కష్టం విలువ

రామవరం అనే గ్రామంలో సోము అనే బాలుడు ఉండేవాడు. అతడు సోమరిపోతు. చదువులో వెనుకబడేవాడు. ఆటపాటల్లో పాల్గొనడు. తరచూ ఉపాధ్యాయులతో తిట్లు తినేవాడు. ఇంట్లోనూ ఏ పనీ చేయడు. సోము చెల్లెలు అపర్ణే అన్ని పనులూ చేసేది.         ఒకరోజు సోము తల్లికి విపరీతమైన జ్వరం వచ్చింది. సోము తండ్రి పొరుగూరు వెళ్ళాడు. సోము తల్లి సోమూను జ్వరానికి మందులు తెమ్మని ఎంతో బతిమాలింది. నాకు చేతకావడం లేదని సోము మొండికేశాడు. అపర్ణ తాను తెస్తానని వెళ్ళింది. జడివాన మొదలై ఎంతకూ తగ్గడం లేదు. బయటకు వెళ్ళిన అపర్ణ జాడలేదు. తల్లి కంగారుతో "చెల్లి బయటకు వెళ్ళి, చాలా సేపయింది. ఇంకా ఇంటికి రాలేదు. నాకు భయంగా ఉంది. చెల్లి ఎక్కడ ఉందో చూసి రారా సోమూ!" అని అన్నది.సోము కదలకుండా మొద్దులా కూర్చున్నాడు. వర్షం తగ్గిన తర్వాత అపర్ణ ఒణుకుతూ మందులతో ఇంటికి వచ్చింది. తల్లి పట్టరాని ఆవేశంతో "ఒరేయ్ పనికిరానోడా! నీ వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు. నీవు నా ఇంట్లో ఉండనవసరం లేదు. తక్షణమే వెళ్ళిపో!" అంటూ ఓ దుడ్డుకర్ర తీసుకుని సోమూని బయటకు తరిమింది.         అలా ఇంటినుంచి వెళ్ళిపోయిన సోము ఓ చెట్టు క్రింద నిద్రపోయాడు. ఎంతో ఆకలి వేయగా మేల్కొన్నాడు. అక్కడ ఓ చీమలబారు కనిపించింది. తానూ చీమనైతే ఎంత బాగుండు. కష్టపడకుండానే కొంచెం ఆహారంతో కడుపు నింపుకోవచ్చు అనుకున్నాడు. ఆశ్చర్యం! చీమగా మారాడు. ఓ చీమ దగ్గరకు వెళ్ళి, అది మోస్తున్న ఆహారాన్ని యాచించాడు. "కష్టానికి మారుపేరైన చీమ జాతిలో పుట్టి, అడుక్కోవడానికి సిగ్గు లేదూ! కష్టపడి ఆహారాన్ని కూడబెట్టుకో!" అన్నది చీమ.              అవమానంతో దూరంగా వెళ్ళిన సోమూకి తుమ్మచెట్టు పైన గిజిగాడు కనిపించింది. ఎంతో అందంగా కనిపించింది. తానూ ఆ అందమైన పక్షినైతే బాగుండు. ఎవరూ తనను అసహ్యించుకోరు అనుకున్నాడు. నిజంగానే గిజిగాడు అయ్యాడు సోము. చెట్టుపై ఉన్న మరో గిజిగాని వద్దకు వచ్చి, "నేను నీ అతిథిని, నీ గూటిలో వారం రోజులు ఉంటాను. నాకు మంచి ఆహారంతో విందు చెయ్యాలి నువ్వు." అని అడిగాడు. "వీల్లేదు. ఇలా పక్షి జాతి పరువు తీయకు. రెక్కల కష్టం చేసుకొని నీ గూటిని నువ్వే నిర్మించుకోవాలి. ఆహారాన్ని ఎంతో కష్టపడి సేకరించుకోవాలి." అంది గిజిగాడు.        సిగ్గుతో అక్కడ నుంచి వెళ్ళిపోతున్న సోమూకు ఓ పువ్వుపైన వాలిన సీతాకోకచిలుక కనిపించింది. తానూ ఆ అందమైన సీతాకోకచిలుక అయితే బాగుండు అనుకున్నాడు. నిజంగానే సీతాకోకచిలుకగా మారాడు. ఇంతలో రాము, వాసు అనే స్నేహితులు అటుగా వచ్చారు. రాము సీతాకోకచిలుక (సోము)ని పట్టుకున్నాడు. "పాపం! ఎందుకురా ఆ అల్పప్రాణిని హింసిస్తావు?" అన్నాడు వాసు. "ఈ ఆట నాకు సోము నేర్పాడురా!" అన్నాడు రాము. "వాడో పనికిరాని వెధవ. ఒక్క మంచిపనీ చేతకాదు వానికి. ఇలాంటి చెడ్డ పనులను నేర్పి అందరినీ చెడగొడుతున్నాడు. వాణ్ణి ఎవరైనా మంచివాడు అని అంటారా? నువ్వూ సోమువే అయితే ఇలాంటి పనులు చేయి." అన్నాడు వాసు. "ఛీ! నేను సోమూనా? కాదు రామూని" అంటూ సీతాకోకచిలుకను వదిలిపెట్టాడు. వారి మాటలకు ఎంతో సిగ్గుపడ్డాడు సోము. బతుకు జీవుడా అనుకుంటూ సోము ఓ చెట్టు కిందకు వచ్చి, తాను మనిషిగా మారాలనుకున్నాడు. మారాడు. సోము ఆలోచనలో పడ్డాడు. చిన్న జీవులు సైతం ఆహారం కోసం ఎంతో శ్రమ పడుతున్నాయి. కష్టపడని వారిని ఈ భూమిపై అందరూ హీనంగా చూస్తారు. తానూ సోమరితనాన్ని వదలిపెట్టాలని అనుకున్నాడు. తల్లిని క్షమాపణ అడగడానికి ఇంటివైపు నడిచాడు. -సరికొండ శ్రీనివాసరాజు.  

అమ్మ మీద అలిగితే

   గుడ్డు నుంచి అప్పుడే బయటకు వచ్చిన బుల్లి కోడిపిల్ల చుట్టూ ఉన్న వాతావరణాన్ని వింతగా చూస్తుంది. ఇంతలో తల్లికోడి అంతకుముందే గుడ్ల నుంచి బయటకు వచ్చిన పిల్లలను దగ్గరకు తీసుకుంటూ ఈ బుల్లి కోడిపిల్లను వాటిలో చేర్చింది. తల్లికోడి ఆహారాన్ని వెతకడంలో అటూ ఇటూ తిరుగుతున్నప్పుడు మిగిలిన కోడిపిల్లలు దానిని అనుసరించేవి. ఈ బుల్లి కోడిపిల్ల మాత్రం బాగా వెనుకబడేది. బద్ధకం పనికిరాదని, సోమరితనాన్ని విడిచి పెట్టమని తల్లి ఎన్నిసార్లు చెప్పినా ఈ పిల్ల ప్రవర్తనలో ఏ మార్పు ఉండేది కాదు.             ఒకరోజు దూరంగా ఏదో అలికిడి విని తల్లికోడి తన పిల్లలను వేగంగా తనను అనుసరించమని హెచ్చరిస్తూ తానూ పరుగెత్తింది. కానీ ఈ చిన్నారి కోడిపిల్ల తల్లి మాటలను వినిపించుకోక అక్కడే ఉంది. విసిగి వేసారిన ఆ తల్లి ఆ పిల్లను కఠినంగా తిట్టింది. ఎంతో బాధపడిన  ఆ బుల్లిపిల్ల తల్లి ఏమరుపాటుగా ఉన్న సమయంలో సోదర కోడిపిల్లల నుంచి దూరంగా వెళ్ళి, ఒక దగ్గర కూర్చొని వెక్కి వెక్కి ఏడవసాగింది.          అంతలో అటుగా వెళ్తున్న ఓ పిల్లి ఈ కోడిపిల్లను చూసి, "ఏమ్మా! ఎందుకలా ఏడుస్తున్నావు?" అని ఆప్యాయంగా పలకరించింది. జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పింది కోడిపిల్ల.  "అది తల్లా! కాదు, బ్రహ్మ రాక్షసి. ఈ బుల్లి బంగారాన్ని తిట్టడానికి దానికి నోరెలా వచ్చింది? మీ అమ్మకు నువ్వంటే ఇష్టం లేదు. మిగతా పిల్లలను ప్రేమగా చూస్తూ నిన్ను పట్టించుకోవడం లేదు. నువ్వేమీ బాధపడకు. నీకు నేనున్నాను. నీకు కావలసిన ఆహారాన్ని నేనే సంపాదించి పెడతాను. నిన్ను కన్నతల్లి కంటే ఎక్కువ ప్రేమతో చూసుకుంటాను. నువ్వు నా దగ్గరే ఉండు." అంది ఆ మార్జాలం. అప్పటి నుండి కోడిపిల్ల పిల్లి పెడుతున్న ఆహారాన్ని తింటూ దాని వెంటే తిరగసాగింది. ఇలా నాలుగైదు రోజులు గడిచాయి.         ఒకరోజు పిల్లి వెంట కోడిపిల్ల తిరగడం ఓ కుందేలు చూసింది. ఆశ్చర్యంగా అనిపించింది. పిల్లి ఆహారాన్ని వెతుకుతుండగా బాగా వెనుకబడిన కోడిపిల్లను సైగతో పిలిచింది కుందేలు. "ఎందుకు పిల్లి వెంట తిరుగుతున్నావు?" అని అడిగింది కుందేలు. జరిగింది చెప్పింది కోడిపిల్ల. "ఓసి పిచ్చిదానా! అమ్మ తిట్టిందని అలిగి శత్రువు పంచన చేరుతావా? అమ్మ తిట్టిందంటే తప్పనిసరిగా అది నీ మంచి కోసమే! నువ్వు అమ్మ వెంట వెళ్ళకుండా సోమరిలా వెనుకబడి ఉంటే శత్రువులు నిన్ను తినేస్తారు. ఆ భయంతోనే అమ్మ నిన్ను తిట్టింది. కానీ నీ మీద ప్రేమ లేక కాదు. ఈ మాయదారి మార్జాలం మాటలు నిమ్మకు. కొన్నాళ్ళు నీకు ఆహారం తినిపించి, నువ్వు పెద్దగా బలిష్టంగా తయారయ్యాక అది నిన్ను తింటుంది. మీ జాతికే శత్రువైన పిల్లి మాటలను మూర్ఖంగా నమ్మకు. తీయగా మాట్లాడే ప్రతి ఒక్కరూ మిత్రులు కాలేరు. మంచి చెడులను గుర్తించే విచక్షణా జ్ఞానాన్ని మనం పెంపొందించుకోవాలి. సరే, నా వెంట రా! మీ అమ్మ దగ్గరకు తీసుకెళ్తా!" అని చెప్పి, తల్లికోడి వద్దకు పిల్లకోడిని చేర్చింది కుందేలు.  కనిపించని తన చిన్నారి కనిపించేసరికి తల్లికోడి ఆనందంతో పిల్లకోడిని తన అక్కున చేర్చుకుంది. అమ్మ చెప్పినట్లే వింటానని, ఇంకెప్పుడూ అమ్మను విడిచిపెట్టి పోనని కోడిపిల్ల ప్రమాణం చేసింది. - సరికొండ శ్రీనివాసరాజు  

ఎర్రచీర

ఎర్రచీర     శ్రీరంగం రాజేశ్వరరావు పదహారేళ్లు వచ్చే సరికి సమాజాన్ని, మనుషుల భావనా ప్రపంచాన్ని అర్థం చేసుకోడానికి ప్రయత్నించాడు. పందొమ్మిదేళ్లు వచ్చేసరికల్లా తన ఆలోచనల ఆవేదనల్ని కథల రూపంలో తీసుకొచ్చాడు. 12 కథలు రాశాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. చదవుతూ ఎవరికీ చెప్పకుండా అదృశ్యమైపోయాడు. ఇప్పటికీ ఆచూకీ తెలియదు. కానీ అతను రాసిన కథలు మాత్రం అదృశ్యం కాలేదు. మనలోని సున్నిత భావోద్వేగాల్ని అదృశ్యం కాకుండా చేస్తున్నాయి. ఆయన రాసిన 12 కథలు ఎర్రచీర పేరుతో పుస్తకంగా వచ్చాయి. ఎర్రచీర కథ ఓ యువతి ఆలోచనా తరంగాల సముద్రం. కథలోకి ప్రవేశిస్తే- విశాలాక్షికి తన స్నేహితురాళ్లకు వచ్చే ప్రేమలేఖల్ని చూసినా, వారి ప్రేమల గురించి విన్నా దిగులు. ఎందుకంటే తనను ఎవరూ ప్రేమించడం లేదని, తనకు ఎవరూ ఒక్క ప్రేమలేఖ కూడా రాయలేదని మనసులో బాధ. తన అందం గురించి బెంగ. అలాగని విశాలాక్షి అందంగాలేని అనాకారి కాదు. కానీ అబ్బాయిల్ని పిచ్చెక్కించి ప్రేమలేఖ రాయడానికి పురికొల్పే శక్తి లేదు... అంతే. విశాలాక్షి పట్నంలో హాస్టల్లో ఉంటూ బి ఎస్సీ చదువుకుంటుంది. ఆ రోజు క్లాసులో తలనొప్పిగా ఉందని మధ్యలోనే హాస్టలకు వచ్చేస్తుంటే ఓ పదేళ్ల అమ్మాయి వచ్చి ఓ లేఖ ఇచ్చి వెళ్తుంది. దాన్ని అలా ఉండలా మడిచి చేత్తో పట్టుకొని, పంజాబ్ మెయిల్ లా గుండెలు కొట్టుకుంటూ ఉంటే రూమ్ లోకి వస్తుంది. కాస్త భయంగా, బెరుగ్గా, గాబరాగా ఉత్తరాన్ని చదువుతుంది. మరో వైపు నాకు ఉత్తరం రాయడానికి ఎంతధైర్యం అని తిట్టుకుంటూంది. గులాబీ రంగు కాగితం మీద నల్లటి ఇంకుతో అందంగా ఉంటాయి అక్షరాలు. ఉత్తరంలో... చెయ్యకూడని పనులు చెయ్యడమంటే మనుషులకు ఇష్టం. నేను మీ హాస్టల్ కు ఎదురుగా ఉండే బిల్డింగ్ లో ఉంటాను. మిమ్మల్ని ఎర్రచీరలో చూశాను. నాకు ఎర్రచీరంటే చాలా ఇష్టం. ఆ రోజు ఆ చీరలో మీరు దానిమ్మగింజల మధ్య, మల్లెపువ్వులా ఉన్నారు. మిమ్మల్ని ప్రేమించానని పిచ్చిపిచ్చి రాతలు రాయడం నాకు ఇష్టం లేదు. నాకు మీ ముఖపరిచయం కూడా లేదు. ఎమ్మే సెకండ్ క్లాసులో పాసయ్యాను. రేపు ఆదివారం ఇంటర్ వ్యూకని బొంబాయి వెళ్తున్నాను. మిమ్మల్ని చూసిన వేళ ఊహాతీతమైన భావాలు నన్ను చుట్టుముట్టాయి. నాది ఒక్కకోరిక ఆఖరి సారిగా మిమ్మల్ని ఎర్రచీరలో చూడాలి అని. అందుకే ఆదివారం సాయంత్రం ఆరుగంటలకు ఎర్రచీరలో బీచ్ కు వస్తారు కదూ... నా పేరు చక్రవర్తి. ఆ ప్రేమలేఖ చదివిన విశాలాక్షికి ఇంతకాలం మూలన పడేసిన వీణనెవరో మీటినట్లు, తంత్రులు సవరించినట్లు అనిపించింది. తనను ఒకరు ప్రేమిస్తున్నారు అన్న ఆలోచనతో అద్దం ముందుకు వెళ్లి మెరిసే చిరునవ్వును చూసుకొంది. ఉత్తరాన్ని మరోసారి చదువుకుంది. ఆకాశమంత సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయింది విశాలాక్షి. అసలు ఎర్రచీర విశాలాక్షిది కాదు. రూమ్మెట్ సరోజది. అప్పుడప్పుడు కట్టుకుంటుంది.  మరసటి రోజే ఆదివారం. ఎర్రచీరలో వెళ్లి అతనికి కనిపించాలని నిర్ణయించుకుంటుంది. అయితే తర్వాతి నిద్రలేచే సరికి విశాలాక్షి అన్నయ్య వస్తాడు. రూమ్మెట్ సరళ కూడా మార్నింగ్ షో సినిమాకు పిలుద్దామని వచ్చి వాళ్ల అన్నయ్య వచ్చాడని తెలిసి వెళ్లిపోతుంది. ఎర్రచీర అడుగుదామని అనుకొని కూడా... సాయంత్రం తీసుకుందామని ఆగిపోతుంది విశాలాక్షి. వాళ్ల అన్నయ్యతో ఇష్టం లేకపోయినా వాళ్ల అత్తగారింటికి వెళ్తుంది. అక్కడ భోజనం. కానీ మనసులో మాత్రం ఆరాటంగా ఉంటుంది. అక్కడ నుండి వచ్చి రూమ్ లో అలారం 5 గంటలకు పెట్టుకుని నిద్రపోతుంది. తలలో ఎవరో సుత్తులతో నెమ్మదిగా కొడుతున్నట్లు అనిపించి లేచేసరికి, అలారం ఆగిపోయి ఉంటుంది. రిస్ట్ వాచి ఆరు, పదినిముషాలు చూయిస్తుంది. ఎర్రచీర కోసం సరళ పెట్టంతా వెతుకుతుంది. కనిపించదు. అర్థంలేని ఆతృత, గుండెదడ ఎక్కువ అవుతుంది. వొళ్లు స్వాధీనం తప్పుతుంది. చివరకు గులాబీరంగు చీర కట్టుకొని బీచ్ కు వెళ్తుంది. అక్కడ సరళ ఎర్రరంగు చీరలో కనిపిస్తుంది. మనసు స్వాధీనం తప్పుతుంది. పరధ్యానంగా ఉన్న విశాలాక్షికి సరళ చెప్తుంది. ఇందాక ఎవరో వచ్చి- ఎర్రచీరలో మీరు చాలా అందంగా ఉన్నారు. నా మాట కొట్టేయకుండా వచ్చినందుకు థాంక్స్ మీ, పేరు చెప్తారా అని అడిగాడు. నేను, మన ఫ్రెండ్స్ కలిసి వాడ్ని దుమ్ముదులిపాం అని చెప్తుంది. పైగా దూరంగా కనిపించే అతడ్ని చూపిస్తుంది. తెల్లటి ఫ్యాంటు, నల్లటి షర్టులో ఉన్న అతడు బస్ వైపు నడుస్తూ కనిపిస్తాడు విశాలాక్షికి. అతడిని బస్ ఎక్కకుండా ఆపాలని, చేతులు పట్టుకొని నేనే నీకు కనిపించింది అని చెప్పాలను కుంటుంది. అఛేతనంగా కళ్లనుండి నీళ్లు వచ్చేస్తాయి, ఆ కన్నీళ్లలో ఆమెలోని మధురమైన భావాలు కూడా కొట్టుకుపోతాయి. అప్పుడు సరళ కట్టుకున్న ఎర్రచీర ఆ కన్నీళ్లలోంచి రక్తపు ముద్దలా కనిపిస్తుంది. ఈ కథను నడిపిన తీరు అత్యంత అద్భుతం. కథమొత్తంలో ఎక్కువగా యుక్త వయసులో ఉన్న అమ్మయి ఆలోచనల్ని రచయిత బాగా చెప్పాడు. తన తోటి వారందరికీ  ప్రేమికులు ఉండడంతో ఓ అమ్మాయి మానసిక స్థితి ఎలా ఉంటుందో తెలిపాడు. కథలోని ప్రేమలేఖను కూడా అత్యంత సహజంగా ఎలాంటి విపరీతమైన వర్ణనలు లేకుండా రాశాడు. అలానే ప్రేమకోసం తపించే అమ్మాయికి ఓ అబ్బాయి దొరినట్లే దొరికి వెెళ్లిపోవడాన్ని కథగా మార్చిన తీరు రచయిత ప్రతిభకు గొప్పనిదర్శనం. కథలో కనిపించే వర్ణనలు పాఠకులను ఊహాలోకాల్లోకి తీసుకెళ్తాయి. సాయంత్రాన్ని వర్ణిస్తూ- చీకటి వెలుగు ఒకే సరిహద్దుకు చేరుకుంటున్నాయి, ప్రేమలేఖ చదివిన విశాళాక్షిని వర్ణిస్తూ- చివరిగా ఆమె హృదయాన్ని గురించి చెప్తూ- ఆమెతోపాటు ఆమె మనసు కార్చిన కన్నీళ్లలో మధురమైన భావాలన్నీ తడిసి ఎటో కొట్టుకుపోయాయి. హృదయంలో లెఖ్ఖలేనన్ని డైనమైట్లు బద్దలవుతున్నాయి. అంతా పీడకలలులాగా... అందరూ శత్రువుల్లాగా సయనైడ్ లో ముంచిన కత్తుల్లాగా కనపడుతున్నారు. అందుకే వర్ణన పరంగా, వస్తువు పరంగా, కథానిర్మాణం పరంగా, అన్ని విధాలా ఇది గొప్ప కథ అని చెప్పడం అతిశయోక్తికాదు. - డా. ఎ.రవీంద్రబాబు

