వెర్రి మొగమాటం (కథ)

    వెర్రి మొగమాటం (కథ)  - మొక్కపాటి నరసింహశాస్త్రి     మొక్కపాటి నరసింహశాస్త్రి పరిచయం చెయ్యాల్సిన అవసరం లేని హాస్య రచయిత. బారిష్టరు పార్వతీశం వీరి ప్రసిద్ధ రచన. చలనచిత్రంగా కూడా వచ్చింది. అసలు వీరి సంభాషణే హాస్యంతో కూడి ఉంటుందని చెప్తారు పరిచయస్థులు. బందరు జాతీయ కళాశాలలో చాలాకాలం ఉద్యోగం చేశారు. చమత్కారి అయిన మొక్కపాటి నరసింహశాస్త్రి కేవలం హాస్య కథలే కాకుండా సీరియస్ కథలు, నాటికలు కూడా రాశారు. వారు రాసిన హాస్య సంజీవిని వంటి కథే 'వెర్రి మొగమాటం'.        'వెర్రి మొగమాటం' కథలో ప్రధాన పాత్ర ఉమ్మాయి. ఉమ్మాయి అసలు పేరు ఉమామహేశ్వరరావు. ఉమామహేశ్వరరావు అనే పేరును ఆఖరుకు ఉమ్మాయే మర్చిపోతాడు. పుట్టినప్పుడు మాత్రమే అతడ్ని ఆ పేరుతో పిలిచి ఉంటారు. తర్వాత అందరూ ఉమ్మాయే అని పిల్తుస్తుంటారు. ఒకవేళ ఎవరన్నా ఉమామహేశ్వరరావు అంటే తన పేరు కాదని ఉలిక్కిపడేవాడు. అదీగాక ఎవరు కొత్తగా పరిచయం అయినా మొదట మర్యాదగా మాట్లాడినా వెంటనే 'అరేయి ఉమ్మి' అని సొంత మనిషిలా మాట్లాడేస్తారు. ఉమ్మాయి కూడా బాగానే కలిసిపోతాడు. ఉమ్మాయికి మొగమాటం కూడా ఎక్కువే. అందువల్ల అతని స్నేహితులు అందరూ ఉమ్మాయిని హాస్య నిలయుడిగా చూసేవారు. అసలు ఏమాత్రం హాస్య స్ఫోరకం లేని వాళ్లకు కూడా ఉమ్మాయిని చూడగానే హాస్యం పుట్టుకొచ్చేది.           ఉమ్మాయిలో మరోలోపం ఏమిటంటే ఎవరేది చెప్పినా కాదనలేక పోయేవాడు. దాంతో అందరూ అతడ్ని కష్టాలు పెట్టేవాళ్లు. చిన్నప్పుడు ఒకసారి నలుగురు స్నేహితులు ఉమ్మాయిని కూర్చోపెట్టి ముప్పై ఇండ్లీలను బలవంతంగా తినిపించారు. కానీ ఉమ్మాయి మాత్రం 'నేను తినను... నా వల్ల కాదు' అని గట్టిగా చెప్పేవాడు కాదు. ముప్పై ఇడ్లీలకు తినడంతో ఉమ్మాయికి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. ఆ బాధ తీరడానికి అతని స్నేహితులే మళ్లీ జింజిర్లు తాగించి, వాంతి చేయించి, అగ్నితుండి మాత్రలు వేసి నానా అవస్థలు పెట్టారు. అప్పుడు కానీ ఉమ్మాయి ఆరోగ్యం బాగు కాలేదు. కాలేజ్ లో చదువుకునేటప్పుడు వార్షికోత్సవానికో, పాత విద్యార్థుల సంఘం వార్షికోత్సవానికో ఓ వినోద కార్యక్రమం జరుగుతుంటే- ఉమ్మాయి యోగాసనాలు వేస్తాడని అనౌన్స్ మెంట్ చేస్తాడు అతని స్నేహితుడు. ఉమ్మాయి 'నావల్ల కాదు, నేను ఏమీ చేయలేను' అని చెప్పినా వినిపించుకోకుండా స్టేజీ మీదకు లాక్కుపోతారు. అక్కడ ఉమ్మాయి శీర్షాసనం వేయలేక నానా తంటాలు పడితే అందరూ నవ్వుకుంటారు.            ఉమ్మాయి స్నేహితులలో ఎక్కుమంది మద్రాసువాసులవుతారు. అందువల్ల ఉమ్మాయి అప్పుడప్పుడు మద్రాసు వెళ్లి పదిరోజులు ఉండివస్తుండేవాడు. ఉమ్మాయి మద్రాసులో ఉన్నన్ని రోజులు వాళ్ల స్నేహితులకు ఇట్టే గడిచిపోయేది. అలా వెళ్లిన ప్రతిసారి ఉమ్మాయి అనుకున్న సమయం కన్నా మరో పదిరోజులు ఎక్కువ ఉండేవాడు. అలా ఒకసారి ఉమ్మాయి మద్రాసు వెళ్లి నప్పుడు పదిరోజులు సరదాగా గడిపి, తిరిగి వద్దాం అనుకునేటప్పుడు అతని స్నేహితుడు వెంకన్న వచ్చి ' వెళ్లు నాయనా వెళ్లు, నీకేం మహారాజువు. నిన్ను అడ్డు పెట్టేవాళ్లు ఎవరు... మేం ఎలా చస్తే నీకేం...' అని నిష్టూరంగా మాట్లాడితే ఉమ్మాయి అతనికి నా వల్ల ఎలాంటి అవసరం ఉందో అనుకుని అక్కడే ఉండిపోతాడు. అలా పదిరోజులు మద్రాలులోనే ఉన్నాడు. తర్వాత పాండీ బజారులో ఎవరితోనే నేను ఊరికి వెళ్తున్నాను అంటే... వెంటనే అక్కడ నలుగురు స్నేహితులు చేరి 'నీతో బోలెడంత పని ఉంది.. నువ్వు వెళ్లడానికి వీలు లేదు' అని చెప్తారు. కానీ వాళ్లు ఎవ్వరూ ఉమ్మాయికి ఒక్కరోజు కూడా తిండిపెట్టినోళ్లు కారు. అసలు ఆ పదిరోజులు ఉమ్మాయికి వాళ్లు కనపడలేదు. ఉమ్మాయికి చేతిలో డబ్బులు అయిపోవడంతో- ఇంటి నుంచి వందరూపాయలు తెప్పించుకుంటాడు.          డబ్బులు వచ్చిన తర్వాత ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకొని మౌంటు రోడ్డులో ఇంట్లో వాళ్లకు అవసరమైనవి ఏవో... కొనుక్కుందామని వెళ్తాడు. అక్కడ శంకరం కనిపిస్తాడు. అంతే అతను ఉమ్మాయిని ఇంటికి వెళ్లనీయకుండా... విషయాన్ని స్నేహితులందరికీ చేరవేస్తాడు. అంతే చివరకు ఉమ్మాయిని తీసుకొని గోపాలం ఇంటికి, తర్వాత వెంకన్న ఇంటికి వెళ్తాడు. అక్కడ స్నేహితులందరూ కలిసి- తీర్మానాలు చేస్తారు. ఉమ్మాయి ఇప్పుడే ప్రయాణం చెయ్యడం భావ్యం కాదు. ఒకవేళ తర్వాత వెళ్లినా స్నేహితులు అందరికీ విందులు, వినోదాలు ఏర్పాటు చెయ్యాలి. తర్వాతే ఉమ్మాయిని రాజ గౌరవాలతో ఇంటికి పంపిస్తారు. అలా ఉమ్మాయి వాళ్ల దగ్గర మొగమాటానికి పోయి ఊరి ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటాడు. ఇక సినిమాలు, షికార్లు, నాటకాలు, ఫలహారాలు, విందులు ఏర్పాటు చేస్తాడు. సెలవలు ఉండడంతో మహాబలిపురం యాత్రకు కూడా వెళ్లి వస్తారు. చివరకు ఉమ్మాయి ఊరికి వెళ్లడానికి స్నేహితులందరూ ఒప్పుకుంటారు. గోపాలం ఉమ్మాయిని ఊరికి సాగనంపడానికి అతనితో కలిసి టాక్సీలో మౌంట్ రోడ్డుకు వస్తాడు. అక్కడ కాఫీ తాగుతారు. గోపాలం 'మీ ఇంటికి వెళ్లే టప్పుడు ఏవో కొనాలని అనుకున్నావు కదా... కొను' అని చెప్తాడు. అప్పుడు గోపాలం 'పోస్టాఫీసుకు వెళ్దాం' అని చెప్తాడు. లోపలికి వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత గోపాలం 'ఎక్కడికి వెళ్దాం' అంటే... ' బసకు వెళ్దాం. ఉన్న డబ్బు పూర్తిగా అయిపోయింది. ఇప్పుడే ఒక్క రూపాయి ఉంటే... దాంతో ఇంటికి టెలిగ్రామ్ ఇచ్చి వచ్చాను డబ్బులు పంపమని' అని చెప్తాడు.          ఇలా ఈ కథమొత్తాన్ని మొక్కపాటి నరసింహాశాస్త్రి మొగమాటం వల్ల ఉమ్మాయి అనుభవించే కష్టాలను చెప్తాడు. ఒక వెర్రి అమాయకుడిని స్నేహితులు ఎలా ఆడుుకుంటారో, ఏడిపిస్తారో ఈ కథ వల్ల తెలుస్తుంది. అందుకే సున్నితమైన హాస్యాననికి ఈ కథ ఓ మంచి ఉదాహరణ.                                                                   ......డా. ఎ.రవీంద్రబాబు

“చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు” 16 వ భాగం

  “చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు” 16 వ భాగం "పాండవులు అరణ్యవాసం చేసే సమయమున మార్కండేయ మహర్షి చూడడానికి వెళ్తారు. అప్పుడు ధర్మరాజు ఆయన్ని అడుగుతాడు..    "స్వామీ! ద్రుపదరాజ తనయ అయిన ద్రౌపది యజ్ఞవేదిక నుండి ఆవిర్భవించిన పవిత్ర మూర్తి. సుకుమారి. అయోనిజ. ధర్మమూర్తి అయిన ఆమెకి ఈ కష్టాలేమిటి? కానల తల దాచుకుని, కందమూలాలు తినవలసిన కర్మ మేమి? ధర్మాన్నే ఊపిరిగా భావించే నాకీ దుర్గతి ఏమిటి? మా వంటి దురదృష్టవంతులు ఎక్కడైనా ఉన్నారా? ఉంటే చెప్పండి."    మార్కండేయముని ధర్మరాజునకు ధైర్యం చెప్తూ.. వారే కాక చాలా మంది కష్టాలు పడిన వాళ్లున్నారని అంటూ సీత కథ అయిన రామాయణం, సావిత్రి చరిత్ర చెప్తారు.    రామాయణం మీకు బాగా తెలిసిందే కదా..    సావిత్రి కథ చెప్పుకుందాం."    పోతమ్మ, కోడలికేసి చూసి సైగ చేసింది. ఇంటి పనేమయినా ఉందా అన్నట్లు.. కోడలు అంతా అయిపోయిందని చెప్పగానే.. సర్దుకుని కూర్చుంది. అత్తా, కోడలు సౌకర్యంగా కూర్చుని.. వినడానికి సిద్ధంగా ఉండుట చూసి ఎర్రన మొదలుపెట్టాడు.    "పూర్వము మద్ర దేశాన్ని అశ్వపతి అనే రాజు పాలిస్తుండేవాడు. అతడు సత్యవ్రతుడు, దానశీలుడు, జనులకు ఇష్టుడు, ఉదార చరితుడు, జితేంద్రియుడు. అన్నీ ఇచ్చిన భగవంతుడు అతడికి పుత్ర సంతానము ఇవ్వలేదు.    సంతానము కొరకై అతడు సావిత్రీదేవిని పద్ధెనిమిది సంవత్సరాలు ఆరాధించాడు. నియమిత ఆహారముతో, కఠోర నియమాలతో, బ్రాహ్మణ సమేతుడై, ప్రతీ దినము గాయత్రీ మంత్రముతో లక్ష ఆహుతులు అర్పించాడు. సావిత్రీ దేవియే గాయత్రీ మాత.    గాయత్రీ మాత సంతసించి సుగుణవతి అయిన ఒక పుత్రికని ప్రసాదించింది. పుత్రుని కోరిన నరపతికి, ఈ పుత్రిక ద్వారానే తన కోరిక తీరునని చెప్పి అంతర్ధానమయింది.    సావిత్రీ సత్యవంతుల గాధను మార్కండేయముని ధర్మరాజుకు చెప్పాడని, జనమేజయునికి, వైశంపాయనుడు సర్పయాగంలో చెప్తాడు. అదే కథను సూతుడు శౌనకాది మునులకు నైమిశారణ్యంలో చెప్తాడు.    అశ్వపతి పట్టపురాణి మాళవి గర్భం దాల్చి, ఒక శుభ ముహుర్తాన బాలికను ప్రసవిస్తుంది. సావిత్రీదేవి వరప్రసాదం కనుక ఆ పాపకి సావిత్రి అని నామకరణం చేస్తారు. అందాల రాశి అయిన సావిత్రి అల్లారు ముద్దుగా పెరుగుతుంటుంది.    యుక్త వయసు వచ్చిన సావిత్రికి సౌందర్య గుణగణాల్లో దీటైన, తగిన వరుడ్ని తేవడం సాధ్యంకాదని తెలిసింది అశ్వపతికి.                             "అమ్మా! నీకు తగిన వరుడ్ని నీవే ఎన్నుకో.. మంత్రులు, సేవకులు నిన్ను సర్వ సన్నాహాలతో అనుసరిస్తారు. యాత్రకు బయలుదేరు. ఈడు వచ్చిన కన్యకు పెండ్లి చేయని తండ్రి, తండ్రి మరణించిన తల్లిని సరిగ్గా చూడని కొడుకు నిందాపాత్రులు."    తండ్రి యాజ్ఞను తలదాల్చి, వరాన్వేషణ ధ్యేయంగా యాత్రకు బయలు దేరుతుంది సావిత్రి.    దేశాన్నేలే రాజుకే వరాన్వేషణ కష్టమయి తనయను, తగిన వరుడ్ని తననే వెతుక్కోమని పంపాడు. అందరూ స్వయంవరాలేర్పాటు చేస్తే అశ్వపతి వరాన్వేషణకి అమ్మాయిని పంపాడు. కుమార్తెకు పూర్తిగా ఇష్టమయితేనే వివాహం చెయ్యాలి అని ఈ చరిత్రలు చెపుతాయి మనకి.    కుమార్తె మీద అటువంటి విశ్వాసం ఉంది ఆ రాజుకి. తనకి చేతకాని పని ఆమె చేయగలదని నమ్మకం. ఆమెయే ఎంచుకుంటే తన సంశయాలు పోయినట్లే.    స్వర్ణరధం మీద, పరిచారికలు, మంత్రులు, వృద్ధులూ అనుసరిస్తుండగా బయలుదేరింది సావిత్రి. ఎక్కడికి వెళ్ళాలి. ఏ విధంగా అన్వేషించాలి అనే నిర్ణయాన్ని సావిత్రికే వదిలి పెట్టారు పెద్దలు.    ముందుగా మునుల ఆశ్రమాలకు వెళ్ళాలని, పిదప తీర్థ క్షేత్రాలను దర్శించాలని సావిత్రి నిర్ణయించుకుంది.     "తపోవనాని రమ్యాణి రాజర్షీణాం జగామ హ     మాన్యానాం తత్ర వృద్ధానాం కృత్వా పాదాభి వాదనం     వనాని క్రమ శస్తాత సర్వాణ్యేవాభ్య గఛ్ఛత     ఏవం తీర్థేషు సర్వేషు ధనోత్సర్గం నృపాత్మజా."    రాజర్షులుండే తపోవనాలను దర్శించి, అక్కడ మాన్యులు, పెద్దలు అయిన మహర్షులను సందర్శించి వారికి నమస్కరించి, వారి ఆశీర్వాదాలను ముందుగా తీసుకోవాలి. ఆ తరువాత తీర్థ క్షేత్రాలలో తిరిగి, అర్హులకు దానం చెయ్యలని నిర్ణయించింది సావిత్రి.    కొండ అడ్డువస్తే నది మలుపు తిరిగినట్లే, తను తీసుకున్న నిర్ణయం మనిషి జీవితాన్ని మలుపు తిప్పుతుంది. నదులు ఆగకుండా ప్రవహించినట్లే జీవితాలు కూడా ఆగకుండా కాలప్రవాహంలో గడిచిపోతూ ఉంటాయి.    సరయిన నిర్ణయం తీసుకొనక పోతే జీవితంలో కష్టాలు తప్పవు. జీవితం అస్తవ్యస్తంగా నడుస్తుంది. వరనిర్ణయం సులువైన పని కాదు. అటువంటి కీలకమైన నిర్ణయం తీసుకునేటప్పుడు మహనీయుల ఆశీస్సులు కావాలి.    మహాత్ముల శుభాశీస్సులు ఎంతగానో ఉపయోగిస్తాయి.    అందుకనే తపోవనాలను దర్శించి మహర్షుల ఆశీస్సులను ముందుగా పొందాలని సావిత్రి అనుకుంది.    నిర్మల చిత్తులైన మహాత్ములకు నమస్కరించడం సంప్రదాయం. అదే విధంగా అర్హులకు దానం చెయ్యడం కూడా. నేడు ఇచ్చిందే రేపు మనకు వస్తుంది. ఇప్పుడు మనకు ఉన్న రాజభోగాలకి కారణం మనం ఎప్పుడో చేసిన దానమే!    సాధు దర్శనం, సపాత్రదానం ముగించి నగరానికి వచ్చింది సావిత్రి. తండ్రిని దర్శించి యాత్ర విశేషాలను చెప్పాలని వెడలింది.    అక్కడ నారద మహర్షి, అశ్వపతితో సంభాషిస్తూ కనిపించాడు. ఆయనకు నమస్కరించింది సావిత్రి.    "కుమార్తెకు వివాహయత్నం చేశావా రాజా" నారదుడు అడిగాడు.    "మహర్షీ! వరాన్వేషణ అమ్మాయికే వదిలిపెట్టాను. ప్రాజ్ఞురాలైన సావిత్రి యాత్రలు చేసి వచ్చింది. ఆమె ఎవరిని ఎంచుకుందో విందాం."    సావిత్రి సౌమ్యంగా, వీణ మీటి నట్లుగా చెప్పసాగింది.    "సాళ్వదేశరాజు ద్యుమత్సేనుడు ధర్మాత్ముడు. తన ఏకైక కుమారుడు బాలుడిగా ఉన్నప్పుడు, ఆ రాజుకు అంధత్వం ప్రాప్తించింది. రాజుకి కన్నులు లేవు, కొడుకు చిన్నవాడు.. శతృ రాజులు దేశం మీదికి దండెత్తి, రాజ్యాన్ని అపహరించారు.    మహారాజు భార్యా పుత్రులతో అడవికి వెళ్ళి నియమ నిష్టలతో తపస్సు చేసుకుంటున్నాడు. వారి కుమారుడే సత్యవంతుడు. మహారాజ పుత్రుడైనా కానలలోనే పెరిగాడు. మాయామర్మం తెలియనివాడు. నియమ నిష్టలుగలవాడు. జననీ జనకుల సేవలో జన్మని చరితార్ధం చేసుకుంటున్న సత్యవంతుడ్ని నేను వరించాను." తన నిర్ణయం చెప్పి తల దించుకుని నిలబడింది సావిత్రి.    సావిత్రి చెప్పినది విని మహర్షి అంగీకారం, ఆశీస్సులకోసం, వేచి చూచాడు అశ్వపతి.    నారదుడు ఉదాసీనంగా ఉన్నాడు.    "మహర్షీ!" రాజు పిలిచాడు.    సావిత్రి కూడా ఉద్వేగంతో చూసింది. తన నిర్ణయాన్ని ఏమంటారో మహర్షి..    "రాజా! సత్యవంతుడు నీతిమంతుడు, బుద్ధి మంతుడు. అతనికి చిత్రాశ్వుడు అనే పేరు కూడా ఉంది. వివిధ రకాల గుర్రాల బొమ్మలు తయారు చేసేవాడు. చిత్ర లేఖనంలో మంచి ప్రావీణ్యముంది.    రాకుమారి చెప్పినట్లు సత్యవంతుడు పితృ భక్తి పరాయణుడు. గుణగణాలను చూసి సావిత్రి అతడిని వరించింది. కానీ అతనికి నివారించలేని దోషం ఉంది. అతడు అల్పాయుష్కుడు. ఈవేళ్టికి సరిగ్గా ఒక సంవత్సరాని అతనికి ఆయుషు అయిపోతుంది."    మహారాజు సావిత్రిని చూశాడు.    "అమ్మా! చూస్తూ చూస్తూ అల్పాయుష్కునికి ఏవిధంగా కన్యాదానం చెయ్యగలను? సత్యవంతుని మరచిపో. మళ్ళీ వరాన్వేషణ సాగించు."    కన్నతండ్రి మనసు అది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె, విధవరాలై కళ్ళ ముందు తిరుగుతుంటే ఏ తండ్రి భరించగలడు..    కానీ సావిత్రి ధృఢ మనస్కురాలు.    "తండ్రీ.. అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాలు, దానశీలుర వాగ్దానాలు, కన్యాదానం ఒకేసారి జరుగుతాయి. అదే విధంగా వర నిర్ణయం కూడా. మీ ఆజ్ఞనుసారమే అన్వేషణ జరిపి, సత్యవంతుడిని పతిగా వరించాను.    సత్యవంతుడు దీర్ఘాయుష్మంతుడైనా, అల్పాయుష్కుడైనా, గుణవంతుడైనా గుణహీనుడైనా.. అతడిని నా భర్తగా ఒక సారి ఎన్నుకున్నాను. మరొకరిని ఊహించడం కూడా నావల్లకాదు."    భారతీయ సంస్కృతి వంట బట్టించుకున్న సావిత్రి ప్రేమమయి. విజ్ఞానఖని. ఆమెది స్వచ్ఛమైన ప్రేమ కథ.    కానలలో కాపురముండాలని తెలిసే సత్యవంతుడిని వరించింది. రాజ్య భోగాలను వదులుకోవడానికి సిద్ధపడింది. అల్పాయుష్కుడని తెలిసినా వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంది.    అందుకే పవిత్ర నారీమణులను స్తుతించేటప్పుడు, సీత, సావిత్రి, ద్రౌపది, దమయంతి అని చెప్తారు మన పెద్దలు. సీత, దమయంతి, ద్రౌపది.. వీరికి వివాహానికి ముందు అడవుల్లో కాపురం చెయ్యాలని తెలియదు. కానీ సావిత్రికి తెలుసు.    సావిత్రి అందుకే విలక్షణమైన స్త్రీ. వరునితో పాటు విపత్తులను వరించింది. తెలిసి తెలిసి ఎవరూ ఆవిధంగా చెయ్యరు. ఆమె ఆలోచనా విధానంలో, నియమ నిష్టలుపాటించడంలో ఋషులకు సమానము.    "మనసా నిశ్చయం కృత్వా తతో వచాభిదీయతే    క్రియతే కర్మణా పశ్చాత్ ప్రమాణం మే మన స్తతః.    తండ్రీ మనస్సులో చేసుకున్న నిర్ణయం మాట ద్వారా బయటకు వస్తుంది. అది కర్మ ద్వారా ఆచరించబడుతుంది. అందుకే నాకు మనస్సే ప్రమాణం." సావిత్రి ధృఢంగా సెలవిచ్చింది.    ఉదాత్తమైన సావిత్రి మాటలకు పరమానంద భరితుడై, సత్యవంతునితో ఆమె వివాహానికి తన సమ్మతిని తెలియజేశాడు నారదుడు.    "మహారాజా! సావిత్రి స్థిరమైన మనస్సుతో ఉంది. ఆమెని ధర్మ మార్గం నుండి ఎవరూ తప్పించలేరు. సుగుణవంతుడైన సత్యవంతునికిచ్చి ఆమె వివాహాన్ని జరిపించు. మీకందరికీ శుభం కలుగుతుంది." అశ్వపతితో ఈ శుభకరమైన మాటలు పలికి వెడలిపోయాడు నారదుడు.    సుదీర్ఘ ఉపన్యాసం తరువాత, దాహార్తుడై ఆగాడు ఎర్రాప్రగడ.    పతి అవసరాలు గ్రహించగలిగిన అర్ధాంగి, రజతపాత్రలో సిద్ధంగా ఉన్న మంచినీరు అందించింది.    "మధ్యాహ్న సమయం అయింది.. భోజనం అయ్యాక చెప్పుకుందాం." చేతులు నేలకానించి కష్టం మీద లేచింది పోతమ్మ. వృద్ధాప్యపు ఛాయలు అప్పుడప్పుడే బయట పడుతున్నాయి.    చేతిలో పని అందుకునే కోడలుంది కనుక లోటు లేకుండా గడిచిపోతోంది. పోతమాంబ తేలిగ్గా ఇంట్లోకి నడిచింది.                         ……………..    "సావిత్రీ సత్యవంతుల వివాహమే కదా ఇంక.." పోతమాంబ అడుగుతుంటే నవ్వుతూ తల ఊపాడు కుమారుడు. శ్రోతలిరివురూ ముందుగానే వచ్చి, తమ ఆసనాలనలంకరించారు.    ఎర్రన్న కొద్ది సేపు ఆగమన్నాడు భుక్తాయాసంతో. ఆ రోజు శుక్రవారం.. గాయత్రీ దేవికి ప్రియమైన గుడాన్నం, పెరుగన్నం నైవేద్యం పెట్టారు. దధ్యన్నాసక్త హృదయ, గుడాన్న ప్రీత మానస అయిన అమ్మవారిని ఆరాధించి ఆవిడ ప్రసాదం భుజించారు. నేతి పోపు దట్టంగా పడిన, మీగడతో కూడిన పెరుగన్నం.. వెన్నకాచిన నెయ్యి బాగా వేసి, యాలకుల వాసన గుబాళిస్తున్న గుడాన్నం.. కాసింత విశ్రాంతి కోరడంలో వింత ఏముంది..    అందులో మహా భారత రచన మొదలుపెట్టినదాది మితాహారం, కోడికునుకు.. కలలో, ఇలలో, సుషుప్తిలో వ్యాస మహర్షే. ఆ అలసట అంతా ఇప్పుడు తెలుస్తోంది.    అత్తాకోడళ్ళు సరేనని, దూరంగా నున్న వెనుకటింటిలో, బియ్యం విసిరే కార్యక్రమం మొదలుపెట్టారు.    రెండు ఘడియలయ్యేసరికి రెండు శేర్ల బియ్యం మొరుం అవడం.. ఎర్రనగారు విశ్రాంతి పూర్తయి తన స్థానానికి రావడం జరిగాయి. సూరనార్యుడు భోజనం అవగానే తన పాఠశాలకి వెళ్ళిపోతాడు రోజూ.    అప్పుడు పురాణశ్రవణానికి కూర్చుంటే సంధ్యా సమయానికి ముందు వరకూ నిరాటంకంగా సాగిపోవచ్చు.                           …………...    "అశ్వపతి మహరాజు అడవికి బయలుదేరాడు, ద్యుమత్సేనుని కలవడానికి. ఆశ్రమానికి వెళ్ళి తన అభీష్టమును తెలియజేశాడు.    "రాజర్షీ! నేను మద్రదేశరాజును. నా కుమార్తె సావిత్రి సుగుణవతి. సౌందర్యవతి. ఆమెను మీ కోడలిగా స్వీకరించ వలసిందని ప్రార్ధిస్తున్నాను."    ద్యుమత్సేనుడు మౌనంగా ఉండిపోయాడు.    "మహానుభావా!"    "మహారాజా! నేను కళ్ళు లేనివాడను. రాజ్యం పోగొట్టుకున్నవాడిని. కానల్లో కందమూలాలు తింటూ, కటిక నేల మీద నిద్రిస్తూ బ్రతుకుతున్నవాళ్ళం మేము. సుకుమారి, రాకుమారి అయిన మీ అమ్మాయి ఈ కష్టాలు పడలేదు. ఈ వలయంలోకి మీ అమ్మాయిని ఎందుకు పంపుతారు.. నాకు ఇష్టం లేదు."    ధర్మవర్తనుడైన ద్యుమత్సేనుని పలుకులకు అశ్వపతి సంతోషించాడు.    "సుఖం చ దుఃఖం చ భవా భవాత్మకం    యదా విజానాతి సుతాహ మేవచ.    స్వామీ! సుఖదుఃఖాలు వస్తుంటాయి పోతుంటాయి. ఈ విషయం మాకు, మా అమ్మాయికి కూడా తెలుసు. అన్ని విషయాలను చర్చించుకున్న తరువాతనే, గట్టి నిర్ణయం తీసుకుని మీ వద్దకు వచ్చాము.    మా ఆశను వమ్ము చేయకండి ద్యుమత్సేనా! నా ఆశయం అర్ధం చేసుకుని నా కుమార్తెను మీ కోడలిగా స్వీకరించండి. సావిత్రి సత్యవంతునికి అన్ని విధాలా తగిన ఇల్లాలు. మనం ఉభయులం వియ్యమందడానికి తగిన వాళ్ళం."    అశ్వపతి మాటలకు ద్యుమత్సేనుడు అమిత సంతుష్టుడైనాడు.    "ఈ సంకల్పం నాకేనాటి నుండో ఉంది. కానీ పరిస్థితుల మారిపోవడంతో మిమ్మల్ని అడగలేకపోయాను. మీకు మీరుగా వచ్చి నా కలల్ని నిజం చేశారు. నేడు ఎంతో సుదినం" ఆనందంగా సావిత్రీ సత్యవంతుల వివాహానికి అంగీకరించాడు ద్యుమత్సేనుడు.    ఈ సందర్భంలో నేను వ్రాసిన పద్యం వింటారా?" ఎర్రన అడిగాడు శ్రోతలని.    "ఎందుకు వినం?" అర్ధాంగి అంది కోమలస్వరంతో.    "మేమడుగుతే నువ్వేమంటావో నని అడగలేదబ్బాయ్.. నీ అంతట నువ్వే వినిపిస్తానంటే అంతకంటేనా?" అమ్మ మాటలకి ఆనందంగా తలూపాడు తనయుడు.    వ్యాస భారతం వ్రాశాక, పార్వతీ దేవి శ్లోకాన్ని వినిపించమంటే తల ఊపిన వినాయకుడు తలపుకొచ్చాడు పోతమ్మకి. విగ్రహంలో కాదు.. విజ్ఞానంలో..    "ఈ కన్నియ నా కూతురు     మాకులమున కెల్ల దెప్ప మనుజోత్తమ! నీ     వీ కన్నియ గోడలుగా గై     కొనుము మదీయ వచన గౌరవ బుద్ధిన్."    అయోమయంగా చూసింది పోతమాంబ..    "అంతా అర్ధమయింది కానీ ‘కులానికంతటికీ తెప్ప’ అన్నావేంటబ్బాయ్!"    "అందులో చాలా అర్ధముంది.." అప్పుడే అక్కడకొచ్చిన సూరనార్యుడు అన్నాడు. అతడు అప్పుడప్పుడు కుమారుడి కవిత్వాన్ని చూస్తుంటాడు. అందులో అతని కంద పద్యాలను చదువుతుంటే ఒడలు పులరిస్తుంటుంది ఆ విద్వన్మణికి.    మామగారి రాక చూసి నిలుచుని ఒక పక్కగా ఒదిగింది ఇంటి కోడలు.    "అంటే.." పోతమ్మ కుతూహలంగా చూసింది.    "మా కులానికంతకీ ఈమె తెప్ప అని చెప్పడం చాలా సందర్భోచితమైన మాట. ఏరు దాటించేది తెప్ప. వంశాన్ని తరింప జేసే పడవలాంటిది సావిత్రి అని చెప్పుకున్నాడా తండ్రి. ఎంతో భావంతో, పుట్టినింటికీ, మెట్టినింటికీ.. రెండు వంశాలకీ వన్నె తెస్తుంది అని చెప్పడం." సూరనార్యుడు కూడా ఎర్రన వచనాలని వినడానికి కూర్చున్నాడు.    కోడలు ఇంటి లోపలికి నడవబోతుంటే వారించారు సూరన, పోతమ్మ.    పోతమాంబ తన ప్రక్కనే కూర్చుండమని సైగ చేసింది.    "అశ్వపతి మద్ర దేశాధిపతి..    అంతఃపురాలూ, చీని చీనాంబరాలూ.. పంచ భక్ష పరమన్నాలూ, హంస తూలికా తల్పాలూ!    ద్యుమత్సేనుడు రాజ్య భ్రష్ఠుడు.    కానల్లో కుటీరాలూ, నార చీరలూ.. కందమూలాలూ, కటిక నేల పడకలూ..    దీనావస్థలో నున్న ద్యుమత్సేనుడిని తన రాజ్యానికి పిలిపించుకుని, అశ్వపతి పెండ్లి మాటలు మాట్లాడవచ్చు. కానీ అతడు నిరాడంబరుడు, సంప్రదాయాలు తెలిసినవాడు, మర్యాదలు పాటించేవాడూ, వినమ్రుడూ.. అందువలననే అడవికి వెళ్ళి వివాహ ప్రస్థావన తెచ్చాడు.    పైగా పాద చారియై వెళ్ళాడని వ్యాస మునీంద్రులు వ్రాశారు.    తన కుమార్తె వరించిన వరుడిని.. అంతస్థులు తేడాఉన్ననూ అంగీకరించాడు. మహరాజైననూ ఒక మామూలు తండ్రివలే మగపెళ్ళివారింటికి వెళ్ళాడు. తన వైభవాన్ని ప్రదర్శించలేదు.    ఆడంబరాలకు పోకుండా బిడ్డల మనోభీష్టాలనేవిధంగా నెర వేర్చాలో చూపించి ఆదర్శ జనకుడయ్యాడు.    తన ఏకైక పుత్రికను అడవుల్లోనికి కాపురానికి పంపడానికి నిశ్చయించుకున్నాడు.    సావిత్రీ సత్యవంతుల వివాహం ఇరుపక్షాల పెద్దల సమక్షంలో.. జరిగిపోయింది. ఆశ్రమాలలోనున్న మునులు, ముని పత్నులు వచ్చి ఆశీర్వదించారు.    రూపవతి, శీలవతి, సుగుణాలరాశి అయిన సావిత్రి ధర్మపత్ని అయినందుకు సత్యవంతుడు అమందానంద భరితుడయ్యాడు. కోరిన వరుడ్ని పెండ్లి యాడినందుకు సావిత్రికి పరమానందమయింది.    తండ్రి తనని అత్తమామలకి అప్పగించి వెళ్ళిన తరువాత, సావిత్రి ఆభరణాలను త్యజించింది. నారచీరలను ధరించింది.    కోమల స్వరంతో సంయమనం పాటిస్తూ పలుకులు.. అత్తమామల సేవ.. వ్రత నియమాలను పాటించడం.. సావిత్రి తపో జీవనానికి అలవాటుపడి పలువురు మన్ననలందుకుంటోంది.    తాను రాజకుమారినని మరచిపోయింది.    వివాహమయి సంవత్సరం కావస్తోంది. సావిత్రి రోజులు లెక్కపెట్టుకుంటోంది. నారద మహర్షి మాటలు మరచిపోలేదు.. వీలైతే కాలాన్ని ఆపెయ్యాలని ఉంది. ఇంక నాలుగు రోజులే ఉంది.    సావిత్రి ఉపవాస దీక్ష ప్రారంభించింది.రేయింబవళ్ళు కూర్చునే ఉంది ధ్యానంలో.    కోడలి కఠోర నియమాలను విని అత్తమామలు కలత చెందారు.    "అమ్మా! నిద్రాహారాలు లేకుండా మూడు రోజుల నుంచీ కాచుకుని ఉన్నావు. నాకు ఎంతో బాధ కలుగుతోంది. భరించలేకపోతున్నాము మేము." ద్యుమత్సేనుడు వ్యాకులతతో అన్నాడు.    అయినా సావిత్రిని నివారించలేకపోయాడు.    అంతటి ధృఢ నిశ్చయంతో వ్రత దీక్ష కొనసాగిస్తోంది.    ఆరోజే నారద మునీంద్రులు హెచ్చరించిన దినము.. సత్యవంతుని మరణమాసన్నమయింది.    సావిత్రి సర్వాహ్నికాలను ముగించుకుని అత్తమామలకు సేవ చేసింది. విప్రులకు నమస్కరించింది. అందరూ పదికాలాలు సకల సౌభాగ్యవతిగా వెలుగొందమని దీవించారు.    అప్పుడే గొడ్డలి భుజాన వేసుకుని సత్యవంతుడు అడవికి బయలుదేరుతున్నాడు. సావిత్రి భర్త వద్దకు వెళ్ళింది.                                .....మంథా భానుమతి

ఉత్తరాంధ్ర తెలుగు కథకు చిరునామా అట్టాడ అప్పల్నాయుడు

  ఉత్తరాంధ్ర తెలుగు కథకు చిరునామా అట్టాడ అప్పల్నాయుడు           ఉత్తరాంధ్ర తెలుగు కథకు చిరునామా చెప్పాల్సి వస్తే అప్పల్నాయుడు పేరు తప్పక చెప్పాల్సిందే. శ్రీకాకుళ ఉద్యమ స్ఫూర్తితో, గిరిజన జాతుల జీవన సంస్కృతిని అవలోకనం చేసిన రచయిత ఆయన. జననాట్య మండలితో సంబంధాలు, మొదటి కథ కూడా అచ్చుకాక ముందే అరెస్టు. ప్రభుత్వ దోపిడీకి, గిరిజనలు అమాయకత్వానికి ప్రత్యక్ష సాక్షి... ఇలాంటివి ఎన్నో అప్పల్నాయుడిని రచయితను చేశాయి. అంతేకాదు నాగావళి అందాలు, తూరుపు కొండల మీద నుంచి వచ్చే గాలి, ఉత్తరాంధ్ర ప్రకృతి శోభ కూడా అతడ్ని రనచవైపు ప్రేరేపించాయనే చెప్పాలి.        అట్టాడ అప్పల్నాయుడు విజయనగరం జిల్లా కొమరాడ దగ్గరున్న గుమడ గ్రామంలో ఆగస్టు23, 1953న జన్మించారు. తండ్రి సూరినాయుడు, తల్లి నారాయణమ్మ. వీరిది వ్యవసాయ కుటుంబం. కోటిపాం జిల్లా పరిషత్ హైస్కూల్లో 10వ తరగతి వరకు చదువుకున్నారు, ఆ తర్వాత పార్వతీపురంలో ఇంటర్మీడియట్ చేరారు. అప్పుడే శ్రీకాకుళపోరాటం, ప్రజానాట్యమండలి వైపు ఆకర్షితులయ్యాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుమానేశాడు. జంఝావతి రిజర్వాయర్ నిర్మాణంలో కూలిగా పనిచేశాడు. కొంతకాలం నాగావళి పత్రికలో కూడా పనిచేశారు. చివరకు బ్యాంకు ఉద్యోగంలో చేరారు. ఉద్యోగిగా 30 సంవత్సరాలు పనిచేశారు. అటు బ్యాంకు ఉద్యోగిగా జీవిస్తూనే రచనా వ్యాసంగాన్ని కూడా  సమర్థవంతంగా నిర్వహించారు.         1979లో రచనలు చేయడం మొదలు పెట్టిన అప్పల్నాయుడు మొత్తంగా వంద కథల వరకు రచించారు. నాలుగు నవలలు రాశారు. కొన్ని నాటికలు కూడా రాశారు. వీరి మొదటి కథ "పువ్వుల కొరడా". విప్లవ కథకుడుగా సాహిత్యంలోకి అడుగుపెట్టి మారుతున్న సామాజిక చిత్రాన్ని చిత్రికపట్టి సామాజిక వాస్తవికతతో అందించారు. నేటి అంతర్జాతీయ వాణిజ్యం ఉత్తరాంధ్ర పల్లెల వరకు ఎలా విస్తరించి దోచుకుంటుందో కూడా వివరించారు. వీరి కథలన్నీ ఐదు సంపుటాలుగా వెలువడ్డాయి. అవి ఒక పొట్టివాడు - కొందరు పొడుగువాళ్లు, క్షతగాత్రగానం,  పోడు - పోరు, ప్రత్యామ్నాయం, బీలు. అలానే వీరి నవలలు పునరావాసం, ఉత్కళం, అనగనగా ఒక ద్రోహం, నూకలిస్తాను. వీరు రాసిన 3 నాటకాలు, 5 నాటికలు విుశాఖఫట్నం ఆకాశవాణిలో ప్రచారం అయ్యాయి. వీరి "మడిసెక్క" నాటకానికి ఆలిండియా రేడియోవారి జాతీయ నాటికల పోటీలో ప్రథమ బహుమతి వచ్చింది. సూర్య దినపత్రికలో సంవంత్సరకాలం పాటు "నేస్తం ఊసులు" పేరిట శీర్షిక నిర్వహించారు. ఇటీవల వీరి సమగ్ర సాహిత్యం కూడా ముద్రితమయింది.         అప్పల్నాయుడు కథలు సృజన, అరుణతార, అంకిత, విపుల, నవ్య, ఆహ్వానం, ప్రజాశక్తి, చినుకు... ఇలా అన్ని పత్రికల్లోనూ ముద్రితమయ్యాయి. ఇంగ్లిషు, హిందీ, తమిళం, కన్నడం, బెంగాళీ, భాషల్లోకి అనువాదమయ్యాయి. "పువ్వల కొరడా" కథలో గ్రామల్లో చాకలి ఊరుమ్మడి మనిషి. పెళ్లిళ్లప్పుడు చాకిలిచేత కావిళ్లు పంపిస్తారు. కానీ చాకలి ఆకలేసి ఆ సారెల్లోని అరిసెలు తింటాడు. అరిసెలు తక్కువయ్యాయి కనుక అసిరిసెట్టి కొరడా దెబ్బలు తినాలి. కానీ కథలో చాకలి ఎదురుతిరుగుతాడు. పంట, ప్రజాకోర్టు, ఖండగుత్త కథలు పోలీసులు, ప్రజానేతలు, అధికారులు, పై వర్గాలు సవరలు, కోదుల వంటి గిరిజనులను ఎలా దోచుకుంటున్నారో తెలియజేస్తాయి. "జీవనస్రవంతి" కథలో అరెస్టు చేసిన నక్సలైట్ ను వదిలెయ్యాలా, చంపాలా అనేదే ఇతివృత్తం. మంత్రి జనజీవన స్రవంతిలోకి రమ్మని ఆహ్వానిస్తాడు. కానీ అరెస్టు చేసిన పోలీసుకు లక్షరూపాయలు పోతుందన్న బాధ. విలేకర్ల దగ్గర నిజం దాస్తారు. చివరకు నెక్సలైట్లు మండలాధ్యక్షుడ్ని కిడ్నాప్ చేయడంతో నెక్సలైట్ ను విడుదల చేస్తారు పోలీసులు. "బంధాలు - అనుబంధాలు", "ప్రత్యామ్నాయం" కథల్లో తల్లీ, కొడుకుల మధ్య, అన్నాదమ్ముల మధ్య ప్రేమాప్యాయతలు తగ్గిపోవడానికి ప్రధాన కారణం మారుతున్న సామాజిక పరిణామంలోని అవసరాలే అని చెప్పారు.             అరణ్య పర్వం, ఆకాశ హర్మ్యాలు, ప్రయాణం, బతికి చెడిన దేశం, యుద్ధం, పందెపుతోట, షా, వెదుకులాట, సాహసం సేయరా, రివాజు, రెండు ప్రశ్నలే, బల్లెం, భద్రయ్య, భోషాణం... ఇలా ఏ కథ తీసుకున్నా అన్నీ ఆణిముత్యాలే. మొదట్లో శిల్పం కన్నా వస్తువుకే ప్రాధాన్యత ఇచ్చే కథలు రాసిన అప్పల్నాయుడు తర్వాత తర్వాత కథనానికి కూడా ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. కారా గారి "కధా కథనం", ఇంకా "రచయితా - శిల్పమూ" వంటి పుస్తకాలను చదివారు. "ఓ తోట కథ"లో తోట చేతే మాట్లాడించారు. ఇంకా శ్రీకాకుళం మాండలికంపై అప్పల్నాయుడికి అపారమైన పట్టు ఉంది. ఆ నుడికారం కథల్లో ఆరుద్ర పురుగులా మెరుస్తూ మనకు కనపడుతుంది. వీరి కథా శీర్షకలు కూడా ప్రత్యేకంగా కనిపిస్తాయి. అప్పల్నాడికి రావిశాస్త్రి పురస్కారం, కథా కోకిల పురస్కారం, విశాల సాహితీ పురస్కారం, కేతు విశ్వనాథరెడ్డి పురస్కారం, అజోవిభో కందాళం ఫోండేషన్ అవార్డు వచ్చాయి.       ఇప్పటికీ నిరంతరం తన సాహితీ ప్రస్తానాన్ని సాగిస్తూ, పేదల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడి రచయితగా తన బాధ్యతను నిర్వర్తిస్తున్నారు అట్టాడ అప్పాల్నాయుడు. నాలుగు దశాబ్దాల ఉత్తరాంధ్ర సాహిత్య చరిత్రనే కాదు, సామాజిక చరిత్రను తెలుసుకోవాలన్నా వీరి కథలు, నవలలు చదవాల్సిందే.                .....డా. ఎ.రవీంద్రబాబు

అతని జీవిత అనుభవాలే అతని కథలు - బోయ జంగయ్య

  తెలంగాణ కథకుల్లో బోయ జంగయ్యది విలక్షణశైలి. కథకు సంబంధించిన ఇతివృత్తాన్ని నిర్ణయించుకోడంలోనూ, కథను నడపడంలోనూ వైవిధ్యంగా కనిపిస్తుంది. జీవితంలోని అగాథాలను వస్తువుగా తీసుకొని ఆ భాషను కథల్లోకి తీసుకరావడంలో వీరిది అందెవేసిన చెయ్యి. అతనే చెప్పుకున్నట్లు అతని జీవిత అనుభవాలే అతని కథలు. ఎక్కడా ఊహలు, వినూత్నమైన వర్ణనలు, వాస్తవికతను దాటిన రాతలు మనకు కనిపించవు. ప్రతి కథ మనకు తెలియని జీవితాన్ని కళ్లకు కడుతుంది. అయితే జీవితాన్ని విస్తరించుకుంటూ, తన పరిధిని పెంచుకునే క్రమంలో బోయ జంగయ్య కథల్లో సామాజిక చైతన్యాన్ని వివరించే వర్గ, కుల దృక్పధాలు కనిపిస్తాయి. బోయ జంగయ్య సెప్టెంబరు1, 1942... నల్లగొండ జిల్లాలోని లింగారెడ్డి గూడెంలో పుట్టారు. సొంత ఊరు పతంగి. వాళ్ల అమ్మానాన్న దినసరి కూలీలు. అంటరానితనాన్ని, పేదరికాన్ని అనుభవిస్తూ ఊరిలో నాలుగో తరగతి వరకు చదువుకొన్నారు. తర్వాత హైదరాబాదులోని ప్రభుత్వ వసతి గృహంలో చేరి బి.ఏ. పూర్తి చేశారు. తల్లిడంద్రులకు సాయంగా సెలవల్లో కూలిపనులకు వెళ్లేవారు. పేదరికంలో తిండిలేక ముంజెలు, సితాఫలాలు, తాటిపండ్లు తినేవారు. కానీ స్వాతంత్ర్యం వచ్చాక ఎదిగిన తొలితరం దళితుల్లో బోయజంగయ్య ఒకరు. ట్రెజరీ శాఖలో అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసురుగా పదవీ విరమణ పొందారు. అటు గ్రామీణ నేపథ్యాన్ని, ఇటు మారుతున్న నగర జీవినశైలిని అవగాహన చేసుకుని... కథలకు ఇతివృత్తాన్ని సిద్ధం చేసుకునే వారు. అందుకే వీరి కథలు సజీవాలు. సుమారు 50 ఏళ్ల సామాజిక జీవితానికి నకళ్లు. జంగయ్య సుమారు 20 రచనలు వరకు ప్రకటించారు. 125కు పైగా కథలు రాశారు. రెండు నవలలు వెలువరించారు. పిల్లలకోసం పుస్తకాలు రాశారు. అలానే అంబెద్కర్, కె.ఆర్. నారాయణ్, జాషువా లాంటి సామాజిక వేత్తల జీవిత చరిత్రలను సొంతగా రాశారు. వచన కవితా సంపుటాలు ప్రకటించారు. వీరి రచనలు ప్రముఖుల మన్ననలు పొందాయి. వర్గస్పృహ, కుల స్పృహ, చైతన్యం, స్త్రీ వాద దృక్కోణం... అన్నిటి సమాహారమే ఈ కథలు. వీరి కథలులో గొర్రెలు, దున్న, చీమలు, ఎచ్చరిక, రంగులు, తెలంగాణ వెతలు, బోజ కథలు వంటి సంపుటాలుగా వచ్చాయి. ముఖ్యంగా దొంగలు, చీమలు, మరుగుమందు, అడ్డం, కరెంటు కథ, బొమ్మలు, తుపాకులు, నాపేరు రాయొద్దు.... వంటి ఎన్నో కథలు ప్రాముఖ్యం పొందాయి. 'దొంగలు' కథలో రాజకీయ నాయకులకు, కార్యకర్తలకు మధ్య ఉన్న భేదాన్ని చెప్తారు. ఎన్నికల తర్వాత నాయకులు కలిసినా, కార్యకర్తలు కక్షలతోనే జీవిస్తుంటారు అనే సత్యాన్ని ఆవిష్కరించారు. అలానే 'నాపేరు రాయొద్దు' కథలో పెళ్లి కాకుండా తల్లి అయిన ఓ స్త్రీ పిల్లలను పాఠశాలలో చేర్పించేటప్పుడు ఎదుర్కొనే సమస్యను చిత్రించారు. 'దున్న' కథలో పల్లెలో గ్రామ పెత్తనంలో వచ్చిన మార్పుల వల్ల ప్రజలకు జరిగే మంచిని వివరించారు. 'మరుగుమందు' కథలో సామాన్య ప్రజల్లోని మూఢనమ్మకాలు వారి మానవీయ సంబంధాలను ఎలా నాశనం చేస్తాయో చెప్పారు. 'సాలిని' కథ నగరంలో సేవ చేయాలని భావించే స్త్రీని అక్కడి ప్రజలు ఎలా మానసికంగా హింసిస్తారో చెప్తుంది, చివరకు ఆమెకు శీలంలేని స్త్రీగా ముద్రపడేలా చేస్తారు. 'రంగులు' కథలో స్వాతంత్ర్యం వచ్చాక అన్ని సమస్యలు తీరుతాయి అని భావించిన పోరాటయోధుడు చివరకు బిచ్చగాడిగా మారిన వైనాన్ని మనకు చూపుతుంది. 'మరమరాలు' కథ స్త్రీ పురుషులు చనువుగా మాట్లాడుకుంటుంటే... పుట్టించే పుకార్లు ఎలా అక్రమసంబంధాలుగా చెలామణి అవుతాయో వివరిస్తుంది. ఇలా బోయ జంగయ్య రాసిన ప్రతి కథ ఓ నీతిని చూపడమే కాదు, సమాజంలోని కుల్లును కడిగేయాలని చెప్తుంది. నిబద్ధతగా జీవించాలని, అప్పుడే జీవితం, రాజ్యం రెండూ బాగుంటాయని సమస్యలను, అందుకు కారకులైన వారిని ఎండగడుతుంది. వీరి కథల్లో శిల్పం సహజంగా, సుందరంగా ఉంటుంది. కానీ పాఠకులను మెప్పించే చాతుర్యం కనిపిస్తుంది. కథలో ఎక్కడా రచయిత ప్రవేశించరు. అలాగే వర్ణనలు చేయరు. ఒక సన్నివేశాన్ని చెప్పి... దానిలోనే తను చెప్పదలచుకున్న విషయాన్ని పాఠకులకు అందేలా చేస్తారు. అంటే కెమెరాతో తీసినట్లు కథ మనకు దృశ్యాన్ని, సన్నివేశాన్ని, సంఘటనను పలుకోణాల్లో చూపుతుంది. కథల ముగింపు కూడా చమత్కారంగా, పరిష్కారాన్ని చూపుతుంది. ఎక్కువగా ఒక్క సన్నివేశ కథల్నే రాశారు బోయ జంగయ్య. ఉత్తమ పురుషలో రాయరు. కేవలం సర్వసాక్షి దృక్కోణంలోనే రాశారు. వీరి 'తెలంగాణ వెతలు' కథలు తెలంగాణ సామాజిక, సాంస్కృతిక జీవితానికి చారిత్రక వాస్తవాలు. వీరి శిల్ప చాతుర్యానికి కుండబద్దలు కొడత కథను ఓ ఉదాహరణగా చెప్పొచ్చు. కథలో మానభంగం జరిగిన తీరు పై పంచాయితీ జరుగుతుంది. కానీ చివరి వరకు దోషులు ఎవరన్నది చెప్పరు రచయిత. చివరకు దోషులపై ప్రజల్లో ఉప్పొంగుతున్న ఆవేశాన్ని చెప్పి, తర్వాత దోషులు ఎవరన్నది... బయటపెడతారు. ఇదో అద్భుతమైన టెక్నిక్. కథలోని పాత్రలకే కాదు, పాఠకులకు ఉత్కంఠకలిగిస్తుంది. వీరి కథల గురించి ఆవత్స సోమసుందర్ చెప్పిన మాటలు అక్షసర సత్యాలు - 'బోజ కథారచనలో అనవసర విస్సాటాలు, తెచ్చికోలు గొప్పలు, షోకిల్లా మెరుగులు, గోసాయి చిట్కాలు ఎక్కడ వెతికినా కనిపించవు. మంచి నీళ్ళంత స్వచ్ఛసుందరంగా అతని కథలు తళతళ లాడుతాయి. ఈ దేశ వాసుల బాధా సహస్రాలే ఇతని గాధా సప్తశతులుగా పలకరిస్తాయి.' - డా. ఎ.రవీంద్రబాబు

“చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు” 15వ భాగం

    “చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు”   15 వ భాగం. ప్రోలయ వేమారెడ్డి రాజ్యాన్ని స్థాపించాక, అత్యంత పరాక్రమంతో భూములను ఆక్రమించి తమ్ములకు, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు ఇచ్చాడు.    వేమారెడ్డి తమ్ముడు మల్లారెడ్డి తెలివితేటలున్నవాడు. వ్యవహార సమర్ధుడు. అతనికి సముద్ర తీర గ్రామాలమీది అధికారం, ఓడలమీద వర్తక పెత్తనం ఇచ్చాడు.  అతడు ద్వీపాంతర వర్తకాన్ని బాగా వృద్ధి చేసి అన్నగారికి వజ్రాలు, సువర్ణం, సుగంధ దినుసులు తెచ్చి ఇచ్చేవాడు.    మల్లారెడ్డి ఎర్రాప్రగడకి స్నేహితుడు.. సన్నిహితుడు.    రెండు వత్సరములు గడవగానే అద్దంకి రాజ్యం కళకళలాడ సాగింది. సాహిత్యాభిలాష మెండుగా గల వేమారెడ్డి, కొలువులోనికి కవులనాహ్వానించ సాగాడు.    మల్లారెడ్డి, అన్నగారికి ఎర్రనని పరిచయం చేశాడు.    మల్లారెడ్డి ఆదరణకు సంతుష్టుడైన ఎర్రాప్రగడ మన్నేరు మీదనున్న గుడ్లూరు వదలి, గుండ్లకమ్మ నదీ తీరాననున్న చదలవాడకు కదల వలసి వచ్చింది.    స్నేహితుడు మడిమాణ్యాలను కానుకగా ఇచ్చాడు మరి..     "చదలవాడకా?" సూరన, పోతమాంబలు ఒకింత అసంతృప్తిగా అన్నారు.    "గుడ్లూరులో ఇన్ని గుడులున్నాయి.. నీలకంఠేశ్వరుని సన్నిధిని వదిలి ఎటుల.. ఇచ్చట శిష్యులు, పరిపాలన.." నిజమే.. వేమారెడ్డి సూరనగారిని గుడ్లూరు యోగక్షేమాలు చూసుకోమని యుద్ధానికి ముందే నియమించారు. అచ్చటి కార్యక్రమాలతో మమేకమైపోయిన సూరన్నకి గుడ్లూరు వదలుట కష్టమే..    "తప్పదు తండ్రీ.. చదలవాడలో రామాలయం కట్టబోతున్నారు మల్లారెడ్డి. మనం దానిని పర్యవేక్షించాలి. అక్కడి వారికి విద్యని నేర్పాలి. గుడ్లూరులో మీ శిష్యులు చాలా మందే ఉన్నారు కద.. ఇరువది సంవత్సరాల నుండి వారిని మీరు అన్ని విద్యలలో నిష్ణాతులని చేశారు. పైగా..    మల్లరధినీ నాధుడు నన్ను అనేక ఐశ్వర్యములతో సముపేతుడిని చేశాడు. మరి ఆ మాణ్యాలను అనుభవించవద్దా! ఇచ్చటి కన్ననూ జీవనం మరింత సొబగుగా ఉంటుంది. సందేహం లేదు."    సూరన్నకి తప్పలేదు..    రాజు తలుచుకుంటే అంతే మరి.    ఈ మారు అంతగా చింతించలేదు సూరన్న కుటుంబీకులు. ఏ విషయమునందైననూ మొదటి సారి ఉన్నటువంటి ప్రభావం రెండవ సారి ఉండదు. మూడవసారి ఉత్సాహం ఉంటుంది. ఆ పైన అసంకల్పితంగా మార్పు కోరుకుంటుంది మనసు.    అదే అనుకున్నాడు సూరనార్యుడు గుడ్లేరు వదులు తున్నప్పుడు. పైగా ఆ ఊరితో నున్న అనుబంధం కూడా తక్కువేం కాదు. వంశోద్ధారకుడు, మున్ముందు చరిత్రలో తమవంశం చిరస్థాయిగా నిలిచిపోయేటట్లు చెయ్యగలవాడూ అయిన ఎర్రన పుట్టింది అక్కడే. అతడి బాల్య క్రీడలను తాము ఆస్వాదించినది అక్కడే.    ఎన్ని ముద్దులు, ఎన్నెన్ని మురిపాలు!    శ్రీ కృష్ణుడికి రేపల్లెతో ఉన్నట్టి అనుబంధం, ఎర్రనకి గుడ్లేరుతో.    తమ కుటుంబాన్ని ఆదుకుని ఆదరించిన గుడ్లేరు వాస్తవ్యులు..    ముఖ్యంగా గుడ్లేరు లో నున్న ఆలయాలు.. ఆధ్యాత్మిక వాతావరణం మరొక చోట దొరుకుతుందని లేదు.    ప్రతీ శివరాత్రికీ నీలకంఠేశ్వరుని దర్శించుకుంటామని, మిత్రులందరికీ మరీ మరీ చెప్పి, భారమయిన హృదయములతో ఆ ఊరిని వదిలారు అందరూ. ఎర్రన స్నేహితులు పొలిమేర వరకూ వచ్చి వీడ్కోలు చెప్పారు.    ఏ గ్రామమున కైనా, పట్టణమున కైననూ నీటి వనరులు ముఖ్యం.    నిత్య గృహ కృత్యాలకి, పాడి పంటలకీ కూడా అత్యవసరమైనది నీరు.    గుడ్లేరు మన్నేరు నది ఒడ్డున ఉంటే, చదలవాడ, గుండ్లకమ్మ నది ఒడ్డున ఉంది.    చదలవాడ వచ్చిన వెంటనే తమతమ కార్యక్రమాలలో తలమునకలైపోయారు సూరనార్యుని కుటుంబ సభ్యులు.                                       …………….                                            12       రామాలయం..   రామపట్టాభిషేక సమయంలో వశిష్ట మహర్షి నుడివిన మాట.. భారతావనికి ఇచ్చిన వరం.      “పది ఇళ్ళుండిన గ్రామములోనైననూ రామమందిర ముండుగాక!”       రామనామం పలుకగానే మనసు పరవశించిపోదా..       పరమశివుడే తారకమంత్రం జపిస్తుంటే..     శంకరస్వామి శిష్యుడు ఎర్రన, రామభక్తుడైన మల్లారెడ్డిని రామాలయం కట్టమని ప్రోత్సహించుటలో వింత ఏమున్నది..    "ప్రాతఃస్మరామి రఘునాధ ముఖారవిందం     మందస్మితం మధురభాషి విశాల ఫాలమ్     కర్ణావలంబి చలకుండల శోభిగండం     కర్ణాంత దీర్ఘనయనం నయనాభిరామమ్."    ప్రాతః కాలమున రఘునాధుని ముఖకమలమును స్మరించాలి. ఆ ముఖబింబము చిరునవ్వుతో కూడినది. తియ్యని మాటలు పలుకునది. కుండలములచే ప్రకాశించు కర్ణములు, శోభాయమానమైన చెక్కిళ్ళు, ఆకర్ణాంత విశాలనేత్రాలు కలిగినది.    "అటువంటి విగ్రహం కల ఆలయం కట్టించు. రామో విగ్రహాన్ ధర్మః. ప్రాతఃకాలమున గ్రామ ప్రజలందరూ శ్రీ రామదర్శనం చేసుకోగలిగిన భాగ్యం కలిగించు."    మిత్రుని మాట వినడమే కాదు.. తక్షణం అమలు పరచాడు మల్లారెడ్డి.    చదలవాడలో రామాలయ నిర్మాణానికి శంఖుస్థాపన జరిగింది. ఒక వత్సరంలో ఆలయ నిర్మాణం జరిగి, రామలక్ష్మణుల విగ్రహాలను ప్రతిష్ఠ చేయించారు. సూరన, ఎర్రన నిర్మాణ వ్యవహారాల్లో పాలు పంచుకుని, అతి త్వరలో ప్రతిష్ఠ జరుగుటకు తోడ్పడ్డారు.                              ప్రోలయవేమారెడ్డి, రెడ్డి రాజ్య స్థాపకుడు.. స్వయంగా చదలవాడకు వచ్చి తమ్ముడు కట్టించిన ఆలయానికి అగ్రహారం ఇచ్చాడు.    ఒక చంద్రగ్రహణం నాడు, గుండ్లకమ్మ నదిలో ఇసుక తిన్నె మీద కూర్చుని ఈ అగ్రహారాన్ని ఇచ్చి, శాసనం తయారు చేయించాడు వేమారెడ్డి.    ఆ అగ్రహారానికి తమ్ముడి పేరున మల్లవరం అని పేరుపెట్టాడు. చదలవాడ గ్రామానికి అరక్రోసు దూరంలో ఈ మల్లవరం ఉంది.    అప్పుడే ఎర్రనని అన్నగారికి పరిచయం చేశాడు మల్లారెడ్డి.    ఎర్రన వంశ వృక్షమును..    తాతగారి ప్రఖ్యాతిని, సూరనార్యుని ప్రతిభను.. ఎర్రాప్రగడ పాండిత్యాన్ని వేమారెడ్డి ప్రభువునకు విశదీకరించాడు.    అచ్చటనే ఉన్న సూరనార్యునకు నమస్కరించాడు ప్రోలయ వేమారెడ్డి.    "ఆచార్యులు మాకు తెలియకపోవడమేమి.. మేమే కద కరాపర్తి నుండి మనసీమకు రప్పించినది. యుద్ధ సమయమున, మా తోడు నీడయై మన పట్టణములను.. గ్రామములను కాపాడినది వీరే..    రాజ్య స్థాపన అయిన పిదప.. రాచ కార్యములలో పడి కాస్త ఉదాసీనత కలిగినది. క్షమించండి ఆచార్యా! కుశలమేనా? మా తమ్ముడు మీ యోగక్షేమములు చూచుచున్నందులకు మాకు ఆనందముగ నున్నది."    మల్లారెడ్డి ఆనంద భరితుడైనాడు.    “ఎర్రాప్రగడ వారు కవి వర్యులు, పండితులు అన్నావు కదూ మల్లా! మల్లవరం గ్రామాన్ని శ్రీవారి భోగానికి సమర్పిస్తున్న సందర్భంలో వారిని రామాయణ కావ్యం వ్రాయమని కోరుతున్నాను."    ఎర్రన్నకి ఆశ్చర్యానందాలతో నోట మాట రాలేదు.    తన చిరకాల వాంఛ..    ప్రభువులకి ఏ విధంగా ఎరుకయింది?    శ్రీరాముల వారి అనుగ్రహం ఉంటే జరుగనిదేముంది.    "మహా ప్రసాదము. కానీ.." కన్నుల నిండా భాష్పాలతో అన్నాడు ఎర్రాప్రగడ.    "ఏమది మహాకవీ?" వేమారెడ్డి ప్రభువు ప్రసన్నవదనారవిందుడై అడిగాడు. తేజో విరాజితుడైన ఈతడు నిస్సంశయముగా ఎన్నదగిన కవియే..    మహాకవి.. అప్పుడే? ఇంకా ఏ రచనా చెయ్యక మునుపే.. ముందుగా తాతగారికిచ్చిన వాగ్దానము తీర్చాలి. నన్నయగారి అరణ్యపర్వ పూరణ చేసి, ఆదికవి ఆశీర్వాదము తీసుకుని.. ఆ పైననే ఇతర రచనలు. ఇంటి విషయాలు తండ్రిగారు చూసుకుంటారు. ధన ధాన్యాదులకి లోటు లేదు.. ప్రభువు ప్రాపు ఉంది. ఇంకేం కావాలి..    పది సంవత్సరములుగా ఎన్నో కావ్యాలు క్షుణ్ణంగా చదవడమయింది. ముప్పదియారు వృత్తాల వరకూ ఛందస్సు కరతలామలకమే.. ధార చిన్ననాట నుండియే ఉందని తాతగారి నమ్మకము.    "కొద్ది సమయము కావాలి ప్రభూ! అత్యవసరమైన కార్యము నిర్వర్తించవలె.."    "మీ అనుకూలము కవి వర్యా! మేము వేచి చూచెదము."    ఆ క్షణమున ఒక మహాకవి కావ్య రచనకి ఆవిర్భావం జరిగింది.    ఆంధ్ర సాహిత్యంలో కొత్త యుగము ఆరంభమయింది.                                     ……………                                         13    ఒక శుభ ముహుర్తమున ఎర్రాప్రగడ కావ్యారంభమును చేశాడు.    నన్నయగారి శైలినీ, శిల్ప రహస్యాలనూ, మరొక్కసారి వారి భారతమును చదివి ఆకళింపు చేసుకున్నాడు. తిక్కనగారి రచనా విధానాన్ని కూడా అర్ధం చేసుకున్నాడు. ఆ రెంటి మధ్యనూ వారధి కట్టాలి..    తాతగారు చెప్పినట్లు రెండు పర్వతములను కలిపి వంతెన కట్టే సాహసమే..    నన్నయగారు అరణ్యపర్వంలో మూడున్నర ఆశ్వాసాలు వ్రాశారు. వారి ఆఖరి పద్యం,    "శారదరాత్రు లుజ్వలలసత్తర తారక హార పంక్తులం     జారుతరంబులయ్యెవికసన్నవకైరవగంధబంధురో     చార సమీర సౌరభము తాల్చి సుధాంశు వికీర్ణమాణక     ర్పూర పరాగ పాండు రుచి పూరములం బరిపూరితులై."    ఎందరో కవులు, సాహిత్యాభిలాషులు ఈ పద్యాన్ని ఎన్ని మారులు చదివారో! ఇంకా ఇంకా ఎందరు చదువుతారో.."    భారతం పూర్తి చెయ్యాలనుకున్నవారు ఈ పద్యం నుండి ప్రారంభించాలి. కానీ తిక్కన గారు అరణ్య పర్వం వదిలేసి, విరాట పర్వం నుంచి మొదలు పెట్టారు.    అపశకునమనుకున్నారేమో.. ఎవరూ అరణ్యపర్వాన్ని పూరించ సాహసించలేదు.    ఎర్రాప్రగడ అటువంటి మూఢనమ్మకాలని దరి చేరనియ్యలేదు. మిగిలిన మూడున్నర ఆశ్వాసాలూ వ్రాయడమే కాక, అవికూడా రాజరాజ నరేంద్రునకే అంకిత మివ్వదలచాడు..    తాతగారికి వాగ్దానం చేసినట్లుగానే!    ఎర్రన్న అనుకున్నదానికంటెనూ కష్టతరమే.    మధ్యలో ఆరంభిస్తే..    ఇష్టదేవత ప్రార్ధన చెయ్యడానికి లేదు..    పెద్దల ఆశీస్సులు అందుకొనుటకు లేదు. తానెవరో చెప్పుకొనుటకు లేదు..    అయిననూ సాహసించాడు..    ఆందుకే కవిత్రయంలో ఒక్కడయ్యాడు.    అతడి తెలివి అపారము. తాను చెయ్యవలసిన దానిలోనే దైవ ప్రార్ధనకి అవకాశం ఎక్కడుందో అని వెదకి చూశాడు.    ఒక ఘట్టంలో, సరస్వతీ గీత అని ఒక భాగం ఉంది. అందులో తారుక్ష్యుడు అనే ముని సరస్వతీ దేవిని ప్రార్ధించవలసి ఉంది. అతడు భారతీదేవిని ఆరాధించి, దేవి ప్రత్యక్షమైతే తన సందేహాలను దీర్చుకుంటాడు.    సంస్కృత మూలంలో వ్యాస మహర్షి సరస్వతిని స్తుతించలేదు.    నన్నయగారి భారతం వలెనే, ఎర్రనగారు కూడా అనువాద రచన చెయ్యదలచుకోలేదు. తాను స్వతంత్రంగా.. మెరుగులు దిద్ది, అవసరమైన చోటున కల్పన జేసి.. వద్దనుకున్న వద్ద వదిలేసి వ్రాయదలచారు.    అందువలన వాగ్దేవీ స్తుతితో తన కావ్యమును ప్రారంభించాడు..    "అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికా     డంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్న దీప్తికా     చుంబిక దిగ్విభాగ శ్రుతి సూక్త వివిక్త నిజ ప్రభావ భా     వాంబర వీధి విశృతవిహారి ననుం గృప జూడు భారతీ."    ఆ తరువాత భారత రచనా ప్రారంభం..    నన్నయ భట్టారకుని మనమున నుతించి శారదవేళను వర్ణించ నారంభించాడు ఎర్రన.    కన్నులు మూసుకున్నాడు. నన్నయ ఆవహించినట్లే..    "శారదరాత్రు లుజ్వల.." పద్యాన్ని తలచుకున్నాడు. ఆ తరువాత ఏ విధంగా సాగుతుంది శారద రాత్రి?     "స్ఫురదరుణాంశురాగరుచి బొంపిరి వోయి నిరస్త నీరదా     వరణములై దళత్కమల వైభవజ్రుంభణ ముల్లసిల్ల ను     ద్గురతరహంస సారస మధువ్రతవిస్వనముల్ సెలంగగా     గరము వెలింగె వాసర ముఖంబులు శారదవేళ జూడగన్."    ఒక్కసారి శారదరాత్రులు.. పద్యం క్రింద తన పద్యం పెట్టి చూసుకుని, గట్టిగా పైకి చదివాడు.    పదముల అమరిక, వాక్య నిర్మాణము, యతి ప్రాసలతో సహా.. వేరెవరికో గాదు తనకే నన్నయగారు వ్రాసినట్లే అనిపించింది.    ఇంక ఆ గంటం ఆగలేదు..    స్నాన, ధ్యాన, ఆహార పానీయాది నిత్యకృత్యములకు, నిదురకు తప్ప లేచింది లేదు.    పూర్తి అయ్యాక ఒకసారి తిరగేసుకున్నాడు తన కావ్యాన్ని ఎర్రన.    మొత్తం, నలభైయారు ఘట్టాలు, 1595 గద్య పద్యాలతో అరణ్యపర్వ శేషం ముగిసింది.    ఇందులో ఇరవై మాత్రమే భారత కథకి సంబంధించినవి. మిగిలినవి పురాణ కాలక్షేపాలు. ఎర్రనకి ఉత్సాహం కలిగించిన విషయం ఒకటుంది ఇందులో..    తను చిన్ననాటినుండీ అనుకుంటున్నది..    అదే.. రామాయణ రచన.    వ్యాస రామాయణం అరణ్యపర్వంలోనే ఉంది. రామ రావణుల జననం నుండీ రాఘవాభ్యుదయం వరకూ.. ఇది సంక్షిప్త రామాయణం.    అయితే ఇది వ్రాయబోయే మహాకావ్యానికి ఒక సాధన మాత్రమే.. వేమారెడ్డి ప్రభువు కోరిన రామాయణ గ్రంధం కూడనూ తను వ్రాయాలి.. అందులో ఏ మాత్రం అనుమానం లేదు.                                   …………….    నన్నయగారి ఇతిహాస శైలితో ప్రారంభించి, తిక్కనగారి నాటకీయ శిల్పంలో ముగించగలిగాడు ఎర్రన తన భారత భాగాన్ని. మొదట కొంచెం అధికంగా ఉన్న సంస్కృత పదాలు పోను పోను తగ్గసాగాయి.    తాతగారు చెప్పిన వారధి సంతృప్తిగా కట్టగలిగినట్లే.    నన్నయగారి శైలే కాదు, భావ స్ఫూర్తిని కూడా ప్రతిఫలించగలిగాడు ఎర్రాప్రగడ.    అనృతమాడుటకు అభ్యంతరం లేని పరిస్థితులను నన్నయగారు వ్రాసినది జ్ఞప్తికి వచ్చింది ఎర్రనకి ఒక సందర్భంలో..    భూతహితంబుగా బలికితే బొంకు కూడా సత్య ఫలమునిస్తుందనీ,    భూతభయాస్పదంబగు ప్రభూతపు సత్యం బొంకు వంటిదేననీ    ప్రాణాతురుడు, పరిణయంబునందును పలుకు బొంకు సత్యాశియంబనీ    వీనినే ధర్మ సూక్ష్మములనెదరనీ.. వివరించాడు.    తను చేసిన వర్ణనలు కూడా సంతృప్తిగా అనిపించాయి ఎర్రనకి.    ఇరువది తొమ్మిదో ఘట్టం నుండీ రామాయణం ప్రారంభమవుతుంది. ఇంకా నన్నయగారి శైలిలోనే నడిచింది..    అవును మరి.    ఇది నన్నయగారి అరణ్య పర్వంలో భాగం..    అదే న్యాయం.    ఒక్కసారి కావ్య రచన ఆరంభించాక ధార సాగిపోతూనే ఉంటుంది. కవి హృదయాన్ని, చేతలను మించి కూడా నడుస్తుంటుంది ఒక్కొక్కసారి.    రామ లక్ష్మణులు చూసిన పంపా సరోవర వర్ణన చదువుకుంటుంటే అదే అనిపించింది ఎర్రనకి..    "కమనీయ కమలినీ కహ్లార దళ కేస    రాన్విత జలముల నర్ఘ్య విధియు.."    నన్నయగారి శైలే..       సావిత్రీ చరిత్ర వ్రాసే సమయమున ఎర్రనకి ఆవేశము వచ్చింది. ఆమె కష్టములు.. అవి అధిగమించడానికి ఆమె చేసిన పోరాటము..    అందుకే ఆ చరిత్రనే ఒక ప్రబంధము లాగ వ్రాశాడు. అనేక మారులు మూల గ్రంధమును చదివి ఎంతో అవగాహనకి రావలసి వచ్చింది. తన శ్రమనంతయూ ఒక సారి జ్ఞప్తికి తెచ్చుకున్నాడు ఎర్రన. అదే సమయానికి, పోతమాంబ కోడలితో సహా వచ్చి ఎదుట నిలిచింది.    "అబ్బాయీ! నీ కావ్యంలోనుంచి ఏదయినా నాలుగు ముక్కలు చెప్తే వినాలని ఉంది మాకు. మరీ మాకు అర్ధంకాని క్లిష్ట పదాలతో కాక మామూలు భాషలో చెప్పు."    ఇంకేముంది.. ఆడువారికి రోమాంచితము సావిత్రీ సత్యవంతుల కథ. తనకీ ఇష్టమయింది, వారికీ నచ్చేది.. అదే చెప్తే స్వామి కార్యము, స్వకార్యము నెరవేరినట్లే.    ఎర్రన వారిని ఎదురుగా కూర్చోమని ప్రారంభించాడు.                                    ……………………..           .....మంథా భానుమతి

వారు ముగ్గురు (కథ)

  వారు ముగ్గురు (కథ) - ద్వివేదుల విశాలాక్షి        తొలితరం కథా రచయిత్రులలో విశాలాక్షి ఒకరు. కేవలం కథలే కాకుండా నవలలు కూడా రాశారు. విదేశాల్లో పర్యటించి తెలుగుభాషా వైభవాన్ని వ్యాప్తి చేశారు. విలువైన ప్రసంగాలు చేశారు. ద్వివేదుల విశాలాక్షి రాసిన నవలల్లో వైకుంఠపాళి, వారధి, మారిన విలువలు వంటివి ఎంతో పేరు తెచ్చాయి. సుమరు 3 కథా సంపుటాలను కూడా వెలువరించారు. ఢిల్లీ తెలుగు అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు. వీరి కథలు మానవ సంబంధాలలోని లోతులనే కాకుండా, మనిషి ప్రవర్తనల్లోని వైవిధ్యాన్ని వివరిస్తాయి. అలాంటి కథే వారు ముగ్గురు.      కథలోకి ప్రవేశిస్తే- ఒక మారుమూల గ్రామంలో ఓ పాడుపడిన ఇల్లు ఉంటుంది. అది దెయ్యాల కొంపగా ఆ వూర్లో ప్రచారం జరిగి ఉంటుంది. ఆ ఇంట్లో ఎవ్వరూ ఉండరు. కానీ ఒకరోజు తెల్లవారే సరికి ఆ ఇంటిముందు ముగ్గేసి ఉంటుంది. అది చూసిన గ్రామ ప్రజలు ఆశ్ఛర్యపోతారు. ఆందోళన చెందుతారు. గ్రామాల్లోని ప్రజలలో ఆత్మీయత, అనురాగాలు, కలివిడి తనం ఎక్కువ. ఎవ్వరికీ ఏ ఆపద వచ్చినా అందరూ తమదిగా భావిస్తారు. కానీ వారిలో కూడా చీడ పురుగుల్లాంటి వాళ్లు, వ్యక్తుల సొంత విషయాలను కూపీ లాగి, అందరి దగ్గరా చెప్పే వాళ్లు ఉంటారు. అలాంటి వాళ్లే కామమ్మ, సోమమ్మ. వారికి ఏ విషయాన్నైనా తెలుసుకొని పక్కవాళ్లకు చెప్పందే నిద్రరాదు. అలాంటి వాళ్లు దెయ్యాల కొంపముందు ఉన్న ముగ్గును చూశారు. ఆ ఇంటి ముందుకు వెళ్లి ఎవరు ఇంట్లో- అని పిలిచారు. ఇంట్లోనుంచి ముగ్గురు స్త్రీలు తెల్లబట్టలతో బైటకు వచ్చారు. వారు జెండా అంచులు గల ఖద్దరు చీరలు కట్టుకొని ఉంటారు. కానీ వీరికి పల్లెటూళ్లో సహజంగా ఇచ్చే మర్యాద ఇవ్వరు. అంటి ముట్టనట్లు సమాధానాలు చెప్తారు. దాంతో కామమ్మ, సోమమ్మ వాళ్లు పట్నం నుంచి వచ్చినట్లు అర్థం చేసుకుంటారు. అలానే ఇల్లు అంతా నీటుగా సర్దిన దాన్ని బట్టి వీళ్లు దెయ్యాలు కాదుకదా అనే అనుమానం వస్తుంది వాళ్లిద్దరికి.         వాళ్లు పెరటిని శుభ్రం చేసుకోవడం చూసి దెయ్యాలేమోనని పగుగులాంటి నడకతో నీలాటి రేవుకు వెళ్తారు. అక్కడ పరిచయం అయిన వాళ్లకు దెయ్యాల గురించి చెప్తారు. ఊళ్లో దెయ్యాల పేరయ్య లేడని, వారం పదిరోజుల దాకా రాడని చర్చించుకుంటారు. వాళ్లు కామినీ భూతాలని, వాళ్ల నుంచి మగవాళ్లను రక్షించుకోవాలని బాగా ప్రచారం జరుగుతుంది. కానీ వాళ్లు ఊరికి వచ్చి మూడురోజులైనా ఎవ్వరికీ ఏ ఆపదా కలగదు. తర్వాత ఆ ఊరి మునసబు రంగారావు ఊరి నుంచి రాగానే సోమమ్మ, కామమ్మ వచ్చి కామినీ భూతాల గురించి, దెయ్యాల కొంపలో వాళ్లు ఉంటున్న సంగతీ చెప్తారు. మునసబు భార్య కూడా వారి జోలికి వెళ్లకు నా సంసారం నాశనం అవుతుంది అని భయపడి భర్తకు చెప్తుంది. మునసబు రంగారావు వారికి కబురు పెడతాడు.        వాళ్లు మునసబు రంగారావును కలుస్తున్నారని తెలుసుకున్న ఊరు ఊరుంతా మునసబు ఇఁటి ముందు గుమిగూడుతుంది. వీభూతి రాసుకొని, దండకాలు చదువుతూ భయభయంగా వస్తారు ప్రజలు. ఆ ముగ్గురు యువతులు రంగారావుతో ఇంగ్లీషులో మాట్లాడి వెళ్లిపోతారు. వెళ్లి పోయిన తర్వాత మరో రెండు ఇళ్లను కూడా స్వాదీనం చేసుకుంటారు.  పట్నం నుంచి కొంతమంది పనివాళ్లు, సామాను వస్తుంది. ఆ ఇళ్లకు రామాపురం గ్రామ మహిళా మందిరం, రామాపురం గ్రామ వైద్యాలయం, రామాపురం గ్రామ ఉచిత విద్యాలయం  అని పేర్లు పెడతారు. పిల్లలకు మిఠాయిలు ఇచ్చి, తమ బడికి రమ్మని పిలుస్తారు. ముందుగా మునసబు తన ఇద్దరు పిల్లల్ని పంపిస్తాడు. వారు ఇంగ్లీషు మాట్లాడడం చూసి మరికొంత మంది తల్లిదండ్రులు ఆ బడికే పంపిస్తారు. తర్వాత క్రమంగా కొంతమంది వారు పెట్టిన వైద్యశాలకు వెళ్లి రోగాలు చూయించుకుని మందులుకూడా తీసుకుంటూ ఉంటారు. ఊరిలో చాలామంది వారు చేస్తున్న సేవను గుర్తిస్తారు.      కానీ ఊరిలో- వాళ్లు ముగ్గురూ కొరివి దెయ్యాలని, రాత్రిళ్లు దెయ్యాలతో వీళ్లు మాట్లాడుతున్నారనే వదంతు వ్యాపిస్తుంది. దాంతో గ్రామ ప్రజలు ప్రాణాల్ని గుప్పిటపట్టుకొని రాత్రిళ్లు నిద్రకూడా పోకుండా బతుకుతుంటారు. కొన్ని రోజులకు ఆ ముగ్గురు చేస్తున్న మంచి పనులు చేసి ఊరుఊరంతా మారుతుంటుంది. ఇంతలో ఒకరోజు నిశిరాత్రి ఊరి మధ్యలో ఉన్న ఇళ్లు అంటుకుంటాయి. అంటించిన మనిషి ఎవరో చూడలేరు. కానీ ఆ ముగ్గురు యువతులు మాత్రం మంటలు ఆర్పడానికి, తగలబడిన ఇళ్ల వాళ్లకు సాయం చేయడంలో గానీ ముందుంటారు. వారి సేవకు గ్రామస్తులందరూ ముగ్దులవుతారు. చివరకు నిప్పు పెట్టిన వ్యక్తిని పట్టుకుంటారు. ఎవరా అని అనుకుంటే... భూతాల పేరయ్య. అతడ్ని చూసి ఊరుఊరంతా ఆశ్చర్యపోతుంది.           గ్రామాల్లో ఇప్పటికీ ఉన్న మూఢనమ్మకాలను ఈ కథ ఆ రోజుల్లోనే వెలుగులోకి తెచ్చింది. అలానే ఊళ్లల్లో ప్రతి ఒక్కరి సొంత విషయాల్ని కనుక్కొని వ్యాపింపజేసే స్త్రీల మనస్తత్వాలను కూడా సోమమ్మ, కామమ్మ పాత్రల ద్వారా చెప్పారు విశాలాక్షి. అలానే కథంతా వ్యవహారిక భాషలో ఒక వాగు ప్రశాంతంగా సాగినట్లు నడుస్తుంది. చివరిలో ఒక కుదుపుకు గురై ఇళ్లకు నిప్పు పెట్టింది ఎవరనే ప్రశ్న వస్తుంది. ముగింపులో భూతాల పేరయ్య అని తెలియడంతో అతనిలోని అసలు గుణం బయటపడుతుంది. ఇలా గ్రామాల్లోని నేటి పరిస్థితులను తెలియజేస్తుంది ఈ కథ.  ........ డా. ఎ.రవీంద్రబాబు

“చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు” 14వ భాగం

  “చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు” 14వ భాగం    ఢిల్లీ ప్రజలకి, రాజప్రాసాదంలో హత్యలూ.. రాత్రికి రాత్రి సుల్తాన్ మారిపోవడాలూ అలవాటైపోయాయి.    పొద్దున్నే లేచి.. "రాత్రి అలా జరిగిందిట" అంటూ ఏదో సాధారణ వార్తలా చెప్పుకోవడం..    ఆ తరువాత, వారి పనులను మామూలుగా చేసుకోవడం. ఏ సుల్తాన్ అయినా ఒక్కటే.. వారి జీవితాల్లో మార్పు ఉండదు.    "ఈ రోజు వరకూ నేను ముసల్మాన్‍గా బ్రతికినా, పుట్టుకతోనూ.. మానసికంగానూ నేను హిందువునే. నాలో హిందూ రక్తం ప్రవహిస్తోంది. అణువణువునా హిందూత్వం ఉంది. నేను హిందూ సామ్రాట్‍నే.. ఢిల్లీ ఈ రోజునుండీ హిందూ సామ్రాజ్యం.    హిందూ రాకుమారి దేవల దేవి.. తండ్రితో దిక్కులేకుండా అడవిలో పారిపోతుంటే పట్టి బంధించి ఆమె మతం బలవంతంగా మార్చారు. ఆమె భర్త శంకర్‍దేవ్‍ని దారుణంగా హత్య చేశారు. ఆమెని నేను వివాహం చేసుకున్నాను. నేటి నుండీ దేవల దేవి హిందూ మహారాణీ."     ఖుశ్రో ఖాన్ తన పేరును నసీరుద్దీన్‍గా మార్చుకున్నాడు. హిందూ పేరే పెట్టుకోవచ్చు కదా! ఏ మూలో ముస్లిములంటే కొద్ది భయం ఉందేమో!                                 హిందూ చక్రవర్తి నసీరుద్దీన్ హిందువుల మీద జిజియా పన్నును ఎత్తేశాడు. హిందువులు కూడా ప్రధమ పౌరులని ప్రకటించాడు. వారిదేశంలోనే వారు హీనంగా బ్రతకడం అన్యాయమన్నాడు. ఆలయాలను పునరుద్ధరించాడు. తన సేనలలో కొన్నింటిని హిందువుల పరి రక్షణకై నియోగించాడు.    హిందూ రాజులు ఈ మార్పును స్వాగతించినా వారి వారి బలాలను సమకూర్చుకుని, ఢిల్లీ హిందూ సుల్తాన్‍కు తోడుగా ఉండి సమైక్యంగా దేశం నుండి ముస్లిములను తరిమి కొట్టాలనే ఉద్దేశ్యాన్ని మరచారు.    స్వార్ధం.. స్వార్ధం.    తామూ తమ రాజ్యం క్షేమంగా ఉంటే చాలు. దేశం ఏమైపోయినా ఫరవాలేదు.    అదే వారు చేసిన తప్పు. జీవితంలో వచ్చిన ఒకే ఒక అవకాశాన్ని నాశనం చేసుకున్నారు.    ఐకమత్యం లోపిస్తే అలుసేనని మరచారు.    హిందూ ధర్మ పునరుద్ధరణకై ప్రయత్నం చేసిన, చేస్తున్న ఖుశ్రో, దేవలదేవిలు ఒంటరిగా పోరాడవలసి వచ్చింది. చుట్టూ ముసల్మానులు.. అదీ కక్షగట్టిన వాళ్ళు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు.    అఫ్ఘనిస్తాన్ నుండీ కర్ణాటక వరకూ విస్తరించిన నసిరుద్దీన్ సామ్రాజ్యం.. కొద్దినెలలే అయినా హిందువుల పాలిటి బంగారు కాలం.    ముసల్‍మానులు ఒదిగి ఒదిగి ఒక మూలకు ఉండిపోయారు.    అదే విధంగా కొనసాగితే..    హిందూదేశ చరిత్రే మారిపోయేది.. మరో విధంగా ఉండేది.    కానీ.. విధి బలీయమయినది.    అవకాశం ఒకేసారి తలుపుతడుతుంది. ఆదమరిస్తే అంతే..    అదే జరిగింది నసీరుద్దీన్ విషయంలో.    ఎన్నో సంవత్సరాల ప్రణాలికని అతిశయం తలకెక్కి ధ్వంసం చేశాడు. ఎన్నో పగళ్ళు మొహంలో భావాల్ని తెలపకుండా శిలలా ఉండగలిగాడు అంతవరకూ! ఎన్నో రాత్రులు రహస్యంగా మేలుకుని వ్యూహాలు పన్నాడు. ఎంతో మంది తన వారిని గుండె బండ చేసుకుని వధింఛాడు..    అతని కఠోర శ్రమ అంతా అతని అనాలోచిత చర్యల వల్ల నాశనం అయిపోయింది. దేవలదేవి ఎంతగానో వారించినా ఫలితం సున్నా..    అనుకున్నది అనుకున్నట్లు అయితే.. తనకి ఎదురే లేదనుకుంటాడు మానవుడు.    ముస్లిములు తమ విషయంలో చేసిన తప్పులే.. అపరాధాలే, తనూ వారి విషయంలో చేశాడు నసీరుద్దీన్.    దేశంలోని హిందువులనందరినీ ఒక దగ్గర చేర్చి, ఆ ఉద్యమాన్ని కొనసాగించవలసింది పోయి.. అహంభావంతో కన్నూ మిన్నూ కానక ప్రవర్తించాడు.    నిండు సభలో, ముస్లిమ్ మంత్రులు, సేనానాయకుల సమక్షంలో.. సింహాసనం మీద ఖురాన్ ప్రతులను పరచి వాని మీద కూర్చున్నాడు. వారి మతాన్నీ.. అప్పటివరకూ తాను రోజూ చేసే నమాజ్‍నీ అవహేళన చేశాడు. ఇంకా.. అతి హీనమైన పనులు.. వర్ణించడానికి ఏహ్యమైన పనులు చేసి, ముస్లిమ్ సర్దార్‍ల మనోభావాల్ని దెబ్బ తీశాడు.    కోటలో, రాజప్రాసాదంలో సగం మంది పైగా ఉన్న ముస్లిమ్‍లు సహించలేని స్థితి వచ్చింది.    నసీరుద్దీన్ పతనం ప్రారంభమయింది.                                  ………..    ఘాజీ మాలిక్..    అల్లావుద్దీన్ సైన్యంలో అతి ముఖ్యుడైన సేనాని. మంగోలులను సరిహద్దునుంచి తరిమికొట్టిన బలవంతుడు. ముల్తాన్‍లో ప్రతినిధిగా ఉన్నాడు. అసమర్ధ ముబారక్ షా సుల్తాన్‍గా ఉన్నప్పుడు స్వతంత్రం ప్రకటించుకుని, ముల్తాన్, సింధు, ఉచ్ రాజ్యాలకు తనే రాజునని ప్రకటించుకున్నాడు. అతని కొడుకు, ఫకిర్ మాలిక్ నసీరుద్దీన్ ఖుశ్రో కొలువులో ఉన్నాడు.    ముసల్మాన్ సర్దార్లు అందరూ కలిసి, ఫకిర్ మాలిక్‍ని రహస్యంగా ముల్తాన్ పంపించారు.    ఢిల్లీలో జరుగుతున్న అత్యాచారాలని తండ్రికి తెలియజేశాడు ఫకిర్.    ఘాజీ మాలిక్ కుతకుతా ఉడికిపోయాడు.    "కాఫిర్ ఖుశ్రో.. హిందువా!" అవునన్నట్లు తల ఊపాడు ఫకిర్.    "జీహాద్.."    భూనభోనాంతరాలు దద్దరిల్లేలా అరిచాడు ఘాజీ.    మూడువేలమంది సుశిక్షితులైన సైనికులతో ఢిల్లీకి బయలుదేరాడు. పంజాబ్ వద్ద అతడిని ఎదుర్కున్నారు ఢిల్లీ సైన్యం.                              నసీరుద్దీన్ ఖుశ్రో సింహాసనం మీద కూర్చుని ముస్లిములని ఏ విధంగా అవమాన పరచాలా అని ఆలోచిస్తుండగా.. ఢిల్లీ కోటలోకి ప్రవేశించారు ఘాజీ సైన్యం.    తుఫాన్‍లా ప్రవేశిస్తున్న జీహాదీలను చూసి పారిపోయారు ఖుశ్రో, దేవలదేవిలు.    ఇద్దరినీ తరిమి తరిమి పట్టుకుని చిత్రవధ చేసి చంపేశాడు ఘాజీ.    పురిట్లోనే సంధికొట్టి పోయింది నసీరుద్దీన్ హిందూ సామ్రాజ్యం.    హిందువుల పాట్లు మొదలయ్యాయి.. ఇంకా భయంకరంగా!    ఘాజీ వెంటనే తాను చక్రవర్తినని ప్రకటించుకోలేదు. ఖుశ్రో చేసిన తప్పు తాను చెయ్యదలుచుకోలేదు. మూడు రోజులు, తన ప్రభువు అల్లావుద్దీన్ ఖిల్జీ మరణానికి సంతాపాన్ని ప్రకటించి, రాజ మందిరంలోనే ఉండి పోయాడు.    ఆ తరువాత ఖిల్జీ వారసులెవరైనా ఉన్నారా అని వెతికాడు. కొందరిని మాలిక్ కాఫర్ చంపుతే, మిగిలిన వారందరినీ ముబారక్ షా చంపేశాడు.    తొందరపడకుండా.. ముస్లిమ్ పెద్దలచేతనే.. మంత్రులు, సేనానులు, దండనాయకుల సమక్షంలో ఘాజీ మాలిక్ తమ నూతన చక్రవర్తి అని ప్రకటింపజేశాడు.    క్రీ.శ. పదమూడు వందల ఇరవయ్యో సంవత్సరంలో.. ఘాజీ మాలిక్ ఢిల్లీ సుల్తాన్‍గా, "ఘియాజుద్దీన్ తుగ్లక్‍" అనే పేరుతో ప్రమాణ స్వీకారం చేశాడు.    అతని కొడుకు ఫకిర్.. మహమ్మద్ షా తుగ్లక్ అయ్యాడు.    హిందూ దేశంలో ఖిల్జీ వంశ పాలన, నసీరుద్దీన్ ఖుశ్రోఖాన్ విప్లవంతో అంతరించిపోయి తుగ్లక్ వంశ పాలన మొదలయింది.                              .......................                                                                          11    "హా..హా! ఢిల్లీ సింహాసనం మీద హిందూ చక్రవర్తి.. మనం స్వతంత్రులమౌతున్నాం.." ప్రతాపరుద్రుడు ఆనందంగా అరిచాడు.. వేగుల వార్త విని.    సభలో కరతాళధ్వనులు మిన్నంటాయి.    "అక్కడికక్కడే బోలెడు సమస్యలు వాళ్ళకి.. హిందువు మోసం చేసి సామ్రాట్ అయ్యాడని ముసల్మానుల అసంతృప్తి.. హీన జాతివాడు సింహాసనమెక్కాడని హిందువుల కినుక.. అంతా అస్తవ్యస్తం. ఇదే సరయిన సమయం. మన నాయంకరులకి యుద్ధ సన్నిద్ధులను కమ్మని వర్తమానం పంపండి గన్నమ నాయుడుగారూ!" మహామంత్రికి ఆదేశాలిచ్చాడు.    దాది గన్నమనాయుడు సమర్ధుడైన సేనాని.. అంతటి క్లిష్ట పరిస్థితులలోనూ.. సాధ్యమయినంత ప్రజారంజకంగా పరిపాలన సాగించడానికి దోహదపడుతుంటాడు. అతడే ప్రతాపరుద్రుని మంత్రి, కోశాధికారి కూడా.    "యుగంధర్" అని ఆత్మీయంగా అందరిచేతా పిలిపించుకునే అందరివాడు.    గన్నమనాయుడి వంశీయులు తరతరాలుగా కాకతీయ ప్రభువులకు సేనానులుగా సేవలందిస్తున్నారు.    ఒక్క క్షణం ఆగుతే పరిస్థితులు మారుతాయేమోనన్నట్లు లేచి పరుగులు పెట్టారు అందరూ.    శివదేవయ్యగారు మాత్రం కన్నులు మూసుకుని కదలకుండా కూర్చునుండి పోయారు.    ప్రతాపరుద్రుడు పట్టించుకోకుండా లేచి వెళ్ళిపోయాడు.    అప్పుడు కళ్ళు తెరిచిన శివదేవయ్యగారు విరక్తిగా ఒక్క నవ్వు నవ్వి లేచారు.                                  …………..    ప్రతాపరుద్రుడి నాయంకరులు నాలుగు సంవత్సరాలనుండీ ముసల్మాన్ రాజుల బానిసత్వం నుండి విముక్తికై ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.    ముసునూరి ప్రోలయ నాయకుడు, ద్వార సముద్రం వీర బల్లుడు, అద్దంకి వేమారెడ్డి.. వారిలో ప్రముఖులు.    వారందరూ యుద్ధానికి సిద్ధం అవుతూనే ఉన్నారు..    ఢిల్లీలో పరిస్థితులు మారిపోయాయి.    నసీరుద్దీన్ ఖుశ్రోను నరికేసి, ఘజియుద్దీన్ తుగ్లక్ సామ్రాట్ అయ్యాడు. అతడు ఆరితేరిన యుద్ధవీరుడు. అల్లావుద్దీన్ నమ్మినబంటు. అల్లాఉద్దీన్ వ్యూహాలన్నీ బాగా తెలిసినవాడు.    ప్రతాపరుద్రుడు స్వతంత్రం ప్రకటించుకున్నాడు. ఢిల్లీ సుల్తాన్‍కు కప్పం కట్టడం మానేశాడు. సామంతులందరినీ సమకూర్చుకుని ముస్లిమ్ దండయాత్రని ఎదురుకొనడానికి సిద్ధంగా ఉన్నాడు.    రెండు సంవత్సరములు ఎదురుచూసిన సుల్తాన్ తన కొడుకుని, పెద్ద సైన్యంతో దక్కనుకి పంపాడు.. హిందూ కాఫిర్‍ల మదమడచమని.    ఉలూఘ్ ఖాన్ .. ఇతన్నే మహమ్మద్ బీన్ తుగ్లక్ అని అంటారు.. తండ్రి అంతటి వీరుడు. అపారమైన సైన్యంతో పూనా, దేవగిరిలను స్వాధీనం చేసుకున్నాక ఓరుగల్లును ముట్టడించాడు.    తయారుగా ఉన్న కాకతీయ సామ్రాజ్య వీరులు ఉల్లూఖాన్ సేనలను తరిమి కొట్టారు. కానీ ఎనిమిది మాసాల ఆ సుదీర్ఘ యుద్ధం వల్ల ఎంతో నష్టం జరిగింది. ఎందరో సైనికులు అసువులు బాసారు. అశ్వ, గజ దళాలు అనేక కష్టాలు పడ్డారు. కాళ్ళు విరిగిన జంతువులను నరికి చంపవలసి వచ్చింది.    ఉల్లూఖాన్ దేవగిరి పారిపోయాడు.    కాకతీయ రాజ్యంలో విజయోత్సవాలు.. పోయిన వారు పోగా మిగిలిన వారు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకుంటున్నారు. సేనానులందరూ వారి వారి సీమలకు వెళ్ళిపోయారు.    అంతలో ఢిల్లీ సుల్తాన్ మరణించాడన్న వార్త దావానలంలా వ్యాపించింది.    ఆనంద హేలలకు అంతులేకుండా పోయింది. పారిపోయిన ఉల్లూఖాన్ ఇప్పుడు సుల్తాన్..    కాకతీయ సామ్రాజ్యం మరల స్థాపించబడింది.    ప్రతాపరుద్రుడు చక్రవర్తి.. పూర్వ వైభవం తిరిగి వస్తుంది.. అని అందరూ ఊహించారు.    యుద్ధంలో అలిసి అలిసి సోలిపోయిన వారందరూ లేచి నిలదొక్కుకున్నారు. ఆయుధాలు అటకెక్కించారు. ఎన్నెన్ని సంవత్సరాల పోరాటం.. చివరికి అంతమయింది.    అంతకన్నా కావలసినది ఏముంది?    చక్రవర్తినుండి, చాకలివాని వరకూ విశ్రాంతి తీసుకుంటున్నారు.. మానసికంగా, శారీరికంగా.                                …………..    ఉల్లూఖాన్.. వట్టి జిత్తులమారి.    తండ్రి చనిపోయినట్లు తనే పుకారు సృష్టించాడు. అదనపు సేనలను పంపమని ఢిల్లీకి వర్తమానం పంపాడు. దేవగిరి సేనలను కూడా సమీకరించాడు.    ఓరుగల్లు సైన్యం ఏమరుపాటుగా ఉన్నప్పుడు విరుచుకు పడ్డాడు.    పంట పొలాల మీద ఆంబోతులు పడినట్లు వీర విహారం చేసి, అడ్డం వచ్చిన వాళ్ళని నరికేశాడు. కోటలో ప్రవేశించి ప్రతాపరుద్రుడిని, రాణీ విశాలాక్షిని.. సేనాధిపతులను.. అందరినీ బంధించాడు.    కోహినూరు వజ్రముతో సహా బంగారము, వజ్ర వైడూర్యాలు.. సంపదనంతా ఇరువదివేల గుర్రములపై, వంటెలపై, ఏనుగులపై నుంచారు. వానితో పాటుగా.. గన్నమనాయుడిని, ప్రతాపరుద్రుడిని ప్రత్యేకమయిన కాపలాతో ఢిల్లీకి తరలించాడు.    ప్రతాపరుద్రుడు అవమాన భారంతో కృంగిపోయాడు. ఢిల్లీ చేరితే సుల్తాన్ ఏ శిక్ష వేస్తాడో తెలుసు. ముందు మతం మార్చుకోవాలి.. ఆ తరువాత..    హరపాల దేవుడు గుర్తుకొచ్చి గజగజ వణికి పోయాడు.    అప్పుడు గుర్తుకొచ్చారు శివదేవయ్యగారు. సలహాలు తీసుకోవడం సరే.. వారితో మాటలాడి ఎంతో కాలమయింది.    సాక్షాత్ శివుని అవతారం వారు.    ప్రతాపరుద్రుడు పశ్చాత్తాపంతో కృంగి పోయాడు. శివదేవయ్య గారు ఒకప్పుడు చెప్పిన సంగతి జ్ఞప్తికి వచ్చింది.    "కాకతీయ సామ్రాజ్యం స్థాపించి వేయి వత్సరములయినది. ఇంక దైవబలము మనకు లేదు.. పద్మాక్షీ అమ్మవారి ఖడ్గ ఖేచకములు మాయమయినవి."    మానవమాత్రులు చేయగలిగినది ఏమున్నది.. విధి వ్రాత తప్పించుటెవరి తరము?    ఢిల్లీ వెళ్తున్న సుల్తాన్ సేనలు నర్మదానదీ తీరమున ఆగాయి. సాయం సమయమయింది. ముసల్మానులు నమాజు చేసికొనుటకు, ఒడ్డున వస్త్రములు పరచినారు.    ప్రతాపరుద్రుడు నది ఒడ్డునకు వెళ్ళి నిలబడినాడు.. కాళ్ళు చేతులు కడుగుకొను వాని వలె. అందరూ చూస్తూనే ఉన్నారు.. భూమ్యాకాశాలకు నమస్కరించి నదిలో దూకేశాడు. కొద్ది సేపటిలోనే సుదూర తీరాలకి కొట్టుకొని పోయాడు. వార్త విన్న విశాలాక్షీ దేవి, తను కూడా ప్రాణ త్యాగము చేసింది.    వేయి సంవత్సరముల కాకతీయ సామ్రాజ్యం అంతరించింది.    చరిత్రలో మిగిలిపోయింది.                                   ………...    ఉల్లూఖాన్ ఓరుగల్లును దౌలతాబాద్ (దేవగిరి)లో ప్రతినిధిగానున్న మాలిక్ బుర్హానుద్దీన్ అధీనంలో నుంచాడు. శ్మశానంలా తయారయిన సామ్రాజ్యాన్ని ఎవరు ఏలితే ఏమి?    తెల్లవారితే..    వెల్లల్లేక నల్లగా మారిన గోడలు    నాచు పట్టిన ఇళ్ళలో    కుళ్ళిపోయిన మనుషులని    నీళ్ళతో కడుపు నింపి    ఊళ్ళకి ఊళ్ళని కొల్లగొట్టడం..    ఇంతే జీవితం. వేంగీకి, వెలనాడుకి, పాకనాడుకీ వలసలు పెరిగిపోయాయి. రాజ్యపాలన అంటే దోచుకుని తినడం కాదు..    నీటి వనరులు చూడాలి. వ్యవసాయం చెయ్యాలి. వ్యాపారం చెయ్యాలి. విద్యలు నేర్పాలి. వివాహాది శుభకార్యాలు చెయ్యాలి. ఆటపాటలు.. సంగీత సాహిత్యాలు..    ఎప్పటికి వచ్చేను ఆ రాజ్యం..    వస్తుంది వస్తుంది త్వరలో    చీకటి వెనుకే వెలుగు.    తెలుగు నాట ఢిల్లీ పాదుషా రాజ్యం అంతరించలేదు.  కానీ.. బలహీనమైపోయింది.    అదీ ఒకందుకు నయమే. తెలుగు వారి జీవితాలలో వెలుగు రాబోతోంది.    అందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.                              …………..    బెండపూడి అన్నయమంత్రి, కొలను రుద్రమదేవుడు.. వీరిరివురు దేశాభిమానులు. చెల్లాచెదురైన హిందూ రాజులను కలిపి తెలుగునాడు విముక్తికి కృషి చేయదలచారు.    ప్రతాపరుద్రుని నాయకులను కొందరిని సమావేశ పరచారు.    వారిలో ముసునూరి ప్రోలానీడుని నాయకునిగా ఎన్నుకున్నారు. ఇతడు కృష్ణా మండలములోని నూజివీడుకి చెందినవాడు. ఇతని పినతండ్రి మనుమడే కాపయ నాయకుడు. పినతండ్రికి అన్నిటా చేదోడు వాదోడుగా ఉంటాడు.    ప్రోలానీడు నాయకులనందరినీ ఒక త్రాటి మీదికి తెచ్చి, ఓరుగల్లు విముక్తికి వ్యూహములు పన్నసాగాడు. ఆ నాయకులలో అద్దంకి వేమారెడ్డి ముఖ్యుడు.    వేమారెడ్డి, పశువుల కాపర్లు, రైతులతో పెద్ద సైన్యాన్ని సమకూర్చాడు.    వీరి విప్లవాన్ని గూర్చి విన్న ఢిల్లీ పాదూషా తుగ్లక్, అణచి వేయడానికి ఓరుగల్లు నుండి సేనలను పంపాడు. దానికి మాలిక్ మక్బుల్ సైన్యాధికారి.    ఈ మాలిక్ మక్బుల్ ఎవరో కాదు.. మతం మార్చుకున్న దాది గన్నమనాయుడు.. యుగంధర్. అల్లాని కొలువకపోతే చర్మం ఒలిచేస్తామన్నాడు డిల్లీ సుల్తాన్. మతం మార్చుకుని, కొన్ని యుద్ధాలలో సుల్తాన్‍కు సేనాపతిగా ఉండి.. చివరకు ఓరుగల్లుకు వచ్చాడు.    అతను మాలిక్ కాఫర్ లాగా, ఖుశ్రోఖాన్ లాగా సుల్తాన్‍కి ద్రోహం చెయ్యదలచుకోలేదు. చరిత్ర గుణపాఠమయింది. మంచో చెడో జరిగింది జరిగిపోయింది. సేనానిగా ఏ సైన్యంలోనున్నా ఒక్కటే.. అటు వుంటే ముస్లిములను చంపాలి. ఇటు వుంటే హిందువులని చంపాలి.    చేసేదొకటే.. చంపడం. ఎవరైతే నేమి..    ముస్లిమ్ సైనికులు దండెత్తి రాగానే వారు ఆగి ఉన్న చోట నీటిని కలుషితం చేయించాడు వేమారెడ్డి. కనిపించకుండా చెట్ల చాటున దాగి దెబ్బ కొట్టసాగారు అతని సైనికులు.. అందరూ సామాన్య ప్రజలే..               ముస్లిమ్ సైనికులందరికీ కడుపులు పాడయి కదల లేకపోయారు. వారందరినీ.. సేనా నాయకుడితో సహా ఓరుగల్లుకు తరిమి కొట్టారు తెలుగు వీరులు.    ఓరుగల్లు వద్ద కాపయ నాయకుడు తుగ్లక్ సైనికులను ఎదుర్కొని, ఓరుగల్లును చేజిక్కించుకున్నాడు. తెలుగునాట తెలుగు రాజులు రాజ్యమేలనారంభించారు.      అద్దంకి రాజధానిగా ప్రోలయ వేమారెడ్డి, రెడ్డి రాజ్యాన్ని స్థాపించాడు.    యుద్ధ వాతావరణం నుండి బయటపడిన పాకనాడులో నిజమైన రాజ్యపాలన మొదలయింది.                                                   ---------------           .....మంథా భానుమతి  

కొనకళ్ళ వెంకటరత్నం

  కొనకళ్ల వెంకటరత్నం (బంగారి మామపాటల రచయిత)  కొనకళ్ల వెంకటరత్నం. పరిచయం అక్కర్లేని పేరు. ఎంకిపాటల తర్వాత అంతటి ప్రాచుర్యం పొందిన బంగారి మామపాటల రచయిత. చలం, కృష్ణశాస్త్రి లాంటి ప్రఖ్యాత కవులు, రచయితలు ఎందరో వీరి పాటల్ని పాడుకుని ఆనందించేవారు. సుక్కలన్ని కొండమీద సోకుచేసుకునే వేళ... అని అవ్యక్త బాధతో, జీరపోయిన గొంతుతో వెంకటరత్నం పాటపాడితే, కృష్ణశాస్త్రి బారంగా నిట్టూర్పు విడిచాడు. ఆ మధుర క్షణాల గురించి చలం చెప్పాడు. అలాంటి కొనకళ్ల కేవలం బంగారు మామ పాటల్నే కాదు ఎన్నో కథల్ని కూడా రాశాడు. అవి తెలుగు కథా సాహిత్యంలోని లోటును పూరించాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కొనకళ్ల వెంకటరత్నం పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడులో 1909లో జన్మించాడు. కాకినాడలోనే విద్యాభ్యాసం చేశాడు. పోలీసు ఉద్యోగం చేసి చివరకు ఏలూరులో స్థిరపడ్డారు. ఉద్యోగరీత్యా అప్పటి ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణ, గుంటూరు, ఉభయగోదావరి వంటి అనేక ప్రాంతాలు తిరిగారు. అక్కడి జీవన పరిస్థితులను, ప్రజల బాగోగులను అవగాహన చేసుకున్నారు. ప్రతోళి, బంగారుమామ పాటలు, పొద్దు తిరుగుడు పూలు వంటి గేయా సంపుటాలను వెలవరించారు. వీరి కథలు ఆనాడు ప్రముఖ పత్రికలైన భారతి, ఆంధ్రప్రభ, ఆంధ్ర పత్రిక, ఆంధ్రసచిత్ర వారపత్రిక వంటి వాటిలో ముద్రితమయ్యాయి. వీరు రాసిిన బంగారిమామ పాటల్లోని- మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో పాటను మొదట 'సిపాయి కూతురు' చిత్రంలో వాడారు. తర్వాత 'అదృష్టవంతులు' సినిమాలో తీసుకున్నారు. అలాగే- రావోయి బంగారిమామా నీతోటి రహస్యమొకటున్నదోయి పాట ఘంటసాల గొంతులో తెలుగు వారి హృదయాలను కొల్లగొట్టింది. కొనకళ్ల వెంకటరత్నం సుమారు 40 కథల వరకు రాశారు. వీరి పాటల వలే కథలు కూడా కవిత్వ వాక్యాలతో రసజ్ఞతతో నిండి ఉంటాయి. వర్ణనలు చేసేటప్పుడు వెంకటరత్నం కవితాత్మకంగా కథా వాతావరణాన్ని, పాత్రల మానసిక స్థాయిని, స్థితిని బట్టి అద్భుతంగా చేశారు. వీరి కథల్లో ప్రేమలోని వివిధ పార్శ్వాలు గమనించవచ్చు. అలాగే రాయలసీమ కరువు గురించి, స్వాతంత్ర్యపోరాట నేపథ్యంలో జరిగిన సన్నివేశాల గురించి చెప్పారు. కథా వస్తువు, కథనం రెండూ రెండు కళ్లలా ఒకే చూపును సూచిస్తాయి. 'శశిరేఖ స్వగతం' కథలో శశిరేఖ, చందర్రావు పట్నంలో చదువుకుంటూ ఉంటారు. వారిద్దరికి వారి తల్లిదండ్రులు పెళ్లి కుదురుస్తారు. కానీ శశిరేఖ పెళ్లికి విఘాతం కలిగించమని చందర్రావును కోరుతుంది. ఆమె పై ఉన్న ఇష్టాన్ని వదులుకొని ఆపని చేస్తాడు చందర్రావు. కాని చివరకు జ్ఞానోదయం అయిన శశిరేఖ మళ్లీ అతడ్నే పెళ్లాడమని అడుగుతుంది. అందుకు చందర్రావు తిరస్కరిస్తాడు. ఈ కథలో చంచల స్వభావం ఉన్న శశిరేఖ మనస్తత్వం, తన అభీష్టాన్ని వదులుకొని శశిరేఖకోసం చందర్రావు చేసిన పని గుర్తించడదినవి. ఒకనొక స్థాయిలో శశిరేఖ మథనపడి చందర్రావుతో- తనను చెడామడా తిట్టి, చాలకపోతే ఎడాపెడా చేయికూడా చేసుకుని, దైర్జన్యంగా బలత్కారం చేసినా బాగుండు అని అనుకుంటుంది. రాయలసీమ కరవు నేపథ్యంలో రాసిన కథ చదివితే కన్నీరు వస్తుంది. జ్వాలాపతి బళ్లారి సమీపంలోని శ్రీధరగడ్డకు కరువు క్యాంపు ఇన్ ఛార్జిగా వెళ్తాడు. ఒకరోజు రాత్రి వంటిట్లో చప్పుడైతే పదిహేనేళ్ల కుర్రాడిని దొంగగా పట్టుకుంటారు. అతడిని కొడతారు. అతడు దొంగతనం కోసం రాలేదు. ఆకలితో ఇంట్లోకి వచ్చాడన్న నిజాన్ని తెలుసుకుంటారు. కానీ అప్పటికే ఆ కుర్రోడు చనిపోతాడు. చివరకు ఆ శవాన్ని తీసుకెళ్లి, క్యాంపులో చోటు దొరక్క చెట్టుకింద ఉన్న అతని తల్లిదండ్రుల చేతుల్లో ఉంచుతారు. వాళ్లు శోకంతో విలవిలలాడిపోతారు. స్వాతంత్ర్య సంగ్రామానికి సంబంధించి వెంకటరత్నం రాసిన కథల్లో 'దొంగసొత్తు', 'చివరికి మిగిలిన రంగడు' లాంటివి గొప్పకథలు. 'దొంగసొత్తు' కథలో నందకిశోర్ పోరాటంలో భాగంగా అజ్ఞాతంలోకి వెళ్లిపోతాడు. అతని సహచరుల జీవనానికి కొంత డబ్బు అవసరం అవుతుంది. అందుకు తన చిన్ననాటి స్నేహితురాలైన లాయర్ రాజేంద్ర భార్య రమాదేవి దగ్గర నుంచి బంగారు కంకణాన్ని తీసుకుంటాడు. చివరకు ఆ విషయం బయటపడుతుంది. ఉదాత్త భావాలు గల పోలీసు కథ 'కత్తిమీదసాము'. ఈ కథలో జవాను 116 ఉత్తమ గుణాలు కలిగిన వ్యక్తి. అన్యాయాలను ఎదిరిస్తాడు. నిజాయితీగా జీవిస్తుంటాడు. ముసుగేసుకుని మోసం చేస్తున్న హెమాహెమీలను పట్టిస్తాడు. చివరకు అతనికి పిచ్చిపట్టిందని పిచ్చాసుపత్రిలో చేర్చుతారు. అప్పుడు రచయిత అతనిచే అద్భుతమైన ఉపన్యాసాన్ని ఇప్పిస్తాడు. 'మీ పాపాలతో పాలు పంచుకోవడం లేదని, మీతోబాటు నేరాలలో రూపాయినోట్లమీద రాజీలకు దిగడంలేదని, చీకట్లో మీ ఆటలు వెలుగులోకీడ్చి తెస్తున్నానని, నా పొట్ట కొడదామని చూస్తారా... అని అంటాడు. ఇలాగే వీరు రాసిన నలభై కథలు అద్భుతంగా ఉంటాయి. కొత్త కోణాల్ని, సమస్యల్ని వెంకటత్నం తనదైన దృక్పథంతో, దృష్టితో చెప్తారు. అలానే వీరి కథల ప్రారంభాలు, ముగింపులు కూడా మొపాసా, ఓ హెన్రీలను గుర్తుకు తెస్తాయి. పాత్రలు మాట్లాడే రీతి చూస్తుంటే- కులాలు, మతాలు, ప్రాంతాలు, చదువు, సంస్కారం వంటి వాటిని అధిగమించాయనిపిస్తుంది. అంటే- పాత్ర స్వభావానికి అంత ప్రాధాన్యత ఇస్తారు కొనకళ్ల వెంకటరత్నం. ఎప్పుడు ఎవ్వరు ఎలా మాట్లాడాలో అలానే మాట్లాడిస్తారు. వీరి కథల్లోని ఇతివృత్తాలు ఎక్కువగా ఆకలి, కట్నాలు, పెళ్లిళ్లు, కామం, పేదరికం, నీచమైన రాజకీయాలు, డబ్బు, విశ్రాంతి లేని పనుల ఒత్తడి, యంత్రాల్లా ఏమాత్రం మానవీయత లేని మనుషులు... వంటి వాటి చుట్టూ తిరుగుతుంటాయి. కథల మలుపుతో పాటు, చమత్కారం, కవిత్వం కథల నిండా నిండి ఉంటుంది. 'మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో' లాంటి అద్భుతమైన పాటల్ని, అడ్డదారి, అతను ఇకరాడు, అద్దంమీద ఆవగింజలు, అనుకోని విరహం, సంఘర్షణ, ఖయిదీ - జవాను, తొందరపాటు, విముక్తి, ఆఖరు గుణపాఠం, పశుపక్షుల సమావేశం వంటి ఎన్నో గొప్ప కథల్ని రాసి మనకిచ్చిన కొనకళ్ల వెంకటరత్నం 1971, జనవరి 9 వ తేదీన మరణించారు. అయినా వారి కథలు, పాటలు మాత్రం తెలుగు ప్రజల హృదయాలపై ఎప్పుడూ చిరస్థాయిగానే నిలిచి ఉంటాయి. ......డా. ఎ.రవీంద్రబాబు

పండిత రమాబాయి సరస్వతి

పండిత రమాబాయి సరస్వతి "ఆడవారు ఉన్నత కులస్తులైనా, నిమ్న కులస్తులైనా, ఆడవారెపుడూ పాపాత్ములూ, హీనులూ, అపవిత్రులూ, అసత్యం లాంటి వాళ్ళూనూ, అందువల్ల వీళ్ళకి మోక్షం లభించదు మగవాళ్ళలాగా. అయితే మోక్షం పొందటానికి వీరికి ఒకే వొక్క మార్గం ఉంది, అదేంటంటే, ప్రత్యక్ష దైవాలైన పతి దేవుళ్ళని కొలవటం. ఇదొక్కటే వారిని అసంఖ్యాకమైన జన్మలెత్తి, చెప్పలేని దుఖాన్ని అనుభవించాల్సిన ఖర్మ నుంచి తప్పించేది. ఆడవాళ్ళు వేదాలనూ వేదాంతాన్నీ చదవటానికి అర్హులు కారు. కానీ బ్రహ్మజ్ఞానం లేకుండా మోక్షం ఎవరూ పొందలేరు కదా. నా కళ్ళు ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా తెరుచుకుంటున్నాయి. ఆడదానిగా నా హీన స్తితికి నేను మెల్లిగా చేరుకుంటున్నాను. భక్తి ద్వారా ఆధ్యాత్మిక ఓదార్పు పొందడం నాకు సాధ్యం కాదని అసలు ఆడదానిగా నాకు ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో స్థానం లేదని, శాస్త్రాలు నాకు ఇవ్వగలిగేదాంతో నాకు తృప్తి లేదని నాకర్ధమవుతోంది." ఈ మాటలు అన్నది ఎవరో మమూలు స్త్రీ కాదు, పన్నెండేళ్ళ వయసుకే 18 వేల శ్లోకాలు అనర్గళంగా వాటి తాత్పర్యంతోపాటు, అది కూడా శుద్ధ సంస్కృతంలో చెప్పగలిగిన రమా బాయి. ఈమె ఆ వయసులో మరాఠీ, కన్నడ, హిందుస్తానీ, బంగాలీ, సంస్కృత భాషల్లో దిట్ట. ఇంత పాడిత్యం ఉన్న ఈమెకు ఇంత విరక్తి కూడా ఎందుకు కలిగిందో తెలుసుకుందాం. ఆమె జీవితం ఒక కధలా కాక ఒక గాధలా రెండు విభిన్న కాలాల్లో జరిగినట్టుగా ఉంటుంది. పెళ్ళివరకూ ఒక కాలంలో, ఆతరవాత కొంచం మనకు దగ్గర కాలంలో లాగా. మైసూరు సంస్థానంలో పండితుడైన అనంతుడనే ఈమె తండ్రి మహా పండితుడూ, పురాణాలను, వేదాలను ఔపోసన పట్టిన వాడు. అయితే ఈయనకిఒక విచిత్రమైన కోరిక పుట్టింది (నా దృష్టిలో అది విచిత్రమే ఆయన ఉన్న కాలంలో) తన పాండిత్యాన్నంతా తన భార్యకూ, తల్లికీ కూడా నేర్పించాలని. మొదట ఆ ఇద్దరూ కూడా ఇది తగని పనని చెప్ప చూస్తారు, కానీ అనంతుడు వినడు. కానీ ఆయన తన పట్టుదల సాధించే లోపే ఇద్దరూ చనిపోతారు. తన పాండిత్యాన్ని ఇంకా మెరుగు పెట్టడం కోసం నేపాల్ వెళ్ళినప్పుడు, ఇతని పాండిత్యానికి మెచ్చి నేపాల్ రాజు ఇతనికి ఇతర కానుకలతో పాటు రెండు ఏనుగులను కూడా బహూకరించాడట. ఈయన తిరిగి తన 44వ ఏట 9 ఏళ్ళ పిల్లను రెండవ వివాహం చేసుకుంటాడు. ఆ పిల్లతో తన పంతం సాధించుకునే ప్రయత్నం చేసినప్పుడు, చిన్న పిల్ల కదా పైగా ఈయన చాలా పెద్దవాడు (తండ్రి వయసు) ఎదురు చెప్పక నేర్చుకుంటుంది, సంస్కృతమే కాకుండా ఇతర భాషలూ నేర్చుకుంటుంది. సగం మంది చనిపోగా మిగిలిన ఒక అబ్బాయికీ, అమ్మాయిలిద్దరికీ కూడా నేర్పిస్తుంది. అయితే ఈ క్రమంలో సమాజం నుంచి వెలి ఎలాగూ తప్పక, తానే దగ్గర్లోని అడవుల్లో, ఒక పుణ్య క్షేత్రం సమీపంలో అనంతుడు ఇల్లు కట్టు కుని ఉంటాడు, మైసూరు లోని సర్వ భోగాలూ వదిలిపెట్టి కేవలం ఆడపిల్లలకి విద్య నేర్పే కార్యానికి అంతరాయాలు లేకుండా ఉండటం కోసం. బాల్య వివాహమే చేస్కున్నా ఈయన ఆశయం హర్షించదగినది. అందులోను రమా బాయి అద్భుత ప్రతిభ కనపరుస్తుంది. స్వతహాగా దాన కర్ణుడైన అనంతుడు ఉన్నదే కాకుండా తను పురాణ పఠనం చేసి సంపాదించేదంతా కూడా దాన ధర్మాలతో ఖర్చు చేస్తాడు. ఆ తరవాత చేసేది లేక తను కూడా కుటుంబంతో సహా పుణ్య క్షేత్రాల దర్శనార్ధం యాత్రికుడై యాచిస్తూ దేశమంతా తిరుగుతుంటాడు. ఈ క్రమంలోనే చెన్నై పరిసరాల్లో ఒక గుడి దగ్గర ఒక సంవత్సం పాటు ఉంటారు. రమాబాయికి పదహారేళ్ళ వయసులో, అప్పుడొచ్చిన భయంకరమైన కరువు వల్ల, తిండి లేక రోగాల బారిన పడి, తండ్రి, తరవాత తల్లి, ఆ తరవాత ఇంకొక అక్కా కూడా చనిపోతారు. రమా బాయి ఆమె అన్న శ్రీనివాసు ఇద్దరే మిగులుతారు. భుక్తి గడవటానికి దారి లేక చిన్నప్పట్నుండి తెలిసిన ఒకే ఒక యాత్రిక జీవనం వల్ల, మళ్ళా ఇద్దరూ యాత్రలు చేస్తూ కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా వేల మైళ్ళు తిరుగుతూ కలకత్తాకు వస్తారు. వారి భోజనం సాధారణంగా ఉప్పు వేసిన గంజి నీళ్ళే. అయితే కలకత్తాలో ఈమె ప్రతిభ గమనించిన పండితులు కొందరు ఈమెకు పండిత అనే బిరుదు ఇస్తారు. ఈమె ప్రతిభ అప్పటి పండిత పురుషులకేమాత్రం తీసిపోదని గుర్తించి ఆమెను అపర సరస్వతి అని కీర్తించి సరస్వతి అనే బిరుదు కూడా ఇస్తారు. ఈ సరస్వతి అనే బిరుదు యూనివర్సిటి ఆఫ్ కలకత్తా ఆమె పాండిత్యాన్ని పరీక్షించి ఇచ్చినది. ఆ తరవాత ఆమె పేరు దేశమంతా మారు మ్రోగుతుంది. కానీ వీరిద్దరికీ అనేక పుణ్య క్షేత్రాల్లో జరిగే మోసాలను ప్రత్యక్షంగా చూసిన అనుభవంతో హిందుత్వం మీదా, హిందూ దేవుళ్ళ మీదా నమ్మకం సన్నగిల్లుతూ ఉంటుంది. ఈ సమయంలో వేదాలు చదివినప్పుడు ఆమెకు, ఆమె తండ్రికి ఉన్న అపారమైన నమ్మకం (మనసా వాచా కర్మణా దేవుడిని నమ్మి పురణాల్లో, శాస్త్రాల్లో చెప్పినట్టు నిష్టగా బ్రతికినా ఎటువంటి కష్టాలు పడ్డారో అనుభవమయ్యాకా) నిజం కాదనీ, పండితులు చెప్పే ఎటువంటి అద్భుతాలూ జరగవని, మోక్ష ప్రాప్తికి ముఖ్యంగా స్త్రీలకు హిందూ మతంలో అవకాశం, లేదనిపిస్తుంది. వేదాలను, ఉపనిషత్తులనూ కూలంకషంగా చదివాకా వాటిల్లో స్త్రీల ఆనాటి స్తితిగతులకి ఎటువంటి సమాధానాలు ఆమెకు లభించవు. పైగా స్త్రీ పురుషుడి జీవితానికి, పురోగతికి ఒక ప్రతిబంధకం, ఆటంకంగా చిత్రించడమే ఆమెకి కనిపిస్తుంది. ఆమె తలంపే ఒక పాపం. పురుషుడి మోక్ష ప్రాప్తికి ఆమె సాంగత్యమొక అవరోధం. తండ్రి భక్తిలో నమ్మకం సన్నగిల్లినా, స్త్రీ విద్య కోసం తాపత్రయపడ్డ ఆయన ఆశయ సాధనకే తమ జీవితమంతా శ్రమించాలని అన్నా చెల్లెళ్ళిద్దరూ నిశ్చయించుకుంటారు. కానీ ఆమెకి 22 ఏళ్ళ వయసులో ఆమె అన్నగారు కూడా విషజ్వరంతో చనిపోతాడు. ఒంటరిగా ప్రపంచంలో బ్రతకటం కష్టమని, వివాహం చేసుకోమని కోరతాడు. తరవాత ఆమె అన్న స్నేహితుడూ, న్యాయవాది అయిన ఒక నిమ్న కులస్తుడిని కోర్ట్ మేరేజ్ చేసుకుంటుంది. ఈమె బ్రాహ్మిన్ కాబట్టి మళ్ళీ సమాజ వ్యతిరేకత తప్పించుకోవటానికి అస్సాంలో స్థిరపడతారు. కానీ దురదృష్ట వశాత్తూ ఒక కూతురు పుట్టిన కొన్ని నెలలకే, భర్త చనిపోతాడు. ఏడు సంవత్సరాల్లో అయిదుగురు కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్న ఆమె, మళ్ళీ విధవరాలు, అందునా కులాంతర వివాహం చేసుకున్న విధవ, ఉన్న చోట బ్రతకటం దుర్లభం కాబట్టి మద్రాసు, అక్కడ్నించి పూనా వస్తుంది. భర్త పోయిన సంవత్సరం లోపే రమా బాయి ఆర్య మహిలా సమాజ్ స్థాపిస్తుంది అగ్రకుల విధవ మహిళల కోసం, స్త్రీ విద్య కోసం, ఇంకా బాల్య వివాహాలకి వ్యతిరేకంగా పనిచెయ్యటం కోసం. స్త్రీ ధర్మ నీతి (Morals for Women) అనే పుస్తకం రాస్తుంది. బ్రిటిష్ గవర్నమెంట్ స్త్రీ విద్య గురించి పంపిన హంటర్ కమిషన్ కి తిరుగులేని తన వాదాన్ని వినిపిస్తుంది. తరవాత అచ్చయిన ఆమె వాదన బ్రిటిష్ క్వీన్ విక్టోరియాను ఎంతగానో ప్రభావితం చేస్తుంది. 1874 లో ఆమె భారత దేశంలో lady teachers, స్త్రీలకి వైద్యులు స్త్రీలే ఉండాలన్న ఆకాంక్షతో ఇంగ్లాండ్లో వైద్య వృత్తి చదవడానికి వెళ్తుంది. కానీ అక్కడ కూడా వైద్యం చదవడానికి వచ్చిన కొద్దిమంది స్త్రీల మీద రాళ్ళేసిన ఘనులే బ్రిటిష్ మగవాళ్ళు. పైగా ఈమె ఇండియను. అందువల్ల వైద్యం నేర్చుకోవడానికి సాధ్య పడదు. అస్సాం లో ఉన్నపుడు పడిన బీజం, క్రిష్టియానిటీ పట్ల ఆకర్షణ ఆమెను అటువైపుకి లాగుతుంది. క్రీస్తు ప్రవచించిన సర్వ మానవ ప్రేమ, ఆడవారినీ అందులోనూ దిగజారిన అంటే పడుపువృత్తి లోని స్త్రీలనూ క్షమించి ప్రేమించి ఆదరించడం, హిందు మతంలోలా వెలివేయటం, శిక్షించడం కాకుండా, ఆమెకు నచ్చుతుంది. భారత దేశంలో స్త్రీలు పడే కష్టాలకి సమాధానం, ఓదార్పూ ఒక్క క్రిస్టియన్ మతంలోనే ఉందని ఆమె విశ్వసిస్తుంది. మతం మారనని అంతకు ముందు ప్రకటించినప్పటికీ, దీనికి తన దేశంలో చాలానే వ్యతిరేకత ఉంటుందని, తను చేయదల్చుకున్న పనికి ఇది అడ్డంకి కాగలదని తెలిసినా ఆమె తన కూతురితో సహా క్రిస్టియన్ మతం పుచ్చుకుంటుంది. అయితె కొన్ని కొన్ని విషయాల్లో ఆమె క్రిష్టీనిటీ వల్ల కూడా పూర్తి సంతృప్తి చెందలేదు. అది వేరే విషయం అనుకోండి. అక్కడనుంచి ఆమె అమెరికా వెళ్తుంది. అక్కడ కిండర్గార్టెన్ టీచర్ ట్రైనింగ్ అవుతుంది. అనేక చోట్లకి వెళ్ళి లెక్చర్స్ ఇచ్చి డబ్బు కూడబెడ్తుంది. The High Caste Hindu Woman అని ఒక పుస్తకం రాసి, దాని అమ్మకాల్తో కొంత డబ్బు సంపాదిస్తుంది. అమెరికా నుంచి కొన్ని విరాళాలు అంతా కలిపి 30,000 దాలర్లు ప్రోగు చేస్తుంది ఇండియా లో తను చెయ్య బోయే కార్యక్రమాల కోసం. తను సంస్కృతం నేర్పిస్తూ, గ్రీక్ ఇంక హిబ్రూ భాషలు నేర్చుకుంటుంది. 1888 లో ఇండియా తిరిగి వచ్చి, శారదా సదన్ అనే సంస్థని సర్వ మత సామరస్యంతో పని చేసే ప్రాతిపదిక మీద, అనాధ విధవలకి, బాలికలకి విద్యనందించటం కోసం స్థాపిస్తుంది. ఇక్కడికి ఉన్నత కులాలకి చెందిన విధవ స్త్రీలని ఆకర్షించటం కోసం వారి ఆచారాలకీ, నమ్మకాలికీ ఎటువంటి అవరోధాలు ఆంక్షలు లేకుండా ఉండేట్టు చూసుకుంటుంది. మెల్లి మెల్లిగా ఇక్కడికి అన్ని వయసుల్లో ఉన్న బాలికలు, స్త్రీలు చదువుకోవటానికి వచ్చి ఉంటారు. కానీ తను పాటించే క్రిస్టియన్ ధర్మాల పట్ల కొందరు ఆకర్షితులవడం వల్ల, హిందూ సమాజంలోని వాళ్ళకు నచ్చక కొందరిని వెనక్కి తీస్కెళ్ళిపోవడం జరుగుతుంది. హిందువులని క్రిస్టియన్లుగా మారుస్తోందని పత్రికలు ఆమెను దుమ్మెత్తి పోస్తాయి. ఈమె స్థాపించిన సూత్రాల మీద పని చెయ్యటంలేదని ఆమెకు విరాళాలు రావటం కూడా ఆగిపోతుంది. ఆమె ఈ కారణంగా, శారదా సదన్ని పూనా కి మారుస్తుంది. మెల్లిగా అక్కడ తలదాచుకునే ఆడవాళ్ళ సంఖ్య మళ్ళి పెరుగుతూ పోతుంది. ఈమె కృషిని ప్రత్యక్షంగా పరీక్షించిన అమెరికన్ సంస్థలు ఆమెకు బేషరతుగా విరాళాలు ఇవ్వడానికి సిద్ధపడతాయి. ఆమె కృపా సదన్ అనే ఇంకొక సంస్థని సమాజంలో వెలి వేయ బడ్డ వేశ్యలకీ వారి పిల్లల కోసం ప్రారంభిస్తుంది. ఈ రెండు సంస్థల్లో ఆమె వాళ్ళకు రక రకాల వృత్తుల్లో శిక్షణ ఇప్పిస్తుంది. వారిలో చాలా మందిని తన దగ్గరే పనికి పెట్టుకుంటుంది. కూతురు మనోరమా బాయి పేరిట కూడా బాలికలకు పాఠశాల స్థాపిస్తుంది. ముక్తి సదన్ అనే సంస్థని స్థాపించి అందులో అనాధ స్త్రీలకీ, పిల్లలకీ, వికలాంగులకీ ఆశ్రయం కల్పిస్తుంది. 1900 మొదటి కాలంలో గుజరాత్లో వచ్చిన కరువు కాలంలో ఆమె తన దగ్గర రెండు వేల మందికి ఆశ్రయం ఇచ్చి తిండి బట్ట సమకూరుస్తుంది. పైగా దీనికోసం ఆమె ఊళ్ళు తిరిగి దిక్కు లేని వారందరిని తన హోంలోకి తీస్కొస్తుంది. అందరికీ వారు చేయ దగ్గ పనులూ వృత్తుల్లో శిక్షణ ఇప్పిస్తుంది. శిక్షణ పొందిన వారిని తన దగ్గరే శిక్షకులుగా ఉంచుకుని వేతనాలిస్తుంది. పేద పిల్లల్ని తన బడికి రప్పించటం కోసం రోజుకి అణా పైసలు ఇచ్చేదట. ఆమె శారదా సదన్ని స్థాపించాకా మొట్ట మొదటిగా ఆమె ఆదుకున్న ఆమ్మాయి ఒక పన్నెండేళ్ళ విధవ, అత్తవారింట్లోంచి గెంటివేయబడి, పుట్టింటి వారు తిరిగి ఆదరించకపోతే రోడ్డునపడి అడుక్కుతింటూ బతుకుతూన్న పసి పాప. ఆలోచిస్తుంటే ఎంత దయలేని సమాజమా ఆనాటిది అని అనిపించక మానదు. తరవాతి సంవత్సరాల్లో ఆ అమ్మాయే ఆమె ముఖ్య సహాయకురాలిగా పని చేస్తుంది. రుక్మాబాయి అనే ఒక బాల్య వివాహిత తన భర్తతో కాపరం చెయ్యడానికి నిరాకరిస్తుంది. అది కోర్ట్ దాకా వెళ్ళి, కోర్ట్ విచారించి ఆమెకు శిక్ష వేస్తుంది. (అమలు అవ్వదు) ఈ విషయంలో స్పందిస్తూ రమాబాయి ఇలా అంటుంది. '' ఒక నిస్సహాయ వివాహిత తన గొంతు విప్పితే, ఆమెను అణిచివేయడానికి హిందూ చట్టం ఇంకా బ్రిటిష్ కోర్ట్ లూ, మూడు కోట్ల పురుషులూ ఇంకా ముప్పై మూడు కోట్ల దేవుళ్ళూ ఏకమై పొయ్యారు. . ఇంగ్లీష్ గవర్నమెంట్ ని అనడానికి వీలు లేదు ఎందుకంటే వాళ్ళు ఇక్కడ మగవాళ్ళ ఆకాంక్షలకి, ఉద్దేశ్యాలకి కట్టుబడి ఉంటామని ఒప్పుకున్నవాళ్ళే.” ఆడవారి సమస్యలూ, బాధలూ ఎప్పుడూ మారలేదు పురాణకాలం నుంచి ఇప్పటిదాకా. కానీ వారి సమస్యలకి స్పందించాల్సిన న్యాయ వ్యవస్థ ఎంత మెల్లిగా స్పందిస్తూ మారుతూ వస్తోందో చూడండి. ఇప్పటికీ మనకి కొత్త చట్టాలు రావాల్సిన అవసరం కనపడుతూనే ఉంటుంది. పండిత రమాబాయి ముక్తి మిషన్ పూనా లో ఇప్పటికీ విజయవంతంగా నడుస్తోంది. వేలాది అనాధల తోడుగా, నీడగా నిలబడుతోంది. ఈ సంస్థ 100 ఏళ్ళు కృషిని గుర్తిస్తూ ప్రభుత్వం స్టాంప్ విడుదల చేసింది. ఆమెను ఒక Australian పత్రిక ప్రపంచంలోని 20 మంది మానవతావాదుల్లో ఒకరిగా గుర్తించి సత్కరించింది. Indian Secular Society అనే సంస్థ నడిపే, The Secularistఅనే పత్రిక ఎడిటర్ A.B.Shah ఆమెను ఆమె చనిపోయిన 50 ఏళ్ళ తరవాత '' The greatest woman produced by the modern India” అని వర్ణించారు. ఆమె చివరి రచన బైబిల్ ను ఒరిజినల్ హిబ్రూ భాషనుంచి మరాఠీలోకి అనువదించడం. అంతకు ముందు అనువాదం లేదని కాదు, ఉంది, కాని అది హిందు పండితుల సాయంతోనే జరగడంవల్ల చాలా పదాలు క్రిస్టియానిటీని దాని అసలు అర్ధంలో ప్రజలకందించలేదని ఆమె అభిప్రాయం. ఇంత పెద్ద రచన ఆమె కొద్ది నెలల్లోనే ముగించిందట. ఇది అచ్చయినది కూడా ఆమె శిక్షణ ఇచ్చిన పనివారితోనే ఆమె సదన్ లోని ప్రెస్ లోనే. ఇందరి జీవితాల్లో వెలుగులు నింపిన రమాబాయి జీవితమంతా విషాదమే. పాతికేళ్ళ వయసులోపే భర్తను పోగొట్టుకుని వొంటరిదైన ఆమె చివరికి తన కూతురి చావును కూడా చూసిన రెండేళ్ళ లోపు మరణించింది. నిజానికి ఒక రచయిత్రిగా కన్నా, ఒక మానవతావాదిగా, స్త్రీల విద్యకూ, బాల్య వివాహాలు నిరోధించటం కోసం ఆమె చేసిన కృషికి ఆమెకు గుర్తింపు ఎక్కువ. ఆమె భాషా పాండిత్యం అమోఘం, అనితర సాధ్యం. ఈరోజున ఆడవారికి ఈమాత్రం స్వేఛ్చ ఉందంటే, Male Chauvinists ని ఎదిరిస్తూ రాయగల్గుతున్నారంటే అది రమాబాయి, తారాబాయి షిండే ఇంకా ఇలాంటి ఎందరో Feminist మహిళామణుల వల్లే కదా. According to Annie Zaide, writer, we all got to be feminists if we are going to be a decent society. అందువల్ల ఈనాటి ఆడవారు వీరికి ఎంతయినా ౠణపడి ఉన్నారు. నాకు చాలా సంతోషం కలిగించిన పరిచయాల్లో ఇది ఒకటి. మీక్కూడా నచ్చుతుందని ఆశిస్తూ.       .... Sharada Sivapurapu

“చరిత్రలో ప్రబంధపరమేశ్వరుడు” 13 వ భాగం

                        “చరిత్రలో ప్రబంధపరమేశ్వరుడు” 13 వ భాగం        సరిగ్గా పది సంవత్సరాల క్రితం.. దేవల్ దేవి, గుజరాత్ రాజు కరణ్ కుమార్తె.                                       అల్లారు ముద్దుగా అపురూపంగా పెరుగుతున్న రాకుమారి జీవితం, ముష్కురుల దండయాత్రతో అస్తవ్యస్తం అయిపోయింది. అల్లావుద్దీన్ రాజ్య కాంక్షకి బలైపోయింది.    ఢిల్లీ సుల్తాన్ జలాల్ ఖాన్ ఖిల్జీ అల్లుడు, మేనల్లుడు అల్లావుద్దీన్. సుల్తాన్ ఆజ్ఞ పై అతడు, దక్షిణ దేశ దిగ్విజయ యాత్ర గుజరాత్‍తో ప్రారంభించాడు.    అక్కడి రాజులు అడవుల పాలయ్యారు. దేవాలయాలు నాశనమయ్యాయి. విగ్రహాలు ముక్కలయ్యాయి.    రాజా కరణ్, ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని, ముక్కుపచ్చలారని పదేళ్ల దేవల్ దేవిని తీసుకుని దేవగిరి పారిపోయాడు. తన రాణి కమల్ దేవిని మాత్రం రక్షించుకోలేక పోయాడు.    కమల్ దేవి అల్లావుద్దీన్ సేనలకు పట్టుబడింది. అల్లావుద్దీన్ ఆమెని వివాహమాడి, తన రాణీవాసంలో చేర్చుకున్నాడు. కమల్ దేవి మతం మార్చుకోవలసి వచ్చింది. అల్లవుద్దీన్ సుల్తానా అయింది.    రాజా కరణ్ దేవగిరి చేరాక దేవల్ దేవిని, దేవగిరి రాజు రామ్‍దేవ్ రావ్ కుమారుడు శంకర్‍దేవ్ రావునకిచ్చి, పసి వయసులోనే పెండ్లి చేశాడు. తనని సుల్తాన్ వదలడని గ్రహించి. ఎవరో ఒకరి రక్షణలో ఉండాలి కదా రాకుమారి!    గుజరాత్ దండయాత్ర, స్వాధీనం తరువాత దేవగిరి మీద పడ్డాడు అల్లావుద్దీన్. యువరాజు శంకర్‍దేవ్ సగం సేనని తీసుకుని గుజరాత్‍కి వెళ్ళాడు.. అతను వచ్చే లోగానే ఎనిమిది వేలమంది బలగంతో, దారిలో అన్నీ సర్వనాశనం చేస్తూ దేవగిరికి వచ్చేశాడు అల్లావుద్దీన్..    రామ్ దేవ్ తన వద్దనున్న నాలుగువేల బలంతో ధైర్యంగా ఎదుర్కొన్నాడు.. కానీ ఖిల్జీ పశుబలం ముందు వెనుకకు మళ్ళక తప్పలేదు.    సుల్తాన్ సేనలు దేవగిరి చేరగానే పట్టణంలోని అమాయక ప్రజల మీద పడి వారిని చిత్రహింసల పాల్జేశారు. ముష్కురులు ఆక్రందనలు చేస్తున్న స్త్రీలని, ఆడపిల్లలని అమానుషంగా మానభంగాలు చేశారు.    రామ్‍దేవ్ అల్లావుద్దీన్‍తో సంధి చేసుకున్నాడు.    కోటకి తిరిగి వస్తున్న శంకర్‍దేవ్ తన సైనిక బలంతో అల్లావుద్దీన్‍ను ఎదుర్కున్నాడు.. సంధి అయిందని కబురు చేసిన తండ్రి మాటను పెడ చెవిని బెట్టి.    ఉన్న సైనిక బలం కన్నా చాలా ఎక్కువగా ఉన్నట్లు భ్రమ కల్పించి శంకర్ దేవ్‍ను ఓడించి, అత్యధిక ధనరాశులను ఢిల్లీకి తరలించి, కప్పం కట్టడానికి ఒప్పుకున్న యాదవ రాజును వదిలి ఢిల్లీ చేరాడు అల్లావుద్దీన్.    ఆ యుద్ధంలోనే దేవల్ దేవిని పట్టుకుని పోయి, పెద్దకొడుకు ఖిజర్ ఖాన్‍ కిచ్చి పెళ్ళి చేశాడు.    తల్లి తన రాణి, కూతురు తన కొడుకు రాణి..    మృగాలకి వావి వరుసలు నీతి నియమాలు ఉంటాయనుకోవడం భ్రమ. వానికి ఉండేవి రెండే రెండు.    ఆకలి, కామం..    మృగాల్లాంటి మనుషులకి అవి కూడా సరిపోవు. ఆలోచనా శక్తి ఉంది కనుక వారికి ఇంకా ఉంటాయి.    అదనంగా రాజ్యకాంక్ష.. అధికారం, క్రోధం, పగ.    ఎక్కడైనా ఊడిగం చేసుకునైనా క్షేమంగా ఉంటుందనుకున్న గారాలకూతురు.. పాలబుగ్గలమీద కన్నీటి చారలతో, అంతఃపురమనే తన బందిఖానాలోకే చేరితే ఆ తల్లి గుండె పగిలి ముక్కలవదా!    అదే జరిగింది కమల్ దేవికి. ఆత్మాభిమానం కల ఆ తల్లి, కూతురుని ఏ వరుసతో పిలవాలో తెలియక, ఆమె కంటికి మళ్ళీ కనిపించలేదు.    అతి చిన్న వయసులో అన్నన్ని దారుణాలు చూసిన దేవల్ దేవి, తనకు జరిగిన అన్యాయాన్ని, సుల్తానా అయిన తల్లి వారించలేకపోయిందని గుండె పగిలేలా ఏడిచింది. ఆ తల్లి నిస్సహాయత చిన్నారి దేవల్‍కి తెలియదు.    ఆ లేతమొగ్గని ఖిజర్ ఖాన్ నలిపి నుగ్గు చేశాడు.    పశు వాంఛకి వయసుతో పనేముంది?    లేత మాంసం మరింత రుచిగా ఉంటుందట..    ఖుశ్రోఖాన్ సహాయంతో సింహాసనమెక్కిన ముబారక్ షా.. అందాల రాణి దేవల్ దేవిని వదలగలడా! అన్నగారి భార్యని రాణీని చేసుకుని తన అంతఃపురంలోనికి తరలించాడు. దేవల్ దేవి, ఖిల్జీ సామ్రాజ్యానికి రాణీ అయింది.. మరొక ఖిల్జీ మృగానికి బలైపోయింది.    సుల్తాన్ కామ వికారాలు, మనశ్శరీరాలని బండ రాళ్ళని చేసుకుని భరించింది దేవల్ దేవి.    ఒక్కొక్కసారి సుల్తాన్‍కి విచిత్రమైన కోరికలు కలుగుతాయి.    తనని.. నాట్యకత్తెలా తయారు చేసి, తనతో నాట్యం చెయ్యమంటే.. మనసులో ద్వేషం రగులుతున్నా, అసహ్యం వేసినా, సుల్తాన్‍కి అలంకారాలు చేసి, మొహంలో ఆనందాన్ని చూపించింది.    నిస్సారంగా గడిచిపోతున్న దేవల్ దేవి జీవితంలోనికి ఖుశ్రో ఖాన్ ప్రవేశించాడు.    ఖిల్జీ వంశ చరిత్ర మారబోతోంది.                                                     ..................                                      10     రాజ్య కాంక్షలకి, యుద్ధాలకి, పశువాంఛలకి.. ధనాగారాలకి, దూషణ భూషణాదులకీ దూరంగా..     ప్రశాంతమైన వాతావరణం.     ఇంటి వెనుక తోటలో..  తాము ఎప్పుడూ కూర్చునే చెట్టుక్రింద కూర్చున్నాడు ఎర్రన. ఎదురుగా తాతగారు లేని లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.    ఎర్రపోతన మనుమనికి మహాభారత రచన మీద అవగాహన, ఆలోచన.. పూర్తి చేయాలన్న ఆశయం కలిగించి, ఆ నృసింహుని సన్నిధికి చేరుకున్నాడు. ఆ వెనుకనే పేరమాంబ కూడా పతిని అనుసరించింది.    అంతకు మును ముందే ఎర్రనని ఒక ఇంటివాడిని చేశారు సూరన దంపతులు. తమ కంటి వెలుగు కళ్యాణాన్ని కన్నులారా గాంచి కన్నుమూశారు ఎర్రపోతన దంపతులు.    ఎర్రన ముందు ఎన్నో ప్రణాలికలు..    మొదటగా తాతగారికి వాగ్దానం చేసిన మహాభారత పర్వాన్ని పూరించాలి.    తన స్వంత ఆశయం.. రామాయణం వ్రాయాలి.    కన్నులు మూస్తే కంటి ముందు ప్రత్యక్షమయి నృసింహ పురాణం వ్రాయమంటున్నారు తాతగారు. కలలో కోరిననూ.. కోరికే కదా!    అదే విధంగా హరివంశము.    అసలు ఏ కావ్యం వ్రాయడానికైననూ ఉభయ భాషా పాండిత్యము, ఛందో వ్యాకరణములలో పట్టు ఉండి తీరాలి.    ఎర్రాప్రగడకి జన్మతః వచ్చిన జ్ఞాపక శక్తి అనన్యం. విద్య నేర్వుటకు సూరనార్యుని శుశ్రూష ఉండనే ఉంది. అన్నింటిలోనూ నిష్ణాతుడైన ఎర్రనని.. తాతగారి దిశా నిర్దేశం ముందుకు నడిచేలాగు చేసింది. నిశ్చయాన్ని అదేశించింది    భారతాన్ని ఎన్ని మారులు చదివాడో లెక్కే లేదు.     నన్నయగారి భారతం మూడు వంతులు పైగా కంఠస్థం..    తిక్కనగారి భారతంలో ఏ పత్రంలో ఏ విషయం ఉందో గ్రహించ గలిగిన శక్తి అపారం.    చిన్నతనంలోనే క్లిష్ట సమాసాలతో పద్యాలు చెప్పగలిగిన ఎర్రాప్రగడకి కావ్య రచన సమస్యే కాదు.    మరి..    నును సిగ్గుతో దరి చేరింది ధర్మపత్ని..    "స్వామీ! క్షీర పానం మరచారు." రాగి పాత్రలో పాలు తీసుకొని వచ్చింది.    అదీ అసలు సమస్య..    అనగా..  ధర్మపత్ని  సమక్షమా? కానే కాదు.    సమస్యల్లా రాగి పాత్ర..    రజత పాత్రలో క్షీర పానం చేసి, సువర్ణ పుష్పం చెక్కిన రజత పళ్ళెంలో భోజనం చేసేటి సూరనార్యుని కుటుంబీకులు రాగి పాత్రలు వాడే స్థితికి వచ్చారు.    మృణ్మయ పాత్రలకి చేరక ముందే ఏమయినా చేయాలి.    ఏదయిననూ జరగాలి..    ప్రతాప రుద్రుడు, సేనానుల మాట కాదని చేసిన అనాలోచిత చర్య వలన రెట్టింపు కప్పం కట్టవలసి వచ్చింది. ఆ ప్రభావం మూలమూలల నున్న గ్రామాలకు కూడా వ్యాపించింది. నిత్యావసర వస్తువుల మీద సుంకం అధికం చేయక తప్పలేదు నాయంకరులకి.    నగలు నాణ్యాలు సేకరించుట అట్టే పోయె.. ఉన్నవి కూడానూ అమ్ముకుని భుక్తి కొనసాగించ వలసి వస్తోంది.    సూరనార్యునికి శిష్యులు తగ్గిపోయారు. బ్రాహ్మణ యువకులను కూడా రాజ ప్రాసాదములోనికి ప్రతి దినమూ పిలుస్తున్నారు.    అద్దంకి ప్రభువు ఏ సహాయమూ చేసే స్థితిలో లేరు. వారు మరల.. భీకర సమరమునకు బలాలను సమకూర్చుకుంటున్నారు. ఈ మారు బలవంతం లేదు.. ఏ ప్రణాలికలు చెవిని వేశారో కానీ, ప్రతీ ఇల్లాలూ ఇష్టపూర్వకంగా తమ బంగారు కొండలను సైన్యం లోనికి పంపుతోంది. మౌలిక మార్పునకు దక్షిణా పథమంతా రహస్య ప్రయత్నాలు చేస్తోంది.    ఎర్రనకి వయో పరిమితి ఆడ్డం వచ్చింది, అద్దంకి సైన్యంలో చేరుటకు. ఊరిని కాపాడవలసిన కొద్దిమందిలో చేరారు సూరన, ఎర్రన. మంచీ చెడూ చూసే ఆచార్యుల పర్యవేక్షణలో పసివారు, వృద్ధులు, స్త్రీలు క్షేమంగా ఉంటారు.    విజయమో. వీర స్వర్గమో.. ప్రతీ వారి నినాదం అదే.    తెగింపు విపరీతమైన ధైర్యాన్నిస్తుంది.    సూరనార్యుడు పురాణ కాలక్షేపం చేసి, మంగళ హారతి పళ్ళెంలో వచ్చిన అల్ప నాణెములతోనే ఇంటిలోని నలుగురూ నాలుక తడుపుకుని మన గలుగుతున్నారు.    నన్నయ భట్టారకునికి, తిక్కన సోమయాజికి రాజ ప్రాపకం ఉంది. ఆదరించి సకల సౌకర్యాలు కలుగ జేసిన ప్రభువుల అండా దండా ఉన్నాయి.    ఎర్రన కొద్ది రోజులలో అభిమానము వదలి, పంట పొలాలలో హాలికుడై పనులకు వెళ్ళవలసిన పరిస్థితి..    ఏది ఏమైనా మహారాజ ప్రోత్సాహం, పోషణ లేనిదే కావ్యరచన చేయుట సంభవం కాదనే నిశ్చయానికి వచ్చేశాడు ఎర్రాప్రగడ.    ఏమవునో.. ఆంధ్ర మహాభారతం సంపూర్ణ స్థితిలో లభ్యమవునో లేదో! ఆంధ్రుల అదృష్ట మెటులున్నదో!    వేచి చూడ వలసినదే.                                …………….     "విధి", ఖుశ్రోఖాన్, దేవల దేవిలను ఒక్క దగ్గరికి కాలక్షేపాని కోసం చేర్చలేదు..    హిందూదేశ చరిత్రలో అనూహ్యమైన మార్పులు రావాలి.. తాత్కాలికంగా నైనా సరే!                 హిందూ మహా సముద్రంలో చుక్కాని లేని నావను నడిపినంత సాహసమే..    నివురు గప్పిన నిప్పుల్లాగ నిశ్చలంగా ఉండి, సుల్తాన్ మదిర మత్తులో వళ్ళెరుగక పడి ఉన్నప్పుడు..    గుండెలోతుల్లో నిక్షిప్తమై ఉన్న భావాల్ని పంచుకున్నారా ’విధి’ వంచితులు.    ఇరువురికీ అవధులు లేని అధికారం చేజిక్కింది.    ఖుశ్రోఖాన్ దేవగిరి దండయాత్రలో జరిపిన హింసతో సుల్తాన్ నమ్మకాన్ని సంపూర్ణంగా గెలుచుకున్నాడు. రోజుకు నాలుగు సార్లు నమాజ్‍తో మతం మీది తన భక్తిని చాటుకుంటున్నాడు.    సుల్తాన్ పాలనాధికారాన్ని పూర్తిగా ఖుశ్రో చేతుల్లో పెట్టేసి, నిశ్చింతగా ఉన్నాడు.    దేవలదేవికి సుల్తాన్ మీది ప్రేమ రోజు రోజుకూ ఎక్కువవుతోంది. మత్తులో లేని కొద్ది సేపూ, అతగాడి విచిత్ర వికృత కోరికల్ని తీరుస్తోంది.    చల్లగా.. చాపకింది నీరులా తాము అనుకున్నది చేస్తున్నారిరువురూ.. ఆ ఫాలాక్షుడికి కూడా అనుమానం రాకుండా.    గుజరాత్‍లో ప్రతినిధిగా ఉన్న సుల్తాన్ మామగారు మరణించగానే, మహమ్మదీయుడిగా మతం మార్చుకున్న ఖుశ్రో అన్న రాజ ప్రతినిధి అయ్యాడు.    గుజరాత్‍లో శిక్షణ పొందిన ముప్పది వేలమంది సైనికులూ.. అందరూ హిందువులే.. ఖుశ్రో కనుసన్నల్లో ఉండి, నిప్పుల్లోనైనా, నడి సంద్రంలో నైనా దూకడానికి సిద్ధంగా ఉన్నారు.    ముసల్మాన్ సర్దార్లకి, వజీర్ ఖుశ్రో కదలికలు అనుమానాస్పదంగా అనిపిస్తున్నాయి. అయిననూ ఏమీ చెయ్యలేని పరిస్థితి. దేవగిరి ఊచకోతలతో సుల్తాన్ ఎవరేం చెప్పినా నమ్మడు.    ఆ విషయం నిర్ధారణగా తెలిసిపోయింది.    సాహసించి ఒకసారి ఒక ముదుసలి మంత్రి.. జలాలుద్దీన్ కాలం నుండీ విశ్వాసపాత్రంగా ఉన్నవాడు.. తన అనుమానాలు చెప్పబోయాడు.    అతను చెప్పినది అంతా విని, ఖుశ్రో అని పేరు రాగానే ముందు వెనుకలాలోచించకుండా నూరు కొరడా దెబ్బలు శిక్ష వేశాడా ఉన్మాది సుల్తాన్. ఇరవై దెబ్బలకే ఆ అభాగ్యుడు ఆఖరి ఊపిరి పీల్చాడు.    మంత్రి మండలి అంతా ఆవేశంతో ఊగి పోయారు.    ఇనుప కవచంలా ఖుశ్రో కమ్మి ఉంటే సుల్తాన్‍ను ఏం చెయ్యగలరు ఎవరైనా!    వారి సంశయం తీర్చడానికే అన్నట్లు మరల దక్కను దండయాత్ర చేశాడు ఖుశ్రో.    ఈ దండ యాత్రతో హిందువులలో మరింత ఉక్రోషము ప్రబలింది. హిందువులలో ఢిల్లీ సుల్తాన్ పట్ల అవిశ్వాసము, అవిధేయత పెరగడానికే ఖుశ్రో దక్కన్ వెళ్ళాడని ముసల్మాన్ నాయకుల నమ్మకం. ముస్లిములను నాశనం చేసి, హిందూ రాజ్యం స్థాపించడమే ఖుశ్రో ధ్యేయం అని వారి ఉద్దేశ్యం.   అదే నిజం కూడా!                                   …………..    హిందువుల ఉక్రోషాక్రోశాగ్ని జ్వాలలకి ఆజ్యం పోస్తున్న వాడు మేవార్ రాజు రాణా హమీర్.    హిందూ రాజుల సైన్య సమీకరణలనూ, రాజపుట్‍ల రహస్య మంతనాలనూ ఖుశ్రో చూసీ చూడకుండా వదిలేస్తున్నాడని ఢిల్లీ హిందువులు, ఉత్తరదేశ హిందువులు నమ్ముతున్నారు. ఖుశ్రోఖాన్, దేవల్ దేవి కలిసి ఏదో విప్లవానికి ప్రణాలిక వేస్తున్నాడని అనుమాన పడుతున్నారు.    దక్షిణ దేశ నిర్దాక్షిణ్య దండ యాత్ర తరువాత ఎవరూ ఖుశ్రోని వేలెత్తి చూపలేరు. ముసల్మాన్ వేష ధారణ, నమాజ్.. తల మీది తప్పనిసరి శిరస్త్రాణం, నిండుగా పెరిగిన గడ్డం, విశ్వాసంతో కూడిన చూపులూ.. నర మానవుడెవడూ ఈ వజీర్ ఢిల్లీ సింహాసనాన్ని ఆక్రమించడమే కాకుండా, ముసల్మాన్ రాజ్యాన్ని హిందు సామ్రాజ్యం క్రింద మార్చగలడని అనుకోడు.    ఖుశ్రోఖాన్, దేవలదేవిల ధ్యేయం అదే.    అదే పదకొండేళ్ళ ఖుశ్రోకి గుజరాత్ రాజు చనిపోయే ముందు చెప్పింది.    అదే మాలిక్ కాఫర్ ఆశయం కూడా.. నెరవేర్చడంలో తన ప్రాణాలు త్యాగం చెయ్యడానికి కూడా వెరవలేదతను. హిమాలయాల చిల్లులోంచి వచ్చి, హిందువుల ఆలయాలను కొల్లగొట్టి, చిద్రం చేసి.. బలవంతంగా  మత మార్పిడా..    అంతకు అంతా తీర్చుకోవాలిసిందే!    సుల్తాన్, ఖుశ్రోని అధికార పాలకుని చేసి తాను రాజ్యభోగాలు అనుభవించడం మొదలు పెట్టాక రాజ్యంలో అనేక మార్పులు సంభవించాయి.    హిందువుల మీద అత్యాచారాలు, దుర్మార్గాలు తగ్గిపోయాయి.    స్వేఛ్ఛగా తమ తీర్థయాత్రలు చేసుకోవచ్చు. భక్తిని ప్రకటించుకోవచ్చు.    అల్లావుద్దీన్ కాలంనుంచీ హిందూ రైతుల మీద ఉన్న సుంకాలని తగ్గించాడు.    నెమ్మదిగా, స్థిరంగా హిందువుల పాలిటి దైవంగా అవతరించాడు ఖుశ్రో. సామాన్య ప్రజకి ఆరాధ్య దైవం అయ్యాడు.    సమయం కోసం వేచి చూస్తున్నాడు.    సమయం ఆసన్నమయింది.    ఖుశ్రో, దేవలదేవిలు తమ ప్రణాలికను అమలుపరచడానికి నిశ్చయించుకున్నారు.    పది పన్నెండేళ్ళ కల ఫలించబోతోంది. మొత్తం మారిపోతుంది.. మార్పు మార్పు..  ఇంకా మారాలి.    మార్పు జరిగింది.    అత్యంత నాటకీయంగా, అనూహ్యంగా.. కోటలోని వారికి ఏం జరుగుతోందో అర్ధమవుటకు కొంత సమయం పట్టింది. ఆలోగా జరగవలసింది జరిగిపోయింది.    "ప్రభూ! గుజరాత్ నుండి ముప్పదివేలమంది హిందువులను పట్టి బంధించాను. వారు మతం మార్చుకోవడానికి సంసిద్ధులు. ఢిల్లీ తీసుకొని వచ్చుటకు అనుమతినివ్వండి."    సగం మత్తులో ఉన్న సుల్తాన్ అనుమతినివ్వడమే కాదు.. వారిని కోటలోకి తీసుకొచ్చి తన ఎదుటే మార్పిడి జరగాలని ఆదేశించాడు.    మార్పిడి జరిగింది..    కానీ సుల్తాన్ జీవితంలో.    ముప్ఫైవేల మంది ఖుశ్రో సైనికులూ కోటలోకి ప్రవేశించారు. రాత్రికి రాత్రి సుల్తాన్‍ను హత్య చేశారు.    ఖుశ్రోఖాన్ తాను సుల్తాన్‍గా, దేవల దేవిని వివాహం చేసుకుని రాణీగా ప్రకటన చేశాడు.                                   ---------------           ......మంథా భానుమతి  

వినాయక పూజలోని అంతరార్థము ( వ్యాసము )

వినాయక పూజలోని అంతరార్థము(వ్యాసము) ‘’పిల్లలూ రండి, రండి !ఇవాళ వినాయకుని పూజ గురించి తెలుసుకొందాం! ‘’చెప్పండి, చెప్పండి . వినాయకున్నే గణపతి అని అంటారు కదా! ఏపూజ చేసినా ముందు వినాయకున్నే పూజించాలని అంటారు . ఎందుకు ? తాతగారు ?’’అన్నారు పిల్లలంతా .తెలిసుకోవాలనే కుతూహలంతో .ఈ వినాయకుడే విఘ్నేశ్వరుడు , విఘ్నేశుడు, విష్వక్సేను డు, గణపతి, గణేషుడు , గణపతి అనే పేర్లు కలవాడు . ఇలా ఈయనకు లోకంలో చాలా పేర్లే వున్నై .విఘ్నాలను తొలగిస్తాడు కనక విఘ్నేశ్వరుడు .గణాలకు అధిపతి గనక గణేశుడు.అనేపేర్లు వచ్చాయి .తండ్రి పరమేశ్వరుడు యిచ్చిన వరం వలన అన్ని పూజలకు, శుభకార్యాలకు ఆది దేవునిగా పూజ లభించింది .. ‘’ఐతే పసుపు ముద్దకు పూజ చేస్తారేమిటి ?’’ – శ్రేష్ఠ ప్రశ్న. ‘’ఔనర్ర్ర్రోయి .గణపతిని పసుపు రూపంలో పూజించే సంప్రదాయం ఎప్పటినుండో వస్తోంది . దానికో కథ వుంది చెప్తా వినండి .’’ ‘’అదేమిటో చెప్పండి ‘’ అన్నారు అంతా . పూర్వం త్రిపురాసురులు అనే రాక్షసులు వుండే వారు .వారు బ్రహ్మచే అనేక వరాలు పొంది లోకాలన్నిటినీ బాధించసాగారు.ఆకాశంలో మూడు నగరాలను నిర్మించుకొని దేవతలను ,లోకాలనూ బాధించసాగారు. వీళ్ళ బాధలు భరించ లేక శివుణ్ణి ప్రార్థించారు . అపుడు శివుడు రక్షిస్తానని అభయమిచ్చాడు. ‘’ఆ ...తర్వాత ఏమైంది ?’’అంది గౌతమి . శివుడు ఆలోచించి ఒక ఉపాయాన్ని చెప్పాడు . నందిని ఆమూడు నగరాలను తన కొమ్ములతో యెత్తి పట్టుకోమన్నాడు .అప్పుడు శివుడు కొమ్ముల పై యెత్తిన మూడు నగరాలతో సహా త్రిపురాసులను సంహరించాడు. ఆ సమయంలో నండి కొమ్ము ఒకటి తెగి పడిపోయింది .అదే పసుపుకొమ్ము. దానితో నందికి చాలా దు:ఖం కలిగింది . ‘’ఐతే బాగా ఎడ్చాడా నంది ?’’తన్ని తన్నిష్ఠ ప్రశ్న. ‘’ఔనమ్మా! తనకొమ్ము విరిగి ఎక్కడో పడిపోతే ఏడవడా మరి ?’’ ‘’అప్పుడేమైం ది ? తాతగారూ ?’’అన్నారందరు . గణపతి అప్పుడు ఆ కొమ్ము ఎక్కడ పడిందో వేడికి తెచ్చాడట ! కొమ్ము దొరికి నందుకు నందికి చాలా ఆనందం కలిగింది . అది చూచిన శివుడు’’నందీ ! బాధ పడకు. నీ పసుపు కొమ్ము పడిన చోటున మొలిచిన పసుపు కొమ్ముల తోనే చూర్ణించగా వచ్చిన పసుపుతో పసుపు గణపతిని చేసి , యే పూజకైనా మొదట పూ జింప వలసినదే !’ ’అన్నాడట!. ‘’మరి అలా పసుపు కొమ్ములు దొరికాయా ? లేదా ?’ అడిగారు పిల్లలు. ఆ పసుపు కొమ్ములతో చూర్ణించిన పసుపుతోనే తయారుచేసిన పసుపు గణపతికి పూజ మొదలైందట! ‘’ఓహో ! అదా పసుపు గణపతి !అందుకే ఆయన ఆది దేవుడు , ప్రథమ పూజ్యుడు అయ్యాడన్నమాట !’’ ‘’ఇదర్రా! పసుపు గణపతి కథ !అందుకే శివుని వరం ప్రకారం యే పూజకైనా ముండుపసుపు గణపతిని పూ జించే సంప్రదాయం ఏర్పడిం దన్నమాట !’అన్నారు తాతగారు. వినాయకుని గురించిన కథలు పురాణాలలో ఎన్నోవున్నై. ఏదేమైనా గణపతి మాత్రం శివ !పార్వతుల కుమారుడుగానూ, ప్రథమ పూజ్యుడుగాను అన్ని పురాణాలు పేర్కొన్నాయి. కాబట్టి దాన్నే మనమూ నమ్మాలి. ! ‘’తాతగారూ! ఈ పూ జలన్నింటిలోనూ పదహారు సేవలు చేస్తారని యిది వరకు చెప్పారు కదా ! అందులో ‘పంచామృత స్నానం’ అని చేయిస్తారు. అదేమిటి ? దాని వలన మనకు కలిగే లాభమేమిటో చెపుతారా? ఒరే ! రాంబాబు ! పదహారు రకాల సేవలంటే షోడశోప చారము లన్నమాట ! వీటిలో పంచామృత స్నానంకుడా ఒక సేవ అన్నమాట ! పంచ అమృతాలు అంటే ఐదు అమృతాలు కలిసినవని అర్థం.- వీ టితో దేవునికి ంచేయించేస్నానమే పంచామృత స్నానం. ‘’ఆ పంచామృతాలు యేమిటి తాత గారూ?’’గౌతమి ప్రశ్నించింది . ‘’నీ రు, పాలూ,పెరుగు,నేయి, తేనె- యివి పంచామృతాలు. వీటిని కలిపి వీటితో చేయించే స్నానమే పంచామృత స్నానం అంటారు. ‘’ఇది చేయటం వల్ల మనకేమైనా ఉపయోగం ఉందా ?’’ ఆడిగారందరు . ‘’ఈ స్నానం అయిన తర్వాత శుద్దోధకస్నానం చేయిస్తారు –అంటే కొబ్బరి నీటిస్నానం అన్నమాట. ’’ ‘’మళ్ళి శుద్దోదకం ఎందుకు?’’ పిల్లల ప్రశ్న . ‘’పంచామృతస్నానంతో దేవుని వొళ్ళంతా జిడ్డుగా వుంటుంది కదా! ఆడి పోగొట్టటానికి శుద్దోదక స్నానం చేయించాలి.’ ‘’మరి ఆ తర్వాత యేం చేస్తారు ?’’ స్నానం చేయించిన పంచామృతాన్ని వచ్చ్చిన భక్తులందరికీ ‘’అకాల మృత్యు హరణం| సర్వ వ్యాధి నివారణం| సమస్త పాప క్షయకరం |శ్రీ గణేశ పాదోదకం పీత్వా | పునర్జన్మ న విద్యతే |’’ అంటూ మూడేసి ఉద్ధరిణెలు చొప్పున తీర్థంగా యిస్తారు . ‘’ఈ తీర్థం తీసుకోవటం వలన యేమిటి లాభం ? ’’ ఈ పంచామృత తీర్థం తీసుకోవటం వలన మనలోని ధాతుశక్తి , నరాలశక్తి పెరుగుతుంది. మేథవ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. హృదయానికి బలం చేకూరుతుంది. కాబట్టి దీనిని వారానికి ఒకసారైనా తీసుకోవటం చాలా మంచిదని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది.’’ ‘’ఓహో! అంటే వారానికొకసారి పంచామృతాలు కలుపుకొని త్రాగాలన్నమాట !’’ ‘’ఉట్టిగా కలుపుకొని త్రాగటం కాదురా అబ్బాయి. దేవునికి దీనితోస్నానం చేయించి త్రాగితే దైవశక్తి కూడా తోడవుతుంది కదా!’’ అన్నారు తాతగారు . ‘’సరే! మరి, ఆకులతో వినాయకుని పూజిస్తారెందుకు? అవి యెన్ని? యెక్కడ దొరుకుతాయి తాతగారూ?’’ప్రశ్నలు పిల్లలవి. ‘’ఓరి భడవ ల్లారా !మీకు ఆకు పూజ కూడా తెలుసా !’’ ‘’సరే! చెప్తా వినండి. రకరకాల ఆకులు అంటే రకరాల పత్రాలన్న మాట! అవి ఇరవై ఒకటి .దీన్నే ఏకవింశతి పత్రాలు- అంటారు.ఇది సంస్కృత పదం . ఇన్ని పత్రాలతో పూజించా లన్నమాట !’’ ‘’ఎందుకు అన్నిఆకులు ? ఏవో ఒకటి రెండు ఆకులు వేస్తే చాలదా?’’ స్వాతి ప్రశ్న. సరిపోదు.ఐనా, సంవత్సరానికి ఒక సారే కదా చేసేది ? వాటి లాభాలూ బోలెడున్నాయి మరి! అవేమిటో తెలుసుకొందాం . ఏకవింశతి పత్రాలు అంట 21 ఆకులు అని అర్థం .ఇవి ఎలా వచ్చాయంటే ; 10 విష్ణు అవతారాలు + 11శివుని అవతారాలు కలిపి ఇరవై ఒకటి ఐనాయి కదా! ఈ అవతారాలకు ప్రతీకలె ఈ ఇరవైయొక్క పత్రా లైనాయి. ఎందుకనగా హరి హరు లిద్దరూ గణపతికి యిష్ఠ మైన దైవాలు . అంతేగాక గణపతి హరి హరులకును ఆరాధ్యుడు . కాబట్టి ఈ పత్రాలతో పూజించిన శివకేశవుల తో మనమూ పూ జించిన పుణ్యం కల్గుతుంది అని భావం . ఇది పుణ్యఫలం.! అన్నారు తాతగారు . కాస్త విరామం తర్వాత తిరిగి ప్రారంభించారు. ‘’అజుడేకపాదు డహుర్బుద్నుయుడును త్వష్ట రుద్ర హరుడునూ శరభుడునూ త్ర్యంబకు డపరాజితుడీ శానుడు త్రిభువనుడను పదకొండవ తారము లివి తెలియగ హరునివి యని యెరుగుము|;ఇవి హరుని (11) పదకొండవతారములు మత్స్య కూర్మవరాహశ్చ నారసింహ వామన: రామో రామశ్చ రామశ్చ బౌద్ధ కల్క్యావతార: |; ఇవి హరి అవతారములు(10) పది. మాచి, బృహస్పతి, బిల్వ, దూర్వ, దత్తూర, బదరి, అపామార్గ, తులసీ, చూత, కరివీర, విష్ణుక్రాంత, దాడి మ, దేవదారు, మరువక, సిందువా ర,జాజి,గండలి, శమీ, అశ్వత్థ అర్జున,అర్క , పత్రమ్ము లిరువది యొకటి యివియు వినాయాక పూజకు.!:ఇవి 21 అవతారములకు సంబంధించిన పత్రములు . ‘’హమ్మయ్య ! ఇన్ని పత్రాలా ? వీ టితో పూజించటం వల్ల ఏమి ఉపయోగం తాత గారూ?’’ శ్రేష్ఠ ప్రశ్న . ‘’ఈ పత్రాల గురించి తెలుసుకుంటే నీవే తప్పకుండా పూజించా లంటావు .’’ ‘’ఓహో ! అలానా ! అయితే చెప్పండి!’’ ‘’మరి వినండి ?’’ 1.మాచి పత్రం (నాగ దమని ) ..దీనీ ఆకులు కళ్ళకు చలువ చేస్తాయి .తలనొప్పిని తగ్గిస్తాయి . 2. బృహతీపత్రం (బృహస్పతి /వాకుడాకు ... దగ్గు, ఉబ్బస ,నంజు,గొంతు, శ్వాస కోశ వ్యాదులకు చాలా మంచిది . ౩ .బిల్వ పత్రం (మారేడు) ...పండ్ల సమస్యలు, నోటి మలినాలు తొలగించుటకు , ఆకులు , ఫలములు రక్తశుధ్ధికి పనికొస్తాయి .‌ 4.దూర్వార యుగ్మం (గరిక/గడ్డి )...రక్త పైత్యానికి ,చర్మ వ్యాధులను రానీయకుండా చేస్తుంది ; మూత్ర వ్యాధులను దూరం చేస్తుంది . 5 .దత్తుర పత్రం (ఉమ్మెత్త )... అస్తమా, ఇతర దగ్గులకు, కీళ్ళ వాతమునకు మంచి మందు.జ్వర నివారణ , కుష్టు నివారణ, తేలు,జెర్రి ,ఎలుక , కుక్క కాటు విషాలకు విరుగుడుగా యీ ఆకు రసం పనిచేస్తుంది. 6.బదరి (రేగు)...భోజనం తర్వాత ఈ ఆకులు తింటే ఆహారం చక్కగా జీర్ణమౌతుంది.అజీర్తి,రక్త దోషాలను నివారిస్తుంది. వీర్య వృద్దికి తోడ్పడుతుంది. 7 .అపా మార్గ(ఉత్తరేణి)...పండ్ల సమస్యలకు ఉత్తమమైనిది .విషాన్ని హరిస్తుంది.గాయాలను మాన్ప టంలో,ఇతర చర్మ సమస్యలకు అద్భుతమైన ఔష ధం. 8.తులసి ( రామ తులసి, కృష్ణ తులసి ) ...నీ టిని, గాలిని శుభ్ర పరుస్తాయి.ఔషధాల గని .కీట కాలను ఇంటిలోనికి రానివ్వవు.జ్వరము ,జలుబు,దగ్గు,దురద,లాంటి వ్యాధులకు దివ్యౌషధము.మొక్కల చీడ పీడలనుంచి కాపాడుతుంది . 9.చూత పత్రం (మధు ఫలం/ మామిడి) ...ఆక్సిజన్ యిస్తుంది. మూత్ర వ్యాధులను అరికట్టుతుంది.పాదాల బాధలనుంచి ఉపశమనం కలిగిస్తుంది . 10.కరవీర పత్రం (గన్నేరు )...జుట్టును పెంచుతుంది . తల చుండ్రును తగ్గిస్తుంది. విషాన్ని హరిస్తుంది .కాని,ఎక్కువైతే విషమే ఔతుంది . 11.విష్ణు క్రాంత పత్రం (శంఖ పుష్పం/వారకాంత )...దీర్ఘకాలిక దగ్గును,కఫ వాతాలను,జ్వరాలను ,నివారిస్తుంది.ఇది జ్ఞాపక శక్తిని పెంచుతుంది.దీనిపూలు నీలంగా ఎర్రగా వుంటాయి. 12.దాడిమీ పత్రం (దానిమ్మ)...ఆకలి కలిగిస్తుంది. అజీ ర్ణాన్నిపోగొడుతుంది .గుండె జబ్బులున్న వారికి మేలుచేస్తుంది. ఈ పండు తింటే విరేనాలు, వాంతులు తగ్గు తాయి.శరీరంలో త్రిదోష వాత పిత్త కఫాలను హరిమ్పజేస్తుంది . 13.దేవదారు పత్రం ...దోమలు,కీటకాలను దరికి రానీయవు.దీనితైలం చర్మ వ్యాధులకు,గొంతు సమస్యలకు ,ప్రేవులలో పుండ్లకు, కండరాల బలోపెతానికి ,లైంగిక ఉత్ప్రేరణకు ఉపయుక్తముగా వుంటుంది. 14.మరువక పత్రం (మరువ౦ )...జుట్టు రాలనివ్వదు. గుండె జబ్బుల వారికిది మచిది . నరాల ఉత్ప్రేరణకు,చెవిపోటు, నొప్పులకు దీన్ని ఔషధంగా వాడవచ్చు. 15.సింధువార పత్రం (వావిలి)...వాతరోగ హరిణి.విషాలకు విరుగుడు .జ్వర నొప్పుల పై పనిచేస్తుంది తలమాడు నొప్పిని తగ్గిస్తుంది.పంటి చిగుళ్ళు , కీళ్ళబాధలను నివారిస్తుంది. 16.జాజి పత్రం (సన్నజాజి)...అజీర్ణం తొలగిస్తుంది . తలరోగాలను దరి రానీయదు.ఆకులు శరీరానికి వేడి నిచ్చి, శక్తినిస్తాయి.వాపు నొప్పిని తగ్గిస్తాయి. రక్తాన్నిశుద్ధి చేస్తాయి. 17.గండకీ(గణకీ) పత్రం (కామంచి /కాకమాసి /తీగె గరిక/ లతా దుర్వా)... అధిక దప్పిక తగ్గిస్తుంది .జ్వరానికి మంచి మందు.కడుపు లొని నులిపురుగులను హరిస్తుంది 18.శమీ పత్రం(జమ్మి ఆకు )...వంశ పారం పర్యంగా వచ్చే వ్యాధులను తొలగిస్తుంది.ఈ ఆకు రసం తల చల్ల దనానికి, జుట్టు నిగనిగ లాడేందుకు ఉపకరిస్తుంది.ఈ వ్హెట్టు పై నుంచి వచ్చే గాలిని స్వచ్చంగానూ ఆహ్లాదంగాను వుంచుతుంది. 19.అశ్వత్థ పత్రం (రావి ఆకు)...ఈ ఆకులు మూత్ర సంబంధ ,శ్వాస కోశ సంబంధ ,చర్మ వ్యాధులను తగ్గిస్తాయి. శరీరంలో విషాల విరుగుడుకు, క్రిమిదోషాల నివారణకు వినియోగిస్తారు. 20.అర్జున పత్రం ( తెల్ల మద్ది/వీర తరు) ...రక్త దోషం,క్షయకు జరిపే చికిత్సల్లో దీనిని వాడతారు.దీ నిబెరడు కషాయం గుండె ఆరోగ్యంగా, పదిలంగా వుండటానికి ఉపయోగిస్తారు. 21.అర్క పత్రం (తెల్ల జిల్లేడు )...దీని పాలు విషానికి విరుగుడు.ఎక్కువ వయసున్న చెట్టు వేళ్ళు గణపతిని పోలి వుంటాయట ! దాన్నే శ్వేతార్కమూల గణపతి అంటారు . ఇది ఇంటిలో వుండటం చాలా మంచిది. దీనిని సూర్యునికి ప్రతీకగా భావిస్తారు. దిఇనిలోని ఔషధ గుణాలు శరీరాన్ని కామ్తివంతంచేస్తాయి.’’ ‘’అబ్బ ! చాలా విషయాలు తెలుసుకున్నాం.! తాతగారూ !’’ అరే !..మన ప్రతి పూజ వెనుకా యెన్నో రహస్యాలు దాచి పెట్టారు మన పెద్దలు . అవన్నీ తెలుసుకుంటేనే మనం చేసే పూజకు అర్థం వుంటుంది .లేకుంటే వ్యర్థమే!. ఆగారు తాతగారు కొంచెం విశ్రాంతి కోసం. ‘’ఒరే ! పిల్లలూ! ఇంతకీ గణేశ పూజకు సిద్ధంగా వున్నారా?చెప్పండి !’’ ‘’ఆ..ఆ..మేమంతా రెడీ! తాతగారు !’’భేష్ ! ఇక ఇంటికివెళ్ళి పాలవెల్లి అవీ తయారు చేసుకోండి. పూజ పూర్తి అయిం తర్వాత కలుద్దాం . ఓకే!’’అన్నారు తాతగారు .పిల్లలు కూడా తాతగారికి ఓకే చెపుతూ వెళ్లి పోయారు ‘’కథ కంచికి- మన మింటికీ ‘ ‘’జయ గణేశ ! జయ గణేశ !’ వ్యాసకర్త :- నల్లాన్ చక్రవర్తుల వెంకట రంగనాథ్  

ముక్తా బాయి రాసిన కొన్ని అభంగ్ లు

  ముక్తా బాయి రాసిన కొన్ని అభంగ్ లు మరాఠీ వర్కారి సంత్ లందరిలోకి మొట్ట మొదటగా ఈమె గురించి చెప్పుకోవలసింది. సంత్ గా గుర్తింపు పొంది గౌరవింపబడుతున్నవారికి కూడా వారిలోని లోపాలు ఎత్తిచూపి, జ్ఞానబోధ చేసి వారిని పరిపూర్ణత వైపు మళ్ళించిన ఘనత ముక్తాబాయిదే. ఇవన్నీ చేసిన ఈమె పద్ధెనిమిది ఏళ్ళు వయసు వరకే బ్రతికిందంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఈమె పుట్టుక, కుటుంబం, గడిపిన జీవితం మొత్తం అంతా ఎంతో అసాధారణంగా, ఒక అద్భుతంలాగే ఉంటుంది. టూకీగా ఈమె పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకుందాము. ముక్తాబాయి తల్లితండ్రులు విఠల్ గోవింద్ కుల్కర్ణి, రుక్మిని. వేదాలు ఔపోసన పట్టిన విఠల్ గోవిందు పెళ్ళి తరవాత ఆ విషయం దాచిపెట్టి వారణాసి లో సన్యాసం పుచుకుంటాడు. అయితే ఈ విషయం గురువుకి తెలిసిన తరవాత అతనికి నచ్చచెప్పి తిరిగి గృహస్తు గానే బ్రతకమని తిప్పి పంపేస్తాడు. కాని తిరిగి వచ్చిన గోవిందుని సన్యాసం పుచ్చుకున్న కారణంగానో లేక తిరిగి గృహస్త జీవితంలోకొచ్చిన కారణంగానో అర్ధం కాలేదు గాని బ్రాహ్మణ పెద్దలంతా సంఘంలోంచి వెలి వేస్తారు. వీరికి నల్గురు పిల్లలు పుడతారు. నివృత్తి, ధ్యానేశ్వర్, సోపాన్ అనే ముగ్గురు అబ్బాయిలూ చివరగా ముక్త అనే అమ్మాయి. సంఘంలోంచి వెలివేత భరించలేని ముక్త తల్లితండ్రులు, నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటారు అప్పుడైనా పిల్లల్ని తిరిగి సమాజంలోకి ఒప్పుకుంటారేమోనన్న ఉద్దేశ్యంతో. కాని అలా జరగలేదు. దిక్కు లేని పిల్లలు అడుక్కుని జీవించే పరిస్తితి. బ్రాహ్మణ పండితులతో వీరు చేసిన వాదనలు, వీరి ఆధ్యాత్మిక జ్ఞానం, వారినెంత అబ్బురపరిచాయంటే, పిల్లలందరూ బ్రహ్మచర్యం పాటించే షరతు మీద వారి వెలివేతని రద్దు చేస్తారు. ఇదంతా చూస్తుంటే అప్పటి సమాజ నియమాలు ఎంత కఠినంగా వన్సైడెడ్ గా ఉండేవో అర్ధం అవుతుంది. . అయితే ఈ పిల్లలెంత ప్రతిభావంతులో చూడండి. నివృత్తి గొప్ప ఆధ్యాత్మిక వేత్త తన తమ్ములకి, చెల్లికీ గురువు. ధ్యానేశ్వర్ మొట్ట మొదటి వర్కారి సంత్. ఇతను అన్నగారి సలహా మేరకు 15 ఏళ్ళ వయసు లోపలే భగవత్ గీత మీద మరాఠీ లో వ్యాఖ్యానించాడు. ఆ రకంగా పండితులకి మాత్రమే అందుబాటులో ఉన్న భగవత్ గీతను సామాన్య జనానికి అందుబాటులోకి తెచ్చిన ఘనత దక్కించుకున్నాడు. అద్వైత సిద్ధాంతం మీద "అమృతానుభవ్" అనే అతి క్లిష్టమైన రచన కూడా చేసాడట. ఇదంతా కూడా టీనేజ్ లోపే. అంటే రెండు దశాబ్దాలు కూడా బతకకుండానే శతాబ్దాలు నిలిచే రచనలు చేసి సమాధిలో తనువు చాలించాడు. తమ్ముడు లేకపోయాకా నివృత్తి చెల్లెలు ముక్తని తీసుకుని పుణ్య క్షేత్రాలు తిరగడానికి వెల్తాడు. అయితే తాపి నది వరదలో ముక్త కొట్టుకు పోతుంది. విరక్తితో నివృత్తి కూడ సమాధిలో తనువు చాలిస్తాడు. ఆఖరి తమ్ముడు సోపాన్ కూడా మరాఠీలో భగవద్ గీత మీద వ్యాఖ్యానం ఆధారంగా "సోపాందేవి" అనే రచనచేస్తాడు ఇంక కొన్ని అభంగ్ లు కూడా ఇతని పేరిట భద్ర పరచబడ్డాయి. ఈ మధ్యలో జరిగిన ముక్త జీవితాన్ని మనం తెలుసుకోవాలి. ముక్తబాయి ఏంటో చెప్పడానికి రెండు మూడు చిన్న చిన్న సంఘటనలని చెప్పుకోవాలి. ఎనిమిదేళ్ళ వయసులో ముక్త తన అన్నలందరికి రొట్టెలు చెయ్యాలనిపించి దానికి కావాల్సిన పెనం కోసం బజారుకెళ్తుంది. అయితే వీరు వెలివేయబడ్డ కారణంగా వారికి కావల్సినవేవీ అమ్మడానికి వీలు లేదని ఊరి పెద్ద శాసిస్తాడు. ఏడ్చుకుంటూ ఇంటికొచ్చిన ముక్త నుంచి విషయం తెలుసుకున్న జ్ఞానేశ్వర్, నేలమీద చేతులు పెట్టి తన వీపుని పెనంలాగ వేడిచేసి రొట్టెలు కాల్చమంటాడుట. ఇది చూసిన ఊరిపెద్ద పిల్లల పాదాల మీద పడి క్షమాపణ అడిగి కాల్చిన రొట్టెను ప్రసాదంగా స్వీకరిస్తాడట. ఇంకొక సంఘటనలో వీరు నల్గురు పండర్పూర్ లో సంత్ నామ దేవ్ ని కలుస్తారు. ముగ్గురు అన్నలూ ఆపాటికే పేరు పొందిన పండితులు. అయినా నామ దేవ్ పట్ల గౌరవంగా పాదాభివందనం చేసినప్పుడు వారించకుండా సంత్ నామ దేవ్ కొంచం గర్వపడటం గమనించిన ముక్త తను సాష్టాంగ పడకుండా ఒక కుమ్మరిని ఇక్కద కుండలన్నీ సరిగా కాలాయా లేదా చూడమని అడుగుతుంది. విషయం అర్ధం చేసుకున్న కుమ్మరి ఒక కర్రతో అక్కడున్న అందరి పండితుల నెత్తి మీద కొట్టినపుడూ ఎవరూ మాట్లాడరు. కాని నామ దేవ్ మాత్రం బాధతో కోపంతో గట్టిగా అరుస్తాడు. అప్పుడు కుమ్మరి అన్ని కుండలూ కాలాయి కాని ఈ కుండ సగమే కాలిందని తేలుస్తాడు. ఈ అవమానం తట్టుకోలేని నామ దేవ్ తన గురువుకి విషయం వివరించి తన తప్పు తెలుసుకుంటాడు. అలా సంత్ లలో ఉన్న అజ్ఞానాన్ని కూడా ముక్త వదిలించడానికి వెనుకాడలేదు. ప్రజల అజ్ఞానపు మాటలతో విసిగి పోయిన జ్ఞాన దేవ్ ఒకసారి కోపంతో గుదిసె లోకి వెళ్ళి తలుపులు బిడాయించుకు కూర్చుంటాడు. అప్పుడు ముక్త ఈ పద్యం రాస్తుందట అతనిని శాంతింపచెయ్యటం కోసం.     "An ascetic is pure in mind and forgives the offences of people. If the world is hot as fire owing to exasperation, a sage should with pleasure be cool as water. If people hurt them with weapons of words, saints should treat those remarks as pieces of advice. This universe is a single piece of cloth woven with the one thread of Brahman, so please open the door, O Jnaneshwar."     దీనర్ధం ఒక సాధువు తన స్వఛ్చమైన మనసుతో ప్రజల తప్పులను క్షమిస్తాడు. నిట్టూర్పులలో వేసారి వేడెక్కిన ప్రపంచాన్ని ఒక సాధువు తన చెదరని ఆనందపు నీటితో చల్ల బరచాలి. ప్రజలు తమ శూలాల్లంటి మాటలతో గుచ్చినపుడు, ఒక సాధువు వాటన్న్నిటినీ సుద్దులుగా స్వీకరించాలి. ఈ విశ్వమంతా బ్రహ్మమనే దారంతో నేసిన ఒకే ఒక బట్ట. ఇది తెలుసుకుని తలుపు తియ్యి జ్ఞానేశ్వర్" అని. ముక్తా బాయి రాసిన కొన్ని అభంగ్ లను చూద్దాము. An ant flew to the sky and swallowed the sun. Another wonder - a barren woman had a son. A scorpion went to the underworld, set its foot on the Shesh Nag's head. A fly gave birth to a kite. Looking on, Muktabai laughed. ఒక చీమ ఆకాశంలోకెగిరి సూర్యుడ్ని మింగింది ఇంకొక అద్భుతం - ఒక గొడ్రాలు కొడుకుని కన్నది పాతాళానికి వెళ్ళిన ఒక తేలు శేషనాగుని తలపై కాలుమోపింది ఒక ఈగ గద్దకి జన్మ నిచ్చింది ఇదంతా చూస్తూ ముక్తా బాయి నవ్వుకున్నది. ఇది ఒక చిన్న పిల్ల చేసుకున్న అభూత కల్పనలు కావు. ఒక అసాధారణ తెలివితేటలు, వేదాంత జ్ఞానం, పాండిత్యం ఉండిన నేపధ్యంలో చెప్పిన మాటలు. ముక్త తన అన్నలందరితోపాటు అనాధగా, వెలివేయబడి, బిక్షమెత్తి, జనుల దయా ధర్మాల మీద బతికినది. ఆడతనం, అంటరానితనం రెండూ అనుభవించినది. ఉన్నత వర్గ సమాజం యొక్క దాష్ఠీకాలని అతి పిన్న వయసునిండి అనుభవించినది. ఒక పూర్తి జీవిత కాలపు అనుభవాన్ని తన అపారమైన జ్ఞానంతో పొందిన ముక్త మాటలు, అర్ధం చేసుకుంటే సమాజంలో బలమైన వర్గంపై, బలహీన వర్గం యొక్క విజయం ఆమె ఊహించినది అని తెలుస్తుంది.     Though he has no form     my eyes saw him,     his glory is fire in my mind     that knows     his secret inner form     invented by the soul.     What is     beyond the mind     has no boundary.     In it our senses end.     Mukta says: Words cannot hold him     yet in him all words are. అతడికి రూపం లేదు అయినా నా కన్నులు అతడిని చూసాయి ఆత్మ శోధనతో కనుగొన్న అతడి రహస్య అంతః రూపం ఎరుకగల్గిన నా మనసున అగ్ని వంటి తేజస్సు. చిత్తానికావల ఉన్న దానికి సరిహద్దు లేదు అదే ఇంద్రియాలు అంతమయ్యేచోట. ముక్త చెప్తుంది: పదాలు అతడిని పట్టలేవు, అయినా అతడిలోనే అన్ని పదాలు ఉన్నది. భక్తి ఉద్యమాలన్నీ ఎప్పుడూ ఎందుకు ఇంత ప్రజాదరణ పొందాయీ అంటే, నా కొకటే అనిపిస్తుంది. ఏ మతమైనా ఏ దైవం అయినా, భక్తి ఎప్పుడూ కూడా వ్యక్తిగత జీవన విధానానికి మాత్రమే పరిమితమై పోలేదు. సమాజంలో ఎప్పటికప్పుడు ఉన్న దురాచారాలను, అన్యాయాలను వ్యతిరేకిస్తూ, ఎప్పుడూ కూడా ఉన్న దాని కన్నా ఇంకొంచం మెరుగైన, న్యాయబద్ధమైన, అన్ని వర్గాల బాగోగులనూ దృష్టిలో ఉంచుకున్న సామూహక జీవన విధానం ఆశిస్తూ మొదలయినదే. ప్రజలందరి తరపున, ప్రజలందరి కోసం, ప్రజలందరినీ కలుపుకొంటూ, కేవలం ఒక వ్యక్తి చేత మొదలెట్టబడినా, ఒక మర్రి చెట్టులా వ్యాపించి వ్యవస్థీకృతం అవడంలో భక్తి ఉద్యమాలు విజయం సాధించాయి. వీర శైవం కానీ బౌద్ధం కానీ ఉదాహరణకి చూస్తే, సమ సమాజాన్నీ, మెరుగైన సామాజిక న్యాయాన్నీ అందజేయాలని తాపత్రయ పడ్డాయి కాబట్టే ప్రజల నమ్మకానికీ, ఆదరణకీ పాత్రులయ్యాయి. అవి పుట్టిన చోటే కాకుండా దేశ దేశాలకీ వ్యాపించాయి. అయితే వ్యవస్థీకృతమయ్యే క్రమంలోనే ప్రతి మతంలోనూ కొన్ని అవకతవకలు చోటు చేసుకున్నాయి. ప్రారంభంలోని ఆశయాలు మరుగున పడ్డాయి. అధికార బలానికి, ప్రజా బలానికి రాజకీయ ప్రయోజనాలకి అస్త్రాలుగా మారిపోయాయి. మహారాష్ట్రలోని వర్కారి భక్తి ఉద్యమం మొదలుపెట్టిన ముక్తా బాయి పద్ధెనిమిది ఏళ్ళు దాటి జీవించకపోయినా, తనుకానీ తన అన్నలు కానీ సాధించిన విజయాలు, వారు చేసిన రచనలు, సమాజంపై వారి ప్రభావం, ఒక నమ్మలేని అద్భుతం కన్నా ఎంత మాత్రమూ తక్కువ కాదు. ముక్తా బాయి రాసిన ఈ భజన గీతం ఇప్పటికీ మనమెప్పుడూ వినేదే. Om jay-jay jagdambe,jay muktai ambe l Nij-jankalpalate tu,karunamayi ambe ll Dhru.ll Ganga tu,go,gayatri,gita,vasundhara l Maha-Saraswati,laxmi,kaali,maate shakti-para ll 1 ll Nijshakti tu,adishakti,adimaya l Brahmaswaroopini mate,tu shuddha turiya ll 2 ll Sarvarth sadhike tu,srimante,kalyani l Mangalroopini nijdasa,tu Dyanesh-Bhagini ll 3 ll             - శారద శివపురపు

“చరిత్రలో ప్రబంధపరమేశ్వరుడు” 12 వ భాగం

  “చరిత్రలో ప్రబంధపరమేశ్వరుడు” 12 వ భాగం   తన చేతిలో పావులాగ అయిపోయిన సుల్తాన్ చేత ఎప్పుడో విల్లు వ్రాయించేశాడు కాఫర్. ఆ విల్లుని మంత్రి మండలికి చూపించి, బాలుడైన షిహాబుద్దీన్‍‍కి పట్టాభిషేకం చేయించాలని చెప్పాడు. ఆ విల్లులోనే, నయీబ్ మాలిక్ కాఫర్ రాజప్రతినిధిగా రాజ్యాన్ని పరిపాలించాలి అని కూడా ఉంది. హసన్ నిర్వికారంగా చేతులు కట్టుకుని దూరంగా నిలిచాడు. జరుగుతున్న తతంగమంతా ప్రపంచానికి తెలియజెప్పడానికి, అక్కడనున్న ప్రజలంతా ఒక్కొక్కరే జారుకున్నారు.. ఇంకా అక్కడే ఉంటే ఏమవుతుందో! అరాచకమైపోతే.. ఎవరు ఏం చేస్తారో తెలియదు. అందరూ కర్కోటకులే.. అల్లావుద్దీన్ అనుయాయులంతా అవాక్కై నిలబడిపోయారు. ఎవరైనా ఎదిరిస్తే..ఖండ ఖండాలుగా నరకడానికి సైనికులు కత్తుల మీద చేతులతో సిద్ధంగా ఉన్నారు. పట్టాభిషేకం అయింది. సభలోని వారందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. వాటిని చేతిలోనే ఉంచుకుని, ఇంకా నిశ్చేష్టులై ఉన్నారు యోధానుయోధులందరూ. "హసన్!" గర్జించాడు రాజ ప్రతినిధి. హసన్ ముందుకు నడిచాడు. "ఈ రోజు నుండీ నువ్వు సర్వ సేనానివి.. నీ పేరు ఖుశ్రో ఖాన్. ఇక్కడ అంతా చూసుకో! " హసన్ కొద్దిగా తల వంచి అభివాదం చేసి, వెనుకకు తిరిగాడు. సగం మంది నిష్ణాతులైన సైనికులని తీసుకుని మాలిక్ కాఫర్ సుల్తాన్ ప్రతినిధిగా సభ బయటకు నడిచాడు. ఆ సైనికులంతా ఒకప్పుడు హిందువులే.. కొత్త సుల్తాన్ తనకి వింజామర వీచుతున్న దాసీ చేతిలోని మిఠాయి తీసుకుని ఏకాగ్రతతో తింటున్నాడు. మాలిక్ కాఫర్ రక్తసిక్త పరిపాలన ఆ క్షణం నుంచే ప్రారంభమయింది. సైనికులు కవాతు చేస్తూ వెంటరాగా, అంతఃపురాల వైపు కదిలాడు.. కసి తీర్చుకునే కడలి కెరటంలా! సుల్తాన్ బంధువులు.. ఎవరైతే పదవికి అణుమాత్రమైనా అర్హులవుతారో.. వారందర్నీ నరికేశాడు. చిన్నా పెద్దా.. పసివారా వృద్ధులా.. ఎటువంటి తడబాటూ, తత్తరపాటూ లేదు. రక్తం ఏరులై పారింది. కొందరు ఆడవేషాలు వేసుకుని అంతఃపురంలో, అల్లావుద్దీన్ అనేకమంది బీబీల్లో బీబీగా కలిసిపోదామని చూశారు. కానీ.. ప్రతీ బీబీ చరిత్రా కాఫర్‍కి తెలుసు. అందరివీ ముసుగులు తొలగించి మరీ తరిమి తరిమి కొట్టి చంపాడు. ఆ చలువరాతి మందిరాల్లో... పాల వంటి తెల్లని రాళ్లు ఎర్రగులాబీ రంగులోకి మారిపోయాయి. సుల్తాన్ పెద్ద కొడుకులు ఖిజ్రి ఖాన్, షాది ఖాన్‍లు.. వారిని తన చేతుల మీదుగా ఆడించాడు. అయినా సరే.. ఏ మాత్రం సందేహించకుండా, వారిని చీకటి గదుల్లో బంధించి, కళ్ళు పొడిచేశాడు. మహారాణి, మాలికఇజహాన్‍ను కారాగారంలో బంధించాడు. రోజు రోజూ, రెండు చేతులా నరికి పారేస్తున్నాడు కాఫర్. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి.. జంతువు కంటే కనాకష్టంగా చేతులు మారి, మనిషికి మనసు.. ఆ మనసుకో అనుభూతి ఉంటాయని మరిచిపోయిన కాఫర్.. తనని, తన మతాన్ని, తన దేశాన్ని దోచుకుంటున్న దైత్యులని దునిమి దునిమి చిత్రవధ చేశాడు. అందులో కొందరు అమాయకులున్నా సరే.. అమాయకులైన హిందువులనెందరిని చంపలేదు యుద్ధాలలో.. వీరొక లెక్కా! ఖుశ్రో ఖాన్‍ని పిలిచి.. మదిర తెప్పించుకుంటున్నాడు ప్రతీ రోజూ రహస్యంగా.. మనశ్శరీరాలు విశ్రాంతి కోరుకుంటున్నాయి మరి. ఇంక అల్లావుద్దీన్ మూడవ కొడుకు ముబారక్ షా మిగిలాడు. అతనొకడ్ని తొలగించేశాడంటే మాలిక్ కాఫర్‍కు ఎదురే లేదు. అతన్ని వేయి స్థంభాల మందిరంలో, నేల మాళిగలో బంధించి, ఒక నెల పైనే అయింది. స్వైర విహారం పూర్తి అవ బోతోంది. ఆ తరువాత అతనే సుల్తాన్.. సుల్తాను అభిజాతులు, బానిసలు.. ఖిల్జీ వంశపు విశ్వాసపాత్రులంతా విసిగిపోయారు మాలిక్ కాఫర్ నిరంకుశత్వానికి. అర చేతుల్లో ప్రాణాలు పెట్టుకుని బ్రతకవలసి వస్తోంది.. అందరూ ఖుస్రోఖాన్ వద్దకు రాయబారం పంపారు. ఆ రోజు.. మదిర పానం ముగించి లేచాడు కాఫర్. ముబారక్ పని ఒక్కటే మిగిలింది. అతన్ని బంధించిన నేల మాళిగలోనికి వెళ్ళాడు. కణకణ లాడుతున్న నిప్పుల మీదనున్న ఇనుప కడ్డీలని తెప్పించాడు. నిప్పులున్న గంపతో సహా తెచ్చారు సేవకులు. కొద్దిగా పొగ కూడా వస్తోంది. ఎర్రగా సెగలు కక్కుతున్న రెండు ఇనుప కడ్డీలనీ తీసి తనే స్వయంగా కన్నులు పొడవబోయాడు. ఎవ్వరినీ నమ్మడానికి వీలు లేదు.. కొంచెం వికారంగా అనిపించింది. కన్నులు మూసుకు పోతున్నాయి. అప్పటి వరకూ జరిగిన ఆ నరమేధంతో అలసట చెందాడో ఏమో.. మరునాడు చూద్దాంలే అనుకుని తన మందిరానికి వెళ్ళి పోయాడు. రాత్రికి రాత్రి ముబారక్ షా తప్పించుకున్నాడు. మరునాడు ప్రొద్దుటికి మాలిక్ కాఫర్ శవమై తేలాడు తన మందిరంలో. సుల్తాన్ విశ్వాసపాత్రులు ముబారక్ షాను రాజప్రతినిధిగా చేశారు. ..................... 9 దక్షిణా పథంలో బెజవాడ దగ్గరగానున్న కొండపల్లి కోటలో.. ఐదేళ్ల క్రితం మాలిక్ కాఫర్ చేత తరమబడి, అక్కడ తల దాచుకుంటున్న క్షత్రియులు, నాయంకరులు.. అందరూ సమావేశమయ్యారు. శివుడికైనా తప్పలేదు చెట్టు తొర్రలో నివాసం.. మానవ మాత్రులైన ఈ సైనికులేపాటి.. చాళుక్య, చోళ, కాకతీయ సేనానులు కోట లోపల ఉన్నారు. కోట చుట్టూ, గడచిన ఐదు సంవత్సరాలలో బాగా పెరిగి, నవ యౌవనులైన, సుశిక్షుతులైన సైనికులు కాపలా కాస్తున్నారు. ప్రతాప రుద్రుడు పంపిన వార్త తీసుకునొచ్చిన వేగులు అప్రమత్తులై నిలుచున్నారు. "ఢిల్లీలో ముసల్మానుల జోరు తగ్గింది. ఆరు సంవత్సరాల బాలుడు సింహాసనం మీద నున్నాడు. రాక్షసుడైన మాలిక్ కాఫర్ హత్య చెయ్యబడ్డాడు. గుజరాత్‍లో విప్లవం మొదలయింది. మహమ్మదీయుల మదమడిచే సమయం ఆసన్నమయింది. మీరందరూ మీ మీ పట్టాణాలకేగి పరిపాలన సాగించండి. నేను ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యం నుండి స్వాతంత్య్రం ప్రకటిస్తున్నాను." సాధారణంగా అటువంటి వార్త వచ్చినప్పుడు హర్షధ్వానాలు మిన్నంటాలి. కానీ.. అక్కడ నిశ్శబ్దం నిలిచింది నిస్త్రాణగా. కాప నాయకులలో ఒకరు లేచాడు. "ప్రతాపరుద్ర చక్రవర్తి తొందర పడుతున్నారనిపిస్తోంది. ముష్కురులు మాయగాళ్లు.. అస్సలు నమ్మడానికి లేదు. ఇప్పుడిప్పుడే అశ్వాలను, ఏనుగులను సమకూర్చుకుంటున్నాం. జన నష్టాన్ని కొద్ది కొద్దిగా పూడ్చుకుంటున్నాం. ప్రజలు ఇంకా ఆ భయానక స్థితి నుంచి తేరుకోలేదు. పగ వాళ్లేమో విభజించి పాలిస్తున్నారు. దేవగిరి వంటి దక్షిణ రాజ్యాలు కొన్ని వారి అధీనంలోనే ఉన్నాయి. మనం అందరూ ఏకం అయినా చాలదు వారి బలం ముందు. ఈ వేగుల ద్వారానే కబురంపుదాం.. కాస్త ఆగుదామని.. ఏమంటారు అందరూ?" అప్పుడు సన్న సన్నగా వినిపించాయి కరతాళధ్వనులు.. వారి అభిప్రాయం కూడా అదే అన్నట్లు. ఆ సమావేశానికి వచ్చిన అద్దంకి నాయకుడు కూడా అదే సరి అన్నాడు. అతని వెంటనున్న సూరనార్యుడు మెచ్చుకుంటున్నట్లు తల ఊపాడు. వారి నిర్ణయం సరి అయినదే అని అతి త్వరలోనే తెలిసింది. అదీ.. ఆ వేగులు, ఓరుగల్లు చేరిన కొద్ది దినములకే. తన సామంతుల, సేనానుల నిర్ణయానికి ప్రతాపరుద్రుడు ఖిన్నుడయ్యాడు. అంతే మరి.. యుద్ధంలో ఓడిపోయిన చక్రవర్తి తను.. ఢిల్లీ సుల్తానుకు కప్పం కట్టుట వలననే కదా వారికి అంత చులకన.. అది మానేస్తే.. ఆ వారమే రెండు ఒంటెల నిండుగా నాణాలను, నగలను తీసుకుని ఢిల్లీ వెళ్ళాలి. మైలి సేనానికి కబురు చేశాడు ప్రతాపరుద్రుడు. "సేకరించిన ధనమంతా ధనగారంలోనికి చేర్చండి. మనం కప్పం కట్టట్లేదు. గుజరాత్ రాష్ట్రీయులకున్న ధైర్య సాహసాలు మనకి లేవా? ఆల్లావుద్దీన్, మాలిక్ కాఫర్.. ఇద్దరూ మరణించారు. ఆరేళ్ళ పిల్లవాడు చక్రవర్తట. వానికి మనం సామంతులమా!" "అది కాదు ప్రభూ! ముబారక్ ఖిల్జీ రాజ ప్రతినిధి. అతని నయీబ్ ఖుస్రోఖాన్, మాలిక్ కాఫర్ కంటే రాక్షసుడు. అతడే మాలిక్‍ని చంపేశాడంటారు. వారు మరల దండెత్తుతే.. మన సేనలు కూడా చెల్లా చెదురైపోయాయి.." మైలి సేనానిని చెయ్యి అడ్డం పెట్టి ఆపేశాడు ప్రతాప రుద్రుడు. హృదయం భగ్గుమంది. హు.. ప్రతీ వాడూ చెప్పేవాడే.. కాని కాలం వస్తే తాడే పామై కరుస్తుందట. "నువ్వా నేనా ప్రభువు.. చెప్పింది చెయ్యి." ఏదో చెప్పబోయి ఆపేశాడు మైలి సేనాని. పోగాలము దాపురించినవాడు మిత్రవాక్యమును వింటాడా.. మైలి సేనాని వెనుకకు మరలాడు, చింతిస్తూ.. ఈ ధిక్కారానికి ఏ పణం చెల్లించాలో! వీరిక్కడ భేటీ అవుతున్న సమయంలోనే ఢిల్లీ సింహాసనం మీద మార్పులు సంభవించాయి. ముబారక్ షా ఖిల్జీ, తమ్ముడిని.. ఆరు సంవత్సరముల ముక్కు పచ్చలారని పసివాడిని బంధించి, వాడి కళ్లు పెరికించి, సింహాసనం ఎక్కాడు. ఆ చిన్నారికి తాను సింహాసనం ఎందుకెక్కాడో తెలియదు. ఎందుకు కళ్ళు పీకారో అసలే తెలియదు.. బాధకి దిక్కులు పిక్కటిల్లేటట్లు ఏడవడం తప్ప. అరవై రోజులు ఢిల్లీ సుల్తాన్‍గా ఉన్న అమాయకుడైన ఆ బాలుడు జీవితాంతం చీకటిలోనే మగ్గాలి, అతని ఇతర సోదరుల వలె. రాజ్య కాంక్షకి మంచి చెడ్డలు ఉండవు. రక్త సంబంధాలుండవు. ఇదంతా ఖుస్రో ఖాన్ పర్యవేక్షణలోనే జరిగింది. రాజ్య స్వీకారం అయిన వెంటనే విప్లవాలని అణచి వేయసాగారు ముబారక్, ఖుస్రోలు. గుజరాత్ విప్లవాన్ని ముబారక్ షా మామగారైన జఫార్ ఖాన్ అణచి వేశాడు. అతనిని గుజరాత్‍కి రాజ ప్రతినిధిని చేశాడు సుల్తాన్. దేవగిరి రాజు కూడా స్వతంత్రాన్ని ప్రకటించాడు. ఖుస్రోఖాన్ అనంత సేనావాహినిని తోడ్కొని దేవగిరి మీదికి దండెత్తాడు.. అల్లాహో అక్బర్ అంటూ! యాదవరాజు హరపాల దేవుడు వీరోచితంగా ఎదుర్కున్నాడు. కానీ, ఖుశ్రో సైనికుల పశుబలం ముందు ఓడిపోయి, పట్టుబడ్డాడు. ఖుశ్రో తమ సైన్యంతో పట్టణం మీద పడి, వేల కొలదీ హిందువులని ఊచకోత కోశాడు.. ఆ వధ కొన్నిరోజులు సాగింది. హరపాల దేవుడిని ఢిల్లీ తీసుకురమ్మని, నిండు సభలో తన ఎదురుగానే, చర్మం ఒలిపించాడు కుతుబుద్దీన్ ముబారక్ షా ఖిల్జీ. అతను పెట్టే హృదయ విదారకమైన కేకల్ని వింటూ ఆనంద కేళి సలిపాడా రాక్షసుడు. అతడి శరీరాన్ని, ఒలిచిన చర్మాన్ని తీసుకెళ్ళి దేవగిరి కోట గుమ్మానికి వేళ్ళాడ దీయించాడు, ప్రజలందరూ చూచేలాగ. రాబందులు రాజు శరీరాన్ని పీక్కు తింటుంటే వికారంతో వందలమంది కళ్ళు తిరిగి పడిపోయారు చూడలేక. సుల్తాన్ ధ్యేయం అదే. ఎంత శతృవుకైననూ అటువంటి శిక్ష విధించడం, అమలు జరపడం.. అతి దారుణం. ఆ చర్య హీనాతి హీనం. అంతకు అంతా అనుభవించక తప్పదు భవిష్యత్తులో. చివరికి దేవగిరిలో మసీదు కట్టించి, తన ప్రతినిధిని ఉంచి, అక్కడి కోటలోని క్షత్రియ స్త్రీలని తన అంతఃపురంలోకి చేర్చాడు. దేవగిరి శాశ్వతంగా ముస్లిమ్ రాజ్యం కింద మారింది. కోటగుమ్మానికున్న మహరాజు దౌర్భాగ్యాన్ని చూసిన వారెవ్వరూ మరి విప్లవాన్ని ఆహ్వానించరు. ఆ తరువాత.. కాకతీయుల విప్లవ ఛాయల్ని పసికట్టి, ఖుస్రో ఖాన్‍తో అతి పెద్ద సేనని ఓరుగల్లు మీదికి పంపాడు సుల్తాన్. కర్కోటకుడైన ఖుస్రోఖాన్‍తో పొలిమేరల్లోనే సంధి కుదుర్చుకున్నాడు ప్రతాపరుద్రుడు. రెండు ఒంటెల బదులు నాలుగు ఒంటెలమీద ధనరాశుల్ని కప్పంగా కట్టాడు. మైలి సేనాని మాట విని వుంటే.. కనీసం రెండు ఒంటెలు, వాని మీది ధనరాశులు మిగిలేవి. మరలా దక్షిణా పథంలో కల్లోలం అణిగి ప్రశాంతత నెలకొంది.. తాత్కాలికంగా! ఢిల్లీలో మాత్రం అల్లకల్లోలం మొదలయింది. వరుస విజయాలతో ముబారక్ తనంతటి వాడు లేడనుకున్నాడు. తండ్రి విధించిన నియమాలను ధిక్కరించాడు. పన్నులను కొన్నింటిని తీసి వేశాడు. తను కారాగారంలో నిరంతరం భయంతో బ్రతికాడు కనుక, ఖైదీ లందరినీ విడుదల చేశాడు. అది చాలదన్నట్లు, మాలిక్ కాఫర్ చంపగా మిగిలిన రాజవంశీయులందరినీ చంపేశాడు. దగ్గర బంధువులనే వాళ్ళు లేకుండా పోయారు చివరికి. ఈ పరిపాలనా విషయాలలో వజీర్‍గా పదోన్నతి పొందిన ఖుస్రో ఖాన్ కల్పించుకోలేదు. పైగా సుల్తాన్‍ను తాగుడికి బానిసని చేశాడు. అతడి వ్యభిచారాన్ని ప్రోత్సహించాడు. ముబారక్ షాకి మదం తలకెక్కి, తనే ఇస్లాము మతానికి అధికారిగా ప్రకటించుకున్నాడు. ఫలితం.. ఖజానా ఖాళీ అయిపోతోంది. మంత్రులు, సేనానులు బలహీన పడి, ప్రజలను శాసించలేకపోతున్నారు. ముసల్మాన్ మంత్రులు, దండనాయకులు సుల్తాన్ చర్యలకు అవమానంతో తలదించుకుంటున్నారు. అరాచకం, అంతర్గత విప్లవం ఆరంభం అయ్యాయి. గుజరాత్‍లో ముప్పది వేలమంది హిందూ సైనికులు రహస్యంగా సుశిక్షితులవుతున్నారు.. బలవంతంగా కాదు.. స్వఛ్ఛందంగా.. హిందూ ధర్మ పరిరక్షణకై, ఒక ధృఢ సంకల్పంగల సేనాని ఆధ్వర్యంలో. నమ్మినబంటు ఖుశ్రోఖాన్ సుల్తాన్ తరువాత రెండవ స్థానంలోనికి చేరాడు.. అల్లావుద్దీన్‍కి మాలిక్ కాఫర్‍లాగ. మొత్తం పరిపాలన అంతా ఖుస్రోకి వదిలేసి సుల్తాన్ విలాసాల్లో మునిగి తేలసాగాడు. రాజ్యపాలన వ్యవహారాలలో అన్నదమ్ములని కూడా నమ్మకూడదని మరచాడు. వినాశకాలే విపరీత బుద్ధి.. విధాత నిర్ణయాన్ని ఎవరు మార్చగలరు? ఖుశ్రోఖాన్‍కి అంతఃపురంలో కూడా ప్రవేశముంది. సుల్తాన్ ఎక్కడుంటే అక్కడికి స్వేఛ్ఛగా వెళ్ళగలడు.. అతని ప్రియుడు కూడా కనుక.. వజీర్ సాబ్ ఖుశ్రో కూడా మాలిక్ కాఫర్ లాగ నపుంసకుడనుకుని అంతఃపుర స్త్రీలు కూడా సంకోచం లేకుండా అతని ఎదురుగా తిరిగేస్తుంటారు.. ఒక్కోసారి పర్దా లేక పోయినా పట్టించుకోరు. ఆ రోజు కూడా ఖుశ్రో, సుల్తాన్‍తో ఆంతరంగిక విషయం మాట్లాడాలని అంతఃపురానికి వచ్చాడు. ముబారక్ షా మత్తుగా పడిపోయి ఉన్నాడు. నిరాశగా వెనుతిరిగిన ఖుశ్రోకి ఎదురుగా ఒక మెరుపు మెరిసినట్లయింది. ఆ మెరుపు తీవె కూడా తడబడకుండా ఖుశ్రోని తీక్షణంగా చూసింది. కళ్లల్లోకి.. నిర్భయంగా. మేలి ముసుగు లేదు.. మెడ నిండుగా నగలు. దాసి అయితే కాదు. సాధారణంగా వజీర్ సాబ్‍కి ఎవరు ఎదురు పడినా కూడా తప్పించుకుని, తల దించుకుని వెళ్ళి పోతారు, ఎటు పోయి ఎటు వచ్చినా మనకెందుకని. అతడికి అంతటి ప్రఖ్యాతి ఉంది ఢిల్లీ కోటలో. అటూ ఇటూగా ఇరువది సంవత్సరాలుంటాయి ఆ యవ్వనికి. ఆమెని ఎక్కడో చూసినట్లనిపించింది ఖుశ్రోకి. ముస్లిం యువతి వేషధారణ అయినా, మొహంలో ఆ ఛాయలు లేవు. కనుముక్కు తీరు, మేని రంగు.. కాంతి, ఠీవి.. హిందూ రాకుమారిలాగ ఉంది. ఏ దండయాత్రలో తమ జనానాలో కలిపేసుకున్నాడో సుల్తాను. "నా పేరు దేవల్ దేవి." గోజ్రీ భాషలో చెప్పింది. ఖుశ్రోకి ఆ గొంతు వినగానే గుర్తుకొచ్చింది. తామిద్దరూ ఒకే సారి తమ దేశం నుండి విడివడిపోయారు. తన వయసే.. తన మతమే. తన భాషే. కానీ హస్తిమశకాంతరం భేదముంది ఇద్దరికీ. ఆమె రాజు కూతురు. ఉత్తమకుల సంజాత. తాను పనివాడి కొడుకు. హీన కులజుడు. విధి విచిత్రమయింది. ఇద్దరికీ ఒకే రకం రాత రాసింది. ఇద్దరికీ కన్నులు చెదిరే అందమిచ్చింది.. అదే వారి పట్ల శతృవయింది. ఖుశ్రోఖాన్‍కి దేవల్ దేవి గురించి బాగా తెలుసు. కానీ అప్పటి వరకూ కలిసే అవకాశమే రాలేదు. తను ఈ స్థాయికి ఎదగడానికి.. ఇష్టం వచ్చిన ప్రదేశానికి అడ్డు లేకుండా, ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళగలగడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. దేవల్ దేవికి కూడా అంతే కాలం పట్టింది, అయితే స్త్రీ కనుక దారి వేరే. ఇద్దరి దారుల్లో ముళ్ళ కంపలూ, ఎదురు దెబ్బలూ, లైంగిక హింసలూ.. భౌతిక, మానసిక గాయాలూ.. అవీ దారుణమైనవి. లోతైనవి. ఎప్పటికీ మాననివి. పచ్చిగా ఉంటూ క్షణక్షణం బాధించేవి. ఆ బాధని ఎక్కడో గుండె లోతుల్లో పాతేశారు ఇరువురూ. అప్పుడు.. పదునైదు సంవత్సరముల తరువాత బహిర్గతమయిన ఆ బాధ.. ఖుశ్రో కన్నులలో రవ్వంత కనిపించింది. దేవల్ దేవి నిస్తేజంగా చూసింది. సుల్తాన్ సమక్షంలో తెచ్చి పెట్టుకున్న ఉత్సాహం మాయమయి, ఆత్మీయులు కనిపిస్తే కలిగే వేదన, ఆమె మోములో. సుల్తానా దేవల్ దేవికి ఖుశ్రో గాధ విదితమే.. ఆ విషయం అతను గ్రహించాడు. గుజరాత్ దండయాత్ర జరిగినప్పుడు ఖుశ్రో చాలా చిన్నవాడయినా, ఇతర బానిసల మాటలను బట్టి జరిగింది తెలుసుకున్నాడు. ----          ......మంథా భానుమతి  

తేనెపట్టులాంటి మునిమాణిక్యం కథలు

  తేనెపట్టులాంటి మునిమాణిక్యం కథలు తెలుగుకథను సుసంపన్నం చేసిన కథారచయితల్లో మునిమాణిక్యం ఒకరని అందరికీ తెలిసిన విషయమే. అయితే మిగిలిన కథకులకు మునిమాణిక్యం నరసింహరావుకు తేడా ఏమిటంటే ఆరోగ్యకరమైన హాస్యానికి చిరునామా అతడు. కథను ప్రత్యేకంగా హాస్యం కోసం రాయడు. కానీ కథలో హాస్యం ఓ భాగమై పోతుంది. చలం, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి వంటి కథా రచయితలు కథలకు ప్రాణం పోస్తున్న కాలంలో, భావకవులు ఊహా ప్రేయసులు అంటూ నేల విడిచి సాము చేస్తున్న రోజుల్లో ఓ సాధారణ మధ్యతరగతి గృహిణిని, ఆమె సంసార జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకొని హాస్యాన్ని పుట్టించారు నరసింహారావు. మునిమాణిక్యం అంటే ఏ మాత్రం సాహిత్యాభిమానం ఉన్నా గుర్తొచ్చే పేరు కాంతం. కాంతం పాత్ర తెలుగువారి సొంతమైపోయింది. దాదాపు కథలన్నిటిలో ఒకేపాత్ర ఉండేలా, ఆపాత్ర నిడివితో ఇతర పాత్రలను చేర్చుతూ ఒకే రకమైన కథలు రాసిన వారిలో మునిమాణిక్యం గొప్పవారు. ఆరోగ్యకరమైన హాస్యానికి చిరునామాగా చెప్పుకునే మునిమాణిక్యం నరసింహారావు గుంటూరు జిల్లా జాగర్లమూడిలో 1898 మార్చి15న పుట్టారు. పేద కుటుంబంలో జన్మించినా కష్టపడి గుంటూరు కళాశాలలో ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. తర్వాత కొండా వెంకటప్పయ్య సహాయంతో విజయనగరంలో బి.ఎ., రాజమమండ్రిలో ఉపాధ్యాయశిక్షణ పూర్తిచేసి ఉపాధ్యాయుడిగా స్థిరపడ్డారు. చివరి రోజుల్లో హైదరాబాదులోని ఆకాశవాణిలో కూడా పనిచేశారు. సహజంగా హాస్యంతో సంభాషించే చాతుర్యం ఉన్న మునిమాణిక్యం ఆనాటి కవులు, పండితులతో అలానే మాట్లాడేవారు. ముఖ్యంగా నోరి నరసింహశాస్త్రి, జరుక్ శాస్త్రులు వీరిని కథలు రాయమని ప్రోత్సహించారు. తను రోజు చెప్పే కబుర్లనే కథలుగా రాయమని తల్లావఝ్ఝుల శివశంకరశాస్త్రి అనడంతో కథా రచనకు పూనుకున్నట్లు నరసింహారావే చెప్పుకున్నారు. మునిమాణిక్యం తొలిసారిగా 1923లో తేనీరు అనే కథ రాశారు. మొత్తంగా అరవై కథలు రాసినట్లు తెలుస్తుంది. కథలతోపాటు శరద్రాత్రులు, రుక్కుతల్లి, మేరీకహానీ అనే నవలలు, గాలిపిల్లలు పేరిట బాలలకోసం కథలు... ఇంకా జయమ్మకాపురం, ఎలోప్ మెంట్ వంటి నాటికలు ప్రకటించారు. అప్పుచెయ్యడం, తీర్చడం, భార్యను లొంగదీసుకోవడం వంటి కొన్ని హాస్య వ్యాసాలనూ రాశారు. హాస్య కథలు, కాంతం కథలు, అల్లుళ్లు వంటి వీరి కథా సంపుటాలు ప్రచురింపబడ్డాయి. ఎన్ని రాసినా మునిమాణిక్యం అంటే కథా రచయితగానే గుర్తింపు వచ్చింది. వారు సృష్టించిన కాంతం పాత్రే తెలుగువారిలో ముద్రపడిపోయింది. అనురాగం, ఆత్మీయతతో కూడిన చాతుర్యం, మాటకారితనం, కొద్దిగా వెటకారం, శృతిమించని శృంగారం, నిండుదనం, కొంటెదనం... ఇలా అన్ని ఉన్న స్వచ్ఛమైన తెలుగు ఇల్లాలు కాంతం. మునిమాణిక్యమే ఆ కథల్లో వెంకట్రావుగా మనకు కనిపిస్తాడు. అతను అమాయకుడు. అలాగని భార్యపై పెత్తనం చేసి తను నెగ్గుకు రావాలనుకున్నా చివరకు తనే లొంగిపోయే స్వభావం కలవాడు. అసలు కాంతం పాత్రకు స్ఫూర్తి నరసింహారావు మొదటి భార్యేనట. ఆ పేరు మాత్రం అతని స్నేహితుల్లో ఒకరి చెల్లెలదని చెప్పారు రచయిత. మొదటి భార్య జీవితానుభవాల నుంచి పుట్టిన కథలే కాంతం కథలు. కాంతం కథలు చాలా చతురతతో పాటు శిల్ప పరంగా కూడా గొప్పవే. కథ సాధారణంగా ఒక వాక్యంతోనో, వర్ణనతోనో, సన్నివేశంతోనో మొదలవుతుంది. మధ్యలో పీటముడి పడుతుంది. చివరకు చురకతో ముగుస్తుంది. మనకు నవ్వు తెప్పిస్తుంది. చాలా కథల్లో అర్థాల ద్వారా మునిమాణిక్యం హాస్యాన్ని సృష్టించారు. కాంతం మాట్లాడే మాటల్లో వెటకారంతోపాటు, ఆ మాటల వెనుక అర్థవంతమైన లోగుట్టు ఉంటుంది. కాంతం భర్తతో చాలా చమత్కారంగా మాట్లాడుతుంది. సన్నివేశాన్ని బట్టి, అవసరాన్ని, అవకాశాన్ని బట్టి చతురోక్తులు విసురుతుంది. ఉదాహరణకు- కొండపల్లి వెళితే మీకు కొయ్యబొమ్మలు కనపడతాయా... అంటే అక్కడ కూడా అమ్మాయిలను చూస్తుంటారు కదా అని ఆమె ఉద్దేశ్యం. ఆ అమ్మాయిని అంతధైర్యంగా ప్రేమించేశారేం... మరి ఆ సమయంలో మీ దగ్గర అద్దం లేకపోయిందా.., అలానే మరోచోట- మా వాళ్లందరూ తోకలేని కోతులా.. పాపం మీ వాళ్లకు ఆ లోటు కూడా లేదులేండి. అంటుంది. మరికొన్ని వాక్యాలలో నరసింహారావు హాస్యం చాలా గొప్పగా ఉంటుంది. విరహం అంటూ అనుభవించాలేగాని హంసతూలికా తల్పమే కావాలా... నులకమంచంలో పడి దొర్లినా నానాహంగామా చెయ్యకూడదా..., లెంపలేసుకున్నారా, స్వయంగానేనా లేక మీ ఆవిడా... పిల్లలు కోతి బొమ్మ కావాలంటున్నారు, వచ్చేటప్పుడు తెస్తారా లేక మీరే వస్తారా...ఇక కొన్ని కథల్లో కాంతం భర్త వెంకట్రావు మాటలైతే ఆయనకు భార్యపై కోపాన్ని చతురోక్తులతో చెప్తాడు మునిమాణిక్యం- కోతి కనిపించే సరికి మా ఆవిడ గుర్తుకొచ్చింది. నేనా పిల్లను ఆటపట్టిద్దాం అనుకున్నాను, కానీ నా ఊహల్లో మా కాంతం ముఖం సూపర్ ఇంపోజ్ అయింది. ఇలా ఎన్నో సున్నితమైన హాస్యపు చెణుకులు వారి కథల్లో మనకు కనిపిస్తాయి. అసలు కాంతాన్ని పెళ్లిచేసుకున్న కొత్తల్లో భర్త వెంకట్రావే పైచెయ్యి సాధించేవాడు. భార్య ఎంత లొంగదీసుకోవాలన్నా కుదిరేది కాదు. అసలు కాంతం దగ్గరకు వస్తేనే చిర్రుబుర్రు లాడేవాడు. కానీ క్రమంగా కాంతం మచ్చికచేసుకుంది. లొంగదీసింది. ఇక అమాయకుడైన వెంకట్రావు సాధుజీవిలా మారిపోతాడు. కాంతం చిరునవ్వుకు అర్థం ఇదే నట. ఇలా కథలన్నీ సున్నితమైన హాస్యంతో పాఠకుల పెదవిపై చిరునవ్వు చెరగనివ్వవు. మిగిలిన పాత్రలు కూడా సందర్భోచితంగా వచ్చిపోతున్నా, కథలో హాస్యానిదే రాజ్యం. అందుకే ఇవి ఏవో టైంపాస్ కథలు కావు. చదివిన ప్రతి కథను గుర్తుపెట్టుకొని మీమీ జివితాల్లో ఎదురయ్యే సన్నివేశాలకు, సంఘటనలకు ఆపాదించుకుంటుంటే జీవితమే హాస్యపు జల్లులా కురుస్తుంది. నవ్వు కరువై, తోటి మనుషులతో మాట్లాడే తీరికే లేని నేటి అత్యాధునిక బిజీ సమాజానికి మునిమాణిక్యం నరసింహారావు కథలు తేనెపట్టులాంటివి. హాస్య రసమాధుర్యాన్ని పంచే మందుల్లాంటివి. అందుకే నేటి యువతీ యువకులతోపాటు పెళ్లైన ప్రతిఒక్కరూ చదవాల్సిన మంచి కథలు ఇవి. డా. ఎ.రవీంద్రబాబు

“చరిత్రలో ప్రబంధపరమేశ్వరుడు” 11 వ భాగం

  “చరిత్రలో ప్రబంధపరమేశ్వరుడు” 11 వ భాగం    "తాతగారూ!"    మరునాడు నన్నయగారి భారత రచనామృతాన్ని ఆస్వాదించడానికి తమ తమ ఆసనాలను అలంకరించాక పిలిచాడు ఎర్రన.    "ఏమి ఎర్రనా?" ఎర్రపోతన గొంతులో ఝంకారం ఏమాత్రం తగ్గలేదు. కానీ గొంతు కొంచెంగా జీర పోయినట్లు అనిపించింది.    "మీకు మాట్లాడుటకు ఇబ్బంది కరంగా లేదు కదా! పోనీ రేపు కూర్చుందాం." గాభరాగా అడిగాడు. దగ్గరగా పరికిస్తే మొహం కాస్త వడలినట్లు అనిపించింది. ముడుతలు బాగా కనిపిస్తున్నాయి. కన్నులలో కాంతి కూడా కాస్త తగ్గింది.    "అబ్బెబ్బే.. మంచిపనులను వాయిదా వెయ్యకూడదు, చెడ్డపనులను వెనువెంటనే చెయ్యకూడదు.. రావణుడు అంత్యకాలంలో లక్ష్మణునకు చెప్పిన నీతి పాఠాలలో మొదటిది ఇది. ఎప్పుడేం జరుగుతుందో ఎవరు చెప్పగలరు?"    ఎర్రన లేవబోయాడు.. వైద్యుని తీసుకుని వద్దామని..    ఎర్రపోతన చెయ్యి అడ్డంగా పెట్టి వారించాడు.    "కూర్చో తాతా. నాకేం అవదు. వయసు వలన వచ్చిన చికాకే కానీ మరేమీ కాదు. వైద్యుని అవసరము లేదు. ఇంతకుమునుపు ఎందుకో పిలిచావు.. సందిగ్ధం వద్దు. ఏ సందేహమైననూ వెనువెంటనే తీర్చేసుకో."    "నాకు సందేహమే కాదు.. కుతూహలం కూడా.." ఎర్రన తటపటాయించాడు.    ధైర్యం చెప్తున్నట్లుగా తల పైకి ఎగరేశాడు తాతగారు.. చిరునవ్వుతో.    "నన్నయగారి తదుపరి భారతం వ్రాసిన తిక్కనగారు, అరణ్యపర్వం సగ భాగం ఎందుకు వదిలేసి ఉంటారు? అది నేను ప్రయత్నిద్దామనుకుంటున్నా.. మీ సలహా అడిగి. నాకు అది అసంపూర్ణంగా ఉండిపోవడం నచ్చలేదు."    "నేను నీ చేత నకలు ప్రతి తయారు చేయించడంలో ముఖ్యోద్దేశం అదే కన్నా! నువ్వు అరణ్యపర్వం అర్ధబాగాన్ని వ్రాసి, భారతాన్ని సంపూర్ణం చెయ్యాలని.    ఇంక తిక్కనగారు ఎందుకు వ్రాసి ఉండరో నాకు తోచింది చెప్తాను.. తన ధారలో, తన ధోరణిలో సాగిపోవడం సదుపాయం ఎవరికైనా. తిక్కనగారి శైలి వేరు.. నన్నయగారి పద్ధతి వేరు. పదిహేను పర్వాలూ పూర్తి అయ్యాక వ్రాయవచ్చని అనుకున్నారేమో! మరి ఏ కారణం చేతనో వదిలి వేశారు.    అది నువ్వు పూరించాలని ఆ గీర్వాణి సంకల్పం అనుకుంటాను. నేను ఇదివరకే నీకు చెప్పినట్లు.. ఇరువురు మహా కవుల మధ్య వారధి కట్టాలి.. అది రెండు సంద్రాలని కలిపే ప్రయత్నం కన్ననూ క్లిష్టతరం."    "అదే నేనూ అడుగుదామనుకున్నాను తాతగారూ. నన్నయగారి భారత భాగము కనుక వారి పద్ధతిలోనే.. నా స్వంత శైలి కలిపి పూర్తి చేస్తాను."    "చిన్ననాటనే జటిల సమాస కల్పనలతో కవిత్వం చెప్పిన నీకు ఇది నల్లేరు మీద నడకే. పూర్తి చేస్తాను.. అన్నావు చూడు.. ఆ ధృడ సంకల్పం ఉంటే ఏ పనికైననూ ఎదురుండదు."    ఎర్రన మోము ఆనంద తరంగాలతో ఎర్రవడింది.    "ఈ రోజు మనం నన్నయ భట్టారకుని సముచిత, సందర్భోచిత చిత్రాలను తెలుసుకుందాం. వ్యాస భారతంలో కూడనూ ఇటువంటివి కోకొల్లలు. అవ్విధంగా సూచనా పరంగా సన్నివేశాలను చిత్రీకరించడంలోనే కవి ప్రతిభ కనపరచేది."    శ్రద్ధగా సర్దుకుని కూర్చున్నాడు ఎర్రన.    చిరు చలిగా ఉందేమో, తాతగారు కొద్దిగా వణికారు. ఎర్రన చటుక్కున లేచే లోగా.. ఎక్కడనుంచి గమనించిందో, పేరమ్మ..    ఉన్ని శాలువా తెచ్చి భుజాలచుట్టూ కప్పింది. ఎర్రపోతన భార్యని ప్రేమగా వీక్షించి ప్రసన్న వదనంతో తల పంకించారు, కృతజ్ఞతా పూర్వంగా.    పేరమ్మ ఒక బోసినవ్వు విసిరి వెనక్కి మళ్ళింది.    ఆ వయో వృద్ధుల పరస్పర ప్రేమకి ఎర్రన కన్నులు చెమర్చాయి ఉద్వేగంతో.    ముదిమి వయసైన నేమి ముచ్చటగ    హృదిని మూటకట్టి సమర్పించుటకు    ఆ దివి నున్న దేవతలెల్లరు మెచ్చి    మదిని దీవెన లందియ్యరే ముదమారగ.    ఆ ఆది దంపతులకి మనసారా నమస్కరించి గంటం అందుకున్నాడు ఎర్రన, తాతగారి వజ్రపు వాక్కులకై ఎదురు చూస్తూ.    "కుమార అస్త్రవిద్యా ప్రదర్శన జరుగుతోంది. ధర్మరాజు బల్లెం విసరడంలో తన ప్రజ్ఞా పాటవాలని ప్రదర్శించాడు. భీముడు తన కండలని ప్రదర్శించి, గదని తిప్పడంలో రకరకాల విన్యాసాలని చూపించాడు. అర్జునుడి విలు విద్యా ప్రదర్శన అయ్యాక, కర్ణుడు తన విద్యని కనబర్చాలని అడుగులు ముందుకు వేశాడు.    అప్పుడు భీముడు, కర్ణుడిని కులం తక్కువ వాడని దూషిస్తాడు.    నిస్సహాయుడైన కర్ణుడు విషణ్ణ వదనంతో "ఆకాశంబున నున్న ఆదిత్యుం జూచుచు మిన్నకుండె.." అంటారు నన్నయ.    తన తండ్రి ఎవరో తెలియని కర్ణుడు, ఆదిత్యుడిని చూస్తూ ఊరుకున్నాడు అని చెప్పడంలో.. కర్ణుడి జన్మ రహస్యం తెలిసిన పాఠకులకు సానుభూతి కలుగక మానదు." అడుగుల చప్పుడు విని ఆపాడు ఎర్రపోతన.    ఈ మారు పోతమాంబ..    తళతళ మెరిసే రెండు రజత పాత్రల నిండుగా గోరువెచ్చని పాలలో, కొద్దిగా మిరియం పొడి, బెల్లం కలిపి తీసుకొని వచ్చి, తాతా మనవళ్లకి అందించింది.    కొద్ది కొద్దిగా చలి అధికమవుతున్న సమయంలో.. ఆ క్షీరం అమృత సమాన మయింది. పాలు త్రావిన వెంటనే నూతన తేజోల్లాసములు కలిగాయి వక్త, శ్రోతలిరువురికీ.    అటువంటి సుహృద్ వాతావరణం ఉంటే ఏ పని చేయుటకైననూ ఎదురేముంది.    "కావ్యాలలో వీలైనంత వరకూ ఉపదేశాలు, నీతి బోధలు చొప్పించాలి. కాలక్షేపానికి చదివి నట్లు మాత్రమే కాక.. చదువరికి లోక జ్ఞానం, విషయ పరిజ్ఞానం కలగాలి. సందేశాత్మకంగా ఉండాలి. నన్నయగారి కావ్యంలో ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయి.    పరీక్షిత్తునకు శాపం ఇచ్చాక కుమారుడి తొందరపాటు తనానికి, ముని ఐన శృంగి తండ్రి బాధపడి కొడుకునకు నీతి బోధ చేస్తాడు.    ’క్రోధం వలన తపఃఫలము పోతుంది. క్రోధము వలన అణిమాది సిద్ధులూ పోతాయి.    క్రోధము ధర్మవిధులకు అడ్డు వస్తుంది. తపస్వికి క్రోధము తగదు.’    ఇటువంటి బోధలు వ్యాస భారతంలో లేవు. నన్నయగారు కల్పించినవే. ఇవి ఏ కాలంలోనైననూ.. ఎవరికైననూ వర్తించేవే..    ప్రాణానికి ముప్పు వచ్చినప్పుడు, సర్వ ధనాపహరణ అవుతున్నప్పుడు, వివాహములందు అనృత మాడవచ్చునని కూడ ఒక సందర్భంలో చెప్పారు.    ’చను బొంకగ బ్రాణాత్యయ    మున సర్వ ధనాపహరణమున వధగావ    చ్చిన విప్రార్ధమున వధూ    జనసంగమమున వివాహ సమయములందున్.’    ఆ నాటి ఆచార వ్యవహారాలను అనేకం కథలో జొప్పించి తెలియ జేశారు.    నన్నయగారి కావ్యంలో శబ్దాలంకారాలు కూడా మనసును రంజింప చేస్తాయి. అర్ధాలంకారాలు ఆలోచనామృతాలైతే, శబ్దాలంకారాలు వీనులకింపైన కెంపులు.    ’ధ్యేయుడవు సకలలోక    స్థేయుడవు, నమ్రులకు విధేయుడవు..’    ఇటువంటి ప్రయోగాలు కొల్లలుగా కనిపిస్తాయి.    ఒకే పదాన్ని ప్రక్క ప్రక్కలను వాడి చిత్ర కవితను విచిత్రంగా మలచడం నన్నయగారి ప్రత్యేకత. ఈ క్రింది వాక్యంలో వ్రాసినట్లుగా..    ’కురు వృద్ధుల్ గురువృద్ధ బాంధవులనేకుల్ చూచుచు నుండగన్’    ’భారత భారతి’ అనే ప్రయోగం కూడా తరచు కనిపిస్తుంది.    క్షుణ్ణంగా విశ్లేషించుకుంటూ.. వాక్యాలలోని అంతరార్ధాలను ఆకళింపు చేసుకుంటూ, మరల మరల మననం చేస్తూ.. చదివిందే చదువుతూ, ఔపోసన పట్టాలి.. అగస్త్యముని సముద్రాన్ని పట్టినట్లుగా. అప్పుడే నీవు అనుకున్నది సాధించ గలుగుతావు."    ఆయాస పడుతూ ఆగారు ఎర్రపోతసూరి.. మనుమనికి చెప్పవలసింది చెప్పేశానన్నట్లు సౌంజ్ఞ చేస్తూ.    "నన్నయగారి భాగము, తిక్కన గారి భారతము కూడా మీరు చెప్పిన విధంగా పరిశీలిస్తాను తాతగారూ! ఎన్ని సంవత్సరములు పట్టినా బాగుగా పట్టు సాధించిన పిదపే అరణ్య పర్వాన్ని పూరిస్తాను. అంతియే కాదు.. అది నన్నయగారే వ్రాసినట్లు చెప్పి, రాజరాజునకే అంకిత మిస్తాను. అరణ్యపర్వం వ్రాసిన పిదపనే, నన్నయ తిక్కనల ఆశీస్సులతో  మిగిలిన కావ్యాలను రచిస్తాను."    ఎర్రన వాగ్దానమును విని తృప్తిగా కన్ను మూశారు ఎర్రపోతసూరి. 8 వ అధ్యాయం    ఢిల్లీ కోట..    దక్షిణ దేశ దిగ్విజయ యాత్ర ముగిసి, అంబరాన్నంటే సంబరాల తరువాత..    అర్ధరాత్రి.. గస్తీ తిరిగే సైనికుల కాగడాల వెలుతురు తప్ప, ప్రాంగణమంతా చిమ్మ చీకటి.    పరమ కిరాతకుడైన మాలిక్ కాఫర్ తన మందిరంలో పచార్లు చేస్తున్నాడు. మొహంలో ఇసుమంత శాంతం.. కొంచెం ప్రసన్నత.. కొంచెం జాలి.. కొంచెం అభిమానం.. అవి అతనిలో చాలా అరుదుగా కనపడే లక్షణములు. కనుబొమలు ముడిచి దీర్ఘంగా ఆలోచిస్తూ తిరుగుతున్నాడు.    నూనూగు మీసాల హసన్ ఒక మూలగా నిటారుగా నిలబడి చూస్తున్నాడు. కొద్దిగా వంచిన తల మాత్రం అతని వినయాన్ని సూచిస్తోంది. అతని కన్నులలో ఏ భావమూ లేదు.     మాలిక్ కాఫర్ అడుగుల శబ్దం వినగానే కోటలో ప్రతీ ఒక్కరూ, భయాందోళనలతో వణికి పోయి ప్రక్కకి తప్పుకుంటారు.. ఒక్క హసన్ తప్ప.    ఆ విశాల మందిరంలో వారిద్దరే..    పచార్లు ఆపి, పాదరక్షలు ఒక మూలకు విసిరేసి, తన పానుపు మీద విశ్రాంతిగా మెత్తలనానుకుని కూర్చుని, హసన్‍ను దగ్గరగా రమ్మని సైగ చేశాడు మాలిక్.    హసన్ నెమ్మదిగా, ఠీవిగా వచ్చి మాలిక్‍కి చేతికందే దూరంలో నిలిచాడు.. ఒక మర బొమ్మ లాగ.    పైనుంచి కిందికి పరిశీలిస్తున్నట్లు పరికించాడు మాలిక్ కాఫర్.    పచ్చని చందమామ వంటి మోము.. విశాల నేత్రాలు. కోటేరేసినట్లున్న ముక్కు. గడ్డం మీది వచ్చీరాని వెంట్రుకలు అడ్డదిడ్డంగా పరచుకుని, చంద్రుడి మీద మచ్చల్లాగ వింత అందాన్నిచ్చాయి. ఆజానుబాహువైనా, ఇంచుక నాజూకుతనం కూడా కనిపిస్తోంది. అది లేత వయసు సూచిక.    మాలిక్ కన్నులు చెమర్చాయి కొద్దిగా..    బండరాయిలో నీటి ఊట లాగ.    హసన్ మొహంలో ఇంచుక ఆశ్చర్యం. అతను ఏవేవో ఊహించుకుని, మానసికంగా సిద్ధపడి వచ్చాడు.    "ఎలా ఉన్నావు? ఇక్కడ బాగుందా?"    హసన్ పెదవులను కొద్దిగా ఒక పక్కకు తిప్పి నవ్వాడు. ఆ నవ్వులో అంతులేని భావం. అది విషాదమా.. విరక్తా.. పగా.. క్రోధమా.. కోపమా.. లేక అన్నీ కలగలిపిన మాటల కందని ఉక్రోషమా!    మాలిక్ కాఫర్, హసన్‍లో తనని తాను చూసుకుంటున్నాడు.    అల్లావుద్దీన్ ఖిల్జీకి, గుజరాత్ దండయాత్రలో దొరికి జంతువులుగా మారిన.. మార్చబడిన మనుషులు వారిరువురూ.    సోమనాధ దేవాలయమును విధ్వంసము చేసి, శివలింగమును ముక్కలు చేశాక, కంబయత్ పై చేసిన దాడిలో, నాజూకైన.. అందమైన హిందూ బానిస దొరికాడు. సుల్తాను ముచ్చటపడి అతనిని వేయి దీనారాలకు కొన్నాడు. అందుకని అతనిని ’హజార్ దీనార్ కాఫర్’ అని పిలిచేవారు.    అతని మీద మనసు పడ్డ సుల్తాన్.. మతము మార్చి మాలిక్ కాఫర్ అని పేరు పెట్టి, స్త్రీలతో సంబంధం పెట్టుకోలేకుండా నపుంసకుడిని చేసి, తన ప్రేమికుడిగా ఉంచుకుంటాడు. తన కొలువులో పెద్ద పదవులిచ్చాడు. సుల్తాను ప్రాపకంతో కొలువులో పలుకుబడి పెంచుకుని నయీబ్ (సర్వసేనాని) పదవిని పొందాడు మాలిక్.    అనేక దండయాత్రలు చేసి, ఖిల్జీ రాజ్యాన్ని విస్తరించాడు.. ఇంకా విస్తరిస్తున్నాడు.    తనకు జరిగిన అన్యాయానికి, అందరి మీదా కోపం పెంచుకుని రాక్షసుడయ్యాడు మాలిక్ కాఫర్. అతనికి మతం మారక పూర్వం ఉన్న పేరు, పుట్టు పూర్వోత్తరాలు ఎవరికీ తెలియవు.    అదే రకమైనది హసన్ చరిత్ర కూడా!    ఇంకా హీనమయినది.    హసన్ అసలు పేరు కూడా ఎవరికీ తెలియదు.    ఒకానొక గుజరాత్ దండయాత్రలో..    అల్లావుద్దీన్ ఖిల్జీ తన దండనాయకులు, ఉల్లూఖాన్, నుస్రత్ ఖాన్‍లను గుజరాత్ మీదికి పంపాడు. వాళ్ళు పటాన్ రాజు, కరన్‍ను ఓడించి, సోమనాథ్ మీదికి పడ్డారు. మొదటగా ఎవరు అడ్డు రాలేదు.. కానీ ’లథి’ రాజు హమీర్జి గోహిల్, అతని అనుయాయుడు వగేడ భిల్లునితో కలిసి ఎదిరించాడు.    కానీ.. ముష్కరుల ధాటికి సోమనాథ ఆలయం వద్ద తట్టుకోలేక పోయారు. వగేడ భిల్లుడు చనిపోతూ, హసన్‍ని పిలిచి తప్పించుకోమంటాడు. ఎప్పటికైనా అల్లావుద్దీన్ ఖిల్జీ మీద పగ తీర్చుకోమంటాడు. అప్పటికి హసన్ తప్పించుకుంటాడు.. అయితే మళ్ళీ కొద్ది రోజులలోనే పట్టుబడతాడు.    పదకొండు పన్నెండేళ్ల పాలబుగ్గల పసివాడు. పచ్చని పసిమిఛాయతో, అమాయకమైన చూపులతో.. అందమైన కుర్రవాడు.. అతని కులం ఎవరికీ తెలియదు. పరియా జాతికి చెందిన వాడని అంటారు.    సుల్తాను పరివారం దృష్టిలో పడ్డాడు.    మతం మార్చేసి "హసన్" అని పేరుపెట్టారు. అందాల హసన్‍ను అనుభవించని, లైంగికపరంగా హింసించని మగవారు లేరు సుల్తాన్ కొలువులో. స్వలింగ సంపర్కం సర్వ సాధారణం అక్కడ.    అప్పుడప్పుడే విచ్చుకుంటున్న మల్లెమొగ్గని చిదిమి చిద్రం చేసి పారేశారు. అతి కర్కశంగా నలిపేశారు. శరీరం, మనసు కూడా బండరాయిలా మారిపోయాయి. ఏ అనుభూతికీ స్పందించని శిలగా మారిపోయాడు చిన్నారి హసన్.    చివరికి అల్లావుద్దీన్ కొడుకు "ముబారిక్ షా ఖిల్జీ” కి ప్రేమికుడిగా స్థిర పడిపోయాడు.    ఆ తరువాత అతని జోలికి వెళ్ళడం మానేశారు అందరూ.. కానీ కొలువులో పెద్ద పెద్ద సేనానులకీ, దండ నాయకులకీ చాలా ఇష్టుడు. అందరికీ కావలసిన వాడు.    ఇప్పుడు ఈ పిలుపుకి కారణమేమిటి? మాలిక్ కాఫర్‍కి ఏం కావాలి?    "హసన్! ఇలా నా ప్రక్కన వచ్చి కూర్చో.."    "హా.. అదేనా!" మనసులో నిర్వికారంగా అనుకుంటూ యాంత్రికంగా తన శిరస్త్రాణాన్ని తీసి ప్రక్కన పెట్టి, కూర్చున్నాడు." ఒక్క కాఫర్ మాత్రమే  సుల్తాన్ కొడుకైన ముబారక్‍కి భయపడడు..    కానీ అతను అనుకున్న కారణం కాదని వెంటనే తెలిసిపోయింది.      "సుల్తాన్ ఆరోగ్యం బాగులేదు.." కాఫర్ మొదలు పెట్టాడు గోజ్రీ భాషలో.. హసన్‍కి మాత్రమే వినిపించేలాగ.    హసన్ కనుబొమ్మలు పైకి లేచాయి.. ఒక్క క్షణం.    మాలిక్ కాఫర్ ఒకేసారి కనురెప్పలు ఆర్పి తెరిచాడు.    సుల్తాన్ పైకి చూడడానికి బాగానే ఉన్నాడే.. కోటలో ఎవరికీ తెలియదు..    "ఆయనకి జలోదరం.. శరీరమంతా నీరు పట్టేసింది. వైద్యులు ఒక నెల కంటే బ్రతకడంటున్నారు. నాకైతే ఇవేళో రేపో అనిపిస్తోంది. ఇంక కోటలో రాజకీయ సంక్షోభం తప్పదు. మనం దేనికైనా సిద్ధపడాలి. రాకుమారుడు అంత సమర్ధుడు కాదు.. నీకు కూడ తెలుసు కదా!"    హసన్ తల ఊపాడు.    "ఇక్కడ సింహాసనం కొంచెం కదిలిందంటే దేశమంతా కదులుతుంది. ముఖ్యంగా దక్షిణ దేశాలలో.. హిందూ రాజులందరూ వేచి చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు స్వతంత్రం ప్రకటించుకుందామా అని. ఓరుగల్లు రాజు ప్రతాపరుద్రుని విషయంలో చాలా జాగరూకత వహించాలి. అతను మహాయోధుడు. అక్కడి అంతర్యుద్ధాల వలన మనం ఓరుగల్లు రాజుని జయించ గలిగాం.    మనం మన సామ్రాజ్యాన్ని పఠిష్టంగా ఉంచాలి. నీ ధ్యేయం, నా ధ్యేయం ఒక్కటే.. ఢిల్లీ సింహాసనం చెక్కు చెదరకూడదు. ఆ ప్రయత్నంలో మనం ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడి ఉండాలి. సుల్తాన్ అల్లాని చేరాక.. జరుగ బోయే దాంట్లో నీ సహాయం కావాలి నాకు. చేస్తావా?"    హసన్ మాట్లాడలేదు. కళ్ళార్పకుండా చూస్తూ ఉండి పోయాడు.    మాలిక్, హసన్ భుజం మీద తట్టాడు, స్నేహ పూర్వకంగా..    ఒక గోడని కొట్టినట్లనిపించింది.. మాలిక్ ‍చటుక్కున చేతిని వెనక్కి తీసుకున్నాడు.    తన లాగనే ఉక్కు శరీరం.. వీడి సంకల్పం కూడా ఇంత గట్టిదేనా!    ఆ విషయం మాలిక్ కాఫర్ త్వరలోనే తెలుసుకుంటాడు.    సరిగ్గా రెండే రోజుల తరువాత..    "సుల్తాన్.. అల్లావుద్దీన్ ఖిల్జీ మరణించాడు. రెండవ అలగ్జాండర్‍గా పేరు పొందిన ఢిల్లీ సుల్తాన్ మనకిక లేరు." రాజ వైద్యులు ప్రకటించారు.    వెంటనే.. సింహాసనం మీద కొత్త సుల్తాన్‍ని కూర్చోపెట్టాలి.. ఖాళీగా ఉంచ కూడదు.    సుల్తాన్ పోయిన రెండవరోజు..    ఒక ప్రక్కన సుల్తాన్ ఖననానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.    ఇంకొక ప్రక్కన.. వారసుడైన పెద్దకొడుకు ఖిజర్ ఖాన్ పట్టాభిషేకానికి తయారవుతున్నాడు.    కానీ అల్లా ఉద్దేశ్యం వేరుగా ఉంది.    రాజ సభ కొలువు తీరింది. సుల్తాన్ అనుయాయులు, మంత్రులు, సేనానులు, దండ నాధులు.. అందరూ తమతమ ఆసనాలలో కూర్చున్నారు. రాజభటులు ఒరలోనున్న కత్తుల మీద చెయ్యివేసి, తయారుగా నిల్చుని ఉన్నారు. దూరంగా.. కొద్ది మంది ప్రజలు కూడా వచ్చారు.. కుతూహలంగా చూస్తూ.    ఎవరి మొహంలోనూ సుల్తాన్ పోయాడన్న విచారం లేదు.. ఏమవుతుందో నన్న ఆతృత తప్ప.    అక్కడున్న వారిలో మూడు వంతుల మంది బలవంతంగా మతం మార్చుకున్నవారే. దండయాత్రలలో బంధువులనీ, స్నేహితులనీ పోగొట్టుకున్నవారే. ఏ నిముషములో ఏమి జరుగుతుందోనని భయంతో బ్రతుకుతున్నవారే..    సుఖ దుఃఖాలకి అతీతంగా అయిపోయారు.    సభలో గుసగుసలన్నీ సద్దుమణిగిపోయాయి ఒక్కసారిగా..                              మాలిక్ కాఫర్ ఆరు సంవత్సరాల షిహాబుద్దీన్ ఉమర్‍ ని.. అల్లావుద్దీన్ ఆఖరి కొడుకుని, సుల్తాన్ లాగ అలంకరించి, చెయ్యి పట్టుకుని, సున్నితంగా నడిపించి తీసుకొస్తున్నాడు.    అతని ముఖం అభావంగా, గంభీరంగా ఉంది.    అప్రయత్నంగా సభలోని వారంతా లేచి నిలుచున్నారు.    ఖిజ్రీ ఖాన్ ఏమయ్యాడు? (చిత్రాలు- గూగుల్ సౌజన్యంతో) ……… ( ఇంకా వుంది) ………..      .... మంథా భానుమతి    

“చరిత్రలో ప్రబంధపరమేశ్వరుడు” పదవ భాగం

“చరిత్రలో ప్రబంధపరమేశ్వరుడు” పదవ భాగం    7 వ అధ్యాయం ఆదికవి నన్నయ యుద్ధం సద్దు మణిగాక, అద్దంకి ప్రజలు సాధారణ జీవనానికి అలవాటు పడుతున్నారు. రణమందు పోయిన ఏనుగులు పోగా మిగిలినవి ఢిల్లీకి కప్పం కింద తరలి వెళ్లాయి. సగం అశ్వబలం పోయింది. మరల అన్నీ సమకూర్చుకుని కోలుకోవడానికి ఐదారు వత్సరముల కాలం కావాలి.    రాజు సజీవుడై వచ్చాడని ప్రాసాదంలో అందరూ ఆనందించారు.    అక్కడక్కడా విషాద ఛాయలు తొలగలేదు.    తమకు తోడుగా నీడగా ఉండి, మనుమలు మనుమరాండ్రనిచ్చి, వృద్ధాప్యంలో చేయూతనిచ్చి, తమని కడతేరుస్తారనుకున్న కొడుకులు కనిపించకుండా పోతే.. ఆ దుఃఖం తొలగడానికి జీవిత కాలం సరిపోదు.    కానీ ఊపిరి ఉన్నంత కాలం బ్రతకాలి.. బ్రతికి ఏం సాధించాలి అన్నది వేరే విషయం.    పెరుగుతున్న పసివారిని చూసి ఆనందించ వలసింది పోయి భయపడుతున్నారు సామాన్య ప్రజ. కాలం అక్కడే ఆగిపోతే ఎంత బాగుండును..    పక్వానికొచ్చిన పండుని కోసుకుని తిన్నట్లు, నవయౌవనంలోనికి అడుగు పెట్టిన యువకులను సైన్యంలోకి తీసుకు పోతారు. ఎప్పటికప్పుడే, ఎప్పుడెప్పుడు యుద్ధం వస్తుందా అని భయం..    కాకతీయ చక్రవర్తి సామంతుడయ్యాడు.. సుంకాలు పెరిగాయి. సగం పైన ఆదాయం ఢిల్లీకి పయనం.. ఆచి తూచి ఖర్చుపెట్టాలి. నగలు, నాణ్యాల సంగతి సరే.. భుక్తికి లోటు లేకుండా జరుగుతే అంతే చాలు..    స్తబ్దుగా సాగుతున్న కాలంలో సాహిత్యం మళ్లీ పుంజుకుంటోంది.    ఎర్రన మహా భారతానికి నకలు చెయ్యడం మొదలు పెట్టాడు.    రెండు నకళ్లు. ఒక ప్రతి, తాతగారి స్నేహితునికి, ఒకటి తనకి.    నకలు చేస్తూనే తను అనుకున్న రామాయణ రచనకి ప్రణాళిక వేసుకుంటున్నాడు.    యాంత్రికంగా కాకుండా రచనలోని అందాలను, పద్యాలలోని సొబగులను.. పదాల పొందికను, రచనా విధానాన్ని గమనిస్తూ, ఆనందిస్తూ చేస్తున్నాడు.              ఎర్రన తాతగారు ప్రక్కనే కూర్చుని మందస్మిత వదనంతో మనవడి వేగాన్ని గమనిస్తున్నారు. గంటం కదిలిందంటే ఆగేది కొన్ని ఘడియల అనంతరమే.     ఏ విషయంలో నైననూ సలహా అడుగుతే తయారుగా ఉంటారు. అలసి సొలసి కన్నులు మూస్తే తక్షణం ఆపెయ్యమంటారు.    నన్నయగారి భారతం పూర్తి అవగానే, గుండె నిండుగా గాలి పీల్చి లేచాడు ఎర్రన.     "అద్భుతమైన రచన తాతగారూ! తెలుగులో ఇటువంటి కవిత్వం చదవలేదు నేనింత వరకూ. పలుకు మాటలు గా నున్న తెలుగు భాషకు గ్రాంధిక హోదా నిచ్చిన ఘనత ఆదికవి నన్నయ గారికే దక్కుతుంది. తొలుత ఇవ్విధమైన ప్రయత్నం చేయవలెనని ఎందుకనిపించిందో కానీ, అది తెలుగు వారు చేసుకున్న పుణ్యమే!"    "దానికి చాలా రాజకీయ సాంఘిక కారణాలున్నాయి." ఎర్రపోతన సాలోచనగా అన్నాడు.    "కవిత్వానికి రాజకీయ కారణాలా? కవి రాజకీయాలలో తల దూర్చడం చెప్పారు కానీ రాజకీయం కవిత్వంలో వేలు పెట్టడం.. అది తొలి ప్రముఖ తెలుగు రచనకి శ్రీకారం చుట్టడం ఆశ్చర్యకరమే!"    "ఇంకేం.. ఆ కారణాలు రేపు తెలుసుకుందాం." నవ్వుతూ ఆసనం నుండి లేవబోయిన ముదిమి వయసు తాతగారికి చెయ్యందించాడు ఎర్రన, నవ యౌవన కాంతులతో మోము వెలిగి పోతుండగా.                         ............................   "మూడు నాలుగు శతాబ్దాల క్రితం, కొద్ది మంది అగ్రజాతుల వారికే పరిమితమైన మతము సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది. అప్పుడు జైన తీర్ధంకరులూ, గౌతమ బుద్ధుడు మొదలైన వారు, ప్రజలందరికినీ ఆమోదయోగ్యమైన మత ధర్మాన్ని బోధించారు.    ముఖ్యంగా స్త్రీలు ఆ మతాల్ని ఆమోదించి ఆదరించారు. రాజులు వైదిక మతాన్ని ప్రోత్సహించినా, ఆడవారు జైన, బౌద్ధ మతాలకు దానాలు చెయ్యడం, ఆరామాలు కట్టించడం చేశారు.    సరిగ్గా మూడు వందల ఏళ్ల క్రితం వేంగి రాజ్యానికి రాజరాజు రాజయ్యాడు. అంతకు మునుపే, ఏడెనిమిది వందల వత్సరాల క్రితం, జైన బౌద్ధ మతాలు ప్రాచుర్యం పొంది నిలదొక్కుకున్నాయి. జనసామాన్యానికి అర్ధమయే భాషలో పాటలు, పద్యాలు ప్రచారమయ్యాయి. జనం ఈ మతాల వైపుకి తిరిగిపోతుంటే బ్రాహ్మణ్యానికి వేడి పుట్టింది.    వైదిక మతాన్ని పునరుద్ధరించి, ప్రజలకు అందుబాటులోకి తేవాలనే సంకల్పం కలిగింది.    మేధావులు కొందరు బౌద్ధ, జైన మతాలను క్షుణ్ణంగా చదివి వాటిని ఖండించ సాగారు. శంకరాచార్యులవారు బుద్ధుడిని, విష్ణుమూర్తి తొమ్మిదవ అవతారంగా చేసి, బౌద్ధ, హిందూ మతాల మధ్య గీతని చెరిపి వేశారు. ప్రజలు ఉభయతారకంగా ఉన్న శంకర వాక్కును శిరసావహించారు. సామాన్యుల దేవుడు రుద్రుడు పురాణాలకెక్కడం అంతకు మునుపే జరిగింది. శివపూజ వైదిక మతమయింది." ఎర్రపోతన ఇంచుక విరామమిచ్చాడు.. అలసటతో.    "సమాజ పరిస్థితులను మార్చి, వ్యావహారిక భాషను లిపిలోనికి తీసుకురావడానికి జరిగిన ప్రయత్నమా?" ఎర్రన అడిగాడు.    తల పంకించాడు ఎర్రపోతన.    "చోళ చక్రవర్తుల దౌహిత్రుడు రాజరాజ నరేంద్రుడు. ఆ కాలంలో చోళ రాజ్యంలో శైవమతం విరివిగా వ్యాపించి ఆరాధనలందుకుంటోంది. అమ్మమ్మగారింట్లో రాజరాజుకి శైవమతం మీద అభిమానం పెరిగి, తల్లిదండ్రులు జైన మతస్థులైనా తాను శైవాన్ని స్వీకరించాడు. రాజ్యం కోసం సవతి తమ్మునితో జరిపిన పోరుల్లో బ్రాహ్మణులు సహాయపడ్డారు. అందుకని, బ్రాహ్మణుల ఆధిక్యాన్ని ప్రోత్సహించే, వర్ణాశ్రమ ధర్మాలని నిలిపే మతాన్ని పునరుద్ధరించాడు.    దానికి పంచమవేదం ప్రాచుర్యంలోనికి తేవడం తెలివైన పని. అందుకే దానిని మొట్టమొదట తెనిగించ దలచాడు రాజరాజు.    అప్పట్లో విద్యా పరిషత్తులు ఉండేవి.. అంటే మహా కవుల సభలు. నన్నయగారు ఆరంభంలోనే ఈ సభలకు నమస్కరించి తన రచన మొదలు పెట్టారు."    ఎర్రనకి తాను చదివిన భారతంలోని పద్యం గుర్తుకు వచ్చింది. ఏకసంథ గ్రాహి అయిన ఎర్రన వెంటనే అందుకున్నాడు,    "సారమతిం గవీంద్రులు ప్రసన్న కథాకలితార్ధ యుక్తిలో     నారసి మేలునా నితరు లక్షర రమ్యత నాదరింప నా     నారుచిరార్ధసూక్తి నిధి నన్నయభట్టు తెనుంగునన్ మహా     భారత సంహితా రచన బంధురుడయ్యె జగద్థితంబునన్."    చిరునవ్వుతో తల పంకించి, వాత్సల్యంతో మనుమడిని చూశారు ఎర్రపోతన.    "ఆ కాలం నాటికే గ్రంధాలు సంస్కృతాన్ని దాటి బయటికి వచ్చాయి. కన్నడంలో పంప భారతం, గదా యుద్ధం అనే మరొక కావ్యం భారతాన్ని ప్రచారంలోనికి తెచ్చాయి.    తమిళంలో "వెణ్బా" అనే గీతాలలో భారతం సామాన్య జనానికి దగ్గరగా వచ్చింది.    సంస్కృత భారతాన్ని దేవాలయాలలో పురాణాలుగా చెప్పేవారు. కర్ణభారం, ఊరు భంగం మొదలయిన భాసుని భారతంలోని నాటకాలు పాండవుల కథలను చిత్రించాయి.    అందుకే రాజరాజు భారతం తెలుగులో కావ్యరూపంలో రావాలని, నన్నయభట్టును అడిగాడు. తమ చంద్రవంశంలోని పూర్వీకులైన పాండవులు జగత్ప్రసిద్ధులైనారు, వ్యాసమహర్షి కావ్యం ద్వారా! శ్రీ మహా భారతంలోని అంతరార్ధం వినాలని రాజరాజు వువ్విళ్ళూరాడు.    ’బంగారు కొమ్ములున్న నూరు గోవులను, ఉత్తమ వేదపండితులకు దానమిచ్చిన ఫలం, భారతం వింటే కలుగుతుందని పెద్దలంటారు. కృష్ణద్వైపాయనుడు రచించిన మహాభారతంలోని అర్ధమును, పరమార్ధమును తెలిసేటట్లు మీరు ప్రతిభ చూపించి తెలుగులో రచించండి.’    పౌరాణికులూ, కవితా విశారదులూ, తార్కికులూ, మంత్రులు, పురోహితులు, సేనాపతులు, దండనాయకులు, దౌవారికులు, ప్రధాని, సామంతులు మొదలుగాగలవారందరూ ఉన్న మహా సభలో నన్నయ భట్టారకుని కోరాడు రాజరాజ నరేంద్రుడు."    ఎర్రన కన్నులు విప్పార్చి, సర్వమూ మరచి వింటూ, రాజరాజు సభని ఊహించుకుంటున్నాడు.    "అత్యంత వైభవోపేతమైన ఆ సభలో అంతటి ప్రాధాన్యత లభించినందులకు నన్నయ భట్టారకుడు ఎంతటి పుణ్యం చేసుకున్నారో కదా!" పారవశ్యంతో అన్నాడు ఎర్రన.    "నిజమే.. కానీ, రాజరాజు తన రాజ్యాన్ని, ఆ వైభవాన్ని పొందగలగడానికి నన్నయభట్టు గారి పాత్ర కూడా చాలా ఉంది."    "తిక్కనార్యుడు ఓరుగల్లుకు పయనమయినట్లేనా?" ఎర్రన మోములో చిరునవ్వు.    "అవును. రాజుల పేర్లు మారవచ్చు, కాలం ముందుకు జరవచ్చు.. కానీ, చరిత్ర కొంచెం అటూ ఇటూగా ఒక్కటే. బంధువుల దునిమి రాజ్య సంగ్రహణం చెయ్యడం అనాదిగా వస్తున్నదే. వేంగి చాళుక్యులలో విమలాదిత్యుని మరణం తరువాత రాజరాజు రాజ్యానికి వచ్చాడు.    అయితే సవతి తమ్ముడు విజయాదిత్యుడు అందుకు అడ్డు వచ్చాడు. రాజరాజుని ప్రశాంతంగా పరి పాలన చెయ్యనియ్యలేదు.    కర్ణాటకుల, కళింగ గంగారాజుల సహాయంతో వేంగీ సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు. నిస్సహాయ స్థితిలో రాజరాజు, మేనమామ అయిన చోళ చక్రవర్తిని సహాయం అర్ధించాడు.    మేనల్లుని దుస్థితి చూసి జాలిపడ్డ చోళ చక్రవర్తి తన సైన్యాన్ని రెండు భాగాలు చేసి, ఒక పాయని కర్ణాటక రాజులైన రాష్ట్రకూటుల మీదికి, ఇంకొక భాగాన్ని వేంగి దేశం మీదికి పంపాడు.    చోళ సేనాని, విజయాదిత్యుని వెళ్లగొట్టి, సింహాసనాన్ని రాజరాజుకి అప్పగించాడు. కానీ పదేళ్లు కూడా గడవక ముందే విజయాదిత్యుడు కర్ణాటకుల సహాయంతోనే అన్నగారిని పదవీచ్యుతుణ్ణి చేసి బెజవాడ సింహాసనం మీద కూర్చున్నాడు.    మళ్లీ తంజావూరికి పలాయనం తప్పలేదు రాజరాజుకి.    ఈ సారి చోళరాజు ముగ్గురు దండనాయకులతో పెద్ద సైన్యాన్ని వేంగి మీదికి పంపాడు. దండనాయకులు మరణించినా రాజరాజు రాజ్యం దక్కించుకున్నాడు.    పదేళ్లు గడవకుండా చరిత్ర పునరావృతం అయింది.    కర్ణాటకులు తాము వేంగీ పురాధీసులమని ప్రకటించుకున్నారు. రాజరాజు, వేంగిలో కొంతభాగంతోనే తృప్తి పడవలసి వచ్చింది.    ఈ సారి మేనమామ, మామగారు అయిన చోళరాజు మరణించడంతో బావమరది సహాయానికి వచ్చి, సింహాసనం ఇప్పించాడు. పట్టువదలని పగవాడైన తమ్ముడు.." తాతగారిని ఆపేశాడు ఎర్రన.    "మళ్ళీ కర్ణాటకులు.. సింహాసనం. హూ.. ఇప్పటికి నాలుగు దండయాత్రలయ్యాయి తాతా! ఎంత జననష్టం అయుంటుందో.. ఊహ కేమాత్రం అందడం లేదు. ఇంతా చేసి అన్నదమ్ముల మధ్య పేచీలు. చెరోసగం పంచుకుంటే పోలేదా!" ఎర్రన నిట్టూర్చాడు.    "అలా కౌరవులు అనుకుంటే భారత యుద్ధం లేదు.. వ్యాస భారతం లేదు. నన్నయ తిక్కనలు లేరు. మనము ఇవ్విధంగా కథలు చెప్పుకునే వాళ్ళం కాదు. జన నష్టం సృష్టిలో భాగమే.    ఇంతకీ..    ఈ నాలుగో యుద్ధంలోనే రాజరాజ నరేంద్రుని కుల గురువైన నన్నయభట్టు ప్రవేశించాడు. చోళరాజు ఈ మారు సహాయానికి రాలేదు. అప్పటికే చాలా సైన్యాన్ని కోల్పోయి ఉండాలి. ఉద్దండులయిన దండనాయకులు చెల్లెలి కాపురం కోసం ప్రాణాలు కోల్పోయారు. అందుకే ఉదాసీనంగా ఉండిపోయి ఉంటాడు.    వాణస నారాయణ భట్టు, నన్నయ భట్టు బాల్య స్నేహితులు. నారాయణ భట్టు దగ్గరి బంధువైన మధుసూనయ్య, పశ్చిమ చాళుక్యులకు ప్రధానామాత్యుడు. ఈ పరిచయాన్ని ఉపయోగించుకుని నన్నయ, రాజరాజుకు పశ్చిమ చాళుక్యులకు మైత్రిని కుదిర్చాడు.    నారాయణ భట్టుని పశ్చిమ చాళుక్యుల ప్రతినిధిగా తమ రాజ్యానికి ఆహ్వానించాడు రాజరాజు.    కర్ణాటక సరిహద్దుకు దగ్గరగా ఉన్న బెజవాడ నుండి రాజధానిని, గోదావరీ నది ఆవలి ఒడ్డునున్న రాజమహేంద్ర వరానికి మార్పించాడు. రాజరాజు పేరు మీదనే ఆ పురి వెలిసింది.    పశ్చిమ చాళుక్యులతో సంధి చేసుకోవడం, రాజధాని మారడం రాజరాజుకు శాంతినిచ్చింది. విజయాదిత్యుని బెడద కూడా తాత్కాలికంగా తప్పింది.    ఆ సమయంలోనే అంగరంగ వైభవమైన సభలు నిర్వహించడం.. సాహిత్యం మీద దృష్టి నిలపడం జరిగింది. భారత రచనావిర్భావం కూడా అప్పుడే జరిగింది.    నారాయణ భట్టు రాజకీయం నడపడంలోనే కాదు. రచనా వ్యాసంగంలో కూడా నన్నయగారికి తోడు నీడగా నిలిచాడు. సంస్కృత, కర్ణాటక, ప్రాకృత, పైశాచికాంధ్ర భాషల్లో ప్రావీణ్యమున్న నారాయణ భట్టు, కవీభవజ్రాంకుశ బిరుదాంకితుడు. మహాభారత సంగ్రామంలో, శ్రీ కృష్ణుడు, అర్జునునికి తోడ్పడినట్లు భారత రచనలో నన్నయకు తోడ్పడ్డాడు.    తొలి తెలుగు రచన ఆరంభమయింది ఆ విధంగా."    "తిక్కన సోమయాజిగారి భారతం ప్రారంభించే ముందు, నన్నయగారి రచన గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి." ఆ రో్జు ద్వాదశి. ఏకాదశి ఉపవాసానంతరం భోజనం చేసి, చెయ్యి కడుక్కోవడానికి లేస్తూ అన్నాడు ఎర్రపోతన.    "నకలు తయారు చేస్తున్నప్పుడే కొంత అవగాహన అయింది తాతగారూ.." తాతగారికి చేతి మీద నీళ్ళు పోస్తూ, అంటుకున్న ఎంగిలి మెతుకుల్ని తన చేత్తో గట్టిగా రుద్ది తీశాడు ఎర్రన.    చేతుల్ని అంగవస్త్రంతో అద్దుకుంటూ ఆలోచనలో పడ్డాడు ఎర్రపోతసూరి.    తను అనుకున్నది ఎర్రాప్రగడ సాధించాలంటే నన్నయ, తిక్కనల కవిత్వం మీద అవగాహన సరిపోదు. అధికారము కావాలి. అనుకోకుండా తన మనసులోకి ఎర్రాప్రగడ అని వచ్చిందే.. అదే కాబోయే మహాకవి పేరు.. నిశ్చయించేశారు తాతగారు.    "నన్నయగారు తొలిసారిగా అంతటి ఉద్గ్రంధాన్ని తెలుగులో రచించడానికి పూనుకున్న తక్షణం భాష మీద పరిశోధన ప్రారంభించారు." ఎర్రపోతన గొంతు సవరించుకున్నాడు.    తాతామనుమలిద్దరూ తమ తమ ఆసనాలనలంకరించారు. ఎర్రన తను తెలుసుకున్న విషయాలు లిఖిత పూర్వకంగా భద్రపరచుకోవడానికి తాళపత్రాలు, గంటం సిద్ధం చేసుకున్నాడు.    "భాషా ఛందస్సులు సమకూర్చుకోవడానికి కూడా కష్టపడవలసి వచ్చిందని కొందరు సమకాలీన పండితులు సెలవిచ్చారు. అది నిజమనుకోను.. ఆయనకి భాష మీదున్న పట్టు తెలిసినవాడై రాజరాజు ఆ కోరిక కోరాడని నా అభిప్రాయం.    ప్రజల వ్యాహారిక భాషను, శాసనాదులలో నున్న దేశ్య భాషను పరిశీలించి అందుండిన పలుకులకు, వాని శబ్దములకు ఒక రూపము ఇచ్చుటకు ప్రయత్నించాడు. అస్తవ్యస్తంగానున్న తెలుగు శబ్దములకు ఒక వ్యవస్థనిచ్చాడు కనుకనే నన్నయగారికి "శబ్దశాసన" అనే బిరుదు లభించింది. ఇదంతా భారత రచనకి పూర్వమే జరిగింది.    ఆ కాలంలో ఒకే మాటను వివిధప్రాంతాలవారు రకరకాలుగా ఉఛ్ఛరించే వారు. నన్నయగారు సహజంగా తాము ఉచ్చరించేటట్లే వ్రాశారు. అదే మనకు కావ్య భాషగా మిగిలింది.    కొన్ని సంస్కృత పదాలు, తెలుగు మాటలను ప్రక్కకు త్రోసి వాని స్థానాన్ని ఆక్రమించుకున్నాయి. సంస్కృత సమపదాలు వాడుకలోనికి వచ్చాయి.    అయినా నన్నయగారు తమ కాలంనాటి వ్యావహారిక భాషలోనే రచన చేశారు. ఆనాటి సామెతలు, పలుకుబళ్ళు చిరస్థాయిగా నిలిచేవే.    ’కడుపు చల్లగ’ అనే పదం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆ పలుకుబడి తెలుగు భాష జీవించినంత కాలం ఉంటుంది.   ”కుంతి కడుపు చల్లగా పుట్టిన ఘనభుజుడు" అని కర్ణుడ్ని గురించి నన్నయగారు వ్రాశారు.    రొమ్మున చేయిడి నిద్రవోవుట, వంట ఇంటి కుందేలు ఓలె.. మొదలయిన నుడికారాలు చిరకాలము నిలిచిపోయేవే.    మాటలు, పలుకులు.. వాని తీరులు మారవచ్చును కానీ మానవస్వభావం మాత్రం మారదు. పాత్రల లక్షణాలు కావ్యారంభం నుంచీ చివరి వరకూ ఒకే విధంగా ఉంటాయి. అందుకే పాత్రను పరిచయం చేసే టప్పుడే ఆ స్వభావానికి సంబంధించిన విశేషణాలను వాడారు. పాత్రలు పరస్పరం సంబోధించే విధానంలో కూడా స్వభావం బయలుపరచారు.    ద్రోణుడు మాట తప్పని వాడు, అనృతం ఆడనివాడు. అర్జునుడికి విలువిద్య నేర్పే ముందు ఎవరూ నీ సాటి లేనట్లు నేర్పుతానని మాట ఇచ్చారు. ఏకలవ్యుడ్ని చూసిన అర్జునుడు అతని విద్యాపాటవాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ద్రోణుడిని కలిసి ఏకలవ్యుడిని గురించి చెప్తాడు.    "విలువిద్య నొరులు నీ క    గ్గలముగ లేకుండ నిన్ను గరపుదునని మున్    పలికిరి... కానీ ఇప్పుడు ఆ స్థితి మారునట్లు కనిపిస్తోంది.    నాకంటెను మీకంటెను అతడు ధనువిద్యా కౌశలములో నధికుడు. మీకు ప్రియశిష్యుడట యమిథ్యా వచనా!"    ఇక్కడ అమిథ్యావచనా అనే సంబోధన గురువుగారిని "మీరు అబద్ధాలాడరు సుమా.. మాట నిలుపుకునే ప్రయత్నం చెయ్యండి" అని హెచ్చరించుట కనిపిస్తుంది.    అదే విధంగా, ఖాండవ దహనానికి ముందు అగ్నిహోత్రుడు విల్లును ఇస్తూ అర్జునుడిని ’ఘనభుజా’ అని సంబోధిస్తాడు. భుజబలం అధికంగా ఉన్నవాడు మాత్రమే ఆ విల్లుని ధరింపగలడు, ప్రయోగింపగలడు అనే అర్ధం ఆ ఒక్క పిలుపులోనే తెలిసిపోతుంది."    ఎర్రన తాతగారు చెప్పినది శ్రద్ధగా విన్నాడు. తండ్రి సూరనార్యుని వద్ద కావ్యరచనలోని మెళకువలు నేర్చుకుని ఉన్నవాడు.. శబ్ద ప్రయోగాలలోని చమత్కారాలను నన్నయ భట్టారకుని రచనా విధానాన్ని గమనించి తెలుసుకుంటుంటే ఆశ్చర్యానందాలతో ఒడలు మరచి వినసాగాడు.. మున్ముందు రాబోయే విశ్లేషణలు ఇంకా ఎంత కర్ణానందకరంగా ఉంటాయో! (చిత్రాలు కమల పర్చా గారి సౌజన్యంతో)                           ……… ( ఇంకా వుంది) ………..         .... మంథా భానుమతి

రేడియో అక్కయ్య (కథకురాలి కథనం)

    కథకురాలి కథనం - తురగా జానకీరాణి            తురగా జనాకీరాణి రేడియో అక్కయ్యగా అందరికి సుపరిచితమైన పేరు. బాలనందం పేరుతో ఎన్నో నాటికలు, రూపకాలు, పాటలు నిర్వహించారు. స్త్రీల సమస్యలకు పరిష్కారాలు చూపుతూ 'ఇది నా సమస్య' అనే శీర్షికను కూడా నిర్వహించారు. అమూల్యమైన బాలసాహిత్యాన్ని సృష్టించారు. నవలలు, కథలు రాశారు. అనువాదాలు కూడా చేశారు. అనేక  సత్కారాలు, అవార్డులు అందుకున్నారు. వీరు రాసిందే 'కథకురాలి కథనం' కథ. భార్యభర్తల మధ్య సంబంధాన్ని స్త్రీకోణం నుంచి అద్భుతంగా చిత్రీకరించారు జానకీరాణి.          కథలో  సావిత్రి, శర్మ భార్య భర్తలు. శర్మ ఉద్యోగం చేస్తూ ఉంటాడు. సావిత్రి రచయిత. కథలు రాస్తూ ఉంటుంది. సావిత్రి అందాన్ని చూసి శర్మ ఏరికోరి పెళ్లి చేసుకుంటాడు. సావిత్రి బి.ఎ. చదువుకున్నా ఇంటి దగ్గరే ఉంటూ కథలు రాస్తుంది. ఆమె కథల్ని అన్ని పత్రికలు ప్రచురిస్తుంటాయి. శర్మ కూడా సావిత్రి రాసిన కథలు చదువుతుంటాడు. అసలు శర్మకు పత్రికలు చదివే అలవాటు ఎక్కువే. పెళ్లైన కొత్తలో సావిత్రి కథలు రాయడం మానుకొని, ఆ అనుభుతుల వెల్లువలో మునిగి పోతుంది. రెండు నెలల తర్వాత మళ్లీ కథలు రాయడం మొదలు పెడుతుంది.            ఒకరోజు శర్మ ఇంటికి ఆలశ్యంగా వచ్చి తిండి కూడా తినకుండా డాబామీద మంచంపై పడుకంటాడు. సావిత్రి కూడా తినదు. డాబామీదకు వెళ్లి, భర్త ప్రవర్తనలో వచ్చిన మార్పును గమనిస్తుంది. భర్త మీదకు వంగి ఆప్యాయంగా 'ఏమిటి ఆలోచిస్తున్నారు. ఎందుకు కోపం' అని అడుగుతుంది. శర్మ సావిత్రిని నిమిలి మింగేసేలా చూస్తూ- 'ఆ రాత్రి ప్రభాకరం ఎక్కడ పడుకున్నాడు' అని అడుగుతాడు. దాంతో సావిత్రి గతానికి సంబంధించిన ఆలోచనల్లోకి వెళ్తుంది.       ఒకరోజు సావిత్రి కథ రాస్తుంటే శర్మ మెల్లగా దగ్గరకు వచ్చి 'ఇంత గొప్పగా కథలు ఎలా రాస్తావు. నువ్వు నాకు సాధారణ స్త్రీగానే కనిపిస్తాయి. ఇంత విప్లవాత్మకమైన కథలు నువ్వేనా రాసేదనిపిస్తుంది' అని ప్రేమగా అడుగుతాడు. అందుకు సావిత్రి 'నా కథల్లో సంఘటనలు కొన్ని నావి, నే విన్నవి, చూసినవి, కొన్ని నేను అనుభవించినవి ఉంటాయి.  కానీ ఆవేశాలు, మమతలు అన్నీ అనుభవిస్తాను రాసేముందు' అని చెప్తుంది. దానికి శర్మ రచయితలు తాము స్వయంగా అనుభవిస్తేనే బాగా రాయగలరు, రచయితలందరూ స్వానుభవాలే రాస్తారు అని నిర్ణయించుకుంటాడు. కొంత బాధపడతాడు. తర్వాత తేలికపడి, మామూలై పోతాడు. శర్మ ఆఫీసర్లతో సినిమాకు వెళ్లినప్పుడు సావిత్రి స్నేహితురాలు శచి వస్తుంది. ఇద్దరూ ఆనందంగా కబుర్లు చెప్పుకుంటారు. శచి సావిత్రి శర్మ కలిసి దిగిన ఫొటోను చూస్తుంది. దాంతో శచిలో ఆదో విధమైన భావం కలుగుతుంది. ఆమెలోని సందేహం, భయం, విషాదాన్ని గమనించిన సావిత్రి 'ఏమిటి... ఏమైంది' అని అడుగుతుంది. చివరకు శచి రెండేళ్లనాటి గాథ అని చెప్తుంది. అది విన్న సావిత్రి బాధపడదు. ఏడ్వదు. ఒక్క నిట్టూర్పు మాత్రం విడుస్తుంది. శర్మ వచ్చేలోపే శచి వెళ్లిపోతంది.         ఒకరోజు శర్మ స్నేహితుడు ప్రభాకరం ఇంటికి వస్తాడు. ప్రభాకరానికి సాహిత్యం మీద మంచి పట్టు ఉఁటుంది. ఆ రోజు రాత్రి డాబామీద ముగ్గురూ మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రభాకరం దగ్గర సావిత్రి సాహిత్యానికి సంబంధించి చాలా విషయాలు తెలుసుకుంటుంది. అదీగాక శర్మకు ఆరోజు భార్య చాలా అందంగా ఉన్నట్లు కనిపిస్తుంది. అలా ముగ్గురు మాట్లాడుకుంటుంటే శర్మ మేనమామకు సీరియస్ గా ఉందని టెలిగ్రాం వస్తుంది. శర్మ వెంటనే ఊరికి బయలుదేరుతాడు. సావిత్రి కూడా వస్తానన్నా వద్దంటాడు. ప్రభాకరం కూడా ఆ రాత్రే బయలుదేరు తానంటే భార్యకు తోడు ఉండమని చెప్పి, భార్యను తెల్లవారి బంధువుల ఇంటికి వెళ్లమంటాడు. కానీ సావిత్రికి బంధువుల ఇంటికి వెళ్లడానికి కుదరదు. మేనమామ చనిపోవడంతో పది రోజుల తర్వాత శర్మ ఇంటికి తిరిగి వస్తాడు. హఠాత్తుగా వెళ్లినందుకు ప్రభాకరానికి సారీ చెప్తూ ఉత్తరం కూడా రాస్తాడు. కానీ పదిహేను రోజుల తర్వాత సావిత్రి రాసిన కథ 'ఒక రేయి పొరబాటు' పత్రికలో వస్తే శర్మ చదువుతాడు. ఆ కథలో ఇతివృత్తమే భర్త ఇంట్లో లేనప్పుడు అతని స్నేహితునితో భార్య తప్పు చేయడం.ఆ కథ చదివిన శర్మ మనసు కకావికలమై పోతుంది. ప్రభాకర్, సావిత్రిని ఆ కథలో ఊహించుకుంటాడు.        శర్మ 'ఆ రాత్రి ప్రభాకర్ ఎక్కడ పడుకున్నాడు అంటే...' చెప్పదు. 'జస్ట్ ఇమేజినేషన్' అని ఆటపట్టిస్తుంది. చివరకు 'మీరు సినిమాకు వెళ్లినప్పుడు, నా స్నేహితురాలు శచి వచ్చింది. మీరు మద్రాసులో వారి ఇంటికి వెళ్లడం, ఆ రోజు ఆమె భర్త సెక్రటేరియట్ లో పని ఉండి రాకపోవడం, ఆమె బీచ్ కు వెళ్తే.. మీరు వెన్నంటి వెళ్లారు. చివరకు ఆవేశ పూరితురాలైన శచితో...' అని బాధపడుతుంది. చివరకు మౌనంగా ఉన్న శర్మ.. 'నన్ను క్షమించు సావిత్రీ' అని ప్రాదేయపడతాడు. 'ఇకనుంటి నీ కథల్లో నా జీవితాన్ని వెతుక్కోవడం మానేస్తాను' అని అంటూ ఆమె తల్లోని పూల వాసనను పీల్చుకుంటాడు.                          వ్యవహారిక భాష, కథ ప్రారంభంలోనే ట్విస్టు, చివరిలో ఆ ట్విస్టును విప్పడం అద్భుతమైన కథా శిల్పం. పాత్రల మానసిక సంఘర్షణ, సావిత్రిలోని ఉదారమైన భావాలు, శర్మలో ఉంటే అనుమాన బీజాలు...ఇలా కథంతా ఓ పకడ్బందీగా సాగింది. అందుకే ఎక్కడా పాఠకుడి మనసు పక్కకు మల్లదు. అందుకే ఈ కథను ఎప్పుడు చదివినా స్త్రీ మనసు లొని గొప్పతనం ఇంకా ఇంకా తెలుస్తూనే ఉంటుంది.     .......డా. ఎ.రవీంద్రబాబు

బహినాబాయి (1628 -1700)

  బహినాబాయి (1628-1700)   ఆదేవ్, జానకి అనే బ్రాహ్మణుల మొదటి సంతానం బహినాబాయి. ఈమె పుట్టకమునుపే ఈమె గురించి ఒక జ్యోతిష్కుడు ఈమె ఒక వరాల బిడ్డ అని, ఆమె వల్ల కుటుంబానికి అదృష్టం అనీ చెప్తాడు. అలాగే ఈమె పుట్టగానే, తండ్రికి ఒక పచ్చటి గుడ్డలో చుట్టి పెట్టిన బంగారు మొహరు ఒకటి దొరుకుతుంది. దీనితో జ్యోతిష్కుడి మాటలమీద నమ్మకం కుదిరి బహినా బాయిని చాలా అపురూపంగా పెంచుతారు తల్లితండ్రులు. దేవగర్ అనే ఊరు ఇప్పటి నార్త్ మహారాష్ట్రలో బహినాబాయి బాల్యం గడిచింది. అయితే ఆమెకు మూడేళ్ళ వయసులోనే చుట్టమయిన గంగాధర్ అనే ముప్పయ్యేళ్ళ రెండో పెళ్ళివాడితో పెళ్ళి చేస్తారు. మూడేళ్ళ పాపాయి కి ముప్పయ్యేళ్ళ వరుడు. ఊహించడానికి కూడా కష్టంగా ఉంది. అయితే పెద్దదయ్యేవరకూ తల్లితండ్రుల వద్దే పెరుగుతుంది. చిన్నపిల్లగా ఆడుకోవడంకన్నా, భక్తి, కీర్తనలు, ప్రవచనాలు ఇవే ఆమెకి ఇష్టం. ఈమె కష్టాలన్నీ కాపరం మొదలెట్టినప్పట్నుంచి మొదలవుతాయి. బహినాబాయి రాసిన 473 అభంగ్ లలో 78 పూర్తిగా ఆమె ఆత్మకధ అంటే ఆమె 12 పూర్వ జన్మలతో సహా, ఆమె బాల్యం ఆ తరవాత జీవితం గురించి రాసినవి. అయితే ఇది కొంచం ఆశ్చర్యకరమైవ విషయం ఒక ఆధ్యాత్మికమైన, భక్తి పర మైన రచనలు చేసిన సంత్, సాధూలు ఇలా వారి ఆత్మకధ కూడా రాయడం. కానీ ఆమె రాసిన ఆత్మకధ వల్ల అప్పటి కట్టుబాట్లు, సంఘ నియమాలు, పరిస్తితుల గురించి వివరంగా తెలుసుకునే అవకాశం కలిగింది. బహినాబాయి కధ చాలా అద్భుతాలతో కూడి, చాలా ఇంటెరెస్టింగా ఉంది. అయితే ఇప్పటివరకూ మనం చదివిన అందరి రచయిత్రుల జీవితాల్లాగే ఈమె జీవితం కూడా అదే సగటు ఆడదాని జీవితంలో ఉన్నట్టుగానే, గృహ హింస, వివక్షతొ కూడుకున్నదే. పెళ్ళి అయిన తరవాత పది పదకొండేళ్ళ వయసులో బహీనా బాయి భర్త, కుటుంబంతో పాటుగా గోదావరి నదీ తీరంలోని మహదేవ అరణ్యంలో యాత్రికుల్లా కాలక్షేపం చేస్తూ ప్రజల దాన ధర్మాల మీద బ్రతుకుతూ ఉంటారు. అటువంటి సమయంలో బహీనా బాయి భర్తకు ఒకరు ఒక నల్ల ఆవును దానం చేస్తారు. ఆ ఆవు ఒక దూడకి జన్మ నిస్తుంది. బహినా బాయి ఈ ఆవూ దూడల సేవలో ఎంతగా మునిగిపోతుందంటే, ఆమె ఒక్క క్షణం కనపడక పోయినా అవి రెండూ ఏడ్చి గోల పెట్టేవట. వాటికి నీరిచ్చినా, గడ్డి పెట్టినా బహినా చేత్తోనే, లేకపోతే అవి తినవు. ఇక దూడ విషయానికొస్తే, అది బహినాబాయి తో పాటుగా, అన్ని ప్రవచనాలకూ, కీర్తనలకూ వెళ్ళి శ్రద్ధగా వినేదని, భజనలయ్యాకా మనుషుల్లానే అది కూడ తల నేలను తాకిస్తూ సాష్ఠాంగ ప్రణామం చేసేదని రాస్తుంది బహీనాబాయి తన ''ఆత్మనివేదన" అనే ఆత్మకధలో. ఒకసారి ఇలాంటి ప్రవచనాలు జరుగుతున్నపుడు, మనుషులు కూర్చోవడానికే చోటులేక దూడను బలవంతంగా బయటికి పంపి కట్టేస్తారు. అప్పుడు బయటనుంచి దూడ, లోపల నుంచి బహీనా ఇద్దరూ ఏడుస్తుంటే, ఏంటి ఈ గొడవ అని అక్కడ గురువు అడుగుతాడు. విషయం తెలుసుకొని అది సామాన్యమైన దూడ కాదని పూర్వ జన్మలో అది బహినాబాయి లాగానే యోగభ్రష్ట అని (యోగభ్రష్ట అంటే ముక్తి మార్గంలో చివరిదాకా వచ్చాకా, చేసిన చిన్న పొరపాటు వల్ల తిరిగి జన్మ ఎత్తిన వారట) అంతే కాక ఆ దూడే బహీనా బాయి గురువని చెప్పి దూడను తనపక్కనే కూర్చోపెట్టుకుంటాడు. ఆ విషయం విని ఆయనకు మోకరిల్లిన బహీనా బాయి తల మీద చెయ్యి పెట్టి ఆశీర్వదిస్తాడు. అయితే ఈ విషయం ఎవరిద్వారానో తెలుసుకున్న భర్త విపరీతమైన కోపంతో, ద్వేషంతో భార్య అయిన బహీనా బాయి జుట్టు పట్టి ఈడ్చి, చితకబాది అదే ఆవు దూడల దొడ్లో కట్టేసి పెడతాడు. బహీనా బాయి బాధ చూడలేని ఆవు, దూడ రెండూ కూడా ఆమెతో బాటుగా తిండి ముట్టవు. బహీనా తల్లి తండ్రులు కూడా అల్లుడికి ఎదురుచెప్పలేక నిస్సహాయంగా ఉండిపోతారు. అయితే ఈ విషయం తెలిసిన గురువు వీరింటికి వచ్చి ఆమె ఎంత గొప్పదో చెప్పి ఆమె నీ భార్య అయినందుకు నువు ఎంతో అదృష్టవంతుడివి, సంతోషించాల్సింది పోయి ఈ అమానుష కృత్యాలేంటని మందలిస్తాడు. విధి లేక వీరిని విడిచిపెట్టినా, భర్త ఆలోచనలను బహీనా బాయి ఏమాత్రం తప్పుపట్టకుండా తన అభంగ్ లలో రాస్తుంది. భర్త బాధ అంతా ప్రజలందరూ, తన భార్య దగ్గర పురాణ శ్రవణానికి వచ్చి, తమ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటూ, ఆమెను గౌరవంతో పూజిస్తుంటే నేనొక గడ్డి పోచ కన్న హీనమయిపోతాను కదా అని. ఇలాంటి భార్యతో అవమానాలు పడే కన్నా సన్యసించి ఎటైనా దూరంగా పోతానని ఆమె తల్లితండ్రులకు చెప్తాడు. పదకొండేళ్ళ వయసులో గర్భిణి అయిన బహీనా బాయిని జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు. కాని ఇంకొక మాయ జరుగుతుంది ఇక్కడ. వెళ్ళాల్సిన సమయానికి భర్త విపరీతమైన కాళ్ళ మంటలతో బాధ పడి నెల వరకూ, ఆతరవాత ఇది కూడా ఆమె మహిమ అయిండచ్చని భయపడి ఆ ప్రయత్నం విరమించుకుంటాడు. భక్తతుకారాం మనకు తెలుసు కదా, ఈయన బహీనా బాయికి సమకాలికుడు. ఈమెకి ఎప్పుడూ, విఠోబా, తుకారాం విజన్స్ వచ్చేవట. అలాంటి ఒక విజన్లోనే తుకారాం ఆమెకు జ్ఞానబోధ చేస్తాడు. అయితే ఇది కూడా భర్త గంగాధర్ కు నచ్చదు. ఎందుకంటే, భ్రాహ్మణులైన వారికి శూద్రుడైన తుకారాం విజన్స్ రావడమేంటి? జ్ఞానబోధ చెయ్యటమేంటి అని. కాని బహీనా బాయి మాత్రం తుకారాం తన గురువు అని చెప్పుకుంటుంది. ఇది భర్తతో పాటు సంఘంలోని మిగతా బ్రాహ్మణ వర్గాలకీ నచ్చదు. అయితే మనం ఇదివరకు చదువుకున్న అక్కమహాదేవి, కన్ హొపాత్ర, జానాబాయి, ముక్తాబాయీల లాగా ఈమె సంసార జీవితాన్ని విడిచిపెట్టదు. ఒక కూతురు పుట్టాక ఆమె విరక్తితో (కొడుకు కాకుండా కూతురు పుట్టిన కారణంగా అనుకుంటా వివరణ లేదు) ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది, కానీ ఆమె మానస గురువైన తుకారాం కలలో కనిపించి నీకు ఒక కొడుకు కూడా పుడతాడు చివరిదాకా నీతో ఉంటాడు అందువల్ల నువ్వు ఆత్మహత్యకు పాల్పడవద్దని వారిస్టాడు. `ఆ ప్రకారమే ఆమెకు కొడుకు పుడతాడు తరవాత. అయితే బహీనా బాయి జీవితమంతా, సంసారంలో పతివ్రత పాత్ర పోషించటం, విఠోబాని కొలవటం, తన సత్య శోధనల మధ్య దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలో తెలియక, భర్త నుంచి సహకారం కానీ ప్రేమగానీ, అర్ధంచేసుకోవడం కానీ లేక, నలుగుతూనే వచ్చింది. ఆడదై పుట్టినందుకు మొదటి నుంచీ చివర వరకూ బాధ పడుతూనే ఉంది. కొన్ని సార్లు తిరుగుబాటు ధోరణి, కొన్నిసార్లు సర్దుకుపోయే ధోరణి. భక్తితత్వం, భర్తను గౌరవించి, భర్తనే దైవంగా కొలవాల్సిన పతివ్రతా ధర్మాల సందిగ్ధాల మధ్య ఏమీ తేల్చుకోలేక ఆమె పడిన బాధలు కూడా ఆమె రచనల్లో ప్రతిబింబిస్తాయి. మచ్చుకు ఆమె రాసిన ఈ రెండు అభంగ్ లూ చూద్దాము. The Vedas cry aloud, the Puranas shout, “No good may come to woman.”  I was born with a woman's body How am I to attain truth? They are foolish, seductive, deceptive --- Any connection with a woman is disastrous”. Bahina says, “if a woman's body is so harmful, How in this world will I reach Truth?”   గట్టి గట్టిగా చేసే వేద పఠనాలూ, పురాణ శ్రవణాలూ "ఎటువంటి మేలూ చేయ లేవు స్త్రీలకు". నేను ఒక స్త్రీ శరీరంతో పుట్టాను, సత్యాన్ని నేనెలా శోధించగలను? "వీరు మూర్ఖులు, మరులుగొల్పుతారు, మోసకారులు----' వీరితో ఎటువంటి సంబంధమూ వినాశకరము.” బహీనా బాయంటుంది, ఒక స్త్రీ శరీరమింత అనర్ధదాయకమైతే, ఈ ప్రపంచములో సత్యాన్ని నేనెలా చేరగలనని? వేద పఠనం, పురాణ శ్రవణం ఇవన్నీ దళితులకే కాదు, అగ్ర వర్ణాల ఆడవారికి కూడా నిషిద్ధమే. అగ్ర వర్ణాలలో ఆడవారి పరిస్తితులు కూడా దళితుల స్తితికి ఏమాత్రం తీసిపోవు. వారికి ఎదురు తిరగడానికి టార్గెట్ చెయ్యడానికి ఒక అగ్ర వర్ణం ఉంది. కానీ అగ్ర వర్ణాల ఆడవారికి సమైక్య పడటానికి కూడా అవకాశం లేదు. ఒక వైపు మేము అగ్ర వర్ణమనే అహంభావం ఇంకోవైపు ఆడవారైన కారణంగా లింగ వివక్ష. దీనికి ఇంకా చాలా కోణాలే ఉన్నాయి కానీ పర్యవసానాలు మాత్రం ఆడవారే అనుభవించారు. తనకంటే 27 యేళ్ళు చిన్నదైనా , తనకంటే పాపులర్ అవుతుందంటే తన భార్య, భరించలేని భర్త గంగాధర్ జీవితాంతం ఆమెను హింసిస్తూనే ఉన్నాడు. దేవుని మీద భక్తా, సంసారంలో పతి భక్తా అనే మీమాంసలోనె పాపం బహీనా బాయి జీవితం గడిచిపోయింది. చిన్న పాపని పెళ్ళి చేసి పంపాకా వాడు కొట్టినా, నరికినా, అడగలేని నిస్సహాయత అప్పటి సమాజంలో తల్లి తండ్రులది. అదీ ఎంతో గారాబంగా పెంచుకున్న బిడ్డ అయినా కూడా. I'll serve my husband – he's my god ... My husband's my guru; my husband's my way this is my heart's true resolve. If my husband goes off, renouncing the world, Pandurang (Vithoba), what good will it do me to live among men? ... My husband's the soul; I'm the body ... My husband's the water; I'm a fish in it. How can I survive? ... Why should the stone god Vitthal (Vithoba) and the dream saint Tuka (Tukaram) deprive me of the happiness I know? నా భర్తను నేను సేవిస్తాను --- అతనే నా దైవం..... నా భర్త దారే నాది; నా భర్తే నా గురువు, ఇదే నా హృదయంతో తీసుకున్న నిర్ణయం, ఈ ప్రపంచాన్ని త్యజించి ఒక వేళ నా భర్త వెళితే, ఓ పాండురంగా! ఈ మగవారి మధ్య బ్రతకటం నాకు మంచిదా? నాభర్త ఆత్మ అయితే; నేను శరీరాన్ని..... నా భర్త నీరయితే; నేనందులోని చేపని. నేనెలా బ్రతుకుతాను?.......... ఎందుకీ రాతి దేవుడు విఠోబా, ఇంకా కలల్లోని సాధువు తుకారం, నాకు తెలిసిన ఈ ఆనందం నాకు లేకుండా చేస్తారు? ఈ పోయెం లో బహీనాబాయి పడే మనో వేదన చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. భర్తతో కలిసి జీవించటానికి తన ఆత్మానందాన్ని త్యాగం చెయ్యాల్సొచ్చినా, మనం ఇంతకు ముందు తెలుసుకున్న మిగిలిన రచయిత్రుల్లా సంసార బంధాల్ని త్యజించడం, సంఘాన్ని ఎదిరించి బ్రతకగల్గటం ఆమెకు చేత కాలేదు. అలా అని సంసారంలో ఆనందంగా ఉండలేక పోయింది. కష్టమైనా నష్టమైనా పతివ్రత లాగా బ్రతకటానికి తన శాయ శక్తులా ప్రయత్నించింది. సంఘ భయం కన్నా కూడా మనం అర్ధం చేసుకోవాల్సింది ఇంకొకటి ఆమె వ్యక్తపరుస్తుంది. సంఘంలో మగవారి నుంచి తనను కాపాడుకోగల్గటం. అది ఒక దుస్సాధ్యమైన పని అప్పుడే కాదు ఆడవారికి ఇప్పుడు కూడా. ఇన్ని వందల వేల ఏళ్ళలో స్త్రీలు ఎంత ప్రగతి సాధించినా అది ఒక వర్గం వారికో, లేదా కొన్ని ఎక్సెప్షన్స్ తో కొందరికే సాధ్య పడింది. ఇప్పటికీ స్త్రీల విషయంలో ఎక్కడ గొంగళి అక్కడే ఉంది. ఇప్పటి యువత కొందరు చదువుకున్న అమ్మాయిల్ని, స్వేచ్చగా అలోచించే అమ్మాయిల ఉదాహరణలు చెప్పి ఇప్పటి ఆడవారు అప్పట్లా కాదు మారి పోయారు అంటారు. కానీ, సమాజంలో పురోగమనం, తిరోగమనం రెండూ, రెండు రైలు పట్టాల్లా సమాంతరంగా సాగుతుంటాయనిపిస్తుంది. ఎందుకంటే ఒక చోట నిలబడి చూసినప్పుడు రెండు రైలు పట్టాల్లో ఏది ఏవైపు వెళ్ళినట్టుగా అయినా ఊహించుకున్నపుడు అవి అలానే కనిపిస్తాయి. కాకపోతే నిజంగా సంఘంలో, ఊహతో సంబంధం లేకుండా అదే జరుగుతుంటుంది. మళ్ళీ వచ్చే వారం ఇంకొక అద్భుత రచయిత్రి పరిచయంతో మళ్ళీ కలుద్దాం. - Sivapurapu Sharada  

“చరిత్రలో ప్రబంధపరమేశ్వరుడు” తొమ్మిదవ భాగం

“చరిత్రలో ప్రబంధపరమేశ్వరుడు” తొమ్మిదవ భాగం 6 వ అధ్యాయం      ఏకశిలా నగరము నందు ప్రతాపరుద్ర చక్రవర్తి కూడనూ సభ ఏర్పాటు చేశాడు.    మంత్రి శివదేవయ్యగారు ఆశీనులయ్యాక అందరూ తమ తమ ఆసనాల్లో సర్దుకున్నారు.    "ప్రభూ! సమయం చూసుకుని పగ తీర్చుకునుటకై దేవగిరి రాజు పశ్చిమాన లక్ష గుర్రములు, రెండు లక్షల పదాతి దళముతో.. మహారాష్ట్ర దేశాధీశుడు లక్ష అశ్వంబులను, పదాతి వర్గంబును.. తక్కిన రాజులు కూడ తమ తమ బలములలో అచట నిలిచారు." ఒక నాయకుడు లేచి విన్నవించుకున్నాడు.    "ఢిల్లీ సుల్తాను సేనాని ఏకశిలానగరమునకు ఉత్తర భాగమున విడిది చేసి ఉన్నాడు.. సైనిక బలం చాలా ఉంది." మరొక సేనాని..    "కటకము నుంచి ఆ రాజు యాభై వేల గజ బలంబు, ఏడు లక్షల పదాతి దళముతో ఈశాన్యమునకు వచ్చుచున్నాడు.." ఇంకొక సేనాని..    "మూడు దిక్కులా దాడి చేస్తున్నారన్నమాట." శివదేవయ్య సాలోచనగా అన్నారు.    "పశ్చిమమునకు మా తమ్ముడు అన్నమదేవుని పంపుదాము. కటకం రాజు మీదికి  నరపతి రాయలు , ఉత్తరమున సుల్తానును మా మూల బలము ఎదుర్కుంటారు. చూచెదము.."    ప్రతాపరుద్రుడు తన ఏకాంత మందిరములో సమాలోచనలో ఉన్నాడు, మంత్రి శివదేవయ్య గారితో.    శివదేవయ్యగారు వృద్ధులైపోయారు. అయిననూ ధృఢంగా ఉన్నారు.   "ప్రభూ!" అదే సమయములో ఆతృతగా పిలుస్తూ రాణీ విశాలాక్షీ దేవి వచ్చింది. వెనుతిరిగి ఉన్న శివదేవయ్యగారిని చూసి వెనుకకు మరలబోయింది.   "రండి దేవీ! మన శివదేవయ్యగారే.." చక్రవర్తి పిలిచాడు.    రాణీ వాసపు స్త్రీలు అంతఃపురము నందు పరాయి పురుషుని కంట పడుట సాంప్రదాయం కాదు. కానీ శివదేవయ్యగారు వేరు. ఆ సంగతి మహారాణీకి వివాహమయిన క్రొత్తల్లోనే తెలిసింది.    ఒక రోజు..    చక్రవర్తి ఏకాంతంగా రాణీగారితో ఉన్న సమయంలో శివదేవయ్యగారు వేంచేశారు. రాణీ లోనికి నిష్క్రమిస్తూ ఉండగా ప్రతాపరుద్రుడు వారించాడు.   "దేవీ! శివదేవయ్యగారు మన ప్రధాన మంత్రి. తాతగారు, గణపతి దేవుని కాలం నుండీ మనలను సన్మార్గమున నడిపిస్తున్నారు. నన్ను ఊయలలో వేసినప్పటి పసితనములోనే నాకు పట్టాభిషేకమొనర్చిన వారు. వారు సాక్షాత్ పరమశివుని ప్రతి రూపమని తిక్కన సోమయాజులవారే మా తాతగారితో చెప్పారట. అందుచే మీరు నిస్సంకోచముగా లోనికి రావచ్చును. వీరిని పూజించిన సకల శుభములూ కలుగును."    మహారాణీ, భర్త చెప్పినట్లు, శివదేవయ్యగారిని ఈశ్వరుని వలెనే భావించి పూజిస్తూ ఉంటుంది.    "స్వామీ! మీరునూ ఇచ్చటనే ఉన్నందుకు రవ్వంత ఉపశమనముగా నున్నది." గురువుగారి పాదాలనంటి నమస్కరించి అన్నది విశాలాక్షీ దేవి.    "ఏమయింది తల్లీ?" శివదేవయ్యగారు అభిమానంగా చూస్తూ అడిగారు.     ఓదార్పు మాట వినగానే రాణీ కన్నులలో నీరు చిప్పిల్లినది.    "ఎందులకంత వ్యాకులపాటు తల్లీ?"    "స్వామీ! పద్మాక్షి అమ్మవారి ఆలయంలో ఖడ్గ ఖేటకములు కాన వచ్చుట లేదు. నాకు భయముగా నున్నది."    శివదేవయ్య మౌనము వహించారు.    "ఎవరో దొంగలు కాజేసి ఉంటారు. మరల చేయిద్దాము.. యుద్ధం సద్దు మణిగాక." ప్రతాప రుద్రుడు అనునయించాడు.    విశాలాక్షీ దేవి గురువుగారిని చూసింది. వారు ఇంకా మౌనముగానే ఉన్నారు కన్నులు మూసుకుని.    "స్వామీ!" ప్రతాపరుద్రుడు పిలిచాడు.    "అమ్మాయ్! నాకు అర్ధమయింది నీ భయము. మానవమాత్రులం మనమేం చెయ్యగలం. విధి వ్రాత."    అప్పుడు ప్రతాప రుద్రునకు గురుతుకు వచ్చింది. ఆ కత్తి డాలులను అమ్మవారు తమ వంశపు తొలి రాజైన మాధవ వర్మకి స్వయముగా ఇచ్చిందనీ, ఇస్తూ ఇస్తూ వెయ్యి సంవత్సరములు మీ సామ్రాజ్యమును రక్షిస్తానని అందనీ ఒక నమ్మకం.    సాలోచనగా శివదేవయ్యగారిని చూశాడు చక్రవర్తి.    "అవును వేయి వర్షములు ముగిసినవి. ఇంక మనకు దైవబలము ఉండదు."    "కానివ్వుము స్వామీ! విధి నెవ్వరూ తప్పించ లేరు కదా! దైవ లిఖితమేదయితే అదియే జరుగును."    మహారాణీ విశాలాక్షీదేవి మ్లాన వదనముతో పూజా మందిరమునకు వెడలింది.       కొద్ది దినములలోనే మూడు దిక్కులా యుద్ధము చేసి, ఓరుగల్లు సైనికులు శతృవులను తరిమి కొట్టారు. అప్పటికి తాత్కాలికంగా ఢిల్లీ సుల్తాన్ సైన్యం కూడా వెనుతిరిగారు.    దేవగిరి రాజు, కటక్ రాజు కూడ కప్పములు చెల్లించి వారి పట్టణములకు తరలారు.    ఆ యుద్ధములలో వేల కొలది గుర్రములు, వందల కొలదీ గజములు, సైనికులు మృతి చెందారు.    ప్రతాప రుద్రుడు తన రాతి కోట చుట్టూ మట్టి గోడ నిర్మించాడు. దాని చుట్టూ కందకం త్రవ్వించాడు. కోట పటిష్ఠమయిన పిదప సైన్యాన్ని బలపర్చ సాగాడు. నాయంకరులందరికీ వర్తమానాలు పంపి, తమ తమ బలములతో సిద్ధము గానుండ మన్నాడు.    తన రాజ్యాన్ని శతృవుల దాడి ఎదురుకొనుటకు రక్షణ ఏర్పరచుకుంటూనే, ప్రజల యోగక్షేమాలు విచారిస్తూ అప్రమత్తంగా రాజ్య పాలన సాగిస్తున్నాడు.    ఒక రోజు ప్రతాప రుద్ర చక్రవర్తి సభలో నుండగా వేగులు వార్త తీసుకొచ్చారు.    "ప్రభూ! ఢిల్లీ సుల్తాన్ జలాలుద్దీన్ ఖిల్జీని, అల్లుడు జునా ఖాన్ చంపేసి, సింహాసనం మీద కూర్చున్నాడు. అల్లవుద్దీన్ ఖిల్జి గా పేరు మార్చుకుని, సరిహద్దు నుంచి మంగోలులను తిప్పికొట్టాడు."    సభలోని వారు సంతోషంగా చూశారు. హిందూ దేశానికి కొత్త బెడద తప్పింది కదా!    "అంతే కాదు.. దక్షిణదేశ దండయాత్రలు ప్రారంభించాడు. ఉల్లూఖాన్, నుస్రత్ ఖాన్లను గుజరాత్ మీదికి పంపి ఆ రాజ్యాన్ని కైవసం చేసుకున్నాడు."    అప్పుడు కలిగాయి సభలో భయాందోళనలు..    నలుప్రక్కలా గుసగుసలు..    చక్రవర్తి సాలోచనగా చూస్తున్నాడు.    "అవును ప్రభూ! మనం కూడా అప్రమత్తులమై ఉండాలి. గుజరాత్ దండయాత్రలో మాలిక్ కపూర్ అని ఒక బానిసని కొన్నారు. అతడిని.." వేగు సంశయిస్తూ ఆగాడు. సభలో అటువంటివి చెప్పవచ్చునో లేదో..    "ఫరవాలేదు. చెప్పు. అతడిని ఏం చేశారు?" చక్రవర్తి ప్రోత్సహించాడు. చర్మం వలిచి ఉంటారు. ఆ రాక్షసులు చేసే పని అదే కదా! పట్టుబడిన వారిని.. ఒక్కసారిగా చంపరు.    "సేనానులు పట్టుబడితే వేరే రకమైన శిక్షలుంటాయి ప్రభూ!. కానీ ఇతడు బానిస కదా.. నపుంసకుడ్ని చేశారు. దానితో అతనికి, మనుషుల మీద, వ్యవస్థ మీద పగ, ప్రతీకారం పెరిగాయి. అన్నివిధాలుగా శరీరాన్ని ధృఢ పరచుకుని, యుద్ధాలలో రాటుదెలి, సేనాని అయ్యాడు. బహు నిర్దయుడు. ఏ మాత్రం కరుణ అనేది అతడి నిఘంటువులో లేదు."    "అంటే అతడిని.."    "దక్షిణ దేశం మీదికి పంపుతున్నారు. దేవగిరి మీదికి అతడు దండెత్తి,  అక్కడి రాజు రామచంద్రుడిని ఓడించాడు. అతడు తన కూతురుని, అల్లాఉద్దీన్ ఖిల్జికిచ్చి పెళ్లి చేసి, సామంతుడిగా లొంగిపోయాడు.    దానితో వారి బలం రెట్టింపైనట్లయింది. ఏ క్షణంలో నైనా మన మీదికి రావచ్చు."    "మన మీదికా! అప్పుడు మన చేతిలో పరాభవింపబడి వెనుతిరిగిన వైనం గుర్తు లేదా?" పోతుగంటి మైలి సేనాని లేచి అడిగాడు.    ఉప్పరపల్లి వద్ద జరిగిన యుద్ధంలో అతడు, రేచర్ల వెన్న సేనాని కలిసి అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి ముష్కురుల సైన్యాన్ని తిప్పి కొట్టారు. ఆ విజయాన్ని దృష్టిలో పెట్టుకుని మైలి సేనాని తేలికగా మాట్లాడాడు. కత్తి యుద్ధంలో.. ఖడ్గాన్ని అత్యంత వేగంగా తిప్పడంలో నకులుడికి సమానుడని పేరు తెచ్చుకున్నాడు అతడు.    "అవును సేనానీ! ఆ అనుభవంతోనే మరింత యుద్ధ నైపుణ్యం సంపాదించి, సైన్యాన్ని పటిష్ఠం చేసుకున్నాడు మాలిక్ కాఫర్. అతడు కర్కోటకుడు. పొంచి పొంచి మీద పడడంలో పెద్దపులికి సాటి ప్రభూ! అతడిని ఏమాత్రం తక్కువ అంచనా వేయ కూడదు. అల్లావుద్దీన్ ఖిల్జీ ఉత్తర దేశంలో చాలా రాజ్యాలని జయించాడు. ఇప్పుడు దక్షిణా పధాన్ని తన సామ్రాజ్యంలో కలుపుకోవాలని పట్టుదల మీద ఉన్నాడు." నెమ్మదిగానైననూ స్థిరమైన కంఠ స్వరంతో సెలవిచ్చాడు ఆ చారుడు.    వేగుల వార్తలు వినగానే ప్రతాపరుద్రుడు అప్రమత్తుడయ్యాడు. తన సేనానులందరికీ వర్తమానం పంపాడు.    సామ్రాజ్యం అంతా అట్టుడికిపోతోంది. మూల మూలలా, గ్రామ గ్రామాలా యుద్ధ వాతావరణం. ఎక్కడికక్కడ ప్రజలు గుంపులుగా చేరి అదే చర్చ. యువకులందరినీ వారి వారి శక్తిని, కౌశల్యాన్నీ గమనించి సైన్యంలోని అనేక విభాగాల్లోకి చేర్చుకుంటున్నారు.    అద్దంకి ప్రభువుల వలెనే ఇతర నాయంకరులు కూడా చర్చలు జరిపి, ప్రతాపరుద్రునికి సహాయ పడడానికి నిశ్చయించుకున్నారు. అద్దంకి, గుడ్లేరు.. చుట్టుప్రక్కల గ్రామాలనుండి యువకుల సేకరణ ఇంకా ఉధృతమయింది. తల్లిదండ్రులు, భీతి చెందిన చూపులతో.. తమ బంగారు కొండలని ఒడలంతా తడిమి, కన్నీళ్లతొ సాగనంపుతున్నారు.    పోతమాంబ, పేరమ్మలను కూడా సంసిద్ధం చేశాడు ఎర్రన.    కానీ.. అతడిని, తండ్రికి సహాయంగా ఉంటూ.. అక్కడి స్త్రీలని, వృద్ధులని కాచుకొమ్మని చెప్పాడు అద్దంకి సేనాని.    "ముష్కురులు మమ్ము దాటి ఇచ్చటికి వచ్చిన మీరే ఎదుర్కొనాలి. అంతవరకూ రాకపోవచ్చును. కానీ.. ఒక వేళ అట్లయినచో.. మనము ఇచ్చట కూడనూ రక్షణ ఏర్పరచుకోవలె. వారు స్త్రీలు, పసివారు, వృద్ధులు అని చూడరు. విచక్షణ ఏమాత్రం లేదు."    యుద్ధానికి వెళ్ళే ముందు కొందరు యువతులకు కూడా శిక్షణ ఇప్పించాడు సూరనార్యుడు.    "మహారాణి రుద్రమదేవి పౌరుషం కొంతయినా ఆమె ప్రజలకి ఉండాలి. ఏ పరిస్థితి నైనా ఎవరైనా తట్టుకోవాలి. ఒక్క స్త్రీ కూడా తురుష్కుల చేతికి చిక్క కూడదు. రాజపుత్ర వనితలని ఆదర్శంగా తీసుకోవాలి."    ప్రతీ పల్లె, ప్రతీ వాడ యుద్ధ సన్నిద్ధులై పోయారు.    కారం, కత్తి పీట చేతికి అనువుగా నుంచుకుంటున్నారు ప్రతీ ఇంటిలో.    ఢిల్లీ సుల్తాన్ మదమడుద్దాం    పులి పిల్లల్లా మీద పడదాం    పిల్లి కూనల్లా పరుగెత్తి పోవాలి    మాలిక్ కాపర్కు మారో మారో    ఓరుగల్లు వీధుల్లో సైనికులు కవాతు చేస్తుంటే పిల్లలు పాటలు పాడుతూ, పిడికిళ్ళు బిగించి గాలిలో యుద్ధం చేస్తున్నారు.    భయపడినంతా అయింది. 1309 వ సంవత్సరం ఆశ్వీయుజ మాసంలో మాలిక్ కాపర్ అపారమైన సైన్యంతో ఢిల్లీ నుండి బయలు దేరాడని వార్త వచ్చింది.    అయితే పుష్యమాసం మధ్యకి సబ్బినాడు ప్రాంతానికి రావచ్చు. రెండు మాసముల పైననే వ్యవధి ఉంది. డెబ్బది ఏడు మంది నాయంకరులు తమ సైన్యాలతో ఓరుగల్లుకు వచ్చేశారు.    తొమ్మిది లక్షల మంది విలుకాళ్ళు, ఇరవై వేల అశ్వబలం, వేయి గజబలం సేకరించాడు ప్రతాప రుద్రుడు.    దేవగిరి రాజు సైన్యాన్ని కూడా కలుపుకుని సంక్రాంతి పండుగ అయిన ఐదవనాడు ఓరుగల్లు కోటని ముట్టడించాడు మాలిక్ కాపర్.. ఇరవై రోజులు భీకర యుద్ధం జరిగింది.    ఢిల్లీ సైనిక బలం అనంత సముద్రం లాగ.. అలలై ఎగసి పడుతూనే ఉంది. వారి సంఖ్య ముందు కాకతీయ సైనికులు పిల్ల కాలువల్లాగ పక్కకి పారిపోసాగారు.    సిరిపురం, హనుమకొండ కోటలు ముష్కురుల స్వాధీనాలయ్యాయి.    వరంగల్ కోట మాత్రం దుర్భేధ్యమై మాలిక్ కాపర్ చేత చిక్కలేదు. కోట గోడ మీద వందల మంది విలుకాళ్లు, ఢిల్లీ సైన్యాన్ని తరిమి కొడుతున్నారు ప్రతీ రోజూ. సూర్యోదయం అవుతూనే సైనికులు కోటకి రావడం.. చావు దెబ్బలు తిని పారిపోవడం..    కాకతీయులకి ఎత్తైన కోటగోడ.. దాని మీది బురుజులు సానుకూలమయ్యాయి. వాళ్ల గురి అరుదుగా తప్పు తోంది. పగ వాళ్ళ బాణాలు బురుజులకి తగిలి వాన చినుకుల్లా కిందికి రాలి పోసాగాయి.    రోజు రోజుకీ వందల కొద్దీ శతృ సైనికులు కూడా చినుకుల్లాగే రాలిపోతున్నారు.    ఇది పని కాదనుకుని వ్యూహం మార్చాడు మాలిక్ కాపర్.    మరునాడు కోట వద్దకు ఒక్క సైనికుడు కూడా రాలేదు. కాకతీయులు ఆశ్చర్యపోయి.. ఒక్క క్షణం శతృవు వెన్ను చూపాడేమో అనుకున్నారు. కానీ మాలిక్ కాపర్ అంత సులభంగా ఓటమి ఒప్పుకోడని కాకతీయ సేనానులందరికీ తెలిసినదే.   వారి ఊహ, వారి భయం నిజమే.   కర్కోటకుడైన కాపర్ పట్టణంలోని ప్రజల మీద పడ్డాడు.    ఆక్రందనలు.. నేల దద్దరిల్లిపోయేలాగ వినిపిస్తుంటే భూమాత విలవిల్లాడి పోతోంది.    పసిబిడ్డల రోదనలు చెవులు పగిలేలా వినిపిస్తుంటే ఆకాశం ఆక్రోశిస్తోంది.    స్త్రీలు జుట్లు విరబోసుకుని వీధులలో పరుగులు పెడుతుంటే..  వెంట వెంట తరుముతూ తురుష్క సైనికుల వికటట్టహాసాలు చేస్తున్నారు.. రోజుకి లెక్కింపలేనన్ని మాన భంగాలు.. అన్నన్నే అమాయకుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి.    ధాన్యాగారాల దోపిడీలు. ఇళ్లల్లో జొరబడి, వృద్ధులని బైటికీడ్చి ఎత్తి బట్టల మూటల్లా విసిరెయ్యడాలు.. నిత్య కృత్యాలైపోయాయి.    అందరూ ఎక్కడెక్కడో దాచుకున్న నాణాలను, ఇళ్ళన్నీ చిందర వందర చేసి బయటికి లాగి వీధుల్లో చెల్లా చెదురుగా చల్లి.. ఏడుస్తున్న బడుగు జనం చేతనే ఏరించి, మూటలు కట్టించి తమ వీపుకు కట్టించు కుంటుంటే.. నిస్సహాయతతో నేల కొదిగి పోతున్నారు అమాయకులు.    స్త్రీలు.. యుద్ధ వాతావరణం ఎదుర్కొనడానికి, నేల మాళిగల్లో దాచుకున్న నగలను మొరటుగా ఉన్న తమ మెడల్లో వేళ్ళాడేసుకుని, అచ్చోసిన ఆంబోతుల్లా తిరుగుతున్నారు.    పంటల మీదికి అడవి జంతువుల్లా పడి తొక్కి సర్వనాశనం చేస్తూ.. ప్రజలని బలవంతంగా రప్పించి, వినోద కార్యక్రమంలా ఆనందించ మంటున్నారు.    నాలుగు రోజులు గడిచాయి.. ఓరుగల్లు, హనుమకొండ.. పరసరాలలో ఉన్న పల్లెలు.. స్మశానాల కంటే హీనంగా తయారయ్యాయి. బ్రతికి ఉన్న శవాల్లాగ తిరుగుతున్నారు ప్రజలు.                                  ……….    ప్రతాపరుద్రునికి ఇంక తట్టుకొనగల శక్తి నశించింది.    ఏ పాపం ఎరుగని.. అన్నెం పున్నెం ఎరుగని ప్రజలు.. వారినెందుకు బాధించాలి?   వారికి ప్రతాపరుద్రుడు రాజైతేనేం.. అల్లావుద్దీన్ ఖిల్జీ రాజైతేనేం.. వారికి కావలసింది, కడుపునిండుట.. కంటినిండా నిదురించగల రక్షణ.    రాజీకి రాక తప్పలేదు రాజునకు.    కాపర్‍కి కబురు చేశాడు.. కప్పం కడతానని.. సువిశాల కాకతీయ సామ్రాజ్య చక్రవర్తి, అల్లావుద్దీన్ ఖిల్జీకి సామంతులుగా ఉంటారనీ..    అపార ధనరాశులను వెయ్యి ఒంటెలమీద ఢిల్లీకి తరలించాడు మాలిక్ కాపర్. ఏనుగులను, అశ్వాలను, ఒంటెలను తోడ్కొని విజయ కేతనం ఎగరేస్తూ ఢిల్లీ పయనమయ్యాడు.    మాలిక్ కాపర్‍కు ఘనస్వాగతం లభించింది అల్లావుద్దీన్ ఖిల్జీ కోటలో!    అప్పుడే కాకతీయ సామ్రాజ్య పతనానికి నాంది పడింది. ……… ( ఇంకా వుంది) ………..         .... మంథా భానుమతి

“చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు” ఎనిమిదవ భాగము

“చరిత్రలో ప్రబంధ పరమేశ్వరుడు” ఎనిమిదవ భాగము  ఎర్రపోత సూరి మనవడిని ఆప్యాయంగా చూసి కొనసాగించాడు.    "అదే.. పరి పరి విధముల చింతించాడు తిక్కన. ఎవరిని సాయమడగాలి? తిక్కరాజ సోదరుల కంటెను బలవంతులయి ఉండవలె. మనుమసిద్ది యన్ననూ, రాయబారమేగుచున్న తాను యన్ననూ ఇఛ్ఛ కలిగి యుండవలె. తమ మీద గౌరవముండవలె.    ఇంకెవరున్నారు.. కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు దక్క..    తిక్కనగారు ఓరుగల్లు పట్టణమునకు తరలి వెళ్ళారు.    ఊరు చేరుటకు కొన్ని యోజనములు ముందే కాకతీయ ప్రభువుల సభలోని పండితులు ఒక్కొక్కరూ ఎదురు వెళ్లి చందన తాంబూలాది సత్కారాలను అంద చేశారు.    వేర్వేరు పురముల నుంచి తిక్కనార్యుడు వచ్చుచున్నాడన్న వైనము వినిన విద్యార్ధులు కొల్లలుగా వచ్చి, ఒక్కొక్కరు కావ్యముల లోని శ్లోకాలను, వివిధ విధములుగా వినిపించారు. అందరినీ ఆప్యాయంగా పలుకరించి ఠీవిగా పట్టణ ప్రవేశం చేశారు ఉభయకవి మిత్రుడు, తిక్కన సోమయాజి.       తిక్కన సోమయాజి రాక, విద్యార్ధుల కవితా పఠనమప్పుడే్ గణపతి దేవుని చేరింది.    గణపతి మహారాజు సన్నాయిలు, శంఖాలు మొదలైన మంగళ వాద్యాలతో ఎదురేగి స్వాగతం పలికాడు. తిక్కన సోమయాజి, వేదశాస్త్ర విద్యా పారంగతుడు. ఉభయ భాషల్లోనూ, సమస్త విద్యలలోనూ ప్రవీణుడు. మనుమసిద్ధి రాజుకి మహా మంత్రి.    మహారాజు ఎదురేగి స్వాగతం పలికి ఉచితాసనాసీనుడ్ని చెయ్యడంలో వింత ఏముంది?    దివ్యవస్త్రములు సమర్పించి, సుగంధ పుష్ప మాలాలంకృతుడ్ని చేశాడు మహారాజు, మహాకవిని.    తిక్కసోమయాజి.. సమస్త శాస్త్రాలని ఔపోసన పట్టాడు. వానిలోని అద్వైతాన్ని, ఉత్తమ జీవనాన్ని.. రాజనీతి, పురాణ కథలు కలిగిన భారతాన్ని.. అందులోని వీరులు చేసిన యుద్ధ పర్వాలని కళ్లకి కట్టినట్లు ప్రతి దినమూ ఆయన చేతనే చెప్పించుకున్నాడు గణపతి దేవుడు. అంత కన్ననూ అదృష్ట మేముంది?    కానీ ఆశువుగా చెప్పిన ఆ భీకర వర్ణనలు వింటేనే వణుకు పుట్టించేట్లున్నాయి.    విరాట పర్వంలో కీచక వధ.. మానవ మాత్రుడెవ్వడూ ఊహించలేని విధంగా..    "మస్తకమును దీన దీర్ఘ భుజశాఖలు పాద యుగంబు మేని లోనికి జొర నుగ్గుగా దునిమి.."    దుశ్శాసనుడిని చంపిన విధమయితే మరీ భయంకరం.    అతడు సభలోన చేసినదానికి వడ్డీతో సహా వడ్డిస్తానని చెప్పి మరీ చేశాడు.    "ఏ నురము వ్రచ్చి నెత్తురు- తేనియ ఇది త్రావెదన్.." అంటూ,   "తల్లి చన్నుల పాలేను త్రావ నెట్టు    లాననే పలుతెరగుల తేనియలును"    అన్నట్లు దోసిటితో నెత్తురు త్రాగి, రుచికి మెచ్చుకున్నాడట. అది చాలదన్నట్లు నెత్తురు ముఖము మీద, ఒంటి మీద కూడా చల్లుకుని వికటాట్టహాసం చేశాడట.    ఆవేశంలోచేశాడే కానీ ఆ తరువాత సిగ్గుపడ్డాడు.. అంత రాక్షసంగా ఏవిధంగా ప్రవర్తించానా అని. ఆ విషయమే స్త్రీ పర్వంలో గాంధారి అడిగింది.    "వైరి నని జంపుదురుగాక వ్రచ్చి నెత్తు     రెత్తికొని క్రోలు క్రూరాత్ము లెచటనైన    నెన్నడేనియు గలిగిరే యీవుదక్క    నది వృకోదర వృకవిధ మసురభంగి."    దానికి భీముడు    "ఆ సభలోనికి ద్రుపదాత్మజని ఒడిసి పట్టుకొని తెచ్చి అవమానించినప్పుడు చేసిన ప్రతిజ్ఞకై, పెదవికి నెత్తుటిని తాకించితి నంతియే.. సైనికుల భీతి కొల్పుటకే ముఖమునకు రక్తం పూసుకొంటిని.. కానీ అనుజుని రక్త పానం చేసేటంటి వెర్రిని కాదు" అంటూ సమాధాన మిచ్చాడు.    అనేక యుద్ధములు చేసిన గణపతి దేవ చక్రవర్తి కనుక తిక్కనగారి వర్ణనని, కవి కంఠస్వరముననే వింటూ తట్టుకోగలిగాడు కానీ, మరొకరికి అంతటి గుడె దిటవు ఉండదు.    "ఆ విధముగా భారతాన్ని వినిపించుటయే కాదు.. తిక్కనార్యుడు శైవమతాన్ని కూడా శక్తి కొలదీ వ్యాపింప జేశాడు ఓరుగల్లులో" అని ఒక కవి తన ద్విపద కావ్యంలో వ్రాశాడు.    ఓరుగల్లు, సబ్బినాడు ప్రాంతాలలో ఆ కాలంలో జైన, బౌద్ధ మతాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. జిన ధర్మాలనీ, బౌద్ధ ధర్మాలనీ పాటించడం.. ఆది పురాణ కావ్యాన్ని పఠించడం నిత్య కృత్యాలుగా ఉండేవి.    గణపతి దేవ మహారాజు తిక్కనార్యుడు  వచ్చినప్పుడు జినాచార్యులతోనూ, బౌద్ధమతా చార్యులతోనూ చర్చావాదన పెట్టించాడట. వారి వారి మత ప్రాచుర్యం చెయ్యడంలో బహు సమర్ధులు ఆ ఆచార్యులు.    శాస్త్ర, సిద్ధాంత, ఇతిహాస పరంగా.. వేదసార ముఖస్తా వారిని ఓడించాడు తిక్కన."    ఎర్రపోతన మౌనం వహించాడు కొద్ది సేపు. ఎర్రన తల ఎత్తి చూశాడు.    అక్కడే చెంబులో ఉన్న మంచి తీర్ధం తీసి ఇచ్చాడు. తాతగారి కన్నులు చెమర్చడం చూశాడు. ఆందోళనగా లేచాడు. ఆరోగ్యానికేమైనా..    "ఏమయింది తాతగారూ?" దగ్గరగా వెళ్ళి, నుదుటి మీద చేయి ఉంచి చూశాడు. చెయ్యి పట్టుకుని నాడి పరిశీలించాడు. తేడా ఏమీ కనిపించలేదు. మరి.. అలసట అయిందా..    తన ఉత్సాహంలో పెద్దాయన వయసు గమనించకుండా ఇబ్బంది పెట్టేశాడా? ఎర్రనకి ఏమి చెయ్యవలెనో అర్ధం అవలేదు.    పిల్లవాని బెదురు, భయం చూసి ఎర్రపోతసూరి ఏమీ ఫరవాలేదన్నట్లు చెయ్యి ఊపాడు.  కొద్ది సమయంలోనే తేరుకుని.. అనవసరంగా ఉద్వేగానికి లోనయి బాలుని బెదరగొట్టాననుకుని.. గట్టిగా ఊపిరి పీల్చి వదిలి, తేరుకుని.. ఎర్రన్నని కూర్చోమని సైగ చేశాడు.    "ఏమీ లేదు నాయనా! నాకేం గాలేదు. జైన బౌద్ధ ఆచార్యులని ఓడించాక తిక్కనార్యుడు చేశాడని చెప్పిన పనులే నన్ను ఉద్వేగానికి గురి చేశాయి. నాకేమీ అస్వస్థత లేదు."    "ఏమి చేశారు తాతగారూ? ఎవరు చెప్పారు?"    "మా తాతగారి సమకాలీకులు అనేవారు. తిక్కనగారు నిజముగా చేయించారో లేదో తెలియదు. బౌద్ధ జైనుల వసతులన్నీ మట్టు పెట్టించారట. వారి దైవాల పేర్లని అణచారట. వాళ్లను ఆ సీమనుంచి వెళ్ళ గొట్టించారట. అందరు జైనులను నరికించి చంపించి సురుచిరోద్దండ భీమ పరాక్రమ బిరుదులతో సత్కరింప బడ్డారుట.    నాకు ఎందువలననో నమ్మ శక్యముగా లేదు. పాండ్య రాజులు ఆ విధంగా చేసి శైవ మతోద్ధరణకి కంకణం కట్టుకున్నారని అందరికీ తెలుసును. వారి అనుయాయులే ఆపని చేయించి ఆచార్యుల మీదికి పెట్టారేమోనని నా అనుమానం. యుద్ధపర్వంలో భీషణ సంగ్రామ వర్ణనలు చేసిన మాత్రమున, నిజ జీవితంలో ఆ విధముగా చేయించ గలరని లేదు కదా! శివానంద లహరి రచించిన ఆదిశంకరులు విష్ణు సహస్రనామ భాష్యం కూడా రచించారు. అద్వైత సిద్ధాంతం ప్రచారం చేసిన వారు ఏ విధమైనట్టి హింసనైనా ప్రోత్సహిస్తారని నేననుకోను."    "అంతే అయుంటుంది తాతగారూ! వేరెవరో చేసి ఆచార్యులని బాధ్యులని చేసి ఉండవచ్చును." ఎర్రన సాంత్వన పరచాడు తాతగారిని.    "సరే! ఆ సంగతి వదిలేద్దాం. గణపతి దేవ చక్రవర్తి తిక్కన సోమయాజి పాండిత్యానికి మెచ్చి, చీని చీనాంబరాలు, విలువైన ఆభరణాలు అత్యంత ప్రేమతో అందించాడు.   తిక్కన అదే ప్రేమతో అందుకున్నాడు కానీ మోము మాత్రం చింతా క్రాంత మయి ఉంది. పెదవులు నవ్వుతున్నాయి కానీ కన్నులలో అంతులేని విచారం. అది చూచిన చక్రవర్తికి తిక్కన సోమయాజి మనసులో ఏముందో.. ఆయన రాకకి కారణమేమో అర్ధమయింది. అయిననూ కవి హృదయం తెలిసి కొనవలెనని అడిగాడు,    "ఆచార్యా! మీరు సత్ప్రవర్తకులు. సత్య సంధులు. మీ విచారణకీ, మీ రాకకీ కారణమేమో చెప్పరా?"    "మహారాజా! మీకు వేగుల ద్వారా తెలిసియే యుండును. సూర్యవంశపు రాజు మనుమసిద్ధి. నెల్లూరు సీమను జన రంజకంగా పాలిస్తున్నాడు. రాజ్యం సర్వ సుభిక్షంగా ఉంది. దేశం మొత్తం మీద అక్కడే పచ్చని పంటలు గణనీయంగా పండుతున్నాయి. నా వంటి కవులను ప్రోత్సహించి ఆ చదువుల సరస్వతిని కూడ ఆరాధిస్తున్నాడా నృపుడు. అటువంటి రాజుని దగ్గర బంధువులే.. అయ్యన్న బయ్యన్నలు ఆ చోడ రాజుని పదవీ భ్రష్టుడిని చేసి అడవుల పాల్జేశారు. వారు చాలా బలము కలవారు. మనుమ సిద్ధి మహరాజుకి ఒక్క కాసు కూడా ఇవ్వకుండా హీనంగా చూస్తున్నారు.    ఆ అన్న దమ్ములను దండించి సిద్ధి మహరాజు నెల్లూరును వారికిప్పించు. ఇదియే నా రాకకు మూల కారణము." తిక్కనార్యుడు చక్రవర్తికి వార్త చేరవేసి, తన అభ్యర్ధనని వినిపించాడు.    "మీరు నా కానుకలు తీసుకొని వెడలండి. మీ వెనుకే మా సేనలు వచ్చి మీ రాజుకి పట్టం కడతాయి."    అన్నమాట నిలుపుకున్నాడు గణపతి దేవ చక్రవర్తి.    తిక్కనగారిని, మనుమసిద్ధి మామా అని పిలిచినందుకు అల్లుని మరల రాజుని చేశారు తిక్కనగారు.    కాకతీయుల సామంతుడిగా మనుమసిద్ధి నెల్లూరు సీమని ఏలాడు. ఆ సమయం లోనే తిక్కనగారి మహాభారత రచన సాగింది.  తమకు చేసిన సహాయానికి మారుగా నన్నయగారి భారతంతో సహా, తన పదిహేను పర్వాల ప్రతినీ గణపతిదేవ చక్రవర్తికి కానుకగా పంపాడు తిక్కనార్యుడు.    రుద్రమదేవి యుద్ధరంగంలో మరణించడం, ప్రతాపరుద్రుడు చక్రవర్తిగా పూర్తి బాధ్యత స్వీకరించడం.. తన రాజ్యాన్ని సుస్థిర పరచుకోవడంలో అతడు తల మునకలుగా మునిగి ఉన్న రాజ్య సంక్షోభంలో అది మన వద్దకు చేరింది.    ఆ మహా గ్రంధానికి ప్రతిని తయారు చెయ్యడం మనం తక్షణం చెయ్యవలసిన కర్తవ్యం."                                                                                  5 వ అధ్యాయము.    సూరన్న వస్తున్న మేనా ఇంటి వద్ద ఆగిన వెను వెంటనే, ఎదురు వెళ్లి కాళ్లు కడుగుకొనుటకు నీళ్లు ఇచ్చి, పొడి వస్త్రమును భుజము మీద నుంచుకుని, వినయంగా నిలిచాడు ఎర్రన.    ప్రసన్న వదనంతో పుత్రుని చూచి, పాద ప్రక్షాలన చేసికొని ఇంటి  లోనికి అడుగుపెట్టాడు సూరన.    ఆతృతగా వచ్చింది పోతమాంబ పెనిమిటి వద్దకు.. దేశంలో యుద్ధ వాతావరణం.. అది సామాన్య ప్రజల మీద ఎంత వరకు ప్రభావం చూపుతుందో!    ఎంత తొందర ఉన్ననూ, వచ్చిన వెంటనే ప్రశ్నలు సంధించడం అనుచితం. ముందుగా.. ఎంత ఆకలిగా ఉన్నారో ఏమో!    భోజనానంతరమే ఏది అడిగినా.. అప్పటి వరకూ ఆగ వలసిందే.    నవ్వుతూ పలుకరించి స్నానానికి అన్నీ ఏర్పరచింది.    ఆదరించే ఇల్లాలు ఉంటే ఎంతటి అలసటైననూ అరక్షణంలో మాయమై పోదూ! తైల మర్దనం చేసి వేడి వేడి నీటితో స్నానమాచరించి వచ్చాక సూరన్నకి ఎంతో ఉపశమనం కలిగింది.    దారిలో ఒక్క సారిగా లేచిన సుడిగాలితో శరీరమంతా దుమ్ము దుమ్ము కొట్టుకుని పోయింది. మేనాకి కట్టిన తెరలు కొంచెం కూడా ఆపలేకపోయాయి. అంతటి ఎదురు గాలిలో బోయీలు ఏ విధంగా తీసుకుని వచ్చారో.. అబ్బురమే!    సూరన్న నట్టింటిలోనికి వెళ్లే లోపుగా పేరమ్మ అంతా సిద్ధం చేసింది. లేత అరిటాకుల్లో తీరుగా పదార్ధములు అమర్చి ఉన్నాయి. ఎర్రపోతన, ఎర్రన తమ ఆసనాల్లో కూర్చుని ఉన్నారు. సూరన్న ఇరువురికీ మధ్యనున్న తన ఆసనం మీద కూర్చోగానే, పేరమ్మ విసిని కర్ర పట్టుకుని, ప్రక్కనే కూర్చుని విసర సాగింది.    పోతమాంబ వడ్డన ప్రారంభించింది. ఔపోసన పట్టాక, విస్తరి చుట్టూ నీళ్ళు చల్లి, ముమ్మారు తీర్థం తాగి.. అభికరించాక ఒక ముద్ద కళ్ళ కద్దుకుని పక్కన పెట్టి, పరబ్రహ్మ స్వరూపమైన అన్నమును మూడు మారులు కొద్ది కొద్దిగా నోట నుంచి.. భోజనానికి ఉపక్రమించారు ముగ్గురూ.    పొగలు కక్కుతున్న వరి అన్నంలో, పప్పు వేసుకుని, నేతితో కలిపి.. కమ్మని పులుసుతో తినడం ప్రారంభించారు ఎర్రపోతనాదులు.    కుమారుడు మూడు రోజుల నుండీ.. ఎక్కడెక్కడ ఏమి తిన్నాడో.. కడుపు నిండిందో లేదో! అతడికి ఇష్టమైన సొరకాయ పులుసులో పప్పు అన్నం నంజుకుని తింటుంటే ఆనందంగా చూస్తూ నెమ్మదిగా విసర సాగింది పేరమ్మ. రెండు రకముల కూరలు, ఊరగాయ, పెరుగు, గుడాన్నం, అరటి పండుతో తృప్తిగా భోజనం ముగించి లేచారు మూడు తరాల శాస్త్ర కోవిదులూ.    అత్తాకోడళ్లు కూడా భర్తలు తిన్న విస్తరి మీదనే మరొక అరిటాకు వేసుకుని, కావలసిన పదార్ధములు వడ్డించుకుని భుజించి లేచారు. వంటిల్లు, నట్టిల్లు శుభ్రం చేసుకుని.. వెండి పళ్లెరంలో తాంబూలం సరుకులన్నీ తీసుకుని, ముందటింట్లోకి నడిచి, విశ్రమిస్తున్న తండ్రీ కొడుకుల వద్దకు చేరారు.    ఆకులకు ఈనెలు తీస్తూ.. అప్పుడు అడిగింది పేరమ్మ,    "రాజుగారు పిలిపించిన వైనమేమి సూరన్నా?"    సూరన్న కొద్ది సేపు మౌనం దాల్చాడు. కర్పూర విడెం తీసుకుని నోటనుంచి నములుతూ, కన్నులు మూసి ఆలోచనలో పడ్డాడు. అందరూ ఆతృతగా అతని వంకే చూస్తున్నారు.    పోతమాంబ చేతిలోని వెండి గిన్నె కింద పడి దొర్లుకుంటూ ద్వారం వద్దకి వెళ్ళిపోయింది.    ఉలిక్కి పడి లేచాడు సూరన్న. ఒక్క నిమేషం ఎక్కడున్నాడో అర్ధం కాలేదు.    "అబ్బాయీ.. సూరనా!" మార్దవంగా పిలిచాడు ఎర్రపోత సూరి.    "ఏం జరిగింది? ప్రభువులు కుశలమే కదా!"    "కుశలమే. జరుగుతున్న రాజకీయ చరిత్ర తెలిపారు ప్రభువులు. కాకతీయ సామ్రాజ్యం సుస్థిరత నిలుపుకునే ప్రయత్నం లోనుంది తండ్రీ! ప్రతాప రుద్ర చక్రవర్తి దిగ్విజయ యాత్ర తూరుపు దిక్కున సఫల మయినట్లే. దక్షిణా పధమంతా కాకతీయ సామ్రాజ్యం విస్తరించింది. అంబదేవుని, యాదవ రాజును రుద్రమదేవి వీర మరణానంతరం తదుపరి యుద్ధంలోనే అణచి వేసి రాజ్యంలో ఉద్రిక్తతను తగ్గించారు.    ఆ పిదప చక్రవర్తి కాశీకి వెళ్ళి మణికర్ణికా ఘట్టంలో స్నాన మాచరించి విశ్వేశ్వరుని భజించాడు. గయకు కూడా నేగి అక్కడ ఏలికైన సుల్తాను పూజలందుకుని పెద్దలకు పిండప్రదానములు చేశాడు. వింధ్య దాటి గోదావరీ తీరం ప్రవేశించి అక్కడ పన్నెండ్రు క్రతువులు చేయించాడు. కాళేశ్వరమునకేగి ముక్తీశ్వరుని దర్శించాడు. కోటి సువర్ణముల దానం, రెండువేల మంది విప్రుల వివాహాలు చేయించాడు.    పన్నెండు సంవత్సరములు చక్రవర్తి దిగ్విజయ యాత్రలో నున్నప్పుడు, తమ్ముడు అన్నమదేవుడు రాజ్య పరిపాలన సాగించాడు. ప్రజల మన్ననలందుకున్నాడు.    తిరిగి వచ్చిన ప్రతాపరుద్రుడు జన రంజకంగా పాలన కొన సాగించాడు. తల్లి ముమ్మమ్మ దేవిని జాగరూకతతో చూసుకుంటూ ఉన్నాడు. పట్టపురాణి విశాలాక్షికి విరూపాక్షుడు, వీర భద్రుడు అను పుత్రులిరివురు కలిగారు.    డెబ్భయ్యేడు మంది నాయంకరులను తీర్చి దిద్ది, వారికి సామ్రాజ్యం లోని వివిధ భాగములను అప్పజెప్పాడు. అద్దంకినేలు మన ప్రభువు కూడ ఒక  సేనా నాయకుడే  కదా.."    "అవును.. మనం రెడ్డి నాయంకరంలోనే ఉన్నాం. అంతా సవ్యంగానే ఉంది కద.. మరి ఇప్పుడు వచ్చిన కష్టమేమి.. మనము చెయ్యవలసిని విధి ఏమి?"   "ఇప్పుడే అసలు కష్టం వచ్చింది. ఢిల్లీ సుల్తానులు దండెత్తి వస్తున్నారు. సేనా నాయకులందరునూ అప్రమత్తులై ఉండవలసిన సమయం. మన అద్దంకి ప్రభువులు కూడా సన్నిద్ధులవుతున్నారు."    పేరమ్మకి, పొత్తమ్మకీ గుండె జారినట్లయింది. అనుకున్నంతా అయింది.    సజల నయనాలతో తమ ఎర్రన్న కేసి చూశారు. యువకులందరినీ యుద్ధ సన్నిద్ధులను చెయ్యడానికే పిలిచారా? ఎర్రన సైన్యంలో చేరాలా? విప్ర యువకునికి అంతటి దేహ శక్తి సామర్ధ్యాలుండునా! ఒక సారి యుద్ధానికి వెడలితే తిరిగి రాగల అవకాశమెంత..    ఎర్రపోతన కూడా అదే భయ పడ్డాడు. అతను ఎర్రన గురించి కాక, సూరన గురించి ఆలోచించాడు. నడి వయసులో ఉన్నవాడు. శరీర ధారుఢ్యము ఉన్నవాడు. రాజాజ్ఞ పాటించక తప్పదు. వెళ్లినా మరణమే.. వెళ్లకున్ననూ మరణమే.    ఇంకా యుద్ధానికి వెళితే, ఆయుర్దాయముంటే బ్రతికి బట్ట కట్ట వచ్చును.    ఒక్క ఎర్రనకి తప్ప అందరికీ మొహాలు ఝడి వాన కురిసే ముందుండే ఆకాశంలాగ నల్లగా అయిపోయాయి.    ఎర్రన ఏ కర్తవ్య మైననూ నెరవేర్చుటకు సిద్ధముగనే ఉన్నాడు.    "ఏమయింది.. అందరూ ఎందులకు అలాగనున్నారు?" మాట్లాడడం ఆపిన సూరన్న అందరినీ ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు,    "మరి.. మరి, నువ్వు యుద్ధంలోకి వెళ్ళ వలెనా?" ఎర్రపోతన.. వణుకుతున్న కంఠంతో అడిగాడు.    "లేక, ఎర్రన వెళ్ళాలా..." పేరమ్మ..    ఏ క్షణంలో నైనా కన్నులు జల ప్రవాహాలగుటకు సిద్ధంగా ఉన్నాయి. పోతమాంబది కూడా అదే పరిస్థితి.    సూరన్నకి తమ వారి ఆదుర్దా అర్ధమయింది.. ఏం భయం లేదన్నట్లు తల ఊపుతూ అన్నాడు,   "లేదమ్మా! ఎవ్వరం యుద్ధానికి వెళ్ల నక్కరలేదు. సుశిక్షితులైన సైనికులు పది వేల మంది పైగా ఉన్నారు మన నాయకుని వద్ద. గజ బలం అశ్వ బలం సరే సరి.. కాకతీయ సామ్రాజ్యంలో ఓరుగల్లు తరువాత మనదే పెద్దది. నన్ను పిలిచిన కారణం వేరు.. ప్రభువు యుద్ధానికి వెడల వలసి వస్తే.. వస్తుంది తప్పని సరిగా.. నన్ను ఇక్కడి పాలన చూసుకోమన్నారు."    "అంతేనా.."    గట్టిగా నిట్టూర్చారు అందరూ.    "అయితే అప్పుడు తరచుగా అద్దంకి వెళ్ళవలసి వస్తుంది. అంతే.."        సూరన్న అద్దంకి వెళ్ళి వచ్చిన నెలలోపు గనే అందరూ భయపడిన రోజు రానే వచ్చింది. చక్రవర్తి వద్ద నుంచి వేగులు వచ్చారు... సూరన్నకి రాజుగారి నుండి కబురు వచ్చింది.    అద్దంకి నాయకుడు అత్యవసరంగా సభ ఏర్పాటు చేసి రాజకీయ పరిస్థితులను వివరించాడు.    "పైకి కనిపించక పోయిననూ, సామ్రాజ్యమంతా అంతర్లీనంగా యుద్ధ వాతావరణం. ఎక్కడ చూసినా భీతి.. భయం. ఇప్పటి శతృవులు.. ముష్కురుల యుద్ధనీతి వేరే విధంగా ఉంటుంది. వారికి స్త్రీలు, పసివారు, వృద్ధులు అని లేదు..    రుద్రమదేవి మరణానంతరం సైన్యాన్ని బలపరచిన ప్రతాపరుద్ర చక్రవర్తి వ్యూహాత్మకంగా శత్రువులను అణచి వేశాడు. చక్రవర్తి పెంపొందించిన నాయంకర విధానం మంచి ఫలితాల నిచ్చింది. నాయకుల సైన్యానికి మంచి శిక్షణ నిప్పించాడు. సైన్యాన్ని మూడు భాగాలుగా విభజించాడు.    మూడు దిశలలో నడిపించాడు.    ఒకటి అంబదేవుని పైకి, రెండవది నెల్లూరి పైకి, మూడవది సేవుణ రాజ్యం పైకి.    ఇందులూరి అన్నయ్య త్రిపురాంతకం మీదికి దాడి చేసి అంబదేవుడిని తరిమి వేశాడు.    అడిదము మల్లు నెల్లూరు పై దండ యాత్ర చేసి అక్కడ మనుమ గండ భూపాలుని హత మార్చాడు.    పశ్చిమాన గోన గన్నారెడ్డి, విటలుడు యాదవ రాజు అధీనంలో నున్న ఆదవాని, తుంబలము కోటలు పట్టుకుని రాయచూరు దుర్గము మీదికి దాడి చేశారు. కృష్ణా తుంగభద్రల మధ్య నున్న దేశాన్నంతనూ స్వాధీనంలోకి తీసుకున్నారు. సేవుణ రాజు దురాక్రమము నణచి రాజ్యాన్ని సుస్థిరం చేసి కొన్న ప్రతాపరుద్రుడు.. పట్టుమని ఐదేళ్లు కూడా శాంతి యుతంగా రాజ్యాన్ని ఏల లేకపోయాడు.    మూడు ప్రక్కలా శతృవుల మదమడచిన చక్రవర్తి నాల్గవ ప్రక్క.. ఉత్తర దేశం నుంచి ఎదురైన ముప్పును ఎదుర్కొన వలసి వస్తోంది. అది తురుష్కుల వద్దనుండి.    ఢిల్లీ వారు మన సామ్రాజ్యం పాడి పంటలతో కళకళ లాడుతుంటే చూడ లేకపోతున్నారు. అందులో హిందూ ధర్మం నలు ప్రక్కలా విలసిల్లుతోంది. దేవాలయాల పునరుద్ధరణ నిరాటంకంగా సాగుతోంది. కొత్త ఆలయాలు నిర్మిస్తున్నారు.    ఓరుగల్లు కోట సుస్థిర మౌతోంది. అది కంటకింపుగా ఉంది.    పరాయి దేశం వారిని, పరాయి మతస్థులని అణచడానికి మన చక్రవర్తి కంకణం కట్టుకున్నారు. మన సైన్యం కూడా తరలి రావాలని ఆదేశించారు."    సభ అంతా నిశ్శబ్దమైపోయింది.    "అనగా.. ప్రభువులు కూడనూ.." సూరన్న లేచాడు.    "అవును సూరనార్యా! మేము కూడా సన్నద్ధులమవుతున్నాము.. మన గజ బలం మీది నమ్మకంతో. అందరం ఐకమత్యంగా పోరాడితేనే ప్రాచ్యుల దాడిని ఆపగలుగుతాము."    "మరి ఇచ్చట పాలన.."    "అందువలననే మిమ్మందరినీ సమావేశపరచాను. ఇచ్చటి కార్యక్రమాలు చూసుకొనుటలో మహామంత్రికి మీరు చేయూత నియ్యవలె. సేనా నాయకులంతా సైన్యాన్ని సిద్ధ పరచండి. ఆచార్యా! ఆడువారిని, పసివారిని, వృద్ధులను చూచుకునే బాధ్యత మీదే.    శ్రేష్ఠి గారూ! మీరు ఆహార పదార్ధాలను భద్ర పరచమని మీ వారందరికీ చెప్పండి. సరిహద్దుకు దూరంలో ఉన్నాము కనుక మనకు అంత చేటు రాకపోవచ్చు. అయిననూ అవసరం అయినప్పుడు ప్రక్క వారికి సహాయము చెయ్యవలసి వస్తుంది.    వీలు చిక్కింది కదా అని అధిక ద్రవ్యమునకు అమ్మవద్దు. ఇక్కడ ఇద్దరు దండ నాధులను ఉంచి వెళ్ళుతున్నాను. మేము తిరిగి వచ్చే వరకూ అద్దంకి సీమ మీ చేతనుంటుంది. అందరూ జాగరూకతతో ఉండండి."    అద్దంకి ప్రభువు ఓరుగల్లు నుండి చక్రవర్తి వర్తమానమునకై ఎదురు చూస్తూ ఉన్నాడు.                                       ……… ( ఇంకా వుంది) ………..         .... మంథా భానుమతి