పోలికలు

పోలికలు - వసుంధర నాన్నగారి దగ్గర్నుంచి నేను పుణికిపుచ్చుకున్న పోలిక ఒకటుంది. అది భార్యను సాధించి, వేధించడం. నాన్నగారు అమ్మను దేనికీ మెచ్చుకునేవారు కారు. ఎంత మంచి పని చేసినా ఏదో వంక పెట్టేవారు ముఖ్యంగా అమ్మను మగాళ్ళ మధ్యకు రానిచ్చేవారు కారు. అమ్మ ఎక్కువగా వంటింట్లోనే మసలుతూండేది. ఆయన అమ్మతో కలిసి సినిమాలు చూసేవారుకాదు. అందుకు అమ్మ ఏ మాత్రమూ సంతోషించాకుండా నన్నే తిట్టేది. మగవాళ్ళలాగే ఉంటారుట. కస్టపడి మగవాడు డబ్బు సంపాదిస్తూంటే, ఆడది కూర్చుని తింటుందిట. అందువల్ల వాళ్ళేమన్నా పడాలిట. మాట కరుకుగా ఉన్నా నాన్నగారి మనసు మంచిదిట. ఈ విధంగా అమ్మ చెబుతూంటే అది అమ్మ గొప్పతనమని గ్రహించకుండా మగవాడు మసల వలసిన పధ్ధతి అదేనన్న భావం క్రమంగా నాలో పాతుకుపోయిది. నాన్నగారు అప్పుడప్పుడు రఘునాథరావు అన్నపేరు తీసుకొచ్చి అమ్మను ఏవేవో అంటూండేవారు. అప్పుడు అమ్మ గుడ్లనీరు కుక్కుకుని "అంతంత మాటలనకండీ'' అనేది. ఆయన అనే అన్ని మాటలకూ పడి వూరుకునే అమ్మ ఈ ఒక్క మాటకు ఎందుకంత బాధపడేదో నాకు అర్థమయ్యేది కాదు. "రఘునాథరావు ఎవరే?'' అనడిగాను అమ్మనొకసారి. రఘునాథరావు అమ్మకు బావౌతాడు. మనిషి మంచివాడు. చాలా బాగుంటాడు. అమ్మంటే చాలా ఇష్టపడతాడు. కానీ నాన్నగారిలా డబ్బునవాడు కాడు. అందుకని అమ్మ అమ్మానాన్నల అమ్మను రఘునాథరావుకు బదులు నన్నకిచ్చి పెళ్ళి చేశారు. "మరి నాన్న ఆయన పేరు చెప్పి ఏదో అంటే నువ్వేడుస్తావెందుకు?'' అని నేనంటే అమ్మ ఖంగారు పడిపోయి "ఇవి పెద్దాళ్ళ విషయాలు, నువ్వు వినకూడదు, వీటి గురించి ఆలోచించకూడదు'' అని చెప్పింది. ఆ తర్వాత నాన్నగారితో "మీరు బావ గురించి అబ్బాయి యెదురుగుండా మాట్లాడొద్దు అడగకూడని ప్రశాన్లు అడుగుతున్నాడు వాడు'' అంది. నాన్న ఆ విషయాన్నీ పట్టించుకోలేదు. నేను మాత్రం అమ్మను మళ్ళీ ఆ విషయమై అడగలేదు. కాస్త పెద్దయ్యాక మాత్రం విషయం అర్థమైంది. అమ్మ మనసులో ఆ రఘునాథరావు ఉన్నాడేమోనని అనుమానం. నాకు పెళ్ళి కుదిరాక ఒకరోజు నాన్నగారు నాకు భార్యతో ఎలా మసలు కోవాలో [ప్రత్యేకంగాచెప్పారు "వయసు చిత్రమైనది. ఆడవాళ్ళకు లోబడేలా చేస్తుంది. భార్యకు లోబడి ఉండడం చాలా అవమానకరమైన విషయం. భార్యను సాటి మనిషిలా, జీవిత భాగస్వామిలా చూడ కూడదు. ఆఫీసరు గుమస్తాను చూసినట్లు చూడాలి. అప్పుడే ఆడది మగవాడికి లొంగి ఉంటుంది. తనను లొంగదీసుకున్న మగవాడినే ఆడది ఆరాదిస్తుంది. అలా ఆడది మగవాణ్ణి ఆరాధించినప్పుడే వారికి కలిగే సంతానానికి ప్యూరిటీ ఉంటుంది. అదే పెళ్ళి పరమావధి.'' నాలో నాన్నగారి పోలికలు చాలా ఉన్నాయి. నా ముక్కూ, కళ్ళూ, ముఖం తీరు అన్నీ నన్నగారివే! అద్నుకాయన ఎంతగానో గర్వపడుతూంటారు. తన భార్య తనను మనసారా ఆరాధించడంవల్లనే నాకా పోలికలొచ్చాయని ఆయన అభిప్రాయం. నేనూ నా భార్యపట్ల తనకు లాగానే ప్రవర్తించి తన లక్షణాలు తరతరాలుగా నిలిచి పోయేలా చేయాలని ఆయన ఆశ. చిన్నతనంనుంచీ నేను నాన్నగారు అమ్మనెలా చూస్తారో చూస్తూనే వున్నాను. అమ్మకవన్నీ ఇష్టమేనని గ్రహించాను. సహజంగా నా ప్రవర్తన ఈ అనుభవాన్ని పురస్కరించుకునే ఉంటుంది. అందుకని నా భార్య పట్ల నా ప్రవర్తన ఎలా ఉండాలో కొన్ని అభిప్రాయాలేర్పడి పోయాయి. నా భార్య రమ చాలా అందంగా ఉంటుంది. అందుకని ఆమెకు చాలా అహంకార ముండవచ్చు. ముందా అహాన్ని పోగొట్టాలి. కాబట్టి ఆమెకు నాకు వచ్చిన ఇతర సంబంధాల గురించి చెప్పాను. అందరూ అప్సరసలే. కానీ కొన్ని కారణాలవల్ల వాళ్ళను నిరాకరించాల్సి వచ్చింది. ఆఖరికి సుమారుగా ఉండే రమను చేసుకున్నాను అసలు రమను కురూపి అందామనుకున్నాను. కానీ మనసొప్పలేదు. సుమారైన అందమంటే అదే పెద్ద అబద్ధం. రమ బాగా చదువుకుంది. అయినా నా మాటలకు చిన్నబుచ్చుకుంది. ఆమె ఉండే ఇంటికెదురుగా ఓ నవ దంపతులుండే వారుట. భార్య అంత బాగుండదట. భర్త సినిమా హీరోలా ఉంటాడట. కానీ వారిది అన్యోన్య దాంపత్యం. అతని పేరు వెంకటేష్. వెంకటేష్ భార్య అందాన్ని రోజూ పొగుడుతూ ఉంటాట్ట. ఆ విషయం ఆమె రమకు చెప్పి సంబర పాడేదిట. "నాకు పెద్ద అందం లేదు. కానీ నా భర్త నా అందాన్ని పొగిడితే నాకదో తృప్తి. అది అబద్ధమని తెలిసినదే. వివాహమైనాక భార్యాభర్తలు ఒకరినొకరిలా మోసం చేసుకోవడంలో విచిత్రమైన ప్రేమాభిమానాలుంటాయి'' రమ చెప్పిన ఈ విషయం విని నేను తడబడలేదు "ఆ వెంకటేష్ భార్యకు అబద్ధం చెప్పి ఉండడు. వాడి పెళ్ళాం వాడి కళ్ళకు నిజంగానే అందంగా కన్పించి ఉంటుంది. అందరూ మగవాల్లకూ నాకులా అందాన్ని గుర్తించే శక్తి ఉండదు. లేదా వాడి భార్య నిజంగానే అందంగా ఉండి ఉంటుంది. ఇంకా పెళ్ళికాని మూలాన నీకు అప్పట్లో ప్రతి మగవాడూ సినిమా హీరోలా కనబడి ఉంటాడు'' అన్నాను. ఈ మాటలకు నా భార్య చాలా నొచ్చుకుంది. ఆ విధంగా ఆమెను ప్రతి విషయంలోనూ దెబ్బ తీస్తూండేవాణ్ణి. నన్ను నేను పొగుడుకుంటూ ఎదుటి వాళ్ళను హీనపరుస్తూ నా భార్య నన్నారాధించేలా చేయడానికి ప్రయత్నించే వాణ్ణి. ఆమెను మగవాళ్ళ మధ్యకు రానిచ్చే వాణ్ణి కాను. తను సరదాపడినా "అలాంటి సరదాలుండడం సంసార స్త్రీల లక్షణం కాదు'' అనేవాణ్ణి. దానికి జవాబు ఆమె దగ్గరుండేది కాదు. ఆమెలో సంసార స్త్రీల లక్షణాలు చాలా తక్కువని చెప్పాను. నా దగ్గరకు వచ్చిన రెండేళ్ళలొ నా కారణంగా అవన్నీ ఏర్పడ్డాయని ఆమెకు నచ్చచెప్పగలిగాను. ఇది వరకు ఆమెను చూసి బుగ్గలు నొక్కుకున్న ఆడవాళ్ళు ఇప్పుడామెను మెచ్చుకుంటున్నారని నమ్మించాను. ఇలా ఎన్నో చేశాను. అప్పుడప్పుడు నా భార్య వెంకటేష్ ప్రసక్తి తీసుకొచ్చేది. నేను వాణ్ణి నిరసించడమేకాక ఆమెనూ వెంకటేష్ కు కలిపి సూచనప్రాయంగా అనుమానించాను. దాంతో ఆమె బెదిరిపోయింది. నా అనుమానాలు చెదరగొట్టడానికి  రమ ఆ వెంకటేష్ ని తిట్టిపోసేది. రమ నా కౌగిలిలో ఉన్నప్పుడు, "ఇప్పుడు నా స్థానంలో వెంకటేష్ ఉంటే బాగుండునని ఉందికదూ నీకు?'' అన్నాను ఒకసారి. ఆమె ఉలిక్కిపడి "అలాంటి మాటలనకండీ! వాడంటే నాకు అసహ్యం'' అంది. అమ్మ రఘునాథరావు గురించి నాన్న దగ్గర కూడా ఇలాంగే విసుక్కునేది. నేను పూర్తిగా నాన్న పోలికలతో పుట్టాను. ఇప్పుడు వెంకటేష్ గురించి రమ కూడా అదే స్థాయికి వచ్చింది. నాకు పుట్టబోయే బిడ్డ నా వంశ లక్షణాలను పూర్తిగా సంతరించుకుంటుంది. నాకు రమమీద ఏ మాత్రమూ అనుమానం లేదు. అయినప్పటికీ అలా అనుమానించడం నాకు సరదా. ఆడదానికి అఫెన్సుకు ఛాన్సివ్వకూడదు. ఎప్పుడూ డిఫెన్సులోనే ఉంచాలి. ఇది నాన్నగారి దగ్గర నేర్చుకుని నేను అమలు చేస్తున్న ముఖ్య విశేషం. రమ గర్భవతి అయింది. ఒక్కగానొక్క కోడలు. అన్ని ముచ్చట్లూ వైభవంగా జరిగాయి. రమ పండంటి కొడుకును కన్నది. వాడివి అన్నీ తల్లి పోలికలు. నా పోలికలు రానందుకు బాధపడ్డాను. తల్లి పోలికవస్తే కోడుకి అదృష్టమంటారు. తండ్రి పోలిక వచ్చిన నాకు మాత్రం అదృష్టానికి తక్కువేముంది? అబ్బాయికి నాన్నగారి పేరే పెట్టాం. వాడికి మాటలు వచ్చేసరికి నాకెంతో ఆనందం కలిగించే విశేషం జరిగింది. నన్నెవరైనా పేరడిగితే ఒకసారి ముక్కు తమాషాగా నలుపుకుని అప్పుడు పేరు చెబుతాను. ఇది చాలా విచిత్రమైన అలవాటు. చూసేవాళ్ళను ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. మా అబ్బాయి కూడా పేరడిగితే సరిగ్గా అలాగే చేస్తున్నాడు.  ఇది వాడు నన్ను చూసి నేర్చుకున్న అలవాటు కాదు. తనకు తానే వచ్చిన అలవాటు, అంటే వాడికి నా ప్రతత్యేకమైన పోలిక వచ్చిందన్న మాట! వాణ్ణి రోజుకు పదిసారైనా పేరడిగి వాడి ఈ చేష్ట చూసి సంతోషించే వాణ్ణి. నేనే కాదు అమ్మ, రమ, నాన్నగారు అంతా అలాగే చేసేవారు. నాన్నగారి పోలికలు పుణికి పుచ్చుకున్న నాకు కైలిగిన కొడుకు నా పోలికలు పుణికి పుచ్చుకుంటున్నాడు. కనీసం ఇంకోతరంపాటు మా వంశ లక్షణాలు నిలబడతాయి. అబ్బాయికి నాలుగో ఏడు వచ్చేసరికి రమ మళ్ళీ గర్భవతయింది. ఆమెను అత్తవారింట దిగవిడిచి రావడానికి కూడా వెడుతున్నాను. ఈ పర్యాయం పుట్టే బిడ్డ కూడా నా పోలికలే రావాలని నా ఆశ. రైలు మాకు ఎదురు సీట్లలో వృద్ధ దంపతులు కూర్చున్నారు. వాళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా సినిమా జంటలా మసల్తున్నారు. భర్త భార్యకోసం చాలా ఖంగారు పడుతున్నాడు. ఆమె కేవేం కావాలో అడుగుతున్నాడు. తనక్కావాల్సిన వస్తువులు తెచ్చిపెట్టడానికి ఆయన ట్రెయిన్ దిగడం ఆవిడకిష్టం లేదు. చాలా నెమ్మదిగా "మీరు నాపక్కన కూర్చుంటే చాలు! నాకింకేమీ అక్కర్లేదు కిటికీ దగ్గరజే వస్తే అవే కొనుక్కుందాం'' అంది. ఆయన వినలేదు. "మనక్కావలసినవన్నీ కిటికీ దగ్గరకు రావు'' అంటూ ఆయన ఫ్లాట్ ఫారమ్ మీదకు దిగి ఏవో పళ్ళు కొనుక్కువచ్చి "ఇవి చాలా మంచివి. కిటికీ దగ్గరకు చేత్తసరుకు వస్తోంది'' అన్నాడు. మధ్యలో వాళ్ళు మమ్మల్ని కూడా పలకరించారు. ఆయన తన భార్య గురిచి చాలా జోకులు వేశాడు. ఆవిడ సిగ్గుపడుతూనే ఆయన గురించి తనూ కొన్ని చెప్పింది. నేనెప్పుడూ అటువంటి జంటని చూడలేడు. నా భార్య నెమ్మదిగా నా చెవిలో "వాళ్ళు వృద్ధ దంపతుల్లా లేరు. కొత్తగా పెళ్ళయిన వాళ్ళలా వున్నారు'' అంది. ఆ మాట ఆ ముసలాయనకు వినబడ్డట్లుంది "కొత్తగా పెళ్ళి కావడమేంటమ్మా! మా కింకా పెళ్ళి కాలేదు. ఇంకా ఏడాది ఆగాలిట'' అన్నాడు. నేనా మాటలు విని ఆశ్చర్యపోతూంటే "వచ్చే ఏడాది ఆయనకు షష్టిపూర్తి లెండి'' అందావిడ. నేను, రమ నవ్వకుండా ఉండలేకపోయాం. అప్రయత్నంగా నా మనసులో 'అమ్మ, నాన్న అలా ఉంటే?' అనిపించింది. 'అమ్మ ఈ ముసలాయాన్ని చూస్తే తన భర్త అలా ఉండనందుకు విచారించదా?' అన్న అనుమానం కలిగింది. 'అమ్మ సంగతి సరే ... పడుచుతనంలో ఉన్న రమ సంగతేమిటి?' దాని గురించి అట్టే ఆలోచించదల్చుకోలేదు. ఒకో మగవాడికి ఒకో ప్రత్యేకత ఉంటుంది. వృద్ధాప్యంలో ఇటువంటి పబ్లిక్ శృంగారం జుగాప్పాకరంగా కూడా ఉంటుంది. నేను, నాన్నగారు అనుసరిస్తున్న విధానమే సరైనది. పెద్దమనిషి తరహాగా ఉంటుంది. ఆడవాళ్ళకు సిగ్గెక్కువంటారు. ఆ ముసలావిడ సిగ్గుపడుతోంది కానీ, ఆవిడ కళ్ళలో భర్తపట్ల ఆరాధనాభావం కనబడుతోంది. అటువంటి భావాన్ని నేనెప్పుడూ నా భార్య కళ్ళలో చూడలేడు. రమ కళ్ళలో ఎక్కువ బెదురు, సంకోచం కనబడుతూంటాయి. కాసేపు సంభాషణలు నడిచాక, ఆయన పరిచయం చేసుకుందామని పేరడిగాను. ఆయన తమాషాగా ముక్కు నలుపుకుని "నా పేరు రఘునాథరావు'' అన్నాడు.

ప్రథమ తాంబూలం

ప్రథమ తాంబూలం   - వసుంధర     ఇళ్ళ స్థలాలకోసం రీజనల్ డెవలప్ మెంట్ బోర్డుకి అప్లై చేశాను. ఇల్లు కట్టుకునేందుకు మా ఆఫీసు నాకు రెండు లక్షలు అప్పిస్తుంది. దాంతో చక్కటి యిల్లొకటి కట్టేసుకుని అందులోనే ఉండాలని నా ఆశ. నగరానికి మధ్యలో పెంటకుప్పలుండే పెద్ద స్థాలమొకటుంది. ఆ మైదానం ఊరి అందాన్ని హరిస్తోంది. నగరవాసులక్కడి వాసనను భరిస్తున్నారు. కొత్తగా వచ్చిన మున్సిపల్ కమీషనర్ ఏ కారణంవల్లనో ఆ స్థలంలో ఇల్లు కట్టాలనుకున్నాడు. మామూలుగా అయితే అక్కడి స్థలం ధర నా బోటి వాడి కందుబాటులో ఉండదు. ఈ స్థలాన్ని సరసమైన ధరకు అప్లికేశాన్సు ప్రకారం ఎవరికైనా యివ్వాలని మునిసిపాలిటీ నిర్ణయించింది. ఇళ్ళస్థలాల కేటాయింపు న్యాయప్రకాం జరుగుతుందని స్థానిక దినపత్రికలలో ప్రకటించడం కూడా జరిగింది. అక్కడ వందిళ్ళ కవకాశముంది. అప్లికేషన్సు యాభైవేల దాకా వచ్చాయి. కొందరు ప్రముఖుల సమక్షంలో లాటరీ పద్ధతిలో స్థలాల కేటాయింపు జరిగింది. వందమందికి ఉత్తరాలు వెళ్ళాయి. వందమంది పేర్లూ స్థానిక దినపత్రికలో వేయడం కూడా జరిగింది. అందులో నా పేరూ ఉంది. స్థలాల కేటాయింపు న్యాయంగా జరిగిందనడానికిదే నిదర్శనం. నేను మంచి ఉద్యోగంలో ఉండి నా మటుక్కు నేనో రిఫ్రిజరేటరు కొనుక్కొగలనేమో! నా పిల్లలు కాస్త మంచిబట్టలు వేసుకుంటారేమో! కానీ నేను నగరానికి సంబంధించి అనామకుణ్ణి. ఇళ్ళ స్థలాలు కేటాయింపుపైన వారిలో ఇంచుమించు నా బోటివారే! నేనెంతో సంతోషించాను. వెంటనే ఆమోదాన్ని తెలియబరుస్తూ ఉత్తరం కూడా రాశాను. నెల్లాళ్ళయింది. ఒకరోజు మా ఇంటికో మనిషి వచ్చాడు. తన పేరు ధర్మరాజని చెప్పాడు. అతడెవరో నాకు తెలియలేదు. "నగరం మధ్య మైదానంలో మీకు స్థలం కేటాయింపు జరిగింది. మీకు పదివేలిచ్చి స్థలం కొంటున్నారు. నేనా స్థలానికి పాతికవేలిస్తాను. నాకమ్మేయండి'' అన్నాడతడు. ఆ ప్రాంతాల స్థలాలే దొరకవు. ఏ సెంటర్లో కొనాలన్నా స్థలం ఆ మాత్రంది కావాలంటే యాభైవేల దాకా అవుతుంది/ నే నతడికి సారీ చెప్పాను. అతడు ధర పెంచాడు. నే నొప్పుకోలేదు. అతడు నలభై వేల దాకా వెళ్ళాడు. "స్థలం అమ్మే ఉద్దేశ్యం నాకు లేదన్నాను. మీరు బేరాలు చెప్పవద్దు'' అన్నాను కాస్త తీవ్రంగా. "నేను నేనుగా మాట్లాడ్డం లేదు. కొందరు ప్రముఖుల తరపున వచ్చాను. వారు తలచుకుంటే ఆ స్థలం మీక్కాకుండా పోగలదు'' అన్నాడు ధర్మరాజు. "ఎలా?'' స్థలం కేటాయింపు జరిగిన నెలరోజుల్లోగా మీరు వాళ్ళకి ఉత్తరం రాయాలి. ఆమోదాన్ని తెలియబరుస్తూ! ఆ ఉత్తరం నెలరోజుల్లోగా వారికి చేరకపోతే మీకా స్థలం అవసరంలేదని వాళ్ళనుకుంటారు. మరొకరికి కేటాయిస్తారు'' అన్నాడతను తాపీగా. "నేను వెంటనే ఉత్తరం రాశాను. నెల్లాళ్ళవసరం లేదు. వారం రోజుల్లోనే అంది ఉంటుంది'' ధర్మరాజు నవ్వి "ఉత్తరం ఫైల్లోంచి గల్లంతైతే ...?'' అన్నాడు. నా గుండె గుభేలుమంది. రీజనల్ డెవలప్ మెంట్ బోర్డు ఆఫీసులో ఇలాంటివి చాలా జరుగుతాయని విన్నాను. "గల్లంతెందుకవుతుంది?'' అన్నాను మేకపోతు గాంభీర్యంతో. "రిజిస్టర్డు ఉత్తరాలే గల్లంతవుతాయి. మీరు మామూలుత్తరం రాశారు. గల్లంతు చేయడం మాకు కష్టం కాదు. రెండ్రోజుల తర్వాత మళ్ళీ వస్తాను. ఈలోగా ఆలోచించుకోండి'' అని ధర్మరాజు వెళ్ళిపోయాడు. నేను చాలా తెలివితక్కువ పనిచేశాను. రిజిస్టర్డు లెటరు రాయాల్సింది. ఇప్పుడిక టైము లేదు. గడువైపోయింది. ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా శ్రీమతి పిలిచి ఏదో పని చెప్పింది. బజారుకు వెళ్లాను. అనుకోకుండా బజార్లో భూషణరావు కనబడ్డాడు. భూషణరావు నా క్లాస్ మెటు. ఇద్దరం విడిపోయి  ఆరేళ్ళయింది. వాడు హైదరాబాదులో ఉండాలని గుర్తు. "అరే! భూషణ్! నువ్విక్కడున్నావేమిటి?'' అన్నాను. వాడూ నా గురించి అదే ఆశ్చర్యాన్ని ప్రకటించాడు. ఇద్దరం ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నాం. భూషణరావు రీజనల్ డెవలప్ మెంట్ బోర్డ్ ఆఫీసులో ఆఫీసరుగా వచ్చి రెండు నెలలయింది. వెంటనే నేను వాడికి నా సమస్య చెప్పుకున్నాను. "ఇదేం పెద్ద సమస్య కాదు. రేపోసారి ఆఫీసుకురా'' అన్నాడు భూషణరావు. "నా వివరాలిస్తాను. నేను మళ్ళీ ఆఫీసుకి రావదమెందుకు?'' అన్నాను. "అలా కాదు ఎవరి కేసునైనా వ్యక్తుల సమక్షంలోనే చూడాలని మాకు నియమముంది. లేకుంటే ఇంటికి వచ్చి చాలామంది మమ్మల్న్ ఇయిన్ ఫ్లుయన్సు చేసే అవకాశాలుంటాయని యాజమాన్యం అభిప్రాయం. నువ్వు స్వయంగా ఆఫీసుకు రాకపోతే నీ కేసు చూడలేను ...'' అన్నాడు భూషణరావు. "మరి పెద్దవాళ్ళ విషయంలోనూ ఇంతేనా?'' "ఊ'' అన్నాడు భూషణరావు. "వాళ్ళిలా రావడానికి జంకుతారు. ఇలాంటి వ్యవహారాల్లో స్వయంగా జోక్యం చేసుకోవడం వాళ్ళకిష్టముండదు. అసలు వాళ్ళ ఇన్ ఫ్లుయన్సు తగ్గించాలనే యాజమాన్యం ఈ నియమం పెట్టింది. అప్లికేషను ఎవరిదో ఆ మనిషే స్వయంగా రావాలి. తన మనుషుల్ని పంపినా మేము పని చూడం'' అన్నాడు భూషణరావు కచ్చితంగా. భూషణరావబద్ధం చెప్పాడని నాకు తెలుసు. మాది చాల దగ్గర స్నేహం. ఒకళ్ళ నాకాలు బూతులు కూడా తిట్టుకునే వాళ్ళం. అయితే మా మధ్య ఎప్పుడూ విరోధభావం లేదు. భూషణరావుని ఇంటికి రమ్మన్నాను. వాడు రానన్నాడు. "నీ పని పూర్తయ్యాక స్థలం నీ పేరున రిజిస్టరయ్యాక నీ ఇంటికి పిలిచి సన్మానించు. అంతవరకూ రాను'' అన్నాడు భూషణరావు. మర్నాడు భూషణరావు ఆఫీసుకు వెళ్లాను. సైంధవుడిలా నాకు ప్యూన్ అడ్డం తగిలాడు. అతడి పేరు అప్పల నరసయ్య. చాలా అర్జెంటన్నాను. భూషణరావు నా స్నేహితుడన్నాను. దేనికీ వాడు చలించలేదు. "సాబ్ బిజీగా ఉన్నారు. ఈ రోజు కెవర్నీ చూడరు ...'' అదే వాడి సమాధానం. నేను దిగులుగా బయటకు వచ్చాను. అక్కడెవరో నాకు సలహా యిచ్చారు. అప్పలనరసయ్య చేతిలో పదిరూపాయలు పెట్టమని. నా స్నేహితుణ్ణి కలుసుకునేందుకు నేను ప్యూన్ చేతిలో డబ్బు పెట్టాలా? నా దగ్గర భూషణరావు టెలిఫోన్ నంబరుంది. నా ఆఫీసుకి వెళ్ళి భూషణరావుకి ఫోన్ చేశాను. భూషణరావు ఫోనెత్తి నా గురించి తెలుసుకుని "సాయంత్రం బజార్లో కలుసుకుందాం'' అన్నాడు. ఫోన్లో వాడికెక్కువ మాట్లాడ్డం ఇష్టంలేదని అర్థమయింది. భూషణరావుని బజార్లోనే కలుసుకున్నాను. "వాడి చేతిలో పదిరూపాయలు పెట్టు'' అన్నాడు భూషణరావు. "నువ్వు యిదే సలహా ఇస్తావా?! నీ ఆఫీసులో నీ స్నేహితుడు నిన్ను కలుగుకుందుకు లంచమివ్వాలా?'' అన్నాను రోషంగా. "నువ్వేమైనా అనుకో ... ఇది తప్పని సరి. అప్పల నరసయ్యకి రూలంటే రూలే! కొందరి విషయంలో నేను కలగాజేసుకున్నానంటే రెండు రకాల వాడు నను వాళ్ళనూ నా గదిలోకి వదలడం. రెండు వాడి యూనియన్?'' అన్నాడు భూషణం. "అడ్డమైన వాళ్ళు నీ దగ్గరకెందుకోస్తారు?'' అన్నాను. "ప్రతి చిన్నపనికీ ఆఫీసర్ని మీటవడం ఒక అలవాటైపోయింది జనానికి. అందువల్ల మా పనులకు అవరోధం కలుగుతూంటుంది. మా ఆఫీసులో ప్యూన్సు కొందరికి రేట్సున్నాయి. వాళ్ళ కొచ్చే డబ్బులో పై అధికారులకీ వాటాలున్నాయి. ఎవరి విషయంలోనూ ఈ నియమం సడలించలేము. అందువల్ల నాకే ఇబ్బంది ...'' అన్నాడు బూషణరావు. ఈ విషయమై ఆఫీసుకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తాను'' అన్నాను. అపరిమితమైన ఆవేశంతో. "చేయి. అందువల్ల అప్పల నరసయ్యకు తాత్కాలికంగా ప్రమాదముంటుంది. ఆ ప్రమాదం తప్పించుకొనటంఅతడికి తెలుసు. కానీ నీ స్థలం నువ్వు దక్కించుకోలేవేమో చూసుకో!'' అన్నాడు భూషణరావు. వాడి హెచ్చరిక నా కర్థమయింది. "నువ్వు అవనీతిపరులను సమర్థిస్తున్నావు.'' అన్నాను. "ఒక వ్యవస్థలోని భాగాన్ని నేను'' అన్నాడు భూషణరావు. మర్నాడు నేను అప్పలనరసయ్యకు పదిరూపాయలూ ఇచ్చాను. అతడింకో పది అడిగాడు,. "ఎందుకు?'' అన్నాను. "మీరు నిన్న వచ్చారు. ఇది రెండోసారి రావడం. మొదటిసారికి పది, ఇప్పుడింకో పది ...'' చాలా తాపీగా అన్నాడతను. నాలో మళ్ళీ ఆవేశం చోటుచేసుకుంది. అప్పలనరసయ్య స్వరం తగ్గించి "ఆఫీసరు బాబు మీకు స్నేహితుడో కాదో తెలియదు. కానీ స్నేహితుడైనా సరే. నేను తల్చుకోనిదే పని కాదు. నాకు మీ పనేమిటో చెప్పండి. జరిగేదో జరగందో చెబుతాను'' అన్నాడు. నేనావేశాన్ని తగ్గించుకున్నాను. ఎందుకైనా మంచిదని విషయం అతడికి చెప్పాను. "ఫైల్లో కాగితాలు గల్లంతు చేయడానికి వాడికి వెయ్యిరూపాయలు దాకా ముడుతుంది సార్. కాగితం గల్లంతైతే ప్రధానమంత్రి కూడా మీకు సాయపడలేడు. పనైతే నన్ను సంతోష పెడతానని మాటివ్వండి. చిటికెలో మీపనవుతుంది. వెయ్యిరూపాలుచ్చుకుని పెద్దవాళ్ళకు సాయపడ్డంలో కంటే తక్కువైనా పుచ్చుకుని మీబోటి వాళ్ళకు సాయపడడంలోనే మాకానందముంది సార్!'' అన్నాడు అప్పలనరసయ్య. అతడికింకో పది ఇచ్చాను. సంతోషపెడతానని మాటిచ్చాను. ఆఫీసులో భూషణరావు దర్శనమయింది నాకు, భూషణరావు గుమస్తాను పిల్చుకుని రమ్మని అప్పలనరసయ్యకు చెప్పదు. గుమస్తా వచ్చాడు. "ఉత్తరం రిజిస్టర్డు పోస్టులో పంపార?'' అన్నాడు క్లర్కు. "లేదు' "పోనీ ఉత్తరం కాపీ ఉందా?'' "లేదు ... ఏ తేదీన రాశానో చెప్పగలను'' "ఆ సమాచారం చాలు. ఇతడు నా క్లాసుమేటు. ఉత్తరం ఎప్పుడందిందో చూసి చెప్పు'' అన్నాడు భూషణరావు క్లార్కుతోఅతడు రిజిస్టర్ వెతుకున్నాడు. మేమిద్దరం చిన్ననాటి కబుర్లలో పడ్డాం. నేనూ, భూషణరావు స్నేహితులమని క్లర్కుకు తెలియడానికే ఆ కబుర్లు. నాకేసు న్యాయమైనది. భూషణరావుకు కావలసిన మనిషిని నేను. క్లర్క్ కు ఉత్తరం దొరికింది. "వెంటనే ఉత్తరం అందినట్లు లేటరు టైపు చేయి. రిజిస్ట్రేషన్ కి తేదీ నిర్ణయించు'' అన్నాడు భూషణరావు. క్లర్కు తలూపి వెళ్ళిపోయాడు. తర్వాత రెండు నెలల్లో స్థలం నా పేరున రిజిస్ట్రేషన్ అయిపొయింది. "నువ్వు నాకు సన్మానం చేయాలి'' అన్నాడు భూషణరావు. "తప్పకుండా ... రేపు హోటల్ శారదకు రా. సాయంత్రం ఆరింటికి ...'' అన్నాను. భూషణరావు ఒప్పుకున్నాడు. అయితే ఆ సాయంత్రం అనుకోకుండా ఆరుగంటల ప్రాంతంలో ఇద్దరం హోటల్ శారదలో కలుసుకున్నాము. ఎందుకో భూషణరావక్కడికి వచ్చాడు. నన్ను నా ఎదుట కూర్చున్న అప్పలనరసయ్యను చూసి ఆశ్చర్యపడ్డాడు. "ఇలారా'' అని పక్కకు పిలిచి "ఏమిటిది?'' అన్నాడు నెమ్మదిగా. "నేను నవ్వి "ప్రథమ తాంబూలం'' అన్నాను.

