కండక్టర్ సుందరం

   కండక్టర్ సుందరం - శారదఅశోకవర్ధన్ ఇంతవరకూ నేను  ఆర్.టి.సి. బస్సులో ప్రయాణం చేసింది కాలేజీలో చదివిన మూడు సంవత్సరాలు మాత్రమే. సికింద్రాబాదు బోట్ క్లబ్ దగ్గరి నుంచి  సెక్రటేరియట్ వరకే. అక్కడ దిగి హోంసైన్స్ కాలేజీకి  నడిచి  వెళ్ళేదాన్ని. దూరపుప్రయాణాలు  బస్సులో  చేస్తే నాకు పడదు. గనుక  ఆ ప్రసక్తేలేదు. ఒక్కసారిగా మోసు గౌలిగూడా  బస్సుస్టాండు నుంచి మచిలీపట్నం  వరకు ప్రయాణం చేశాను. తోవపొడుగునా  ఎన్నిసార్లు  వాంతులు చేసుకున్నానో నాకే తెలీదు. అది మొదలు నేను బస్సులో  ప్రయాణం చేస్తానంటే  భయపడిపోయి  ఇంట్లోవాళ్ళే వొద్దని  కాన్సిల్  చేస్తారు ప్రపోజల్స్ ని. అలాగే  మరోసారి  రేడియోస్టేషన్ లో పని చేసేటప్పుడు  ఉద్యోగరీత్యా  సిమ్లాకి  ట్రైనింగ్ కి పంపించారు. వెళ్ళేటప్పుడూ, వచ్చేటప్పుడూ కూడా ఢిల్లీ నుంచి చండీఘర్ కీం అక్కడి నుంచి సిమ్లాకి బస్సు ప్రయాణాలే! నేను ఎన్ని వాంతులు  చేసుకున్నానో నాకే తెలీదు. బస్సులో వున్న వాళ్ళందరికి కంగారే. అప్పటినుంచి మళ్ళీ నేను బస్సులో  ఏ ప్రాంతానికీ ప్రయాణం చెయ్యలేదు. పెళ్ళయ్యాక  శ్రీవారికి వాహనం వుండడంవల్ల  బస్సు అవసరమూ కలగలేదు. నేను బస్సెక్కి దాదాపు పాతికేళ్ళుదాటుతుంది అనుకుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. కాలేజీలో  చదివేటప్పటి మూడేళ్ళూ తలుచుకుంటే బస్సంటే ఒకరకమైన ప్రేమ! మళ్ళీ బస్సెక్కాలనిపిస్తుంది. ఆ రోజుల్లో డబుల్ డెక్కర్ ఎక్కి పై బస్సులో కూర్చుని అక్కడి నుంచి కిందకి చూడాలంటే ఏదో సరదా! ఫ్రెండ్సందరం  కలిసి  బస్సుకోసం కబుర్లు  చెప్పుకుంటూ  ఎదురుచూడడం, బస్సు రాగానే హడావుడిగా బిలబిలమంటూ  ఎక్కడం, గమ్యం చేరేంతవరకూ ఏవేవో కబుర్లు. బాల్యంలోని  తీపిగుర్తులలో బస్సు ప్రయాణం కూడా ఒక భాగమే. మా గ్రూపులో అందరికన్నా  జానవి చాలా లావుగా ముందు సబితా, సుశీలా నుంచుని  అది మధ్యలో  వుండేట్టు చూసేవాళ్ళం. డబుల్ డక్కర్ మెట్లక్కడం  ఒక మేడమెట్లెక్కినట్టే  వుండేది.     మా చిన్నతనంలోనూ  సిటీబస్సుల్లో జనం, బాగానే వుండేవారు. కాకపోతే మరీ ఇప్పుడున్నంత రాపుళ్లూ తోపుళ్లూ వుండేవి కావు. ఆకతాయిమూక  కాస్త అల్లరి పట్టించినా అదీ ఒక స్టైల్లో అందంగానే, ఆనందంగానే వుండేది. ఇప్పటిలా భయంగా ఉండేదికాదు. ఉదాహరణకి ఒకతను వుండేవాడు. తెల్లగా, నాజూగ్గా - ఆ రోజుల్లో హీరో నాగేశ్వర్రావు లాగా  చూడగానే  బుద్దిమంతుడిలా వుండేవాడు. మేము ఏ బస్సెక్కితే  ఆ బస్సే ఎక్కేవాడు. మేము ఎక్కడ దిగుతామో అక్కడే దిగేవాడు. అది గమనించిన మేము ఒక్కోసారి  బస్సు ఒచ్చినా ఎక్కడం మానేసేవాళ్ళం. పాపం, మేము తప్పకుండా బస్సు ఎక్కుతామని అనుకున్న అతడు, తోసుకుంటూ బస్సెక్కేసి, మేము ఎక్కకపోవడం చూసి, ఉస్సురంటూ  మావంకచూసి, నెక్ట్స్ స్టేజిలో దిగిపోయి  మళ్ళీ మా దగ్గర కొచ్చి  నుంచునేవాడు. చాలాసార్లు  అతడి ప్రవర్తన గురించి ఇంట్లో వాళ్ళకి చెప్పడమో లేదా బస్సులోవాళ్ళకి చెప్పి, నాలుగు తగిలించాలనో అనుకునేవాళ్ళం. కానీ అతడిని చూశాక 'పోనీలే పిచ్చాడు, మననేమీ అనడంలేదుగా' అనుకుని ఊరుకునే వాళ్ళం.      రాను రాను రోజూ  అతణ్ణి బస్ స్టాండులో చూసి అలవాటయిపోయి, ఒక్కరోజు అతడు కనబడకపోతే  చుట్టూ  కలయజూసేవాళ్ళం. ఒకరోజు మాలో అందరికన్నా  చిలిపిదైన  కుసుమ  నన్నుచూసి 'అడుగో హీరో నాగేశ్వర్రావు! పాపం, మనని పలకరించాలని  ఎలా నుంచున్నాడో' అంది. ఒక్కక్షణం అతడు బిత్తరపోయినా, వెంటనే తేరుకుని "అవునండీ సూర్యకాంతంగారూ! మీ పక్కనున్న  భానుమతిగారిని కాస్త పరిచయం చేస్తారా? లేకపోతే ఆ పక్కనున్న అంజలిదేవిని" అన్నాడు. మాకా నిక్ నేమ్స్ కాలేజీలో వుండేవి. ఇతడికెలా తెలుసబ్బా? అని ఆశ్చర్యబోయినా, అతడు మన సంగతులన్నీ కనుక్కుంటున్నాడేమో అని భయపడి చచ్చిపోయి, పిచ్చిగా వాగినందుకు చెంపలేసుకుని, మనసులోనే  ఆంజనేయ దండకం చదువుకున్నాం! ఎంతటి నిష్కల్మషమైన వయస్సు!     ఇదిలా వుండగా ఒక రోజు  ఏడో నెంబరు డబుల్ డెక్కర్ లో ఒక కొత్త కండక్టరుని చూశాం. పెద్ద బొద్దు మీసాలూ, నల్లటి రంగు, తెల్లటి పలువరుస. విశాలమైన నుదురు. బొద్దుగా ఎదిగిన జుట్టుని చక్కగా దువ్వుకున్న క్రాఫ్. మంచి బలిష్ఠమైన శరీరం, చూడగానే అందరి దృష్టినీ ఆకర్షించే పర్సనాలిటీ. దానికితోడు ఏవో సినిమా పాటలు  ఈలవేస్తూ ఈలతో పాడుతూ 'టిక్కెట్ టిక్కెట్' అని అరుస్తూ  అందరితోటి జోక్ చేస్తూ టిక్కెట్లిచ్చేవాడు. అతణ్ణి చూస్తే భయంగా ఆర్. నాగేశ్వర్రావుని చూసినట్టుండేది. అతని ప్రవర్తన కూడా అదోలా అనిపించేది. మా దగ్గరికొచ్చి ఒక్కొక్కళ్ళనే 'టిక్కెట్టు పాపా!' అని అడిగేవాడు. ఆ పిలుపు మాకు ఒళ్లుమండేది. "పాపా.....ఏమిటిట పాపా....ఇంకానయం.... చీ.... చీ.... అని పలకరించడంలేదు" అంది బిర్రుబుర్రులాడుతూ  పద్మ "ఊరుకోవే, గొడవచెయ్యకు." వారించింది కుసుమ. అతడు నాకేసి తదేకంగా చూసి, ఆ తరువాత ఏదో లోకం నుండి దిగొచ్చి అప్పుడే మేల్కొన్న వాడిలా చిరునవ్వు నవ్వేడు. నాకు ఒళ్లుమండింది. "ఏయ్.... అపర భానుమతీ! నీకు లైట్ కొడ్తున్నాడు జాగ్రత్త" అంది సబిత. "అవునే.... కళ్ళు కళ్ళు కలిపి....రేపు చెయ్యి చెయ్యి కలిపి." రాగంతో  పాడుతూ అంది జానవి. "ఛీ! నోర్మూసుకోండి!...." అంటూ ఒక్క కసురు కసిరేను వాళ్ళని. దాంతో వాళ్ళు నోరుమూసుకున్నారు. మర్నాడు మళ్ళీ అదే వరస. ఈసారి నేను డబ్బులిస్తుంటే "ఒద్దులే పాపా!" అంటూ టిక్కెట్టు చింపి చేతిలో పెట్టేడు. "టిక్కెట్టు తీసుకోకపోతే రిపోర్టు చేస్తాం." అరిచింది విజ్జి. "ఇదుగో, టిక్కెట్టు ఇచ్చేనుగా" అన్నాడు అతను నవ్వుతూ. "డబ్బులు?" అరిచింది జానవి. "ఆ పాప టిక్కెట్టు డబ్బులు నేనిచ్చేస్తానులే పాపా!" అన్నాడు. "నీకు అందరూ పాపలే! అదేమో స్పెషల్ పాప! వొట్టి బ్రూట్!" అంది విజ్జి గట్టిగా అతడికి వినబడేలాగే! అతడు వినిపించుకోకుండానే "సంసారం సంసారం ప్రేమసుధా...." పాటని విజిల్ లో పాడుకుంటూ వెళ్ళిపోయాడు. 'టిక్కెట్, టిక్కెట్' అనుకుంటూ.       ఆరోజు నుంచి అందరూ "రావే స్పెషల్ పాపా! నీకు టిక్కెట్టక్కరలేదు" అంటూ ఆట పట్టించేవారు స్నేహబృందం.     ఆరోజు  నాజీవితంలో  మరిచిపోలేని రోజు. కాలేజీ పరీక్ష ఫీజు కట్టడానికీ, ప్రాక్టికల్స్ కీ, ఇంకా ఏవో కొన్ని పుస్తకాలు కొనుక్కోవడానికీ అయిదు వందలు నాన్న దగ్గర తీసుకొని హడావుడిగా ఒచ్చేస్తూ బ్యాగ్ లో పెట్టకుండా  చేతిలో వున్న కెమిస్ట్రీ టెక్ట్స్ బుక్ లో అయిదునోట్లు  మడిచి పెట్టేసి ఒచ్చేశాను. ఆ రోజు కెమిస్ట్రీ టెస్టు వుంది. బస్సులో కూర్చుని పేజీలు   తిరగేస్తున్నాం. సబిత దగ్గర టిక్కెట్టుకి చిల్లర లేదు. పది రూపాయల నోటుంది. నన్ను చిల్లరడిగింది. పుస్తకం పక్కనపెట్టి  జామెట్రీ బాక్స్ లోంచి  చిల్లర తీసి దానికిచ్చాను. ఇంతలో మేము దిగవల్సిన స్టేజీ రావడంలో కంగారుగా బస్సు దిగిపోయాం. ఆ తొందరలో కెమెస్ట్రీ బుక్కు బస్సులోనే వుండిపోయింది. గుండె ఆగినంత పనయింది. దాన్లో అయిదొందలున్నాయి! ఆపుకోలేక దుఃఖాన్ని కదిలిపోతూన్న బస్సువైపు బాధగా చూసి ఏడ్చేశాను. మా స్నేహబృందం అంతా కలిసి నన్ను ఊరుకో బెట్టడానికి శతవిధాల ప్రయత్నించారు. చివరకి విజ్జి వాళ్ళింటికి ఫోన్ చేసి, వాళ్ళ మమ్మీతో చెప్పి, ఇంటినుంచి అయిదొందలూ  తెప్పించి ఫీజు కట్టేసింది. ఆ రోజు పని జరిగిపోయింది. కానీ, ఆ డబ్బు వాళ్ళకి తిరిగిచ్చేదెలా? అసలే నాన్న ముక్కోపి నా అజాగ్రత్తకి నానాతిట్లూ  తిడతారు. అమ్మ సరేసరి దండకం చదివేసి నాలుగు బాదుతుంది కూడా! అన్నింటినీ మించిన నాలో బాధ. అసలే మా పరిస్థితులు ఆర్ధికంగా బాగులేని రోజులు. అతికష్టం మీద నాన్నగారు ఆ డబ్బులు నా ఫీజుకని ఇచ్చారు. అమ్మ ఇంకేదో ఖర్చు చెబుతున్నా  వినక. ఆ రోజంతా  పిచ్చిదానిలా  అయిపోయాను. ఏడ్చి ఏడ్చి కళ్ళు ఉల్లిపాయల్లా అయిపోయాయి. ఎలాగో ఇల్లు చేరుకున్నాను.     సాయంత్రం ఆరున్నర దాటింది, అప్పుడే ఇంటికొచ్చిన నాన్నకి  అసలు విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ కూర్చున్నాను. అప్పటికే అమ్మ చాలాసార్లు అడిగింది. 'మొహం ఎందుకు అలా ఏడ్చినట్టుంది? కళ్లు ఎర్రబడ్డాయి' అని. తమ్ముళ్ళు అమ్మకి వంతపాడారు. ఏం చెయ్యాలో, ఎలా చెప్పాలో  ఎటూ పాలుపోక ,గేటు దగ్గర వరండాలో కూర్చున్న నాన్న దగ్గరకి చేరుకున్నాను. నా కళ్లు నాలుగిళ్ల అవతలవున్న వ్యక్తిమీద పడ్డాయి. గుండె ఆగినంత పనయింది. కాళ్ళు వొణుకుతున్నాయి. ఇంట్లోకి పారిపోవాలంటే పాదాలు భూమి కంటుకుపోయినట్టున్నాయి. అడుగు పడడం లేదు. అంతలో ఆ వ్యక్తి నన్ను చూసేశాడు. మా ఇంటి వైపే ఒస్తున్నాడు. మరింత గబగబా నడుచుకుంటూ! "ఇడియట్ ఇల్లు కూడా ఎంక్వయిరి చేసి తెలుసుకున్నాడన్న  మాట!" అనుకుంటూండగానే "నీహారికగారిల్లిదేనాండీ?" అడిగేడాయన నాన్నగారిని, నాకేసి చూస్తూ? నాన్నగారు అతనికేసీ,  నాకేసీ అదోలా చూసి "అవును మీరెవరూ?" అనడిగేరు. "అంతలోనే అతడు నాకేసి చూచి చిన్నగా నవ్వుతూ "నా పేరు సుందరం నేను బస్ కండక్టర్ని. ఈ పాప వెళ్ళే రూట్ లోనే నెల రోజులుగా డ్యూటీ పడింది నాకు. ఏడో నెంబరు బస్సులో ఈ రోజు ఈ పాప మా బస్సులో ఈ పుస్తకాన్ని మరిచిపోయింది మామూలుగా అయితే రేపొచ్చినప్పుడు  ఈ పుస్తకాన్ని ఇచ్చేసేవాడిని. కానీ ఇది తిరగేసే సరికి ఇందులోనుంచి  అయిదువందల రూపాయల నోట్లు కనబడ్డాయి. డబ్బూ పుస్తకం రెండూ పోయాయని పాప దిగులు పడుతుందని, పైగా పారేసినందుకు మీరు ఏం కోప్పడతారో అనీ వెంటనే పుస్తకంమీదున్న పేరూ అడ్రసు చూసి, నా డ్యూటీ అయిపోగానే,  మీ ఇల్లు వెదుక్కుంటూ వొచ్చాను" అని డబ్బునీ, పుస్తకాన్నీ నాన్న చేతికందించాడు సుందరం కండక్టర్.     నాన్నగారు  అతని చేతిలోంచి  పుస్తకాన్నందుకుని  చూశారు. అది నా పుస్తకమే. అతని చేతిలోని డబ్బునీ తీసుకున్నారు. ఈ కాలపు పిల్లల అజాగ్రత్త గురించీ, చదువు సంధ్యలు గురించీ నాన్నగారొక క్లాసు తీసుకున్నారతనికి.     పాపం! అతడు మంచి బాలుడిలాగా  నాన్నగారు చెప్పేదంతా వింటూ వొచ్చాడు. "ఇంకా ఈ పిల్లలు నయం సార్! కొందరొస్తారు. చదువుకోవడానికెళుతున్నారో, కాలక్షేపానికెళుతున్నారో అర్ధం కాదు. బస్సులో వాళ్ళు చేసే అల్లరి కూడా అంతా ఇంతా కాదు. ఇక మొగపిల్లల సంగతి సరేసరి. ఎంతో కష్టపడి తల్లిదండ్రులు వారిని చదివిస్తూ వుంటే ఏ బాధ్యతా లేకుండా చేతిలో పుస్తకాలూ, జేబులో బీరుసీసాలు పెట్టుకుని వెళ్ళే పిల్లల్ని చూస్తే బాధనిపిస్తుంది" అన్నాడు సుందరం డబ్బును మరోసారి చూసి జేబులో పెట్టుకుంటూ, నాన్నగారు అతనికి థాంక్స్ చెబుతూ, కృతజ్ఞతాపూర్వకంగా లోపలికి ఆహ్వానించారు. అతను లోపలికొచ్చి  కూర్చుని "కాసిని మంచినీళ్ళియ్యి పాపా!" అన్నాడు. భయం భయంగానే వెళ్ళి మంచినీళ్ళు తెచ్చి గ్లాసందించాను. "రావుగారూ! మీ పాపని చూస్తే అచ్చు నాకు మా చెల్లాయి జ్ఞాపకమొస్తుందండీ! విచిత్రం! ఎంత పోలికో! అందుకే, పాప బస్సెక్కుతే దిగేదాకా ఆమెనే చూస్తూండేవాడిని. అందుకు పాప నన్ను చూసి కోపగించుకోవడం, విసుక్కోవడం కూడా నాకు తెలుసు. కానీ, బస్సులో పాపకి నా అభిప్రాయాన్ని ఎలా చెప్పగలను? నేను నవ్వినప్పుడల్లా పాప పళ్ళుకొరికేది. టిక్కెట్టు నా డబ్బులతో కొని ఎక్కౌంట్ చూపించేవాణ్ణి. పాప దగ్గర డబ్బులు తీసుకోనందుకు కూడా పాపా, వాళ్ళ ఫ్రెండ్సందరూ ఏవేవో అనేవారు. కాని నా చెల్లెలి దగ్గర నేను డబ్బులు తీసుకుని టిక్కెట్టెలా ఇవ్వగలను?" అతని గొంతు ఆర్ద్రతతో నిండిపోయింది. కళ్ళల్లోని తడి తళుక్కున మెరుస్తోంది.     అతనిలోని సోదరి ప్రేమకు నాన్నగారు కూడా చలించిపోయినట్టున్నారు. "మీ చెల్లెలు ఎంత అదృష్టవంతురాలు, ఈ రోజుల్లో కూడా ఇంత అభిమానమున్న  అన్నయ్య వున్నందుకు ఆమె గర్వపడాలి. ఎక్కడున్నారు ఆమె? ఏం చేస్తున్నారు?" అడిగేరు. "ఆమె ఈ ప్రపంచంలో లేదు. రెండు సంవత్సరాల క్రితం కేన్సర్ వ్యాధితో మరణించింది."  మరి మాట్లాడలేకపోయాడు సుందరం. గుండె బాధతో గొంతులో అడ్డుపడిపోతోంది. కన్నీళ్లు సెలయేరులా అతని చెంపల మీదుగా కారిపోయాయి. నా గుండె పగిలిపోయినట్టనిపించింది. అతని గురించి అంత అసహ్యంగా  అనుకున్నందుకు, తనమీద తనకే ఒళ్ళు మండిపోయింది. "అన్నయ్యా!" అని నోరారా పిలవాలనిపించింది. కాఫీ పట్రా అమ్మా!" అన్నారు నాన్నగారు. గబగబా వంటింట్లోకెళ్ళి, నేనే కాఫీ కలిపేసి అతని కందించాను. నవ్వుతూ కాఫీ కప్పందుకుని, "థాంక్స్ పాపా!" అన్నాడు.     "ఒస్తూవుండండి మీ చెల్లెల్ని చూడ్డానికి అప్పుడప్పుడు సుందరంగారూ!" అన్నారు నాన్నగారు, అతనికి ప్రతిఫలంగా ఒక వంద నోటుని అందిస్తూ.     "సార్!....మీ డబ్బు మీకు అందించినందుకు నాకు ప్రతిఫలమా? ఒద్దు సార్! మానవతకి డబ్బుతో వెల కట్టకండి. పైగా, నేనిలా వెతుక్కుంటూవొచ్చి నా చెల్లెలి రూపంలో వున్న పాపని, నీహారికని ఒక్కసారి చివరిగా చూసిపోవాలన్న  స్వార్ధంతో కూడా వొచ్చాను" అన్నాడు.     చివరి మాటలు నన్నూ నాన్నగారినీ కూడా ఆశ్చర్యపరచాయి.     "చివరిసారి అంటావేంటి బాబూ?" అడిగేరు నాన్నగారు.     "నాకు ఈ వూరి నుంచి  బదిలీ అయింది. నిజామాబాద్ వేశారు" అన్నాడు.     ఎందుకో నా గుండెల్లో ముల్లు గుచ్చుకున్నట్టయింది!     "పోనీ, హైదరాబాదొచ్చినప్పుడల్లా  మా ఇంటికి రండి - మీ చెల్లెల్ని చూసిపోదురు గాని. ఇంకా మీలాంటి నిజాయితీపరులూ, మానవతా విలువలూ వున్నవారు  వుండబట్టే, ఈ ప్రపంచం ఈ మాత్రంగానైనా నిలుస్తోంది. స్వార్ధం పెరిగి, అభిమానాలూ, ఆప్యాయతలూ అంతరించి స్వంత అన్నదమ్ములూ అక్కచెల్లెళ్ళే కత్తులు నూరుకుంటూన్న  ఈ రోజుల్లో మీలాంటివారు నూటికీ కోటికీ ఒక్కరుంటారు." నాన్నగారు ఆవేశంగా అంటున్నా ప్రతీ అక్షరం నిజమనిపించింది. సెలవు తీసుకుని సుందరం వెళ్ళిపోయాడు.          అతడు లేని బస్సు ఎక్కబుద్ది కాలేదు! ఎలాగో ఆ సంవత్సరం చదువు పూర్తి చేశాను. అంతలో నాకు పెళ్ళయిపోవడం, ఇండియానే ఒదిలిపెట్టి పోవడం జరిగింది. ఎన్నేళ్ళు గడిచినా బస్సు ప్రయాణం అంటే సుందరం కండక్టరే కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాడు. ఇలాంటి నిజాయితీపరులకి ఒక ఇంక్రిమెంటు ఇవ్వడమో, ప్రమోషనివ్వడమో, ఆర్. టీ.సీ వాళ్ళు చేస్తే బాగుంటుంది.     నాన్నగారు వివరాలన్నీ రాస్తూ అతనికి ఇంక్రిమెంటు రికమెండ్ చేస్తూ ఉత్తరం రాశారుట. కానీ, ఏం జరిగిందో ఫలితం తెలుసుకునే అదృష్టం మాకు లేకపోయింది. నేను భర్తతోసహా అమెరికాకి వెళ్ళిపోవడం, నాన్నగారికి హైదరాబాదు నుంచి బొంబాయి ట్రాన్స్ ఫర్ అవ్వడం వెంటవెంటనే జరిగిపోయాయి. కాలచక్రంలో ఎన్నో సంవత్సరాలు దొర్లిపోయినా, సుందరం కండక్టరుని మాత్రం మా ఇంటిల్లిపాదీ ఇప్పటికీ జ్ఞాపకం చేసుకుంటుంటాం.                   

అమ్మ పిలుపు

అమ్మ పిలుపు ఎపిసోడ్ - 3 - వసుంధర                         కనకయ్య బట్టలుతికితే, వాడి పెళ్ళాం అందరిళ్ళకూ బట్టలు తీసుకుని వెళ్ళి యిచ్చి వస్తుంది. ఇప్పుడు కనకయ్య కొడుకులు కూడా కాస్త అంది వచ్చారు. కనకయ్య పక్కనే కూర్చుని వాడితో కలిసి భోం చేయగలిగినవాళ్ళకు వెయ్యి రూపాయిలు బహుమతిగా యిస్తానని ఆ ఊరి ప్రెసిడెంటు శేషగిరి ప్రకటన కూడా చేశాడు.     చేయడానికి సాహస కార్యాలెన్నో వుండగా ఎందుకూ పనికిరాని ఆ సొరంగంలోకి ఎందుకు వెళ్ళడం అని వాళ్ళ వాదన. ఒకవేళ సొరంగంలోకి వెళ్ళడం యింకా గొప్ప సాహసకార్యం అనుకుంటే-ముందీ సాహసకార్యాలు చేసి అప్పుడు దానికి ప్రయత్నించాలి. ఇవే చేయలేనివాడు అవీ చేయలేడు కదా!     "ఎప్పుడో ఒకరోజున అవన్నీ చేస్తాను కానీ ముందు సొరంగంలోకి వెళ్ళనిచ్చి మీకు అక్కడి విశేషాలన్నీ చెప్పకపోతే నా పేరు గోపీ కాదు" అన్నాడు గోపీ.     గోపీ మామయ్య తిరిగి ఊరికి వెళ్ళిపోతూ "ఒరేయ్ గోపీ! నువ్వేం సాహసకార్యం చేశావో నాకు ఉత్తరం రాయాలి సుమా!" అన్నాడు గోపీతో.     "అలాగే మామయ్యా!" అంటూ గోపీ తలూపాడు కానీ వాడి మను వూగిసలాడుతోంది. సొరంగంలోకి వెళ్ళాలని వాడికి కోరికగా వుంది. కానీ మళ్ళీ తిరిగి వస్తానో రానో అని వాడికి భయంగానూ వుంది. అందుకే ఏ నిర్ణయానికీ రాలేకపోతున్నాడు. ఈలోగా తండ్రికి వీరయ్యిచ్చిన గడువు దగ్గర పడుతోంది. తను త్వరగా ఏదో కటి చేసి తండ్రికి సాయపడాలని గోపీకి అనిపిస్తోంది.     ఆ రోజు రాత్రి గోపీ మంచి నిద్రలో వుండగా "గోపీ"! అని ఎవరో తట్టి లేపినట్టయింది. గోపీ ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. గదిలో దీపం లేదు. చీకటిగా వుంది.     "ఎవరూ?" అన్నాడు గోపీ.     "నేను రా! గోపాల్రావుని మీ నాన్నకు ముత్తాతను. నేను కుబేరుడి కొలను దగ్గర వున్నాను. కొన్ని కారణాల వల్ల నేనిక్కణ్ణించి కదిలిరాలేను. నువ్వక్కడికి వస్తే నీకు బంగారం చేసే రహస్యం నేర్పుతాను" అన్న మాటలు గోపీకి వినిపించాయి.     గోపీకి భయం వేసింది. అయినా ధైర్యం చిక్కబట్టుకుని "నువ్వు నాతో ఎలా మాట్లాడుతున్నావు?" అన్నాడు.     "మాటల్ని తీగల్లేకుండా గాలిలోకి పంపి వైర్లెస్ పద్ధతి ద్వారా మీరు రేడియోలో ఎక్కడెక్కడి మాటలూ వింటున్నారు కదా! అలాగే నేను నా ఆలోచనల్ని తరంగాల రూపంలో నీ దగ్గరకు పంపాను. నువ్వు వింటున్నవి నా ఆలోచనా తరంగాలు. నేను కూడా యిక్కడ నీ ఆలోచనల్ని వింటున్నాను" అన్న మాటలు మళ్ళీ గోపీకి వినిపించాయి.     అప్పుడు గోపీకి చాలా సంతోషం కలిగింది. అంటే తాతయ్య కుబేరుడి కొలను వద్ద వుండడమే కాక బోలెడు సైన్సూ అదీ నేర్చుకున్నాడన్నమాట. తను వెడితే తాతయ్య చాలా నేర్పవచ్చు.     "సరే పెద్ద తాతయ్యా! నేనక్కడికి ఎప్పుడు రాను?" అన్నాడు గోపీ.     "రేపు నీకు స్కూలు సెలవు కదా! మధ్యాహ్నం బయల్దేరిరా. సాయంత్రానికల్లా వెనక్కు వెళ్ళిపోవచ్చు" అన్నాడు గోపీ పెద్ద తాతయ్య.     "కానీ రేపు నాకు సెలవు లేదే?" అన్నాడు గోపీ.     "ఓహో! నీకు భవిష్యత్తులోకి చూడ్డం రాదు కదూ! రేపు నీకు సెలవేలే! మీ లెక్కల మేష్టారు రామనాథంగారు ఇంకాసేపట్లో చచ్చిపోతాడుగా. ఇంక నేనేమీ మాట్లాడను. అన్న ప్రకారం మధ్యాహ్నానికల్లా బయల్దేరిరా" అన్నాడు గోపీ పెద్ద తాతయ్య.     గోపీకి ఒక్క క్షణం మాట రాలేదు.     "ఒక్కమాట గుర్తుంచుకో! నువ్వు నా దగ్గరకు వస్తున్నట్లు ఎవ్వరికీ తెలియకూడదు. నా గురించి ఎవరికైనా చెప్పావా ఈ జీవితానికి నువ్వు నన్ను మళ్ళీ కలుసుకోలేవు" అన్నాడు గోపీ తాతయ్య.     "పెద్ద తాతయ్యా! రామనాథం గారీ రోజు మాకు పాఠం కూడా చెప్పారు. ఆయనెంతో మంచివారు. మొన్ననే ఆయనకో బాబు కూడా పుట్టాడు. ఆయన ఎంతో ఆరోగ్యంగా వున్నారు. ఆయన ఎందుకు చచ్చిపోతారు? ఆయన చావకుండా ఆపడం కుదరదా?" అంటూ గోపీ కేకలు పెట్టాడు. కానీ బదులుగా యింకేమీ వినిపించలేదు.     ఈలోగా గదిలో దీపం వెలిగింది.     "ఏమిట్రా గోపీ చాలా గట్టిగా పలవరిస్తున్నావు" అన్నాడు రఘురామయ్య.     "ఒక్కోణ్ణీ పడుకోవద్దంటే వినడు. చదువుకుని చదువుకుని స్టడీరూంలోనే పడుకుంటాడు. వాణి, వేణిలతో పాటు వాళ్ళ గదిలోనే పడుకోవచ్చుగా. నిద్రలో ఏకలొచ్చిందో ఏమో-జడుసుకున్నట్లున్నాడు. వణుకుతున్నాడు కూడా" అంది సీతాదేవి కొడుకుని సమీపిస్తూ.               తను వణుకుతున్నట్లుగా అప్పుడే గోపీక్కూడా తెలిసింది.     "అసలేం జరిగిందిరా?" అన్నాడు రఘురామయ్య.     "మా లెక్కలుమేష్టారు రామనాథం గారు చచ్చిపోతారట" అన్నాడు గోపె ఏడుస్తూ.     "ఎవరూ-రామనాథమా! ఆయనకేంరా-నిక్షేపంలాగున్నాడు. సాయంత్రం వాళ్ళింటిమీంచే వచ్చాను కూడా. నీకు కలేమైనా వచ్చిందా?" అన్నాడు రఘురామయ్య.     "కలకాదు. పెద్ద తాతయ్య చెప్పాడు" అన్నాడు గోపీ.     "పెద్ద తాతయ్యెవరూ?" అన్నాడు రఘురామయ్య అర్ధంకాక.     ఏదో చెప్పాలనుకుని ఆగిపోయాడు గోపీ. తన గురించి ఎవరికీ చెప్పొద్దని గోపాల్రావు తాతయ్య తన్ను హెచ్చరించడం గుర్తొచ్చింది.     "ఏమోలే-కలేఏమో" అన్నాడు గోపీ కళ్ళు తుడుచుకుంటూ.     సీతాదేవి గోపీకి దగ్గరగా వచ్చి తన చీరచెంగుతో వాడి కళ్ళుతుడిచి "నా దగ్గర పడుకుంటావా?" అనడిగింది లాలనగా.     "ఊ" అన్నాడు గోపీ వెంటనే. పన్నెండేళ్ళొచ్చినప్పటికీ ఇప్పటికీ గోపీకి అమ్మ దగ్గర పడుకోవాలనే వుంటుంది. అందరూ నవ్వుతారని భయపడతాడు. అమ్మనడగటానికేమో మొహమాటం.     "దా" అంది సీతాదేవి. గోపీ మంచం దిగి తల్లిననుసరించాడు. సరిగ్గా అప్పుడే ఎవరో వీధి తలుపు బాదారు.     "అబ్బా! యింత అర్ధరాత్ర్పూట ఎవరో?" అంది సీతాదేవి విసుగ్గా.     "అర్దరాత్రిపూట నువ్వు లేచి తిరగడం లేదూ యిల్లంతా- అలాగే మనమంటే యిష్టమున్న వాళ్ళెవ్వరో చూడ్డానికి వచ్చి వుంటారు" అంటూ రఘురామయ్య వీథి తలుపు తీయడానికి వెళ్ళాడు.     సీతాదేవికి పిల్లలంటే ప్రాణం. తన ఆరోగ్యం ఎలా వున్నప్పటికీ రోజూ అర్దరాత్రి వేళ లేచి పిల్లలెలా వున్నారో చూసుకుని వస్తుంది. ఈ వేళ కూడా అలా లేచినప్పుడే గోపీ గదిలోంచి మాటలు వినపడ్డాయి.     గోపీ తల్లికి దగ్గరగా జరిగి నడుస్తున్నాడు. తల్లి నడుం గట్టిగా పట్టుకున్నాడు. వాడి బుర్రలో రకరకాల ఆలోచనలు పరుగెడుతున్నాయి. గోపాల్రావు తాతయ్య నిజంగా తనతో మాట్లాడేడా లేక తను కలగన్నాడా అన్న విషయం వాడికి తేలడం లేదు.     ఈలోగా తలుపు తీయడానికి వెళ్ళిన రఘురామయ్య కంగారుగా "నేను అర్జంటుగా బయటకు వెళ్ళాలి. సెకండ్ షో సినిమా చూసి వస్తుండగా లారీ గుద్ది రామనాథం మేస్టారికి యాక్సిడెంటయిందట. పరిస్థితి చాలా ప్రమాదకరంగా వుందిట" అన్నాడు.     ఇది వింటూనే గోపీ తెల్లబోయాడు. అంటే గోపాల్రావు తాతయ్య చెప్పినట్లే జరిగిపోతుందా?     "రామనాథం మేస్టారికేమీ అవకూడదు. ఆయన బ్రతకాలి" అని ఆ రాత్రంతా గోపీ దేవుణ్ణి ప్రార్ధించుకుంటూనే వున్నాడు.           తెల్లవారిలోగానే రామనాథం మేష్టారు చచ్చిపోయాడు. ఆ రోజు గోపీ స్కూలుకి సెలవిచ్చారు. వాడి మనసు నిండా చెప్పలేనంత పుట్టెడు దిగులు.     రామనాథం మేస్టారు ఇలా అనుకోకుండా అర్ధంతరంగా చచ్చిపోతాడని ఎవ్వరూ అనుకోలేదు. కానీ గోపాల్రావు తాతయ్యకు తెలిసింది. ఎలా?     అసలు గోపాల్రావు తాతయ్య వున్నాడా? తనతో నిజంగా మాట్లాడాడా? లేకతను భ్రమపడ్డాడా?      తనకు వచ్చింది కల అనుకుందామా అంటే అంతా తాతయ్య చెప్పినట్లే జరిగింది. అంటే ఆయన నిజంగానే తనతో మాట్లాడాడు. ఆయన చెప్పిన ప్రకారం మధ్యాహ్నం తను కుబేరుడి ఆలయంలోని సొరంగంలోకి ప్రవేశించాలి.     గోపాల్రావు తాతయ్యకు చాలా విశేషాలు తెలుసు. ముందేమవుతుందో తెలుసు. బంగారమెలా చేయాలో తెలుసు. సైన్సు తెలుసు. ఇన్ని తెలిసిన తాతయ్య దగ్గర్నుంచి తను చాలా తెలుసుకోవడం మంచిది కదా!     ఇలా అనుకున్నప్పటికీ గోపీకి మళ్ళీ ధైర్యం చాలడం లేదు. సొరంగంలొ ఓ పెద్ద కొండచిలువుందనీ, అది తన్ను మింగేస్తుందనీ వాడికి భయంగా వుంది..     గోపీ పదకొండింటికల్లా భోంచేశాడు. కాసేపు చదువుకోవాలని ప్రయత్నించాడు. పుస్తకం తీస్తే చాలు గోపాల్రావు తాతయ్య, రామనాథం మాస్టారు కనపడుతున్నారు. గోపాల్రావు తాతయ్యను చూస్తుంటే వాడికి ఉత్సాహం పుడుతోంది. రామనాథం మేస్టార్ని చూస్తుంటే ఏడుపు వస్తోంది.     టైము సరిగ్గా పన్నెండుయ్యేసరికి వాడికి ఎవరో "గోపీ!" అని పిలిచినట్టయింది.     గోపీ ఉలిక్కిపడి-"ఎవరూ?" అన్నాడు.     "నేను గోపాల్రావు తాతయ్యను. టైము పన్నెండయింది. వెంటనే బయల్దేరు. ఇంట్లో అసలు విషయం చెప్పకు. నా దగ్గరకు వస్తున్నట్లు నీ స్నేహితులక్కూడా  చెప్పకు. ఒక్కడివీ బయల్దేరిరా. వెంటనే-ఊ లేచిరా-" అన్న మాటలు గోపీకి వినబడ్డాయి.     పెద్ద తాతయ్య తను పిలుస్తున్నాడు. తనిప్పుడేం చేయాలి? గోపీ ఆలోచిస్తున్నాడు......     "నీకేం భయం లేదు. అక్కడే కొండ చిలువలూ లేవు. నీకే ప్రమాదమూ రాకుండా నేను నిన్ను కాపాడుకుంటాను. నువ్వు సొరంగంలో అడుగుపెట్టావంటే చాలు- నా దగ్గరకు వచ్చినట్లే! ఊ త్వరగా..." అన్నమాటలు మళ్ళీ వినిపించాయి.     గోపీ యింక ఆలస్యం చేయలేదు. పుస్తకం మూసి లేచి నిలబడి తల్లి దగ్గరకు వెళ్లి "అమ్మా! అలా బైటకు వెళ్ళివస్తానే!" అన్నాడు.     సీతాదేవి అప్పుడు రామనాథం మేస్టారింటికి వెళ్ళి ఆయన భార్యనోదార్చే ఉద్దేశ్యంలో వుంది. అందుకని ఎక్కడికని కూడా అడక్కుండా "సరే-వెళ్ళు కానీ-జాగ్రత్త! బయట కార్లూ అవీ సరిగ్గా చూసుకుంటూండు. అసలే రోజులు బాగాలేవు" అంది.     గోపీ యింట్లోంచి బయటపడ్డాడు. నడుచుకుంటూ కొండ చేరుకున్నాడు. మిట్ట మధ్యాహ్నం కావడం వల్ల కొండ మెట్ల మీద వాడికెవ్వరూ కనబడలేదు. చకచకా మెట్లెక్కాడు. నెమ్మదిగా కుబేరుడి ఆలయాన్ని సమీపించాడు. లోపల ప్రవేశించాడు.     ఆలయం చాలా చిన్నది. కొండగుహను దొలిచి మలిచినట్లుంటుంది. ఆలయంలో కుబేరుడి విగ్రహం మినహా యించి మరేమీ లేదు. ఈ ఆలయానికి ద్వారం వుండదు. ఎవరెప్పుడు కావాలన్నా వెళ్ళవచ్చు.     ఆలయంలో కనుచీకటిగా వుంది. అయినా కుబేరుడి విగ్రహం వెనుకనున్న గోడకు కాస్తపైగా వున్న సొరంగమార్గం స్పష్టంగా కనబడుతోంది.     గోపీకి వళ్ళు జలదరించింది. తనిప్పుడందులో ప్రవేశించాలా? లోపల కొండ చిలువుండదా?     "ఊ ఆలస్యం చేయకు" అన్న మాటలు గోపీకి మళ్ళీ వినిపించాయి. అప్పుడు వాడికి బాగా ధైర్యం వచ్చింది. విగ్రహం వెనక్కువెళ్ళాడు. సొరంగంలో ప్రవేశించడానిక్కాబోలు అక్కడ గోడకు మెట్లున్నాయి.       గోపీ ఆ మెట్లెక్కాడు. ఇప్పుడు సొరంగం చేతికి అందుతోంది. లోనికి వెళ్ళాలంటే పట్టుదొరుకుతోంది. గోపీ క్షణం మాత్రం తటపటాయించాడు. ఏమైతే అయిందని నిర్భయంగా సొరంగంలోకి దూరాడు.     అప్పుడు వాడొకసారి లోనికీ బైటకూ చూశాడు.     బైట ఆలయం. కనుచీకటిలోన సొరంగం. కన్ను పొడుచుకున్నా కానరాని చిమ్మ చీకటి!                           (సశేషం)     

అమ్మ పిలుపు

అమ్మ పిలుపు ఎపిసోడ్ - 2 - వసుంధర ఆయన ఆ సొరంగంలోకి వెళ్ళడం చూసినవాళ్ళు మాత్రం ఒక్కరు కూడా లేరు. కానీ ఆ తర్వాత గోపాల్రావు నెవ్వరూ చూడలేదు.     సొరంగంలోకి వెళ్ళాడేమోనని ఆయన భార్య అనుమానించింది. అయితే సొరంగంలోకి వెళ్ళి వెతకడానికెవ్వరూ సాహసించలేదు. ఆ సొరంగంలో పాములే వున్నాయో, కొండచిలువలే వుంటున్నాయో ఎవరికెరుక? ఒకవేళ సొరంగ మార్గంలో ఏ ప్రమాదమూ లేదనుకుందామంటే వెళ్ళినవాడు క్షేమంగా తిరిగిరావాలికదా!    గోపాల్రావుకు కోపం జాస్తి. భార్య తన పద్ధతిని నిరసించిందని కోసం వచ్చి ఆయన ఇల్లు వదిలిపోయాడని అంతా అనుకున్నారు. ఆ విధంగా గోపాల్రావు భార్య ముత్తయిదువుగానే చనిపోయింది. గోపాల్రావు జాడ మాత్రం అప్పటికీ ఇప్పటికీ తెలియలేదు.     "బ్రతికి వుంటే ఆయనకి వందో, నూటయిదో ఏళ్ళుంటాయి. గాంధీగారికంటే పదేళ్ళుకాబోలు చిన్నవాడని చెప్పుకునేవారు" అంది లక్ష్మీదేవమ్మ.     ఈ కథ విన్నాక గోపీకి చాలా సందేహాలు కలిగాయి. అన్నీ కుబేరుడి కొలను గురించే! ఆ సొరంగ మార్గంలో వెడితే నిజంగా కుబేరుడి కొలను వస్తుందా? అక్కడ ద్వాపర యుగంనాటి యోగి వుంటాడా? ఆ యోగికి బంగారం తయారు చేయడం తెలుస్తుందా? వెళ్ళిన వాళ్ళకాయన విద్య నేర్పుతాడా?     లక్ష్మీదేవమ్మ ఈ సందేహాలన్నీ విని "ఏమోరా! నేను మాత్రం ఆ సొరంగంలో దూరి చూశానా ఏమిటి? అందరూ చెప్పుకునేవే నేనూ నీకు చెప్పాను, అంతే!" అంది.     గోపీ ఆలోచనలో పడిపోయాడు. కుబేరుడి ఆలయంలోని సొరంగంలోకి తను వెడితే ఏమవుతుందీ అన్న ఆలోచన వాడి చిన్న బుర్రలో మెదిలింది. కానీ అంతలోనే భయంతో వాడి వళ్ళు జలదరించిపోయింది.  అక్కడ ఏ కొండచిలువైనా తనను మింగేస్తే ఇంకేమైనా వుందా?     తనతండ్రి ముత్తాత ఏమయ్యాడు? ఆయన ఆ గుహలోకి వెళ్ళి చచ్చిపోయాడా? లేకపోతే భయపడి గుహలోకి వెళ్ళలేదా?     ఇలా ఆలోచిస్తుండగా గోపీకి వీరయ్య తండ్రిని నానామాటలూ అనడం గుర్తుకువచ్చింది.     డబ్బులేకపోవడం వల్లనే తండ్రి వీరయ్యకు చులకనైపోయాడు. వీరయ్య తండ్రికి నెలరోజులు గడువిచ్చాడు. నెలరోజుల్లో బాకీతీర్చకపోతే వీరయ్య ఈ యిల్లు స్వాధీనం చేసేసుకుంటాడు. అప్పుడు తామందర యిరుకింట్లోకి మారిపోవాలి. ఇరుకింట్లో అయితే తాతయ్య వుండలేడు.     అయినా ఈ యిల్లెందుకు వీరయ్య కివ్వాలి? పెద్దక్కయ్య పెళ్ళి గురించే కదా! ఇప్పుడు మళ్ళీ చిన్నక్క పెళ్ళి చేస్తే చిన్నిల్లు కూడా అమ్మేయాలి. ఆ తర్వాత ఆఖరక్క పెళ్ళి. అప్పుడు పొలం అమ్మేయాలి.      ముగ్గురక్కల పెళ్ళిళ్ళూ అయ్యేసరికి తమకు ఇల్లుండదు. భూమి వుండదు. అప్పులు కూడా పెరిగిపోతాయి.     అంటే అన్నీకష్టాలే! ఈ కష్టాలన్నింట్నించీ బయట పడాలంటే డబ్బు కావాలి. డబ్బెలా వస్తుంది?     ఇప్పుడెందరో బాగా చదువుకునేవాళ్ళకే ఉద్యోగాలు దొరకడంలేదు. ప్యూను ఉద్యోగానికి ఎమ్మే చదువుకునేవాళ్ళు పోటీ పడుతున్నారట. తను పెద్దై ఏం సంపాదిస్తాడు?     గోపీ మనసంతా కుబేరుడి ఆలయం వైపు లాగుతోంది. అయితే అక్కడ కొండచిలువ వుంటుందేమోనని భయపడుతున్నాడు వాడు.     ఏది ఏమైనా కుబేరుడి ఆలయంలోకి ప్రవేశించి సొరంగ మార్గాన వెళ్ళి కొలను వద్ద యోగిని కలుసుకుని బంగారం తయారుచేయడం నేర్చుకోవాలన్న కోరిక గోపీలో ఆరోజునే పుట్టింది           మర్నాడు గోపీ స్కూలుకు వెళ్ళినప్పుడు తన స్నేహితులను కుబేరుడి ఆలయంలోని సొరంగం గురించి అడిగాడు. వాళ్ళలో చాలా మందికి ఆ సొరంగం గురించి తెలుసు. ఒకడైతే "నాకా సొరంగంమంటే ఏమీ భయం లేదు. ఒక్కసారి కొండ మీద నేనూ ఫ్రెండ్స్ ఆట ఆడుకున్నాం. అప్పుడు నేను ఆ సొరంగంలో కాసేపు దాక్కున్నాను కూడా!" అన్నాడు.     "మరి నీకు కొండ చిలువ కనపడలేదా?" అన్నాడు గోపీ.     "లేదు, అక్కడ మన ఇంటికంటే శుభ్రంగా వుంది" అన్నాడువాడు.     "అయితే మనమిద్దరం ఆ గుహలోకి వెళదాం వస్తావా?" అనడిగాడు గోపీ.     వాడు వెంటనే భయంగా "నాకైతే భయంలేదు కానీ మా తాతయ్యకా సొరంగం మంటే భయం. నాకేదైనా అయిన ఆయన బెంగపెట్టుకుంటాడు" అన్నాడు.     గోపీ చాలామందిని అడిగి చూశాడు. అటువంటి ప్రమాదకరమైన పని చేయడానికి ఎవ్వరూ ఒప్పుకోలేదు. అంతమంది వెనకదీసేసరికి గోపీక్కూడా భయం వేసింది. వాడింక సొరంగం విషయం ఎవరితోటీ మాట్లాడలేదు.     ఆరోజు గోపీ యింటికి తిరగి వెళ్ళేసరికి వాడి మామయ్య వచ్చి వున్నాడు. ఆయన వాణ్ణి చూస్తూనే "నీ కోసమే చూస్తున్నారా గోపీ! ఏదీ ఓసారి నీ చెయ్యి చూపించు" అన్నాడు.     గోపీ మామయ్య కొత్తగా హస్తసాముద్రికం నేర్చుకున్నాట్ట. కనపడ్డవాళ్ళందరికీ బలవంతంగా చెయ్యి చూసి జోస్యం చెప్పేస్తున్నాట్ట. అందరికీ చెప్పడం అయిపోతే చుట్టాలిళ్ళక్కూడా వెళ్ళి జోస్యం చెప్పేస్తున్నాట్ట. ఇప్పడిక్కడికీ అందుకే వచ్చాట్ట.     "ఇంట్లో అందరికీ చెప్పడం అయిపోయింది. ఇంక నువ్వూ మీ నాన్న మిగిలారంతే!" అంటూ గోపీ మామయ్య వాడి చేయిపట్టుకుని బాగా పరీక్షించి "ఒరేయ్! నీ ముఖం చూస్తే వెర్రివెధవలాగున్నావు. కానీ త్వరలోనే నువ్వో గొప్ప సాహసకార్యం చేస్తావురోయ్!" అన్నాడు.     మామయ్యలా చెప్పగానే గోపీ ముఖం వెలిగిపోయింది. "ఇంకా చెప్పు మామయ్యా"! అన్నాడు.     ఆయన వాడి చేయి పరీక్షించి వందేళ్ళు బ్రతుకుతాడనీ, పెద్ద ఉద్యోగం చేస్తాడనీ, కారు కొంటాడనీ చెప్పాడు.     "అంటే నాకు బోలెడు బంగారం కావాలన్నమాట" అన్నాడు గోపీ.     "బంగారమైనా సరే, డబ్బైనా సరే" అన్నాడు గోపీ మామయ్య.     గోపి మళ్ళీ ఆలోచనలో పడిపోయాడు. తను వందేళ్ళు బ్రతుకుతాడుట. త్వరలో సాహసకార్యం చేస్తాట్ట అంటే అర్ధమేమిటి?     తను సొరంగంలోకి వెళ్ళినా ప్రమాదమేమీ జరుగదు.     గోపీ మామయ్య వక అనుమానంగా చూస్తూ "మామయ్యా! నువ్వు నాకు వందేళ్ళుయుష్షన్నావు. సాహసకార్యం పేరు చెప్పి ఏ కొండమీంచైనా దూకేశాననుకో అప్పుడు నాకేమవుతుంది?" అన్నాడు.     "ఏమవుతుంది? ఏ చెట్టు కొమ్మకో తగుల్కుని బ్రతుకుతావు. ఆయువు వున్నవాడిని మృత్యువేమీ చేయలేదు. అలాగని వెళ్ళి నూతిలో దూకకు. ప్రాణాకుదక్కినా జలుబుపట్టుకుని అవస్థ పడాలి" అన్నాడు గోపీ మామయ్య.     "మామయ్యా! ఈ జాతకాలూ అనీ నిజమేనంటావా?" అన్నాడు గోపీ మళ్ళీ.     "ఎందుకు నిజం కావు? పామిస్ట్రీ అంటే హస్తసాముద్రికం పుస్తకాలు రాసింది తెల్లదొరలు. కారణం లేనిదే వాళ్ళు దేన్నీ నమ్మరు తెలిసిందా?" అన్నాడు గోపీ మామయ్య నమ్మకంగా.     "హస్త సాముద్రికం నమ్మడానికి కారణమేముంటుంది?" అన్నాడు గోపీ.     గోపీ మామయ్య అంతా వివరంగా చెప్పాడు.     హస్తసాముద్రికమంటే అదీ సైన్సు లాంటిదే! కొన్ని వందల ఏళ్ళ నుంచి ఎందరి అరచేతుల్లో రేఖలో గమనించి ఏ రేఖల కారణంగా ఏయే గుణాలు మనుషుల్లో వుంటున్నాయో కనిపెట్టారు.     "అంటే ఏ రోగానికే మందు పని చేస్తుందో కనిపెట్టారూ- అలాగన్నమాట!" అన్నాడు గోపీ సాలోచనగా.     "కరెక్ట్! బాగా అర్ధ మ్చేసుకున్నావు. సైన్సు రోగాలకు మందులు కనిపెట్టిన ట్లే చేతుల్లో రేఖల్లోంచి భవిష్యత్తునూ కనిపెట్టింది. ఒకోసారి సరైన మందు వేసినా కొందరికి పని చేయదు. అలాగే ఎప్పుడైనా హస్త సాముద్రికమూ తప్పవచ్చు. అలాగని జ్యోతిష్యం అర్ధం లేనిదనడం తప్పు తెలిసిందా?" అన్నాడు గోపీ మామయ్య.     "అయితే నేను నిజంగా సాహసకార్యం చేస్తానంటావా?" అన్నాడు గోపీ.     "అందుకు సందేహం లేదు."     "నేను నూరేళ్ళూ బ్రతుకుతానా?"     "ఆహా!"     "థాంక్స్ మామయ్యా!" అన్నాడు గోపీ.     హస్తసాముద్రికం తెలిసిన గోపీ మామయ్య కూడా గోపీ తనకు థాంక్స్ ఎందుకు చెప్పాడూ అని ప్రత్యేకంగా ఆలోచించలేదు. తన జోస్యం గోపీ నెటువంటి ప్రమాదానికి పురిగొల్పుతుందో కూడా ఆయన ఆలోచించలేదు.           ఆ మర్నాడు కూడా గోపీ స్కూల్లో తన స్నేహితులతో కుబేరుడు కొలను గురించి మాట్లాడి "నిజంగా అక్కడికి వెళ్ళడం గొప్ప అనుభవం. నేనెలాగూ అక్కడికి వెడుతున్నాను. మీలో ఎవరైనా నా అంత ధైర్యవంతులుంటే నాతో రండి. నేను సాహసకార్యం చేస్తానని మా మామయ్య చేయి చూసి చెప్పాడు కూడా!" అన్నాడు.     ఇది వింటూనే గోపీ స్నేహితుడు రామేశం పెద్దగా నవ్వి "నాయనా! నువ్వు నిజంగా సాహసకార్యాలు చేయగలవాడివే. అయితే క్లాసులో చలపతి పక్కన కూర్చోకూడదూ" అన్నాడు.     గోపీక్లాసులో చలపతి అని ఓ కుర్రాడు వున్నాడు. వాడు కండలు తిరిగి వస్తాదులా వుంటాడు. మనిషికి కోపం ఎక్కువ. కోపం వస్తే వాడి నోటికి అడ్డూ, అదుపూ వుండవు. మేస్టర్లనైనా సరే ఎదిరించి మాట్లాడతాడు. వాడినోరు మంచిది కాదని మేస్టర్లు కూడా వాడినేమీ అనరు.     గోపీ క్లాసులో మొత్తం విద్యార్ధులు యాభై మంది. బెంచీలు మొత్తం పదహారున్నాయి. బెంచీకి ముగ్గురు కూర్చోవచ్చు. అయితే చలపతి తనకంటూ ఓ బెంచీ ప్రత్యేకించుకున్నాడు. ఆ బెంచీ మధ్యలో వాడు కూర్చుంటాడు. ఒక్క ప్రక్క టిఫిన్ క్యారియర్ పెడతాడు. మరో ప్రక్క పుస్తకాల బ్యాగు పెడతాడు. ఆ బెంచీలో మరెవ్వరూ కూర్చుందుకు లేదు. వాడు రాకపోయినా సరే ఆ బెంచీ అలా కాళీగా వదిలేయాల్సిందే! ఎవరైనా కూర్చున్నట్లు వాడికి తెలిసిందో చలపతి ఊరుకోడు. అందుకని మిగతా కుర్రాళ్ళంతా అవసరమైతే నలుగురో, అయిదుగురో సర్దుకునైనా ఓ బెంచీ మీద కూర్చుంటారు కానీ ఎవ్వరూ చలపతి బెంచీ జోలికి వెళ్ళరు.          ఇప్పుడు రామేశం ఆ చలపతి గురించే చెప్పాడు.     గోపీ యిది విని "సాహసకార్యమంటే పేచీకోరువాళ్ళతో తగువుపెట్టుకోవడం కాదు" అన్నాడు.     "సాహసకార్యమంటే ఏమిటో పోనీ నువ్వే చెప్పు, వింటాం!" అన్నాడు రామేశం వెటకారంగా.     "మీరునన్నేమీ వెటకారం చేయక్కర్లేదు. మనిషి ధైర్యంగా హిమాలయపర్వతాలెక్కుతున్నాడు. మంచు ఖండాలకు వెళుతున్నాడు. మనవేమో వూళ్ళో వున్న సొరంగంలోకి వెళ్ళలేకపోతున్నాం" అన్నాడు గోపీ.     "అందువల్ల ప్రయోజనం?" అన్నాడు రామేశం.     "స్వానుభవంతో మూడనమ్మకాలను తొలగించవచ్చు కదా!" అన్నాడు గోపీ.     "ఏమో అది మూడనమ్మకం కాదేమో! ఎవరు చెప్పగలరు?" అన్నాడు వీర్రాజనే మరో    స్నేహితుడు.     "అందుకే ఆ విషయం సొరంగంలోకి వెళ్ళి తెలుసుకుందాం" అన్నాడు గోపీ ఆశగా.     అయితే ఎవ్వరూ గోపీని ప్రోత్సహించలేదు.     సాహసకార్యమంటే ఆ సొరంగంలోకే వెళ్ళనవసరం లేదని వాళ్ళవాదన.     ఆ ఊళ్ళో ఓ పాలవాడున్నాడు. వాడు సైకిలుకి నాలుగు ఇత్తడి బిందెలు తగిలించుకుని సైకిలు మీద రయ్ మని దూసుకుపోతుంటాడు. చాలాసార్లు వాడు విద్యార్ధులను సవాలు చేశాడు. కానీ ఇంతవరకూ ఒక్కరూ కూడా సైకిలు తొక్కడంలో వాడిని మించలేకపోయారు.     ఆ ఊళ్ళో గంగమ్మ చేరువని పెద్ద చెరువుంది. ఆ చెరువులో అట్నించి యిటూ, యిట్నించి అటూ నాలుగు పక్కలా ఆగకుండా గంటసేపు ఈతకొడతాడు అప్పారావు. తనకంటే ఎక్కువసేపు ఈతకొట్టగలిగిన వాడికి వెయ్యి రూపాయిలు బహుమతి కూడా యిస్తానంటాడు. అప్పారావుకి కిళ్ళీ కొట్టుంది. డాని మీద రోజుకు రెండు మూడొందలు సంపాదిస్తాడని అంతా చెప్పుకుంటారు. అతడి కిళ్ళీకొట్టు ఎప్పుడూ రద్దీగానే వుంటుంది. అయినా సరే ఎలాగో తీరిక తీసుకుని రోజూ రెండు మూడు గంటలైనా చెరువులో గడుపుతాడు అప్పారావు.     అప్పారావుకు పూర్తిగా వ్యతిరేకం కనకయ్య. కనకయ్య ఆ ఊరి చాకలి. బట్టలు మల్లెపువుల్లా ఉతుకుతాడని పేరు. కనకయ్య ఎప్పుడూ నీళ్ళ దగ్గరే వుంటాడు. బట్టలు వుతకాలి కాబట్టి! కాని నెలకొక్కసారి కూసా స్నానం చేయడు. కాళీ దొరికినప్పుడల్లా సారా తాగి నేలమీద పడిదొర్లుతుంటాడు. వాడు నోరు విప్పితే సారా కంపు. వాడి పక్కన ఎవ్వరూ కూడా వుండలేరు.                         (సశేషం)      

