జామకాయ వ్రతం

జామకాయ వ్రతం   రంగాపురంలో యాదయ్య అనే బిచ్చగాడు ఒకడు ఉండేవాడు. పని చేసి డబ్బు సంపాదించుకునేందుకు శక్తి ఉన్నా, ఊరికే అందరినీ అడుక్కొని డబ్బు సంపాదించుకునేవాడు అతను. "కష్టపడి డబ్బు సంపాదించుకోవచ్చుకదా?" అని ఎవరైనా అతనిని అడిగితే, "నా కష్టాలేవో నేను పడతాను నీకెందుకు?" అని పొగరుగా సమాధానమిచ్చేవాడు.  ఆ ఊరిలోనే సౌజన్య అనే అమ్మాయి ఉండేది. తను చాలా తెలివైనది. యాదయ్య తీరును గమనించిన సౌజన్య, అతనితో ఎలాగైనా మార్పు తేవాలనుకొని, ఆలోచించింది. తనకొక పథకం తట్టింది. ఒకరోజు యాదయ్య బిక్షాటన చేస్తుండగా, సౌజన్య అతనిని పిలిచి "ఒక్కసారిగా ధనవంతులు కావాలంటే ఏం చెయ్యాలో నాకు తెలుసు. నీకు ఒక్కసారిగా ధనవంతుడివి కావాలని లేదా?" అని అడిగింది. "ఎందుకు లేదు?" అన్నాడు యాదయ్య, కొంత తడబడుతూ. మరైతే "నువ్వు జామకాయ వ్రతం చేయాలి" చెప్పింది సౌజన్య. యాదయ్య తెల్లమొహం వేశాడు-"జామకాయ వ్రతమా?! దాన్ని ఎలా చేయాలి?" అని.     "అదేమంత కష్టమైన వ్రతం కాదులే, నువ్వు సులభంగానే చెయ్యగలవు. వ్రతం చెయ్యాలనుకునేవాళ్ళు ముందు ఒక మూట జామకాయలు కొనాలి. ఒక్కో జామపండును రెండు రూపాయలకు ఒక్క పైసా తగ్గించకుండా అమ్మాలి. ఇలా వరసగా పదిహేను సార్లు చెయ్యాలి. ఇలా వచ్చిన డబ్బులను మితంగా, అవసరమైనంత వాడుకోవచ్చు కూడా. ఇంకేమి, మిగిలిన డబ్బులను దాచుకుంటే సరి. ఎంత డబ్బును దాచుకుంటే అంత ధనవంతుడివి అవుతావు నువ్వు!" చెప్పింది సౌజన్య ఉత్సాహంగా.  యాదయ్య తన దగ్గర మూట జామకాయలు కొనడానికి డబ్బులు లేవన్నాడు. "అయ్యో! సొంత డబ్బులు వాడుకోకపోతే వ్రతం ఫలించదే?! మొదటిసారి జామకాయలకోసం నీ ఇంట్లో ఉన్న పైసా పైసా వాడుకుంటే తప్ప ప్రయోజనం‌ ఉండదు. నేనేమీ చెయ్యలేను" అన్నది సౌజన్య. "సరే, చూస్తానులే. ఇంట్లో అంతా వెతికితే ఒక మూటకు సరిపడా డబ్బులు దొరక్కపోవు" అన్నాడు యాదయ్య కొంచెం‌ ఆలోచించి. మరునాడే అతను జామకాయల మూటను కొని, సౌజన్య చెప్పినట్లు, చక్కగా అమ్ముకున్నాడు. సౌజన్య కూడా వాళ్ల అమ్మా నాన్నలిచ్చిన డబ్బుతో అతని దగ్గర కొన్ని జామకాయలు కొనుక్కున్నది. అట్లా వరసగా పదిహేను రోజుల పాటు జామకాయలు అమ్మాడు యాదయ్య.    వ్రతం అయిపోయాక చూస్తే, ఆశ్చర్యం! యాదయ్య దగ్గర చాలా డబ్బు ఉన్నది! అతను సౌజన్య దగ్గరకు వెళ్ళి, సంతోషంగా "నీ వల్లే నాకు ఈ వ్రతం గురించి తెలిసింది. ఇందులో కొంత డబ్బు నువ్వు తీసుకో!" అన్నాడు. సౌజన్య అప్పుడు నవ్వుతూ "నిజానికి జామకాయ వ్రతం అనేది ఏదీ లేదు యాదయ్యా! 'ఊరికే అడుక్కుని బ్రతుక్కోవచ్చు' అనే నీ ఆలోచనలో మార్పు తెచ్చేందుకే ఇలా చేశాను. కష్టపడి పనిచేసి బ్రతకటంలోని సంతోషం ఇప్పుడు నీ అనుభవంలోకి వచ్చింది కదా, అది చాలు నాకు" అన్నది. శ్రమశక్తితో సంపాదించిన డబ్బు విలువను రుచి చూసిన యాదయ్య ఇక ఆ రోజునుండీ కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించటమే కాదు వాటిని పొదుపుగా వాడుకొని, చూస్తుండగానే తన వ్యాపారాన్ని విస్తరించుకున్నాడు. సుఖంగా జీవించాడు. - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

ఎండాకాలంలో పిల్లకాకి (కథ)

ఎండాకాలంలో పిల్లకాకి     మంచి ఎండాకాలం. ఎండ పెళపెళలాడుతోంది. ఒక పిల్లకాకికి చాలా దాహమయింది. ఎటుచూసినా ఎండిపోయిన గుంటలే. నీటి బొట్టు కానరాలేదు. ఎండలో ఎగిరీఎగిరీ అలసిపోతున్న తరుణంలో దానికొక కూజా కనిపించింది. సన్నమూతి కూజా. దొర్లించడానికి వీలులేని కూజా. చిల్లి పొడిచేందుకు వీలుకాని కూజా. దానిలో అడుగున ఎక్కడో నీళ్ళున్నాయి. వెంటనే అది చుట్టూ వెదికింది. గులక రాళ్ళకోసం. తన ముత్తాత మాదిరి. ఒక్కొక్కటిగా గులక రాళ్ళను తీసి, కూజాలో వేసింది. ఆశతో ముక్కుని తడుముతూ. ఎన్ని వేసినా నీళ్ళుమాత్రం పైకిరాలేదు. కూజా రాళ్ళతో నిండిపోయింది. పిల్లకాకికి ఆశ్చర్యంవేసింది - "ఇదేంటి,ఇది తప్పెలా అవుతున్నది? తరతరాలుగా తల్లి పిల్లకు, పిల్లలపిల్లలకు చెప్పుకొస్తున్న ఈ కథ తప్పెలా అవుతున్నది?" నీళ్ళ టబ్బులో కూర్చుని లేచిన ఆర్కిమెడిస్ చెప్పిన సూత్రాలు పనిచేయడం మానేశాయా? ఏమో, తెలీదు. నీళ్ళు మాత్రం పైకి రాలేదంతే. ఇలాంటి చరిత్రలు చాలానే ఉన్నాయి. చాలా కాలంక్రితం ప్రభుత్వాలు పంచిన పొగరాని పొయ్యిలు, కొంతకాలం క్రితం ఇజ్రాయల్ పద్ధతిలో చేసిన కార్పొరేట్ వ్యవసాయం, ఈ మధ్యకాలంలో నడుపుతున్న కార్పొరేట్ బడుల, కార్పొరేట్ ఆసుపత్రుల సౌకర్యం........ అయినా ఈ కాకికథకు కొత్తగా పుట్టిన పిల్లలు ఊఁ కొడుతూనే ఉన్నారు. తమ పిల్లలకు ఈ కాకమ్మ కథను చెప్పుకుంటూనే పోతున్నారు - గర్వంగా, ఏవో తెలివితేటల్ని అందిస్తున్నామన్న ఉత్సాహంతో- గాలికి బరువుందని చూపాల్సిన బెలూన్ల ప్రయోగం మాదిరి- అవి ఎప్పటికీ చూపవు; మనం ఆ ప్రయోగాన్ని ’చెప్పకుండా’ ఉండనూ ఉండం. మళ్లీ ఒక సారి చూ(పి)స్తే చాలు - నిజం తెలిసిపోతుంది. అందుకే మనమెంతగా ఎరిగిన సత్యాలనైనా ఒక్కసారి ఇంకొంచెంగా పరీక్షించుకుంటే మంచిదేమో. శాస్త్రీయతని పుస్తకాల్లోనుంచి లేవనెత్తి ఇంకొద్దిగా జీవితాల్లోకి రానిస్తే నయమేమో. ఏమంటారు?   - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

బలవంతుని గర్వభంగం

బలవంతుని గర్వభంగం   ఒకనాడు ఒక బలవంతుడు సోము దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు. ’ప్రపంచంలో నువ్వు తెలివైన వాడివి, నేను బలమైన వాడిని. నా ఉద్దేశం ప్రకారం మనుషులకు బలం కావాలి తప్ప, తెలివి తేటలతో పనిలేదు. అందువల్ల, నువ్వు, నేను తలపడక తప్పదు. నువ్వు గొప్పో, నేను గొప్పో ఈ రోజున తేలిపోవలసిందే.   సోము బలవంతుడిని ఒకసారి తేరిపార చూశాడు. "నీ బలమెంత?" అని అడిగాడు. "నేను ఒక చేతితో ఒక టన్ను బరువును ఎత్తి సులభంగా ఈ ప్రహరీ గోడ పైనుండి పట్టణం మధ్యకు విసిరివేయగలను" అని బలవంతుడు సమాధానమిచ్చాడు గర్వంగా. "నాకు నమ్మకం కలగటంలేదు" నెమ్మదిగా అన్నాడు సోము "అయితే నా బలాన్ని నీ ముందే నిరూపిస్తాను. ఏ బల పరీక్షకైనా నేను తయారు." అన్నాడు బలవంతుడు.   "సరే, అయితే నీకొక చిన్న బలపరీక్ష పెడతాను. అందులో నెగ్గితే నువ్వు ప్రపంచంలోకెల్లా గొప్పవాడివని అంగీకరిస్తాను" అని సోము బలవంతుడిని ప్రహరీ గోడ దగ్గరకు తీసుకెళ్లాడు. తన జేబులో ఉన్న సిల్కు రుమాలును బలవంతుని చేతిలో పెట్టి, " దీన్ని ఈ ప్రహరీ గోడ అవతలికి విసిరి చూపించు చాలు" అన్నాడు.   బలవంతుడు నవ్వుకుంటూ జేబు రుమాలును విసిరేశాడు. అది ప్రహరీ గోడను దాటలేదు. సోము అప్పుడు ఆ రుమాలును తీసుకొని, దానిలో ఒక చిన్న రాయిని కట్టి, దాన్ని ప్రహరీగోడ అవతలికి సులభంగా విసిరేశాడు. బలవంతుడు సిగ్గుతో తలదించుకొని, తన ఓటమిని అంగీకరించాడు. "బలం, తెలివి రెండూ గొప్పవే, ఈ ప్రపంచంలో మనిషికి రెండూ అవసరమే. ఏది లేకున్నా పరాజయం తప్పదు" అని అతన్ని ఊరడించాడు సోము. - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

వెర్రిబాగుల రవి

వెర్రిబాగుల రవి   అనగనగా ఒక ఊళ్లో ఇద్దరు దంపతులుండేవారు. వాళ్లకు ఒక కొడుకు. వాడి పేరు రవి. ఒట్టి అమాయకుడు. వాళ్లకు రెండు మేకలు ఉండేవి. ఒకరోజున రవి వాళ్ల నాన్న "ఒరేయ్ రవీ! ఇవ్వాళ మేకలను మేపడానికి వాటిని అడవికి నువ్వు తోలుకెళ్లు" అని చెప్పాడు. `సరే'నన్న, రవి చద్ది కట్టుకొని, కొన్ని ఉలవలను బట్టలో మూట కట్టుకొని మేకలను అడవికి తోలుకుపోయాడు. మేకలు తమ మానాన తాము గడ్డి మేస్తుంటే, బాగా పెరిగిన ఒక తుమ్మ చెట్టుకింద కూర్చుని, రవి తనతోపాటు తెచ్చుకున్న ఉలవలను పటపటమని నమలడం మొదలుపెట్టాడు. సరిగ్గా అదే సమయానికి అతని రెండు మేకలూ నేలరాలిన ఎండు తుమ్మకాయలను కరకరా నమలుతున్నాయి. ఆ శబ్దం విన్న రవి మేకలు రెండూ తనను వెక్కిరిస్తున్నాయనుకొని వాటిని అవతలికి తోలాడు. ఏమీ తెలియని మేకలు మళ్ళీ వచ్చాయి! అక్కడ పడివున్న తుమ్మకాయలను కొరుకుతున్నాయి మళ్లీ! ఈ సారి రవికి పట్టరాని కోపం వచ్చింది. తనతో తెచ్చుకున్న కొడవలితో మేకలు రెండింటినీ నరికేశాడు. ఇక వాటిని అలానే ఇంటికి తీసుకెళ్లాడు. రవి తండ్రి చాలా బాధ పడ్డాడు కానీ ఏమీ చేయలేక ఊరుకున్నాడు. ఆ మరునాడు రవి నట్టింట్లో మంచం వాల్చుకొని పడుకున్నాడు. పైన వాసాలమధ్యలో ఒక ఎలుక అటూ ఇటూ తిరుగుతూ కనిపించింది. ఎంత తరిమినా ఎలుక పోవటం లేదు. చూసి చూసి రవికి విసుగు అనిపించింది. ఎలుకను చంపడంకోసం ఇంటికి నిప్పంటించాడు. ఇల్లు మొత్తం కాలిపోగా పడిపోతున్న వాసాలు ’కిర్ కిర్’ మని శబ్దం చేస్తూంటే, రవి మాత్రం ఎలుకను చంపానన్న ఆనందంతో గంతులు వేయసాగాడు. ఇంటికొచ్చి జరిగినదాన్ని చూసిన రవి తండ్రి రవిని నాలుగు వాయించాడు. కొత్త కొట్టం వేయడానికి వాసాలు కొట్టుకొని రమ్మని అడవికి పంపాడు. అడవికెళ్లి తీరికగా మూరెడు పొడవుండే కట్టెలు కొట్టుకొచ్చాడు రవి. కొడుకు వెర్రిబాగులతనానికి భాదపడ్డ అతని తండ్రి ’నేను అడవికి వెళ్లి వాసాలు కొడతాను. నువ్వు అన్నం తీసుకుని, బండి కట్టుకురా’ అని చెప్పి వెళ్లాడు. `సరే'నన్న రవి చద్ది గంపను బండిలో పెట్టుకొని, అడవివైపుకు బండిని తోలాడు. బండి అడవిలో ప్రవేశించింది. ఎక్కడా శబ్దాలు లేవు. దూరంగా పక్షులు కిల కిలమంటుంటే, రవి నడుపుతున్న బండి చక్రాలు కిర్రు కిర్రుమంటున్నై. వింటున్న రవి మెదడులో ఓ ఆలోచన మొదలైంది- "అయ్యో! బండి చక్రాలకు ఆకలౌతున్నట్లుంది" అని. చూసిచూసి వాడు చద్ది గంపలోని ముద్దలను కాస్తా బండి చక్రాలకిందికి వేశాడు. అయినా అవి కిర్రుమంటుంటే వాడికి అనిపించింది- చక్రాలకు నీళ్లు దప్పికౌతోందేమో’ అని. ఆ ఆలోచన రాగానే వాడు ఎద్దులను విడిచి, బండిని బావిలోకి తోస్తూ "త్వరగా నీళ్లు తాగొచ్చెయ్"మని చెప్పేశాడు. బావిలో పడ్డ బండి ఎంతకీ బయటికి రాలేదు. "పాపం, బండికి ఇంకా దాహం తీరినట్లు లేదు" అనుకున్నాడు రవి. ఎద్దులను అక్కడే వదిలి వాళ్ల నాన్నను వెదుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు. జరిగినదాన్ని తెలుసుకున్న వాళ్ల నాన్న, ’ఇక నువ్వు ఇంట్లోకి రావద్ద’ని, వాడిని తరిమేశాడు. భయపడ్డ రవి ఆ నాటి రాత్రికి ఇంటికి వెళ్ళకూడదనుకున్నాడు. ఊరి చివరన గుళ్లో పడుకుందామని పోయేసరికి, అక్కడ ఒక దొంగ అమ్మవారికి మొక్కుతూ కనిపించాడు:" అమ్మా! ఇవాళ్ల మంచి సొమ్ముండే ఇంటికి వెళ్ళేట్టుచూడు తల్లీ" అని. ’నేనూ వస్తాను’ అన్నాడు రవి. ’సరే’నన్నాడు దొంగ. ఇక ఇద్దరూ కలిసి ఆ చీకటి పూట ఒక ఇంటికి వెళ్లారు. అది ఊరి జమీందారు గారి ఇల్లు. "ఇక్కడ మనమేం చెయ్యాల"ని దొంగనడిగాడు రవి. "ఏదైనా పెద్దదాన్ని పట్టుకుపోదాం" అన్నాడు దొంగ. వెంటనే రవి దగ్గర్లోనే ఉన్న ఒక పెద్ద బండరాయిని ఎత్తాడు - ఎత్తుకు పోదామని. అయితే పాపం, ఆ బరువును మోయలేక వాడు దాన్ని మధ్యలోనే కింద పడేశాడు. `దబ్బు'మంటూ రాయి కింద పడగానే మేలుకున్న పని వాళ్లు దొంగను పట్టుకున్నారు. అందుకు కారణమైన రవిని అభినందించారు జమీందారుగారు. మరి ఆయన అభినందనల ప్రభావమో, లేక ఆయన తనను పనిలో పెట్టుకున్నారన్న సంతోషం రవికి కలగటం వల్లనో ఏమో, క్రమంగా రవి వెర్రిబాగులతనం పోయి, అందరిమాదిరి సంతోషంగా జీవించాడు. - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

