బిందూ ఆంటీ

            బిందూ ఆంటీ  - శారద అశోకవర్ధన్       "ఒరేయ్ మురళీ...టైము ఎనిమిదవుతోంది. నువ్విలాగే ఇంకా ముస్తాబవుతూ కూర్చో- ఫ్లైట్ ఒచ్చేస్తుంది. తొందరగా తెములు." బామ్మ మురళిని తొందరపెడుతోంది. గబగబా షూ వేసుకుని క్రాఫుని ఒకసారి మళ్ళీ సరిచేసుకుని, ఒక్కసారి అద్దంలో చూసుకుని బయలుదేరాడు మురళి. "ఎంత షోకురా నాయనా!" నవ్వుతూనే అంది బామ్మ.     "కువైట్ నుంచి  మా అక్కగారు  శ్రీమతి నిఖిల, బావగారు శ్రీశ్రీశ్రీ మాధవ్ గారు వొస్తూవుంటే  ఎయిర్ పోర్ట్ కి నన్ను దేభ్యం మొహం వేసుకుని వెళ్ళమంటావా?" మారుతీ కారు తాళాలకోసం  ఒక్కక్షణం  జేబులన్నీ వెతికి చివరికి పాంటు వెనక  జేబులో తాళాలు తగలగానే తీసి, నవ్వుతూ  బయలుదేరాడు మురళి.     "అమ్మా! ఎయిర్ పోర్ట్ టైము గురించే మీరు కంగారుపడుతున్నారుగానీ, పెళ్ళికూతుర్ని చెయ్యడానికి ముహూర్తం  దాటిపోతోందని  ఆలోచించడంలేదు." అరిచాడు పురోహితుడు.     "వొచ్చేస్తున్నా" అని బామ్మ  అంటూనే- "కూతురు రాగానే కాఫీ అడుగుతుంది. దానికి ఫిల్టర్ కాఫీ అంటేనే ఇష్టం. ఫ్లైట్ లో ఇచ్చే ఆ కాఫీలు దానికి నచ్చవు" అంటూ  కాఫీ డికాషన్ తయారు చెయ్యడంలో నిమగ్నమయింది కామాక్షమ్మ, రూబీ కాళ్ళకి  పారాణి  పెడతానని చెప్పి  వెళ్ళిన విషయం మర్చిపోయి! అరగంట దాటినా  ఎవరూ పారాణి గురించి గానీ, పెళ్ళికూతురి ముస్తాబు గురించిగానీ మాట్లాడకపోవడం బాధనిపించింది రూబీకి. రూబీ స్నేహితులు యశస్విని, భ్రమర మాత్రం జడ అల్లడం, కాటుక దిద్దడం వంటి పన్లు  చేస్తున్నారు. అంతలో  ఆదరాబాదరాగా పరుగెత్తుకుంటూ  వొచ్చిన  బిందూ ఆంటీని చూడగానే  రూబీ మొహం చాటంతయింది.     "ఆంటీ!....ఇంత లేటుగానా రావడం?" బుంగమూతి పెట్టింది రూబీ.     "ఏం చెయ్యను రూబీ! ఒక్క ఆటో కూడా దొరకలేదు. గంట సేపటి నుంచి బయట నుంచున్నా తయారయి. ఇవ్వాళ ఆటో స్ట్రైక్ అటగా? ఎవరో చెప్పారు. అప్పుడిక  లాభంలేదని రిక్షా ఎక్కొచ్చాను"  అంది. రూబీ పాదాల వంక చూసి. "ఇంకా పారాణి పెట్టలేదా?" అంటూ గబగబా వెళ్ళి పసుపూ కుంకం అన్నీ పట్టుకుని  కాళ్ళకి పసుపు రాస్తూ.     బిందూ ఆంటీ వొచ్చే వరకూ ఇవాళ  రూబీని  పెళ్ళి కూతుర్ని  చేస్తున్న హడావుడి కనిపించలేదు. నిఖిలా మాధవ్ లు కువైట్ నుంచి ఒచ్చే హడావుడి తప్ప! క్షణంలో  పారాణి పెట్టేసింది. కళ్యాణ కళ మొహంలో ఉట్టిపడుతోందని ముద్దులతో  ముంచెత్తి  బుగ్గ చుక్క పెట్టింది. నుదుటన ఎర్రటి తిలకంతో  జ్యోతిలా  బొట్టుని  తీర్చిదిద్దింది. చిలకపచ్చ  కంచి చీరకి తోపుకుంకం రంగు అంచు కంచి చీర కట్టి, నడుంకి  వొడ్డాణం పెడుతూ, 'ఎంత అందంగా ఉన్నావే' అంటూ మాటిమాటికీ మెల్లగా నుదుటిపైన ముద్దు పెట్టుకుంది. ఆమె ఆప్యాయతకీ అనురాగానికీ రూబీ గుండె  కరిగిపోతోంది. కళ్ళల్లో  నీళ్ళు నిండితే  కాటుక చెదిరిపోతుందేమోనన్న భయంతో  రుమాలుతో  కళ్ళు తుడుచుకుని బిందూ పాదాలకి  నమస్కరించింది. బిందూ కళ్ళల్లోనూ  నీళ్ళు నిండాయి.     "రూబీ!....ఏమిటిది? నిన్నటి దాకా  అల్లరిచేస్తూ గొడవ గొడవగా తిరిగే నువ్వు, ఇవ్వాళ  పెద్ద ఆరిందాలా ఈ నమస్కారాలేమిటి?" భుజం పట్టుకుని  లేవనెత్తి చెంపలు  నిమిరింది.     "బిందూ ఆంటీ! ఒక్క మాట చెప్పనా?"     బిందూ చెప్పమన్నట్టు  చూసింది.     "నాకు మళ్ళీ జన్మంటూ వుంటే నీ కడుపునా పుట్టాలని వుంది. అదే భగవంతుణ్ణి కోరుకుంటాను" అంది కళ్ళల్లోని  నీటి పొరను రుమాలుతో తుడుచుకుంటూ  బిందూ షాక్ తిన్నదానిలా రూబీ వంక చూసి, గుండెలకి హత్తుకుంది. యశస్విని నాలుగు కప్పుల్లో  కాఫీ పోసి  పట్టుకొచ్చి  బిందూ  ఆంటీకి, రూబీకి, భ్రమరకీ ఇచి తనూ తీసుకుంది. ఇక్కడ ఈ నలుగురి హడావుడే తప్ప మిగిలిన వాళ్ళ కళ్ళూ చెవులూ  గూడా  గేటువైపే వున్నాయి. ఏ కారు చప్పుడైనా  నిఖిల వొచ్చిందేమో  అంటూ పరుగెడుతున్నారు. రూబీ తమ్ముడు బబ్లూ అయోమయంగా  అటూ ఇటూ తిరుగుతున్నాడు.     "అక్కా! పెళ్ళయితే  నువ్వెళ్ళి పోతావా? అప్పుడు నేనొక్కణ్ణే వుంటాను ఇంట్లో. బామ్మ తాతగారూ వాళ్ళ గొడవలు వాళ్ళవి. నాకు బోర్ కొడుతుంది. నేను బిందూ ఆంటీ వాళ్ళ ఇంటికెళ్ళి  వుండిపోతాను. బిందూ ఆంటీ కథలు చెబుతుంది నాకూ టింకూకీ" అన్నాడు జాలిగా మొహం పెట్టి. వాడి మాటలకి గుండె  కరిగిపోయింది బిందూకి. రూబీకి  ఏడుపొస్తోంది అది చూసి.     "ఒరేయ్ బబ్లూ! నువ్వు కూడా మీ అమ్మా నాన్నతో  ఈసారి  కువైట్ వెళ్ళిపో" అంది భ్రమర.     "కరెక్ట్" అంది యశస్విని వాడి బుగ్గలు  ముద్దుగా  గిల్లుతూ.     "అక్కా! అమ్మ ఎలా వుంటుంది. అచ్చు ఫోటోలో లాగేనా?" అడుగాడు రూబీని.     ఈసారి బిందూ  ఆపుకోలేకపోయింది. వాణ్ణి  ఎత్తుకుని  గట్టిగా గుండెలకి  హత్తుకుంది.     బయట మంగళవాద్యాల జోరు. వీళ్ళ గుండెల్లో  ఆప్యాయతల హోరు! బంధువులు ఒక్కొక్కరే దిగుతున్నారు. రూబీవాళ్ళ పెద్దమామయ్యా అత్తయ్యా అందర్నీ రిసీవ్ చేసుకుంటున్నారు. కామాక్షమ్మగారి కళ్ళు మాత్రం గేటువైపే! అంతలో ఫోను మోగింది. కామాక్షమ్మ పరుగెత్తుకెళ్ళి  ఫోను తీసింది.     "అబ్బ....గంటన్నర  లేటా! అక్కడే వుండు. మళ్ళీ ఒచ్చి ఏం వెళతావ్? అదీగాక ఒక్కోసారి ఫ్లైట్ లేటని చెప్పినా ముందే రావొచ్చు" అంది మురళికి ఫోన్ లోనే ఆదేశాలిస్తూ.     రూబీ కళ్ళనిండా నీళ్ళు నిండుకున్నాయి. అవి చెంపల మీదుగా జారకుండా  జాగ్రత్తగా  వెంటనే తుడిచేసింది బిందూ ఆంటీ. యశస్వినీ, భ్రమరా రూబీకి చెరోవైపు నుంచుని  భుజం తట్టారు ఊరడిస్తున్నట్టు. బబ్లూ బిందూ ఆంటీ కొంగుచ్చుకుని నుంచున్నాడు టింకూ పక్కనే.     "రండమ్మా ....ముహూర్తం వొచ్చేసింది. అమ్మాయిని పీటలమీద కూర్చో పెట్టండి" అరిచాడు పురోహితుడు.     కామాక్షమ్మ ఈ లోకంలో లేదు. లేటయిన ఫ్లైటుని తిట్టుకుంటూ  అసలు ఇండియన్ ఎయిర్ లైన్స్ వారి నందరినీ నిందించేసింది తనే సహజ ధోరణిలో. రమణయ్యగారు ఎవరితోనో పొగాకు వ్యాపారం గురించి మాట్లాడుతున్నారు. అయినా ఆయనకి ఈ మూహూర్తాలూ గిహుర్తాలూ వాటిమీద నమ్మకం లేదు. పెద్దమామయ్య నాగార్జున సినిమాల గురించి మాట్లాడుతున్నాడు. అత్తయ్య కీర్తన ఆడబిడ్డ తేబోయే లగేజి గురించి, వస్తువుల గురించి మాట్లాడుతోంది ఎవరితోనో. పురోహితుడు మళ్ళీ కేక పెట్టాడు. దాంతో.ఈ లోకంలో పడ్డారు కామాక్షమ్మా కీర్తనా. రూబీ చెయ్యి పట్టి నడిపించుకు తీసుకొస్తున్న బిందూ వెనకాలే వాళ్లూ నడిచారు. ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు  వాళ్ళ పని వాళ్ళు చేసేశారు. వింత వింత అనుభూతులతో, కొత్తకొత్త ఊహలతో తూగిపోతూ పీటలమీద కూర్చుంది రూబీ. యశస్వినీ, భ్రమరా ఏవేవో జోకులు చెవిలో చెబుతూంటే  చిన్నగా నవ్వుకుంది రూబీ. టింకూ  బాబ్లూలు రూబీని కొత్త మనిషిని చూస్తున్నట్టు చూస్తున్నారు. పురోహితుడు తన పని తను చేస్తున్నాడు. ఎవరికీ అర్ధంకాని శ్లోకాలేవో చదువుతూ.     "అక్కా! బావగారొచ్చారు" అరిచాడు బబ్లూ.     అందరి కళ్లూ అటు తిరిగాయి. నేవీ బ్లూ సూట్ లో, బంగారంలా నిగనిగ మెరిసే మేనుతో, సోగకళ్ళ సోయగంతో అచ్చం రాకుమారుడిలా వున్నాడు  ఇంద్రతేజ. అతని వెనకే వాళ్ళమ్మగారు అనసూయమ్మ, చెల్లెలు మహీజ, మామగారూ, మిగిలిన బంధువులూ - పూలూ, పళ్ళూ చీరా సారెలతో దిగేరు.     అందరూ  వారికి స్వాగతం పలకడంలో నిమగ్నులయ్యారు.     "ఇంకా నిఖిలా మాధవ్ లు రాలేదా?" అడిగింది అనసూయమ్మ.     "ఫ్లైటు గంటన్నర లేటుట!" సమాధానం చెప్పింది కామాక్షమ్మ.     "అయినా నాకు తెలీకడుగుతా! నాలుగు రోజులు ముందొస్తే ఏం పోయిందట! కూతురి పెళ్ళికి కూడా సెలవు పెట్టక అంత ముహూర్తం సమయానికి దిగాలా, మరీ విడ్డూరం!" సాగదీసింది. అందరిలోకీ పెద్దావిడా, పెళ్ళికొడుకు తరపు మనిషి. ఆ మాటలు రూబీ మనసుకి గుండుసూదుల్లా తగిలాయి. ఒక్కసారి  మనసు ఎటో వెళ్ళిపోయింది ఎగిరే పిట్టలా.         *    *    *     అది తను రెండో క్లాసు చదువుతున్న రోజులు. మొదటిసారిగా  తనకి బుద్ధి తెలిశాక అమ్మని చూడడం. తను ఆరు నెలల పాపగా  వున్నప్పుడే అమ్మా నాన్నా ఇద్దరూ తనని బామ్మ దగ్గర ఒదిలిపెట్టి  కువైట్ వెళ్ళిపోయారు. ఇద్దరూ డాక్టర్లే కావడం, నాలుగు చేతులా సంపాదనే! ఆ వెళ్ళడం, వెళ్ళడం, ఏడాది బబ్లూని పట్టుకుని ఇండియాలో బామ్మ దగ్గర ఒదిలి వెళ్ళడానికి ఇండియా కొచ్చారు.     ఆ రోజు తన పుట్టిన రోజు. ఫ్రెండ్సందరినీ కేక్ కట్ చేస్తున్నానని రమ్మని ఆహ్వానించింది సాయంత్రం అయిదింటికి. అయితే, ఆ రోజే నిఖిలా మాధవ్ లు వెళ్ళిపోవలసిన రోజు. సెలవు ఎక్స్ టెండ్ చెయ్యడానికి వీల్లేదట. ఫ్లైట్ అయిదు గంటలకే! అందుకే మూడింటికే కేక్ కట్ చెయ్యమన్నారు. ఫ్రెండ్సు రాందే కట్ చెయ్యనంది తను. తన మొండితనానికి బామ్మ ఎంతో తిట్టింది చివరికి రెండు తగిలించింది. దాంతో తను ఏడుపు లంకించుకుంది. అంతే! కేకు సంగతి అందరూ  మర్చిపోయారు. నాలుగింటికల్లా ఏర్ పోర్ట్ కి బయలుదేరారు. తనూ ఎయిర్ పోర్ట్ కి వెళ్ళింది. ఇలాగే ఫ్లైటు గంటన్నర లేటు. తన మనసంతా ఫ్రెండ్సు మీదే! వాళ్ళు ఒచ్చి వెళ్ళిపోయారేమోనన్న బెంగ ఒక పక్కా, అమ్మానాన్నా వెళ్ళిపోతున్నారన్న  బాధ మరో వంకా, ఊపిరాడని ఉక్కిరిబిక్కిరి ఆలోచనలతో సతమతమయిపోయింది. తనకి ఊహ తెలిశాక అమ్మని చూడడం అదే మొదటిసారి. ఆమె వెళ్ళిపోతూ వుంటే ఎందుకో ఏడుపు పొంగుకొచ్చింది.       "అమ్మా....నేనూ ఒస్తా." ఏడ్చింది. "నువ్వు బామ్మ దగ్గరే వుండాలి. బాగా చదువుకోవాలి. నీకు బోలెడు ఫ్రాకులూ, బొమ్మలూ అన్నీ తెస్తాను. సరేనా?" నచ్చచెప్పింది అమ్మ.     అంతలోనే ఫ్లయిటు డిపార్చర్ అనౌన్స్ చేశారు. అమ్మ తనని అమ్మమ్మ కిచ్చేసి వెళ్ళిపోయింది. ఒక్కసారిగా  ఏదో నీరసం, ఏదో బాధ అందరూ ఇల్లు చేరుకున్నారు. కేకు ఎదురుగా వెక్కిరిస్తున్నట్టు కనిపించింది. ఫ్రెండ్సంతా ఒచ్చి వెళ్ళిపోయారు. ఆ రోజు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా పండుకుంది తను. అంతే! ఆ తరువాత ఎన్నో పుట్టిన రోజులు దొర్లిపోయాయి అమ్మ లేకుండానే! చదువులో ఫస్టొచ్చినా, ఆటల్లో గెలిచినా, నాటకాలు వేసినా  ఎవ్వరూ మెచ్చుకునే వాళ్ళులేరు, టీచర్లూ ఫ్రెండ్సూ తప్ప. బిందూ ఆంటీ వాళ్ళు ఒకప్పుడు, బామ్మ గారింట్లో  అవుట్ హౌస్ లో అద్దెకుండేవాళ్ళు. అస్తమానం తనని ఎత్తుకుని  ముద్దు పెట్టుకునేది. తనకీ బబ్లూకీ టింకూతోపాటు  చాక్లెటిచ్చేది. టిఫిన్ పెట్టేది. కథలు చెప్పేది. తను వేసే నాటకాలకి, స్కూల్ డేకీ రమ్మని పిలిస్తే బామ్మకి పనుందని ఒచ్చేదికాదు. తాతయ్యకి ఇంట్రెస్టులేదు. కానీ బిందూ ఆంటీ తప్పకుండా  వొచ్చేది. తననెంతో  మెచ్చుకునేది. గంటలతరబడి బిందూ ఆంటీతో మాట్లాడుతూ గడిపేది తను ఎంత తియ్యటి అనుభూతి!     ఒక్కసారిగా కారు హారన్ జోరుగా  మోగేసరికి ఈ లోకంలో కొచ్చి పడింది రూబీ. అందరూ అటు పరుగెత్తేరు. కారు పోర్టికోలో ఆగింది. వంకాయ రంగు చీరకి పచ్చి పసుపురంగు అంచు కట్టి పట్టుచీరా ,మెడలో రవ్వల నెక్లెసూ, చేతికి రవ్వల గాజులూ, రవ్వల దుద్దులూ, బాబ్ డ్ హెయిరూ, ఖరీదైన హ్యాండు బ్యాగూ- అధునాతనంగా, అందంగా అనిపించింది అమ్మ రూబీ కళ్ళకి. సూటూబూటూ గోల్డ్ ఫ్రేం కళ్ళద్దాలూ నాన్నగారు కూడా అమ్మకి తగ్గట్టుగానే  వున్నారనిపించింది. బబ్లూ కూడా ఇద్దర్నీ కొత్తగా చూస్తున్నాడు. అందరూ వాళ్ళని చుట్టేశారు. నాగార్జునా, మురళీ సామాన్లు  లోపల పెడుతున్నారు.  కీర్తన సామాన్లనీ నిఖిలనీ మార్చి మార్చి చూస్తోంది. అందర్నీ దాటి నిఖిల రూబీ దగ్గరికొచ్చి కౌగలించుకుంది. బిందూ వాళ్ళందరికీ దారి నిస్తూ వెనక్కి జరిగింది. నిఖిల హ్యాండుబ్యాగ్ లో నుంచి కెంపుల నెక్లెసు, కెంపుల దుద్దులూ, కెంపుల గాజులు బైటికి తీసింది. ఒక్కొక్కటే వేసింది రూబీకి. అందరూ వాటికేసి చూసి పరీక్షించడం, చర్చించడం మొదలెట్టారు. పురోహితుడు అది గ్రహించి ఏవో రెండు మంత్రాలు చదివి అయిందనిపించాడు. వెంటనే అయినవాళ్ళు అందరూ కానుకలు సమర్పించడం మొదలెట్టారు- చీరలూ, నగలూ వాళ్ళవాళ్ళ హోదాను చాటుతూ! మెల్లగా వెళ్ళి బిందూ కాగితం చుట్టివున్న  ఒక పెయింటింగ్ ని అందించింది రూబీకి. రూబీ వెంటనే కాయితం విప్పి చూసింది. ఏ బహుమతినీ పట్టించుకోని రూబీ, దీన్ని అంత తొందరగా  విప్పి చూడడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. రూబీ ఆ బొమ్మని తనివితీరా చూస్తోంది. ఏమిటా అది అని అందరూ చూశారు. తల్లి పొత్తిళ్ళల్లో ఒద్దికగా కూర్చుని కబుర్లు చెబుతున్న పాప! తల్లీ బిడ్డా ఎంతో ముద్దుగా వున్నారు.     "ఎంత బాగా వేశారో, ఎవరో ఆ చిత్రకారుడు?" అన్నారెవరో.     "బిందూ ఆంటీయే!" గట్టిగా చెప్పింది రూబీ. అందరూ ఆమెకేసి చూడటంతో ఆనందంతో ఆమె మొహం ఎర్రబారింది.     "అందరికీ నమస్కారాలు చెయ్యమ్మా! ముందుగా మీ అమ్మగారికీ, నాన్నగారికీ తరవాత బామ్మకీ, తాతగారికీ, మామయ్యలకీ..." అంటూండగానే రూబీ వెళ్ళి బిందూ ఆంటీకి పాదాభివందనం చేసింది. అందరికీ ఆశ్చర్యం, నిఖిలకీ, కామాక్షమ్మకీ కోపం ఒక్కసారే పెల్లుబికాయి.     "ఏమిటే ఆ పని? కన్న తల్లికి నమస్కరించకుండా ఎవళ్ళకో ఏమిటా నమస్కారాలు?" గట్టిగానే అంది కామాక్షమ్మ.     "ఎవళ్ళకో కాదు బామ్మా....నన్ను అర్ధం చేసుకుని ఆదరించిన అమ్మ ఆమె" అంది ఉక్రోషంతో రూబీ.     "కన్నతల్లికంటే ఎక్కువా?" కామాక్షమ్మ అహం దెబ్బతింది. నలుగురిలో నిఖిలకి ఏం చెప్పాలో తెలీలేదు. "ఆ.....ఎక్కువే!....నా మనసు తెలిసి మమతలు పంచిన మల్లెల మనసు బిందూ ఆంటీది. 'అమ్మా' అని ఏడ్చిన రోజున 'ఊరుకోమ్మా' అని ఊరడించిన  అభిమానపు గుండె ఆమెది! నా మాటా,  నా ఆటా చూసి మురిసి నన్ను ప్రోత్సహించిన చల్లని మనసు ఆమెది! ఆమెకి కాక, కేవలం కన్నంత మాత్రాన ఆమేమిటో నాకు తెలీక, నేనేమిటో ఆమెకి తెలీక కేవలం నగలూ, నాణాలూ ఇవ్వడం తప్ప మనసివ్వని  ఆమెకి ముందు నమస్కరించడం న్యాయమా?" ఆవేశంతో, తను పెళ్ళికూతురనీ, అక్కడ అందరూ ఉన్నారనీ కూడా మర్చిపోయి  తన మనసులోని మాటల్ని చెప్పేసింది రూబీ.     ఆమె మెడలోని కెంపులహారం బిందూ గీసిన తల్లీబిడ్డల చిత్రం ముందు వెలవెలబోయింది. మబ్బులు కమ్మిన చంద్రుడిలా! అందరూ కొయ్యబారినట్టయి పోయారు. రూబీ కళ్ళ నీళ్ళు చెంపలమీద చారలు కట్టాయి. వెంటనే ఇంద్రతేజ లేచొచ్చి జేబురుమాలుతో రూబీ కళ్ళు తుడిచి బిందూ ఆంటీకి పాదాభివందనం చేశాడు. ఈ సంఘటనతో అందరూ మూగవారిలా  రూబీని, ఇంద్రతేజని చూస్తుండిపోయారు. పురోహితుడి సైగతో అక్షింతల వర్షం కురిసింది దంపతులు ఇంద్రతేజ, రూబీలపైన!                    

అనుభూతుల ఎడారితోటలో

అనుభూతుల ఎడారితోటలో... - డా.ఎ. రవీంద్రబాబు                                                       'నిన్ను వదిలి వెళ్లాలని లేదు... అని నాకోసం ఒక్క కన్నీటి చుక్క కార్చకు' అని మాట తీసుకున్నావు. శాశ్వతంగా నీలోనే ఉంటానని ఒట్టేశావు. అది నిజం. జ్ఞాపకంగా, యదార్థంగా ఇప్పటికీ నన్ను కౌగిలించుకునే ఉన్నావు. ఉంటున్నావు. నమ్మకం ఓ గాఢమైన అనుభూతి మాత్రమేనా...!! ఆ రోజు వదిలి వెళ్లడానికి అంత బాధపడ్డావు. కానీ ఈ రోజు, ఈ క్షణాన ఎలా ఉన్నావో కదా...! నిన్ను నీ జ్ఞాపకాలను తలచుకుంటూ, నీ వదిలి వెళ్లిన ఏకాంతంలో... నేను...!!           నువ్వు వెళ్లేటప్పుడు ఎలా ఉందో నా గది ఇప్పటికీ అలానే ఉంది. నామదిలా...  అన్ని వస్తువులు నీకోసం ఎదురు చూస్తున్నాయి. నీవు రావని, కుదరదని తెలిసినా...!? వెర్రిగా, పిచ్చిగా...! ఏ వస్తువును ముట్టుకోబోయినా వాటి మీద నీ వేలి ముద్రలు నాకు నీ స్పర్శనే గుర్తుకు తెస్తున్నాయి. నీవు వేసుకున్న షర్టు, ఇప్పటికీ హ్యాంగర్ కు వేళాడుతూనే ఉంది. నేను మాత్రం దానిని చూసినప్పుడల్లా నీతో గడిపిన క్షణాలు గుర్తుకు వచ్చి హ్యాంగ్ అవుతూనే ఉన్నాను.            అవును... నిన్ను నువ్వు భరించలేనంతాగా నన్ను ఇష్టపడ్డావు. ప్రేమకు పిచ్చి భాషలెన్నో చెప్పావు. ప్రేమన్నది నిర్వచనం ఇవ్వలేనిదేమో...! ప్రేమలో మునిగి ఉన్నప్పుడు వాళ్ల వాళ్ల హృదయ సౌందర్యాన్ని కొలవడానికి ఏదైనా సాధనం ఉంటే ఎంత బావుణ్ణు...! అప్పుడు ప్రేమకు కచ్చితమైన రంగు, రుచి ఇవ్వొచ్చు. అయినా నా పిచ్చి కాని ప్రేమను కొలవటం ఏంటి.? అదొక ఆంతరంగిక చలనం. ఒక స్పార్క్. గుండెలో కదిలే సుతిమెత్తని సవ్వడి. మధురమైన బాధ. ఇలాంటివి ఎన్నైనా చెప్పొచ్చు. అవన్నీ నేను నీ ప్రేమలో పొందాను.        'ప్రేమంటేనే శాస్వత విరహం. ప్రేమంటేనే సుదీర్ఘ నరకం' అన్నాడు ఓ కవి. నిజమే...! అర్థమవుతోంది. ఎన్ని కలలు, ఎన్ని కళలు, ఎన్ని కల్పనలు, ఎన్ని చేతలు, ఎన్ని రాతలు... అన్నీ అన్నీ ఒక్క ఎడబాటుతో జ్ఞాపకాల్యయాయి. చేదు జ్ఞాపకాలయ్యాయి. ఇంతకీ ఎలా ఉన్నావు.? ఈ క్షణంలో ఏలా ఉన్నావు.? చివరకు పడుకునే ముందైనా నేను గుర్తుకు వస్తానా...? నా అభిమానం కాకపోతే..! నేను గుర్తు పెట్టుకున్నానని, నీవు గుర్తు పెట్టుకోవాలను కోవడం... ప్చ్..      ప్రేమలో ఇంత తీక్షణత, కాంక్ష, వేదన ఎలా ఉన్నాయో...! ఎప్పుడయినా కనపడక పోతావా... అని చిగురించే ఆశ. ఒకవేళ కనపడితే నీతో ఏం మాట్లాడాలి.? ఎలా మాట్లాడాలి.? తొలి పదాన్ని ఎలా ఉచ్ఛరించాలి.? నీ రూపం ఎలా ఉంది?. నీ మనసు ఎలా ఉంది?. ముఖ్యంగా అంత తేనేను దాచిని నీ అధరాలు ఎలా ఉన్నాయో...! నువ్విచ్చిన తొలి ముద్దు తీయదనం నా పెదాల మీద ఇంకా ఆరలేదు. ఇప్పటికీ అలానే కదలాడుతోంది.           ఇన్ని ఆలోచనలు చేస్తున్నాను గానీ, నువ్వసలు కనపడాతావా...? ఏ దేవలోకంలో గంధర్వ కన్యగా మారి ఉంటావో కదా...! ఒక వేళ కలలో కనపడినా ఈ ప్రేమ బుజ్జి బిచ్చగాడితో మాట్లాడతావా...? అయినా స్త్రీకి, స్త్రీ ప్రేమకు లొంగే పురుషుడంటే... స్త్రీయే సర్వస్వంగా తపించే పురుషుడంటే స్త్రీకి లోకువే కదా...!? నీ ప్రేమ కోసం ఎంత ఆరాటపడ్డాను. ఎన్ని రోజులో మూగగా రోదించాను. కరుణించావు. కురిపించావు. వర్షించావు. చివరకు దూరమయ్యావు. అంతా ఓ చిత్రికలా...! అవన్నీ తలచుకుంటుంటే ఆ క్షణాలలో... నేను పొందిన ఆనందం ఎంత గొప్పదో ఇప్పుడు తెలిసి వస్తోంది. నిజంగా ఆరాధనలో ఉండే ఉషస్సు నా హృదయాన్ని వెలిగించిన రోజులవి. దేవతకోసం నే ఎత్తిన మంగళ హారతిలాంటివి.            ఈ ప్రపంచం నిండా ప్రేమికులే ఉన్నారు. కానీ భయం. ప్రతి స్త్రీ, పురుషుడు తప్పక ఎవరో ఒకర్ని ఏదో ఒక క్షణం తప్పక ఇష్టపడి ఉంటారు. వారికోసం ఒక్క నిద్రలేని రాత్రినైనా గడిపి ఉంటారు. ఎన్ని ఏళ్లు గడిచినా ఆ మధుర ఘడియల్ని తప్పక గుర్తు చేసుకుంటూనే ఉంటారు. కానీ ఈ సమాజపు బురదలో పడి ఆంతరంగిక లోతుల్ని దాచేసుకుంటుంటారు. మనిషి సంకెళ్లు విధించొచ్చుగానీ, మనసుకు సంకెళ్లు విధించలేరు కదా...! అంతా ఓ విచిత్రమైన మనో చర్య. వారిని వారు మోసంతో నటించే నటనా ప్రక్రియ.. ఓహ్..!! ఏం ఈ జీవన సంతోషం.!       రోజులన్నీ ఖాళీగా కదులుతున్నాయి. కఠినంగా నన్ను, నా జీవితాన్ని శాసిస్తున్నాయి. నీకు నిజం చెప్పనా...! నీవు దూరమైన రోజునుంచి ఇప్పటి వరకు నేను బతికిన క్షణం ఒక్కటీ లేదు. బతకడం అంటే ఒక పరిమళ భరితమైన ఆనందాన్ని, ఉవ్వెత్తున ఎగసే సౌందర్యాన్ని అనుభూతి చెందడం. కానీ ఈ మనుషులకు ప్రేమంటే తెలీక. బతకడం అంటే తెలీక... డబ్బు, ఆస్తి, హోదా అని బతికేస్తుంటారు. నవ్వు వస్తుంది కదూ...!!            మళ్లా నేను నేనుగా బతకాలన్న కోరిక చచ్చిపోయింది. చిగురించని ఆశతో ఎలానో ఒకలా... బహుశా ఇలానే నేమో...                                                లేకుండా ఉండనా...                                                 

ప్రేమచినుకుల జ్ఞాపకం

ప్రేమచినుకుల జ్ఞాపకం - డా. ఎ. రవీంద్రబాబు    ధారాపాతంగా వర్షం కురుస్తుందిరా...! ఆకాశం నుంచి అప్సరసలెవరో పూలు కురిపిస్తున్నట్లు...! వానాకాలం నాటి సాయంత్రాలు...! ఎన్ని అనుభూతుల్ని మిగిల్చాయో నీ నుంచి నాకు...! సన్నటి తువర మధ్య వెచ్చటి నీ శరీరపు వాసనతో రోడ్ పై నడుస్తుంటే...! ఎంతమంది విచిత్రంగా చూసే వాళ్లో...?! వీరిద్దర్ని వర్షం తడుపుతుంది కదా...? ఎందుకు పట్టించుకోవడం లేదు అని. అయినా.., వర్షం అంటే నీకు అంత ఇష్టం ఎందుకో, నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఒకవేళ ప్రకృతిలోని అందమైన దృశ్యాలన్నీ పూర్వజన్మవల్ల నీలో అనుభూతులుగా మిగిలాయోమో...! తెల్లటి నీ శరీరం ఎర్రటి చుడీదార్ లో తడిస్తే...! పక్కనున్న నాలో కవిత్వం ముక్కలై పూస్తుంటే...! నువ్వు ఎంత బలవంతం చేసే దానివి కవిత్వం చెప్పొద్దు, చెప్పొద్దు అని, అయినా ప్రవాహం ఆగకపోతే చివరకు 'నీ కవిత్వమే నేనైనప్పుడు నీకు ప్రత్యేకంగా కవిత్వం ఎందుకురా?' అని గోముగా తిట్టేదానివి. దాంతో మౌనంగా నిన్ను, వర్షాన్ని, వర్షంలో నిన్ను చూస్తూ అలా ఉండిపోయేవాడ్ని.         నీకు గుర్తుందా...? ఒకరోజు రోడ్ పై వర్షంలో ఇద్దరం నడుస్తువ్నాం. వర్షం విపరీతంగా పెరిగింది. గానుగ చెట్టుకింద ఒదిగి నిలబడ్డాం. నీ నుంచి వెచ్చనైన ఉచ్చ్వాసలు, ఆ చల్లదనం మధ్య బరించలేని వేడి. ముంగురులు నీ ముఖం మీదకు వాలి ముత్యాల్లాంటి చినుకుల్ని రాలుస్తున్నాయి. నీ అధరాలు తడిసిన లేత గులాబీల్లా గాలికి స్పందిస్తున్నాయి ప్రకృతిలోని సౌందర్యమంతా నీలో కుమ్మరించినట్లు...!          'ఇప్పుడు ఇక్కడ కురిసిన వర్షం ఎక్కడి మేఘానిదో' అన్నది ఓ కవయిత్రి. కానీ నా గుండెలో నిశ్శబ్దంగా కురుస్తున్న ఈ వాన మాత్రం నీదే... ఏం చెప్పను, ఎం చేయను. పదేపదే గుర్తుకు వస్తావు. నీవు లేకుండా వర్షం వచ్చినందుకు తిట్టాలనిపిస్తుంది ఈ వర్షాన్ని. 'అయినా మనలాంటి ప్రేమికులెవరో ఈ వర్షాన్ని ఎంజాయ్ చేస్తుంటార్లే' అని నాలో నేనే సంతోషపడతాను. ప్రకృతిని చూసి, లీనమై, లయమై దానిలో ఆనందాన్ని పొందేవాళ్లు తగ్గిపోయారు. అంతా ఇంటర్నెట్..., ఫబ్ లు, కుత్రిమమైన లైట్స్... యాంత్రిక సౌందర్యం కోసం వెంపర్లాడుతున్నార్రా...!. ఇలాంటి వాళ్ల మధ్య ఈ సాయంత్రం ఓ ఒక్క జంటైనా వర్షానుభూతిని అనుభవిస్తూ ఆ సౌందర్యాగ్నిలో భస్మమవ్వక పోతారా...!? అనుకుంటాను.         నంగనాచిలా వర్షం ఆగిపోగానా తెలిమబ్బులతో ఆకాశం సిద్ధమైంది... రాలిన చినుకుల జ్ఞాపకాల్ని నెమరువేసుకోడానికి. ఈ మధ్య ఒకరోజు వర్షంలో టీ తాగుతుంటే... 'వర్షంలో తడుద్దామా...?' అని అడిగింది స. సరే అని ఇద్దరం పిచ్చిగా తడుస్తూ రోడ్ పై జారే ప్రవాహంలో పాదాలను అభిషేకిస్తూ చాలాదూరం నడిచాం. ఎందుకో అనుభూతి, అంటే ఫీల్ లేదు. ఉండదని ముందే తెలుసు. ఆమెదో విరాగి బ్రతుకు. తనకుండే అహం నుంచి మాట్లాడుతుంది. డబ్బు, దర్పణం, కులం... ఏవో ఈ సమాజం మనకు బదిలీ చేసిన పాతచింతకాయ పచ్చడిలోంచి మాట్లాడుతుంది. అయినా అవవ్నీ ఎప్పుడో నేను వదిలేశానని తనకు తెలియదు కదా...! ప్రేమంటే... ఇవ్వడం. ప్రేమంటే... కోల్పోవడం. ప్రేమంటే... మన హృదయానికి మనమిచ్చే అద్భుతమైన కానుక. ప్రేమంటే... మనల్ని మనం అర్పించుకోవడం. 'దేవుడా నీకు లంచమిస్తాను. నా కోరికలు తీర్చు' అనే ఈ పాడు లోకానికి ప్రేమ గురించి చెప్పడం వేస్టే...! అనిపించింది. వర్షంలో చాలాసేపు సుబాబుల్ చెట్లకింద కూర్చున్నాం. అనుభూతుల్లేని జీవితాల్లా... ప్రకృతి వికర్షించిన సునామీల్లా... ఆమెను సమాధాన పరచడానికి చాలా శ్రమించాను. ఓడిపోయాను. 'చాలామంది అమ్మాయిలు అంతేరా గోడలు కట్టుకొని, అద్దాల్లోంచి బయట ప్రపంచాన్ని చూస్తూ భయపడుతూ, తిడుతూ... అలా అలా... అంతే' అన్నావు చూడు నీ మాటలు అక్షరాలా నిజం. స తో మాట్లాడినప్పుడు నిజమని తెలిసిపోయింది. తర్వాత నేనెప్పుడు అంతగా మాట్లాడటానికి ఆమెకు అవకాశం ఇవ్వలేదు.           ఇదిగో అక్షరాలు ఇలా వెళ్తున్నాయా...! వానలో తడిసిన నువ్వు ఈ అక్షరాల్లో ఒదుగుతున్నావు. నా గుండెను తడిచేస్తున్నావు. ఆ తడి నా కళ్లల్లో... చినుకులుగా కురుస్తుంది. ఇప్పుడు నువ్వుండే చోట కూడా వర్షం కురుస్తుందా...? తడుస్తున్నావా...?! ఆ సంతోషంలో నీ మల్లెల నవ్వును ఆరబోస్తున్నావా...!!!                                                 జ్ఞాపకాల పుటలో ఓ వాన           