అమ్మ పిలుపు

అమ్మ పిలుపు - వసుంధర              సీతానగరం ఊరు చిన్నదీ కాదు. అలాగని పెద్ద పట్నమూ కాదు. ఊళ్ళో పాతిక వేల జనాభా వుంటుంది. పట్నంలో దిరికే వన్నీ అక్కడ దొరుకుతాయి. రెండు సినిమాహాళ్ళు కూడా వున్నాయి. ఓ చోటినుంచి ఇంకో చోటుకు వెళ్ళడానికి రిక్షాలే కాక ఓ ఆటోరిక్షా కూడా వుంది.     ఊళ్ళలో సీతానగరం ఎలాంటిదో ఆ ఊళ్ళో రఘు రామయ్యగారు అలాంటి వారు. ఆయన మరీ వున్నవాడూ కాదు, బొత్తిగా లేని వాడూ కాదు. దగ్గర్లోని పల్లెటూళ్ళో నాలుగెకరాల భూమి ఉంది. పొలాన్ని ఆయన అమరకానికిచ్చేశాడు. ఏటా ముప్పై బస్తాలకు తక్కువ కాకుండా ధాన్యం వస్తాయి. అందువల్ల తింది గింజలకు లోటు లేదాయనకు.     రఘురామయ్యగారు హైస్కూల్లో తెలుగు మాష్టారు. తెలుగు బాగా చెబుతాడని పేరు. చదువు చెప్పడమంటే ఆయనకు చాలా ఇష్టం. అందుకని ఇంటిదగ్గర కూడా విద్యార్ధులకు పాఠాలు చెబుతాడు. కానీ ఎవరినీ డబ్బడగడు. అందువల్ల ఊళ్ళో ఆయనంటే గౌరవం.     ఆయన మొదట్నించీ ఆ ఊళ్ళోనే వుంటున్నాడు. అసలు చాలాకాలం నుంచి రఘురామయ్య పూర్వీకులు కూడా ఆ ఊరినే ఆశ్రయించుకుని వుంటున్నారు. వాళ్ళింటికి వందేళ్ళకు పైగా వుంటాయని చెప్పుకుంటారు. రఘురామయ్య ముత్తాత గోపాల్రావు ఆ ఇల్లు కట్టించాడుట.     ఆ ఊళ్ళో వున్నది కమిటీ స్కూలు. ఊళ్ళో వున్న పలుకుబడివల్లే రఘురామయ్య కందులో ఉద్యోగం వచ్చింది. ఆయనకిప్పుడు నలభై అయిదేళ్ళు. ఆయనకు ముగ్గురు కూతుళ్ళు. ఆ తర్వాత ఓ కొడుకు. కొడుక్కు ముత్తాత గోపాల్రావు పేరే పెట్టారు. ఎందుకంటే వాడు పుట్టేముందురోజున రఘురామయ్య తల్లికి గోపాల్రావు కలలో కనిపించి తను ఫలానా అని చెప్పి మర్నాడు రఘురామయ్యకు మగపిల్లాడు పుడతాడనీ వాడికి తన పేరు పెట్టమనీ అడిగాడుట. రఘురామయ్య తల్లి ఈ కల గురించి చెప్పిన మర్నాడే ఆయనకు కొడుకు కలగడంతో వాడికా పేరే పెట్టడం జరిగింది. పేరు గోపాల్రావైనా వాడి నందరూ గోపీ అని పిలుస్తారు.        రఘురామయ్య తండ్రికి అరవై అయిదేళ్ళు. తల్లికీ అరవై దాటాయి. ఇద్దరూ ఆరోగ్యంగానూ దృడంగానూ వున్నారు.  రఘురామయ్య భార్య సీతాదేవి. ఆమెనేదో రోగం పీడిస్తోంది. ఎన్నిరకాల వైద్యాలో జరిగాయి. మందులకు డబ్బు ఖర్చవుతోందిగానీ గుణం కనిపించడం లేదు. అటు ఇంటిపనులూ ఇటు కోడల్ని సేవా కూడా రఘురామయ్య తల్లి లక్ష్మీదేవమ్మే చూసుకుంటోంది. అందుకు సీతాదేవి ఎంతో నొచ్చుకునేది. కానీ ఏం చేస్తుంది?     లక్ష్మీదేవమ్మ మాయామర్మం ఎరుగని మనిషి. ఆమెకి స్వపర భేదం లేదు. సీతాదేవినామె కన్నకూతురి కంటే ఎక్కువగా చూసుకుంటుంది. లక్ష్మీదేవమ్మ భర్త జానకిరామయ్యకు మాత్రం ఏ గొడవలూ పట్టవు. ఇంట్లో ఎవరేమైపోయినా తన పనులు జరిగి పోతూంటే చాలు.     రఘురామయ్య పెద్ద కూతురు రేణుక. ఆమెకు పెళ్ళి అయింది. ఆ పెళ్లికి బాగా ఖర్చయింది. వచ్చే ఆదాయం చాలక పెళ్లి గురించి ఆయన అప్పు చేశాడు. అల్లుడు గోవిందరావుకి ఆశ ఎక్కువ. చీటికీ మాటికీ డబ్బు కావాలని మామగారికతడు ఉత్తరాలు రాస్తూంటాడు. పెద్దకూతురు పెళ్ళి జరిగినప్పట్నించీ రఘురామయ్యకు డబ్బు ఇబ్బంది మొదలైంది. ఆయన తరచుగా వీరయ్య అనే భాగ్యవంతుడి నుంచి అప్పు తెస్తూండేవాడు. తెచ్చేది ఎక్కువ, చెల్లువేసేది తక్కువ. అందువల్ల వడ్డీ బాగా పెరుగుతోంది.     ఇప్పుడు రఘురామయ్య రెండో కూతురు వాణి పెళ్ళికి సిద్ధంగా వుంది. మూడో కూతురు కృష్ణవేణికి పధ్నాలుగేళ్ళు. గోపీకేమో ఇప్పుడు పన్నెండేళ్ళు.     గోపీ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. జీవితం మీద వాడికెన్నో ఆశలువున్నాయి. పెరిగి పెద్దవాడై తను చాలా గొప్పవాడైపోతాడని అస్తమానూ కలలు కంటూంటాడు. తండ్రి కూడా వాడిమీద చాలా ఆశలు పెట్టుకున్నాడు.     గోపీ బడికి ఉతికిన బట్టలు వేసుకుని వెడతాడు. కానీ వాడికి ఖరీదైన పోలీఎస్టర్ బట్టలు వేసుకుని వెళ్లాలని కోరిక. గోపీ తండ్రికి మంచివాడనీ, పాఠాలు బాగా చెబుతాడనీ గౌరవం వుంది. గోపీ కది చాలదనిపిస్తుంది. ఆ ఊరి ప్రెసిడెంటు శేషగిరికి లాగా, వడ్డీవ్యాపారి వీరయ్యలాగా గొప్పగా, దర్జాగా వుండాలని వుంటుంది. వాడు రోజూ స్కూలుకు యింట్లో చేసిచ్చిన టిఫిను తీసుకుని వెడతాడు. కానీ వాడి స్నేహితులు కొందరు స్కూలు దగ్గరే వున్న కాఫీ హోటల్లో టిఫిను తింటారు. ఆ పక్కనే ఉన్న కిళ్ళీకొట్లో కూల్ డ్రింక్స్ తాగుతారు. తనకూ అలాగే వుండాలనుంది వాడికి. అన్ని పుస్తకాలూ వున్నా అని పెట్టుకునేందుకు ఖరీదైన బ్యాగులేదని బాధ!     గోపీ తన పేదరికానికి బాధపడుతున్నాడని రఘురామయ్య గ్రహించి ఒక రోజున వాడికి హిత బోధ చేశాడు.      "చూడమ్మా గోపీ! చాలామందికి ఉన్నది పోగొట్టుకుంటే తప్ప తమకున్న దేమిటో అర్ధంకాదు. కన్నూ, చేయీ, కాలూ అన్నీ సక్రమంగా వుండడం మనిషికి మొదటి అదృష్టం! అటుపైన తినడానికి తిండి, కట్టుకోడానికి బట్ట, వుండడానికిల్లు రెండో అదృష్టం! ఆ తర్వాత చదువుకునే అవకాశం రావడం ఇంకా అదృష్టం. ఆ చదువుకోవడంలోనూ ఏ ఇబ్బందీ లేకపోతే ఇంకా అదృష్టం. ఎందుకంటే నీ క్లాసులో పాపం- ఎందరికో చదువుకుందుకు అన్ని పుస్తకాలూ లేక వాళ్ళిళ్ళకూ, వీళ్ళిళ్ళకూ వెళ్ళి చదువుకుంటున్నారు. డబ్బు లేకపోవడంవల్ల ఓ పూట తిని ఓ పూట మాడుతున్నారు. నీ క్లాసులో ఎంతమంది మంచి బట్టలు వేసుకుంటున్నారు? ఎంతోమందికి అన్ని పుస్తకాలూ వున్నాయి? ఎంతమంది మధ్యాహ్నం పూట తిండి తింటున్నారు? వాళ్ళందరితో పోల్చుకుంటే నీ పనెంతో మెరుగు కదా!" అన్నాడాయన.     గోపీకది నిజమే అనిపించినా " మళ్ళీ ఆ శేషగిరిగారబ్బాయి స్కూలుకు కార్లో వస్తాడు. వీరయ్యగారబ్బాయికి స్కూలుదాకా ఒకడు పుస్తకాలు మోసుకుని వస్తాడు. నేనూ వాళ్ళకులా వుండాలనుకోవడం తప్పా?" అన్నాడు.     "తప్పే!" అన్నాడు రఘురామయ్య. "ఎందుకంటే శేషగిరిగారబ్బాయి, వీరయ్య కొడుకు వాళ్ళు స్వయంగా గొప్పవాళ్ళేం కాదు. వాళ్ళ తలిదండ్రులు గొప్పవాళ్ళు. పిల్లలు తలిదండ్రులవల్ల తమంతతామే గొప్పవాళ్ళుకావాలి. ఉదాహరణకు నిన్నే తీసుకుందాం. మీ క్లాసులో అసలైన గొప్పవాడివి నువ్వే! మరి అందరికంటే నువ్వే కదా ఫస్టుగా వుంటావు.."     గోపీ వెంటనే "అంటే పెద్దయ్యాక నేను వాళ్ళందరికంటే గొప్పవాడినైపోతానా?" అన్నాడు సంతోషంగా.     "అవును అందుకే పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ మాని నువ్వు కష్టపడి చదువుకోవాలి. ఎవ్వురూ నిన్ను గొప్పవాణ్ణి చేయరు. నీ అంతట నువ్వే గొప్పవాడివి కావాలి" అన్నాడు రఘురామయ్య.     ఆ రోజునుంచీ గోపీ మరింత కష్టపడి చదువుకోసాగాడు. ముందు ముందు తను కార్లలోనూ, విమానాల్లోనూ తిరుగుతున్నట్లూ అందరూ తనకు సలాములు చేస్తున్నట్లూ వాడికి కలలు వస్తూండేవి.             2     ఒకరోజున పొద్దున్నే వీరయ్య రఘురామయ్యింటికి వచ్చాడు. ముందు నెమ్మదిగా మాట్లాడాడు.     "మేష్టారూ! మీ అప్పు పెరిగిపోతోంది! వడ్డీ కూడా పెరిగిపోతోంది. ఆలస్యం చేసినకొద్దీ మీకే నష్టం. నా మాటవిని ఈ యిల్లు అమ్మేయండి. నేనే కొనుక్కుంటాను. అందరూ ఇచ్చేకంటే ఎక్కువ ధర ఇస్తాను. మీ బాకీ అంతా చెల్లు వేయగా నా ఇంటి పక్క నున్న చిన్న యిల్లు కూడా మీకే ఇచ్చేస్తాను" అన్నాడు వీరయ్య.     విషయమేమిటంటే రఘురామయ్య యిల్లు చాలాపెద్దది. బోలెడు ఆవరణ కూడా వుంది. అటుపైన మంచి సెంటర్లో వుంది. అక్కడ ఓ సినిమాహాలు కట్టాలని వీరయ్య అనుకుంటున్నాడు.     ఈ సంభాషణ వీధి అరుగు మీద కూర్చుని వున్న జానకిరామయ్య విననే విన్నాడు. ఆయన విసురుగా లోపలకు వచ్చి "ఇదిగో వీరయ్యా! ఇంత పెద్దింటికి అలవాటు పడ్డవాళ్ళం ఇరుకు ఇళ్ళలో వుండలేం. ఈ యిల్లు అమ్మడమన్నది కలలోని మాట. అనవసరంగా ఆశలు పెట్టుకోకు. ఈ వేళ కాకపోతే రేపైనా అణాపైసలతో మా అబ్బాయి నీ బాకీ తీర్చేస్తాడు" అనేసి మళ్ళీ అరుగు మీదకు వెళ్ళిపోయాడు.     అప్పుడు వీరయ్య స్వరం కాస్త తగ్గించి "మేష్టారూ! మోసేవాడికే కదా బరువు తెలిసేది! మీ యిబ్బందులా ముసలాయనకేం తెలుస్తాయి? నా మాటవిని నేను చెప్పిన ప్రకారం చేస్తే మీకే యిబ్బందీ వుండదు" అన్నాడు.       వీరయ్య చెప్పిందంతావిని "వీరయ్యా! ఈ విషయంలో మా నాన్నమాటే నా మాట కూడా! ఈ యిల్లు అమ్మడం జరగదు. నీ బాకీ నేను తప్పకుండా తీర్చగలను!" అన్నాడు.     అప్పుడు వీరయ్యకు చాలా కోపం వచ్చి ఎప్పుడు తీరుస్తావనీ, ఎలా తీరుస్తావనీ నానా మాటలూ అన్నాడు. అతడు స్వరం హెచ్చించి మాట్లాడ్డంతో ఇంటిల్లపాదీ అక్కడికి చేరుకున్నారు.     "నా బాకీ తీర్చడానికి నీ దగ్గరేమైనా తాత ముత్తాతలు దాచిన నిధులు వున్నాయా? ఎలా తీరుస్తావు? నెల్లాళ్ళు టైమిస్తున్నాను. తీర్చావా-సరేసరి! లేదా కోర్టుకెళ్ళి అమీనాను తీసుకొచ్చి నీ యిల్లు వేలం పాడిస్తాను" అన్నాడు వీరయ్య.     వీరయ్య వెళ్ళిపోయాక గోపీ నెమ్మదిగా నాయనమ్మను చేరాడు. వాడికి వీరయ్య మాటలు చాలా బాధను కలిగించాయి.     ఇంతకాలం తన తండ్రికి చాలా గౌరవం వుందని వాడు అనుకున్నాడు. ఈ రోజున వీరయ్య తండ్రిని గడ్డిపోచలా తీసిపారేశాడు. అందుక్కారణం డబ్బు! డబ్బు లేకపోవడంవల్ల తండ్రి ఈ రోజున వీరయ్యకు చులకనైపోయాడు.     గోపీ నాయనమ్మతో "నానమ్మా! నాన్న ముత్తాత ఇంత పెద్దిల్లు కట్టాడంటే ఆయనదగ్గర బోలెడు డబ్బుండి వుండాలి. ఆ డబ్బంతా ఏమైపోతుంది?" అనడిగాడు.     లక్ష్మీదేవమ్మ భారంగా నిట్టూర్చి "ఆయన వున్న డబ్బంతా పెట్టి ఈ యిల్లు కట్టాడట. గొప్ప జమీందార్లకులా బ్రతకాలని ఆయనకు సరదా! ఆయనకు డబ్బు పిచ్చి ఎక్కువగా వుండేదట. అదే ఆయన ప్రాణాలు తీసింది" అంది.     "అసలేం జరిగింది నాయనమ్మా?" అన్నాడు గోపీ కుతూహలంగా.     లక్ష్మీదేవమ్మ గోపీకి గోపాల్రావు కథ క్లుప్తంగా  చెప్పింది.     ధవళేశ్వరంలో కాటన్ దొర ఆనకట్ట కట్టించే రోజుల్లో గోపాల్రావు కూలీల మీద సూపర్వయిజరుగా వుండేవాడు. ఆయనకు రోజుకు అణా జీతం. అణా అంటే ఇప్పట్లో ఆరుపైసలకు సమానం. ఆ జీతంలోనే యింటి ఖర్చులన్నీ సుఖంగా జరిగిపోయేవి. అయితే గోపాల్రావు అంతటితో తృప్తిపడకుండా ఆనకట్ట పనులలో కొంత సిమెంటూ, కలపా లాంటివి మిగిల్చి ఓ చోటకు చేరవేస్తూండేవాడు. మొత్తంమీద సీతానగరంలో స్థలం కొని ఓ పెద్ద యిల్లు కట్టాడు. ఇల్లు కట్టడంతో ఆయనకు తృప్తి కలగలేదు. దాన్ని రాజభవనాల్లా అలంకరించాలని ఆయన ఆశ! అంత డబ్బెలా సంపాదించడం?     సీతానగరంలో శ్రీమన్నారాయణుడి ఆలయం వుంది. ఆ ఆలయం ఓ కొండమీద వుంది. ఆ ఆలయ ప్రాంగణంలోనే మరో చిన్న ఆలయం కూడా వుంది. దాన్ని కుబేరుడి ఆలయమంటారు. ఆ ఆలయంలో కుబేరుడి విగ్రహానికి కాస్త పైన ఓ సొరంగమార్గం వుంది. ఆ సొరంగ మార్గాన వెడితే కుబేరుడి కొలను వస్తుందని ఆ కలను పక్కన ఓ యోగి వుంటాడని ఆయనకు బంగారం చేసే విద్య తెలుసుననీ చెప్పుకుంటారు. ఆ యోగి ద్వాపరయుగం నుంచీ వున్నాడట. మృత్యువును జయించేడట. ఇలాగని అంతా చెప్పుకుంటూంటారు.     గోపాల్రావు ఆ పుస్తకాలూ యీ పుస్తకాలూ చదివి బంగారం చేయడానికి ప్రయత్నిస్తూండేవాడు. చాలా పుస్తకాల్లో రాగినీ, మట్టినీ, ఆవు పేడనూ బంగారంగా  మార్చడానికి పద్ధతులు రాసి వున్నాయి. గోపాల్రావు బోలెడు డబ్బు వృధాచేసి ఆ పద్ధతులన్నీ అమలు చేసేవాడు. ఒక్కటీ ఫలించలేదు.     ఆఖరికాయన భార్య విసిగిపోయి "మీ బంగారం పిచ్చితో ఇంట్లో వున్న బంగారం కూడా కరిగిపోతోంది. అంతగా కావాలంటే కుబేరుడి కొలనుకు వెళ్ళరాదూ!" అంది.     "అలాగా!" అని గోపాల్రావు ఇంట్లోంచి బయటకు వెళ్ళాడు.     ఆయన శ్రీమన్నారాయణుడి గుడి వున్న కొండఎక్కడం కొందరు చూశారు. ఆలయంలోకీ ప్రవేశించడం చూశామని కొందరన్నారు. ఆయన కుబేరుడి ఆలయంలోకి వెళ్ళడం చూశామని మరికొందరన్నారు.                     (సశేషం)    

చీకటి ఊబి

 చీకటి ఊబి -శారద అశోకవర్ధన్                     చీకటి ఊబి         చిక్కటి చీకటి! అమావాస్య చీకటి!                 కాటుకకన్నా నల్లగా పులుముకుపోయింది!     గదే కాదు ఆమె మదినిండా చీకటే!     కిటికీలోంచి అప్పుడప్పుడు  చారల్లా  అగుపిస్తూన్న వీధిలైటు వెలుగుకూడా  చూడటానికి భయపడుతున్న  ఆమె, కళ్ళు గట్టిగా మూసుకుంది. చేత్తో కిటికీ తలుపుల్ని దభాల్న మూసేసింది.     గీతకి చీకటంటేనే బాగుంది. చీకట్లో  ఒక్కర్తే ఎవరి మొహాలు చూడకుండా, ఎవరికీ మొహం చూపించకుండా, ధైర్యంగా తనలో తను మాట్లాడుకుంటూ  వుంది. ఎంత హాయిగా వుంది, ప్రపంచం అంతా శూన్యంలా వుంది చీకట్లో!     ఆమెకు కరుణాకర్, అబ్దుల్ రహమాన్ జ్ఞాపకం వచ్చారు. సబ్బునీటిని గొంతుతో పీల్చి గాలిబుడగలు చేసి ఆనందించే పిల్లల్లా, ఎంతో అలవోకగా రక్తాన్ని పీల్చి ఆనందించే జలగలు వీళ్ళు! బ్లెడ్ సక్కర్స్!!     ప్రీతమ్ సింగ్ డొక్కుమొహం కళ్ళముందు కదిలింది. సన్నగా, పీలగా మలేరియా వచ్చి అప్పుడే తగ్గినట్టు కనిపిస్తాడు. ఎక్కడో నూతిలోనుంచో, గోతిలోనుంచో మాట్లాడుతున్నట్టుంటుంది అతని గొంతు కీచుగా! ఎప్పుడూ నవ్వుతూనే వుంటాడు - వెకిలినవ్వు.     ఆ నవ్వుతోనే  పువ్వుల్లాంటి  ఆడపిల్లల్ని  బోల్తా కొట్టించి, తేనెటీగలా చుట్టుముట్టేసి పట్టేస్తాడు.     బతుకుకోసం బావురుమనే వాళ్ళూ, కోర్కెల సంకెళ్ళలో చిక్కుకొని సతమతమయ్యేవాళ్ళూ, అవసరాలని సర్దుకోలేక చితికిపోయేవాళ్ళూ - వాళ్ళందరూ ఇతని గుప్పెట్లో బందీలు. అవసరానికి వాళ్ళని ఆదుకొనే ఆపద్భాంధవుడు.        చక్రవడ్డీకి అప్పులిచ్చి, ఆ అప్పుల వలయంలో  చిక్కుకున్నవారిని  తను చెప్పినట్టల్లా  ఆడించేందుకు  చక్రాన్ని తిప్పుతాడు ప్రీతమ్ సింగ్!     అప్పు తీసుకున్న ఆడవాళ్ళంటే అతనికి మహాప్రీతి. ముందు ముందు అతని వ్యక్తిత్వం తెలియక చిక్కుకుపోయిన ఆడవాళ్ళు, ఆ తర్వాత అతని బలహీనత, కళాపోషణ తెలుసుకొని - దానికి దాసులు అయిపోతూ  వుంటారు.     ఆడంబరాలకుపోయి, ఖర్చుల భారాన్ని  పెంచుకొని అప్పుల ఊబిలో  కూరుకుపోయే అతివల శీలాన్ని వడ్డీగా మార్చుకొనే మోసగాడు ప్రీతమ్ సింగ్!     తన అవసరాలకు అనుకూలంగా మారిన అతివలను ఇతరుల అవసరాలకు కూడా ఉపయోగపడేలా చేసే విశాలహృదయుడు ప్రీతమ్ సింగ్.          తను చేసిన పొరపాటు తెలుసుకొనేసరికే అంతా కోల్పోయింది. కోరికల గుర్రాలకు కళ్ళేలు వేయలేకపోయింది. ఊహల సౌధాలు కూలిపోతే  తట్టుకోలేకపోయింది. మధ్యతరగతి స్త్రీననే విషయం మర్చిపోయి  ఆకాశమంత ఎత్తుకి ఆశగా చూసింది. అందుకే ఆడంబరాలకోసం ప్రీతమ్ సింగ్ దగ్గర తన ఆడతనాన్ని తాకట్టు పెట్టింది గీత.     ఒక్కసారి తన ఒంటికేసి  చూసుకొని నవ్వుకుంది గీత. 'రక్తం - రక్తంగానే వుందా? నీళ్ళలా పలచబడిపోయిందా?' బ్లేడుతో కోసి చూసుకోవాలనుకుంది. తన పిచ్చి ఆలోచనకు తనే నవ్వుకుంది.     చీకట్లో తననెవరైనా చూస్తున్నారనే భయంలేదు. తనని చూసి ఎవరైనా నవ్వుతున్నారేమోనన్న  దిగులు లేదు. ఎంత హాయి చీకటి!      *    *    *   గీత బట్టల మిల్లులో పనిచేస్తోంది. పొట్టిగా, నల్లగా, లావుగా  వుంటుంది. చీపికళ్ళు, చట్టిముక్కూ, చిన్న నోరూ - తనకేసి ఎవ్వరూ కన్నెత్తి అయినా చూడకపోగా, చూసినవాళ్ళు వెంటనే తలతిప్పుకోవడం బాధగా వుండేది.     అందుకే తన అందాన్ని ద్విగుణీకృతం చేసుకొనేందుకు  తాపత్రయపడేది. అలంకరణకీ, షోకులకీ ఖర్చు పెట్టేది. తనను మనసారా ఆరాధించి షికార్లకు, సినిమాలకు తిప్పే మొగుడు రావాలని కలలు కంది.     మొదటిసారిగా గీత తన అందాన్ని పొగిడినా ప్రీతమ్ సింగ్ గుప్పెట్లో చిక్కుకుపోయింది. ఆ ఊబిలోంచి బైటపడే ప్రయత్నంలో ఒక శుభముహూర్తాన కాళిదాసుకి పెళ్ళామయింది. అయితే భర్త కౌగిట్లో కరిగిపోవాలన్న కవుల మాటలూ. భర్తతో డ్యూయెట్లు పాడాలన్న సినిమా హీరోయిన్ లాంటి కోరికలూ  అలాగే మిగిలిపోయాయి.     కాళిదాసు గీతకి ఒక బాబును ప్రసాదించగలిగాడు కానీ, ఆమె ఇతర గొంతెమ్మ కోర్కెలని తీర్చలేకపోయాడు. గొర్రెతోక జీతంతో ఆమెను తృప్తిపరచలేకపోయాడు. గీతదాటి ప్రవర్తించే గీత అలవాట్లను మాన్పించలేకపోయాడు. అనాకారిగా వున్నా ఆమె మానసిక సౌందర్యాన్ని అభిమానించాలని ఆశపడ్డ కాళిదాసుకి గీత అవకాశం ఇవ్వలేదు.     ప్రీతమ్ సింగ్ కీ - అవసరం  ఊబిలో  కూరుకున్న ఆడవాళ్ళకీ  మధ్య దళారీగా వుండే భ్రమరాంబ ప్రభావం నుంచి గీతని బైటికి  గీసుకురావడం  కష్టమని గ్రహించిన కాళిదాసు, అసమర్ధ భర్తగా ముద్రపడిన కాళిదాసు, గీతను తన దారిలోకి మళ్ళించుకోలేకపోయిన కాళిదాసు - గీత్నీం బాబునీ వదిలేసి  వెళ్ళిపోయాడు. సరిగ్గా ఆ సమయంలోనే గీతకు  తారసపడ్డాడు మన్మధకుమార్.     మన్మధకుమార్ గీతని  పార్కులకి తీసుకెళ్ళాడు. హోటళ్ళకి తీసుకెళ్ళాడు. కౌగిట్లో కరిగించేశాడు. తన్మయత్వంలో  ముంచెత్తాడు.     మన్మధకుమార్ తో  చెట్టాపట్టాలేసుకు తిరగడానికి ప్రీతమ్ సింగ్ అభ్యంతర పెట్టడంతో కరుణాకర్ దగ్గర అప్పుచేసి, ప్రీతంసింగ్ దగ్గరి అప్పు మొత్తం తీర్చేసింది. అలా  చేయడంవల్ల పెనంమీద నుంచి  పొయ్యిలో  పడ్డాననే  సత్యాన్ని తెలుసుకోవడానికి  గీతకి  చాలా కాలం పట్టింది.     గీత మన్మధకుమార్ పట్ల  అపేక్ష పెంచుకుంది. ఆమె సంతోషానికి అవధుల్లేవు. పబ్లిగ్గా  తన కొంగు పుచ్చుకుని పార్కుల్లో  కూర్చుని కబుర్లు  చెప్పే మన్మధకుమార్ అంటే ప్రాణం గీతకి! తాళికట్టిన  మొగుడు కాళిదాసు కూడా భయపడేవాడు అలా కూర్చోడానికి. వాళ్ళిద్దరి  బంధం అలా బిగుసుకుపోయింది.     మొదట్లో  సినిమాలకు, షికార్లకు  వెళ్ళినప్పుడు  మన్మధకుమార్ తనే ఖర్చు పెట్టేవాడు. గీత కూడా అప్పుడప్పుడు తనూ ఖర్చుపెట్టేది. అవసరమైనప్పుడల్లా  కరుణాకర్ దగ్గర చక్రవడ్డీకి డబ్బు తెచ్చేది. మన్మధకుమార్ కి పెళ్ళయింది. అతనికి ఒక కొడుకు, ఒక కూతురూ వున్నారు. అతని భార్య  జబ్బు మనిషి. అక్కడ తనకు  లభించని సుఖాన్ని  గీత దగ్గర పొందుతూన్న  మన్మధకుమార్ తన అవసరాలకు గీతని డబ్బు అడుగుతూ వుండేవాడు. గీత తన ఆనందంకోసం అతనికి ఎంతంటే అంత డబ్బు ఇస్తుండేది. గీతలో తరిగిపోయే అందాన్ని బేరీజు వేసుకుంటూ, తనకూ, తన కష్టమర్లకూ గీత ఎంతవరకు ఉపయోగపడుతుందో, ఆమె అందాన్ని తన అప్పుకి  సరిపడా ఎంతవరకు సొమ్ము చేసుకోవచ్చునో బేరీజు వేసుకుంటూ  గీతకి డబ్బు ఇస్తుండేవాడు కరుణాకర్.     మన్మధకుమార్  తనకు అందుబాటులో వున్న అవకాశాల్ని  చక్కగా ఉపయోగించుకుంటూ  వుండేవాడు. ఒక్క గీత మాత్రమేకాదు. గీతలా ప్రవర్తించే ప్రతి ఆడపిల్లా మన్మధకుమార్ కి ఆపద్భంధువు. వాళ్ళతో చనువుగా తిరుగుతూ, వాళ్ళ దగ్గర డబ్బులు  పుచ్చుకుంటూ, జల్సాలు చేస్తూ మీసాలు మెలేస్తుంటాడు. అది తాత్కాలికమేనని  అతడెప్పుడూ  ఆలోచించలేదు. ఆ మత్తులో వున్న గీతలాంటివాళ్ళు కూడా ఆలోచించరు.     ఉన్నట్టుండి  ఒకరోజు 'పదివేలు అర్జంటుగా కావా'లన్నాడు మన్మధకుమార్. అతడి వ్యామోహంలో వున్న గీత కరుణాకర్ దగ్గర డబ్బు తెచ్చి ఇచ్చింది. ఇక పై డబ్బడిగితే ఇవ్వనని హెచ్చరించాడు కరుణాకర్.     మర్నాడు  సాయంత్రం  తెల్లచీర కట్టుకుని, మల్లెపూలు పెట్టుకొని  మన్మధకుమార్ కోసం ఎదురుచూసింది గీత. వాకిటి తలుపులు తెరిచి అతని రాకకోసం ఎదురుచూసింది.     వెన్నెలంతా వెళ్ళిపోయింది. మంచి గంధం సెంటు ఇంకిపోయింది. మల్లెలన్నీ  వాడిపోయాయి. ఆమె కళ్ళు కన్నీటి కుండలయ్యాయి.     మర్నాడు తెలిసింది గీతకి, మన్మధకుమార్ ఆ ఊరు నుంచి ట్రాన్స్ ఫర్ అయి వెళ్ళిపోయాడని!     మతిపోయింది ఆమెకి. పిచ్చెక్కినట్టయింది.     ప్రీతమ్ సింగ్ ను మించిన కరుణాకర్, రామనాధం, రంగదాసులు బారులుతీరి తమ అప్పు తీర్చమని పీక్కుతింటున్నట్టు  అనిపించింది. అప్పుడు కనువిప్పు కలిగింది - తను ఎంత విచ్చలవిడిగా అప్పులు చేసిందో తెలిసి వచ్చింది.     ఆ రోజూ తనను ఏనాడూ ఏమీ అడగని ఏడేళ్ళ కొడుకు ఒక్కమాట అడిగాడు.     ఆ మాట తనను తూలనాడేది కాదు. తనను కించపరిచేదికాదు. తనను సిగ్గుపడేలా చేసేదీకాదు.     "అమ్మా! రేపు బళ్లో ఎక్స్ కర్షన్ కి తీసుకెళ్తున్నారు. అయిదు వందలు కట్టాలి ఇవ్వవూ?" అని.     గీత గుండెలో గుండుసూదులు గుచ్చుకున్నాయి.     తన కడుపుచించుకు పుట్టిన కన్నబిడ్డకి పైసా ఇవ్వలేని  పరిస్థితిలో వుంది. కట్టుకున్నవాణ్ణి  చేతకానివాడిలా భావించి, తనని విడిచి వెళ్ళిపోయేలా చేసింది. తను అనాకారినని తెలిసికూడా, మన్మధకుమార్ పొగడ్తలకి పొంగిపోయి భ్రమల్లో బ్రతికింది. భ్రమరాంబ వెళ్ళేదారి మంచిదికాదని తెలిసినా ఆమె దారిలోనే నడిచి తాను పతనమైపోయింది. డబ్బు కోసం, ఆడంబరాలకోసం, అప్పు కోసం  ప్రీతమ్ సింగ్, కరుణాకర్ లాంటి వారి చేతుల్లో చిక్కి తన శరీరాన్ని ఫణంగా పెట్టింది. ఛీ! ఛీ! తను ఆడదేనా?     మమతకీ, మాతృత్వానికీ మారు పేరైన ఆడజాతికే అవమానం కలిగేలా ప్రవర్తించింది. ఎన్నడూ నోరు తెరిచి ఏదీ అడగని బుజ్జిబాబు డబ్బు అడిగితే జవాబు చెప్పలేకపోయింది.     ఏం చేయాలిప్పుడు? ఎవరిస్తారు డబ్బు?     భర్త కాళిదాసు ఎక్కడున్నాడో? అసలు ఉన్నాడో, లేక ఈ అవమానాలను భరించలేక ఏదైనా....అఘాయిత్యం చేసుకున్నాడో?     గీత కళ్ళు కుండపోతగా వర్షించాయి. చెంపల మీదుగా జారిన కన్నీళ్ళు గుండెని తడిపేశాయి.     చాలా కాలానికి కాళిదాసు గుర్తొచ్చాడు. తన బిడ్డకి తండ్రి! అంతే. బాబుని గుండెలకి గట్టిగా హత్తుకొని పడుకుంది.     ఆ పుత్రగాత్ర పరిష్వంగంలో ఏదో తన్మయత్వం. ఏదో తీయని అనుభూతి. ఇంతకాలం ఎంత పోగొట్టుకుంది తను! తన లోకం తనదే అనుకుంది. తనకు ఒక కొడుకున్నాడనే ధ్యాసకూడా లేకుండా బతుకును వెళ్ళదీసింది. ఎంత దౌర్భాగ్యం?     ఆమె గుండెలకి గుచ్చుకున్నాయి మంగళసూత్రాలు. తీసి తదేకంగా చూసింది. పెదవులమీద చిరునవ్వు వెలిసింది. తప్పకుండా వాటికి అయిదు వందలకు తగ్గకుండా వస్తాయి. తృప్తిగా నిట్టూర్చింది.     ఎప్పుడు తెల్లవారుతుందా? వాటిని డబ్బుగా మార్చి బుజ్జిగాడుకి ఎప్పుడు ఇవ్వాలా అని ఆత్రంగా వుంది.     మొట్టమొదటిసారి ఆ రాత్రి ఆమెకు కాళరాత్రిలా అనిపించింది. వెలుగు కోసం  తపించిపోతూ, చీకటిని ద్వేషిస్తూ. ఏ నడిరాత్రికో నిద్రలోకి జారిపోయింది. చీకటి ఊహలకి స్వస్తి చెపుతూ గీత.     గీతకి దూరంగా ఉన్నా ఎప్పటికప్పుడు ఆమె పరిస్థితులను గమనిస్తున్న కాళిదాసు తెల్లవారేటప్పటికి తిరిగొచ్చాడు.     "గీతా! నీ కోసం, బాబుకోసం వచ్చేశాను. నీ బలహీనతలకు కారణాలు తెలుసుకున్నాను. నిన్ను ఆ ఊబిలోంచి తప్పించటానికి నా స్కూటర్, ఉంగరాలు అమ్మేశాను. కరుణాకర్, రంగదాసు, రామనాధంల దగ్గర నీవు చేసిన అప్పులు తీర్చేశాను. నీవు ఇప్పుడు స్వేచ్చాజీవివి. నీ బతుకు నా చేతుల్లోనే వుంది. గీతా! అందం మనసుకుండాలి; శరీరానికి కాదు. శక్తికి మించిన కోర్కెలకి మనిషి బానిస కాకూడదు. నువ్వు వాస్తవాన్ని విస్మరించి ఊహల్లో బతికావు. ఇప్పటికైనా తెలుసుకో" అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ.      ఆమె భోరున ఏడ్చింది. అతని కాళ్ళమీద పడి "నన్ను క్షమించండి! ఏ భార్యా, ఏ భర్తకి చేయని తీరని ద్రోహం మీకు చేశాను. నేను చెడిపోయిన దాన్ని" అంటూ  కన్నీళ్ళతో  అతని పాదాలు కడిగేసింది.     "గీతా! నీ మనసుకి పట్టిన చీకటిబూజు వదిలిపోయింది. అదే నాకు కావలసింది. మన బుజ్జిగాడు కోసం ఇక పైన పవిత్రంగా బతకటం అలవాటు చేసుకోవాలి. లేకపోతే వాడూ ఇంకొక మన్మధకుమార్ లా, ప్రీతమ్ సింగ్ లా, కరుణాకర్ లా తయారవుతాడు. ఎందరో గీతల్ని మార్చేస్తాడు. గతాన్ని ఇద్దరం మర్చిపోదాం, లే!" అంటూ ఆమె రెండు భుజాలు పట్టుకొని లేవనెత్తాడు.     ఆమె సిగ్గుతో ముడుచుకుపోయింది ఆనందంతో తేలిపోయింది. అందం, ఆనందం, అనుభూతి మనసుకు సంబంధించినవి కానీ, శరీరానికి సంబంధించినవి కావనీ తెలుసుకొని, తన్మయత్వంలో తేలిపోయింది. చీకటి ఊహలు దూది పింజల్లా పటాపంచలైపోయాయి. ఆమెకిప్పుడు చంద్రుడు అందంగా కనిపిస్తున్నాడు. వెన్నెల  హాయిగా పన్నీటిజల్లులా అనిపిస్తోంది.                 

కథ కంచికి

కథ కంచికి -శారద అశోకవర్ధన్ ఉన్నట్టుండి  వేదగిరిరావుకి  కథలు రాయాలనే యావ పట్టుకుంది. దానికి కారణం అతని భార్యామణి భానుమతి రోజు అతణ్ణి కథలు రాయమని పోరు పెట్టడమే అంతే! ఆ ఆలోచన రావడంతో మనసు ఆలోచించడం మొదలుపెట్టింది. ఎంత ఆలోచించినా అసలు ఎలా రాయాలో, దేన్ని గురించి రాయాలో తోచి చావడం లేదు. వెంటనే ఎప్పుడో, ఎక్కడో చదువుకున్నట్టు  గుర్తొచ్చాయి శ్రీశ్రీ మహాకవిగారి మాటలు 'అగ్గిపుల్లా కుక్కపిల్లా అన్నీ కవితా వస్తువులే' అని. కుక్కపిల్ల గురించి  రాద్దామంటే  వాళ్ళింట్లో కుక్కల్లేవు. అందుకని తనకి తెలిసినవాళ్ళు ఎవరెవరిళ్ళలో కుక్కలున్నాయా అని ఆలోచించి  చివరకి తన కొలీగు రామబ్రహ్మం గుర్తుకొచ్చి  వాళ్ళింటి కెళ్ళాడు. వాళ్ళింట్లో  చక్కగా, బొద్దుగా పెరిగిన ముద్దొచ్చే  పామరేనియన్ కుక్కపిల్ల ఉంది. పామరేనియన్ కి ఒళ్ళంతా  తెల్లటి జూలు  ఉంటుంది. రామబ్రహ్మంగారి భార్య ఆ కుక్కని ఎప్పుడూ  ఒళ్ళో కూర్చోబెట్టుకునుంటుంది, చంటిపిల్ల  నెత్తుకున్నట్టుగా, నోరు తెరచి బిస్కట్లు నోట్లో  పెడుతుంది. పసిపిల్లలకి పెట్టినట్టు. వేదగిరిరావు వెళ్ళేటప్పటికి రామబ్రహ్మంగారి భార్య వసుంధర మిక్కీని (కుక్కపిల్లని) ఒళ్ళో కూర్చోబెట్టుకుని, జూలు దువ్వుతోంది  దువ్వెనతో. 'ఆహా వసుంధరగారూ! మీ మిక్కీ జూలు మెత్తటి నూలు! దాని నోరు స్టారు హోటల్లోని  బారు! అది పడుకునే మీ ఒడి నాకు సైతం పడుకోవాలనిపించే గుడి" అన్నాడు సంతోషంగా పళ్ళికిలించుకుంటూ  నవ్వుతూ  నాలుగు పాదాలూ చక్కగా  అంత్యప్రాసలతో  చెప్పానని గర్వంగా చూస్తూ.     అప్పుడే అతిథికి కాఫీతేవడానికి లేచిన వసుంధర వేదగిరిరావు కేసి కొరకొరా చూసింది. ఆ చూపులకి తట్టుకోలేక సిగ్గుతో తలవంచుకున్నాడు వేదగిరిరావు. కాఫీ సంగతి దేముడుకి తెలుసు - కళ్ళు తిరిగినంత పనై తను చేసిన తప్పు తెలుసుకొని  క్షమాపణ చెప్పుకుంటూ  ఇంటిమొహం పట్టాడు వేదగిరిరావు, వేదగిరిరావు మర్నాడు చెంపలు వాయించాలని ఉద్రేకంగా  బయలుదేరిన రామబ్రహ్మం సంగతంతా విని 'నీ కవిత్వం పిచ్చి తగలడ అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు.     కొన్నాళ్ళు గడిచిపోయాయి. వేదగిరిరావులో రాయాలన్న పట్టుదల మాత్రం తగ్గలేదు. దానికితోడు భార్యామణి భానుమతి "ఏమండీ! ఇంకా ఎప్పుడు మొదలెడతారు రాయడం?" అంటూ  మాటిమాటికీ అడగడం, "మంచి ప్లాటు తగులుతోంది. కొంచెం ఆగవే" అని వేదగిరిరావు చెప్పడం, దాంతో 'ఏమండీ, ఈ వేడి వేడి కాఫీ తాగండి మంచి ఆలోచనలు వస్తాయి" అంటూ వేడిగా కాఫీ చేసి ఇవ్వడం పరిపాటయిపోయింది. భార్య ముందు పరువుపోతుందేమో అన్న బాధతో వేదగిరిరావు ఆఫీసుపన్లకన్నా  సీరియస్ గా కథల గురించీ, కవితల గురించీ ఆలోచించడం మొదలెట్టాడు.      ఒక రోజు ఉన్నట్టుండి  ఒక ఆలోచన కలిగి కాగితం, కలంతీసి రాయడం మొదలెట్టాడు. కాస్సేపటికి దాన్ని ఎవరికైనా చదివి వినిపించాలన్న  కోరిక కలిగి అందరిలోకీ కాస్త రస హృదయం గలది అనుకున్న టైపిస్టు కనకదుర్గకి చూపించాడు. అంతే! ఆవిడ అపర మహిషాసురమర్దనిలా  వేదగిరిరావుమీదికి  దూసుకుపడింది. "నీకు సిగ్గుందా? నువ్వు మనిషివేనా? ఒక కన్నెపిల్లకి ఇల్లాటి చీట్లా రాయటం? పెళ్లై పిల్లలు పుట్టి, వాళ్ళు  పెళ్ళీడుకొస్తున్నారే!  ఇదేం బుద్ధి?" అంటూ చీటీని వేదగిరిరావు మొహాన విసిరికొట్టి  విసురుగా వెళ్ళిపోయింది. అనుకోని ఈ తుఫానుకి మతిపోయింది వేదగిరిరావుకి. చుట్టూ కొలీగ్స్ మూగారు. సోంబాబు ఆ కాగితాన్ని  తీసి చదివాడు బిగ్గరగా: "తెల్లని మేను చివర నల్లని టోపీ! రాసుకుంటే మంటలు రేపి వేడి తగ్గగానే చల్లారుతుంది క్రమేపీ క్రమేపీ.... దీన్లో ఏముందసలు? వీడు రాసిందేమిటో అర్ధం కాలేదు. ఆమెకి కోపం ఎందుకొచ్చిందో అసలే అర్ధం కాలేదు" అన్నాడు. "ఒరేయ్, వేదగిరీ! దీని భావ మేమిటో నువ్వే చెప్పరా!" అన్నాడు చంద్రమౌళి - తోటి సూపరింటెండెంటూ, సదరు స్నేహితుడూ వేదగిరిరావుకి. "అగ్గిపుల్లరా! శ్రీశ్రీ చెప్పినట్లు అగ్గిపుల్ల మీద కవిత్వం రాద్దామని మొదలెట్టాను. సమయానికి మీరెవ్వరూ దగ్గర లేకపోవడంవల్ల ఆమెకి చూపించాను. నన్ను అపార్ధం చేసుకుంది" అన్నాడు. అందరూ ఘొల్లున నవ్వేశారు. "నీ కవిత్వం మండ! ఇది కవితలా లేకుండా  పొడుపుకథలా ఉందేమిటిరా?" అన్నాడు చంద్రమౌళి.       "గురూ! నువ్వు కవిత్వం జోలికి పోకు. గురూ! కావాలంటే కథలు రాయి! నువ్వు కవిత్వం రాయడంలో అప్పుడే రెండుసార్లు పప్పులో కాలేసేవు" అన్నాడు నవ్వుతూ శాస్త్రి. నిజమే అనిపించింది వేదగిరిరావుకి. అసలు శ్రీశ్రీమీదే కోపమొచ్చింది, 'అగ్గిపుల్లా, కుక్కపిల్లా దేనిగురించైనా  రాయొచ్చునట - ఎట్లా?" అని!     మరో వారం రోజులు గడిచాయి. ఒక రోజు సాయంత్రం ఆఫీసు నుంచి వేదగిరిరావు ఇంటికి వెళ్ళేసరికి అతని భార్యామణి రిక్షాడు పుస్తకాలతో రిక్షా దిగుతూ కనిపించింది. "ఏమిటా భానూ, ఇదంతా?" అయోమయంగా అడిగాడు వేదగిరిరావు.     "మీకోసమేనండీ! అలా బజారుకెళ్ళి  పాత పుస్తకాలమ్మే  దుకాణానికెళ్ళి  పాత పత్రికలూ, బోలెడు కథల పుస్తకాలూ కొనుక్కొచ్చాను. ఎందుకంటే, ఇవన్నీ చదివితే మీకు కథలు ఎలా ఉంటాయో తెలుస్తుంది. అందులోని ఐడియాలను, అవే భావాలను తీసుకుని మీరూ కథలు రాసెయ్యొచ్చు!" అంది పుస్తకాలన్నీ  కిందకు దించిపెట్టిన  రిక్షావాడికి డబ్బిస్తూ భానుమతి.     "భానూ! నీకింత బుర్రుందనీ, అంతకన్నా  మించి నన్నొక  రచయితగా చూడాలని నువ్వంత తహతాహలాడిపోతున్నావో! నిన్ను చూస్తూ ఉంటే సిసలైన ధర్మపత్నివనిపిస్తూన్నావు" అంటూ ఆప్యాయంగా ఆమె కళ్ళలోకి  చూశాడు వేదగిరిరావు.     ఆ చూపులకి మెలికలు తిరిగిపోతూ తల వంచుకుంది సిగ్గు నభినయిస్తూ భానుమతి.     "భానూ! మనిద్దరం సినిమా హీరో, హీరోయిన్లలా లేమూ?" అన్నాడు వేదగిరిరావు.     "ఛీ పొండీ!" అంటూ వెంటనే "ఏమండీ! ఈ డైలాగులన్నీ మీ కథల్లో రాయండీ! అవన్ని చదివి నా స్నేహితులూ, మన బంధువులూ  గిజగిజలాడిపోతుంటే  నాకు చాలా సంతోషంగా ఉంటుంది" అంది స్మిత వదనంతో.     "అబ్బా!" అన్నాడు బాధగా వేదగిరిరావు.     "ఏమైందండీ?" కంగారుగా దగ్గరకొచ్చింది భానుమతి.     "ఏం లేదు. తల నొప్పి. హఠాత్తుగా కొట్టినట్టొచ్చింది."      "అదా? ఏం లేదు, మీరు కథల థీమ్ కోసం  ఆలోచిస్తున్నారు కదూ! అందుకని  వచ్చుంటుంది. మేధావులకి తలనొప్పి, కంటిజబ్బూ  కామనండీ! ఉండండి కాఫీ తెస్తాను" అంటూ  పుస్తకాలని పక్కన పెట్టి  వంటింట్లో కెళ్ళింది.     వేదగిరిరావు  పాత కథల పుస్తకాలనీ, పత్రికలనీ తిరగెయ్యడం మొదలెట్టాడు. నిమిషాలు, గంటలూ గడిచిపోయాయి. రాత్రి పది దాటినా  అలా చదువుతూనే ఉన్నాడు. "పొద్దుపోయింది.  అన్నం తినండీ!" అని భానుమతి పిలిచేవరకు ఏకధాటిగా అన్ని కథలు చదివాడేమో, మనసంతా గజిబిజిగా ఉంది. శరీరం, మెదడూ కూడా అలిసిపోయి  ఆవలింతలు  రావడం మొదలుపెట్టాయి. నాలుగు మెతుకులు గతికి గుర్రుపెట్టి  నిద్దరపోయాడు వేదగిరిరావు, ఐ.ఎ.ఎస్. పరీక్షకు చదివినంతగా  చదివి!     అన్ని కథలూ కలిసి మెదడులో ఎక్కడో దాక్కున్నాయేమో, అర్దరాత్రి కల్లా  అవి గొడవ చేస్తున్నట్లు  వేదగిరిరావు గట్టిగా  అరవడం మొదలెట్టాడు. భానుమతి కంగారుపడుతూ  "ఏమండీ! లేవండీ! ఏమయిందీ?" అంటూ కుదుపుతూ లేపింది. కాస్సేపటికి కళ్ళు తెరిచిన వేదగిరిరావు "ఎక్కడా? వాళ్ళంతా ఏరీ?" అంటూ అరవడం మొదలెట్టాడు.     "ఏమండీ! కలొచ్చిందా? పీడకలై ఉంటుంది. ఉండండి, మంచినీళ్ళిస్తాను" అంటూ  వెళ్ళి మంచినీళ్ళు తెచ్చిచ్చింది. సమాధానం చెప్పకుండానే  మంచినీళ్ళు  తాగేసి మళ్ళీ నిద్రలో మునిగిపోయాడు వేదగిరిరావు.     కలత నిద్ర కావటంవల్ల కాస్త లేటుగానే  లేచాడు వేదగిరిరావు. భానుమతి అందించిన కాఫీ కప్పు అందుకుంటూ "కలొచ్చింది రాత్రి, పెద్ద కల" అన్నాడు. వెంటనే భానుమతికి మెరుపులాంటి  ఆలోచనొచ్చింది. "ఏమండీ! ఏమండీ! ఆ కలనే కథగా రాసేయకూడదూ?" అంది. భార్యామణి ఇచ్చిన బంగారంలాంటి సలహాతో వేదగిరిరావుకి గుండె మీద భారం తొలగినట్టయింది. వెంటనే ఆ రోజు సి. ఎల్. పెట్టి కాగితాలు ముందేసుకుని, మధ్య మధ్య శ్రీమతి అందిస్తున్న కాఫీ తాగుతూ  'కలలో కల్లోలం' అంటూ కథ రాసేశాడు. సాయంత్రానికల్లా 'ఏ పత్రిక కి  పంపుదాము?' అని ఆలోచిస్తూంటే  మళ్ళీ శ్రీమతిగారే  ఓ చక్కటి సలహా ఇచ్చింది - "కాపీలు తీయించి అన్ని పత్రికలకూ పంపిస్తే సరి.... ఎవరో ఒకరు వేస్తారు" అని!     "భానుమతీ! నీ బుర్రే బుర్ర, మీ నాన్న నిన్ను చదివించి ఉంటే లాయరయిపోయేదానివి" అన్నాడు సంతోషంగా.     "పోనీ, ఇప్పుడు నేను 'లా' చదవనా? పిల్లలు హోమ్ వర్కు చేసుకుంటూ ఉంటారు. మీరు కథలు రాసుకుంటూ  ఉంటారు. నాకు బోరు కొట్టకుండా  నేను 'లా' చదువుతాను. రేపే పుస్తకాలు తెప్పించండి" అంది, అప్పుడే తనని తాను లాయరుగా ఊహించుకుంటూ!     వేదగిరి నాలుగు కాపీలు తీయించి, నాలుగు పత్రికలకు పంపాడు అదే కథని. ప్రతిరోజూ పోస్టు కోసం ఎదురు చూడడం, వారం వారం పత్రికలన్నీ తిరగవేయడం భార్యాభర్తలిద్దరికీ అలవాటైపోయింది. ఒక నెల్లాళ్ళు తిరిగేసరికి మూడు పత్రికల దగ్గర్నుంచి పంపిన కథ తిరిగొచ్చింది. వేదగిరిరావు నిరుత్సాహంతో నీరుకారిపోయాడు. కాని, వారం తిరక్కుండానే నాలుగో పత్రికలో పడ్డ  తన కథని చూసి ఎగిరి గంతేశాడు. భానుమతిని గట్టిగా పట్టుకొని ముద్దుల వర్షం కురిపించేశాడు. "నా కెంతో గర్వంగా ఉందండీ! నేనొక రైటర్ భార్యని" అంది ఉక్కిరిబిక్కిరై పోతూ.      "భానూ! నీలాంటి భార్య దొరకడం నాకు మామూలు 'లక్' కాదు. సూపర్ లక్....బంపర్ లాటరీలాగా  అనుకో! ఇక నుంచి నీ డ్యూటీ ఏమిటో తెలుసా?" అడిగాడు వేదగిరి.     "చెప్పండి!"     "పుస్తకాలన్నీ  తెప్పించి, వాటిని చదివి, ఆ కథలు నాకు నువ్వు చెప్పాలి. దాన్నిబట్టి  ఆలోచించి, నేను వేరే కథలు రాస్తాను! సరేనా?"     "ఓ....!" అంది సంతోషంగా భానుమతి.     ఆఫీసు నుంచి  అందరికీ ఫోన్లు  చేసి చెప్పేశాడు వేదగిరిరావు. తన కథ చదవమని. ఇరుగుపొరుగు వారందరికీ, బంధువులకీ భానుమతి స్వయంగా వెళ్ళి చెప్పొచ్చింది 'మావారు రాసిన కథ చదవ'మని.     ఆ రోజునుంచి భానుమతి ఎవరింటికొచ్చినా సరే, అందరూ మాట్లాడుతూంటే తనో మూల ఏ పత్రికో పట్టుకుని కూర్చునేది. చివరికి పేరంటాని కొచ్చినా, నలుగురూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూంటే, తనొక పుస్తకం పట్టుకుని పరీక్ష కెళ్ళేంత సీరియస్ గా ఫోజు పెట్టి  చదువుతూ  కూర్చునేది. అలా చేస్తే చుట్టూ ఉన్న వారికి చిరాగ్గా ఉంటుందని కాని, నలుగురితో కలవకుండా ఉండడం సభ్యత కాదనీ కానీ ఆమె గుర్తించదూ, వేదగిరిరావు చెప్పడూ. రెండూ లేదు. పై పెచ్చు అదొక గొప్పగా  భావిస్తారు వాళ్ళిద్దరూ.     ఎలాగో అలాగ వేదగిరిరావు మరో రెండు కథలు రాశాడు. ఆ రెండూ అదివరకు అచ్చయిన పత్రికకే పంపించాడు. కానీ, ఈసారి ఆ రెండూ  తిరిగొచ్చాయి. కారణం ఏమిటంటే, ఆ కథలు ఇదివరకు అచ్చయిన కథలకు పోలికలు కలిగి ఉన్నాయని. భానుమతికీ, వేదగిరిరావుకీ మతి పోయినట్లయింది. ఏం చెయ్యాలో పాలుపోలేదు.     కానీ, వారం తిరక్కుండానే  భానుమతికి మరో మెరుపులాంటి ఆలోచన వచ్చింది. "ఏమండీ! మీ కెవ్వరూ సినిమా ప్రొడ్యూసర్లు తెలీదూ?" అంది సీరియస్ గా. ఈ ప్రశ్నకి వేదగిరిరావు తెల్లబోయాడు. సమాధానం వెతుక్కునే లోపల ఆమే అంది - "పోనీలెండి. అదివరకు తెలీకపోయినా ఇప్పుడు తెలుసుకోండి. ఒకరిద్దరు ప్రొడ్యూసర్లని కలుసుకోండి! నా దగ్గర మంచి సబ్జెక్టు ఉందని చెప్పండి. టైమిస్తే వచ్చి కథ చెబుతానని చెప్పండి! స్క్రిప్టు నవలగా  అచ్చులో ఉందని చెప్పండి! ఈలోగా మనం రోజుకో సినిమా చేసేద్దాం. ఏముందీ - నాలుగు సినిమాల కథ కలిపేస్తే ఒక కొత్త కథ తయారవుతుంది" అంది.     "భానూ! నీ బుర్ర...."     "లాయరు బుర్ర!" పకపకా నవ్వింది.     రోజుకో సినిమా చూసేస్తున్నారు వేదగిరిరావు, భానుమతి - మార్నింగ్ షో పాత సినిమాల దగ్గర నుంచి నైట్ షో సరికొత్త సినిమాల వరకూ! నెల జీతం రాగానే మూడొందలు సినిమాల కోసం, రెండొందలు ఆటోలకీ, రిక్షాలకీ....ఆ తరువాతనే బియ్యం, పప్పు, ఉప్పు అన్నీ!     అనుకోకుండా  ఒకరోజు  ఒక సినిమాహాల్లో  ఒక ప్రొడ్యూసరు కనిపించాడు. అంతే! తనని తాను పరిచయం చేసుకొని, తన దగ్గరొక మంచి కథ ఉందని, ఆ ప్రొడ్యూసర్ ని భోజనానికి పిలిచాడు వేదగిరిరావు. భానుమతి పిండి వంటలతో విందు భోజనం తయారుచేసింది స్వయంగా భర్తకీ, ఆయనకీ వడ్డించింది. ఆ తరువాత వేదగిరిరావు ఆయనకీ కథ వినిపించాడు.     "బాగుంది కానండీ.... హీరోకి అక్కినేని దేవదాసు లాంటిదీ, 'యమగోల'లో ఎన్. టి. రామారావు లాంటిదీ కలిసిన పాత్ర కావాలి. హీరోయినుకి 'మల్లీశ్వరి'లో భానుమతిలాంటి  ప్రాత్రయితే బాగుంటుంది. ఇహపోతే కామెడీ మన రేలంగీ, గిరిజా జంట ఉంది చూశారూ - ఆ టైపులో ఉండాలి. విలన్ ఇప్పటిలా కాక మన ఆర్. నాగేశ్వరరావులా ఉండాలి. పోతే, జ్యోతిలక్ష్మి డాన్స్....సారీ! ఇప్పుడు మన 'సిల్కు' స్మితకి పనికొచ్చే ఒక డాన్సుండాలి. ఇవన్నీ కలిపి మీరు చెప్పిన కథని, నేను చెప్పిన విధంగా ఊహించుకొని రాసి. నాకు కబురు చెయ్యండి. మన పిక్చరు వంద రోజులు గ్యారంటీ!" మొదటి మాటలకి నీరు కారినా, చివరి మాటలకి ఊహల్లో తేలిపోయారు వేదగిరిరావూ, భానుమతీ దంపతులు.     పదిహేను రోజులు నిద్రాహారాలు మాని అతను చెప్పినట్లు  రాశాడు వేదగిరిరావు. కానీ, అతను అయిపు లేదు. ఉత్తరాలు రాశాడు, టెలిఫోన్లు చేశాడు. 'ఇదిగో, అదిగో' అనేవాడే తప్ప తిరిగిరాలేదు.     పట్టువదలని విక్రమార్కుడిలా  వేదగిరిరావు "సినిమా ప్రొడ్యూసర్ల ఇళ్ళ చుట్టూ  తిగురుతూనే ఉన్నాడు. పత్రికల వాళ్ళ చుట్టూ కూడా తిరుగుతూనే ఉన్నాడు. అయినా, కాలం కలిసి రాలేదు. కలలు ఫలించలేదు.     ఒక రోజున మొదట కథ విన్న ప్రొడ్యూసర్ దగ్గరనుంచి  ఒక ఉత్తరం వచ్చింది. దాంతోపాటు  మరో రెండు ఉత్తరాలూ వచ్చాయి! ముందుగా ప్రొడ్యూసర్ ఉత్తరాన్నే  చింపబోయాడు వేదగిరిరావు. "ఆగండి! మీ కథని సినిమా తీస్తున్నామని రాస్తే వెంటనే నాకు పట్టుచీర కొనివ్వాలి" అంది భానుమతి పొంగిపోతూ.     "ఓ!....మరి నాకేమిస్తావు?" చిలిపిగా అడిగాడు వేదగిరిరావు.     "ఏమండీ! మీరు కొత్తవారు కాబట్టి  వెండితెరకి కనీసం పదివేలయినా ఇవ్వరా? మీకు స్కూటర్ కొనిస్తాను. మనం సినిమాలు చూడటానికి కనీసం ఆటో ఖర్చులయినా తగ్గుతాయి. ఏదీ కవరు చింపండీ!" అంది ఇంక ఆగలేనట్లు గొంతు పెద్దది చేసి దీర్ఘం చేసి దీర్ఘం తీస్తూ.     వేదగిరిరావు కవరు చింపాడు. కళ్ళు పెద్దవి చేసి చూశాడు. అక్షరాలు మసక మసకగా కనబడుతుంటే ఉత్తరాన్ని పైకి చదివాడు.     "డియర్ వేదగిరిరావుగారూ, శ్రీమతి భానుమతిగారూ!"     మీతో మాట్లాడి వెళ్ళాక నాకో చక్కని కథ దొరికింది. దాదాపు సినిమా తియ్యడం పూర్తయింది. విడుదలవరకూ  పబ్లిసిటీ ఇవ్వకూడదనే  ఈ సంగతి ఎక్కడా చెప్పలేదు. మా అమ్మాయీ, అల్లుడూ రేపు హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ లో హైదరాబాద్ చేరుకుంటున్నారు. మీ అడ్రసిచ్చాను. మీరు చూపిన ఆప్యాయతా, ఆదరణా, పెట్టిన భోజనం ఎన్నటికీ మరిచిపోను. ఒక్కపూటే గనక అల్లుణ్ణీ, అమ్మాయినీ మీ దగ్గరే దిగమన్నాను. అన్యథా భావించరని తలుస్తాను."     ఆ మాటలు వింటూంటే  మూర్చొచ్చినట్టయింది భానుమతికి. వేదగిరిరావు వెర్రెత్తినట్టయింది. ఏదో కోపం....ఒక రకమైన తాపం....మతిభ్రమించి నట్టనిపించింది. వెంటనే మూడ్ మార్చుకుని వేదగిరిరావు మరో ఉత్తరం చింపాడు. అది పిల్లల స్కూలు నుంచి ప్రిన్సిపాల్ రాసిన ఉత్తరం.     "డియర్ పేరెంట్స్!"     మీరు అదివరకులా పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకోవడం లేదనుకుంటాను. ఎప్పుడూ మంచి మార్కులు తెచ్చుకునే మీ పిల్లలు ఈ మధ్య ఫెయిలవడమేమిటీ ఒకసారి స్కూలు కొచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను."     తల దిమ్మెత్తినట్టయింది ఇద్దరికీ! కాళ్ళు పాతాళానికి పోతున్నట్టూ, నరాల బిగువు తగ్గినట్టూ అనిపించింది.      మూడో ఉత్తరం చింపాడు కంగారుగా వేదగిరిరావు.  అది వాళ్ళ ఆఫీసు నుంచి వచ్చిన ఉత్తరం. ఆఫీసు భాషలో చెప్పాలంటే 'మెమో.'     "మీరీ మధ్యన సెలవులు తెగ పెడుతున్నారు, ఆఫీసు పనిలో తగిన శ్రద్ధ వహించక నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఈ వైఖరి ఇలాగే ఉంటే మీ మీద తగు చర్య తీసుకోబడుతుంది."     ఈసారి వేదగిరిరావుకి నిజంగానే పెచ్చెక్కినట్టయి  జుట్టు  పీక్కుంటూ మంచం మీద కూర్చున్నాడు.     "ఆ మూడో ఉత్తరం ఎవరిదండీ? సినిమావాళ్ళ దగ్గర్నుంచేనా?" అంది భానుమతి.       "భానుమతీ!" అరిచాడు వేదగిరిరావు.     హడలిపోయి  బెదురుచూపులు చూసింది శ్రీమతి భానుమతి.     "ఏదీ, నువ్విందాకా రాసిన బడ్జెట్ లిస్టు?"     వెంటనే అందించింది.     "మూడిందలు  సినిమాకి రెండొందలు ఆటోలకి" అని ఉన్న చోట గుండ్రంగా సున్నా చుట్టి "పిల్లల  ట్యూషన్ ఫీజుకి" అని రాశాడు.     పాత పత్రికలూ, పుస్తకాలూ కాగితాలవాళ్ళకమ్మేసింది భానుమతి.     వేదగిరిరావు ఆఫీసులో హాయిగా పనిచేసుకుంటున్నాడు యథాప్రకారంగా.     "ఆడమంటే ఆడేది ఆట కాదు, పాడమంటే పాడేది పాట కాదు"....రేడియోలో  పాట విని శ్రుతి కలిపింది భానుమతి...." రాయమంటే రాసేది కవిత కాదు - అది కథ కాదు" అని.     వేదగిరిరావు "అవతలి గదిలో చదువుకుంటున్న  పిల్లలకి  రేడియో డిస్టర్ బెన్స్" అని రేడియో కట్టేస్తూ నవ్వాడు.                        