కాకతీయుల కాలంలో మహిళల పోరాట ఆనవాళ్ళు

  కాకతీయుల కాలం నాటి మహిళల పోరాటానికి సంబంధించిన సాక్షాలు వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని తిప్పడంపల్లి గ్రామంలో నేటికీ దర్శనమిస్తున్నాయి. వీరగల్లుల శిల్పాలుగా పిలువబడే ఈ శిల్పాలు నాటి మహిళా సైనికుల అనవాళ్ళను గుర్తుచేస్తున్నాయి. తిపుడంపల్లి కి సమీపంలో అడవి ఆంజనేయుడు ఉన్న ప్రాంతాన్ని బింగిరాసిపల్లిగా పిలిచేవారని స్థానికులు తెలిపారు. ఇక్కడ ఓ మహిళ రంకెలేస్తున్న గుర్రంపై కత్తి చేతబట్టి కూర్చుండగా మరికొందరు మహిళలు రక్షణగా ఉన్న శిల్పం స్పష్టంగా ఉంది. చారిత్రక శిల్పాలైనప్పటికి పొలం యజమానులు మాత్రం వీటిని దైవ సంబంధమైనవిగా భావించి పూజలు చేస్తుంటారు.తిపుడంపల్లి సమీపంలోని శ్రీరాంనగర్ రైల్వే స్టేషన్ కు వెళ్ళే దారిలో మరో ప్రాంతాన్ని ఎద్ధులోనిపల్లిగా స్థానికులు పిలుస్తారు. ఇక్కడ కూడా ఆయుధాలు చేబట్టిన మహిళలల శిల్పం ఉంది. తిపుడంపల్లి కాకతీయుల రాజధానిగా కొంతకాలముండడం రుద్రమదేవి కుడిభుజమైన గోనగన్నారెడ్డి ఎలుబడిలో ఈ ప్రాంతముండడం చారిత్రక ఆధారాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. బింగిరాసిపల్లి, ఎద్దులోనిపల్లి నాడు యుద్ధ శిక్షణా క్షేత్రాలుగా ఉండేవని  అనంతరం కాలగర్భంలో కలిసిపోయాయని తెలుస్తోంది. 1995 నుండి 2001 వరకు,(తొలినియామకం) 2009 నుండి 2015 (పదోన్నతి)వరకు తిపుడంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేస్తున్న కాలంలో పూర్వవిద్యార్థులిచ్చిన సమాచారంతో చారిత్రక ప్రాంతాలను సందర్శించి ఆధారాలను వెలుగులోకి తేవడం జరిగింది లోతుగా పరిశోధన జరిపితే మరిన్ని చారిత్రక ఆనవాళ్ళు వెలుగుచూసే అవకాశముంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవడం సందర్భోచితమని భావిస్తున్నాను.      వ్యాసకర్త:  గుముడాల చక్రవర్తి గౌడ్ తెలుగు భాషోపాధ్యాయులు  జడ్పీ హెచ్ యస్

ఈ ఒక్కరోజు నన్ను వదిలేయండి ప్లీజ్..

  ఈ ఒక్కరోజు నన్ను వదిలేయండి ప్లీజ్.. "తిన్న తర్వాత అందరూ హాల్లో కూర్చోండి. మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి" రాత్రి పదిగంటలకు భర్త, పిల్లలిద్దరికి భోజనాలు పెడుతూ చెప్పింది ఇందిర. "ఇప్పుడే చెప్పొచ్చుగా మామ్మీ.. మళ్లీ హాల్లో కూర్చోవడం ఎందుకు?" అన్నాడు కొడుకు చైతన్య. "అబ్బా! మమ్మీ రేపు ఆదివారం కదా. అందరూ ఇంట్లోనే ఉంటారు. నాకు పని ఉంది. రేపు మాట్లాడుకుందాంలే".. అంది కూతురు సౌమ్య. " ఇందూ! అంత అర్జంట్‌గా మాట్లాడేది ఏముంటుంది. పిల్లలెందుకు? నాతో చెప్పొచ్చుగా.." మొబైల్ మాట్లాడుతూ అన్నాడు భర్త రాజేష్.  "నేను చెప్పే విషయం మీ ముగ్గురికి సంబంధించిందే. తొందరగా తినండి. మాట్లాడాక ఎవరి పని వాళ్లు చేసుకోండి" అంది ఇందిర. అరగంట తర్వాత నలుగురూ హాల్లో కూర్చున్నారు. ఇందిర టీవీని కూడా ఆపేసింది. "అబ్బా! మమ్మీ క్రికెట్ మాచ్ వస్తుంది. మాట్లాడుతూ టీవీ చూస్తే ఏమైంది. ఎందుకు ఆపేసావ్?" విసుక్కున్నాడు చైతన్య. " నోరు మూసుకో. ఎప్పుడూ మొబైల్ లో ముచ్చట్లు, కంప్యూటర్ ముందు లేదా టీవీ ముందు తప్ప వేరే ఏదీ కనపడవు మీకిద్దరికి.”   "తొందరగా చెప్పు మమ్మీ. ఈ సస్పెన్స్ ఏంటి?" అంది సౌమ్య. రాజేశ్ మాత్రం ఎన్నడు లేనిది ఇందిర ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందా అని ఆలోచిస్తున్నాడు. అతను కొద్ది రోజులుగా మౌనంగా, ఏదో ఆలోచనల్లో ఉంటున్న గమనిస్తూనే ఉన్నాడు ఇందిరని. తన బిజినెస్ పనులలో తలమునకలుగా ఉంటూ తనను ఏమైందని అడగలేకపోయాడు. ఆరోగ్యంగా ఉంటూ అన్ని పనులు చేసుకుంటూ ఉంది కదా అని అంతగా పట్టించుకోలేదు. ఏమై ఉంటుందా? అని ఆలోచనలో పడ్డాడు రాజేశ్.  "నేను చెప్పబోయేది జాగ్రత్తగా వినండి. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఇది తొందరతనంతో తీసుకున్న నిర్ణయం కాదు. మీ అందరితో చర్చించాల్సిన అవసరం కూడా కనపడలేదు నాకు. కొంత కాలంగా నాలో నేను మధనపడుతూ చివరికి ఈ నిర్ణయానికి వచ్చాను. ఇకనుండి ప్రతీ ఆదివారం నేను ఇంట్లో ఉండను. ఈ ఒక్కరోజు నాకోసం నన్ను వదిలేయండి.. నాకు ఇష్టమైన, నాకు సంతృప్తి నిచ్చే పని చేయడానికి వెళ్తున్నా. ఇన్నేళ్లుగా భర్త, పిల్లలు, బంధువులు అంటూ అసలు నాకంటూ కోరికలు ఉన్నాయని కూడామర్చిపోయాను. దానికి నేను బాధపడడం లేదు. ఇప్పుడు మీరు పెద్దవాళ్లయ్యారు. మీకు నా అవసరం అంతగా లేదు. నా మీద ఆధారపడి లేరు. మీకు ఇష్టమైన పనులు మీరు చేసుకోవాలనుకున్నప్పుడు నేను ఎందుకు నా ఇష్టాలను చంపుకోవాలి? మీ అవసరాలే నాకు ఇష్టాలా?" అడిగింది ఇందిర. "ఇందూ! ఇప్పుడితంగా ఎందుకు? నీకేం తక్కువైంది? డబ్బులకు ఎప్పుడూ కొదవలేదు. టీవీ చూడు, పూజలు, వ్రతాలు చేసుకో, లేదా కిట్టీ పార్టీలకు వెళ్లు . నాతో మీటింగులకు, పార్టీలకు రమ్మంటే రావు. ఎప్పుడూ ఇంట్లోనే ఉంటానంటావ్? నీకలా ఉండడమే ఇష్టం కదా. ఇప్పుడేమైంది మరి??" అడిగాడు రాజేశ్. "మమ్మీ! ఇష్టమైన చీరలు, నగలు కొంటానంటే డాడీ వద్దనరు కదా.. ఇంట్లో అన్నీ ఉన్నాయి. కార్ ఉంది బయటకు వెళ్లడానికి, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లడానికి  కాని నీకు ఉన్నది ఒకే ఫ్రెండు. ఇంట్లోనుండి బయటకు కదలవు. మా అందరి ఇష్టాలను తెలుసుకుని అన్నీ తీరుస్తున్నావు. మా సంతోషమే నీ సంతోషం కదా.. ఇంకా కొత్త ఇష్టాలు, కొత్త పని ఏంటి? అసలు నువ్వు పని చేయాల్సిన అవసరమేంటి? అదీ ఈ వయసులో? మరీ టూ మచ్ " విసుక్కున్నాడు చైతన్య.. “అసలు నాకు ఏమిష్టమో మీకెవరికైనా తెలుసా? కడుపు నిండా తిండి, మంచి బట్టలు, నగలు, ఆర్ధిక ఇబ్బంది అసలే లేని జీవితం.. ఇవేనా  మీరనుకునే నా ఇష్టాలు, కోరికలు. అంతకంటే వేరే ఏమీ ఉండవా. ఎప్పుడైనా నన్ను అడిగారా? నాకు ఇష్టమైన వస్తువులు, పని ఏంటి? మనస్ఫూర్తిగా నీకు ఏం కావాలి అని? మీ అందరి ఇష్టాలు, అభిరుచులను తీర్చడమో, తీర్చుకునేలా సహాయం చేయడమో చేసాను.ఇప్పుడు నా గురించి నేనే ఆలోచించుకోవాలనుకుంటున్నాను. నాకు ఏమవసరమో, ఇష్టమో నేనే తెలుసుకుని తెచ్చుకుంటాను.. కనీసం ఇప్పుడైనా నాకంటూ కొంత సమయం కేటాయించుకోనివ్వండి. " "ఓకే! ఏం చేయాలనుకుంటావ్ మమ్మీ?" అంతవరకు నిశ్శబ్ధంగా ఉన్న సౌమ్య  అడిగింది.. భర్త రాజేశ్, కొడుకు చైతన్య కూడా ఆసక్తిగా చూసారు. ఏం చెప్తుందో అని.  "రేపటినుండి నేను పొద్దున్నే ఎనిమిది గంటలకు వెళ్లిపోతాను. ఇల్లంతా మీరే చూసుకోవాలి. ప్రతీ ఆదివారం మీకు సెలవు కావాలి, రెస్ట్ కావాలంటారు.  ఇంట్లో ఉండి ఏ పనీ చేయకుండా అన్నీ స్పెషల్స్ చేయమంటారు. కూర్చున్న దగ్గరికే అన్నీ తెచ్చివ్వమంటారు. ఏమంటే? వారమంతా కష్టపడ్డాం కదా. రెస్ట్ కావాలి అని.. మరి నాకు ఎప్పుడు రెస్ట్.??. అందుకే ఆ రెస్ట్, సంతృప్తి కోసమే ఒక రిటైర్డ్ లెక్చరర్ దగ్గర తెలుగు అనువాదాలు చేసి, తెలుగు టైపింగ్ చేయడానికి ఒప్పుకున్నాను..మధ్యాహ్నం సంగీతం, వీణ నేర్చుకోవడానికి వెళ్తున్నాను. సాయంత్రం ఆరు గంటలకు తిరిగొస్తాను. అంతవరకు మీ పనులన్నీ మీరే చూసుకోండి. చేసుకోండి.." అని కాస్త ఆగింది ఇందిర.  తల్లి అలా  గట్టిగా చెప్పేసరికి పిల్లల్లిద్దరూ షాక్ అయ్యారు. ఏమనాలో తెలీలేదు. వద్దు అన్నా ఆగేట్టు లేదు అని అర్ధమైపోతుంది. అసలు అమ్మ బయటకెళ్లాల్సిన పనేంటి? ఇంట్లో ఉండొచ్చుగా? ఇప్పుడు సంగీతం, వీణ నేర్చుకుని ఏం చేస్తుంది? కచేరీలు ఇస్తుందా? ఈ వయసులో నేర్చుకుని ఏం చేయాలి? ఎవరిని ఉద్ధరించాలి? మరి రేపు మమ్మీ ఇంట్లో లేకుంటే ఎలా? ముఖ్యంగా భోజనం. హాయిగా సెలవురోజున బ్రేక్‌ఫాస్ట్ నుండి డిన్నర్ వరకు ఏదో ఒక స్పెషల్ చేస్తుంది . మరి సడన్‌గా ఇప్పుడేమైంది?? అని ఏమీ మాట్లాడకుండా లేచి తమ గదుల్లోకి వెళ్లిపోయారు. రాజేశ్, ఇందిర ఇద్దరే మౌనంగా కూర్చున్నారు. ఇందిర మనసులో ఎటువంటి కల్లోలం లేదు దృఢ నిశ్చయం తప్ప. రాజేశ్ మాత్రం ఇందునే చూస్తూ ఆలోచనలో పడ్డాడు. ఇందిర వెళ్ళి తలుపులన్నీ చెక్ చేసి  వెళ్లి పడుకుంది. రాజేశ్ ఎప్పుడు పడుకున్నాడో తనకు తెలీదు.  రోజులాగే తొందరగా నిద్ర లేచి స్నానం, పూజ చేసుకుని టీ చేసి తనకో కప్పు, భర్తకో కప్పు తీసుకుని బెడ్‌రూంలోకి వెళ్లింది. పేపర్ చదువుతున్న భర్తకు కప్పు ఇచ్చి తను కూడా టీ తాగింది. "నేను వెళ్తున్నా.. మీరు చూసుకుంటారు కదా.." అని సందేహపడుతూనే అడిగింది.. తలెత్తిన రాజేశ్ ప్రశాంతంగా చూసి "డోంట్ వర్రీ ఇందు. నువ్వెళ్లు. నేను ఉంటాను.. వీలైతే మీ తమ్ముడింటికి వెళ్లు సాయంత్రం.. "  ఎనిమిదైనా,  ఇంకా నిద్రపోతున్న పిల్లలను ఓసారి చూసి నిశ్చింతగా, ధైర్యంగా బయటకు నడిచింది ఇందిర.. - జ్యోతి వలబోజు

నేనేం చెయ్యాలి..