పెరట్లో తాచుపాము

పెరట్లో తాచుపాము - వసుంధర ఉదయం ఆరుగంటల సమయం లక్ష్మి నిద్రలేచి పెరట్లోకి వచ్చింది. ఎందుకో ఆరోజింకా అప్పటికి కుళాయి రాలేదు. అందుకని నూతి దగ్గరకు వెళ్ళిందామె. బాల్చీతో నీళ్ళు తోడి పక్కనే వున్న బకెట్లో పోయబోయి ఆగిపోయింది.   ఆ బకెట్ పక్కనే పడగవిప్పి ఆడుతోందో పాము. పడగమీద కృష్ణపాదాలు స్పష్టంగా కనబడుతున్నాయి. పాము లక్ష్మిని చూసిదో లేదో తెలియదు కానీ వెంటనే పాడగముడిచి నేలవ్రాలి చరచరా పాక్కుంటూ అక్కణ్ణించి వెళ్ళిపోయింది. కాసేపు శిలాప్రతిమలా ఉండిపోయిన లక్ష్మి పామెటు వెళ్ళిందో గమనించలేదు. అక్కడ పాము లేదని తెలియగానే చేతిలోని బాల్చీని క్రిందపెట్టి లోపలకు పరుగెత్తి ఇంకా నిద్రపోతున్న భర్తను తట్టి లేపింది. విసుక్కుంటూ బద్ధకంగా ఆవులించి "ఏమిటే?'' అన్నాడు లక్ష్మి భర్త చలపతి. అతడికి సమాధానం రాలేదు. కారణమేమిటా అని కళ్ళు నులుముకుని చూస్తే లక్ష్మి నిలువెల్లా గజగజ వణికిపోతోంది, "ఏమయిందే?'' అన్నాడు చలపతి. లక్ష్మికి నోట మాట రావడానికి చాలాసేపు పట్టింది. ఆమె చెప్పింది విన్నాక చలపతికి ఒళ్ళు జలదరించింది. "ఇప్పుడెలా?'' అన్నాడతను. ఆ ప్రశ్నే ఒక తాచుపాములా ఆ యింట్లో బుసలు కొడుతోంది. చలపతిడి ప్రయివేటు కంపెనీలో మంచి ఉదోగం. అద్దె కంపెనీవాళ్ళే భారిస్తున్నారని ఉన్నదిద్దరే అయినా నాలుగు గదుల పెద్ద ఇల్లు తీసుకున్నాడు. ఇల్లే విశాలమైతే అంతకు రెట్టింపు విశాలం పెరడు. అందులో నాలుగు రకాల పళ్ళ చెట్లున్నాయి. రెండేళ్ళ క్రితం చలపతికి పెళ్ళయింది. అప్పట్నుంచీ భార్యాభర్తలా యింట్లో ఉంటున్నారు. లక్ష్మికి కూరగాయలు పెంచే తోటపని అంటే యిష్టం. దొడ్లో వంగ, బెండ, టమేటా మొక్కలున్నాయి. పొట్ల, దొండ, కాకర పాదులున్నాయి. కనకాంబరం, మల్లి, సన్నజాజి, రాదామనోహారం వగైరా పూలున్నాయి. ఇంట్లో రెండు గదులకు బాత్రూం సదుపాయమున్నప్పటికీ ముఖప్రక్షాళనం పెరట్లోనే చేస్తుంది లక్ష్మి. పెరట్లో తొండలు, ఉడతలు లాంటివి తిరుగుతూనే ఉంటాయి. ఏ నలికెలప్పాములో కనబడుతూంటాయి. పాము కనపడ్డం ఇదే మొదలు. ఇప్పుడా పెరట్లో ఎలా మసలడం? ఆ పాము పెరట్లోనే ఉంటుందని నమ్మకమేమిటి? విశాలమైన ఆ యింట్లోకి ప్రవేశించిందంటే ఎప్పుడెక్కడుంటుందో ఎలా చ్ప్పడం? భార్యాభర్తలా పూతకింక పెరట్లోకి వెళ్ళలేదు. ఇంట్లోకి ఏర్పాటు చేసుకున్న కుళాయిలను తరచుగా ఉపయోగించని లక్ష్మి ఆ పూత అన్నింటికీ వాటినే ఉపయోగించింది. చలోఅపతి ఆఫేసుకు వెడుతూ పెరట్లో మసలకు నేను నా స్నేహితులను సంప్రదించి ఏం చేయాలో చెబుతాను'' అన్నాడు. సాయంత్రం మూడింటిదాకా లక్ష్మి ఇంట్లోనే ఉంది. అప్పుడామెకు తను కొత్తగా నాటిన చిట్టి చేమంతుల గురించి గుర్తువచ్చింది. పాపం దొడ్లో మొక్కలన్నీ తన చేతినీళ్ళకోసం ఎదురుచూస్తుంటాయి. ప్రతి స్త్రీలోనూ నిబిడీకృతమై ఉంటుంది మాతృప్రేమ. బిడ్డలు పుట్టేదాకా స్త్రీ ఆ ప్రేమనెవరికైనా పంచి పెట్టగలదు. మగడు భార్యనుంచి పూర్తీ ప్రేమను పొందగాలిగేది ఆమె తల్లి అయ్యేవరకూ మాత్రమే! అన్ని భయాల్నీ జయించి లక్ష్మి పెరట్లోకి వెళ్ళి ముందు చిట్టి చేమతులను తడిపింది. ఆ తర్వాత వంగ, బెండ, టమేటాలావైపు వెళ్ళింది. వాటిని సగమైనా తడిపిందో లేదో బుస్సుమన్న శబ్దం వినపడింది. ఉలిక్కిపడి చూస్తే చరచర పాకిపోతున్న పాము కనబడింది. ఒక్క పరుగున ఇంట్లోకి చేరింది లక్ష్మి. అప్పుడే పలకరింపుగా వచ్చింది ఎదురింటావిడ. లక్ష్మి హడావుడి చూసి కారణమడిగి తెలుసుకుని, "హమ్మో! తాచుపామే! ఇంకోసారి వస్తాన్లే'' అని వెళ్ళిపోయింది. ఆవిడవార్తనెంతమందికి చేరవేసిందో ఏమోకానీ ఇంకెవ్వరూ అటుగా రాలేదు.. భర్త వచ్చేదాకా బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తోంది లక్ష్మి. సాయంత్రం ఆరింటికి వచ్చాడు చలపతి. లక్ష్మి అతడికి జరిగిన విశేషం చెప్పింది. "భయపడకు అన్నింటికీ నేనేర్పాట్లు చేశాన్లే!'' అన్నాడతను. ఆఫీసులో సుందర్రావనే స్నేహితుడు "పెరట్లో తాచుపాముంటే చాలా అదృష్టం. నీకు సిరి రాబోతోంది. నీకేం భయంలేదు. హాయిగా ఉండు'' అన్నాట్ట. "అయితే ఆ సిరి నువ్వే అనుభవిద్దువుగాని. తాచుపాముని పట్టి నీ పెరట్లోకి తీసుకుపో'' అని చలపతి బదులిచ్చాడు. మరో స్నేహితుడు భక్తిభావంతో పరవశించి నాగదేవత దొడ్లో వెలసిందన్నాడు. చలాప్తి అతడిక్కూడా నాగదేవతను ఆఫర్ చేశాడు. ఒక స్నేహితుడు మాత్రం మంత్రగాణ్ణి తీసుకుని వస్తానన్నాడు ఏడింటికల్లా అతగాడు రావచ్చు. చలపతి, లక్ష్మి మంత్రగాడి కోసం ఎదురుచూశారు. "సరిగ్గా ఏడింటికి మంత్రగాడు వచ్చాడు. కూడా మంత్రించిన మిగులు తెచ్చాడు. పెరడంతా తిరిగి వాటిని చల్లాడు. ప్రతిఫలంగా నూటపదహార్లడిగి బేరంలో ముప్పై రూపాయల కొప్పుకుని తీసుకుని వెళ్ళిపోయాడు. మర్నాడుదయం ఆరింటికి లక్ష్మి మళ్ళీ అదే దశలో తాచుపామును చూసింది. పాము పాక్కుంటూ వెళ్ళిపోయాక లక్ష్మి గమనిచిన విశేషం ... పాము ఆడింది మంత్రించిన మిగులపైనే! మంత్రానికి చింతకాయలు రాలవచ్చునేమో కానీ తాచుపాములు బెదరవని లక్ష్మికేకాదు, చలపతికీ అర్థమయింది. "దాన్ని చంపడం మినహా మరోమార్గంలేదు'' అని యిద్దరూ నిర్ణయానికి వచ్చారు. కానీ ఎవరు చంపుతారు? అయితే ఆ రోజు మధ్యాహ్నం వెతుక్కుంటూ ఓ పాములు పట్టేవాడు వాళ్ళింటికి వచ్చాడు. పాముకి యాభైరూపాయలిస్తే పెరడంతా గాలించి ఉన్న పాములన్నింటినీ పట్టేస్తానన్నాడు. వాణ్ణి మంత్రగాడు పంపేడట. లక్ష్మి భర్తకు ఫోన్ చేసింది. అతడుత్సాహంగా సరేనన్నాడు.. పాములు పట్టేవాడు పెరట్లో నాగస్వరాన్నూదాడు, మంత్రించిన వేరులను చేత్తో పట్టుకుని మూల మూలలకు తిరిగిగాడు. చివరికి వాడు ఒకటి కాదు, రెండు కాదు ... మొత్తం నాలుగు పాముల్ని పట్టాడు. రెండువందలు తీసుకుని వెళ్ళిపోతూ వాడు "ఇక మీ పెరట్లో పామన్నది కనిపించదు'' అన్నాడు. మర్నాడే లక్ష్మికి నాగదేవత దర్శనమిచ్చింది. చలపతి మండిపడి ఆ పాముల్ని పట్టేవాదికోసం ఆరా తీస్తే వాడు మాత్రం కనబడలేదు. వాడు పట్టిన నలుగు పాములూ వాడి శిక్షణలో పెరిగిన వాడి స్వంత పాములయుండాలనీ అసలు పాము పెరట్లో అలాగే ఉండిపోయిందనీ లక్ష్మి, చలపతి అర్థం చేసుకున్నారు/ అర్థంచేసుకున్నంతమాత్రాన సమస్య తీరిపోదు. చలపతికి పామును చంపే ధైర్యం లేదు. ఇంత అనుభవమయ్యాక మంత్రగాళ్ళని నమ్మే ఆవకాశం లేదు. సమస్యకు పరిష్కారం లభించలేదు. కానీ ఆ దంపతులకు సానుభూతిపరుల సంఖ్య పెరిగింది. అందులో పనికిరాని సలహాలిచ్చేవారి సంఖ్య మరీ ఎక్కువగా ఉంది. కొందరు ఫోన్లు చేస్తున్నారు, కొందరు పలకరించి ముళ్ళమీద నిలబడ్డట్లు హదావిడుగా ఏదో అనేసి పారిపోతున్నారు. కొందరు స్వయంగా కసుకోవాడమిష్టంలేక ఉత్తరాలు కూడా రాస్తున్నారు. అలా వారం రోజులు గడిచాయి. లక్ష్మికి తాచుపాము అలవాటయింది. దాన్ని చూస్తే ఆమెకిప్పుడు భయంవేయడంలేదు. తన జోలికి వస్తే తప్ప అది ఎవర్నీ ఏమీ చేయదని ఆమెకు నమ్మకం కుదిరింది. పొరపాటున దాన్ని రెచ్చగొట్టకూడదని ఆమె పెరట్లో మసిలేటప్పుడెంతో జాగ్రత్తగా ఉంటోంది. పురికొస తాడునైనా, పుల్లముక్కనైనా ఒకటికి రెండుసార్లు చూసి నిర్థారణ చేసుకుని మరీ అడుగులేస్తోంది. చలపతి మాత్రం పెరట్లోకి రావడం మానేశాడు. లక్ష్మిలో పెరిగే ధైర్యం అతన్ని మరింతగా కలవరపెడుతోంది. ప్రస్తుతానికి తాచుపాము లక్ష్మినేం చేయడంలేదు. కానీ పొరపాటున ఆమె కాలు దాని తోకను తొక్కితే! ధైర్యంగా తిరుగుతున్నాననుకుంటున్న లక్ష్మి కూడా అరచేతిలో ప్రాణాలుంచుకునే పెరట్లో తిరుగుతోంది. అలాంటి పరిస్థితిలో చలపతికి జగ్గయ్య గురించి తెలిసింది. జగ్గయ్య అతడికి బాగా దూరపు బంధువు. వ్యవసాయంలో దిట్ట, పాముల్ని చంపడంలో చాంపియన్ అని చెప్పుకునేవారు. కాలం కలిసిరాక బాగా చితికిపోయి నికృష్టమైన జీవితం గడుపుతున్నాడు. అతణ్ణి సహాయమడిగితే? ఒకందుకు సంకోచిస్తున్నాడు, ఏడాది క్రితం జగ్గయ్య అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం నిమిత్తం మూడువందలు కావాలని తన వద్దకు వచ్చాడు. తను లేవని పంపేశాడు. అదిప్పుడు చెబితే, "కన్నా కొడుకులే ఆయన్నాదుకోలేదు. మనం చేసిందేం తప్పుకాదు. వెళ్ళి ఆయన్ని పిలవండి. ఓ పంచెల చాపు పెట్టి చేతిలో నూటపదహార్లు పెడదాం'' అంది లక్ష్మి. ఈ ఉపాయం చలపతికి నచ్చింది. ఒకరోజు సాయంత్రం అతడు జగ్గయ్యను కలుసుకున్నాడు. అతుకుల పంచి, చిరుగుల చొక్కా, మాసిన గెడ్డం, చింపిరి జుట్టు ... చూడ్డానికి జగ్గయ్య బిచ్చగాడిలా ఉన్నాడు. కావడానికది జగ్గయ్య ఇల్లేకానీ కొడుకు దాన్నెవరికో అద్దెకిచ్చేశాడు. పెరట్లో రేకుల షెడ్లో ఉంటున్నాడతను. అతడి జీవనాధారమేమిటో ఎవరికీ తెలియదు. కొడుకు నెలకు వందరూపాయలు పంపుతున్నాడంటారు కొందరు. ఇంట్లో ఉన్నవాళ్ళు చూసీచూడక తిండి పెడతారంటారు కొందరు. మనిషి మాత్రం చిక్కిశల్యమైవున్నాడు. జగ్గయ్య, చలపతి చెప్పిందంతా విని, "పెరట్లో తాచుపాములు ఒక్కటేమిటి, వద్దన్నాసరే పట్టి చంపగలను, కానీ చంపను వెళ్ళు'' అన్నాడు. చలపతి తెల్లబోయి "ఎందుకు?'' అన్నాడు. "తాచుపాములా కలకాలం వర్థిల్లాలి. వీలుంటే ఒకదాన్ని పట్టి నా కొడుకింటి పెరట్లో కూడా వదిలిపెట్టాలనుంది'' అన్నాడు జగ్గయ్య. చలపతికి అతడి మాటలు అర్థంకాలేదు. అది కనిపెట్టినవాడిలా "తాచుపాము నీ పెరట్లో చేరింది.నీ స్నేహితులు నీ యింటికి రావడం మానేశారు. నీకు సాయపదతామని మంత్రగాళ్ళు, పాములుపట్టేవాళ్ళు నీవల్ల ప్రయోజనం పొంది నిన్ను మోసం చేశారు. ఏం చేయాలో నెకెఉ చెప్పే సానుభూతిపరులు పెరిగారు. వాళ్ళు చెప్పింది నువ్వు చెయ్యగలవా అని ఆలోచించరు.అందుకు సాయమూపడరు. కొందరైతే పెరట్లో తాచుపాము నీ అదృష్టమంటారు కానీ ఆ అదృష్టాన్ని తాము తీసుకోరు, కోరుకోరు. చివరి కేమవుతుందంటే నువ్వు తాచుపాముకి అలవాటు పడతావు. నీ స్నేహితులకంటే, అయినవాళ్ళకంటే అది ప్రమాదకరమైంది కాదని తెలుసుకుంటావు. తాచుపామే నీ స్నేహితుడవుతుంది. అంతమాత్రాన నీ సమస్య తీరిపోదు.తాచు పాముతో సహజీవనమంటే నీ ప్రాణాలు నీకు దక్కినా అవెప్పుడూ అరచాతుల్లోనే ఉంటాయి. అర్థమయిందా?'' అన్నాడు జగ్గయ్య. "అర్థమయింది కానీ యిన్ని తెలిసికూడా నువ్వు నాకెందుకు సాయపడవు?'' అన్నాడు చలపతి. "ఓరి మూర్ఖుడా! ఇంకా నీకర్థం కాలేదా? మనిషికి దరిద్రం పెరట్లో తాచుపాములాంటిది. దరిద్రుణ్ణి అయినవాళ్ళు దూరంగా ఉంచుతారు. మాయగాళ్ళు మోసంచేస్తారు. బాగా ఉన్నవాళ్ళు దరిద్రుడే సుఖపడుతున్నట్లు చెప్పి కవులు, రచయితలచేత పొగిడిస్తారు కూడా! ఏ దారీలేక దరిద్రంతో సహజీవనానికి సరిపెట్టుకుని అది నన్నేక్షణంలో కాటేస్తుందోనని అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బ్రతికే దరిద్రుణ్ణి నేను. నాకు సాయపడాలని మీరేవ్వరైనా అనుకున్నారా? నా బాధ మీకు తెలియాలంటే మీ పెరట్లో ఆ తాచుపాముండితీరాలి. దాన్ని నేనెందుకు చాపుతాను? వెళ్ళు ...'' అంటూ గద్దించాడు జగ్గయ్య, అప్పుడు మొదటిసారిగా చలపతి జగ్గయ్య కేకకు భయపడ్డాడు. క్షణం కూడా ఆగకుండా అక్కణ్నుంచి ఇల్లు చేరే సరికి గుమ్మంలోనే నవ్వుముఖంతో ఎదురయింది లక్ష్మి. "పాతికేళ్ళ కుర్రాడండీ ... మేకు తోచిందివ్వండి పామును చంపేసి పోతానన్నాడు. మోసగాడేమోననిపించినా ఏమో ఏ పుట్టలో ఏ పాముంటుందోనని సరేనన్నాను. అతగాడు పెరట్లోకి వెళ్ళి అరగంటలో పామును వెతికి పట్టుకుని చంపేశాడు. మీరు కానీ బాబయ్యగారిని తీసుకొచ్చేస్తున్నారమోనని కంగారుపడి హడావిడిగా యిలా వచ్చాను. అతగాడు పెరట్లో స్నానం చేస్తున్నాడు నూతి దగ్గర'' అంది లక్ష్మి ఉత్సాహంగా. చలపతి వెళ్ళి ఆ కుర్రాణ్ణి చూశాడు. అప్పటికతడి స్నానమైపోయింది. మళ్ళీ తనకున్న చింకి బట్టలు కట్టేసుకున్నాడు. చలపతి డబ్బు గురించడిగితే తోచిందివ్వమన్నాడు. "తోచిందంటే అయిదు రూపాయలిస్తాను తీసుకుంటావా?'' అన్నాడు చలపతి. ఆ యువకుడు తలాడించాడు. "వెర్రివాడా! ఇలా అయితే ఈ వృత్తిలో డబ్బులేం సంపాదించగలవు?'' అన్నాడు చలపతి జాలిగా. "పాముల్ని చంపడం నా వృత్తికాదు. పాముని చంపడానికి నేను చేసిన తోలిప్రయట్నం ఇదే!'' అన్నాడాయువకుడు. "అయితే మాత్రం, ఓ వృత్తి ప్రారంభించేక స్థిరమైన రేటంటూ ఉండాలి. ఈవేళ అయిదు రూపాలకొప్పుకుంటే రేపందరూ అంతే యిస్తామంటారు ...'' "ఇక ఈ వృత్తి చేయను ...'' అన్నాడా యువకుడు. "ఎందుకని?'' "నాకు చదువులేదు. నా న్నవాళ్ళు లేరు. పనిచ్చేనాధులు లేరు. కాలూ చేయీ తిన్నగా ఉందని అడుక్కోవడం అచ్చిరావడం లేదు. దరిద్రం ... దరిద్రం ... నేను భరించలేకపోతున్నాను. ఆత్మహత్య చేసుకోవాలంటే మనస్కరించటంలేదు. చావు తప్ప నా సమస్యలకి పరిష్కారం లేదు. మీ పెరట్లో తాచుపాముందని తెలిసింది. చేతకానిపనిచేస్తే చావు తప్పదుకదా అన్న ఆశతో ప్రాణం పోగొట్టుకోవాలని వచ్చాను. దరిద్రుణ్ణి పాము కూడా కాటేయడానికి భయపడింది. నేనింకేమైనా ప్రయత్నం చేయాలి ...'' అన్నాడా యువకుడు. అటు జగ్గయ్యా ... ఇటు యువకుడు ... దరిద్రం ... పెరట్లో తాచుపాము ... చలపతి భార్యతో అన్నాడు "అయినవాళ్ళకు నామీద ఆధారపడాల్సిన అగత్యం లేదు. మన అవసరానికి మించిన సంపాదన నాది. అనుభవంమీద పెరట్లో తాచుపముంటే ఎలాగుంటుందో తెలుసుకున్నాం. దేశంలోని దరిద్రాన్ని పారద్రోలడం మనవల్ల కాదు. కానీ ఉడుతాభక్తిగా ఓ జగ్గయ్య, ఓ యువకుడు ... వీళ్ళకు మనమో దారి చూపిస్తే ఆ దారిలో మరెందరో నడిస్తే ... దేశంలోని దరిద్రాన్ని పారద్రోలడానికి నాయకులమీద ఆధారపడకుండా ప్రజలే ప్రజలకు దారులేర్పరుస్తారు. ఏమంటావు?'' లక్ష్మి ఏమంటుందో అతడికి తెలియదా?

ఓటమిలో గెలుపు

ఓటమిలో గెలుపు - వసుంధర   నేను తల్లిదండ్రుల చాటు బిడ్డను కావడం నా అదృష్టమే కానీ నాలోని లోపం కాదు. అమ్మానాన్నలకు నేను ఒక్కన్నే కొడుకును కాదు. అయినా వాళ్ళు నన్ను అపురూపంగా పెంచారు. చిన్నప్పట్నించీ కంటికి రెప్పలా చూసుకునేవారు. నాకు చదువు బాగా వస్తూంటే చదివించారు. నేను బి.కాం. ప్యాసవ్వగానే నాన్న డబ్బూ, పలుకుబడి ఉపయోగించి ఓ నేషనలైజ్ద్ బ్యాంకులో ఉద్యోగం కూడా వేయించారు. ఉద్యోగంలో చేరాక కూడా వాళ్ళు నన్ను నా మానానికి వదిలి పెట్టలేదు. ఆఫీసులో నాకెలాంటి ఇబ్బందులూ రాకుండా నాన్నా, ఇంట్లో నాకే కష్టమూ కలక్కుండా అమ్మా చూసుకుంటున్నారు నన్నెంతో ఇదిగా. ఇదంతా బాగానే వుంది. కానీ ఎంతమంది తల్లిదండ్రులిలా ఉంటున్నారు? అందుకని నా మిత్రవర్గంలో చాలామందికి నేనంటే అసూయ. ఆ అసూయతో వాళ్ళు నన్ను తరచుగా వేళాకోళం చేస్తుంటారు. నా మిత్రులు మొత్తం అరడజను మంది. అందులో ఇద్దరికీ చదువే రాలేదు. ఇద్దరికీ చదువొచ్చింది కానీ ఉద్యోగం రాలేదు. మరో ఇద్దరికీ ఉద్యోగాలున్నా అవి వాళ్ళు బ్రతకడానికి చాలవు. ఈ ఆరుగురూ కాక నాకింకా స్నేహితులుండేవారు. నాకంటే ఉన్నత స్థానంలో ఉన్న వాళ్లనే కాదు, నాతొ సరిసమానుల్ని కూడా నేను సహించలేను. అందుకే నాకంటే తక్కువ స్థాయిలో ఉన్న ఈ ఆరుగురూ నాకు మిత్రులుగా మిగిలారు. అదేం దురదృష్టమో నాతో స్నేహం చేసిన ప్రతివాడూ నా మీద జోకువేయడానికి ప్రయత్నించేవాడు. ఇప్పుడున్న ఆరుగురు మిత్రులూ కూడా నామీద దారుణంగా జోకులు విసుర్తూనే వుంటారు. సరిసమానులూ, నాకంటే గొప్పవాళ్ళు వేసిన జోకుల్లా, వీరి జోకులు నన్ను బాధించక పోవడంవల్ల వీరితో స్నేహాన్ని నేను కొనసాగించగల్గుతున్నాను. "ప్రస్తుతం నాకు ఉద్యోగం లేదు. అయితే వుద్యోగం కోసం సుధాకర్ కి అన్నింటికీ నాన్నే ఆధారం. నీకులా లేమన్నదే మాకు తృప్తి'' అన్నారు చదువురాని వాళ్ళు. "మాకొచ్చే జీతంతో నాలుగువేళ్ళూ లోపలికి పోవడంలేదు. ఇటే ఏం స్వయంకృషితో సంపాదించిన నాలుగు పైసలూ, నాలుగు లక్షల్లా కనబడతాయి'' అన్నారు చిరుద్యోగులు. నేను వేటికీ చలించకుండా "మీ అసూయే మీ చేత ఆ మాటలు పలికిస్తోంది. ఐనా నేను స్పోర్టివ్ గా తీసుకుంటున్నాను, నేను కావాలని ఎవరిమీదా ఆధారపడలేదు. కాలవ దాటడానికి బల్లకట్టున్నప్పుడు ఈత కొట్టుకొంటూ వెళ్ళాలా? వడ్డించిన విస్తరి నా జీవితం. అది నా అదృష్టం'' అన్నాను. "అదే ... అదే ... అదే నిన్ను చేతకానివాణ్ణి చేస్తోంది'' అన్నాడు నిరుద్యోగి. "చేతకాని వాణ్ణి అంటే ఎలా?'' అనడిగాను. వాళ్ళంతా ఆలోచనలో పడ్డారు. వాళ్ళవంకే చిద్విలాసంగా చూస్తున్నాను నేను. ఆఖరికి ఒకడు "నువ్వు అమ్మాయిల్ని ప్రేమించగలవా?'' అనడిగాడు. "అది మంచి బాలుడి లక్షణం కాదు. కాబట్టి అలాంటి ప్రయత్నం కూడా చేయను'' అన్నాను. ఉన్నట్లుంది చిరుద్యోగి అన్నాడు. "చెడ్డ బాలుడిలా ప్రవర్తించవద్దు . చేతనైతే ఒకమ్మాయిని ప్రేమించి పెళ్ళిచేసుకో'' రెండో చిరుద్యోగి ఇంకా కన్సెషన్ ఇచ్చాడు "నీకు తెలియని అమ్మాయిని ప్రేమించే సాహసం వీవల్ల కాదని నాకెలాగూ తెలుసు. కానీ మీ ఇంట్లో నీకు వరుసకు మరదలుంటే ప్రేమించు చాలు. నీ గురించి నమ్ముతాం'' "ఏమిటీ సవాల్?'' అన్నాను చిరాగ్గా. అప్పుడే నా మనసులో ఆ ఊళ్లోనే ఉన్న మరదలు పిల్ల కాత్యాతని మెదిలింది. ఆ మధ్య ఎవరో బామ్మగారు ఏదో చుట్టపు చూపుగా మా ఇంటికొచ్చి మా కాత్యాయని ఈ ఊళ్ళోనే చదువుకొంటోందని చెప్పినప్పుడు ఆ కాత్యాయని గురించీ, నాకూ ఆమెకూ వున్న వరుస గురించీ తెలిసింది. ఆ తర్వాత మళ్ళీ కాత్యాయని ప్రసక్తి ఇంట్లో రాలేదు. కాత్యాయని ఉమన్స్ కాలేజీలో రెండో సంవత్సరం బియ్యే చదువుతోంది. కాలేజీ హాస్టల్లో ఉంటోంది. బామ్మగారుండగా ఓసారి కాత్యాయని మా ఇంటికి వచ్చింది. అప్పుడు చూసిన రూపం ఇంకా గుర్తుంది. మనిషి బాగుంటుంది. 'కత్యాయనిని ప్రేమించి పెళ్ళి చేసుకుంటే వీళ్ళ సవాలుకు జవాబుగా వుంటుంది, నాకో చక్కని జోడూ దొరికినట్లుంటుంది' అనుకున్నాను. మర్నాడే ఉమన్స్ కాలేజీ గేట్ దగ్గర కాత్యాయాన్ని కలుసుకున్నాను. నన్ను చూడగానే ఆమె గుర్తుపట్టింది. అందుకు నాకెంతో సంతోషం కలిగింది. "మీతో మాట్లాడాలి. చాలా ముఖ్యమైన విషయం. ఓసారి పార్కుకు వస్తారా?'' అన్నాను. కాత్యాయని ఒప్పుకొని తిన్నగా  పార్కుకు వచ్చింది. "నాకు డొంక తిరుగుడుగా మాట్లాడ్డం చేతకాదు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరూ నన్ను ప్రేమించగలరా?'' అనడిగాను కత్యాయాన్ని. కాత్యాయని నావంక అదోలా చూసి "పెళ్ళి గురించి నాకెన్నో కలలున్నాయి. మీరు యద్దనపూడి సులోచనారాణి నవలలు చదివారా?'' అనడిగింది. "లేదు. నవలలు చదివితే చేదిపోతానని అమ్మా, నాన్న చెప్పారు'' అన్నాను. "ఆ నవలల్లో హీరోలా ఉండాలి మీరు. ముందు చదివి తెల్సుకోండి'' అంది కాత్యాయని. నేను వెంటనే లేచి, "ఆ పుస్తకాలెక్కడ దొరుకుతాయి?'' అనడిగాను. "మీ ఇంట్లో ఉండకపోవచ్చునేమోగానీ, మీ ఇరుగూ పొరుగూ ఇళ్లలో తప్పకుండా వుంటాయి'' అంది కాత్యాయని. ఆమె కూడా లేచి నిలబడింది. "సరే, అయితే మళ్ళీ కలుద్దాం. కానీ ఎన్ని నవలలు చదవమంటారు?'' అన్నాను. "కనీసం ఆరు'' అంది కాత్యాయని. ఇద్దరం విడిపోయాం. తర్వాత నేను వీథిలో వాకబుచేయగా కాత్యాయని చెప్పిన మాట అక్షరాల నిజమని తెలిసింది. ఆ వీధిలోనే నాకు 10 పుస్తకాలు దొరికాయి. ఇంట్లో తెలియకుండా ఒకటి కాదు, రెండు కాదు పది నవలలు చదివాను. ఇంకా చదవాలనిపించింది. కానీ అప్పటికే కాత్యాయాన్ని కలుసుకుని నెల రోజులు దాటింది. అందుకని ఇంకా నవలలు చదివే ఉద్దేశ్యం అప్పటికి కట్టిపెట్టి మళ్ళీ కాత్యాయన్ని గేటు దగ్గర కలిశాను. "చాలా కాలమైంది మిమ్మల్ని చూసి'' అంది కాత్యాయని. "పార్కులో మాట్లాడుకుందాం'' అన్నానుఇద్దరం పార్కుకి వెళ్ళాం. "మీరు ఆరన్నారు, కానీ నేను పది చదివాను'' అన్నాను. కాత్యాయని ఆశ్చర్యంగా "ఈజిట్!'' అని "ఎలా వున్నాయి?'' అంది. "మీకు చాలా థాంక్స్ ... చాలా బాగున్నాయి ...'' అన్నాను. "సరే. కనీ మీరీమధ్య కనబడలేదు ...'' "నవలలు చదివేదాకా మిమ్మల్ని చూడకూడదనుకున్నాను'' "నవలలు చదువుతున్నప్పుడు నేను గుర్తుకొచ్చానా?'' "లేదు. నాది అర్జునుడిలాంటి శ్రద్ధ, ఏకాగ్రతతో నవల చదువుతున్నప్పుడు మరే విషయమూ నా బుర్రలో వుండేది కాదు'' అన్నాను గర్వంగా. కాత్యాయని ముఖం అదోలాగైపోయింది. పోనీ నవల చదవడం అయ్యాకయినా నన్ను చూడాలని పించేదా?'' "లేదు. తర్వాత చదవవలసిన నవల గురించి ఆలోచించేవాణ్ణి'' అన్నాను గర్వంగా. కాత్యాయని చాలా భారంగా నిట్టూర్చింది. "ఇప్పుడు చెప్పండి ... మీరు నన్ను ప్రేమించగలరా?'' అన్నాను. "పెళ్ళి గురించి నాకెన్నో కలలున్నాయి. వాటిలో కొన్నింటిని మీరు చదివి తెల్సుకున్నారు. ఇంకా చూసి తెల్సుకోవాల్సినదుంది. మీరు అమితాబ్ బచ్చన్ సినిమాలు చూస్తారా?'' అంది కాత్యాయని. "చూడలేడు. కానీ అతడు హిందీలో పెద్ద హీరో అని తెలుసు'' అన్నాను. అమితాబ్ బచ్చన్ పేరు నే నెరుగున్నది కావడమే నాకు చాలా గర్వకారణ మనిపించింది. "అతడి సినిమాలు చూడండి. ఈ రోజుల్లో ఆడపిల్ల కోరుకునే మగవాడు అలా వుండాలి'' అంది కాత్యాయని. "అలాగే!'' అని లేచాను. ఇంక కాత్యాయనితో మాట్లాడవలసిందేముంది? ఆమె వెళ్ళి పోతూండగా చటుక్కున గుర్తుకు వచ్చి "ఏవండీ!'' అని పిలిచాను. కాత్యాయని వెనక్కి తిరిగింది. ఆమె కళ్ళు మెరుస్తున్నాయి. నే నామెవంక నడిచి, "అన్నట్లు ... ఎన్ని సినిమాలు చూస్తే చాలంటారు?'' అన్నాను. ఆమె కళ్ళలోని మెరుపు మాయమైంది. "కనీసం నాలుగు!'' అని చరచరా నడిచి వెళ్ళిపోయింది. నేను మళ్ళీ ఎక్కడ పిలుస్తానోనన్న భయం ఉన్నదానిలాగా. ఊళ్ళో అమితాబ్ బచ్చన్ సినిమాలు రెండు ఆడుతున్నాయి. నన్ను ఎన్నోమాటలు మిత్రులు బలవంత పెట్టారు. కానీ ఎన్నడూ హిందీ సినిమా చూడలేదు. ఇప్పుడు కాత్యాయని కోసం చూస్తున్నాను. ప్రేమ ఎంత బలమైనది! ఇంట్లో తెలియకుండా రెండు సినిమాలూ చూశాను. నాకెంతో నచ్చాయి. వాటిలో అమితాబ్ బచ్చన్ ఎంత చక్కగా నటించాడు! మరో రెండు సినిమాలు అమితాబ్ బచ్చన్ వి మా ఊరు రావడానికి ఆరువారాలు పట్టింది. అవి కూడా చూశాక నా అభిప్రాయం మరింత బలపడింది. ఇకమీదట హిందీ సినిమాలు క్రమం తప్పకుండా చూడాలని కూడా అనుకున్నాను. నాలుగు సినిమాలు చూడడం అయ్యేక మళ్ళీ వాళ్ళ కాలేజీగేటు దగ్గర కాత్యాయనిని కలుసుకున్నాను. కాత్యాయని నన్ను చూసి నీరసంగా నవ్వింది. "పార్కుకి వెడదామా?'' అన్నాను. "ఊ.('' అందామె. ఇద్దరం పార్కు చేరాక'' నాలుగు సినిమాలు చూడ్డం పూర్తయ్యేదాకా నన్ను చూడకూడదనుకున్నారు కదూ?'' అంది. "అవును బాగా ఊహించారు. ఆ మాటకొస్తే ఈ మధ్యకాలంలో మీరసలు నాకు గుర్తే లేరు!'' అన్నాను నేను గర్వంగా. "అనుకున్నాన్లెండి!'' అంది కాత్యాయని. "ఇప్పుడు చెప్పండి ... మీరు నన్ను ప్రేమించగలరా?'' అనడిగాను ఆత్రంగా. "ఇప్పుడే చెప్పలేను. నాకు మూడునెల్ల వ్యవథి కావాలి. అంత వరకూ మీరు నన్ను డిస్టర్బ్ చేయకూడదు. అంటే మనం కలుసుకోకూడదన్న మాట!'' అంది కాత్యాయని. "ఓస్ .. .ఇంతే కదా?'' అన్నాను. "ఎలా గడుస్తాయ్ మీకు రోజులు ... బోరనిపించదూ?'' అంది కాత్యాయని. "ఇదివరలో అయితే ఏమోగానీ ఇప్పుడు ఫరవాలేదు. నవలలు చదువుతూ, సినిమాలు చూస్తూ గడిపేయగలను'' అన్నాను. కాత్యాయని చటుక్కున లేచి "సరే, అలాగే చేయండి'' అని వెళ్ళిపోయింది. ఆ తర్వాత నేను నవలలు చదవడానికి, సినిమాలు చూడ్డానికీ ఇంట్లో పర్మిషన్ అడిగాను. నేనూహించుకున్నట్లుగా అమ్మ అభ్యంతర పెట్టలేదు. ఆమె అర్జంటుగా నాన్నగార్ని పిలిచి "మనవాడు పెద్దవాడౌతున్నాడండీ! ఇంకా వాడికి పెళ్ళి చేసేయొచ్చు'' అంది. నాన్నగారు కూడా విషయం విని ఆనందంగా ముఖంపెట్టి "వీడి అన్నయ్య విషయంలోనూ అచ్చం ఇలాగే జరిగింది. ఈ వయసులోనే వాడు ...'' అని మాట నాన్చేశాడు. రోజులు గడుస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ నేను నా మిత్రుల్ని కలుసుకుంటున్నాను. ప్రతి రోజూ వాలు తన సవాల్ గురించి అడుగుతూంటే నేను చిరునవ్వుతో "కంగారెందుకు? మీరే చూస్తారుగా'' అనేవాణ్ణి. ఒకరోజున వాళ్ళలో ఒకడు చిరాగ్గా, "ఇలా ఎన్నాళ్ళు దాటవేస్తావ్? ఇంతవరకూ నువ్వు ప్రేమ కలాపం ప్రారంభించనైనా లేదు'' అన్నాడు. "ప్రారంభించకేం? అంతా అయింది. పెళ్ళి ముహూర్తం నిర్నంయ్యాక అన్ని వివరాలూ నీకు చెబుతాను'' అన్నాను. "అలాగే అంటావ్. పెద్దలు నిర్ణయించిన అమ్మాయిని చూపించి ఆమెనే ప్రేమించానని కోస్తావు. ఇదేమ లాభంలేదు. మాకు ఋజువు కావాలి'' అన్నాడో చిరుద్యోగి. వాళ్ళు బాగ్ఫా నొక్కించడంతో కాత్యాయని పేరు చెప్పక తప్పలేదు. ఆ పేరు వింటూనే వాళ్ళకు ఆశ్చర్యంతో కాసేపు నోట మాట రాలేదు. "ఆ అమ్మాయినెప్పుడు కలుసుకున్నావు? ఎలా కలుసుకున్నావు?'' అనడిగారు వాళ్ళంతా ఏక కంఠంతో. "ఆమె నిన్తవరకూ నేను ముచ్చటగా మూడుసార్లు కలుసుకుని మాట్లాడాను. అంతకుమించి మీకీమీ చెప్పలేను. నాలుగోసారి నేను, ఆమె కలుసుకున్నప్పుడు వివాహం గురించి చర్చించుకుంటాం'' అన్నాను నేను. "ఒక్కసారి ఆ అమ్మాయిని చూపించు'' అన్నారు వాళ్ళు. "ఆమెను కలుగుకోనని మాటిచ్చాను. ఆ గడువింకా పూర్తి కాలేదు. మీకు కావాలంటే ఆమె అడ్రెస్ ఇస్తాను. వెళ్ళి చూడండి'' అన్నాను. రెండ్రోజుల తర్వాత నిరుద్యోగి నాతో, "కాత్యాయనిని చూశాను. మనిషి చాలా బాగుంది. కానీ, ఆమె నిన్ను ప్రేమిస్తోందంటే నమ్మను. ఆమె ఎవరో యువకుణ్ణి రోజూ పార్కులో కలుసుకుంటోంది'' అన్నాడు. "నువ్వెన్ని చెప్పినా నేను నమ్మను'' అన్నాను. "నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం!'' అన్నాడు చిరుదోగి. నాకు అనుమానం కలిగింది, 'మా ప్రేమ ఏదో విధంగా ఫెయిలవ్వాలని చిరుదోగి ప్రయత్నిస్తున్నాడేమో? గడువులోగా నేనామెను కలుసుకున్నానంటే నా ప్రేమ విఫలమైనట్లే! "పోనీ కలుసుకుంటే కలుసుకోనీ! నేను మీకులా అసూయాపరుణ్ణి  కాను, స్పోర్టివ్ గా ఉంటాను. కాత్యాయనిపై నాకు నమ్మకముంది. మీరేం చెప్పినా నమ్మను;; అన్నాను. "నమ్మకపోతే నీ కర్మ. కానీ నువ్వు కాత్యాయాన్ని పెళ్ళి చేసుకుంటే అప్పుడు తప్పకుండా చేతకాని వాడివే అవుతావు. శీలంలేని ఆడపిల్లను చేతకానివాళ్ళే చేసుకుంటారు'' అన్నాడు చిరుద్యోగి తీవ్రంగా. ఎందుకైనా మంచిదని కాత్యాయనిని రహస్యంగా గమనించసాగాను. నిజంగానే ఆమె ఓ యువకుడితో కలిసి పార్కుకు వెడుతోంది. ఆ యువకుడు అందచందాల్లో నాకు సాటి వస్తాడనిపించలేదు. వేషభాషలను బట్టి కూడా నాకులా ఉన్నవాడనిపించదు. సులోచనారాణి నవలల్లోని హీరోకి కానీ, అమితాబ్ బచ్చన్ కి కానీ వాడు దరిదాపుల్లో లేడు. గడువు తీరిన రోజున కూడా ఆమెను ఎప్పటిలా గేటువద్ద కలుసుకోలేదు. ఎం చేస్తుందోనని రహస్యంగా గమనించాను. ఆమె ఆ యువకున్ని కలుసుకుని పార్కుకు వెళ్ళింది. ఇద్దరూ దట్టంగా ఉన్న క్రోటన్స్ మొక్కల చాటుకు వెళ్ళారు. వాళ్ళు మొక్కల కవతల ఉంటే నేను ఇవతల ఉన్నాను. వాళ్ళక్కడున్నట్లు నాకు తెలుసు. కానీ నేనక్కడున్నట్లు వాలు తెలియదు. వాళ్ళు గట్టిగా మాట్లాడడంలేదు. కానీ శ్రద్ధగా వింటే వాళ్ళ మాటలు వినిపిస్తాయి. నేను శ్రద్ధగానే వింటున్నాను. "నీ గురించి ఆలోచిస్తూ ఈ రోజు లెటర్లో ఎనిమిది తప్పులు రాసి, ఆఫీసర్ చేత ముఖం వాచేలా చీవాట్లు తిన్నాను'' "నన్ను క్షమించు మదన్! నీ ఆలోచనల్లోకి రావడం నాదే తప్పు'' "అలాగానకు కాత్యా! ఆఫీసర్ నన్ను తిట్టినా బాధలేదు. కానీ నువ్వు మాత్రం నా ఆలోచనల్లోకి వస్తూనే వుండాలి.'' "నేనంటే నీకుందుకీ ఆకర్షణ?'' "నువ్వంటే ఎవరైనా ఆకర్షించబడతారు. ఆ ఆకర్షణ సహజమే! నన్ను నువ్వామోదించడమే నా అదృష్టం'' వాళ్ళిద్దరూ ఎన్నో ప్రేమ కబుర్లు చెప్పుకుంటున్నారు. అవి వింటూంటే ఏదో నవలలో చదివినట్లూ, సినిమాలో చూసినట్లూ అనిపిస్తోంది. వినడానికి నాకెంతో ఆసక్తికరంగా ఉన్నాయి. నే నుత్సాహంగా వింటున్నాను ... మధ్యలో నా ప్రసక్తి వచ్చేవరకూ!. "అయితే నువ్వు నన్ను పెళ్ళి చేసుకుంటావా?'' అన్నాడు వాడు. "ఆ సందేహ మెందుకొచ్చింది నీకు?'' కాత్యాయని కంఠంలో ఆశ్చర్యం ధ్వనించింది. "ఎవరో సుధాకర్ నీకు బావ వరుస అవుతాడనీ అతడు నిన్ను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాడనీ రెండు మూడుసార్లు చెప్పావు గదా! నువ్వు చెప్పాక ఆ సుధాకర్ ని చూసి వచ్చాను. అతగాడు అందంలో పర్సనాలిటీలో, డబ్బులో అన్నింట్లోనూ నన్ను మించిన వాడు. అతన్ని కాదని నన్ను చేసుకుంటావా?'' నా ఛాతీ ఉబ్బింది. ఆ యువకుడిపై కాస్త గౌరవభావం కూడా కలిగింది. కాత్యాయని నవ్వుతూ మాట్లాడినట్లుంది "ఆ సుధాకర్ కథ చెప్పనా నీకు?'' అందామె. "ఊ ...'' "అతగాడికి వయసులో వున్న ఆడపిల్లతో ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. నాకు సులోచనారాణి నవలల్లోలాంటి హీరో అంటే ఇష్టమన్నాను. ఓ నెల్లాళ్ళపాటు నన్ను కూడా మర్చిపొయి ఆ నవలలు చదివాడు. ఆ నెల్లాళ్ళలో ఒక్కసారి కూడా నన్ను తల్చుకోలేదు సరికదా తన ఏకాగ్రత గురించి చెప్పుకున్నాడు. "తర్వాత అమితాబ్ బచ్చన్ అంటే ఇష్టమన్నాను. రెండు నెలలు కనబడడం మానేశాడు. ఆ రెండు నెలల్లోనూ నాలుగు బచ్చన్ సినిమాలు కూడా చూసి వచ్చి నన్ను ఒక్కసారి తల్చుకోలేదు.'' "ఆ తర్వార నేనే విసిగిపోయి ఓ మూడు నెలలు కనపడవద్దన్నాను. 'ఓస్ అంతేగదా' అన్నాడు తప్పితే ఏమాత్రం బాధ వ్యక్తం చేయలేదు. నోరు విడిచి అడిగినా కూడా 'బాధెందుకు?' అన్నాడు తప్పితే ఏమాత్రం ఆకర్షణ వ్యక్తం చేయలేదు'' "మూడుసార్లు కలుసుకున్నాం మరదలై నందుకయినా చనువుగా నువ్వని పిలవొచ్చు. మీరేనే మన్నించాడు. ఒక్క ప్రేమ కబురు లేదు ... పెళ్ళికి ఒప్పుకుంటావా అన్న ప్రశ్న తప్ప! రెండ్రోజుల పరిచయంలోనే మనం దగ్గరైపోయాము. ఒక్కరోజు చూడకపోతే వుండ్లేక పోతున్నాను. నీలాంటి డ్నోదిలి ఆ మొద్దును నేనెలా ప్రమిస్తాను? ఎలా పెళ్ళి చేసుకుంటాను?'' అంది కాత్యాయని. నాకు తల తిరిగినట్లయింది. "మూడు నెలలైపోయాయా?'' "ఏమో! నాకు గుర్తులేదు. అయిపోగానే అతడే ఠంచనుగా వచ్చి గుర్తుచేస్తాడులే. ఈసారి ఇంకో నాలుగు నెలలు కనపడొద్దని చెప్పానంటే అయిపోతుంది'' అంది కాత్యాయని. ఇద్దరూ పకపకా నవ్వుకున్నారు. కిలకిలా నవ్వుకున్నారు. హాయిగా కబుర్లు చెప్పుకుంటున్నారు. నేనింక అక్కడ ఉండలేకపోయాను. వెంటనే లేచి ఇంటికి వెళ్ళిపోయాను. ఆ రాత్రంతా ఏదోలా ఉన్నాను. అయితే ఒక్క రోజులో నేను సర్ధుకోగలిగాను. కాత్యాయని పరిచయం ఒక విధంగా నాకు మేలే అనిపించింది. ప్రతిదీ స్పోర్టివ్ గా తీసుకోవడం నాకు అలవాటు. కాత్యాయని, మదన్ ల సంభాషణ వినడంవల్ల ఆడపిల్ల మగవాడినుంచి ఏం కోరుకుంటుందో, మగవాడు ప్రేమ కబుర్లు ఎలా చెప్పాలో నాకు తెలిసింది. అలా నేను చెప్పగలనా అన్నది వేరే సంగతి. నా మిత్రులు నన్ను కాత్యాయని గురించి అడిగారు. విషయం చెప్పకుండా దాచేస్తున్నాను. అయితే నే నూహించిన సంఘటన ఒకటి జరిగింది. వూళ్ళోనే నాకో పెళ్ళి సంబంధం వచ్చింది. తల్లిదండ్రుల కొక్కర్తే కూతురు. వాళ్ళు మరీ ఉన్నవారు కాదు. కానీ సంప్రదాయమైన కుటుంబం. అమ్మాయి బియ్యే చదువుతోంది. పేరు రూప. ఆశ్చర్యమేమిటంటే రూప మదన్ చెల్లెలు. నా మిత్రులు అన్నట్లుగానే తల్లిదండ్రులు కుదిర్చిన రూపను పెళ్ళి చేసుకున్నాను. రూపవంటి సౌందర్యవతి నా భార్య కావడం అదృష్టమే. కానీ మిత్రుల సవాల్ కు నిలువలేకపోయానన్న బాధ నా మనసులో కొంత వెలితిని సృష్టించింది. తొలిరాత్రి రూప దగ్గర నా సందేహం బయటపెట్టకుండా ఉండలేకపోయాను. "నువ్వు నిజంగా నేనంటే ఇష్టపడుతున్నావా?'' అని అడిగేశాను. "ఇష్టమేమిటి? నా పట్టుదల మీదనే ఈ పెళ్ళి జరిగింది'' అంది రూప. "అదెలా?'' అన్నాను ఆశ్చర్యంగా. "అన్నయ్య కాత్యాయిని అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి మీ గురించి ఏం చెప్పిందో చెప్పి ఒక రోజు వేళాకోళం చేసాడు. మీ లక్షణాలు నాకు చాలా నచ్చాయి. ఆ విషయం అమ్మకు చెబితే అమ్మా నాన్నలిద్దరూ చర్చించుకున్నారు. వాళ్ళకీ మీ లక్షణాలు నచ్చాయి'' అంది రూప. "కానీ నువ్వు నాతో సుఖపడగలననుకుంటున్నావా?'' అన్నాను అనుమానంగా. "కాత్యాయిని తెలివితక్కువది. ఈ రోజుల్లో ఏ ఆడపిల్లయినా భర్తగా కోరుకునేది మీలాంటి వాళ్ళనే! కాస్త ఆలస్యంగానైనా ఏ ఆడపిళ్ళైనా తెలుసుకునేది ఈ విశేషమే!'' అంది రూప. నాకు చాలా సంతోషం కలిగింది. అప్పుడే మరో విషయం గ్రహించాను.ఒక ఆడపిల్ల అందులోనూ నాకు మరదలు వరుస కాని పిల్ల ... నన్ను కావాలని ఏరి కోరి చేసుకుంది. మరి నేను చేతకాని వాడినా? నేను చేతకాని వాడిని కావడమే రూప ఆశయమా! ఆమె ఆశయం ఏదైనా మిత్రులు చేసిన సవాల్లో నేను నెగ్గానా, ఓడానా అన్న విషయానికి నాకు జవాబు స్ఫురించడం లేదు.

