నాకున్నది ఒక చక్కని బొమ్మ

నాకున్నది ఒక చక్కని బొమ్మ ఎపిసోడ్ - 7 - వసుంధర ఈ మధ్య వాడు నాతో అట్టే అడ్డం లేదు. వాడు పెద్దవాడై పోతున్నాడట. ఆడపిల్లలతో ఆడకూడదుట. వాడలా అన్నాడని నాకేం బాధ కలగలేదు. అల్లరి వెధవ-వాడితో నాకాటలేమిటీ?     "సుధాకర్ కి నీ బొమ్మ అమ్ముతావే?" అన్నాడు వాడు.     "నేను అమ్మను" అన్నాను.     "వాడు చాలా డబ్బు ఇస్తాట్ట" అన్నాడు కిష్టిగాడు.     "ఎంతిచ్చినా సరే అమ్మనంటే అమ్మను."     "వెయ్యి రూపాయలిస్తాట్ట. తెలుసా? వెయ్యి రూపాయలంటే మాటలుకాదు. వాడి దగ్గరుందీ- అలాంటి బొమ్మలు ఇరవైదాకా రావచ్చుట" అన్నాడు కిష్టిగాడు.     "అమ్మా- నాది అమెరికా బొమ్మ. నా బొమ్మ నా దగ్గరే వుంటుంది" అన్నాను.     ఎవరైనా నాకు కారు కొనిపెట్టినా సరే నా బొమ్మను అమ్మకూడదనిపించింది. అదంటే నాకు ప్రాణం. కొంత మంది లేనివాళ్ళు డబ్బుకోసం కన్నబిడ్డల్నే అమ్ముకుంటారుట. నా బొమ్మనే నేను వదులుకో లేకుండా వున్నాను. పాపం వాళ్ళకెలా వుంటుందో ననిపించింది. ఈ ప్రపంచంలో ఎవ్వరికీ డబ్బు ఇబ్బంది వుండకూడదు. అందరి దగ్గరా సమంగా వున్నా లేకపోయినా ఎవ్వరూ డబ్బు కోసం ఇష్టంలేని పనులు చేయకూడదు. నేను పెద్దయ్యాక అందుకేం చేయాలో ఆలోచిస్తాను.     కిష్టిగాడు ఆ రోజు వెళ్ళిపోయాడా! అదంతటితో అయిపోలేదు. మర్నాడు సుధాకర్ వచ్చి నన్ను బ్రతిమాలుకుని వెళ్ళాడు. నేను ఒప్పుకో లేదు. అప్పటికీ ఈ వ్యవహారం పూర్తికాలేదు.     ఇంకో రెండ్రోజులాగి సుధాకర్ అమ్మా, నాన్నా మా ఇంటికివచ్చారు. డాక్టరుగారు నాకైతే తెలియరుకానీ మా ఇంట్లో పెద్దాళ్ళకందరికీ తెలుసు. మా ఇంట్లో ఎవరికి వంట్లో బాగుండకపోయినా ఆయనే మందిస్తారుట.     నాన్నగారు వాళ్ళకి బాగా మర్యాద చేశారు. అన్ని మర్యాదలూ అందుకుని ఆ డాక్టరుగారు అంటాడూ "నాకు ఒక్కడే కొడుకు, వాడి కోసం ఏం చెయ్యమన్నా చేస్తాను. ఎంత డబ్బు అయినా ఖర్చు పెడతాను. మీ అమ్మాయి దగ్గరున్న బొమ్మ వాడికి కావాలంటున్నాడు. దాని కోసం ఏడుస్తున్నాడు. దయచేసి మీరది నాకు ఇవ్వండి. వెయ్యి రూపాయలిస్తాను" అని.     నా గుండెల్లో రాయి పడింది. వ్యవహారం పెద్దవాళ్ళ దాకా వెళ్ళిపోతుందని అనుకోలేదు. ఇప్పుడు నాన్నగారేమంటారో, నాకైతే ఆ మాటలు వినగానే కోపం వచ్చింది. కానీ నాన్నగారు మాత్రం డాక్టరుగారి మాటలు విన్నాక కూడా నవ్వుతూనే వున్నారు. ఆయన బొమ్మను అమ్మేస్తారో ఏమో!     "చూడండి డాక్టరుగారూ! మాకూ ఒక్కగానొక్క అమ్మాయి. దానికోసమని వాళ్ళ బాబాయి ప్రత్యేకంగా అమెరికా నుండి పుట్టినరోజు బహుమతిగా తెచ్చి ఇచ్చాడు. మాకు మీ అంత డబ్బులేదు. కానీ కన్నకూతురు పుట్టిన రోజు బహుమతులు మాత్రం అమ్ముకోను. మీరేమీ అనుకోకండి. నా తమ్ముడు ఇలాంటి బొమ్మ ఇంకోటి సంపాదించే అవకాశముందేమో చూడమంటాను" అన్నారు నాన్నగారు చాలా శాంతంగా.     డాక్టరుగారు వెళ్ళిపోయారు. నేను వెంటనే నాన్నగారి దగ్గరకు వెళ్ళిపోయి కాళ్ళు పట్టుకుని "నాన్నగారండీ మీరింత మంచివారని ఎప్పుడూ అనుకోలేదండీ!" అన్నాను. ఆయన నన్ను దగ్గరకు తీసుకుని "ఆ బొమ్మను అమ్ముకోవడమంటే నిన్ను అమ్ముకోవడమే కదమ్మా!" అన్నారు. నాకు కళ్ళనీళ్ళొస్తే ఒత్తుకున్నాను. అవి ఆనంద బాష్పాలేమోమరి !      అమ్మ కూడా నాన్నగారిని మెచ్చుకుని "చాలా బాగా అన్నారండీ! లేకపోతే ఆయన డబ్బుంది కదా అని మన పిల్ల బొమ్మ అడుగుతాడా ?" అంది.     "అసలిదంతా నీవల్లే వచ్చింది. 'ఆ బొమ్మను ఎవరికయినా అమ్మేసినా బాగుండును' అన్నావు. అంతే కిష్టిగాడు వచ్చేశాడు. సుధాకర్ వచ్చాడు. ఆ తర్వాత డాక్టరుగారు వచ్చారు. నా బొమ్మ ఇంట్లో వుండడం నీకిష్టం లేదు. అందుకే ఇలా జరిగింది" అన్నాను.     "ఇంకెప్పుడూ నీ బొమ్మను ఏమీ అనను, సరేనా?" అంది అమ్మ.     నిజంగానే ఆ తర్వాత అమ్మ నన్నూ, నా బొమ్మనూ ఏమీ అనలేదు. అమ్మ బుద్దిగా వుంటే నేను మాత్రం బుద్దిగా వుండనా మరి ! నేను కూడా అమ్మ చేత చెప్పించుకోకుండానే అన్ని పనులూ చేస్తూ అప్పుడు బొమ్మతో ఆడుకునేదాన్ని.     బొమ్మ మూలంగా నా సెలవులిట్టే అయిపోయాయి. సెలవులు అయిపోయినందుకు ఈసారి నాకట్టే విచారంగా లేదు. నా బొమ్మ గురించి క్లాసులో అందరికీ చెప్పుకోవాలని చాలా ఆత్రుతగా వుంది.     స్కూలు తియ్యగానే మొదటిరోజు నేనూ, కిష్టిగాడూ కలిసే స్కూలుకు వెళ్ళాం. వాడు నాతో బొమ్మ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేనేదో అనబోతే "బొమ్మ గురించి చిన్న చిన్న పిల్లలకు చెప్పుకో! నాకు చెప్పొద్దు, చిరాకు!" అనేశాడు.     స్కూలుకు వెళ్ళాక వాడు నన్నింకా ఏడ్పించాడు.     మేస్టారు క్లాసుకు రావడం కాస్త ఆలస్యమయింది. అంతే కిష్టిగాడు మాస్టారు కూర్చునే కుర్చీ దగ్గరకు వెళ్ళి నిలబడి "ఈ క్లాసులో అన్నపూర్ణ అనే అమ్మాయికి అమెరికా నుండి వాళ్ళ బాబాయి ఓ బొమ్మ తెచ్చాడు. ఆ బొమ్మకు లేతగులాబీ రంగు వళ్ళు. రెండడుగుల పొడుగుంటుంది" అంటూ మొత్తం బొమ్మ గురించి అన్నీ చెప్పేసి "పాపం అన్నపూర్ణ ఈ విశేషం అందరికీ చెప్పాలని తొందర పడిపోతోంది. ఒక్కొక్కరికే, ఒక్కొక్కరికే ఒక్కొక్కరికే చెబుతూ కూర్చుంటే ఎప్పటికి అవను? అందుకని దాని తరపున నేను మీకు అందరికీ ఒక్కసారే చెప్పేస్తున్నాను. ఇంక మీరు దాని బోరు భరించనక్కర్లేదు" అన్నాడు.     వెంటనే అంతా నవ్వేశారు.     కిష్టిగాడు నా ప్లానంతా పాడు చేసేశాడు. నా కలలన్నీ నాశనం చేసేశాడు. విన్న వాళ్ళంతా నా బొమ్మ గురించి మరిచిపోయి వాడి మాటలు చెప్పుకుని నవ్వుకోసాగారు. నేనేమైనా అందామనుకునేలోగా మేస్టారు క్లాసులోకి వచ్చేశారు.     ఇంటర్వల్ దాకా నాకు ఎవ్వరితోటీ మాట్లాడ్డానికి వీలు కాలేదు. ఈలోగా నేను ఆలోచించి వుంచుకున్నాను. అందరికీ నా బొమ్మను చూస్తే అసూయే! దాన్ని చూసి అంత అసూయ పడితే బొమ్మకు బోలెడు దిష్టితగుల్తుంది. దానికి దిష్టి తీద్దామంటే అమ్మ ఇప్పు ఇవ్వదు.     బొమ్మను చూసి అసూయపడకుండా సంతోషించే వాడు శంకరం ఒక్కడే అవుతాడు. నేను శంకరం కోసం క్లాసంతా చూశాను. వాడు ఎప్పటిలాగానే వున్నాడు.     ఇంటర్వల్ అవగానే నేను శంకరం దగ్గరకు వెళ్ళాను. వాడు నాతో మాట్లాడ్డానికి ఉత్సాహం చూపించలేదు.     "ఏం శంకరం బొమ్మ గురించి చెప్పి బోరుకొడతానని భయంగా వుందా ?" అనడిగాను.     "అదేం కాదు" అంటూ వాడు తడబడ్డాడు.     "అమెరికా బొమ్మ వచ్చాక నిన్ను పిలుస్తానని చెప్పానుగా ఈ రోజు వస్తావా?" అనడిగాను.     "రాను" అన్నాడు శంకరం.     "ఏం?" అన్నాను ఆశ్చర్యంగా.     "నేను దాచుకున్న సబ్బుముక్క కాకెత్తుకు పోయింది. అమ్మ మళ్ళీ సబ్బు ముక్కలు తేలేదు. ఎవ్వరూ ఇవ్వడం లేదంది. సబ్బుల ధర పెరిగిపోతోందిట. అందుకని పాత సబ్బు సన్నగా అయిపోగానే కొత్త సబ్బుకు అంటించేస్తున్నారుట" అన్నాడు శంకరం.     "అయ్యో పాపం!" అన్నాను. కానీ ఇప్పుడెలా ?     అప్పుడు నాకు గుర్తు వచ్చింది. అరిగిపోయిన రెండు సబ్బు ముక్కలు నేను బొమ్మ కోసం దాచుకున్నాను. అందులో ఒకటి పోనీ శంకరానికి ఇస్తే ?     అప్పుడు శంకరం సంతోషిస్తాడు. దాంతో శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకుని మా ఇంటికి వస్తాడు. బొమ్మ చూస్తాడు.     శంకరానికి బొమ్మ చూపించాలని నాకెందుకంత ఇదిగా వుందో నాకే తెలియదు. కానీ కిష్టిగాడంటే ఎంత అసహ్యమో శంకరం అంటే అంత ఇష్టం నాకు !     కిష్టిగాడు ఎంత వేళాకోళం చేసినా నాతోపాటు ఆ రోజు నా క్లాస్ మేట్సు ఇద్దరబ్బాయిలూ, నలుగురమ్మాయిలూ వచ్చి ఆ బొమ్మ చూసి వెళ్ళారు. వాళ్ళు బొమ్మను చూసి ఆశ్చర్యపడ్డారు. మెచ్చుకున్నారు. అయినా నాకు సంతోషం మరీ ఎక్కువగా కలగలేదు. పాపం- శంకరం చూడలేదే అనిపించింది.     అంతా వెళ్ళిపోయాక సబ్బు ముక్కల కోసం చూశాను. అవి కనబడలేదు, వెతికి వెతికి ఆఖరికి అమ్మను అడిగాను.     ముందు అమ్మకు అర్ధం కాలేదు. తర్వాత "అవా? పాపం మన పనిమనిషి రత్తమ్మకు ఇచ్చానే!" అంది.     నాకు చాలా కోపం వచ్చింది. అమ్మ నన్నడక్కుండా నా వస్తువులు ఎందుకు తీయాలి? అలాగని నేను నిలదీస్తే నా ఇష్టం పొమ్మంది అమ్మ. నాకు చాలా కోపం వచ్చింది. అమ్మకు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నాను. మా ఇంట్లో ముందు మామ్మ స్నానం చేస్తుంది. తర్వాత అమ్మ, ఆ తర్వాత నేను, నా స్నానం అయి భోం చేసి బడికి వెళ్ళాక ఆ తర్వాతనే నాన్నగారు స్నానం చేస్తారు. అమ్మ నా సబ్బు నాతో చెప్పకుండా తీసింది కాబట్టి ఇంట్లో సబ్బు అమ్మకు చెప్పకుండా తీసుకుని వెళ్ళి బడిలో శంకరానికి ఇవ్వాలను కున్నాను.     సబ్బుతీసి రెండు రోజులే అయింది. ఇంకా కొత్తగా వుంది. నా స్నానం కాగానే దాన్ని జాగ్రత్తగా కాగితంలో చుట్టబెట్టి నా స్కూలు బ్యాగులో వేసుకున్నాను.     ఈ రోజు కూడా ఇంటర్వల్ దాకా శంకరంతో మాట్లాడడం కుదరలేదు. అప్పుడు వాడికి సబ్బు ఇచ్చాను.     "పెద్ద సబ్బు ఇది, ఇంత పెద్ద సబ్బుతో నేనెప్పుడూ వళ్ళు రుద్దుకోలేదు" అన్నాడు శంకరం.     "అందుకే ఈ రోజే నువ్వు తప్పక రావాలి" అన్నాను బ్రతిమాలుతున్నట్లుగా.     "ఈ సబ్బు నీకెలా వచ్చింది" అని అడిగాడు శంకరం.     "ఎలా రావడమేమిటి? ఇది నాదే. మా ఇంట్లో నాకు వేరే సబ్బు వుంటుందని అబద్ధం చెప్పాను.      "మరిప్పుడు నీకు ఎలా?" అన్నాడు శంకరం.     "నా కోసం నెలకు రెండు సబ్బులు తెస్తారు. నాకు ఇంకొకటుందిలే! ఎలాగో గడుపుకుంటాను. నా సంగతి నీకెందుకు? ఇది అచ్చంగా నీకే" అన్నాను.     "చాలా థాంక్స్ అన్నపూర్ణా!" అన్నాడు శంకరం.     నాకు ఎంత గర్వం కలిగిందో చెప్పలేను. ఒక పేదవాడికి నేను సబ్బు ఇచ్చి సాయపడ్డాను. అందుకు వాడు నాకు థాంక్స్ చెప్పాడు.     నా గర్వమంతా సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి అణగారిపోయింది. ఇంట్లో చాలా గొడవగా వుంది.     నేనింటికి వచ్చినా అమ్మగానీ, మామ్మగానీ నా గురించి పట్టించుకోలేదు. వాళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటున్నారు.     జరిగిందేమిటో నాకు తెలియడానికి ఎంతో సేపు పట్టలేదు.     నాన్నగారు స్నానం చేయాలనుకునే సరికి సబ్బు కనిపించలేదుట. ఆయన సబ్బు లేకుండానే స్నానం చేశారుట. కానీ చాలా కోప్పడిపోయారుట. ఇంట్లో ఎంత వెతికినా సబ్బు కనిపించలేదుట. ఆఖరికి అనుమానం రత్తమ్మమీదికి పోయిందట. ఎంత అడిగినా అది ఒప్పుకోడంలేదుట.      "అది ఒప్పుకుంటేనే పనిలో వుంచుకుంటాను. లేకపోతే పనిలోంచి తీసేస్తాను, నేనేకాదు ఇంకెవ్వరూ దాన్ని పనిలో పెట్టుకోనీకుండా చేస్తాను" అందిట అమ్మ.     "నేను నిజంగా తప్పు చెయ్యలేదు. చెయ్యని తప్పు ఎలా ఒప్పుకుంటానమ్మా" అని ఏడ్చిందిట రత్తమ్మ.     "పాపం! అది తియ్యలేదేమోనే!" అందిట మామ్మ.     అంతే! అమ్మ మామ్మ దెబ్బలాడుకోవడం ప్రారంభించారుట.     "దాని ఎదురుగానే మీరలాగ అంటే నా మాటకు విలువేముంటుంది? ఈ రోజు సబ్బు అయింది, ఇంకో రోజు నగలు కావచ్చు" అందిట అమ్మ.     "నగలైతే  అప్పుడు చూసుకోవచ్చు చిన్న సబ్బుముక్క కోసం ఇంత మంచి పనిమనిషిని మానిపిస్తే ఆ తర్వాత నిజంగా దొంగబుద్దులున్నదే వస్తుంది" అందిట మామ్మ.     అప్పట్నించీ ఆ ఇద్దరూ దెబ్బలాడు కుంటూనే వున్నారుట. ఇదంతా నాకు మామ్మ చెప్పింది.     "నువ్వే రైటు మామ్మ! ఆ సబ్బు నేనే తీశాను" అంటూ నేను మామ్మకు జరిగిందంతా చెప్పాను. వెంటనే మామ్మ అమ్మను కేకేసింది. తిట్టింది. ఆ తిట్లన్నీ అమ్మ నన్ను తిట్టింది.     "నన్ను తిడతావేం?" అన్నాను.     "అంత పెద్ద సబ్బు బిళ్ళను ఎవరికో దానం చేస్తావా? ఇది ఇల్లనుకున్నావా, ధర్మసత్ర మనుకున్నావా?" అంది అమ్మ.     "నేనేం చెయ్యను? చిన్న సబ్బు ముక్కే ఇవ్వాలనుకున్నాను. అదేమో నువ్వు నాకు చెప్పకుండా ఎవరికో దానం చేశావు మరి!" అన్నాను మామ్మ వెనకాల నుంచుని. మామ్మ వెనకాల నుంచున్నప్పుడు నాకు చాలా ధైర్యంగా వుంటుంది. అప్పుడు అమ్మ నన్నేమీ చెయ్యలేదు.      చివరికే మనుకుందో "సరేలే, ఇలా జరిగిందని రత్తమ్మకు మాత్రం చెప్పకు" అంది అమ్మ.     అయితే బాబాయి మాటలు నాకు పూర్తిగా గుర్తున్నాయి. మనుషులు అంతా ఒక్కటేనన్నాడు బాబాయి. అమ్మ రత్తమ్మను అన్యాయంగా అనుమానించింది. అవమానించింది. తొందరపడ్డం అమ్మ తప్పు.                      (సశేషం)

అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం

 అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం                                                                                                                                                              -కనకదుర్గ ఎందుకు? ఎందుకూ? ఓరి భగవంతుడా నాకెందుకింత పెద్ద శిక్ష వేశావు? నేనేం తప్పు చేసాను?  నేనూ నాన్న లాగే నాకు చేతనయినంత వరకు నాన్నంత కాక పోయినా నాకు తోచినంత ఎవరికైనా సాయం కావాలంటే చేయడం, ఏ పని చేసినా కష్టపడి చేయడం, నిజాయితీగా వుండడానికే ప్రయత్నిస్తాను కదా!  అలాంటిది నాన్న అందనంత దూరాలకు వెళ్ళిపోతే నాకు ఆఖరు చూపు కూడా దక్కకుండా ఎందుకు చేసారు అందరు కలిసి?మోకాళ్ళల్లో తల పెట్టుకుని విలపిస్తుంది సుప్రజ.  అప్పుడే 13రోజులయిపోయాయి.  భర్త శ్రీమంత్ వచ్చి పక్కన కూర్చున్నాడు.  "చిన్నా! నీ బాధని నేను అర్ధం చేసుకోగలను, కానీ చూడు నువ్వు నాన్న కోసం ఈ రోజు ఇక్కడ మన ఆత్మీయులందరినీ పిలిచి ముఖ్యంగా నాన్న గురించి అందరితో నీ జ్ఞాపకాలు, ఆయన మంచితనం, ఆయన ధైర్యం, ఆయన ఎంత మందికి సాయం చేసారు చెబితే అందరూ ఎంత సంతోషించారు.  అయినా నాన్న ఎక్కడికి వెళ్ళారు రా? మన మనసులో ముఖ్యంగా నీ హృదయంలో ఎప్పటికీ వుంటారు.  ఇంక ఎక్కువ బాధ పడకూడదు.  నాన్న మనల్ని ఎప్పుడూ చూస్తూనే వుంటారు.  నువ్వు బాధ పడితే ఆయన ఆత్మకు కష్టం కల్గుతుందిరా."  అన్నాడు సుప్రజ కళ్ళు తుడుస్తూ.  మెల్లిగా లేచి లోపలికి వెళ్ళింది సుప్రజ అలిసి పోయినట్టుగా వుంటే బట్టలు కూడా మార్చుకోకుండా కూతురు దృశ్య పక్కనే పడుకుంది. పిల్లలు పుట్తినప్పటినుండి ముఖ్యంగా ఎక్కువగా తను పిల్లలను చూసి మురిసిపోయినపుడు, వారిని ముద్దు చేస్తున్నపుడు,  తనతల్లీ తండ్రి తను పుట్టినపుడు కూడా చేతుల్లో పసిపాపను, తనని చూసుకుని తనలాగే మురిసిపోయుంటారే, తన ముద్దు ముచ్చట్లు చూసి ఎంతగా ఆనందించుంటారో కదా అనిపించేది.  గత పదమూడు రోజుల్లో జరిగిన విషయాలు గుర్తొస్తుంటే, కన్నీరు కారి పోసాగింది.  అంతా కలలా జరిగిపోయింది. అదీ కాక ఇంకో రెండు నెలల్లో ఇండియాకి వస్తానని ఎంతో ఆత్రంగా, ప్రేమగా, మొత్తం కుటుంబం కలిసి ఉత్తర భారతదేశ ప్రయాణం చేయాలని సంతోషంగా ఎదురు చూస్తున్న నాన్న వృద్దాప్యం వల్ల ఎలాంటి కష్టం లేకుండా 13 రోజుల క్రితం మధ్యాహ్నం కునుకు తీద్దామని పడుకున్నపుడు నిద్రలోనే పోయారు.  ఇండియా నుండి ఫోన్ రాగానే (ముగ్గుర్లోకి చిన్నదయిన) సుప్రజకు నాన్నకు సీరియస్ గా వుందని చెప్పారు.  తను వెంటనే భర్త శ్రీమంత్ కి ఫోన్ చేసి ఇంటికి రమ్మని, స్కూల్ నుండి పిల్లలు( స్రవంత్ ఏడేళ్ళు, దృశ్యా ఐదేళ్ళు) వచ్చే సమయం కావడంతో ఫ్రెండ్ స్వాతికి ఫోన్ చేసి వాళ్ళని పికప్ చేసుకొమ్మని చెప్పింది.  ఇండియాకి ఫోన్ చేసి ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా రావడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పింది.  శ్రీమంత్ ఇంటికి వచ్చేసరికి ట్రావెల్ ఏజెంట్ కి ఫోన్ చేసి మాట్లాడుతుంది సుప్రజ.  శ్రీమంత్ మంచి నీళ్ళు తాగి వచ్చి సుప్రజ పక్కన కూర్చుని తన భుజాల పై చేతులు వేసి దగ్గరకు తీసుకున్నాడు.  సుప్రజ అతని గుండెలపై తల ఆన్చి, "నాకు భయంగా వుంది శ్రీ," అని కన్నీరు పెట్టుకుంది బాధతో. "పిల్లలు ఏరిరా? ఇంకా రాలేదా?" "స్వాతి వాళ్ళింట్లో వున్నారు." అంది కన్నీరు తుడుచుకుంటూ. "నేను ఆఫీసు నుండి బయల్దేరుతుంటే అన్నయ్య ఫోన్ చేసాడ్రా చిన్నా,"  "ఏమన్నాడు? నాన్న ఎలా వున్నాడు? మనం వెళ్ళేవరకు వుంటే మనని చూస్తే నాన్నకి తృప్తిగా వుంటుంది అన్నదే...."  "నేనొకటి చెబుతాను, నువ్వు కంగారు పడకు, నాన్నకు ఏజ్ అయ్యింది, చాలా సంతృప్తికరమైన జీవితం జీవించారాయన....ఆయనకి ఏమైనా నువ్వు ....." "అంటే? నాన్న పోయారా?" అవునన్నట్టు తల వూపాడు శ్రీమంత్, భోరుమన్నది సుప్రజ.  శ్రీమంత్ భార్యని గుండెలకదుముకుని తల నిమురుతూ వుండిపోయాడు.    "టికెట్స్ త్వరగా దొరికితే వెళ్దాం చిన్నా!" సుప్రజ గబుక్కున లేచింది, కళ్ళు తుడ్చుకుంటున్నా ఉబికి ఉబికి వస్తూనే వున్నాయి.  కన్న తండ్రి ఇక లేడు అన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతుంది. " నేను ఫోన్ చేసి మళ్ళీ చెబుతాను మనం వస్తున్నామని.  లేకపోతే మనం వెళ్ళకముందే అన్నీ చేసేస్తే.... వాళ్ళ కళ్ళకు నేనో చిన్నపిల్లని, నేనేమి తట్టుకోలేనని అనుకుంటారు.  వాళ్ళకి వీలయినట్టుగా నా గురించి అభిప్రాయం మార్చుకుంటుంటారు, ఒకోసారేమో, ’అమ్మో నీకెంత ధైర్యమో, పరాయి దేశంలో ఒక్కదానివి చిన్న పిల్లలను పెట్టుకుని, వుద్యోగం చేసుకుంటూ వుంటున్నావు.’ అంటారు, మరోసారి ఎవరికైనా బాగాలేకపోతే సడన్ గా నేను ఏమీ తట్టుకోలేని దాన్ని, పిరికిదాన్ని అయిపోతాను.  మనకి దగ్గరవారికి వొంట్లో బాగా లేకున్నా, చనిపోయినా కన్నీళ్ళు రావడం, ఏడవడం సహజమైన రియాక్షన్ కదా!  దానికే పెద్దగా అమ్మో అది తట్టుకోలేదు అని అన్నీ దాస్తుంటారు.  ఇప్పుడు ఏం చేస్తారో నాకు భయంగా వుంది."  అని ఫోన్ డయల్ చేసింది భుజాలకి కళ్ళు తుడ్చుకుంటూ.  "హలో! అన్నయ్య!"  "చిట్టితల్లీ, నాన్న మనకిక లేడమ్మా," అని భోరుమన్నాడు.  సుప్రజ కూడా వెక్కి వెక్కి ఏడవసాగింది.  సుప్రజ తనని నిలదొక్కుకుంటూ, "అన్నయ్య మేము వీలయినంత త్వరగా వస్తున్నాము.  మేము వచ్చేవరకు వేయిట్ చేయండి....,"  "కానీ పెద్దవాళ్ళందరూ మంచి రోజని ఈ రోజే చేసేయమని అంటున్నారు మరి.....," "నో నోనో! యూ కాన్ట్ డూ దట్....నేనూ ఆయన కూతురినే, నాకూ వచ్చి ఆఖరి చూపు చూసుకునే హక్కు వుంది కదా! అవునా, కాదా...?"  "అవుననుకో వాళ్ళంతా అలా అంటున్నారు...." "అంటే నీ బుద్ది ఏమయింది? నేను మాట్లాడతాను వాళ్ళతో సరేనా? నేను రాకముందు నువ్వు ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం నీకు, నాకు మధ్య ఎలాంటి సంబంధం వుండదు. గుర్తుంచుకో, తెలిసిందా!" అని గర్జించింది.  అటు నుండి కాసేపు ఏమి జవాబు లేదు.  "అన్నయ్య, ఏం మాట్లాడవేమిటి? నేను అన్నది అర్ధం అయ్యిందా లేదా?" అని అడిగింది కోపంతో వూగిపోతూ.  "నువ్వు అనవసరంగా కంగారు పడకమ్మా! వాళ్ళతో మాట్లాడతానన్నావు కదా! మాట్లాడు సరేనా! మళ్ళీ మాట్లాడదాం." అని ఫోన్ పెట్టేసాడు.  సుప్రజ కింద కూలబడిపోయి ఏడవసాగింది.  శ్రీమంత్ కూడా కింద కూర్చుని,"కన్నా ఎందుకంత ఆవేశపడ్తావు?  మనం వెళ్తున్నాం కదా! ఇంతలోనే ఏం జరిగిపోదు కదా..." " వాడేమన్నాడో తెలుసా? పెద్దలందరూ ఈ రోజు మంచి రోజు దహనసంస్కారాలు చేసేద్దామంటున్నారట. నాకు ఆఖరి చూపు కూడా లేకుండా చేస్తారు వీళ్ళంతా కలిసి..." అని ఆవేదనగా శ్రీమంత్ గుండెలమీద వాలిపోయి గట్టిగా ఏడ్చేసింది. "కన్నా మీ మామయ్యకి ఫోన్ చేయ్యి, వాళ్ళని కన్విన్స్ చేద్దాం మనం వచ్చేదాక ఆగమని, సరేనా? నువ్వు కంగారు పడకు ప్లీజ్!" అని నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చాడు శ్రీమంత్.  సుప్రజ, "సరే"అని నీళ్ళు తాగి గట్టిగా వూపిరి పీల్చుకుని వదిలి మళ్ళీ ఇండియాకి, ఈసారి వాళ్ళ మామయ్యకి, అమ్మ వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసింది.  చిన్నపుడు అతను అమ్మ దగ్గరే వుండి చదువుకున్నాడు.  అమ్మే అందరికంటే పెద్దది కావడంతో అటు అత్తింట్లో, ఇటు పుట్టింట్లో వారికి చేదోడు వాదోడుగా వుండేది.  రామం పెద్ద లాయర్ అయ్యి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుని తన కుటుంబంతో బెంగళూర్ లో సెటిల్ అయ్యాడు. "హలో! మామయ్య, నేను సుప్రజని అమెరికానుండి ఫోన్ చేస్తున్నాను."  "అమ్మా! నాన్న మనని వదిలి పెట్టి వెళ్ళిపోయాడమ్మా! ఆయన మీకే నాన్న కాదు మాకు నాన్న లాంటి వాడేనమ్మా!" అని భోరుమన్నాడు.  "మామయ్య, మేము వీలయినంత త్వరగా బయల్డేరుతున్నాము, మేము వచ్చేవరకు నాన్నని వుంచాలి...." "నువ్వు ఎందుకొస్తున్నావమ్మా?" "మా నాన్నని ఆఖరి చూపు చూసుకోవడానికి......" "అవునూ నాన్న ఇంకా ఎక్కడున్నాడని వచ్చి చూస్తావు తల్లీ...?"  " నాన్న ప్రాణం పోతే మాత్రం నేను ఆఖరి చూపుకి నోచుకోలేదా? నేను వచ్చేవరకు దహనసంస్కారాలు చేయవద్దని చెప్పడానికి ఫోన్ చేసాను..."  "ఏంటీ తల్లీ?  నీకు ఎవ్వరు ఈ అబద్దాలు చెబుతున్నారో, ఎందుకు చెబుతున్నారో నాకు తెలీదు, నాన్న పోయినరోజే ఆయన దహన సంస్కారాలు చేసేసారు మంచి రోజని...."  సుప్రజకి తల తిరిగిపోయింది. ఏమంటున్నాడు? నాన్న ఈ రోజు పోలేదా? పోయిన రోజే అన్నీ చేసేసారా?  అంటే నాకు ఆఖరి చూపు కూడా దక్కకుండా చేసారా వీళ్ళంతా.   "నువ్వేం చేస్తున్నావు? ఇవన్నీ చూస్తూ కూర్చున్నావా? నేనొక దాన్ని వున్నానని నాకు చెప్పాలని తెలియదా?  మీరంతా ఒకటే నేను బ్రతికుండగా మీమొహలు చూసేది లేదు ఇంక తెలిసిందా?"  అని కడుపులోనుండి తన్నుకు వస్తున్న ఆక్రోశం ఆపుకోలేక ఫోన్ విసిరికొట్టి,  ’ హయ్యో! నాన్నా,’ అని కుప్పకూలిపోయింది సుప్రజ.  శ్రీమంత్ ఖిన్నుడయ్యాడు.  సుప్రజ బాధ, ఆవేదన చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది, ఫోన్ రిసీవర్ తీసుకున్నాడు, "అమ్మా, చిట్టితల్లీ నా మాట వినమ్మా!  నేనేమీ చేయలేకపోయానమ్మా!  నాన్న కుటుంబం వారే అన్నీ నిర్ణయాలు తీసుకున్నారమ్మా...."  శ్రీమంత్,"హలో నేనండీ, సుప్రజ బాగా అప్ సెట్ అయ్యింది.  అసలేం జరిగింది?  మాకు ఈ రోజే ఫోన్ వచ్చింది సీరియస్ గా వుందని ముందు చెప్పారు, కాసేపయ్యాక పోయారని చెప్పారు.  సీరియస్ అని తెలియగానే మేము బయల్దేరడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాము...’" "బాబు దాని బాధ నాకర్ధం అవుతుంది.  ఆయన పోయిన రోజు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని రాత్రికి రాత్రే అంతా చేసేసారయ్యా..... మీరు అంత త్వరగా రాలేరని చేసేసారు. కానీ మీకు ఇవన్నీ చెప్పారనే అనుకున్నాను.  నాకు ఈ విషయం తెలియదు.   అనుకోకుండా పోవడంతో మా అక్కయ్య షాక్ లోకి వెళ్ళిపోయింది.  డాక్టర్ వచ్చి ఇంజెక్షన్లు, మందులు ఇచ్చి ఆమెని ఈ లోకంలోకి తీసుకొచ్చారు కానీ అరవై ఏళ్ళ బంధం ఒకటేసారి మాట్లాడుతూ మాట్లాడుతూ పోవడంతో ఆమె ఏ నిర్ణయం తీసుకునే పరిస్థితిలో లేదు దాంతో అంతా తొందర్లో అలా జరిగిపోయింది.  జరిగింది తప్పే, దాన్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి బాబు." అని ఫోన్ పెట్టేసారు.  శ్రీమంత్ షాక్ అయ్యాడు.  ఎందుకిలా చేసారు? సుప్రజ తల్లి తండ్రులను ఎంతగా ప్రేమిస్తుందో అక్కడ అందరూ మర్చిపోయారా?  "అంతా అయ్యిపోయిందట.  అయ్యో నేను ఆయన కూతురిననే విషయమే మర్చిపోయారా అందరూ?  ఎందుకిలా చేసారు దుర్మార్గులు-నేను చెప్పాను వాడికి ఈ జన్మలో వాడితో ఇంక సంబంధం లేదని.  నాకెవరు లేరు.  మా అమ్మకయినా నేను గుర్తు రాలేదా? అయ్యో  నాన్న, ఇంకొన్నిరోజులయితే వచ్చేవాళ్ళం కదా, నీకు పిల్లల్ని చూడాలని వుందని అన్నావే, ఎందుకు తొందరపడి వెళ్ళిపోయావు?  ఇదే మగపిల్లవాడయితే వాడికోసం ఆగేవారేమో? నేను రాలేని పరిస్థితిలో లేనే, ఒక్కరోజు ఆగలేకపోయారెందుకు? నన్ను అడగవచ్చుకదా పరిస్థితి చెప్పి." అని కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది సుప్రజ.  వాడిని ఎన్నడూ ఏది అడగలేదు తను, ఇప్పుడు ఎవరో ఏదో చెప్పారని తనకి నాన్నని చూడాలని వుంటుందని తెలియదా?  తల్లి తండ్రుల మీద అందరికీ ప్రేమ వేరుగా వుంటుందా?  వేరే ఎవరి ఇంట్లో ఎవరైనా పోతే వారెంత బాధ పడుతున్నారో ప్రతి సారీ చెప్పేవాడు.  అంటే బాధ ఒకరికి ఒకలా ఇంకొకరికి ఇంకోలా ఉంటుందా! ఎందుకు అర్ఢం చేసుకోరు వీళ్ళు?  అనుకుని కుమిలిపోతూ వుంది సుప్రజ. తండ్రి ఈ ప్రపంచంలోనే లేరు అని తెలిసినా వృద్దాప్యంతో పోయారు అని మనసుకి సరి చెప్పుకుని ఆఖరి చూపుకోసం వెళ్ళాలని అనుకుంటే తోబుట్టువులు, అందులో సుప్రజ వాళ్ళ అన్నయ్య బాగా క్లోజ్ గా వుంటారు, ఇద్దరి అభిరుచులు కలుస్తాయి, అన్నయ్య అంటే బాగా నమ్మకం వుంది, అలాంటి వాడు ఇంత భయంకరంగా అబద్దం ఆడాడంటే సుప్రజ మనసు ఎందుకు, ఎంతగా విరిగిపోయిందో అర్ధం చేసుకోవచ్చు అనుకున్నాడు శ్రీమంత్.   స్వాతి ఎంత సేపయినా సుప్రజ నుండి మళ్ళీ ఏ విషయం తెలియకపోవడంతో, ఫోన్ బిజీగా వుండడంతో తన ఇద్దరు ఐదేళ్ళ కవలలు, రమ్య, సౌమ్యలను, సుప్రజ వాళ్ళ పిల్లల్ని తీసుకుని వచ్చేసింది ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి. సుప్రజ పిల్లల్ని దగ్గరకు తీసుకుని ఏడ్చింది.  అమ్మ ఎందుకు ఏడుస్తుందో తెలియక బెంబేలు పడే పిల్లలకు శ్రీమంత్ మెల్లిగా దగ్గరకు తీసుకుని వారికి అర్ధం అయ్యేలా చెప్పి వారిని ఊరడించాడు.   స్వాతి సుప్రజని అలా చూసి షాక్ అయ్యింది.  మెల్లిగా వెళ్ళి పక్కకు వెళ్ళి కూర్చుంది.  "స్వాతి! అంతా అయిపోయిందే!  నాకు ఆఖరి చూపు కూడా దక్కకుండా చేసారు.  నాన్న వెళ్ళిపోయారే, నా కోసం ఎదురు చూసి, అన్ని రోజులు వుండలేనమ్మా అని వెళ్ళిపోయారు.  ఒక్కసారి చూడాలని వుందే, మాట్లాడాలని వుందే, నా వల్ల కావటం లేదే తట్టుకోవటం!"అని స్వాతిని పట్టుకుని భోరుమంది.  స్వాతి స్నేహితురాలిని పొదివి పట్టుకుంది, కళ్ళనుండి కన్నీరు కారిపోతుంది.  రెండేళ్ళ క్రితం ఇక్కడికి వచ్చినపుడు కలిసారు సుప్రజ తల్లితండ్రులను.  ఆది దంపతుల్లా వుండేవారు.  వాళ్ళు వున్నన్ని రోజులు రెండు కుటుంబాల వాళ్ళు ఎంతో సరదాగా గడిపారు రోజులు.  స్వాతి భర్త  రమేష్ ఆఫీసుకి ఫోన్ చేసి విషయం చెబితే అతను నేరుగా అక్కడికే వచ్చేసి ఆ రాత్రంతా అక్కడే వున్నారు వారి కుటుంబం.  శ్రీమంత్, రమేష్ కలిసి పిల్లలందరికీ తిండి పెట్టి, పడుకోబెట్టారు.  "స్వాతి నాకే ఎందుకే ఇలా జరుగుతుంది?  మళ్ళీ ఫోన్లు చేస్తే బోలెడంత ప్రేమలొలకబోస్తారు. ఇప్పుడు కన్న తండ్రినే చూడకుండా చేసారు.  ఇదే నేను మగపిల్లవాడినయితే ఇలా చేసేవారు కాదేమోనే.  మా అత్తగారు పోయినపుడు మేము వెళ్ళేవరకు ఎదురు చూసారు కదా!  నన్నేపుడు వాళ్ళల్లో ఒకదాన్నిలా చూసుకోలేదు నన్ను.  పెళ్ళిళ్లయ్యాక ఎవరి దారి వారిదయ్యింది.  హైద్రాబాద్లో వున్నపుడు కూడా నేనే పట్టు బట్టి అందరి ఇళ్ళకు వెళ్ళడం, పిల్లల్ని సెలవులకు పంపించండి అని అడగడం చేసేదాన్ని.  ఇంకెపుడూ వాళ్ళతో సంబంధం పెట్టుకోనే.  నన్ను ప్రతి సారి బాధే పెట్టారు .....ఎందుకే నాకే ఇలా జరుగుతుంది?"అంటూ భోరుమంది సుప్రజ ఆవేదనని దిగమింగుకోలేక, ఎందుకిలా జరిగిందో తెలుసుకోలేక అవస్థ పడుతుంది.  "అలా అనుకోకే, మనకి అందరి సంగతి తెలీదు కదా, కనీసం నీకు తెలియజేసారు మీ నాన్న పోయారని.  మా మామయ్య ఎపుడో వాళ్ళకిష్టం లేకుండా పెళ్ళి చేసుకుని ఇక్కడకు వచ్చి సెటిల్ అయ్యాడని మా అత్తయ్య తండ్రి, మాకు చిన తాతగారవుతారు, ఆయన పోయినపుడు చెప్పనేలేదు.  అప్పుడు మా అత్తయ్యని పట్టుకోవడానికి ఎంత కష్టం అయ్యిందో నీకు తెలుసు కదా!   తను అప్పుడు వాళ్ళ అమ్మగారి గురించి స్నేహితుల ద్వారా తెలుసుకుని, ఆవిడ పరిస్థితి కూడా బాగాలేదని తెలుసుకుని వెళ్ళీ వాళ్ళ అన్నదమ్ములతో గొడవ పెట్టుకుని ట్రీట్మెంట్ ఇప్పించడానికి తన అపార్ట్మెంట్ కి తీసుకెళ్ళి ప్రేమగా చూసుకుంది.  బాగయ్యాక కొన్నాళ్ళు ఇక్కడికి కూడా తీసుకొచ్చుకుంది.  ఇండియాకెళ్ళాక కొన్నాళ్ళకే పోయింది కానీ ప్రెండ్స్ కి చెప్పింది కాబట్టి వాళ్ళు వెళ్ళి చుస్తూ వుండేవారు, తనకి బాగాలేదని తెలియగానే మాఅత్తయ్య వాళ్ళు అందరూ వెళ్ళారు కానీ అప్పటికే ఆవిడ పోయింది కానీ ఆఖరి సారి చూసుకుంది, తనకి బాగాలేనపుడు తనకి చేతనయినంత చేయగలిగానని తృప్తి పడింది కానీ తల్లి, తండ్రి లేని లోటుని ఎవ్వరూ తీర్చలేరు కదా!  నువ్వు మరీ ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోకు స్వాతి.  నువ్వు ఇదంతా సద్దుమణిగాక వెళ్ళి అమ్మను తీసుకొచ్చుకొని కొన్నాళ్ళు వుంచుకో తనకి చేంజ్ గా వుంటుంది, నీకు అమ్మ దగ్గర వుంటే నీ బాధని తనతో పంచుకుంటే కాస్త వూరటగా వుంటుంది." అని సుప్రజ చేతుల పై నెమ్మదిగా రాస్తూ  ఓదారుస్తూ చెప్పింది స్వాతి.   సుప్రజకి ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. అక్కడ కుటుంబ సభ్యులు, బంధువులంతా కలిసి మోసం చేసినట్టుగా ఫీలయ్యింది.  "ఆ దుర్మార్గుడికి చెప్పాలి ఇక వాడికి, నాకు సంబంధం లేదని," అని ఫోన్ తీసుకుంది.  స్వాతి,"జాగ్రత్తగా మాట్లడవే, అక్కడ వారి పరిస్థితి మనకి తెలీదు కదా....’ "ఏం జరిగినా నేనూ ఆయన కూతురినే, నాకు చెప్పాల్సిన బాధ్యత వారికి లేదా? కనీసం ఇలా వుంది, ఏం చేద్దామమ్మా అనయినా అడగాలి కదా? నన్ను పరాయిదాన్ని చేసేసినట్టే కదా! అంతా అయిపోయాక అబద్దాలు మొదలుపెట్టి అంతా ఈ రోజే అయినట్టు చెబుతారా? నన్ను మరీ అంత పిచ్చిదాన్ని అనుకున్నారా?  చెబితే నేను అర్ధం చేసుకునే దాన్నేమో అపుడు నేను ఏం చేసేదాన్నో అది నా నిర్ణయం అయ్యేది కదా!  అన్నీ నిర్ణయాలు వాళ్ళే తీసుకుని నేనొక మనిషినే కాదు అన్నట్టు తీసి పడేసారు కుటుంబం నుండి.   మనసు మండిపోతుందే..." స్వాతి భర్త రమేష్ వచ్చి, "సుప్రజ ఇపుడు నువ్వు కామ్ డౌన్ కావాలి.  శ్రీ, పిల్లలు చూడు ఎలా బెంబేలు పడుతున్నారో!" అన్నాడు రమేష్.  "జరిగిపోయిందేదో జరిగిపోయింది.  వాళ్ళతో మాట్లాడాలనుకున్నా నీ కోపం కొంచెం తగ్గాక ట్రై చేయాలి, కోపంలో నువ్వేం అన్నా, వారి మనసు బాధ పెట్టినా మళ్ళీ వెనక్కి తీసుకోలేవు, తర్వాత నువ్వే ఎక్కువగా బాధ పడే అవకాశం వుంది." అని కామ్ గా చెప్పాడు రమేష్. "కాదు రమేష్ వాళ్ళు నన్ను ఎన్నో రకాలుగా బాధ పెడుతూనే వున్నారు.  అందరికీ తోబుట్టువులుంటే కష్టం, సుఖం అన్నీ పంచుకుంటారు కానీ నా విషయంలో అలా జరగలేదు.  ఒక్కసారి మాట్లాడి పెట్టేస్తాను, లేకపోతే వాళ్ళు నన్ను మరీ పనికిరాని దాన్నని అనుకుంటారు...ఒక్కసారి ఫోన్ చేస్తే కానీ నా గుండెను కత్తిలా కోస్తున్నఈ బాధ కొద్దిగానయినా తగ్గదు." అని ఫోన్ తీసుకుని డయల్ చేసి రింగ్ అవ్వగానే, అటునుండి అన్నయ్య శ్రవణ్, "హలో !" అనగానే ఇటు నుండి సుప్రజ కాళికాదేవే అయ్యింది, "ఒరేయ్ నేను చెప్పానా నీకు నేను రాకుండా ఏమైనా చేసావో నీకు నాకు సంబంధం ఉండదని.  హౌ డేర్ యూ టు లై టు మి?  ఎన్ని రోజులయ్యింది నాన్న పోయి....?"  "నిన్ననే... చెప్పానుగా అందరూ మంచి రోజని....." "షటప్ ఇడియట్! నీకసలు నేనంటూ వున్నానని గుర్తున్నానా?  లేకపోతే మీరిద్దరే సంతానం అనుకున్నారా, నువ్వు, నీ అక్కయ్య!  నువ్వు నిన్ననే ఫోన్ చేసి ఇలా వుంది పరిస్థితి ఏం చేద్దామంటావు అని నన్ను అడిగితే నీ అహం దెబ్బ తింటుందా?  స్త్రీలు, అన్యాయాలు అంటావే, మరి ఇది నీకు అన్యాయంగా అనిపించలేదా?  నేనొక్కదాన్ని ఇక్కడ ఈ బాధ ఎలా భరించాలిరా? నాన్నతో పాటే నీ చెల్లి కూడా చచ్చింది అనుకుని తద్దినం పెట్టుకోరా." దు:ఖం తెర తన్నుకు రాగా ఫోన్ పెట్టేసింది. సుప్రజ రొటీన్ గా పిల్లల్ని స్కూల్ కి పంపించడం, వర్క్ కెళ్ళి కూర్చుని ఏడుస్తూ పని చేయలేకపోతే ఆఫీసుకెళ్ళి లాభం లేదని సెలవు పెట్టింది.   కళ్ళు తెరిచినా, మూసినా తండ్రే కనిపించేవాడు.  చిన్నప్పటి ఫోటోలు అన్ని తీసి చూసుకుంటూ చిన్ననాటి జ్ఞాపకాల్లో కొట్టుకుపోయేది.  అక్క సుకన్య తర్వాత శ్రవణ్, సుప్రజ పది ఏళ్ళ వరకు పుట్టలేదు. రెండేళ్ళల్లో ఇద్దరు పుట్టారు తల్లీ తండ్రి ఆనందానికి అంతే లేదు. సుకన్య కూడా పిల్లల్ని చాలా ప్రేమగా చూసుకునేది.  శ్రవణ్ కి, సుప్రజకి ఎక్కువ తేడా లేక పోవడంతో తల్లీతండ్రి, చెరోకరిని చూసుకునేవారు రాత్రిపూట. తల్లి వీక్ గా వుండడంతో తల్లి పాలు లేవు అందుకని ఎంత రాత్రి అయినా పాలు ఫ్రెష్ గా కలిపి చల్లార్చి తాగించి, బట్టలు తడిస్తే మార్చి పడుకోబెట్టేవారు. చంటి పిల్లలై జలుబు చేస్తే తెల్లవార్లు ఎత్తుకుని తిప్పేవాడు, వారికి వూపిరి ఆడి కాసేపయినా నిద్రపోవాలని.  నాన్నరాత్రి నిద్ర లేదని అస్సలు అనుకునేవారు కారట.  పొద్దునే లేచి ఇంట్లో వీలయినంత సాయం చేసి ఆఫీసుకెళ్ళేవాడట.  కొన్నాళ్ళయ్యాక పిల్లలు పెద్దవుతుంటే ఫ్రెష్ పాలు ఇవ్వాలని రెండు గేదెలను తీసుకొచ్చి వాటి సంరక్షణ తనే చూసుకోవడం, పిల్లలు అన్ని రకాల పళ్ళు, ఫ్రెష్ కూరలు తినాలని పెరట్లో, ఇంటి ముందర  చెట్లు పెట్టి వాటి పని కూడా తనే చూసుకునేవాడు.  అంజూర్ పళ్ళు, కూడా ఎంతో జాగ్రత్తగా పెంచేవాడు, ఒకోసారి ఒకో పండు పండితే అవి పిల్లలకు పెట్టి తనే తిన్నంతగా సంతోషించేవాడు.  మేడపైన ద్రాక్ష తీగలు పాకించి గుత్తులు గుత్తులు ద్రాక్షలు పండిచారు.  తన పిల్లలే కాక ఆయన అక్క చెల్లెళ్ళ, అన్నదమ్ముల పిల్లలు కూడా తన పిల్లల్లాగే తినాలని ఆఫీసవ్వగానే వెళ్ళి ఇచ్చి వచ్చేవారు.    కొన్నాళ్ళకు హైద్రాబాద్ నుండి వెరే వూరికి ట్రాన్స్ ఫర్ అయ్యింది.  చిన్న వూరు, నాన్న బ్యాంక్ లో పని చేసే వారు కాబట్టి అందరూ బాగా గౌరవంగా చూసేవారు.  నాన్న బ్యాంక్ నుండి నేరుగా ఇంటికి రావడం రోజు చందమామ, బొమ్మరిల్లు కథలు, రామాయణం, భారతంలో చిన్ని కృష్ణుడి కథలు చెప్పేవారు. నాన్న ఎపుడైనా బ్యాంక్ లో పని ఎక్కువుండి కొంచెం లేట్ గా వస్తే శ్రవణ్, సుప్రజ ఇద్దరూ నాన్నకోసం ఎదురు చూస్తూ కూర్చూనే వారు.  నాన్న అన్నం తింటూ అమ్మతో కబుర్లు చెబుతుంటే ఇద్దరు పిల్లలు చెరో తొడపై పడుకుని,  అలాగే న్నిద్రపోతే మెల్లిగా తీసుకెళ్ళి పడుకోబెట్టేవాడు.  పిల్లలందరికీ దొమతెరలు కట్టి ఒక్క దోమ కూడా లేకుండా చూసేవారు ప్రతిరోజు.   చిన్నపుడు చాలా ముద్దు చేసేవారు.  ఆఫీసు నుండి రాగానే పిల్లలు కనిపిస్తే చాలు ఆయన కళ్ళల్లోకి సంతోషం ప్రాకి వచ్చేది.  పిల్లలతో వుంటే చిన్న పిల్లాడిలా అయిపోయి, వారితో కల్సి  చిన్నపిల్లల్లా ఆడుకునేవాడు.  ఎండాకాలం పెరట్లో వెన్నెట్లో మామిడి పళ్ళ రసంతోఅమ్మ స్వీట్  చపాతీలు చేస్తే కుటుంబంతో పిక్నిక్ చేసుకోవడం ఆయనకు చాలా ఇష్టం. ఎన్నెన్ని జ్ఞాపకాలో... అవి గుర్తొస్తున్నా కొద్ది నాన్నని చూడాలని, మాట్లాడాలని అనిపిస్తుంది.  ఇంత చేసిన నాన్నపోతే తను అక్కడ లేదు కానీ ఆయన ఎప్పటికీ తన గుండెల్లో వుంటారు.  ఈ రోజు పదమూడో రోజని గుర్తొచ్చి శ్రీమంత్ కి ఫోన్ చేసి తను ఏం చేయబోతుందో చెప్పింది.   తనకున్న ఇండియన్, అమెరికన్ ఫ్రెండ్స్ ని సాయంత్రం చిన్న గెట్ టుగెదర్ కి రమ్మని చెప్పి స్వాతి, సుప్రజ ఇద్దరు కలిసి నాన్నకిష్టమైనవి చేసి పెట్టారు.  గార్డెన్ లో కుర్చీలు, టేబుల్ వేసి బఫేకి అంతా రెడీ చేసేసారు శ్రీమంత్, రమేష్.  సుప్రజ నాన్నవి, నాన్నతో తమ చిన్నప్పటి ఫోటో కాపీలు తీసి లాప్ టాప్ లోకదులుతున్నట్టుగా రవిశంకర్ మ్యూజిక్ తో పాటు పెట్టింది.  ఇలాగా ఎవ్వరూ, ఎప్పుడూ అందులో ఆడపిల్లలు చేయని పని- సుప్రజ తన తండ్రి కోసం చేసి తన ప్రేమని, అందరితో కలిసి పంచుకున్నది.  నాన్నని కలిసిన ఫ్రెండ్స్ అందరూ సుప్రజ నాన్నస్వయం కృషితో జీవితంలో ఎలా పైకి వచ్చారో చెబుతుంటే, " హి లుక్డ్ సో సింపుల్! వియ్ నెవ్వర్ ఇమాజిన్డ్ హి వాజ్ సచ్ ఏ హీరో అండ్ యువ్ ఆర్ సో లక్కీ టు హావ్ సచ్ ఏ వండర్ ఫుల్ అండ్ హ్యాండ్ సమ్ ఫాదర్, హీ రియల్లి లుక్డ్ లైక్ గ్రెగరీపెక్," అని అందరూ వచ్చి సుప్రజని ఊరడిస్తుంటే కన్నీరు ఆగలేదు, స్వాతి వచ్చి స్నేహితురాలిని ఆప్యాయంగా కౌగిలించుకుని, "ఈ బాధ జీవితాంతం వుంటుందే కాని ముందుకి సాగాల్సిందే అదే జీవితం," అని కన్నీరు తుడిచింది.  అందరూ వెళ్ళి పోయాక ఇండియాలోని వారు గుర్తుకు రాగానే, ఎందుకో సుప్రజకి అప్రయత్నంగా ఇది గుర్తొచ్చింది, "అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం, ఆత్మ తృప్తికై మనుషులు ఆడుకునే నాటకం, వింత నాటకం....." (విదేశాల్లో వుండేవారికి ఇండియాలో వుండే కుటుంబ సభ్యులు అనుకోకుండా ఈ లోకం వదిలి వెళ్ళిపోతే కొంత మంది వుద్యోగాల వల్ల, లేదా, వీసా, సమస్యల వల్ల ఇలా వివిధ కారణాల వల్ల వెళ్ళలేకపోతే, అటు వెళ్ళలేక, ఇటు వుండలేక విపరీతమైన మానసిక క్షోభకి గురవుతారు. ఈ కథ ఎవరినీ ఉద్దేశించి రాసింది కాదు!)                                                                                                                                                                                                                                                                                                                        