నేనేం చెయ్యాలి..     ఆవులు కాసే రంగన్నకు ఉన్నట్టుండి ఓ సందేహం కలిగింది. "నేనేం చెయ్యాలి?" అని. ఇప్పుడు చేస్తున్న పని సరైనది కాదేమోనన్న అనుమానపు తాలూకు రూపమే ఆ సందేహం. పక్కనే పచ్చగడ్డి మేస్తున్న ఆవును అడిగాడు రంగన్న "నేనేం చెయ్యాలి?" అని. "బాగా తినాలి. మంచిగా పాలివ్వాలి. ఇంకా మంచిగా పేడ వెయ్యాలి కూడా" అని చెప్పింది ఆవు. ’ఊహూ, ఇది కాద’నుకున్నాడు రంగన్న. ’ఇది కాకపోతే మరి ఇంకేది?’ అని కూడా అనుకున్నాడు. వెంటనే వెళ్లి ఓ పెద్ద చెట్టును అడిగాడు "నేనేం చేస్తే సరిపోతుందో చెప్పు?" అని. "దొరికినప్పుడు దొరికినదాన్ని వీలయినంత బాగా వాడుకోవాలి. ఇంకా వీలయితే దాచుకోవాలి- జాగ్రత్తగా. దొరకనప్పటికి అక్కరకొస్తాది అది. దొరకనప్పుడు దాచుకున్నదాన్ని చక్కగా వాడుకోవాలి. అప్పుడు చింత లేకుండా ఉండొచ్చు. తీసుకోవాలి; ఇవ్వాలి. అలా మనకు మనం మేలుచేసుకోవాలి; ఇతరులకూ మేలు చేయాలి" చెప్పింది చెట్టు ఆలోచించుకుంటున్నట్లు. "ఏమిటో ఈ చెట్టూ, చెట్టు మాటలూనూ! నాకేమీ అంతుపట్టడం లేదు. నేనేం చెయ్యాలో ఏమో!’ అనుకుంటూ వెళ్లి ఈ సారి గాలిని అడిగేశాడు రంగన్న. "నేనేం చెయ్యాలి?" అని. "పొయ్యే వీలున్న అన్ని చోట్లకూ పోవాలి. అన్నింటినీ చూడాలి. అన్నింటినీ తాకాలి. చల్లగా! మెల్లగా! ఉల్లాసంగా! ఉత్సాహంగా!. రంగన్నా! ఓ రంగన్నా! వెళుతున్నా! నే వెళ్తున్నా!" అంటూ ముందుకు సాగిపోయిందా గాలి తెర. గాలితెర మోసుకొచ్చిన పూల వాసన రంగన్నకు పూలచెట్లను గుర్తు చేసింది. వెంటనే పూలచెట్ల దగ్గరకు పోయాడు ఆయన. తమపైని పూగుత్తులు పిల్ల గాలికి అటూ ఇటూ ఊగుతుంటే తమవంతుగా తామూ సంతోషంగా తలలూపుతున్నాయి పూల మొక్కలు. చూస్తుంటే అవన్నీ నిజంగా పూలను ఉయ్యాలలూపుతున్నట్లే ఉంది. రంగన్న రాకను గమనించి, పూలన్నీ తమ గుభాళింపు నవ్వులతో స్వాగతం చెప్పాయి అతనికి. "పువ్వుల్లారా! పువ్వుల్లారా! మీరైనా చెప్పండి, నేనేం చేస్తే సరిపోతుందో?" అని అడిగాడు రంగన్న వాటిని. "నవ్వు, రంగన్నా, నవ్వు! సంతోషంగా నవ్వు!! వచ్చే వాళ్లకు హాయ్! హాయ్!. పొయ్యే వాళ్ళకు బయ్ బయ్!! నవ్వు, రంగన్నా, నవ్వాలి! అదీ.. అలా నవ్వాలి!’ అని పువ్వులు గట్టిగా నవ్వాయి. అవి అట్లా నవ్వుతుంటే, రంగన్నకు కూడా నవ్వు వచ్చింది. ఆ నవ్వు మోసుకొచ్చిన సంతోషంతో అతనిలోని సందేహాలన్నీ పటాపంచలయ్యాయి! ఇక అతను సంతోషంగా నవ్వుకుంటూ ఆవులు కాసుకోవడానికి వెళ్ళిపోయాడు.

హనుమంతుడి రంగు

హనుమంతుడి రంగు     రామాయణంలోని ప్రధాన పాత్రల్లో ఒకడు హనుమంతుడు. పర్వతాలెత్తగల బలమూ, దేనికీ భయపడని మానసిక స్థైర్యమూ ఉండే హనుమంతుడంటే పిల్లలకు ప్రత్యేక అభిమానం ఉంటుంది. హనుమంతుని హాస్య చతురత, పిల్ల చేష్ఠలే ఈ అభిమానానికి ఊతం. హనుమంతుని గుళ్లలో విగ్రహానికి పండు నారింజ రంగులో సింధూరం పులిమి ఉంటుంది- గమనించారా? దాని వెనక ఓ కథ ఉంది. హనుమంతుడికి రామభక్తి చాలా ఎక్కువ. ఆయన రాముడికీ, సీతకూ సన్నిహితంగా అనేక సంవత్సరాలు గడిపాడు. ఆ సమయంలో హనుమంతుడు రాముడికి ఏవేవి ఇష్టమో కనుక్కుని, ఆయన ఇష్టానికి అనుగుణంగా మెసలుకునేవాడు.   ఒకసారి హనుమంతుడు సీతతో మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో ఆమె బొట్టు పెట్టుకుంటున్నది. చూస్తున్న హనుమంతుడికి అకస్మాత్తుగా ఓ సందేహం కలిగింది. "తల్లీ! నువ్వు తిలకం ఎందుకు పెట్టుకుంటావు ఎప్పుడూ?" అని అడిగాడు సీతను. సీతకు ఏం చెప్పాలో తోచలేదు. ఆమె చిరునవ్వు నవ్వి, "రాముడికోసం, నాయనా! నేను ఇట్లా నొసటన సింధూరం పెట్టుకుంటే రాముడికి ఇష్టం" అన్నది. హనుమంతుడు ఆలోచనలో పడ్డాడు. "రాముడికి ప్రీతిపూర్వకంగా ఉండటం నాకూ ఇష్టమే కదా! సీతమ్మ నుదుటిమీద పెట్టుకునే ఇంత చిన్న సింధూరపు చుక్క రాముడికి అంత ప్రీతినిస్తోందే, మరి నేను పూర్తిగా ఒంటినిండా సింధూరం పూసుకుంటే ఎంత సంతోషపడతాడో మరి!" అనుకున్నాడు.   అందుకని వెంటనే వెళ్ళి నూనెలో‌ సింధూరం కలుపుకొని, ఆ తొట్టిలో మునిగితేలాడు. బయటికి వచ్చాక చూస్తే- ఏమి దృశ్యం! చూసినవాళ్ళు అందరూ నవ్వులే నవ్వులు! వాళ్ల నవ్వుల్ని చూసి హనుమంతుడికి ఇంకా సంతోషం కలిగింది. రాముడికి ఈ సంగతి తెలిసి, ఆయన స్వయంగా వచ్చాడు హనుమంతుడిని చూసేందుకు. తన శిష్యుడు రామ భక్తిలో ఎంతగా మునిగాడో చూసిన ఆయన హనుమంతుడిని సంతోషంగా కౌగలించుకున్నాడు. రాముడికి తన రంగు నచ్చిందని హనుమంతుడు ఇంకా ఉప్పొంగిపోయి, ఇక ప్రతిరోజూ ఒంటినిండా సింధూరం పూసుకోవటం‌ మొదలుపెట్టాడు! హనుమకు శ్రీరాముడి ఆదరాన్ని సంపాదించి పెట్టిన సింధూరం, నాటినుండీ హనుమంతుడి విగ్రహానికి తప్పనిసరి అలంకారం అయ్యింది!   - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

చిన్నమ్మ - పెద్దమ్మ

చిన్నమ్మ - పెద్దమ్మ   శ్రీపతికి భక్తి ఎక్కువ ఆశకూడా ఎక్కువే. ఏదో ఒక రోజు తన అదృష్టం తన్నుకొని వస్తుందని ఎదురు చూస్తూ ఉండేవాడతను. ఇంట్లో చాలా మంది దేవతల ఫోటోలు ఉండేవి, రోజూ వాటిలో తనకు గుర్తొచ్చిన వాళ్లకల్లా పూజలు చేసి హారతులిస్తూ ఉండేవాడు శ్రీపతి. అలా పూజ చేసినప్పుడల్లా ఆ దేవుళ్లకు తప్పకుండా చెప్పేవాడు: "స్వామీ! తల్లీ! మాతా! మా యింటికి రండి! ఒక్కళ్ళే రాకండి- సపరివారసమేతంగా విచ్చేయండి. ఇక్కడే ఉండిపోండి! ఇది మీ ఇల్లే అనుకోండి! నన్ను కటాక్షించండి,... " ఇలా సాగేది అతని స్తోత్రం. ఆ రోజు శ్రీపతి ఒక్కడే ఉన్నాడు ఇంట్లో. బయట వాన కురుస్తున్నది. చలి కూడా చాలా ఎక్కువే ఉన్నది. శ్రీపతి పడక్కుర్చీలో కూర్చొని కునికి పాట్లు పడుతున్నాడు. ఆ సమయంలో ఎవరో తలుపు తట్టినట్లు అయ్యింది.     శ్రీపతి వెళ్లి తలుపుతీశాడు. ఎవరో చాలా చక్కని యువతి నిలబడి ఉన్నది బయట! బంగారం రంగులో ధగధగా మెరిసిపోతున్నది. ఎన్నడూ కనీ-వినీ ఎరుగని నగలు ధరించి ఉన్నది. "ఎవరమ్మా నువ్వు?" అడిగాడు శ్రీపతి. "రోజూ పూజ చేస్తున్నావు కదా, గుర్తు పట్టలేదా?" అన్నదామె. శ్రీపతి నిర్ఘాంత పోయాడు. "నేను, లక్ష్మీదేవిని!” అన్నదామె, తనని తాను పరిచయం చేసుకుంటున్నట్లు. "సంపదల తల్లీ! రా! నా యింట్లోనే ఉండిపో" అని అంతగా‌ ప్రార్థించావుగా? అందుకనే వొచ్చా" అన్నది చిరునవ్వుతో. "అయ్యో ! తల్లీ! రామ్మా! రా! ఇన్నాళ్లకు కరుణించావా?! రా, తల్లీ! కూర్చో! ఒక్కతెవే వచ్చావా?" అని హడావిడి పడ్డాడు శ్రీపతి. సంపదల తల్లి మాట్లాడకుండా లోపలికొచ్చి అటూ ఇటూ చూడటం మొదలు పెట్టింది. శ్రీపతి ఆ తల్లికి మంచినీళ్ళు తెచ్చి ఇచ్చి "తర్వాత పాలు ఇవ్వాలా, టీ ఇవ్వాలా?” అని కంగారు పడటం మొదలు పెట్టాడు. కొంచెం సేపటికి మళ్లీ ఎవరో తలుపు తట్టినట్లు అయ్యింది- "ఈ సారి ఎవరొచ్చారో!" అని సంబరంగా వెళ్లి తలుపు తీశాడు శ్రీపతి. ఎవరో బిచ్చగత్తె- మాసిపోయి, చిరుగులు పడ్డ చీరతో , రేగిపోయిన జుట్టుతో, ముడతలు పడిన చర్మంతో - చాలా వికారంగా ఉంది. "నీ ఇంట్లోనే ఉండిపోదామని వొచ్చాం. రానియ్యి లోపలికి!" అంటోంది. "ఆగాగు - ఎవర్నువ్వు? నిన్ను నేనెందుకు పిలిచాను?! ఎవర్ని చూసి ఎవరనుకుంటున్నావో!" అడ్డుకున్నాడు శ్రీపతి.    "మా చెల్లి వచ్చిందిగా ఇక్కడికి?! నువ్వు సకుటుంబంగా రమ్మన్నావని చెబితే ఇద్దరం బయలు దేరి వచ్చాం. నేను దరిద్ర దేవతను, రానియ్యి నన్ను, లోపలికి !" అన్నదామె. శ్రీపతిని ప్రక్కకు నెడుతూ. "ఆగు! తల్లీ! ఆగు! నేను లక్ష్మిని ఒక్కదాన్నే రమ్మన్నాను, ఆమె కావాలంటే విష్ణువును వెంటబెట్టుకొని రావచ్చు! నువ్వు మాత్రం నా యింట కాలు పెట్టేందుకు వీల్లేదు తల్లీ, పోమ్మా పో!" అని ఆమెను అటునుండి అటే సాగనంపాడు శ్రీపతి. ఆవిడ అటుపోగానే ఇటు లక్ష్మీదేవి కూడా బయలు దేరింది- "మా అక్కా-నేనూ ఎప్పటికీ కలిసే ఉంటామని ఒట్టు పెట్టుకున్నాం. అయినా నువ్వేంటి, అందరినీ తీసుకు రమ్మని, తీరా తీసుకొచ్చాక ఇలా అవమానిస్తున్నావు?" అని మాయం అయిపోయింది కోపంగా. - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