నొప్పింపక తానొవ్వక

నొప్పింపక తానొవ్వక - వసుంధర శంకరం బయట పాంటు, షర్టు వేసుకుంటాడు. ఇంట్లో పంచ, లాల్చీ! బయట దేవుణ్ణి తిడతాడు, ఇంట్లో రోజూ పూజ చేస్తాడు. బయట కాంగ్రెస్ పార్టీనీ, నెహ్రూ కుటుంబాన్ని దుమ్మెత్తి పోస్తాడు. ఇంట్లో తన పడక గదిలో నెహ్రూ, ఇందిర, సంజయ్ ల ఫోటోలున్నాయి. ఇటీవల వాటి పక్కన రాజీవ్ ఫోటో తగిలించాడు. ఆఫీసులో స్త్రీ స్వాతంత్ర్యం గురించి లెక్చర్లిస్తాడు. లేడీ కొలీగ్సుకి అతడంటే చచ్చేటంత ఆరాధనాభావం. కానీ ఇంట్లో అతడి భార్య ఏడుగజాల చీరను వళ్ళంతా కప్పుకుని రూపాయా కాసంత బొట్టుతో ముసలి ముత్తైదువులాగుంటుంది. ఆమె పేరంటాలకొ, దైవదర్శనానికో తప్ప బయటకు రాదు. భార్యాభర్తలు కలిసి బయట కనబడరు.. నాకు శంకరం తత్త్వం అర్థంకాదు. కొందరు వాణ్ణి లౌక్యుడంటారు. నాకు మాత్రం హిపోక్రాట్ అనిపిస్తుంది. నా భార్య పేరు లక్ష్మి. నేను తనని లక్కూ అని పిలవాలనుంటుంది. నా పేరును కట్ చేసి రాజ్ అని పిలుస్తుంది. నలుగురిలోనూ నన్ను నువ్వంటుంది. తను చీరలు మాత్రమే కాక మినీలు, మిడీలు, చురీదార్లు, ఘాగ్రాలు వేస్తుంది. చీరాల మీద స్లీవ్ లెస్ వేస్తుంది. పెదాలకు లిప్ స్టిక్ రాస్తుంది. ముఖానికి క్రీమ్సు పూస్తుంది. ఇష్టం వచ్చిన సినిమాలు చూస్తుంది. నన్ను శాసిస్తుంది. ఆమెను స్నేహితురాండ్రు హాయ్ లక్కీ అని పిలుస్తారు. నేను మనసా, వాచా స్త్రీ స్వాతంత్ర్యానికి ప్రాధాన్యతనిచ్చేవాణ్ణి. అందుకని అంతా లక్కూ ఇష్టానికే విడిచిపెట్టినా ఆమె చేసే అన్ని పనులూ నాకు నచ్చవు. తప్పు ఆమె చేసే పనుల్లోకాక నా మనసులోని మగాడిలో వుందని గ్రహించి ఊరుకున్నా ఏదో అసంతృప్తి నన్ను బాధిస్తుంది. మానసికంగా హిపోక్రాట్ నైనా ఆచరణలో కానందుకు గర్వపడుతూంటాను. నాకు నా గురిన్చిఉ గర్వమే కాదు. శంకరం భార్య గురించి విపరీతమైన జాలి కూడా వుంది. అయితే పేరంటంలో ఆమె అందరికంటే సంతృప్తితోనూ, సంతోషంగానూ కనిపిస్తుందనీ ఎంతో తెలివిగా మాట్లాడుతుందనీ అంతా ఆమెను పెద్దవాళ్ళకంటె ఎక్కువగా గౌరవిస్తారానీ లక్కూ నాకు చెప్పేది. చెప్పి ఊరుకోకుండా, ప్రపంచంలో ఆమెకి తెలియని విషయాలు లేవు. ఆడదానికంత తెలివి అనూహ్యం. వాళ్ళాయనే అన్ని చెప్పి నేర్పుతుంటాడని నా అనుమానం. మీరెప్పుడూ పోసుకోలు కబుర్లు తప్ప ఇంకేం చెప్పరు నా తెలివి పెరిగిపోతుందని బెంగ'' అంటూ ఆమె నా మీద నెపం వేసింది. శంకరంతో పోల్చి నన్ను చిన్నబుచ్చడం సహించలేక అతగాడు భార్యనెలా ఆంక్షలు పెడుతున్నాడో వివరించాను. లక్కూ అంతా విని "ఆమెకి వాళ్ళాయనంటే ప్రాణం. అతడిమీద ఈగ వాలనివ్వదు. అంటే అతడి గోప్పతనేం! నాక్కూడా మీరే ప్రాణంగా బ్రతకాలనీ, మీమీద ఈగ వాలనివ్వకూడదనీ వుంటుంది. కానీ మీరాస్థాయికి ఎప్పటికి ఎదుగుతారో ఏమో'' అనేసింది. నా భార్య నన్ను గౌరవించదు సరికదా అందుకు నన్నే తప్పుపడుతోంది. ఆమెనేమీ అనలేక ఊరుకున్నాను కానీ నా మనసు ప్రతీకారజ్వాలతో రగిలిపోతోంది. అంతకాలం నేనెప్పుడూ శంకరానికెదురు వెళ్ళలేదు. ఇక తప్పదనిపించి మర్నాడాఫీసులో అతడు నాస్తికత్వం మీదా, స్త్రీ స్వాతంత్ర్యంమీదా, రాజకీయాల మీదా ఉపన్యాసాలు దంచుతూంటే మధ్యలో ఆపి ఆడి లక్షణాలన్నీ బయటపెట్టి "నువ్వు హిపోక్రాట్ వి'' అన్నాను. ఎదుటపడి శంకరాన్నంతవరకూ అంతమాటన్నవారు లేరు. అయినా శంకరం నివ్వెరపోక "కనిపించని దేవుడి గురించి కనీ పెంచిన తల్లిదండ్రుల మనసుకు కష్టం కలిగిస్తే వాడు ఆస్తికుడైనా నాస్తికుడే! అందుకే ఇంట్లో నేను నా వాళ్ళని తృప్తిపరచడం కోసం దేవుడికి పూజ చేస్తాను. నెహ్రూ కుటుంబాన్ని ఆరాధిస్తాను. నా భార్యను అదుపులో వుంచుతాను. అయితే నా అసహాయాతను, బలహీనతలను నా భార్య దగ్గర ఒప్పుకుని ఏకాంతంలో ఆమె శాసనాలకు తలవంచుతాను. నేను తనవాడినని నా భార్య నమ్మినంతగా మరే భార్యా తన భర్త గురించి అనుకోదని సవాలు చేయగలను. నువ్వు నన్ను నాస్తికుడను, హిపోక్రాట్ అను, స్త్రీలకు శత్రువను. నాకు అభ్యంతరం లేదు. నా భావాలేమైనా నా ఎదుటివారిని నొప్పించకపోవడమే నా మతం! ఉదాహరణకి ఇప్పుడు నువ్వు నన్ను నానా మాటలూ అన్నావు. నాకు నీ మీద కోపం రాలేదు. అందుకు సాక్ష్యంగా రేపు సాయంత్రం మన స్టాపునందర్నీ మా ఇంటికి అల్పాహారానికి ఆహ్వానిస్తున్నాను. ఆహ్వానం నీకూ వుంది. తప్పక రావాలి'' అన్నాడు. అందరూ నవ్వేశారు. నాకు చిన్నతనం అనిపించింది. మర్నాడు పార్టీకి వెళ్లాను. మొత్తం ఇరవైమంది కొలీగ్సు. అందరూ వచ్చారు. ఇంకా ఆశ్చర్యం శంకరం బాస్ ని పిలవకపోవడం. ఇలాంటి విషయాల్లో బాస్ కి పట్టింపెక్కువ. రేపు శంకరం మీద ఇది తెలిసి మండిపడినా పడవచ్చు. పార్టీలో ఇడ్లీ, పులిహోర, గులాబ్ జాం, పాయసం పెట్టారు. పదార్థాలన్నీ ఎంతో రుచిగా వున్నాయి. పార్టీలో శంకరం భార్య తానొక్కతీ అందరికీ వడ్డన చేస్తూ ఏలోటూ జరక్కుండా చూసింది. మనిషిలో ఉత్సాహం చెప్పనలవి కాదు. శంకరం తల్లిదండ్రులెంతో ఆప్యాయంగా అందర్నీ పలకరించారు. ఆ కుటుంబం సుఖసంతోషాలకు మారు పేరన్నట్లుంది. పార్టీ ముగిసేసరికి శంకరంపట్ల నాకు గౌరవం పెరిగిపోయింది. ఏదో కోర్టుకేసులో పోయిందనుకున్న ఆస్తి తిరిగి స్వాధీనమైందని ఈ పార్టీ ఇచ్చాడు శంకరం. నేను శంకరాన్ని కలుసుకుని నిన్నటి నా ప్రవర్తనకు సారీ చెప్పుకుని కోర్టు కేసు నెగ్గినందుకు అభినందించాను. "జరిగింద మరిచిపో! నీకెవరిమీద కోపం వచ్చినా పదిమందిలో ఎటాక్ చేయకు. నీలో తప్పుంటే పదిమందిలో అపహాస్యానికి గురవుతావు. నిన్న నీక్కలిగిన సందేహాల్ గురించి ఏకాంతంలో మాట్లాడి వుంటే విషయం మన మధ్యనే వుండిపోయేది అవునా?'' అన్నాడు శంకరం. అందులో హెచ్చరిక ధ్వనించింది. "బాస్ ని పిలవలేదేం?'' అన్నాను. అతడి హెచ్చరిక నన్నూ హెచ్చరికకు ప్రోత్సహించిందనుకుంటాను. శంకరం నవ్వి ఊరుకున్నాడు. ఆ నవ్వు అతన్ని ఎత్తులో వుంచింది. నాలో అసూయ మళ్ళీ మొదలయింది. ఆ అసూయ మర్నాడు నన్ను బాస్ వద్దకు పంపింది. నేను శంకరం ఇచ్చిన పార్టీ గురించి ఆయనకు చెప్పి "పార్టీలో మీకు కూడా వుంటే బాగుండేది'' అన్నాను. బాస్ నవ్వి "మిమ్మల్ని పిలిచినట్లు నన్నూ అల్పాహారానికి పిలిస్తే బాగుండదని ప్రత్యేకంగా ఈ రోజు విందు భోజనానికి పిలిచాడు. అందుకని నిన్న మీరంతగా నన్ను మిస్ కాక తప్పలేదు. నీ అభిమానానికి థాంక్స్'' అన్నాడు. తెల్లబోయాను. కొలీగ్సుకు టిఫిను, బాస్ కి డిన్నరు. శంకరం అవకాశవాది! అంతేకాదు. ఇది కొలీగ్సుకందరికీ అవమానం కూడా! వెంటనే నలుగురిలో శంకరాన్ని కడిగేయాలనుకున్నాను. కానీ ఆవేశాన్నణచుకున్నాను. శంకరం ఏం బదులిచ్చి నన్ను చిన్నబుచ్చుతాడో! అందుకు ముందుగా కోలీగ్సందర్నీ ఆకట్టుకుని అప్పుడతగాణ్ణి ఎటాక్ చేయాలి. ఈ ఉద్దేశ్యంతో అందరికంటే ముందు కిశోర్ ని కలుసుకున్నాను. కిశోర్ బాస్ అంటే పీకలదాకా కోపం. ఊళ్ళో పలుకుబడి వుండడం వల్ల బ్రతికిబట్టకట్టగల్గుతున్నాడు. కానీ ఆఫీసులో అతగాడికి నీళ్ళు పుట్టేవి కాదు. ఉన్న ఇరవైమందిలోనూ ఆరుగురు కిశోర్ కి చెంచాలు. మరో ముగ్గిరికి కిశోర్ అంటే భయం. శంకరం బాస్ ని మెప్పించడం కోసం కోలీగ్సందర్నీ ఎలా నొప్పించాడో కిశోర్ కి వివరించాను. "అందరూ నాకులా ధైర్యవంతులు కాలేరు. పోనీలెద్దూ'' అన్నాడు కిశోర్ తేలికగా. "కానీ ఈ విషయం మన దగ్గర ముందు చెప్పలేదు. తెలిస్తే వెళ్ళి వుండేవాళ్ళం కాదు పార్టీకి. బాస్ కి డిన్నరు, మనకి టిఫిను ... ఛీఛీ ... ఎంత అవమానం?'' "నాకు ముందే తెలుసు'' అన్నాడు కిశోర్. మళ్ళీ ఆశ్చర్యం నన్ను కమ్మేసింది. జరిగిందేమిటంటే శంకరం కిశోర్ ని ముందుగా కలుసుకుని "నేను నీకులా ధైర్యవంతున్ని కాను. బాస్ ని కూడా మా ఇంటికి పిలవాలి. ఆయనొస్తే నువ్వు రావు. మరికొందరు రారు. ఆ వచ్చిన మిగతా వాళ్ళు కూడా పార్టీలో ఫ్రీగా వుండలేరు. ఎంజాయ్ మెంటుండదు. అందుకని ముందుగా బాస్ లేకుండా మన కోలీగ్సందర్నీ పార్టీకి పిలుస్తాను. అందరికీ డిన్నర్ కష్టం కాబట్టి టిఫిను పెడతాను. బాస్ ని విడిగా ఒక్కణ్ణి పిలుస్తాను. ఒక్కడికి టిఫిను పెడితే బాగుండదు కాబట్టి డిన్నరంటాను. ఏది ఏమైనా నా ఈ విషయంలో నాకు సలహా కావాలి'' అన్నాడు. కిశోర్ శంకరం చెప్పినదానికి ఆమోదముద్ర వేయకుండా వుండగాలడా? అప్పటికి శంకరం నాకు అర్థమయ్యాడు. అతడు తను మంచి అని నమ్మినది చేస్తూనే ఎవ్వర్నీ నొప్పించకూడదనుకుంటాడు. ఆ ప్రయత్నంలో అహంకారాన్ని కూడ పూర్తిగా విడిచిపెట్టగలడు. శంకరంలా ఉండడం నాకు సాధ్యం కాదు. కానీ అతన్ని హిపోక్రాట్ అంటే మాత్రం నేను హిపోక్రాట్ నవుతాను.

సెల్లు సొల్లు

సెల్లు సొల్లు రచన - మల్లిక్ విశ్వనాధంకి ఎంతో ఆనందంగా ఉంది ఆ రోజు.     "బుజ్జిముండ!... ఎంత ముద్దొచ్చేస్తుందో?" అనుకున్నాడు...     అలా అని ఆ రోజు... అప్పటికి వందసార్లు అనుకున్నాడు.     అంత ముద్దొచ్చే బుజ్జిముండ ఎవరు? అతని భార్య?...     ఛఛ... కాదు!     అయితే డెఫెనెట్ గా ప్రియురాలే!...     ఉహు... అస్సలు కాదు.     కొంపదీసి పెంపుడు కుక్కపిల్లా?...     అబ్బే!... అదీ కాదు.     మరి అంత ముద్దొచ్చేది ఏమై ఉంటుందబ్బా అని బుర్ర గోక్కుంటున్నారా?బాధపడకండి... చెప్పేస్తున్నా!...     ఆ బుజ్జిముండ అతని అరచేతిలో నల్లగా మెరుస్తుంది!     కొత్త సెల్ ఫోన్... నల్లటి రంగులో మెరిసిపోతుంది!     సెల్ ఫోన్ కాదు... సెల్ ఫోన్ కనెక్షన్ కూడా కొత్తదే!... కొత్త కనెక్షన్ అనే కాదు... అదే మొదటిసారి సెల్ ఫోన్ కనెక్షన్ తీస్కోడం కూడా.     అసలు విశ్వనాధానికి సెల్ ఫోన్ కనెక్షన్ తీస్కోడంలో పెద్ద ఇంటరెస్ట్ లేదు...     "ఆ... నేనేమైనా పెద్ద బిజినెస్ మాగ్నెట్ నా... నాకెందుకూ సెల్ ఫోన్... నేను ఇంట్లో ఉన్న లాండ్ ఫోనే సరిగా ఉపయోగించను..." అనుకునేవాడు.     భార్య సత్యవతి మీరుకూడా సెల్ ఫోన్ తీసుకోండీ అని ఎన్నిసార్లు చెప్పినా పై కారణాల వల్ల అతను వినిపించుకోలేదు.     కానీ... ఈ మధ్య విశ్వనాధానికి కొన్ని అవమానాలు జరిగాయ్... దాంతో అతను సెల్ ఫోన్ ని తీస్కోక తప్పలేదు...     ఒకసారి...     బాత్రూమ్ లో టైల్స్ కాస్త పగిలితే ఓ మేస్త్రిని పిలిచాడు విశ్వనాధం.     పగిలిన టైల్స్ తీసేసి కొత్త టైల్స్ వెయ్యడానికి రెండొందలు అడిగాడు మేస్ర్తీ. కొత్తటైల్స్, సిమెంట్ ఖర్చూ విశ్వనధందే.     "అమ్మో అంతా?..." అన్నాడు విశ్వనాధం.     మేస్ర్తీ ఓసారి విశ్వనాధం వంక సీరియస్ గా చూసి మారు మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోసాగాడు.     పెళ్ళంపోతే మరోదాన్ని ఈజీగా చేస్కోవచ్చు... అదే మేస్త్రి వెళ్లిపోతే మరో మేస్త్రిని వెతికి పట్టుకోడం ఎంత కష్టం... అందుకే చెంగున ఎగిరి మేస్త్రి ముందుకి గెంతి రెండు చేతులూ బార్లా చాపి అడ్డంగా నిలుచున్నాడు.     "నేను వెళ్లనివ్వనుగా!!" చిలిపిగా నవ్వుతూ అన్నాడు విశ్వనాధం!!     మేస్త్రితో అలా నవ్వకుండా సీరియస్ గా మాట్లాడ్తే వాడు ఫీలయిపోయి వెళ్లిపోతే ఎంతకష్టం?...     "మరి రెండొందలు ఇస్తావా?" మేస్త్రిమాత్రం సీరియస్ గానే అడిగాడు.     "ఓ... అలాగే... నీ ఇష్టం..." సర్దాగా నవ్వేస్తూ అన్నాడు విశ్వనాధం.     "పని ఈ రోజే మొదలెట్టేస్తాను... టైల్స్ షాపు తెరిచాడో లేదో ఫోన్ చేసి కనుక్కుంటా..." అన్నాడు మేస్ర్తీ.     "అదిగో... ఆ మూలనున్న టీపాయ్ మీద ఫోనుంది... చెయ్యి!" అన్నాడు విశ్వనాధం.     "అదెందుకు?" అని జేబులోంచి సెల్ ఫోన్ తీసి ఓ నెంబర్ కొట్టి టైల్స్ షాపు వానితో మాట్లాడాడు.     విశ్వనాధం తెల్లబోయి చూశాడు. సత్యవతి మాత్రం విశ్వనాధాన్ని కొరకొరా చూసింది.     తర్వాత సెల్ నుండి మరో నెంబర్ కొట్టి "రేయ్ వెంకటేసు... ఇక్కడ కాలనీలో నూట పదకుండు ఇంట్లో పని ఉంది... వెంటనే రా..." అని చెప్పి సెల్ ఆఫ్ చేసి "నా అసిస్టెంట్ ని రమ్మని చెప్పా" అన్నాడు.     ఈసారి విశ్వనాధం మరింత తల్లబోయి చూశాడు... సత్యవతి అతన్ని మరింత కొరకొరా చూసింది.     "నేను సిమెంట్,ఇసుక,టైల్స్ తెచ్చుకుంటా... డబ్బులివ్వు!" అన్నాడు మేస్త్రి చెయ్యి చాపుతూ.     విశ్వనాధం మేస్త్రికి డబ్బులు ఇచ్చి పంపించాడు.     "చూడు...ఏబ్రాసి మోహమూ మీరూనూ...వాడికే కాదు... వాడి అసిస్టెంటుకి కూడా సెల్ ఫోన్ ఉంది!!..." అంటూ అతనికి జల్లకాయ్ కొట్టింది.     విశ్వనాధం కృంగిపోయాడు...     మరోసారి...     బజార్లో వెళ్తుండగా విశ్వనాధానికి సత్యవతితో మాట్లాడాల్సి వచ్చింది... కూరగాయలు ఏమైనా తేవాలా... ఒకవేళ తేవాలంటే ఏ కూరగాయలు తేవాలి?... అని సత్యవతిని అడగాలి.     విశ్వనాధం ఒక కిరాణాషాపుకి వెళ్లి"బాబూ... ఓసారి ఫోన్ చేస్కోవచ్చా?..." అని అడిగాడు.     షాపువాడు విశ్వనాధం వైపు చూడకుండానే "కుదర్దు...ఫోన్ చెడి పోయింది..." అని చెప్పాడు.     విశ్వనాధం వెనక్కి తిరిగాడు.     అప్పుడే షాపులోని ఫోన్ మోగింది... షాపువాడు రిసీవర్ ఎత్తి ఫోన్ లో మాట్లాడసాగాడు.     అంటే ఫోన్ పనిచేస్తున్నా షాపువాడు అబద్ధం చెప్పాడన్నమాట!!     ఒరేయ్... నువ్వు నాశనం అయిపోతావురోరేయ్ అని మనసులో అనుకుంటూ వేరే షాపు దగ్గరికెళ్లి వాడినీ అడిగాడు.     "బాబూ... ఓసారి ఫోన్ చేస్కోనా"     "ఉహు!... కుదర్దు!!" అన్నాడు షాపువాడు మొహం చిట్లించి.     "ఏం?... ఇది కూడా చెడిపోయిందా?"     "లేదు... బాగానే ఉంది... అయినా నేనివ్వను! పోవయ్యా ఫో... పనీ పాటు లేకుండా..." అంటూ ఛీదరించి కొట్టాడు... బిచ్చగాడిని ఛీదరించి కొట్టినట్టు.     దెబ్బకి విశ్వనాధం ఇంటికెళ్లి మంచంమీద బోర్లాధబేలుమని పడి... తలగడలో మొహం దాచుకుని భోరుమని ఏడ్చాడు.     రెండ్రోజుల తర్వాత మరో ఘోరమైన సంఘటన జరిగింది.     విశ్వనాధం పుట్ పాత్ మీది నుండి వెళ్తుంటే ఓ బిచ్చగాడు అతనికి ఎదురుపడి "బాబూ... ధర్మం చెయ్యండి... మీకు పుణ్యం వస్తది." అని బొచ్చెని మొహం మీద పెట్టాడు.     "పోరా ఫో... దున్నపోతులా ఉన్నావ్... ఏదైనా పనిచేస్కోలేవు?..." అని వాడిని కసిరికొట్టాడు.     వెంటనే ఆ బిచ్చగాడు ప్యాంటు జేబులోంచి ఓ సెల్ ఫోన్ తీసి ఏదో నెంబర్ నొక్కి"ఒరేయ్ ఓబులేసూ... ఆ వైపుగా గళ్లషర్టూ నల్లప్యాంటూ వేస్కుని ఓ దరిద్రుడు వస్తున్నాడు... ఆడిని అడక్కు... వేస్టు నాయాలు" అని చెప్పాడు.     విశ్వనాధం నవనాడులూ కృంగిపోయాయ్...ఆఖరికి బిచ్చగాడికి కూడా సెల్ ఫోన్ ఉందిగానీ తనకి సెల్ ఫోన్ లేదు...     సత్యవతి కూడా ఈ మధ్య రోజూ విశ్వనాధంతో పోరు పెడ్తూంది ఫలానావాళ్లు యింటికి ఫోన్ చేస్తే మీరు లేరని చెప్తే వాళ్లు మీ సెల్ నెంబర్ అడిగారు... మీకు సెల్ ఫోన్ లేదని చెప్పడానికి నాకెంత అవమానంగా ఉందో... అని.     ఇంక తప్పదని విశ్వనాధం సెల్ ఫోన్ తీస్కున్నాడు. తెల్సిన వాళ్లందరికీ ఫోన్ చేసి తన సెల్ నెంబర్ చెప్పాడు.     "టింగ్ టింగ్ టింగ్ టింగూ...టింగూ..." మంచి రింగ్ టోన్ తో సెల్ మోగితే ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు విశ్వనాధం. బటన్ నొక్కి"హలో" అన్నాడు.     "హలో...ఎవరు?...అప్పల్రాజేనా?" అవతలి కంఠం అడిగింది.     ఏంటీ?... సెల్ కి కూడా రాంగ్ నెంబర్లు వస్తాయా?...అని ఆశ్చర్యపోతూ "రాంగ్ నెంబర్" అని చెప్పేలోగానే వంటగదిలోంచి సత్యవతి రయ్యిన పరిగెత్తుకు వచ్చి "మా చెల్లెలేనా?..." అంటూ విశ్వనాధం చేతిలోని సెల్ ఫోన్ ని చటుక్కున లాక్కుని.     "ఏంటే.. ఎలా ఉన్నావ్?... నువ్వు పంపిన పేలమందు బాగానే పని చేసింది... ఇప్పుడుద్ నా తలలోని పేలు పోయాయి గానీ మీ బావగారి తలకి బాగా ఎక్కాయ్... హిహిహి...అంది.     "అక్కడ లైన్లో ఉన్నది ఎవడో గన్నాయ్... మీ చెల్లెలు కాదు!!" అని విశ్వనాధం ఆమె చేతిలోని సెల్ ఫోన్ ని లాక్కుని "రాంగ్ నెంబర్" అని ఫోన్ లో అరిచి డిస్కనెక్ట్ చేసేశాడు.     "రాంగ్ నెంబరైతే పోనీలే... నేనే మా చెల్లెలికి ఫోన్ చేస్తాను!"     "పేల గురించి మాట్లాడడానికా?... పళ్లు కొరుకుతూ అన్నాడు విశ్వనాధం.     "ఉహు... కాదు!... అమెరికా ఆర్ధికవ్యవస్థ గురించి మాట్లాడడానికి!..." అని విశ్వనధంకి జల్లకాయ్ కొట్టి అతని సెల్ ఫోన్ లాక్కుని బెంగుళూరులోని చెల్లెలికి ఫోన్ చేసి గంటన్నర మాట్లాడింది... తను ఫాలో అయ్యే సీరియల్స్ కధల గురించి విశ్లేషిస్తూ...     విశ్వనాధం గోడకేసి తల బాదుకుంటూనే ఉన్నాడు ఆ గంటన్నర సేపు.     ఫోన్ డిస్కనెక్ట్ చేసిన సత్యవతి విశ్వనాధం వంక చాలా ఆశ్చర్యంగా చూసింది.     "అదేంటీ... ఇందాక మీ తలకాయ్ పీచుతీసిన కొబ్బరికాయ సైజులో ఉంది... ఇప్పుడేమో ఏకంగా కొబ్బరి బొండం సైజులో ఉంది?" అని అడిగింది.     విశ్వనాధం రెండు చేతుల్తో తల పట్టుకుని బేర్ మన్నాడు.     ఆఫీసులో కూడా తోటి క్లర్కు సుబ్బారావ్ విశ్వనాధాన్ని రోజూ పీక్కు తినసాగాడు సెల్ ఫోన్ లో మాట్లాడడం కోసం.     మా యింటికి అర్జంటుగా మాట్లాడాలోయ్... బాస్ క్యాబిన్ లో కెళ్లి ఫోన్ చేస్కోడం కుదుర్డు కదా మరి?... అంటూ ఒకరోజు... మా అత్తగారికి ఒంట్లో బాలేదోయ్... ఎలా ఉందో కనుక్కోవాలి అని ఇంకోరోజూ... మా ఫ్రెండుకి విరోచనాలు అవుతున్నాయట!... పాపం తగ్గిందో లేదో కనుక్కోవాలి అని మరో రోజూ ... ఇలా ప్రతిరోజూ ఏదో కారణం చెప్పి విశ్వనాధం సెల్ ఫోన్ ని విరివిగా వాడడం మొదలుబెట్టాడు సుబ్బారావ్.     నెల తిరిగేసరికి విశ్వనాధం సెల్ ఫోన్ బిల్లు నాలుగువేలు వచ్చింది.     విశ్వనాధం బేర్ ర్... మన్నాడు.     ఇదిలా ఉంటే సెల్ ఫోన్ వల్ల డిస్టర్బెన్స్ కూడా బాగా ఎక్కువ పోయింది.     ఇది వరకు ఆఫీసు నుండి విశ్వనాధం ఇంటికొచ్చేదాకా అతనితో మాట్లాడడానికి సత్యవతికి వీలుండేది కాదు... ఇప్పుడు విశ్వనాధం దగ్గర సెల్ ఉండడం వల్ల ఆమె అతనికి చీటికీ మాటికీ పోన్ చెయ్యసాగింది."ఆఫీసులో కాఫీ తాగారా?... లంచ్ చేశారా?... సాయంత్రం వచ్చేప్పుడు కూరగాయలు తెస్తారా?..." అంటూ.     దానివల్ల లాండ్ ఫోన్ బిల్లు కూడా ఎక్కువ రాసాగింది.     అంతేకాదు... ఓసారి బాస్ తో మీటింగ్ లో ఉండగా సత్యవతి నాలుగైదు సార్లు విశ్వనాధంకి ఫోన్ చేసింది.     "నీ సెల్ ఫోన్ ఆఫ్ చేస్తావా లేకపోతే నిన్ను మారుమూల అడవుల్లోకి ట్రాన్స్ ఫర్ చెయ్యనా?" అని బాస్ రంకె వేశాడు.     ఓ ప్రక్క సత్యవతితో కూడా చీవాట్లు తినడం మొదలుపెట్టాడు. "ఏం?... సెల్ ఆఫ్ చేసి పెట్టారేం?... నాకేదైనా అర్జంట్ పని తగిల్తే ఎలా?... నాకు జరగరానిది జరిగితేకూడా అంతేనన్నమాట! మీ మొహం మండా..." అంటూ అతను సెల్ ఆఫ్ చేసినప్పుడల్లా సత్యవతి తిట్టేది.     ఓసారి సినిమా చూస్తున్నప్పుడు సెల్ మోగితే విశ్వనాధం తీసి మాట్లాడాడు..."బావగారూ... మీ పేలు తగ్గాయా?...." అంటూ అవతలినుండి మరదలి గొంతు!"     "ఈ..." అంటూ బాధగా అరిచాడు విశ్వనాధం.     వెంటనే వెనకలైనులోంచి నాలుగు చేతులు విశ్వనాధం బుర్రకాయ్ మీద ఠపా...ఠపామంటూ మొట్టాయ్.        "ఏం సార్... మేం సినిమా చూడొద్దా... మీ సెల్ ఆఫ్ చేస్తారా లేదా బయటికి విసిరెయ్యమా?..." అంటూ ఛడామడా తిట్టారు...     ఇలాంటి ఇబ్బందులు కూడా అతను సెల్ ఫోన్ వల్ల ఫేస్ చేశాడు.     రాను రానూ అతని ఫ్రెండ్స్ "అరే...ఏంటీ?... నీ సెల్ ఫోన్ కి కెమెరా లేదా?... ఛా... అదేంటీ... యాక్... సెల్ ఫోన్ కి కెమెరా లేకపోతే అది చాలా బీసీ నాటి సెల్ అయి ఉంటుంది!" అంటూ అతని సెల్ ఫోన్ గురించి చీప్ గా మాట్లాడడం మొదలుపెట్టారు.     వాళ్లందరి బాధ పడలేక కెమెరా ఉన్న సెల్ ఫోన్ ఎనిమిది వేలు పెట్టి కొన్నాడు.     కానీ... ఆ కెమెరాని అతను ఏనాడూ ఉపయోగించిన పాపాన పోలేదు... ఒకవేళ దాంతో ఫోటోలు తీసినా ఏం జాంబవంతుడిలానో... ఆ లంఖిణిలానో వస్తున్నాయ్ ఫోటోలు.     ఇంకొన్నాళ్లు గడిచాక అతని ఫ్రెండ్స్ అతని సెల్ ఫోన్ ని చూసి"ఛీ...యాక్" అన్నారు.     "మళ్లీ ఏం వచ్చింది... దీనికి కెమెరా ఉందిగా?" అన్నాడు విశ్వనాధం...     "కానీ...దీంట్లో ఎఫ్.యమ్. రేడియోలు రావుగా?... యాక్... థూ..." అన్నారు.     విశ్వనాధం భోరుమని ఏడ్చాడు.

