ఏడు సంవత్సరాల కరువు

ఏడు సంవత్సరాల కరువు   చేత్ సింగ్ ఒక రైతు. అతను పెద్దగా చదువుకోలేదుగానీ, వ్యవసాయంలో మెళకువలన్నీ చేత్ సింగ్ కు బాగా తెలుసు' అని ఊళ్లో పేరుండేది. ముఖ్యంగా,శ్రమించడం' అంటే మాత్రం చేత్ సింగ్ వెనకడుగు వేసేవాడు కాదు. "భగవంతుడి కృప వల్లనే మొక్కలు పెరుగుతాయి" అని అతనికి ప్రగాఢమైన విశ్వాసం ఉండేది. "ప్రకృతిని గమనించుకుంటూ, ఏ సమయంలో ఏం చేయాలో అవి చేస్తూండటమే మనిషి బాధ్యత" అని అతను నమ్మేవాడు. అందువల్ల అతను ప్రకృతికి తల ఒగ్గి వర్తించేవాడు; తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తూ పోయేవాడు. చేత్ సింగ్ పెద్ద ధనికుడేమీ కాదు - కానీ అతని కుటుంబ అవసరాలన్నీ ఎప్పటికప్పుడు తీరేంత సంపాదననిచ్చేది, అతని వ్యవసాయం. ఒక సంవత్సరం, సమయానికి వానలు పడలేదు. తేమలేక, వేసిన పంటలన్నీ వాడిపోయాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ఆ సమయంలో చేత్ సింగ్ శ్రమించి, చేతనైనంత పంటను సేకరించుకొని, ఖర్చులు తగ్గించుకొని, ఆ సంవత్సరాన్ని పొదుపుగా గడిపేందుకు సిద్ధపడ్డాడు. నెలలు గడుస్తున్నకొద్దీ రైతులందరి పరిస్థితీ మరింత విషమించింది. కారణం, ఒక్క వాన చినుకుకూడా లేదు! గాలి అంతా పొడిగా ఉంది.. ఆకాశంలో మబ్బుతునక లేదు! ఎక్కడెక్కడి జనాలూ జ్యోతిష్కుల్నీ, దైవజ్ఞుల్నీ సంప్రతించకుండా ఉండలేకపోయారు. జ్యోతిష్కులు అందరూ లెక్కలు వేసి, పెదిమ విరిచారు ఆ ఏడాదే కాదు, ఇక రాబోయే ఆరేడు సంవత్సరాలలోనూ వానలు పడే అవకాశం లేదన్నారు. దైవజ్ఞులు వివిధ రకాల దేవతల్ని సంప్రతించి, "మానవుల్లో పరస్పర ద్వేషమూ, హింసా, ప్రకృతి ధిక్కారం పెచ్చుమీరాయి. తమ పద్ధతుల్ని మార్చుకొమ్మని ఎందరు దేవతలు- ఎన్ని రకాలుగా- తెలిపినా, మనుషులు తమ శైలిని మార్చుకోలేదు. ఇప్పుడు దేవతలంతా విసిగిపోయారు. మనుషుల్ని శిక్షించక తప్పదని నిర్ణయించారు. ఏడు సంవత్సరాల కరువును పంపారు. ఇంకో ఆరేళ్లపాటు వానలురావు" అని చెప్పారు. అందరి మనసుల్లోనూ భయం రాజ్యమేలింది. వానలు లేకుంటే పంటలు ఎలాగూ పండవు. రైతులు సాగు వదిలిపెట్టారు. అనేకమంది పల్లెల్ని వదిలి పోతున్నారు. ఎవ్వరికీ ఏం చేయాలో తెలీటంలేదు. గ్రామాల్లో పరిస్థితి అంతా అల్లకల్లోలం అయ్యింది.  ఊరంతట్లోనూ ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొలానికి పోయి, పని కొనసాగించినవాడు చేత్ సింగ్ ఒక్కడే. తన నిరాశగానీ, చుట్టూఉన్న జనాల ఎగతాళిగానీ అతనిచేత పనిని ఆపించలేకపోయాయి. అతను యథా ప్రకారం ఉదయాన్నే పనికి వెళ్లి, ఆపకుండా నాలుగుగంటలపాటు పని చేసేవాడు. ఆ తరువాతనే ఉదయపు భోజనం, విశ్రాంతి. ఒకనాడు దారినపోయే దాసప్ప ఒకడు పొలంపని చేస్తున్న చేత్ సింగ్ ని చూసి ఆగాడు. "ఏమయ్యా, రైతూ? నేలనెందుకు, దున్నుతున్నావు? ఏడు సంవత్సరాల కరువు గురించి విని ఉండలేదా నువ్వు? లేకపోతే అలాంటి వాటిలో నీకు నమ్మకం లేదా? నీ శక్తినీ, సమయాన్నీ ఇలా వృథా చేసుకుంటున్నావే, ఎందుకు? మరీ మూర్ఖంగా ఉన్నావనిపిస్తుంది. ఇంటికి పో! ఈ పనిని ఇక్కడితో ఆపెయ్యి! దీని వల్ల ఏమీ ప్రయోజనం లేదు!" అన్నాడతను బిగ్గరగా, చేత్ సింగ్ తో. చేత్ సింగ్ మర్యాదగా జవాబిచ్చాడు - "అయ్యా! ఏడు సంవత్సరాల కరువు గురించి నేనూ విన్నాను. విత్తనాలు నాటే అవకాశం లేదని గ్రహించాను కూడాను. కానీ నాకింకో సంగతీ తెలుసు. కాలం ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ ఏడు సంవత్సరాలు కూడా తప్పక గడుస్తాయి. ఆ తర్వాత వస్తాయి వానలు. అయితే ఈ ఏడేళ్లూ పనిచేయకుండా ఉండిపోతే, ఇక నాకు దున్నే అలవాటు తప్పిపోతుంది. శక్తి ఉండీ నిజానికి నేను శక్తి హీనుడినే అవుతాను. చివరికి వానలు పడ్డప్పటికి నాలో పనిచేసే క్రమశిక్షణ లోపించి, ఇక నా వృత్తికి నేను న్యాయం చేయలేకపోతాను. అందుకని, నేనిప్పుడు కేవలం పనిని సాధన చేస్తూ గడుపుతున్నాను, అంతే!" అని. ఆ దాసప్ప ఎవరోకాదు. వరుణుడే! తోటి దేవతలు పురమాయించిన మీదట, ఏడు సంవత్సరాల నిషేధాన్ని విధించుకున్న వానదేవుడే ఆయన. చేత్ సింగ్ కార్య దీక్షా, జ్ఞానంతో కూడుకున్న ముందుచూపూ ఆయన్ని కరిగించాయి. అంతేకాదు, చేత్ సింగ్ స్థైర్యాన్ని చూసి, వాన దేవుడు కూడా ఆలోచనలో పడ్డాడు- "నిజమే! నేను వరుసగా ఏడేళ్లు వర్షాలను కురిపించకపోతే, వానను కురిపించే కళను నేనూ మర్చిపోయే ప్రమాదం ఉంది! ఆపైన ఇక నేనూ నా విధిని సరిగా నిర్వర్తించలేకపోతానేమో! ఎలాగ?" అనుకొని, ఆయన తక్షణం వానల్ని కురిపించాడు. భగవంతుడిని నమ్ముకున్న చేత్ సింగ్ వెంటనే పొలంలో విత్తనాలు చల్లాడు! కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

రైతు కష్టాలు

రైతు కష్టాలు     అనగనగా శ్రీశైల క్షేత్రానికి దగ్గరలోని ఒక కుగ్రామంలో లింగయ్య అనే రైతు ఒకడు ఉండేవాడు. లింగయ్యకు తండ్రి తాతలు ఇచ్చిన ఆస్తి పన్నెండు ఎకరాల చేను ఉండేది. అయినా ఏం, ప్రయోజనం? ఆ భూమిలో‌ ఏదీ సరిగా పండేది కాదు. అంతేకాక తను చాలా పేదవాడు- పంటకు కావలసిన పెట్టుబడి కూడా దొరక్క తంటాలు పడుతూండేవాడు. ఒకసారి వాళ్ల ఊరికి కొందరు వ్యాపారులు వచ్చారు. "భూముల్ని కొంటాం. ఎకరానికి పదివేలిస్తాం" అంటూ. పదివేలు అనేసరికి రైతులందరూ‌ చాలా ఉత్సాహపడ్డారు. చాలామంది వాళ్ళకు భూములు అమ్ముకున్నారు. లింగయ్య మటుకు అమ్మలేదు. 'భూమి అమ్ముకొని నేను ఎక్కడికి పోవాలి?' అన్నాడు. త్వరలోనే అందరికీ తెలిసింది- "శ్రీశైలంలో కృష్ణకు ఒక పెద్ద డ్యాము కడతారు. ఆ ఆనకట్ట వెనక లక్షలాది ఎకరాల్లో నీళ్ళు నిలవ ఉంటాయి. ఒక్కో ఎకరాకి పదిలక్షలకు తక్కువ కాకుండా వస్తుంది. చేన్లన్నీ పొలాలైపోతాయి" అని. "నేను చెప్పలేదా, ఈ వ్యాపారులు ఒట్టి మోసకారులు. మన దగ్గర పదివేలకే ఎకరా కొనుక్కుందామనుకున్నారు" అన్నాడు లింగయ్య సంతోషంగా. అయితే చూస్తూండగానే శ్రీశైలం ప్రాజెక్టు వెనక్కి జరిగింది. వీళ్ల చేను రిజర్వాయర్‌కి సంబంధం లేకుండా దూరంగా విసిరేసినట్లు అయ్యింది. వీళ్ల ఊరికి నీళ్ళు అందలేదు. భూములు అమ్మినవాళ్ళు ఏనాడో ఊరు వదిలేసి పోయారు. భూములు కొన్న వ్యాపారులు ఆజాపజా లేరు. ఊరంతా బోసిపోయింది. పంటలు పెడదామంటే కూలీలు దొరకని స్థితి ఏర్పడింది.   త్వరలోనే అందరు రైతులూ బోర్లు వేయటం మొదలెట్టారు. "రిజర్వాయర్లో నిండా నీళ్ళుంటాయి. మనం బోరు వేస్తే కొల్లలుగా నీళ్ళు పడతాయి" అని ఆశ పెట్టారు బోర్ల వ్యాపారులు. లింగయ్య దగ్గర బోరు వేసుకునే డబ్బు లేదు. అప్పుగా కూడా దొరికే అవకాశం లేకుండింది. బోరు పంపుల ఆధారంగా వ్యవసాయం చేసిన రైతులు రకరకాల పండ్ల తోటలు పెట్టారు. వారికి లక్షలు ఆదాయం రావటం మొదలు పెట్టింది. కొన్నేళ్లకు మడి కట్టుకొని కూర్చున్న లింగయ్యకు కూడా తల తిరగటం మొదలైంది. "ఒక్క బోరు వేయాలి. పండ్లతోటలు ఎన్నటికీ నిలుస్తాయి" అని పైసా పైసా కూడబెట్టటం మొదలెట్టాడు. తిండి తిప్పలు మాని పొదుపు చేసాడు. ఆలోగా అక్కడున్న పండ్లతోటలు అన్నీ ఒక్కటొక్కటే ఎండిపోవటం మొదలెట్టాయి. "ఈ నీళ్ళు మంచివి కావంట" అని కొందరు అనసాగారు. "భూగర్భ జలాలు అడుగంటాయంట" అని ఇంకొందరు చెప్పుకోసాగారు. ఆలోగా పళ్లతోటలు పెట్టిన రైతులు ఇంకా ఇంకా బోర్లు త్రవ్వటం మొదలు పెట్టారు. కొందరి బోర్లలో మంచి నీళ్ళు పడ్డాయి. నీళ్ళు పడని వాళ్ళు భూములమ్ముకొని ఎటుపోయారో, పోయారు. లింగయ్య కూడా ఒక జమిందారి దగ్గర అప్పు తీసుకొని బోరు వేశాడు. కాని తన దురదృష్టం, బోరులో నీళ్లు పడలేదు! ఆలోగా కొత్తరైతులు కొందరు పత్తి పంట వేయటం మొదలెట్టారు. "పత్తికి వాననీళ్ళు చాలు! చీడపీడల్ని తట్టుకుంటుంది! ఎకరాకి లక్షరూపాయలు ఆదాయం‌ ఉంటుంది!" చూసి, చూసి ఆశపడిన లింగయ్య 'ఇక లాభం లేద'ని తనూ పత్తి పంట వేశాడు. అయితే ఏం ఖర్మమో- ఆ సంవత్సరం ఎండలు విపరీతంగా కాశాయి. లింగయ్య పత్తి అంతా ఎండకు కాలింది.  చివరికి పంట అంతా బూడిద అయ్యింది. మరుసటి సంవత్సరం లింగయ్య మళ్ళీ అప్పు చేసి, ఈసారి మిరపతోట వేశాడు. పంటను జంతువులు తొక్కి నాశనం చేసినా, 'మిగిలిందే చాలు' అనుకున్నాడు. తీరా పంట చేతికి వచ్చేసరికి మిరప రేట్లు ఎంత అడుగంటాయంటే, పంటని కోసిన కూలి డబ్బులు కూడా గిట్టలేదు!   అయినా పట్టువదలని లింగయ్య మళ్లీ అప్పు తీసుకొని, ప్రక్క పొలం వారితో‌ నీటి ఒప్పందం పెట్టుకొని, ఈసారి వరి పంట వేశాడు. నీళ్లు లేక వరి పంట దాదాపు ఎండిపోయింది. ఆ సరికి లింగయ్య జమీందారుకు ఇవ్వాల్సిన డబ్బు ఆరంకెల స్థాయికి చేరుకున్నది. లింగయ్య నీరసించి పోయాడు. అతని మనసు విరిగిపోయింది. వరి పంటకోసం కొన్న పురుగు మందును తాగి చనిపోవాలని నిశ్చయించుకొని, ఒక రోజు మధ్యాహ్నం సమయంలో‌ పొలం చేరుకున్నాడు. సరిగ్గా ఆ సమయానికి మేఘాలు క్రమ్ముకున్నాయి. ఉరుములు, మెరుపులతో భయంకరమైన వాన మొదలైంది. లింగయ్య ఆవేశం అంతా ఆ వానతో ఆవిరైంది. అతని ఆశలు మళ్ళీ చిగురించాయి. తన వరిపంట ఇక తిరుక్కుంటుంది. ఈసారి బాగా పండుతుంది! తన కష్టాలన్నీ తీరతాయి! లింగయ్య చనిపోయే ఆలోచనని ప్రక్కన పెట్టేసి పనిలోకి దిగాడు. ఈసారి అతని పొలం మంచిగా పండి కోతకు వచ్చింది. వచ్చిన వడ్లు అమ్మేసరికి ఆనాటి వరకూ తనకు ఉన్న అప్పంతా తీరింది! తను గెలిచాడు! - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

అవకాశం వదలకండి

అవకాశం వదలకండి     ఒక ఊరికి వరదలు వచ్చాయి. అందరూ హడావిడిగా ఇళ్ళు వదిలేసి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజుగారి కోట కూడా వరదలో మునిగిపోయే ప్రమాదంలో పడింది. కానీ రాజుగారు మాత్రం "నేను దైవభక్తుడిని. నన్ను దేవుడే రక్షిస్తాడు!" అనుకుంటూ ఇంట్లోంచి కదల్లేదు. నీటి మట్టం పెరుగుతూనే ఉంది. రాజుగారి ఇంట్లోవాళ్ళు, పొరుగువాళ్ళు అందరూ రాజుగారిని తమవెంట రమ్మన్నారు. రాజుగారు ఒప్పుకోలేదు.  "నన్ను దేవుడే కాపాడతాడు" అన్నారు. వాళ్లందరూ ఆయన్ని అక్కడే వదిలేసి సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. రాజుగారు ఒక్కరే పై అంతస్తుకి ఎక్కారు. ఊరంతా అల్లకల్లోలంగా ఉంది. కొంతమంది పడవల్లో తిరుగుతూ ఇళ్ళల్లో చిక్కుకు-పోయిన వారిని రక్షిస్తున్నారు. వాళ్లలో ఒక పడవవాడు రాజుగారిని పిలిచాడు. "రా, త్వరగా పడవెక్కు! లేకపోతే మునిగిపోతావు!" అన్నాడు. రాజుగారు పోలేదు.      "నన్ను దేవుడే కాపాడతాడు" అన్నారు. వరద నీరు ఇంకా పెరిగిపోతుండటంతో రాజుగారు పై కప్పు మీది కెక్కారు. వరదలో చిక్కుకుపోయిన వాళ్ళని రక్షించడానికి అంతలో ఓ హెలికాప్టర్ వచ్చింది. అందులోంచి పైలట్ గట్టి తాడుని ఒకదాన్ని కిందికి విసిరాడు. "దాన్ని పట్టుకో - పైకి లాగుతాం!' అని అరిచాడు. అయినా రాజుగారు "నన్ను దేవుడే రక్షిస్తాడు " అంటూ పాత పాటే పాడారు. అటు తర్వాత ఇంక వేరే ఎవ్వరూ రాలేదు. వరద ఇంకా ఎక్కువైంది.  రాజుగారు నీళ్ళలో పడి చచ్చిపోయారు. మళ్ళీ చూసేసరికి ఎదురుగా దేవుడు ఉన్నాడు. పాప పుణ్యాల లెక్కలు సరి చూసుకుంటున్నాడు. రాజుగారు దేవుడ్ని నిలదీశాడు. "నేను నీ భక్తుడిని కాదా, మరి నాకెందుకు సాయం చెయ్యలేదు?" అని. "ఏంటి నువ్వు మాట్లాడేది? నేను నీ పొరుగువాడ్ని పంపాను. పడవ పంపాను హెలికాప్టర్ పంపాను నువ్వు సాయమే తీసుకోకపోతే నేనేం చెయ్యాలి?! " అన్నాడు దేవుడు అవకాశాల్ని పంపించేదీ దేవుడే గద, మరి!? - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