జారిన మల్లెలు

 జారిన మల్లెలు - శారదా అశోకవర్ధన్ "అమ్మా, అన్నం పెట్టు. మళ్ళీ వెంటనే ఆఫీసుకి వెళ్ళిపోవాలి." హడావుడిగా లోపలికొస్తూ  అన్నాడు హరీష్.     "ఏమిట్రా ఆ తొందర? తిండి కూడా కడుపునిండా  తినడానికి  నీకు టైము లేదంటావు. ఏం పిల్లాడివో ఏమిటో. ఎన్ని పన్లున్నా తిండి దగ్గర తొందరైతే ఎలా? ఆ తినే నాలుగు మెతుకులూ  నెమ్మదిగా తినవాయె." అనుకుంటూ వొచ్చి కంచం, గ్లాసూ పెట్టి, వడ్డన మొదలెట్టింది రామాయమ్మ.     "ఏది శ్రేష్ఠ, కనబడదేం? అడిగాడు హరీష్.     "ఇప్పటివరకు ఇక్కడే వుందే! నీతో కలిసి తిందామని ఇప్పటివరకూ భోం చెయ్యకుండా కూర్చుంది. పాపం, చూసి చూసి నువ్వెంతకీ రాకపోయేసరికి ఇందాకే తింది. అమ్మాయ్ శ్రేష్ఠా....శ్రేష్ఠా...." పెద్దగా పిలిచింది రామాయమ్మ.     "ఆఁ....ఆఁ....చాలు..." అంటూ బెడ్ రూంకేసి చూస్తూ "నా కంచంలో వడ్డిస్తున్నావ్, ఎంత వేసేసేవో చూడు....అబ్బ ఇదంతా ఎలా తినాలి?" అన్నాడు పళ్ళెం కేసి చూస్తూ హరీష్.     "ఒరేయ్!  అదేం కూరో చూసే అంటున్నావా ఆ మాట? నీకు ఎంతో ఇష్టమయిన గుత్తోంకాయ్ కూర...."     "ఓ....మరింకేం? అంతా లాగించేస్తా! నీ కోడలు చేసిందా, నువ్వు చేశావా?" అన్నంలో కూర కలుపుకుంటూ అడిగేడు.     "ఎవరు చేస్తే ఏమిరా ....తిని బాగుందా లేదా చెప్పు." నవ్వుతూ అంది ఆమె.     "అహఁ....నువ్వు చేస్తే అసలు బాగుండదన్న  ప్రశ్నే లేదుగా...." ముద్ద నోట్లో  పెట్టుకుంటూ  అన్నాడు.      "అంతా నీ ఊహ!....మొన్న నువ్వూరెళ్ళినప్పుడు కోడలు వంట చేసింది. ఎంత బాగా చేసిందనుకున్నావ్. మీ నాన్న భోంచేస్తూ నాకసలు వంటే రాదు పొమ్మన్నారు" అంది కొడుకు కంచంలో మరింత కూర వడ్డిస్తూ,     "ఏమో! నేను ఎక్కడ తిన్నా నీ వంట రుచిరాదు. ఆఁ  పెరుగేసెయ్యి" అన్నాడు హడావుడిగా గడియారం చూసుకుంటూ.     వీరి సంభాషణంతా వింటూన్న శ్రేష్ఠ ముఖం  ఎఱ్ఱ మందారంలా వుంది. ఒంటి వేడి సెగలు కక్కుతూన్నట్టుగా అనిపించింది. గబగబా వెళ్ళి మంచంమీద పడుకుని కళ్ళు మూసుకుంది. భోజనం పూర్తిచేసి గదిలో కొచ్చి, భార్య పడుకుందనుకుని చప్పుడు చెయ్యకుండా వెళ్ళి "అమ్మా.... వెళ్ళొస్తాను. సాయంత్రం ఆరూ ఆరున్నరకల్లా  వొస్తాను" అంటూ  వెళ్ళిపోయాడు హరీష్.     తలుపు గడియవేసి, కోడలు గదిలో కెళ్ళి ఆమె పడుకునుండడం చూసి, వెనక్కెళ్ళి  ఆ రోజు శనివారం కావడంవల్ల రాత్రి టిఫిన్ ఏర్పాటు చేస్తూవుండిపోయింది రామాయమ్మ, మినప రొట్టె కోసం పప్పు రుబ్భుతూ.     రామాయమ్మగారిని చూడగానే ఎవరికైనా రెండు చేతులూ  ఎత్తి నమస్కరించాలనిపిస్తుంది. పచ్చటి శరీరచ్చాయ, కళ్ళ నిండుగా  కాటుక, పావలా కాసంత బొట్టూ చక్కటి తలకట్టూ, నిండైన చిరునవ్వు, స్త్రీత్వం వుట్టిపడేలా అనిపిస్తుంది. మంచి విగ్రహపుష్టే కాదు, మంచి గంధం లాంటి మనసు కూడా ఆమెకు భగవంతుడిచ్చిన వరం. అందుకే ఆమెను చూడగానే అందరికీ దండం పెట్టాలనిపిస్తుంది. ఆ చుట్టుప్రక్కల ఆ వాడలో వున్న పిన్నా పెద్ద అందరూ ఆమెకు ఆప్తులే. 'వొదినా' అని కొందరూ అక్కా అని కొందరూ పిన్నీ అని కొందరూ అలా వరసలు కలిపేసి క్షణంలో ఆమెకి చేరువవుతారు. చివరికి చిన్న పిల్లలు బొమ్మల పెళ్ళిళ్ళు చెయ్యాలంటే తాటాకు బొమ్మలు చెయ్యడానికి, తాటాకు బుట్టల దగ్గరి నుంచి, ముస్తాబు చేసేందుకు పాతగుడ్డతో బొట్టూ, కాటుకా మాత్రమే కాకుండా, పప్పుబెల్లాలు, పిండివంటలూ కూడా ఆమె తయారు చేసిచ్చేది. పిల్లలందరికీ ఆమె అమ్మామ్మో బామ్మో అవుతుంది. "నీ ఓపిక్కే మెచ్చుకోవాలి రామాయమ్మా!" అనేవారు తోడివారు. "ఊరి పిల్లలందరికీ ఇంత చేస్తావ్.... నీ సొంత మనవడో మనవరాలో ఒస్తే ఇంకా ఎంత చేస్తావో....అసలు కింద కాలు పెట్టి నడవనిస్తావా? ఇంతకీ ఆ వొచ్చే కోడలు అదృష్టవంతురాలు" అనేవారు. "తల్లిలాంటి అత్త దొరకడం అదృష్టంకదూ!"  అనేవారు చిన్నవారు. కోడలు నెలతప్పిందని  తెలుసుకుని మురిసిపోతూ' ఊళ్ళో వాళ్ళ మాటలు తలుచుకుని మురిసిపోతూ పప్పు రుబ్బడంలో నిమగ్నమయిపోయింది రామాయమ్మ.     "మినపరొట్టంటే  హరీష్ కి ప్రాణం. దాన్లో నంచుకోవడానికి ఉల్లిపాయ పచ్చడి చేస్తే వాడికి పంచపరమాన్నాలు  తిన్నంత ప్రీతి.  ఆయనా అంతేగా! 'రామూ! మళ్ళీ ఎప్పుడు చేస్తావ్ మినపరొట్టె?' అనేవారు  చేతులు కడుక్కుంటూ, ఆ పూట తిన్నవెంటనే వెంకట్రావుగారు. ఆయనకి భార్య వంట ఎంత ఇష్టమో, భార్యంటే అంతకు రెట్టింపు ఇష్టం. ఆమె పంచే మమతానురాగాలు బొండుమల్లెలకన్నా ఇష్టం. కాపురాని కొచ్చినది మొదలు ఇంట్లో ప్రతీవారికీ తల్లో నాలుకలా మెలుగుతూ మంచిపేరు తెచ్చుకుంది. 'కోడలంటే నా కోడలే. మేలిమి బంగారం!' గొప్పగా చెప్పుకునేది ఆమె అత్తగారు సూరమ్మగారు. అయితే, వారి కొచ్చిన సమస్యల్లా పెళ్ళయి పదేళ్ళు కావొచ్చినా రామాయమ్మ కడుపు పండకపోవడం. సూరమ్మగారు చెయ్యని పూజలేదు, మొక్కని దేముడు లేడు.       ఏ నోటివరమో, ఏ పూజా ఫలితమో పద్నాలుగు సంవత్సరాల తరవాత వాళ్ళింట పాపాయి పలికింది. హరీష్ ని పువ్వుల్లో పెంచారు. సూరమ్మ కడుపు నిండిపోయింది. బంగారు మొలతాడు, మామిడిపిందెల గొలుసు, రెండు చేతులకీ మురుగులూ, కాళ్ళకి మువ్వలూ అచ్చు అంబాడే బాలకృష్ణుడిలా వుండేవాడు హరీష్. ఆమె హరీష్ కి మూడోనెలరాగానే ముద్దకుడుములు చేయించి ఊరంతా పంచింది. పాకుతూంటే పాయసం, అడుగులేస్తే అరిసెలు సంతర్పణ చేయించింది. పగలంతా హరీష్ సూరమ్మగారి ఒడిలో, రాత్రిళ్ళు రామాయమ్మ పక్కలో. అందరికీ ఆరోప్రాణం హరీష్, హరీష్ పలుక నేర్చాక, నడకనేర్చాక. చేతికర్ర విసిరి అవతల పారేసింది. గుడికి వెళ్ళేటప్పుడు వాడు ఆమెకి తోడు. బడికి వెళ్ళేటప్పుడు ఆమె వాడికి తోడు. ఊళ్ళో పిల్లలందరూ వొచ్చి వాళ్ళింటి ముందు ఆడాలి. హరీష్ ఆటకి వెళ్ళినా ఎప్పుడైనా ఆమె ప్రాణం కొట్టుకుపోయేది వాడాడింది ఆట, పాడింది పాట. వాడికేం కావాలన్నా సిఫారస్ చెయ్యడానికి బామ్మ ప్రత్యక్షం. బామ్మ మాటంటే జడ్జిమెంట్ మరి!     "అత్తయ్య మరీ గారాబం చేసి వాణ్ణి  పాడు చేస్తున్నారు" అనేది రామాయమ్మ.     "ముద్దుకైనా హద్దుండాలి" అనేవాడు వెంకట్రావుగారు.     "హద్దులూ  ఎల్లలూ లేనిదేరా బామ్మా మనవళ్ళ ప్రేమ. అది బామ్మయి నువ్వు తాతయిననాడు తెలుస్తుంది ఈ తీపి. చెబితే అర్ధం కాదు" అంటూ  వెళ్ళి హరీష్ ని ఎత్తుకుని కూర్చునేది సూరమ్మ.     పప్పు రుబ్బుతున్నంతసేపూ, గతం మనసులో  నలిగిపోయింది. ఊహలు తుమ్మెదల్లా  మనో పుష్పంమీద వాలిపోయాయి, ఆలోచనల పుప్పొడిని  ఆరగిస్తూ అనురాగపు తీయదనాన్ని గ్రోలుతూ.         *    *    *     ఆరు దాటుతున్నా  శ్రేష్ఠ లేవలేదు. "అమ్మాయ్! ఒంట్లో బాగులేదా? అబ్బాయొచ్చేవేళయింది. లే!" అంటూ  లేపింది రామాయమ్మ. సమాధానం చెప్పకుండా  లేచి బాతురూంలో కెళ్ళి మొహం కడుక్కొచ్చింది శ్రేష్ఠ.     "ఒంట్లో నలతగా వుందేమో కనుక్కో. మందేమైనా  కావాలంటే చెప్పు, నే పట్టుకొస్తా. వాడొచ్చేసరికి లేటవొచ్చు" అన్నారు వెంకట్రావుగారు.     "ఏమీ అఖ్కర్లేదు" ముక్తసరిగా జవాబు చెప్పింది శ్రేష్ఠ.     మాటల్లోనే హరీష్ రావడంతో ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమయిపోయారు రామాయమ్మ, వెంకట్రావుగార్లు. హరీష్ ని చూడగానే మళ్ళీ మంచమెక్కింది శ్రేష్ఠ. " శ్రేష్ఠా....అమ్మాయ్...." పిలిచారు వెంకట్రావుగారు. "అబ్బబ్బబ్బబ్బబ్బ ..... చంపేస్తున్నారు. ఏమిటో ఆ గావు కేకలు!" విసుక్కుంటూ అటునుంచి ఇటు తిరిగి పడుకుంది శ్రేష్ఠ.     "నాన్నగారు పిలుస్తుంటే వెళ్ళవేం?" అడిగాడు హరీష్. "పిలుస్తారు. పొద్దు గూకులూ, మీనాన్నా అమ్మలకి సమాధానం చెప్పడమే నా ఉద్యోగం." కసురుకుంది శ్రేష్ఠ.     "ఓస్! అదీ కష్టమేనా?" నవ్వేడు హరీష్.     మరొకప్పుడు అయితే ఆ నవ్వులో శృతి కలిపేది శ్రేష్ఠ. కానీ ఈ రోజు కాలిపోతూన్న  మనసుకి ఆజ్యం పోసినట్టుంది ఆ పిలుపు! అందుకే అది జ్వాలల్లా దహించేస్తున్నట్టుంది ఆ పిలుపు.     "ఏమిటే! ఒకసారి  మీ అత్తయ్య పిలుపు. మరోసారి మీ మామయ్య పిలుపు. ఈ చాదస్తపు శాల్తీలతో ఎలా వేగుతున్నావో బాబూ! ఇరవైలోనే అరవైలా వున్నావ్" అంది లిప్ స్టిక్ ని చిన్న అద్దంలో చూసుకుని కర్చీపుతో సరి చేసుకుంటూ. తన ఫ్రెండు నిత్య.     ఇప్పుడా మాటలు గబుక్కున జ్ఞాపకమొచ్చాయి. ఆమెలో దాగివున్న కోపం పడగ విప్పి బుసలు కొట్టింది.     "అమ్మాయ్ శ్రేష్ఠా........"     "నాన్నగారు పిలుస్తుంటే వెళ్ళవేం?" బట్టలు మార్చుకుంటూ అడిగేడు హరీష్ హెచ్చుస్వరంలో.     "పిలవగానే పరుగెత్తడానికి నేనేం పనిమనిషినా? క్షణానికోసారి పిలుస్తారు పనున్నా లేకపోయినా..... మీరిప్పుడే ఇంటికొచ్చారుకదా! భార్యాభర్తలు ఏదో మాట్లాడుకుంటుంటారు, పిలవడమెందుకు అన్న జ్ఞానం వుండక్కర్లా.....! అయినా నేను పెళ్ళిచేసుకున్నది మిమ్మల్నా, వాళ్ళనా - పిలవగానే పరుగెత్తడానికి?"     "శ్రేష్ఠా....! నువ్వేనా మాట్లాడుతూన్నది?" ఆమెకేసి ఆశ్చర్యంగా చూస్తూ అడిగేడు హరీష్.     "అవును నేనే! మిమ్మల్ని చేసుకుని నేనేం సుఖపడ్డాను? సరదాగా ఒక సినిమాకెళ్ళడంలేదు. ఒక షికారుకెళ్ళడంలేదు. ఎంతసేపూ మీరు మీ అమ్మానాన్నల భజనచేస్తూ కూర్చుంటారు. మీవెనక తందానతానా అంటూ నేను. ఒక్కడేకొడుకు సుఖపడతావు అంటూ, వొచ్చిన సంబంధాలన్నీ వొదులుకుని మీకిచ్చి కట్టబెట్టారు. ఎమ్.ఏ. చదువుకుని అంట్లదానిలా ఇంట్లో కూర్చున్నాను. నా స్నేహితులందరూ  హాయిగా ఉద్యోగాలు చేసుకుంటూ, జల్సా చేసుకుంటూ హాయిగా వున్నారు." కళ్ళు తుడుచుకుంటూ ముక్కు చీదుకుంది శ్రేష్ఠ.     ఆమె దగ్గరగా వెళ్ళి నవ్వుతూ "శ్రేష్ఠా.... హాయిగా వుండడం అంటే ఉద్యోగం చెయ్యడమేనా? మనకి ఆ అవసరం ఏముంది చెప్పు? అమ్మకీ నాన్నకీ నేనంటే ఎంత ఇష్టమో నువ్వన్నా అంతే ఇష్టం. వారికి ఆడపిల్ల లేని లోటు నీ ద్వారా తీర్చుకుంటున్నారు. ఎందరికి అత్తవారింట్లో  ఆ స్థానం దొరుకుతుంది చెప్పు?" అన్నాడు భుజాలమీద చేతులువేస్తూ. అతని చేతులు తోసిపారేసింది శ్రేష్ఠ.     "నా మొహం. ఇదీ ఒక అదృష్టమేనా?  ఆ ముసిలాళ్లు జలగల్లా పట్టుకుని పీక్కుతింటున్నారు" అంది.     అంతే హరీష్ అరచేతి అయిదువేళ్ళూ  ఆమె చెంపకతుక్కుపోయాయి.     ఆమె కళ్ళంట జలపాతం ప్రవహించింది.     అప్పుడే శ్రేష్ఠ ఎంతకీ రాకపోవడంతో కొన్ని మల్లెపూలు  దోసిట్లో పోసుకుని లోపలికొస్తూన్న వెంకట్రావుగారు, ఆ దృశ్యం చూసి చలనం లేని వారిలా దోసిలి ఒదిలేశారు. గాభరా పడ్డట్టుగా మల్లెలు గదంతా గంతులు వేశాయి.     వెంకట్రావుగారి గుండె ఆగిపోయినట్టయింది.     లోపల్నుంచి బయటికొచ్చి చూసిన రామాయమ్మగారికి ఆ దృశ్యం అర్ధం కాలేదు.     "ఏమయిందండీ! ఈ పూలన్నీ ఇలా పడేశారేమిటి?" అంటూ దగ్గరగా వెళ్ళింది.     "కోడలికీ నీకూ అని కొన్నాను. జారిపోయాయే" అన్నారు.     "ఫరవాలేదు. నేనేరుతాలెండి" అంటూ  ఒక్కొక్క పువ్వే తీసి ఏరింది రామాయమ్మ.     ఆమెకేసి తదేకంగా చూస్తున్న వెంకట్రావుగారు, "ఈ పువ్వుల్ని ఏరేవ్ గానీ జారిపోతూన్న నవ్వుల పువ్వుల్ని  ఎలా ఏరుతావ్?" అన్నాడు ఆమెకేసి చూస్తూ.     ఆ మాటల్లోని అర్ధం కాక అతనికేసి అమాయకంగా చూసింది ఆమె.     "అవును రామూ! మనం కొన్నాళ్లు ఎక్కడికైనా  పోవాలి. ఎప్పటినుంచో కాశీ, రామేశ్వరం, గయా తీర్ధయాత్రలకి వెళ్ళాలన్నావుగా. పద తీసికెళతాను. మంచి రోజు చూడు" అన్నారు తను విన్న మాటలనీ చూసిన దృశ్యాన్నీ మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ.     "చాల్లెండి. మనం తీర్ధయాత్రలు చెయ్యడానికి ఇదా సమయం? ఎవరైనా వింటే నవ్విపోతారు. కోడలు ఇప్పుడు వట్టి మనిషి కూడా కాదు. పాపం, ఏం పని చేసుకోగలుగుతుంది? దానికి ఏదైనా తినాలనుంటే చేసి పెట్టాలి. ఏడో నెలలో శ్రీమంతం చెయ్యాలి. అప్పటికి మల్లెపూల కాలం అయిపోతుంది.  అందుకని ఇప్పుడే పెద్ద పెద్ద పువ్వులు తెప్పించి మల్లెపూలతో వొంకి జెడ వెయ్యాలి." అంది చేతిలోని పూలని పళ్లెంలో పోస్తూ.     వెంకట్రావుగారు ఆమెకేసి జాలిగా చూసి నిట్టూర్చారు.     రామాయమ్మ ఆ నిట్టూర్పెందుకో అర్ధంకాక, అతని మొహంలోకి చూసింది.     అంతలో శ్రేష్ఠ వెక్కి వెక్కి ఏడుపూ, గట్టిగా అరుస్తూన్న  హరీష్ గొంతు విని కంగారుగా అక్కడి కెళ్ళింది రామాయమ్మ. ఆమె రావడం చూసి దభాల్న తలుపేసేసింది శ్రేష్ఠ.రామాయమ్మకి భూమి బద్దలయిపోతూన్నట్టనిపించింది. కళ్ళు గిర్రున తిరిగాయి. అంతలో బయటి కొచ్చేడు హరీష్ తలుపు తెరుచుకుని, గడప దగ్గరనుంచున్న  రామాయమ్మని చూసి "అన్నం పెట్టమ్మా...." అన్నాడు. ఆ మాటలకి వెంకట్రావుగారు, రామాయమ్మని చూసి ఏదో సైగ చేశారు శ్రేష్ఠ గదివైపు చూపిస్తూ. అర్ధమయినట్టు తలూపింది రామాయమ్మ. "నాకు కాళ్ళు పీకుతున్నాయి. నీ పెళ్ళాన్ని వడ్డించమను. అయినా, పెళ్ళామొచ్చినా కూడా నన్ను వడ్డించమని అడుగుతావేమిట్రా చిన్న పిల్లాడిలా?" అంది పక్కనున్న కుర్చీలో కూర్చుంటూ. "అమ్మా.... నువ్వేనా ఇలా అంటూన్నది? శ్రేష్ఠ మాటలకి కోపం వొచ్చిందా? అమ్మా! ఈ ఇల్లు ఒక అనురాగ కోవెల అందరికీ. నాన్నా నువ్వూ అందరికీ దేవతలతో సమానం. అటువంటిది. కన్నబిడ్డని నాకు నీకన్నా ఎవరమ్మా ఎక్కువ? మీ ప్రేమని అర్ధం చేసుకోలేని మూర్ఖురాలు శ్రేష్ఠ. పల్లెటూళ్ళో ఎక్కడో పుట్టి, ఎలాగో ప్రైవేటుగా పరీక్షలు కట్టి ఎమ్.ఏ.ప్యాసయి, పది మంది పిల్లల్లో తాను ఒక్కరిగా మధ్యతరగతి కుటుంబంలో పెరిగి, మీరు పంచే ప్రేమని అందుకుని అరిగించుకోలేని తెలివి తక్కువ మనిషి. అసూయతో స్నేహితురాలు చెప్పే మాటల్ని అర్ధం చేసుకోలేక ఆచరించాలనుకుంటూన్న బుద్దిహీనురాలు. దాని మాటలకేం? నువ్వొచ్చి అన్నం పెట్టు" అంటూ కంచం దగ్గర కూర్చున్నాడు.     శ్రేష్ఠనీ రమ్మని బతిమాలింది రామాయమ్మ. అయినా రాలేదు శ్రేష్ఠ. ఆమె మూర్ఖత్వానికి మండిపడుతూ భోజనం చెయ్యకుండానే  వెళ్ళిపోయాడు హరీష్. ఆ పూట అందరికీ పస్తే. ఎంతో సంతోషంగా చేసిన మినప రొట్టె తనుని చూసి నవ్వుతూన్నట్టనిపించింది రామాయమ్మకి. ఎలాగో అందర్నీ వొప్పించి కాస్త ఎంగిలి పడనిచ్చింది రామాయమ్మ, అలా పస్తుండడం ఇష్టం లేక.  యాత్రలకవి దూరంగా వెళ్ళడం ఇష్టం లేక, ఇక్కడే దూరదూరంగా వుంటున్నారు దంపతులిద్దరూ. కొడుకు ఆఫీసునుంచొచ్చే  సమయానికి వీళ్ళు గుడికెళ్ళిపోతారు. ఏ రాత్రికో వాళ్ళ భోజనాలయ్యాక  ఇల్లు చేరుకుంటారు. "ఎందుకమ్మా ఇంత ఆలస్యం" అని అడిగితే "పురాణ కాలక్షేపం జరుగుతోంది బాబూ, గుడి దగ్గర" అని చిన్న అబద్ధం చెప్పేరు. నిజానికి గుళ్ళో కూర్చున్నంత సేపూ వాళ్ళ ఆలోచనలు  హరీష్, శ్రేష్ఠా, పుట్టబోయే పాపాయి గురించే.         *    *    *     ఏడోనెల రాగానే పుట్టింటికి  బయలుదేరింది శ్రేష్ఠ. శ్రీమంతం వేడుక పూర్తిచేసి తల్లితో పంపించేసింది రామాయమ్మ. శ్రేష్ఠ వెళ్ళిపోతూవుంటే  రామాయమ్మ పడ్డబాధ మరో మనసున్న  మనిషికి తప్ప  మాటలలో  అర్ధంకాదు. బయలుదేరి వెళ్ళినప్పటినుంచి రోజులు లెఖ్కెట్టడం మొదలెట్టింది.     ఆమె మదినిండా  కొత్త ఊహలు కొత్త ఊసులే. ఆ ఇంట్లో మళ్ళీ బుచ్చి హరీష్ వెలుస్తాడు. హరీష్ కి సూరమ్మగారు  చేయించిన మురుగులూ, బంగారు మొలతాడు, మామిడిపిందెల గొలుసు, కాళ్ళ గజ్జెలు, చేతి ఉంగరాలూ అన్నీ అలాగే వున్నాయి. అవన్నీ మళ్ళీ వాడికి పెట్టాలి. మూడో నెలలో ముద్ద కుడుములూ, పాకుతూంటే పాయసం, అడుగులేస్తే అరిసెలూ అన్నీ హరీష్ కి జరిగినట్టే జరగాలి. ఆ మాటే వెంకట్రావుగారితో  అంది. ఆయన నవ్వుతూ "మనవడూ మనవడూ అంటున్నావ్! ఇవన్నీ మనుమరాలైనా చేస్తావా లేక మనవడైతేనా?" అన్నారు. "మనుమరాలైతే ఇంకా ఎక్కువ చేస్తాను. నా మెళ్ళో వున్న గొలుసు కూడా దానికే వేసేస్తాను. మనవడైనా, మనవరాలైనా ముద్దు ముచ్చుట్లు ఒక్కటే కదండీ!" అంది ఆమె నవ్వుతూ. "ఎంత అచ్చరలచ్చలు విలువచేసే మాటన్నావే రామూ! నీ మనసు బంగారం" అన్నారు. ఆమె తల నిమురుతూ!  వాళ్ళిద్దరి  అరవై ఏళ్ల దాంపత్యంలోనూ, ఎన్నడూ దెబ్బలాడుకున్న రోజు కనీసం ఒక్కటైనా లేదంటే  నమ్మశక్యం కాదు. ఎవరైనా దెబ్బలాడుకుంటూంటే ఎందుకు దెబ్బలాడుకుంటున్నారో  కూడా వాళ్ళకి అర్ధంకాదు. జన్మజన్మల బంధం వారిది ప్రేమించడమే తెలుసు. ప్రేమను పొందడమే తెలుసు. నాగరికత ముదిరిన కల్మష వాతావరణం కృత్రిమత్వం వారికి అంటలేదు.     కాలచక్రంలో  మరో మూడు మాసాలు గడిచిపోయాయి. ఒక శుభ ముహూర్తంలో  పండంటి పిల్లాణ్ణి ప్రసవించింది శ్రేష్ఠ. రామాయమ్మ గారికి పెద్ద నిధి దొరికినంత సంతోషం కలిగింది. పదకొండో రోజు నామకరణానికి వెళ్ళేటప్పుడు, పిల్లాడికి నలుగుపెట్టి స్నానం చేయించాలని సున్నిపిండి విసరించింది. మంచి ఆముదం, పుట్టతేనె, కస్తూరి మాత్రలు - అన్నీ  ఒక సూటుకేసు నిండా  నింపింది. కోడలికోసం జడ కుచ్చులు, నాగరం చేయించింది. వెంకట్రావుగారూ రామాయమ్మా పదోరోజునే శ్రేష్ఠ ఊరు చేరుకున్నారు.     శ్రేష్ఠని  చూడగానే గతుక్కుమంది రామాయమ్మ. శ్రేష్ఠ జుట్టు మెడల వరకూ కత్తిరించేసుకుంది. ఆమె కిద్దామని తెచ్చిన జడకుచ్చులూ నాగరం తనని చూసి హేళనగా నవ్వుతూన్నట్టున్నాయి. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. "చక్కటి నీలాలు పిరుదుల దాకా వేలాడేజడ." నిట్టూర్చింది. మర్నాడుదయమే పిల్లాడికి స్నానం చేయించడానికి ఆముదం, సున్నిపిండి, మీగడా, వెన్నపూసా అంతా తయారుచేసింది. బాతురూంలో రెండు పీటలు వేసి, వేడినీళ్ళు పెట్టుకుని కూర్చుంది, బాబు నెత్తుకుని. శ్రేష్ఠ గబుక్కున ఆమె చేతిలో నుంచి బాబుని లాక్కుంది "ఇవన్నీ ఏమిటండీ చాదస్తం. బేబీ సోప్ తో స్నానం చేయిస్తాను. ఈ గొడవంతా ఒద్దు. ఈ పిచ్చి పిచ్చివన్నీ  ఇప్పుడెవ్వరూ చెయ్యరు నాకిష్టం లేదు" అంది.     రామాయమ్మా నోరు తెరిచి గుడ్లప్పగించి  చూస్తుండి పోయింది మతి పోయినదానిలా. ఆమె కళ్ళనిండా నీళ్ళు నిండుకున్నాయి. గుండె బరువెక్కింది. పీటమీంచి లేచి వెళ్ళిపోయింది శ్రేష్ఠకి దారినిస్తూ.     'కిరీటి' అని పేరు పెట్టారు బాబుకి. "ఎన్నో కీర్తి కిరీటాలు  సంపాదించి  చిరంజీవిగా వర్ధిల్లు బాబూ!" అని ఆశీర్వదించి, ఆ భరణాలన్నీ  తొడిగింది బాబుకి రామాయమ్మ.     "ఇవన్నీ  వెయ్యడమేమిటి పిల్లలకి  అసహ్యంగా!" అంటూ వెంటనే అవన్నీ  తీసేసింది. రామాయమ్మ గుండెల్లో మరో శూలం గుచ్చుకుంది. మరి కాస్సేపటికి, కంసాలిని పిలిపించి, పిల్లాడికి పెట్టిన నగలన్నీ కరిగించి, తను నెక్లెస్ చేయించుకోడానికి ఆర్డరిచ్చింది శ్రేష్ఠ. అది చూసిన రామాయమ్మకి గుండె ముక్కలు ముక్కలయిపోయింది. తన శరీరంలో  ఒక భాగాన్ని కోసేసినంత బాధనిపించింది. గుండె చెరువైపోయింది. కన్నీళ్ళు జలజలా కళ్ళంట రాలేయి. శరీరంలోని శక్తంతా  పోయినట్టు  కుప్పగా కూలిపోయింది. ప్రేమా,   అభిమానం, ఆప్యాయతా, మమకారం ఇవన్నీ మనసున్న మనిషికి భగవంతుడు పెట్టిన శాపాల్లా  అనిపించాయి. దీనంగా కూర్చున్న  రామాయమ్మ  భుజంమీద చెయ్యివేసి "రామూ! నువ్వలా కళ్ళనీళ్ళు పెట్టుకుని దిగులుగా కూర్చుంటే నే చూళ్ళేను. పశుపక్ష్యాదులు కూడా వాటిప్రేమని కొంతవరకే  చూపిస్తాయి. మరి మనుషులు కూడా వాటిలాగే మారిపోతే సుఖం వుందికదూ! మారే కాలంలో విలువలు కూడా మారిపోతున్నాయి. వాటిప్రకారం మనం మారకపోతే  ఆందోళనా, బాధాతప్ప ఏమీయగలదు?" ఓదార్చారు. ఆయన గుండెలమీద తల పెట్టి తనివి తీరా ఏడ్చింది రామాయమ్మ. ఆ కన్నీటి తడికి తడిసి గుండె చల్లబడిందేమో, లేచి మామూలుగా పన్లు చేసుకుంది.     ఆ మర్నాడే తీర్ధ యాత్రలకని  బయల్దేరారు దంపతులిద్దరూ. ఇంటికెళ్ళడం ఇష్టంలేక. ఇంటి తాళాలు శ్రేష్ఠ చేతిలో పెట్టింది రామాయమ్మ. అమ్మా నాన్నా ఎందుకు వెళుతున్నారో తెలుసు. కానీ ఏమీ చెయ్యలేని పరిస్థితి. అటూ తనని కన్నవారూ, ఇటూ తను కన్నవారూ, కట్టుకున్నవారూ. మధ్యలో మనసు నలిగిపోయింది హరీష్ కి. బరువెక్కిన  గుండెతో కన్నీరు కనబడకుండా  ముఖానికి చేతులడ్డం పెట్టుకుని రైలు కనుమరుగయ్యే వరకు చెయ్యూపుతూ వీడ్కోలు చెప్పాడు హరీష్. "ఇదే జీవితం! తెలుసుకో ఈ సత్యం!" ఎవరో చెబుతూన్నట్టుగా ఎక్కడి నుంచో ఈ మాటలు వినిపించాయి, గుండె లోతుల్లోంచీ, నరనరాలన్నుంచీ!     రైలు వెళ్ళి పోయింది! ఒక్కసారిగా జనం మటు మాయమైనట్టు  స్టేషను నిశ్శబ్దంతో నిండిపోయింది. అడుగులో అడుగు వేసుకుంటూ  హరీష్ తిరుగుముఖం  పట్టేడు, జీవన సత్యాన్ని  కనుగొన్న  యోగిలా! మరో పాతికేళ్ళ తర్వాత తన కొడుకు కిరీటి కూడా, తన లాగే తనని సాగనంపడానికి ఈ విధంగానే వచ్చే దృశ్యాన్ని ఊహించుకుంటూ!          

నాలోని నేను

నాలోని నేను                                                                                       - శారద అశోకవర్ధన్ శ్రీవారినీ, పిల్లలనీ ఆఫీసుకీ స్కూళ్ళకీ పంపించేసి, గబగబా ఇంటిపనులన్నీ పూర్తి చేసుకుని, క్రితం రోజు సగం రాసి వొదిలిపెట్టిన కథని పూర్తి చెయ్యడానికి కూర్చుంది బృంద. అంతలోనే కాలింగ్ బెల్ మోగింది. ఎప్పుడూ ఏదో ఒక డిస్టర్బ్న్సీయే. కాగితం కలం ముందేసుకుని కూర్చుందో లేదో, టెలిఫోను మోగింది. ఉస్సురంటూ వెళ్ళి తీస్తే రాంగ్ నంబరు. రంగనాథాన్ని  తిట్టుకుంటూ వొచ్చి మళ్ళీ కాగితాల దగ్గర కూర్చుంది.     "అమ్మగోరూ!" తలుపు కొట్టింది, గావు కేకలు పెడుతూ పనిమనిషి అనసూయ.     "ఏమిటబ్బా  ఈ వేళప్పుడొచ్చింది? ఇప్పుడేగా పని పూర్తి చేసి వెళ్ళింది" అనుకుంటూ లేచి వెళ్ళి తలుపు తీసింది బృంద.     "అమ్మగోరూ! నేనింటికి పోయేసరికి మా చిన్నమ్మ కూతురు ఊరి నుంచి ఒచ్చింది. రేపే ఎల్లిపోతారంట. మధ్యాహ్నం ఆట సినిమాకి బోదామంటోంది. అందుకే ఏమన్న పనుంటే సేసేసి పోదామని ఒచ్చాను" అంది.     "అంటే - సాయంత్రం ఇంక రావా?" అడిగింది బృంద.     "ఎట్టా ఒత్తానమ్మా? సినిమా అయిపోయేకాడికే ఆరు దాటుతది. ఇంటి కెల్లేసరికి ఏడు. అల్లకేమన్నా  సేసి పెట్టాల కదా....ఇయ్యాలటికిరాను" అంది.     "ఇప్పుడేగా  అన్ని పన్లు చేశాం. ఇంకా నా భోజనం కూడా  కాలేదు. గిన్నెలు కూడా లేవు తోమటానికి. సరే వెళ్ళు. రేప్పొద్దుటే ఒచ్చేయ్" అంది ఏడవలేక నవ్వుతూ బృంద.     ఆదెళ్ళిపోగానే తలుపు గడియ పెట్టొచ్చి కూర్చుంది బృంద. కలం పట్టుకుని  ఆలోచిస్తోంది, తన కథలోని హీరోయిన్ శివప్రియని గురించి.  శివప్రియ భర్త పాదాలకింద చరణ దాసిలా పడుండే వ్యక్తి కాదు. ఆత్మ గౌరవం కలది. ఆత్మస్థయిర్యం కలది. అందుకే తాగుబోతూ, తిరుగుబోతూ అయిన భర్తతో కాపురం చెయ్యనని ఖచ్చితంగా  చెప్పి, తన బ్రతుకుతెరువుకోసం బయటపడుతుంది. శివప్రియ ఏవిధంగా సెటిలయిందీ వగైరాలు రాయవలసి వుంది. బృంద తీక్షణంగా ఆలోచిస్తోంది.     మళ్లీ కాలింగ్ బెల్ మోగింది. తన ఆలోచనలకి  అంతరాయం  కలిగిస్తున్న దెవరో - తిట్టుకుంటూ  వెళ్లి తలుపు తీసింది.     "బృందగారు మీరేనా?" అడిగింది ఆమె.     "అవును. మీరెవరూ?" అడిగేలోగానే, లోపలికొచ్చేసి కుర్చీలో కూర్చుంది 'క్షమించండి కూర్చుంటూన్నందుకు!" అంటూ.     ఎవరీవిడ? స్నేహితురాలా - కాదు. బంధువా....ఎప్పుడూ చూళ్ళేదు. ఎంతో చొరవగా ఒచ్చేసి అలా కూర్చోవడం ఎబ్బెట్టుగా అనిపించింది. ఆమె చేతిలో ఒక ప్లాస్టిక్ బుట్ట మాత్రమే వుంది. అందుకని ఊరినుంచొచ్చిన వ్యక్తి కాదు అనుకుంటూ.... "మీరు?....."     అడిగే లోపలే  ఆమె ఏడుపు లంకించుకుంది.     కంగారుగా "ఎవరమ్మా నువ్వు? ఎందుకేడుస్తున్నావ్?" అడిగింది బృంద.     "మీరు స్త్రీల సమస్యల గురించి అనేక కథలూ వ్యాసాలూ రాశారు. మొన్నీమధ్యనే ఒక దినపత్రిలో మీ గురించి  చదివి నా జీవితానికో పరిష్కారం సూచిస్తారనే ఆశతో, మీ అడ్రసు వెతుక్కుంటూ  కొండంత ఆశతో వొచ్చాను." చెప్పటం ఆపి వెక్కి వెక్కి ఏడుస్తోంది ఆమె.     బృంద ఆమెకేసి  పరిశీలనగా చూసింది. వయస్సు నలభై దాటివుండదు. మనిషి ఎర్రగా బుర్రగా పెద్ద అందంగా కాకపోయినా  ఆకర్షణీయంగానే వుంది. వెంటనే ఏమడగాలో తెలీక 'ఏడవకండి, ఊరుకోండి. మీ సమస్యేమిటో చెప్పండి' అంది ఆమెని ఊరడించే ప్రయత్నం  చేస్తూ బృంద. ఆమె కళ్ళు తుడుచుకుని బృందకేసి చూసింది.     "నేను ఇల్లువిడిచి ఒచ్చేశాను. మీరేదైనా  దారిచూపిస్తే  నా బతుకు నేను బతుకుతాను. మిషన్ కుడతాను. బుట్ట లల్లుతాను. ఏ ఊడిగమైనా  చేస్తాను, ఆయనతో సంసారం తప్ప." మళ్ళీ ఏడ్చింది.      "మీ ఆయనేం చేస్తారు?"     "ఇక్కడ రిఫ్రిజిరేటర్స్ కంపెనీలో ఇంజనీరు."     ఖంగుతింది బృంద.     అంత మంచి చదువూ, హోదాగల ఉద్యోగం. ఏవో చిన్న గొడవలు జరిగుంటాయి. ఆవేశంలో ఈవిడ ఆ నిర్ణయం  తీసుకుని ఒచ్చేసుండొచ్చు. మాటల్లో పెట్టి ముందు ఆమె ఆవేశపు పొంగు చల్లార్చాలి అనుకుంది బృంద.     "మీకు పిల్లలున్నారా?"     "ఆఁ. ఒకమ్మాయి, ఒకబ్బాయి. అమ్మాయి పదోక్లాసు. అబ్బాయి ఎనిమిదోక్లాసు."     "అంటే.... పెద్దవాళ్ళే."     "ఆ..."     "మరయితే.... ఎందుకు ఇల్లొదిలి ఒచ్చేశారు?"     "అతను కొట్టే దెబ్బలూ పెట్టే హింసలూ పడలేక." మళ్ళీ ఏడ్చింది ఆవిడ.     "మీ పెళ్ళయి ఎన్నేళ్ళయింది?"     "ఇరవై ఏళ్ళు!"     "అప్పుడంతా బాగానే వుండేవారా?"     "లేదు. ఈ శరీరం ఇరవై ఏళ్ళనుంచి దెబ్బలతో కమిలిపోయింది. దెబ్బ తగలని చోటులేదు. అతనికి కోపం ఎందుకొస్తుందో, ఎప్పుడొస్తుందో తెలీదు. అసలా కోపానికి అర్ధం లేదు. వంకాయకూర చెయ్యమంటారు. చేస్తే ఎందుకు వంకాయ చేశావని కొడతారు. కూరంతా నా మొహానికి పూసి, నా ఏడుపూ అరుపులూ వినబడకుండా, రేడియో పెద్దది చేసి పెట్టి, చేతిలో ఏదుంటే అది పెట్టి కొడతారు. ఎవరైనా ఆ దెబ్బలేమిటని అడిగితే, పడ్డానని చెప్పాలి. డాక్టరు దగ్గరకెళ్ళి మందు తెచ్చుకోమంటారు. తనూ కూడా వస్తాను. డాక్టరుకి పడ్డాననో, ఏదో తగిలిందనో చెప్పాలి. డాక్టరు ఎన్నోసార్లు 'అలా ఎలా పడతావమ్మా చిన్నపిల్లలాగా?' అని ఎగతాళి చేశారు. నేనేం చెప్పాలి చెప్పండి?" మళ్ళీ వెక్కివెక్కి ఏడ్చింది.     ఆమెని ఓదారుస్తూ మంచినీళ్ళు  తెచ్చి  అందించింది బృంద. గడగడా నీళ్ళు తాగేసి గ్లాసు పక్కన పెట్టింది.     ఇద్దరిమధ్యా పది నిముషాలు  నిశ్శబ్దం చోటుచేసుకుంది.     బృంద ఆమెనే పరికించి చూసింది. ఎక్కడా ఆమె అబద్ధం చెబుతూన్నట్టు  అనిపించలేదు.      "మీ ఆయనకి ఈ పెళ్ళి ఇష్టంలేదా?" అడిగింది.     "అలా ఏమీ ఎప్పుడూ  అనలేదు."     "కట్న కానుకలు  చాలవని  సాధిస్తాడా?"     "ఊఁ.....హూ.....!"     "మిమ్మల్ని  అనుమానిస్తాడా?"     "తెలీదు. కోపం  వచ్చినప్పుడల్లా, కొట్టికొట్టి సిగ్గుంటే ఎక్కడికైనా  వెళ్ళిపో అని తిడతారు ఇష్టం వచ్చినట్టు." కళ్ళొత్తుకుంది.     "అమ్మా నాన్నా....అన్నా తమ్ముడూ....అక్క చెల్లెళ్ళూ  ఎవ్వరూ లేరా నీకు?" అడిగింది బృంద ఆమె కళ్ళల్లోకి  సూటిగా చూస్తూ.     "ఉన్నారు. నాన్నగారు రైల్వేలో ఉద్యోగం  చేసి రిటైర్ అయిపోయారు. ఒక అన్నా, ఒక తమ్ముడూ వున్నారు. అక్క చెల్లెళ్ళు లేరు. వొదినా, మరదలూ నా బాధలు  తెలిసినా సానుభూతి  చూపించరు. అన్నయ్య తమ్ముడూ  'మగవాడేం చేసినా నువ్వే భరించాలి' అని ఖచ్చితంగా చెప్తారు. అమ్మా నాన్నా చాటుగుండా ఓదార్చినా  నా స్థానం మాత్రం వాళ్ళదగ్గరకాదని  అతని పాదాల దగ్గరేనని, కొట్టినా చంపినా అక్కడే పడుండాలనీ అంటారు. పైగా  వారికి నేనొక్కర్తెనే ఆడపిల్లని కావడంవల్ల, బాధనంతా  గుండెల్లోనే  దాచుకుని, పరువు కోసం  నన్ను పతిదేవుడి  దగ్గరే వుండమని మరీ మరీ చెబుతారు." మళ్ళీ ఏడుపు.     "అది సరే కనీసం, మీ వారితో మాట్లాడి సంగతులు కనుక్కోరా?"     ఏడుపాపి "చాలాసార్లు  కనుక్కున్నారు. మా ఆయన వాళ్ళముందు చాలా చక్కగా నటిస్తారు. తప్పంతా  నాదేనన్నట్టు చిత్రిస్తారు. అంతే. వాళ్ళటూ, నేనిటూ. ఆ తరవాత  దెబ్బలు  రెట్టింపు." పమిట కొంగుతో ముఖం కప్పుకుని ఏడుస్తూన్న ఆమెని చూస్తూవుంటే  బృంద మనసు కరిగిపోయింది.     "మరైతే ఇప్పుడేం చేద్దామని?" పిచ్చిగా అంది.     "మీరే చెప్పాలి. నాకేదైనా  పనిప్పించండి. ఎక్కడైనా  తలదాచుకుంటానికి  కాస్త దారి చూపించండి. మీరు స్త్రీల సమస్యల పట్ల రాసిన అనేక కథలే,   కథల్లో మీరు చూపిన  పరిష్కారాలే నన్ను చావనీయకుండా  చేశాయి. మీ అడ్రసు వెతుక్కుంటూ  మీమీదే ఆశలు పెట్టుకుని ఒచ్చాను. నిజానికి నాకు ఏ బస్సు ఎక్కడెక్కాలో తెలీదు. ఎప్పుడోతప్ప  రోడ్డు చూసే అవకాశమే లేదు నాకు. మా బంధువుల్లోగానీ  స్నేహితుల్లోగానీ  ఏ శుభ కార్యానికి పిలిచినా  ఆయనొక్కరే వెళ్తారు. నేను పనుండి రాలేకపోయాననో, ఒంట్లో బాగులేదనో వాళ్ళకి చెప్తారు. నన్నూ కలిస్తే అలాగే చెప్పమంటారు. అందుకే వాళ్ళందరూ నా గురించి అదోలా మాట్లాడుతారు. గర్వం అనీ, ఒంటి పిల్లి రాకాసిననీ ఏదేదో అంటారు. అందుకే నాకు ఏ చుట్టాలదగ్గరకీ వెళ్ళాలని లేదు. వెళ్ళనుగాక వెళ్ళను!" అంది ధృడ నిశ్చయంతో. గదిలో బంధించి  కొడితే  పిల్లి కూడా పులిలాగే పంజా విప్పుతుందంటారు - ఇదేనేమో! ఇరవై ఏళ్ల చిత్రవధ ఆమె మనసును రాయి చేసింది అనుకుంది బృంద.     "మరి పిల్లల సంగతేమిటి?" అంది.     "నేను పోతే వాళ్ళనైనా  జాలితో చేరదీస్తారు లెండి, మా అమ్మా నాన్నా...."     "మరి ఆయన పిల్లలనైనా  ప్రేమగా  చూస్తాడా?"     "లేదు. వాళ్ళదీ నా గతే! అతనంటే వొణికిపోతారు." అంది నేలచూపులు చూస్తూ. బృంద మనసు బరువెక్కిపోయింది.     "చూడమ్మా! తండ్రి దగ్గర చనువులేదు. తల్లి కూడా కనబడకుండా  పోతే.... మరి.... ఎలా? వాళ్ళకోసమైనా  నువ్వు ఇంటికి వెళ్ళాలి" అంది.     తలెత్తి ఆమె బృంద కళ్ళలోకి చూసింది.     ఆ చూపులు తూటాల్లా  తాకాయి బృందకి.     "మీరు కూడా అందరిలాగే  మామూలు మాటలు చెబుతున్నారా? మీరు రాసే కథలూ కథల్లో ఇచ్చే పరిష్కారాలూ  అన్నీ నీటి మూటలేనా? వాస్తవంలో ఒక్క పరిష్కారాన్ని  చూపించలేని మీరు, లేనిపోని ఆశలు కలిపించే కథ లెందుకు రాస్తారు?" అన్నట్టున్నాయి ఆ చూపులు!     మనసులో జగుతూన్న  సంఘర్షణకి మాటలు  గొంతుదాటి రావడంలేదు బృందకి.     "పోనీ, ఈమె తనింట్లోనే వుంచుకుంటే? ఏదో ఒక ఉపాధి కల్పించేంత వరకైనా  తనే వుంచుకుంటే? కానీ, ఈమె వ్యక్తిత్వం మంచిది కాక అతడి ప్రవర్తన బాగులేదని చెబుతోందేమో! ఆమె భర్తకి గానీ, తల్లిదండ్రులని గానీ ఆమె ఇక్కడుంటున్నట్టు  తెలిసి, వాళ్ళు తమ ఇంటిమీద పడితే? శ్రీవారూ పిల్లలూ తననేవంటారో?" జవాబు దొరకని ప్రశ్నలతో అలిసిపోయి మూగిగా కూర్చుంది బృంద.     సాధారణంగా బృంద రాసే ప్రతి కథా చదివి ఉత్తేజితురాలై చక్కటి కామెంటు  చేస్తుంది మహిత. మహిత ఎదురింట్లో  వుంటుంది. ఎమ్.ఏ. చదివింది. భర్త బ్యాంకులో ఆఫీసరు. ఇద్దరు పిల్లలు. చింతల్లేని చిన్న సంసారం వాళ్ళది. మహితతో కబుర్లు  చెప్పడం బృందకి కూడా ఇష్టమే!     "రా మహితా, సమయాని కొచ్చావు" అంటూ మహితకి పరిచయం చేసింది ఆమెని.     "ఆమె పేరు చెప్పలేదు" అంది మహిత ఆమెని చూస్తూ - అంతదాకా ఆమె పేరు కూడా అడగనందుకు బృంద సిగ్గుపడింది.     "నా పేరు మీరా" అంది ఆమె.     బృంద ఆమె కథంతా చెప్పింది మహితకి.     మహిత కూడా ఆలోచనల్లో మునిగిపోయింది.     అన్నింటికీ స్పందించి అనర్గళంగా మాట్లాడే మహిత కూడా మూగగా చూస్తోంది, దిక్కుతోచక!     మీరా ఆశగా మహితకేసీ బృందకేసీ చూస్తోంది. కాలం ముగ్గురి మధ్యా స్థంభించిపోయింది.     "మీ పిల్లల కోసమైనా మీరు తిరిగి ఇంటికి వెళ్ళాలి వారి భవిష్యత్తు కోసమైనా  మీరు బాధలన్నీ భరించాలి. పైగా, ఇరవై ఏళ్లు భరించగా లేనిది మరో ఏడాదో రెండేళ్లో భరిస్తే.... ఆ పాప చదువైపోతుంది. ఎక్కడైనా ఉద్యోగం వొస్తుంది. వాళ్ళనీ తీసుకొని వెళ్ళిపోవచ్చు...." చెప్పుకుపోతోంది  మహిత.     ఆమె మాటలు చెవికి సోకడం లేదు మీరాకి. 'ఇరవై ఏళ్లు భరించగా లేనిది మరో రెండేళ్ళు భరిస్తే పోలా?....' ఈ మాటలే చెవుల్లో రింగుమంటున్నాయి. బృందకేసి చూసింది. ఆమె ఆ మాటల్నే తన నోటితో చెప్పింది. మీరా వారిద్దరినీ  మార్చి మార్చి చూసింది. ఆ చూపుల్లో ఏహ్యభావం! "మీరేనా చెప్పేవాళ్ళు! చేతికొచ్చినది మీరు రాస్తున్నారు, నోటికొచ్చినది ఆమె చెప్పింది. మీ మాటల్లో మీ రాతల్లో నిజాయితీ లేదు. మీరు ఒడ్డున కూర్చుని కబుర్లు  చెప్పడంతప్ప ఏమీ చెయ్యలేరు" అన్నట్టున్నాయి ఆ చూపులు! శూలాల్లా గుచ్చుకున్నాయి బృంద గుండెల్లో!     ఆమె "వొస్తా" అంటూ  గిరుక్కున తిరిగిచూడకుండా  వెళ్ళిపోయింది.     ఆమె వెళ్లిపోయినా ఆమె నీడలు బృంద మస్కిష్కంలో కదులుతూనే వున్నాయి. ఆ మర్నాడు హుస్సేన్ సాగర్ లో తేలిన మహిళ శవం అనే శీర్షికని పేపర్లో చూసి, తనే ఒక హంతకురాలిగా  ఫీలయింది. తన మీద తనకే వొళ్ళు మండిపోయింది. తనచేత పెద్దపెద్ద నీతులు చెబుతూ  రాయించిన  రచయిత్రిని కసితీరా తిట్టుకుంది!     వారం రోజులు  గడిచిపోయాయి. ఆరోజు  తలంటుకున్న  జుట్టుని ఆరబెట్టుకుంటూ  వసారాలోని  వాలుకుర్చీలో కూర్చునుంది బృంద. అల్లంత దూరాన్నించి అనసూయ కనిపించింది. అనసూయ పక్కనే కబుర్లు చెబుతూ  వొస్తున్న ఆమెని ఆత్రంగా చూసింది. 'అవును. ఆమే - మీరా!' ఆనందంతో లేచినుంచుంది.      "పాపం! ఈయమ్మగోరు  బస్సు స్టాండుకాడ దిగాలుబడి  కూకుంది. మేము సినిమాకాడినుంచి వొత్తావుంటే  ఈమెని సూసి ఇవరాలడిగాము. తన గోడంతా సెప్పింది. మా ఇంటాయనకి సెప్పి  ఒప్పించి, మా ఇంటోనే వుంచుకున్నాం. మాతోపాటే, కలో గంజో తాగుతూ  వుంది, ఈ వారం రోజుల్నుంచి. మా ఇంటాయన, మా ఇంటిముందే ఒక  సెడ్డేసి, కూరగాయల దుకునం పెట్టి పించిండు. రోజుకి పదిఏనూ, ఇరవై దాకా ఒత్తున్నాయి. ఆమె అదుట్టం! మా ఇంటి ఎదురింట్లో  ఒక గది కాళీ అయింది. నెలకి అరవై రూపాయలద్దె. ఈ యమ్మని అందులో వుంచేము. మీకీ ఇసయాలు  సెబితే  స్త్రీల కథలు రాసే మీరు ఎంతో సంతోషిస్తారని ఎదురుసూత్తున్నా. పాడు జెరంతో పడి రోజుల్నుంచి పనిలోకే రాలేదుకదా! అంది అనసూయ.     బృందలోని రచయిత్రిని ఎవరో కొట్టినట్లనిపించింది మళ్ళీ! సిగ్గుతో మాట్లాడలేక మీరానే చూస్తూ వుండిపోయింది.      "అవునండీ! మా పిల్లల్ని  నేననుకున్నట్టుగానే, మా అమ్మ వాళ్ళూ తీసుకెళ్ళారట. ఆయన  ఈ వూరి నుంచి మదురైకి ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారట. అడ్రసిచ్చి పంపితే, అనసూయ భర్త ఈ సమాచారం సేకరించి పెట్టాడు" అంది.     బృంద చెయ్యలేని పని చదువూ సంధ్యాలేని పనిమనిషి అనసూయా. ఆమె భర్తా చేసి చూపించారు. మళ్ళీ తనలోని రచయిత్రి సిగ్గుతో కుచించుకు పోయింది.     "రచయిత్రీ! నీకు జోహార్లు!!" అనుకుంది తనలోని రచయిత్రిని కసిగా చూస్తూ బృంద!     "నేను మీలాగా చదువుకున్నదాన్నికాను. కానీ, మీ రచనలు చదివి' సమస్యలకి మీరిచ్చే పరిష్కారాన్ని  అర్ధం చేసుకుని. ఎట్టి పరిస్థితిలోనూ సమస్యలకి చావు పరిష్కారం కాదు అని తెలుసుకున్నాను. ఆ బోధనలే నాలోని ఆశని చావకుండా చేశాయి. నా కాళ్ళమీద నేను నా స్వశక్తితో నుంచునే ధైర్యాన్నిచ్చాయి. నాలాంటి పరిస్థితులలో  కొట్టుకుపోతూన్న  వారికి మీరిచ్చే సందేశాలు సంజీవినిలా పనిచేస్తాయి. భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి" అంది మీరా.     ఆమెలోని  ప్రతీ మాటకీ బృంద స్పందించిపోయింది! ఆమె కళ్ళంటనీళ్ళు చెంపల మీదుగా  ముత్యాల్లా రాలాయి! ఆమెలోని రచయిత్రి తృప్తిగా తలెత్తి చూసింది!     కాస్సేపు కూర్చుని కాఫీతాగి మీరా వెళ్ళిపోయింది. పని పూర్తి చేసుకుని, అనసూయా వెళ్ళిపోయింది. కాగితాలు ముందేసుకుని  తనలోని  రచయిత్రికి నమస్కరిస్తూ  కలం పట్టింది. బృంద భావతరంగాలతో  పోటీపడుతూ  అక్షరాలు పరుగెడుతున్నాయి.                 