జ్ఞానం-పాండిత్యం

జ్ఞానం-పాండిత్యం    అది ఒక పల్లెటూరు. ఆ ఊళ్లో అందరూ శాంతి సౌఖ్యాలతో, సమ భావంతో, కలిసి మెలిసి జీవించేవాళ్లు. ఆ ఊరికి ఒక సాంప్రదాయం ఉండేది. మంచి పండితుల్ని , తత్త్వవేత్తలను అప్పుడప్పుడు వాళ్ళ ఊరికి ఆహ్వానించేవాళ్ళు. వాళ్ల చేత ఉపదేశాలు, ఉపన్యాసాలు ఇప్పించుకునేవాళ్లు. వాటి ద్వారా ఊళ్ళోవాళ్లంతా మంచి విలువలను పెంపొందించుకొనే వాళ్ళు. దీని వెనక ఉన్నది, ఆ ఊరి పెద్ద త్యాగయ్య. ఆయన బాగా చదువుకున్నవాడు, శాంత స్వభావి, మంచి తెలివైనవాడు కూడా. ఒకసారి ఆయన మంచి పేరు గడించిన పండితులు ఇద్దరిని తమ ఊళ్ళో ప్రసంగించేందుకుగాను ఆహ్వానించారు. ఊళ్ళోవాళ్ళు ఉపన్యాస వేదికను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆరోజు ఉదయం పండితులిద్దరూ ఊరు చేరారు. త్యాగయ్యగారి ఇంట్లోనే వారికి విడిది ఏర్పాటు చేశారు. ఆ పండితుల రాకతో తన ఇల్లు పావనమైందని అనుకున్నారు త్యాగయ్యగారు. కొద్ది సేపు అవీ-ఇవీ మాట్లాడిన తర్వాత వాళ్ళలో మొదటి పండితుడు స్నానాల గదిలోకి వెళ్ళాడు, స్నానం చేసేందుకు. అంతలో రెండవ పండితుడు రహస్యం చెబుతున్నట్లు గొంతు తగ్గించి త్యాగయ్యతో ఇలా అన్నాడు: "ఇప్పుడు స్నానానికి వెళ్ళాడు చూశారా, పైకి పండితుడు! కానీ నిజానికి వీడు ఒక దున్నపోతు. ఆధ్యాత్మిక జ్ఞానం ఏమాత్రం లేదు వీడికి. వట్టి అహంకారి. ఉపన్యాసాలు ఇవ్వటం తప్ప, జ్ఞానం అంటే ఏంటో తెలీదు వీడికి. నా సరసన వీడు ప్రసంగించడం కూడా ఇష్టం లేదు నాకు!" అని. అంతలో మొదటి పండితుడు స్నానం ముగించుకొని వచ్చాడు. రెండోపండితుడు లేచి స్నానం చేసేందుకు వెళ్లాడు. ఇప్పుడు మొదటి పండితుడి వంతు వచ్చింది. అతను త్యాగయ్యతో గుసగుసగా అన్నాడు: "ఈ గాడిదను ఎందుకు పిలిపించారు? వీడికి ఏ జ్ఞానం ఉందని మీరు భావించారు? వీడికి "అహం జాస్తి, సంస్కారం నాస్తి". ఎన్ని జన్మలు ఎత్తినా నాతో వీడు సమం కాజాలడు" అని. ఇద్దరి మాటల్నీ మౌనంగా విన్నారు త్యాగయ్యగారు. కొంతసేపటికి పండితులిద్దర్నీ భోజనానికి ఆహ్వానించారు. ఇద్దరికీ ఎత్తైన పీటలు వేసి, ప్రత్యేకంగా తెప్పించిన మంచి అరటి ఆకులు వేసి కూర్చోబెట్టారు. ఇద్దరూ భోజన ప్రియులు కావటంతో ఎట్లాంటి వంటకాలు రానున్నాయో అని ఊహించుకుంటూ‌ కూర్చున్నారు. అంతలో వడ్డించేవాళ్ళు వచ్చి హడావిడి చేస్తూ ఇద్దరి అరిటాకులలోనూ గడ్డి, చిత్తు కాగితాలు, ఆకులు, అలములు వడ్డించారు. "మీకు ఇష్టమైనవేవో కనుక్కొని మరీ ప్రత్యేకంగా చేయించాను. తినండి తినండి" అన్నారు త్యాగయ్యగారు దగ్గర కూర్చొని. పండితులిద్దరు ఆశ్చర్యపోయారు. ఆగ్రహించారు. చటుక్కున లేచి నిల్చున్నారు- "ఏంటిది?! మమ్మల్ని ఇలా అవమానించడానికా, మీ ఊరికి పిలిపించింది?" అని గట్టిగా అరిచారు.   త్యాగయ్యగారు చిరునవ్వు నవ్వుతూ అన్నారు: "అయ్యా! తమరు ఇద్దరూ ఒకరికొకరు మిత్రులని లోక ప్రసిద్ధం. వారు మాతో ముచ్చటిస్తూ తమరిని 'దున్నపోతు' అన్నారు. తమరేమో 'వారు గాడిద' అని శలవిచ్చారు. 'సర్వజ్ఞులైన పండితులు కదా, తమరు; తమరి నిజ స్వభావాలకు తగిన భోజనమే చేస్తారేమో, మనుష్యులు తినే ఆహారం పెడితే తినరేమో' అనుకొని, ఎవరేది తింటారో కనుక్కొని, ఎంతో శ్రమపడి మరీ తెప్పించాను. తినండి తినండి" అని. పండితులిద్దరూ సిగ్గుతో తలవంచుకున్నారు. తమలోని అహంకారాన్ని గుర్తించి ఇద్దరూ త్యాగయ్యగారికి క్షమాపణలు చెప్పారు. త్యాగయ్యగారు వారిని మన్నిస్తూ "విజ్ఞులు, పెద్దలు- తమరే నన్ను మన్నించాలి. చిన్నతనంకొద్దీ చొరవ తీసుకున్నాను తప్ప, మరోలా అనుకోకండి" అని వాళ్లను తగిన విధంగా సత్కరించి పంపారు.ఆరోజు సాయంత్రం పండితులిద్దరూ ఔదార్యం గురించీ, జ్ఞానం గురించీ జనరంజకంగా ఉపన్యసించారు! - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

దుంగరాజు కొంగరాజు

దుంగరాజు కొంగరాజు   అనగనగా ఒక అడవిలో ఒక చెరువు ఉండేది. ఆ చెరువులో చాలా కప్పలుండేవి. అవన్నీ ఒకరోజున అనుకున్నాయి. "ఈ చెరువుకు ఒక రాజు ఉంటే ఎంత బాగుంటుంది?!" అని. అట్లా అనుకొని, అవన్నీ దేవుడిని ప్రార్థించాయి: "మాకో రాజుని ఇవ్వు దేవుడా" అని. "కప్పలన్నీ బాగా ఆడుకునేందుకు బాగుంటుంది కదా" అని, దేవుడు ఒక దుంగని చెరువులోకి విసిరేసి "మీ రాజు ఈయనే" అన్నాడు.  కప్పలన్నీ దుంగరాజు మీదికి గెంతి, తైతక్కలాడాయి. దుంగరాజు కదల్లేదు; మెదల్లేదు. కప్పలన్నిటినీ చక్కగా ఆడుకోనిచ్చాడు.  అయితే దుంగరాజు వల్ల కప్పలకి సంతోషం కలగలేదు- " ఈ మహరాజు వట్టి మొద్దులా ఉన్నాడు- ఈయన ఒద్దు మనకు- చురుకుగా ఉండే రాజైతేనే బాగుంటుంది" అని కప్పలన్నీ మళ్ళీ దేవుణ్ణి వేడుకున్నాయి. "నిజంగానా?! చురుకైన రాజే కావాలా?" అడిగాడు దేవుడు. "ఔను స్వామీ!‌   ఇలా మొద్దులాగా పడి ఉండే రాజు బాలేదు" అన్నై కప్పలు. "సరే, అయితే!మీకు కావలసింది ఇదిగో- ఇలాంటి రాజే!" అని దేవుడు ఒక కొంగని చెరువులోకి వదిలాడు. ఈ కొంగరాజు చురుకుగా కప్పలమీద పడి ఒక్కొక్క కప్పనే తినటం మొదలు పెట్టాడు. చూస్తూండగానే చెరువులోని కప్పలన్నీ తరిగిపోయాయి. మిగిలిన కప్పలన్నీ చాలా దు:ఖించాయి- 'చక్కని దుంగరాజుని ఇస్తే ఎంచక్కా సంతోషించక, ఇట్లాంటి రాజుని కొని తెచ్చుకున్నామేమి?' అని .  - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

గారెలు తిన్న గాడిద

గారెలు తిన్న గాడిద   మల్లేశు, సీతాలు చాకలి పని చేసేవాళ్ళు. వాళ్లకు ఒక గాడిద ఉండేది. దాని పేరు గుడ్డూ. బట్టలు రేవుకు మోసేందుకు, బియ్యం సరుకులు తెచ్చేందుకు, పక్క ఊళ్ళో ఉన్న కూతురింటికి వెళ్ళేందుకు అన్నిటికీ ఆ గాడిదమీదే తిరేగేవాడు మల్లేశు. ఓ రోజు కూతురింటికి ప్రయాణం కట్టాడు మల్లేశు. ఏవేవో పచ్చళ్ళు, పెరట్లో కాసిన కూరగాయలు సంచుల నిండా నింపాడు. "ఏమయ్యా! వేడిగా కాసిని గారెలు చేసి కూతురికి తీసుకు వెళ్దామా?" అంది సీతాలు. "అవునవును. అల్లుడికి గారెలంటే చాలా ఇష్టం. చకచకా చేసిపెట్టు. తీసుకొని బయలుదేరుదాం" అన్నాడు మల్లేశు. సీతాలు వంటింట్లోకి వెళ్ళి సరిగ్గా పదంటే పది గారెలు చేసింది.   కమ్మటి ఆ గారెల వాసనకు చుట్టు ప్రక్కల ఇళ్ళలో వాళ్లందరి నోళ్ళూ ఊరాయి. పొరుగింటి రత్నమ్మ, సుబ్బరత్న కొంచెం సేపు ఆగారు గానీ, ఇక తట్టుకోలేక గబగబా వచ్చేసారు- "ఏం చేస్తున్నావు వదినా, ఇంత ఘుమఘుమలు!" అంటూ. "అల్లుడికి గారెలంటే ఇష్టం కదా వొదినా, అందుకని ఇప్పుడు ఇవి పెట్టుకున్నాం. ఇదిగో తిని చూసి చెప్పండి అని వాళ్ళిద్దరికీ తలా ఒక గారే ఇచ్చింది సీతాలు. వాళ్ళు తింటుంటే చూస్తూ ఉండలేకపోయాడు మల్లేశు. "సీతాలూ! నేను వీటిని మూట కట్టేయనా? బయలుదేరచ్చు ఇంక?" అంటూనే వాటి దగ్గరికి వెళ్ళి చకచకా రెండు గారెలు తినేసాడు. "బాగా వచ్చినై. రుచి బలే ఉంది" అంటూ.   "అయిపోతున్నాయి.. తినకు! అయిపోతున్నాయి.. తినకు" అని సీతాలు గుండె అరిచింది, కానీ రత్నమ్మ, సుబ్బరత్న ఉండగా ఆ మాటని బయటికి అనలేదు కదా! అందుకని "అవునవును బాగా వచ్చాయి. ఇంకో రెండు తినయ్యా!" అనేసింది పళ్ళు నూరుతూ. 'సీతాలు అన్నది కదా' అని మల్లేశు ఇంకో గారె లాగించాడు. పొరుగిళ్ళవాళ్ళు వెళ్ళగానే సీతాలు మల్లేశుతో‌ వాదనకు దిగింది-"తినమంటే అట్లా తినెయ్యటమేనా?! చూసుకోవద్దా?! నేను మనిషిని కాదా?!" అని. దాంతో మల్లేషు సీతాలుని బుజ్జగించి, ఆమెకు రెండు గారెలు తినబెట్టాడు- తను ఇంకో గారెను లాగిస్తూ.   అంతసేపటి నుండీ గారెల వాసనని పీలుస్తున్న గాడిద ఇంక తట్టుకోలేక పోయింది. నేరుగా ఇంట్లోకి వచ్చేసి, మిగిలిన రెండు గారెల్నీ లటుక్కున తినేసి, చక్కా పోబోయింది. సీతాలు లబోదిబోమన్నది. "గారెలు తినేసి పోతోంది చూడయ్యో!" అంటూ. దాంతో మల్లేశు కట్టె పట్టుకొని గాడిద వెంట పడ్డాడు: "బిడ్డకోసం అన్నన్ని గారెలు చేస్తే తినేసేందుకు నీకు నోరెలా వచ్చిందే!" అని అరుస్తూ. అతని వెనకనే సీతాలు! గాడిదకి తల తిరిగింది: "నేను తిన్నది రెండే కదా, అట్లా అంటారేంటి?!" అని. అయినా తనని తాను కాపాడుకోవాలి కాబట్టి, అది చటుక్కున వెను తిరిగి, రోడ్లోకి పరుగు పెట్టింది.   కొద్ది దూరం దాని వెంట పడిన మల్లేశు, సీతాలు అలిసిపోయి, ఒట్టి చేతులతో వెనక్కి తిరిగి వచ్చారు. అప్పటికి ఊరి పొలిమేర చేరుకున్న గాడిద కొంచెం సేపు చాలా ఆలోచించింది: "రెండు గారెలు తింటే కూడా తట్టుకోలేని యజమాని వృధా" అనిపించింది దానికి. అందుకని అది ఆ ప్రాంతాల్లో దొరికిన గడ్డినే మేసేసి, అక్కడే పడుకొని నిద్రపోయేందుకు చూసింది. అయితే ఎంత సేపటికీ దానికి నిద్ర రాలేదు. ఒకవైపునుండి మల్లేశు కట్టె పట్టుకొని వస్తున్నట్లు, మరో వైపునుండి పాములు, తేళ్ళు ప్రాకినట్లు, మరో వైపునుండి పులులు, తోడేళ్ళు వచ్చి మీద పడినట్లు అనిపించి వణుకుతో జ్వరం వచ్చేసింది దానికి. సాయంత్రం అయ్యేసరికి అది లేచి వెనక్కి బయలుదేరింది: "మళ్ళీ ఇంటికే పోతాను. పని లేకపోతే నిద్ర కూడా రాదు" అనుకుంటూ. సరిగ్గా ఆ సమయానికే దాన్ని వెతుక్కుంటూ వచ్చాడు మల్లేశు. ఇప్పుడు అతని చేతిలో కట్టె లేదు. "పోనీలే! గారెలు తింటే తినేసావు. ఏం చేస్తాం. ఈసారినుండీ తినకు!" అంటూ దానిమీద బరువులు వేసి, కులాసాగా బిడ్డ ఊరికి తీసుకెళ్ళాడు. "మీకోసం గారెలు కూడా చేసిందమ్మా, మీ అమ్మ! కానీ ఇదిగో, ఈ గాడిదే- ఇది తినేసింది ఒక్కటీ మిగల్చకుండా!" అని మల్లేశు బిడ్డకి చెబుతుంటే గాడిదకు తల తీసేసినట్లయింది. అయినా సర్దుకుని అట్లాగే నవ్వుముఖంతో నిలబడింది అక్కడంతా. తెల్లవారగానే మల్లేశం దాన్ని ఇంటికి తెచ్చి, ఎప్పుడూ‌ కట్టే చోట కట్టేస్తే "అబ్బ! ఇల్లు చేరుకున్నాను!" అనుకొని తృప్తిగా నిద్రపోయింది గాడిద. అయినా ఆ తర్వాత సంవత్సరం వరకూ అందరూ దాన్ని తిడుతూనే ఉన్నారు: "వదిలేస్తే ఇది ఎన్ని గారెలైనా తినేస్తుందమ్మా" అని! - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

చెడపకురా.. చెడేవు!