వేషం మార్చిన యువరాజు

వేషం మార్చిన యువరాజు   ప్రవీణుడు ఒక రాజ కుమారుడు. వయసు ఆరేళ్ళే. అయినా అల్లారు ముద్దుగా పెరగటం వల్లనో ఏమో, అతనిలో గర్వం పాలు ఎక్కువే ఉండేది. తమ వద్ద పనిచేసే వాళ్లందరితోటీ దురుసుగా ప్రవర్తించేవాడు. ఆ సంగతి గుర్తించినా, పని ఒత్తిడిలో ఉండే రాజుగారు దాన్ని గురించి ఏమీ చేయలేదు. కానీ తగిన వయసు రాగానే అతన్ని విద్యాభ్యాసం కోసం గురుకులానికి పంపించారు. గురుకులంలో అన్ని కులాలకు, వృత్తులకు చెందిన పిల్లలు కలిసిమెలిసి ఉండేవాళ్ళు. అందరూ రకరకాల విద్యలను, శాస్త్రాలను, కళలను అభ్యసించేవాళ్ళు. గురువులు ఎవ్వరూ ప్రవీణుడికి రాజకుమారుడని ప్రత్యేక గుర్తింపు ఇవ్వలేదు. వాళ్ళకు పిల్లలందరూ సమానమే! పిల్లలు కూడా అతన్ని తమలో ఒకడుగానే చూసారు తప్ప, రాజకుమారుడని వేరుగా చూడలేదు. అప్పటివరకూ అహంకారంతో మెలగిన ప్రవీణుడికి అక్కడి సమానత్వపు వాతావరణం ఏమంత నచ్చలేదు. "రాజకుమారుడికి ఇదేమి శిక్ష?" అనుకోసాగాడతను.   చూస్తూండగానే సంవత్సరం గడచిపోయింది. సెలవలు ఇచ్చే సమయం దగ్గర పడింది. సెలవల ముందు గురుకులంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. దానికోసం పిల్లలంతా నెల రోజుల పాటు సాధన చేస్తారు. వాళ్ళు వేయబోయే నాటకంలో ప్రవీణుడికి పనిమనిషి పాత్ర ఇచ్చారు గురువుగారు: "నాటకం రక్తి కట్టాలంటే, నటించేవాడు పాత్రలో లీనం అయిపోవాలి" అని గుర్తుచేస్తూ. ప్రవీణుడికి ఆ నాటకం నచ్చింది. అందులో తను పనివాడు. చాలా కష్టపడి పని చేస్తాడు. యజమానిని, యజమాని ఇంటివాళ్లని మనస్ఫూర్తిగా గౌరవిస్తుంటాడు. అయినా వాళ్ళెవ్వరూ తన కష్టాన్ని గుర్తించరు. ప్రతి క్షణమూ తనని చులకనగా చూస్తారు. చివరికి అందరూ అతని మంచితనాన్ని గుర్తించటంతో నాటకం ముగుస్తుంది. నాటకం వేయటంలో లీనమైన ప్రవీణుడికి సాధన చేస్తున్న కొద్దీ ఆ పాత్ర స్వభావం అర్థం కాసాగింది. యజమాని పరుషంగా మాట్లాడిన ప్రతిసారీ పనివాడి మనసు ఎలా గాయపడుతున్నదో అతనికి అర్థమైంది. ఎంత పని చేస్తున్నా తృప్తి చెందకుండా "ఇంకా పని చెయ్యి" అంటూ పీడించే యజమాని 'తప్పు చేస్తున్నాడు' అని అనిపించసాగింది. నాటకం అయిపోయేసరికి అతనికి తను ఎలా జీవించాలో తెలిసిపోయింది!  సెలవులకని ఇంటికి వెళ్ళిన ప్రవీణుడిలో గొప్ప మార్పు కనబడింది అందరికీ. ఇప్పుడతను అందరితోటీ మర్యాదగా మెసలుకుంటున్నాడు. పని చేసేవారిని చిన్నబుచ్చటం లేదు సరికదా, "నేను ఇదివరకు మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించండి" అంటున్నాడు! అందరూ యువరాజులో వచ్చిన మార్పుకు ఆనందించారు.   - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

బొగ్గుల మనిషి

                                                      బొగ్గుల మనిషి                                                                                                                      1 రాత్రి వాన కురిసింది. నేలంతా తడిసిపోయి అక్కడ క్కడా నీళ్లు నిలబడి ఉన్నాయి. బయట దూరంగా సైకిల్ వస్తున్న చప్పుడు. 'ఎవరు?' కేక వినిపించింది లోపల్నుంచి. 'న్నా! నేను మార్కెట్ సందులో గుడ్డలు ఇస్త్రీ చేసే వెంకటేశు కొడుకును. మా నాయన పంపించినాడు బొగ్గులు కొనుక్కు రమ్మని!' చెప్పినాడు సైకిల్ ఆపి, స్టాండ్ వేస్తూ. 'నిన్ననేకదుబ్బీ.. మీ నయనొచ్చి తీసుకపోయింది. అప్పుడే అయిపోయినాయా... అయినా ఊరంతా విడిచిపెట్టి, ఊరి బయట ఉండే ఈ బట్టీల కాటికే రావాల్నా...' లోగా గదిలోంచి మంచం మీద పడుకునే దీర్ఘం తీసినాడు బొగ్గుల మనిషి. ' ఏమోన్నా! నాకు తెలీదు. రాత్రి వానకు బొగ్గులన్నీ తడిసిపోయినాయని చెప్పమన్నాడు' చేతి లోకి ప్లాస్టిక్ సంచి తీసుకుంటూ జవాబిచ్చాడు. 'బొగ్గులన్నీ బట్టి వేయకముందే కాంట్రాక్టర్ కు అమ్మేసినాము. దింట్లోయి అమ్మీతే వాడు మొత్తుకొని సస్తాడు.అని తన బాధ చెప్పుకుంటా... ' పదికి, ఇరవైకి అమ్మముబ్బీ. ఇంతకుముందు కూడా మీ నాయనకు చెప్పినానే.. మళ్ళా నిన్ను అంపించినాడు ' విసుక్కుంటా బయటికొచ్చినాడు బొగ్గుల మనిషి. 'ఏమోలేన్నా... ఈసారికి ఇయ్యి!' అని చేతిలోని చిల్లర డబ్బు బొగ్గులాయప్పకు ఇచ్చినాడు. 'ఈ చిల్లర కు ఏం వస్తాయి... ఏమిఇయ్యాల..' అని గొణుక్కుంటూ పక్కనున్న పార చేతిలోకి తీసుకున్నాడు. కొన్ని బొగ్గులు లాగి ప్లాస్టిక్ సంచి లోకి వేశాడు. బయట ఆకాశం లో మళ్లీ మోడాలు కమ్ముకుంటున్నాయి. గబగబా సైకిల్ తొక్కుకుంటూ ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు.                                       2 బయట రెండు  బొగ్గు బట్టీలు కనిపిస్తున్నాయి. వాటిని వేయడానికి కంటే ముందే కాంట్రాక్టర్ దగ్గర అవసరానికి డబ్బులు తీసుకుని అమ్మేయవలసి వచ్చింది. కొండకు పోయినోళ్ళు తెచ్చిచ్చిన కట్టెలు, మొద్దులు అటువైపు ఇంకా ఉన్నాయి. ఇంకో రెండు బట్టీలు వేయాల్సి ఉంది. ఈసారి ముహూర్తాలకు కూతురు పెళ్లి చేయాలని అనుకుంటున్నాడు బొగ్గుల మనిషి. రైతులు ఎవరైనా తమ పొలాల దగ్గర ఉన్న 'సర్కారు తుమ్మ' ను అమ్మితే కొనుక్కోవాలని చూస్తున్నాడు. కానీ కుదరడం లేదు. దిగువ పల్లెకు అవతల ఎక్కడో బేరం మాట్లాడుకొని వచ్చాడు బట్టీల పనిచేసే రామాంజి. తను కూడా వెళ్లి మాట్లాడవలసి ఉంది. ఇంతకు ముందులాగా లేదు పరిస్థితి. ఎప్పుడు ఎవరు వచ్చి పట్టుకుంటారో అర్థం కాకుండా ఉంది. సర్కారు తుమ్మ చెట్లు కొట్టడానికి ముందు అనుమతి తీసుకోవాలని అంటున్నారు. బొగ్గుల బట్టీలు వేసుకోవడానికి కూడా మరొక అనుమతి కావాలి. బొగ్గుల రవాణాకు కూడా ఇంకొక అనుమతి కావాలి. ఫారెస్టు అధికారు లో, విజిలెన్స్ అధికారులో ఎప్పుడు ఎవరొచ్చి ఏ అనుమతి పత్రం చూపించమంటారా రో అని గుండెల్లో దడ పుడుతోంది. వారికి ఇవ్వాల్సిన మామూళ్ల సంగతి సరే సరి! ' నువ్వు ఏమైనా చెప్పు. ఈసారి మాత్రం ముందుగా కాంట్రాక్టర్కు కొయ్య బొగ్గులు అమ్మేది వద్దని, అడ్వాన్సు తీసుకునేదే వద్దని ' రోజూ మొత్తుకుంటా చెప్తా ఉంది భార్య నాగులమ్మ. బస్తా బొగ్గులు కాంట్రాక్టర్ కు అమ్మితే మూడొందలు ఇస్తాడు. అదే బయట మార్కెట్లో అమ్ముకుంటే బస్తాకు ఐదొందలు దాకా వస్తాయి. ఒక్కొక్క బట్టి కి కనీసం ఈసారైనా ముప్ఫయి బస్తాల బొగ్గు తీయాలని అనుకుంటున్నాడు. ఒక ఆలోచన తర్వాత మరొకటి. ఇంకొకటి. వ్యవస్థలోని అవస్థ గుర్తొచ్చి తనలో తానే నవ్వుకున్నాడు.                                        3 ఎండొచ్చింది. కూలోల్లందరూ  పనికి వచ్చారు. ఈరోజు బట్టీలు వేసే పని ఉంది. సర్కారు తుమ్మ కట్టెలు పల్లె నుంచి ఎద్దుల బండ్ల లో నిన్న సాయంత్రమే వచ్చాయి. ఇక్కడ కనపడే రెండు బట్టీలు కూడా రామాంజినే వేశాడు. బాగా వచ్చాయి. రెండు రోజుల్లో కాంట్రాక్టర్ వచ్చి వాటిని తీసుకెళ్తాను అన్నాడు. ఈ రోజు ఉదయం కూడా ఒకసారి ఫోన్ చేసి మాట్లాడాడు. అతను కోపిష్టి మనిషి. అతన్ని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది అనిపిస్తోంది. ఇప్పుడు కొత్తగా వేస్తున్న ఈ రెండు బట్టీలు మాత్రం అతనికి ఇవ్వకూడదని బలంగా అనుకుంటున్నాడు బొగ్గుల మనిషి. రామాంజి హడావిడిగా కేకలు వేస్తూ పని చేస్తున్నాడు. కట్టెలన్నీ సమంగా పేర్చుతున్నాడు . గుండ్రంగా కట్టెలన్నీ సరిగ్గా కాలేటట్లు పేర్చడం రాకపోతే కష్టమవుతుంది. సగం మాత్రమే కాలిపోయి, మిగతా సగం కట్టెలుగానే ఉండిపోతాయి. అందుకే ఈ పని జాగ్రత్తగా చెయ్యాలి. నాగులమ్మ టీ తెచ్చి కూలోల్లందరికీ ఇస్తోంది. కట్టెలు పేర్చడం తో పాటు మధ్యలో గడ్డి కూడా కూర్చారు. ఆ తర్వాత బట్టీల లోపలికి గాలి ప్రవేశించకుండా పైనంతా మట్టితో అలికారు. సాయంత్రానికి అంతా పని పూర్తయింది. పక్షులు గూళ్ళకు చేరుకుంటున్నాయి. చీకటైతాంది.                                     4 పొద్దున్నే బయట ఏదో వాహనం వచ్చిన చప్పుడు . తలుపు తట్టారు. నిద్ర మొహం తో ఒళ్ళు విరుచుకుంటూ వెళ్లి తలుపు తీశాడు. ' రేయ్... ఈ బొగ్గుల మనిషి ఎవర్రా...' గదమాయించి అడుగుతున్నాడు వచ్చిన ఎత్తుటి వ్యక్తి . 'నేనే ...నేనేసార్' జవాబిచ్చాడు తడబడుతూ. మళ్లీ అక్కడి నుంచి బొగ్గుల బట్టీల దగ్గరికి వెళ్ళాడు ఎత్తుటి వ్యక్తి . ఏమి జరుగుతోందో అర్థం కావడం లేదు. అప్పటికే అక్కడికి ట్రాక్టర్ వచ్చి ఆగి ఉంది. అందులో నుంచి ఆరు  మంది కూలీలు దిగారు. అక్కడున్న బొగ్గుల్ని సంచులకు ఎత్తి టాక్టర్ లోకి విసిరేస్తున్నారు. కాసేపట్లో వాళ్ళు వచ్చిన పని పూర్తయింది. ఆ వచ్చిన వాళ్ళు ఫారెస్ట్ అధికారులని చూస్తేనే అర్థమవుతుంది. ' సార్ సార్... అవన్నీ కాంట్రాక్టర్ కు అమ్మేసిన బొగ్గులు. మీరు తీసుకపోతే నేను చేతినుంచి వాళ్లకు డబ్బులు వెనక్కి కట్టేయాలి. ఇంక బట్టీలు వెయ్యను. మా అమ్మ మీద ఒట్టు. సార్ సార్...' అతను బతిమాలు కుంటున్నాడు . కానీ వాళ్ళు వినలేదు. పొగ లేపుతూ ట్రాక్టర్ ముందుకు కదిలింది. అక్కడే నేలపైన బొగ్గుల మనిషి దిగులుగా కూర్చుండిపోయాడు. ఇప్పుడు కాంట్రాక్టు వచ్చి అడిగితే ఏం చెప్పాలి ? ఇక తన సరుకు ట్రాక్టర్ బొగ్గుల్ని విడిపించుకోవడానికి ఫారెస్ట్ వాళ్ళ చుట్టూ తిరగాలి. అనుకుంటేనే బాధగా ఉంది. తెలియకుండానే కనురెప్పల లోతుల్లో కన్నీళ్లు కదిలాయి. అట్లా ఆలోచనల్లో మునిగిపోయాడు.                                     5 కాసేపటి తర్వాత దూరంగా సైకిల్ వస్తున్న చెప్పుడు. మార్కెట్ సందులో గుడ్డలు ఇస్త్రీ చేసే వెంకటేశు కొడుకు వస్తున్నాడు. స్టాండ్ వెనక తెచ్చుకున్న ప్లాస్టిక్ సంచిని దులిపాడు. దగ్గరగా వచ్చాడు. ఏదో అడుగుతున్నాడు. 'బొగ్గులు లేవు ' అని మాత్రం అన్నాడు బొగ్గుల మనిషి.. ముఖం దిగాలుగా పెట్టుకొని పోతూ పోతూ కాసేపు ఆగాడు ఆ అబ్బాయి. ఏదో అడిగాడు. తను తలాడించాడు. తన చేతిలో కొంత చిల్లర పెట్టాడు. బొగ్గు బట్టీలు దగ్గర అక్కడక్కడ పడి ఉన్న చిన్న చిన్న బొగ్గు తునకలను ఏరుకొని ప్లాస్టిక్ సంచిలో కట్టుకొని, సైకిల్ స్టాండ్ వెనకవైపు పెట్టుకొని వెళ్లిపోతున్నాడు. కొంత దూరం ముందుకు వెళ్ళగానే ఎదురుగా బైక్ లో కాంట్రాక్టర్ వస్తున్నాడు. ఆ అబ్బాయిని ఆపాడు. సంచి లోని బొగ్గులు తెరచి చూశాడు. ఏదో తిడుతున్నాడు. సంచి లోని బొగ్గుల్ని విసురుగా లాక్కొని అక్కడే కింద పోయించాడు. జేబులోంచి చిల్లర తీసి వాడిచేతిలో పెట్టి ఇంకోసారి ఇటు రావద్దని చూపుడు వేలు చూపించి హెచ్చరించాడు. సంచి బొగ్గులు పోతుంటేనే అంగీకరించని కాంట్రాకర్, మొత్తం బొగ్గుల సంచులన్నీ ఫారెస్ట్ వాళ్లు వచ్చి ట్రాక్టర్ లో తీసుకు పోయారని తెలిస్తే ఇంకేం చేస్తాడో...? కొన్ని ఎట్లా రాసిపెట్టి ఉంటే అట్లా జరుగుతాయి. ఎదురుగా తనవైపుకు వేగంగా వస్తున్న కాంట్రాక్టు వైపు అలాగే  చూస్తుండిపోయాడు బొగ్గుల మనిషి. జరిగేది జరగక మానదు. మధ్యాహ్నం వెళ్లి అధికారులను కలిసి మాట్లాడుకోవాలి. తమ సరుకును విడిపించు కోవాలి.  ఇక ఎక్కువ రోజులు  ఈ బొగ్గుల బట్టీల పని చెయ్యడం సాధ్యం కాదు.   కష్టంగా కూడా ఉంది. కూతురి పెళ్లి  చేసేసిన తర్వాత,  పట్నానికి వెళ్ళిపోయి ఏదైనా కొత్త పని వెతుక్కోవాలి. మనసులో అనుకున్నాడు. తనకు మాత్రం కళ్ళ నిండా కన్నీళ్లు పెట్టుకుని సైకిల్ పైన వెళ్తున్న మార్కెట్ సందులో గుడ్డలు ఇస్త్రీ చేసే వెంకటేశు కొడుకే పదే పదే గుర్తొస్తున్నాడు. ఆకాశంలో నల్ల మబ్బులు కమ్ముకుంటున్నాయి.                                                                               - డాక్టర్ వేంపల్లి గంగాధర్