అర్జునుడూ - అనసూయమ్మా

అర్జునుడూ - అనసూయమ్మా - వసుంధర అంట్లు తోమడమన్నది లక్ష్మీ వంశానికి కొత్తకాదు. లక్ష్మీ కొత్తకాదు, కానీ పెళ్ళయినాక అంట్లు తోమవలసిన అవసరం లక్ష్మీకి రాలేదు. అయెం మొగుడు రిక్షా లాగి బాగా సంపాదించేవాడు. అయితే ఒకసారి ఆమె మొగుడికి హఠాత్తుగా జబ్బు చేసింది. అప్పుడు లక్ష్మికి ఒక రింట్లో పని  మనిషిగా కుదరాల్సిన అవసరం ఏర్పడింది. ఇదివరలో ఆమె కేవలం తన తల్లికి సహాకురాలిగా మాత్రమే పనికి వెడుతూండేది. నిజానికి ఎవరెవరి ఇళ్లలో ఎలా ఎలా మసులుకోవాలో ఆమెకు సరిగ్గా తెలియదు. అందుకే చుక్కమ్మ జట్టులో చేరింది. లక్ష్మితో కలిపితే చుక్కమ్మ జట్టులోని సభ్యలు పదిమంది అవుతారు. వాళ్ళందరూ కలిసి ఒక కాలనీలోని ఇళ్లను గుత్తకు తీసుకున్నారు. ఆ కాలనీలో చుక్కమ్మ జట్టు సభ్యులు తప్ప మరెవరూ పనిమనుషులుగా చేరడానికి వీలులేదు. ఆమె నాయకురాలు కావడానికి కారణం చదువు. చుక్కమ్మకు వ్రాయడమూ చదవడమూ కూడా వచ్చు. ఆమెకు పురాణాల్లోని అనేక కథలు కూడా తెలుసు. ఇవన్నీ కాక, తన అనుభవాన్ని నిత్యజీవితావసరాల కుపయోగించుకోవడం ఆమెకు బాగా తెలుసు. లక్ష్మీ తల్లి గౌరమ్మ, చుక్కమ్మ జర్రులోనే వుంది. ఆమె కారణంగానే లక్ష్మికి చుక్కమ్మ జట్టులో సభ్యత్వం దొరికింది. చుక్కమ్మ జట్టుకిప్పుడు చేతినిండా పని ఉంది. జట్టులో కొత్త సభ్యులు అవసరం లక్ష్మికి అయిదిల్లు దొరికాయి, అన్నీ ఇళ్ళలోనూ పని ఎక్కువగానే ఉంటుంది. నెలకు పదిరూపాయలిస్తారు. టిఫిన్, కాఫీ లిస్తారు. అడపా తడపా అన్నం పెడుతుంటారు. ఏడాది కొకటి రెండుసార్లు పాత చీర లిస్తుంటారు ... లక్ష్మికి బాగానే జరిగిపోతుంది. లక్ష్మి ఉదయం ఆరుగంటలకు పనిలోకి వెడుతుంది. ఇరవై నిమిషాలకో ఇల్లు చొప్పున చకచకా పనిచేసి ఎనిమిది గంటల ప్రాంతాన ఓసారి ఊపిరి పీల్చుకుంటుంది. ఈ ట్రిప్పులో ఆమె క్రితం రాత్రి తాలూకు అంట్లగిన్నెలు తోముతుంది. మళ్ళీ తొమ్మిది గంటలకు రెండో త్రిప్పు మొదలుపెడుతుంది. ఈ ట్రిప్పులో బట్టలుతకడం, ఇళ్ళూడవడం ఆమె డ్యూటీ. మూడవ ట్రిప్పులో ఆమె మరోసారి అంట్లగిన్నెలు తోముతుంది. మధ్యాహ్నం రెండయ్యేసరికి ఆమెకారోజు పని ముగిసిపోతుంది. ఈ పద్ధతిలో పనిచేస్తూ లక్ష్మి ఒక మంచి పనిమనిషిగా పేరుకెక్కింది. పని శ్రద్ధగా చేసుకుపోవడమూ, మాతకుమాట జవాబిచ్చే అలవాటు లేకపోవడమూ, తనకు తానై యజమానురాండ్ర నేమీ యాచించక పోవడమూ లక్ష్మి ప్రత్యేకతలు. అయితే లక్ష్మి తన ప్రత్యేకతలను నిలబెట్టుకోవడానికి కొంచెం ఎక్కువ కష్టపడవలసి వచ్చింది. అందుకు కారణం చుక్కమ్మ సలహాలు. లక్ష్మి యజమానురాండ్రపట్ల మసలవలసిన తీరులో కొన్ని మార్పులు సూచించింది చుక్కమ్మ. ఆ మార్పులు లక్ష్మి తత్వానికి సరిపడ్డవి కాదు. చుక్కమం లక్ష్మికి మార్పు సూచించడానికి వేరే కారణాలున్నాయి. లక్ష్మి బాగా పనిచేస్తోందని గ్రహించి చాలామంది తమ ఇంటికి కూడా లక్ష్మినే పంపించావలసిందని అడగ నారంభించారు. చుక్కమ్మ జట్టులో లక్ష్మికి మంచి పేరు రావడంతోపాటు ఇతర సభ్యురాండ్రకి చెడ్డపేరు రాసాగింది. అందుకే చుక్కమ్మ లక్ష్మికి నీతి బోధ చేసింది. "పని ఎక్కువున్న వారింట్లో అప్పుడపుడోరోజు నాగా పెడుతూండాలి. సుఖం మరిగిన మీదట ఒకరోజు అంట్లు తోముకోవాలన్నా ఇంటి ఇల్లాలికి ఇబ్బంది అనిపిస్తుంది. దాంతో పనిమనిషి అవసరం బాగా కనిపిస్తుంది. ఎక్కువ గిన్నెలు పడ్డప్పుడు కొంచెంగానైనా విసుక్కోవాలి. లేకపోతే ఆ విషయాన్ని ఇంటి ఇల్లాళ్ళు గుర్తించరు. అడపా తడపా పాత చీరో, పాత జాకెట్టో అడుగుతూండాలి. ఇతర యజమానురాండ్రను గురించి రెండు విధాలుగా చేబుతూండాలి. "ఆవిడకి కక్కూర్తి లేదమ్మా ... తమకేం చేసుకున్నా నాక్కూడా పెడుతుంది'' అని ఒకామె గురించీ, "ఆవిడ మరీ పిసినారి తల్లీ ... చిరిగిపోయిన జాకెట్టు గుద్దయినా ఇవ్వదు'' అని మరో ఆమె గురించీ చెబితే ఈ పనిమనిషి ఇచ్చేవాళ్ళ గురించి అందరివద్దా మంచిగా చేబుతుందనీ ఏమీ ఇవ్వని వాళ్ళను నలుగురివద్దా తీసిపారేస్తుందని విన్న ఇల్లాలి కర్థమవుతుంది. ఇది ఆమె మనస్తత్వం మీద చక్కగా పనిచేయడంతో పనిమనిషికి బహుమతులు లభిస్తాయి. ఎవరైనా ఇల్లాలు అన్యాయంగా దెబ్బలాడబోతే ఊరుకోకూడదు. పెద్దింటి ఆడవాళ్ళు గట్టిగా అరిచి దెబ్బలాడ్డానికి సంకోచిస్తారు'' ... ఇవీ చుక్కమ్మ చెప్పిన కొన్ని నీతులు మాత్రమే. ఇవి లక్ష్మి మనస్తత్వానికి సరిపడనివి, ఇవికాక లక్ష్మి తత్వానికి సరిపడే మరికొన్ని సూక్తులు కూడా చెప్పింది చుక్కమ్మ. లక్ష్మికున్న అయిదిళ్ళలోనూ ఏ ఇంట్లో ఎలా మసులుకోవాలో వివరించి చెప్పింది చుక్కమ్మ. కొంచెం కష్టమేననిపించినా నెమ్మదిగా తన ప్రవర్తనను మార్చుకోసాగింది లక్ష్మి. అయినా ఆమెకున్న మంచిపేరు పోలేదు. అలా సుమారు పదినెలలు గడిచిపోయాక ఆ కాలనీకో కొత్త మెంబరోచ్చింది. ఆవిడ పేరు అనసూయ. అనసూయ కాలేజీలో బియ్యే రెండేళ్లు చదివి పెళ్ళికావడంతో చదువుకు స్వస్తి చెప్పిన బాపతు. సుమారు ఇరవైయేళ్ళ వయసున్నా వయసుకు తగ్గ అనుభవం లేని యువతి పెళ్ళై ఏడాది అయినా భర్తతో కాపురానికి రావడం ఈ కాలనీకే. అనసూయ తెలివైనది, కాలేజీలో ఆమె చదువులోనే కాక ఆటల్లో కూడా అనేక బహుమతులు గెల్చుకుంది. కానీ కాస్త కలిగినవారి బిడ్డ కావడంవల్లనో ఏమో ఆమె ఎన్నడూ వంటచేసి ఎరుగదు. వంటిల్లన్నా, వంటగిన్నెలన్నా ఆమెకు చచ్చేంత భయం. అందువల్లనే అనసూయతో పాటు ఆమె అమ్మమ్మ కూడా వచ్చింది. అనసూయ వంట భయం గురించి ఆ కాలనీలోని ఆడవాళ్ళందరూ ఆమె లేని సమయంలో చర్చలు జరిపి ఆనందిస్తూండేవారు. చుక్కమ్మ జట్టువాళ్ళు అనసూయను 'అనసూయమ్మ' అనేవారు. వచ్చేరాగానే పనిమనిషికోసం తాపత్రయ పడిపోయింది. అనసూయ. చుక్కమ్మ వచ్చి ఆమెతో మాట్లాదేక లక్ష్మికి ఆ ఇల్లు అప్పగించింది. అనసూయ ఇంట్లో పని చాలా తక్కువ. కానీ ఆ తక్కువ పనికే పనిమనిషి అవసరం చాలా ఎక్కువున్నట్టు ప్రవర్తిస్తుంది అనసూయ. ఆమె లక్ష్మిపట్ల చాలా ఉదారంగా ప్రవర్తిస్తూండేది. లక్ష్మికి అనసూయనుండి తరచుగా బహుమతులు ముడుతూండేవి. అనసూయ ఇంట్లో పని లక్ష్మికి చాలా హాయిగా ఉంటోంది. వంటింటి విషయం అలాగుంచితే అనసూయ మిగతా విషయాల్లో ప్రజ్ఞగలదనే చెప్పుకోవాలి. ఎంత కష్టమైన కొత్త భాషనైనా ఆమె కృషిచేసి తొందరగా నేర్చుకోగలదు. అల్లిక, కుట్టుపనుల విషయంలో ఆమెది ఆ కాలనీలో అగ్రస్థానమని చెప్పవచ్చు. ప్రతిరోజూ అనసూయ గురించి లక్ష్మిని వివరాలడిగి తెలుసుకుంటూండేది చుక్కమ్మ. అనసూయ మనస్తత్వాన్ని గురించి ఒక అంచనా వేసుకోడానికి అయిదారు నెలలు పట్టింది చుక్కమ్మకి. ఆ తర్వాత లక్ష్మికి ఓ విలువైన సలహా పారేసింది. ఏ పరిస్థితుల్లో అనసూయ ఇంట్లో నాగా పెట్టవద్దన్నదామె సలహా. చుక్కమ్మ అంత మంచి సలహా ఎందుకు చెప్పిందో లక్ష్మికి బోధపడలేదు. అనసూయ అమ్మమ్మ ఎంతోకాలం ఉండలేదు. మనుమరాలి బలవంతం మీద ఆవిడ అయిదు నెలలవరకు మాత్రమే ఆమెకు తోడుగా ఉండి, ఆ తర్వాత తన ఊరు వెళ్ళిపోయింది. అంత కాలమూ కూడా చుక్కమ్మ సలహా మేరకు ఒక్కరోజు కూడా పనికి నాగా పెట్టలేదు లక్ష్మి. తన అమ్మమ్మ వెళ్ళిపోయాక అనసూయ లక్ష్మికి మరీమరీ చెప్పింది, 'ఇంటిపని విషయంలో భారమంతా నీదే'నని. ఒకసారి లక్ష్మికి జ్వరం వచ్చ్జి మూడు రోజులు పనిలోకి రాలేకపోయింది. ఆ మూడు రోజులూ లక్ష్మికి బదులు అనసూయ ఇంటికి చుక్కమ్మ వెళ్ళి పనులు చేసింది. లక్ష్మి తాలూకు మిగతా ఇళ్లకు ఆమె వెళ్ళలేదు. లక్ష్మి పనిలో చేరాక మిగతా ఇల్లాళ్ళు ఆమెమీద విరుచుకుపడ్డారు. నాగాపడ్డ రోజులకు జీతం విరగ్గోస్తామని బెదిరించారు. కాని చుక్కమ్మ దగ్గర శిక్షణపొందిన లక్ష్మి ఘాటుగానే సమాధానమిచ్చింది. రోజులూ, వారాలూ, నెలలూ గడిచిపోతున్నాయి. ఒకసారి చుక్కమ్మ స్వగ్రామం వెళ్ళింది. వెళ్ళడం చాలా పెద్ద పనిమీదే వెళ్ళింది. వెళ్ళేటప్పుడు ఆమెకున్న ఎనిమిదిళ్ళలోనూ అయిదింటి బాధ్యత మాత్రం జట్టులో మనుషులకి అప్పగించింది. మూడుల్లు వదిలేసుకుని తను మలేలే తిరిగి వచ్చేదాకా మరెవరినయినా చూసుకోమని నిష్కర్షగా చెప్పింది. లక్ష్మి మాత్రం ఏ పరిస్థితుల్లోనూ అనసూయ ఇంటికి మాత్రం నాగా పెట్టవద్దని మరీమరీ చెప్పింది. చుక్కమ్మ ఆమె వెళ్ళిన వారంరోజులకి ఆమె నెల రోజులపాటు వదిలేసుకున్న మూడిళ్ళలోనూ ఒక ఇంటి యజమానురాలైన లక్ష్మమ్మగారు హఠాత్తుగా జబ్బు చేసి మంచాన పడింది. ఉన్నఫళంగా పనిమనిషి అవసరమైనదావిడకు. ఆవిడ ఇంట్లో జనం చాలామంది ఉన్నారు. ఆ జనానికి తగ్గ పనికూడా ఉండి. అంత ఎక్కువపని ఉండడంవల్లనే ఒక నెల రోజులపాటూ ఇంటికి వదులుకుందుకు సిద్ధపడింది చుక్కమ్మ. అయితే ఇప్పటి పరిస్థితిలో ఆవిడకు పనిమనిషి తప్పనిసరికదా. చుక్కమ్మ జట్టులోని మనుషులను బతిమాలవలసి వచ్చింది. కానీ అందరికీ ఎవరి పనులు వారికి ఉన్నాయి. ఎవరూ అంగీకరించలేదు. వేరే మనుషుల్ని చూసుకుందామన్నా అక్కడ దొరకరు. అందుకని ఆవిడా అందరిలోకీ మెత్తనిదైన లక్ష్మిని బాగా బ్రతిమిలాడింది. ఆవిడ పరిస్థితికి లక్ష్మి జాలిహృదయం కరిగిపోయింది. ఆమె బాగా ఆలోచించి సరేనంది. మహాలక్షమ్మ ఇంట్లో పనులకు ఒప్పుకున్నాక లక్ష్మి మిగతా ఇళ్లలో తన టైములు మార్చుకోవలసి వచ్చింది. అందరితో పాటు అనసూయ ఇంటికీ టైము మారింది. అనసూయ ఒక పధ్ధతి ప్రకారం మసులుకునే మనిషి. లక్ష్మి టైము మార్చడం ఆమెకు కొంచెం ఇబ్బందే అయింది. కానీ పని అంటే వున్న భయంవల్ల అతికష్టం మీద అందుకు అడ్జస్టు కాగలిగింది. అయితే ఆమె ఇబ్బంది అక్కడితో ఆగలేదు. లక్ష్మి ఒకోపూట నాగా పెట్టడం కూడా ఆరంభించింది. మహాలక్ష్మమ్మ ఇంట్లో ఉండే పని వత్తిడివల్ల లక్ష్మికి అప్పుడప్పుడు ఒకో ఇంట్లో నాగా పెట్టడం తప్పేదికాదు. మానవత్వం గల మనిషిగా లక్ష్మి మహాలక్ష్మమ్మ గారికి చాలా సేవలు చేసేది. అలా సేవలు చేయడంలో ఆమె చుక్కమం సలహా నతిక్రమించి అడపాతడపా అనసూయ ఇంట్లో నాగాలుపెట్టసాగింది. అనసూయమ్మకు ఏంటో పని ఉండదు కదా ఎలాగో అలా సర్దుకుపోదా అన్న వుద్దేశ్యంతో ఆమె నాగా అవసరం పడినప్పుడల్లా అనసూయ ఇల్లే ఎగరేస్తూ ఉండేది. అలా ఆమె రెండు వారాల్లో నాలుగు నాగాలు పెట్టింది. ఇది అనసూయకు చాలా ఇబ్బంది కలిగించింది. లక్ష్మి రానప్పుడు ఇంట్లో అంట్లగిన్నెల సంఖ్యా పెరిగిపోతుండేది తప్పితే ఆమె ప్రయత్నించి అంట్లు తోమడమన్నది జరగలేదు. చుక్కమ్మ మరోవారం రోజులకు వస్తుందనగా మహాలక్ష్మమ్మ గారిని హాస్పిటల్ లో జాయిన్ చేయవలసి వచ్చింది. ఆ సందర్భంలో లక్ష్మి నాలుగైదు రోజులు హాస్పిటల్ లో ఉండి మహాలక్ష్మమ్మ గారికి సహాయపడింది. ఫలితంగా అనసూయ ఇంట్లో అయిదారురోజులు తిరిగి నాగా పడింది. ఆ నెలలో చివరి రెండు రోజులూ పనిచేశాక ఒకటో తారీఖునాడు లక్ష్మికి జీతం ఇచ్చి "ఈ నెలలో చాలా నాగాలు పెట్టినా పూర్తి జీతం ఇచ్చేస్తున్నాను నీకు. ఎందుకంటే ఈ రోజు నుంచీ నువ్వు మరి పనిలోకి రానవసరం లేదు'' అంది అనసూయ. లక్ష్మి తెల్లబోయి "అదేంటమ్మా ... అంత కోపం ఏటి ...'' అని సణగబోయింది. కానీ, అనసూయ చాలా సీరియస్ గానే చెప్పింది. లక్ష్మికి కోపం వచ్చి "చూస్తానుగా నేనుండగా ఇంకో పనిమనిషిని ఎలా పెట్టుకుంటారో'' అంది. అనసూయ మాట్లాడలేదు కానీ, ఆమె తర్వాత మరో పనిమనిషి కోసం ప్రయత్నించలేదు. అనసూయ ప్రవర్తనకు ఆశ్చర్యపోయిన లక్ష్మిలో చాలా ప్రశ్నలు రేగాయి. చుక్కమ్మ రాగానే విషయం చెప్పి "పనంటే అంత భయపడే అనసూయమ్మ హఠాత్తుగా ఇలా ఎందుకు మారిపోయింది?'' అని అడిగింది. తన సలహాను విననందుకు లక్ష్మిని తీవ్రంగా మందలించేక చుక్కమ్మ చెప్పిన వివరం ఇది. అర్జునుడికి చీకట్లో భోజనం పెట్టవద్దని అశ్వద్ధామ వంటవాడికి ఆజ్ఞాపించేడట. కానీ ఒకసారి భోజనాల సమయంలో దీపాలారిపోయాయట.  చీకటిగా ఉన్నప్పటికీ చేత్తో ముద్దా కలిపి మామూలుగా భోజనం చేస్తున్న అర్జునుడికి, అభ్యాసముంటే చీకట్లో అయినా గురితపప్కుండా బాణాలు ప్రయోగించవచ్చునని తోచి ఆ రోజునుంచే చీకట్లో విలువిద్యనభ్యసించడం మొదలుపెట్టి సత్ఫలితాలు సాధించాడట. అలాగే అనసూయమ్మ బద్ధకస్తురాలు కాదు. అన్నిపనుల్లో ఆరితెరినది. ఎన్నడూ ముట్టుకొని అంట్లగిన్నెలంటే ఆమెకు భయం. అయితే తప్పనిసరై ముట్టుకోవలసి వచ్చేసరికి ... ఇంతేనా అంట్లు తోమడమంటే అని గ్రహించేసింది. దాంతో ఆమెకు పనిమనిషి వృధా అనిపించింది. చుక్కమ్మ కాపాడుకుంటూ వచ్చిన రహస్యాన్ని లక్ష్మి అజాగ్రత్తవల్ల అనసూయ గ్రహించేసింది. అదీ కథ.

అభిమాని

అభిమాని - వసుంధర రచయితగా నేను మంచి పేరు సంపాదించా ననడానికి నిదర్శనం అన్ని పత్రికలలోనూ నా రచనలు ప్రచురింపబడడమే కాదు దేశం నలుమూలల నుంచీ అభిమానులుత్తరాలు వ్రాయడం! ఇళ్లకు వచ్చి వెడుతూండే అభిమానులు కొందరున్నారు. వీరిలో కొందరు ప్రముఖులున్నారు. వాళ్ళు నా బోటి వాళ్ళకు సన్మానం చేసి తమ పలుకుబడిని పెంచుకోవాలనుకుంటారు. రచయితగా నేను వాళ్ళ మనస్తత్వాన్ని అర్థం చేసుకోగలను. అయినప్పటికీ వాళ్ళంటే నాకు ఇష్టమే! వాళ్ళకు నా రచనలంటే ఇష్టం లేకపోవచ్చు. వాళ్ళ అభిమానం నటన కావచ్చు. అయినప్పటికీ నాకు సన్మానం చేశారనో, చేస్తారనో అభిమానముంటుంది. అలా కాకుండా కేవలం నా మీద అభిమానంతో నా యింటికి వచ్చి నాతో సాహిత్య చర్చ చేయాలనుకునే వాళ్ళ మీద మాత్రం నేను కోపం దాచుకోను. ఈ నా స్వభావం కూడా నాకు వన్నె తెస్తుందని కొందరంటూంటే విని నేను గర్వపడ్డాను కూడా. నాకో అభిమాని ఉన్నాడు. అతడి పేరు సూరిబాబు. అతడికి తెలుగు వ్రాయడం, చదవడం వచ్చు. నా రచనలన్నీ తనకి నచ్చుతాయట. అంతవరకూ బాగానే ఉన్నది. కానీ నా సహకారంతో అతడు రచయిత కావాలనుకుంటున్నాడు. అందుకని తను వ్రాసిన కథలు నాకు పంపిస్తూంటాడు. సినిమా ఫీల్డులో సినీతారల ఉన్నతి వారి  సెక్రెటరీలపై ఆధారపడి ఉంటుందంటారు. అదీ కొంతవరకూ నిజమేననిపిస్తుంది. నా యింట్లో శ్రీమతి నాకు సెక్రెటరీగా పని చేస్తూంటుంది. నా దస్తూరీ బాగుండదు. అందుకని నేను వ్రాసే ప్రతి ఉత్తరాన్ని ఆమె ఫెయిర్ చేసి పంపిస్తుంది. కథలకు సంబంధించినంత వరకూ ఆమె నాకు కేవలం అభిప్రాయాలు చెప్పి ఊరుకుంటుంది. ఉత్తరాల విషయంలో మాత్రం తను సెన్సారాఫీసరులా పనిచేస్తుంది. ఆమె అలా చేయడం నాకిష్టముండదు. కానీ ఆమె అనేది ఒక్కటే! "వాళ్ళంత అభిమానంతో మీకు ఉత్తరాలు రాస్తున్నారు. వాళ్ళు అమాయకులు కావచ్చు, తెలివితక్కువగా వ్రాసి ఉండవచ్చు. కానీ రచయితగా మీ కర్తవ్యం వారిని చిన్నబుచ్చకుండా ఉండడం'' ఈ కారణంగా నా అభిమానుల సమాఖ్య నానాటికీ పెరుగుతూ వస్తోంది. కానీ వారిలో సూరిబాబు అంత రెగ్యులర్ గా నాకుత్తరాలు వ్రాసే వాళ్ళు వేరెవ్వరూ లేరు. అతడు వారానికొకటి చొప్పున నాకు ఉత్తరం వ్రాస్తాడు. జవాబు ఆలస్యమైతే ప్రేయసి కన్నా ఎక్కువగా గాభరాపడతాడు. అతడు పంపిన కథలు పరమచెత్తగా ఉన్నాయని నేను వ్రాసినా చిన్నబుచ్చుకోడు. నేను కస్తపడి చదివి అభిప్రాయం వెలిబుచ్చినందుకు థాంక్స్ చెబుతాడు. సూరిబాబు కథలు నాకు తరచుగా వస్తున్నాయి. అవి చదవుతూంటే నాలో అసహ్యం పెచ్చు మీరిపోతోంది. మరీ ప్రాథమిక దశలో ఉంటున్నాయవి. అలాంటి కథలు వ్రాసేవాడు నా అభిమాని అంటే నాకు చిన్నతనంగా కూడా అనిపించేది. ఓసారి సూరిబాబు నుంచి నాకు ఉత్తరం వచ్చింది. అందులో అతడు సమకాలీన రచయితలందర్నీ పేరుపేరునా సమీక్షించి అందరిలోకి నేనే గొప్పవాడినని తేల్చాడు. ఈ ఉత్తరం నాకు ఏమాత్రం సంతోషానివ్వలేదు సరిగదా చాలా కోపాన్ని కూడా తెప్పించింది. అతడితో వ్యక్తిగతంగా మాట్లాడ దల్చుకున్నట్లు ఉత్తరం వ్రాసాను. ఉత్తరం అందుకున్న మర్నాడతను మా యింటికి వచ్చాడు. బియ్యే చదువుతున్న కుర్రాడు. ముఖంలో అమాయకత్వం ఉన్నది. ఎక్కువగా బాధ్యతలున్నట్లు లేవు. మనిషి దర్జాగా ఉన్నాడు. మిమ్మల్ని కలుసుకోవడం నా అదృష్టం ...'' అన్నాడతను. శ్రీమతి అతడికి బాగానే మర్యాద చేసింది. "నేను నిన్ను ఎందుకు పిలిచానో తెలుసా?'' అడిగాను. తెలియదన్నట్లు తలూపాడతను. "నువ్వు రాసిన కథల మీద నా అభిప్రాయం వెలిబుచ్చాను. పంపే ముందు అవి చాలా మంచి కథలనే నువ్వు అభిప్రాయపడ్డావు. అవునా?'' అతడు అవునన్నట్లు తల ఆడించాడు. "అంటే నీకు మంచి కథలెలాగుంటాయో తెలియదు. నేను ఎత్తి చూపే వరకూ నీ కథల్లోని లోపాలు నీకు తెలియలేదు. నేను ఎత్తి చూపినా ఆ తరువాత నువ్వు రాసే కథల్లో ఆ లోపాలు సవరింపబడడంలేదు. అంటే నీకు లోపాలు తెలుసుకోవడం చేతకాదు. అనగా నువ్వు కథకుడిగా మాత్రమే కాక, విమర్శకుడిగా కూడా పనికిరావు. అవునా?'' అతని ముఖం చిన్నబోయింది. "రచయితలందరిలోకి నువ్వు నన్ను అగ్రస్థానాన కూర్చోబెట్టాలనుకున్నావ్. కానీ రచయితల్లో నా స్థానాన్ని నిర్ణయించే అర్హత నీకు ఉన్నదా? అహంకారం నిన్నిందుకు ప్రోత్సహించింది'' అతడు తడబడుతూ "నా వల్ల పొరపాటు జరిగినట్లుంది నన్ను మీరు మన్నించాలి'' అన్నాడు. "మన్నించమనడం కాదు. ఇకమీదట ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. నేల విడిచి సాము పనికి రాదు. ముందు నీది అంటూ ఓ మంచి కథ రాయి. ఆపై ఎదుటివారి కథలమీద విమర్శల సంగతి చూడవచ్చు'' అన్నాను. అతను తల వంచుకున్నాడు. "ఓ మంచి కథ రాయాలంటే అది ఇప్పట్లో నీ వల్లనయ్యే పనికాదనిపిస్తోంది. అందుక్కారణం నీకు సమగ్రమైన ఆలోచనాశక్తి లేకపోవడం మరి కొన్నాళ్ళ పాటు నావీ, మరికొందరు ప్రముఖులవీ రచనలు చదువుతూండు. ఓ ఏడాది దాకా కథలు రాయకు.'' అన్నింటికీ అతడు తల ఊపాడు. ఏ క్షణంలోనూ తిరగబడాలని చూడలేదు. అతడు వెళ్ళిపోయాక శ్రీమతి నన్ను దెబ్బలాడింది. అభిమానులతో మాట్లాడవలసిన తీరు అది కాదంది తెలివితేటలు అందరికీ ఆయాచితంగా లభించవు. ఆ మాత్రం దానికే అతడిని నిరసించరాదంది. "నువ్వు రాజకీయం మాట్లాడుతున్నావు. నాకు రాజకీయాలు నచ్చవు. నా మనసులోని మాట అతడికి చెప్పాను. అతడు నా అభిమానిని. అతడి గురించిన నిజం అతడికి తెలియజేయటం నా కర్తవ్యం. "మిమ్మల్ని అభిమానించడం అతడు చేసిన తప్పు. ఆ తప్పునతడు ఈ పాటికి గ్రహించే ఉంటాడని ఆశిస్తాను'' అంది శ్రీమతి. శ్రీమతి అంచనా తప్పయింది. అతడు ఇల్లు చేరాక నాకు మళ్ళీ ఉత్తరం రాశాడు. తన తప్పులకు మరోసారి క్షమార్పణ కోరాడు. తనలోని లోపాన్ని ఎత్తిచూపించినందుకు ధన్యవాదాలర్పించాడు. నా పరిచయం తన అదృష్టమన్నాడు. తన ఉత్తరాలకు ఎప్పటిలాగే బదులివ్వడం మానవద్దన్నాడు. ఆ ఉత్తరం చదవగానే నాకు మనసేదోలాగైపోయింది. అతడిపట్ల నేను కఠినంగా వ్యవహరిస్తున్నందుకు బాధ కలిగింది. శ్రీమతి అతడి ఉత్తరం చదివి "ఇలాంటి అభిమాని దొరకడం మీ అదృష్టం'' అంది. "అదృష్టం కాదు. అది నా అర్హత'' అన్నాను. "మీకు చాలా అహంకారం'' అంది శ్రీమతి. ఆ తర్వాత సూరిబాబుని మళ్ళీ ప్రత్యక్షంగా కలుసుకుంటాననుకోలేదు. కలుసుకుంటే ఈసారి అతడితో ప్రేమగా మాట్లాడాలని అనుకున్నాను. కానీ తానొకటి తలిస్తే దైవమొకటి తలుచునంటారు. ఆ రోజు 'కోణార్క్' ట్రయిన్లో ఉన్నాను. కాలక్షేపం కోసం ఓ యింగ్లీషు నవల చదువుతున్నాను. ఏ నవలైనా చదివేటప్పుడు నేను కాస్త శ్రద్ధగానే చదువుతాను. నచ్చిన వాక్యాలు పెన్సిల్ తో అండర్ లైన్ చేస్తూంటాను. రచయిత ఏం చెప్పదల్చుకున్నాడూ ఎలా చెబుతున్నాడూ అన్నది చాలా శ్రద్ధగా గమనిస్తాను. నవల చదవడంలో నా ఆసక్తి గమనించినట్లున్నాడు నా పక్కనున్న ఆసామి. నన్ను పలకరించి "మీకు సాహిత్యాభిలాష ఎక్కువనిపిస్తుంది'' అన్నాడు. "ఊ...'' అన్నాను అన్యమనస్కంగా. "ఆంగ్ల సాహిత్యమేనా, తెలుగు సాహిత్యంపై ఆసక్తి ఉన్నదా?'' "ఆంగ్ల సాహిత్యం కంటే తెలుగు సాహిత్యమంటేనే ఇష్టం. తెలుగులో కథలు వ్రాసే సరదా కూడా ఉంది'' అన్నాను నేను రచయితను సుమా అని సూచిస్తూ. "అయితే ప్రముఖ రచయిత 'నిరంజన్'' తెలుసా మీకు?'' అనడిగాడతను. హఠాత్తుగా నిరంజన్ ప్రసక్తి రాగానే ఆశ్చర్యపడ్డాను. అది నాకలం పేరు. ఈయన నన్ను గుర్తుపట్టాడా! లేకపోతే అర్థాంతరంగా ఈ ప్రశ్న ఎందుకు? "ఏం?'' అన్నాను కుతూహలంగా. "మీరు కలుసుకోవాలనుకుంటే నిరంజన్ ఇప్పుడు ఈ ట్రయిన్లోనే ఉన్నాడు'' అన్నాడు ఆసామి. ఆ సంగతి నాకూ తెలుసు. ఇతడు నన్ను గుర్తుపట్టాడు. ఏ సభలోనో చూసి ఉంటాడు లేదా పత్రికల్లో ఫోటో చూసి ఉంటాడు. ఆ విషయం చెప్పకుండా తెలివిగా మాట్లాడుతున్నాడు. నేను కూడా తెలియనట్లు అమాయకంగా ముఖంపెట్టి "ఎక్కడండీ?'' అన్నాను. అప్పుడతడు "మీరు రచయితలే కాదు మంచి నటులు కూడా'' అంటాడనుకున్నాను. కానీ అలా జరగలేదు "పక్కబోగీలో'' అన్నాడు ఆసామీ. "నిజమా?'' అన్నాను నమ్మలేనట్లు. "నేనిప్పుడే ఆయన్ని కలిసి వచ్చాను. కావాలంటే మీరూ వెళ్ళి రండి'' "మీ మాటలు నేను నమ్మను'' అన్నాను. "ఎందుకని?'' అన్నాడతను ఆశ్చర్యంగా. రచయితగా అతడి కళ్ళలోని ఆశ్చర్యాన్ని చదివాను. అర్థం చేసుకున్నాను. అతడు మోసగాడు కాదు. నేను పక్క భోగీలోకి వెళ్లాను. కోణార్క్ వెస్టిబ్యూల్ టైపు కావడం నాకు చాలా మంచిదనిపించింది. "నిరంజన్ గారూ. మీ భగ్నప్రేమికుడు నవలకు ప్రేరణ ఏమిటండీ?'' ఎవరో అడుగుతున్నారు. నన్నే అడిగినట్లు ఉలిక్కిపడి గొంతు సవరించుకునేలోగా సమాధానం వచ్చేసింది. నిరంజన్ మాట్లాడుతున్నాడు. భగ్న ప్రేమికుడు నవలకు ప్రేరణగా నేను ఏయే విశేషాలు చెప్పబోతానో అవే అతడూ చెబుతున్నాడు. ముందుకు నడిచి అతడెవరా అని చూశాను. అతడు సూరిబాబు. అతడికక్కడ శీతలోపచారాలు జరుగుతున్నాయి. అతడి చుట్టూ ఓ అరడజను మంది ఉన్నారు. వారిలో ఓ అమ్మాయి కూడా ఉంది. వాళ్ళు అడుగుతున్నారు అతడు చెబుతున్నాడు, వాళ్ళతడిని మెచ్చుకుంటున్నారు. నా ఉత్తరాల ద్వారా తను తెలుసుకున్న సమాచారం వాళ్ళకు అందచేసి తాత్కాలికంగా గౌరవం పొందుతున్నాడతను. ఇదా అతడు నా నుంచి ఆశించిన ప్రయోజనం? ఇదా నా అభిమాని ఆడుతున్న నాటకం? కొంతమందికి పదిమందిలోనూ గొప్ప వారిగా గుర్తింపబడాలని ఉంటుంది. తమ అర్హత గురించి వారాలోచించరు. సూరిబాబు ఆ కోవకు చెందిన వాడన్న మాట! సూరిబాబు నన్ను చూడలేదు. నేను నా ఆవేశాన్నణచుకుని వీలైనంత శాంతంగా "నిరంజన్ గారూ!'' అన్నాను. అతడు చటుక్కున నావైపు తిరిగి చూసి "మీరా?'' అని తడబడ్డాడు. అయితే అతడిలో తడబాటే తప్పితే భయం కనబడడం లేదు. అతడు చటుక్కున బెర్తుదిగి "ఒక్క క్షణం వీరు నాకు గురుతుల్యులు'' అని "అలా కాస్త ముందుకు వెళ్ళి మాట్లాడుకుందాం పదండి'' అన్నాడు. అతడంత తాపీగా అలా అంటూంటే నా ఆవేశాన్నదుపు చేసుకోడం నాకు చాలా కష్టమనిపించింది. చుట్టుపక్కల ఎవ్వరూ లేరనిపించేక ఆగి "ఓ రచయిత పేరును స్వంతం చేసుకున్నంత మాత్రాన నువ్వా రచయితవుకాలేవు. తాత్కాలికంగా నీకు గౌరవం లభించవచ్చు. కానీ ఏదో ఓ రోజున నీ మోసం బయటపడుతుంది. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా?'' అన్నాను. "ఇలాంటి విషయాల్లో నేను పూర్తిగా మీ శిష్యుణ్ణి సార్! ఒక రచన చేసేటప్పుడు మీరెంత పకడ్బందీగా ప్లాటు అల్లుతారో ఇల్లాంటి నాటకమాడే ముందు నేను చుట్టుపక్కల వారందర్నీ జాగ్రత్తగా గమనించి పకడ్బందీగా కబుర్లు చెబుతాను'' అన్నాడు. "కానీ ఇప్పుడేమయింది?'' "నేనిప్పుడు అందరిముందు నిజం చెబితే ఏమౌతుంది?'' అన్నాను. సూరిబాబు అదోలా నవ్వి "దయచేసి మీరాపని చేయకండి. నేనీనాటకమాడుతున్నది నాకోసం కాదు మీకోసమే'' అన్నాడు. "నా కోసమా?'' అన్నాను ఆశ్చర్యంగా. "అవును సార్! నాకు మీరంటే పిచ్చి అభిమానం. అంతా మీగురించి మంచిగా చెప్పుకోవాలని వుంటుంది. కానీ మీ ఇంటికి వచ్చి వెళ్ళాక మీరు కాస్త ఆవేశపరులనిపించింది. ఆ కారణంగా కొందరు మీ గురించి చెడ్డగా చెప్పుకునే అవకాశముంది. మిమ్మల్నెరుగని వారు మీ గురించి మంచిగా చెప్పుకోవాలనే ఉద్దేశ్యంతో ఉడతా భక్తిగా ఈ నాటకమారంభించాను మీరే వెళ్ళి వినండి ... అక్కడివారు మీ గురించి ఏం చెప్పుకుంటున్నారో'' అన్నాడు సూరిబాబు. నేను ఆశ్చర్యపడ్డాను. అతడు చెప్పేది వింటూంటే నోటమాట రాలేదు. వెనకడుగు వేశాను. "ఓ కథ రాస్తే చాలు ఓ హేన్రీలా మాట్లాడతారు చాలామంది. ఇలాంటి వినయగుణం గల రచయితనెక్కడా చూడలేదు'' నిరంజన్ గురించి పొగడ్తలు మార్మోగిపోతున్నాయా భోగీలో. నేను వెళ్ళి నా సీట్లో కూర్చున్నాను. ఇంతకాలం సూరిబాబు అర్హతల గురించి ఆలోచించాను నేను. కానీ అతడి అభిమానం పొందడానికి నా అర్హతలేమిటి? అర్హతల గురించి మాట్లాడటానికి కూడా అర్హత ఉండాలి. ఈ విషయాన్ని నేను విస్మరించినట్లున్నాను.

దొంగతనాలు బంద్

దొంగతనాలు  బంద్ హైదరాబాద్ లో హఠాత్తుగా దొంగతనాలు  ఎక్కువయ్యాయ్. రోజూ ఏదో ఒక ఏరియాలో దొంగతనం జరుగాతూనే ఉంది. పోలిస్ స్టేషనన్లలో వంద కొద్దీ కేసులు నమోదు అవుతున్నాయ్.        ఆ దొంగతనాల గురించి రకరకాల రూమర్లు స్ప్రెడ్ అయ్యాయి. కొందరేమో మహారాష్ట్ర నుండి ఒక దొంగల ముఠా నగరంలో దిందని అంటే, మరీ కొందరేమో బెంగాల్ నుండి దొంగలు వలస వచ్చారని అన్నారు.        రూమర్ల మాట ఎలా ఉన్నా పోలీసులు మాత్రం దొంగల గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు.        కానీ   పోలీసులు దొంగల్ని పట్టించుకోవాల్సిన  పరిస్థితి ఏర్పడింది.       ఎందుకంటే ...       బాపనయ్య  ఇంట్లో దొంగలు పడ్డారు గాబట్టి.       బాపనయ్య  అంటే అల్లాటప్పా కాదు. మినిష్టర్ మిన్నారావు బామ్మర్ది.      ఏ అర్దరాత్రి   వేళో  దొంగలు వచ్చి గప్ చుప్ గా దొంగతనం చేస్కుని పోయారు.       తెల్లారి లేచింతర్వాత గానీ  బాపనయ్యకి తెలీదు దొంగలు పడినట్టు. ఏమేం దొంగతనం జరిగాయో లెక్కే చుస్కున్నారు. యాభైవేలు ఖరీదు చేసే నగలు, ఎనిమిదివేల రూపాయల నగదు, ఒక వాచీ, నాలుగైదు పట్టుచీరలు పోయాయి.         బాపనయ్య  భార్య నాంచారమ్మ ధన్ ధన్  మంటూ  గుండెలు బాదుకుని "వామ్మో ...వామ్మో ..." అంది.      బాపనయ్య నేనేం తక్కవ తిన్లేదు అని ధణేళ్...ధణేళ్ మణి గుండెలు బాదుకుంటూ తన బావగారైన  మినిష్టర్ మిన్నారావు  దగ్గరికి పరుగు తీశాడు.     " మా ఇల్లు దొచేశారు బా..." అన్నాడు  ఘోల్లుమంటూ.      "నా పేరు చెప్పుకొని నువ్వు ఊళ్ళో వాళ్ళని  దోచేస్తున్నావని విన్నాన్... అట్టాంటి  నిన్నే దోచేశారా?...హ్హహ్హహ్హ.." అన్నాడు మినిష్టర్ మిన్నారావు .       "ఏంటా ఇకిలింపు...ఇంకాపుతారా నాలుగు కాజాలు తినిపించనా?..." అంది  మిన్నారావు భార్య అచ్చమాంబ.        మినిష్టర్ మిన్నారావు నవ్వటం మాని బిక్కమొహం వేసి  అచ్చమాంబ వైపు  చూశాడు.       "అవును గానీ వాడిల్లు  దొంగలు  దోచుకొని బాధపడ్తుంటే మీరేంటి వాడికి సహాయం చేయడం పోయి హాస్యాలాడుతున్నారు?...ఆ?..." భర్త వంక కోపంగా చూస్తూ అంది అచ్చమాంబ.       "హయ్యో ... సహాయం ఎందుకు చెయ్యనూ... తప్పకుండా చేస్తాను...హిహి...అది నాకానందం కాదా ?..." అన్నాడు మినిష్టర్ మిన్నారావు .       అప్పటికప్పుడే మినిష్టర్ మిన్నారావు పోలీసు ఆఫీసర్లకి ఫోన్ చేసి తన బామ్మర్ది బాపనయ్య ఇంట్లో దొంగతనం గురించి వెంటనే ఇన్వేస్టిగేషన్  మొదలెట్టి  దొంగలని పట్టుకొని సొమ్ము వసూలు చేయాలని ఆదేశాలిచ్చాడు. ఈ వార్త పేపర్లోకి ఎక్కింది.      దీన్ని పట్టుకొని ప్రతిపక్ష సభ్యులు  అసెంబ్లీలో గలాభా  చేశారు.      "దొంగతనాలవల్ల  ఇంతకాలం ప్రజలు బాధపడ్తుంటే ప్రభుత్వం పట్టించుకోలేదు...అటువంటిది ఇప్పుడు     బాపనయ్య ఇంట్లో దొంగతనం జరగ్గానే తల్లక్రిందులు అయ్యిపోతున్నారు..యేం! బాపనయ్య  మినిష్టర్ మిన్నారావుకు బామ్మర్దనా?" ఓ ప్రతిపక్ష నాయకుడు మైకు విరిచేస్తూ ఆవేశంగా ప్రశ్నించాడు.       "ఏం?...మిన్నారావు బామ్మర్ది ప్రజల్లో ఒకడు కాడా...ఆ?..."అంటూ అధికార పార్టీ యమ్మేల్యే ఒకడు తను కూడా మైకు విరగ్గొట్టి  వైరు తెంపి, కసిగా నవ్వాడు.       అధికార పార్టీ  సభ్యులంతా బల్లల మీద "ధన ధన ధన" మని  చరుస్తూ " షేం...షేం... షేం..."అని అరిచారు.      ఆ దెబ్బకి  ఇందాక మైకు విరక్కొట్టిన ప్రతిపక్ష సభ్యుడు కంగారుపడి వంగి తన ఫ్యాంటు జిప్పువంక చూస్కున్నాడు. జిప్పు బాగానే ఉంది.      అధికార సభ్యులంతా  ఘోల్లున నవ్వి "మేం అందుకు షేమ్ షేమ్ అన్లేదుగా!..."అన్నారు.      అప్పుడా  ప్రతిపక్ష సభ్యుడికి అర్ధం అయింది. వాళ్ళంతా ఎందుకు  షేమ్...షేమ్ ... అన్నారో. తను మైకు విరగ్గొడితే అధికార పార్టీ సభ్యుడేమో మైకు విరగ్గొట్టి  వైరు కూడా  తెంపేశాడు. నిజ్జంగా షేమే...     వెంటనే ఆ  ప్రతిపక్ష సభ్యుడు ఆవేశంగా "ఎహెహెహె...హో..." అని గట్టిగా అరిచి ఆంజినీలుసామిలా గాల్లోఒక్క గెంతు గెంతి ఆనక  ఇంకో మైకు విరగ్గొట్టి  దాని వైరుని ముక్కముక్కలుగా తెంపేశాడు.     దాంతో తిక్కరేగిన అధికారపక్ష సభ్యులు బల్లలు విరక్కొట్టారు.     ప్రతిపక్ష సభ్యులు వాళ్లుకూడా   బల్లలు విరక్కొట్టారు.ముఖ్యమంత్రి చిరునవ్వుతో అంతా చూస్తున్నాడు.     "మీరిట్టా చేస్తే నేను వెళ్ళిపోతానంతే....ఆ ..." అన్నాడు స్పీకర్ బుంగమూతి పెడ్తూ.     ఉన్నట్టుండి ఏమైందో ఏమో... ఒక్కసారిగా బూతులు తిట్టుకుంటూ చొక్కాలు చింపుకుంటూ సభ్యులు కొట్టుకోడం మొదలుపెట్టారు. అప్పుడు పోలీసులు రంగంలోకి దూకి వారిని అదుపులో పెట్టారు. "అసలు మీరంతా ఎందుకు ఇలా కొట్టుకు చస్తున్నారు.?..." అన్నాడు స్పీకర్ సభ్యుల వంకా చూస్తూ.     "ఆ విషయమే ఇందాకట్నుండీ నేనూ అడుగుదామని అనుకుంటున్న..." అన్నాడు చీఫ్  మినిష్టర్ చిరునవ్వులు చిందిస్తూ. ఆయనలా చిరునవ్వులు చిందించడానికి కారణం ఉంది. అధికార పార్టీ సభ్యులకంటే ప్రతిపక్ష సభ్యుల చొక్కాలు ఎక్కువగా చిరిగాయ్. వాళ్ళకి దెబ్బలుకూడా ఎక్కువ తగిలాయ్.   కాస్సేపు సభ్యులంతా మౌనంగా ఉండి ఆలోచించడం మొదలుబెట్టారు.     ఇంతకీ తాము అందరూ ఎందుకు కొట్టుకున్నట్టు?...     మినిష్టర్ మిన్నారావు కిసుక్కున నవ్వాడు.     ఆయన నవ్వడం చూడగానే అందరికీ గుర్తొచ్చింది తామెందుకు బూతులు తిట్టుకుంటూ కొట్టుకున్నారో.     "మిన్నారావు బామ్మర్ది ఇంట్లో జరిగిన దొంగతనం గురించి పోలీసులు పట్టించుకోడానికి వీల్లేదు..." అని అరిచాడు ఒక ప్రతిపక్ష సభ్యుడు.     "పోలీసులు పట్టించుకు తీరాలి!...' ప్రతిగా అరిచాడు అధికార పార్టీ సభ్యుడు.     "పట్టించుకోడానికి వీల్లేదు..." ఇంకా గట్టిగా మూడు నాలుగు గొంతులు అరిచాయ్.     "దొంగతనం జరిగితే దొంగని పట్టుకోవద్దంటారేం?" మిన్నారావు  విసుగ్గా మొహం పెడ్తూ అన్నాడు.     "ఏం?... దొంగతనం మీ బామ్మర్ది ఒక్కడి ఇంట్లోనే జరిగిందా? ఊళ్ళో అందరిళ్ళలోనూ జరగడంలేదా?..." ఒక ప్రతిపక్ష సభ్యుడు ప్రశ్నించాడు.     "దొంగతనం జరిగిన వాళ్ళు అధికార పార్టీలోని వాళ్ళకి ఎవరికో ఒకరికి బామ్మర్ది అవుతేనే పోలీసులు పట్టించుకుంటారు సార్..." మరో ప్రతిపక్ష సభ్యుడు కామెంట్ చేశాడు.     ఆ కామెంట్ కి ప్రతిపక్ష సభ్యులంతా ఘొల్లున నవ్వారు.     వాళ్ళలా నవ్వుతుంటే ఊర్కే కూర్చుంటే బాగుండదని అధికార పార్టీ సభ్యులు బల్లలు గుద్దుతూ "షేమ్ షేమ్..." అంటూ అరిచారు.     దాంతో రెండు పక్షాలకి సంబంధించిన సభ్యులూ మళ్ళీ వాగ్వివాదానికి దారి తీశారు.     "ఇట్టగయితే నేనెళ్ళిపోతానంతే...." అంటూ బుంగమూతి పెట్టాడు స్పీకర్.     "ఇకముందు ఎవరింట్లో దొంగతనం జరిగినా మా పార్టీ సభ్యుల బామ్మర్దుల ఇళ్లలో దొంగతనం జరిగినట్టుగా ఫీలయి పోలీసులు దొంగల్ని పట్టుకుని సొమ్ములు అప్పచెప్పేలా చేస్తామని హామీ ఇస్తున్నాను. అంతేకాదు... ఒక ముందు దొంగతనాలు జరక్కుండా కట్టుదిట్టమైన ఏర్పాటు చేయిస్తాం..." అంటూ హామీ ఇచ్చాడు ముఖ్యమంత్రి.     ఆరోజు అసెంబ్లీ సెషన్స్ ముగిశాక ముఖ్యమంత్రి పోలీసు కమీషనర్ ని పిలిచి నగరంలోని దొంగతనాల నివారించడం గురించి చర్చించాడు.ఇకముందు దొంగతనాలు జరక్కుండా చూడమని చెప్పాడు.     ఆ మర్నాడు పోలీసు కమీషనర్ సీనియర్ పోలీసు ఆఫీసర్ల మీటింగ్ ఒకటిపెట్టి నగరంలోని దొంగతనాలను నివారించడం గురించి చర్చించాడు.ఈ దొంగతనాలని అరికట్టే బాధ్యత డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ డింభకరావుకి అప్పగించాడు పోలీసు కమీషనర్.     డింభకరావు ఎన్ని చర్యలు తీస్కున్నా దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి.     ఒక విషయాన్ని గమనించిన డింభకరావుకి చాలా ఆశ్చర్యం కలిగింది.అదేమిటంటే నగరంలో అన్నిచోట్లా దొంగతనాలు జరుగుతున్నాయ్. కానీ కొన్ని కొన్ని ప్రాంతాల్లో అస్సలు ఒక్క దొంగతనం జరగలేదు...కారణం ఏమిటి?...     అలా అస్సలు దొంగతనం జరగని ఏరియాలు... మలక్ పేట, సలీమ్ నగర్, ముసారాంబాగ్ ఇంకా కొన్ని ప్రదేశాలు!     డింభకరావు సంగతి తెల్సుకుందామని అతని ఇంటికి దగ్గర్లో ఉన్న మలక్ పేట కాలనీకి వెళ్ళాడు.     ఆ కాలనీలోని ఒక ఇంటికి వెళ్ళి ఇంటాయనకి తనని తాను పరిచయం చేస్కున్నాడు డింభకరావు.     "మీ కాలనీలో అస్సలు ఒక దొంగతనం కూడా జరగలేదు... మీ కాలనీ వాళ్ళేమైనా రాత్రిపూట గస్తీ తిరుగుతున్నారా?..." అడిగాడు డింభకరావు ఆ ఇంటాయన్ని.     "లేదే?..." ఆశ్చర్యంగా అన్నాడాయన.     "మరి మీ కాలనీలో ఒక్క దొంగతనంకూడా ఎందుకు జరగలేదు?"     "అదేంటిసార్ అలా అడుగుతారు?... ఇంట్లో అందరూ గాఢంగా నిద్రపోతున్నప్పుడు కదా దొంగలు పడ్తారు. మా కాలనీలో ఒక్కరుకూడా నిద్రపోరుగా... మరి దొంగలెలా పడ్తారు?..."     "ఒక్కడుకూడా నిద్రపోడా?'...అదేం??..." డింభకరావు ఆశ్చర్యంతో తలమునకలవుతూ అడిగాడు.     "ఎలా నిద్రపోతామండీ... మా కాలనీ దగ్గరేగా మూసీనది ఉంది. మూసీనది ఉందంటే చచ్చేన్ని దోమలు ఉంటాయ్ కదా ?... ఎవడికి నిద్ర  పట్టిచస్తుంది చెప్పండి.అందుకే మూసీనది ఉన్న ఏరియాల్లో  జనాలకి నిద్రపట్టదు,దొంగతనాలు కూడా జరగవు..."     అది వింటూనే డింభకరావు సంతోషంతో కెవ్వున కేకేశాడు.     దొంగతనాలు ఎలా అరికట్టాలో అతనికి తెల్సిపోయింది.     డింభకరావు పరుగునవెళ్లి పోలీసు కమిషనర్ కి విషయం చెప్పాడు. పోలీసు కమీషనర్ సంతోషంతో గుండెలు బాదుకుంటూ ఛీఫ్ మినిష్టర్ దగ్గరికెళ్ళి చెవులు కొరికాడు.        "హమ్మా ...ఇదా సంగతి?" అయితే ఇహనుండి హైదరాదాద్ నగరంలో దొంగతనాలు బంద్ " అన్నాడు చెవులు రుద్దుకుంటూ చీఫ్ మినిష్టర్.     చీఫ్ మినిష్టర్ ఆదేశాలతో పని వెంటనే ప్రారంభం అయ్యింది.     మూసీనది నుండి కాలవలు తీసి హైదరాదాద్ లోని ప్రతి ప్రదేశానికి పారే ఏర్పటు చేస్తున్నారు. డ్రైనేజి నీరు కలిసే ఆ కుళ్ళు నీళ్ళు నగరం మొత్తం పారుతుంటే నగరం మొత్తం దోమలతోనిండి ఒక్కడికీ రాత్రిళ్ళు నిద్రపట్టదు. ఆ విధంగా నగరంలోని దొంగతనాలు అరికట్టవచ్చని ప్రభుత్వం ఆలోచన!... మల్లిక్

తొలిప్రేమ

తొలిప్రేమ ఏయ్ మధు...మధూ...ఇక్కడ.... పరిచయమైన గొంతు...గుండె మూలాల్లో నిండిపోయిన పిలుపది..టక్కున వెనక్కి తిరిగి చూసింది మధు...ఆ మనిషి కోసం  కళ్ళు ఆత్రంగా వెతికాయి...ఎక్కడా కనిపించలేదు. 'తాను పొరపాటు పడిందేమో'  నిరాశగా అనిపించింది. అంతలో తలపైన చిన్నగా తట్టినట్టు అనిపించింది. గుండె గొంతుకలోకి రావటమేంటో అనుభవమయ్యింది. 'చందూ'.... ?  గిరుక్కున తిరిగింది. నిజంగానే చందూ! ... చందూ నువ్విక్కడ?  ఆనందంతో టక్కున తన చేతిని పట్టుకుంది. నవ్వుతూ చూస్తున్న చందూ కళ్లలో గిర్రున నీళ్లు తిరిగాయి. ఇద్దరూ నీరు నిండిన కళ్ళతో ఒకరిని ఒకరు కళ్లల్లో నింపుకుంటున్నారు. ఏదో స్పృహ వచ్చినట్టు నెమ్మదిగా చందూ చెయ్యి వదిలేసింది మధు.  ఒక్కడివే వచ్చావా? ఆ...Office, work....నువ్వు?....' నేనూ Office పనిమీదే వచ్చాను. పద బయటకు వెళుతూ మాట్లాడుకుందాం..అంటూ చందూ ముందుకు నడిచాడు. మాటలు గడ్డకట్టుకుపోయాయి. ఇద్దరూ మౌనంగా నడుస్తున్నారు. Airportలో లగేజి తీసుకుని బయటకు వచ్చారు. పక్కనే చేతికందేంత దూరంలో ఒకరికి ఒకరు. కాని ఒకరికి ఒకరు ఏమీ కానంత దూరం ఇద్దరి మధ్యా. ఒకప్పుడు ఒకరికోసం ఒకరుగా బతికారు... కాలం ఇంద్రజాలంలో ఎవరికి వారైపోయారు. *               *         * నువ్వేం అంటున్నావో నీకు తెలుస్తోందా మధూ... అన్నీ ఆలోచించే చెబుతున్నా చందూ నువ్వు ఆలోచించు మన జీవితం మనది మాత్రమే కాదు  మన వాళ్ళది కూడా అమ్మానాన్న, అక్కా, అన్న వీళ్ళందరిని కాదనుకొని మనిద్దరమే అనుకోవటం ఎంత స్వార్థం చెప్పు? ప్రేమలో స్వార్థం వుండచ్చా? కాని మధు మన జీవితాలు?  నడుస్తాయి చందూ కాలానికి ఆ మ్యాజిక్ తెలుసు. ఇంపాజిబుల్ నేను ఒక్క క్షణం కూడా ఆ ఆలోచనని తట్టుకోలేను. ఇక బతకటం?  ఇదే మాట మీ నాన్నగారు కూడా అంటున్నారు తన కొడుకుని వదిలి ఉండలేనని మరి ఆయన ప్రేమకి విలువ లేదా? ఇలా ఒకరోజు కాదు పదిరోజులు సాగాయి వాదోపవాదనలు ఇద్దరి మధ్యా,  దూరమైనా ఒక్కో ప్రేమకథలో ఒక్కో కారణం.. ఉన్నట్టు చందూ నాన్నగారి పట్టుదల వీళ్ళప్రేమకథలో దూరానికి కారణం . ఆరేళ్ళ ప్రేమ. ఒకరికి ఒకరు తోడుగా నిలిచారు. పార్కుల వెంట తిరుగుతూ, సినిమా హాల్లో కబుర్లు చెబుతూ సాగిన ప్రేమ కాదు వారిద్దరిది. జీవితం, లక్ష్యాలు వాటిని సాధించే మార్గాలు ఆ దశలో ఒకరికి ఒకరు భరోసా, ఒకరికి ఒకరు ఆదర్శం. కలసి చదువుకున్న మంచి మంచి పుస్తకాలు దాచుకున్న పాటల క్యాసెట్లు జీవిత కాలానికి మించిన మంచి అనుభూతులు ఇద్దరి స్వంతం. ఆ ఆరేళ్ళ ప్రేమ జీవితమంతా పరుచుకోకుండానే విడిపోవాలంటోంది. ఇద్దరికీ బాధే కాని 'స్వార్థంతో' ఆలోచించలేక రాజీ పడ్డారు. 'నేను' కాదు 'మేము' ముఖ్యం అనుకున్నారు. వీడ్కోలు చెప్పుకున్నారు. ఆరోజు ఒక్కసారి చందూని గట్టిగా పట్టుకుని ఆ భరోసాని గుండెల్లో ఓ అనుభూతిగా దాచుకోవాలనుకుంది మధు. చందూకీ అలానే అనిపించింది. కానీ ఇద్దరూ నీరు నిండిన కళ్ళతో చేతులుని వదలలేక వదలుతూ...బై చెప్పుకున్నారు. ఇక ఎవరి జీవితాలు వారివి. ఫ్రెండ్స్ గా కూడా కలవద్దు. తలచుకోవద్దు. హ్యాపీగా ఉండటమే ఒకరికొకరు ఇచ్చుకునే బహుమతి అనుకున్నారు. "ప్రేమ ఒకింత గర్వంగా, మరికొంత నిస్సహాయంగా వారి వీడ్కోలుని చూస్తూ వుంది". *               *            * ఏ హోటల్?. సాయంత్రం కలుస్తావా? నెమ్మదిగా అడిగాడు చందూ. కామ్ గా చందూ కళ్ళలోకి చూసింది మధు. చూస్తాను చందు. తనమాట పూర్తి కాకుండానే టక్కున మధు చెయ్యి పట్టుకున్నాడు చందూ. మధూ ప్లీజ్  పన్నెండేళ్ళ తర్వాత కలిసాం. ఇలా ఇప్పుడే మళ్ళీ విడిపోవటం. నీతో చాలా మాట్లాడాలి. సరే 6'o Clock కి Minerva లో కలుద్దాం. Bye అంటూ గబగబా ముందుకు  నడిచేసింది మధు. ఇంకొక్క క్షణం అక్కడ వున్నా చందూని వదిలిరాలేదు. నిస్సహాయంగా వెళ్ళిపోతున్న మధూనే చూస్తూ నుంచున్నాడు చందూ. *              *               * చందూ...కళ్ళముందు కదులుతుంటే రోజంతా మనసులో ఏదో అలజడి. ప్రేమలోని తియ్యటి అనుభూతి గుండెనిండా నిండుతుంటే..మధుకి ఏదో ఇబ్బందిగా అనిపిస్తోంది. ఏంటి ఇంకా చందూని తను ప్రేమిస్తూనే వుందా. మొదట్లో చందూని చూడటానికి, తనతో కలసి వుండటానికి మనసు ఎంత ఆతృత పడేదో ఇప్పుడూ అదే ఆతృత అదే తియ్యటి ఆనందం. మరి ఇన్నేళ్ళుగా శేఖర్ తో పంచుకున్న ప్రేమ ఉట్టిదేనా..కాదు శేఖర్ తన జీవితంలో ఎంతగా  నిండిపోయాడో తనకే తెలుసు. అయినా ఎక్కడో ఏదో మూల 'ప్రేమ' అన్న మాట వినపడగానే కళ్ళముందు చందూ కదలాడుతాడు. అదేంటో? అక్కడ చందూ కూడా అవే ఆలోచనలతో ఆరు ఎప్పుడవుతుందా అని చూస్తున్నాడు. *                   *           * చాలా మారిపోయావు మధూ. లావెక్కాను కదా. ఇద్దరు పిల్లలు నాకిచ్చిన బహుమతి ఇది. నవ్వుతూ అంది. మరీ కాదులే .కాస్త లావెక్కావు అంతే. నువ్వు మాత్రం అలానే వున్నావు ఇంకా నీ జిమ్ కంటిన్యూ చేస్తున్నావా? ఇద్దరూ ఒకరి ఫ్యామిలీ గురించి ఒకరు చెప్పుకున్నారు. Life లో సాధించిన విజయాలు, చేస్తున్న ఉద్యోగం, పిల్లలు, చదువు వారి జీవిత భాగస్వామితో జీవితం ఎంత బావుందో అన్నీ చెప్పుకున్నారు. ఇవన్నీ పై మాటలే. ఇద్దరి మనస్సులో ఏదో అలజడి. ఇంకేదో అడగాలని, మరింకేదో చెప్పాలని. ఎలా వున్నావు మధు? నెమ్మదిగా అడిగాడు చందూ.  చర్రున మధు కళ్ళలోకి నీరు పొంగుకొచ్చింది. "'చందూ... జీవితం ఎప్పుడూ మనకి ఏది మంచిదో అదే చేస్తుంది. మనమే మొండిగా నాకిదే కావాలని పట్టుబడతాం. మనిద్దరి జీవితాలే అందుకు ఉదాహరణ. లైఫ్ ని ఆక్సెప్ట్ చేస్తూ వెళితే   ఎప్పుడూ ఆనందంగానే వుంటాం." "నువ్వేం మారలేదు. ఇప్పటికీ Life ని అదే Positive attitude తో చూస్తున్నావ్. అందుకే నా మధు Something unique అనేసి టక్కున మధువైపు చూసాడు. మధు నవ్వుతూ ' నీ మధు కాదు. మా.. శేఖర్ మధుని'...శేఖర్ కూడా ఇలాగే అంటాడు. మూడు గంటలు ఎలా గడిచాయో తెలీదు. కాసేపు కబుర్లు, మరికాసేపు మౌనం.  లేచి బై చెప్పుకుంటుంటే.... మళ్ళీ ఎప్పుడు? చందూ ప్రశ్న. ఇలాగే...లైఫ్ ఎప్పుడో తిరిగి కలిసినప్పుడు.  'రాక్షసి' పెద్దయిపోయాం. కనీసం ఫోన్ నెంబర్?  వద్దు చందూ. బలహీనత ప్రేమని చంపేస్తుంది. మళ్ళీ కలుస్తామో లేదో. తిరిగి ఎప్పుడైనా చూసుకోగలమా? ఇద్దరి మనసుల్లో బెంగ.... బోల్డంత బెంగ....  బై అనటానికి మనసు, నోరు రెండూ సిద్ధంగా లేవు. కలసి అడుగులు వేస్తుంటే మధు చందూ చేతిని నెమ్మదిగా పట్టుకుంది. ఒకరి కళ్లలోకి ఒకరు చూస్తూ నీరు నిండిన కళ్ళతో చేతులు వదిలేసి నెమ్మదిగా చెరో వైపు కదిలిపోయారు. ఇన్నేళ్ళ తర్వాత కూడా అదే కోరిక ఒక్కసారి గట్టిగా హత్తుకోవాలని, మనసు వెనక్కి లాగుతోంది. సంస్కారం ముందుకు నడిపిస్తోంది. ప్రేమా...మనసులో నిలిచిపోయావ్,  కాలంతో పాటు కరిగిపోతావనుకుంటే గుండె లోతుల్లో ఇంకా నేనున్నానంటున్నావ్,  ఇదేనా మొదటి ప్రేమలోని తియ్యదనం?  అవునేమో.... రమ ఇరగవరపు

పాపం జంబులింగం

పాపం జంబులింగం వసుంధర టెలికమ్యునికేషస్స్ జనరల్ మేనేజర్ జంబులింగం తన పదవిలోకి వచ్చేక డిపార్ట్మెంట్లో ప్రవేశపెట్టిన మార్పుల గురిండ్చిసాదించిన అభివృద్ధి గురించి తన క్రింది ఉద్యోగికీ ఉపన్యాస రూపంలో చెబుతుండగా ఫోన్ మ్రోగింది. ఆయన వెంటనే రిసివరందుకుని హలో! టెలికమ్యునికేషస్స్ జనరల్ మేనేజర్ అన్నాడు. పేరుకు ముందు తన హోదాను తగిలించడం ఎన్నడు మరువని కారణంగా చాల మందాయన ఇంటిపేరు టెలికమ్యునికేషస్స్ జనరల్ మేనేజర్ అని పోరాబడుతుంటారు.ఇంట్లో వాళ్లయితే ఇంటి పేరు మరచిపోయారు. “నమస్కారం సార్! ణా పేరు విఇర వెంకట సత్యనారాయణ. అర్జెంటుగా మీరు ణా ఫిర్యాదు వినాలి సార్! అంటూ తన ఇంటి చిరునామా,ఫోన్ర్ నెంబర్ చెప్పి – మా ఫోన్ర్ తిన్నగా పనిచేయడంలేదు సార్ అన్నాడు ఫోన్లో మాట్లాడుతున్న అవతలి వ్యక్తీ. ఇలాంటి కంప్లయింట్స్ జంబు లింగానికి కొత్తకాదు అయన వెంటనే “సరే మీ వివరాలు నోట్ చేసుకున్నాను. మావాళ్ళు వస్తారు అని ఫోన్ పెట్టేశాడు. అయన క్రిది ఉద్యోగి కుతూహలంగా ఎవరు సార్ ఫోన్ చేస్తా? అనడిగాడు ఆ ఏదో పర్సనల్ కాల్ లెఅన్నాడు జంబులింగం అంతవరకూతను సాదించిన అభివృద్ధి గురించి చెబుతున్నమూలానా జంబులింగానికి ఫిర్యాదు గురించి క్రింది ఉద్యోగికి చెప్పడానికి సమయం కాదనిపించింది. ఆ సాయంత్రం జంబులింగం ఇంటికి అతిథులోచ్చారు డిపార్ట్మెంట్లోతను సాదించిన విశేషాలగురించి ఆయన వారికి వివరిస్తుండగాఫోన్ వచ్చింది సాదారణంగా ఎప్పుడు ఫోనుకు పక్కకగా కూర్చోవడం జంబులింగం అలవాటు అందుకని ఆయన వెంటనే రిసివారెత్తి –“ హలో టెలికమ్యునికేషస్స్ జనరల్ మేనేజర్ జంబులింగం స్పీకింగ్” అన్నాడు జంబులింగం గార నమస్కారం సార్ – నాపేరు వీర వెంకట సత్యనారాయణ నా ఫిర్యాదు విషయమేమ్చేసారు సార్ అన్నాడు అవతలి వ్యక్తీ. మావాళ్ళు రాలేదా అన్నాడు జంబులింగం చిరాగ్గా... వచ్చారు సార్ అరగంటసేపు నా టెలిఫోన్తో ఆదుకునిఏ లోపము లేదని చెప్పి వెళ్ళి పోయారు.... అయితే వాళ్ళు చెప్పిందే నిజం అని ఫోన్ పెట్టశాడాయన. తన మతమేరకు తన డిపార్టుమెంట్ మనుష్యులువెంటనే వేల్లినదుకు రవంత గర్వంకుడా కలిగి తనలో తనేముసిముసిగా నవ్వుకున్నాడుఏమిటి సార్ అనడిగారు అతిధులు కుతూహలంగా ఏమిలేదు మా డిపార్టుమెంట్ ను మెచ్చుకుంటూ ఎవరో ఫోన్ చేసారుఏది నాకు మాములే అన్నాడు జంబులింగం. మర్నాడు బైటేక్కడో అఫీషియల్ మీటింగ్ ఆ రోజే కూతురి పెళ్ళికోసం చూపులకొచ్చినవారు నిర్ణయం తెలియబరుస్తారుకబురు తీసుకుని బావమరిది పదకొండింటికి రావలి కబురు తెలియగానే నాకు ఫోన్ చేయండి అని ఆయన భార్యకు ఫోన్ నెంబర్ రిచ్చివెళ్ళాడు. మీటింగ్ లో ఉండగా అక్కడ  తను ఫోన్ దగ్గరే నే కూర్చుని సరిగ్గా పదకొండు గంటల ప్రాంతంలో తనకు ఫోన్ వస్తుంది అని మిగితా వారికి చెప్పదు మీటింగ్ పదిగంటలకు ప్రారంభమైంది వివిధ సంస్థలకు సంబంధించిన అధినేతలు డిపార్టుమెంటు నిర్వహించడంలో తమకున్న సమస్యలగురించి చెప్పుకుంటన్నారు. కాసేపటికి జంబులింగం కలగజేసుకుని తను డిపార్టుమెంట్లో సాధించిన ఘనవిజయలగురించి చెబుతుండగా బల్లమీద ఫోన్ మ్రోగింది తను టైం చూసుకున్నాడుపదకొండు అయిదైంది. బావమరిది వచ్చేశాడనమాట ఏం కబురు తెచ్చాడో – అనుకుంటూ రిసివారెత్తి హలో ! టెలికమ్యునికేషస్స్ జనరల్ మేనేజర్ జంబులింగం స్పీకింగ్ అన్నాడు జంబులింగం మీరేనా సార్ నమస్కారం నాపేరు వీరవెంకట సత్యనారాయణ మీకు గుర్తుండే ఉంటాను నా ఫిర్యాదు విషయం ఏంచేసారు సార్ మా వాళ్ళు వచ్చి చూసారుగా కొన్నాళ్ళు వేచి చూడండి ఏం వేచి చూడండి. మా చెల్లయిని అత్తరు మాఇంటికి రానివ్వడంలేదు మా బావ మంచివాడేకాని ఏమిచేయలేక ఫోన్లో మాట్లాడుకోందని సలహా ఇచ్చాడు.ఇప్పటికి ముప్పైసార్లు ఫోన్ చేశానుముప్పైరోజుల్లో ఒక్కసారి దొరకదే ఆ నెంబరు దొరకదే! అందవతలి గొంతు అసహనంగా... నేను నమ్మను ఫిర్యడుచేయడం మికలవాటైఉంటుంది. నేనిక్కడుంటే అక్కడికి వెతుకుంటూఫోన్ చేస్తున్నారు ఏది మర్యాద కాదు నిజం చెప్పాలంటే నాకు మీ నెంబర్ తెలియదు సార్... నేను మాచెల్లయికి ఫోన్ చేయలన్నపుడల్లా ఏదో రాంగ్ నెంబర్ తగుల్తోంది ముప్పైసార్లలో మూదుసార్లు మీ నెంబర్ తగిలింది ఎలాగో తగిలింది కదా అనిఒక ఫిర్యాదు చేస్తున్నాను....అందవతలిగొంతు దీనంగా.... జంబులింగం ముఖం అదోలగైపోయింది. ఏమిటివిసేశం అన్నాడు పక్కనున్న వ్యక్తీ పాపం జంబులింగం ఏంచెప్తాడు...

నలిగిన పసి రెక్కలు

నలిగిన పసి రెక్కలు శశి ఏదో వర్క్ చేసుకుంటూ ఉన్నాను ఆఫీస్ లో. అంతా పది మంది స్టాఫ్ అటెండర్ లతో కలిపి. చిన్నగా కలకలం, నవ్వులు. లేచి మేనేజర్ టేబుల్ దగ్గరకు వెళ్లాను. అందరు అప్పటికే అక్కడకు చేరి నవ్వుకుంటూ స్వీట్ తింటూ, మాట్లాడుతూ ఉన్నారు. రికార్డ్ అసెస్టెంట్ నన్ను చూడగానే నవ్వుతూ’ ‘స్వీట్ తీసుకోండి మేడం’ ఇచ్చింది. “ఏమిటి సంగతి?” కొంత కుతూహలంగా అడిగాను. భర్త చనిపోయిన తరువాత ఒక్క కూతురిని సాకుతూ లేమితనం బయట పడకుండా గోర్వంగా ఉంటుంది. “పాపకి పెళ్లి కుదిరింది” చెప్పింది. “పెళ్ళా” ఉలిక్కిపడ్డాను. ఇంకా సీనియర్ ఇంటర్ కదా....దాచుకుందాము అన్నా దాగని కోపం. ఎందుకు వీళ్ళు ఇలాగ చిన్న పిల్లలకు పెళ్లి చేసేస్తారు. ‘లేదు మేడం అబ్బాయి ఇక్కడ మెకానిక్. బాగానే సంపాదిస్తాడు. వాళ్ళ అమ్మ ఈ మధ్య చనిపోయింది. ఆడ దిక్కు లేని సంసారం. ఎక్కడో పాపని చూసి ఇష్టపడ్డాడు అంట. అసలు పాపని ఇష్టపడని వాళ్ళు ఎవరు చెప్పండి? కట్నం ఉన్నంతే ఇమ్మనండి చేసుకుంటాను. పెళ్లి త్వరగా చేయాలి అని చెప్పి పంపించాడు. ఇంకోవారం లోనే పెళ్లి. పెళ్లి ఖర్చు కూడా అతనే పెట్టుకున్నాడు. అమ్మాయిది ఏమి అదృష్టమో చూడండి.” సంతోషంగా గుక్క తిప్పుకోకుండా చెప్పింది. మనసులో ఏమి అదృష్టం బొమ్మల పెళ్లి లాగా ఇంతచిన్న పిల్లని కట్టబెడుతూ అనిపించినా ఆమె సంతోషాన్ని తుంచలేక నవ్వాన్. కాని వాడిపోయిన పూవు మీద పడిన చంద్రకాంతి లాగా దానిలో కళ లేదు. మేడం మీరు తప్పకుండా రావాలి” బ్రతిమలాడింది విజయ. పదో క్లాస్ లో వాళ్ళ పాపకి ఇంగ్లీష్ కష్టం అంటే కొన్ని రోజులు చెప్పాను. ఆ కృతజ్ఞత. “సరేలే” అన్నాను. ఆ మాత్రానికే తన కళ్ళు ఒక్కసారి వెలిగాయి. చక్కగా షామియాన వేసి మధ్యలో స్టేజ్ మీద పెళ్లి ఏర్పాట్లు చేసారు. ఇంటి పక్కన ఖాళీ జాగాలో పెళ్లి ఏర్పాటు చేసి షామియాన గుంజలకు మామిడి తోరణాలు వాసన మనసుని పచ్చన చేస్తూ, గలసిన ఉప్మా వాసన. నన్ను చూడగానే విరిసిన నవ్వులు స్వాగతం చెపుతూ ఉంటే మనసుకు హాయిగా అనిపించింది. ఈ మధ్య బయట ఆహ్వానించే వాళ్ళని కూడా అద్దెకు మాట్లాడుతున్నారు. అసలు దగ్గరి వాళ్ళ పెళ్ళికి వెళ్ళినా దూరపు పెళ్ళికి పోయినట్లే ఉంటుంది. మెల్లిగా లోపలికి వెళ్లాను. ఆ అమ్మాయి నన్ను చూసి నవ్వి కుర్చీ వేసింది. పచ్చటి చీరకు గులాబి రంగు బార్డర్, లేని నడుముకు అతకక జారిపోతున్న వడ్డాణం, వంకీలు బ్యూటీపార్లర్ రంగులు లేక స్వచ్చంగా విరిసిన తామర పువ్వులాగా ఉంది. కాని నాకు మాత్రం బొమ్మల పెళ్లి చూస్తున్నట్లే ఉంది. అబ్బాయి ఈడు జోడు బాగానే ఉన్నాడు. ఎవరిని పరిచయం చేసినా కలివిడిగా నవ్వుతూ పలకరించాడు. తాళి కట్టిన తరువాత అక్షితలు వేసి స్టాఫ్ అందరి తరుపున ప్రెషర్ కుక్కర్ ఇచ్చి వచ్చేసాను. అందరు గుమ్మం బయటి దాకా వీడుకోలు చెప్పారు. మళ్ళా స్వీట్ వాసన తీపి కబురుతో పాటు.... అమ్మమ్మ అవుతున్నాను అనే ఆనందం ఇంత బాగుంటుందా?” “అంత చిన్న పిల్లకి అప్పుడే పిల్లలా?” ఉండబట్టలేక అడిగేసాను. “అయ్యో అలా అనకండి మేడం. ఆ బాబు మా అమ్మ పుడుతుంది అని ఎంత సంతోషంగా ఉన్నాడో. మా అమ్మాయిని నెత్తిన బెట్టుకొని చూసుకుంటున్నాడు.” ఎందుకో తన సంతోషం చూస్తే నాకు కూడా సంతోషం వేసింది. నిజమే చిన్న పిల్ల అనేది తప్పిస్తే ణా మనసులో కూడా ఏ అడ్డంకి లేదు. ఏ ఆడపిల్లకైనా కావాల్సింది భర్త, పిల్లలతో సుఖంగా ఉండటమే కదా...రోజులు గిర్రున తిరుగుతున్నాయి. రంగుల రాట్నంలో పిల్లలు లాగా మనం కూడా కాలంతో.... అబ్బాయి పుట్టాడు. బారసాల కు పిలుపు వచ్చింది. వెళ్లాను మళ్లా అదే షామియానా. లోపలికి వెళితే బాబుకు పాలు ఇస్తూ ఉంది. ఆ తృప్తి కోసం తన మొహంలో వెదికాను. కాని ఏదో లోపం. పెదాల మీద పాలిపోయిన నవ్వు, వానలో తడిసి వెలిసిపోయిన రంగుకాగితాల్లాగా. “ఏమైంది?” అడగ పోయేసరికి వాళ్ళ ఆయన వచ్చి చేతిలో కాఫీ పెట్టాడు. మగవాళ్ళ చేత మర్యాదలు చేయించు కుంటున్నందుకు నోచుకున్నాను. “పర్వాలేదు మేడం, కావ్య లేవలేదు. అత్తమ్మ బయట పనిలో ఉంది.నాకు మాత్రం ఎవరు ఉన్నారు వీళ్ళే కదా” ఎంత చక్కని సంస్కారం. నిజంగా కావ్య అదృష్టవంతురాలు. చిన్నగా నవ్వింది కావ్య. బాబుకు “చేతన్” అని పేరు పెట్టారు. తీసుకెళ్ళిన బట్టలు, ఉంగరం ఇచ్చి ఆశీర్వదించి వచ్చాను. బాబు చక్కగా ముద్దుగా ఉన్నాడు. పర్వాలేదు విజయకు ఇంక కష్టాలు లేవు అనుకున్నాను. కష్టాలు లేకపోతే తనను తలుచుకోరని దేవునికి అనుమానం. అందుకే ఏదో ఒకటి సమస్యను తెస్తూనే ఉంటాడు. కావ్య భర్త కి ఆక్సిడెంట్. అక్కడే మరణించాడు. విషయం వినగానే విజయ స్పృహ తప్పి పడిపోయింది. అందరం కష్టపడి మెలుకువ వచ్చినాక ఇంటికి తీసుకెళ్ళాము. ఎవరు మాత్రం చేసేది ఏముంది..... ఒక పక్క వాలిపోయి కావ్య, అసలు ఆ ఇంటిలోని దైన్యం చూస్తే పగ వాళ్లకు కూడా వద్దు ఈ శాపం. అదిగో అన్ని క్రతువులు అయిపోయాయి. భోతిక శరీరం అగ్నిలో కలిసిపోయింది. ఇక మిగిలింది ఒకే క్రతువు. అమ్మాయికి మాంగల్యం, బొట్టు, గాజులు తీసెయ్యడం. దాని తరువాత కావ్య మొహం.... చిన్న పిల్ల నీటిలో తళుక్కు మనే నక్షత్రం లాగా నవ్వే పిల్ల, ముద్దబంతి పూవు లాంటి ముచ్చటైన మొహం అన్నీ తీసేసి దైన్యంగా...ఛా..... ఊహించుకోలేకపోయాను. ముందు మాంగల్యం తీసేసారు. విజయ బోరు మంటూ శోక సముద్రంలో విలవిల లాడుతూ... కావ్య మాత్రం నిర్లిప్తంగా ఉంది. నన్ను కాదు చేసేది అన్నట్లు. బాబుని దూరంగా ఎవరో ఎత్తుకొని ఉన్నారు. పూలు కూడా తీసేసారు ఇక బొట్టు... ‘వద్దులే, పసి బిడ్డ.... అనీ తియ్యవాకండి.’ ఎవరో అన్నారు. మానవత్వం మిగిలే ఉంది...చిన్నగా గుస, గుస లోకం తెలిసిన వాళ్ళు చెప్పుకుంటూ “పసిబిడ్డ. మళ్ళీ పెళ్లి చేస్తారు. ఎందుకులే ఉండనియ్యండి. మాంగల్యం తీసేస్తే చాలు పర్వాలేదు. ఆడవాళ్ళు మరీ మూర్ఖంగా లేరు. అంతే ఆరోజు వచ్చేసాను తరువాత ఇక వెళ్ళలేదు. ఎప్పుడైనా బాబుని విజయ ఆఫీస్ కి తీసుకొని వస్తూ ఉండేది. లంచ్ టైం లో విజయ వచ్చి ణా టేబుల్ దగ్గర కూర్చుంది. గంబీరపు నీడలు విషయ సాంద్రతను సూచిస్తూ.... ఏమి అయి ఉంటుంది? చెప్పు విజయా....సూటిగా విషయం కి వచ్చేస్తూ. “ఏమి లేదు మేడం, కావ్య కి మళ్ళా పెళ్లి చెయ్యాలని అనుకుంటున్నాను. ఎదిగిన అరటిగెల లాంటి పిల్ల మోడుగా జీవితాన్ని గడుపుతుంటే మనసు తరుక్కొని పోతుంది. బాబుని కావాలంటే నేను సాకుతాను” “మరి చెయ్యి దానిలో ప్రాబ్లెం ఏమిటి? సంబంధాలు చూడాలా?” అడిగాను. “లేదమ్మా, ఆడి ఏదో మనసులో పెట్టుకుంది. చెప్పమంటే చెప్పదు. పెల్లిమాట ఎత్తితే చచ్చిపోతాను అంటుంది. నాకు మాత్రం చనిపోయిన పిల్లాడి మీద అభిమానం లేదా చెప్పండి. కాని పోయిన వాళ్ళతో మనం పోలేము కదా. మొగ దిక్కులేని సంసారం అంటే ఎంత కష్టమో నాకు తెలుసు, మీరు అయినా దానితో మాట్లాడండి అమ్మ” చెప్పింది. “సరే రేపు సాయంత్రం నేను పిలుస్తున్నాను అని చెప్పి ఇంటికి పంపు. పనిలో సహాయం చేయడానికి అని చెప్పు” చెప్పి పంపేసాను, ఏమై ఉంటుంది అని ఆలోచన. కాలింగ్ బెల్ మోగితే తీశాను. కావ్య....”రాకావ్య” లోపలి వచ్చింది. మునుపటి హుషారు లేదు. ఏదో దిగులు లోపలి నీడలను ముఖంపై ప్రస్పుటిస్తూ...కాఫీ పెట్టుకొని వచ్చి ఇచ్చాను. తాగుతూ ఉంది. ఇంతకు ముందు మాట్లాడే గల గల సందడి మూగపోయి నిలుచుంటే గుండె కోసేసినట్లు, లేత పక్షి రెక్కలు తెంపి వేసినట్లు. “చేతన్” ఎలా వున్నాడు?” ముభావంగా చెప్పింది. లాభం లేదు విషయంలోకి రావాల్సిందే. “కావ్య ఒక విషయం చెపుతాను అర్థం చేసుకో” అన్నాను. “పెళ్లి విషయమే కదా? అనుకున్నాను అమ్మ మీ దగ్గరకు వెళ్ళమన్నప్పుడే” తల వంచుకొని ఉంది. “అయితే చెప్పు కావ్య. ఊరకే ఉంటే మనసులో మాట ఎలా తెలుస్తుంది? “లేదు ఏమీ లేదు..... చేసుకోను అంతే” గొంతులో స్థిరత్వం...కాని ఎందుకో ఆ పదాల వెనుక ఏదో నీలి నీడ మెరుస్తూ... దగ్గరకు వెళ్లాను. కావ్యా నిన్ను చాలా ఏళ్ల నుండి చూస్తున్నాను. ఇంత మొండి మనస్తత్వం నీకు ఎప్పుడు లేదు. ఏమైందమ్మా” లాలనగా తల మీద చేయి వేసి నిమురుతూ అడిగాను. అప్పుడు బద్దలు అయింది గడ్డ కట్టిన మౌనం....కన్నీళ్ళుగా జల జలా కారుతూ, మౌనపు రేకులు ఒక్కొక్కటిగా విప్పుతుంటే గుప్పుమన్న కన్నీటి వాసన....ఒక్కో దృశ్యాన్ని నా కాళ్ళ ముందు నిలుపుతూ.... “ఏమిటి కావ్య ఏమి మాట్లాడవు? సిగ్గా?” మొదటి మాట భర్త నుండి మొదటి రాత్రి విన్నప్పుడు సిగ్గు ఇంకా రెట్టింపు అవుతూ.... “అవును ఇంత అందగత్తేవి, ఎవరూ నీకు లైన్ వెయ్యలేదా?” ఉలిక్కిపడి తల ఎత్తింది. “ఏమిటి పెద్ద రోషం...ఇవాళ రేపు ఎవర్నీ నమ్మేట్లు లేదు” సన్నగా నువ్వు వెనుక కనపడే తోడేలు నీడ. అసహ్యంతో నిండిన శరీరం ప్రాణం చచ్చిపోయి అర్పిస్తూ... ఆడి మొదలు...క్షణం క్షణం చచ్చి బ్రతకడమే. పాలోడి తో మాట్లాడితే తప్పు, కూరలు వాడితో మాట్లాడితే నేరం.... ఎవరో ఒకరితో వరుసలు కలుపుతూ సూదులు గుచ్చిన క్షణాలు మౌనంగా రెప్పల వెనుక దాచుకుంటూ, అమ్మని బాధ పెట్టకూడదని మోసం చేస్తూ, .....వేకిల్లు చూపించాయి కాలిన గాయాలు, సున్నితంగా విచ్చి వెలుగును చూసి సుతారంగా తల ఊపి నవ్వాల్సిన మొగ్గ రాక్షసుడి వికృత విన్యాసాల పాదం కింద రేకులుగా నలిగి.... కన్నీటి చుక్కలుగా. మనసు ఆపుకోలేక “నా తల్లి ఎంత బాధను అదుముకున్నావే” అని దగ్గరకు తీసుకొని ఘోల్లుమన్నాను. కౌగిట్లో ఒదిగిపోయి మనసులోని బాధను దాచిన దుఖాన్ని బయటకు పంపించింది. “ఇప్పుడేమి చేస్తావు చెప్పు? నేను నీకు తోడూ ఉంటాను” చెప్పాను. “లేదాంటి ఆడవాళ్ళు ఏమి అంత కొవ్వు పట్టి లేరు. నాకు ఈ జీవితం మీద విరక్తి వచ్చేసింది. కాకుంటే బాబు కోసం నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనుకుంటున్నాను. కంప్యూటర్స్ నేర్చుకుందాము అనుకుంటున్నాను” చెప్పింది. “సరే చేర్పిస్తాను. మీ అమ్మతో నేను మాట్లాడుతాను” చెప్పాను తన నుదుట కుంకం దిద్ది...ఎందుకు ఉదయించే సూర్యుడి లాగా ఉన్న తన నుదుటన అది ఉండాలి అనిపించింది.  

ఆడపిల్లనమ్మా

ఆడపిల్లనమ్మా.... సురేష్ పెద్దిరాజు మనదేశ జనాభాలో స్త్రీల నిష్పత్తి ఏ ఏటికాయేడు తగ్గుతూ వస్తోంది. ఆడవాళ్ళ సంఖ్య గణనీయంగా రోజురోజుకూ పడిపోతోంది. అసలు ఆడపిల్లను గర్భస్త దశలో వుండగానే చిదిమేస్తున్నారు. భ్రూణహత్యలకు పాల్పడుతున్నారు. ఆడపిల్లలు వద్దనుకోవటానికి ఈనాడు ప్రధాన కారణం వరకట్న సమస్య. వరకట్నం కారణంగానే ఆడపిల్లల కంటే మగపిల్లలు నయమని అధిక శాతం తల్లితండ్రులు నమ్ముతున్నారు. ఎన్నో వ్యయప్రయాసలు పడి ఆడపిల్లలను పెంచడం, చదివించడం. చివరకు భారీగా కట్నకానుకలివ్వడం తల్లితండ్రులకు పెను భారంగా పరిణమించింది. ఈ సాంఘీక దురాచారాన్ని సమూలంగా రూపుమాపడం పోయి అసలు ఆడపిల్లనే వద్దనుకోవడం, పురిట్లోనే చంపేయడం, లేకపోతే పుట్టాక వదిలించుకోవాలని చూడడం దారుణం. ఇవన్ని ఆడపిల్లల సంఖ్య తగ్గడానికి దోహదపడుతున్నాయి. ఇదిలాగే కొనసాగితే సమాజంలో విపరీతపరిణామాలకు దారితీస్తాయని సామాజిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. టీవీలో ప్రత్యేక కార్యక్రమం అలా కొనసాగుతూ వుంది. చూస్తున్న ఎనిమిది నెలల గర్భవతి నిర్మల ఆలోచనలో పడిపోయింది. ఇంతలో తలుపు ధబాలున తెరుచుకున్న శబ్దం...మనిషి కన్నా అతని నుంచి వస్తున్న మందు వాసన ముందు ఆమెని పలకరించింది. హ్మ్...మళ్ళీ తాగొచ్చాడు అని అనుకుంటూ చూస్తున్న ఆమెను. “ఏయే అలా గుడ్లప్పగించి చూస్తున్నావ్...నీయ...కూడెట్టు” అని గద్దించాడు ఆమె మొగుడు ప్రతాప్. ఇతగాడు ఓ ప్రయివేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తుంటాడు. వీరిద్దరికి పెళ్ళయి నాలుగు సంవత్సరాలు అయ్యింది. మూడేళ్ళ పాపా కూడా ఉంది. ఈ నాలుగేళ్లలో పాతిక కంపెనీలన్నా మారివుంటాడు. ఎక్కడా కుదురుగా వుండడు. సరే నేను కూడా పనిచేస్తే కాస్త ఊరటగా వుంటుందనుకున్న ఆమెను గడప దాటనీవడు. ఏంటో ఈ మనిషి అనుకుంటూ టీవీ కట్టేసి అన్నం వడ్డించడానికి అక్కడి నుండి కదిలింది. ముద్ద చేతిలోకి తీసుకోవడం...మూతి దగ్గరకు రాగానే తూలడం జరుగుతోంది. చూసి చూసిన నిర్మల తనే నోటికి అందివ్వడానికి ప్రయత్నించింది. ఆమె చేతిని విసురుగా కొట్టి ‘తీయే...నీయ...అని తిడుతూ తోసేశాడు. “ఆసుపత్రికి వెళ్ళావా?” అడిగాడు ప్రతాప్ “ఆ” ముక్తసరిగా సమాధానం ఇచ్చింది నిర్మల. “స్కానింగు చేసిందా డాక్టరు..పిల్లనా? పిల్లోడా? ఏమైనా చెప్పిందా?” “ఆ చేసింది...కానీ ఎవరనేది చెప్పనంది. మళ్ళీ ఇంకోసారి అడిగితే బావుండదని గట్టిగా చెప్పింది” కంచంలో చేయికడుగుతూ నాలిక మడత పెట్టి “ఈతూరి గనక మగపిల్లోడు కాక మళ్ళీ ఆడపిల్ల పుట్టిందో...నీయ...చంపేత్తాను నిన్నూ, ఆ పుట్టిందాన్ని ఏమనుకున్నావో”. అంటూ అక్కడి నుండి కదిలాడు. ఆ మాటలకు కడుపులో వున్న పసికందు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డట్టు అనిపించింది నిర్మలకు. లోపలి కదలికలకు. అదేమన్నా నా చేతిలో వుందా నీ మూర్ఖత్వం కాకపోతే అని మనసులోనే గొణుక్కుంటూ తను తినటం ముగించింది. ఆమె లోపల గదిలోకి వెళ్లేసరికి ప్రతాప్ మంచం పై బోర్లా పడిపోయుండడం చూసింది. నిట్టూరుస్తూ వచ్చి నిద్రపోతున్న తన మూడేళ్ళ కూతురు పల్లవి పక్కన పడుకుంది. తన కడుపుపై చేతితో నిమురుకంటూ నువ్వూ నిజంగా ఆడపిల్లవైతే నిన్ను ఆ దేవుడే కాపాడుకోవాలి అని మనసులో అనుకుంటూ ఎదురుగా వున్నా దేవుడి ఫోటోలకు దండమెట్టుకుంది. రాత్రి తొమ్మిది గంటలు : ప్రభుత్వాసుపత్రి లేబర్ రూంలో పురిటినొప్పులతో గట్టిగా అరుస్తోంది నిర్మల. బయట ఆమె భర్త వున్నాడు. కాన్పు కష్టమయితే ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయడానికి కూడా డాక్టర్లు సిద్ధంగా వున్నారు. అలా మరో గంట వేదన అనుభవించాక ప్రసవం జరిగింది. పుట్టిన ఆ పసికందును చేతిల్లోకి తీసుకొని “ఆయ్ ఆడపిల్ల!” అంది నర్సు. మగతలో వున్నా నిర్మల విని ఉలిక్కిపడింది. విషయం తెలిస్తే తన భర్త నుండి వచ్చే ప్రతిస్పందన ఎలా వుంటుందో వూహించుకోవదానికే భయపడుతోందామే. నర్సు పాపాను ఎత్తుకొని చూపిస్తూ తనని చూడమంది. చూడు చూడు నీ బిడ్డ ఎంత ముద్దుగా వుందో...బొమ్మలా వుంది అని చూపించబోయింది. ఉబికివస్తున్న కన్నీళ్ళను చూపించలేక తల పక్కకు తిప్పుకుంది నిర్మల. బొడ్డు తాడును కత్తిరించి బిడ్డను తీసుకెళ్ళి శుభ్రపరిచి తిరిగి నిర్మల వున్న మంచం దగ్గరకు తెచ్చింది నర్సు. “ఆయ్ బుజ్జీ ఇదిగో మీ అమ్మ...అమ్మ పక్కన బజ్జోమ్మ” అంటూ నిర్మల పక్కన పడుకోబెట్టింది. అబ్బా ఏమిటీ వెలుతురు...అంతా కొత్తకొత్తగా వుంది. ఇన్నాళ్ళు అమ్మ కడుపులో హాయినా వున్నాను. ఇప్పుడే కదా బయటపడ్డాను. ఇక ఒక్కొక్కరినీ పలకరించాలి. ఈ లోకానికి నన్ను నేను పరిచయం చేసుకోవాలి. అమ్మా...అమ్మా చూడు...నేను నీ పక్కనే పడుకున్నాను. చేత్తో తడుతున్నాను...ఓసారి చూడు! అమ్మయ్య చూశావా...నువ్వేనా నన్ను కన్న అమ్మవి. అయ్యో ఎందుకేడుస్తున్నావ్? నాన్నా మళ్ళీ ఆడపిల్ల పుట్టిందని గొడవ చేస్తాడనా? లేదులే...నన్ను చూశాక బంగారు బొమ్మ పుట్టిందని అన్నీ మరచిపోతారాయన. అయినా ఆడపిల్లగా పుట్టడం నా తప్పామ్మా...అది నా చేతుల్లో లేదు కదా...నువ్వా కావాలని చేసిందీ కాదు. మరి నాన్నకు ఎందుకంత కోపం మనిద్దరి మీద. ఏంటి అలా చూస్తున్నావ్? ఈ విషయం నాకెలా తెలుసనా...నేను నీ కడుపులో వున్నప్పటి నుంచే అన్నీ వింటున్నానుగా. అవును అక్క ఏదీ? అమ్మమ్మ ఇంటికి పంపించావు కదా? వస్తుందా నన్ను చూడడానికి? అసలు నేను బావుంటానా? అక్కనా? మిలమిలా మెరిసే కళ్ళతో తననే చూస్తున్న పాపాయిని చూస్తుంటే తనతో ఏదో మాట్లాడుతున్నట్టు, అడుగుతున్నట్టు, అనిపించింది నిర్మలకు. ఆప్యాయంగా చేతితో తడుముతూ “చిట్టితల్లీ నిన్ను తనివి తీరా చూద్దామంటే, కన్నీటి పొర అడ్డుపడి సరిగ్గా కనిపించటం లేదని” మనసులోనే కుమిలింది. ఇంతలో నర్సు వచ్చింది. వస్తూ “ఏంటి మీ ఆయన...పాప పుట్టింది చూద్దువుగానీ రా అని పిలిస్తే వినపడనట్టు వెళ్ళిపోయాడు.” అది విన్న వెంటనే మళ్ళీ దుఃఖం తన్నుకొచ్చింది నిర్మలకి. సమాధానం ఇవ్వలేక అలాగే నీరు నిండిన కళ్ళతో నర్సును చూస్తుండిపోయింది. “అంటే ఏంటి...ఆడపిల్ల పుట్టిందనా..ఏం...ఆడపిల్ల ఎందులో తక్కువ? బాగుంది చోద్యం” అంటూ పాపకు పాలు పట్టుమని చెప్పి వెళ్ళిపోయింది నర్సు. అదీ అలా అడుగమ్మా నాన్న వచ్చినప్పుడు. అసలు నాన్నా వస్తాడా? నన్ను చూస్తాడా...ఇక్కడే వదిలేసి రమ్మంటాడ..నన్ను వదిలివెళ్ళకమ్మా..నీతోపాటు ఇంటికి తీసుకెళ్ళు. నేను అక్కను చూడాలి. అక్కతో ఆదుకోవాలి. అరే నాకేమి అవుతోంది. ఓ... నాకిప్పుడు ఆకలేస్తోంది అనుకుంటా...మరి నేనిప్పుడు ఏమి చేయాలి..అయ్యో నాకెడుపొస్తోంది.... బిడ్డ ఏడుపు విని చ్చు...చ్చు. లేదు...లేదమ్మ భూమి మీద పడగానే నీకు ఎన్ని కష్టాలో కదా...ఏంటో అని అనుకుంటూ సరే పాలుతాగు అని తన స్తన్యాన్ని బిడ్డ నోటికి అందించింది నిర్మల. పాలుతాగుతున్న తన బిడ్డ తలపై ముద్దుపెట్టుకుందామె. మరో అరగంటలో ప్రస్తూతి వార్డులోకి మార్చారు ఆమెని. ఆ వార్డులో ఇంకో ఇద్దరితో పాటు తను మూడవ బాలింత. పాపకు పాలు పట్టుతూ అలాగే నిద్రలోకి జారుకుంది నిర్మల. పొట్టనిండా పాలుతాగిన ఆమె బిడ్డ కూడా పక్కన తనని అట్టిపెట్టుకొని నిద్రపోతోంది. పూర్తిగా తెల్లారడానికి ఇంకో గంట సమయం వుంది. ఎవరో చేత్తో తడుతున్నట్టు అనిపించి ఉలిక్కిపడుతూ కళ్ళు తెరిచింది నిర్మల. ఎదురుగా ఆమె భర్త ప్రతాప్. “వుష్...నేను చెప్పేది విను. ఆ పుట్టినదానిని ఇక్కడే వదిలేసి వచ్చేయ్ ఇట్నుంచి ఇటే పోదాం. బయట ఆటో రెడీగా వుంది.” అన్నాడు తనకు మాత్రమే వినపడేట్టు. భయంగా చూస్తూ “బిడ్డ...బిడ్డను వదిలేసి నేను రాను” అంది నిర్మల పళ్ళు పటపటమని కొరుకుతూ “చంపెత్తా నిన్నూ, దాన్ని ఏమనుకున్నావో. ఆడపిల్ల పుడితే ఏమవుతుందో ముందే చెప్పా కదా. ఇందుకే కదా నువ్వు ఆసుపత్రిలో చేరిన ఇషయం ఎవరికీ చెప్పలేదు. మీయమ్మ, మాయమ్మ వాళ్ళు అడిగితే పుట్టింది పురిట్లోనే చచ్చింది అని చెప్పొచ్చు. పదపద మళ్ళీ నర్సు వస్తుంది.” అంటూ తొందరపెట్టాడు. ఏమీ మాట్లాడక అలాగే భయంగా చూస్తుండిపోయింది నిర్మల. “ఏందే అట్లా చూత్తావుండావు. ఇది ఏమవుతుందనా? దీన్ని ఎక్కడోచోట వదిలేయమని ఆయమ్మకు చెప్పాలే....అయిదొందలు కూడా ఇచ్చా. లెగు లెగు తెల్లార్తుంది” అంటూ తన పెళ్ళాన్ని గుంజాడు ప్రతాప్. ఆ గుంజుడికి మంచం మీద నుండి కింద పడబోయింది. తన రెండు చేతులను ఆమె భుజాలకింద వేసి పట్టుకొని బిరాబిరా లాక్కెళ్ళాలని చూశాడు. చీర సర్దుకుంటూ వెనక్కి తిరిగి మంచంపైన వున్న బిడ్డను చూసి “వదులు నీవు చెప్పినట్టే చేస్తా. ఒక్కసారి బిడ్డను చూసి వస్తా” అంటూ విదిలించుకుంది నిర్మల. చేసేదేమీ లేక ఆమెను వదిలేశాడు. మంచం దగ్గరకు పోయి నిద్రపోతున్న తన బిడ్డ పక్కన కూర్చొని తల నిమిరుతూ, “ఆడపిల్ల వద్దనుకుంటున్న ఇంట, నా అమ్మతనాన్నే వదిలేసుకుంటున్నా...అమ్మనే కానీ దానికంటే ఒకరికి ఆలిని, ఆర్ధిక స్తోమత లేనిదాన్ని. తల్లీ! నిన్ను నిర్జీవిగా చూడటంకన్నా, పరజీవిగా చూడటమే మేలనుకొని నిన్నొదిలి వెళ్తున్నా,....క్షమించరా కన్నా...నాకు వేరే దారీలేదు ఇంత కన్నా. మీ అక్క కోసమైనా నేను బ్రతకాలిగా. నిన్ను ఏ ధర్మాత్ముడో ఆదరించాలని కోటి దేవుళ్లకు మొక్కుకుంటున్నాను” అంటూ కట్టలు తెంచుకొని వస్తున్న దుఃఖాన్ని నోటిలోకి చీరకొంగును కుక్కుకొని అతి కష్టంగా ఆపుకుంటూ కూతురి నుదిటిపై ముద్దుపెట్టుకొని పైకిలేచి ఇక తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. తొమ్మిదినెలలు మోసి కన్నందుకు తొమ్మిది గంటలు కూడా అమ్మగా లేకుండాపోయానని కడుపుకోతను భరిస్తూ వెళ్ళిపోయింది నిర్మల. ఆఫీసుకు పోవడానికి : హడావుడిగా తయారవుతున్నాడు కైలాష్ నాథ్. అప్పటికే రెండుసార్లు ఫోన్ చేశాడు అతని పై ఆఫీసరు ఇంకా రాలేదేమని. ఇన్స్పెక్షన్ వుంది తొందరగా రమ్మని కేకలేశాడతను. ఇదిగో పావుగంటలో మీ ముందు వుంటాను అని హామీ ఇచ్చాడు. కైలాష్ ది టవును ప్లానింగ్ ఆఫీసులో గుమాస్తా వుద్యోగం. “ఏందీ నీ హడావుడి? ఎక్కడికి పోతున్నావ్ ఇంతపొద్దున్నే. అదేదో క్షణం తీరికలేదు దమ్మిడి ఆదాయం లేదు అన్నట్టుంది నీ యవ్వారం. పైసా పై ఆదాయం లేదుకదా జీవితానికి...పెద్ద నిజాయితీ పరుడు బయలుదేరాడు నా ప్రాణానికి...హ్మ్” అంటూ విసుక్కుంది అతని భార్య గంగా భవాని. ఇది రోజూ వుండేదే కదా అనుకుంటూ తన మానాన తాను తయారవుతున్నాడు కైలాష్. “ఏందయ్యా ఏమీ వినపడనట్టు నటిస్తున్నావు. నువ్వు యాటికైనా పో గానీ వచ్చేటప్పుడు రెండు మంచి జరీ చీరలు పట్టుకురా. రేపటి నుండి నవరాత్రులు. ఇరుగుపొరుగోళ్ళు పేరంటానికి పిలుస్తారు. పాత చీరతో వెళ్ళలేను” అంది. ఏమీ మాట్లాడకుండా తయావుతున్న అతడిని “ఏంది ...వినపడుతోందా?” అని గద్దించింది. “ఆ ...ఆ సరేలేవే” అంటూ అప్పుడే నిద్రలేచి మంచంపై కూర్చొన్న తన ఇద్దరి కొడుకులను చూసి, దగ్గరకు వచ్చి “ తొందరగా రెడీ అయి స్కూలికి వెళ్ళండి నాన్నా. ఈ రోజు మిమ్మల్ని అమ్మ వదిలిపెడుతుంది. బై నాన్నలు” అంటూ ఇంటి గడపదాటాడు. వారి ఇద్దరి కొడుకుల్లో పెద్దవాడు అభిషేక్ నాల్గవ తరగతి, రెండోవాడు కార్తిక్ రెండవ తరగతి చదువుతున్నారు. తొలిసారి మగబిడ్డ పుట్టినా మల్లిసారి అయినా అమ్మాయి పుట్టాలని ఎంతో కోరుకున్నాడు కైలాష్. కానీ తానొకటి తలిస్తే దైవమొకటి తలచాడని అతనికి రెండవసారి కూడా అబ్బాయే పుట్టాడు. తన మోపెడ్ పై వెళుతున్నాడు కైలాష్. తను వుండే సందులోంచి కుడివైపు తిరిగాడు. ఆ సందులోకి ప్రవేశించగానే రోడ్డు పక్కన కొంతమంది మనుషులు గుమిగూడి వుండడం గమనించాడు. తన మోపెడ్ వేగం పూర్తిగా తగ్గించి ఏమైందని అక్కడ నిల్చొని చూస్తున్న మనిషిని అడిగాడు. “పసిబిడ్డను ఎవరో ఫుట్పాతుపై వదిలి వెళ్ళారంట ఇప్పుడే!” సమాధానం ఇచ్చాడతను. అవునా...అయ్యో అంటూ తన మోపెడ్ను పక్కకు తీసుకొని స్టాండ్ వేసొచ్చి జనం మధ్యనుంచి ముందుకు వచ్చాడు కైలాష్. రోజూ చెత్త వూడ్చే మునిసిపాలిటీ ఆమె ఏదో వివరిస్తోంది అక్కడున్న వారికి. ఎవరు వదిలేసి వెళ్లారని అడిగాడు కైలాష్ ఆమెని. “ఏమో సారూ ! నేను ఆ చివరన చెత్త తీస్తున్నాను కదా...ఇంతలో ఏడుపు వినిపించింది. ఎవరాని చూసి వచ్చేంతలోపు ఇక్కడ పడుకోబెట్టి పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయింది ఒకామె. సందు చివరికి వచ్చి చూసేసరికి ఎవరూ కనిపించలేదు. వచ్చి చూస్తిని గదా ఆడపిల్ల. అందుకే వదిలించుకోవాలనుకున్నారేమో. పాపం....” అంటూ సానుభూతి వ్యక్తపరిచింది. అవునా అన్నట్టు తలూపుతూ ఫుట్పాతుపై పడుకోబెట్టిన పసికందును చూశాడు కైలాష్. “ఎంత ముద్దుగా వుంది. ఎలా వదిలించుకోవాలనిపించింది వారికి. మరీ ఇంత కఠినాత్ములుగా తయారయ్యారేంటి మనుషులు. మానవత్వం అన్నది అడుగంటిపోతోంది మనుషుల్లో రోజురోజుకీ” అతని మనసులోని మాటలు అప్రయత్నంగానే నోటినుండి వెలువడ్డాయి. అతని మాటలు విని అక్కడున్న వారు పాప కన్నతల్లి గురించి తలోమాట అనసాగారు. వాటిని వినలేక మళ్ళీ తన ఆఫీసరు ఫోన్ గుర్తొచ్చి మోపెడ్ స్టార్టు చేసుకొని బయలుదేరాడు. నడుపుతున్నాడు కానీ మనసంతా ఏదోలా వుంది అతనికి. ఇప్పుడా బుజ్జితల్లి  పరిస్థితి ఏంటి? కాసేపటికి నాలాగే అందరూ తలోదారి వెళతారు. ఎవరూ పట్టించుకోరు కదా...జాలి చూపారు కదా అనుకున్నాడు. మళ్ళీ వెంటనే నేను చేసిందేమిటి? పాపం ఎప్పుడూ పాలుతాగిందో ఏమో కనీసం పాలు తెచ్చి పట్టలేకపోయానే అని వగచాడు. మళ్ళీ అతని కళ్ళముందు ఆ పసికందు కదిలాడింది. అతని కంట నీరు వూరింది. ఎవరో ఒకరు ఆదరించాలి అనుకుంటున్నానే గానీ ఆ ఒక్కరు నేనే ఎందుకు కాకూడదు. అనుకున్న తడువే ఏమైతే అదయింది ఎలాగైనా ఆ చంటిపాపను కాపాడాలని మనసులో గట్టిగా అనుకుంటూ మోపెడ్ వెనకితిప్పాడు. దారిలో పై ఆఫీసర్ నుండి ఫోన్ వస్తే నేను ఈ రోజు రాలేను...కడపు అప్సెట్ అయ్యిందని చెప్పి పెట్టేశాడు. తను ఇంతకుముందు ఆగిన చోటికి వచ్చాడు. అప్పటికే చాలా మంది వెళ్ళిపోయారు. మిగిలిన ముగ్గురు ఏమి చేయాలిప్పుడు అని తర్జనభర్జన పడుతున్నారు. మరోపక్క పాప గుక్కతిప్పుకోకుండా ఏడవసాగింది. మోపెడ్ స్టాండ్ వేసి దగ్గరకెళ్ళి “అయ్యొయ్యో పసికందును ఇలా ఎలా వదిలేశారో కదా..పాపం. ఆకలేస్తున్నట్టుంది” అంటూ తన రెండు చేతులతో ఎత్తుకున్నాడు. అంతే టక్కున ఆగిపోయింది ఏడుపు. అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు. తన చిన్న చిన్న కన్నులు తెరుస్తూ అతన్నే చూడసాగింది. “ఏమ్మా అలా చూస్తున్నావు? ఆకలేస్తోందా చిట్టిబొజ్జకు. ఇంటికి పోదామా అక్కడ అన్నయ్యలు వుంటారు. వాళ్ళతో ఆడుకుంటూ పాలుతాగుతావా మరి” అన్నాడు. “మీలో ఎవరైనా నా బండిని మా ఇంటివరకు తీసుకువస్తారా? ఇక్కడే మా ఇల్లు.” అని అడిగాడు అక్కడున్న వారినుద్దేశించి. “హలో ...ఏంటి ఈ పాపను మీరు తీసుకువెళతారా...ఎందుకు అనవసరంగా రిస్కు. వదిలేయండి. పోలీసులకు చెప్తే వారే వచ్చి చూసుకుంటారు” అన్నాడు అందులో ఒకతను. “మనం పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళు వచ్చి విచారణ జరిపెసరికి చాలా టైం పడుతుంది. ముందు పాపకు పాలు పట్టి తన బొజ్జ నింపితే ఆ తరువాత ఆలోచించవచ్చు ఏమి చేయాలన్నది” చెప్పాడు కైలాష్. కాసేపయ్యాక సరే నేను వస్తాను పదండంటూ ఇందాక మాట్లాడిన వారు కాకా ఇంకొక వ్యక్తి ముందుకువచ్చాడు. అతను  బండి నడిపిస్తూ వుంటే పాపను ఎత్తుకొని వెనక కూర్చున్నాడు కైలాష్. ఆ వచ్చేదారిలో ఎన్ని అవాంతరాలనైనా ఎదురవనీ వాటిని ఎదుర్కొని ఈ పాపను చట్టపరంగా దత్తతతీసుకొని పెంచుకోవాలని. ఆడపిల్ల లేని లోటును తీర్చుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు కైలాష్ నాథ్. అతని మనసులోని విషయాన్ని గ్రహించినదై తన రెండు చేతులనూ దగ్గరికీ తీసుకుంటూ అతనికి నమస్కారం చేసింది ఆ ఆడపిల్ల. ఆడపిల్ల పుట్టిందని గర్విద్దాం!...............ఆడపిల్ల ఆస్తిత్వాన్ని కాపాడుదాం!   

జీవనరాగం – కలలతీరం

జీవనరాగం – కలలతీరం డి. లలిత పెరట్లో .....పారిజాతం, నందివర్ధనం చాన్నాళ్ళకు కలిసిన అక్కచెల్లెళ్ళలాగా కొమ్మలు పెనవేసుకుని అందినంతమేరా నేలమీద నీడను పరిచాయి. ఆ పలచటి నీడలో  నాపరాయిబల్లమీద కూర్చొని  ఒళ్ళోఉన్న రాగిపళ్ళెంలోంచీ  నాలుగేసి దళాలు గుత్తిలా అమరుస్తూ తులసి మాల అల్లుతుంది సీతాదేవి. ఆవిడ నిర్లక్షంగా వదిలేసిన  చీరచెంగూ నేలమీద జీరాడుతుంది. అన్యమనస్కంగా అల్లిన జడ పాయలు విడిపోయివుంది. కొమ్మల్లు కదిలినప్పుడల్లా ఆకుల సందుల్లోంచీ  పడుతున్న ఎండకు ఆవిడ తలలో అక్కడక్కడా పరుచుకున్న తెల్లని  వెంట్రుకలు  వెండితీగల్లాగా  చటుక్కున మెరుసి ఆరుతున్నాయి. ఆవిడ మనసంతా గందరగోళంగావుంది. తొలిపొద్దునూ, నులివెచ్చని కిరణాలను, దూరం నుంచీ గాలివాలుకు ఆగాగి వినవస్తున్న ఘంటసాల గాత్రాన్నీ  దేన్నీ ఆవిడ గుర్తించేలాలేదు. తెల్ల తెర వారుతున్నవేళ  రంగులు చిమ్ముకుంటూ వచ్చి వెళ్ళిన ఆ కలనే ఆవిడ పదే పదే  నెమరేస్తూ.....కొంత ఆందోళనా  మరికొంతా ఆలోచనా కలగలిసిపోగా  దిగులుగా  నిట్టూర్చి తలవిదిలించింది. కానీ కల రాలిపడలేదు ఇంకా అలానే  వేళ్ళడుతూవుంది. ఆకాశం నుంచీ తానున్న ఎత్తుకు దిగి వచ్చింది ఇంద్రధనుస్సు. అసలేమాత్రం ఆకర్షణ లేని  మట్టిరంగు రెక్కల పురుగులు ఆ ఇంద్ర ధనుస్సులోనికి వెళ్ళి సప్తవర్ణాలు పులుముకుని ఎగురుతూ బయటికొస్తున్నాయి.  వాటి  రంగుల చెమ్మ తనకి అనుభూతిలోకి వస్తుంది. వేళ్ళతో తాకిచూడాలని ప్రయత్నిస్తుంది తాను. ఎంత ప్రయత్నించినా చేయి కదపలేకపోతుంది. సాలెగూడు లాంటి  సన్నని దారం తన చేతిని బలంగా చుట్టి పట్టుకుంది. కళ్ళు తిప్పిచూస్తే తెల్లని పావురాలగుంపు శ్రావ్యంగా పాడుతున్న రంగుల పక్షిచుట్టూ చేరి కువకువల కోరస్ అందిస్తున్నాయి. తనకి తెలిసిన రాగమేదో తనూ పాడబోయింది. గొంతు చుట్టూ బిగుసుకునుంది అతి సన్నని దారం. బంగారు రంగులో మెరుస్తున్న పట్టుదారంలా వుంది. నిరాశతో కూలబడింది. కొలనులోంచీ బయటికి ఎగిరొచ్చిన  చేపలు  కోతులతో కలిసి చెట్లెక్కడం నేర్చుకుంటున్నాయి. పక పకా నవ్వాలనుకుంది. పళ్ళు బయటపడ్డాయి కానీ నవ్వు కళ్ళలోనే దాక్కుండిపోయింది. అక్కడ కుందేలూ తాబేలూ పరుగుపందెం ఆపి కులాసాగా కబుర్లాడుకుంటున్నాయి. అటు పరిగెత్తి ఆ కబుర్లు తానందుకుని తన దగ్గరున్న మూటలో కబుర్లు వాటికి పంచాలనుకుంది.  రెండుపాదాలూ భూమిలో దిగబడిపోయాయి  ఇంకెలా కదులుతుంది. ఒక నీడ తన దగ్గరగా వచ్చింది ...తాను చేతులెత్తింది పైకి లాగమని ...... కానీ ఆ నీడ తన రెండు చేతులనీ  కలిపి కట్టేసి, తలకి నల్లని ముసుగు వేసేసి బరువుగా తన మీద పడుతుంది. వద్దొద్దు....నన్నలా తాకొద్దు నాకు కంపరంగావుంటుంది.....అయ్యో నా కాళ్ళే కాదు, కళ్ళూ చెవులూ, నోరు గొంతూ అన్నీ మూసుకుపోయాయి ....నాకు ఊపిరాడ్డంలేదు   నన్ను ఇక్కడినుంచీ బయట పడేయండి ....... గాలి తగలకపోతే నేను చచ్చిపోతాను. కావాలంటే నా కాళ్ళూ చేతులూ, కళ్ళూ చెవులూ అన్నీ బంధించెయ్యండి. నోరు కూడా గట్టిగా కుట్టేయండి కానీ .....నాకు  గాలి కావాలి....నేను ఊపిరి పీల్చుకోవాలి.... నేనీ బరువును మోయలేను...... ఎవరో ఒకరు రండి .... విదిలించుకుంటూ అరుస్తున్నానుకుంది ...ఊహు మూలుగుతుంది......సన్నగా దిగులుగా ....మరో చెవికి సోకనంత  నిశ్శబ్ధంగా ......ఇతరులెవరూ  కనిపెట్టలేనంత రహస్యంగా ......... మూలుగుతుంది .... ”వద్దొద్దు”......పెనుగులాడుతూ మూలుగుతుంది . “ ఛీ...ఛీ.... దరిద్రం...రోజూ ఇదే ఏడుపు .. .....పో .....పోయి అవతల గదిలో అఘోరించు ఈ మాత్రానికి ఇక్కడెందుకు ....మంచం ఇరుకు చేసుకోటం  " నిన్నే...." భుజం పట్టుకు తోసినంత పని చేస్తే ...  చప్పున కళ్ళు తెరిచి, కలలో ఉందో నిజంలో పడిందో తేల్చుకోలేక ఒక్క క్షణం నిశ్చేస్టురాలయిపోయింది. వెల్లకిలా పడుకుని  ముఖం చిట్లించి నోరు పడేసుకుంటున్న భర్తని చూస్తూనే  గాఢంగా గుండెలనిండా ఊపిరి తీసుకుంది. అలవాటయిన ఈసడింపుని  ఆనవాయితీగా  విదిలించుకుని  చీర సర్దుకుంటూ హాల్లోకొచ్చి పడింది. ఏంటో !! ఆ కల అలావుంది. కలలో రంగులూ ...రాగాలూ....ఆటలూ .....అరమరికలు లేని స్నేహాలూ ......అన్నీ బావున్నాయి కానీ.....తనకేవయిందీ ?  ఎవరితోనూ కలవలేక అలా వొంటరిగా నేలలో కూరుకుపోయి.......అవునూ ఆ నీడెవరిదీ??....తనకి సాయం చేయకపోగా  అదేం పని !!......వచ్చింది పీడకలో రంగుల కలో అర్ధం కాలేదు ఆమెకి. ఈ క్షణం వరకూ అదే ఆలోచిస్తుంది ఏ వందసార్లో రంగుల రాట్నం తిరిగినట్టూ అలా ఆమె  మస్తిష్కంలో తిరుగుతూనే వుందా కల. పూర్తయిన మాలను చూసింది. ఖాళీ ఖాళీగా అక్కడక్కడా ముడులు మాత్రమే కనిపిస్తూ  కొన్ని చోట్ల సాగదీసినట్టూ  .....!! చిన్నప్పుడు  నాన్నమ్మ తిట్టేది. పాపిడి తిన్నగా రానప్పుడూ, ముగ్గు వంకరగా వేసినప్పుడూ , గోరింటాకు ఎర్రగా పండకపోయినా  తిట్టేది. అవన్నీ కుదురుగ్గా వస్తేనే .... కాపురం  కుదురుగా సాగుతుందట. చేతులు ఎర్రగా పండించుకోవు. వెంటనే కడిగేసుకుంటావు ....ఓర్పూ నేర్పూ లేకపోతే మొగుణ్ణేం సుఖపెడతావు అనేది. పువ్వులు అందంగా వత్తుగా సరి సమానంగా మాల కట్టే అమ్మాయి సంసారాన్ని కూడా అలానే ఒద్దికగా చేసుకుంటుందట. సాధించి మరీ నేర్పించేది అవన్నీ. తనకేమో అన్నీ అల్లిబిల్లిగా ఉంటే ఇష్టం, కుదురులో ఒక పద్ధతిగా పెరిగే మొక్కల కన్నా తనకి నచ్చినట్టూ స్వేచ్చగా, పందిరంతా అల్లుకుపోయే పూల తీగలంటే ఇష్టం.  అయినా తన ఇష్టం ఎప్పుడు చెల్లింది. దుర్గ తో స్నేహం చేస్తే  నప్పేది కాదు. ”శూద్రపిల్ల తో స్నేహం ఏంటే  సీతా “ అని కోప్పడింది.  “ఇంకోసారి మా పిల్లతో కనిపిస్తే కాళ్ళిరగ్గొడతాను” అని భయపెట్టింది. తనకిష్టమని దుర్గ తెచ్చి పెట్టే మామిడి తాండ్ర, మాగాయ ముక్కలు  తినకుండా చేసింది.  దుర్గతో కలిసి కంచెల్లో పండే పుల్లరేగుపళ్ళూ, వాక్కాయలూ, చేలల్లో చెట్లెక్కి కోసుకునే యలక్కాయలు  అన్నిటికీ దూరం చేసింది. ఎవరి పెరట్లోంచో అలుపులేకుండా కూసే  కోయిల స్వరానికి బదులిస్తూ కూ....అంటే, కూ....అని  కోకిలని రెచ్చగొట్టడం తనకి  ఎంతిష్టమని. నాన్నమ్మ వింటే “హుష్....తప్పూ ఏంటా నోరెట్టుకుని అరవడం”  అని కసిరేది. తొమ్మిదో తరగతిలో ఉండగా కదూ ఎంత మొత్తుకున్నా వినకుండా చదువు మానిపించేసాడు నాన్న. “తల్లి లేని పిల్లని గారాబం చేస్తే రేపు మనం బాధ పడ్డా ప్రయోజనం ఉండదు“ అని   నాన్నమ్మ వంత పాడింది . చదువూ, ఆటలూ అన్నిటినీ వదిలేసుకుని  ఎందుకు తింటుందో  ఎందుకు  పెరుగుతుందో తెలియని ఆ రోజుల్లో  ఆ రేడియో అబ్బాయి  ......పక్క పోర్షన్ లో దిగాడు.  కిటికీకి దగ్గరగా తనకి వినిపించేలా పెద్ద సౌండ్ తో పాటలు పెట్టేవాడు. ఇవతల గోడకి జారబడి తను పాటలు వింటున్నట్టూ  ఎలా కనిపెట్టాడు!! ఒకరోజు  రెండు పుస్తకాలు కిటికీలోంచీ విసిరేసి పోయాడు. ఒకటి ' కృష్ణ పక్షం '   ఒక కవిత ఇప్పటికీ గుర్తుంది తనకి. "నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గూ నా ఇచ్చమే గాక నాకేటి వెరపు" ........ “పక్షి నయ్యెద చిన్ని ఋక్ష మయ్యెదను మధుప మయ్యెద చందమామ నయ్యెదను మేఘ మయ్యెద వింత మెరపు నయ్యెదను అలరు నయ్యెద చిగురాకు నయ్యెదను” చదవుతుంటే ఎంతో బావుంది. కానీ అలా అయిపోవడం ఎలా కుదురుతుందీ ........వీధరుగు మీంచి చెంగున దూకాలన్న  చిన్న సరదానే తీరడంలేదే తనకు ఆ రేడియో అబ్బాయిని  ఇంటికి పిల్చి, మండువాలో బల్లమంచం మీద కూర్చోమని, తినడానికి గవ్వలో జంతికలో పెట్టీ ....అప్పుడు  ఆ కవితలన్నీ పెద్ద గొంతుతో చదువుతూ అదెలా సాధ్యమో  అడగాలని పేద్ధ కోరికగా ఉండేది తనకి. ఆ కోరిక తీరకపోగా  అసలుకే మోసం వచ్చింది. ఆ రెండో పుస్తకం నాన్న కంట పడింది "ప్రేమలేఖలు" కావల్సి వచ్చాయేనీకు .....అంటూ  ప్రారంభించి  తన మెళ్ళో మూడు ముళ్ళూ  వేయించి కానీ ముగించలేదు. “బాబూ...పిల్లని ఎంతో పద్ధతిగా పెంచాం. వంచిన తలెత్తడం మాటకి మాట ఎదురాడ్డం దానికి చాత కాదు. నువ్వెలా చెపితే అలా నడుచుకుంటుంది. తల్లిలేని పిల్ల అన్నీ నువ్వే నాయనా జాగ్రత్తగా చూసుకో వాలి “ అంటూ ....మరో నాలుగు ముళ్ళేసి  పోయిందా పెద్దావిడ. వంటింట్లో గిన్నెలు కొట్టుకున్న శబ్ధంతో సీతదేవి  ఆలోచనలు తెగిపడ్డాయి. “రాత్రి తీరని ఆకలికి పొద్దున్నేపుట్టిన ఆకలి తోడయ్యింది. ఇక శివాలే ....” అనుకుంటూ కదిలిందామె. నేతితో వేయించిన పెసరట్టులో జీడిపప్పు ఉప్మా సర్ది  పేపర్లో మునిగిన భర్త ముందుంచింది. “పెసరట్టు మాడింది“ అన్నాడాయన ఆవిడ ఎటో చూస్తూ నుంచుంది "ఒకటి చాలదా ....రెండు టిఫిన్లు ఎందుకూ దండగా" అన్నాడు ఉప్మా జరిపేస్తూ ..... "కలిపి తింటే బావుంటుంది ...." "ఈ వయసులో అరిగి చావొద్దూ ...." అన్నాడు పెసరట్టు నోట్లో కుక్కుకుంటూ "రాత్రి తగ్గిన వయసు తెల్లారేపాటికి పెరిగిపోయిందా..." అనాలనిపించినా అనలేదు. ఎదురు మాట్టాడం రాదని ఆ నాడెపుడో నాన్నమ్మ చెప్పిన మాటని ఈ నాటివరకూ నిజం చేస్తూ వచ్చింది ఆవిడ. టి. వి. లో వస్తున్న దరిద్రపు ప్రకటనని తదేకంగా చూస్తున్నాడతను .  రోజుకో కేప్సూల్ మింగితే నవ మన్మధులయిపోవచ్చు అని ఊరిస్తూ చెపుతుంది అమ్మాయి. తన కలలో చేపలకి చెట్లెక్కడం నేర్పిస్తున్న కోతి పిల్ల గుర్తొచ్చింది. ఈ టైముకే సంగీత విభావరి ప్రోగ్రాం వచ్చేది. అతడు  త్వరగా తిని స్నానాకి లేస్తే తను ఛానెల్ మార్చుకోవచ్చని చూస్తుంది ఆవిడ. బ్రేవ్ మంటూ త్రేంచి......ప్లేటు ఆవిడకి అందిచి తాను పేపరు అందుకున్నాడు. రిమోట్ వొళ్ళోనేవుంది. అతను చూడటం లేదు కదా అని  తనకి నచ్చిన ఛానెల్ పెట్టుకుని  చివాట్లు తింది ఒకసారి. ఆరోజు కళ్ళల్లో పొంగుతున్న నీటినీ, గొంతులో ఉబుకుతున్న దుఖాన్నీ ఆపుకోటానికి  పెద్దగా కష్టపడలేదు. ఎందుకంటే అది ఆవిడకి  అలవాటయిపోయింది ఉల్లిపాయ ఘాటులాగా. వంటేం చేసావ్ అని  ఆయన అడగడానికీ.......లేదా, భోజనానికి లేవండి అని ఆవిడ  అనడానికీ మధ్య మూడు గంటల  పాటు వాకిట్లో కాకులగోల  టి.వి. లో వార్తల గోల తప్ప మిగిలిందంతా నిశ్శబ్ధమే. "మీవారు భలే సరదాగా మాట్లాడతారండీ "అంది అప్పుడెప్పుడో ఒకావిడ, రోడ్డుమీద కూరలబండి దగ్గర పరిచయం తనకీ ఆమెకీ .......” అవునా !!“ అని హాస్చర్యం ప్రకటించాలనిపించింది కానీ నవ్వేసి ఊరుకుంది తను. తాను పిల్లని ఎత్తుకొచ్చాకా కదూ ... అతని దగ్గరికి ఆఫీస్ పనిమీద ఒకతను వస్తూవుండేవాడు. "అతను నవ్వు ఎంత స్వచ్చంగా ఉంటుందో కదండీ......నోరంతా తెరిచి నవ్వుతుంటే ఆ చిన్ని కళ్ళు మరింత చిన్నవయిపోతాయ్ అతన్నలా చూస్తూ మనం నవ్వకుండా వుండలేం"... అంది అబ్బురంగా. ఆ తర్వాత ఎప్పుడూ మళ్ళీ ఆ నవ్వు తన కళ్ళపడలేదు ..... ’ఏవయ్యిందానవ్వు‘ అని తనూ ఆరా తీయలేదు. అతనేవిటో ఏ మాత్రం తెలియని కొత్తల్లో ఓ రాత్రి డబామీద పక్కలేసింది. ఎందుకు చేయాలనిపించిందో అలా, తలలో పెట్టుకునే పువ్వుల్ని తలగడ మీద జల్లింది. వెల్లకిలా పడుకుని చందమామతో మేఘాలు ఆడుతున్న దోబూచులు చూస్తుంది పవిటని గాలికి వదిలేసి  “ ఏంటీ వేషాలు ఇవన్నీ ఎక్కడ నేర్చావ్!? “కటువుగా వుందామాట. "తెగ కబుర్లు చెప్పింది మీ నాన్నమ్మ ఆ రోజు ....."  తెల్లగా పాలిపోయిన అతని ముఖం ముందు వెన్నెల నల్లగా ఉందనిపించింది. వెనక్కి తిరిగి చూడకుండా ఒక్క గెంతులో వెళ్ళిపోయాడు. తను చేసిన తప్పేంటో తెలీకపోయినా,  హడలిపోయింది వణికిపోయింది. ఆ భయం ఎన్నాళ్ళో ఎన్నెళ్ళో తనని వీడలేదు. ఇప్పటికీ  దేహంలో ఏదో మూల ఆ భయం అలా ముణగదీసుకుని ఉండిపోయిందేమో కూడా!! మనసూ మనసూ కలిసినప్పుడే పిల్లలు పుట్టే ఏర్పాటు ఆ దేవుడు చేయనందువల్ల .... చూస్తుండగానే ఇద్దరు పిల్లలు పుట్టుకొచ్చారు. పిల్లల పోషణ, ఇంటి సంరక్షణ  తప్ప ఆవిడకి  మరో పని లేదు. ప్రాధమిక అవసరాలు తీర్చుకోటమే పరమావధిగా  జీవితం గిర్రున తిరిగింది. “అమ్మాయిని చదివిద్దాం ....అపుడే పెళ్ళెందుకూ“ అని మాటమాత్రంగా అనగలిగింది కానీ, పట్టుపట్టి ఆపలేకపోయింది.  “నువ్వు నోర్మూసుకో.....ఏం చెయ్యాలో నాకు తెలీదా! పిల్లలముందు తన ప్రతాపం ప్రదర్శించాడు భర్త.” నాన్నకు కోపం తెప్పిస్తావెందుకమ్మా .....నా బట్టలు సర్దావా నేను హాస్టల్ కి వెళ్ళిపోవాలి“.   “నోరుమూసుకుని నీ పని చూసుకో” అనడంలో లౌక్యం చూపించాడు కొడుకు. పండక్కి పుట్టింటికొచ్చిన కూతురు స్నేహితురాలితో మనసు విప్పి మాట్లాడుతుంది. "చదువుకోటానికి అతన్ని ఎలా వొప్పించావ్! ఆ సీక్రెట్ ఏదో నాకూ చెప్పవే"  ఉత్సాహంగా అడుగుతుంది స్నేహితురాలు. మరి మా అమ్మలా అనుకున్నావా ....”  కళ్ళెగరేసి చెపుతుంది కూతురు.” కోతుల్ని ఆడించడానికీ, పాముల్ని ఆడించడానికీ ట్రిక్స్ ఉన్నట్టే ....మొగుడ్ని ఆడించడానికీ కొన్ని ట్రిక్స్ ఉంటాయ్లే” ... అంటూ ఆ స్నేహితురాలి చెవిలో ఏదో చెప్పింది ఇద్దరూ గలగలా నవ్వుతున్నారు. సీతాదేవికి సంతోషం వేసింది. తన కూతురుకి తన పోలిక రానందుకు. మొగుణ్ణి ఆడించే ట్రిక్ ఏదో ఆ పిల్ల నేర్చుకున్నందుకు. ముఖ్యంగా అమ్మలా కానందుకు. ఒక ధనుర్మాసపు సాయంత్రం....... "అన్నీ టేబుల్ మీదే ఉన్నాయి. గంటలో వచ్చేస్తాను. గుళ్ళో స్వామీజీ ప్రసంగ వుందట ...శారదగారితో వెళుతున్నాను" అతనికి రాగల సందేహాలేవో ముందే తెలుసున్నట్టూ వరసగా సమాధానాలు పేర్చుకొచ్చింది. “రోజుకో దొంగ స్వామి భాగోతం బయటపడుతున్నా .....మీరు మారరు. టి.విలోనూ పేపర్లోనూ  ఎందరెందరు సన్నాసుల్ని ఎండగడుతున్నారో ......ఎక్కడ చూసినా దొంగ ముం .....కొడుకులే. అయినా మీలాంటి తెలివి తక్కువ దద్దమ్మలు ఇంటికొకరు బయల్దేరుతుంటే  వాళ్ళననుకోటం దేనికిలే....” పెద్ద ఉపన్యాసమే అయింది.  ఉన్నంతలో మంచిని వెతుక్కుంటూ పోవాలి కానీ, అంతా కుళ్ళే అని కూర్చుంటే ...అడుగు ముందుకు వేయగలమా !! అనుకుని ఆవిడ  గడప దాటుతుండగా కొట్టాడు చివరి దెబ్బ" హు....ఏదో వంకతో ఊరుమీద పడ్డం కావాలి" అతని చేతిలో మస్కిటో బేట్ కి చీక్కిన దోమ కరెంటు షాక్ కి గిలగిల్లాడుతుంటే తలతిప్పుకుంది ఆవిడ. రామాయణంలో సీత రాముణ్ణి వదిలి  వెళ్ళిందా వదిలించుకుని వెళ్ళిందా అన్న సందేహం కలిగిందావిడకి మొదటిసారి. సహనం చచ్చిపోయి కదూ సీత  అతన్ని కాదని అమ్మ వడి చేరిందీ!!.  ఆ మాత్రం తెగింపు తనకెప్పుడయినా కలుగుతుందా ......!!  వెనక్కి వెళ్ళీ అతని చెంప పగలగొట్టాలన్న ఆలోచనని  అతికష్టం మీద నిభాళించుకుని, ఆ ఆలోచనకే లెంపలేసుకుని బయటికి నడిచింది. గుళ్ళో ముందంతా తొడతొక్కిడిగా అనిపించి ఎక్కడయినా వినడమేకదా కావలిసింది  వెనకవైపు కూర్చుంటానని, శారదగారికి చెప్పి గర్భగుడికి వెనకవైపు ఎత్తు గట్టెక్కి కూర్చుంది. అందరూ స్వామీజీని చూడాలనీ, వీలయితే కాళ్ళమీదపడి ఆయన దివ్య ఆశీస్సులతో తమ బాధలన్నీ తొలగించుకోవాలనీ ఉవ్విళ్ళూరుతూ గుడిముందు తోసుకుంటున్నారు. వెనక ప్రశాంతంగావుంది.  ఎదురుగా అద్దాలమండపం ..... గోడకి వరుసగా పేర్చిన అద్దాల్లో తనకి తాను కనిపిస్తూంది. అలా చూస్తుండగానే ఒక్కో అద్దంలోంచీ తను కనుమరుగైపోతుంది. వరుసగా నాన్నమ్మ, నాన్న, భర్త , పిల్లలు ....ఇంకా ఎవరెవరో కనిపిస్తున్నారు. ‘మీరెప్పుడూ ఇంతే నాకు అడ్డుగా నిలబడతారు. తప్పుకోండి మీరంతా... నన్ను నేను చూసుకోవాలి‘ అని అర్వాలనిపించిందామెకు. కానీ అలా అరిస్తే నలుగురూ పోగయిపోరూ ......!! నిస్సహాయంగా అద్దాల్లో కనిపించని తన ప్రతిబింబాన్ని వెతుక్కుంటుంది. "ఇక్కడ కూర్చోవచ్చా" ...తల తిప్పి చూసింది. అచ్చం తను కట్టుకున్న చీరలాంటిదే కట్టుకుందామె. "నువ్వంటే నీకిష్టమేనా .....?" పక్కనే కూర్చొని హటాత్తుగా అంది. సీతాదేవికి అర్ధం కాలేదు ......ఏవంటుంది నేనంటే మీకిష్టమేనా అందా !! "నీకేం కావాలో నువ్వెప్పుడన్నా తెలుసుకున్నావా??" "నీ అశాంతికి నువ్వే కారణం అని ఎప్పుడూ అనిపించలేదా?? "నీ జీవితంలోకి  సంతోషాన్ని ఆనందాన్ని తెచ్చుకోవాలని నువ్వెప్పుడయినా గట్టి ప్రయట్నం చేసావా?? “ఎందుకు తప్పు అందరిమీదా తోస్తావ్ .....నిన్ను నువ్వు నిలుపుకోలేనపుడు ఆ శూన్యంలో ఏదో ఒకటి నిండాలి కదా అలా నిన్ను ఆక్రమించినవాళ్ళే వీళ్ళంతా ...” అద్దాలవైపు చూపించింది. సీతాదేవి ఆశక్తిగా వింటుంది ......  ఎదో మంత్రం వేసినట్టూ రెప్పలు వేయటం కూడా మర్చిపోయి ఆమెనే చూస్తూ వళ్ళంతా చెవులు చేసుకు ఆ అపరిచితురాలిని వింటుంది   సీతాదేవి నీకు గుర్తుందా .....చిన్నప్పుడు చెవి పోగులూ ఎవరూ తెంచుకుపోకుండా నాన్నమ్మ బూచాడు భయం పెట్టింది. ఆ చివరి మెట్టు దిగావో బూచాడు ఎత్తుకెళ్ళి నిన్ను నమిలి తినేస్తాడు అని ఆవిడంటే .....నువ్వక్కడే ఆగిపోయావు. నీ మనసు ఆనవాలు నీకు దొరికేలావుందని  నాన్న కనిపెట్టేసాడు. అందుకే పెళ్ళి చేసి ప్రమాదాన్ని తప్పించానుకున్నాడు.  అక్కడితో నువ్వూ వెతుకులాట ఆపేసావు. భార్యని  తన స్వంత వస్తువుగా భావించడానికి సర్వాధికారాలూ కలిగిన  వాడినని  నీ భర్త  గ్రహించాడు. ఆ అధికారంతో ‘నీలోంచి నిన్నే‘  పూర్తిగా గెంటేసాడు. దాన్ని నువ్వో ధర్మంగా అమలుపరిచావు. ఎప్పుడూ ఏ భావాలూ కనపరచని నువ్వో ‘ఖాళీ డబ్బావి‘ అనుకున్నారేమో పిల్లలు వాళ్ళూ నిన్ను గాల్లోకి తన్ని ఆనందించారు. నా పిల్లలే కదాని నువ్వూ చప్పుడు చెయ్యకుండా పడి ఉండిపోయావు. “ఇంకే చేయగలను.....నాకు విలువియ్యటం మాట అటుంచి ఎవ్వరూ కనీసం నన్నో మనిషిగా అయినా గుర్తించడంలేదు“ జాలిగా నవ్వుతుందనుకుంటే  మెరుస్తున్న కళ్ళతో చల్లగా నవ్వి అంది ..... ఇప్పటికీ ఆలశ్యం కాలేదు. ఈ క్షణమే దాని ఉనికిని కనిపెట్టు. సందేహంగా చూసిందావిడ ’దేన్నీ‘ అన్నట్టూ.... నీలో ఒక ఆత్మవుంది. దాన్ని అణచిపెట్టడం, లేదా పూర్తిగా మాయం చేయడం వేరొకరివల్ల అయ్యేదికాదు. ఇది ఎంతగా నువ్వు గుర్తించగలిగితే అంత గా నీ జీవితం పరిపూర్ణమవుతుంది.  కలిమిలేములతోనూ కష్ట సుఖాలతోనూ సంభంధ లేని ఆనందం నీ సొంతమవుతుంది. సెలయేరులాంటి చల్లని స్వరంతో ఆమె అలా అనునయంగా మాట్లాడుతుంటే సీతాదేవికి  కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. "ఎవరునువ్వూ.....నా చిన్నప్పుడే చచ్చిపోయిన మా అమ్మవా?? " “సీతా ఇంకా అర్ధం కాలేదా .... అమ్మయినా, నాన్నయినా, పిల్లలయినా  ఎవరూ ఒకరికోసం ఒకరు పుట్టరు. ఎవరూ ఎవరికీ పూర్తి తోడవ్వరు .......” నీకు నువ్వే సాయపడాలి  నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. “ఉద్ధరే దాత్మనా త్మానం ఆత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనోబన్దురాత్మైవ రిపురాత్మనః॥“... అనేకదా భగవానుడు చెప్పాడు నీ స్థితికి కారణం నీలో దొరుకుతుంది. నీ మనసును వెతికిపట్టుకో ...అసంతృప్తికి కారణం కనిపెట్టు ......ఇష్టాలకు ఊపిరిపొయ్యి ......కోయిలలా గొంతెత్తి పాడు, నెమలిలా వొళ్ళువిరుచుకుని నాట్యం చెయ్యి,  సీతాకోకచిలుకలా రంగులు నింపుకుని నచ్చిన చోటికి ఎగురుతూవెళ్ళు  .....నలుగురినీ నీతో  కలుపుకో ...... నీలో నువ్వుండు. సీతాదేవికి  మనసూ శరీరం దూదిపింజలా ఉంది. కొత్త వెలుగేదో వెచ్చగా తనని కపినట్టూ హాయిగావుంది. దివ్యమయిన అనుభూతి ఏదో అణువణువూ ఆవరించినట్లైంది. ఏనాడో పోగొట్టుకున్న అపురూప వస్తువేదో అనుకోకుండా కళ్ళపడితే ఎంత విస్మయంగా వుంటుందో అలావుంది. ఆ రాత్రి ..... ఇంద్రధనుస్సు కు ఊయల కట్టి  భూమికీ ఆకాశానికీ మధ్య నిర్భయంగా ఊగుతూంది తను. పంచవన్నెల రామ చిలుక తన భుజం మీద వాలి చక్కిలిగిలి పెడుతుంది. తను సుతారంగా దాని రెక్కల్ని సవరిస్తూవుంది. గాల్లో ఊరేగుతూ వచ్చిన మెత్తని పూరేకులు జలజలా తలబ్రాల్లా రాలుతున్నాయి. ఆ స్పర్శకి పులకించిపోతూ దూరం నించీ వినవస్తున్న సన్నాయిరాగానికి  ముగ్ధురాలై చిన్నగా తల ఊపుతూ కూనిరాగం తీస్తుంది ...... ఆ రాగం మోహన..... కళ్యాణి..... ఆనందభైరవి .....కాదు కాదు అదో కొత్త రాగం .. "జీవరాగం" నుదుటిమీద నిలిచిన  వెచ్చటి పెదవుల స్పర్శ ని  ఇష్టంగా  తడుముకుని  అతనికి దగ్గరగా చేరింది. ******** ఉదయపు నీరెండకి తల ఆరబోసుకుంటూ, చక్కగా తయారయిన చేతిలో మాలను  చూస్తూ అనుకుంది ... ‘ఆ రోజు గుళ్ళో కలిసి, నన్ను నాకు దగ్గర చేసిన ఆమె ఎవరూ. వెళుతూ వెళుతూ  తనెవరో చెప్పిందే....!!’ “సీతా ...” .మొహమాటంగా ఎవరికీ వినపడకూడదు అన్నంత రహస్యంగా పిలిచాడాయన. మొదటిసారి భర్త నోటివెంట నిన్నే....ఏమేవ్..వసేయ్....వంటి పదాలు కాకుండా సీతా అన్న  తియ్యని పిలుపు ఆవిడ మనసులో అలజడులు రేపుతుండగా ఉద్వేగాన్ని అణచుకుంటూ...... "ఇదిగో వస్తున్నా...." అంటూ కుచ్చిళ్ళు సర్దుకుని కదిలింది. ఆనాడు గుళ్ళో  తను విన్నది   నిజమే ఇప్పటికీ ఆలశ్యం కాలేదు.

దిశమారిన లక్ష్యం

దిశమారిన లక్ష్యం జి. సురేఖ "ఎలా ఉంది, పెద్దమ్మ?" అని నెమ్మదిగా చేయి నిమురుతూ అడిగాను, అప్పుడే నిద్రలొనుంచి మేల్కంటున్న పెద్దమ్మని. తల తిప్పి నా వైపు చూసి, "ఎంత సేపైంది వచ్చి?" అంది చాలా నీరసంగ. "ఎంతొ సెపు కాలెదు, ఇప్పుడే." అన్నాను నేను, బైపాస్స్ సర్జరి (bypass surgery) నుంచి తేరుకుంటూ కూడ నన్ను గుర్తు పట్టినందుకు సంతొషపడుతూ. "నువ్వు ఒక్కతే వచ్చావా?" అంది గది నలుమూలల చూస్తూ. ఫెద్దమ్మ కళ్ళు ఎవరికోసం వెతుకుతున్నాయన్నది అర్ధమౌతొంది. "అమ్మ కూడా వచ్చింది, పెద్దమ్మ. బాత్రూంకి వెళ్ళొస్తానని, ఇందాకే అటెళ్ళింది." అన్నాను. "విక్రం, పిల్లలు బగున్నారా..." అంటూ పెద్దమ్మ అడుగుతూ ఉండగా అమ్మ, మా వారు, పిల్లలు బిల బిలమంటూ గదిలోకి వచ్చారు. అమ్మ వచ్చి, వాళ్ళ అక్క ప్రక్కనే హొస్పిటల్ బెడ్ కూర్చుంటూ, "ఇప్పుడే జ్యొతి తొ మాట్లాడోస్తున్న. ఆపరేషను బాగా జరిగింది అని అంది. నువ్వేమిటి, వేళకు సరిగ్గా మందులు వెసుకోవట్లేదంట?" అంది. "నేను ఆ మందులు వేసుకొని, బ్రతికుండి ఇంకా ఏం వినాలి, రాజ్యం...." అంటూ పెద్దమ్మ కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకొని మా వైపు చూసింది. చెల్లెలతొ మనసులోని మాట చెప్పుకోవలనే ఆత్రుత పెద్దమ్మ కళ్ళలో చూసి, నేను వెంటనే, "ఏవండి, నేను జ్యొతక్కతొ మాట్లాడాలి. మీరు పిల్లలని Sai Baba Space Center కి తీసుకెళ్లండి." అంటూ గదిలొ నుండి బయటికి వచ్చి, జ్యొతక్క రూం వైపు వెళ్ళా. ***** ********** ******** ********** ******** జ్యొతక్క మా పెద్దమ్మ కూతురే. ఇంచు మించు ఇరవైరెండు సంవత్సరాలు అమెరికా లొ Cardiologist గా పనిచెసి, ఈ మధ్యే, అంటే ఏడు నెలలు క్రితం పుటపర్తికి వచ్చి, Satya Saibaba Super Speciality Hospital లొ పని చేస్తొంది. మా బావగారు Cardio Thorasic Surgeon. అక్కకి ఇద్దరు పిల్లలు - పవన్, ప్రతిమ. పవన్ డాక్టరు, చక్కగ పెద్దలు చూసిన అమ్మాయిని క్రితం ఏడాద పెళ్ళి చేసుకున్నాడు. ప్రతిమ ఈ మధ్యనే లా కొర్సు పూర్తి చెసింది. మా వారికి అమెరికాలో ఉద్యొగం ఆఫర్ వచ్చినప్పటి నుండి అనుకుంటున్నా పెద్దమ్మని, అక్కని అమెరికాకి వెళ్ళే ముందు చూసి వెళదామని. కాని ఐదు రూజులు క్రితం పెద్దమ్మకి హార్ట్ అటాక్ వచ్చి బైపాస్ సర్జరీ చేయడంతొ, ఈ వాళ అమ్మని తీసుకొని హైదరబాదు నుంచి వచ్చా. ***** ********** ******** ********** ******** Dr. Jyothi Rao, MD (USA), Cardiologist అన్న చిన్న నేంప్లేట్ (nameplate) తలుపు పైన చూసి, నెమ్మెదిగా తలుపు పైన తట్టాను. "కమిన్ (come in)" అని అక్క గొంతు వినిపించింది. తలుపు తీసుకొని లోపలికి వెళ్ళా. పేపర్లేవో సంతకం చేస్తూ తల ఎత్తి నా వైపు చూసి, "నువ్వా అమృత. రా, రా." అంటూ పేపర్లు నర్సుకి ఇచ్చి, " రూమ్  203 లొ ఉన్న పేషెంట్ని మధ్యాహ్నం ఇంటికి పంపిచేద్దాము. పేపర్ వర్కంతా పూర్తి చేసి నాకు చెప్పమ్మ." అని ఆవిడ్ని పంపేసింది. క్రితం సంవత్సరం, పవన్ పెళ్ళిలొ చూసినప్పటికంటె ఇప్పుడు బాగా సన్నబడినట్లు కనిపిస్తొంది అక్క. యాబైఐదు  సంవత్సరాలు దాటినా వయసులో చాలా చిన్నగా వుండి తన పిల్లలకి అక్క లాగ ఉంటుందని మేమందరము అనుకుంటూ ఉంటాము ఎప్పుడు. అలాంటిది, ఒక్క ఏడాదిలొనే పది సంవత్సరాలు పైబడట్టు కనిపిస్తోంది. "ఈ రోజు ప్రొద్దున్నె రెండు యాంజియోగ్రాంస్ (angiograms) వుంటె తొందరగ హస్పిటల్కి వచ్చెసా. వంటావిడకి చెప్పొచ్చా, బ్రెక్ఫాస్ట్ చేసిపెట్టిందా?" అంది. "అందరమూ బ్రేక్ఫాస్ట్ చేసామక్క. పెద్దమ్మకి పర్వాలేదా?" సంశయిస్తూ అడిగా. "సర్జరీ బాగా జరిగింది. అమ్మ డైబీటిక్ (diabetic) కదా, అందుకని ఐదు రోజులు అబ్సెర్వేషన్లొ (observation) ఉంచాను. ఆవునూ, మీ అమెరికా ప్రయణం ఎప్పుడు?" అంది. "రెండు నెలలు తరువాత బయలుదేరాలి . ఈ లోపుల పిల్లల్ని అమ్మా వాళ్ళ ఇంటికి దగ్గరగా ఉన్న స్కూల్లో చేర్చాలి" అన్నాను. "అదేంటి, పిల్లలని తీసుకెళ్ళావా  నీతొ ? వీసా రాలేదా వాళ్ళకి?" అంది అక్క . "వీసాతో ఏమీ సమస్య కాదక్క. నేను మాస్టర్స్ ఇన్ ఇంటర్నేషనల్ స్టడీస్ కి అప్లై చేసాను. అది పద్దెనిమిద నెలలో అయిపోతుంది. ఆ తరువాత పిల్లల్ని తీసుకేళదామని అనుకుంటున్న."  అన్నాను చాలా ఉత్సాహంగా. ఎందుకంటే, మా అందరి ఆడపిల్లల్లో జ్యోతక్కే పెద్దది. అమ్మాయులు బాగా చదువుకొని, వారి కాళ్ల మీద నిలబడాలి అని ఎప్పుడు చెబుతూ ఉంటుంది. అక్క చటుక్కున లేచి, వెళ్లి తలుపు మూసి గొళ్ళెము పెట్టి వచ్చి నా ప్రక్కన కూర్చొని "అమృత , పిల్లలని నీతో తీసుకొని వెళ్ళు . వాళ్ళు అక్కడ స్కూలుకి అలావాటు పడ్డాక నువ్వు నెమ్మదిగా చదువుకోవచ్చు." అంది. అక్కేనా ఈ మాట అంది అని ఆశ్చర్య పోయి "అలా చేస్తే ఎప్పటికో అక్క నా కోర్స్ అయ్యేది " అన్నాను "ఎప్పటికైనా పర్వాలేదు, అమృత. ఇరవైరెండు సంవత్సరాలు క్రితం నేను చేసిన తప్పును నువ్వు చేయదమ్మ. పవన్, ప్రతిమ పుట్టాక ఇద్దరినీ అమ్మ దగ్గర వదిలేసి నేను మీ బావ దావానగిరిలో PG కోర్స్ చెయ్యడానికి వెళ్ళిపోయాము. కాని మీ బావ వాళ్ళ అక్క అమెరికాలో బాగా డబ్బులు సంపాదిస్తోందని విని , మళ్ళీ  ECFMG పరీక్ష వ్రాసి, అమ్మ దగ్గర పిల్లలని ఉంచి,  US కి రెసిడెన్సీ చెయ్యడానికి వెళ్ళాము. మేము ఇద్దరమూ రెసిడెన్సీ పూర్తి చేసేసరికి పవన్ కి పన్నిండు ఏళ్ళు, ప్రతిమకి తొమిది వచ్చాయి. పిల్లలు మా దగ్గరకి వచ్చాక మీ బావకు కాని నాకు కాని వాళ్ళతో గడపడానికి టైం వుండేది కాదు. ఇద్దరవీ చాలా బిజీ ప్ర్యాక్టీసులే. అప్పుడు, తల్లిగా వాళ్లకి అన్ని చేసాననే అనుకున్నాను. మంచి ప్రైవేటు స్కూల్స్ లో వేసాను, టెన్నిస్ కోచింగ్ ఇప్పించాను, సమ్మర్ కాంపస్ కి, స్కీయింగ్ ట్రిప్స్ కీ పంపాను , వాళ్లు అడిగినది ఏది కాదనలేదు . ముఖ్యంగా, పవన్ మంచి మార్క్స్ తెచ్చుకునేవాడు. వాడు నా లాగ బ్రిలియంట్ అని నా స్నేహితులు అంటూ ఉంటే , నేను చాలా గర్వపడ్డాను ." "మరి ఇద్దరు బాగా చదువుకొని పైకొచ్చారు కాదక్కా ?" అన్నాను . "అవును, ఒకరు డాక్టరు ఒకరు లాయరు అయ్యారు, కాని మంచి మనుషులుగా ఎదగలేదు. నేనన్నామీ బావన్నా ఇద్దరికీ గౌరవము అస్సలు లేదు." అంది బాధగా. "అదేంటక్క, పవన్ మీరు చెప్పిన పిల్లనే చక్కగా పెళ్లి చేసుకున్నాడు కదా?" అన్నాను నాకు అర్థం కాక. "అక్కడే వాడు అందరిని మోసం చేసాడు, అమృత. మేము చేసిన అమ్మాయి డాక్టర్, అందమైనది, ఆస్తి బాగా ఉంది. అందుకే చేసుకున్నాడు. పెళ్లి అయిన రెండు వారాలకే, వాడికి అన్ని దురలవాట్లు వున్నాయని ఆ అమ్మాయి తెలుసుకొంది. అలవాట్లు మానుకోమని వాడిని బ్రతిమిలాడుకోంది. నేనూ ఎంతో చెప్పి చూసాను వాడికి, కాని వాడు తను చేసేది ఏదీ తప్పే కాదన్నట్లు మాట్లాడాడు. ఆ అమ్మాయి డివోర్స్ కి ఫైల్ చేసింది." "ఎప్పుడు జరిగిందక్క ఇదంతా?" అని అడిగాను నివ్వెరపోయి. “ఏడు నెలలు క్రితం. మీ బావ కోపం నీకు తెలుసుగా. వాడి ప్రవర్తన చూసి, ఆయన బాగా అరిచారు. మాట మాట పెరిగి, వాడు మీతో నాకేమీ సంబంధం లేదని వెళ్ళిపోయాడు. ఒక మూడు వారాలు తరువాత ఆస్తి కోసం లాయర్ నోటిస్ పంపాడు మా ఇద్దరికీ ..." అంటూ కన్నీరు పెట్టుకుంది. నాకేం చెప్పాలో తెలియక అక్క వీపు నిమురుతూ కూర్చున్న. కాసేపటికి తెపరాయించుకొని, "ఇదంతా ఎందుకు చెబుతున్నానో తెలుసా అమృత? తల్లిగా నా భాద్యతని నేను విస్మరించానని అప్పుడు తెలియలేదు. పిల్లలు చదువులో, ఆటల్లో రాణిస్తూ ఉంటే, మురిసిపోయనే కాని, వారి మనోభావాలు ఎలా ఉన్నాయి అని తెలసుకోవాడానికి సమయము కేటాయించలేక పోయాను. ఆడవారు ఉన్నత చదువులు చదువుకోవాలి, స్వతంత్రంగా బ్రతకాలి అని మెడిసిన్ లో చేరాను. ప్ర్యాక్టీస్ బాగా జరగాలని PG చేసాను, మన దేశంకంటే డబ్బులు ఎక్కువ సంపాదించవచ్చని, అమెరికా భూలోక స్వర్గమని మీ బావని ఒప్పించి మరి us కి వెళ్ళాను. వెళ్ళినప్పటి నుండి హోస్పిటల్లోనే బ్రతికాను. సంపద పెరిగే కొద్ది ఇంకా సంపాదించాలి అనే వ్యామోహం పెరిగింది. దానికి స్త్రీ స్వాతంత్రం అనే ముసుగు వేసి నన్ను నేను మభ్య పెట్టుకున్నాను. పవన్ లాయర నోటిస్ అందిన రోజు కను విప్పు కలిగింది నాకు." అంది. "ప్రతిమ ఏమంటోంది ఇదంతా జరిగాక?" అన్నాను "లాయరు కదా, మంచి లయరిని వెతికిపెట్టి వాళ్ళ అన్నకి సహాయం చేసింది." అంటూ అక్క కళ్ళ నీళ్ళు తుడుచుకోంది. అక్క బాధని చూసి, ఏ తల్లికి ఈ పరిస్తితి రాకూడదు భగవంతుడా అని అనుకున్న. "పిల్లలది ఏమీ తప్పు లేదు, అమృత. ‘Apple does not fall far from the tree’ అని అంటారు. బ్రాండ్ నేమ్ (brandname) బట్టలు, హైఎండ్ కార్లు (high-end cars) ఇస్తేనే ప్రేమని అనుకుంటున్నాడు వాడు. నిజమైన ప్రేమని కొనే ధనం  లేదు ఈ లోకంలో అని పిల్లలికి తెలిసేలా నేను నడుచోకోలేదు. ఇది తెలుసుకోనేసరికి పిల్లలిద్దురూ చేయిజారి పోయారు. ఆకాశమంత ఎత్తు ఎదిగి, నక్షత్రాలను తాకాలని ఆశించాను కాని, నా జీవితంలో ఉన్న హృదయాలను తాకలేక పోయాను. తల్లిగా ఓడి పోయాను, అమృత..." అంటూ ముఖము చేతుల్లో దాచుకుంది అక్క. తలుపు తడుతున్న చప్పుడు విని , కళ్ళ నీళ్ళు తుడుచుకొని , గొంతు సవరించుకొని, "కమిన్" అంది అక్క. నర్స్ వచ్చి , "రూమ్ 203 లో ఉన్న పేషంట్ ఇంటికి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు, డాక్టర్" అంది. ఇప్పుడే వస్తా నంటూ అక్క లేచి వెళ్ళింది. పిల్లల్ని మాతోపాటు అమెరికా తీసుకెళ్లాలని వెంటనే నిర్ణయుంచుకున్నను. ఈ విషయమే మా వారితో మాట్లాడాలని రూమ్ బయటకి వస్తూంటె, మరి బావ ఎందుకు అక్కతో ఇక్కడికి రాలేదు అన్న  సందేహం వచ్చింది.

కాపురం అంటే ఇదీ

కాపురం అంటే ఇదీ జి.ఎస్.లక్ష్మి రంజిత అందమైంది, తెలివైంది, చురుకైంది, శ్రీమంతురాలూ కూడానూ. అందుకనే మరి రెండో ఆలోచనే లేకుండా వెంటనే పెళ్ళి కొప్పేసుకున్నాడు రణధీర్. అప్పటిదాకా ఉన్న ఊరు వదిలి ఒక్కతీ బైటకి వెళ్ళని రంజితని కాపరానికి రాగానే హోటల్ కి తీసికెళ్ళేడు. అక్కడ పదార్ధాలన్నీ బల్లమీద ఒకచోట లైన్ గా పెట్టి ఉన్నాయి. తినడాని కొచ్చినవాళ్లందరూ వాళ్ళంతటవాళ్ళే అక్కడ దొంతరగా పేర్చిన ప్లేట్లు ఒక్కొక్కటీ తీసుకుని, ఒక్కొక్క అయిటమూ చూసుకుంటూ వడ్డించుకుని, టేబుల్ దగ్గరికి తెచ్చుకుని కూర్చుని తింటున్నారు. రంజిత ఆశ్చర్యపోయింది. ఎప్పుడైనా ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు తండ్రి భోజనానికి హోటల్ కి తీసికెడితే, హాయిగా సోఫాల్లో కూర్చుంటే టేబుల్ మీద మొత్తం అన్నీ తెచ్చి వడ్డించేవాడు సర్వర్. అలాంటిది ఇలా ఎవరికి వారే తెచ్చుకోవడమేంటని అడిగింది రణధీర్ ని. ఏమీతెలీని రంజితకి వివరంగా అన్నీ చెప్పేడు రణధీర్. "చూడు రం..(ముద్దుగా రంజితని అలాగే పిలుస్తాడు రణధీర్..అలా ఒద్దు..ఆ పేరు నాకు నచ్చదన్నా అలా పిలుస్తేనే నాకు బాగుంటుంది అంటాడు..అంతేకాదు..రంజితకి కూడా తన పేరుని ఆమె కిష్టమైనట్టు పిల్చుకునే స్వాతంత్ర్యం కూడా ఇచ్చేసేడు. కాని ఏవిటో..ఇంకా రం అతనిని ఏవండీ..అనే పిలుస్తోంది). దీన్ని బఫే అంటారు. మీ ఊళ్ళో హోటల్ లో లాగ ఇక్కడ అన్నీ పట్టుకొచ్చి వడ్డించెయ్యరు. అక్కడ వాళ్ళు ఏం వడ్డిస్తే అదే తినాలి. అందరికీ అన్నీ ఇష్టముండవు కదా..అక్కడ కన్న ఇక్కడ అయిటమ్సూ ఎక్కువుంటాయి. ఎవరికేది కావలిస్తే వాళ్ళు అది ఎన్నిసార్లైనా వెళ్ళి తెచ్చుకోవచ్చు. అందుకని ఇష్టమైనవే తినే ఛాన్సు ఇక్కడే ఎక్కువన్న మాట.” రణధీర్ చెప్పింది శ్రధ్ధగా వింది రంజిత. భోజనమయ్యేక కాఫీ అడిగితే ఒక ట్రేలో కెటిల్ లో డికాషన్, విడిగా పాలు, పంచదార, ఖాళీకప్పులూ తెచ్చేడు. రణధీర్ మళ్ళీ క్లాస్ తీసుకున్నాడు. "చూసేవా.. కొంతమంది డికాషన్ ఎక్కువ వేసుకుంటారు. కొంతమంది పాలు ఎక్కువేసుకుంటారు. వాళ్ళిష్టమొచ్చినట్టు వాళ్ళు కలిపేసింది మనం తాగక్కర్లేకుండా మన టేస్ట్ కి కావలసినట్టు తాగొచ్చన్నమాట." అంతేకాకుండా సెల్ఫ్ సర్వీస్ అంటే ఏవిటో చాలా వివరంగా చెప్పేడు. బైటకెళ్ళినప్పుడు స్లాట్ లో డబ్బు ఎలా వేసి, కూపన్ తీసుకోవాలో, ఆ కూపన్ తో కాఫీ మెషిన్ నుంచి కాఫీ, టీ ఎలా తీసుకోవాలో దగ్గరుండి చూపించేడు. తను స్వయంగా దగ్గరుండి గుడికి వెళ్ళినప్పుడు అర్చన కోసం కూపన్ ని రంజిత చేతే తీయించేడు. మురిసిపోయింది రంజిత. అంతే కాదు..రంజితకి ఇంకా చాలా నేర్పేడతను. ముఖ్యంగా కంప్యూటర్ ఎలా వాడాలో నేర్పించేడు. ఆన్ లైన్ లో ఫోన్ బిల్లులూ, పవర్ బిల్లులూ ఎలా కట్టాలో చెప్పేడు. ట్రైన్ టికెట్లూ, బస్ టికెట్లూ ఎలా కొనాలో చూపించేడు. ఆఖరికి సినిమా టికెట్లు కూడా కంప్యూటర్ లో కొనడం మరీ నచ్చేసింది రంజితకి. రణధీర్ లాంటి భర్తని తనకిచ్చినందుకు దేవుడికి మరీ మరీ కృతఙ్ఞతలు చెప్పేసుకుంది. ఆ రోజు రణధీర్ ఇంటికొచ్చేటప్పటికి కంప్యూటర్ ముందు కూర్చుని సీరియస్ గా ఆన్ లైన్ షాపింగ్ చేసేస్తోంది. "రం..ఆకలేస్తోంది. భోంచేద్దారా.." ప్రేమగా పిలిచేడు. "ఓహ్..రణ్..నేను తినేసేను. నీకు ఆమ్లెట్ వేడిగా ఉండాలి కదా. ఫ్రిజ్ లో ఎగ్స్ ఉన్నాయి.. వేడిగా వేసేసుకో. ఉడికిన పప్పు ఫ్రిజ్ లో కప్పులో అట్టిపెట్టేను. కాస్త చింతపండు పులుసు కలుపుకుని నీకు కావల్సినట్టు పోపు ఎక్కువగా వేసుకో.. నీకు జీలకర్ర బాగా వేగితే ఇష్టం కదా.. అలా చేసేసుకో. నాకు అది నచ్చదు. అందుకే తినలేదు. నీకు సెల్ఫ్ సర్వీస్ ఇష్టం కదా. తొందరగా తినేసి రా.. ఇక్కడ నీ ఫ్రెండ్ చైతూ చాటింగ్ లోఉన్నాడు.." రణధీర్ వంటింటికీ డైనింగ్ టేబిల్ కీ మధ్య నిశ్చేష్ఠుడై నిలబడిపోయేడు.

ఆరోజు వస్తుంది

  ఆరోజు  వస్తుంది      చీకటి పడిపోయింది.  కాస్త భయంగానే ఉంది  కౌసల్యకి  ఆ చీకట్లో.  వీధి దీపాలు వెలగట్లేదు. దానికి  తోడు  అమావాస్య.   అసలు చిన్నప్పటినించీ  భయస్తురాలే.  ఇలా చీమ చిటుక్కుమంటే  భయపడిపోయేదానివి  రేపు  పెళ్ళయ్యాక  నీ పిల్లల్ని ఎలా పెంచుతావే  అంటూ  దిగులుగా  కూతుర్ని దగ్గిరకి  తీసుకునేది  తల్లి  పద్మావతి.  “ మీ ఆడాళ్ళకి  పెద్దయ్యాక  మొండి ధైర్యాలు  అవే వస్తాయిలే. “  ఓ  విసురు  విసిరేవాడు తండ్రి  సాంబమూర్తి. “  ఔనౌను.  లేకపోతే  సంసార సాగరం  ఈదగలమా ? మీలాంటి వాళ్ళకి  వెనకఉండి విజయాలు  తెచ్చిపెట్టగలమా ? “  నవ్వుతూ  చురక  వేసేది పద్మావతి.  వాళ్ళమాటలు  వింటూ నవ్వుకునేది  కౌసల్య .  కానీ  ఇప్పుడు  నవ్వు రావట్లేదు.  ఏ రోజుకారోజు  బతికి బయటపడితే  అంతేచాలన్న రీతిలో  కాలం గడుస్తుంటే అమ్మయ్య  అన్న నిట్టూర్పులే  వస్తున్నాయి .  ఆడపిల్లని  ఒక  అయ్య  చేతిలో పెట్టేస్తే  పెళ్ళంటూ చేసేస్తే  ఆ స్ర్తీకి  రక్షణ   ఏర్పడిపోయినట్టేనని  భావించేవారు  పూర్వపురోజుల్లో.  కంచే  చేను మేసినట్టు  వాడు కొట్టినా తిట్టినా  పట్టించుకునేవారే కాదు.  అడిగేవారే  కాదు. అడిగి మాత్రం ఏం చెయ్యగలం అన్న ధోరణిలో  ఉండేవారు.  ఇప్పుడూ  అలాంటి  సంసారాలున్నాయి  లేకపోలేదు. ఎటొచ్చీ చదువుకుని   ఎవరి కాళ్ళమీద  వాళ్ళు నిలబడాలన్న ఆలోచన  పెరగడం మంచిదయ్యింది.  అయినా కూడా  రక్షణ  అనే  విషయానికి  వచ్చేసరికి అగమ్యగోచరంగానే  ఉంది.                                                                   దాన్ని గురించే  ఆలోచిస్తూ  నడుస్తోంది కౌసల్య.  అసలు  సృష్టిలోనే  ఎందుకంత  అన్యాయం ! స్త్రీని  శారీరకంగా   బలహీనంగానూ  మానసికంగా సున్నితంగానూ  ఎందుకు  సృష్టించాలి ?                                                                     ఈ రోజుల్నిబట్టి  ఆడవాళ్ళు  కాస్త  మారుతున్నారు  నిజమే.                        మానసికంగా  ధైర్యాన్ని  అలవరచుకుంటున్నారు.  మానసిక బలంతో  కష్ట నష్టాలు ఎదుర్కుంటున్నారు.  అదీ  నిజమే. మంచిదే.  కానీ  మరి  రౌడీల  ఆగడాలు అత్యాచారాలు  అంతకంతకీ  ఎక్కువ  అవుతున్నాయే  తప్ప  తగ్గుతున్న  ఛాయలేవీ ! ఆ రౌడీ  కుటుంబంలో   ఆడవాళ్ళుండరా ! ఓ  తల్లి  కన్నబిడ్డే  కదా  వాడు.  ఆడవాళ్ళంటే అంత  నీచమైన  నికృష్టమైన  భావన  ఎలా  చోటు చేసుకుంటుందో  అర్ధం కావట్లేదు కౌసల్యకి.              చదువూ  చదువుకుంది.  ఉద్యోగమూ  చేస్తోంది  తను.  రెండు బస్సులు  మారి  వెళ్ళి రావాలి.  ఇంటికి  దూరం    బస్ స్టాపు.  ఆఫీసులో పని  అయ్యేసరికి  ఆలస్యమైందంటే ఇంటిదగ్గిర  బస్ దిగేసరికి  చిమ్మ చీకటే .  లోపలికి    సందులో  ఎక్కువే  నడవాలి.  వీధి దీపాలు  ఎప్పుడూ  ఉండవు.   చివరగా  ఓ మూలగా  విసిరేసినట్టుంది  ఇల్లు.  ఆతర్వాత ఇంక  ఇళ్ళులేవు.   ఉన్న నాలుగు  ఇళ్ళల్లోనూ  టీ.వీ. లు చూస్తూ  తలుపులు వేసేసుకుని  ఎవరిలోకంలో   వాళ్ళుంటారు.  తలుపులు  తెరుచుకుని   కూర్చోడానికి   ఇదేమన్నా   గుప్తులకాలంనాటి   స్వర్ణయుగమా ?  ఇళ్ళ   వెనకాల  పెద్ద పెద్ద   తుప్పలు చెట్లు  బండరాళ్ళూ.  ఇళ్ళ ముందూ  అవే కనపడతాయి.  రాత్రయితే  జీబురుమంటూ ఉంటుంది. పగలు  కూడా  సుమారుగా  అంతే.  ఏవున్నా  లేకపోయినా  ఎవరున్నా లేకపోయినా  రౌడీలకీ  దొంగలకీ  కొదవలేదు కదా . అలాంటివాళ్ళకి  ఇలాంటి సందులు మరీ చులకన.   అందుకే  అప్పుడప్పుడు  తల్లితో  అంటూనే   ఉంటుంది  సమాజంలో  మృగాళ్ళు ఉన్నంతవరకూ  ఆడవాళ్ళు  ఏం చదువులు  చదువుకున్నా  ఏం  ఉద్యోగాలు  చేసినా ఏవుంది  సంతోషం అని.  విని  ఊరుకునేది కాదు  పద్మావతి.  కూతురికి  ధైర్యం   చెప్పడానికి  శతవిధాల  ప్రయత్నం చేసేది.  రోజులు  ఒక్కలా ఉండవులే  కాలం మారుతోంది అంటూ  చాలా  తేలిగ్గా  చెప్పేది.  కానీ ఆవిడకీ  మనసులో బిక్కుబిక్కుమంటూనే  ఉండేది.  ప్రతిపూటా  కూతురు  ఆపీసు నించి  ఇంటికి వచ్చేవరకూ హనుమాన్  చాలీసా  మనసులో  పఠిస్తూనే  ఉంటుంది.  కూతురి ఎదురుగా  బింకంగానే ఉంటుంది.  పిల్లకి  సంబంధం  తొందరగా  కుదిరితే  బావుండునని  రోజుకి  వందసార్లు అనుకుంటూ  ఉంటుంది.  ఓ రోజు  నవ్వుతూ  అడగనే  అడిగింది  కౌసల్య  తల్లిని.                                                                వెర్రిదానివమ్మా  నువ్వు .  నేను  ఇంటికి  చేరేదాకా  నువ్వు  ఆదుర్దా  పడుతూ ఉంటావు. రేపు  పెళ్ళయ్యాక  ఆ కట్టుకున్న వాడు   పడతాడు.  అంతేగా ! అంటే ఏమిటి ?  ఆడది బయటికెళ్తే  చీకటి  పడిందంటే   ఇంట్లో  వాళ్ళు   ఎవరో  ఒకళ్ళు   ఆదుర్దా   పడుతూ   ఆందోళనతో   రక్తపోటు  పెంచుకోవలసిందన్నమాటేగా ?   దీనికి  పరిష్కారం లేదా ? “  “ఎందుకు  లేదూ పరిష్కారం ? మన ఆడవాళ్ళం  మనసుల్లో  సున్నితత్వం  గుండెల్లో మొండిధైర్యం  జీవిత  చరమాంకం  వరకూ పెంచుకుంటూ  పోవాలి.  లేకపోతే  జీవించడం కష్టం.  సమస్యలున్నప్పుడు  వాటికి  తగ్గ   పరిష్కారాలూ  ఉంటాయి.  అమలు పరచడంలో తెలివితేటలు  ఉపయోగించే  నేర్పు  సంపాదించాలి .”               “ అడవుల్లోకి  వెళ్తే  క్రూరమృగాలుంటాయి  కాబట్టి  అడవుల్లోకి  వెళ్ళద్దంటే  అర్ధం  ఉంది.  నగరాల్లో  వీధుల్లోకి  చీకటిపడితే  ఆడవాళ్ళు   వెళ్ళద్దంటే  మగవాళ్ళు   క్రూరమృగాలు  అని  అర్ధమా ? “  “ అందరూ కాదే నా తల్లీ  కొంతమంది  రాక్షసులు  కొన్ని క్రూరమృగాలు  నరరూపంలో వీధుల్లో  తిరగడం జరుగుతోంది. అటువంటివాళ్ళకి  భయపడుతోంది  ఆడది.  కానీ ఎన్నాళ్ళిలా  సాగాలి ? దీనికి  అంతం చూపించేందుకు  ఆడదే  ముందుకి రాక  తప్పదేమో !   వస్తుందిలే !  ఆడపిల్ల బ్రతుకులో  ఆ రోజు  తప్పక వస్తుంది. “  ఆమె మాటల్లో  ధ్వని    కంటే  నమ్మకం ఎక్కువగా  కౌసల్య  హృదయాన్ని తాకింది.                       తల్లి   మాటలు  పదేపదే   గుర్తొస్తున్నాయి   కౌసల్యకి .  తనవెనకే  ఎవరో  వస్తున్న సవ్వడి  అయ్యింది.  రోడ్డు   మీద  ఎవరూ  లేకపోయినా  భయమే.  తనుకాక  ఒక్కడే ఒక్కడు  మరొకడెవరైనా  చుట్టుపక్కల  ఉన్నా  భయమే. ఎలా  బతకాలి ?  బస్సులో  నిలబడి  నిలబడి  వచ్చిన  నీరసం  రెట్టింపుగా  అనిపిస్తోంది  భయంవల్ల .   నడక వేగం  పెంచాననుకుంది.  అబ్బే ! ఉత్తదే !   వెనకాల   అడుగులు  కాస్త  దగ్గరగా   వస్తున్నట్టనిపించింది.  ఎందుకైనా  మంచిదని  చున్నీ  ఒక వైపునించి  తల చుట్టూ ముసుగులా  వేసుకుంది.   వెనక్కి  తిరిగి  చూడాలంటే  వణుకు  పుడుతోంది. అసలెందుకు  చూడటం ?  కొరివితో  తల  గోక్కోవడమెందుకు ?   కావాలని  రోటిలో  తల దూర్చడమెందుకు ?   అయినా ఎంత చెప్పింది  తను  నాన్నగారికి   ఇలాంటి  చోట  ఇల్లు  తీసుకోవద్దు  అని. వింటేనా ?  ఆయన గొడవ  ఆయనది మరి . అందులో   తప్పు ఎంచడానికి  లేదు. తక్కువ  సొమ్ములో  వచ్చేది  ఆయన  తాహతుకి  తగ్గట్టు  చూసుకున్నారు.  మిగిలిన ఖాళీ  స్థలాలన్నిటిలోనూ  ఇళ్ళు  లేచి  చుట్టుపక్కల  కొన్ని  దుకాణాలవీ  వస్తే  గానీ   ఈ బిక్కు బిక్కుమంటూ  బతకడం  తప్పదు.  అన్నయ్య  ఉన్నాడు  కాబట్టి   చెట్టంత కొడుకు  ఉన్నాడన్న  ధైర్యంతో  అప్పు  తీసుకుని మారుమూల  శివార్లలో  ఉన్నా కూడా  ఈ ఇల్లు  కొనేసి  సొంత  ఇంట్లో  ఉన్నాము హాయిగా  అన్న సంతృప్తితోనూ  అస్తమానం  సామాన్లు  సద్దుకుని   నెత్తిన   పెట్టుకుని ఇళ్ళు  మారే  ప్రయాస  తప్పిందన్న  సంతోషంతోనూ   ఉన్నారు   నాన్నగారు.                  ఆలోచన్లలో  తల మునకలవుతూ  త్వరత్వరగా  నడుస్తున్న  కౌసల్యనోటిని   హఠాత్తుగా   వెనకనించి  ఒకచెయ్యి  వచ్చి  గట్టిగా  మూసేసి  బలంగా చేతులు  రెండూ  నొక్కి పట్టేసుకుని  వెనక్కి  తిరిగే   అవకాశం   ఏమాత్రం ఇవ్వకుండా   తుప్పల్లోకి లాక్కుపోతుంటే   శాయశక్తులా   పెనుగులాడుతోంది.  గట్టిగా  అరుద్దామనుకుంటే  నోట్లోంచి  అసలు  శబ్దం  వస్తేగా ! తాగిన  మత్తులో తూలుతున్న ఆ వ్యక్తి    “ తొందరగా  రారా ! “  అంటూ పిలిచేదాకా వెనకాల ఇంకెవరో  వస్తున్నట్టు   తెలియదు కౌసల్యకి.  తెలిసిన  మరుక్షణం  భయాందోళనలతో  వణికిపోతూనే  బలాన్ని పుంజుకోక తప్పదన్న నిర్ణయానికి  వచ్చింది.  “ ఎ క్క డి కి తీ సు కొచ్చా వు ?  ఎ క్క డు న్నాం   ఇప్పుడు ?  నాకేమీ  తెలియట్లేదు. “   మత్తు మత్తుగా   మాట్లాడుతున్న  ఆ  గొంతు  విని  తనకొచ్చిన  సందేహానికి  తనని తనే  తిట్టుకుంది  అంత  దుర్భర పరిస్థితిలో కూడా.   “ ఈ సందులో  చీకట్లో   ఒంటరిగా  పోతున్న   ఈఅమ్మాయిని  వదిలేసి  ఎక్కడికో  మనం  తిరగడానికి  ఎందుకెళ్ళడం   అనిపించి  ఇటువైపు  మళ్ళాను.  తొందరగా  రావయ్యా  బాబూ ! ఎవరూ   టువైపు  రాకముందే. “   చిరాకు  తొణికిసలాడింది  కౌసల్యని   బలవంతంగా  లాక్కుపోతున్న   వ్యక్తి గొంతులో.       “ వస్తున్నా  వస్తున్నా “  వెనకనించి  సమాధానం.  తన  సందేహం  తీరిపోయినట్టనిపించింది  కౌసల్యకి.  తల్లి  ఆవిడ  మనసులో  ఎన్నెన్ని భయాలు  పడేదో  ఏఏ   దేవుళ్ళకి  మొక్కుకుంటూ  ఉండేదో  ఆ లెక్కాపత్రాలు  తనకి తలియదుగానీ  ఆవిడ తనకి  ప్రతి రోజూ  జీవితమ్మీద ఆసక్తి  కలిగిస్తూ  ధైర్యాన్ని నూరిపోసే  ప్రయత్నాలు  చేయడం  మాత్రం  తెలుసు.   ఆ  ప్రయత్నాన్ని  తను  వమ్ము చెయ్యకుండా  నిలబడాలి.  ఔను.  ఆ బలం ఎక్కడినించో  కాదు  అమ్మ పలుకుల నించే  వచ్చింది  అందుకే   తనని పట్టుకున్న వ్యక్తిని  చేతిమీద       కొరకడమే  కాదు  ఆదిశక్తిలా  అపరకాళిలా  కాళ్ళతో  ఎడాపెడా  తన్ని  పడేసింది.  రాళ్ళమీద రక్తమోడుతూ  పడ్డాడు.  తూలిపోతూ  మెల్లిగా వచ్చి  వెనకనించి  తన భుజమ్మీద  చెయ్యి  వేసిన  వ్యక్తి మొహమ్మీద  ఛీత్కరించి  ఉమ్మేసింది.   “ నువ్వా ? “  తుళ్ళిపడి  ఒక అడుగు  వెనక్కి వేశాడతను   దగ్గరనించి  చూశాక.                                                                                                            “ ఏం ?  నేను కాక  వేరే  అమ్మాయి  అయితే మాత్రం  ప్రాణమున్న మనిషికాదా ! ఆటబొమ్మనుకుంటున్నావా ? ఆడపిల్లల  మానప్రాణాలతో   ఆడుకునేవాడికంటే   అడవిలోని   క్రూరజంతువులు  నయంరా  నికృష్టుడా !  నువ్వు  నా  అన్నయ్యవని  నేను నీ   చెల్లెలినని  చెప్పుకోడంకంటే   దౌర్భాగ్యం  ఇంకొకటి  లేదు  నాకు.  చెట్టంత కొడుకున్నాడని   గుండెలమీద  చెయ్యివేసుకుని  నిద్ర పోయే  నీ  తండ్రి  గుండెలమీద తన్నే పనులు  చేస్తున్నావని  తెలిసి తీరాలి    ఆయనకి.  ఇంట్లో వాళ్ళ  కళ్ళు కప్పి నీలాంటివాళ్ళు  చేసే పనులు  బయటపడకపోవు. నిన్ను నేనే  పోలీసులకి  అప్పచెప్తాను. నడు. “    అదిరిపోయాడు  అన్నయ్య .  కాదుకాదు  ఆ రూపంలో   ఉన్న నరరూపరాక్షసుడు.  చీమ  చిటుక్కుమంటే  భయపడే  ఆడపిల్ల  అవసరమైతే   ఆదిశక్తి   కాగలదు.   ఓర్పు  సహనం  వహిస్తుంటే  ఓడిపోయిందనుకున్న   మొగవాడు   తెలివితక్కువవాడు.