అమ్మ మనసు

అమ్మ మనసు   - శ్రీమతి శారద అశోకవర్ధన్ "శరత్!....శరత్!" పరుగెత్తుకుంటూ  వొచ్చి  పిలిచింది, రోడ్డు దాకా వొచ్చి జగదాంబ. సూటుకేసు చేతిలో పట్టుకుని, పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ, వెనక్కి తిరిగి చూడకుండా, తనని కాదన్నట్టు  నడుస్తూ  పోతున్నాడు శరత్.     "శరత్! శరత్!"  ఇంచుమించు పరుగెట్టినట్టుగా నడుస్తోంది  జగదాంబ.     శరత్ పక్కనున్న ఆటో ఎక్కి 'పోనీ' అన్నాడు.     "శరత్!" అని పెద్దగా అరుస్తూ  పిలిచింది జగదాంబ, అది రోడ్డు అన్న సంగతి కూడా మర్చిపోయి  ఆటో ఆమె గుండెల మీదుగా పోతూన్నట్టుగా అనిపించింది. గుండె  ముక్కలైనట్టనిపించింది కళ్ళు తిరిగి కనుగుడ్లు  రోడ్డుమీద పడిపోయినట్లుగా అనిపించి, చీకటికి  రోడ్డుమీద ఏమీ కనిపించక ధబాలున అక్కడే పడిపోయింది జగదాంబ.     "ఎవరో పాపం! ఉన్నట్టుండి పడిపోయింది."     "ఎవర్నో పిలుస్తూ పిలుస్తూ  పరుగెత్తింది. ఆ అబ్బాయి వినిపించుకోకుండా ఆటోలో  వెళ్ళిపోయాడు. అంతే! ఈమె పడిపోయింది."     "వెంట ఎవ్వరూ  ఉన్నట్టు  లేదు. ఇప్పుడేం చేద్దాం? ఆసుపత్రికి తీసికెళ్ళి చేర్పిద్దామా?" మరో కంఠం.     "ఆఁ....మనకెందుకు? ముట్టుకుంటే  ముప్పులొస్తయ్." మరో గొంతు.     "అయ్యో! నన్ను  ఆసుపత్రికి  తీసికెళ్లకండి. ఇంట్లో పడెయ్యండి" అని చెప్పాలనుకుంది. నోట మాట రావడం లేదు. కళ్లు తెరిచి వారికేసి చూడడానికి ప్రయత్నం చేసింది. చుట్టూ జనం మసక మసకగా  కనిపిస్తున్నారు. పెదవి విడడం లేదు మాట్లాడడానికి.        "పాపం, ఆడకూతురు! ఆసుపత్రిలో చేర్పించేసి  పోదాం. దిక్కులేని దానిలా వుంది" అంటూ కొందరు ఒక ఆటో ఆపి ఆమెని మోసుకుని ఆటోలో పడుకోబెట్టారు మెల్లగా.     ఆసుపత్రిని  తలుచుకుంటే ఆమె గుండె మరీ వేగంగా కొట్టుకోవడం మొదలెట్టింది. అనుకోని  ఈ సంఘటనకి  ఒళ్ళు జలదరించి పోతూంటే, శరత్ జ్ఞాపకం వచ్చి కళ్లు వర్షించాయి.     ఆటోలో  నుంచి ఒకతను దిగి ఆసుపత్రి అవుట్ పేషంటు  డాక్టరుకి చెప్పి స్ట్రెచ్చరు తెప్పించి  ఆమెను దింపి  లోపలికి పంపించి, వెళ్ళిపోయాడు. నర్సులు ఆమెని లోపల పడుకోబెట్టారు. ఆసుపత్రి వాతావరణం చూడగానే, నిజంగానే సొమ్మసిల్లి పోయింది ఆమె. "నీ పేరు...." తట్టి తట్టి కొట్టి అడుగుతూన్న నర్సుతో మెల్లగా చెప్పింది "జ....గ....దాం....బ...." అని.     బి.పి. బాగా ఎక్కువగా ఉందని అడ్మిట్ చేసుకున్నారు ఆసుపత్రిలో.  కళ్లు తెరిచి చూసిన జగదాంబ వార్డులో మంచం మీద పడుకునుంది. పక్క మంచం పేషంటు దగ్గరున్నావిడ జగదాంబను చూసి, "హమ్మయ్య! ఇక ఫరవాలేదు. మూడు రోజుల తరవాత  ఇప్పుడు కళ్లు తెరిచి చూశారు" అంది. నర్సు గబగబా వొచ్చి నాడి చూసి నవ్వుతూ, "ఓ.కే! ఫరవాలేదు" అంది.     జగదాంబ కూడా సమాధానంగా చిరునవ్వు నవ్వింది.     "మీదేవూరు?" అడిగింది నర్సు.     "ఈ ఊరే."     "మీ ఇల్లెక్కడ?"     "హిమాయత్ నగర్."     "మీరు రోడ్డుమీద  పడిపోతే  ఎవరో పట్టుకొచ్చి ఇక్కడ చేర్పించారు. మీ వాళ్లెవరూ రాలేదు. బహుశ చేర్పించినవాళ్ళకి  మీ యిల్లు తెలీదు. మీ వాళ్ళకి మీ రిక్కడున్నట్టు తెలీదు. మీ వాళ్ళకి చెప్పమంటారా?"     "ఒద్దు, నేనే వెళ్ళిపోతాను." కంగారుగా అంది జగదాంబ.     "మీరు వెళ్ళే స్థితిలో లేరు. కనీసం రెండు మూడు రోజులైనా  ఉండాలి. పేపర్లో  ప్రకటించినట్టున్నారు మీ గురించి."     జగదాంబ కంగారుపడుతూ "ఏమని?" అడిగింది.      "ఫలానా పేరుగల వ్యక్తి, ఫలానా చోట పడిపోతే ఆసుపత్రిలో చేర్పించారు. బంధువులూ, కుటుంబ సభ్యులూ  ఫలానా ఆసుపత్రికొచ్చి ఆమెని చూసుకుని వెళ్ళొచ్చు అని."     జగదాంబ కళ్ళలో నీళ్ళు సుళ్ళు తిరిగాయి. ఏదో అవమానంగా ఫీలయింది. సిగ్గుతో బిక్కచచ్చినట్టనిపించింది. కానీ వెంటనే ఏదో స్పురించినట్టయి కళ్లు కాంతివంతమయ్యాయి.     "సిస్టర్!" అని పిలిచింది.     "ఏమిటి?" సిస్టర్ నవ్వుతూ దగ్గరికొచ్చింది.     "నాకోసం  ఎవరైనా వొచ్చారా?" అడిగింది ఆత్రంగా.     "లేదు" అంది సిస్టర్.     "మీ ఫోటో, మీ పేరూ రెండూ పేపర్లో కూడా వేయించాం. పోలీసు రిపోర్టు రాగానే!"     "అవునా?" కంగారుగా లేచి కూర్చోబోయింది జగదాంబ.     ఒళ్ళు తూలినట్టయి లేవలేకపోయింది.     "లేవకండి, పడుకోండి. ఏం కావాలి మీకు?" అడిగింది మెల్లగా వెల్లకిలా పడుకోబెడుతూ  నర్సు.     "ఏం వొద్దమ్మా! నాకోసం ఎవరూ రాలేదా?" దుఃఖాన్ని దిగమింగుకుంటూ  జాలిగా నర్సు కళ్ళల్లోకి  చూస్తూ అడిగింది.     ఆమె మాటల్లో, ఆమె చూపుల్లో ఆమె ఎవరికోసమో ఎదురుచూస్తూ  తపించి పోతోందని అనుకుంది సిస్టర్.     "ఎవరూ రాలేదండీ! మీరు ఎవరికోసం ఎదురుచూస్తూన్నారు?" సందేహంగా  అడిగింది.     జగదాంబ  మొహంలో  బొట్టూ, కాటుకా ఏమీ లేకపోవడమూ, మట్టెలూ, మంగళసూత్రాలూ  ఏమీ లేకపోవడంవల్ల ఆమె విధవరాలో, అవివాహితో అర్ధంకాక అలా అడిగింది.     జగదాంబ సిస్టరడిగిన ఏ ప్రశ్నకీ సమాధానం చెప్పలేదు. గట్టిగా కళ్ళు మూసుకుని ఆలోచనల్లో పడిపోయింది. అది చూసి సిస్టర్ ఆమెని యింకే ప్రశ్నా అడగకుండా వెళ్ళిపోయింది.     రోజులు గడుస్తున్నాయి. జగదాంబ బి.పి. తగ్గడంలేదు. ఆసుపత్రివారిచ్చే భోజనం  ముట్టడంలేదు. ఎవ్వరితోటీ  మాట్లాడడంలేదు. ఎప్పుడూ  శూన్యంలోకి చూస్తూ ఏదో ఆలోచిస్తూ పడుకునుంటోంది డాక్టర్లూ, నర్సులూ, ఇరుగుపొరుగు పేషంట్ల తాలూకువాళ్ళు ఎవ్వరితోటీ  మాట్లాడదామె. ఆమె మనస్తత్వం ఎవ్వరికీ అర్ధంకావడంలేదు. 'సైక్రియాట్రిస్ట్' వొచ్చి చూసివెళ్ళాడు. ఆమెనిండా గుబులు నిండివుందనీ, ఎవరికోసమో ఆమె తీవ్రంగా  ఎదురుచూస్తోందనీ, ఆ నిరాశవల్లే ఆమె మాట్లాడలేకపోతుందనీ, ఆమె ఎదురుచూసే వ్యక్తి కనిపిస్తే తప్ప ఆమె పరిస్థితి మారడం కష్టమనీ చెప్పి వెళ్ళాడు.     మామూలుగా అయితే ఈ ధర్మాసుపత్రిలో కానీ ఖర్చు చెయ్యని యిటువంటివారి గురించి  ఎవరూ పట్టించుకునుండేవారు కారు. కానీ సిస్టర్ లూసీకి ఎందుకనో జగదాంబ పైన ఒకరకమైన జాలి ఏర్పడి, ఆమె డాక్టర్లందరికీ జగదాంబ తనకి దూరపు బంధువనీ, చాలాకాలం తరువాత కలుసుకోవడం వల్ల మొదట గుర్తుపట్టలేదనీ ఏవో కథలు చెప్పి- పెద్ద డాక్టర్లందరిచేత పరీక్ష చేయిస్తోంది.     దాదాపు పది రోజులు గడిచిపోయాయి. ఈ పది రోజుల్లోనూ ఆమె ఒక్క మాట కూడా ఎవ్వరితో మాట్లాడలేదు. మతిస్థిమితం పోయిందేమో, మెదడు వ్యాధుల ఆసుపత్రికి పంపించాలని కొందరు డాక్టర్లు అభిప్రాయపడ్డారు.     సిస్టర్ లూసీ పెషంట్లందరికి టెంపరేచర్ చూసి, మందు లివ్వవలసిన వాళ్ళందరికీ మందులిచ్చేసి, తన డ్యూటీ అయిపోవడంతో, జగదాంబ మంచం దగ్గరకొచ్చి "వెళ్ళొస్తాను. నా డ్యూటీ అయిపోయింది" అని చెప్పింది. జగదాంబ మామూలుగా అయితే ఉలుకూ పలుకూ లేకుండా వూరుకునేదే. కానీ అలాకాక సిస్టర్ చెయ్యిపట్టుకుని "నాకోసం ఎవరూ రాలేదా?" అని అడిగింది.     "లేదు" అని సిస్టర్ లూసీ తలూపి, "మీ అడ్రస్ చెప్పండి. మీవాళ్ళని నేను పిల్చుకొస్తాను" అంది. జగదాంబ సమాధానం చెప్పలేదు.     సైగచేసి చూపించింది కాగితమూ, పెన్సిలూ తెమ్మని. లూసీ గబగబా వెళ్ళి డాక్టరు రూములో నుంచి కాగితమూ పెన్సిలూ తెచ్చియిచ్చింది.     "బాబూ శరత్! అమ్మ మనసు నీ కర్ధంకాలేదురా! పెళ్ళినాటినుంచీ నువ్వు భూమిమీద పడేవరకూ కట్నం ఎక్కువ తీసుకురాలేదని, నన్ను రాసి రంపాన పెట్టేరు అత్తమామలు. నిండు చూలాలినని కూడా దయా దాక్షిణ్యాలు లేకుండా  గొడ్డులా  చాకిరీ చేయించుకుని, పట్టెడన్నం  పెట్టకుండా  మలమల మాడ్చి చంపినా నీమీద ప్రేమతో ఆత్మహత్య చేసుకోకుండా  బతికేను కానీ ఆ చిరాకులో, పరాకులో నువ్వు పుట్టినా, నువ్వేడుస్తూవుంటే  ఎత్తుకుని లాలించక నీమీద విసుక్కున్నానని కోపగించావా బాబూ ఈ అమ్మపైన?     వొంటిమీది నగలన్నీ మీ నాన్న తాగుడుకి నిలువుదోపిడీ యిచ్చి, నువ్వు గోళీకాయలు కొనుక్కుంటానన్నా, పతంగులు కొనుక్కుంటానన్నా  డబ్బులు లేవన్నానని అలిగావా బాబూ అమ్మపైన?     తాగిన మైకంలో మీ నాన్న నన్ను కుక్కను బాదినట్టు బాదితే, ఆ బాధ భరించలేక తిరిగి ఏమీ చెయ్యలేక ఆ కోపం నీమీద చూపించాను- నువ్వేదో కావాలని గొడవచేస్తూవుంటే, చెళ్ళున చెంపమీద కొట్టి  అసహ్యించుకున్నాననా బాబూ? అమ్మంటే కోపం?     ఎన్ని రోజులు వస్తున్నా, ఎన్ని దెబ్బలు తిన్నా, ఎన్ని చీదరింపులు భరించినా, అన్నీ నీకోసమే ఓర్చుకుని బతికున్నానని నీ చిన్ని మనసు కేం తెలుసు?     అత్తమామలు ఇంట్లోంచి తన్ని తగిలేసినా, మీ నాన్న మరొక మనిషిని చేసుకుని నన్నొదిలేసినా, నేనింకా బతికేవున్నానంటే  అది నీకోసమేనని నీ పసి మనసుకేం తెలుసు?     నాకు కూడు లేకపోయినా, నీ గోడు చూడలేక ఊడిగం చేసి, వొళ్ళమ్ముకుని నీకోసమే ప్రాణాలతో మిగిలేనని నీకెలా చెప్పను బాబూ?     నువ్వెక్కడున్నా క్షేమంగా వుండాలి! ఎప్పటికైనా అమ్మ గుర్తుకొస్తే, నా గాధ నిన్ను కదిలిస్తే, నే చెప్పింది నిజమనితోస్తే రెండు కన్నీటిబొట్లు కార్చు!  నా పరితప్త హృదయానికవి ఉపశమనం కలిగిస్తాయి!     బాబూ, ఒక్కమాట! నువ్వు పెరిగి పెద్దవాడివయ్యాక ఏ ఆడపిల్ల మనసునీ కష్టపెట్టకు బాబూ! ముఖ్యంగా కట్టుకున్నదాన్ని కన్నీరు పెట్టకుండా చూడు బాబూ! ఇదే నేను నిన్నడిగే వరం! నువ్వు నాకిచ్చే ప్రతిఫలం! అంతకన్నా  ఇంకేదీ కోరను బాబూ! నిన్ను చూడాలనే కోరికతో ఇన్నాళ్ళూ ఒళ్ళంతా కళ్ళు చేసుకుని బతికున్నాను బాబూ! ఇంక నావల్ల కాదు. వెళ్ళిపోతున్నాను.  మళ్ళీ  జన్మంటూ వుంటే నువ్వే నాకు బిడ్డగా పుట్టాలనీ, నా వొళ్లోంచి నిన్ను దింపకుండా ముద్దులు కురిపిస్తూ పెంచాలనీ ఆశిస్తూ కళ్ళు మూసుకుంటున్నాను. క్షమించు బాబూ! ఈ జన్మకి ఇంకేమీ చెయ్యలేను.                                                ప్రేమతో,                         మీ అమ్మ..                         జగదాంబ."     ఉత్తరాన్ని మడిచి నర్సు చేతికిచ్చింది. "దీన్ని అచ్చువేయించమ్మా పేపర్లో" అంది మెల్లగా. అంతే! ఆమె తల పక్కకి వాలిపోయింది. నర్సు హడావుడిగా పల్సు చూసింది. కంగారుగా డాక్టర్ని పిలిచింది. డాక్టరు పెదవి విరిచాడు.     ఏనాటి బంధమో! చుట్టమని  చెప్పినందుకు ఆమె బాధ్యత నర్సు లూసీ మీద పడింది. టాక్సీని పిలిపించి నలుగురు మనుష్యులకి డబ్బిచ్చి శవాన్ని తీయించి దహనసంస్కారాలు చేయించింది. ఆమె రాసిన ఉత్తరాన్ని ఆమె కోరిక ప్రకారం అన్ని పేపర్లలోనూ  వేయించింది. ఎవరైనా ఒస్తారేమోనని ఎదురుచూసింది. కానీ ఎవ్వరూ రాలేదు. "ఎక్కడున్నాడో, పాపం!" అనుకుంటూ ఆసుపత్రికి వొచ్చిన నర్సుకి "లూసీ! ఎవరో శరత్ అనే అబ్బాయొచ్చి వెళ్ళిపోయాడు ఆ జగదాంబగారికోసం" అని చెప్పింది సిస్టర్ జానకి.     "ఎక్కడి కెళ్ళాడు? ఏం చెప్పాడు?" ప్రశ్నించింది లూసీ.     "ఏమీ చెప్పలేదు. ఆమె చనిపోయింది అని చెప్పగానే వెళ్ళిపోయాడు కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ" అంది.     అంతే! అప్పటినుంచి ఇప్పటివరకూ సిస్టర్ లూసీ శరత్ కోసం ఎదురు చూస్తూనేవుంది....!

నాకున్నది ఒక చక్కని బొమ్మ

నాకున్నది ఒక చక్కని బొమ్మ   ఎపిసోడ్ - 6 - వసుంధర అమ్మెప్పుడూ నాన్ననే కొట్టమంటుంది. ఒక్కగానొక్క కొడుకుని గదా! తనసలు కొట్టలేదు నన్ను. నాన్నతో అలా చెప్పగానే ఆయన 'సరే కొడతాను కానీ ఎంతసేపు కొట్టాలి' అని అడిగారు. 'ఇదీ నన్నడగాలా ఏడ్చేదాకా కొట్టండీ' అంది అమ్మ. అమ్మ నోట్లోమాట పూర్తికాకుండానే నేను పెద్దగా ఏడుపు మొదలెట్టాను. ఒక్కగానొక్క కొడుకును కదా! నాన్న నా ఏడుపు చూడలేకపోయాడు. 'సరేలే! ఇంకెప్పుడూ ప్లేట్లు బద్దలు కొట్టకు' అని నాన్న వెళ్ళిపోయారు" అన్నాడు కిష్టిగాడు.     "మరి మీ అమ్మ, మీ నాన్నగారు నీ వీపు బద్దలు కొట్టారని చెప్పింది" అనడిగాడు.     "అదా. అమ్మెప్పుడూ అలాగే అబద్ధాలు చెబుతుంది. అమ్మలూ, నాన్నలూ వాళ్ళ వాళ్ళ పిల్లల గురించి ఇరుగువాళ్ళకీ, పొరుగువాళ్ళకీ కొంచెం అబద్ధాలు చెప్పాలిట. నేనెంత అల్లటి చేసినా సరే-మావాడు అస్సలు అల్లరి చేయడు అనాలిట. ఎప్పుడైనా అల్లరి చేస్తే చావా చితకదన్నేస్తాం అని చెప్పాలట. అలా చెప్పకపోతే అంతా నీతులు, సలహాలు మొదలెడతారు. చిన్నపిల్లల్ని చిన్నప్పట్నించీ అదుపులో పెట్టకపోతే పాడైపోతారంటారుట. 'మొక్కైవంగనిది మానై వంగుతుందా ?' అని సామెతలు కూడా చెబుతారట. నీతులు, సామెతలు చెప్పడానికేగాని వినడానికి బాగుండవుట. సలహాలు కూడా అంతే. ఇవ్వడానికే గానీ పుచ్చుకోవడానికి బాగుండవుట" అన్నాడు కిష్టిగాడు.     "సరేలే, నా కొత్త గౌను బాగుందా ?" అనడిగాను.     "కొత్త గౌనా ! చెప్పేదాకా నాకు తెలియలేదే?" అన్నాడు కిష్టిగాడు.     వాడెప్పుడూ ఇంతే! అస్సలు దేనికీ మెచ్చుకోడు. అయినా తప్పదు, నాకు వాడు తప్ప వేరే స్నేహితులు లేరు మరి !     "ఇది మా బాబాయి అమెరికా నుంచి తెచ్చాడు. తెలుసా!" అన్నాను.     "అమెరికా నుండి నీకు గౌను తెచ్చాడా? మరి బొమ్మ తెస్తానన్నాడు, తేలేదా?" అనడిగాడు కిష్టిగాడు.     "బొమ్మ కూడా తెచ్చాడు. నాతో వస్తే చూపిస్తాను...." అన్నాను.     కిష్టిగాడి కళ్ళు పెద్దవయ్యాయి. వాడిది ఊహించినట్లు లేదు. చాలా ఆశ్చర్యపడ్డాడు. "నిజంగా?" అన్నాడు.     "నీకులా నేనేమీ అబద్ధాలు చెప్పను తెలుసా?" అందామనుకున్నాను. కానీ అలాగంటే వాడు నా బొమ్మను చూడ్డానికి రానంటాడు. వచ్చినా బొమ్మ బాగోలేదని తీసిపారేస్తాడు. అందుకని "నాతో రా- నీకే తెలుస్తుంది!" అన్నాను. వాడు వచ్చి నా బొమ్మను చూసి మెచ్చుకుంటేగానీ నాకు తృప్తిగా వుండదు.     కిష్టిగాడు నాతో వచ్చాడు. బొమ్మను చూశాడు. వాడి ముఖం చూడగానే నాకు తెలిసిపోయింది బొమ్మ వాడికి నచ్చిందని.     వాడు బొమ్మను పడుకో పెట్టాడు. నోట్లోంచి పాలపీక తీసి ఏడ్పించాడు. వీపు వెనుక బటన్ నొక్కి పాట పాడించాడు.     "బాగుందే!" అన్నాడు.     "నీకు నచ్చిందా?" అన్నాను.     "నచ్చింది. కానీ ఈ బొమ్మకు ప్రాణం వుంటే ఇంకా బాగుంటుందిగా" అన్నాడు కిష్టిగాడు.     "ప్రాణం వుండడం అంటే?" అని అడిగాను.     "నాకు తమ్ముడు పుడుతున్నాడని అమ్మ చెప్పింది. ప్రాణం వున్న బొమ్మ అంటే అది!" అన్నాడు కిష్టిగాడు.     కిష్టిగాడు అసూయతో అన్న మాటలివి. నాకు తెలుసు. అందుకే వాడిని ఏడిపించాలని "ఈ బొమ్మకు నేనే అమ్మను. తెలుసా?" అన్నాను.     "అయితే ఏం?"     "తమ్ముడినైతే నీ యిష్టం వచ్చినట్లు ఆడించడానికి వుండదు. నా బొమ్మ నా యిష్టం. దీన్నేం చేసినా నన్నెవ్వరూ తిట్టరు. దీంతో అన్ని సరదాలూ తీరుతాయి. పైగా ఇది ఉచ్చ పోయదు. బట్టలు పాడుచేసుకోదు. బొమ్మకే అమ్మగా వుంటే ఎంతో సుఖం" అన్నాను.     "నువ్వు చెప్పిందీ నిజమే! కానీ నీ బొమ్మ ఆడదైపోయింది. 'మనమెప్పుడైనా బొమ్మలా పెళ్ళి చేసుకున్నామనుకో అప్పుడు నువ్వు ఆడ పెళ్ళివారి వైపోతావు. నాకు ఆడపెళ్ళి వారి జట్టు ఇష్టం వుండదు" అనేసి వెళ్ళిపోయాడు కిష్టిగాడు.     నేను రెండు పెళ్ళిళ్ళకు వెళ్ళాను. రెండు పెళ్ళిళ్ళలోనూ మగపెళ్ళివారు చాలా అధార్టీ చేశారు. ఆడ పెళ్ళివారు అణగి మణగివున్నారు.     నేను వెంటనే బాబాయి దగ్గరకు వెళ్ళి "నాకు మగబొమ్మ తేకుండా  ఆడబొమ్మ తెచ్చావేం బాబాయ్?" అని అడిగాను.     "ఏ బొమ్మ అయితే ఏం?" అన్నాడు బాబాయి.     నేను ఆడపెళ్ళి వారి గురించి చెప్పాను.     "చూడమ్మా అమ్మలూ! ఆడపెళ్ళి వారు, మగపెళ్ళి వారు అంతా సమానమే! ఆడపెళ్ళి వారు మగపెళ్ళివారిని గౌరవించడం పాత పద్ధతి. అలాంటి పాత పద్ధతులకు నువ్వు స్వస్తి చెప్పాలి. అందుకే నీ కోసం ఆడబొమ్మ తెచ్చాను" అన్నాడు బాబాయి.     అప్పటికింకేమీ అనలేదు నేను. కానీ నా సమస్య మళ్ళీ మొదటికి వస్తుందని అప్పటికి తెలియదు నాకు.     సాయంత్రం కిష్టిగాడు ఓ కుర్రాడిని వెంట బెట్టుకుని వచ్చాడు. మా వీధికి రెండు వీధులవతల ఓ డాక్టరుగారు ఉన్నారుట. వాళ్ళబ్బాయిట వాడు. పేరు సుధాకర్ అని చెప్పాడు.     'మేము మగపెళ్ళి వారం. పిల్లను చూసుకునేందుకు వచ్చాం. మీ అమ్మాయిని చూపించు. మర్యాదలు బాగా చేయాలి. లేకపోతే పిల్ల నచ్చలేదని అనేస్తాము" అన్నాడు కిష్టిగాడు.     వాడేమంటున్నాడో నాకు అర్ధం కాలేదు. కాసేపటికి తెలిసింది. సుధాకర్ ఇంట్లో కూడా ఓ మంచి బొమ్మ వున్నదట. అది అబ్బాయి బొమ్మ అట. ఆ బొమ్మకూ, నా బొమ్మకూ పెళ్ళి చేయించాలని కిష్టిగాడి తాపత్రయం.       "మర్యాదలేమీ చెయ్యను. మీరు మర్యాదగా మాట్లాడితేనే నా బొమ్మను చూపిస్తాను" అన్నాను.     "ఉత్తుత్తినే సరదాకు అన్నానే! చూపించవే" అన్నాడు కిష్టిగాడు.     వాళ్ళిద్దరూ నా బొమ్మను చూశారు.     "ఎంత బాగుందో!" అన్నాడు సుధాకర్.     "ఇంకేం. పిల్ల నచ్చినట్లే" అన్నాడు కిష్టిగాడు.     "మీకు పిల్ల నచ్చినా నేను ఇవ్వను గదా!" అన్నాను.     సుధాకర్ అన్నాడూ "నా బొమ్మను తీసుకొస్తాను. ఇక్కడ ఆడుకుందామా!" అని.     "అలాగే తీసుకురా" అన్నాను.     కాసేపట్లో సుధాకర్ వాడిబొమ్మతో వచ్చాడు. ఆ బొమ్మ కూడా బాగానే వుంది. అది అమెరికా బొమ్మ కాదు. కాని నా బొమ్మంత ఎత్తూ వుంది. నిలబడినప్పుడు కళ్ళు తెరిచి, పడుకున్నప్పుడు కళ్ళు మూస్తుంది.     "రెండు బొమ్మలకూ పెళ్ళి చేద్దాం" అన్నాడు కిష్టిగాడు.     "నువ్వు మర్యాద పేరెత్తకూడదు మరి!" అన్నాను.     "ఎందుకని? మగపెళ్ళి వారికి మర్యాద చేయకుండానే నీ బొమ్మకు పెళ్ళి చేస్తావా?" అన్నాడు వాడు.     నేను ఒక్కసారి రెండు బొమ్మల్నీ పరీక్షగా చూశాను. ఇంచుమించు ఒక్కలాగే వున్నాయని. అప్పుడు నాకో ఉపాయం స్పురించింది. నా బొమ్మ జుట్టును పక్క పాపిడిలో దువ్వాను. సుధాకర్ బొమ్మను చేత్తో పట్టుకుని "ఈ బొమ్మలకు బట్టలు మారుద్దామా, ఎలా వుంటాయో చూద్దాం" అన్నాను. సుధాకర్ ఒప్పుకున్నాడు.     నా బొమ్మ బట్టలు సుధాకర్ బొమ్మకి, సుధాకర్ బొమ్మ బట్టలు నా బొమ్మకి మార్చాను. సుధాకర్ బొమ్మకి రెండు జడలు వేశాను.     ఆశ్చర్యం! ఇప్పుడు నా బొమ్మ అబ్బాయిగానూ, సుధాకర్ బొమ్మ అమ్మాయిగానూ మారిపోయాయి.     "ఇప్పుడు ఎవరు ఎవరికి మర్యాదలు చేయాలిరా కిష్టిగా!" అన్నాను.     కిష్టిగాడికి నోట మాట రాలేదు.     నేను పాట ప్రారంభించాను.     "నాకున్నది ఒక చక్కని బొమ్మ దానికి నేను అమ్మ     అది అమ్మాయా, అబ్బాయా! అని అడగకూడదు         గౌను తొడిగితే అమ్మాయి         అది పాంటు తొడిగినపుడబ్బాయి"     సుధాకర్ చప్పట్లు కొట్టి "భలేభలే పాట చాలా బాగుంది" అన్నాడు.     నాకు సుధాకర్ చాలామంచివాడులా కనిపించాడు. వాడు ఎలాంటి వాడో అసలు విషయం తర్వాత నాకు తెలిసింది.     మళ్ళీ బొమ్మల బట్టలు, వేషం యథా ప్రకారం మార్చేశాం.     నాకు ఇప్పుడు చాలా సంతోషంగా వుంది. బొమ్మకు రకరకాల డ్రస్సులు కుట్టించాలను కున్నాను. కొన్ని అబ్బాయివి, కొన్ని అమ్మాయివి.     సుధాకరూ, కిష్టిగాడు వెళ్ళిపోయాక జరిగిందంతా బాబాయికి చెప్పాను. బాబాయి నన్ను చాలా మెచ్చుకోవడమే కాకుండా మర్నాడు టెయిలర్ని ఇంటికి రప్పిస్తానని చెప్పాడు.     రాత్రి నేను బొమ్మను పక్కలో పెట్టుకుని పడుకున్నాను. అలా పడుకుంటే ఎంత బాగుందో! అందుకేనేమో నేను తన పక్కలో పడుకోనంటే నా చిన్నప్పుడు అమ్మ నన్ను బ్రతిమాలి మరీ పడుకో బెట్టుకునేది. ఇప్పుడు పెద్దదాన్నయి పోయాను కాబట్టి వేరే పడుకుంటున్నాను.     మర్నాడు ఉదయం నిజంగానే మా ఇంటికి టెయిలర్ వచ్చి బొమ్మకు కొలతలు తీసుకుని వెళ్ళాడు. రెండు రోజుల్లోనే అరడజను అమ్మాయి బట్టలు, అరడజను అబ్బాయి బట్టలు తెచ్చి ఇచ్చాడు.     బాబాయి కొద్ది రోజులు వుండి బొంబాయి వెళ్ళిపోయాడు. బాబాయికి అక్కడ ఉద్యోగంట.     బాబాయి వెళ్ళిపోయాక ఇంట్లో నా కష్టాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు నేను కిష్టిగాడి దగ్గరకు కూడా వెళ్ళడం మానేశాను. నా బొమ్మతోనే నాకు కాలక్షేపమై పోతోంది.     "ఇరవై నాలుగు గంటలూ బొమ్మతో ఏం చేస్తావే?" అని అమ్మ నన్ను కసురుతూంటుంది.     కానీ అమ్మకేం తెలుసు. నా బొమ్మ కదలదు, మెదలదు అనుకుంటుంది అమ్మ. కానీ అది చేసే అల్లరి ఇంతా అంతా కాదని అమ్మకు తెలియదు. అందుకే నన్ను కసురుతుంది.     బొమ్మకు చక్కగా జడ వేసి కూర్చోపెట్టి చదువు చెప్పాలనుకుంటాను. దానిచేత చెయ్యి పట్టి అఆలు దిద్దించాలనుకుంటే అప్పుడేం జరుగుతుందో తెలుసా! అది కూర్చున్నదల్లా ముందుకో, వెనక్కో పడిపోతుంది. ముందుకుపడితే పలకమీద సుద్ద అంటుకుంటుంది, వెనక్కు పడితే జడ రేగిపోతుంది.      ఒకోసారి దాని బట్టలు సరిచేస్తూంటే వెనకాలున్న మీట నొక్కుకుని పాట పాడడం ప్రారంభిస్తుంది. నేనేమో ఉలిక్కిపడి చేతిలోంచి జారవిడుస్తాను. కింద పడుతుంది. నోట్లో పాలపీక లేదు కాదా, ఒకటే ఏడుపు. పడుకోగానే దాని నోట్లో పాలపీక వుండాలి.     నేనెంత జాగ్రత్తగా వున్నప్పటికీ బొమ్మకు ఏవో అంటుకుంటూనే వుంటాయి. గోళ్ళరంగులో తిలకమో, కాటుకో ఏదో ఒకటి! వెంటనే దానికి స్నానం చేయించాలి కదా!     ఇలా నాకు బొమ్మతో ఎన్నో పనులు వుంటాయి. బొమ్మకు నీళ్ళోసి, జడవేసి, బొట్టుపెట్టి, అక్షరాలు దిద్దించి, అన్నం పెట్టి పడుకోబెట్టాలి. దాని బట్టలు వుతకాలి. అన్నీ జాగ్రత్తగా దాచాలి.     అమ్మకెన్ని పనులున్నాయో నాకూ అన్ని పనులూ వున్నాయి. కానీ అమ్మ అర్ధం చేసుకోదు. మహా-తనే అమ్మనని అనుకుంటుంది. నేను మాత్రం నా బొమ్మకు అమ్మను కానా?     ఈ బొమ్మ గురించి రోజూ అమ్మకీ నాకు పెద్ద గొడవ.     నేను బొమ్మకు నీళ్ళోద్దామని  కూర్చుంటాను. దాని బట్టలు విప్పుతాను. అప్పుడు అమ్మ పెద్దకేక పెడుతుంది. "ఒసేయ్ అమ్ములూ నీళ్ళోసుకుందువు గాని రావే!" అని.     ఇంక తప్పదు మరి. నా బొమ్మకు నీళ్ళోయడం మానేసి అమ్మ దగ్గరకు వెళ్ళాలి.     నేను బొమ్మకు లెక్కలు చెబుతూంటాను. మళ్ళీ అమ్మ పెద్ద కేక  "ఏమే అమ్ములూ సెలవుల్లో నీకు హోంవర్కు చేయమని ఇచ్చారు గదా! అసలు ఒక్కసారైనా పుస్తకాలు ముట్టుకున్నావా?" అని.     ఇంకేం చేస్తాను. బొమ్మకు చదువు చెప్పడం మానేసి నేనే చదువుకోవడం మొదలెడతాను.     పెద్దాళ్ళయితే ఇంచక్కా అదృష్టం. చిన్న వాళ్ళకి నీతులు చెప్పొచ్చు. ఇప్పుడు నేనూ అమ్మనేగా! నా బొమ్మకు బుద్దులు నేర్పుతుంటాను. మళ్ళీ అమ్మ కేక- అల్లరి చేయొద్దని.     ఇలాగుంటుందా! తీరా నా బొమ్మని నిద్రపోగొట్టే సరికి మాత్రం అమ్మా, కిష్టిగాడి అమ్మా కలసి పెద్ద గొంతులతో కబుర్లు. మరి అది మాత్రం అల్లరికాదూ? వాళ్ళలా అల్లరిచేస్తూంటే నా బొమ్మకు నిద్రెలా పడుతుంది?     అమ్మతీరు ఇలా వుంటే నా బొమ్మ ఎలాగు బ్రతుకుతుంది? నా బొమ్మ కోసం నా తల్లి ప్రాణం గిలగిలలాడిపోతూంటుంది. కానీ అమ్మ అర్ధం చేసుకోదు. నాకేమైనా అయితే అమ్మ ఎంత కంగారు పడిపోతుందో? నాకు కాస్త జ్వరం వచ్చిందంటే అమ్మ కళ్ళలోకి నీళ్ళు కూడా వస్తాయి. అమ్మకు నేనంటే ఇంత ప్రేమకదా? తనకు తల్లిప్రేమ తెలుసును గదా! మరి నా బాధను అర్ధం చేసుకోదేం?      నేను నా బాధను మామ్మకు చెబితే మామ్మ నవ్వేసింది. దీన్నే 'పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణసంకటం' అంటారు. మామ్మకు నేనేం చెప్పినా ఆటగానే వుంటుంది. కానీ తర్వాత మాత్రం అమ్మను పిలిచి తిట్టింది.     అమ్మ విసుక్కుని "దీనికీ వెధవ బొమ్మ తప్ప ఇంకేమీ అక్కర్లేదులా వుంది. ఆ బొమ్మను ఎవరికైనా అమ్మేసినా బాగుండును. ఇది బాగుపడేది" అంది.     అమ్మలు పిల్లల్ని ప్రేమిస్తే చెడిపోతారా? అమ్మ అలాగనడం నాకు నచ్చలేదు. కానీ అమ్మ ఏ ముహూర్తాన ఆ మాట అన్నదోకానీ బొమ్మకు నిజంగానే బేరం వచ్చింది. నాకు విలన్ కిష్టిగాడే కదా!                     (సశేషం) 

నాకున్నది ఒక చక్కని బొమ్మ

నాకున్నది ఒక చక్కని బొమ్మ   ఎపిసోడ్ - 5 - వసుంధర వాళ్ళిద్దరూ ఒకరినొకరు నిందించుకోవడం తప్పితే నా మాట గురించి పట్టించుకోరు. ఆఖరికి మామ్మ నన్ను నాలుగు ఉప్పురాళ్ళు నమలమంటుంది. అందువల్ల కంటి మంటతోపాటు నోరు కూడా ఉప్పగా అయిపోతుంది.     ఈరోజు కూడా ఉప్పురాళ్ళు నముల్తూండగా బాబాయి నన్ను పిలిచాడు.     అమ్మ లేపి తలంటు హడావుడి చేయగానే అసలు విషయం మర్చిపోయాను. ఈరోజు బాబాయి నాకు బహుమతి ఇస్తానని చెప్పాడు. అదేమిటో మరి !     "బాబాయ్!" అని పరిగెత్తాను.     అలా పరుగెడుతూంటే అమ్మ నా తలకు కట్టిన గుడ్డ జారిపోయింది. నేను వంటికి చుట్టుబెట్టుకున్న తువ్వాలు కూడా జారిపోతే మళ్ళీ ఆదరాబాదరగా చుట్టుకున్నాను. అదృష్టం కొద్ది అమ్మ చూడలేదు. లేకపోతే "ఆడపిల్లవు సిగ్గు లేదుటే?" అని తిడుతుంది. మరి మగపిల్లలకు సిగ్గక్కర్లేదేమో నాకు తెలియదు.     బాబాయి కనబడేదాకా పరిగెత్తాను. నాక్కాస్త ఆయాసం కూడా వచ్చింది. తువ్వాలు గట్టిగా పట్టుకున్నాను. అది మళ్ళీ జారి పోతోంది మరి.     బాబాయి చేతిలో ఓ అట్ట పెట్టివుంది. అది లావుగా, ఎత్తుగా లేదు. సన్నగా వుంది. అందులో నేను కలలుగంటున్న బొమ్మ వుండే అవకాశం లేదు. ఇంకా పరీక్షగా చూడాలనుకునేలోగా కళ్ళు మండాయి. తలవంచుకుని తువ్వాలు అంచుతో కళ్ళు తుడుచుకున్నాను.     "హాపీ బర్త్ డే టూ యూ అమ్మలూ!" అన్నాడు బాబాయి.     అప్పుడు నాకు గుర్తుకొచ్చింది.     అరే! బాబాయి వచ్చే ముందురోజు దాకా నా పుట్టినరోజు సంగతి నాకు గుర్తుంది. అలా ఎలా మర్చిపోయానా? అమ్మ, నాన్న, మామ్మ ఎవ్వరూ గుర్తు చేయలేదేమిటి? మామ్మ సంగతి సరే- ఆవిడదంతా తెలుగు క్యాలెండరు లెక్క. కానీ అమ్మ, నాన్నగారు....?      "నీకోసం అమెరికా నుండి ఏమి తెచ్చానో చూడు" అన్నాడు బాబాయి.     చటుక్కున ఆ పెట్టె అందుకున్నాను. తెరిచాను. అందులో ఎంతో అందమైన గౌను వుంది.     "ఇది నీకోసమే !" అన్నాడు బాబాయి. "ఇప్పుడే వేసుకోవాలి"     నాకు చాలా ఉత్సాహం కలిగింది. బాబాయి నాకోసం అమెరికా నుండి గౌను తెచ్చాడు. ఎంత బాగుందో!     చటుక్కున తువ్వాలు విప్పిపారేసి వెంటనే ఆ గౌను వేసుకున్నాను. ఎప్పుడు వచ్చిందో అమ్మ అప్పుడే అక్కడ ప్రవేశించి "హవ్వ !" అంది.     అమ్మ హవ్వ ఎందుకు అన్నదో నాకు తెలుసు. బాబాయి ముందే ఆ గౌను తొడిగేసుకున్నావే! ఇప్పుడు నువ్వే అమెరికా బొమ్మలాగున్నావు" అంది అమ్మ.     అందుకే అమ్మంటే నాకు ఇష్టం. ఒకోసారి నన్ను తిట్టాలనుకుని కూడా వెంటనే మరచిపోతుంది. బాబాయి ముందే గౌను వేసేసుకున్నానని తిట్టాలకుకుంది. కానీ ఆ గౌన్లో నన్ను చూడగానే అయా విషయం మరిచిపోయింది.     "అమ్మా! చాలా బాగుంది కదూ!" అన్నాను సంతోషంగా.     "ఊ! ఒకొక్కరికే దణ్ణం పెట్టిరా" అంది అమ్మ. "గౌనిచ్చాడు కాబట్టి ముందు బాబాయికి దణ్ణం పెట్టు"     "ఊహూ- అలా కాదు. ముందు పెద్దవాళ్ళతో ప్రారంభించాలి. మామ్మకీ తర్వాత మీ అమ్మకీ, నాన్నకీ- ఆ తర్వాతే నాకు!" అన్నాడు బాబాయి.     వెళ్ళి మామ్మకు దణ్ణం పెట్టాను. నన్ను ఎన్నో విధాలుగా దీవించింది. ఆ తర్వాత నన్ను దగ్గరగా తీసుకుని ముద్దులాడి ఓ పెద్ద కేక పెట్టింది-నాకు దిష్టి తీయమని. మామ్మ దిష్టితీయమందంటే దాని అర్ధం నేను చాలా అందంగా వున్నానని. అందుకోసమని అద్దమున్న గదిలోకి పరుగెత్తాను.     "ఒక్క క్షణం ఆగండమ్మా" అంటూ నన్ను వారించింది పని మనిషి రత్తమ్మ. అదప్పుడా గది తుడుస్తోంది. అప్పుడే నాకు మా బాబాయి మాటలు గుర్తుకు వచ్చాయి.     "నేను గుమ్మం దగ్గరే ఆగి "రత్తమ్మా! నువ్వు మా అమ్మకంటే, నాన్నగారి కంటే పెద్ద దానివి కదూ" అన్నాను.     "అవునమ్మా, ఏం?" అంది రత్తమ్మ.     "అయితే ఒక్కసారి అలా నిలబడు" అన్నాను.     "ఎందుకమ్మా?" అంటూనే అది నిలబడింది.     నేను చటుక్కున లోపలకు వెళ్ళి దాని కాళ్ళకు దణ్ణంపెట్టి "ఈ రోజు నా పుట్టిన రోజు. కొత్త గౌను వేసుకున్నాను. ఇది మా బాబాయి అమెరికా నుండి తెచ్చాడు బాగుంది కదూ?" అన్నాను.     "బాగుంది కానమ్మా-నువ్వు నాకు దణ్ణం పెట్టావేమిటి?" అంది రత్తమ్మ.     "నువ్వు పెద్ద దానివి కదా! నన్ను దీవించాలి" అన్నాను.     అది చటుక్కున నన్ను దగ్గరగా తీసుకుని "వెయ్యేళ్ళు వర్ధిల్లమ్మా" అంది. అప్పుడు నాకు దాని దగ్గర అదోరకం వాసిన వేసింది. శంకరం గుడిసెలో వచ్చిన లాంటిదే ఆ వాసన.     చటుక్కున రత్తమ్మను విడిపించుకున్నాను. అయితే అదంటే నాకు అసహ్యం వేయలేదు. జాలి వేసింది. స్నానం చేస్తే వళ్ళు రుద్దుకునేందుకు సబ్బు కూడా వుండదు వీళ్ళకు.     నేను వెనక్కు తిరిగే సరికి గుమ్మంలో అమ్మ వుంది. అమ్మ నాకేసి కాస్త కోపంగా చూస్తోంది. అమ్మ పిడికిలి మూసి వుంది. అందులో ఉప్పు వుంటుందని నాకు తెలుసు. మామ్మ ఏ పని చెప్పినా అమ్మ వెంటనేవినదు. కానీ దిష్టి తీయమంటే మాత్రం వెంటనే ఆ పని చేస్తుంది.     నేను అమ్మ దగ్గరకు వెళ్ళాను. "నాన్నగారికి దణ్ణం పెట్టావా?" అని అడిగింది అమ్మ కోపంగా.     "లేదు. పెద్దవాళ్ళు ఒకొక్కరికే పెట్టుకు వస్తున్నాను. ముందు మామ్మకు అయింది. అప్పుడు రత్తమ్మకి అయింది. ఇంక నాన్నగారూ నువ్వూ, బాబాయి వున్నారు" అన్నాను.     "అఘోరించావులే" అంటూనే అమ్మ దిష్టి తీసింది.     తర్వాత ఒకొక్కరికే దణ్ణాలు పెట్టాను. అమ్మ అందరికీ నేను చేసిన పని చెప్పింది. బాబాయి నన్నెత్తుకుని ముద్దులాడి "ఈ ఇంటి మొత్తానికి నువ్వే నచ్చావు నాకు. నిన్ను చూసి అంతా నేర్చుకుంటారని ఆశిద్దాం. నువ్వు చాలా గొప్ప దానివి కదా! అందుకని నీకు ఇంకా గొప్ప బహుమతి ఇవ్వాలి. ఆ బహుమతి అందుకునేందుకు స్పెషల్ డ్రస్ వుండాలి. అందుకనే ముందుగా గౌను ఇచ్చాను. నాతో రా" అన్నాడు.     అంటే బాబాయి నా కోసం ఇంకేదో ఇచ్చాడన్న మాట. అదేమిటి?     నేను బాబాయి వెంట నడిచాను.     అప్పుడు ఇచ్చాడు బాబాయి నాకు చక్కని అమెరికా బొమ్మ !     ఎంత చక్కని బొమ్మ అది! అచ్చం మనిషిలా వుంది. లేత గులాబీ రంగు వళ్ళు. వంటి రంగుకు నప్పే మ్యాచింగ్ ఫ్రాక్, బూరి బుగ్గలు, చేపల్లాంటి కళ్ళు. రెండడుగుల పొడవు వుంది. దానికి బుల్లి బుల్లి సాక్సు. బూట్సు.     "ఇది నీకు పుట్టిన రోజు బహుమతిగా ఇవ్వాలనుకుని వెంటనే ఇవ్వలేదు. బాగుందా?" అన్నాడు బాబాయి.     బొమ్మను గుండెకు గట్టిగా హత్తుకుని ఎంత బాగుందో చెప్పాలనుకున్నాను. సంతోషంతో మాటలు రాలేదు నాకు.     పరుగు పరుగున వెళ్ళి ఆ బొమ్మను మామ్మకూ, రత్తమ్మకూ, అమ్మకూ, నాన్నగారికీ చూపించాను. అయితే ఎక్కడా మాట రాలేదు.     అప్పుడు నాకు కిష్టిగాడు గుర్తుకు వచ్చాడు. కిష్టిగాడు గుర్తుకు రాగానే నాకు మాటలు వచ్చేశాయి. బాబాయి దగ్గరకు వెళ్ళి "బాబాయ్-నువ్వు అందరి బాబాయిల్లాంటి వాడివి కాదు. కిష్టిగాడు చెప్పాడూ - బాబాయిలు రాబోయే పెళ్ళాల గురించే ఆలోచిస్తారు తప్పితే చిన్న పిల్లల గురించి ఆలోచించరుట. కానీ నువ్వు అలాంటి వాడివి కాదు. నాకెంతో సంతోషంగా వుంది. ఇప్పుడే వెళ్ళి వాడిని పిల్చుకుని వస్తాను. బొమ్మ చూపిస్తాను" అన్నాను.     బాబాయి చాలా గర్వంగా నవ్వాడు. కానీ కిష్టిగాడి దగ్గరకు వెళ్ళడం అప్పుడే కుదరలేదు. అమ్మ నాకు జడవేస్తానంది. తలంటుకున్నాక వెంటనే జడ వేయడం అంటే అది పెద్ద నరకం. కానీ తప్పదు మరి.     అమ్మ నాకు జడ వేస్తూంటే బాబాయి పక్కనే కూర్చుని "అమ్ములూ నువ్వు కూడా నీ బొమ్మకు ఇలాగే జడవేసుకోవచ్చు. తెలుసా?" అన్నాడు.     "నిజంగా!" అన్నాను.     "నేను అబద్ధం చెప్పనుగా" అన్నాడు బాబాయి.     "అయితే నా బొమ్మకు తలంటవచ్చా?" అనడిగాను.     "ఆహా! మీ అమ్మ నీకేం చేస్తుందో అవన్నీ నువ్వు నీ బొమ్మకు చెయ్యొచ్చు" అన్నాడు బాబాయి.     "అమ్మ బాబోయ్! నిజంగానే" అని ఉత్సాహంగా చప్పట్లు కొట్టేయబోయాను.     "కుదురుగా కూర్చోవే" అని అమ్మ తన చేతిలో వున్న నా జుట్టును ఓసారి గట్టిగా లాగింది.     "అమ్మా! నువ్వు నాకు అమ్మవు. నా బొమ్మకు నేను అమ్మను" అన్నాను సంతోషంగా.     "బాగా అన్నావు. 'నాకున్నది ఒక చక్కని బొమ్మ-దానికి నేను అమ్మ' అని రోజూ పాడుకోవచ్చు నువ్వు"     అన్నాడు బాబాయి.     ఆ పాటకూడా నాకు నచ్చింది. వెంటనే మొదలు పెట్టేశాను.     అమ్మ జడవేయడం ముగించి "ఇప్పుడు ఎక్కడికి వెడతావో వెళ్ళవే" అంది.     నాకు కిష్టిగాడింటికి వెళ్ళాలనిపించలేదు. కాసేపు తనివితీరా ఆ బొమ్మను చూసుకోవాలనిపించింది.     బొమ్మ దగ్గరకు వెళ్ళాను. దాన్ని ముద్దులాడాను.     ఆ బొమ్మను పడుకోబెట్టగానే కళ్ళు మూసేస్తోంది. దాని నోట్లో చిన్న పాలసీసా వుంది. నిలబడినప్పుడు ఫరవాలేదు. కానీ పడుకున్నప్పుడు పాలసీసా తీస్తుంటే ఏడుస్తోంది. సీసా నోట్లో వుంచగానే ఊరుకుంటోంది. బొమ్మ వెనకాలే ఓ మీట వుంది. అది నొక్కగానే పాట పాడుతోంది.     నాకు ఇంగ్లీషు అర్ధం అవుతుంది. కానీ ఈ బొమ్మ పాడే ఇంగ్లీషు నాకు అర్ధం కావడంలేదు. బాబాయి నడిగితే తనే చెప్పాడు. 'తానొక అందమైన పాపననీ, తన్ను చూసి ముచ్చటపడి పలకరించి రమ్మని చంద్రుడు వెన్నెలను పంపిస్తా'డనీ ఆ పాటకు అర్ధమట. అమెరికన్ ఇంగ్లీషు అర్ధం చేసుకోవడం చాలా కష్టమని బాబాయే అన్నాడు.     బొమ్మతో చాలాసేపు కాలక్షేపం చేశాను.     మామ్మ, నాన్నగారు, అమ్మ, బాబాయి అంతా ఎవరి పనుల్లో వాళ్ళుంటున్నారు. నేను దగ్గరగా వెడితే "నీకు బొమ్ముందిగా దాంతో ఆడుకో పో" అంటున్నారు. నాకెంతో సంతోషంగా వుంది. ఆ సంతోషాన్ని ఎవరితోనైనా పంచుకోవాలి. ఇంక తప్పలేదు. బొమ్మను జాగ్రత్తగా బజ్జుండ బెట్టి నోట్లో పాలసీసా వుంచి కిష్టిగాడి ఇంటికి వెళ్ళాను.     వాళ్ళింటికి వెళ్ళడానికి ఒక్కటే భయంగా వుంది. కిష్టిగాడి అమ్మకు నా మీద కోపంగా వుందేమోనని! ముందు ఆవిడ కాకుండా కిష్టిగాడే కనిపిస్తే బాగుండుననిపించింది. కానీ అనీ మనం అనుకున్నట్లే జరుగవు కదా!     ముందుగా నాకు కిష్టిగది అమ్మే కనబడింది.      నన్ను చూస్తూనే ఆవిడ "అరే అమ్ములు కొత్త గౌను వేసుకుందే!" అంది. నాకెంతో సంతోషం కలిగింది. "ఈరోజు నా పుట్టిన రోజు ఆంటీ" అన్నాను.     "అలాగా. గౌను చాలా బాగుంది" అంది కిష్టిగాడి అమ్మ. ఆవిడ నా గౌను కేసే రెప్పవాల్చకుండా చూసింది.     "ఇది అమెరికా నుండి నాకోసం తెచ్చాడు మా బాబాయి" అంటూ "ఆశీర్వదించు ఆంటీ అందుకే వచ్చాను" ఆవిడ కాళ్ళకు దణ్ణం పెట్టాను.     ఆవిడ నన్ను దగ్గరకు తీసుకుని "నువ్వు చాలా బుద్ధిమంతురాలివి" అంది.     నిజానికి నేను వచ్చిన పని వేరు. అయితే ఇలాంటి అబద్ధాలు చెప్పడం నేను మా అమ్మదగ్గర నేర్చుకున్నాను. చిన్నచిన్న అబద్ధాలు చెప్పి అమ్మ మామ్మను చాలాసార్లు మోసం చేసింది. అలా చేయడం తప్పుకాదా అంటే ఎదుటి వాళ్ళకు సంతోషం కలిగించేటప్పుడు, ఇతరులకు ఎటువంటి హానీ కలిగించనప్పుడు అబద్ధం చెప్పడంలో తప్పులేదని అమ్మ నాకు చెప్పింది. అది నిజమే ఏమో! ఇప్పుడు కిష్టిగాడి అమ్మ కూడా ఎంతో సంతోషించినట్లే కనబడుతోంది.     "కిష్టిగాడింట్లో లేడా ఆంటీ!" అనడిగాను.     "వున్నాడు. పింగాణీ ప్లేటు బద్దలు కొట్టాడని వాళ్ళనాన్న వాడి వీపు బద్దలు కొట్టారు. ఆ గదిలో కూర్చుని ఏడుస్తున్నాడు" అందావిడ.     వాడేడుస్తున్నాడనగానే నాక్కాస్త నిరుత్సాహం కలిగింది. మా మూలప్పుడే వాడికి అసూయ ఎక్కువ. ఇప్పుడసలు నా సంతోషంలో పాలు పంచుకుంటాడా? అని అనుమానం వచ్చింది. అయినప్పటికీ వెళ్ళాను.     నన్ను చూడగానే కిష్టిగాడు ఏడుపు ఆపేశాడు.     "ఏరా కిష్టీ, నిన్ను మీ నాన్న కొట్టాడా?" అనడిగాను.     "ఎవరు చెప్పారు? నేను ఏడుస్తున్నానని అలాగ అనుకుంటున్నావా ? ఇదంతా నటన. నాకసలు మా నాన్న ఎంత కొట్టినా ఏడుపు రాదు. ఎందుకంటే నేను నాన్నకి ఒక్కగానొక్క కొడుకుని గదా! ఆయన నన్ను గట్టిగా కొట్టలేరు. కానీ ఏడ్చేదాకా కొడతారు. అసలు నాన్నకి నన్ను కొట్టడం ఇష్టం వుండదు. ప్లేటు బద్దలు కొట్టానని అమ్మ నాన్నకు చెప్పింది. నాన్న 'ఊఁ' అని విని వూరుకుంటే 'అలా వూరుకుంటే ఎలాగండీ, రోజూ ఓ ప్లేటు బద్దలుకొట్టేస్తాడు' అంది అమ్మ. 'ఏం చేయమంటావూ?' అనడిగారు నాన్న. 'వాణ్ణి కొట్టండి' అంది అమ్మ.                     (సశేషం)

నాకున్నది ఒక చక్కని బొమ్మ

నాకున్నది ఒక చక్కని బొమ్మ ఎపిసోడ్- 4 - వసుంధర   వాళ్ళు బాబాయికి ఏం చెబుతున్నారో వినిపిస్తోంది. ఆ మాటలు వింటుంటే నాకు చాలా ఏడుపు వచ్చేసింది. నేనేదో చాలా పెద్ద నేరం చేసినట్లు చెబుతున్నారు వాళ్ళు. దీనికి బాబాయి ఏమంటాడో?     వాళ్ళు చెప్పేదంతా విని బాబాయి నవ్వేశాడు.     "ఇందులో దాని తప్పేముంది? తప్పంతా మీదే! వుండండి దాన్ని పిలుస్తాను...." అంటూ నా గదిలోకి వస్తున్నాడు బాబాయి.     నాకు చాలా ఉక్రోషం వచ్చింది. బాబాయి పిలిచినా సరే వెళ్ళకూడదనుకున్నాను. చేతిలోని పుస్తకాన్ని గట్టిగా పట్టుకుని దానికేసే చూస్తున్నాను. ఎంత శ్రద్ధగా చూద్దామన్నా ఒక్క అక్షరం కూడా నాకు కనబడ్డం లేదు. బాబాయి ముఖమే కనబడుతోంది.     "అమ్మలూ!" అన్నాడు బాబాయి.     నేను ఊఁ అనలేదు. పుస్తకంలో అక్షరాలు కనబడక పోయినా గుర్తుకు వచ్చిన పాఠం గట్టిగా పైకి చదవసాగాను.     "అదేమిటమ్మా సైన్సు పుస్తకం పట్టుకుని తెలుగు పద్యాలు చదువుతున్నావు?" అన్నాడు బాబాయి.     "నేను చదువుకోవాలి. డిస్టర్బ్ చెయ్యొద్దు" అన్నాను.     "బడి వున్నప్పుడు చదువుకోవాలి. సెలవులు ఇచ్చినప్పుడు ఆడుకోవాలి. మరి పుస్తకం మూసేసి నాతో రా!" అన్నాడు బాబాయి.     ఎవరైనా బ్రతిమాలుతుంటే నా పట్టుదల పెరిగి పోతుంది. నేనెందుకు రావాలి? రాను...." అన్నాను.     "ఎందుకు రావాలంటే నీ బాబాయి పిలుస్తున్నాడు కాబట్టి! నేను అమెరికా నుండి ఎందుకు వచ్చాననుకుంటున్నావు? నీ కోసమే వచ్చాను. ఈ ఇంట్లో కనుక నువ్వు లేకపోతే అసలు ఎప్పుడూ అమెరికాలోనే వుండిపోయేవాడిని. మరి నువ్విలా కూర్చుంటే ఎలా?" అన్నాడు బాబాయి.     "నేను రాను" అన్నాను.     "నువ్వు రాకపోతే మీ అమ్మకూ, నాన్నకూ బుద్ధి చెప్పడమెలా అన్నాడు బాబాయి.     "ఏంకాదు. వాళ్ళంటే నీకూ భయమే!" అన్నాను.     "నాతో రా! వాళ్ళంటే నాకు భయముందోలేదో చూద్దువుగాని!" అన్నాడు బాబాయి.     "నేను రాను" అన్నాను మళ్ళీ.     "రానంటే ఎత్తుకుని తీసుకుపోతాను" అని బాబాయి చటుక్కున చేతిలో పుస్తకం తీసి బల్లమీద పారేసి నన్ను ఎత్తుకున్నాడు.     నేను గింజుకుంటూ "నేను రాను వాళ్ళు నన్ను తిట్టారు" అన్నాను. బాబాయి లెక్కచేయకుండా నన్ను అమ్మా నాన్నల దగ్గరకు తీసుకువెళ్ళి "ముందు మీరు దీనికి క్షమాపణ చెప్పుకోండి" అన్నాడు.     అమ్మ రుసరుస లాడుతూ "చాలా బాగుంది. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి క్షమాపణ చెప్పకూడదు" అంది.     అదే తప్పు. అందుకే మన ఇండియా ఇలాగుంది. అమెరికా అంత పెద్దదైపోయింది" అంటూ బాబాయి అమెరికా పద్ధతులు చెప్పుకునివచ్చాడు.     అమెరికాలో పెద్దవాళ్ళని చిన్నవాళ్ళు గౌరవించరట. అక్కడ మనుషులందరూ సమానమేనట. పెద్దవాళ్ళయినా సరే. వున్నవాళ్ళయినా సరే. తప్పుచేసినప్పుడు- చిన్న వాళ్ళనయినా, లేని వాళ్ళయినా సరే క్షమాపణ చెప్పి తీరాలట.     "అయితే మరక్కడ ఎవరూ ఎవర్నీ గౌరవించుకోరా?" అనడిగింది అమ్మ.     "ఎందుకు గౌరవించుకోరు?" అన్నాడు బాబాయి.     మనకు చేతకాని పని ఎవడైతే చేయగలడో అలాంటి వాళ్ళను గౌరవిస్తారుట. అందుకే గొప్ప గొప్ప ఆటగాళ్ళనూ, సైంటిస్టులనూ, కళాకారులనూ వాళ్ళు గౌరవిస్తారట.     "మరి డబ్బు సంపాదించడం కూడా అందరికీ చేతకాని విషయమే కదా. లేనివాడు వున్నవాడిని ఎందుకు గౌరవించకూడదు?" అనడిగారు నాన్నగారు.     "అదీ చెబుతానన్నయ్యా!" అన్నాడు బాబాయి. "నువ్వు నీకోసం డబ్బు సంపాదించుకుంటావు. అది నీకు మాత్రమే ఆనందం కలిగిస్తుంది. కానీ కళాకారులు, సైంటిస్టులు, ఆటగాళ్ళు తాము సంపాదించిన దానివల్ల పదిమందికీ ఆనందాన్ని కలిగిస్తారు. అదీ తేడా!"     "ఇంతకీ ఇప్పుడు మేము చేసిన తప్పేమిటి?" అంది అమ్మ.     "అలా అడుగు చెబుతాను. ఇంట్లో మన అమ్మ వుంది. పెద్దరికం మినహా యిస్తే ఆవిడలో గొప్పతనం ఏముంది? చదువా లేదు. తెలివి తేటలా అంతంత మాత్రం. తన పనికూడా తాను చేసుకోలేదు. అయినా వయసులో పెద్దదికదా అని మనమంతా గౌరవిస్తున్నాం. వయసులో మన అందరి కంటే పెద్దదైన పనిమనిషిని గౌరవించడం లేదు సరి కదా! అలా గౌరవించడం తప్పు అనే అభిప్రాయాన్ని పిల్లలకు కలిగిస్తున్నాం. మనుషులందర్నీ ఒక్కలాగే చూడడం పిల్లలకు నేర్పాలి. ఆ పనిమనిషికి మనం డబ్బులు ఇస్తున్నాం. మనం ఇచ్చే డబ్బుకు అది చేసే పని ఎక్కువ. నువ్వేమో దానికి నెలకు ఇరవై రూపాయలు ఇస్తున్నావు. అందుకని అది ఇల్లూడుస్తుంది, గిన్నెలు తోముతుంది, బట్టలు వుతుకుతుంది. అమెరికాలో అయితే ఈ పనులన్నీ చేయాలంటే నెలకు మూడు వేలిచ్చినా చాలదు" అన్నాడు బాబాయి.     "నీ అమెరికా ఉపన్యాసానికో నమస్కారం. ఇదంతా వినడం కంటె అమ్మాయిని క్షమాపణ అడగడమే సుఖంలా వుంది" అంది అమ్మ.     అమ్మా, నాన్న నన్ను క్షమాపణ అడిగారు. అప్పుడు నాకు చాలా గర్వం వచ్చింది. సంతోషం పట్టలేక పక్కకు తిరిగిపోయాను నవ్వుకోడానికి. బాబాయి అది కనిపెట్టేశాడు.     "అదిగో అలా నవ్వేసుకుంటే కాదు. ఈ రోజునుంచీ మనుషులందర్నీ ఒక్కలా చూడాలి తెలిసిందా?" అని అన్నాడు బాబాయి.     "అలాగే" అన్నాను.     "నువ్వు చాలా మంచి పిల్లవు. నీకు దేవుడు చాలా మేలు చేస్తాడు" అన్నాడు బాబాయి.     "నాకెంతో సంతోషంగా వుంది బాబాయ్! ప్రతి ఇంట్లోనూ ఒక బాబాయి అమెరికా వెళ్ళి వచ్చి వుంటే బాగుంటుంది" అన్నాను.           ఎందుకో బాబాయి ముఖం అదోలా అయిపోయింది. నిట్టూర్చుతూ అన్నాడూ -"మనుషులంతా ఒక్కటేనని తెలుసుకుందుకు విదేశాలు వెళ్ళాలా ? ఈ దేశం ఎప్పటికి బాగుపడేను ?" అని.     బాబాయి మాటలు నాకు అర్ధంకాలేదు. కానీ ఈలోగా అక్కడికి మామ్మ వచ్చింది.     "అంతా వింటున్నారా. నేనెందుకు పనికి మాలినదాన్నా? పెద్దదాన్ని కాబట్టి గౌరవిస్తున్నావా ? నేనూ పనిమనిషి ఒక్కటే నంటావా? ఇదిట్రా నువ్వు అమెరికా వెళ్ళి నేర్చుకొచ్చిన చదువు అంటూ బాబాయిని తిట్టడం మొదలుపెట్టింది.          బాబాయి వెంటనే వంగి మామ్మ కాళ్ళకు దణ్ణం పెట్టి లేచి నిలబడి అమ్మా నువ్వంటే ఎప్పుడూ గౌరవమే నాకు. చిన్నపిల్లలకు అర్ధమయేలా  చెప్పడం కోసమని ఏవో అంటూంటే అవి నిజాలనుకుని ఇలా దెబ్బలాడతావేమిటమ్మా!" అన్నాడు.     బాబాయి దణ్ణం పెట్టగానే మామ్మ కరిగి పోయింది. "నాకు తెలుసురా- నువ్వు అమెరికాకే కాదు, ఆ చంద్రమండలానికి వెళ్ళొచ్చినా నీకు నా మీద గౌరవం పోదు. ఇంకా చాలా గొప్పవాడైపోయి ఇలాగేనన్ను గౌరవిస్తూ వుండు" అంది.     నాకు మాత్రం పెద్ద అనుమానమే వచ్చింది. బాబాయి ఎవరికి నిజం చెప్పాడు? నాకా, మామ్మకా?     నా అనుమానం తీరడానికి ఎంతో సేపు పట్టలేదు. భోజనాలు కాగానే బాబాయి నన్ను ప్రత్యేకంగా పిలిచి "నేను నీకు చెప్పిందే నిజం. మామ్మకు చెప్పింది నిజం కాదు. రేపు ఉదయం లేచేసరికి నీ కోసం ఓ మంచి బహుమతి ఎదురు చూస్తూంటుంది. పెందరాళే పడుకుని పెందరాళే లేవాలి మరి" అని చెప్పాడు.     "అదేమిటో నాకు చెప్పవా బాబాయ్" అని అడిగాను.     "చెప్పను. ఎదురు చూడాల్సిందే" అన్నాడు బాబాయి.     వెళ్ళి పడుకున్నాను. ఎప్పటికీ నిద్రరాదె౧ బాబాయి నాకు ఇచ్చే బహుమతి గురించి ఒక్కటే ఆలోచన.     అది కానీ అమెరికా బొమ్మ కాదు గదా అనిపించింది. అయినా అంత అదృష్టమా నాకు? బొమ్మ తెస్తే బాబాయి ముందే ఇచ్చేవాడు కదా! బాబాయి వచ్చిన రోజు రాత్రే అమ్మను అడిగాను. "అమ్మా బాబాయి నాకోసం బొమ్మతెస్తానన్నాడు. తేలేదేమే?" అని.     "మీ నాన్నగారి వంశం వాళ్ళంతా అంతేనమ్మా! తెస్తానని చెబుతారు, ఏమీ తేరు" అంది అమ్మ.     అమ్మ మాటలు వింటే మా నాన్నగారి వంశం వాళ్ళని తిట్టడానికి సరదా పడుతోందనిపించింది. బొమ్మతేనందుకు బాధపడలేదని అనిపించింది.     బాబాయినే అడిగేద్దామా అంటే వెంటనే అడిగేయడానికి మొహమాటం వేసింది. నాలుగు రోజులు ఆగితే అడగొచ్చు మరి.      పోనీ మామ్మతో చెబుదామా అంటే బాబాయిని పిల్చి తిట్టేస్తుందేమోనని భయం వేసింది. మరి మామ్మ అలాంటిదే! అప్పుడు బాబాయికి నా మీద చెడ్డ అభిప్రాయం కలుగుతుంది. తనమీద పితూరీ చేశానని కోపం కూడా వస్తుంది. అది నాకు ఇష్టం లేదు.     నాన్నగారిని అడుగుదామంటే 'వాడికిదే పని అనుకున్నావా?' అని తిడతారు. అసలు నేను ఏమి అడిగానో సరిగ్గా వినకుండా ముందే తిట్టేస్తారాయన. నేనంటే చాలా ఇష్టం. నేను అడగకుండానే నా కోసం ఎన్నో కొనిపెడతారు. కానీ ఆయనకు చిరాకు ఎక్కువ. చిరాకు లేనప్పుడు ముద్దు చేస్తారు. నాన్నగారికి చిరాకు లేకపోతే బాగుండును అనిపిస్తుంది నాకు. కానీ మా నాన్నగారికే కాదు, అందరి నాన్నలకూ అంతేనట. ఈ విషయం కిష్టిగాడు చెప్పాడు.     నాన్నగారి కంటే బాబాయే చాలా నయం. నేను అడిగిన ప్రశ్నలన్నింటికీ వివరంగా సమాధానాలు చెబుతాడు.     మామ్మతో ఒక లాగా, నాతో ఇంకోలాగా చెప్పినందుకు కారణమడిగితే ఎంత బాగా చెప్పాడో?     మామ్మ ఆలోచనలన్నీ తప్పట. కానీ ఇప్పుడు మామ్మని మార్చడం చాలా కష్టంట. మార్చాలనుకోవడం అనవసరం కూడా అన్నాడు బాబాయి. నేనేమో భావిభారత పౌరురాల్నిట. నా ఆలోచనల్ని సరైనదారిలో పెట్టడం అవసరం అని బాబాయి చెప్పాడు.     బాబాయి చాలా తెలివైన వాడు. అందుకే అమెరికా వెళ్ళి వచ్చాడు. నేనూ తెలివైన దాన్నేమో! అందుకని బాబాయి నాకోసం బొమ్మ తెస్తాను లేకపోతే అమ్మతో మాత్రమే చెప్పాడు. మామ్మకు, నాన్నగారికి చెప్పలేదు. అయినా అమ్మ నన్ను 'ఆలోచన లేనిదానా'! అని తిడుతుంది.     నేనింత బాగా ఆలోచిస్తానా? మరి బాబాయి నా కోసం ఏం తెచ్చాడో ఆలోచించలేక పోతున్నానేమిటీ?     ఆఁ సందేహం లేదు. అది బొమ్మే అయ్యుంటుంది....     ఎప్పుడో నిద్ర పట్టేసింది. నిద్రలో కల. కలలో అమెరికా బొమ్మ. ఎంత బాగుందో అది. ఆ బొమ్మతో నేను ఎన్నో రకాల ఆటలాడుకున్నాను. అలా ఆడుకుంటూంటే ఎంత సరదాగా వున్నదో!     ఆ సరదా అంతా అమ్మ నిద్రలేపడంతో పోయింది.     ఆమెప్పుడూ ఇంతే! మంచి కలలు వచ్చినప్పుడే నిద్ర లేపుతుంది. అమ్మతో నా ఆట అంతా కలే అయిపోయినందుకు నాకు చాలా బాధ అనిపించింది. ఇంకా నా బాధ ఏమిటంటే అమ్మ నిద్ర లేపగానే నేను కలలో అమ్మ ఎలా వుందో మర్చిపోయాను. ఎంత గుర్తు చేసుకుందా మనుకున్నా గుర్తు రావడం లేదు. ఆటలు మాత్రం అన్నీ గుర్తున్నాయి. బొమ్మ కూడా గుర్తుంటే కిష్టిగాడిని నా దగ్గర బొమ్మ వుందని అబద్ధం చెప్పి ఆటపట్టిద్దామనుకున్నాను. ఇప్పుడింక అది సాధ్యం కాదు.      అమ్మ నాకు తలంటి పోసింది.     "ఎందుకే?" అన్నాను. తలంటు అంటే నాకు చాలా చిరాకు. ఎప్పుడూ సబ్బుతో రుద్దుకుంటే సరిపోతుందా! ఆ రోజు సున్నిపిండి పెట్టి వళ్ళంతా మంటపుట్టేలా పామి తోమేస్తుంది అమ్మ. ఇంక కుంకుడుకాయ పులుసు సంగతి సరేసరి. కళ్ళలో పడిందంటే ఎంత బాధగా వుంటుందో! అదేం కర్మో గానీ నేనెప్పుడు తలంటి పోసుకున్నా కళ్ళలో పులుసు పడుతుంది.     అమ్మ నాకు నలుగు పెడుతూంటే వంటికి మంటగా వుంది. నేను గోల పెడుతూంటే "చూడు, నీ వంటి మీంచి పాములెలా వస్తున్నాయో" అంది అమ్మ.     నిజమే! సున్నిపిండి నావంటి మీద నలిగి సన్నగా పొడుగ్గా పాము పిల్లల్లా కిందపడుతోంది. ఆ పిండి నల్లరంగులో వుంది.     "పచ్చటి పిండి నల్లగా అయిపోయింది. నీ వంటిమీద ఎంత కుళ్ళు పేరుకుని పోయిందో చూడు...." అంది అమ్మ.     పాముల్ని చూసే ధ్యాసలో నేనుండగా అమ్మ నావంటికి నలుగు పెట్టడం పూర్తిచేసింది.     అమ్మ మాటలు అప్పుడే అక్కడికి వచ్చిన మామ్మ విని "అందుకే వారానికొక్కసారయినా పిల్లలకు నలుగు పెట్టి తలంటి పోయాలి. ఇప్పుడందరూ ఇవి మానేస్తున్నారు. మనింట్లోనైనా ఎన్నాళ్ళులే ? నేనున్నన్నాళ్ళేగా సాగేది అని వెళ్ళిపోయింది.     అమ్మ నాకు తలంటు మొదలుపెట్టింది. కళ్ళు మూసుకుని కూర్చోగానే నాకు ఏడుపు మొదలయింది.     "పెద్ద దాని వౌవుతున్నావు. ఇంకా చిన్న పిల్లలా ఏడ్వడమేమిటి?" అని అమ్మ నన్ను తిట్టింది.     ఇప్పుడిలా తిట్టిందా కాసేప్పోయాక పెద్దాళ్ళ కబుర్లలో నేనూ మాట కలిపితే "చిన్న పిల్లవు పోయి ఆదుకోక మా కబుర్లు నీకెందుకే?" అంటుంది అమ్మ.     అసలు అమ్మ మూలంగానే నేను పెద్దదాన్నో చిన్నదాన్నో తెలియకుండా పోతోంది. మా అమ్మేకాదు, కిష్టిగాడి అమ్మా అంతే! నేను పెద్దా, వాడు పెద్దా అన్న విషయం మా అమ్మల కారణంగానే తేలకుండా వుండి పోయింది.     మళ్ళీ నాకు కంట్లో పులుసుపడింది. కళ్ళు మండుతున్నాయి. అమ్మ తల పిడప కట్టేక ఏడుస్తూ మామ్మ దగ్గరకు వెళ్ళాను.     "మళ్ళీ కంట్లో పులుసు పడిందా? మీ అమ్మెప్పుడూ ఇంతే. నేను తలంటితే కంట్లో ఒక్క చుక్క పులుసు కూడా పడనివ్వను" అంది మామ్మ. మామ్మ ఎప్పుడూ అలాగే అంటుంది.     ఈ మాట అమ్మ దగ్గర అంటే "అలాంటప్పుడు పోనీ ఆవిడే అంటొచ్చుగా" అంటుంది అమ్మ.     అందుకు మామ్మ బోసినోటితో నవ్వుతూ "ఇప్పుటికీ నేనే అంటితే నువ్వెప్పుడు నేర్చుకుంటావే ?"  అంటుంది.                      (సశేషం)

షాక్ ట్రీట్ మెంట్

  షాక్ ట్రీట్ మెంట్     - శారద అశోకవర్ధన్               నరసరాజుగారూ రామస్వామిగారూ మంచి స్నేహితులు. గత మూడు దశాబ్దాలుగా నరసరాజుగారు ఒక ప్రైవేటు సంస్థలో హోదాగల ఉద్యోగమే చేస్తున్నారు.     అతనికి అన్నీ వున్నా  భగవంతుడు  ఏదో ఒక వెలితి పెట్టాలి కాబట్టి, యాభై ఏళ్ళు దాటీ దాటకుండానే  తనకి ప్రాణంలో ప్రాణంగా, అడుగులకు మడుగులొత్తే అనుకూలవతి, ప్రేమమయి అయిన భార్యని  పోగొట్టుకున్నాడు. భగవంతుడు మరీ క్రూరుడు కాదని తన ఉనికిని తెలిపి నిలుపుకోవడానికేమో  బంగారంలాంటి  కొడుకునీ, కూతుర్నీ యిచ్చాడు. కొడుకు డాక్టర్ సుధీర్, కూతురు ఇంజనీరు  సునయన. తల్లిపోయాక పిల్లలిద్దరూ  నరసరాజుగారిని కళ్ళల్లో పెట్టుకుని కనిపెట్టుకుంటున్నారు సర్వీసులో  వుండగానే పెళ్ళిళ్ళు చేసెయ్యమని, స్నేహితులూ బంధవులూ  యిచ్చిన  సలహామేరకు  నరసరాజుగారు, మంచి సంబంధాలకోసం  చూసి చూసి, ఇద్దరికీ పెళ్ళిళ్ళు  చేసేశారు. సునయన భర్త పోలీసాఫీసరు సుధీరు భార్య  అమూల్య ఎం.కామ్. అందరూ ఉద్యోగస్తులే. నరసరాజుగారంటే  అటు అల్లుడికీ, ఇటు కోడలికి కూడా ప్రాణమే. భార్యలేని  లోటు తప్ప. మిగతా విషయాలలో  ఆయనకి ఏ సమస్యా లేదు.     రామస్వామిగారికి  హోమియో మందులు  తయారుచేసే  ఫ్యాక్టరీ వుంది. ఒద్దనుకున్నా దానిమీద అతనికి  కనీసం ఖర్చులుపోను  పదివేల  దాకా వొస్తుంది. అదికాక మందులు  అమ్మకంచేసే  షాపుకూడా వుంది. దానిపైన  కూడా ఖర్చులు పోను  దాదాపు  పదివేలదాకా  వొస్తాయి. రెండు కార్లూ, నౌకర్లూ, డబ్బూ, గోల్డు అన్నీ వున్న రామస్వామిగారి  భార్య  కనకవల్లికి  మాత్రం  తన తండ్రి తన వివాహ సమయంలో రాసిచ్చిన  విజయనగర్ కాలనీలోని  ఇల్లే  గొప్పగా  అనిపిస్తుంది. ఆ యింటి మీద వొచ్చే అద్దె మూడువేలూ  తన పేరిట  బ్యాంకులో  వేసుకుంటూ, డబ్బు  పెరిగిన కొద్దీ  అహం  పెంచుకుంటూ, సంసారాన్ని  సామ్రాజ్యంగా, భర్తా పిల్లలూ అంతా సామంతరాజుల్లా  నడుపుతోంది కనకవల్లి. ఆమె గీచిన గీత రామస్వామిగారు నుంచి  పిల్లలు  చెంగల్వ,రాకేష్, ఉదయులకు కూడా లక్ష్మణ రేఖే. ఆమె మాటకు  తిరుగులేదు. ఆమె మాట అందరికీ ఆర్డర్. ఆమె నోరువిప్పితే  అందరికీ హడల్! ఒక్కొక్కసారి  ఆమె ప్రవర్తన అందరిలోనూ  తరగని  అసంతృప్తినీ, చెరగని అసహ్యాన్నీ కలగచేస్తున్నది. రామస్వామికి పిచ్చెక్కినంత పనౌతుంది!      చాలాకాలం తరువాత  ఒకరోజున అనుకోకుండా సరస్వతీ గానసభవారు ఏర్పాటుచేసిన డాక్టర్  మంగళంపల్లి బాలమురళీకృష్ణగారి గాత్రం, శ్రీమతి శోభానాయుడి కూచిపూడి నృత్యం  కార్యక్రమానికి వెళ్ళడం వలన స్నేహితులిద్దరూ కలుసుకున్నారు. ప్రశాంత  వాతావరణంలో  మనసువిప్పి మనసులోని  మాటలెన్నో  చెప్పుకున్నారు. అన్నింటిలోకీ  రామస్వామిగారిని సంభ్రమాశ్చర్యాలలో  ముంచి మాటరాకుండా అక్షరాలు గొంతులో అడ్డుపడిన  విషయం నరసరాజుగారు, తన ఆఫీసులోనే పనిచేసే ఎక్కౌంటెంటు శివకామేశ్వరిని పెళ్ళి చేసుకోవడం! సరసరాజుగారి భార్య సుశీల రామస్వామిగారిని 'అన్నయ్యా' అని పిలిచేది. సుశీల లేనిదే నరసరాజుగారు ఏపనీ  చేసేవారు కాదు. ఆమెతోటే  ఈ జగం! ఆమెతోనే సోయగం! ఆమెలేని బ్రతుకు వ్యర్ధం అన్నట్టు గడిచింది వారి జీవితం. అటువంటి  నరసరాజుగారు  మళ్ళీ పెళ్ళిచేసుకున్నారు  అంటే చెప్పలేనంత ఆశ్చర్యంగా  వుంది రామస్వామిగారికి. రామస్వామిగారి మౌనాన్నిబట్టి  వారి ఆలోచనలను గ్రహించిన  నరసరాజుగారే చెప్పడం మొదలెట్టారు:     "రాముడూ"....'పిలిచారు నరసరాజుగారు. మనసు ఆత్మీయతతో అల్లుకుపోయినప్పుడో, ఆనందంతో నిండిపోయినప్పుడో, బాధతో మనసు కృంగిపోయినప్పుడో  అతను రామస్వామిగారిని  రాముడూ అని పిలుస్తారు. అలాగే రామస్వామిగారు నరసరాజు గారిని 'రాజా' అని పిలుస్తారు.     "చెప్పు రాజా!" అన్నారు రామస్వామిగారు.     "నీకు తెలుసు  నేను సుశీలని ఎంతగా  ప్రేమించానో! సుశీలనే కాదు మా ప్రేమ ఫలితాలు సుధీర్, సునయనలు కూడా నాకు పంచప్రాణాలే కదా! అయితే ఈ మధ్యన  ఈ పిల్లలు  ఎవరి గొడవల్లో వాళ్ళుండి, నేను గ్లాసు మంచి నీళ్ళడిగినా విసుక్కుంటున్నారు. ఆ మధ్య వైరస్ ఫీవరొచ్చి వారం రోజులు నేను మంచం దిగలేదు. అల్లుడికి గోవాలో  ఏదో ట్రైనింగ్ వుందని, ఫామిలీతో సహా ఏదో ప్రోగ్రాం పెట్టుకున్నాడు. సుధీర్ కి మెడికల్ కాన్ఫరెన్సు. కోడలు పిల్లలతో  సతమతమయి పోతూ, నాకేసి చూడడానికే టైములేక నలిగిపోయింది. రాను రాను నేను వాళ్ళందరికీ భారమైపోతున్నానిపించింది. నాలుగు రోజులు  ఆఫీసుకి వెళ్ళకపోవడం చూసి ఆఫీసువాళ్లే ఇంటికొచ్చారు. డాక్టరు దగ్గరికి తీసుకెళ్ళారు. పరీక్షలు చేయించారు. అందులో  శివకామేశ్వరి నన్నంటి పెట్టుకునే వుండి, వేళకి  మందివ్వడం, పళ్ళరసం ఇవ్వడంవంటి సపర్యలు  చేసింది. ఆమె అలా చేస్తూ వుంటే పన్నెత్తి పలకలేదు. కన్నెత్తి చూడలేదు. సుధీర్, కోడలూ కూడా మౌనంగా వుండిపోయారు. అమూల్య ఇప్పుడు కేవలం తన భర్త, పిల్లలూ తప్ప ఇంకేమీ పట్టించుకోవడంలేదు. రాముడూ! ఇప్పుడే ఇలా అయితే నేనింకో పదేళ్ళు బతికితే, ఇంకా పెద్దరోగాలేమైనా వొస్తే నన్ను తీసికెళ్ళి ఏ నర్సింగ్ హోంలోనో పడెయ్యడమో, లేకపోతే, 'హోం ఫర్ ది ఏజ్ డ్' లో చేర్పించడమో, లేకపోతే ఏ నర్సునో పెట్టి చూసుకోవడమో చేస్తారు. మనసువిప్పి  కాస్సేపు మాట్లాడుకోవాలన్నా, కష్టసుఖాలు  చెప్పుకోవాలన్నా  ఒకరికొకరు తోడుండడం అవసరం. ఆ తోడు ఒక్క వివాహబంధానికి మాత్రమే ఉంది. ఏమంటావ్?...." అన్నారు రామస్వామి మొహంలోకి ఆత్రంగా చూస్తూ. రామస్వామి కళ్ళు చెమర్చాయి. నోటమాట పెగలలేదు ప్రయత్నించినా.     "నేను చేసింది తప్పంటావా రాముడూ?" అడిగేరు నరసరాజుగారు.     "అననురా రాజా! ఎందుకంటే  - ఆమె అవివాహిత. నువ్వు భార్యని పోగొట్టుకున్నవాడివి. ఇద్దరికీ కూడా ఒక వయస్సులో  ఇదే ప్రశ్న ఎదురవుతుంది. ఇష్టపడి, ఒకరినొకరు అర్ధం చేసుకుని కలిసి వుండాలనుకుంటే తప్పేముంది? అందుకు మన దేశంలో, మన సంప్రదాయం ప్రకారం, అలా కలిసుండడానికి కళ్యాణం ఒక్కటే మార్గం. అయితే, నిన్ను చూసి కాస్త ఈర్ష్యపడుతున్నాను నేను" అన్నారు రామస్వామి. నరసరాజు అదోలా  చూశారు అతనివైపు, అతనేమైనా  వేళాకోళం చేస్తున్నాడేమోనని! అలా ఏమీ అనిపించలేదు.     "ఎందుకా అని విస్తుబోతున్నావా? చెబుతాను విను. అపుడు సుశీలా, ఇప్పుడు శివకామేశ్వరీ కూడా నిన్ను నిన్నుగా  ప్రేమిస్తూ, నీకోసం తపిస్తూ, నీ సేవలో అంకితమైపోయారు. ఎంత అదృష్టంరా అది?" కళ్ళు తుడుచుకున్నారు రామస్వామి.      నరసరాజు  గారికి, రామస్వామిని చూస్తూ  ఉంటే  అతనిలో  నిగూఢంగా ఏదో బాధ కనిపించింది.     "రాముడూ! నీకు మాత్రం ఏం తక్కువ? చచ్చేంత  ఆస్తి, భార్యాబిడ్డలూ -" అతని మాటల్ని  మధ్యలోనే  ఆపుతూ, "అవున్లే ....అవన్నీ వున్నాయ్. ఏం లాభం? భార్యాభర్తల నడుమ ఉండవలసిన ఆప్యాయతా, ప్రేమా, గౌరవభావం అవే లేవు. మా ఆవిడకి తన ఆస్తి, డబ్బూ, హోదా - అవన్నీ  తన పుట్టింటివి కనుక అవే ముఖ్యం  మొగుడూ, పిల్లలూ అంతా అనవసరం. ఆమె అంటే మాకు ప్రేమకన్నా  భయమెక్కువ. నన్నొక మనిషిలా అనుకోదు ఆమె. ఆమె కోసం ధనార్జన చేసే యంత్రాన్ని  మాత్రమే నేను! ఆమె స్టేటస్ కి సింబల్ని మాత్రమే నేను! ఆమె బిడ్డలకి రక్షకభటుడ్ని నేను అంతే! అంతకుమించిన స్థానం నాకు లేదు. ఇది గ్రహించిన  పిల్లలు కూడా ఆమె ప్రాపుకే పాకులాడుతున్నారు గానీ, నాన్న అనే ప్రేమని చూపించలేకపోతున్నారు. ఆమె ఆధిపత్యాన్ని కాదంటే  ఏం గొడవ జరుగుతుందోనని వాళ్ళకీ భయమే! ఇలా  భార్య ప్రేమకీ, పిల్లల ప్రేమకీ నోచుకోని నేను, వాళ్ళకి దాసుడిగా  మనసుని  చంపుకుని  బ్రతుకుతున్నాను జీవితం అంటే విరక్తి పుట్టిందిరా!" అన్నారు రామస్వామి గారు, చెమ్మగిల్లిన కళ్ళను కర్చీఫ్ తో తుడుచుకుంటూ. నరసరాజుగారి గుండె ఆర్ద్రతతో  నిండిపోయింది. మనస్సు  బాధతో ద్రవించిపోయింది. అంతలోనే ఆయన  మెదడులో ఒక ఆలోచన మెరుపులా  మెరిసింది. నాలుగురోజులక్రితం  పేపర్లోచూసిన  వార్త ప్రిన్స్ ఆగా పాతికేళ్ళ  తరువాత  భార్యతో  విడాకులు పుచ్చుకున్నాడు అని. ఆ వార్త అతనిలో  కొత్త ఆలోచనలు రేకెత్తించింది.     "రాముడూ!" పిలిచారు.     "చెప్పు" అన్నారు రామస్వామిగారు.     నరసరాజు చెప్పిన ఆలోచన రామస్వామికి  నచ్చింది.     ఇద్దరూ  ఇంటికెళ్ళారు.     "ఇంత రాత్రిదాకా  ఎక్కడికెళ్ళారు? మా అందరి భోజనాలు అయిపోయాయి. టేబుల్ మీద అన్నీ వున్నాయ్. పెట్టుకు తినండి. నాకు నిద్దరొస్తోంది" అంది కనకవల్లి.     "నువ్వు లేచివెళ్ళి వడ్డించు." గర్జిస్తున్నట్లుగా అన్నారు రామస్వామిగారు.     ఆ కంఠం, అతడి ధైర్యం చూసి ఆశ్చర్యపోయి  క్రమంగా తేరుకున్న కనకవల్లి "నామీద అరుస్తున్నారా? నేను లేచివెళ్ళి  వడ్డించాలా రాత్రి పదకొండు గంటలకి?" సాగదీస్తూ అంది కనకవల్లి.     "అవును. నువ్వే వడ్డించాలి. పదకొండు  గంటలేకాదు - రాత్రి రెండు గంటలకొచ్చినా  నువ్వే వడ్డించాలి. నువ్వు నా భార్యవి!" అన్నాడు రామస్వామి.     పిల్లలు సయితం  తండ్రి తల్లితో  అంత గట్టిగా  మాట్లాడ్డం  విని ఆశ్చర్యపోతూ  చెవులు  రిక్కపొడుచుకుని వింటున్నారు, నిద్రపోతున్నట్టు  నటిస్తూనే.     "భార్య అంటే బోయివాడూ కూలివాడూ కాదు, నీ మోచేతికింద  నీళ్ళు తాగి పడుండడానికి!" గట్టిగా  అరుస్తూ  అన్నాడు రామస్వామి.     ఆమెలో  ఆవేశం  పెరిగిపోయింది. "మీరిచ్చే జీతంరాళ్ళు పెద్ద గొప్ప కాదు. మా నాన్నగారిచ్చిన  ఇల్లూ దానిమీద  అద్దే చాలు - నేనూ  నా పిల్లలూ  కాలుమీద  కాలేసుకు కూర్చుని  తినడానికి."     "అయితే  అలాగే చెయ్యి! నేను నీకు విడాకులిస్తున్నాను. నువ్వూ, నీ పిల్లలూ  మీదారి మీరు చూసుకోండి."     "పాతికేళ్ళు  సంసారం చేసి విడాకులు తీసుకుంటానని చెప్పడానికి సిగ్గు లేదూ?" రెచ్చిపోయింది కనకవల్లి.     "సిగ్గెందుకు? కావాలంటే  నాకు మరో పెళ్ళాం దొరుకుతుంది. నాకు వ్యాపారముంది. నా డబ్బుని చూసి నాకు నచ్చిన, నేను మెచ్చినపిల్ల  దొరక్కపోదు. చూడూ  ఈ వార్త" అంటూ  పేపరు గిరాటేశారు రామస్వామి.     ఆమె పేపరు గబగబా  తిప్పి  చూసింది. "ఓ యబ్బో! మీరేదో  గొప్ప ప్రిన్స్ అనుకుంటున్నారేమో! మీ మొహం చూసి ఎవరూ  రారు" అంది.     "నరసరాజు వాళ్ళ ఆఫీసులో  పనిచేసే  అమ్మాయినే పెళ్ళి చేసుకున్నాడు తెలుసా - కొడుకు, కూతురు ఎవరు చూసుకోవడం లేదని!" అన్నారు బట్టలు మార్చుకోవడం  పూర్తిచేసి  రామస్వామి.     "ఏమిటీ, నరసరాజుగారు  పెళ్ళి చేసుకున్నారా? ఈ వయస్సులో...."     "ఏం, తప్పా? పెళ్ళికీ, ప్రేమకీ వయసుందా? వుంటే  అది మనం పెట్టుకున్న అడ్డుగోడే"     కనకవల్లి  గుండె ఆగిపోయినట్టనిపించింది. వెంటనే  తేరుకుని__     "అతనికంటె భార్య పోయింది. ఇక్కడ  విడాకులివ్వడానికి  నేనొప్పుకోవాలిగా!" అంది లాపాయింటు చెబుతూ.     "రెండేళ్ళు మీకు కనబడకుండా  పారిపోతాను, ఆ తరవాత కనిపించి నీవల్లే  పారిపోయానని సాక్ష్యాలూ, ఋజువుల ద్వారా నిర్ధారించి విడాకులు పుచ్చుకుంటాను, శతకోటి  దరిద్రాలకి  అనంతకోటి ఉపాయాలు. అన్నీ లాయరుగారిని సంప్రదించే వొచ్చాను" అన్నారు రామస్వామి మంచంమీద వాలుతూ.     మొట్టమొదటిసారి కనకవల్లికి  భయమేసింది. అతడు అన్నంతపనీ చేస్తాడేమోనని పిల్లలంతా ఒక్క ఉదుటున లేచొచ్చి "నాన్నగారూ! మీరు మమ్మల్నొదిలెయ్యకండి! మేమూ  మీతోనే  వుంటాం" అన్నారు.     కనకవల్లికి మతిపోయింది. పిల్లలతో  వయస్సుమళ్ళాక  తోడుండేదెవరు? కేవలం డబ్బు పనికిరాదే? ఆస్తి, అంతస్తు ఆదుకొనేది కొంతవరకే. కనకవల్లి  ఆలోచనలో పడిపోయింది. పిల్లలంతా  ఏడుస్తుంటే  ఎలాగో అనిపించింది. నిజంగా అలా జరిగితే? తను తట్టుకోగలదా? వెళ్ళి అతని కాళ్ళమీద పడింది.     ఊహించని  ఈ పరిణామానికి  ఉక్కిరిబిక్కిరయిపోతూ రామస్వామిగారు కనకవల్లిని రెండు భుజాలు పట్టుకుని  లేవనెత్తారు. "భార్యస్థానం పాదాల దగ్గర కాదు. పనికిరానివాణ్ణిగా భావించి మొగుడ్ని నెత్తికెక్కడమూ  కాదు. ఎవరు ఎవరికీ దాసీలూ కాదు, బోయిలూ కారు! భార్యాభర్తల మధ్య వుండవలసింది ప్రేమానురాగాలు. ఒకరి అభిప్రాయాలను ఒకరు  గౌరవించుకుంటూ  ఒకరికి ఒకరు తోడుగా, విడివడని జోడీగా నడచుకోవాలి. ఇరువురూ  కలిసి పాపల్ని కంటిపాపల్లా చూసుకోవాలి. అంతేగానీ - డబ్బూ, లెక్కలూ, అంతస్తులూ, హోదాలూ - ఇవేవీ  అడ్డు నిలవకూడదు. అలా నిలిస్తే పాతికేళ్ళయినా, ముప్పై ఏళ్ళయినా వాళ్ళ జీవితాలు  కలవని రైలు పట్టాల్లా, ఎండిన మోడులా  సాగిపోతాయి.     "అలా కానప్పుడే  వయస్సుతో ప్రమేయం లేకుండా  కాపురాలు కొనసాగుతాయి! పెళ్ళంటే డబ్బూ, పలుకుబడీ లేదా లైంగికసంబంధం మాత్రమే కాదు.  రెండు శరీరాల కలయిక అసలేకాదు! రెండు మనస్సులు పెనవేసుకుపోయే పవిత్రబంధం! ఒకరి అవసరాలు  ఒకరు తెలుసుకుని, ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవించి స్నేహితుల్లా, ప్రేమికుల్లా కలకాలం కలిసిమెలిసి మనవలసిన అనుబంధం! ఇందులో  నేను ఎక్కువా కాదు, నువ్వు తక్కువా కాదు, లేదా నేను తక్కువా కాదు, నీవు ఎక్కువా కాదు" అన్నారు తల నిమురుతూ రామస్వామి.     పసిపిల్లలా  భోరున  ఏడ్చేస్తూ  కనకవల్లి  అతణ్ణి  కౌగిలించేసుకుంది.     ఆ ఆలింగనంలో కోటిస్వర్గాలు  చూసినంత  తృప్తి!     మొదటి రాత్రి లేలేతసిగ్గుల  దొంతరలవెనుక  దాగివున్న  సంతోషంకన్నా వెయ్యిరెట్లు  సంతోషం!     "కనకం! ఇదే నేను కోరుకునేది. ప్రేమ, అభిమానం!"     "అవునండీ! నేనేం పోగొట్టుకున్నానో కూడా ఇప్పుడే అర్ధమయింది" అంది కౌగిలి  విడిపించుకుని అన్నం వడ్డిస్తూ.     పిల్లలు  దుప్పటి కప్పుకుని  ప్రశాంతంగా  నిద్రపోయారు. మనసులోనే నరసరాజుగారికి ధన్యవాదాలు చెబుతూ. ఆ రాత్రి తారాశశాంకుల్లా  రతీమన్మధుల్లా, శివపార్వతుల్లా ఒకరిలో ఒకరు  లీనమైపోయారు రామస్వామి, కనకవల్లి దంపతులు!     ఈ వార్త విన్న నరసరాజుగారు పొంగిపోయారు.     ఒక గురజాడ, ఒక తిలక్, ఒక చలం, ఒక శ్రీశ్రీ, ఒక వీరేశలింగం పంతులు - ఇంకా ఇంకా ఎందరో  వారి అభిప్రాయాలకి  ప్రాణంవొచ్చినట్టు హాయిగా నవ్వుతూ  కనిపించారు  ఆయన కళ్ళముందు. నరసరాజుగారు  తృప్తిగా నిట్టూర్చారు.     "రాజు! నీ సలహా మ్యూజిక్ లా పనిచేసింది" అన్నారు రామస్వామిగారు.     "మ్యాజిక్ కాదురా రాముడూ, మందులా పనిచేసింది. దివ్యౌషధం!"     "కాదులే! కాలం  చేసిన కనికట్టు!"     ఇద్దరూ హాయిగా నవ్వుకున్నారు.                         (అన్వేషణ 1 జూన్ 1995)

ప్రేమకు చిరునామా

ప్రేమకు చిరునామా - దోనె. నాగేశ్వరరావు "ప్రసన్నకేదో కవరోచ్చింది శారదా! అసలు మీరెవరూ లెటర్ బాక్సు చూట్టం లేదనుకుంటా'' అంటూ కాళ్ళిడ్చుకుంటూ వచ్చి వరండాలో వున్న సోఫాలో భార్య ప్రక్కన చతికిలబడ్డాఋ ప్రభాకరరావు మాష్టారు. "ప్రొద్దుట తల తిప్పినట్టుందన్నారు? ఎక్కడికెళ్ళారు? కాస్త విశ్రాంతి తీసుకోవచ్చుగదండీ?'' అంటూ ఆప్యాయంగా మందలించింది శారద. కుబేరయ్య ఫోన్ చేశాడోయ్! మొన్న వడ్డీ తాలూకు లెక్క పొరపాటుగా చూశాడట. శత్రుశేషంలాగా బకాయి శేషం మిగిలిందని లెక్క చూపించాడు. ఏమంటాం?'' "అదేమిటి? మీరు లెక్క చూసే ఇచ్చారు కదా?'' "పిచ్చిదానా! మన లెక్క వడ్డీ లెక్క. అది చక్రవడ్డీ లెక్కట" "ఏం లెక్కలో ఆ స్థలం అమ్మినా చిక్కులు తొలగలేదన్న మాట. పోన్లెండి. నిండా మునిగాక చలేమిటి? ఇద్దాం పోయేది పోక తప్పదుగా? ఆపగలమా?'' "ఆపలేము గదాని ఓపగలమా? బాధపడతాం మరి. సరేలే. ఈ కవరు తీసుకెళ్ళి అమ్మాయికివ్వు. ఏదైనా అర్జెంటేమో చూసుకుంటుంది'' "ఎంత అర్జెంటైనా తనిప్పుడు చూడదులెండి. వేలకి మనకింత వండి వార్చాలని వంటగదిలో తంటాలు పడుతోంది'' "ఆ పిల్లతో వంట చేయిస్తున్నాం ... పాపం కాలం కాటేసినా వెరవక కర్తవ్యాన్ని నెత్తికెత్తుటుంది పిచ్చితల్లి. ఏమిటో ... తనకు మనం ఋణపడిపోతున్నాం కదూ?'' "ఏమోలే ... అంతా ఆ పైవాడి లీల ...'' "పైవాడి లీలేనా? ... పైకెళ్ళినవాడి లీలగదూ?'' అంటూనే కళ్ళనుండి త్రుళ్ళివచ్చే గంగమ్మను కొంగుతో ఆపుకుంది. "సరే ... సరేలే ... ఏడవకు ... ఏడ్చి మరింత నీరసపడటం తప్ప ... ఏం లాభం? అదిసరే ... ఇప్పుడింకో సమస్య వచ్చిందోయ్ ... ఆ ఇళ్ళ బ్రోకర్ని కలిశాను. మనం కక్కుర్తిగా అమ్ముకుంటున్నామనో ఏమో ... సగానికి సగం రేటు అడుగుతున్నాడు'' దిగులు పడుతూ చెప్పారు. "ఎద్దు పుండు కాకికి ముద్దనీ ... సహజం. మన కష్టాలు మనవీ వాళ్ళ వ్యాపారం వాళ్ళదీనూ. మొన్న ఆ స్థలం కూడా ఇందుకే అంట తక్కువకి పోయింది. పోతుంది మరి అసలిదంతా ఎందుకు? నేనొక మాట చెప్పనా? ఎలాగూ మన ప్రసంనకి మనం సగం వాటా ఇద్దామని అనుకున్నాం గదా? సగానికి సగం జేసి ఎవరో బ్రోకరుకి ఇచ్చేకంటే ... అసలీ ఇల్లు అమ్మాయికే రాసేస్తే మంచిదిగదా? వృధాకా పోలేదని మనక్కూడా తృప్తిగా వుంటుంది గదా?'' "ఏంటి నీ ఔదార్యం శారదా? మనం బతకోద్డా?'' "మనం బతకటానికి మీ పెన్షనుంది? గదండీ? అయినా ఇంకెన్నాళ్ళు బతుకుతామని?'' "చచ్చేదాకా బతకాలిగా? చెట్టుకింద వుందామా?'' "అదేనా మీభయం? మా అమ్మ ఆస్తిగా మా పుట్టింటివాళ్ళు నాకొక ఇల్లు ఇచ్చారుగా?'' "అది వృద్ధాశ్రమానికి ఇచ్చేడ్డామనుకున్నాంగా?'' "మనమూ వృద్దులమేగదండీ? అక్కడే వుందాం. మన తర్వాత అది వృద్దాశ్రమంగానే వుండిపోతుంది. సరేనా?'' "ఏమిటో నీ ధోరణి నీది. నువ్వెప్పుడు నా మాట విన్నావ్? శక్తికి మించి అప్పులు చేయించావ్ ... ఇప్పుడు చూడు'' "దెప్పుతున్నారా? చెట్టంత కొడుకు చేజారి పోతాడని నేనేం కలగన్నానా? వాడే బతుకుంటే మనకీ ఖర్మ పట్టేదా?'' అంటూ కట్టలు తెన్చుకుంటున్న దుఃఖాన్ని కట్టడి చేసుకుంది శారద. "అమ్మా కాఫీ తీసుకోండి'' అంటూ తెచ్చింది ప్రసన్న. "తీసుకుందాంలేమ్మా! అక్కడ పెట్టు. ఇదిగో నీకేదో ఉత్తరం వచ్చింది చూడు'' అంటూ కవరు ఇచ్చింది శారద. ప్రసన్న కవరందుకుని చదివి ఆపాదమస్తకం కంపించి పోవటం చూసి శారద లేచి ప్రసన్నని పొదవి పట్టుకుంటూ "ఏమైందమ్మా పిచ్చితల్లీ!'' అంటూ కూర్చోబెట్టింది. ప్రసన్న భగవంతుడా'' అంటూ శూన్యానికి నమస్కరించింది. ఆనందం, దుఃఖం కృతజ్ఞత అన్నీ కలగాపులగంగా కలిసి ప్రసన్న మనసులో సుడులు తిరుగుతుంటే నయనాలు నయాగారాకు నెలవులయ్యాయి. "ఎందుకమ్మా పిచ్చితల్లీ! ఇంతకంటే కష్టం ఇంకేం వస్తుందని? ఎదవకమ్మా!'' అంటూ శారద అక్కున చేర్చుకుంది. "అమ్మా! కష్టం కాదమ్మా దేవుడు కరుణించాడు. మనకో దారి దొరికింది. నాకు ఉద్యోగ మొచ్చిందమ్మా! ఇదంతా తనకు ముందే తెలిసినట్టు ఆయన బలవంతంగా నాతొ అప్లై చేయించారు. వెంటపెట్టుకుని ఇంటర్వ్యూకి కూడా తీసుకెళ్ళారు ... కానీ ... ఏరీ? ... నా ఉద్యోగం ... చూడకుండానే ... భగవంతుడా ...'' అంటూ కుమిలి కుమిలి ఏడ్చింది ప్రసన్న. కొన్ని క్షణాలు భయంకర నిశ్శబ్దం ఆవహించింది. అందరి ఆవేదనా తరంగాలు వినీలాకాశంలో విలీనమయ్యాక, "పోన్లే తల్లీ! కీడులో మేలంటే ఇదేనమ్మా! వాడు పోతూ నీకో దారి చూపించి పోయాడు ... సరే ... లేమ్మా ... లే'' అంటూ ఆప్యాయంగా తల నిమిరింది శారద. ప్రసన్న లేచి కళ్ళుతుడుచుకుంటూ "నాన్నగారూ! స్నానానికి నీళ్ళు తొరుపుతాను రండి'' అంది. "అమ్మా! నన్నలా పిలవకు తల్లీ! ఆ పిలుపుని దేవుడు పిలుచుకు పోయాడు. అమ్మా నాన్నా అని పిలిపించుకునే అదృష్టం మాకు లేదమ్మా!'' అన్నారు మాష్టారు. "అదృష్టమైతే అది నాకూ లేదుగా నాన్నగారూ! అసలు అదృష్టమే మన బంధుత్వమేమో!' 'అంది ప్రసన్న. "అంతేనేమోలే తల్లీ! ఆయనేదో అనేశార్లే ... బాధపడకు. ఏమండీ! పాపం తనేది ఆప్యాయంగా పిలుస్తుంది. అలాగే ... పిలవనిద్దాం. అయిన ఇంకెన్నాళ్ళు\లెండి. వాళ్ళ అమ్మానాన్నా వచ్చి తీసుకెళ్ళే వరుకునేగా అంటూ నిట్టూర్చింది శారద. ఇంతలో మాష్టాలు జేబులో సెల్ ఫోన్ రింగయింది. "హలో? ఎవరండీ? ఆ ... ఆ ... నేనే ... నమస్కారం, మీరూ? ఓహో ... ఆఆ ... అలాగే ... సరే ... రండి. ఆ .... నమస్కారం'' ఫోన్ ఆపేశారు మాష్టారు. "అమ్మా! ప్రసన్నా! మీ అమ్మా, నాన్నా, ఎవరో పట్టయ్యగారట వారూ బయల్దేరుతున్నారట. మధ్యాహ్నానికి వచ్చేస్తారు. చూశావా శారదా! నువ్విప్పుడే అంటున్నావా? తథాస్తు దేవతలు పలికినట్టు వారు ఫోన్ చేశారు. లేవండి. ఆ వచ్చేవారికి మర్యాదలు, ఆ ఏర్పాట్లేవో చూడండి''"నాన్నగారూ! మీరు నన్ను పంపించేయ్యాలనే అనుకుంటున్నారా?'' అంది దీనంగా ప్రసన్న. మాష్టారు గంభీరంగా "మేము అనుకోక పోయినా తప్పదుగదమ్మా? మనం కోరినట్టు జరుగుతుందా చెప్పు? ఇదంతా మనం కోరుకున్నామా?'' అన్నారు. "నువ్వంటే మాకు ప్రేమేగాని ద్వేషం లేదమ్మా! నిన్ను ఎప్పుడైనా కోడలిగా చూశామా?'' నిట్టూర్చింది శారద. "కోడిలిలా కాదు. కూతురులా చూసుకున్నారు, అది నాకూ తెలుసమ్మా! మరి ఇప్పుడెందుకు నన్ను పరాయిని చేసి పంపించేయ్యాలనుకుంటున్నారు?'' అడిగింది ప్రసన్న. "పిచ్చితల్లీ! భర్తపోయిన పిల్ల తల్లిదండ్రుల దగ్గరనే వుండాలమ్మా! పుట్టి పెరిగిన వాతావరణంలో వుంటేనే నీకూ కాస్త మనశ్శాంతిగా వుంటుంది'' చెప్పింది శారద. "నాకు సరేనమ్మా! మరి మీకు మనశ్శాంతి ఎలా?'' "మాదేముందమ్మా! పండుటాకులం. ఆ దేవుడి మీదే భారం వేసి అలాగే నేట్టేస్తాం'' అన్నారు మాష్టారు. "అయితే నాన్నగారూ! మీరు దేవుడిమీద భారంవేసి వున్నట్టే నీనూ మీమీద భారం వేసి ఇక్కడే వుంటాను'' "తప్పమ్మా! నీకు తెలీదు. ఆ మాయదారి యాక్సిడెంట్ లో వాడు పోకపోతే నిన్ను మేము వదులుకుంటామా చెప్పు? విధికి ఎదురు పోగాలమా> పెద్దవాళ్ళం నువ్వు మా మాట వినాలి'' నచ్చజెప్ప చూసింది శారద. "క్షమించండమ్మా! మీరు నామాటే వినేవరకూ నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను'' అంటూ ఏడుస్తూ లోనికెళ్ళింది ప్రసన్న. దిగ్భ్రాంతి చెందటం పెద్దవాళ్ళ వంతు అయింది. "ఏమిటీ పిచ్చిపిల్ల శారదా? అసలు తనేమంటుందో తనకి తెలుస్తుందా?వెళ్ళు ... నెమ్మదిగా నచ్చజెప్పు'' "చెబుదాం లెండి. ఇప్పుడైతే మరీ ఏడుస్తుంది. వాళ్ళ అమ్మనీ నాన్ననీ చూశాక తనే దారికొస్తుందిలెండి'' మధ్యాహ్నమయింది .... ప్రసన్న తండ్రి రాజారావు, తల్లి పద్మజ, ప్రసిడెంటు పట్టయ్యగారూ ఆటో దిగి వాకిట్లోకి వచ్చేశారు. "నమస్కారం బావగారూ! రండి'' అంటూ ఇంట్లోకి ఆహ్వానించారు మాష్టారు. "నన్ను అలా పిలవకండి. మాకిక్కడ ఏం బంధుత్వాలూ అక్కర్లేదు'' రుసరుసలాడాడు రాజారావు. "పంచాయితీ ప్రసిడెంటుగా నాకు పక్షవాతం తగదు. దయచేసి అందరూ సంయమనం పాటించండి. సమస్యలుంటే సామరస్య పూర్వకంగా చర్చింది పరిష్కరించుకుందాం'' అంటూ పట్టయ్యగారు అందర్నీ వరండాలోనే కూర్చోబెట్టారు. "నమస్కారం వదినగారూ!'' అంటూ శారద వచ్చింది. "నమస్కారం వదినమ్మా!'' అంటూ పద్మజ లేచి నిలబడింది. "మగవాళ్ళు కూర్చుంటార్లెండి మీరు ఇంట్లోకి రండి'' అంది శారద. "పద్మజా! నీకు ప్రత్యేకంగా చెప్పాలా? అమ్మాయిని రమ్మను. బయల్దేరదాం'' హుకుం జారీ చేశాడు రాజారావు నిరంకుశం ప్రదర్శిస్తూ. పద్మజ చతికిల బడింది. "పంచాయితీ ప్రసిడెంటుగా నాకు పక్షపాతం తగదు. మీరు కాస్త శాంతించాలి. ఎంతైనా మీరు పిల్లనిచ్చినవారు. వారు పుచ్చుకున్న వారున్నూ'' అన్నాఋ పట్టయ్యగారు. "మేం పిల్లనివ్వలేదండీ! వాళ్ళు లాక్కున్నారు. దాని బతుకు బండలు చేశారు. అప్పుడు కొడుకేమో నా ఆస్తిమీద కన్నేశాడు. ఇప్పుడు తండ్రేమో ఆధారాలన్నీ కమ్మేసి ఆత్మరక్షణ చేసుకుంటున్నాడు. ఎవరికి తెలీదని?'' "అయ్యా! గొర్రె పోయిందీ జాతర జరిగిపోయిందీ అన్నట్టుగా ఇప్పుడదంతా వద్దు'' అన్నారు పట్టయ్యగారు. "అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకర్థం గావటం లేదు'' అంటూ ఆశ్చర్యంగా అన్నారు మాష్టారు. "మాష్టారూ! ఆయనేదో బాధకొద్దీ అన్నార్లెండి. మీరు ఈ మధ్య స్థలాలేవో అమ్మేశారటగదా? ఏది ఏమైనా వారికి మీ ఆస్తిమీద ఆశలేదులెండి'' "స్థలాలు ఎన్నో కాదండీ! ఒక్కటే అమ్మాను. అది నా స్వార్జితం. పిత్రార్జితం కాదు. వాడి చదువుల కోసం చేసిన అప్పులు తీర్చటం నా బాధ్యతా గదండీ? తీర్చేశాను.ఆ దేవుడు మాకు అన్యాయం చేసినా మేము న్యాయమే చేస్తాం. మాకు వున్నదాంట్లో సగం వాటా ప్రసన్నకిచ్చి పంపుదామని అనుకుంటున్నాం. మీరు అడక్కపోయినా సరే'' "చూశారా ప్రెసిడెంటుగారూ? తెలివితేటలండీ! ఎక్కడిదక్కడ చక్కబెట్టేసి తక్కిన గోచిపాతలో సగం చించి ఇస్తారట. మీ ముష్టికోసం మేము రాలేదు'' అవహేళనగా అన్నాడు రాజారావు. "అది కాదండీ ...'' ఏదో చెప్పబోయారు మాష్టారు. "మీరు ఆగండి నాన్నగారూ! నేను మాట్లాడతాను'' అంటూ బయటికి వచ్చింది ప్రసన్న. పట్టయ్యగారు గతుక్కుమన్నారు. "కొంపదీసి మతిపోలేదుగదా? మామగార్ని నాన్నగారంటుందేం?'' అనుకుంటూ వింతగా చూశారు పట్టయ్యగారు. బిడ్డను చూడగానే పద్మజ బావురుమంటూ లేచి కౌగిలించుకుంది. వాతావరణం రంగుమారింది. దుఃఖాలూ, ఓదార్పులూ కొంతసేపు రాజ్యమేలాయి. గృహరాజకీయ సభ సంతరించుకున్న గాంభీర్యాన్ని ఛేదిస్తూ ప్రసన్న గొంతు విప్పింది. "అమ్మా! మీకు నామీద ప్రేమ వుంటుంది. అది సహజం. నన్ను చూడాలనుకుంటే మీరు ఎప్పుడైనా రావచ్చు. ఇక్కడ ఎవరికీ అభ్యంతరం లేదు. అంతేగాని మేము పుట్టెడు దుఃఖంలో వున్నప్పుడు మీరేదో దండయాత్రలా వచ్చి వాటాలనీ, పంపకాలనీ ఇక్కడ గొడవ చేయటం మంచిపని కాదు. నన్నిలా బతకనివ్వండి ప్లీజ్'' అంటూ చేతులు జోడించింది. "అంటే ఏంటమ్మా నీ వుద్దేశ్యం? నువ్వు మా బిడ్డవి కావా? ఏదో పరాయిదానిలా మాట్లాడ్తున్నావ్? అప్పుడు మేము నీ ప్రేమని కాదన్నామని ఇప్పుడు కక్ష సాధిస్తున్నావా?'' అంది గద్గద స్వరంతో పద్మజ. "అమ్మా! నేను తల్లిదండ్రుల్ని ద్వేషించేటంత సంస్కార హీనురాలిని కాను. మీ మాటల ధోరణి మారాలంటున్నాను'' "ఎందుకమ్మా ఈ మాటలన్నీ? మరి బయల్దేరాదామా?'' అంటూ పట్టయ్యగారు కల్పించుకున్నారు.. "పెళ్ళికి రాలేకపోయినా చావుకొచ్చారు. భోజనాలు చేసి బయల్దేరండి'' అంది ప్రసన్న. "ఏమిటమ్మా నీ మాటలు? బట్టలు సర్దుకో బయల్దేరదాం'' "నేనెక్కడికీ రాను.దయచేసి నన్ను బాధ పెట్టకండి'' "అలా అనకూడదమ్మా! భర్తపోయిన తర్వాత పుట్టింటికి రానంటే ఎలా? పోనీ ఓ బిడ్డో పాపో వుంటే ...'' అన్నారు పట్టయ్యగారు. "ఉన్నారు తాతయ్యా! నాకు బిడ్డా పాపా వున్నారు. ఇదిగో వీళ్ళే ఈ అమ్మ మా అత్తయ్య, కాని ఈమెలో నాకెప్పుడూ అత్త కన్పించలేదు. అమ్మే కన్పించింది. ఈయన మా మామగారు. మామయ్యలో అయ్యానే చూపిస్తూ మామను మరుగున పరిచిన మహా మనిషి. వీళ్ళెంత సంస్కారులంటే, పెళ్ళై నెల తిరగకుండానే కొడుకు చనిపోతే ... ఈ పాపిష్టిది పాదంపెట్టి నా కొడుకును మింగేసింది అనకుండా నువ్వు దురదృష్టవంతురాలివే నా తల్లీ అని అక్కున చేర్చుకున్న ఆడర్శనీయులు. అటువంటి దేవతల్ని, నా బిడ్డల్ని అవమానిస్తారా?'' నిలదీసింది ప్రసన్న. "చూశారా ప్రసిడెంటుగారూ! మా అమ్మాయితో ఎలాంటి చిలకపలుకులు పలికిస్తున్నారో చూశారా?'' అన్నాడు రాజారావు. "నాన్న! నేనింత చెబుతున్నా అర్థం కాలేదా? ఇంకెప్పుడూ అలా మాట్లాడకండి''అంది ప్రసన్న నిరసనగా. "ఇంకెలా మాట్లాడుతారే పాపిష్టిదానా! ఇన్నాళ్ళూ నువ్వు పుట్టింటి దిక్కులేని దానివనీ, మాకు తప్పదనీ బాధను దిగమింగి నిన్ను ఒక్కమాట కూడా అనలేకపోయాం. ఇప్పుడంటున్నా. నీ పాపిష్టి పాదం పెట్టి మా కొంపని పాడుబెట్టావ్. చాలు మా మీద నువ్వేమీ ప్రేమ ఒలకబోయనక్కర్లేదు. ఉద్యోగాలుచేసి మమ్మల్నేమీ ఉద్ధరించనక్కర్లేదు. వెళ్ళిపో. నీకు దణ్ణం పెడతాం. మమ్మల్నిలా వదిలేయ్యవే తల్లీ'' అంటూ శారద కర్కశంగా మాట్లాడింది. "మాట్లాడేది మా శారదేనా?'' అన్నట్టు ఆశ్చర్యపోయారు మాష్టారు. "మీరెవరమ్మా నన్ను పొమ్మనటానికి? మీరు రమ్మంటే వచ్చానా? పొమ్మంటే పోతానా? మీరెవరూ మా పెళ్ళికి ఒప్పుకోకపోతే, నా బలవంతం మీద మేము పోలీసుల్ని ఆశ్రయించి పెళ్ళాడాం. అసలు మా ప్రేమగురించి మీకేం తెలుసు? నన్ను ప్రేమించూ, నన్ను ప్రేమించో అని యాసిడ్ బాటిల్ పట్టుకుని వెంటపడే అబ్బాయిలున్న ఈ రోజుల్లో, నేను ప్రేమిస్తున్నాను మహాప్రభో అంటూ నేను ఆయన వెంటపడితే 'ప్రసన్నా! నేను నీకు తగను, నాకీ చదువు తప్ప వేరే ఆస్తేమీ లేదు, నాకష్టాలను నీకు రుద్డలేను, దయచేసి అర్థం చేసుకో' అంటూ దూరంగా జరగటానికి ప్రయత్నించారు తప్ప, నా అందానికో, ఆస్తికో ఆయన విలువీయలేదు. అదీ ప్రేమంటే. అందుకే నాకు నచ్చారు. నేనే వెంటపడి మరీ ఆయన్ని పెళ్లిచేసుకున్నాను. తన చివరి క్షణం వరకూ నా క్షేమాన్నే కోరిన దేవుడు నా భర్త, ఇది నా భర్త ఇల్లు. మీరాయన తల్లిదండ్రులు. నాది నిజంగా ప్రేమే అయితే ఆయన సుఖాలే కాదు, ఆయన కష్టాలూ, బాధ్యతలూ కూడా నావే, ఆయనకు బడులుగానేను మీకు కూతుర్నై మిమ్మల్ని చూసుకోవాలి. ఆయన లేని లోటు తీర్చాలి. మీకిష్టం లేదంటే నన్ను చంపెయ్యండి.... చంపెయ్యండి ... '' అంటూ స్పృహతప్పి పడిపోయింది ప్రసన్న. అందరూ ఉపచారాలు చేశారు. లేచింది ... "అమ్మా!'' అంటూ శారదను కౌగిలించుకుంది. "పిచ్చితల్లి! అలా మాట్లాడితే వెళ్ళిపోతావనీ, నువ్వైనా సుఖపడ్తావనీ అన్నానమ్మా పాపిష్టిదాన్ని. చనిపోయిన వాడు నీ భర్త. నువ్వుమాత్రం మా బిడ్డవే తల్లీ'' అంది శారద. ఇదిగదా "ప్రేమకు చిరునామా?'' అన్నారందరూ.         ..... శుభం .....

నాకున్నది ఒక చక్కని బొమ్మ

నాకున్నది ఒక చక్కని బొమ్మ - ఎపిసోడ్- 3 - వసుంధర     వద్దు. మా ఇంట్లో ఒప్పుకోరు. చీకటి పడ్డాక మా అమ్మ ఎవరింటికీ వెళ్ళనివ్వదు" అన్నాను.     శంకరం దీనంగా "పోనీలే మా ఇంటికి రావద్దు. నా జట్టు పచ్చి మాత్రం అయిపోకేం?" అన్నాడు.     వాడి జట్టుపచ్చి అయిపోవాలనే వుంది నాకు. కానీ వాడి ముఖం చూస్తే జాలివేసి ఆమాట అనలేదు. "అవునులే" అని కూడా అన్నాను.     "నీ అమెరికా బొమ్మ వచ్చేక నాకు చూపిస్తావా ?" అనడిగాడు శంకరం.     "తప్పకుండా చూపిస్తాను" అన్నాను.     "ఎక్కడ చూపిస్తావు? మా ఇంటికి తీసుకొచ్చి చూపిస్తావా? మీ ఇంటికి నన్ను పిలిచి చూపిస్తావా?" అనడిగాడు శంకరం.     ఏం జవాబు చెప్పాలో తోచలేదు. వాళ్ళింటికి వెళ్ళడానికి అమ్మ ఒప్పుకోదు. ఇంటికి పిలుద్దామంటే శంకరం వేషం అసహ్యంగా వుంటుంది. అమ్మ అలాంటి వాళ్ళను ఇంటికి రానివ్వదు.     "ఆలోచిస్తున్నావు కదూ? నీ బాధ నాకు తెలుసులే. నువ్వు నన్ను మీ ఇంటికి పిలు. ఆరోజు నేను వస్తాను. నన్నుచూసి మీ అమ్మ తిట్టదు. ఆరోజు స్నానంచేసి శుభ్రంగా వళ్ళు రుద్దుకోవడం కోసం ఓ చిన్న సబ్బు ముక్క దాచుకున్నాను. మంచి బట్టలు ఒక్కరోజుకు అద్దెకిస్తానని ఓ లాండ్రివాడు అన్నాడు. నువ్వేమీ కంగారు పడకు. నీ మర్యాద నిలబెడతాను. నువ్వు మాత్రం నీ అమెరికా బొమ్మను చూడ్డానికి నన్ను పిలవాలి...." అన్నాడు శంకరం.     నేను ఆశ్చర్యపోతూ "సబ్బుముక్క దాచుకోవడం ఏమిటి? రోజూ సబ్బు వాడుకోరా మీరు? సబ్బు లేకుండా స్నానం చేస్తే వళ్ళువాసనపోతుందా?" అన్నాను.         శంకరం దిగులుగా "సబ్బు కొనాలంటే రెండు రూపాయలవుతుందిట. ఆ డబ్బు పెడితే ఓరోజుకు సరిపడ బియ్యం వస్తాయట. అసలు నన్ను చదివించడం నాన్నకు ఇష్టం లేదు. అమ్మ పట్టుబట్టి నన్ను చదివిస్తోంది. నేను చదువుకుని గొప్పవాడినయి అమ్మ కోసం ఓ మేడ, కారు కొంటాను. అంతవరకూ  సబ్బు కొనుక్కోవడం  కుదరదు. ఎప్పుడయినా ఎవరింట్లోనయినా అడిగి అమ్మ సబ్బు ముక్కలు తెస్తే వాటిని పండగల కోసం మేము దాచుకుంటాం" అన్నాడు.     శంకరం గురించి వింటే నాకు మనసు బాధగా అయిపోయింది. పేదవాళ్ళ గురించి నాకాట్టే తెలియదు. ఇప్పటికే నాకేదోలా వుంది. అందువల్ల నేను "నిన్ను తప్పకుండా బొమ్మను చూడ్డానికి పిలుస్తానులే!" అన్నాను.     "వచ్చినవెంటనే పిలవాలి" అన్నాడు శంకరం.     అలాగే అన్నాను. కానీ నామాట నిలబెట్టుకోలేనని అప్పుడు నాకు తెలియదు.     బడికి సరిగ్గా రేపు శలవులిస్తారనగా వచ్చాడు అమెరికా బాబాయి. వచ్చిన రోజున నన్నోసారి పిలిచి ముద్దులాడేసి తర్వాత పెద్దవాళ్ళతో కబుర్లలో పడిపోయాడు. నా బొమ్మ గురించి ఒక్క ముక్క కూడా చెప్పలేదు.     కిష్టిగాడు చెప్పింది నిజమేనా అనిపించింది.     మర్నాడు బడికి వెళ్ళేటప్పుడువాడు నన్ను అడిగేశాడు. "మీ బాబాయి వచ్చాడు కదా బొమ్మ తెచ్చాడా?" అని.     "తెచ్చాడు. కానీ రేపు ఇస్తాట్ట" అని అబద్ధం చెప్పాను.     ఆరోజు క్లాసులో కూడా నిరుత్సాహంగా వున్నాను. మా అమెరికా బాబాయి వచ్చినట్లు కిష్టిగాడు క్లాసులో అందరికి చెప్పేశాడు. అంతా నా దగ్గరకు వచ్చి బొమ్మ గురించి అడగసాగారు. అందరికీ కూడా కిష్టిగాడికి చెప్పినట్లే చెప్పేశాను.     ఆఖరున శంకరం నాదగ్గరకు వచ్చి "మీ బాబాయి వచ్చేట్టకదా బొమ్మ గురించి నన్ను పిలవకూడదనుకున్నావా?" అన్నాడు.     శంకరానికి అబద్ధం చెప్పాలనిపించలేదు. అందుకని నెమ్మదిగా "బాబాయి బొమ్మను తెచ్చినట్లు లేదు. మరి నాకింత వరకూ చూపించలేదు. దాని గురించి మాట్లాడలేదు. ఈ సంగతి ఎవరికీ చెప్పలేదు. నీ ఒక్కడికే చెప్పాను. నువ్వు కూడా ఎవరికీ చెప్పకు. మిగతా వాళ్ళంతా నన్ను వేళాకోళం చేస్తారు" అన్నాను.     శంకరానికి చాలా సంతోషం కలిగింది "ఎవ్వరికీ చెప్పను నిన్నెవరూ వేళాకోళం చేయకూడదు" అన్నాడు.     ఇదే కిష్టిగాడయితే అందరికీ చెప్పి నన్ను ఏడిపించేవాడు.     "నువ్వు చాలా మంచివాడివి" అన్నాను.     "పేదవాళ్ళు మంచిగానే వుండాలిట" అన్నాడు శంకరం.     "ఎందుకని?" అనడిగాను.     "నువ్వు నన్నేడిపించావనుకో- అప్పుడు నేను మాష్టారుకి చెప్పాననుకో ఆయన నన్నే తిడతారు. నేను నిన్నేడిపించాననుకో అప్పుడు నువ్వు మాష్టారుకి చెప్పావనుకో- ఆయన మళ్ళీ నన్నే తిడతారు. ఎందుకంటే నేను పేదవాళ్ళు వున్నవాళ్ళని గౌరవించక్కర్లేదు" అన్నాను.     "నువ్వు చెప్పిందీ నిజమే! కానీ అమ్మ చెప్పిందీ -వున్న వాళ్ళందరూ పెద్దవాళ్ళట. లేనివాళ్ళంతా చిన్నవాళ్ళట. మనుషుల పెద్దరికాన్ని వయస్సుతో కాక డబ్బుతో కొలవాలిట" అన్నాడు శంకరం.     "ఏమో నేను నమ్మలేను" అన్నాను.     "పోనీ ఓ ఉదాహరణ చెబుతాను. మీ ఇంట్లో పనిమనిషి వుందా అన్నాడు శంకరం.     "వుంది" అన్నాను నేను.     "అది మీ అమ్మ కంటే పెద్దదా, చిన్నదా?"     "చాలా పెద్దది" అన్నాను.     "మరి మీ అమ్మ దాన్ని గౌరవిస్తుందా? అనడిగాడు శంకరం.     "బాగుంది. ఎవరైనా పనిమనుషుల్ని గౌరవిస్తారా?" అన్నాను మామూలుగా.     "చూశావా. నువ్వే ఎలాగనేశావో దానికి డబ్బు లేకపోవడం తప్ప అది మాత్రం మనిషి కాదా?" అన్నాడు శంకరం.     "అరే!" అనుకున్నాను నేను శంకరం నిజమే చెప్పాడు. పెద్దవాళ్ళని చిన్నవాళ్ళు గౌరవించడంకాదు. వున్నవాళ్ళని లేనివాళ్ళు గౌరవించాలి. ఈ విషయం ఇన్నాళ్ళూ నాకు తెలియలేదు. అయితే కిష్టిగాడి విషయం పట్టాలి. వాళ్ళమ్మ అస్తమానం అంటూ వుంటుంది "మీకేమమ్మా, మా కంటే జీతమూ ఎక్కువ. స్వంత ఇల్లు వుంది. పొలాల మీంచి పంట వస్తుంది. మాకు జీతంరాళ్ళు ఒక్కటే ఆధారం" అని.     నాకు చాలా ఉత్సాహం వచ్చింది. "శంకరం నువ్వు చాలా మంచివాడివి. నాకు చాలా మంచి విశేషం చెప్పావు" అన్నాను.     "నేనేం చెప్పాను? వున్న మాట చెప్పాను. అంతేకదా !" అన్నాడు వాడు.     "ఏదో ఒకటి. చాలా మంచిమాట అన్నాను. అందుకని నీకు ఏం చేయను?" అని ఓ క్షణం ఆలోచించి "నీకు కూడా ఎవరినైనా ఏడిపించాలని వుంటుందా?' అని అడిగాను.     "ఎందుకుండదూ? వుంటుంది. కానీ ధైర్యం చాలదు."     "అయితే ఓ పని చేయి. నువ్వు నన్ను ఏడిపించు. నేను ఏమీ అనుకోను. మేష్టారికి చెప్పను" అన్నాను.     శంకరం కళ్ళు మెరిశాయి. "నువ్వు అడిగినా సరే నేను నిన్ను ఏడిపించను. ఎందుకంటే నువ్వు మంచిదానివి. అందుకని నువ్వంటే నాకు ఇష్టం" అన్నాడు.     నేను ఇంక శంకరంతో మాట్లాడలేదు. నా దృష్టి అంతా కిష్టిగాడి మీదే వుంది. సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు వాడితో అనేశాను. "ఒరేయ్ కిష్టీ! ఇంకెప్పుడూ నువ్వు నన్ను ఎదిరించడానికి వీల్లేదు. నువ్వు లేనివాడివి. నేను వున్నదాన్ని. నువ్వు నన్ను గౌరవించాలి."     నేనేం అంటున్నానో కిష్టిగాడికి అర్ధంకాలేదు. వాడికి ఉదాహరణతో సహా వివరించి చెప్పేసరికి ఏడుపు మొహం పెట్టేశాడు. వాడి మొహం చూస్తే నాకు జాలి కూడా వేసింది. అయినా సరే కిష్టిగాడి లాంటి వాళ్ళ మీద జాలిపడకూడదని ఊరుకున్నాను.     నేను ఇంటికి వెళ్ళాను. అప్పటికి బాబాయి ఇంట్లో లేడు. ఊళ్ళో ఎవరో తెలిసిన వాళ్ళింటికి వెళ్లేడుట.     నాకు మాత్రం చాలా ఉత్సాహంగా వుంది. కిష్టిగాడి మీద దెబ్బతీయ గలిగాను గదా. ఇంక వాడు జన్మలో నా జోలికి రాడు.     అయితే నా ఆనందం ఎంతోసేపు నిలబడలేదు.     కిష్టిగాడి అమ్మ మా ఇంటికి వచ్చింది. అమ్మతో పెద్ద దెబ్బలాట వేసుకుంది.     "మేము లేచి వాళ్ళమని ఎందుకు అనాలి?" అంటుందావిడ.     "నేనెప్పుడన్నాను?" అంటోంది అమ్మ.     అమ్మకు గొడవేమిటో అర్ధం కావడంలేదు కానీ నాకు అర్ధమైపోయింది.     "మీరు అనకపోతే మీ అమ్మాయికి అంత పెద్ద విషయాలు ఎలా తెలుస్తాయి?" అందావిడ.         ఇంక లాభంలేదని అప్పుడు నేను కలగజేసు కున్నాను.     "ఆంటీ నా మాట వింటావా?" అన్నాను.     పిన్నీ అంటే గొడవ వస్తోందని ఆవిడని ఆంటీ అని పిలవడ మొదలుపెట్టాను. ఈ ఉపాయం నాన్నగారే చెప్పారు. పెద్దా, చిన్నా తేల్చకుండా వుండడానికీ. వావీ వరసా తెలియనివ్వక పోడానికీ ఇంగ్లీషు భాష చాలా మంచిదట. ఆంటీ అంటే పిన్ని కావచ్చు. దొడ్డ కావచ్చు. అత్త కావచ్చు.     ఆవిడ నా వంక చిరాగ్గా చూసి "నీ మాట ఏమిటే?" అంది.     "పాపం ఇందులో అమ్మకు ఏమీ తెలియదు. నువ్వు చాలాసార్లు అమ్మతో అన్నావు కదా- మీరు లేనివాళ్ళని అదే కిష్టిగాడికి చెప్పాను. నువ్వు అన్నమాటలే నేను వాడికి చెప్పాను. అమ్మ నాకేం చెప్పలేదు" అన్నాను.     "మేము లేని వాళ్ళమయితే మాత్రం మా అబ్బాయి నీకు సలాం కొట్టాలా? మేము మీ దగ్గరేమైనా డబ్బు తీసుకుంటున్నామా? ఆడుకుంటున్నామా? మీకు వున్నది మీకు వుంటుంది. మాకు వున్నది మాకు వుంటుంది" అంటూ ఆవిడ చాలా కోపంగా నన్ను కసిరింది.     ఆవిడిని ఎప్పుడూ అంత కోపంగా చూడలేదు నేను. అందుకని నాకు భయం వేసింది. కళ్ళలో నీళ్ళు కూడా తిరిగాయి.     అమ్మ మాత్రం వెంటనే "ఒక్క నిమిషం ఆగండి శాంతగారూ! జరిగింది ఏమిటో నన్ను తెలుసుకోనివ్వండి!" అంది.     అమ్మ, ఆవిడ వరసలు మానేసి పేర్లతో పిల్చుకోవడం ప్రారంభించి కూడా చాలా రోజులైంది.     నేను అమ్మకు ఏం జరిగిందో చెప్పాను.     అమ్మ కోపంగా "ఆవిడకి కోపం రావడంలో తప్పేముందీ? వెంటనే ఆంటీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగు" అంది.     అలా చేయడం నాకు ఇష్టం లేదు. కానీ అలా చేస్తే గొడవ చల్లారిపోతుందేమో అనిపించింది.     అమ్మ చెప్పినట్లే చేశాను. నాకు ఏడుపు కూడా వచ్చేసింది. అప్పుడు ఆంటీ నన్ను దగ్గరగా తీసుకుని "చిన్నపిల్లవు. నీకు ఏం తెలుస్తుందిలే. ఇంక ఎప్పుడూ అలా మాట్లాడకు" అంటూ తన చీర చెంగుతోనా కళ్ళు తుడిచి  "మీ అమ్మాయి ఎలాగైనా బుద్ధిమంతురాలు, మా వాడు చస్తే చెప్పిన పని వెంటనే చెయ్యడు" అని నన్ను మెచ్చుకుంది.     అప్పుడు అమ్మ ఆవిడిని పొగిడేసింది. ఆవిడ అమ్మను పొగిడేసింది. ఇద్దరూ నవ్వుకున్నారు కూడా.     వాళ్ళు ఏమిటో నాకు అర్ధంకాలేదు. నా గొడవ మాత్రం అప్పుడే అయిపోలేదు. సాయంత్రం నాన్నగారు వచ్చేక అమ్మ మళ్ళీ అంతా ఆయనకు చెప్పింది. నాన్నగారు కూడా నేను చెప్పేది వినిపించుకోకుండా నన్ను తిట్టి పోశారు.     నేను మామ్మ దగ్గరకు వెళ్ళాను. మామ్మ జరిగిందంతా విని "నువ్వు చాలా చురుకైన పిల్లవే" అని నన్ను ముద్దులాడింది. మామ్మ మాటలు నాకు సంతోషం కలిగించలేదు. నేను తప్పేమిటీ అని ఆలోచిస్తున్నాను. ఏమీ తెలియడం లేదు. అందువల్ల నిరుత్సాహంగా వున్నాను. ఏమీ తోచక నా గదిలోకి పోయి క్లాసు పుస్తకం తీశాను.     ఏమీ తోచనప్పుడూ, నిరుత్సాహంగా వున్నప్పుడూ క్లాసు పుస్తకం తీసి చదువుతాను. ఎవరూ చెప్పకపోయినా సరే!     బాబాయి ఇంటికి ఎప్పుడు వచ్చాడో నేను గమనించ లేదు. కానీ వున్నట్లు బాబాయి మాటలు వినిపించాయి.     "అమ్మలు ఏదీ? ఎక్కడా హడావుడి కనిపించదేం?" అన్నాడు బాబాయి.     అమ్మ, నాన్న బాబాయికి జరిగింది చెబుతున్నారు.                     (సశేషం)

నాకున్నది ఒక చక్కని బొమ్మ

నాకున్నది ఒక చక్కని బొమ్మ ఎపిసోడ్ - 2 - వసుంధర     బాబాయి అంటే నాన్నగారి తమ్ముడు. అమెరికాలో వున్నాడు. బాబాయికి నేనంటే చాలా ఇష్టం. వచ్చే నెలలో ఇండియా వస్తున్నాడు. వచ్చేటప్పుడు నా కోసం ఓ మంచి బొమ్మ తెస్తున్నానని వ్రాశాడు. ఆ బొమ్మ కోసం నేను కలలు కంటున్నాను.     "ఎందుకని?"     "ఎందుకా? బొమ్మలు చిన్న పిల్లలకేగానీ పెద్ద వాళ్ళకి కాదు. అసలు కిష్టిగాడే పెద్ద. వాడి కంటే చిన్నవాళ్ళకే గానీ పెద్ద వాళ్ళకి బొమ్మలు తేకూడదు" అన్నారు నాన్నగారు.     "అయితే నేను కిష్టిగాడి కంటే చిన్నే" అనేశాను.     "చాల్లెండి మీ వేళాకోళం అంది అమ్మ. కానీ మర్నాడు నాన్న ఇంట్లోనే వున్నా సరే మధ్యాహ్నం భోజనాలు కాగానే కిష్టిగాడి అమ్మను కబుర్లకు పిలిచింది.     వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటుండగా నేను వెళ్ళి కిష్టిగాడిని బ్రతిమలాడాను.     "ఏమిటే గొడవ?" అన్నాడు వాడు.     "మనమిద్దరం బంతాట ఆడుకుందాం. బంతి మా అమ్మ దాచేసింది. నువ్వెళ్ళి అడిగితే ఇస్తుంది" అన్నాను.     "సరే అడుగుతాను" అని వాడు బయలుదేరాడు.     "ఏమని అడుగుతావు?" అన్నాను.     "అవునూ మీ అమ్మను నేనేమని పిలవాలి?" అన్నాడు వాడు.     "పిన్నీ అని పిలు" అని చెప్పాను.     ఏ కళన వున్నాడో వాడు ఇంకేమీ అనకుండా మా అమ్మ దగ్గరకు వెళ్ళి నేను చెప్పినట్లే అడిగాడు.     ఏం జరుగుతుందోనని నేను గుమ్మం పక్కనుండి తొంగిచూస్తున్నాను.     వాడు పిన్నీ అనగానే కిష్టిగాడి అమ్మ వాడివంక కోపంగా చూసి "ఏమిట్రా మధ్యలో వచ్చి అలా పిలుస్తావు?" అని గసిరింది.     అమ్మ మాత్రం కిష్టిగాడిని దగ్గరకు తీసుకుని "చిన్నపిల్లల్నలా కసరకూడదు అక్కయ్యగారూ! బాబు చూడండి ఎంత ముద్దొస్తున్నాడో- నీకు ఒక బంతి ఏమిటి? రెండిస్తాను పద" అని లోపలకు తీసుకువెళ్ళి నిజంగానే వాడి చేతిలో రెండు బంతులు పెట్టింది.     నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ రెండో బంతి సరికొత్తది. ఎన్నిసార్లడిగినా అమ్మ నాకివ్వడం లేదు.     ఆరోజు సరదాతీరేలా ఇద్దరం ఆడుకున్నాం.     మర్నాడు కిష్టిగాడు బడిలో ఏడుపు ముఖంతో నా దగ్గరకు వచ్చి "మీ అమ్మను పిన్నీ అంటే తప్పా? నిన్న ఇంటికి వెళ్ళాక మా అమ్మ నన్ను బాగా తిట్టింది" అన్నాడు.     "ఈ పెద్దాళ్ళంతేరా కిష్టీ. ఉత్తిగా అలా తిడుతూంటారు" అని వాడిని ఓదార్చాను కానీ అసలు సంగతి నాకు తెలుసు.     ఆ తర్వాత మా అమ్మ, కిష్టిగాడి అమ్మ ఓ వారం పది రోజులపాటు మాట్లాడుకోలేదు మాలో ఎవరు వచ్చి ఎవర్ని పిన్నీ అని పిలుస్తామని భయపడ్డారో ఏమో మరి !             2     ఆ వేళ మా బాబాయి తేబోయే చక్కని బొమ్మ గురించి కిష్టిగాడికి చెప్పాను.     కిష్టిగాడు వెంటనే "బాబాయిల మాట ఎప్పుడూ నమ్మకు. వాళ్లు మనకు ఏమీ కొనరు, తేరు! అనుభవం మీద చెబుతున్నాను!" అన్నాడు.     "మా బాబాయి అందరి లాంటి వాడు కాదు" అన్నాను.     మీ బాబాయికి పెళ్ళయిందా ?" అడిగాడు కిష్టిగాడు.     "లేదు" అన్నాను.     "అయితే నీకు బొమ్మతెచ్చినట్లే?" అని తీసిపారేశాడు వాడు.     "ఏం?" అన్నాను కంగారుగా.     "పెళ్ళికాని బాబాయిలు ఎప్పుడూ ఆడపిల్లల గురించే ఆలోచిస్తారు. మన గురించి పట్టించుకోరు !" అన్నాడు కిష్టిగాడు.     "నేను ఆడపిల్లనేగా?" అన్నాను.     "ఛీ! నువ్వేమిటీ ? ఆడపిల్లలంటే కాబోయే పెళ్ళాలన్న మాట" అన్నాడు కిష్టిగాడు. పెళ్ళాలు అన్నమాట అనేటప్పుడు వాడికి చాలా సిగ్గువేసింది. విన్నప్పుడు నాకూ సిగ్గేసింది.     ఇద్దరం కాసేపు సిగ్గుతో ఏమీ మాట్లాడుకోలేదు.     "నిజంగా అంతే నంటావా ?" అన్నాను దిగులుగా.     "అనుభవం మీద చెబుతున్నాను. నా మాట నమ్ము. మా బాబాయి వున్నాడా! ఎగ్జిబిషనుకు తీసుకెడతాడు. నేను బెలూన్లు చూస్తుంటే తను అమ్మాయిల జడల్లో పువ్వులు చూస్తుంటాడు. ఎవరయినా ఆడపిల్ల సాయమడిగితే నా సంగతి కూడా మరిచిపోతాడు" అన్నాడు కిష్టిగాడు.     ఈ కిష్టిగాడెప్పుడూ ఇంతే! అన్నీ అపశకునం మాటలు. అందుకని వాడి దగ్గర్నుంచి శంకరం దగ్గరకు వెళ్లాను.     శంకరం చాలా మంచివాడు. క్లాసులో ఫస్టుమార్కులు రావుగానీ శ్రద్ధగా చదువుకుంటాడు. బుద్దిగా వుంటాడు. పాపం! వాళ్ళు పేదవాళ్ళుట ! అందుకని మంచి బట్టలు వేసుకోడు. క్లాసులో వాడితో ఎవ్వరూ సరిగ్గా మాట్లాడరు. ఎవరో ఎందుకూ? నేనూ మాట్లాడను!     ఏమీ తోచనప్పుడూ, ఎవ్వరూ దొరకనప్పుడూ నేను శంకరంతో మాట్లాడుతుంటాను. నేను పలకరిస్తే శంకరం సిగ్గుపడుతుంటాడు.     నేను బాబాయి తెచ్చే బొమ్మ గురించి చెబితే విని ఆనందించేవాడూ, ఆశ్చర్యపడేవాడూ శంకరం ఒక్కడే అనిపించింది. మిగతా వాళ్ళందరూ నిర్లక్ష్యంగా "వచ్చినప్పుడు చూద్దాంలే" అనేసే రకాలు.     శంకరానికి బొమ్మ గురించి చెప్పాను.     "అలాగా ! ఎంచక్కా ఎంత అదృష్టమో!" అన్నాడు శంకరం.     "అదృష్టమేమరి. నా దగ్గరయితే చాలా బొమ్మలు వున్నాయి. కానీ ఆమెరికా బొమ్మ అన్ని బొమ్మల లాంటివి కాదుట" అన్నాను.     "ఏమో అసలు బొమ్మ లెలాగుంటాయో నాకేం తెలుసు? షాపుల్లో చూస్తుంటే అన్నీ బాగానే వున్నాయనిపిస్తుంది" అన్నాడు శంకరం.     "అయ్యో ! నీదగ్గర ఒక్క బొమ్మ కూడా లేదా ?" అన్నాను జాలిగా. నాకు శంకరం మీద చాలా జాలి కలిగింది.     "లేదు. నువ్వు అమెరికా బొమ్మ గురించి చెప్పవూ?" అనడిగాడు శంకరం. వాడికి చాలా కుతూహలంగా వున్నట్లుంది.     "నిలబడినప్పుడు కళ్ళు తెరచుని వుంటుందిట. పడుకోబెడితే కళ్ళు మూస్తుందిట. పడుకుని వుండగా నోట్లోంచి పాలసీసా తీస్తే ఏడుస్తుందిట. దానికి మంచి జుట్టు వున్నదట. ఎలా కావాలంటే అలా దువ్వుకోవచ్చునట. బొమ్మకు వీపుమీద బటను నొక్కితే పెదాలు కదలక పోయిన మాటలు వస్తాయట...." అన్నాను.     "అంటే అచ్చం మనుషులకు లాగే అన్నమాట!" అన్నాడు శంకరం. నిజంగా అప్పుడే ఆ బొమ్మను చూసినంత ఆనందపడుతూ.     "అవుననుకో - కానీ మనుషులైతే ముద్దురారు. బొమ్మ ఎంచక్కా ముద్దు వస్తుంది...." అన్నాను.     "ఏమో- మరి నాకు నా తమ్ముడు ముద్దొస్తాడు. వాడు బొమ్మలాగా వుంటాడు" అన్నాడు శంకరం.     "అలాగా?" అన్నాను ఆశ్చర్యంగా నాకూ తమ్ముడు కావాలని సరదాగా వుంది. కానీ తమ్ముడు లేడు. మా పక్క వీధిలోని జానకి వుంది. అది అస్తమానం వాళ్ళ తమ్ముడి గురించి ఒకటే గొప్పలు చెబుతుంది.     "అమ్మా- మనకు ఓ తమ్ముడుంటే బాగుంటుందేం?" అని అమ్మతో చాలాసార్లు అన్నాను.     అమ్మ నవ్వేసి ఊరుకుంది.     శంకరం కూడా తన తమ్ముడి గురించి గొప్పగా చెబుతున్నాడు. ఓసారి వెళ్ళి వాడి తమ్ముడిని చూడాలని అనిపించింది.     "నీ తమ్ముడిని ఒకసారి చూడనిస్తావా?" అన్నాను.     "నువ్వు చూస్తానంటే సాయంత్రమే చూపిస్తాను. బడి వదిలేక నాతో వస్తావా?" అన్నాడు శంకరం.     'సరే' అన్నాను.     సాయంత్రం బడి వదలగానే ఇద్దరం కలిసి వెళ్ళాం.     శంకరం ఇల్లు ఓ పూరి గుడిసె. లోపలకు వెడితే నా వంటికి బూజు అంటుకుంది. లోపల గుడ్డిదీపం వెలుగుతోంది. అక్కడంతా ఏదో తెలియని వాసన వేస్తోంది.     "అమ్మ నిద్రపోతోంది.." అన్నాడు శంకరం.     "నేను బయట నించుంటాను" అన్నాను.     "వద్దు అలా కూర్చో" అన్నాడు శంకరం.     నేను అక్కడ కూర్చోలేననిపించి బయటకు వచ్చేశాను. ఈ లోగా శంకరం తన తమ్ముడిని ఎత్తుకుని తీసుకుని వచ్చాడు.     శంకరం తమ్ముడు నల్లగా వున్నాడు. జుట్టు అట్టకట్టి వుంది. చీమిడిముక్కు. శంకరం నా దగ్గరకు రాగానే అదోరకం వాసన వేసింది. ఇందాక గుడిసెలో వేసిన వాసన లాంటిదే అది.     వాడు కళ్ళు నులుముకుంటున్నాడు. నిద్రమత్తు ఇంకా వదిలినట్లు లేదు. ఆవులిస్తున్నాడు. వాడి వంకే చూస్తున్నాను, నాకు చాలా అసహ్యంగా వుంది.     "ఎత్తు కుంటావా?" అన్నాడు శంకరం.     "వద్దు. నాకు పిల్లలు అంటే భయం" అన్నాను. అయితే అది నిజం కాదు. శంకరం తమ్ముడిని ముట్టుకోవాలంటేనే నాకు భయం వేసింది.     "బాగున్నాడు కదూ?" అన్నాడు శంకరం.     "వీడేనా నువ్వు బొమ్మలా వున్నాడు అన్నావు" అన్నాను.     "ఊఁ"     "అయితే ఇప్పుడే మా ఇంటికి రా నా బొమ్మలు ఎలాగుంటాయో చూస్తాను" అన్నాను.     "బొమ్మలు ఎలా వుంటాయో నాకు తెలుసు. అమెరికా బొమ్మ వచ్చేక నేను మీ ఇంటికి వస్తాను. ఆ బొమ్మ చూడాలని వుంది నాకు" అన్నాడు శంకరం. అలా అంటున్నప్పుడు వాడి కళ్ళు చిత్రంగా మెరిశాయి.     నేను ఆశ్చర్యంగా "ఎం ఆ బొమ్మే చూడాలని ఎందుకు అనుకుంటున్నావు" అని అడిగాను.     "ఎందుకంటే ఇంతవరకూ బజార్లో నేను ఎన్నో బొమ్మలు చూశాను. అన్నింటి కంటే నా తమ్ముడే నాకు నచ్చాడు. ఈ అమెరికా బొమ్మ నా తమ్ముడి కంటే బాగుంటుందేమో చూడాలని వుంది" అన్నాడు శంకరం.     నేను ఇంక ఏం మాట్లాడలేదు. తొందరగా వాడి దగ్గర సెలవు తీసుకుని ఇంటికి వెళ్ళి అమ్మకు జరిగింది చెప్పాను.     "అలాంటి వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు!" అని అమ్మ నన్ను దెబ్బలాడింది.     "వెడితే తప్పేమిటమ్మా?" అన్నాను.     "వాళ్ళింట్లో ఏమైనా తిన్నావా?" అంది అమ్మ.     "లేదమ్మా. అక్కడ నేను ఎంతోసేపు వుండలేదు" అన్నాను.     "మంచినీళ్ళు తాగావా?" అంది అమ్మ.     "తాగితే తప్పా అమ్మా" అన్నాను.     "తప్పుకాదు ప్రమాదం. అపరిశుభ్రంగా వుండే ఇంట్లో సూక్ష్మక్రిములు ఎక్కువగా వుంటాయి. అలాంటి చోట ఏమీ తినకూడదు, తాగకూడదు. ఇంక ఎప్పుడూ అలా వెళ్ళకు" అంది అమ్మ.     సూక్ష్మక్రిములు అంటే నాకు తెలుసు. బడిలో మేష్టారు చెప్పారు. అవి కంటికి కనిపించవు. కానీ మనకు వచ్చే జబ్బులు అన్నింటికీ ఈ సూక్ష్మక్రిములే కారణం! అన్నీ సూక్ష్మక్రిములే శంకరం ఇంట్లో వుంటే మరి వాళ్ళకు జబ్బులు రావా? వెంటనే ఈ విషయం అమ్మను అడిగాను.     "పాము విషం పామునేమైనా చేస్తుందా ? అలాగే వాళ్ళింట్లోని సూక్ష్మక్రిములూనూ!" అంది అమ్మ.     నాకు కాస్త అర్ధమయింది. మర్నాడు బడికి వెళ్ళినపుడు శంకరం దగ్గరకు వెళ్ళడానికి భయం వేసింది. ఎంతసేపూ సూక్ష్మక్రిములే గుర్తుకు వస్తున్నాయి వాడిని చూస్తూంటే !     ఇంటర్వెల్లో వాడే నా దగ్గరకు వచ్చి "నాతో మాట్లాడకూడదనుకున్నావా?" అన్నాడు.     'లేదే!' అన్నాను తడబడుతూ. కానీ ఇంక వాడితో మాట్లాడకూడదనే అనుకున్నాను.     "నాకు తెలిసిపోయిందిలే ! నిన్న నువ్వు ఎంతో అభిమానంగా పలకరించావు. ఈరోజు ముఖం చాటేస్తున్నావు. నేనుండే గుడిసె చూశావుగా! అందుకే నాజట్టు పచ్చి అయిపోవాలనుకుంటున్నావు. అవునా ?" అన్నాడు వాడు దీనంగా.     నేనేమీ మాట్లాడలేదు. కానీ వాడి మీద కాస్త జాలి వేసింది.     శంకరం మళ్ళీ మొదలు పెట్టాడు. "నేనేం చేసేది? మా నాన్న ఏదో దుకాణంలో వడ్రంగి పని చేస్తాడు. సంపాదించిన దాంట్లో సగం తాగుడుకే అయిపోతుంది. అమ్మ చాలా ఇళ్ళలో పనిమనిషిగా చేస్తుంది. పని చేసి వచ్చి అలసిపోయి సాయంత్రం కాసేపు పడుకుంటుంది. రాత్రి ఆరింటికయితే మాఇల్లు శుభ్రంగా వుంటుంది. నువ్వు అప్పుడు వచ్చి చూడాల్సింది. అనవసరంగా నిన్ను సాయంత్రం ఇంటికి తీసుకుని వెళ్ళాను. ఈరోజు ఆరింటికి మా ఇంటికి వస్తావా?"                      (సశేషం)  

గుండె తడిసిపోయింది

గుండె తడిసిపోయింది - శ్రీమతి శారద అశోకవర్ధన్          "టెలిగ్రాం" అన్న కేక విని ఇంటిల్లిపాదీ పరుగెత్తారు కంగారుగా!     "ఎక్కడ నుండి బాబూ టెలిగ్రాం?" మెల్లిగా మనవడి సాయంతో లేచి నుంచుంటే అడిగింది సుభద్రమ్మ మనవడు పవన్ ని.     టెలిగ్రాం పుచ్చుకోవడానికెళ్ళిన రాజుకేసి  చూసి, "టెలిగ్రాం మీకు కాదు సార్, సుభద్రమ్మ గారికి. ఆమెని పిలవండి" అన్నాడు పోస్టతను.     "అమ్మకా? ఏది?" ఆశ్చర్యంగా అడిగాడు రాజు.     ఆ మాటలు వినగానే చెమటలు పట్టిపోయాయ్ సుభద్రమ్మకి. "బాబూ పవన్! టెలిగ్రాం ఎవరు పంపించారురా? మీ పెద్దనాన్నా? తాతగారు కులాసాగా వున్నారా? ఆయనకేమీ ప్రమాదం జరగలేదుకదా?" గుండె చేతుల్తో పట్టుకొని పవన్ సహాయంతో లేవబోతూ  అడిగింది, కన్నీళ్ళు చెంపల మీదుగా వాగులా ప్రవహిస్తూ వుంటే.     "అమ్మా! అమ్మా! నీకు కలకత్తా భాషా కుటీరం వారి దగ్గర నుంచి ఇరవైవేలు బహుమతొచ్చింది. నువ్వేదో పుస్తకం రాశావటగా? వెరీగుడ్! ముందు ఇక్కడ సంతకంచేసి ఈ టెలిగ్రాం తీసుకో" అన్నాడు రాజు సంబరపడిపోతూ.     సుభద్రమ్మ నమ్మలేకపోతోంది. చేతులు వణికి పోతున్నాయ్. కన్నీరు గుడ్లనిండా నిండి ఏమీ కనబడకుండా  చేస్తున్నాయ్! పవిట కొంగుతో కళ్ళు తుడుచుకుని, సంతకం చేసింది సుభద్రమ్మ.       "ఒకటా, రెండా? ఇరవై వేలు  బహుమతొస్తే  ఎవరైనా  సంతోషిస్తారుగానీ  ఏడుస్తారా? అయినా  ఏడు పెందుకు!" ఎంతో ప్రేమని  వొలకబోస్తూ  అంది సౌమ్య. ఆమె కళ్ళ ముందు క్రితం  రోజు మహిళా  మండలి ఫంక్షన్ లో రచన వేసుకున్న  కెంపుల నెక్లెస్ తళతళా మెరిసింది. "అత్తయ్యా, మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను" అంది ఆమెకి దగ్గరగా జరిగి టెలిగ్రాంని మరోసారి చదువుతూ.     "అమ్మా! నాన్నమ్మ ఏడవడం లేదే! అవి ఆనందభాష్పాలు. ఎక్కువ బాధ కలిగినప్పుడు కన్నీళ్ళేలా వస్తాయో, ఎక్కువ సంతోషం కలిగినప్పుడు కూడా కన్నీళ్ళు అలాగే వొస్తాయిట - నాన్నమ్మ చెప్పింది" అన్నాడు పవన్.     సుభద్రమ్మ పవన్ బుగ్గమీద గట్టిగా ముద్దు పెట్టుకుంది.     రాజు కళ్ళలో  ఇటీవలే తన కొలీగ్ కొనుక్కున్న  హీరో హోండా కళ్ళ ముందు కనిపించింది. ఇరవైవేలు. 'కాస్తో కూస్తో తక్కువపడితే  వేసుకోవచ్చులే' అనుకున్నాడు. డెబ్బయ్యో పడిలో పడి, ఎందుకూ పనికిరాదనుకున్న  తల్లి, పైగా మందులూ  మాకులతో తనకు భారంగా తయారైన తల్లి ఈరోజున  ఉన్నట్టుండి లాటరీ కొట్టేసినట్టు  యిరవైవేలు  సంపాదించేసింది. అమ్మ ఇంకా ఇలాగే రాస్తూపోతే, ఇరవై + ఇరవై + మరో ఇరవై. త్వరలో తానొక ఇల్లు కూడా కట్టేయ్యొచ్చు. రాజు కలలలో  తేలిపోతున్నాడు.     "అమ్మా! ఏం రాశావమ్మా? నీకింత  పెద్ద బహుమతి వొచ్చింది? నాతో ఇలా  అని ఒక్కమాట  చెబితే  తెల్లకాగితాల కట్ట తెచ్చి నీ ముందు పడేసే వాణ్ణిగా!" తల్లి పక్కన కూర్చుంటూ అన్నాడు రాజు. సుభద్రమ్మ గుండె కరిగిపోతోంది. కన్నీరు ఉప్పెనలా పొంగిపోతోంది. ఎన్నాళ్ళకి రాజు అలా తన పక్కన  కూర్చుని మాట్లాడుతున్నాడు! పసివాడి దగ్గర నుంచి పెళ్ళి కానంత వరకు ఇలాగ కూర్చునేవాడు. కాలేజీలో  చదువుతూన్నా అన్నం ముద్దలు  కలిపి పెట్టమనేవాడు. పెద్దవాడు వాసు మాత్రం పసిపిల్లాడిలా వొచ్చి పక్కన పడుకునేవాడు, ఏదో కబుర్లు చెబుతూ గోముగా. ఆఁ! పెద్దాడంటే జ్ఞాపకమొచ్చింది. ఆయనెలా వున్నారో ఏమో! పెద్దాడు ఆయనకీ సరిగ్గా మందులు కొంటున్నాడో లేదో? ఆయనకి ఏది అడగాలన్నా  మొహమాటమే. ఏం తింటున్నారో ఏమో? ఆయనకి చేగోడీలంటే  చాలా ఇష్టం. కోడలుకి  అంత ఓపికుందా? 'ఇవన్నీ ఎవరు చేసుకుంటారు? డబ్బు పడేస్తే అవే బజార్లో  దొరుకుతాయ్' అంటుంది నీలిమ. 'బజార్లో చేసినవి బాగుండవే సుభద్రా! చక్కగా ఇంగువేసి, నువ్వులువేసి  నువ్వు చేస్తావే - అవి ఎంత బాగుంటాయో' అనేవారు ఆయన. మనసు మరి ఆలోచించలేకపోతోంది. తనకే రెక్కలుంటే  గబుక్కున ఎగిరి ఆయన గుండెల మీద వాలిపోయేది. బోలెడన్ని చేగోడీలు  చేసిపెట్టేది. తన ఆశక్తతకి  దుఃఖం పొర్లుకొచ్చింది. సుభద్రమ్మ వెక్కి వెక్కి ఏడుస్తోంది.     "ఎంత ఆనందబాష్పాలయితే  మాత్రం ఇంత ఇదా? ఊరుకోండత్తయ్యా!" ఊరడించింది, ఎన్నడూ లేనిది సౌమ్య.     "అయినా అమ్మా! నువ్వు కథలూ, నవలలూ రాస్తావని మాకు తెలీదే! ఇంత మంచి నవల ఎప్పుడు రాశావమ్మా?" రాజు ఆమెకి మరింత దగ్గరగా జరుగుతూ  అన్నాడు.     వారిద్దరూ తన దగ్గర అలా కూర్చోవడం, మాట్లాడడం....ఆమె మనసు ఉప్పొంగిపోతోంది. నోట మాట రావడం లేదు.     "నేను చెబుతాను నాన్నా! నీతో రామకోటి రాసుకుంటాను, కాగితాలు తెచ్చి పెట్టమని నాన్నమ్మ అడిగితే నువ్వు తేనేలేదు. నేనే నా నోటుబుక్స్  యిచ్చేవాణ్ణి. దాన్లో నానమ్మ రామకోటి రాయలేదు. 'బండబారిన గుండె డైరీ' అని,  నవల రాసింది. నాయనమ్మకి కాయితాలన్నీ  నేనే ఫెయిర్ చేసి పెట్టేవాణ్ణి! రామకృష్ణ తాతయ్య లేడూ, అతను ప్రింటుచేసి పెడతానన్నాడు. అతనే నానమ్మకి కూడా తెలీకుండా ఆ పుస్తకాన్ని  పోటీకి పంపాట్ట!" పవన్ మాటలు రాజూ, సౌమ్యలు ఆశ్చర్యంగా విన్నారు.         *    *    *     సుభద్ర రాసిన ఉత్తరం, పేపర్లో  వార్తా చదివి పొంగిపోయాడు సుబ్బారావుగారు. వెంటనే ఉత్తరం రాశారు - తను బయల్దేరి వస్తున్నానని, ఇద్దరం కలిసి కలకత్తా  వెళ్ళి బహుమతిని తీసుకుందామని. కలకత్తా వెళ్ళాలంటే  డబ్బు కావాలి. తన చెవి దుద్దులూ, ముక్కు పుడకా అమ్మేద్దామనుకుంది సుభద్రమ్మ. అక్కడ  సుబ్బారావుగారు  తన పెళ్ళిలో  అత్తవారు పెట్టిన  తులం బంగారం ఉంగరాన్ని  ఏనాడూ  అతను ఎటువంటి కష్టాల్లోనూ  తాకట్టు పెట్టడానికయినా తియ్యలేదు. ఈ రోజున దాన్ని అమ్మేసి కలకత్తా ప్రయాణానికి సిద్ధపడ్డారు.     "మీరెందుకు ఉంగరాన్ని అమ్మేశారు మామగారూ? మేము లేమూ టిక్కెట్లు కొనడానికి?" అంది కుసుమ. "మమ్మల్ని అడగడం నామోషీయా? మేము పరాయివాళ్ళమా నాన్నగారూ?" అన్నాడు వాసు. వాళ్ళిద్దరూ  తననలా  పలకరించి ఎన్నాళ్ళయింది? కాదు....ఎన్నేళ్ళయింది? 'నాన్నగారూ!....' అని నోరారా పిలిచి  ఎంతకాలమయింది? మందులయిపోయాయని చెప్పినా, ఒంట్లో బాగులేదని చెప్పినా, బట్టలు చిరిగిపోయాయని చెప్పినా చిర్రు బుర్రులాడే ఆ ఇద్దరూ ఆ రోజు అలా పలకరించడంతో  అతడికి మతి పోయింది. అతడి కళ్ళు ఆనందంతో మెరిశాయి. వాసు, కుసుమల కళ్ళల్లో మొన్నెవరో  అమ్ముతామన్న ఊరి చివరన వున్న ద్రాక్షతోట కళ్ళల్లో కలిసి మెరిసింది!     దగ్గరుండి వాసు, కుసుమలు సుబ్బారావుగారిని కలకత్తా తీసుకొచ్చారు, కానీ ఖర్చు పెట్టనీయకుండా! రాజు, సౌమ్యలు పువ్వుల్లో పెట్టి  సుభద్రమ్మను కలకత్తా తీసుకెళ్ళారు!     "సుభద్రా! ఏమో అనుకున్నాం గానీ, మన పిల్లలెంత మంచివాళ్ళే! వాళ్ళిద్దరూ  నన్నూ, వీళ్ళిద్దరూ నిన్నూ ఎంత జాగ్రత్తగా తీసుకొచ్చారో ఇక్కడికి! నాకు చాలా సంతోషంగా వుంది. నువ్వు ప్రైజు తీసుకుంటూ  వుంటే స్వయంగా దగ్గరుండి చూడాలనిపించి రాగలనో లేదోనని  భయపడిపోయాను పిల్లల్ని డబ్భులడగడమెందుకని  నా ఉంగరాన్ని  అమ్మేశాను అయిదు వేలొచ్చాయి. ఇదుగో, ఇవి నీ దగ్గరుంచు. ఏనాడు ఇంతమొత్తాన్ని నీకివ్వలేకపోయాను. కొద్దో గొప్పో యిచ్చినా  అది  పిల్లల కోసమే  ఖర్చు పెట్టేదానివి. కాని నీకోసమంటూ  ఏమీ చేసుకోలేదు. అన్నట్టు నీ చెవుల దుద్దులూ ముక్కు పుడకా ఏవీ?" బోసి నోటితో  సుభద్రమ్మను ముద్దు పెట్టుకుంటూ అన్నారు సుబ్బారావుగారు. సుభద్రమ్మ సిగ్గుపడిపోతూ  అతని కౌగిట్లో కుంచించుకుపోయింది.     "రాజునీ. సౌమ్యనీ  ఇబ్బంది  పెట్టడడమెందుకని మన రామకృష్ణ ద్వారా అవి అమ్మేశానండి. రెండూ కలిపి పదివేలొచ్చాయి. ఇప్పుడు  మనిద్దరి దగ్గరా మొత్తం పదిహేనువేలున్నాయి. బహుమతి డబ్బు యిరవై వేలు. ముప్పై అయిదు వేలూ బ్యాంకులో వేస్తే...." ఏదో చెప్పబోయేలోపల కొడుకులూ, కోడళ్ళూ రావడంతో చెప్పడం ఆపేసి వారందరికేసి ఆప్యాయంగా చూసింది.     "ఎన్నాళ్ళకి కుటుంబం అంతా ఒక్కచోట ఉందండీ! ఈ సంతోషం నేను పట్టలేపోతున్నాను" అంది సుభద్రమ్మ భర్త వంక చూస్తూ.     "అవును సుభద్రా! నాకూ  అలాగే వుంది. ఈ కాలం ఇలాగే నిలిచిపోతే. అందరూ ఇలాగే కలిసి వుండిపోమూ? ఒరేయ్ పెద్దాడా? నువ్వెలాగూ డాక్టర్ వి కదరా! ఈ ప్రాక్టీసేదో రాజమండ్రిలోనే పెట్టుకోకూడదూ? నువ్వూ, చిన్నాడూ అందరం కలిసి పెద్ద ఇల్లు తీసుకుని వుందాం. చిన్న వాడికి ఇప్పుడు రాజమండ్రి నుంచి ట్రాన్స్ ఫర్ అయ్యే అవకాశం లేదు కదా!' అన్నారు సుబ్బారావుగారు.      ఆ మాటలు కొడుకులకీ, కోడళ్ళకీ ఎవ్వరికీ నచ్చలేదు  కాబోలు  మొహమొహాలు  చూసుకున్నారు సుభద్రమ్మ సుబ్బారావుగారి కేసి చూసి చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వులో  ఎన్ని అర్ధాలో, ఎంత బాధో ఒక్క ఆమెకే తెలుసు!     "ఇక ముందు మీరు మా దగ్గర, అత్తగారు మరిదిగారి దగ్గరా వుండడం ఎందుకు? ఇద్దరూ  మా దగ్గరే వుండండి. మా పిల్లలిద్దరూ  సుజీత, స్మితలని ఊటీ స్కూల్లో  వెయ్యాలనుకుంటున్నాము. నాకూ ఇంక వేరే పన్లేమీ వుండవు కాబట్టి, ఊరి చివర ఒక ద్రాక్షతోట కొని  దాన్ని నేను చూసుకోవాలనుకుంటున్నాను. మీరిద్దరూ  వుంటే మాకు ఇల్లు తాళం పెట్టవలసిన  అవసరమూ వుండదు; మీరూ ఒకరికొకరు తోడుగా వుంటారు" అంది కుసుమ.     "అవును నాన్నగారూ, కుసుమ చెప్పింది నిజం" అన్నాడు వాసు.     "బాగుంది మీ వరస. మా పవన్ కి అత్తగారంటే  పంచప్రాణాలూనూ! ఆవిడ లేనిదే వాడుండలేడు. ఆవిడతోపాటే  మామగారూనూ! ఇద్దరూ మా దగ్గరే వుంటారు. నేనీమధ్య మహిళాభివృద్ధి కార్యక్రమాల్లో  తలమునకలై  తిరుగుతున్నాను. నేను ఇంట్లో వుండని లోటు పవన్ వల్ల వాళ్ళకి తీరుతుంది. పైగా, వాళ్ళకి బోరు కొట్టదు. మీ దగ్గరుంటే వాళ్ళకి  కాలక్షేపమేమిటి? పిల్లలు ఊటీకి వెళ్ళిపోతారుగా!" అంది సౌమ్య.     వారి వాదనలని ముద్దాయిల్లా  విన్నారు సుభద్రమ్మగారూ, సుబ్బారావుగారూ!     అమ్మా, నాన్నా ఎవరి దగ్గర వుంటామని చెబుతారా అని ఆదుర్దాగా ఎదురు చూస్తున్నవాళ్ళు - ఆ రోజు ఫంక్షన్ తాలూకూ  ఆర్గనైజర్లు లాంఛనంగా  పలకరించి  పిలవడానికి  రావడంతో ఆలోచనలకి కళ్ళెం వెయ్యడం జరిగింది.             *    *    *     ముదురు నీలంరంగు పట్టుచీరకి మెరూన్ కలర్, తోపు కుంకుమరంగు  అంచు చీర! అది పెళ్ళినాటి చీరే అయినా ఎప్పుడో అప్పుడప్పుడు  కట్టుకోవడం వల్ల బాగానే వుంది. ఆ చీరలో ఆరోజు ఆమెను "పార్వతీ!" అన్నారు ప్రేమగా సుబ్బారావుగారు. ఆశ్చర్యంగా అతనికేసి చూసి, " నా పేరు మర్చిపోయారా? ఈ పేరేమిటి?" అంది సుభద్రమ్మ.     "నువ్వు సాక్షాత్తూ  పార్వతీదేవిలా, అందంగా, ఆదిశక్తిలా, శక్తివంతంగా కనిపిస్తున్నావు సుభద్రా! పదో తరగతి తరవాత, ఆడపిల్లకి పై చదువెందుకూ  అని మీ పుట్టింటివాళ్ళు  చదివించలేదు. బడి పంతులు ఉద్యోగం చేస్తూ ఎందరికో విద్యాదానం చేసిన నేను కూడా నిన్ను కేవలం భార్యగానే చూశాను కానీ, నీ కోరిక తెలిసి కూడా  చదివించడానికి ప్రయత్నం చెయ్యలేదు. కాని, ఇలా ఇంత గొప్ప బహుమతి పొందిన గ్రంథాన్ని  నువ్వు రచించావంటే  నాకు చాలా ఆనందంగానూ, ఆశ్చర్యంగానూ వుంది. అంత భాషా, భావం ఎక్కడ సంపాదించావు సుభద్రా?" అడిగారు సుబ్బారావుగారు.     "ఏ బడీ, ఏ గురువూ చెప్పలేని పాఠాలు నాకు జీవితం నేర్పించిందండీ! నేనది కథ కింద రాయలేదు. నా ఆవేదనను అక్షరరూపంలో డైరీలా రాసుకున్నాను. ఒక్కొక్క పుటా, ఒక్కొక్క రోజు సంఘటన! అవన్నీ ఒక రోజు మన రామకృష్ణ చూసి నాకు తెలీకుండానే  అచ్చువేయించి తీసుకొచ్చాడు. అతనే ఈ పుస్తకాన్ని బహుమతి పోటీకి కూడా పంపించాడు. అందులోని పాత్రలు మీరు, నేను, మన సంసారం, మన పిల్లలూ అవేనండి" అంది కళ్ళు తుడుచుకుంటూ.     ఆ సాయంత్రం వేదిక మీద "వాస్తవాన్ని కళ్ళకి కట్టినట్లు రచించిన ఈ రచయిత్రి మహానుభావురాలు. వీరి కలం నుండి వెలువడ్డ ఈ రచన మణిపూస. వీరు ఇదే తన తొలి రచన అని చెప్పుకున్నారు. చాలా ఆశ్చర్యం! తొలి రచనలోనే  ఇంత సిద్ధహస్తులయిన  వీరు, మునుముందు ఇంకా ఎన్నో మంచి రచనలు చేస్తారని ఆశిస్తూ, ఈ బహుమతిని అందుకోవలసిందిగా కోరుతున్నాం. వారు శ్రీవారు కూడా ఇక్కడ వున్నట్టు తెలిసింది. వారిని కూడా వేదిక మీదకి రావలసిందిగా కోరుతున్నాం" అన్నారు.     వాసు తండ్రి చెయ్యి పట్టి నడిపించి వేదిక పైకి  తీసుకెళ్ళాడు. రాజు తల్లి చెయ్యి పట్టుకుని వేదిక మీద కూర్చోబెట్టాడు.     ఇద్దరికీ శాలువాలు కప్పి, గౌరవించారు ఆర్గనైజర్లు. సభ ఎంతో వేడుకగా పూర్తయ్యింది. ఆ రాత్రి భోజనాలయ్యాక, "అమ్మా,  ఆ చెక్కేది? రేపే మన ప్రయాణం. నువ్వు మాతోనే వచ్చేస్తున్నావ్!" అన్నాడు వాసు.     "చెక్కు ఎక్కడ పెట్టేవమ్మా? జాగ్రత్త! నాన్నగారిని మనతోనే తీసుకుపోతున్నాం" అన్నాడు రాజు.      "అరె! చెక్కు కనబడ్డం లేదే!" కంగారుగా వెతికింది సుభద్రమ్మ. అందరూ మరింత కంగారుగా ఆ గదిని, సభ జరిగిన ప్రాంగణాన్ని  అంతా వెతికారు. ఎక్కడా కనిపించలేదు. ఆర్గనైజర్లకు చెప్పారు. వాళ్ళు ఏం చెప్పాలో తెలీక "మీరొక ఉత్తరం రాసివ్వండి చెక్కు పోయినట్టు. మేము ఎంక్వయిరీ చేసి మీకు సమాధానం రాస్తాము. డూప్లికేట్ చెక్ ఇస్తాం" అన్నారు. సుభద్రమ్మ గారు, వారు చెప్పిన విధంగానే రాసిచ్చింది.     కుసుమ విసుక్కుంది.     సౌమ్య గొణుక్కుంది.     వాసు చిటపట లాడాడు.     రాజు చిరాకు పడుతున్నాడు.     "బాబూ మమ్మల్ని, ఎవరు తీసుకెళ్తున్నారు?" అడిగింది సుభద్రమ్మ వాసునీ, రాజునీ చూస్తూ.     "మీ చెక్కు రాగానే ద్రాక్షతోట  కొనాలనుకున్నాను.  ఇప్పుడెలా? మీరు మరిదిగారింటికే వెళ్ళండి?" అంది కుసుమ.     "ఎంతో మోజు పడ్డాను - మహిళామండలిలోని శ్యామల మెళ్ళో లాంటి కెంపుల నెక్లెస్ కొనొచ్చని ఇరవై వేలతో!  ఊ....అంతా నిరాశే అయింది. మీరు బావగారింటికే వెళ్ళండి" అంది సౌమ్య.     వాసూ, రాజూ మాట్లాడకుండా  మౌనంగా ఊరుకున్నారు.     సుబ్బారావుగారు అయోమయంగా చూశారు అందరివైపు, కర్తవ్యం అర్ధం కానట్టుగా! కలలన్నీ  పేక మేడల్లా కూలిపోయినట్టయింది.     "సుభద్రా! ఏం చేద్దాం?" అన్నారు తడబడుతూ.     సుభద్రా పకపకా నవ్వింది! పార్వతీదేవిలా నవ్వింది గంభీరంగా!     గల గలా నవ్వింది ప్రవహించే గంగానదిలా!     భద్రంగా జాకెట్టు మడతలో దాచిన చెక్కును పైకి తీసింది. సుబ్బారావుగారి చేతిలో పెట్టింది.     "పదండీ! ఇది నా స్వంత సంపాదన! ఇరవైవేలు. మన దగ్గర బంగారం అమ్మగా వొచ్చినవి పదిహేను వేలు. బ్యాంకులో వేస్తే ముప్పై అయిదు వేలు.  ఆ వడ్డీ మీద మనం హాయిగా  ఒక్క గది అద్దెకు తీసుకుని బతకొచ్చు! డబ్బు మనుషులు మనకొద్దు! నాకు మీరూ, మీకు నేనూ తోడు. మనకి భగవంతుడు తోడు - పదండి!" అంది ఆవేశంగా.     అందరూ తెల్లబోయి ఆమెకేసి చూశారు.     ఆమెలో ఆనందం! కళ్ళు చెమ్మగిల్లాయి.     ఆమెలో ఆత్మస్థయిర్యం! కళ్ళు మెరిశాయి.     ఆమెలో ధైర్యం! చూపులు సూదుల్లా వున్నాయి.     ఆమె సాక్షాత్తూ ఆదిశక్తిలా కనిపించింది అందరికి!     ఆలోచనల్లోంచి, షాకులోంచి  అందరూ తేరుకొనేలోగా, ఆమె సుబ్బారావుగారి చెయ్యి పట్టుకుని, మరొక చేతిలో సూటుకేసు పట్టుకుని, అడుగు బయటకు వేసింది.     ఆమెలో భార్య మాత్రమే కాదు - ఒక చెల్లి, ఒక తల్లి కనిపించారు సుబ్బారావుగారికి. 'ఆడది అబల కాదు - శక్తి! ఆదిశక్తి!!' తనలోతనే  గొణుక్కున్నట్టుగా అన్నారు.                  

నాకున్నది ఒక చక్కని బొమ్మ

నాకున్నది ఒక చక్కని బొమ్మ - వసుంధర నా పేరు అమ్మలు. అంటే అంతా నన్నలా పిలుస్తారని అర్ధం. నా అసలు పేరు చాలా పెద్దది. అది పూర్తిగా చేపగలిగింది మా యింట్లో మామ్మ మాత్రమే! బడిలో కూడా నాపేర్లో చాలా పొడి అక్షరాలు వున్నాయి. చివర మాత్రం అన్నపూర్ణ అని వుంటుంది. అది కూడా ఏ. పూర్ణ అనొచ్చునని బడిలో మా మేష్టారు ఏడిపిస్తుంటారు.     బడిలో చదివేస్తున్నానని నేను చాలా పెద్దదాన్నని అనుకోకండి నాకింకా ఎనిమిదేళ్ళే.     అసలు నాకు పెద్దదాన్నని చెప్పుకోవడమే ఇష్టం. మా అమ్మ చాలా మందికి నా వయసు తగ్గించి చెబుతుంటుంది. అప్పుడు నాకెంత బాధ కలుగుతుందో! ఓసారి ఆ బాధ భరించలేక నిజం చెప్పేస్తే ఆరోజు ఇంట్లో పెద్ద గొడవయ్యింది కూడా.     ఇంతకూ ఏం జరిగిందంటే....     నా క్లాస్ మేటు కిష్టిగాడి అమ్మ మా ఇంటికి వచ్చింది. కిష్టిగాడికి అన్నిట్లోనూ నా కంటే తక్కువ మార్కులు వస్తున్నాయి. మాటల్లో వాడి అమ్మ అన్నది కదా__ "తొందరపడి వెధవని తక్కువ వయసులో బడిలో వేశాను. మీ అమ్మలుకి లాగే కరెక్టుగా జేర్పించాల్సింది" అని.     "మీ కిష్టిగాడికి ఎన్నేళ్ళు?" అనడిగింది అమ్మ.     "ఇంకా ఏడే కదా" అంది వాడి అమ్మ.     "అయితే మా అమ్మలు ఇంకా చిన్నది. దానికింకా ఆరే కదా" అంది అమ్మ.     నాకెంతో ఉక్రోషం వచ్చేసింది. బడిలో నేనూ, కిష్టిగాడూ నేను పెద్దంటే నేను పెద్ద అని దెబ్బలాడుకుంటుంటాం. దెబ్బలాట ఎందుకంటే పెద్ద వాళ్ళని చిన్నవాళ్ళు గౌరవించాలని మా మాష్టారు క్లాసులో చెప్పారు.     మా యింట్లో అందరిలోకీ నేనే చిన్నదాన్ని. నన్నెవరైనా గౌరవించాలని నాకుంటుంది. ఎవ్వరూ నన్ను గౌరవించరు. కిష్టిగాడిది మా వీథే. మేమిద్దరం కలిసే బడికి వెడుతూంటాం.     "ఇద్దరూ కలిసి బుద్దిగా వెళ్ళి రండమ్మా" అని రోజూ వాళ్ళమ్మా, మా అమ్మ కూడా చెబుతూంటారు.     "నేను చెప్పినట్లు నువ్వు వినాలి" అంటాడు కిష్టిగాడు.     "కాదు, నేను చెప్పినట్లే నువ్వు వినాలి" అంటాను నేను.     "నేను మగాణ్ని. మగాళ్ళ మాటలు ఆడపిల్లు వినాలి" అన్నాడు కిష్టిగాడు.     "నేను నీకంటే పెద్దదాన్ని. పెద్దాళ్ళ మాటలు చిన్నపిల్లలు వినాలి" అన్నాను నేను.     "ఇద్దరం ఒకే క్లాసు చదువుతున్నాం. నువ్వు నాకంటే పెద్ద ఎలాగయ్యావూ?" అన్నాడు కిష్టిగాడు.     "నేను నీకంటే ముందు పుట్టాను అందుకని!" అన్నాను.     వెంటనే కిష్టిగాడు "నీకు చైనా వాళ్లు మనమీద యుద్ధం చేయడం గురించి తెలుసా?" అనడిగాడు.     "తెలియదు" అన్నాను.     "నాకు తెలుసు! అందుకని నేనే నీకంటే పెద్ద!" అనేశాడు.     నాకు ఉక్రోషం వచ్చేసింది. నువ్వు గాంధీగారిని చూశావా?" అనడిగాను.     "చూశాను" అన్నాడు తడుముకోకుండా.     "అన్నీ అబద్ధాలు. పద మా మామ్మ నడుగుదాం" అన్నాను.     "మీ మామ్మకేం తెలియదు. ఈ ప్రపంచంలో అన్నీ తెలిసిన వాడు మా బాబాయి. ఆయన్ని అడుగుదాం" అన్నాడు కిష్టిగాడు.     కిష్టిగాడు మొండివాడు. అన్నింటికీ వాడి మాటే నెగ్గాలంటాడు. పోనీ నేను పెద్దదాన్నని రుజువయితే అప్పుడైనా నా మాట వింటాడు కదా అని వాడి బాబాయి దగ్గరకు వెళ్ళడానికి ఒప్పుకున్నాను.     కిష్టిగాడి బాబాయికి నేనంటే చాలా ఇష్టం. వాళ్ళింటికి ఎప్పుడు వెళ్ళినా నాకు చాక్లెట్లు ఇచ్చి ఏమేమో అడుగుతుంటాడు. అన్నీ విని 'నువ్వు చాలా తెలివయిన పిల్లివి' అని మెచ్చుకుంటుంటాడు. కిష్టిగాడి కంటే నేనంటేనే ఆయనకు ఎక్కువ ఇష్టమని నా అనుమానం.      కిష్టిగాడి బాబాయి మేము చెప్పిందంతా విని "చైనా యుద్ధం సమయానికి నేనింకా బళ్ళో చేరలేదు. దాని గురించి నీకెలా తెలుసురా" అన్నాడు.     "నువ్వే కదా చెప్పావు" అన్నాడు కిష్టిగాడు.     "నేను చెబితేగదా తెలిసింది. అలాంటప్పుడు అమ్మలుతో అబద్దమెందుకు చెప్పావు?" అన్నాడాయన.     "నేనేం అబద్ధం చెప్పలేదు. చైనా యుద్ధం గురించి నాకు తెలుసునని అన్నాను. అంతే!" అన్నాడు కిష్టిగాడు.     "మరి గాంధీగారిని చూశానన్నావు. నేను పుట్టినప్పటికే గాంధీగారు చచ్చిపోయి పదేళ్ళయింది. నువ్వెలా చూశావురా?" అన్నాడాయన.     "బాగుంది! సినిమాల్లో చూడలేదేంటీ?" అన్నాడు కిష్టిగాడు.     కిష్టిగాడి బాబాయి వెంటనే నవ్వడం మొదలు పెట్టాడు. కిష్టిగాడు నావంక గర్వంగా చూశాడు.     నాకు ఉక్రోషం వచ్చింది. అవతల పెద్ద సమస్యతో మేము సతమతమైపోతుంటే ఈయన నవ్వుతూ కూర్చుంటాడేమిటి? ఇదే మా ఇంట్లో మామ్మ అయితే తెగతిట్టేనేదాన్ని.     బాబాయి నవ్వు ఆపుకుని నావంక చూసి "అరే అమ్మాయీ ఏడుస్తున్నావా?" అన్నాడు.     నా కళ్ళలో నీళ్లు తిరిగినట్లున్నాయి. అవి ఆయన చూశాడు.     చటుక్కున గౌనుతో కన్నీళ్ళొత్తుకున్నాను.     "ఏయ్ చంటిపిల్ల....ఏడ్చేస్తోంది" అన్నాడు కిష్టిగాడు.     బాబాయి వాడిని కసిరాడు. మమ్మ ఇద్దర్నీ దగ్గరగా తీసుకున్నాడు. నెమ్మదిగా "మీ ఇద్దరిలో క్లాసులో ఎవరికి మంచి మార్కులు వస్తాయీ?" అని అడిగాడు.     "నాకే?" అన్నాను గర్వంగా.     "ఏరా నిజమేనా?" అన్నాడాయన. "నిజమేలే! ఆడపిల్లలకు పనేముంటుంది? ఎప్పుడూ చదువుకుంటూ కూర్చుంటారు. లేదా ఏడుస్తుంటారు. నాకైతే ఎన్ని పనులు?" అన్నాడు కిష్టిగాడు.     "ఏమైనా సరే. క్లాసులో మార్కు లెవరికెక్కువవస్తే వాళ్ళే పెద్దవాళ్ళు" అన్నాడు కిష్టిగాడి బాబాయి.     నాకెంతో సంతోషం కలిగింది. వెంటనే ఆయనకు దూరంగా జరిగి చప్పట్లు కొట్టేశాను.     కిష్టిగాడి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. చొక్కాతో తుడుచుకుంటూంటే నేను "ఏయ్ చంటిపిల్లాడు.... ఏడ్చేస్తున్నాడు....!" అన్నాను.     "నేనేం ఏడవడం లేదు. కంట్లో నలకపడింది. అంతే?" అన్నాడు కిష్టిగాడు.      అప్పట్నుంచీ వాడు నా మాట కాస్తవింటున్నాడు.     ఏదో పెద్దదాన్నని వాడు నా మాట వింటున్నాడు కానీ లేకపోతే ఈ మగపిల్లలు చాలా గడుగ్గాయలు. వాళ్ళని అదుపుచేయడం చాలా కష్టం.     ఇంత కష్టపడి వాడిని నేను అదుపులోకి తెచ్చుకున్నానా. అదంతా ఇప్పుడు అమ్మ పాడు చేసేస్తోంది. కిష్టిగాడికి ఏడేళ్ళేనని వాళ్ళమ్మే అంటోంది. అంటే వాడు నా కంటే చిన్నే కదా! అమ్మ ఊరుకోవచ్చు గదా!- తీరి కూర్చుని నాకు ఆరేళ్ళే అంటోంది. అది అబద్ధం కూడాను. వాళ్ళమ్మ వెళ్ళి కిష్టిగాడికి ఈ విషయం చెబితే ఇంకేమైనా వుందా?     అందుకే నేను ఊరుకోలేదు.     "అబద్ధం పిన్నీ ! నాకు ఆరేళ్ళు కాదు. ఎనిమిదేళ్ళు. నేను పుట్టిన ఏడాదికి ఎమర్జన్సీ వచ్చిందని ఇంట్లో అంతా చెప్పుకుంటారు కూడాను...." అనేశాను.     వెంటనే అమ్మ తెల్లముఖం వేసింది. పిన్ని మాత్రం నన్ను ఆప్యాయంగా దగ్గరగా తీసుకుని- "తప్పమ్మా- పెద్దవాళ్ళు మాట్లాడు కుంటున్నప్పుడు నువ్వు కలగజేసుకో కూడదు. వెళ్ళి ఆడుకోమ్మా" అంది.     ఏమనాలో నాకు తెలియలేదు. "నేను తనకంటే చిన్న అని కిష్టిగాడికి మాత్రం చెప్పకేం?" అని అక్కణ్ణించి తిన్నగా మామ్మ దగ్గరకు వెళ్ళిపోయి జరిగింది చెప్పి "చూడు మామ్మా అమ్మ అంత పెద్దదిగదా అలా అబద్ధం చెప్పొచ్చా?" అనడిగాను.     "మీ అమ్మ ఎప్పుడూ అబద్ధాలు చెబుతుంది. అందుకే నువ్వు పుట్టావు అని "పోనీలేవే మీ అమ్మ అబద్ధాలు చెప్పి మంచిపనే చేసింది. లేకపోతే నువ్వు నాకు దొరికే దానివి కాదు అంటూ నన్ను ముద్దులాడి, అయినా నీకు అయిదేళ్ళే అయితే ఆరేళ్ళే అని చెప్పడానికి దానికి నోరెలావచ్చిందే?" అంది.     నాకు మతిపోయి నట్లయింది. మామ్మ నన్ను ఇంకా చిన్నదాన్ని చేసేస్తోంది. ఈ మాటలు విన్నాడంటే కిష్టిగాడిని ఇంక పట్టలేము.     "మామ్మా! నువ్వు కూడా అబద్ధాలు చెబుతున్నావు. నేను పుట్టిన ఏడాదికి ఎమర్జన్సీ వచ్చిందని మీరంతా అనుకోరూ?" అన్నాను.     "అదా?" అని నవ్వేసి "నువ్వు పుట్టిన ఏడాదికి రెండోసారి ఎమర్జన్సీ వచ్చిందిలే!-" అంది మామ్మ.        ఇంక మామ్మతో మాట్లాడి లాభం లేదనిపించి ఊరుకున్నాను. నా బెంగ అంతా ఈ విషయం కిష్టిగాడికి తెలిసిపోతే ప్రమాదమని !     అంతకంటే ప్రమాదం ఇంట్లోనే కాచుకుని వుందని నాకు తెలియదు.     సాయంత్రం నాన్నగారు వచ్చేసరికి నేనింట్లో లేను. పక్కింట్లో ఆడుకుంటున్నాను. కనుచీకటిపడే సమయానికి ఇల్లు చేరుకున్నాను. నేను ఇంకా ఇంట్లో ఇలా అడుగుపెట్టానో లేదో "అమ్ములూ!" అన్న కేక వినిపించింది. ఆ గొంతు నాన్నగారిది. ఆ గొంతు వినగానే నాక్కాస్త భయం వేసింది. నన్ను తిట్టడానికే పిలుస్తున్నారని అర్ధమైపోయింది. పిల్లిలా అడుగులో అడుగు వేసుకుంటూ ఆయన దగ్గరకు వెళ్ళాను.     "శనివారం నీ బడికి సెలవు కాదు కానీ- నా ప్రాణాలు తీస్తున్నావమ్మా" అన్నారు నాన్నగారు.     "నేనేం చేశానండీ?" అన్నాను.     "కిష్టిగాడి అమ్మ మనింటికి వస్తే నువ్వేం చేశావు?" అని అడిగారు నాన్నగారు.     "అమ్మ అబద్ధం చెప్పింది. లేకపోతే నాకు ఆరేళ్ళా మరి?" అన్నాను.     "అబ్బా దాని సంగతి కాదమ్మా! ఆడవాళ్ళకు అలాంటి అబద్ధాలు మామూలే! దానికేమీ ఫరవాలేదు. కానీ నువ్వు ఆవిడని పిన్నీ అని పిలిచేవా లేదా?" అనడిగారు నాన్నగారు.     "మరేమని పిలవాలండీ?" అని అడిగాను.     "దొడ్డా అని పిలవచ్చుగా" అన్నారు నాన్నగారు.     "దొడ్డా అనే ఎందుకు పిలవాలి? పిన్నీ అని ఎందుకు పిలవకూడదు?" అని అడిగాను.     "దొడ్డా అంటే ఆవిడ అమ్మకంటే పెద్దది. పిన్ని అంటే అమ్మ కంటే చిన్నది. నువ్వావిడిని పిన్నీ అని పిలిచావు. ఆవిడ అమ్మకంటే చిన్నదైపోయింది" అన్నారు నాన్నగారు.      "చూడ్డానికి కాస్త  చిన్నదానిలా కనిపించేమాట నిజమే కానీ ఆవిడ నా కంటే పెద్దదేనండీ- మాటల సందర్భంలో రాజమండ్రిలో గోదావరికి వరదలు వచ్చినప్పుడు పుట్టానని ఆవిడ అంది. నేను ఆ తర్వాత వచ్చిన పుష్కరాలకు కాస్త ముందు కాబోలు పుట్టాను" అంది అమ్మ గదిలోపలకు వస్తూ.     నాకు నవ్వు వచ్చింది. "అరే నేను కిష్టిగాడూ కూడా అచ్చం ఇలాగే దెబ్బలాడుకున్నాం!" అన్నాను.     నాన్న అడగ్గా ఆ వివరాలు కూడా చెప్పాను.     "మీ ఇద్దరికీ చిన్న తేడా వుందమ్మా. నువ్వేమో నీ వయసు ఎక్కువ చెప్పి పెద్దదానివై పోవాలను కుంటున్నావు. మీ అమ్మేమో తన వయసు తగ్గించి చిన్నదైపోవాలను కుంటోంది అన్నారు నాన్నగారు.     "నేనేం వయసు తగ్గించు కోవడం లేదు. వున్న మాటే అంటున్నాను. ఈ రోజు ఆ కిష్టిగాడి అమ్మని పిన్నీ అని పిలిచింది. వెంటనే ఆమె నన్ను అక్కయ్యగారూ అనడం మొదలుపెట్టింది" అంది అమ్మ.         నేను అమ్మ దగ్గరగా వెళ్ళి- "పోనీ లేవేఅమ్మా! నువ్వు పెద్ద దానివైతే మంచిదే కదా! అంతా నిన్ను గౌరవిస్తారు. ఆవిడ నీ కాళ్ళకు దణ్ణం పెడుతుంది. ఎంచక్కా చేతులెత్తి నువ్వు ఆవిడను ఆశీర్వదించవచ్చు కూడా" అన్నాను.     "నీ ఓదార్పు లెవరికీ అక్కర్లేదు" అంది అమ్మ.     "చూడండి నాన్నా! అమ్మ నన్ను విసుక్కుంటోంది" అన్నాను.     అప్పుడు నాన్న నాకు ఒక సలహా ఇచ్చారు. నేనేమో కిష్టిగాడి వద్దకు వెళ్ళాలట. మా అమ్మా వాళ్ళమ్మా మాట్లాడుకుంటూండగా వాడిచేత మా అమ్మను పిన్నీ అని పిలవడానికి ఒప్పించాలిట.     "కిష్టిగాడు నా మాట వినాలంటే నేను వాడికంటే చిన్నదాన్నని ఒప్పుకోవాలి" అన్నాను.     "పోనీ ఒప్పేసుకో" అన్నారు నాన్నగారు.     "అమ్మో- నే వొప్పుకోను" అన్నాను.     "అయితే మీ బాబాయికి బొమ్మ తేవద్దని రాసేయనా?" అన్నారు నాన్నగారు.                      (సశేషం)

అమ్మ పిలుపు

అమ్మ పిలుపు - వసుంధర     సీతాదేవికి తనతో ఎవరు మాట్లాడుతున్నదీ అర్ధంకావడం లేదు. కానీ గోపీ పిలుపు విని ఆమె చలించిపోతూ గోపీ, గోపీ, గోపీ అని అదేపనిగా అరుస్తోంది. గోపీ ఆ పిలుపు ఎట్నించి వస్తున్నదో అటే నడవసాగాడు. వాడికి దారి కనిపించడం లేదు. ప్రపంచం తెలియడంలేదు. వాడికున్న దొక్కటే ఆధారం... అదే కన్నతల్లి పిలుపు.     తానెక్కడికి పోతున్నదీ వాడికి తెలియదు. కానీ వాడు నడుస్తున్నాడు. నడుస్తూనే వున్నాడు. తను సొరంగంలోంచి  బయటపడ్డానని గానీ, ఆలయం లోంచి బయటకు వచ్చాననిగాని, కొండ దిగుతున్నాననీ గాని వాడికి తెలియదు.     తల్లి పిలుస్తోంది. ఆ పిలుపు వాడికి వినపడుతూనే వుంది.     అలాగే వాడు సరాసరి తన యింట్లోని తన గదిలోకి వెళ్ళిపోయాడు.     అంతవరకూ గోపీ గోపీ అన్న పిలుపుతో నిండివున్న ఆ గదిలో అప్పుడున్నపళంగా నిశ్శబ్దం ఆవరించింది. వున్నట్లుండి గదిలోకి అవతరించిన సన్యాసి శరీరుణ్ణి చూసి అంతా ఉలిక్కిపడ్డారు.     పిలుపు ఆగిపోగానే గోపీ ఈ లోకంలోకి వచ్చి చుట్టూ చూశాడు. అప్పుడు వాడికి మంచంమీద స్పృహ లేకుండా వున్న తన శరీరం కనిపించింది. ఆ పక్కనే తల్లి కనపడింది.     "అమ్మా!" అంటూ అరిచాడు వాడు.     సీతాదేవి వాడివంకే చూస్తూ "స్వామీ! నా ప్రాణాలైనా తీసుకుని నా బాబు గోపీని రక్షించండి" అంటూ అరిచింది. ఆ స్వామి ఎవరని కూడా ఆమె ఆలోచించలేదు.     అప్పుడు గోపీకి కర్తవ్యం గుర్తుకొచ్చింది. తన శరీరాన్ని సమీపించి "పెద్ద తాతయ్యా-నేనొచ్చేశాను-" అన్నాడు.     అంతే! వాడి నోట్నించిలా మాటలు వెలువడ్డాయోలేదో సన్యాసి శరీరం దబ్బున నేలమీద పడింది. అంతా కంగారుగా ఆ సన్యాసిని సమీపించారు. సన్యాసి ఒక్కసారి కళ్ళు తెరిచి వాళ్ళను చూసి "నా ఈ శరీరం ఈ వాతావరణంలో ఎంతోసేపుండదు. నేను రఘురామయ్య ముత్తాత గోపాల్రావును. నన్ను సగౌరవంగా దహనం చేయండి. గోపీకింక ఏ ప్రమాదమూ వుండదు" అని కళ్ళుమూసుకున్నాడు.     ఆతర్వాత కాసేపటికి గోపీ మామూలుగా లేచాడు. గోపాల్రావు తాతయ్య చచ్చిపోయాడు.         *    *    *     ఆ రాత్రి గోపీ ప్రశాంతంగా నిద్రపోయాడు. వాడికి కలలో ఓ విచిత్ర వ్యక్తి కన్పించి యిలా చెప్పాడు:     "గోపీ! నేను జడ్యాగ్రహాధినేతను. నీ శరీరాన్నంటి పెట్టుకుని దాన్నెంతో శ్రమ పెట్టిన నీ తాతయ్యను వదల్చుకునేందుకు మెదడు వేడెక్కి అదుపు తప్పింది. అప్పుడే నీ తాతయ్య జీవశక్తి కొస ప్రాణాలకు వచ్చింది. నీ తల్లి పిలుపు నందుకుని నువ్వు రావడం కాస్త ఆలస్యమయుంటే నీ శరీరమే మరణించి వుండేది. కానీ మాటవిన్న మరుక్షణం కొస ప్రాణంతో తాతయ్య జీవశక్తుల్ని ఆయా శరీరానికి మార్పిడి చేశాడు. ఆ విధంగా నీ ప్రాణాలు దక్కించాడు.     ఇప్పుడు నేను నీ కెందుక్కనిపించానంటే. నీకో ముఖ్య విశేషం చెప్పాలని! మా జడ్యాగ్రహవాసి సృష్టించిన అభేద్య మైన  సొరంగానికి తరతరాల చరిత్ర వుంది. ఆ చరిత్ర ఈ నాటితో అంతమయింది. అందుక్కారణమేమిటో తెలుసా? నీ తాత నీ రూపంలో వచ్చి తన శక్తితో నీ క్లాస్ మేట్ చలపతిని, పాల పాపారావును, కిళ్ళీ కొట్టు అప్పారావును చిత్తుచేశాడు. అందులో పెద్ద సారాంశం లేదని ఊరుకున్నాడు కానీ చాకలి కనకయ్యతో భోంచేయగలిగేడు. అయితే అందుకు వైజ్ఞానిక శక్తియే అవసరంలేదు. కృషిలో అవన్నీ సాధించవచ్చు.     "ఎందుకంటే తల్లిని చూడాలన్న నీ కోరిక, నిన్ను బ్రతికించుకోవాలన్న నీ తల్లి తపన-ఈ రెండూ ఏకమై అసాధ్యమూ, అభేద్యమూ అయిన సొరంగమార్గంలో నీకు దారి చూపించాయి. వైజ్ఞానికంగా మీకంటే ఎన్నో కోట్ల రెట్లు ప్రగతిని సాధించిన మా అడ్డుగోడల్ని నీ తల్లి పిలుపు, తల్లిని కలవాలన్న నీ కోరిక భేదించాయి. కార్య దీక్షలో ఏమైనా సాధించవచ్చుననడానికింతకంటే ఉదాహరణ ఏం కావాలి?     నిన్ను కన్న సీతాదేవి నీ తల్లి. నీ వున్న దేశం నీ తల్లి. నిన్ను తనపై నిలుపుకున్న భూమాత నీ తల్లి. ఆ తల్లుల కోసం నీవు జీవించు. వారి పిలుపు నీకు అసాధ్యాలను సాధ్యంచేసి, అభేద్యాలను భేదించి పెడుతుంది.     "వైజ్ఞానికంగా మీ మానవులు సాధించిన ప్రగతి గొప్పదే! మీ మానవులకిప్పుడిక వైజ్ఞానిక ప్రగతి అవసరం లేదు. నీ సోదరులంతా నీకులాగే సుఖంగా వుండేందుకు, నీ చుట్టూ వాతావరణం ఎప్పటికీ సహజంగా వుండి నిన్ను రక్షించేందుకు కృషిచేయి."     "కొందరు స్వార్ధపరులు చేస్తున్న దోపిడీ వల్ల నీ దేశంలోనే ఎందరో అన్నం లేక మాడిపోతున్నారు. మీ మానవులు వైజ్ఞానిక ప్రగతి పేరు చెప్పి భూమిని మనుష్యులకే నివాసయోగ్యం కానివిధంగా చేస్తున్నారు. ఈ రెంటినీ నివారించడానికి నీవు కృషిచేయాలి. నీలో పట్టుదల వుండాలి. ఇందుకు జడ్యాగ్రహాధినేతల సాయం నీకవసరం లేదు. సీతాదేవి, భారతమాత, భూదేవి చేతులెత్తి ఎలుగెత్తి నిన్నూ నీ సోదరులనూ పిలుస్తున్నారు. ఆ పిలుపు మీకు అందరికీ దారి చూపిస్తుంది. ఆ దారిలో నడవడమే మీకు, మున్ముందు తరాలకు శ్రేయస్కరం."     ఇలా చెప్పి జడ్యాగ్రహాధినేత మాయమైపోయాడు.     గోపీ అప్పటికింకా నిద్రపోతున్నాడు. వాడికి మెలకువ వస్తే తను లేవడమే కాక తన సహోదరులెందరినో నిద్రలేపగలడు.     వాడు పొందిన అనుభవాలు సామాన్యమైనవి కనుకనా-వాడినిప్పుడు సామాన్యుడనుకునేటందుకు!                     (అయిపోయింది)

ఎర్రకలువ!

ఎర్రకలువ - శ్రీమతి శారద అశోకవర్ధన్ చేతిలోని  కర్రతో  హుందాగా  జీపు దిగింది మంజూష. వెనకాల ఇద్దరు కానిస్టేబుల్స్ ఆమె వెనకే వొస్తూంటే  ముందు ఇద్దరు కానిస్టేబుల్స్ గబగబా నడిచి ఆమె గది డోరు తెరిచారు. మధ్యలో  వున్నవాళ్ళంతా  'గుడ్ మార్నింగ్ మేడమ్' అంటూ  లేచి నుంచుంటే. 'గుడ్ మార్నింగ్ ' అంటూ లోపలికి వెళ్ళింది మంజూష. ఆమె దృష్టి ఒక మూలగా నుంచున్న  యువతి మీద పడింది. ఆమె రోజూలాగా  జైలు దుస్తులు కాకుండా మామూలు చీర కట్టుకుంది. పైటకొంగు మెడచుట్టూ  కప్పుకుని  తలవంచుకు నుంచుంది. ఆమెకేసి  పరికించి చూసింది మంజూష. మొహంలో  అలసట, ఆ కళ్ళలో  ఏదో ఆవేదనా కొట్టొచ్చినట్టు  కనిపిస్తున్నా, ఏదో మంచితనం  ఆమె నుదుటన రాస్తున్నట్టు  కనిపిస్తోంది. చదువు లేకపోయినా  సంస్కారం ఉట్టిపడుతూన్నట్టనిపించింది ఆమెలో మంజూషకి. నీ ప్రవర్తన బాగుందని  రిపోర్టు  రాయడం  వల్ల నీకు శిక్షకూడా ఆరునెలలు తగ్గింది. ముందుగానే  విడుదల చేస్తున్నాం. ఇన్నాళ్ళు  ఈ నాలుగు గోడల మధ్యా మెదిలిన  నీవు ఇప్పుడు బయట ప్రపంచంలో ఎలా ఇముడుతావో జాగ్రత్త!" తన మామూలు ధోరణిలో చెప్పింది మంజూష.     "అలాగే," తలూపింది జైలు నుండి విడుదల కాబోతూన్న కనకమ్మ.     సాధారణంగా  అయితే  మరికొన్ని  హెచ్చరికలు చేసి పంపించేసేదే మంజూష. కానీ కనకమ్మని చూసినప్పుడల్లా  మంజూష  మనసులో ఎదో ఘర్షణ! ఆమెతో  మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకోవాలనే తపన. ఎంత పోలీసాఫీసరైనా  స్త్రీ పరంగా వుండే సహజమైన ఆమె కోమల మనస్తత్వం, దయ, సానుభూతి, విషయం తెలుసుకోవాలన్న  ఆందోళనా ఆ రోజు ఆమె వెళ్ళిపోతుందని తెలిసే సరికి ఎక్కువయ్యాయి. గబగబా అందరితో మాట్లాడి పంపించేసి కనకమ్మని కాసేపు వుండమని సైగ చేసింది. కొన్ని పనులు ఫోన్లలో పూర్తిచేసి,  కొన్ని ఫైళ్ళమీద సంతకాలు పెట్టడం పూర్తిచేసి  కుర్చీలోంచి లేచొచ్చి, కనకమ్మ భుజంమీద చెయ్యివేసింది. కనకమ్మ ఒక్కసారి కన్నెత్తి  మంజూషకేసి చూసి తలదించుకుంది.     మంజూష నవ్వుతూ  ఆమె గడ్డం పుచ్చుకుని తలపైకెత్తి ఆమెకేసి చూసి "చూడు కనకమ్మా! జైలులోకొచ్చిన  వాళ్ళందరూ  దుర్మార్గులేననీ, జైలు బయటవున్న వాళ్ళందరూ  మంచివాళ్ళేనని  నమ్మని వాళ్ళలో నేనొకదాన్ని. కొందరు నేరం చెయ్యకపోయినా, లేదా ధర్మం ప్రకారం వారు చేసింది న్యాయమే కావొచ్చు. న్యాయశాస్త్ర ప్రకారం చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి  తీసుకొని చర్య తీసుకోవడంవల్లా జైలుపాలు కావొచ్చు! కొందరు తెలివిగా  ఎన్ని నేరాలు చేసినా తప్పించుకుపోవచ్చు! అది వేరే విషయం. నిను చూస్తే ఎందుకనో నువ్వు ఏ ఘోరాలు చెయ్యలేని వ్యక్తివని  నా మనసు ఘోషిస్తోంది. అయితే ఉద్రేకంలో అనుకోనివిధంగా హత్య జరిగిపోయింది. జైలుపాలయ్యావు. నీ సత్ప్రవర్తన వల్ల శిక్షతగ్గి విడుదలై వెళ్ళిపోతున్నావు. అయితే  ఒక పోలీసాఫీసరుగా  కాక, ఒక వ్యక్తిగా, ఒక స్త్రీగా నిన్నీ ప్రశ్న  అడుగుతున్నాను. సమాధానం వినాలని ఆశపడుతున్నాను" అంది మంజూష.     ఏమిటో చెప్పమన్నట్లు  కనకమ్మ నమ్రతగా  మంజూష కేసి  చూసింది.     "ఈ దేశంలో  పుట్టిన స్త్రీ భర్త దుష్టుడైనా, దుర్మార్గుడైనా, తాగుబోతైనా నానా హింసలు పెట్టినా పతియే ప్రత్యక్షదైవం అని పడుంటుందే తప్ప - లేదా అతని చేతిలో చావడానికైనా సిద్ధపడుతుందే తప్ప, భర్తను చంపదు. నువ్వు కూడా కావాలని  చంపకపోయినా  అంత ఎదురుతిరిగి ఘర్షణ పడేంత  సంఘటన ఏమిటో  నీ నోటిద్వారా తెలుసుకోవాలనుంది" అని అడిగింది మంజూష.     కనకమ్మ కళ్ళు నీటి కుండలయ్యాయి.     మనస్సు రాకెట్ లా రయ్ మని గతంలోకి దూసుకుపోయింది. చెంపల మీదుగా  కారుతూన్న  కన్నీటిని  పమిటకొంగుతో  తుడుచుకుంటూ  చెప్పడం మొదలెట్టింది.         *    *    *     "నాకు ఏడెనిమిదేళ్ళున్నప్పుడే  మా అయ్య నా పెళ్ళి నాకన్న పదియేండ్లు  పెద్దయిన లింగమయ్యతో  చేసేసిండు. అప్పటికే వాడికి తాగుడలవాటుంది.  పైగా మిరపకాయ బజ్జీల బండి  నాగమ్మతో  సంబంధముంది! నాగమ్మ ఆడికి తాగటానికి పైసలిచ్చేది. ఆణ్ణి తన కాళ్ళకాడ  పడుంటేటట్లు  సేసుకుంది. కొలువు సేసేటోడుకాదు. రోజంతా తాగుడు, దాని కొంపలోనే కులుకుడు. నా పెండ్లికి బెట్టిన  పుస్తెగొలుసు సిల్కుచీర అన్నీ  గొండబోయి డానికే ఇచ్చిండు. మా అమ్మా నాయన నచ్చజేప్పేటందుకు సూసిండ్రు గానీ ఆడు ఇనకుంటే  నా తలరాత గట్టగే వున్నదని  ఒదిలి పెట్టిండ్రు.     ఈ లోపల నాకొక బిడ్డపుట్టింది. ఇంట్ల ఖర్చు బెరిగింది. ఆడు ఇంటికి పూరాగా రాకడ బంద్సేసిండు. అప్పుడు చైతన్య ఇస్కూలు పెద్ద టీచరమ్మ, అదే ప్రిన్సిపాల్ సావిత్రమ్మ  కాడ నేను ఇంట్ల బట్టల బాసాన్లు సాపుచేసే కొలువుకు కుదిరిన. ఆయమ్మ దేవత - నా కట్టంజూసి, నాకు పాతబట్టలిచ్చేది. అన్నం బెట్టేది. ఆ యమ్మ ఇచ్చిన బట్టలుగూడ ఆడు కొండబోయి  నాగమ్మకే ఇచ్చేటోడు! 'నా రాత అట్లగే సస్త' అని ఊకున్న! కానీ...." దుఃఖంతో గొంతు పూడుకుపోతుంటే  మాటరాక  వెక్కివెక్కి  ఏడ్చింది కనకమ్మ. ఆమె గుండె బద్దలయి కన్నీరు వరదగా పారుతోందేమోననిపించింది మంజూషకి. "ఊరుకో కనకమ్మా! అనవసరంగా అడిగి నిన్న బాధపెట్టేను" అంది.     "చెప్పనీ తల్లీ! ఇన్నేళ్ళసంది గుండెలో  గడ్డగట్టిన నీళ్ళు ఇప్పుడు  కరిగికారిపోతున్నయ్" అంది కళ్ళు తుడుచుకుంటూ. మంజూష ఆసక్తిగా  ఆమెనే చూస్తోంది.     కనకమ్మ మళ్ళీ చెప్పడం మొదలెట్టింది:     "నా బిడ్డకి  ఇందిర అని పేరు పెట్టుకున్న దానికి సదువంటే  శానా ఇట్టం. నాతో పనికి గొంచబోతుంటే ఏడ్చేది. ఒకనాడు  అది పనికి రానంటే  బాగా గొట్టిన. బిడ్డ ఎక్కెక్కి ఏడిసింది. ఆయాల బువ్వ తినలేదు. ఆ సంగతి సావిత్రమ్మకి దెలిసింది. ఆ మర్నాటి నుంచే దాన్ని ఆమె ఇస్కూల్లనే  సేర్పించింది. యూనిఫార మిప్పించింది. ఫీజుగూడ  ఆమెనే గట్టేది. నా బిడ్డ  బంగార మాలెగా తయ్యారయ్యింది. మంచిగ జదివేది, సావిత్రమ్మ చాన మెచ్చుకునేది." చెప్పడం ఆపి బోరున ఏడ్చింది కనకమ్మ.     మంజూష కంగారుపడిపోయింది. "ఏమయింది కనకమ్మా! ఊరుకో" అంటూ ఊరడించింది. మంచినీళ్ళ గ్లాసు నందించింది. కాసిన్ని నీళ్ళుతాగి మళ్ళీ చెప్పడం మొదలెట్టింది కనకమ్మ.      "నా సిట్టితల్లి  సీరకట్టడం మొదలెట్టింది. ఆ బస్తీల  అందరి కండ్లు దానిమీదనే! ముఖ్యంగా ఆ నాగమ్మ తమ్ముడు రాజిగాడు  ఇందిరని ఆడికిచ్చి పెండ్లి జెయ్యమని పట్టుబట్టిండు. మా యింటాయనికి  రోజూ పొద్దుగాల, పొద్దుమీకి బాగా తాగిపించి, పెండ్లిజెయ్యమని కొట్లాడెట్టోడు. బుడ్డీలు సూడంగనే అట్లగే జేస్తా అంటూ మాటిచ్చెటోడు మా ఆయన. ఒకనాడు  ఇప్పుడు  తోల్కెస్తెనెగానీ బుడ్డీలియ్యనన్నాడు రాజిగాడు. దాంతో  బుడ్డిదీపంకాడ  సదువుకుంటూన్న ఇందిరని సెయ్యిబట్టి ఈడ్చుకుంట ఆనికానికి తీస్కబోతుండు ఆయన. నేనడ్డుపడితే ఒక్క నూకుడు నూకిండు. ఇందిర గింజుకుంది, ఆడు ఒదిలిబెట్టలేదు. అప్పుడు నేను కూరగాయలు గోస్తున్న, లేచి ఇందిర సెయ్యిబట్టి  నా దిక్కు లాక్కున్న. ఆడు దాన్ని ఒక్కతోపు తోసిండు. అది బోయి బుడ్డిదీపం మీద బడ్డది. ఆడుబోయి కత్తిపీట మీద బడిండు ఆ తోసుట్ల. ఇందిర సీర అంటుకోని మంటలొచ్చేసినయ్! లింగమయ్య  మెడకి కత్తిపీటదాకి మెడ కోస్కబోయింది. రక్తపు మడుగులో పడున్నడు లింగమయ్య. మంటలల్ల  మాడిపోయింది నా బిడ్డ. అంతె! బస్తంత ఒక్కటయ్యింది. నా మొగుణ్ణి  నేనే జంపినా అని రాజిగాడు పోలీసులకి జెప్పిండు. నా సేతులకి బేడీలేసిండ్రు." కనకమ్మకి కళ్ళు తిరుగుతున్నాయి. తూళిపోయింది. మంజూష ఆమె చెయ్యిపట్టుకుని  కుర్చీలో కూర్చోబెట్టింది. కనకమ్మ కన్నీరు మున్నీరుగా ఏడుస్తోంది. మంజూష మనసు వెన్నలా కరిగిపోతోంది.     సారా బుడ్డీకోసం  కన్నబిడ్డనే  అప్పగించడానికి యత్నించిన  తండ్రి! అడ్డుకోబోయి  పెనుగులాటలో బిడ్డనీ, భర్తనీ ఒక్కసారే పోగొట్టుకున్న అభాగిని కనకమ్మ - నీడలేని ఆడది.     సమాజం ఆమెని ఒంటరిగా  బతకనివ్వదు!     'నిందలు! ఘోరాలు! రేపులు!' మంజూష ఊహలు ఎటో వెళ్ళిపోతున్నాయి.     ఆడదాని బతుకు ఎప్పుడూ ఇంతేనా?     బుడ్డీ, ఆలోచనా, ఓపికా, నేర్పూ అన్నీ పురుషుడితో  సమానంగా వున్నా శారీరకంగా స్త్రీ పురుషుడికన్నా  బలహీనురాలు కావడం దౌర్భాగ్యం!     మంజూష శరీరం  ఆలోచనలతో  వొణికిపోతోంది. "దిక్కులేని కనకమ్మ ఎక్కడికి పోతుంది?"     ఆలోచిస్తోంది మంజూష.     "తన ఇంటికి తీసుకుపోతే?     ఎందరినని తీసుకుపోతుంది  ఇలా? దీనికి ఏదిమార్గం? మంజూషకి  తల భారంగా అనిపించి కుర్చీలో కూలబడింది. కనకమ్మకేసి చూసింది. ఆమె తల వంచుకుని  వుంది. కన్నీరు ఆమె గుండెని  తడిపేసింది. కనకమ్మ అంతబాధలోనూ  అందంగా  కనిపించింది మంజూషకి. ఈ సమాజం  ఆమెని బతనినివ్వదు. ఆడతనానికి  అందం శాపమేమో! అదే ఆమెని బలహీనురాలిగా  చేస్తుందేమో? ఆలోచనలతో  సతమతమయిపోతూ  'ఏది ఏమైనా  కనకమ్మని ఒంటరిగా  వుండనివ్వకూడదు. నా దగ్గరే వుంచుకుంటాను. లేకపోతే  ఆ దిక్కులేని  మనిషిని కాకుల్లా  పొడుస్తుంది సమాజం' అనుకుంటూ లేచి నుంచుంది.     "కనకమ్మా! పద, నా జీపు ఎక్కు" అంది.     కనకమ్మ అయోమయంగా చూసింది.     "పద" అంటూ తను ముందు నడిచింది.     కనకమ్మ ఆమె ననుసరించింది.     మంజూష జీపు దగ్గర నుంచునుంది. చైతన్య స్కూలు ప్రిన్సిపాలు సావిత్రమ్మ! " అమ్మా! మీరా?" ఆశ్చర్యంగా అడిగింది కనకమ్మ.     "అవును కనకమ్మా, నేనే! నీ కోసమే ఒచ్చాను."     "నాకోసం మీరింత దూరం వచ్చారా?" కృతజ్ఞతతో  పాదాలమీద  పడింది కనకమ్మ.     "కనకమ్మా! ఆనాడే  నిన్నూ, ఇందిరనూ నా హాస్టల్లోనే  వుంచుకుంటే  ఈ ఘోరం జరిగేదికాదు. బడిలో చేర్చించి చదివిస్తున్నాననే  అనుకున్నానుకానీ  ఇతర విషయాలు ఊహించనందుకు సిగ్గుపడుతున్నాను రా, పోదాం. హాస్టల్లోనే  వుందువుగాని  పిల్లలకి  వండిపెడుతూ. ఆ పిల్లల్లో నీ ఇందిరని చూసుకో! హాస్టల్లో నీ కోసం ఉద్యోగం రెడీగా వుంది, పద!" కనకమ్మ చెయ్యిపట్టుకుని నడిపించి తీసుకువెళుతూన్న సావిత్రమ్మ మంజూషకి దేవతలా కనిపించింది.     ఘోరం, నేరం అక్రమం, అన్యాయం - తెల్లారితే ఇవే చూసే మంజూషకి సావిత్రమ్మలోని  మానవత్వం ముళ్ళమధ్య విచ్చుకున్న గులాబీలా  అందంగా అగుపించింది.      ఆమె మమత, అనురాగం, ఆప్యాయతా శరీరంలో ప్రతి రక్తపు బొట్టూ కలిసి పులకరించి పొంగి అప్పుడే బురదలో  పూచిన ఎర్రకలువలా అనిపించింది. అప్రయత్నంగానే రెండు చేతులూ జోడించి సావిత్రమ్మకి నమస్కరించింది మంజూష.     "మంచితనం పూర్తిగా చచ్చిపోలేదు.     మానవత్వం ఇంకా కొంచెం మిగిలి వుంది.     అందుకే ఈ ప్రపంచం ఇంకా నిలిచి వుంది."     మనసులోనే అనుకొంటూ, సావిత్రమ్మ వెనకాలే వెళ్తున్న కనకమ్మని చూసి తృప్తిగా నిట్టూర్చింది మంజూష.     "ఎటు పోవాలమ్మా?" అడిగాడు జీపు డ్రైవరు.     ఆలోచనల్లోంచి  తేరుకుని ఆలోచించింది మంజూష కట్నం తేలేదని కిరోసిన్ పోసి తగులబెట్టిన అత్త, భర్తల రాక్షసత్వానికి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న సుహాసిని కేసు గుర్తుకొచ్చింది. "గాంధీ ఆసుపత్రికి పోనీ!" అంది జీపులో కూర్చుంటూ. జీపు గాలిలో  దూసుకుపోతూన్నట్టు వేగంగా సాగిపోతోంది. మంజూష ఆలోచనలు మరీ స్పీడుగా పోతున్నయ్!         

అమ్మ పిలుపు

అమ్మ పిలుపు - ఎపిసోడ్ -7 - వసుంధర         పోటీలో ఓడిపోయినా నాకు బాధగా లేదు. సమర్డుల చేతిలో ఓడిపోవడు నాకు సంతోషమే!" అన్నాడు అప్పారావు.     ఆ తర్వాత అప్పారావు వెయ్యి రూపాయలూ ఇవ్వగా గోపీ ఆ డబ్బు కనకరాజు కిప్పించేశాడు.         9     ఆ రాత్రి గోపీ ఒక్కడు తన గదిలో నిద్రపోబోతూండగా "తాతయ్యా! నువ్వు చేసినవన్నీ చూశాను. చాలా తమాషాగా వుంది. నాకెంతో సంతోషంగా కూడా వుంది" అన్న మాటలు గోపీకి వినిపించాయి.     "నాకూ సంతోషంగా వుందిరా! ఎలాగైనా మనుషుల మధ్య జీవితం చాలా బాగుంటుంది. ఇన్నాళ్ళు దూరాన్నుంచి చూశాను. ఇప్పుడు దగ్గర్నుంచి అనుభవిస్తూంటే ఎంతో బాగుంది. ఇక్కడే యిలా వుండిపోతే ఎంత బాగుంటుంది?" అన్నాడు గోపీ.     "తాతయ్య! అంత మాటనకు! పదిరోజులూ ఎప్పుడైపోతాయా అని నేనెదురు చూస్తున్నాను. నువ్వు అన్న మాట తప్పకుండా వెనక్కు వచ్చేయాలి" అన్న మాటలు మళ్ళీ గోపీకి వినిపించాయి.     "నువ్వేమీ కంగారు పడకు. నా వంశాంకురానికి నేనన్యాయం చేయను అన్నాడు గోపీ.     తర్వాత గోపీ నిద్రపోయాడు. మర్నాడు ఉదయం నిద్రలేచాక గోపీ యింట్లో అంతా డబ్బు గురించే మాట్లాడు కుంటున్నట్లర్ధం చేసుకున్నాడు. అసలు స్కూల్లో ఏం జరుగుతోందో అన్నదెవరూ పట్టించుకోవడం లేదు. గోపీ తన తెలివి తేటలతో వాళ్ళ సమస్యను వెంటనే అర్ధం చేసుకున్నాడు.     ఇంట్లో అంత బంగారం దొరికినా వాళ్ళు అందరికీ చెప్పుకోలేదు. ఎందుకు భూమిలో దొరికిన నిధి నిక్షేపాలు ప్రభుత్వానికి చెందుతాయి. కాబట్టి ఆ విషయం రహస్యంగా వుంచాలను కుంటున్నారు. అయితే ఆ బంగారాన్ని డబ్బుగా మార్చడం ఎలాగని వాళ్ళాలోచిస్తున్నారు.     అప్పుడు గోపీ బుర్ర చురుగ్గా పనిచేసింది.అతడొక్కడూ ఎవరికీ చెప్పకుండా ఓ మూలగదిలోకి వెళ్ళి పద్మాసనం వేసుకుని నిష్ఠగా కూర్చున్నాడు. అలా ఓ గంట సేపున్నాడేమో- అంతే! అతని చేతిలోకి ఏవో కొన్ని పుస్తకాలు వచ్చాయి. అప్పుడు గోపీ ధ్యానం వదిలి లేచి తండ్రి వద్దకు వెళ్ళి-"నాన్నా! కొట్టు గదిలో ఈ పుస్తకాలేమిటో ఉన్నాయి చూడు!" అన్నాడు.     రఘురామయ్య ఆశ్చర్యంగా వాటిని చూసి "అరే! ఇవి బ్యాంకు పాసు బుక్కులు, చెక్కుబుక్కులు. స్టేట్ బ్యాంకు లో మనకెవ్వరికీ అకౌంటు లేవే... ఇవి మొత్తం మూడున్నాయి. ఒకటి నాపేరున, మరొకటి నాన్న పేరున, ఇంకొకటి సీత పేరున..." అంటూ అవి తెరచి చూసి ఒక్కొక్కళ్ళ అకౌంట్లో రెండేసి లక్షలున్నాయి. అదీ ఒక్కరోజులో వచ్చినవి కాదు. మనమందరం ఈ అకౌంట్స్ ఎన్నో ఏళ్ళనుంచి నడుపుతున్నట్లు రికార్డుంది" అన్నాడు.     ఏడిసినట్లుంది మనకేమిటి-లక్షల్లో ఎకౌంట్సుండడమేమిటి? ఇందులో ఎవరో సరదాకి ఏవో పిచ్చంకెలు వేసి వుంటారు" అన్నాడు జానకిరామయ్య.     గోపీ వెంటనే-" రాత్రి నాకు కలలో యోగి కనిపించాడు. బంగారముందని చెప్పాడు. ఆ యోగి- నాకు కనపడ్డాడు. ఆయన చెప్పాడూ 'బంగారం మార్చుకునేందుకు మీ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఒకో బిందెలో పాతిక లక్షల విలువ చేసే బంగారముంది. అదంతా డబ్బుగా మార్చుకోవాలంటే వాళ్ళకు కష్టంగా వుంది. అందుకని అందులోని కొంత బంగారం నేనే డబ్బుగా మార్చి బ్యాంకులో వేస్తాను. నా కంప్యూటర్ బుర్రలో బ్యాంకులో ఎన్నో ఏళ్ళనుంచి అకౌంట్స్ నడుస్తున్నట్లు ఏర్పాటు చేస్తున్నాను. కొంత డబ్బు చేరితే మిగతా బంగారం మార్చుకుందుకు వాళ్ళకేం కష్టముండదు. నువ్వు పొద్దున్నేలేవగానే మీ కొట్టు గదిలో వెతికితే బ్యాంకు పాసుబుక్సు కనబడతాయి. అవి తీసుకుని మీ నాన్నకియ్యి" అని అన్నాడు.     రఘురామయ్య ఆశ్చర్యంగా "ఎవడ్రా ఆ యోగి? వెతికి వెతికి మనకు సాయపడుతున్నాడు?" అన్నాడు.     "ఏమో-నాకేం తెలుసు?" అన్నాడు గోపీ.     లక్ష్మీదేవమ్మ మాత్రం "సందేహం లేదు. ఆయన గోపాల్రావు గారే అయుంటారు. ఆయనకు గోపీ అంటే మోజుంది కాబట్టే కలలో కనబడి మరీ అడిగి తన పేరు పెట్టించుకున్నాడు. ముందోసారి బ్యాంకుకు వెళ్ళిరండి" అంది.     "బ్యాంకుకు వెళ్ళేక తీరా డబ్బు లేదంటే మనల్ని నేరస్థుల్లా చూస్తారు. నా పేరున బ్యాంకులో ఇంత డబ్బుందంటే నాకు నమ్మకం లేదు" అన్నాడు రఘురామయ్య అపనమ్మకంగా.     దానిమీద కాసేపు తర్జన భర్జనలు జరిగేక ఆఖరికి అకౌంట్ నంబర్సు చెప్పి స్టేట్ బ్యాంకులో వాటి విశేషాలు తెలుసుకోవాలని జానకిరామయ్య అన్నాడు. బ్యాంకుకు జానకిరామయ్య, రఘురామయ్య, సీతాదేవి- ముగ్గురూ వెళ్ళారు. అకౌంట్ నంబర్సు జానకిరామయ్యే కౌంటర్లోని వ్యక్తికి చెప్పి వాటిలో ఎంత డబ్బుందో చెప్పమన్నాడు. కౌంటర్లోని వ్యక్తి యథాలాపంగా ఆ అకౌంట్సు తిరగేసి వాటిలోని మొత్తాలు చూసి ఆశ్చర్యంగా జానకిరామయ్య వంకచూసి-"మిమ్మల్నెప్పుడూ నేను చూడనేలేదే" అన్నాడు. అతడు చెప్పిన మొత్తాలు వాళ్ళ దగ్గరున్న పాస్ బుక్స్ తో సరిపోయాయి. అప్పుడు జానకిరామయ్య, రఘురామయ్య, సీతాదేవి ముగ్గురూ ఒక్కొక్కరు వెయ్యేసి రూపాయిలకు చెక్కులు రాసిచ్చారు.     ముగ్గురూ కొత్తగా వుండడం వలన వాళ్ళ సంతకాలను కూడా వెరిఫై చేయడం జరిగింది. ఆశ్చర్యమేమిటంటే బ్యాంకులో వాళ్ళు ముగ్గురి స్పెసిమెన్ సంతకాలూ ఉన్నాయి. వాటితో వాళ్ళ సంతకాలూ సరిపోయాయి.     "అంతా మాయగా వుంది. కాలో నిజమో తెలియడంలేదు-" అనుకుంటూ ముగ్గురూ యిల్లుచేరారు.     "యోగి చెప్పింది నిజంగానే వుందిరా రఘూ! ఓ బిందిలో బంగారం కొంత తగ్గింది" అంది లక్ష్మీదేవమ్మ వాళ్ళు ముగ్గురూ యింటికిరాగానే.          "ఒక్కసారిగా మనమే దేవతలో కరుణించారే అమ్మా! ఇంట్లో బంగారముంది, బ్యాంకులో లక్షలున్నాయి" అన్నాడు రఘురామయ్య సంతోషంగా.     ఇది విని గోపీ సంతోషంగా నిట్టూర్చాడు. ఆ రోజు వంట్లో బాగాలేదని అతడు బడి ఎగేశాడు. అందరూ సంతోషంలో వున్న మూలాన వాడి బడి గురించి ఎవరూ పట్టించుకోలేదు.     గోపీ సంతోషంగా తన గదిలోకి వెళ్ళి ఈ విషయం కుబేరుడి కొలను వద్దనున్న యోగికి తెలియజేశాడు. యోగి శరీరంలోనున్న గోపీ-" పెద్ద తాతయ్యా! ఇదంతా నీకెలా సాధ్యపడింది?" అన్నాడు.     "మనిషి మెదడుకు అసాధ్యమైనది లేదు. మీవాళ్ళ అకౌంట్సు మూలంగా ఎందరు కాతాదార్లకో అకౌంట్ నంబర్లు మారిపోతాయి. కానీ బ్యాంకులో ఎక్కడా పద్దుల్లో తేడా వుండదు. మీ యింట్లోని బంగారాన్నే ఒక వడ్డీ వ్యాపారింట్లోకి మార్చి అక్కణ్ణించి నోట్లు తీసి వాటిని బ్యాంకులోకి మార్చాను. ఇదంతా నా ఆలోచనలవల్లే జరిగింది. కానీ నేనో పొరపాటు చేశాను. మనవాళ్ళకు సాయపడాలనే ఆత్రుతలో నీ మెదడు పరిమితులు మరచిపోయాను. ఇప్పుడు నీ మెదడు వేడెక్కుతోంది. ఏం చేయాలో తెలియడం లేదు. నేను అసహాయుణ్ణి. కాసేపట్లో నేను స్పృహతప్పి పడిపోవచ్చు-" అన్నాడు గోపి.     "అప్పుడేం జరుగుతుంది?" అన్న మాటలు గోపీకి వినిపించాయి.     "వేడికి మెదడు పగిలిపోవచ్చు. లేదా నీ మెదడు నన్ను లొంగదీసుకుని సామాన్యుణ్ణి చేయవచ్చు. రెండు విధాలా కూడా నేను నీ దగ్గరకు రాలేను-" అంటూ గోపి పెద్దగా కేకపెట్టాడు.     ఆ కేక విని ఇంటిల్లపాదీ కంగారుగా అక్కడకు పగురున వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి చూసేసరికి గోపీ అక్కడ స్పృహ తప్పి పడి వున్నాడు.     లక్ష్మీదేవమ్మ కంగారుగా అతనిని సమీపించి- "ఏమైందిరా గోపీ!" అంటూ వాడివళ్ళు ముట్టుకుని కంగారుగా "వీడి వళ్ళు కాలిపోతోంది" అంటూ అరిచింది.     అందరూ కంగారుపడ్డారు.     "వీడి నే దెయ్యమో పట్టి పీడిస్తోంది. ఇంట్లోకి బంగారం, బ్యాంకులోకి లక్షలు తెచ్చినట్లేతెచ్చి ఆ దెయ్యం వీడి నెత్తుకుపోయే లాగుంది" అంటూ లక్ష్మీదేవమ్మ శోకాలు పెట్టసాగింది.     ఈ లోగా రఘురామయ్య ఒక డాక్టర్ని పిల్చుకుని వచ్చాడు. డాక్టరు వచ్చి గోపీని పరీక్షించి చూసి "పరిస్థితి చాలా ప్రమాదకరంగా వుంది" అన్నాడు.             10     కుబేరుడి కొలను వద్దనున్న యోగి శరీరంలోకి గోపీకి వున్నట్లుండి మతిపోయినట్లయింది. అతడికి అక్కణ్ణించి ఎలా బయటపడాలో తెలియదు. అవతల గోపీ శరీరం ప్రమాదావస్థలో వుంది. ఆ శరీరాన్నే అంటిపెట్టుకుని వుండడం వల్ల కాబోలు గోపాల్రావు తాతయ్య జీవశక్తి కూడా అసహాయమ్గా వుండిపోయింది.     కాసేపాగి గోపీ నెమ్మదిగా ఆలోచించసాగాడు. అక్కడ ఎన్నో పుస్తకాలున్నాయి. తనకేదైనా ఉపాయం దొరుకుతుందేమోనని గోపీ అవన్నీ ఒకటొక్కటిగా తిరగేయసాగాడు. అవి చాలా వరకూ వాడికి అర్ధం కావడంలేదు.     అక్కడ రకరకాల యంత్రాలున్నాయి. ఏ వంటలు కావాలంటే అవి చేసిపెట్టేవి, ఏ పాటలు కావాలంటే అవి వినిపించేవి, ఏ దృశ్యాలు కావాలంటే అవి చూపించేవి - ఎన్నో ఉన్నాయి. కానీ గోపీకి ఆ సొరంగం లోంచి బయటపడే మార్గం కావాలి. అదొక్కటీ చెప్పడానికి అక్కడే యంత్రమూలేదు.     గోపీ దిగులుగా తనింట్లోని దృశ్యాన్నే చూస్తున్నాడు. తన శరీరం స్పృహలేకుండా మంచంమీద పడుంది. ఆ శరీరం వద్ద కూర్చుని ఏడుస్తోంది తల్లి సీతాదేవి.     తల్లిని చూడగానే గోపీ అప్రయత్నంగా -"అమ్మా!" అని గట్టిగా అరిచాడు వాడి ఆ పిలుపు సీతాదేవి చెవుల్లో వినిపించింది. అది గోపీగొంతు లాగే వుంది. ఆమె అప్రయత్నంగా-"బాబూ- గోపీ-పిలిచావా?" అంది.     గోపీకి ఆ మాటలు వినిపించాయి.     కానీ ఈ లోగా లక్ష్మీదేవమ్మ-"వాడేం పిలుస్తాడే-వళ్ళెరక్కుండా పడున్నాడు" అంది.     గోపీకి ఏడ్పువచ్చింది-"లేదమ్మా! నిజంగానే పిలిచాను. నాకు నీ దగ్గరగా రావాలనునుందమ్మా- కానీ రాలేను" అన్నాడు గోపీ. ఆశ్చర్యమేమిటంటే ఏ ఆవేదన కారణంగానో వాడి గొంతు తల్లి గురించిన వ్యధ పడుతుంటే గోపీకిలాగే ధ్వనిస్తోంది.     "బాబూ-గోపీ! ఎక్కణ్ణించిరా పిలుస్తున్నావు! అంది సీతాదేవి.     మిగతా మాటలకూ ఈ మాటలకూ తేడా కనిపించింది గోపీకి. ఆ మాటలు సొరంగపు గోడల్ని చీల్చుకుని వస్తున్నట్లున్నాయి.     తల్లి ఆలోచనల నిండా తనే వున్నాడు. తన ఆలోచనలనిండా తల్లి వుంది. అందుకే తామొకరితో ఒకరు మాట్లాడుకో గల్గుతున్నారు. అప్పుడే గోపీ బుర్రలో ఓ ఆశా కిరణం ఉదయించింది. "అమ్మా! నువ్వు నన్నలా ఆగకుండా పిలుస్తూండమ్మా! ఆ పిలుపును వెన్నంటే నేను నిన్ను చేరుకుంటాను..." అంటూ అరిచాడు.                     (సశేషం) 

అమ్మ పిలుపు

అమ్మ పిలుపు - వసుంధర ఎపిసోడ్ - 6               చలపతి అతడివంక క్రూరంగా చూశాడు. గోపీ పట్టించుకోకుండా వాడి పక్కనే కూర్చున్నాడు. చలపతి వెనువెంటనే గోపీని పక్కకు తోసేయాలనుకున్నాడు. కానీ ఎవరో చెప్పినట్లు ఆగిపోయాడు.     క్లాసు క్లాసంతా ఆశ్చర్యంగా ఆ బెంచీ వంకే చూస్తున్నారు. అప్పుడేదో జరుగుతుందని అంతా అనుకుంటున్నారు. ఈ లోగా క్లాసులోకి ఇంగ్లీషు టీచరు వచ్చాడు. క్లాసులోని కుర్రాళ్ళందరూ లేచి నిలబడి తిరిగి కూర్చున్నారు.     ఇంగ్లీషు టీచరు దృష్టి కూడా అనుకోకుండా చలపతి బెంచీమీదనే పడింది. ఆయన ఆశ్చర్యంగా "అరె! చలపతి బెంచీ మీద ఈ రోజు ఇద్దరున్నారే" అన్నాడు అప్రయత్నంగా.     చలపతి వెంటనే విసురుగా లేచి నిలబడ్డాడు. "ఈ వెధవనిక్కణ్ణించి మీరు లేపకపోతే మీ మర్యాదకూడా దక్కనివ్వను" అందామనుకున్నాడు. కానీ "ఇన్నాళ్ళూ అనాగరికంగా, అసహ్యంగా ప్రవర్తించినందుకు సిగ్గుపడుతున్నాను మేష్టారూ! నన్ను క్షమించండి. ఇవతల పక్క కూడా మరొకరువచ్చి కూర్చుంటే సంతోషిస్తాను" అంటూ అటున్న పుస్తకాల సంచీని తీసిముందు పెట్టుకుని కూర్చున్నాడు.     చలపతి గోపీని పక్కన కూర్చోనిచ్చినందుకే ఆశ్చర్యపడుతున్న క్లాస్ స్టూడెంట్స్, టీచరూ అతడి ఈ మాటలకింకా ఆశ్చర్యపడ్డారు. ఇంగ్లీషు టీచరు చలపతిలో వచ్చిన మంచి మార్పును మెచ్చుకుని రామేశాన్ని లేచి వెళ్ళి చలపతి పక్కన కూర్చోమన్నాడు. రామేశం లేచి రాగానే చలపతి లేచి బయటకు వచ్చి "నువ్వు గోపీ పక్కన కూర్చో. నువ్వు వాడూ ఫ్రెండ్సు కదా" అన్నాడు రామేశం కూర్చోగానే చలపతి అప్పుడు తనూ పక్కన కూర్చున్నాడు. మొత్తం క్లాసు క్లాసంతా ఈ సంఘటనకు తెల్లబోయారు.     చలపతికి మాత్రం అంతా విచిత్రంగా వుంది. వాడికి గోపీమీద చాలా కోపం వుంది. పట్టుకుని తన్నాలని కూడా వుంది. అందర్నీ కసికొద్దీ తిట్టాలని వుంది. కానీ వాడి అవయవాలేమీ వాడి స్వాధీనంలో లేవు. వాడొకటి చేయాలనుకుని ఒకటి చేస్తున్నాడు.     క్లాసు అయిపోయాక అందరూ గోపీ చుట్టూ చేరారు. అందులోనూ తర్వాత క్లాసు లెక్కలది.. రామనాధం మేస్టారు పోయాడు. ఆ పీరియడ్ కి వేరే మాస్టార్నింకా వేయలేదు.     "చలపతిలో ఎంత మార్పు? ఇదెలా జరిగింది గోపీ!" అని అంతా గోపీని అడిగారు. గోపీ అప్పుడుత్సాంగా "చలపతిగాడు జడ్డి వెధవ. చదువులో తెలివి లేదు. బుద్ధులు మంచివి కావు. అందరూ వాణ్ణి అసహ్యించుకుంటున్నారు. అయినా ఏమీ చేయలేకపోతున్నారు. ఇదినాకు నచ్చలేదు. నిన్న నేను వాణ్ణి చెడామడా తిట్టి మంచి బుద్దులు నేర్పాను. వాడప్పుడు నా కాళ్ళు పట్టుకొని ఇంక మీదట తను బుద్దిగా వుంటాననీ నేను చెప్పినట్టు వింటాననీ అన్నాడు. అన్నమాట నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు కూడా చూడండి. పీరియడ్ కాళీ అయినా సరే సీట్లోంచి కదలద్దన్నానని అలా కదలకుండా కూర్చున్నాడు." అన్నాడు.     ఈ మాటలు వింటూంటే చలపతికి వళ్ళుమండి పోయింది. అన్నీ అబద్ధాలు. వాడు గోపీని తిట్టాలని నోరు తెరిచాడు. చేయి విసిరాడు. కనీ అప్రయత్నంగా వాడు అందరికీ దణ్ణం పెట్టి, "నేను చాలా పాపాలు చేశాను. గోపీ నా కళ్ళు తెరిపించాడు. ఇన్నాళ్ళూ మీకు చేసిన అన్యాయానికి ప్రతిఫలంగా కొన్నాళ్ళ పాటు మీరందరూ ఎలా చెబితే అలా నడుచుకోవాలనుకుంటున్నాను" అన్నాడు.      అప్పుడు కొందరు వాడిని గుంజీలు తియ్యమన్నారు. కొందరు పిల్లిమొగ్గలు వేయమన్నారు. కొందరు నాట్యం చేయమన్నారు. కొందరు కాళ్ళకు మొక్కించుకున్నారు. చలపతి మాత్రం మారుమాట్లాడకుండా ఎవరేం చెబితే అది చేశాడు. కాసేపటికి గోపీ వాళ్ళను వారించి "చలపతి చేసిన పాపాలకు శిక్ష అయిపోయింది. వాడిప్పుడు మంచి వాడైపోయాడు. మంచి వాళ్ళనేడిపించడం పాపం. ఇంక వాడి జోలికి వెళ్ళకండి. మనమిప్పుడు రెండో సాహస కార్యం గురించి ఆలోచించాలి" అన్నాడు.     రామేశం వెంటనే ఉత్సాహంగా "అయితే నువ్వు పాల పాపారావుతో పోటీ పడతావా?" అన్నాడు.     "ఛాఛా-ఆ పాపారావుతో నేను పోటీ పడ్డమేమిటి? ముందు వాణ్ణి మన కనకరాజుతో పోటీ పడి నెగ్గమనండి. అప్పుడు చూద్దాం"-అన్నాడు.     ఇది విని అందరూ తెల్లబోయారు. కనక రాజు ఆ స్కూల్లోనే పదవ తరగతి చదువుతున్నాడు. వాడికి ఒక కాలు పొట్టి. ఒక కాలు పొడుగు. మనిషి కుంటుతూ నడుస్తూంటాడు. వాడికో సైకిలుంది. కాళ్ళెగుడు దిగుడు కావడం మూలాన వాడు చాలా నెమ్మదిగా సైకిలు తొక్కుతాడు. ఆ స్కూల్లో నత్త నడకలా అనడానికి బదులు కనకరాజు సైకిల్లా అనడం మామూలు.     "బాణంలా దూసుకు పోయే ఆ పాపారావెక్కడ? మన కనకరాజెక్కడ? నీకేమైనా మతి పోయిందా?" అన్నాడు రామేశం.     "అదంతా నాకు తెలియదు. చేవుంటే పాపారావుని కనక రాజుతో పోటీ పడి ఓడించమనండి. కనకరాజు మీద నెగ్గేకనే నేను పాపారావుని ఓడిస్తాను. పాపారావు ఈ పోటీకి ఒప్పుకోలేదంటే, నా శక్తికి భయ పడ్డాడని అర్ధం" అన్నాడు గోపీ.     ఈ వార్త పాల సైకిళ్ళ పాపారావుని చేరింది. కుంటి వాళ్ళతోటీ, సొట్టి వాళ్ళతోటీ పోటీ పడ్డం నాకవమానం అంటూ ముందు వాడు చిందులు తొక్కాడు. కానీ అందువల్ల తను గోపీకి భయపడ్డానన్న చెడ్డపేరు రావచ్చునని అర్ధమయ్యాక తను పోటీకి సిద్ధపడ్డాడు. ఈ పోటీలో పాల్గొనడానికి కనకరాజు సిగ్గుపడ్డాడు. కానీ గోపి వాడిని ఒప్పించ గలిగాడు. హైస్కూలు విద్యార్ధులందరూ తలో రూపాయి చందా తెచ్చి కనక రాజుకు బహుమతిగా యివ్వాలని గోపీ చెప్పాడు.     కనక రాజెలాగూ నెగ్గడు కదా అన్న నమ్మకంతో రామేశం ఆ చందా డబ్బులు వసూలు చేసే పూచీ తనదన్నాడు.     చలపతికి బుద్ధి చెప్పిన మర్నాడే గోపి ఈ పోటీ ఏర్పాటు చేశాడు. పోటీ స్కూలు దగ్గర సాయంత్రం ప్రారంభమయింది. గోపీ కనక రాజుతో "నువ్వు శ్రమ పడకు. ఎప్పటిలాగే మామూలుగా సైకిలు తొక్కు. విజయం నీదే అవుతుంది" అన్నాడు.     పోటీదారు లిద్దర్నీ గమనించడానికి సురేష్ అనే కుర్రాడు మోటార్ సైకిల్ మీద బయల్దేరాడు. వాడి వెనుక గోపీ, రామేశం కూర్చున్నాడు.     సరిగ్గా స్కూలు గేటు దగ్గర సాయంకాలం అయిదింటికి సైకిళ్ళు రెండూ బయల్దేరి సీతా నగరంలోని గంగమ్మ చెరువును చేరుకోవాలి. ఎవరు ముందు వెడితే వాళ్ళు నెగ్గినట్లు.     విద్యార్ధుల్లో కొందరు స్కూలు గేటు వద్ద వుంటే కొందరు గంగమ్మ చెరువు వద్దనున్నారు.     సరిగ్గా అయిదింటికి ఓ విద్యార్ధి ఈల వేయగా పాపారావు, కనక రాజు సైకిళ్ళు తొక్కసాగారు. గోపీ హెచ్చరికను మరిచిపోయి కనకరాజు తనశాయశక్తులూ ఉపయోగించి సైకిలు వేగంగా తొక్కుతున్నాడు. ఎటొచ్చి పాపారావు విషయమే విచిత్రంగా వుంది. అతడు కూడా తన శాయశక్తులూ ఉపయోగించి సైకిలు తొక్కుతున్నాడు. కానీ ఎదురుగాలి ఉన్నట్లుగా అతడి సైకిలు వేగంగా ముందుకు వెళ్ళడం లేదు. అది పాపారావుకే విచిత్రంగా వుంది.     కనక రాజు గంగమ్మ చెరువు చేరుకునే సరికి పాపారావింకా సగం దూరం కూడా దాటలేదు. స్కూలు విద్యార్ధులందరూ గంగమ్మ చెరువు వద్ద ఉత్సాహంగా పెద్దగా కేకలు వేశారు. కాసేపు సైకిలు తొక్కేక పాపారావుకు పోటీలో ఓడినట్టు అర్ధమైంది. వాడింక చెరువు వైపుకు వెళ్ళకుండా ఊళ్ళోకే వెళ్ళిపోయాడు. అప్పుడు మళ్ళీ వాడి సైకిలు రయిన దూసుకుపోయింది. పాపారావు ఆశ్చర్యపోతూ ముందు ఓ సైకిలు షాపు వద్దకు వెళ్ళి "సైకిల్ కండిషనెలాగుందో చూడు" అన్నాడు.     షాపువాడన్నీ పరీక్షించి "నిక్షేపంగా ఉంది" అన్నాడు.     ఏదో మోసం జరిగిందని పాపారావనుకున్నాడు. కానీ ఎలా జరిగిందో వాడికి అర్ధంకాలేదు. ఈ అవమానంనుంచెలా తప్పించుకోవాలో అని ఆలోచిస్తూంటే వాడి మెదడు అదుపు తప్పింది. అటు మీదట వాడు కనిపించిన వాళ్ళందరికీ కనకరాజనే హైస్కూలు కుర్రాడు సైకిల్ పందెంలో ఓడించాడు" అని చెప్పసాగాడు. ఈ విషయాన్ని వాడు కొంతమంది ఊరి పెద్దల యిళ్ళ క్కూడా వెళ్ళి చెప్పుకున్నాడు. అయితే అలా చెప్పుకోవాలని వాడనుకోలేదు.     పాపారావు సంగతిలా వుంటే అక్కడ గంగమ్మ చెరువు వద్ద విద్యార్ధులందరూ సంతోషంలో కేరింతలు కొడుతూంటే చటుక్కున చెరువులోంచి అప్పారావు పైకి లేచి -"కుర్రాళ్ళు ఏమిటిక్కడ గొడవ?" అన్నాడు.     అప్పుడు గోపీ అప్పారావుని చూసి కనకరాజు పందెంలో నెగ్గిన విషయం చెప్పి "ఇప్పుడు మాకుర్రాళ్ళంతా డబ్బు పోగుచేసి కనకరాజు కివ్వాలి. నువ్వే వెయ్యి రూపాయలూ ఇచ్చేస్తే మాకాశ్రముండదు. కావాలంటే నిన్ను ఈత పందెంలో ఓడిస్తాలే!" అన్నాడు.     "ఏమిటి-నన్నీ పందెంలో ఓడిస్తావా? ఏదీ-చెరువులోకి దూకు" అన్నాడు అప్పారావు కసిగా.     "పాపం-ఇప్పటికే ఈది ఈది అలిసియున్నావు. మన రేపొద్దున్న పోటీ పెడదాం" అన్నాడు గోపీ వేళాకోళంగా.     "నీ లాంటి బొట్టికాయతో పోటీ పడ్డానికి రేపటి దాకా ఆగక్కర్లేదు. ధైర్యముంటే ఇప్పుడే దూకు-" అన్నాడు అప్పారావు.     "సరే-నువ్వడిగావనే పోటీ పడుతున్నాను. తర్వాత అన్యాయమని అనకూడదు" అని "రామేశం-ఇప్పుడు టైము చూడు. ఎవరు ముందు ఒడ్డెక్కితే వాళ్ళోడినట్లు" అంటూ గోపీ నీళ్ళలోకి దూకాడు.     అందరూ ఆశ్చర్యంగా చూడసాగారు. గంగమ్మ చెరువు ఒడ్డు దగ్గరే నిలువులోతుందని చెప్పుకుంటారు. గోపీ అంతకు ముందెన్నడూ ఆ చెరువులో ఈది వుండలేదు. అలాంటి వాడు ధైర్యంగా ఈ చెరువులో కెలా ఉరికాడు? ఉరికినా అప్పారావుతో ఎలా పోటీ పడగలడు?     గోపీ, అప్పారావు చెరువులో హుషారుగా ఈతలు కొడుతున్నారు. చుట్టూ చేరిన వారందరూ వాళ్ళను గమనిస్తున్నారు.     ఉన్నట్లుండి అప్పారావును వీపు మీద ఎవరో గుచ్చినట్లయింది. అప్పారావటూ యిటూ అనుమానంగా చూశాడు. గోపీ దగ్గర్లోనే ఈదుతున్నాడు. "నువ్వేదో మోసం చేస్తున్నావు." అనాలనుకున్నాడు. కానీ "అయ్యబాబోయ్, నాకాయాసం పెరిగిపోతోంది. నన్ను రక్షించండి" అన్నమాట లతడి నోట్లోంచి వచ్చాయి. తనలాగన్నందుకతడే ఆశ్చర్యపోయి "మోసం" అని అరవబోయాడు. కానీ "ఎవరూ రారేం-నన్ను రక్షించరేం?" అన్న మాటలే అతడి నోటి నుండి వెలువడ్డాయి.     అంతే! వెంటనే ఈత తెలిసిన నలుగురైదుగురు కుర్రాళ్ళు చెరువులోకి దూకి అప్పారావును ఒడ్డుకిలాగేశారు. అప్పారావు వాళ్ళను ప్రతిఘటించాలనుకున్నాడు. "నన్నీత కొట్టనివ్వండి-నాకేమీ ఆయాసం లేదు" అని అరవాలను కున్నాడు. కానీ "థాంక్యూ! సమయానికి నన్ను రక్షించారు.                     (సశేషం)     

నేను టామీని కాను

నేను టామీని కాను - శ్రీమతి శారదఅశోకవర్ధన్ "ఛీ! పో! అస్తమానం నా వెనకాలే ఒస్తావేంటీ? వెళ్ళు!" కసురుకున్నాడు ఇందర్. అది మెరిసేకళ్ళతో అతనికేసి చూస్తూనే ఉంది. ఆ చూపుల్లో ఏదో ఆశ! ఏదో భావన!     "పో! ఊ...." దాదాపు రెట్టింపు స్వరంతో అరిచాడు ఇందర్ కొట్టినట్లుగా.     అది బెదిరిపోయిందేమో, వెనక్కి వెళ్ళిపోయింది.     ఇందర్ బూట్లు వేసుకోవడం పూర్తిచేసి టై కట్టుకుంటున్నాడు.     దూరం నుంచి ఇదంతా  చూస్తున్న  కోటేశ్వరరావుగారు "ఒరేయ్ ఇందర్! ఎందుకురా దాన్నలా కసురుకుంటావ్? నోరులేని మూగజీవిరా అది పాపం!" అన్నారు, వెళ్ళిపోతున్న  టామీని వెనక్కి పిలిచి కిటికీలో వున్న ప్యాకెట్ లోంచి బిస్కట్లు తీసివేస్తూ.     బిస్కట్లు వాసనకి  వెళ్ళిపోతున్న  టామీ  తోకాడించుకుంటూ  వెనకొచ్చింది. సంబరంతో ఎగిరిగంతేసి అతని మీదికి దూకుతూ  అతని చేతిలోని బిస్కట్టుని అందుకుంది.     "మూగజీవి లేదు, గీగజీవి లేదు. దానికంతా  తెలుసు. కసురుకున్నా దగ్గరకు తీస్తారని తెలుసు. అందుకే  అది తరిమికొడుతున్నా వెంట వెంట తిరుగుతుంది. ఛీ!ఛీ!" అంటూ టై కట్టుకోవడం పూర్తిచేసి, మరోసారి  అద్దంలో చూసుకుని క్రాపు సవరించుకుంటూ  వెళ్ళిపోయాడు ఇందర్ కారు డ్రైవ్ చేసుకుంటూ. రాత్రికోసం  చపాతీల పిండి  కలుపుతున్న  శకుంతలమ్మకి  ఎందుకనో సడన్ గా, తనూ  ఆ టామీలాగే అనిపించింది. రొట్టెల పిండి ముద్దలా  ఆలోచనలన్నీ  పోగయి ఉండ కట్టుకోసాగాయి.         *    *    *     పసుపు పారాణితో, నుదుట  కళ్యాణ తిలకంతో పందిట్లో  కూర్చున్న శకుంతలకి  ఉన్నట్టుండి  తన వాళ్ళెవరూ  కనిపించకపోవడం  ఆశ్చర్యాన్ని  కలిగించింది. పందిరంతా కలియజూసింది. స్నేహితురాలితో  చెవిలో  మెల్లగా చెప్పింది. "మా వాళ్ళంతా  ఎక్కడున్నారో చూడు. ఒక్కరైనా  దగ్గరలేరేం?" అని. 'నీకు తెలీదా? మీ వాళ్ళెవరూ  భోం చేయకుండా  వెళ్ళిపోయారు. మీ మామగారు మీ నాన్నగారిని  ఏదో అన్నారు, పెళ్ళఏర్పాట్లు  సరిగ్గా  చేయలేదని!" చెప్పింది చంద్రమతి.     పిడుగుపడ్డట్లయింది శకుంతలకి. కళ్ళకాటుక  వెచ్చటి  తడికి కరిగిపోయింది. రక్తనాళాలు చిట్టినట్లయి  కళ్ళలో  ఎర్ర జీరలు  పొంగుకొచ్చాయి. నోట మాట రాలేదు. అవమానంతో  కృంగిపోతున్న తండ్రి, కన్నీళ్ళతో  తడిసిపోతున్న  తల్లీ, అయోమయంగా చూస్తున్న ఇద్దరు తమ్ముళ్ళు....ఇద్దరు చెల్లెళ్ళూ....కళ్ళముందు కదిలారు. గుండె బరువెక్కిపోయింది. ఆవేశంతో  ఒళ్ళు వెచ్చబడి జ్వరం వచ్చినట్లనిపించింది. నీరసంతో శరీరం తూలిపోతూన్నట్లనిపించింది.     "కంగ్రాట్స్!" అంటూ ఎవరెవరో వస్తున్నారు, పోతున్నారు, బహుమతుల నందజేస్తున్నారు. అవన్నీ చంద్రకిచ్చి బిత్తర చూపులు చూస్తుంది  శకుంతల.     "అమ్మాయ్! వీళ్ళంతా  నా కొలీగ్స్." పరిచయం చేశారు రామశర్మగారు.     "కంగ్రాట్యులేషన్స్" అన్నారు వాళ్ళంతా.     "థాంక్స్" చెప్పింది శకుంతల.     "మీ వియ్యంకులేరీ?" అడిగారు వారు.     "రండి, భోం చేద్దురుగాని. ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది" అంటూ  మాట దాటేసి వాళ్ళని భోజనానికి తీసుకుపోయాడు రామశర్మగారు.     శకుంతల కళ్ళు నీటి కుండలయ్యాయి.       "ఆర్ధిక అసమానతలే కదా  ఈ పరిస్థితికి కారణం? అయినా నాన్న డబ్బుకి పేదవాడే కానీ, గుణానికీ మర్యాదకీ కాదే? బతికి చెడ్డ ఆయనకీ ఇప్పుడున్న  ఆస్తి సంతానమే! అందరూ  కష్టపడి  చదువుకొని పైకి వస్తున్నారు. మరి తనూ  అంతేగా. తన చదువూ, అందం అవీ చూసేగా తనని కోడలుగా చేసుకుంటానన్నది? మెడలో  మూడుముళ్ళు పడగానే, తను ఆ పేద తండ్రి కూతురిగా కాక  ఈ  శ్రీమంతుని  కోడలుగా మారిపోయిందా?" శకుంతలకి దుఃఖం ముంచుకొస్తోంది. రామశర్మగారి మీద  కోపం ముంచుకొస్తోంది. "ఇలా రామ్మా! ఈమె నా మేనత్త కూతురు. చిన్నప్పుడు మేమంతా ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు ఆమెగారు ఆంధ్రదేశం, పల్లెటూళ్ళు అన్నీ మరిచిపోయి, అమెరికాలో  సెటిలయిపోయింది." ఏదేదో చెబుతూ  పరిచయం  చేస్తున్నారు దుఃఖాన్ని  దిగమింగుకుని, కోపాన్ని అణుచుకుంటూ  ఆమెతో మాట్లాడింది శకుంతల. సమయం చూసి తన బాధని  మెల్లగా  భర్తతో చెప్పింది.     "ఓ....ఫర్ గెటిట్! నాన్న ఊరికే  ఏమీ అనరుగా? ఏర్పాట్లు తన స్టేటస్ కి తగినట్లు లేవని బాధతో ఏమైనా  అనుంటారు. అంతమాత్రానికి  మీ నాన్న అలా వెళ్ళిపోవాలా?" అన్నాడు కోటేశ్వరరావు. మామగారి ప్రవర్తన కన్నా భర్త మాటలు శకుంతలకి శూలాల్లా తగిలాయి. కాళ్ళకింద  భూమి  బద్ధలవుతున్నట్లు  అనిపించింది. అక్కడి నుంచి  పారిపోవాలనిపించింది. గుండెమీద ధగధగా  మెరుస్తున్న మంగళ సూత్రాలు  కదలకుండా  బంధించినట్లయింది. నిస్సహాయంగా, బేలగా, కీలుబొమ్మలా ఉండిపోయింది.     "ఐస్ క్రీం తింటావా?" అడిగాడు కోటేశ్వరరావు.     "వద్దు"     ఆమె మాట పూర్తవకుండానే  ఎవర్నో పిలిచి రెండు ఐస్ క్రీం ప్లేట్లు తెప్పించారు.     గుండెల్లో మంటలు!!     నోట్లో చల్లగా ఐస్ క్రీం!     ఆడదానిగా పుట్టినందుకు మొదటిసారిగా  తననితాను తిట్టుకుంది శకుంతల.     "ఛీ! పో! అని చీదరించుకుంటే  తోక  ముడుచుకుని పారిపోయే కుక్కలా  నోరుమూసుకుని ఊరుకోవడం, 'రా! ర'మ్మని పిలిచేసరికి  నోరు తెరుచుకుని  ఆశగా  పరుగెత్తే శునకంలా  వెర్రి ఆనందంతో  చేరువవ్వడం! ఏమిటో ఈ బతుకు?" నిట్టూర్చింది శకుంతల. పరిస్థితులు  మారినా, ఇద్దరు పిల్లల తల్లైనా, ఇప్పటికీ  ఆ చేదు జ్ఞాపకం  ఆమె మనసు నుంచి  చెదిరిపోలేదు.     పక్కింటి  మానస గుర్తుకొచ్చింది. ప్రభుత్వ కార్యాలయంలో  ఏదో ఉద్యోగం  చేస్తున్నాడు భర్త కిషోర్ కుమార్.  అస్తమానం టీలు, జర్దా పాన్లూ అతని దవడ ఆడిస్తూ  ఉంటాయి. సగం జీతం వాటికిపోను మిగిలినది ఇంట్లో ఇస్తాడు పాపం - మానస కూరల్లోనూ, వెచ్చాల్లోనూ  ఏదో మిగిల్చి డబ్బుతో నగా నట్రా చేసుకోవడమేకాక, అతగాడికి అవసరమైతే, ఎవర్నో అడిగి తెచ్చానని  అప్పుగా ఇచ్చి మళ్ళీ వసూలు చేసేది. పిల్లలకి మంచి బట్టలు  వేసేది. ట్యూషనూ, చదువులూ, అంతా ఆవిడ బాధలే. అతడు ఉదయం పదింటికి ఇల్లు వదిలి వెళితే, రాత్రి పదింటికే మళ్ళీ వచ్చేది. శెలవొస్తే పేకాట, సినిమాలు! ఇదేమిటని  మానస అడిగితే "నీకేం తెల్సు నీ బొంద! కష్టపడి సంపాదిస్తున్న  వాణ్ణి నాకు తెలుసు ఆ బాధేమిటో. ఒక్క రోజు పేకాడినా, సినిమా కెళ్ళినా అలా ఏడుస్తావేం? నీకేం? హాయిగా  తెచ్చి పెడుతుంటే  తేరగా  తిని  కూర్చోవడమేగా?" అతగాడి అరుపులు. శకుంతలకి  వద్దన్నా వాళ్ళ సంభాషణంతా అర్ధమయిపోయింది.     శకుంతల కళ్ళల్లో  నీళ్ళు తిరిగాయి. అతడు ఆఫీసులో కొన్ని గంటలు పనిచేసి, నెల జీతంలో అతనికి కావలసినది అతడుంచుకుని మిగిలినది ఆమె మొహానపడేసి, అదే గొప్పగా అనుకుంటున్నాడు. కానీ దాన్లో  ఎంత ప్లానుతో అందరి అవసరాలు తీరుస్తూ ఎంత తెలివిగా చాకచక్యంగా ఆమె ఆ సంసారాన్ని, పిల్లల్ని  నడుపుతుందో అర్ధం చేసుకోవడంలేదు.     కసురుకుంటూ  వెళ్ళిపోతున్న  కిషోర్ గారి కంఠం.     వెక్కి వెక్కి  ఏడుస్తున్న మానస స్వరం.     శకుంతలని కలిచివేశాయి.     ఆ సాయంత్రం "ఏమేవ్ మానసా! నీ కోసం  ఏం తెచ్చానో చూడు." కిషోర్ గొంతు.     'ఆ! మల్లెపూలా? ఎంత బాగున్నాయ్!" మానస గొంతు.     మరోసారి శకుంతలకి శునక సూత్రమే గుర్తుకొచ్చింది.         అబలగా పుట్టినందుకు మరోసారి కంట తడిపెట్టింది.     "అనూషా!" అన్న పిలుపు  విని బయటికొచ్చింది శకుంతల.     "అనూష ఇంకా రాలేదమ్మా కాలేజీనుంచి, రా  కూర్చో! అలా వున్నావేం? ఏం జరిగింది?" అడిగింది.     "ఏం లేదాంటీ!" అంది అస్మిత, కళ్ళనీళ్ళు  కనబడకుండా  దాచడానికి మొహం పక్కకు  తిప్పుకుంటూ.     "ఏం లేదేమిటీ? నీ కళ్ళే చెప్తున్నాయి ఏం జరిగిందో చెప్పు." లాలనగా అడిగింది శకుంతల.     అస్మితకి వాళ్ళింట్లో  కంటే  వీళ్ళింట్లోనే  చనువు ఎక్కువ. అనూష  లేకపోయినా అన్ని విషయాలు  శకుంతలతో చెప్తుంది.     అనూషా, అస్మితా స్కూల్ మేట్స్ అనూష మెడిసిన్ లో చేరింది. పరిస్థితులవల్ల  అస్మిత ఉద్యోగం చేస్తుంది. టైపూ, షార్టుహ్యాండూ నేర్చుకుని చక్కగా తయారవుతుంది అస్మిత.  వాయిదా పద్దతుల్లో తనకి నచ్చిన లేటెస్ట్ చీరలు  కొనుక్కుంటుంది. గల గలా నవ్వుతూ చలాకీగా ఉంటుంది. ఆ రోజు ఆఫీసులో ఏవో కాగితాలు టైపు చేసినవ్వలేదని  కోప్పడుతూ  ఆఫీసరు అసహ్యంగా మాట్లాడాడట. రోజుకో కొత్త చీర ఎక్కణ్నుంచొస్తుందో అంటూ వ్యంగ్యంగా అన్నాడుట. తను పట్టించుకోకుండా  బయటికొచ్చేశాక అక్కడున్న ఒకరిద్దరి మాటలు తనకి వినిపించాయట - "ఆ అమ్మాయికి బోలెడంత మంది ఫ్రెండ్స్ సార్! ఎవడో ఒకడు చీర కొనిస్తూనే ఉంటాడు" అని. చెప్తూ చెప్తూ అస్మిత ఏడవడం మొదలుపెట్టింది. "ఛ! ఊరుకో. నాలుగు చెడామడా దులిపెయ్యక పోయావా?" అంది శకుంతల.     "ఎలా, ఆంటీ? రేపు మరిన్ని కల్పించి మాట్లాడతారు.  మా కాన్ఫిడెన్సియల్ రిపోర్టు పాడుచేసి  పైకి  రానీయకుండా  చేస్తారు. అందుకే నోరు మూసుకుని ఊరుకున్నాను. అంతలోనే  అతడికి నేను విన్నానని అనుమానం వొచ్చినట్టుంది. వెంటనే లోపలికి పిలిచి, మామూలుగా మాట్లాడి కాఫీ  తెప్పించాడు. బాగుండదని కాఫీ తాగేసి, ఆ కాగితాలేవో టైపుచేసి ఇచ్చేసి వొచ్చాను. మనసు బాగులేక అనూషని చూసి పోదామని వచ్చాను" అంది.     మళ్ళీ శకుంతల గుండెలో  ఏదో అలజడి! ఆడది ఈ మూగ బాధ అనుభవించవలసిందేనా? ఆమె నయనాలు  అశ్రుపూరితాలయ్యాయి.     "వదినా! వదినా!" ఉరుములా  అరుచుకుంటూ వచ్చింది మౌనిక.     ఏదో కొంప మునిగే వుంటుందనుకుని ఏమిటమ్మా! ఏం జరిగింది?" అడిగింది శకుంతల.     "వెధవ ఉద్యోగం! వెధవ ఆఫీసు!" అంది, ఉస్సూరని కుర్చీలో  కూర్చుంటూ.     "అంత పెద్ద ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నావ్ నీకేం బాధ ఆఫీసులో?" అంది కాఫీ అందిస్తూ  శకుంతల.     "అసలీ మొగాళ్ళ సంగతి  నాకంతుపట్టదు. ఆడ ఆఫీసర్ని  తనతో సమానంగా చూడరే! ఎంత సమర్ధవంతంగా  పనిచేస్తున్నా  ఎక్కడో అక్కడ  అడ్డొచ్చి అదేదో వాళ్ళు గొప్పవాళ్ళలా  ఇంకా పైవాళ్ళ దగ్గర చెప్పుకోవడానికి  ప్రయత్నిస్తారు. ఎవరైనా  ఆమెని పొగుడుతూ వుంటే అంతవరకూ మాట్లాడుతున్న వాళ్ళల్లా  మూగిగా  వుండిపోతారు. లేదా తప్పనిసరైతే  పొడిపొడిగా మెచ్చుకుంటారు. మీటింగుల్లో కూడా ఆఫీసర్లు చెప్పే సలహాని చులకనగా చూస్తారు. పనుండి, కింద ఆఫీసర్లని పిలుస్తే నామోషీగా భావిస్తారు రావడానికి. ఇదేం ఫీలింగో నాకర్ధం కావడం లేదు. ఛీ! ఛీ!" విసుక్కుంటూ కాఫీ తాగడం పూర్తిచేసింది మోనిక.     "అదేంటీ, నువ్వు పెద్ద ఆఫీసరువే కదా! అలాంటి వాళ్ళని నాలుగు దులపొచ్చుగా?"       "అదేకదా! ఆడ ఆఫీసరు మెల్లగా  మందలించినా, భరించలేరు. అందుకే నేనే సర్దుకుపోతాను. ఒకటిలే! అయిష్టంగానో, కష్టంగానో పనిచేసుకుపోతున్నారు కదా! పదిమందిలో అలా ప్రవర్తించినా ఒక్కదాన్నే ఉన్నప్పుడొచ్చి క్షమాపణ చెప్పుకుంటారు. ఇవ్వాళ అలాగే జరిగింది. మూడాఫ్! సరే వస్తా. పనుంది. మళ్ళీ కలుస్తా!" వెళ్ళిపోయింది మౌనిక.     అందరిలో అవమానపరిచినా, ఒంటరిగా క్షమాపణ చెప్పుకుంటే  మరచిపోయిన స్వభావం అబలత్వమా? లేక ఆమె ఔదార్యమా? నోరుండి, మాట్లాడలేని అశక్తురాలు. శక్తుండి నివురుకప్పిన  నిప్పులా  పడున్న అబల!     ఆడజాతికిది శాపమా? వరమా?     ఆమె ఓర్పు, నేర్పు, దయాగుణం, క్షమాగుణం ఆమెకూ, ఆమె చుట్టూ వున్న  కుటుంబసభ్యులకు  ఆలంబనం. అలా కాకపోతే, ఈ బంధాలూ, బాధ్యతలూ ఏవీ ఉండేవి కావేమో, కానీ, మరీ అలా.... టామీలా - ఛీ! ఛీ! అంటే పోవడం, రా అంటే తోకాడిస్తూ రావడం, అవసరమైనచోట కూడా నోరువిప్పకుండా  మూగగా  పడుండటం  మంచిది కాదేమో! ఆలోచిస్తూ  పిండికలపటం పూర్తి చేసి, ఎండిపోయిన చేతులకేసి చూసుకుంది శకుంతల. సర్దుబాటుతనం ఎంత వరకో అంతవరకే! ఆమె వ్యక్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని నిలుపుకోవలసినచోట తిరుగుబాటు కావాలి, సర్దుబాటు కాదు.     "అమ్మా! అమ్మా!" హడావుడిగా అడుగులేసుకుంటూ  లోపలికొచ్చాడు ఇందర్.     "ఏమిట్రా? ఏం జరిగింది?" అడిగింది శకుంతల.     "చూశావా నీ కోడలు? ఇంకా ఏదో చదువుతుందిట. సంవత్సరం కంప్యూటర్ కోర్సు. అంతవరకూ తను ఇక్కడికి రాదుట" "వాళ్ళింటికెళితే నా మొహాన కొట్టునట్లు చెప్పింది ఈ మాటలు."     పళ్ళు కొరుక్కున్నాడు ఇందర్ కోపంగా.     శకుంతల మొహంలో  సంతోషరేఖ తొంగిచూసింది.     "ఆ మాటే ఇప్పుడు నాతోవచ్చి నీతో చెప్పమన్నాను. ఏమందో తెలుసా?"     "ఏమందీ?"     "తానిప్పుడు రాలేదుట! రేపో ఎల్లుండో వచ్చి మీతో చెప్తుందట! నాన్నా, కూడానువ్వూ రమ్మన్నారని చెపితే కూడా నే చెప్తాలే వాళ్ళతో అంది! పైగా నన్ను చదవమంటోంది. ఏమిటీ ఈ గొడవ!" చిందులు తొక్కాడు ఇందర్.     శకుంతల మనసూ,  చెవులూ  ఇందర్ మాటలు వినడం లేదు. ఆమె మనసు దూదిపింజలా గాలిలో తేలిపోతుంది. ఎన్నో ఏళ్ళ అనుభవాలకీ, ఘర్షణలకీ  ఈ రోజు సమాధానం దొరికినట్లయింది.     'థాంక్స్ పూజా! ఆడవాళ్లు టామీలు కారు. మూగజీవులు కారు. అవసరమైతే అపర కాళులూ, సరస్వతీ పుత్రికలు, లక్ష్మీ ప్రసన్నులు, అన్నివిధాల పురుషులతో సమానంగా ఉండగల ధీమంతులు! ఆడది అబల కాదు సబల. అందుకే నేమో. బిడ్డని గర్భంలో  తొమ్మిది నెలలూ భరించే శక్తి స్త్రీకే దక్కింది. ఎంతటి వీరుడైనా, ధీరుడైనా, ప్రభువు అయినా, ప్రయోక్త అయినా ఒక తల్లి గర్భంలో నుంచి వచ్చినవాడే కదా? అందుకే ముందుగా మాతృదేవోభవ! అన్నారు.' శకుంతల గుండె నిండా సంతోషం. మనసునిండా అనురాగం. ప్రేమగా ఇందర్ తల నిమురుతూ__     "పూజ చెప్పింది కరెక్టే బాబూ! నువ్వూ చదువు. ఆడదాని మాటలు వినాలా అన్న అహం, నువ్వు చెప్పిందే వేదం అన్న గర్వం నీలోనుంచి దూరం చెయ్యి బాబూ!"      ఇందర్ తల్లికేసి ఆశ్చర్యంగా చూశాడు.     టామీ దగ్గరకొచ్చి నిల్చుంది "ఛీ! పో!" అన్నాడు ఇందర్ విసుగ్గా.     టామీ కదల్లేదు. శకుంతలకేసి  తోకాడిస్తూ చూసింది. అలా నిలుచునే వుంది నిశ్చలంగా.     శకుంతల అధరాలపై చిరునవ్వు పూసింది. తనూ, మానస, అస్మిత, మౌనిక అందరూ టామీలాగే ప్రవర్తించినా, నేను టామీని కాను అని నిరూపించిన పూజ మహిళలకే తలమానికంగా అనిపించింది. స్పూర్తిలోనే మరోసారి రెట్టించి చెప్పింది ఇందర్ కి - పూజ చెప్పింది అక్షరాల నిజం అని!                    

అవ్వ-కాకి

అవ్వ-కాకి     అవ్వ రొట్టెను కాకి ఎత్తుకుపోయింది..గొడ్డలి చెట్టును కొట్టేయనంది.. ఎలుక గొడ్డలిని కొరికేయనంది.. కథ గుర్తుందా? అవన్నీ ఎందుకు పని చేయనన్నాయి? ఎందుకంటే ఆ ముందువి తమకు నష్టం కలిగించలేదు కదా, అందుకనట! అలా నడుము వంచని జీవాలన్నీ చివరికి ఎలా దారికి వచ్చాయో మరి, ఈ అద్భుత జానపద కథ చదివితే అర్థం అయిపోతుంది. కష్టాలు తమమీదికి వచ్చినప్పుడు, జీవిలో దయ దాక్షిణ్యాలకంటే ఆత్మ రక్షణ వ్యవస్థే బలవత్తరంగా పనిచేస్తుందని చెబుతున్నట్లుంది ఈ కథ. కథకుడు: పోతి రెడ్డి, 2వ తరగతి చిత్రం: అడవి రాముడు ఒక ఊరిలో ఒక అవ్వ ఉండేది. ఆ అవ్వ ఒకనాడు రొట్టె చేస్తోంది. అంతలో ఒక కాకి వచ్చి ఆ రొట్టెను ఎత్తుకెళ్ళి చెట్టు మీద కూర్చుంది. అవ్వ అన్నది "కాకీ కాకీ నా రొట్టె ఇచ్చెయ్, నాకు ఆకలిగా ఉంది" అని. అయినా కాకి రొట్టెను ఇవ్వలేదు. అప్పుడు ఆ అవ్వ చెట్టు దగ్గరకు వెళ్లి, "చెట్టూ, చెట్టూ, కాకి నా రొట్టెను ఎత్తుకుపోయింది, ఇవ్వమంటే ఇవ్వటం లేదు, అందుకని కాకి గూడును తోసేయ్" అన్నది. అప్పుడు ఆ చెట్టు "నేనేమీ తోసెయ్యను, కాకి నాకేమీ చెయ్యలేదు కదా?" అన్నది. అప్పుడా అవ్వ ఇంకేమీ చెయ్యలేక కట్టెలు కొట్టే ఆయప్ప దగ్గరకు పోయింది. "కట్టెలు కొట్టే ఆయప్పా, కట్టెలు కొట్టే ఆయప్పా, కాకి నా రొట్టెను ఎత్తుకుపోయింది, చెట్టు కాకి గూడును తోసేయనంది, నువ్వు చెట్టును కొట్టేయవా?" అని అడిగింది. "ఉహుఁ., నేను కొట్టేయను. చెట్టు నాకేమీ నష్టం చెయ్యలేదు" అన్నాడు కట్టెలుకొట్టే ఆయప్ప. "సరేలే", అని ఆ అవ్వ ఎలుక దగ్గరకు వెళ్లింది. "ఎలుకా, ఎలుకా, కాకేమో నా రొట్టె ఎత్తుకు పోయింది; చెట్టు గూడు తోసేయనంది; కట్టెలు కొట్టే ఆయప్ప చెట్టును కొట్టేయనన్నాడు, అందుకని నువ్వు పోయి ఆయప్ప గొడ్డలిని కొరికేసెయ్" అని అడిగింది. "నేను కొరకను, కట్టెలాయప్ప నాకేం నష్టం చేయలేదు" అన్నది ఎలుక. అప్పుడా అవ్వ "సరేలే" అని పిల్లి ఉండే తావుకు పోయింది. "పిలీ, పిల్లీ, కాకేమో నా రొట్టె ఎత్తుకుపోయింది; చెట్టేమో గూడును తోసేయనంది; కట్టెలాయప్ప చెట్టును కొట్టేయనన్నాడు; ఎలుక గొడ్డలిని కొరికేయనన్నది, నువ్వు పోయి ఎలుకను తినేసెయ్యి" అన్నది. కానీ పిల్లి ఒప్పుకోలేదు- "నువ్వు చెప్పిందైతే బాగానే ఉంది, కానీ అలాచెయ్యను. ఎలుక నన్నేమీ చెయ్యలేదు" అన్నది పిల్లి. "సరేలే" అని అవ్వ కుక్క దగ్గరకు వెళ్లింది. "నా ప్రియమైన కుక్కా, నా ప్రియమైన కుక్కా, కాకేమో నా రొట్టె ఎత్తుకుపోయింది; చెట్టేమో గూడును తోసేయనంది; కట్టెలాయప్ప చెట్టును కొట్టేయనన్నాడు; ఎలుక గొడ్డలిని కొరికేయనన్నది; పిల్లి ఎలుకను తినెయ్యనన్నది- నువ్వు పోయి పిల్లిని తినేసెయ్యి" అన్నది. అది "సరే" అని పోయి, పిల్లి వెంట పడింది అప్పుడా పిల్లి వణికిపోతూ "వద్దొద్దు, నన్ను చంపద్దు- నేను పోయి ఎలకను చంపేస్తాను" అని ఎలక వెంట పడింది. అప్పుడా ఎలక "వద్దొద్దు, నన్ను చంపద్దు, నేను గొడ్డలిని కొరికేస్తాను" అని గొడ్డలి మీద కెళ్లింది. అప్పుడా కట్టెలు కొట్టే ఆయప్ప "వద్దొద్దు, నా గొడ్డలిని కొరకద్దు, నేను చెట్టును కొట్టేస్తాను" అని చెట్టు మీదికి వెళ్లాడు. అప్పుడా చెట్టు "వద్దొద్దు, నన్ను నరకద్దు; నేను కాకిగూడును తోసేస్తాను" అని కాకి గూడును తోసేసింది. దాంతో కాకి నోట్లోని రొట్టెముక్క జారి క్రింద పడిపోయింది. అప్పుడా అవ్వ దాన్ని తీసుకొని సంతోషంగా ఇంటికి పోయింది.

అమ్మ పిలుపు

అమ్మ పిలుపు - వసుంధర ఎపిసోడ్- 5                 అది కాగితం కానీండి, ఇస్త్రీ పెట్టి కానీండి, ట్రక్కు కానీండి__ సరే అణువుల నుంచే తయారయ్యాయి. భూమిలో సహజంగా తొంభైరెండు రకాల అణువులున్నాయి. వాటిని మూలకాలంటారు. వీటిలో ప్రాణవాయువు బాగా ఎక్కువగా వుంది. అంటే సుమారు సగానికి సగం శాతం. మిగతావాటిలో సిలికాన్ ఇరవైయారు, అల్యూమినియం ఏడున్నర, ఇనుము నాలుగు, కాల్షియం మూడుంపావు ,సోడియం రెండున్నర, పొటాషియం రెండున్నర, మెగ్నీషియం రెండున్నర, ఉదజని ఒకటి శాతం వుంటాయి సుమారు. మిగతా ఎనభైమూడు సహజమూలకాలూ కలిపి ఒకటి ముప్పావు శాతం వుంటాయి. ఈ మూలకాల నుంచే ఎన్నో రకాల విభిన్న పదార్ధాలు వుద్భవించాయి.     మూలకాల అణువులకు ఆ లక్షణాలు రావడానికి కారణం వాటిలో వుండే ప్రొటాన్సు. ఒక అణువులో ఒక ప్రొటాన్ వుంటే అది ఉదజని అవుతుంది. ఎనిమిది వుంటే అది ప్రాణవాయువు అవుతుంది. ఇరవైయారుంటే అది ఇనుమవుతుంది. నలభైఏడుంటే వెండి, డెబ్భై తొమ్మిదుంటే బంగారం అవుతాయి.     అణువుల్లో ప్రొటాన్లు అమితశక్తితో బంధింపబడి వుంటాయి. అందుకే అణువుల్లోని ప్రొటాన్ల సంఖ్యను మార్చడం చాలా కష్టమైన పని. జడ్యా గ్రహవాసులకదెంతో సులభం. ఉదాహరణకు గంధకం అణువుల్లో పదహారు ప్రోటాన్లుంటాయి. భాస్వరం అణువులో పదిహేను ప్రోటాన్లుంటాయి. అంటే గంధకం అణువులోంచి ఓ ప్రోటాను తీసేస్తే భాస్వరం అణువు వస్తుంది. భాస్వరం అణువుకు ఓ ప్రోటాన్ కలిపితే గంధకం అణువు వస్తుంది. నాలుగు గంధకం అణువుల్నీ, ఒక భాస్వరం అణువునీ కలిపి అన్ని ప్రోటాన్సునీ ఒకచోట కలిపి బంధించగలిగితే బంగారం అణువు తయారవుతుంది. లేదా ఏడు బొగ్గు అణువులను కలిపి వాటిలోంచి అయిదు ప్రోటాన్లను తీసేయగలిగితే బంగారం తయారవుతుంది.     ఇప్పటికి మనిషికిందా అణువుల్ని బద్దలు కొట్టడం తెలిసింది. అందువల్ల ప్రోటాన్లను బంధించి వున్న అమితశక్తి బైటకు వెలువడి దేశాలకు దేశాల్నే నాశనం చేయగలవు. అటుపైన మనిషి తనకు తెలిసిన పెద్ద అణువులకు ఒకటిరెండు ప్రోటాన్లు కలిపి భూమ్మీద లేని కొత్త మూలకాలను కూడా సృష్టించగలిగాడు. ఆ విధంగా ఇప్పుడు తొంభై రెండు మూలకాల సంఖ్య__ నూటపదికి మించింది.     కానీ జడ్యా గ్రహంలో అలా కాదు. వారు క్షణాల మీద ఏ అణువునైనా మరో అణువుగానూ తయారు చేయగలరు. మెదడుకున్న శక్తినుపయోగించి వారు చెట్లకు ఫలాలనీ, యంత్రాలకులా వస్తువుల్నీ సృష్టించగలరు.     అందుకని యోగి ఏం చేశాడంటే తన శక్తితో భూమ్మీద మనుషులను ప్రభావితం చేసి తనవైపు ఆకర్షించుకోసాగాడు. అది యించుమించుగా భూమ్యాకర్షణ శక్తి వంటిది. ఎటొచ్చీ యోగి సొరంగం లోపల మామూలు ప్రపంచానికి దూరంగా వుండిపోయాడు కదా- అందువల్ల అవతల మనిషిక్కూడా ధనం గురించి అత్యాశ వుంటే తప్ప అతడి ఆకర్షణ పనిచేయదు. ఆ విధంగా యోగి ముందుగా ఓ మనిషి నాకర్షించి రప్పించుకున్నాడు. యోగిలోని జీవశక్తి ఆ మనిషిలోకీ, ఆ మనిషిలోని జీవశక్తి యోగిలోకీ మార్పు చెందేలా చేసి ఆ మనిషి రూపంలో యోగి బయటకు వెళ్ళిపోయాడు. అతడు మళ్ళీ సొరంగ మార్గంలోకి రాలేదు. మనిషి శరీరాన్నంటి పెట్టుకుని వున్న కారణంగా యోగి జీవశక్తి కూడా కొంత కాలానికి భూమ్మీదే ఆ శరీరంతో పాటు నాశనమయింది.     యోగి శరీరాన్నంటి పెట్టుకున్న కొత్త మనిషి క్రమంగా అక్కడి పుస్తకాలూ అవీ చదివి తన విజ్ఞానాన్ని పెంపొందించుకున్నాడు. అక్కడే వుండి ప్రపంచంలో జరిగే వింతలన్నీ చూడగల్గుతున్నా, కావలసినవన్నీ పొందగల్గుతున్నా, రోగాల బాధ_మృత్యుభయం లేకపోయినా అతడికి మనుషుల మధ్యకు పోవాలన్న కోరిక కలిగింది. తిరిగి ఓ మనిషిని ఆకర్షించి అతడి రూపంలో తనూ బైటకు వెళ్ళిపోయాడు.         *    *    *      

అమ్మ పిలుపు

అమ్మ పిలుపు ఎపిసోడ్ -4 - వసుంధర                 గోపీకి మళ్ళీ భయమేసింది. సొరంగం లోంచి దిగిపోదామా అని కాసేపు మనసూగిసలాడింది. అప్పుడు మళ్ళీ "నీకేం భయం లేదు. నేనున్నాను. ముందుకురా!" అన్న మాటలు గోపీ చెవిలో వినిపించాయి.     అప్పుడు గోపీకి చాలా అనుమానాలు కలిగాయి. తనతో ఎవరైనా మాట్లాడుతున్నారా? లేక తను భయపడుతున్నాడా?     సొరంగంలోకి ప్రవేశించి బంగారం చేయడం నేర్చుకోవాలని తనకు చాలా కోరికగా వుంది. ఎవరికైనా బలమైన కోరిక వున్నప్పడది నెరవేర్చుకుందుకిలాంటి భ్రమలు కలుగుతాయని జానకిరామయ్య తాతయ్య చెప్పాడు. అలాంటి భ్రమే తనకు కలుగుతోందా?     అప్పుడు గోపీకి తను చూసిన 'పాతాళభైరవి' సినిమా గుర్తుకొచ్చింది. ఎంతో పాత సినిమా అది. కానీ ఎంత బాగుందో! అందులో ఎన్టీరామారావు తనలాగే గుహలో ప్రవేశిస్తాడు -ఓ మాంత్రికుడితో. ఫలితంగా పాతాళభైరవి విగ్రహం సంపాదించుకుంటాడు. సాహసం చేయాలనుకునేవాడికి మొండితనం వుండాలి. దురాలోచన వుండకూడదు.     అప్పుడే గోపీకి తను చూసిన 'రాజూ-పేద' సినిమా కూడా గుర్తుకొచ్చింది. అందులో రేలంగికి జేబులో ఓ బొమ్ముంటుంది. ఆ బొమ్ముంటే తననెవరూ ఓడించలేరని రేలంగి నమ్మకం. ఆ బొమ్మ దగ్గరుంటే ఎలాంటి వీరులతో అయినాసరే ఫైటింగ్ చేసి ఓడించేసేవాడు. ఒకోసారి బొమ్మ పడిపోయినా అది  తన దగ్గరే వుందనుకుని బాగా ఫైట్ చేసేవాడు. బొమ్మ లేదని తెలిస్తే మాత్రం కత్తి పక్కన పారేసి ఏడుస్తూ కూర్చునేవాడు. నిజానికి బొమ్మలో ఏమీ లేదు. బొమ్మ మీద వున్న నమ్మకమే రేలంగికి బలాన్నిచ్చింది. అదంతా రేలంగి భ్రమ!     తనూ అలాగే భ్రమపడుతున్నాడా? తనకు సొరంగంలోకి వెళ్ళాలనుంది. అందుకని ఎవరో పిల్చినట్లు భ్రమపడుతున్నాడా? ఎవరో పిలిచారు కాబట్టే వెడుతున్నానని సరిపెట్టుకుంటున్నాడు.     "ఒరేయ్ గోపీ! త్వరగారా! నువ్వేమీ భ్రమంపడ్డం లేదు. నీకున్నది భ్రమే అయితే రామనాథం మేస్టారి చావు గురించి నీకెలా తెలిసింది? త్వరగా బయల్దేరిరా- ఊ-వెంటనే ముందడుగు వేయి" అన్న మాటలు మళ్ళీ గోపీకి వినిపించాయి.     అవునా-నిజమే! రామనాథం మేస్టారి చావు గురించి తనకు ముందుగానే తెలిసింది. అంటే గోపాల్రావు తాతయ్య నిజంగానే నన్ను పిలుస్తున్నాడు.     గోపీ ముందుకు వెళ్ళాడు. సొరంగం మరీ ఎత్తుగా లేనందువల్ల వాడు కాస్త వంగి నడవాల్సి వస్తోంది. అంతా చిమ్మచీకటి.     లోపల అదో రకం వాసన. ఆ వాసన బాగోలేదు. గోపీ ఒక్క క్షణం ఆగి ముక్కు మూసుకున్నాడు.     "అదేమీ విషవాయువు కాదులే- ధైర్యంగా ముందడుగు వేయి" మళ్ళీ గోపీకి హెచ్చరిక వినబడింది.     గోపీ యింక జాప్యం చేయలేదు. చకచకా అడుగులు వేయడం మొదలుపెట్టాడు. కాసేపటికి వాడా సొరంగంలోని వాసన కలవాటు పడ్డాడు. అలా కొంత దూరం నడిచేసరికి వున్న పళంగా వాడికి వెలుగు కనబడింది. గోపీ చటుక్కున కళ్ళు మూసుకున్నాడు. చిమ్మచీకటిలో ఒక్కసారి వెలుగు కనబడే సరికి వాడి కళ్ళుచెదిరి పోయాయి. అందువల్ల వాడు నెమ్మదిగా కళ్ళు తెరిచి ఎదురుగా కనబడ్డ దృశ్యం చూసి భయంతో గజగజ వణికి పోయాడు.     అక్కడ ఒక కొండ చిలువుంది. ఎంత పొడుగుందో తెలియదు. కానీ గుహ లాంటి నోరు తెరిచి గోపీ వంకే చూస్తూ నెమ్మదిగా ముందుకువస్తోంది.     గోపీ వెనక్కు తిరిగి పారిపోవాలనుకున్నాడు. కానీ కాళ్ళూ, చేతులూ కూడా వాడికి పనిచేయలేదు. మెదడు మొద్దు బారిపోయింది.     కొండ చిలువ క్రమంగా గోపీకి దగ్గరవుతోంది. గోపీ భయంగా నిస్సహాయంగా దాని వంక చూస్తున్నాడు. అది బాగా దగ్గరవగానే గోపీ కెవ్వుమని కేకవేసి నిలువునా కూలబడి పోయాడు. తన ప్రాణాలు పోయినట్లే అనుకున్నాడు గోపీ. క్షణాల మీద వాడి స్పృహ తప్పింది.             7     ఎవరో తన గుండెల మీద రాస్తున్నట్లనిపించి చటుక్కున కళ్ళు తెరిచాడు గోపీ. ఎదురుగా వాడికి గెడ్డం, మీసాలు గుబురుగా పెరిగి ఉన్న ఓ సన్యాసి లాంటి వాడు కనిపించాడు.     "స్పృహ వచ్చిందా గోపీ!" అన్నాడు సన్యాసి.     గొంతుణు గోపీ గుర్తించాడు "నువ్వే నా గోపాల్రావు తాతయ్యవి" అన్నాడు వుత్సాహంగానూ, ఆశ్చర్యంగానూ!     "బాగానే గుర్తు పట్టావు" అంటూ  నవ్వాడా సన్యాసి.     "నేనిక్కడికెలా వచ్చాను?" అన్నాడు గోపీ. అప్పుడే వాడికి జరిగిన దంతా గుర్తుకు వస్తోంది. కొండ చిలువొకటి మీదకు వస్తూంటే స్పృహతప్పింది తనకు. ఆ తర్వాతేం జరిగిందో తెలియదు.     "నువ్వెక్కడికి రావాలో అక్కడికే వచ్చావు. నువ్వు కోరిక కుబేరుడి కొలను నీ పక్కనే వుంది చూడు" అన్నాడు సన్యాసి.     గోపీ లేచి కూర్చుని చుట్టూ చూశాడు. అక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా వుంది. చుట్టూ పచ్చని ఎత్తైన చెట్లున్నాయి. పక్కనే ఓ అందమైన  కొలనుంది. కొలనులోని నీరు బంగారు ఛాయలో మెరుస్తోంది.     "నేనిక్కడికెలా వచ్చాను?" అన్నాడు గోపీ మళ్ళీ.     "తమకు తామై సొరంగంలో ప్రవేశించిన వారా కొండ చిలువకు బలైపోతారు. నేను రప్పించిన వారు క్షేమంగా కుబేరుడి కొలను చేరుకుంటారు. ఎటొచ్చీ దారి మాత్రం ఎవ్వరికీ తెలియదు. అక్కణ్ణించి ఇక్కడికెలా వచ్చానని అడక్కు. ఎందుకొచ్చానని అడుగు చెబుతాను" అన్నాడు సన్యాసి.     "ఎందుకో నాకు తెలుసు. బంగారం చేయడం నేర్పుతానని పిలిచావు నువ్వు. సాయంత్రానికల్లా వెనక్కు పంపేస్తానని కూడా అన్నావు" అన్నాడు గోపి.      "అది నిజమే! కానీ నీకు చెప్పని విషయాలు కూడా కొన్ని వున్నాయి. నేను నిన్ను రప్పించడానికి అసలు కారణం వేరే వుంది" అన్నాడు సన్యాసి.     "ఏమిటది?" అన్నాడు గోపీ కంగారుగా.     "అది తెలుసుకునే ముందు నువ్విక్కడి విశేషాలు, వింతలు తెలుసుకోవాలి. నేనిక్కడికెలా వచ్చానో కూడా తెలుసుకోవాలి!" అన్నాడు సన్యాసి.     "చెప్పు తాతయ్యా! అన్నీ తెలుసుకోవాలనుంది నాకు" అన్నాడు గోపీ ఆత్రుతగా.     సన్యాసి చెప్పడం ప్రారంభించాడు.     కాంతికిరణం సెకనుకు మూడు లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తుంది. అరవై సెకన్లు ఒక నిమిషం. అరవై నిమిషాలు ఒక గంట. ఇరవై నాలుగు గంటలు ఒక రోజు. 365 రోజులు ఒక సంవత్సరం. కాంతి కిరణం ఒక సంవత్సరంలో ఎంత దూరం ప్రయాణం చేస్తుందో అంత దూరాన్ని కాంతి సంవత్సరం అంటారు. సూర్యుణ్ణి తప్పిస్తే- మనకు దగ్గర్లో వున్న నక్షత్రం దూరం 4.3 కాంతి సంవత్సరాలు. అంటే మనం కాంతి వేగంతో అనగా సెకనుకు మూడు లక్షల కిలోమీటర్లు  ప్రయాణం చేయగలిగితే ఆ నక్షత్రం చేరుకుందుకు 4.3 సంవత్సరాలు పడుతుందన్నమాట. మనకు కాంతివేగంతో ప్రయాణం చేయగల అవకాశం ఇప్పట్లో లేదు.     మనకు సుమారు వంద కాంతి సంవత్సరాల దూరంలో జడ్యా అనే గ్రహముంది. ఆ గ్రహవాసులు వైజ్ఞానికంగా గొప్ప ప్రగతిని సాధించారు. ఆ గ్రహ వాసులు ఏ క్షణాన ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి వెళ్ళగలరు. ఏ పదార్ధం కావాలనుకున్నా క్షణాల మీద తయారు చేయగలరు. వారు అన్ని రోగాలకూ మందులు కనిపెట్టారు. మృత్యువును జయించడం తప్ప వారికి చేతకానిదేదీ లేదు. అలాగని మృత్యువును జయించడం వారికి అసాధ్యమూ కాదు. శరీరానికైనా నాశనం అవసరం. అప్పుడే మనిషి లక్ష్యా లేర్పడతాయి. తను బ్రతికుండగా ఏమేం చేయాలో మనిషి నిర్ణయించుకుంటాడు. మృత్యువు తన్ను వెంట తరుముతున్నదని భయపడి మెదడుకు పదునుపెట్టి కొత్త కొత్త విశేషాలు నేర్చుకుంటాడు. మృత్యువు లేకపోతే మనిషి సోమరి అయిపోతాడు. మనిషికి లక్ష్యమన్నది వుండదు. అటుపైన ప్రపంచంలో మనుషుల సంఖ్య పెరిగిపోయి చోటు కోసం వెదుక్కోవలసిన దుర్గతి పడుతుంది. ఎప్పటికప్పుడు ప్రపంచంలోకొత్త మనుషులు వస్తూండాలి. పాత మనుషులు పోతూండాలి. అందుకే జడ్యాగ్రహవాసులు మృత్యువును జయించలేదు. అయితే వారికి చావు తనంత తాను రాదు. జడ్యాగ్రహంలో చావును నిర్ణయించడానికి ఓ అధికారి వున్నాడు. ఎవరెవరు ఎప్పుడు పోవలసిందీ ఆయన నిర్ణయిస్తాడు. గ్రహమంతటా ఆయనకు ఆఫీసులున్నాయి. కొన్ని లక్షల మంది ఆ ఆఫీసుల్లో పని చేస్తూ ఎప్పటికప్పుడు ప్రతి గ్రహవాసి వివరాలూ సేకరిస్తూంటారు.     ఇవన్నీ ఎలా జరుగుతాయీ, ఆ గ్రహం పూర్తి విశేషాలేమిటీ అన్నవి మనకు అప్రమత్తం. ఆ విశేషాలు మరెప్పుడైనా తెలుసుకోవచ్చు.          ఆ గ్రహవాసులు విశ్వాంతరాళంలో ఎక్కడెక్కడ జీవమున్నదా అని అన్వేషిస్తుంటారు. ఎక్కడ జీవజాలమున్నా అక్కడికి వెళ్ళి విశేషాలు తెలుసుకుని వస్తూంటారు. ఆ విధంగా ఒకసారి భూగ్రహం మీదకు జడ్యా గ్రహవాసి ఒకడు వచ్చాడు. కొన్నివేల సంవత్సరాల క్రితం. అప్పటికి మనిషింకా ఆటవిక దశలో వున్నాడు. భూమిపైన నాగరికత ఏర్పడలేదు.     జడ్యా గ్రహవాసికి మానవులకు సాయపడాలన్న బుద్ధి పుట్టింది. తనకు తెలిసిన విజ్ఞానాన్నంతా మానవులకు చెప్పి వారినీ తమ గ్రహవాసులకు వలెనే తయారుచేయాలనుకున్నాడు. అయితే అందుకతడు జడ్యా గ్రహాధినేత అనుమతి తీసుకోవాలి. ఆ విషయం మరిచి అతడు ఆటవికుల మధ్యకు హేరి "మీరు జంతువుల్లా జీవిస్తున్నారు. మనుషుల్లా జీవించాలి" అని చెప్పాడు.     మానవుల్లో అప్పుడప్పుడే భాష పుడుతోంది. జడ్యా గ్రహవాసి వారికర్ధమయ్యే భాషలో నాగరికత గురించి చెప్పసాగాడు. అతడు చెప్పేది చాలామందికి అర్ధం కాలేదు. తెలుసుకోవాలని ఉత్సాహం చూపించి ముందుకు వచ్చిన యిద్దరు ఆటవికులు అతడు చెప్పేది కాసేపు విని పెద్ద కేక పెట్టి చచ్చిపోయారు.     ఊహించని ఈ పరిణామానికి జడ్యా గ్రహవాసి ఆశ్చర్యపోయాడు. మిగతా ఆటవికులతడినేమీ చేయలేక ప్రాణభయంతో అక్కణ్ణించి పారిపోయారు. జరిగిన విశేషాన్ని జడ్యా గ్రహవాసి గ్రహాధినేతకు తెలియపరిచాడు. తన అనుమతి లేకుండా అటువంటి కార్యం తలపెట్టినందుకు జడ్యాధినేత గ్రహవాసిపై మండిపడి "మన గ్రహం ఇప్పటి దశకు చేరుకునేందుకు కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాలు పట్టింది. జీవ పరిణామం క్రమంగా జరుగవలసిన విశేషం. నీవు చెప్పే విజ్ఞాన విశేషాలకు తట్టుకోలేక మెదడు చిట్లి ఆ యిద్దరు ఆటవికులూ చచ్చిపోయారు" అన్నాడు.      అంతేకాకుండా జడ్యాధినేత ఆ గ్రహవాసిని భూమిపైనే వుండిపొమ్మని శాసించాడు. అదే అతనికి శిక్ష.     "నీ శక్తులతో భూగ్రహవాసులకు సాయపడగలిగితే వారికి నీ శక్తి గురించి చెప్పకు. నీకు అపూర్వ శక్తులున్నట్టు వారికి చెప్పు. నాగరికత ఆరంభంలో మనిషిని విజ్ఞానంతో కాక మూడనమ్మకాలతో నమ్మించాలి" అని జడ్యాధినేత ఆ గ్రహవాసికి చెప్పాడు.     అప్పట్నుంచీ జడ్యా గ్రహవాసి భూలోకంలో యోగిగా వ్యవహరించబడ్డాడు. అతడు క్రమంగా ప్రజలకు దైవం, మతం గురించి ఎన్నో మూడనమ్మకాలు నేర్పాడు. ఎంతకాలం నడిచినా మనుషులు కొద్దికొద్దిగా మారుతున్నారు తప్పితే యోగి తెలివితేటలు స్థాయికి చేరుకోలేకపోతున్నారు. అందుకని యోగి వారి మధ్యన జీవించడం మానేసి కుబేరుడి ఆలయమన్న పేరుతో వున్న గుడిలోంచి సొరంగమార్గం ఏర్పరచుకుని నాగరికతకు దూరంగా జీవించసాగాడు. ఆ లోపల నుండి అతడో కొత్త ప్రపంచం ఏర్పాటు చేసుకున్నాడు. తన సామర్ధ్యంతో అతడక్కడే వుండి భూమ్మీద ఎక్కడే వింతలున్నా చూస్తుండేవాడు. తనకు కావలసిన ఆహారం తయారుచేసుకుని తినేవాడు. ప్రపంచంలో ఎక్కడైనా కాస్త తెలివైన వాడు పుట్టి సృష్టి రహస్యాలనర్ధం చేసుకుందుకు ప్రయత్నిస్తుంటే వెంటనే తనకు తెలిసే ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి మనుషుల మెదడును తట్టుకోగలిగినంతగా ప్రభావితం చేసి సహకరిస్తుండేవాడు యోగి. ఈ భూమ్మీద కనిపెట్టబడిన ఎన్నో వైజ్ఞానిక విశేషాలకు సొరంగం లోపల తన ప్రపంచంలో వుండే సహకరించేవాడు యోగి.     ఇలా ఎన్నో ఏళ్ళు గడిచాయి. జడ్యా గ్రహంలో మృత్యు అధికారి భూలోకం గ్రహవాసిని పట్టించుకోకపోవడం ఏమో యోగికి చావు రావడం లేదు. అతడికీ జీవితంపై విరక్తి పుడుతోంది. తన శరీరానికి నాశనం లేదని అతడికి తెలుసు. తను మనుషుల మధ్యకు వెళ్ళి సామాన్యుడిలా బ్రతకలేడు. తను ప్రతిభను చూపిస్తే మనుషులు తట్టుకోలేరు. జడ్యా గ్రహానికి తిరిగివెళ్ళే అవకాశం లేదు. ఆఖరికి యోగి ఓ ఉపాయం కనిపెట్టాడు. తనకు తెలిసిన విజ్ఞానాన్నంతా పుస్తకరూపంలో వ్రాయడం మొదలుపెట్టాడు. యోగికి కాగితాలెక్కడివి. సిరా ఎక్కడిదీ అని ఆలోచించనవసరం లేదు. యోగి తను వ్రాయదలుచుకున్నది అచ్చుపుస్తకాలుగా తయారుచేస్తున్నాడు. అదెలాగంటే......                     (సశేషం)