ఒంటికాలి కాకి

                                                                 ఒంటికాలి కాకి                          అప్పుడే క్లాస్ అయిపోయి బయటికొస్తున్నాను. దూరంగా ఇద్దరు పిల్లలు నా వైపుకు పరిగెత్తుకు వస్తున్నారు. 'సార్... సార్.. కుంటి కాకి అక్కడుంది. రండి చూపిస్తాం ' అని గస పెడుతూ చెప్తున్నారు. 'అవునా...' అని దీర్ఘం తీస్తూ ఊ కొడుతూనే 'కుంటి కాకి అనొద్దని ఎన్నిసార్లు చెప్పాలి.' అని చిరాకుపడ్డాను. ' అదే.. అదే.. ఒంటికాలి కాకి ... సార్!' అంటూ తడబడుతూ బదులిచ్చారు పిల్లలు. మొన్న కూడా కొంత మంది పిల్లలు ఇట్లాగే వచ్చి చెప్పారు. ఆ కాకిని చూడ్డానికి ఆసక్తిగా పరుగుపరుగున వెళ్లాను. కానీ అదక్కడ లేదు. ఇప్పుడే అటువైపుకి ఎగిరిపోయిందని చెప్పారు అక్కడున్న పిల్లలు. ' అయ్యో ' అనుకుంటూ వెనక్కి వచ్చేశాను. ఈ మధ్య బడి ఆవరణలో 'ఒంటికాలితో తిరుగుతున్న కాకి ' బాగా కనిపిస్తోందని బడి పిల్లలు తరచూ చెప్తున్నారు . నాకెప్పుడూ అది తారసపడలేదు. దాన్ని చూడాలని నాక్కూడా అనిపిస్తోంది. కానీ ఆ కాకి కనిపించడం లేదు. బడి గోడకు చివర ఉన్న కానుగ చెట్టు వద్ద దాన్ని చూశామని పిల్లలు ఎప్పుడూ చెప్తుంటారు. మధ్యాహ్నం పిల్లలందరూ భోజనం చేశాక, ప్లేట్లు కడుక్కునే చోట అన్నం మెతుకులు తినడం కోసం కూడా వస్తుందని ఇంకొందరు చెప్పారు. నేనెప్పుడూ దాన్ని చూడలేదు. ఒక కాలుతో ఆ కాకి ఎట్లా జీవనం సాగిస్తోందో నా ఊహకు కూడా తట్టేది కాదు . దానికి ఒక కాలు ఎట్లా పోయి ఉంటుందో అనే ఆలోచన కంటే ఒక కాలు తోనే అది బతుకుతున్న తీరు పైనే మొదట్నుంచీ నా దృష్టి . దీంతో ఆ కాకిని చూడాలనే ఉబలాటంతో ఉన్నాను. ఇదిగో ఇప్పుడిట్లా పిల్లలొచ్చి కాకి విషయం చెప్పడం తో వారితో పాటూ ముందుకు కదిలాను. దూరంగా వేపచెట్టు కొమ్మలు గాలికి ఊగుతున్నాయి. పైన ఎండ కు కింద విస్తరించిన కొమ్మల నీడలు. అడుగులు ముందుకు పడుతున్నాయి. అవును ... చెట్టుకింద నీడలో కాకి కనిపిస్తోంది. అటూ ఇటూ తిరుగుతోంది.ముక్కుతో ఏదో పొడుచుకొని తింటోంది. ఇంకొంచెం దగ్గరికి వెళ్తే ఎగిరి పోతుందేమో. తెలియదు. కానీ దాన్ని దగ్గర్నుంచి చూడాలనే కోరిక. ఆలోచిస్తూనే చిన్నగా ముందుకు నడుస్తున్నాను. ఎండ మండిపోతోంది. వేడిగాలి. వేప చెట్టు పూత వాసన . మెల్లగా చెట్టు దగ్గరికి చేరుకున్నాను. అవును... దానికి ఒక కాలే ఉంది. తన దేహ బరువునంతా ఆ ఒక్క కాలు పైనే మోస్తోంది. ఏ గింజలనో తినడానికి వంగి నప్పుడల్లా తన దేహం అంతా భూమిని తాకుతోంది. అట్లా ఒంగితే గాని అది ఆ గింజల్ని తన ముక్కుతో అందుకో లేకపోతుంది. ఇలా ఒకరోజు కాదు రెండు రోజులు కాదు. అది తన జీవిత కాలమంతా బతకాలి. అనుకుంటేనే గుండె బరువెక్కుతోంది. దాన్నిఅట్లాగే కాసేపు చూస్తుండిపోయాను. దాని కళ్ళల్లో ఎక్కడ తనకు ఒక కాలే ఉందన్న భావన లేదు. ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా తన జీవితానికి జీవాన్ని నింపి జీవిస్తోంది. రెక్కల్ని రెపరెపలాడిస్తూ తన ఆహారాన్ని తానే సంపాదించుకుంటోంది. రివ్వున కొమ్మల పైకి ఎగురుతోంది. మళ్లీ కిందకి దిగుతోంది. నేలపైన ఒక కాలితో ఒక చోటి నుంచి మరో చోటికి అది ఎగురుతున్నప్పుడు చూడముచ్చటగా ఉంది. వళ్ళంతా నల్ల రంగు తో మధ్య మధ్య లో ' కావ్... కావ్ ..'అని అంటుంటే ' ఏవీ శాశ్వతం కాదని. ఈ జీవితాన్ని ఇట్లా గడపడమే పరమార్థమని' హెచ్చరిస్తున్నట్లు గానే ఉంది. అలాగే దాన్ని చూస్తుండిపోవాలనిపిస్తోంది. బలంగా గాలి వీచింది. చెట్టు పై నుంచి ఒక ఎండిన కొమ్మ రాలి పడింది. కింద పడగానే ముక్కలు ముక్కలయింది. చీమల పుట్ట దగ్గర ఆహార అన్వేషణలో ఉన్న ఒంటికాలి కాకి తన రెక్కల్ని విప్పార్చింది. ఎగురుతూ ఎగురుతూ రాలిపడిన ఎండిన పుల్లల వద్దకు చేరుతుంది. ఒక మంచి పుల్లను ఎంపిక చేసుకొని నోటికి కరచుకుని పైకి ఎగిరింది. ఒక కొమ్మ ను చేరుకుంది. ఆ కొమ్మ పై నుంచి మరో కొమ్మకు . పైనున్న చిటారు కొమ్మకు చేరుకుంది. పచ్చటి ఆకులు నీడలు పడుతున్న చోట తన గూడును కట్టుకుంటోంది. అది నిర్మిస్తున్న 'పెద్ద గూడు' ను నేనట్లా చూస్తూనే ఉండిపోయాను.                                                                                            - డాక్టర్ వేంపల్లి గంగాధర్

జమీందారి బంగ్లా

                                  జమీందారి బంగ్లా                                                                                1 గుర్రపు బగ్గీ చెట్టు కింద నీడలో కనిపిస్తోంది. బయటికి వెళ్లే పని లేకుండా ఇవాళ జమీందారు గారు బంగ్లా లోనే ఉంటారు కాబోలు. నౌకర్లు అటు ఇటు గా ఇంటి పనులు చేస్తూ వేగంగా తిరుగుతున్నారు. సిరా బుడ్డీ లో కలాన్ని అద్దుకొని చేవ్రాలు పెట్టిన కాగితాలు పట్టుకొని గుమస్తాలు కార్యాలయంలోని గదిలోకి పరుగులు పెడుతున్నారు. వాతావరణం అంతా హడావిడిగా ఉంది. పట్నం నుంచి నలుగురు కొత్త వ్యక్తులు వచ్చారు. తాము వచ్చిన సంగతి, తమ వివరాలను అక్కడున్న బంట్రోతుకు చెప్పారు. అతను కాసేపు వాళ్లను ఆవరణ లోని చెక్క కుర్చీ ల్లో ఆసీనులు కమ్మని సైగ చేశాడు. వాళ్లు పిలుపు కోసం ఎదురు చూస్తూ ఆ కుర్చీల్లో కూర్చుండిపోయారు. కొంతసేపటి తర్వాత వారికి జమీందారు గారి గదిలోకి అనుమతి లభించింది. తేనీరు కప్పులు లోపలికి వెళ్లాయి. గట్టిగా జమీందారు గారు నవ్విన నవ్వు బయటకు వినిపించింది. వారు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నట్లున్నారు. మామూలుగా అయితే వారి కేకలతో బంగ్లా మొత్తం దద్దరిల్లుతుంటుంది . క్షణమొక యుగమై , తుఫాను ముందు ప్రశాంతతను మోస్తూ, నిరంతరం అప్రమత్తమై ఉంటుంది. నౌకర్లు గుండెను అరచేతిలో పెట్టుకొని తిరగడం ఒకటే తక్కువ. బంగ్లాలో పని చేయడం అంటే ఆషామాషీ కాదు.                                      2 కొంత సమయం గడిచిన తరువాత జమీందారు గారి తో సహా, ఆ నలుగురు కూడా బయటికి వచ్చారు. బంగ్లా మొదట్లో ఉన్న పొడవాటి రాతి మెట్లను దిగారు. అట్నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చారు. వాళ్ళల్లో పొడవుగా ,లావుగా ఉన్న వ్యక్తి అక్కడొక పెద్ద వలయం గీశాడు మట్టిలో. సరిపోతుంది అన్నట్లు జమీందారు గారు తలాడించారు. మళ్లీ వాళ్లను లోపలికి తీసుకెళ్లారు. అక్కడ ఎడమ వైపు గోడకు ఉన్న ఎత్తైన తైలవర్ణ చిత్రాన్ని చూపిస్తున్నారు. అది జమీందారు గారి తండ్రి గారిది. ఆ చిత్రంలోని వ్యక్తి అశ్వం పై కూర్చున్న విధానంలోని గంభీర ధీరత్వం , ముఖకవళికలను, తేజస్సును, రాజసాన్ని, వీరత్వాన్ని గురించి కథలు కథలుగా చెప్తున్నారు. వాళ్లు వింటున్నారు. తన తండ్రిగారి నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని తయారుచేయించి బంగ్లా బయట ప్రవేశ మార్గంలో ప్రతిష్టించాలని జమీందారు గారు చాలా కాలంగా అనుకుంటూ ఉన్నారు. ఆ పని నిమిత్తమై ఇప్పుడు పట్నం నుంచి అదేపనిగా ఈ తయారీదారులను పిలిపించారు. కాంస్య విగ్రహం ఎలా ఉండాలని తను కోరుకుంటున్నాడో, తన మనసులోని ఆలోచనలన్నింటినీ వారికి వివరంగా చెప్పారు. దివాణం లోని ఖజానా అధికారిని పిలిచి కొంత రొక్కాన్ని వారికి ఇప్పించారు. ఇక వెంటనే పనులు ప్రారంభిస్తామని చెప్పి, వారు సంతోషంగా వెళ్లిపోయారు.                                     3 బంగ్లా లోపలికి అడుగుపెడుతూనే పైన ఎదురుగా భీకర రూపంలో ఉన్న పులి తల, దాని చర్మము గోడకు బిగించబడి ఉన్నాయి. కుడి వైపు గది పై భాగాన బలిష్టమైన , నునుపైన తెల్లని ఏనుగు దంతాలు అలంకరించబడి ఉన్నాయి. ఎడమ వైపు గది పైభాగాన ఒంపులు సొంపులు గా పురి తిరిగిన జింక కొమ్ములు కనిపిస్తాయి. మరో వైపు గోడకు నాటు తుపాకులు సగర్వంగా పలకరిస్తాయి. బంగ్లా దర్బారు మందిరంలో అటు ఒక సింహం , ఇటు ఒక సింహం తో తయారుచేసిన నైపుణ్య మైన కొయ్య సింహాసనం. దానికి అటువైపుగా నిలువెత్తు వీర ఖడ్గం. ధరించడానికి సిద్ధంగా ఉన్నా ముత్యాల పట్టుకుచ్చుల తలపాగా , పులిగోరు హారం, మెరిసేటి విదేశీ పట్టు వస్త్రాలు, ఆభరణాలు, మెత్తటి మేజోళ్ళు, పరిమళాల అత్తర్లు, పూలాభిషేకాలు .. ఒక్కటేమిటి ? తరతరాల జమీందారు గారి సంస్థానం చూడ్డానికి రెండు కళ్లు చాలవని జనం అందరూ చెప్పుకుంటారు. జమీందారు గారు సంస్థానంలో కి ఎవరొచ్చినా మంచి ఆతిథ్యం ఇవ్వడం ఆనవాయితీ. మీది ఏ ఊరు అయినా, ఏ పని ఉండి ఇక్కడికి వచ్చినా ఆకలి కడుపుతో బాధపడకూడదని జమీందారు గారి ఆజ్ఞ. అందుకోసమే ఎడమవైపు చింతవనం దగ్గర వంటశాల, భోజనశాల కట్టించారు. పొయ్యి ఎప్పుడూ ఆరిపోకుండా వెలుగుతూనే ఉంటుంది. రావుబహద్దూర్ అనిపించుకున్న తన తండ్రి గారు బాటసారుల కోసం నిర్మించిన సత్రాలు కూలిపోయిన చోటల్లా మళ్లీ కొత్తగా నిర్మిస్తూనే ఉన్నారు. గ్రామ ప్రజల కోరిక మేరకు చెరువులు, బావులు త్రవిస్తూనే ఉన్నారు. కరువు కాటకాలు వచ్చిన ప్రతిసారి, ఆదుకోమని చెయ్యి చాచి, బంగ్లా బయట నిలబడ్డ ప్రతి నిరుపేదకు, నిర్భాగ్యునికి సహాయం అందేది. వారి కన్నీళ్లు తుడిచి పంపేవారు.                                   4 జమీందారు గారి గుర్రాన్ని చూడ్డానికి కూడా చుట్టుపక్కల ఊర్లల్లో నుంచి జనం వచ్చేవారు. వారి గుర్రపుస్వారీ కనువిందుగా ఉండేది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త గుర్రాలను తేప్పించే వారు. తెల్లటి గుర్రానికి ముఖంపైన నల్లటి నామం ఉంటే అదృష్టం అని నమ్మారు. అలా రాజసం ఉట్టిపడేలా ఉండే గుర్రం కోసం చెన్నపట్నం వెళ్లారు. దొరకలేదు. అట్నుంచి బొంబాయి పోయారు. దొరకలేదు. అట్లా అన్వేషిస్తూనే బరోడా , ఇండోర్, గ్వాలియర్ తిరిగొచ్చారు. చివరికి మైసూరు లోనే దొరికింది. ఎక్కువ మొత్తానికి ఖరీదు చేసికొన్నారు. ఆ గుర్రం అంటే వారికి ప్రాణం. ఎంతో నమ్మకం. గుర్రపు పందాలు ఆడడం అలవాటైంది. సంస్థానంలో ఉన్న కాలం కంటే, గుర్రపు పందాలు ఆడుతూ ఎక్కడెక్కడో తిరిగే సమయం ఎక్కువ. బంగ్లాకు వచ్చినా కూడా మత్తుగా తాగి, చిత్తుగా పేకాట ఆడుతూ గడిపేవారు. విలాస పురుషుడు. సుఖ లోలుడు . అందుకే తన ఒక్కగానొక్క కుమారుడికి పెళ్లి చేయకుండానే పెద్ద వాళ్ళందరూ కాలంతో పాటు వెళ్ళిపోయారు.                                   5 ఉదయాన్నే ఒక నాటక సమాజం వాళ్ళు వచ్చారు. ఇక్కడే మూడు రోజులపాటు విడిది చేసి, 'సారంగధర' నాటకాన్ని ప్రదర్శిస్తామని వేడుకున్నారు. తమరు దయతలచి సహాయ , సహకారాలు అందించాలని మనవి చేసుకున్నారు. జమీందారు గారు ' సరే' నని ఒప్పుకున్నారు. ప్రతిరోజు సాయంత్రం నాటకం ఆసక్తిగా జనం చుట్టుపక్కల పల్లెల నుంచి బండ్లు కట్టుకొని వచ్చి మరీ తిలకించేవారు. బంగ్లా పైనుంచి మద్యం సేవిస్తూ జమీందారు గారు వీక్షించే వారు. నాటకంలో చిత్రాంగి పాత్ర వేసిన నాట్య నర్తకి ని తన గదికి రమ్మన్నాడు. వెళ్లక తప్పలేదు. చివరి రోజు పొద్దున్నే దివాణం లోని ఖజానా గుమస్తా వచ్చాడు. నాటక బృందంతో మాట్లాడి వాళ్లకి ఏం కావాలో అది ఇచ్చి సంతోషంగా పంపాడు.                                   6 కాలం ఇట్లా సాగుతుండగానే... సంస్థానంలోని గ్రామాల్లో మశూచి ప్రబలింది. అనారోగ్యంతో ఎంతోమంది ప్రాణాలు విడిచారు. కరువు మేఘాలు కమ్ముకున్నాయి. పంటలు దెబ్బతిన్నాయి. ఆహారం అందని పరిస్థితి. కూడళ్ళలో గంజి కేంద్రాలు ఏర్పాటు చేయవలసి వచ్చింది. కాలం ఇప్పుడు ఏం బాగోలేదు. కర్కశంగా ఉంది. సాయంత్రం కాగానే బంగ్లా లోని దీపాలన్నిటికీ నూనె పోసి వెలిగించి వెళ్లిపోయారు పనివాళ్ళు. అవి అట్లా తెల్లవార్లూ వెలుగుతూనే ఉంటాయి. బంగ్లా నిశ్శబ్దంగా ఉంది. నిర్మానుష్యంగా ఉంది. 'దివాణం దివాలా తీసింది. ఖజానా ఖాళీ అయింది.' అని అందరూ అనుకుంటున్న మాటలు ప్రతిధ్వనిస్తున్నాయి. జమీందారు గారికి రాత్రంతా ఆలోచనలు పరిభ్రమిస్తున్నాయి. అసహనంగా ఉంది. దూరం గా ఏదో పక్షి ఆగి ఆగి అరుస్తోంది . కాలుస్తున్న నోట్లోని పొగచుట్ట అయిపోయింది. వేళ్ళ మధ్యలో మిగిలిన చివరి ముక్క అటువైపు కోపంగా విసిరేసాడు. ఒక నిశ్చయానికి వచ్చాడు. తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. అప్పటివరకు బయట వరండాలో దేదీప్యమానంగా, ప్రకాశవంతంగా వెలుగుతున్న దీపం నూనె అయిపోవడంతో ఒక్కసారిగా బగ్గున వెలిగి ఆరిపోయింది.                                                                    - డాక్టర్ వేంపల్లి గంగాధర్