జింక రాజు కథ

జింక రాజు కథ   బ్రహ్మదత్తుడు కాశీ రాజ్య పీఠాన్ని అధిరోహించకముందు యువరాజుగా విలాస జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. అతనికి ఉండే వ్యసనాల్లో ఒకటి, వేట. కాశీ యువరాజుకి కొంత సమయం చిక్కిందంటే చాలు, వేటాడేందుకు అడవిలోకి పోయేవాడు. ధనుర్బాణాలు ధరించి, గుర్రాన్నెక్కి కాలయముడిలా సంచరించే బ్రహ్మదత్తుడిని చూస్తే అడవిలోని జంతువులన్నీ వణికి పోయేవి. అతని వల్ల జంతువులన్నిటిలోనూ ఎక్కువ నష్టపోయింది జింకలు. కాశీ రాజ్యానికి ఉత్తరాన ఉన్న అడవుల్లో లెక్కలేనన్ని జింకలు ప్రశాంతంగా జీవించేవి. ఇప్పుడవన్నీ భయంతో బక్కచిక్కిపోసాగాయి. వాటన్నిటికీ రాజుగా ఉండిన బోధిసత్త్వుడు ఒకనాడు తోటి జింకలన్నిటినీ సమావేశపరచి, "మిత్రులారా, అనేక తరాలుగా మనవాళ్లంతా ఎలాంటి దురవస్థలూ లేక సుఖంగా జీవించటానికి అలవాటుపడి ఉన్నారు. మన శరీరాలన్నీ బాగా క్రొవ్వు పట్టినై, ఎముకల సంధులు కావలసినంత చురుకుగా కదలటం లేదు. ఇప్పుడు యీ కాశీ యువరాజు పేరిట ఆపద ముంచుకొచ్చే సరికి, మనం అతని బాణాలకు సులభంగా చిక్కుకుంటున్నాం. అందువల్ల మనందరం మన శరీరాలను బాగుచేసుకోవాలి; మన చురుకుదనం పెంచుకోవలసి ఉన్నది. అయితే బ్రహ్మదత్తుని తీరు చూస్తే ఆ లోగానే మనం ఎవ్వరం మిగలని పరిస్థితులు ఎదురవుతామేమో అనిపిస్తున్నది. ఉత్తమ సంస్కారాలను అనేకాన్ని ప్రోది చేసుకున్న కారణంగానే యీ బ్రహ్మదత్తు కాశీ యువరాజుగా జన్మించాడు. అయితే ఏనాటి దుష్ట కర్మలో అతన్ని యీ మారణ పర్వంలో భాగస్వామిని చేస్తున్నాయి. అతనిలో కరుణ బలపడితే తప్ప మన కష్టాలు పూర్తిగా తీరవు. దానికై మనం పెను త్యాగాలకు సిద్ధమవ్వాలి. మీరంతా సరేనంటే నేను అతనితో మాట్లాడతాను" అన్నది. జింకలన్నీ సమ్మతించిన మీదట, ఆరోజు వేటకై బయలుదేరిన బ్రహ్మదత్తుడికి అడవి అంచునే ఎదురేగి, ప్రేమ పూరితమైన స్వరంతో, మానవ భాషలో- "యువరాజా! నీ బలసంపదకు ఎదురొడ్డి నిలువలేని జింకల సమూహం కొద్ది నెలల్లోనే, నీ ప్రతాపం వల్ల వందల సంఖ్యకు చేరుకున్నది. మిగిలి ఉన్న జింకలు కూడా తమ జీవన క్రియలన్నిటినీ ప్రక్కన పెట్టి భయంతో ముడుచుకొని పోయాయి. ఇదే గనక కొనసాగితే ఇక యీ అడవులలో జింక అన్నదే కనిపించకుండా పోతుంది. అందువల్ల నువ్వు మా మీద దయ చూపాలి. మమ్మల్ని వధించరాదు" అన్నది.   బ్రహ్మదత్తుడు దాని మాటలకు నవ్వి "ప్రభువులు మృగయా వినోదులు. కాబట్టి నన్ను వేటాడవద్దనే అధికారం మీకు లేదు. అయితే మీరంతా మా రాజ్యంలోని ప్రాణులు- కనుక మీ కోరికని నేను మనసులో పెట్టుకుంటాను- అయితే దాని వల్ల నాకేమి లాభం?" అన్నాడు. "ఏ ప్రాణి పట్ల అయినా మీ మనసులో ఉదయించే కరుణ మీకు ఎనలేని మేలు చేస్తుంది. ప్రభువులైన తమకు మాబోటి అల్పజీవులు చేయగల మేలు అంతకంటే ఏముంటుంది?" అన్నది జింకరాజు. "అలా కాదు. నేను మీ జాతినంతటినీ ఏమీ చేయకుండా వదులుతాను. మీరు నిశ్చితంగా బ్రతకవచ్చు. అయితే దానికి బదులుగా, మీలో రోజుకొకరు నాకు ఆహారం అవుతూ ఉండాలి. అది మీ జాతి పట్ల మీకున్న నిబద్ధతను సూచిస్తుంది; నేను ఇచ్చిన మాటను కూడా నాకు ఏరోజుకు ఆరోజు గుర్తు చేస్తుంటుంది" అన్నాడు బ్రహ్మదత్తుడు. జింకల రాజు మిగిలిన జింకలకేసి జాలిగా చూసింది. అవి సమ్మతిస్తూ తలలు ఊపిన మీదట, అది బ్రహ్మదత్తుడికి తమ అంగీకారాన్ని తెలియజేసింది. ఆ రోజునే జింకలన్నీ వంతులు వేసుకున్నాయి; రోజుకొక జింక చొప్పున యువరాజుకు ఆహారమౌతూ వచ్చింది. ప్రతిరోజూ ఒక జింకను అడవి అంచున నిలిపే బాధ్యత జింకరాజుది. జింకల జీవితాలు త్వరలోనే సాధారణ స్థితికి చేరుకున్నాయి. ఎటొచ్చీ రోజుకు ఒక జింక నిశ్శబ్దంగా అదృశ్యం అయిపోయేది. అయితే మిగిలిన జింకల్లో నిర్భయత పెరిగింది; అవి తిరిగి బలం పుంజుకున్నాయి; వాటి శరీరాలు చురుకుగా తయారయ్యాయి. జింకల సంతతి తిరిగి పెరగనారం లభించింది. ఆ సమయంలో ఒకసారి యువరాజుకు ఆహారంగా వెళ్లే వంతు ఒక ఆడ జింకదైంది. అది ఆ సమయంలో నిండు గర్భిణి. 'తన పిల్లను యీ లోకంలోకి తెచ్చే ముందుగానే తన జీవితం ముగియనున్నదే' అని దానికి చాలా దు:ఖం వచ్చింది. దాన్ని అడవి దాటించేందుకు వచ్చిన జింకరాజుకు దాని దు:ఖం అర్థమైంది-"జింకల సంతతిని తిరిగి వృద్ధి చేసేందుకు గదా, యువరాజుతో ఇటువంటి ఒప్పందం కుదుర్చుకున్నది? ఇప్పుడు ఇలా నిండు గర్భిణిని అతనికి ఆహారంగా పంపటం ఎంత తెలివి తక్కువ పని?!" అని ఆలోచించి, దాన్ని ఊరడిస్తూ "తల్లీ! వంతును మళ్లీ ఏదో ఒకనాటికి మార్చుకుందువు. ఇవాల్టికి ఏదో ఒక విధంగా ఆ ఖాళీని భర్తీ చేస్తాను. నువ్వు పో!" అని దాన్ని వెనక్కి పంపించేసింది.   ఆనాడు స్వయంగా తనకు ఆహారం అయ్యేందుకు వచ్చిన జింకరాజును చూసి బ్రహ్మదత్తుడికి చాలా ఆశ్చర్యం వేసింది. "ఏంటి ఇది? ఇవాళ్ల నువ్వే వచ్చావెందుకు? మిగిలిన జింకలేమైనాయి?" అని అడిగాడు దాన్ని. జింకరాజు అతనికి జరిగిన సంగతిని వివరించి, "రాజా! నేను లేకున్నా మా జాతి వారు తమ మాట తప్పరు. నువ్వు నిశ్చింతగా నన్ను చంపవచ్చు; ఏమీ పర్వాలేదు" అన్నది. "కాదు, నువ్వు వెళ్లి వేరే జింకను దేన్నైనా పంపు. నిన్ను చంపటం నాకెందుకో ఇష్టం కావట్లేదు" అన్నాడు బ్రహ్మదత్తుడు, కలవరపడుతూ. జింకరాజు నవ్వి "యువరాజా! శరీరం అంటూ ఒకటి ఉన్నప్పుడు దానికి కష్టాలు తప్పవు. చిన్నతనంలోను, యౌవనంలోను, మధ్య వయస్సులోను, ముసలితనంలో కూడాను ఎక్కడి దు:ఖం అక్కడ, ఉండనే ఉన్నది. రాజైన వాడు దు:ఖాన్ని అధిగమించి ఇతరులకు మార్గదర్శకుడు కావాలి తప్ప, తన శరీర రక్షణ కోసం ప్రజలను బలి చెయ్యకూడదు." అన్నది. ఆ క్షణంలోనే యువరాజులో అనంతమైన పశ్చాత్తాపం నెలకొన్నది. "రాజ ధర్మాన్ని నిలుపుకునేందుకు సాధారణమైన జింక ఒకటి తన ప్రాణాలను అలవోకగా త్యజించబోయిందే, మరి తను? ఇన్ని ప్రాణులకు ప్రభువైన తను నిస్సిగ్గుగా ఆ ప్రాణులను ఎలా హింసిస్తున్నాడు, ఇన్నాళ్లుగా?! నిజానికి వాటిని అన్నిటినీ కాపాడవలసిన బాధ్యత తనదే; తను 'వేట' అనే యీ కౄరకర్మలో ఎందుకు కూరుకుపోయాడు?” తక్షణం అతనిలో హృదయ పరివర్తన కలిగింది. జింకరాజులో బోధిసత్త్వుడిని దర్శించిన యువరాజు దాని ముందు మోకరిల్లాడు. అటుపైన అతను ఇక ఏనాడూ వేటాడలేదు; జంతువుల్ని హింసించలేదు!! - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

మనది కానిది మనకెందుకు?

మనది కానిది మనకెందుకు?   ఒక ఊరిలో రాజయ్య అని ఒక కట్టెలు కొట్టేవాడు వుండేటోడు. వాడు రోజూ అడవికి పోయి ఆ రోజుకు సరిపడా కట్టెలు కొట్టుకోని అమ్మేవాడు. ఎక్కువగా ఆశ పడేవాడు గాదు. ఉన్న దానిలో తిని, హాయిగా కాలం గడిపేవాడు. ఒక రోజు వాడు అడవిలో పోతావుంటే, దారిలో ఒక చోట ఒక బంగారు వరహా కనబడింది. దానిని తీసుకొని చుట్టూ చూసినాడు.. ఎవరూ కనబళ్ళేదు. కొంచెం దూరం పోయేసరికి మరో వరహా కనబడింది వాడికి! ఇంకొంచెం దూరం పోయేసరికి ఇంకో వరహా! అలా ఒకదాని తరువాత ఇంకొకటి!! కాసేపటికి వాడి చేతులు రెండూ వరహాలతో నిండిపోయినాయి. కానీ వరహాలు మటుకు ఇంకా కనబడతానే ఉన్నాయి. "పాపం! ఎవరో పారేసుకున్నట్టున్నారు. వీటిని తీసుకు పోయి రాజభటులకు చూపిద్దాం. వాళ్ళొచ్చి, మిగతావి కూడా వెతికి పట్టుకొని, సొంతదారులు ఎవరో కనుక్కొని అప్పజెబుతారు" అనుకుంటా తిరిగి వెనక్కు బైలుదేరినాడు రాజయ్య. రాజయ్య ఇంటి పక్కనే ధనయ్య అని ఒకడు వున్నాడు. ఊరిలో వానంత ధనవంతుడు ఎవడూ వుండడు. వాడు పెద్ద ఆశపోతు. ఎంత సంపాదించినా "ఇంకా కావాల,ఇంకా" అని అల్లాడి పోతా వుంటాడు. ఆరోజున వాడు ఇంటి బైట కూచోని, ఎప్పుడూ గాడిద మీద కట్టెలు వేసుకోని వచ్చే రాజయ్య వుత్త చేతులు వూపుకుంటా రావడం చూసినాడు. "పాపం.. ఈ రోజు కట్టెలు దొరకలేదేమో" అనుకున్నాడు- గాని రాజయ్య మొగం ఏదో గాబరాగా వుంది. అది చూసి, 'ఏదో జరిగింది' అనుకోని, దగ్గరికి పోయి "ఏం రాజయ్యా, కట్టెలు దొరకలేదా, ఎందుకలా కంగారు పడతా వున్నావు?" అన్నాడు. రాజయ్య వానికి జరిగిందంతా చెప్పినాడు. "నిజమా... ఇంకా వరహాలు వున్నాయా, అక్కడ?" అన్నాడు ధనయ్య అశగా. 'వున్నాయం'టూ తలూపినాడు రాజయ్య. "సరే ఒక పని చెయ్యి. మన పల్లెలో రాజభటులు ఎక్కడ వుంటారు?! నేనే సొయంగా అవన్నీ ఏరుకోని పోయి, మన నగరాన్ని పాలించే రాజుకు అప్పజెబుతాలే. నువ్వు హాయిగా నీపని చూసుకో!"అని నమ్మకంగా చెప్పేసినాడు ధనయ్య.   రాజయ్య చానా అమాయకుడు. ఎవురిని పడితే వాళ్లని నమ్ముతాడంతే. అందుకని ఆ ధనయ్య మాటలు నమ్మేసి, తన చేతిలోని వరహాలు గూడా వానికే ఇచ్చి, "ఇవి గూడా తీసుకోని పోయి రాజుకు అప్పజెప్పు ధనయ్యా, ఒకని సొమ్ము మనకెందుకు?!" అనేసినాడు. ధనయ్య లోపల్లోపల సంబరంగా నవ్వుకుంటా అవి తీసుకున్నాడు. వెంటనే బిరబిరా ఇంటిలోనికి పోయి, రెండు గోనె సంచులు గాడిదమీద వేసుకోని, రాజయ్య చెప్పిన వైపు వురుకులు పరుగులు మీద పోయినాడు. రాజయ్య చెప్పిన చోటుకి చేరుకునే సరికి బంగారు వరహాలు కనబన్నాయి. సంబరంతో ఎగిరి గంతులు వేసినాడు. గాడిదను వేగంగా తోలుకుంటా పోతా ఒక్కొక్క వరహా ఏరుకో సాగినాడు. నెమ్మదిగా ఒక గోనెసంచీ నిండిపోయింది. వరహాలు చానా బరువు వుంటాయి గదా, దాంతో గాడిద మోయలేకపోతోంది. ఐనా ధనయ్య ఆశ అగడం లేదు. ఇంకా దారి వెంబడి వరహాలు కనబతానే వున్నాయి. సాయంకాలానికి రెండు సంచులూ నిండిపోయినాయి. ఇంక చీకటి పడతా వుంది. ఆ అడవిలో దొంగలు చానా ఎక్కువ. వాళ్ల చేతికి చిక్కితే కష్టమే. అందుకని ధనయ్య మెల్లగా వెనక్కి తిరిగి ఇంటికి బైలుదేరినాడు. గాడిద ఆ బరువును మోయలేక, అడుగు తీసి అడుగు వేయసాగింది. ఇలాగే నత్తలాగా నెమ్మదిగా పోయారంటే చీకటి పడి, దొంగలకు దొరికిపోవడం ఖాయం! దాంతో ఎదారిపడిన ధనయ్య ఒక మూటని తనే ఎత్తుకుని పోదామని చూసినాడు. కానీ పని చేయక చానా రోజులైంది కదా, అందుకని నాలుగు అడుగులు వేసేసరికే చుక్కలు కనబన్నాయి. దాంతో తిరిగి మూటలు రెండూ గాడిద వీపుమీదే వేసినాడు. "ఏం చేద్దామా?" అని ఆలోచించ సాగినాడు. ఊరికి తొందరగా చేరుకొనేకి ఒక అడ్డదారి వుంది. ఆ దారిన పోతే సగం దూరం తగ్గుతుంది. కానీ ఆ తోవలో చిన్న వాగు ఒకటి అడ్డం వుంది. వాగులో ఎక్కడ ఏ గుంత వుంటాదో, ఎక్కడ ఏ పెద్ద రాయి తగులుతాదో ఎవరికీ తెలీదు. అందుకే ఎవరూ అటువైపు రారు. కానీ ఆశపోతు ధనయ్య ఆ వాగువైపే బైలు దేరినాడు. కాసేపటికి అక్కడికి చేరుకోని నెమ్మదిగా గాడిదతో సహా వాగులోకి దిగినాడు. నీళ్ళు వేగంగా పారతా వున్నాయి. గాడిద అప్పటికే బాగా అలసి పోయివుంది. దానికి చేతగావడం లేదు. అడుగులు తడబడతా వున్నాయి. అంతలో దాని కాలు చిన్న గోతిలో పడింది. అంతే! దభీమని కింద పడిపోయింది. దాని వీపు మీదున్న రెండు మూటలూ జారి పోయినాయి. వాటిలోని నాణాలన్నీ నీళ్ళలో పడి చెల్లాచెదురై పోయినాయి. ధనయ్య అదిరిపన్నాడు. నీళ్ళల్లో కిందా మీదా పడతా వెదకసాగినాడు.   కొట్టుకు పోయినవి కొట్టుకు పోగా అక్కడొకటి ఇక్కడొకటి దొరకసాగినాయి వరహాలు. వాటిని ఏరుకుంటా వుండగానే వెనుక చప్పుడయింది. తిరిగి చూసినాడు: పెద్ద దొంగలగుంపు- చేతుల్లో కత్తులతో. అదిరిపన్నాడు. "దొరికితే ఇంగేమన్నా వుందా, అంతే సంగతులు!" అనుకొని, ఆ నీళ్ళల్లోనే వేగంగా ముందుకు వురకసాగినాడు. అలా వురుకుతా వుంటే నడుమ ఒక పెద్ద గొయ్యి అడ్డం వచ్చింది. చూసుకోక అందులో కాలు పెట్టినాడు. అంతే కాలు కలుక్కుమనింది. దభీమని పడిపోయినాడు. "అబ్బా!" అంటూ ముక్కుతా మూలుగుతా పైకి లేచినాడు. అంతలో దొంగలు వచ్చి వాన్ని చుట్టుకున్నారు. "ఏరా మానుంచే తప్పించుకోని పారిపోదామని అనుకుంటున్నావా" అంటా తలా నాలుగు పీకినారు. చేతిలోని బంగారు వరహాలన్నీ గుంజుకున్నారు. వాటితో పాటు ధనయ్య మెడలో గొలుసు, వేళ్ళ వుంగరాలు, చేతి కంకణం, బంగారు మొలతాడు- అన్నీ ఒలుచుకోని పోయినారు. "అయ్యో! చేతికి చిక్కిన వరహాలూ పాయ, ఒంటిమీదున్న బంగారమూ పాయ!" అని బాధతో లబోదిబోమన్నాడు ధనయ్య. అయినా వానికి ఆశ చావలా. బుధ్దిరాలా. వుత్త చేతులతో ఇంటికి పోవాలనిపించలా. అక్కడే ఒక చెట్టుచాటున పడుకోని నిదురపోయినాడు. తరువాతి రోజు పొద్దున్నే- ఇంకా తెలవారక ముందే లేచి, కుంటుకుంటా కుంటుకుంటా మళ్ళీ వరహాలు దొరికిన చోటికి పోయినాడు. ఇంకా అక్కడ దారంతా వరహాలు పడున్నాయి. "హమ్మయ్య! ఆ పాతవన్నీ పోతే పోయినాయిలే. ఇక్కడ ఇంకా చాలా వున్నాయి. ఈసారి తొందరగా ఏరుకోని పోతాను. చీకటి పడేలోగా ఇంటికి చేరుకుంటాను" అనుకుంటా బిరబిరా ఏరుకోసాగినాడు. నిజానికి ఆ వరహాలన్నీ ఆ వూరి రాజుగారివే. ఆ ముందురోజు వరకూ చుట్టు పక్కల దేశాలనుంచి, సామంతుల నుంచి వసూలు చేసుకున్న కప్పమంతా ఒక పెద్ద గుర్రంబండిలో వేసుకోని రాజుగారి ఖజానాకు తీసుకోని పోతా ఉండినారు సైనికులు . అయితే ఆ బండికింద చిన్న బొక్క పడింది. దారి వెంబడంతా ఒక్కొక్కటే వరహా జారి పడిపోయింది. సైనికులు దాన్ని గమనించుకోలేదు. తీరా పోయినాక తెరిచి చూస్తే ఇంకేముంది?! లోపల సగానికి సగం ఖాళీ అయిపోయింది. దాంతో సైనికులు అదిరిపడి వెదుకుతా పోతే, దారి వెంబడి మొత్తం బంగారు వరహాలు కనబన్నాయి. దాంతో వాళ్ళు అటు వైపు నుంచి ఒక్కొక్కటి ఏరుకుంటా రాసాగినారు. ధనయ్యకు ఇది తెలీదు గదా, అందుకని వీడు ఇటువైపు నుంచి ఒక్కొక్కటి ఏరుకుంటా పోసాగినాడు. కొంతసేపు అయ్యేసరికి వాళ్ళు, వీడు ఒకరికొకరు ఎదురు పడినారు! సైనికులు అదిరిపడి "ఏరా, దొంగ వెధవా! రాజుగారి వరహలే కాజేసి పోదామని అనుకుంటా వున్నావా?" అంటూ వాన్ని పట్టేసుకున్నారు.   వాడు నాకేమీ తెలీదంటూ లబోదిబోమని మొత్తుకోసాగినాడు. "మిగిలిన వరహాలు ఎక్కడున్నాయో చెప్పు!" అంటూ వాళ్ళు వాన్ని నున్నగా, తన్నిన చోట తన్నకుండా తన్నినారు. దాంతో వాడు వాళ్లకు జరిగిందంతా చెప్పేసినాడు. సైనికులు కోపంగా "పోగొట్టుకుని పోయింది ఏదైనా దొరికితే దాన్ని రాజుకి అప్పజెప్పాల గానీ, ఇలా మట్టసంగా మూడో కంటికి తెలీకుండా నున్నగా నొక్కేయడమేనా. ఇంక నీకూ, ఆ దొంగలకూ తేడా ఏముంది? నీవల్ల రాజు సంపద అంతా దొంగల పాలు అయింది. మరియాదగా తిరిగి ఆ రెండు మూటల బంగారు ఖజానాకు కడతావా, లేక జీవితాంతం కారాగారంలో వేసి బంధించమంటావా?!" అన్నారు. ఆ మాటలకు వాడు అదిరిపన్నాడు. కాళ్ళా వేళ్ళా పన్నాడు. అయినా వాళ్ళు వాన్ని వదలలేదు. దాంతో ఇంటికొచ్చి, ఎప్పుటినుంచో తినీ-తినక దాచి పెట్టుకున్న సొమ్మంతా తీసి వాళ్ళ చేతిలో పెట్టినాడు ధనయ్య. దాంతో ఆ సైనికులు అవన్నీ తీసుకోని వాన్ని వదిలేసినారు. "ఆశకు పోతే ఆఖరికి వున్నవి గూడా పోయినాయే!" అని ధనయ్య లబలబలాన్నాడు.  - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

కరిగిన అహం

కరిగిన అహం   అనగనగా ఒక పెద్ద రాజ్యం. ఆ రాజ్యానికి ఒక రాజు ఉండేవాడు. అతని పేరు శూరసేనుడు. శూరసేనుడికి చాలా పెద్ద కోట ఉండేది. ఆ కోట నిండా బంగారం ఉండేది. రాజు ప్రజలను హింసించి వాళ్ళ దగ్గర నుండి కప్పాలు వసూలు చేసేవాడు. 'పన్నులు కట్టేందుకు సరిపడా పంటలు వాళ్ళకు పండాయా, లేదా' అని చూసేవాడు కాదు. 'ఈ ప్రపంచంలో తన కంటే గొప్ప వాడు లేడు' అని అనుకునేవాడతను. సహజంగానే అట్లాంటి రాజులకు యుద్ధం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. ఒకసారి పొరుగు దేశం మీద యుద్ధం చేయాలని ప్రకటించాడు శూరసేనుడు.  ఆ దేశం వాళ్ళు ఇతన్ని ధైర్యంగా ఎదుర్కొన్నారు కానీ, చివరికి ఇతనే గెలిచాడు. దాంతో శూరసేనుడి అహంకారానికి పట్ట పగ్గాలు లేకుండా అయింది. అతను చేయించిన ఆ యుద్ధంలో అనేకమంది సైనికులు మరణించారు; వారి కుటుంబాలన్నీ‌ వీధిన పడ్డాయి. అయినా యుద్ధోన్మాదంలో మునిగిన శూరసేనుడికి, 'సైనికులు తనవారు' అనే ఆలోచనే లేదు! 'తను గెలవాలి' అనే పట్టుదల వల్ల, ప్రజలు, సైనికులు అందరూ పరాయి వాళ్ళే అయ్యారు!  ఒక రోజున అతను ఎప్పటిమాదిరే గుర్రం ఎక్కి అడవికి బయలుదేరి పోయాడు, వేటాడేందుకు. అసలైతే రాజులు ప్రజల సమస్యలను వినాలి; వాటిని పరిష్కరించాలి. ఇప్పుడు క్రూరమృగాల సమస్యలేమీ లేవు: అయినా శూరసేనుడి తీరు అంతే. అడవిలో అతనికి జింకలు, కుందేళ్ళు మాత్రం ఎదురయ్యాయి. అవన్నీ తనని చూసి బెదిరి పరుగు పెడుతుంటే, అతని చేతులు దురద పెట్టాయి. చివరికి ఓ కుందేలుని చంపేందుకు బాణాన్ని ఎక్కుపెట్టాడు. అంతలో అతనికి కళ్ళు తిరిగినట్లు అయింది. ఎవరో ఋషి వచ్చాడు- ఎక్కడినుండో, మరి?! "కుందేలుని చంపద్దు!" అన్నాడు. "ఇది నా రాజ్యం; ఇక్కడ నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను- నువ్వెవరు, నన్ను ఆపడానికి?" అన్నాడు రాజు, ఆవేశంగా. ఋషి నవ్వాడు. "ఆలోచించు. నీ రాజ్యంలో ప్రజలంతా నిజానికి నీ పిల్లలే. ఇక్కడి జంతువులన్నీ నిన్నే నమ్ముకొని జీవిస్తై. ప్రజల్ని వేధించటం, జంతువుల్ని చంపటం- అదేం గొప్ప?" అన్నాడు. అయినా శూరసేనుడి మనసు మారలేదు. "ప్రక్కకు జరుగు. లేకపోతే బాణం నీకే తగుల్తుంది" అన్నాడు.  "ఇదిగో, నా మాట వినకపోతే నీకు పుట్ట-బోయే పిల్లలు పందుల వలే పుడతారు" అన్నాడు రుషి. శూరసేనుడు గట్టిగా నవ్వేసి, “చూద్దాం" అంటూ కుందేలుని చంపేసాడు! అతను రాజధానికి తిరిగి వెళ్ళే సరికి 'రాణికి కవల పిల్లలు పుట్టారు' అని వార్త వచ్చింది. వెంటనే రాజు ఉత్సాహంగా ప్రసూతి గృహం వైపుకు వెళ్ళాడు- రాణిని పలకరించేందుకు, తన పిల్లల్ని చూసేందుకు! తీరా చూస్తే ఆ పిల్లలు ఇద్దరూ రెండు చిట్టి చిట్టి పంది పిల్లల్లాగా ఉన్నారు! శూర సేనుడికి మతి పోయింది. గిర్రున వెనక్కి తిరిగి తన ప్రాసాదానికి వెళ్ళిపోయాడు. అయినా అతని మనసు మనసులో లేదు: "తన పిల్లలు అలా ఉండేందుకు వీల్లేదు. ఎందుకు అవుతారు, అలాగ?!” మళ్ళీ ఓసారి ప్రసూతి గృహానికి వెళ్ళి చూసుకున్నాడు.    నిజమే-” రెండు చిట్టి చిట్టి పంది పిల్లలు!- "కుదరదు- అవి అట్లా ఉండే వీల్లేదు!” అని అతని మనసు అరిచింది. ఆవేశం వచ్చింది. చర్రున కత్తి దూశాడు. పంది పిల్లల్ని రెండిటినీ చేత్తో పట్టి ఎత్తాడు- చంపేద్దామని. కానీ వాటి ముఖాల్లో అతనికి తనే కనిపించాడు. వాటి కళ్లలో తన రాణి! శూరసేనుడి కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. కత్తి అతని చేతిలోంచి జారి పడింది... తెలివి వచ్చేసరికి శూరసేనుడు ఇంకా అడవిలోనే ఉన్నాడు- రాజ్యానికి పోనే లేదు, ఇంకా! అతని కళ్ళ ఎదురుగానే కుందేళ్ళు చెంగు చెంగున ఎగురుతున్నాయి, జింకల గుంపులు పోతున్నాయి నిర్భయంగా. అతని చేతిలో‌ని ధనుర్బాణాలు క్రింద పడి ఉన్నాయి. చిత్రంగా, ఇప్పుడు ఆ జంతువులన్నిటిలోనూ తన ప్రతిబింబం కనిపిస్తోంది అతనికి. వాటిని వేటాడాలనే ఆలోచనే లేదు అతనిలో. అతనిక నిద్రలో ఉన్నట్లే వెనక్కి తిరిగి వచ్చాడు రాజ్యానికి. "జయము జయము మహారాజా! మన రాజ్యానికి యువరాజుల వారు పుట్టారు! చంద్రబింబం లాంటి ముఖం! అచ్చుగా తమరి పోలిక!" అని సంతోషంగా స్వాగతించారు పురోహితులు. ప్రజలంతా ఆ సరికే పండుగల్లో మునిగి ఉన్నారు!    శూరసేనుడు వెళ్ళి రాణిని, కొడుకును చూసి వచ్చాడు. కొడుకు పందిలాగా లేడు- మామూలుగానే ఉన్నాడు- చాలా అందంగా, అచ్చు తన లాగానే! కానీ ఎందుకనో, తనే, పూర్తిగా మారిపోయాడు... తన అహం ఏదో కరిగిపోయింది! శూరసేనుడికి ఇప్పుడు ప్రజలందరిలోనూ స్వయంగా తనే కనిపిస్తున్నాడు! పూర్తిగా ప్రజల మనిషి అయిపోయాడు అతను. అటుపైన అతను తన సంపదని యావత్తూ కేవలం ప్రజల మేలు కోసమే వినియోగించి 'మంచి రాజు' అనిపించుకున్నాడు.  - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

రాణి కడుపులో చేప

రాణి కడుపులో చేప   అనగనగా ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు. అతనికి ఒకభార్య. వాళ్ళకు ఎన్నిరోజులైనా పిల్లలు కలుగలేదు. అందుకు వాళ్ళు రోజూ ఏడుస్తూ ఉండేవాళ్ళు. ఒక రోజున చాలా చేపలు వచ్చాయి అమ్మకానికి. అన్నీ చనిపోయి ఉన్నాయి; కానీ వాటిలో ఒక చేప మాత్రం బ్రతికే ఉంది. రాణి ఆ చేపను చూడగానే మళ్ళీ ఏడ్చింది. "దేవుడా! ఈ చేపనైనా నా కడుపులో వెయ్యరాదా?" అని. చేపలు వెళ్ళిపోయిన మూడు నెలల తర్వాత రాణి గర్భవతి అయ్యింది. రాణి గర్భవతి అయ్యిందని దండోరా వేశారు. అందరూ చాలా సంతోష పడ్డారు. చివరికి రాణికడుపులో చేప పుట్టింది! "దేవుడా! చేప వెయ్యమంటే చేపే వేస్తావా!" అని రాణి కుళ్లి , కుళ్లి ఏడ్చింది. ఆ చేపకు "చేపన్న" అని పేరు పెట్టుకొనింది. అప్పటి నుండి ఆ చేప రోజు రోజుకూ లావైంది. ఒకరోజున రాణి రాజుతో "ఏమండీ! మన బాబు లావవుతున్నాడు. ఇప్పుడు మన బాబు కోసం ఒక బంగారు బావి కట్టించాలి. కట్టించాక మన బాబుని అందులో ఉంచి రావాలి" అన్నది. రాజు చేపకోసం బంగారు బావిని కట్టించి, చేపన్నను అందులో వదిలాడు. ప్రతి రోజూ ఒక కూలివాడు చేపన్నకు అన్నం తీసుకువెళ్ళేవాడు. ఒకరోజున చేపన్న అన్నం తింటూ అడిగింది- "ఇవాళ్ల ఊళ్ళోంచి ఏదో శబ్దం వస్తున్నది- ఏంటి అది?" అని. అప్పుడు కూలివాడు "చేపన్నా! నీ అంత వయసు ఉన్న వాళ్లకు పెళ్లి జరుగుతున్నది ; నీకేంటి, ఇంకా పెళ్లికాలేదు?" అన్నాడు నవ్వుతూ. వెంటనే చేపన్నకు కోపం వచ్చేసింది-"ఒరే, నాకు గాని రెండు రోజుల్లో పెళ్ళి చేయకపోతే నేను వచ్చి కనబడ్డవాళ్లనల్లా మింగేస్తా. మీ రాజు,రాణిలతో చెప్పు, ఈ సంగతి. ఫో, త్వరగా" అని బెదిరించింది వాడిని. కూలివాడు ఈ సంగతి రాజు,రాణిలతో చెప్పే సరికి, వాళ్ళిద్దరికీ చాలా దిగులు పట్టుకున్నది. ఎలాగైనా చేపన్నకు తగిన భార్యను వెతకాలని గుర్రమెక్కి బయలుదేరాడు రాజు. అట్లా ఆయన గుర్రం ఎక్కి, గోతం నిండా బంగారు నాణాలు వేసుకొని వెళ్తూ ఉంటే ఒకాయన ఎదురయ్యాడు. "ఎక్కడికి వెళ్తున్నారు, రాజుగారూ?" అని అడిగాడు. "చేపన్నకు తగిన భార్య కోసం వెతుకుతున్నాను" అన్నాడు రాజు. అప్పుడు అతను అన్నాడు- "ఎక్కడికో ఎందుకు రాజుగారూ! నాకు ఇద్దరుకూతుర్లు ఉన్నారు. వాళ్లలో పెద్ద అమ్మాయిని ఇస్తాను" అని.   పెద్దలంతా కలిసి చేపన్నకు ఆ పాపను ఇచ్చి పెళ్లి చేశారు. అప్పటి నుండి ఆ పాపే, చేపన్నకు అన్నం తీసుకువెళ్ళేది. ఒక రోజున ఆమె అన్నం తీసుకువెళ్తుంటే దారిలో ఆలస్యం అయ్యింది. ఆమె చేరుకునేసరికి చేపన్నకు చాలా ఆకలైపోయింది. "ఏమిటే, ఇంతలేటు? నాకు చాలా ఆకలిగా ఉంది" అని అంటూనే ఒక్క సారిగా ఆమెను తినేసింది చేపన్న! ఎంతసేపటికీ ఆమె ఇంటికి రాకపోవడంతో ఇంట్లోవాళ్ళు కంగారుపడ్డారు. అయితే ఎంత వెతికినా ఆమె కనబడలేదు. మరుసటి రోజు నుండీ కూలివాడిని అన్నం తీసుకుపొమ్మన్నారు మళ్ళీ. మరుసటి రోజున కూలివాడు అన్నం తీసుకుపోయాడు; కానీ చేపన్న తినలేదు- "నాకు ఇప్పుడు అన్నం వద్దు. ఇంకో పెళ్ళి కావాలి. చెయ్యకపోతే ఆ పాపను మింగినట్లే మిమ్మల్నందరినీ మింగుతా" అన్నది.  ఆ విషయం కూలివాడు రాజుతో చెప్పాడు. రాజు గుర్రం ఎక్కి గోతం నిండా బంగారు నాణాలు వేసుకొని పోతూఉంటే అంతకు ముందు కనబడిన వ్యక్తే మళ్లీ కనపడ్డాడు. "ఏమి జరిగింది రాజుగారూ?" అంటే అప్పుడు రాజుగారు జరిగిందంతా చెప్పాడు. ఆయన ఆ బంగారునంతా చూసి "నాకు రెండో కూతురు ఉంది కదా! ఆ కూతుర్ని నీ కోడలిగా ఇస్తానులే" అన్నాడు. చేపన్నకు, ఆ పాపకు మళ్ళీ పెళ్లి అయ్యింది. మరుసటి రోజు ఆ అమ్మాయి చేపన్నకోసం అన్నం తీసుకొని వెళ్తూ దారిలో రాయి మీద కూర్చొని ఏడవటం మొదలు పెట్టింది. ఆ సమయంలోనే ఆకాశంలో శివుడు, పార్వతి ఎక్కడికో పోతూ ఉన్నారు. "అక్కడ చూడు! కింద ఎవరో ఏడుస్తున్నారు" అని వాళ్లిద్దరూ కిందికి వచ్చారు. "ఎవరమ్మా నువ్వు?" అని అడిగాడు శివుడు. ఆ అమ్మాయి పలకలేదు. అప్పుడు శివుడు "నువ్వు భూతానివా, దయ్యానివా, పిలిస్తే పలకవెందుకు?" అని అడిగాడు. "లేదు! నేను మనిషిని!" అని పెద్దగా అరిచింది ఆ పాప. "మరి ఎందుకు అలా ఏడుస్తున్నావు, చెప్పు?" అన్నాడు శివుడు. ఆమె జరిగిందంతా చెప్పింది. "అలాగా! ఇదిగో పాపా! ఈ ఇసుక తీసుకొని ఆ చేపన్న మీద మూడు సార్లు చల్లు" అని శివుడు, పార్వతి ఆ పాపకు కొంత ఇసుక ఇచ్చి మాయమయ్యారు.   అప్పుడు ఆ అమ్మాయి రాయి మీద నుండి లేచి చేపన్న దగ్గరకు పోయింది. "ఏంటే ఇంత ఆలస్యంగా వచ్చావు. నాకు చాలా ఆకలిగా ఉంది " అని అరిచింది చేప. ఆ పాప మాట్లాడకుండా దానికి అన్నం పెడుతూ శివుడు ఇచ్చిన ఇసుకని దానిమీద మూడుసార్లు పోసింది. దాంతో ఆ చేపన్న కాస్తా మనిషిగా మారిపోయాడు! వాడి బుద్ధికూడా మారిపోయింది! అప్పుడు అమ్మాయి చాలా సంతోషించింది. రాజు రాణి, అందరూ కూడా చాలా సంతోషపడ్డారు. ఆ తర్వాత అందరూ సుఖంగా జీవించారు. - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

విశ్వసనీయత

విశ్వసనీయత     అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి ఫకీర్‌ అనే ఒక స్నేహితుడు ఉండేవాడు. ఫకీర్‌ అంటే రాజుకి చాలా ఇష్టం. అతని పట్ల ఎనలేని ప్రేమాభిమానాలు చూపేవాడు. ఒకసారి మిత్రులు ఇద్దరూ వేటకు వెళ్ళారు. జంతువుల్ని వెంటపడి తరమటంలో వాళ్లిద్దరూ తమ పరివారం నుండి దూరం పోయి, ఎక్కడో తప్పిపోయారు. ఆ సంగతి తెలిసే సరికి వాళ్ళిద్దరికీ‌ బాగా దప్పిక, ఆకలి అవుతున్నాయి. దగ్గర్లో నీళ్ళు దొరికే అవకాశం ఏదీ కనిపించలేదు. అయితే దగ్గరలోనే పెద్ద చెట్టు ఒకటి కనిపించింది. వాళ్ళిద్దరూ‌ మెల్లగా ఆ చెట్టు క్రిందికి చేరుకున్నారు. చెట్టైతే పెద్దగా ఉంది గానీ, అదేం చెట్టో తెలియదు. దానికి పెద్దగా కాయలూ లేవు, ఒకే ఒక్క కాయ ఉంది, చెట్టు మొత్తానికీ. "ఈ చెట్టు మీద పక్షులు పెద్దగా ఉన్నట్లు లేదు" అన్నాడు ఫకీర్. "అవును. దీని క్రింద పడుకుంటే పక్షుల రెట్టల సమస్య ఉండదు" నవ్వాడు రాజు "కొంచెం ఆ కాయ ఏమైనా అందుకోగలవేమో, ప్రయత్నించరాదూ?" అన్నాడు.     వెంటనే ఫకీర్ గుర్రం ఎక్కి, కొంచెం శ్రమపడి, ఆ కాయని అందుకున్నాడు. దాన్ని నిశితంగా పరిశీలిస్తూ "ఈ‌ కాయ ఏదో‌ వింతగా ఉన్నది మిత్రమా! తినచ్చో తినకూడదో తెలీదు" అన్నాడు. రాజు దాన్ని అందుకొని, తన కత్తితో దాన్ని ఆరు ముక్కలుగా కోశారు. "తిని చూద్దాం, ఏ కొంచెం‌ బాగున్నా తినచ్చు. నాకు మటుకు చాలా ఆకలిగా ఉన్నది" అంటూ అలవాటు ప్రకారం ఫకీర్‌కు ఒక ముక్కను ఇచ్చాడు. ఫకీర్‌ గబుక్కున దాన్ని నోట్లో‌ వేసుకొని, వెంటనే "ఆహా! ఎంత తియ్యగా ఉంది ఈ పండు! నా జీవితంలోనే ఇంత తియ్యటి పండును తినలేదు! ఇంకో ముక్క ఇవ్వండి!" అని అడిగాడు. రాజు ఇచ్చాడు. అది తిన్నాక మరోకటి , ఆ తరువాత మరోటి... అట్లా ఐదు ముక్కలు తినేసి, మిగిలిన ఆ ఒక్కటి కూడా అడిగాడు ఫకీర్. రాజుగారు నవ్వారు. "ఫకీర్! బలే స్వార్థమబ్బా, నీది! నా మీద నీకు ఏ కొంచెం అన్నా ప్రేమ ఉందనుకున్నాను గానీ, అట్లాంటిదేమీ లేదని బలే నిరూపించు-కున్నావు. ఇస్తున్న కొద్దీ తీసుకుంటూనే పోతున్నావు కదా?! నాకంటూ ఒక్క ముక్కకూడా‌ మిగిల్చేట్లు లేవేం! నాకు కూడా ఆకలిగానే ఉంది- ఇది నాదే" అంటూ చటుక్కున ఆ ముక్కను నోట్లో వేసుకున్నాడు. కానీ ఆ కాయ తినేట్లే లేదసలు! ఘోరమైన రుచి, భయంకరమైన వాసన- 'తింటే ఏమైపోతామో!' అన్నట్లు ఉన్నది. రాజు వెంటనే దాన్ని ఉమ్మేసి "ఎందుకు, అబద్ధం ఎందుకు చెప్పావు? ఇంత చేదుగా ఉన్న కాయను 'తియ్యగా ఉంది' అని ఎందుకన్నావు? పైగా గడ్డు చేదుగా ఉన్నా, అన్ని ముక్కలు తిన్నావు!" ఆశ్చర్యపోతూ అడిగాడు ఫకీరును.   "తమ చేత్తో ప్రేమగా ఇచ్చిన పండుని బాలేదని తమర్ని నొప్పించబుద్ధి కాలేదు మహారాజా! అంతేకాక, తమరు బాగా దప్పిగొని ఉన్నారు; ఆకలిగా కూడా ఉన్నారు. నేను తినకుండా ఆపితే తమరు తింటారు. అడవి పళ్ళు- ఏది మంచిదో, ఏది విషపూరితమో కనుక్కునేందుకు ఒక పరీక్ష, వాటిని పక్షులు తింటున్నాయా, లేదా అనేది. ఈ చెట్టుమీద పక్షులు కూడా నివాసం లేవు కదా, అందువల్ల అనుమానం వచ్చింది" అన్నాడు ఫకీర్ ఆప్యాయంగా. అయితే ఆ సరికే అతని ముఖ కవళికల్లోను, మాట లోను తేడాని గమనించిన రాజు వెంటనే అతన్ని తీసుకొని ఆఘమేఘాలమీద రాజ్యం చేరుకున్నాడు. అక్కడ రాజవైద్యుల పర్యవేక్షణలో వారిద్దరి ఆరోగ్యం త్వరలోనే మెరుగైంది. అటుపైన రాజు తెలివి, విశ్వసనీయత ఉన్న ఫకీరును తన ఆంతరంగికుడుగా నియమించుకొని, అనేక సంవత్సరాలపాటు చక్కగా రాజ్యాన్ని పాలించాడు.   - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

జింక రాజు కథ

జింక రాజు కథ   బ్రహ్మదత్తుడు కాశీ రాజ్య పీఠాన్ని అధిరోహించకముందు యువరాజుగా విలాస జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. అతనికి ఉండే వ్యసనాల్లో ఒకటి, వేట. కాశీ యువరాజుకి కొంత సమయం చిక్కిందంటే చాలు, వేటాడేందుకు అడవిలోకి పోయేవాడు. ధనుర్బాణాలు ధరించి, గుర్రాన్నెక్కి కాలయముడిలా సంచరించే బ్రహ్మదత్తుడిని చూస్తే అడవిలోని జంతువులన్నీ వణికి పోయేవి. అతని వల్ల జంతువులన్నిటిలోనూ ఎక్కువ నష్టపోయింది జింకలు. కాశీ రాజ్యానికి ఉత్తరాన ఉన్న అడవుల్లో లెక్కలేనన్ని జింకలు ప్రశాంతంగా జీవించేవి. ఇప్పుడవన్నీ భయంతో బక్కచిక్కిపోసాగాయి. వాటన్నిటికీ రాజుగా ఉండిన బోధిసత్త్వుడు ఒకనాడు తోటి జింకలన్నిటినీ సమావేశపరచి, "మిత్రులారా, అనేక తరాలుగా మనవాళ్లంతా ఎలాంటి దురవస్థలూ లేక సుఖంగా జీవించటానికి అలవాటుపడి ఉన్నారు. మన శరీరాలన్నీ బాగా క్రొవ్వు పట్టినై, ఎముకల సంధులు కావలసినంత చురుకుగా కదలటం లేదు. ఇప్పుడు యీ కాశీ యువరాజు పేరిట ఆపద ముంచుకొచ్చే సరికి, మనం అతని బాణాలకు సులభంగా చిక్కుకుంటున్నాం. అందువల్ల మనందరం మన శరీరాలను బాగుచేసుకోవాలి; మన చురుకుదనం పెంచుకోవలసి ఉన్నది. అయితే బ్రహ్మదత్తుని తీరు చూస్తే ఆ లోగానే మనం ఎవ్వరం మిగలని పరిస్థితులు ఎదురవుతామేమో అనిపిస్తున్నది. ఉత్తమ సంస్కారాలను అనేకాన్ని ప్రోది చేసుకున్న కారణంగానే యీ బ్రహ్మదత్తు కాశీ యువరాజుగా జన్మించాడు. అయితే ఏనాటి దుష్ట కర్మలో అతన్ని యీ మారణ పర్వంలో భాగస్వామిని చేస్తున్నాయి. అతనిలో కరుణ బలపడితే తప్ప మన కష్టాలు పూర్తిగా తీరవు. దానికై మనం పెను త్యాగాలకు సిద్ధమవ్వాలి. మీరంతా సరేనంటే నేను అతనితో మాట్లాడతాను" అన్నది. జింకలన్నీ సమ్మతించిన మీదట, ఆరోజు వేటకై బయలుదేరిన బ్రహ్మదత్తుడికి అడవి అంచునే ఎదురేగి, ప్రేమ పూరితమైన స్వరంతో, మానవ భాషలో- "యువరాజా! నీ బలసంపదకు ఎదురొడ్డి నిలువలేని జింకల సమూహం కొద్ది నెలల్లోనే, నీ ప్రతాపం వల్ల వందల సంఖ్యకు చేరుకున్నది. మిగిలి ఉన్న జింకలు కూడా తమ జీవన క్రియలన్నిటినీ ప్రక్కన పెట్టి భయంతో ముడుచుకొని పోయాయి. ఇదే గనక కొనసాగితే ఇక యీ అడవులలో జింక అన్నదే కనిపించకుండా పోతుంది. అందువల్ల నువ్వు మా మీద దయ చూపాలి. మమ్మల్ని వధించరాదు" అన్నది. బ్రహ్మదత్తుడు దాని మాటలకు నవ్వి "ప్రభువులు మృగయా వినోదులు. కాబట్టి నన్ను వేటాడవద్దనే అధికారం మీకు లేదు. అయితే మీరంతా మా రాజ్యంలోని ప్రాణులు- కనుక మీ కోరికని నేను మనసులో పెట్టుకుంటాను- అయితే దాని వల్ల నాకేమి లాభం?" అన్నాడు.   "ఏ ప్రాణి పట్ల అయినా మీ మనసులో ఉదయించే కరుణ మీకు ఎనలేని మేలు చేస్తుంది. ప్రభువులైన తమకు మాబోటి అల్పజీవులు చేయగల మేలు అంతకంటే ఏముంటుంది?" అన్నది జింకరాజు. "అలా కాదు. నేను మీ జాతినంతటినీ ఏమీ చేయకుండా వదులుతాను. మీరు నిశ్చితంగా బ్రతకవచ్చు. అయితే దానికి బదులుగా, మీలో రోజుకొకరు నాకు ఆహారం అవుతూ ఉండాలి. అది మీ జాతి పట్ల మీకున్న నిబద్ధతను సూచిస్తుంది; నేను ఇచ్చిన మాటను కూడా నాకు ఏరోజుకు ఆరోజు గుర్తు చేస్తుంటుంది" అన్నాడు బ్రహ్మదత్తుడు. జింకల రాజు మిగిలిన జింకలకేసి జాలిగా చూసింది. అవి సమ్మతిస్తూ తలలు ఊపిన మీదట, అది బ్రహ్మదత్తుడికి తమ అంగీకారాన్ని తెలియజేసింది. ఆ రోజునే జింకలన్నీ వంతులు వేసుకున్నాయి; రోజుకొక జింక చొప్పున యువరాజుకు ఆహారమౌతూ వచ్చింది. ప్రతిరోజూ ఒక జింకను అడవి అంచున నిలిపే బాధ్యత జింకరాజుది. జింకల జీవితాలు త్వరలోనే సాధారణ స్థితికి చేరుకున్నాయి. ఎటొచ్చీ రోజుకు ఒక జింక నిశ్శబ్దంగా అదృశ్యం అయిపోయేది. అయితే మిగిలిన జింకల్లో నిర్భయత పెరిగింది; అవి తిరిగి బలం పుంజుకున్నాయి; వాటి శరీరాలు చురుకుగా తయారయ్యాయి. జింకల సంతతి తిరిగి పెరగనారం లభించింది. ఆ సమయంలో ఒకసారి యువరాజుకు ఆహారంగా వెళ్లే వంతు ఒక ఆడ జింకదైంది. అది ఆ సమయంలో నిండు గర్భిణి. 'తన పిల్లను యీ లోకంలోకి తెచ్చే ముందుగానే తన జీవితం ముగియనున్నదే' అని దానికి చాలా దు:ఖం వచ్చింది. దాన్ని అడవి దాటించేందుకు వచ్చిన జింకరాజుకు దాని దు:ఖం అర్థమైంది-"జింకల సంతతిని తిరిగి వృద్ధి చేసేందుకు గదా, యువరాజుతో ఇటువంటి ఒప్పందం కుదుర్చుకున్నది? ఇప్పుడు ఇలా నిండు గర్భిణిని అతనికి ఆహారంగా పంపటం ఎంత తెలివి తక్కువ పని?!" అని ఆలోచించి, దాన్ని ఊరడిస్తూ "తల్లీ! వంతును మళ్లీ ఏదో ఒకనాటికి మార్చుకుందువు. ఇవాల్టికి ఏదో ఒక విధంగా ఆ ఖాళీని భర్తీ చేస్తాను. నువ్వు పో!" అని దాన్ని వెనక్కి పంపించేసింది. ఆనాడు స్వయంగా తనకు ఆహారం అయ్యేందుకు వచ్చిన జింకరాజును చూసి బ్రహ్మదత్తుడికి చాలా ఆశ్చర్యం వేసింది. "ఏంటి ఇది? ఇవాళ్ల నువ్వే వచ్చావెందుకు? మిగిలిన జింకలేమైనాయి?" అని అడిగాడు దాన్ని. జింకరాజు అతనికి జరిగిన సంగతిని వివరించి, "రాజా! నేను లేకున్నా మా జాతి వారు తమ మాట తప్పరు. నువ్వు నిశ్చింతగా నన్ను చంపవచ్చు; ఏమీ పర్వాలేదు" అన్నది. "కాదు, నువ్వు వెళ్లి వేరే జింకను దేన్నైనా పంపు. నిన్ను చంపటం నాకెందుకో ఇష్టం కావట్లేదు" అన్నాడు బ్రహ్మదత్తుడు, కలవరపడుతూ. జింకరాజు నవ్వి "యువరాజా! శరీరం అంటూ ఒకటి ఉన్నప్పుడు దానికి కష్టాలు తప్పవు. చిన్నతనంలోను, యౌవనంలోను, మధ్య వయస్సులోను, ముసలితనంలో కూడాను ఎక్కడి దు:ఖం అక్కడ, ఉండనే ఉన్నది. రాజైన వాడు దు:ఖాన్ని అధిగమించి ఇతరులకు మార్గదర్శకుడు కావాలి తప్ప, తన శరీర రక్షణ కోసం ప్రజలను బలి చెయ్యకూడదు." అన్నది.     ఆ క్షణంలోనే యువరాజులో అనంతమైన పశ్చాత్తాపం నెలకొన్నది. "రాజ ధర్మాన్ని నిలుపుకునేందుకు సాధారణమైన జింక ఒకటి తన ప్రాణాలను అలవోకగా త్యజించబోయిందే, మరి తను? ఇన్ని ప్రాణులకు ప్రభువైన తను నిస్సిగ్గుగా ఆ ప్రాణులను ఎలా హింసిస్తున్నాడు, ఇన్నాళ్లుగా?! నిజానికి వాటిని అన్నిటినీ కాపాడవలసిన బాధ్యత తనదే; తను 'వేట' అనే యీ కౄరకర్మలో ఎందుకు కూరుకుపోయాడు?” తక్షణం అతనిలో హృదయ పరివర్తన కలిగింది. జింకరాజులో బోధిసత్త్వుడిని దర్శించిన యువరాజు దాని ముందు మోకరిల్లాడు. అటుపైన అతను ఇక ఏనాడూ వేటాడలేదు; జంతువుల్ని హింసించలేదు!!   - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

చేసిన మేలు

చేసిన మేలు     అనగనగా ఒక అడవిలో ఒక కాకి, ఒక కోయిల ఉండేవి. అడవిలోని ఒక వృక్షం మీద వాటి నివాసం ఉండేది. ఒకరోజున వాటికి చాలా ఆకలైంది. ఆహారం కోసం అడవి అంతా గాలించాయి. ఎంత వెతికినా తినేందుకు ఏమీ దొరకలేదు. తిరిగి తిరిగి పాపం, అవి బాగా అలసిపోయాయి కూడా. దాహంతో వాటి నోరు పిడచబారింది. "ఇక లాభం లేదు- ఈ పూటకు నీటితోటే కడుపు నింపుకుందాం!' అని అనుకునే సరికి అవి అడవిని దాటి జనావాసాలను చేరుకొనేసాయి! అది మండు వేసవి.    ఊరిలో కూడా ఏ మూలనా నీటి జాడ లేదు. మనుషులుండే గుడిసెలలోకి పోయి వెతికేంత చొరవ వీటికి లేదు! ఆ సరికి అవి రెండూ చాలా అలసి పోయాయి. అంతలో కొంత దూరాన మంచి చేను ఒకటి కనబడింది.  రెండూ ఆ చేనును చేరుకునేసరికి కోయిల మరింత నీరసించింది. ఇక దానికి అడుగు తీసి అడుగు వేసేంత బలం కూడా లేదు. ఉండిన చోటనే కూలబడిపోయింది.    కాకి ఒంటరిగా చేనులోకి పోయింది. చేనులో దూది విరగకాసి ఉండింది. కానీ‌ నీరు ఏ మూలనా పారటం లేదు- బిందు విధానం వలన! అయితే బోరుబావి కాడ నీరు కొంచెం కొంచెంగా కారుతూ ఉండింది!  కాకి ఆ తావును చేరి, తాను గబగబా కాసంత నీరు తాగేసి కడుపు నింపుకుంది. 'మరి కోయిలకు నీరు తీసుకొని పోయేది ఎలాగ?' అని ఆలోచించింది. అంతలో దాని చూపు దూది మీద పడింది. గబగబా పోయి, కొంత దూదిని సేకరించి, దానిని నీటిలో తడిపింది. తడి దూదితో ఎగిరి కోయిలను చేరింది. కోయిల మన సోయిలో లేదు.    కాకి తడి దూదిని దాని ముఖం మీద వేసి పిండింది. ఇలా రెండు మూడు తడవలు అటూ ఇటూ తిరిగి, తడి దూదిని తీసుకొని పోయి వేసే సరికి, ఆ తేమకు కోయిల కొంచెం కదిలింది. కోయిల కనులు తెరిచేసరికి కాకికి చాలా సంతోషం వేసింది. అది ఇంకో మూడు వరుసలు తిరిగి మరింత తడి దూదిని తీసుకుపోయింది.   అమృతం లాంటి ఆ నీటి బిందువుల వలన కోయిల తేరుకొనింది. సంతోషంతో వాటికి సగం బలం సమకూరింది. ఇక అవి నిదానంతా చేనులోని బోరుబావిని చేరుకొని, కడుపులు నింపుకుని, కొంత సేపు సేద తీరాయి. చేనులో‌ కాకికి తొండ లాంటిది ఒకటి దొరికింది కూడా. తనకు దొరికిన తిండిని అది కోయిలతో కూడా పంచుకొనింది.    సాయంకాలం అవుతుండగా కాకి, కోయిల రెండూ తిరిగి కాసిని నీరు తాగి, వెనుకకు మరలాయి. 'కలసి ఉండటం వలననే కదా, ఇవి తిరిగి రాగలిగింది?' అని అడవిలోని పక్షులు సంబరపడినాయి. 'కాకులు ఎలాగైనా చాలా తెలివైనవి' అని అభినందించాయి. 'ఇకమీద చాలా దూరాలు ఎగరకండి' అని తమ కూనలకు బోధించాయి.    - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

పావురం చెప్పిన పాఠం

పావురం చెప్పిన పాఠం   అనగనగా ఒక ఊరి శివాలయంలో చాలా పావురాళ్ళుండేవి. అవన్నీ అక్కడ చాలా సంతోషంగా‌ బ్రతికేవి. అయితే ఒకసారి ఆ గుడికి కుంభాభిషేకం చేసే సమయం దగ్గరయింది. అభిషేకం కోసం ఆలయాన్ని శుభ్రం చేయటం మొదలు పెట్టారు. చాలామంది పనివాళ్ళు వచ్చారు. బూజు దులిపే కట్టెలు, చీపుర్లు పట్టుకొని ఎక్కడెక్కడి బూజూ దులపసాగారు. పక్షుల గూళ్ళను తొలగించటం మొదలు పెట్టారు. పావురాళ్ళకు చాలా కష్టమైంది. వాటి గూళ్ళన్నీ పోయాయి. ఇక అక్కడ ఉండటం ఇష్టం కాలేదు వాటికి. శివాలయం ఎదురుగానే ఉన్నదొక చర్చి. పావురాళ్ళన్నీ ఇప్పుడు ఆ చర్చిలోకి వెళ్ళి నివాసం ఏర్పరచుకున్నాయి. చర్చిలోని ప్రశాంత వాతావరణం వాటికి చాలా నచ్చింది. అక్కడ వాటిని బెదిరించేవాళ్ళు, గూళ్లను చెరిపే వాళ్ళు ఎవరూ లేరు. అట్లా‌ అవన్నీ కొంతకాలంపాటు చర్చిలో ప్రశాంతంగా జీవించాయి. అయితే అంతలోనే క్రిస్మస్ పండగ వచ్చింది. చర్చికి సున్నం కొట్టే పనులు మొదలయ్యాయి. పావురాళ్లకు మళ్ళీ కష్టకాలం వచ్చింది. ఇప్పుడు ఎక్కడ ఉండాలో అర్థం కాలేదు వాటికి. అటూ ఇటూ చూసాయి. దగ్గర్లోనే ఉన్న మసీదు కనబడింది. ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉన్న ఆ మసీదు వాటికి అనువుగా తోచింది. ఇక ఇప్పుడు అవన్నీ వెళ్ళి మసీదును ఆశ్రయించాయి. అట్లా మరికొంత కాలం గడిచింది. అంతలోనే రంజాన్ మాసం వచ్చింది. పావురాళ్ళకు మళ్ళీ‌ఇబ్బందులు మొదలయ్యాయి. మళ్ళీ సందిగ్ధంలో పడ్డాయి. చివరకు మళ్ళీ శివాలయంలోకి వచ్చి చేరుకున్నాయి..మునుపటి లాగే జీవించసాగాయి.   అంతలోనే ఏదో కలవరం మొదలైంది. మనుష్యులు ఒకరినొకరు తుపాకులతో కాల్చుకుంటున్నారు- కత్తులతో నరుక్కుంటున్నారు! పావురాళ్ళు గూళ్ళలో నుండి బయటకు వచ్చి చూశాయి. పిల్ల పావురం ఒకటి భయంతో తన తల్లి రెక్కల సందులోకి చేరింది. తల్లి పావురం ఒకటి తన పిల్లలకోసం వెతుక్కొని, వాటినన్నిటినీ ఒక మూలకు తరిమి, తను అడ్డంగా కూర్చున్నది. "ఈ మనుషులకేమైంది, ఇట్లా ఒకళ్ళనొకళ్ళు కాల్చుకుంటూ నరుక్కుంటున్నారు?" అడిగిందొక చిన్న పావురం. "ఈ గుడిలో వాళ్ళు, ఆ చర్చిలో వాళ్ళు, మసీదులోవాళ్ళు 'మేం గొప్ప' అంటే 'మేం గొప్ప' అని కొట్టుకుంటున్నారు. నిజంగా ఎవరు గొప్పో మరి?!" అన్నది వాళ్ళమ్మ. "మరి మనం గుడిలోనూ ఉన్నాం, చర్చిలోనూ ఉన్నాం, మసీదులోనూ ఉన్నాంగా? వాళ్ళందరికంటే- మరి, మనమే గొప్ప అన్నమాట!" అన్నది చిన్నపావురం, ఆలోచిస్తున్నట్లు. "ఔను తల్లీ! మనం అస్సలు కొట్టుకోంగా, అందుకని మనమే గొప్పవాళ్ళం" అన్నది తల్లి పావురం, దాన్ని కూడా తన రెక్కల సందులోకి నెడుతూ. - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

ఎవరి ఆవు..

ఎవరి ఆవు?   చంద్రపురం న్యాయాధికారి శాంతన్న చాలా మంచివాడు, తెలివి తేటలు గలవాడున్నూ. 'ఆయనైతే నిష్పాక్షికంగా తీర్పు చెబుతాడు' అని ఆచుట్టు ప్రక్కల ఊళ్ళలో అందరూ చెప్పుకునేవాళ్ళు. ఒకసారి భటులు ఇద్దరు వ్యక్తుల్ని, ఒక ఆవును ఆయన దగ్గరకు పట్టుకు వచ్చారు. "వీళ్ళు ఇద్దరూ ఈ ఆవు కోసం తగవులాడుతున్నారు ప్రభూ! ఈ మూగ ఆవుకు మాటలు వచ్చి ఉంటే సమస్య తీరిపోయేను; కానీ దానికి మాటలు రావు, వీళ్ళు కొట్లాట ఆపరు! తమరు ఏదో ఒకలాగా వీరి తగాదాను పరిష్కరించాలి" అని విన్నవించుకున్నారు. "ఈ ఆవు నాదేనండయ్యా. తమరు గమనించండి" అన్నాడు సుబ్బయ్య గట్టిగా. "కాదు ప్రభూ! ఇది నాది. పేదవాడిని దయచూడండి. వీడిని నమ్మకండి" అన్నాడు లింగయ్య, మరింత గట్టిగా. శాంతన్న ఒక్క క్షణం ఆలోచించాడు.   "సరే, సుబ్బయ్యా! నువ్వు ఇక్కడ ఉండు. లింగయ్యా, కొంత సేపు బయట కూర్చో" అన్నాడు. లింగయ్య మళ్ళీ ఒకసారి "ఆవు నాదేనండయ్యా!" అని చెప్పి బయటికి నడిచాడు. "సుబ్బయ్యా! నీ ఆవు ఆనవాళ్ళు చెప్పు" అన్నాడు శాంతన్న. "అయ్యా! నా ఆవుకి ఒకసారి వెనుక కాలులో ఎడమవైపున ఇనుప చువ్వ గుచ్చుకుని, పెద్ద గాయం అయ్యింది. గాయమైతే తగ్గింది గానీ మచ్చ అట్లాగే నిల్చిపోయింది" చెప్పాడు సుబ్బయ్య. శాంతన్న ఆదేశం మేరకు భటులు ఆవు కాలుని పరిశీలించారు. నిజంగానే ఎడమ కాలుకు గాయపు మచ్చ ఒకటి ఉంది. "సరిగా ఆనవాలు పట్టావు కాబట్టి, ఆవు నీకే చెందచ్చు. ఐతే ఇదే మాట లింగయ్యను కూడా అడుగుదాం, ముందు" అంటూ లింగయ్యను లోనికి పిలిచాడు శాంతన్న. "లింగయ్యా! నీ ఆవు ఆనవాళ్ళు చెప్పు!" ఆదేశించాడు. "నా ఆవు తోకమీద వరసగా మూడు అడ్డు గీతలు ఉంటాయి ప్రభూ!" అన్నాడు లింగయ్య. భటులు ఆవును పరిశీలించి నిజంగానే ఆవు తోకమీద మూడు అడ్డుగీతలు ఉన్నాయని చెప్పారు. "ఓహో! అయితే ఆవుని ఇద్దరూ బాగానే పరిశీలించి ఉన్నారే!” నవ్వాడు శాంతన్న. "సరే! అయితే సుబ్బయ్యా, ఈ ఆవుని ఇవాల్టికి నువ్వు తీసుకెళ్ళు. మీ ఇంట్లో ఒక రోజు ఉంచుకొని, రేపు ఉదయం మాకు తెచ్చి ఇవ్వు. రేపు లింగయ్య తీసుకెళ్తాడు దీన్ని! ఆలోగా మేం ఆలోచించి, ఇది అసలు ఎవరిదో మర్నాడు తేలుస్తాం" అని చెప్పి ఆ రోజుకు సభను ముగించాడు శాంతన్న. సుబ్బయ్య ఆవుని తోలుకొని వెళ్ళి, మరునాడు ఉదయాన్నే దాన్ని వెనక్కి తెచ్చి ఇచ్చాడు. ఆ వెంటనే లింగయ్య ఆవుని తోలుకెళ్ళాడు. తర్వాతి రోజున సభ ప్రారంభం కాగానే శాంతన్న తీర్పు ఇచ్చేసాడు: "ఆవు సుబ్బయ్యదే" అని!   దాంతో సుబ్బయ్య ముఖం సంతోషంతో విప్పారింది. కానీ లింగయ్య మటుకు ఒప్పుకోలేదు: "అయ్యా! మీరేదో పొరపడి-నట్లున్నారు!‌ మీరు ఈ నిర్ణయానికి ఎలా వచ్చారో తెలియకుండా ఉంది" అన్నాడు బాధగా. శాంతన్న నవ్వి, "చూడు సుబ్బయ్యా! ఆవు మీ ఇద్దరి దగ్గరా చెరొక రోజూ ఉన్నది కదా; నీ దగ్గర వున్న రోజున అది ఉత్సాహంగా లేదు; సుబ్బయ్య దగ్గర ఉన్నప్పుడే ఉత్సాహంగా ఉంది. అదీ గాక, నువ్వు ఆవును పట్టుకెళ్ళాక, దాని అవసరాలకోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసావు: దాన్ని కట్టేసేందుకు గాటం కొత్తగా వేసావు; పలుపు కొత్తది కొన్నావు; నీళ్ళు పెట్టేందుకు మీ ఇంటిలోని బొక్కెనను కూడా కొత్తగానే తీసుకెళ్ళావు. సుబ్బయ్య దగ్గర ఆవుకు కావలసిన వస్తువులన్నీ ముందుగానే ఉన్నాయి.    ఆవు నీదే అయినప్పుడు, దానికి అవసరమైన వస్తువులు నీ దగ్గర ముందుగానే ఉండి ఉండాలి కద, ఇప్పుడు వెతుక్కునే అవసరం ఏముంటుంది?" అన్నాడు. లింగయ్య ముఖం చిన్నబోయింది. అయినా అతను అంగీకరించక, "అయ్యా! తమరు పునరాలోచించాలి. పోయిన లక్ష్మి తిరిగి వస్తున్నదన్న ఉత్సాహంకొద్దీ వస్తువులు కొత్తగా అమర్చాను తప్పిస్తే, ఆవు మటుకు నాదే" అనేసాడు! శాంతన్న ఏదో నిశ్చయించినట్లు, "సరే! నా తీర్పు సరైనదేనని నేను నిరూపిస్తాను. మీరిద్దరూ తలా ఇంత ఎండు గడ్డి చేత పట్టుకొని అటొకరూ, ఇటొకరూ నిలబడండి. కావాలంటే మీ ఆవుని మీరు పేరు పెట్టి పిలవండి" అని ఆదేశించి, ఆవుని వదల-మన్నాడు. ఆవు ఒకసారి ఇరు వైపులకూ చూసి, మెల్లగా సుబ్బయ్య దగ్గరికి చేరుకున్నది! లింగయ్య ముఖంలో నెత్తురు చుక్కలేదు. తన మోసాన్ని అంగీకరించక తప్పలేదతనికి. "'ఈ ఆవు నీది కాదు; సుబ్బయ్యది' అని తేలిపోయింది. ఇతరుల సొమ్మును ఆశించటమే కాక, న్యాయస్థానపు తీర్పు సరైనదైనా, దానిపై అవిశ్వాసం ప్రకటించినందుకుగాను నీకు వంద బంగారు నాణాలు శిక్ష విధిస్తున్నాను. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఆ మొత్తాన్ని చెల్లించలేకపోతే ఏడాదిపాటు కారాగారంలో ఉండాలి" అని తీర్పు చెప్పాడు శాంతన్న. సభికులంతా హర్షధ్వానాలు చేసారు. - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

నక్క పాట

నక్క పాట       అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. ఒక రోజున దానికి బాగా ఆకలి వేసింది. ఆహారంకోసం వెతుకుతూ వెళ్ళింది. కొంచెం దూరాన్నే దానికి ఒక కుందేలు పిల్ల కనిపించింది. దాన్ని చూడగానే నక్క నోట్లో నీళ్ళు ఊరాయి. "ఎలాగైనా సరే దానిని పట్టుకొని చంపి తినాలి" అని నిర్ణయించుకుంది అది. కుందేలును పట్టు కుందామని మెల్లగా నక్కుకుంటూ దాని దగ్గరకు వెళ్ళింది. అయితే తెలివైన కుందేలు నక్కను చూదగానే పరుగు అందుకున్నది. నక్క కూడా ఊరుకోకుండా కుందేలు వెంట పడింది. సరిగ్గా ఆ సమయంలోనే కుందేలుకు ఏనుగుల గుంపు ఒకటి అడ్డం వచ్చింది- వాటిని తప్పించుకొని ఎటుపోవాలో తెలీక గందరగోళ పడి, అది కాస్తా నక్కకు దొరికి పోయింది. నక్క వగరుస్తూ, చొంగ కార్చుకుంటూ దాన్ని ఎత్తి పట్టుకొని, "నీ చివరి కోరిక ఏమిటో కోరుకో!" అని కుందేలును అడిగింది వెటకారంగా. కుందేలు ఒక్క క్షణం ఆలోచించి, "మరేమీ లేదు. చనిపోయే ముందు ఓ పావు గంట సేపైనా నీ పాట వినాలని ఉంది" అన్నది.     నక్క కొంచెం ఉబ్బిపోయింది; కొంచెం‌ ఆశ్చర్య పడింది. "దీనికి నా పాట వినాలని ఎందుకు, అంత ఉత్సాహం?" అనుకుని, తను ఉత్సాహపడ్డది. మెల్లగా గొంతెత్తి పాడటం మొదలు పెట్టింది. త్వరలోనే దాని ఊళ గొంతు చాలా దూరం వరకూ వినిపించసాగింది. ఆ చుట్టు పక్కల పొలాల్లో ఉన్న రైతులు దాని ఊళ విని "ఇదెక్కడినుండి వచ్చిందో‌ ఇప్పుడు. మన కోళ్ళన్నీ‌ ఇక మనవి కావు! దీని పని పట్టాల్సిందే" అని కట్టెలు పట్టులొని, పరుగున వచ్చారు. గాత్ర కచేరీ చేస్తున్న నక్కను చంపి చక్కా పోయారు. "అబ్బ!‌ బ్రతికిపోయాను" అనుకుంటూ‌ కుందేలు పిల్ల అడవిలోకి పరుగు పెట్టింది!  - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

మర్రిచెట్టు-గడ్డిపోస

మర్రిచెట్టు-గడ్డిపోస   అనగనగా ఒక నది ఒడ్డున పెద్ద మర్రిచెట్టు ఒకటి ఉండేదట. లెక్కలేనన్ని కొమ్మలతో ఘనంగా విస్తరించి ఉండేదట ఆ చెట్టు. అయితే దానికి గర్వం ఎక్కువ. "నేను చూడు, ఎంత పెద్దదాన్నో! వయసులోనూ‌ పెద్దనే; విస్తృతిలోనూ‌ పెద్దనే! నేనే అందరికంటే గొప్పదాన్ని" అనుకుంటూ ఉండేది. రోజూ నది ఒడ్డున పెరిగే చిన్న చిన్న మొక్కలకు అది వినయం గురించి చెప్పేది. "మీరు నాకు రోజూ తల వంచి నమస్కారం చేయాలి. ఎందుకంటే, వయసులో మీరు నాకంటే ఎలాగూ‌ చిన్నవాళ్ళే; అంతేకాక శక్తిలోనూ నాకంటే బలహీనులే! ఎవరి శక్తి యుక్తులను వాళ్ళు గ్రహించి, బలవంతులతో మర్యాదగా మసలుకోవాలి" అనేది. చిన్న మొక్కలు నవ్వి "వయసులో చిన్న అంటే ఒప్పుకుంటాం గాని, వేరే రకంగా మేము నీకంటే ఏమీ తక్కువ కాదు. ఎవరి గొప్పదనం వారికి ఉంటుంది. అయినా అడిగి చేయించుకొనే నమస్కారమూ ఒక నమస్కారమా? మేము నీకు తలొంచేది లేదు" అని వాదించేవి. మర్రి చెట్టుకి కోపం వచ్చేసేది. గబగబా తన కొమ్మల్ని ఊపి ఓ మోస్తరు గాలిని తెప్పించేది. ఆ మాత్రం గాలికే చిన్న మొక్కలు అన్నీ వణికిపోయి తలలు వంచేవి. అది చూసి మర్రి చెట్టు పెద్దగా నవ్వి, "నేను పుట్టించే ఇంత చిన్న గాలికే నిలబడలేకపోయారు మీరు. ఇప్పుడు ఏం చేసారో- తలవంచలేదు కాబోలు!" అని ఈసడించేది.   గడ్డి మొక్కలు కూడా తగ్గక, "అయ్యో! మేము తలలు వంచింది నీకు కాదు- గాలికి! గాలి పట్ల గల భక్తితో తలలు వంచాం, నువ్వు కూడా గాలి దేవుడికి నమస్కరించు! నీ కొమ్మలు వంచి పలకరించు. ఆయన ఆగ్రహానికి గురి అయ్యావంటే తట్టుకోలేవు" అనేవి. "నేను పుట్టించే గాలిని గురించి నాకు చెబుతారా, మీరు! ఊరుకోండి! చిన్న ప్రాణులు చిన్నగా ఉండండి చాలు!" అని ఎగతాళి చేసేది మర్రిచెట్టు. అంతలోనే ఒకసారి పెద్ద తుఫాను మొదలైంది. ఎన్నడూ‌ కనీ వినీ‌ ఎరుగతనంత వేగంగా గాలులు వీచాయి. చిన్న చిన్న మొక్కలన్నీ‌ అల్లాడిపోయాయి. "వంగండి! మరింత వంగండి!" అని ఒకదానితో‌ ఒకటి చెప్పుకున్నాయి.    ఎగతాళిగా నవ్విన మర్రిచెట్టు తన కొమ్మల్ని అన్నిటినీ బిగబట్టుకొని గాలికి ఎదురొడ్డి నిలబడింది. అది ఎంత గట్టిగా నిలబడిందో, గాలి అంత బలంగా నెట్టింది దాన్ని. చూస్తూ చూస్తూండగానే అది కూకటి వ్రేళ్లతో‌ సహా పెకలి పోటెత్తిన నదిలో పడి, అలానే కొట్టుకుపోయింది. ఒదిగిన మొక్కలు తుపాను తర్వాత తిరిగి నిలబడ్డాయి. పొగరెత్తిన మర్రిచెట్టు మటుకు పూర్తిగా కనుమరుగైంది.  - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

బంగారు గరిటె

బంగారు గరిటె   అనగనగా ఒక ఊళ్లో ఒక అవ్వ ఉండేది. ఊరి పొలిమేరల్లో నివసించే ఆ అవ్వను అందరూ ఊరికే 'పేదరాసి పెద్దమ్మ' అని పిలిచేవాళ్ళు; కానీ ఎవ్వరూ నిజంగానైతే ఆ అవ్వను పట్టించుకునేవాళ్లు కాదు. వ్యవసాయం పనులు ఉన్నప్పుడు కూలీగా వెళ్తుండేది అవ్వ. చక్కగా శ్రమపడి నడుం వంచి పని చేసేది. అట్లా వచ్చిన డబ్బులతో ఆదివారం రోజున సంతకు పోయేది; వారానికి సరిపడా సరుకులు తెచ్చుకునేది. పండగ ఉండే వారాల్లో ఎక్కువ సరుకులు- ఎందుకంటే పండగ రోజున ఎవ్వరైనా అవ్వ ఇంటి ముందు నిలబడి అడిగితే లేదనేది కాదు: వాళ్లను ఇంట్లోకి పిలిచి కడుపు నిండా భోజనం‌పెట్టి గానీ‌ పంపేది కాదు. అట్లా ఓసారి అవ్వ తను వారమంతా కష్టపడి కూడబెట్టిన సొమ్ముతో పండగ సరుకులు తెచ్చుకున్నది. ఆ రోజే పండగ. అవ్వ తినేందుకు పులిహోర, రవ్వకేసరి చేసుకున్నది. ఆ రోజంతా ఎవరైనా వస్తారేమోనని ఎదురు చూసింది పాపం. సాయంత్రం వరకూ ఎవ్వరూ రాలేదు గానీ, ఇక చీకటి పడుతున్నదనగా దూరదేశం నుండి ఎవరో పండితుడు ఆకలితో వచ్చి 'తినేందుకు ఏమైనా ఉందా తల్లీ?!' అని అడిగాడు.   అవ్వ ఆయన్ని లోపలికి ఆహ్వానించి తను చేసిన కేసరి పెట్టింది తినేందుకు. కేసరి అంతా తినేసాడాయన. అన్నం పెడితే అంతా అయిపోచేసాడు. పండగకు చేసిన అన్ని పదార్థాలూ తినేసాడు. అయినా ఇంకా ఆయన ఆకలి తీరినట్లు అనిపించలేదు. ఆలోగా అవ్వ తను వారమంతా గడిపేందుకు తెచ్చుకున్న కూరగాయలన్నీ వండింది. ఇంట్లో ఉన్న బియ్యమంతా వండి వార్చింది. మొత్తం ఆయనకు వడ్డించింది. పండితుడు ఆమెకేసి సంతోషంగా చూసి, ఏమి పెడితే అదంతా తినేసాడు గబగబా. పెడితే ఇంకా తినేట్లు అనిపించాడు! అవ్వకి ఇంక ఏం చేయాలో పాలు పోలేదు. ఏమంటే ఆ సరికి ఇంట్లో తను కూడబెట్టుకున్న సరుకులు, కూరగాయలు అన్నీ అయిపోయాయి; బియ్యం కూడా ఖాళీ! డబ్బులూ లేవు! ఇక మిగిలిందల్లా అవ్వకు వారసత్వంగా వచ్చిన పెద్ద గరిటె మాత్రమే. ఆ గరిటె అంటే అవ్వకు చాలా ఇష్టం. ఇన్నేళ్ళుగా దాన్ని చాలా భద్రంగా చూసుకుంటూ ఉండిందామె. అయితే ఇప్పుడు ఆమె చటుక్కున పోయి, దాన్ని అయిన లెక్కకు అమ్మేసి, ఆ డబ్బుతో కూరలు, సరుకులు తీసుకొచ్చి పండితుడికి వండి పెట్టింది. పండితుడు ఆమె వంటని మెచ్చుకుంటూ తిని, చెయ్యి కడుక్కుంటూ "తల్లీ! ఉన్నదంతా నాకే పెట్టినట్లున్నావు. మరి నీకు?" అని అడిగాడు. "ఇవాళ్ళ పండగ కదా, స్వామీ! ఇవాళ్లంతా ఉపవాసం ఉండి, రేపు తింటాను నేను" అన్నది అవ్వ. "మరి వంట చేసేటప్పుడు దేనితో‌ కలుపుతావు తల్లీ?!" అడిగాడు పండితుడు.   "సండ్రకట్టెతో కలిపితే వంట చాలా బాగుంటుంది స్వామీ!" అన్నది అవ్వ టక్కున. పండితుడు నవ్వి, "నేను చాలా ఊళ్ళు తిరిగాను తల్లీ! కానీ ఎక్కడా నాకు కడుపు నిండలేదు. ఇవాల్టి నీ‌ త్యాగంతో నా ఆకలి తీరింది. ఇదిగో, నీకో బహుమతి" అని తన జోలెలోంచి ఒక బంగారు గరిటెని బయటికి తీసి అవ్వకు ఇచ్చాడు. "ఇదిగో తల్లీ! ఇక ఇది నీ గరిటె. దీనితో నువ్వు ఏమి వండినా అది అక్షయం అవుతుంది. అతిథి సేవకు ఇకపైన ఏ ఆటంకమూ ఉండదు" అని అవ్వను ఆశీర్వదించి, వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఇక ఆ దారిన పోయేవాళ్ళెవ్వరూ ఆకలితో‌ పోలేదు!   కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

పొట్టి మునక్కాయ

పొట్టి మునక్కాయ   అనగా అనగా ఒక ఊళ్లో ఒక అవ్వ, తాత ఉండేవాళ్ళు. వాళ్ళకి పిల్లలు లేరు. ఒక మునక్కాయ తోట మాత్రం ఉండేది.  రోజూ అవ్వ తోటలోని మునక్కాయలు కోసుకునేది. ఒక రోజున అవ్వ ఒక మునక్కాయను కోయబోతుంటే "అవ్వా!అవ్వా! నన్ను కోయబాకవ్వా!" అని వినిపించింది. అవ్వ అటూ-ఇటూ చూసింది.  "అవ్వా! అటూ-ఇటూ చూడబాకవ్వా! నువ్వు కోసే మునక్కాయనవ్వా!" అంది ఆ గొంతు. అయినా అవ్వ ఆ మునక్కాయను కోసుకుని ఇంట్లో పెట్టుకుంది.  "మునక్కాయా!మునక్కాయా! నువ్వు ఇక్కడే ఉండు. నేను పోయి తాతకు అన్నం ఇచ్చేసి వస్తాను" అంది.  అవ్వ తాతకు అన్నం ఇచ్చేసి వచ్చింది. మునక్కాయ అంత సేపూ ఇంటికి కాపలా కాసింది. ఇట్లా ఉంటే ఒక రోజు అవ్వకు ఒంట్లో బాగాలేదు. "మునక్కాయా, మునక్కాయా! నువ్వు పోయి తాతకు అన్నం ఇచ్చి రావా!" అంది అవ్వ. "సరే" అని మునక్కాయ తాతకు అన్నం ఇచ్చేసి రాను పోయింది.  పోయి తాత దగ్గరున్న మడక తీసుకొని సాయంత్రం దాకా దున్నుతూ ఉంది.  చీకటి పడింది- మునక్కాయ ఇంక ఇంటికి పోదామనుకుంటున్నది. ఇంతలో దొంగలు వచ్చి ఎద్దులను కాస్తా తోలుకొని వెళ్ళారు. మునక్కాయ తాత దగ్గరకు పోయి "తాతా!తాతా! ఎద్దులను దొంగలు తోలుకుని వెళ్ళారు. అయినా మీరేమీ‌ బాధ పడకండి. నేను పోయి వెనక్కి తోలుకుని వస్తాను" అంది. అలాగే అవ్వ దగ్గరకు వెళ్ళి "దార్లో తినేకి నాకు మురుకులు నాలుగు కాల్చి ఇవ్వు" అని అడిగింది. అట్లాగే అవ్వ నాలుగు మురుకులు కాల్చి ఇచ్చింది.  మురుకులు తీసుకొని పోతూవుంటే దారిలో మునక్కాయకు ఒక ఎండ్రకాయ కనిపించింది. "మునక్కాయా!మునక్కాయా! నాకు కొంచెం మురుకులు పెట్టవా!" అంది. "నాకు సహాయం చేస్తే ఇస్తాను" అంది మునక్కాయ. రెండూ కలసి బయలుదేరాయి. కొంత దూరం వెళ్ళాక వాటికొక తేలు కనిపించింది. "మునక్కాయా! మునక్కాయా! నాకు కొంచెం మురుకులు పెడతావా!" అంది తేలు. "అయితే నాతో కూడారా" అంది మునక్కాయ. తరువాత ఒక చీమ ఎదురైంది. అదికూడా మునక్కాయను అలాగే అడిగింది. అన్నీ కలసి దొంగల ఇంట్లో చేరాయి. అప్పుడు పోయి ఎండ్రకాయ గుమ్మంలోను, చీమ లైటు స్విచ్చి దగ్గర, తేలు వంట ఇంటిలో దాక్కున్నాయి. అంతలో దొంగలు ఇంట్లోకి రాబోయారు.  గుమ్మం దగ్గర కూర్చున్న ఎండ్రకాయ మొదటి దొంగను కరిచింది.  స్విచ్చి దగ్గర కూర్చున్న చీమ రెండవ దొంగను కుట్టింది. వంట ఇంట్లో దాక్కున్న తేలు వచ్చి మూడవ దొంగను కుట్టింది. మునక్కాయ వచ్చి అందరి తలల మీదా తలా ఒక దెబ్బ వేసింది. దాంతో‌ దొంగలంతా భయపడి ఎద్దుల్ని అక్కడే వదిలేసి పారి పోయారు. మునక్కాయ మురుకులను ముగ్గురికీ పంచింది. సహాయం చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపింది. నలుగురూ కలసి ఎద్దులను ఇంటికి తోలుకొని పొయ్యారు. అవ్వ, తాత మునక్కాయను మెచ్చుకొని కొడుకులా చూసుకున్నారు. - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

పుచ్చకాయ కథ

పుచ్చకాయ కథ     నారాయణ రెడ్డి- నాగలక్ష్మి దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు- శశి, కిరణ్, వైష్ణవ అది మంచి వేసవి కాలం. పిల్లలందరికీ సెలవలు. నారాయణ రెడ్డి ఆ రోజు ఉదయం బజారునుండి ఒక పుచ్చ కాయని తెచ్చాడు. పిల్లలంతా అది చూసి చాలా సంబరపడ్డారు. నారాయణరెడ్డి దాన్ని ఐదు భాగాలు చేసాడు. మొత్తంగా ఫ్రిడ్జ్‌లో పెడుతూ "అందరం తలా ఒక ముక్కా తిందాం, సరేనా?! మధ్యాహ్నం అన్నం తిన్న తరువాతే తినాలి!" అన్నాడు. పిల్లలంతా 'సరే' అన్నారు. కానీ కిరణ్ మటుకు ఆగలేకపోయాడు. వాడి మనసంతా "తిందాం తిందాం" అని తొందరపెట్టింది. అందరూ 'మధ్యాహ్నం' అని ఊరుకున్నారు కదా, కిరణ్ మాత్రం ఎవరికీ తెలవకుండా ఫ్రిజ్‌లోంచి ఒక ముక్క తీసుకొని తినేసాడు.   మధ్యాహ్నం అందరూ కలిసి భోజనం చేసాక, నారాయణ రెడ్డి "ఇప్పుడింక పుచ్చకాయ ప్రోగ్రాము" అంటూ వెళ్లి ఫ్రిజ్ తలుపు తెరచి చూసాడు. అందులో ఒక ముక్క లేదు! నారాయణ రెడ్డి దాన్నే తెచ్చి ముందు పెడుతూ "మీ నలుగురిలో ఎవరు, వాళ్ల వాటా పుచ్చకాయ తినేసింది?" అని అడిగాడు. "నేను తినేసా" అని చెబుదామనుకున్నాడు కిరణ్. కానీ 'ఎందుకు తిన్నావు?' అని కోప్పడతారేమో?! -అని, నోరు మెదపలేదు. "సరే, పర్లేదులే, మనలో ఎవరికో చాలా ఆకలి వేసి ఉంటుంది. మిగిలిన దాన్నే మనం అందరం పంచుకుందాం" అని నవ్వి, ఆ మిగిలిన నాలుగింటినే అందరికీ సమానంగా పంచాడు నారాయణ రెడ్డి. "ఇది తప్పు! అందరికీ కొంచెం కొంచెం తగ్గిపోతుంది!" గొణిగాడు పెద్దోడు. "నేనేలే, తిన్నది! బాగా ఆకలివేసేసరికి, ఆగలేక తినేసాను. ఇప్పుడు ఇవన్నీ మీకే!" అన్నాడు కిరణ్, నోరు విప్పి. నారాయణ రెడ్డి వాడి భుజం తడుతూ "ఏమీ‌ పర్లేదు. ఈ సారి ఇంకా పెద్ద పుచ్చకాయ తెచ్చుకుందాం. ఏదైనా సరే, అందరం కడుపునిండా తినటం ముఖ్యం. ఎప్పుడు తిన్నా, ఉన్నదాన్నే సమానంగా పంచుకొని తిందాం!" అన్నాడు. ఆశ్చర్యం, అటు తర్వాత ఎప్పుడూ ఇంట్లో పంపకాల సమస్య రాలేదు. - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

చాకలి-గాడిద

చాకలి-గాడిద   ఒక ఊళ్ళో ఒక చాకలాయన ఉండేవాడు. ఆయన పేరు సాంబయ్య. సాంబయ్యకు పనిలో‌ సాయంగా ఒక గాడిద ఉండేది. రోజూ ఊళ్ళో వాళ్ల బట్టలను అన్నింటినీ సేకరించుకొని, వంక దగ్గరికి వెళ్ళి, ఆ బట్టలు ఉతుక్కొచ్చేవాడు సాంబయ్య. ఆ బట్టల బరువును మోయటం ఈ గాడిద పని. అట్లా ఒకరోజున బట్టలు ఉతికి, వెనక్కి తిరిగి చూసిన సాంబయ్యకు తన గాడిద కనిపించలేదు. "ఇక్కడే కట్టేసానే?! ఎటుపోయింది?" అని అడవంతా వెతికాడతను. ఎక్కడా గాడిద జాడ లేదు. "ఎవరో‌ ఎత్తుకుపోయి ఉండాలి. లేకపోతే తనంతట తాను ఎక్కడికీ పోదు, పాపం నా గాడిద!" అని అతనికి చాలా బాధ వేసింది. ఊళ్ళో కనిపించిన వాళ్లనల్లా అడిగాడు- "నా గాడిద కనపడట్లేదు ఎవరైనా చూసారా?" అని. "మేం‌ చూడలేదు- మేం‌ చూడలేదు" అన్నారు అందరూ.   మరునాటికల్లా సాంబయ్యకు కోపం వచ్చేసింది. "గాడిద లేకపోతే బట్టల మూటలు ఎవరు మోస్తారు?" అని. అప్పుడు ఇక తన భాష మార్చాడు: కనబడిన వాళ్లతోనల్లా "ఇదిగో! మీరెవరైనా నా గాడిదను చూసి ఉంటే మర్యాదగా ఇప్పుడే ఇచ్చెయ్యండి, చెబుతున్నాను. లేకపోతే మా తాత ఏం చేసాడో అదే నేనూ చేస్తాను! తర్వాత మీ యిష్టం మరి!" అనటం మొదలు పెట్టాడు. ఊళ్ళోవాళ్ళు చాలా మంది "నిజంగా నేను తీసుకోలేదు సాంబయ్యా! నన్ను నమ్ము!" అని చెప్పాల్సి వచ్చింది సాంబయ్యకు. అయితే నిజంగా గాడిదను దొంగిలించింది ఆ ఊరివాడే, ఒకడు. "వాళ్ళ తాత చేసినట్లే చేస్తాడట తనుకూడా!' అని ఆ దొంగకు చాలా భయం వేసింది. మరో‌ రెండు రోజులు గడిచే సరికి అతను ఇక తట్టుకోలేకపోయాడు. "ఏం చేస్తాడో, మరి! ఊరికే ఎందుకు తంటాలు?!" అని అతను భయ పడుతూనే సాంబయ్య దగ్గరకు వచ్చి, "నీ గాడిదను నేనే దొంగిలించాను- నన్ను క్షమించు సాంబయ్యా! ఇదిగో నీ గాడిద!" అని గాడిదను తిరిగి అప్పగించేసాడు ! తన గాడిద తనకు చిక్కినందుకు సంబరపడిన సాంబయ్య అతన్ని ఇంక ఏమీ అనలేదు.   దొంగ వెను తిరిగి పోబోతూ సాంబయ్యతో "సాంబయ్యా! నేను వెనక్కి తెచ్చి ఇచ్చా కాబట్టి సరిపోయిందనుకో! కానీ ఒక వేళ నేను నీకు గాడిదను తెచ్చి ఇవ్వకుంటే ఏం చేసేవాడివి?" అని అడిగాడు. "ఏం చేసే వాడిని? ఇంకో కొత్త గాడిదను కొనుక్కునే వాడిని!" అన్నాడు సాంబయ్య "అప్పట్లో మా తాత అదే పని చేసాడు పాపం!" అది విన్న దొంగకు నిజంగా తిక్క తిరిగింది!  - కొత్తపల్లి. ఇన్ వారి సౌజన్యంతో

రైతు కష్టాలు

రైతు కష్టాలు   రామాపురంలో సోమయ్య అనే రైతు ఉండేవాడు. అతని భార్య పేరు లక్ష్మమ్మ. అతనికి ఇద్దరు కూతుళ్ళు. సోమయ్యకి ఎనిమిది ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలో బంగారు పంటలు పండించవచ్చు. కానీ ఏం లాభం?! ఊళ్ళో త్రాగేందుకు సరిపడ నీళ్ళే లేవు- ఇంక పొలాలకు నీళ్ళెక్కడివి? కరువుకు తట్టుకోలేక ఊళ్ళో రైతులు చాలామంది పట్నానికి వలస పోయారు. కానీ సోమయ్య మాత్రం అక్కడినుండి కదలలేదు. ఏ రైతుకూ తను పెంచిన ఊరిని, తిండి పెట్టిన పొలాన్ని విడిచి ఎక్కడికీ పోవాలని ఉండదు.  ప్రతి సంవత్సరం నష్టాలు వచ్చీ, వచ్చీ పాపం, సోమయ్య కాస్తా పేదవాడైనాడు. సోమయ్యకి 'పొలంలో బోరు వేద్దాం' అని ఆలోచన వచ్చింది. 'బోరులో నీళ్ళు పడ్డాయంటే ఇక ఈ‌ నష్టాలు ఉండవు!' అయితే అతని దగ్గర బోరుకు సరిపడ డబ్బు లేవు. దాంతో కొంత పొలాన్ని తాకట్టు పెట్టి, జమీందారు దగ్గర అప్పు తీసుకున్నాడు. అప్పు సొమ్ముతో బోరు వేయింవాడు; కానీ తనకి అదృష్టం లేదు- బోరులో నీళ్ళు పడలేదు. భూగర్భజలాలు ఇంకిపోయాయి. సోమయ్య చాలా బాధ పడ్డాడు. ఇక ఆ సంవత్సరం తక్కువ నీళ్లతో పెరుగుతుంది కదా అని పత్తి పంట వేశాడు. పత్తి బాగానే‌ పెరిగింది.   కానీ పంట చేతికి వచ్చే సమయానికి, ఎండిన పొలంలో‌ నిప్పు రాజుకొని, పంట మొత్తం బూడిదైపోయింది. ఆ బాధకి సోమయ్య పాపం, వారం రోజులపాటు అన్నం తినలేదు. ఆ తరువాతి సంవత్సరం అతను మిరప పంట వేశాడు. పెట్టుబడికోసం మళ్ళీ జమీందారు దగ్గర అప్పు తీసుకున్నాడు. కొన్ని రోజులు గడిచే సరికి, గడ్డి దొరకని ఆవులన్నీ పంటమీద పడి నాశనం చేశాయి. పెట్టుబడి మొత్తం నష్టమైంది. "ఈసారి పంటలు వేయద్దు. నీకు వ్యవసాయం అచ్చిరాలేదు" చెప్పారు అందరూ. కానీ సోమయ్య చెయ్యి ఊరుకోలేదు. ఈసారి అతను ప్రక్క పొలం వాళ్ళతో మాట్లాడుకొని, సగం తోటలో వరి మడి నాటాడు. వరికి నీళ్ళు చాలా అవసరం. "అసలే వానలు లేవు- వరి ఎందుకు వేస్తావు?" అని తిట్టారు అందరూ. వాళ్ళు అన్నట్లుగానే పొలం మంచిగా పండలేదు. పొలంలో చల్లేందుకు బయటినుంచి అప్పుపెట్టి మందులు తెచ్చాడు. మళ్ళీ ఓసారి జమీందారును డబ్బులు అప్పు అడిగాడు. కూతుర్లకి స్కూలు ఫీజు కట్టాలి... "ఇక తట్టుకోలేను" అనుకున్నాడు. పొలంకోసం తెచ్చిన పురుగుమందులను తాగేద్దామని నిశ్చయించుకున్నాడు. అంతలో అకస్మాత్తుగా మేఘాలు క్రమ్ముకున్నాయి. 'ఢమ!... ఢమ!...' అంటూ ఉరుములు, మెరుపులు మొదలయ్యాయి. ఆకాశానికి చిల్లులు పడ్డట్లు వానలు కురిసాయి. వాగులు, వంకలు పారాయి. చెరువులన్నీ నిండాయి. ఇక బాధ లేదు. అప్పులు అన్నీ తీరిపోయాయి. అయితే అప్పుడు వానలు పడకపోయి ఉంటే‌ ఏమయ్యేది? సోమయ్య పురుగుమందుకు బలైపోయేవాడు! అతని కుటుంబం మొత్తం కష్టాలపాలయ్యేది! వ్యవసాయంలో ప్రధాన సమస్య ప్రకృతి వైపరీత్యాలు. గాలి ఎక్కువ వచ్చినా, తక్కువ వచ్చినా; వాన ఎక్కువ వచ్చినా,తగ్గినా; ఎండ ఎక్కువ వచ్చినా, తగ్గినా- ఏమాత్రం తేడా వచ్చినా పంటలు పండవు. దానిమీద ఆధారపడిన రైతు పరిస్థితి గాలిలో పెట్టిన దీపం. ఇన్ని వ్యయ ప్రయాసలకు ఓర్చి రైతులు పండించిన పంటల్ని తిని దేశం అంతా బ్రతుకుతున్నది. అందుకని ఆహార పదార్థాలని వృధా చేయకూడదు. దాన్ని పండించిన రైతు శ్రమని అందరమూ అర్థం చేసుకోవాలి. ప్రకృతి సమస్యల వల్ల రైతులకు నష్టాలు రాకుండా వ్యవస్థల్ని ఏర్పరచాలి. ప్రధానంగా సాగునీటి సమస్యల్ని దూరం చేసేందుకు చెరువులు, వాగులు, వంకల్ని సరిచేసి, నీటికోతని నివారించే చర్యలు చేపట్టి, వాననీటిని ఆపే ఏర్పాట్లు చేయాలి. అన్నదాతకు భద్రత కల్పించవలసిన బాధ్యత మనందరిమీదా ఉన్నది! - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

కండబలం - బుద్ధిబలం

కండబలం - బుద్ధిబలం   శివపురంలో అంజన్న, శివన్న అనే ఇద్దరు మిత్రులు ఉండేవాళ్ళు. వాళ్లది విడదీయరాని స్నేహబంధం. అంజి పొడవుగా, బలంగా ఉండేవాడు. ఇక శివకేమో లోకజ్ఞానం ఎక్కువ. "నీకేమిరా, కొండలు పిండి చేసైనా అమ్ముతావు" అనేవాడు శివ. "నీకూ ఏమీ నష్టం లేదు. బలం లేకపోయినా, నీకున్న తెలివితేటలతో ఎక్కడైనా బతికేస్తావు" అనేవాడు అంజి. "ఇద్దరూ కలిస్తే ఇంకెవరూ వీళ్లని ఏమీ చేయలేరబ్బా!" అనుకునేవాళ్ళు ఊళ్ళో వాళ్ళు. శివపురంలో దసరా పండగ బాగా జరుపుకుంటారు. పండగకు అవసరమయ్యే సామాన్లు తెచ్చి అమ్మితే ఈ సమయంలో బాగా లాభాలు వస్తాయి. అందుకని, ఇంకో నాలుగు రోజుల్లో దసరా పండగ రానున్నదనగా, అంజి, శివ ఇద్దరూ చేతికందిన మొత్తాలు పట్టుకొని పొరుగూర్లో జరిగే సంతకు బయలుదేరారు.  ఆ రోజుల్లో ఇప్పటిలాగా తారు రోడ్లు అవీ లేవు. పొరుగూరు వెళ్ళాలంటే ఊరికే కాదు: అడవి మార్గంలోనుంచి వెళ్ళాలి! దారి దోపిడి దొంగలు, కౄర మృగాల బెడద బాగా ఉంది. అయితే వీళ్ళిద్దరికీ అవి సమస్యలు అనిపించలేదు. కండబలం, బుద్ధిబలం రెండూ ఉన్నవాళ్ళాయె! అట్లా అడవిలోంచి పోతూ ఉంటే వాళ్ల వెనకాల ఏదో అలికిడి అయ్యింది. వాళ్లని ఎవరో అనుసరిస్తున్నారు! "ఎవరై ఉంటారు?" అని ఆలోచించిన శివకి వాళ్ళు దొంగలే అని నిశ్చయంగా అనిపించింది. 'దొంగలు చాలామందే ఉన్నట్లున్నారు. వాళ్లతో పోరాటం చేస్తే కూడా పెద్ద ప్రయోజనం‌ ఉండకపోవచ్చు.. ' శివకి వెంటనే ఒక ఐడియా వచ్చింది. అతను నడుస్తూనే క్రిందికి వంగి, చేతినిండా గులకరాళ్ళని, మట్టిబెడ్డల్నీ తీసుకుని, గబగబా వాటిని తన దగ్గరున్న ఒక గుడ్డలో చుట్టి చటుక్కున జేబులో పెట్టుకున్నాడు. అటుపైన అతను అంజీతో‌ గట్టిగా మాట్లాడటం మొదలెట్టాడు: "ఒరేయ్, అంజీ! మన దగ్గర ఇన్నిన్ని డబ్బులున్నాయి కదరా!    మనల్ని ఎవరైనా దోచుకుపోతే ఎలాగ?!" అని. "మన దగ్గరికి ఎవరూ రారులేరా! ఇంత పెద్ద శరీరాన్ని చూసి భయపడతారులే, వాళ్ళు!" అన్నాడు అంజి, సంగతి అర్థంకాక. "అయినా ఎక్కువమంది వచ్చారనుకో, నిన్నూ నన్నూ కట్టి పడేస్తారు, అప్పుడింక ఏం చేస్తాం? అందుకని ఓ పని చేద్దాం. సంతలో మనకు ఏమన్ని డబ్బులు అవసరం ఉండదు కాబట్టి, ఊరికే ఏ పదో పరకో మన దగ్గర పెట్టుకొని, మిగిలిన సొమ్ములన్నీ ఎప్పటిమాదిరి ఇదిగో, ఈ చెరువులో పడేద్దాం: తెలిసిన చెరువే కనుక, మళ్ళీ మనం వెనక్కి వచ్చేటప్పుడు చెరువులోకి దిగి మన మూటని మనం తీసుకుంటే సరిపోతుంది" అన్నాడు శివ. అంజికి తిక్క పట్టినట్లయింది. శివ ఏమంటున్నాడో అతనికి అర్థమే కాలేదు. "అయినా మిత్రుడు అట్లా అన్నాడంటే ఏదో ఉన్నట్లే కదా" అని తనకు కూడా ఏదో అర్థం అయినట్టే తల ఊపాడు.  దాంతో శివ ముందుకొచ్చి, మిత్రుడి జేబులోంచే తీసినట్లుగా రాళ్ళ మూటను బయటికి తీసి, దాన్ని నదిలో గిరాటు వేసాడు- "గంగమ్మ తల్లీ! ఎప్పటిమాదిరే డబ్బులు నీ దగ్గర వదిలి వెళ్తున్నాం. మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు తీసుకుంటాం తల్లీ! ఈ మాత్రం సాయం చెయ్యి!" అంటూ. వాళ్ళు అటు వెళ్ళగానే ఇక ఆలస్యం చేయకుండా దొంగలు నలుగురూ చెరువులోకి దూకారు. అంజి, శివ ఇద్దరూ మరే సమస్యా లేకుండా సంతకు చేరుకున్నారు. ఏడు ఊళ్లకి ఒకటే సంత అది- చాలా పెద్ద సంత. తమకు కావలసిన సరుకులన్నీ కొనుక్కున్నారు మిత్రులిద్దరూ. ఇంకా‌ ఒక్క మేకపోతును మాత్రం కొనవలసి ఉన్నది. ఆ సంతలోనే ఒక ప్రక్కగా పశువులు-జంతువుల సంత జరుగుతుంది. మిత్రులిద్దరూ అందులోకి ప్రవేశించారు. అక్కడ ఒక దుకాణంలో వాళ్ళిద్దరికీ నచ్చిన మేకపోతు ఒకటి కనిపించింది. కొమ్ములు మెలిక తిరిగి, మెరిసే బొచ్చుతో నిండుగా ఉన్న ఆ మేకపోతుని చూస్తే అంజికి, శివకి చాలా ముచ్చట వేసింది.   "ఇది బలే ఉందిరా! కొంటే ఈ పోతునే కొనాలి!" అంటూనే పోయాడు అంజి, ఆ దుకాణాదారు ముందు. "మాట్లాడకు!" అని శివ ఎన్ని సైగలు చేసినా ప్రయోజనం లేకపోయింది. దాంతో వీళ్లెవరో పల్లెటూరివాళ్ళు- ఎంత ధర చెప్పినా కొనేట్లున్నారని, దుకాణదారు రేటును చెట్టెక్కించాడు: అసలు ధరకు రెట్టింపు రేటు చెప్ప సాగాడు. "అంత రేటు ఎందుకు?" అంటే "ఇది దేవతా మేక" అనసాగాడు!  "వద్దులేరా! మనకు ఈ మేకపోతు వద్దు. వేరే ఎక్కడైనా మామూలుది కొనుక్కుందాం" అని శివ అంటే "కాదు, ఇదే కావాలి!" అని మొండికేసాడు అంజి! దాంతో శివ అతన్ని బలవంతంగా అక్కడినుండి దూరం తీసుకొచ్చి, "ఒరే! కొందరు దుకాణాలవాళ్ళు నిజాయితీగా ఉంటారు. ఎవరొచ్చినా ఒకే రేటు చెబుతారు. కొందరు ఇతనిలాగా, మనిషికో రేటు చెబుతారు. అదే తెలివనుకుంటారు. అట్లాంటివాళ్లముందు మనం వస్తువులు నచ్చినా నచ్చనట్లే ఉండాలి" అని నచ్చ జెప్పాడు.   "అయినా మనం ఆ మేకపోతునే కొనాలి" అని పంతం పట్టాడు అంజి. దాంతో శివ కొంచెం ఆలోచించి, "సరే! నువ్వు ఎక్కువ మాట్లాడకు- నేను ఎట్లా చెబితే అట్లా చెయ్యి" అని కొంచెం అవతలగా ఉన్న దుకాణానికి పోయి ఒక బాతు గుడ్డును కొనుక్కొచ్చాడు. దానికి బంగారు రంగు పూసాడు. రంగు ఆరాక, దాన్ని చేత పట్టుకొని, మేకపోతు దుకాణదారు దగ్గరికి పోయాడు. అతనికి తన చేతిలోని గుడ్డును చూపిస్తూ- "మిత్రమా! నిజంగా మాట్లాడితే నీ మేక మాకు అవసరంలేదు. మాకు బంగారు గుడ్లు పెట్టే బాతొకటి ఉంది. రోజుకో‌ గ్రుడ్డు ఇస్తుందది. అసలైతే ఆ గ్రుడ్డును అమ్ముకునేందుకు వచ్చాం, సంతకి. ఇప్పుడు మేం దీన్ని ఇక అమ్మం. దీన్నే పొదగ పెడతాం. బంగారు బాతు పిల్లలు ఎట్లాగూ పుడతాయి. రోజూ ఓ పదో పన్నెండో బంగారు గుడ్లు వస్తే ఇంకేమి, మేం కోటీశ్వరులం అవుతాం, త్వరలోనే. అందుకని, నీ మేకపోతును ఏదో ఒక రేటుకు ఇచ్చెయ్యి పర్లేదు.." అని ఏదేదో చెప్పసాగాడు.   దుకాణదారుకి 'వీడు ఏదో తెలివిని చూపిస్తున్నాడు' అని అర్థమైంది, కానీ కిటుకు ఏంటో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. "ఏదీ- ఆ గ్రుడ్డును ఓసారి చూపించు" అని మాత్రం అన్నాడు. ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్న శివ, దాన్ని దుకాణదారు చేతిలో పెట్టినట్లే పెట్టి, గ్రుడ్డును క్రిందికి వదిలేసాడు! గ్రుడ్డు పగిలి అందులోని సొన అంతా నేలమీద పడింది. శివ కనుసైగ చేయగానే అంజి ఏడుస్తూ గట్టిగా అరవటం మొదలెట్టాడు: "మా బంగారు బాతు గుడ్డు! నువ్వు పగల గొట్టావు!" అంటూ. జనాలు అంతా చుట్టూ మూగారు. శివ, అంజి తమ నాటకాన్ని రక్తి కట్టిస్తూ, "ఇది మామూలు గుడ్డు కాదు! బంగారు గ్రుడ్డు! దాన్ని ఇతను పగల గొట్టాడు- కాబట్టి దాని మూల్యం చెల్లించాల్సిందే" అని అరవసాగారు. చివరికి, అందరి జోక్యంతోటీ, దుకాణదారు తన మేకపోతును సగం ధరకే వాళ్ల పరం చేసి, నోరు మూసుకొని ఇంటికి పోవలసి వచ్చింది! మిత్రులిద్దరూ విజయగర్వంతో మేకపోతును, సామాన్లను తీసుకొని వెనక్కి బయలు దేరారు. ఇక అడవిలో దొంగలు చెరువు మొత్తం గాలించి, గాలించి చివరికి ఆ మూటని పట్టుకున్నారు. అయితే దాన్ని తెరిచి చూస్తే అందులో ఒట్టి గులకరాళ్ళున్నాయి. దాంతో వాళ్లంతా మండి పడ్డారు: "ఆ ఇద్దరూ ఎక్కడికీ పోలేరు! ఇటే తిరిగి వస్తారు! అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న సొమ్ము, సామగ్రి మొత్తం మన సొంతం చేసుకుంటాం!" అని ప్రతిజ్ఞలు చేసారు. కులాసాగా మేకపోతుతో పాటు వెనక్కి తిరిగి వస్తున్న శివని, అంజిని వాళ్ళు చూడనైతే చూసారు కానీ, అంజి కండల్ని చూసి వాళ్ల మీదికి దూకేందుకు కొంచెం జంకారు. అప్పుడు వాళ్లలో ఒకడు "అన్నా! వీళ్ళేదో తెలివైనవాళ్ళనుకుంటున్నారు. వీళ్లని తెలివితోటే మోసం చేస్తాం! ఆగండి!" అని తన ఆలోచన చెప్పాడు. అందరూ "సరే సరే" అన్నారు.   అట్లా మిగిలిన వాళ్లంతా పొదలమాటునుండి పొంచి చూస్తూండగా ఒక దొంగ మటుకు ముందుకు వచ్చి, శివ వాళ్ళతో పాటు నడుస్తూ "ఎక్కడ దొరికిందయ్యా, మీకు ఈ పంది?!" అని అడిగాడు. శివకు దొంగల పధకం చటుక్కున అర్థమైంది. వెంటనే అతను సమయ స్ఫూర్తితో "ఏంటి, ఈ విడ్డూరం?! ఇది నీకు పందిలా కనపడుతూందా?! నిజానికి వీడు ఒక దొంగ. దారిలో మమ్మల్ని చంపేందుకు ప్రయత్నించాడు. వాడిని చంపటం మాకు ఓ లెక్క కాదు; కానీ ఎట్లాగైనా బంధించి, మచ్చిక చేసుకొని, వాడిచేత ఊడిగం చేయించుకోవాలని మా ఆలోచన. అందుకే ఇదిగో, ఇట్లా మార్చి, వెంట తీసుకెళ్తున్నాం. అయినా మీరు పెంచుకుంటామంటే దానిదేముంది, వీడిని మీకు ఇచ్చేస్తాం!" అన్నాడు. దొంగ బిత్తర పోయాడు. అయినా తేరుకొని, నవ్వు ముఖంతో "బాగుందే! మీరు చూస్తే మంచి వీర యోధుల్లానే ఉన్నారే! దొంగల్ని కూడా మచ్చిక చేసుకుంటారా, మీరు?" అన్నాడు. "ఓ, నిజానికి జంతువుల్ని మచ్చిక చేసుకోవటం కంటే దొంగల్ని మచ్చిక చేసుకోవటమే చాలా తేలిక. మా గురువుగారు మాకో ఛాలెంజ్ పెట్టారు. ఐదుగురు దొంగల్ని మచ్చిక చేసుకొని తెస్తే తప్ప, మా చదువు ముగిసినట్లు కాదని. ఇదిగో, ఇప్పటికి ఒక దొంగ లెక్క తేలాడు. మరో నలుగురికోసం వెతుకుతున్నాం. ఆ కనబడే పొదల్లో అలికిడి అవుతున్నది చూసావా, అక్కడే ఎవరో దొంగలు నక్కి ఉన్నారని నా అనుమానం. అయితే వాళ్ళు ధైర్యం చేసి మా మీదికి వచ్చే వరకూ మేం ఏమీ చేయటానికి లేదు. అందుకనే ఆలోచిస్తున్నాను" అన్నాడు శివ నవ్వు ముఖం పెట్టి. ఆ పొదల్లోనేగా తమ వాళ్ళున్నది?! దాంతో దొంగవాడికి భయం వేసింది. "మీరు బలే ఉన్నారు. వస్తా" అని చెప్పి సులభంగా తప్పించుకు పోయి, "అబ్బాయిలూ! వీళ్లెవరో మరీ ప్రమాదకరంగా ఉన్నారు. వీళ్లని వదిలేద్దాం- వేరే ఎవర్నైనా పట్టుకోవచ్చు బ్రతికుంటే" అని తమ వారినందరినీ తిరిగి అడవిలోకి తీసుకెళ్ళిపోయాడు. "పద పద- వాళ్ళు మనసు మార్చుకునేలోపల మనిద్దరం ఊరు చేరాలి" అని గబగబా నడిచి, క్షేమంగా శివపురానికి చేరుకున్నారు మిత్రులిద్దరూ.  - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో