గంగాసతి

గంగాసతి గంగాసతి జీవించిన కాలం 12 వ శతాబ్దం నుంచి 14 వ శతాబ్దం లోపల ఎప్పుడో ఖచ్చింతంగా చరిత్రకారులు తెలుపలేక పోయినా, ఆమె రచనల ద్వారా చిరకాలం గుజరాతీలకు అయితే గుర్తుండిపోయింది. ఆమె రాసిన భజనలని ఇప్పటికీ అక్కడ పాడుకుంటూనే ఉన్నారు, ఉంటారేమో కూడా. సౌరాష్ట్రలో కహ్లూబా అనే అతనితో ఆమెకు వివాహం జరిగింది. స్వతహాగా భక్తి ఎక్కువయిన గంగాసతి తన భర్తను కూడా తనమార్గంలోకి తెచ్చుకుందట. For a change, ఇది మాత్రం చదవటానికి బాగుంది. వాళ్ళిల్లు ఎల్లప్పుడూ చర్చలకీ, భక్తి ప్రవచనాలకీ భజనలకీ నిలయంగా ఉండేదట. అయితే జీవితంతో విరక్తి చెందిన భర్త సమాధిలోకి వెళ్ళిపోయి తన జన్మ చాలించాలనుకుంటాడు. తను కూడా భర్తను అనుసరించడానికి ఆమె సిద్ధ పడుతుంది, కానీ భర్త వారిస్తూ, నువు కోడలికి జ్ఞాన బోధ చేసి, సరైన మార్గంలో పెట్టాకా అప్పుడు అలోచించు సమాధి గురించి అంటాడు. భర్త సమాధిలోకెళ్ళిన కొద్ది రోజులు గంగా సతి తన కోడలు పన్నాబాయి కి జ్ఞానబోధ చేస్తుంది. ఆమె నుద్దేశించి ఆమె పాడినవే ఆమె రచనలు. చాలా కొద్ది రోజుల్లోనే ఆమె తన భర్త మార్గాన్నే అనుసరించింది. అయితే ఆమె పాడినవన్నీ ఆమె తర్వాతనే రాసి భద్ర పరచడం జరిగింది. అవి కూడ ప్రజల నోట నానుతూ ఉన్నవే ఒక 40 వరకు. గంగాసతి అటు ఇటూగా మీరాబాయి కాలానికి చెందినదే. అయితే ఈమె అనుసరించిన భక్తి మార్గం వేరు. ఇక్కడ, ఎటువంటి, పూజా విధానాలు, కృతువులూ లేవు. విగ్రహారాధన లేదు. అసలు వారి దైవానికి ఒక రూపం లేదు. కేవలం ధ్యాన యోగా ద్వారా మనసుని లగ్నం చేసి సమాధి స్తితిని సాధించడమే. పైగా ఈ రకంగా జీవించడానికి సన్యాసి కావలిసిన అవసరం లేదు. సంసార బాధ్యతలు నిర్వర్తిస్తూనే రాగ ద్వేషాలను పరిత్యజించి జీవించడం. జిడ్డు క్రిష్ణ మూర్తి భారతదేశం, ముఖ్యంగా తెలుగువాళ్ళు గర్వించదగ్గ ప్రపంచ ప్రఖ్యాత తత్వ వేత్త, ధ్యానం, మెడిటేషన్ గురించి ఇలా అంటారు. "ధ్యానం అంటే అనుకరణ కాదు, అనుసరణా కాదు, విధేయతా కాదు, అది ఒక ఎరుక, మన చుట్టూ ఉన్న వాటి బాహ్య వివరాలు మాత్రమే కాదు, వాటి లోతైన అంతర్గత వివరాల గురించిన ఎరుక కూడా. మన జీవనంలో ధార్మికత లేనపుడు, చేసే ధ్యానం దైనందిన జీవిత సంఘర్షణ నుంచి పారిపోవటానికి చేసే ప్రయత్నం మాత్రమే అవుతుంది అని. ధర్మ మార్గంలో జీవించడం అంటే, సామాజిక నైతికత ఒకటే కాదు, స్వేఛ్చ పొందటం, ఈర్ష్య, ద్వేషం , దురాశ, అధికార కాంక్షల నుంచి, ఎందుకంటే ఇవన్నీ కూడా శతృత్వాన్ని పెంచి పోషిస్తాయి కాబట్టి. ధ్యానం అంటే, మైండ్ తో చేసే ఆలోచనల్లోకి హార్ట్ ని పెట్టడమే. అప్పుడు ఆలోచనలకి ఒక విలువ, ఉన్నతత్వం వస్తుంది. వాటి గుణమే వేరుగా ఉంటుంది, దాని ఫలితమూ అలాగే ఉంటుంది" మెడిటేషన్ గురించి జిడ్డు క్రిష్ణమూర్తి గారు చెప్పినదంతా చెప్పాలంటే కష్టమే. రోజువారీ జీవితంలోని ఘర్షణ, నిరాశ, నిర్లిప్తత, సంతోషం, బాధ, దుఖం, నిరుత్సాహాల బురద లోంచి, వికసించే పద్మం లాగా ధ్యానం ఉండాలి అంటారు. అంటే ధ్యానం చెయ్యడానికి ఎవరూ సన్యసించనవసరంలేదు. మనం చూస్తూ, వింటూ, చేస్తూ ఉన్న ప్రతి దానినీ లోతుగా విశ్లేషించి సత్యాన్ని నిజంగా అర్ధం చేసుకోగల్గడమే”. యజుర్వేదంలో 32 వ అధ్యాయం ఇలా చెప్తుందట. "ఈశ్వరుడైన దైవానికి రూపం లేదు. జీవులన్నిట్లోను, అన్ని దిక్కులయందూ అతను వ్యాపించి ఉంటాడు. అతనికి ఆవాసం గుడి కాదు, విగ్రహాలలో అతను ఉండడు అని.'' వేద కాలంలో గుళ్ళూ, విగ్రహారాధనలూ కూడా లేవని అన్నా, ఈ విషయం గురించి నేను ఎక్కువ వివిరంగా చదవలేదు. అయితే విగ్రహారాధన అనేది మధ్యలో వచ్చిన ఆచారంగా అయితే కనబడుతుంది. మసీదుల్లో ఉండే సూఫీ సమాధులూ, చర్చిల్లో ఉండే జీసస్ శిలువలూ కూడా ఒక రకంగా చూస్తే విగ్రహారాధన అనే చెప్పచ్చేమో. గంగాసతి చెప్పినలాంటి, ధ్యాన యోగ మార్గాన్ని అనుసరించడం సామాన్యులందరి వల్లా కాని పని అని ఇన్ని రకాల పూజా విధానాలని ఏర్పాటు చేయడం జరిగింది అని ఇప్పటికీ మత పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే ఇవన్నీ కాదని గంగాసతి వాటన్నిటికన్నా, ఉత్తమమైన భక్తి మార్గాన్ని ఎంచుకుని ప్రచారం చేయడమే ఆశ్చర్యపరిచే గొప్ప విషయం. గంగాసతి పోయెం ఒకటి చూద్దాము. Oh, The Meru Mountain May be Swayed Oh, the Meru mountain may be swayed but not the mind of the Harijan, Let the whole universe be shattered into fragments, But the mind uncorroded by misfortune - That's the true measure of the Harijan, The Meru mountain may be swayed, but not the mind of the Harijan, O brother, this is one unaffected by joy and sorrow, Whose head is willingly offered in sacrifice, Who shows courage in adhering to the true Guru's teachings Who surrenders the ego in full fubmission ------- The Meru mountain may be swayed but not the mind of the Harijan. O brother, this is one who lives in the company of the enlightened, Who rejoices all hours of the day, Who does not waver between resolution and counterresolution, Who has broken all the bonds of wordly life------ The Meru mountain may be swayed, but not the mind of the Harijan. Devote yourself to God, O Panabai ! Be faithful toyour words; Here is a word of advice from Gangasati, Submit yourself wholly to the true Guru The Meru mountain may be swayed, but not the Harijan. ఓ, మేరు పర్వతం చలించవచ్చేమో ఓ, మేరు పర్వతం చలించవచ్చేమో కాని, హరిజనుడి మనసు చలించదు విశ్వమంతా అనన్య శకలాలుగా చిద్రమైపొయినా కానీ, దురదృష్టం వల్ల నాశనం కాని మనసు ----- అదే నిజమైన తూనిక హరిజనుడికి, ఓ, మేరు పర్వతం చలించవచ్చేమో కాని, హరిజనుడి మనసు చలించదు ఎవడైతే తన శిరము ఇష్టపూర్వకంగా బలికి అర్పిస్తాడో, ఎవడైతే నిజమైన గురువు బోధనలకు ధైర్యంగా కట్టుబడుంటాడో, ఎవడైతే అహాన్ని వదిలి సంపూర్ణంగా తనను సమర్పించుకుంటాడో ------ ఓ తమ్ముడా, వాడు సంతోషం, దుఖం వల్ల ప్రభావితం కాడు. ఓ, మేరు పర్వతం చలించవచ్చేమో కాని, హరిజనుడి మనసు చలించదు ఓ, తమ్ముడా, అతను, ఎవడైతే జ్ఞానుల సాంగత్యంలో ఉంటాడో, ఎవడైతే రోజులో అన్ని ఘడియల్లో ఆనందంగా ఉంటాడో, ఎవడైతే సంకల్పాసంకల్పాల మధ్య ఊగిసలాడడో, ఎవడైతే ప్రాపంచిక బంధాలన్నిటినీ తెంచుకున్నాడో------- ఓ, మేరు పర్వతం చలించవచ్చేమో కాని, హరిజనుడి మనసు చలించదు ఓ పన్నాబాయి ! నిన్ను ఆ దేవునికర్పించుకో, నీ మాటలకి కట్టుబడుండు; ఇది గంగాసతి పలికే హితవు నిజమైన గురువుకి నిన్ను నువు సంపూర్ణంగా సమర్పించుకో ఓ, మేరు పర్వతం చలించవచ్చేమో, కాని హరిజనుడి మనసు చలించదు. హరిజనుడు అనే పదాన్ని గంగాసతి మొట్టమొదటిసారిగా వాడిందట. దానర్ధం " హరి తన మనిషిగా గుర్తించిన వాడు" అని. అయితే నాల్గు వందల ఏళ్ళ తరవాత గాంధీ గారు ఈ "హరిజన్" అనే పదాన్ని దళితుల నుద్దేశించి వాడారు. అప్పట్నించి ఆ పదం ఎంత ప్రచారంలోకొచ్చిందో మనందరికీ తెలుసు. అయితే గంగాసతి హరిజనుడెటువంటివాడు? దురదృష్టంతో తన ప్రపంచం అంతా ముక్కలైపోయినా, సుఖ దుఖాలవల్ల చలించకుండా, గురువు వల్ల జ్ఞానాన్ని పొందుతూ, అతని పట్ల సంపూర్ణ విశ్వాశంతో, భక్తితో, తన అహంకారాన్ని విడిచిపెట్టి, సదా జ్ఞానుల సంగతిలో ఉంటూ, అన్ని ఘడియలందూ తన ఆనందాన్ని కోల్పోకుండా, కార్య శీలియై, బంధాలనుంచి విముక్తుడై, ఒక్క మాటలో చెప్పాలంటే స్తితప్రజ్ఞత కలిగిన వాడు. మేరు పర్వతమైనా చలిస్తుందేమో కానీ, అట్టివాడి మనసు చలించదు. గంగాసతి బోధించిన భక్తి మార్గం ఎంత ఉన్నతమైనదో, సాధించటానికి అంత కఠినమైనది కూడా. అందుకే సులువైన మార్గాలు చెప్పే 'సులభ ' బాబాలు, స్వాముల చుట్టూ అమాయక ప్రజలు తిరిగి మోసపోతూనే ఉన్నారు.         - శారద శివపురపు

“చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు ఏడవభాగము

“చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు ఏడవభాగము   4వ- అధ్యాయము                                     ఎర్రపోతసూరి ఇంటిలోనికి వెళ్లి భోషాణంలో దాచిన తాళపత్ర గ్రంధాన్ని  తీసుకొచ్చాడు. అది మూలికలతో కలిపి కొన్ని ఆకుల మధ్యన భద్రపరచబడి ఉంది.    ఆకులనీ మూలికల్నీ జాగ్రత్తగా తొలగించి మెత్తని బట్టతో తుడిచాడు.    ఒక గ్రంధం కాదు.. రెండు.    ఒకటి చిన్నదిగా ఉంది. మరొకటి పెద్దదిగా ఉంది.    ఎర్రన ఆశ్చర్యంగా చూశాడు.    “తాతగారూ! ఏమది? ఇంత పెద్ద గ్రంధాలు.. ఎచటి నుండి వచ్చినవి?    “ఓరుగల్లు నుండి.”   "కాకతీయ సామ్రాజ్య ముఖ్యపట్టణము నుండా?" ఎర్రన సంభ్రమంగా చూశాడు. ఆ సామ్రాజ్యం గురించి ఎప్పుడునూ వినుటయే.. అచ్చటి నుండి వచ్చినటువంటి గ్రంధమంటే ప్రాముఖ్యమైనదే అయుంటుంది.    "అవును ఎర్రనా! ఇది చాలా ప్రాముఖ్యమైన గ్రంధం. ఆంధ్ర మహా భారతం."    "నన్నయ భట్టారకుడు, తిక్కనార్యుడు రచించిన భారతమా? నమ్మ లేక పోతున్నాను. మనకి ఏ విధంగా లభ్య మయింది?" గ్రంధాన్ని అరాధనగా చూస్తూ అడిగాడు ఎర్రన. అప్పటికే దక్షిణాపధ మంతా ఆ గ్రంధం ఖ్యాతి వ్యాపించింది.    "మా తాతగారి మిత్రుడొకరు గణపతి దేవుని ఆస్థానంలో కవి. ఆయన మనుమడు కొద్ది కాలం క్రితం నాకు ఈ గ్రంధాలను తెచ్చి ఇచ్చాడు. నేను ఒక సారి చదివాను. అద్భుతమైన గ్రంధం."    "నన్నయ వేంగీ దేశం వాడు, తిక్కన సోమయాజిది నెల్లూరు సీమ. నన్నయగారి భారతాన్ని పూర్తి చెయ్యడానికి తిక్కన గారు ప్రతిని సంపాదించి ఉండవచ్చును. కానీ ఇవి కాకతీయుల వద్దకే విధంగా చేరాయో నాకు అర్ధం అవుట లేదు తాతగారూ!"    "మహారాణీ రుద్రమదేవి వీరమరణం తరువాత, కొందరు బ్రాహ్మణులు.. ప్రతాపరుద్ర మహారాజు ఆనతి మీద ఓరుగల్లునుండి పాకనాడుకు వచ్చారు. ఆ సమయంలో వచ్చినవారిలో మనకి తెలిసిన ఈ వ్యక్తి ఉన్నారు. ఆయన నాకిది ఇచ్చి, దీనికి ప్రతి తయారు చెయ్యగలరా అని అడిగారు. మనం రెండు ప్రతులను చేద్దాం. ఒకటి మన వద్ద నుంచుకుందాం."    "ప్రతి తయారు చెయ్యడం సులభమే. అది కాదు.. అసలు ఓరుగల్లునకు ఏ విధంగా.."    మనుమడి ఆతృత చూసి ఎర్రపోతసూరి నవ్వుకున్నాడు. ఆ వయసులో ఉండే సహజ కుతూహలమే..    "అది పెద్ద చరిత్ర. రాజకీయ కారణాల వలన అక్కడికి చేరింది ఒక ప్రతి."    "రాజకీయ కారణములా?" కాలమంతా సంస్కృతాంధ్రాలను ఔపోసన పట్టడంలోనే గడిపిన ఎర్రనకు రాజకీయ పరిస్థితుల పై అంత అవగాహన లేదు.. అక్కడక్కడా విన్నది కొద్దిగా మాత్రమే గ్రహించాడు.    "అవును. ప్రదోష వేళ అయింది. ఆలయానికి వెళ్లి అర్చన చేసుకునే సమయం.. ఈ గ్రంధముల గురించి రేపు చెప్పుకుందాం."    "అటులనే తాతగారూ! నన్ను కూడా శంకరస్వామి గురువుగారు త్వరగా రమ్మన్నారు. శివపురాణ కాలక్షేపం ఉంది, నీలకంఠేశ్వరుని ఆలయంలో."    "కేశవుని ఆరాధన అయిన పిదప నేను కూడా వస్తాను." తాతా మనవలిద్దరూ లేచారు.. చెరొక గుడికీ వెళ్లుటకు.    ప్రాతఃకాల స్నానాదులకి నదీ తీరానికి బయలుదేరారు ఎర్రపోతసూరి, ఆయన పేరింటిగాడైన ఎర్రన.    సూరన అత్యవసర పని మీద అద్దంకి వెళ్లాడు. తాతగారితో ఏకాంతాన్ని సంపూర్ణంగా వినియోగించ దలచుకున్నాడు ఎర్రన, ఒక్క క్షణం కూడా వదల దలచుకో లేదు..    ఉషోదయాన ఆదిత్యునికి అర్ఘ్యం వదిలి, స్నానం చేసి ఇంటికొచ్చారు.    దేవతార్చన చేసి, పదునొకండు మారులు గాయత్రి జపించి, క్షీర పానం చేశారు.    "తాళ పత్రములు తీసుకొని రమ్మని పురమాయించాను నాగయ్య శ్రేష్ఠిని. రెండు మూడు దినములలో రావచ్చును. ఆ లోగా నీకు తిక్కన సోమయాజిగారి ఓరుగల్లు పయనం గురించి చెప్తాను. మనం తోటలోకి వెళ్దాం." మనుమడిని తోటలో వేప చెట్టు కింద అరుగు మీద కూర్చో పెట్టి, తను కూడా ఎదురుగా చాప మీద కూర్చుని ప్రారంభించాడు. అక్కడంతా నున్నగా అలికి ముగ్గులు వేసి మంగళ కరంగా ఉంది.    పక్షుల సమూహములన్నీ ఉషోదయ రాగములను ముగించి ఆహారాన్వేషణకై వెళ్ళాయి. అప్పుడూ అప్పుడూ వినిపించే పక్షి పిల్లల కూకూ, కిచ కిచ ధ్వనులు తప్పిస్తే వాతావరణం ప్రశాంతంగా ఉంది.    చల్లని గాలి.. ఉండుండి ఆహ్లాదంగా వీస్తోంది. చెట్లన్నీ.. మేము కూడా సిద్ధం అన్నట్లు కొమ్మల నూగిస్తున్నాయి. ఒకదాన్నొకటి తరుము కుంటున్న రెండు ఉడుతలు దూరంగా పారిపోయాయి, మీ ఏకాంతానికి మేము అడ్డురామంటూ.    ఎర్రన ఏకాగ్రతతో.. కొత్త విషయములు, సందేహములు వ్రాయుటకు తాళపత్రములు, గంటం పట్టుకుని మరీ వచ్చాడు. ఎర్రపోత సూరి ప్రారంభించాడు..    "మాతాతగారు వెలనాటి చోళుల ఆస్థానంలో ఉన్నపుడే, చోడతిక్కరాజు  నెల్లూరు సీమను పాలిస్తూ ఉండేవాడు. అప్పుడే చోళుల పతనం ప్రారంభమయింది. తిక్కరాజు, చాలా చిన్నతనం లోనే వెలనాటి రాజు పృధ్వీశ్వరుడిని చాలా భీకరంగా చంపాడు. వెలనాటి సీమని జయించిన చోడ తిక్కరాజు, మార్గ మధ్యమున గుంటూరు విభుడైన భాస్కర మంత్రిని చేరదీసి ఆశ్రయమిచ్చాడు. భాస్కరమంత్రి సర్వజ్ఞుడు, కవి. పేరు ప్రఖ్యాతులు కలవాడు.    తాను గెలిచిన సీమలోని విద్వాంసులను ఆదరించడం రాజుల విజ్ఞానానికి చిహ్నం.    తిక్కరాజు కూడా స్వయంగా కవి.   "తిరకాల భూవిభుడు సార్వభౌమాంకుడు" అని తిక్కనగారే ప్రస్తుతించారు.    భాస్కరమంత్రికి నలుగురు కుమారులు. కేతనప్రగ్గడ, మల్లన, సిద్ధన, కొమ్మన. ఆఖరి కొడుకైన కొమ్మనగారి పుత్రుడే తిక్కన సోమయాజి.    మూడవ కొడుకు సిద్ధన చోడతిక్కరాజుకు ఇష్టుడైన మంత్రి. సిద్ధనను నెల్లూరునకు కొనిపోయి తన ఆస్థానములో సముచిత స్థానమిచ్చాడు తిక్కరాజు.    ఈ సిద్ధన మంత్రి కుమారుడే ప్రసిద్ధుడైన ఖడ్గతిక్కన. ఈయనా, సోదరుడు చిన భాస్కరుడూ అనేక యుద్ధములలో రాజుకు వెన్ను దన్నుగా నిలిచారు. సిద్ధన కుటుంబం నెల్లూరులో నుండగా, కొమ్మన తండ్రితో గుంటూరులోనే ఉండిపోయాడు. కొమ్మన కుమారుడు తిక్కన, పెదతండ్రి పెద్ద పదవిలో ఉండుట వలన నెల్లూరులో విద్యాభ్యాసము సాగించాడు.    చోడతిక్కరాజు పుత్రుడు మనుమ సిద్ధి, తిక్కన సహాధ్యాయులు. మనుమసిద్ధి, తిక్కనను ’మామా’ అని పిలిచేవాడు. ఇద్దరూ గాఢ మిత్రులు. అందువలననే మనుమసిద్ధిని ’వివిధ విద్యా పరిశ్రమవేది’ అని తిక్కనగారు అన్నారు. అంతటి మిత్రుడు కనుకనే తిక్కన, మనుమ సిద్ధి మహరాజుకి మంత్రి అయినాడు." తిక్కన సోమయాజి   ఈ వివరాలన్నీ ఎర్రనకి తెలియవు.. తిక్కనగారు మహాభారతం చాలా భాగం వ్రాశారనీ, ఆయన మనుమసిద్ధికి మంత్రి అనీ మాత్రమే తెలుసు. నెల్లూరు చోడరాజుల కొలువులో తిక్కన వంశీయులు ఉండేవారని అప్పుడే తెలుసుకున్నాడు. తాతగారిని కొంత విరామమడిగి అన్నీ గ్రంధస్తం చేసుకున్నాడు ఎర్రన. మునుముందు ఉపయోగపడతాయేమో..   "మొదటి తిక్కరాజు నెల్లూరును దీర్ఘకాలం పాలించిన తరువాత, కుమారుడు మనుమసిద్ధిని రాజుని చేశాడు. తిక్కనార్యుడుమంత్రిగా మనుమసిద్ధి జనరంజకంగా పాలిస్తున్నాడు. మనుమసిద్ధి కవిజన ప్రియుడు. ఆయన కొలువులో అనేక మంది కవులు ఉండేవారు.     అందువలననే తిక్కన, నన్నయ భట్టు అసంపూర్తిగా వదిలిన మహా బారతమును పూర్తి చెయ్యగలిగాడు. అది ఎంతో క్లిష్టమైన, మహత్తరమైన కార్యము. ఎవరైనా తాము స్వంతంగా మొదలుపెట్టి కావ్య రచన సాగించడం వేరు. స్వేఛ్ఛ ఉంటుంది. ఇతరులు మొదలుపెట్టినది కొనసాగించడం కష్టం."    "ఎందుకని తాతగారూ?"    "కావ్యాన్ని ప్రారంభించిన కవి రచనా పద్ధతికి ఎటువంటి లోపమూ కలుగ కూడదు. ఆ శైలిని గౌరవిస్తూ కావ్యరచన సాగాలి. శిల్పములో భేదమున్ననూ, అది కూడా కావ్యమునకు అందము తేవాలి."    "తిక్కనగారు భారతమును పూర్తి చేశారా తాతగారూ?"    ఎర్రన ప్రశ్నకి సమాధానం చెప్పటానికి ఇంచుక ఆలోచించారు ఎర్రపోతన. ఈ బాలుడు యువకుడవుతున్నాడు. తండ్రి మార్గ దర్శకత్వంలో అనేక గ్రంధాలను చదివాడు. అన్నీ తెలిసినా గుంభనగా ఉంటాడు. ఈతడి మేధని మధిస్తే మంచి కవి కాగలడు. తన అభీష్ఠం నెరవేర్చ గలడు తప్పక. అమృత మధనం చెయ్యాలి.. దానికి తన వంతు కృషి చెయ్యవలసిందే.    కంఠం సవరించుకున్నాడు.   "ఆవిషయం మనం తరువాత చెప్పుకుందాం. ముందు మనం తిక్కనగారు ఓరుగల్లు ఎందుకు వెళ్లాడో చూద్దాం."    "సరే తాతగారూ!" ఎర్రన సర్దుకున్నాడు.    "తిక్కనార్యుడు భారతం, నిర్వచనోత్తర రామాయణం మొదలైన కావ్యాలు రాస్తూనే తోటి కవులను ఆదరించి, ఉభయకవి మిత్రుడు అనే బిరుదును పొందాడు.  కేతన తన దశకుమార చరిత్రమును తిక్కనార్యునికి అంకితమిస్తూ, కృతిపతి ’సుకవీంద్ర బృంద రక్షకుడు’ అనీ, ’కవి సరోజ మార్తాండుడు" అనీ కొనియాడాడు.    సకలవిద్యా పారంగతుడైన తిక్కనార్యుడు ఊపిరి సలపని కావ్య రచనల్లో కాలం గడుపుతుంటే రాజ్యంలో అనేక సంక్షోభాలొచ్చాయి. మనుమసిద్ధి మహారాజు కష్టాల పాలయ్యాడు.    చోడతిక్కరాజు, కుమారుడైన మనుమసిద్ధికి రాజ్యం అప్పగించి విశ్రాంతి తీసుకుంటున్నాడు. మనుమ సిద్ధి దగ్గరి బంధువు తిక్కరాజు కూడా ప్రముఖుడే. ఎన్నో దాన ధర్మాలు చేశాడు. మహరాజు కొద్దిగా అస్వస్థులవగానే కొంత రాజ్యం తాను తీసుకుని, కాంచీపుర వరాధీశుడ్నని ప్రకటించుకున్నాడు. ఇతని తమ్ముడు విజయాదిత్యుడు మనుమసిద్ధి ప్రతినిధిగా తాను ఏలుతున్న మరికొన్ని ప్రాంతాలను స్వాధీనంలోనికి తీసుకున్నాడు.    అన్నదమ్ములిరువురూ కలిసి, మనుమసిద్ధిని తప్పించి నెల్లూరును ఆక్రమించుకున్నారు. తండ్రి మరణించగానే మనుమ సిద్ధి అడవుల పాలయ్యాడు." ఎర్రపోతన అలసటగా ఆగాడు.    "తాతగారూ! మంచి తీర్ధం.."    "భోజనానికి వేళయింది. తాతా మనుమలిద్దరూ కదలి రండి. ఆనక చెప్పుకోవచ్చును చరిత్రలు." పేరమ్మ ఇంటి లోనుండి పిలిచింది.    "అయ్యయ్యో.. అంతటి మహరాజు.." ఎర్రన విచారంగా అన్నాడు.    "ఎంతటి మహరాజయిననూ విధిని తప్పించలేము కదా!"    "అవును తాతగారూ! హరిశ్చంద్ర మహారాజుని చూడండి.. ఆయన తప్పు కానీ ప్రమేయం కానీ లేకుండా ఎన్ని కష్టాల పాలయ్యాడో.. విధి కాక ఇంకేమిటి?"    "నిజమే! హరిశ్చంద్రుడు ఆ మాతంగ కన్యలను వివాహమాడి ఉంటే ఆ కష్టాలే ఉండేవి కాదు కదా!"    "అదెటుల కుదురుతుంది.. హరిశ్చంద్ర మహారాజు ఏక పత్నీ వ్రతుడు. మాట తప్పని వాడు."    "హు.. భార్యా బిడ్డలను అష్టకష్టాల పాల్చేసే ఏం వ్రతం అది.." ఎర్రపోతన మనవడిని రెచ్చగొట్టాడు.. ఆ బుడుతడి అభిప్రాయములెలా ఉంటాయో చూద్దామని.    "కష్టముల నెదిరించి ధీరుడై నిలచాడు హరిశ్చంద్రుడు. పంతమునకు పోయినది విశ్వామిత్ర మహర్షి. ఎన్ని ఇక్కట్లు వచ్చిననూ నియమ నిష్ఠలను వదల కూడదని పాఠం చెప్పిన వాడు హరిశ్చంద్రుడు."    "నీకు హరిశ్చంద్రుని చరిత్ర అంత బాగా తెలుసునా ఎర్రనా?"    "అక్షర జ్ఞానం వచ్చిన వెనువెంటనే నేర్చుకొన వలసిన పురాణ గాధలలో నది ఒకటి కద తాతగారూ!     ఒక నాడు ఇంద్ర సభలో సత్యము నిక్కముగ పలికెడి వారెవరైననూ ఉన్నారా అనే ప్రశ్న వచ్చింది. వశిష్ఠుడు లేచి హరిశ్చంద్ర మహారాజు పేరు చెప్పాడు. వెంటనే విశ్వామిత్రుడు లేచి, "హరిశ్చంద్రుడు సత్య వాక్య పరిపాలకుడు కానేకాడని" నిరూపిస్తానన్నాడు. వశిష్ఠుడు అది నీ వల్ల కాదన్నాడు. విశ్వామిత్రుడిలో పట్టుదల పెరిగింది. హరిశ్చంద్రుని రాజ్యానికేగి, తానొక యజ్ఞం తలపెట్టాననీ, ఆ యజ్ఞానికి ధనం కావలెననీ అడిగాడు.    "మీకు కావలసినంతటి ధనం నేను సమ కూరుస్తానని" హరిశ్చంద్రుడు మాట ఇచ్చేశాడు. సమయం వచ్చినపుడు వచ్చి అడిగెదనని విశ్వామిత్రుడు వెళ్ళిపోయాడు.     ఒక నాడు హరిశ్చంద్రుడు వేటకి వెళ్లి నప్పుడు విశ్వామిత్రుడు ఇరువురు మాతంగ కన్యలను రాజు వద్దకు పంపాడు. వారు ఎంత ఆకర్షించిననూ రాజు చెక్కు చెదర లేదు. తరువాత సభకు వచ్చిన ఋషి మాతంగ కన్యలను వివాహమాడ వలెనని బలవంత పెట్టాడు. తాను ఏక పత్నీ వ్రతుడనని రాజు నిరాకరించాడు.    "రాజ్యాన్ని వదులుకుంటా కానీ వ్రత భంగం చెయ్యను" అన్నాడు.    "అయితే రాజ్యం వదులుకో.. అడవికి వెళ్లిపో." ఋషి ఆదేశించాడు.    నిస్సంకోచంగా అడవికి వెళ్లిపోయాడు హరిశ్చంద్రుడు. అప్పుడు, సమయం చూసుకుని తన యజ్ఞానికి ధనం సమకూర్చమని, ఆ సత్య వ్రతుడిని నిర్దయగా ఇక్కట్ల పాల్చేశాడు విశ్వామిత్రుడు.     మానవమాత్రుడెవడూ సహించలేని కష్టాలు.. భార్యని అమ్మేసి, కొడుకుని పోగొట్టుకుని, కాటి కాపరిగా చేసి.. చివరికి భార్యని దొంగతనం, హత్య నేరాల మీద  శిరఛ్ఛేదనం చెయ్యబోతే అప్పుడు దేవతలు ప్రత్యక్షమై హరిశ్చంద్రుని కొనియాడుతారు. ఆ చక్రవర్తి చరిత్ర చిరస్థాయిగా నిలిచిపోయింది..    ఏ విధంగా అంటే.. సత్యానికి మారుపేరు హరిశ్చంద్రుడేనని అనేంతగా!"    "చాలా బాగా చెప్పావు ఎర్రనా! ఆ కాలంలో సత్యవ్రతం అనీ, ఏకపత్నీ వ్రతం అనీ, ప్రజా వాక్కులనీ.. మునులను, స్త్రీలను హింసించే రాక్షుసుల వల్లనూ, వారిని సంహరించుటకునూ కష్టాల పాలయ్యే వారు. యుగాలు మారుతున్న కొలదీ రాజ్యాల కోసం అన్నదమ్ముల మధ్య యుద్ధాలు ఎక్కువైపోయాయి. బంధుత్వాలు అన్నీ గంగ పాలే. చేరదీసి మంచి పదవి నిస్తే.. ఆ చేరదీసిన వారినే తునిమేసి.. వారి స్థానాన్ని ఆక్రమించేటి ధూర్తులు కోకొల్లలు. అదే కలి ప్రభావం." ఎర్రపోతన గట్టిగా నిట్టూర్చి అన్నాడు,    "ఎక్కడ మంచి ఉంటుందో అక్కడే చెడు.. సుఖమున్న చోట దుఃఖము.. పాప పుణ్యములు, కష్ట సుఖములు.. అదే జీవితం. ఏ కాలమందైననూ.. ఏ యుగమునందైననూ తప్పదు. మార్పల్లా జరిగే, జరిపే విధానము లోనే."      "మరి మనుమసిద్ధి మహారాజు ఎంతకాలం అక్కడా ఇక్కడా తలదాచుకున్నాడు తాతగారూ?"     మరునాడు ప్రాతఃకాల క్రియలు అయ్యాక, మామూలు స్థలంలో కూర్చున్నారు తాతామనవలిద్దరూ.     ఆ రోజే సూరన్న అద్దంకి నుండి వస్తున్నాడు. ఇంట్లో అత్తా, కోడలూ ఆయనకి ప్రీతికరమైన భక్ష్యాలు చెయ్యడంలో నిమగ్నమై ఉన్నారు.  ఎర్రపోతసూరి కొంత అసహనంగా ఉన్నాడు. అద్దంకి నుండి ఏ వార్త వస్తుందో.. రాజుగారు ఎందుకు రమ్మన్నారో.. రాజకీయ పరిస్థితి ఎలా ఉందో!    మహరాజుకీ శాంతి లేదు.. మామూలు ప్రజకీ సుఖం లేదు. కడుపుకింత తిని, కంటి నిండుగా నిదురించడానికి లేదు. వంద సంవత్సరాల క్రితం అంతే, యాభై ఏళ్ళ క్రితం అంతే.. యుగాల క్రితం అంతే! ఇప్పుడూ అంతే.. ఎప్పటికైననూ పరిస్థితులు మారునా!    "తాతగారూ!"    "ఆ.. ఆ. మనుమసిద్ధి కదూ! ఆయన ఎవరికీ తెలియని చోట తల దాచుకున్నాడు. తెలిస్తే ఏమవుతుందో.. తలలు నరకడం రాజులకి సొరకాయలు నరికినంత సులభం. రాజ్యకాంక్ష అటువంటిది.    ఎందరికో సిరి సంపదలు, పదవులు ఇచ్చిన రాజు.. కవులకు ఆశ్రయం ఇచ్చి ప్రోత్సహించిన సాహిత్య ప్రియుడు.. కొండల్లో కోనల్లో, సెలఏటి గలగలలే వీణా నాదంలా, కోయిల కూతలే గానంలా.. నెమలి అడుగులే నాట్యంలా.. లేళ్లు, జింకలు, వానరాలు సభ్యుల్లా అడవిలో కొలువు తీరుస్తూ కాలం గడుపుతున్నాడు.    అప్పుడు.. మనుమసిద్ధి ప్రాణ స్నేహితుడు, మంత్రి తిక్కన.. నేనున్నానని ముందుకు వచ్చాడు. అప్పటి ఏలికలు కవుల జోలికి వెళ్ళినట్లు లేదు. అందునా.. కావ్య రచనలో మునిగిన తిక్కనమంత్రి, తన మిత్రుని అడవుల పాల్జేసిన రాజుగారి తమ్ముని కంట పడక పోవడంలో ఆశ్చర్యం లేదు.    "మామా!" మనుమసిద్ధి ఆదరంగా ఆహ్వానించాడు తిక్కనని.    "నీకు ఉచితాసనం ఇవ్వలేకున్నాను.. ఏమనుకోకుమా!" మహారాజు కంఠం జీరపోయింది.    స్నేహితుని గాఢాలింగనం చేసుకుని వెన్ను తట్టాడు తిక్కన.   "రాజా! రుద్రదేవుని కాలంలో రచించిన నీతి శాస్త్ర గ్రంధాన్ని మనమిరువురమూ కలిసి పఠించితిమి కదా.. మరచితివా? విభజించి పాలించడం అందులోని రాజనీతికి మొదటి పాఠం. అదే విధముగా విభజించి శిక్షించవలెను కూడా..    పెక్కుండ్రు జనులు నేరమి    యొక్కట జేసినను వారి నొకమరి గినియం    జిక్కరు గావున నేర్పున    నొక్కొకరన పాపి శిక్ష యొనరింప దగున్.    అన్నదమ్ముల నిరువురినీ ఒక్క దగ్గర నుండేటట్లు జేయుట దగని చర్య అయినది. ఇప్పుడు మనం విడిదీసి, విడి విడిగా వారిని ఓడించి వెళ్లగొట్టవలె.. అదియును మరికొందరు మంచి మిత్రుల సహకారముతో."    మనుమసిద్ధి మహరాజునకు మహోత్సాహము వచ్చింది, ప్రియమిత్రుని ధైర్య వచనములతో.    "నిక్కము మామా! తండ్రిగారి అనారోగ్యముతో నమ్మి బాధ్యతల నప్పగించిన దగ్గరి బంధువు, ఈ విధముగా మహారాజు యని చూడక బంధించి, రాజ్యమపహరించునని ఎటుల ఊహింతును? ఆ సమయమున నీతిసారము.. రాజనీతి, ఏమియును జ్ఞప్తికి రాలేదు."    "అవును కదా మిత్రమా! తల్లిని జూచుటకు వెళ్ళినపుడు కూడ రాజు భవన శోధన చేయించాలని ఉదాహరణములతో చెప్పాడు కదా కామందక గ్రంధ కర్త.. నిరంతరము అప్రమత్తుడవై మెలగవలె నని కదా ఆర్యులు చెప్పినది.    భద్రసేనుడు భార్య వద్దకు వెళ్తే అతని తోబుట్టువే అతన్ని దునిమాడు.    తేనేలో విషము కలిపి వనిత ద్వారా బావమరదులు కాశిరాజుని అణచారు.    తల్లి మంచము కింద దాగి పుత్రుడే తండ్రిని పొడిచాడు.    జడలో జాతుషీ శస్త్రము దాచి ఒక రమణి విదో రధుని జంపింది.    ఎవ్వరినీ.. సతిని, దమ్ముల దాయాదుల, బావల ,బావమరదుల.. నెవ్వరినీ నమ్మవలదు.. నమ్మ వలదు.. నమ్మ వలదు."    ముమ్మారు జాగ్రత్తలు చెప్పి, తను చెయ్యగల కార్యము చేసి వచ్చెద నని వీడ్కోలు చెప్పి తిక్కన మనుమసిద్ధిని వదిలి వెళ్లాడు."    "ఓరుగల్లుకేనా తాతగారూ?" ఎర్రన ఒకింత ఆవేశంగా, ఒకింత ఉత్సాహంగా అడిగాడు.   ……… ( ఇంకా వుంది) ………..          .... మంథా భానుమతి

వెలుగు నీడలు

  అసలు కథకు కథానిక అని నామకరణం చేసిన వ్యక్తి హనుమచ్ఛాస్త్రి. కథానిక అంటే ఇది అని చెప్పిన రచయిత. ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి కేవలం కథా రచయితే కాదు, కవి, విమర్శకులు కూడా. ఎన్నో అద్భుతమైన, అరుదైన సాహితీ గ్రంథాలను మనకు అందించారు. తెలుగువారి సాహితీ చరిత్రలో గుర్తుండిపోయే నవ్యసాహితీ పరిషత్తు, అభ్యుదయ రచయితల సంఘాల్లో ప్రధాన పాత్ర వీరిది. పద్యాలు రాసే హనుమచ్ఛాస్త్రి కథలు కూడా రాసిన విషయం చాలా మందికి తెలియదు. కానీ వీరు రాసిన 29కథల్లో మౌనసుందరి, ఆశ్రమవాసి లాంటి గొప్పకథలు ఉన్నాయి. వాస్తవ జగత్తుకు, ఊహలోకానికి మధ్య ఉన్న చిన్న పొరను వెలుగు నీడలు కథలో అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ కథలో ప్రధాన పాత్ర కవి. ఆ కవి రాత్రంతా మేలుకొని విక్రమోర్వశీయ పద్యకావ్యంలోని ఊర్వశి సౌందర్యాన్ని, పురూరవ చక్రవర్తి ప్రేమ సల్లాపాల్ని గొప్పగా వర్ణించి ఉంటాడు. ఉదయాన్నే సుధర్మలో భరతముని ప్రయోగించే నాటికలోని అప్సరస సుందరి రంగస్థలం మీదకు వచ్చినప్పుడు రాసిన పద్యం గురించి మననం చేసుకుంటూ ఉంటాడు. హఠాత్తుగా భార్య గొంతు వినిపిస్తుంది - రేషను షాపుకెల్లి బియ్యం తేవాలని. ఒక్కసారిగా ఊహాలోకం నుంచి ఈ లోకంలోకి వచ్చి రేషను షాపుకు వెళ్లాలనుకుంటాడు. బియ్యం లేవని తెలియగానే కడుపులో ఆకలి కూడా పెరుగుతుంది. ఆంధ్రకవీశ్వరునికి ఆకలి కలగడాన్ని నీచంగా భావించి సంచీ తీసుకొంటాడు. దారిలో జమీందారు కారు, టౌనుహాలులో జరిగే పార్టీలోని టీ వాసన, నగరంలో బియ్యంకోసం తొక్కిసలాడే పేదలు, లంచాల చేతులతో బలిసిన సిల్కు సూట్లు ధరించిన బొజ్జలు చూసి నవ్వుకుంటాడు. కవి రేషను షాపు క్యూలో నిలబడితే లోపల గొడవ జరుగుతుంటుంది. కొద్ది సేపటికి ఓ ఆకారాన్ని పదార్థంలా చేసి రోడ్డుమీద పడేస్తారు షాపులో వాళ్లు. ఆ ఆకారం దుమ్ము దులుపుకొని పక్కనున్న తూము మీద కూర్చొంటుంది. కవి బియ్యం కొనగానే దగ్గరకొచ్చి, కూలి కావాలా అని ఆడిగి దమ్మిడీ ఇవ్వమంటే కవి పావలా ఇస్తానని చెప్పడంతో సంతోషిస్తాడు. అతని పేరు సన్నాసి. బియ్యం మోయడం వల్ల వచ్చిన పావలా చూసి తెగ ఆనందపడిపోతాడు. ఆ సంతోషం కవిలో ఉదయం ఇంట్లో వదిలేసిన పురూరవుడ్ని జ్ఞాపకానికి తెస్తుంది. కవి సాయంత్రం కూరగాయల కోసం సంతకు వెళ్తాడు. అక్కడ అమ్ముతున్న కూరగాయలు చూసి విజయనగర సామ్రాజ్య కాలం నాటి రత్నాలు గుర్తుకు తెచ్చుకుంటాడు. అంతలో ఇద్దరు పెద్దమనుషులతో సన్నాసి గొడవపడడం చూస్తాడు. వాళ్లు సన్నాసిని దొంగగా ముద్రవేసి కొడతారు. సంతలో మిగిలిన జనాల్లో చాలామంది సన్నాసిని దొంగ వెధవ...కూలి అని చెప్పి, దొంగతనం చేస్తాడు అని తిడతారు. ఆ అలజడి తగ్గాక సన్నాసి నెమ్మదిగా గొడవలో కాలికింద తొక్కిపట్టిన పెద్దకాపు రొంటి నుంచి జారిన వస్తువును పదిలంగా తీసుకొని నల్లమందు కొట్టుకు వెళ్తాడు. సిరాలా చీకటి పడుతుంది. ఎక్కడి వాళ్లు అక్కడ నిద్రపోతూ ఉంటారు. గాలి చల్లగా వీస్తుంది. ఒక్క సంతపాకల్లో తప్ప ఊరుఊరంతా నిద్రపోతుంది. ఎఱుకల నీలాలు మాత్రం ఆకలేసి నిద్రలేస్తుంది. చీకటి రాత్రులు పడుచువాళ్లకు సరదాగా ఉంటాయి అనుకుంటుంది. రేగిన జుట్టును సరిచేసుకుంటూ ఆకలి ఎట్లా తీరుతుందా అని ఆలోచిస్తుంది. ఎదురుగా మిఠాయి కొట్టు కనిపిస్తుంది. కానీ దొంగతనం ఎలా చేయాలా అని అనుకుంటుండగానే ఒక ఆకారం ఆ కొట్టు వెనక నీడలా కనిపిస్తుంది. ఆ ఆకారం మిఠాయి కొట్టు వెనకబల్లను ఊడగొడుతుంటే తనూ వెళ్తుంది. అంతలో ఆకారం తప్పుకోగానే, నీలాలే బల్ల కొద్దిగా మేకుకు పట్టుకొని ఉంటే లాగుతుంది. లాగుతూ లాగుతూ వెనక్కు పడితే- ఆ ఆకారం పట్టుకుంటింది. చిన్నగా ఇద్దరూ కలిసి జంగిడిలో వేరుశనగ ఉండల్ని దొంగతనం చేస్తారు. ఆ వ్యక్తి సన్నాసి అని గుర్తుపడుతుంది నీలాలు. కుక్క అరవడంతో, ఎవరో కదిలినట్లు అనిపించి సన్నాసి పరుగెత్తబోతే వేరుశనగ ఉండలు మురిక్కాలవలో పడతాయి. నీలాలు తను దాచిన ఒక్క శనగ ఉండను కొరికి సగం సన్నాసికి పెడ్తుంది. వర్షం మొదలుకావడంతో నీలాలు వణుకుతుంది. సన్నాసికి దగ్గరగా జరుగుతుంది. తన రెండు చేతుల్తో సన్నాసి వొంటిమీద గాయాలను మృదువుగా తాకుతుంది. సన్నాసి గాజుకళ్లు తలవని తలంపుగా చెమ్మగిల్లుతాయి. వాన కురుస్తూనే ఉంటుంది. ఈ కథంతా అద్భుతమైన కవిత్వంగా రాశారు హనుమచ్ఛాస్త్రి. కథ ప్రారంభానికి, ముగింపుకు అంతగా సంబంధం కనపడకపోయినా, కథంతా ఆకలి గురించే అన్న భావన పాఠకుడిలో కలుగుతుంది. అరుదైన, గొప్పవైన వర్ణనలు ప్రతి పేరాలోనూ ఉన్నాయి. ఆకలితో అలమటించే వారి మాటల్లో వేదాంతాన్ని పలికిస్తాడు. సంతలో కూరగాయల్ని- ఇంద్రనీల మణి రాసుల వంటి వంకాయలు, కెంపుల వంటి ఉల్లిగడ్డలూ, పచ్చల వంటి బచ్చలకూర... అని వర్ణిస్తాడు. అలానే స్వార్థావరణం చీల్చి నిజమైన మనస్సు తెరచి చూపితే మనుషులు ఎంత దగ్గరకు వస్తారు అన్నారు. నీలాలు నవ్వును గురించి చెప్తూ - అడవిలో ముళ్లపొదల మీద అడవి మల్లెపూలు జ్ఞాపకం వస్తాయి అంటాడు. ఇక కథ ప్రారంభంలో కవి కవితాలోకంలో ఉన్నప్పుడు భార్య వచ్చి రేషను షాపుకు వెళ్లు అని చెప్పినప్పుడు అతని మనోలోకం గురించి హనుమచ్ఛాస్త్రి చెప్తూ - ఇంద్ర సభకు బదులుగా మా చాలీచాలని అద్దెవాటా, నాట్యఉజ్ఝ్వల రూపిణి ఊర్వశికి బదులుగా నిత్య సంసార యాత్రలో నలిగే పాతగళ్ల చీర బ్రాహ్మణీ కనపడేసరికినా పురూరవ చక్రవర్తి హిందూదేశంలో ఒక నాగరిక పట్టణంలోని ఆరో నెంబరు రేషను షాపు దగ్గరకు నడవలేక చట్టున తప్పుకున్నాడు అంటాడు. ఇలా కథంగా పాటకుడి భావనా లోకానికి, వాస్తవ లోకానికి మధ్య వంతెన కడుతుంది. - డా. ఎ. రవీంద్రబాబు

మానవత్వ వర్ణన ప్రతిభాశాలి ఐ.వి.ఎస్. అచ్యుతవల్లి

  కుటుంబ సంబంధాల్లోని తీరుకు, సమాజంలోని మానవ ప్రవర్తనకు కారణాలైన సిద్ధాంతాలను నమ్మి రచనలు చేసిన రచయిత్రి అచ్యుతవల్లి. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి మనుషుల జీవితాల్లోని అనేక పార్శ్వాలను నిజాయితీతో చెప్పిన రచయిత్రి. ఎక్కడా పరిమితులు, పరిధులు విధించుకోకుండా... సూక్ష్మంలో విశాలత్వాన్ని గ్రహించి కథల్లో రాసిన రచయిత్రి అచ్యుతవల్లి. నా పోరాటం పురుషుల మీద కాదు, వారిలో ఉన్న పురుషాధిక్య భావజాలం మీద అని సగర్వంగా చెప్పి, ఆ కోణంలోనే రచనలు చేసింది. చిన్నచిన్న హాస్యాన్ని, ప్రజలు మాట్లాడుకునే సాధారణ భాషలో అలవోకగా రాయగల ప్రతిభ అచ్యుతవల్లిది. తచన జీవితం నుంచే కాకుండా, సమకాలీన జీవితంలోని సమస్యలను గుండెలు బరువెక్కేలా చెప్పగలరు. అచ్యుతవల్లి పూర్తి పేరు ఇరంగంటి వెంకట శేష అచ్యుతవల్లి, ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలోని దొంతవరంలో మే1, 1943లో జన్మించారు. కాకినాడలో తర్వాత మాధ్యమిక విద్యను పూర్తి చేసి, ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి బి.ఎ. పట్టా పొందారు. ఇతర భాషల పై మక్కువతో హిందీ, సంస్కృత భాషల్లో విశారద పూర్తిచేశారు. మైసూర్ విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎ. హిస్టరీ చదివారు. ఇలా పలు భాషలపై పట్టు సాధించడం ఆమె రచనలకు ఎంతో ఉపయోగమైంది. తర్వాతి కాలంలో జయశ్రీ పత్రికలో కాలమిస్టుగా ఇజ్జత్, ఆజ్ ఔర్ కల్... రచన మాసపత్రికలో బాతోంమే ఖూనీ వంటి శీర్షికలు నిర్వహించి కాలమిస్టుగా పేరు తెచ్చుకోడానికి ఇవి ఎంతో ఉపకరించాయి. అలానే కర్ణాటక సంగీతాన్ని నేర్చుకొని ఆకాశవాణిలో 1962 నుంచి 64 వరకు లలిత గీతాలు పాడారు. 1964లో రాఘవాచారిని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఆ పేరుతోనే రచనలు చేశారు. భర్త ఉద్యోగ రీత్యా అనేక ప్రాంతాలకు వెళ్లడం ఆయన రచనా వస్తువు విస్తృతికి ఎంతో ఉపయోగపడింది. అచ్యుతవల్లి సుమారు 400ల కథలు రాశారు. వీటిలో ఎక్కువభాగం మూగవోయిన ప్రకృతి, అవ్యక్తాలు - మనస్తత్వాలు, బాత్ ఏక్ రాత్ కీ, నాగావళి నవ్వింది, అచ్యుతవల్లి కథలు వంటి సంపుటాలుగా వచ్చాయి. వీరి కథలు ఇతర భాషల్లోకీ అనువాదాలయ్యాయి. అచ్యుతవల్లి మొదటి కథ 'వంచిత' జగతి మాసపత్రికలో వచ్చింది. కానీ తర్వాత భారతి పత్రికలో వచ్చిన 'దీపకరాగం' ఆమెకు కథా రచయిత్రిగా మంచి పేరు తెచ్చింది. అసలు అచ్యుత వల్లి అనగానే తెలుగు కథా సాహిత్యంలో గుర్తుకు వచ్చే కథలు- సన్నాటా, ముత్యాల చెరువు, వర్షం వచ్చినరోజు, అభిశంస, ప్రయాణం, ఇజ్జత్... 'సన్నాట' కథలో పావురాళ్ల గూడు వంటి ఇంటికి ఓ వ్యక్తి కారులో రావడంతో ఆ ఇంట్లో ఉన్న వాళ్లు వాళ్లవాళ్ల సమస్యలకు పరిష్కారం చూపించే వాళ్లు వచ్చారని ఆశపడతారు. కానీ తీరా ఆ వ్యక్తి పాత ఇంటిని లాడ్జింగ్ గా మార్చడానికి వచ్చాడని తెలుసుకుంటారు. లేమిరికం కల్పించే ఊహలు ఆలోచనలకు, వాస్తవలాకు మధ్య జరిగే పోరాటం ఈ కథలో కనిపిస్తుంది. 'వర్షం వచ్చినరోజు' కథలో ధనవంతులైన సునంద, జయరాం భార్యాభర్తలు. కానీ సునంద అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది. మొక్కజొన్న పొత్తులు అమ్మే ఎల్లమ్మ, టీ అమ్మే అప్పిగాడు... వారి మానసిక జగత్తు వర్షం కురిన రోజు ఎలా కకావికలంగా ఉందో అద్భుతంగా వర్ణిస్తుంది అచ్యుతవల్లి. ఇక 'ముత్యాల చెరువు' కథలో ముత్యాలు దళిత స్త్రీ. ఆమెను ఆర్థిక, లైంగిక, కుల దోపిడీకి గురవుతున్న స్త్రీగా చిత్రీకరించారు రచయిత్రి. ఈ కథ చదివితే చలనచిత్రం చూసిన అనుభూతి కలుగుతుంది. కుటుంబ సంబంధాలు, స్త్రీ పురుష సంబంధాలను బహిరంగంగా విమర్శకు పెట్టిన కథ 'అభిశంస'.భార్యాభర్తల సంబంధం గురించి చెప్తూ - హైందవ వివాహ ధర్మం, సెక్స్ కోరికలకు లైసెన్స్ అనుకుంటారు చాలామంది పురుషులు. గృహస్థ ధర్మంలో ఎంత ఆనందం పొందవచ్చునో, ఎంత నిర్భయం, సంతృప్తి, ప్రశాంత జీవన మాధుర్యం అనుభవించవచ్చునో చాలామందికి తెలియదు. జీవితాన్ని సమస్యల వలయంలోకి నెట్టుకుంటారు. అని అంటారు. జీవితంలో ఏదశలో నైనా పెళ్లిచేసుకోవచ్చు అని 'జీవితానికో తోడు' కథలో చెప్తుంది. ఇలా స్త్రీల జీవితాల్లోని పలుకోణాల్లో వివరించేవే వీరి కథలు. 'వర్షించని మబ్బులు', 'నాతిచరామి' కథలో జయప్రద, 'మూగబోయిన ప్రకృతి' కథలో శంకరి, 'అబల' కథలో అచల, 'ఆజ్ అవుర్ కల్' కథలో మధుర... ఇలా ప్రతి పాత్రా వైవిధ్యమైన వ్యక్తిత్యంతో, సమాజంలోని విభిన్నమైన జీవితాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఇంకా వీరి కథల్లో ప్రమే, స్నేహం, ఆర్ద్రత, సామాజిక బాధ్యత, భిన్నమైన మనస్తత్వాలు కనిపిస్తాయి. అచ్యుతవల్లి ఇదెక్కడి న్యాయం, సీతకలలు, కొడిగట్టిన దీపాలు, తీరం చేరిన కెరటం, భ్రమరగీతం, పుట్టిల్లు, కానుక, కోరిక, ఏకాంత... వంటి 19 నవలలు రాశారు. ఇదెక్కడి న్యాయం నవల నాలుగు భాషల్లో చలనచిత్రంగా వచ్చింది. 1977లో ఈ చిత్ర పరంగా అచ్యుత వల్లికి అనేక అవార్డులు వచ్చాయి. వీరికి ఇంకా 1970లో మద్రాసు కేసరీ కుటీరం వారి గృహలక్ష్మీ స్వర్ణకంకణం, 1994లో తెలుగు విశ్వవిద్యాలయం ధర్మనిధి పురస్కారం, 1995లో సుశీలా నారాయణరెడ్డి అవార్డు, 2000లలో యువభారతీ సాహితీ పురస్కారం వచ్చాయి. ఈమె రచనలపై పరిశోధనలు కూడా జరిగాయి. ఎన్నో ప్రఖ్యాతమైన రచనలు మనకందించిన అచ్యుతవల్లి 2010లో మరణించారు. ఇప్పటి సమాజానికీ ఆమె రచనలు ఎంతో అవసరం. - ఎ.రవీంద్రబాబు

“చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు" పార్ట్ - 6

   “చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు" పార్ట్ - 6  గుడ్లూరులో ఎర్రపోత సూరి గారింట ఆనందమునకు అవధి లేదు.    ఎర్రపోతనగారి మనుమడు ఎర్రనకి అక్షరాభ్యాసం. వంశపు పేరు ప్రతిష్థలను ఇనుమడింపజేసే వంశోద్ధారకుడుదయించి ఐదు సంవత్సరాలు అయింది.    పోతమాంబ ఆమ్మాయి కావలెననుకుని అంబని వేడుకున్నా.. అంబ బ్రతిమాలినా, ఆ పరమశివుడు వినిపించు కోలేదు. తన అంశతో అబ్బాయి పుట్టాల్సిందే అని పట్టుబట్టాడు.    పున్నమి చంద్రుని వంటి మోముతో వెలిగి పోతున్న పుత్రుని చూసిన పోతమ్మ తన కోరిక మాటే మరచిపోయింది.    తండ్రి పేరే పెట్టాడు కుమారుడికి సూరన్న.    అల్లారు ముద్దుగా పెరుగుతున్నాడు చిన్నారి ఎర్రన. అలనాటి శ్రీరామ చంద్రునికి ఏమాత్రం తీసిపోని ముద్దు మోము.. ఆకర్ణాంత విశాల నేత్రాలు.. తీర్చి దిద్దినట్లున్న నాసిక, ముచ్చటైన చిన్ని నోరు.. నవ్వుతే మెరిసే ముత్యాలవంటి పలువరుస.    ఆ పైన.. ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు. "ఆకలి వేసినప్పుడు కూడా ఏడ్వకపోయిన ఎటులరా కన్నయ్యా.." అని అమ్మ ముద్దుగా కసురుకుంటుంది.    ఐదు సంవత్సరాలు, ఐదు ఘడియల్లా అయిపోయాయి.    నాయనమ్మకి ఎంత ఎత్తుకున్నా.. ఎంత ఆడించినా తనివి తీరదు. ఏనెలకానెలే కొత్త వింతలు బాలునిలో. అత్తా కోడళ్లిద్దరికీ బాలుని ఆట పాటలలోనే దినమంతా.    "కొంచెం మేము కూడనూ ఇంటిలో సభ్యులమే నని గురుతుంచుకోండి. ఎప్పుడూ మనుమడేనా.. మా సంగతి ఏమిటి?" ఎర్రపోతన భోజనానికై పీట మీద కూర్చుని భార్యని పిలుస్తాడు.    "ఇదిగో.. వచ్చేస్తున్నా. పప్పులో తాళింపు వేసి.." పేరమ్మ అనే లోపు తాళింపు మాడిన వాసన.    "హమ్మమ్మ.. ఇవేళ మన పని గోవిందా! మాడిన పప్పే గతి." సూరన్న నవ్వుతూనే నిట్టూర్పు..    "మ్మమ్ మ్మ.. తాతా.." కిలకిలా నవ్వుతూ బాలుడు వెనుకనుంచి తాత వీపు మీదికి ఎగ బ్రాకుతాడు. ఎర్రనకి పది మాసములున్నప్పుడు..    బుడిబుడి అడుగులు వేసే వేళ.. అమ్మ తులసి కోట చుట్టూ, పెరడంతా తిరుగుతూ వెతకి వెతకి వేసారిపోయేది.    "కన్నయ్యా! ఈ ఒక్క ముద్ద.. వెన్న వేసిన పెరుగన్నం. ఇదిగో ఈ ఉడుతకి పెట్టేస్తున్నా.."    "ఏదీ ఉడుత?" అప్పుడు మల్లె పొద చాటునుంచి ఒక్క దుముకు దుమికి అడుగుతాడు, చిన్ని కృష్ణయ్య వలెనే మూతి కంటిన వెన్నని అరచేతితో తుడుచుకుంటూ..    "ఇదిగో.." ఎత్తుకుని, ఒలిచిన అరటి పండు చిన్ని నోట్లో పెడుతుంది నాయనమ్మ.. ఎర్రనకి పదునెనిమిది మాసములప్పుడు.     తాత కళ్లల్లో వెలుగై, ఆ ఇంటి నిత్య కృత్యములకు ఆధార కేంద్రమై తానే ప్రధానమై ప్రగడ అయ్యాడు ఎర్రన.    అక్షరాభ్యాసమునకు అన్ని ఏర్పాట్లూ జరిగాయి.    ఇల్లంతా కొత్త సున్నపు వాసన వేస్తోంది. ద్వారాలకి మామిడి తోరణాలు, బంతి పువ్వులు అలంకరించారు. ఎర్రని పట్టు చీర అంచు కనిపించేలాగ అందంగా కట్టి, పోతమాంబ పదుగురిచే పని చేయిస్తూ తిరుగుతోంది. సూరన్న శిష్యులు వీధి అరుగు మీద వేద పఠనం చేస్తున్నారు.    శారదా నిలయమే ఆ గృహము. ఆ ఇంట వాగ్దేవి విహరిస్తూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఎర్రన చిన్ని వేళ్లతో ఆకారాలు దిద్దుకుందామా అని అక్షర సరస్వతి ఎదురు చూస్తోంది.    "ముహుర్తం దగ్గర పడుతోంది. గురువుగారు వచ్చు వేళ అయింది. అక్షింతలు కలిపారా? వెండి పళ్లెరంలో బియ్యం సిద్ధంగా ఉందా? ఫలములు, తమలపాకులు, వక్కలు, పసుపు కుంకుమలు.." పేరమ్మ హడావుడిగా అటూ ఇటూ నడుస్తూ, గడప తట్టుకుని పడబోయింది.    "నాన్నమ్మగారూ! వస్తున్నా.. ఆగండి." పట్టుపంచ జారకుండా ఒక చేత్తో పట్టుకుని, పరుగెత్తుకుంటూ వచ్చాడు బుజ్జి ఎర్రన.    బాల సుబ్రహ్మణ్యం అభయం ఇవ్వడానికి వస్తున్నట్లు అనిపించింది పేరమ్మకి. ఒక్క చిన్న త్రిశూలం మాత్రం లోటుగా అనిపించింది. ద్వారబంధం పట్టుకుని నిలదొక్కుకున్న నాన్నమ్మకి చెయ్యి అందించాడు ఎర్రన. కన్నుల ఆనంద భాష్పాలు తిరుగుతుండగా, ఆ చిన్ని చెయ్యి అందుకుని ఆ ఆసరాతోనే నిలబడినట్లు నటించింది.    కించిత్తు గర్వంగా తలెగరేసి తల్లి వంక చూస్తూ, నాయనమ్మని చెయ్యి పట్టుకుని తీసుకొచ్చి ఆసనం మీద కూర్చుండబెట్టి అన్నాడు,    "నాన్నమ్మగారూ! మీరిచ్చటనే ఉండండి. అమ్మగారు మిగిలిన పనులన్నీ చూసుకుంటారు." మనవడి ముద్దు మాటలకి మురిసిపోతూ, ఎర్రపోతన ప్రక్కనే తనకి అమర్చిన ఆసనం మీద కూర్చుంది పేరమ్మ.    "ఇంత చిన్న వయసులో ఎంత పెద్ద మనసో.." ఆహ్వానాన్ని అందుకుని, చూడవచ్చిన  పెద్దలు ఆశ్చర్యంగా చూశారు.    హృదయం ఉప్పొంగగా ఎర్రపోతన పసివాడిని ఎత్తుకుని ఒడిలో కూర్చోపెట్టుకుని, ఆనంద భాష్పాలని కండువాతో తుడుచుకున్నాడు.    వాకిట ఒకటే కలకలం.   "గురువుగారొచ్చారు.. అభివాదం చెయ్యండి.." గుసగుసలు..    అందరూ ప్రక్కకి జరిగారు. సూరనాచార్యుడు గురువుగారి పాదాలు కడిగి, వినమ్రంగా లోపలికి తీసుకొచ్చాడు.    శంకరస్వామి.. సూరనార్యుడి గురువు.    అపర శివుని వలే గంభీరంగా అడుగులు వేస్తూ లోనికి వచ్చారు.    అనుదినమూ శివార్చన జరుపుట వలన అలౌకికమైన ఆనందంతో ఆయన పెదవులు ఎప్పుడూ నవ్వుతున్నట్లే ఉంటాయి. మోములో ప్రశాంతత.. పవిత్రత. చూసిన వారు చేతులు అసంకల్పితంగా జోడిస్తారు.    ప్రతీ శివరాత్రీ నిష్ఠగా, నియమంగా నిర్వహిస్తారు. శంకరస్వామి సమక్షంలో కైలాసంలో ఉన్న అనుభూతి కలుగుతుంది ప్రతీ ఒక్కరికీ. ఆ శంకరస్వామి శిష్యుడే సూరన్న.. ఆయన భావి శిష్యుడు ఎర్రన్న.    గురువుగారిని ఉచితాసనం అలంకరించమని ప్రాధేయపడి, ఎర్రన్నని నమస్కరించమని ఆదేశించాడు సూరన్న. వెంటనే సాష్టాంగ నమస్కారం చేశాడు ఎర్రన్న.. పట్టుపంచ పైకి లాక్కుని.    "గురువుగారికి నమోవాకములు." ముద్దుముద్దుగా అంటున్న ఎర్రన్నని ఆప్యాయంగా ఒడిలోనికి తీసుకున్నారు శంకరస్వామి.    ఒకసారి వినాయకుని వలే.. ఒకసారి షణ్ముఖుని వలే గోచరించాడు ఎర్రన.    సంకల్పం, వినాయక పూజ, నవగ్రహ పూజ, చేశారు సూరన్న దంపతులు. పిదప వెండి పళ్లెంలో నున్న పసుపు బియ్యంలో బాలుని చేత అక్షరాలు దిద్దించారు శంకరస్వామి.    "ఓం నమః శివాయః సిద్ధం నమః" మూడు మారులు అనిపించారు. ఆ బాలుని స్పష్టమైన ఉఛ్ఛారణ, వీణ మీటినట్లున్న కంఠస్వరం ఆలకించి అక్కడున్న వారందరు ముగ్ధులైపోయారు.    ఎర్రన్నకి ఎనిమిదో ఏట, ఎనిమిది మంది ఋత్విక్కులను రావించి అంగరంగ వైభవంగా ఉపనయనం కావించారు. నిత్యం త్రి కాలముల యందు సంధ్యావందనం, గాయత్రి మంత్ర జపం తాతగారి పక్కన కూర్చుని నిష్ఠగా చేస్తాడు.  (చిత్రం- గూగుల్ సౌజన్యంతో) గాయత్రి జపిస్తున్నప్పట్నుంచీ ఎర్రన్నలో కొత్త వెలుగు పొడచూపసాగింది. ఏకాగ్రత పెరిగింది. తాతగారితో ఎర్రన అనుబంధం మరింత పటిష్ఠమయింది. తాతగారితో ఉదయం కేశవుని దర్శనం, సాయం సమయం తండ్రి గారితో.. ప్రదోష వేళల్లో నీలకంఠేశ్వరుని సేవ, నిత్య కృత్యాలయ్యాయి.    పగటి వేళల గురువుగారైన శంకర స్వామి సేవ చేసుకుంటాడు. ఆ సమయంలో ఆయన వద్ద అనేక ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకుంటాడు.    ఆచార్యుడైన తండ్రి శిష్యులకి నేర్పిస్తున్న సమయంలో.. తను కూడా అన్ని పాఠాలనూ వల్లె వేయ సాగాడు. చురుకుగా ప్రతీ పాఠమూ ఇట్టే పట్టేసి తాతగారికి అప్పచెప్పేస్తాడు.. వెన్నెల్లో ప్రక్కనే పడుక్కుని.    మహాభారత కథలు విటుంటే ఎన్నో సందేహాలు.. తాతగారికి కూడా కష్టమే అవి తొలగించడం.    "తాతా! కొంచెం పెద్దయ్యాక నీ అంతట నువ్వే చదువుకుని అర్ధం చేసుకోవాలిరా! నేను తీర్చలేను నీ అనుమానాలు.." ఎర్రపోతన చేతులెత్తేస్తాడు.    "చదవడ మేం తాతగారూ! నేను రాసేస్తా మహాభారతం." హామీ ఇచ్చేశాడు తొమ్మిదేళ్ల ఎర్రన.       ఎర్రన్న పది సంవత్సరములు నిండుతుండగానే ఉభయభాషల్లోనూ ప్రావీణ్యత సంపాదించాడు. సూరన్న, కుమారునికి సంస్కృతాంధ్రాలలోని కవిత్వ రహస్యాలను సవిస్తరంగా నేర్పాడు.    గురువుగారైన శంకరస్వామి ప్రభావం ఎర్రన్న మీద రోజు రోజుకూ అధికం అవుతోంది. తండ్రి కంటే గురువుగారే ఆదర్శం ఎర్రన్నకి. శివారాధన కూడా పెరుగుతోంది. గురువుగారు ఈశ్వర సమానుడనీ, ఆయన చరణారవింద ధ్యానం ఆనందం కలిగిస్తుందనీ చిన్నతనమందే గ్రహించాడు.    శ్రీశైలం ఆదిగా ఆ చుట్టు ప్రక్కల అన్ని శివక్షేత్రములలోనూ శంకరస్వామి శివపురాణం ప్రవచిస్తూ ఉద్ధరణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. శైవమతం ప్రాచుర్యంలో ఉన్న రోజులు అవి.    పలనాటి యుద్ధం ముగిశాక ప్రజల్లో మతం అంటేనే భయం పట్టుకున్న రోజులు. ఆ భయం పోగొట్టి దేముడి మీద నమ్మకం కలిగించి, క్రమశిక్షణతో జీవనం గడవడానికి శంకరస్వామి వంటి గురువుల ఆవశ్యకత అవసరమయింది.    "ఏ మతమైనా చేసే మంచి ఒక్కటే.. క్రమశిక్షణ. దేముడు ఉన్నాడా? ఉంటే ఏ రూపంలో ఉంటాడు.. అనే సందేహం కంటే, మనల్ని కాపాడడానికి ఎవరో ఉన్నారన్న నమ్మకమే మనల్ని నడిపిస్తుంది. ఆ దేముడు శివుడైనా సరే.. కేశవుడైనా సరే.." ఎర్రపోతన మనుమడ్ని ప్రక్కన పడుక్కోబెట్టుకుని, ప్రతీ రాత్రీ శివపురాణం, విష్ణుపురాణం వివరిస్తాడు.    ఎర్రపోతన తన ఇష్ట దైవమైన నరసింహుని గాధలను.. చిన్నారి ప్రహ్లాదుని కాపాడిన విధానమును చెప్తుంటే ఎర్రన కళ్లు పెద్దవి చేసుకుని వింటూ ఉంటాడు.    "నేను నృసింహుని కథ కావ్యంగా రాస్తా.." తాతగారికి మాట ఇచ్చేశాడు కూడా.    "మరి ఈశ్వరుడంటే నీకు ఇష్టం కదా! మీ గురువుగారు శంకర తత్వం ఉపదేశిస్తూ ఉంటారు. నువ్వు కూడా రోజూ శివపురాణం చదువుతావు. కేశవుని కథ రాయగలవా?" ఎర్రపోతన అడిగాడు.. మనవడి అభిప్రాయం తెలుసుకోవడానికి.    "అవును తాతగారూ. నాకు శివతత్వం నచ్చుతుంది. ఈశ్వరుడు భోళాశంకరుడు. భక్త వత్సలుడు. తలచినంతనే భక్తుల అభీష్టాలు నెరవేరుస్తాడు. అంతే కాక సులభ ప్రసన్నుడు. మామ దక్షుడు అంత అపకారం చేశాడా.. సతీదేవి ఆత్మాహుతికి ఆయనే కారణమా.. అయినా ఏంచేశాడో చూడు." మిలమిలా మెరుస్తున్న కళ్లతో అన్నాడు ఎర్రన.    "ఏం చేశాడేం?"    కొంచెం సిగ్గుపడ్డాడు ఎర్రన తన ఆవేశానికి.    "ఫరవాలేదు చెప్పు." తాతగారు చిరునవ్వుతో అన్నారు.    "ముందర మహోగ్ర రౌద్రాకారుడై జటాజూటంలో నుంచి జటను పెరికి విసిరి, భద్రకాళి, వీరభద్రులను సృష్టించాడా.. వారు వికటాట్ట హాసాలు చేస్తూ, దక్షయజ్ఞ వాటికకు వెళ్లి, సమస్తం ధ్వంసంచేసి, దక్షుని తల నరికి హోమ గుండంలో పడేశారు. ఆ తల మాడి మసైపోయింది. వీరభద్రుడు వికటాట్టహాసం చేశాడు. భద్రకాళి నాలుక జాపి విలయతాండవం చేసింది. దేవతలు భయోద్వేగులై కైలాసం చేరి శాంతింపచేయమని వేడుకున్నారు ఆ పరమశివుని.    విష్ణు, బ్రహ్మాది దేవతలు వేడుకోగా శివుడు శాంతించి, దక్షయజ్ఞం పూర్తి చెయ్యడానికి అనుమతి ఇచ్చాడు. ఉత్తరంగా నిద్రిస్తున్న ఒక మేక తలకాయ తెచ్చి దక్షుని మొండెమునకు అతికించి దక్షునికి ప్రాణం పోశాడు శివుడు. దక్షుడు తన తప్పిదం తెలుసుకుని, శివుని స్తుతించి యజ్ఞం పూర్తి చేశాడు. చూడండి తాతగారూ.. తన భార్య మరణానికి కారకుడైన వాడికి ప్రాణం పోశాడా లేదా? తాతగారూ.. ద్రాక్షారామం వెళ్దామా ఒక్కసారి.."    "ఎందుకూ?"    "అక్కడే కద దక్షుడు యజ్ఞం చేసింది. దానినే దక్ష వాటిక అంటారు"    "నిజమే.. అటులనే వెళ్దాం. సమయం వచ్చినప్పుడు.  కానీ చెయ్యని తప్పుకి ఎందరో బలైపోయారు.. వీరభద్రుని ఆవేశం వల్ల. దక్షుడినొక్కడినీ చంపమనచ్చు కదా.. అంత విధ్వంసం ఎందుకు? ఎందరికో అవయవాలు పోయాయి. ఎంతో బాధననుభవించారు. మరి అన్యాయం కదా? పరమ శివుడు ఆ విధంగా చెయ్యవచ్చునా.. భక్త వరదుడంటావు.. ఆ పోయిన వారిలో ఆయన భక్తులు కూడా ఉండ వచ్చును కదా!" ఎర్రపోతన కుతూహలంగా అడిగాడు.    "పరమ శివుడు లయకారకుడు. ప్రళయ తాండవం ఆయన సహజ ధర్మం. మహాభారతంలో వ్యాస మహర్షి చెప్పలేదా చేసిన కర్మ అనుభవించక తప్పదని. పాపక్షయం తప్పదని. అందుకే ఆ విధ్వంసం. ఎవరైనా కర్మ ఫలాలను అనుభవించక తప్పదు."    ఆ వయసులో అంతటి వేదాంతం చర్చిస్తున్న మనవడిని చూసి ఎర్రపోతన మూగవాడయ్యాడు. అది చాలదన్నట్లు ఆశువుగా ఒక కవిత చెప్పాడు ఆ బాల ప్రాయంలోనే ఎర్రన.. తన ఇష్ట దైవమైన నీలకంఠేశ్వరుని మీద..    "నిను సేవించిన కల్గు మానవులకున్ వీటీ వధూటీ ఘటీ    ఘన కోటీశ కటీపటీ తటిపటీ గంధేభ వాటీపటీ    రసటీ హారికటీ సువర్ణ మకుటీ ప్రఛ్ఛోటికాపేటికల్    కన దామ్నాయ మహా తురంగ శివలింగా నీలకంఠేశ్వరా"    తాతగారు నిశ్చేష్టులై నిలబడ్డారు. ఇంత జటిలమైన సమాస కల్పనా? ఇతడెవరు? ఏదో కార్యోద్ధరణకై అవనికొచ్చిన శంభు సుతుడా!    "అయిననూ తాతగారూ! శివకేశవులలో భేదం లేదు కదండీ. అదే కదా హరిహరాద్వైతం."    "అవును.. అది నిరూపించడానికి నీకొక కథ చెప్తాను విను."    "ధధీచి కథేగా.."    "ఊ.. నీకు తెలుసా?"    "పూర్తిగా తెలియదు తాతగారూ.. ఆ మధ్యన ఒక పిచుక పిల్ల గూటిలోంచి కింద పడి, మెడ విరక్కొట్టుకుంది. గిలగిలా కొట్టుకుంటుంటే దాని పని అయిపోయిందనుకున్నాం నాన్నమ్మ గారూ, నేనూ. కానీ అది కొంచెం సేపటికి, మెడ విదిలించి లేచి ఎగిరి పోయింది అప్పుడు నాన్నమ్మ అన్నారు, ’ఇది ధధీచి వంటిదిరా బాబూ.” అని. అప్పుడే విన్నా. నాన్నమ్మని అడుగుతే.. హరిహరాద్వైతం, శివకేశవులు.. అంటూ చెప్పబోయారు. ఈ లోగా ఏదో పనిలో ప్రవేశించి మరచారు."    ఎర్రపోతసూరి ఫక్కున నవ్వి బాలుని తల నిమిరాడు. ధధీచి మహర్షి(గూగుల్ సౌజన్యంతో)   "పూర్వకాలంలో క్షుపుడను రాజు ప్రజలను కన్నబిడ్డల వలే పాలిస్తూ ఉండేవాడు. అతని ఆస్థానానికి ధధీచి మహర్షి తరచు వెళ్లి రాజుకి ధర్మ శాస్త్రాలు బోధిస్తూ ఉండే వాడు.    భృగు వంశీయుడు.. చ్యవన మహర్షి కుమారుడు ధధీచి మహర్షి. సకల ధర్మ శాస్త్రాలను ఔపోసన పట్టిన వాడు. క్షుపునికి శాస్త్రాలను బోధిస్తూ అతను ధర్మ మార్గమున నడచుటకు తోడ్పడుతూ ఉండే వాడు. ధధీచి శివ భక్తుడు. క్షుపుడు విష్ణు భక్తుడు.    రాజు కూడా మహర్షి ఆశ్రమానికి తరచుగా వెళ్తుండే వాడు. ఇరువురి మధ్య స్నేహము, ఆప్యాయత నెలకొన్నాయి.    ధధీచి బోధించిన ధర్మ సూత్రాలను తన పాలనలో ఉపయోగిస్తూ ప్రజారంజకంగా పాలించే వాడు క్షుపరాజు. ఒక రోజు క్షుపుడు, ధధీచి ఆశ్రమానికి వెళ్లినప్పుడు జరిగిందీ అవాంచనీయ సంఘటన..    ఉన్నట్లుండి క్షుపుడు మహర్షిని ఒక ప్రశ్న అడిగాడు.    "స్వామీ! సకల సంపదలూ ఇచ్చే లక్ష్మీదేవి పతి, పీతాంబరధారి, అష్టైశ్వర్యములూ కల వైకుంఠ నివాసి, సర్వ వ్యాపకుడు అయిన విష్ణు మూర్తిని వదిలి.. పులి చర్మం కట్టి, శ్మశానంలో తిరుగుతూ, పాములని ఆభరణాలుగా ధరించి, నెత్తి మీదినుంచి నీరు కారుతూ, బిచ్చమెత్తుకునే శివుడ్ని మీరెందుకు ఆరాధిస్తున్నారో నాకు అర్ధం అవడం లేదు. వివరించ గలరా?"    "మహారాజా.. అనాలోచితంగా పలుకుతున్నావు. ఈశ్వరుడు శాసకుడు. జగత్పిత. పార్వతీ దేవి జగన్మాత. బిక్షమెత్తుట ధర్మ మార్గం. అది భక్తులకు మోక్షం ఇవ్వడానికి మాత్రమే. బిక్షాటనం ప్రాచీన సాంప్రదాయం. అందుకే ఆయన ఆది భిక్షువైనాడు. ప్రపంచంలో బ్రతకటానికి కావలసింది ఆహారం, నిద్ర, భయం లేకపోవడం. ఇవి ప్రాధమిక అవసరాలు. అందుకే ఆయన నివాసం రుద్రభూమి. భయం పోగొట్టడానికే అది. ఆహారం ఎటువంటిదైనా కడుపు నిండటం ప్రధానం. అదే విధంగా నిద్ర.. హంస తూలికా తల్పం అయినా, కటిక నేల అయినా నిద్ర పోవడం ముఖ్యం.    ఇంక నెత్తి మీది నీరా.. ఆ జటాజూటమున గంగమ్మని బంధించకపోతే నువ్వూలేవు.. నేనూ లేను. జగమే లేదు. అంతా నీటి మయమే.     అష్టైశ్వర్యాలూ అనుగ్రహించే శివుడికి అష్ట దిక్కులు అంబరాలే. ఆయన భక్తులందరి హృదయాలలోనూ నివసిస్తాడు. శ్మశానవాసి అని చులకనగా చూడ కూడదు.    అణిమాది అష్ట సిద్ధులను, పద్మాది నవ విధులనూ అనుగ్రహించ గలవాడు ఈశ్వరుడే. వీటిని కుబేరునికి అనుగ్రహించినదే ఆయన. ధన, వస్తు వాహనాలమీద కోరిక సామాన్యులకి ఉంటుంది. వాటిని అనుగ్రహించే దేవ దేవునికి ఎందుకుంటుంది?"    మహర్షి, శివుని గురించి చెప్తుంటే.. చెప్పమని అడిగిన మహరాజు కనులు ఎర్రవడ సాగాయి. ఎంతటి అహం.. తన ఎదుటే.. ఆ కొండలు కోనలు పట్టుకుని తిరిగే వాడిని పొగుడుతాడా!    కోపోద్రేకాలతో, ముందూ వెనుక చూడకుండా ఒర లోనుండి కత్తి లాగి ఒక్క వ్రేటుతో ధధీచి తల నరికాడు. ఆ తరువాత ఒక్క క్షణం కూడా ఆగకుండా నిష్క్రమించాడు.    ధధీచి మహర్షి, ప్రాణం పోయే సమయంలో తాతగారైన శుక్రాచార్యుడ్ని స్మరించాడు. స్మరించి ప్రాణం విడిచాడు. వెంటనే శుక్రాచార్యుడు ప్రత్యక్షమయి, మనుమని మృత దేహాన్ని చూసి.. మృత సంజీవనీ విద్యతో ధధీచిని బ్రతికించాడు. భవిష్యత్తులో ఎవరూ చంపకుండా మృతసంజీవనీ విద్య ఉపదేశించాడు. ఒక మండల కాలం ఆ మహా మంత్రాన్ని నియమ నిష్ఠలతో జపించమన్నాడు.    మహర్షి ఆ విధంగా చేసి దృఢకాయుడయ్యాడు.    అతని తపస్సుకి మెచ్చిన పరమశివుడు భక్తుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు.    ధధీచి కోరినట్లు మరణం లేకుండా వరమిచ్చి, త్రిశూలం ఒసగాడు.    వెనువెంటనే ధధీచి మహర్షి, మహోగ్ర జ్వాలలతో దహించిపోతూ, మంత్రి సామంతాదులతో నిండు కొలువులో నున్న క్షుపుని వద్దకు వెళ్ళి ఎడం కాలితో బలంగా తన్నాడు.    క్షుపుడు వెంటనే సింహాసనం మీదినుంచి కింద పడిపోయాడు. అవమానం పట్టలేక ధధీచి మీదికి ఒరలోని కత్తిని తీసి ప్రయోగించాడు. కానీ చిరంజీవి అయిన ధధీచిని ఆ ఆయుధం ఏమీ చెయ్యలేకపోయింది. అది మరీ పరాభవమనిపించింది.    శ్రీమన్నారాయణుని ధ్యానించాడు. "నీ అంశతో జన్మించిన నన్ను కాషాయ బట్టలు కట్టుకున్న ఒక సన్యాసి అవమానించాడు. ఇది నేను భరించలేకపోతున్నాను స్వామీ.. పాహిమాం.." అని వేడుకున్నాడు.    ధధీచి శివుడిని ప్రార్ధించాడు. "నన్ను ప్రశ్నించి, సమాధానం ఎరుక చేస్తుంటే అన్యాయంగా నరికాడు.. ఈతడి మద మణచు స్వామీ.."    అప్పుడు శ్రీమన్నారాయణుడు, శివుడు ఇద్దరూ ప్రత్యక్షమయ్యారు.    విష్ణుమూర్తి మహారాజునకు, శివుడు ధధీచికి బోధ చేశారు.   "బ్రాహ్మణ తేజం ముందు క్షత్రియ తేజం నిలువలేదని మహరాజుకీ, విష్ణు స్వరూపుడైన రాజుని అవమానించ తగదని మహర్షికీ నీతి చెప్పారు.    "శివుడూ కేశవుడూ ఒకరే. ’నేహనా నాస్తి కించన”. శివుడే కేశవుడు, కేశవుడే శివుడు. ఈ తత్వాన్ని మీరు తెలుసుకోవాలి.    "మద్భక్తా శంకర ద్వేషీ మా ద్వేషీ శంకర ప్రియః     తావుభో నరకం యాతః యావచ్చంద్ర దివాకరే//    విష్ణు ద్వేషి అయిన శివ భక్తుడు, శివ ద్వేషి అయిన విష్ణు భక్తుడు, సూర్య చంద్రులు ఉన్నంత కాలం నరకం అనుభవిస్తారు. మీరిద్దరూ పూర్వం వలే మంచి స్నేహితులుగా ఉండి ఎవరి ఇష్ట దైవాన్ని వారు ప్రార్ధించుకోండి. సామాన్య ప్రజలకి ఆదర్శంగా నిలవండి."    దేవదేవులిద్దరి హితం విన్న మహరాజు, మహర్షి భక్తితో మ్రొక్కి, సాష్టాంగ ప్రమాణం చేశారు."    "తాతగారూ! విష్ణువుని సేవిస్తే శివుడు ప్రీతి చెందుతాడు కదూ.." తాతగారు చెప్పిన ధధీచి వృత్తాంతం శ్రద్ధగా విన్న ఎర్రన వెంటనే అనేశాడు భక్తిగా చూస్తూ.    "అవును.. ఆ పరమ శివుడే తారక మంత్రం జపిస్తూ ఉంటాడు. విష్ణ్వవతారమైన రాముడు శివలింగ ప్రతిష్ఠ చేశాడు రామేశ్వరంలో."    "అయితే నేను రామాయణ కావ్యం కూడా రాసేస్తా!" ముద్దు ముద్దుగా మాట ఇచ్చిన మనుమని అపరి మితమైన వాత్సల్యంతో చూసి, హృదయానికి హత్తుకున్నాడు ఎర్రపోతన.        "అవును ఎర్రనా! నీకొక పని చెప్తాను చేస్తావా?"    "ఆనతినివ్వండి. అవశ్యం నెరవేరుస్తా."    "దానికంటే ముందుగా నీకొక చరిత్ర చెప్పాలి. ఆ తరువాత నీవొక కర్తవ్యం నెరవేర్చాలి."    "తమ ఆజ్ఞ."                                 ……… ( ఇంకా వుంది) ……….. .... మంథా భానుమతి                                             

“చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు" పార్ట్ - 5

    “చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు" పార్ట్ - 5                        అద్దంకి సీమ ఆ సమయంలో ప్రశాంతంగానే ఉంది. గుడ్లూరు నీలకంఠేశ్వర స్వామి ఆలయం నిత్యం భక్తులతో కళకళ లాడుతూ ఉంది. ఎర్రపోతన, సూరన్న కూడా ఆ పురి గురించి వినే ఉన్నారు. అందుకనే నిస్సంకోచంగా ఆహ్వానాన్ని అంగీకరించారు.    ముక్కంటి మిన్నగా వెలసిన పురము    నిక్కముగ నంబ న్తెచ్చిన పురము    చక్కగ చెన్నకేశుడు చేరిన పురము    చొక్కముగ మారుతి చొప్పిన పురము.    ఈ నేత్రపురమున..    గుట్టలు గుళ్లై ప్రకాశించాయి. హరి హరులు ప్రజలకు స్వయంగా అద్వైతం బోధించినట్లుగా సమానంగా పూజలను అందుకుంటున్నారు. లక్ష్మీ సరస్వతులు ఆ పురిలో తిష్టవేసుకుని కూర్చున్నారు.    నేత్రపర్వంగా వయ్యారి పారిజాతములు, సొంపగు సంపంగిలు, దీటైన దేవకాంచనములు, గుత్తముగ గన్నేరులు, సువర్ణ గన్నేరులు, చెంగలువలు.. నాగమల్లెలు, మందారాలు.. అన్ని చెట్లుయు నాలయమ్ముల నందముగా నిలిచి, ఎప్పుడెప్పుడు పరమాత్మ సన్నిధికేగుదుమా అని ఎదురు చూస్తూ ఉన్నాయి.    మరి ఫల వృక్షములేమైన తక్కువ ఉన్నవా..    నారింజలు, మామిళ్లు.. కదళీ ఫలములు, నారికేళములు.. తియతియ్యని తొనలొసగు పనసలు.. వనములన్ మెండుగ నుండి, అచ్చోట ఏ లోటు లేకుండ నిండుగ నైవేద్యమునకు నిబిడముగా కాస్తున్నాయి.    అది నాకపురమా లేక వైకుంఠపురమా అనిపించక మానదు.    అమృతధారలనొసగు ఆవు అమరావతినందు నొకటియే నుందేమో.. ఈ పురమున మాత్రము పెక్కు ధేనువులు ఉన్నాయి.    ఇంక ఇచ్చోట గృహములు..    తీరుగా, శుభ్రముగా.. గడపలన్నీ పసుపు, కుంకుమలతో శ్రీకరములై అలంకరించి ఉన్నాయి.    చాతుర్వర్ణములవారు కలసి మెలసి.. అవసరాలలో, ఆపదలలో ఒకరినొకరు ఆదుకుంటూ జీవిస్తున్నారు.    సూరన్న కుటుంబం ఈ గ్రామమునకు వచ్చి మూడు మాసములవుతోంది.    సూరన్న ఆలయ నిర్వహణ చూస్తూ, విప్రబాలురకు వేద మంత్రాలు, క్షత్రియ బాలురకు యుద్ధనీతి, వైశ్య బాలురకు వ్యాపార రహస్యాలు నేర్పుతున్నాడు. వృత్తివిద్యలనభ్యసించేవారు పురాణగాధలను, ఇతిహాసాలను వింటూ అందునుండి భక్తి భావనలు, నీతి శాస్త్రమును నేర్చుకుంటున్నారు.    నెమ్మది నెమ్మదిగా పేరమ్మ, పోతమాంబలు కూడా కొత్త పరిసరాలకి అలవాటు పడుతున్నారు. ఇంచుక ప్రశాంతత కన్న మరి కావలసిందేమి?     కడుపుకింతన్నము, కాయమునకింత బట్ట.. అంతియే కదా!    అయితే.. మానవునికి సంతృప్తి ఎందులో కలుగుతుంది?    ఒక రోజు..    ఎర్రపోతన మన్నేరుకి వెళ్లి, స్నానం చేసి వచ్చి, కేశవుని ఆలయానికి వెళ్లాడు. సూరన సరే.. అనుదినమూ బాలభానుని దర్శనమే నీలకంఠుని సన్నిధిలో, ఆ విద్వన్మణికి.    ఇంట పనిపాటలు ముగించుకుని, చావడిలో కూర్చుని వత్తులు చేసుకుంటోంది పేరమ్మ. కోడలు, పెరటి అరుగు మీద బియ్యం, పప్పుధాన్యాలు బాగు చేసుకుంటూ వాల్మీకి రామాయణంలో, బాలకాండలోని శ్లోకాలు పాడుకుంటోంది.    "నమోస్తు రామాయ సలక్ష్మణాయ     దేవ్యైచ తస్మై జనకాత్మజాయై    నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో    నమోస్తు చంద్రార్క మరుద్గుణేభ్యః"    సన్నని కంఠంతో రాగయుక్తంగా పాడుతున్న కోడలి స్వరం వింటున్న పేరమ్మ, వాకిట్లో చప్పుడు విని లేచింది.. కుతూహలంగా చూస్తూ.    సైనికులు కవాతు చేస్తున్న శబ్దం..    అత్తా కోడళ్లు ఇద్దరూ వాకిలి తలుపు తీసుకుని మిద్దె బయటికి వచ్చారు.    పన్నెండు మంది.. పదునాలుగు నుంచీ పదహారేళ్ల వయసు మధ్య మగపిల్లలు.. సైనికుల ఆహార్యము, చేత ఖడ్గములు ధరించి, కవాతు చేస్తూ  వెళ్తున్నారు. వారి ముందు ఒక శిక్షకుడు నడుస్తూ సూచనలిస్తున్నాడు.    పోతమాంబ కన్నులు పెద్దవి చేసి చూస్తోంది ఆశ్చర్యంగా.    "ఈ పసివారు ఎక్కడికి అత్తయ్యా? గురుకులంలో పాఠాలు వల్లె వేయవలసిన వయసులో.."    "ఏముంది.. రాచ సైన్యంలో చేరడానికి.. శిక్షణకై తీసుకు వెళ్తున్నట్లున్నారు. మరలా ఎప్పుడు ఇళ్లకి వస్తారో ఏమో? ఏం యుద్ధాలో.. ఏం రాజ్య కాంక్షలో! అన్యాయంగా పసి మొగ్గల జీవితాలు వాడిపోతున్నాయి." పేరమ్మ గట్టిగా నిట్టూర్చి లోపలికి నడవబోయింది.    "అంటే వీరందరూ ఇంటికి తిరిగి వెళ్లరా?" కోడలి మాటల నిండా ఆవేదన..    "ఏం చెప్పం తల్లీ! ఎవరి రాత ఏ విధంగా ఉందో.." పేరమ్మ మాట పూర్తి కానే లేదు..    వీధరుగు చివరికి వెళ్లి భళ్లున వాంతి చేసుకుంది పోతమ్మ.    కళ్లు గిర్రున తిరిగి కిందికి పడిపోబోతున్న కోడలిని పొదివి పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్లిమంచం మీద పడుక్కోబెట్టింది పేరమ్మ. చల్లని నీటిలో ముంచిన బట్ట తీసుకొచ్చి మొహం తుడిచి, లేపి వేడి వేడి పాలు తాగించింది.    పాలు తాగిన వెంటనే కళ్లు మూసుకుని, పడుక్కుంది పోతమాంబ. నుదుటి మీద చెయ్యివేసి చూసింది పేరమ్మ. చల్లగా.. మంచుముక్క పట్టుకున్నట్లుంది. వెంటనే, పళ్లెంలో పసుపు ముద్దగా కలిపి, అరిపాదాలకి రాయసాగింది.    "ఏం జరిగింది?" అప్పుడే లోనికి వస్తున్న ఎర్రపోతన అడిగాడు, ఆందోళనగా.    "ఏం లేదు.. సైన్యంలో చేరబోతున్న ఆ చిన్న పిల్లలని చూసి వ్యాకులపడినట్లుంది. సున్నితమనస్కురాలు.. ఏ కొంచెం అలజడికి తట్టుకోలేదు."    "ఉండు.. వైద్యుడ్ని పిల్చుకొస్తా.." వెంటనే వెళ్లి పక్క వీధి చివరనే ఉన్న ధన్వంతరిగారిని తీసుకొచ్చాడు ఎర్రపోతన.    "అమ్మాయి అప్పట్నుంచీ కళ్లు తెరవడం లేదు. అపస్మారకంగా పడుంది. సూరన్నకి కబురంపండి.. " పేరమ్మ ధైర్యంగానే ఉంది కానీ, వయో భారం చేత కాళ్లు, చేతులు వణుకుతున్నాయి.    వైద్యుడు నాడి పట్టుకుని చూశాడు. కను రెప్పలు లేపిచూశాడు, అప్పుడు కొద్దిగా కదిలింది పోతమ్మ. "నోరు తెరుస్తావామ్మా?"    బలవంతమ్మీద నోరు తెరిచి నాలుక జాపింది.    "ఏమీ ఆందోళన వద్దండీ ఎర్రనగారూ! కాస్త రక్త హీనత.. అంతే. మీ ఇంట పాపాయి పారాడ బోతున్నాడు. మంచి ఆహారం.. రోజూ క్షీరాపానం చేయించండి. అంతా సవ్యంగా అయిపోతుంది." ధన్వంతరిగారు సరంజామా సర్దుకుని బైటికి నడిచారు.    శిష్యునిచే కబురందుకుని పరుగున వచ్చిన సూరన్న శుభవార్తని విన్నాడు.    పక్కన కూర్చుని ఆప్యాయంగా భార్య చెయ్యి పట్టుకున్నాడు.    "మనకి అమ్మాయే పుట్టాలి స్వామీ.." నీరసంగా అంటున్న పోతమ్మని ప్రశ్నార్ధకంగా చూశాడు సూరన్న.    "అబ్బాయైతే యుద్ధంలోకి తీసుకుపోతారు.." కళ్లు పెద్దవి చేసి, భయంగా చూస్తూ అంది పోతమాంబ.. ఒక స్త్రీ.. కాబోయే మాతృ మూర్తి.    "ఆలోచన మాని విశ్రాంతి తీసుకో."                                               ……………                                                       3                                                అధ్యాయము   కాకతీయుల రాజధాని, ఓరుగల్లు పట్టణంలో..  "హూ! విశ్రాంతి.. ఎక్కడుందది? ఆ పదానికి అర్ధం మర్చిపోయి చాలా కాలమయింది. సామాన్య ప్రజకే నయం. అమ్మాయయితే రక్షణ ఉంటుంది. మరి రాచ పుట్టుక పుడితే.. అబ్బాయైతేనే కాదు యుద్ధంలోనికి తీసుకుని వెళ్లేది!"    గుడ్లూరుకి వాయవ్య దిశగా కొన్ని యోజనాల దూరంలో మరొక స్త్రీ అటువంటి ఆవేదనతోనే ఆలోచిస్తోంది. ఆవిడే కాకతీయ సామ్రాజ్య మహా రాజ్ఞి రుద్రమదేవి.    రాణీ రుద్రమదేవి తన ప్రాసాదంలో అసహనంగా అటూ ఇటూ తిరుగుతోంది. ముఖంలో గాంభీర్యం, కన్నులలో వేదన. కుడి చేయి పిడికిలితో ఎడమ చేయి అరచేతిలో కొట్టుకుంటోంది.    తన తండ్రి అమ్మాయినైనా అబ్బాయి వలెనే పెంచాడు. యుద్ధ విద్యలన్నీ నేర్పించాడు. రుద్రదేవుడని్ లోకానికి పరిచయంచేసి యువరాజ పట్టాభిషేకం చేశాడు. కానీ ఎంతకాలం మభ్యపెట్టగలిగాడు? చివరికి.. తను ఉండగానే కాబోయే మహారాణి అని రాజ్యాధికారం అప్పచెప్పాడు.    తను అమ్మాయే కానీ.. రాజ్య స్వీకారం అయినప్పటిప్పటినుండి.. ఎన్నెన్ని యుద్ధాలు? శిరస్త్రాణం ధరించి.. కత్తీ, డాలూ, కవచం.. అశ్వారోహణ.    అనుక్షణం అప్రమత్తత.    అంతూ దరీ కనిపించడం లేదు. ఎన్ని ప్రాణాలు గాలిలో కలిశాయి.. కలిసి పోతున్నాయి? అంతర్యుద్ధాలు.. తను స్త్రీ అని మరింత చులకన..    నలు ప్రక్కలనుండీ సరిహద్దులోని రాజులు అనుక్షణం కయ్యానికి కాలుదువ్వడమే..    సమర్ధులైన సేనానులు సహకరిస్తుంటే రాజ్యాన్ని ఒక్కతాటి మీద నడపగలుగుతోంది.    "మహారాణీ వారికి నమస్సులు.." పరిచారిక వినయంగా వచ్చి నిలిచింది.     రాణీ రుద్రమ దేవి కనుబొమ్మలు ముడిచి చూసింది.    "మహారాణీ వారి దర్శనార్ధం మంత్రి శివదేవులవారు విచ్చేశారమ్మా."    శివదేవయ్య ఉచితాసనం అలంకరించి, మందస్మిత వదనంతో మహారాణీని చూశారు.    తిక్కన సోమయాజిచే ఈశ్వరుని అవతారంగా చెప్పబడిన గురుదేవుడు.    "వసుమతీ నాధః యీతడీశ్వరుడె గాని     మనుజ మాత్రుండు గాడు పల్మారు నితని     యను మతంబున నీవు రాజ్యము నెమ్మి ఏలుమని" తిక్కన, గణపతి దేవునికి చెప్పిన వాడు. మహా జ్ఞాని.. మహా మంత్రి.    రుద్రమ దేవి ఎదురేగి అభివాదం చేసింది.    "అమ్మా! ప్రతాప రుద్రదేవ మహారాజునకు ఉపనయనం జరిగి రెండు వత్సరములైనది కదా.. ఉభయభాషల యందు కొంత ప్రవేశం వచ్చింది. ఇంక ధనుర్విద్య, కత్తి యుద్ధం, మొదలైన యుద్ధ విద్యలు నేర్పాలి. కొంచెం పొడవు పెరిగినాక గజ, తురగాదుల ఆరోహణం నేర్పించాలి. మీ అనుమతి తీసుకుని ప్రారంభించవలెనని ఆగాను. ఇంత కాలం మీరు దేవగిరి రాజుతో.."    "అవును స్వామీ! యుద్ధం.. యుద్ధం.. యుద్ధం. ఎంతటి జన నష్టం. ఎందుకు ఇదంతా.."    శివదేవయ్య చిరునవ్వు నవ్వారు.    "అంతటి భీకర సమరం తరువాత ఈ నిర్వేదం సహజమే తల్లీ! మూడు లక్షల పదాతులు, లక్ష గుర్రంబులు నేల కూలిన పిదప ఈ విచారం సముచితమే! యుద్ధమున గెలిచి కోటి ద్రవ్యములు సుంకము కింద కానుక తీసుకొన్ననూ.. జయ స్థంభముల పాతించిననూ సరే.."    తను గెలిచి, విప్రులకు దాన ధర్మములు చేయుట, సామంత రాజులకు చీని చీనాంబరములు, మణిమయ భూషణములను ఒసగుట.. విజయ భేరీలు మోగించుట.. మొదలగు విజయోత్సవములను సందర్భోచితంగా గుర్తు చేశారు శివదేవయ్య.    "ఏమిటో ఆచార్యా.. అది అయిపోయిందిలే అనుకోవడానికి లేదు కదా! నెల్లూరు సీమ పాండ్యుల వశమయింది. వల్లూరు సామంతులు, కాయస్త జన్నిగదేవుడు, త్రిపురారిదేవుడు మనకి అనుకూలంగా ఉన్నారనుకుంటే.. ఇప్పుడు సింహాసనం ఎక్కిన వారి సోదరుడు అంబదేవుడు ఎదురుతిరుగుతున్నాడు. కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. ఈ నర మేధానికి ఎక్కడా అంతం లేదా స్వామీ?" ఆవేదనగా అంది రుద్రమదేవి.    "ఇటువంటి అర్జున విషాద యోగం ప్రతీ సామ్రాజ్య పరి రక్షణలోనూ సామాన్యమే తల్లీ! తప్పదు. ప్రజా క్షేమం కోరే ఏ ఏలిక అయినా ప్రతీ క్షణం అప్రమత్తం అయుండాలి. ఆ పైన వారసుడ్ని తయారు చెయ్యాలి. కాకతీయ యుగం మరి కొన్ని దశాబ్దాలు మార్తాండ తేజో విరాజితమై వెలగాలి."    "సరే స్వామీ! మీ అభీష్టం ప్రకారమే కానియ్యండి. ప్రతాపునకు సకలవిద్యలూ అభ్యసింపజేయాలి. నేను.. అంబదేవుని పై యుద్ధానికి సన్నిద్ధం కావాలి."    ప్రతాపరుద్రుడు రుద్రమదేవి మనుమడు. ముమ్మడమ్మ కుమారుడు.     రుద్రమదేవి వానిని దత్తత తీసుకొని, వారసుడిగా చేసికొన్నది.     కాయస్త ప్రధాని అంబదేవుడు బలవంతుడు. తన రాజ్యాన్ని విస్తరింజేయాలని.. ఎవరికీ సామంతునిగా ఉండనని ప్రతిన పట్టినవాడు. సింహాసనం ఎక్కినప్పట్నుంచీ కాకతీయ సామ్రాజ్ఞికి కప్పం కట్టడం మానేశాడు.    పాండ్య రాజులతోటీ, సోన యాదవులతోటీ స్నేహం కలిపి, వారి సైనిక బలం సహాయంతో స్వతంత్రం ప్రకటించుకున్నాడు అంబదేవుడు.    చుట్టుపక్కలనున్న డెబ్భై రెండు మంది నాయకులతో పోరాడి గెలిచాడు. నెల్లూరు, ఎరువనాడు, పెండేకల్లు మొదలైన రాజుల్ని ఓడించి కాయస్త రాజ్యంలో కలిపేసుకున్నాడు. చివరికి పాండ్యులని కూడా తరిమి కొట్టాడు. ఆంధ్ర దేశంలో పాండ్యుల సార్వభౌమత్వం అంతరించిపోయింది.    దక్షిణ భారతంలో అంబదేవుని బలమైన కాయస్త స్వతంత్ర రాజ్య విస్తరణ, కాకతీయ సామ్రాజ్యానికి పెద్ద సమస్యగా మారింది. మహారాణి రుద్రమదేవి, అంబదేవుని సార్వభౌమ ధిక్కారత్వాన్నీ, నిరంకుశత్వాన్నీ సహించ లేక పోయింది. మల్లికార్జున సేనానితో కలిసి అంబదేవుని పై పోరు సలపడానికి బయలుదేరింది.    యుద్ధానికి బయలుదేరే ముందే.. పదునారు సంవత్సరాలు నిండిన ప్రతాపరుద్రునికి వివాహం జరిపించింది.. అదీ.. విశాలాక్షి మొదలుగాగల పదహారు మంది కన్నెలతో.                    జరుగబోయేది ఎరుకే నన్నట్లు ఓరుగల్లు ప్రజలంతా మహారాణీగారికి పుర వీధుల్లో నిలబడి, వీడ్కోలు చెప్పారు. కవచ శిరస్త్రాణాలతో కత్తి, డాలు చేపట్టి అశ్వాన్ని ముందుకురికించింది వీర నారి రుద్రమ దేవి.    అప్పటికే రాజ్యవిస్తరణతో సైనిక బలం పెంపొదించుకున్న అంబయ్య, పాండ్యుల, యాదవ సైనల సహకారంతో భీకరపోరు సలిపాడు. లక్షలమంది పదాతి దళాలు, అశ్వ దళాలు, వేల సంఖ్యలో గజబలం నాశనమయ్యాయి.    ఆ భీకర సంగ్రామంలోనే కాకతీయ సామ్రాజ్య మహారాజ్ఞి రుద్రమ దేవి వీరమరణం పొందింది.    ఓరుగల్లు నగరం, పాకనాడు, పలనాడు, వేంగి.. యావత్ కాకతీయ సామ్రాజ్యం దుఃఖ సాగరంలో మునిగిపోయింది.    రుద్రమ దేవి ప్రజలను కన్నబిడ్డలవలే పాలించింది. వారి క్షేమం కోసం నిరంతరం యుద్ధరంగంలోనే ఉండేది. అయినా.. సమర్ధులైన మంత్రులతో, సేనానులతో.. రాజ్య పాలనకి ఎటువంటి లోటూ రానియ్యలేదు. వ్యవసాయం, వ్యాపారం, శిల్పకళ, సాహిత్యం.. నాట్య సంగీతాలు అభివృద్ధి చెందాయి.    ఎన్ని చేస్తేనేం.. విధికి ఎదురీదలేదు కదా!    ప్రతాపరుద్రుడు సింహాసనమధిష్టించాడు. సార్వభౌమునిగా బాధ్యతలు స్వీకరించాడు.. ఎదుట నెరవేర్చవలసిన కార్యములు, చెయ్యవలసిన యుద్ధములు అనంతములు. అది సింహాసనము కాదు.. పగతో సెగలు కక్కుతున్న వేయితలల సర్పము.      అద్దంకి సీమ కూడా అల్లల్లాడిపోయింది.    రాజ్య క్షేమం కోసం వీర మరణం పొందిన మహారాణి రుద్రమదేవిని తలుచుకోని వారు లేరు... విలపించని వారు లేరు. మహారాణీ తన సువిశాల సామ్రాజ్యంలో, ప్రతినిధుల పాలనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిపించారు. ముఖ్యంగా చెరువులు, పంట కాలువలు తవ్వించి దేశాన్ని సస్య శ్యామలం చేశారు. సామాన్యులు ఎంతో హాయిగా జీవనం గడుపుతున్నారు.    అద్దంకి నాయంకరులు కూడా ప్రతాపరుద్ర దేవ మహరాజుకి తమ విధేయతని ప్రకటించారు.    ప్రతాపరుద్రుని కీర్తి అప్పటికే నలుదిశలా మారు మ్రోగుతోంది.    చక్రవర్తి గుణ సంపదను, శివదేవయ్యగారు పుట్టిన వెంటనే తెలియ జేశారు.    "ఈ బాలుడు సర్వ లక్షణ సంపన్నుడు. విక్రమార్కుడు, దాన కర్ణుడు. ఇతడు ఇంద్ర సన్నిభుడు కానీ మానవ మాత్రుడు కాడు. ఇతను పుట్టినపుడే సింహాసన మెక్కగలడు." శివదేవయ్యగారు సాక్షాత్తు పరమశివుని అవతారమని ప్రతీతి. ఆయన అన్నటులే ఆ పసివాడిని ఊయల యందు నుంచి సింహాసనమెక్కించింది మహారాణి రుద్రమ దేవి.     అయిననూ.. ప్రతాప రుద్రదేవుడు సింహాసన మధిష్టించిన పిదప కొంత అరాచకము తప్పలేదు.    కొందరు దుండగులు శివాలయములో పూజలు జరుపుకుంటున్న మునులను బెదిరించి వారు సేవించుచున్న పరశువేది శివలింగమును ఎత్తుకుపోయారు. మహారాజు వారిని సంహరించి శివలింగమును తిరిగి మునులకి చేర్చాడు.    ఇంకొక రేయి.. దుష్టులు, ఒక విప్రుని ఇంట దూరి, సొమ్ములు అపహరించి, యజమానిని పొడిచి పోయారు. అదృష్టవశాత్తూ ఆ బ్రాహ్మణుడు బ్రతికి బైట పడి రాజునకు బ్రహ్మహత్యా పాతకము చుట్టుకోకుండా బయట పడేశాడు.    ఇటువంటి దుష్ట చర్యలను నివారించుటకు, డెబ్బది ఏడుగురు పద్మనాయకులను పిలిపించి వారికి నాయకత్వం ఇచ్చాడు. వారి బంధువులకు ఉపనాయకత్వం.. రాజ్యములో కొంత భాగం విప్రులకు, కొంత బంధువులకు వితరణ చేశాడు.    కోటి సువర్ణములు దానం చేసి జనరంజకంగా రాజ్యాన్ని పాలిస్తున్నాడు ప్రతాపరుద్రుడు.    రాజ్యంలో ప్రజలందరు ధర్మవర్తనులై, సిరి సంపదలతో ఆనందిస్తున్నారు.    ఇంక మిగిలింది సామ్రాజ్య విస్తరణ.. కోల్పోయిన రాజ్య భాగాలను తిరిగి పొందే ప్రయత్నం..    అన్నింటి కంటే ప్రధానమైన కర్తవ్యం.. మహారాణీ రుద్రమదేవిని చంపిన అంబయని మట్టుపెట్టడం.    అందులకే సంసిద్ధుడవుతున్నాడు మహా్రాజు ప్రతాపరుద్ర దేవుడు.    యుద్ధ భేరీలు మ్రోగుతూనే ఉన్నాయి. రాజ్యంలోని ప్రతీ గ్రామం నుంచీ యువకులను సైన్యంలోనికి చే్ర్చుకుంటూనే ఉన్నారు.. వారికి శిక్షణ ఇస్తూనే ఉన్నారు.    కాకతీయ సామ్రాజ్యం ప్రశాంతంగా ఉన్నట్లుగానే ఉంది. నివురు గప్పిన నిప్పులాగ! ……… ( ఇంకా వుంది) ………..  (చిత్రాలు- మాలా పర్చా గారి సౌజన్యంతో) .... మంథా భానుమతి                         

కన్ హొపాత్ర – మరాఠీ

  కన్ హొపాత్ర – మరాఠీ ఒక అందమైన అమ్మాయి , అందమైన అనే విశేషణం లేకపోయినా పరవాలేదేమో, అన్ వాంటెడ్ అట్టెన్షన్ పొందకుండా ఈరోజుకీ నడిరోడ్డులో వెళ్ళలేకుండా ఉంది. అదే ఏడెనిమిది శతాబ్దాలముందు, ఒక వేశ్య కులంలో పుట్టి పైగా, బాద్ షా కూడా కామించి పొందాలని వెంటబడేంత అందం., నేను ఎవరికీ వశపడను, నన్ను ఎవరూ ముట్టడానికి వీల్లేదని కూర్చుంటే కుదిరే పనేనా. కాని కొన్ని శతాబ్దాల క్రితం కన్ హోపాత్ర అనే వేశ్య చివరికి తన ప్రాణాలు కూడా అర్పించి తన ఈ పంతం ఎన్నో సినిమా కష్టాలకోర్చి నెగ్గించుకుంది. అయితే క్రితం వారం మనం తెలుసుకున్న అక్కమహా దేవి లాగానే ఈమె కూడా ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నది భక్తి మార్గమే. కన్ హొపాత్ర వర్కారి సంత్ అంటే, కృష్ణుడిని విఠోబా రూపంలో కొలిచే ఒక హిందూ వైష్ణవ సంప్రదాయంకి చెందినది. కన్ హొపాత్ర జీవించిన కాలం 14 నుంచి 16 వ శతాబ్దం వరకు ఎప్పుడైనా అయుండచ్చట. ఈమె మహరాష్ట్ర కి చెందిన పండర్పూర్ దగ్గరలో మంగల్ వెధె, అనే చోట ఒక ధనికురాలైన వేశ్య శ్యామ కు పుట్టింది. ఆమె చిన్నతనం అంతా అత్యంత విలాసవంతంగా, రాజ సౌధం లాంటి ఇల్లు, సేవకుల మధ్య సాగింది. అప్సరసలను పోలిన అందము, సంగీత నృత్య కళల్లో శిక్షణ, పొందిన ఈమె తన వృత్తి లోనే స్థిరపడాలని తల్లి శ్యామ ఆశించింది. కాని కన్ హొపాత్ర ఇందుకు భిన్నంగా ఆలోచించింది. అయితే తల్లికి మాత్రం కన్ హొపాత్ర, బీదరు ముస్లిం బాదుషా దగ్గర స్థిరపడితే, ధనానికి, సంపదలకి సౌఖ్యానికీ లోటుండదని ఆశ పడింది. కాని కన్ హొపాత్రకి తనకన్నా అందంగా ఉన్నవాడిని పెళ్ళి చేసుకోవాలని ఆశ. ఇది వెర్రి ఆశ పాపం, ఆనాటి సమాజంలో, వేశ్యలు పెళ్ళి చేసుకోవడానికి అర్హులు కారట. ఒకసారి ఆ కులంలో పుట్టాకా, వేశ్య గానే జీవితం గడపాల్సిన స్తితి. సదాశివ మలగుజార్, శ్యామ ప్రకారం కన్ హొపాత్ర తండ్రి. ఆమె ఎంత చెప్పినా తను తండ్రి అయుండచ్చని నమ్మడు. అవున్లెండి ఇప్పటిలాగ డీ ఎన్ ఏ టెస్ట్ లు అప్పుడు లేవుగదా. పోనీ తండ్రి కాకపోయినా, కూతురి వయసు కన్ హొపాత్రది అన్న విషయం కూడా పట్టించుకోకుండా ఆమెని పొంద గోరతాడు. అయితే కన్ హొపాత్ర ఇందుకు ఒప్పుకోదు. సదాశివ కక్ష్య కట్టి ఆ కుటుంబాన్ని రోడ్డుకీడుస్తాడు. ఉన్న డబ్బంతా పోయి చేసేదేమీ లేక తల్లి సదాశివ కి తన అంగీకారం తెలుపుతుంది. అయితే తన సేవకురాలి సహాయంతో ఒక సేవకురాలి వేషంలో కన్ హొపాత్ర ఇల్లు విడిచి పారి పోతుంది. పండరిపూర్ చేరుకుని ఒక చిన్న గుడిసలో జీవిస్తూ, రోజూ గుడి అంతా శుభ్రం చెయ్యడం లాంటి పనులు చేస్తూ విఠోబా ని కొలుస్తూ ఉండి పోతుంది. తన పాచిక పారని సదాశివ బీదరు బాధుషా కి కన్ హొపాత్ర అందం, సంగీతం నృత్యం గురించి చెప్పి తన కోటలో ఉంచుకోమని ఎగదోస్తాడు. బాదుషా కన్ హొపాత్రని తీసుకు రావటానికి తన సైన్యాన్ని పంపస్తాడు. ఇక్కడ జరిగిన విషయాలే రక రకాల కధలుగా ప్రచారం పొందాయి. గుడి పక్కగా పారుతున్న భీమా నది పొంగి గుడిని ముంచెత్తిందని, ఆ వరదల్లో, సైనికులు కొట్టుకు పోయారని, ఆ తరవాత కన్ హొపాత్ర శవం గుడిలోని ఒక బండ మీద దొరికిందని, ఆమెను ఆ చోటనే సమాధి కట్టారని చెప్పుకుంటారట. అయితే ఇప్పటికీ కన్ హొపాత్ర సమాధి గుడి ఆవరణలోనే ఉంటుందట. ప్రజలంతా ఆమె సమాధికి కూడా మొక్కుతారట. అయితే నిజంగా ఏం జరిగుండచ్చని మనమంతా ఊహించవచ్చు. బాదుషా దగ్గరికి వెళ్ళడం ఇష్టం లేని కన్ హొపాత్ర, గుడిలోనే ఆత్మహత్య చేసుకుని తన జీవితాన్ని అంతం చేసుకుంటుంది. అచ్చం సినిమా కధలా ఉంది కదూ కన్ హొపాత్ర జీవితం. ఆమె గుడిలో గడిపిన కాలంలోనే విఠోబాను, భర్తగా, తల్లిగా తన సర్వస్వంగా భావిస్తూ రాసిన కొన్ని అభంగ్ లు ఇప్పటికీ పండర్పూర్ వెల్తూ జనాలు పాడుకుంటారట. ఆమె సాటిలేని భక్తి తత్వం, ఆత్మ సమర్పణ, ఎటువంటి సంసారిక బంధాలలోనూ ఆసక్తి లేకుండా విఠోబా కు అంకితమయిన వైనం ఆమెను వర్కారి సంత్ లలో ఒకరుగా గుర్తించడానికి కారణాలు. సకల్ సంత్ గాధ అనే Anthology లో కన్ హొపాత్ర అభంగ్ లని కూడ చేర్చారట. ఆనాటి సమాజంలో వేశ్య కున్న స్థానం దృష్ట్యా ఇది చాలా అరుదైన విషయం. ఆమె తన అభంగ్ (అంటే విఠోబాని కీర్తిస్తూ పాడే భక్తి రసభరిత కవిత. అ - భంగ్ అంటే భంగము లేకుండా సాగేదీ అని.) లలో ఆనాటి కుల వ్యవస్త గురించి ముఖ్యంగా, వేశ్యలంటే ఉన్న చిన్నచూపు గురించి పాడేదట. ఒకసారి ఎక్కడో చదివిన గుర్తు మన దేశంలో ఆడవారికి ఒకరికంటే ఎక్కువ మగవారితో సంబంధం పెట్టుకోవడం తప్పని, ఆ రకమైన స్వేఛ్చ లేదని అయితే పాశ్చాత్య దేశాల్లో ఆడవారికి ఆ స్వేఛ్చ ఉందని, కాకపోతే ఎవ్వరి వద్దకు వెళ్ళకుండా ఉండే స్వేఛ్చ్ మాత్రం వారికి కూడా లేదని. స్వేఛ్చకి కొన్ని నియంత్రణలు, నిబంధనలు చాలానే అలోచించి పెట్టారు ఆడవారి విషయంలో. ఒకటయితే మాత్రం నిర్ధారణగా తెలిసేదేంటంటే ఏ కాలంలో అయినా, ఏదేశంలో అయినా ఆడవారి స్వేఛ్చకి చాలానే ఆటంకాలున్నాయని. వారి జీవితాన్ని వారికిష్టమయినట్లు, ఎవరికీ ఎటువంటి హానీ చెయ్యకపోయినా జీవించలేరని. కన్ హొపాత్ర రాసి పాడిన అభంగ్ లు ఒక ముప్ఫై కన్నా మించి ఇప్పుడు లభ్యం కాలేదట. అవికూడా ప్రజల నోళ్ళలో నానుతూ ఉన్నవే. ఒక రెండు మాత్రమే నాకు, వికిపీడియాలో దొరికాయి. అవే ఇక్కడ ఇచ్చాను. 1. O Narayana, you call yourself savior of the fallen... My caste is impure I lack loving faith my nature and actions are vile. Fallen Kanhopatra offers herself to your feet, a challenge to your claims of mercy. ఓ నారాయణా నిన్ను నీవు పతిత జనోద్ధారకుడవంటావే....... నా కులం అపవిత్రమైనది, ప్రేమ, నమ్మకం నాకు కొరత నా గుణము, కర్మములు నీచమైనవి కన్ హోపాత్ర అనే పతిత తనను తాను నీ పాదాలకు అర్పించుకుంది, ఇది ఒక సవాలు నీ కారుణ్యం గూర్చిన ప్రగల్భాలకు. అందము చందం, నృత్యం, సంగీతం, కవిత్వం అన్నింటినీ మించి ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం ఉండి కూడా, కేవలం జన్మతహా వచ్చిన కులవృత్తి (చెయ్యకపోయినా) వల్ల, పూజకి పనికిరాని ఒక పువ్వు అయినందుకు ఆమె ఎంత ఆత్మన్యూనతకి గురయ్యిందో ఈ అభంగ్ ద్వారా అర్ధం అవుతుంది. 2. If you call yourself the Lord of the fallen, why do O Lord not lift me up? When I say I am yours alone, who is to blame but yourself if I am taken by another man. When a jackal takes the share of the lion, it is the great, who is put to shame. Kanhopatra says, I offer my body at your feet, protect it, at least for your title. పతితజననాధుడనని నిను నీవు పిలుచుకున్నట్లయితే ఓ దేవా నన్నేల ఆదుకోవు? నేను నీదాననేనని చెప్పినపుడు, నిన్ను కాక ఎవరిని నిందించాలి, నన్ను వేరొకడు చేపట్టినపుడు? ఒక సింహపు వేటను నక్క నుంచి కాపాడుకోలేనపుడు, బలవంతమైన సింహానికే కదా సిగ్గు. కన్ హోపాత్ర అంటుంది, 'నా శరీరాన్ని నీ పాదాలకర్పితం చేస్తాను, దానిని రక్షించు, కనీసం నీ పేరు కోసమైనా'. తన వద్దకు వచ్చే విటులు ఎలా తనను ఒక వస్తువు లాగా చూస్తారో, అందమైన స్త్రీ శరీరం ఒక పొందవలసిన ఆస్తిగా ఎలా మారిందో, సమాజంలో వేశ్యల స్తితి ఎంత దారుణంగా ఉందో ఆమె తన అభంగ్ లలో పాడేదట. ఆమె కధను మరాఠీ లో సినిమాగా కుడా తీసారు, కానీ భాష సమస్య వల్ల దానిని అర్ధం చేసుకోవడం సాధ్య పడలేదు. ఏ గురువు దగ్గరా శిష్యరికం చెయ్యకండా, వేరే ఎటువంటి విద్యాభ్యాసం లేకుండా, కన్ హొపాత్ర, సమాజం నీచంగా చూసే వేశ్య కులంలో పుట్టి సంత్ పరివారంలో చోటు సంపాదించుకుందంటే, ఆరోజుల్లోనే కాదు, ఈరోజుకీ అది ఎంతో గొప్ప విషయమే. Janabai - జానాబాయి జానాబాయి గురించి కూడా ఈ వారమే తెలుసుకుందాము. ఎందుకంటే ఈమె కూడా మరాఠీ వర్కారి హిందూ సంత్. మళ్ళీ వారం ఈమె గురించి విడిగా చెప్పినా కొంచం మొనోటనస్ గా ఉంటుందేమోననిపించింది. పండర్పూర్ లో మరాఠీ సంత్ నామ దేవ్ ఇంట ఈమె పనిమనిషి. ఆ ఇంట ఉన్న భక్తి వాతావరణం వల్లనూ, స్వతహాగా కూడా భక్తి ఎక్కువే అయిన కారణంగానూ ఈమె కూడా తన జీవితాన్ని విఠోబాను కొలవడంలోనే గడిపేసింది. ఎటువంటి విద్యాభ్యాసం లేని ఈమె 300 అభంగ్ లు సంత్ నామదేవ్ అభంగ్ ల తో పాటుగా భద్రపడ్డాయంటే, అది కూడా, ఆయనతో పాటుగా సంత్ జానాబాయి గా గుర్తిస్తూ. ఒక శూద్ర కులస్తురాలైన ఈమె ది ఒక అద్భుత ప్రయాణం. ఈమెవి ఒక రెండు అభంగ్ లు ఇక్కడ చూద్దాం. Cast off all shame Cast off all shame, and sell yourself in the marketplace; then alone can you hope to reach the Lord. Cymbals in hand, a veena upon my shoulder, I go about; who dares to stop me? The pallav of my sari falls away (A scandal!); yet will I enter the crowded marketplace without a thought. Jani says, My Lord, I have become a slut to reach Your home. సిగ్గంతా విడిచివేయి నిన్ను నువు మార్చుకో ఈ బజారులోన అప్పుడు మాత్రమే నువు ఆశ పడగలవు భగవంతుని చేరగలనని. చేతిలో తాళాలతో భుజాలపై వీణని వ్రేలాడేసి నేను తిరుగుతుంటాను నన్ను ఆపే ధైర్యమెవరికి? నా చీర కొంగు చెదరి పోతుంది అయినా నే వెళ్తుంటాను ఇరుకైన బజార్లలో ఏ చింతా లేకుండా. జానాబాయంటుంది, ఓ దేవా, నీ నివాసం చేరడానికి నేను పతితనయ్యానని. Acceptance If the Ganga flows to the ocean and the ocean turns her away, tell me, O Vitthal, who would hear her complaint? Can the river reject its fish? Can the mother spurn her child? Jan says, Lord, you must accept those who surrender to you. తన్ను చేర వచ్చిన గంగను సముద్రుడు తిరస్కరిస్తే చెప్పు ఓ విఠలా, ఆమె మొర ఎవరు వింటారు? చేపను నది తిరస్కరించవచ్చా? శిశువును తల్లి కాదనవచ్చా? జానాబాయంటుంది, దేవా, నీ శరణు కోరిన వారిని నువు ఆదరించవలసిందే. స్త్రీ జీవితమంటే, నిరంతర పోరాటం, పరిశ్రమ, దాస్యం, సంకెళ్ళు, అణిచివేత, పీడన, రోదన, శోధన. ఆమెది ప్రేమ తత్వం, పొందేది ప్రేమ రాహిత్యం, దూషణ, తిరస్కారం. పురుషుడు ఆమెకోసం కుతంత్రంగా నిర్మించిన సాలెగూడు లో చిక్కుకుని అందులోని విషపు కాట్లను లెక్క చెయ్యకుండా తెగిపడిన తన హృదయ శకలాలను తిరిగి అతికించుకుని బయటపడి తారల ఆకాశంలో తనకో స్థానం ఏర్పరుచుకోవడం ఇటువంటి అసాధారణ వ్యక్తిత్వం ఉన్న స్త్రీలకి తప్ప సాధ్యం కాదేమో. ఇంకొక అద్భుతమైన రచయిత్రి పరిచయంతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం.        ........... శారద శివపురపు

“చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు" పార్ట్ - 4

  “చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు" పార్ట్ - 4 మరునాడు కృష్ణానది దాటాలి. మేనాలూ, బోయీలూ కిట్టమ్మకీవల ఒడ్డునే ఆగిపోయారు. బోయీలు పేరు పేరునా వీడ్కోలు చెప్పారు.    "అయ్యవారూ! మీతో గడిపిన ఈ రెండు దినాలూ క్షణాల్లా గడిచాయండి. అందరూ మీ వలె ఉంటే మాకు మేనా బరువే ఉండదండి.. ఎన్నో విషయాలు నే్ర్చుకున్నాం కూడా మేం.."    మితాహారంతో, పని పాటలతో చక్కని సమ శరీర సౌష్టవంతో ఉన్న సూరనాదులకి వాహకులుగా ఉండడం ఆనందాన్నిచ్చింది వారికి. మేనా సమతుల్యానికి కూడా ఏ మాత్రం భంగ పాటు రాలేదు.    దారంతా సూరన్న భాగవత కథలు చెప్తూనే ఉన్నాడు. వాతావరణం ఆహ్లాదంగా ఉన్నప్పుడు మేనాకున్న కప్పు తొలగించారు.    రౌతులు, గుర్రాలు వేరు వేరు నావల్లో, సూరనాచార్యుల కుటుంబాన్ని సౌకర్యంగా నున్న నావలో దాటించారు.    కొత్త మేనాలు.. కొత్త బోయీలు. అదేం చిత్రమో.. వాహకులందరూ ఒకే రకమైన శరీరాకృతితో ఉన్నారు. వారందరి శ్రమా ఒక్కటే కదామరీ అనుకున్నాడు సూరన్న. మోముల చిరునవ్వులూ.. కన్నుల పరవళ్లు తొక్కే ఉత్సాహం అదనపు అలంకారమయింది వారికి.    "బాబూ నరసింహా! మంగళగిరి ఇచ్చటికి ఎంత దూరం?" ఎర్రపోతన్న సందేహిస్తూ అడిగాడు నరసింహ సేనానిని.    "ఒక యోజనం పైన ఉంటుంది బాబుగారూ.."    "అంటే మధ్యాహ్న వేళ అవుతుంది. కుదురుతుందో లేదో.." గొణుక్కుంటూ మేనా ఎక్కాడు ఎర్రపోతన. ఆ నారసింహుని దయ ఏ విధంగా ఉంటుందో..    సూరన్న సతీమణి పోతమ్మ శిరోభారంతో వణికిపోతోంది. ఆమెకి ఏటి గాలి పడదు.. భార్య చెవుల మీది నుంచి నుదిటిని కప్పుతూ పలుచని బట్టని గట్టిగా కట్టి, పల్లకీలో ఆనుకోనుటకు వీలుగా మెత్తలమర్చి, కళ్లు మూసుకుని వెనుకకు వాలి కూర్చోమన్నాడు సూరన్న. కన్నుల మీదుగా వైద్య మూలికలు కలిపిన పాలాస్త్రి పట్టీ వేశాడు. అతని గురుకులంలో ప్రాధమిక వైద్యం కూడా ఒక భాగమే.    పోతమ్మ నిస్త్రాణగా సోలిపోయింది. ఆదిత్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. బోయీలు రొప్పుతూ అక్కడక్కడున్న చెట్ల నీడల్లో పరుగు పెడుతున్నారు.   "బాల ప్రహ్లాదుని కనికరించి బ్రోచిన నారసింహా!    మమ్ము కరుణించి నీ దరికి తోడుకొని పొమ్మా!    మార్తాండుని కాస్త తీవ్రత తగ్గించుమనుమా    మానిని బాధను తొలగించి మమ్మద్దరికి చేర్చుమా."    కన్నులు మూసుకుని తన ఇష్టదైవాన్ని ప్రార్ధిస్తున్నాడు ఎర్రపోతన. మనసారా..     ఆలయం ప్రక్కనుండి వెడుతూ కూడా దర్శించుకోలేడా.. అంతటి దురదృష్టవంతుడా తను. అవును.. ఆయనే రప్పించుకోవాలి కానీ మనం అనుకుంటే వెళ్లగలమా?    “లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం.. దేహి దేహి..”    సూరన్న ఆరారా నోటికి అందిస్తున్న తేనె, మంచి తీర్థం పోతమ్మకి శక్తినిచ్చి, నీరసాన్ని పోగొట్టాయి.    అక్కడా అక్కడా తారాడుతున్న మేఘాలు ఒక చోట చేరి, సూర్యునికీ బాటసారులకీ మధ్యనొక తెర నేర్పరచాయి. ఉన్నట్లుండి చల్లని గాలి నెమ్మదిగా వీస్తూ.. బోయీల స్వేదాన్ని చల్లపర్చి హాయి కలిగిస్తోంది. అశ్వాలు కూడా హుషారుగా వేగం పెంచాయి. అనుకున్న సమయం కంటే ముందుగానే మంగళగిరి చేరారు.    నరసింహ సేనాని ఊరిలోనికి దారి మళ్లించి, ఆలయం వద్ద మేనాలని దింపించాడు.    ఆలయ ద్వారాలు తెరిచే ఉన్నాయి. అనుకూల వాతావరణంతో అనుకున్న సమయం కంటే త్వరితమే రాగలిగారు.    ఎర్రపోతన కన్నులు మూసుకునే ఉన్నాయి. పేరమ్మ మేనా లోనుంచి బయటికి వచ్చింది.    పోతమాంబ కూడా తలకున్న పట్టీ తీసివేసి నవ్వుతూ నిలుచుంది. శిరోభారం మటుమాయం. మలయపవనాలు సేద తీరుస్తున్నాయి.    సూరనార్యుడు గట్టిగా నిట్టూర్పు విడిచి మేనాలో మెత్తలు సరుదుతున్నాడు.   "స్వామీ!" నరసింహ సేనాని ఎర్రపోతనగారి వద్దకేగి గట్టిగా పిలిచాడు.    కన్నులు తెరిచిన ఎర్రపోతన వెలుపలికి రాగానే ఆశ్చర్యంతో కన్నులు పెద్దవి చేశాడు.    తన ఆరాధ్య దైవం.. లక్ష్మీ నారసింహుని ఆలయం..    కన్నుల ధారగా నీరు, ఆనందంతో. కాళ్లు, చేతులు వణుకుతుండగా ఆలయంలోనికి నడిచి, కాళ్లు, చేతులు, ముఖము ప్రక్షాళన గావించి ముకుళిత హస్తాలతో నారసింహుని దివ్యమంగళ విగ్రహం ముందు నిలిచాడు. కుటుంబమంతా ఆయన వెనువెంటే..    యుధిష్ఠరుడు వనవాసంలో నున్నపుడు స్వయంగా ప్రతిష్ఠించిన విగ్రహం.. భానుమండలతేజోవిరాజితమై సమస్త భక్తుల ఈప్సితముల్తీర్చ సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అచ్చట వసిస్తున్నచందాన కాంతులీనుతోంది.    పరిసరాలు మరచి ఎర్రపోతన తదేకదృష్టితో.. కన్నులార కాంచుతూ స్తుతించసాగాడు.    కమలాక్షు నీ చరణ కమలముల నే వ్రాలితి నీ కర    కమలాల నా కభయమిచ్చి బ్రోచుటకు నన్ను నీ    సమక్షమునకున్ రప్పించితివి నిరతము నిను భవదీ    యు మదిన్ నిలిపి కొలుతు నన్ను రక్షింపవే నారసింహా!    ఆ విధంగా మై మరచి ఎంత సేపుండిపోయేవాడో.. పూజారి వచ్చి, ఆలయం మూసే వేళయిందని గర్భగుడి తలుపులు వెయ్యకపోతే!    తెలివి తెచ్చుకుని, అటూనిటు చూడగా.. ఆనందోత్సాహములతో కొడుకు, కోడలు, భార్య కాన వచ్చారు. దివ్యమంగళ నారసింహుని దర్శనం ఎవరికి మాత్రం సంతోషం కాదు..    గుడి ప్రక్కనే ఉన్న అన్న సత్రంలో భక్తులందరికీ ప్రసాదాలు కడుపారగా కమ్మగా వితరణ చేశారు.    "నేను మధ్యాన్న ప్రసాదానికి ఇచ్చటికి వద్దామనే ప్రణాలిక రచించాను స్వామీ.. కానీ ఆ ప్రహ్లాదవరదుడి ఆహ్వానం లేకుండా మనమిచ్చటికి అడుగిడలేము. అందుకే మిన్నకుండిపోయాను.     ఆ స్వామి దయ కలిగింది.. ఎండ తీక్షణత తగ్గింది.. ఆలయం మూసి వెయ్యక ముందే రాగలిగాము. మీకు ఆనందం కలిగించినందుకు నేను పొంగి పోతున్నాను. ఇంక మనకి అడ్డే ఉండదు. అనుకున్నట్లుగా వారంలోగా గుడ్లూరు చేరగలమని చెప్పగలను." నరసింహ సేనాని నవ్వుతూ సెలవిచ్చాడు.    మేనాలు, అశ్వాలు నెమ్మదిగా సాగుతున్నాయి. దారి కొంచెం ఎగుడు దిగుడుగా ఉంది.    "స్వామీ!" నరసింహ సేనాని మేనా ప్రక్కకి వచ్చి ఎర్రపోతనని పిలిచాడు.    తెర పక్కకి తొలగించి చూశాడు ఎర్రపోతన.    "మీరు పంచాయతనం తేవాలి అంటూ వెనక్కి వెళ్లారు కదా.. అంటే ఏమిటి స్వామీ? పూజా గృహంలో ఉంటుందని తెలుసు.. దేవతార్చన చేస్తారని తెలుసు.. మీరు కృష్ణా తీరంలో మనం ఆగినప్పుడు కూడా పూజ చేశారు."    ఎర్రపోతన అభిమానంగా చూశాడు. కుతూహలమున్న శ్రోత దొరుకుతే ఏ వక్తకైనా సంతోషమే. గంభీర కంఠంతో మొదలు పెట్టాడు. అప్పుడప్పుడు విన వచ్చే పక్షుల కూతలు, వీచే గాలి శబ్దం తప్ప వాతావరణం ప్రశాంతంగా ఉంది.    "పంచాయతనం అంటే ఐదుగురు దేవతా మూర్తులున్న పీఠం. ఆదిత్యుడు, అంబిక, విష్ణువు, గణపతి, పరమేశ్వరుడు. మూర్తులంటే విగ్రహాలు కావు. ఆయా దేవతలకు ప్రతిరూపాలుగా భావించే శిలలు.    ఆదిత్యుడికి ప్రతి రూపం స్ఫటికం. గోళీకాయంత ప్రమాణంలో ఉండే స్ఫటికం సూర్యునిగా పూజలందుకుంటుంది.    అంబికకు ప్రతిరూపం నాపరాయి వలే ఉంటుంది. ఇందులో సువర్ణం ఉంటుందంటారు. కొన్ని నాపరాళ్లలో బంగరు రంగు గీతలుంటాయన్నది విదితమే కదా! దీనిని చంద్రశిల అంటారు.    విష్ణువు సాలగ్రామ రూపంలో ఉంటాడని అందరికే తెలిసిన విషయమే. ఇందులో జీవశక్తి ఉంటుంది. ఈ సాలగ్రామాలు ఉత్తరాన, హిమాలయాల్లో ప్రవహించే గండకీ నదిలో లభ్యమౌతాయి.    గణపతి జేగురు రంగులో ఉండే శిలలో ఉంటాడు. ఇవి శోణా నదిలో ఉంటాయి. శోణం అంటే ఎరుపు, లేదా అగ్ని వర్ణం. శోణానది మైనాక పర్వతంలో పుట్టి గంగలో కలుస్తుంది. ఈ నదిలో లభించే శిలలను శోణభద్ర వినాయక మూర్తులని అంటారు.    మహేశ్వరుడు బాణలింగ రూపంలో పూజలందుకుంటాడు. ఇది కూడా చిహ్న రూపమే. బాణలింగాలు నర్మదా నదిలో లభిస్తాయి. ఇవి శివలింగాకృతిలో ఉంటాయి.    నువ్వు చెప్పినట్లుగా పంచాయతనం, పూజాగృహాల్లోనూ, దేవతార్చనా మందిరాల్లోనూ ఉంటుంది. కొన్ని గర్భగుడుల్లో కూడా ఉంటాయి. కానీ గుళ్ళల్లో ఉన్న పంచాయతనంలో విగ్రహాలుంటాయి. తిరుమలలో, శ్రీశైలంలో, కాళహస్తిలో, పంచాయతనాలు లేవు.. మూల విరాట్ఠులు మాత్రమే ఉంటారు. గృహస్థులు ఎచటికేగినా పంచాయతనాన్ని తమ వెంట తీసుకుని వెళ్లి పూజలు చెయ్యాలి. మధ్యలో ఉన్న శిలను బట్టి పంచాయతనానికి పేరు ఉంటుంది.    మాది విష్ణుపంచాయతనం. అంటే సాలగ్రామం మధ్యలో ఉంటుంది.    నాలుగు తరాలుగా ఈ పంచాయతనం మా గృహంలో ఉంది. మా ముత్తాతగారు రాజుగారివెంట గంగాతీరానికి వెళ్లి, దారిలో ఒక్కో నదిలో ఒక్కొక్క పవిత్రశిలని తీసుకొచ్చారు. అప్పటినుంచీ పూజలందుకుంటోందీ పంచాయతనం."    "చాలా చక్కగా సెలవిచ్చారు స్వామీ! బాగా అర్ధమయింది." నరసింహుడు వేగం పెంచాడు.. రహదారి సమతలం అవడంతో.      గుంటూరు సీమ దాటి వెళుతుంటే.. నిర్జీవమైన కొన్ని పల్లెలు కనిపించాయి.    పేరమ్మ తెరతొలగించి చూసింది. జనహీనమైన వీధులు, ఎండిన పంట పొలాలు.. కూలిపోవడానికి సిద్ధంగా నున్న కొంపలు. ఎక్కడ చూసినా తుప్పలు, ముళ్ల చెట్లు.. పిశాచాల నివాసం లాగ ఉన్నాయి ఆ పల్లెలు..   "ఏమిటండీ ఇది? ఇంతటి విధ్వంసం ఎప్పుడయింది?"    "పలనాటి యుద్ధ ప్రభావం అది. వీర శైవ, వైష్ణవ మతాల మధ్య రగిలిన కార్చిచ్చు. ఒక ఆడదాని పంతంతో సర్వ నాశనమైన రాజ్యావశిష్టాలివి. మహాభారత యుద్ధం వలెనే దాయాదుల కార్పణ్యాలకి బలైపోయిన సామాన్యప్రజల ఆక్రందనలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. చరిత్ర పునరావృతమవుతుందంటారు చూడు.. ఆ విధంగానే జరిగింది." ఎర్రపోతన నిట్టూర్చారు గద్గద స్వరంతో.    "అవునవును.. విన్నాను. మా ముత్తాతగారు ఆ యుద్ధంలోనే పోయారుట. మలిదేవుడికి కుడి భుజంలా ఉండేవారుట."    "ప్చ్.. నిజమే. మహాభారత యుద్ధానికి మూలం మాయా జూదం.. పలనాటి యుద్ధమునకు కారణం కోడి పందాలు. అక్కడ వనవాసం.. ఇక్కడ రాజ్య బహిష్కరణ. కలి ఇంకా ప్రవేశించలేదు కనుక అక్కడ రాయబారిని చంపలేదు.. పైగా కృష్ణపరమాత్మ కద. ఇక్కడ రాయబారానికి వెళ్లిన అలరాజుని విషం పెట్టి చంపేశారు. అక్కడ అభిమన్యుడు, ఇక్కడ బాలచంద్రుడు."    "భూ భారం తగ్గించడానికేనేమో.. ఈ యుద్ధం కూడా.." పేరమ్మ ఆవేదనగా అంది.    "నిజమే... చుట్టుపక్కల రాజులంతా ఏదో ఒక పక్షం చేరి పోరుసలిపి పోయారు. అదే ఇక్కడి చాళుక్యుల పతనానికి నాంది అయింది. ఒక తరం తరం అంతరించిపోయింది."    "ఏమిటో ఈ యుద్ధాలు, రాజ్య దాహాలు.. ఇప్పుడు మాత్రం.. కాకతీయ గణపతిదేవుడు ప్రశాంతంగా రాజ్యం ఏలగలిగాడా? ఎన్నో ఏళ్లు కారాగారంలో మగ్గి బయటికి వచ్చాడు. ఎన్నో యుద్ధాలు చేసి.. ఎందరో అసువులు బాసాక రాజ్యం స్థాపించాడు. కూతుర్నే కొడుకులా పెంచి రాజ్యం అప్పగించాడు. ముసలితనంలో.. చివరి యుద్ధంలో ఓడిపోయాడు. రుద్రమదేవి మాత్రం.. నిరంతరం రణాలే. ఇప్పుడు కూడా అంబయతో నడుస్తోంది. ఇన్నిన్ని యుద్ధాలతో కూడా రాజ్యం సుభిక్షంగా ఉంటోంది. ఏమవుతుందో ఏమో.." పేరమ్మ సిగ్గుపడింది.. ఎర్రపోతన దీర్ఘంగా తనవంకే చూస్తుంటే.    "ఈ విషయాలన్నీ నీకు బాగానే తెలిశాయే.."    "ఏదో.. మీరు మాట్లాడుకుంటుంటే విని, ఏటి దగ్గర చర్చించుకుంటుంటాము. అందులో రుద్రమదేవి మాకు.."    "ఆదర్శం కదూ! నయం యుద్ధనీతులన్నీ వంటింట్లో చూపట్లేదు." పరాచకమాడాడు ఎర్రపోతన.    "ఆలాగే! మరి ఆ చాతుర్యమంతా చూపుతుండబట్టే.. ఇంత కాలం ఇల్లు నడిచింది." పేరమ్మ ఏ మాత్రం తీసిపోలేదు.    నిజమే.. అన్నట్లు నిట్టూరుపు విడిచాడు ఎర్రపోతన్న. ఎర్ర ఏగాని సంపాదనలేదు.. ఇంచుమించు ఏడాదిగా. ఏ విధంగా రెండు పూటలూ నాలుగు వేళ్లూ నోటికి చేరాయో.. ఇల్లాలి చాకచక్యమే    అంతా స్త్రీ శక్తి నైపుణ్యం.    ఓదార్పుగా.. నేనున్నా మీకు అన్నట్లుగా చేతి మీద చెయ్యి వేసింది అర్ధాంగి.                                 …………………                                       అధ్యాయము-2                                               "స్వామీ! ఇదియే తమ నివాస గృహము. ఇందు సమస్త సౌకర్యములు మాకు తెలిసినంతలో కలుగ జేశాము. ఈ గుడ్లేరు తటాకములతో, ఆలయములతో.. పచ్చని తోటలతో కన్నుల పండువలా ఉంటుంది. ఇచ్చటి జనులు పుణ్య చరితులు. మీరు ఇచ్చోట సుఖంగా ఉండగలరు.  మరింకేమైనా కావలసిన మీకొసంగవలెనని ప్రభువుల వారి ఆజ్ఞ." నరసింహుడు గుడ్లూరులోని ఒక ఇంటి వద్ద మేనాలని ఆపించి, సూరనకి విన్నవించాడు.    "మరి రాజకీయ పరిస్థితి.." సూరన్న ఆందోళనగా అడిగాడు.    "అవును స్వామీ! అనిశ్చితంగానే ఉంది. రాణీ రుద్రమదేవి స్త్రీ పాలన సహించలేని సామంతులతో, దాయాదులతో యుద్ధం చెయ్యవలసి వచ్చింది. అదే సమయంలో దేవగిరి రాజు దండెత్తాడు. గోన గన్నారెడ్డి, రేచర్ల ప్రసాదాదిత్యుడు, రుద్రనాయకుడు, జన్నిగదేవుడు, త్రిపురాంతకుడు, బెండపూడి అన్నమయ్య మొదలగు సేనానుల సహాయంతో ఆ ఆపదని అధిగమించింది.    అంతలో తూర్పున గంగ నరసింహుడు వేంగి సీమని ఆక్రమించాడు. అయితే పోతినాయక, ప్రోలి నాయకులు గంగ రాజుని ఓడించి తిరిగి కాకతీయ రాజ్యాన్ని స్థాపించారు.. తూర్పున. మరల దేవగిరి యాదవుడు.. అతన్ని ఓడించడం.. దక్షిణాన పాండ్యుల విజృంభణ.    వల్లూరు రాజ్యం మాత్రం పాండ్యుల నుంచి కాకతీయుల వశమయింది. త్రిపురాంతక దేవుడు సామంతుడుగా ఉన్నంత కాలం బాగా ఉండేది. అతని తరువాత వచ్చిన అంబదేవుడే ప్రస్థుతం కయ్యానికి కాలుదువ్వుతున్నాడు. చీటికి మాటికి యుద్ధాలే. రాణీగారు స్వయంగా అశ్వారూఢ అయి యుద్ధ రంగానికి వెళ్తున్నారు."    "మరి అద్దంకి ప్రభువుల ఆస్థానంలో యుద్ధ వాతావరణం ఏ విధంగా ఉంది?" ఎర్రపోతన అడిగాడు.    "ఈ యుద్ధం అద్దంకి నాయంకరానికి దూరంగా జరుగుతున్నట్లుంది. ప్రతాపరుద్ర చక్రవర్తికి రాజ్యం అప్పగించి, రాణీగారు సైన్యాన్ని నడుపుతున్నారు. తొందరలోనే సమాప్తి అయే అవకాశాలు కనిపిస్తున్నాయి."    అప్పటికే ఎక్కువ మాట్లాడేశాననుకుని నరసింహుడు సంభాషణ ముగించి, సూరనాదులకి ఇల్లు చూపించడానికి ముందుకి నడిచాడు. ……… ( ఇంకా వుంది) ……….. (చిత్రాలు- కమలా పర్చా గారి సౌజన్యంతో) .... మంథా భానుమతి

మమకారం

  మమకారం    గోపీచంద్ తెలుగు కథకు శిల్పనడకలు నేర్పిన రచయిత. తండ్రి రామస్వామి చౌదరి నేర్పించిన ప్రశ్నించడం అనే హేతుదాన్ని పునికిపుచ్చుకొని అనేక తాత్వికమైన రచనలు చేశారు. పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా, అసమర్థుని జీవయాత్ర లాంటి నవలలు గోపీచంద్ కు పేరు ప్రఖ్యాతులు తెచ్చాయి. ఇక కథల విషయానికి వస్తే ధర్మవడ్డీ, జనానా వంటివి ఆణిముత్యాలు. అలానే గోపీచంద్ రాసిన తత్వవేత్తలు గ్రంథం మరో ముఖ్యమైన రచన. ఆధునిక సాహిత్యానికి, ప్రపంచానికి కావాల్సిన తాత్విక దోరణులు వీరి రచనల్లో కనిపిస్తాయి. అలానే గోపిచంద్ వారి మమకారం కథ రైతుకు, భూమికి ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది. ప్రస్తుతం ఉన్న తెలుగు రాష్ట్రాల రైతుల మానసిక స్థితికి ఈ కథ అద్దం పడుతుంది.  కథలోని ఇతివృత్తం గురించి చప్పాలంటే- జోగయ్య మామకు పొలం అంటే ప్రాణం. ప్రాణం కన్నా ఎక్కువే. ఆ పొలం గట్టుమీద పుట్టి, పెరిగిన తుమ్మచెట్లు అతనితోనే పుట్టి పెరిగాయి. వాటిలో రెండు చెట్లు నరికి నాగలి చేయించినందుకే బాధపడే మనస్తత్వం జోగయ్యది. పొలం వస్తే గట్టుమీద ఉన్న నేరేడు చెట్టుకింద కూర్చొంటాడు. వాటి నీడనే అన్నం తింటాడు. ఎడ్ల వ్యాపారిగా ఆ వూరు వచ్చిన జోగయ్య మంచితనం గుర్తించి ఆ ఆసామి తన కూతుర్ని ఇచ్చి ఇళ్లరికం ఉంచుకున్నాడు. అప్పుడు మామ పొలం కేవలం అయిదు ఎకరాలే. కానీ జోగయ్య కష్టపడి దాన్ని వందఎకరాలు చేస్తాడు. దాన్ని బట్టే అతనికి పొలం అంటే ఎంత ఇష్టమో తెలుస్తుంది.        అతనికి ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. వాళ్లని చూడకుండా ఉండగలడు కానీ, పొలం మాత్రం చూడకుండా ఉండలేడు. పెద్దకొడుకు నరసయ్య అతనితోపాటు పొలం పనులు చూసుకుంటూ ఉంటాడు. రెండో కొడుకు వేరే ఊళ్లో బట్టలదుకాణం పెట్టుకుంటాడు. కానీ అది నరసయ్యకు ఇష్టం ఉండదు. మూడో కొడుకు ఇంగ్లిషు చదువులు చదువుతుంటాడు. కానీ జోగయ్యకు మాత్రం అందరూ పొలాన్ని వృద్దిచేయాలని కోరుకుంటాడు. ఒకసారి పొలానికి నీళ్లు పెట్టే విషయంలో గొడవ వస్తే నరసయ్య కర్రపట్టుకొని గట్టుమీద నిలబడతాడు. దాంతో అవతలి వాళ్లు భయపడతారు. గట్టు పడగొట్టి పొలానికి నీళ్లు పెడతాడు. పొలం నీళ్లు తాగుుతుంటే, చంటిబిడ్డ పాలుతాగున్నట్లు అనిపిస్తుంది జోగయ్యకు. పెద్ద వయసైన జోగయ్యను కొడుకు ఇంట్లో ఉండు పొలం పనులు నేను చూసుకుంటాను అంటే మాత్రం ఒప్పుకోడు, పొలానికి వెళ్తాడు. దగ్గరుండి పనులు చేయిస్తాడు. అతనికి దానిలో దొరికే తృప్తి అంతా ఇంతా కాదు.          ఒకరోజు భార్యకు బాగుండదు. కొడుకు నువ్వు ఇంట్లో ఉండి అమ్మను చూసుకో, నేను పొలం వెళ్లి దమ్ముకు నీళ్లు పెట్టి వస్తాను అని పొలం వెళ్తాడు. అంతలో పొలానికి నీళ్లు పెట్టనివ్వకుండా అవతివాళ్లు కర్రలు, ఈటెలతో గొడవకు వస్తున్నారని కబురు వస్తుంది. భార్య బాగోగులు కూడా పట్టించుకోకుండా కర్ర తీసుకొని పొలం వెళ్తాడు జోగయ్య. దాంతో అవతలి వాళ్లు తగ్గుతారు. కొడుకు ఇంటికి వస్తాడు. వెంటనే భార్య పరిస్థితి బాగలేదని తెలిసినా పొలం మొత్తం నీళ్లతో తడిసిందాకా ఆగి, తర్వాతే ఇంటికి వెళ్తాడు జోగయ్య. భార్య ఇంటి బాధ్యతలు అన్నీ మాట్లాడుతూ అతని చేతిలోనే ప్రాణం విడుస్తుంది.       తర్వాత జోగయ్య ప్రెసిడెంట్ అయినా పొలం పోవడం మాత్రం మానుకోడు. కూలీలు పనులు చేస్తుంటే చూస్తూ, వారిచేత మంచిగా పనులు చేయిస్తూ ఉంటాడు. మనవడు పొలం వస్తే ఇదంతా మన పొలం అని గర్వంగా చెప్పి పొంగిపోతాడు. అలానే మనవరాలు పొలానికి అన్నం తెస్తుంది. పట్టుపరికిణిలో వచ్చిన ఆ అమ్మాయిని పట్టించుకోకుండా పొలాన్ని చూసుకుంటూ ఉంటాడు. ఆవకాయ, గోంగూరతో అన్నం తింటాడు. వర్షం మొదలయ్యేలా మేఘాలు కమ్ముకుంటాయి. జోగయ్య నేరేడు చెట్టుకింద కూర్చొని తొలి చినుకులను ఆనందిస్తూ ఉంటాడు. వాన పెద్దది కావడంతో కొడుకు, మనవరాలు అతని దగ్గరకు వచ్చి పిలుస్తారు. అతను వర్షానికి తడిసిన మట్టిని గుప్పెట్లోకి తీసుకొని వాసనను పీల్చుకొని ఆనందించినట్లు తెలుస్తుంది. చేతిలోని మట్టి కిందకు జారుతుంది. జోగయ్య మాత్రం ఆ మట్టిలోనే కలిసిపోయినట్లు వాళ్లకుస అర్థం అవుతుంది.     ఈ కథ- రైతు పొలాన్ని కన్నబిడ్డలకన్నా, భార్య కన్నా ఎక్కువ ప్రేమగా చూసుకుంటాడు అన్న విషయాన్ని చెప్తుంది. రైతును పట్టించుకోని నేటి ప్రభుత్వాలకు, రైతును పట్టించుకోని రాజకీయ నాయకులకు ఈ కథ ఓ మేలుకొలుపు లాంటిది. ఇక శిల్పం విషయానికి వస్తే గోపీచంద్ ఒక వరుసలో రైతుకు భూమికి ఉన్న అనుబంధాన్ని పాఠకులకు చెప్పాడు. కథను ఏ నేరేడు చెట్టుకింద ప్రారంభించాడో అక్కడే ముగించాడు. అలానే జోగయ్య, పొలం అనుబంధాన్ని ఆత్మీయంగా చెక్కాడు. కథను చెప్పడంలో ముందు వెనుకలు అంటే ప్లాష్ బ్యాక్ కథనాన్ని తీసుకొన్నాడు. అందుకే నేటి తరం చదవాల్సి కథ మమకారం.                                                            .....డా. ఎ.రవీంద్రబాబు

“చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు" పార్ట్ - 3

“చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు" పార్ట్ - 3 సూరన్న జరీ కండువా తీసుకుని, వక్షస్థలం కప్పుకోబోయాడు. రెండు పెద్ద పెద్ద చిరుగులు.. అప్పుడు దర్శనమిచ్చాయి, తమ స్థితిగతులను సూచిస్తూ. విద్యాభ్యాసం.. వివాహం, వీటి ధ్యాసలో పడి పట్టించుకొనే సమయం లేక.. ఏదీ గమనించలేదు. గట్టిగా నిట్టూర్పు విడిచాడు.    ఇంక విచారించి ఏం లాభం.. ఏదో చెయ్యవలసిందే కానీ!    మూడు తరాల ముందటి మహరాజు మెచ్చి ఇచ్చిన మణులు మడి మాన్యాలు మాయమై పోయాయి..    మడి కట్టుకుని కూర్చుంటే మనుగడ సాగేదెలా? ముందుకు సాగి మేధకి పదును పెట్టాలి మరి.    తనకి తనే ధైర్యం చెప్పుకుని, కష్టపడి కండువా చిరుగులు కనిపించకుండా సర్ది, వీధి వాకిలి తీశాడు.    ఇద్దరు భటులు..    సూరన్న రాక చూసి, శిరస్త్రాణాలు తీసి ప్రక్కనున్నఅరుగు మీదనుంచి నమస్కరించారు.    "స్వామీ! అద్దంకినాయంకరానికి చెందిన పంటవంశపు రెడ్డి ప్రభువులు తమకు వర్తమానం అంపారు. మీ సమాధానం విని తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు." నడుముకి కట్టిన సంచీ తీసి, అందు భద్రపరచిన లేఖని ఇచ్చాడు ముందుకు వచ్చిన ఒక సైనికుడు.    లేఖ అందుకుని, భృకుటి ముడిచి చదవసాగాడు సూరన్న.    "ఎవరదీ.. ఏ పని మీద వచ్చారూ?" ఎరపోతసూరి నెమ్మదిగా వచ్చి స్థంబానికి ఆనుకుని నిలిచి ఆడిగాడు.    "అద్దంకి నుండి వర్తమానం తండ్రీ! రెడ్డి ప్రభువులు నన్ను గుడ్లూరులోని నీలకంఠేశ్వరాలయం చూసుకుంటూ, అక్కడ పాఠశాలని ప్రారంభించమని అడుగుతున్నారు. అచ్చటి ప్రధాన అర్చకునికి వారసులు లేరట. ఆయన నా పేరు సూచించి మరణించారట. మా గురువుగారు, ఆయన మంచి స్నేహితులు. ఏం చేద్దామంటారు?"    "ఆ నీలకంఠుడే పిలుస్తుంటే కాదనడానికి మన మెవరం.. సరైన సమయంలో నేనున్నానని చూపించాడు. పరమేశ్వరుని ఆజ్ఞ.. పైగా రెడ్డి ప్రభువులు సాహిత్యాభిలాషులనీ, సామాన్యులని కూడా అక్షరాసక్తులని చెయ్యాలని కంకణం కట్టుకున్నారనీ విన్నాను. మనం ఆలోచించవలసిన పనే లేదు."    వాకిట మేనాలు సిద్ధంగా ఉన్నాయి.    పేరమ్మ ఇల్లంతా తిరుగుతూ, ద్వారాలు, గవాక్షాలూ, గోడలూ.. అన్నీ తడుముతూ విచారంగా పెరటి తోటలోని వృక్షాలనీ, పక్షుల్నీ పేరు పేరునా పలుకరిస్తోంది. ఇరువది ఐదు వత్సరాలుగా ఆ ఇంటితో నున్న అనుబంధం..    "అమ్మా! మమ్మల్ని చల్లగా కాపాడావు. ఇప్పటి వరకూ ఏనాడూ పస్తు పడుక్కునే స్థితి రాకుండా చూసుకున్నావు. నీకు దూరమవుతున్నా.. నిరంతరం నిన్ను స్మరిస్తూనే ఉంటా తల్లీ.. కరుణ చూపు.." తను నిత్యం పూజించే తులసి కోట దగ్గర నిలిచి కన్నులు మూసుకుంది.    ఎరపోతసూరి తనకి అత్యంత ప్రియమైన మామిడి చెట్టును వదిలి రాలేకపోతున్నాడు. తనకి మూడు సంవత్సరాల వయసప్పుడు.. తాతగారు భీమన మంత్రి రాజుగారి తోటనుండి తెచ్చిన చిన్న మొక్కని పాతారు. చిన్ని చిన్ని చేతులతో దానికి గొప్పులు తవ్వి, నీళ్లు పోసి, తనతో ఆ చెట్టు కూడా పెరుగుతూ ఉంటే.. చిగురాకులు వేసినప్పుడల్లా తామందరూ ఎగిరి గంతులేస్తూ.. ఎన్నెన్ని జ్ఞాపకాలు?    ఆ తరువాత అది మహా వృక్షమైనప్పుడు, ఎన్నో శుభ కార్యాలు జరిగాయి ఆ చెట్టు నీడన. ఆ ఇంటి ఆడపడుచులు ఉయ్యాలలు ఊగుతూ పాడిన పాటలు ఇంకా చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి.    ప్రతీ పండుగకీ మామిడి తోరణాలు, వేసంగుల్లో ఊరగాయలు.. మామిడికాయ పప్పుతో వరి అన్నం, పురిషిడు నెయ్యి వేసుకుని తింటే.. ఆ రుచి ఏ పంచ భక్ష్య పరమాన్నాలకి సాటి?    "ఈ వేప చూశారా.. కొమ్మలు ఊగించి మనకి పూస్నానం చేస్తోంది.." గద్గద కంఠస్వరంతో పేరమ్మ అడుగుతుంటే నోట మాట రాక తలూపారు ఎరపోతసూరి.    "అమ్మా! మనం ఇంక సాగాలి.. సంధ్యా సమయానికి రెండు యోజనములు పైగా వెళ్లాలి. అక్కడే మనకి రేయి గడపడానికి వసతి ఉంది. మీరు ఇచ్చోటు వదిలి రావడం కష్టమే.. కానీ మనకి సమయానికి మంచి అవకాశం కల్పించాడు ఆ పరమేశ్వరుడు. లేకున్న కొద్ది రోజులలో పస్తులు తప్పేవి కాదు కదా. మీరు పెద్దవారు.. అనుభవజ్ఞులు. మీకు చెప్పేటంతటి వాడిని కాను.." సూరన్న రెండు చేతులతో తల్లిదండ్రులిద్దరినీ తోడ్కొని వెళ్లి మేనా ఎక్కించాడు.    తిరు చందనం నామం పెట్టుకొన్న ఎర్రపోతసూరి సాక్షాత్తూ విష్ణుని వలే ఉన్నాడు. ఇంక పేరమ్మ.. ఎర్రని పట్టు చీర కట్టి, అడ్డబాస మెరుస్తుండగా, నల్లపూసలు నిగనిగలాడుతూ పవిత్ర భావాన్ని కలిగిస్తుంటే లక్ష్మీదేవికి ప్రతి వలే ఉంది. నడవలేక నడవలేక నడిచి, మేనా ఎక్కారు ఇరువురూ.    మెత్తని బూరుగు దూది పరుపులమర్చిన మేనా సౌకర్యంగా ఉంది.    ముందు నున్న మేనాలో భార్యని ఎక్కించి.. తాను కొంత దూరం వెనుక నడుస్తానని చెప్పాడు సూరన్న. ఇంట నున్న సామాన్లు ఏవీ తీసుకొని రావద్దనీ, వీరికి సకల సౌకర్యాలూ కలుగ జేశామని చెప్పమన్నారని అన్నారు.. రాజుగారు పంపిన భటులు.    అయినా.. ఇంటిలో సామాన్లు ఏమున్నాయని.. మట్టి కుండలు తప్ప.    సామాన్లు ఒక్కొక్కటీ ఏనాడో తాకట్టుకి కట్టుగా వేంచేశాయి. సంభారాలా.. ఏ పూటకాపూటే..    దారిలో మార్చుకొనుటకు మాత్రం తలకొక రెండు జతలు బట్టలు మూటలు కింద కట్టి, మేనాలో పెట్టుకున్నారు.      "ఒక్కనిముషం.." ఎర్రపోతసూరి మేనా దిగి ఇంటిలోనికి వెళ్లాడు.    సూరన్న అసహనంగా అటూ ఇటూ తచ్చాడుతున్నాడు. మనసులో కూడా పితృదేవుని చిన్న చూపు చూడని మనస్తత్వం.. జన్మతః వచ్చిన సంస్కారం.    "చూశావా సూరీ. అనుకుంటూనే ఉన్నా.. నా పంచాయతనం మరచిపోతానని. ఆ విధంగానే.." భద్రంగా పట్టుబట్టలో చుట్టిన పంచాయతనాన్ని, పూజా గృహంలోనుంచి తీసుకొస్తూ అన్నాడు ఎర్రన్న, వణుకుతున్న కంఠంతో.    తండ్రిని మేనా ఎక్కించి, తాను బోయీలతో నడుస్తానన్నాడు సూరన్న. వేరొకరు మోస్తుంటే తాను కూర్చొనడమా! శక్తి ఉంది కదా.. తన వంతుగా కొద్ది భారము తగ్గించిననూ నయమే కదా!     మేనాలు తీసుకొని వెళ్లే బోయీలు కాక నలువురు భటులు.. ఒక అధికారి ఉన్నారు. త్రోవలో భోజన, విశ్రాంత్యాది కార్యక్రమాలకి కూడా అన్ని ఏర్పాట్లూ చేశామన్నారు.    రాజు గారు తలచుకుంటే దేనికి కొదవ..    అచ్చట గుమికూడిన ఊరివారందరికీ కన్నీటితో వీడ్కోలు చెప్పారు నలువురూ.    వేచి ఉన్న శ్రేష్ఠి గారికి ఇంటి తాళం అప్పజెప్పి, తాము ఋణపడిన వారి పట్టిక ఇచ్చారు సూరన్న, ఎర్రపోత సూరి.    ఊరి పొలిమేర వరకూ వచ్చి సాగనంపారు కరాపర్తి గ్రామ వాస్తవ్యులు.. కన్నుల ప్రవహిస్తున్న నీరు ఆపుకునే ప్రయత్నం చెయ్యలేదు ఎవరూ. మూడు తరాల అనుబంధం.    తమ శరీరాల్లో ఒక భాగాన్ని వదిలి వేస్తున్నట్లు అనిపించింది ఆ కుటుంబీకులకి.    అందరికీ అన్నన్ని బోధలు చేశాడు కానీ సూరన్న కన్నులు చెమరుస్తూనే ఉన్నాయి. వెనుతిరిగి చూసుకుంటూ అడుగులు వేస్తున్నాడు. ప్రతీ చెట్టూ, ప్రతీ పుట్టా వీడ్కోలు చెప్తున్నట్లే ఉంది.    అదిగో ఆ వేప చెట్ల మీదనే కదా మిత్రులతో కోతి కొమ్మచ్చి ఆడింది..    ఈ రావి చెట్టుకిందనే మొదటి గురువు అక్షరాలు దిద్దించింది.    అరే.. తాము ఈత కొట్టిన దిగుడుబావి. ఒక్క చుక్క నీరు లేదు. పిచ్చి మొక్కలు మొలిచి దీనంగా చూస్తోంది. అడుగు ముందుకు పడనని మొరాయిస్తోంది శరీరం.    "అయ్యోరూ! మీరు మేనా ఎక్కండి. మాకంటే అలవాటే. పైగా మేం మజిలీ మజిలీకీ మారుతాం. మీకు ఎదర చేకొనే కార్యాలు చాలా ఉంటయ్యి." బోయీల పెద్ద అనునయించగా సూరన్న భార్య కూర్చున్న మేనా ఎక్కాడు.    భటులంతా అశ్వారూఢులై ముందు ఇరువురు, వెనుక మువ్వురు సాగుతున్నారు. సూరన్న ఎక్కగానే వేగం పెంచి పరుగందుకున్నారు బోయీలు. అప్పుడు.. అర్ధమయింది సూరన్నకి తను చేసిన తప్పు.. తన వలననే వేగం తగ్గింది అంత వరకూ.    పోతమాంబ భర్త చెయ్యి పట్టుకుంది అనునయిస్తూ.. ధైర్యం చెప్తూ.   "నిక్కము నిక్కము, నిక్కము..    ప్రక్కా తోడూ, ఊరూ వాడా..    ఎవరూ, ఏదీ నీ వెంట రాదు.    మధ్య మజిలీలకి మేమున్నామన్నా    చిట్ట చివరి మజిలీకి    ఒంటరి పయనం తప్పదన్నా.    ఒహోం.. ఒహోం హోం ఒహోం ఒహోం..    నాలుగు రోజులున్నా    నలుగురికీ మేలు చెయ్యాలన్నా    పదుగురి మెప్పూ పొందాలన్నా    పదికాలాలు నీ మంచే తలవాలన్నా.    ఒహోం.. ఒహోం హోం ఒహోం ఒహోం.."    బోయీలు పాటందుకున్నారు. తన చేత కాని పరిస్థితులలో వేదాంతం తప్పదు ఎవరికైనా.. సూరన్న విరక్తిగా నవ్వుకున్నాడు.    మధ్యాహ్న కాలం వరకూ అవిశ్రాంతగా సాగి, అప్పుడు.. దట్టంగా చెట్లున్న చోట ఆగారు.    బోయీలు మేనాలు ఆపి కిందికి దింపారు. మేనా దిగిన ఎర్రపోతన దంపతులు, సూరన్న, పొత్తమ్మ కాళ్లు చేతులు సాగదీసుకుని, చెట్ల చాటునకు వెళ్లి అవసరాలు తీర్చుకుని, నీడన చాపలు పరిచి విశ్రాంతిగా కూర్చున్నారు.    అక్కడికి దగ్గరలోనే ఏరు ఉంది. చల్లని నీటితో ముఖము కడుగుకొనగానే సుఖంగా అనిపించింది అందరికీ. మలయమారుతం సేద తీరుస్తోంది.    రౌతులు, గుర్రాలను చెట్లకి కట్టేసి, మాలీషు చెయ్యసాగారు. అశ్వాలకి కడుపు నిండుగా తిండి పెడ్తే సరిపోదు. ఆప్యాయత కూడా కావాలి. గుగ్గిళ్లు పెడుతూ, వాటితో సంభాషణలు జరుపుతుంటే ఆశ్చర్యంగా చూసింది పొత్తమాంబ.    "మానవులకంటే అభిమానం ఎక్కువ తురగాలకి. తమ యజమాని కోసం ప్రాణాలివ్వడానికి కూడా వెనుకాడవు. రౌతుకి దెబ్బ తగిలి పడిపోతే, క్షేమంగా ఇంటికి చేరుస్తాయి. అంతే ఆప్యాయతని ఆశిస్తాయి కూడా.. ఉదాసీనంగా ఉంటే కదలమంటూ మొరాయిస్తాయి" సూరన్న వివరించాడు.    పెద్ద పెద్ద ఆకులు తీసుకుని, అందులో నాలుగు రకాల ఫలాలు పెట్టి ఎర్రపోతన్న, సూరన్నాదులకి అందించారు భటులు. వెదురు బూరాల్లో మంచి తీర్థం ఉండనే ఉంది.    "స్వామీ! మీరు ఫలములు ఆరగించి కొద్ది సేపు విశ్రాంతి తీసుకుంటే మనం సంధ్యవేళకి ఒక పల్లె చేరుతాము. అచ్చట అర్ఘ్యపాద్యాది అనుష్ఠానం అయిన పిదప, మీకు బ్రాహ్మణ సత్రంలో భోజన వసతి చేయించాము."    పేరమ్మ, తనూ కోడలూ నాలుగు రోజులుగా కూర్చుని చేసిన భక్ష్యాలు, అరిసెలు, వేయించిన అటుకులు, వేపుడు బియ్యం.. కొద్ది కొద్దిగా అందరికీ పెట్టింది. చుట్టు ప్రక్కల ఉన్న ఆడవాళ్ళు కూడా వచ్చి సహాయం చేశారు.. పిండి దంచడంలో, జల్లెడ పట్టడంలో.. అరిసెలు వత్తడంలో.    అత్తా, కోడలు వాటన్నింటినీ ప్రత్యేకంగా బాదం ఆకుల్లో, అరటి ఆకుల్లో భద్రంగా చుట్టి.. పరిశుభ్రమైన వస్త్రాలతో మూటలు కట్టారు. అవి వారి వెంటే ఉంటాయి.    "అమ్మగారూ! ఈ ఫలారాలు ఇకనుంచీ మాకు పెట్టద్దమ్మా! మేం తెచ్చుకున్నవే ఉన్నాయి. అవి మీరు తినరు కదా.. రెండువారాలు పడుతుంది మనం మన ఊరు చేరే సరికి. అప్పటి వరకూ జాగరూకతతో వాడుకోవాలి కదా!" అధికారి, నరసింహ సేనాని అన్నాడు.    పేరమ్మ ప్రసన్నంగా చూసింది.    "ఈ పూటకి తినండి బాబూ.. కష్టపడుతున్నారు."    "మాకు ఈ పయనం నల్లేరు మీది నడకేనమ్మా! గంగా తీరం వరకూ తెలియని త్రోవల వెంట వెళ్లిన వాళ్లం. దారి వెంట పురుగు, పుట్ర.. దొంగలు, క్రూర జంతువులు.. ఒకటేమిటి.. ఎన్నో అడ్డంకులు. అన్నింటినీ అధిగమించి సాగవలసిందే." నరసింహుడు వినమ్రంగా అన్నాడు.    పోతమ్మ మాత్రం కొంగు భుజాల చుట్టూ కప్పుకుని, తల దించుకుని వినయంగా కూర్చునుండిపోయింది. మామగారు, భర్త ఎదురుగా ఉండగా ఏ విధంగా భక్షించాలి.. సంప్రదాయం కాదు కదా!    "అమ్మా! ఈ కానలో కోనలో.. ఏ సంకోచం వలదు. మేం నీ తల్లిదండ్రులం. తీసుకో తల్లీ.." ఎరపోతన్న అభిమానంగా చూస్తూ అన్నాడు.    ఆప్యాయతకీ, ప్రేమాభిమానాలకీ ప్రతీకలైనట్లున్న ఆకుటుంబాన్ని ముచ్చటగా చూశారు అచ్చటనున్న బోయీలు, భటులూ.    రెండురోజులు పయనం తరువాత కృష్ణా తీరం చేరారు.    ఇంద్రకీలాద్రి పర్వతం..    అర్జనుడు పరమేశ్వరుని మెప్పించి పాశుపతాస్త్రాన్ని సాధించిన ప్రదేశం. విజయుని పేరుమీదుగా విజయవాడ అనే పేరును సార్ధకం చేసుకొన్న పట్టణం. అచ్చట ఒకరోజు విశ్రాంతి అనీ.. బోయీలు మారుతారనీ నరసింహుడు చెప్పాడు.    శివభక్తుడైన సూరన్న సంతోషానికి అవధిలేదు.    కృష్ణవేణీ నదిలో స్నానమాచరించి, ఇంద్రకీలాద్రి మీద వెలసిన కనకదుర్గమ్మ దర్శనం చేసుకుంటే కామితములన్నీ నెరవేరును కదా! మల్లికార్జునస్వామిని సేవిస్తే మరి ఎదురేముండదు కదా! ఎటువంటి అవకాశం దొరికింది.. అంతా ఆ ముక్కంటి దయ. తాము తీర్థ యాత్రలు చెయ్యడానికే ఈ విధంగా జరిగిందేమో!    ప్రభువులు ఏర్పాటు చేసిన విడిది ఇల్లు ఒక బ్రాహ్మణ సత్రము. అచ్చట నియోగింపడిన బ్రాహ్మణుడు ఆదరంతో పలుకరించి వసతి చూపించాడు.    ఒకప్పుడు ఆ ప్రదేశంలో రాక్షసుల బాధ అధికంగా ఉండేదట.. అప్పుడు ఇంద్రకీలుడనే ఋషి తపస్సు చేసి కనకదుర్గమ్మని మెప్పించి, తన శిరము మీద వసించి ప్రజలని రక్షించి కాపాడమని అడిగాడుట. అదే ఇంద్రకీలాద్రి పర్వతం అని ఒక పురాణ గాధ తెలుపుతుంది.    భక్తుని కోరిక మన్నించి దుర్గమ్మతల్లి అక్కడ నివాసం ఏర్పరచుకుందని ప్రజల నమ్మకం.    సూరన్న తెలతెల వారుతుండగా అందరినీ లేపేశాడు. కృష్ణానదిలో స్నానం, అమ్మవారి దర్శనం, మల్లికార్జున స్వామికి అభిషేకం.. పిదప పరిసరాలన్నింటిని పరికించి చూస్తూ, మనసారా ఆనందిస్తూ కొండ దిగుతున్నారు.    ఎన్నెన్నో వృక్షాలు.. వాటినల్లుకుని రంగు రంగుల పువ్వులతో నిండిన  తీవెలు   ఓహ్.. ఏమి అందాలు                             .    మల్లెలు మొల్లలు మామిళ్లనల్లి హొయలుపోగా    అల్లన మెల్లన వాయు వీచోపుల్ హాయి గొలుపగా    ఘల్లు ఘల్లున పోతమాంబ అందెలు రంజిల్లుతూ మ్రోగగా    మెల్లగ చనిరి మున్ముందుకు ఎర్రపోతసూరనాదులు. (చిత్రాలు- కమలా పర్చా గారి సౌజన్యంతో) .... మంథా భానుమతి

అక్క మహాదేవి

    ఈ కాలం లో రచయిత్రులని పరిచయం చెయ్యటం కోసం మొదటగా కొన్ని శతాబ్దాలు వెనక్కి వెళ్ళి రచయిత్రిని ఎన్నుకోవటానికి కారణం ఏంటంటే, కాల మాన పరిస్తితుల ప్రభావాలు ఆడవారు రచయిత్రులుగా ఎదగడానికి ఎలా దోహద పడ్డాయి ఎలా అడ్డుపడ్డాయి, ఎలా వారి రచనలను ప్రభావితం చేసాయి, వారి అలోచనా సరళి ఎలా మార్పు చెందుతూ వచ్చింది, ఎటువంటి క్లిష్ట పరిస్తితులని ఎదుర్కొంటూ వాళ్ళు వారి రచనలు కొనసాగించి చరిత్రలో వారి పేజీలు రాసుకొన్నారో తెలుసు కోవటానికి మాత్రమే. అక్క మహా దేవి విషయంలో మాత్రం ఈ విషయాల్ని తెలుసుకుని తీరవలసిందే.   అక్క మహాదేవి (1130-1160) అక్క అన్నది మనం తెలుగులో మాత అన్నట్లు, కన్నడిగులు ప్రేమగా పిలుచుకొన్న తీరు. ఆమె అసలు పేరు మహా దేవి, అపురూప సౌందర్యవతి, అద్భుతమైన కేశ సౌందర్యం. ఈమె గురించి తెలుసుకునే ముందు, ఈమె పెరుగుతున్నపుడున్న దేశ కాల పరిస్తితులను గురించి, ఆ సమయంలో వచ్చిన విప్లవాత్మక మార్పులను గురించి తెలుసుకుందాము. ఎందుకంటే, అప్పటి పరిస్తితులు ఆమెనెంత ప్రభావితం చేసాయో, ఆమె కూడా వాటిని అంతే ప్రభావితం చేసింది కనక. బసవేస్వర (1134-1196) ఒక గొప్ప వేదాంతి, సంఘ సంస్కర్త. పరమ శివుడు ఒక్కడే సర్వ సృష్టి స్తితి లయ కారకుడైన, నిరాకారుడైన దేముడిగా గుర్తించే శైవ (లింగాయతిస్మ్) మతంగానే ప్రచారం చేసినవాడు. లింగ ధారణ వీరికి ముఖ్యం. లింగాన్ని ధరించి శివ పూజలు చేసే వారే శరణులు. వీరు రాసినవే వచనాలు. ఈ వచనాలకి చందస్సు, వ్యాకరణం ఏమీ అక్కర్లేదు, కేవలం భావ ప్రాధాన్యమైన ఫ్రీ వర్స్. అయితే ఈ లింగాయతిజం హిందూయిజం లోని సనాతన ధర్మాలకి వ్యతిరేకంగా, వేదాలను పూర్తిగా అంగీకరించకుండా, అలాగే వర్ణ విభజన, కుల వ్యవస్థ, లింగ వివక్ష లేకుండా, అంటరానితనాన్ని కూడా వ్యతిరేకిస్తూ, మూఢ నమ్మకాలు లేని, సమానావకాశాలు గల ప్రజాస్వామ్య వ్యవస్థని, అందరికీ విద్యనీ, స్త్రీ స్వేఛ్చనీ ముఖ్య ప్రాతిపదికలుగా పెద్ద సంఖ్యలో ప్రజలందరినీ ఆకర్షించింది. బసవని మొట్ట మొదటి భారత దేశ ప్రజాస్వామ్య వాదిగా చెప్పొచ్చట. ఈయన ప్రతిపాదించిన ప్రజాస్వామ్యం పనిచేసేది అనుభవ మంటప, మన ప్రస్తుత పార్లమెంట్ లాగే ఉంటుందట. కొన్ని గుళ్ళలో వీటి చిత్రాలను కూడ చెక్కారట. బుడ్ధుడిలాగా బసవ కూడా ప్రజలకు సమస్యలను అహింసాయుతంగా పరిష్కరించుకుని సామరస్యంతో, ఆనందంగా ఎలా గడపాలో చెప్పేవాడట. ఈయన శ్రీకారం చుట్టినదే కన్నడ భాషలో వచన సాహిత్య విప్లవం. అక్క మహాదేవి శివమొగ్గ జిల్లా కర్ణాటక లో సుమతి, నిర్మలసెట్టి దంపతులకు పుట్టింది. తల్లితండ్రులు శివభక్తులు. ఈమె, తన తోటి పిల్లలు బొమ్మలతో ఆడుకుంటే, తను చెన్నమల్లికార్జునుడి బొమ్మతో ఆడుకునేదట. నిర్బంధిత వాతావరణంలో, ఆడపిల్లకి ఉండే ఇంటి బాధ్యతలు ఆమెకున్న శివ భక్తికి అడ్డుగా తోచాయి. ఇంట్లో చేసే సంప్రదాయ శివార్చనలు ఆమెకు తృప్తి నివ్వలేదు. ముక్తి, మోక్ష మార్గాల్లో పయనించడానికి ఆడవారి మీదున్న ఆంక్షలు ఆమెకు నచ్చలేదు. మొండితనంతో ఆ రోజుల్లో ఆమె గురుకులంలో గురువు దగ్గర విద్యనభ్యసించింది. ఇది ఆమె సాధించిన మొదటి గొప్ప విజయం ఆ రోజుల్లో ఆడవారున్న పరిస్తితుల దృష్ట్యా. చిన్నతనంలోనే జరిగిన వివాహం, రాజయిన భర్తనీ, రాజ సౌధమయిన భర్త గృహాన్నీ, ఇతర భోగాలు వదిలి, సన్యాసిని గా మారాలన్న తన చిన్ననాటి కోరికతో ఇల్లువదిలింది. సాధారణంగా అయితే కట్టు బట్టలతో ఇల్లు వదిలారంటాము కదా. ఈమె కట్టు బట్టలు కూడా లేకుండా, ఆ రోజుల్లో, ఇల్లు వదిలింది. దీని వల్ల ఆమె తరవాతి రోజుల్లో చాలానే కష్టాలు ఎదుర్కొంది కానీ తన పంతం విడువలేదు. అతి పొడవైన ఆమె శిరోజాలే ఆమె శరీరాన్ని కప్పి ఉంచేవట. ఈమెను సన్యాసినిగా ఒప్పుకోవడం, చెన్న బసవనికి, అల్లమప్రభు అనే శైవ సన్యాసులకు మరి పెద్ద అభ్యంతరమే. వారికి ఈమె సమాధానాలు చెప్పిన తీరు, ఒప్పుకోక తప్పని పరిస్తితిని కల్పించడమే కాకుండా, ఆమెను ప్రశంసల వర్షంలో ముంచెత్తాయంటే, అది కూడా, మగ సన్యాసులనుండి అంటే, ఆమె స్థాయి ఏంటో మనం ఊహించుకోవచ్చు. ఒక స్త్రీ తన జీవితాన్ని భక్తి మార్గంలో జీవించదల్చుకుంటే అందుకామెకు సర్వ హక్కులూ ఉన్నాయని, ఆపడం ఎవరి తరమూ కాదని ఆమె నిరూపించింది. తన మనసున నిండి ఉన్న దైవం తప్పించి, ఎటువంటి సంసారిక బంధమూ లేకుండా ఈ ప్రపంచంలో బతకటం ఒక స్త్రీకి సాధ్యమన్న విషయం నిరూపించడానికి ఆమె చాలానే కష్టాలకోర్చింది. తన చిన్ని ముప్పై ఏళ్ళ జీవితాన్ని పణంగా పెట్టింది. ఆమె స్థిరపడిన కల్యాన్ (ఇప్పటి బీదరు) ప్రజలు తమను తాము పెళ్ళికూతురి తరపు బంధువులుగా అభివర్ణించుకుని ఆమెను శ్రీశైలం చెన్నమల్లికార్జున స్వామి వద్దకి సాగనంపారని ప్రతీతి. ఈమె, ఈమె తోటి సన్యాసులు, మిస్టిక్స్ రాసిన వచనాలను భద్రపరచాల్సిన అవసరం గుర్తించిన బసవ, వచనాల చివరి పంక్తిలో రాసిన వారి పేరు వచ్చేట్టుగా చేసారట. ఇంగ్లీష్ లోకి అనువదించిన ఈమె రాసిన కొన్ని వచనాలను చూద్దాం. (1) For hunger, there is the village rice in the begging bowl, For thirst, there are tanks and streams and wells For sleep temple ruins do well For the company of the soul I have you, Chenna Mallikarjuna ఆకలికి, ఊరివారు ధర్మం చేసేందుకొక బిక్షా పాత్ర ఉంది దాహానికి, గుంటలూ, సెలఏళ్ళూ, బావులూ ఉన్నాయి విశ్రాంతికి, ఆలయ శిధిలాలే చాలు నా ఆత్మ సంగతికి, నాకు నీవున్నావు చెన్న మల్లికార్జునా! (2) “I am without pride of caste Without pride of resolute will am I. I have cast away the arrogance of riches, Of the pride of learning also I have none. No manners of pride dare some near me, For Thou hast blest me with Thy Grace.” నాకు కుల గర్వము లేదు నాకు పొగరు లేని ధృఢనిశ్చయముంది నేను ధనహంకారాన్ని విడిచివేసాను విద్య వల్ల వచ్చే గీర్వాణమూ నాకు లేదు మిటారపు ఛాయలు కూడా నా వద్దకు రావు ఎందువలనంటే, నీ కరుణతో నన్ను దీవించావు (3) The bounteous will not brim over, you see. The trusting will not doubt, you see. The loving will not waver, you see. The well-understood is not forgotten, you see. Chennamallikaarjunayya The sharana whom you accept has boundless bliss, ayya. నిండు కుండ ఎన్నడూ తొణకనట్లు నమ్మినవారికెప్పుడూ అనుమానం కలగనట్లు ప్రేమించినవరెప్పుడూ తొట్రు పడనట్లు సంపూర్ణమైన జ్ఞానమెప్పుడూ మరువబడనట్లు చెన్న మల్లికార్జునయ్యా నీవు గైకొన్న శరణుల కెన్నడూ అవధిలేని ఆత్మానందమే కదయ్యా! (4) Without union, there is no fire. Without union, there is no sprouting. Without union, there is no flower. Without union, there is no bliss. Chennamallikaarjunayya, in union with those greats who have your spiritual experience I became supremely happy. కూడక, అగ్ని పుట్టనట్టు కూడక, విత్తు మొలకెత్తనట్టు కూడక, పూవు పుష్పించనట్టు కూడక, తన్మయత్వము లేనట్టు చెన్న మల్లికార్జునయ్యా, కూడి, ఆధ్యాత్మికానుభవ జ్ఞానులతో నేనమితానంది నైతిని. (5) Maya has haunted the body as shadow Maya has haunted the life-breath as mind Maya has haunted the mind as memory Maya has haunted the memory as awareness Maya has haunted awareness as forgetting Maya has haunted the milling crowds of this world with a beating stick. No one can overcome the Maya you have set O Chennamallikaarjuna. మాయ వెంటాడుతుంది శరీరాన్ని ఒక ఛాయలా మాయ వెంటాడుతుంది ఊపిరిని ఒక మనసులా మాయ వెంటాడుతుంది మనసుని ఒక స్మృతిలా మాయ వెంటాడుతుంది స్మృతిని ఒక స్పృహలా మాయ వెంటాడుతుంది స్పృహని ఒక మరపులా మాయ వెంటాడుతుంది ఈ ఆడేటి జనాన్ని శిక్షించే ఒక బెత్తంలా ఓ చెన్నమల్లికార్జునా! How can you be modest? People, male and female, blush when a cloth covering their shame comes loose When the lord of lives lives drowned without a face in the world, how can you be modest? When all the world is the eye of the lord, onlooking everywhere, what can you cover and conceal? ఈ వచనంలో అక్కమ్మ అంటుంది, ఒంటిమీద గుడ్డ కొద్దిగా జరిగినప్పుడు మగా, ఆడా లేకుండా సిగ్గు పడతారే, ఎవరి నుంచి కాపాడుకుంటారు మీ మానాన్ని, ప్రపంచంలో మునిగి ఉండి, తనకంటూ ఒక ముఖం లేకుండా, అసలు ప్రపంచమంతా తన కన్నుగా అంతటా చూసే ఆ ప్రభువు దగ్గర దేన్ని కప్పగలరు? ఏమి దాచగలరు? అని. చిన్నతనం నుంచి ఆమె కున్న ఈ పిచ్చి భక్తిని, భక్తిగా కన్నా, పిచ్చి గానే వర్ణించిన కధనాలూ ఉన్నాయి కానీ, ఆమె వచనాలు చదివినపుడు మాత్రం అటువంటి భావన కలగదు. ముప్పై ఏళ్ళ వయసులో పరమ శివుడిలో ఐక్యమైన ఈమెకు అంత చిన్న వయసులోనే ఎంత వేదాంతం ఎంత ఆధ్యాత్మిక జ్ఞానం అని నాకే కాదు తప్పకుండా మీకందరికీ అనిపించి ఉండచ్చని అనుకుంటున్నాను. ఆమె అప్పటి ప్రజల జీవనాన్ని ఎంత ప్రభావితం చెయ్యక పోతే ఆమె ఇంత కాలం ప్రజల మనసుల్లో ఉండి పోతుంది. ఎంతో ఉన్నతమైన ఆశయాలతో మొదలైన లింగాయతిసం వల్ల ఆమె, ఆమె వల్ల లింగాయతిసం బలపడ్డాయనడం అతిశయోక్తి కాదు. ఇన్ని శతాబ్దాల వెనక్కి వెళ్ళిన ఫలితం దక్కిందని నాకనిపించింది.   - శారద శివపురపు

హరిశ్చంద్రుడు

  హరిశ్చంద్రుడు - శారద   శారదగా అందరికి పరిచయమైన కథా రచయిత అసలు పేరు ఎస్. నటరాజన్. పుట్టుకతో తమిళుడు. కాని బతుకు తెరువుకోసం తెనాలి వచ్చాడు. ఒక్కో అక్షరాన్ని కూడబలుక్కొని తెలుగు చదువుకున్నాడు, నేర్చుకున్నాడు. తన అనుభవాల ద్వారా అద్భుతమైన కథలు, నవలలు రాశాడు. వీరి రచనలు పలు పోటీలలో బహుమతులు కూడా పొందాయి. అనారోగ్యం, దారిద్ర్యం అయినా లెక్కచేయని సాహిత్య రచన ఆయన గొప్పతనానికి నిదర్శనం. అందుకే నేమో జీవితాన్ని అర్ధాంతరంగా 31వ ఏటనే ముగించి తన రచనలను మనకు మిగిల్చి వెళ్ళిపోయాడు శారదగా పరిచయమైన నటరాజన్. మంచీచెడు, ఏది సత్యం, అపస్వరాలు వంటి నవలలు, వందకు పైగా కథలు వీరి సాహితీ సంపద. వీటిలో హరిశ్చంద్రుడు కథ బతుకులోతుల్ని, పేదరికంలోని ఘాటను రియాల్టీగా మనకు చూపుతుంది.      సినిమాకు వెళ్లాలని హాలు దగ్గరకు వచ్చిన నాగభూషణం ఆ విషయాన్ని మర్చిపోయి స్త్రీల గేటు వైపు చూస్తూ నిలబడిపోతాడు. తెల్లటి లాల్చీలో చంద్రుడిలా మెరిసిపోతూ ఉంటాడు. సినిమా ప్రారంభం అవుతుంది. నాగభూషణం చూపు బుగ్గమీద గాలికి ఊగే ఉంగరాలు జుట్టు పడుతున్న అమ్మాయిపై పడుతుంది. చామనఛాయలో అందంగా కనిపిస్తుంది. ఆమె చూపును, చిరునవ్వుతో పలకరిస్తాడు. ఇద్దరి చూపులు కలుస్తాయి. కన్నుగీటుతాడు. ఆమె సిగ్గు నటిస్తుంది. ఇద్దరూ సినిమాహాలు నుంచి బయటకు వస్తూ మట్లాడుకుంటారు. నాగభూషణం "సినిమాకు వెళ్లాలంటే టిక్కటు ఇప్పిస్తాను" అంటాడు. అందుకు ఆమె "నా భర్త పక్కన ఉన్న ఆసుపత్రికి మందుకోసం వచ్చాడు, తను వస్తానంటే సినిమాకు వచ్చాను. తను రాలేదు. నేను ఇంటికి వెళ్తున్నాను" అని బదులు చెప్తుంది. "మా ఇల్లు కూడా అటే..." అని చెప్పి నాగభూషణం ఆమెతో పాటు నడక సాగిస్తాడు. వారి మాటల్లో డిసెంబర్ నెల చలి, చంద్రుడు కురిపిస్తున్న మత్తు కనిపిస్తుంది.         కొంతదూరం వెళ్లాక నాగభూషణం ఓ పూరిగుడిసె ముందు ఆగి "మా ఇంట్లోకి వచ్చిపోండి" అని ఆహ్వానిస్తాడు. ఆమె కూడా వెళ్తుంది. లోపల చిరిచాప, కొన్ని పత్రికలు, ల్యాంప్ మాత్రమే ఉంటాయి. ఆమె "ఇదా మీఇల్లు" అని అడిగితే... "ఆ పక్కనున్న బిల్డింగ్ కూడా మాదె" అని చెప్తాడు. చలి వస్తుందని తడికె వేస్తాడు నాగభూషణం. ఆమె చాపమీద పడుకొని శరీరాన్ని మత్తుగా విరుస్తుంది. నాగభూషణం జేబులోంచి బీడి తీసి వెలిగించి, వెలుగుతున్న ల్యాంపును ఆపేస్తాడు. ఆమె భయపడినట్లు నటిస్తే- "ఫర్వాలేదు, వెన్నెల పడుతుందిగా" అని తడికె సందుల్లోంచి పడుతున్న తెల్లటి చారికలను చూపిస్తాడు. ఆమె తన పేరు "చంద్రమతి" అని చెప్తుంది. పడుకున్న తీరును బట్టి ఆమె వయసును లెక్కకట్టడం నాగభూషణం వల్ల కాదు. కానీ ఆ వెన్నెల వెలుగులో తమకంగా ఆమె మీదకు వరిగుతాడు. ఆమె మాత్రం మెల్లిగా అతని జేబును వెతుకుతుంది. బీడీలు తగులుతాయి. ఇంకేమీ ఉండవు... అంతే.. "ఛీ .. దూరంగా జరుగు" అని పడుకున్న చంద్రమతి అతని పట్టును విడిపించుకొని పైకి లేస్తుంది.        నాగభూషణం "ఎందుకు నా జేబు వెతికావు" అంటే... "నీకు తెలీదా.. డబ్బులకోసం" అని చెప్తుంది. ఆ మాట విని నాగభూషణం పెద్దగా నవ్వుతాడు. చంద్రమతి అమాయకంగా "ఎందుకు నవ్వుతున్నావ" ని అడుగుతుంది. "డబ్బులకోసం ఆరు రోజుల నుంచి తిరిగి తిరిగి, అందరిని అడిగి.. విసిగి ఉన్నాను. నువ్వు డబ్బులు అంటే నవ్వు వచ్చింది" అని ఉద్వేగంతో, హృదయాంతరాళంలోంచి చెప్పాడు. "అంటే ఈ తెల్లని బట్టలు, ఉంగరం అంతా... నువ్వూ నా కన్నా దరిద్రుడివి అన్నమాట.. బిల్డింగ్ నీదే అన్నావు..." అని అడుగుతుంది. "నువ్వు సంసార స్త్రీవి అన్నావు" కదా అని అడుగుతాడు నాగభూషణం. ఇద్దరి మధ్య వాదన జరిగుతుంది. దొందూదొందే అని తేల్చుకుంటారు. "నేను జమిందారు అని నువ్వు అనుకున్నావు. నువ్వు సంసారస్త్రీ అని నేను అనుకున్నాను.." అని నిర్ణయానికి వస్తారు. తడిక తీసుకొని చంద్రమతి బయటకు వెళ్తూ "నీ పేరంటి" అని నాగభూషణాన్ని అడుగుతుంది. "హరిశ్చంద్రుడు" అని చెప్తాడు. "మళ్లీ అబద్ధమా.. నీ బతుకు చెడ" అని శాపం పెడుతూ వెళ్తుంది ఆమె. "నీ పేరు చంద్రమతి అయితే, నా పేరు హరిచంద్రుడు" అని నాగభూషణం నవ్వుకుంటాడు.           చీకట్లో ఆమె ఎటో పోతే, నాగభూషణం మరో బజారుకు వెళ్తాడు... దాంతో కథ ముగుస్తుంది.          కథను హృద్యంగా చెప్పడం శారదకే తెలుసు అని చెప్పడానికి ఈ కథ అక్షరాలా నిదర్శనం. ప్రారంభం నుంచి చివరి వరకు ఎక్కడా పాఠకుడి మనసు పక్కకు మల్లదు. కేవలం ఒక్క సన్నివేశాన్ని కథగా మలచిన తీరు అద్భుతం. ఒకరు పేదరికాన్ని బరించే వ్యక్తి, మరొకరు ఆ పేదరికాన్ని బరించలేక శరీరాన్ని అమ్ముకునే స్త్రీ. పైగా కథ ప్రారంభం నుంచి వారివారి అవసరాలకోసం ఇద్దరి మధ్య నడుస్తున్న మాటల తీరులో నటన. ఒకరి గురించి ఒకరు నిజమని నమ్మేలా నటన. నమ్మించడానికి నట. అవసరాలకోసం నటన. నిజ జీవితాలను నగ్నంగా చిత్రించారు రచయిత. మనిషి మనసుల్ని, వాటి లోతుల్ని పురిచుట్టి మెలిబెట్టే చిన్న సంఘటనను, మనిషి దారిద్ర్యాన్ని అద్భుతంగా చెప్పారు. ఇలాంటి కథను రచించడం కత్తిమీద సాము. కానీ శారదగారు ఎక్కడా పాఠకునికి ఇబ్బంది కలగకుండా అరటిపండు వలిచి ఇచ్చినట్లు చెప్పారు. ఇదే కథలోని శిల్పం రహస్యం. దీనిని పట్టుకొని చెప్పడం కష్టసాధ్యమే.       ఇలాంటి కథలను ఆరుద్ర చెప్పినట్లు ఎవరికి వారే చదివాలి. బాధపడాలి. ఆ బాధలోంచి కోలుకొని తేరుకోవాలి. తేరుకొని నిజాన్ని దర్శించాలి. ఆ నిజంలోంచి జీవితాలను మార్చుకోవాలి. సమాజ మార్పుకోసం ఏదైనా చెయ్యాలి. అప్పుడే ఇలాంటి కథలకు న్యాయం చేకురుతుంది. - డా. ఎ.రవీంద్రబాబు

నిశ్శబ్ద సాయం...

                         నిశ్శబ్ద సాయం...   సమయం రాత్రి 11 గంటలు: సిటీలో అదో పెద్దహాస్పిటల్. అందులో  ICU వార్డు కి ఆనుకొని ఉన్న హాలులో నీరజ, సునీత కూర్చొని ఉన్నారు. వాళ్ళదగ్గరకు ఒక నర్స్ వచ్చి “మీరు తీసుకొచ్చిన పేషెంట్ కి ట్రీట్ మెంట్ మొదలైంది” అని చెప్పి వెళ్ళిపోయింది.  ఈ లోపల నీరజ భర్త హాస్పిటల్ కి వచ్చారు. అతనికి నీరజ అన్ని విషయాలు వివరించింది.  “ప్రాణభయం లేకపోవచ్చు అన్నాడు,డాక్టర్”  “అంటే ష్యూర్ గా చెప్పలేదా”  “లేదు, కానీ చిన్న వయసు కాబట్టి తట్టుకునే శక్తి ఉంది అన్నారు” “అసలు ప్రోబ్ల్రం ఏంటి,”  నీరజ భర్త అడిగాడు  “అదే చెప్పాను ఇందాక,కడుపునిండాతిండి లేక ఆర్చుకుపోయడుట” ఇద్దరూ ఒకసారి అన్నారు. “ok! పదండి, 11గంటలు అయింది టైం, మనం చెయ్యాల్సినది మనం చేసేసాం. ఆ పైన దేవుడున్నాడు. తప్పకుండా ఆ అబ్బాయి కోలుకుంటాడు.”   “అవును! తప్పకుండా ఆ అబ్బాయికి నయం అవ్వాలని నేను ఆంజనేయస్వామికి మొక్కుకున్నాను” అంది నీరజ.   “నేను డిట్టో! నీరజా! పాపం ఇంత చిన్న పిల్ల వాడు,తల్లి కోసం,చెల్లెళ్ల కోసం కష్టపడటం నిజంగా మెచ్చుకోవాలి. అందుకే నేను మొక్కు కొన్నాను”   “అవును వాళ్ళ ఫ్యామిలి మెంబెర్స్  ఏరి ఎవరూ కనిపించటంలేదు” నీరజ భర్త అడిగాడు.   “ఈ అబ్బాయి పక్కింట్లోఉండే కరీం, వాళ్ళ ఫ్యామిలీని తీసుకురావడానికి వెళ్లాడు” “ఓకే !మిగతా వివరాలు వాళ్ళని  అడిగి తెలుసుకుంటారులే” అని తమలో తాము చెప్పుకుంటూ ఆ ముగ్గురు కలిసి వెళ్ళిపోయారు. పైన జరిగిన సంభాషణల తాలూకు పూర్వాపరాలు తెలియాలంటే కొన్ని గంటలు వెనక్కి వెళ్ళాలి, అప్పుడు సమయం సాయంత్రం 7గంటలు: ఎప్పటి లాగే ఆ రోజు సాయంకాలం బషీర్ బాగ్ లోని పరిశ్రమ భవన్ దగ్గర కంపెనీ బస్సు దిగారు నీరజ, సునీతా. మర్నాడు వాళ్ళ కంపెనీ కి ఫారెన్ డెలిగేట్స్  వస్తుండటం తో   చక్కటి  హేండీ క్రాప్ట్స్ వస్తువులను  కంపెనీ తరఫున బహుమతి గా ఇద్దామని వాళ్ళ బాస్ చెప్పడంతో, అవి కొనడానికి గన్ ఫౌండరీ దగ్గర ఉన్న లేపాక్షి  కి  వెళుతున్నారు.  ఇద్దరూ హైదరాబాద్ శివార్లలో ఉన్న ఓ మల్టినేషనల్ కంపెనీ లో  హెచ్ ర్(HR) డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నారు.సునీత నీరజ కూడా పక్క పక్కనే ఉంటారు.   లేపాక్షి నుండి అన్ని సామానులు తీసుకోని,బయటకు వచ్చి ఆటోకోసం నిలుచున్నారు. ఒక్క ఆటో కూడా  వీళ్ళు వెళ్ళే చోటుకి రమ్మంటే రావటం లేదు. అది వర్షాకాలం కూడా కావటంతో పెద్దగా ఉరుములు మెరుపులతో వానకూడా మొదలయింది. సమయం రాత్రి 9 గంటలు. ఇంతలో అక్కడున్న సెక్యురిటిగార్డ్ వీళ్ళు ఆటో కోసం నిలబడటం చూసి,  ఒక ఆటో ని పిలిచి ఎక్కించాడు. ఆటోవచ్చింది. చూడటానికి చిన్న గానే  ఉన్నాడు. పరవాలేదు అనుకొని,ఇద్దరు ఎక్కి  ఎక్కడికి వెళ్ళాలోచెప్పారు. మీటరు వేశాడా లేదా చూసుకున్నారు. నీరజ, సునీతా ఇద్దరు కబుర్లు చెప్పుకుంటున్నారు కొంచెం దూరం వెళ్ళాక ఆటో నెమ్మదిగా వెళ్ళడం మొదలెట్టింది. అంతే కాకుండా అతను సీట్లో  అసహనంగా అటు ఇటూ కదులుతూ డ్రైవ్ చేస్తున్నాడు. కబుర్ల  మధ్యలో  సునీత అది చూసి  నీరజ కు చెప్పింది.  నీరజ వెంటనే “ఏయి ఆటో అబ్బాయి  ఏంటీ అలా డ్రైవ్ చేస్తున్నావు?” అని గట్టిగా అడిగింది  “ఏం లేదమ్మా,కడుపులో వికారంగా ఉండి కొంచెం తల తిరుగుతోంది”అన్నాడు.అయితే వీళ్ళకి,అనుమానం వచ్చింది, తాగినడుపుతున్నాడని,ఇద్దరు గుసగుసగా అనుకున్నారు. కాలేజీ అబ్బాయి లా ఉన్నాడు,అప్పుడే తాగుడుకి అలవాటు పడ్డాడు ఛీ,ఛీ! అనుకున్నారు.   ఇంతలో సడెన్ గా ఒక చోట ఆపి వాంతి చేసుకున్నాడు.  అది చూసే సరికి వాళ్ళు ఇది ఆ బాపతే అని నిర్ధారణకు వచ్చి , ఇక ఇందులో వద్దు  వేరే ఆటో మాట్లాడుకుందామని  కిందకు దిగబోతున్నారు. అంతలో, ఆ అబ్బాయి వీళ్ళు దిగడం చూసి “మేడం దిగకండి,నేను జాగ్రత్తగా తీసుకోని వెళతాను, మీరిచ్చే పైసలతో  మా అమ్మకి మందులు కొని  తీసుకెళ్లాలి” అని దీనంగా అన్నాడు.  అది విని కొంచెం వెనక్కు తగ్గారు. అప్పుడు దగ్గరగా అతనిని చూచింది సునీత. ఇందాక అంతగా  గమనించలేదు గాని బాగా చిన్న పిల్లాడు; 19 ఏళ్ళు ఉంటాయేమో, తెల్లగా సన్నగా ఉన్నాడు , మొహంలో పసితనం వీడలేదు. తాగావా అని అడగలేక “నీకు ఒంట్లో బాగా లేదేమో? అందుకని వేరే ఆటో మాట్లాడదాము  అనుకుంటున్నాము,సరే పద” అని మళ్ళీ లోపలకి ఎక్కి కూర్చొన్నారు. అప్పుడు అతనిని మాటలలో దింపింది సునీత,  “నీ పేరు ఏంటి ,మీరు ఎంత మంది ?” అని    దానికి సమాధానం గా  “నా పేరు అఫ్జల్ మేడం,మేము మొత్తం ఆరు మంది,పెద్దోడి ని కూడా, పైసలు కమాయించే వాడినికూడా నేనే”,  “అదేంటి మీ అమ్మ నాన్న ఏమయ్యారు?” అని ఇద్దరు ఒకేసారి ప్రశ్నించారు.   “మానాన్న మొన్న జరిగిన దిల్ సుఖ్ నగర్ లో బాంబు పేలుళ్ళలో చనిపోయిండు. అమ్మకి గుండె జబ్బు ఉండే,తమ్ముళ్లు,చెల్లెళ్లు చిన్న వాళ్ళు.ఇక నేనే,నాన్న ఆటో నడుపుతున్నా.”  “నువ్వు చదువుకున్నావా?”అని అడిగింది నీరజ  “ఆ!మేడం!ప్రైవేటు గా,డిగ్రీ  చదువుతున్నాను.  అది అయ్యాక బ్యాంకు ఎగ్జామ్స్ కూడా రాస్తాను,మేడం, మీరు కూడా ఏదైనా ఉద్యోగాలు  ఉంటె చెప్పండి మేడం” అని అన్నాడు  “సరే నీ ఫోన్ నం చెప్పు ఏదైనా, ఉంటె చూస్తాను అంది”  ఫోన్  నెంబర్ ఇచ్చే లోపల  మళ్ళీ ఆటోని ఆపి వాంతి చేసుకున్నాడు. ఆ తరువాత ఆటోని ఆనుకొని నిస్త్రాణంగా వాలిపోయాడు. పాపం జాలి వేసింది ఆ అబ్బాయిని చూస్తే “ఏం చేస్తాము, వెళ్ళిపోదాం” అనుకొని ఇద్దరూ ఆటో దిగి  రెండడుగులు వేశారు. కానీ ఇద్దరి మనస్సులో ఒకటే సారి అనిపించింది.  “చ! ఇలా మనకే జరిగితే” అని.  ఇంతలో నీరజ సెల్ మోగింది వాళ్ళ ఆయన ఫోన్ చేసారు. “ఎక్కడున్నారు? చాలా లేట్ అయింది. ఇంకా రాలేదేంటి?” అని. అప్పుడు నీరజ జరిగింది చెప్పింది. దానికి అతను వెంటనే  “సరే ఒక పని చెయ్యి, అతనిని హాస్పిటల్ తీసికొని వెళ్ళండి ముందు” అని చెప్పాడు. అంబులెన్సు కి ఫోన్ చేద్దాము అనుకునేంతలో వేరే ఆటో అతను వచ్చి  “ఏం జరిగింది మేడం” అని అడిగాడు.   “ఈ ఆటో అబ్బాయిని హాస్పిటల్ కు తీసుకొని వెళ్ళాలి వస్తారా” అంటూ ఉండగానే అతనే ఆటో దిగి వచ్చి,అతన్ని చూసి   “అయ్యో! మా అజ్జు బేటా!, అంటూ వాళ్ళ వైపుకి తిరిగి,   “మావాళ్ళ పిల్లగాడేనమ్మా! ఏమైందో ఏమో? పర్వాలేదు స్పృహ లోనే ఉన్నాడు” అని అతనిని మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాడు. అలా మాట్లాడుతూనే అతనిని చేతులతో మోసుకొని ఆటోలో  కూర్చోపెట్టాడు”   “ఇప్పుడు ఎలా వుంది బేటా” అని అడిగాడు  “దాహం వేస్తోంది” అని “నా ఆటో, నా ఆటో ఎలా? అమ్మికి ఆపరేషన్ కి డబ్బులు కావాలి”  అంటూ ఏదో  మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు  కానీ అతని వల్ల కావటం లేదు. “నీ ఆటోని నేను చూస్తానులే” అంటూ పక్కనే ఉన్న షాప్ అతను చెప్పాడు.  నీరజ తన బాగ్ లో ఉన్న నీళ్ళ బాటిల్ తీసి ఇచ్చింది.  ఆటో అతను తాగించాడు. మొత్తానికి అందరూ కలిపి హాస్పిటల్ కు తీసుకోని వచ్చారు.     అక్కడ రిసెప్షన్ లో ఇది అర్జెంట్ కేసు గా తీసుకోమని చెప్పారు.   అక్కడ ఉన్న వాళ్ళు ఫార్మాలిటీస్ అన్ని అడుగుతూ ఉంటే ఇద్దరూ ఒకే సారి చెప్పారు “మాకు ఏమీ తెలియదు. అతని ఆటో ఎక్కాము. అంతలో ఇలా జరిగింది. వెంటనే హాస్పిటల్ కి  తీసుకొచ్చాము అంతే” అన్నారు.  కాని హాస్పిటల్ స్టాఫ్ “మా రూల్స్ కి విరుద్ధంగా జాయిన్ చేసుకోలేము అనడంతో, నీరజ, సునీత కూడా కోపం వచ్చి ఆవేశం తో మాట్లాడటం,వీళ్ళని తీసికొచ్చిన ఆటోవాలా, కరీం. అతనుకూడా  రెండు చేతులూ జోడిస్తూ “సాబ్! మా అజ్జు బేటా, ప్రాణం నిలపండి అంటూ ప్రాధేయ పడుతూఉండటం  చూసిన ఒక  యువ డాక్టర్  రిసెప్షన్ వాళ్ళతో ఏదో మాట్లాడాడు.  వెంటనే వాళ్ళు నీరజ,సునీత ల తో అన్నారు. “అబ్బాయిని అడ్మిట్ చేసుకుంటాము,కొంత నామినల్ అమౌంట్ కట్టండి అలాగే  మీ ఐడెంటిటీ కార్డ్స్  కూడా  చూపించండి” అన్నారు.”  అతనికి సహయం చెయ్యాలన్న ఉద్దేశ్యంతో హాస్పిటల్ వాళ్ళకి  ఓ రెండు వేలు కట్టింది. రశీదు తీసుకుంటూ “మనచేతిలో ఉన్నది ,చేయగలిగినది ఇదే సునీ” అంది  “అవును.,పాపం చిన్నపిల్లాడు”సునీత  జాలిగా అంది  “కష్టపడకపొతే పొట్ట నిండేదెట్లా మరి వాళ్ళకి,చిన్న పెద్ద భేదం లేదు.అబ్బ!నిజంగా  తలచుకుంటునే,ఎంత  బాధగాఉందో”అందినీరజ.   పక్కనుంచి “వాళ్ళ అమ్మ ఆపరేషన్ కోసం తిండి తినకుండా, వట్టి చాయి నీళ్ళు  తాగుతూ పైసలు కూడపెడుతున్నాడు .పాపం అదే వాడి కొంపముంచింది” అన్నాడు. కరీం.  ఇంతలో అతనికి ఫోన్ వచ్చింది,”అమ్మనాకు ఒక సవారీ ఉంది వాళ్ళను దింపి నేను వాడింటికి వెళ్లి,వాళ్ళ అమ్మను తీసుకోని వస్తాను” అని చెప్పి కరీం వెళ్ళిపోయాడు. “Even the smallest act of caring for another person is like a drop of water -it will make ripples throughout the entire pond” అన్న వాక్యాలు ఎదురు గోడ మీద మెరుస్తూ కనిపించాయి.  అది చూసిన ఇద్దరి కళ్ళలో ఒక మంచి పని చేసాము అన్న తృప్తి కనిపించింది.    అంతలో నీరజ భర్త రావడంతో, ముగ్గురూ కొంచెం సేపు ఉండి, తరువాత  నిశ్శబ్దం గా హాస్పిటల్ నుండి వెళ్ళిపోయారు.  సమయం రాత్రి 12 గంటలు  కరీం ద్వారా  విషయం తెలుసుకున్న ఆటో అబ్బాయి తల్లి, చెల్లెళ్లు హాస్పిటల్ కి పరిగెత్తుకొని వచ్చారు. అక్కడ నర్స్ చెప్పింది ఏడుస్తున్న ఆటో అబ్బాయి తల్లితో  “మీ అబ్బాయికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు.మీరు బయటే కూర్చోండి. ఇప్పుడే లోపలకి వెళ్ళడానికి లేదు” అంది . అప్పుడు గురుకొచ్చింది తన కొడుకును ఎవరో ఇద్దరు ఆడవాళ్ళు హాస్పిటల్ కు తెచ్చారని, “మానవత్వం తో స్పందించి,నీ కొడుకు  ప్రాణాన్ని నిలబెట్టారు వాళ్ళిద్దరూ బెహన్” అన్న కరీం మాటలు, ఆ తల్లి  గుండెలో ప్రాణదీపాన్ని వెలిగించాయి.  వెంటనే కరీం ని అడిగింది “వాళ్ళేరని”.   “అదే వాళ్ళకోసం అంతా వెతికాను, కాని ఎక్కడా లేరు రజియా బెహన్” అని కరీం చెప్పాడు.    “దేముడు లాగే వీళ్ళు కూడా కనిపించకుండా,నిశబ్దంగా చేసిన సాయం, విలువ కట్ట లేనిది నా బిడ్డని బతికించిన ఆ అల్లా కి వేల వేల కృతజ్ఞతలు జన్మజన్మలకి వాళ్ళకి ఋణపడిఉంటాను” అంటూ ఆ కన్నతల్లి అక్కడ లేని నీరజ, సునీత లకు మనసారా రెండు చేతులు జోడించి,వాళ్ళకు ఎప్పుడూ మంచి జరగాలని ప్రార్థించింది ...... Mani Murthy Vadlamani

“చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు" పార్ట్ - 2

“చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు" పార్ట్ - 2   స్వామి సర్ప రూపంలో ఒకానొక ఆవుల మందలోని గోక్షీరం రోజూ తాగేస్తూ ఉండే వాడట. ఆ ఆవు ప్రతీ దినం మందలోంచి తప్పించుకుని, కడుపారా స్వామికి పాలు తావించి వెళ్లేదట. ఖాళీగా వేళ్లాడుతున్న పొదుగును చూసి యజమాని కాపరిని కోప్పడేవాడు.    కొన్ని రోజులు చూసి, ఆ పశువుల కాపరి కాపు కాచి, ఆ పాముని కర్రతో కొట్టాడట. ఆ దెబ్బకి కారిన రక్తంతో ఒక పక్క ఎరుపు, ఆవు పొదుగు నుండి కారిన పాలతో ఇంకొక పక్క తెలుపు వచ్చాయని అంటారు. ఆ లింగాన్ని చూసి కాపరి పశ్చాత్తాపంతో స్వామిని వేడుకున్నాడట.    భోళా శంకరుడు కదా.. కరుణించి కాపరిని కాపాడాడు.    నిజమైన ప్రాయశ్చిత్తంతో వేడుకుంటే ఆ గరళ కంఠుడు పాపాలను తొలగించి, కష్టాలను తీరుస్తాడని ప్రతీతి.    ఇన్నిన్ని గుడులు ఏర్పడక ముందు ఈ ఊరిని fనేత్రపురిf అని పిలిచేవారు.    శైవ, వైష్ణవ సాంప్రదాయాలకు సమాన ప్రాధాన్యత నిచ్చు సహన శీలురు, విశాల హృదయులు అయిన గుడ్లూరు గ్రామస్థుల ఖ్యాతి వాడవాడలా వ్యాపించింది. నూరు ఆలయాలే కాక నూరు తటాకాలు కూడా ఉన్న గుడ్లూరు.. సహజ వనరులతో అలరారుతూ, పాడి పంటలు సమృద్ధిగా ఉండి.. చతుర్వర్ణాలవారు సౌఖ్యంతో మెలిగే ఆదర్శ ప్రదేశం అని పేరు పొందింది.    పదమూడవ శతాబ్దంలో.. గణపతి దేవుడు, అతని తదుపరి రుద్రమదేవి, రాజ్యమేలిన కాకతీయ సామ్రాజ్యపు అధీనంలోనున్న.. అద్దంకి సీమకి చెందిన ఈ ప్రాంతాన్ని పంట వంశ నాయంకరంలోని రెడ్లు ప్రజా రంజకంగా పరిపాలిస్తూ ఉండే వారు.    సామంతులయినా.. తమ తమ స్వాభిమానాన్ని కాపాడుకుంటూ, నీటి వనరులను చెరువులుగా భద్రపరచి రాజ్యాన్ని సస్య శ్యామలం చేశారు.    ఆహార కొరత లేనప్పుడు సహజంగానే సాహిత్య సంగీతాల మీద, కళల మీద ఆసక్తి పెరుగుతుంది. అందునా.. సుస్థిరమైన సామ్రాజ్యం. శత్రువులెవరైనా దాడి చేసినా ఏకశిలానగరం ఏలికలు కొండంత అండగా ఉండనే ఉన్నారు.     ఇంక ఏ లోటు? అందుకనే ఆదర్శ సీమ అయింది.    రెడ్డిరాజుల గజ సంపద చక్రవర్తికి స్థైర్యాన్ని, ధైర్యాన్ని కూడ ఒసగి వారిరువురి మైత్రికి దోహదం చేశాయి. సరిహద్దులోనున్న పెద్ద చెరువును కోటలోని  ఏనుగుల దాహానికి, స్నానానికి వాడుతూ.. ఏనుగుల దొరువు అని పిలుస్తారు. ఆ సమయంలో అక్షరానికి కొరతయిందా సీమలో.      అంటే.. అక్షరాభ్యాసం చేయించడానికి కాదు..    ఛందో వ్యాకరణాలు సాంగోపాంగంగా నేర్పించడానికి, ఉభయభాషల్లోనూ ప్రావీణ్యత గలిగి విద్యార్థులను వేదవేదాంతాలలో నిష్ణాతులను చెయ్యగల గురువు కావాలి.. తెలుగులో కావ్యరచన చేయగలిగే స్థాయికి చేరుకునేలా అభ్యాసములు చేయించే వారు కావాలి.    నీలకంఠేశ్వర స్వామి ఆలయపూజారి నారసింహాచారి కాలధర్మం చెయ్యడంతో ఏర్పడిందా లోటు.    రెడ్డి ప్రభువు ఆ లోటు పూడ్చే ప్రయత్నంలోనే ఉన్నాడు.                                                                                                  ……………………     గుడ్లూరునకు సుమారు ఇరవై యోజనములు ఉత్తరాన.. కృష్ణా, గోదావరీ నదుల మధ్యనున్న వేగినాడులోని కరాపర్తి గ్రామంలో..    నాలుగంకణాల విశాలమైన ఎత్తరుగుల ఇల్లు. ఇంటి ముందు వేప చెట్టు చల్లని నీడ నిస్తోంది.    సూర్యోదయాత్పూర్వమే ఆ గృహంలో కలకలం మొదలయింది.    ఇంటి కోడలు పొత్తమాంబ, వీధి వాకిలి ఈ చివర్నుంచాచివరికి తుడిచి, కళ్లాపు జల్లి, రంగవల్లులు తీర్చి దిద్దింది. గృహస్థు గడప దాటక ముందే ముగ్గు వేసెయ్యాలి.. అదే సంప్రదాయం.    వెనువెంటనే యజమాని ఎర్రపోతసూరి పెద్ద రాగి చెంబు, అంగవస్త్రం, ఉతికేసిన బట్టలు పట్టుకుని జాగ్రత్తగా ముగ్గు పక్కనుంచి దాటి, ఏటికేసి వెళ్లాడు, భుజాలమీదుగా కొంగు కప్పుకుని, అణకువతో తలవంచుకుని నిలబడ్డ కోడలి కే్సి చూసి తల పంకిస్తూ.    దారి పొడవునా, ఎదురైన ఊరివారు, వేదకాలం నాటి ఋషి వంటి ఎర్రపోతనకి నమస్కరిస్తూ పక్కకి తొలిగారు.    ఎర్రపోతసూరి ఏటి దగ్గర స్నానమాచరించి, ఎర్రని పట్టు వస్త్రం ధరించి, నీరుకావి ఉత్తరీయంతో వక్షస్థలాన్ని కప్పుకుని, రాగి పాత్రలో నీటిని దారిలో చల్లుకుంటూ ఇంటికి వచ్చాడు.    పచ్చని ఛాయ గలవాడేమో.. ఆరీ అరని నీటి బిందువులలో ఉదయార్కుని ఎరుపు రంగు పరావర్తనం చెంది ఆయన మేను ఉషోదయ కాంతులు వెదజల్లుతోంది.  సాక్షాత్తూ ఆదిత్యుడే నడచి వస్తున్నాడేమో అని భ్రమ కలుగుతోంది. తలవంచి ద్వారంలో అడుగు పెడుతూనే నృసింహ స్తోత్రం వల్లించసాగాడు.        "శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే       భోగీంద్ర భోగమణి రక్షిత పుణ్య మూర్తే     యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ది పోత       లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం."     అప్పటికే తలారా స్నానమాచరించిన అతని ధర్మపత్ని పేరమ్మ, వేలు ముడి వేసుకుని, ఒద్దికైన కాశ కట్టుతో మడి చీర కట్టుకుని తులసి కోట దగ్గర శుభ్రం చేసి ముగ్గు వేసి, దీపం పెట్టేసింది,. ఆదిత్య హృదయం చదువుకుంటూ, దేముడి అర తుడిచి, దీపపు సెమ్మెలు, పంచపాత్ర, అరివాణం, ఉద్ధరిణీ మొదలుగాగల పాత్రలను తళతళా తోమి, బోర్లించింది. పొయ్యి వెలిగించి మహా నైవేద్యానికి సిద్ధం చేస్తోంది.    ఎర్రపోతసూరి కుమారుడు సూరన్న ఉభయ భాషా ప్రవీణుడు. సంస్కృతాంధ్ర భాషల్లోని కవిత్వాలలో ప్రౌఢ శబ్ద ప్రయోగాలతో ఘనుడిగా పేరు పొందాడు. తండ్రికి తగ్గ తనయుడు.. ఆచార వ్యవహాల్లోనూ, ఆత్మాభిమానంలోనూ కూడా. కలిమిలోనూ, లేమిలోనూ నిమిత్తమాత్రంగా ఉంటారు ఇరువురూ.    సూరన్న బ్రాహ్మీ ముహుర్తమందే లేచి, పూజాది కార్యక్రమాలు ముగించి.. వీధి అరుగు మీద తన పాఠశాల తెరిచాడు.    విప్ర బాలురు నమకం, చమకం, పురుష సూక్తం, వ్యాకరణ సూత్రాలూ ఆదిగాగల సంస్కృతాంధ్ర భాషల్లోని పాఠాలను వల్లె వేస్తున్నారు. ఇంకా చిన్న పిల్లలు నల్లని అరుగు మీద తెల్లని ముగ్గు వేసి అందులో అకారాది అక్షరాలను దిద్దుతున్నారు.    సూరన్న భార్య పొత్తమ్మ, తలుపు చాటున నిలిచి, చేతులు కదిపి గాజులు చప్పుడు చేసింది.    ఏదో వ్రాయ నిశ్చయించుకుని తాళపత్రాలు సర్దుకుంటున్న సూరన్న లేచి లోనికేగాడు.    పొత్తమ్మ ఇరువది ఏండ్ల ముగ్ధ. విశాలమైన కనుదోయి.. తీరైన నాసిక, నిరంతరం చిరునవ్వు నవ్వుతున్నట్లు అనిపించే పెదవులు.. కావ్య నాయిక వలెనే ఉంటుంది. జుట్టు తడి ఇంకా ఆరలేదేమో.. విరబోసుకుని, చివర వేలుముడి వేసింది. వంకీలు తిరిగిన ముంగురులు నుదుటి మీద అల్లల్లాడుతుండగా, సిగ్గుతో కను రెప్పలు వాల్చి కంచు పాత్రలో గోరువెచ్చని పాలు అందించింది.    ప్రసన్న వదనంతో క్షీర పాత్రని అందుకున్నాడు సూరన్న.   "మరీ.." సన్నని స్వరంతో ఏదో చెప్పబోయింది పొత్తమ్మ.    కనుబొమ్మలెగరేశాడు పతిదేవుడు.   "కోమటి జంగన్న అంగడికి వెళ్లి వస్తారా? ఇంటిలో వస్తువులన్నీ నిండుకున్నాయి. కట్టెలు కూడా.." సగం సగం మాటలు మింగేసింది సంశయాత్మకంగా చూస్తూ.   చెప్పవచ్చునో లేదో.. చెప్పకున్న రాత్రికి పొయ్యి రాజేసే పని లేదు. అప్పటి దాకా అన్ని విషయాలూ అత్తగారు, మామగారూ చూసుకునేవారు.    సూరన్న అయోమయంగా చూశాడు. ఇల్లు, వస్తువులు.. అవన్నీ తను.. ఏ విధంగా.. ఏం చెయ్యాలో తెలియదే! తండ్రిగారు ఏమీ చెప్పలేదే! ఉన్నట్లుండి వంట సామగ్రి అంటే ఎక్కడికి వెళ్లాలి.. వీటన్నింటికీ ద్రవ్యం ఎక్కడనుంచి వస్తుంది..   తల తడుముకుంటూ వీధి అరుగు మీదికి వెళ్లాడు.    నిశ్చింతగా కాలం గడుపుతున్న సూరన్న ఒక్కసారిగా కొండంత భారం శిరమున ఎత్తుకుంటున్నట్లు, హఠాత్తుగా సమస్యల సర్పాలు చుట్టుముట్టినట్లు విలవిల్లాడిపోయాడు.    అన్యమనస్కంగానే పిల్లలకి పాఠాలు నేర్పాడు.  "కోడలు చెప్పింది నిజమే అబ్బాయీ! మీ తాతగారి తండ్రి భీమన గారు వెలనాటి చోడుల వద్ద మంత్రిగా ఉండే వారు. ఆ రాజులకి అత్యవసర సమయంలో అమూల్యమైన సలహాలందించి మంచి పేరు తెచ్చుకున్నారు. వారికి రాజులు ఇచ్చిన మడిమాన్యాలతో ఇన్ని తరాలు గడిచాయి. పుత్ర పౌత్రాభివృద్ధి అయి వంశం శాఖోపశాఖలుగా విస్తరించింది. కూర్చుని తింటే కొండలయినా కరిగిపోతాయి.    మన విషయంలో అదే అయింది. దానికి తోడు కరవు.. కౌలుకిచ్చిన భూమి మీద ఏమాత్రం రూకలు రావట్లేదు. రూకలు లేకున్న నూకలెక్కడ్నుంచి వస్తాయి మరీ! మీ తండ్రిగారు వృద్ధులవుతున్న సంగతి చూస్తున్నావు కదా!"  పేరమ్మ ఎప్పట్నుంచో కొడుక్కి చెప్పాలనుకుంటున్న మాటలన్నీ కష్టపడి చెప్పేసింది.    బాధ్యత అప్పచెప్పడం ఇంతటి భారమైన పనని అనుకోలేదు. తండ్రి నుంచి తనయుడికి ఆస్థి సంక్రమిస్తే ఆనందమే కానీ..    ఆదాయం లేకుండా ఇల్లు నడపమనడం అన్యాయమే! కానీ అనివార్యం.    సూరన్న అటూ ఇటూ చూశాడు ఆధారం కోసం.    ఎర్రపోతసూరి మాట్లాడకుండా ఔపోసన పట్టాడు.    తండ్రీకొడుకులిద్దరూ నట్టింట్లో భోజనాలకి కూర్చున్నారు. పెరటి తోటలో కోసిన బచ్చలి కూర పులుసు, జొన్న సంకటి వడ్డించింది పేరమ్మ. సూరన్న సరిగ్గా గమనించడం లేదు కానీ.. గత ఆరు మాసాలుగా ఆధరువులు అరకొరగానే ఉంటున్నాయి.    "మరి ఇంత కాలం నాదృష్టికి ఎందుకు తీసుకొని రాలేదమ్మా?" జొన్నసంకటిలో పులుసు కలిపి నోట పెట్టుకోబోతూ అడిగాడు సూరన్న.    "నువ్వు గురుకులం వెళ్లి విద్య నభ్యసించడం.. ఆ తరువాత వివాహం.. ఇప్పుడిప్పుడే కదా ఇంటి పట్టున ఉంటున్నది.."    "ఏదో నడిపించినంత కాలం నడిచింది. ఇప్పుడు ఋణ బారం ఎక్కువయింది. వర్షాలు పడితే అంతా సర్దుకునేదేమో! మూడు సంవత్సరాలుగా వరుణుడి కరుణ లేదు కదా.. ఇంక ఇప్పుడు మనం ఏదో ఒకటి చెయ్యకపోతే ఊర్లో ఉండలేం. అదీ అత్యంత త్వరితంగా." ఎర్రపోతసూరి నోరు విప్పాడు.    నిజమే.. తాను ఇంక గృహ బాధ్యతలు స్వీకరించక తప్పదు. తల్లిదండ్రులని మానసికంగా, భౌతికంగా సుఖపెట్టడం తన బాధ్యత. సూరన్న ఆలోచిస్తూ భోజనం పూర్తి చేశాడు.    తను నమ్ముకున్న ఆ చంద్రశేఖరుడు ఏదో దారి చూపించకపోతాడా..    చూపిస్తాడు. చూపించబోతున్నాడు..    తండ్రీ కొడుకులిరువురూ లేచి, పెరటి అరుగు మీద చేతులు కడుక్కుంటుండగా వినిపించింది ఒక కేక.    "అయ్యా! సూరన్నగారి గృహమిదేనా?" (ఇంకా వుంది) .... మంథా భానుమతి

వంశీకుంజం

  వంశీకుంజం   - తెన్నేటి హేమలత                 తెలుగు కథా సాహిత్యంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న రచయిత్రి తెన్నేటి హేమలత. స్త్రీగా ఎన్నో అరుదైన అనుభవాలను, సమాజంలో గుర్తింపబడని స్త్రీల జీవితాలను కథల్లో, నవలల్లో చిత్రీకరించారు. కేవలం కథలు నవలలే కాకుండా ప్రాచీన సాహిత్యానికి సంబంధించిన గ్రంథాలూ రచించారు. వ్యాసాలు రాశారు. వీరు సుమారు వంద నవలలు, వందల సంఖ్యలో రేడియో నాటికలు, నాటకాలు రాశారు. కవితలు కూడా రచించారు. ఎన్నో ప్రఖ్యాత బహుమతులు పొందారు. భాగవతంలోని శ్రీ కృష్ణ లీలలను ఇతివృత్తంగా తీసుకొని వంశీకుంజం పేరుతో అద్వైతభావాన్ని కథ రాశారు.          హేమలత వంశీకుంజం కథలో కృష్టుడు, గోపకాంత అయిన నీరజ మధ్య ఉన్న బంధాన్ని అలౌకికంగా చిత్రీకరించారు. ప్రేమికుడైన కృష్ణుడికోసం వడలిన వయసులో, ఎండిన వెదురులాంటి శరీరంతో నీరజ ఆయనతో గడిపిన రోజులను గుర్తు చేసుకుంటూ ఎదురు చూస్తూ ఉంటుంది. మధుర ఉద్యానవనంలో ఒకప్పుడు కృష్ణుడుతో గడిపిన జ్ఞాపకాలను తలపోస్తూ...  ప్రేమతో ఆర్థ్రమైన హృదయమూ, కన్నీటితో నిండిన కన్నులూ, ఆరాధనతో పరవశమైన బతుకూ వెలలేనివి అన్నావు. ఈ పారిజాత సుమమాలు అపూర్వమైనది. అది వాడిపోక మునుపే వస్తానన్నావు.... కానీ రాలేదు. నన్ను మర్చిపోయావా... అని అసుర సంధ్యలో వంశీకుంజం ఎదుట ఒక్కతే గత జ్ఞాపకాలలోని కృష్ణుడిని గుర్తు చేసుకుంటూ ఉంటుంది.           వసంతకాలంలో లేత చిగురుల మధ్య కృష్ణుడి రూపాన్ని చూసి తరించిపోయింది నీరజ. బంగారు వర్ణపు మృదుకేశాల నుంచి, శౌర్యాన్ని నింపుకున్న భూజాల నుంచి, సమ్మోహనంతో ఉన్న కన్నుల నుంచి, తేనెలు కురిసే పెదవుల నుంచి, ఎందరో స్త్రీలు తమతమ హృదయాలను పారేసుకున్న గడ్డం కింద ఉన్న చొట్ట నుంచి... అన్నిటిని చూసి ఆ మోహనుడిని మోహించింది. కృష్ణుడు కూడా స్త్రీ ముందు నేను అల్పుడిని, మనసుకు విషాదం కలిగినప్పుడు, బతుకు భరించలేనంత బరువుగా తయారైనప్పుడు స్త్రీ ప్రేమ, ఆరాధన, ఆప్యాయతా నాకు అవసరమవుతాయని చెప్పాడు. నేను నీ ప్రేమను అర్థం చేసుకున్నాను అని చెప్పి తన ఆత్మలో ఆమెను అంతర్భాగం చేసుకున్నాడు. అప్పుడు నీరజ కృష్ణుడితో- నా గుండె గూటిలో నీవు ఉన్నావు, మనసు కన్నా దేవలయం లేదు. మమత కన్నా పూజలు లేవు అని చెప్పింది. పైగా మనసు, మమత కలిస్తే పూజకు ఫలం అన్నది. నీవిచ్చే వరం కోసం వేచి యుంటాను అని మాట ఇచ్చింది. ఇదంతా నీరజ యువతిగా ఉన్నప్పుడు జరిగిన సంఘటన. అప్పటి నుంచి నీరజ ఆ వంశీకుంజం దగ్గర  వేచి ఉంది. వంశీకుంజం కూడా ఇప్పుడు పెద్దదై పోయింది.         నీరజకు పిచ్చిపట్టిందని ఆమె భర్త వదిలేశాడు. తమాలవృక్షం కింద తపస్సుచేసే రాధమ్మ కూడా మయమైపోయింది. తపతి, చంద్రిక వంటి చెలికత్తెలందరూ వెళ్లిపోయారు. కానీ ఆమె దొర నల్లనయ్యకోసం, ఇచ్చిన మాట కోసం ఎదురు చూస్తేనే ఉంది నీరజ. ఈ సుధీర్ఘ వియోగంలో ఆమె కృష్ణుడు గురించి ఎన్నో కథలు విన్నది. కానీ వస్తాడని నమ్మకం. ఎందుకంటే... స్త్రీత్వం ఆయన్ని ప్రేమించి తనని తాను అర్పించుకుంది. చిత్రంగా భగవానుడు మనోహరుడుగా దర్శనమిచ్చాడు. అసలు కృష్ణుడిలో తను అంతర్భాగం. తనలోని ఒక మనోహరమైన ప్రేమప్రవాహం కృష్ణుడిగా అయిపోయింది. ఆమెకు ఆమె జీవితమే రెండుగా చీల్చిపేసిన అనుభూతి కలిగింది. ఆమె ఆలోచనా ప్రవాహం పరుగులెత్తింది. ఆ ఆనందమయమైన రూపంలో కృష్ణుడు వృద్ధురాలిని తోడమీదకు తీసుకున్నాడు. భగ్న తపస్వి నీరజ అతని స్వరహృదయంలో నిండిపోయింది. అప్పుడు ఆమె అడిగింది... భగవంతుడా, జీవితం అంటే ఏమిటి... అందుకు సమాధానంగా కృష్ణుడు- మనుష్య జీవితం అనేక సంస్కారాలతో నిండి ఉంటుంది. తినడం, తాగడం, దేహవాంఛలే కాకుండా..., స్వప్నాలు, సుఖ దుఃఖాలు, మానవమానాలు పెనవేసుకుని ఉంటాయి. వీటి సంస్కార సంచయమే జీవితం అని చెప్తాడు.       ఆమె కోరిక ప్రకారం వంశీకుంజాన్ని పిల్లనగ్రోవిగా  జోలపాడతాడు. అప్పుడు ఆమెకు ప్రణయ తరంగిణిలా గీతాసారం వినిపిస్తుంది. ఎవరికి ప్రపంచంలో ఎవరితోనూ వైరంలేదో, ఎవడు తటస్థుడిగా ఉండి, నిరపేక్షగా జీవితం గడపుతాడో, ఎవడు తను చేసిన దానికంతటికీ నాకే సమర్పించి క్షమాశీలుడూ, నిస్సంగుడూ, ప్రేమమయుడూ అవుతాడో అతడే నేను... తర్వాత అతని కన్నీటి బొట్లు ఆమె నుదుటిని తడుపుతాయి. ఆ విరహణి నీరజ ఆయనలో ఐక్యమైపోతుంది. తర్వాత అక్కడ నీరజకు బదులు పారిజాత సుమరాశి కనిపిస్తుంది. వంశీకుంజం మాత్రం ఇప్పటికీ కృష్ణస్పర్శకోసం ఎదురు చూస్తూనే ఉంది. అని కథ ముగిస్తుంది తెన్నేటి హేమలత.            ఇలా భాగవతంలోని గోపికలు, కృష్ణ తత్వాన్ని కథగా మలిచారు రచయిత్రి. అలానే ఆత్మ, పరమాత్మ..., భగవంతుడు, భక్తుడు... ఇలా వీరి మధ్య ఉన్న ధ్వైదీ భావాన్ని గొప్పగా చెప్పారు ఈ కథలో తెన్నేటి హేమలత.    - డా. ఎ.రవీంద్రబాబు

చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు

“చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు" పార్ట్ - 1                                    శ్రీమన్నారాయణుడు క్షీరసాగరముపై, శేషతల్పమున శయనించి చిదానంద రూపుడై సృష్టి వైచిత్ర్యాలను పరికిస్తున్నాడు. మూలకారణంబొక్కడే అయినా అనేకానేక రూపాలు. విఘ్నేశ్వరుడు.. అనంతుడు, అచ్యుతుడు, చతుర్ముఖుడు, ముక్కంటి, ఆదిశక్తి, నాగేంద్రుడు, ఆంజనేయుడు, హయగ్రీవుడు..    హిందూ మతంలోనే ఇన్నిన్ని రూపాలుంటే మరి ఇతర మతాల మాటేమిటి..    ఏకకణ జీవిని సృష్టించాడు.. అదే చేతితో మనిషిని సృష్టించాడు.    మనిషిలో దూరే సూక్ష్మ జీవులనీ, మనిషి మీద పడే క్రూర జంతువులనీ సృష్టించాడు.    మరి.. మనిషి మనిషికీ మధ్య ఇంతటి విభేదాలనెందుకు సృష్టించాడో..    కక్షలు కార్పణ్యాలు, కాంక్షలు వాంఛలు    అధికార దాహాలు.. పోనీ..    అదో ఆట అనుకుందాం..    మరి మతం అంటూ తనకి తనే వేరు పరచుకున్నాడే.. ఆ మాటేమిటి?    మతం పేరుతో మారణహోమాలు..    మాధవుడు దేవుడంటే..    కాదు శివుడే దేవుడు..    జైన తీర్ధంకరులు, బౌద్ధారామాలు..    కాదు కాదు అల్లానే దైవం..    అశ్వమేధం, నరమేధం.. అంతులేని పోరాటం.    ఎందుకని.. చివరికి ఏం సాధించాలని? లయ కారణంబునకా!    పోరాటాల మధ్య విరామానికి కాబోలు..    మానసికోల్లాసమునకై వెలసిన సంగీత సుమాలు, సాహిత్య సౌరభాలు.    అన్నీ ఆ పరమాత్ముడికే చెల్లు.                            ...........................     పాకనాడు (నేటి ప్రకాశం జిల్లా) లోని గుడ్లూరు గ్రామం... క్రీ.శ.13వ శతాబ్దం ఉత్తరార్ధంలో..    మన్నేరు నది ఒడ్డునున్న ఈ గ్రామం లో నూరు పైన గుళ్లున్నాయి. అందువలననే ఆ గ్రామానికి ఆ పేరు స్థిర పడింది.. వానిలో నీలకంఠేశ్వర స్వామి గుడి బహు ప్రఖ్యాతి చెందింది.    అంతే సమానమైన ప్రాముఖ్యత సంతరించుకున్న కేశవ పెరుమాళ్ ఆలయంలో నారాయణుడు అత్యంత వైభవంతో పూజలందుకుంటున్నాడు..   శివ కేశవులిరువురూ ఆ గ్రామాన్ని తమ రక్షణలోనికి తీసుకున్నట్లు వెలిశారు.     పలు రకాల పండుగలకు, సాహిత్య సంగీత సభలకు ఆలవాలమయింది ఆ సీమ.     పామర జనాలు, బంగారపు తొడుగు గల గ్రామదేవత పోలేరమ్మను ఆరాధిస్తూ ఉంటారు.    ప్రతాప వీరాంజనేయ స్వామి గుడి, చెన్నకేశ్వరాలయం, వినాయకుడి గుడి, వీరభద్రుని ఆలయం.. అక్కడున్న ఆలయాల్లో కొన్ని. ఆ పరబ్రహ్మ అన్ని రూపాల్లోనూ కొలువై ఉన్నాడు అక్కడ.    నీలకంఠేశ్వర స్వామి ఆలయంలోని లింగం సగం తెలుపు రంగులో, సగం ఎరుపు రంగులో ఉంటుంది. ఇతిహాసం ప్రకారం దీనికొక కథ ఉంది. ....మంథా భానుమతి   

కామిని హృదయం

  కొడవగంటి కుటుంబరావు గారు రాసిన " సరితా దేవి డైరీ" "సరోజ డైరీ" "కామిని హృదయం " ప్రముఖ ఆంగ్ల రచయిత్రి Jene Austen గారు రాసిన Pride and Prejudice  అనే నవల చదువుతుంటే  నాకు కొడవగంటి కుటుంబరావు గారు రాసిన " సరితా దేవి డైరీ" "సరోజ డైరీ" అనే నవలలు గుర్తొచ్చాయి.   రెండు నవలలు మధ్య తరగతి అమ్మాయిల పెళ్లి సమస్యలే.   Pride and Prejudice  18  వ శతాబ్దంలో బ్రిటిష్ దేశపు నేపధ్యంలో రాసిన నవల.          సాహిత్యం తో పరిచయం ఉన్న వారికి కొడవగంటి కుటుంబరావు గారి గురించి పరిచయ వాక్యాలు రాయాల్సిన అవసరం లేదు.   నేను అంత సాహసం కూడా చేయలేను.    ఆలిండియా రేడియో వారి ' రేడియో మాసం'  సందర్భం లో సీరియల్ గా ప్రసారం చెయ్యడానికి 'డైరీ' రూపం లో రాసిన పెద్ద కథ   సరితా దేవి డైరీ.   డైరీ అనంగానే తేదీల వారీగా కాకుండా కథ లాగా ఉండి ఉత్తమ పురుషలో స్వగతం లాగా సాగుతుంది.   ఐతే కథ చెప్పేపాత్రకు తన చుట్టూ అప్పటివరకు జరిగిన జరుగుతున్న విషయాలే తప్ప ముందు జరుగబోయే విషయాలు గాని ఇతరుల మనసులో ఉన్న విషయాలు గాని తెలియవు.    "రేడియో వరకు కధ సరిపోయింది గాని కథ పూర్తి కాలేదనిపించి  సరితా దేవి డైరీ కి అనుబంధంగా సరోజ డైరీ అనే నవలా కామిని హృదయం అనే నాటకం రాశాను" అని ముందు మాటలో రాసుకున్నారు.  మూడింట్లోనూ  హాస్యం వ్యంగ్యం తగు పాళ్ళలో ఉండి చాలా సరదాగా సాగుతుంది.            సరితా దేవి కూతురు పెళ్లి కోసం ఆరాట పడే సగటు మధ్య తరగతి ఇల్లాలు.    ఆమె ఉద్దేశంలో భర్త ఒట్టి నసుగుడు.     సందర్బానికి తగినట్టు మాట్లాడలేని   అడవి మనిషి.   సరితాదేవి కూతురు సరోజ.  ఇంటర్ ఆ సంవత్సరమే పాస్ అయింది.   తల్లి ధృష్టిలో విషయం అర్ధం చేసుకోలేని పెద్దమ్మ.   కానీ కూతురంటే విపరీతమైన ప్రేమ.    ఎవరు చక్కటి చీర కట్టుకున్నా నగలు పెట్టుకున్నా తన కూతురుకి కూడా అలాంటివి దిగేసి  నలుగురు కూతురిని అందంగా ఉందని మెచ్చుకోవాలి అని ఆరాటం.     సరొజకు ఇవన్ని నచ్చవు.    ఇలాంటి విషయాలలో తల్లి కూతురు ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు.           సరోజ ఇంటర్ ఆత్తెసరు మార్కులతో పాస్ అయిన అమ్మాయి.    " అమ్మకు అర్థం అయ్యేటట్టు చెప్పడం నాకు చేత కాదు.  ఆమె నామీద ఆపేక్ష తోనే చెబుతుంది.  గాని, ఆవిడ చెప్పినట్టాల్లా చేస్తే నేను నవ్వులపాలై పోవాలిసిందే.  ఆవిడ నన్ను కొంచెం కూడా అర్థం చేసుకోదు.  అటువంటి మనిషి ఆపేక్షకు వీలువేమిటి.    ఏదో కట్టుకోమంటుంది,  ఏవో పెట్టుకోమంటుంది.   నా వయసు తక్కువ చెప్పమంటుంది.   నన్ను నాలగా ఉండనివ్వక ఇంకే మహాలక్ష్మి లాగానో, అనసూయ లాగానో, రాధలాగానో చేస్తానంటుంది.  నన్ను నలుగురు అందగత్తె అనాలన్న ఆదుర్ధా నాకే లేనప్పుడు ఆవిడ ముచ్చట నేనేం తీర్చను." సరోజ ఆలోచనలు ఇలా సాగుతాయి.    సరోజ స్నేహితురాలు సావిత్రి.   ఇంటర్  ఫస్ట్ క్లాసు లో పాస్ అవుతుంది.    సరోజ ఉద్దేశం లో  సావిత్రి చాలా బాగా,  మగ స్టూడెంట్ లాగా చదువుతుంది.   ఎన్ని నగలు వేసుకుంటే మాత్రం  ఫస్టు మార్కు కు సరి అవుతుందా  అనుకుంటూ ఉంటుంది. సావిత్రి తండ్రి పబ్లిక్ ప్రాసిక్యూటర్.   సమాజం లో బాగా పలుబడి ఉన్న పెద్ద మనిషి.    ఆమె తల్లి సుశీలా,  సరితా దేవి  కూతుర్ల పెళ్లి విషయం లో పోటీ పడుతూ ఉంటారు.               సరితాదేవి  తమ్ముడు వాసు  డిల్లీ లో ఉంటాడు.   అతని ఆఫీసులోనే పనిచేసే  మనోరంజన్  తో కలిసి అక్కను  చూడడానికి సరితా దేవి ఇంటికి వస్తాడు.   మనోరంజన్ ఇంకా  పెళ్ళికాని అందగాడు.   డిల్లీ లో మంచి ఉద్యోగం చేస్తున్నాడు  అని తెలిసినప్పటి నుండి  ఎలాగైనా  కూతురిని  రంజన్ కి ఇచ్చి పెళ్లి చేయాలని ఆరాట  పడుతుంది.    ఆరోజు పుట్టిన రోజు కాక పోయినా  రంజన్ ని  బుట్టలో వేయడానికి సరోజకు  తలంటి  పోయడం మంచి చీర కట్టి నగలు పెట్టి అలంకారం చేయడం లాంటి వన్ని చేస్తూ ఉంటుంది.    రంజన్ సావిత్రి అన్న రాఘవరావుకి ఇంటర్ లో క్లాస్ మెటు కమ్ రూమ్మేటు.  అందుకని   అటు సుశీల కూడా  రంజన్ ని తన అల్లుడిని చేసుకోవాలని పన్నాగాలు పన్నుతుంది.  భర్తకున్న  పరపతీ కూడా ఉపయోగించి పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తుంది.    రంజన్  చివరికి ఎవరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు  అనే విషయాన్ని చాలా సరదాగా హస్యోక్తంగా చెప్పారు కుటుంబరావు గారు.   సరితాదేవి, సరోజ స్వగతం లో చెప్పినా ఎక్కడా గందరగోళం లేకుండా ఉంది.    ఇద్దరి మనసుల్లో పరకాయ ప్రవేశం చేసి రాశారు.    వీళ్ళ సమక్షం లో జరగని విషయాలు ఎవరో అమ్మలక్కల ద్వారా చెప్పించడం,   కథని ఏమాత్రం అటూ ఇటూ కాకుండా నడిపించడం,  హాస్య చతుర సంభాషణలు   చదువుతూ ఉన్నంత సేపు మనల్ని మనం మరచి పోతాం.              ఈ రెండు కధలకు  అనుబంధంగా రాసిన నాటకం కామిని హృదయం.   ఇది సుశీల ఇంట్లో జరిగిన సంభాషణల తోనూ , డిల్లీ లో రంజన్, వాసుల మధ్య సంభాషణలతోనూ ఉంటుంది.   "నాకు పెళ్లి అంటెనూ- నీళ్ళు అంటెనూ భయం లెదు.  కానీ వాటిల్లోకి ప్రవేశించడానికి కొంత మానసిక  ప్రయత్నం ఉండాలి.   స్వయం నిర్ణయం కావాలి.   అంతేగానీ,  ఎవరో వచ్చి వెనుకనుంచి అమాంతం తోసేస్తె?"--రంజన్ " సుశీలమ్మగారు మా అమ్మ కన్నా చెడ్డది కాదు.   మా అమ్మ అయితే ఇంత నాజుకులు కూడా ఉండవు.  మిమ్మల్ని పడగొట్టడానికి రోకలి బండ ఒకటి తీసుకొని వెంట బడుతుంది."  - సరోజ. " ఎంతసేపు చచ్చినవాళ్ల ఆత్మ కోసమే ప్రార్ధిస్తారు గాని, బతికుండగానే నాలాగా పోగొట్టున్నావాడి ఆత్మ కోసం ఎవరూ ప్రార్దించరు."-  రంజన్. బుద్ధి తెలిసినప్పటి నుండి నన్ను నేను కాపాడుకోవడమూ,  అనుక్షణము ముందు వెనుకా చూసుకుంటూండటమూ,  ఎంతో జాగ్రత్తగా ప్రతి విషయమూ నిర్ణయించుకోవడం చేస్తూ వచ్చాను.    నా బుద్ధీ, మనస్సూ,  అంతరాత్మా అహోరాత్రులు నాకోసం కాపలా కాశాయి.  మా అమ్మ ఆధారపడే మనిషైతే నేనింత ఘోరంగా తయారై ఉండను. " -- సరోజ.          సంభాషణలలో ఎంత హాస్యముందో  అంత ఆలోచింప జేస్తాయి.  చదువుతున్నంత సేపు  అమ్మాయిల పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు పడే  ఆరాటం అందులో ఉన్న సమస్య తీవ్రత అంతా కనబడుతుంది.    సరితాదేవి అల్లుడిని సంపాదించే జిమ్మిక్కులు చూసి కాసేపు నవ్వుకున్నా నెమ్మదిగా ఆమె అంటే జాలి పుడుతుంది పాఠకుల్లో.       ఈ కథలు యాభైల్లో రాశారు. అంటే  అరవై ఏళ్ల తరువాత కూడా సమస్య పూర్తిగా పోలేదు.   కాస్త తీవ్రత తగ్గింది అంతే.   కధలు చదువుతున్నంతసేపూ ఇదివరకు కొడవగంటి కుటుంబరావు గారి కధలు చదవని వాళ్ళయితే చదవనందుకు నిజంగా బాధ పడతారు.           - ఝాన్సి మంతెన

లచ్చి

  లచ్చి       - గూడూరి సీతారం చిన్నచిన్న కథల్లో హృదయం పట్టనంత భావాన్ని చెప్పిన రచయిత గూడూరి సీతారం. తెలంగాణలో తొలితరం కథకుల్లో సీతారాంది ప్రత్యేకమైన శైలి. మాండలిక పదాల్ని అందంగా కథల్లో ప్రయోగించారు. పల్లెటూరి జీవితాలను, వారి బతుకుల్లోని కఠిన వాస్తవాలను తన రచనల్లో చిత్రీకరించారు. వీరి కథలు నేల విడిచి సాము చేయవు. ప్రతీకాత్మకంగా సాగి మనసుల్లోని మాలిన్యాన్ని బయట పెడతాయి. సీతారాం రాసిన "లచ్చి" కథ బిచ్చగాళ్ల జీవితాల్లోని మానవీయ సంబంధాల లోతుల్ని ఆవిష్కరింస్తుంది. కథలోకి వెళ్తే-         బిచ్చగాళ్లలో ఒక ఆచారం ఉంది. కొడుక్కు పెళ్లి కాగానే వేరే కాపురం పెట్టిస్తారు. వాళ్లకు కావాల్సింది వాళ్లు సంపాదించుకొని తినమంటారు. లచ్చి, రంగడు భార్యా భర్తలు. ఆచారం ప్రకారం పెద్ద వాళ్లనుంచి విడిపోయి ఓ గుడిసెలో వేరుకాపురం పెడతారు. లచ్చి వాళ్లలో ఎవ్వరూ చెయ్యలేనంత పనిచేస్తుంది. పైగా అందంగా ఉంటుంది. భాగాలు పంచుకుంటే రంగనికి రెండు పాతకుండలు, ఒక కమ్మకోత కత్తి, రెండు అంబలి పోసుకునే బుర్రలు, రెండు బిచ్చమెత్తుకునే కమ్మజోలెలు వస్తాయి. రంగడు ఈత కమ్మకోసుకొస్తాడు. మధ్యాహ్నం నుంచి ఎంట్రకాయలో, చేపలో పట్టుకొచ్చి అమ్ముతాడు. మందుచెట్ల ఏళ్లు తవ్వకొచ్చి అమ్ముతుంటాడు.మధ్యాహ్నానికి తన పాలిటి గంజి అడక్కొచ్చుకుంటాడు. అప్పుడప్పుడు కల్లు తాగి, బుద్ధి పుడితే భార్యకు కూడా తెస్తాడు. భార్య లచ్చి రంగడు తెచ్చిన కమ్మతో చాపలు అల్లి అమ్ముకొస్తుంది. అలానే రాత్రికి ఇద్దరికి కావల్సినంత గంజి అడ్కకొస్తుంది. ఇలా వాళ్ల కాపురం ఎటువంటి గొడవలు లేకుండా అన్యోన్యంగా హాయిగా సాగిపోతూ ఉంటుంది.           సహజంగా బిచ్చగాళ్లు సంచారంచేస్తూ జీవిస్తుంటారు. వానాకాలం దగ్గరపడడంతో రంగడి తండ్రి, బంధువులు వేరే ఊళ్లకు వెళ్లిపోతారు. రంగడికి ఓ కాపు దగ్గర కూలి దొరకడంతో భార్యతో కలిసి ఆ ఊళ్లోనే ఉండిపోతాడు. కానీ ఒకరోజు రంగడిని పోలీసులు పట్టుకెళ్తారు. లచ్చికి పోలీసులు ఎక్కడ ఉంటారో, ఎందుకు భర్తను పట్టుకెళ్లారో తెలియదు. అయినవాళ్లు ఎవ్వరూ లేరు. దాంతో ఒక్కతే కుమిలి కుమిలి ఏడుస్తుంది. నాలుగురోజుల తర్వత రంగడు ఇంటికి తిరిగి వస్తాడు. లచ్చికి వెయ్యేనుగుల బలం వస్తుంది. నూకల గంజికాసి పెడుతుంది. రంగడి మీద అనుమానంతో పోలీసులు పట్టుకెళ్లారు. వళ్లు సున్నం అయ్యేలా కొట్టారు. కానీ ఊళ్లో రంగడు తలెత్తుకుని తిరగలేక పోతాడు. అందరూ దొంగలా చూస్తుంటారు. పని ఇచ్చిన కాపుకూడా మాటలు అనడంతో రంగడు, లచ్చితో కలిసి పట్ఠణం వలసపోతాడు.        పట్టణంలో బిచ్చమెత్తుకొని జీవించడం కష్టంగా ఉంటుంది. ఆహారపు అలవాట్లు కూడా మారతాయి. బిచ్చమెత్తుకుని కూడబెట్టుకున్న డబ్బుతో పాటు, కొంత అప్పుచేసి రంగడు రిక్షా కొంటాడు. రంగడు పనిలో పడి ఇంటికి రావడం తగ్గిస్తాడు. రిక్షాకు తెచ్చిన అప్పు కట్టాలని రూపాయి రూపాయి కూడబెడతాడు. కానీ ఒకరోజు పోలీసులు దీపం లేకుండా రిక్షా నడుపుతున్నాడని రంగడ్ని పట్టుకుంటారు. చివరకు యాభై రూపాయలు లంచం ఇవ్వాల్సి వస్తుంది. కూడబెట్టిన డబ్బు అంతా ఖర్చైపోతుంది. క్రమంగా రంగడికి రిక్షా మిత్రులు ఎక్కువై పోతారు. సిగరెట్లు, పాన్ లు, ఛాయ్ లు అలవాటవుతాయి. లచ్చి చెప్పినప్పుడు తలూపి, బయట మళ్లీ తాగుతూనే ఉంటాడు. రిక్షా వాళ్లు కాపురం ఉండే మురికిపేటలో రంగడూ ఓ ఇల్లు అద్దెకు తీసుకుంటాడు. అలానే లచ్చి అడుక్కోవడం మానేసి నాలుగు ఇల్లళ్లో పాచిపని చూసుకుంటుంది. అయినా ఇంట్లోకి కావాల్సినవి అన్నీ కొనడం వల్ల... సంపాదన చాలదు.            ఒక రోజు రంగడు చాలా పొద్దుపోయినా ఇంటికి రాడు. లచ్చి ఎదురుచూస్తూ ఉంటుంది. చివరకు రంగడు తాగి ఇంటికి వస్తాడు. వాంతి చేసుకుంటాడు. ఆ వాసన కల్లుకాదని అర్థం చేసుకున్న లచ్చి, భర్త చెడిపోతున్నాడని బాధపడుతుంది. అతని కాళ్లకు, చేతులకు తగిలిన దెబ్బలకు సున్నం పెడుతుంది. తెల్లారి రంగడు ఇంకెప్పుడు అలా చేయనని మాట ఇస్తాడు. రోజూ ఇంటి అద్దెవాళ్లు, రిక్షాకు కట్టాల్సిన బాకీ వాళ్లు వస్తుంటారు. వాళ్లు వచ్చినప్పుడు రంగడు ఇంట్లో ఉండడు. ఒకప్పుటిలా సంపాదించింన డబ్బు రంగడు లచ్చికి ఇవ్వకుండా తనదగ్గరే ఉంచుకుంటుంటాడు. లచ్చి బాకీవాళ్ల గురించి రంగడికి ఎంత చెప్పినా వినిపించుకోడు. సేటు రాత్రి వరకు ఎదురు చూసి డబ్బులు ఇవ్వకపోతే ఊరుకోను అని బెదిరించి వెళ్లి పోతాడు. అలా సేటు వెళ్లగానే ఇటు ఇంటికి వచ్చిన రంగడు లచ్చిమీద అనుమానంతో బూతులు తిడుతూ, చెడిపోయావని కొడతాడు. లచ్చికి మాత్రం అలా ఎందుకు అంటున్నాడో, కొడుతున్నాడో అర్థంకాదు.         ఆ రోజునుంచి రంగడు ఇంటికి రావడం పూర్తిగా మానేస్తాడు. లచ్చికి తిండి కూడా కష్టమై పస్తులు ఉండాల్సి వస్తుంది. అటు అప్పుల వాళ్లతో, ఇటు భర్తపెట్టే కష్టాలతో, తిండి లేక లచ్చి పరిస్థితి కనాకష్టమైపోతుంది. ఒక రోజు రంగడు పెందలాడే ఇంటికి వస్తాడు. వస్తూ... వస్తూ... తన ఇంటి మలపులో ఎవరో కనిపిస్తారు. అంతే అగ్గిమీద గుగ్గిలమై భార్యను చావదన్ని బయటకు వస్తాడు. భార్యమీద పట్టరానంత కోపం, కసి. అంతే... రిక్షా తొక్కుతూ ఉంటే యాక్సిడెంట్ అవుతుంది. ఆసుపత్రిలో పాలవుతాడు. భార్య వచ్చినా చూడడు. లచ్చికి కూడా తనతో అంత ఇష్టంగా కాపురం చేసిన రంగడు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో అర్థం కాదు. రంగడికి సాయంత్రానికి పూర్తి తెలివి వస్తుంది. తను ఇన్ని కష్టాలు పెడుతున్నా, కొట్టిన దెబ్బలతోనే తన దగ్గరికి వచ్చిన భార్యను చూస్తాడు. ఆలోచనలో మునిగి పోతాడు. ఏదో తళుక్కుమన్న భావన కలిగి... ఆ ఇంటి నుంచి బయటకు వస్తూ కనిపించింది, తను అప్పు తీసుకున్న సేటు అని, అప్పు అడగడానికే వెళ్లాడని, ఆ మాట లచ్చి పదేపదే చెప్తున్నదని జ్ఞప్తికి తెచ్చుకుంటాడు. "లచ్చీ...! నన్ను క్షమించు" అని ప్రాదేయపడతాడు. లచ్చి కళ్లలో ఆనందభాష్పాలు పూస్తాయి.              ఇలా కథను ఎక్కడా బిగి సడలకుండా చెప్పాడు సీతారం. భార్యభర్తల అన్యోన్యం, అనుమానం, మబ్బులు తొలిగిన చంద్రుడిలా అవి విడిపోవడం....కథ చదువుతుంటే.. ఆద్యంతం ఓ చిత్రాన్ని చూస్తున అనుభూతి కలుగుతుంది. అంతేకాదు బిచ్చగాళ్ల జీవితాలతో వచ్చిన కథల్లో ఈ కథ మణి వంటిది.       - డా. ఎ.రవీంద్రబాబు

తోడొకరు౦డిన...

తోడొకరు౦డిన... సన్నటి జల్లు ! అదీ ప్రేమగా ఇష్టంగా పూల రెక్కలు కురిపి౦చినట్టు. ఓ చిన్న చిలకరింపు , అంతే, అంతలోనే ఏ గాలి పల్లకీలు తరలించుకు పోయాయో మబ్బులన్నీ పరుగెడుతున్నట్టు తేలికైన మనసుల్లా ఎగిరిపోయాయి. అంతవరకూ అక్కడో ఇక్కడో తిరుగుతున్నా వారంతా మొక్క మొలిచి పోతామన్నట్టు  చెట్టు నీడల్లోకో , చినుకు కురవని భవనాల లోకో జారుకున్నారు. పద్మ నవ్వుకుంది. ఎంత బావుంది రాలిన చినుకుల పలకరింపు. చెక్కిలిపై వాలి సుతారంగా జారుతున్నదొక చినుకైతే, పెదవిపై వాలి రెచ్చగొడుతూ ఒక చిరుచినుకు కంటి రెప్పలను సవరిస్తూ కలలు వెదుక్కుంటూ మరో చినుకు. ఆ స్పర్శే చిత్రంగా ఉంది.తుడుచుకోవాలని కూడా అనిపించలేదు. లేచి వెళ్లి ఎదురుగా ఉన్న కాఫీ పాయింట్ నుండి వేడి వేడి కాఫీ తెచ్చుకు మళ్ళీ అదేదో తన స్వంత స్థలమైనట్టు వచ్చి కూచుంది. ఉదయం నిద్ర లేవకుండానే ఫోన్ అది ఎవరిదో చూడక్కర్లేదు. ఇంత ఉదయాన ఫోన్ చేసేది అతనే. కళ్ళు తెరవకుండానే పక్కనున్న దిండు కి౦దను౦డి సెల్ తీసుకుని ఆన్ చేసింది. ఒక్క క్షణం ఆగి “హలో” హస్కీగా పలికి౦ది నిద్ర నిండిన స్వరం. చప్పున గుర్తుకు వచ్చి౦ది రామ్ ఎన్ని సార్లు చెప్పాడో ,  “ ఉదయం ఇంకా నిద్రలేవక ముందు నీ స్వరం ఎలాఉ౦టు౦దో తెలుసా?” చెక్కిలిపై ముని వేలితో సున్నాలు చుడుతూ అడిగాడు.  “నాకెలా తెలుస్తుంది, నా స్వరం నేనే ఎలావినడం ?” “అవును కదూ , మాంచి సెక్సీ గా అనిపిస్తుంది” తుళ్లిపడి అతని చెయ్యిని తప్పించి కాస్త పక్కకు జరిగింది. అదేమీ పట్టించుకోకుండా “గొప్ప పిచ్చెక్కిస్తు౦ది. అబ్బో” చాలా మంది చెప్పారు స్వరం విలక్షణంగా ఉ౦టు౦దని. కాని మరీ ఇలా.. ఎందుకో ఆమాట పెద్ద ఇష్టంగా అనిపించలేదు. “ ఇంకా నిద్రలేవలేదా?” “ఊ, లేస్తూ లేస్తూ .. చెప్పు”  “తెలుస్తోంది, అనుకున్నాను గాని , సరే ఈ రోజు మనం అనుకున్నట్టు వెళ్ళడం కుదరదు పద్దూ. ఒక అర్జెంట్ వర్క్, వరంగల్ వెళ్లి రావాలి” తడుముకుంటూ చెప్తున్నట్టు ఉంది స్వరం. “ఊ’..” ఏమీ అనలేదు పద్మ. “ సారీ రా, మళ్ళీ వారం చూద్దాం. “ “ ఊ , సరే “ మరింక అతనితో మాటలు పొడిగి౦చాలని అనిపి౦చలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ దిండులో  తలదూర్చి మళ్ళీ నిద్రపోదామని అనుకున్నా ,మరిక మత్తు వదలిన మనసు సహకరి౦చ లేదు. చటుక్కున లేచి , కప్పుకున్న బ్లాంకెట్ మడతవేసి బయటకు నడిచి౦ది. సరిగ్గా ఎనిమిదింటికి పనిమనిషి వస్తుంది. నిజానికి ఎప్పటినుండో వర్గల్ వెళ్లి సరస్వతీ దేవిని చూసి రావాలన్న కోరిక. క్రితం వారం సినిమాకి వెళ్ళినప్పుడు మాటల సందర్భంలో వచ్చి౦దా విషయం. “ ఇంత చిన్న విషయం వాయిదాలేమిటి ? వచ్చే వారం వెళ్దాం. పెద్ద పండగ రోజులు కావు, స్కూల్ సెలవలూ కావు గనక రష్ ఉండదు. వెళ్లి వద్దాం” “ నీకు వీలవుతుందా ?” “ శనివారమేగా వెళ్దాం” వారం నుండి ప్రతి క్షణం అవే ఊహలు. అసలు చిన్నప్పటినుండీ అనుకున్నవేవీ జరగవు. అయినా పెద్దగా కోరికలేమీ  పెంచుకోలేదు. ఇలా చూడాలని ఉ౦దనగానే వెళ్దామనడం పెద్ద థ్రిల్లింగ్ గా అనిపి౦చి౦ది. అసలు రామ్ పరిచయమే పెద్ద థ్రిల్. ఆ రోజు కూడా శనివారమే. పని చేసేది హైటెక్ సిటీ లో ఒక ఎం ఎన్ సి లో , అయిదు  రోజులు బండ చాకిరీ చేసాక దొరికే సెలవురోజులు పూర్తిగా తనకోసం తనకిష్టమైన విధంగా గడిపే౦దుకే ఎప్పుడో నిర్ణయించుకు౦ది. పాత బస్తీలో ఉన్న అమ్మా నాన్నలను చూసేందుకు వెళ్ళేది ఇదివరలో , కానీ ఇప్పుడు వెళ్లాలనీ అనిపించడం లేదు. వెళ్తే ఏముంది ఎప్పటిలా ఇబ్బందుల ఏకరువు , లెక్కచెయ్యని అన్నదమ్ముల మీద ఫిర్యాదులు మూతి తిప్పుకు౦టూ అసహనం వ్యక్తపరచే మరదళ్ళు, అంతేగా. అందుకే “ఆఫీస్ పని శనివారాలూ ఉ౦ద౦టూ” చెప్పి క్రమ౦గా వెళ్ళడం తగ్గించుకుని సినిమానో లేకపోతె మాల్ లో తిరగడమో అలవాటు చేసుకుంది. ఆ రోజున అలాగే మాల్ లో తిరుగుతూ విండో షాపింగ్ తో తృప్తి పడుతూ , జారిన కళ్ళద్దాలు సవరి౦చు కుంటూ నడుస్తున్న పద్మ ఎదురుగా వస్తున్నా అతన్ని గమనించనే లేదు. అతనూ అంతే, ఎవరికో మెసేజ్ టెక్స్ట్ చేస్తూ వస్తున్నవాడు ఒకరినొకరు బలంగా గుద్దుకునే వరకూ గమనించనే లేదు. పడి పోబోతున్న పద్మను ఆపేందుకు చాపిన చేతిలో వాలిపోయి నిలవరి౦చు కోలేక అతన్ని హత్తుకుపోయి౦ది. ఇద్దరికిద్దరూ తెల్లబోయి, తమాయించుకుని “సారీ సారీ సారీ “ అన్న మాట కోరస్ లా సాగి ఆగింది. ఇద్దరూ ఒకరినొకరు చూసి నవ్వుకున్నారు. “ పద్మ , పద్మా శంకరమంచి “ “ రామ్, అభిరాం “ ఇద్దరూ ఒకేసారి పేర్లు చెప్పుకుని చేతులు చాపారు. కలిసి కాఫీ తాగారు. మరోగంత కలిసి తిరిగారు. ఒకరి గురించి ఒకరు తెలుసు కున్నారు. అతనో సాఫ్ట్ వేర్ కంపెనీలో డైరెక్టర్. చివరకు సెలవు తీసుకోబోయే వేళ ఆమె కాబ్ కి ఫోన్ చేయ్యబోడంతో ఆపి లిఫ్ట్ ఆఫర్ చేసాడు. కాదనలేదు పద్మ. అపార్ట్మెంట్ చేరేసరికే పదిగంటలు దాటింది. వచ్చినవాడిని గెట్ వద్దే వెనక్కు ప౦పలేకపోయి౦ది. తాళం తీసి లోనికి ఆహ్వానించింది. “ఒక్కరే ఉంటున్నారా?” “అవును. రోజూ సిటీకి వెళ్లిరాడం  కుదరటం లేదు.” అని మాట మార్చి ” మొహం కడుక్కుంటారా ?” అని అడిగి మొహమాటపడుతున్న అతనికి బాత్ రూమ్ చూపింది. ఆటను ఫ్రెష్ అయివచ్చే లోగా లోనికి వెళ్లి ఎం ఉన్నాయో చూసి వచ్చింది. వేడిగా రైస్ కుకర్ లో అన్నం , గాస్ మీద చారు పెట్టి ఫ్రిజ్ లో ఉన్న కూరలు తీసి మైక్రోవేవ్ లో వేడి చేసి పెట్టింది. మొహం  తుడుచుకుని రిఫ్రెష్ అయివచ్చిన అతనికి సోఫా చూపుతూ , తనూ రిఫ్రెష్ అయ్యే౦దుకు వెళ్ళింది. “ ఏమనుకోకపోతే, ఎందుకు నువ్వు పెళ్లి చేసుకోలేదు ?” పద్మ ఆఫర్ చేసిన డ్రింక్ తీసుకు౦టూ అడిగాడు. కాసీపు తలవంచుకుని ముదురు తోపు రంగు నెయిల్ పాలిష్ వేసిన గోళ్ళను చూసుకుని, తలెత్తి “ చేసుకు౦దామనీ వద్దనీ ఏమీ అనుకోలేదు. చాలా ఏళ్ళు  అమ్మా నాన్నే సంబంధాలు చూసారు, కొన్ని వాళ్లకి నచ్చక కొన్ని నాకు నచ్చక మరికొ౦దరికి మేము నచ్చక  చూస్తుండగానే ఏళ్ళు గడిచిపోయాయి.” చటుక్కున లేచి వచ్చి ఆమె పక్కన కూచు౦టూ , “ రిగ్రేట్ అవుతున్నారా ?” ఓదార్పుగా అడిగాడు. జవాబివ్వలేదు పద్మ. “ఏమో ..” ఎప్పుడూ ఆలైన్ లో ఆలోచన రాలేదు. “ నా పెళ్లై పాతికేళ్ళు “ “అవునా?” ఆశ్చర్యం ప్రకటి౦చి౦ది పద్మ. నిజమే , అతనంత వయసున్నవాడిలా అనిపించడు. “ నా భార్య శ్రావణి కూతురి పురిటి కనీ అమెరికా వెళ్ళింది” మరింత ఆశ్చర్యపోయి౦ది. “ వచ్చే నెల వరకూ రాదు. కొడుకు అక్కడే పీ హెచ్ డీ చేస్తున్నాడు. మొన్నే యాభై రెండు దాటాయి . కాని అలా అనిపి౦చను కదూ” తలూపింది. అవును. వయసులో పెళ్లి జరిగిఉంటే తనకూ అంత పెద్ద పిల్లలే ఉండే వారు. ఎందుకు అడిగి౦దో  ఏమిటో  కాని అడిగేసింది “నేనెలా కనిపిస్తాను “ “ లేట్ ధర్టీస్ ఆర్ అర్లీ ఫార్టీస్ అనిపిస్తావు” అతనికి చెప్పలేదు తను అతనికన్నా ఓ ఏడాది పెద్ద అని. ఆరాత్రే కాదు , ఆదివారం అంతా అక్కడే ఉ౦డిపోయాడు అభిరాం. రెండునెలల్లో శనాది వారాలకు రెక్కలు రావడం , మిగతా అయిదు రోజులూ సుదీర్ఘమవడం జరిగింది శ్రావణి అమెరికా నుండి వచ్చినా అతని రాకపోకలు ఆగలేదు. కానైతే కుదిరినప్పుడే. ఉదయం అతను రానని అన్నాక చిన్నప్పటి నేస్తం గౌరీకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పాపెట్టకుండా వెళ్ళింది. తలుపులు చేరవేసి ఉన్నాయి. నాక్ చెయ్యబోయి ఆగిపోయింది. “ అందుకే ఇంట్లో ఉ౦డబుద్ధి కాదు, ఏడుపు మొహం , దానికి తగ్గట్టు అనుమానాలు “ “ ఇప్పుడు ఏమన్నాననీ, ‘శనివారం సెలవేగదా ‘ అనేగా “ గౌరీ స్వరంలో ఏడుపు. విసురుగా తలుపు తెరిచిన గౌరీ భర్త కాస్త తొట్రుపడి “ గౌరీ మీ ఫ్రె౦డ్ “ అంటూ ఓ అతికి౦చుకున్న నవ్వు విసిరి వెళ్ళిపోయాడు. సందిగ్ధంగానే లోనికి వెళ్ళక తప్పలేదు. గౌరి ఒక్కనిమిషం  అంటూ లోనికి వెళ్లి మొహం కడుక్కు వచ్చి౦ది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. “ సారీ గౌరీ , మరోసారి కలుద్దామా ?” ఎ౦బరాసి౦గ్ గా ఫీలయి అడిగింది. “భలే దానివే , మనకు మొహమాట మేమిటి ? “ అ౦టూ సర్దుకుని మాటలు మొదలెట్టి౦ది. ఎంతో సేపు ముభావంగా ఉ౦డలేకపోయి౦ది గౌరీ. భర్త మరొకరితో అఫెయిర్ ఉందని ఖచ్చితంగా తెలుసట. ఆమెను తను చూసిందట కూడా. “ ఏమీ చెయ్యలేను పద్మా, ఆవిడకు పెళ్లైంది.భర్త ఉన్నదో వదిలేసి౦దో  తెలియదు” “గట్టిగా అడిగేయ్యకపోయావా ?” ఆవేశపడింది పద్మ.  , కానే ఎందుకో వెంటనే ఆమెకు  అభిరాం గుర్తుకు వచ్చాడు. శ్రావణి కూడా ఇలాగే అనుకు౦టో౦దా ? “ఎవరిని అడగను ? అతన్ని నిలదీస్తే నిజమే నాకు ఆవిడే కావాలంటే ఏం చెయ్యను? ఆవిడను అడిగే అధికారం నాకెక్కడిది? సాటి స్త్రీగా ఒక్క తననే ఎలా బ్లేమ్ చెయ్యను సగం పొరబాటు కాదు కాదు చాలా మటుకు ఇనీషియేటివ్ ఇతనిదే అయిఉ౦టు౦ది” నిజమేగా! “ అభిరాం చొరవేగా ఈ రోజున అతని చేతి వంపులోనో , గు౦డెలమీదో సేదదీరడానికి మూలం. ఇమోషనల్ గా తప్ప నేను అతనిపైనో ఆటను నాపైనో ఏవిధంగానూ ఆధారపడి లేము.” అనుకు౦ది పద్మ. ఎంతో సేపు అక్కడ  ఉ౦డలేక ఇంటికి వెళ్ళలేక అల౦కృత గార్డెన్స్ కి వెళ్ళింది. రెండు నెలల క్రితం ఇద్దరూ అక్కడ రోజంతా గడిపారు. అప్పుడు దూరంగా పూపొదరిళ్ళ మధ్యన ఉన్న ఆ బెంచీ మీదే కూచుని రోజంతా గడిపినది. వెళ్లి అక్కడే కూచు౦ది. చీకట్లు అల్లుకోబోయే వేళ లేచింది. అంతవరకూ మూగవోయిన ఫోన్ రింగయి౦ది. “ ఎక్కడ ఉన్నావ్? ఫోన్ నాట్ రీచేబుల్ అ౦టో౦ది “ ఆదుర్దాగా అడిగాడు అభిరాం. “ దారిలో ఉన్నాను, ఇంటికి వెళ్తున్నా “ అందకుండా పొందకు౦డా జవాబిచ్చి౦ది . మర్నాడు ఉదయం ఫోన్ నిద్రలేపలేదు. స్విచ్చాఫ్ చేసి పడుకు౦ది పద్మ. అయిదు రోజులు అన్యమనస్కంగా గడిచాక శనివారం ఉదయం డోర్ బెల్ శబ్దానికి లేచి నిద్రకళ్ళతో నలిగినా నైటీ సరిచెసుకు౦టు తలుపుతీసింది పద్మ. ఎదురుగా అభిరాం. పక్కకు తప్పుకుని అతను లోనికి రాగానే డోర్ వేసి ఒక్క మాటా లేకుండా అతన్ని అల్లుకుపోయి౦ది. ఇద్దరికీ మాటలు పెగల్లేదు . swatee Sripada