జెయింట్ వీల్

                                                           జెయింట్ వీల్                                                  ఊర్లోకి ఎగ్జిబిషన్ వచ్చింది. వీధుల్లో రిక్షా బండి కి మైకు తగిలించి ప్రచారం చేస్తున్నారు.   ఎప్పుడూ టీవీలకు అతుక్కుపోయిన మొహాలు ఇంట్లోనుంచి బయటికి వచ్చి రిక్షా బండి ని తొంగిచూసి వెళ్తున్నాయి. వాడిపోయిన సాయంత్రాలకు జీవం నింపడానికి అప్పుడప్పుడు ఇలాంటి ఎగ్జిబిషన్లు వస్తుంటాయి అనుకుంటాను. నేను కూడా వెళ్లాలి. చూడాలి... కనీసం ఈ సాయంత్రం అయినా వీలు కుదురుతుందో లేదో ! ఆఫీసు మిత్రులతో ఇదే మాట అంటే నవ్వారు. 'చిన్నప్పట్నుంచి ఎన్నిసార్లు వెళ్ళ లేదు. ఇప్పుడు మాత్రం వెళ్లి కొత్తగా చూసేది ఏముంటుంది' అని కొందరన్నారు.' ఆ తిరిగే జెయింట్ వీల్ ను చూస్తూ పెద్ద అప్పలాన్నో, మిరపకాయ బజ్జినో ఆ దుమ్ములో తినడం కోసమా...'అని వెటకారం గా అన్నారు ఇంకొందరు.   నా చిన్నప్పుడు మా ఊరిలో జరిగే జాతరకు, తిరునాళ్ళకు, ఉరుసుకు ఒకరోజు ముందే 'రంగులరాట్నం' వచ్చేది. దాన్ని బిగిస్తునప్పుడే బడిలో పిల్లలందరికీ తెలిసిపోయేది. ఇక ఆ తర్వాత సమయం అంతా అక్కడే గడిచిపోయేది. నేను ఎప్పుడు జాతరకు వెళ్ళినా ' రంగులరాట్నం' తప్పనిసరిగా ఎక్కే వాడిని. ఆ తరువాత రంగులరాట్నం ఎప్పుడు మాయమైయిందో తెలియదు. దాని స్థానం లోకి 'జెయింట్ వీల్' వచ్చి చేరింది. జెయింట్ వీల్ వచ్చిన తర్వాత రంగులరాట్నం పరిస్థితి ఉన్నాకూడా లేనట్లుగానే తయారయ్యింది. రంగులరాట్నాన్ని జెయింట్ వీల్ మింగేసింది. పిల్లలందరూ జెయింట్ వీల్ వద్దనే గుమికూడే వారు. వాళ్ళ ఆనందం అంతా ఇంతా కాదు. దాని చుట్టూ చేరి కేరింతలు కొట్టే వారు. వారి సంబరం అంబరాన్ని తాకేది. ఊర్లో నువ్వు ఏ వైపు నుంచి చూసినా అదో వింత జంతువులా 'జెయింట్ వీల్' కనిపిస్తూ ఉండేది. వచ్చి తనను కలవమని పిలుస్తున్నట్లు గానే ఉండేది. అంతకంటే ఆహ్వానం ఇంకేముంటుంది...   రెండు రోజులు దాటిపోయింది. ఎగ్జిబిషన్ కి వెళ్ళడానికి కుదరలేదు. ఈరోజు సాయంత్రం మిత్రుడు నాగరాజు వచ్చాడు. ఇద్దరం కలిసి ఎగ్జిబిషన్ కి బయలుదేరాం. ఎడమ గేటు కు అవతల జెయింట్ వీల్ కనిపిస్తోంది.   వాతావరణం అంతా కోలాహలంగా ఉంది. కుడివైపు గేటు వద్ద ఒక సన్నటి, పొడవాటి వ్యక్తిని చూసి అక్కడున్న పిల్లలు పరుగు పరుగున వచ్చి చేరుతున్నారు. చుట్టుముడుతున్నారు. అతను తన చేతిలోని టిక్కెట్లు పిల్లలందరికీ పంచుతున్నాడు . అందులో రెండు టికెట్లు ఉన్నాయి. ఒకటి లోపలికి ప్రవేశం కోసం, మరొకటి జెయింట్ వీల్ ఎక్కడం కోసం. అతడికి ప్రేమగా షేక్ హ్యాండ్ ఇస్తున్నారు పిల్లలు. వాళ్లందరూ పేద పిల్లలని చూస్తేనే అర్థమౌతోంది. మట్టి కొట్టుకపోయిన మాసిన ముఖాలు, చిరుగులు పడిన దుస్తులు, దుమ్ము పాదాలు ... బయటి నుంచి రోజూ లోపలికి చూసే కళ్ళు, వారి లేత చూపుల పిల్లలు అట్నుంచి సంతోషంతో కేరింతలు కొడుతూ లోపలికి పరుగు పెడుతున్నారు. వాళ్లను చూసి అతడు కళ్ళనిండా సంతృప్తిని నింపుకుంటున్నాడు.   ఎగ్జిబిషన్ లోపలికి వెళ్లడానికి డబ్బులు లేక బయట నిలబడి. రంగురంగుల విద్యుద్దీపాల వెలుగులతో తిరుగుతున్న జెయింట్ వీల్ ను చూస్తూ గడిపే పేద పిల్లలకు ఇలా రోజూ వచ్చి ఉచితంగా టికెట్లు పంచుతూ అందులో తన సంతోషాన్ని వెతుక్కునే వ్యక్తిని నేను చూడడం ఇదే మొదటిసారి. ఎప్పుడూ వినింది కూడా లేదు. ఆశ్చర్యంగా ఉంది. ' ఆ వ్యక్తి ఊరి బయట ఉన్న ఆటోనగర్లో మెకానిక్ గా పనిచేస్తూ ఉన్నాడట. తన చిన్నప్పుడు డబ్బుల్లేక ఎగ్జిబిషన్ బయట నిలబడే వాడని , తనలాగా ఎవరూ పిల్లలు బాధపడకూడదని, ఇట్లా చేస్తున్నాడని అక్కడున్న వారు చెప్పుకుంటున్నారు.   నేనట్లా అతన్ని చూస్తూ ఉండిపోయాను. అతను జెయింట్ వీల్ కంటే ఎత్తుగా కనిపించాడు!                                                                   - డాక్టర్ వేంపల్లి గంగాధర్

సహదేవుడి వేణువు

                             సహదేవుడి వేణువు                                                           1 అంతఃపుర స్త్రీలందరూ గుమిగూడారు. రాణివాసం తలుపులు తెరుచుకున్నాయి. 'నువ్వేం చేస్తావో మాకు తెలియదు. మేము కూడా వేణు గానం చేయాలి. ఆ విద్య నువ్వే మాకు నేర్పాలి' అని పట్టుబట్టారు. బృహన్నల బేల చూపులు చూసింది. వేణువు ఊదడం తనెప్పుడూ నేర్చుకోలేదు. రాజగృహ మాలినీమణుల కోరిక తీరేది ఎట్లానో... 'వేణుగానం నాకు రాదు. నన్ను శిక్షణ ఇమ్మని బలవంతం పెట్ట వద్దని' అమాయకంగా ముఖం పెట్టి ప్రాధేయపడింది. కానీ వాళ్ళు వినేటట్టు లేరు. ఇప్పటికిప్పుడు వేణువు పైకి వీళ్లకు మనసు ఎందుకు పోయిందో అంతుబట్టడం లేదు. ' మన దగ్గర, ఈ గదిలో వేణువు కూడా లేదు కదా. మీకు నేర్పించడానికి...' అని తప్పించుకోవాలని చూసింది. ' అదెంత సేపట్లో పని, ఇప్పుడే కబురంపి చిటికెలో తెప్పిస్తాం ' అని అన్నారు వాళ్ళు ఉత్సాహంగా. ఎవరక్కడ? అనగానే వచ్చిన పరిచారిక తో వేగంగా వెళ్లి ఒక వేణువు ను తీసుకొని రమ్మని పురమాయించారు కూడా! 'దేవుడా ...వీళ్లు వదిలేలా లేరు' అని తల పట్టుకుని కూర్చుంది బృహన్నల. ఏదో ఆలోచన మదికి తట్టింది. వెంటనే 'మన రాజ్యంలో బాగా వేణుగానం చేయగలిగిన కళాకారుడిని పిలిపించి అతని ద్వారా ఆ విద్య అందరం నేర్చుకుందాం.' అని తనకు తోచిన ఆలోచనను అందరికీ చెప్పింది. 'చాల్లే ఆపు నీ మాటలు' అన్నట్లు చూశారు. 'అంతఃపుర రాణివాసం లోకి పురుషుడు అడుగు పెట్టే అవకాశం లేనేలేదని' తేల్చి చెప్పారు. బృహన్నల గుండెల్లో బండ పడి పడినట్లయ్యింది. అటూ ఇటూ చూసి మెల్లిగా అక్కడి నుంచి బయట పడింది.                                      2 అజ్ఞాతవాస కాలం. మత్స్య రాజు పరిపాలించే రాజ్యం. పాండవులు పన్నెండేళ్ళు అరణ్యవాసం ముగించుకున్నారు. విరాట నగరం చేరుకున్నారు. విరాట రాజు కొలువులో- 'కంకుడు ' పేరుతో ధర్మరాజు, 'బల్లవ ' గా భీముడు, ' బృహన్నల' గా అర్జునుడు, 'గ్రంధిక' గా నకులుడు, ' తంతి పాలుడు' గా సహదేవుడు, 'సైరంధ్రి 'గా ద్రౌపది... మారుపేర్లతో కొలువులు చేస్తున్నారు. కాలం గడుస్తూ ఉంది. ఇదిగో ఇప్పుడు ఇలా ఊహించని రీతిలో తనకు వచ్చిపడిన 'వేణుగాన' సంకటాన్ని గురించి అర్జునుడు సతమతమవుతూ ఉన్నాడు. రాజమహల్ వద్ద తారసపడిన ధర్మరాజుతో తో ఇదే విషయాన్ని చెప్పాడు . ' అర్జునా... ఎందుకైనా మంచిది. నువ్వు ఒకసారి సహ దేవుడిని కలిసి మాట్లాడు. సమస్య ఒక కొలిక్కి వస్తుంది. శ్రీకృష్ణుడు, సహదేవుడు ఇద్దరూ కలిసి వేణుగానం విద్యపై , అందులోని మెలకువల పై లీనమై మాట్లాడుకోవడం, చర్చించుకోవడం, నేను చాలా సార్లు చూసాను. నిన్న ఈ గండం నుంచి గట్టెక్కించగలిగినవాడు - సహదేవుడే' అని చెప్పి ధర్మరాజు వెళ్ళిపోయాడు. అర్జునుడు సహ దేవుడిని వెతుక్కుంటూ గోశాల వైపుకు కదిలాడు.                                     3 గోశాల నిశ్శబ్దంగా ఉంది. సహదేవుడు అక్కడ లేడు. ఆవుల మందలను తోలుకొని ఉదయాన్నేకొండకు వెళ్లాడని సాయంత్రం తిరిగీ వస్తాడని అక్కడున్న పనివాళ్ళు చెప్పారు. అర్జునుడికి ఎందుకో ఒక సందేహం వచ్చింది. 'సహదేవునికి వేణువు వాయించడం వస్తుందా?' అక్కడున్న వారిని అడిగాడు. వాళ్ళు ఆశ్చర్యంగా ఎగాదిగా చూశారు. 'సహదేవుడి వేణుగానానికి గోవులు పరవశించి పోతాయని' చెప్పారు. 'అతడి వేణు గానం తో ప్రాతఃకాలంలోనే నిద్రలేచి గోవులు తమంతకుతాముగా పాలిస్తాయని' అని వాళ్లు చెప్పారు. అతడట్లా వేణువు వాయించుకుంటూ ముందు వెళ్తుంటే వెనుక వేలాది ఆవులు తన్మయత్వం తో లయబద్ధంగా అడుగులు వేసుకుంటూ, మెడలోని గంటల శబ్దం తో కొండకు కదులుతాయని, చూడ్డానికి అదొక వేడుకలా ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. అర్జునుడికి నమ్మశక్యంగా లేదు. కొండలోని రాతి బండ పైన కూర్చొని సహదేవుడు వేణు గానం చేస్తున్నప్పుడు మేఘాలు నీడలుపడతాయని, ఆవులకు దాహం వేసినపుడు వానలు కురిపిస్తాయని, చెరువులు, కుంటలన్నీ నిండుతాయని, పచ్చని ప్రకృతి పరవశించి పశుపక్ష్యాదులకు ఆహ్లాదాన్ని ఇస్తుందని' వాళ్ళు అట్లా చెబుతూనే ఉన్నారు. 'వీళ్ళు చెబుతున్నది సహదేవుని గురించేనా?' అనే సందేహం లోనే అర్జునుడు ఉన్నాడు. 'సహదేవుడి వేణుగానం వింటూ ఒకవైపు గోవులు, మరోవైపు పులులు ఆ ప్రాంతంలో పక్కపక్కనే సంచరిస్తూ ఉండటం కూడా మేము చూశామని' ఇంకొందరు చెబుతున్నారు. అంతా గందరగోళంగా అనిపిస్తోంది. 'సరే... సహదేవుడు వచ్చిన తర్వాతనే కలుస్తాను' అని చెప్పి గోశాల నుంచి వెనక్కి వచ్చేశాడు అర్జునుడు.                                    4 పైన ఆకాశం నిర్మలంగా ఉంది. సాయం సమయం కోవెల కోనేరు మెట్ల పైన ఒకవైపు అర్జునుడు కూర్చుని ఉన్నాడు. మరోవైపు సహదేవుడు ఉన్నాడు. ' నీకు వేణువు వాయించడం వచ్చునా...' సందేహంగా అడిగాడు అర్జునుడు. తన చేతిలోని వేణువు తీసి , చేత్తో తుడిచి, పెదవి అంచుకు చేర్చి సుతారంగా గాలి ఊదాడు. సమ్మోహన అమృత సంగీత తరంగాలు. చూస్తుండగానే కొలనులోని పూలన్నీ విచ్చుకున్నాయి. ఎక్కడి నుంచో రెండు రాజహంసలు ఎగురుతూ వచ్చి కోనేరులోకి చేరాయి. పురివిప్పిన మయూరాలు పచ్చటి పచ్చిక పైన ఆడుతున్నాయి. ఒక్కసారిగా వాతావరణం అంతా మారిపోయింది. ' సహదేవ...! నాకు వేణువు వాయించడం నేర్పించాలి. ఆ విద్య నాకు ఇప్పుడు అవసరం వచ్చింది. అంతఃపుర రాణివాసపు స్త్రీలు తమకు నేర్పించమని పట్టుబడుతున్నారు.' అని అన్నాడు అర్జునుడు. సహదేవుడు సరేనన్నట్టు తలాడించాడు. 'నేనేం చేయమంటావు' అడిగాడు అర్జునుడు ఆసక్తిగా. 'సాధన ' అని జవాబిచ్చాడు సహదేవుడు. 'ఇది నా ప్రతిభాపాటవాలు సంబంధించిన విషయంగా మారింది. సరిగ్గా చెప్పు'తీక్షణంగా చూస్తూ అన్నాడు. 'సాధన' అని ప్రశాంతంగా సమాధానమిచ్చాడు. 'సరే , ఇదిగో నేను తెచ్చుకున్న వేణువు ను ఒక సారి వాయిస్తాను. చూడు.' అని అర్జనుడు వేణువును పెదవుల వద్దకు చేర్చి గాలి ఊదాడు. అందులోనుంచి ఏదో విచిత్రమైన శబ్దం వచ్చింది. మరోసారి వాయించాడు . అది పలకలేదు. గాలి తుస్సి పోయింది. సహదేవుడి వైపు ముఖం చిట్లించుకొని చూసాడు. 'సాధన చేస్తూ ఉంటే వస్తుంది ' అని సావధానంగా అన్నాడు సహదేవుడు . 'వెదురు లో ఏదో లోపం ఉన్నట్టుంది ' అని సమర్థించుకున్నాడు అర్జునుడు. సహదేవుడు చిన్నగా నవ్వాడు. సహదేవుడి వేణుగాన విద్య అంతా అతడిలో ఉందా ? అతడి వేణువులో ఉందా ? అర్జునుడికి ఏదో అర్థమైంది. స్పష్టత వచ్చినట్లైయింది . దులుపుకొని పైకి లేచాడు. సహదేవుడి వైపు సంతృప్తి గా చూసాడు. 'చివరిగా చెప్పు ...ఏమి చేయమంటావు?' అని అడిగాడు తన చేతిలోని వేణువును కోనేరులోకి విసిరేస్తూ. 'ఏ వేణువు అయినా ఒక కొయ్య ముక్కనే. అందులోకి నువ్వే ఊపిరి ఊది సంగీతాన్ని పుట్టించాలి. దాని కోసమే కావాలి-సాధన ' అంటూ స్థితప్రజ్ఞత తో చెప్పాడు . బయలుదేరడానికి పైకి లేచాడు సహదేవుడు. ఆకాశం లోకి రాత్రి ని మోసుకొంటూ చంద్రుడు వస్తున్నాడు . ఎవరి పాటికి వాళ్ళు వెళ్లిపోయారు.                                      5 ఎప్పటిలాగానే ప్రాతఃకాలంలోనే నిద్ర లేచాడు సహదేవుడు. కాలకృత్యాలు ముగించుకున్న తరువాత వేణుగాన సాధన చేయడానికి పూనుకున్నాడు. తలుపు కు అటువైపు ఉన్న గదిలో రోజూ వేణువు పెట్టె చోట చూశాడు. అది అక్కడ లేదు. కిందా, పైనా వెతికాడు. కనిపించలేదు. తనలో తానే నవ్వుకున్నాడు. కొత్త వేణువు తయారు చేసుకోవడానికి వెదురు పొదల దారి వైపు కి ముందుకు కదిలాడు.                                                                   - డాక్టర్ వేంపల్లి గంగాధర్