లేచిరా తల్లీ

 లేచిరా తల్లీ                                                                                    - శారద అశోకవర్ధన్    వాళ్ళు వెళ్ళగానే తలుపు ధబాల్న వేసి గడియ పెట్టింది పార్వతి. ఆ చప్పుడుకి  శివప్రసాద్ ఉలిక్కిపడ్డాడు. అవంతికి అర్ధమయిపోయింది, కాస్సేపట్లో అగ్ని పర్వతాలు బద్దలయ్యాయా అన్నంత తీవ్రంగా పార్వతి స్థాయి పెరిగి దండకం మొదలెడుతుందని. అందుకే అవంతి అక్కడ కూర్చోలేక పక్కగదిలో కెళ్ళిపోయింది. శివప్రసాద్ కూడా లేవబోయాడు.     "కూర్చోండి! ,మీరెక్కడికి? అది వెళ్ళగానే తోకలాగా మీరూ దాని వెనకాలే వెళ్ళాలా?" ఉరుములూ వుంది కంఠం శివప్రసాద్ మాట్లాడకుండా కుర్చీలో కూర్చున్నాడు. "వీళ్ళ మొహాలు చూస్తే మీకేమనిపిస్తోంది?" అదే స్థాయిలో ప్రశ్నించింది.     మొహాలు చూసి ఏం చెబుతాం? వాళ్లు ఇంటికి వెళ్ళి మాట్లాడుకుని నాలుగయిదు రోజుల్లో ఏ సంగతీ చెప్తామన్నారుగా! చూద్దాం" అన్నాడు ప్రశాంతంగా శివప్రసాద్. ఆయనకి తెలుసు పార్వతి మూడ్ చూసి మాట్లాడడం. ఆమె అపరకాళిలా అరుస్తూంటే, ఆయన కంఠం అసలు పలుకదు.     "ఏమిటి వాళ్ళు చెప్పేదీ మనం చూసేదీ? వాళ్ళ మొహాలు చూస్తే మీ కర్ధంకాలేదేమో కానీ, నాకర్ధమయింది. పచ్చి వెలక్కాయ తిన్నట్టు పెట్టారు మొహం."     "అది నీ కాఫీ తాగుతున్నప్పుడు కాబోలు. కానీ, అవంతిని  చూస్తున్నప్పుడు  వాళ్ళకి అవంతి నచ్చినట్టుగానే  అనిపించింది నాకు." నెమ్మదిగా అన్నాడు నవ్వుతూ పార్వతి మూడ్ మార్చే ప్రయత్నంలో.     "ఛ! ఊరుకోండి. జోక్ చెయ్యడానిక్కూడా, ఒక సమయమూ సందర్భమూ ఉండాలి. ఈ దేవేరి వాళ్ళకి నచ్చలేదు. ఈ శని నాకు ఒదిలేటట్టు  లేదు. వాళ్ళమ్మ కనిపారేసి కళ్ళు మూసుకుంది. నాన్న సంసారం కంటే సన్యాసమే  సుఖమని దేశాలు పట్టిపోయాడు. బోడి ఆరు తులాల బంగారం, పాతికవేలు ఇన్సూరెన్సు, పెళ్లెట్లా చెయ్యాలి? అక్క కూతురని ఆప్యాయంగా  ఆదర్శవంతంగా ఇంటికి పట్టుకొచ్చేశారు ఏం? తల్లి పోయేనాటికి  అవంతి పసిపిల్లేం కాదు కదా? పదో క్లాసు చదువుతోంది. ఏ హాస్టల్లోనయినా  పెడ్తే  ఏమయ్యేదంట?" ఆమె గబగబా  దండకంలా చదివేస్తోంది. "తల్లి తరువాత మేనమామంటారు. నేను ఈ ఊళ్ళోనే వుండగా  దాన్ని హాస్టల్లో పెడితే  నలుగురూ  ఏమనుకుంటారు? అయినా ఒకరనుకుంటారని కాదు. ఆమాత్రం  ఆ పిల్లకి అండగా  నిలిస్తే మన సొమ్మేం పోతుంది?" అదే స్థాయిలో  సమాధానం చెప్పాడు శివప్రసాద్.     "ఛస్తున్నాను చాకిరీ చెయ్యలేక నీతులు నేనూ చెప్తాను." మరింత రెచ్చిపోతూ  అంది పార్వతి.     ఏమిటే నువ్వు దానికి చేస్తున్న చాకిరీ? మెట్రిక్ ప్యాసయిందో లేదో చదువు మాన్పించి, దానిచేత  ఇంటెడు చాకిరీచేయిస్తున్నావు. వాళ్ళమ్మే బతికుంటే అది ఈ రోజు లక్షణంగా ఏ ఎమ్.ఎ.నో చదివుండేది అది నీకు చాకిరీ చేస్తొందే. నువ్వు  చేస్తూన్నదేమిటి దానికి తిట్లు, శాపనార్ధాలూ పెట్టడం తప్ప?" ఈసారి శివప్రసాద్ కోపం తారాస్థాయికి చేరుకుంది.     "ఏదో కాస్త ఇంట్లో పనిచేస్తే ఆ సుకుమారి కందిపోతుందా? దురదృష్ట జాతకురాలు ఎమ్.ఏ.లూ ఎమ్ బి.బి.ఎస్ లూ చదివే అదృష్టం వుంటే తల్లినెందుకు  మింగేస్తుందీ? ప్రతిసారీ పెళ్ళి చూపులంటూ  ఎవరో రావడం, కాఫీలు, ఫలహారాలు చెయ్యడం, వాళ్ళవన్నీ మెక్కి వెళ్ళడం, ఆ తరువాత నచ్చలేదనో గిచ్చలేదనో తిరిగి చూడక పోవడం ఇప్పటికి పదిసార్లయింది. నే వేగలేను. ఈ తతంగం అంతా నేను పడలేను గనకే మూడోసారి గర్భవతినని  తెలిశాక స్కానింగ్ చేసినపుడు ఆడపిల్ల అని తెలీగానే గర్భవిచ్చేదం చేయించుకున్నాను." కోపంలో  గబగబా అనేసి నాలిక్కరుచుకుంది పార్వతి.     "ఏమిటీ ఆడపిల్ల అని తెలిసి అబార్షన్ చేయించుకున్నావా?" ఆశ్చర్యంగా అడిగాడు శివప్రసాద్.     ".... ....    ....."     "మాట్లాడవేం?" గద్దించాడు.     "ఏమిటి, మాట్లాడేది, చెప్పానుగా  సురేష్, సుభాష్ చక్కగా  రెండు కళ్ళలా ఇద్దరు మొగపిల్లలుండగా ఆడపిల్ల అనవసరపు ఖర్చని, మీరు టూరెళ్ళినప్పుడు  ఆ పని చేశాను." లాభం లేక నిజం చెప్పేసింది పార్వతి.     "ఓసి దౌర్భాగ్యురాలా! ఎంత పనిచేశావే! ఇంటికి ఆడపిల్ల వుంటే ఎంత అందమే! ఆప్యాయతా అభిమానానికి నిలయమే ఆడపిల్లలు. అలా ఎలా చెయ్యగలిగేవ్? నువ్వాడదానివి కావా? మీ అమ్మ నీలాగ అనకుంటే  నువ్వెక్కడుండే దానివిప్పుడు? అంత నీచానికెలా ఒడిగట్టగలిగావ్? నిన్ను చంపినా  పాపంలేదు" కోపంతో  వొణికిపోయాడు శివప్రసాద్.     అవంతి గుండెలో  గునపం  గుచ్చుకున్నట్టయింది పార్వతి మాటలు.ఆమెకి పార్వతి రాక్షసత్వం, తనను తిట్టేతిట్లూ, పెట్టే శాపనార్ధాలు ఆలవాటయి పోయినా, అంతా మామయ్య మొహం చూసి, అతని మంచితనం చూసి ఊరుకుంది. కానీ ఈ నిముషంలో  ఆమె నోటినుంచి తను విన్న మాటలకి  షాక్ కొట్టింది. చెంపలమీదుగా కన్నీరు జలజలా రాలి గుండెని తడిపేస్తున్నాయ్.     "వెధవ దరిద్రం. శనిలా దాపురించింది నాకు. వాళ్ళమ్మ లాగే ఇదీ చస్తేపోయేది. నన్ను చంపేలా వుంది. నా కాపురంలో నిప్పులు పొయ్యడానికే నా ఇంటికొచ్చినట్టుంది. లేకపోతే  ఇన్ని సంవత్సరాలుగా నా గుండెల్లో  దాచుకున్న  ఆ విషయం ఇవ్వాళ  ఇలా నోరు జారి బయటపడింది" అంటూ  మళ్ళీ దండకం అందుకున్న అత్తయ్య నోరు ఒక్కసారిగా మూతపడడం, "చెళ్ళు" మని కొట్టిన చప్పుడూ ఒక్కసారే జరగడంతో  వొణికిపోతూ అటుకేసి తొంగిచూసింది అవంతి. మామయ్య రుద్రనరసింహుడిలా వున్నాడు - కోపంతో ఊగిపోతూ.     "కొట్టండి! చంపండి! దానికోసం  మీరేమైనా చేస్తారు. నాకన్నా మీకది ఎక్కువయిందేం?" రొప్పుతూ సెగలు కక్కుతూ అంది.     "ఛీ....నోర్మూసుకో!......" అసహ్యంగా ఆమెకేసి చూసి బయటకెళ్ళిపోయాడు శివప్రసాద్.     "ఎందుకు నోర్మూసుకోవాలి? మీరొక్కరే మామయ్యున్నారా దానికి?? ఎవరూ రమ్మని దగ్గరుంచుకోలేదే మీలాగా! మీకేనా అది అక్క కూతురు? ఎవరికీ లేని ప్రేమ మీకే ఎందుకు? అసలది నన్ను చంపడానికే బతికున్నట్టుంది.      లేకపోతే ఏ రోగమో వొచ్చి పోగూడదూ ఇది కూడా, లేకపోతే ఉరేసుకు చావకూడదా? ఇప్పటివరకూ  పదిమంది చూసి వెళ్ళారు. ఒక్కరికీ నచ్చలేదే? వీళ్ళకి మాత్రం నచ్చి చస్తుందా? ఛీ....ఛీ!" శివప్రసాద్ అక్కడ లేకపోవడంతో మరీ గట్టిగా అరిచింది పార్వతి. పార్వతి ప్రతీమాటా ములుకుల్లా గుచ్చుకున్నాయి అవంతికి. "ఇంతకుముందు ఆమె అన్నట్టుగానే  పదిసార్లు పెళ్ళివారొస్తున్నారని, పట్టుచీర కట్టుకుని, పువ్వులు పెట్టుకుని, ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలన్నింటికీ తలొంచుకుని సమాధానాలు చెప్పడం, పెళ్ళికొడుకూ  ప్లస్ అతనితో వచ్చిన వాళ్ళందరూ తినేసేలా తనని చూడడం, అత్తయ్య కాఫీలు, ఫలహారాలు ఇవ్వడం వాళ్ళందరికీ, ఆ తరువాత కట్నాలు సరిపోవనో, పిల్ల చదువు సరిపోలేదనో, ఉద్యోగంచేసే పిల్ల కావాలనో, ఏదో వంకతో కాన్సిల్ చేసుకోవడం. సంతలో పశువులా ఎన్నిసార్లు  తను అందరి ఎదుటా అలా కూర్చుంది? ఛీ....తనకైనా సిగ్గుండాలి" అనుకుంటూ  ఆ మూల అలాగే చతికిలబడి గంటలకొద్దీ ఏడ్చింది.     పార్వతి దండకం చదువుతూనేవుంది. ఆ తరువాత అలసిపోయినదానిలా నోరు మూసుకుని పనిలో పడిపోయింది. వాతావరణం తుఫానొచ్చి వెలిసినట్టుగా  వుంది. అప్పుడే బయటినుంచి లోపలికి అడుగు పెట్టిన శివప్రసాద్ అవంతి దగ్గరకొచ్చి "నువ్వింకా ఇలాగే కూర్చున్నావా? మీ అత్తయ్య మాటలకి బాధపడుతూ ఏడుస్తున్నావా తల్లీ! బాధపడకమ్మా.. నీకూ మంచి రోజులొస్తయ్! నాకెందుకో ఇందాకొచ్చి వెళ్ళిన ఈ బ్యాంకబ్బాయి సంబంధానికి నువ్వు నచ్చావనే అనిపిస్తోంది. అబ్బాయి తల్లీ, తండ్రీ కూడా ఉత్తముల్లాగే అనిపిస్తున్నారు" అన్నాడు అవంతి తలని ఆప్యాయంగా నిమురుతూ. అవంతి పసిపిల్లలా అతణ్ణి చుట్టేసి బావురుమంది. అతడి కళ్ళూ తడయ్యాయి! రెండు హృదయాలూ  ఆప్యాయపు జల్లులలో తడిసి చల్లబడ్డాయి. అవంతి లేచివెళ్ళి బట్టలు మార్చుకుని పనిలో పడిపోయింది.     దాదాపు రెండు వారాలు గడిచిపోయినా పెళ్ళివారి నుండి పిల్ల నచ్చినట్టు గానీ, నచ్చనట్టుగానీ సమాధానం రాలేదు. "వీళ్ళకీ ఏవో అడ్డొచ్చిందా? నచ్చనట్టేనా? మరోసారి పెళ్ళిచూపులకి సిద్ధంకావాలి కాబోలు!" అవంతి గుండెల్లో గుబులు అలుముకుంది. దానికితోడు ఆ రోజే పార్వతి మళ్ళీ ఆమె పురాణం మెదలెట్టింది.     "పంచాంగం విప్పావా? ఇంకా లేదే అనుకుంటున్నా!" అన్నాడు శివప్రసాద్.     "ఈసారి పెళ్ళిచూపులూ అని ఎవరన్నా అన్నారో, 'దానికి పెళ్ళి కాదు, మీరు రాకండి' అని ముందే చెప్పేస్తా. ఆ తంతంగం ఇంక నావల్ల కాదు" ఖచ్చితంగా అంది పార్వతి. ఆ మాటలు అవంతి చెవుల్లో రింగుమన్నాయ్. ఏ పనిచేస్తున్నా ఆ మాటలే గుర్తుకొస్తున్నాయ్ నీరసం ముంచుకొచ్చింది. గబగబా బాతురూంలోకెళ్ళి తలుపులు మూసుకుంది.     ఇల్లంతా ఏడ్పులతో పెడబొబ్బలతో బంధువులతో, స్నేహితులతో, అయినవారితో, కానివారితో  క్రిక్కిరిసిపోయింది.     "బొద్దింకల మందు తాగేసిందంట! ఏం పోయేకాలం?" అంది ఒకావిడ.     "ఏమోనమ్మా, ఈ కాలపు  పిల్లల్ని ఎవరు నమ్మమన్నారు? ఏం తిరుగుళ్ళు తిరిగిందో! కడుపో కాలో వొచ్చుంటుంది, చచ్చూరుకుంది." మరో ఆవిడ గుసగుస.     "అందులో తల్లీతండ్రీ లేరాయె. చెప్పేవాళ్ళెవరూ, మంచీ చెడునూ." దీర్ఘం తీసింది మరో గొంతు.     అంతలో శవం చీర కొంగుముడిలో  ఈ ఉత్తరం దొరికిందని  ఓ ఉత్తరాన్ని ఇనస్పెక్టర్ గారికి తీసిచ్చాడు పోలీస్ కానిస్టేబుల్.     ఇన్స్ పెక్టరు అది చదివి శివప్రసాద్ కిచ్చాడు. శివప్రసాద్ కి అక్షరాలు కనబడడం లేదు. మెల్లగా కూడబలుక్కుని, కళ్ళు తుడుచుకుని, పైకే చదివాడు.     "మామయ్యా, అవంతి నమస్కారం! ఇదే నా తుది నమస్కారం. పెళ్ళి కొడుకుల వేటలో, పెళ్ళిచూపుల సంతలో అమ్ముడుపోని, అమ్ముడు కాని దౌర్భాగ్యురాలిని. ఆ తతంగంలో అత్తయ్యే కాదు, నేనూ విసిగిపోయాను. ఈ నికృష్టపు జీవితానికి స్వస్తి చెప్పాలని, మా అమ్మను కలుసుకోవడానికి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ జన్మంటూ వుంటే నీ కడుపునే పుడతాను. అత్తయ్యతో చెప్పు ఆడపిల్లగా మాత్రం పుట్టను. ఉంటాను. బతికి అత్తయ్యనీ, చచ్చి నిన్నూ బాధ పెడుతున్నాను. ఏం చెయ్యను? నీకూ అత్తయ్యకూ నా చివరి నమస్కారం. నన్ను మన్నించండి.                                                                                                            ఇట్లు                                                                                                        అభాగిని                                                                                                     అవంతి"        ఉత్తరం చదివి ఘొల్లుమన్నాడు శివప్రసాద్. అక్కడున్న వాళ్ళందరి కళ్ళూ వర్షించాయి. అవంతి కేసి చూసి కన్నీటి బొట్లు రాల్చని వారు లేరు. భగవంతుడూ కరిగిపోయాడేమో! 'టెలిగ్రాం' అన్న పిలుపు విని అందరూ అటుకేసి చూశారు. గుంపులోంచి  ఎవరో వెళ్ళి సంతకం చేసి టెలిగ్రాం అందుకున్నారు.     'బాయ్....లైక్ డ్ ది.... గర్ల్....ఫిక్స్ ది మ్యారేజ్ నెక్ట్స్ మంత్.... నో డౌరీ రిక్వైర్డ్ ప్లీజ్...."     పిచ్చివాడిలా అరిచాడు అది చదివిన శివప్రసాద్ "అవంతీ.... లేచి రావమ్మా...." అంటూ....అతడి మాటలకి భూమి దద్దరిల్లింది!     ఆకాశం కంపించింది!     మేఘాలకి చిల్లులు పడ్డట్టు వర్షం ప్రారంభమయింది! కన్నీరు, వర్షపు నీరూ సెలేరులా ప్రవహించింది. అందులో ఆనందంగా సాగించింది అవంతి తన ప్రయాణాన్ని! అవంతీ. ఎందుకమ్మా తొందరపడ్డావ్? ఈ పెళ్ళి కొడుకుల సంతలో నువ్వు అమ్ముడుపోనందుకు, నిన్ను నిన్నుగా ప్రేమించేవాడు దొరికే దాకా ఆగినందుకు నువ్వు గర్వపడాలమ్మా! సిగ్గుపడవలసిందీ, తలదించుకోవలసిందీ సమాజమమ్మా! నువ్వు కాదు. నిన్ను నిన్నుగా ప్రేమించేవాడు దొరికాడు తల్లీ! లేచిరా! అమ్మా....అవంతీ...."     అతనిని ఆపటం జనానికి సాధ్యం కావడం లేదు.... మబ్బులు కమ్మేసి వర్షం తీవ్రమై అందరినీ తమేస్తోంది!                 

సూసైడ్-నోట్

  సూసైడ్-నోట్                                                                                                                               - సంహిత్                                                           మనిషి జీవితంలో ఎన్నో సమస్యలు, ఒడిదుడుకులు. ఇవన్ని కలిసి మనిషి సమర్దవంతుడైన సరే  సొమ్మసిల్లునట్లు చేస్తున్నాయి.ఈ సమస్యలనేవి మనిషి నే తన కంట్రోల్ లో చేసుకొని తను చెప్పినట్లు ఆడిస్తున్నాయి.దీని నుండి బయటపడేటట్లు మనిషి ఎంత ప్రయత్నించినా అది చాలా కష్టతరమవుతుంది.అసలు సమస్య ఎక్కడ మొదలవుతుంది అని ఆలోచిస్తే మనకు కొంతమేరకు అర్దమవుతుంది.                                                    * * * * * * *    ఆ రోజు తెల్లవారుఝామున్నే అందరికంటే ముందుగా లేచాడు "రాజు". కాలేజ్ కి వెళ్ళేప్పుడు   ఎన్నడూ ఇంత పొద్దున్నే లేచేవాడుకాదు.వేడి నీళ్ళతో తల స్నానం చేసి, వాళ్ళ అమ్మ,నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకొని బయలుదేరుతాడు.తను ఎప్పుడు కాలేజ్ కి వెళ్ళే దారిలో ఉండే బాబాయ్ హొటల్ కి వెళ్ళి టిఫిన్ చేసి మళ్ళీ తిరిగిరానివాడు చెప్పినట్లుగా బాబాయ్ కి వీడ్కోలు చెప్పి అక్కడనుండి బయలుదేరాడు.తను వెళ్ళే దారిలో చెట్లు,చేమలు అన్ని అతనికి వీడ్కోలు చెబుతున్నట్లుగా అనిపిస్తుంది.అయిన ఏమీ అలోచించకుండా,వెనక్కి చూడకుండానే తను వెళ్తున్నాడు. వీటన్నింటికి తెలియదు తను ఇక మళ్ళీ ఆ దారిలో రాలేడని. ఇంతకి తను ఎక్కడికెళ్తున్నాడో తెలుసా.... "ఆత్మహత్య" చేసుకోడానికి...... రాజు ఎందుకు చనిపోవాలనుకున్నాడంటే....రాజు వాళ్ళ నాన్న(రామకృష్ణ) ఒక ప్రైవేట్ ఎంప్లాయ్.ఒకటో తారీఖు వచ్చేసరికి జీతం కన్నా వాళ్ళు ఇవ్వాల్సిన అప్పులవాళ్ళు ఇంటికొస్తారు.చాలి చాలని ఆ జీతం తో రాజు వాళ్ళ నాన్నరామకృష్ణ ఎలాగోలా ఇంటి బండి ని లాక్కొస్తున్నారు. సరైన అవగాహన లేక రామకృష్ణ గారు, రాజు వాళ్ళ గురించి చాలా అప్పులు చేస్తారు.ఇప్పుడు రాజు చేతికి వచ్చాడు అప్పులు తీర్చగలడు కాని తను దేనిలోనైనా ఒక దానిలో సెటిల్ అవ్వడానికి ఒక సంవత్సరం అయినా పడుతుంది.కాబట్టి ఇప్పుడే ఇంటి బాధ్యతలను తీసుకోలేడు.ఒక రోజు ఆ అప్పులబాధ భరించలేక రామకృష్ణ గారు రాజు ని పెళ్ళి చేసుకో, ఎంతో కొంత కట్నం వస్తుంది.దానితో మన అప్పులన్నీ తీరిపోయి హ్యాపీ గా ఉండవచ్చునని అంటారు.అది చెప్పడానికి బాగుంది కానీ నాకు ఇప్పుడప్పుడే పెళ్ళి ఉద్దేశం లేదు అని రాజు వాళ్ళ నాన్న రామకృష్ణ గారితో చెబుతాడు. నా కాళ్ళ మీద నేను నిలబడగలిగి ఎంతో కొంత సంపాదిస్తుంటే బాగుంటుంది. అప్పటిదాక నేను పెళ్ళి చేసుకోకూడదనుకున్నాను.కానీ రోజు రోజు కి ఇంట్లో సమస్య లు ఎక్కువవుతున్నాయ్.వీటన్నింటిని వదిలి ఎక్కడికైనా దూరంగా వెళ్ళాలనిపిస్తుంది,కాని వాళ్ళని వదిలి ఉండలేను.కాబట్టి శాశ్వతంగా వదిలి వెళ్ళాలని నిర్ణయించుకున్నా.అని ఒక లెటర్ రాసి అక్కడ పెట్టి వెళ్తాడు రాజు. అంతకు ముందే చూసుకున్న సూసైడ్ స్పాట్ దగ్గరకువస్తాడు. అక్కడ ఆల్‍రెడీ ఒక వ్యక్తి వచ్చి ఉంటాడు.అతనితో మట్లాడిన కొద్దిసేపటికే రాజు కి తెలుస్తుంది,అతను కుడా సూసైడ్ చేసుకోడానికే వచ్చాడని.అప్పుడు రాజు కు కారణం అడగాలనిపించలేదు ఎందుకంటే ఎవరికి సంబందించిన బాధలు వారికి ఉంటాయి కదా అని.మాటల సందర్బంలో తన పేరు రాజు అని చెప్పి,మీ పేరు... అని అతన్ని అడుగుతాడు.అతడు తన పేరు ఆనంద్ అని సమాధానమిస్తాడు.కొద్దిసేపటి తర్వాత అక్కడకు శ్రీను అనే ఇంకో వ్యక్తి వస్తాడు.తనుకుడా అదే ఘనకార్యం చేద్దామనే వచ్చింది.ముగ్గురూ మాట్లాడుకొని ఆలోచిస్తుంటారు ఎవరు ముందు చావలి అని.... ఇంతలో ఆనంద్ ... మీ సమస్యలెమిటో నాకు తెలియదు కాని నాది చాలా పెద్ద సమస్య "సో" నేను ముందు చనిపోతాను...ప్లీజ్...ప్లీజ్....అంటూ వేడుకుంటాడు. రాజు తనకు తెలిసిన అనుభవంతో చనిపోయే ముందు మనకు బాగా ఇష్టమైన, కాన్ఫిడెంట్ అని అనుకున్న పనిని చేసి చనిపోతే స్వర్గానికి చేరుతాం అని అంటాడు.అప్పుడు శ్రీను, తనకు రేపు ఎక్జామ్ మొబైల్ కంప్యూటింగ్ ఉందని,ఆ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టమని,దానిలో మా కాలేజ్ ర్యాంకర్ కన్నా కూడా నేనే బాగా రాస్తాను.అది మా ఫ్రోఫెసర్ కి కూడా తెలుసు అని అంటాడు. అయితే నువ్వు రేపు ఆ ఎక్జామ్ రాసి సాటిస్ఫైడ్ అయ్యి అప్పుడు చనిపో అని చెబుతాడు రాజు. మరి .. నువ్వు ఏం చేస్తావు? అని రాజు ను శ్రీను అడుగుతాడు.నేను సాటిస్ఫై కావడానికి చిన్న చిన్న పనులు ఏమి లేవులే వాటికి చాలా తతంగం ఉంది. అయిన పర్వాలేదు నేను ఎల్లుండు చస్తా అని అంటాడు. మీరు ఎప్పుడైన చనిపోండి నేను మాత్రం ఈ రోజు కచ్చితంగా చనిపోవాల్సిందే అని అంటాడు ఆనంద్. అయితే సరే నీ ఇష్టం అని అనుకుంటూ అక్కడినుండి వెళ్ళిపోతారు రాజు,శ్రీను లు. ఆనంద్, నాన్న నన్ను క్షమించండి అనుకుంటూ అక్కడవున్న బావి లో దూకి చనిపోతాడు. ఆనంద్ చనిపోయాడని విషయం తెలిసిన వెంటనే పరుగెత్తుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు రాజు. అప్పుడు తనలో తాను ఇలా మదనపడ్డాడు...నిన్న నాతో గంటల కొద్దీ మట్లాడిన ఆనంద్ ఇప్పుడు శవమై పడి ఉన్నాడు. ఆనంద్ చనిపోయాడని తెలిసి స్ప్రుహ కోల్పోయిన ఆనంద్ వాళ్ళ అమ్మగారు.శవం పై మీద మీద పడి ఏడుస్తున్న వాళ్ళ నాన్న.ఇంతకీ తను ఎందుకు సూసైడ్ చేసుకున్నాడో అని తన రూమ్ లోకి వెళ్ళి చూసా అక్కడ ఏదో పేపర్ మే బి అది ఆనంద్ రాసినదే అనుకుంటా అని వెళ్ళి దాన్ని చూసా. యస్ అది ఆనంద్ రాసిన "సూసైడ్-నోట్". ఆనంద్ కి వాళ్ళ నాన్న ఒకసారి లక్ష రూపాయలు దాయమని ఇస్తే వాటిని పోగొట్టుకొని వస్తాడు.అవి పోయిన విషయం వాళ్ళ నాన్న కి చెప్పడానికి భయపడతాడు, ఎందుకంటే ఆనంద్ వాళ్ళ నాన్న మనుషులకంటే డబ్బునే ఎక్కువ ప్రేమిస్తాడు.ఒకవేళ ఆనంద్ ఈ విషయం చెప్తే ఖచ్చితంగా ఆనంద్ ని చంపేస్తాడని అతడి భయం... శవం పై మీద మీద పడి ఎడుస్తున్న వాళ్ళ నాన్న కు అది తెలిసి ఇంకా ఎక్కువగా రోదిస్తూ.... అయ్యో దేవుడా లక్షరూపాయలు పోగొట్టుకున్నావని చనిపోయావా.ఇక మిగిలిన లక్షల ఆస్తి ఎవరు అనుభవిస్తారు రా నాన్న....అంటూ బిగ్గరగా ఏడుస్తూ కన్నీరు మున్నీరు అవుతాడు. ఎంత విచిత్రం అదే విషయం ఆనంద్ వాళ్ళ నాన్నకు ముందే చెప్పితే ఎంత బాగుండేది అనిపించింది ఒక్కసారి రాజు కి... ఇంతలో ఈ రోజు సూసైడ్ చేసుకోబోయే శ్రీను గుర్తుకువస్తాడు.వెంటనే అక్కడ నుండి బయలుదేరి శ్రీను వాళ్ళ ఇంటి వైపు వెళ్తుంటాడు.ఇంతలో శ్రీను నే ఎదురై ఆనంద్ ని చూసొచ్చావా అని రాజు ని అడుగుతాడు.అవును అన్నట్లుగా తల ఊపిన రాజు ని చూసి కంటతడి తో ఇలా అంటాడు...... కష్టమో,నష్టమో ఏదైనా బ్రతికి సాదిద్దాం చచ్చి ఏం ప్రయోజనం అని..... ఇలా తను మాట్లాడుంటే రాజు కు కూడా ఏంతో సంతోషంగా అనిపించింది. ఆనంద్ చావు శ్రీను లో కొంత మార్పును తెచ్చింది.తను చనిపోవాలి అని అనుకున్న డెశిషన్ మార్చుకున్నాడు. అప్పుడు శ్రీను ని రాజు అడిగాడు అసలు నువ్వెందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నవని,దానికి శ్రీను సమాదానమిస్తూ.. నాన్న ప్రతీరోజు కాలేజ్ కి వెళ్ళేటప్పుడు అయ్యా!!మంచిగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేసి,ఈ కాక హొటల్ ని పెద్ద 5 స్టార్ హొటల్ చేయాలని అంటూ ఉంటాడు.కాని రాస్తున్న ఎక్జామ్స్ లో మూడు సబ్జెక్ట్స్ సరిగా రాయలేకపోయా అంటాడు.అందుకే నాన్న ఆశలను నేను నెరవేర్చలేకపోతున్న అందుకే చావాలనుకున్నా. కాని ఆనంద్ ని అలాచూసి ఏదైనా బ్రతికిసాధిద్దాం అని అనిపించింది. అప్పుడు సూసైడ్ చేసుకోవాలనే వారికి ఏం చెప్పి వారిని ఆపాలో తెలిసేది కాదు. కాని ఇప్పుడు మాత్రం జీవితం యొక్క విలువేంటో కొంచెం చెప్పగలను అని అనిపిస్తుంది అనుకున్నాడు రాజు. చనిపోతే భాధలు,సమస్యలు అన్నీ తీరిపోతాయని అందరూ అనుకుంటారు కానీ మిగిలున్న వారికి ఎంతో భారం అవుతుందని ఇప్పుడే తెలిసింది.. ఇప్పుడు జెనరేషన్ లో సూసైడ్ ఒక ఫ్యాషన్ అయ్యింది.అదృష్టం కలిసిరాక కొంతమంది,అప్పులబాధ బరించలేక కొంతమంది,లవ్ ఫెయిల్ అయ్యిందని కొంతమంది,ఎక్జామ్ ఫెయిల్ అయ్యారని ఇంకొంతమంది.అమ్మ తిట్టిందని,నాన్న కొట్టాడని,పరువు పోయిందని,కష్టపడినా ఫలితం దక్కలేదని కొంతమంది,బాధ్యతలు ఎక్కువయ్యాయని,తగ్గని రోగం తనకు ఉందని ఇలా చాలా రకాలుగా కారణాలు ఉన్నాయి సూసైడ్ చేసుకోడానికి. జీవితం అనేది చాలా విలువైనది.ఎంతో పుణ్యం చేసుకుంటే గాని మనిషి గా పుట్టడం జరగదు.అలాంటి జీవితాన్ని ఏవో చిన్న,చిన్న సమస్యలకు బలి ఇవ్వడం ఎంతవరకు సమంజసం.తప్పు చేసిన వారైన సరే "ఆత్మహత్య" చేసుకోవడం అనేది చాలా నేరం. ఒక ఊరిలో దుర్మార్గుడు,బహిష్కరింపబడిన వాడు వేరొక ఊరిలో రాజు లా బ్రతుకవచ్చు. ప్రపంచం మొత్తం నాశనమై నువ్వు ఒక్కడివే బ్రతికి ఉన్న మళ్ళీ నువ్వే ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించగలవు అంత శక్తి ఉంది మనిషికి... ఎందుకంటే ప్రపంచాన్ని సృష్టించినది మనిషే కదా...! అని అనుకుంటూ ఇంటికి వెళ్ళాడు.                                                                                                                                            

మరో మృగం

మరో మృగం                                                                  శ్రీమతి శారద అశోకవర్ధన్ నిశీధిని చీల్చి నెమ్మది నెమ్మదిగా  పయనిస్తున్న  మార్తాండుడు మధ్యాహ్నం అయ్యేసరికి ఉద్వేగంతో ఉరకలు వేస్తున్నాడు. ఆ టైములో ఉద్యోగాలు చేసేవాళ్ళెవ్వరూ  ఇంట్లో వుండరు. ఇంట్లో వుండే వాళ్ళయితే ఎయిర్ కండిషన్ల మధ్యా, ఎయిర్ కూలర్ల మధ్యా, పంఖాల కిందా కునుకుతీస్తూ వుంటారు.     చలికి తట్టుకోలేక  పక్షులు కూడా బయటికి రావు. ఆకుల మాటున ఎక్కడో నక్కి నక్కి కూర్చుంటాయి. పాతికేళ్ళయినా  పట్టుమని  నిండని సింధూజ ఏదో ఇంగ్లీషు నవల చదువుతూ  నిద్రలోకి  జారుకుంది.     సింధూజ ఎమ్.ఎస్.సి. చదివింది. చదువయిందో లేదో ఒక ప్రయివేట్ కంపెనీలో ఉద్యోగం వస్తే చేరింది. అలా చేరి మూడు నాలుగు నెలలయిందో లేదో నవనీత్ తో పెళ్ళి జరిగిపోయింది.     నవనీత్ కి హైదరాబాద్ లో పెద్ద కంప్యూటర్ కంపెనీలో ఉద్యోగం రావటం, సింధూజ తన ఉద్యోగానికి స్వస్తి చెప్పి హైదరాబాద్ రావడం అంతా గబగబా జరిగిపోయాయి.     ఇల్లు సర్దుకోవడానికి, మద్రాసు నుంచి హైదరాబాదొచ్చిన వాతావరణానికి అలవాటు పడడానికి కొంత టైము పట్టింది. అంతలోనే సింధూజకి  తనలో కలుగుతున్న మార్పుల గుర్తులు అర్ధమయ్యాయి.     అందుకే కొన్నాళ్ళపాటు, బిడ్డపుట్టి  కాస్త పెరిగేదాకా  ఉద్యోగ ప్రయత్నాలు  చేయకూడదని  నిర్ణయించుకుంది. అందుకే రోజూ లైబ్రరీ నుంచి ఏవేవో పుస్తకాలు తెప్పించుకుని, పరీక్షకి వెళ్ళేదానిలా  చదివేస్తూ వుంటుంది.     "సింధూ....నీ బొజ్జలోని  బాబు ఒట్టి పుస్తకం పురుగులా  అయిపోతాడు జాగ్రత్త" అనేవాడు నవనీత్.     "మరేం చెయ్యను? ఊరికే తిని కూర్చుంటే  తిండిపోతుగా, అసలేమీ చేయకుండా  ఉంటే సోమరిపోతులా ఉంటాడేమోనని కూడా భయం. అందుకే పుస్తకం పురుగులా పుట్టినా  ఫరవాలేదని  చదువుతున్నాను" అనేది నవ్వుతూ సింధూజ.     "బాబోయ్! నీలా వసపిట్టపుడతాడేమో?" కొంటెగా అనేవాడు నవనీత్.     "పోన్లెండి! మరీ మీలా ముంగిలా  ముడుచుకుపోకుండా  వుంటే చాలు" కవ్విస్తూ అనేది సింధూజ.     "నేను ముంగినా...." ఆమెని చుట్టేసేవాడు అతను.     "కాదు....వొదలండి" విలవిల లాడిపోయేది ఆమె.     ఆ తరువాత ఇద్దరూ  సినిమాకో, షాపింగుకో, షికారుకో వెళ్ళిపోయేవారు.     ఈ జంటని చూసి ఈర్ష్యపడేవి కొన్ని కళ్ళు!     ముచ్చటపడేవి కొన్ని కళ్ళు!     అసూయ చెందేవి కొన్ని కళ్ళు!     ఆశీర్వదించేవి కొన్ని కళ్ళు!     నిద్రలో వున్న సింధూజ కాలింగ్ బెల్ మోగేసరికి నవనీత్ వచ్చేశాడేమో అనుకుంటూ  గబుక్కున లేచి వెళ్ళి తలుపుతీసింది.     "ఓ....నువ్వా శరభయ్యా....బాగున్నావా? అయ్యగారు పంపారా?" అడిగింది.     ఏమనాలో  తెలియక వాడు తదేకంగా ఆమెనే తినేస్తున్నట్టు  చూశాడు.     సింధూజ అతని 'వాడి' చూపులకి తట్టుకోలేక, అర్ధం తెలీక కళ్ళు కిందకు దించుకుంది. అప్పుడర్ధమయింది ఆమెకి తను గభాల్నలేచి రావడంలో పమిట జారివుందని. సిగ్గుతో క్షణంలో పమిట సరిచేసుకుంది.     తన మనసులోని కంగారుని అతనికంట పడకుండా  జాగ్రత్త పడుతూ "అయ్యగారేమన్నా చెప్పమన్నారా?" మళ్ళీ అడిగింది.     "లేదమ్మగోరూ! నేనే వచ్చా. అర్జంటుగా ఒక రెండు వేలు కావాలమ్మ గోరూ! కిందటిసారి అయిదొందలూ, ఈ రెండువేలూ కలిపి వచ్చేనెల యిచ్చేస్తాను. ఎల్.ఐ.సి లోనుకి పెట్టాను" అన్నాడు నీళ్ళు నములుతూ.     "అంత డబ్బు నాదగ్గరెక్కడుంటుంది శరభయ్యా? అయ్యగారినే అడుగు" అంది.     "అయ్యబాబోయ్! అయ్యగారినే. మొన్ననే కేకలేశారు, నీకు ఊరినిండా అప్పులున్నయ్ పొమ్మని." నెమ్మదిగా అన్నాడు.     "మరి నేనేం చెయ్యను చెప్పు? నీ సంసారమా గంపెడంత. ఇద్దరు పెళ్ళాలు. ఏడుగురు పిల్లలు. ఎంతని అప్పులు చేస్తావ్? అయినా అంత అర్జంటుగా ఇప్పుడు రెండు వేలెందుకు?" అంది సోఫాలో కూర్చుంటూ.     "నా చిన్న భార్యని డాక్టరుకి చూపించాలి. నాలుగో నెలట. పెద్దభార్య పెద్ద కొడుకుకి యాదగిరి గుట్టమీద పుట్టు వెంట్రుకలు తీయిస్తానని మొక్కుకుందట పెద్దామె. ఇంకా ఇంట్లో...."     "ఆ....ఆ....చాల్లే పురాణం. ఇవన్నీ నన్నడిగితే అనవసరపు ఖర్చులే. ఇలా అప్పులు చేసి ఎన్నాళ్లు గడుపుతావు? పైగా చిన్న భార్య మళ్ళీ గర్భవతి అంటున్నావ్? ఇలాగయితే ఎలా?"     శరభయ్య మాట్లాడకుండా  తలదించుకున్నాడు.     కాసేపు వారిమధ్య  మౌనం గంభీరంగా నుంచుంది.     "ఎట్టాగయినా మీరే దయ సూపించండి అమ్మగోరూ!" నసిగాడు.     "ఎట్టాగయినా అంటే ఎలాగయ్యా? చిన్న చిన్న అమౌంట్లంటే నువ్వడిగినప్పుడల్లా  ఇస్తూనే వున్నాను. రెండువేలు నా దగ్గర రెడీగా ఎందుకుంటాయి చెప్పు?" టీపాయ్ మీదున్న పేపర్లను సర్దుతూ  చెప్పింది సింధూజ.     "కాస్త మంచినీళ్ళిప్పించండి అమ్మగోరూ!" అన్నాడు ఎండిపోతున్న గొంతులోంచి కీచుగా వస్తున్న మాటలతో.     "అలాగే. వుండు, కాఫీ కూడా చేస్తాను. పాపం, ఆశతో అంత దూరం నుంచి వచ్చావు" అంటూ లోపలికి వెళ్ళింది సింధూజ.        ఎప్పుడు శరభయ్య వచ్చినా, వాడికి కాఫీ ఇచ్చి పంపిస్తుంది. ఆఫీసులో లేటయితే, ఫైళ్ళూ, టిఫిను క్యారియరూ శరభయ్యకిచ్చి ఇంట్లో ఇచ్చి రమ్మని పంపిస్తాడు నవనీత్. లేదా శరభయ్యకి యాభయ్యో వందో అప్పుకావాలంటే నవనీత్ ని అడగకుండా, సింధూజని అడుగుతాడు వాడు.     "వాడు నన్నడగకుండా, నిన్నడుగుతాడేమిటి అప్పు?" నవ్వుతూ అనేవాడు నవనీత్.     "మీ పేరే నవనీత్ గాని, మీరు మహాగట్టి. అందుకే మీ దగ్గర అప్పు దొరకదని నన్నడుగుతాడు" కిలకిలా నవ్వుతూ అనేది సింధూజ.     "అవును. నువ్వు సార్ధకనామధేయురాలివి. సింధూ నదంతటి హృదయం. నదిలోంచి  పుట్టిన లక్షీదేవంతటి కారుణ్యం!" వ్యంగ్యంగా అనేవాడు నవనీత్.     సింధూజ మంచినీళ్ళందించింది.     గడగడా తాగేశాడు శరభయ్య.     సింధూజ టీ పెట్టడానికి లోపలికెళ్ళింది.     వేడి వేడి టీ కప్పుతో  ముందు హాల్లోకి వచ్చేసరికి  శరభయ్య కనిపించలేదు.     టీపాయ్ మీద కప్పు పెట్టి శరభయ్యకోసం  గుమ్మం వరకు వచ్చి చూసింది. శరభయ్య లేడు.     "ఏమిటో నిలకడలేని మనిషి. డబ్బులేదు అనేసరికి నిరాశ పడినట్లున్నాడు. మరో చోటికి పరుగెత్తి ఉంటాడు. ఎప్పుడూ ఇంతే. టీ అయినా తాగకుండా పోయాడు" అనుకుంది సింధూజ.     తలుపులు మూసి వచ్చి టీ కప్పు అందుకుంది. తానే తాగేసేందుకు సిద్ధపడింది.     అంతలో తలుపు టక టక కొట్టారెవరో.     సింధూజ టీ కప్పు టీపాయ్ మీద పెట్టి  వెళ్ళింది.     తలుపులు తీసింది.     ఎదురుగా పొట్టిగా, నల్లగా  ఉన్న ఓ యువకుడు నిలబడి వున్నాడు.     "ఏం కావాలి?" అడిగిందామె.     "పాత పేపర్లు కొంటాం. పోయిన వారం వస్తే మీ వారు వారం తర్వాత రమ్మన్నారు. పేపర్లు అమ్ముతారా?" అడిగాడతను.     "ఊహూ.... పేపర్లు కావాలంటే ఆదివారం నాడు వస్తే ఆయన ఉంటారు. అప్పుడు అమ్ముతారు...." అంది సింధూజ.     వాడు కళ్ళు పెద్దవి చేసుకొని  ఆమె చేతి ఉంగరాలనీ, మెళ్ళో గొలుసుని చూశాడు.     ఆమె ఎత్తయిన వక్షాల వైపు లొట్టలు వేస్తూ కళ్ళప్పగించి చూస్తున్నాడు.     సింధూజ అది గమనించింది.     పైట సరిచేసుకుంది.     "నువ్వు వెళ్ళొచ్చు. ఆదివారం రా" అని తలుపులు వేసేసింది.     టకటక మంది తలుపు.     టక్కున వెనక్కి తిరిగి వచ్చి తలుపులు తీసింది.     మళ్ళీ వాడే!     "ఏమిటీ" అన్నట్టు చూసింది.     "ఆదివారం నాడు ఉదయం రమ్మంటారా? సాయంత్రమా?" వాడు ఆ మాట అడుగుతూ ముందు హాలుని పరిశీలనగా చూడసాగాడు.     వాడి ప్రవర్తనకి చిరాకు కలిగింది సింధూజకి.     "ఉదయం పదకొండు గంటలకి వస్తే ఆయన ఇంట్లో ఉంటారు."     "ఇప్పుడు లేరా?"     "లేరు!"     "ఎప్పుడొస్తారు?"     "సాయంత్రం. అయినా ఇవన్నీ  నీకెందుకు? ఆదివారం రా" అంటూ తలుపులు వేసేసింది.     తలుపులు వేస్తూ చూసింది సింధూజ.     ఎదురింటి మేడ బాల్కనీలోంచి  అతను తను ఇంటివైపే చూస్తున్నాడు.     పనీపాటా లేదనుకుంటాను.     నాలుగు రోజులక్రితంను కూరగాయల బండి వచ్చినపుడు కొంటూ ఉంటే....తనుకూడా వచ్చి కూరగాయలు కొనేవాడిలాగా ఫోజు.     తననే తినేసినట్టు చూస్తున్నాడు. ఆ చూపులకి  తనకి ఒళ్ళు చచ్చిపోయింది.     వెధవకి అంత వయసు వచ్చినా బుద్దిలేదు. వెకిలి వేషాలూ వాడూను అనుకుంటూ తలుపులు దగ్గరకి వేసేసి లోపలికెళ్ళింది సింధూజ.     మరో అయిదు నిముషాల తర్వాత వంటగదిలో ఉన్న సింధూజ ఏదో చప్పుడు వినిపించి వెనక్కి తిరిగి చూసింది.     అంతే - ఒక్కసారిగా గావుకేక పెట్టింది.         *    *    *     పోలీసులు ఇంటి ముందు జనాన్ని కంట్రోలు చేయడానికి ప్రయాసపడుతున్నారు.     లోపల సింధూజ అనే, ఆ ఇంట్లో ఉండే ఆమె ఆ మధ్యాహ్నం హత్య చేయబడిందని అందరికీ తెలిసిపోయింది.     సింధూజ భర్త నవనీత్ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు.     పక్కనే నిల్చున్న  శరభయ్య అతన్ని ఓదారుస్తున్నాడు.     పోలీసులు అటూ ఇటూ హడావుడిగా తిరుగుతున్నారు. ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీస్తున్నారు.     సింధూజని దారుణంగా రేప్ చేసి చంపేశారు.     ఆమె ఒంటిమీద నగలు దోచుకున్నారు.     కత్తిపీటతో ఆమె గొంతు కోశారు.     ఆ కర్కోటకులకు ఆమె గర్భవతి అనే దయ కూడా లేనట్టుంది.     అయ్యో పాపం! ఎంత ఘోరం జరిగిపోయింది.     రకరకాలుగా జనం చెప్పుకుంటున్నారు.     పోలీసులు ఆ కేసుకి సంబంధించి విషయ సేకరణ మొదలెట్టారు.     శవాన్ని అంబులెన్స్ లో పోస్ట్ మార్టంకి పంపారు.     ఆ రోజు నవనీత్ ఆఫీసుకి వెళ్ళాక ఆ ఇంటికి ఎవరెవరు వచ్చారో ఎంక్వయిరీ చేయసాగాడు ఇన్ స్పెక్టర్.     పక్కింట్లో ఉండే నలభై అయిదేళ్ళ సుభద్ర చెప్పింది: "ప్రొద్దుట నవనీత్ గారు వెళ్ళిపోయాక నేను సింధూజని పలకరించానండి.     "ఆయన ఉన్నారా?" అని అడిగాను.     "ఆఫీసుకి వెళ్ళింది పది నిమిషాలయిందని" ఆమె చెప్పింది. ఆ తరువాత మధ్యాహ్నం రెండుగంటల ప్రాంతంలో నవనీత్ ఆఫీసులో పనిచేసే శరభయ్య రావటం చూశాను" అని చెప్పింది సుభద్ర.     "ఆ తర్వాత ఎవరైనా  ఈ ఇంటికీ  రావటం చూశారా?" అడిగాడు ఇన్ స్పెక్టర్.     "ఆ తర్వాత నేను చూడడం వీలు పడలేదు. ఇంటిపనిలో  ఉండిపోయి బైటికి రాలేదు. అయితే ఆ ఎదురింట్లో  మేడమీద ఉండే మన్మధరావుని అడిగితే తెలియవచ్చు" అంది సుభద్ర.     "అతను ఎలా చెప్పగలడు?" సందేహం వ్యక్తం చేశాడు ఇన్ స్పెక్టర్.     "అతనికి పనీపాటా లేదు. నలభై అయిదేళ్ళ బ్రహ్మచారి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ మేడ మీది బాల్కనీలో నిలబడి వచ్చేపోయే ఆడవాళ్ళని  చూడటం అలవాటు. అతని దృష్టి ఎప్పుడూ  సింధూజ మీదే ఉన్నట్లు నేను గమనించాను. సింధూజ తలుపు తెరిస్తే చాలు - ఆమెని తినేసేటట్టు  చూస్తుంటాడు. అందుకే అతన్ని అడగండి" అంది సుభద్ర.     ఇన్ స్పెక్టర్ మన్మధరావుని పీల్చుకు రమ్మని కానిస్టేబుల్ ని పంపాడు. అయిదునిముషాల్లో  మన్మధరావు హాజరయ్యాడు.     "మీరేనా మన్మధరావు?"     "అవునండి!"     "మీరెక్కడుంటారు?"     "ఆ ఎదురు మేడమీద గదిలో."     "ఏం ఉద్యోగం చేస్తుంటారు?"     "లాండ్ బిజినెస్ చేస్తున్నాంటాను."     "ఈవేళ నవనీత్ వాళ్ళ ఇంటికి ఎవరెవరు వచ్చారో చెప్పగలరా?"     "ఆ....మధ్యాహ్నం ఒంటిగంటన్నరకి కూరగాయల వాడు వచ్చాడు. రెండుగంటలకి నవనీత్ ఆఫీసులో పనిచేసే శరభయ్య అనే అతను వచ్చాడు. తర్వాత పేపర్లవాడు వచ్చాడు."     "నవనీత్ ఆఫీసులో పనిచేసే అతనంటే ఈయనేనా."     నవనీత్ పక్కనే ఉన్న శరభయ్యని చూపించి అడిగాడు ఇన్ స్పెక్టర్.     "అవును" అన్నాడు మన్మధరావు.     "ఇతని పేరు శరభయ్య అని మీకెలా తెలుసు?     "చాలాసార్లు ఈ ఇంటికి వస్తూ పోతూ ఉండటం గమనించి అతని పేరుని తెలుసుకున్నాను."     "ఈరోజు మొత్తం వచ్చిన వాళ్ళు అంతేనా?" అడిగాడు ఇన్ స్పెక్టర్     మన్మధరావు ఓసారి కళ్ళు మూసుకుని ఆలోచించాడు.     "ఆఁ ....గుర్తొచ్చిందండి. సరిగ్గా మూడు గంటలకి నవనీత్ తన ఇంట్లోంచి  హడావుడిగా బయటకి వెళ్ళటం చూశాను" అన్నాడు మన్మధరావు.     ఆ మాట విని నవనీత్ షాక్ తిన్నాడు.     "ఇన్ స్పెక్టర్ గారూ! ఇతను అబద్ధం చెప్తున్నాడు. సరిగ్గా  మూడుగంటలకి నేను ఆఫీసులో స్టాఫ్ మీటింగులో వున్నాను" అన్నాడు.     ఆఫీస్ స్టాఫ్ లో నలుగురైదుగురు నవనీత్ మాటని సపోర్ట్ చేశారు.     నవనీత్ ఆఫీసులో, మీటింగ్ లో ఉంటే ఆ సమయంలో ఇంట్లోంచి  బయటికి వెళ్ళటం చూశానని మన్మధరావు చెప్పటం ఏమిటి? కావాలని చెప్తున్నాడా? తప్పుదారి పట్టించడానికి  చెప్తున్నాడా? అలా చెప్పటం వలన అతనికేమి ప్రయోజనం?     ఇన్ స్పెక్టర్ కి ఏం పాలుపోలేదు.     "మీరు నవనీత్ ని సరిగ్గా చూశారా?"     మళ్ళీ మన్మధరావుని అడిగాడు ఇన్ స్పెక్టర్.     "చూశాను." నమ్మకంగా చెప్పాడు మన్మధరావు.     "నవనీత్ బైటికి వెళ్ళేటప్పుడు ఏ బట్టల్లో ఉన్నారో గుర్తుందా?"     "ఆ....రోజ్ కలర్ గళ్ళ షర్టు, బ్లాక్ పాంటు. చేతిలో పెద్ద బ్యాగ్ కూడా ఉంది." చెప్పాడు మన్మధరావు.     ఇన్ స్పెక్టర్ నవనీత్ వైపు చూశాడు.     అతను వైట్ షర్ట్, గ్రే కలర్ పాంట్ లో ఉన్నాడు.     "మీరు ఈవేళ ఉదయం నుంచి డ్రెస్ మార్చారా?"     "లేదు. ఉదయం ఆఫీసుకి వెళ్ళేటప్పుడు  ఈ డ్రెస్ లోనే వెళ్ళాను. ఈ ఘోరం గురించి తెలిసి ఆఫీసు నుంచి ఇలాగే వచ్చాను."     ఇన్ స్పెక్టర్ మన్మధరావు వైపు సూటిగా చూశాడు.     "నీవు నవనీత్ గారిని ఆ బట్టల్లో చాలాసార్లు చూశాను. అందుకే చెప్పగలుగుతున్నాను" అన్నాడు మన్మధరావు.     అంతలో కానిస్టేబుల్ పేపర్లు కొనే వ్యాపారం చేసే సైదులు అనే యువకుడ్ని  వెంటబెట్టుకు వచ్చాడు.     అతన్ని ప్రశ్నించిన తరువాత కూడా ఎలాంటి క్లూ దొరకలేదు.     ఇన్ స్పెక్టర్ ఆలోచిస్తూ నవనీత్ ని నిశితంగా పరిశీలించాడు.     జరిగిన సంఘటనకి  అతను బాగా బాధపడుతున్నాడు. ఎటో శూన్యంలోకి  చూస్తున్నాడు. తనలో తను గొణుక్కుంటున్నాడు.     అతని పక్కనే శరభయ్య నిలబడి నవనీత్ ని ఓదారుస్తున్నాడు.     ఉన్నట్లుండి  ఇన్ స్పెక్టర్ దృష్టి శరభయ్య మెడమీద నిలిచింది.     అక్కడ ఎర్రగా చిన్న గాయం కనిపించింది. శరభయ్యని దగ్గరికి పిలిచాడు ఇన్ స్పెక్టర్.     "ఏమైందిక్కడ?" అడిగాడు.     శరభయ్య కంగారు పడ్డాడు.     "అబ్బే, ఏం లేదు నిన్న మా అబ్బాయి నాతో ఆడుతూ గోరుతో గిచ్చాడు" అన్నాడు శరభయ్య.     ఇన్ స్పెక్టర్ జాగ్రత్తగా పరిశీలించాడు. అది నిన్నటి గాయంలా లేదు. రక్తం ఇంకా మెరుస్తోంది. ఇన్ స్పెక్టర్ కి అనుమానం దృడపడింది.     "శరభయ్యా, నిన్ను అరెస్టు చేస్తున్నాం!" అన్నాడు.     అందరూ కంగారుపడ్డారు.         *    *    *     ఇంటరాగేషన్ లో శరభయ్య నేరం ఒప్పుకున్నాడు. మానభంగం,  హత్య, దొంగతనం కేసులు ఆధారాలతో నిరూపించబడ్డాయి. శరభయ్యకి ఉరిశిక్ష వేశారు.     ఆరోజు జరిగిన విషయం శరభయ్య వివరించాడు:     "నాకు డబ్బు ఎంతో అవసరం వచ్చింది. అప్పు అడుగుదామని సింధూజ గారి దగ్గరికి వచ్చాను. ఆమె చాలాసార్లు  నాకు అవసరానికి వంద రెండువందలు ఇస్తూ ఉండేవారు. కానీ రెండువేలు ఇవ్వటానికి ఆమె ఒప్పుకోలేదు. కాని నా అవసరం నన్ను ఎంతో టెన్షన్ కి గురి చేసింది. వేరే మార్గం కనపడలేదు.     అప్పుడు నా దృష్టి సింధూజ ఒంటిమీద ఉన్న నగలు, ఉంగరాల మీద పడింది. అవి దొంగిలిస్తే చాలు - నా అవసరం తీరుతుంది అనుకున్నాను. ఆశ, అవసరం అనే మృగాలు నాలో నిద్రలేచాయి.     సింధూజ టీ తేవటానికి వంట గదిలోకి వెళ్ళినప్పుడు  నేను పక్క గదిలోకి వెళ్ళి అక్కడ నాకు కనిపించిన కత్తిపీటని సిద్ధం చేసుకున్నాను. అంతలో పేపర్లవాడు వచ్చి మాట్లాడి వెళ్ళాడు. వాడు వెళ్ళాక నేను వంటగదిలోకి వెళ్ళాను. సింధూజ కత్తిపీటతో నిలబడ్డ నన్ను చూసి గావుకేక పెట్టబోతే నోరు నొక్కేశాను.     ఆ సమయంలో నాలో దాగివున్న  కామం అనే మృగం మేల్కొంది. అంతే. ఆమె నోట్లో గుడ్డలుకుక్కి  అరవకుండా  చేశాను. నా కోరిక తీర్చుకున్నాను. ఆమె ఎంతో పెనుగులాడింది. నన్ను రక్కింది. అయినా, నా బలం ముందు ఆమె ప్రయత్నం ఫలించలేదు. నా కామానికి బలైపోయిన సింధూజని కత్తిపీటతో గొంతుకోశాను. ఆమె ఒంటిమీద నగలు ఒలుచుకున్నాను. మూట కట్టుకున్నాను. నా బట్టలు రక్తసిక్తం అయ్యాయి. వాటిని విప్పి నవనీత్ గారి బట్టలు వేసుకున్నాను. పెద్దబ్యాగ్ లో రక్తపుబట్టలు, నగలు పెట్టుకొని బైటపడ్డాను. దారిలో ఒకచోట బట్టల్ని గొయ్యితీసి  పాతేశాను. ఇంటికెళ్ళి బట్టలు మార్చుకుని ఆఫీసుకి వెళ్ళిపోయాను. అంతే. తర్వాత  నవనీత్ గారికి ఫోన్ వచ్చింది. ఇంటి దగ్గర జరిగిన ఘోరం గురించి తెలుసుకుని ఆయన హడావుడిగా వెళ్ళారు అంతే!"     "బాబూ! ఆవిడ ఎంతో మంచి తల్లి. ఎంతో సాయం చేసింది నాకు. దేవతలాంటిది. నేను పాపాత్ముణ్ణి, దుర్మార్గుడినైపోయి ఆమెను బలి తీసుకున్నాను. మృగంలా ప్రవర్తించాను. రాక్షసుణ్ణయిపోయాను. నన్ను క్షమించకండి. నన్ను వెంటనే ఉరితీయండి?" అంటూ అరిచాడు శరభయ్య కనీళ్ళు కారుస్తూ.     శరభయ్యని చట్టం ఉరితీసింది కానీ, సింధూజని ఎవ్వరూ మళ్ళీ బతికించలేకపోయారు. మతి పోగొట్టుకొని పిచ్చివాడైన నవనీత్ ని ఏ డాక్టరూ మామూలు మనిషిని చెయ్యలేకపోయాడు.     'అయ్యో పాపం!' అంటారు అతని కథ తెలిసిన మరికొందరు.     ఎందరో శరభయ్యలు - ఎందరినని ఉరితీస్తాం ఈరోజున? శరభయ్యలని ఉరితీసి లాభంలేదు. వారిలో నానాటికి పెరుగుతున్న గొంతెమ్మ కోర్కెలు, స్వార్ధం, ధనాపేక్ష. కష్టపడకుండా  డబ్బులు కావాలి, సుఖాలు పొందాలి అనే తపన. ఎదుటివారిమీద కనీసం సానుభూతైనా ఉండని ప్రవర్తన. ముందు వాటిని ఉరితీయాలి. అందుకు ప్రతి ఒక్కరూ ఆత్మవిమర్శ చేసుకోవాలి.     అప్పుడు శరభయ్యలు పుట్టరు!     సింధూజలు చావరు!     నవనీత్ లు పిచ్చివాళ్ళుగా మారిపోరు!                  