  చెడపకురా.. చెడేవు!   అనగనగా ధర్మారం ఆనే ఊరిలో రామయ్య-భీమయ్య అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. రామయ్యకు భీమయ్య అంటే చాలా ఇష్టం. భీమయ్య మాత్రం రామయ్య దగ్గర ఉన్న డబ్బును మాత్రమే చూసేవాడు. రామయ్య భార్య లక్ష్మికి తెలుసు, భీమయ్య ఎలాంటివాడో. కానీ రామయ్య ఆమె మాటల్ని పట్టించుకునేవాడు కాదు. మిత్రుడిని అమితంగా ప్రేమించేవాడు. అయితే రాను రాను మిత్రుల ఆర్థిక పరిస్థితి దిగజారటం మొదలైంది. దాంతో రామయ్య 'పట్నానికి వలస పోదాం' అనుకున్నాడు. "ఇప్పుడు వెళ్తే తన దగ్గరున్న కొద్దిపాటి డబ్బులతో ఏదైనా వ్యాపారం మొదలు పెట్టుకోవచ్చు.  తర్వాత తర్వాత అది కూడా వీలవ్వకపోవచ్చు.." అయితే భీమయ్య దానికి ససేమిరా ఒప్పుకోలేదు. "మన పొలాలు ఎటు పోతాయి? కావాలంటే నీ పొలం కూడా నేనే సాగు చేసి పెడతాను!" అన్నాడు. రామయ్య కుటుంబం పట్నానికి వలస పోయింది. భీమయ్య అక్కడే ఉండి రామయ్య పొలాన్ని కౌలుకు చేయటం మొదలు పెట్టాడు. "ఖర్చులు నువ్వు పెట్టు; పొలంలో వచ్చిన లాభాలను సమానంగా పంచుకుందాం" అన్నాడు. పట్నంలో రామయ్య వ్యాపారం బాగానే సాగింది. అక్కడ తనకు వచ్చిన కొద్దిపాటి లాభాలను కూడా రామయ్య తన వంతు పెట్టుబడిగా భీమయ్య చేతికి ఇస్తూ వచ్చాడు. తీరా పంట చేతికి వచ్చే సరికి భీమయ్య మొండి చెయ్యి చూపించాడు: "ఏం చెప్పమంటావు రామయ్యా! వానలే లేవాయె! నీ పొలం అసలు పండనే లేదు!" అన్నాడు.   "అందరి పంటలూ బాగానే పండుతున్నాయి కాని నా పంట పండట్లేదేమి?" అని దిగులు చెందేవాడు రామయ్య. "కొన్ని రోజులు ధర్మారం లోనే ఉండి చూద్దాం" అన్నది లక్ష్మి, భీమయ్య మాటల మీద ఒకింత అనుమానంగా. నిజంగానే వాళ్ళు ఉన్న కొద్ది రోజుల్లో పంట చాలా మెరుగైంది. ఏపుగా పెరిగిన పంటను చూసి "ఈసారి మంచి ఫలితాలు వస్తాయి" అని కొంచెం ఆశపడ్డాడు రామయ్య. తరువాత భీమయ్యకు కొంత ఎక్కువ డబ్బు ఇచ్చి, పంటకు అవసరం అయ్యే పనిముట్లు తెప్పించమని, తను పట్నం చేరుకున్నాడు. అయితే "ఈ సంవత్సరమూ పంట బాగా పండలేదు- నీ‌ పొలానికి ఏదో అరిష్టం పట్టినట్లుంది. సాధనాల వల్ల కూడా ఫలితం రాలేదు" అన్నాడు భీమయ్య, ఒక్క పైసా కూడా‌ ఇవ్వకుండా.  వ్యాపారంలో వచ్చిన లాభాలతో ఈసారి తన పొలంలో బోరుబావులు వేయించాడు రామయ్య. పంట ఎలా ఉన్నదో చూసుకు-నేందుకు ప్రతినెలా ఒకసారి తనూ, లక్ష్మీ ఊరికి రావటం మొదలుపెట్టారు. దాంతో పరిస్థితి కొంత మెరుగయింది. పంట బాగా వచ్చింది. రామయ్య, లక్ష్మి ఇద్దరూ దగ్గర నిలబడి పంటను నూర్పించారు. భీమయ్య "ఈసారి నీ అదృష్టం బాగుంది" అని మాటవరసకు మెచ్చుకున్నాడుగానీ, డబ్బుల దగ్గరికి వచ్చేసరికి- "రేపు ఇస్తాను- ఎల్లుండి ఇస్తాను" అని దాటవేస్తూ వచ్చాడు. "చూసారా, మీ మిత్రుడి బుద్ధి?!" అన్నది లక్ష్మి. ఆమె పోరు పడలేక రామయ్య డబ్బులు ఇమ్మని భీమయ్యను ఒత్తిడి చేయటం కొనసాగించాడు. మరొకవైపున లక్ష్మి భీమయ్య భార్యపై ఒత్తిడి పెంచింది.   చివరికి ఒకరోజున భీమయ్య "నా దగ్గర ఎక్కడున్నై రామయ్యా, డబ్బులు?! మళ్ళీ‌ సంవత్సరం‌ ఇస్తాలే" అనేసాడు. అయితే అదే రోజున లక్ష్మి పోయి అతని భార్యనుండి తమకు రావలసిన మొత్తాన్నంతా వసూలు చేసుకొచ్చింది! అప్పుడు రామయ్యకు అర్థమైంది- భీమయ్య తనను ఎంత మోసం చేస్తున్నాడో! లక్ష్మి చెప్పిన మాటను తను ముందుగానే విని ఉండాల్సిందని బాధపడ్డాడు. అటు తర్వాత భీమయ్యతో సంబంధాలు తగ్గించుకున్నాడు. వేరే పాలేరును ఒకరిని పెట్టుకొని, స్వయంగా తన పంటను తానే పండించుకున్నాడు. దాంతో అటు వ్యాపారమూ లాభాల్లో కొనసాగింది. ఇటు పొలమూ వృద్ధిలోకి వచ్చింది. రాను రాను రామయ్య మంచి స్థాయికి ఎదిగాడు. మోసం చేస్తూ పోయిన భీమయ్యకు మటుకు పెట్టుబడి కరువౌతూ వచ్చింది. కొద్ది సంవత్సరాల తర్వాత అతని పొలంలో పంటలు అస్సలు బాగా పండలేదు. తనను వదిలేసి సొంతంగా వ్యవసాయం చేసుకుంటున్న రామయ్యను సహాయం అడిగేందుకు ఇప్పుడు అతనికి ముఖం చెల్లలేదు. తప్పు తెలుసుకొని బాధ అయితే పడ్డాడు కానీ, ఇప్పుడిక ఏమి ప్రయోజనం?!   - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

మనసుకు బానిసలయ్యామో అంతే సంగతులు....

మనసుకు బానిసలయ్యామో అంతే సంగతులు....     అనగనగా ఒక రాజు. ఆయన ఏ కొరత రానివ్వక రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయన దగ్గర ఒక బానిస ఉన్నాడు. రాజుగారి అవసరాలను ఎప్పటికప్పుడు గమనించి ఆ పనులను ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చేసి మంచి పేరు పొందుతుండేవాడు. రాజు గారికోసం చేసే పనులలో ఎక్కడా తేడా రాకుండా చూసుకునే వాడు.  అతనంటే రాజుకు కూడా ఎంతో ఇష్టం. అతనిపై నమ్మకం కూడా ఎక్కువే రాజుకు. ఒకరోజు రాజు అతనితో "నీకు ఏం కావాలో నన్ను అడుగు. నీకు నేనది ఇస్తాను. ఆలోచించకు. ఏది కావాలన్నా అడుగు" అన్నాడు. అతను ఒక్క క్షణం కూడా ముందువెనుకలు ఆలోచించక "రాజా, నేను కూడా మీలాగా రాజుగా  ఈ దర్బారులో మీ సింహాసనంలో కూర్చోవాలని ఉంది" అని చెప్పాడు. నిజానికి ఈ కోరిక అడగవచ్చా అడగకూడా అని ఆ బానిసకు  తెలియదు. అడగడమైతే అడిగేసాడు.  అతని మాటకు రాజు ఖంగు తిన్నాడు. అయినా ఆ భావాన్ని మొహంలో చూపించక కాస్సేపటికి సర్దుకుని "సరే అలాగే కానివ్వు" అని చెప్పాడు రాజు.  రాజు వెంటనే మంత్రులను పిలిచి "ఇదిగో మీ అందరికీ చెప్తున్నాను. వినండి. ఈ సేవకుడికి ఒక్క రోజు రాజు కావాలని, నా సింహాసనంలో కూర్చోవాలని కోరిక. అది నెరవేర్చడానికి అవసరమైన ఏర్పాట్లు చూడండి. నన్ను మీరందరూ ఎలా రాజుగా గౌరవిస్తారో అలాగే అతని పట్ల కూడా నడచుకోవాలి. అతను ఏం చెప్తే అది చెయ్యాలి. మేం చెయ్యం అని మీలో ఏ ఒక్కరూ కూడా అనకూడదు. ఎందులోనూ ఒక్క ఆవగింజంత తేడా కూడా రాకూడదు" అని ఆదేశించాడు. బానిస సేవకుడు రాజయ్యాడు.  అతను సింహాసనంలో కూర్చోగానే యేమని ఆజ్ఞాపించాడో తెలుసా..? "రాజు తల నరకాలి" అని.   సభలో ఉన్న వారందరూ ఖంగుతిన్నారు. నోట మాట లేదు. కానీ ఏం లాభం. అతనిప్పుడు రాజు. కనుక మరో దారి లేదు. అతని ఉత్తర్వులను యధాతధంగా అమలు చెయ్యడం తప్ప... పైగా అంతకు ముందే రాజు కూడా చెప్పాడుగా అతనేం చెప్తే అవన్నీ అమలు చెయ్యాలని.  రాజైన బానిస  చెప్పినట్లే ప్రధాన మంత్రి ఒక భటుడిని  పిలిచి రాజు తల తీయించాడు.  ఆ తర్వాత బానిస  సేవకుడే ఆ రాజ్యానికి రాజయ్యాడు. ఇది వినడానికి కాస్తంత విడ్డూరమైన కథే కావచ్చు. కానీ ఇక్కడ చెప్పదల్చుకున్నది ఏమిటంటే మన జీవితమూ అంతే.  ఈ కథలోలాగే మనమే రాజులం. . మన మనసు ఆ సేవకుడు. మనలో చాలా మంది ఆ మనసును రాజును చేసేస్తాం. కానీ దాని మార్గంలో ఆ తర్వాత జరిగే తంతు చూస్తుంటే మనసనే సేవకుడు కథలోని బానిస చెప్పినట్లు చేస్తే మన అర్హత, జీవితంపై పట్టు, ఆధిపత్యం, శక్తి, ఇలా ప్రతిదీ అంతరించిపోతాయి.  అందుకే మనం ఏ నిర్ణయాన్నైనా చైతన్యవంతులై ఉన్నప్పుడు తీసుకోవాలి. అప్రమత్తంగా ఉన్నప్పుడే ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి. అలాకాకుండా మనల్ని  మనసనే దాసుడికి అప్పగిస్తే మనలోని న్యాయాలు, ధర్మాలు అన్నీనూ అస్తమిస్తాయి. మన స్థానంలో మనసు ఉంటుంది. మనముండం.   - యామిజాల జగదీశ్  

కలిసొచ్చిన అదృష్టం

కలిసొచ్చిన అదృష్టం   రాయల చెరువులో నివసించే లక్ష్మయ్య అదృష్టవంతుడు అనుకునేవాళ్ళు అందరూ. పది ఎకరాల చేను ఉండేది అతనికి. లక్ష్మయ్య చాలా మంచివాడు. ఎదురు పడిన శత్రువునైనా ఇంట్లోకి పిలిచి మర్యాదలు చేసేంత మంచివాడు. ఆ సంవత్సరం అందరిలాగానే లక్ష్మయ్య కూడా తన పొలంలో వేరుశనగ విత్తనాలు వేసేందుకు తయారయ్యాడు. చేనును బాగా దుక్కి చేసి, విత్తనాలు వొలిచి పెట్టుకొని, వర్షం కోసం ఎదురు చూడసాగాడు. కానీ అంతకు ముందులాగే ఆ ఏడాది కూడా అదనులో వర్షాలు పడలేదు. 'పడతాయిలే' అని ధైర్యం చేసి విత్తిన రైతులందరూ ఘోరంగా నష్టపోయారు. చాలా పొలాల్లో వేరుశెనగ మొలకలు కూడా రాలేదు. గ్రామంలో అందరూ అప్పులపాలయ్యారు. "త్వరపడి విత్తకపోవటం మంచిదైంది. అయినా ఈ సంవత్సరం అంతా చేన్లను బీడుగా వదిలితే ఎలాగ?" అని ఆలోచిస్తూ విచారంలో మునిగాడు లక్ష్మయ్య. ఆరోజు రాత్రి చీకటి పడుతుండగా ఒక ముసలాయన లక్ష్మయ్య ఇంటి తలుపు తట్టాడు. "పెద్దయ్యా! మాది కొమ్ముల తాండా. సంతకని బయలుదేరి వస్తుంటే బండి చక్రం విరిగి, ఆలస్యమైపోయింది. అటూ ఇటూ కాకుండా ఇరుక్కుపోయాను. తమరు సరేనంటే ఇక్కడ ఈ రాత్రికి పడుకొని, రేపు ఉదయంగా మళ్ళీ మా ఊరికి నేను బయలుదేరి పోతాను" అని. "దానిదేముంది, పశువుల్ని అక్కడ కట్టేసి, నువ్వు లోనికి రా, రొంత బువ్వ తిందువు మాతోటి" అని అతన్ని ఆహ్వానించిన లక్ష్మయ్యకు మాటల సందర్భంలో మరిన్ని వివరాలు తెలిసాయి: అతను అంతకు క్రితం పండించిన కొర్రలు అమ్ముకునేందుకు వచ్చాడు సంతకు. అతని దగ్గర ఐదు బస్తాల కొర్రలు ఉన్నాయి.   ఆ రోజు రాత్రి నిద్రపోబోతుండగా లక్ష్మయ్యకు ఓ ఆలోచన వచ్చింది. "వేరుశెనగకు అదను ఎలాగూ తప్పిపోయింది. ఇప్పుడు తన చేనులో కొర్రలు వేస్తే ఎలా ఉంటుంది? దేవుడు నా కోసమే పంపించినట్లున్నాడు ఇతన్ని! ఒక్క వాన పడితే చాలు- కొర్రలు పండిపోతాయి. వాటికి పెద్ద రేటు ఉండదు; కానీ చేనును బీడుగా వదలటం కంటే అదే మంచిది కద!" తెల్లవారాక, ముసలాయన చెప్పిన రేటుకు ఐదు బస్తాల కొర్రలూ కొనేసి అతన్ని సంతోషంగా ఇంటికి పంపించాడు లక్ష్మయ్య. నిజంగానే అదృష్టం ఆ ముసలాయన రూపంలో వచ్చిందేమో మరి- ఆ రోజు సాయంత్రమే వర్షం మొదలైంది. ఎక్కడో వచ్చిన తుఫాను వల్ల రాయల చెరువులో నింగీ నేలా ఏకమయ్యేట్లు వానలు పడ్డాయి. ఊళ్లో పొలాలన్నీ చెరువులయ్యాయి. లక్ష్మయ్య ఎంతో సంబరపడిపోయాడు. "వేరుశనగ విత్తుదామా? వరి వేద్దామా?" అని అతనికిప్పుడు రకరకాల ఆలోచనలు వచ్చాయి. అయితే మరొకవైపున ముసలాయన ముఖం గుర్తుకొస్తూ ఉండింది. చివరికి "ఏమైనా సరే!కొర్రలే విత్తుదాం. దేవుడు నాకోసం ఆ వాట్నే పంపించాడు" అని తన చేన్లో అంతటా కొర్రలు చల్లేసాడు, ఎవ్వరు ఏమన్నా వినకుండా. పొలాలున్న రైతులందరూ గబగబా వరి నారు కొనుక్కొచ్చి నాటారు. అయితే ప్రకృతి రైతును మళ్ళీ మోసమే చేసింది. ఆ సంవత్సరం ఇక వానలు పడలేదు. అదను తప్పిపోయాక వేరుశెనగ వేసిన రైతుతో బాటు, వరి నాటిన రైతులంతా భారీగా నష్టపోయారు. లక్ష్మయ్య పొలంలో మటుకు కొర్రలు విరగ కాసాయి.   "అయినా ఏం లాభం? కొర్రలు పశువుల మేతకు తప్ప ఇంకెందుకూ పనికి రావు" అన్నారు అప్పటికే నష్టపోయిన రైతులు. వాళ్ల అంచనాలను వమ్ము చేస్తూ లక్ష్మయ్య పండించిన కొర్రలు మొత్తం మంచి ధరకు అమ్ముడయ్యాయి. "తృణధాన్యాలు చక్కెర వ్యాధిని దరి చేరనివ్వవు" అని కొత్తగా కనుక్కున్న పట్టణాల వాళ్ళంతా వరసలు కట్టి మరీ కొనుక్కెళ్ళారు, లక్ష్మయ్య పంటని. ఆ ఒక్క సంవత్సరంలోనే వేరుశెనగకంటేను, వరికంటేనూ ఎక్కువ లాభాన్ని కళ్ళజూసాడు లక్ష్మయ్య, తనకు ఆ అదృష్టాన్నిచ్చిన ముసలాయనకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ. - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

కుడి భుజం

కుడి భుజం     కొండమింది పల్లెకు దగ్గరలో కేసరివనారణ్యం అని ఒక అడవి ఉండేది. ఆ అడవిలో లెక్క లేనన్ని జంతువులు నివసించేవి. శూరసింగ్ సింహం ఆ అడవికి రాజు. ఆయనకు కుడిభుజం, చాణక్య మంత్రి అనే నక్క. తన నమ్మకాన్ని, మిత్రుడి స్నేహాన్ని ఆధారంగా చేసుకుని, అడవిలో అందరి మంచి చెడ్డలనూ చూసుకునేది సింహం. మాసంలో రెండు రోజులు చాణక్య మంత్రి మారువేషంలో‌ పోయి అడవి అంతా తిరిగి వచ్చేది. అడవిలో సంగతులన్నీ రాజుగారికి విశేషాలు చేరవేసేది. ఒకసారి చాణక్యమంత్రి ఆ పనిమీద పోయిన సమయంలో, శూరసింగ్‌కి ఏదో అనారో-గ్యమైంది. అది తన గుహను వదిలి ఆ రెండు రోజులూ బయటికి రాలేదు. దాంతో జంతులోకంలో కొంత గందరగోళమైంది. అంతలో చాణక్యమంత్రి తిరిగి వచ్చి, హుటాహుటిన రాజుగారిని చూడబోయింది. మూసిన కళ్ళు తెరవకుండా జ్వరంతో పడుకుని ఉన్నాడు శూరసింగ్. చాణక్య మంత్రి రాజుకు ధైర్యం చెప్పి "మన ఆస్థాన వైద్యుడు ఎలుగుబంటి సంజీవయ్యను తీసుకువస్తాను" అని బయలుదేరింది. వైద్యుడు సంజీవయ్య రాజుగారిని పరీక్షించి, "ఏమీ పర్వాలేదు. మామూలు జ్వరమే. తగ్గిపోతుంది" అంటూ గుహ బయటికి పోయి కొన్ని రకాల ఆకులు తెచ్చి నూరింది. వాటి రసాన్ని తాను తెచ్చిన చిన్న ముంతలో పోసి ఇచ్చి "దీన్ని బాదాం ఆకులో పోసి మూడు పూటలా నాకించండి. జ్వరం తగ్గిపోతుంది. భయపడాల్సిన పనిలేదు. ఒక్క ఐదు రోజులు విశ్రాంతి తీసుకుంటే చాలు. ఇక నేను వెళ్ళివస్తాను" అన్నది. చాణక్య మంత్రి సంజీవయ్యకు కృతజ్ఞతలు తెలిపి, గౌరవించి పంపించింది. ఎన్నాళ్ళ నుండో అడవికి రాజు కావాలన్న ఆశతో ఉన్న తంత్రీపాలుడు అనే‌ పులికి తెలిసింది ఈ సంగతి. "శూరసింగ్ ఆరోగ్యంగా ఉన్నప్పుడు నేను వాడిని ఏమీ చేయలేను. అయితే ఇప్పుడు మంచి సమయం. ఈ అవకాశాన్ని ఉపయోగిం-చుకోవాలి" అనుకున్నదది. రాజ్యాన్ని చక్కబెడుతూ బిజీగా ఉన్న మంత్రి చాణక్యుడిని కలిసి, ముందు కొద్ది సేపు ఆమాటా, ఈమాటా కలిపింది.    రాజుగారికి ఆరోగ్యం బాగా లేదని తెలిసి బాధ పడుతున్నట్లు నటించింది. అటుపైన గొంతు తగ్గించి ఇప్పుడు కొంచెం మెల్లగా గర్జిస్తూ, "మహామంత్రి గారూ! మీరు ఏమీ అనుకోనంటే, మరి- నేను నా మనసులో మాట బయట పెడతాను... చూడండి, నేను కూడా మీ‌ రాజులాగానే వేటాడగలను; నాకు కూడా పంజా విసరటం వచ్చు; నాకు కూడా కోర దంతాలు ఉన్నాయి..ఏమంటే మీ రాజుగారికి గడ్డం ఉంది, నాకు లేదు- అంతే కదా తేడా?! మిగతావన్నీ‌ అచ్చం మీ రాజులాగానే‌.... ఆ!... ఏమంటారు?" అని వికవికా నవ్వింది. మంత్రి చాణక్య ఒక్క క్షణం ఖంగుతిన్నది అంతే. ఆ వెంటనే దాని కళ్ళలో ఏదో మెరుపు వచ్చింది. అది చటుక్కున తంత్రీపాలుణ్ణి పక్కకు లాగుతూ, తనూ గొంతు తగ్గించింది- "మెల్లగా మాట్లాడు. గోడలకు చెవులుంటాయి. మన మాటలు ఎవరైనా‌ వింటారు. నేను చెప్పినట్లు చెయ్యి. నేను రాత్రంతా ఆలోచించి, మనం ఏం చేస్తే ఎవరికీ‌ తెలియకుండా పని జరిగిపోతుందో చెప్తాను నీకు. రేపు సాయంత్రం ఊరి పొలిమేర దగ్గర కలుద్దాం. నేను మాత్రం శక్తిలేని ఈ‌ ముసలి రాజుతో ఎన్నాళ్ళని వేగుతాను?" అన్నది గుసగుసగా.   "ఊరి పొలిమేర వరకూ పోవటం ఎందుకు?! ఇక్కడే మాట్లాడుకుంటే‌ పోలా?!" అన్నది తంత్రీపాలుడు మూర్ఖంగా. దానికి గుసగుసగా మాట్లాడటం రాదు. అన్నిటికీ గర్జనే! నక్క దానికి అడ్డు చెప్తూ "అందుకే! నువ్వు ఇన్నాళ్ళూ రాజువి ఎందుకు కాలేదో నీ మాటలు వింటే అర్థం అయిపోతోంది. ఇలాంటి విషయాల్ని ఊరి పొలిమేర దగ్గరే మాట్లాడుకోవాలి.. తెలుసుకో! పద..పద! వర్షం కూడా వచ్చేటట్లు ఉంది!"‌ అంటూ పులిని పంపించేసింది. మరునాడు పొలిమేరలో కలిసారు ఇద్దరూ. "ఏమి ఆలోచించావ్.." అడిగాడు తంత్రీపాలుడు. చాణక్య నక్క చిన్నగా నవ్వింది- "ఏముంది, అన్ని విధాలుగానూ ఆలోచించా. ఇదే మంచి తరుణం. రాజు ప్రస్తుతం జబ్బుతో ఉన్నాడు. కనుక..., సంజీవయ్య ఇచ్చిన ఆకు పసరును మార్చి, మనం వేరొకటి ఏదో ఇస్తాం.. అటు రాజు హతం.. ఇటు మీకు రాజపదవి!" అన్నది. "శభాష్..! భలే ఆలోచన" అని మురిసింది పులి.   ఇంతలో దూరంగా మేకల గుంపుల్ని తోలుకుపోతున్న కాపరులు కనపడ్డారు వాళ్ళకు. చాణక్య మంత్రి కాపరులకేసి చూపిస్తూ, "నేను వీళ్లను ఎదుర్కొనలేను గానీ, వీళ్లంతా ఇష్టంగా తినే మేక మాంసం అంటే మటుకు చాలా ఆశ నాకు! దాన్ని తినాలని నా చిన్నప్పటి నుండీ‌ ఎదురు చూఫులే!" అన్నది. "నువ్వు నాకు ఇంత సాయం చేస్తున్నందుకు నేను ఈమాత్రం చేయలేనా.. ఇప్పుడే వెళ్ళి వాటిని వేటాడి మాంసం తెస్తాను" అన్నది పులి. నక్క దానికేసి చూసి తిరస్కారంగా నవ్వింది. "అన్నింటా నీకు ఆవేశం‌ఎక్కువ, ఆలోచన తక్కువ లాగా ఉందే! అందుకే మరి, నువ్వు ఇన్నేళ్ళూ రాజువి కాలేకపోయావు. ముందు నేను చెప్పినట్లు చెయ్యి! అక్కడ కనబడుతున్న రాళ్ళ వరకూ వెళ్ళి, చుట్టూ చూసి రా! ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను!" అన్నది. "అబ్బ! నాకు మండుతున్నది!" అనుకొని, "అయినా వీడి మాటలు వినక తప్పదు- ఏం చేస్తాం" అని గుట్టమీదికంతా పోయి నక్క చెప్పినట్టుగా చుట్టూ చూసి వచ్చింది పులి. అది తిరిగి రాగానే "ఏం చూశావ్?!" అన్నది నక్క "ఏముందీ‌, బురద తొక్కుకుంటూ పోయా! పోయి ఊరికే పొలాలు, చెట్లు, గుట్టలు చూసొచ్చా..!" అన్నాడు తంత్రీపాలుడు చికాకుగా. అప్పుడు చాణక్య నక్క "అందుకే! మరి నువ్వు ఇన్నాళ్ళుగా రాజువి కాలేకపోయింది! అక్కడ అంతమంది కాపరులు మేకల్ని తోలుకుని ఇళ్ళకు పోవడం నీకు కనిపించనే లేదా?! ఇప్పుడు వేటాడడానికి వెళ్తావా? వెళ్తే వాళ్లంతా కలిసి మనల్ని పట్టుకుని చంపెయ్యరా? ఆమాత్రం‌ ఆలోచన లేదేమి?" అని కసిరింది. "ఒక పని చెయ్యండి! తమరు రేపు మధ్యాహ్నం వేళకు రండి, ఇక్కడికి. ఆ సమయానికి కాపరులు అలిసిపోయి, అన్నం తిని, కునికిపాట్లు పడుతూంటారు. ఆ సమయంలోనైతే తమరు నిశ్చింతగా వేటాడవచ్చు; ఇటు నా కోరికా తీర్చవచ్చు. ఏమంటారు? .. కాబోయే రాజుగారూ...!" అనగానే తంత్రిపాలుడు పొంగిపోయి, "సరే సరే" అని పాటలు పాడుకుంటూ అడవిలోకి దూరాడు. మర్నాడు తెల్లవారుజామున ఎప్పటిలాగానే పొలం పనులకు బయలుదేరారు రైతులు, మేకల కాపరులు. దారిలో అక్కడంతా బురదలో పులి అడుగులు కనిపించినై వాళ్లకి. వాళ్ళు వాటిని గుర్తించి "ఒరేయ్! రాత్రి మన పల్లెలోకి పులి వచ్చినట్లుందిరోయ్! ఇప్పుడే‌ పోయి గ్రామాధికారికి చెప్పాలి! లేకపోతే ఇంక మనం‌ లేం!" అని వెనక్కి పరుగు పెట్టారు. ఆ వెంటనే గ్రామాధికారి అక్కడికి వచ్చి చూసి, "నిజమే! ఇది మళ్ళీ వస్తుంది!" అని మాంసం ఉంచిన బోనును ఒకదాన్ని ఊరి పొలిమేరల్లో ఏర్పాటు చేయించాడు. అనుకున్నట్లుగానే ఆ రోజు మధ్యాహ్నానికి నక్క, పులి వచ్చాయి అక్కడికి.    బుర్ర తక్కువ తంత్రీపాలుడి ముక్కు పుటాలకు మాంసం వాసన తగిలేసరికి, ఇక అది ఉండబట్టలేక పోయింది. నక్క ఎంత వారిస్తున్నా వినకుండా అది పరుగు పరుగున పోయింది, బోనులోని మాంసం తినేందుకు. అంతలోనే బోను తలుపు మూసుకున్నది; అది ఆ బోనులో‌ ఇరుక్కుపోయింది. గర్జిస్తూ, గింజుకుంటూ అది చాణక్య నక్క ఉండిన దిక్కుకు చూసింది. కానీ నక్క ఇప్పుడు అక్కడ ఉంటేగా? "మా మహారాజుకు మంత్రిని! కుడి భుజాన్ని! నమ్మిన బంటుని! నాతో పెట్టుకుంటావా?!" అని నవ్వుకుంటూ‌ అడవి వైపుకు సాగిపోతున్న ఆ నక్క వీపు మటుకు కనపడింది దానికి! అధికారులు తంత్రీపాలుడిని పట్నంలోని జంతు ప్రదర్శనశాలకు పంపించివేశారు. అడవి అంతా హాయిగా తిరుక్కుంటూ, అనుకున్నది తింటూ, స్వేచ్ఛగా బ్రతికిన పులి, ఇప్పుడు తన అత్యాశ పుణ్యాన మనుషులకు చిక్కి, వాళ్ళు పెట్టింది తింటూ, వచ్చే పోయే మనుషులను ఆశగా చూస్తూ కాలం గడిపింది!  ఎంత దుర్దశ!!  - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

తెలివైన కోతి!

తెలివైన కోతి!   అనగనగా ఒక ఊళ్ళో ఒక అవ్వ, మనుమడు ఉండేవాళ్ళు. ఒకరోజున అవ్వ సంతకు పోతుంటే, మనుమడు 'నేను కూడా వస్తా' అని ఏడ్చాడు. 'సరే, రా' అని, అవ్వ వాడిని వెంటబెట్టుకొని పోయింది. అక్కడ, సంతలో అవ్వ కూరలు బేరం చేస్తుంటే, మనుమడు అక్కడే ఉన్న కోతులను చూస్తూ నిలబడ్డాడు. ఆ కోతుల్లో ఒక పిల్లకోతి ఉన్నది. దానికి ఒక కాలుబాగా లేదు, పాపం. మిగిలిన కోతులన్నీ దాన్ని భయపెడుతుంటే, అది చెట్టు క్రిందికి దిగి, అక్కడే ముడుచుకొని కూర్చున్నది. మనుమడు దాన్ని చూసి జాలిపడి, అవ్వ తనకిచ్చిన అరటిపండును దాని చేతిలో పెట్టాడు. అది దాన్ని గబగబా తిని, ఇక వాడిని వదిలిపెట్టలేదు. అవ్వ, మనుమడు ఇంటికి వెళ్లినప్పుడు అదికూడా వాళ్ల వెంటే వచ్చింది. ఆపైన ఇక అది వాళ్ళ కుటుంబంలో భాగం అయిపోయింది. ఒక ఆదివారంనాడు, అవ్వ మనుమడితో "ఒరే, ఈరోజు బడికి సెలవు. నువ్వు అడవికి వెళ్లి, పేడ పెటకలు పట్టుకురా, పో" అన్నది. వాడికి వెళ్లటం ఇష్టంలేక ఏడుస్తుంటే, కోతి ఒక గంప పట్టుకొని, తనొక్కతే అడవికి బయలుదేరింది. అక్కడ దానికి ఒక పాడుపడిన మిద్దె కనిపించింది. 'అందులో ఏముందో' అని, చూసేందుకని, అది మెద్దెపైకి ఎక్కింది. మిద్దెపైన చూస్తే చాలా బంగారం! వెంటనే అది ఆ బంగారాన్ని తన దగ్గరున్న గంపలో వేసుకొని, దానిమీద పేడ పెటకలు పెట్టుకుని, ఇంటికి పోయింది. నేరుగా ఇంటి లోపలికి పోయి, 'దించుకుందువు రా, అవ్వా' అని పిలిచింది అవ్వని. అవ్వా, కోతీ కలిసి గంపను కుమ్మరించి చూస్తే, ఏముంది?- గదినిండా బంగారమే! 'ఇంత బంగారం ఎక్కడినుంచి తెచ్చావే?' అని అడిగింది అవ్వ ఆశ్చర్యంగా. అప్పుడు కోతి అవ్వకు విషయం అంతా చెప్పింది. "అయ్యో, అది దొంగ ఉండే మిద్దే, నువ్వు బంగారం తెచ్చిన సంగతి తెలిసిందంటే దొంగ ఇక మనల్ని బతకనివ్వడు" అని భయపడింది అవ్వ. "నీకేం భయంలేదులే, అవ్వా! నేనున్నానుగా!" అని భరోసా ఇచ్చింది కోతి.   ఇక అక్కడ దొంగ తన బంగారం పోయిన సంగతిని గుర్తించి, "ఎవరబ్బా నా బంగారం ఎత్తుకెళ్ళారు, ఈసారి రానీ వాళ్ళ పని చెబుతాను" అని కాచుకు కూర్చున్నాడు. కొన్ని రోజుల తర్వాత, ఇదివరకులాగానే ఇంకొంచెం బంగారం ఏమన్నా దొరుకుతుందేమోనని, కోతి బయలుదేరి, మిద్దె పైకి ఎక్కింది. అక్కడ కాచుకు కూర్చున్న దొంగ వెంటనే దాన్ని పట్టుకున్నాడు - "నువ్వేనా, నా బంగారం తీసుకుపోయిన కోతివి! " అంటూ. అప్పుడు కోతి కిచకిచలాడుతూ "నన్నేం చెయ్యకు, నన్నేం చెయ్యకు! నీకు నా చెల్లినిచ్చి పెళ్ళి చేస్తాను" అన్నది. "ఇదేదో మంచి కోతులాట, బాగానే ఉందే, చూద్దాం, ఏమౌతుందో" అని, ఒప్పుకున్నాడు దొంగ. అప్పుడు కోతి ఇంటికెళ్లి, సంగతంతా అవ్వకు చెప్పింది. అందరూ కలిసి రెండు కేజీల గోధుమ పిండితో ఒక అమ్మాయి బొమ్మను చేశారు. కోతి ఆ బొమ్మను తీసుకొని, దొంగ దగ్గరకు వెళ్ళి "ఇదే, నా చెల్లి. ఈమెను ఈ గదిలో దింపి వెళ్తాను. మూడు రోజుల వరకూ ఈమెను ముట్టుకోవద్దు. రోజూ ఈమెకు అన్నం పెట్టి, గది తలుపులు మూసి వెళ్తూండు. మూడు రోజుల తర్వాత నేను మళ్ళీ వస్తాను. ఆలోగా ఈమెకు ఏమైనా అయ్యిందో, నీ పని చెబుతాను" అని, వెళ్ళిపోయింది. దొంగవాడు కోతి చేష్ఠలకు నవ్వుకున్నాడు. "ఈ పిండి బొమ్మకు రోజూ అన్నం పెట్టాలట!" అని, వాడు మూడురోజుల తర్వాత ఏం వినోదం జరుగుతుందో చూద్దామనుకున్నాడు. అయితే మూడో రోజున ఇంకా కోతి రాకుండానే వాడు వెళ్లి, పిండిబొమ్మ చెయ్యిముట్టుకుంటే- చెయ్యి విరిగిపోయింది. తలను ముట్టుకుంటే తల విరిగిపోయింది. అంతలో అక్కడికి వచ్చిన కోతి "అయ్యో! నా చెల్లిని చంపేశాడు! నా చెల్లిని చంపేశాడు! నన్ను అన్యాయం చేశాడు- దేవుడో! అవ్వో! రండి! రండి!‌ అందరూ రండి!" అని మొత్తుకున్నది. సిద్ధంగా ఉన్న అవ్వ, పోలీసుల్ని వెంటబెట్టుకొని పరుగెత్తుకొని వచ్చింది. పోలీసుల్ని చూసిన దొంగ కాలికి బుద్ధి చెప్పాడు, కానీ వెంటబడి పోలీసులు వాడిని పట్టుకుపోయారు. తమ పథకం పారినందుకు అవ్వ, కోతి చాలా సంతోషపడ్డారు. ఆపైన అందరూ హాయిగా జీవించారు.   - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

బంగారు నాణాల కథ..

బంగారు నాణాల కథ!   అనగనగా ఒక ఊళ్లో ఒక ముసలమ్మ ఉండేది. ఆ ముసలమ్మకు ఇద్దరు కొడుకులు. పెద్దోడు మొద్దు కానీ అతని మనసు మంచిది. చిన్నోడు బాగా చదువుకునేవాడు కానీ అతనిలో చాలా స్వార్థం ఉండేది. రోజులు, సంవత్సరాలు గడిచాయి. చిన్నోడు పరీక్షలు పాసై పట్నంలో మంచి ఉద్యోగం తెచ్చుకున్నాడు. పట్నంలో ఉంటూ, అప్పుడప్పుడూ పల్లెకు వచ్చి తల్లిని, అన్నను చూసి పోయేవాడు. పెద్దోడు ఊళ్ళోనే ఉండేవాడు. వ్యవసాయం చూసుకుంటూ, ఎవరూ లేని పిల్లలకు వాళ్ళు చదువుకునేంత వరకు చదువు చెప్పించేవాడు. ముసలమ్మని కనిపెట్టుకొని ఉండేవాడు- అందుకని ఊళ్ళో వాళ్లంతా అతని గురించి మంచిగా అనుకునేవాళ్ళు. అయినా చిన్నోడికి పెద్దోడు అంటే లక్ష్యం లేదు. పెద్దోడిని చూసి అసూయ పడేవాడు. పెద్దోడు మంచి కోరి ఏం చెప్పినా గానీ ఇతను చికాకు పడేవాడు.   ఒకసారి ముసలమ్మకు ఆరోగ్యం బాగా లేకుండా అయ్యింది. "తను చనిపో-బోతున్నది" అని అర్థం అయిందామెకు. దాంతో ఆమె తన ఇద్దరు కొడుకులనూ చేరబిలిచి, తాంబూలపు తిత్తిలోంచి పది బంగారు నాణాలు బయటకు తీసింది. చెరైదు నాణాలూ కొడుకులకు ఇస్తూ "నాయనలారా! ఇవి మామూలు నాణాలు కావు. వీటిని మట్టిలో పూడ్చితే, ఒక్కో నాణెం నుండి ఒక్కో‌ మొక్క వస్తుంది. ఆ మొక్కల్ని జాగ్రత్తగా పెంచండి- కొన్ని రోజులకల్లా ఒక్కొక్క మొక్కకూ ఒక్కొక్క గుమ్మడికాయ కాస్తుంది. ఆ గుమ్మడికాయల నిండా బంగారు నాణాలు ఉంటాయి.." అని తను మాట్లాడం ఆపి, మళ్ళీ చెప్పింది. "చూడండి బాబులూ! వీటిని మీ స్వార్థం కోసం వాడుకోవద్దండి. ఇతరులకోసం ఉపయోగిస్తే తప్ప, ఇవి మీ దగ్గర నిలవవు!" అని చెప్పి కన్ను మూసింది. కొన్ని రోజులు గడిచాయి. పెద్దోడు ఆ ఐదు నాణాలనూ నాటాడు. ఐదు గుమ్మడికాయలు వచ్చాయి. నాలుగు గుమ్మడి కాయల్ని ఆనాథాశ్రమాలకు, పేదవాళ్ళకు ఇచ్చేసాడు.   ఐదో గుమ్మడికాయ నాణాలని తనతోనే పెట్టుకున్నాడు. పేద పిల్లల్ని చదివించేందుకు, ఊరికి పనికొచ్చే పనులు చేసేందుకు వాటిని వాడాడు. అవి అయిపోవస్తున్నాయనగా వాటిల్లోంచి మరో ఐదు నాణాలు నాటాడు. అవి మొలకెత్తినై; మళ్ళీ నాణాలనిచ్చినై. చిన్నోడు నాటిన ఐదు నాణాలు కూడా ఐదు గుమ్మడి కాయల్ని ఇచ్చాయి. ఐతే స్వార్థపరుడైన చిన్నోడు వాటిలోని బంగారు నాణాలని ఎవ్వరికీ‌ ఇవ్వలేదు. వాటినన్నిటినీ నాలుగెకరాల చేనులో తిరిగి నాటాడు. అయితే ఆశ్చర్యం, ఎన్ని రోజులైనా ఏమీ కాలేదు! త్రవ్వి చూస్తే అక్కడ తను నాటిన నాణాలు కూడా లేవు! చిన్నబోయిన చిన్నోడికి అమ్మ చెప్పిన మాటలు అప్పుడు గుర్తుకుచ్చాయి. 'ఇతరులకోసం ఉపయోగించటం' అంటే ఏంటో కొద్దిగా అర్థం అయ్యింది అతనికి. దాంతో చింతించటం మాని, తనకు చేతైనంతలో ఇతరులకు సాయం చేయటం మొదలుపెట్టాడు. అన్న మంచితనాన్ని గుర్తించి, అతనితో‌ సఖ్యంగా ఉండటం మొదలెట్టాడు. కాల క్రమంలో అన్నాదమ్ములిద్దరూ సమాజానికి పనికొచ్చే పనులు చాలా చేసారు! - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

ఆరియన్-డాల్ఫిన్ కథ

ఆరియన్-డాల్ఫిన్ కథ   ఏసుక్రీస్తు పుట్టటానికి ఆరువందల సంవత్సరాల ముందు గ్రీసు దేశంలో కోరీంత్‌ అనే నగరం ఒకటి ఉండేది. పెరియాందర్‌ అనే రాజు పరిపాలించేవాడు కోరీంత్‌ను. ఆ రాజుకు కళలన్నా వృత్తులన్నా చాలా ఇష్టం ఉండేది. పెద్ద పెద్ద భవంతులు కట్టిన వాస్తు శిల్పులు, ఎర్రమట్టిపై చిత్రాలు గీసే కళాకారులు, గాయకులు- ఇట్లా అనేక మంది కళాకారుల్ని ఆయన పోషించేవాడు. అట్లాంటి ఆ సమయంలో కోరీంత్‌కు దగ్గర్లోనే ఉన్న మరో గ్రీసు ద్వీపంలో ఒక క్రొత్త సంగీతపు కెరటం ఎగసింది. 'ఆరియాన్‌ ' అనే గాయకుడొకడు, అద్భుతమైన తన గానంతో పిల్లల నుండి ముసలివాళ్ల వరకూ అందరినీ మెప్పించసాగాడు. అతనుండే చిరుద్వీపం లెస్‌బోస్ నుండి అతని ఖ్యాతి సుదూరంగా ఉండే టర్కీ వరకూ ప్రాకింది. అతని సంగీతాన్ని గురించి విన్న పెరియాందర్‌ అతన్ని తన సభలో పాడేందుకు రప్పించుకొని విని, పరవశించి పోయాడు. పెద్ద జీతం ఇచ్చి అతన్ని తన ఆస్థాన విద్వాంసుడిగా చేర్చుకున్నాడు. 'లైర్' అనే తీగల వాయిద్యాన్ని వాయిస్తూ లోకాన్ని సమ్మోహింపజేసేటట్లు పాడేవాడు ఆరియన్. గ్రీకులకు సారాయి త్రాగుతూ నాట్యం చేయటం అంటే ఇష్టం. ఆరియన్ పాడే పాటలు దానికి అనువుగా ఉండేవి. దాంతో అతన్ని తమ వద్దకు వచ్చి వెళ్ళమంటూ ఎక్కడెక్కడినుండో ఆహ్వానాలు వస్తుండేవి. ఇట్లా ఆస్థాన విద్వాంసుడైనాక, రాజుగారి ఖర్చుతో దేశదేశాలూ తిరిగి సంగీత సభలు చేసేవాళ్ళు, ఆరియన్, అతని బృందమూనూ. అట్లా అతని పాట వినేందుకు వందల సంఖ్యలో‌ బంగారు నాణాలను వెచ్చించేవాళ్లట, ఆనాటి ధనికులు! అట్లా ఆరియన్‌కు ఒట్టి పేరే కాక లెక్కలేనంత సంపద కూడా సమకూరింది.   అట్లా ఉండగా ఒకసారి ఇటలీ చివర్లో ఉన్న 'సిసిలీ' నుండి అతనికి ఒక ఆహ్వానం వచ్చింది. పెరియాందర్ అనుమతి తీసుకొని, అనేక రోజుల పడవ ప్రయాణం తరువాత ఆరియన్‌ సిసిలీ చేరుకున్నాడు. అక్కడి ప్రజలు, రాజులు అతనికి బ్రహ్మరధం పట్టారు. లెక్కలేనంత బంగారాన్ని, నగల్ని కానుకలుగా ఇచ్చారు. సిసిలీ నుండి ఆ సంపదనంతా తీసుకొని, ఒక పెద్ద పడవలో తిరిగి కోరింత్‌కు బయలుదేరాడు ఆరియన్. అయితే ఆ పడవను నడిపే వాళ్లు చాలా దుర్మార్గులు. తమ పడవలో ఉన్న ప్రయాణీకుడు ఎవరో వాళ్లకు బాగా తెలుసు. అతని దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని కూడా వాళ్లకు తెలుసు. నడి సముద్రంలో వాళ్ళు తమ అసలు ఉద్దేశాన్ని బయట పెట్టారు. సంతోషంగా వెనక్కి వస్తున్న ఆరియన్‌కు ఆ విధంగా కష్టాలు ఎదురైనాయి. పడవ సరంగు కత్తి చూపి బెదిరిస్తూ, ఆరియన్‌ను "నువ్వు ఆత్మహత్య చేసుకుంటావా, లేకపోతే కాళ్లు చేతులు కట్టేసి నిన్ను సముద్రంలో పడేయమంటావా?!" అని అడిగాడు కర్కశంగా. రెండూ ప్రాణాంతకాలే, అయితే ఆత్మహత్య చేసుకుంటే సరంగులు అతని శరీరాన్ని నేలకు చేర్చి దహనం చేస్తారట; లేకపోతే అతనే స్వయంగా జలచరాలకు ఆహారం అయిపోవచ్చట! అయితే అంత కష్టంలో కూడా ఆరియన్‌ బెదిరిపోలేదు. సముద్రంలోకే తనని పడేయమన్నాడు: అయితే 'ఆలోగా తనకు నచ్చిన పాటలు కొన్ని పాడుకోనీ'యమన్నాడు. మామూలుగా తాను పాటలు పాడేటప్పుడు ధరించే ప్రత్యేకమైన డ్రస్‌ వేసుకొని, లైర్‌ వాయిస్తూ గొంతెత్తి పాడటం మొదలు పెట్టాడు ఆరియాన్‌ . అంత గొప్ప గాయకుడు, ప్రత్యేకంగా 'తాము మాత్రమే వినేందుకు పాడుతున్నాడు' అని పడవ నడిపే నావికులందరూ సంతోషపడి ఉంటారు. ఇతను పాటలు పాడుతున్నప్పుడు బహుశ: బాగా త్రాగి ఉంటారు కూడా. అతని చివరిపాటల్ని తాము మాత్రమే వింటామని నావికులు అనుకున్నారేమో గానీ, అంతకు మించిన అద్భుతం ఒక్కటి జరిగింది. ఆరోజున ఆరియన నిజంగా హృదయాన్ని కరిగించే పాటలు పాడాడు. వాటిని వినేందుకు సముద్రంలోని డాల్ఫిన్లు అన్నీ అక్కడ వందల కొద్దీ జమ అయినాయట!   పాట ముగియగానే ఆరియన్ తనంతట తాను సముద్రంలోకి దూకేశాడు. 'అతని కాళ్ళు చేతులు కట్టెయ్యలేకపోయామే' అని ఆ పని పెట్టుకున్న నావికులు కొందరు బాధ పడ్డారుగానీ, "ఇంత నడి సముద్రంలోని షార్క్ చేపలు వాడిని ఈపాటికే చప్పరించేసి ఉంటయిలే; తాళ్ళు మనదగ్గర ఉంటే నష్టం లేదు" అని మిగిలినవాళ్ళు వాళ్లను ఊరడించారు. ఆపైన అందరూ "పీడ విరగడైంది-బంగారం సొంతమైంది" అని సంతోషంగా పాటలు పాడుకుంటూ వేగంగా తమ దారిన తాము పోయారు. అయితే ఎంత నడి సముద్రమైనా, వాళ్లు ఊహించినట్లు ఆరియన్‌ మునిగీ పోలేదు; షార్కులకూ బలి కాలేదు. అతని పాటను విన్నదో ఏమోగాని, సముద్రంలో ఈది ఈది అలసి, మునిగిపోతున్న ఆరియన్‌ను డాల్ఫిన్‌ ఒకటి తన మీదికి ఎక్కించుకొని క్షేమంగా అవతలి ఒడ్డుకు చేర్చింది! 'కేప్టీనేరమ్‌' అని పిలిచే ఆ తీరంలో సముద్ర దేవత గుడి ఒకటి ఉండేది. అక్కడి తేరుకుంటూ కొన్నాళ్ళు గడిపిన ఆరియన్ను అక్కడి ప్రజలు "డాల్ఫిన్‌నెక్కి వచ్చిన వీరుడు" అని పిలుచుకున్నారట! వాళ్ళకు అందరికీ అతను తన సంగీతాన్ని, సంతోషాన్ని పంచాడట! అలా 'అతని సంగీతం మరింత పదునెక్కింది' అని చెబుతారు. కొంత బలం వచ్చాక అక్కడినుండి బయలుదేరిన ఆరియన్‌ అనేక కష్టాల తర్వాత మెల్లగా కోరింత్‌ చేరుకున్నాడు. రాజు పెరియాందర్‌ అతన్ని చూసి ఆశ్చర్యాన్నీ సంతోషాన్నీ ప్రకటిస్తూ "ఏమైంది నీకు? ఇన్నాళ్లయినా రాకపోతే, ఇక మరి మా ఆస్థానాన్ని వదిలేసావేమో అని బాధ పడ్డాను!" అన్నాడు. ఆరియన్ ఆయనకు జరిగిన కథనంతా చెప్పి, నావికుల మోసాన్ని, డాల్ఫిన్లు తనని కాపాడటాన్ని వివరించాడు. అయితే ప్రయాణం వల్లనైతే నేమి, తను భరించిన కష్టాలవల్లనైతే నేమి ఆరియన్ గొంతు బాగా మారిపోయి ఉన్నది. రాజుకు అతను చెప్పిన ఈ కథ నమ్మశక్యం కాలేదు. దాంతో పాటు అసలు ఇతను "ఆరియన్‌ కాదేమో" అని కూడా అనుమానం వచ్చింది. అందుకని ఆయన ముందుగా ఆరియన్‌ను ఇంట్లో నుంచి బయటికి రాకుండా కట్టడి చేసి, వైద్య సదుపాయాలు వగైరా కల్పించి, ఆనక సిసిలీ నుండి రావలసిన పడవకోసం కబురు పంపాడు. ఆ పడవ కోరింత్‌ చేరుకోగానే సైనికులు అందులోని నావికులను అందరినీ రాజాజ్ఞ ప్రకారం పెరియాందర్ ముందు ప్రవేశపెట్టారు.   రాజుగారు ఆ నావికులతో "మీ ప్రయాణాలు బాగా జరుగుతున్నాయా? ప్రఖ్యాత గాయకుడు ఆరియన్‌ ఎలా ఉన్నాడు? తిరిగి ఎప్పుడు వస్తాడట?" అని అడిగాడు. కంగారు పడిన నావికులు, బయట పడకుండా "బాగున్నాడు ప్రభూ! సిసిలి అంతటా సంగీతాన్ని ప్రవహింపజేస్తున్నాడు. ఒకసారి అక్కడంతా పాటలు పాడాక, అప్పుడు తిరిగి వస్తాడు" అనేసారు. అంతలోనే తెరవెనకనుండి బయటికి వచ్చి నిలబడ్డాడు ఆరియన్. తను సముద్రంలోకి దూకినప్పుడు వేసుకున్న దుస్తులే వేసుకొని ఉన్నాడతను! అతన్ని, అతని నవ్వుని చూసిన నావికులంతా "భూతమేమో!" అనుకొని వణుక్కుంటూ సాగిలపడ్డారు. పెరియాందర్‌ గట్టిగా అడగగానే తమ నేరాన్ని పూర్తిగా ఒప్పుకున్నారు. అయినా కథని పూర్తిగా నమ్మని పెరియాందర్‌ తన రాజ్య ప్రజల్నే కాకుండా అనేక మంది యాత్రికుల్ని కూడా ఈ విషయమై ప్రశ్నించాడట. వాళ్లలో కొందరు చెప్పిన ప్రకారం అతను కేప్టినేరమ్‌ చేరుకొని అక్కడి గుడిలోకూడా చూసాడని, 'సముద్రంలో డాల్ఫిన్‌పై తేలుతూ వస్తున్న ఆరియన్‌ ' కంచు విగ్రహాన్ని ఆ గుడిలో చూసిన తర్వాతగానీ అతనికి డాల్ఫిన్‌ల మంచితనంపై గురి కుదరలేదని, చెబుతారు. ఈ కథను వెతికి తీసిన చరిత్రకారులు కూడా చాలామంది దీన్ని నమ్మలేదు. కానీ ఈ మధ్య కాలంలో మనకి డాల్ఫిన్ల గురించి అనేక సంగతులు తెలిసాయి. అవి చేపల జాతి సముద్ర జీవులు కాదు: భూమి మీద తిరిగే జంతువులలాగా అవి కూడా క్షీరదాలు- అంటే పిల్లలకు పాలు ఇచ్చి పెంచుతాయి! అంతే కాదు; అవి శబ్దాల ద్వారా ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి! మనుషులతో స్నేహం చేయగలుగుతాయి! ఆధునిక కాలంలో కూడా సముద్రంలో చిక్కుకుపోయిన వారిని కొందరిని అవి కాపాడాయి! అట్లా చూస్తే ఈ కథ ఏమంత కట్టుకథ కాదనిపిస్తుంది. అయినా మరి నున్నగా జారే డాల్ఫిన్‌ మీదినుండి జారిపోకుండా ఆరియన్‌ ఎలా వచ్చాడో?! మనషులు, జంతువులు ఒకప్పుడు నిజంగానే స్నేహంగా ఉండేవాళ్లేమో?! -ఇవన్నీ మీకై మీరు కనుక్కోవాలి; ఆ క్రమంలో పాత కట్టు కథల్లో దాక్కున్న నిజాల్ని బయటికి తేవాలి. - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

భలే పిల్లలు

శ్రీను, వాణీ ఇద్దరూ ఒకే తరగతి చదువుతున్నారు. ఇద్దరూ తెలివైన విద్యార్థులే. ఎప్పుడు ఎవరు మొదటి ర్యాంకు వస్తారో చెప్పడం కష్టం. చిన్నప్పటి నుంచీ ప్రతి చిన్న విషయానికీ పోట్లాడుకునేవారు. వారి సమస్యను పరిష్కరించడానికి తల ప్రాణం తోకకు వచ్చేది. "శభాష్ వాణీ! నువ్వు పద్యాన్ని రాగ, భావ యుక్తంగా మంచిగా అప్పజెప్పావు." అని తెలుగు ఉపాధ్యాయులు మెచ్చుకుంటే శ్రీనూకి కోపం వచ్చేది. శ్రీనూని పొగిడితే వాణీకి కోపం వచ్చేది. కానీ ఇద్దరూ ఎంత పోట్లాడుకున్నా కాసేపట్లో అంతా మరచిపోయి ఎవరి చదువులో వారు మునిగి పోయేవారు. వీరిద్దరి మధ్య వైరాన్ని పెంచడానికి కొంతమంది స్వార్థపరులు ప్రయత్నించేవారు.           "వాణీ! ఆ శ్రీను నువ్వు బాగా చదువినా, నిన్ను ఎవరు మెచ్చుకున్నా అస్సలు ఓర్వలేడు. వాడితో నువ్వు ఎప్పుడూ మాట్లాడవద్దు." అన్నది మంజుల అనే అమ్మాయి. "శ్రీను నీకు శత్రువా?" అన్నది వాణి.  "కాదు" అన్నది మంజుల. "మరి నువ్వెందుకు అతనిపై చెడుగా నాకు చెబుతున్నావు?" అని నిలదీసింది వాణి. మంజుల తలవంచుకుని అక్కడ నుంచి వెళ్ళింది. మరోసారి సతీశ్  అనే అబ్బాయి‌ శ్రీను వద్దకు వచ్చి, "ఆ వాణీనే మాస్టార్లు ఎఎప్పుడూ మెచ్చుకుంటారం? పాపం! నిన్నెవ్వరూ పట్టించుకోరు. ఆ వాణీతో నువ్వు ఎప్పుడూ మాట్లాడవద్దు. ఎప్పుడూ నీతో ఏదో ఒక గొడవే!" అన్నది. "నీకూ వాణికి శత్రుత్వమా?" అని అడిగాడు శ్రీను. "లేదు." అన్నాడు సతీశ్. "ఇద్దరి మధ్య పోట్లాటలు జరుగుతుంటే వారి మధ్య శత్రుత్వాన్ని పెంచడమేనా నీ పని? అలా పెంచితే నీకు ఏం వస్తుంది? నీవు మనశ్శాంతిని కోల్పోతావు. నీ సమయాన్ని ఇతరులకు మంచి చేయడానికి కేటాయించు. కానీ ఇలాంటి పనిలేని ఆలోచనలు చేయకు." అన్నాడు శ్రీను. సిగ్గుతో తల వంచుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు సతీశ్. వాళ్ళిద్దరూ పోట్లాడుకున్నా ఎవరి మధ్యనైనా వైరం వస్తే వాళ్ళిద్దరినీ కలిపేవారు. తరగతి ఐకమత్యంగా ఉండడానికి నిరంతరం పాటుపడేవారు. మరి మీ ఇద్దరూ ఎందుకు ఐకమత్యంగా ఉండరు? అని ఎవరైనా అడిగితే కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోయేవారు శ్రీను, వాణీలు.   శ్రీను ఒక గ్రూపును, వాణీ ఒక గ్రూపును నడిపేవారు. వారిలో శత్రుత్వాన్ని పెంచడానికి కాదు. ప్రత్యర్థి గ్రూపుతో తామకు చదువులోనూ, ఆటపాటలలోనూ మరింత పోటీ పెంచడానికి. ఇది తెలిసిన ఉపాధ్యాయులు ఆశ్చర్యపోయారు. 10వ తరగతి పూర్తి కావస్తున్నది.           ఒకరోజు శ్రీను తన పుట్టినరోజు సందర్భంగా స్నేహితులను అందరినీ తన ఇంటికి ఆహ్వానించాడు. పుట్టినరోజు వేడుకల సందర్భంగా అక్కడి సన్నివేశాన్ని చూసి, అందరూ అవాక్కయ్యారు. శ్రీనూకి వాణీ ఆప్యాయంగా కేకు అనిపిస్తుంది. శ్రీను వాణికీ కేకు తినిపించాడు. ఇంతకీ పుట్టినరోజు ఎవరిది అనేది అందరికీ అయోమయం. అప్పుడు వాణీ ఇలా అన్నది. "మీరంతా! ఆశ్చర్యపోయారా! శ్రీను నాకు అన్నయ్య. మేమిద్దరం అక్కాచెల్లెళ్ళ పిల్లలం. చిన్నప్పటి నుంచీ ఎక్కడికి వెళ్ళాలన్నా ఇద్దరం కలిసే వెళ్ళేవాళ్ళం. వేసవి సెలవులలో అక్కాచెల్లెళ్ళ పిల్లలం ఒకచోట కలుసుకుంటే ఆటలే ఆటలు ‌ క్యారమ్ బోర్డు, ఒక్కొక్క అక్షరంతో ఊరు, పేరు, సినిమా, వస్తువులను ఆలోచించి రాసే ఆట, సినిమాలో మొదటి అక్షరం, చివరి అక్షరం రాసి, మధ్యలో తగినన్ని ఖాళీలు పెడితే సినిమా పేరు ఆలోచించి రాసే ఆట, అష్టా చెమ్మా, పచ్చీసు ఇలాంటి బోలెడన్ని ఆటలు ఆడుకునే వాళ్ళం. ఇంటివద్ద చదువులో ఒకరినొకరం ప్రోత్సహించుకుంటూ చిన్నప్పటి నుంచి అలా చదువుకునే వాళ్ళం. తరగతిలో మా పోట్లాటలు సరదాకే! కానీ మా గొడవలతో ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. తరగతి ఐక్యత కోసం కృషి చేశాం. గ్రూపులు చేసి, శత్రుత్వాన్ని పెంచలేదు. చదువులో, ఆటపాటల్లో అందరినీ ప్రోత్సహించాం. మా ప్రోత్సాహం వల్లే మీ అందరూ మెరుగయ్యారని అనుకుంటున్నాం. అందుకే ఐక్యత ముఖ్యం. భవిష్యత్తులో మీరు ఎక్కడ చదువుకున్నా అందరూ ఐకమత్యంగా ఉండాలి." అన్నది వాణీ. సంతోషించారు అందరూ. ఆ అన్నాచెల్లెళ్లను అభినందించారు. - సరికొండ శ్రీనివాసరాజు.