గంగమ్మ పూలు

                            గంగమ్మ పూలు                                                                                                                                                     ఎదురుగా కనిపిస్తోంది ఏనుగు నల్లరాతి కొండ. కొండ మధ్యలో నల్లరాతి బండ. బండ మధ్యలో గవి. గవి లో ప్రవహిస్తోంది గంగమ్మ. చీకటి గవి ముందు నిలబడి అంత ఎత్తు పైనుంచి కిందకి చూస్తే నీళ్లు పారుతున్న శబ్దం మాత్రం వినిపిస్తుంది. నీళ్లు కనపడవు. గవిలోకి దిగిన వాళ్ళు లేరు. నీళ్లను చూసినోళ్లు లేరు. ఆ నీళ్లు అట్లా ప్రవహిస్తూ పాతాళంలో ఉండే పరమశివుడి పాదాల చెంతకు చేరుతాయని చెప్పుకుంటూ ఉంటారు. ఊరి చివరి వేపచెట్టు కింద ఉండే గంగమ్మ తల్లికి మొక్కుకున్నారు . వాన కురిసే కాలానికి ముందు నెత్తి మీదికి ' గంగమ్మ పూలు ' ఎత్తుకొని ఆడోళ్ళు బయలుదేరారు. చిన్నచిన్న వెదురు బుట్టల్లో, రకరకాల రంగురంగులపువ్వులు కొత్త కాంతి తో, కొత్త శోభతో మెరుస్తున్నాయి. వాటిని తల పైకి ఎత్తుకుని వాళ్లందరూ కదిలారు. వాళ్ల ముందు నలుగురు తప్పెట కొడుతున్నారు. 'మేలుకొనమ్మ మా తల్లి గంగమ్మ తల్లి పూల పూజలు చేసెదము మేలుకొనమ్మ...' అని గుంపులో నుంచి ఎవరో పాటెత్తుకున్నారు. వాళ్ళు అట్లా దేవళం దగ్గర బయలుదేరారు. ఆ వచ్చే గుంపులోనే వస్తావుంది ఆయమ్మి. అట్నుంచి దావ పట్టినారు. ఎగువ గుట్ట దాటుకున్నారు. దిగువ గుట్ట దాటుకున్నారు. చుట్టూ అడవి. కాలి దారెమ్మడి ఒకరేనక ఒకరు కొండ ఎక్కుతా ఉండారు.ఏనుగు కొండపై నుంచి దూరం నుంచి వస్తాండే ఆయమ్మిని వాడు చూసినాడు. వాడిని ఆయమ్మి చూసింది. ఆడవాళ్లందరూ గస పెడుతూ కొండ ఎక్కారు. గవి దగ్గరికి చేరుకున్నారు. 'ఈ పూలన్నీ గవిలోని గంగమ్మ కిస్తే మోసుకొని పోయి పాతాళంలో ఉండే పరమేశ్వరుడికి మన కోరికలు జెప్పి ఇస్తాది. ఆసామి నెరవేరుస్తాడు ' అని చెప్పింది నమ్మకంగా పెద్ద రామక్క. 'విరం కాశి .. విరం జ్యోతి ...నీకు హారతి, గంగా మాతల్లి నీకు మంగళ హారతి... చెవ్వు, చెవ్వ0దం చూడు, చెవుల కమ్మలు చూడు, చెయ్యి, చెయ్యందం చూడు, చేతిగాజులు చూడు, కాళ్లు, కాళ్ళందం చూడు, కాళ్ళ గజ్జెలు చూడు, ముక్కు, ముక్కందం చూడు, మెరిసే ముక్కెర చూడు పూజ చేయుమురారో గంగమ్మ తల్లికి... కుసుమాల పూజ చేతుము రారో పుణ్యవతులారా...' ఇట్లా హారతి పాట పాడుతూ పూజ చేశారు. వాడు ఆయమ్మినే చూస్తా ఉండాడు. పూజ అయిపోయిన తర్వాత ఆయమ్మి కొంచం పక్కకు వచ్చింది. వాడు ఇంకేదో చెప్తుందని దగ్గరికి పోయాడు ఆశగా . 'ఇది గంధపు దండ. గంగమ్మ పూల తో పాటు తెచ్చినాను. గవిలేకి వేస్తా ఉండను.నువ్వు మొగుడివి అయితే దీన్ని బయటికి తీసకచ్చిసూపి...' అని చెప్పింది ఆయమ్మి. వాడికి దిమ్మ తిరిగింది. చెప్పి నడుము తిప్పుకుంటా పోయింది ఆయమ్మి. గవిలోకి గంధపు దండ వేసింది. వాడికి దిక్కు తెలియలేదు. ఆయమ్మి పోయిన వైపుకే చూస్తా ఉండాడు. పాతాళ గంగ శబ్దం వినిపిస్తా ఉండాది.                                                                                    - డాక్టర్ వేంపల్లి గంగాధర్

బైరాగుల బండి

                             బైరాగుల బండి                                                                                                                                                                                                          బొగ్గింజన్ తో నడిచే రైలుబండి . దాన్ని చూడడం , అందులో ప్రయాణం చేయడం అప్పట్లో సరదాగా ఉండేది. అందులోని డ్రైవర్లు ఇనుప పారలతో వెనకవైపు ఉన్న బొగ్గును తెచ్చి ఇంజన్ లోకి పోస్తూఉండేవారు. ఆవిరితో కదిలేది. రైలింజనంతా పొగలు కక్కుతూ ఆవిర్లు వెదజల్లుతూ అదో పెద్ద డైనోసార్ లాగా కనిపించేది. ఆ రైలు ఎక్కడమే గానీ ఎప్పుడు దిగుతామో తెలియదు . ఒక స్టేషన్లో ఆగింది అంటే ఎప్పుడు కదులుతుందో తెలియదు. నీలోని ఓపికంతా ఆవిరి అయితే తప్ప ఈ 'ఆవిరింజన్'గమ్యం చేరేది కాదు. అట్లా సాగేది ప్రయాణం. ప్రయాణికులు తిని పారేసిన చెనిక్కాయ పొట్టు ఎక్కడ చూసిన గాలికి ఎగురుతూ ఉండేది. దీని అసలు పేరు లోకల్. కానీ 'బైరాగుల బండి' అని అంటేనే ఎక్కువ మందికి అర్థమయ్యేది. ప్రయాణికులంతా దర్జాగా కూర్చుని ఉండేవారు. ఎవరి దగ్గర టిక్కెట్లు ఉండేవి కాదు. టిక్కెట్ల తనిఖీ అధికారులు అని పిలువబడే 'టీసీలు' కూడా ఎవరూ వచ్చేవారు కాదు. సాధువులు, సన్యాసులు , బైరాగులు రైల్లో ఎక్కడ చూసినా కనిపించే వారు. తంబురా మీటుకుంటూ ఏవేవో జీవిత సత్యాలు తత్వాలు గా పాడుతుండేవారు. 'చిల్లర ఱాళ్లకు మొక్కుచునుంటే.. చిత్తము చెడునుర... ఒరే ఒరే... చిత్తము నందున చిన్మయ జ్యోతిని చూచుచుండట సరే సరే...' అని బ్రహ్మం గారి జ్ఞాన తత్వాన్ని ఒకసారి పాడితే, మరోసారి' దేవ దారి పూల కై నేనొచ్చేదా ... దేవదేవుని పూజకై నేనొచ్చేదా ...' అని సిద్దయ్య పలుకు పాడేవారు. అట్లా వాళ్ల కీలు గొంతుల రాగాలతో, ఇంజన్ వేసే శబ్దాలతో కాలం ముందుకు సాగిపోతూ ఉండేది. తిరుమలకి వెళ్లి దర్శనం చేసుకుని గుండు కొట్టించుకుని వస్తున్న భక్తులు గోవింద నామాలు పలుకుతూ ఉండేవారు. భోగి ల నిండా గుండు కొట్టించుకున్న వాళ్లే ఎక్కువమంది. వెంట తీసుకెళ్తున్న తిరుమల లడ్డూ ప్రసాదం వాసన గుప్పుమనేది. అమ్ముకునే వాళ్ల కేకలతో , కొనమని మారాం చేసే పిల్లల ఏడుపుల తో రైలు రైలంతా అదో వింత లోకం లా ఉండేది. రైలు మామండూరు, బాలపల్లె శేషాచలం అటవీ ప్రాంతం మధ్యలో ఆగినప్పుడు గుండెలు అదిరిపోయేవి. ఒకరి ముఖాలు ఒకరు భయం భయంగా చూసుకునే వాళ్ళు. చిన్న చిన్న స్టేషన్లలో కూడా గంటకు తక్కువ కాకుండా ఆపేవారు. తెచ్చుకున్న తిను బండారాలన్నీ అయిపోతే గాని రైలు కదిలేది కాదు. నీలోని ఓపిక, సహనం అన్నిటిని పరీక్షించడానికే దేవుడి దీన్ని పంపించాడు ఏమో అనిపించేది. ఏదైతే అదే అయ్యింది ఒక్కొక్కసారి ' దిగి నడుచుకుంటూ వెళ్ళిపోదాం' అని కూడా అనిపిస్తూ ఉండేది. ఆగిన స్టేషన్ లో నుంచి స్టేషన్ మాస్టర్ బయటికొచ్చి పచ్చజెండా ఊపితే ప్రాణం లేచి వచ్చేది. అప్పుడు 'ఇంజన్ వేసే విజిల్' మరి కాసేపు వినాలనిపించేది. కుదేలైన దేహానికి కుదుపు వచ్చేది. జీవితం మీద మళ్ళీ కొత్త ఆశ పుట్టేది. అట్లా ఆశనిరాశల మధ్య ఈ రైలు ప్రయాణం సాగేది. రైల్లో పక్కనున్న వాళ్ల తోనే కాక ఆ బోగీలో వాళ్లతో వీళ్ళకి, ఈ బోగీలో వాళ్లతో వాళ్లకి పరిచయాలు కూడా అయ్యేవి. బంధువులు కూడా అయిపోతారు ఏమోనని కూడా అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉండేది. అటు వైపు కూర్చున్న వాళ్లది ఏ ఊరో, ఇటు వైపు కూర్చున్న వాళ్లది ఏ ఊరో , వాళ్లకి ఎంతమంది పిల్లలో , వాళ్ళు ఏమి చదువుకుంటున్నారో, వాళ్ళ బంధువులు ఎవరో... ఇట్లాంటి సమాచారమంతా క్షుణ్నంగా తెలుసుకునే మహద్భాగ్యం కలిగేది. అన్నయ్య, వదిన అనే వరసలు కూడా కలిసేవి. ఆగిన ప్రతి స్టేషన్లో మర చెంబులు తీసుకెళ్లి ఓపిగ్గా, నిదానంగా, నిబ్బరంగా, తోసుకోకుండా, ఒకరు పైన ఒకరు పడకుండా , తాగి నన్ని తాగి, పిల్లలకి తాపించి ఒకటికి రెండు సార్లు తిరిగి నీళ్లు పట్టుకునేవారు. ఆ మరచెంబు ను పిల్లలు ఎంత ఇష్ట పడేవారో ! ఆ తండ్రి తన పిల్లాడిని ఎత్తుకొని పోయి ఇంజన్ డ్రైవర్ తో షేక్ హ్యాండ్ ఇప్పించి నప్పుడు ఆ పిల్లాడి కళ్ళల్లో ఆనందం చూడాలి. రేపట్నుంచి వేసవి సెలవులు అని అన్నప్పుడు కూడా వాడింత ఆనందపడడు. రైల్లో వెనకున్న గార్డ్ విజిల్ వేస్తూ పచ్చజెండా ఊపాడు. ఎట్టకేలకు రైలు కదిలింది.                                                                   - డాక్టర్ వేంపల్లి గంగాధర్

రాగింగ్

 రాగింగ్      ఇంజనీరింగ్ కాలేజ్ లో నా మొదటి రోజది.... నాన్నగారు నాతో వచ్చినా కూడా నేను బిక్కు బిక్కు మంటూనే కాలేజ్ లోకి అడుగుపెట్టాను....ఒక వైపు ఉత్సాహం...ఇంకో వైపు భయమూ ....కలగలిపిన మొహలతో  నాలాంటివాళ్ళు చాలామందే ఉన్నరక్కడ ...విశాలమైన ప్రాంగణం లో  సమున్నతం గా, గంభీరం నిలచి ఉన్న కాలేజ్ బిల్డింగ్ రా రమ్మంటూ ఆహ్వానించింది.  మా కాలేజ్ కి పేరూ ప్రఖ్యాతులు బాగా ఉన్నాయ్...కాంపస్ సెలెక్షన్స్ కు కూడా మా కాలేజ్ పెట్టింది పేరు ...అందుకే చాలా మంది ఈ కాలేజ్ లో సీట్ వస్తే బావుండనుకుంటారు .   కాలేజ్ కాంపస్ లోనే కాస్త దూరం గా ఒక వైపు గర్ల్స్ హాస్టల్, ఇంకోవైపు బాయ్స్ హాస్టల్, ఒక దానికొకటి ఏ మాత్రమూ కనపడని విధం గా , ఎవరూ చొరబడటానికి వీలులేకుండా జాగ్రత్తగా నిర్మించబడ్డాయి .....        మా ఊరు కాలేజ్ కి 60 కిలోమీటర్ల దూరం లో ఉంది ...ఆడపిల్ల బస్సుల్లో వెళ్ళిరావటం కష్టమంటూ ....నన్ను హాస్టల్ లో చేర్పించారు   .      ఇంక హాస్టల్ లో మా రూం మేట్  సుబ్బలక్ష్మి . ఒక పల్లెటూరులో ఇంటర్ వరకూ తెలుగుమీడియం లో చదువుకుంది....తను వాళ్ళ కాలేజ్ ఫస్ట్ ...ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ లో మంచి రాంక్ తెచ్చుకుని...ఈ కాలేజ్ లో సీట్ తెచ్చుకుంది....చాలా నెమ్మదస్తురాలు... మొహం లో అమాయకత్వం, ఇంగ్లిష్ గబ గబా మాట్లాడలేకపోవటం ...కొంచెం బెదురు చూపులూ తను పల్లెటూరి పిల్లని ఇట్టే తెలిసేలా చేస్తాయి .... వాళ్ళ నాన్న ఒక మోస్తరు రైతు.....పిల్ల బాగా చదువుకుని,మంచి ఉద్యోగం చెయ్యాలని ఎన్ని కష్టాలున్నా తనని చదివిస్తున్నారు .            మొదటి సంవత్సరం వాళ్ళకు క్లాస్ లు మొదలయ్యేసరికి, సీనియర్స్ కు సెలవలు  ఉండటం వల్ల మేము హాయిగా కాలేజ్ కు వెళ్ళగలిగాము ...తరువాత సీనియర్లు వచ్చినా గానీ ,ప్రిన్సిపాల్ గారు చాలా గట్టి మనిషి అందుకే మాకు రాగింగ్ రూపంలో కాలేజ్ లో  పెద్దగా ఇబ్బందులు ఎదురుకాలేదు....కానీ....  ఇంక హాస్టల్ లో  మాత్రమూ రాగింగ్ బాగానే జరుగుతోంది.... మా సీనియర్లలో 3 వ సంవత్సరం చదువుతున్న హర్షిణి  అని ఒక రాజకీయనాయకుడి కూతురు ఉంది ..వాళ్ళది అదే వూరు అయినా కూడా ఇంట్లో ఉండే రాజకీయ వాతావరణమూ హడావిడీ తన చదువుకు అడ్డంకి కాకూడదని తనను హాస్టల్ లో చేర్పించారు వాళ్ళ అమ్మగారు ..తనకు మంచి స్నేహితురాళ్ళుగా చెప్పుకునే వారిజ ,సుగుణ,ముగ్గురూ ఒకే రూం, ఒకే మాట,ఒకే బాట ....   మా సీనియర్లను మేము మేడం అని పిలవాలి ....వాళ్ళ రికార్డ్ లు వ్రాయటం, వాళ్ళ బట్టలు మడతెయ్యటం ,భోజనాల సమయం లో వాళ్ళకు అన్నీ వడ్డించిన ప్లేట్లు అందీయటం వంటి చిన్న చిన్న పనులు చేస్తున్నాం రాగింగ్ పేరుతో....ఒక రోజు సుబ్బలక్ష్మి ని మూడు సార్లు మంచినీళ్ళు తెచ్చియ్యమన్నారు ....4 వసారి ఇంకేదో అడిగితే తను చెయ్యలేనని చేతులెత్తేసింది. హర్షిణీ మేడం భృకుటి ముడిపడింది . సాధారణం గా రాగింగ్ చేసేటప్పుడు జూనియర్స్ లో ఏ కాస్త అవిధేయత పొడచూపినా  సీనియర్స్ సహించరు ...అయినా కానీ హర్షిణీ మేడం ఆ రోజు కు తనను ఓకే ఓకే అంటూ వదిలేసింది....అందరూ ఆశ్చర్యపోయారు...ఎందుకు వదిలేసిందో అర్ధం కాక..... ఆ మర్నాడు సాయంత్రం రాగింగ్ లో భాగం గా సీనియర్స్ మా రూం కు వచ్చారు....సుబ్బలక్ష్మి తన పెట్టే సర్దుకుంటొంది ...వెనక్కు తిరిగి ఉంది వీరి రాకను గుర్తించలేదు...నేను మాత్రం నమస్తే మేడం అంటూ విష్ చేశాను ....   హర్షిణి సుబ్బలక్ష్మి వెనక్కు వెళ్ళి తన పెట్టెలో ఉన్న ఒక చీర తీసుకుంది....హలో సుబ్బలక్ష్మీ అంటూ తనే పలకరిస్తూ ....ఈ చీర ఎవరిదీ అంటూ అడిగింది....సుబ్బలక్ష్మి అది మా అమ్మచీర ,తనకు గుర్తుగా తెచ్చుకున్నాను అని చెప్పింది...ఓహో అలాగాంటూ ఆ చీరను ముగ్గురు ఫ్రెండ్సూ ఒకళ్ళ పైకి ఒకళ్ళు విసిరేసుకుంటూ ఆటమొదలెట్టారు....సుబ్బలక్ష్మి హడావిడిగా వాళ్ళ చేతుల్లోంచి వాళ్ళమ్మ చీరను లాక్కోబోయింది....ఆ పెనుగులాటలో హర్షిణి డ్రెస్స్ కొంచెం చిరిగింది ........వెంటనే హర్షిణి గొడవ మొదలెట్టింది.... తన డ్రెస్స్ ఖరీదు పదివేల రూపాయలనీ, అప్పటి కప్పుడు కొనివ్వాల్సిందే అంటూ ...సుబ్బలక్ష్మి తను వెంటనే కొనివ్వలేననీ, మూడు నాలుగు నెలల్లో కొనిస్తాననీ, అంత డబ్బులు వెంటనే సమకూర్చలేననీ చెప్పింది. ముందు రోజు అందరిలో తనకు ఎదురుచెప్పటం, ఆరోజు తనతో పెనుగులాడటం  ఇదంతా హర్షిణికి  ఒళ్ళు మండించింది    ...   ఒక్క వారం లోపల ఆ డబ్బులు కట్టటమో . అలాంటి డ్రెస్స్ కొనివ్వటమో చెయ్యాలనీ, లేకపోతే ఆ రోజు సుబ్బలక్ష్మి వంటిమీద ఉండే దుస్తులు తీయించి తమ టాయ్లెట్లు శుభ్రం చేయిస్తాననీ వార్నింగ్ ఇచ్చింది...సుబ్బలక్ష్మి ఎంత బ్రతిమిలాడినా తను ఒప్పుకోలేదు.... హాష్టలంతా వేడేక్కింది .....గరం గరం గా  సీనియర్సూ, బిక్కు బిక్కుమంటూ జూనియర్స్ నిట్టూర్పులతో .....          ఆ రాత్రంతా సుబ్బలక్ష్మి ఏడుస్తూనే ఉంది...ఒక సాధారణ రైతు బిడ్డైన  తను అంత డబ్బులు అప్పటికప్పుడు ఎలా తేవాలంటూ....జూనియర్స్ ని అందరి దగ్గిర డబ్బులూ కొంత కొంత సర్దమంటూ అడగాలన్నా  ...హర్షిణి ఇచ్చిన వార్నింగ్ తో అందరూ సుబ్బలక్ష్మి ని తప్పుకునే తిరుగుతున్నారు.... విషయమంతా వార్డెన్ కు వివరించాము .....సీనియర్లతో మర్యాదగా ప్రవర్తించకపోతే అంతే మరి అని వార్డెన్ మమ్మల్నే తిట్టిపోసింది .....సరే మూడు రోజుల పాటు కాలేజ్ కి మామూలుగానే వెళ్ళొచ్చాము ...నాలుగోరోజు హర్షిణీ బృందం...మా రూం కి వచ్చి మళ్ళి ఇంకో రెండురోజులే సమయం ఉందని  గుర్తు చేసి వెళ్ళారు....ఈ సారి మేము మా 4త్ ఇయర్ సీనియర్స్ దగ్గరకు వెళ్ళాము...ఎట్లా అయినా మా సుబ్బలక్ష్మి ని రక్షించమని ....వాళ్ళు కూడా మేమొక సారి చెప్పి చూస్తాము...కానీ వివాదాల్లోకి మమ్మల్ని లాగకండి ...మేము చదవాల్సింది చాలాఉంది అంటూ మమ్మల్ని సున్నితం గానే తిరస్కరించారు.  అందరూ కూడా హర్షిణి తనను సుబ్బలక్ష్మి ఎదిరించింది కాబట్టి , ఆ పిల్లను బెదిరించాలని ఇదంతా చేస్తోంది అనుకున్నారు కానీ, తన ఈగో దెబ్బతింది కాబట్టి , తన ఆధిక్యతను  నిరూపించుకోవాలని బలం గా అనుకుంటోంది అని గమనించలేక పొయ్యారు....  మర్నాడు తెల్లవారం గానే మళ్ళీ డబ్బు రెడీ చేశావా అంటూ సుబ్బలక్ష్మి ని నిలదీశారు మిత్రత్రయం ......సుబ్బలక్ష్మి తలవంచుకుని నిలబడింది....సరే ఎల్లుండి పదిగంటలకు రెడీ గా ఉండు ...అని చెప్పి వెళ్ళిపొయ్యారు....ఆ రోజు అర్ధ రాత్రి సుబ్బలక్ష్మి నోట్స్ లో ఏదో వ్రాసుకోవటం గమనించాను....నేను కావాలనే కొంచెము మూలుగుతూ పక్కకు తిరిగాను...తను వెంటనే పుస్తకం మూసేసి వచ్చి పడుకుంది....  ఆ మర్నాడు నాకు కాస్త తలనొప్పిగా ఉందని నేను కాలేజీకి రానని చెప్పి రూం లోనే ఉండిపొయ్యాను ....సుబ్బలక్ష్మి అన్యమనస్కం గానే కాలేజ్ కి వెళ్ళింది ...నేను తను ఒక పక్కగా పెట్టుకున్నా ఆ ప్రత్యేకమైన నోట్స్ తీసి చదివాను......అందులో " అమ్మా,నాన్నా నన్ను క్షమించండి...వచ్చే జన్మలో కూడా మీకే పుట్టాలని కోరుకుంటున్నాను " అని వ్రాసుకుంది.....నేను చేసింది తప్పే....కానీ సుబ్బలక్ష్మి నా రూం మేట్ ....తనకు ఏమీ జరగకూడదనే నేను రహస్యం గా చదివాను..... మర్నాడు పదిగంటల సమయం .....హర్షిణీ వాళ్ళు రమ్మంటున్నారని ఆయా వచ్చి మమ్మల్ని పిలుచుకెళ్ళింది .....వారిజ ,సుగుణ చేతుల్లో అధునాతన సెల్ ఫోన్స్ ఉన్నాయి ...రికార్డింగ్ మోడ్ లో ....సుబ్బలక్ష్మి దగ్గర అంత డబ్బు లేదనేది నిర్వివాదాంశం .....సుబ్బలక్ష్మి హర్షిణి చేతులు పట్టుకుని బ్రతిమాలుతోంది...నన్నఏమీ చెయ్య వద్దు మేడం అంటూ ఏద్చేస్తోంది ....అందరమూ చూస్తున్నాము.....హర్షిణి డబ్బుల్లేకపోతే....నువ్వు చెయ్యాల్సిన పని చెప్పానుకదా ....ఊ రా అంటూ సుబ్బలక్ష్మి చున్నీ మీద చెయ్యి వేసింది...ఇంతలో ...అమ్మా వారిజా ! నీ చేతిలో ఫోన్ ఇలా ఇవ్వుతల్లీ,నేనయితే వీడియో సరిగ్గా తీస్తాను అంటూ ఒక గొంతు వినిపించింది ......అంతే హర్షిణి నిర్ఘాంత పోయి వెనక్కు తిరిగింది...అక్కడ ఎర్రబడ్డ కళ్ళతో హర్షిణీ వాళ్ళ అమ్మగారున్నారు .....ఒక్కసారి గా హర్షిణీ సుబ్బలక్ష్మి చున్నీ ని వదిలేసింది.... ఆవిడ చూపులకు హర్షిణి తల వాలిపోయింది....నిన్ను నేను ఇలా పెంచానా? నా పెంపకం లో ఏ లోపం నిన్నిలా తయారు చేసింది అంటూ ...ఆవిడ కళ్ళనీళ్ళతో తనని ప్రశ్నించారు ....అంతే కాక సుబ్బలక్ష్మి చెయ్యి పట్టుకుని ఆవిడ నాకూతురు చెయ్యబోయిన పనికి మమ్మల్ని  నువ్వు మన్నించాలమ్మా ...అంటూ సుబ్బలక్ష్మి ని కోరారావిడ  .....ఇంకెప్పుడయినా సరే నాకూతురు వల్ల ఎవరికి కష్టం కలిగినా ,శిక్ష నేను అనుభవిస్తాను,అలా వ్రాసి ఇస్తాను కూడా , ఎందుకంటే  ....దాన్ని సరిగ్గా పెంచాను అనుకున్నాను....ఇవ్వాళ తెలిసింది నాది సరి అయిన పెంపకం కాదన్నది...అది ఒక రాజకీయ నాయకుని కూతురిగా ఎలా ప్రవర్తించినా ఎదురు లేదనుకుంది కానీ,దాని ప్రవర్తనతో అసలు వాళ్ళ నాన్నగారికి రాజకీయ భవిష్యత్తే లేకుండా పోయే అవకాశం ఉందని తెలుసుకోలేకపోయింది ...   తన ప్రాణమెంతో ,తన అభిమానమెంతో ,ఇంకో ఆడపిల్లకు కూడా అంతే అని ఆలోచించలేకపోయింది  ....  అని చెప్తుంటే హర్షిణి మ్రాన్ పడిపోయింది.....వెంటనే హర్షిణి వాళ్ళమ్మతో ...వద్దమ్మా నేనెప్పుడూ ఇలా ప్రవర్తించను నన్ను క్షమించమ్మా అంటూ వాళ్ళమ్మను హత్తుకుపోయింది ...సుబ్బలక్ష్మికి కూడా క్షమార్పణలు చెప్పింది ..... ఇదంతా అసలు ఎలా సాధ్యపడింది ? విజిటింగ్ అవర్స్ కాకపోయినా ఆవిడెలా లోపలకు రాగలిగింది అని అందరూ ఆశ్చర్యపోయారు సుబ్బలక్ష్మితో సహా .....  ఏదేమైనా కధ సుఖాంతమయ్యింది హమ్మయ్య అనుకున్నారందరూ .....   యిలా జరగటానికి కారణం వెతుకుతూ ....రెండురోజుల వెనక్కు వెళితే , ఆ రోజు సుబ్బలక్ష్మి నోట్స్  చదివిన నేను, .... ఆ తరువాత హాస్టల్ లో అందరూ దాదాపు వెళ్ళిపోయ్యాక నేను మళ్ళి మా వారెడెన్ ను కలిశాను......ఆవిడకు సుబ్బలక్ష్మి నోట్స్ చూపించాను....ఆవిడ వాళ్ళు సీనియర్లు, డబ్బూ ,పలుకుబడీ ఉన్న పెద్దల సంతానం.... వాళ్ళను కోప్పడ్డా లొంగరు,పైపెచ్చు అనవసరపు రాధ్ధాంతం సృష్టిస్తే కష్టం ...అలా అని ఒక బాధ్యత గల వార్డెన్ గా నేను ఘోరం జరుగుతుంటే చూస్తూ కూర్చోలేను ....విద్యార్ధుల బ్రతుకులు క్షణికావేశాలకు నాసనమవటం చూస్తూ కూర్చోలేను ...దీన్ని ఆపక పోతే నా ఉద్యోగధర్మానికీ, సమాజానికీ ద్రోహం చేసినట్టే అంటూ ఒక ప్లాన్ ప్రకారమూ హర్షిణీ వాళ్ళమ్మగారికి ఫోన్ చేసి విషయము వివరించారు ...మేమిద్దరమూ కలిసి సంఘటన జరిగే సమయానికి ఆవిడ ఇక్కడకు వచ్చేలా ప్లాన్ చేసి ,ఈ సంగతి ఎవరికీ తెలియకుండా ఉండేలా జాగ్రత్తపడ్డాము  ......  నా ద్వారా ఈ విషయము తెలిసిన సుబ్బలక్ష్మి చక్కని ఆలోచనతో తనను అవమానం పాలుకాకుండా రక్షించిన వార్డెన్ కు  చేతులెత్తి మొక్కింది....ఆ తరువాత వార్డెన్ సుబ్బలక్ష్మిని  మందలించారు....కష్టమొస్తే ముందు అమ్మానాన్నలకు విషయము వివరించాలి కానీ...చనిపోవాలనే నిర్ణయాలు తల్లితండ్రులకెంత మనస్తాపం కలిగిస్తాయో ఆలోచించలేనివాళ్ళు ఏం బిడ్డలంటూ కోప్పడ్డారు ...... మొత్తానికి నాకూ ,సుబ్బలక్ష్మికీ,వార్డెన్ గారికే తెలిసిన నిజం గుంభనంగా ...రాగింగ్ కు బలి కాకుండా విద్యార్ధుల జీవితాలు నిలిచినందుకు గర్వపడుతోంది.....     Nagajyothi Susarla

ఐశ్వర్యం

మనం ఐశ్వర్యం అంటే అనేక రకాలుగా ఊహించుకుంటాం. కాని అసలు ఐశ్వర్యం అంటే ఏమిటో తెలుసుకుందాం ఐశ్వర్యం అంటే నోట్ల కట్టలు, లాకర్స్ లోని తులాల బంగారాలు కాదు?!?!?! ఇంటి గడపలలో ఆడపిల్ల గజ్జెల చప్పుడు ఐశ్వర్యం ఇంటికిరాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య ఐశ్వర్యం   ఎంత ఎదిగినా, నాన్న తిట్టే తిట్లు ఐశ్వర్యం   అమ్మ చేతి భోజనం ఐశ్వర్యం భార్య చూసే ఓర చూపు ఐశ్వర్యం పచ్చటి చెట్టు, పంటపొలాలు ఐశ్వర్యం వెచ్చటి సూర్యుడు ఐశ్వర్యం పౌర్ణమి నాడు జాబిల్లి ఐశ్వర్యం మనచుట్టూ ఉన్న పంచభూతాలు ఐశ్వర్యం   పాల బుగ్గల చిన్నారి చిరునవ్వు ఐశ్వర్యం ప్రకృతి అందం ఐశ్వర్యం పెదాలు పండించే నవ్వు ఐశ్వర్యం అవసరంలో ఆదరించే ప్రాణస్నేహితుడు ఐశ్వర్యం బుద్ధికలిగిన బిడ్డలు ఐశ్వర్యం బిడ్డలకొచ్చే చదువు  ఐశ్వర్యం భగవంతుడిచ్చిన ఆరోగ్యం  ఐశ్వర్యం చాలామందికన్నా ఉన్నతంగా ఉన్నామనుకునే తృప్తి ఐశ్వర్యం   పరులకు సాయంచేసే మనసు మన ఐశ్వర్యం ఐశ్వర్యం అంటే చేతులు లేక్కేట్టే కాసులు కాదు. కళ్ళు చూపెట్టే ప్రపంచం ఐశ్వర్యం.  మనసు పొందే సంతోషం ఐశ్వర్యం. ఇన్ని ఐశ్వర్యాలు ఉంటేయి ఇవి వదిలేసి ప్రశాంతత లేకుండా జీవనం గడుపుతున్న మనమందరం ఐశ్వర్యాన్ని కోల్పోయిన వాళ్ళమౌతాము సేకరణ M.s.s.k

పిట్ట తెలివి

  పిట్ట తెలివి     మామిళ్ళపల్లిలో పెద్ద మర్రి చెట్టు ఒకటి ఉండేది. ఆ చెట్టు తొర్రలో ఒక పిట్ట, దాని పిల్ల నివసిస్తూ ఉండేవి. తల్లి పక్షి రోజూ పోయి, తన పిల్ల కోసం ఆహారం వెతికి తెచ్చేది. "చిట్టి పిల్ల, పాపం ఇంకా రెక్కలు రాలేదు" అనేది. పక్షి పిల్ల ఆ పురుగులను తిని చాలా సంతోషంగా ఉండేది. కొన్ని రోజులకు పిల్ల రెక్కలు గట్టిపడసాగాయి. అది గుర్తించిన తల్లి పక్షి మెల్ల మెల్లగా దాన్ని గూటి చివరి వరకూ వచ్చేందుకు, ఒక రెక్కను తెరిచేందుకు, మెల్లగా రెండో రెక్కను కూడా తెరిచేందుకు శిక్షణనివ్వటం మొదలెట్టింది. "ఇదిగో, నేను ఎలా ఎగురుతానో చూడు! అయితే ఎగరాలంటే రెక్కలు గట్టిపడాలి. నీవి ఇంకా లేతగానే ఉన్నాయి. ఇంకొంచెం గట్టిపడ్డాక, అప్పుడు ఎగురుదువు- తొందరపడి ఎగిరితే ప్రమాదం, అర్థమైందా?! క్రింద పడిపోతావు! అందుకని జాగ్రత్తగా ఉండాలి. నేను ఎగరమన్నప్పుడే ఎగరాలి! ఇప్పుడు మటుకు, నేను ఎలా ఎగురుతానో బాగా గమనించు.." అని ఎగిరి చూపించేది. అట్లా పిల్లకు ఎగరటం ఎలాగో చూపించింది కానీ, దాన్ని సొంతగాఎగరనివ్వలేదు తల్లి. దానికి కావలసిన ఆహారాన్ని కూడా తనే తెచ్చి ఇచ్చేది. తల్లిని చూసి "నేనూ ఎగురుతా త్వరలో" అనుకుంటూ రెక్కలు అల్లాడించేది పిల్ల పిట్ట. ఆ సమయంలో ఒకరోజు ఉదయాన్నే పిల్లకి ఆహారం తెచ్చి ఇవ్వటం కోసం పోయిన తల్లి పక్షి ఇక తిరిగి రాలేదు! సమయం గడుస్తున్న కొద్దీ పిల్లకు కడుపులో ఆకలి మొదలైంది. దాంతోపాటు 'తల్లికి ఏమైందో' అని ఆందోళన మొదలైంది. మధ్యాహ్నం కావస్తుండగా ఇక ఆగలేక, అది మెల్లగా గూటి చివరికి వచ్చింది. ఒక్కో రెక్కనీ అల్లాడించి చూసుకున్నది. ఆ పైన రెండు రెక్కల్నీ ఒక్కసారి అల్లాడిస్తూ ధైర్యం చేసి ముందుకు దూకేసింది! ఒక్క సారిగా రెక్కలు కలుక్కుమన్నాయి! బలే నొప్పి పుట్టింది. కానీ ఒక్క క్షణం మాత్రమే! ఆ తర్వాత చూసేసరికి తను ఎగురుతున్నది! క్రింద పడిపోలేదు! అట్లా మెల్లగా క్రిందికి వాలి, నేలకు దగ్గరగానే కొంచెం కొంచెంగా ఎగురుతూ ఆ ప్రాంతం అంతటా కలయ తిరిగింది పక్షి పిల్ల.   "అమ్మా! అమ్మా!" అని అరుస్తూ, తక్కువ ఎత్తు కొమ్మల మీద వాలుతూ పోయిన పిల్ల పిట్టకు చివరికి అక్కడికి దగ్గర్లోనే కనబడింది తల్లి. పిల్ల పిట్ట సంతోషంగా తల్లి మీదికి దూకబోయింది. "దగ్గరికి రాకు! అక్కడే నిలబడు!" అరిచింది తల్లిపిట్ట భయంతో వణికిపోతూ. "ఏమైంది? ఎందుకు?" అడిగింది పిల్ల పిట్ట, అక్కడే నిలబడిపోయి. "కనిపించట్లేదా, నా మీద అంతా ఒక వల పరచుకొని ఉన్నది.  నేను ఎంత కదిలితే అది నాచుట్టూ అంతగా బిగుసుకుపోతుంది! వేటగాళ్ళు వలలు వేసి పెడుతుంటారు ఇలా. మనం ఆ వలల దగ్గరికి రాకూడదు. నేను చూసుకోక, ఇట్లా వచ్చి, ఇందులో‌ చిక్కుకుపోయాను!" అంది తల్లిపిట్ట ఏడుస్తూ. అప్పుడు గానీ పిల్ల పిట్టకు అక్కడొక వల ఉందని తెలీనే లేదు! దాన్ని చూస్తే పిల్ల పిట్టకు కూడా ఏడుపొచ్చింది. అయినా అది ఏడుపును ఆపుకొని వలని జాగ్రత్తగా పరిశీలించి చూసింది. గట్టి దారాలతో పేనారు వలను. దారాల మధ్య దూరం ఎక్కువ లేదు. అయితే వలకు ఒకవైపుగా కొన్ని దారాలు తెగిపోయి ఉన్నాయి. తల్లి జాగ్రత్తగా అటువైపు నడిస్తే, ఆ దారాల మధ్యలోంచి బయట పడచ్చు.."   అది తల్లికి ధైర్యం చెప్పి, దాన్ని మెల్లగా ఆ తెగిపోయిన దారాల వైపుగా నడిపించింది. ఆ దారాల మధ్య సందులు నిజంగానే పెద్దగా ఉన్నాయి! అక్కడ దూరుకొని, పిల్ల సాయంతోటి వలలోంచి పూర్తిగా బయటికొచ్చేసింది తల్లి! తల్లి పిట్ట, పిల్ల పిట్ట రెండూ ఆ దగ్గర్లోనే ఉన్న నీళ్లతో‌ ముఖం కడుక్కుని సేద తీరాక, రెండూ కలిసి ఎగిరి, సంతోషంగా తమ గూటికి చేరుకున్నాయి! "నేను నీలాగా ఆలోచించనే లేదమ్మా!‌ వలలో చిక్కు పడే సరికి నా మెదడు స్తంభించిపోయింది. నువ్వు బలే తెలివిగా ఆలోచించావు- ఆపదలు వచ్చినప్పుడు నిజంగానే, అస్సలు కంగారు పడకూడదు! " అని పిల్లని మెచ్చుకున్నది తల్లి.  - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