మల్లెజడ

మల్లెజడ                                                                                                                      శ్రీమతి శారద అశోకవర్ధన్         ఊరంతా తిరిగి తిరిగి ఆకుపచ్చా, తోపుకుంకం రంగు కలిసిన కలనేత నెమలి కంఠం రంగు పట్టుకు, జానెడంత జరీ మెరిసిపోతూ  ఎంతో  అందంగా వున్న పట్టు పరికిణీ గుడ్డ కొని, దాన్లో  బొద్దుగా ముద్దుగా వుండే 'సమీక్ష'ని ఊహించుకొని మురిసిపోయింది జానకమ్మ. పసిడిరంగు శరీరానికి ఈ పరికిణీ జాకెట్టు ఎలా కొట్టొచ్చినట్టు కనిపిస్తుందో  తలుచుకుంటూ మురిసిపోయింది. ఆ చిన్ని జడకి ముద్దొచ్చే మూడు గంటల్లా ముద్దగా అమర్చిన జడకుచ్చులు ఎంత బాగుంటాయో? ఆలోచన రావడమేమిటి వెంటనే బ్యాంకుకు బయలుదేరింది. ఎన్నేళ్ళ నుంచి వున్నాయో అవి బ్యాంకులో! ఎంతో ముచ్చటపడి వాసంతికి చేయించింది ఆ జడ కుప్పులు. పద్నాలుగేళ్లు నిండేవరకూ వాసంతో ఎంతో సరదాగా ఆ జడ కుప్పులూ, జడ మధ్యన కెంపులూ ముత్యాలూ కలిపి తయారుచేసిన చామంతి బిళ్ళా, తలమీద మూడువెళ్ళ వెడల్పుతో లక్ష్మీ విగ్రహం కింద గజ్జెలూ కలిపి తయారు చేసిన నాగరం, నడుముకి వొడ్డాణం, చెవులకి రాళ్ళ జుంకీలూ, చేతికి వంకీలూ, వాసంతిని చూసిన వాళ్ళంతా సాక్షాత్తూ లక్ష్మీదేవి, చిన్ని రూపంలో వీళ్ళింట్లో వెలిసుంటుందని అందరూ ముచ్చటపడేవారు. ఎండాకాలంలో  పుట్టింది వాసంతి. వసంత ఋతువులో పుట్టిందని వసంతా, వాసంతి అని పేరు పెట్టారు జానకమ్మా రామారావుగార్లు.     మూడేళ్ళు నిండినప్పటినుంచీ, మల్లెపూలతో  పూల జడలు వేసేది జానకమ్మ వాసంతికి. ఒకరోజు వొంకీజడ, ఒకరోజు ముద్దజడ. ఇలా రోజుకో రకంగా వేసి మురిసిపోయేది జానకమ్మ. వాసంతికి లేని నగలేదు. రకరకాల నెక్లెసులూ, లోలక్కులూ, చంద్రహారాలూ చంద్రవంకలూ, ఎన్నో  ఎన్నో....! అందరూ వాసంతిని పొగుడుతూ వుంటే, మురిసి ముద్దయిపోయేది జానకమ్మ. రోజూ, ఉప్పూ, మిరపకాయలూ, నూనెలో తడిపిన గుడ్డని చుట్టూ తిప్పి కాల్చి పారేసేది పెరట్లో జానకమ్మ. ఆ తరవాత కూతురికి దిష్టి దిగిపోయిందని తృప్తిగా నిద్దరపోయేది. నిద్దట్లో కూడా  జానకమ్మకి వాసంతి ధ్యాసే! అటూ ఇటూ ఎగిరిపోయిన దుప్పటిని  సరిగ్గా కప్పి, నిద్దరపోతూన్న  వాసంతి బుగ్గలనీ, నుదుటినీ తనివితీరా నిమురుతూ, ముద్దులవర్షం కురిపించేది. "ఏయ్! అన్ని ముద్దులూ అటేనా? కాస్త ఇటు కూడా  ఇవ్వు...." అనేవారు నవ్వుతూ రామారావుగారు. "ఛీ పోండీ...." అనేది గోముగా తను. అయినా అతను బలవంతంగా అతడివేపు బలంగా లాక్కొని, కౌగిట్లో కదలకుండా  బంధించేసేవారు. ఆ పరిష్వంగంలో కోటిస్వర్గాలు చవిచూసేది జానకమ్మ. రామారావుగారు తన్మయత్వంతో ఆమె అణువణువూ  చుంబించేవారు. ఆ సమయంలో కూడా జానకమ్మగారి ఒక కన్ను వాసంతి వైపే వుండేది!         *    *    *     రామారావుగారు సికింద్రాబాదులోని  ఒక ప్రభుత్వ పాఠశాలలో హెడ్ మాస్టరుగా వుండేవారు.  ఈరోజుల్లో బడిపంతులంటే  బతకలేనివాడని అర్ధాలు చెబుతూ చిన్న చూపు చూస్తారు. అందులో ప్రభుత్వపాఠశాల  అంటే మరీనూ. కానీ ఆ రోజుల్లో మాస్టారంటే ఎంత గౌరవం! ఇంట్లో అమ్మా నాన్నల తరవాత విద్యనేర్పేటి గురువుగారంటే  దేముడితో సమానం.     జానకమ్మగారికి మూఢనమ్మకాలులేవుగానీ, మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి, మన ధర్మాన్ని మనం నెరవేర్చాలి అన్న నమ్మకం మాత్రం చాలా వుంది.  అందుకే ఉమ్మడి కుటుంబంలో వుంటూ  అందరికీ తల్లోనాలుకలా మసిలేది. అలా వుండడం అందరికీ సాధ్యంకాదు. దానికి చదువుకన్నా ఎంతో సంస్కారం కావాలి. అది జానకమ్మలో పుష్కలంగా వుంది. "ఒకదేశాన్ని పరిపాలించే మంత్రికి ఎన్నిబాధ్యతలూ బరువులూ వుంటాయో అన్ని బాధ్యతలూ అవీ ఇల్లాలికి వుంటాయి" అనేది నవ్వుతూ జానకమ్మ.పరిపాలనలో ఎన్ని గ్రూపుల వాళ్ళని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు  తీసుకోవాలో, ఇంట్లో  పరిపాలనలో కూడా అత్తా మామా, ఆడపడుచులూ, తోటికోడళ్ళూ, బావమరుదులూ, పిల్లా పాపలు, బంధువర్గాలూ, స్నేహబృందాలూ - ఇలా....ఇలా....ఎన్నో వర్గాలు అందరినీ సముదాయించుకుంటూ నడవడం ఎంత కష్టమో చెప్పఖ్కర్లేదు. అయితే ఆ రోజుల్లో అందరూ అనురాగానికీ ఆప్యాయతలకీ గౌరవాన్నిచ్చేవారు. ఇప్పటిలాగా డబ్బుని చూసి గౌరవించడమో, హోదాని చూసి పలకరించడమో వుండేది కాదు. అందుకే ఉమ్మడి కుటుంబం అంటే మమతల పందిరి అనుకునేవారు. పెళ్ళిళ్ళు కూడా నలుగురున్నవాళ్ళ కుటుంబాన్ని  ఎంచి ఎంచి చూసి చూసేవారు జానకమ్మగారి మరిది కూతురు సుమన ఇంచు మించు  వాసంతి వయసుదే! ఇద్దరికీ కలిపి నలుగు స్నానం, పూల జడలూ అన్నీ జానకమ్మగారే చేసేవారు.     గతం కళ్ళ ముందు గబగబా సినిమారీలులా  కదులుతూంటే  కారు మెల్లగా నడుస్తున్నట్టనిపించింది జానకమ్మకి. "డ్రైవర్! బ్యాంకు మూసేస్తారు. టైమయిపోతోంది. త్వరగా పోనీ.... ఇవాళ శనివారం కదా! జనం కూడా ఎక్కువగానే వుంటారు" అంది.     డ్రైవర్ స్పీడు పెంచాడు.     "కాలంలో ఎన్ని మార్పులు!' అనుకుని తన మాటకి తనే నవ్వుకుంది. కాలం మారలేదు. మనుషులే చెప్పలేనంతగా మారిపోయారు. నాగరికత అనే పేరుతో సంస్కృతినే మార్చేశారు. ఎక్కడా ఉమ్మడి కుటుంబాలు కనిపించవు. బంధుత్వంలో ప్రేమలు లేవు. ఎవరికి ఎవరూ అక్కర్లేదు. అందరికీ కావలసింది డబ్బు! డబ్బు....! డబ్బు....!         *    *    *     ఒక్క కూతురైనా అంత గారాబంగా పెరిగినా,  వాసంతి ఈ కాలం లాగా మారలేదు. దానికీ తనలాగే మనుషులు కావాలి. "అయ్యో! మరిచేపోయాను. దానికి రసాల మామిడిపళ్ళంటే ఎంత ఇష్టమో! దానికోసమని నూజివీడు నుంచి తెప్పించే వాడాయన రసాలు ఆరోజుల్లో. ఏమిటో! అదొస్తోందని తెలిసి కూడా ఆయన ఆ సంగతే మర్చిపోయారు, ఈ మగాళ్ళంతా అంతే. ఏదీ జ్ఞాపకం వుంచుకోరు." ఆలోచనల్లో మునిగిపోయిన ఆమె. "అమ్మగారూ, బ్యాంక్ వొచ్చేసింది" అనగానే ఉలిక్కిపడి తెలుపుతెరిచి దిగింది.     బ్యాంకులో వున్న  నగలన్నీ  తీసుకుని, సమీక్షని ఆ నగలలో ఊహించుకుంటూ ఇల్లు చేరుకుంది. పట్టు పరికిణీలు, మామిడిపళ్ళు కోసేవి, నగలు, మల్లెపూలు - ఇంకా ఏమిటేమిటో పట్టుకుని  కారు దిగుతున్న జానకమ్మ గారిని చూసి నవ్వుతూ ఎదురొచ్చారు రామారావుగారు.     "ఎందుకా నవ్వు?" చిరుకోపం ప్రదర్శిస్తూ  అడిగింది జానకమ్మ.     "అమెరికా....టు....ఆంధ్రా! ఇవన్నీ వాళ్ళకెందుకే? వాళ్ళ అభిరుచులు, రుచులూ, అన్నీ మారిపోయుంటాయి."     "ఏమీ మారవు. నా వాసంతి సంగతి నాకు తెలీదూ? అయినా, దాని కోసం మీరు రసాలు తెప్పించ లేదేమిటి?" అంది హడావుడిగా, తను తెచ్చిన వస్తువులన్నీ సర్దుతూ.     "సరేలే!....నీ తృప్తికోసం అవీ పట్టుకొస్తాను" అంటూ క్షణంలో పంచె మార్చుకుని బజారుకెళ్ళారు రామారావుగారు.     రామారావుగారు పళ్ళకోసం  వెళుతూవుంటే జానకమ్మ మళ్లీ పాత జ్ఞాపకాలల్లో మునిగిపోయింది.     ఆ సంవత్సరం ఎండలు విపరీతంగా వున్నయ్.  భారమైనా కొత్తావకాయా, పెరుగు, రసాలపళ్ళూ తప్ప ఎవ్వరూ  కూరలూ, పసుపులూ ముట్టుకోవడంలేదు. మంచి పళ్ళు బాగా రసమున్నవి తీసి పక్కన పెట్టింది జానకమ్మ - రాత్రి భోజనాల ముందు వాసంతి కివ్వాలని. ఇంటికెవరో  రావడంతో అత్తగారు వెంకటలక్ష్మమ్మ గారు, ఆ రెండు పళ్ళూ రసం తీసి వాళ్ళ కిచ్చింది. రాత్రి భోజనం ముందు వాసంతి మామిడిపళ్ళు  కావాలని మారాం చేసింది. రామారావుగారు వెంటనే బజారుకెళ్ళి బుట్టడు పళ్ళు కొనుక్కొచ్చారు. దాని సంతోషానికి అవధుల్లేవు. సమీక్షకి కూడా వాసంతిలాగే మామిడిపళ్ళూ, మల్లెపూలు ఇష్టమేనేమో! అసలు అమెరికాలో దొరుకుతాయా పాడా? వాళ్ళిక్కడున్నన్నాళ్లూ తిన్నన్ని మామిడిపళ్ళు  పెట్టాలి. రోజుకోరకం మల్లెపూల జడ వెయ్యాలి. మళ్ళీ వాసంతి పసిపిల్లయి తిరుగుతూన్నట్టు సమీక్షని చూసి మురిసిపోవాలి అనుకుంటూ వసంతా పూర్తిచేసి, తొట్టెలోని చల్లటి నీళ్ళతో స్నానం చేసి, కొన్ని మల్లెపూలు దండగా గుచ్చి, సిగచుట్టూ చుట్టుకుంది.     బుట్టడు రసాల మామిడి పళ్ళతో లోపలికొచ్చారు రామారావుగారు.     రామారావుగారు నిజంగా  శ్రీరామచంద్రుడి లాంటివారే. తరగని తాతల నాటి ఆస్తివున్నా అహంకారం కించిత్ కూడా లేదు. ఎమ్. ఏ, ప్యాసయి లెక్చరరుగా  ఉద్యోగం వొస్తే ఒద్దని, పసి పిల్లలతో  ఆడుతూ పాడుతూ  పాఠాలు చెప్పే బడిపంతులు ఉద్యోగాన్నే కోరుకున్నారు. "కడుపున పుట్టిన బిడ్డ ఒక్కర్తే అయినా, బళ్ళో పిల్లలంతా  నావాళ్ళే" అంటారాయన. అతణ్ణి జానకమ్మగారినీ చూసిన వాళ్ళంతా "నిజంగా వీళ్ళిద్దరూ  సీతారాములే" అంటారు.       "ఇన్ని పళ్ళు తెచ్చేరేమిటండీ ఒక్కసారిగా?" అంది జానకమ్మ ఒక్కొక్కటే తీసి లోపల పెడుతూ. "మళ్ళీ ఇంటికెవరైనా  వొస్తే వాళ్ళకీ పళ్ళు రసం తీసి ఇచ్చేస్తే, నీ గారాల బిడ్డ, పళ్ళకోసం  మారాం చేస్తే అప్పటికప్పుడు  నేను బజారుకి పరుగెత్తాలి. అందుకనే  ఏకంగా  ఇన్ని తెచ్చేశాను" అన్నారాయన జానకమ్మ కళ్ళల్లోకి చూస్తూ.     "మీకూ జ్ఞాపకం వుందీ ఆ విషయం!?" అంది ఉప్పొంగిపోతూ జానకమ్మ.     "జానకీ!....నువ్వు, వాసంతి  నాకు రెండు కళ్ళు. నా కళ్ళసంగతి నాకు తెలీదూ. కాకపోతే, అమెరికాలో అయిదేళ్ళు  కాపరం చేసిన వాళ్ళ అలవాట్లు ఎలా మారాయో తెలీక. నీ సంబరానికి బ్రేకు వేస్తూ వొచ్చాను" అన్నారు ఆమెను కళ్ళతోనే తినేసేలా చూస్తూ.     "నా తల్లి ఎన్నటికీ  మారదు మొన్న పంపించిన ఫోటోలో  అదీ సమీక్షా ఎలా వున్నారు. వాసంతికి ఈ కాలపు  పిల్లల్లాగా  జానెడు పిలకో, బెత్తెడు పిలకో లేదు. బారెడు జడ ముందుకేసుకుని, కంచిపట్టు చీరలో  మహాలక్ష్మిలా లేదూ! సమీక్షకి మాత్రం, మూరెడు జుట్టూ, పట్టులంగా. అమెరికా కాదు, అంతరిక్షంలో కాపురం పెట్టినా, నా చిట్టితల్లి మారదండీ! నాకు తెలుసు" అంది మళ్ళీ అల్మారాలోవున్న  ఫోటోలని తీసి తనివితీరా చూసి మురిసిపోతూ, అతనికి చూపిస్తూ.     రామారావుగారు చిన్నగా నవ్వేరు.     ఆ నవ్వులో ఎక్కువ వ్యంగ్యం కనిపించింది జానకమ్మకి. వ్యంగ్యమే కాదు, "నీ అంచనా తప్పవుతుందేమో" అన్న ఉద్దేశ్యం కూడా కనిపించింది. అయితే ఆమె "సరే చూద్దామా - అది మారిపోయి బాబ్ డ్ హెయిర్ తో వస్తుందో, ఇలా ఈ ఫోటోలోలాగా  బారెడుజడతో వొస్తుందో" అంది.     రామారావుగారు మాట్లాడలేదు. నవ్వేసి ఊరుకున్నారు.     "ఏమిటా నవ్వు?" అంది ఉక్రోషంగా.     "జానకీ! నీ ఉక్రోషం చూస్తూవుంటే, దేవదాసు కథలో  పారూ ఉడుకుమోతుతనం జ్ఞాపక మొస్తోంది" అన్నారు బుగ్గమీద చిటికేస్తూ.     "ఛీ....పొండి....రేపు మన సరసం సమీక్ష చూసిందీ అంటే....?"     "ఏమీ అవదు. అది అంతకన్నా  ఎక్కువే ఆ దేశంలో చూసుంటుంది" అన్నారు నవ్వుతూ.     అతని నవ్వుతో శ్రుతి కలిపింది జానకి.     ఆనందభైరవి రాగం ఆ గదంతా  మ్రోగినట్టయింది.         *    *    *     పెసరరంగు జరీపువ్వుల చీరకి  గులాబీరంగు బార్డర్ ఎంతో హుందాగా, గౌరవంగా కనిపించింది. నిజానికి నిగనిగలాడే వాసంతి మేనుమీద, ఆ చీరకే కొత్త అందం వొచ్చినట్టనిపించింది. వోదులుగా అల్లుకుని మెడమీద నుంచి ముందుకు వేసుకున్న జడ నడుస్తుంటే తొడలను తాకుతూ గిలిగింతలు పెడుతూన్నట్టుంది. కాటుక కళ్లూ, పొడుగ్గా, నిటారుగా వెలిగే జ్యోతిలా మెరిసిపోతూన్న  ఎర్రటి తిలకంబొట్టూ, మెళ్లో మంగళసూత్రాలూ, నల్లపూసలూ. సమీక్ష ఎరుపురంగు జరీ అంచు, పట్టులంగా, జుంకీలూ, పొడుగాటి జెడ. వీళ్ళు అమెరికా కాదు. అమలాపురం నుంచి వస్తున్నట్టుగా  అనిపించింది జానకమ్మకి. మొహంలో  గర్వం తొణికిసలాడుతూ వుంటే, రామారావుగారివైపు  చూసింది. అతను నవ్వుతూ చిన్నగా 'నువ్వే గెలిచావులే' అన్నారు. "మామూలు గెలుపా ఇది? ఇండియా - పాకిస్తాన్ తో క్రికెట్ లో గెలిచినంత గెలుపు" అంది అతణ్ణి ఉడికించాలనే ఉద్దేశ్యంతో. రామారావుగారు నవ్వి ఊరుకున్నారు.         *    *    *     ఏర్ పోర్ట్ నుంచే కారులో జోగిపోతున్నారు వాసంతీ ,సమీక్షా. అక్కడి రాత్రి ఇక్కడి పగలూ, ఇక్కడి పగలు అక్కడి రాత్రీ అవడంతో, 'జెట్ లొగ్'లో తూలిపోతూ ఇల్లు చేరుకున్నారు.     "అమ్మా! అన్ని విషయాలూ, మెల్లగా తీరిగ్గా  మాట్లాడుకుందామమ్మా....కళ్ళు మూసుకుపోతున్నయ్" అంటూ చీరమార్చి నైటీ వేసుకుని, సమీక్షకి కూడా నైటీ వేసేసి తన గదిలోకెళ్ళి  పడుకుంది వాసంతి, "సారీ మమ్మీ...." అంటూ.     "కొంచెం మామిడికాయ పులిహోర తినవూ....నీ కోసం చేశాను" అంది జానకమ్మా అప్పటికప్పుడే ప్లేటులో పెట్టితెస్తూ.     "ఒద్దు మమ్మీ....ప్లైట్ లో హోమ్ బర్గు సమోసా....ఏమిటేమిటో పెట్టారు ప్లీజ్" అంటూ  ఒక్కటే చెంచా నోట్లో వేసుకుని గ్లాసుడు నీళ్ళుతాగి పడుకుంది వాసంతి.     "మమ్మీ....వేర్........ఐ....స్లీప్?" అడిగింది సమీక్ష.     "నా దగ్గర పడుకుంటావా?" అడిగింది జానకమ్మ.     "నో....నో....నాకు వేరే రూములేదా?" అడిగింది సమీక్ష.     "మమ్మీ దగ్గర పడుకోవా?" అడిగింది జానకమ్మ.     "నో.... నో....నా గది చూపించు" అంది సమీక్ష.     వెంటనే పక్కనే వున్న గెస్ట్ రూం చూపించారు రామారావుగారు. గబగబా వెళ్ళి మంచం మీద పడుకుంటూన్న సమీక్షికేసి గుడ్లప్పగించి చూస్తూండిపోయింది జానకమ్మ.     ఆమె పరిస్థితిని  అర్ధం చేసుకున్న  రామారావుగారు, ఆమె భుజంమీద చెయ్యివేసి, తన గదిలోకి తీసికెళ్ళారు.     జానకమ్మ మనసులో ఏదో బాధ. సమీక్షని గుండెల హత్తుకుని మామిడి పళ్ళ ముక్కలు తినిపిస్తూ, అనగా అనగా రాజు కథ చెబుతూ, జో అచ్యుతానంద జోజో అంటూ జో కొడుతూ, లాలిపాటలు పాడుతూ ,దాని బుజ్జి బుజ్జి మాటలకి మురిసిపోతూ, చిలిపి ప్రశ్నలకి సమాధానం చెబుతూ ఆనందతరంగాలలో  మునిగిపోవాలన్న  కమ్మని ఊహలను, ఏదో పెద్ద అల వొచ్చి కొట్టేసినట్టుగా  బాధపడింది జానకమ్మ. కూతురితో తెల్లవార్లూ కబుర్లతో మునిగిపోవాలనుకున్న  తను, పెద్ద కెరటం ఒడ్డుకి విసిరి కొట్టేసినట్టుగా విలవిలలాడిపోతూ, బాధను కడుపులోనే  దిగమింగే ప్రయత్నం చేస్తూ, వండిన వంటకాలవైపు పిచ్చిగా చూస్తూ, తనూ విశ్రమించింది జానకమ్మ. "రెస్టు తీసుకో" అంటూ గదిలో ఫాన్ ఆన్ చేసి, పేపరు తీసుకుని  సావిట్లో చదువుకుంటూ  కూర్చున్నారు రామారావుగారు.         *    *    *     జానకమ్మకి ఏం చెయ్యాలో తెలీడంలేదు. ఏవేవో చెయ్యాలనుకుంది. కానీ, దేనికీ కాలూ, చెయ్యీ ఆడట్లేదు. సుమన ఇంజనీరింగ్ పూర్తయ్యే వరకు పెళ్ళి చేసుకోనని భీష్మించుకు కూర్చోవడంవల్ల, ఆ తరవాత వొచ్చిన సంబంధాలు  ఒకళ్ళకి నచ్చితే మరొకళ్ళకి నచ్చకపోవడంవల్లా, సుమన పెళ్ళి ఇప్పటికిగాని ఫిక్సవలేదు. సుమన పెళ్ళికోసమే ఇప్పుడు వాసంతి వచ్చింది.     "దొడ్డమ్మా....పెళ్ళిలో కాస్త గమ్మత్తు  చెయ్యాలి. మా ఇద్దరికీ ఒకే రకం చీరలు కొంటాను. ఒకేలాగా మా ఇద్దరికీ నువ్వే పూలజడలు వెయ్యాలి. పందిట్లో వాళ్ళంతా ఇద్దరూ ఒకేలా వున్నారే అని ఆశ్చర్యంలో మునిగిపోవాలి, పెళ్ళికొడుకుతో సహా" అంటూ పకపకా నవ్వేది. అలాగే ఇద్దరికీ ఒకేరకం పట్టుచీరలు కొంది. సాయంత్రం రిసెప్షనుకి ఏవేవో మాటలు చెవులో రింగుమంటూంటే, ఎక్కడెక్కడి జ్ఞాపకాలో ఆమెని ఉక్కిరి బిక్కిరి చేస్తూ వుంటే, పరుపులూ, దిళ్ళూ రాళ్ళలాగా, ముళ్ళపొదల్లాగా అనిపించి, లేచి గదిలో కొచ్చింది. మల్లెపూలు విచ్చుకుని వెన్నెల గుట్టగా వెలిసినట్టనిపించింది. ఇల్లంతా మల్లెల పరిమళం మత్తెక్కిస్తున్నట్టుంది. పూలజడలు వేసుకోకపోయినా చక్కగా దండలు కట్టి  పెట్టుకుంటారేమోనని చూసి, వాసంతి గదిలోకి వెళ్ళింది. ఒళ్ళు మరచి పడుకున్న  వాసంతిని తనివితీరా చూసి మురిసిపోయింది. నిద్దట్లో ఇప్పటికీ చిన్న పిల్లలాగే  అనిపించింది జానకమ్మకి. ఫ్యాను గాలికి అటూ ఇటూ ఎగురుతూన్న నైటీని సవరించి, సమీక్ష గదిలో కెళ్ళింది.     పెద్ద ఆరిందాలా రెండు చేతులూ తలకి ఇరువైపులా పెట్టుకుని నిద్రపోతోంది. బొద్దుగా, ముద్దుగా వున్న సమీక్షని గుండెలకి హత్తుకోవాలనిపించింది. కానీ, దానికి నిద్రాభంగ మవుతుంది కదా! అందుకని ఆ కోరికని అణచి పెట్టి, బయటి కొచ్చింది, ఇదంతా గమనిస్తూన్న రామారావుగారు, "జానకీ....మరీ....ఇంత ప్రేమ పెంచుకోకూడదు. వాసంతి మన బిడ్డే కావొచ్చు. ఈనాడు మరొకరికి భార్య. సమీక్ష మనకి మనవరాలే కావొచ్చు. కానీ మన కేమాత్రమూ ఏ రకమైన అధికారమూ లేదు ఆ పిల్లమీద. వాళ్ళకేం కావాలో అందించి నీ మమకారాన్ని పంచాలే తప్ప, నీకేం కావాలో చెప్పి కాదు" అన్నారు ఆమెని ఊరడించే ధోరణిలో. అతనికి తెలుసు జానకమ్మ మనసు వెన్నపూస అని, ఆమె ప్రేమ ప్రవాహానికి ఆనకట్టలు లేవని. అయితే ఆమెను ఈరెంటికి కాస్త దూరంగా ఎలా అట్టే పెట్టాలో ఆడే తెలీదు. ఆమె మనస్సు చివుక్కుమంటే తట్టుకోలేదు. అందుకే అలా కనిపెట్టుకు తిరుగుతున్నారు.     "జానకీ!" పిలిచారు రామారావుగారు.     పరధ్యానంగా కాఫీ కలుపుతూన్న జానకమ్మ  ఉలిక్కిపడి  "ఆ!...." అంది కంగారుగా.       "ఏ లోకంలో వున్నావ్? కొంపదీసి నిల్చునే నిద్రపోవట్లేదు కదా?" నవ్వుతూ అన్నారు.     జానకమ్మ కూడా చిన్నగా నవ్వింది.     "చూడూ ఈ పూలన్నీ  దేముడికి పెట్టెయ్. కొన్ని పక్కింటికీ, ఎదురింటి వాళ్ళకీ పంపేయ్" అన్నారు.     "అవును నిజమే! రేపో ఎల్లుండో దాని బడలిక తీరాక, బోలెడు పువ్వులు కొని ముద్దజెడలు కుడ్తాను" అంటూ పూలన్నీ పనిపిల్ల నాగమణిచేత అందరికీ పంచేసింది.     కొత్తావకాయ, అందులోనూ ఉల్లావకాయ వాసంతి కిష్టమని జాడీలోంచి సీసాలోకి వేసింది. వేడిగా అన్నం చేసింది మిగిలినవన్నీ పొద్దున్న చేసినవి అలాగే వున్నాయ్.     రాత్రి దాదాపు పది గంటలకి లేచింది వాసంతి. "భోంచేద్దువుగాని లే తల్లీ!" అంది జానకమ్మ వాసంతి తలనిమురుతూ.     "ఒద్దమ్మా.... తేనుపులొస్తున్నయ్. స్టమకప్సెట్టయినట్టుంది" అంది. "నీ కోసం ఉల్లావకాయా, పెరుగూ, మామిడి పండు ముక్కలూ...."     "మై గాడ్! ఆవకాయ తింటే స్ట్రెయిట్, అమెరికాలో పడ్తాను. అమ్మా.... కారం అస్సలు తినం మేము. అది చూస్తేనే మంటగా అనిపిస్తుంది మీ అల్లుడుగారికి. కారంవాడేచోట మిరియాల పొడి చేసుకుంటాం." అంది నవ్వుతూ వాసంతి. జానకమ్మని ఆవకాయ సీసా వెక్కిరిస్తూన్నట్టనిపించింది. "నేనూ....సమీక్షా....పాలు తాగేస్తాం. ఇంకేం వొద్దు. పాలున్నాయా?" అంది అప్పుడే 'మమ్మీ' అంటూ లేచొచ్చిన సమీక్షని ఎత్తుకుంటూ.     "ఉన్నాయమ్మా పాలు. జానకీ! వాళ్ళకి పాలిచ్చేసి, నాకు వడ్డించు" అన్నారు రామారావుగారు. జానకమ్మ కంట్లోని నీటిపొరని చూసి కంగారు పడిపోతూ.     జానకమ్మ లోపలి కెళ్ళింది.     "నాన్నా....ఎంత వేడిగా వుంది బాబూ ఇక్కడ? ఈ ఆరేళ్ళలోనూ ఎండ చూడలేదేమో, బాంబే వొచ్చినప్పటినుంచీ, ఫ్రెషర్ కుక్కర్ లో కూర్చున్న ట్టుంది.  పూర్.... సమీక్ష ఎలా భరిస్తోందో" అంటూ సమీక్ష నుదుటి మీద ముద్దుల వర్షం కురిపిస్తూన్న  వాసంతికి జానకమ్మగారు పాల గ్లాసులతో  రావడంతో బ్రేకు పడింది.         *    *    *     మర్నాడు పొద్దుటే లేచి, ఇడ్లీ కారప్పొడీ టిఫిన్ చేసి సుమనని చూసి ఒక గంటలో ఒచ్చేస్తానని వెళ్ళిన వాసంతి పన్నెండు గంటలకి తిరిగొచ్చింది. వాసంతినీ, సమీక్షని చూసిన జానకమ్మ కనురెప్పలు మూతపడలేదు. నోట మాట పెగలక పెదవులు బిగుసుకుపోయాయి. మెదడు మొద్దుబారినట్టయింది. కళ్లు బైర్లు కమ్మినట్టయి, సోఫాలో కూలబడిపోయింది జానకమ్మ. పరిస్థితి అర్ధం చేసుకున్న రామారావుగారు, ఆమె పక్కనే కూర్చుని "చూడవోయ్....ఇప్పుడూ....ఇప్పుడు మనమ్మాయి అమెరికా అమ్మాయనుకుంటారు. అంతకుముందు, అమలాపురమో, ఆముదాల వలసో అనుకుని వుంటారు" అన్నారు నవ్వుతూ.     "అమ్మా....సుమన ఇంటికి వెళ్ళడానికి ముందు 'బ్యూటీ పార్లర్' కి వెళ్ళాను. నాకూ సమీక్షకీ కూడా చచ్చేంత చిరాగ్గా వుంది ఈ జుట్టు. మొన్నా మధ్యన అమెరికాలో మిసెస్ ఇండియా పోటీల్లో, 'అచ్చమైన తెలుగు మహిళ' పోటీకి పదివేల డాలర్ల  బహుమతి పెట్టారు. అందులో పాల్గొనమని మీ అల్లుడు నితిన్, మిగిలిన స్నేహబృందం బలవంతం చేశారు. కష్టపడి ఆరునెలలు జుట్టు పెంచుకొని పోటీలో పాల్గొన్నాను. ఎంత బాగా పెరిగిందో? నా జాడా, నా పట్టుచీరా, ప్లెస్ నా ఉపన్యాసం, పదివేల డాలర్లు గెల్చుకున్నాను. అచ్చమైన తెలుగు మహిళా కిరీటం నాకే పెట్టారు. నేను పెంచుకోవడం చూసి, సమీక్ష కూడా పెంచుకుంది. ఇంక ఇక్కడ చిరాగ్గా వుంది. అందులో పెళ్ళికూడానూ' అంది బెల్ బాటమ్ లో వున్న వాసంతి, చిన్న నిక్కరూ బనియన్ లో వున్న సమీక్షని ఎత్తుకుని అలిసిపోయి కిందికి దింపుతూ. ఇద్దరిదీ ఇంచుమించు బాయ్ కట్ అనొచ్చు!     జానకమ్మ కళ్ళముందు ముద్దకుట్టు మల్లెజడా, జడకుచ్చులూ, వొడ్డాణం అన్నీ వంకర టింకరగా గెంతుతూ ఆమెని గేలి చేస్తూ నాట్యం చేస్తున్నాయ్! ఒళ్ళంతా చెమటలు పడ్తున్నాయ్. 'అచ్చమైన తెలుగు మహిళ' ఫోటోలు తేవడానికి గదిలో కెళ్ళింది వాసంతి.     "జానకీ! చెప్పానా, లేనిపోని  ఆశలు పెట్టుకోవద్దని? వాసంతి నువ్వు చిన్నప్పుడు  గోరుముద్దలు తినిపిస్తూ ,పిట్టకథలు  చెబితే కేరింతలు కొడుతూ ఆడుకున్న పసిపాప కాదు. తనకేం కావాలో తను తెలుసుకో గలిగిన యువతి. తన యిష్టాయిష్టాలు తనవి. తన జీవితం తనది. మనం కేవలం ఆమెకు జన్మనిచ్చిన కన్నవాళ్ళం మాత్రమే. మారేకాలంతో మనమూ మారితే, మనకీ, వాళ్ళకీ కూడా సుఖం. లేదా బతుకంతా దుఃఖమయమే! లే - లేచివెళ్ళి ఆ ఫోటోలు చూడు. నవ్వుతూ మాట్లాడు" అంటూ ఉపదేశం చేశారు.     జ్ఞానోదయం కలిగిన బుద్దుడిలా లేచి, వాసంతి గదిలోకి వెళ్ళి, ఆమె నవ్వుతూ తుళ్ళుతూ వ్యాఖ్యానిస్తూ చూపిస్తూన్న ఫోటోలను, ఎవ్వరికీ కనబడని నీటిపొర కళ్ళకి అడ్డంగా వున్నా, చూడ్డానికి ప్రయత్నించింది జానకమ్మ. ఆమె కళ్ళలో ఆ ఫోటోలకన్నా  ముద్దగా కట్టిన మల్లెజెడే కదలాడుతూ కనిపించింది. రామారావుగారి మనసులోనూ జానకమ్మ ఊహల్లోని  మల్లెజెడే మొదటిసారిగా, ప్రత్యేకంగా కనిపించింది. అతనికీ చిన్నముల్లు గుండెకి సూదిలా గుచ్చుకున్నట్టయింది ఒక్క క్షణం!     

ఇలాంటి మగాళ్లూ ఉంటారా

ఇలాంటి మగాళ్లూ ఉంటారా                                                                                                        శ్రీమతి శారద అశోకవర్ధన్     సముద్రపు అలలు కేరింతలు కొడుతూ పరుగులు పెట్టి ఆడుకుంటున్న పిల్లల్లా ఒడ్డుని తాకి మళ్ళీ వెనక్కి వెళుతున్నాయి. సంధ్యచీకట్లు అలుముకుంటున్నాయి. సముద్రపు ఒడ్డున  జనసంచారం లేదు.     రాజశేఖరం ఇసకను  తన్నుకుంటూ, ఒక్కొక్క అడుగే ముందుకు వేస్తూ మెల్లగా నడుస్తున్నాడు. అతని దృష్టి దూరంగా  ఓ చోట ఇసకలో కూర్చుని  సముద్రంవైపు  చూస్తున్న  ఓ స్త్రీ మీద పడింది.     ఒంటరిగా ఉన్న ఆ స్త్రీని  చూడగానే  రాజశేఖరం  మనసులో ఏదో అనుమానం కలిగింది. అంతలోనే  ఆమె పైకిలేచి నిలబడి  సముద్రపు  అలలవైపు  గబగబా  నడవటం అతనిలో  ఆందోళన కలిగించింది.     అంతే, రాజశేఖరం  ఆలస్యం  చేయకుండా  వేగంగా  ఆమె వైపు పరుగుతీశాడు.     సముద్రపు అలలు ఆమె కాళ్ళను తాకాయి. ఆమె గభాల్న ముందుకి వంగింది. రాజశేఖరం  ఒక్క ఉదుటున ఆమెను చేరి ఆమె చెయ్యిపట్టుకుని బలంగా  వెనక్కిలాగాడు. ఆమె విసురుగా  వెళ్ళి వెనక్కి పడింది. ఒక్కసారిగా  కెవ్వున  అరిచింది.     రాజశేఖరం ఆమె దగ్గరకు నడిచాడు. "నన్నేం చేయకండి ప్లీజ్!" ఆమె కలవరిస్తున్నన్నట్లుగా  అరిచింది.     "నేను మిమ్మల్ని  ఏమీచేయను, భయపడకండి."  అన్నాడు రాజశేఖరం.     అతని  కంఠంలోని సౌమ్యం, మనిషి ప్రవర్తననుబట్టి  అతని వలన తన కెలాంటి  హానీ  కలగదని అనిపించిందామెకి.     మెల్లగా లేచి నిలబడింది.     రాజశేఖరం ఆమె దగ్గరగా వచ్చాడు.     "మీరు చదవుకున్నవారిలా ఉన్నారు. ఆత్మహత్యా ప్రయత్నం  చేయటం తప్పుకదా! క్షణికావేశంలో నూరేళ్ళ నిండు జీవితాన్ని బలిపెట్టేందుకు  ఎందుకు సిద్ధపడ్డారు?" అన్నాడు రాజశేఖరం.     ఆమె చిన్నగా నవ్వింది.     "మీరు పొరపడ్డారు. నేను ఆత్మహత్య చేసుకొనేంత  బలహీనురాలిని  కాను. సముద్రపు  అలలతో నా గోడు చెప్పుకొని సేద తీరాలని  ఇక్కడికి  వచ్చాను. అంతే!" అందామే.     "నాతో అబద్ధం  చెప్పినంత మాత్రాన దాన్ని నిజమని నమ్ముతానని మీరనుకుంటున్నారేమో! మీరు ఉన్నట్లుండి సముద్రంలోకి  నడిచివెళ్ళటం చూసే, నేను పరుగున  వచ్చి మీ చెయ్యిపట్టుకు లాగాను, చావాలని వచ్చిన వాళ్ళంతా  ఇలా మధ్యలో అవాంతరం రాగానే తాము చేయబోయే  తప్పుని కప్పి పుచ్చుకోవడం కోసం, ఇలా జీవితం మీద ఆశ ఉన్న వాళ్ళలా  మాట్లాడుతారు. మేకపోతు  గాంభీర్యం ప్రదర్శిస్తారు." ఆమెను మందలిస్తున్న  ధోరణిలో అన్నాడు రాజశేఖరం.     "నన్ను అనవసరంగా  అపార్ధం చేసుకొంటున్నారు. కెరటాలు  ఒడ్డుకి నెట్టుకు వచ్చే సముద్రపు గవ్వల్ని ఏరుకొనేందుకే నేనలా వెళ్ళాను. ఆత్మహత్య చేసుకొనే  ఆలోచన  నాలో ఏ కోశానా లేదు" అంది ఆమె గంభీరంగా.     "మరి నేను మిమ్మల్ని చెయ్యిపట్టుకు  లాగగానే  అలా ఎందుకు గావుకేక పెట్టారు?" తన సందేహాన్ని  వ్యక్తం చేశాడు రాజశేఖరం.     "నా జీవనయానంలో నేను  ఎదుర్కొన్న  సంఘటనల ఛాయలే నన్నలా  భీతితో అరిచేలా  చేశాయి! నా బతుకులోని  ఎత్తు పల్లాలను  పోలిన  ఈ ఇసుక తిన్నెలను చూస్తూ  ఎలాంటి కాలుష్యంలేని, కపటంలేని  ఈ సాగర కెరటాలతో నా భాదను చెప్పుకొని  సేదతీరాలని నేనిక్కడికి వచ్చాను. అది ఎవరినీ ఇబ్బంది పెట్టే పనికాదుగదా!" అంది ఆమె జీవం లేని ఒక నవ్వు నవ్వుతూ.     ఆ మసక చీకట్లో  ఆమె నవ్వుకి అర్ధంగానీ అసలు ఆ నవ్వుగానీ రాజశేఖరంకి తెలియలేదు.     "ప్రాణంలేని  ఆ కెరటాలతో  మీ వ్యధ చెప్పుకొంటే  ప్రయోజనం  ఏముంటుంది? ఆలోచించి  ఆదుకొనే  మనుషులకి చెప్పుకుంటే  కొంత ఫలితం ఉంటుందేమో?" అన్నాడు రాజశేఖరం.     ఆమె పెదవి విరిచింది నవ్వింది.     "ఈ సమాజంలోని  మనుషుల మీద నాకు నమ్మకం పోయింది. వాళ్ళ కంటే  ఈ చెట్లు, చేమలు, ఇసుకతిన్నెలు, సముద్రపు కెరటాలు వెయ్యి రెట్లు నయం. అందుకే వాటితో నా మనో వేదన చెప్పుకొని  ఊరట చెందాలనుకుంటున్నాను. 'జీవమున్న మనిషికన్నా  ఈ శిలలే నయం' అని సినారే రాసిన పాట మీకు తెలిసే ఉంటుంది. అందుకే  నేనీ నిర్ణయానికొచ్చాను" అందామె.     "మీకు ఎదురైన సంఘటనలు  మీలో అలాంటి మార్పుని  తెచ్చాయని నాకు అర్ధమయింది. అలా అని సమాజంలోని  అందరు మనుషులూ  మీరనుకున్నట్లుంటారనుకోవటం పొరపాటు. మీకు అభ్యంతరం లేకపోతే  మీ ఆవేదనలో  నన్నూ పాలు పంచుకోనిస్తారా? మీ బాధ ఏమిటో చెప్తారా?" సందేహిస్తూనే అడిగాడు రాజశేఖరం.     "ఒంటరిగా ఆడది కనిపిస్తే వెకిలివేషాలు  వేసే మగమహారాజులున్న  ఈ రోజుల్లో మీలాగ సానుభూతి చూపి, ఎదుటివారి కష్టాన్ని  తెలుసుకొని సాయం చేద్దామనే తత్వంగలవాళ్ళు ఉండటం అరుదు. మీ మొదటి పలకరింపులోనే  మీలోని సంస్కారం, మంచితనం అర్ధమయ్యాయి. కానీ, నా చితికిన బతుకుని గురించి ఏమని చెప్పను?" ఆవేదనగా అందామె.     "మీ కథ చెప్పండి!"     ఆమె నవ్వింది.     "కథేమిటి సార్? జీవన సత్యాలు. గుండెలను మండించే  యదార్ధచిత్రాలు ఏమని చెప్పను? ప్రేమించి పెళ్ళాడినవాడు ప్రేమ ఇగిరిపోగా, పెళ్ళిని వ్యాపారానికి పెట్టుబడిగా మార్చి కర్కోటకుడిగా మారి, నలుగురికీ నన్ను తార్చటానికి సిద్ధపడగా, నేనెందుకు వప్పుకోలేదని  నన్ను నానా రకాలుగా హింసలు పెట్టి నరకాన్ని చూపిస్తే భరించలేక ఆ బంధనాలు తెంచుకొని బయటపడ్డానని చెప్పనా?     శాడిస్టు భర్త పెట్టే హింసల నుంచి విముక్తి  పొందేందుకు విడాకులు ఇప్పించమని  సాయంకోరితే, విడాకులిప్పించిన తరువాత నువ్వు ఒంటరిదానివి అయిపోయాక  నాకు ఉంపుడుగత్తెగా ఉండి  నా ఫీజుని చెల్లిస్తావా అని అడిగిన ప్లీడరును పెళ్ళు పెళ్ళున చెంపలు వాయించానని చెప్పనా?     ఆ తర్వాత  మహిళాకోర్టు సాయంతో విడాకులు పొంది, స్వతంత్ర జీవనం గడపాలని ఉద్యోగంకోసం వెళితే, 'నీకు ఉద్యోగమిస్తే నాకు లంచంగా ఏమిస్తావ్?' అంటూ  నా శరీరపు ఒంపుసొంపుల్ని  కళ్ళతో తడిమేసిన కామపిశాచం లాంటి ఆఫీసర్ని తిట్టినతిట్టు తిట్టి బయటపడ్డానని చెప్పనా?     పడుచుపెళ్ళాన్ని  ఇంట్లో ఉంచుకొని, ఒంటరి ఆడదాన్నని నన్ను అలుసుచేస్తూ, పిట్టగోడమీంచి లొట్టలువేస్తూ తొంగిచూస్తుండే పక్కింటి పరంధామయ్యలు, ఆర్ధిక ఇబ్బందిని  కొండంతలుగా చేసి చూపిస్తూ, ఆ సమస్య తీరాలంటే తాము ఎన్నుకున్న మార్గంలో నడవమని  ప్రలోభపెట్టి ఆ పాప పంకిలంలోకి నన్ను కూడా లాగాలని చూసే మెల్లకన్ను  మీనాక్షులు, ఆడది ఒంటరిగా కనిపిస్తే వెకిలిచేష్టలతో అల్లరిచేసే రోడ్డు రోమియోలు నా మనసుని కకావికలు చేస్తున్నారని చెప్పనా?     ఏం చెప్పను సార్! ఆడదాన్ని అబలగా  ముద్రవేసి, ఆటబొమ్మగా  చేసి ఆడుకుంటున్న  ఈ సమాజంలోని  మగమృగాల వలయంలో  పవిత్రంగా బతికి బట్టకట్టటం ఎంతో కష్టమనిపించినా, ఆత్మస్థయిర్యంతో, బతుకుమీద కొండంత ఆశతో  ముందుకి  నడవటానికే నిర్ణయించుకున్నానని  చెప్పగలను సార్! చెప్పగలను!"     ఆమె వాగ్దోరణికి రాజశేఖరం ఆశ్చర్యపోయాడు. ఆమె మాటల్లో ఆమె గుండెల్లో గూడుకట్టుకున్న  ఆవేదన, ఆవేశం వ్యక్తమయింది. అతను నోరు తెరిచి ఏదో అడగబోయేంతలో  మళ్ళీ ఆమె చెప్పటం సాగించింది.     "సార్! ఆడదాని బతుకుల్లో  ఎదురయ్యే కష్టాలు, అవమానాలు ఎంత చెప్పినా  తక్కువే అవుతాయి. ఆడపిల్ల పుట్టగానే 'ఆడపిల్లా!' అంటూ  పెదవి విరుస్తారు. ప్రతి సందర్భంలోనూ ఆడపిల్లని కించవరుస్తూ  పెంచుతారు. దాని ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా  పెళ్ళి చేస్తారు. కట్టుకున్నవాడి హింసలు భరించలేక ఏ ఆడదైనా పుట్టింటిని ఆశ్రయిస్తే పెళ్ళయ్యాక ఆడది భర్త పాదాల దగ్గరే పడుండాలి గాని పుట్టింటికి రాకూడదు.   ఆడపిల్ల - ఆడపిల్లే! అంటూ నీతులు చెప్పి తమ చేతులు దులిపేసుకుంటారు. ఆడపిల్లకి  ఎక్కడ చూసినా అన్యాయమే జరుగుతుంది సార్! నా పుట్టింట్లోనూ అలాంటి సంఘటననే ఎదుర్కొన్నాను. ఒంటరి పోరాటం సాగించాలని  సిద్ధపడితే అడుగడుగునా  అవాంతరాలే!"     ఆమె చెప్పటం ఆపి అతని ముఖంలోకి చూసింది.     రాజశేఖరం ఆశ్చర్యంగా ఆమెనే చూస్తున్నాడు.     "ఏమిటిసార్ అలా చూస్తున్నారు? ముక్కు మొఖం తెలియని  మీతో ఇన్ని విషయాల్ని మొహమాటం లేకుండా చెప్తున్నానేమిటా అని వింతగా ఉంది కదూ! అవును, వింతగానే ఉంటుంది. కానీ, ఇంతవరకు నాపై సానుభూతి చూపి, ఏమిటమ్మా నీ బాధ అని అడిగినవారు లేరు.  సాటి ఆడవాళ్ళు కూడా నన్ను అపార్ధం చేసుకొని నన్ను ఆడిపోసుకున్నవారే! ఆడదానికి ఆడది శత్రువు అంటారు. నిజమే సార్! సాటి ఆడది కష్టాలు పడుతుంటే చూసి తృప్తిగా నవ్వుకునేవాళ్ళనే చూశాను. వీలుంటే వారిపై విమర్శల గులకరాళ్ళను  విసిరి మరింత ఆనందిస్తారు. ఇదీ సార్ లోకం తీరు!"     ఆమె ఆగింది.     రాజశేఖరం భారంగా నిట్టూర్చాడు.     "మీ జీవితం చాలా చిత్రంగా ఉంది. నీతిగా, న్యాయంగా, పవిత్రంగా బతకాలంటే సమాజం మీకు సహకరించటం లేదు. భర్త వలన ఇన్ని హింసలు పడిన మిమ్మల్ని గురించి తెలుసుకుంటుంటే మగాళ్ళలో ఇంతటి దుర్మార్గులు ఉన్నారా? అనిపిస్తుంది. ఇంతకాలం ఆడవాళ్ళని అసహ్యించుకుంటూ గడిపాను" అన్నాడు రాజశేఖరం.     "ఆడవాళ్ళమీద అసహ్యమా?" విస్మయంగా అడిగిందామె.     "అవును. మీలాగే నా స్నేహితుడి జీవితం పెళ్ళయ్యాక భార్య మూర్ఖత్వానికీ, నిర్లక్ష్యానికి, అహంకారానికి మధ్య నలిగిపోయింది. రోజూ అతను నాతో తన బాధల్ని చెప్పుకోనేవాడు. ప్రతిక్షణం అతడిని మాటలతో హింసించేదట. అతడిని ఒక పురుగులా చూసేదట. ఒక్కమాట కూడా లెక్కచేసేది కాదట. ఇంట్లో ఉండకుండా  తన సరదాలు, విలాసాలకు షికార్లు  కొట్టేదట. ఆమెకి చాలా మందితో సంబంధాలున్నప్పటికీ  అతడు ఆమెని ఏమీ అనలేకపోయేవాడు. దానికంతటికీ  ఆమెపట్ల  అతనికున్న  అపారమైన ప్రేమే కారణం. చూశారా, అతని జీవితానికీ, మీ జీవితానికీ ఎంత వ్యత్యాసమో! స్త్రీ మూలంగా అతని జీవితం నలిగిపోతుంటే, పురుషుని మూలంగా మీ జీవితం నరకప్రాయం అయింది. మానవ జీవితం చాలా చిత్రమైంది సుమండీ!" అన్నాడు రాజశేఖరం.     "ఎవరో ఒక్క ఆడది.... తన భర్తని  ఇబ్బందులు  పెట్టిందని  ఆడవాళ్ళందరి మీదా అసహ్యం పెంచుకోవటం ఏం న్యాయం సార్?"     "ఏమో! ఇలా భర్తలని హింసించే ఆడవాళ్ళు ఎందరో ఉండొచ్చు. ఆడవాళ్ళు బైటపడినట్లు మగాళ్ళు తమ భార్యలతో హింసింపబడుతున్నామని చెప్పుకొనేందుకు  అంత త్వరగా  బైటపడరు" అన్నాడు రాజశేఖరం.     "మీకు పెళ్ళయిందా?"     హఠాత్తుగా  ఆమె అడిగిన ప్రశ్నకి  రాజశేఖరం ఉలిక్కిపడ్డాడు.     "లేదు" అన్నాడు.     "మీరు అవివాహితులు. ఆడదాని ప్రేమలోని  మాధుర్యాన్నిగానీ, పగలో కర్కశత్వాన్నిగానీ చవిచూసే అవకాశం మీకు లేదు." ఎవరో మీ స్నేహితుడు తన భార్యవల్ల పడే బాధల్ని మీకు వివరించి చెప్తే సానుభూతి చూపించి ,స్త్రీల మీద ఒక దురబిప్రాయం ఏర్పరుచుకొన్నారు. నేను....ఈ పురుష ప్రపంచం నుంచి ప్రత్యక్షంగా అసహ్యకరమైన పరిస్థితుల్ని ఎదుర్కొన్నాను. నా తండ్రి, భర్త, లాయరు, ఆఫీసరు, ఆఖరికి ఆటోవాడు కూడా ఆడదానిగా నన్ను అవమానించినవారే! అయినా పురుషులమీద నాకు ద్వేషంగానీ, అసహ్యంగానీ లేదు. ఇంత హీనంగా దిగజారిపోయిన  ఈ సమాజ పరిస్థితులను చూసి బాధగా ఉంది. ఈ వ్యవస్థమీద  అసహ్యం కలుగుతోంది. అంతేసార్! మీ స్నేహితుడికి నా సానుభూతి తెల్పండి. నాలాగ ఆమె నుండి విడాకులు తీసుకొని స్వేచ్చగా బతకమనండి!" అందామె.     "అబ్బే! ఆ అవకాశం లేదు. అతనా నిర్ణయం తీసుకోవటానికి ముందే ఆమె ఎవడితోనో లేచిపోయిందట. పాపం, ఆమె మీద అతను పెట్టుకున్న ఆశలు కూలిపోయి కుమిలి కృశించిపోతున్నాడు" అన్నాడు రాజశేఖరం.     "పూర్ ఫెలో!" అనుకుందామె.     "మీ పేరు?" సందేహిస్తూ అడిగాడు రాజశేఖరం.     "రజని." చెప్పిందామె.     "రజనిగారూ! ఇలాంటి పరిస్థితులను  ఎదుర్కొన్న మీరు, జీవితం విషయంలో  ఎలాంటి నిర్ణయానికి వచ్చారో నేను తెలుసుకోవచ్చా?" రాజశేఖరం ప్రశ్నకి ఆమె పేలవంగా నవ్వింది.     "ఈ సమాజంలో  తోడులేని  ఆడదాని ప్రతివారూ  చులకనగా చూస్తారు. మీసాలు మొలిచిన కుర్రవెధవ దగ్గర్నుంచి కాటికి కాలుచాపుకొన్న  ముసలాడి వరకు మగదిక్కులేని ఆడది అతితేలిగ్గా  తమ కౌగిట్లోకివచ్చి వాలుతుందనే  ఆశతో లొట్టలు వేస్తూ చూస్తుంటారు. నేను బాధలుపడ్డ ఆడదాన్నేగాని, బరితెగించిన ఆడదాన్ని కాను. నన్ను అర్ధం చేసుకొని ఆదరించి, నన్ను తనతోటి మనిషిగా చేసుకొని నాకు నీడగా నిలిచే వ్యక్తికోసం చూస్తున్నాను. అంతే సార్!" అంది రజని.     ఆమెలోని  నిజాయితీకి, నిష్కల్మష మనస్తత్వానికి రాజశేఖరం చాలా ఇంప్రెస్ అయ్యాడు.     ఆమె మాట్లాడే ప్రతి మాటను విశ్లేషణాత్మకంగా  ఆలోచిస్తూనే ఉన్నాడు. చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు. తన మనసులో మాటని ఆమెతో చెప్పాడు.     "మీకు అభ్యంతరం లేకపోతే....నేను మిమ్మల్ని  పెళ్ళి చేసుకుంటాను."     ఆమె చివాల్న అతని ముఖంలోకి  చూసింది.     రాజశేఖరం కాస్త కంగారుపడ్డాడు.     "అంటే....మీకిష్టమైతేనే! నాకు వెనుకా ముందు ఎవరూ లేరు. బతకటానికి ఉద్యోగం ఉంది. భార్యా పిల్లల్ని పోషించగలిగే సత్తా ఉంది. ఎదుటి వారిని అర్ధం చేసుకోగలిగే హృదయం ఉంది. ఇంకా ....     అతని మాటలకి అడ్డం వచ్చిందామె.     "మీరింకేమీ చెప్పనక్కరలేదు. ఏడాదిన్నర ఆలోచించి ,ప్రేమించి ప్రేమించి, ప్రేమ పండించుకొని, పెళ్ళాన్ని తార్చేందుకు సిద్ధపడ్డ ఒక దౌర్భాగ్యుణ్ణి కట్టుకుని జీవితంలో  పెద్ద పొరపాటు చేశాను. క్షణాల్లో నిర్ణయం తీసుకున్నప్పటికీ, అంతకంటే  ఇంకా పెద్ద పొరపాటు చేసే అవకాశం లేదు. అంతకు మించి నేను నష్టపోయేది ఏమీ లేదు సార్, నేను మీ పేరు అడగలేదు. పేరుతో నాకు అవసరంలేదు కూడా! మీ మాటల్లో మంచితనం, మీ ప్రవర్తనలోని సంస్కారం గమనించాను. మీరు నాకు అండగా నిలవడానికి సిద్ధపడటం నా అదృష్టం. దీనికి కాదంటే నిజంగా  నేను మూర్ఖురాలిని అవుతాను" అంది రజని.     రాజశేఖరం కళ్ళు ఆనందంతో మెరిశాయి. పొంగిపోతూ  కుడిచెయ్యి ముందుకి చాపాడు. రజని అతని చేతిని పట్టుకొని ముందుకి నడిచింది.         *    *    *     "ఇంత కాలానికి మీరు వివాహం చేసుకోవటం, అదీ ఒక అభాగ్యురాలికి అండగా నిలిచేందుకు ఆదర్శవివాహం చేసుకోవటం నాకెంతో సంతోషంగా ఉంది. రాజశేఖరంగారూ! మనకి పరిచయం అయిన ఆర్నెల్లలో  ఒకరి గురించి ఒకరు పూర్తిగా  తెలుసుకొని  మంచి స్నేహితులం అయ్యాం. ఆ స్నేహాన్ని దృష్టిలో పెట్టుకొని మీ పెళ్ళయిన మర్నాడే మొదటి వ్యక్తిగా నన్ను మీ ఇంటికి ఆహ్వానించటంవల్ల నా మీద మీకుగల అభిమానం వ్యక్తం అవుతోంది. మిమ్మల్ని పెళ్ళాడిన ఆ అదృష్టవంతురాల్ని  అభినందించే అవకాశం నాకు కలుగుతోంది" అన్నాడు సుబ్బారావు సోఫాలో కూర్చుంటూ.     రాజశేఖరం కూడా అతని పక్కనే కూర్చున్నాడు.     ఆ రోజు ఉదయమే రజనితో చెప్పాడు రాజశేఖరం - తన స్నేహితుడు సుబ్బారావుని ఇంటికి భోజనానికి తీసుకువస్తానని.     అంతలో లోపలినుంచి ట్రేలో రెండు కాఫీ కప్పులు పట్టుకుని వచ్చింది రజని.     "రజనీ! ఈయనే  నేను నీకు చెప్పిన భార్యా బాధిత మిత్రుడు. పేరు సుబ్బారావు." పరిచయం చేశాడు రాజశేఖరం.     రజని సుబ్బారావుని చూసి షాక్ తింది.     సుబ్బారావు పరిస్థితీ అలాగే ఉంది.     "రజనీ! నువ్వా?" అన్నాడు సుబ్బారావు.     "రాజశేఖరంగారూ! కట్టుకున్న పెళ్ళాన్ని  ఇతరులకు తార్చటానికి బలవంతం చేస్తే, ఆమె ఒప్పుకోలేదని  రకరకాలుగా  హింసించి, ఆమె ఆ బాధలు పడలేక విడాకు లిచ్చి తన దారిన వెళ్ళిపోతే, ఆ సంగతి బయటపడనీయకుండా ఆమెపట్ల అసహ్యం కలిగేలా  కట్టుకథలల్లి చెప్పి మీ సానుభూతిని సంపాదించుకున్న  ఈ 'పిచ్చి కుక్కా' మీ స్నేహితుడు!?" ఆవేశంగా అరిచింది రజని.     ఈసారి ఆశ్చర్యపోవటం రాజశేఖరం వంతు అయింది. 'ఈ లోకంలో ఇలాంటి మగాళ్ళూ ఉంటారా?!'  అనేది ఆ ఆశ్చర్యానికి అర్ధం అని మాత్రం ఎవరూ ఊహించలేరు.            *      

ప్రేమికుల ఓట్లు

ప్రేమి"కుల "ఓట్లు కండ్లకుంట శరత్ చంద్ర " భావిభారత ప్రేమికులారా! నమస్కారం!!" చిరునవ్వుతో అన్నాడు ' ప్రేమికుల దేశం' పార్టీ అధ్యక్షుడు ప్రేమారావు. చైతన్య', 'క్రాంతి','కిరణ్', 'క్రాంతి',... ఇత్యాది పేర్లను ఎలాగైతే స్త్రీలకూ కూడా పెట్టవచ్చునో. ' ప్రేమ' అనే పేరును కూడా స్త్రీ , పురుషులిద్దరికీ వాడచ్చని తీర్మానించుకుని,ప్రేమరావు తండ్రి,అతనకి   ఆ పేరు పెట్టాడు.తప్పదు కాబట్టి ,ప్రేమారావు అందరిలాగే పెరిగి పెద్దవాడయ్యాడు .వయసులో మాత్రమే కాకుండా ,జనాలలోనూ సెలబ్రిటీనో,లెజెండో అయిపోయి 'పెద్దవాడు ' అనే పేరు తెచ్చుకోవాలనే సంకల్పంతో సినిమాలలో ప్రయత్నించాడు.అయితే పౌరాణిక సినిమాలలో  కౌరవులలో అరవైనాలుగోవాడి పాత్ర, మొహానికి మాస్క్ వేసుకుని నటించిన జఠాయువుపాత్ర, లవకుశులు పాట పాడుతుంటే విని ఆనందించే వందమంది మునిబాలుళ్ళలో ఒకడి పాత్ర లాంటిది రావడంతో సినిమాలు మానుకుని , భూమిని నమ్ముకుని, లాక్కుని,అమ్ముకుని ఓ భారీసైజు ధనవంతుడు అయ్యాడు.   అయితే ఎన్నికోట్లు సంపాదించినా ,తనను ఎవరు గుర్తించడంలేదనే   తపనతో రాజకీయాలలోకి అడుగుపెట్టాడు. ఉచిత కరెంటిస్తాం , ఉచిత సెల్ ఫోన్ ఇస్తాం, ఉచిత కార్లు ఇస్తాం,ఉచిత వరకట్నాలు ఇస్తాం, ఉచితంగా తద్దినం పెట్టిస్తాం,గాడిద గుడ్డు ఇస్తాం,పంది పిల్లలు పావలకొకటి ఇస్తాం.. లాంటి  వాగ్దానాలతోదేశస్థాయిలో దోచుకునే పార్టీలు,రాష్ట్రస్థాయిలో దోచుకునే పార్టీలు, ప్రాంతీయ స్థాయిలో దోచేయజూసే పార్టీలు తీవ్రస్థాయిలో చర్చించి విశ్లేషించి, తర్కించి మీమాంస చెంది చిట్టచివరికి " ప్రేమికులను  బుట్టలో వేసే " సంకల్పంతో ప్రజా ప్రతినిధి అయిపోవాలని  సభలో ప్రేమికుల ముందు ప్రసంగించసాగాడు.    "ప్రభుత్వాలు మహిళా పథకాలు పెడుతున్నాయి, ఆరోగ్యపథకాలు అంటున్నాయి,గృహ పథకాలు వంట గ్యాస్ పథకాలు,నిరుద్యోగ నిర్మూలనా పథకాలు,బాలింతల పథకాలు,ఉచిత బడి పథకాలు,   ఇలా అన్ని వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ భావిభారతదేశానికి పట్టుగోమ్మలైన ప్రేమికులను మాత్రం మర్చిపోతున్నాయి. అసలు ప్రేమికులంటే ఎవరు ? " మైకులో గర్జించాడు. ఆ గర్జనకు  చుట్టుపక్కల ఉన్న చెట్లపైనున్న పక్షులు తలోదిక్కూ పారిపోయాయి. "ఊ ! చెప్పండి. అసలు ప్రేమికులంటే ఎవరు? " మళ్ళీ గర్జించాడు జనాలు రకరకాలుగా చూసారు. ప్రేమారావు కార్యదర్శి బుల్ బుల్ రెడ్డి, ఆయన దగ్గరకొచ్చి" సార్. ఇది తరగతి గదో, సమావేశమో కాదు . భారీ సభ ఎవరూ సమాధానం చెప్పరు. మీరే చెప్పాలి" అన్నాడు చెవిలో. ' నాకు తెలుసులేవయ్యా' అని ప్రేమరావ్ అతడిని తిట్టి ,జనాలవైపు  తిరిగాడు. " అసలు ప్రేమికులంటే భావి భారత పౌరులు . భావిభారత పోరలు,పోరీలు , ప్రేమికులను రాజకీయ పార్టీలు   చిన్న చూపు చూస్తున్నాయి.ప్రేమికుల కోసం ఏ పథకాలు లేవు. ప్రేమికుల గురించి, ఆలోచించే నాధుడే లేడు. అరె! ప్రేమికులు మనుషులు కారా ? వాళ్ళకు మాత్రం   ఓట్లుండవా ? అని నాలుక కరుచుకుని ' వారికీ మాత్రం సమస్యలుండవా? సరిగ్గా ప్రేమించుకుందామంటే  ఒక పార్కు ఉండదు .పార్క్ లలో సరైన పొదలుండవు మద్య మద్యలో పల్లీలు అమ్మేవాళ్ళ డిస్టర్బెన్స్.ఛీ ఛీ ! ఈ దేశంలో సరిగ్గా ప్రేమించుకోవడానికి  కనీస వసతులు లేవు.పాపం రాత్రనకా పగలనకా పార్కులలో ప్రేమించుకుందామని వస్తే ,అతి అమానుషంగా,రాక్షసంగా, దారుణంగా వాచ్ మెన్ లు పార్క్ టైమ్ అయిపోయిందని ప్రేమికులను వెళ్లగొట్టి గేటు ముసేస్తుంటే ఆ ప్రేమికులు పడే బాధ, మూగరోదన  వర్ణనాతీతం. వా..! వా...!! ప్రేమరావు ఏడ్చాడు. అదిచూసి సభకు  వచ్చిన వారిలో ప్రేమికులంతా గుక్కపెట్టి ఏడవసాగారు.  "నీయవ్వ! నా మీద ముక్కు  చీదుతవేంది బే" సభలో ఒకడు తన ప్రక్కనున్న వాడిని అన్నాడు. "ఏడ్చి ఏడ్చి చిదాను క్షమించు" అన్నాడు ఆ చీదినవాడు. "ప్రేమనగర్ "సినిమా ఎందుకు హిట్టైయ్యింది? స్వయంవరం సినిమా ఎందుకు ఆడింది ? దసరాబుల్లోడు,ప్రేమాభిషేకం,మజ్నూ, ప్రేమ ఇవన్ని ఎందుకు హిట్లూ,బ్లాక్ బస్టర్లూ అయ్యాయి! ప్రేమరావు  ప్రేమరావు ప్రశ్నించాడు, ప్రేమికులు బుర్రలు గోక్కుని ఎందుకబ్బా అనుకున్నారు. వాటిలో ప్రేమ అనే అంశం వుంది కాబట్టి. ఆ  సినిమాలను  మీ మీ తల్లిదండ్రులు ఎగేసుకు వెళ్లిచూసారు కాబట్టి.నేను ఈ పాత సినిమాలను  ప్రస్తావించడానికి కారణం.మీ తల్లిదండ్రుల అభిరుచి గురించి చెప్పడానికే! ప్రేమ సినిమాలను ఆదరిస్తారు కానీ, ప్రేమికులను మాత్రం ఆదరించరు. ప్రేమికులంటే అంత చిన్న చూపు ! పాపం, ప్రేమికులు ఎంతో కష్టపడి సెల్ ఫోన్ లలో ప్రేమ మెసేజ్ లు కొట్టుకుంటుంటే ఈ తల్లిదండ్రులు అతికిరాతకంగా, అతిహేయంగా, అతినీచంగా, అతిచెండాలంగా,ప్రేమికుల సెల్ ఫోన్లు లాక్కుంటున్నారు. మీ తల్లిదండ్రులే మీపాలిట రావణ కుంభకర్ణ మారీచసుబాహులై,ఖరదూషణులై వేదిస్తున్నారు."ఆవేశంగా అన్నాడు ప్రేమారావు. ప్రేమికులందరూ ఏడుపు మానేసి ఆవేశంతో అవును నిజమే అనుకున్నారు. ఒక ఆధునికప్రేయసి,తన ప్రియుడితో  " డియర్! రావ, నకుంబ, కర్ణమా, రీచసు, బాహులిక, రదూషణులైవేదిస్తున్నారు.ఈ పాదాలకు అర్ధమేమిటి " ? అంది.వాడు నెత్తినోరూ కొట్టుకుని "నీకు తెలుగు నేర్పిన వెధవ ఎవరు ?" అడిగాడు. "మా డాడి !మా డాడీ నే వెధవ అంటావా.ఛీఛీ నీకు గుడ్ బై " అనేసి జనాలలో పడి వెళ్లిపోసాగింది.వాడు 'సారీ 'అంటూ ఆమె వెంపడ్డాడు."ప్రేమికులారా ఇకపోతే, ప్రేమికుల దినం ఆ రోజున మీకు రైళ్ళలో, బసుల్లో ఏమైనా రాయితీలు ఇస్తున్నారా ? లేదు. కనీసం " గ్రీటింగ్ కార్డులపై రాయితీలు ఏ ప్రభుత్వమైనా ఇచ్చిందా? లేదు.ప్రేమికులు ఈ ప్రభుత్వాల కళ్ళకు వెధవలుగా,గూట్లేలుగా, దొంగానయాళ్ళలా,భ్రష్టుల్లా,నీచుల్లా కనిపిస్తున్నారు" అన్నాడు ప్రేమారావు. ప్రేమికులందరూ మళ్ళీ క్యారుక్యారుమని, బ్యారుబ్యారుమని ఏడుస్తూ గ్యాలన్ల కొద్ది కన్నీళ్లు  కార్చారు.   " ప్రేయసులారా,ప్రేమికులారా , బాధాసర్ప దృష్టులారా,ఏడవకండేడవకండి! పి.టి.వో అనగా పేజి తిప్పు చూడుము" అని నాలుక కరుచుకోకుండానే, ఉపన్యాసపు  పేజిని తిప్పి అన్నాడు " మరో ప్రపంచం ప్రేమ ప్రపంచం,ప్రేమప్రపంచం పిలిచింది,పదండి ముందుకు పదండి, ప్రేయసిని లేపుకు పోదాం పోదాం  "ముంబైకి "! అని అందరి మొహాలు చూసాడు. ఎవ్వరూ ప్రతిస్పందించలేదు , కోపంతో బుల్ బుల్ రెడ్డి వంక చూసాడు.బుల్ బుల్ రెడ్డి సైగ చేసాడు.ఆ సైగను చూసి, జనాలలో అక్కడక్కడా నిల్చున్న అద్దె చప్పట్ల వాళ్ళు చప్పట్లు కొట్టారు. చప్పట్లు 'అంటువ్యాధి ఫార్ములా' మిగతావారందరూ చప్పట్లు కొట్టేలా  పురికొల్పింది. ప్రేమారావు కొనసాగించాడు.'నేను సైతం ప్రేమకోసం పిచ్చికుక్కనైపోతాను,నేనుసైతం ప్రేమికుల రొమాన్స్ కు పిచ్చి పొదలను నాటించాను,నేనుసైతం మీరు లేచిపోయేటందుకు  బ్రేకుల్లేని డొక్కు కారునైపోతాను . నేను సైతం  మీ పెద్దలపై రంకెవేసే గజ్జి ఎద్దునౌతాను.   అందరు పటపటా చేతులు విరిగేలా చప్పట్లుకొట్టారు. వారు చప్పట్లుకొట్టింది, నేనుసైతం అనే శ్రీ శ్రీ గారి జయభేరి కవితలోని ఆ రెండు పదాలలో శక్తికి మాత్రమేనని , ప్రేమారావుకు  తెలియదు. అతడు మరింత విజృంబించాడు.   " పాత సెల్లు, సెల్లులో సొల్లు పార్కులో ముల్లూ, పిచ్చిగా  చూడకు దేన్నీ , ప్రేమమయమేనోయే అన్నీ! పిచ్చిముక్క,పల్లీల తొక్క, పెద్దల తిక్క ప్రేమను పోషిస్తాయ్, లేచిపోమ్మంటాయ్. ప్రేయసి  ముద్దు, పెద్దల గుద్దు ,ప్రేమను వదలొద్దు కావేవీ ప్రేమకు అనర్హం. ప్రేమికులదేశం  పార్టీయే ఘనం ! " చప్పట్లు సీమ టపాకాయల్లా పేలాయి. బుల్ బుల్ రెడ్డి వచ్చి " సార్  ఇక మీ వాగ్ధానాలు చదవండి " చెవిలో ఊదాడు. "ఏయ్ ఎందుకలా చెవిలో ఉమ్మేసావ్?" సీరియస్ గా అడిగాడు ప్రేమరావు. " నేను  ఊమ్మెయ్యలేదు సార్. చచ్చిపోయిన మీ మొదటి భార్య మీదొట్టు.చెవిలో చెప్పను అంతే." "సరే దూరంగా వెళ్లి తగలడు ",అన్నాడు తన చెవిని తుడుచుకుంటూ బుల్  బుల్ రెడ్డి దూరంగా వెళ్ళిపోయాడు." ఇకపోతే, ఇప్పటివరకు రాజకీయ నాయకులలో, పార్టీలలో ప్రేమికులపట్ల ఉన్న చిన్న చూపును ఎండగట్టిన నేను, ఇప్పుడు  నా వాగ్దానాలను చెప్తాను". మీరేగనక మీ పవిత్రమైన ఓటు నాకు వేస్తె ప్రేమికుల పంట పండినట్లే అన్నాడు. సభలో ఒకడు"మనం సాఫ్ట్ వేర్ ఇంజనియర్లం కదా! పంట ఎట్లా పండిస్తాం" ?  తన ప్రేయసి చెవి కొరికాడు. " ఏమో? వినువిను, ఆయనేదో  చెప్తున్నాడు "అంది.  ప్రేమరావు గొంతు సవరించుకున్నాడు.ఆ శబ్ధానికి  కిలో మీటర్ దూరంలో ప్రసవవేదన పడుతున్న ఓ గాడిద, సుఖం గా  ప్రసవించింది. " ప్రేమికులకోసం హైదరాబాద్ లో వంద పార్కులు కట్టిస్తాను , ఆ పార్కులను ఇరవైనాలుగు గంటలు తెరచి ఉంచుతాం.పార్కులలో ఏకాంతంగా ప్రేమించుకోవడానికి చక్కటి పొదలను.. వీలైతే గుడిసెలను ఏర్పాటు చేస్తాం". ప్రేమికులు ఆనందంగా చప్పట్లు కొట్టారు. " బడుగు బలహీన ప్రేమికులకు"  సెల్ ఫోన్లు ఉచితంగా ఇచ్చి , బిల్స్  కూడా మేమే కడతాం ప్రేమికులు గనక  విద్యార్ధినీ విద్యార్దులైతే వారికి బస్సు పాస్ లు ఉచితం. మళ్ళీ చప్పట్ల వర్షం కురిసింది."ప్రేమికులు అవగానే వారికి గుర్తింపు కార్డు ఇస్తాం. ఆ కార్డు చూపించి  సినిమా థియేటర్లలో పదిశాతం డిస్కోథెక్ లలో ఇరవై శాతం రాయితీ పొందవచ్చు." ప్రేమికులకోసం ప్రతీజిల్లాలోను ప్రభుత్వ డిస్కోథెక్లూ, ప్రభుత్వ పబ్బులూ నడుపుతాం". చపట్లు కొట్టీకొట్టీ  కొందరి చేతులు విరిగిపోయాయి. "అంతేకాదు, యురోపియాన్ దేశాలలోలగా ప్రేమికులకి ఎప్పుడు ఎక్కడ మూడ్ వస్తే, అప్పుడే  అక్కడే ముద్దులు పెట్టేసుకోనేలా చట్టాన్ని సవరిస్తాం. లేచిపోయే పవిత్రమైన ప్రేమికులకోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటుచేస్తాం. ఆనెంబర్ కు ఫోన్ చేస్తే మీరు  లేచిపోయెందుకు, ప్రభుత్వమే సహకరిస్తుంది". ఆహా, ఓహో,ఓహోహో  అన్నారు ప్రేమికులు. "ప్రేమను  ముఖ్యమైన అంశంగా స్వీకరించి, సినిమాలు తీసేవారికీ రాయితీలు ఇస్తాం". ప్రేమగీకుడు,ప్రేమ పుల్లయ్య ప్రేమవీర, ప్రేమశంకరరెడ్డి, ప్రేమ గురువిందలు... ఇలా ఏ అంశానికి చెందిన సినిమాల్లో అయినా సరే, సినిమా పేరులో ప్రేమ వుంటే వినోదపన్నులో రాయితీ ఇప్పిస్తాం.ప్రకటించాడు ప్రేమరావు. ఈ కార్యక్రమాన్ని లైవ్ లో టివిల్లో చూస్తున్న ఓ నిర్మాత తాను తీయ్యబోయ్యే కమ్యూనిజపు చిత్రం " రెక్కాడితే డొక్కాడదు" పేరును " ప్రేమ రెక్కాడితే కానీ - డొక్కాడదు", అని మార్చాలని తీర్మానించుకున్నాడు."ట్యాంక్ బండ్,నెక్లెస్ రోడ్ ప్రాంతాలలో ప్రేమికులు సుబ్బరంగా ప్రేమించుకోవడం కోసం పోలీసులను ఆ ప్రాంతాలకు రానివ్వం అమ్ముకునే వాళ్ళను అడుగుపెట్టనివ్వం. ",ప్రేమికులుఉబ్బితబ్బిబ్బయ్యారు."భగ్నప్రేమికుల కోసం అన్ని బార్లలోనూ, మద్యం దుకాణలలోనూ భగ్నప్రేమికుడు అనే ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపితే.. ఫ్రీగా మందుపోయ్యిస్తాం".భగ్నప్రేమికులకోసం ఉచిత శాలువాలు, కుక్క పిల్లలూ ఇచ్చే ' శాలువా- కుక్కపిల్ల' పథకాన్ని తీసుకొస్తాం.ప్రేమికులు ఆనందంతో గెంతారు ."రౌడి ప్రేమికుల కోసం రూపాయికే లీటర్ యాసిడ్ ను అందించే  పథకాన్ని ప్రారంభిస్తాం. మీరు ప్రేమించిన అమ్మాయిపై యాసిడ్ దాడి చేసేందుకు, ప్రభుత్వ రేషన్ షాపులలో రూపాయి చెల్లించి, యాసిడ్ కొనుక్కుని వెళ్ళొచ్చు. యాసిడ్  దాడి టెక్నిక్ లను, ప్రేమ మంత్రిత్వ శాఖ నేర్పిస్తుంది.ఆర్ధిక,విద్యా, వైద్య శాఖ మంత్రులతో పాటు  ప్రేమకు సంబందించిన  ప్రభుత్వ పథకాల అమలుకు ప్రేమమంత్రిని నియమిస్తాం.   విద్యావ్యవస్థలోనూ  విప్లవాత్మక  మార్పులను తీసుకొస్తాం. అన్ని సబ్జెక్టులతో పాటు "ప్రేమశాస్త్రం " అనే  సబ్జెక్టు ను  పాఠశాలల నుండే  ప్రవేశ పెట్టి భావి భారత ప్రేమికులను తయారు  చేస్తాం. పాఠాలలో ఎలా ప్రేమించాలి, ఎందుకు ప్రేమించాలి, ఎవరిని ప్రేమించాలి, ప్రేమంటే ఏమిటి, ముద్దులు ఎలా పెట్టుకోవాలి. ఎలా కౌగిలించుకోవాలి, ఒకేసారి ఇద్దరిని ఎలా ప్రేమించాలి. ప్రేమలోకి ఎలా దింపాలి, లేచిపోయేటప్పుడు  తీసుకోవలసిన జాగ్రత్తలు , ప్రేమకథలలో ఔనత్యం మొదలైనవి బోధించేలా శ్రద్ద వహిస్తాం. పాఠశాలల్లో  ప్రార్ధన అయిపోయాక, ప్రేమ గీతం పాడిస్తాం. మనం ప్రేమికులం నీయబ్బ... మనది ప్రేమకులం  నీ తల్లి... ప్రేమంటే  మనదేరా కుయ్య... ప్రేమిస్తావా చస్తావా  నీ అయ్య.. ఈ  సాహితీ విలువలు కలిగిన సినీ గీతాన్ని ప్రతిరోజూ పిల్లలతో  పాడిస్తాం. ఈ నూతన ఆలోచనా విధానాన్ని విని , ప్రేమికులు ఆశ్యర్యపోయారు. " కనీసం  ఎనిమిది సంవత్సరాలు  ప్రేమ అనుభవం ఉన్న నిరుద్యోగులను, ప్రేమశాస్త్రం భోదించే ఉపాధ్యాయులుగా  తీసుకుంటాం. ప్రేమికుల కోసం ఉచితగ్రీటింగ్ కార్డులు ఇస్తాం. ఆరూ అంతకన్నా ఎక్కువ ఏళ్ళ అనుభవం ఉన్న వారికి పెట్రోల్ లో  పదిరూపాయలు లీటర్ కు చొప్పున రాయితీ. ఈ రాయితీలు పొందాలంటే, మీరు, ప్రేమలో పడగానే, జంటగా వచ్చి, రిజిస్టర్  చేయించుకుని, గుర్తింపు కార్డు తీసుకోవాలి. బండికి  లైసెన్స్ లాగా , ప్రేమకు  లైసెన్స్  అన్నమాట, దీనికోసం ' ప్రేమ కార్యాలయాలు' గ్రామస్థాయిలో స్థాపించేస్తాం. ప్రేమ కోసం కృషి చేసిన వారికి ,ప్రతి సంవత్సరం, జిల్లాస్థాయి, రాష్ట్ర స్థాయి..' ఉత్తమప్రేమికులు' అవార్డులు ఇస్తాం. ఫిబ్రవరి పద్నాలుగో తేదిని  'రాష్ట్రీయ  ప్రేమదినం' గా   ప్రకటించి ఆ రోజు అన్ని కార్యాలయాల్లోనూ హృదయాకారపు గుర్తు జెండాలను ఎగురవేయించి, సెలవు ఇచ్చేస్తాం.   ఇవన్నీ జరగాలంటే మీ ఓటు మనకే. మన ప్రేమికుల దేశం పార్టీకే! మన గుర్తు అంతర్జాతీయ ప్రేమికుల గుర్తు అదే హృదయకారపు!! మీ ఓట్లు మాకే మాకే' హృదయం గుర్తుకు మీ ఓటు...! గుద్దండీ గుద్దండీ .,  హృదయం మీదే గుద్దండీ". వేదిక మీదున్న పార్టీ కార్యకర్తలు అరవసాగారు. ఆ తర్వాత ఓ ప్రేమ గీతం పాడి,సభను ముగించారు. మీడియాలో 'ప్రేమికుల దేశం పార్టీ ఆవిర్భావ సభకు సంబందించిన వార్తలు,దద్దరిల్లిపోయాయి.   ప్రేమారావు తన కారులో ఇంటి ముందు దిగాడు.తనకు ఇంటి ముందు మంగళ హారతులతో ఘనమైన స్వాగతం ఉంటుందనుకున్నాడు. కానీ ఇంటిముందు నిశ్శబ్దం అతన్ని పలకరించింది. అతడు లోపలికి వెళ్లేసరికి, జుట్టురేగిపోయి,చీర నలిగిపోయి, బొట్టు చెదిరిపోయి, ఏడుస్తూ అతని భార్య ఎదురొచ్చింది.   " ఆ  ... ఎవరు ? ఎవరు  నిన్ను మానభంగం చేసిన నీచుడు ? నీ మానాన్ని దోచుకుని, నీ శీలాన్ని చెరిపేసి, నిన్ను  అపవిత్రం చేసిన "ఆ ధూర్తుడు ఎవరు " ? కోపంగా అరిచాడు."మీ మొహం! మీ బొంద, నాపిండాకూడు, నన్నెవడూ మానభంగం చేయలేదు. నేను కిందపడి దొర్లుతూ ఏడ్చాను. అందుకే  ఇలా అయ్యాను", అంది. ఓ ఉత్తరం చేతిలో పెడుతూ. ప్రేమారావు, ఆ ఉత్తరం అందుకుని చదివాడు."నాన్న! నేను మన Electrician  ను ప్రేమించాను. తెలిస్తే నువ్వు ఒప్పుకోవని నాకు తెలుసు అందుకే, అతనితో కలసి ఎగిరిపోతున్నాను. మాకోసం వెతకొద్దు మీకే పెట్రోల్ దండగ. ఇట్లు మీ కూతురు.... ప్రత్యుష, టెన్త్ క్లాస్" ఇప్పుడు, ప్రేమారావు కిందపడి దొర్లుతూ ఏడుపు ప్రారంభించాడు.

జలదృశ్యం

జలదృశ్యం శ్రీమతి శారద అశోకవర్ధన్ నిండుపున్నమి. పండువెన్నెల. సముద్రం తెల్లని పాలపొంగులా  నురగలు కక్కుతూ  పిచ్చి ఆవేశంతో  ఉరకలు వేస్తోంది, ఎంతో ఆరాటంగా ఒడ్డు చేరుకోవాలని. తీరా ఒడ్డుకొచ్చేసరికి  నీరసపడిపోయినట్టు నీరుగారిపోయి  అంత ఎత్తునుంచీ ధబాల్న నేలకూలినట్టు కుంగిపోయి, అయినా పట్టువదలని  దానిలా పాకుతూనే ముందుకు రావాలని కొట్టుకువస్తూ, 'హమ్మయ్య, ఒడ్డు చేరుకున్నాను' అని నిట్టూర్చేలోగానే, గాలి తాకిడికి తట్టుకోలేక వెనక్కెళ్ళి  ఇసకలో కలిసిపోతోంది. ఈ పిచ్చి కెరటాలకి అలుపు లేదు. ఎవరైనా  తమని చూస్తున్నారేమోనన్న ఆలోచన లేదు. తమ చాతకానితనానికి సిగ్గులేదు. పసిపిల్లల్లోని  గట్టి నమ్మకంలా అతివేగంగా ముందుకు రావడం, వొట్టి నిరాశతో  అంత వేగంగానూ ఇసకలో కలిసిపోయి  తిరుగుముఖం పట్టడం; మళ్ళీ కొత్త కెరటంతో  కలిసి ముందుకు ప్రయాణం కట్టడం. ఎంత సామీప్యం సముద్రానికీ జీవితానికీ? మనిషి పుట్టి పెరిగి పెద్దవ్వగానే ఉరికే కెరటంలా ఏదో సాధించాలని ఏవేవో కలలు కని జీవితం గురించి ఎంతో సాధించాలనే ఉబలాటంతో వుంటాడు. తీరా ఏమీ సాధించకుండానే  కొన్ని చిన్న కెరటాలు మధ్యలో ఆగిపోయినట్టు అర్ధాంతరంగా ఆగిపోయి  మధ్యలోనే మట్టిలో కలిసిపోతాడు. మరికొందరు ఆవేశంతో ఉరకలు తీసే పెద్ద కెరటాలలా ఒడ్డుదాకా  ఒచ్చినా  ఒడ్డుకి  మాత్రం రాలేక, సాగుతూ పాకుతూ ఇసకలో కలిసిపోతారు. మళ్ళీ ఆ ఇసకలోంచే మరో జన్మెత్తి మళ్ళీ ఆ కెరటాలలే మామూలే! అందుకేనేమో అన్నారు పెద్దలు 'జీవితం ఒక కామా, ఫుల్ స్టాప్ కాదని'.      సముద్రాని కెదురుగా  రోడ్డుకి ఆవలివైపు, తెల్లని రెండతస్థుల మేడ. సముద్రపు కెరటాలు నురుగులోని  తెల్లదనం ఆ ఇంటిని కప్పేసినట్టు, తెల్లని నునుపైనగోడలు, తెల్లరంగు పులుముకున్న తలుపులూ  కిటికీలూ, పండు వెన్నెల రోజున  మరీ పాలరాయితో కట్టిన  భవనంలా కాంతులు చిందుతూ  ధగధగా మెరిసిపోతూ వుంటుంది. చందమామ సయితం, ఒక్కసారి అన్నీ మరచి ఆ యింటిని చూడాలన్న  అభిలాషతో, అక్కడే వుండిపోయాడేమో నన్నట్టు, సరిగ్గా పరిగెడితే పట్టుకోవచ్చునన్నంత దూరంలో వెండి కంచంలా  ధగధగా మెరిసిపోతూ  కనిపిస్తాడు. ఇల్లంతా  చూడాలని ఆశ కాబోలు, ఇంట్లో ఏ గదిలో వున్నా కనిపిస్తాడు. తనొచ్చినట్టు ముందుగానే అందరికీ తెలియాలని కాబోలు నెలరాజు, భటుల్లాంటి కిరణాలని ముందుగానే అన్ని గదుల్లోకీ  ప్రసరింపజేస్తాడు. తనరాక ఆ ఇంట్లో  ఏ మూలనున్నా  తెలియాలని. చంద్రుడు అంత ముచ్చట పడిచూస్తూ  ఆ యింటినీ, ఆ సంద్రాన్నీ, తమని మర్చిపోతాడేమోనని భయం కాబోలు అతని దృష్టి నాకర్షించదానికిం అప్పుడే మెరుగుపెట్టిన మేలిమి బంగరులా మరింత మెరుస్తూ వెలిగిపోతున్నాయి. కొబ్బరిబొండాలతో  నిండివున్న కొబ్బరిచెట్లూ, అరటి గెలలతో ఆకుపచ్చని చీరలో అందంగా అలంకరించుకున్న నిండుచూలాల్లా నిగనిగలాడుతూన్న  అరటిచెట్లూ, రకరకాల క్రోటన్లూ తీవెలూ ఆ యింటి అందాన్ని రెట్టింపు చేశాయి.     అందంగా, అధునాతనంగా అలంకరింపబడిన  డ్రాయింగ్ రూము  పక్కనే అదే సైజులో  వున్న అతి సుందరమైన పడకగదిలో పాలరంగు సిల్కు పరదాలను  పక్కకునెట్టి, కిటికీ తలుపులు  తెరచి తలుపులు దభాల్న గాలికి పడిపోకుండా చిడతలు పెట్టి, కిటికీ ప్రక్కనే వున్నా సోఫాలో కూర్చుంది మాణిక్యవల్లి. అలా ఆమె ఎన్ని గంటలైనా  కూర్చోగలదు. ఆమె కట్టే మల్లెపువ్వులాంటి  తెల్లచీర వెన్నెలతో పోటీ పడుతుంది. ఆమె పసిడి మేను నక్షత్రాలకు పోటీ. ఆమెతో అంటిపెట్టుకున్న  పొడవాటి తెలుపు నలుపు కేశాలు నీలి గగనాన్ని  ఆక్రమించుకున్న మేఘాలకు  పోటీ! అవి గాలికి ఎగురుతూ అప్పుడప్పుడు చందమామనే కప్పేసే మబ్బుల్లా  ఆమె మొహాన్ని  కప్పేస్తున్నాయి! నుదుటన పావలా కాసంత మందార రంగు కుంకం తప్ప మరే ఆభరణాలు లేవు ఆమెకు. ఆ బొట్టు ఆమె ముఖానికి జ్యోతి, పువ్వొత్తిలా వెలిగే జ్యోతి. ఆమె ఎవరితోనూ మాట్లాడదు. ఏమీ అడగదు. ఆమెకి టైముకి స్నానం చేయించడం, ఏదో తినిపించడం, మళ్ళీ ఆ కిటికీ దగ్గరే కూర్చోబెట్టడం ప్రతి నిత్యం  వసంతమ్మ పని. బాగా నిద్దరొచ్చి  కళ్ళు  మూసుకుపోతూంటే  మాత్రం, కిటికీ తలుపులు మూసేసొచ్చి, మంచంమీద వాలిపోతుంది మాణిక్యవల్లి.     ఆ ఊరు భీమిలి! ఎర్రకొండలు  నగరప్రాకారాల్లా  చుట్టూ  దట్టంగా వుంటే, పాలసముద్రంలా అక్కడ వెలసిన సముద్రం వొయ్యారాలొలికే నవయవ్వనవతియైన  సౌందర్యరాశిలా  హొయలొలికిస్తూ  స్వర్గమంటే  ఇదేనేమో ననిపిస్తుంది. నిజంగా అది భూతల స్వర్గమే. అందుకే ఎందరో  విదేశీయులనూ చిత్ర నిర్మాతలనూ  దర్శకులనూ  యాత్రికులకు ఆకర్షించింది. సముద్రంలో దొరకే రకరకాల శంఖాలు, రకరకాల రూపాల్లో ఆ వొడ్డున పేర్చి, వాటితో అనేక రకాల వస్తువులను తయారుచేసి  విక్రయిస్తూ వుంటారు కొందరు - సముద్రాన్ని చూసిన వాళ్ళంతా ఇవీచూసి ముచ్చటపడి  కొనుక్కుపోతుంటారు. ముఖ్యంగా విదేశీయులు మరీనూ. మరోవైపు సముద్రంలో దొరికే పెద్ద పెద్ద చేపలు! సొరచేపా, ఉప్పు చేపా మొదలైన ఎన్నోరకాలు.  లొట్టలేసుకుంటూ  వాటికేసి  చూస్తారు జనం. జాలరుకిది  స్వర్గధామం. సముద్రంతో ఆడుకుంటూ  పాడుకుంటూ  పడతారు చేపల్ని. వలనిండగానే  గుండె  నిండిపోతుంది  సంతోషంతో. ఒడ్డుకొచ్చేసరికి చేపల్ని  కొనేవారు ఎదురు చూస్తూంటారు  వీరికోసం. తాజా తాజా  చేపలు కొనుక్కుని డబ్బులిచ్చి వెళ్ళిపోతారు. ఆ చిల్లరతో  జేబులు  నింపుకుని  ఇళ్ళకెళ్ళిపోతారు జాలరులు. అదే వారికెంతో  తృప్తి. అదే వారి జీవనం. అదే వారికి ఆనందం. ప్రశాంతమైన  వాతావరణంలో  స్వచ్చమైన మనస్సులతో  ఇతర కృత్రిమ వాతావరణానికి  దూరంగా  బతికే  నిష్కల్మషమైన జీవులు  వాళ్ళు. దురాశ లేదు! దుఃఖం లేదు! గంగమ్మతల్లి  ఒడి వారి నిధి; అదే పరమావధి.     కిటికీలోలోంచి  ఇవన్నీ  చూస్తూ, సముద్రాన్ని  చిరునవ్వుతో  పరిశీలిస్తూ  గంటలూ, రోజులూ, నెలలూ, ఏళ్ళూ గడిపేసింది మాణిక్యవల్లి. ఆ ఊరినీ ఆ సముద్రాన్ని చూడ్డానికొచ్చిన  ప్రతీవారూ  ఆ ఇంటినీ, ఆ యింట్లో రెండో అంతస్థులో వున్న పెద్దకిటికీ దగ్గర కూర్చున్న ఆమెనూ  చూడకుండా  వుండలేరు. పాలరాతి  ఫలకంమీద నల్లటి  అక్షరాలతో  'జలదృశ్యం' అని రాసి వుంటుంది వాకిటిగేటుపైన. ఆ పేరూ, ఆ ఇల్లూ  అందరికీ  వింతే! ఒక కొత్త పులకింత!         *    *    *     'హిందూదేశంలో  చూడదగ్గస్థలాలూ' అనే గ్రంథాన్ని  సమగ్రంగా  పరిశీలించి రాయాలని అనేక రాష్ట్రాలూ, ఊళ్ళూ తిరుగుతూన్న  అమెరికా నుంచి డేవిడ్ ఆంధ్రాలో అడుగుపెట్టి  విశాఖపట్నంమీదుగా  భీమిలి చేరుకున్నాడు. సముద్రతీరాన వున్న 'సాగర్ విశ్రాంతి గృహం'లో బసచేశాడు. పున్నమి నుంచి పున్నమివరకు  పదిహేనురోజులు  గడిచినా, అతనికి తనివి తీరడంలేదు. కలం కదలడంలేదు. తన్మయత్వంలో  తేలిపోతున్నాడు. అతని భార్య నిశ్చల విశాఖపట్నానికి  చెందిన తెలుగు యువతి కావడంతో  తరుచు ఆమె విశాఖ, భీమిలి సౌందర్యాలను  వర్ణిస్తూ  వుంటే  వినడమే తప్ప, అనుభవిస్తూన్న  ఆ అనుభూతి మాటల కందడం లేదు డేవిడ్ కి. అందుకే మరో పక్షం అక్కడే వుండడానికి నిశ్చయించుకున్నాడు. అతడు ఆ వూళ్ళోచూసిన  స్థలాలలో  అతడు మెచ్చిన - అతడికి నచ్చిన వాటిల్లో జలదృశ్యం బంగాళా, ఆ బంగాళాలో దక్షిణం వైపున్న పడక గదీ, ఆ గదికి అమర్చిన పెద్ద కిటికీ, ఆ కిటికీ దగ్గర కూర్చున్న మల్లెపూవు లాంటి ముగ్ధ సౌందర్యవతి  మాణిక్యవల్లి! ఆమె ప్రతి నిత్యం గంటల తరబడి  ఒక్కర్తే ఎందుకలా కూర్చుంటుందో, ఆ మౌనం ఒక తపస్సా, ఒక పరిశీలనా ఏమిటో తెలుసుకోవాలన్న  కుతూహలం అతనిలో కలిగింది కానీ ఆమె ఎవ్వరితోటీ మాట్లాడదట! అది విన్న డేవిడ్ కి ఏం చెయ్యాలో తేలీలేదు. అయితే వసంతమ్మ మాట్లాడుతుందని  చెప్పారు అందరూ. మెల్లగా  ఆమె దగ్గర సమయం తీసుకున్నాడు విషయసేకరణకి! డేవిడ్ ఉత్సాహంతో  ఊగిపోతూ  అడుగులో  అడుగు వేసుకుంటూ  జలదృశ్యం గేటు తీసి లోపలికెళ్ళాడు! ఎదురుగ్గా  నిల్చున్న  వసంతమ్మ  లోపలికి  రమ్మని  ఆహ్వానించింది. అత్యంత  పారవశ్యంతో ఒక్కొక్క అడుగే ముందుకు  వేస్తూ  ఆ ఇంటినీ ఇంట్లోవున్న వస్తువులనీ ఆశ్చర్యంతో ఆనందంతో తిలకిస్తూ  నడుస్తున్నాడు డేవిడ్.     ఒక గదిలో ఫ్రేము కట్టబడి  గోడకి  అమర్చిన  ఫోటో దగ్గర రెప్ప వాల్చకుండా  చూస్తూ  ఆగిపోయాడు  డేవిడ్. బ్రహ్మదేముడు  ఎంతో తీరిగ్గా  కూర్చుని ప్రశాంతమైన  మనస్సుతో తీర్చిదిద్దిన కుందనపు  బొమ్మలా  వున్న  ఆమె పక్కన ఆజానుబాహుడు, స్పురద్రూపి అయిన ఒక అతను వున్నాడు. వారిరువురూ అందంలో ఒకరితో ఒకరు పోటీపడుతూ  ఒకరికోసం  ఒకరు పుట్టినట్లుగా  వున్నారు ఒకరి భుజాలమీద  ఒకరు చెయ్యివేసి తీయించుకున్న ఫోటోలో.     "ఈమే కదూ ఆ కిటికీ దగ్గర కూర్చునే అందాలరాసి?" అన్నాడు అచ్చతెలుగులో  డేవిడ్. భార్య నిశ్చలవలన  అతనికి తెలుగు మాట్లాడడం బాగానే వొచ్చింది. కాకపోతే అదోరకమైన ఇంగ్లీషులాంటి యాస, కనబడుతూ వుంటుంది.     "అవును."     "అతను?...." ప్రశ్నార్ధకంగా చూశాడు డేవిడ్.     "ఆమె భర్త ఉల్లాస్" అంది వసంతమ్మ.     "ఏం చేస్తారతను?" అడిగాడు డేవిడ్.     "అదొక పెద్ద కథ".... నిట్టూర్చింది వసంతమ్మ. ఈలోగా  వాళ్ళు మాణిక్యవల్లి కూర్చున్న గదిదాకా  వొచ్చారు. తెల్లటి పెద్దాపురం సిల్కుచీర, అదే తెలుపు సిల్కు బ్లౌజు, పిరుదుల వరకూ వ్రేలాడుతూన్న వెంట్రుకలూ__ఆ అందం ఎంత చూసినా  చూడాలనే అనిపిస్తోంది డేవిడ్ కి.     "ఒక తపస్వినిలా  వుంది కదూ?" అన్నాడు డేవిడ్.     "అవును" అన్నట్టు తలూపింది వసంతమ్మ.     "మాట్లాడొచ్చా?" అడిగేడు డేవిడ్ వుండబట్టలేక.     "వొద్దు....మరోసారి. ఈరోజు  శనివారం కదా! ఆమె నాతో కూడా మాట్లాడదు. ఆహారం కూడా ఏమీ తీసుకోదు."     "ఎందుకని? వ్రతమా? పూజా?" ప్రశ్నించాడు డేవిడ్.     "కాదు! అది ఆమె జీవితాన్ని తారుమారు చేసినరోజు. చెప్తా రండి. అలా బయట పచ్చికలో కూర్చుని మాట్లాడుకుందాం" అంటూ కిందకు  తీసుకెళ్ళింది వసంతమ్మ. ఇద్దరూ  వెళ్ళి పచ్చికమీద రెండు కుర్చీలు వేయించుకుని కూర్చున్నారు. వసంతమ్మ చెప్పడం మొదలెట్టింది:     "మాణిక్యవల్లి  మా అక్క కూతురు. ఉల్లాస్ మా ఆడపడుచు కొడుకు. ఇద్దరూ వైజాగ్ లోని ఇంజనీరింగ్ కాలేజీలో  చదువుతూ వుండేవారు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. మేమూ సంతోషించాం. రూపురేఖల్లోనూ, చదువు సంధ్యల్లోనూ  కూడా ఎవరికి ఎవరూ తీసిపోనంతగా వున్నారు. ఇద్దరి పెళ్ళి  విశాఖపట్నం  డాల్ఫిన్ హోటల్లో  ఘనంగా  జరిగింది. హనీమూన్ కి సింగపూర్ పంపించాడు బావ. బావగారు మెరీన్ ఇంజనీయరు. ఉల్లాస్ వాళ్ళ నాన్నగారు  విశాఖపట్నం కె.జి.హెచ్. లో డాక్టరు. పెళ్ళయిన సంవత్సరానికే అమ్మానాన్నలయ్యారు మాణిక్యవల్లి, ఉల్లాస్ లు. పండులాంటి  కొడుకు  పుట్టాడు. పేరు కౌశిక్."     "ఓ....వండర్ ఫుల్....హౌ లక్కీ...." అన్నాడు డేవిడ్.     "నా మొహం! ఏమి లక్కీ! కౌశిక్ మొదటి పుట్టిన రోజున అందరూ భీమిలీ వొచ్చారు.  ఈ జలదృశ్యం విద్యుద్దీపాలతో దేదీప్యమానంగా అలంకరించబడి  వెలిగిపోయింది. ఎందరో  అతిధుల సమక్షంలో కౌశిక్ కేక్ కట్ చేశాడు. అందరి ఆశీర్వచనాలతో కార్యక్రమం పూర్తయి ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళారు. బాబుకి 'దిష్టి' తీస్తానని అక్క లోపలికి వెళ్ళింది. మేమూ అక్కా కౌశిక్ లతో లోపలికి వెళ్ళాము. ఆరోజు నిండుపౌర్ణమి! పండువెన్నెల పిండారపోసినట్టుగా  వుంది. ఉల్లాస్ కీ మాణిక్యానికీ కూడా సముద్రమంటే  పిచ్చే. గంటలకొద్దీ ఇద్దరూ సముద్రతీరాన గడిపేవారు భీమిలీకొస్తే! అసలు మాణిక్యవల్లికి  మా ఇల్లు జలదృశ్యమంటే  మరీ ఇష్టం. ఏ గదిలో నుంచి చూసినా  సముద్రం పలకరిస్తూ  కనిపిస్తుంది.     "నేనూ  ఉల్లాస్ బీచ్ కెళ్ళొస్తాం. కౌశిక్ జాగ్రత్త!" అని అరుస్తూనే అక్క సమాధానానికి  కూడా ఎదురుచూడకుండా   బీచ్ కి వెళ్ళిపోయారు మాణిక్యవల్లీ ఉల్లాస్ లు. కౌశిక్ కి అన్నం తినిపించి  నిద్రపుచ్చింది అక్క. అందరూ  ఆ రోజు జరిగిన పుట్టినరోజు కార్యక్రమంలోని  విశేషాలు  చెప్పుకుంటూ  కూర్చున్నాం." అంటూ ఇంకా ఏదో చెప్పబోయేలోపల  టెలిఫోన్ మ్రోగడంతో గబగబా వెళ్ళి ఫోను తీసింది వసంతమ్మ. ట్రంక్ కాల్ లా వుంది, గట్టిగా  అరిచి మాట్లాడుతోంది. "ఆ! సెలవులిచ్చారా? ఎన్నాళ్లు? వారంరోజులా? సరే....రా....ఆ!....అమ్మా....అమ్మ బాగానేవుంది. ఆ!....సముద్రమా? దానికేం?....బాగానేవుంది. రా! నువ్వురా....నీతోకూడా  ఎవరొస్తున్నారు? దివ్యకాంతి వస్తోందా? ఇంకా? పెద్ద వాళ్ళెవరూ  రావడంలేదా? డ్రైవర్ శంకరొస్తున్నాడా? ఓ....కే....బై...." ఫోను పెట్టేసింది వసంతమ్మ.     'పైడితల్లీ' అని వంటవాణ్ణి  కేకేసి తనకీ డేవిడ్ కీ రెండు 'టీ'లు పంపించమంది. వసంతమ్మ  వెళ్ళి డేవిడ్ ఎదురుగ్గా కూర్చుంటూ "సారీ....బాబు ఫోను చేశాడు. ఎల్లుండి బయల్దేరి ఒస్తున్నాట్ట. సారీ....బాబు అంటే మా కౌశిక్. మాణిక్యవల్లి కొడుకు" అంది.     "ఓ.... అయితే నేను బాబుని  చూడొచ్చన్న మాట!"     "చూడొచ్చు...."     "అది సరే....బాబెక్కడున్నాడు? వాళ్ళ నాన్నగారి సంగతీ...."     "అదే.... చెప్తున్నా.... అలా పుట్టింరోజు కేక్ కట్ చెయ్యడం అయిపోగానే బీచ్ కెళ్ళిన మాణిక్యవల్లీ, ఉల్లాస్ లు, చీకటి పడుతోందీ అన్న విషయం కూడా మర్చిపోయి, పసి పిల్లల్లా చెట్టా పట్టా లేసుకుంటూ, నీళ్ళల్లోకి  నడిచారు. ఒడ్డుకి చేరే కెరటం భూమిమీద పాకుతూ  వున్నప్పుడూ, కాళ్ళ కింద ఇసక జారిపోతూ  మనిషి తూలి పోతూన్నట్టవుతుంది కదా. అందులో పౌర్ణమి రాత్రి.   సముద్రం పిచ్చి ఆవేశంతో గంతులు వేస్తూన్నట్టుంది. అప్పుడే జాలరులందరూ  కూడా ఇళ్లు చేరుకుంటున్నారు, గంగమ్మకు దణ్ణం పెట్టి సెలవు తీసుకుంటూ  బీచ్ కొచ్చిన వాళ్ళుకూడా  ఒక్కొక్కళ్ళే మెల్లగా  తిరుగు ముఖం పడుతున్నారు. అంతలోనే నల్ల ముసుగు వేసినట్టు ఆకాశాన్ని  కారుమబ్బులు  కప్పేశాయి. ఎక్కణ్ణుంచో తోసుకు వొస్తున్నట్టు  మేఘాలు  వర్షాన్ని మోసుకుంటూ వొచ్చి అక్కడ వొదిలేసినట్టు. ఒక్కసారిగా వర్షం ప్రారంభమైంది. చిమ్మని చీకటి! పరుగులెత్తే సముద్రం! వర్షం! అందరూ గబగబా పరుగెత్తడం మొదలెట్టారు. పెద్ద పెద్ద ఉరుములూ, మెరుపులూ, మిన్ను విరిగి మీద పడేంత గాలి! ఆ ఫెళ ఫెళలోంచి ఏవో అరుపులు! ఒక పెద్ద  అల ఉల్లాస్ నీ మాణిక్యవల్లినీ ఒడ్డునుంచి లాగేసింది. మరో అల విసురుగా వొస్తూ, మాణిక్యవల్లిని మళ్ళీ వెనక్కి తోసేసింది. కానీ ఉల్లాస్ మాత్రం, ఎంత దూరం కొట్టుకుపోయాడో, ఎక్కడ చిక్కుకుపోయాడో ఇప్పటికీ తెలీదు." వసంతమ్మ  దుఃఖాన్నాపుకోలేక పోయింది. పమిట కొంగు మోహాని కడ్డం పెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. డేవిడ్ కూడా కన్నీళ్ళని కర్చీపుతో, తుడుచుకున్నాడు.     పైడి తల్లి ట్రేలో బిస్కట్లూ, టీ పెట్టి పట్టుకొచ్చాడు. మౌనంగానే కప్పులని అందుకున్నారు వసంతమ్మా డేవిడ్ లు. వేడి వేడి టీ నలిగిపోతూన్న మనసులకు కాస్త ఉపశమనాన్నిచ్చింది. వసంతమ్మ మళ్ళీ చెప్పటం మొదలెట్టింది:     "అపస్మారస్థితిలో మాణిక్యవల్లిని ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆమె ప్రాణాలని కాపాడ్డంకోసం విశాఖపట్నం నుంచి  డాక్టర్లని పిలిపించారు ఆమె తండ్రి. ఎందరు గజ ఈతగాళ్ళు దిగి సముద్రమంతా  గాలించినా, హెలీకాప్టరులో ప్రభుత్వమువారు ఉల్లాస్ జాడ కనుక్కోవడానికి వారంరోజులు శ్రమించినా  ఫలితం లేకపోయింది. కళ్ళు తెరిచిన మాణిక్యవల్లి నోట ఒకే మాట........ 'ఉల్లాస్.... ఉల్లాస్...ఒచ్చెయ్....పెద్ద కెరటం వొస్తోంది....' అని! ఆమెకి స్పృహవొచ్చినా....ఇంకా నీళ్ళలో వున్న అనుభూతి....కొట్టుకుపోతూన్నట్టు  భయం....ఉల్లాస్ వొచ్చేయ్ అని పిలుస్తూన్న ఆందోళన తప్ప మన ధ్యాస రాలేదు. క్షణంలో అందరి జీవితాల్లోనూ  అంతులేని చీకటి! చెప్పనలవికానంత  సముద్రమంతదుఃఖం. ఆకాశాన్ని  కమ్ముకున్నంత  మబ్బులంత దిగులు! డాక్టర్ల బృందం ఆమెకి ఇక్కడే వుండి  వైద్యం చేసింది! దాదాపు సంవత్సరం పట్టింది ఆమె వాస్తవంలోకి రావడానికి! అయితే విచారకరమైన విషయమేమిటంటే, ఇదంతా కౌశిక్ పుట్టినరోజునాడు జరగడం. ఆ రోజే ఉల్లాస్ పోవడంతో, కౌశిక్ అంటే మాణిక్యవల్లికి  ద్వేషం పట్టుకుంది.  కంచే చేనుమేసినట్టు కన్న తండ్రి కరువైపోయి, కన్నతల్లి ఆగ్రహానికి బలైపోయిన  కౌశిక్ ని వాళ్ళ బామ్మ, తాతయ్యలు కొన్నాళ్ళూ, మా అక్కాబావగారూ కొన్నాళ్ళూ పెంచారు. కొడుకు పోయాడన్న దిగులుతో ఈ దేశంలో వుండలేక ఏదో అవకాశం రావడంతో మా ఆడపడుతూ అన్నయ్యగారూ అమెరికా వెళ్ళిపోయారు. కౌశిక్ అమ్మమ్మగారి దగ్గరే విశాఖలో  చదువుతున్నాడు. ఇప్పుడు ఏదో క్లాసులో కొచ్చాడు."     "ఇప్పటికీ కౌశిక్ ఒస్తే మాణిక్యవల్లిగారు మాట్లాడరా?" సందేహంగా, బాధగా అడిగాడు డేవిడ్.     "లేదు ఊరికే వాడికేసి చూస్తోంది. ఆ చూపులో జాలి వుందో, కోపం వుందో, బాధ వుందో తెలీదు. అంతేకాదు, వాణ్ణి చూడగానే మళ్ళీ 'ఉల్లాస్' అంటూ సముద్రంవైపు  పరుగెడుతుంది. అందుకే  డాక్టర్లు  కొన్నాళ్ళు బాబుని ఆమెకి చూపించొద్దన్నారు."     "పాపం!" డేవిడ్ మళ్ళీ కర్చీపుతో కళ్ళు తుడుచుకున్నాడు.     "కౌశిక్ అచ్చు మా ఉల్లాస్ పోలికే అచ్చోసినట్టు! ఇంకా పెద్దయ్యాక వాడిలో ఉల్లాస్ పోలికలు పూర్తిగా  వొస్తాయని నా నమ్మకం. డాక్టర్లు అదే అంటారు. అప్పుడు వాడిలో ఉల్లాస్ ని చూసుకుంటూ  మాణిక్యవల్లి మామూలు మనిషి కావొచ్చు అంటారు" అంది వసంతమ్మ.     "..........." డేవిడ్ నిట్టూర్చాడు.     "ఆమెకి ఆ కిటికీయే సర్వస్వం. కేవలం నిద్రపోయినప్పుడూ  లేదా అత్యవసవరమైన  కార్యక్రమాలకు  లేచినప్పుడూ  తప్ప ఆమె ఆ కిటికీని వొదలదు."  దుఃఖాన్ని దిగమింగుతూ చెప్పింది వసంతమ్మ.     "అవును. నేనీ వూరువొచ్చి, ఈ సముద్రపు వొడ్డున కూర్చున్నంత సేపూ  అటు సముద్రాన్నీ  ఇటు కిటికీలోంచి కనబడే ఆమెని ఇద్దరినీ రెండు కళ్ళతో  చూడడం నా కలవాటయిపోయింది" అన్నాడు.     "ఈ రోజు శనివారం. ఆమె పచ్చి మంచినీళ్ళు  కూడా ముట్టుకోదు. శనివారమే తన జీవితాన్ని మార్చేసిన వారం. ఉల్లాస్ ని తనలో కలుపుకున్న వారం" అని ఆమెకి తెలుసా అంటే వారాలూ, తారీకులు ఆమెకి తెలుసన్న  మాటేగా!" అడిగేడు డేవిడ్ తన సందేహాన్ని  వెలిబుచ్చుతూ.     "అవును మిస్టర్ డేవిడ్! ఒక శనివారం మేము మర్చిపోయాం. పైడితల్లి మామూలుగా పొద్దున్న  ఇడ్లీలు తీసుకెళ్ళాడు బ్రేక్ ఫాస్ట్ కి. ముట్టుకోలేదు. ఒకే మాట అంది. 'ఇవాళ శనివారం. నా ఉల్లాస్ కూడా వొస్తాడు. కలిసితింటాం. అందాకా ఆగుతాను.' అంతే. అప్పటినుంచి పొరపాటున ఎవరైనా తినడానికి ఏదైనా ఇచ్చినా మళ్ళీ అవే మాటలు. దీన్ని బట్టి  ఆమెకు పూర్తిగా మతిపోలేదు. కానీ, సముద్రం, ఉల్లాస్, జరిగిన సంఘటనా  ఇవి మాత్రమే గుర్తున్నాయనిపిస్తుంది. డాక్టర్లూ అదే అంటారు. ఇప్పటికీ ఎన్నో మందులు నిత్యం వాడుతూనే వున్నాం."     ఇద్దరి మధ్యా మౌనం.     "వెరీ శాడ్...." అన్నాడు డేవిడ్ బాధగా.     మళ్ళీ మౌనం.     కాస్సేపటికి డేవిడ్ అడిగాడు - "మేడమ్.... మీవారు...." అని.     "ఓ.... అదా.... చెప్పడం మరిచా. మాకు టెక్స్ టైల్ బిజినెస్ వుంది. ఆ పనిమీద వారు జపాన్ వెళ్ళారు. నెలరోజులయింది. నెక్ట్స్ మంత్  వొచ్చేస్తారు. మాకు పిల్లలులేరు. మాణిక్యవల్లే  మా అమ్మాయి. ఈ బంగ్లా మా కౌశిక్ కే ఇస్తాం. వాడు నాకు మనవడే కదా...." అంది నవ్వుతూ.     "ఇండియాలో ఈ బంధాలు చాలా అపురూపమైనవి మిసెస్ వసంతమ్మ గారూ! మీ ఫిలాసఫీ, మీ సిద్ధాంతాలూ చాలా గొప్పవి. మాలాగా మెకానికల్ లైఫ్ కాదూ, మెటీరియలిస్టిక్ లైఫూకాదు. వేదాంతధోరణీ, పునర్ జన్మ  గురించిన చింతనా  మీలో వుంది కాబట్టే, తప్పు చెయ్యడానికి మీరు వెనకాడుతారు.  ఐ....లైక్.... ఇట్.... అందుకే ఇండియన్ ని పెళ్ళి చేసుకోవాలనుకున్నాను. నిశ్చలను చేసుకున్నాను. ఆమె మీలాగే చాలా మంచిది" అన్నాడు ఇంక వెళ్ళడానికి సిద్ధపడుతూ.     "థాంక్యూ.... ఫర్ ది కాంప్లిమెంట్ మిస్టర్ డేవిడ్!" అంది నమస్కారం పెడుతూ వసంతమ్మ.     "మళ్ళీవొస్తాను. రేపు నేను హైదరాబాద్ వెళ్తున్నాను. ఒక వారం తరవాత  మళ్ళీ వొస్తాను. అప్పుడు మాణిక్యవల్లిగారిని  పలకరిస్తాను" అన్నాడు డేవిడ్ ప్రతినమస్కారం చేస్తూ.     "అలాగే" అంది వసంతమ్మ.     ఆ కిటికీవైపు  మరోసారి చూసి, వెళ్ళిపోయాడు డేవిడ్.         *    *    *     హైదరాబాద్ నుంచి తిరిగి రాగానే, బీచ్ కి వెళ్ళాడు డేవిడ్. అతనికళ్ళు అప్రయత్నంగా జలదృశ్యంలోని కిటికీవైపు  వెళ్ళాయి.డేవిడ్ మనసు చివుక్కుమంది. కిటికీ తలుపులు  మూసున్నాయి. మతిపోయినవాడిలా కిటికీనే చూస్తూ, ఉండబట్టలేక జలదృశ్యానికెళ్ళాడు. బెల్ కొట్టగానే పైడితల్లి  తలుపుతీశాడు. డేవిడ్ ని గుర్తుపట్టి లోపలికి  రమ్మని  ఆహ్వానించాడు.     "వసంతమ్మగారు లేరా?" అడిగేడు డేవిడ్.     "లేరుసార్! మాణిక్యవల్లి అమ్మగారికి గుండెనొప్పి వొచ్చింది మొన్న సాయంత్రం. హార్ట్ అటాక్ అని, మద్రాసు తీసుకెళ్ళారు. అక్కడ విజయా నర్సింగ్ హోంలో చేర్పించారు" అన్నాడు పైడితల్లి.     డేవిడ్ కి పిచ్చెక్కినట్టయింది. ఒక్కసారి పైకెళ్ళి, కిటికీవైపు చూశాడు. ఆమె కుర్చీ అక్కడే వుంది కిటికీ తలుపులు  మూసున్నాయ్! ఆ మూసిన కిటికీనీ, ఆమె లేని ఆ కిటికీని చూడలేకపోయాడు డేవిడ్.     పైడితల్లి  అందించిన టీ తాగేసి  వెళ్లిపోయాడు గబగబా. ఏదో బాధ, ఏదో అసంతృప్తి అతణ్ణి పిచ్చివాణ్ణి చేస్తోంది.     ఆ సముద్రాన్ని మధించి ఉల్లాస్ ని వెలికి తెచ్చి, మాణిక్యవల్లికి అప్పగించాలన్న ఆశ!     మాణిక్యవల్లి మామూలు మనిషైపోయి, కౌశిక్ తో ప్రేమగా వుండాలన్న కోరిక!     ఆ కిటికీ తలుపులు అలా మూతపడుండక, తెరిచే వుంచాలన్న ఆకాంక్ష!     వెర్రిగా సముద్రంవైపూ, కిటికీవైపూ చూస్తుండిపోయాడు డేవిడ్!     ఆ మర్నాడు మళ్ళీ బీచ్ కొచ్చిన డేవిడ్ 'జలదృశ్యం' బంగళావైపూ ఆ కిటికీ వైపూ  చూశాడు. కిటికి తలుపులు  తెరిచివున్నాయ్ భగవంతుడు తన బాధ తెలుసుకున్నాడు కాబోలు, ఆ గది కిటికీలు మళ్ళీ  తెరుచుకున్నాయ్' అనుకుంటూ  మాణిక్యవల్లిని  కుసుకోవాలని  గబగబా లోపలికెళ్ళాడు. హాల్లో అడుగు పెట్టిన  డేవిడ్ అడుగు ముందుకు పడక అక్కడే ఆగిపోయాడు. అందరూ వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. ఆ దృశ్యం అతనికి బాకులా గుచ్చుకుంది గుండెల్లో. మాణిక్యవల్లి శవం రకరకాల పూలమధ్య అమర్చినట్టుగా వుంది. ఆ పూలకన్న అందమైన ఆమెని శవమని  మరచి ఒక్కక్షణం ముద్దు పెట్టుకోవాలనిపించింది డేవిడ్ కి. వెళ్ళి నెమ్మదిగా నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. కాళ్ళు నెమ్మదిగా ఆ కిటికీ దగ్గరకి లాక్కుపోయాయి. ఆశ్చర్యం! ఆ కిటికీ దగ్గర కూర్చుని తదేకంగా సముద్రాన్ని చూస్తున్న ఆ అబ్బాయి కనిపించాడు. అతడు అచ్చు ఉల్లాస్ లాగానే వున్నాడు. వెనక నుంచి వెళ్లి అతడి భుజాల మీద చెయ్యి వేశాడు డేవిడ్.     "ఏం చూస్తున్నావు బాబూ....సముద్రాన్నా?...." అడిగేడు.     'కాదు....' ఖచ్చితంగా జవాబు చెప్పేడు బాబు.     'మరి?' ఆశ్చర్యంగా అడిగేడు డేవిడ్.     'మా అమ్మనీ....నాన్ననీ...."     డేవిడ్ గుండెల్లో సముద్రం పొంగినట్టయింది. గుండె పగిలిపోతుందేమో నన్నంత బాధ. రెండు చేతులూ ఎత్తి  ఎడమచెయ్యితో  గుండెని అదిమి పట్టుకుని, కుడిచేత్తో బాబు తల నిమిరాడు. కళ్ళు రెండూ  సముద్రాలయ్యాయి. అంతలో పైడితల్లి  ఇడ్లీప్లేటుతో అక్కడికొచ్చి 'బాబూ! పొద్దుటి నుంచి పచ్చి మంచినీళ్ళయినా  తాగలేదు. ఈ ఇడ్లీలు తినండి' అన్నాడు ప్లేటుని బాబు కందిస్తూ.     'ఇవాళ శనివారం, నేనేమీ తినను.'     ఆ మాటలకి పైడితల్లి గుండె అదిరిపోయింది. చేతిలోని ఇడ్లీపళ్ళెం జారిపోయింది. గుండె ఆగినట్టయిపోయింది. డేవిడ్ నోరుతెరిచి బాబుని చూస్తూండిపోయాడు.                  

వారసులు

వారసులు శ్రీమతి శారద అశోకవర్ధన్      జూబ్లీ హిల్స్ లో ఎత్తయిన కొండమీద అత్యంత అధునాతనంగా కట్టిన పాలరాతి బంగళా జాబిల్లి చిమ్మే వెండి వెలుగుల జిలుగులతో తళ తళా మెరుస్తోంది. ప్రహరీగోడ చుట్టూ వాచ్ మాన్ లలా నుంచున్న అశోక వృక్షాలు వెన్నెల కాంతికి మెరిసిపోతూన్నట్టున్నాయి. అందమైన చిన్న లాను, చుట్టూ అనేక రకరకాల పూల తొట్లూ ఆ యింటి గొప్పదనాన్ని చాటుతున్నాయి. కాపలాదారు మాత్రం నిద్రకాపుకోలేక కాపలా పని ఆల్ సేషన్ కుక్కలకి వొదిలేసి, వెన్నెల స్నానం చేసినట్టు హాయిగా గేటుదగ్గరే కటికనేలమీద గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు. క్షణమైనా కన్ను మూత పడక నిద్రపట్టని నరహరిగారు కిటికీలోంచి ఈ దృశ్యాన్ని చూసి నవ్వుకున్నాడు. ఎనభైఏళ్ళ నాటి గోడగడియారం ఎవరికీ నచ్చనందున అది నరహరిగారి గదిలో చోటుచేసుకుంది. దాని డ్యూటీ అది చేస్తూ మూడు గంటలు కొట్టింది. నరహరిగారు మంచం దిగి పక్కన టేబిల్ మీద వుంచిన రాగి చెంబు వొంపుకుని గ్లాసుడు నీళ్ళు గడగడా తాగేశాడు. మంచం మీద వెల్లకిలా పడుకుని, కిటికీ చువ్వలలో నుంచి కనిపిస్తూన్న చందమామను చూస్తూ పసిపిల్లాడిలా పులకరించిపోతూ రాని నిద్రకోసం జపంచేస్తూ కళ్ళు మూసుకున్నాడు.        గడియారం క్రమం తప్పకుండా తన కర్తవ్యాన్ని తను నెరవేరుస్తూ నాలుగు గంటలు కొట్టింది. మార్నింగ్ వాక్ చెయ్యడం అలవాటున్న వరహరిగారు పొద్దుటే బయలుదేరి ఆరు కిలోమీటర్లు నడిచాక టాంక్ బండు మీదుగా వస్తూ, పరుగెడుతున్న జనాన్ని చూసి అర్ధం కాక అడిగారు కనిపించిన ప్రతివాణ్ణీ. "అసలు ఇక్కడ ఏం జరిగింది? ఎక్కడికి అలా కంగారుగా పరుగెత్తి పోతున్నారు? చెప్పండి. ఏం జరిగింది?" గొడవేమిటో తెలీక పరుగెడుతూన్న జనాన్ని చూసి, ఎవరూ జవాబు చెప్పక పోవడంతో తనూ పరుగెత్తారు నరహరిగారు. జనాన్ని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీలు ఝళిపిస్తున్నారు. అందరి మొహాల్లోనూ ఏదో భయం. ఆడవాళ్ళు వొణికిపోతున్నారు. పసిపిల్లల నెత్తుకున్న తల్లులూ, గర్భిణీలూ, ముసలీ ముతకా పరుగో పరుగు. నరహరిగారికి చెమటలు పట్టాయ్. మరి పరుగెత్తలేకపోతున్నారు. పోలీసులు తరుముకొస్తున్నారు. అందరూ దుకాణాలు మూసేస్తున్నారు. ఇళ్ళలో వాళ్ళు తలుపులు బిడాయించుకుంటున్నారు. నరహరిగారికి పంచె కాళ్ళకి అడ్డం తగిలింది. తూలిపడ్డారు. వెనకనుంచి ఎవరో పట్టుకుని, పదవయ్యా గబగబా అంటూ తనే రెక్కపట్టిలాగి, ఎవరిగేటులోకో దూరిపోతూ అతణ్ణీ లోపలికి లాగి గేటు మూసేశాడు.            పెద్ద ఊరేగింపుతో, బాజాభజంత్రీలతో, రకరకాల జానపదాల వంటి నృత్యాలతో, పూలతో అలంకరింపబడ్డ లారీ కనిపించింది. ఏదో దేవుడి ఊరేగింపు అనుకుని "ఏ దేముడు బాబూ?" అడిగారు. అతడు నరహరిగారి నోటిమీద చెయ్యివేసి, మెల్లగా మాట్లాడ మన్నట్టు సౌజ్ఞ చేసి "దేముడా పాడా? ఎవరో రౌడీ షీటర్ చచ్చిపోయాట్ట....క....క....కాదు....చంపబడ్డాట్ట మరో రౌడీ షీటర్ చేత. ఇరు వర్గాలమధ్య ఘర్షణ జరిగి, మరో ఇద్దరు పొడుచుకున్నార్ట....దాంతో ఈ గొడవంతా...." "మరీ...." ఏదో అనబోయిన నరహరి, ఊరేగింపు లారీ దగ్గరకి రావడం, అందరి అరుపులూ, కేకలూ, శోకాలూ, గందరగోళం విని మాటరాక అక్కడే చతికిలబడిపోయారు దాదాపు రెండు గంటలసేపు నరహరిగారు! అది దుఖఃమో, సంబరమో తెలీని విధంగా భయ బీభత్సాలని మాత్రం సృష్టిస్తూ రథం లాగ కదిలిపోయింది. సదరు శవయాత్ర తాలూకా లారీ! 'బతుకు జీవుడా' అని బయటపడ్డ నరహరిగారు, రామ్మూర్తి గారింటికెళ్ళి లోపలకి అడుగుపెట్టబోతూ అడుగు ముందుకు పడక అక్కడే ఆగిపోయారు. రామ్మూర్తిగారూ తనూ కలిసిపనిచేసిన రోజులు కళ్ళముందు తిరిగాయ్ పాపం! రామ్మూర్తి మధ్య వయస్సులోనే కష్టాలకుంపట్లో కాలి మసై పోయాను.          అతని సంతతి నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్ళు కష్టపడి చదువుకుని వారాలు చేసుకుని, స్వయంకృషితో పైకొచ్చారు. అందరూ పెద్ద పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అన్నదమ్ములు కలిసి కట్టుగా కష్టాలనన్నీ ఎదుర్కొని ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ ఇద్దరు సోదరీమణులకీ పెళ్ళిళ్ళు చేసి రామ్మూర్తిగారిని ఎరిగున్న వాళ్ళందరి చేతా శెభాష్ అనిపించుకున్నారు. అయితే ఉద్యోగాలూ హోదా పెరిగాక, వారి వారి భార్యామణుల్లో కలిగిన మనస్పర్ధలూ, పెరిగిన స్వార్ధం అన్నదమ్ముల్లో జ్వాలలు రేపాయి. రక్తసంబంధాన్ని కూడా మరచిపోయి, ఆప్యాయతలని అడుగున మట్టు బెట్టి, మమకారాన్ని మంటగలిపి, గర్భశత్రువుల్లా పోట్లాడుకుంటున్నారు. ఆ రోజు వారి పోట్లాట తారాస్థాయి నందుకుంది. నరహరిగారు ఆ దృశ్యాన్ని చూసి నోటమాటరాక చలించిపోయారు. ఒక్కొక్కరినే పిలిచి సర్దిచెప్పబోయారు. ఫలితంగా అందరినుంచీ తిరస్కారాలూ ఛీత్కారాలూ అందుకున్నారు. తనక్కడ వున్నాడన్న మర్యాద కూడా లేకుండా ఒకరినొకరు చంపుకున్నంతగా మండిపడుతూ తిట్టుకు చచ్చారు. ఇంచుమించు నరహరిగారిని కూడా చీవాట్లు పెట్టినంత పనిచేయడంతో, నోరెత్తలేక, మూగవేదనతో తిరుగు ముఖం పట్టారు నరహరిగారు. ఆ కంగారులో సరిగ్గా చూసుకోకపోవడంవల్ల, కాలు బురదలో పడి బాగా మట్టి అంటుకుపోయింది. దారిలో బోరింగ్ పంపు దగ్గర కాలు కడుక్కుందామని ఆగారు. ధార సన్నగా వొస్తోంది.       నిమిషాల్లో అక్కడ బారులు తీసిన బెందెలు, అదేదో సినిమాలో బిందెల డాన్సులాగా కనిపించి, 'ఇదేదో సినిమా షూటింగు కాదుకదా!" అనుకుని తిరిగి చూసేసరికి ఆడవాళ్ళు నీళ్ళకోసం బిందెలతో గుద్దుకోవడం కనిపించి గుండె ఆగిపోయి వాళ్ళనాపడానికెళ్ళి చాతకాక బిందె దెబ్బలు తిని, మూలుగుకుంటూ బయటపడ్డారు ఇక లాభం లేదని. అప్పటికే టైము తొమ్మిది దాటడంతో కడుపులో ఎలుకలు తిరగడం మొదలెట్టాయి. "ఇంటికెళ్ళి స్నానం చేసి ముందు పాలు తాగెయ్యాలి. ఇవ్వాళ ఆలస్యమైపోయింది" అనుకుంటూ, షార్టుకట్ కదా అని బోట్ క్లబ్బు దగ్గరి నుంచి బస్సెక్కి వెళదామనుకుని బస్ స్టాండ్ దగ్గర నుంచున్నారు. ఎంతకీ బస్సులు రాలేదు. మళ్ళీ కాళ్ళకి బుద్ధి చెప్పి అంత దూరం నడిచినందుకు తనని తానే తిట్టుకుంటూ, ఆటో కోసం చూడగా, జూబిలీహిల్స్ అంటే ఒక్కడూ రానన్నాడు. అరగంటకి కానీ కారణం తెలీలేదు నరహరిగారికి. ఇద్దరు వేరువేరు మతస్థుల మధ్య మతాబాలాగా అంటుకున్న గొడవల చిచ్చు దావానలమై, అది ఇళ్ళూ గుళ్ళూ కూలగోట్టుకుని తలలు పగిలేదాకా పెరిగిందట. దాంతో బస్సులూ, ఆటోలూ అన్నీ బంద్! హోటళ్ళూ తెరిచినవి మూసేశారు. ఉస్సురంటూ అడుగులు అతికష్టం మీద వేస్తూ నడక ప్రారంభించారు. కానీ కాస్సేపటికి ఆయాసం పట్టుకుంది. చిన్న కిల్లీ కొట్టు దగ్గర ఆగి వున్న టిఫిను బండి కనిపించింది. కిల్లీ కొట్టు దగ్గరే వున్న దుకాణంలో న్యూస్ పేపరు కొని, పక్కనున్న టిఫిను బండి దగ్గర ఒక కప్పు టీ తాగి, కాళ్ళు పీకుతుండడంవల్ల, కాస్సేపు మూసున్న దుకాణం అరుగుమీద కూర్చుండిపోయారు.         అసలే ఆంధ్రకేసరీ, పఠాభి వంటి మహనీయులతో కలిసి పనిచేసి, నేడు స్వాతంత్ర్యసమర యోధుడుగా పెన్షన్ పుచ్చుకుంటూన్న నరహరిగారు, భోజనం లేకపోయినా వుంటారేమోగానీ, వార్తలు చదవకుండా వుండలేరు. పేపరు చదవకపోతే, కడుపులో తిప్పినట్టయి, వాంతి చేసుకున్నంత పనవుతుంది అతనికి. "ఏ కులానికెన్ని సీట్లు కేటాయించాలీ, ఎవరెవరు పదవుల కోసం పార్టీలు మారుస్తూ కులాల పేరుతో కులకాలని చూస్తున్నారూ దానికోసం ఎన్ని వంచనలూ, ఎన్ని సంచలనాలూ, కక్షలూ కార్పణ్యాలూ? ఎంత మారిపోయింది కాలం! పదవికోసం, పలుకుబడి కోసం, పైసా కోసం పెళ్ళాన్నయినా అమ్ముకునే నీచత్వం , కుటుంబానికి విలువలేని విచ్చిన్న పరిస్థితులకు దారితేసే తిక్క సిద్ధాంతాలూ, కపట రాజకీయాలూ, వికట వ్యాసంగాలూ - ఎంత కలుషితమైపోయింది వాతావరణం! నీతికి నిలిచినావాడికి నిలువ నీడలేదు. భీతి వొదిలి సిగ్గువిడిచిన వాడు రొమ్ము విరుచుకు స్వైరవిహారం చేస్తున్న సమయం...." మరి చదవలేక పేపర్ని విసిరికొట్టి మళ్ళీ నడక ప్రారంభించారు. గుంపులు గుంపులు జనాలు! పెట్టే పేడా బట్టుకొని కొందరూ, బుట్టా, తట్టా, చేతి సంచీలూ కర్రలూ వగైరాలతో కొందరు.... నేల ఈనినట్టుంది జన సందోహం! నరహరిగారికేమీ అర్ధం కాలేదు. "ఎవరు మీరంతా?" ఒకర్ని చెయ్యి పట్టుకుని మరీ ఆపి అడిగారు. "మేమంతా సాయంత్రం మీటింగు కొచ్చినోళ్ళం! లారీలన్నీ పచ్చిక గార్డెను కాడా ఆపేసినారు. అదేదో కాలేజీ అంట. ఆడ మీటింగంట! పెద్ద పెద్దోల్లందరూ వొచ్చి, ఓటెవరికెయ్యాలో దేశాన్నెట్టా బాగుసెయ్యాలో సెప్తారంట. నిన్న రేతిరి బయల్దేరి వొచ్చాం, తలకో ఇరవై రూపాయలు ఇత్తామంటే మా ఇంటిల్లిపాదీ ఒచ్చాశాం." నవ్వుతూ చెప్పాడతడు. తన కుటుంబ సభ్యులని పరిచయం చేస్తూ. నరహరిగారికి ఏడుపొచ్చింది. మౌనంగా నడవడం మొదలెట్టారు.        కానీ జనం.... జనం.... జనం! తోసుకుపోతున్నారు. ఒకచోట ఇద్దరు ముసలాళ్ళు రొప్పుకుంటూ రోజుకుంటూ కనిపించారు. "వీళ్ళ ఇరవై రూపాయల ఆశపాడుగానూ, వీళ్ళకీ డబ్బు పిచ్చే ఈ వయస్సులో! అనుకుంటూ ఆ మాటే అడిగేశారు నరహరిగారు. "డబ్బా పాడా? మీటింగూ లేదు గీటింగూ లేదు. మా వూళ్ళో. ప్లేగొచ్చింది! ఇప్పటికి సగం వూరు చచ్చింది! మందిచ్చేడాక్టర్లూ మనుషులే కదా! వాళ్లూ పారిపోతూంటే ఏం చెయ్యాలి? మేము ఒచ్చేశాం. మా కొడుకూ కోడలూ, కోడలి వూరి కెళ్ళారు బెంగుళూరు." "మీదే వూరు?" "మాదీవూరే - సికింద్రాబాదు. మా బాబుకి సూరత్ లో ఉద్యోగం. అందుకని అక్కడున్నాం." ఆ మాటలు వింటూనే చుట్టూవున్నవాళ్లు వాళ్ళతో మాట్లాడేలోపే వాళ్ళకి ప్లేగ్ అంటుకుంటుందన్నట్టు భయంగా పరుగులు దీశారు. ఆ పరుగుల్లో ఆ కలకలంలో రాపిళ్ళు! తోపిళ్ళు! పెనుగులాటలు! దొంగతనాలు! హాహాకారాల జనం! ఆక్రందనల జనం! వందలమంది పరుగులు తీస్తూ ఒకరిమీద ఒకరు పడిపోతున్నారు. పోలీసు దళాలు అదుపు చెయ్యలేక కాల్పులు జరుపుతున్నారు. ఒక తూటా చూస్తుండగానే క్షణాల్లో ఒచ్చి నరహరిగారి కాలికి తగలడం. ఆయన వృక్షంలా అక్కడికక్కడే నేలకూలడం జరిగింది. నరహరిగారు స్పృహ కోల్పోతున్నారు. ఎవరో కొంతమంది ఆయనని లేవనెత్తి కారులో కెక్కించడం జరిగింది. మొహాన నీళ్ళు జలాలు. నీరసంగా కళ్ళుతెరిచి "ఎవరుబాబూ మీరు? నన్నెక్కడికి తీసుకెళుతున్నారు?" అన్నారు మధ్యలో. "నరహరిబాబుగారూ నేనండి, ఇన్ స్పెక్టరు బాలకృష్ణని. ఈ తొక్కిసలాటలో జాగర్తకోసం పోలీసులు కాల్పులు జరిపారు. ఓ తూటా ప్రమాదవశాత్తూ మీ కాలికి తగిలింది. మీరు కిందపడిపోవడం చూసి, నేను పక్కనే పార్కుచేసిన కార్లో తెచ్చి మిమ్మల్ని డాక్టరుకి చూపించాను." "డాక్టరుగారు నన్ను చూశారా?" "చూశారండీ! తూటా మీకాలిలోకి దూసుకుపోలేదు. ఊరికే తగిలి పక్కకిపోయి నేలమీద పడింది. మీకు వెంటనే స్పృహపోయింది. ఇప్పుడే వచ్చింది."        "బాబూ!" "ముందు ఈ పాలు తాగండి తరవాత మాట్లాడుదురుగాని." పాలకప్పును నోటికందించాడు. పాలు తాగగానే అమృతం తాగినట్టనిపించింది. పొద్దుటినుంచీ పరగడుపునే పడుతూన్న కష్టాలన్నీ మటుమాయమైపోయినట్టనిపించింది. "బాబూగారూ! మీరెందుకు ఇటువై పొచ్చారు? ఎక్కడ మీ ఇల్లు జూబ్లీహిల్స్! ఎక్కడ ఖైరతాబాదు! నేను చూశాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏమయ్యేది? అయినా మీరిలా ఒంటరిగా ప్రయాణం చెయ్యొచ్చా?" "ఏమిటయ్యా? నువ్వనేది?" అన్నారు పకపకా నవ్వుతూ నరహరిగారు. బాలకృష్ణ జవాబు చెప్పేలోపలే. "ఆడపిల్ల అర్దరాత్రి ఒంటరిగా క్షేమంగా, తిరగగలిగిననాడు నిజమైన స్వాతంత్ర్యం ఒచ్చిన రోజు అన్నారు గాంధీజీ. అంతేగానీ, స్వాతంత్ర్యం వొచ్చిన నలభైఏడు వసంతాల తరువాత, స్వాతంత్ర్య సమరయోధుణ్ణి, మగాణ్ణి నన్ను నిలదీసి ఇలా చెబుతావేమయ్యా, నేనేదో పరాయిదేశంలో వున్నట్టు?" అన్నారు. "బాబుగారూ! మీరు భారతదేశ స్వాతంత్ర్యంకోసం, దేశమాత బంధనాల విముక్తికోసం బ్రిటీష్ వారికి ప్రాణాలొడ్డి, దేశాన్ని కాపాడిన వీరులుకి అప్పుడు మన భారతదేశంలో తెల్లవారొక్కరే శత్రువులు. కాని ఇప్పుడో? మీ పొరుగునున్న ప్రతీవారూ శత్రువులే! వేరే మతస్థుల మధ్య సహృద్భావంలేక శత్రువులు. ఒక కులంవారికీ, మరో కులంవారికీ రాజకీయ లబ్దికోసంకు పడే కుస్తీల వల్ల శత్రుత్వమే! బలాబలాలు ప్రదర్శించుకోవడానికి ఎవరి రక్షణకోసం వారు పోషించుకునే రౌడీషీటర్లు శత్రువులే! ఎవరికోసం ఎవరు పోరాడుతున్నారో, ఎవరు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారో తెలీని అమాయక ప్రజలు కూడా ఒకరికొకరు శత్రువులే! చివరకి ప్రతీదీ పైసాతో ముడిపెట్టడం, ముఠా రాజకీయాలవల్ల పెరిగిన స్వార్ధంలో, ఆర్ధిక స్తోమతనే గౌరవించే సంఘంలో ఒక్క తల్లి పిల్లలూ హెచ్చుతగ్గుల బేరీజులో శత్రువులే! ఇక ఎవరు స్నేహితులు సార్? మీలాగా ఆలోచించిన తరం, నీతికీ నిజాయితీకీ నిలబడిన తరం కనుమరుగైపోయింది. ఎక్కడో....అక్కడా....అక్కడా....మీబోటివాళ్ళున్నారు. అక్కడా....అక్కడా మీలాంటివారి అడుగుజాడల్లో నడచిన గుర్తులను నేమరేసుకుంటూ ఇంకా ఆ ఓల్డ్ థాట్స్ ని, ఆ ఆలోచనలని మర్చిపోలేని నాలాంటివాళ్ళున్నారు. రేపటి తరంలో మీలాంటివాళ్ళు అసలుండరు సరికదా నాలాంటివాళ్ళూ మిగలరు. ఉండేదంతా పాలకులూ, పాలితులూ, పోలీసులూ, జనం, టీచర్లూ, విద్యార్ధులూ, అందరూ ఇలాగే ఇందాకటినుంచి మీరు చూస్తూన్న లాంటివారే సార్! మనిషిని చూసి మనిషి భయపడుతూన్న తరుణంలో ఇంట్లో, బయటా అంతా శత్రు భయమే! దినంలో ఎన్నోసార్లు ఛస్తూబతకాలి - అంతే!" ఆవేశంగా, అర్ధవంతంగా భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన బోధలా చెప్పుకుపోతున్నాడు బాలకృష్ణ. ఖాకీ దుస్తుల్లో కఠినుడిగా పేరు పొందిన ఇన్స్ పెక్టర్ బాలకృష్ణ నరహరిగారి కంటికి! కారు గేటుముందాగింది. బాలకృష్ణ నరహరిగారిని మెల్లగా నడిపించి తీసికెళ్ళి, వసారాలో కంగారుగా తిరుగుతున్న అతని భార్యామణి దుర్గాబాయమ్మ గారూ, కొడుకు రాజేంద్ర ప్రసాద్, కోడలు ఝాన్సీ, మనుమరాలు ప్రియదర్శినీ వాళ్ళందరికేసీ చూసి సోఫాలో కూర్చోబెట్టాడు. వారందరూ పడుతున్న ఆందోళనని గ్రహించి, జరిగినదంతా చెప్పి, తను అర్జంటుగా వెళ్ళిపోవాలి గందరగోళం జరుగుతున్న ప్రదేశానికని వెళ్ళిపోయాడు.      ఇంటిల్లిపాదీ మరోసారి అతణ్ణి అలా వొంటరిగా అంతదూరం వాకింగ్ కి వెళ్ళొదని వారించి, మంచం మీద పడుకోబెట్టారు. మర్నాడు పేపరు చదువుతూ ఆశ్చర్యంతో నోరు మూతపడక అలాగే వుండిపోయారు నరహరిగారు. "పోలీసులు రాక్షసుల్లా ప్రవర్తించడంవల్ల అనేకమంది మరణించారు. గాయపడ్డారు. ముఖ్యంగా ఇన్స్ పెక్టర్ బాలకృష్ణ ప్రవర్తించిన తీరు ప్రజాస్వామ్యానికే వ్యతిరేకం! మానవతకే మచ్చ! అతడిని వెంటనే బదిలీ చెయ్యాలి" అంటూ అనేక రాజకీయ ప్రతినిధుల వ్యాఖ్య. "ఛీ! ఛీ! పాడులోకం! పాపిష్టి మనుషులు! అంతా అబద్ధం. పచ్చి అబద్ధం! బాలకృష్ణ చాలా మంచివాడు. కర్తవ్య పరాయణుడు." కేకలు పెడుతూన్న నరహరిగారి గొంతువిని, ఇంటిల్లిపాదీ లేచొచ్చి లైటు వేసి చూశారు. "ఇదా....నా దేశం? వీళ్ళా నా ప్రజలు? గాంధీ మహాత్ముని వారసులు? నో....నో.... నా కొద్దీ స్వాతంత్ర్యం! అడుగడుగునా ఛస్తూ, మనిషిని చూసి మనిషి భయపడే ప్రజాస్వామ్యం నా కొద్దు....ఒద్దూ....ఒద్దూ. మహాత్మా! ఎక్కడున్నారు మీరు? మీ రనేవారు జ్ఞాపకం వుందా? ఇప్పుడు మనం పోరాడుతున్నది కలిసికట్టుగా ఒక్క తెల్లవారితోనే! కానీ, స్వాతంత్ర్యం వొచ్చాక మనం పోరాడవలసింది ప్రతి నిత్యం, ప్రతి మనిషితో అని. అది అక్షరాలా నిజం బాపూ! మా కేదైనా దారి చూపు! నేను నీలాగే ఆ రోజే మరణించి వుంటే ఈ ఘాతుకాలు చూసుండేవాణ్ణి కాదు. ఇప్పుడు నా భయం నా గురించి కాదు. నా ముందు తరం గురించి! వారికి ఏ విధంగా మీ సందేశాలు తెలుపగలను? ఏం చెయ్యగలను? ఈనాడు ప్రజల దృష్టిలోనే నసమర్దుణ్ణి!          బాపూ....బాపూ....చెప్పండి? వీరా మన వారసులు? ఇదా మీరు కోరిన సమాజం?" "అబ్బబ్బబ్బబ్బబ్బ! ... నిద్రలో కూడా ఇదే అవస్థ.... ఇదే ధోరణి! ఎలా బాబూ రాజేంద్రా!" దుర్గాబాయమ్మగారి కళ్ళు చమర్చాయి. ఇంటిల్లిపాదికీ గుండె కరిగిపోయింది అతనిలో సిన్సియారిటికి! "మనసా వాచా, కర్మణా వారు నిజమైన గాంధేయులు, అమ్మా! నిద్రావస్థలో కూడా వాళ్ళు నిజాయితే మాట్లాడుతారు. ఏ విధమైన భేషజాలు లేని వ్యక్తులు!" అన్నాడు రాజేంద్ర తండ్రిని మెల్లగా తట్టి లేపుతూ. ఉలిక్కిపడి లేచారు నరహరిగారు. అర్ధంకాక అందరికేసి అదోలా చూశారు. "మంచినీళ్ళు తాగండి" అంటూ దుర్గాబాయమ్మగారు గ్లాసు నందించారు. నీళ్ళు గుటగుట తాగేసి గ్లాసు నామెకందిస్తూ, "కలవరించానా?" అన్నారు నవ్వుతూ. "కలవరపడ్డారు కూడా!" అది ఆమె నవ్వుతూ. "పెద్ద కల....ఆ కలలో".... "అర్ధమయింది అంతా! ఇక ఆ ధోరణిమాని కాస్సేపు పడుకోండి. ఇంకా పూర్తిగా తెల్లారలేదు" అంది దుర్గాబాయమ్మ దీపాన్నార్పేస్తూ. 

పునర్వివాహం

పునర్వివాహం - వసుంధర            నా చేతిలో గోవిందరావు పెళ్ళి శుభలేఖ వున్నప్పుడు విన్నాను-దేశంలో మధ్యంతర ఎన్నికలని. అయినా నా ఆలోచనలు గోవిందరావు చుట్టూ తిరగడం మానలేదు. గోవిందరావు పెళ్ళాం చేచ్చిపోయిందని తెలిసినపుడు చాలామంది అడిగిన ప్రశ్న - ఆత్మహత్య చేసుకుందా? అని. అందుకు కారణాలు లేకపోలేదు. అతడు పేరున్నవాడు పేరుతెచ్చ్చే పనులు చేస్తాడు. అతడెప్పుడూ నవ్వుతూంటాడు. ఎదుటివాడెంత మాటన్నా ఆవేశపడడు కానీ వీలునిబట్టి చమత్కారంగా తిప్పి కొడతాడు. ఇంటికెవరొచ్చినా వారి వారి అలవాట్లు తెలుసుకుని ఏ లోపమూ జరక్కుండా మర్యాదలు చేస్తాడు. అయితే గోవిందరావు తాగుతాడు. వ్యభిచారగృహాలకు వెడతాడు. ఈ రెండూ తప్పనుకుందుకు లేదు. గొప్పతనానికి అవి కూడా చిహ్నమే! అందువల్ల భార్యపరంగా ఆలోచిస్తే తప్ప అతన్ని చెడ్డవాడనడానికి లేదు. గోవిందరావు చాలా పెద్ద ఆస్తికి ఏకైక వారసుడు. పద్దెనిమిదవ ఏట పదిహేనేళ్ళ శారదను పెళ్ళి చేసుకున్నాడు. పెళ్ళికి అతడు భారీగా పాతికేళ్ళవాడిలా వుండేవాడు. ముప్పై ఏళ్ళొచ్చినా ఇప్పుడూ అలాగే వున్నాడు. శారద మాత్రం కాపురం చేసిన పదేళ్ళలో నలభై ఏళ్ళదానిలాగైపోయింది.      గోవిందరావుకి అన్నీ తండ్రి పోలికలు. మొగుడు పెళ్ళాన్నెలా చూస్తాడో తండ్రిని చూసే తెలుసుకున్నాడతను. గోవిందరావు తల్లి సహజంగా కాక ప్రమాదవశాత్తూ మరణించింది. ఆ ప్రమాదం కాకతాళీయమనీ, ఆమె తనకు తానే కల్పించుకున్నదనీ, గోవిందరావు తండ్రి కల్పించాడనీ వాగ్వివాదాలున్నాయి. అప్పుడు గోవిందరావు వయస్సు పదిహేనేళ్ళు. భార్య పోయిన ఏడాదికి గోవిందరావు తండ్రి క్యాన్సరుతో మంచానపడితే చాలామంది ఆదాయాన పాపాలకు శిక్ష అన్నారు. గోవిందరావు ఎక్కువగా చదువుకోకపోయినా వ్యవహారజ్ఞుడు. మేజరు కాకపోయినా ఆస్తి వ్యవహ్యారాలు చూడడం ఆరిందాగా మసలడం నేర్చుకున్నాడు. అతడి పెళ్ళయిన ఆర్నెళ్లకె తండ్రిపోతే నదురు, బెదురూ లేకుండా ఆ ఇంటికి ఏకాచ్చత్రాధిపతి అయ్యాడు. అతడి ఆస్తి, పరిస్థితి చాలామంది బంధువుల్ని ఆకర్షించాయి. స్తోత్రపాఠాలలో ఆరితేరిన రామాయమ్మగారిని తప్ప మిగతా అందరినీ అతడు తెలివిగా వారించగలిగాడు. రామాయమ్మ విధవ. గోవిందరావు దగ్గర చేరేటప్పుడావిడ వయసు నలభై అయిదు. చూడగానే సెంచరీ కొట్టే శాల్తీ అనిపించేంత ఆరోగ్యం. తమ్ముడు రమణకు ఆవిణ్ణి అంటిపెట్టుకుని వుండటం మినహా వేరే పనిలేదు.        భార్య సుభద్ర అతడి పక్కన కాకి ముక్కుకు దొండపండులా వుంటుంది. ఆమె కొడుకు వెంకట్రావు. రమణ బుర్రలో తెలివి శూన్యం. చెప్ప్పిన పని చెప్పినట్టు చేయడం అతడి ప్రత్యేకత అంటుంది రామాయమ్మ. కానీ సుభద్ర ఒప్పుకోదు. వెంకట్రావునామే తన కొడుకంతుంది తప్ప మా అబ్బాయని ఎక్కడా అనదు. వెంకత్రావులో తల్లి పోలిక సంగతి చెప్పలేం కానీ తండ్రి పోలిక ఏ కోశానా లేదు. పైగా కాస్తో కాస్తో తెలివితేటలూ వున్నాయి. రామాయమ్మ గోవిందరావుకు దూరపు వరుసలో దొడ్డమ్మ అవుతుంది. తానేక్కడికి వెళ్ళాలన్నా సుభద్ర పెద్ద అసెట్ అని ఆమెకు తెలుసు. చెప్పుకుందుకో మొగుడూ, మాతృప్రేమకొ కొడుకూ వున్న సుభద్రకు రామాయమ్మ సలహాలే చేయూత. గోవిందరావు సుభద్ర అందాన్ని చూసే రామాయమ్మకాశ్రయమిచ్చాడు. ఆమె అతడికంటే ఏడేళ్ళు పెద్ద. వాళ్ళ సంబంధానికా వయోభేదం అడ్డురాలేదు. శారద ఆ ఇంట్లో నిలదొక్కుకుని లోకమంటే ఏమిటో తెలుసుకుందుకు మూడు నాలుగేళ్ళు పట్టింది. అప్పటికి భర్త రామాయమ్మ చెప్పుచేతల్లోకీ, సుభద్ర చేతుల్లోకీ వెళ్ళిపోయాడు. అట్నించి నటుక్కు రావాలనుకునే రామాయమ్మ శారదను బుట్టలో వేసుకుందామనే ప్రయత్నించింది. అయితే అక్కడి పరిస్థితి తెలిసి పుట్టింటి వారిచ్చే సలహాల ఫలితంగా గోవిందరావు కేవలం తనవాడనీ, తనాయింటి యజమానురాలనీ శారద ఓ బిడ్డ తల్లి కూడా అయింది. అప్పుడామె మాతృత్వానికి సంబంధించిన స్వార్థానికి కూడా లోనై భర్తను చెప్పుచేతల్లో తీసుకుందుకు గట్టి ప్రయత్నం ప్రారంభించడంతో సుభద్రతో భేటీ వచ్చింది.         సుభద్ర రామాయమ్మను సలహా అడిగింది. శారదకూ, సుభద్రకూ తేడా వుంది. శారద శరీరంపై గోవిందరావుకు సర్వహక్కులూ వున్నాయి. సుభద్ర అతడికి పొరుగింట పుల్లకూడా. భర్త చాటు భార్య. రమణవంటి భర్త కారణంగా ఆమె ఒకప్పుడు చాలామంది మగాళ్ళను మరిగి చాలా విద్యలు నేర్చుకుంది. వలచి వలపింపచేసుకునే ఆమె తెలివి, అనుభవం, విద్యలు అన్నింటినీ ఇప్పుడామె తనకంటే చిన్నవాడైన గోవిందరావును మచ్చిక చేసుకుందుకుపయోగిస్తుంది. పైగా గోవిందరావు తనకు తాళికట్టిన భర్త కాదు కాబట్టి ఆమె అతడి చెడుతిరుగుళ్ళను సమర్థిస్తూ "మీకేం మగమహారాజులు'' అంటుంది. అందువల్ల రామాయమ్మ సలహా ప్రకారం సుభద్ర గోవిందరావుకు శారదమీద నేరాలు చెబితే అతడు భర్తను దెబ్బలాడేవాడు. మొదట్లో శారద ఊరుకునేది కానీ క్రమంగా సమాధానమివ్వడం ప్రారంభించింది. "భార్య అంటే నోరెత్తకుండా పడి వుండడమేనని'' గోవిందరావు శారదకు మోటుగా చెప్పాడు. ఏకాంతంలో భర్త ఎన్ని మాటలన్నా ఊరుకునే శారద, సుభద్ర ఎదుట మాత్రం చిన్నమాట కూడా భరించలేక ఎదురు తిరిగితే గోవిందరావు ఆమెపై చేయి చేసుకునే స్థితికి వచ్చాడు. "నేను మీ భార్యను. మీరేమన్నా పడతాను, ఏం చేసినా సహిస్తాను. రామాయమ్మ బృందాన్ని ఇంట్లోంచి తరిమేయండి'' అన్నది శారద చిన్ని కోరిక. "సుభద్ర కాలిగోటికి పోలవు నువ్వు. ఆమెను మెప్పించు. ఆమెను నొప్పించావో నిన్ను పుట్టింటికి పంపగలను'' అన్నది గోవిందరావు సమాధానం. అతడు సుభద్రకూ తనకూ గల సంబంధం భార్యకు తెలిసేలా ప్రవర్తించసాగాడు. శారద స్థానం క్రమంగా ఆ ఇంట్లో పడిపోయింది. రామాయమ్మ ఆమెకు ఆ ఇంటి దాసిని చేసింది.         గోవిందరావుకు తెలియకుండా అతడి పిల్లల చేత కూడా ఆమె ఊడిగం చేయించేది. గతిలేక అభిమానాన్ని చంపుకున్న శారదకు పండుగ రోజున పనివాళ్ళతో పాటు ముతకచీరనిచ్చి తను పట్టుచీర కొనుక్కునేది సుభద్ర. సుభద్ర పుట్టినరోజున గోవిందరావు, ఆమె గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకునేవారు. వాళ్ళిద్దరూ ఒకే మంచంమీద పడుకుని వుండగా శారద, మరో దాడి సుభద్రకు చెరో పాదం ఒత్తేవారు. ఫలితంగా ఆమె పనివాళ్ళక్కూడా లోకువైపోయింది. తన ముగ్గురు బిడ్డలకోసం అన్నీ సహించి దుర్భరజీవితాన్నీడ్చాలనే శారద అనుకుంది. అయితే పెళ్ళయిన పన్నెండేళ్ళకు స్టవ్ వెలిగిస్తూ భగ్గున మండింది శారద. ఆమె వంటిమీద అంత కిరసనాయిలు ప్రమాదవశాత్తూ ఎలా వచ్చిందో తెలియదు కానీ అది హత్య అన్నవాళ్ళు మూర్ఖులే. శారదను హింసించడం వినోదంగా పెట్టుకున్న ఆ ఇంట్లో మనుషులామెను చేజేతులా చంపుకుంటారా? ఈ దేశంలో ఆడపుట్టుక పుట్టిన నేరానికి - మరేదారీలేక కన్నా మమకారాన్ని కూడా వదులుకుని నూరేళ్ళ జీవితాన్ని త్యాగం చేసిన శారద ఆత్మహత్య చేసుకుందనడంలో సందేహం లేదు. ఆమె పరిస్థితి తెలిసినవారు మాత్రం ఇంతాలస్యం చేసిందేమని ఆశ్చర్యపడ్డారు. శారద మరణం గోవిందరావుళ్ ఒఎలాంటి మార్పు తెచ్చిందో తెలియదు కానీ రామాయమ్మ బృందం ఆ ఇల్లు విడిచి వెళ్ళింది. ఎనిమిది, ఆరు, మూడేళ్ళ వయసు పిల్లలతో ఆ ఇంట్లో మిగ్లాడు గోవిందరావు. శారద తండ్రి చూడ్డానికివస్తే గోవిందరావు బావురుమన్నాడు.      ఆయన అల్లుణ్ణి ఓదార్చుతూ తనూ ఏడ్చాడు. చాలాకాలం తర్వాత అవకాశం రావడంవల్ల శారద పుట్టింటి వారా ఇంట్లో మకాం పెట్టి కొంతకాలమున్నారు. "శారద తిరుగుతూంటే ఇల్లంగా నిండుగా వుండేది. చూడండి ఒక్క మనిషి లేక ఇల్లెలా చిన్నబోయిందో?'' అని గోవిందరావేడిస్తే అంతా ఓదార్చారు తప్ప "నీ మూలంగానే నీ భార్య పోయింది'' అని ఒక్కరు కూడా అనలేదు. "కొన్నాళ్ళపాటు నీకు ఒంటరితనం పనికిరాదు. మాకిక్కడుండడం కుదరదు. మా ఇంటికొచ్చేయ్'' అన్నాడు మామగారు. గోవిందరావు మామగారింటికి వెళ్ళి రెండు నెలలున్నాడు. అక్కడ నంగనాచిలా, ముంగిలా మసిలి రెండు నెలల్లో ఎందరి సానుభూతినో సంపాదించాడు. "మళ్ళీ పెళ్ళి చేసుకోరాదూ?'' అన్నాడొక రోజున శారద తండ్రి. "నాకు పెళ్ళా?'' అన్నాడు గెడ్డం పెరిగి వేదాంతిలా వున్న గోవిందరావు అదే ధోరణిలో. "నీకు పెళ్ళామక్కర్లేదు. కానీ నీ బిడ్డలకు తల్లి కావాలిగా'' అన్నాడు మామగారు. "కావాలి కానీ మరో ఆడది నా పిల్లలకు తల్లి కాలేదు ...'' "అయితే అల్లా చూడు'' అన్నాడు శారద తండ్రి. గోవిందరావటు చూసి కళ్ళు తుడుచుకున్నాడు. శారద చెల్లెలు హేమకు ఇరవై రెండేళ్లు. గోవిందరావు పిల్లలు ఆమె తల్లీబిడ్డల్లా కలిసిమెలిసి ఆడుకుంటున్నారు. అంతకుముందే గోవిందరావోసారి శారదా అని అరిచి హేమ చేయిపట్టుకున్నాడు. హేమ అయిదు నిముషాలతడి కౌగిట్లో వుండి, ఒక చిన్న ముద్దు కూడా అందుకున్నాక "ఏమిటి బావా?'' అని విదిపించేసుకుని జరిగిందాట్లో పూర్వభాగాన్ని తలికి చెప్పగా తల్లి తండ్రికి చెప్పగా ఆయన ఇప్పుడీ ప్రస్తావన తెచ్చాడు. ఆయన డబ్బిబ్బందుల్లో వుండడం వల్ల బంగారు బొమ్మలాంటి హేమకు నాలుగేళ్ళుగా ప్రయత్నిస్తూ కూడా సంబంధం కుదర్చలేకపోతున్నాడు. శారద చనిపోగానే తన రెండో కూతుర్నే గోవిందరావుకిస్తే అనిపించిందాయనకు. ఇరవై రెండుకు ముప్పై చక్కని జత. స్వయానా అక్కపిల్లలు కాబట్టి వాలకు సవితి తల్లి బాధ వుండదు. గోవిందరావు స్వతహాగా మంచివాడనీ, రామాయమ్మ బృందమే శారద కష్టాలకు మూలమనీ కూడా ఆయన సరిపెట్టుకుంటూ ఇంట్లో తర్జనభర్జనలు జరిగితే హేమ తల్లితో "అసలు లోపం కొంత అక్కలో కూడా వుందేమో. సుభద్ర బావని కట్టిపడేసుకుందిగదా తనాపని ఎందుకు చేయలేకపోయిందీ?'' అంది. తండ్రికీ మాటలు రుచించి "నాకు మటుక్కు హేమను నీకివ్వాలని వుంది. కానీ చాలామంది శారద చావుకి కారణం నువ్వే అంటున్నారు'' అన్నాడు అల్లుడితో అక్కడికి తనకేమీ తెలియనట్టు. "నా సంజాయిషీ శారదను బ్రతికిస్తుందని హామీ ఇస్తానంటే అందరికీ జరిగిందేమిటో చెప్పగలను'' అన్నాడు గోవిందరావు వేదాంతిలా. అల్లుడిపట్ల మామగారి గౌరవాభిమానాలు రెట్టింపయ్యాయి. గోవిందరావు అందం, డబ్బు, వయసు వున్న మగాడు కావడంవల్ల అతడికి హేమతో పెళ్ళి నిశ్చయమయింది. శారద విషయంలో తన ప్రవర్తన గురించి అతడు ఇనుమంత కూడా పశ్చాత్తాపం వెలిబుచ్చలేదు. ఎవ్వరూ అతడి తప్పుల గురించి నొక్కించలేదు.     ఆఖరికి హేమ కూడా తనకు వేరే వరుడు దొరకడనో ఏమో ఈ పెళ్ళికి సుముఖత చూపించింది. ఆ శుభలేక నా చేతిలో వుంది. వెయ్యికోట్ల ఖర్చుతో అయిదేళ్ళకొక్కసారే ఎన్నికలు భరించడం కష్టంగా వున్న అతి బీద భారతదేశ ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ప్రజానాయకులు అయిదేళ్ళపాటు కలిసి వుండాలన్న జ్ఞానం కూడా లేక అంతఃకలహాలతో విలువైన కాలాన్ని వృధాచేస్తూ పదవికోసం దేశంలో కులమత భేదాలను రెచ్చగొట్టి దారుణహత్యాకాండకు కారుఅకులై మధ్యంతర ఎన్నికలంటూ ప్రజల ముందుకు వస్తూంటే నాకు వారిలో ప్రతి ఒక్కడిలోనూ గోవిందరావు కనిపిస్తున్నాడు. గోవిందరావుకు పునర్వివాహం. ప్రజానాయకులకు మధ్యంతర ఎన్నికలు. అటు గోవిందరావు ... ఇటు ప్రజానాయకులు. అటు హేమ ... ఇటు భారతపౌరులు. శుభలేఖ ఇంకా నా చేతిలోనే వుంది. టి.వి.లో వార్త కొనసాగుతూనే వుంది.

సీత-సావిత్రి

సీత-సావిత్రి - వసుంధర                 తెల్లచీర కట్టుకుని జడనిండా మల్లెపూలు పెట్టుకుని దూరానికే గుభాళించిపోతున్న ఆమె నన్ను చూడగానే పలకరింపుగా నవ్వింది. ఆ నవ్వు నాకు వళ్ళంతా గిలిగింతలు పెట్టింది. ఎదురింటి గోవర్ధన్ భార్య ఆమె. పేరు సీత. ఆమె మెరుపుతీగలా వుంటుంది. పాయసంలా ఆకర్షిస్తుంది. ఆమెను చూడగానే నా మనసేదోలాగైపోతుంది. ఆమె నవ్వుకు నేనూ నవ్వుతో బదులిచ్చాను. ఆమె సిగ్గుతో తలవంచుకుంది. అంతే! ఆమె ముఖం నాకిక కనపడదు. నిట్టూర్చి ఇంట్లోకి వెళ్ళాను. నేను వచ్చే సమయానికి సావిత్రి తలుపులు దగ్గరగా వేసి వుంచుతుంది. సావిత్రి నా భార్య. సావిత్రి కూడా అందంగా వుంటుంది. అయితే అనుభవానికి వచ్చిన అందానికి అవసరంలో తప్ప గుర్తింపువుండదు. ఆమెకు నేనంటే చాలా ఇష్టం. నాకిష్టమైనవన్నీ చేసిపెడుతుంది. నా యిష్టమే తనిష్టంగా భావిస్తుంది. ఆఖరికి చీరల ఎన్నికలో కూడా ఆమె నా అభిరుచికే తలవంచుతుంది. నాకు సేల్సుటాక్సు డిపార్టుమెంటులో ఉద్యోగం. వూర్లో నాకు మంచి పలుకుపడి దుకాణాలున్నవారందరూ నేను కనబడితే చాలు సలాములు చేస్తుంటారు. నా వుద్యోగం నాకు అక్రమ ధనార్జనేకాదు-దురలవాట్లను కూడా సంపాదించి పెట్టింది. నేను తరచుగా బార్లకు వెడుతూంటాను. అట్టే ప్రమాదంలేని అక్రమ సంబంధాలకూ పాల్పడుతుంటాను. ఎదురింటి సీత భర్త గోవర్థన్ కి ఊళ్ళో పెద్దషాపే వుంది. అందులో ఫాన్సీ, కిరానా సరుకులేకాక నిత్యావసరానికి సంబంధించిన ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ గూడ్సు దొరుకుతాయి. ఆ దుకాణంలో ఎప్పుడూ రష్ గా వుంటుంది. నాకక్కడ ఒక్క పైసా కూడా దొరకదు. మా డిపార్టుమెంటు కొలీగ్ ఒకతను "అందమైన భార్య వున్నవాడెవ్వడూ డబ్బు లంచంగా యివ్వడు'' అనేశాడు. అప్పట్లో గోవర్థన్ భార్య ఎలా వుంటుందో నాకు తెలియదు. మూడు వారాలక్రితం గోవర్థన్ మా ఎదురింట్లోకి వచ్చాడు. ఆ పోర్షన్ అతడు కోనేశాడని తెలిసింది. వచ్చిన రెండురోజుల్లోనే అతడు నన్ను కుటుంబసమేతంగా వాళ్ళింటికి పిలిచాడు. నాతొ స్నేహం పెంచుకున్నాడు. అతడిభార్య స్నేహమాయి. ఎక్కువగా మాట్లాడు కానీ ఎప్పుడు చూసినా చిరునవ్వులు చిన్దిస్తుంది. ఆ నవ్వులో ఆహ్వానం వంటిదున్నదనే అనిపిస్తుంది. నేనామె గురించి బాగా ఆలోచించసాగాను. అప్పుడు నా కొలీగ్ మాటలు గుర్తొచ్చాయి.                     "అందమైన భార్య ఉన్నవాడెవ్వడూ డబ్బు లంచంగా యివ్వడు'' గోవర్థన్ కావాలని నా ఎదురింటికి వచ్చాడు. అతడి ప్రోత్సాహం మీదనే అతడి భార్య నన్ను చూసి నవ్వులు చిందిస్తున్నదేమో. గోవర్థన్ రోజూ సాయంత్రం ఆరింటికి ఇంటికొస్తాడు. అతడికోసంఅరగంట ముందునుంచే గుమ్మంలో నిలబడి ఎదురుచూస్తుందతడి భార్య. ఆ టీములు నాకు తెలియగానే ఓ పావుగంట ముందుగా నేనింటికి రావడం ఆరంభించాను. సాధారణంగా నేను ఆఫీసునుంచి తిన్నగా ఇంటికి రాకుండా స్నేహితులతో తిరిగేవాణ్ణి. సీతను చూడాలని ఆ అలవాటు మార్చుకున్నాను. కానీ యిలా ఎన్నాళ్ళు? సీతను చూస్తే నా మనసెలా స్పందిస్తుందో నాకు తెలుసు. అందుకే సావిత్రిని గుమ్మంలో నిలబడనివ్వను. ఆమెతో కలిసి బజార్లకు తిరగను. మేమిద్దరం కలిసి వెళ్ళేది అప్పుడప్పుడూ సినిమాలకు మాత్రమే! నా భార్యపై పరపురుషుల దృష్టి పడకూడదని ప్రయత్నాలు చేస్తూనే పరాయి స్త్రీల గురించి ఆలోచిస్తున్నాను. నేను లోపలకు రాగానే ఉత్సాహంగా వచ్చింది సావిత్రి. "టమేటాబాత్ చేశానండీ'' అందామె. ఇటీవల ఆమెలో ఉత్సాహం పెరగడం గమనించాను. అందుకు కారణం నాకు తెలియదు. "టమేటాబాత్ చేశానండీ'' అంది సావిత్రి మళ్ళీ. అది నాకెంతో యిష్టమైన టిఫిను. కానీ రోజురోజుకూ సీత ఆలోచనలతో నా మనసు నిండిపోతుంది. సీత తప్ప యింకో ధ్యాస లేకుండాపోతోంది. అందుకే టమేటా బాత్ పేరు నా నోట్లో నీరూరించలేదు. కానీ వెంటనే సావిత్రిని దగ్గరగా తీసుకుని "టమేటాబాత్ కంటే నువ్వంటేనే నాకిష్టం'' అంటూ పెదాలపై ముద్దు పెట్టుకున్నాను. నా ప్రవర్తనకు సావిత్రి ఆశ్చర్యపడి వుండాలి. ఉన్నట్లుంది ఆమెలో సీతను చూస్తున్నానని ఆమెకు తెలియకపోవచ్చు. తర్వాత టమేటాబాత్ మేమిద్దరం కలిసి తిన్నాం.                "నీవంటలు అద్భుతం'' అని మెచ్చుకున్నను. "అబద్ధం ... మొన్న వాళ్ళింటికెళ్ళినప్పుడు సీత వంటలు కూడా మెచ్చుకున్నారు మీరు'' ఆశ్చర్యపోయాను. నేనెలా తీసుకురావాలా అని ఆలోచిస్తుంటే తనే సీత ప్రసక్తి తీసుకొచ్చింది. "సీత ... సీత ... అంటున్నావు. మీ యిద్దరికీ అంట చనువు పెరిగిందా?'' అన్నాను. "ఆమె చాలా మంచిదండీ ... ఇద్దరూ అక్కాచెల్లెళ్ళలా కలిసిపోయాం'' అంది సావిత్రి. సావిత్రి అక్క. సీత చెల్లెలు. అంటే సీత నా మరదలు. 'వరస బాగుంది' అనుకున్నాను. "నోరారా నన్ను చెల్లీ అని పిలిచింది. చూడ్డానికి నాకంటే చిన్నదానిలాగుంటుంది'' అంది సావిత్రి. ఆమె అభిమానానిక్కారణం తెలిసింది. నేను వెంటనే కంగారుపడి "ఆమె నీకంటే చిన్నది. ఆమె నిన్ను చెల్లీ అని పిలిచినా సరే నువ్వామెను అక్కా అనే పిలు'' అన్నాను. "ఎందుకని?'' "ఆమె నిన్ను సంతోషపెట్టి నీద్వారా నన్ను మంచిచేసుకోవాలనుకుంటోంది. ఈ వ్యాపారం చేసుకునే వాళ్ళ బుద్ధులే అంత! ఉచ్చనీచాలుండవు ...'' "అబ్బే ... ఆమె అలాంటిది కాదండీ. కేవలం స్నేహభావంతో మనింటికొస్తుంది .....'' అంది సావిత్రి. "అంతే రోజూ వస్తోందా?'' ఆశగా అడిగాను. "ఊ'' "అయితే యింకేం ఏదో దురుద్దేశ్యముంది. సావిత్రీ! అంతా నీలాంటి వాళ్ళేననుకుంటావు. నువ్వు నాకోసం కూడా గుమ్మంలో నున్చోవు. ఆవిడా రోజూ సింగారించుకుని గుమ్మంలో నిచోవడమేకాక నన్ను చూడగానే నవ్వుతుంది. ఆ నవ్వు కూడా మామూలుగా పలకరించినట్లు కాక పిలుస్తున్నట్లుంటుంది ...''       "ఆమె గురించి అలా అనుకుంటే పాపం! తప్పంతా మీ ఆలోచనల్లో ఉంది ...''అంది సావిత్రి. "పోనీ నేనెప్పుడైనా ఎవరి గురించేనా తప్పుగా మాట్లాడానా?'' సావిత్రి ఈ ప్రశ్నకు జవాబివ్వలేదు. ఏ భార్యకూ ఇలాంటప్పుడు నిజం చెప్పే ధైర్యముండదు. "ఆవిడ విషయంలోనే ఎందుకు నేనిలా మాట్లాడుతున్నాను?'' అంటూ నా ప్రశ్నల పరంపర కొనసాగించాను. "ఆమెకు మిమ్మల్ని మంచి చేసుకోవలసిన అవసరమేమిటి?'' "ఒక విధంగా ఆమె భర్తకు వ్యాపారంలో లాభం, రెండో విధంగా ఆమెకు సంతోషం'' "ఇప్పుడామె సంతోషానికి తక్కువేమయింది?'' అంది సావిత్రి. "నీ అదృష్టం నీకు తెలియక అలాగంటున్నావు. నేను గవర్నమెంటుద్యోగిని. వానలు పడకున్నా, వరదలొచ్చినా నా జీతం నాకొస్తుంది. ఆపైన బొజ్జలు పెంచిన శావుకార్లందరూ నా చేతుల్లో ఉంటారు. నాకు వంగి సలాములుచేసి కోరినంత డబ్బిస్తూంటారు. పైసా పెట్టుబడి లేకుండా సంపాదిస్తున్నాను నేను. వ్యాపారస్తుల విషయామలాకాదు ఈనాటి వ్యాపారి రేపటి బికారి. ఇటు కష్టమర్సునీ, అటు నాబోటివారినీ, ఇంకా ఊళ్ళో గూన్దాలనీ అన్నింటికీ మించి రాజకీయనాయకుల్నీ తృప్తిపరచడానికే వాళ్ళ జీవితం. అందుకే డబ్బుతోపాటు భార్యల్ని కూడా అమ అవసరాలకితరులపై ప్రయోగిస్తుంటారు. ఎదురింటావిడ అలాంటి ప్రయత్నంలో వుందని నా అనుమానం ...''           "మీరు చెప్పిందే నిజమనుకుంటే ఇందులో ఆమె సంతోషమేముంది? అంతా భర్త కోసమే ...'' "ఎందుకులేదు? గోవర్థన్ నాకంటే పొట్టి, నాకంటే రంగు తక్కువ. మనిషి టిప్ టాప్ గా ఉండాలన్న సరదాలేదు. కొత్త ఫేషన్ల మోజులేదు. చూడగానే నైన్ టీన్ ఫార్టీస్ లో సినిమా హీరో ఫాన్ లా ఉంటాడు ...'' సావిత్రి మాట్లాడలేదు. "నా మాట అబద్ధమంటావా ... మాట్లాడవేం?'' పరాయిమగాడికంటే నేనే బాగున్నానని భర్త అంటే కాదనడానికి ఏ భార్యకు ధైర్యముంటుంది? "ఎందుకొచ్చిన పోలికలండి యివి?'' అంది సావిత్రి. "అలా కాదు ఇలా ఎంతకాలమో సాగాడు, గోవర్థన్ ఏడింటికల్లా బయటకు వెళ్ళిపోతాడు. నువ్వామెను మనింటికాహ్వానించు. నేనింట్లో ఉన్నట్లు చెప్పదు. తన ఉద్దేశ్యమేమిటో నిలదీసి అడుగు. ఏం చెప్పిందో నేనూ వింటాను. నిజం నీకు తెలుస్తుంది ...'' అన్నాను. గోవర్థన్ ఇంటికి మళ్ళీ రాత్రి పదిన్నర దాటేక వస్తాడు. ఈలోగా ... నా బుర్రలో రకరకాల పథకాలు మెదుల్తున్నాయి. నా అనుభవాలను పురస్కరించుకుని ఆమె ఇష్టపడితే అవకాశమెలా కల్పించుకోవాలో, ఆమె ఇష్టపడకపొతే ఎలా ఇష్టపడేలా చేసుకోవాలో ఆలోచిస్తున్నాను. సావిత్రి అంగీకరించింది. ఏడున్నరకామె సీతను పీల్చుకుని వచ్చింది. వాళ్ళిద్దరూ బెడ్రూంలోకి వెళ్ళి కబుర్లు ప్రారంభించారు. నాకు వీలుగానే వుంది వారిని గమనించడం. సావిత్రి వ్యాపారస్తుల పద్ధతులూ, వారి భార్యల అక్రమసంబంధాల ప్రస్తావనా తీసుకొచ్చింది. సీత వెంటనే "మావారలాంటివారు కాదు'' అంది. "వ్యాపారస్థులు సాధారణంగా అందమైన భార్యలనెన్నుకుంటారు. నువ్వు అందమైనదానివి'' అంది సావిత్రి. "ఆ మాటకొస్తే నువ్వు కాకంటే అందమైన దానివి'' "ఆడదాని అందాన్ని అంచనా వేసేది మగాడు ...'' "అవును. నేను చెబుతున్నది నామాట కాదు. నా భర్త నీ అందాన్ని ఆరాధిస్తాడు. నేను నీతో పరిచయం పెంచుకుందుకదే కారణం ...'' ఉలిక్కిపడ్డాను. "అంతే నీ భర్త తరపున రాయబారానికోస్తున్నావా?'' "ఛీఛీ అందాన్నారాధించే వాళ్ళందరూ రాయబారాలు పంపే కుసంస్కారులేనంటావా?'' వాళ్ళిద్దరి మాటలూ వింటూంటే నాకు మతిపోయినట్లయింది.     నాతో వివాహానికి ముందు సావిత్రి, గోవర్థన్ పరస్పరం ప్రేమించుకున్నారు. ఒకరిని విడిచి ఒకరు బ్రతకలేమనుకున్నారు. పెళ్ళి చేసుకోవాలనే అనుకున్నారు. ఇద్దరికీ కులాలు కలవలేదు. ఇరువైపులా పెద్దలు తీవ్రంగా వారి ప్రేమను నిరసించారు. ఈ పెళ్ళి జరిగితే చస్తామన్నారు. ఫలితంగా ప్రేమికులు ప్రేమను చంపుకున్నారు. వేరే పెళ్ళిళ్ళు చేసుకున్నారు. పెళ్లైనా గోవర్థన్ కి సావిత్రిపై మోజుపోలేదు. అతడు తన ప్రేమకథను భార్యకు చెప్పుకున్నాడు. సావిత్రికోసమే ఈ ఎదురిల్లు కొన్నాడు. సావిత్రిలో విశేషమేమిటో తెలుసుకుని ఆ లక్షణాలు తను సంతరించుకోవాలనీ, సీత ఆమెతో పరిచయం పెంచుకుంది. అలంకరణలో, అభిరుచులలో మార్పు తెచ్చుకుంది. గోవర్థన్ ఆమెపై సానుభూతి చూపించి "సీతా నువ్వు సావిత్రివి కాలేవు'' అన్నాడు. అతడి మనసులో ఒక్కసారైనా సావిత్రి ననుభావిన్చాలన్న కోరిక వుంది. భర్త నమితంగా ప్రేమించే సీత అతడికి సహకరించాలనుకుంది. "నేకు సిగ్గులేదూ? ఇలాంటి రాయబారానికి నేనంగీకరిస్తానా? నీ భర్తను పరాయి స్త్రీకప్పగించడానికి పురాణకాలం కాదు'' "పురాణకాలం నుంచీ పురుషుల బుద్ధి ఒక్కటే! స్త్రీకి శరీరసుఖానికి మించి త్యాగం తృప్తినిస్తుంది. అన్నివిధాల నీ భర్త కంటే అధికుడైన నాభర్తను నువ్వు కాదంటావనుకోను'' అంటూ సీత తన భర్త ఎలా అధికుడో చెప్పింది. అతడొకరి కింద ఉద్యోగం చేయలేదు. ఓ కలెక్టరేడాది జీతంగా తెచ్చుకునేది నెల్లాళ్ళలో సంపాదిస్తున్నాడు. నావంటివాళ్ళను బిచ్చగాళ్ళుగా భావించి బిచ్చం చేసినట్టు లంచం పారేస్తాడు. ఆపైన అందం, ముఖవర్చస్సు, పర్సనాలిటీ, మగతనం ఉట్టిపడే వ్యక్తిత్వం ... "ఇవి నీ అభిప్రాయాలు.     నేను నా భర్త గురించీ ఇలాగే అనుకుంటాను ...'' అంది సావిత్రి. "కానీ నేకు నీవై ఎన్నుకున్న వ్యక్తి నా భర్త. నీ భర్తను పెద్దలు నీకంటగట్టారు. కాదంటావా?'' అంది సీత. సావిత్రి ఏమందో తెలియదు కానీ నా కళ్ళు బైర్లుకమ్మాయి. నన్ను చూసి నవ్వులు చిందించే ఓ అందమైన ఆడది ... నన్నెలా తీసిపారేసింది? అదీ మరో మగాడితో పోల్చి. మళ్ళీ నేను వాళ్ళ మాటలు వినగలిగే స్థితికి వచ్చేసరికి "నువ్విందు కంగీకరిస్తే నేను నీ భర్తతో ఒక రాత్రి గడపడానికి సిద్ధంగా ఉన్నాను'' అంది సీత. అప్పుడు నాకు వళ్ళంతా గిలిగింతలు. అమ్మదొంగా అసలు విషయానికి వచ్చావన్నమాట అనుకున్నాను. మరి దీనికి సావిత్రి ఏమంటుందో? సీత భర్త సంస్కారి. తను సావిత్రిని కోరుకున్నప్పుడు తన భార్యను సావిత్రి భర్తకప్పగించడం అతడికి న్యాయమనిపించింది. నేను సీతతో తప్పు చేస్తే తప్ప అతడికి సావిత్రితో తప్పు చేసే ధైర్యంరాదు. అందుకే సీత నన్ను పలువిధాల ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది. "నా భర్తను నువ్వాకర్షించగలవా? నేను నీకంటే అందమైనదాన్నిగా ...'' "మగాడికి భార్య అందంగావుండాలి. పరాయి ఆడడైతే ఎలాగున్నా ఫరావాలేదు. నీ భర్తను నేను లొంగదీసుకోగలను ...'' సావిత్రి సీతను తీవ్రంగా మందలించి గోవర్థనాన్ని కూడా హెచ్చరించినట్లు చెప్పమంది. తన భర్త అపర శ్రీరామచంద్రుడంది. "అదే నిజమైతే నేన్ను క్షమించు'' అంది సీత. "ఏం క్షమిచాను? ఇప్పటికే నువ్వు వారికి నాపట్ల దురభిప్రాయం కలిగించానంటున్నావు?'' నేనేం చేశాను? ఓ చిరునవ్వు విసిరాను. అది తప్పా? మగాణ్ణి చూసి ఓ చెల్లి నవ్వదా? తల్లి నవ్వదా?'' అంది సీత. వాళ్ళు కావాలనే అలా మాట్లాడుకున్నారో లేక అంతా నిజమేనేమో నాకు తెలియదు. తెలుసుకోవాలనికూడాలేదు.     ఓ సీతను నేను కోరితే అందుకు చెల్లించాల్సిన మూల్యం సావిత్రి. అందుకు సిద్ధపడలేకపోతే సీతను కోరే అర్హత నాకు లేదు. నన్ను చూసి నవ్వినా ఆడదానిమీద మనసుపడేముందు ఓ చెలి నవ్వదా, ఓ తల్లి నవ్వదా అన్న విషయం గుర్తుంచుకోవాలి. శృంగారం సృస్తి సహజం. ఆ సహజత్వాన్ని సమాజమామోదించిన పద్ధతిలో నడిపితేనే అది సరసం! సరసం గురించి నాలో అభిప్రాయం మారినప్పుడల్లా నేను చెల్లించాల్సిన మూల్యం హెచ్చరికంగా వుంటోంది. అందుకేనేమో వున్నట్లుండి నా జీవనవిధానం మారి, సంసార జీవితం నాకూ, సావిత్రికీ పరిమితమైపోయింది.

శ్రీవారికి ప్రేమలేఖ

శ్రీవారికి ప్రేమలేఖ - వసుంధర           "మీ తొలిరాత్రి అనుభవాలు నాకు చెప్పాలి. ఎ సంకోచమూ లేకుండా జరిగింది జరిగినట్లు చెప్పాలి. మీ వివరాలు రహస్యంగా వుంచాబడతాయి. మీరు నిజాయితీ పాటిస్తే అందువల్ల ఎందరో యువతీయువకులకు ఎంతో ప్రయోజనం'' అంది కుసుమ. ఆ గదిలో వున్న ఆరుగురు ఆడవాళ్ళూ ముఖముఖాలు చూసుకున్నారు. వాళ్ళక్కడ పోసుకోలు కబుర్లకు చేరారు. కబుర్ల మధ్యలో శృంగారం చోటు చేసుకోబోతే తనకి ఆసక్తిలేనట్టుగా ముఖం చిట్లించింది కూడా, వారిలో జయ అనబడే ఆమె. మిగతా అయిదుగురూ ఆ పేటవారే! జయ మాత్రం ఏదో పనిమీద పుట్టింటికి వచ్చి పదిరోజులైంది. ఇంకో రెండు వారాలుంటుంది. జయకు వయసు 30-35 మధ్యలో వుంటుంది. పద్దెనిమిదో ఏట పెళ్ళై కాపురానికి వెళ్ళింది. ఇద్దరు పిల్లలు అయినా బయటివాళ్ళతో ఆ కబుర్లు ఎ సందర్భంలోనూ మాట్లాడలేదు. మనిషి కూడా గంబీరంగానూ, హుందాగానూ వుంటుంది. పుట్టింటికెప్పుడొచ్చినా అమ్మలక్కలామెను అభిమానంగా పిలుస్తుంటారు. అందరితోనూ మంచిగా వుంటూ అందరి గురించీ మంచే చెబుతుందని ఆమె అంటే వాళ్ళకు ఇష్టం. నిత్యం అక్కడే వుంటే ఏమో కానీ అప్పుడప్పుడు కలుస్తూండడంవల్లనేమో వారి స్నేహంలో ఏ మార్పూ లేదు. "నువ్వేమీ మారలేదు జయా!'' అన్నాడు అమ్మలక్కలు ఆమె ముఖం చిత్లింపు చూసి ముచ్చటపడుతూ. సరిగ్గా అప్పుడే తలుపులు తెరచివున్న గుమ్మంలో కుసుమ ప్రత్యక్షమైంది. క్రీమ్ కలర్ చుడీదార్లో, దేవకన్యలా ముఖసౌందర్యంతో వెలిగిపోతున్న ఆమెను చూసి ఆడవాళ్ళందరూ ఒక్కసారిగా అప్రభులయ్యారు. ఆమె వయసు 20-25 మధ్యలో వుండవచ్చు. ముఖంలో మాత్రం జ్ఞాననేత్రం స్పష్టంగా వెలుగుతోంది. ఆమె భుజానికో సంచీ వేలాడుతోంది. కుసుమ రచయిత్రి. ఆమె రాసిన అయిదారు నవలలు విపరీతంగా అమ్ముడై పాఠకులపై ఆమె రచనా శక్తికున్న ఆకర్షణను నిరూపించాయి. ఇప్పుడామెకు వాటికి భిన్నంగా సాంఘిక ప్రయోజనమున్న పరిశోధనాత్మక రచనలు చేయాలని కోరిక పుట్టింది. వాటిలో భారతీయ మహిళల శృంగారజీవితం-ఇంతవరకూ ఎవరూ దర్శించని కోణాలనుంచి ప్రదర్శించాలన్నది ఆమె తొలి ప్రయత్నం. ఈమాత్రం తన గురించి చెప్పుకుని ఆమె భుజానికి వేలాడుతున్న సంచీలోంచి ఒక నోట్ బుక్ నూ, బాల్ పెన్నునూ తీసి వారిని తొలిరాత్రి అనుభవాలని చెప్పమనేసరికి అంత సూటిగా అడుగుతుందని తెలియక వాళ్ళు ముఖముఖాలు చూసుకున్నారు. "ఇందులో మొహమాటపడాల్సిందేమీ లేదు. సిగ్గుపడాల్సింది మొదలే లేదు. శృంగార విశేషాలను దాచిపెట్టి మనం చాలా పెద్ద పొరపాటు చేస్తున్నాం. మన ఋషులు విజ్ఞాన విశేషాలు దాచిపెట్టి మానను మూఢాచారాల్లోంచి బయటపడకుండా చేశారు. మనం శృంగార విశేషాలు దాచిపెట్టి భావితరాలను పాశ్చాత్య సంస్కృతివైపు తరుముతున్నాం. ప్లీజ్-నాకు మీ సహకారం కావాలి!'' అంది కుసుమ వారినందరినీ హెచ్చరిస్తూ. తమలో తాము ఎంతో కొంత శృంగార విశేషాలు చర్చించడం ఆ మగువలకు అభ్యంతరంలేదు. వాటికి వాళ్ళు చిలవలూ పలవలూ అల్లుతారు. అబద్దాల్ని జోడిస్తారు. స్వాభిప్రయాల్ని అతికిస్తారు. అవి తర్కానికి అందవు కాబట్టి సాంఘిక ప్రయోజం కోరేవారి ప్రశ్నలకు తట్టుకోలేరు. వారందరూ ఇలా ఆలోచనలతో సతమతమావుతూంటే వారిలోంచి ముందుకు వచ్చి ముందడుగు వేసింది మరెవరో కాదు-జయ! మిగతావాళ్ళందరూ ఈ పరిణామానికి తెల్లబోయి చూస్తుంటే జయ ఆమెతో "అమ్మాయ్ కుసుమా! నేను నీకు సహకరిస్తాను. కానీ ఇక్కడ కాదు. మా ఇంటికి రా. ఇప్పుడింట్లో ఎవ్వరూ లేరు. మనం ఏకాంతంగా మాట్లాడుకుందాం. నాకు తెలిసినవీ, గుర్తున్నవీ చెబుతాను. నువ్వేమడిగినా అందుకు బదులివ్వడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు టైము మూడయింది కదా- ఆరింటికల్లా మన సంభాషణ పూర్తవ్వాలి. అప్పటికి మావాళ్ళు తిరిగొచ్చేస్తారు'' అంది. అమ్మలక్కలు ముక్కున వేలేసుకుని - "జయ మారలేదనుకున్నాం. కానీ ఆమె చాలా మారిపోయింది'' అనుకున్నారు. జయ, కుసుమ వాళ్ళింటికి వెళ్ళారు. జయ తాళం తీస్తూనే "నేను నీకు సహకరిస్తాననడానికి ఒక్కటే కారణం. నాకు నీ సహాయం కావాలి'' అంది. కుసుమ ఆశ్చర్యంగా చూస్తూ "మీకు నేనేం సాయపడగలను?'' అంది. ఇద్దరూ ఇంట్లోకి ప్రవేశించారు. జయ తలుపులు మూసి గడియ వేస్తూ "నువ్వు రచయిత్రివికదా ... నాకోసం నా తరపున ఒక ప్రేమలేఖ రాసి పెట్టగలవా?'' అంది. కుసుమ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. "ప్రేమలేఖా! ఎవరికి?'' అంది. "మా వారికీ'' అంది జయ. ఇద్దరూ హాల్లో సోఫాలో కూర్చున్నారు. జయ ఆమెకు తన గోడు చెప్పుకుంది. జయ భర్త కృష్ణమూర్తి. అతడు గొప్ప భావుకుడు. కాలేజీరోజుల్లో ఓ అందమైన అమ్మాయి నుంచి ప్రేమలేఖ అందుకున్న వ్యక్తిత్వం అతడిది. ఆ ప్రేమలేఖ ఎంత గొప్పగా వుందంటే అతడు దాన్నిప్పటికీ దాచుకున్నాడు. ఆమెని పెళ్ళి చేసుకోవాలనుకున్నాడు కానీ ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. వాళ్ళు నిర్ణయించిన జయను పెళ్ళి చేసుకున్నాడు. జయకు భాపుకత్వం అర్థం కాదు. ఆమె ప్రాక్టికల్ మనిషి. భర్తకు ఏ వేళల్లో ఏంకావాలో చెప్పకుండా తెలుసుకుని అమర్చుతుంది. ఎన్నడూ అతడి మాటకు ఎదురుతిరగదు. తిడితే సహిస్తుంది. పొగిడితే సంబరపడుతుంది. పిల్లలు పుట్టక వాళ్ళ సంరక్షణ కూడా పూర్తిగా తనే చూసుకుంటోంది. ఇంట్లో ఎవరెవరి వస్తువులు ఏయే సమయాల్లో ఎక్కడెక్కడ వుంటాయో అమెకు తెలుసు. ఆమెవంటి భార్యవుండడం తన అదృష్టమని కృష్ణమూర్తి ఎందరికో చెపుతూ ఆమెతోనూ అంటాడు. కృష్ణమూర్తికి భాపుకత్వం, భావావేశం ఎక్కువ. ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. పొంగిపోతాడు. జయ మాత్రం నవ్వి ఊరుకుంటుంది. కుర్రాడికి స్కూల్లో ఫస్టుర్యాంక్ వస్తే అతడు సెలబ్రేషన్ అంటాడు. ఆమె 'ఇలాగే అన్నిమార్లూ రావాల'ని కొడుకుని ఓసారి హెచ్చరించి ఊరుకుంటుంది. అతడామెకు కొత్తచీర కొని, 'ఇందులో నిన్ను చూడాలనిపించి వెంటనే కొనితెచ్చాను. కట్టుకుని రా, బయటకు వెడదా'మంటే ఆమె తాపీగా, 'ఈవేళ ఏ అకేషనూ లేదు. పదిరోజుల్లో పండగొస్తోంది. ఆ వేల కట్టుకుంటాను' అంటుంది. ఆమెలో భాపుకత్వం లేదని అతడు తరచూ బాధపడతాడు. మంచి సినిమా చూసినా, పుస్తకం చదివినా, అనుభవం పొందినా అతడు భావోద్రేకం పొందుతాడు. ఆమె ముక్తసరిగా 'బాగుంది' అంటుంది. అలాంటప్పుడతడొకసారి రెచ్చిపోయి 'నా కర్మకొద్దీ మడ్డి మృగాన్ని కట్టుకునాను. అంతా నా దురదృష్టం' అంటాడు. ఆమె కన్నీళ్ళు పెట్టుకుంటుంది. 'ఇప్పుడు నేనేమన్నాననీ?' అని అతడు నొచ్చుకుంటాడు. 'నేను నిజంగానే మడ్డి మృగాన్ని, మీరు మీకు తగిన పిల్లని పెళ్ళి చేసుకోవలసింది. ఆ ప్రేమలేఖ పిల్లని పెళ్ళి చేసుకుంటే ఎంతో సుఖపడేవారేమో'' అంటుందామె. కృష్ణమూర్తి కాసేపూరుకుని తిరిగి ఆమెతో అంటాడు 'ప్రేమలేఖ రాసిన అమ్మాయిని ఎప్పుడో మర్చిపోయాను. ఎందుకంటే అది తొలి చూపులోంచి పుట్టిన ప్రేమ. చూపులు కాస్త కరువు కాగానే ఆ ప్రేమ అంతరించిపోయింది. మనది సాహచర్యంలోంచి పుట్టిన ప్రేమ. ఇప్పుడు నిన్ను విడిచి క్షణం వుండగాలనా?' జయ అవునేమో అన్నట్లూరుకుంటుంది. తిరిగి క్రిష్ణమూర్తే ఒకసారి 'చెప్పాలంటే ఆ ప్రేమలేఖ అమ్మాయి ముఖం కూడా నాకిప్పుడు సరిగ్గా గుర్తులేదు. ఆ అమ్మాయిని నా స్మృతిపథంలో నిలబెడుతున్నది ఆ ప్రేకలేఖే. నువ్వు ఒక్కసారంటే ఒక్కసారి ఆ లేఖను మరిపించే అపురూపమైన ప్రేమలేఖను నా కోసం రాయగలవా?' అనడిగాడు. కృష్ణమూర్తి, జయు ఒకరినొకరు విదిచివున్న సందర్భాలే తక్కువ. ఆ సందర్భాల్లో పరస్పరం ఉత్తరాలు రాసుకుంటారు. కృష్ణమూర్తి రాసే ఉత్తరాల్లో ప్రేమ, విరహం, కవిత్వం పెల్లుబుతుంది. జయ మాత్రం "మీ ఉత్తరం చదువుతూంటే ఎవరైనా చూస్తారేమోనని సిగ్గేసింది. మనిద్దరమే వున్నప్పుడు వినడానికి కబుర్లు బాగుంటాయిగానీ ఉత్తరాల్లో ఇలాంటివి వద్దు. నాకూ వచ్చేయాలని వుంది ...'' అని మామూలు విశేషాలు రాస్తుంది. అందులో వాళ్ళమ్మ వడియాలు పెట్టడంనుంచి, తను బొబ్బట్లు వేయడంలో కొత్తగా నేర్చుకున్న చిట్కాలనుంచీ, ఇంటి పనిమనిషి కూతురికి విరేచనాలు వెళ్ళడంలాంటివి వుంటాయి. జయను భర్త ప్రేమలేఖ గురించి ఒకటికి రెండుసార్లు అడిగేడు. కానీ ఉన్త్తరం ముందు కూర్చుంటే ఆమెకు రోటీన్ విషయాలు తప్ప స్ఫురించేవికాదు. భర్త కోర్కె తీర్చాలంటే ఏ రచయిత్రి సాయమో తీసుకోవాలని ఆమె గుర్తించింది. అయితే ఎవరిని, ఎలా అడగాలి ... అన్నదే సమస్య. అది ఇన్నాళ్ళకిలా తీరింది. కుసుమ ఈ కథను ఆశ్చర్యంగా విని, "ఈ విశేషాలే ఓకే గొప్ప కథ అవుతాయి. మీ వారికి ప్రేమలేఖ రాయడంకోసం మీవంటివారు నా రచనకు సహకరించే వివరాలివ్వడానికి సిద్ధపడడం అపూర్వం. మీము నేను తప్పక సాయపదతాను. ఎటొచ్చీ మీరు ఉత్తరం రాయండి. దానికి నేను కొన్ని ప్రేమ వాక్యాలతో కొసమెరుపు ఇస్తాను'' అంది. జయ తల అడ్డంగా ఊపి, "భోజరాజుని మెప్పించాలని కొందరు నాబోటివాళ్ళు భోజనం దేహి రాజేంద్ర, ఘ్రుత సూప సమన్వితం అని సామాన్యంగా రాస్తే దాన్ని కాళిదాసు మహిశశ్చ శరచ్చంద్ర, చంద్రికా ధవళం దధిః అని పూరిస్తే భోజరాజు చివరి రెండు పాదాలనూ వేరుగా గుర్తించి అక్షర లక్షలిచ్చేట్ట. మా వారిని మెప్పించే ప్రేమలేఖలో నా వాక్యాలు భోజనం దేహి అన్నట సామాన్యంగానూ వుంటాయి. మొత్తం ఉత్తరం నువ్వే రాసిపెట్టు'' అంది. కుసుమ అంగీకరించి జయను ఇంటర్వ్యూ చేయడం మొదలెట్టింది. ఆమె జవాబుల్లో చిత్తశుద్ధికీ, ఆమె నుంచి లభించిన సమచారానికీ కుసుమ ఆశ్చర్యపడింది. చకచకా జయ బదులివ్వడంవల్ల నాలుగున్నరకల్లా ఇంటర్వ్యూ అయిపొయింది. అప్పుడు జయ, కుసుమను ప్రేమలేఖ రాసి పెట్టమనీ తను ఈలోగా కాఫీ టిఫిన్లు సిద్ధంచేస్తాననీ వెళ్ళింది. ఆమె తిరిగి వచ్చేసరికి ప్రేమలేఖ సిద్ధంగా వుంది. జయ ఆ ఉత్తరం చదివి "ఎంత బాగా రాశావో'' అని మెచ్చుకుంది. కుసుమ టిఫిన్ తింటూ, "మీలో భాపుకత వుందో లేదో కనీ మీ చేతివంట భాపుకతను పుట్టిసొంది'' అంది. కుసుమ వెళ్ళేక జయ ఆ ప్రేమలేఖను మరోసారి చదువుకుని వేరే కాగితం మీద ఫెయిర్ చేసి తన సంతకం కూడా పెట్టింది. అయితే కొన్ని విశేషాలు రాయలేదని ఆమెకు అసంతృప్తిగా తోచింది. అమ్మాయి గౌనుకి తను నేర్చుకున్న డిజైన్ కుట్టింది. పక్కింట్లో దొంగతనం జరిగింది. పాత పనిమనిషిని తీసేసి కొత్త పనిమనిషిని పెట్టారు. ఈమె తోమిన గిన్నెలు తళతళా మెరుస్తున్నాయి. ఇంకా ఎన్నో. మూడ్ను జయ ఇవన్నీ ఉత్తరంలో వున్న ఖాళీలో రాయాలనుకుంది. ఈ ఉత్తరాన్నా ఉత్తరంతో కలపడం ఇష్టంలేక అవన్నీ కలిపి వేరే కాగితం మీద రాసింది. పదిహేను పంక్తులు వచ్చాయి. రెండుత్తరాలనీ కవర్లో పెట్టి భర్తకు పోస్టు చేసింది.                                                        *************** కృష్ణమూర్తి కవరుచింపి ఉత్తరం తీశాడు. 'నా హృదయచోరునికి' అంటూ మొదలైన ఆ లేఖ చూసి తెల్లబోయాడు. ఎవరా అని కింద చూస్తే 'మీ హృదయచోరిణి జయ' అని వుంది. జయ ఈ ఉత్తరం రాసిందా అనుకుంటూ చదివాడు. ఉత్తరం నిండా ప్రేమానుభూతులు, కవిత్వం రసవత్తరంగా వుంది. చదువుకుందుకు బాగుంది కానీ అతడిలో ఏదో అసంతృప్తి .... ఉత్తరాన్నతడు మడిచి కవర్లో పెడుతూండగా ఇంకో కాగితం కనబడి బయటికి తీశాడు. 'ప్రియమైన మీకు ... ఉత్తరం పూర్తిచేశాక కొన్ని విశేషాలు మరిచేననిపించి మళ్ళీ ఈ ఉత్తరం రాస్తున్నాను. అమ్మాయి గౌనుకి నేను కొత్తగా నేర్చుకున్న డిజైన్ కుట్టాను ... కొత్త పనిమనిషి తోమిన గిన్నెలు తళతళా మెరుస్తున్నాయి ... మీ జయ' ఈ ఉత్తరం చదువుతూంటే క్రిష్ణమూర్త్గి పరవశించిపోయాడు. ఈ ఉత్తరానికే తానెందుకు పరవశించాడో అతడికి వెంటనే అర్థమైంది. జయదీ, అతడిదీ తొలిచూపుల ప్రేమ కాదు. సాహచర్యంలో ఏర్పడిన ప్రేమ. అందుకే మొదటి ఉత్తరంలో అతడికి జయ కనపడలేదు. రెండో ఉత్తరంలో కనబడింది. ఆమె కనబదితేనే అతడికి పరవశం మరి! మనదేశంలో ప్రతి భర్తా భోజరాజు. ప్రతి భార్యా కాళిదాసు. వారి అనుబంధాల నుంచే జీవిత ప్రబంధాలు పుడతాయి. వారి మధ్యకు అసలు కాళిదాసు వచ్చినా అతడి ప్రబంధాలు వెలవెలబోక తప్పదు. అయితే ఈ వాస్తవాన్ని కృష్ణమూర్తి కాస్తంత ఆలస్యంగా తెలుసుకున్నాడు.

ప్రేమాన్వేషణ

       ప్రేమాన్వేషణ                                                                                                             - వసుంధర          చదువు పేరు చెప్పి ఆరేళ్ళున్నాను చాలా అనుభవాలు పొందాను అమెరికాలో, వెళ్ళినప్పుడు నా ముఖ్యంగా ప్రేమ విషయంలో వయసు ఇరవై రెండు. అక్కడ అమెరికాలో అడుగు పెట్టిన ఆర్నెల్లలోనే ఒకమ్మాయి నన్ను ప్రేమించింది. ఆమె పేరు మిస్ స్వీట్. పేరుకు తగ్గట్టే మనిషి కూడా తియ్యగా ఉండేది. నాకోసం ఎన్నో కొనేది. నాకు దగ్గర కావాలని ప్రయత్నించేది. మొదట్లో దూరంగా ఉండాలనుకున్నాను. కానీ అక్కడి వాతావరణమే వేరు. ఆకర్షణకు లొంగిపోయాను. ఒకసారి లొంగిపోయాక మిస్ స్వీట్ కు నావల్ల అన్యాయం జరక్కూడదనిపించింది. ఆమెను పెళ్ళి చేసుకుంటానని చెప్పాను. స్వీట్ నవ్వి "ఇంకో పదేళ్ళదాకా నేను పెళ్ళి గురించి ఆలోచించను'' అంది. ఆమె కొన్నాళ్ళు నాతొ చనువుగా తిరిగి నన్ను వదిలేసింది. మానసికంగా దెబ్బతిన్నాను. అయితే అక్కడి వాతావరణానికి ఆడతోడు అవసరం. అందుకని డిస్కో రెక్స్ కి వెళ్ళి ననే కొందరమ్మాయిలతో పరిచయం పెంచుకున్నాను. కాస్త పరిచయంలోనే ఆకలిచూపులు చూసి, బాగా దగ్గరకువచ్చి కూడా పెళ్ళి గురించి అడగని అమెరికన్ అమ్మాయిలూ నాకు నచ్చారు. నాలుగేళ్లలో నా చదువైపోయింది. మరో రెండేళ్లు ఉద్యోగం చేశాను. ఆ ఆరేళ్ళలోనూ ఎందరో అమ్మాయిలతో సన్నిహితంగా మసిలాను. ప్రేమ కబుర్లు చెప్పాను, విన్నాను. "ప్రేమానుభవాలకి ఎవరైనా అమెరికా రావాలి'' అని తరచుగా స్నేహితులతో అంటూండేవాణ్ణి. అంతా ఒప్పుకునేవారు. కానీ ఒకసారి ప్రసాద్ అనే బీహారీ యువకుడు మాత్రం "ఇదంతా కామం. ప్రేమానుభవం ఇండియాలో తప్ప దొరకదు. ఒక యువతి, ఒక యువకుడు ఒకరికోసం ఒకరు కలిసి జీవించాలి. తమ పరిచయాన్ని శాశ్వతం చేసుకోవాలి'' అన్నాడు. ముందు నేనతన్ని నిరసించాను. కానీ ప్రసాద్ మాత్రం "నిన్ను ప్రేమించి నీకు తోడుగా ఉండాలనుకున్న యువతని శ్రద్ధగా చూడు. ఆమె చూపులు నిన్ను పన్నీట జలకా లాడిస్తాయి. ఆమె పెదవులు నీచేత అమృతాన్ని తాగిస్తాయి. ఆమె స్పర్శ నిన్ను దివ్యలోకాలకు తీసుకుని వెడుతుంది. ఆమె మనసు నిన్ను దేవతాపురుషుణ్ణి చేస్తుంది. ఇది అనుభవంలో మాత్రమే తెలిసే విశేషం'' అన్నాడు. నేను ప్రసాద్ ని నిరసించినా అతడి మాటలకు ప్రభావితున్నయ్యాను. ప్రేమగురించి అడిగి అడిగి అతడినుంచి చాలా తెలుసుకున్నాను. ప్రసాద్ ఇండియాలో ఒక యువతిని ప్రేమించాడు. ఆమె కోసమే ఇంకా అమెరికాలో కూడా అతడు పరితపిస్తున్నాడు. ఇక్కడి స్త్రీలకు దూరంగా ఉంటున్నాడు.నాకూ ప్రసాద్ లా ఓ అమ్మాయిని ప్రేమించాలనిపించింది. అందుకో చక్కటి అవకాశం వచ్చింది. మా కంపెనీ ఆర్నెల్లపాటు ఇండియాలో ఏదో సర్వే చేయమని నన్ను పంపించింది. ఆ పనికి నా ప్రేమాన్వేషణను జతపరచి ఇండియా వచ్చాను.విశాఖపట్నంలో నా మకాం. కంపెనీ తరపున నాకో పెద్ద బంగ్లా, ఇంపోర్టెడ్ కారు, ఊర్లో పెద్ద పరిచయాలు. ప్రిన్స్ లా వెలిగిపోతున్నాను. చాలామంది బంధువులు వచ్చి పలకరించి వెళ్ళారు. పరిచయాలను పునరుద్ధరించుకున్నారు. అప్పుడు నాకు ఇరవై ఎనిమిదేళ్ళు."పెళ్ళి చేసుకో'' అన్నారు చాలామంది. విశాఖపట్నంలోనే నాకు నలుగురు యువతులు పరిచయమయ్యారు. వాళ్ళు ఫారిన్ అమ్మాయిలంత డాషింగ్ గానూ ఉన్నారు. వాలకు నేనే కాక ఇతర స్నేహితులూ ఉన్నారు. రాజకీయాలు, స్పోర్ట్సు, సినిమాలు వగైరాల్లో నాకంటే చాల ఎక్కువ పరిజ్ఞానంతో ఉన్నారు. వాళ్ళను చూడగానే ప్రసాద్ చెప్పిన యువతి గుర్తుకు రాలేదు.ఇండియా వచ్చి నెల్లాళ్ళయింది. విశాఖపట్నంలో బంధువులు నాకూపిరి సలపనివ్వడం లేదు. అలాంటి సమయంలో లచ్చన్న మామయ్యా నన్ను పల్లెటూరికి ఆహ్వానించాడు.ఏదో దూరపు వరుసలో అమ్మకు అన్నయ్యవుతాడాయన. ఆయనకు నేనంటే ఏంతో యిష్టం. హైస్కూల్ చదువు పల్లెటూళ్ళోనే చదివాను నేను. లచ్చన్న మామయ్యదీ, మాదీ పక్కపక్కనే ఇల్లు. నేను వాళ్ళింట్లో ఆడుకునేవాణ్ణి. లచ్చన్న మామయ్యా కూతురు సరోజకూ, నాకూ మంచి స్నేహం. అప్పట్లో సరదాగా మా యిద్దరికీ పెళ్ళి చేస్తామని చెప్పుకునేవారు. సరోజ నాకంటే ఆరేళ్ళు చిన్న. నా హైస్కూల్ చదువు కాగానే నాన్న వ్యాపారం చేయాలని బొంబాయికి మకాం మార్చాడు. మేము ఆర్థికంగా బాగా ఎత్తుకి ఎదిగాం. అప్పటికీ ఇప్పటికీ లచ్చన్న మామయ్యే మా పొలాలు చూస్తున్నాడు. "అత్తయ్య నిన్ను చూడాలంటోందిరా'' అన్నాడు లచ్చన్న మామయ్యా. అది నిజమే అయుండాలి. నేను బొంబాయి వెళ్ళాక అత్తయ్య కోసమే నాలుగుసార్లు మా ఊరువెళ్లాను. అయితే నేను ఊరు వెళ్ళి ఇప్పటికి పదేళ్ళయింది. ఇంపోర్టెడ్ కార్లో వెళ్ళానా పల్లెటూరు. అక్కడ నా కారే ఒక ఆకర్షణ అయింది. ఇంటికి వెళ్ళగానే అత్తయ్య నాకు దిష్టి తీసింది. ఏంటో అభిమానంతో ఆదరించింది. నాకిష్టమైన పదార్థాలన్నీ గుర్తుంచుకొని మరీ వండిపెట్టింది. చిన్ననాటి సంగతులెన్నో గుర్తు చేసింది. అవి వింటూంటే నాకు సిగ్గేసింది కూడా. అత్తయ్యకు నేను చిన్నతనం నుంచీ తెలుసేమో ... నా రహస్యాలన్నీ బట్టబయలవుతున్నట్టే ఫీలయ్యాను. ఏడెనిమిదేళ్ళు దాటేదాకా నాకు సిగ్గు తెలిసేది కాదు. ఇంట్లో సాధారణంగా బట్టలు విప్పుకునే తిరిగేవాణ్ణి. చంటిపిల్లయినా ఆడపిల్ల కాబట్టి సరోజ కెప్పుడూ ఓ లాగు తొడిగేవారు. సరోజ నవ్వుతుందిరా అని నన్ను వేళాకోళం చేసేది అత్తయ్య. అప్పుడు సరోజా నిజంగానే నవ్వేది. ఆ నవ్వెంత బాగుండేదో! ఎవరి దగ్గరా సిగ్గుపడని నేను ఎడాదిపిల్ల నవ్వుకి సిగ్గుపడి లాగు వేసుకునేవాణ్ణి.అత్తయ్య ఆ విషయం గుర్తు చేయగానే సిగ్గుపడ్డాను. అప్పుడే పక్క గదిలోంచి నవ్వు వినబడింది.ఏంటో మనోహరంగా ఉందా నవ్వు. నన్నేదో వింత లోకాలకు తీసుకుని పోయిందా నవ్వు.  "ఎవరది?'' అన్నానప్రయత్నంగా. "సరోజ ... నీ ఎదుట పడడానికి సిగ్గుపడుతోంది'' అంది అత్తయ్య. "సరోజకు నాదగ్గర సిగ్గెందుకు?'' అన్నాను. కానీ కారణం నాకూ తెలుసు. బాల్యం ఎవరినైనా దగ్గర చేయగలదు. కులమతాలు, స్త్రీపురుష విభేదాలు అందుకడ్డురావు. కానీ వయసు మనిషికీ మనిషికీ మధ్య ఎన్నో అంతరాలను సృష్టిస్తుంది.వయసు స్త్రీ పురుషులను దగ్గర కమ్మని ప్రోత్సహిస్తుంది. అందుకే వయసులో వారొకరికొకరు వీలనినంత దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నాలకు అందాన్నిచ్చేది సిగ్గు. "రావే సరోజా ... బావే కదా!'' అంది అత్తయ్య. తల్లి బలవంతం మీద సిగ్గునదుపు చేసుకుంటూ నా ముందుకు వచ్చి తలవంచుకొని నిలబడింది సరోజ.నా ఊహల్లో సరోజ వేరు ... ఎదుట నిలబడ్డ సరోజ వేరు.సరోజ కట్టుకున్న చీర ఆమెకందాన్నివ్వలేదు సరికదా ... చీర అందం కూడా పాడైంది ఎగుడు దిగుడులుగా కట్టుకుందామె చీర. పూర్వకాలపు మోడల్లో జాకెట్టు, బిగించి వేసుకున్న జడ. "చిన్నప్పుడు చెట్టాపట్టా లేసుకుని తిరిగేవారు. ఇప్పుడింత సిగ్గేమిటీ ... తలెత్తి బావని చూడు ...'' అందత్తయ్య. చిన్నప్పట్నుంచీ అత్తయ్య మాటలు కాస్త మోటుగానే ఉండేవి. అత్తయ్యాలో ఇప్పటికీ పెద్దమార్పు లేదు.సరోజ తలెత్తింది.ముఖానికి కాస్మెటిక్స్ లేవు. పసుపు వాడుతుందేమో బాగా పచ్చగా ఉంది ముఖం. బొట్టుకాస్త పెద్దసైజులో వుంది. కళ్ళకు కాటుక పెట్టుకుంది. ఆ నలుపు కళ్ళకేకాక కాస్త ముఖానికి అంటింది.సరోజ వంకే చూస్తున్నాను. "ఆ కన్నులు నిన్ను పన్నీట జలకాలాడిస్తాయి. ఆ పెదవులు నీ చేత అమృతాన్ని తాగిస్తాయి. ఆమె స్పర్శ నిన్ను దివ్య లోకాలకు తీసుకొని వెడుతుంది. ఆమె మనసు నిన్ను దేవతాపురుషుణ్ణి చేస్తుంది'' ప్రసాద్ మాటలు నా చెవుల్లో గింగురుమన్నాయి. సరోజ పెద్ద అందంగా లేదు. కానీ ఆమె కనుల్లో అమాయకత్వముంది. ఆమె పెదవుల్లో ఏదో ప్రత్యేకత వుంది.ఆమెతో సాన్నిహిత్యాన్ని పెంచుకోవాలనుకున్నాను.పల్లెటూళ్ళో రెండ్రోజులున్నాను.క్రమంగా సరోజలో భయం, సిగ్గు తొలగిపోయాయి.చిన్నప్పుడు మేము కలిసి స్నానం చేసేవాళ్ళం సామెతపరంగా కాక ఒకే కంచంలో భోంచేసి ఒకే మంచంలో పడుకున్న సందర్భాలు నిజంగానే ఉన్నాయి. మేమిద్దరం ఎప్పుడూ దెబ్బలాడుకోలేదు.అవన్నీ ఇప్పుడు గుర్తుచేసుకుంటూంటే చాలా మధురంగా వుంది. సరోజ మాటల్లో అమాయకత్వంతో కలిసి మాధుర్యముంది. ఆమె మాట్లాడుతుంటే ఏరుకుని భోంచేయాలనిపిస్తుంది. ఆమె నవ్వుతూంటే పెదాలపై ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. అంతకుమించి ఆమె నుంచి నాకేమీ లభించేలేదు.నేను నా అమెరికా జీవతం గురించి ఆమెకు కొంత చెప్పాను.సరోజ ప్రయివేటుగా బియ్యే చదివింది. ఆంగ్లభాష అర్థమవుతుంది కానీ మాట్లాడలేదు. ఆమెకు మంచి సంబంధంచూసి పెళ్ళి చేయాలని లచ్చన్న మామయ్యనుకుంటున్నాడు. ఒక్కతే కూతురు, కొడుకు పట్నంలో చదువుకొంటున్నాడు.కూతురి కొచ్చిన సంబంధాల్లో కొన్ని అత్తయ్యకు, కొన్ని మామయ్యకు నచ్చడం లేదు. అందరికీ నచ్చిన సంబంధాల్లో కట్నం సమస్య వచ్చింది.  ఓ ఇంజనీరు కుర్రాడు యాభైవేలడిగాడు. "నిన్ను కట్న మడగడం అన్యాయం. నేనైతే నీకే ఎదురిస్తాను'' అన్నానొక రోజున అప్రయత్నంగా.సరోజ సిగ్గుపడింది "నువ్వు అమెరికాలో ఉన్నాననుకుంటున్నావు బావా'' అందామె.ఆమె బావా అన్నప్పుడల్లా నా మనసు వింత అనుభూతి చెందుతోంది.సరోజను పెళ్ళి చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చాను. అయితే పెళ్ళికిముందు ఆమెను నాకు అనుగుణంగా మార్చుకోవాలి. ఇప్పటి వేషంలో సరోజను చూస్తే నా యింటి పనిమనిషిగా కూడా ఎవరూ అంగీకరించరు. "మీరు కొన్నాళ్ళు వచ్చి నాతొ ఉండాలి'' అని అత్తయ్యను బలవంతపెట్టాను. కుటుంబసమేతంగా వాళ్ళను నా కార్లో విశాఖపట్నం తీసుకుని వెళ్లాను. అక్కడ సరోజ కోసం బ్యూటీ పార్లర్ నించి ఓ యువతిని రప్పించి నియమించాను సరోజ హెయిర్ స్టయిల్ మార్చడానికిష్టపడలేదు."నీ అందానికి తగ్గ హెయిర్ స్టయిలుండాలి కాదనకు'' అని సర్దిచెప్పాను. ఒప్పుకుంది.సరోజ బట్టల విషయంలోనూ ప్రతిఘటించింది."నీ వంటికి తగిన అలంకరణ కావాలి ...'' అన్నాను. వింది. సరిగ్గా వారంరోజుల్లో సరోజ మారిపోయింది. ఆమెను చూసి నేనే ఆశ్చర్యపడ్డాను.అనాకర్షణీయంగా ఉండే సరోజ ఇప్పుడు అప్సరసలా మారిపోయింది. అలంకరణ మనిషినెంతగానైనా మార్చగలదనడానికి సరోజ ఉదాహరణ. అత్తయ్య నన్ను మెచ్చుకుని "అమ్మాయిని గొప్పగా మార్చేశావు. ఇలా దీన్ని పెళ్ళిచూపుల్లో చూపించామంటే ...'' అంది కాస్త మోటుగానే.అత్తయ్య మాత్రం నా బలవంతంమీద విశాఖపట్నంలో ఉండిపోయింది కూతురితో సహా. ఆమెకు అంతరాంతరాల్లో నేను సరోజను వివాహం చేసుకుంటానన్న ఆశ కూడా ఉందనుకుంటాను. లేకపోతే అన్నాళ్ళు ఉండదు. నేనే సరోజను, అత్తయ్యను ఊరంతా తిప్పాను. పెద్ద పెద్ద పరిచయాలు వాళ్ళకు కలిగించాను. నా హోదాకు వాళ్ళిద్దరూ దిగ్భ్రాంతి చెందేలా ప్రవర్తించాను.అత్తయ్య నోరు విప్పితే నా గురించే పొగడ్తలే. ఇప్పుడు నేను అప్పుడపుడు సరోజను స్పృశించగల్గుతున్నాను. ప్రసాద్ చెప్పినట్టే దివ్యలోకాలకు వెళ్ళిపోతున్నాను.సరోజ నాకు ఎక్కువ చనువివ్వడంలేదు. అందుకేనేమో ఆమె పట్ల నా ఆకర్షణ దారుణంగా పెరిగిపోతోంది. అమెరికా మనిషినేమో ... ఆమెను స్వంతం చేసుకోవాలన్న కోరిక నానాటికీ బలాప్డుతోంది ఇక ఆగలేక ఒకరోజున సరోజను బీచికి తీసుకుని వెళ్లాను. ఆకక్డే నా మనసులోని మాట చెప్పాలనుకున్నాను."సరోజా ... ఇప్పుడు నీలో చాలా మార్పు వచ్చింది ...'' అన్నాను. "ఇదంతా నీ చలవ బావా'' అంది సరోజ."నీ వేషాన్ని మార్చి నీ వ్యక్తిత్వాన్ని బాధించలేదు కదా'' అన్నాను."లేదు బావా! వ్యక్తిత్వానికి వేషం కూడా జోదవుతుందని నీ వల్లనే గ్రహించాను. చదువు నాకివ్వలేని గౌరవాన్ని వేషం నాకిచ్చింది. ప్రకృతి నా కివ్వలేని అందాన్ని అలంకరణ యిచ్చింది. అయితే నువ్వు నాకోసం ఇంతలా ఎందుకు శ్రమించావో అర్థం కావడం లేదు'' అంది సరోజ. "నీ వంటికి తగ్గ అలంకరణ నీకుండాలని భావించాను. ఇందులో శ్రమ ఏముంది?'' అన్నాను. "థాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ ... ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా'' "లేదు ...'' "ఎందుకని?'' "ఇప్పుడు నీ రూపానికి తగిన విశేషాలు నీకుండాలి ...'' "ఉన్నాయిగా'' అంది సరోజ. "పెద్ద బంగ్లా ... ఇంపోర్టెడ్ కారు ... దాసదాసీజనం ...'' సరోజ నవ్వి "అన్నీ ఇచ్చినట్టే యివి కూడా నా కివ్వగలవా?'' అంది. "ఎక్కడ కావాలో చెప్పు నీకోసం నీవు కోరిన విధంగా బంగ్లా కట్టిస్తాను. నీకు నచ్చిన కారు ఎన్నిక చేసుకునేటందుకు నిన్ను నేను అమెరికా తీసుకుని వెళతాను. నీవు కోరిన విధంగా సేవలు చేసేటందుకు ఏ దేశంనుంచైనా మనుషుల్ని రాప్పిస్తాను'' "నిజంగా!'' "నిజంగా!'' సరోజ ఆశ్చర్యంతో కళ్ళు రెప రెప లాడించి "ఎందుకు బావా నేనంటే నీకింత అభిమానం?'' అంది. "నేను నిన్ను ప్రమిస్తున్నాను సరోజా!'' అన్నాను చటుక్కున ఇంత సూటిగా ఆ మాట చెప్పడం ఇదే మొదటిసారి.సరోజ చలించలేదు "అయితే?'' అంది. "ప్రేమించిన యువతికోసం ఏమైనా చేయగలదడు ప్రేమికుడు ...'' "అయితే నీకు తెలియదా? స్త్రీ జీవితంలో కోరుకునేది బంగళా కాదు, కారు కాదు, దానదాసీ జనాల సేవలు కాదు ...'' "మరి ...'' "తగినజోడు'' నా తనువు పులకరించింది. "నీ మాటలు నిజం ... నీ మనసులోని మాట చెప్పు ... వెంటనే నీ కోరిక నెరవేరుతుంది'' "నా మనసులోని మాట నువ్వే చెప్పు....'' "సరోజా!'' అన్నాను. "నీ మనసులోని మాట, నిర్భయంగా నాకు చెప్పకపోతే నీ మనసు నా ముందు మూగబోయిందన్న బాధ నాక్కలుగుతుంది ...''సరోజ కొద్దిక్షణాలు తటపటాయించి "నేనూ నిన్ను ప్రేమిస్తున్నాను బావా'' అంది. "థాంక్స్ సరోజా'' అన్నాను అప్రయత్నంగా. "అందుకే నాకు తగిన వరుణ్ణి చూసే బాధ్యత కూడా నీకు అప్పగిస్తున్నాను ...''అంది సరోజ."నువ్వెవరిని ప్రేమిస్తున్నవో అతడినే పెళ్ళిచేసుకో'' అన్నాను."అదెలా సాధ్యం బావా? నేను మా అమ్మని ప్రేమిస్తున్నాను. నాన్నని ప్రేమిస్తున్నాను, నా తమ్ముణ్ణి ప్రేమిస్తున్నాను. చెప్పాలంటే ఇంకా చాలామందిని ప్రేమిస్తున్నాను. ప్రేమకూ పెళ్ళికీ ముడిపెట్టకు'' అంది సరోజ. నేను తెల్లబోయి "నీ పెళ్ళి విషయంలో నేనెలా సాయపడగలనో చెప్పు?'' అన్నాను. "నా మనసు నీకు తెలుసు. నేనెలా పెరిగానో నీకు తెలుసు. నేను నమ్మే సంప్రదాయం నీకు తెలుసు. నా గురించి నీకు తెలియనిది లేదు. ఒక్క చూపులో నా వంటికేమినప్పుతాయో గ్రహించావు నువ్వు. ఇప్పుడు నేను నా వంటిని కూడా ఎంతో ప్రేమిస్తున్నాను నాకు తగిన వరుణ్ణి కూడా నువ్వే చూడు బావా'' అంది సరోజ.సరోజ భావం నా కవగతమయింది. నేను చెప్పిన బట్ట, నేను చెప్పిన విధంగా కట్టుకుంటే ఆమె అప్సరస అయింది. ఆమె కాలి నడక, భాషోచ్చారణ నా సూచనలతో ఆమె వ్యక్తిత్వాన్నే మార్చాయి.సరోజకు నేనంటే గౌరవం, నమ్మకం బయల్దేరాయి. ఇప్పుడామె నన్నే తగినవరుణ్ణి చూడమంటోంది. తను జీవితంలో ఆ వరుడితో సుఖపడగలనని నమ్ముకుంటోంది. తన సంప్రదాయానికి నా అమెరికా సంప్రదాయం అడ్డు వస్తుందని పరోక్షంగా ఆమె సూచించిందా? లేక అమాయకంగా ఆమె నా ఔన్నత్యాన్ని నమ్ముతోందా?ఒకటి మాత్రం నిజం. సరోజకు తగిన వరుడిగా నా గురించి ఆలోచించుకాగానే నాలో చాలా లోపాలు కనబడ్డాయి. నా లోపాలను సరిదిద్దుకోమని సరోజ చెపుతోందా?ఎన్ని లోపాలు దిద్దుకున్నా నేను కోల్పోయిన పవిత్రత తిరిగి రాదు కదా! అది నేను సరిదిద్దుకోలేని లోపం గదా!ప్రేమాన్వేషణకై ఇండియా వచ్చాను. ఆ ప్రేమ కారణంగానే ప్రస్తుతం నేను సరోజకై వరాన్వేషణలో ఉన్నాను.