ప్రతీకారం

                      ప్రతీకారం        "మేడమ్! ఈ రోజు మీకు ఫేర్ వెల్ పార్టీ ఎరేంజ్ చేశాము." లలిత చెప్పి వెళ్ళిపోయింది.     అద్దం ముందు నిల్చున్న కల్పన అలాగే తన మొహాన్ని చూస్తుండి పోయింది. వెండితీగల్లాంటి తలవెంట్రుకల్ని ఆప్యాయంగా సవరించుకుంది.     తన జీవితంలోని అనుభూతుల్ని ,ఆవేదనలనూ పంచుకొని తోడుగా నడిచింది అద్దమే! అది తన బింబం! దానికి తెలుసు తనలోని మాయని గాయాలు ఆనందాతిరేకాలు!     అప్పుడే తను రిటైరు అవుతోందా! అంటే తనింక పనిచేయటానికి పనికిరాదనీ, విశ్రాంతి తీసుకోమనీ... ఇదెలా సాధ్యం... తను ఖాళీగా కూర్చొని విశ్రాంతి తీసుకోగలదా!     ఈ రోజు ఈయబోయే పార్టీలో కాలేజీకి తనకూ ఋణం తీరిపోతుంది. తన జీవితంలోని ఒడుదుడుకుల్నీ, ఎత్తుపల్లాలను స్పర్శించిన గాలీ, తన జీవితంలోని అవహేళనలూ, అమర్యాదలతో బాటు ఆరాధననూ గౌరవాన్నీ అమితంగా పొందేట్లు చేసిన కాంపౌండు వాతావరణం...     అసలు తన మనసుకు నిజంగా దగ్గరైన వ్యక్తి ఉన్నారా... చప్పున మధు గుర్తొచ్చాడు. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ స్వచ్చమైన మనిషికి ప్రతీకలా...అటువంటి మధును తన జీవితంలోకి ప్రవేశించనీయకుండా తనే నిర్ధాక్షిణ్యంగా తోసేసింది. సమాజానికి భయపడా?... హు... ఇంతలా శాసించిన సమాజం తన బాగోగుల్ని పట్టించుకుందా? తన భయంకరమైన మానసిక సంఘర్షణ గురించి ఆలోచించిందా?... ఆఖరికి కట్టుకున్న భర్త కూడా... నిర్ధాక్షిణ్యంగా తనను పట్టించుకోలేదు... కానీ చిత్రం... మధు తన మనసును అంత స్పష్టంగా ఎలా ఫోటో తీయగలిగాడు.       ఈపాటికి తాత హోదాలో ఎక్కడో మనవళ్ళు, మనవరాళ్ళతో కాలక్షేపం చేస్తుంటాడు... నిజంగా జీవితం ఎంత భయంకరమైనది. ఎంత విచిత్రమైనది... నవ్వుకుంది కల్పన. గతం తాలూకు ఆలోచనలు పరదాల్లా చుట్టేసి ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.     అందరు ఆడపిల్లల్లాగానే కోటి కోరికలతో కలల ఇంద్రధనుస్సును వెంట బెట్టుకొని పారాణి పాదాన్ని అత్తింట్లో పెట్టింది కల్పన.     "ఏమ్మా! మీ నాన్న ఇస్తానన్న కట్నం తాలూకు బాకీ ఏది" అడిగింది అత్తగారు ఆ రోజు సాయంత్రమే!     నిర్ఘాంతపోయింది కల్పన.     "నాన్న నాతో ఏమీ చెప్పలేదే" కన్ ఫ్యూజన్ గా అంది.     "అవును తల్లీ ఎందుకు చెప్తాడు? తల్లిలేని బిడ్డ అంటూ నా కొంపమీద పడేసి చేతులు దులిపేసుకున్నాడు మీనాన్న... అయినా ఇదంతా నా కొడుకు చేసిన నిర్వాకమే... వాడేగనుక నిన్నే చేసుకుంటానని పట్టుబట్టకపోతే... ఆ నూజివీడు సంబంధం చేసుకుంటే మూడు లక్షలిచ్చేవాళ్ళు... అంతా నా ఖర్మ" వ్యంగ్యంగా అందావిడ.     "కల్పనా! మా అమ్మ మాటలకు కష్టపెట్టుకోకు..." మొదటి రాత్రి తనని దగ్గరగా తీసుకొన్న భర్త గుండెలపై తల ఆనించింది కల్పన. ఆమె కన్నీళ్ళు అతని లాల్చీని తడిపాయి.     "ఛీ... పిచ్చీ... ఎందుకీ కన్నీళ్ళు... ఆవిడే సర్దుకుపోతుంది. నువ్వు ఎమ్.ఎ. చదివావంటే నాకు నమ్మకం కుదరటం లేదు" తేలికపడిన మనసుతో తన బేలతనానికి తానే సిగ్గుపడిపోయింది.     శ్రీనివాస్ ఆఫీసుకి వెళ్ళాక అత్తగారి విశ్వరూపం చూసి భయపడిపోయింది కల్పన. ఎంత సర్దుకుపోతున్నా ఆవిడ సతాయింపు సణుగుడు పెరుగుతున్నాయే గానీ అవగాహన పెరగటం లేదు. భర్త ఉన్నప్పుడు ఒక రకంగానూ అతను లేనప్పుడు మరోవిధంగా ప్రవర్తించే ఆవిడ్ని చూస్తుంటే సినిమాల్లో ద్విపాత్రాభినయం చేసే పాత్రలు గుర్తొస్తున్నాయి కల్పనకు.     ఆరోజు మధ్యాహ్నం కల్పన దొడ్లో బట్టలారేస్తుంటే మళ్ళీ మొదలెట్టింది అత్తగారు.     "మీ నాన్న చచ్చేలోపయినా ఇస్తాడా ఆ ఐదువేలు".     కల్పనకి చాలా కోపం, ఆవేశం వచ్చాయి.     "అసలెందుకియ్యాలి... ప్రాణంలా పెంచిన నన్నిచ్చాడు... చాలు" గభాల్న అనేసింది.     "ఏంటే... అంత రోషమొచ్చింది... వెళ్ళి ఆ ఐదువేలు తీసుకొచ్చి మాట్లాడు..." బరబరా కల్పనని వాకిలి దాకా లాక్కెళ్ళింది.     "ఫోవే పో... డబ్బు తెచ్చాకే నా గడపతొక్కేది..." మొహం మీదే తలుపు లేసిందావిడ.     ఇరుగుపొరుగు వాళ్ళంతా చోద్యం చూస్తున్నారు. కానీ ఒక్కరూ నోరు మెదపలేదు.     కల్పనకి పౌరుషం ముంచుకొచ్చింది. "తను బతకలేదా! డబ్బు ఎదురు ఇచ్చి బానిసగా బతికే ఈ దుర్భర జీవితం కోసం ఎందుకు పాకులాడాలి... తన జీవిత సౌధాన్ని తాను నిర్మించుకోగలదు... భర్తకి తన శరీరమే గానీ మనసు అవసరం లేదన్నది తేలిపోయింది. అనుభూతుల్ని పట్టించుకోని అవకాశవాది... తల్లి దోషాలను పరోక్షంగా సమర్ధిస్తున్న పిరికివాడు..."     స్నేహితురాలు రమణి దగ్గరికి విజయవాడ వెళ్ళే రైలెక్కేసింది. అక్కడే రమణి సాయంతో కాలేజిలో లెక్చరర్ గా చేరింది. తండ్రిని సమాధానపరచి పిలిపించుకుంది. జీవిత వైకుంఠపాళిలో పాముల్ని తప్పించుకుంటూ కష్టపడి నిచ్చెనలనే ఎక్కింది.     ప్రిన్స్ పాలయినా ఆడంబరం లేక సంస్కార ముట్టిపడే ఆమె ప్రవర్తనే ఆమెకు శ్రీరామరక్షగా నిలిచింది. జీవితంలో ఎదురుపడిన ఆత్మీయుని చేయి మాత్రం అందుకోలేకపోయింది... సమాజానికి భయపడిందా... తను!... శ్రీనివాస్ మరో పెళ్ళి చేసుకున్నాడనీ... ఆమె పరమగయ్యాళి కావటంతో ఇల్లు నరకంగా మారిందనీ అతను పచ్చితాగుబోతుగా మారాడనీ... ఎవరిద్వారానో తెలిసింది.      "మేడమ్ పార్టీకి టైమయింది..." లలిత పిలుపుతో ఆలోచనల్ని వదిలించుకుని అనుసరించింది కల్పన.     పొగడ్తలూ ,ప్రశంసల మధ్య వీడ్కోలు ఇచ్చిన తన వారందర్నీ చూస్తుంటే కళ్ళు చెమర్చాయి. భారమయిన హృదయంతో అందరికీ కృతజ్ఞతలు తెలిపి మౌనంగా ఇంటికి వచ్చి వరండాలోని కుర్చీలో చేరగిలబడి కళ్ళు మూసుకుంది.     మొమెంటోలు, పూలదండలు టీపాయ్ మీద పెట్టి లలిత నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది. మేడమ్ ని అప్పుడు డిస్ట్రబ్ చేయకూడదని ఆ అమ్మాయికీ తెల్సు.     ఇన్నాళ్ళూ కాలేజి, ఉపాధ్యాయులు, విద్యార్ధినులు వాళ్ళ వ్యవహారాలకు జీవితాన్ని సమర్పించుకొని తన ఉనికినే మర్చిపోయిన కల్పనకు ఇప్పుడు ఎన్నడూ లేనంత ఒంటరితనంగా ఉంది. ఎవ్వరున్నారు తనకి? ఎందుకింత వేదన తన జీవితంలో... తనవాళ్ళనుకున్న వాళ్ళంతా ఈ రోజు వీడ్కోలు చెప్పేశారు...ఇన్నాళ్ళూ ఇంత ఒంటరితనం ఎక్కడ దాక్కుంది... నాన్న ఉన్నా ఈ రోజు ఇంత బాధగా అన్పించేది కాదేమో...!     తండ్రి గుర్తు వచ్చేసరికి ఆమె కనుకొలకుల్లో తడితడిగా కన్నీరు... అరె...ఇంకా ఈ కన్నీరు నాలో దాగుందా... తండ్రి తన జీవితం పట్ల అసంతృప్తితోనే కళ్ళు మూశాడు... కూతురు పచ్చగా పిల్లపాపలతో కళకళలాడాలని ఏ తండ్రి కోరుకోడు... తన హోదా... డబ్బు ఆయనకి తృప్తినీయలేదు... తనకి మాత్రం? ఏ మూలో అసంతృప్తి లేదూ... ఎవరినైనా పెంచుకున్నా బాగుండేది.     ప్చ్... కాలేజి పిల్లలే తన పిల్లలనుకుంది ఇన్నాళ్ళూ... బంధువులకు తానేనాడో దూరమయింది.     లైటు కూడా వేయని ఆ చీకటి ఇంటిలో ఒంటరి నక్షత్రంలా ఆమె...     గేటు దగ్గర 'దబ్బు'మని చప్పుడు విన్పించి చివాలున తలతిప్పి చూసింది.     ఎవరో తెలీటం లేదు. అస్పష్టమైన ఆకారం. చేతిలో కఱ్ఱ కూడా ఉంది. పడిపోయినట్లున్నారెవరో...     "ఎవరూ..." లేచి లైటు వేసింది.     ఎవరూ బదులివ్వలేదు. దగ్గరిగా వెళ్ళిన కల్పన లైటు వెలుగులో ఆ వ్యక్తికి పోల్చుకుంది.     ఆమె మనసు నిండా ఆశ్చర్యం, అనుమానం వింతగా కమ్మేశాయి.     "మీరు... ఇలా... ఈ స్థితిలో..." తడబడింది కల్పన. ఆమె కల్పన కాళ్ళు చుట్టేసి ఏడవడం ఇబ్బందిగా కూడా ఉంది.     పదినిమిషాలలా ఏడ్వనిచ్చి దుఃఖపు తెరతగ్గాక "ఏమిటిలా వచ్చారు... ఇలా అయిపోయారేమిటి..." అత్తగారి పట్ల కల్పన గొంతునిండా అంతులేని సానుభూతి. ఆ సానుభూతి అత్తగార్కి నిలువునా కత్తితో చీల్చినట్లు అన్పిస్తోంది.     "నన్ను క్షమించు కల్పనా! నీకు చేసిన అన్యాయానికి నేనిలా బిచ్చగత్తెనయిపోయాను" కన్నీరు లావాలా కరుగుతోందామె కళ్ళనుండి.     "ఇలా ఎందుకు జరిగింది... రండి లోపలికి..." ఆమె చేయిపట్టి లేవదీసింది కల్పన.     అతి బలవంతంగా నడిపించుకొని లోపలికి తెస్తుంటే ఆయాస పడుతూనే ఆమె వివరిస్తోంది.     "నళిని... అదే నా రెండో కోడలు ఎవరినో ప్రేమించిందట. వాళ్ళ వాళ్ళు బలవంతంగా వీడికిచ్చి చేశారుట... చివరికి అతనితో వెళ్ళిపోయింది... నా బంగారు తండ్రి శీనూ జీవితం నా చేతులతో నేనే... పాపిష్టి డబ్బుకోసం నాశనం చేశాను... తాగి తాగి వళ్ళు తెలీక లారీ కిందపడి నా శీనూ..." ఆమె పమిట కొంగు నోట్లో దోపుకొని ఏడ్వసాగింది. కల్పన గుండెల్లో కలుక్కుమంది.     అతికష్టం మీద ఆమెను ఓదార్చి కుర్చీలో కూర్చోబెట్టి లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చిచ్చింది. కాస్త తేరుకుందావిడ.     "కల్పనా! నిన్ను ఉసురు పెట్టినందుకే... ఇలా... బిచ్చమెత్తటానికి కూడా పనికి రాకుండా..." ఆవిడకి తనమీద తనకే అసహ్యమేసినట్లు కంపించిపోతోంది.        డెబ్బై ఏళ్ళు నిండిన ఆ ముసలి ప్రాణాన్నిలా చూస్తుంటే కల్పనలో జాలి, దయ పెల్లుబుకుతున్నాయి. మానవత్వం వివేకాన్ని వెన్నుదట్టి లేపుతోంది. తనకీ ఒంటరి జీవితమెందుకు మిగిలిందని ఇంతసేపూ బాధపడింది. తనవల్ల ఇంకో ప్రాణికి సహాయం జరుగుతుందని భగవంతుడు వెంటనే తెలియజేశాడు అనుకుంది జీవితం పట్ల పరిపూర్ణ విశ్వాసంతో.     అత్తగారి చేయి పట్టుకున్న కల్పన దృడమైన ఆమె నిర్ణయాన్ని తెలియజేస్తున్నట్లుగా స్పర్శిస్తోంది.     కానీ ముసలావిడ మనసు విలవిల్లాడిపోతోంది. కల్పన కసితీరా తిట్టినా బాగుండేది. ఇదేమిటి... తనపట్ల ఇంత దయగా ప్రవర్తిస్తోంది. ఇటువంటి కరుణామయినా... తనారోజు నిర్ధాక్షిణ్యంగా గెంటేసింది. "భగవాన్... ఇంతటి దయకు నేను అర్హురాలిని కాదు... ఈ నరకం నేను భరించలేను" పశ్చాత్తాపంతో ముసలావిడ హృదయం కుమిలిపోతోంది. ఆమెకు సాంత్వన ప్రసాదిస్తున్నట్లు స్వచ్చమైన చిరునవ్వులు చిందిస్తున్నది కల్పన.     అపకారికి ఉపకారం చేయటం కన్నా ప్రతీకారం తీర్చుకొనే మార్గం లేదనీ, అది మనిషిని నిలువెల్లా కుదిపేస్తుందనీ ప్రత్యక్షంగా చూసిన ఆకాశం తలవంచి కల్పనను దీవించింది.

ఆంటీ... ఆంటీ...

ఆంటీ... ఆంటీ - శారదఅశోకవర్ధన్     అశ్విన్ చెప్పిన వార్త విని శుభాంగి కుప్పలా  కూలిపోయింది. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.     "ఎప్పటికీ ఇవే గొడవలా? ఇది మూడోసారి మన పెళ్ళయ్యాక." విసుక్కుంది.     అశ్విన్ నవ్వుతూ శుభాంగి రెండు భుజాలూ పట్టుకుని "అదేమిటోయ్, అలా దిగులు  పడిపోతూ  దిగాలుపడి కూర్చున్నావ్? నువ్వే నా మొగుడివై, నేనే నీ పెళ్ళాన్నయితే, ఇటువంటి వార్త తెచ్చిన మొగుణ్ణి గట్టిగా బాహువుల్లో బంధించేసి, పెదాలతో నోటికి తాళం వేసేదాన్ని. కానీ కేసు రివర్సయిందే. పోనీ, ఆ పని నేను చెయ్యనా?" అంటూ సోఫాలో కూర్చున్న శుభాంగిని లేపి నుంచోపెట్టి  నడుం చుట్టూ చేతులు వేసి చుట్టేశాడు.     "ఏయ్ అశ్విన్! నువ్వు మరీ చిన్నపిల్లాడివై పోతున్నావ్ రోజు రోజుకీ. వదులు" అంటూ అతని చేతులు విడిపించుకుని వెళ్ళి సోఫాలో కూర్చుంది.     "అమ్మగారు కోపంలో కాఫీ కూడా ఇవ్వరన్నమాట!" శుభాంగి ముక్కు లాగుతూ అన్నాడు అశ్విన్.     శుభాంగి గబుక్కున లేచి వెళ్ళింది వంటింట్లోకి. రెండు కప్పుల్లో కాఫీతో ప్రత్యక్షమయింది రెండు నిమిషాల్లో. కాఫీ సిప్ చేస్తూ, "వండర్ ఫుల్" అన్నాడు కాఫీని మెచ్చుకుంటూ.     "అది సరే, ఏ ఊరు?" అడిగింది శుభాంగి.     "మద్రాసు."     "ఊ.... మళ్ళీ ఇంటివేట ప్రారంభం. అదీ, పిల్లలకి స్కూల్లో సీట్ల గురించి యుద్ధం చెయ్యాలి" అంది విసుక్కుంటూ.       "మైడియర్ శుభా! ఒక్కొక్క ఊరూ చూసే అవకాశం ఎంతమందికుంటుంది చెప్పు? పాపం, ప్రభుత్వం కొంతమంది ఉద్యోగస్తులకి ఈ ట్రాన్స్ ఫర్లు పెట్టి, ఇలా ఊళ్ళు చూసే అవకాశాలు కలిగిస్తూ  ఉంటే సంతోషించాల్సిందిపోయి బాధపడిపోతే ఎట్లా?" కాఫీ కప్పు కింద పెడుతూ  అన్నాడు అశ్విన్.     అశ్విన్ ఒక బ్యాంకు ఆఫీసర్. హోదా  పెరుగుతూన్నకొద్దీ  రెండేళ్ళకో, మూడేళ్ళకో ఈ బదిలీలు తప్పవు ఈ ఉద్యోగాల్లో.     "ఎప్పటికి వెళ్ళాలి?" అడిగింది శుభాంగి.     "ఒక వారం రోజుల్లో."     "మరి పిల్లల స్కూలో?"     "మూడూ, నాలుగు తరగతులేగా! అప్పుడే మా ఫ్రెండుకి ఫోన్ చేసి చెప్పేశాను. మద్రాసులో సీట్ల ఏర్పాట్లు, ఇంటి ఏర్పాటూ జరిగిపోతున్నాయి. రాత్రికి మా స్టాఫంతా డిన్నరుకి పిల్చారు. హోటల్ సిద్ధార్దకి, పిల్లలతో సహా రమ్మన్నారు. చక్కగా ముస్తాబవ్వు." శుభాంగి గడ్డం పట్టుకుని తలపైకెత్తి కళ్ళలోకి చిలిపిగా చూస్తూ అన్నాడు అశ్విన్.     ఆ చూపుల్లోని  మత్తూ, మమతా, చిలిపితనం శుభాంగిని పిచ్చిదాన్ని చేస్తాయి. అతని ఉంగరాల జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి తల నిమురుతూ ఆనందిస్తుంది. వక్షస్థలం మీద గుబురుగా పెరిగిన జుట్టుతో ఆడుకుంటుంది. ప్రస్తుతం ఏమీచేయలేక రెండు చేతులతోటీ  అతని జుట్టు పీకింది ప్రేమగా.     వారం రోజులూ పార్టీలతోటీ, పంక్షన్లతోటీ, వచ్చేపోయే స్నేహితులూ, బంధువులతోటీ గడిచిపోయాయి. సామాన్లన్నీ సర్దుకోవడం అంతా పూర్తయింది. మద్రాసు టి. నగర్ లో ఇల్లు చూసి పెట్టినట్టు, పిల్లలకి అక్కడే స్కూల్లో సీట్లు కూడా ఏర్పాటు చేసినట్టూ మద్రాసు నుంచి వైద్యనాధన్ ఫోన్ చేసి చెప్పాడు.     ఇంత తొందరగా ఇల్లు దొరకడం, పిల్లలకి సీట్లు దొరకడం అన్నీ సవ్యంగా జరిగిపోయినందుకు సంతోషంతో తేలిపోయారు శుభాంగీ, అశ్విన్.     శుభాంగి గొడవల్లా ఒక్కటే - కొత్తచోటు కెళ్ళాక, కొన్నాళ్ళ వరకూ  కొత్తకొత్తగా ఉండి తోచకపోవడం; కాస్త ఇరుగూ పొరుగుతో స్నేహం ఏర్పడిందీ అనుకునేసరికి మళ్ళీ ట్రాన్స్ ఫర్ అయి, పరిస్థితి మొదటికి రావడం; పైగా ఎమ్.ఏ. వరకూ చదువుకున్నందుకు  ఏదైనా ఉద్యోగం చేస్తే కాస్త కాలక్షేపంగా ఉంటుంది కదా  అనుకుంటే, ఇంట్లో ఎవరూ పెద్దవాళ్ళు లేకపోవడం వల్ల, పిల్లలని వదిలిపెట్టి  ఉద్యోగాలకు  వెళ్ళడం ఇష్టం లేక, ఇంట్లోనే ఉండిపోవలసి వచ్చింది - అనుకుంటూ  ఉండగానే మద్రాసుకి వెళ్ళే రోజు రానే వచ్చింది.         *    *    *     కొత్త వాతావరణం, కొత్త మనుషులూ, కొత్త భాష చిరాగ్గా అనిపించింది శుభాంగికి. అశ్విన్ కి ఆ బాధ లేదు. బ్యాంకు కెళ్ళగానే బోలెడంతమంది తెలిసిన వాళ్ళూ, కొలీగ్స్, చేతినిండా పనీ ఉండడం వల్ల బోరు కొట్టడం అనేది తెలీదు. అసలు ఆ ప్రశ్నే అతనికి రాదు. అపర్ణా, ఆదిత్యలకి కూడా పెద్ద సమస్యలుండవు, కొంచెం కొత్త వాతావరణం అనే బాధ తప్ప. తొందరలోనే అందరితో కలిసిపోతారు. ఎటొచ్చి సమస్యల్లా శుభాంగిదే.     టీ. నగర్ లో వైద్యరామా స్ట్రీట్ లో. సుందరంగారింట్లో ఒక అవుట్ హౌస్ లో అద్దెకి దొరికింది, శుభాంగి వాళ్ళకి. ఆ వీధిలో ఇరుగు పొరుగూ ఇద్దరూ తెలుగువాళ్ళే. రాఘవేందర్ రావూ, మురళీమోహన్. రాఘవేందర్ రావుగారు ఇంగ్లీషు లెక్చరర్. మురళీమోహన్ ఏ.జి. ఆఫీసులో అక్కౌంట్స్ ఆఫీసరు. వారి భార్యామణులు రేవతీ, నివేదితా. రేవతికి నలుగురు పిల్లలు - ఇద్దరు కొడుకులూ, ఇద్దరు కూతుళ్ళూ, నివేదితకి ముగ్గురు కూతుళ్ళూ, ఇద్దరు కొడుకులూ. ఇంటివాళ్ళు సుందరంగారూ, అతని భార్య సీతారాణి; వాళ్ళకి ఇద్దరు కొడుకులు.     ఇంట్లో  దిగిన రెండు మూడు రోజులకే  ఓ రోజు సీతారాణి కూరలు కొంటూ బయట కనపడేసరికి, శుభాంగి ఆమెని చూసి స్నేహపూర్వకంగా నవ్వి, ఆమెతో స్నేహం కలుపుకోవాలని చెప్పి, తన కప్పుడు  కూరలు అవసరం లేకపోయినా, కూరల బుట్టా, డబ్బూ పట్టుకొచ్చి, "టమాటాలు ఎట్లా ఇస్తున్నాడూ?" అని అడిగింది.     "నాలుగు రూపాయలు." తల తిప్పుకుని, కూరలవాడికి డబ్బిచ్చేసి  వెళ్ళిపోయింది ఆమె. శుభాంగి మనసు చివుక్కుమంది. ఆలోచిస్తూ నుంచున్న శుభాంగిని "ఎన్నవేణుం?" అంటూ అడిగాడు కూరలవాడు. చేసేది లేక "టమాటో అరకిలో ఇవ్వు" అని టమాటాలు తీసుకుని లోపలి కొచ్చేసింది శుభాంగి. అప్పటినుంచీ  ఆమె ఇక సీతారాణితో మాట్లాడే ప్రయత్నం చెయ్యలేదు. సీతారాణి  కూడా మళ్ళీ ఆమెని పలకరించలేదు.     ఓ వారం రోజులు పోయాక, ఒకనాడు అపర్ణకి, ఆదిత్యకి యూనిఫారం బట్టలూ, పుస్తకాలు కొనడానికి బజారుకి బయలుదేరుతూన్న శుభాంగి ఆటో కోసం వీధి గడప దగ్గర నుంచుంది. వాళ్ళింటి ఎడమవైపున  ఉండే పక్కింటి రేవతి శుభాంగిని చూసి నవ్వీ నవ్వనట్టు నవ్వింది. శుభాంగి తిరిగి చిరునవ్వు నవ్వింది.     "మీవారేం పనిచేస్తారు?" మొట్టమొదటి ప్రశ్న రేవతి అడిగింది.     "బ్యాంకులో మేనేజర్"     "ఏ బ్యాంకులో?"     "సిండికేట్ బ్యాంకు."     "ఎక్కడి కెళుతున్నారు?"     "పిల్లలకి యూనిఫారమ్ బట్టలూ, పుస్తకాలూ కొనడానికి." ఈలోగా ఆటో దొరకడంతో - "ఎప్పుడైనా రండి ఇంటికి" అంది శుభాంగి.     "ఆ... నాకెక్కడ తీరుతుంది? పగలల్లా  ఆఫీసు పని. చదువుకుంటే  ఊరికే కూర్చోక ఉద్యోగం  చెయ్యాలనిపిస్తుంది. ఉద్యోగం చేస్తే ఎక్కడికీ వెళ్ళడానికుండదు, లేకపోతే హాయిగా  మీలాగా.... మీకు తెలీదు ఆ గొడవ, అసలు చదువుకోకుండా  ఉంటే బాగుండేదని అనిపిస్తుంది ఒక్కొక్కసారి."     శుభాంగికి షాక్ కొట్టింది. ఎమ్.ఏ. ఫస్టు క్లాసులో  ప్యాసయింది. పెళ్ళికి పూర్వం ఒక పత్రిక ఆఫీసులో సబ్ -ఎడిటర్ గా పనిచేసేది. పిల్లలు పుట్టాకే పిల్లల సంరక్షణ స్వయంగా  తనే చేసుకోవాలని, ఇంటినీ, పిల్లల్నీ ఆయాల మీద వదిలిపెట్టడం ఇష్టంలేక తనే ఉద్యోగానికి రాజీనామా ఇచ్చింది. ఇప్పటికీ తన పేరు మీద వివిధ పత్రికల్లో వ్యాసాలూ వస్తూ ఉంటాయి. ఎంత తేలిగ్గా అనేసింది మాటలు అనుకుంటూ "మీరేం చదివారూ? ఏం ఉద్యోగం చేస్తున్నారూ?" అని అడిగింది.     "బి.ఏ చదివాను. రెవిన్యూ బోర్డు ఆఫీసులో టైపిస్టుగా పనిచేస్తున్నాను" అంది.     అంతలో ఆటోవాడి తొందర. ఆటో కదలడంతో సంభాషణ ముగిసింది.     ఆ తరువాత కొన్నాళ్ళకి  తను రాసిన ఆర్టికల్ ఒకదాన్ని అక్కడి వారపత్రిక ఆఫీసులో ఇచ్చొద్దామని  బయలుదేరుతున్న శుభాంగికి బస్సు స్టాపులో తమ ఇంటికి కుడివైపున  ఉండే  నివేదిత  కనిపించింది. శుభాంగిని చూసి స్నేహపూర్వకంగా చిరునవ్వు నవ్వింది. "మీరీ ఊరు కొత్తగా వచ్చారా?" అడిగింది నివేదిత.     "అవునండీ!" అంది ముక్తసరిగా శుభాంగి.     రెండు మూడుసార్లు మిమ్మల్ని చూసి పలకరిద్దామనుకున్నాను. మళ్ళీ ఏమనుకుంటారో అని ఊరుకున్నాను" అంది నివేదిత.     "అదేమిటండీ! అనుకోవడాని కేముంది? మాట్లాడుకుంటేనే కదా ఒకరికొకరు తెలిసేది?"     "మీ రెందాకా వెళుతున్నారు?"  అడిగింది నివేదిత.     "న్యూస్ పేపర్ ఆఫీసుకి - మాంబళంలోనే!"     "ఆటోలో వెళదాం రండి. నేనూ అటే వెళ్ళాలి ఇంచుమించు. మాట్లాడుకుంటూ  వెళ్ళొచ్చు" అంది నివేదిత.     ఆటో మాట్లాడుకున్నారు ఇద్దరూ.     "న్యూస్ పేపర్ ఆఫీసులో ఏం పని?"     "నా ఆర్టికల్ ఇచ్చి రావాలి."     "మీరు రాస్తారా?"     "అవును."     "ఏ పేరుతో రాస్తారూ?"     "శుభాంగి!"     "ఓ-శుభాంగి అంటే మీరేనా? బాగా రాస్తారు. మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది." ఇలా సాగింది వాళ్ళ సంభాషణ. పత్రిక ఆఫీసు రాగానే శుభాంగి ఆటోను ఆపించింది. ఆటోకి డబ్బిస్తూ ఉంటే నివేదిత ఇవ్వనివ్వలేదు. థాంక్స్ చెప్పి "ఎప్పుడైనా ఇంటికి రండి" అని చెప్పి దిగిపోయింది శుభాంగి.     ఒక రోజు సాయంత్రం నివేదిత పిల్ల లొచ్చారు. "ఆంటీ! అమ్మ ఇవి మీకు ఇచ్చి రమ్మంది. మా ఇంట్లో పూశాయి" అంటూ కనకాంబరాలు అందించింది నివేదిత కూతురు నీలిమ. ఆ అమ్మాయికి అప్పుడే ఇంట్లో తయారుచేసిన  మైసూరుపాకు ముక్కలు కొన్ని పొట్లాం కట్టి "అమ్మ కివ్వు" అని ఇచ్చింది శుభాంగి. కాస్సేపు నీలిమ అపర్ణ, అపూర్వలతో  ఆదుకుని, వీడియో చూసి మైసూరుపాకు  తీసుకుని ఇంటికెళ్ళింది. అప్పటినుంచీ రోజూ నీలిమా, వాళ్ళ చెల్లెలు నిరుపమా అందరూ 'ఆంటీ....ఆంటీ' అంటూ వచ్చి కబుర్లు చెప్పడం, ఒకరి రెండుసార్లు నివేదిత కూడా వచ్చి వెళ్ళడంతో, శుభాంగి కూడా అప్పుడప్పుడు వెళ్ళి వచ్చేది నివేదిత ఇంటికి. ఇద్దరూ కలిసి ఒకటి రెండు సినిమాలు కూడా చూశారు నివేదిత బలవంతం మీద.     శుభాంగి కిప్పుడు కాస్త కాలక్షేపంగా ఉంది. అయితే, ఒక  చిక్కొచ్చి పడింది. నివేదిత పిల్లల్ని  చూసి రేవతీ, ఆవిడ పిల్లలు అందరూ రావడం మొదలెట్టారు. రేవతి కూడా నివేదిత ద్వారా శుభాంగి ఎమ్.ఏ. ఫస్టు క్లాసనీ, ఆర్టికల్స్ రాస్తుందనీ విని, స్నేహం మొదలెట్టింది. వీరిద్దరినీ చూసి సీతారాణి రావడం మొదలెట్టింది. నివేదితతో శుభాంగి సినిమా కెళ్ళిందని తెలిసి రేవతీ, సీతారాణీ కూడా శుభాంగిని సినిమాకి ఆహ్వానించారు. ఒకరితో వెళ్ళి ఒకరితో వెళ్ళకపోతే ఏం గొడవ లొస్తాయోనని, చచ్చినట్టు వెళ్ళుతోంది శుభాంగి. ఇప్పుడు ఆ మూడు కుటుంబాల వారికీ శుభాంగి ఆంటీయే! పిల్లా పెద్దా అందరూ 'ఆంటీ' అనే పిలుస్తారు. ఇప్పుడు ఆంటీకి వి.ఐ.పి. ట్రీట్ మెంటు పొద్దున్న ఒకరొస్తే, మధ్యాహ్నం ఒకరు, సాయంత్రం ఒకరూ. వీరి పోటీ స్నేహాలతో సతమతమైపోతుంది.     ఒక రోజు అందరూ ఒక పేరంటంలో కలుసుకున్నారు. "ఆంటీ అచ్చు వాణిశ్రీలా ఉంటుంది కదూ?" అంది నివేదిత.     "ఏమో! నాకు వాణిశ్రీ కన్నా ఆంటీయే బావుంటుందనిపిస్తుంది" అంది రేవతి.     "నాకు హిందీ ఆర్టిస్టు షబానా అజ్మీలా అనిపిస్తుంది ఆంటీ" అంది సీతారాణి.     వీళ్ళ మాటలకి నవ్వాలో ఏడవాలో అర్ధం కాక తలొంచుకుంది శుభాంగి. ఈ మూడు కుటుంబాలవారూ ఏదో తెచ్చి పెట్టుకున్న ప్రత్యేకతతో ప్రేమ ఒలకబోస్తూ  ఉంటే చిరాగ్గా అనిపించింది. కానీ ఏం చేస్తుంది? వీళ్ళ వల్ల ఈ మధ్య అశ్విన్ తో కూడా  సరిగ్గా మాట్లాడడానికీ, అశ్విన్ తో కలిసి సినిమాకి వెళ్ళడానికి కూడా లేకుండా పోయింది.     ఒక రోజున నివేదిత అడిగిన ప్రశ్నకి నివ్వెరపోయింది శుభాంగి. "మీకు నేనిష్టమా, రేవతీ, సీతారాణీ ఇష్టమా?" అని. భార్య భర్తనో, భర్త భార్యనో ఇలా అడిగితే చెప్పలేను కానీ వీళ్ళు ఇలా అడగడం ఏమిటో అర్ధం కాక పిచ్చిదానిలా చూసింది శుభాంగి.     అంతలో మళ్ళీ నివేదితే అంది: "అసలు నేను మీతో స్నేహం చెయ్యడం చూసి వాళ్ళూ మొదలెట్టారు. లేకపోతే మీ రీ వూరొచ్చి  ఇన్నాళ్ళయింది కదా, ఒక్కసారైనా  వాళ్ళెవరైనా పలకరించారా? రేవతి మిమ్మల్ని చూసి మీరేమీ చదువుకోలేదనుకుంది. తనే పెద్ద ఉద్యోగం చేస్తూన్నానన్న గర్వం. మీరు ఎమ్.ఏ. చదివేరనీ, ఆర్టికల్స్ రాస్తారని తెలిశాక మీతో స్నేహం మొదలెట్టింది. సీతారాణి మాత్రం? మీ మొహం చూసేదా? వీళ్ళందరికీ నాతో పోటీ? వీళ్ళు ఏడ్చుకునేలా మనం సినిమాలకీ, షాపింగులకీ వెళ్ళాలి - ఏమంటారు?"     శుభాంగికి  ఏ మనాలో  తెలీక నవ్వి ఊరుకుంది. వీళ్ళ పోటీలతో మధ్య తను నలిగిపోతోంది. ఆదివారం వస్తే రేవతి సినిమాకి రమ్మంటుంది. "వెళ్ళు, రాను అంటే బావుండదు" అనేవాడు అశ్విన్. మిగతా రోజుల్లో, ఒకసారి నివేదితా, మరోసారి సీతారాణి. శుభాంగికి మతిపోతోంది.     ఆ రోజు రాత్రి అశ్విన్ ని అడిగింది - "ఏమండీ! మనకి మళ్ళీ ట్రాన్స్ ఫర్ ఎప్పుడవుతుంది?" అని. ఈ ప్రశ్నకి అశ్విన్ ఆశ్చర్యబోయాడు.     "ట్రాన్స్ ఫర్ అంటే కంట తడిపెట్టే నువ్వు....నువ్వేనా అడుగుతున్నది?" అంటూ.     శుభాంగి కళ్ళలో నీళ్ళు నిండాయి. "అశ్విన్! కనీసం మనం ఈ ఇల్లైనా ఖాళీ చేసి వెళ్ళిపోవాలి" అంది బాధగా.     "ఏమీ? ఇరుగు పొరుగూ అంటూ గోల పెట్టే నువ్వు ఇలా అంటున్నావేంటి? సినిమాలూ, షాపింగులూ - బాగానే ఉంది కదా?" శుభాంగి కళ్ళల్లోకి  చూస్తూ అన్నాడు, చెంపలమీదుగా జారుతున్న కన్నీళ్ళు తుడుస్తూ అశ్విన్.     "ఇరుగూ పొరుగూ అంటే ఒకరి నొకరు సాయపడుతూ ఉండాలి కానీ ఇబ్బంది కలిగించేవారిలా ఉండకూడదు, అశ్విన్! వీళ్ళ పోటీల వల్ల, కృత్రిమ ప్రేమతో నన్ను కట్టిపడేస్తున్నారు. ఈ గోలలో నాకు మనశ్శాంతితో రాసుకోవాలన్నా, పని చేసుకోవాలన్నా కుదరడంలేదు పైగా, నేను మీతో కన్నా వాళ్ళతోనే ఎక్కువ కాలం గడుపుతున్నట్లుగా ఫీలవుతున్నాను. అశ్విన్! ప్లీజ్, ఇల్లు మార్చేద్దాం" అంటూ అతని గుండెలమీద తలపెట్టి, పసిపాపలా ఏడ్చింది.     వారం తిరక్కుండా ఇల్లు మారిపోయారు.     "ఆంటీ, మీ అడ్ర సివ్వండి వస్తాను" అంది నివేదిత.     "అవును. డైరీలో రాసుకుంటాను చెప్పండి ఆంటీ!" అంది రేవతి.     "నేనూ వస్తాను ఆంటీ! నాకూ చెప్పండి" అంది సీతారాణి.     అశ్విన్ పక పకా నవ్వుతున్నాడు. కళ్ళ నీళ్ళ పర్యంత మవుతూన్న శుభాంగిని చూసి.     "ఎందుకలా నవ్వుతున్నారు?" కోపంగా అడిగింది శుభాంగి.     "ఈ ఆంటీని చూస్తూ ఉంటే! నీ కన్నా పెద్దవాళ్ళు నిన్ను అలా పిలుస్తూంటే అదేదో నీ పేరు లాగా, నాకూ ముచ్చటగా, అలాగే పిలవాలనిపించింది" అన్నాడు నవ్వుతూ.     శుభాంగి కోపంగా అతని జుట్టు పీకింది ఉడుక్కుంటూ. గుండెల మీద రెండు చేతులతో గుద్దింది సున్నితంగా కోపాన్ని ప్రదర్శిస్తూ.     "నా కంటికి నువ్వు వాణిశ్రీ షబానా అజ్మీలా కాదు - ఎలిజిబెత్ టేలర్ లా ఉన్నావు ఆంటీ!" అంటూ నవ్వుతూ ఆమెని తన రెండు చేతుల్లోనూ బంధించి, మాట్లాడకుండా పెదవులు బిగించేశాడు మృదువుగా, తన పెదవులతో. ఇరుగునీ పొరుగునీ మరచిపోయి, అతని భుజాలపైన వాలిపోయింది శుభాంగి నెలవంకను తెచ్చి తల్లో ముడుచుకున్నంత ఉత్సాహంతో అతని కౌగిలి ఒదిగిపోయింది.    *                     (ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక 7 - 12 - 88)  

తెల్లమబ్బు

తెల్లమబ్బు - భవానీ దేవి       గుంటూరు బస్ స్టాండ్ లో చీరాల వెళ్ళే బస్సు కదలటానికి సిద్ధంగా ఉంది.     బస్సు ఎక్కి కిటికీ దగ్గర సీటు ఖాళీగా ఉండటం చూసి వెళ్ళి కూర్చుంది సుజాత.     బస్సంతా ఒక్కసారి కలియచూసింది. మరీ రష్ గా లేదు... ఫర్వాలేదు... కండక్టర్ వచ్చి ఎక్కాడు. ఒక్కొక్క సీటు దగ్గరికి వెళ్ళి టికెట్ ఇవ్వటం ప్రారంభించాడు. టిక్కెట్లు ఇవ్వడం పూర్తవుతూనే 'రైట్' కొట్టాడు కండక్టరు. బస్సు కదుల్తోంది. 'హమ్మయ్య' అనుకుంది సుజాత. హడావుడిగా ఒకతను పరుగెత్తుకుంటూ వచ్చి బస్ ఎక్కేశాడు.     అతను టికెట్ తీసుకోని సీటు వెదుక్కోవటంలో నిమగ్నమైనాడు.     అతడ్ని చూస్తూనే సుజాత కళ్ళు వెడల్పయినాయి. పదేపదే అతనికేసి చూస్తుంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని సంకోచంతో మధ్య మధ్య ఆగిపోతున్నది.     అతను ఒకసారి తనకేసి చూస్తే బావుండు. చూడకపోతేనే మంచిది. సరిగ్గా అర్ధంకాని ద్వైదీభావం.. ఆమెలో...     సీటుకోసం వెదుకుతున్న అతని చూపులు ఆమెను చూడగానే సూర్యరశ్మి సోకినా కమలాలయినాయి . కళ్ళల్లో మెరుపులు నింపుకుంటూ "బావున్నారా?" అడిగాడు దగ్గరకొచ్చి. నవ్వుతూ తలూపింది సుజాత.     'ఎక్కడుంటున్నారు' ఆమె మెడలోని నల్లపూసల దండమీద అతని చూపులు ఆగిపోయాయి.     'చీరాల దగ్గరే' సుజాత మొహం ముకుళించుకుపోవటం అతని దృష్టిని దాటిపోలేదు. 'మీ వారేం చేస్తుంటారు' మళ్ళీ అడిగాడు.       సుజాతకి అతని వరసేం నచ్చలేదు. అయినా తనను తాను సంబాళించుకుంటూ చెప్పింది.     "స్కూల్ టీచర్".     బస్ ఏదో స్టేజీలో ఆగింది.     సుజాతకి పక్కగా ఉన్న సీటు ఖాళీ అయింది. వెంటనే కూర్చున్నాడు రిలీఫ్ గా.     అతని సీటుకూ ఆమె సీటుకూ మధ్యగా నడిచే దారి ఉంది. అయినా సుజాతకు ఏదో తెలియని ఇబ్బందిగా ఉంది.     ఒకటి రెండుసార్లు ఓరగంట చూసింది. ఆమె ధ్యాసే లేనట్లుగా ప్రక్కనున్న పల్లెటూరు ఆసామితో రాజకీయచర్చకు దిగాడతను.     మధ్యలో ఒకసారి హఠాత్తుగా ఇటు తిరిగి చూశాడామెకేసి.     "పిల్లలెంతమంది" అడిగింది కుతూహలంగా.     "ఇద్దరు" చెప్పాడు గర్వంగా. మళ్ళీ సుజాతని అడిగాడు నవ్వుతూ.     "మీకు...?"     "లేరు.." అంది తలదించుకొని అపరాధిలా...     సానుభూతిగా అతను చూసిన చూపులు సూదుల్లా గుచ్చుకుంటున్నట్లనిపించింది. మళ్ళీ సంభాషణ కొనసాగలేదు.     అతను ప్రక్కసీటతనితో మళ్ళీ కబుర్లలో పడ్డాడు.     అతడ్ని అలా ఆనందంగా సంతోషంగా చూస్తుంటే ఆమె మనసులో చెప్పలేని అసంతృప్తీ. వెలితిగా ఉంది. ఎందుకో అతనిమీద కోపం వస్తున్నది. నాలుగేళ్ల కిందటి ప్రేమలాలస ఆమె హృదయాన్ని అగ్నిలా మండిస్తోంది. అతను కనిపించటంవల్ల మానని గాయం మరింత రేగుతోంది. ఆనాటి దృశ్యాలే దుమ్ము తుడిచిన అద్దంలా మరింత స్పష్టంగా కన్పిస్తున్నాయి.     సుజాతది చీరాల దగ్గర ఒక పల్లె. తండ్రి కరణం కావటాన నలుగురికీ ఆ కుటుంబం అంటే మర్యాదా మన్నన ఉన్నాయి. నలుగురు అన్నల తర్వాత ఆడపిల్లయిన ఆమెని తండ్రి ఎంతో గారాబం చేశాడు. ఎలాగో పదోతరగతి గట్టెక్కించిన సుజాతకి ఇంక చదవాలన్న కోరికేలేదు.     "ఎంత చదువుకున్నా ఏం లాభం! ఓ అయ్య చేతిలో పెట్టాల్సిందేగా" అనే తల్లి మాటలు బాగా జీర్ణం చేసుకుంది సుజాత.     ఆ "ఓ అయ్య కోసం" సుజాత కన్నెమనసు ఊహల రెక్కలు విప్పుకుని తరచుగా కలలలోకంలోకి ప్రయాణం చేస్తుండేది. ఆ అమ్మాయి చూసిన సినిమాల్లో హీరోలాంటి భర్తకోసం ఈస్ట్ మన్ కలలు కంటుండడమే వ్యాపకంగా మారింది. వెన్నలాంటి కన్నెమనసును కరిగించే నిప్పులా అశోక్ పరిచయం అయ్యాడు.     అశోక్ ఆ వూరివాడే అయినా చదువుకోసం చిన్నప్పటినుంచీ మేనమామ ఇంట్లో పెరగటం వల్ల ఊళ్ళో ఎవ్వరికీ అతనితో పరిచయం కాలేదు. ఇంజనీరింగ్ చదువు పూర్తిచేసి ఉద్యోగాన్వేషణలో ఉంటూ ఓసారి తన అన్నగారిని చూడాలని పల్లెకు వచ్చిన అశోక్ మంచినీళ్ళ బావిదగ్గర సుజాత అందాన్ని చూసి అప్రయత్నంగా మనసు పారేసుకున్నాడు.     రోజూ బావిదగ్గర ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నట్లు నటిస్తూ గమనించేది సుజాతనే! అతను తననే చూస్తున్నాడనీ తన గురించే మాట్లాడుతున్నాడనీ అర్ధమవుతున్నకొద్దీ ఆమె అడుగులు తడబడుతున్నాయి. గుండె లయ పెరుగుతోంది. కళ్ళెత్తి చూడాలంటే బిడియం తెరలు దించుతోంది.     ఆరోజు బావి దగ్గర ఖాళీలేక కాసేపు పక్కగా నిలబడి ఎదురుచూస్తోంది సుజాత. ఉన్న నాలుగు గిలకలమీదా నీళ్ళు తోడుకుంటున్నారు. సుజాత ఇవతలే నిలబడి ఉందిగానీ... ఆమె వెనుక వచ్చిన వాళ్ళు కూడా చొరవగా తాడు అందుకొని నీళ్ళు నింపుకెళ్తున్నారు. పరధ్యానంగా ఉన్న సుజాత అలాగే నిలబడటం చూసి అశోక్ నవ్వుకున్నాడు.     "మీరిలా ఎంతసేపు నిలబడ్డా మా ఆదిలక్ష్మత్తయ్య తాడు అందించదు... రండి... నేను తోడిస్తాను."     అశోక్ మాటలకు ఉలిక్కిపడి కొద్దిగా సిగ్గుపడింది. అశోక్ సుజాత బిందెను నీళ్ళతో నింపటం చూసి ఆడవాళ్ళంతా చోద్యంగా బుగ్గలు నొక్కుకున్నారు. కనీసం "థ్యాంక్స్" కూడా చెప్పకుండా విశాలనేత్రాలతో ఓసారి చూసి వెళ్ళిపోయే ఆమెని ఆరాధనగా చూశాడతను.     ఆ కళ్ళు అతని కలల లోగిళ్ళయినాయి.     క్రమంగా సుజాత ఆలోచనల్లో కూడా అశోక్ చోటు చేసుకుంటున్నాడు. అతని మాట, చొరవ, ప్రేమ, అనురాగం ఆమెని వివశురాల్ని చేస్తోంది.     సుజాత మంచినీళ్ళకోసం వెళ్ళినప్పుడల్లా ఆలస్యంగా తిరిగిరావటం తల్లికి అనుమానం కలిగించింది. సదాచార కుటుంబం కాబట్టి నీళ్ళు స్వయంగానే తెచ్చుకోకతప్పదు. తాను అనారోగ్యవంతురాలు కాబట్టి కూతుర్ని పంపకా తప్పటం లేదు.     "నీ పెద్ద జడ వల్ల పువ్వుకే అందం" మందారపువ్వు అందించాడు.     "నీ విశాలనేత్రాల్లో నీ నీడ చూసుకోనీ" కళ్ళల్లోకి సూటిగా చూశాడు.     "నీ అరచేతి రేఖలు నా అరచేతి రేఖలకు జతపడినాయో లేదో చూడనీ" పాణిగ్రహణం చేశాడు.     బావిదగ్గర పూలతోట ప్రేమోద్యానం అయింది. కలల కౌగిలిలో కాలం బందీ అయింది.     పల్లెల్లో ఇలాంటివి ఎన్నాళ్ళు దాగుతాయి! కరణంగారు అగ్గిమీద గుగ్గిలమై పోయాడు.     "ఇంటి పరువు తీస్తావా..." అని జుట్టుపట్టి, లాక్కెళ్ళి గదిలో పడేసి దాదాపు బందీని చేశాడు.     తాను చూసిన సినిమాల్లో హీరోయిన్ లా అశోక్ తో లేచిపోయి పెళ్ళి చేసుకోవాలని ఆశపడ్డ సుజాత అతడు వూరిని విడిచిపోయాడని విని నిరాశతో నీరుగారిపోయింది.     పది రోజుల్లోనే పక్కవూళ్ళో బడిపంతులు బసవయ్యకు రెండో భార్యగా ఆ ఇంట్లో అడుగుపెట్టిన సుజాత ప్రాణంలేని బొమ్మలా యాంత్రికంగా మారిపోయింది. ఆమె దృష్టిలో అశోక్ మోసగాడుగా పిరికివాడిగా మిగిలిపోయాడు.     తొలిప్రేమలోని మాధుర్యాన్ని రుచి చూపించిన అశోక్ మళ్ళీ జీవితంలో కన్పిస్తాడని సుజాహ ఊహించలేదు. బసవయ్యగారి భార్యగా బాధ్యతలు ,బాధలు తప్ప అనుభూతులు, ఆనందాలు లేని జీవితంలో అనుకోకుండా అశోక్ కనపడడం ఆమె మనసును అల్లకల్లోలం చేసింది.     చీరాల్లో బస్ ఆగిన కుదుపుకు ఉలిక్కిపడి ఆలోచనల్లోంచి తేరుకుంది సుజాత.     బస్ దిగి నిలుచుంది. అతనూ దిగాక ఆమె దగ్గరికి వచ్చాడు.     "ఏం పనిమీద వచ్చారు" కొంగు భుజాల చుట్టూ కప్పుకొని సంచీ చేత్తో పట్టుకుంది. ముందుకు అడుగేయబోతూ ఆగిపోయి అడిగింది.     "ఆఫీసు పనిమీద... ఇక్కడికి దగ్గర్లో పల్లెల్లో..." ఊరిపేరు చెప్పాడు.     "అరె.. అది మా వూరే.." ఆనందం, బాధ ఆమె స్వరంలో మెలికలు తిరిగాయి.     "అలాగా.. ఆటోలో వెళదాం" ఆటోకేసి నడిచాడు.. ఆమె అతన్ని అనుసరించింది.     ఇద్దరూ ఊళ్ళోకి అడుగుపెట్టారు.     భర్త ఏమనుకుంటాడో! అశోక్ తన కాపురం కూలుస్తాడా... ఇన్నేళ్ళ తర్వాత ఈ కలయిక దేనికి దారితీస్తుందో...     ఆలోచనల్లోనే ఇల్లు వచ్చేసింది.     బసవయ్యగారు ఇంటి అరుగుమీదే కూర్చొని చుట్ట కలుస్తున్నాడు. అతడ్ని తన భర్తగా అశోక్ కి పరిచయం చేయాలంటే సిగ్గుగా ఉంది. కానీ తప్పదు...     పరిచయాలయినాక... 'కూర్చోండి.. కాఫీ తెస్తాను' ఇంట్లోకి వెళ్ళింది సుజాత.     వాళ్ళిద్దరూ ఏవేవో సంగతులు మాట్లాడుకుంటున్నారు. చదువు, ఉద్యోగం, పిల్లలు... లోపల్నుంచే ఆసక్తిగా వింటోంది.     "నాకు చిన్నప్పుడే మా మామయ్య కూతురితో పెళ్ళయిందండీ! ఇంజనీరింగ్ చదివించిందీ ఆయనే! ఉద్యోగం వచ్చి సెటిలయ్యాక ఫామిలీ పెట్టాను హైద్రాబాదులో" ఆ మాటలు శూలాల్లా గుచ్చుకుంటున్నాయి.     ఎంతమోసం... తననో పావుగా వాడుకున్నాడు. అతని వల్లనే తొందరపడి నాన్న ఈ రెండో సంబంధం చేశాడు. కళ్ళల్లో నీళ్ళు కాఫీ గ్లాసులో పడుతుంటే తలతిప్పుకుంది. మౌనంగా కాఫీ గ్లాసు బల్లమీద పెట్టి లోపలికి వచ్చేసింది.     "మీరు పని అయినాక భోజనానికి మా యింటికే రండి" అమాయకపు బసవయ్య ఆహ్వానం అది.!     "వద్దండీ! శ్రమ ఎందుకు... నేను ఒక గంటలోనే వెళ్ళిపోతాను. సుజాతగార్కి థ్యాంక్స్ చెప్పండి.."     "మంచిదండీ! ఇటువైపొస్తే మా యింటికి తప్పక రండి. వాళ్ళ ఊరివాళ్ళు కనిపిస్తే సుజాతకెంతో ఆనందం."     అశోక్ వెళ్తేగానీ బైటికి రాలేదు సుజాత.     "అతగాడేమనుకుంటాడు.. కనీసం భోజనం చేసిపొమ్మని చెప్పొచ్చుగదా! మర్యాదకైనా అనవు" బసవయ్య మందలింపుగా అన్నాడు.     "మరేం ఫర్వాలేదు... అలాంటి వాళ్ళకిదే మర్యాద.. మీరు లోపలికి రండి.. గాలి చల్లగా ఉంది.." భర్త చేయి పట్టి లోపలికి తీసుకెళ్ళింది సుజాత.     పెళ్ళయ్యాక తొలిసారిగా ప్రేమగా మాట్లాడిన భార్య స్పర్శకు బసవయ్య వళ్ళు పులకరించింది.     తాను వచ్చిన పనిని పూర్తి చేసుకున్న తృప్తితో వెనక్కి తిరిగి వెళుతున్న అశోక్ బలహీనహృదయంలో తట్టుకోలేనంత సంతోషం! టప్ మని ఓ చుక్కరాలింది. తలెత్తి చూశాడు.. ఆకాశం నిండా... ఆకాశమంతటి నల్లమబ్బు... విధి వేరుచేసినా సుజాతను మర్చిపోలేని దురదృష్టవంతుడు. ఉద్యోగం ఇంటర్వ్యూకి పిలుపు వచ్చి వెళ్ళాడు. తిరిగి వచ్చేసరికి ఆమె పరాయిదై పోయింది. ఆమెను మరువలేక అవివాహితుడుగా మిగిలిపోయినా.. సుజాత తల్లిద్వారా ఆమె దాంపత్యజీవితం సరిగా లేదని విని.. ఆమె సుఖం కోరి.. అసంతృప్తితో రగిలే ఆమె మనసు మారటానికే ఆమె మేలుగోరి అలా విషయాన్ని మార్చి చెప్పాడని సుజాతకి ఎవరూ చెప్పే అవకాశం లేదన్న నమ్మకంతో సాగిపోతున్నాడతను.     వానజల్లు మొదలయింది. వాన కురిపించి జగత్తుకు మేలుచేసి, తేలికపడిన మనసుతో తేలిపోతుందా తెల్లమబ్బు అతనిలాగే!

నర్తకి

            నర్తకి - శారదా అశోకవర్దన్     వెలుగుల వాహినిలో కిరణాల కెరటాలపై  విహరిస్తూన్నట్టుగా పోతోంది మద్రాస్ ఎక్స్ ప్రెస్ హైద్రాబాద్ వైపు. కన్ను మూతపడడం లేదు. కునుకుపట్టని మనసు కుదురుగా నిలవలేకపోతోంది మంజరికి. ఆలోచనలు దాదాపు దశాబ్దం వెనక్కి వెళ్ళాయి. కాలేజీ చదువూ వాతావరణంలో హరిణి హృదయ ఫలకంపైన హీరోయిన్ లా నిలిచిపోయింది.     ఎంత చక్కని రోజులు! కాలేజీ మొత్తంలో మంజరి, హరిణిల పేర్లు తెలియనివాళ్ళు లేరు. సంగీత సాహిత్య పోటీల్లో  మంజరిది ముందడుగయితే నాట్యంలో హరిణిది ప్రథమ పాదం! ఇరువురిదీ ఒకే రకమయిన ఆలోచన, ఒకే రకమైన ప్రవర్తన. కాలం ఐస్ లాగా కరిగిపోయింది. ఎంకాం., రిజల్ట్స్ రావడం, శ్రీరాంతో మంజరి పెళ్ళి జరిగిపోవడం, అంతా ఒకే షెడ్యూలులో పూర్తయిన సినిమాలా నెల రోజుల్లో జరిగిపోయింది. మంజరి శ్రీరాంతోపాటు  అమెరికా వెళ్ళిపోయింది. అయితే, విధి విచిత్రమేమోగానీ అమెరికా  ప్రయాణం ఒక వారం రోజులుందనగా హరిణికి గోకుల్ అనే ఇంజనీయర్ తో పెళ్ళి జరిగింది. హరిణికి కూడా తనతోపాటే  పెళ్ళవడం  మంజరికి  ఎంతో సంతోషాన్ని  కలిగించింది. "మంజరీ! నువ్వెళ్ళిపోతే, నాకు బోర్ కొడుతుందే. పోనీ ఇండియాలో ఎక్కడున్నా అప్పుడప్పుడు కలవడానికయినా కుదిరేది. ఏకంగా విదేశాల్లోనే  జెండా పెట్టేశావ్!" అనేది హరిణి. ప్రతీ విషయం హరిణి మంజరితో చెప్పికాని చేసేది కాదు. పై పెచ్చు ఇంట్లో ఏదైనా ఘర్షణ జరిగినా, ఒడుదుడుకులొచ్చినా  ప్రతి విషయం చర్చించుకుని  ఉపశమనం పొందేంత గొప్ప స్నేహం వారిది.     హరిణి పెళ్ళి కూతురు. మంజరి అప్పుడే పెళ్ళయిన కొత్త పెళ్ళికూతురు. స్నేహితులందరూ  వీరి మీద ఒకటే జోక్స్. మంజరికి అమెరికాలోనే మోనిక పుట్టింది. మంజరీ వాళ్ళమ్మ రుక్మిణమ్మ పురుడు పొయ్యడానికి అమెరికా వెళ్ళింది.  మంజరికి కాన్పు చాలా కష్టమయింది. శ్రీరాం డాక్టరవడం వల్ల, మళ్ళీ కాన్పు కూడా మంజరికి కష్టమే కావొచ్చునని  గర్భం రాకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నాడు. అయితే హరిణికి  మాత్రం మోనిక పుట్టినప్పుడే ఒక నెలముందుగా అనిరుద్ పుట్టాడు. మళ్ళీ సంవత్సరంన్నరకే సంయుక్త పుట్టింది. పిల్లలు పుట్టాక మంజరికీ, హరిణికి మధ్య  దూరం బాగానే పెరిగింది. మంజరి రాసిన ఉత్తరాలకి తీరికలేదని ఎప్పుడో గానీ సమాధానం రాయడం లేదు హరిణి. దాంతో మంజరి కూడా తగ్గించేసింది. అమెరికా నుంచి కాల్ చేసినప్పటికీ హరిణి  పొడిపొడిగా మాట్లాడడం మంజరికి బాధ కలిగించింది. అందుకే ఈ మధ్య కాల్స్ చెయ్యడం కూడా మానేసింది.     ఆ మధ్యన తల్లి రాసిన ఉత్తరం  ద్వారా  హరిణి మళ్ళీ కడుపుతో వున్నట్టు తెలిసింది. ఇన్నాళ్ళ తరవాత - కాదు, ఇన్నేళ్ళ తరవాత హరిణిని ముగ్గురు పిల్లలకి తల్లిగా చూడబోతున్నందుకు హరిణి ఎలా వుందోనన్న  కుతూహలం  మంజరిలో ప్రబలిపోయింది. మోనికకి ఏడేళ్ళు. తనకే  కొంచెం ఒళ్ళొచ్చింది. శరీరంలోని వొంపుసొంపులలో  చాలా మార్పులొచ్చాయి! హరిణి ఎలా వుందో? సన్నగా పుల్లలా  వుండేది. అదీ దాని డాన్సు గొడవా ఇరవైనాలుగు గంటలూ - పెళ్ళయినా డాన్సు చెయ్యడానికి అభ్యంతరం చెప్పని వ్యక్తినే పెళ్ళి చేసుకుంటానని చెప్పుకునేది. అంతేకాదు, అటువంటి ఇంట్రస్టులేని వ్యక్తుల దగ్గరి నుంచి ఒచ్చిన సంబంధాలన్నీ  ఒదులుకుంది.     గోకుల్ కి డాన్స్ గురించి  ఏమీ తెలీకపోయినా డాన్స్ చెయ్యడానికి అభ్యంతరం చెప్పనన్నాడట. అదే అస్సలు కారణం హరిణి అతణ్ణి చేసుకోవడానికి. అయితే, అది కేవలం పెళ్ళినాటి ప్రమాణాల్లా  మిగిలిపోయాయి. సంవత్సరంలోపే  హరిణికి గర్భం  రావడంతో, కాలిగజ్జెలను అటకెక్కించింది. హరిణికి  మానసికంగా అదొక దెబ్బ!     చాలా రోజుల తరువాత  ప్రాణ స్నేహితురాలిని కలుసుకోబోతున్నందుకు  మంజరికి  ఎంతో సంతోషంగా ఉంది. చాలాకాలం తరువాత  స్వదేశానికి తిరిగి రావడం, పుట్టింటి ప్రయాణం, ఆ వూళ్లోనే ప్రాణ స్నేహితురాలు స్థిరపడి వుండడం.....మంజరిని ఆలోచనలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయ్! ఏ తెల్లవారు ఝామునో నిద్రలోకి  జోగిపోయింది మంజరి.     కళ్ళు తెరిచి చూసే సరికి చంద్రుడూ వెన్నెలా అంతా కలలాగా కరిగిపోయి, సూర్యుడూ, వేడీ పేరుకున్న ఆలోచనల్ని కరిగించి బద్దకాన్ని తొలగించాయి. మరో అయిదు నిమిషాల్లో సికింద్రాబాద్ స్టేషనొచ్చేస్తోందని కంపార్ట్ మెంటులో వాళ్లు, సూట్ కేసులు గబగబా సర్దేసి, సామాన్లన్నీ  వరుసగా డోర్ దగ్గర పెట్టేసి నుంచున్నారు. "ఇన్ని గంటలు కూర్చుని  ప్రయాణం చెయ్యగా లేనిది ఒక అయిదు పది నిమిషాలు దిగడానికి పడితే తొందరెందుకో!" తలుచుకుని నవ్వుకుంది మంజరి. నిద్రలో వున్న మోనికని లేపి తను కూడా సామాను సర్దేసింది. పెద్ద కూత కూసుకుంటూ  రైలు స్టేషన్లో ఆగింది. తమ్ముడు నిఖిల్, చెల్లెలు గౌతమీ స్టేషన్ కొచ్చారు. "బావగారేరీ?" అంది కంపార్ట్ మెంటు కలయజూస్తు గౌతమి. "అతనికేదో చిన్న పని తగిలింది. రేపటి ఫ్లైట్లో వొస్తారు." అంది నవ్వుతూ మంజరి. నిఖిల్ సామాన్లు చేరవేస్తున్నాడు. గౌతమి మోనికతో సంభాషణ ప్రారంభించింది. ఇరవై నిముషాల్లో కారు బంజారాహిల్స్ చేరుకుంది.     భోజనాలు అయిన తరువాత ప్రశాంతంగా మాట్లాడాలని మంజరి హరిణికి ఫోన్ చేసింది. అసలు తనొస్తోందంటే పరుగెత్తుకు రాకపోయినా వెంటనే ఇంటికొస్తుంది అనుకుంది మంజరి. అందుకే రాగానే ఫోన్ చెయ్యకుండా  కాస్సేపాగింది. మధ్యాహ్మమైనా  రాకపోయేసరికి, ఫోన్ చేసింది మంజరి. "అమ్మగారు డాక్టరు దగ్గరికి వెళ్ళారు. ఒక గంటలో వొత్తారు" అని చెప్పింది పని మనిషి ముత్యాలు. "ఎందుకూ? ఎక్కడ?" అని అడిగేలోపునే అది ఫోన్ పెట్టేయడంతో ఇంక ఫోన్ ప్రయత్నం చెయ్యక సాయంత్రం వాళ్ళింటికే వెళ్ళాలనుకుంది.     గౌతమీ, నిఖిల్, మొనికాతో, హరిణి పిల్లల కోసం తెచ్చిన బొమ్మలూ, హరిణి కోసం తెచ్చిన రెడ్ అండ్ గ్రీన్ షిఫాన్ చీరా, పెర్ ఫ్యూమ్స్, గోకుల్ కోసం తెచ్చిన లైటరూ అన్నీ తీసుకుని బయలుదేరింది మంజరి.     మంజరి వరండాలోనే ఎదురుపడ్డ  హరిణిని చూసి గతుక్కుమంది. పెద్ద పొట్టా, వడలిపోయిన మొహం, నీరసంగా వున్న కళ్ళతో వయసు మళ్ళినదానిలా  వుంది హరిణి. అనిరుధ్, సంయుక్తలు వాళ్ళలో వాళ్ళు ఏదో ఆడుకుంటున్నారు. "ఏమే! అలా నిల్చుండిపోయావ్, నన్ను గుర్తుపట్టలేదా? అంత మారిపోయానా?  అవున్లే, నువ్వు మారలేదు మరి. పెళ్ళిరోజెలా వున్నావో ఇప్పుడూ  అలాగే వున్నావ్. ఏడేళ్ళ కూతురుందంటే  ఎవరన్నా నమ్ముతారా?" అంది మంజరిని తృప్తిగా చూస్తు హరిణి.     హరిణి నవ్వులో కూడా అనందం కనిపించలేదు  మంజరికి. అదేదో తన కోసం  తెచ్చిపెట్టుకున్న  నవ్వులా ఉంది.     "అవునే! నువ్వేమో అమ్మమ్మలా తయారయ్యావ్. నా క్లాస్ మేట్ ని నువ్వు అంటే మా మోనిక కూడా నమ్మదు. అయినా, హాయిగా ఒక మొగపిల్లడూ, ఒక ఆడపిల్లా వున్నారు కదా! ఇంకా ఎందుకే సంతానం? ఇద్దరూ ఎడ్యుకేటెడ్ కదా - ఆ మాత్రం తెలీదు?" అంది నవ్వుతూనే చురక తగిలిస్తూ  మంజరి.     "హరిణీ! చిన్నప్పటి నుంచీ మన మధ్య ఏ రహస్యాలూ లేవు. మనసు విప్పి ఏవేవో మాట్లాడుకునేవాళ్ళం. పెళ్ళి మాత్ర మనని మార్చేసింది. ఎన్నోసార్లు నీకు అమెరికా  నుంచి కాల్ చేశాను. ప్రతీసారీ నువ్వు పొడిపొడిగా మాట్లాడేదానివి. అందుకే రానురాను ఫోను చెయ్యడం మానేశాను. నా ఫోన్లు నిన్ను ఇబ్బందుల్లో పెడ్తున్నాయేమోననే అనుమానం వొచ్చింది. ఒక్క విషయం చెప్పు. నువ్వు సంతోషంగా వున్నావా? గోకుల్ ఎలాంటివాడు? నిన్ను చూడగానే నాకెందుకో  ఈ సందేహాలన్నీ  వొచ్చాయి" అంది బాధగా అడుగుతూ మంజరి. హరిణి కళ్ళు నిండుకుండలయ్యాయి.     చెంపల మీదుగా జారుతున్న కన్నీరు తుడుచుకుంటూ  మంజరికేసి చూసింది. ఆ చూపులు సూదుల్లా గుచ్చుకున్నాయి.     ఆ చూపుల్లో జాలి, నిస్సహాయతా....మంజరి నోట మాట రాలేదు.     "గోకుల్ ఒక రకమైన దుర్మార్గుడు. చదువుకున్నవాళ్ళంతా  మంచివాళ్ళని  మనం చిన్నప్పుడనుకునేవాళ్ళం. కానీ అది చాలా తప్పు. గోకుల్ ఉత్త డబ్బు మనిషి. పిల్లలు పుట్టక ముందు నాచేత ప్రోగ్రామ్స్ ఇప్పించింది కూడా కేవలం డబ్బు కోసమే. అయితే అలా కూడా వుండనీయకుండా చెయ్యడానికి కారణం అతనిలో ఉన్న అనుమాన పిశాచం. డాన్సు మాస్టరి దగ్గరి నుంచి ఆడియన్స్ లో వున్న మగ అనే ప్రతీవాణ్ణి అనుమానించేవాడు. నాతో ఏదో రంకు కట్టేవాడు. చివరకి ఎవరైనా  వొచ్చి, కంగ్రాట్యులేషన్స్ చెప్పినా అనుమానమే.  ఏదో ఒక వంక మీద నాన్నగారి దగ్గరి నుంచి డబ్బు తెమ్మనేవాడు. ఏం చేస్తాం? పాపం, నాన్న అడిగినంతా ఇచ్చేవారు. అదేబాగుందని నా చేత డాన్స్ ప్రోగ్రామ్స్ మాన్పించడానికి, చక్కని కారణం నేను తల్లిని కావడం. అనిరుధ్ పుట్టినప్పుడు చాలా సంతోషించాడు. వాణ్ణి ఇంజనీయర్ని  చేస్తే ఈ రోజుల్లో కనీసం రెండు మూడు లక్షల కట్నం వొస్తుందట. తనే చాలా చవకగా ఒచ్చేశాడట నాకు!"     దుఃఖంతో హరిణి గొంతు బొంగురుపోయింది. ఆవేశం గొంతులో అడ్డుపడి మాట పెగలడం లేదు.     మంజరి కళ్ళు   కూడా వర్షిస్తున్నాయి. "బ్రూట్!" అంది అప్రయత్నంగా. మంజరి కనుసైగల్ని అర్ధం చేసుకుని గౌతమి పిల్లలందరినీ  అవతలి గదిలోకి తీసుకెళ్ళి ఆడిస్తోంది.     హరిణి మళ్ళీ చెప్పడం మొదలెట్టింది:     "సంయుక్త పుట్టినప్పుడు అతడు పదకొండో రోజుదాకా దాని మొహం చూడలేదు. ఎందుకంటే, అనిరుధ్ వల్ల ఒచ్చేదంతా సంయక్తవల్ల పోతుందట!" చీర కొంగుతో  కళ్ళు తుడుచుకుంది.     "మై గాడ్!" ఆశ్చర్యంతో అంది మంజరి.     "ఇప్పుడు నా గర్భంలో వున్నది కవలలట. ఇద్దరూ మగాళ్ళు కావాలని రోజుకో వందసార్లు అంటూంటారు."     "స్కాన్ చేశారా?"     "ఆ...."     "మగపిల్లలేనా?" కుతూహలంగా అడిగింది మంజరి.     "సరిగా తెలీలేదట. బహుశ ఆడపిల్లలేమోనంది డాక్టరు."     "గోకుల్ ఏమన్నాడు?" భయం చోటు చేసుకుంది మంజరి మొహంలో.     "నా వైపు అసహ్యంగా చూసి, నన్ను ఇంటి దగ్గరైనా  దింపకుండా  ఎటో వెళ్ళిపోయాడు. నాకేదో భయంగా వుందే మంజరీ!" అంటూ పసిపాపలా ఏడ్చింది హరిణి. మంజరికి ఏం చెప్పాలో, ఎలా ఓదార్చాలో హరిణికి అర్ధం కాలేదు.     "గోకుల్ అసలు మనిషా గొడ్డా? బిడ్డ మీద బిడ్డ- మగ బిడ్డను కని బిజినెస్ చేద్దామనుకుంటున్నాడా? కట్టుకున్న భార్య ఏ స్థితిలో వుందో, ఆమె మనసు గురించీ గానీ, శరీరం గురించిగానీ ఏ బాధ్యతా లేదుగానీ ,డబ్బు మీద మాత్రం మమకారం! అందుకు భార్య టార్ గెట్! ఇడియట్! ఆడపిల్లని అసహ్యించుకునే ఛండాలుడు! అసలు ఆడదే లేకపోతే తనెలా పుట్టేవాడట? అటువంటి త్రాష్టుడితో సంసారం చెయ్యడం వ్యభిచారంకన్న పాపం. విడాకులిచ్చేసి, హాయిగా నాట్య మయూరిగా బ్రతకొచ్చు. నీ బిడ్డల్ని నువ్వు పోషించుకోవచ్చు హరిణీ! ఏమైంది నీలోని ఆత్మస్థయిర్యం ధైర్యం?" టీ కలపడానికి లేస్తూన్న హరిణిని వారించి తనే కలపడం మొదలెట్టింది మంజరి.     "మంజూ! చిన్నప్పుడు మనం మాట్లాడుకునే మాటలు ఆచరణలో పెట్టడం చాలా కష్టం. నేను విడాకులిస్తే పుట్టింటి వాళ్ళకి అవమానమని తమ్ముళ్లూ, మరదళ్లూ అంటున్నారని అమ్మా నాన్న నాకు నచ్చజెపుతూ  వొచ్చారు. నావల్ల వాళ్ళందరికీ మచ్చ ఒస్తుందట. అవి విన్నాక, నా బతుకుని ఇలాగే ఈడ్చదలుచుకున్నాను. నా భయమల్లా  నాకేమయినా అయితే కాన్పులో, గోకుల్ సంయుక్తని సరిగ్గా చూసుకోడు."     "ఛ! అవేం మాటలు? నీకేమీ కాదులే! పిచ్చి పిచ్చి ఆలోచనలతో దిగులు పెట్టుకోకు." టీ కప్పుని హరిణికందిస్తూ అంది మంజరి.       ఇద్దరు స్నేహితుల్లోనూ  మదినిండా  గోకుల్ ని గురించిన  భయం. హరిణి భవిష్యత్తును గురించి బాధ, సంయుక్తని గురించిన  దిగులు. రకరకాల ఆలోచనలతో టీ తాగడం  పూర్తి చేశారు.     "గోకుల్  ఒస్తాడేమో, అతణ్ణి కూడా చూసి, కాస్త హితబోధచేసి వెళదామనుకున్నాను. కానీ అతడి జాడలేదు" అంది మంజరి గడియారం చూసుకుని, ఎనిమిది దాటిందని లేస్తూ.     ఇద్దరు మిత్రులూ విడలేక గడియారాన్నీ, చీకటినీ తిట్టుకుంటూ  విడిపోయారు. ఆ మర్నాడు పిల్లల్ని  తీసుకుని ఇంటికి రమ్మని ఆహ్వానించింది మంజరి. "గోకుల్ కి కూడా ఫోన్ చేసి చెప్తాలే" అంటూ  కారెక్కింది.     ఉదయం  భానుడి నులివెచ్చని  కిరణాలు కిటికీలోంచి  చొచ్చుకుని శరీరాన్ని  తాకేవరకు  తెల్లారినట్టే తెలీలేదు. మంజరిని చూడగానే తల్లి రుక్మిణమ్మ  అదోలా అయిపోయింది. నిఖిల్ మౌనంగా  వున్నాడు. ఇద్దరూ అలా మౌనంగా  ఎందుకున్నారో  అర్ధంకాలేదు. గడియారం చూస్తే పది గంటలు కావస్తోంది. ఇంతలో నిఖిల్ హడావుడిగా పేపర్ పట్టుకుని వచ్చి__     "అక్కా! హరిణిని గోకుల్  గొంతుపిసికి  చంపేశాడట- డాక్టరుగారు ఆమె కడుపులో వున్నది ఇద్దరూ ఆడకవలలని అనుమానించడంవల్ల. కానీ ఇప్పుడు  రిపోర్టు చూస్తే ఇద్దరూ మగపిల్లలేనట...." ఇక అతడు చెప్పే మాటలేవీ  చెవికి  సోకడం లేదు మంజరికి. "గొంతుపిసికి  చంపేశాడు...." పేపర్లో తాటికాయంత అక్షరాలతో వార్త.     "నాకేదో భయంగా వుందే! నాకేదన్నా  అయితే గోకుల్  సంయుక్తని సరిగ్గా  చూడడని నా భయం." హరిణి మాటలు.     మంజరికి కళ్ళు  తిరుగుతున్నట్టయింది. గోకుల్ నే గొంతుపిసికి  చంపెయ్యాలనిపించింది. పేపర్ తీసి  మళ్ళీ మళ్ళీ చదివింది.     "మరో నాలుగయిదు రోజుల్లో ప్రసవిస్తుందనగా, డాక్టరు ఆడపిల్లలేమోనని  వెలిబుచ్చిన  అవమానంతో భార్య గొంతుపిసికి  చంపిన కర్కోటకుడైన భర్త ఉదంతం. చంపేసి  ఆత్మహత్యగా పోలీసులను పిలిపించి చెప్పాడట. అయితే ఆమె చావుకి పూర్వం బాగా పెనుగులాడినట్లు  అక్కడి దృశ్యాన్ని బట్టి  ఊహించిన  పోలీసులు, శవాన్ని  పోస్ట్ మార్టమ్ చెయ్యగా తేలింది అది హత్యనీ, కవలలు మగపిల్లలనీను, గోకుల్ ని అరెస్టు చేసి కస్టడీలోకి  తీసుకున్నారనీను."     కారు బయటికి  తీసి నిఖిల్ నెక్కించుకుని హరిణి ఇంటికి వెళ్ళింది. ప్రశాంతంగా నిద్రపోయేలా ఉంది హరిణి మొహం. శవం మీదపడి  గుండెలవిసిపోయేలా, భూదేవి కంపించిపోయేలా, మహిళలందరూ  మాన్పడిపోయేలా ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయింది మంజరి.     "ఈ కన్నీటి వీడ్కోలు  కోసమా  తను ఇండియా కొచ్చింది?" నెత్తీనోరూ  కొట్టుకుంది మంజరి.     "కాదు! నువ్వొచ్చింది మామూలు మహిళల్లా ఏడవడానికి కాదు! మహిషాసుర మర్ధనిలా విజృంభించు! గోకుల్ లాంటి గోముఖ వ్యాఘ్రాలను  మట్టు బెట్టు. సంయుక్తలాంటి  అమాయకులు బలై పోకుండా  కాపాడు! నీలో ఆ శక్తుంది! లే! మహిళాశక్తిని కూడగట్టుకో! అడుగు ముందుకు వెయ్!"     "ఎక్కడివా మాటలు?" అంటూ విస్తుపోయి  అటూ ఇటూ చూసింది మంజరి.     ఎదురుగుండా  వున్న ఫోటోలో  త్రిశూలంతో కాలిమువ్వలతో, ఎర్రటి తిలకంతో మహిషాసురమర్ధని ఫోజులో వున్న హరిణి ఫోటోలోంచి  వినబడ్డట్టనిపించింది.          మంజరి లేచి నుంచుంది!     ఫోటోకేసి చూసింది!     'జయజయహో మధుసూదనకామిని రమ్యకవర్ధని' అంటూ  త్రిశూలంతో సాక్షాత్తూ  జగన్మోహకారి శాంభవిలాగే  అనిపించింది. కర్తవ్యం బోధపడ్డట్టు  చేతులెత్తి నమస్కరించింది. కారు కేసి చూస్తున్న గోకుల్ వైపు కాండ్రించి వుమ్మేసి కారెక్కింది మంజరి.         *    *    *     వెండి కొండల మధ్య తారామండలాన్ని  దాటి రివ్వున ఎగిరిపోతూన్నట్టు  వెళుతోంది ఇండియన్ ఏర్ లైన్స్ వారి విమానం.     ముందు సీట్లోని మోనికా, సంయుక్త మాత్రం ఏవేవో సీరియస్ గా మాట్లాడేసుకుంటున్నారు.     వెండి వెన్నెల వెలుగు జిలుగుల్లో  మహారాజులా  వెలిగిపోతున్నాడు శశాంకుడు.     "ఇవాళ పౌర్ణమి కదూ!" గుర్తుకి తెచ్చుకుని చందమామని చూస్తూండిపోయింది మంజరి కిటికీ అద్దాల్లోంచి, వింత వింత ఆలోచనలతో సతమతమయిపోతూ.     గోకుల్ కి ఉరి శిక్ష పడుతుంది! అప్పటికిగానీ హరిణికీ, హరిణితోపాటు మరణించిన ఇద్దరు చిన్నారి పాపలకి మనశ్శాంతి లభించదు. ఆడవాళ్ళు అబలలు కారు. పెదవి విప్పనంతవరకే, గడపదాటనంతవరకే వాళ్ళు అబలలు! విజృంభించారో ఏ శక్తీ వారిముందు ఆగలేదు! అందుకు నాటి పురాణ గాథలూ, చరిత్రలే అక్కర్లేదు - నేడు నడుస్తూన్న చరిత్ర చాలు సాక్ష్యాలకి.     "పురుష పుంగవులు  ఇప్పటికైనా  ఆమె శక్తి సామర్ధ్యాలను గుర్తిస్తే చాలు! ఆమెకి కిరీటం పెట్టి కొలవమని చెప్పడం లేదు. కనీసం తమనీ మనుషులుగా వారి ఇష్టాయిష్టాలని గౌరవిస్తే చాలు - ఈ పోరాటం, ఈ వాదం సమసిపోతుంది. భూతలమే స్వర్గతుల్యమనిపిస్తుంది." ఆవేశంగా భర్తతో చెప్పింది మంజరి.     శ్రీరాం ఆప్యాయంగా భార్య తల నిమురుతూంటే  అందులో ఎన్నో భావాలు స్పురించాయి. విమానం పక్షిలా గాలిలో  ఎగిరిపోతూ ఉంటే, చందమామని చూసి తృప్తిగా నవ్వుకుంది మంజరి.

నాణానికి రెండోవైపు

నాణానికి రెండోవైపు   - భవానీ దేవి సూర్యుడు సహస్రాధిక బాహువులతో ప్రాణికోటి ముంగిట్లోకి వస్తున్నాడు.        బాత్ రూమ్ లో స్నానం చేస్తున్న వర్ధనమ్మ చుట్టూ ఓసారి చూసింది. బాత్ రూమ్ గోడలకు తెల్లటి టైల్స్ తాపడం చేసి ఉన్నాయి. షవర్ బాత్, సోప్ కేస్ లతో అధునాతనంగా ఉన్న ఆ స్నానాలగదిలో స్నానం చేయటం వర్ధనమ్మ జీవితంలోనే వింత అనుభూతిగా అన్పించింది.     ఇస్త్రీ చీర కట్టుకొని బెడ్ రూమ్ నాలుగు వైపులా పరిశీలించింది. ఎంత పొందికగా సర్దుకుని మాధవి! గదిలో ఓ మూల గోడకి ఉన్న ర్యాక్ లో కొన్ని పుస్తకాలు నీట్ గా సర్ది ఉన్నాయి. వాటి పక్కనే ఉన్న షోకేస్ లో వింత వింత ఖరీదైన పింగాణీ బొమ్మలు... గోడ మూలగా ఉన్న టీపాయ్ మీద పింగాణీ ఫ్లవర్ వాజుల్లో అందమైన గులాబీలు... కిటికీలకున్న కర్టెన్లు సిల్కువి కాబోలు...తళతళా మెరుస్తూ ఆనందం అంతా అక్కడే ఉన్నట్లుగా ఊగుతున్నాయి.     ఈ మాధవిలో చిన్నప్పటి మాధవి పోలికలు అసలు లేవు. చిన్నప్పుడు మాధవి ఎంత అల్లరిచిల్లరిగా ఉండేది. కాలేజి నుంచి రాగానే పుస్తకాలు చిందరవందరగా టేబుల్ మీద విసిరికొట్టొద్దని తనెన్నిసార్లు కోప్పడలేదు... పెళ్ళి కాగానే ఆడపిల్లలు ఎంతగా మారిపోతారు...! తనలో తాను చిన్నగా నవ్వుకుంది వర్ధనమ్మ... నిట్టూరుస్తూ దేవుడి మందిరం కేసి నడిచింది.     వెండి దేవుడి విగ్రహాలు చెమ్కీ దండలతో రంగురంగుల బట్టలతో కళకళలాడుతున్నాయి.     ఒక్కమారు నమస్కరించి వంటింట్లోకి నడిచింది. ఒక పొయ్యిమీద చిక్కని పాయసం కమ్మని వాసన వేస్తూ నోరూరించేలా తయారవుతోంది... మరో పొయ్యిమీద గారెలు ఉడుకుతున్నాయి.     వర్ధనమ్మ మరోసారి నిట్టూర్చింది.     "అమ్మా! స్నానం అయిందా!" గ్యాస్ స్టవ్ దగ్గర నిల్చుని గారెలు చేస్తున్న మాధవి వెనక్కి తిరిగిచూసి ప్రశ్నించింది.     "ఆ! అయిందమ్మా..." బదులిస్తున్న వర్ధనమ్మ కళ్ళు మాధవిని నఖశిఖ పర్యంతం ప్రేమగా తడిమాయి.     రాత్రి వచ్చేసరికి పొద్దుపోయింది. మాధవిని సరిగా చూడలేదు గానీ కొద్దిగా వళ్ళు చేసింది. పండు టమాటా కలర్ చీర... అదే రంగు బ్లౌజ్ వేసుకున్న ఆమె శరీరఛాయ-మరింత కొట్టిచ్చినట్లు కనిపిస్తోంది. జుట్టుకు రబ్బరు బ్యాండ్ వేసుకుంది. ఎఱ్ఱని బొట్టు... మెళ్ళో ఎఱ్ఱరాళ్ళ సింపుల్ నెక్లెస్... ముక్కుకు రవ్వపుడక... ఒక్కో చేతికి ఆరేసి బంగారు గాజులు... లక్ష్మీదేవిలా    ఉంది కూతురు.     "అమ్మమ్మా... గుడ్ మార్నింగ్..." అన్న మనవరాలు హిమబిందు పిలుపుతో చూపు మరల్చుకుంది వర్ధనమ్మ... చిరునవ్వుతో మనవరాలి వీపు నిమిరి దగ్గరగా తీసుకుంది ఆప్యాయంగా.     కూతుర్ని ప్రేమగా గారాబంగా స్కూలుకు తయారుచేస్తున్న మాధవిలోని తల్లిప్రేమని చూసి ఆశ్చర్యపోయింది వర్ధనమ్మ... హిమబిందును చూస్తుండిపోయింది ముచ్చటగా...     మళ్లీ ఇంతలోనే మనసులో ముల్లు గుచ్చుకున్న అనుభవం... ఈ ఆలోచనని అణచుకోవటం కష్టంగా ఉంది. ఆధునిక సౌకర్యాల సాయంతో ఎక్కువ శ్రమ పడకుండానే కూతుర్ని స్కూలుకూ, భర్తను ఆఫీసుకూ పంపింది మాధవి.     తర్వాత తల్లితో కబుర్లు చెపుతూ దగ్గరుండి ఇల్లంతా చూపించింది మాధవి. ముందు వరండా, దాని వెనుక పెద్ద హాలు, హాల్లోంచి మూడు బెడ్ రూంలు, ఒకవైపు డైనింగ్ హాలు, దాని వెనుక కిచెన్, ప్రతి బెడ్ రూంకు ఎటాచ్ డ్ టాయిలెట్లు... అడుగడుగునా ఖరీదైన ఫర్నిచర్, కర్టెన్లు, ఫ్లవర్ పాట్స్ తో ఇల్లంతా సిరి తాండవిస్తోంది.     "చాలా బాగుందమ్మా..." పైకి మెచ్చుకుంటూ అన్నదే గానీ గుండెల్లో మాత్రం బరువు పెట్టినట్లుంది.... ఏదో వెలితి... బాధ.     "రామ్మా! అన్నం తిందాం..." మాధవి పిలుపుకు యాంత్రికంగా డైనింగ్ హాల్లోకి నడిచింది.     భోజనాలు అయినాక గెస్ట్ రూం చూపించి తల్లిని విశ్రాంతి తీసుకోమంది మాధవి.     పడుకున్నదేగానీ వర్ధనమ్మకు నిద్ర పట్టలేదు. మనసులో పురుగు తొలుస్తున్న భావన... నిలువెల్లా అగ్ని దహిస్తున్నట్లుంది. నిద్ర మాగన్నుగా పట్టింది.     నిద్ర లేస్తూనే "రేపు ఉదయం రైలుకు నన్ను పంపేయమ్మా..." అంటున్న తల్లికేసి ఆశ్చర్యంగా చూసింది మాధవి.     "అదేంటమ్మా... వచ్చి ఒకరోజయినా కాలేదు... అప్పుడే..."     "కాదులే తల్లీ... ఇంటి దగ్గర నేను లేకపోతే ఇబ్బంది పడతారు..." కూతురు మాటల్ని మధ్యలోనే అడ్డుకుంది వర్ధనమ్మ.     మాధవి అలిగింది... బ్రతిమాలింది... ఉహు... లాభంలేదు... ఆ రాత్రి కడుపునెప్పిగా ఉందని ఏమీ తినలేదు వర్ధనమ్మ. పెళ్లయ్యాక ఇంతకాలం పారిన్ లో ఉండటం వలన అమ్మకి తన ఇంటికి రావటం కుదరలేదు. ఇప్పుడు మొదటిసారి వచ్చి ఇలా ప్రవర్తిస్తుందంటే... తల్లికి తనంటే... ఆలోచన జీర్ణించుకోలేక మౌనంగా ఉండిపోయింది మాధవి. ముళ్ళ మీద ఉన్నట్లుగా గడిపి రైలెక్కింది వర్ధనమ్మ.     కూతురి ఐశ్వర్యం చూసి తను అసూయపడుతోందా... లేదు... అనుకుంది బాధ్యతగా.             * * *     వెలిసిన వోణితో ఒక చేతిలో చీపురు కట్టతో తలుపు తీసిన సువర్ణ మొహం తల్లిని చూసిన మరుక్షణమే చాటంతయింది.     "అమ్మొచ్చిందర్రా... లేవండి లేవండి..." అంటూ హడావుడిగా తమ్ముణ్ణి, చెల్లెళ్ళనూ నిద్రలేపింది. జిడ్డు కారుతున్న వాళ్ళ మొహాల్లో పెన్నిధిని చూసినంత సంబరం... "అమ్మా! కాస్త కాఫీ పెట్టు... నేను నీళ్ళు పడతాను" సువర్ణ హడావుడి పడుతూనే "అక్కెలా ఉందమ్మా... ఎప్పుడొస్తుందిట" అడిగింది ఆత్రంగా.     తన ఐశ్వర్యాన్ని ప్రదర్శించటమేగానీ ఇంటిదగ్గర చెల్లెళ్ళు, తమ్ముడు, అన్న ఎలా ఉన్నారని పన్నెత్తయినా ప్రశ్నించని మాధవి గుర్తొచ్చి వర్ధనమ్మ మనసు మూలిగింది.     "ఊ... వస్తుందిలే" అంటూ పరధ్యానంగానే కొంగు దోపి పనిలో పడిపోయిందామె.     పది రోజులుండొస్తానని అక్క ఇంటికి వెళ్ళి మర్నాడే తిరిగొచ్చేసిన తల్లిని సువర్ణ ఏమీ ప్రశ్నించలేదు... కానీ ఆమె చూపులో వచ్చిన మార్పు... ఆలోచనగా ఉండటం మాత్రం గ్రహించింది.             * * *     తండ్రి పోయినా బాధ్యత తీసుకొని సంబంధాలు చూస్తున్న అన్న రామంతో "నేను మామూలు గుమాస్తాను చేసుకోనన్నయ్యా! మరో పదివేలు కట్నం ఇచ్చయినా సరే ఇంజనీర్నో, డాక్టర్నో చూడు..." అంటున్న మాధవి కేసి ఆరోజు ధైర్యంగా తలెత్తికూడా చూడలేకపోయాడు రామం.     "అంతగా మన దగ్గర డబ్బు లేదంటే నాన్న ఇచ్చిన ఈ ఇంటిలో నావాటా అమ్మి నా పెళ్ళి మంచి ఉద్యోగస్థుడితో చేయండి. నాకు ఒక దరిద్రుడ్ని ముడిపెడితే ఆ తర్వాత మీరెంత సహాయం చేసినా జీవితంలో ఎదుగూ బొదుగూ ఉండదు..." మాధవి ఆలోచనలకు కొయ్యబారిపోయింది వర్ధనమ్మ.     అందరు అమ్మాయిల్లాగా "కట్నం తీసుకోని వాడినే పెళ్ళి చేసుకుంటాను" అనటంలేదు మాధవి. అదే ఆమెకు ఆశ్చర్యం!     ఆమె కోరినట్లే రామ్మోహన్ ఆమె సౌందర్యానికి ముగ్ధుడై అందరికంటే తక్కువ కట్నంతోనే చేసుకున్నాడు. వాళ్ళ అదృష్టం బాగుండి ఫారిన్ లోనే ఆ దంపతుల కొత్త కాపురం మొదలయింది. తనకోసం ఇల్లు అమ్మేసిన తల్లి, అన్న, చెల్లెళ్ళు, తమ్ముడు ఎలా ఉన్నారో అని ఒక్కసారి కూడా ఆలోచించలేదు మాధవి.     హక్కులేగానీ బాధ్యతల గురించి ఆమె ఆలోచించదు. ఎందుకంటే ఆమె సగటు ఆడపిల్ల గనుక!     "కుటుంబంలో మగ పిల్లలతో బాటు ఆడపిల్లలకి సమానత్వం కావాలంటే వాళ్ళు హక్కులేగాక బాధ్యతల్ని కూడా వహించాలి కదా! అలా ఆడపిల్ల నిండు వ్యక్తిగా తయారయితే ఆమెను సమాజం చిన్నచూపు చూడలేదు. ఆడశిశువుల హత్యలు, పెంపకంలో ఆడపిల్లల వివక్షత, మగపిల్లల పట్ల పిచ్చి ప్రేమతో సంతానాన్ని విపరీతంగా పెంచుకోవటం ఇటువంటివి జరిగే అవకాశం ఉండదు కదా!"     వర్ధనమ్మ మెదడు నిండా తేనెటీగల్లాగా ఆలోచనలు ముసురుకుంటున్నాయి. ఆ మహారాజుకేం... హాయిగా... వెళ్ళిపోయాడు. అధిక సంతానాన్ని మోయటం తనకే కాదు... తన బిడ్డలకు కూడా భారమే... ఆమెలోని వేదన సుళ్ళు తిరుగుతోంది.     చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఆ మధ్యతరగతి తల్లి పిల్లల భవిష్యత్ సౌధానికి పునాదులు వేయటానికి అప్పడాలు, వడియాలు చేసి అమ్ముతూ విధిని నిందిస్తూనే ఉంది. తండ్రి ఆస్తులియ్యకపోయినా ఆస్తిలా ఇచ్చిన చెల్లెళ్ళు, తమ్ముడి కోసం రామం, సువర్ణలు జీవితాలను కొవ్వొత్తుల్లా కరిగించుకుంటూనే ఉన్నారు. వర్ధనమ్మకిప్పుడు నాణానికి రెండోవైపు స్పష్టంగా కన్పిస్తోంది..     అది బొమ్మ కాదు బొరుసే!  

ప్రేయసికో ప్రేమలేఖ

  ప్రేయసికో ప్రేమలేఖ  - డా. ఎ.రవీంద్రబాబు.  రోజూలాగే ఈ రోజూ బద్దకంగా తెల్లారింది. మరో రోజూ నిర్దయగా నా మీద నుంచి నడిచి వెళ్లడానికి సిద్ధమైంది. నీకు తెలుసు కదా... పక్కమీద కళ్లు మూసుకుని, వళ్లు విరుచుకుంటూ నిన్ను దగ్గరగా తీసుకోవడం నాకెంత ఇష్టమో... ! ఉదయాన్నే నా మత్తుకు నీ స్పర్శ మందేమో...!!       కళ్లు తెరుచుకోగానే నా చేతులతో పాటు, నీ హృదయం కూడా నీ కోసం వెతికాయి. ఏం చేద్దాం...!? నీ వులేవని ఆ రెండిటికీ తెలుసు. ఏ మంత్రశక్తో నిన్ను నా పక్కన ఉంచితే ఎంత బావుణ్ణు...!! స్పర్శలేని ప్రేమను ఎలా ఊహించగలం చెప్పు. అసలు స్నేహానికి, ప్రేమకు మధ్య ఈ చిన్న అడ్డంకు లేకపోతే..., నువ్వు అన్ని రోజులు  నా బెస్ట్ ఫ్రెండ్ వని దూరంగా ఉంచేదానివేమో కదా...!! అయినా లోకానికి నీతి నియమాలకు భయపడి ఎన్ని ప్రేమలు స్నేహం మాటున రగిలిపోతున్నాయో కదా...? ఎన్ని బంధాలు దొంగ ముసుగు లేసుకుని ఈ కపట ప్రపంచంలో రాజ్యమేలుతున్నాయో కదా... ?!       ఉదయాన్నే... నిద్రలో గమ్మత్తుగా పక్కకు ఒత్తిగిలే నిన్ను చూడ్డాం నా కెంతోసరదానో...!! నా చెయ్యిని అలా గుండెల మీదకు లాక్కొని.., 'నాకెంట్రా నువ్వున్నావు' అనే నీ మాట గుర్తుకొచ్చింది.  అయినా నిద్ర లేచే ముందు నీ ముఖంలో అంత అందం ఎక్కడ నుంచి వస్తుంది?. రాత్రంతా దేవలోకంలో సుఖాలలో తేలియాడిన అప్సరసలు, ఆ తృప్తి తాలూకూ భావనని నీలో నింపి ఉండాలి. బెడ్ లైట్ లాంప్ లో మెరిసే నీ బుగ్గ నిగారింపు...,రాత్రి తలస్నానం చేసిన నీ కురుల పరిమళం నా గుండెకు ఎంత హాయినిచ్చేవో...!!        ఏంటో నీకు కోపం వస్తుందని భయమేస్తుంది గానీ...! ఎన్ని రహస్యపు వానల సువాసనల్ని భద్రంగా భద్రపరిచావో ఈ చిన్ని గుండెపై...!! అవన్నీ ఇప్పుడు గాయాలు చేసి సుతిమెత్తగా ఆ గుండెనే కోస్తున్నాయి. 'నేను నీ లవర్ని' అని నీవు చెప్పిన ఆ పదాన్ని నేను వినడంలో జరిగిన ఆలశ్యానికి ఇప్పటికీ సారీ చెప్తూనే ఉన్నాను మౌనంగా...!! అయినా- ఏదీ ఎప్పుడూ డైరెక్టుగా చెప్పే మనస్తత్వం కాదు నీది. అందుకే నీ మనసును పరిపూర్ణంగా అర్థం చేసుకోవడంలో నేను ఫెయిల్ అయ్యానేమో...!! లేకపోతే ఈ తుంటరి తగాదా మనల్ని విడదీసి ఉండేదా...??      అయినా ఇప్పుడు ఎన్నని ఏం లాభం?. నీవు లేని క్షణాలు, ఘడియలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు... నా ప్రయాణం... ఇలా వ్యర్థంగా గడిచిపోతున్నాయి. అవును నీ గురించి నేను ఇంతగా తపన పడుతున్నాను కదా...! ఇదంతా నీకు తెలుస్తుందా...!? ఋషులకు ఏదో అద్భుత శక్తి ఉండేదట. వారి హృదయాలలోని భావాలు ఒకరికొకరికి తెలిసేవట...! అలాంటి శక్తి మన హృదయాలకు ఉండకూడదా...?! ఎందుకంటే- వాళ్లు పొందే అలౌకిక ఆనందమూ, ప్రేమికులు పొందే సౌందర్య పరామానందము ఒకటే కదా...!!       ఇప్పుడు ఒంటరిగా లేచి, ఒంటరిగా రడీయై, ఒంటరిగా ఆఫీసుకు వెళ్లాలి. నా చుట్టూ ఎంతమంది ఉన్నా, నువ్వు లేని ఒంటరి తనమే బాధిస్తుంది. ఇప్పుడిక్కడ సమయం ఉదయం 8.00 గంటలైంది. ఈ టయంలో నువ్వు ఏం చేస్తుంటావు?. నీకు నిద్ర లేవగానే నేను గుర్తుకు వస్తున్నానా...? దూరమై ఇంతకాలమైనా ఎంతకాలమిలా బాధిస్తావు. 'మనిషికి మరుపు దేవుడిచ్చిన వరమట' ఆత్రేయ అన్నాడు. మరి నా మనసుకెందుకు మరుపు అనేది రావడం లేదు?. ఇక ఎప్పటికీ రాదా...! అసలు నిన్ను మర్చిపోవడం అంటే నన్ను నేను మర్చిపోవాలేమో...!!        అవును- ఈ ప్రపంచం నిండా ప్రేమికులే... ఒకరి మనసు వేరొకరి దగ్గర తప్పక ఉంటుంది. మనసులన్నీ ఏకమై ఏ దివ్యలోకాల్లోనో మీటింగ్ పెట్టుకొని ఉంటాయి. అవి లేని మనం ఇలా వ్యర్థ బతుకులను గడుపుతున్నాం. మనసులు ఏకమైన జీవితాల కోసం అన్వేషిస్తూ జీవితాలను వ్యర్థం చేసుకుంటున్నాం. నా మనసు నీ దగ్గర ఉందని, నీవు లేని నేను ఉండలేని క్షణాలు నీకు తెలిసే క్షణాలు ఇక రావని తెలిసినా...!! ఏమిటో ఈ పిచ్చి...!?                                    ఉంటాను... ఒంటరిగానే.... 

యావజ్జీవితం

యావజ్జీవితం - భవానీ దేవి   "పందిట్లో పెళ్ళవుతున్నది. కనువిందవుతున్నది" బ్యాండు మేళంలో పాటను అందరి హృదయాలు ఆనందంగా హమ్ చేస్తున్నాయి.     "బంగారు బొమ్మ రావేమే! పందిట్లో పెళ్ళి జరిగేనే"! అందరి మనస్సులో అపురూప దృశ్యాలెన్నో మెదుల్తున్నాయి.     "బాబూ! అమ్మాయి చేయి పట్టుకో!"     పురోహితుడి ఉపదేశంతో అత్యుత్సాహంగా మోటుగా తన కుడిచేతి చిటికెన వేలుని పెడగా విరిచి పట్టుకున్న రమణకేసి చురచురగా చూసింది వాణి. రమణకిదేమీ పట్టినట్లులేదు. అతనసలు వాణి ఫీలింగ్స్ పట్టించుకునే మూడ్ లో లేడు. ఎప్పుడెప్పుడీ పెళ్ళితంతు పూర్తి చేసుకోవాలా అనేంత హడావుడిగా కార్యక్రమాన్ని ఏకాగ్రంగా నిర్వర్తిస్తున్నాడు. కనునొసల నుంచి రమణ హడావుడి చూసిన వాణి నలుగురు చూపులు తనమీదే ఉంటాయన్న ఆలోచన రాగానే చూపుల్ని నేలకి తాకించింది.     "కొంగులు ముడివేసి కోర్కెలు పెనవేసి" బ్యాండ్ మేళం పాటల సాక్షిగా ఇద్దరు ఒక్కటయ్యారు.     రమణ వాలకం చూస్తుంటే వాణికి వళ్ళుమండి పోతోంది. బెంగగా కూడా ఉంది. "ఏదోలే! ఎర్రగా బుర్రగా ఉన్నాడు. బుద్దిమంతుడు. ఇంజనీర్ గా మంచి ఉద్యోగమే చేస్తున్నాడని" ఈ పెళ్ళికి ఒప్పుకుంది. కానీ ఇంత నాన్ సెన్సిటివ్ అనుకోలేదు. పెళ్ళిలో రమణకి వాణి గురించిన స్పృహే లేదు.     తలంబ్రాలు పోయమన్నదే తడవుగా.... ఉత్సాహం ఆపలేనట్లు పళ్ళెం ఎత్తి కుమ్మరించాడేగానీ ఒక్కసారన్నా కళ్ళల్లో కళ్ళుంచి చూశాడా! పెదవుల కొసన చిరు కొంటెనవ్వయినా! ఉహు... పైగా ఆ పళ్ళాన్ని వాణి తలకేసి తగిలించాడు కూడా. తొందరపాటుతో. కోపంగా పెద్ద పెద్ద కళ్ళు మరింత విశాలం చేసి చూడబోయింది వాణి. అతగాడేమో ఇదేమీ పట్టనట్లు పెళ్ళిమంత్రాలు చెప్తున్నాడు.     'పోన్లే... తొందరగాబోలు' అని సరిపెట్టుకుంది. ఇక అప్పగింతల సీనులో సరేసరి. అమ్మా నాన్న ఏడుస్తున్నారు.     'పోయిరాగదమ్మా జానకి' ఈసారి సన్నాయి మేళగాళ్ళు ఆలపిస్తుంటే అందరికీ మరింతగా దుఃఖం ముంచుకొస్తోంది. బహుశ ఎవరి పెళ్ళిళ్ళు వాళ్ళకి గుర్తొచ్చి ఉంటాయి.     వాణికి ఇదంతా చూస్తుంటే కళ్ళ నీళ్ళు తిరిగాయి. ఎక్కడో పుట్టి, పెరిగి, ఎక్కడికో పోయి ఎవరితోనో బతకాలి అమ్మా నాన్నలని వదిలి. ఆడపిల్లలే ఎందుకు వెళ్ళాలి? వస్తువును అప్పగిస్తున్నట్లు ఈ అప్పగింత లేమిటి? ఏనాటి సంప్రదాయాలో! చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు చేసే రోజుల్లో పసిపిల్ల కాబట్టి అప్పగించేవాళ్ళు. మరి ఇప్పుడెందుకీ తంతు. "రమణ, అనే భర్త తన పట్ల ఎలా ప్రవర్తిస్తాడు. ప్రేమగానీ... బాధ్యత గానీ మొక్కబడి బంధంతోనా... అమ్మ కౌగిలించుకుని ఏడుస్తుంటే బ్రహ్మముడి దగ్గర పట్టుకుని లాగాడు రమణ.     "ఎందుకేడుస్తావు? ఏడవకూడదు" అన్నాడు. వాణికి మండిపోయింది. "ఎందుకేడవ్వొద్దు ఇంతకష్టం వచ్చిపడ్డాక? అసలు ఎవరైనా ఏడవాలన్నా వద్దన్నా ఇంకొకరి పర్మిషన్ కావాలా! నన్ను ఏడవ్వొద్దంటానికి కూడా ఇంక ఇతగాడి ఇష్టమేనా? నా యిష్టం. ఏడుస్తానంతే!". మరింతగా కావాలని ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్న వాణికేసి నిస్సహాయంగా చూశాడు రమణ.      వాణికిప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఆనందంగా మరిన్ని కన్నీళ్ళు కార్చింది.     అత్తగారింట్లో కొత్త పెళ్ళి కూతురికి అన్నీ పరీక్షలే! ఏం తింటుంది. ఏం తినదు. ఇష్టం లేని కూరలేమిటి... ఏం పన్లు వచ్చు... ఏవి రావు... అన్నీ ఆరాలే! వాణికీ వాతావరణం మరీ చిరాకుగా ఉంది. అన్నీ తినటం అలవాటు చేసేయాలని వాణికి ఇష్టం లేని కూరలు, పచ్చళ్ళు రోజూ ఒకటి చేసి వడ్డిస్తున్నారు. మొహమాటంగా వాణి నంజటం అత్తగారింట్లో అందరికీ సంతోషంగా ఉంది.     "అమ్మలుకి పదహారు రోజుల పండగ దాకా ఎంగిలి తినిపిస్తుండు రమణా!" పెద్ద ముత్తయిదువ పెళ్ళిలో అన్నట్లు గుర్తు.     రమణ రోజూ ఏదో ఒక ఎంగిలి తినిపించాలని నిజాయితీగా ప్రయత్నం చేస్తున్నాడు. వాణికిదంతా కంపరంగా ఉంది. ససేమిరా ఎంగిలి తిననని భీష్మించుకుంది. అందరూ బుగ్గలు నొక్కుకున్నారు చాటుగా... ఎదురుగా...     వాణి తనకేమయినా తిని పెడుతుందేమోనని ఎదురు చూసిన రమణకి నిరాశే మిగిలింది.     తొలిరేయి. సినిమాల్లో చూపించే సరిగమలు కనిపించటం లేదు సరిగదా నవలల్లో చదివిన గిలిగింతలేవీ లేవు. కరెంటు లేదు. ఒకటే ఉక్కపోత... బయట పోలీసుల్లా బంధువుల కాపలా... వాణికి తిక్కగా ఉంది. రమణకి వాణి ధోరణి అర్ధంగాక తికమకపడుతుండగానే తెల్లారిపోయింది.     తెల్లవారాక ఆడబడుచు సరసం వింటే వాణికి కారం రాసుకున్నట్లయింది.     వాణి ఎన్నో సినిమాలు చూసింది. నవలలు చదివింది. జీవితం అలా ఎందుకు లేదు. అవన్నీ రంగుల కలలేనా? రమణ సినీ హీరోలా తనను ఆరాధించలేడా...     ఇటువంటి ద్వైదీభావాల మధ్య ఆమె నేలని తాకేలోపు ఇద్దరు బిడ్డల తల్లి అవటం సృష్టి సహజమే! ఆర్ధిక సమస్యలూ అంతే సహజం కాబట్టి దగ్గర్లో ఓ స్కూల్లో టీచర్ గా కూడా చేరింది. జీవితంలో చాలావరకు రాజీపడిపోయింది.... రమణ పెళ్ళప్పుడు ఎలా ఉన్నాడో... ఇప్పుడూ అలాగే ప్రవర్తిస్తున్నాడు. అదే కంగారు... అదే తొందర ప్రతి పనిలోనూ... ఇప్పుడు వాణికి రమణ అలా ప్రతిదానికి తొందరపడటం కూడా అలవాటయిపోయింది.     ఓ రోజు స్కూలునుంచి తలనొప్పిగా ఉందని కాస్త ముందుగా ఇంటికొచ్చిన వాణి బెడ్ రూంలో కనిపించిన దృశ్యం చూసి కొయ్యబారిపోయింది. బడుద్దాయి, ముద్దపప్పు అని ముద్దుగా తను పిల్చుకునే రమణ కౌగిట్లో ఎదురింటి సరోజ...     వాణికి నోట మాటరాలేదు.     సరోజ వాణిని చూస్తూనే రమణ చేతులు విడిపించుకుని పారిపోయింది.     రమణ తలొంచుకుని నిలబడ్డాడు. 'ఇదేమిటండీ?' అని వాణి ప్రశ్నిస్తే ఏం జవాబివ్వాలా అని ఆలోచిస్తున్నాడు. కానీ అతనికా అవసరం వాణి రానివ్వలేదు.     మౌనంగా లోపలికి పోయి యధావిధిగా పనిలో నిమగ్నమయింది.     ఆమె మనస్సులో బద్దలైన అగ్ని పర్వతాలు రమణ ఊహించగలడు... కానీ అతని తొందరపాటుకి శిక్ష ఏమిటో? అదే అతనిలో గిల్టీనెస్.     ఇలాగే రోజులు గడుస్తున్నాయి.     నాల్రోజులయ్యాక వాణి కోపం చల్లారాక అవీ ఇవీ చెప్పి ఆమెను ప్రసన్నం చేసుకోవాలని రమణ ఆలోచన.     వాణి యాంత్రికంగా తన పని ముగించుకుని ఉద్యోగం చేస్తూ వస్తున్నది. పిల్లలతో కూడా ముక్తసరిగా ఉంటోంది.     వాళ్ళు ఇంట్లో లేనప్పుడు ఇల్లు మరీ శ్మశానంలా నిశ్శబ్దంగా ఉంటోంది.     ఓ రోజు రమణే ధైర్యం చేసి అడిగేశాడు "ఇంకా నన్ను క్షమించలేవా, వాణీ?" అని దీనంగా చూశాడు.     ఆమె కళ్ళల్లో రాజీలేని నిరాసక్తత.     పిల్లల పెళ్ళిళ్ళు మధ్యవర్తుల ద్వారా అయిపోయాయి. పెళ్ళిలో కూడా మౌనంగానే బాధ్యత నిర్వర్తించిందామె.     కాలానికి ఏదీ పట్టదు. మౌన ప్రవాహానికి చెరోవైపు ఇద్దరూ మిగిలారు. అపరాధిలా అతను. విరాగినిలా ఆమె.     ఓ రోజు ఉదయం నిద్రలేచిన వాణికి అడుగుపడలేదు. నిలువునా నేలమీద పడిపోయింది. 'దబ్బు' మనే శబ్దం విని రమణ లేచాడు. డాక్టర్ చూసి 'పెరాలిసిస్' అన్నాడు. వాణికి కాలు, చెయ్యి పడిపోయాయి. మాట మాత్రం మిగిలింది. ఎంతమంది డాక్టర్లకి చూపించినా ఫలితం లేకపోయింది. మంచంలో ఉన్న వాణికి రమణ తనకి సేవలు చేయటం, అతని సాహచర్యం అసహనీయంగా ఉన్నాయి. మాట్లాడగలిగినా ఒక్కమాట కూడా మాట్లాడకుండా మూగతపస్సు చేస్తోంది మృత్యువు కోసం.     అలాగే కుంగి కృశించి పోయింది. రోజులు గడిచే కొద్దీ ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. కళ్ళు మాత్రం జ్యోతుల్లా వెలుగుతున్నాయి. రమణకి దిగులుగా ఉంది. ఆరోజు డాక్టర్ చెప్పేది ఆమెకి అర్ధమయింది.     "ఇక అట్టే బతకదు... లాస్ట్ మూమెంట్స్..." అని పెదవి విరిచాడు డాక్టర్.         రమణ వాణి చేయి పట్టుకొని దీనంగా అడిగాడు "వాణీ! ఇప్పటికైనా నన్ను క్షమించలేవా?" క్షమించానని ఒక్కమాట చెప్పు. పదహారేళ్ళుగా ఈ ఒక్కమాట కోసమే ఎదురుచూస్తున్నాను వాణీ! ప్లీజ్"     వాణి కళ్ళనుండి రెండు కన్నీటి చుక్కలు రమణ మునిచేతి మీదికి వెచ్చగా జారాయి.     "అదేపని నేను చేస్తే క్షమించేవారేనా?" అని ప్రశ్నిస్తున్నట్లున్నాయి చలనం ఆగిపోయిన ఆమె కళ్ళు.     పదహారేళ్ళ మౌనశిక్ష ముగించి అలసినట్లు శాశ్వత విశ్రాంతిలోకి నిష్క్రమించింది వాణి.     అతను మాత్రం యావజ్జీవిత శిక్షను మోస్తూ... ఇంకా అలాగే...             * * *

గోపురం

గోపురం - భవానీదేవి         కాశీ విశ్వనాథుని గుడిగంటలు సుప్రభాత కీర్తనలను ఆలపిస్తున్నాయి. ఆ గుడి గోపురం చూస్తూనే పరమేశ్వరశాస్త్రి మనసు పులకించిపోయింది. జీవితంలో ఒక్కసారైనా కాశీ దర్శించాలనీ, విశ్వనాథుని చూసి తరించాలన్న కోరిక ఇన్నాళ్ళకు తీరిందన్న ఆనందంతో కళ్ళు చెమర్చుతున్నై. శాస్త్రి వెనక కిట్టప్ప వడివడిగా అనుసరిస్తున్నాడు. ఇద్దరూ విశ్వనాథుని ఆలయంలోకి ప్రవేశించారు.     "ప్రభో ప్రాణనాథం విభో విశ్వనాథం" స్వరంలో శివధ్యానాన్ని ప్రతిష్టిస్తూ.... స్తోత్రం చేస్తూ ముందుకు కదిలారిద్దరూ.     ఎందరో దేవతలు కొలువైన విశ్వనాథుని సమక్షంలో శాస్త్రి మనసు ఈశ్వర దర్శనం కోసం ఉబలాటపడింది. శివుడు అభిషేక ప్రియుడు. కాశీ లింగాన్ని సుప్రభాతవేళ 'హరహర మహాదేవ' అంటూ జలాభిషేకం చేస్తున్నారు భక్తులతో. కైలాసం కదిలి వచ్చినట్లుంది. శాస్త్రి విశ్వనాథునికి అభిషేకం చేసి పూలహారం సమర్పించాడు. కిట్టప్ప కూడా అలాగే చేశాడు. భక్తిగా ఇద్దరు బయటికి కదుల్తున్నారు.     కిట్టప్ప చూపులు నాలుగడుగుల దూరంలో ముందు నడుస్తున్న శాస్త్రి మీదే నిలిచాయి.     నిండయిన ఆజానుబాహు విగ్రహం, పచ్చని దేహఛాయ, నుదుట విభూతి రేఖలు, సాంప్రదాయికమైన గోష్పదం, చురుకైన చూపులు ఆకట్టుకుంటాయి. మెడలో రుద్రాక్షలు, మెరుపుతీగలాంటి జందెం శివదీక్షతో తదేకంగా కాశీ విశ్వనాథునికేసి చూస్తూ కదిలి వెళ్తున్న పరమేశ్వరశాస్త్రిని చూస్తుంటే పరమశివుని ప్రమథగణాల్లో ఒకరు కైలాసం నుంచి కదిలివచ్చాడు అన్పిస్తోంది. మనసులోనే నమస్కరించాడు కిట్టప్ప. "ఈ మహానుభావుడి వల్లనే కాశీ విశ్వేశ్వరుని సందర్శన భాగ్యం కలిగింది" అనుకున్నాడు.     విశ్వనాథుడ్ని తనివితీరా దర్శించి ఇద్దరూ బయటికి వచ్చారు. వెనుదిరిగి ఒకసారి గుడికి నమస్కరించాడు పరమేశ్వరశాస్త్రి. ఆయన కళ్ళల్లో చిప్పిల్లిన నీటి బిందువుల్ని కిట్టప్ప కంటపడకుండా పై కండువాతో అద్దుకున్నాడు.     మరో గంటకి వాళ్ళు గంగాతీరంలో ఉన్నారు. "చూశావురా కిట్టప్పా! ఇందాక గంగమ్మని దూరంగా చూశాం. ఇప్పుడు చూడు. ఎంత కరుణ నింపుకుని కన్పిస్తోందో! పాపాతుల్ని కూడా ఒడిలో చేర్చుకుని ఆదరిస్తోంది!" అన్నాడు శాస్త్రి భక్తిగా.     "అవునండీ! సినిమాల్లో చూసినప్పుడు నిజంగా గంగను చూడగలనా? అనుకున్నా... మీవల్లే..." కిట్టప్ప భక్తిగా నమస్కరించాడు.     "ఇవాల్టి ప్రపంచంలో అంతా తన కోసమే ఏ పనైనా చేసుకుంటారు. అలాంటిది... భగీరధుడు తన తాత తండ్రుల కోసం ఘోరతపస్సు చేసి వారి ముక్తి కోసం ఈ దేవ నదిని రప్పించాడు... ప్చ్. తండ్రుల కోసం తాతల కోసం ఇంతటి మహత్తర కార్యం చేయటం... ఇవ్వాళ మనం ఊహించే విషయమేనా! తల్లిదండ్రుల కోసం ఒక్క గంట కూడా కేటాయించలేని ఐశ్వర్య సంపాదనలో పిల్లలు ఎటు కొట్టుకు పోతున్నారో!" నిట్టూర్చి నది వైపు అడుగులేశాడు శాస్త్రి.     కిట్టప్ప శాస్త్రి సంచిని ఎడంచేత్తో హృదయానికి భద్రంగా అదిమి పెట్టుకొని ఆయన్ని అనుసరించాడు.     శాస్త్రి ఆగాడు. వెనుదిరిగి కిట్టప్పని ఆగమని చేత్తో వారించాడు.     "నువ్వుండరా! అలా ఒడ్డున కూచో! నేను జపతపాలు ముగించి స్నానం చేసి వస్తా. తర్వాత నువ్వు చేద్దువు. సంచీ జాగ్రత్త..." ముందుకు కదిలిన శాస్త్రికేసి చూస్తూ ఒకచోట కూర్చున్నాడు కిట్టప్ప.     కంటి చూపు అందినంత మేరా పరమపావని గంగానదిని భక్తిగా ప్రేమగా చూశాడు శాస్త్రి. అమ్మలా చేతులు చాపుతూ తనని ఒడిలోకి ఆహ్వానిస్తున్నట్లు అన్పించింది. చిన్నప్పుడే చనిపోయిన అమ్మ మళ్ళీ స్పర్శించినట్లనిపించింది.     ఇంకో అడుగేశాడు. పాదాలు దాటి నీళ్ళు పైకి వచ్చాయి. మనసు సముద్రంలా ఉప్పొంగింది. ఎన్నాళ్ళనించి ఈ శుభ ఘడియ కోసం ఎదురుచూశాడు. పూలదండని తాకినట్లు నీళ్ళని తాకి కుడిచేత్తో నెత్తిమీద చల్లుకున్నాడు. కొన్ని నీటి చుక్కలు భుజం మీదికి జారి వీపు మీదికీ పొట్ట మీదికీ పడ్డాయి .శరీరమంతా పులకరించింది.     చిన్నప్పుడు లాల పోసేటప్పుడు అమ్మ చేతులకి అందకుండా అటూ ఇటూ పరిగెత్తేవాడు. అమ్మ వెంటబడి బతిమిలాడి బుజ్జగించి స్నానం చేయించేది. అమ్మ.. ఆ మాటే మనసునంతా వెన్నలా కరిగిస్తుంది. అమ్మ ఎలా ఉండేది.. ఆ కళ్ళలో ఎంత ప్రేమ.. కరుణ... రానురాను "అమ్మబొమ్మ" మసకేసినట్లుగా అన్పిస్తోంది.     నలుగురు అక్క చెల్లెళ్ళ మధ్య ఎంత గారాబం. అంతా తన కాళ్ళకింద అరచేతులు పరిచి పెంచారు. కాళ్ళకు మువ్వల పట్టీలు తలకి కొండీ చుట్టి నెమలి పించం పెట్టి పట్టు ధోవతి చుట్టి 'కన్నయ్యా' అనేది అమ్మ. 'నా దిష్టే తగుల్తుంది' అని దిష్టి చుక్క దిద్దేది. తనను విడిచి ఒక్క క్షణమైనా ఉండగలిగేదా! మరి శాశ్వతంగా వదిలి వెళ్ళిపోయిందేంటి? అసలు అమ్మ లేకుండా ఒంటరిగా ఎలా ఉండగలిగాడు. మరో అడుగు ముందుకేశాడు. నీళ్ళు పిక్కలు దాటుతున్నాయి.     అమ్మ లేకపోతేనేం! అలివేలుని చూపించి వెళ్ళిందిగా! అలివేలు తనపాటల్ చూపించిన ప్రేమవల్లే అమ్మ లేకపోయినా బతికున్నాడు. అవును.. అలివేలు అమ్మని మరిపించింది. యాభై ఏళ్ళపాటు కంటికి దీపంలా చూసుకుంది. తనకేం కావాలో తనకి తెలీకపోయినా అలివేలుకు తెలిసేది. తన కాల్లో ముల్లు డిగితే ఆమె కంట నీరు తిరిగేది. అమ్మే మరో రూపంలో అలివేలులా వచ్చిందని అన్పించేది.     ఇద్దరు కొడుకులు పెరిగి అమెరికా వెళ్ళి ప్రయోజకులు కాగానే తన కర్తవ్యం తీసిపోయినట్లు నిద్రలోనే నిష్క్రమించింది అలివేలు. అప్పటినుంచి తన జీవితం దీపం లేని గుడిలా మారిపోయింది.     భార్య ఉన్నప్పుడు చాలామంది మగవాళ్ళలా శాస్త్రికి కూడా ఆమె విలువ తెలియలేదు.ఆమె పోయాక అంతవరకు అర్ధంకాని సత్యం వెలుగులోకి వచ్చి జ్ఞానోదయమయింది. అలివేలు ఉన్నప్పుడు ఎప్పుడూ ఆమెని అగౌరపరచలేదు. గానీ ఆమెలేని జీవితం స్మశానంలో ఒంటరి నడకలా ఇంత నిస్సహాయంగా ఉంటుందని మాత్రం ఊహించనే లేదు. పరమేశ్వరశాస్త్రి ఆలోచిస్తూ నీళ్ళలోంచి దోవచేసుకుని వెళ్తున్నాడు.     అలివేలు పోయినప్పుడు ఇద్దరు పిల్లలకు అమెరికా నించి రావటానికి కుదర్లేదు. నట్టింట్లో శవాన్ని పెట్టుకొని వాళ్ళకోసం ఎంతగానో ఎదురుచూశాడు. ఏదో ఆశ! అలివేలు పిచ్చిది! వాళ్ళకి జ్వరం వస్తే ఎన్ని రాత్రిళ్ళు నిద్రమానేసింది. ఎన్ని రాత్రిళ్ళు నిద్ర మానేసింది. ఎన్ని రోజులు అన్నం మానేసి సపర్యలు చేసింది... వాళ్ళకి మాత్రం అమ్మని కడసారి చూడటానికి తీరికేలేదు. పైగా అంతిమ సంస్కార దృశ్యాలు వీడియో తీసి పంపమని పెద్దాడు అంటే.     "ఎందుకన్నయ్యా! వేస్ట్ ఆఫ్ మనీ! చూసి ఏం చేస్తాం చెప్పు. బాధపడటం తప్ప" అంటూ వారించాడు చిన్నవాడు.     తన మనసు పాతాళంలోకి కుంగిపోయినా ఏమీ అన్లేకపోయాడు. "ఇల్లు అద్దెకిచ్చో అమ్మేసో మాతో వచ్చేయండి" పెద్దాడి సలహా.     పెద్దకోడలు పక్కకి వెళ్ళి ఏదో సైగ చేసింది. వాడే మళ్ళీ అన్నాడు.     "పోనీ ఇక్కడే ఏదైనా వృద్ధాశ్రమంలో... అక్కడికొస్తే ఎటూ మీకు తోచదు" నసిగాడు. చిన్నవాడు వంటపాడాడు. ఏదో చెప్పబోతున్న స్నేహితుడు నాగభూషణం చేయిపట్టుకుని సున్నితంగా ఆపాడు తనే.     ఈ పిల్లల కోసమేనా ఆటో ఎక్కితే డబ్బులు ఎక్కువ ఖర్చవుతాయనీ మైళ్ళ దూరం నడవటం, అన్నంలోకి రెండు ఐటమ్స్ చేసుకోకుండా ఒకటే చేసుకొని తినటం, పండక్కి బట్టలు మానేసి వాళ్ళకి పుస్తకాలు కొనటం...     "పోనీలేరా! కొన్నాళ్ళు చూద్దాం. అంతగా ఉండలేకపోతే ఏదో ఒకటి చేస్తాను" ఆ సంభాషణను తనే తుంచేశాడు. చాలా రిలీఫ్ గా ఫీలయిన కొడుకులు విషాదాన్ని నటిస్తూ ఆనందంగా అమెరికా ప్లయిట్ ఎక్కేశారు.     ఆలోచనల అలల మధ్య మరో అడుగు వేశాడు శాస్త్రి.     నీళ్ళ అలలు మోచిప్పల్ని చేప పిల్లల్లా చుట్టుకుంటూ చుట్టాల్లా పలకరిస్తున్నాయి. అలివేలు అస్థికల్ని ఇలా కృష్ణనీటిలో పెన్నిధిని జారవిడిచినట్లు కలిపేశాడు. ఇవ్వాళ మాత్రం మనసంతా ప్రశాంతంగా ఉంది.     "ఇంకెన్నాళ్ళండీ! ఈ రెండేళ్ళు కష్టపడితే నా బిడ్డలు రెండుచేతులా సంపాదించి మనల్ని నేలమీద నడవనివ్వరు" అలివేలు మాటలు నిజం అవుతున్నాయి. నేలమీద నడవనివ్వటం లేదు...     'స్వాతి'లో మాలతీచందూర్ గారు పరిచయం చేసిన నవల 'అమ్మకేమయింది' చదివి ఏడ్చేశాడు తను. నిజంగా తల్లికోసం అంతగా తపించే పిల్లలుంటారా? తమకంటూ ఒక కుటుంబం, ఒక ప్రపంచం ఏర్పడిన తర్వాత అమ్మ గురించి... ఆవేదనతో రెపరెపలాడే ఆమె జీవితం కోసం చేతులు కాపుకాసే పిల్లలుంటారా! పిల్లల కోసం తల్లిదండ్రులు చూపించే ప్రేమ, తపనల్లో కనీసం పదోవంతయినా పిల్లలు వాళ్ళ పట్ల చూపించలేరా?     భారంగా మరో అడుగేశాడు శాస్త్రి. నీళ్ళు తొడల దాకా వచ్చాయి. చిన్నప్పుడు నీళ్ళల్లో ఆడుతుంటే జలుబు చేస్తుందని గాభరాగా వళ్ళంతా తుడిచి బట్టలు మార్చేది అమ్మ. ఇవ్వాళ అమ్మ ఎందుకో మరీమరీ గుర్తొస్తున్నది.     దూరంగా కిట్టప్ప శాస్త్రికేసి ఆదుర్దాగా చూస్తున్నాడు. వాడి మోహంలో క్రమక్రమంగా ఆందోళన చోటు చేసుకుంటోంది. ఏదో అర్ధమయినట్లుగా శాస్త్రికేసి కుడిచెయ్యి ఊపుతూ గట్టిగా అరిచాడు.     "పంతులుగారూ! ఇంక లోతెళ్ళకండి. తొరగా బయటికి వచ్చేయండి" అని మళ్ళీ మళ్ళీ కేకలు పెడుతున్నాడు.     ఈ కేకలేవీ శాస్త్రి చెవులకి సోకినట్లు లేవు. సోకినా ఆయన పట్టించుకోదల్చుకోలేదేమో! అడుగులు పడుతూనే వున్నాయి. నీళ్ళు భుజాలదాకా వచ్చాయి.     కిట్టప్ప తీరం దగ్గర అటూ ఇటూ పరిగెడుతూ అరుస్తున్నాడు. వాడి గొంతులో దుఃఖపు జీర పంజరంలో పక్షిలా గిజగిజలాడుతోంది. నదిలోంచి శాస్త్రి కిట్టప్పకేసి చేతులూపాడు. ఇక వెళ్ళిపొమ్మన్నట్లు. కిట్టప్ప గుండె గుభేలుమంది .శాస్త్రి రెండుచేతులు పైకెత్తి పరమేశ్వరుడికీ, జన్మనిచ్చిన తల్లికీ నమస్కారం చేశాడు. ఆయన కళ్ళముందు చివరిగా జ్వర భారంతో దిక్కులేక తను మంచాన పడిన దృశ్యం, అలివేలు చావు మెదిలాయి.     "భగవంతుడా! తల్లిదండ్రుల మీద దయా ప్రేమ లేని పిల్లల్ని ఇచ్చేకన్నా గొడ్రాలుగా మిగుల్చు. నాలాంటి వారికి ఇచ్ఛామరణం ప్రసాదించు" అని చేతులెత్తి ప్రార్ధించాడు.     తర తరాల భారతీయ కుటుంబ సంస్కృతీ గోపురంలా ఆ నమస్కారం క్రమంగా గంగలో మునిగిపోయింది.      నేలమీద కూలబడి ఏడుస్తున్న కిట్టప్ప ఏవో గుర్తొచ్చినట్లు సంచీ తీశాడు. కొన్ని వందల కట్టలు... ఓ ఉత్తరం.. విప్పి చదివాడు.     నాయనా కిట్టూ,     నువ్వు జీర్ణించుకోలేని నిజం. ధర్మరాజు వెంట యమునిలా నువ్వు చివరిదాకా నా వెంట వచ్చావు. నా ఇల్లు నీ పేర రాశాను. ఈ డబ్బులో కొంత నా కర్మ కాండలకి వాడి మిగిలింది నువ్వు తీసుకో... నా శవసంస్కారం నువ్వే చేయి నా కొడుకులకి కబురు పంపక్కర్లేదు. నీకు చేతనైతే నీలాంటి అనాథని చేరదీయి. అలివేలమ్మ ఋణం ఇలా తీర్చుకో.. నీకు శుభం.. ఆశీస్సులతో.. శాస్త్రి.     కిట్టప్ప గుండెలు పగిలేలా ఏడ్వలేదు .శాస్త్రి వాడికి నేర్పిన చదువు ఆయన కడసారి కోరిక తెలుసుకోవటానికి ఉపయోగపడింది. కిట్టప్ప రాల్చే అశ్రుధారలు మానవసంబంధాల మీది నమ్మకాన్ని మళ్ళీ చివురింపజేస్తున్నాయి.             * * *

నవరాగం

నవరాగం - డా.భవానీదేవి టక్.. టక్.. టకాటక్... టక్ టక్...     టైపు రైటర్ మీద నాట్యం చేస్తున్న ప్రియాంక చేతివేళ్ళు ముచ్చటగా అన్పిస్తున్నాయి ప్రకాశరావుకు.     ప్రియాంక మాత్రం తల తిప్పి ఎటూ చూడటం లేదు. పని మీదే పూర్తి ఏకాగ్రతంతా! ఆ అమ్మాయికి తనలాగా సమస్యలేవీ లేవు అనుకోటానికీ వీల్లేదు. అయినా ఆఫీసు పని విషయంలో మాత్రం శ్రద్ధ చూపించటం చూస్తే ఎవరికయినా ప్రియాంక అంటే పూర్తి గౌరవభావం కలుగుతుంది. ఆ అమ్మాయి కేసి చూస్తుండిపోయాడు ప్రకాశరావు.     చామన ఛాయ, ఒక మాదిరి పొడవు, విశాలమైన అందమైన కళ్ళు, సన్నని పెదవులు. పెద్ద అందగత్తె అనిపించదు. కానీ ఆకర్షణ మాత్రం ఆ నవ్వులోనే ఉంది. స్వచ్చమైన పాలమీది మీగడలా పసిపిల్లలా ముగ్ధంగా నవ్వుతుంది.     ఆ నవ్వుకు మాత్రం ప్రకాశరావు మనసు దూదిపింజలా తేలిపోతుంది. హృదయ భారమంతా కరిగిపోయి శరత్కాలంలో వెన్నెల నిండినట్లవుతుంది. ఒక్కరోజు సెలవు పెట్టాలన్నా ఆమె నవ్వు చూడకపోతే ఎలా అనే దిగులు!     ప్రియాంక దేనికోసమో ఓ క్షణం టైపు చేయటం ఆపి పక్కకి తిరిగింది. టేబుల్ మీది పేపర్ వెయిట్ ను సరిగ్గా జరుపుతూ అప్రయత్నంగా కళ్ళు తిప్పి చూసింది. తనవైపే తదేకంగా చూస్తున్న ప్రకాశరావును చూసి ఓ నవ్వు గులాబీ హాసంలా విసిరి మళ్ళీ పనిలో నిమగ్నమయింది.     వెన్నెల కిరణం సూటిగా వచ్చి తాకినట్లయింది. ఇంక అతని మనసు పనిమీద లగ్నం కావటం లేదు .ప్రియాంక అంత హాయిగా ఎలా నవ్వగల్గుతుంది! చూచాయగా ఆఫీసు వాళ్ళు అనుకుంటుంటే విన్నాడు. ఆమె చుట్టూ ఎన్నో ముళ్ళ కుంచెలున్నాయని... ఆ కుటుంబానికి ఆమే ఆధారమని.. మళ్ళీ మనసునిండా దిగులు కమ్ముకుంది.     "ప్రియాంక తండ్రి బాగా బతికిన వాడనీ, పూర్వీకుల ఆస్తి వందెకరాల దాకా ఉండేదనీ, మితిమీరిన వ్యసనాల వల్ల ఆస్తి హారతి కర్పూరంలా హరించుకు పోయిందనీ..."     ఆఫీసు వాళ్ళు కష్టపడి సేకరించిన సమాచారం ఇంకా చాలా ఉంది.     ప్రియాంకకు చాలా సినిమా కష్టాలున్నాయట. వాళ్ళమ్మ గుండెజబ్బు మనిషి. పెళ్ళికి ఎదిగి కళ్ళతోనే ప్రశ్నిస్తున్న చెల్లెలు, చదువుకుంటున్న తమ్ముడు, ఇలా... ఇన్ని బాధ్యతల్నీ, భారాలనూ గుండెల్లో దాచుకుని చాలీచాలని జీతంతో చిరునవ్వులు చిందిస్తూ పనిలో కూడా అంత ఏకాగ్రత చూపటం ప్రియాంకకు ఎలా సాధ్యం! ప్రకాశరావుకు అస్సలు అర్ధంకాని ప్రశ్న ఇదే! టైపు చేయటం పూర్తయినట్లుంది.     సన్నని వేళ్ళతో మిషన్ మీది కాయితాలన్నీ తీసి సీట్లో కూర్చొని సరిచూసుకుంటోంది ప్రియాంక. ఆమె పెదవుల మీద పారిజాతం మొగ్గ విరియబోతున్నట్లు అదే నవ్వు!     "హలో...బ్రదర్... టీకి వస్తారా"     ముత్యాలరావు చెయ్యి భుజం మీద పడటంతో ఉలిక్కిపడ్డాడు ప్రకాశరావు.     'ఆ! పదండి' మొహమాటంగానే లేచాడు. ప్రియాంక తలెత్తటం లేదు. ఆమె నవ్వు మరోసారి చూద్దామనుకున్న ప్రకాశరావుకు నిరాశ మిగిలింది. ముత్యాలరావుతో కలసి అయిష్టంగానే క్యాంటిన్ వైపు నడిచాడు.     ఆఫీసునుంచి సాయంత్రం ఇంటికి బయల్దేరిన ప్రకాశరావుకు గుండె నిండా దిగులు గుబులు.     రోజూ దాదాపు ఇలాగే ఉంటుంది. కానీ ఇవ్వాళ మరీ దిగులుగా ఉంది.     గుమ్మంలో దుర్గ కాళికా రూపాన్ని ఊహించుకుంటేనే గుండెల్లో దడగా ఉంది.     పదిహేను రోజులుగా భార్య కోరిన శ్రావణ మాసపు పట్టుచీర కొనాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇంక రేపు వరలక్ష్మి వ్రతం. దుర్గ బతకనిస్తుందా! అప్పు కూడా ఎవరిస్తారు? పట్టుచీర అంటే మూడు వేలయినా కావాలి. 'మన కుటుంబ ఆర్ధిక పరిస్థితి ఇదీ' అని దుర్గకు బుజ్జగించి చెప్పినా అర్ధమయి చావదు. మనసులోనే భార్యపై చిరాకుపడ్డాడు.     ఇక తప్పదన్నట్లు జేబుల్ మీది కాయితాలన్నీ సర్దేశాడు. ఫైల్స్ మూసేసి, జేబులోంచి కర్చీఫ్ తీసి గట్టిగా ఓసారి మొహం తుడుచుకున్నాడు.     ఆఖరి అవకాశాన్ని ఉపయోగించుకోక తప్పదు. అటూ ఇటూ చూశాడు. అంతా జారుకున్నారు. ప్రియాంక కూడా వర్క్ క్లోజ్ చేసి హ్యాండ్ బ్యాగ్ లో లంచ్ బాక్సు సరిచేసుకుంటోంది. మనసు కూడదీసుకుని ధైర్యం చేశాడు.     'ప్రియాంక గారూ!'     చురుగ్గా చూసిందామె. కళ్ళతోనే ఏమిటన్న ప్రశ్న!     'మీతో కొంచెం మాట్లాడాలి.'     'మాట్లాడండి.... ఏమిటి ప్రాబ్లం' సానుభూతిగా అడిగింది.     ఆ సానుభూతినే అతను భరించలేకపోతున్నాడు. ఫ    'ఇక్కడ కాదు. అలా ట్యాంక్ బండ్ మీదికెళ్దాం' అన్నాడేగానీ బిక్కుబిక్కు మంటున్నాడు. ప్రియాంక సమాధానం ఏమిటో తెలిసేదాకా ప్రతిక్షణం నరకమే! ఈడ్చి తన చెంపమీద కొడితేనో! భయం వేసింది.     'పదండి' చల్లగా నవ్వింది.     మనసులోకి కొత్త శక్తి ప్రవేశించినట్లయింది.     ఇద్దరూ ట్యాంక్ బండ్ వైపు నడుస్తున్నారు మౌనంగా. ఒకరిద్దరు తెల్సిన వాళ్ళు కన్పించి విడివిడిగా విష్ చేశారు. ఇద్దరూ తిరిగి వాళ్ళకి విష్ చేశారు గానీ మాట్లాడుకోలేదు. మరికొందరు తెల్సినవాళ్ళు ఇద్దర్నీ విచిత్రంగా చూస్తూనే వెళ్ళిపోయారు.     టాంక్ బండ్ మీద అంతగా జన సంచారం లేని చోటు చూసుకొని ఓ బెంచ్ మీద కూర్చున్నారు.     గాలికి ఎగిరిపడే ముంగురుల్ని సరిచేసుకుంటూ హుస్సేన్ సాగర్ లోని అలలకేసి చూస్తుంది ప్రియాంక. గాలికి ఎగిరే కొంగును చుట్టూ తిప్పి భుజాల మీదుగా కప్పుకుంది.     ఈమెలో ఎంతటి ప్రశాంతత! మరొకరైతే ఇలా రమ్మన్నందుకు ఎన్ని అపార్ధాలో! ఎవరో ఎందుకు. దుర్గకీ సంగతి తెలిస్తే!     అమ్మో! గుండెలు గుబగుబలాడాయి.     అలలమీంచి తేలివస్తూ అపర కాళిలా దుర్గే కన్పిస్తోంది.     అసలు బుద్ధుడి విగ్రహం బదులు... తన భార్య విగ్రహం పెట్టేస్తే హుస్సేన్ సాగర్ లోకి దూకి ఆత్మహత్య చేసుకునే ధైర్యం ఎవ్వరికీ ఉండదేమో!     తన ఆలోచనలకు తనకే నవ్వొచ్చింది ప్రకాశరావుకు. అతన్ని చూస్తే ఆమెకు చిత్రంగా అన్పిస్తోంది. తనతో మాట్లాడాలని. ఇంత దూరం పిలిచి ఈ మౌనం... గాంభీర్యం... అసభ్యంగానూ ప్రవర్తించడు... తనపట్ల గల గౌరవం, ఆరాధన... స్పష్టంగా ఆ కళ్ళే చెప్తాయి. నలిగిన బట్టలు, దైన్యమైన చూపులు ఏదో పోగొట్టుకున్నట్లు. తెలివైన వాడే! పనిలో మనసు పెట్టకుండా ఆఫీసర్ చేత తిట్లు తింటుంటే తనే అతనికి సాయం చేస్తుంది. చిన్నపిల్లాడిలా సంతోషపడతాడు.       ఇంకా ఎంత సేపిలా... కాలం హెచ్చరిస్తోంది.     'చెప్పండి' సూటిగా ధ్వనించిన ఆమె స్వరానికి ఉలిక్కిపడ్డాడు.     "మా ఆవిడ...అదే...దుర్గ..." నాన్చాడు నీళ్ళు నములుతూ.     "విషయం ఏమిటి?" కొద్దిగా విసుక్కున్నట్లుగా అంది.     "రేపు వరలక్ష్మీ వ్రతానికి పట్టుచీర కొనాలి. మూడు వేలు అప్పిస్తే మెల్లగా తీర్చేస్తాను. మీరు జి.పి.యఫ్ లోను తీసుకున్నారని అడిగాను. మీకు అభ్యంతరం లేకపోతేనే" గబగబా చెప్పేసి చివర్లో నసిగాడు.     "అప్పు చేసి కొనాలా! మీ దగ్గర డబ్బుల్లేవని మీ భార్యకు చెప్పారా!"     దెబ్బతిన్న పక్షిలా విలవిలలాడాడతను.     "చెప్పలేదు. చెప్పినా అర్ధం చేసుకోదు. గొడవ చేస్తుంది" నిట్టూర్చాడు.     జాలిగా చూసింది.     ఈ మాట కోసం ఇంతదూరం రావాలా! అన్న భావన మెదిలింది ఆమెలో. కాని పెదవి దాటి పదం కాలేకపోయింది.     "లోన్స్ ఏవీ రావా?" అడిగింది ఆలోచిస్తూ.     తల అడ్డంగా ఊపాడు.     "నేనివ్వగలను కానీ ఇలా అప్పులు చేసి ఆమె కోరికలు తీర్చటం వల్ల మీ చుట్టూ ముళ్ళు ఇంకా బిగుసుకుంటాయి. మీ కుటుంబ ఆర్ధిక పరిస్థితి గురించి మీ భార్యతో చర్చించండి. నచ్చజెప్పండి. మీ సమస్యల్లో ఆమెనూ భాగస్వామిని చేయండి."     బ్యాగ్ లోంచి మూడు వేలు తీసి లెక్కపెట్టి ఇచ్చింది.     రెండు నెలలలోపు తిరిగి ఇవ్వాలి! ఖచ్చితంగా అంది.     అతను డబ్బు చేతిలో పట్టుకొని కృతజ్ఞతగా చూసి మహాద్భాగ్యంగా 'సరే' అన్నట్లు తలూపాడు. బస్సేదో ఆగింది. ఆమె సెలవు తీసుకొని వడివడిగా బస్సెక్కి కదిలిపోయింది.     ఆనాటి సంఘటన అతని జీవితాన్ని మరింతగా ప్రభావితం చేసింది.     మగవాడి జీతం గురించి భార్యకి తెలియకూడదనీ, ఆమెకి కావలసిన సౌకర్యాలు సంపాదించి పెట్టటమే అతని పని అనే భావజాలంలో పడికొట్టుకుంటూ, కుటుంబ ఆర్ధిక పరిస్థితి గురించిన అవగాహన లేకుండా, అసలు పట్టించుకోకుండా కోరికల పర్వతాలెక్కలేక, తనతోపాటు భర్త జీవితాన్ని నరకప్రాయం చేసే భార్యలూ, వారినలా అజ్ఞానంలోనే మగ్గబెట్టే భర్తలూ ఉన్నారు. భార్యతో తన జీతం గురించి చెప్పటం, కుటుంబ ఖర్చుల గురించి చర్చించటం చిన్నతనంగా భావించే భర్తలున్న ఈ వ్యవస్థలో భార్యకి ఆమె బాధ్యతను విడమర్చి చెప్పేదెవరు?     ప్రకాశరావు ఆలోచనా లోచనాలు విప్పార్చుకుని చూస్తున్నాయి. దుర్గకి తన జీతం, ఇంటి ఖర్చుల గురించి అర్ధమయేలా మెల్లమెల్లగా చెప్పసాగాడు.     ఆడవాళ్ళ వయసు. మగవాళ్ళ జీతాన్ని ప్రశ్నించరాదన్న నిర్ణయం దుర్గలో సడలిపోతున్నది.     "నాక్కావల్సింది. కొనటం మీ బాధ్యత" అనే దుర్గ ఆలోచనలు మారిపోతున్నాయి. భర్త ఆదాయం గురించి అతని కష్టసుఖాల గురించి పట్టించుకొని ఇంటి ఖర్చులో పొదుపు చేయటాన్ని అలవాటు చేసుకుంటున్నది.     "ఆ వస్తువు ఇప్పుడొద్దు లెండి. వచ్చేనెల చూద్దాం" అనటం మొదలుపెట్టిన దుర్గకేసి ఆశ్చర్యంగా అభిమానంగా చూస్తున్నాడు ప్రకాశరావు.     ప్రియాంక సలహా తమ కుటుంబంలో చాలా మార్పు తీసుకువచ్చింది. ఆమెతో స్నేహం తన జీవితంలో సరికొత్త ద్వారాలను తెరిచింది.     "అన్నీ నీకు చెప్పాలా! ప్రతి పైసా ఖర్చు గురించి ఆడవాళ్ళకు చెప్పటం, మా ఇంటా వంటా లేదు. ఆడపెత్తనం చేయటానికి నేనొప్పుకోను..." లాంటి మాటలకి దూరంగా, ఆ ఇంట్లో ఆరోగ్యకరమైన పరిణామాలు ఏర్పడుతున్నాయి.     "ఆడవాళ్ళకేం తెలుసు. వాళ్ళకి ఉద్యోగాలిస్తే ధ్యాసంతా ఇంటి మీదే! పని సరిగ్గా చేయరు అనేవాళ్ళు, తేలిగ్గా మాట్లాడేవాళ్ళు ప్రియాంకను చూస్తే ఎన్నటికీ అనుకోలేరు" అనుకున్నాడు ప్రకాశరావు.     "మీరు చిన్న చిన్న చేబదుళ్లు తగ్గించాలి" ప్రియాంక సలహా ఇచ్చిందతనికి ఒకరోజు.     ఆమె పెదవులపై విసిరిన హాసం చూస్తూ 'నిజమే' నిజాయితీగా అంగీకరించాడు.     "నన్నడిగారని కాదు. అలా అడగటం వల్ల ఆఫీసులో చీప్ అయిపోతారు." ప్రియాంక ఎనలైజ్ చేసింది. క్రమంగా ప్రకాశరావులో చాలా మార్పు కన్పిస్తోంది. చిన్నచిన్న అప్పులు తీర్చేశాడు. అతికష్టం మీద సిగరెట్లు తాగటం మానేశాడు. ఇంటికి వెళ్ళేటప్పుడు కూతురికి చిన్న గిఫ్ట్ ఇస్తే ఆ పాప గుండెల్లో పొంగే ఆనందం ముందు సిగరెట్ తాగే ఆనందం ఏపాటిది అన్పిస్తోంది. ఇస్త్రీ బట్టలతో సంతోషంగా ఉండాలని ప్రయత్నిస్తున్నాడు... పని తీరు కూడా మెరుగ్గా ఉంది.     ఆఫీసు స్టాఫ్ కి ప్రకాశరావులో వచ్చిన మార్పు నచ్చటంలేదు. ప్రియాంకతో అతని స్నేహానికి కొత్త రంగులు అద్దారు. భాష్యాలు చెప్తున్నారు. ఇంకా ప్రకాశరావు చెవిదాకా సోకలేదవి.     "సాయంత్రం ఓసారి మా యింటికి వస్తావా" ఎన్నడూ లేనిది ప్రియాంక హఠాత్తుగా అతన్ని ఆహ్వానించింది. ముందే ఆవిడ గుర్తులు చెప్పేసింది గాబట్టి ఇంటి అడ్రస్ కనుక్కోవటం పెద్ద కష్టమేం కాలేదు.           రామ్ నగర్ లో మెయిన్ రోడ్డుకు కొంచెం లోపలిగా పొందికగా... చిన్న ఇల్లు ఆధునికంగా ఉండే సౌకర్యాలేమీ లేకపోయినా హాయిగా అన్పిస్తోంది. ముందున్న కొద్ది జాగాలోనే గులాబీ మొక్కలు పూలతో... ఆకర్షణీయంగా.     "రండి కూర్చోండి...!! ఆహ్వానించింది ప్రియాంక నవ్వుతూ. ఆఫీసులో అంత పనిచేసినా ఫ్రెష్ గా కన్పిస్తోంది.     ప్రకాశరావును చెల్లెలికీ, తల్లికీ, తమ్ముడికీ పరిచయం చేసింది. తండ్రి మరణం వల్ల ఇంటి బాధ్యత ఆమె తీసుకుంది. ఒక గంటసేపు ఆ ఇంట్లో గడిపితే అతనికి అర్ధమయింది. అమృతం తాగినంత శక్తి వచ్చింది ప్రకాశరావుకు.     అసంతృప్తి, నిరాశలు మనిషిని ఇంకా కుంగదీస్తాయి. జీవితం పట్ల అవగాహనతో ఎన్ని సమస్యలున్నా అన్ని పరిష్కారాలూ ఉంటాయన్న నమ్మకంతో కృషి చేస్తే ఇక వేదనకి చోటేముంటుంది.     ప్రియాంక పట్ల ఆ ఇంట్లో ప్రతి ఒక్కరూ చూపించే ప్రేమ, అనుబంధం ఆమెకు జీవన సమరానికి కావలసిన శక్తినిస్తున్నాయి. ఆత్మస్థైర్యంతో ఆమె ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తోంది.     ప్రకాశరావుకు చీకట్లోంచి వెలుగులోకి వచ్చినట్లుంది. నా అనుకున్నవారి అనురాగం, ఆప్యాయతలు, అండదండలుంటే ఎన్ని కష్టాలైనా చిరునవ్వుతో ఎదుర్కోవచ్చు. రంగులు పులిమే కుసంస్కారులను పట్టించుకోనక్కర్లేదు. ఇంటిదారి పట్టిన ప్రకాశరావు మనసు పచ్చని పంట చేనులా నాట్యమాడుతూ నవరాగాన్ని ఆలపిస్తోంది.  

నాలో నేను

    నాలో నేను - గీత జోరున వర్షం....ఎప్పుడు ఆనందాన్ని ఇచ్చే ఆ హోరు ఎందుకో ఇప్పుడు కలవర పెడుతుంది....ఇనాళ్లు ఏదో కోల్పోయాను అని బాధపడే నాకు వాళ్ల ఆస్థీత్వాన్నే కొల్పోతున్న ఈ తరం పిల్లల్ని చూసి...నువ్వేం కోల్పోయ్యావు అని మనసు ఎదురు ప్రశ్న వేస్తుంది...సమాధానం  దొరికితే కదా...దానికి నచ్చచెప్పటానికి.....ఇంతగా నా మనసు నన్ను నన్ను గా  నిలవనివ్వక పోవటానికి కారణం....జీవితం లో ఎవ్వరు అందుకోనంత ఎత్తుకు ఎదగాలని.....ఎదో సాధించాలని.....ఇంకా తేలిగ్గ చెప్పాలంటే నాకు నేను నచ్చాలని కోరుకోవటమే...పరిస్ధితులు ఏవైతేనేం.....చిన్నతనం పెళ్లి...పిల్లలు...బంధాలు...బంధుత్వాలు...భాద్యతలు....సర్దుబాట్లు....పైకి అన్ని బావునట్టే వున్న ఏదో తెలియని వెలతి మనసు పొరల్లో.....అందుకే నాక్కావాల్సీన ప్రపంచం కోసం వెతకటం ప్రారంభించాను..ఉద్యోగ పర్వం అంటూ బయలుదేరాను...బయట రంగుల ప్రపంచం ఇంత బావుటుందా అనిపించింది..సీతకోక చిలుకల్లా ఎగిసి పడుతున్న ఈ తరం అమ్మాయిల్ని చూసి మహ ముచ్చటేసింది....చదువు...కమిట్ మెంట్..సాధించాలి అనే తపన తో పాటు స్త్రీ సహజత్వం.. చిన్నపాటి చిలిపితనం..కాస్తంత గడుసుతనం...కలసిన నేటి మహిళలు అనిపించే మఘువలు...అబ్బురపరిచారు...కాని ఈ కధ నాణాణి కి ఓ వైపే...మరో వైపు ఆడతనం అనే చేపను   మగవాడి బలహీనతకు ఎర వేసి...ఎదగటం...ఇల ఒకరితో కాదు పనికివచ్చే ప్రతివాడితో....వాళ్లను వాళ్లు కోల్పోతూ.....వాళ్ల ఆస్థిత్వన్ని తాకట్టు పెడుతూ....అందరాడపిల్లలు ఇలానే వున్నారు అని కాదు కాని చాలా మటుకు ఉన్నతంగా ఎదగాలి అంటే ఇదే సులువైన మార్గం అనుకుంటున్నారు...అందుకే ఆ దారి వెంట గుడ్డిగా ప్రయాణిస్తున్నారు....పూల దారి అనుకుంటూ రక్తసిద్దమైన పదాలు పట్టించుకోకొండ భావిత అంటూ భ్రమపడుతున్నారు....మారుతున్న కాలం లో ఇది తప్పు కాక పోవచ్చు..మనసు అంగీకరించనూవచ్చు....కాని  ఈ మార్పుకి కారణం...సంపాదనే పరమావధి అని నేర్పుతున్న తల్లదండ్రులదా....మార్కలే మనిషి తెలివి కి కొలమానాలు అని నేర్పుతున్న విద్యావ్యవస్ధదా....సంస్కారం నేర్పలేకపోతున్న సమాజానిదా...ఎవరు భాద్యత వహించిన....మనని మనం కొల్పోతున్నాం అనేది మాత్రం వాస్తవం....ఎవరి జీవితం వారి ఇష్టం అని ముసుగు వేస్తున్నాం...ఎలా అని కాదమ్మ ఎదిగామా లేదా అనేది పాయింట్ అంటూ అంకెలు అందుకోవటం లో మనని మనం వెత్తుకుంటున్నాం...నా ఆలోచన ల వేడి పెరుగుతుంటే వాన జోరు కొద్ది కొద్ది గా తగ్గుతుంది...చల్లని గాలి మెల్లగా చెక్కిలిని మీటుంది....అర్దంలేని ఈ అలోచనలు కు జవాబు దొరకాలి అంటే ఇంకోంచం ఎదిగి ఆలోచించు అంటుంది......నిజమే నా పరం గానే ఎందుకు ఆలోచిస్తున్నా...నాకు అస్ధిత్వం ..వ్యక్తిత్వం అనిపించేవి వారికి తుఛ్చమైనవి కావచ్చుగా వాళ్ల పరం గా వాళ్లకు నచ్చినట్టుగా వారి జీవితాన్ని మలుచుకోవటమే పరిపూర్ణమైన సంతోషాన్ని వారికి ఇవచ్చుగా...మనుకు తెలిసిందే మనుకు అనుకూలంగా వున్నదే మంచి అనుకుంటే ఎలా...మనిషి మారుతున్నాడు...విలువలు మారుతున్నాయి....మారుతున్న కాలం తో నువ్వు మారకపోయినా....మార్పును అంగీకరించటం లో తప్పులేదు కదా...వర్షం పూర్తిగా తగ్గింది..మనసు తేలిక పడింది....  

నడక

నడక - డా. సి భవానీదేవి సులభకి ఇప్పటికీ నమ్మబుద్ధి కావడంలేదు. టైపు యాంత్రికంగా చేస్తున్నదికానీ మనసు ఆ పని మీద లగ్నం కావటంలేదు. మాటిమాటికీ కుమార్ నవ్వు మొహం కళ్ళ ముందు కదులుతోంది.     తీక్షణంగా ఉండే ఆ చూపు, నవ్వే పెదవులు, అందమైన మీసకట్టు ఒక్కక్షణం ఉలిక్కిపడింది సులభ. ఏమిటివ్వాళ తన మనసు ఇలా వశం తప్పుతున్నది!     ఒక పురుషుడి పట్ల ఆకర్షణ పెంచుకోటానికి సులభ పెళ్ళిగాని కన్య కాదు. ఇద్దరు బిడ్డల తల్లి! భర్తను కోల్పోయిన అభాగిని! కళ్యాణ్ సడన్ గా హార్ట్ ఎటాక్ తో మరణించటం వల్ల అతను పనిచేసే బ్యాంక్ లోనే ఆమెకి ఉద్యోగమిచ్చారు. సులభను చూస్తే ఇద్దరు పిల్లల తల్లిలా అనిపించదు. పచ్చగా, సన్నగా, హుందాగా తీర్చినట్లుండే సులభ వ్యక్తిత్వాన్ని బ్యాంక్ స్టాఫ్ అంతా గౌరవిస్తారు. వాళ్ళంతా కళ్యాణ్ స్నేహితులే! అందుకే ఆమెకే సహాయం కావాలన్నా చేస్తారు.     ఆ ముందురోజు సాయంత్రం ఇంటికి వచ్చిన కుమార్ మాటలు ఆమె హృదయంలో మళ్ళీ మళ్ళీ అలజడిని రేకెత్తిస్తున్నాయి. ఆ మాటలు ఆమెను అల్లకల్లోలం చేసే సమస్యల వలయంలోకి నెడుతున్నాయోమో అన్నంతగా డిస్ట్రబ్ అవుతోంది సులభ.     "నువ్వొప్పుకుంటే నిన్ను పెళ్ళిచేసుకుంటాను సులభా!" ఆప్యాయంగా అడిగాడు కుమార్.     ఆ గొంతులో జాలి లేదు. అనురాగం, అభిమానం ధ్వనిస్తున్నాయి.     'నన్నా!' దిగ్బ్రాంతికి లోనయింది సులభ.     ఇతనిలో తనపట్ల ఇలాంటి ఉద్దేశ్యం ఉందా! నమ్మలేక పోతోందామె. ఎందుకంటే కుమార్ కళ్యాణ్ కి ప్రాణ స్నేహితుడు. అటువంటి వ్యక్తి ఇప్పుడిలా అడగటం ఆమెను అప్రతిభురాల్ని చేస్తోంది.      "సులభా! నేనీ నిర్ణయం తీసుకోవటానికి ముందు బాగా ఆలోచించాను. ఆ కారణాలన్నీ నీతో చెప్పకుండా దాచలేను. మనం చాలాకాలంగా కుటుంబ స్నేహితులం. నా గురించి నీకూ, నీ గురించి నాకూ పూర్తిగా తెలుసు. నా భార్య చనిపోయేనాటికి వికాస్ కి తొమ్మిదేళ్ళే గదా! ఇంకా వయసులోనే ఉన్నాననీ, నన్ను మళ్ళీ పెళ్ళిచేసుకోమని అంతా వత్తిడి చేశారు. నీకు తెలుసో లేదో గానీ కళ్యాణ్ కూడా ఒకటి రెండు సంబంధాల గురించి చెప్పాడు. నేను మళ్ళీ పెళ్ళి చేసుకుంటానన్న వార్త వింటూనే వికాస్ గదిలో తలుపులు బిడాయించుకుని మూడు రోజులు నిద్రాహారాలు మాని ఏడుస్తూ కూర్చున్నాడు. నా కొడుకును బయటికి రప్పించడానికి నేను వాడికి చాలా వాగ్దానాలను చేయాల్సి వచ్చింది. తర్వాత కాలంలో నాకు రెండో పెళ్ళి ప్రస్తావన ఎవరు తెచ్చినా, వికాస్ తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. తల్లి లేని కొడుకన్న మమకారంతో వాడికి అవసరానికి మించిన స్వేచ్చ ఇచ్చాను. నాకు డబ్బుకు లోటు లేదు. వాడిని వ్యాపకం కోసం బిజినెస్ లో పెడదామన్నా, ఉద్యోగంలో పెడదామన్నా వినే స్థితి దాటిపోయాడు. సరైన పెంపకం లేక, తల్లి ప్రేమ కరువై ఇలా చెడు స్నేహాలకు అలవాటుపడ్డాడు..."     "మరి ఇప్పుడుమాత్రం నన్ను చేసుకుంటే..." మధ్యలోనే అడిగింది సులభ సందేహం వెలిబుచ్చుతూ.     ఇప్పుడు వాడికి ఇల్లుపట్టడం లేదు. ఆమధ్య నేను వూళ్ళో లేనప్పుడు వరసగా పదిరోజులు ఇంటికే రాలేదుట. అడిగితే 'నాయిష్టం' అన్నాడు. 'నా జీవితం నాది... వాడి జీవితం వాడి'దని నిర్లక్ష్యంగా జవాబిచ్చాడు.     అతని గొంతులో కొడుకు మీద కోపంకన్నా తనపట్ల వాడికి ప్రేమ లేదన్న బాధ ధ్వనిస్తోంది.     "మరి ఈ పెళ్ళి వల్ల... వికాస్..." సులభ ఆర్దోక్తిగా ఆగింది.     "వికాస్ శ్రేయస్సు కోరి... నాకు మనశ్శాంతి కోసమే ఈ పెళ్ళి... నా భార్య మరణించి ఇంత కాలమైనా నేను పెళ్ళి చేసుకోవాలని మనస్పూర్తిగా అనుకోలేదు. అలాగని నీ పరిస్థితిని అడ్వాంటేజ్ గా తీసుకున్నానని మాత్రం భావించవద్దు. నీకు అభ్యంతరాలేవీ లేకపోతేనే... బాగా ఆలోచించు... నీ సహనం, పిల్లల పట్ల నువ్వు చూపించే ప్రేమ... వికాస్ లో నేను కోరుకున్న మార్పును తీసుకొస్తాయనే నా నమ్మకం! నువ్వే ఒక నిర్ణయం తీసుకో! పెళ్ళి అయినాక నువ్వు ఉద్యోగం మానేస్తే నాకభ్యంతరం లేదు. ఆర్ధికంగా అయితే ఆ అవసరం ఉండదు. ఆ ఉద్యోగం వల్ల కళ్యాణ్ జ్ఞాపకాలు నిన్ను బాధిస్తాయనే ఇలా అంటున్నాను. లేదా ముందు లాంగ్ లీవ్ అప్లయ్ చేసి తర్వాత ఆలోచించి నిర్ణయం తీసుకో!" అంటూ వెళ్ళిపోయాడు కళ్యాణ్.     అతని మాటలకు సులభ మనస్సు ఉక్కిరి బిక్కిరయింది. ఎటూ నిర్ణయించుకోలేకపోతోంది. తనను గురించి లోకం ఏమనుకుంటుంది? మరుక్షణంలో తల విదిలించి ఆ ఆలోచనను దూరంగా నెట్టివేసింది.     కళ్యాణ్ కట్నకానుకల కోసం మానసికంగా హింసించాడేగానీ భర్తగా మమతానురాగాలను ఏనాడూ పంచలేదు. అతని ఉమ్మడి కుటుంబంలో.... హక్కుల్ని మర్చిపోయి బాధ్యతల్ని మౌనంగా భరించింది తాను. అయినా ఆ విషయాన్ని కళ్యాణ్ ఏనాడూ గుర్తించలేదు.     పెళ్ళి చేయగానే పుట్టింటివాళ్ళు తనను పరాయిదాన్ని చేశారు. భర్త అంతగా హింసించినా పట్టించుకోని సమాజం తన రెండో పెళ్ళి గురించి పట్టించుకున్నా తను మాత్రం కేర్ చేయదు... అంతే.... ఆమె ఆలోచనలకు ఒక ఆలంబన దొరికింది.     ఇద్దరు పిల్లల్ని దగ్గరకు పిలిచింది.     "ఇంక మీ ఇద్దరికీ ఏలోటూ రానివ్వను" ఇద్దర్నీ గాఢంగా హృదయానికి హత్తుకొంది.     అమ్మ ఎందుకీ వేళ వింతగా ప్రవర్తిస్తున్నదో అర్ధంకాని పదిహేనేళ్ళ కొడుకు అవినాష్, పదమూడేళ్ళ కూతురు రేఖ చూస్తుండిపోయారు తల్లికేసి. తల్లి అంతగా ఆనందపడటానికి కారణం మరో పదిహేను రోజులకు వాళ్లకు అర్ధమయింది.     సులభ కుమార్ ని యాదగిరిగుట్టలో పెళ్ళి చేసుకుందన్న వార్త బంధుజనాలలో కార్చిచ్చులా వ్యాపించింది. విన్న వాళ్లంతా దిగ్భ్రమ చెందారు. ఆమె తన బ్యాంక్ ఉద్యోగానికి రిజైన్ చేసిందన్న వార్త చర్చనీయాంశంగా మారింది. స్వయానా సులభ తండ్రే ఈ వివాహాన్ని వ్యతిరేకించాడు.      భ్రష్టురాలా! మన వంశంలో ఇంటా వంటా లేని అప్రాచ్యపు పనిచేశావు. నువ్వు చచ్చావనుకొంటాను. ఇంక ఈ ఇంటి గడప తొక్కొద్దు" శాసించాడు గడపలోనే.     కళ్ళొత్తుకుంటూ నిలబడిపోయిన తల్లి మనసు చేసిన పనిని వ్యతిరేకించకపోయినా కూతుర్ని మాత్రం ఆదరించలేకపోయింది... సంఘం, భర్త అంటే వున్న భయం వల్ల.     "కనీసం సంవత్సరీకం అయ్యేదాకన్నా ఆగాల్సింది" తమ్ముడు లోలోపలే గొణుక్కుంటుంటే వినలేక బరువెక్కిన హృదయంతో పుట్టింటికి శాశ్వతంగా వీడ్కొలిచ్చి వచ్చేసింది సులభ.     ఒక పదిహేను రోజుల్లోనే సులభ ఆర్ధిక పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి. అద్దె ఇల్లు ఖాళీచేసి కుమార్ ఇంటికి పిల్లలతో సహా మారిపోయింది.     పెద్దఇల్లు... ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ఒక గది. వంటమనిషి వంటచేసి డైనింగ్ టేబుల్ మీద సర్దేసి వెళ్ళిపోతుంది. పనిమనిషి, డ్రైవర్... ఇంటి ముందు ఖాళీస్థలంలో రకరకాల పూలమొక్కలు, లాన్ ఉన్నాయి. పని చాలా తగ్గిపోయి చాలా విశ్రాంతిగా హాయిగా అనిపిస్తోంది సులభకు. ఇరుకుగదిలోంచి ,విశాల మైదానంలోకి వచ్చినట్లు అన్పిస్తున్నది.     కుమార్ కొడుకు వికాస్ కి మాత్రం తండ్రి చేసిన పని అసలు నచ్చలేదని అతని వైఖరే చెబుతుంది. గ్రాడ్యుయేట్ అయినా గమ్యం నిర్ణయించుకోలేని అతడు సులభనుగానీ, పిల్లల్నిగానీ పలకరించలేదు. సులభే పలకరిస్తే ముభావంగా ఊ...ఆఁ లతో సరిపెట్టి వెళ్ళిపోయి ఎక్కువ టైము బయటే గడుపుతున్నాడు.     వికాస్ పద్ధతి నచ్చకపోయినా కాలక్రమంలో తనే తెల్సుకుంటాడని వూరుకున్నాడు కుమార్. సులభకు కూడా అలాగే నచ్చజెప్పాడు.     క్రమక్రమంగా వికాస్ అవినాష్, రేఖలతో మాట కలపడం మొదలుపెట్టాడు. ప్రత్యేకించి రేఖను చూస్తుంటే అతనికి కొత్తప్రపంచం పరిచయమైనట్లుగా  అన్పిస్తుంది. ఆ అమ్మాయి మాత్రం అతనికి పరాయిగా అనిపించటం లేదు. సులభను తల్లి స్థానంలో చూడలేకపోతున్నా రేఖ అతనికి ఓ ఆకర్షణగా మారింది. ఫలితంగా వికాస్ కొంత టైమ్ ఇంటిపట్టునే ఉండటం మొదలుపెట్టాడు. ఈ మార్పు సులభ, కుమార్ ల భయాలను తగ్గిస్తూ కొత్త ఆశల్ని కల్పిస్తున్నది.     కాలం రెక్కలు కట్టుకొని ఎగురుతున్నది. రేఖలో కాలం తెచ్చిన మార్పులు వింత అందాల్ని ఒలకబోస్తున్నాయి. రేఖ పట్ల వికాస్ ప్రవర్తనలో కూడా కొత్తదనం కనిపిస్తోంది. అతని చూపుల్లో పదును పెరిగింది. ఆ చూపులు రేఖ శరీరాన్ని అణువణువూ తడిమి చూస్తున్నాయి.     తల్లి ప్రేమ, సోదరి ప్రేమ తెలియని వికాస్ మనసులో స్త్రీ పట్ల కాంక్షాదృష్టి మాత్రమే వుండటం రేఖకి ఇబ్బందిగా ఉంది.     రేఖకి విషయం అర్ధమవుతూనే భయవిహ్వల అయింది. వికాస్ ఏకారణం లేకుండా తన భుజంపై చేయి వేయటం రేఖకు నచ్చటం లేదు. అతనికెలా చెప్పాలో కూడా తెలియటం లేదు.     రేఖ పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించినా, కొత్త విషయాలేవైనా ఆ అమ్మాయికి నేర్పాల్సి వచ్చినా రకరకాల వంకలతో వికాస్ తరచుగా తాకటం భయం కల్గిస్తోంది. రేఖకి వికాస్ ప్రవర్తనను ఎలా అభ్యంతరపెట్టాలో తెలీడం లేదు. అతను తకుతున్నప్పుడు తన శరీరంలో విచిత్ర ప్రకంపనలు ఉతపన్నమౌతూ తోచనీయకుండా చేస్తున్నాయి. ఇలా ఎందుకు జరుగుతోందో రేఖకి తెలీడంలేదు. ఏంచేయాలో అసలు అర్ధంకావడం లేదు.     వికాస్ కి రేఖ ఇబ్బందిగా ఫీలవడం తెలుస్తూనే ఉంది. అయినా తెలీనట్లే ప్రవర్తిస్తున్నాడు. రేఖ అభ్యంతరపెట్టడానికి కూడా వీలులేని విధంగా ప్రవర్తిస్తున్నాడు. అతన్ని ఎలా వారించాలో, అలా నిశ్శబ్దంగా ఉండొచ్చో లేదో కూడా రేఖకు తెలీడంలేదు. తల్లి ఈ రెండో పెళ్ళి చేసుకోవటం ద్వారా తండ్రి స్థానంలో కుమార్ అందిస్తున్న మెరుగైన ఆర్ధిక సౌకర్యాలు మనసుకు నచ్చుతున్నాయి. కుమార్ అందించే తండ్రి ప్రేమకు ఆనందంగానే వుంది కానీ వికాస్ ప్రవర్తన మాత్రం రేఖకో వింత సమస్యగా మారింది.     తననేదో వంకతో నిమురుతున్న వికాస్ చేతుల్ని చాలాసార్లు విసిరికొట్టాలనిపిస్తుంది. కానీ అమ్మ ఏమన్నా అంటుందేమోననీ, కుమార్ లో ఏ విపరీతార్ధాలు చోటు చేసుకుంటాయేమోనన్న సంకోచంతో రేఖ భయపడుతోంది. ఆ అమ్మాయి మౌనం వికాస్ ని మరింత రెచ్చగొడుతోంది. వికసిస్తున్న ఆ పసి యవ్వన రేఖలు అతనిలో మృగాన్ని నిద్రలేపుతున్నాయి. స్నేహితులతో కలిసి దొంగతనంగా చూసిన బ్లూఫిల్మ్ లు కళ్ళ ముందు వికృతంగా నాట్యమాడుతున్నాయి.     వికాస్ స్పర్శ ఏదో ప్రమాదాన్ని సూచిస్తోంది. అకస్మాత్తుగా ఇద్దరి కళ్ళు ఎప్పుడైనా కలిసినప్పుడు వికాస్ కళ్ళల్లో కనిపించే కోరికల జీరలు చెప్పకుండానే తెలుస్తున్నాయి.     సినిమాల్లో విలన్ హీరోయిన్ కేసి ఇలాగే చూడటం గుర్తొచ్చిన రేఖ భయంతో వణికిపోతున్నది.     మెల్లమెల్లగా వాస్తవంకేసి వెలుగు ప్రసరిస్తున్న వికాస్ నిజస్వరూపం బయటపడే రోజు వచ్చేసింది.     ఆ సాయంత్రం మంచి సినిమా వుందని భార్య, పిల్లలతో సినిమాకు బయలుదేరాడు కుమార్. ఎప్పుడూ రానని తిరస్కరించే వికాస్ మాట్లాడకుండా బయలుదేరటం ఆశ్చర్యమే!     సినిమాహాల్లో వికాస్ అన్నా, చెల్లెళ్ళ మధ్య కావాలని కూర్చున్నాడు. అవినాష్ పక్కన కుమార్, సులభలు కూర్చున్నారు. సినిమా జరుగుతున్నప్పుడు వికాస్ ప్రవర్తన రేఖకు దుఃఖాన్నీ, కోపాన్నీ కలిగించింది. పారిపోయే మార్గం కూడా లేదు. వికాస్ కుసంస్కారం పడగవిప్పి బుసలు కొట్టిన ఆక్షణాల నుంచి తనను ఎలా కాపాడుకోవాలో తెలీక రేఖ కుంగిపోయింది.     "రేఖ! నువ్వు చాలా అందంగా ఉంటావు తెలుసా!" చెవిలో గుసగుసలాడాడు వికాస్!     అతని చేయి రేఖ చేతిని నిమురుతోంది.     రేఖ తలదించుకొనే ఉంది. రెండు సీట్లకు అవతల కూర్చున్న తల్లికి వాళ్ల మాటలేవీ వినపడవని తెలుసు. అందరి దృష్టీ పూర్తిగా సినిమా మీద నిమగ్నమై ఉంది. తెరపై బొమ్మలు అలుక్కుపోతున్నట్లున్నాయి. రేఖ కళ్ళనిండా నీళ్ళు... తన పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలో తెలీడం లేదు.     సినిమాలో విలన్ హీరోయిన్ ని మానభంగం చేయటానికి విశ్వప్రయత్నం చేస్తుంటే దర్శకుడు భీభత్స రసాన్ని యథాశక్తి చిత్రీకరించాడు. హీరోయిన్ కేకలు రేఖ గళంలో కొట్టుకుంటున్నాయి.     తన వంటిమీద పాకే వికాస్ చేతుల్ని నెట్టేయటానికి ఆమె చేసే ప్రయత్నం విఫలమౌతున్నది. ఇంటర్వెల్ కాబోలు... హఠాత్తుగా లైట్లు వెలిగాయి. అతను ఉలిక్కిపడి చేతులు వెనక్కి లాగేసుకున్నాడు... నిటారుగా అయ్యాడు. అప్పుడు ఎవరైనా అతడ్ని చూస్తే అలాంటివాడని నమ్మరు. తన తల్లి కూడా నమ్మదు.     చాటుగా కళ్ళు తుడుచుకుని కొంత రిలీఫ్ ఫీలయింది. ఇంటికొచ్చేదాకా రేఖ ఆ హింసను మానసికంగా, శారీరకంగా అనుభవిస్తూనే ఉంది.     వికాస్ తనకి అన్నస్థానంలో ఉన్నాడు. ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు? అవినాష్ చిన్నన్న అయితే వికాస్ పెద్దన్నయ్య కాలేడా! ఎవ్వరూ లేనప్పుడు అసహజంగా, కాముకంగా వుండే అతని చేష్టలు ఇతరులముందు కృత్రికమైన రంగుల్ని పులుముకొని సోదర ప్రేమగా కృతకంగా వ్యక్తంచేయటం చూస్తే రేఖకి అసహ్యంగా ఉంది.     ఈ మధ్య ఏ చప్పుడైనా బెదిరిపోతోంది. తెలీని బెంగగా ఉంది. రాత్రిళ్లు నిద్రపట్టడం లేదు. వికాస్ గొంతు వినబడితేనే ఎలర్జీగా ఉంది. ఎక్కడికైనా వెళ్ళి దాక్కోవాలనిపిస్తుంది.             * * *     రోజూ వికాస్ ఇంటికి వచ్చే టైము దాటిపోయింది. ఆ వేళకు ఆ ఇంటికి వచ్చిన వార్తకు సులభకు కాళ్లూ చేతులూ ఆడటం లేదు. కుమార్ కుప్పకూలి పోయాడు. స్కూటర్ మీద వస్తున్న వికాస్ కి యాక్సిడెంటయింది. కాళ్లు విరిగిపోయాయి. ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు.     "కష్టం వచ్చినప్పుడే మనిషి ఆత్మస్థైర్యం పెంచుకోవాలి. మీరలా బెంబేలు పడితే ఎలా? పదండి హాస్పిటల్ కి పోదాం! వికాస్ ఏం బాధపడుతున్నాడో!" భర్తకి ధైర్యం చెప్పి సులభ తన మనసును కూడదీసుకుంది. దడదడలాడుతూ హాస్పిటల్ కు బయలుదేరారు అంతా.     అతను వికాసా! చూడటానికే రేఖకి భయమేసింది. ఒళ్లంతా రక్తసిక్తంగా గాయాలతో కదలలేకుండా పడివున్నాడు. కళ్ళు మూసుకొని మూలుగుతున్నాడు. రేఖ ఇంక చూడలేక తల తిప్పుకుంది.     డాక్టర్లు...నర్సులు...స్ట్రెచర్స్... అంతా హడావుడి. నాలుగురోజులు వళ్లు తెలీకుండా వున్నాడు వికాస్.     ఐదవరోజు వికాస్ కి స్పృహ తెలుస్తోంది. మెల్లగా మాటలు వినిపిస్తున్నాయి. కళ్ళు మాత్రం తెరిపిళ్ళు పడటం లేదు. ఆ గొంతు... రేఖది.     "ప్లీజ్...మమ్మీ! పెద్దన్నయ్యకి ఏంకాకూడదు. నాకు భయమేస్తుంది" రేఖ ఏడుస్తోంది. ఆ పసి హృదయంలో వికాస్ తనపట్ల ప్రవర్తించిన క్రూరత్వం గురించిన పగ ఇసుమంతైనా లేదు... వికాస్ కోలుకోవాలనీ, అతనికేం కాకూడదనీ నిర్మలమైన మనసుతో కోరుకుంటోంది.     వళ్లంతా కట్లతో మూలిగే వికాస్ ని చూడలేకపోతోంది రేఖ. అవినాష్ పరిస్థితి కూడా దాదాపు అంతే! ఆ నాలుగురోజులూ అతని బెడ్ దగ్గర్నుంచి వాళ్ళు కదలలేదని వాళ్ళ మాటల్ని బట్టి వికాస్ కి అర్ధమయింది. చిన్నగా మూలిగాడు...     ఆదుర్దాగా రేఖ, సులభలు వికాస్ బెడ్ దగ్గరికి వచ్చారు.     "వికాస్..." సులభ పిలిచింది.     "అన్నయ్యా..." రేఖ ఏడుస్తోంది.     వీళ్ళు తననెందుకు ఇంత ప్రేమిస్తున్నారు? తను చచ్చిపోతే వాళ్ళకు ఎన్నో రకాలుగా లాభం! ఆస్తి అంతా వాళ్ళ స్వంతం అయ్యేదికదా! ఈ ప్రేమకు... ఇంత ప్రేమకు... తను అర్హుడు కాడు. రేఖను తను ఎంతగా బాధపెట్టాడు? ఆప్యాయంగా చూసుకోవాల్సిన చెల్లెల్ని వికృతచేష్టలతో హింసించాడు. తనని చెడు మార్గంలో నడిపించిన స్నేహితులు తను ప్రాణాపాయ స్థితిలో వుంటే ఒక్కరూ బెడ్ పక్కన లేరే..?     కుటుంబ సంబంధాలలో ప్రేమకింత విలువుందా! ఆ విలువే తనని ఇవాళ కాపాడుతోందా! రేఖనలా హింసించినందుకు తనకీ శాస్తి జరగాల్సిందే! కాళ్లు కదలటం లేదు... బహుశా విరిగిపోయి ఉంటాయి. అంతా బ్యాండేజ్ వేసేశారు... తనకీ శిక్ష కావాల్సిందే! అతని చెక్కిళ్ళు కన్నీటితో తడిసిపోతున్నాయి.       వికాస్ కన్నీటిని తుడిచింది సులభ. "ఎలా వుంది నాన్నా!" కుమార్ కొడుకుని పలకరించాడు. వికాస్ చేతిపై ఓదార్పుగా చేతిని వుంచింది రేఖ. ఆ స్పర్శ ఇప్పుడు అమ్మ మనసులా చల్లగా వుంది.     "బాధపడకు బాబూ! నీకేం కాలేదు. కొద్దిరోజుల విశ్రాంతి తర్వాత మామూలుగా నడుస్తావు" సులభ అతని తలపై చేయివేసి నిమిరింది.     "అవునన్నయ్యా! నీకేం కాలేదు. నిజం" అమాయకంగా అంటున్న రేఖ చేయి పట్టుకొని "నన్ను క్షమించు రేఖా! నేను ఇలా మీచేత సేవలు చేయించుకుంటూ... అవిటివాడిలా" అతని నోటి మీద మృదువుగా చేయి వుంచి వారించింది రేఖ.     "అలా అనకు అన్నయ్యా! ఒక నెల రోజులు ఓపికపడితే... నీ నడక నీదే" రేఖ మాటలకు బలహీనంగా నవ్వాడు వికాస్.     "ఈ నడక నాది కాదమ్మా! ఇకనుంచి మీదే!" వికాస్ గొంతు నిండా చెల్లెలి పట్ల కొండంత అభిమానం.     "మంచిది బాబూ! నువ్వింక విశ్రాంతి తీసుకో!" దుప్పటి సరిచేసింది సులభ.     "ఇంక పడుకో అన్నయ్యా" అంటూ అవినాష్ వచ్చి వికాస్ బెడ్ దగ్గర స్టూల్ పై కూర్చుని ప్రేమగా చేయి పట్టుకున్నాడు. ఆ స్పర్శలో స్నేహం ఉంది.     వికాస్ కిప్పుడు నిజంగానే ప్రశాంతంగా ఉంది. సులభ అరచేతిని కళ్ళపై ఉంచుకుని కళ్ళు మూసుకున్నాడు. వెన్నెలంత చల్లగా వుంది అతని మనస్సు. ఆ మనస్సులో జీవితం పట్ల ఏవేవో కొత్త ఆశలు ఊపిరిపోసుకుంటున్నాయి.

కార్నర్ సీటు

 కార్నర్ సీటు     - రావి శాస్త్రి      పరిస్థితులను బట్టి మనిషి మనసులో చెలరేగే ఆలోచనల స్రవంతే 'కార్నర్ సీటు' కథ. సహజంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఎదుటివారి గురించి తనలో తను మాట్లాడుకునే ఆంతరంగిక సంభాషణే 'కార్నర్ సీటు' కథ. చేయితిరిగిన రచయిత రావిశాస్త్రి తనదైన శైలిలో ఈ కథను అద్భుతంగా రాశారు.       మేనల్లుడి పెళ్లికి బయలుదేరిన రాజు,  అతని ఎదురుగా కూర్చొన్న పచ్చకోటతనిని గురించి చేసే ఆలోచనలే ఈ కథ.  అందరిలాగే రాజు కూడా ట్రయిను ఎక్కగానే కార్నర్ సీటులో కూర్చోవాలనుకుంటాడు. కానీ ఒకడుగు వెనుకబడటంతో ఓ పచ్చకోటతను ఆ సీట్లో కూర్చొంటాడు. దాంతో రాజుకు చిరాకు వేస్తుంది. వళ్లు మండుతుంది. అతని మాసీమాయని పంచె, నెత్తి మీదున్న మరాఠీ టోపీ, లోతుకుపోయిన కళ్లు చూసి పరిపరి విధాలుగా మనసులో అతడిని తిట్టుకుంటాడు రాజు. ఆఖరకు 'మీరెక్కడ దిగుతారూ' అని అడుగుతాడు. కానీ అతను మాత్రం 'నా మానాన్న నన్ను కూర్చోనివ్వండి.' అని విసుక్కుంటాడు. తల మీదున్న టోపీ తీసి బల్లపై విసిరేస్తాడు.      పచ్చకోటతని మీద రాజుకు కోపం మరీ ఎక్కువ అవుతుంది. 'దౌర్భాగ్య పు వెధవ, చెవల వెధవ' అని తిట్టుకుంటాడు, మండిపోతాడు.         పచ్చకోటువాడు దగ్గితే. అతికి క్షయ ఉందనుకుంటాడు. టీ.సి. వస్తే చెప్పి దించేయాలి అనుకుంటాడు. ఒకవేళ అతను చస్తే భూభారం తగ్గుతుందని కూడా ఆలోచన చేస్తాడు. ఏదో స్టేషను వస్తే పచ్చకోటువాడు లేచి వెళ్తే, అతను తిరిగి రాకూడదనుకుంటాడు. వెనుక గుమ్మం దగ్గర నిలబడిన అతడిని చూసి, ఎందుకో ఈ దర్పం అని రాజు ఈర్ష్య చెందుతాడు. ఇంతలో ట్రయిన్ కదులుతుంది. పచ్చకోటు అతను ట్రయిన్ కిందపడి చనిపోతాడు. పదిగజాలు కూడా ట్రయిను కదలకుండానే ఆగిపోతుంది. పోలీసులు, టీసీలు, జనాలు అంతా హడావుడి. రాజూ మాత్రం దగ్గరకు వెళ్లడానికే భయపడతాడు. దూరం నుంచి అతని అరిపాదాలు మాత్రం చూస్తాడు. అప్పటి వరకు కార్నర్ సీటులో కూర్చోవాలన్న తన కోర్కెను కూడా మర్చిపోతాడు. ట్రయిన్ లో జనాలు పచ్చకోటతని టోపీిని తాకడానికి కూడా భయపడతారు.        ట్రయిన్లో నుంచి ప్రకృతిని చూస్తున్న రాజు ఆ చనిపోయిన పచ్చకోటతను ఈ అందాలను చూడలేకపోయాడు కదా... అనుకుంటాడు. రాజు గుండె బరువెక్కుతుంది. మనసు విచారభరితమవుతుంది. కళ్లు చెమ్మగిల్లుతాయి. దిగులు కలుగుతుంది.      రావి శాస్త్రి ఈ కథలో పాఠకులకు మరణమన్నా, చనిపోయిన వారన్నా, వాళ్ల వస్తువులన్నా బతికున్న వారికి ఎంత భయమో ప్రత్యక్షంగా వివరిస్తారు. కథ పూర్తయ్యే సరికి మన హృదయమూ బరువెక్కుతుంది. అప్రయత్నంగా గుండెల్లో కన్నీటి చెమ్మ ఊరుతుంది. బతుకుకు, చావుకు మధ్య ఉన్న విలువ తెలుస్తుంది. ఇక రావిశాస్త్రి గారి శైలి అక్షరాల వెంట పరుగులు తీయిస్తుంది. వర్ణనలు మనసుల్లో దృశ్యాలను ఆవిష్కరిస్తాయి. అందుకే 'కార్నర్ సీటు' కథ మాణిక్యమే.                                          - డా. రవీంద్రబాబు.

ముద్దబంతి పూవులో

 ముద్దబంతి పూవులో - భవానీదేవి   "నేనిప్పుడే పెళ్ళి చేసుకోను" సీరియస్ గా అంటున్న కొడుకుని అమయాకుడిలా చూసింది అన్నపూర్ణ.     "చేసుకోమని ఎవరన్నారు? అనూని ఓసారి చూడు. ఆపై నీ అభిప్రాయాన్ని మేము కాదంటేగా!"     "చేసుకోనప్పుడు చూడటం మాత్రం దేనికి?" పదునుగా వుంది మనోజ్ స్వరం.     "చిన్నప్పటి నుంచీ అనూరాధని నీ భార్య అనుకున్నాంరా" బతిమిలాటగా అంది.     "దానికి నేనా బాధ్యుడ్ని?" కోపంగా వుందతని స్వరం.     "అంత కోపం ఎందుకురా! ఆడపిల్లగలవాళ్ళు ఇంకెన్నాళ్ళు ఆగుతారు చెప్పు? నువ్వోసారి చూసి..."     ఇంక అమ్మ మాటలకి ఎదురుచెప్పలేకపోయాడు మనోజ్.     "ఆ పల్లెటూరి బైతుని సాయంత్రం చూసి రాత్రి బస్ కి హైదరాబాద్ వెళ్ళాలి.. నా లీవ్ వేస్టవుతుంది" అల్టిమేటం జారీ చేసి అలా పొలాలకేసి నడక సాగించాడు.     మనోజ్ మనసు కుతకుతా వుడికిపోతోంది. హైదరాబాద్ లో ఫ్రెండ్స్ తో హాయిగా కాలక్షేపం చేస్తున్న మనోజ్, 'తల్లికి బాగాలేదన్న' టెలిగ్రాం అందుకుని ఆదరా బాదరాగా వచ్చాడు. మామయ్య ఆడిన నాటకం తెలిసి అనురాధని చూడాలంటే మరింత కోపంగా వుంది.     మెగా సిటీలో చుడీదార్లు, మిడ్డీలలో కళ్ళు జిగేల్ మనేలా కన్పడే అమ్మాయిల్లో ఒకర్ని ప్రేమించి, ప్రేమించటంలోని థ్రిల్ ని అనుభవించి తర్వాత పెళ్ళి చేసుకోవాలనుకున్నాడు.      మేనకోడల్ని కోడలుగా చేసుకోవాలని అమ్మ తాపత్రయం. ఈ పల్లెటూరి గబ్బిలాయిని తను మాత్రం ఛస్తే చేసుకోడు. నామమాత్రంగా పెళ్ళిచూపులకి అటెండ్ అయి ఝూమ్మని రాత్రి బస్ కి హైదరాబాద్ వెళ్ళిపోతాడు.     పంట చేల గట్ల మీద ఆలోచిస్తూ అడుగులేస్తున్నాడు మనోజ్. నీలి ఆకాశానికి కొంగల బారులు మేలిముసుగేస్తున్నాయి. విస్తరిస్తున్న అలలు చెరువు కౌగిట్లోంచి బయటకు రాలేక చెరువు అంచుల్ని ముద్దుపెట్టుకుని లయించి పోతున్నాయి.     ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఆ అమ్మాయిని చురుగ్గా చూశాడు. 'అబ్బా' అనుకుంటూ నుదురు తడుముకున్నారిద్దరూ.     తీవ్రంగా చూడబోయి చేతకాక 'సారీ' అంటూ ఆమె కళ్ళలోకి చూశాడు.     నీలాలు మెరిసినట్టున్న ఆ కనుపాపల్లో తన నీడే కన్పించింది.     అతని అవస్థ చూసి సన్నగా నవ్వింది. పారిజాతం పూలు రాల్చిన నిశ్శబ్ద వీణాస్వనం అది.     ఇంత అందంగా ఆడపిల్లలు నవ్వగలరని అతనికి మొదటిసారిగా తెలిసింది.     కింద రాలిన బంతిపూలను ఏరి ఒళ్ళో వేసుకుంటుంటే పొడుగాటి వాలుజడ ముందుకు వాలి చెవిలో ఏదో గుసగుసలు చెప్తున్నది కాబోలు. ఆమె పెదవులపై నునుసిగ్గు గంతులు వేస్తోంది.     గులాబీ రంగు లంగా, జాకెట్టు, నల్ల ఓణీలో రోజా పూవులా వుంది. ముద్దబంతి పూవులా ఒద్దికగా వున్న అలాంటి అమ్మాయిలు సిటీలో కన్పించరు. డబ్బాలా పైనుంచి కింది దాకా చుడీదార్లు దిగేసుకుని బస్సుల కోసం పరుగెత్తే సిటీ అమ్మాయిలు గుర్తొచ్చారు.     పల్లెటూరి జీవన విధానానికి అలవాటుపడిన ఈ అమ్మాయిలో ముగ్ధత్వం, సుకుమారత, సౌందర్యం సమపాళ్ళలో వుండటం మనసుకు ఆహ్లాదాన్నిస్తోంది.     బంతిపూలు ఏరటంలో సాయం చేసి ఆమె కొంగులో పోశాడు.     చిలిపిగా కళ్ళల్లోకి చూసి నవ్వి పరుగు పరుగున వెళ్ళిపోయిందామ్మాయి.     గాలి అలల మీద తేలివస్తున్న పాంజేబుల సవ్వడి మధుర సంగీతంలా వుందతనికి.     ఇక పెళ్ళిచూపులకు వెళ్ళాలనే లేదు. మరోసారి ఆ ముద్దబంతి పూవును ఈ పల్లెలో వెదికి పట్టుకోవాలి.     తల్లి మందలింపుతో తప్పనిసరయి మేనమామ ఇంటికి వెళ్ళాడు.     వరండాలో ఉంచిన నీళ్ళతో కాళ్ళు కడుక్కొని లోపలికెళ్తుంటే కర్టెన్ చాటు నుంచి వినిపించిన పాంజేబుల సవ్వడికి మనసులో ఏదో తటిల్లత మెరిసినట్టయింది. అటూ ఇటూ చూశాడు. ఎవ్వరూ కన్పించలేదు.     పెళ్ళి చూపులంటేనే కోపంగా వుంది. ఈ అనురాధ తన మేనమామకు పుట్టడమెందుకు? పుట్టింది పో... తననే భర్తగా అనుకోవడమెందుకు? ఖర్మ కాకపోతే...     కోపంగా తల దించుకుని కూర్చున్న కొడుకుని మందలించింది అన్నపూర్ణ.     "కాస్త తలెత్తి చూడరా పిచ్చి సన్నాసి..."     "అనూ! నువ్వు కూడా! బావని చిన్నప్పుడు చూసివుంటావు" అమ్మ మళ్ళీ అంటోంది.     తనకిలాంటి ఇరకాటాన్ని కల్పించిన అనురాధని తీక్షణంగా చూద్దామని తలెత్తాడు మనోజ్.     కళ్ళముందు వంద మెరుపులు... ముద్దబంతిపూలు వర్షంలా కురుస్తున్నాయి. తెల్ల ఓణి, నీలిరంగు లంగా, జాకెట్టూ ధరించిన అనూ... ఆకాశదీపంలా వుంది. పొద్దుటి నుంచి తన మనసు నిలవనీయని ఆ పువ్వు ఆమె పెదవులపై ఇంకా మెరుస్తూనే వుంది.     నాగుపాము పడగమీద మణిలాగా పొడుగాటి వాలుజడలో బంగారు వన్నె ముద్దబంతి పువ్వు ఫక్కున నవ్వింది.     "పిల్ల నచ్చినట్టేనా..?"     అన్నపూర్ణ మాటలకు మనోజ్ మనసులో విద్యుత్తరంగాలు. పక్క గదిలోకి పారిపోయిన పాంజేబుల సవ్వడి.     మరో నెల రోజుల వరకూ ముహూర్తం కోసం ఆగటం ఎంతో కష్టంగా వుంది మనోజ్ కి.     'విరహము కూడా సుఖమే కదా! నిరతము చింతన మధురము గాదా' అని పాడుకుంటూ రోజులు గడిపాడు.     పెళ్ళి తతంగమంతా ట్రాన్స్ లో వున్నట్టు ముగించాడు.     అతి ఆసక్తిగా, ఆనందంగా ఎదురుచూసే తొలిరేయి... తెల్లచీరలో దగ్గరికొచ్చిన అనూని మాట్లాడనీయలేదు మరి...     "ఒరేయ్... నేనురా... వదులు..." మామయ్య మాటలకు సిగ్గుపడి వదిలేశాడు.     "మనూ! అనురాధ తల్లిలేని పిల్ల. దానికి ఏ లోటూ తెలీకుండా పెంచాను. నీతో పెళ్ళి కావాలని, నీకోసం ఎన్ని దేవుళ్ళకు మొక్కుకుందో... దానికి నోరు లేదు గానీ... ఆ మూగతనమే లేకపోతే నా తల్లి సంగీత సరస్వతి కదూ..." ఆయన గొంతు రుద్ధమయింది.     మనోజ్ కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నది.     "ఏమిటి మామయ్యా... మీరనేది?... అనూ...మూగదా!"     "అవును బాబూ! నీకు తెలీదా?" ఈసారి నివ్వెరపోవడం ఆయన వంతయింది.     "మరి నాకు ముందే ఎందుకు చెప్పలేదు?" మేనల్లుడి గొంతులో తీవ్రతకు తెల్లబోయాడాయన.     "నేను చెప్పేది కాస్త సావధానంగా విను మనోజ్. పద్నాలుగేళ్ళ వయసప్పుడు రోగ రూపంలో గొంతుకు వెనక్కి తీసుకున్నాడు దేవుడు. అదృష్టమో... దురదృష్టమో... చెవులు మాత్రం సరిగ్గానే పనిచేస్తాయి. కమ్మని కంఠస్వరంతో ఎన్నెన్ని పాటలు పాడేది చిట్టి తల్లి! అయినా అమ్మకి అన్నీ తెలుసు... నీకు చెప్పేవుంటుందనుకున్నాను" అనునయించబోయాడు.     "అనుకుంటే సరా! తండ్రిగా ఈ విషయాన్ని నాతో ముందుగానే చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? మూగదాన్ని నా మెడకు తగిలించి నా గొంతు కోస్తారా?" ఆగ్రహంగా అంగలు వేస్తూ వెళ్ళిపోయిన అల్లుణ్ణి ఆపలేక చతికిలపడ్డాడాయన.     పాంజేబుల సవ్వడి తడబడుతోంది. ఇప్పుడు ఆ సవ్వడి కర్ణకఠోరంగా అన్పిస్తుంటే వినలేక గేటు దాటాడు మనోజ్.     ఇంటికి వచ్చేశాడు. తల్లితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు.     కిటికీలోంచి బయటికి చూస్తే పుచ్చపువ్వు లాంటి వెన్నెల. మల్లెలు ఒళ్ళు విరుచుకుంటున్నాయి. మనసు మండిపోతోంది.     ఎంత మోసం! అనురాధ మాత్రం ఎంత నంగనాచి... తాను మూగదాన్నని సైగలతోనైనా చెప్పొచ్చుగదా! దెయ్యంలా మిడిగుడ్లేకుని చూడకపోతే... పిడికిలి బిగించి గోడకు కొట్టాడు... షిట్!     రిజర్వేషన్ కాన్సిల్ చేసుకుని మర్నాడే వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్న కొడుక్కి ఎన్నో విధాల నచ్చజెప్పింది అన్నపూర్ణ.     "అనూ... చాలా మంచిపిల్లరా! నువ్వంటే ఎంత ప్రేమో! ఎన్ని జన్మలెత్తినా అలాంటి భార్య దొరకదురా.. పెళ్ళికి ముందు అది మూగదని తెలిస్తే... ఈ పెళ్ళికి ఒప్పుకోవని నేనే అసలు విషయాన్ని దాచాను.. దానికంత శిక్ష వేయకురా... కావాలంటే నాకు వెయ్యి ఏ శిక్షయినా.." కన్నీళ్ళతో ప్రాధేయపడిందా తల్లి.     "అమ్మా! అయ్యిందేదో అయ్యింది. ఆ మూగ మొద్దును అంగీకరించలేను. ఇంక నన్ను మాటలతో వేధించకు" అంటూ గది తలుపులేసుకున్న కొడుకు ప్రవర్తనకు కుమిలిపోయింది అన్నపూర్ణ.     తెల్లవారుఝామున జీతగాడు తెచ్చిన వార్తకు తల్లీ కొడుకులిద్దరూ కొయ్యబారిపోయారు.     అనురాధ నిద్రమాత్రలు మింగేసింది. ఆస్పత్రిలో చావుబ్రతుకుల మధ్య వుంది.     ఎర్రని ముఖమల్ గుడ్డలో చుట్టిన నాలుగైదు డైరీలు, ఓ లేఖ ప్యాకెట్ గా అతని చేతికొచ్చాయి.     ఆ వార్త ఇచ్చిన జీతగాడు కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయాడు.     చిరాకుగా ఆ ప్యాకింగు విప్పాడు మనోజ్. ఏం రాసిందో మహాతల్లి. ఆత్మకథేమో! మూగది కదూ. రాతలెక్కువ.     ఆలోచనల్ని విదిలించి లేఖలోని అక్షరాలు చదవసాగాడు గుండ్రని అక్షరాలు అందంగా... పొందికగా... అనూలా...     నా బావా!     ధైర్యంగా ఇలా అన్నందుకు క్షమించు... నీ హృదయంలో నాకు చోటులేదని తెల్సినా ఇలా అంటున్నానంటే చిన్నతనం నుంచీ నువ్వు నావాడివనే భావనతో పెరిగినందుకే. నా వూపిరి నీ పేరుగా ఆరాధించాను. జీవితం మూగబోయినా మనసు వీణమీద నీ పేరే పాడుకుంటూ, నీ భార్యనైనందుకు నా అంత అదృష్టవంతురాలు లేదని ఆనందించాను. నా మూగతనం ఇంత శాపాన్ని తెచ్చిపెట్టింది. నీకు తెలుసనుకున్నాను గానీ, నిన్ను మోసం చేయాలనుకోలేదు... ప్రేమించటం కన్నా ప్రేమించబడటంలోనే ఆనందం, అదృష్టం వుంది. నీకోసం పరచిన నా ఊహల, ఊసుల పల్లకీలు ఈ డైరీలు. నీకు నా చివరి కానుకలివి.                     నీదాన్ని కాలేని                        - అనూ     ఉత్తరం తర్వాత ఆ డైరీల్లోని పేజీలు తిరగేస్తుంటే అతని మనసు పిండినట్టవుతోంది. అనూ మనసులో బాల్యం నుంచి తన కోసం అల్లుకున్న ప్రేమలతలు ఎలా చిగురించి పూలు పూచి ఫలించాయో... ఎంత పిచ్చి ప్రేమను గుడిలా చేసి తన రూపాన్ని అందులో ప్రతిష్ఠించిందో...     ఇంత ప్రేమకు తాను అర్హుడా! కేవలం పైపై మెరుగుల కోసం, మూగ మువ్వలాంటి అనూని కాలదన్ని వెళ్ళిపోతున్న తనకి ఈ డైరీలు నిజమైన చూపును ప్రసాదించాయి. ఆమెవి రాలిన స్వప్నాలా?... కావు...కావటానికి వీల్లేదు. ఇతరుల చేత గాఢంగా ప్రేమించబడటానికి ఎంత అదృష్టం ఉండాలి. అవును తాను నిజంగానే అదృష్టవంతుడు. హాస్పిటల్ కి పరుగెత్తుతున్న కొడుకుకేసి విభ్రమంగా చూసింది తల్లి.      ఆ రాత్రి... మరోసారి కలలరాత్రిలా వచ్చింది.     తెల్లచీరలో మల్లెపూవులా కన్పిస్తున్న అనూని చూస్తుంటే మనోజ్ కి గర్వంగా వుంది. 'తనకోసం ప్రాణాలైనా ఇచ్చే భార్య...!' నిజంగా అందరికీ లభించే అదృష్టం కాదు.     వికసిస్తున్న ప్రేమసుమాల పరిమళాలు గది అంతా వ్యాపిస్తున్నాయి.     ప్రేమగా ఆమె ముంగురులు సవరిస్తోంటే చిన్నగా నవ్వి పాల గ్లాసు అందించింది. ఆమె చేయి అందుకొని మంచం మీద కూర్చోబెట్టాడు. పాలగ్లాసు టేబుల్ పై వుంచి... "నన్ను క్షమించు అనూ!" అని చెప్పబోతున్న అతని పెదవులపై చేతిని వుంచి మృదువుగా ఆపి కళ్ళతో వద్దని వారించింది.     ఆ చేతిని అలాగే పట్టుకొని ముద్దు పెట్టుకున్నాడు. గాజుల గలగలలు ఆమె మనోవీణలా రాగాలు పలికాయి. కాళ్ళ పాంజేబులు వలపు సందడులు చేశాయి.     కిటికీలోంచి తొంగి చూస్తున్న ముద్దబంతి పువ్వు మీద వెన్నెల కిరణాలు వెల్లువలా కమ్ముకున్నాయి. తన్మయంగా ఆ పువ్వు వెన్నెల అందాల్లో మొహం దాచుకొని సరికొత్త వేణుగానాన్ని వినిపించింది. దూరంగా ఎక్కడో ఘంటసాల గళం విన్పిస్తోంది సుతిమెత్తగా!     "ముద్దబంతి పూవులో మూగ కళ్ళ ఊసులో     ఎనక జనమ బాసలు ఎందరికి తెలుసులే"                 

వెలుగులోకి

 వెలుగులోకి - డా.సి. భవానీదేవి "శరత్  చాలా మంచివాడు, యోగ్యుడు, మన గీతను ఆఫీసులో చాలా రోజులుగా చూస్తున్నాడుట. చేసుకోవాలని ఇష్టపడుతున్నాడు".     అరుణ పిన్ని మాటలు వింటూనే అందరి మొహాలు వెలవెలా బోయినై.     ముందుగా పెద్దకోడలే తేరుకుంది. "ఇదెలా సాధ్యం! గీత స్వాతంత్ర్య భావాలున్న పిల్ల. అంత సాంప్రదాయకమైన ఇంట్లో ఇమడగలదా" ఆవిడ గొంతులో అయిష్టత స్పష్టంగా వినిపిస్తోంది.     అరుణ పిన్ని ఇంకేదో చెప్పబోతున్నది. మళ్ళీ పెద్దకోడలే అంది.     "ఇంతగా చెప్పటానికి ఆ పెళ్ళికొడుకులో ప్రత్యేకత ఏమిటో నాకర్ధంకావటం లేదు". పెద్దకోడలు మాటలు పూర్తవుతూనే గీత తల్లి జోక్యం చేసుకుంది.     "అయినా ఆఫీసర్ అంటే సరిపోయిందా! ఆఫీసర్లని చేసుకున్న వాళ్ళు ఏం సుఖపడుతున్నారు. మంచా... చెడా! ఎప్పుడూ ఫైళ్ళూ. ఇన్ స్పెక్షన్లూ, బాధ్యతలూ... మా మేనత్త మనవరాలి మొగుడూ ఆఫీసరే! రోజూ రాత్రి పదకొండుగంటల దాకా ఇంటికే రాడు." తల్లి తనవంతు కర్తవ్యాన్ని తృప్తిగా నిర్వర్తించింది.     "మునుపటిలా ఈ రోజుల్లో ఆఫీసర్ హోదాకి పెద్దగా గౌరవం లేదు. జీతాలు కూడా బిజినెస్ తో పోలిస్తే తక్కువే! దానికొచ్చే జీతం మీద ఆధారపడటం అతనికీ తప్పదు". గీత పెద్దన్నయ్య, ఆ ఇంటి పెద్దకొడుకు, తన జీవితానుభావాన్ని జోడించాడు.     "పోయిన మంగళవారం అనుకుంటూ... అతను బార్ లోంచి బయటకు వస్తుంటే చూశాను". గీత చిన్నన్న, ఆ ఇంటి చిన్నకొడుకు, సాక్ష్యాలను కూడా వివరించాడు.     తండ్రి కూడా ఏదో చెప్పబోతున్నట్లు గమనించింది గీత.     "వాళ్ళ వంశం అంతా నాకు తెల్సు. వాళ్ళ తాత పుండరీకాక్షయ్య ఎప్పుడూ ఈ లావు కర్రతో భార్యని చితకబాదుతుండేవాడు". మూలనున్న కర్ర తెచ్చి మరీ చూపించాడాయన.     బల్లమీద పుస్తకాలు సర్డుతున్న చెల్లెలు ఓసారి వెనక్కి తిరిగిచూసింది కర్రకేసి.     "అదేంటి నాన్నా!  స్మపాదిస్తున్న భార్యని ఎవరైనా కొట్టుకుంటారేమిటి? అయినా మా ఫ్రెండ్ కి వాళ్ళు చుట్టాలేట. ఎమ్.ఏ. ఒక పేపర్ పూర్తికాలేదుట" గబగబ చెప్పేసి విసవిసా వెళ్ళిపోయింది చెల్లాయి.     ఇంక అరుణ పిన్ని ఏం మాట్లాడుతుంది పాపం! ఆవిడకి గీత అంటే వల్లమాలిన అభిమానం. గీత పనిచేసే ఆఫీసులో ఆఫీసర్ అయిన శరత్ ఆవిడకు దూరపు బంధువు అవడంవల్ల అతని కోరిక మేరకు ఎలాగైనా వాళ్ళిద్దరినీ ఒ యింటివాళ్ళని చేయాలని తాపత్రయపడుతున్నది.     శాయశక్తులా ప్రయత్నించి మొత్తానికి శరత్ తల్లితో సహా ఓసారి గీత వాళ్ళింటికి రావడానికి గీత తండ్రిని ఒప్పించి వెళ్ళింది అరుణ పిన్ని.     గీత మనసు మనసులో లేదు. "ఏమిటి వీళ్ళందరి ఉద్దేశ్యం! జీవితాంతం ఇలాగే ఉండిపోవాలా? అనేక వసంతాలుగా ఊపిరి పోసుకున్న కోరికలు అణగారి పోవాల్సిందేనా! ఈ బందిఖానాలోంచి రెక్కలు విప్పుకొని స్వేచ్చగా ఎగిరిపోవాలనుంది. ఆ కోరిక మంచికే అవుతుందా! పాతికేళ్ళ గీత మనసు పరిపరి విధాల ఆలోచనల్లో పడింది.      చదువు పూర్తికాగానే ఉద్యోగం వచ్చిందన్న ఆనందం ఎంతోకాలం నిలవలేదు. మరబొమ్మలా ఆఫీసుకెళ్ళడం, డ్యూటీ చెయ్యటం, నెల మొదట తేదీ జీతం తెచ్చి తండ్రిచేతికి ఈయడం. పాకెట్ మనీ కూడా ఆయనిచ్చింది తీసుకోవడం, అలవాటుగా మారిపోయింది ఆమెనందరూ చిన్నపిల్లలా చూస్తారు. అంతా ఆమె మీద పెత్తనం చలాయిస్తారు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఇంట్లో చెప్పాలి. వాళ్ళు ఒప్పుకుంటేనే వెళ్ళాలి. ఉద్యోగరీత్యా వచ్చే జీతం కాకుండా డి.ఏ.లు, అడ్వాన్స్ లు కూడా అన్నీ ముందుగానే లెక్కలు తేల్చుకుని ఎదురుచూసే తండ్రిని చూస్తే ఒక్కోసారి కోపం వస్తుంది. ఒక్కోసారి గీతకి జాలేస్తుంది కూడా.     చదువు పూర్తికాగానే ఉద్యోగం దొరకడం అదృష్టమే. ఉద్యోగం వల్ల జీవితం తృప్తికరంగా ఉంటుందని ఊహించి తెలిసీ, తెలియని మోజులతో, ఈ సాలెగూడులో ఇరుక్కుంది. కానీ ఉద్యోగం వచ్చిన కొద్దిరోజుల్లోనే ఆమెకి పూర్తిగా పరిస్థితి అర్ధమయింది. తన ఊహలు భ్రమలని! తండ్రి వట్టి కోపదారి, కొంచెం మంచి చీర కట్టుకున్నా, ఆఫీసునుంచి కొంచెం లేటయినా కేకలేస్తాడు. తల్లి అందరికీ చాకిరిచేసే యంత్రం మాత్రమే!     పెద్దన్నయ్య పెళ్ళి అవుతున్నప్పుడు ఇంక తన పెళ్ళనే అనుకుంది గీత. డబ్బున్న కుటుంబంలోంచి బోలెడు కట్నం, వస్తువులతో ఆ ఇంట్లో అడుగుపెట్టిన పెద్దకోడలు అందరి దృష్టినీ మార్చేసింది. అందర్నీ గడగడలాడించే తండ్రి, పెద్దకోడలు మాటలు వింటే నాగస్వరం విన్న నాగులా అయిపోవడం ఆశ్చర్యమే! పెద్దొదిన తన మాటల్ని శాసనంలాగా మార్చేసింది. అన్నయ్యకు భార్య ఎంత చెప్తే అంత. ఆమె ఏం మంత్రం వేసిందో గానీ పెద్దన్నయ్య ఇంటి ఖర్చులకి నెలనెలా ఇచ్చే మొత్తాన్ని కూడా ఇవ్వడం మానేశాడు. ఇప్పుడా డబ్బు భార్య నగలకీ, అలంకారాలకీ, సినిమాలకీ, షికార్లకీ మాత్రమే ఉపయోగపడుతోంది.     చిన్నన్నయ్య ప్రేమించి పెళ్ళి చేసుకున్న చిన్నొదిన పరిమిత స్వాభావి. త్వరగా బయటపడదు. ఆమె ఏ కట్నమూ తేలేదన్న విషయాన్ని పెద్దొదిన ఎప్పుడూ అందరికీ గుర్తు చేస్తుంటుంది. పైకి నవ్వేసినా లోలోపల చిన్నవదిన నొచ్చుకుంటున్నదని గీతకి తెలుసు. చిన్నన్నయ్యకి జీతం తక్కువ. అది వాళ్ళ ఖర్చులకే సరిపోతుంది.     ఇంటి ఖర్చంతా తండ్రి పెన్షన్, గీత జీతంతోనే గడవాలి. గీత తండ్రి ఉద్యోగకాలంలో సాధించింది స్వంత ఇల్లు, పెన్షన్ లే! ఇప్పుడు ఇంక పెన్షన్ తో పాటు కూతురి జీతం ఆసరాగా ఇల్లు గడుపుతున్నాడాయన. సంపాదించే కూతురికి పెళ్ళిచేస్తే ఇల్లు గడిచేది ఎలా అనేది వాళ్ళ సమస్య.     ఎంతోమంది పెళ్ళికొడుకుల గురించి ఎన్నో వివరాలతో సంబంధాలు వచ్చినా పొసగడం లేదని అనడం కన్నా తండ్రి పొసగనీయటం లేదనేది సరైన మాట.     ఆ మధ్య ఎవరో దూరపు బంధువు ద్వారా ఒక సంబంధం తెలిసింది. వరుడు ఢిల్లీలో ఇంజనీర్. రూపసే కాదు మాటకారి అని తెలుస్తున్నది. ప్రస్తావన మొదలయిన తర్వాత అతను గీత ఆఫీసుకి ఫోన్స్ కూడా చేసేవాడు. కట్నం తీసుకోననీ చెప్పాడు. తీరా అతను వచ్చినపుడు తండ్రి తెగేసి చెప్పాడు.     "చూడు నాయనా! నీవు చాలా సరదా మనిషిలా ఉన్నావు. అభ్యుదయ భావాలు కలవాడివి. మా గీత నీకు తగిన భార్య కాదు" అని! ఆ సంబంధం అలా చెడిపోయింది.     గీతకు తల తిరిగిపోయింది. కన్నతండ్రే ఇలా ప్రవర్తించడం ఆమె జీర్ణించుకోలేకపోతోంది. ఎవరే సంబంధం చెప్పినా ఇంట్లో వాళ్ళంతా కలిసి ఐకమత్యంగా దాన్ని కాన్సిల్ చేసేదాకా నిద్రపోవటంలేదు. అరుణ పిన్ని చెప్పిన పెళ్ళికొడుకు శరత్ రోజూ గీతకు కన్పించే వ్యక్తే.     అతను ఆమెకి ఆఫీసర్. స్నేహంగా చిరునవ్వుతో అందరి మన్ననలూ పొందే సహృదయుడు. గీత పట్ల మర్యాదగా ప్రవర్తించే అతని మనస్సులో ఇలాంటి భావన ఉందని ఆమెకే తెలీదు.     అతను తమ ఇంటికి ఆరోజు వస్తున్నాడంటే గీతకి చాలా బెదురుగా ఉంది. ఇది సిగ్గువల్ల వచ్చే బెదురు కాదు. ఇంట్లోవాళ్ళు అతన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో! వీళ్ళంతా కాదంటే రేపు ఆఫీసులో అతను తనను ఎలా ట్రీట్ చేస్తాడోననే!     అంతేనా! అంతకంటే అతని పట్ల ఆమెకెలాంటి ఆకర్షణ లేదా..? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పటానికి గీత నిరాకరిస్తుంది. ఎందుకంటే అటువంటి ఆకర్షణలకి దూరంగా ఉండాలని ఆ ఇంటి వాతావరణం ఎప్పుడూ ఆమెను శాసిస్తుంటుంది.     చదువుకొని ఉద్యోగం చేస్తున్నా వ్యక్తిత్వంలేని మామూలు మధ్యతరగతి యువతి గీత. తన జీవిత భాగస్వామిని ఎంచుకోవటంలాంటి ముఖ్యమైన నిర్ణయాల్లో కూడా ప్రముఖ పాత్ర తీసుకోలేని అశక్తురాలు. సంపూర్ణ వ్యక్తిత్వం రూపొందించుకోలేకపోతే ఉద్యోగిని అయినా ఆర్ధికస్వాతంత్ర్యం కలలోని మాటే. అంతవరకూ ఆమె ఒక కీలుబొమ్మే గదా!     గీతకు ఇవ్వాళ చాలా ఆవేదనగా ఉంది. తననెవరూ అర్ధం చేసుకోవడం లేదు. అంతా తన జీతాన్ని ప్రేమిస్తున్నారే గానీ, జీవితాన్ని కాదు!     ఆత్మీయమైన స్నేహ హస్తం గీత చెక్కిళ్ళపై జారిపోతున్న కన్నీటిని తుడవడంతో ఈ లోకంలోకి వచ్చిందామె. ఎదురుగా చిన్న వదిన వాసంతి.     "ఛీ! ఏంటిది? చిన్నపిల్లలా" వాసంతి మందలించింది ప్రేమగా.     "స్త్రీకి పెళ్ళి అవసరం లేదంటావా వదినా...?" ప్రశ్నించింది గీత బేలగా... చిన్న వదిన్ని.     "చాలా గంభీరమైన ప్రశ్న ఇది. పెళ్ళి కాకుండానే మానవసేవలోనే తరించిన మదర్ థెరిసా వంటి మహనీయమూర్తుల్ని చూశాం! మనం సాధారణ స్త్రీలం. మన మనస్సుకి నచ్చిని తోడుని ఎంచుకోవటంలో తృప్తి, ఆనందం ఉంటాయి" వాసంతి చెప్పింది మెల్లగా.     మరి నేను పెళ్ళిచేసుకోవడం ఈ ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదెందుకు? మళ్ళీ ప్రశ్నించింది గీత.     "మనిషి ఎప్పుడూ స్వార్ధపరుడే! నువ్వు పెళ్ళి చేసుకొని వెళ్ళిపోతే ఇంటి ఖర్చులు ఎవరు భరిస్తారు? తల్లితండ్రులైనా, అన్నదమ్ములైనా, ఎవ్వరూ స్వార్ధానికి అతీతులు కారు. గీతా! ఇందులో నీ తప్పేం లేదు" వాసంతి మాటల్లో కొత్త అర్ధాలు ఎన్నో తెలుస్తున్నాయి.     "మరి నేను ఎల్లకాలం ఇలానే...." గీత మాటల్ని సగంలోనే ఆపింది వాసంతి.     "అదే జరగకూడదని నా అభిప్రాయం. ఇంటి నిర్వహణలో ఆడపిల్లలు బాధ్యత తీసుకోకూడదని కాదు. మగపిల్లలు వదిలేసిన బాధ్యత పూర్తిగా ఆడపిల్లల నెత్తిన పడేసి హింసాయుతంగా అణచివేతతో పెళ్ళి అనే నీ హక్కుని కాలరాయడం నాకు బాధగా ఉంది. నువ్వు ఎవరి చేతుల్లోనూ కీలుబొమ్మవి కావు. వ్యక్తిగా ఎదిగిన స్త్రీ వివాహ విషయంలో తను కూడా కొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకోవడం నేరం కాదు. ఆమె ఆలోచనలనూ, అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకొని వివాహం జరిపిస్తే విడాకుల కేసులు తగ్గుతాయి కూడా".     "హియర్ హియర్" చిన్నన్నయ్య చప్పట్లు కొడుతూ రావటంతో ఇద్దరూ తలతిప్పి చూశారు.     "ఏమిటీ! మీ వదిన నీకు కూడా లెక్చర్స్ ఇస్తోందా!" చిన్నన్నయ్య మాటలకు నవ్వేసింది గీత.     "చాల్లెండి. అన్నగారయి ఉండీ గీత అమాయకత్వాన్ని మీరూ ఎక్స్ ప్లాయిట్ చేస్తున్నారు" చిరుకోపంగా అంది వాసంతి.     "నేనా" తెల్లబోయాడు చిన్నన్నయ్య.     "అవును! చెల్లెలి పెళ్ళి గురించి కనీసం మీరైనా ఆలోచించారా!" సూటిగా అడిగింది వాసంతి.     నేనెందుకు ఆలోచించడం. నాన్నగారున్నారు. పైగా అది చదువుకుంది. ఉద్యోగిని" తప్పించుకోబోయాడు.     "అలా చూస్తున్నారా! అలా పెంచారా! ఇంతకాలం ఆంక్షలు పెట్టి గడప దాటనీయకుండా పెంచారు. ఇప్పుడు తనే ఎలా చేసుకుంటుంది" తీవ్రంగా అంది వాసంతి.     "నీ ట్రైనింగ్ లో పడిందిగా" నవ్వుతూనే వెళ్ళిపోయాడతను. అతనికి చెల్లెల్ని అర్ధం చేసుకొనే తీరిక, ఓపికా, లేవు మరి!     "వాళ్ళొచ్చేశారు.." చెల్లాయి కేక! అంతా హడావుడి. శరత్, తల్లీ వచ్చారు. అతనికి తండ్రి లేడట. వాళ్ళకి కాఫీలు ఇవ్వమన్న చిన్నవదిన వాసంతి మాట కాదనలేక ఆపని ఎలాగో బెరుగ్గానే పూర్తిచేసింది గీత.     శరత్ చాలా ఫ్రీగా అందరితో మాట్లాడుతూ మధ్యమధ్య గీతకేసి చూసి పలకరింపుగా నవ్వుతున్నాడు. వాళ్ళమ్మగారు గీత దగ్గర కూర్చుని ప్రేమగా పలకరించింది. ఆవిడ్ని చూస్తుంటే గీతకి "అమ్మ కూడా ఇలా ప్రేమగా ఉంటే బాగుండు" అన్పించింది.     చిన్నొదిన ప్రోత్సాహంపై శరత్, గీతలకు ఏకాంతం కల్పించారు. గీతకు అతను కొత్త వ్యక్తి కాదు. ఐనా గుండె దడదడలాడుతోంది.     "మీరు చాలా రిజర్వ్ డ్ గా ఉంటారు. ఆఫీసులోనూ అంతే" మెల్లగా అన్నాడు.      తలదించుకుని కూర్చుని ఉంది గీత.     "సిగ్గా... లేక భయమా! అవసరం లేదు. మనం జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నాం. ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటే మంచిది" అతను మధురంగా చెప్తుంటే తలూపింది గీత.     "మరి అడగండి" అన్నాడు భరోసా ఇస్తున్నట్లు.     "మీరు తాగుతారా?" భయంగా ఆమె అడిగిన తీరుకు నవ్వొచ్చిందతనికి. నవ్వేశాడు.     "ఎవరు చెప్పారు" అడిగాడు.     "చిన్నన్నయ్య" టీచరు ప్రశ్నకు జవాబు చెప్పే స్టూడెంట్ లాగా చెప్పింది.     "అదా"! అర్ధమైనట్లు చూశాడు. ఆ రోజు బార్ లోంచి వస్తుంటే గీత వాళ్ళ చిన్నన్నయ్య ఎదురుపడటం గుర్తొచ్చింది.     "ఆ బార్ లో మా స్నేహితుడుంటే కలవటానికి వెళ్ళానంతే! తాగడానికి కాదు!" చెప్పాడు. ఆమె కళ్ళల్లో అతనిపట్ల నమ్మకం కన్పించింది.     శరత్ వాళ్ళు వెళ్ళినాక ఇంట్లో చాలా చర్చ జరిగింది. భోజనాలయినాక తండ్రి గీతని పిల్చి నిలదీశాడు.     "ఆ! ఇప్పుడు చెప్పు! ఈ రోమియోతో నువ్వు ఆఫీస్ లో రోజూ కలుస్తావుగా! హోటళ్ళకీ, పార్కులకీ వెళుతుంటారా? ఇంకేం! ఇంట్లోంచి వెళ్ళిపోయి నీ పెళ్ళి నువ్వే చేసుకో"! అతను తండ్రిలా కాక జన్మ జన్మల శత్రువులా కనిపించాడు.     ఆమె మనసులో ఓ మెరుపు మెరిసింది. కంపిస్తున్న తన అరచేతిని చిన్నవదిన అదిమి పట్టుకోవడం కొంత ధైర్యాన్ని ఇస్తోంది. ఆనాటినుండీ గీత ప్రతి ఒక్కరినీ ప్రత్యేకంగా చూస్తోంది. తనకిన్నాళ్ళూ తెలియని సంగతులెన్నో తెలుస్తున్నాయి. చిన్నొదిన అల్మారాలోని పుస్తకాలు చదువుతుంటే చీకటిపొరలు విడిపోతున్నాయి. ఆలోచనాలోచనాలు విప్పుకుంటున్నాయి.     "ఎందుకంత పిరికితనం తనలో! అంతా తన మీద ఆధారపడినవాళ్ళే! అయినా అధికారం చెలాయిస్తున్నారు. తన కాళ్ళపై తాను నిలబడగలిగే ఉద్యోగం ఉన్నా పరాధీనంగా ఎందుకుంది. ఎంత విద్యావతీ, ఉద్యోగినీ అయినా స్త్రీ వ్యక్తిత్వాన్ని ఎదగనీయకుండా చిదిమివేయటంలో ఎందరి స్వార్ధం ఉంది! తన శక్తిని గుర్తించిననాడు ఆమెని ఎవరు అణచివేయగలరు". గీత హృదయంలో ద్వారాలు తెరుచుకున్నాయి. క్రమక్రమంగా ఆ ద్వారాలనుండి వెలుగు కిరణాలు ప్రసరిస్తున్నాయి.     రోజూ ఆ టైముకు ఆఫీసునుంచి వచ్చే గీత ఆరోజు ఇంకా ఇల్లు చేరలేదు. పైగా ఒకటవ తేదీకూడా! తండ్రి ఆమె రాకకోసం ఎదురుచూస్తూ వరండాలో కూర్చున్నాడు. ఆయన చూపులు మాటిమాటికీ గేటుమీద వాలుతున్నాయి.     వాకిట్లో కారాగింది. ఇంట్లో అందరి కళ్ళూ కారు మీదే!     మెళ్ళో పూలదండలతో కారు దిగి వస్తున్న జంటని చూసి అవాక్కయిపోయారంతా! పాదాలకి నమస్కరిస్తున్న వధూవరులని ఆశీర్వదించలేకపోతున్నాడా తండ్రి.     "మీ సమస్య నాకు తెలుసునాన్నా! నా జీవితాన్ని తీర్చిదిద్దుకునే హక్కు నాకుందని తెలుసుకున్నాను. నాదైన జీవితాన్ని ప్రారంభిస్తున్నాను. మీ కొడుకులతో బాటు కూతురిగా నా బాధ్యతను నేనెక్కడున్నా భరిస్తాను. మీ మనస్సు నొప్పిస్తే క్షమించండి" గీత మాటలకు తండ్రి కళ్ళు నిప్పులు కక్కాయి.     చల్లని వెన్నెల కిరణాల లాంటి అక్షింతలు తలపై కురవటంతో తలెత్తి చూసిన గీతకి వాసంతి చిరునవ్వు, కొండంత అండగా అన్పించింది. వధూవరులకి కొత్తబట్టలు పెట్టి ఆదరాభిమానాలతో సాగనంపిన వాసంతి గీతలో భవిష్యత్తుకు కావలసినంత స్థైర్యాన్ని నింపింది.

ఆమె విముక్తి

 ఆమె విముక్తి   - డా.సి. భవానీదేవి కిటికీలోంచి మసక వెలుగు గదిలోకి ప్రసరించింది. కలత నిద్రలో ఉన్న అనసూయకి మళ్ళీ మెలకువ వచ్చింది.     అలవాటుగా గోడ మీద దేవుడి పటానికి దండం పెట్టుకుంది. మునుపటిలా దేవుడు స్పష్టంగా కనపడటం లేదు. అలవాటుగానే గడియారం చూసింది. టైము కూడా తెలీటం లేదు.     స్టూలు మీది కళ్ళజోడు తీసి పెట్టుకుని మళ్ళీ టైము చూసింది. ఐదున్నరయింది. గంటలు కొట్టే గడియారం అయితే చూడకుండానే తెలుస్తుందని కొన్నది. కానీ గంటల వల్ల నిద్రాభంగం అని సైలెంట్ చేసేశారు. ఇంకాసేపు పడుకోవచ్చు. అయినా పడుకుంటే.. కందిరీగల గుంపులాంటి ఆలోచనల్ని తప్పించుకోవటం కష్టం. లేచి ఏదో ఒక పని చేయాలి. ఇంతకాలం చేసిందదేగా! మనసు నోరు నొక్కి పెట్టటానికి ఏదో ఒక వ్యాపకాన్ని కల్పించుకుని బిజీగా జీవితాన్ని నడిపింది. ఇప్పుడింక శరీరం సహకరించలేనని మొరాయిస్తోంది. విశ్రాంతిని కోరుతోంది. కానీ మనసు దాడిని తట్టుకోవటం కష్టంగా ఉంది.     రాత్రి పొద్దుపోయే దాకా గుండెల్లో సన్నని నెప్పి. కలతనిద్ర. మళ్ళీ తెల్లారింది... మెల్లగా లేచి బాత్ రూంకి పోవాలని ప్రయత్నించింది. కాళ్ళు తడబడుతున్నై. బెడ్ పక్కనున్న చేతి కర్ర ఆధారంగా జాగ్రత్తగా వెళ్ళి వచ్చి పడుకుంది. మళ్ళీ ఆలోచనల దాడి.     కడుపులో మంట. మందుల వల్లేమో! ఏదైనా తింటే తగ్గుతుందేమో! ఇంత పొద్దున్నే తనకోసం ఎవరు ఏం చేస్తారు? ఎందుకు చేయకూడదు? మనసు ప్రశ్నస్తోంది.     తను మాత్రం వాళ్ళకోసం చీకటి పొద్దుల్లో లేచి ఆదరాబాదరాగా టిఫిన్లు వంట, బాక్సులు ,స్కూలు బ్యాగులు, బూట్లు, సాక్స్...మధ్యలో "అనూ! నా టవల్!' అంటూ శ్రీపతి కేకలు.  పిల్లలు అరుపులు, ఏడుపులు... అసలు అన్ని పన్లు ఎలా చేయగలిగిందో! ఇప్పుడు ఆశ్చర్యంగా అన్పిస్తుంది.     తనలో అంతశక్తి ఉండేదంటే నమ్మలేకపోతోంది. మరి ఆ వయసులో ఉన్న తన తర్వాతి తరం అలా లేదే? వాళ్ళకి అవసరం లేదా? తమ ఆరోగ్యాల పట్ల ముందు నుంచే జాగ్రత్తగా ఉంటున్నారా!? తనలాగా శ్రమించి ఆరోగ్యం పాడు చేసుకునేవాళ్ళు ఈ తరంలో కన్పించరు. వాళ్ళది స్వార్ధమా? జాగ్రత్తా? ఒకవేళ స్వార్ధమైతే అది మంచి స్వార్ధమే! మరి తనకెందుకు లేకపోయింది?     పెద్దాడు, కోడలు ఎనిమిదింటికి కానీ గదిలోంచి బయటికి రారు. ఉద్యోగం చేసే కోడలు కదా! మరి తను కూడా ఉద్యోగం చేసిందిగా! ఏం ఉద్యోగంలే! టీచర్ గా అత్తెసరు జీతం. సాఫ్ట్ వేర్ కోడల్ని పొద్దున్నే లేవమని చెప్పే ధైర్యం ఎవరికుంటుంది. ఇప్పటికీ బాగా గుర్తు. పెద్దాడ్ని కడుపుతో ఉన్నప్పుడు ఓరోజు నలతగా ఉండి ఎండెక్కి నిద్రలేచిన తనని శ్రీపతి ఎన్ని మాటలన్నాడు? జన్మంతా గుర్తుండేలా! ఎంతయినా ఇప్పటి ఉద్యోగినులకు భర్తల అండ ఓ పెద్ద రిలీఫ్.     నిద్ర పట్టక పక్కకు తిరిగి పడుకుంది అనసూయ. మళ్ళీ ఏవేవో ఆలోచనలు.     చిన్నాడు ఐ.ఎ.ఎస్. పరీక్షకు ప్రిపేరు అవుతున్నాడు, వాడేప్పుడు పడుకుంటాడో... ఎప్పుడు లేస్తాడో....? వాడికి పెళ్ళయితే వాడికీ ఆఫీసరైన భార్యే వస్తుంది. ఇంక ఆ అమ్మాయికి ఇంటి బాధ్యతేముంటుంది. ఇలా అయితే ఈ ఇంటి బాధ్యత ఎవరిది...? తనెంత కాలం ఉంటుంది.     ట్రింగ్..ట్రింగ్... కాలింగ్ బెల్ మోగుతుంటే శ్రీపతి లేస్తాడేమోనని కాసేపు చూసింది. శ్రీపతి కదల్లేదు. అతనూ తనకన్నా పెద్దవాడేగదా! ఏం ఓపిక ఉంటుంది. మొదట్నుంచీ ప్రతి పనీ తనే చేయటం అలవాటు చేసింది. అయినా విసుక్కుంటూనే ఉంటాడు.     ఓసారి శ్రీపతికి పెద్ద జబ్బు చేసి సంవత్సరంపాటు మంచంలో ఉంటే అన్నీ తనే చేసింది. కానీ ఇప్పుడు కొంత అనారోగ్యంతో బాధపడే తనకి శ్రీపతి ఏమీ చేయలేకపోతున్నాడు. ఆడవాళ్ళు సేవ చేసినట్లు మగవాళ్ళెందుకు చేయరు. మళ్ళీ కాలింగ్ బెల్ మోగుతోంది... త్పనిసరిగా లేచి చేతి కర్ర సాయంతో వెళ్ళి తలుపు తీసింది.     ఎదురుగా పాలవాడు.. పాల ప్యాకెట్లు అందిస్తూ చేతికర్రకేసి సానుభూతిగా చూశాడు. మళ్ళీ అదే చూపు.... తను భరించలేని జాలి చూపు... ప్యాకెట్లు తీసుకుని తలుపేసింది.. మరీ అంత విసురుగా వేయకుండా ఉండాల్సింది.     ఎంతైనా ఈ మధ్య తనకు చిరాకు, కోపం ఎక్కువయ్యాయని ఇంట్లో వాళ్ళ కంప్లైంట్. శరీరం అనారోగ్యం పాలయితే మనసు ఆరోగ్యంగా ఎలా ఉంటుంది. ఎంత బాగాలేకపోయినా చిరునవ్వులు చిందిస్తూ శాంతంగా ఆడవాళ్ళు నటించాల్సిందేనా? పెళ్ళయింది మొదలు ఎన్నో బాధ్యతల్ని ఇటూ అటూ నెత్తిన వేసుకుంది. ఉద్యోగం, పిల్లలు, భర్త, ఇల్లు సంతోషంగా నిర్వర్తించింది. ఈ పక్షవాతం వచ్చి కాలు చచ్చుబడ్డప్పటి నుంచి మనసు నరకంగా మారిపోయింది. యాంత్రికంగా చేతులు పనిచేస్తున్నాయి!     మిల్క్ బాయిలర్ వికృతంగా అరుస్తోంది. ఉలిక్కిపడి ఆపే లోపే శ్రీపతి ధుమధుమలాడుతూ లేచాడు.     "నిన్నెవరు లేవమన్నారు" విసుక్కున్నాడు అలవాటుగా.     మనసులో మరో ముల్లు బలంగా దిగింది.     "నిద్రపట్టక లేచాను లెండి" తప్పు చేసినట్లు సంజాయిషీ స్వరంతో అంది.     "నీకు ఎటూ నిద్ర పట్టదు. మమ్మల్ని నిద్రపోనీయవు. మరోసారి విసుక్కుంటూ బాత్ రూం కేసి నడిచాడు. ఈ విసుక్కోవటం అతనికి కొత్తకాదు. పెళ్ళయింది మొదలు అతని నోట ప్రేమ పూర్వకమైన మాట విని ఎదుగదు. ఎంత రుచిగా వంట చేసినా ఎంత మంచిపని చేసినా భార్యని మెచ్చుకోవటం అతనికి తెలీదు. కారణం తనకీ తెలీదు. పిల్లల్ని కూడా ఓసారైనా మెచ్చుకోవటం చూసి ఎరుగదు. వాళ్ళెంత ర్యాంక్ సాధించినా... బాగా సంతోషంగా ఉన్నట్లు కన్పించినా ఏదో ఒక మాట అని బాధ పెట్టందే ఉండలేడు శ్రీపతి. అతనికి సరదాలు లేవు, హాయిగా నవ్వలేడు. అలాగని విరాగి కాదు. డబ్బు వ్యామోహం ఎక్కువే!     పెద్దాడు పుట్టినప్పుడు... ఇప్పటికీ ఆ దృశ్యం కళ్ళముందు కదుల్తుంది. ముటముటలాడుతూ హాస్పిటల్ కి వచ్చి చూసి వెళ్ళాడు. తొలిసారి తండ్రి అయిన సంతోషం ఏ కోశానా లేదు. ఆమె ఆరోగ్యం గురించి గానీ పిల్లాడి గురించిగానీ అడక్కపోగా పిల్లాడు పుట్టిన ఘడియ, నక్షత్రం బాగాలేదని శాంతి, హోమం, జపాల గురించి ఏకరువు పెట్టి నూనెలో మొహం చూడాలనీ, చాలా ఖర్చవుతుందనీ అనసూయ తల్లిదండ్రులు తమ వాళ్ళకి బారసాల్లో చేయాల్సిన మర్యాదల గురించి చెప్పి వెళ్ళిపోయాడు.     అనసూయ చిన్నబుచ్చుకుంటే తల్లే ఓదార్చింది "కొందరంతేలేమ్మా! ప్రేమని ప్రకటించరు" అని.     "ప్రకటించలేని ప్రేమెందుకు" అనుకుంది మొదటిసారిగా.     ఆ తర్వాత క్రమంగా అతని పద్ధతి అలవాటవటానికి సెన్సిటివ్ నెస్ నోరు నొక్కేయక తప్పలేదు.     "కాఫీ..." గ్లాసు స్టూలు మీద పెట్టి వెళ్ళాడు శ్రీపతి. పరధ్యానంగా ముట్టుకుంది. చురుక్కుమన్న చేతిని వెనక్కి తీసుకుంది.     ఆ రోజు ఇంతే! పొరపాటున వేలు తెగింది. రక్తం కారుతుంటే ఆడపడుచు కంగారుపడిపోతోంది. శ్రీపతి చూశాడు "బాగా అయింది. అంత నిర్లక్ష్యం దేనికి" అంటూ నిరాసక్తంగా వెళ్ళిపోయాడు అక్కడ్నుంచి.     వేలు తెగిన బాధ కన్నా అతని మాట, ప్రవర్తన తాలూకు గాయం, మచ్చ అలాగే ఉండిపోయాయి. తర్వాతి కాలంలో అంతకన్నా పెద్ద పెద్ద గాయాలు మచ్చలతో తన మనసు తనే గుర్తు పట్టలేనట్లు మారిపోయింది.     "లోతైన బావిలో నీరు ఉంటుంది. కానీ ఎవరి దాహాన్ని తీర్చలేనప్పుడు దానికి సార్ధకత ఏముంది. అతని ప్రేమా అంతే" అనుకుంది తను.     పిల్లల సరదాలు అవసరాలు అన్నీ తనే తీర్చింది, పెద్దాడికి పెళ్ళయ్యాక అమ్మతో అవసరం తీరినట్లే! వాడికి మీజిల్స్ వస్తే పదిహేను రోజులు మంచం పక్కనే పడుకుంది. వాడికి మాత్రం 'ఎలా ఉందని' అమ్మని పలకరించే తీరిక లేదు.     "అమ్మా! రేపు ఫీజు కట్టాలి" చిన్నాడు పక్కలో కూర్చున్నాడు.     'వీడికి అవసరం ఇంకా ఉంది' అనుకుంది.     "ఎంత నాన్నా!" అడిగింది.     "పదిహేను వందలు. పుస్తకాలకి ఇంకో వెయ్యి" గారంగా అడిగాడు. మూడు వేలు దిండు కింద నుంచి తీసివ్వగానే మాయం అయ్యాడు.     స్కానింగ్ కోసం దాచినవి... వాడికన్నా ఎక్కువా!     ఆ రోజుల్లో తల్లిదండ్రుల శక్తిని బట్టి చదువుకుంది. ఇప్పటి పిల్లలు తల్లిదండ్రుల శక్తి గురించి అనవసరం. ఎక్కడ్నుంచయినా సరే తెచ్చి వాళ్ళక్కావలసింది చదివించాలి అంతే..! ఈ మార్పు ఎందుకొచ్చిందో తనకి అర్ధం కావటంలేదు.             * * *     నగరంలోని నక్షత్రాల హాస్పిటల్ లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో స్పృహ ఉండీ లేని స్థితిలో అనసూయ.     రోజులు... గంటలు... నిమిషాలు... మరో క్షణంలో ఏమో... అనే పరిస్థితి.           అనసూయ వళ్ళంతా నరకం.. ఇదే నరకం... పురాణాల్లో ఏమేమో చెప్తారు. ఇదే నిజం.. చచ్చిపోతే ఏమౌతుంది.. అంతా వస్తారు.. చూస్తారు.. అంత మంచిది ఇంత మంచిది... ఆనాడిట్లా... ఈనాడిట్లా... అంటారు. కొందరు నిజంగా.. కొందరు నంగి నంగిగా ఏడుస్తారు.. పిల్లలు ఏడుస్తారా? ఏడవక పోవచ్చు... మంచాన ఉన్న అమ్మకు చేయడం కష్టమే కదా! పోవటమే మంచిదని సర్దుకుంటారు, పాలవాడి జాలి చూపులు భరించక్కర్లేదు.      ఇంటికి ఎవరొచ్చినా తన నడక మీద వాళ్ళ జీవితాలు ఆధారపడినట్లు 'కాస్త నడుస్తున్నారా' అనే అవకాశం ఉండదు. రోజూ పూలు పూసే చెట్లు... కోడలు ఒళ్లొంచి నీళ్ళు పోస్తే అలాగే పూస్తాయి. తన అక్క చెల్లెళ్ళ రాకపోకలు తగ్గిపోవచ్చు. శ్రీపతి తద్దినాలంటూ విసుక్కుంటూ విసిగిస్తాడేమో! వద్దని చెప్పాలి. బతికుండగా తనపై లేని శ్రద్ధ శ్రద్ధలపై ఎందుకు? అదేదో జంధ్యాల సినిమాలాగా శ్రీపతికి విసుక్కోవటానికైనా తను కావాలేమో! కానీ తనకి మాత్రం అలా గోడమీద ఫోటోలోంచి కూడా ఇంకా శ్రీపతితో మాట్లాడాలని లేదు. అసలు మనిషికి బంధాలన్నీ ప్రాణాలు పోగానే పోతాయట. ఇంకెందుకు మరి. హాయిగా వెళ్ళిపోవచ్చు. నడవలేకపోయినా... అంత బాధలోనూ అనసూయకి నవ్వొచ్చింది.     "అమ్మ నవ్వుతోంది" చిన్నాడి గొంతు అది. మళ్ళీ తనకి దిగులేస్తోంది. వీడి పెళ్ళి అయితే బాగుండేది. పోన్లే! లవ్ మ్యారేజ్ చేసుకుంటాడు. తన మీద ఆధారపడడు. తన మీద ఆధారపడే వాళ్ళుంటేనేనా ఆడవాళ్ళు బతకాలనుకునేది? తమకోసం తాము ఎందుకు బతకరు? ఆడవాళ్ళు అంతా ఇతరుల కోసమే ఎందుకు బతుకుతారు. చరమదశలో స్త్రీవాదం ఆలోచనలు... శ్రీపతికి తెలిస్తే అమ్మో!     "ఇంక లాభం లేదండీ! రేస్పిరేషన్ కష్టంగా ఉంది... వెంటిలేటర్ మీదికి షిఫ్ట్ చేయాలి" డాక్టర్ విసుక్కుంటున్నాడు.     ఇతనికీ విసుగ్గానే ఉంది. తనకంటే అన్ని విధాలా తక్కువ స్థాయిలో ఉన్న ఆడవాళ్ళని భర్తలు ప్రేమగా గౌరవంగా చూస్తున్నారు. ఈ కుటుంబంకోసం ఇంత చేసినా ఎందుకింత నిరాదరణ. అనసూయకి దుఃఖం వచ్చింది. "ఆవిడ బాధపడ్తున్నారు" సిస్టర్ తన కన్నీళ్ళు తుడుస్తోంది.     "ఈ అమ్మాయే నయం... తన కన్నీళ్ళని చివరి క్షణాల్లో తుడుస్తోంది" జీవితమంతా ఇటువంటి ఆప్తస్పర్శ కోసమే ఎదురుచూసింది.     మళ్ళీ కళ్ళు మూతలు పడ్డాయి. ఎవరెవరో వస్తున్నారు. చూసి వెళ్తున్నారు. అనసూయకి మగతగా ఉంది. ఎవరో గుర్తు పట్టలేకపోతోంది.     "సిస్టర్... క్విక్" డాక్టర్ స్వరంలో హడావుడి... అనసూయకి వెంటిలేటర్ పెట్టారు. ఇప్పుడు హాయిగా గాలి పీల్చుకోగల్గుతోంది. హమ్మయ్య! తను ఇంకా బతుకుతుందా? దేనికి.... ఇటువంటి జీవితానికి పొడిగింపు అవసరమా?! స్పృహ తెలిస్తే ఇవే ఆలోచనలు... దిగులు.     "మా ట్రీట్ మెంట్ వల్ల యూజ్ లేదు. ఆవిడ డిప్రెషన్ లోకి వెళ్తున్నారు. కావలసిన వాళ్ళందరికీ కబురు చేయండి".     డాక్టర్ గొంతువిని అనసూయ రిలీఫ్ గా ఫీలయ్యింది.     బీప్... మంటూ శబ్దం. గోల చేసింది వెంటిలేటర్... డ్యూటి డాక్టర్ గాభరాగా వచ్చి చూశాడు.     ఈలోగా అనసూయకి ఉక్కిరిబిక్కిరి అవుతోంది.     భార్య పక్కనే ఉన్న శ్రీపతి కంగారుగా చూశాడు.       "వెంటిలేటర్ కి ఆక్సిజన్ పైప్ డిస్కనెక్ట్ అయింది" అంటూ రీసెట్ చేశారు డాక్టర్, సిస్టర్.     అనసూయ మళ్ళీ కొంచెం కుదుటపడింది.     "ఎన్నాళ్ళిలా డాక్టర్?" శ్రీపతి గొంతులో కొండంత దిగులు.     "పేషెంట్ రెసిస్టన్స్... రెస్పాన్స్ ని బట్టి... ఎన్నాళ్ళనేది ఇప్పుడే చెప్పలేం..." అంటూ ముందుకి నడిచాడు డాక్టర్.     ఆ రాత్రి చీకటి నిర్దయలా వ్యాపించింది.     ఒళ్ళంతా పైపులు, ట్యూబులతో ఉన్న భార్య కేసి పరిశీలనగా చూశాడు శ్రీపతి. సెడేషన్ లో ఉన్న అనసూయ మత్తులో ఉంది.     "సారీ అనూ! నీ బాధ చూళ్ళేకపోతున్నాను. నేను నీకేమీ చేయలేకపోయాను. కనీసం త్వరంగా విముక్తి కల్గిస్తాను" గొణుక్కున్నాడు శ్రీపతి.     వెంటిలేటర్ కి ఉన్న కొన్ని కనెక్షన్లు తీసేసి వెనుదిరిగి చూడకుండా నిశ్శబ్దంగా వెళ్ళిపోతున్న భర్తకేసి చూడలేని అనసూయ మొహంలో చెక్కు చెదరని ప్రశాంతత.. నిశ్చల దీపంలా వెలుగుతోంది...!

నాకున్నది ఒక చక్కని బొమ్మ

నాకున్నది ఒక చక్కని బొమ్మ ఎపిసోడ్ - 8 - వసుంధర     మర్నాడు నేనే లేచేసరికే రత్తమ్మ వచ్చి తనపని తను చేసుకునిపోతోంది. నేను దాని దగ్గరకు వెళ్ళి మొత్తం జరిగిందంతా చెప్పేసి "అసలు తప్పు అంతా నాది. నా గురించి నువ్వు తిట్లు తిన్నావు. నన్నూ, అమ్మనూ క్షమించవూ?" అన్నాను.     కాసేపు అది నావంక వెర్రిమొహం వేసుకుని చూసింది. తర్వాత్ చేస్తున్న పని వదిలిపెట్టి అమ్మ దగ్గరకు పరుగెత్తింది.     "మీ అమ్మాయిగారమ్మా, మా దొడ్డ మనసమ్మా! అలాంటి తల్లి గొప్ప చదువులు చదివి దేశాన్నేలితే- ఇందిరమ్మలా మాలాంటోళ్ళనో కంట కనిపెట్టి కాపాడుతుందమ్మా! అలాంటి బిడ్డను కన్నందుకు నీ జన్మ ధన్యమయిందమ్మా" అంటూ నన్ను పొగిడేయ సాగింది.     అమ్మ జరిగింది విని ఏమనాలో తెలియక "నిన్న అయిందేదో అయిపోయింది. ఏమీ అనుకోకేం?" అంది.        "అదేంటమ్మా! పొరపాట్లన్నాక ఎవరికైనా వస్తాయి. మీరు నన్ను ఎన్నోసార్లు ఆదరించారు. ఒక్క రోజులో అన్నీ మరిచిపోతాననుకున్నారా అమ్మా?" అంది రత్తమ్మ.     నేను శంకరం గురించి ఆలోచిస్తున్నాను.     నిన్న రావడానికి ప్రయత్నిస్తానని చెప్పాడు. రాలేదు. ఈ రోజైనా వస్తాడో, రాడో? వాడెలాగున్నాసరే గౌరవిస్తానని అమ్మ నాకు మాట ఇచ్చింది.     "పెద్ద వాళ్ళం. మనం దానికి చెప్పాల్సింది ఎలాగూలేదు. కనీసం దాని నుండి నేర్చుకుందాం!" అని నాన్నగారు అమ్మకు చెప్పారు.     అయితే ఆరోజు శంకరం బడికి రాలేదు. ఆరోజే కాదు వరుసగా ఆ వారమంతా రాలేదు.     నా దగ్గర సబ్బు తీసుకుని శంకరం నా ఇంటికి రావడం సంగతి అటుంచి బడికి కూడా రావడం మానేశాడు. వాడి ఇంటికి వెళ్ళి  కనుక్కుందామా అంటే నాకు ఒక్కటే భయం.     వాడు నన్ను అక్కడ ఏ మయిన నీళ్ళయినా తాగమంటే ? అప్పడందులోని సూక్ష్మజీవులు నాకు రోగం తెప్పిస్తే?     మరుసటి వారం శంకరం బడికి వచ్చాడు.     "ఇన్నాళ్ళూ ఏమైపోయావు?" అనడిగాను.     వాడు నా చేతిలో చిన్న కాగితం పొట్లం పెట్టి "ఇది నువ్వు నాకిచ్చిన సబ్బు. నేను దీన్ని వాడలేదు" అన్నాడు.     "ఏం ?" అన్నాను.     "సరిగ్గా ఆరోజు మధ్యాహ్నమే మా అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది. డబ్బు ఖర్చు పెట్టకపోతే బ్రతకదుట. వెయ్యి రూపాయలు కావాలట.     "మరయితే ఎలా ?"     "ఏమో మరి అమ్మ చచ్చిపోతుందని నాకు బెంగగా వుంది. అమ్మ కోసం తమ్ముడు కూడా బెంగట్టుకుని చిక్కిపోయాడు. నీకు తెలుసుగా వాడెంత బాగుంటాడో" అన్నాడు శంకరం.     "అవునవును చాలా బాగుంటాడు" అన్నాను వాణ్ని సంతోష పెట్టడానికి.     "నిన్ననే అమ్మ బతికే ఉపాయం తెలిసింది" అంటూ శంకరం ఏడ్చేశాడు.     వాడేడుస్తూంటే నాకు చాలా జాలేసింది. ఉపాయం తెలుసుగా ఇంక ఏడ్వడ మెందుకూ ?" అన్నాను.     "ఆ ఉపాయమేమిటో తెలుసా? తమ్ముడిని అప్పలస్వామికి అమ్మేయడం" అన్నాడు శంకరం. వాడి ఏడుపు ఇంకా ఎక్కువయింది.     "అదేమిటి?" అన్నాను ఆశ్చర్యంగా.     "తమ్ముడిని తనకిచ్చేస్తే వెయ్యి రూపాయలిస్తానన్నాడు అప్పలస్వామి. ఆ తర్వాత తమ్ముడు మా ఇంట్లో వుండడు.వాడు లేకపోతే నేను బతకలేను. కానీ అమ్మను బతికించుకోవడం కోసం వాడిని అమ్మేయాలి" అన్నాడు శంకరం.     వాడి మాటలు పూర్తయ్యేసరికి నాకూ ఏడుపు వచ్చేసింది. "పోనీ ఆ అప్పలస్వామి వాడిని బాగా చూసుకుంటాడా?" అన్నాను. ఏడుపు ఆపుకుందుకు ప్రయత్నిస్తూ.     "వాడి గురించి ఎవ్వరూ మంచిగా చెప్పుకోరు. వాడు కన్నో, చెయ్యో, కాలో పాడుచేసి ఎక్కువ డబ్బుకి చిన్న పిల్లల్ని ముష్టివాళ్ళకి అమ్మేస్తాడంటారు" అన్నాడు శంకరం. వాడికి మళ్ళీ ఏడుపు వచ్చేసింది.     నాకు వళ్ళంతా వణికిపోయింది. "అమ్మ బాబోయ్!" అన్నాను. ఆ అప్పలస్వామి ఎవరో కానీ న చేతులూ, కాళ్ళూ విరిచేస్తున్నట్లు అనిపించింది.     "అయితే అమ్మేశారా?" అన్నాను.     "లేదు. రేపు అప్పలస్వామి డబ్బు తీసుకుని వస్తాట్ట" అన్నాడు శంకరం.     "అయితే మా నాన్నగారిని అడుగుతాను. నువ్వు తొందర పడకు. ఆయన సాయం చేస్తారు" అన్నాను.     శంకరం నమ్మలేదు. సాయంత్రం వాడిని మా ఇంటికి తీసుకు వెళ్ళాను.     అమ్మకు విషయమంతా వివరించి చెప్పాను.     "మనమేమైనా జమీందార్లమా ? మనకేమైనా ఎస్టేట్లున్నాయా? అడ్డమైన వాళ్ళకీ వెయ్యేసి రూపాయలిస్తూ కూర్చోవడం వున్న వాళ్ళక్కూడా ఇష్టంలేని పని. అసలు నువ్వు బాగా బరితెగించి పోయావు. నీ ఆగడాలరికట్టాలి!" అంటూ కసిరింది.     నా బాధ మామ్మకు చెప్పుకున్నాను. మామ్మ కూడా నన్ను తిట్టింది. మామ్మ శంకరాన్ని కూడా తిట్టింది.     "నేను చెప్పానా ?" అన్నట్లు నా వంక చూశాడు శంకరం.     "మా వాళ్ళు తిట్టారని నీకు బాధగా వుందా ?" అన్నాను.     "ఇలాంటివి నా కలవాటే ! ఎలాగూ మీ ఇంటికి వచ్చానుగా బొమ్మను చూసి వెళ్ళిపోతాను" అన్నాడు శంకరం.     వాడికి నా బొమ్మ చూపించాను. అన్నీ వివరంగా చెప్పాను. ఆ బొమ్మతో నేనెలా ఆడుకుంటానో చెప్పాను. వాడు అన్నీ విన్నాడు. బొమ్మ వాడికి చాలా నచ్చింది.     కానీ నా బొమ్మకు అన్నీ జరుగుతున్నాయి. శంకరం తమ్ముడికి ఏం జరగడం లేదు.     నా బొమ్మ నాదగ్గరే ఎన్నేళ్ళున్నా ఇలాగే వుంటుంది. కానీ శంకరం తమ్ముడు ఏదో ఒకరోజున పెరిగి పెద్దవాడౌతాడు. నాన్నగారంతటి వాడౌతాడు. ఈలోగా అప్పలస్వామి వాడినేం చేస్తాడో ?     "శంకరం నీ తమ్ముడు మీ ఇంట్లో వుండాలి. వుంటాడు!" అన్నాను.     "ఎలా ?" అన్నాడు వాడు నమ్మలేనట్లు.     "నాతో పద" అన్నాను.     నేను బొమ్మతో సహా శంకరాన్ని తీసుకుని డాక్టరు వద్దకు వెళ్ళాను. నేను వెళ్ళేసరికి డాక్టరుగారు ఇంట్లోనే ఉన్నాడు. ఆయన నన్ను వెంటనే గుర్తు పట్టలేదు. నేనే ఆయనకు గుర్తు చేశాను.     డాక్టరుగారు కోప్పడలేదు. ఆప్యాయంగానే పలకరించి "ఏం కావాలమ్మా!" అన్నాడాయన.     "వెయ్యి రూపాయలిస్తే ఈ బొమ్మను మీకిచ్చేస్తానండి" అన్నాను.     ఆయన ముందు ఆశ్చర్యపడి డబ్బుకోసం బొమ్మను అమ్ముకునే దుర్గతి పట్టిందా పాపం మీకు? మీ నాన్న తనే రాలేకపోయాడా ? ముఖం చల్లక నిన్ను పంపించాడా ?" అన్నాడాయన.     "మా నాన్నగారికి తెలియదండి. మీరు కూడా ఆయనకు చెప్పవద్దండి" అన్నాను.     డాక్టరుగారు ఇంకా ఆశ్చర్యపోయాడు. ఆయనకు నేను అన్నీ చెప్పాను.     "నువ్వు చెప్పేదంతా నిజమా ?" అన్నాడాయన.     "వీడేనండి శంకరం. వీడి అమ్మకే జబ్బు చేసింది" అన్నాను.     "అలాగా" అని "ఎక్కడుందిరా మీ అమ్మ?" అంటూ డాక్టరుగారు వాడిని వివరాలడిగి అప్పటికప్పుడు ధర్మాసుపత్రికి ఫోన్ చేశాడు. ఏమేమిటో మాట్లాడాడు.     నేనాయన వంక ఆత్రుతగా చూస్తున్నాను.     "ఆ బొమ్మలాగియ్యి" అన్నాడు డాక్టరుగారు. నేనాయనకు అందించేశాను.     "ఇంక నువ్వు వెళ్ళొచ్చు. వీడి అమ్మను నేను బతికిస్తాను. ఇప్పుడే వీడితో బయలుదేరి వీడింటికి వెడతాను" అన్నాడు డాక్టరుగారు.     "అన్నపూర్ణా! నా కోసం నువ్వు నీ బొమ్మను అమ్మేస్తున్నావా ?" అన్నాడు శంకరం బాధగా.     "అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం" అని నేను ఇంటికి వెళ్ళిపోయాను. బొమ్మలేక ఇల్లంతా చిన్నబోయినట్లయింది.     బొమ్ముంటే నాకు ఎన్ని పనులో !     నేను కాళీగా వుండడం చూసి అమ్మ "ఏమే, నీ బొమ్మ బజ్జుందా? నువ్వు కాళీగా కనపడుతున్నావు?" అంది.     "ఊఁ" అన్నాను. అంతకంటే ఇంకేం చెప్పను.     నా బొమ్మకు ప్రాణంలేకపోవచ్చు. కానీ అది నాకు బాగా అలవాటైపోయింది. ఏదో మూల నుండి నన్ను పిలుస్తున్నట్లే అనిపిస్తోంది.     అప్పుడు నాకు శంకరం గుర్తుకువచ్చాడు. వాడి తమ్ముడిని అమ్మేసుకుంటే వాడికింకా ఎక్కువ ఏడుపొచ్చేదేమో!     ప్రాణంలేని నా బొమ్మ వాడి అమ్మ ప్రాణాలు కాపాడుతోంది. అందుకు నేను సంతోషించాలి. నా బొమ్మ సంగతి నేను ఇంట్లో ఎవరికీ చెప్పలేదు.     మర్నాడు స్కూలుకు వెళ్ళాను. డల్ గా వున్నాను. శంకరం బడికి రాలేదు. నేను ఇంకెవ్వరితోనూ మాట్లాడలేదు.     ఎప్పుడూ అల్లరిచేసే కిష్టిగాడు కూడా నా దగ్గరకు ప్రేమగా వచ్చి "ఏమిటే అమ్ములూ అదోలా వున్నావు? వంట్లో బాగోలేదా?" అనడిగాడు.     "బాగానే వుందిరా!" అని వూరుకున్నాను.     ఆ రోజు పాఠాలేమీ సరిగ్గా ఎక్కలేదు. ఇంటికి వెళ్ళాక కూడా నాకలాగే వుంది.     "ఏమే ఆ శంకరంగాడి తమ్ముడి కోసం బెంగెట్టుకున్నావా? అడ్డమైన వాళ్ళ గురించీ ఆలోచిస్తే మనం బతకలేం" అంది అమ్మ. మామ్మ కూడా అలాంటిదే ఏదో చెప్పింది.     నాన్నగారు ఆఫీసు నుండి వచ్చిన అరగంటకి మా ఇంటికి డాక్టరుగారు భార్య వచ్చారు. వాళ్ళబ్బాయి సుధాకర్ కూడా వచ్చాడు. వాడి చేతిలో నా బొమ్మ వున్నది.     నాకు తెలిసిపోయింది. వాళ్ళు నాన్నగార్ని వేళాకోళం చేయడానికి వచ్చారు. నా పని అయిపోయింది.     "ఒకప్పుడు ఈ బొమ్మను మీ ఇంట్లోంచి కొందా మనుకున్నాను. కానీ ఈ రోజు ఈ బొమ్మను మీ అమ్మాయికి బహుమతిగా ఇద్దామని వచ్చాను" అన్నాడు డాక్టరుగారు.      "ఈ బొమ్మ మీ కెక్కడిది?" అన్నారు నాన్నగారు.     "ఈ బొమ్మ మీ అమ్మాయిదే!" అంటూ డాక్టరుగారు నిన్న జరిగిందంతా ఆయనకు చెప్పి "మీ పాప చాలా గొప్పది! ఎప్పుడూ డబ్బుకోసం తప్ప వైద్యం చేసి ఎరుగని నా మనసునే మార్చేసింది. అసలు నిన్న మీ పాప దగ్గర్నుంచి బొమ్మ తీసుకోకూడదనుకున్నాను. కానీ ఇంత గొప్ప మనసున్న పాపకు ఏదైనా బహుమతిగా ఇవ్వాలనిపించింది. ఈ బొమ్మకు మించి తనకు నేనివ్వగలదేమీ లేదు. అందుకే తన దగ్గర తీసుకున్నాను. మీ పాపను పిలుస్తారా?" అన్నాడు.     "అమ్మలూ!" అన్నారు నాన్నగారు.     నేను నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ అక్కడకు వెళ్ళాను.     డాక్టరుగారు సుధాకర్ చేత నాకా బొమ్మను ఇప్పించారు.     "చూడు పాపా! శంకరం తల్లి నా నర్సింగ్ హోంలో వుంది. తప్పక బ్రతుకుతుంది. చేతనైనంతలో కొందరైనా లేనివాళ్ళకి సాయం చేయకపోతే ఈ జీవితానికి అర్ధంలేదని తెలుసుకున్నాను. ఈ రోజు నుండి నువ్వూ, మా సుధాకర్ స్నేహంగా వుండాలి. రోజూ ఓ గంటసేపైనా కలుసుకుని మాట్లాడుకోవాలి" అన్నాడు ఆయన. ఆయనింకా ఏమో అన్నాడు కానీ నాకు అర్ధం కాలేదు.     వాళ్ళు వెళ్ళిపోయాక నాన్నగారు "బొమ్మను ఆ డాక్టరుకు అమ్మేశావా? ఏం అదంటే నీకు విసుగు పుట్టిందా?" అన్నారు.     ధైర్యం చేసి "మనదేశంలో ప్రాణమున్న పసిపాపలు తిండి, గుడ్డలేక అలమటిస్తూంటే నాకుబొమ్మలెందుకు? ఆ బొమ్మకు ఖర్చులెందుకు? ఇంక ఈ బొమ్మ గురించి నేనేమీ ఖర్చుచేయను. దీనికి పెట్టే ఖర్చుతో ఏ పేదవాళ్ళకైనా సాయపడతాను" అన్నాను.     "బయల్దేరింది పెద్ద సంఘ సేవకురాలు! మరి అలాంటప్పుడా బొమ్మను మళ్ళీ ఎందుకు డాక్టరుగారి దగ్గర తీసుకున్నావు?" అనడిగారు నాన్నగారు.     "ఏమో శంకరంలాంటి వాళ్ళ కింకెవరికైనా సాయపడ్డానికి పనికి వస్తుందేమోనని" అన్నాను. అన్నాక భయంగా మూలమూలగా పోతున్నాను.     అప్పుడు నాలుగడుగుల్లో అమ్మ వచ్చి నన్ను కలుసుకుంది.     నా బుగ్గలు పుణికింది. ఆప్యాయంగా నా తల నిమిరింది. తన ఒడిలో నన్ను కూర్చో బెట్టుకుంది.     "వున్నట్లుండి నన్నూపుతూ, తనూగుతూ పాట ప్రారంభించింది.     నాకున్నది ఒక చక్కని బొమ్మ దానికి నేను అమ్మ     అది అబ్బాయా అమ్మాయా అని అడుగకూడదు     గౌను తొడిగినా అమ్మాయే అది పాంటు వేసినా అమ్మాయే"     అమ్మ ఈ పాట నా గురించే పాడిందని అర్ధమైపోయింది నాకు. "అమ్మా!" అని ఏడ్చేశాను.     "పిచ్చి పిల్లా ఏడుస్తా వెందుకూ?" అంది అమ్మ.     కొంచెం సేపట్లో నా ఏడుపు ఆగిపోయింది.     "అమ్మా! బొమ్మ గురించి నేనేమీ అడగను. నా ఖర్చులు కూడా తగ్గించుకుంటాను. పాపం! ఆ శంకరానికి మంచి బట్టలు కుట్టించండి. వాడు బాగా చదువుకుందుకు సాయం చేయండి. అప్పుడు వాడు గొప్పవాడు అవుతాడు. వాళ్ళ వాళ్ళని పైకి తీసుకొస్తాడు" అన్నాను.     అప్పుడు నాన్నగారు వచ్చి అమ్మ ఒడిలోంచి నన్ను తీసుకుని ఎత్తుకున్నారు. "మనమెలా వుంటున్నామన్నది కాదు ముఖ్యం. మన చుట్టూ వాళ్ళెలా వుంటున్నారని పట్టించుకోవాలి. కాస్త కలిగిన ప్రతిఒక్కడూ తన పక్క నుండే లేనివాడిని ఆదుకుంటే దేశంలో పేదరికం తొలగిపోడానికి మనం నాయకులమీదే ఆధారపడక్కరలేదు" అని "నీ కోరిక తప్పక నెరవేరుస్తానమ్మా- నీ పేరు నీకు బాగా కుదిరింది. మీ అమ్మ, నా అమ్మ దేశంలో ఒక్కొక్క అమ్మ మాత్రమే! కానీ దేశంలో అమ్మలందరూ నీలో వున్నారు. నువ్వు ఒక్క అమ్మవు కాదు. అందుకేనేమో మాకు నువ్వు పుట్టినప్పుడే నిన్ను అమ్మలూ అని పిలవాలనిపించింది" అన్నారు.     అవును. నా పేరు అమ్మలు.     నా బొమ్మకు నేను అమ్మను. కానీ ఇంకా ఎందరో అమ్మలు నాలో వున్నారు.     'నా పేరు అమ్మలు' అంటూ కథ ప్రారంభించాను.     నా కథ ఎప్పుడూ ఇలాగే నడుస్తూ వుండాలన్నది నా కోరిక.                ***      (సమాప్తం)    ***  

అమ్మా! నన్ను క్షమించొద్దు

   అమ్మా! నన్ను క్షమించొద్దు   - డా.సి.భవానీదేవి కిచెన్ సర్దుకుంటున్న సునీత మోహన్ ని పిలిచింది.     "మోహన్! కొంచెం హెల్ప్ చేయవూ ప్లీజ్" సునీత అలా అడిగితే కాదనలేడు మోహన్.     ఎంత డాక్టరయినా భార్య ముందు భర్తే గదా! కొత్తగా ఇల్లు మారి వారం అయినా ఇద్దరికీ డ్యూటీలతోనే సరిపోవడంతో ఇల్లు సర్దుకునే టైం లేదు. ఫ్రిజ్ కనెక్షన్ ఆన్ చేశాడు.     "రేపు కూరలు తెప్పిస్తాను సునీతా! ఇంక చాల్లే ఆకలేస్తోంది వడ్డించు" అంటూ చేయి కడుక్కున్నాడు మోహన్.     ఇంతలో పక్కింటావిడ గొంతు వినిపించింది మళ్ళీ.     "రాధా! కొంచెం కంచాలు పెట్టమ్మా! అన్నం తిందాం" కూతురితో అంటోంది.     ఈ వారం రోజులుగా ఆవిడ మాటలు వింటూనే ఉంది సునీత. గరిటెలు గిన్నెల చప్పుడు. భోజనాలు చేస్తున్నట్టున్నారు.     "రాధా! నాన్నగార్కి పక్కవేయి. మంచినీళ్ళు దగ్గరపెట్టు. అన్నట్లు టాబ్లెట్లు వేయడం మర్చిపోకు" పక్కింటావిడ గొంతు వింటూనే సునీత మోహన్ లు భోజనం ముగించారు. పక్కింట్లో లైటు ఆరిపోయింది. అంతా పడుకున్నట్లున్నారు.     సునీత ఇంట్లో ఉన్న టైంలో పక్కింటావిడ గొంతు విన్పిస్తూనే ఉండడం సునీత దినచర్యలో భాగం అయింది. ఆవిడ పేరు జానకమ్మని పనిమనిషి చెప్పింది. ఓసారి వెళ్లి ఆవిడ్ని పరిచయం చేసుకుందామనుకునేలోపు అర్జంట్ ఫోన్ కాల్. అమ్మకి బాగాలేదు, వెంటనే రమ్మని. ఆదరాబాదరాగా ఇద్దరూ లీవ్ లెటర్స్ పడేసి నెల్లూరు వెళ్లారు.     పక్సవాతంతో మంచంలో పడుకున్న అమ్మని చూసి ఏడ్చేసింది సునీత. మోహన్ కి భార్యని ఓదార్చడం కష్టమైంది. పదిరోజులున్నారు. అమ్మకి కొంత నయం అన్పించాక తిరుగు ప్రయాణమైంది సునీత.     అమ్మ సునీత చెయ్యి పట్టుకుని వదల్లేదు. భయంగా వుందని దగ్గరుండమని బతిమాలింది. కళ్ళనీళ్ళు పెట్టుకుంది. తననింత దాన్ని చేసిన అమ్మకి అవసానకాలంలో దగ్గర ఉండడానికి టైం లేదు సునీతకు.     "సెలవు లేదమ్మా! మళ్ళీ వస్తాను" తల్లికి నచ్చచెప్పి బయలుదేరిందేగాని మనసంతా అమ్మ దగ్గరే వుంది.     మళ్ళీ రొటీన్. ఇద్దరూ ఉద్యోగం చేసే జీవితంలో అమ్మకే స్థానం లేదు. పక్కింటివాళ్ల గురించి చెప్పేదేముంది. కొత్త ఇంట్లోకి వచ్చాక కొత్త పరిసరాలు, పరిచయాలు. అంటీ ముట్టని సిటీ జీవితం.     ఆరోజు ఉదయం నిద్ర లేస్తూనే జానకమ్మగారి గొంతు విన్పిస్తోంది. ఆవిడ "రాధా! ఇదివ్వు అదివ్వు" అంటుంటే సునీతకి అమ్మ మళ్ళీ గుర్తొస్తోంది.     "రాధా! దేవుకి పూజకు పూలు కోసుకురమ్మన్నాను తెచ్చావా? ఆ... ఇలా పెట్టు. ఈలోగా ఆ కూర కాస్త తరిగిపెట్టు" జానకమ్మగారి గొంతు ఖంగుమంటోంది.     ఆ రోజంతా హడావుడి. కొలీగ్స్ లో ఎవరిదో పెళ్ళి. సాయంత్రం ఎలాగైనా జానకమ్మగారిని కలవాలి అనుకుంది. బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ టాలీ కావడానికి లేటయింది. ఇంటికి వచ్చేసరికి ఎనిమిదయింది. మోహన్ కి క్లినిక్ లో లేటై తొమ్మిదింటికి వచ్చాడు. భోజనాలై అలసిపోయి బెడ్ మీద వాలిపోయి దుప్పటి కప్పుకుంది సునీత.     అర్దరాత్రి తలుపులు ఎవరో బాదుతుంటే హఠాత్తుగా మెలకువ వచ్చి ఇద్దరూ లేచారు. తలుపులు తీస్తే ఎదురుగా పక్కింటి పెద్దాయన. గాభరాగా "డాక్టర్, ప్లీజ్ ఓసారి త్వరగా రండి. జానకికి స్పృహ లేదు"     మోహన్ వెంట పరుగున పక్కింటికి వెళ్లింది సునీత. ఆవిడకి ఇంజెక్షన్ ఇచ్చాడు మోహన్. "ఫర్వాలేదు భయపడకండి. హై టెంపరేచర్ లో ఇది మామూలే" బి.పి. చూస్తూ అన్నాడు.     ఆవిడకి అరవై ఏళ్ళుంటాయి. నెరిసిన జుట్టు, విశాలమైన నుదుట మీద కాసంత బొట్టు, మట్టి గాజులు, జరీ చీర అంతా అమ్మలానే వుంది. ఇల్లంతా కలియజూసింది సునీత. పాత ఫర్నిచర్, పాత తరం ఫోటోలు, పిల్లల ఫోటోలు, రెండు జంటల కలర్ ఫోటోలు లేటెస్ట్ వి. వీళ్ల పిల్లలివి కాబోలు.     ఆవిడ మంచం పక్కనే కుర్చీ మీద కూర్చుంది సునీత. జానకమ్మగార్ని తాను చూసుకుంటాననీ, పెద్దాయనని కాస్త రిలాక్స్ అవమని చెప్పింది. ఆయన వెళ్లి పక్కగదిలో పడుకున్నాడు. మోహన్ కూడా ఇంటికి వెళ్ళాడు.     జానకమ్మగార్ని అలా చూస్తుంటే మళ్ళీ అమ్మ గుర్తొస్తున్నది. అమ్మ కూడా ఇలాగే ఉంటుంది. ఇలాగే అనారోగ్యంతో బాధపడ్తోంది. చిన్నప్పుడు తనకి చికెన్ పాక్స్ వస్తే నెలరోజులు తన మంచం పక్కనే నిద్రాహారాలు మాని సేవలు చేసిన అమ్మ, తన చదువుకోసం నాన్న ఇంట్లోకి ఇచ్చిన డబ్బుల్లో పొదుపుచేసి ఫీజులు కట్టి చదివించిన అమ్మ, "నేను చదువుకోలేదమ్మా! మీరైనా చదువుకోండి" అంటూ ప్రోత్సహించిన అమ్మ, తన పెళ్ళయిన రోజు కళ్ళనిండా కన్నీటితో అంపకాలు పెట్టిన అమ్మ. అమ్మ గురించి ఎంత ఆలోచించినా అమ్మ తన కోసం తపించిన జ్ఞాపకాలే అన్నీ... తను చేసిన సహాయం, సేవ ఒకటైనా గుర్తు రావటంలేదు.     "అమ్మకేదైనా అయితే" ఆ ఆలోచనకే దుఃఖం ముంచుకొచ్చింది సునీతకు.     బలవంతంగా నిగ్రహించుకొని కన్నీళ్ళు తుడుచుకుంటోంది మాటిమాటిగా.     జానకమ్మగారు అస్పష్టంగా "రాధా!" అని పిలిచారు.     సునీత పెద్దాయన దగ్గరికెళ్ళి "రాధని పిలుస్తారా!" అడిగింది.     ఆయన కళ్లనిండా నీళ్ళు. టీవీ పక్కన ఆడపిల్ల బొమ్మని చూపించి కళ్ళు తుడుచుకున్నారు. ఆ బొమ్మ తీక్షణంగా తన హృదయం లోతుల్లోకి చూస్తున్నట్లనిపించింది సునీతకి. చూపులు మరల్చుకుని ప్రశ్నార్ధకంగా ఆయనకేసి చూసింది.     "అవునమ్మా! రాధ మా అమ్మాయి. సాఫ్ట్ వేర్ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని అమెరికాకి వెళ్లిపోయింది. కూతుర్ని వదిలి వుండలేని ప్రేమతో జానకి ఇలా మారిపోయింది. చీటికీ మాటికీ రాధని పిలుస్తూ మాట్లాడుతూ కూతురు ఇంకా ఇక్కడ ఉన్నట్లే పిచ్చి భ్రమ. చాలా ఖర్చు ప్రయాణం. అల్లుడు రాధని ఎక్కువగా పంపడు. కొడుకు కోడలు ఉద్యోగస్తులే. మాతో వుండలేరు. పోయినసారి రాధ వచ్చేముందు 'అమ్మా నీ కోసం ఏం తెమ్మంటావు' అని అడిగింది. 'నీలాంటి ఆడపిల్ల బొమ్మకావాలి' అంది జానకి. ఆ బొమ్మే ఇది" ముగించాడాయన.     సునీతకి ఇప్పుడా బొమ్మలో రాధకాదు, తనే కనబడుతోంది. మెల్లగా లేచి జానకమ్మ దుప్పటి సరిచేసి బయటికి నడిచింది.     "అమ్మా నన్ను క్షమించొద్దు" చెమ్మగిల్లిన మనసుతో అనుకుంది సునీత. నెల్లూరులో కదల్లేని తల్లికి కన్నపేగు కదిలినట్లయింది.