తెలివైన కోరిక

తెలివైన కోరిక   చాలా కాలం క్రితం ఒక రాజుగారు ఉండే-వారు. ఒకసారి ఆయన వేటకి వెళ్ళి, తిరిగి వస్తూ వస్తూ, మధ్యలో రథం దిగి ఒంటరిగా అడవిలోకి వెళ్ళారు. ఆ సమయంలో అకస్మాత్తుగా పులి ఒకటి రాజుగారి మీదికి దూకింది. రాజుగారి పరివారం ఎవ్వరూ దగ్గర్లో లేరు. అయితే అటుగా వెళ్తున్న స్నేహితులు ఇద్దరు తమ ప్రాణాలకు తెగించి పులిని ఎదుర్కొన్నారు. చేతులతోటే పోరాడి, పులిని పారద్రోలారు. రాజుగారిని కాపాడారు.   రాజుగారు వాళ్ళిద్దరినీ చాలా మెచ్చుకొన్నారు. వాళ్ళను రాజధానికి ఆహ్వానించారు. వాళ్లకొక చక్కని విందు ఏర్పాటు చేశారు. విందు పూర్తయిన తర్వాత వాళ్ళిద్దరినీ చెరొక కోరికా కోరుకోమన్నారు. మొదటివాడు అన్నాడు: "అయ్యా! నేను, నా కుటుంబం నివసించేందుకు ఇప్పుడు ఉంటున్న ఇల్లు సరిపోవట్లేదు. నాకు ఇంకా పెద్ద ఇల్లు ఒకటి కట్టించి పెట్టండి" అన్నాడు. రాజుగారు సరేనన్నారు. దండనాధుడిని పిలిచి, అతని కోరికను నెరవేర్చమని ఆదేశించారు.   ఇక రెండవవాడు "మహా రాజా! సంతోషంగా జీవించేందుకు అవసరమైనవన్నీ‌ ఉన్నాయి నాకు. అయితే నాది ఒక్కటే కోరిక- తమరు ఒకసారి మా ఇంటిని సందర్శించి, మాఇంటి భోజనం స్వీకరించాలి అనేది" అన్నాడు. "సరే! తప్పక వస్తాం" అని అతనికి మాట ఇచ్చిన రాజుగారు "తగిన ఏర్పాట్లు చేయండి" అని మంత్రిని ఆదేశించారు. రాజుగారి ఆదేశాల ప్రకారం దండనాధుడు మొదటి వాడికి చక్కని ఇంటినొకదాన్ని కట్టించాడు. అతని కోరిక నెరవేరింది. అయితే మంత్రిగారికి మటుకు రెండవవాడి కోరిక తీర్చటంలో సమస్యలు ఎదురయ్యాయి. రెండవవాడి ఇల్లు చాలా చిన్నది; వాళ్ల గ్రామానికి వెళ్ళే రోడ్డు, వాడి ఇంటికి వెళ్ళే రోడ్లు కూడా అన్నీ పూర్తిగా గుంతలు పడి ఉన్నాయి. ఇక రాజుగారు తినగలిగే ఆహారం అక్కడ దొరికేట్లు లేదు; నీళ్ళు కూడా మురికిగా ఉన్నాయి. దాంతో మంత్రిగారు ఆలోచించి, "అయ్యా!‌నాకు ఒక ఐదు నెలల సమయం ఇప్పించండి" అని రాజుగారిని వేడుకొని, యువకులు ఉండే ఊరికి రోడ్డు వేయించాడు.   గ్రామంలోని రోడ్లన్నిటినీ సరిచేయించాడు, గ్రామం మొత్తానికీ రక్షిత మంచినీటి సౌకర్యం ఏర్పరచాడు, రెండవవాడికి పెద్ద ఇల్లు ఒకటి కట్టించాడు, కావలసిన కూరగాయలన్నీ పండించుకునేందుకుగాను పెద్ద తోటను ఒకదాన్ని కేటాయించాడు, మొత్తాన్నీ సర్వాంగ సుందరంగా తయారు చేయించాడు. రెండవ వాడి కోరిక పుణ్యాన గ్రామంలోని ప్రజలందరికీ మేలు జరిగింది. "రాజుగారికి భోజనం పెట్టటం" వల్ల గ్రామానికి ఎంత లాభమో ఊళ్ళో వాళ్లంతా చాలా కాలం పాటు చెప్పుకున్నారు.   కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

నక్కయుక్తి

నక్కయుక్తి     ఒక ఊరికి చివర్లో రైతు ఉండేవాడు. ఆయన ఇల్లును ఆనుకుని దట్టమైన అడవి ఉండేది. రైతు దగ్గర ఒక కోడిపుంజు ఉండేది. దానికి బాగా గింజలు, ఇంకా మంచి మంచి తిండీ, పెడుతూ పెంచుతున్నాడు ఆయన. రాబోయే పండగరోజున దానితో మంచిగా పలావు చేసుకుందామని ఆయనకు చాలా ఉబలాటంగా ఉంది.    ఒకనాడు కోడిపుంజు రైతు ఇంటి గోడ పైకెక్కి, ’కొక్కొరోకో’ అని గట్టిగా అరుస్తూ కూర్చుంది. దానిని అడవిలోంచి ఒక నక్క చూడనే చూసింది. బాగా బలిసిన ఆ కోడిపుంజును చూడగానే నక్కకు నోరూరింది. ఎలాగైనా కోడిపుంజును రుచి చూడాల్సిందేననుకుంది. మెల్లగా అది కోడిపుంజు నిలబడివున్న గోడ దగ్గరకు వచ్చి, "ఓ కోడిపుంజుగారూ! ఎంత శ్రావ్యమైన కూతండీ మీది! మళ్లీ మళ్లీ వినాలనుందండీ నాకు, మీ కూతని!. నేను రోజూ ఇక్కడికి వచ్చి మీ కూతను వినాలనుకుంటున్నాను. మీకేమైనా అభ్యంతరమా?" అని అడిగింది. నక్క మాటలకు అప్పటికే పొంగి పోయిన కోడిపుంజు "దానికేం భాగ్యమండీ నక్కగారూ! రండి..రండి. రోజూ వచ్చి వినండి. దానికేం భాగ్యం?" అన్నది కులుకుతూ. ఇక రోజూ నక్క అక్కడికొచ్చి గోడ కింద కూర్చోవటం మొదలు పెట్టింది. నక్కను చూసి గోడమీది కోడిపుంజు రెట్టించిన ఉత్సాహంతో కూతలు కూసేది. మెల్లిగా అది కొంచెం కొంచెం చిందులేయటం కూడా అలవాటు చేసుకుంది. కొద్ది రోజుల్లోనే నక్కకూ, కోడిపుంజుకూ సాన్నిహిత్యం ఏర్పడింది. కోడిపుంజు నక్కను పూర్తిగా నమ్మింది. ఒక రోజున నక్క కోడితో అన్నది: "ఇవ్వాళ మీ ఆటా,పాట నాకు ఎంతో ఇంపుగా అనిపిస్తున్నాయి కోడిగారూ! మీరలా ఆడుతూ పాడుతూ ఉంటే నేనిట్లాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తోదండీ!" అని.   "ఓహ్! మీరు భలే పొగుడుతారండీ నక్కగారూ, నా గానందేముంది.." అంటూనే ఒళ్ళు మరచిన ఆ కోడి కాలుజారి గోడమీది నుండి క్రింద పడిపోయింది. అవకాశాన్ని జారవిడుచుకోని నక్క వెంటనే ముందుకు దూకి, దాన్ని నోట చిక్కించుకుని అడవిలోకి పారిపోయింది. అందుకనే, పొగడ్తలకు లొంగకూడదు. - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

మాయ రోలు

మాయ రోలు   అనగనగా ఒక ఊళ్లో ఒక అన్న, ఒక తమ్ముడు ఉండేవాళ్ళు. అన్నయ్య చాలా ధనవంతుడు; తమ్ముడు చాలా పేదవాడు. తమ్ముడేమో చాలా మంచివాడు; అన్నేమో చాలా చెడ్డవాడు. ఒక సంవత్సరం ఏమైందో, తమ్ముడి వ్యాపారం అస్సలు సరిగ్గా జరగలేదు. ఏ పని పెట్టుకుంటే అందులో నష్టం ఎదురైంది. చివరికి కుటుంబం మొత్తం పస్తులుండే పరిస్థితి ఎదురైంది. అందరూ అన్నారు "మీ అన్నని సాయం అడగరాదా? ఆయన వ్యాపారం బాగా జరుగుతున్నది గదా?" అని. దాంతో ఓ పండగ రోజున అన్నయ్య దగ్గరకు వచ్చాడు తమ్ముడు- "అన్నా! పరిస్థితులు సరిగా లేవు. కష్టంగా ఉంది. నువ్వు కొంచెం డబ్బు సాయం చేస్తే సమస్యల్లోంచి బయటపడతాను. ఆపైన నీ అప్పు తప్పక తీర్చుకుంటాను" అన్నాడు.   అన్నయ్యకు అతన్ని చూడగానే చికాకు వేసింది. "ఛ! పొద్దున్నే లేవగానే ఎవరి ముఖం చూశానో, ఇప్పుడు నీ ముఖం చూడాల్సి వస్తున్నది. ముందు ఇక్కడి నుంచి ఫో!" అంటూ గొంతు పట్టుకొని బయటకు నెట్టేశాడు. తమ్ముడు ముఖం వ్రేలాడ వేసుకొని ఇంటికి పోతుండగా ఓ ముసలివాడు కనిపించాడు. కట్టెలమూటని పైకి ఎత్తుకోవటం రాక కష్టపడుతున్నాడతను. తమ్ముడికి జాలి వేసి అతనికి సాయం చేస్తూ "ఎక్కడి వరకూ తాతా?" అని అడిగాడు. తాత చాలా దూరం పోవాల్సి ఉంది. "అయ్యో అంత దూరం నీవల్ల ఏమవుతుంది?" అంటూ తమ్ముడు ఆ మూటని తనే ఎత్తుకొని అతని ఇంటి వరకూ మోసుకువచ్చాడు. ఆ ముసలి తాత అతనికి ధన్యవాదాలు చెబుతూ, "దేవుడు నీకు మేలు చేస్తాడు నాయనా! నీకు అన్నీ శుభాలే జరుగుతాయి" అన్నాడు.అది వినగానే తమ్ముడికి తన కష్టాలు గుర్తుకొచ్చి కళ్లలో నీళ్ళు తిరిగాయి. అది గమనించి తాత "చూడు బాబూ! కష్టాలు, సుఖాలు అందరికీ వస్తూ పోతూ ఉంటాయి. ఏవీ శాశ్వతంగా ఉండవు. తెలివైనవాడు కష్టాలకు క్రుంగిపోడు; సుఖాలకు పొంగిపోడు" అని చెప్పి, తన ఇంట్లోకి వెళ్ళి ఒక తీపి రొట్టెను తెచ్చి ఇచ్చాడు. "నా మాటలు జాగ్రత్తగా విను నాయనా! నా ఇంటి వెనుక ఒక చిన్న అడవి ఉంది. ఆ అడవి చివర మూడు మల్బరీ చెట్లున్నై. వాటి వెనుకగా కొండపైకి ఒక కాలి బాట ఉంటుంది.   ఆ బాటకు రెండు వైపులా ముళ్ళ చెట్లే ఉంటాయి. ఒక్క ముల్లు కూడా గుచ్చుకోకుండా జాగ్రత్తగా కొండ ఎక్కి పోతే అక్కడో గుడిసె కనిపిస్తుంది. ఆ గుడిసెలో ముగ్గురు మరుగుజ్జులు ఉంటారు. వాళ్లకు ఈ రొట్టెను ఇచ్చి, "పని కోసం వెతుకుతున్నాను- మీరు ఏ పని చెబితే అది చేస్తాను" అను. వాళ్ళు ఏ పని చెబితే అది చేయి. అప్పుడు వాళ్ళు నిన్ను మెచ్చుకొని "నువ్వు మంచివాడివిరా, నీకు ఏం కావాలో అడుగు, ఇస్తాం" అంటారు. అప్పుడు నువ్వు "మీకు వీలైతే నాకు ఒక మాయారోలు ఇప్పించండి- లేకపోతే మీ ఇష్టం" అను. ఆపైన ఎట్లా జరగాలో అట్లా జరుగుతుంది" అని దీవించి పంపాడు. తమ్ముడికి ఆశ్చర్యం వేసింది. "ముసలాయన ఇంత నమ్మకంగా చెబుతున్నాడు. పట్నం‌ మధ్యలో ఇక్కడ అసలు కొండే లేదు కదా" అనుకున్నాడు. అయితే ఇంటి వెనకగా వెళ్ళి చూస్తే నిజంగానే అక్కడో అడవి కనిపించింది. ఆ చిన్న అడవిలోనే నిండా భయంకరమైన పాములు ఉన్నాయి. వాటిని అన్నిటినీ తప్పించుకొని ముందుకెళ్తే నిజంగానే మూడు మల్బరీ చెట్లు కనిపించాయి. వాటి వెనకనే కాలిబాటకూడా కనిపించింది. ముళ్ళన్నీ తప్పించుకుంటూ జాగ్రత్తగా ఆ బాట వెంబడి నడుస్తూ పోయాడు. కొండపైన ఉన్న కోతులను కూడా తప్పించుకొని పోయి చివరికి తాత చెప్పినట్లే ఓ గుడిసెకు చేరుకున్నాడు. గుడిసెలో ఉన్న మరుగుజ్జులకు తను తెచ్చిన రొట్టెను ఇచ్చి, తాత చెప్పమన్నట్లే "పనికోసం‌ వెతుకుతున్నాను" అని చెప్పాడు. వాళ్ళు గట్టిగా నవ్వి, "పని కావాలా, మేం తిన్న అన్నం గిన్నెలు పెద్ద కుప్ప పడి ఉన్నై. అవన్నీ శుభ్రం చేస్తావా?" అన్నారు. "సరే" అని తమ్ముడు ఆ గిన్నెలన్నీ శ్రద్ధగా తోమిపెట్టాడు. వాళ్ళు వాడిని మెచ్చుకొని "నీకేం కావాలి?" అని అడిగి, వాడు కోరినట్లే ఒక మాయరోలును తెచ్చి ఇచ్చారు. "నీకు ఏం కావాలన్నా దీన్ని రుద్ది, మర్యాదగా అడుగు. రోజుకు ఒకసారి మాత్రం పని చేస్తుందిది" అన్నారు. తమ్ముడు వాళ్లకు నమస్కరించి, రోలును రుద్ది, మర్యాదగా "నేను మా ఇంటికి చేరాలి" అని కోరుకున్నాడు. మరుక్షణం వాడు తన ఇంట్లో ఉన్నాడు! అతను దాన్ని ఇంట్లో దేవుని గూడులో పెట్టి, జాగ్రత్తగా చూసుకుంటూ, రోజూ అదిచ్చే సంపదల్ని వ్యాపారం ద్వారా మరింత వృద్ధి చేస్తూ పోయాడు. అనతి కాలంలోనే అతని అప్పులన్నీ తీరటమే కాక, సమాజంలో మంచి పేరు ప్రతిష్ఠలు, మర్యాద, మన్నన ఏర్పడ్డాయి.   అయితే అటువైపున దుర్మార్గుడైన అన్నకు తమ్ముడి పరిస్థితిని చూసి అసూయ వేయసాగింది. అతను ఒక రోజున తమ్ముడి ఇంటికి వచ్చి ప్రేమ నటిస్తూ "తమ్ముడూ! మొన్నటికి మొన్న నువ్వు పరిస్థితి బాగాలేదు" అని నా దగ్గరికి వచ్చావు. ఇంత తక్కువ సమయంలో నీ దశ ఎట్లా తిరిగింది?" అని ఊరికే అడిగినట్లు అడిగాడు. తమ్ముడు అమాయకంగా తనదగ్గరున్న రోలును చూపించాడు. దుర్మార్గుడైన అన్న రాత్రికి రాత్రి ఆ రోలును దొంగిలించుకొని పోయి, "ఇది ఉంటే నాకు, నా కుటుంబానికి ఇంకేమీ అక్కరలేదు" అంటూ పరదేశం వెళ్ళిపోయేందుకై పడవ ప్రయాణం మొదలెట్టాడు. ఆ రోజు ఉదయం "మీ తమ్ముని మాటలు నమ్మి ఇట్లా బయలుదేరాం. ఇంతకీ ఈ రోలు మనం కోరుకున్నది ఇస్తుందా?" అన్నది అతని భార్య అనుమానంగా. అన్న "ఇస్తుంది" అంటూనే రోలుని రుద్ది, నాకు లెక్కలేనంత బంగారం కావాలి" అని కోరుకున్నాడు. మరుక్షణం రోలులోంచి బంగారం రావటం మొదలైంది. ఇంక ఏం చేసినా ఆ బంగారం ప్రవాహం ఆగలేదు. దాని బరువుకు వాళ్ల పడవ, పడవతోబాటు రోలు, అన్న కుటుంబం మొత్తం సముద్రం పాలైంది. - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

మామ చేసిన మాయ

మామ చేసిన మాయ   ఏడో తరగతి చదివే అఖిల్ చాలా తుంటరి పిల్లవాడు. చదువుల్లో మనసు అస్సలు నిలిచేది కాదు వాడికి. కానీ చేతులు మటుకు ఎప్పుడూ వులవుల పెడుతూ ఉండేవి. వాడి తుంటరి పనులతో అందరూ విసిగిపోయారు: "ఒరే! చక్కగా చదువుకుంటూంటే కొంచెం అల్లరి చేసినా ఎవ్వరూ ఏమీ అనరు. చదవకుండా పోరంబోకువైతే అసలు ఎవ్వరూ మెచ్చరు. రాను రానూ బ్రతుకు కష్టం అవుతుందిరా!" అని ఎంత చెప్పినా వాడు మాత్రం వినేవాడు కాదు. అయితే రోజులన్నీ‌ ఒకలాగా ఉండవు కదా, అనుకోకుండా ఒక రోజున ఓ అద్భుతం జరిగింది.  ఆ రోజు కూడా వాడు బడి ఎగగొట్టి ఎప్పటిలాగానే ఊరి చివర్లోని పాడుబడ్డ ఇంటికి పోయాడు. ఆ యింటి చుట్టూ చెట్లు, తుప్పలు, అటు మూలన ఓ పాడుబడ్డ బావి ఉంటాయి. అయితే ఆ రోజున ఎందుకనో, బావిలోంచి రంగు రంగుల పొగలు బయటికి వస్తున్నాయి! దానికి తోడు "ఢుం!ఢుం!" అంటూ భయంకరమైన శభ్దాలు! అఖిల్‌కి కొంచెం భయం వేసింది. అటూ ఇటూ చూసాడు, ఎవరైనా పెద్దవాళ్ళు కనిపిస్తారేమో, ధైర్యానికి అని. అయితే అసలు అటువైపుకే ఎవ్వరూ రారాయె! ఒక్క క్షణం పాటు వాడికి పారిపోదామనిపించింది గానీ, అడుగులు వెనక్కి తిరగలేదు. వాడు ఎంత 'వద్దు! వద్దు!' అని గింజుకులాడినా అవి మాత్రం బావి వైపుకే దారి తీసాయి.   బావి లోపలికి దిగేందుకు మెట్లు ఉన్నాయి. మెట్లు అక్కడక్కడా విరిగిపోయి ఉంటాయి; కానీ ఎక్కడ ఎలా ఉంటాయో వాడికి కొట్టిన పిండే. ఇప్పుడు వాడి కాళ్ళు ఆ మెట్లను దిగటం మొదలు పెట్టాయి. అఖిల్ మనసు బిగిసిపోయింది. "వద్దు వద్దు" అంటోంది; కానీ‌ కాళ్ళు మనసు మాట వినట్లేదు. ఇంకేదో శక్తి వాటిని నడిపిస్తున్నట్లుంది. వాడి ముఖం పాలిపోయింది; ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి; బావిలోంచి దట్టంగా వస్తున్న రంగు రంగుల పొగకు వాడికి ఊపిరి ఆడనట్లు అనిపిస్తోంది. ఇంకా మూడు నాలుగు మెట్లు ఉన్నాయి అనగా వాడికి ఒక భయంకర దృశ్యం కనిపించి కాలు జారింది.. బావిలో ఒక రాక్షసుడు. దుమ్ము కొట్టుకొకుండా జుట్టుకు ఓ ఎర్రటి బట్ట, ఆకు పచ్చని వొంటి నిండా వెంట్రుకలు, ఎర్రని-తెల్లని బొట్లు. మెడలోను, చేతులకు ఎముకల దండలు. నడుము చుట్టూ ఒక పుర్రెల దండ. వాడు చకిలంమకిలం వేసుకొని కూర్చొని, ఉయ్యాల లాగా ఊగుతూ ఏవేవో మంత్రాలు జపిస్తున్నాడు. వాడికి ఎదురుగుండా ఒక యజ్ఞ గుండం ఉంది. మంత్రాలు చదువుతూ మధ్య మధ్యలో ఆ మంటలోకి ఏవో పొడులు విసురుతున్నాడు వాడు. ఒక మూలగా మరుగుజ్జు ఒకడు పెద్ద ఢంకా లాంటి దాన్ని "ఢుం ఢుం" అని కొడుతున్నాడు.. అఖిల్ దబ్బుమని క్రింద పడేసరికి రాక్షసుడి యజ్ఞం భంగమైంది. వాడు కళ్ళు తెరిచి కోపంగా అఖిల్ వైపు చూసాడు. అఖిల్ తేరుకునే లోగానే వాడు చటుక్కున లేచి, పైకెగిరి, తన చేతిలోని మంత్రదండంతో అఖిల్ నెత్తి మీద దభాలున ఒక దెబ్బ కొట్టాడు. మరుక్షణమే స్పృహ తప్పాడు అఖిల్. మెలకువ వచ్చేసరికి అఖిల్ కాళ్ళు చేతులు కట్టేసి ఉన్నాయి. వాడిప్పుడు యజ్ఞగుండం ముందు పడేసి ఉన్నాడు. మరుగుజ్జువాడు ఆగి ఆగి ఢంకా కొడుతున్నాడు. రాక్షసుడు కళ్ళు మూసుకొని "హ్రీం హ్రాం భం" అని అరుస్తూ విరగబడి నవ్వుతున్నాడు.   అఖిల్‌ కళ్ళు తెరవటం చూసిన రాక్షసుడు మంత్రాలు చదవటం ఆపి బిగ్గరగా "ఒరే! కుర్రా! నువ్వు నాకు సరిగ్గా సరిపోయావ్. 'చదువు సంధ్యలు లేకుండా, పోరంబోకుగా తిరిగే కుర్రవాడిని పంపు తల్లీ! నీకు బలి ఇస్తాను!' అని ఆ తల్లిని కోరుకోగానే నువ్వు దిగి వచ్చావు. నిజంగానే చదువు రాని వాడివి! నిజంగానే పోరంబోకువి! తల్లి కోరి పంపిందిరా, నిన్ను! ఇంకొద్ది సేపట్లో ఆ తల్లినే చేరతావు నువ్వు!" అంటూ పొడిని యజ్ఞగుండంలోకి వేసి, ఊగటం మొదలెట్టాడు వాడు కళ్ళు మూసుకొని. అఖిల్‌ గుండె ఆగినట్లైంది. ఏడుపొచ్చింది. కొంచెం సేపు బిగ్గరగా ఏడ్చాడుగానీ, రాక్షసుడు అసలు పట్టించుకోలేదు. చివరికి "నువ్వనేది అబద్ధం. నేను పోరంబోకును కాదు! నేను చదువుకున్న పిల్లాడిని!" అని అరిచే సరికి, రాక్షసుడిలో చలనం వచ్చింది. వాడు ఎగతాళిగా నవ్వుతూ "అవునా? అయితే మరి ఏమైనా పద్యాలు చెప్పు? ఎక్కాలు చెప్పు? ఇంగ్లీషు రైమ్సు చెప్పు? ఏమీ రావు, చూసావా?! వట్టి రోషం! ఎందుకు పనికొస్తుంది?!" అన్నాడు. "బలికి పనికొస్తుంది గురూ!" అన్నాడు మరుగుజ్జువాడు, అవతలినుండి, ఆవలిస్తూ. "బాగా చెప్పావురా, బలికి పనికొస్తాడు వీడు. అంతే" అన్నాడు రాక్షసుడు.  ఆ వెంటనే కొద్ది సేపు అఖిల్‌కు తల తిరిగింది. తను రకరకాల పాములతో యుద్ధం చేస్తున్నట్లు, బలి ఇచ్చే కత్తితో వాటిని చంపుతున్నట్లు అనిపించింది. సాధారణంగా అఖిల్‌కు ఇరవయ్యో ఎక్కం వరకూ రావు. పదమూడు నుండి అన్నీ తప్పులే ఉంటాయి. అయినా వాడు లేని ధైర్యం నటిస్తూ, రెండో‌ ఎక్కంతో‌ మొదలెట్టి గడగడా చెప్పటం మొదలెట్టాడు. వాడి తప్పులన్నీ‌ భరించిన రాక్షసుడు "తప్పులున్నాయిరా!" అని నవ్వి, "పద్యాలు?" అని అడిగి, అవన్నీ కూడా చెప్పించుకున్నాడు. 'తప్పులో, రైట్లో' గాని ప్రాణభయంతో అఖిల్ నోటికి ఏ పద్యం వస్తే అది, చెప్పాడు.   వింటున్న మరుగుజ్జు వాడు "ఇప్పుడెట్లా, గురో!" అని కేకపెట్టాడు అకస్మాత్తుగా. "వీడు కొంచెం చదివే పిల్లాడు లాగే ఉన్నాడు. మనకి పనికి రాడు గురో!" అంటూ వచ్చి అఖిల్ తలమీద గట్టిగా మళ్ళీ ఓ‌ మొత్తు మొత్తాడు. ఆ దెబ్బకి మళ్ళీ స్పృహ తప్పిన అఖిల్‌కి ఈసారి పాములు, కత్తులు, మంచు కొండలు, కుక్కలు, సింహాలు అన్నీ కనబడ్డాయి. వాడు అన్నిటితోటీ పోరాడుతూ పోయాడు. తెలివి వచ్చి కళ్ళు తెరిచే సరికి వాడు ఆ పాడుబడ్డ ఇంటి గేటుదగ్గరే పడి ఉన్నాడు. తల బొప్పి కట్టి ఉన్నది! బావిలోంచి పొగ ఏమీ రావట్లేదు. పరిసరాలన్నీ‌ పదిలంగానే ఉన్నాయి. రాక్షసుడూ, వాడి అనుచరుడూ ఇద్దరూ జాడ లేరు. వణికే కాళ్లతో ఇల్లు చేరుకున్న అఖిల్, ఆ తర్వాత రెండు రోజుల పాటు నిద్రపోతూనే ఉన్నాడు. ఆ సరికే ఇంటికి వచ్చి ఉన్న రంగామామయ్య, వాళ్ల కొడుకు ఇద్దరూ అఖిల్‌ని పలకరించారు. మధ్యలో మామయ్య ఒకసారి "ఒరే! పద్యాలు చెప్పు! ఎక్కాలు?" అన్నప్పుడు అఖిల్‌కి 'ఈ గొంతు ఎక్కడో విన్నానే?!' అనిపించింది; అయితే అలసిపోయి ఉండటాన వాడు ఇక ఏమీ అనలేదు. కానీ ఆ తర్వాత వాడు బాగా మారిపోయాడు. అల్లరి తగ్గించేసాడు; రోజూ‌ బడికి పోతున్నాడు; బాగా చదువుతున్నాడు; బాగా ఆడుతున్నాడు కూడా. తల్లిదండ్రులు అది చూసి సంతోషిస్తూ "ఇదంతా రంగా మామ చలవే!" అనుకున్నారు. "కాదు- రాక్షసుడి మహిమ" అనుకున్నాడు అఖిల్‌. - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

‘మా’ మామిడి చెట్టు

‘మా’ మామిడి చెట్టు   చైత్ర మాసానికి స్వాగతం పలుకుతోంది... ఆ మామిడి చెట్టు లేత పిందెలతో... మా మంచి మామిడిచెట్టు. ప్రకృతి కాంత ఆకుపచ్చని చీర కట్టునట్లుంటుంది. మావిచిగురు తిని మత్తెక్కి కూసే కోకిల గానం... గమ్మత్తుగా వుంటుంది కదా! వయస్సు పైబడ్డ తాతయ్య ‘మా’ మామిడిచెట్టు నీడలో పడకకుర్చీ వేసుకుని పుస్తకం చదువుకునేవారు. మా చిన్నతనంలో చూసేదాన్ని. పెరట్లో మామిడి పిందెల కోసం గోడలెక్కే ఆకతాయిలను కర్రచూపించి తరమడం బామ్మకో గొప్ప కాలక్షేపం. మామిడిచెట్టు పెరట్లో వుంటే ఆ ఇంటి పెద్దకొడుకు ఉన్నట్లే... మామిడాకులతో తోరణం.. మామిడికాయ పప్పుతో శుభకార్యం... ప్రతి తెలుగింటా చూస్తూ మామిడిపై అనురాగం... మమకారం.. నాకు... మామిడిచెట్టుని చూస్తే జీవితం కనబడుతుంది. లేత వగరు పిందె... యవ్వనం... పులుపు.. మధ్య వయస్సులోని బింకం... పండ్ల రసం... వయస్సుతో వచ్చే అనుభావాల మాధుర్య సారం... వాత్సల్య రసం... దీనిని పొగడ నా తరమా.... ఊరగాయ రోజుల్లో అమ్మమ్మ జాడీకెత్తే కొత్త ఆవకాయ వేడి అన్నంలో కలుపుకుని తింటూ వుంటే స్వర్గానికి బెత్తెడు దూరం... వేసవి సెలవల్లో మామిడి పండు తింటూ... చివరన వదలబుద్ధి కాని టెంకెను చీకుతూ... అప్పుడూ స్వర్గానికి బెత్తెడే దూరం... బంగినపల్లి, చెరుకు రసాలు, కలక్టెరు కాయలు... పేరు ఏదైనా వేసవిలో ఏ మామిడి చెట్టుని చూసినా; యుద్ధానికి సంసిద్ధమైన సైనికుడిలా... అస్త్ర శస్త్రాలతో, కాయ, పండ్లతో... వెన్ను విరుచుకుని... నిటారుగా... మా బంగారు మామిడి... ప్రకృతి ఆరాధకులకు,పరమ భక్తులకు, భోజన ప్రియులకు.... అందరినీ అలరించి పలకరించే కడుపు నింపే అమృతవృక్షం. మా మంచి మామిడిచెట్టు. కడుపారా పిల్లల్ని కని సమాజానికి అందించే ఆదర్శం... కనికరం లేని సమాజం శాఖలుగా చీర్చి... పొయ్యిలోకి తోసినా తొణకని... బెణకని... తల్లిని తలపించే... ఓర్పు... అనురాగం... శిరస్సు వంచి.. ప్రణమిల్లుతున్నాను మా తల్లి ‘మామిడి’కి; మా అందరి మదిలో ఎప్పటికీ నీ స్థానం సుస్థిరం... పదిలం... సస్యశ్యామలం. మా మంచి చెట్టు మామిడికి వందనాలతో.... - పి.భారతీలక్ష్మి

చెప్పుడు మాటలు వినకు..

చెప్పుడు మాటలు వినకు!     కోగిర అడవిలో ఒక మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు కొమ్మల్లో‌ గూడు కట్టుకొని కాకి ఒకటి నివసిస్తూ ఉండేది. అదే చెట్టు తొర్రలో ఒక పిల్లి, చెట్టు క్రింద కన్నంలో ఒక ఎలుక నివసించేవి. మూడూ దాదాపుగా సమాన వయస్సువి అవ్వటంతో వాటి మధ్య స్నేహం ఏర్పడింది. జాతులేవీ వాటి స్నేహానికి అడ్డు రాలేదు. అట్లా కొన్నేళ్ళు గడిచాక, "మనం ముగ్గురం స్నేహితులం కదా, ఆ సంగతి లోకానికి అంతటికీ తెలిసేట్లు చేయటం ఎలాగ?" అని అవి చాలా సీరియస్‌గా ఆలోచించాయి. ఆలోచించి, "ఇకనుండీ రోజూ ముగ్గురం కలిసి వంట చేసుకుని తిందాం" అని నిశ్చయించుకున్నాయి. "కలిసి పని చేస్తూంటే మనం పదిమంది కళ్ళలో పడతాం. అట్లా మన గురించీ, మన స్నేహం గురించీ అందరికీ తెలుస్తుంది" అన్నది పిల్లి. "అవును- నిజమే. కలిసి వంట చేసుకుందాం" అన్నది ఎలుక. "మరి ఎవరు ఏం పని చెయ్యాలి?" అడిగింది కాకి.   "ఎవరికి సులభంగా వచ్చిన పని వాళ్ళు చేద్దాం. నువ్వు పుల్లలు ఏరుకురా. ఎలుక గింజలు తెస్తుంది. నేను వంట చేస్తాను" అన్నది పిల్లి. "సరే!" అన్నాయి మిగిలిన రెండూ. అట్లా వాటి వంట కార్యక్రమం మొదలైంది. అడవిలోని జంతువులన్నీ వాటి గురించి చాలా గొప్పగా చెప్పుకున్నాయి. అవి కూడా చక్కగా వండుకొని హాయిగా తింటూ, చీకూ చింతా లేకుండా జీవించినై, కొన్నాళ్ళు. అట్లా నెల రోజులు గడిచిందో, లేదో- ఒక నక్క చూపు పడింది వీటి మీద. వీటికి మంచి పేరు రావటం దానికి ఇష్టం లేదు. "వీటి స్నేహాన్ని చెడగొట్టాలి, పిల్లిని చంపి తినెయ్యాలి" అనుకుందది. "ఈ మూడింటిలోనూ కొంచెం అమాయకంగా ఎవరు ఉంటారు, పొగిడితే ఎవరు పొంగి పోతారు?" అని ఆలోచించింది. కాకి-రొట్టె ముక్క కథ గుర్తుకొచ్చింది దానికి. అది కాకి దగ్గరకు వెళ్ళి: "కాకి బావా! ఎంతైనా నువ్వు నువ్వే! మీ ముగ్గురిలోనూ చాలా కష్టపడేదంటే నువ్వే. వాళ్ళ పని ఏమున్నది? కడుపులో‌ చల్ల కదలకుండా సుఖంగా‌ ఉంటారు" అన్నది. "అదేం లేదులే, ముగ్గురమూ బాగానే పని చేస్తాం. ఎవరికి వీలైనంత పని వాళ్లం చేస్తాం" అన్నది కాకి. నక్క దాన్ని వదల్లేదు. బ్రాహ్మణుడు-దొంగలు కథ గుర్తు చేసుకున్నది. మళ్ళీ మళ్ళీ కాకిని పలకరించటం, మళ్ళీ‌ మళ్ళీ అదే మాట అనటం చేసింది. ఇట్లా కొన్ని సార్లు అనేసరికి కాకిలో ఆలోచన మొదలైంది.." నిజంగానే ఈ పిల్లి, కాకి పెద్ద పని చేయట్లేదు" అనిపించింది దానికి.   దాని ఆలోచనని పసిగట్టిన నక్క "నిజం కాకమ్మా! కావాలంటే ఓ పని చెయ్యి. పిల్లి చేసే పని నువ్వు చేసి చూడు- నీకే అర్థమైపోతుంది, అది ఎంత చవకైన పనో!" అని హితబోధ చేసింది. దాని బుట్టలో పడిపోయిన కాకి వెంటనే మిత్రుల దగ్గరికి పోయి తగవులాడింది- "నేను చాలా అలసిపోతున్నాను. పని బరువు బాగా పడుతున్నది. మీరు సులభం పనులు పెట్టుకొని, నాకు ఇంత కష్టం పని పెట్టారు. అది కుదరదు. ఇప్పుడు పనులు మార్చుకోవాల్సిందే!" అని పట్టుబట్టింది. పిల్లికి, ఎలుకకి కోపం వచ్చింది. "నా కష్టం నీకు తెలీదు. నువ్వు వంట చెయ్యి తెలుస్తుంది!" అన్నది పిల్లి.  "నా పని నాకూ నచ్చట్లేదు. ఎంత ఏరినా గింజలు దొరకట్లేదు- ఆ పని నువ్వు చెయ్యి!" అన్నది ఎలుక. మూడూ పనులు మార్చుకున్నాయి. గింజల కోసం వెళ్ళిన పిల్లి నక్క నోట చిక్కింది. వంట చేసేందుకు వెళ్ళిన కాకి కాస్తా పొయ్యిలో పడి కాలిపోయింది. పుల్లల కోసం పోయిన ఎలుక మరి ఏమైందో, ఇంకా తిరిగే రాలేదు. చూసారా! చెప్పుడు మాటలు ఎంత చేటు చేస్తాయో?! - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో