‘‘అజ్ఞాత కులశీలశ్య….” 20వ భాగం

  ‘‘అజ్ఞాత కులశీలశ్య….” 20వ భాగం      “మిత్రమా! అదిగో కాంచీ పురం. చాలా పురాతనమైన పట్టణం. మహా భారత కాలం నుంచీ ఉందని చెప్తారు. ఇక్కడ ఉన్న ఆలయాలు బహు ప్రసిద్ధాలు. మన విడిది ఏర్పాటు అయిందా? ఇంతకీ.. ఇంత దూరం ఎందుకొచ్చామో?” మాధవుడు, కళ్యాణిని రాకుమారుని అశ్వం పక్కగా నడిపిస్తూ అడిగాడు.                                                              “అవును మిత్రమా! ‘పుష్పేషు జాతి పురుషేషు విష్ణు, నారీషు రంభ, నగరేషు కంచి’ అని పేరుపొందింది ఈ పట్టణం. మోక్ష విద్యకు మూల పీఠం. అద్వైతమునకు ఆధారం. ఆదిశంకరులు స్థాపించిన కామకోటి పీఠ స్థానం. వరదరాజస్వామిని ఎప్పుడెప్పుడు సేవిస్తానా అని ఉర్రూతలూగుతోంది నా మనసు.”   మాధవుడు మాత్రం అన్యమనస్కంగానే ఉన్నాడు.   “కంచికెందుకు…”   ఇంక మాధవుని సందేహానికి సమాధానం చెప్ప వలసిందే అనుకున్నాడు పురుషోత్తమ దేవుడు.   పకపకా నవ్వాడు.   “విజయనగర రాజు, దేవరాయల సామంతుడైన కాంచీపుర రాజునకు చక్కని చుక్క అయిన కుమార్తె ఉంది మిత్రమా! పేరు పద్మావతి. రుక్మిణీ దేవి, శ్రీకృష్ణుని గురించి విని, ఆయన చిత్ర పటాన్ని చూసి వరించి నట్లు గానే పద్మావతి కూడా..” చిరునవ్వుతో.. చెప్పబోయాడు.   “రాకుమారి రాయబారం పంపిందా మిత్రమా?” మాధవుడు ఆత్రంగా అడిగాడు.   “ఇంకా లేదు. కానీ చారుల వార్త అందుకుని తండ్రిగారు చూసి రమ్మన్నారు. ఈ వివాహం జరుగుతే, రాజకీయంగా కూడా ఉపయోగం ఉంటుందనేది వారి అభిప్రాయం.”   “రాకుమారికి ఏవిధంగా వార్త పంపుతారు?”   మాధవుడి అయోమయంచూస్తుంటే మరింత ముచ్చట కలిగింది రాకుమారుడికి.   “మరీ ఇంత అమాయకుడవేమయ్యా మిత్రమా? ఏ చారుల ద్వారా వార్త తెలిసిందో.. వారి సహకారం తోనే.”   నవ్వుతూ సిగ్గు పడ్డాడు మాధవుడు.   “రాకుమారి, రేపు ఉద్యానవనానికి వస్తుంది. అందుకే ఆ దిశలో ఉన్న గృహంలో వసతి ఏర్పాటవుతుంది.. నా సంగతి సరే.. మరి నీ ప్రణయ విశేషాలు చెప్పవా?”   “నాకేమి ప్రణయం మిత్రమా? కోటలో వలె మాకు ప్రణయ సందేశాలుండవు. మా ఇళ్లల్లో సాధారణంగా పెద్దలే చూసి పరిణయం నిశ్చయం చేస్తారు. మాకు ఇష్టమయిన తరువాతనే అనుకోండి.”   “అప్పటి వరకూ వలపు కలుగ కుండా ఆగుతుందా మిత్రమా?” పురుషోత్తముడు మిత్రుని మనసెరిగినట్లు అన్నాడు..      కం.      “చూసిన వేళనట నదియె                వేసిన నొకవలపు నమ్ము పేర్మిని బాగా                నా సిన దాని మరులుగొని                భాసిలు కన్నులును మోము బాగుగను సఖా!     ఎర్రబడిన నీ బుగ్గలే చెపుతున్నాయి.. వలపుల చెలి దాగుందని. ఎవరో చెప్పు మిత్రమా! హంస రాయబారం నడుపుతాను.”   “అబ్బెబ్బే.. ఎవరూ లేరు మిత్రమా! నిజంగానే..” మాధవుని గొంతులో వచ్చిన వణుకు అతడు నిజం చెప్పట్లేదన్న సంగతి చెప్పింది. అయినా రెట్టించలేదు పురుషోత్తముడు. ముందుగా తను వచ్చిన పని పూర్తయితే, పిదప మిత్రుని సంగతి చూడవచ్చు.   కాదంబరీ దేవిని చూసినప్పుడు మాధవుని మోములో కానిపించిన వెలుగు మర్చిపోలేదతడు. కానీ కులం? తండ్రిగారూ, సోదరీ ఏమనెదరో..   రాజకీయ ప్రయోజనం కలిగించే వరుడెవరూ సోదరికి సరైనవాడు.. కనిపించుట లేదు. క్షత్రియుడు కాదనే కానీ.. మాధవుడు అన్ని విధాలా సరైన జోడు. ఏదో ఒక రాజ్యానికి పరీక్ష గా నియమిస్తే సరి పోతుంది.   తన ఆలోచనలకి తనకే నవ్వు వచ్చింది పురుషోత్తమ దేవునికి. ఇవన్నీ పెద్దలు చూసుకోవలసిన విషయములు. ముందుగా తన వివాహం సానుకూలమైతే.. అప్పుడు చూసుకోవచ్చు.   “ప్రభూ!” సేనాని పిలిచాడు.   ఆలోచనల్లోంచి బైటపడ్డాడు రాకుమారుడు.   “తమకు రాజోద్యానవనానికి ఆనుకుని ఉన్న వసతి గృహంలో ఏర్పాటు చేశాము ప్రభూ. అక్కడికి వరదరాజ స్వామి ఆలయం చాలా దగ్గర. అర్ఘ్య సమర్పణకి నది కూడా దగ్గర లోనే ఉంది.”   పురుషోత్తముడు, మాధవుని చూసి చిరునవ్వు నవ్వాడు.   అందరూ వసతిగృహానికి బయలు దేరారు.   సేనాని వర్ణించినట్లుగానే ఉంది.. ఒక చిన్న రాజ ప్రాసాదం లాగా ఉంది.   “విజయనగర రాజులు వచ్చినప్పుడు వారితో వచ్చిన మంత్రి సామంతులు ఇచ్చటనే విడిది చేస్తారు ప్రభూ. అన్ని సదుపాయాలూ ఉన్నాయి. ఇచ్చ వచ్చిన రోజులుండ వచ్చునిచట. భోజనం కూడా చాలా రుచిగా ఉంటుంది.”   గుర్రాలకి కూడా మంచి శాల ఉంది.   “ఈ రోజుకి విశ్రాంతి తీసుకుందాము మాధవా! రేపు ప్రాతఃకాలమున లేచి కర్తవ్యం ఆలోచిద్దాము.”   “అశ్వాలని అప్పజెప్పి వస్తాను రాకుమారా! సాయం సంధ్యవార్చుటకు ఆలయ కోనేటికి వెళ్దాము. చాలా ప్రశాంతంగా ఉంటుదని చెప్తున్నారు సేనాని.” మాధవుడు గృహము యజమానితో మాట్లాడి, గుర్రాలని తీసుకుని వెళ్లాడు.                                   …………………..                                                              వరదరాజస్వామి ఆలయం.. చోళ రాజులు 11వ శతాబ్దంలో కట్టించిన గుడి, 108 వైష్ణవ ఆలయాలలో ఒకటి. విస్తారమైన 23 ఎకరాల ఆవరణలో అనేక ఆలయాల సముదాయం కట్టించారు చోళ చక్రవర్తులు.. వైష్ణవ గురువు రామానుజాచార్యులు ఈ గుడిలో నివసించారుట.   కోనేటిలో మునుగుతూ అన్నాడు మాధవుడు.. “దీనిని ఆనంద సరోవరం అంటారుట. ఈ కోనేటి అంతర్భాగాన అత్తి కర్రతో చేసిన విగ్రహాలుంటాయి. నలభై సంవత్సరాల కొకసారి ఆ దేవతా మూర్తులను వెలికి తీసి భక్తుల దర్శనానికి అనుమతిస్తారుట.”   “చాలా హాయిగా ఉంది మిత్రమా! నువ్వు చెప్పింది నిజమే. ఇంత విశాలమైన ఆవరణ ఉన్న ఆలయాన్ని చూడడం ఇదే ప్రధమం. ఈ ప్రశాంతత మనసులో చాలా కాలం అలా నిలిచి పోతుంది.”   వరదరాజస్వామి దర్శనం అయిన పిదప ఆవరణంతా తిరిగి తమ వసతికి చేరుకున్నారు.   తమిళ వంటకాలతో భోజనం.. సాంబారు, తైరు సాదం, కొబ్బరన్నం, మిరియాల రసం.. పూర్తిగా వేరు రుచులతో! కమ్మగా ఉన్నాయి. కడుపు నిండుగా తిని విశ్రమించారు. వారం రోజుల నుంచీ ప్రయాణంలోనే ఉన్నారేమో.. కంటి నిండుగా నిదుర పోయారు.     “మిత్రమా! ఈ ఉదయం వేగవతి నది వద్దకు వెళ్దామా, ప్రాతః సంధ్య వార్చుటకు? ఎక్కడైనా నదీతీరాన్ని మించిన సలిల సేవనం ఉండదు కదా! అశ్వముల నధిరోహించి వెళ్తే పట్టణం నలుమూలల చూసి రావచ్చును. ఆ తరువాత ఉద్యాన వనమునకు మీరు వెళ్ల వచ్చును. నేను వీధులన్నీ పర్యటించి వచ్చెదను.” మాధవుడు పురుషోత్తమ దేవుని వద్దకు వచ్చి అన్నాడు.   మిత్రులిరువురూ సూర్యోదయాత్పూర్వమే నదికి బయలు దేరారు. పక్షుల కిలకిలారావాలు తప్ప మనుషుల అలికిడి లేదెక్కడా.     అశ్వాలని చెట్లకి కట్టేసి, మార్చుకోబోయే దుస్తులను ఏటిగట్టున పెట్టి.. నీళ్లలో దిగబోతూ అన్నాడు మాధవుడు. రాకుమారుడు కూడా వెళ్లబోయాడు.   “ఆగండి రాకుమారా! నదిలోనికి దిగవద్దు.” ఆందోళనగా ఒక కంఠం కొద్ది దూరం నుంచి వినిపించింది.   ఉలిక్కిపడి ధ్వని వినవచ్చిన దిక్కుకు చూశారు.   పురుషోత్తమదేవుడు ఆందోళనగా ఆలకించాడు.   ఈ దేశంలో తనని రాకుమారునిగా గుర్తించి, సంబోధించడమా? ఇంక తన రాకలోని రహస్యం? మాధవుడు జాగ్లత్తగా వెనుతిరిగి, రాకుమారునికి రక్షగా నిలుచున్నాడు. రెండంగల్లో, దుస్తులలో దాగిన కరవాలాన్ని తియ్యగలిగే విధంగా.   “మిత్రులమే రాకుమారా! సంశయం వద్దు..” వృక్షం చాటునుండి వినవచ్చిందొక స్త్రీ స్వరం. వెంటనే, ముగ్గురు స్త్రీలు గుర్రాల మీద వచ్చి ఎదురుగా నిలబెట్టారు అశ్వాలని.   మధ్యలో మెరుపుతీగవలె నున్న యువతి రాజకుమార్తె వలె ఉంది. ఆ ఠీవీ, ఆహార్యం, మోములోని ప్రసన్నత, కళ.. చెప్పక చెపుతున్నాయి.   మిగిలిన ఇద్దరూ చెలికత్తెలని తెలిసి పోతోంది.   “మేము దేశాటన చేయు బాటసారులం. నదిలో స్నాన మాచరించి అర్ఘ్య సమర్పణ చేయుదమని..” మాధవుని మాట పూర్తి కాకుండానే సమాధానం వచ్చింది.   “తమరు పురుషోత్తమదేవులనీ, గజపతుల రాకుమారులని, కాబోయే సార్వభౌములనీ మాకు తెలుసు రాకుమారా! మీరు రానున్నారని వార్త కూడా మా వేగులు తెచ్చారు. మిమ్ములను వెతుక్కుంటూనే వచ్చాము. ఈ నదిలో మొసళ్లు చాలా ఉన్నాయి. అందుకనే మిమ్మల్ని దిగవద్దన్నాము. పట్టణంలో కోనేరులు, సెలయేరులు చాలా ఉన్నాయి. ఏకాంబరేశ్వరుని ఆలయ తటాకం చాలా పెద్దది. అందులోనికి, వేగవతీ నది నుంచే నీరు ప్రవహిస్తుంది.” ఒక చెలికత్తె వివరించింది.   “మీకు ధన్యవాదాలమ్మా! ఇంతకీ మీ పరిచయం..” మాధవుడే సంభాషణ జరుపుతున్నాడు.   “మీరెవరో చెప్పనేలేదు స్వామీ?” ఇంకొక పరిచారిక అడిగింది.   “నేనెవరో తెలుసునన్నారు కదా! ఇతడు మా మంత్రి, మాధవ మహాపాత్రులు.” పురుషోత్తమ దేవుడు జవాబిచ్చాడు.   మాధవుడు ఉలిక్కి పడ్డాడు.. మంత్రి.. తనా!   మిత్రుని వంక చూశాడు. పురుషోత్తముడు అవునన్నట్లుగా తల ఊపాడు, చిరునవ్వుతో.   తన మీద ఇంతటి బాధ్యత.. నిర్వహించగలడా? దీని కొరకేనా తను కళింగకోటలో ప్రవేశించింది?   అయోమయంగా చాశాడు.   “మా వివరాలు సేకరించినపుడు, మీరెవరో కూడా చెప్తే..” తెలుస్తూనే ఉంది, చిత్రపటం చూడకపోయినా.. అయినా నిర్ధారణ అవకుండా నిర్ణయానికి రాలేరు కదా!   “మీరు గ్రహించినట్లుగానే.. వీరు కాంచీపుర రాకుమారి పద్మావతీ దేవి. అంద చందాలలో, విద్యలలో తనకి తనే సాటి.” కించిత్ గర్వంగా చెప్పింది చెలికత్తె.                                      …………………..   ......మంథా భానుమతి

‘‘అజ్ఞాత కులశీలశ్య….” 19వ భాగం

                        ‘‘అజ్ఞాత కులశీలశ్య….” 19వ భాగం    “మాధవా! మనం వేగిరం ప్రాతః కాల సంధ్యాదులు పూర్తి చేసుకుని, చక్కని దుస్తులు, ఉత్తరీయం ధరించి తయారవాలి. ఇవేళ ఒక విశిష్ట వ్యక్తిని కలువ బోతున్నాము.” తొలి కోడి కూసిన వెను వెంటనే మాధవుడిని నిదుర లేపాడు పురుషోత్తముడు.    మాధవుడు, తను చేయవలసిన పని రాకుమారుడు చేస్తున్నందుకు బిడియ పడుతూ లేచి మిత్రునికి అభివాదం చేసి, ఇరువురి పడక బట్టలనూ సరి చేసి, వసతి గృహంలో పెట్టి వచ్చాడు.   బావి వద్దకేగి కాలకృత్యములు తీర్చుకుని ఏటి ఒడ్డునకేగారు మిత్రులిరువురూ.   పచ్చపచ్చని వరిచేల అందాలనీ, భానోదయానికి స్వాగతం పలుకుతూ ఎర్రని తివాచీ పరచినట్లున్న ఆకాశాన్నీ చూస్తూ పరవశమౌతూ, ఆదిత్యహృదయం చదవసాగాడు మాధవుడు. అది గౌతమి నేర్పిన అలవాటు. స్నానం పూర్తి అవుతూనే అసంకల్పితంగా “రశ్మిమంతం సముద్యంతం..” అని మొదలు పెట్టేస్తాడు.   పురుషోత్తముడు ధ్యానం చేస్తున్నాడు.   సూర్యోదయం అవుతుండగానే ప్రత్యక్ష నారాయణ మూర్తికి అర్ఘ్యం అర్పణ చేసి, దుస్తులు మార్చుకుని, ఆలయానికి వెళ్లి, శ్రీరాముని దర్శనం చేసుకున్నారు.   జగన్నాధుని భక్తుడైన పురుషోత్తముడు విష్ణు ఆలయం చూస్తే మైమరచి పోతాడు.   ఆ దిప్యమంగళ విగ్రహాన్ని చూసి తరించి ఆలయం బయటికి రాగానే కనిపించిందొక సుందర దృశ్యం.   చెట్ల ఆకుల మధ్యలోనుంచి సూర్యకిరణాలు ఆలయ ప్రాంగణ మంతా పరుచుకున్నాయి.   ఆలయమంతా , తెల్లవారకుండానే భక్తురాళ్లు వచ్చి తీర్చిదిద్దిన రంగవల్లులతో కళకళలాడుతోంది.   నేలరాలిన పొగడపూలని కూడా రంగవల్లుల్లాగ తీరుగా, అందంగా దిద్దారు వనితలు. వాటినుంచి వచ్చే తేలికైన పరిమళం ఆహ్లాదాన్ని కలిగిస్తోంది.   వసతి గృహ యజమాని చెప్పినట్లుగానే అక్కడ, చెట్టు కిందనున్న అరుగు మీద ఆసక్తి కరమైన సాహిత్య చర్చ సాగుతోంది.                           సీ.   మబ్బు ల చాటున మఱుగున దాగిన                                        వెలుగు ఱేడు యతడు వేగ రాగ                                వేద పండితులంత వీధరుగున చేరి                                        పఠనము సేయగ పనస లన్ని                                కవిసార్వభౌముడు గంగాధరుడికిని                                        యభిషేకము సలిపి యనువు నెంతొ                                కొలువుతీరె నపుడె కోవెల నందున                                        సాహిత్య చర్చలే సలుప గాను                       తే.గీ.   చేరి కవులు, కోవిదులంత చేరికగను                               మారు పలుకక కవిరాజు మాట లన్ని                               కోరి వినుచు తామంతయు కూర్మి తోను                               భూరి పదములే కదయని పొగుడు నంత.         రాగయుక్తంగా వినవస్తున్న సీస పద్యాల సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ, పరిసరాలను పరికించడం మాని అటు పక్కగా చూశాడు మాధవుడు.   సంభ్రమంగా కన్నులు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయాడు ఐదు క్షణాలు.     “మిత్రమా! శ్రీనాధుల వారు.” మాధవుడు చిన్నగా అరిచాడు ఉద్వేగంతో.   “నీకెలా ఎరుక మిత్రమా?” ఆశ్చర్యపోతూ అడిగాడు పురుషోత్తముడు. తాను మిత్రుడిని తక్కువగా అంచనా వేశాడు.. అతడికి చాలా విషయాలు తెలుసును.   “వారి చిత్రపటం నావద్ద ఉన్నది రాకుమారా! ఒక సారి కాశీ యాత్ర కేగుతున్న పండితులొకరు నాకు ఇచ్చారు. తేలికగా గుర్తుపట్టేశాను.”                                                మిత్రునికి శ్రీనాధ కవీంద్రుని చూపించి ఆశ్చర్యాంబుధిలో ఓలలాడిద్దామని సంబర పడిన పురుషోత్తమునికి కించిత్ ఆశా భంగం కలిగినా, మాధవుని గ్రహణ శక్తికి ముచ్చట పడకుండా ఉండలేక పోయాడు.   “కొద్దిగా చిక్కారు, చిత్రపటం కన్నా.. వయో భారంతో. అయినా ఆ ఠీవి, ఆ గాంభీర్యం వేరెవరికుంటాయి చెప్పండి. తారల మధ్య చంద్రునిలా వెలిగి పోతున్నారు పండితుల మధ్య. వీరినేనా చూపిస్తానన్నారు? అందుకేనా మనం ఇచ్చట మజిలీ చేశాము..” సంభ్రమానందాలతో ఏక బిగిన ముచ్చటిస్తున్న మాధవుని చిరునవ్వుతో వారించాడు పురుషత్తమ దేవుడు.   “నాకు కూడా తెలియదు మిత్రమా! వారు దేశాటనలో ఉన్నారని మాత్రమే తెలుసు. గృహ యజమాని నిన్న రాత్రి చెప్పగానే నాకు కూడా విస్మయం కలిగింది. ఈరోజు వారిని కలవడానికనే ఇక్కడ ఆగుదామన్నాను. కలుసుకున్నాక నీ సంతోషాన్ని చూద్దామనుకున్నాను. ఈలోగానే..”   “ధన్యుడిని మిత్రమా! ఇంత భాగ్యం కలిగించావు. ఎప్పుడెప్పుడు వారిని కలిసి నాలుగు మాటలు వారి నోట విందామా అని ఆతృతగా ఉంది.” మాధవుడు ముకుళిత హస్తాలతో అన్నాడు.   “మనం కూడా వెళ్లి వెనుక వరుసలో కూర్చుని వీక్షిద్దాం.” పురుషోత్తముడు దారి తీశాడు.   మాధవుడు ఏదో లోకంలో ఉన్నట్లుగా మిత్రుడిని అనుసరించాడు. అతడికి ఇంకా నమ్య శక్యంగా లేదు. తన చిరకాల వాంఛ నెరవేర బోతోందా? శ్రీనాధ మహాకవిని ప్రత్యక్షంగా చూస్తున్నాడా?   కళ్లు మాటి మాటికి చెమరుస్తున్నాయి. తనతో మాట్లాడుతారో లేదో.. చూడగానే ఏమనాలి?   వెనుక వరుసలో గురువుగారి మోము కనులకు బాగా ఆనేలాగ కూర్చున్నారు. తన్మయత్వంతో వీక్షిస్తూ కూర్చున్నాడు మాధవుడు. కలలో లాగ వినిపిస్తున్నాయి వారి పలుకులు.   “ప్రౌఢ దేవ రాయల కొలువులో, డిండిమభట్టుతో వాదన చేయు సమయంలో మీకు ఏమనిపించింది మహా కవీ?” ఒక పండితుడు కుతూహలం తో అడిగాడు.   “శాస్త్రాలన్నీ క్షుణ్ణంగా తెలిసి నప్పడు, రచించిన కావ్యాలలో ఏ దోషమూ లేదన్న ధీమా ఉన్నపుడు ధైర్యంగా ఉంటుంది పండిత వర్యా! మన కున్నది అంతా సరస్వతీ కటాక్షం, ఆ పరమేశ్వరుని అనుగ్రహం అనుకున్నపుడు ఏ ఆందోళనా ఉండదు. గౌడ డిండిమభట్టులవారు ఉద్దండ పండితులు. వారితో వాదించ గలిగే అవకాశం దొరకడమే నాకు అపురూపం.” శ్రీనాధుని పలుకులలో ఎంతో వినయం.   “సెలవు కవీశ్వరా! మరల రేపు సమావేశ మవుదాము.” ఒకాయన సైగ అందుకుని, పండితులు లేచారు.   “చెప్పలేను పండితులారా! రేపే శ్రీశైలం పయనమవుదామనుకుంటున్నాము, ఆ మల్లిఖార్జునుని ఆనతి కలుగుతే..” శ్రీనాధుని మాటలకు విచారంగా చూశారందరూ. ఒక్కొక్కరే వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి, భారమైన హృదయాలతో అక్కడి నుంచి కదిలారు.   అందరూ కదలి వెళ్లాక, వెనుక వరుసలో కూర్చున్న మిత్రులిరువురూ లేచారు.   ఇద్దరినీ దగ్గరగా రమ్మని సైగ చేశాడు శ్రీనాధుడు. దగ్గరగా వెళ్లి పాదాభివందనం చేశారు. చెరో పక్కనా కూర్చోమని చెప్పి, పరీక్షగా మొహాల్లోకి చూశాడు కవీంద్రుడు.   “ఇంతవరకూ మిమ్ములను ఇక్కడ చూడలేదు. ఎవరు నాయనా?” కొద్దిగా వణుకుతున్నట్లున్న కంఠం.. అయినా ఝంకారం తగ్గ లేదు.   “బాటసారులం కవి సార్వభౌమా! కళింగ నుంచి కాంచీపురం వెళ్తూ మధ్యలో మజిలీ చేశాము.” పురుషోత్తముడు జవాబిచ్చాడు.   “కళింగ దేశమా? మీరు బాట సారుల వలె లేరే? కార్యార్ధులై సాగుతున్నట్లున్నారు. మోముల్లో రాచకళ ఉట్టి పడుతోంది. ఈ కుర్రవాడు వంగ దేశస్తుని వలే ఉన్నాడు. గజపతులు రాజమహేంద్రవరం స్వాధీన పరచుకున్నారా?” శ్రీనాధులవారు ఇంకా ఏదో అడుగుతుంటే..   అప్పుడని పించింది పురుషోత్తమ దేవ, మాధవులిద్దరికీ..   అనవసరంగా ఈ మహానుభావుని కదిలించామా అని.. తమ పర్యాటన రహస్యం బట్ట బయలైపోతుందేమో అని..   మ్లాన వదనాలతో సమాధానాలు ఇవ్వ బోయారు.   కానీ.. ఆ మహాకవి..అర్ధ శతాబ్దంగా రాజకీయానుభవాలతో తలపండిన వాడు.. ఆ మాత్రం గ్రహించలేడా! మాట మార్చేశాడు.   “ఎవరైతేనేమిలే నాయనలారా! తెలుగు సాహిత్యం మీద మీ అభిరుచి శ్లాఘనీయం. పరాయి భాష వారై ఉండీ తెలుగు కవిని గుర్తు పెట్టుకున్నారంటే, నన్ను చూడడానికి వచ్చారంటే.. అభినందనలు అంజేయాలిసిందే. రాజకీయాలకీ, సాహిత్యానికీ ముడి వెయ్య కూడదు. గజపతులకీ, రెడ్డి రాజులకీ, విజయనగర రాజులకీ, రాచకొండ వారికీ, బహమనీ సుల్తానులకూ జరిగే నిరంతర పోరులకూ మన తెలుగు సాహితీ మాతకీ  సంబంధం లేదు..” ఆయాసంతో ఆగి, పక్కనున్న రాగి పాత్రతో నీరు కంఠంలో పోసుకుని గడగడా తాగారు శ్రీనాధ కవి.   “స్వామీ!” కంగారుగా లేవబోయాడు మాధవుడు.   ఆందోళన వలదన్నట్లు చెయ్యి అడ్డంగా ఊపి గంభీర కంఠంతో చెప్ప సాగాడు శ్రీనాధుడు.   “నేనొక సారి కొండవీటి ప్రభువు రాయబారిగా రాచకొండకు బయలు దేరాను. ఆ సమయంలో రెండు రాజ్యాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. నేను విజయనగరంలో ఉన్నాను. మా ప్రభువు అస్వస్థులై ఉన్నారు కూడాను. కృష్ణలంకలో, నది ఒడ్డునకు మా కోమటి వేమ ప్రభువు కులదైవం కటారిని (కత్తి) తీసుకు వెళ్లారు మా సైనికులు, ప్రక్షాళన చేయుటకు.. ఆ కటారిని, మా సైనికులనోడించి,  రాచకొండ సైనికులు తీసుకొని పోయారు. సింగభూపాలుని మెప్పించి ఆ కటారిని తిరిగి తేవలసిన బాధ్యత నాకు ఇచ్చారు ప్రభువు. ” శ్రీనాధుని గొంతు గద్గదమయింది..   పాత జ్ఞాపకాలు ముసురు కోగా!   ఈ విషయాలు శ్రోతలిద్దరికీ తెలియనివే.. అవి జరిగినప్పుడు చిన్న పిల్లలు వారు. గురుకులంలో విద్యాభ్యాసం జరుగుతున్న కాలం. రాజకీయాలు పట్టించుకునే సమయం లేదు. అర్ధం చేసుకునే వయసు కూడా లేదు.   “నేను తిరిగి రాగానే, విషయం తెలిసింది. అమాత్యుల వారికి చెప్పి బయలు దేరాము.. నేనూ, దుగ్గనా. దుగ్గన అంటే మా బావమరిది. మంచి కవి కూడా. ఆ సమయంలో రాచకొండనేలే సింగ భూపాలుడేమన్నారో తెలుసా?               ‘వైరం సమరమందే. సాహిత్యమందు సామరస్యమే.’     ఈ వాక్యమే నేను అనుక్షణం మననం చేసుకుంటూ ఉంటాను. రాజమండ్రీ రెడ్డి రాజుల ప్రాపు కేగినపుడు, విజయనగరం ప్రౌఢరాయల సహాయం అర్ధించినపుడు, రాచకొండ వారి వద్ద, కన్నడ దేశంలో ఎక్కడైనా నాకు ఆకలి తీర్చేది, చేపట్టిన కార్యం సానుకూలమయేట్లుగా చూసిందీ సాహిత్యమే. అందుకే నేను మరణ సమయంలో కూడా కవిత్వం వదల కూడదని నిశ్చయించుకున్నాను.”   శ్రీనాధుల వారి పలుకులనూ వింటూ, వారిని చూస్తుంటే మాధవునికి ఒక పక్క సంతోషమూ, ఇంకొక పక్క విచారమూ కలిగాయి.   చేతులకి కంకణాలతో, మెడనిండా ముత్యాల, బంగరు మాలలతో, జరీ పట్టు పంచలతో వెలుగొందిన కవీంద్రులు.. దిన వెచ్చాలతో కాలం గడపటమా! పైకి కనిపించడం లేదు కానీ, దుస్తులు శిధిలావస్థలో ఉన్నాయి.   “ధన్యులు మహాకవీ తమరు. కవిత్వానికి తనువు, మనసు అర్పించగలగడం ఎందరికి సాధ్యమవుతుంది?” సంభాషణ అంతా పురుషోత్తమ దేవుడే కొన సాగిస్తున్నాడు.   “నా సంగతి సరే.. మీ విషయం ఏమిటి? నేను మీ రాజకీయాల గురించి అడగటం లేదు. తెలుగు భాష, అందులో కవిత్వం, పద్యాలు.. మీ వరకూ ఏ విధంగా చేరేయా అని. పైగా మీ మాతృభాష కూడా కాదు. ఇదే నిజమైతే నిజంగా ఆనందించవలసిందే!”   “నూటికి నూరు పాళ్లు నిజం గురువుగారూ! మాతృభాష కాదు కానీ, అక్షరాలు దిద్దాక, మేము నేర్చుకునే నాలుగు భాషల్లోనూ తెనుగు తప్పకుండా ఉంటుంది. మా మాధవుడికి మీ కావ్యాలలో చాలా పద్యాలు కంఠస్తం. మా కళింగ దేశంలో మీ శృంగారనైషధం పండితుల చర్చల్లో ముఖ్యాంశమైతే.. భీమఖండం, క్రీడాభిరామం పద్యాలు, ద్విపదలు, రగడలు పాటకజనం నోళ్లలో నిత్యం నానుతూంటాయి.”   పురుషోత్తముని మాటలకి శ్రీనాధ మహాకవి పరమ సంతోషంతో ఉప్పొంగి పోయారు.   ఏ కవికయినా అంత కంటే కావలసినది ఏముంటుంది? వంద కనకాభిషేకాల పెట్టు పాఠకాదరణ.   “ఏముంది నాయనా! కావ్యాల పేర్లు ఉచ్ఛరించడం ఏమంత కష్టమయిన పని?” బింకంగా అన్నారు శ్రీనాధుడు.   మనసులో సంతోషపడుతూనే..   పురుషోత్తమునికి అర్ధమవుట లేదు.. ఏ విధంగా కవి సార్వభౌములని నమ్మించగలమా అని మాధవుని వంక చూశాడు.   మాధవుడు ఇంకా సంభ్రమం నుంచి తేరుకోనట్లుగా తేర పారి చూస్తున్నాడు, శ్రీనాధుడిని.   “మాధవా! గురువుగారేదో అంటున్నారు వింటున్నావా? వారి కావ్యాలేమి చదివావూ? చాటువులు ఏం విన్నావు అని అడుగుతున్నారు.” మాధవుని భుజం తట్టి అన్నాడు పురుషోత్తముడు.   అంతే..   ఒక్క సారిగా కంఠం సవరించి.. గొంతెత్తి రాగయుక్తంగా అందుకున్నాడు మాధవుడు. అతని గొంతులోనుండి రాగఝరి ప్రవహించ సాగింది.   ఆలయ ప్రాంగణంలో మనుషులు, పక్షులు, ఉడతలతో సహా నిలిచి విన సాగారు.                   “చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాడు                            రచియించితి మరుత్తరాట్చరిత్ర                 నూనూగు మీసాల నూత్న యవ్వనమున                            శాలివాహన సప్తశతి నుడివితి                 సంతసించితి నిండు జవ్వనమునను                             హర్షనైషధ కావ్యమాంధ్ర భాష                 బ్రౌఢ నిర్భరవయః పరిపాకమున గొని                             యాడితి భీమనాయకుని మహిమ                   బ్రాయ మెంతయు మిగుల గైవ్రాలకుండ                 గాశికా ఖండమను మహా గ్రంధమేను                 దెనుగుజేసెద గర్ణాట దేవకటక                 పద్మనవహేళి శ్రీనాధ భట్ట సుకవి.”     అక్కడితో ఆప లేదు మాధవుడు. శృంగార నైషధము నుండి, భీమ ఖండం నుంచి.. వరుసగా సీస పద్యాలు, రాగాలు మార్చి వినిపిస్తూనే ఉన్నాడు.   చివరికి శ్రీనాధుల వారే నవ్వుతూ ఆపమని, మాధవుని చెయ్యి పట్టుకునే వరకూ సాగింది కవితా ఝరి.   “గురువుగారూ, మీ కాశీ ఖండం నుంచి కూడా..”   “ఇంక చాలు నాయనా. అపరాహ్ణం సమీపిస్తోంది. భోజన సమయం.. పద్యాలను మించి నీ గానం అలరిస్తోంది. కానీ వీనులతో పాటుగా, జఠరాగ్నిని కూడా శాంత పరచాలి కదా! మిమ్ములను కలిసి నందుకు చాలా సంతోషంగా, గర్వంగా కూడా ఉంది. మీరు కార్యార్ధులు. మేము దేశాటన చేయు వారం. ఇరువురి మార్గాలు వేర్వేరు. మరల ఎప్పటికైనా కలువ గలమో లేదో.. ఆ పరమేశ్వర కృప.” శ్రీనాధుల వారు లేచారు.   పక్కనే ఉన్న అనుచరుడు చెయ్యందించాడు.   “గురుదేవా!” మాధవుని పిలుపు విని వెను తిరిగారు.   చెయ్యి పట్టుకుని వారిని అక్కడున్న అరుగు మీద కూర్చుండ బెట్టారు మిత్రులిరువురూ.   “మా చిరు కానుకను స్వీకరించ వలసినదిగా కోరుతున్నాము. అన్యధా భావించ వలదని మనవి.” పురుషోత్తమ దేవుడు నూరు బంగారు నాణాలు, పట్టు వస్త్రములు కల ఒక సంచీని, కొన్ని ఫలములతో, ఒక పళ్లెరమున పెట్టి సమర్పించి, సాష్టాంగ నమస్కారము చేశాడు.   మాధవుడు కూడా కొన్ని నాణములు, వస్త్రములు ఇచ్చాడు.   దూర ప్రయాణం చేయునపుడు రాకుమారుని పరివారం ఆ మాత్రం ధనం, వస్తువులు తెచ్చుకోవడం సాధారణమే.   శ్రీనాధుడు సంతసించి, యువకులనిద్దరినీ ఆశీర్వదించి ఉత్సాహంగా తమ నెలవునకేగారు.   ప్రతిభకి పట్టం కట్టినపుడు, ఏ కవికైనా బహు సంతసమే కదా!                                          ………………   ......మంథా భానుమతి  

‘‘అజ్ఞాత కులశీలశ్య….” 18వ భాగం

  ‘‘అజ్ఞాత కులశీలశ్య….” 18వ భాగం   “ఇంతకీ మిత్రమా! మనం కంచి ప్రయాణం ఎందుకో..” ఆపేశాడు మాధవుడు. గుంటూరు దాటి పలనాడు ప్రవేశిస్తున్నారు పురుషోత్తముని బృందం. వీరి దృష్టికి ఆనేట్లుగానే ముందూ వెనుకలుగా పయనిస్తున్నారు అనుచరులు.   అనుకున్న సమయానికే, ప్రాతఃకాలమందే స్నాన పానాదులన్నీ ముగించుకుని బయలుదేరారు.   కొండపల్లి పూటకూళ్ల ఇంటివారు ప్రయాణీకులకి ఆరోజుకి సరిపోయే ఆహారం అరిటాకుల్లో కట్టి ఇచ్చారు, అర్ధం గ్రహించి. మినప రొట్టి, నంజుకోను కొరివికారం. పులిహోర, బొబ్బట్లు. ఇంకా చాలా ఇస్తామన్నారు కానీ.. పురుషోత్తముడు వద్దని వారించాడు.                                               “ఎప్పటి కప్పుడు నెచ్చట నైనను                           అప్పము లచ్చటి వైని వలదనను                           కప్పడి వలెనుం గన్పడ వలయును                           ఒప్పుగ సాగుదు మూర్మి కలియజను.”     అశ్వాన్ని అధిరోహించిన పురుషోత్తముడు కాలితో సున్నితంగా హయం మీద లయ వేస్తూ పాడాడు.   “మిత్రమా! మా గురువుగారి ప్రభావం మీమీద కూడా పడినట్లుందే!” మాధవుడు పకాలున నవ్వుతూ అన్నాడు.   “ఆరునెలలు చాలు గదా వారు వీరవడానికి.. మరి ఇన్ని వత్సరముల సాంగత్యం. ఇంతకీ నేను పాడింది రగడేనా?”   “సందేహమెందుకు దేవా? ఉత్కళిక మధురగతి రగడ. చక్కని లయ. ప్రయత్నిస్తే మంచి కవి కాగలరు మీరు.”   “చూచెదము. ఈ రాచకార్యాలలో ఏ కాస్తయినా సమయం చిక్కవలె కదా!” పురుషోత్తమ దేవుడు నిట్టూర్చాడు.   “కృష్ణా తీరానికీ గుంటూరు సీమకీ గల వ్యత్యాసాన్ని గమనించారా మిత్రమా?”   చూశానన్నట్లు తల పంకించాడు పురుషోత్తముడు.   “అక్కడ, ఎక్కడ చూసినా పచ్చదనం. ఇక్కడ తుప్పలు, బీళ్లు. అక్కడక్కడ మిరప, పత్తి పంటలు తప్ప తక్కినవేమీ కానరావు.” మాధవుడు చేయి చాచి చుట్టూ చూపించాడు.   “ఇంకా, ఇంకా పలనాటి సీమలోనికి వెళ్తుంటే జొన్న చేలు తప్ప ఏమీ ఉండవుట కదా?”   “అవును దేవా! అన్నీ మెట్ట భూములు. వర్షాలు తక్కువ. బావుల్లో నీళ్లు పాతాళంలో ఉంటాయి. శ్రీనాధుల వారు కొన్నేళ్ల క్రితం ఈ సీమకి వచ్చి చాలా కష్ట పడినట్టు చెప్తారు. విద్వన్మణులు కదా.. బాధనీ, కష్టాన్నీ, సుఖాన్నీ, శృంగారాన్నీ కూడా తమ చాటువులలో సెలవిస్తారు.” మాధవునికి మిత్రుడిని దేవా అని సంబధించడం ఇష్టం. పేరులోనే ఉందికదా అంటాడు పురుషోత్తమ దేవుడు అభ్యంతర పెట్ట బోతే.   “ఇంకేం మిత్రమా! వదలు కొన్ని శ్రీనాధుల వారి చాటువులను. మనకి ప్రయాణపు బడలిక తెలియకుండా ఉంటుంది. అసలే వేడి గాలులు మొదలయ్యాయి.”                                                     “జొన్నకలి జొన్న యంబలి                               జొన్నన్నము జొన్న పిసరు జొన్నలు తప్పన్                               సన్నన్నము సున్న సుమీ                               పన్నుగ బలినాటి సీమ ప్రజలందరకున్"     కొంచె విషాదంగా పాడాడు మాధవుడు.   “పలనాటి సీమని బలినాటి సీమ అన్నారు కవి.. ఆకలిలో కూడా చమత్కారమే మహానుభావునికి.” రాకుమారుడు చిరునవ్వు నవ్వాడు.   “అంతే కాదు.. దీనికి తోడు, చింతకూరా, బచ్చలి కూరా కలిపిన పులుసు నంజుకి. ఆ చేదు భరించలేక నీళ్లు తాగుదామంటే మంచి నీటికి కూడా కరవే. అందుకే పరమశివుడిని నిందా స్తుతి చేశాడు.”   “నిందించాడా” ఆశ్ర్యపోయాడు పురుషోత్తముడు.                                                          “సిరిగల వానికి చెల్లును                              తరుణులు పదియారువేల దగ పెండ్లాడన్                              తిరిపెమున కిద్దరాండ్రా                              పరమేశా గంగ విడుము పార్వతి చాలున్.”     ఈ సారి నవ్వాపుకోలేక పోయారు ఇద్దరూ.   “సందర్భోచితంగా భలే అల్లుతారు పద్యాలు మీ గురువుగారు. అంతే కాదు.. రసికుడనే వారెవరూ పలనాడు వెళ్లరనీ, వెళ్లినా అక్కడ ఉండలేరనీ చెప్పి, గోదావరీ తీరానికి వెళ్లి పోయారుట.” పురుషోత్తముడు నవ్వాపుకున్నాక అన్నాడు.   “అవును.. అసలే శృంగారానికి పేరొందిన వారు కద!”   అలసట తెలియ కుండా కబుర్లు చెప్పుకుంటూ పలనాటి సీమ దాటేశారు.   పాకనాడు ప్రవేశించే సరికి అపరాహ్ణం దాటింది. గుర్రాలు కూడా వేగం తగ్గించి ఈడుస్తూ వెళ్తున్నాయి.   ఒక గ్రామ పరిసరం కనిపించింది. అక్కడున్న సత్రం దగ్గరాగి, గుర్రాలను శాలలో కట్టేశారు. అంతలో సైనికులందరూ కూడా వచ్చి, రాకుమారునిదీ, మాధవునిదీ కూడా గుర్రాల పనిని వారు చూశారు. కాస్త  ఒడలు చల్ల బడుతుందని మిత్రులిరువురూ, పక్కనే ఉన్న సెలయేరులో ఈతకి దిగారు. ఒక అరగంట నీటిలో సేద తీర్చుకుని, ఒడ్డుకి వచ్చి పొడి దుస్తులు ధరించి.. సత్రం అరుగు మీద, తాము తెచ్చుకున్న భోజనం తిని.. విశ్రమించారు.   “మిత్రమా..”   “తెలియును.. అర ఘడియ మాత్రమే కదూ?” నవ్వుకుంటూ కనులు మూసుకున్నారు.                                         ………………     “మనం నెల్లూరు మండలం దాటి వెళ్తాము కదూ సేనానీ?” సైన్యాధికారిని అడిగాడు పురుషోత్తముడు.   “అవును దేవా! ఈ రాత్రికి అచ్చటనే విశ్రాంతి.”   “కందుకూరు, పైడిపాడు.. దారిలో ఏమైనా కనిపించునా?”   “కొంచెం దారి మళ్లాలి. అవసరమా ప్రభూ? అటులయిన మనం వేగం కొంచెం పెంచాలి. హయములు హుషారుగానే ఉన్నాయి.”   “అచట మంచి వసతి గృహం ఉందని విన్నాను. వీలైతే రేపు ఆగుదామక్కడ.” పురుషోత్తమ దేవుడు గుర్రాన్ని అదిలించాడు.   “మిత్రమా! కందుకూరు వద్ద మండలాలన్నీ విజయనగరం రాయల ఏలుబడిలో ఉన్నవి కదా? అక్కడ ఏమి కార్యమో అడగ వచ్చా?” మాధవుడు గుర్రాల వేగం కొద్దిగా తగ్గాక పక్కకి వచ్చి అడిగాడు.   “పలనాటి సీమ దాటాం కదా! నెల్లూరు సీమలో.. అందులో కందుకూరు సన్న బియ్యానికి ప్రసిద్ధి. పైడిపాడు నేలే ప్రభువు మైలార రెడ్డి మంచి ఆతిధ్యానికి పేరు పొందిన వాడు. ఎంత వేగిరం వెళ్తే అంత మంచి భోజనం దొరుకుతుంది. అందుకనే..” పురుషోత్తముడు గుంభనగా అన్నాడు, నవ్వు ఆపుకుంటూ.   మాధవుడు వింతగా చూశాడు మిత్రుడిని. తనకి తెలిసీ, ఆహారం పట్టింపులేం లేవు రాకుమారుడికి.   మైలార రెడ్డి, విజయనగరం రాజు సామంతుడు. దేవరాయలకు అనేక యుద్ధాలలో సహాయం చేసి, చాలా మందికి భూదానాలిప్పించాడు.   రాజకీయాలకు అతీతంగా దానధర్మాలకు ప్రసిద్ధి చెందిన వాడు. చేయి చాచినవాడిని కాదనడని ప్రతీతి. రాజ్యాలందరూ పాలిస్తారు కానీ, తమ కీర్తిని తమకు తెలియకుండానే దూరతీరాలకు వ్యాపింప చేసుకునే వాళ్లు అరుదు. మైలారరెడ్డి గురించి గజపతుల రాజ్యం వరకూ వెళ్లిందంటే ఆశ్చర్యమే మరి.   “ప్రభూ! పైడిపాడు చేరాము.” సేనాని కనిపిస్తున్న పట్టణాన్ని చూపించి అన్నాడు.   “సంధ్యా సమయం ఆసన్న మౌతోంది. ఏదైనా వసతి గృహం వద్దకు చేరితే సంధ్యా వందనం చేసుకుని విశ్రమిద్దాము. చెరువో, కాలువో ఉంటే మరీ మంచిది.” పురుషోత్తముడు ఆదేశ మిచ్చాడు.   “ఇచ్చట ప్రభువు, బాటసారులకి చక్కని ఏర్పాట్లు చేశారు దేవా. మనం నేరుగా అక్కడికే వెళ్లిపోవచ్చు. ఆనుకునే చక్కని కొలను కూడా ఉంది. పక్కనే రామాలయం.”   “ఇంకేం మరి.. ఆలోచనెందుకు?”    విన్నదానికంటే ఆహ్లాదంగా ఉందక్కడి వాతావరణం. పరిసరాలు ప్రశాంతంగా ఉన్నాయి.                                                                         సాయం సంధ్య కార్యక్రమం చేసుకుని, ఆలయం లోనికి వెళ్లి రాకుమారుడు పూజలు చేసుకుని వచ్చాడు, మిత్రుడు వెంట రాగా!   “ఇంకా అర ఘడియలో వడ్డన చేస్తామని చెప్పమన్నారు సామీ!” రాజుగారి వసతి గృహం నుంచి వార్తాహరుడు వచ్చి చెప్పాడు.   పట్టణంలో ప్రవేశించగానే సైనికులు అశ్వాలని శాలకి తీసుకు వెళ్లారు.. వాటి సదుపాయం చూడడానికి.   “ఈ సీమలో బాటసారుల బాగోగులు చక్కగా చూస్తున్నారు మాధవా! మన పర్యటనలో గమనించ వలసిన ముఖ్య విషయం.. మనం ఆచరించ వలసినది కూడా.”   “కళింగ దేశంలో కూడా, చక్కగా ఉన్నాయి మిత్రమా! చెప్పాలంటే, ఇచ్చటి వాటి కంటెనూ బాగుగా. మనకి కాశీ యాత్రికులు అధికంగా వస్తుంటారు.. దీర్ఘ ప్రయాణాలు చేస్తూ.. మీకు అచ్చట పూటకూళ్ల గృహానికి రావలసిన అవసరం లేదు కనుక తెలియక పోవచ్చు..” మాధవుడు వివరించాడు.   “అవునవును.. నేను మాటలాడుతున్నది వసతి గృహం యజమానితో.. ఆ మాటే మరచాను సుమీ!” నవ్వుతూ అన్నాడు పురుషోత్తముడు.     మాధవునికి ఒక్కొక్క సారి ఆశ్చర్యం కలుగుతుంటుంది.. తన జీవితం ఏ విధంగా సాగుతోందో చూస్తుంటే. విధి వ్రాసిన రాతలు ఎంత వింతగా ఉంటాయో..   చిన్ననాటనే తల్లిదండ్రులను దూరంచేసి నందుకు నిలదియ్యాలా?  కర్కశకుల కంట పడకుండా తప్పించి, ప్రేమ ఆప్యాయతలు పంచే కుటుంబాన్నందించి నందుకు మొక్కాలా? ఇప్పుడు రాకుమారునితో ఈ స్నేహం, యీ చనువు ఎందుకు ఏర్పడ్డాయో, ఎంత ముందుకు తీసుకొని వెళ్తాయో? ఆ విధి విలాసం ఏమిటో.. వేచి చూడ వలసిందే అనుకున్నాడు మాధవుడు.   రాజులతో అతి చనువు పనికి రాదని కన్న తల్లి చెప్పిన పాఠం గుర్తుకొచ్చింది. అనుక్షణం రాజుని వెన్నంటి ఉన్న కన్న తండ్రి, రాజుతోనే అసువులు కోల్పోయాడు.   అయినా ఏదీ తప్పించలేరు మానవ మాత్రులెవరూ! రాచ కుటుంబంతో సన్నిహితత్వం తాను కావాలనుకుంటే వస్తుందా, వద్దనుకుంటే పోతుందా?   “మిత్రమా! మనం రేపు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాము. నాకు ఈ పరిసరాలు బాగా నచ్చాయి. రేపంతా కోనేటి స్నానం, రాముల వారి ధ్యానం. ఎల్లుండి ప్రాతః కాలమందే పయనం సాగిద్దాము. పద.. పద. క్షుద్బాధ అధికమవుతోంది. శాంతింప జేయాలి దేహాన్ని ముందు.”     భోజనం అయాక ఆరుబయట అరుగు మీద కూర్చున్నారు, పురుషోత్తముడు, మాధవుడు, ఆ వసతి గృహం యజమానీ! తాంబూల సేవనం అవుతోంది. చల్లనిగాలి సేద తీరుస్తుంటే, పున్నమి సమీపిస్తోందేమో.. పలుచని వెన్నెల పరచుకుంటోంది ప్రాంగణ మంతా.   “సామీ! ఎందాకా పయనం?” యజమాని అడిగాడు.   “కాంచీ పురం వరకూ. ఇక్కడే.. ఆరుబయట నిదురిస్తే ఎంత హాయి..”   “అట్లానే సామీ! ఇక్కడ దొంగల భయాలేంలేవు. హాయిగా పండచ్చు. ఈ గృహంలోని వారు చాలా మంది పండుకుంటారు.” గృహ యజమాని చెప్తుండగానే, మాధవుడు లేచి లోపలికి వెళ్లాడు, రాకుమారునికి పానుపు గురించి అనుచరులకి చెప్పాలని. తరువాతి ప్రయాణానికి కూడా కాస్త సరుదుకోవాలి..   “కొంచెం ప్రధాన రహదారికి పక్కకి ఉంది కదా.. మీ పట్టణానికి కూడా బాటసారులు వస్తుంటారా తరచుగా?”   “వస్తారు స్వామీ! మా రాములోరు ఈ పరగణాలో ప్రసిద్ధి చెందినోరు. గుడికి వస్తుంటారు, చుట్టు పక్కల గ్రామాల వారు. శ్రీరామనవమి తొమ్మిది దినాలూ ఉత్సవాలు చేస్తాము. అప్పుడు పందిట్లో హడావుడే హడావుడి. యక్షగానాలు, హరి కథలు.. ఒకటేమిటి. అందరికీ భోయనాలు రాజుగారే!” వసతి గృహయజమాని గర్వంగా చెప్పాడు.  “అంత ఐశ్వర్య వంతమా ఈ ప్రాంతం?”  “అవును సామీ. మూడు రకాల పంటలు పండుతాయి ఏటికేడూ. ఇంక పాడి చెప్పనక్కర్లేదు. అదంతా శ్రీరాముల వారి వంటి మా రాజు మహత్యం. వారు బ్రాహ్మణులను, పేదవారినీ ఆదరిస్తున్న ఫలం. రాయల వారితో చెప్పి వారి రాజ్యం లోనే కాక బైట కూడా అగ్రహారాలిప్పించారు. నిత్యం ఇంత మంది ప్రజల ఆశీస్సులనందుకుంటుంటే, మరి ఆ దేవుడు కూడా మంచి చూపు చూస్తాడు కదా!”   “నిజమే. రాజు యోగ్యుడైతే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది.” పురుషోత్తముడు సాలోచనగా అన్నాడు. దేశాటన వల్ల ఎన్ని అనుభవాలు.. ఎన్నెన్ని కొత్త విషయాలు గ్రహించ వచ్చు.. ప్రజలలో ఉండే మంచి పేరే శ్రీరామరక్ష ప్రభువుకి.   “అంతే కాదు సామీ.. మా రాజు గారు ఎందరికో దిన వెచ్చాలు ఏర్పాటు చేశారు. చేస్తున్నారు.”   “దిన వెచ్చాలా? దేనికి?”   “బ్రతికి చెడిన వారికి. పండితులు, కవులు.. ఇదివరకు ఒక వెలుగు వెలిగి, పతనమైన రాజాశ్రయాలలో వైభోగం అనుభవించిన వారు, సలహా దారులు.. ఎవరైనా ఆశ్రయిస్తే చాలు, వారి ఆకలి పోగొడతారు. వారు ఏ పనీ చెయ్యలేరు కదా! మా వసతి గృహంలోనే ఒక మహానుభావులున్నారు. ఎన్నో కావ్యాలు గ్రంధాలు రాశారు. మహాకవిట. కొండవీటి రెడ్డిగారి దగ్గర విద్యాధికారిట. వారికి దిన వెచ్చాలిస్తున్నారు మా రాజుగారు. వారి అనుచరుడు వండి పెడుతుంటాడు. త్వరలో శ్రీశైలం వెళ్తారుట. వారు ఎక్కడా ఎక్కువ రోజులుండలేరని అందరూ చెప్పుకుంటారు. కాశీఖండం అనే కావ్యం రచించి విశ్రాంతి కోసం ఇక్కడ ఉందామని వచ్చారుట.” యజమాని ఇంక లేవడానికి ఉద్యుక్తుడై అన్నాడు.   “కాశీ ఖండమా?” పురుషోత్తముడొక్క సారి ఉలిక్కి పడి లేచాడు.   “అవును సామీ! ఇక్కడ అందరికీ అప్పుడప్పుడు తన కావ్యాలు వినిపిస్తుంటారు కూడా.” అంత ఆశ్చర్య పోవలసిన సంగతేమిటో అర్ధం కాలేదు యజమానికి.   “వారిని మేము కలుసుకోవచ్చా?”   “మహ చక్కగా కలవచ్చు. ప్రాతఃకాల విధులు నిర్వర్తించుకుని, వారు ఆలయంలో రావి చెట్టుకింద అరుగు మీద కూర్చుని కొలువు తీరుతారు. అప్పుడు వారి వంటివారే అందరూ వచ్చి చర్చలు చేస్తుంటారు. ఆ చర్చల ద్వారానే తెలిసింది, వారు శ్రీశైలం వెళ్ల బోతున్నారని.”   పురుషోత్తమునికి లిప్త మాత్రం పట్టింది కర్తవ్యం నిర్ణయించడానికి.   “మా మిత్రునికీ విషయం చెప్పవద్దు. రేపు కవిగారిని కలిసి మేం ప్రయాణమౌతాము. రెండు రోజులకీ మీరు మాకు వసతి సదుపాయాలు చూసి రొక్కం చెప్తే మాధవుడిచ్చేస్తాడు.”   “అట్లాగే సామీ! ఆ సామికి చెప్తా లేవగానే మీ సంగతి.”   “ఎవరు మిత్రమా ఆ సామి?” అప్పుడే ఏర్పాట్లు ముగించుకుని అక్కడికి వచ్చిన మాధవుడు అడిగాడు.   “ఎవరో.. రాజుగారికి ఆప్తుడట. దేశాటనలు బాగా చేస్తారని చెప్తున్నారు. మనకి దిశా నిర్దేశం చేస్తారని, రేపు కలుద్దామనుకుంటున్నా.”                                           ……………….     ......మంథా భానుమతి

‘‘అజ్ఞాత కులశీలశ్య….” 17వ భాగం

‘‘అజ్ఞాత కులశీలశ్య….” 17వ భాగం “కాంచీపురాధీశునితో సంధి ఏమిటి రాకుమారా? వారు మన దండయాత్రలకి చాలా దూరాన ఉన్నారు కదా? ఇప్పటికి గోదావరీ తీరం అయింది. కృష్ణా తీరం దాటాక కదా కావేరీ తీరం వచ్చేది. మధ్యలో విజయనగరం రాయలు ఉన్నారు. నెల్లూరు తీరం దాటాలి. నాకైతే అయోమయంగా ఉంది మిత్రమా!” మాధవుడు, కళ్యాణికి గుగ్గిళ్లు పెడుతూ అన్నాడు.   పురుషోత్తమ దేవుడు తన గుర్రాన్ని కట్టేసి విశ్రమిస్తున్నాడు. అప్పటికే అతని గుర్రం మాలీషు చేయించుకుని, గుగ్గిళ్లు తినేసి, హాయిగా కునికి పాట్లు పడుతోంది.   బ్రాహ్మీ ముహుర్తంలోనే బయలు దేరారు, ముందరి మజిలీ నుంచి. ఉషోదయం తొందరగానే వస్తుంది కనుక ధైర్యం చేశారు. దారంతా గ్రామాలు.. సస్య శ్యామలమైన ప్రదేశం.   “ఒక్క ఘడియ మాత్రమే ఆగుతున్నాము మిత్రమా! త్వరగా బయలుదేరాలి మనం.” రాకుమారుడు వేగిర పెట్టాడు.   గోదావరీ తీరం అది.   మిత్రులిద్దరూ బయలుదేరి మూడు రోజులయింది. రాజమహేంద్రవరం చేరుకున్నారు. కోరుకొండ వరకూ వారి రాజ్యమే అయినా కూడా.. రాకుమారుడనని ఎవరికీ చెప్పలేదు. ఆ విధంగా ప్రజలేమనుకుంటున్నారో తమ పాలన గురించి తెలుసుకుందామని..   వారి పరిపాలన అందరికీ సంతృప్తిగా ఉందని తెలుసుకుని, మరింత ఉత్సాహంతో పయనం సాగించారు.   దారిలో రెడ్ల పాలన.. రాయల పాలనల గురించి తెలుసుకుంటూ వెళ్లాలని ప్రణాలిక రచించారు కపిలేంద్ర దేవుడు.   ఆవిధంగా ఆయా రాజ్యాల ఆనుపానులు కూడా తెలుస్తాయని మహారాజు ఉద్దేశ్యం.   చెప్పిన వెంటనే గౌతమి అభ్యంతర పెట్టినా నందుడు సర్ది చెప్పడంతో ఆనందంగానే పంపింది. “ఈడు వచ్చిన  కుర్రవాడిని ఇంట్లో కట్టి పడేస్తే ఏ విధంగా అభివృద్ధి సాధించగలడు? ఆ జగన్నాధుడే కాస్తాడు పుత్రుడిని.” సీతమ్మ కూడా అవునంటూ మద్దతిచ్చింది.   “మిత్రమా! రాజమహేంద్ర వరం సమీపించగానే ఏదో తెలియని ఉత్సాహం పరవళ్లు తొక్కుతోంది మనసంతా! ఏదో చెప్పాలని ఉత్సుకత..” పురుషోత్తముడు పరవశంగా అన్నాడు.   “నిజమే! ఈ పవిత్ర గోదావరీ తీర మహత్యమటువంటిది. రెడ్డిరాజుల పరిపాలన కూడా గజపతుల పరిపాలన వలెనే ప్రజల మన్నన పొందింది. మహాకవి శ్రీనాధుడు వీరి పాలన గురించి చక్కని పద్యం రాశారు వినిపించుదునా?”   అడిగేశాడే కానీ మాధవునికి విపరీతమైన భయం కలిగింది.   ఒక కాబోయే రాజు ముందు వేరొక రాజును పొగడడమా?   బెదురుగా ఉన్నా బింకంగా నిలుచున్నాడు. క్షత్రియ రక్తం కదా!   “అవశ్యం మిత్రమా.. వినిపించు. ఉత్తరోత్తరా మనకి ఉపయోగపడవచ్చును కదా!” పురుషోత్తముడు నవ్వుతూ అన్నాడు.   మాధవుడు మొదలుపెట్టాడు, రాగయుక్తంగా..                         “ సీ.   ధరియింప నేర్పిరి ధర్బ వెట్టెడు వ్రేళ్ల                                      లీల మాణిక్యాంగుళీయకములు                               కల్పింపనేర్చిరి గంగ మట్టియ మీద                                      గస్తూరికా పుండ్రకములు నొసల                               సవరింప నేర్చిరి జన్నిదంబుల మ్రోల                                      దార హారములు ముత్యాల సరులు                               చెరువంగ నేర్చిరి శిఖల వెన్నడుములు                                      గమ్మని క్రొత్త చెంగలువ విరులు                                   తే.గీ.   ధామమున వెండియును బైడి తడబడంగ                              బ్రాహ్మణోత్తము లగ్రహారముల యందు                              వేముభూపాలు డనుజన్ము వీరభద్రు                              ధాత్రి ఏలింప గౌతమీ తటమునందు.”     “ఎంత బాగా వ్రాశారు మిత్రమా! కళ్లకి కట్టినట్లుంది. మనం కూడా ఈ విధంగా పరిపాలన సాగించాలి భవిష్యత్తులో.” పురుషోత్తముని ప్రశంస విని అమ్మయ్య అనుకుని నిట్టూర్చాడు మాధవుడు.   “రాకుమారా! శ్రీనాధులవారు ఎచటనున్నారో ఏమైనా తెలిసిందా? నాకు వారిని కలవాలని ఉంది మిత్రమా!”   “రాజమహేంద్రవరంలో లేరని విన్నాను. హంపీ, కర్ణాటక దేశాలలో పర్యాటన చేస్తూ, అక్కడి రాజులకు, పండితులకు తమ పాండిత్య ప్రకర్షని చూపిస్తున్నారు. రాచకొండ సింగ భూపాలుని వద్ద నున్నారని విన్నాను. వారు దేశ సంచారులు. మనకి ఎక్కడైనా ఎదురు పడే అవకాశం ఉంది. ఇంక మన ప్రయాణం కొన సాగిద్దామా?” పురుషోత్తమదేవుడు, లేచి తన హయం వద్దకు నడిచాడు.   “ఇంతకీ మన పయనోద్దేశ్యం చెప్పనేలేదు రాకుమారా? కాంచీపురం ఐతే, విజయనగర రాజుల సామంత రాజ్యం. దేవరాయలు అక్కడ గట్టి రక్షణ ఏర్పాటు చేశాడు. మనం సంధి ప్రయత్నాలేవో చేస్తే దేవరాయలితో చెయ్యాలి కానీ, కంచి రాజుతోనా? నాకు ఏమీ బోధపడుట లేదు.”   “నీకు బోధపడదులే మిత్రమా!” పురుషోత్తముడు గుంభనగా నవ్వాడు.   “అంటే..మీకు తెలుసునా?”   “అదంతే! నాకు తెలియకుండా ప్రయాణం అవుతానా? తండ్రిగారికి అన్ని విషయాలూ తెలుసును. వారి చారులు వృత్తిలో నిష్ణాతులు. చారులు సేకరించని విషయాలు రాజ్యంలో లేవు.”   రాకుమారుని మాటలు విని ఉలిక్కి పడ్డ మాధవుడు, పక్కనే హయాన్ని నడిపిస్తున్న మిత్రుని వంక చూశాడు. అయినచో.. తన గురించి కూడా..   ఆ సమయంలో గుర్రాల వేగం తగ్గింది.. దారి క్లిష్టంగా ఉండడంతో. పైగా నదీతీరం అవడంతో.. నేల జారుతోంది కూడా.   మాధవుని ఆందోళనని పట్టించుకోకుండా, జాగ్రత్తగా హయాన్ని నడుపుతున్నాడు పురుషోత్తముడు.   “ఇంక మంచి దారి మొదలవబోతోంది.. మనం వేగాన్ని పెంచాలి. ఈ సాయంకాలానికి అర్ఘ్యం విడవడానికి కృష్ణా తీరం చేరాలి సుమా!”   “అటులనే రాకుమారా! గుర్రాల అవసరాలకి మాత్రమే ఆగుదాము.”   “ఇంకొక ముఖ్యమైన విషయం.. నన్ను ఇతరుల సమక్షంలో రాకుమారా అని సంబోధించ వద్దు. మనిద్దరం మిత్రులము.” పురుషోత్తముడు గుర్రాన్ని వేగిర పరచాడు.   “అటులనే మిత్రమా!” మాధవుడు కళ్యాణి పక్కలు సున్నితంగా కాళ్లతో కొట్టాడు.   రెండు గుర్రాల డెక్కల చప్పుడు తప్ప ఇంకేమీ వినిపించడం లేదు అక్కడ.                                       …………………                  “ఇదే సరైన ప్రదేశం మిత్రమా! ఇక్కడే సంధ్యా వందనం చేసుకుని, సమీపాన ఉన్న గ్రామంలో విశ్రమిద్దాము ఈ రాత్రికి.” కృష్ణ ఒడ్డుకు కాకపోయినా, బెజవాడ దగ్గర్లో ఉన్న గ్రామం వద్దకి చేరారు మిత్రులిద్దరూ.   కృష్ణా నది నుండి తవ్విన కాలువ ఒకటి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తోంది. దట్టమైన వృక్షాలతో ఆ ప్రాంతం, నదీ తీరం కన్నులకింపుగా ఉన్నాయి.   సంధ్య వార్చడానికింకా సమయం ఉన్నా, గుర్రాలు అలిసి పోయాయని ముందుగా ఆగి పోయారు. అక్కడి ప్రకృతిని తనివితీరా ఆస్వాదించడం ఒక కారణమైతే.. సమీపంలో మంచి గ్రామం ఉండుట మరొక కారణం.   గుర్రాలని కట్టేసి, అక్కడున్న మఱ్ఱి చెట్టు దగ్గరికి పరుగెత్తాడు మాధవుడు.   “అద్భుతం మిత్రమా! ఎంత రమణీయం ఈ ప్రకృతి.. రండి రండి.. సంధ్యకింకా సమయం ఉంది కదా! కొద్ది సేపు ఈ అందాలని ఆస్వాదిద్దాం..                                                                    తురగవల్గన రగడ కళిక:                      సంజ వెలుగు చూడ నల్ల చాల సంత సంబు నుండు                   *కంజ తావు నంత గానె కాచు గాద చల్ల గుండు                      గూడు వదలి వెళ్లె గాద గువ్వ లన్ని కూడు కొఱకు                    గూడు లోని కూనలన్ని పాట పాడు నమ్మ కొఱకు                      అస్త మించు భాను డదియె నలల పైన తేలియాడు                    వస్త నంటు చందురూడు వగలు తెలిపె కలువ చూడు.                      ఆలమంద మేత నాపి యవికి జేర పయనమయ్య                    పాలు త్రావ దూడలన్ని పరుగు పరుగు గెంతు లెయ్య.                       ఒడలు పులక రించె గాద ఊడలున్న మఱ్ఱి చెంత                     బెడద లన్ని వదలి వేసి వెడల గాను మనము సుంత.”   (కంజ= అమృతం)     రగడ పాడుతూ మాధవుడు నాట్యం చేయ సాగాడు. చెట్టుక్కట్టేసిన గుర్రాలు కూడా తలలూపుతూ తై అంటున్నాయి.   పురుషోత్తముడు నవ్వుతూ వెళ్లి గుర్రాలని విప్పి, జీనులు తీసి నిమర సాగాడు. గుర్రాలు.. యజమానిని పక్కకు తప్పించి హాయిగా నాట్యం మొదలు పెట్టాయవి కూడా.       ఆహ్లాదంగా ఉంది వాతావరణం.   “ఏం మిత్రమా! ఆ పల్లె ప్రజల ప్రభావమా! రగడలందుకున్నావు? మీ గురువు గారేమంటారో?” మేలమాడాడు పురుషోత్తమ దేవుడు. మాధవునికి శ్రీనాధుని కవిత్వం ఇష్టమని ఆయన శిష్యునిగా సంబోధిస్తుంటాడు.   “ఈ చల్లగాలిలో, సూర్యాస్తమయ కాంతులలో లయ ప్రాధాన్య కవిత రావడంలో వింతేముంది మిత్రమా! జానపదాలకి రగడలు, ద్విపదలే కదా సాధనాలు! ఇంక మా గురువుగారా.. వారు కూడా రగడలు వాడారు కదా? శివరాత్రి మహాత్యంలో, కాశీ ఖండంలో..” మాధవుడు తీసి పోలేదు. సమాధానాలు తయారుగా ఉంటాయి.   “నిజమే మిత్రమా! అదుగో.. సంధ్యా సమయం ఆసన్న మౌతోంది. మనం ఆట పాటలు ఆపి కార్యక్రమం లోనికి ప్రవేశిద్దామా?”   ఇరువురూ తమతమ అశ్వాలకు సాంత్వన చేకూర్చి, స్నాన సంధ్యాదులను పూర్తి చేసినంతలోగానే..   ఇరువురు ఆగంతకులు సమీపించారు వారిని.   “ప్రభూ! మీకు భోజన వసతులు ఈ కొండపల్లి గ్రామంలో ఏర్పాటు చేశారు. ఈ రాత్రికి విశ్రమించి ప్రాతఃకాల మందే మీ ప్రయాణం కొన సాగించ వచ్చు.” ఇద్దరిలో అధికారిలా ఉన్నతను అన్నాడు.   “మీరు..” మాధవుడు సందేహంగా అడిగాడు.   “మేం.. కపిలేంద్రుల వారి సైనికులం. గజపతుల రాజ్య సరిహద్దులు దాటాక, మీకు తోడుగా, మమ్మల్ని ముందు వెనుకల వెడలమని మహారాజుగారి ఆనతి. కోరుకొండ దాటినప్పట్నుంచీ వస్తున్నాము. ఈ ప్రాంతం నుంచీ మీకు కొత్త కనుక బయటికి వచ్చి కనిపించాము. రెడ్డి రాజుల చారులు, విజయనగర రాజుల వేగులు అన్ని ప్రాంతాల కాచి ఉంటారు. జాగరూకతతో ఉండాలి.”   “ఎంత మంది ఉన్నారు మీరు?”   “నలుగురు మీకు ముందు, నలుగురు మీకు వెనుక. మీ వెనుక వారు కొద్ది సమయంలో కలుస్తారు.”   “మీరు మా రాజ్యం వారని మాకు నమ్మకం ఎటుల?” మాధవుడు చేతిని కత్తి ఒర మీద నుంచి అడిగాడు.   “ఇదిగో.. రాజుగారి ముద్రిక.” లో దుస్తుల్లోంచి జాగ్రత్తగా తీసి ఇచ్చాడు.   పురుషోత్తముడు కొద్ది దూరం నుంచి అంతా గమనిస్తున్నాడు.   మాధవుడు రాకుమారుని వంక తిరిగి తల ఊపాడు.. సరే అన్నట్లు.   అశ్వాలకి అన్నీ అమర్చి, అధిరోహించి, సైనికులు దారి తియ్యగా ముందుకి నడిచారు, స్నేహితులిద్దరూ.   కొండపల్లి గ్రామానికి వెళ్లే దారిలోనే ఉంది పూటకూళ్ల ఇల్లు. అక్కడ అరుగు మీద కూర్చుంటే కొండ మీద నున్న కోట కనిపిస్తుంది. మామూలు బాటసారుల వలెనే ఆహార్యం ఉంది కనుక, గజపతుల రాకుమారుడని.. కాబోయే చక్రవర్తి అనీ, ఎవరికీ అనుమానం రాలేదు. మాధవుడు, సైనికులు కూడా తమ తోటి ప్రయాణీకుని వలెనే పురుషోత్తముని చూడ సాగారు. అందరివీ ఒకే రకం తలపాగాలు, దుస్తులు.   కోట వైభవం తగ్గినట్లు అనిపిస్తోంది. పెదకోమటి వేమారెడ్డి హయాంలో ఒక వెలుగు వెలిగింది.. కొండవీటి కోటకి పోటీగా.   అంతఃకలహాలతో ప్రజాపాలన కూడా అంతంత మాత్రంగానే ఉంది. ప్రజలు కొత్త సుంకాలు కట్టలేక అసంతృప్తులై ఉన్నారు.   “కొండవీటి రెడ్డిరాజుల వైభవం ఎందుకు పోయింది?” పురుషోత్తముడు సైనికాధికారిని అడిగాడు. అతడు గజపతుల చారుడు కూడా.   “పెదకోమటి వేమారెడ్డి కొడుకు రాచవేమారెడ్డి అస్తవ్యస్త పాలన వల్ల.. అతడికి రాజమండ్రీ  రెడ్డిరాజులనెదుర్కోవడం సాధ్యం కాలేదు. పైగా కనీ వినీ ఎరుగని సుంకాలతో  ప్రజా కంటకుడిగా పేరు పొందాడు. చివరికి అనూహ్యమైన రీతిలో ఒక మామూలు బలిజ వాని చేతిలో చచ్చిపోయాడు.”   “అదేవిధంగా?” మాధవుడు అడిగాడు కించిత్ ఆశ్చర్యంతో.   “రాచవేముడు పురిటి మంచం మీద పన్ను వేశాడు. ఈ పురిటి పన్ను వసూలు చెయ్య బోతుంటే, సవరం ఎల్లయ్య అనే బలిజ నాయకుడు రాచవేముడిని పొడిచి చంపేశాడు. ఒక ప్రభువుని, సామాన్యుడు చంపాడంటే.. ఆ రాజ్యం ఏ విధంగా దిగజారి పోయిందో తెలుస్తుంది. అతడితోనే కొండవీటి రెడ్డి రాజ్యం అంతరించింది. ముక్క చెక్కలయి, అటు విజయనగరంలో కొంత, ఇటు రాజమండ్రీలో కొంత కలిసి పోయింది. కొంత తెలంగాణాలో.. దేవరకొండలో కలిసింది. ఇది పొరుగు రాజ్యాలకి ఒక పాఠం లాగ మిగిలింది.”   “మరి ఆ రాజుని ఆశ్రయించుకుని ఉన్న పండితులు, మంత్రులు, సైన్యాధికారులు.. అందరూ ఏమయ్యారు?”   “ఏమౌతారు సామీ.. ఇతర రాజుల ప్రాపుకై వెళ్తారు. అదంత సులభం కాదు. ఎక్కడైనా కొలువు దొరికే వరకూ నానా పాట్లు పడుతుంటారు.”   “భోజనానికి రండి స్వామీ. కాళ్లూ చేతులూ ప్రక్షాళన కానియ్యండి..” పూటకూళ్ల ఇంటి వారి పిలుపు విని అందరూ లేచారు.     ......మంథా భానుమతి

‘‘అజ్ఞాత కులశీలశ్య….” 16వ భాగం

ఎప్పుడెప్పుడు ప్రకృతి కరుణిస్తుందా అని ఎదురు చూస్తున్న మాధవుడు, పురుషోత్తమ దేవుడు కోటలోనుంచి బయటికి వచ్చారు.   అంతా భీభత్సం..   తుఫాను వచ్చే ముందు, కోటలో ఉండిపోయిన మాధవునికి, తన ఇంటికి వెళ్లే అవకాశమే లేకపోయింది.   ఆందోళనగా  ఇంటి దారి పట్టబోయాడు. రాకుమారుడు అచ్చటే నిలబడి చూస్తున్నాడు.                             ఎక్కడుంది దారి? బాటంతా నేలకొరిగిన చెట్లతో, కొమ్మలతో నిండి పోయింది.    భయానకంగా ఉంది.. అడుగు వేసేట్లు లేదు.    వెనుతిరిగి, పశువుల శాలల్లో ఉండిపోయిన పనివారిని, సైనికులను కత్తులతో, గొడ్డళ్లతో, గడ్డపారల్తో రమ్మని పిల్చుకొచ్చారిద్దరూ.   కోటలో చెట్లన్నీ బాటలకి చాలా దూరంలో ఉన్నాయి. అలాగే.. గజ శాలలు, అశ్వ శాలలు, పాడి పశువుల కొట్టాలు.. అన్నీ దిట్టంగా గట్టిగా కట్టినవే. చెక్కు చెదరలేదు. లోపల ఉన్న సేవకుల ఇళ్లు కూడా బాగానే ఉన్నాయి. కొన్ని ఇళ్లల్లోకి నీళ్లు వచ్చేసినా కూడా.   అందరూ చకచకా బాట మీదున్న చెట్లని తొలగించారు. రాకుమారుడు దగ్గరుండి పనులు చేయిస్తున్నాడు. వాన తగ్గగానే, ప్రజలంతా బయటికి వచ్చేసి, బాటలనీ, ఇంటి కప్పులనీ బాగు చేసుకునే పనిలో పడ్డారు.   దారులన్నీ నీటి మయం. ఆ నీటిలోనే తేలుతూ పోతున్నాయి, రకరకాల పాములు, తేళ్లు, ఇతర క్రిమి కీటకాలు.   మాధవుని ఇంటివరకూ నడిచే త్రోవ తయారయింది. పరుగు పరుగున మాధవుడు ఇంటికి చేరాడు.   కొంతకో కొంత నయం.. ‘కళింగం’ వసతి గృహం తుఫాను ధాటికి తట్టుకుని నిలబడింది. సంభారాలన్నీ గట్టిగా కట్టిన కొట్ల గదుల్లో దాస్తారు కనుక అవి కూడా బానే ఉన్నాయి.   మాధవుని చూడగానే నందుడు, గౌతమీ విప్పారిన మొహాల్తో ఎదురొచ్చారు. సీతమ్మ.. ఎక్కడుందో, ఆరబెట్టుకుంటున్న జుట్టు ముడి వేసుకుంటూ పరుగున వచ్చింది.   “అమ్మయ్య. ఎక్కడ చిక్కుపడి పోయావా నని హడిలి పోయాము కన్నయ్యా! ఇప్పుడే నందుడిని కోటకి వెళ్లమని అడుగుదామనుకుంటున్నాను.” సీతమ్మ మాట నోటిలోనే ఉంది.. వీధిలో కలకలం వినిపించింది.   అందరూ ప్రహరీ దాటి బైటికెళ్లారు. దాదాపు యాభై మంది ఉంటారు.  పెద్దలు, పిన్నలు, పసి వారు.. అందరికీ కళ్లల్లో ఉన్నాయి ప్రాణాలు. చింపిరి జుట్లు. తడీ పొడి వస్త్రాలు.. చిన్న పిల్లలు కొందరు నోట్లో వేళ్లు పెట్టుకుని చీకుతున్నారు.   కొందరు చేతుల్లో మట్టి చిప్పలు పట్టుకుని నిలుచున్నారు.   “సామీ! మీరే రచ్చించాలి. తిండి తిని మూడు రోజులయింది. చూరులోంచి పడిన వాన నీళ్లు తప్ప లోనికేం పోలేదు. ఇంత ముద్దెట్టి బతికించండయ్యా!” నందుడి, మాధవుడి కాళ్ల మీద పడిపోయారు అందరూ.   పూటకూళ్ల ఇంట్లో తిండి దొరుకుతుందని తెలుసు. వారున్న పల్లె రెండు కోసులుంటుంది.  అడ్డదిడ్డంగా పడిన చెట్లనీ, అడ్డంకులనీ తొలగించుకుని ఏ విధంగా రాగలిగారో.. ఆశ్చర్యమే.   ఆకలి.. ఆహారం దొరుకుతుందనే ఆరాటం ఎక్కడలేని శక్తినీ ఇస్తుంది.   నందుడి ఇంటి వారందరికీ కడుపు ద్రవించుకు పోయింది.   ఇంటిలోని వస్తువులు ఎన్ని నాళ్లు వస్తాయో.. ఆ జగన్నాధునికే ఎరుక. ముందు ఎదురుగా ఉన్న అన్నార్తుల ఆకలి తీర్చడం మానవ ధర్మం.   అందరినీ, లోనికి రమ్మని పిలిచారు.   ముందున్న సావడిలో కూర్చోపెట్టి,  దాహం తీరడానికి వారు తెచ్చుకున్న చిప్పల్లో కాసిని నీళ్లు పోశారు.   వసతి గృహం కనుక అన్ని రకాల ఆటుపోట్లకీ తట్టుకునేట్లుగా నిర్మించాడు నందుడు. సంభారాలన్నీ ఎప్పటికప్పుడు సర్దుతూ, పురుగు పుట్ర లేకుండా చూసుకుంటూ ఉంటారు.   వంట చెరకు కూడా జల్లు కురవకుండా కట్టిన సావళ్లలో పేర్చి ఉంచుతారు.   బైటంతా ఆకాశం.. ఒక్క మేఘం కూడా లేకుండా తేటగా స్వచ్ఛంగా ఉంది. వెనుక వైపు పెరడంతా బాగుచేశారు, ఇంట్లోనే ఉండే పనివారు.   మూడు రాళ్ల పొయ్యిలు మూడు వెలిగించాడు నందుడు. రెండు గుండిగల్లో ఎసరు పెట్టాడు మాధవుడు. వీశ చింతకాయలు కడిగి, మరుగు నీళ్లలో నానబెట్టింది సీతమ్మ. కిందికొరిగిన కరివేపాకు చెట్టునుంచి ఆకులన్నీ దూసి కడిగి ఆరబెట్టింది గౌతమి.   వీధి వసారాలో ఉన్న జనాలని కదిలించ దల్చుకోలేదు ఎవరూ. వాళ్లందరూ శోషొచ్చినట్టు పడిపోయున్నారు.   సరిగ్గా రెండు ఘడియల్లో వేడివేడి అన్నం వార్చి, గంజిని దాచింది సీతమ్మ. చింతకాయ చారు కాచింది గౌతమి గుండిగ నిండా. కరివేపాకు, చింతకాయ పిప్పి, ఉప్పు, బెల్లం, మిరపకాయలు రోట్లో నూరాడు మాధవుడు. అందులో ఘుమఘుమలాడే పోపు వేయించాడు నందుడు.   నలుగురూ తలా చెయ్యీ వేసి, వంటచేసేశారు. పాలేళ్లిద్దరూ, వసారా తుడిచి, రాలి పడిన అరిటాకుల్లోంచి మంచివేరి పరిచారు.   కమ్మని పోపు వాసనకి, నోరూరిపోతూ లేచి సందు చివరినుంచి తొంగి చూస్తున్నారు అభ్యాగతులు.   బావి దగ్గరికి వెళ్లి, చేతులు కాళ్లు, నోరు శుభ్రంగా కడుగుకొమ్మని చెప్పారు పాలేళ్లు. ఒకరి తరువాత ఒకరు, శక్తి తెచ్చుకుని ఒడలు శుభ్ర పరచుకుని తమ స్థానాల్లో కూర్చున్నారు.   మాధవుడు, నందుడు వడ్డన మొదలు పెట్టారు. మట్టి పిడతల్లో గౌతమి మంచి నీరు పోసింది.   వడ్డించే వాళ్లు వడ్డిస్తూనేన్నారు.. అలా తింటూనే ఉన్నారు తినే వాళ్లు. చివరికి వేళ్లకి అంటుకున్న మెతుకులని నాక్కుంటూ లేచారు ఒక్కొక్కరూ.   గౌతమికి కన్నీరాగలేదు వారిని చూస్తుంటే. ఇప్పుడు సరే.. మహా ఐతే మరో నాలుగైదు రోజులు తాము పెట్టగలరు. ఆ తరువాత?   తుఫాను దాడి నుంచి కోలుకోవడానికి ఎన్ని రోజులు, మాసాలు పడుతుంది? మళ్లీ పైరు లేవాలి, పుయ్యాలి, కాయాలి. ఎప్పటికి..   రాజుగారే తలుచుకోవాలి..                                       ………………     రాజుగారు తలుచుకున్నారు..   తుఫాను తగ్గిన రోజే.. కటకం ప్రజంతా కోట ముందుకి వచ్చేశారు.. ధనవంతులు, వ్యాపారస్థులు తప్ప..   కాపలా దారులంతా కోటలోకి వెళ్లి రాజుగారి చెవిని వేశారు. కపిలేంద్రదేవుడు, పురుషోత్తమునికి అప్పగించాడు కార్యాన్ని.   రాకుమారుడు గజం మీద కోట బైటికి వచ్చి, అందరికీ అభయ మిచ్చాడు.                    సీ.     పెనుతుఫానున చిక్కి వీటిపట్టు ప్రజలు                               భయముతో నటునిటూ పరుగు లిడగ                         చెట్లుచేమలు నేల చేరి యొరిగి యుండ                               బాటలన్నియు మూత పడెను గాద                         నిలువ నీడ కనక నీరు కారు కొనుచు                               దిక్కు తోచక నెంతొ దీను లైరి                          అచట నిలిచె నతడచ్యుతుడే యన                               సకల జనులకును శరణు నొసగ                   ఆ.వె.   నృపుని యనుమతి గొని నీరసించిన ప్రజన్                           ఆర్తి నంత బాపి యాదు కొనగ                           వంట శాలలందు పంచలందునకూడ                           ఆశ్రయంబొసగెను యాజ మిచ్చె.     అంతే కాదు, బెహారీలందరినీ సమావేశ పరచాడు. కోటలోని ధనాగారంలోనుంచి వెచ్చాలకి ధనం యిస్తానని వాగ్దానం చేశాడు.   అందరికీ దినవెచ్చాలిప్పించడమే కాదు.. వారి ఇళ్లు బాగు అయే వరకూ కోటలోనే ఉండమన్నాడు.   కోటలో ఒక పట్టణం పట్టేంత జాగా ఉంది.   యుద్ధ ప్రాతిపదికలో ఇళ్లన్నీ బాగుచేయించాడు పురుషోత్తముడు. అతనికి తోడు మాధవుడు.   మూడు నెలలలో నాము పంట వచ్చేసింది నవనవలాడుతూ.   రెట్టింపు ఉత్సాహంతో పనుల్లో పడ్డారు ప్రజలంతా! తుఫాను వలన నష్టం ఎంతయినా.. వందల్లో మనుషులు, వేలల్లో పశువులు పోయినా.. కోలుకోవడమనేది చాలా ముఖ్యమైనది, బ్రతికున్న వారికి. పోయిన వారినెవరూ తీసుకు రాలేరు కదా!   ఆ సమయంలో రాకుమారుడు, మాధవుడు చేసిన సహాయాలు ఎనలేనివి.   అదిగో.. అప్పటి నుంచీ, పురుషోత్తముడు, జగన్నాధుని అవతారమని ఇంకా.. ఇంకా ప్రచారమయిపోయింది.                                          ………………     ఆరుమాసాలయింది..   సంధ్యా సమయంలో మహానదీ తీరాన విహరిస్తూ, తాము ఎప్పుడూ కూర్చునే చెట్టు ఊడల్లో కూర్చుని, పురుషోత్తమ దేవ, మాధవులు హర్షుని నైషధానికీ, శ్రీనాధుని శృంగార నైషధానికీ గల సామ్యాలని చర్చిస్తున్నారు.   “గాఢ పాకంబైన హర్ష నైషధ కావ్యాన్ని ఆంధ్ర భాషలో కల్పించానని శ్రీనాధుడు గర్వంగా చెప్పుకుంటాడు. శృంగార నైషధం శ్రీనాధుల వారి కావ్యాలలో కెల్లా గొప్పదని నా ఉద్దేశ్యము  మిత్రమా!” మాధవుడు అన్నాడు.. నైషధంలో నుండి తెచ్చిన కొన్ని తాళ పత్రాలను తీసి చూస్తూ.   “నిజమే. కానీ, కొన్ని ఆయువు పట్టు శ్లోకాలను చివర్లో డు,ము,వు,లు కలిపి, యథాతథంగా తెలుగులోకి దించారని సంస్కృత పండితులన్నారుట. పైగా నీ డుమువులు నువ్వు తీసుకుని మా నైషధాన్ని మాకిచ్చేయ మన్నారని కూడా అంటారు.” పురుషోత్తముడు చెప్పాడు.   “సంస్కృత పదాలను అధికంగా వాడిన మాట నిజమే. అయితే.. ‘నీకంటికి పేలగింజయుం పెద్దయ్యెనే’, ‘చేదు తిన్న విధము’, ‘ఐదు పది చేయు’ వంటి తెలుగు పలుకు బడులు కూడా బాగా చూపించారు శ్రీనాధుల వారు” మాధవుడు చెప్తుంటే తల ఊపాడు పురుషోత్తముడు.. అవునన్నట్లుగా.   “కవిత్రయం తరువాత అంతటి పేరునూ శ్రీనాధునికే అంద జేశారు సాహితీ ప్రియులు. వారి చాటువులు ముఖ్యంగా..” రాకుమారుడు ఆపేశాడు సగంలోనే.. గుర్రం వస్తున్న చప్పుడు విని.   “మిత్రమా! శ్రీనాధ కవిని చూడాలని ఉంది నాకు. ఇది వరకు ఒకసారి అడుగుతే వారు ఎచ్చట ఉన్నారో తెలియదన్నారు మీరు. ఈ రాచ కార్యాల నుండి కొద్ది విరామం తీసుకుని దేశాటనం చేసి రావాలని ఉంది.” మాధవుడు తల పక్కకి తిప్పి వస్తున్నదెవరా అని చూస్తూ అన్నాడు.   కోటలోనుండి వార్తా హరుడు..   “ప్రభూ! మహారాజుగారు తమరిని వీలయినంత త్వరగా కలవాలని మీతో చెప్పమన్నారు. మాధవుల వారిని కూడా తీసుకుని రమ్మన్నారు.”   వెంటనే మిత్రులిరువురూ తమతమ అశ్వాలని అధిరోహించి కోటలోనికి బయలుదేరారు.   అశ్వశాలలో అశ్వాలని అప్పజెప్పి ప్రాసాదం లోనికి నడుస్తుండగా ఎదురు పడింది.. ఒక అందాల రాశి.   మాధవుడు కళ్లార్పడం మరచి పోయాడు.   ఉద్యానవనంలో.. పొదరిళ్ల మధ్య నుండి వడివడిగా నడిచి వస్తూ తడబడుతూ ఒక మెరుపు తీగ.. మాధవుడు కొద్ది సంవత్సరాల క్రితం మేనాలో చూసి, చెంగల్వ పువ్వందించిన బాలిక. నిండు యవ్వనంలో! నిగనిగని మోములో మాత్రం అదే పసి తనం. బెదురు చూపులు చూస్తూ పొద వెనక నక్క బోయి, మిత్రులిరువురినీ చూసి ఆగి పోయింది.    వెనుకగా నలుగురు చెలియలు..   “ఆ.. దొరికి పోయారుగా చెలీ..” అంటూ.   అందరూ కదలకుండా నిలుచుండిపోయారు, ఆగంతకులను చూసి.   భయం లేదన్నట్లుగా చిరునవ్వుతో అచటి నుండి కదిలాడు పురుషోత్తముడు.   వెనుకనే మాధవుడు, వెను తిరిగి చూసుకుంటూ!      “మా సోదరి కాదంబరీ దేవి మిత్రమా! అంటే మేము ఏక గర్భ సహోదరులం కాదు.. తండ్రిగారి మూడవ భార్య పుత్రిక. మా తల్లిగారు రెండవ భార్య. ఐతే.. మాతో చాలా ఆప్యాయంగా ఉంటుంది రాకుమారి. నాలుగు భాషల్లో నిష్ణాతురాలు.” రాకుమారుడు, మాధవుడికి చెప్పాడు.   రాకుమారి? ఇంకేముంది.. ఆశ వదులు కోవలసిందే. పలుకరించడానికి కూడా లేదు. కొంచెం నిరాశగా, నిశ్సబ్దంగా పురుషోత్తముడి వెనక నడిచాడు మాధవుడు.   కానీ మనసు మాత్రం ఆ జవ్వని తో వెళ్లిపోయింది.   “తండ్రిగారు వరునికోసం వెతుకుతున్నారు. మా సోదరికి సాటి అయిన వీరుడు, విద్యావంతుడు దొరకడం కష్టమే. పొరుగు దేశాల రాకుమారులలో వారికి నచ్చిన వారు ఇప్పటి వరకూ దొరక లేదు. ఎక్కడున్నాడో గజపతుల అల్లుడు..” రాకుమారుడు కించిత్తు గర్వంగా అన్నాడు.   నిజమే.. గజపతుల సామర్ధ్యం అప్పటికే నలుదిశలా వ్యాపించింది. చిన్న చిన్న రాజ్యాలన్నీ స్వచ్ఛందంగా సామ్రాజ్యం లో కలిసి పోయాయి.   కనుల ముందొక్క సారి కాదంబరి నిలిచింది మాధవునికి..                    తే.గీ.   చదువు లందున గీర్వాణి సత్యముగను                             సిరుల యందున నెలతియే సిరియె కాద                             పొందికనె తాను సీతయై పొసగు చూడ                             కాంతి వలె మెరసె నిలను కలయు కాదు.     కానీ, రాకుమారెక్కడ.. తానెక్కడ? పూటకూళ్ల ఇంటికి రాకుమారిని పంపుతారా కోడలిగా? పైగా తాము బ్రాహ్మణులు, వారు క్షత్రియులు.. నిట్టూర్చాడు మాధవుడు. ఐతే చంచల చిత్తం చెప్పిన మాట వినదే!   ఆలోచనల మధ్య రాకుమారుని వెంట వెళ్తూ, మహారాజుగారి ప్రాసాదంలోకి వచ్చినట్లు చూసుకోలేదు మాధవుడు. పురుషోత్తమ దేవునికి కొద్దిగా వెనుక నిలుచుని, రాకుమారునితో పాటుగా అభివాదం చేశాడు.   కపిలేంద్ర దేవుడు మహారాజయ్యాక, అంత దగ్గరగా చూడటం అదే ప్రధమం.   చిన్నతనంలో.. కోటలోనికి, సైనికులతో వెళ్తుండగా, ‘వీరేనా మహారాజుగారు.’ అని నందుడిని అడగడం గుర్తుకొచ్చింది.   కొద్దిగా వయసు ప్రభావం కనిపిస్తున్నా.. అదే పొంకం మహరాజులో..   “ఇతడే కదా నీ అనుంగు మిత్రుడు మాధవుడు, పురుషోత్తమా?”   “అవును తండ్రిగారూ..”   “మీరిరువురూ కాంచీ పురం వెళ్లి రావాలి. అక్కడి ప్రభువును కలిసి, సంధి సందేశాన్నివ్వాలి.” మహారాజు, ఆదేశ మిచ్చారు.   “మరి జగన్నాధుని ఉత్సవాలు?” సన్నగా అన్నాడు మాధవుడు.   ఆషాఢ శుద్ధ విదియ నాడు జరిగే పూరీ జగన్నాధుని రథ యాత్రకి రాజ వంశస్థులు ఉండి తీరాలి. పురుషోత్తముడు యువకుడయ్యాక అతడి చేత కూడా జగన్నాధునికి సేవ చేయిస్తున్నాడు రాజు.   ప్రజలు కూడా వేల సంఖ్యలో వచ్చి, జగన్నాధుని అంశ అయిన రాకుమారుని చూడ డానికి వస్తారు.   “ఉత్సవాలు ఇంకా రెండు మాసాల తరువాత. అప్పటికి వచ్చెయ్యవచ్చు.. వెంటనే బయలు దేరండి.” రాజుగారు లేచి లోనికి వెళ్లి పోయారు.                                        ………………....    ......మంథా భానుమతి

‘‘అజ్ఞాత కులశీలశ్య….” 15వ భాగం

ఆజ్ఞాత కులశీలస్య.. 15వ భాగం         హయ ప్రచార రగడ:      “నల్ల సామి వచ్చి యుండు                                     అల్ల కోట నందు యుండు                                     మల్ల సామి మంచి గుండు                                      కొల్ల జేసె కోతి దండు”    ముందుగా లేచిన పెద్దాయన గట్టిగా పాడుతూ నాట్యం చెయ్యడం మొదలు పెట్టాడు. మిగిలిన వాళ్లు గుండ్రంగా అతని చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ, పాడుతూ, ఆడుతూ సందడి చేస్తున్నారు.    పురుషోత్తమ దేవుడు, మాధవుడు ఆశ్చర్యంగా చూస్తున్నారు.    ఎక్కడ్నుంచి తెచ్చారో డప్పులు.. ఇద్దరు మోగిస్తున్నారు.    పల్లె పదాలు.. స్వచ్ఛమైన భావాలు.    నిష్కళ్మషమైన మందహాసాలు..    ఒకరినొకరు కవ్వించుకుంటూ ఆడుతున్నారు.    పెద్దాయన అన్నది, మిగిలిన వాళ్లు తిరిగి తిరిగి పలుకుతున్నారు.                    తురగవల్గన రగడ-                  “మడిసి బ్రోవ నిలకు వచ్చి మనుపు నొసగు సామి నీకు                   ఒడిసి పట్టి గట్టి గాను నొదలు సేయు దేవ నీకు                     వెన్న తిన్న మన్ను తిన్న వేడి వేడి బువ్వ నీకు                   అన్ను మిన్న కంట పడ్డ యయ్యవంట కన్న నీకు                    కుంతి మాత మధ్య సుతుని కోరి రధము నడుపు నీకు                    ఇంతి కృష్ణ మాన మెంతొ కృపను నిజము నిల్ప నీకు                    కఱకు కంసు దునిమి నట్టి కడిమి దొరకు వందనాలు                    పెఱిమ గల్గు దేవ నీకు వేల వేల వందనాలు.”    పాటలు, ఆటలు అయ్యాక సాష్టాంగ దణ్ణం పెట్టి అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు.    రాకుమారుడు మాధవుని వంక చూశాడు. తనకి కూడా ఏమీ తెలియట్లేదన్నట్లు తల అడ్డంగా తిప్పాడు మాధవుడు.    ముందుగా పాట మొదలు పెట్టిన పెద్దాయన్ని లేపాడు పురుషోత్తముడు.    “ఏమిటి పెద్దాయనా ఈ హడావుడి? పూరీ జగన్నాధుడి సంబరాలేమైనా ఉన్నాయా? అందుకోసం నాట్యం తయారయి చూపిస్తున్నారా? పూరీ వెళ్తున్నారా? ధనము కావలెనా?”    “అదేంది దొరా! ఆ జగన్నాధుడే ఇక్కడుండగా ఇంక పూరీ వెళ్లే పనే ముంది.”    “జగన్నాధుడు ఇక్కడున్నాడా?” ఆశ్చర్యంగా అడిగాడు మాధవుడు.    “వీరు పురుషోత్తమ రాకుమారుడే కదా?”    “అవును.”    “పురుషోత్తమ దేవుడు పూరీ జగన్నాధుని అంశ. ఆ సంగతి ఓఢ్ర ప్రజలందరికీ తెలుసు. వారి చిత్ర పటాలు మా అందరిళ్లకీ వచ్చాయి.”    “ఎవరు చెప్పారు? చిత్రపటాలు ఎవరిచ్చారు?” మాధవుడికి నమ్మ శక్యం కావట్లేదు.    “పూరీ సాములోరయ్యా! ఊరూరా తిరిగి చెప్తున్నారు. అప్పుడు అడవిలో ఏనుగులన్నీ తోకలూపుకుంటూ ఆరి వెంట వచ్చినయ్యంట కదా! అన్నట్లు, మీరు మాధవుల వారు కదా? కృష్ణులవారి హితుడైనోరే.. అర్జనుడే మీరని కూడా మాకు తెల్సు దొరా!”    ఈ సారి మరీ సంభ్రమానికి లోనయ్యారు మిత్రులిరువురూ.    ఏమీ చెప్పడానికి లేదు. చెప్పినా వినేట్లు లేరు.సాక్షాత్తూ పూరీ జగన్నాధునే చూసినంత ఆనందం లో ఉన్నారందరూ.    చీకట్లు దట్టంగా ముసురుకుంటున్నాయి.    పురుషోత్తముడు లేచి నిలుచున్నాడు. మాధవుని తో కలిసి అడుగులు వేశాడు..    “దణ్ణాలయ్యా! మమ్ముల్ని చల్లగా చూడాల తమరు.” పెద్దాయన తో సహా అందరూ వంగి వంగి దండాలు పెడుతుండగా ముందుకి నడిచి వారి గుర్రాలని అధిరోహించారు మిత్రులిద్దరూ.    మౌనంగా రాకుమారుడితో కోటలోపల, అంతఃపురంలో వారి అమ్మగారి భవనం వరకూ వెళ్లి, అక్కడ సేవకుడు గుర్రాన్ని తీసుకుని వెళ్లే వరకూ ఆగి,  రాకుమారుడు లోపలికి వెళ్లాక వెను తిరిగాడు మాధవుడు.    మహానది ఒడ్డున జరిగిందంతా కలలో అయినట్లు అనిపిస్తోంది.    ఈ రకంగా ప్రజల మధ్యకు వార్తలెలా వెళ్లాయో! ఎందుకు వెళ్లాయో.. ఏమీ బోధ పడలేదు.    “ఏమయింది కన్నయ్యా?” మౌనంగా భోజనం చేస్తున్న మాధవుడిని అడిగింది గౌతమి.    మాధవుడు ఇంటికి వచ్చి, స్నానం చేసి, భోజనానికి కూర్చున్నప్పుడు.. ఆ రోజు జరిగిన విశేషాలన్నింటినీ వివరిస్తాడు. నందుడు, గౌతమి ఎదురుగా మరునాటికి కావలసిన వస్తువులని ఒక దగ్గర పేరుస్తూ, ఆసక్తిగా వింటుంటారు.    ఆకుకూరలు బాగు చేసుకుంటూనో, పచ్చి మిరపకాయల తొడిమలు తీస్తూనో, విస్తళ్లు కుడుతూనో.. ఏదో ఒక పని. వారిరువురూ ఖాళీగా ఉండటం గడచిన పది సంవత్సరాలలోనూ మాధవుడు చూడ లేదు.    సీతమ్మ ఎదురుగా పీట వేసుకుని కూర్చుని కావలసినవి వడ్డిస్తుంది, కొసరి కొసరి.    “ఈ రోజు ఒక వింత జరిగిందమ్మా! ఆ విషయమే ఆలోచిస్తున్నాను.” నది ఒడ్డున జరిగిందంతా వివరించాడు మాధవుడు.    “ఇందులో వింతే ముంది మాధవా? ఈ సంగతి రెండు మూడు సంవత్సరాలుగా నడుస్తున్నదే. రాజు గారి ప్రోద్బలం తోనే ఇదంతా నడుస్తోందేమో నని కొందరు అనుకుంటున్నారు కూడా.” సీతమ్మ తేలిగ్గా అంది.    ఏటి ఒడ్డున వార్తలు సేకరించడంలో దిట్ట సీతమ్మ.    “కాకపోతే.. నువ్వు అర్జునుడి అవతారం అన్నది మాత్రం కొత్త వార్తే.” చిరునవ్వు నవ్వింది సీతమ్మ.    “మరి ఈ సంగతి ఎవరూ చెప్పలేదేమ్మా ఇన్ని రోజులూ? రాకుమారునికి కూడా ఇది ఆశ్చర్యం కలిగించిన సమాచారమే!”    “ఏ వార్తైనా అసలు వాళ్లకి ఆఖరున తెలుస్తుందన్న సామెత ఉందిగా.. చాలా మంది ప్రజలకి రాకుమారుడు పురుషోత్తముడంటే ఆరాధన. అదంతా నెమ్మదిగా, ఒక ప్రణాలికలో జరిగినట్లు అనిపిస్తుంది. ఏదేమైనా, రాకుమారులందరిలోకీ పురుషోత్తముడే సౌమ్యుడు, సమర్ధుడు అంటారు.” నందుడు నెమ్మదిగా అన్నాడు.    “రాకుమారుడు ఏ విధంగా స్పందిస్తున్నాడో..” సాలోచనగా అన్నాడు మాధవుడు.    అదే సమయానికి పురుషోత్తమ దేవుడు తల్లిదండ్రుల ఎదురుగా కూర్చుని, తండ్రి చెపుతున్న విషయాలను వింటున్నాడు. బుగ్గలు కందగడ్డల్లా ఉన్నాయి. చాలా అసౌకర్యంగా ఉంది.    వ్యాహ్యాళి నుంచి రాగానే, స్నానం, భోజనం చేసి, తల్లి మందిరానికి వచ్చాడు. కానీ.. ఏమీ చెప్ప లేకపోయాడు. తల్లిని చూస్తే యేమీ మాట్లాడ లేడతను.    వాతావరణం ఆహ్లాదంగా ఉంది. గవాక్షాల తలుపులన్నీ తీసి ఉంచారు. మలయ మారుతం మందంగా వీస్తోంది. వెన్నెల కాంతి ప్రాసాదమంతా పరచుకొని ఉంది.    రాకుమారుడు అస్థిమితంగా పచార్లు చేస్తున్నాడు.    మహారాజుగారు వస్తున్నారనే వార్త పట్టుకుని వచ్చింది పరిచారిక.    పురుషోత్తముని తల్లి ఆనందంగా లేచి ఎదురు వెళ్లింది. రాజుగారు అంతే ఆనందంగా లోనికి వచ్చి ఆసనం మీద కూర్చున్నారు.    “కుమారులు కూడా ఇచ్చటనే ఉన్నారే? సంతోషం.” దగ్గరగా పిలిచి మనసారా ఆలింగనం చేసుకున్నారు కపిలేంద్రుడు.    “కుమారుడు ఎందుకో చింతా క్రాంతుడై ఉన్నాడు.” రాణి అంది, రాజుగారి పక్కన కూర్చుని.    పురుషోత్తముని ప్రశ్నార్ధకంగా చూశారు రాజుగారు.    జరిగింది చెప్పాడు రాకుమారుడు.    ఏకాంత మందిరంలోకి దారితీశాడు రాజు, భార్యతో.. పురుషోత్తముని రమ్మని సైగ చేస్తూ. ఆ మందిరంలో ఇతరులెవరికీ ప్రవేశం లేదు. పురుషోత్తముడే రెండు మూడు సార్ల కంటే వెళ్లలేదు.    రాజుగారు చెప్పిందంతా విన్నాడు పురుషోత్తముడు.    “ఇదీ సంగతి కుమారా! మీ సహోదరులందరూ యుద్ధాలలో పోల్గొని రాజ్య విస్తరణకు పాటు పడ్డారు.. నిజమే. కానీ వారిలో ఎవరికీ పరిపాలనా దక్షత లేదు. రణం వేరు, రాజ్య పాలన వేరు. చిన్ననాటి నుంచీ నిన్నే నాకు వారసునిగా అనుకుని నీకు ఈ విధంగా శిక్షణ నిప్పించాను. మిగిలిన పుత్రులని వేర్వేరు రాజ్యాలకు ‘పరీక్ష’ (ప్రతినిధి)లుగా నియమించడానికి నిశ్చయించాను.”    రాణి మోము వికసించి వేవేల కాంతులతో వెలిగి పోతోంది. ఆవిడ పట్టుదలే పురుషోత్తముని వారసునిగా ఎన్నుకొనడానికి కారణం. రాజుని తన ప్రేమతో తెలివితో ఆకట్టుకున్న రాణి ఆవిడ.    “కానీ అన్నల ఆగ్రహానికి బలైపోతానేమో తండ్రీ!”    “సందేహం లేదు కుమారా! తప్పక వారు ఆగ్రహిస్తారు. ముఖ్యంగా హంవీర కుమారుడు. దక్షిణాన అతనికి మంచి పట్టు ఉంది. నాకు కుడి భుజంలాగే ఉండి పోరు సలిపాడు. ఇంకా సలుపుతున్నాడు. కృష్ణా తీరం, హంపీ విజయనగరం స్వాధీనం చేసుకోవాలి. తెలంగాణా కూడా మన రాజ్యంలో కలుపుకోవాలి. త్వరలో జైత్రయాత్రకి వెళ్తున్నాము. వంగదేశ సుల్తానులని ఓడించడ మయింది. కానీ అనుక్షణం అప్రమత్తతతో నుండాలి. మేమంతా దండయాత్రలు చేస్తుంటే నువ్వు రాజ్యాన్ని ప్రజల బాగోగుల్నీ చూడాలి.”    “దానికేమీ అభ్యంతరం లేదు తండ్రీ.. కానీ, ప్రజలు నన్నేదో జగన్నాధుడి అవతారం అనుకుంటుంటే.. అంటుంటే ఇబ్బందిగా ఉంది. వారితో ఏ విధంగా మాట్లాడాలో అర్ధమవుట లేదు.” పురుషోత్తముడు సన్నగా అన్నాడు. అతని బుగ్గల ఎరుపు ఇంకా తగ్గలేదు. అసలే పచ్చని పసిమి ఛాయేమో.. దీపాల కాంతిలో ఎరుపు రంగు ప్రతిబింబిస్తూ.. అక్కడక్కడ కెంపులు పొదిగిన బంగారంలా మెరిసి పోతున్నాయి.    “అవును.. నేనే ఆ విధంగా ప్రచారం చేయించాను. మున్ముందు ప్రజల అండ నీకుంటుందని. కళింగ దేశంలో జగన్నాధుడే కదా ఆరాధ్య దైవం.”    “మీరా!” ఆశ్చర్యంగా అడిగాడు పురుషోత్తముడు.    “నేనే.. ఒక పధకం ప్రకారం కొన్ని ఏళ్లుగా చేస్తున్నాను. ఇప్పుడు అందరూ నమ్ముతున్నారని నువ్వు చెప్తుంటే తెలిసింది. చాలా ఆనందంగా ఉంది.” గర్వంగా అన్నాడు కపిలేంద్ర వర్మ.    “ఇదంతా రాజకీయంలో ఒక భాగం కుమారా! నాకు నీ మీద నమ్మకం ఉంది. ఇంత శ్రమ పడి నేను విస్తరించిన ఈ సామ్రాజ్యాన్ని కాపాడుతావని. అందుకే.. కొందరు నమ్మకస్తులైన ఆంతరంగికుల సహాయంతో, నెమ్మదిగా.. ఎవరికీ అనుమానం రాకుండా చేయించాను.”    ఇంకా పురుషోత్తముడు ఒప్పుకోనట్లు కనిపించాడు.. స్తబ్దుగా.    ఇదే సమయం.. కుమారుని సందేహాలు తీర్చవలసిందే. భౌతికంగా, మానసికంగా పురుషోత్తమ కుమారుని తయారుచెయ్య వలసిన సమయం ఆసన్న మయింది.    “నువ్వీ శ్లోకం ఎప్పుడూ వినలేదా? ఇది ప్రసిద్ధి చెందిన సామెత లాంటి సూక్తి..                    “నానృషిః కురుతే కావ్యం, నా గంధర్వః సురూపభ్రుత్                     నా దేవాంశో దదాత్యన్నం నా విష్ణుః పృధివీ పతి”           ఋషి కానివాడు కావ్యం రాయలేడు. గంధర్వాంశ లేనివాడు అందంగా ఉండడు. దేవతాంశ లేనివాడు అన్నదానం చేయలేడు. విష్ణ్వంశ లేనివాడు రాజు కాలేడు. నీలో ఆ జగన్నాధుని అంశ ఉంది నాయనా! అందుకే నా కుమారులందరిలోనూ నిన్నే ఎన్నుకున్నాను నా వారసునిగా.” మహారాజు నచ్చ చెప్పారు కుమారునికి.                                        ……………… ఒక మాసం తిరగ కుండానే, పురుషోత్తముడు జగన్నాధుని అంశ అని ప్రజలు నమ్మే సంఘటన జరిగింది. గంగా తీరం నుంచీ కోరుకొండ వరకూ రాజ్యాన్ని విస్తరించిన కపిలేంద్ర దేవుడు రాజమండ్రీని కైవసం చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఆ తరువాత, కృష్ణా తీరం.. దైవం అనుకూలిస్తే కావేరి వరకూ గజపతుల తళ్లు (దండయాత్రలు) సాగాలనేది అతని కోరిక.. ఆశయం. పురుషోత్తముడు తక్క మిగిలిన కుమారులందరూ, నాలుగు దిక్కులా సామంత రాజుల వద్ద నుంచి కప్పాలు వసూలుకై వెళ్లారు. అధికారులకి ఏమైనా సమస్యలెదురైతే పరిష్కరించడానికి. హం వీర కుమారుడు, తన భార్యా పిల్లలతో దక్షిణాన, కోరుకొండ దగ్గరే ఉంటున్నాడు.. రెడ్డి రాజుల నుంచి దాడి రాకుండా చూస్తూ.. వీలైతే వారిని ఓడించి, రాజ్యాన్ని కబళించడానికి యత్నాలు చేస్తూ.. ఒక రోజు.. తూరుపు తీరం నుంచి విపరీతమైన గాలులు వీచ సాగాయి. కటకం లో ప్రజలంతా తలుపులు వేసుకుని ఇళ్లల్లో కూర్చున్నారు. పశువులు భీకరంగా అరవ సాగాయి. కొట్టాల్లో కప్పిన ఆకులన్నీ ఎగిరి విష్ణు చక్రాల్లా ఎగర సాగాయి గాల్లో. పొలాల్లో, అడవుల్లో పనిచేసే వారు ఆఘ మేఘాల మీద తమ నెలవులకి వెళ్లిపోయారు. బేహారీలు తమ కొట్లు కట్టేసి పరుగు పరుగున తమ భవనాలు చేరుకున్నారు. బట్టలు, సామాన్లు..  సరుకులన్నీ తడిసి ముద్దవడం ఖాయం.. తగిన రక్షణ కల్పించక పోతే. ఆకాశం అంతా నల్లని కారు మబ్బుతో కమ్ముకు పోయింది. పట్టపగలే చీకటి ప్రవేశించింది. పశువులకి తగిన ఆహారం సమకూర్చి, కొట్టాలలో కట్టేశారు. అన్నీ అస్థిమితంగా రకరకాలుగా అరుస్తున్నాయి. పక్షులన్నీ.. ఎక్కడికెళ్లి పోయాయో... మాయం అయిపోయాయి. ప్రకృతి విలయ తాండవానికి సమస్త ప్రాణులూ తయారయినట్లుంది. పూరి గుడిసెల్లో ఉండే పాటక జనం.. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని, ఇంట్లో ఉండాలో, బైటికెళ్లాలో తెలియక అల్లాడి పోతున్నారు. అనుకున్నట్లుగానే.. కొద్ది ఘడియల్లో తుఫాను, ప్రారంభం అయింది. గాలులతో పాటుగా కుండపోత వర్షం.. కన్ను మూసి తెరిచే లోగా, వేళ్లతో సహా చెట్లు లేచి వాలి పోయాయి. మూడు రోజులు ఆగకుండా కురుస్తూనే ఉంది. గాలుల వడి తగ్గినా, ఆ జడి వానకి కటకం చుట్టూ ఐదారు కోసుల దూరం వరకూ.. అన్ని పల్లెలూ ఊడ్చి పెట్టుకు పోయాయి. పంటలన్నీ కోతలై పోయి, కుప్పలు పోశారు. అన్నీ .. ధాన్యాలు, కందులు, పెసలు.. అన్నీ కొట్టుకు పోయాయి. ఇంకా కంకులు కోసిన చెట్లు అలాగే ఉన్నాయి. తుఫాను తగ్గాక ప్రజలు ఇళ్లలోంచి బైటికొచ్చి చూస్తే ఏముంది? విధ్వంసం.. పొయ్యిలు వెలిగిన వాళ్ల ఇళ్లల్లో వెలిగాయి.. లేని వాళ్లు గంజి కూడా తాగలేని స్థితి. పశువులు కొట్టుకుపోయాయి, కొట్టాలతో సహా! నది ఒడ్డున ఉన్న పూరి గుడిసెలన్నీ తేలి పోయాయి. అందులో ఉన్న మనుషుల సంగతి అనుకునేదేముంది? సర్వ నాశనం. పోయిన వారు పోగా ఉన్న వారి సంగతేమిటి? తుఫాను సమయంలో పిట్ట కూడా బైటి కొచ్చే అవకాశం లేదు. ఆ తరువాత పరిస్థితేమిటి? ఆ జగన్నాధుడే ఆదుకోవాలి..                                                                                                                         ......మంథాభానుమతి

‘‘అజ్ఞాత కులశీలశ్య….” 14వ భాగం

‘‘అజ్ఞాత కులశీలశ్య….” 14వ భాగం    పురుషోత్తమదేవునికి వరదలా వచ్చి పడ్డాయి సమస్యలు. వయసుకి మించిన బాధ్యతలు.    కపిలేంద్ర దేవునికి అత్యంత ప్రియమైన భార్య కుమారుడతడు. దశరధుడు కైకేయికి వరమిచ్చినట్లు గానే కపిలేంద్రుడు కూడా తన తరువాత పురుషోత్తముడే రాజని ఆవిడకి మాట ఇచ్చాడు. కానీ అది బహిర్గతం చేయడానికది సమయం కాదు.    ఆ సంగతినే ఆ భార్యకి చెప్పి కొన్ని రోజులు ఊరకుండుమన్నాడు.    “పురుషోత్తముడు ఇంకా చిన్నవాడు. నాకున్న పద్ధెనిమిది మంది పుత్రులలోనూ నాకు ప్రీతి పాత్రుడే. కానీ, రాజ్యాన్ని సుస్థిర పరచుకోవాలి.. అదే ప్రధమ కర్తవ్యం.”    జ్యేష్ఠ కుమారులలో బలమైన వాడు, ప్రముఖుడు హంవీరదేవుడు. తండ్రి రాజ్యానికి రక్షగా ఉన్నవాడు. నందాపురం రాజులనూ, ఒడ్డాది మత్స్యవంశపు రాజులనూ, యలమంచిలి చాళుక్యులనూ లొంగ దీసుకోవడంలో తన పరాక్రమాన్ని చూపించిన వాడు.    సహజంగానే.. తండ్రికి ప్రీతి పాత్రుడని, అన్నదమ్ములందరికీ పురుషోత్తమ దేవుడనిన అసూయ, కోపం. అందరూ అతడిని వెలివేసినట్లుగా చూస్తుంటే బాల ప్రాయమునించీ ఒంటరి గా గడపడం అలవాటు చేసుకున్నాడు.    ఒక రకంగా ఆ ఒంటరి తనం అతన్ని సాహిత్యానికి దగ్గర చేసింది.    విద్యలన్నిటి యందూ అధిక సమయం వెచ్చించడానికి దోహద పరచింది. ఆటపాటల బాల్యాన్ని గురుకులంలో తోటి విద్యార్ధుల మధ్య గడిపాడు.    మాధవుని సాంగత్యం ఎడారిలో ఒయాసిస్సులా ఊరట పరచింది పురుషోత్తముడిని. తెలివిలో, ఠీవిలో, అభిరుచులలో, ఆసక్తిలో అన్నిటా సమ ఉజ్జీ. దాయాదుల మత్సరంలేకుండా, స్వచ్ఛమైన స్నేహం లభించింది.        మహానదీ తీరం నుండి కోటకి వచ్చిన వెంటనే, పురుషోత్తమ దేవునికి పిలుపు వచ్చింది, తండ్రిగారి నుండి.    మాధవుడు గజ శాలలకి వెళ్లిపోయాడు. శాలలలో యుద్ధ శిక్షణ ఇస్తున్న గజాలని పర్యవేక్షించడానికి. వన్య మృగాలకి యుద్ధ శిక్షణ చాలా కఠినంగా ఉంటుంది.. సైనిక శిక్షణ లాగానే. అవి మగ ఏనుగులే అయుంటాయి.    మొదట్లో వాటికి ఆహారం ఇవ్వకుండా.. మాడుస్తారు. నెమ్మదిగా, వాటిని మావటి వానిచే మచ్చిక చేయిస్తారు. వాని మీదికి, బాణాలు విసరడం, కత్తులు ఝుళిపించడం.. గాయాలు చెయ్యడం వంటివన్నీ చేస్తారు. యుద్ధభూమిని తయారుచేసి అందులో ఏ విధంగా రెచ్చిపోవాలో నేర్పిస్తారు.    రణ రంగంలో ఉండేవి చాలా పెద్ద ఏనుగులు. ముందుగా వాటి ఆకారాలని చూసే భయపడి పోతారు, పదాతి దళం.. తొండంతో ఇరవై అడుగులు పైకి ఎగరేసి విసిరెయ్యడ, నేల మీదకి పడేసి తొక్కడం, దంతాలని మనుషుల్లోకి గుచ్చడం వంటి వన్నీ, బొమ్మలతో శిక్షణ ఇస్తారు.    అంత భయంకరంగా పోరాడే జీవులూ, తమ యజమాని గానీ, మావటి గానీ దగ్గరగా వస్తే.. చెప్పినట్లు వింటాయి వెంటనే.    ఆ శిక్షణలో తగలే దెబ్బలకి వైద్యం చెయ్యడానికీ, ఔషధాలు తయారు చెయ్యడానికీ ఒక విభాగం ఉంటుంది. యుద్ధ సమయంలో డేరాలలో, వైద్యులతో, పశు వైద్యులు కూడా ఉంటారు.    మాధవుడు, ప్రతీ పనినీ స్వయంగా చూసుకుంటాడు. శిక్షణ కఠినంగా ఉందనిపించినా మాట్లాడడు. భీకర యుద్ధాలనెదురుకోవాలంటే ఆ విధంగా ఉండాలిసిందే!    ఆ శిక్షణలో ఒక్కొక్క సారి అతడికి కూడా దెబ్బలు తగులుతుంటాయి. ఆ సమయంలో గౌతమి పదే పదే చెప్తుంటుంది.. కోటలోకి వెళ్ల వద్దని. మాధవుడు ఊరడిస్తే ఊరుకుంటుంది.               ఉ.    పోరు నెదుర్కునే బలిమి పూటుగ రావలె నన్నచో సదా                      భారము కల్గియే మెలగి బాగుగ శిక్షణ చేయగా వలే                      నోరిమి యెంతయో కలిగి నొట్టిగ భీతిని చెందియుండకే                      ఘోరముగా నదే రణము గొప్పగ సల్పను శక్తి కల్గుగా!        ఆ రోజుకి తన పని ముగించుకుని ఇంటికి వెళ్లిన మాధవునికి దుఃఖముతో ఎదురొచ్చారు గౌతమీ, నందులు.    “ఏమయిందమ్మా?”    “అమ్మ మనల్ని వదిలి వెళ్లిపోయింది మాధవా!” నందుడు వెక్కుతూ అన్నాడు.    మాధవుని నోటి వెంట మాట రాలేదు. అరుగు మీద కూర్చుండి పోయాడు.    “ఆఖరు చూపు దక్కలేదు. మొన్నటి రేయి, నిద్దురలోనే విడిచిందట ఆఖరు శ్వాశ. రేపు ప్రాతఃకాలమందే బయలు దేరి వెళ్తున్నాము ఇద్దరమూ.. కర్మ కాండలు నిర్వర్తించవలెను కదా! నువ్వు రాకుమారుని అనుమతి తీసుకుని మా వెనుకే బయలుదేరి వచ్చెయ్యి.”    “ఇప్పుడే వెళ్లి అడుగుతాను. అందరం కలిసే వెళ్దాము.” మాధవుడు కళ్యాణి పైకి ఎక్కి కళ్లెం లాగాడు.                                             ………………    గౌతమి మేనాలో, నందుడు, మాధవుడు చెరొక అశ్వం మీద బయలు దేరారు. త్వరిత గతిన వెళ్లడానికి కుదురుతుందని.    మరునాడు సాయంత్రానికి కానీ వెళ్ల లేకపోయారు.. అతి తక్కువ విశ్రాంతి సమయాలు తీసుకుంటూ. దారంతా, మాధవునికి బాలవ్వ జ్ఞాపకాలే. ఆరోజు సైనికుల నుంచి తనని కాపాడక పోయి ఉంటే..    ఆవిడ చూపించిన ప్రేమ, తన పుత్రునికే అప్పజెప్పడం.. ఏ నాటి అనుబంధమో. ఈనాటి తన స్థితికి ఆవిడే మూలం. కళ్ల చెమరుస్తూనే ఉన్నాయి. తన తల్లిని విపత్కర పరిస్థితులలో అడవిలో వదిలేసి వచ్చిన దృశ్యం కనిపించింది.    ఆవిడ భద్రకాళి అవతారం ఎత్తి శతృవులని ఎదుర్కొన్న వైనం..    అడవి నుండి నిస్సహాయ స్థితిలో, భయ భ్రాంతులతో వచ్చిన తనని ఆదుకున్న బాలవ్వ..    ఈ స్త్రీ మూర్తుల ఋణం తీర్చుకోగలగడం ఎవరికైనా తరమా!    మాధవుడు బృందం వెళ్లేసరికే దహన సంస్కారాలైపోయాయి.    “ఐపోయింది అన్నగారూ! ఇంక ఆపద్దని సెలవిచ్చారు పెద్దలు. మీరు ఎప్పటికి రాగలరో తెలియదు కదా..” జగన్నాధుడు అన్నగారిని పట్టుకుని రోదించాడు.   “ఆవిడ ఓర్పు, ప్రేమ.. అమ్మని ఆదర్శంగా తీసుకోవాలి మనం. చాలా నేర్చుకోవాలి ఆవిడ జీవన శైలి నుండి.. జాతస్య మరణం ధృవమ్. ఆ సమయం వస్తే ఎంతటి వారైనా వెళ్లి పోవలసిందే కదా!” నందుడు ఓదార్చాడు తమ్ముడిని.    పన్నెండు రోజులు ఉండి, శాస్త్రోక్తంగా కర్మ కాండలు ముగించుకుని, కటకం వచ్చేశారు ముగ్గురూ.    ఆ పన్నెండు రోజులూ పూటకూళ్ల ఇల్లు మూసి వేశారు.        మాధవుడు తిరిగి వచ్చే సరికి అనేక మార్పులు వచ్చాయి కోటలో.    కపిలేంద్రుడు వంగదేశ దండయాత్రకి వెళ్లాడు. అతడితో కొందరు కుమారులు వెళ్లారు. అదే అదనుగా, చారుల సమాచారంతో.. దక్షిణం నుంచి రెడ్డిరాజులు దండెత్తారు.    కోటకీ, రాజ్యానికీ రక్షగా ఉంచిన హంవీరదేవుడు వారికి గుణపాఠం చెప్పటానికి బయల్దేర వలసి వచ్చింది.. సగం గజబలం, అశ్వబలం ఉంచే వెళ్లాడు రాజు.    తప్పని పరిస్థితులలో, చిన్నవాడైనా, పురుషోత్తమ దేవుడిమీద రాజ్య భారం పడింది. విశ్వాస పాత్రులయిన దండనాయకులు ఇద్దరున్నారు.    మాధవుని చూడగానే పురుషోత్తమునికి కొండంత బలం వచ్చినట్లయింది. అక్కడ వదిలి వెళ్లిన గజబలం అంతా మాధవుడు తరలించినదే. అతడి చే సైగకి పరుగులు పెడతాయి ఆ గజాలు.    రోజూ గజ, అశ్వ దళాల చేత కవాతులు చేయించడం, శిక్షణ పర్యవేక్షించడం.. అంతే కాదు, వంటశాలలో కూడా అజమాయిషీ, మాధవునికి బాధ్యతలు చాలా అప్పగించాడు రాకుమారుడు.    “అందుకే పెద్ద వారితో స్నేహం వద్దన్నాను కన్నయ్యా! పట్టుమని పదహారేళ్లు నిండాయో లేదో.. ఇప్పటినుంచీ కోటలో పనులా?”గౌతమి నిష్ఠూరంగా అంది.    “అమ్మా! నీ భయం నాకర్ధమయింది. కానీ.. యువకులకి తప్పని పనులమ్మా ఇవి. నా వయసు వాళ్లు యుద్ధానికే వెళ్లారు. నేనింకా రాకుమారుని స్నేహితుడుని కనుక, అతని భారాన్ని పంచుకుంటూ ఉండగలుగు తున్నాను. రోజూ ఇంటికి వచ్చి మిమ్మల్ని చూడ గలుగుతున్నాను.” ఓదార్చాడు తల్లిని.    “కోటని ఎవరైనా ముట్టడిస్తే..”    “ఏమవుతుందమ్మా? రాకుమారునితో యుద్దంలో పాల్గొంటాను. అభి మన్యుడు, బాల చంద్రుడు నా వయసులోనే యుద్ధం చేశారు.”    చటుక్కున వచ్చి మాధవుని నోటి మీద చేతులుంచింది గౌతమి.    “అశుభం పలుకకు నాయనా!”    “అటులనే అమ్మా! అయినా నన్ను రెండు కారణాల వలన రణానికి పంపరు. మీకు చింత వలదు. ఒకటి.. బ్రాహ్మణ బాలురు పిరికి వారని కోటలో వారి అభి ప్రాయం. మరొకటి.. మన వృత్తి. పదుగురికీ ఆహారం సమ కూర్చుతాము కదా! అది లేకున్న జీవనమే ఉండదు.. ముందు భుక్తి.. పిదపనే రాజ్యం.” నవ్వుతూ అన్నాడు మాధవుడు.    “చిన్న వాడవైనా ఎంత అవగాహనరా నీకు..” సీతమ్మ మెచ్చుకుంది.    “అమ్మమ్మా! ఆకలి.. ముందుగా నా బొజ్జని మెచ్చుకో.. ఆ తరువాత నన్ను మెచ్చుదువు..” మాధవుడు గోముగా అడిగాడు.    “రా నాయనా! ఎప్పుడు తిన్నావో ఏమో. నీ కిష్టమైన శాకమే ఇవేళ.. వంకాయ అల్లం వేసి చేశాను.” సీతమ్మ వెనుకింటికి దారి తీసింది.                                        ………………    ఎవరి కెన్ని సమస్యలున్నా, సంతోషంతో తేలి పోతున్నా, దుఃఖ భారంతో కుంగి పోతున్నా.. కాలం సాగి పోతూనే ఉంటుంది.    నాలుగు సంవత్సరాలు.. పొరుగు దేశాలతో పోరులు, తన సామంతరాజుల సర్దుబాట్ల మధ్య కపిలేంద్ర దేవుడు ప్రజానుకూలంగానే పరిపాలిస్తున్నాడు. ముఖ్యంగా పాడి పంటల అభివృద్ధిలో ప్రజల మన్ననలందుకుంటున్నాడు. రాజ్యం సుభిక్షంగా ఉంది.    క్రీ.శ. 1443- ఉత్తరాన గంగా తీరం నుండి, దక్షిణాన విశాఖ పట్టణం.. కోరుకొండ వరకూ రాజ్య విస్తరణ సాగింది.    గురుకులం లో విద్య పూర్తి అయిందని గురువుగారు చెప్పారు.    మాధవునికి కోటలో కొలువు ఖాయమయింది.    రాకుమారునికి ఇష్ట సఖుడతడు..  ఇరువురూ కలిసి చేసే సాహిత్య చర్చ ఎంతో ప్రియమైనది మాధవునికి.    ఒక సాయంకాలం.. మిత్రులిరువురూ, మహానది ఒడ్డున, వనంలో మర్రిచెట్టు కింద ఊడల ఆసనాలపై కూర్చున్నారు.    ఇరువురూ సంధ్యా సమయంలో ఏ రాజకీయాల గురించీ ఆలోచించకుండా సాహిత్యం గురించే మాట్లాడుకుంటారు.    “మిత్రమా ఎంత ఆహ్లాదంగా ఉందీ ప్రకృతి? ఏ ఆందోళనలూ లేకుండా హాయిగా.. ఎటువంటి ఒత్తిడులూ లేకుండా, ఉండిపోతే.. అంత కంటే జీవితానికింకేం కావాలి?           సీ.    నిశ్చలమౌ నదీ నీరములన్నియు                         నిటలాక్షుడే యోగ నిద్రను యుండ                  పక్షికూనల కూహు పాటలాగినవిగా                         చెట్టుమీదను తల్లి చేర రాగ                  ఊడలన్నియు వంగి నీడ నందుకొనగా                         మర్రి మురిసెగ తాను మాకు నవగ                  దూరమున నిలిచి తొణకక నగమదె                         దృష్టి సారించెనే దీక్ష గాను           ఆ.వె.  ఈ ప్రశాంత సంధ్య నీ తటి నిర్మల                    మానసమున ధ్యాన మాచరించ                    నేమి పుణ్యమోను, నీ జన్మ మంతయు                    ధన్య మయ్యె గాద తధ్యముగను.         కాసేపు, చింత నంతా వదిలి ధ్యానం చేసుకోవాలనిపిస్తోంది, గుండె నిండుగా ఊపిరి పీల్చి.” రాకుమారుడు అర్ధ నిమీలత నేత్రాలతో అన్నాడు.          రాకుమారునిలో ఒక దివ్య తేజస్సు ప్రవేశించినట్లు అనిపించింది మాధవునికి.                                       “అవశ్యం రాకుమారా! మీరు ధ్యానం చేసుకోండి. నేను కావ్య పఠనం చేసుకుంటాను.” మాధవుడు కొద్ది దూరంలో కూర్చుని, తాళ పత్రాలు విప్పాడు. రాకుమారుని మీద దృష్టి నిలుపుతూ. పురుషోత్తమ దేవుని రక్షణ అతడికి అప్పగించాడు మహారాజు, నిరంతరం కలిసే ఉంటారు కనుక. అందులో మాధవుని ప్రతిభ అవగతమే కపిలేంద్రునికి.    శ్రీనాధుని కావ్యాలంటే మక్కువ మాధవునికి. ఆ మహాకవి ఇప్పుడెక్కడున్నారో, రాకుమారుని అడగాలి. జీవితంలో ఒక్క సారైనా వారిని కలవాలి అనుకుంటూ హరవిలాసం తీశాడు. పాల్కురికి సోమనాధుని పండితారాధ్య చరిత్రను పోలి ఉంటుంది.    హరవిలాసం అంతా శివ భక్తుల కథలు.    శృంగారనైషధం అనువాద కావ్యమంటారు, కానీ.. హర విలాసం, అందులోని కథలు శ్రీనాధుల వారి సృజననే అంటారు. అద్భుతమైన వర్ణనలుంటాయి, శ్రీనాధుని కావ్యాలలో.    పఠనంలో మునిగి పోయి ఒక ఘడియ మాత్రం రాకుమారుని గమనించ మరచి నట్లునట్లున్నాడు.. తల ఎత్తి చూసే సరికి కనిపించిన దృశ్యం ఒక్క సారి మాధవుడిని అప్రమత్తుడిని చేసింది.    ఒక్క ఉదుట్న లేచాడు.    ఇంత మంది జనం.. రాకుమారుని చుట్టూ.. వారినే చూస్తూ..    ఏమయింది? తాము భయపడుతున్నట్లే, సవతి సోదరులు కుట్ర పన్నారా? మహారాజుగారికి పురుషోత్తమదేవుడంటే అవ్యాజమైన ప్రేమ, వాత్సల్యమూ అని అందరికీ తెలిసిన విషయమే. అందువలన ఇతడి మీద వారికి మత్సరం అని విన్నాడు. కానీ.. అక్కడున్న జనం హాని కనిగించే వారి లాగా, సైనికుల లాగా లేరు.  అడవుల్లో, పొలాల్లో పనులు చేసుకుని ఇళ్లకి తిరిగి వెళ్లే పల్లె జనం. తలపాగాలు చుట్టుకుని అమాయకంగా ఉన్నారు.    తమతమ చేతుల్లో ఉన్న పనిముట్లన్నీ నేల మీద పెట్టి, రాకుమారుని చుట్టుముట్టి, నేల మీద కూర్చున్నారు.    మాధవునికి ఏం చెయ్యాలో అర్ధం కాలేదు.    చటుక్కున వెళ్లి రాకుమారుడి పక్కన నిలుచున్నాడు. అది అతని బాధ్యత. ఒరలో కత్తిని సవరించుకుని కళ్లని చురుకుగా తిప్పుతూ అక్కడున్న ప్రతీ ఒక్కరినీ పరిశీలిస్తున్నాడు.    అంతా నిశ్సబ్దంగా కూర్చున్నారు. అలసిన వారి మొహాల్లో కూడా ప్రశాంతత..    రాకుమారుడు కదలకుండా మెదలకుండా ధ్యానం చేస్తున్నాడు. ఒక ఘడియ గడిచిందేమో.. నెమ్మదిగా కన్నులు తెరిచాడు. ఒక్క నిమేషం.. కళ్లలో ఆశ్చర్యం కదలాడింది. చిరునవ్వు నవ్వాడు.. గుండ్రంగా తల తిప్పి అందరినీ పరికించాడు. అతడి మోము ఆ సంధ్య వెలుగులో వింత కాంతిని వెదజల్లుతోంది.    ఆ కన్నులలో ప్రశాంతత, మోములోని పవిత్రత ఎవరినైనా కట్టి పడేస్తాయి.    ప్రజలలో కొద్ది కలకలం.. ఒక పెద్దాయన లేచి, తలపాగా తీసి చేతిలో పట్టుకున్నాడు.. “సామీ.. మీరు రాకుమారులే కదా?” తల పంకించాడు పురుషోత్తముడు.    వెంటనే అందరూ లేచారు.. మాధవుడు కత్తి పిడి మీద చెయ్యి వేశాడు..                                      ………………..        ......మంథా భానుమతి  

‘‘అజ్ఞాత కులశీలశ్య….” 13వ భాగం

                     ‘‘అజ్ఞాత కులశీలశ్య….” 13వ భాగం                                     కోటలో..                                       ఉ.    జీవన యానమున్ కలుగు చేర్పులు తర్కము కందవే మరీ                   ఏ విధి రాసెనో నుదుట యెవ్వరి కైనను నేర్వవచ్చునా                   కావగ దైవమే యిలను కైనొసగేనుగ మోదమందగా                   చేవగ కోటలో నడుగు చిక్కగ వేసెను మాధవుండదే.         కళింగ దేశం వచ్చినప్పటునుంచీ కోటలోపలికి వెళ్లాలనుకున్న మాధవుడు, అనుకోని విధంగా, రాకుమారుని వెంట కోటలో ప్రవేశించాడు.   వంగదేశంలోని తమ కోట కంటే ఎంతో విశాలంగా ఉంది. తీరైన దారులు.. దారుల పక్కన పూల మొక్కలు.. స్వాగతిస్తున్నట్లు తలలూగిస్తున్న వృక్షాలు..   ఎంతో శుభ్రంగా కన్నుల కింపుగా ఉంది.   పురుషోత్తమ దేవుడు, గజాలని గజశాలలకి తరలించాడు.   గజశాలలని చూసిన మాధవుడు అనుకున్నాడు.. కపిలేంద్ర దేవుని విజయాలకి ఆటంకం ఉండదని, వారి వంశానికి గజపతులనే పేరు నిలిచి పోతుందనీ, కనీసం మూడు తరాలు పాలన చేసి తీరుతారని!   కోట వెనుక భాగాన ఎత్తైన ప్రాకారాలతో ఉంది గజశాల. అచటికి వెళ్లాలంటే కోటను దాటే వెళ్లాలి. ఏ చారులూ సులభంగా చేరలేరు.   అదాటుగా చూసి ఏనుగులను లెక్కించడం అసాధ్యం.   మొత్తం అంతా చూపించి, కొత్త గజాలన్నింటినీ, ఒక్క రోజులో నిర్మించిన విశాలమైన శాలల్లో ప్రవేశ పెట్టారు. ప్రతీ ఏనుగు వద్దా గుట్టల్లా పోసిన కొమ్మలు.      మాధవుడు, పురుషోత్తమ దేవుడు.. శాలలన్నీ నడిచి చూస్తున్నారు.   గజశాలలన్నీ పెద్ద అడవిలో ఉన్నట్లే ఉన్నాయి.   రాజ్యాన్ని చేజిక్కించుకునే ముందే ఏనుగుల సంరక్షణ కేర్పాట్లు చేశాడు కపిలేంద్ర దేవుడు.   ఒకటి రెండు రోజుల్లో జరిగిన ఆక్రమణ కాదది. దాదాపు ఐదారు సంవత్సరాల నుంచీ ప్రణాలిక వేసిందే.   ప్రధాన సామంతుడిగా, సైన్యికాధికారిగా, కపిలేంద్రుడు అభివృద్ధి పనులని బాగా చేపట్టాడు.. తనే చేస్తున్నట్లు చల్లగా ప్రచార మిచ్చుకుంటూనే.   ఏదేమైనా.. కళింగదేశం కళకళ్లాడుతోంది. ఆలయాల నిర్మాణం, పూరీ జగన్నాధుని ఆలయానికి అలంకరణలూ.. పాడి పంటల అభివృద్ధి బాగా సాగుతోంది. ప్రజలు మార్పుని మనస్ఫూర్తిగానే ఆహ్వానించారు.   అయితే.. సైన్య సమీకరణ, అశ్వ, గజ శాలల అభివృద్ధి కూడా వేగంగా జరుగుతున్నాయి. అంతర్గత విప్లవాలని అణచి వేసినా, బలహీన పొరుగు దేశాలపై యుద్ధానికి సన్నిద్ధమౌతున్నాడు రాజు.   గజ శాలలని చూసి అదే అనుకున్నాడు మాధవుడు.   అతి త్వరలో యుద్ధానికి సమాయత్తమవ వలసి ఉంటుందని.      “మాధవా!” రాకుమారుని పిలుపు విని తల తిప్పి చూశాడు   “రోజూ కోటకి రాగలవా? అంటే.. కొద్ది సమయం ఇక్కడ గడపగలవా?”   మాధవుని నోట మాట రాలేదు. రాకుమారుడు అడుగు తున్నాడంటే ఆజ్ఞాపిస్తున్నాడనే అర్దం. కాదనగలడా?   “ఇది ఆజ్ఞ కాదు సుమా.. అభ్యర్ధన మాత్రమే.” మనసులో మాట తెలుసుకున్నట్లుగా అన్నాడు.   “తల్లిదండ్రులకో మారు చెప్పి..” మాధవుని మాట పూర్తి అవకుండానే పురుషోత్తముడు చిరునవ్వు నవ్వాడు.   “అవశ్యం మిత్రమా! వారి అనుమతి తీసుకునే! నంద మహాపాత్రులకి అభ్యంతరం ఉంటుందనుకోను. మీ అమ్మగారే భయ పడవచ్చును. కానీ సర్ది చెప్పగలవని నాకు నమ్మకమే.. అది నీకు ఇష్టమైతేనే సుమా..”   రాకుమారుడు, మిత్రమా అని సంబోధించడమా? అదీ ఒక పూటకూళ్లఇల్లు నడిపే బ్రాహ్మణుల బాలుడిని.   మాధవుడు సంశయాత్మకంగా చూశాడు.   “మనం ఒకే గురువు వద్ద విద్యనభ్యసిస్తున్నాం. మరి మనం మిత్రులమేకదా మిత్రమా?” మాధవుని భుజం మీద చెయ్యివేసి అన్నాడు పురుషోత్తముడు.   ఆ క్షణం నుంచీ మాధవ, పురుషోత్తములిరువురూ ప్రాణ స్నేహితులై పోయారు. జీవితాంతం ఒకరికొకరు తోడుగా నిలిచారు.   ఇంటికి తేరుకుని, ఏవిధంగా కోట సంగతి చెప్పాలా అని మధన పడుతున్న మాధవునికి ఊరట కలిగింది, నందుని ఉత్సాహాన్ని చూసి.   “కోటలో పాగా వెయ్యడమంటే ఇదే కుమారా? అవశ్యం వెళ్లు. మన రాజుగారికి సేవ చెయ్యడం కన్న కావలసినది ఏముంటుంది?”   గౌతమికి మాత్రం ఆవేశం వచ్చింది.   “ఇదేనా మీరు చెప్పవలసింది. కోటలోకి అడుగు పెడితే ఇంక కన్నయ్య మనకి దూరమైపోడా? వద్దని చెప్పక, ఇంకా ప్రోత్సహిస్తారా?”   అప్పటికి నందుడు ఏమీ మాట్లాడకుండా వెళ్లి పోయాడు.   “అమ్మా! మీరు వలదన్నచో నేను ఇల్లు కదలనే కదలను.” మాధవుడు మాత్రం అభయం ఇచ్చేశాడు.. తల్లిని మరపించిన తల్లికి.   అంతా వింటున్న సీతమ్మ మౌనంగా ఉండి పోయింది. ఆవిడకి తెలుసు.. ఆ సమయం వస్తే ఎవ్వరూ ఏదీ  ఆపలేరని.   “ఐనా.. రోజూ కొద్ది సేపే కదమ్మా రాకుమారుడు నన్ను రమ్మని అడిగింది. అంతలో నన్ను సైన్యంలో చేర్చుకున్నట్లు కాదు కదా!” మాధవుడు ఊరడించ బోయాడు.   గౌతమి కళ్ల నీళ్లు పెట్టుకుంది.   “ఇప్పుడలాగే అంటారు కన్నయ్యా! ఒక సారి అందులోకి వెళ్తే ఇంక వదలరు. అందులో ఇప్పుడు యువకులని యుద్ధాలకి తీసుకు పోతున్నారు. వాడ వాడంతా హడలి పోతున్నారు.”   “నన్ను యుద్ధానికి తీసుకెళ్లరమ్మా! రాకుమారుని వెంటే ఉంటాను. ఐనా మీరు వద్దంటే వెళ్లనని చెప్పా కదా?” మాధవుడు తల్లి చీర కొంగుతోనే ఆమె కన్నులు తుడుచాడు.                                       ………………..     “రాకుమారుడు మాట వరుసకి అడిగారు కానీ, అది ఆజ్ఞే గౌతమీ. తప్పక వెళ్ల వలసిందే. మనం సంతోషంగా అనుమతి ఇవ్వాలి, ఆశీర్వదిస్తూ.” నందుడు ఏకాంతంలో గౌతమికి సర్ది చెప్పాడు.   “ఒక సారి కోటలోకి వెళ్లే.. మనకి తెలియనిదేముంది?” కళ్లనిండా నీళ్లతో అంది గౌతమి.   “అంతలాగ మాయా మోహంలో చిక్కుకో కూడదు గౌతమీ! అయినా ఐదారు సంవత్సరాల క్రితం మాధవుడెవరో మనమెవరో.. ఇప్పుడు ఈ అనుబంధం వచ్చింది కానీ.. నిమిత్త మాత్రంగానే ఉండాలి సుమా.”   మరునాడు.. గౌతమి, ఆందోళన లోలోపలే దాచుకుని మాధవునికి అనుమతి ఇచ్చింది.   కానీ ఆవిడ భయపడినట్లే అయింది.   మాధవుడు గురుకులం నుండి కోటకే వెళ్తున్నాడు. వారానికి ఒక పరి మాత్రమే ఇంటికి వస్తున్నాడు.   వచ్చినప్పుడు మాత్రం ఎప్పటి లాగానే అందరితో కలసి మెలసి, ఛలోక్తులు విసురుతూ అలరిస్తుంటాడు.   కోటలో..   గజశాల పర్యవేక్షణ మాధవుని ప్రధాన బాధ్యత. ప్రతీ ఏనుగుకీ ఒక మాలీ ఉన్నాడు. వారు పనిని బాగుగా చేస్తున్నారా, గజాలకి బాగా శిక్షణ ఇస్తున్నారా.. నమూనా యుద్ధరంగాలనేర్పరచి, అందులో ఏనుగులకి బాధ్యతగా ప్రవర్తించే విధానాలు నేర్పుతున్నారా..   ఆహారం బాగా అందుతోందా..   పశువుల ఆరోగ్యాలెలా ఉన్నాయి.. ఇటువంటి ముఖ్యమైన పనులన్నీ మాధవుని బాధ్యతలే. అవన్నీ అతడు ఇష్టంగా చేస్తున్నాడు.   మధ్య మధ్యలో పురుషోత్తమ దేవునితో కలిసి సాహిత్య చర్చలు తప్పని సరి. అప్పటికి నాలుగు శతాబ్దాలుగా, సంస్కృతం నుంచి పురాణ గాధలని ప్రాంతీయ భాషల్లో, జన సామాన్యానికి అందుబాటులో ఉండేలాగా రచించడం వచ్చింది, రాజమహేంద్రవరం నుండి ప్రారంభమై.     కవిత్రయం ఆంద్ర మహా భారతం రచించడం, దేశంలోని అన్ని బాషల వారికీ మార్గ దర్శకం అయింది.   కవులు కనీసం నాలుగు భాషల్లో ఆరితేరిన వారై ఉండే వారు.   మాధవునికీ, పురుషోత్తమునికీ కూడా తెలుగు సాహిత్యం మీద అంతులేని మక్కువ.    కపిలేంద్రదేవుడు, రాజమండ్రీ, కొండవీడు, తెలంగాణ, పాకనాడు మొదలైన రాజ్యాలని స్వాధీన పరచుకునే ప్రయత్నంలో.. తెలుగు వారితో రాక పోకలు అధిక మయ్యాయి.   ప్రతీ రోజూ కనీసం నాలుగు ఘడియలైనా సాహిత్య చర్చ జరుగుతుంది.     కపిలేంద్ర గజపతి కళింగని స్వాధీన పరచుకున్నప్పుడు, రాజమండ్రీ రాజధాని గా రాజ్యాన్నిఅల్లాడ వేమారెడ్డి తమ్ముడు వీరభద్రా రెడ్డి పాలిస్తుండే వాడు. కొండవీడు నేలిన పెదకోమటి వేమారెడ్డి రాజ్య పతనం అయ్యాక మహాకవి శ్రీనాధుడు రాజాస్థానంలో ప్రాపునకై రాజమండ్రీ వచ్చాడు.   దాదాపుగా కపిలేంద్రుడు సిహాసనాన్ని చేజిక్కించుకున్న కాలం లోనే, శ్రీనాధుడు భీమఖండం అనే కావ్యాన్ని రచించాడు. కాశీ యాత్రకు వెళ్తున్న పండితులు కొందరు, మహాపాత్రుల కళింగంలో బస చేసినప్పుడు, మాధవుని ఆసక్తిని గమనించి ఆ ప్రతిని కానుకగా ఇచ్చారు.   “మేము తిరుగు ప్రయాణంలో వచ్చే సరికి మీరు మరొక ప్రతిని చేసుకుని మాకు ఈ కావ్యాన్ని తిరిగి ఇచ్చెయ్యాలి సుమా!” పండితుడు హెచ్చరించాడు.   “అంత గొప్ప గ్రంధమా స్వామీ?”   “అవునయ్యా. కవిత్రయం వారి మహా భారతం సరసన నిలువగల రచనలు చేశారు, శ్రీనాధ కవి సార్వభౌములు. సులభంగా అర్ధమయే చాటువులు.. అందరి నోట తిరిగే పద్యాలు.. ఆసక్తిగా సాగే కథనం. చదివి చూడండి. మీకే తెలుస్తుంది కదా! మీ రాకుమారుడు కూడా సాహిత్య పిపాసి అని విన్నాం. వారికి కూడా చూపించండి అనుకూల మైనప్పుడు.”   మాధవుడు భీమఖండం పఠనం ముగించగానే, శ్రీనాధ కవికి అభిమాని అయి పోయాడు.   రాకుమారునికి చూపించాడు ఒక రోజు..   “దేవా! ఈ కావ్యం చదివి తీరాలి మనం. అద్భుతంగా ఉంది.”   “అవశ్యం మాధవా! నాకూ చాలా ఉత్సుకతగా ఉంది. చదువుతాను. చదివాక ఇద్దరం కలిసి చర్చిద్దాము.”   మాధవునికి ఎనలేని సంతోషం కలిగింది. రాకుమారుని సాంగత్యం తన పూర్వజన్మ పుణ్యం అనుకున్నాడు.   “ప్రస్తుతానికి, మహానదీ తీరానికి విహారం వెళ్దాము. చాలా రోజులయింది. అందులో సంధ్యా సమయంలో  నది అందాలు చూసి తీర వలసిందే కదా..” పురుషోత్తమదేవుడు అశ్వశాల కేసి దారి తీశాడు.   ఇద్దరూ బయల్దేరారు, రెండు అశ్వాల మీద. నది ఒడ్డునే వెళ్తూ, కావ్య పఠనం సంగతి ప్రక్కన పెట్టి ప్రకృతి అందాలు చూస్తూ.. పరవశిస్తూ, నెమ్మదిగా వెడల సాగారు.   చల్లని గాలి హాయిగా తనువు తాకుతుంటే, మనసు తేలిపోసాగింది. సంధ్య వెలుగులు పరిసరాలన్నింటినీ ఆక్రమించుకుని, అందుబాటైన చోటంతా పరావర్తనం చెందుతున్నాయి.   మాధవుని నోట అసంకల్పితంగా వెలువడిందొక పద్యం. అప్పటికి తెలుగు భాష మీద మక్కువ మిక్కుటంగా ఏర్పడిందతడికి.              కం.      “కెంజాయల మెరుపు నదిన                        సంజాతము కలిగె గాద సంపూర్ణముగా                        కంజజుడు గీసినటులనె                        రంజనముగ మనసులే పరవశింపగనే.”     పక్కనే ఉన్న రాకుమారుని చూసి మాధవుని మోము కెంజాయ దాల్చింది.. అచ్చు అక్కడున్న నింగీ, నదుల వలెనే.                           “మాధవా! ఇదంతా కవి సార్వభౌముని కావ్య సాంగత్యమే?” రాకుమారుడు ప్రశంసగా చూశాడు.   “దేవా మీకు..” సంకోచంతో ఆపేశాడు మాధవుడు.   “అవును మాధవా! సమకాలీన సాహిత్యంలో శ్రీనాధ మహాకవి ప్రతిభ తెలియని వారుండరు. పాఠ్యాంశాలు కూడా ఉన్నాయి. నీకు తెనుగు సౌరభం ఇప్పుడిప్పుడే తెలుస్తున్నట్లుంది. శ్రీనాధులవారే తెనుగు భాష గురించి ఈవిధంగా అన్నారు..               ఆ.వె.  "జనని సంస్కృతంబు సకల భాషలకును                        దేషభాషలందు దెనుగు లెస్స                        జగతి తల్లి కంటె సౌభాగ్య సంపద                        మెచ్చుటాడుబిడ్డ మేలు కాదె?"     ఇద్దరూ గుర్రాలు దిగి, అక్కడున్న చెట్టుకు కట్టేసి, కాసిని గుగ్గిళ్లని వాటి ముందు పెట్టి, మహానది ఒడ్డునే నడవ సాగారు.   అప్పడే పక్షులన్నీ గూళ్లకి చేరుకుంటున్నాయి, తమ పిల్లల ఆకలి తీర్చడానికి. తల్లుల్ని చూడగానే నోళ్లని తెరిచి, రకరకాల అరుపులతో తమ సంతోషాన్ని వ్యక్త పరుస్తున్నాయి.. ఇరవైరెండు శృతుల్లోనూ.  నది ఒడ్డునే ఉన్న ఒక తిన్నె మీద కూర్చున్నారు స్నేహితులిరువురూ.   “అవును మిత్రమా! ఒక రకమైన పారవశ్యంలోఉండి పోయాను. కవిత్రయానికి దీటైన కవి ఎవరంటే శ్రీనాధులవారే అంటాను.”   “ముమ్మాటికీ నిజమే మాధవా! జీవితాన్ని కాచి వడపోసిన మహానుభావులు. ఎక్కడున్నారో ఇప్పుడు?” కొద్ది విచారంగా అన్నాడు పురుషోత్తమ దేవుడు.   “అదేమిటి దేవా? రాజమహేంద్రవరంలో ఉంటారు కదా? ఈ యుద్ధ వాతావరణం తగ్గాక వెళ్లి దర్శించుకుందామను కుంటున్నానుకూడా..” మాధవుడు ఆశ్చర్యపోయాడు.   “వేగుల వార్తలను బట్టి..” ఆపేశాడు రాకుమారుడు.. బహిరంగంగా మాట్లాడవలసిన విషయాలు కావవి.   “మరొకసారి చెప్పుకుందాం. నదిలో సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించి బయలుదేరుదాము. తండ్రిగారు ఎదురు చూస్తుంటారు.” పురుషోత్తమదేవుడు లేచాడు.                                         ……………..   ......మంథా భానుమతి

‘‘అజ్ఞాత కులశీలశ్య….” 12వ భాగం

  ‘‘అజ్ఞాత కులశీలశ్య….” 12వ భాగం                             సీ.   రాజనగ నెవరదీ జగమున జన                                  సామాన్యమందరి సాధకముల                                  చూచి కాచెడి వాడు, చోరుల దండించ                                  యప్రమత్తుడై నుండి  యరయు వాడు                                 తగురీతి రాజ్యమున్ ధరలదుపుంబెట్టి                                  సుఖజీవనమునంత చొనుపు వాడు                              వెవసాయమునకునూ బేహారమునకునూ                                 సమ ప్రధానత్వ మొసగెడి వాడు.                     ఆ.వె.   ప్రజను కన్న తండ్రి వలె చూచుగ నతడు                             కష్ట సుఖములందు కమ్ము కొనగ                             యట్టి రాజెపుడును యక్షయముగ నిల                             మనగలడుగ నెంతొ మహిమ తోను.       రాకుమారుడు పురుషోత్తమదేవుని రాక చూసి గురుకులంలోనే కాదు పల్లె పల్లంతా సంతోషం వెల్లి విరిసింది.   పురుషోత్తమదేవుని వెనుక బళ్లల్లో, నిండుగా ఏనుగులకి ఆహారం.. పెద్ద పెద్ద చెట్ల కొమ్మలు, ఆకులూ.. చాలా బళ్లున్నాయి. పాతిక పైగా. ప్రతీ బండిలోనూ ఇద్దరిద్దరు యువకులు.. బండి తోలే వాళ్లు కాకుండా.   రాకుమారుడు వచ్చి, గుర్రం దిగి ఆచార్యులవారికి వందనం చేశాడు.   “ఏమిది రాకుమారా?”   “ఏనుగులన్నిటినీ కోటకి తరలిద్దాము ఆచార్యా! తండ్రిగారు గజబలం పెంపొదించే ఆలోచనలో ఉన్నారు. సరైన శిక్షణ నిస్తే మన గజబలానికి ఎదురే ఉండదు. కోట వెనుక ఏనుగుల నిమిత్తం పెద్ద వనం కూడా పెంచాము.. ఇంకా ఆ వన వైశాల్యము పెంచుతున్నాము. కరవుతో అడవిలో ఆహారం లేనే లేదు కదా!” పురుషోత్తముడు వినయంగా అన్నాడు.   “మీ వంశానికి గజపతులనే పేరు సార్ధక నామధేయం అవగలదు నాయనా! మహరాజుగారి ఆలోచన దివ్యంగా ఉండి అటు పశువులకీ, ఇటు రాజ్యానికీ.. ఇరు పక్కలా.. ఉభయతారకం.” ఆచార్యులు ఆశీర్వదించారు, నమస్కరిస్తున్న రాకుమారుడిని.   “మాధవా! ప్రారంభిద్దామా?” పురుషోత్తముడు పిలిచాడు, కొద్ది దూరంలో నిలుచుని వీక్షిస్తున్న మాధవుడిని. అతడి నైపుణ్యం మీద అంతులేని నమ్మకం రాకుమారునికి.   “ముందుగా కొంత ఆహారం.. ఒక బండి మీదున్నది.. పల్లెవైపు వస్తున్న మంద ముందు వేస్తే ఏనుగులు ఆగిపోతాయి. ఆ బళ్ల మీదున్న వారు మావటీ వారనుకుంటాను.. ఆహారం తింటున్నపుడు ఏనుగులని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తుంటే.. మనం ప్రణాలిక రచిద్దాము.” మాధవుడు జవాబిస్తూనే, రాకుమారుని వద్దకు వచ్చాడు.   పురుషోత్తముడు  మావటి వారికి సైగ చేశాడు.                                           ……………….     అడవి లోనికి వెళ్లే దారిలో చితుకులనీ, ఎండు కట్టెలనీ పేర్చారు. అదే విధంగా.. కోట వైపుకి ఉన్న దారిలో తప్ప మిగిలిన రెండు దిక్కులా చేశారు. కోటకి వెళ్లే దారిలో ఆకుపచ్చని ఆకులతో ఉన్న కొమ్మలు పేర్చారు. ఏనుగుల గుంపు నడుస్తుంటే.. ఆ కొమ్మలని బళ్లతో లాగే ఏర్పాటు చేశారు.   మొత్తం అనుకున్న విధంగా తయారయే సరికి అపరాహ్ణం దాటింది.   ఆ సమయంలో మావటివారు ఏనుగులని మచ్చిక చేసుకో గలిగారు.   మాధవుడు అన్ని పనులనూ పర్యవేక్షించి, ఏనుగుల వద్దకు వెళ్లి.. నాయకునిలా ముందు ఆజమాయిషీ చేస్తున్న గజరాజు వద్దకు వెళ్లాడు.   తమ కోసం ఆహారం సమకూర్చాడనో ఏమో.. ఆ ఏనుగు అభివాదం చేస్తున్నట్లు తొండం ఎత్తింది.   మాధవుని కంట నీరు తిరిగింది. ఎన్ని రోజులుగా ఆహారం లేకుండా ఉన్నాయో! తప్పని సరైతే కానీ జనావాసాలకి రావు.   ఏదో.. చెప్పాలని ఉంది ఆ గజానికి..   మాధవుని తొండంతో ఎత్తి తన మీదికి ఎక్కించుకుంది ఆ గజరాజు. ఒక మావటి వానిని కూడా ఎక్కించుకుని ఏనుగు ఎక్కడికి తీసుకు వెళ్తుందో గమనిస్తున్నాడు మాధవుడు.   పల్లెకి అడవికీ మద్యనున్న ఒక పుంతలోకి దారి తీసింది. కొద్ది దూరం వెళ్లగానే కనిపించింది.. పొదల మధ్య. పడుకున్న నల్లని కొండలాగుంది..   దూరం నుండే ఆ ఆకారాన్ని పోల్చుకున్నారు.   సైనికుడు కత్తి విసిరిన గజం.   తమ నేస్తం అలా పడుందని ఏనుగులన్నీ ఒక దగ్గర చేరి నట్లున్నాయి.   ఏనుగు మరణించి ఉండదు. మరణిస్తే ఇంకా విజృంభించేవి. ఎప్పడో పల్లె మొత్తం నాశనమయ్యేది.   చాలా పెద్ద ఏనుగు.. బాధతో తల వాల్చేసి ఉంది.   నెమ్మదిగా అక్కడికి నడిచింది, మాధవుడెక్కిన గజం.                                    ఆ ఏనుగు వద్దకు వెళ్లి నేలమీదికి కూర్చుని, తొండాన్ని మాధవునికి ఆనించింది,   ముందుగా మాధవుడు, తరువాత మావటీడు దిగారు.   గాయపడిన గజం.   సైనికుని చురకత్తి ఒక కాలిలో లోతుగా దిగింది. ఆ కత్తి ఇంకా అక్కడే ఉంది.. స్తంభంలా ఉన్న కాలి పైభాగంలో.. తొడ వద్ద. కాలంతా రక్తం గడ్డకట్టి ఉంది.   ముందు గాయాన్ని కడగాలి.. ఏనుగు చేత నీరు తాగించాలి. శరీరంలో ద్రవాలు లేక నిస్త్రాణ అయిపోయింది. అటూ ఇటూ చూశారిద్దరూ.. రక్షణ బృందం.   జంతువులకున్న గ్రహింపు శక్తిని తక్కువగా అంచనా వేయకూడదు.   వారిని తీసుకొచ్చిన ఏనుగు తొండంతో ఇద్దరినీ తడిమింది. వంగి ఉన్న కాలి మీద ఎక్కి మాధవుడు పైకి లంఘించాడు. త్వరత్వరగా నడుస్తూ గురువుగారు, రాకుమారుడు ఉన్న స్థలానికి తీసుకెళ్లింది.   వెంటనే జరగ వలసిన ఏర్పాట్లు జరిగి పోయాయి.   కుండలలో నీళ్లు, అవసరమైన ఔషధాలు, లేపనాలు, పల్చని వస్త్రములు తీసుకుని, ఒక బండి తరలింది. మాధవ, మావటీలు తమని తీసుకు వచ్చిన ఏనుగు మీద కూర్చుని దారి చూపుతూ ముందుగా వెళ్లారు.   రక్త సిక్తమై ఉన్న కాలంతా కడిగి, జాగ్రత్తగా కత్తిని బైటికి లాగి, గట్టిగా మెత్తని వస్త్రాన్ని కాలి చుట్టూ కట్టారు.. రక్త స్రావం అరికట్టడానికి.   మావటి, వీలు చూసుకుని, తల పక్క కూర్చుని ఏనుగు నోరు తెరచి, నీళ్లు పోశాడు గొంతులో.. కుండలతో. కాస్త త్రాణ రాగానే కళ్లు తెరిచి తల అటూ ఇటూ తిప్పిందా గజం. వెంటనే.. ఆహారం తినిపిస్తూ, ఔషధాలు కూడా పోశారు గొంతులో.   కాలికున్న బట్ట విప్పి, అవసరమైన లేపనాలు పూశారు.   ఈ వైద్యం జరుగుతున్నంత సేపూ అక్కడే కూర్చుని చూస్తోంది మాధవుని తీసుకు వచ్చిన ఏనుగు. వైద్యం తీసుకుంటున్న గజం కూడా కిమ్మనలేదు.   కొంచెం తల ఎత్తి, కూర్చోగానే.. బాగా ఆకులున్న కొమ్మలు దగ్గరగా పెట్టారు. నెమ్మదిగా నములుతూ తల అటూ ఇటూ తిప్ప సాగింది గజం.   అందరూ సంతోషంతో గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు.                                                      సంధ్యా సమయానికే దెబ్బతిన్న గజరాజు లేచి నిలబడ్డాడు.   నెమ్మదిగా నడిపించుకుంటూ తీసుకెళ్లారు మిగిలిన పరివారం వద్దకి. ఆ గజాన్ని చూడగానే అన్ని ఏనుగులూ తొండాలూ, తలలూ ఊపుకుంటూ వచ్చేశాయి తమ నేస్తం దగ్గరగా!   కొన్ని తొండాలు ఊపుకుంటూ, కొన్ని తలలూపుతూ.. గున్నలు తల్లుల కింద నిలబడి తొండాలతో సవరదీస్తూ.. సన్నగా ఘీంకరిస్తూ చుట్టూ చేరాయి. వాటి ఆనందం చూసి తీర వలసిందే.   చుట్టూ ఉన్న జనుల మీద కోపం పోయింది.   మాధవుడు, మావటీడు తమ వాహన గజం మీది నుంచి కిందికి దిగగానే.. వారి వద్దకు రావడానికి ప్రయత్నించాయి. ఇద్దరూ ఏనుగుల వద్ద మెలగడం అనుభవంఉన్నవారే..   అన్నిటినీ స్వయంగా.. తడుముతూ, పలుకరిస్తూ ఓదార్చారు.   ఆ ఓదార్పు ప్రక్రియ చూసిన వారు జంతువుల కృతజ్ఞతా భావాలను చూసి కదలి పోయారు.            ఆ.వె.      తమకు హాని కలుగ దాడిచేయను వచ్చు                          ప్రేమ చూప గాను పేర్మి యొసగు                          మాట రాదు గాని మౌన భాషణ సేయు                          వారి చేష్టలన్ని బాగు బాగు.     మూగజీవులే కాని భావ ప్రకటనలో సిద్ధహస్తులే.   గురువుగారు పురుషోత్తమదేవుని చూసి చిరునవ్వు నవ్వారు.   “ఈ రోజు ఇంక కదలలేము రాకుమారా! రేపు ప్రభాత సమయంలో బయలు దేరుదాము.” మాధవుని సలహాకి తల పంకించాడు రాకుమారుడు.                             “మన నేస్తాలని కూడా విశ్రాంతి తీసుకోమందాము. పాపం.. అవి కూడా గత రెండు దినముల నుండీ బాగా అలిసి పోయాయి. ఇప్పుడు సంధి కుదిరింది కనుక నిశ్చింతగా ఉంటాయి. మన మాట వింటాయనే ఆశిస్తున్నాను.”   “అవును మాధవా! కడుపు నిండుగా ఆహారం కూడా దొరికింది. ఇంక కావలసినదేముంది? అటు చూడు మిత్రమా?” పురుషోత్తముడు చూపిన వైపు చూసి చిరునవ్వు నవ్వాడు మాధవుడు.   అన్ని ఏనుగులూ తలొక చెట్టు కిందా, స్థిర పడిపోయాయి. గున్నలు తల్లుల పక్కగా తలలు పక్కకి తిప్పి రాస్తూ ఉన్నాయి. ఒక అలౌకిక స్థితిలోకి చేరుకున్నాయి ప్రశాంతంగా.   పురుషోత్తమదేవుడు సంతృప్తిగా తల పంకించి, గురుకులం వైపుకి దారి తీశాడు.   పల్లె వాసులంతా తమ పల్లెకేసి తిరిగారు.   “ఒక్క క్షణం ఆగండి..” వెను తిరిగిన రాకుమారుడు పిలిచాడు.   పల్లె పెద్ద దగ్గరగా వచ్చాడు. కోటలో ఉండే రాకుమారుడు.. తమ వద్దకు వచ్చి.. తమని పిలిచి మాటలాడడమా! పల్లె వాసులకి నోట మాట రాలేదు.   “మీ పంట నష్టం గురించి తండ్రిగారికి విన్నవించాను. మిమ్మల్ని తప్పక ఆదుకుంటారు. బెంగ పడకండి.”   వంగి వంగి దణ్ణాలు పెట్టుకుంటూ వెళ్లి పోయారు అందరూ.   మావటీలకీ, బళ్లు తోలే వారికీ.. వచ్చి వారందరీకీ ఆహారం తయారు చేశారు.శిష్యులు గురు పత్ని పర్యవేక్షణలో.   రాకుమారు ఒక బండిలో ఆహార పదార్ధాలు తీసుకుని వచ్చాడు. శిష్యులు తమ గృహాల నుంచి తెచ్చివి కూడా ఉంటాయెలాగూ. గురుకులంలోనే కూరగాయలు పండిస్తారు.   కడుపు నిండుగా భోజనాలు చేసి ఒళ్లు తెలియకుండా నిద్ర పోయారందరూ.                                        ………………                కం.   ప్రేమను మించిన భావము                      ప్రేమ వలెను నూరడింప వేరేముందీ                      ప్రేమయె కద నిలనంతయు                      ప్రేమ మయము చేయ వచ్చె పెన్నిధి వలెనే.        మరునాడు లేవగానే అందరినీ అలరించిందొక సుందర దృశ్యం.   ఏనుగుల మంద.. అక్కడున్న చెరువులో జలకాలాడుతోంది. గురుకులంలో మాధవుడు, రాకుమారుడు చూపిన ప్రేమతో వాటికి అంతులేని విశ్వాస మొచ్చింది, అక్కడి వారి మీద.   మాధవుని చూడగానే తొండాల నెత్తి, ఘీంకరిస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశాయి.   కాలకృత్యాలు తీర్చుకోవడానికీ, స్నాన మాచరించి, అర్ఘ్యం విడవడానికీ కొలనుకి వెళ్తే.. అతని మీద తొండాలతో నీళ్లు కుమ్మరించి అభిషేకం చేశాయి.      చూస్తున్న వారి కన్నులు ఆశ్చర్యంతో విప్పారాయి.   సదానందాచార్యులవారు ప్రసన్న వదనంతో వీక్షించారు.         వాతావరణం అంతా ఆహ్లాదంగా ఉంది.   పరివారం అంతా లేచి, త్వరిత గతిన తయారయి కోటకి పయనమయ్యారు.   మొదటగా అనుకున్నట్లు మూడు పక్కలా మంటపెట్టడం, కోట దారంతా కొమ్మలు లాగడం వంటి ప్రణాలిక అవసరం లేక పోయింది.   మాధవుడు, మావటి తమకు మచ్చికైన గజం మీద కూర్చుని త్రోవ చూపుతుండగా..  ఏనుగులన్నీ బారాబతి కోటకి పయనం సాగించాయి. ప్రయాణం ఆరంభం అవగానే మరి మూడు మందలు వచ్చి చేరాయి.  బళ్ల మీదున్న ఆహారం వాటికి తినిపించి, వారంతా కూడా పాలు, పళ్లు ఫలహారం చేసి బయలు దేరారు.   అనూహ్యంగా నూరు ఏనుగులు.. అంతకన్నా సైన్యానికి బలం ఏముంటుంది?   కపిలేంద్ర దేవుని రాజ్య విస్తరణకి తిరుగు లేని విధంగా గజబలం సేకరణ అయింది దైవికంగా.                                              …………….. ......మంథా భానుమతి

అజ్ఞాత కులశీలశ్య….” 11వ భాగం

అజ్ఞాత కులశీలశ్య….” 11వ భాగం మాధవుడు రయమున కళ్యాణిని కళ్లెంతో వేగిర పరుస్తూ వెళ్లే సరికే పరిస్థితి భీభత్సంగా ఉంది.   గౌతమికి కాస్త సుస్తీ చేస్తే గురువుగారి అనుమతితో నాలుగు రోజులు సెలవు తీసుకున్నాడు. ఇంకా ఒక రోజు గడువుంది.   గురుకులం ఒక పల్లెనానుకుని ఉంది.   పల్లెవాసులంతా భీతావహులై అటూ ఇటూ పరుగెడుతున్నారు.   ఏనుగులు పంట పొలాలన్నింటినీ నాశనం చేశాయి. పెద్దా చిన్నా కలిపి పదిహేను ఏనుగులుంటాయి. గున్న ఏనుగులు కూడా చిన్న తొండాలని ఊపుకుంటూ చేలలో మొక్కలని భక్షిస్తున్నాయి.   మాధవునికి చూడగానే అర్ధమైపోయింది. చాలా పెద్ద సమస్యే..   మాధవుడు ఇట్టువంటి విపత్తుని ఇదివరకు చూశాడు. వంగ దేశంలో అడవులెక్కువే.. ఏనుగులూ, పులులూ కూడా ఎక్కువే. ఒక సారి ఇటువంటి పరిస్థితే పులులతో వచ్చింది అక్కడ.   వెంటనే తమ కోటలోని సైనికులు వెళ్లి పులులని తరిమేశారు. ఒక పులి, నలుగురు మనుషులు చనిపోతే కానీ అదుపు లోకి రాలేదు పరిస్థితి. అప్పుడు అక్కడి రాకుమారుడితో వెళ్లి దూరం నుంచే చూశాడు.   మాధవునికి గజం మీదికి ఎక్కడం వాటిని మచ్చిక చెయ్యడం కూడా వచ్చును. ఒక రకంగా పసి వయసులోనే అన్నీ నేర్పిస్తారు వంగదేశపు కోటలలో రాకుమారులకి. నిరంతరం అప్రమత్తులై ఉండాలిసిందే. ఏ క్షణం ఎక్కడి నుంచి దాడి జరుగుతుందో ఎవరూ చెప్పలేరు.   అది మనుషులవచ్చు, జంతువులవచ్చు. అందుకే పసి తనం నుండే మాధవునికి చాలా అనుభవాలు కలిగాయి.   “మనవాళ్లేమైనా చేశారా ఏనుగులని?”   తల వంచుకున్నాడు సహ విద్యార్ధి.   “ఏమయింది?”   “మొన్న ఒక మదపుటేనుగు వచ్చి పొలాలన్నీ నాశనం చేస్తే చుర కత్తి పట్టుకుని ఒక సైనికుడు..”   మాధవుని హృదయం ఒక క్షణం లయ తప్పింది.   “ఏనుగు మరణించిందా?”   “తెలియదు. బాగా రక్త స్రావం అవుతుంటే అడవిలోకి పారిపోయింది, కుంటుకుంటూ.”   “ఇక్కెడెక్కడా గాయపడిన ఏనుగు కనిపించడం లేదు. మరణించే ఉంటుంది. అందుకే మొత్తం మందంతా వచ్చింది. ఊరుకున్నామంటే మిగిలిన మందలని కూడా పిలుస్తాయి.”   “ఇప్పుడేం చెయ్యాలి మాధవా?” వణికి పోతూ అడిగాడు మిత్రుడు.   “ఏనుగులు ఏమీ ఎరగనట్లుంటాయి కానీ, గ్రహణ శక్తి ఎక్కువే. అసలు అడవి లోనుంచి జనావాసంలోకి ఎందుకు వచ్చిందో ఆ మదపుటేనుగు?”   “ఈ సంవత్సరం కరవు వచ్చింది కదా.. అడవిలో వృక్షాలన్నీ ఎండిపోయుంటాయి. ఆహారం దొరక్క వచ్చుంటుంది.”   ఆలోచనగా తలూపాడు మాధవుడు.. నిదానంగా పచ్చని పొలాల్లోని, తోటల్లోని చెట్ల ఆకుల్ని భక్షిస్తున్న ఏనుగులని చూస్తూ.   అప్పుడే గురువుగారు మిగిలిన శిష్యులని తీసుకుని వచ్చారు, చింతా క్రాంతులై.   “మాధవా! ఎందుకో.. నీకు ఈ పరిస్థితిని తప్పించగల నేర్పుందని అనిపిస్తోంది. ఇప్పటికే నలుగురి ప్రాణాలు హరించుకు పోయాయి. గజాలన్నీ మహోగ్రంగా ఉన్నాయి. ఏం చెయ్యాలో అర్ధం అవడం లేదు.. ఈ పరిసరాలని విడిచి పెట్టి పోవడం తప్ప.” గద్గద స్వరంతో అన్నారు.   “ఆ మదపుటేనుగుని గాయపరచకుండా ఉండాలిసింది. ఇప్పుడు ఆ జంతువులన్నీ అభద్రతా భావంతో రెచ్చిపోతున్నాయి.” మాధవుడు కొద్ది దూరంలో కనిపిస్తున్న మందని చూస్తూ అన్నాడు.   నిజమే..   ఒక సైనికుడు అటుపక్కకి నాలుగడుగులు వేశాడో లేదో.. భయంకరంగా ఘీంకరిస్తున్నాయి.   మందకి ముందుగా ఒక ఆడ ఏనుగు అందరినీ పర్యవేక్షిస్తోంది. కొన్ని గున్నలని తొండంతో సవరిస్తూ.   ఆ ఏనుగుని కనుక స్వాధీన పరచుకుంటే..   “అది చాలా ప్రమాదం మాధవా!” మాధవుని మనసు గ్రహించిన గురువుగారు వారించారు.                నిజమే.. ఏనుగులు ఒకదానికొకటి రక్షగా నిలిచినట్లు ఉన్నాయి.   “నీకేం ఫరవాలేదు. మేమున్నాము..” అన్నట్లుగా తుండములతో సవర దీసుకుంటున్నాయి.   తమ వారంటే.. తమ జాతంటే ఎంత ప్రేమ?   ఆ ప్రేమే.. సమస్త విశ్వాన్నీ ఇంకా కాపాడుతోంది. చూస్తున్న వారి మనసులు ఆర్ద్ర మయ్యాయి. ఒక్క క్షణం అవి చేసిన విధ్వంసాన్ని మరచేట్లు చేశాయి.    ఉ.   పేర్మిని విశ్వ రక్షణము పెంపున నెప్పుడు సేయనుండగా       కూర్మిని సంతసంబు నను కోరి సమస్త ప్రపంచ మందునా       ధార్మిని జంతుజాలముల తార్క్ష్యము లన్నిటి నందు కూడనూ       వార్మణి వోలెనే కనగ బాగుగ విశ్వము ప్రేమ మంతయున్.      (వార్మణి= కౌస్తుభము)      ఒక కాకికి ఏమైనా ఐతే కాకులన్నీ వాలిపోయి నానా గోలా చేస్తాయి.   మానవులే చాలా నేర్చుకోవాలేమో అనుకున్నాడు మాధవుడు.   “అవును మాధవా! సకల విశ్వమునూ లయ తప్పకుండా నడిపించేది ఆ ప్రేమ తత్వమే. ఆ అనుబంధమే లేక పోతే.. ఎవరికి వారనుకుని బ్రతుకుతుంటే నిస్సారమే. ఇపుడీ సమస్య తీరే విధం కనిపించడం లేదు.” విచారంగా అన్నారు గురువుగారు.   అంతలో పల్లెవాసులు పరుగు పరుగున వచ్చారు.   “స్వామీ! మీరే కాపాడాలి మమ్మల్ని. వేరే దిక్కు లేదు.” కాళ్ల మీద పడిపోయాడు పల్లె పెద్ద.   అదృష్టమే.. ఇంకా పల్లె లోని ఇళ్ల మీద పడలేదు. ముందుగా కడుపు నింపు కోవాలనుకున్నాయేమో!   ఒక విధంగా జాలి వేసింది మాధవునికి. అడవిలో ఆహారం లేక జనావాసాల్లోకి చొచ్చుకొస్తున్నాయి జీవాలు. వర్షాధారమైన వనాలు కరవు వస్తే ఎండి పోతాయి.   “లేవండి.. ఏదో ఉపాయం ఆలోచిద్దాము. ప్రస్తుతానికి ఇళ్ల మీదికి రావు లెండి. జంతువుల జోలికి మాత్రం వెళ్లకండి.”                                        ……………….   “గురువుగారూ! ఏనుగుల మందని అడవిలోకి పంపించ వచ్చును, కానీ.. అక్కడ ఆహారం లేక పోతే మళ్లీ వచ్చేస్తాయి. మహారాజుగారు ఏదైనా ఏర్పాటు చేస్తే కానీ సమస్య పోదు.” మాధవుడు అంటుండగానే పురుషోత్తమ దేవుడు వచ్చాడు.   “రాకుమారా! చూస్తున్నావు కదా.. ఏమిటి కర్తవ్యం?” గురువుగారు అడిగారు.   పురుషోత్తమ దేవుడు చాలా చురుకైనవాడు. తండ్రి వద్ద చాలా చనువు కూడా ఉన్నవాడు. కపిలేంద్రదేవుని ప్రియ భార్య కొడుకు.   “ఏదో ఒకటి తప్పకుండా చేద్దాం ఆచార్యా! నేను వెంటనే కోటకి వెళ్లి తండ్రిగారికి వివరించి వస్తాను. రేపు ఆపరాహ్ణానికి ఒక ప్రణాలిక రచిద్దాము. అంతవరకూ మాధవుని సహాయం తీసుకోండి. అతడికి అడవి జంతువులతో మెలగుట, వాటిని అదుపులోనికి తెచ్చుట కరతలామలకము.” వెనువెంటనే పురుషోత్తముడు వెడలిపోయాడు.   ఏనుగుల మంద తినడం కొంత తగ్గినట్లుంది. ఒక దాన్నొకటి రాసుకుంటూ, తొండాలతో పలుకరించుకుంటూ తిరుగుతున్నాయి నెమ్మదిగా. అన్నీ ఒక చెట్టుకిందికి వెళ్తున్నాయి.   మాధవుడు పెద్ద పెద్ద డప్పులు తెప్పించి చెవులు హోరెత్తేటట్లుగా, కర్రలతో వాయించమన్నాడు కొందరిని.   కొందరిని పొడవైన కాగడాలు తీసుకురమ్మని, నూనెలో ముంచి వెలిగించి, అర్ధ చంద్రాకారంగా, అడవి దిక్కుకి వ్యతిరేకంగా, మందవైపుకి అతి నెమ్మదిగా కదలమన్నాడు.   ఏనుగులన్నీ ఒక్క సారిగా కదిలి అడవిలోకి పయనమయ్యాయి.   ఘీంకారాల్లేకుండా, నెమ్మదిగా.. ఒక ఊరేగింపులాగ.   నాశనమయిన పంటలని చూస్తూ, రోదిస్తూ, పల్లె జనం తమతమ ఇళ్లకు బయల్దేరారు. గురువుగారు, శిష్యులు కూడా గురుకులంలోకి పయనమయి, పాఠ్యాంశాల మీద దృష్టి పెట్టడానికి ప్రయత్నించారు.   బాలురందరూ, గట్టిగా ఆదిశంకరులవారి సౌందర్యలహరి శ్లోకాలని వల్లిస్తూ సాగుతున్నారు.   “ఇంక రావేమో కదా మాధవా గజాలు.. అడవిలోకి వెళ్లి పోయాయి కదా?” ఒక సహాధ్యాయి అడిగాడు. గురువుగారు మాత్రం తల అడ్డంగా తిప్పుతూ సాలోచనగా చూశారు.   ”అవును ఆచార్యా! మీ ఊహ నిజమే. తిరిగి రావడానికే అవకాశాలు ఎక్కువ. రాకుమారులు ఏ వార్త తీసుకుని వస్తారో వేచి చూద్దాము.” మాధవుడు కళ్యాణి వద్దకు వెళ్లాడు, దాణా పెట్టడానికి.                                            ……………          నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః        నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యా ము తతేనమః   గురువుగారు, నమకం అభ్యాసం చేయిస్తున్నారు శిష్యుల చేత.   పరమశివుడు మేరు పర్వతాన్నిబంగరు ధనుస్సుగా చేసుకుని, తూణీరాలను ఇరు ప్రక్కలా పట్టుకుని పాపం చేసిన వారిని దండించడానికి సిద్ధంగా ఉన్నాడు.. రౌద్ర రూపంలో. అతడు తూణీరాలను వదుల్తే జగమంతా అశ్రుధారలే.   అందువలననే ఆ రుద్ర మూర్తిని శాంతింప జేయాలి, స్తుతించి. యజుర్వేదంలోని ఆ స్తోత్రములే నమకంగా ప్రసిద్దమయినవి.    “ నా మీద కోపగించకు. నేను పాపాలే చేసి యుండవచ్చు. నన్ను వ్యాకుల పరిస్తే  తట్టుకోలేను. నాకు దుఃఖం వస్తే నిన్ను తలవలేను. నా యీ జీవితంలో నీ పాదాలకు దూరమై పోతాను. నీ పాదాలను తలచలేని, ఆరాధించలేని పరిస్థితి వస్తుంది. అది నేను భరించలేను. ఈశ్వరా నీ రౌద్రానికొక నమస్కారం. నీ ధనుస్సునకో నమస్కారం. నీ తూణీరాలకూ ఒక నమస్కారం.”     గురువుగారు ప్రధమ శ్లోకాన్ని వివరించాక మరింత భక్తితో స్తుతిస్తున్నారు శిష్యులు.   మాధవుడు వల్లిస్తున్నాడు కానీ కొంత దృష్టి అడవికేసి సారించాడు. ఏక సంథగ్రాహి అవడంతో శ్లోకం కంఠస్తా వచ్చేసింది. యాంత్రికంగా పెదవులు కదుపుతున్నాడు.   మనసంతా నిండిన ఆందోళన ఏకాగ్రతని అసాధ్యం చేస్తోంది.   అనుకున్నంతా అయింది. ముందు సవ్వడి వినిపించింది. ఆ తరువాత పైకిలేపుతూ, పక్కలకి ఆడిస్తున్న తొండాలు కనిపించాయి.   ఆ పిదప  ఒక దాని వెనుక ఒకటి.. తల్లి పక్కగా ఆనుకుని నడుస్తూ గున్నలు, చివరిగా మగ ఏనుగులు.. వస్తూనే ఉన్నాయి.   ఒక క్రమశిక్షణతో.. ఊరేగింపు వస్తోంది.   “ఆచార్యా!” మాధవుడు సన్నగా పిలిచాడు. అది పిలుపు కాదు.. ఆక్రోశం.   వేదఘోష ఆగింది.   అందరూ ఒకేసారి లేచి నిలుచున్నారు.   “నిన్నటికంటే మూడు రెట్లున్నాయి ఏనుగులు. ఏం విధ్వంసం జరగబోతోందో.. ఇంకా మందల్ని కలుపుకుని వస్తున్నాయి” మాధవుని మాటలకు ఆందోళనగా తలూపారు గురువుగారు.   “కిం కర్తవ్యం?”   “గురువుగారూ! రాకుమారుడు..” శిష్యులు అరిచారు.   తలవెనుకకు తిప్పారు ఆచార్యులు, మాధవుడు. ఇద్దరి మోములూ వికసించాయి.. పురుషోత్తమ దేవుని అశ్వం కాన వచ్చింది.   వెనుకగా ఎడ్ల బళ్లు..   “బళ్ల నిండుగా.. ఏమది మాధవా? రాజుగారు ఏం చెయ్యబోతున్నారు?”   మాధవుడు నమ్మలేనట్లు చూశాడు బళ్లని, బళ్ల లోనివారిని, అందున్నవాటిని!                                     ………………….. ......మంథా భానుమతి

“అజ్ఞాత కులశీలశ్య….” 10వ భాగం

“అజ్ఞాత కులశీలశ్య….” 10వ భాగం     సీ.      నిలువ గలదనేది నే కాలమందైన యుండనే యుండదు యుర్వి లోన చెట్లు చేమలు పొదలు, చేరియున్న క్రిములు చెదరక మానవు, సెంక వలదు కళ్లు జిగేల్మనే కనకపు కాంతులు కదలి పోవునెపుడో కనుల ముందె సడలని కోటలే శత్రు భేద్యము లయిన కూలక మానవు గుంజ కదల                                      ఆ.వె.     నేలనంత కూడ నేలేటి వారైన                                     కూల బడ వలయుగ నేల కింద                                     కాల మహిమ నెవరు కాదన గలరుగా                                     వేల వేల యేళ్లు వేడు కొనిన.     క్రీ.శ. 1435-- ఫాల్గుణ మాసం.                కోట చుట్టూ తిరిగి, ముఖ ద్వారం చూస్తూ మాధవుడు వెను తిరిగాడు. మాధవుడు తిరిగిన బాటకీ, కోటకీ మధ్య అగడ్త ఉంది. అందులో నీళ్లు అడుక్కి ఉన్నాయి.   అదే సమయంలో కోట సింహ ద్వారం వైపుగా ఒక మేనా వెళ్తోంది. మేనాకి తెరలు కట్టి ఉన్నాయి. గాలి వాలుకి తెర తొలగింది. ఒక మెరుపు మెరిసినట్లయింది మాధవుని కనుల ముందు.   జరీ చీనాంబరాలు కట్టుకుని, నగలతో అలంకరించుకున్న బాలిక మోము.. చిరునవ్వు, నగలని మించిన మెరుపు నిచ్చింది. సోగ కన్నులతో.. అందిన అవకాశం జార కూడదన్నట్లు, బాలిక కన్నులు విప్పార్చి అంతా పరికిస్తోంది.   తీర్చి దిద్దినట్లున్న కను ముక్కు తీరు.. ప్రతీ కదలికలో కనిపిస్తున్న రాచ ఠీవి..   కళ్యాణిని అటు పరుగెత్తించి, గుట్టమీద చేతికందిన చెంగల్వ పూవును కోసి బాలిక చేతి కందించి, వేగంగా మాయ మయ్యాడు మాధవుడు.   బిత్తర పోయిన బాలిక, ఎదురుగా కూర్చుని ఉన్న తల్లిని చూసింది గాభరాగా..   ఆదృష్టం.. ఆవిడ అటు పక్కనున్న తెర కొద్దిగా తొలగించి ప్రకృతిని పరిశీలిస్తోంది.   చెంగల్వ పూవు చేత పెట్టినప్పుడు, ఆ బాలుని కళ్లలో కనిపించిన ఆరాధన.. అతడి మోమున విరిసిన వెలుగు.. బాలిక మనసులో నిలిచి పోయాయి.   ఆ బాలిక కపిలేంద్ర దేవుని కూతురు. కాదంబరీ దేవి. కాబోవు రాకుమారి..   కపిలేంద్రునికి బహు భార్యలు.. పలు సంతానం. పద్ధెనిమిది మంది కుమారులని కళింగంలో ప్రచారంలో ఉన్న వార్తలు. కుమార్తెలెందరో ఊహ లేదు ప్రజలకి.                                           …………..     చడీ చప్పుడు లేకుండా కళ్యాణిని కట్టేసి ఇంట్లోకి వచ్చాడు.   “ఇంత వేగిరం వచ్చేశావేం కన్నయ్యా?” వెన్న చిలుకుతున్న గౌతమి అడిగింది.   సాధారణంగా గుర్రం మీద స్వారీకి వెళ్తే మాధవుడు ఐదారు ఘడియల్లోపుగా రాడు. ఆ రోజు గురువు గారి వద్ద పాఠాలు కూడా లేవు.   మౌనంగా తండ్రి పక్కకి వెళ్లి కూర్చున్నాడు.   ఆ రోజు వంటకి వలసిన సరుకులని సరుదుతున్న నందుడు తలతిప్పి చూశాడు. మాధవుడి మొహంలో ఏదో ఆరాటం, ఆందోళన.   “ఏమయింది?” నందుని కంఠంలో ఆదుర్దా..   “కోటలో ఏదో జరుగుతోంది తండ్రీ! అంతఃపురంలోని వారందరినీ కోట వెనుక ప్రాకారం లో కొత్తగా ఏర్పరచిన ద్వారం గుండా తరలించేస్తున్నారు. మేనాలు, అశ్వాలు దక్షిణ దిక్కుగా వెళ్తున్నాయి. నేను విన్న దేమంటే..”   మాట్లాడ వద్దన్నట్లు సైగ చేశాడు నందుడు. అదే సమయంలో రాజ భటులు కొందరు ఇంటిలోనికి ప్రవేశించారు.   “మూడుపదుల మందికి రెండు ఘడియల్లోగా వంట సెయ్యాలి పూటకూళ్లయ్యా! రాజుగారు చెప్పమన్నారు.” వారిలో అధికారిలా ఉన్నవాడు చెప్పాడు. అది ఆజ్ఞే..   “రాజుగారు యుద్ధం నుంచి..”   “ఆ రాజుగారు రారు ఇంక. ఇప్పుడు కళింగాన్నేలే మహారాజు కపిలేంద్ర దేవులవారు.ఇక నుండీ వారి ఆజ్ఞలే పాటించాలి అందరూ.”   ఊహించినదే ఆయినా.. అదే వాస్తవానికొచ్చినప్పుడు తట్టుకోవడం అంత సులభం కాదు. ఒక ఒరవడికి అలవాటు పడినవారు.. మరలా కొత్త పాలన, కొత్త పరిధులు..   ఒక్కసారిగా లేచి నిలుచున్నాడు నందుడు.   అసంకల్పితంగా గౌతమి కూడా లేచింది.   అదేం పట్టించుకోకుండా, వచ్చినట్లే వెనక్కి వెళ్లిపోయారు భటులు.   “ఇదే నేను విన్నది నాన్నగారూ! అంతఃపుర స్రీలని పంపించేస్తున్నారు కోటలోనుంచి. దక్షిణాన ఉన్న శ్రీముఖలింగం వద్ద ఉంచుతారట. కొత్త రాజుగారు వారి బాగోగులన్నీ చూస్తారుట.” మాధవుడి మాటలకి తలూపాడు నందుడు.   కొత్త రాజుగారి పరివారం కోటలోకి ప్రవేశిస్తున్నారు.   “అవును.. గత కొద్దినెలలుగా పురంలో అట్టుడుకిపోతోంది. పుకార్లని తోసి పడేశారు. నాకు అనుమానంగానే ఉంది. మనకి సైనికుల తాకిడి కూడా బాగా ఎక్కువయింది.”   “ఇక్కడ రాజ్యం, హిందూ రాజే ఆక్రమించుకున్నాడు కనుక ఆడవారికి ఏ అవమానం జరుగ లేదు. అదే వంగ దేశంలో.. సుల్తానులు మగవారిని నరికేసి, ఆడవారిని వారి బీబీలుగా చేసేసుకుంటారు. అందుకే నేను, జానూపూర్ సుల్తాన్ గురించి అడుగుతున్నాను. పాపం.. ఆ భానుదేవుడు రాజుగారేమైపోయారో..” మాధవుడు విచారంగా అన్నాడు.   “ఏమీ చెప్పలేం. ప్రజల యోగక్షేమాలు పట్టించుకోకుండా, సుంకాలు వసూలు చేస్తారని వారి పాలన మీద అసంతృప్తిగా ఉన్నారు ప్రజలు. కపిలేంద్రుల వారికి రహస్యంగా ప్రజలు చేసిన విన్నపాలే ఈ ఫలితాలకి కారణం. ఏది ఏమైనా.. జన నష్టం లేకుండా గాంగేయుల యుగం అంతరించి పోయినందుకు ఆ దైవానికి కృతజ్ఞతలు చెప్పవలసిందే.” నందుడు, చకచకా శాకములు తరుగుతూ అన్నాడు.   మాధవుడు కూడా సీతమ్మకి కావలసిన సహాయం చేస్తున్నాడు. కళింగం వచ్చి కొద్ది నెలలే అయినా, ప్రేమ, ఆప్యాయతలు.. నిశ్చింతగా సాగుతున్న జీవితం మాధవుని ఎదుగుదలకి దోహదం చేశాయి. కండ పట్టి పొడుగు కూడా అయ్యాడు.   “కపిలేంద్ర దేవుల కుమారుడు పురుషోత్తమదేవుడు నా సహాధ్యాయి గురువుగారి వద్ద. నాకన్నా రెండు వత్సరములు పెద్దయి ఉంటారు. నేనంటే చాలా ఇష్టం వారికి.” మాధవుడు, అమ్మమ్మకి సహాయంగా మిరియం నూరుతూ అన్నాడు.   చేస్తున్న పనాపి ఆందోళనగా మాధవుని వద్దకు వచ్చింది గౌతమి.   “నీకు రాకుమారులతో స్నేహమెందుకు కన్నయ్యా? వారికి అనుగ్రహం వచ్చినా, ఆగ్రహం వచ్చినా పట్టలేము.”   “తప్పదమ్మా! మరి గురువుల వద్దకు వెళ్లి విద్యలు నేర్వాలంటే సహాధ్యాయులతో మెలగాలి కదా! ఆది రాజకుమారుడైనా, బికారైనా..”   “నిజమే..” నిట్టూరుస్తూ వెళ్లి పోయింది గౌతమి.   “కొత్త పాలన ఏ విధంగా ఉంటుందో.. మళ్లీ కొత్త సుంకాలు, కొత్త యుద్ధాలు.” నందుడు గుసగుసగా అన్నాడు.   “యుద్ధాలు తప్పవు తండ్రీ”   ఉలిక్కి పడ్డాడు నందుడు. ఈ బాలుడికి ఇంతింత రాజకీయాలే విధంగా తెలుసునో!   “రాజులు మారినప్పుడు ప్రజలకీ, సామంతులకీ ఒప్పుకోవడానికి సమయం పడుతుంది. అందరినీ అధీనంలోకి తీసుకొని రావలె కదా.” మాధవుడు వెనుక వాకిలి లోకి వెళ్లాడు.. పశువులకి మేత వెయ్యడానికి.   వెంటనే రకరకాల అరుపులు.. మాధవుడిని చూడగానే ఆనందంతో గెంతులేసుకుంటూ వస్తాయి.. శ్వేత, శార్వరి. ఆవు మాత్రం చిద్విలాసంగా నెమరేస్తోంది.                                      …………….      చైత్రం, వైశాఖం వెళ్ల పోయాయి. జ్యేష్టం ప్రవేశించింది. వానలు కూడా ఆరంభమయ్యాయి.   మూడు మాసాలు కటక ప్రజలకీ, సామంత రాజులకీ సమయం ఇచ్చి, వారందరి సహాయ సహకారాలతో.. ఒక రకంగా సమ్మతితో, కపిలేంద్ర దేవుడు సింహాసనం అధిష్టించాడు.   రాజ్యం చేజిక్కించుకున్నాడే కానీ క్షణ క్షణం అప్రమత్తతతో ఉండాల్సిందే.. ఏమరుపాటు ఏ మాత్రం పనికి రాదు.   మొదటగా తన సామంతుల విప్లవాన్ని అణచాలి. వారిలో ముఖ్యులు, నందపురం శీలవంశీయులు, ఒడ్డాది మత్స్య రాజులు,  పంచధారల విష్ణు వర్ధనులు.   గాంగేయుల రాజ్యం అంతరించిందని వార్త వినగానే సామంత రాజులు పన్నులు కట్టడం మానేశారు. సుశిక్షతులైన తన సైనికులతో వారినందరినీ ఒక త్రాటి మీదికి తీసుకొచ్చాడు కపిలేంద్ర దేవుడు..    రాజులందరికీ పరాక్రమ వంతుడైన కపలేంద్రుని ఎదిరించడానికి సాధ్యం అవలేదు.    కళింగలో సూర్య వంశీయులైన ‘గజపతు’ల పాలన మొదలయింది.    మాధవుడు చెప్పినట్లే అవుతోంది.   మహాపాత్రులు వండి వారుస్తున్న వారు వారుస్తున్నట్లే ఉన్నారు. కోటలో వంటశాల వచ్చే పోయే సైనికుల అవసరాలు తీర్చలేక పోతోంది.   ఆ రోజు ప్రవాహంలా వస్తూనే ఉన్నారు..   “ఏమయింది బాబూ?” సీతమ్మ ఆయాస పడుతూ అడిగింది ఒక సైనికుడిని.   నంద, గౌతమిలు కూరగాయలు తరిగేస్తున్నారు చకచకా..   అరటి వంటి వాటికి తప్ప, కొన్నింటికి తొక్కలు తియ్యడానికి సమయం సరి పోక, రుద్ది రుద్ది కడిగి అలాగే వండేస్తున్నారు.   కొందరు సైనికులు వీరి కష్టం గమనించి వారికి తోచిన సహాయం వారు చేస్తున్నారు. అయినా.. రాత్రి ఎప్పుడో ఏడెనిమిది ఘడియలు తప్ప విశ్రాంతి దొరకడం లేదు.   “ఉత్తరాన జానుపురం, వంగ దేశాల నుంచి ఎప్పటి కప్పుడు బెదిరింపులు.. అవి చాలనట్లు ఢిల్లీ సుల్తాను కూడా ఓఢ్రం మీద కన్నేశాడని చారుల వార్త. అందువలనే సైన్యాన్ని పటిష్ఠం చేసుకోవలసిన అవసరం వచ్చింది మహా రాజుగారికి.” పెద్ద గుండిగ నిండుగా ఎసరు పెట్టి గాడి పొయ్యి మీరికి ఎక్కించడానికి సహాయ పడుతున్న ఒక సైనికుడు చెప్తున్నాడు.   “ఈ విధంగా ఎంత కాలం?” నీరసంగా అడిగింది గౌతమి.   “రెండు మూడు సంవత్సరాలుండ వచ్చమ్మా. కొత్త వారిని తీసుకుంటున్నారు సైన్యం లోకి. సామ్రాజ్యాన్ని విస్తరింప జేశాక దాన్ని కాపాడుకోవాలి కదా! గాంగేయుల వలే గంగ నుండి గోదావరి వరకూ జయించాలని మహారాజుగారి కోరిక.”   నందుడు ఇద్దరిని సహాయకులుగా పెట్టుకున్నాడు.   అయినా.. అంతా చూసుకుంటూ పర్యవేక్షించాలంటే గౌతమి, సీతమ్మలే కావాలి. అందుకే బాగా అలిసి పోతున్నారు. ధనం మాటెలా ఉన్నా.. రాజాజ్ఞ పాటించి తీరాలి. తప్పదు.   పప్పులు, ఉప్పులు పెట్టుకోవడానికి ఒక గది, ధాన్యం నిలవకి ఒక గాదె, కాయగూరలు కుళ్లి పోకుండా ఆర బెట్టి ఉంచడానికొక కటకటాల పంచ.. ఇవన్నీ కాకుండా, పాతిక మందికి ఒకే సారి వడ్డించడానికి అనువయిన పొడుగాటి వసారా.. ఇంటికి కలిపారు.   రాజుగారి ఆంతరంగికులలో ఒకరైన గోపీనాధ మహాపాత్రులు నందుడికి పినతండ్రి వరసౌతారు.. దాయాదులు. వారి సహాయంతో ఇంటికి కావలసిన మార్పులు చేయించగలిగారు. కోటలో ధనాగారం నుంచి ధన సహాయం లభించింది.   బాటసారులు రాత్రి ఉండి పోయి విశ్రాంతి తీసుకోవడానికి అనువుగా నాలుగు గదులు కూడా వేశారు.   పాడి కూడా పెరిగింది.. మరో రెండు గోవులు తువ్వాయిలతో సహా కలవడంతో.   చిన్న పూటకూళ్ల ఇంటి స్థాయి నుంచి ఓ మాదిరి వసతిగృహం గా మారింది మహాపాత్రుల ‘కళింగం’.   “మన కన్నయ్య వచ్చినప్పట్నుంచే మన ఇంట సిరులు విరిసాయమ్మాయ్..” సీతమ్మ రోజుకొక సారైనా అనక మానదు.   మాధవుడు అల్లారు ముద్దుగా పెరుగు తున్నాడు.   ఇంట నుంటే వద్దన్నా పనులలో జోక్యం చేసుకుంటాడు. అందువలననే, కళ్యాణితో సహా అతడిని గురుకులానికి పంపారు నందుడూ, గౌతమీ.. బాగా ఆలోచించుకుని.   కపిలేంద్ర గజపతి అంతర్గత విప్లవాలని అణచి వేసి సామ్రాజ్యాన్ని సుస్థిరం చేశారు.                                        ……………..    కీ.శ. 1439:     మాధవునికి పదహారు సంవత్సరాలు నిండాయి. గురుకులంలో విద్యలన్నింటిలో రాణిస్తున్నాడు. స్వతసిద్ధంగా కత్తి యుద్దంలో, గుర్రపు స్వారీ లో అతనికున్న ఆసక్తితో ఆ విద్యలలో నైపుణ్యం సంపాదిస్తున్నాడు. గురువుగారి సమ్మతి తీసుకుని, రోజూ ఇంటి వద్దనుండే వెళ్లి వస్తున్నాడు.     కళ్యాణిని గుర్రపు స్వారీకి అనుకూలంగా తయారు చేసి, మాధవుడు కొత్తగా చేరిన వారికి తనే నేర్పిస్తున్నాడు. గురువుగారు సదానందులవారు మాధవుని ఆసక్తికి ప్రసన్ను లయ్యారు.   స్వభావ సిద్ధంగా మాధవునికి సాహిత్యం మీద అభిరుచి మెండు. సంస్కృతాంధ్ర, వంగ, ఓఢ్ర బాషల్లో మంచి పట్టు వచ్చింది.   ఆంధ్ర దేశం నుంచి పండితులెందరో కాశీ యాత్రకి తరచుగా వెళ్తుంటారు. దారిలోనే ఉన్న నందుని పూటఇంటిలో బస చేసే వెళ్తారు. ఒక్కొక్క సారి మధ్యదారిలో ఉన్నందు వల్ల రెండు మూడు రోజులు ఆగి, అలసట తగ్గాక వెళ్లటం కూడా కద్దు. ఆ సమయంలో మాధవుడు, ఇంటి వద్ద ఉంటే..  వారి వద్ద కవితా గానాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు.   మాధవుని నాణాలు కొన్ని మాత్రమే ఖర్చు పెట్టాడు నందుడు. మిగిలినవి భద్రంగా ఇనుప పెట్టిలో దాచాడు.   కవిత్రయం రాసిన ఆంధ్ర మహాబారతం మాధవునికి అత్యంత ప్రియమైనది. కొండవీడు నుండి, రాజమహేంద్రవరం నుండి వచ్చిన కవుల వద్దనుండి కొన్ని కొన్ని పద్యాలను రాసుకుని తన వద్ద భద్ర పరచుతుంటాడు.     కోట వద్ద రద్దీ పెరిగింది.     ప్రకృతి ఆరాధన మాధవునికి ప్రియమైన విషయాల్లో ఒకటి.   సూర్యోదయాత్పూర్వమే మహానది ఒడ్డుకు వెళ్లి అర్ఘ్యపాదాదులు అర్పిస్తూ ఉంటాడు. అతని, యుద్ధవిద్యల  ఆసక్తిని గమనించిన నందుడు, మాధవుని కేశములను కూడా పూర్తిగా తియ్యకుండా, మధ్యలో పిలక ఉంచుకునేట్లు అనుమతి ఇచ్చాడు.   చల్లని ప్రాతః కాలమున మాధవుడు కదలి వెళ్తుంటే పశుపక్ష్యాదులు వెనువెంటే గుంపులుగా ఉంటాయి.    చం.  తెలతెల వారకుండగనె తేకువతో వెడలేటి మాధవున్          కలకలల ధ్వనిన్ కనగ, కామిత మానసుడైన శ్రీహరే          నిల కగుదెంచె నేమొయని నివ్వెర పోయిన గువ్వలన్నియున్          మెలకువఁ దెచ్చు కొమ్మనుచు మేల్కొలుపుల్ పలికేనుమోదమున్.       ఇంటివద్దనున్నపుడు, గురుకులంలోనూ కూడా మాధవుని నిత్య కృత్యమదే.      ఒకరోజు.. మాధవుడు, ఉషః కాల సంధ్యావందనం పూర్తి అయాక, నది ఒడ్డునే ఉండిపోయాడు. అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ.    రస హృదయులకి, పిట్ట ఎగిరినా, తువ్వాయి గెంతినా హృదయం స్పందిస్తుంది కదా!                                                       కపిలేంద్ర దేవుడు రాజ్యానికి వచ్చినప్పట్నుండీ పాడి పంటల మీద దృష్టి కేంద్రీకరించాడు. తిరుగుబాట్లని అణచడంలో ఎంతటి సమర్ధత చూపించాడో.. రాజ్యంలో చెరువులు పునరుద్ధరించడంలో, చెట్లు నాటించడంలో అంతే చూపించాడు.   రాజ్యం సుభిక్షంగా ఉంది.   తడి వస్త్రములు మార్చుకుని, మంచి చోటు చూసుకుని, పద్మాసనం వేసి కూర్చున్నాడు. ప్రాణాయామం చేస్తూ.   పులుగులన్నీ ఆహార సేకరణకై వెడలినట్లున్నాయి.. వాతావరణం నిశ్శబ్దంగా ఉంది.   ప్రాణాయామం అయ్యాక నెమ్మదిగా ధ్యానంలోకి వెళ్లాడు.   ఒక ఘడియ గడిచిందేమో..   “మాధవా.. మాధవా..” గట్టిగా పిలుస్తున్నారు ఎవరో..   కన్నులు తెరిచి చూశాడు.   గురుకులంలో సహ విద్యార్ధి.. రొప్పుతున్నాడు ఆయాసంతో.   “గురువుగారు నిన్ను త్వరితగతిని పిలుచుకు రమ్మన్నారు. గురుకులం లోనికి ఏనుగుల మంద వచ్చింది. పంటంతా నాశనం చేస్తున్నాయి. ఇంక ఇళ్ల మీద కూడా పడ బోతున్నాయి. వాటిని వెళ్లగొట్టాలి. నీకు కొన్ని మెళకువలు తెలుసునట కదా?   మాధవుడు వెంటనే స్పందించాడు.   ఇంటికి వెళ్లి అమ్మతో చెప్పి, వెను వెంటనే సహాధ్యాయిని తీసుకుని, కళ్యాణి మీద బయలుదేరాడు, గురుకులానికి.    యజమాని స్థితిని అర్దం చేసుకున్న హయం వేగంగా పయనం సాగించింది.       ......మంథా భానుమతి

“అజ్ఞాత కులశీలశ్య….” 9వ భాగం

“అజ్ఞాత కులశీలశ్య….” 9వ భాగం         కోట           సీ.    నిట్ట నిలువుగనే నిల్చిన కోటంత                       పట్టి నడచునట్టి భయము భీతి                ఏదొ యేదొ వెదక నేమియు కనరాదు                       కలతయె నన్నిట కలిగి యుండ                ఎంత నసహజత్వ మెందెందుఁజూసినా                        కాకమీ దున్నదా కాల్చు నెండ                కదలక మెదలక గాలియు స్థంభించ                         క్రమశిక్షణన్ కూడె ఖగమనములు       ఆ.వె.   అటునిటు నడయాడు నాయుధము ధరించి                యోధు లంత కూడి యూసులాడ                పెద్దలు సమ కూడి పేర్మిని యోచింప                పట్టణమును గట్టి పర్చగాను.                                  మాధవుడు కళింగం వచ్చి సంవత్సరం అవుతోంది. అక్కడి పరిసరాలకి బాగా అలవాటు పడిపోయాడు.   ఆ రోజు. ఉదయపు కార్యాలను ముగించుకుని, కళ్యాణిని తీసుకుని కోట వంకే చూస్తూ బయలు దేరాడు. రోజూ ఆరాధనగా చూసే కోటే.. ఏదో మార్పు..   కోట బైట సైనికులు అక్కడా అక్కడా పొదల మాటున మాటు వేస్తూ అప్రమత్తంగా, ఆందోళనగా కాపలా కాస్తున్నారు.   చుట్టూ స్వారీ చేస్తున్న మాధవుని కంట పడింది .. కోట వెనుకగా, పెద్ద పెద్ద చెట్లు, గుబుర్ల వెనుక కొత్తగా ఏర్పడిన ద్వారం. పరీక్షగా చూస్తే కానీ తెలియట్లేదు. ఆ ద్వారం సన్నని బాట చివర ఉంది. ఆ బాట ఊరి బయటికి దక్షిణం వేపుగా సాగి పోతుంది. అది పట్టుకుంటే శ్రీముఖలింగం, రాజమహేంద్రం చేరుతామని తండ్రిగారు చెప్పారు.   అప్పుడప్పుడు సైనికులు తిరగడం, స్వారీలు చెయ్యడం, జరుగుతున్నదే అయినా ఆ రోజు ప్రత్యేకంగా అనిపించింది.   అఘ మేఘాలమీద.. కళ్యాణిని కళ్లెంతో వేగిర పరచి ఇంటికొచ్చేశాడు.   ఇంటి బయట సైనికులు గుంపులుగా మాట్లాడుకోవడం చూసి, ఇంటి వెనుకకి వెళ్లి గుర్రాన్ని కట్టేసి.. చుట్టూ తిరిగి వాకిలి ముందుకి వచ్చాడు.   నెమ్మదిగా నడుస్తూ లోనికి వెళుతుండగా అతడి చెవిని పడ్డాయి సంభాషణలు, వంగ భాషలో. ఏమీ ఎరగనట్లు, అతి నెమ్మదిగా ఆగి ఆగి కదులుతున్నాడు మాధవుడు.   వారు చర్చిస్తున్న సమస్య తీవ్రమయింది..   ఒక పక్కగా ఒదిగి ఒదిగి నడుస్తున్న మాధవుడిని చూసి తలెగరేశాడొక సైనికుడు, ఎవరన్నట్లు.   “ఈ పూటకూటింటి వాని కొడుకు.” ఇంకొకడు సమాధానం ఇచ్చాడు.   “హేయ్.. చేపలు పులుసు చేయిస్తావా? నాలుక పీకేస్తోంది?” వంగ భాషలో అడిగాడు మరొక సైనికుడు.   అందరినీ కలియ చూశాడు మాధవుడు. మొత్తం పాతిక మంది పైగా ఉన్నారు. అంత మందికి వండడం అలవాటే. కానీ చేపలంటే.. అయోమయంగా, అమాయకంగా చూశాడు. అది శాఖాహార పూటకూళ్ల ఇల్లు. వారికి తెలిసే అడుగుతున్నారు.   కత్తి చూపించి, చేసి తీర వలసిందే అంటే?   అమ్మకి ఎంత కష్టం?   వీరి ఆగ్రహానికి గురి అవకుండా ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాడు మాధవుడు.   “వీడికి భాష రాదనుకుంటా. ఐనా ఏదో కడుపు నింపుకోవాలి కానీ.. రుచులంటే ఎక్కడ?” సైన్యాధికారి లాంటి వాడు మందలించాడు.   “సర్సరే.. లోనికి పరుగెత్తి త్వరిత గతిని ఆ శాకాలేవో తయారయే విధం చూడు.” కసిరాడు మరొకడు.   “సైనికులు కఠినంగా మాట్లాడినా ఏమనుకోకూడదు మనం. మనం మనడానికి ఆధారం ఈ గృహం. వచ్చిన వారికి ఆకలి తీర్చడం మన బాధ్యత. పైగా ఆ సైనికులు, భార్యా పిల్లలని, తల్లిదండ్రులనీ వదిలి మాసాల తరబడి, ఎండనక, వాననక, తినీ తినక తిరుగుతుంటారు. నీడ పట్టున ఉన్న మన వంటివారికీ, వారికీ మనో భావాల్లో చాలా భేదం ఉంటుంది.” మాధవుడు వచ్చిన కొత్తలో నందుడు చెప్పిన మాటలు చెవిలో ప్రతిధ్వనిస్తుండగా లోపలికి నడిచాడు మాధవుడు.   అంతా యుద్ధ వాతావరణం.   ప్రతీ యుద్ధంలోనూ వందల మంది ప్రాణాలు కోల్పోతారు. గెలిచినది పరాయి రాజులైతే, ఊరి మీద పడి బీభత్సం చేస్తారు. దోపిడీలు, అత్యాచారాలు లెక్కే ఉండదు. కొందరి కళ్లల్లో భీతి, మరి కొందరి కళ్లల్లో క్రౌర్యం.   ఎవరికీ నచ్చని ఈ యుద్ధాలు ఎందుకు?   పాలకుల రాజ్య కాంక్ష తీర్చడానికే..   మాధవుని వంటి చిన్న పిల్లలకి కూడా మనసంతా విరక్తి భావం ఏర్పడుతుంది.   ఇంటిలో కూడా ఎక్కడ చూసినా సైనికులే.. సరిపోయేటన్ని సంభారాలున్నాయో లేదో! మాధవుడు లోనికి పరుగెత్తాడు. తన కళ్యాణి ఎలా ఉందో!   సైనికులు గుర్రాల మీద పడ్తారు. మేకలు కూడా.. ఏముంది? రెండు ముక్కలు చేస్తే ఒక పూట ఆహారం.   అదృష్టం.. అంతకు ముందే, వెనుక ఆవరణ లేనట్లుగా గోడ మూసేశాడు నందుడు.. గడ్డి మేటు అడ్డంగా వేసి. ఆవు, దూడ మాత్రం గడ్డి మేస్తూ కనిపించాయి. మిగిలిన జీవులు గోడ వెనుక.. వాటికి కూడా తెలిసిపోయింది, వాతావరణంలో మార్పు. నిశ్శబ్దంగా ఉండిపోయాయి.                                            …………………   పాతికమంది పైగా ఉన్నారు  సైనికులు.   వెనుక, పెరట్లో తవ్విన గాడి పొయ్యి వెలిగించింది సీతమ్మ. పెద్ద గంగాళం నిండా నీళ్లు పోసింది, మరిగించడానికి.   అర బస్తా బియ్యం కడిగి ఆరపోశాడు నందుడు. దానికి సరిపోయే కూరలు తరుగుతోంది గౌతమి. అప్పటికే శేరు పైగా పప్పు నాన పోసింది సీతమ్మ. బాగా కారంగా పచ్చడి కూడా చెయ్యాలి.. ఏం చేద్దామా అని ఆలోచిస్తోంది..   “మిరపకాయ పచ్చడి చేస్తున్నావా అమ్మమ్మా? బావుంటుంది..”  అప్పుడే అక్కడి కొచ్చిన మాధవుడు అన్నాడు.   “నీకు భలే ఆలోచనల్రా.. ఇంతున్నావు కానీ..” నవ్వుతూ చూసింది సీతమ్మ.   “ఇంతంత చేస్తున్నావే అమ్మమ్మా? మిగిలి పోతుందేమో కదా..”   “అక్కడున్నారే.. వాళ్లు, ఒక్కొక్కళ్లు శేరు బియ్యం అన్నం తినగలరు. పైగా.. ఆ సమయానికి ఇంకా ఇంత మంది వస్తారు చూడు.” సీతమ్మ గంగాళంలో సగం నీళ్లు తీసి వేరే డేయిసా లో పోసి అది కూడా గాడిపొయ్యికెక్కించింది. మరిగాక అందులో పప్పు పోసింది.   సరిగ్గా రెండి ఘడియల్లో వంటయిపోయింది.   వసారా బయట, తాటి చాపలు పరచి, సైనికులందరినీ పిలిచి కూర్చోమని.. అరిటాకుల మీద వేడిగా పొగలు గక్కుతున్న సన్న బియ్యం అన్నం వడ్డించారు, నందుడూ, గౌతమీ.   కమ్మ్టటి నెయ్యి వేసుకుని ఎన్ని రోజులయిందో పాపం.. ఒక్కొక్కళ్లు పురిషెడేసి వేసుకుని పప్పు కలిపి అందులో పచ్చిమిరప కాయ పచ్చడి నంచుకుని మాట్లాడకుండా తినేస్తున్నారు. మాట్లాడితే ఆ క్షణం వృధా అవుతుందని.   సీతమ్మ అన్నట్లుగానే, మరో పదిహేను మంది వచ్చేశారు సమయానికి. వాళ్లంతా అంత ఆబగా తింటుంటే ఆవిడకి కళ్లలో నీళ్లు తిరిగాయి. అంత మందికి వండి వార్చిన అలసట అంతా మాయమైపోయి, హృదయం కదిలి పోయింది.   “మరికొంచెం.. మరికొంచెం” అంటూ కొసరి కొసరి వడ్డించింది.   మాధవుడు పిడతల్లో మంచినీళ్లు నింపుతూ, నెయ్యి మారు వడ్డిస్తూ తిరిగాడు.   అందరూ కడుపు నిండుగా తిని, లేచాక చూస్తే.. సరిగ్గా నందుడి కుటుంబానికి సరిపోయేటన్ని మాత్రం మిగిలాయి ఆధరవులు. అమ్మమ్మ అనుభవంతో చెప్పిన మాటలు.. మాధవునికి ఆశ్చర్యం వేసింది.   భోజనాలయ్యాక సైనికులందరూ లేచి చేతులు కడుక్కుని వెళ్లి పోయారు.. కోటలోనుంచి కొమ్ము బూరా పిలుపులు వినిపించగానే!   ఏమీ మాట్లాడకుండా.. మొహల్లో కొంచెమైనా అసహనం చూపించకుండా నిశ్శబ్దంగా ఆకులు తీసి అంతా శుభ్రం చేశారు నంద గౌతమిలు.   “అదేమి అమ్మమ్మా? అంత మంది తిని ఏమీ ఇవ్వకుండా వెళ్లి పోయారు? మనకి ఒక వారాని సరిపోయే సంభారాలు అయిపోయాయి” మాధవుడు అడిగాడు చిరాకుగా.   “తొందరపడి ఏ వ్యాఖ్యానాలు చెయ్యకూడదు నాయనా.. వేచి చూడు. వాళ్లకి కోట నుంచి ఎప్పుడు పిలుపందుతే అప్పుడు వెళ్ళాలని ఆజ్ఞ. ఏమీ చెయ్యలేరు. నిత్యం కత్తి మీర సామే వారి పని. నా ఊహ సరైతే, వాళ్లంతా ఇప్పుడో.. ఇంకాసేపట్లోనో బయల్దేరుతారు.”   అంతలో వాకిలి బైట గంటలు వినిపించాయి. మాధవుడు పరుగెత్తుకుంటూ బైటికెళ్లి చూశాడు. వరుసగా ఎడ్లబళ్లు కోట దిశగా వెళ్తున్నాయి.   మళ్లీ ఇంట్లోకి పరుగెత్తాడు మాధవుడు.                          “సైనికులు బైటికెళ్లట్లే.. బళ్లు లోపలికెళ్తున్నాయి. తెరలు కట్టించి అంతఃపుర స్త్రీలని ఎక్కడికైనా పంపుతారేమో.. కోట ఖాళీ చేసేస్తారేమో! అప్పుడు నేను లోపలికెళ్లి చూడచ్చా?”   “వేచి చూద్దాం కన్నయ్యా ఏం జరుగుతుందో! ఈ లోగా మనం భోజనాలు చేద్దాం. ఆకలి దహించేస్తోంది.” నందుడు బాలుడు ఉత్సాహానికి అడ్డు కట్ట వేశాడు.   మాధవునికి కూడా పేగులు గోల పెడుతున్నాయి.   ఆకలికి మాత్రమే కాదు..   ఏదో తెలియని భయం.. ఏం జరగ బోతోంది?   వాళ్లు భోంచేస్తుండగానే కోటలో కలకలం.. గబగబా తినేసి, వాకిలి దగ్గరకు వెళ్లి చూశారు.   సైనికులు.. ముందుగా పదాతి దళం, తరువాత అశ్వదళం వెళ్తున్నారు.. దక్షణ దిశగా. ఆ వెనుక గజ దళం. మధ్యలో ఒక ఏనుగు మీద అంబారీ.. అందులో పూర్తి కవచ రక్షణలో ఉన్నాడు, కళింగ రాజు నాల్గవ భాను దేవుడు.   నందుడు, మాధవునికి చూపించాడు మహా రాజుని. గౌతమి, సీతమ్మలు కూడా కనుచూపు మేర చూసి లోపలికి వెళ్లారు నిట్టూరుస్తూ.   “అమ్మ, అమ్మమ్మ విచారంగా ఉన్నారు నాన్నగారూ.. ఇక్కడ కూడా ఇప్పుడు యుద్ధాలు వస్తున్నాయా?” మాధవుని శరీరం వణికింది. వంగ దేశం నుంచి తప్పించుకుని వస్తే ఇక్కడ కూడా..   “అదే కదా.. గత కొద్ది వారాలుగా అట్టుడికి పోతోంది. నగరం అంతా. మనం కూడా కావలసిన బియ్యం, పప్పులు.. అన్నీ నాణాలున్నంత వరకూ తెప్పించి పెట్టుకున్నాము. అయినా.. యుద్ధం ఆరంభం అయితే ఏ విధంగా పరిస్థితులు మారుతాయో చెప్పలేం.”   “వంగ దేశం నుంచి.. ఏమైనా భయం ఉందా? అక్కడి సుల్తాను..” మాధవుడు ఆందోళనగా అడిగాడు.   “అవును. జానుపూర్ సుల్తాన్ ఉత్తారాన చాలా సార్లు దండెత్తాడు. కానీ మాల్వా సుల్తాన్ పశ్చిమం నుంచి వంగ దేశాధీశుడిని చికాకు పెడ్తుండడంతో వెనక్కి వెళ్లిపోయాడు. పది సంవత్సరాల నుంచీ ఈ రాజు, నాల్గవ భానుదేవుడు ఏలుతున్నాడు.. కానీ ప్రజలేమంత సంతోషంగా లేరు. ఇప్పుడు చూడు.. దేశంలో ఎన్నో సమస్యలున్నాయి. చెరువులు ఎండి పోతున్నాయి. రహదారులు నిర్మించ వలసి ఉంది. పన్నులు పెంచేస్తున్నారు. ప్రజలు విలవిల్లాడి పోతున్నారు. దక్షిణాన రెడ్డిరాజులు కలహించుకుంటున్నారని అక్కడ గెలిచి, రాజ్యం పెంచుకోవచ్చని బయల్దేరాడు. ‘ఉట్టికెగరలేని వాళ్లు స్వర్గానికి ఎగరడం’ అంటే ఇదే..”   “చిన్న పిల్లవాడు. వానికి ఈ రాజకీయాలు నేర్పించ తగునా నందా?” సీతమ్మ కోప్పడింది.   “ఫరవాలేదండీ సీతమ్మగారూ! అర్ధం చేసుకున్నంతే.. ఈ సమయంలో ఏదీ దాచ కూడదు. పరిస్థితులు ఏ విధంగా మారుతాయో ఎవరు చెప్పగలరు?”   గౌతమి మ్లాన వదనంతో ఇంట్లోకి వెళ్ల బోయింది.   అంతలో.. రెండు ఎడ్ల బళ్లు వచ్చి ఇంటి ముందు ఆగాయి. వాటి నిండుగా బియ్యం, పప్పులు వంటి దినుసులు.. నందుడు సైనికుల భోజనాలకి వాడిన వాటికి నాలుగింతలు వచ్చాయి.   “మీ సేవకి సంతుష్టులైన కపిలేంద్ర దేవుల వారు పంపించారండీ. ఎప్పుడైనా ఎవరైనా సైనికులు వచ్చిన యెడల వారికి వండి పెట్టమని చెప్పమన్నారు. ఇంకా కొంత ధనము కూడా ఇచ్చారు.” మామూలు దుస్తులు వేసుకున్న ఒక యువకుడు, ఆశ్చర్యంతో చూస్తున్న నందుడి వద్దకు వచ్చి చెప్పాడు.   “కపిలేంద్రుల వారికి కృతజ్ఞతలు అంద చేయండి.” నందుడు వచ్చిన వారి సహాయంతో సంభారాలన్నీ లోపలికి తరలించాడు.   “అందుకే తొందర పడవద్దన్నాను. చూశావా మాధవా?” సీతమ్మ అంది.   మాధవుడు అర్ధమయిందన్నట్లు తలూపాడు.                                       ……………….   ......మంథా భానుమతి

ప్రియ ముళ్ళవనే... కథ

ప్రియ ముళ్ళవనే... కథ   - రచన : పద్మిని - హర్ష   ' ప్రియ ముళ్ళవనే...ప్రియ ముళ్ళవనే...విరహవుమెందొరొ మధురం...' శ్యామలి తన్మయత్వంలో పాడుకుంటూంది. 'అబ్బబ్బా...ఆ పాటే నిన్నటినుంచీ పాడి పాడి చంపుతున్నావ్...ఇంక చాలు తల్లీ..ఆపు నీ ఆడ మళయాళం గోల! " ఈశ్వర్ విసుక్కున్నా, శ్యామలి పాట ఆపటమే లేదు. ఇంకా, నవ్వూ, పాటా రెండూ కలిపి..గొంతు పెంచి మరీ పాడుతోంది. ఈశ్వర్ చెవులు మూసుకుని, బైటికి వెళ్ళిపోయాడు. శ్యామలికీ పాటల పిచ్చి బాగానే ఉంది. ఇప్పుడీ పాట ఆమే ఫేవరెట్ సాంగ్. ' కత్తీ పోయె డోలూ వచ్చె ఢాం ఢాం ఢాం అని సామెతున్నట్టు, ఆయుర్వేద తైల చికిత్స మాటేంటొగానీ, నీకీ మళయాళం పాటల పిచ్చి మాత్రం బాగానే పట్టుకుందీమధ్య. చస్తున్నాన్నేను..' అని వేళాకోళం కూడా చేస్తుంటాడు ఈశ్వర్ యెప్పుడూ..నిజమే ...ఇలా తను మారటానికి దారితీసిన క్రమమంతా సినిమా రీల్ లాగ గుర్తొచ్చింది శ్యామలికి.. ......... ' నా దుంప తెంచావ్ నిన్నటినుంచీ! కేరళా వైద్యం చేయించుకోవే నీ మోకాలి నొప్పికి అని..పోనీలే చిన్ననాటి ఫ్రెండ్ వి కదా నీ మాట విందామని నీవిచ్చిన అడ్రెస్ పట్టుకుని ఇక్కడికొస్తే..చెమటలు పట్టిస్తూందీ అడ్రెస్..ఓ పట్టాన కనపడి చస్తేగా? మహాతల్లీ! నా వల్లకాదిక..' కిసుక్కున నవ్వావైపునుంచీ.. మళ్ళీ మంజుల గొంతు. .యేంటీ? నా పాట్లు పడలేకే చెప్పావా..సడేలే....అబ్బబ్బా...సరిగ్గా వినబడటం లేదే..రోడ్ నెంబర్ 8 లో ....యెడమ వైపు రెండో సందులో....? .......... ' ఆఆ. చివరో హెరిటేజ్ అడ్వర్టైజ్మెంటున్న షాపుందే తల్లీ! ......... ' ఆ...ఆగాగు...స్కూటీ ఆపనీవే తల్లీ..ఆఆ..ఇది మరీ బాగుందే...అదేదో మాయల మరాఠీ ప్రాణంలాగ ఇలా చెబుతున్నావేంటే? పాల షాప్ వాడు డాక్టర్ ఇల్లు అడ్రెస్ చెబుతాడా. .ఇంతసేపూ ఇక్కడే యీ అడ్రెస్ చేతిలో పట్టుకుని తిరుగుతున్నా చచ్చేట్టు... ! . .......... ' ఆఆ.. భలే చెప్పొచ్చావులే. ఒక్కోసారి మన యెదురుగా వున్న ఇళ్ళే మనకు సరిగ్గా కనబడవు..అప్పుడే ఇలాంటి వుపాయాలు ఆలోచించాల్సింది అంటున్నావ్? నీకే ఇలాంటి తిప్పలొస్తే...అప్పుడు తెలుస్తుందిలే అమ్మగారి సంగతి! ..అర్జునునికి గీతాచార్యునిలా భలే బోధచేశావ్ లే! !...సరేలే..థాంక్స్ తల్లీ! ఆ షాప్ వాణ్ణడుగుతా.., డాక్టర్ ఇల్లు చెప్పకపోయాడా..నీ పని చెబుతా...' ' ..........' శ్యామలి మాట్లాడుతూనే, షాప్ లోకి వెళ్ళింది. అక్కడో పెద్దాయనున్నాడు. 'ఆ..పెద్దయ్యా.. ఇక్కడ డా. అంబుద గారి ఇల్లెక్కడ చెబుతావా? ?' ' డా. అంబుద మేడమా? ఆయమ్మ, రెండ్రోజులాయ బిడ్డా.. రోడ్ నంబర్ 10కి మారిపోయి గీడ బిల్డింగ్ సరిపోడం లేదంట ....ఆడ, గణేశ్ కిరానా దుక్నం పక్కన పచ్చ బిల్డింగ్ల రెండో మంజిల్ల పెద్ద ఇల్లు రెంట్కి దీస్కుంది ..సూడు..' 'థాంక్స్ పెద్దయ్య..' శ్యామలి షాప్నుండీ బైటికి వచ్చి మంజులకు ఫోన్ కలిపి క్లాస్ పీకింది..'ఆఆ..నీకేం బహుమతిస్తానో తెలుసా? రెండు పిడిగుద్దులూ, నాలుగు మొట్టికాయలూ ..భలేగా చెప్పావుగా అడ్రస్ ?' చెమటతో తడిసిపోయిన మొహం తుడుచుకుంటూ స్పీకర్ ఆన్ చేసింది శ్యామలి ఇంతసేపూ తనకీ సంగతి తట్టనందుకు తనను తాను తిట్టుకుంటూ! 'ఇది మరీ బాగుందే శ్యాం? ఆవిడ వున్నట్టుండి ఇల్లు మారితే నాదా తప్పు? సారీనే..ఇంతకూ అ షాపతను కొత్త అడ్రస్ కూడా చెప్పాడుగా.నేనే గెలిచాకదా! ఇంకే.బయలుదేరు నీ పంచకల్యాణి మీద? ' కిసుక్కున నవ్వు అటువైపు. శ్యామలీ నవ్వాపుకుంటూ 'సరేలేవే. .అడ్రెస్ కనుక్కుని , డాక్టర్ను కలిసి వెళ్తాలే..పాపం నువ్వేదో నాకు మంచి చెయ్యాలనేగా యీ డాక్టర్ గురించి చెప్పింది.చూద్దాం.ఫోన్ చేస్తా ఈవెనింగ్....వుంటా ..' హమ్మయ్య!మొత్తానికి శ్యామలి డా. అంబుద కేరళ ఆయుర్వేద మసాజ్ చెంటర్ కు చేరుకుంది. డాక్టర్ చాలా ఆప్యాయంగా వివరాలు కనుక్కుంది. అమెరికాలో కూతురూ, అల్లుడూ, మనుమళ్ళతో, డిస్నీలాండ్ లో తిరుగుతున్నప్పుడు, హఠాత్తుగా పలుకరించి పిక్కల్ని పట్టేసిన మాయదారి నొప్పి గురించీ, తానక్కడ దొరికిన తైలాలతో సొంతంగా మసాజ్ చేసుకుని, హాట్ వాటర్ బాగ్ తో కాపడం పెట్టుకుని, నొప్పి యెలా కంట్రోల్ చేసుకుందో, ఇక్కడికి వచ్చిన తరువాత, తన స్నేహితురాలి ద్వారా ఇక్కడికి యెలా వచ్చిందో అన్నీ వివరంగా చెప్పింది. శ్యామలి చెప్పిన వివరాలన్నిటినీ శ్రద్ధగా విని, నోట్ చేసుకుంది డాక్టర్ అంబుద . మోకాలి నొప్పికి ఆయిల్ మసాజ్ మంచి ట్రీట్మెంట్ అంది. ఆపరేషన్ అవసరం లేకుండా చేస్తామనన్నది. శ్యామలికూడా, తన ఫ్రెండ్ మంజుల వాళ్ళ బంధువిక్కడే ట్రీట్ మెంట్ తీసుకుందనీ, రిలీఫ్ కనిపించిందనీ, తన సలహా పైనే ఇక్కడికి వెతుక్కుని మరీ తను వచ్చిందనీ చెప్పగానే, డాక్టర్ చాలా సంతోషించింది. 'అంబుద అంటే ? మాటల్లో అడిగింది శ్యామలి. 'మేఘమండీ' చక్కటి తెలుగులో బదులిచ్చింది డాక్టర్ నవ్వుతూ! అంబుద..యెంత చక్కటి పేరో! మళయాళం పాటల్లోనూ సంసృతం బాగానే వాడుతారు..యెప్పుడైనా చెవిన పడినప్పుడు తను గమనించిన విషయమిది! తనకు పూర్తిగా నమ్మకం కుదిరితేనే ట్రీట్మెంట్ తీసుకోవచ్చనీ, పదహారు సీట్టింగ్ లకూ, పదిహేను వేలవుతుందనీ, నచ్చితే, రేపటినుంచే మొదలెట్టవచ్చనీ చెప్పింది డాక్టర్ అంబుద . డబ్బు మాట వినగానే ఆలోచనలో పడింది శ్యామలి. 'ఒకే విజిట్లోనే ఒప్పుకోవాలని రూలేమీ వుండదెక్కడైనా కదా!' అనుకుని, ఇంటికెళ్ళి, హజ్బెండ్ తో మాట్లాడి ఫోన్ చేస్తానని చెప్పి, బయట పడింది అప్పటికి! ఇంట్లో శ్రీవారితోనూ, స్నేహితురాలు మంజులతో మరోసారీ చర్చించింది శ్యామలి. బైట యే డాక్టర్ దగ్గర్కి వెళ్ళినా, ఆ టెస్టులూ, యీ టెస్టులూ అంటూ, వేలకువేలవటమెటూ వుంటుంది. ఇక అల్లోపతీ మందుల సంగతి చెప్పేదేముంది? ఖర్చూ, దానికి తగ్గట్టు, వేరే ప్రభావాలూ చూపిస్తాయనీ వాళ్ళూ వీళ్ళూ అంటూనే వుంటారాయె! కేరళ ఆయుర్వేద తైల చికిత్స..ఆ పేరే యెంతో బాగుంది. పైగా ఆయుర్వేదం కూడా! సహజ సుందరమైన కేరళ అందాలలాగే, యీ చికిత్స కూడా, మనస్సునిట్టే ఆకర్షిస్తుందని శ్యామలి నిశ్చితాభిప్రాయం. అందుకే దీనికి వెళ్ళాలనే నిర్ణయించుకుంది శ్యామలి. అనుకున్నదే ఆలస్యం-డేటూ, టైమూ కూడా ఫిక్స్ చేసుకుంది. ఇక వెళ్ళటమే తరువాయి.. .... శ్యామలి డా. అంబుద క్లినిక్ కి చేరుకుంది. ఓ ఐదు నిముషాలు కూర్చున్న తరువాత, ఓ రూంలొకి రమ్మని పిలిచారు. అక్కడ, అంబుద గారితొపాటూ, మరో ముగ్గురు ఆడవాళ్ళు. ముఫై ఐదు నలభైయేళ్ళున్నావిడా, పదహారు పదిహేడేళ్ళ అమ్మాయీ, యిరవై యేళ్ళ యువతీ వున్నారు. అంబుద ఇంగ్లీష్ లో చెప్పింది - బట్టలు విప్పి, నడుము చుట్టూ, ఒక లంగోటా లాంటి తెల్లటి తుండుగుడ్డ చుట్టుకొమ్మని! శ్యామలికి చెప్పొద్దూ, కాస్త సిగ్గేసింది! వున్నది ఆడవాళ్ళే ఐనా, ఉన్నఫళాన బట్టలు మార్చుకొమ్మంటే యెలా వాళ్ళముందే! అల్మారా కేసి తిరిగి, ఓ తలుపు మూసి, బట్టలు మార్చుకుంది శ్యామలి. ఇవన్నీ తమకు మామూలే అన్నట్టు, చూస్తున్నారా ఇద్దరూ! యెదురుగా వున్న చెక్క మంచంపైకెక్కి వెల్లకిలా పడుకొమ్మన్నారు. సిగ్గు సిగ్గుగానే పడుకుంది శ్యామలి. డాక్టర్, శ్యామలిని మాటల్లో పెట్టింది. అమెరికా ట్రిప్ లో యేమేమి చూశారంది. శ్యామలి కూతురూ, అల్లుళ్ళ చదువూ, వుద్యొగ వివరాలూ అడిగింది. శ్యామలి మాటలు వింటూ వింటూనే, మధ్యలో, వాళ్ళీద్దరికీ, మళయాళంలోనే యేవో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుంది. ఇంతలో యెవరో తలుపు తట్టారు. శ్యామలి చటుక్కున ముడుచుకుపోయింది బల్లమీద! డా. అంబుద అంది. 'కంగారు పడకండి.యెవరూ రారు లోపలికి. నేవెళ్తాను. వీళ్ళిద్దరూ చూసుకుంటారిక్కడ! ఆ..మీరు వెళ్ళేటప్పుదు, దాహమైతే, వీళ్ళను నీళ్ళివ్వమని అడగంది తప్పక! దాహం వేస్తుంది కూడా!' అంటూ బైటికి దారి తీసింది, ఆ ముఫైయేళ్ళావిడను వెంటపెట్టుకుని! శ్యామలికి మనసులో ఓ వైపు సంకోచం! అక్కడున్న ఇద్దరమ్మాయిలూ తమకివన్నీ అలవాటేనన్నట్టు, శ్యామలి ఒంటిపై, ముందే గోరువెచ్చగా కాచి పెట్టుకున్న పరిమళభరిత తైలాన్ని అరచేతులనిండా తీసుకుని, పాదాలూ, పిక్కలూ, నడుము భాగమూ, చాతీ, భుజాలూ- ఇలా అన్నిటిపైనా వేసి, మసాజ్ మొదలెట్టారు - తమలో తామే మళయాళంలో మాట్లాడుకుంటూ! ఇద్దరమ్మాయిల్లో పదహారేళ్ళమ్మాయి , చామనచాయకంటే ఓ పిసరు యెక్కువే వుంది.ముక్కూ, కళ్ళూ, పళ్ళూ బాగానే ఉన్నాయి. కాసేపటికి ఇద్దరమ్మాయిలూ ఇద్దరూ గొంతులు తగ్గించి, గుస గుసగానే, బోలెడన్ని సంగతులు మాట్లాడేసుకుంటున్నారు. ఒకసారి, యెవరిగురించో ఫిర్యాదుల్లా, మరో సారి ఆనందాన్ని పంచుకుంటున్నట్టు కళ్ళల్లో మెరుపులు! మరో సారి, తెగ నవ్వులూ! యీ మళయాళం లో యెక్కువగా సంస్కృత పదాల వాడకం యెక్కువ. శ్యామలి అప్పుడప్పుడూ, ఏసియా నెట్లో, పాటల పోటిలు చూస్తుంటుంది. చాలా వెరైటీగా వుంటాయవి! వాళ్ళు పాడే పాటల్లోనూ, సంస్కృత పదాలెక్కువగా వినిపిస్తుంటాయి కూడా! కానీ, వాళ్ళు మాట్లాడే విధానం - యేదో ప్రత్యేకంగానే వుంటుంది. యే పదాన్నీ నొక్కి పలక్కుండా, గాల్లో తేలిపోతున్న ఫీలింగ్ వింటుంటే! మొదటమ్మాయి చేతులంత పట్టుగా మసాజ్ చేస్తున్నట్టు లేదు. మాటలపై ఉన్న శ్రద్ధ పనిలో లేదీ పిల్లకు!రెండో అమ్మాయి మనిషిలో ఆకర్షణ లేకున్నా గొంతు తియ్యగానూ, చేతి పట్టూ బాగానే వుందనిపించింది శ్యామలికి! వాళ్ళ మాటలు వింటూ వింటూ, తాను పడుకుని వున్న చెక్క బల్లపై సీలింగ్ లో ఉన్న కథాకళి చిత్రాలనూ, పేరుతెలియని పువ్వులనూ చూస్తూ పడుకుంది శ్యామలి. భుజాలూ, చేతులూ, అరచేతులూ, చేతివేళ్ళూ, గుండెదగ్గరా, నడుము కింద భాగమూ, పిక్కలూ, పాదాలూ, కాలి వేళ్ళూ- ఇలా అన్ని భాగాలమీద కాసేపు మసాజ్ ముగిసింది.తరువాత, మంచి సువాసనతో నులివెచ్చగా వున్న నీళ్ళు, తీర్థమిచ్చే చెంబులాంటి పాత్రతో ఒంటిమీద పైనుంచీ పడేలగా యేదో పెద్ద పాత్రనుంచీ కాస్త కాస్త తీసుకుంటూ పోశారు ఓ పదిహేను నిముషాలపాటు! శ్యామలి ఇంగ్లీషులోనె వాళ్ళనడిగింది - ఇదేమిటని! వాళ్ళూ వచ్చీరాని ఇంగ్లీషులోనే జవాబు చెప్పారు-ఆ నీళ్ళలో, యెవో ఔషధవిలువలున్న వేళ్ళపొడిలాంటివి కలిపారట! శ్యామలికి సంతోషం వేసింది. అల్లోపతీ, ఆ పతీ, యీ పతీ అంటూ వేరే వైద్యాల జోలికి వెళ్ళకుండా, అసలు సిసలైన భారతీయ వైద్యం తను చేసుకుంటున్నందుకు కాస్త గర్వం కూడా కలిగింది! థాంక్స్ టు ఫ్రెండ్షిప్! మొత్తానికి, యీ కోర్స్ అయ్యేంతలో, తను చకచకా నడవగలుగుతుందనే నమ్మకం వచ్చేసింది. .................. ఇలాగే మరి రెండు రోజులు జరిగింది. శ్యామలి, ఇంగ్లీషులోనే వాళ్ళను తన సందేహాలడగటం, వాళ్ళూ అలాగే సమాధానాలు చెబుతుండటంతో వాళ్ళిద్దరితో కాస్త దోస్తీ పెరిగింది కూడా! తరువాత రెండు రోజుల్లోనూ, వైద్య విధానం ఇలా జరుగుతుంటే, శ్యామలికి తాను ఇలా మరీ మూగ మొద్దులా పడుకుని వుండటం నచ్చలేదు. అసలే తనకు చిన్నప్పటినుంచీ వాగుడుకాయ అనే పేరు మరి! ఈశ్వర్ కూడా యీమాటే అంటుంటాడు యెప్పుడూ! మనుషుల మధ్య అనుబంధాలు పెరిగేందుకు మాటల పందిరి అవసరమని శ్యామలి ఘంటాపధంగా చెబుతుంది. ఇప్పుడూ, అదే పని మొదలెట్టింది. ఆ ఇద్దరు అమ్మాయిలతో మాటా మాటా కలిపింది. తన వివరాలూ చెప్పింది. పాటలు పాడింది. వాళ్ళిద్దరూ వుత్సాహంగా తమను గురించి చెప్పుకున్నారు. కానీ ఆ విషయాలు విని ఆశ్చర్యపోయింది. కానీ బైట పడలేదు. యెందుకంటే, ఇంత చిన్న వయసులో, కుటుంబాలకు దూరంగా వుంటున్న వాళ్ళిద్దరూ ఇప్పటికే పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయి వుండటమే! పదహారేళ్ళమ్మాయి ప్రియుడు ఇప్పుడు డిగ్రీ ఫష్టియర్లో వున్నాడట అల్లిప్పీలో! ఇద్దరి అమ్మా నాన్నలకు వీళ్ళిద్దరి ప్రేమ గురించీ తెలుసునట! ఇక రెండో అమ్మాయి ప్రియుడు ఇక్కడే, యీ సెంటర్లోనే వుద్యోగం చేస్తున్నాడట! వీళ్ళిద్దరి గురించీ ఇళ్ళల్లో తెలుసట! రెండేళ్ళతరువాత వీళ్ళ పెళ్ళట! ఇద్దరి సంగతీ తెలిసిన తరువాత, శ్యామలి ఒకింత ఆలోచనలో పడింది. మంజులతొ అంటే, తేలిగ్గా కొట్టిపడేసిందీ విషయాన్ని ' అబ్బే యెన్ని చూడలేదు మనమిలాంటివీ? ఇవన్నీ వానకాలం ప్రేమల్లేవే!' అంటూ! ఇంతకీ మొదటమ్మాయి పేరు సహనా, రెండొ పిల్ల పేరు సదియా! సదియా అంటే సత్యవతి లాంటి అర్థం! పేర్లైతే బాగున్నాయి మరి వాళ్ళ ముందు జీవితాలె లా వుంటాయోనని అప్పుడప్పుడూ ఆలోచనలో పడుతూనే వుంది శ్యామలి! ఈలోగా, వాళ్ళిద్దరితో దోస్తీ బాగానే పెరిగింది. మూడు నాలుగు రోజుల జల వైద్యం, తైలం తో మసాజ్ తరువాతేమి చేస్తారని అడిగింది శ్యామలి వాళ్ళను! ఒక పల్చటి బట్టలో, ఆయుర్వేద మిశ్రమాలను కట్టి వుంచిన 'కీళి' అనే మూటలాంటి దాన్ని, వేడి వేడి తైలంలో ముంచి, దానితో, దేహమంతా కాపడం పెడతారట! ఇంటికి వెళ్తూనే, యేరోజుకా రోజు ఆయుర్వేద తైల చికిత్సలో యేంచేశారో ఈశ్వర్ కు పూస గుచ్చినట్టు చెబుతున్నట్టే, ఇక్కడి అమ్మాయిల వ్యవహరమూ చెబుతూనే వుంది శ్యామలి! ప్రేమ కథ అనగానే ఈశ్వర్ కు కూడా ఇంట్రెస్ట్ పెరిగింది కస్త! సహన ఓరోజు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడించిందనిందోరోజు! మరో రోజు సహన, తనీమధ్య తన లవర్ కోసం కొన్న సెల్ చూపించిందట కూడా! సదియా, ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండూ ఇద్దరూ కలిసి పాటలు వింటున్నారటోరోజు! ఆదివారమవటం వల్లా డాక్టర్ రారు. అందుకని, సహన ఒక్కతే కాసేపు మసాజ్ చేస్తుండగా, కాసేపటికి సదియా వచ్చిందట! అన్నట్టు ఓ రోజు తానో తెలుగు పాత పాడితే, సదియా దానికి మళయాళం మాతృక పాడిందట కూడా! 'రోజావే చిన్ని రోజావే,' 'యెంత కాలం యెంత కాలం, కాలమాగి పోవాలీ '. ఇలా! అదిగో..ఆ క్రమంలొనే సదియా పాడిన యీ మళయాళం పాట తెగ నచ్చింది శ్యామలికి! ఆ పాటను యూ ట్యూబ్ లో యెన్ని సార్లో చూసి మరీ తరించింది! మధుశ్రీ నారాయణ్ అన్న గాయని పాడిన ఆపాట శ్యామలి ఫేవరెట్ సాంగ్ ఇప్పుడు! 'కిళి' తో ఒంటిమీద కాపడం పెట్టేటప్పుడు, పాట తాళానికి అనుగుణంగా, సదియా, తనూ, 'ప్రియ ముళ్ళవనే' పాట పాడుకోవటం హైలైట్ శ్యామలికి! మొత్తానికి ఆ అమ్మాయి గొంతులో యేదో మత్తుంది! అది తెగ నచ్చింది తనకు! యీ పదహారు సిట్టింగులూ యేకధాటిగా జరగలేదు. శ్యామలికి కాస్త జ్వరం రావటమొక కారణం కాగా, వేరే వూళ్ళలో దగ్గరి బంధువుల పెళ్ళిళ్ళు అటెండ్ కావలసి రావటం వల్లా, ఓ వారం రోజుల బ్రేక్ వచ్చింది. శ్యామలికేదో పేద్ద గాపే వచ్చినట్టు ఫీలింగ్. వైద్యం సంగతెటున్నా, అ ఇద్దరమ్మాయిలతో వారం పదిరోజుల సాన్నిహిత్యమూ, ఆ కర్పూరాది తైల చికిత్సా తెగ నచ్చాయి. పైగా, కర్పూర పరిమళానికి, పాటల సౌరభమూ కలిసి, శ్యామలికి, యెన్నో రోజులైనట్టనిపించింది వాళ్ళిద్దరినీ చూసి! వూరినుండీ తిరిగి వచ్చిన తరువాత అలసటా...మళ్ళీ రెండ్రోజులగ్గానీ, తైల చికిత్సవైపు వెళ్ళలేక పోయింది శ్యామలి. మంజుల జోకులేసింది కూడా నీకు నిద్ర పట్టటం లేదా మీ 'ప్రియముళ్ళవనే' ని ఇంకా కలుసుకోలేదని?' అని! శ్యామలిని వాళ్ళిద్దరూ కూడా బాగానే మిస్సయ్యారట! యెందుకంటే, తనలా ఫ్రెండ్లీగా వుండే పేషంట్లూ, పాటలు కూడా పాడి, పాడించుకునే పేషంట్లు అసలు తామొచ్చిన ఆరు నెల్లలో యెవరూ లేరట! తన పాటలు వాళ్ళనలా మురిపించటంకూడా శ్యామలికి నచ్చింది. ఈశ్వర్ కు పాటలంతగా నచ్చవు. యెప్పుడూ, పాలిటిక్స్, క్రికెట్టూ, సినిమాలూ తప్ప మరో ముచ్చటుండదు తనతో! మంజులైతే కాస్త నయం. తైల చికిత్స సంగతటుంచి, తన గొంతును వీళ్ళిద్దరొ మెచ్చుకోవటమూ, సదియా, ముస్లిం ల పిల్లైనా, తియ్యటి గొంతూ, పాడే విధానమూ కూడా నచ్చటం ప్లస్ పాయింటయింది, శ్యామలికీ చికిత్స నచ్చటానికి! వాళ్ళతో సరదాగా తీసుకున్న సెల్ఫీ కూడా మంజులకూ, ఈశ్వర్ కూ చూపించిన సంగతి చెబితే, వాళ్ళూ సరదగా, సెల్ఫీలు తీసుకున్నారు. యీలోగా, శ్యామలికి మసాజ్ లో నొప్పనిపించినప్పుడు సహన, అడిగింది, ' వేదనె? ' అని, బాధగా మొహం పెట్టి! వేదన అన్న పదం తెలుగులో గ్రాంధికం. కానీ మళయాళంలో వాడుకభాషలో కూడా వాడుతారని తెలుసుకుని, ఆహా,, యెంత బాగుందో ' అని మురిసి మూర్చ పోయింది శ్యామలి. ఇంకా, అని అదిగింది. అభినయం (నటన) భక్షణం (ఆహారం) సమాదానం (సమాధానం అని తెలుగులో ఒత్తి పలుకుతాం) పరిష్కారం (తెలుగు పదమే) మనోరధం (కోరిక) ఇలాంటి కొన్ని సంస్కృత పదాలు వాడుక భాషలో వాళ్ళు వాడే విధానమూ విధానమూ నచ్చింది శ్యామలికి! ఇలా పాడుతూ, పాడించుకుంటూ, మొత్తం పదహార్రోజుల పండుగలాగే, పదహార్రోజుల తైల చికిత్సా ముగిసింది. చికిత్స గురించి ఈశ్వర్ పెదవి విరిస్తే, శ్యామలి, చికిత్సా ప్లస్ పాటలతో కలిపి వందా యాభై మార్కులేసింది. డాక్టర్ కు కృతజ్ఞతలు చెప్పింది. సహన కూ సదియాకూ చెరో వెయ్యి రూపాయలిచ్చి తన గుర్తుగా, డ్రెస్సులు కొనుక్కోమంది కూడా! వాళ్ళ ఫోన్ నంబర్లూ తీసుకుంది. అదే ఈశ్వర్ కు శ్యామలిలో నచ్చనిది! 'వెళ్ళిన పనికంటే, తక్కిన విషయాలపైనే నీకు శ్రద్ధెక్కువ! ' అన్నాడు విసుక్కుంటూ! 'తైల చికిత్స తరువాత నువ్వు పరిగెడుతూ ఇంటికొస్తావనుకున్నాగానీ, ఇలా మళయాళం పాటలు పాడుకుంటూ, కుంటుకుంటూ వస్తావనుకోలేద' ని కోప్పడ్డాడు కూడా! శ్యామలి ప్రతిదీ డబ్బుతోనే కొలవకూడదనీ, యెప్పుడు యెవరితో పరిచయం యెలా రూపుదిద్దుకుంటుందో తెలుసుకొలేమనీ, యే చికిత్స కైనా, ఫలితాలు చూ మంతర్ లా నిలుచున్న ఫళాన రావనీ, నిదానమే ప్రధానమనీ.. చాలా విధాలుగా తన వాదన వినిపించింది శ్యామలి. ఊహూ..ఈశ్వర్ వింటేనా? పనిలో పనిగా పరిచయం చేసిన మంజులనూ కోపగించుకున్నాడు కూడా! శ్యామలి ఒకే మాటపై నిలబడింది. వాళ్ళిచ్చిన టాబ్లెట్స్ అన్ని సరిగ్గా వాడాలింకా..కొన్ని యెక్సర్ సైజులు కూడా చేస్తే అప్పుడు నొప్పి కుదురుకుంటుందని తన గట్టి నమ్మకం. శ్యామలి అంటున్నట్టే, నొప్పి రాను రాను నెమ్మదించింది. నడకలొనూ, వేగం పెరిగింది. మళయాళం పాటల పట్ల ప్రేమ కూడా, ఇంతై వటుడింతింతై వలెనే, పెరిగిపొయింది కూడా! తరువాత కూడా, వాళ్ళిద్దరితో ఫోన్లో రెండుమూడుసార్లు మాట్లాడింది శ్యామలి. అటుతరువాత, తన పనులూ, ఇంటి పనుల ఒత్తిడి వల్ల దాదాపు నెలరోజులపాటు వాళ్ళతో మాట్లాడలేదు కానీ, 'ఇందు పుష్పం చూడి' అన్న చిత్ర పాడిన పాటను సదియా సలహా పై నేర్చుకుని తెగ పాడుకుంటూంది శ్యామలి. వున్నట్టుండి, ఒక రోజు సదియాతో మాట్లాడాలనిపించి, ఫోన్ చేసింది. ఫోన్ నాట్ రీచబుల్ అంది సెల్లు. పోనీ సహన నంబర్ ట్రై చేద్దామని చేస్తే, అదీ కలవలేదు. ఇద్దరూ, యేదైనా పనిలో వున్నారేమో నని వూరుకుంది. వారం తరువాత మళ్ళీ అదే సమాదానం ..వుండబట్టలేక హాస్పిటల్ కే చేసింది ఫోన్..అంబుద వూళ్ళొ లెరట! అక్కడే పనిచెస్తున్న సదియా బోయ్ ఫ్రెండ్ షరీఫ్ తొ మాట్లాడాలంది! యెవరో తీశారు ఫోన్! అక్కడ వాళ్ళెవరూ ఇప్పుడు పనిచేయటం లేదని చెప్పాడా అబ్బాయి - వచ్చీరాని తెలుగు లో! శ్యామలి ఆశ్చర్యపోయింది. రెండు నెల్లలో వుద్యొగం ముగ్గురూ మానేశారే! ఇదెలా! ఈశ్వర్ తేలిగ్గా అనేశాడు, అబ్బో! వాళ్ళిచ్చే జీతం నచ్చలేదేమో! పైగా సిటీలో యెన్నో కేరళ వైద్యశాలలు! మరెకడికో వెళ్ళిపోయుంటారు..హమ్మయ్య! ఫోన్ బిల్లు తగ్గిందని సంతోషపడ్డాడు కూడా! శ్యామలి పాటల ప్రాక్టీస్ మానలేదు. ఇంతలో ఒక రోజు పనిమీద బంజరాహిల్స్ వెళ్ళి, యేదో అవసరమొచ్చి, దగ్గరే వున్న మాల్ లో ప్రొవిజన్స్ తీసుకుంటూంది. బిల్ చెల్లిస్తుండగా, లొపల, సహనలాగే యెవరో కనిపించి, వెంటనే వెనక్కి వెళ్ళి చూసింది. దూరంగా సహనే! సంతోషంగా 'సహనా' అని గట్టిగా పిలిచి, గబ గబా అటుకేసి అడుగులు వేసి చూసేసరికి, అక్కడా అమ్మాయి లేదు. ' అరె! అంతలోనే యెలా మాయమైంది? తను కాదా? 'అని సందేహం కూడా! మనసంతా చెదిరి పొయింది. ఇంటికి వెళ్ళగానే, ఈశ్వర్ కి కూడా యీ విషయం చెప్పింది. 'ఆ..నీలాంటి వాళ్ళెంతమందో వాళ్ళకు.. అందరినీ గుర్తు పెట్టుకుని పలకరిస్తూ, టైం వేష్ట్ చేసుకొరమ్మా యెవరూ! నీకే యీ విషయం తెలీదు కానీ! ' అని వెక్కిరించాడు కూడా! 'బతకనేర్చినవాళ్ళు ' అని చక్కటి తాఖీదు కూడా ఇచ్చాడు వాళ్ళకు! శ్యామలికి యీ విషయమేంటొ తెలుసుకుని తీరాలనిపించింది. మళ్ళీ హాస్పిటల్ కు ఫోన్ చేసింది. డా. అంబుదగారున్నారా అని. ఊళ్ళొనే వున్నారనీ, కాని మధ్యాహ్నం మూడింటికి వస్తారని చెప్పాడా అబ్బాయి! పనిగట్టుకుని శ్యామలి మళ్ళీ వెళ్ళిందక్కడికి! లోపలెవరో పేషంట్ వున్నట్టుంది. పదిహేను నిముషాలు వైట్ చేసినతరువాత, అంబుదగారొచ్చారు. శ్యామలిని చూసీ చూడగానే, 'నొప్పి తగ్గిందా?' అని ఆప్యాయంగా అడిగిందావిడ! తన సంగతంతా చెప్పి, అప్పుడడిగింది శ్యామలి సహనా, సదియాలగురించి! డాక్టర్ ఆశ్చర్యపోయింది - వాళ్ళను గురించి తెలుసుకోవటానికే తను వచ్చానంటుంటే! లోపలికి తీసుకెళ్ళి సోఫాలో కూర్చున్న తరువాత చెప్పిందావిడ ..'ఆ ఆడపిల్లలిద్దరూ, ఆ అబ్బాయీ ఇక్కడ బాగానే పని చేసేవాళ్ళు. సహనకూ, సదియాకూ లవ్ స్టోరీలున్న సంగతి తెలుసు తనకు..షరీఫూ, సదియా యెంతో క్లోజ్ గా వుండేవాళ్ళు. మరో రెండేళ్ళలో వాళ్ళ పెళ్ళట కూడా! ఇంటర్ తరువాత, తైల చికిత్సలో యేదో కోర్స్ చేసిన ఆ ముగ్గురూ, అల్లిప్పీ నుంచీ వచ్చారు! అంతా బాగానే వుంది కానీ,... వున్నట్టుండి, సదియకూ, ఆ షరీఫ్ కూ యేదో గొడవైందట! పైగా, సహన వెంట పడుతున్నట్టుగా కూడా సహనే, సదియాతో చెప్పుకుని యేడ్చిందట! సదియా కూ, షరీఫ్క్ ఊ పెద్ద రాద్ధంతమే అయినదని ఇక్కడే పనిచేస్తున్న మరొకావిడ చెప్పింది! పెళ్ళి కూడా చేసుకుందామనుకుని, అమ్మ నాన్నలను ఒప్పించి ఇంత దూరం వచ్చి, సంతోషంగా వుంటున్న వాళ్ళ మధ్యలో యీ కలతలవల్ల, హాస్పిటల్ పనుల్లో ఇబ్బంది కలుగుతుంటే, తనే వాళ్ళు ముగ్గురినీ వెళ్ళిపొమ్మందిట కూడా! కానీ, మళ్ళీ యేమి జరిగిందొ యేమో, ముగ్గురూ తనకు సారీ చెప్పుకుని బుద్ధిగా వుద్యోగాలు చేసుకుంటామన్నారట! ... ఇది జరిగిన పదిహేను రోజులకే, ఒక రోజు పొద్దునే హాస్పిటల్ నుచీ ఫోన్! సదియా ఫాన్ కు వురి వేసుకుందనీ, కొన వూపిరితో వున్న ఆ అమ్మాయిని, దగ్గర్లోని హాస్పిటల్ లో చేర్పించారనీ, త్వరగా రమ్మనీనూ! యేంచెయాలో తొచలేదు. కంగారుగా వాళ్ళు చెప్పిన హాస్పిటల్ కు వెళ్ళి, ఆ ఖర్చంతా తానే భరించిందట! పొలీసు కేసు కాకుండా, తెలిసిన వాళ్ళతో యెలాగో మేనేజ్ చేసేసరికి తలప్రాణం తోకకొచ్చిందట! చావు తప్పి కన్ను లొట్ట పోయినట్టు, సదియాకు ప్రాణాపాయం తప్పింది కానీ, గొంతు శాశ్వతంగా పోయిందట! ఇంతకూ, ఆ అమ్మాయి యీ పనిచేసిన కారణం వింటే, మతి పోయిందట అంబుదకు! సహనా ప్రేమికుడక్కడ, మరో అమ్మాయితో ప్రేమలో పడ్డాడట! ఆ విషయం తెలిసిన షరీఫ్ మళ్ళీ సహన వెంట పడటం మొదలెట్టాడట! సదియా, సహనా, ఇద్దరూ తిరగబడినా, షరీఫ్ ఒప్పుకోవటం లేదట! పైగా, సదియాతో క్లోజ్ గా వున్న సెల్ఫీలు చూపించి, నోరెత్తవద్దని బెదిరిస్తున్నాడట సదియా ను! అతణ్ణి దారిలో పెట్టుకునేందుకు సదియా చేసిన యీ బెదిరింపు పని ఆ అమ్మాయి తలకే చుట్టుకుని, ఇలా దారి తీసిందట! ఈ స్టోరీ అంతా తెలిసి, కడుపు మండిపోయి, అ ముగ్గురి ఇంటివాళ్ళకూ యీ సంగతంతా చెప్పి, ముగ్గురినీ వుద్యొగాలనుంచీ తీసేసిందట అంబుద! ఇప్పుడు వాళ్ళెక్కడున్నారో కూడా తనకు తెలీదని చెప్పింది, మొహం యెర్రగా చేసుకుని! 'యేదో మా వాళ్ళు కదా అని చేరదీస్తే, నన్నే యిరుకున పెట్టారా ముగ్గురూ' అని చికాకుపడింది కూడా! 'ఐనా, మీరేమిటిలా వాళ్ళగురించి ఇంత ఇదిగా అడుగుతున్నార' ని అడిగింది కూడా! సదియా గొంతంటే తనకిష్టమనీ, అందుకే వచ్చానని చెప్పి, బైట పడింది శ్యామలి! ఈశ్వర్ అనే మాట నిజమే! యేది యేమైనా, ఇంతగా, ప్రతి పరిచయాన్నీ, మనసులొకి తీసుకుని, యేమైనా ఐతే బాధపడుతూ కూర్చోవడం అవసరమా? అని! శ్యామలి కూడా మాటలు రాని మూగదైపోయింది! అంటే, సహన ఇక్కడే ఎక్కడో ఉందన్న మాట! మరి సదియా యేమై వుంటుంది? వాళ్ళ ఊరికి వెళ్ళిపోయిందా! మరి పాటలు పాడని సదియానెలా ఊహించుకోవటం? అదేదో అడ్వర్టైజ్ మెంట్ లో అన్నట్టు, వలపు మంచిదే - సరైన మలుపులుంటే! అది ఆంధ్రాలో కావచ్చూ, కేరళలో కావచ్చు. అనాలోచితంగా శ్యామలి నోటివెంట అదే పాట - 'ప్రియ ముళ్ళవనే! ప్రియ ముళ్ళవనే ' .. కళ్ళలో నీళ్ళతొపాటూ!

“అజ్ఞాత కులశీలశ్య….” 8వ భాగం

“అజ్ఞాత కులశీలశ్య….” 8వ భాగం    మాధవుడు విద్యలన్నింటిలోనూ బాగా రాణిస్తున్నాడు.    ఒక రోజు అడవిలోకి వెళ్లి, ఒళ్లంతా రక్త సిక్తమై వచ్చాడు. అప్పటికే అతడు వెళ్లి చాలా సేపు అవడం వల్ల, ఇంటిలోని వారందరూ ఆందోళనగా ఉన్నారు.    మాధవుడిని చూసి సీతమ్మ వాకిలి నుండే గట్టిగా అరిచింది. గౌతమి, నందులు పరుగెత్తుకుని వచ్చారు.    “అయ్యో! ఏమయింది కన్నయ్యా? అడవిలోకి వెళ్లద్దంటే వినవు కదా.” గాభరాగా అంటూ బట్టలు విప్పి, ఒడలంతా పరీక్ష చేశాడు నందుడు. కాళ్లూ చేతులూ వణుకుతుండగా స్తంభాన్ని ఆనుకుని కూల బడింది గౌతమి.    సీతమ్మ లోనికి పరుగెత్తి, వేడి నీళ్లు కాచ సాగింది.    “ఫరవాలేదమ్మా! పైపైనే గీరుకు పోయింది. గాయాలు లోతుగా లేవు. నాలుగైదు దినాల్లో తగ్గిపోతుంది.”    “ఈ విధంగా రక్తాలు కారుతూ ఎలా వచ్చావు కన్నయ్యా?”    “కళ్యాణి తీసుకొచ్చిందమ్మా. నా పక్కనే నడుస్తూ.. జాగ్రత్తగా! గుర్రం మీదికి ఎక్కలేదు.” మాధవుని మాట స్పష్టంగానే ఉంది. మెడ పై భాగానికి దెబ్బలేం లేవు. అది కాస్త నయమే అనుకున్నాడు నందుడు.    సీతమ్మ తెచ్చి వేడి నీటిలో బట్ట ముంచి, కొద్దిగా చల్లారాక ఒడలు తుడవడం మొదలు పెట్టింది. అప్పటికి గౌతమి కూడా తేరుకుని ఇంకొక బట్ట తీసుకుంది.    మాధవుని మాట నిజమే.. పైపైనే ఉన్నాయి గాయాలు.    వాటిని తుడుస్తుంటే కిక్కురు మనలేదు మాధవుడు. గౌతమి, నందుడు ఒకరి వంక ఒకరు చూసుకున్నారు… కర్ణుడి కథ జ్ఞప్తికి వచ్చి. ఇతడు బ్రాహ్మణ బాలుడేనా?    కానీ, వెంటనే వారి సందేహం నివృత్తి అయింది. సీతమ్మ పసుపు తెచ్చి అద్దుతున్నప్పుడు దిక్కులు పిక్కటిల్లేట్లు అరిచాడు మాధవుడు.    సగం.. నిజంగానే మండటం వల్ల. సగం, గౌతమీ, నందుల ముఖ కవళికలు గమనించడం వల్ల. బాలునికి తెలిసి పోయింది.. బాధను తట్టుకునే శక్తి బ్రాహ్మణులకి తక్కువుంటుందని.    పరిచర్య పూర్తయి, పల్చని అంగవస్త్రం వక్షం మీద ఆచ్ఛాదనగా వేశాక వినిపించాయి..    వెనుక వాకిలి నుంచి గుర్రం సకిలింపు, దాంతో పాటుగా.. మే.. మే అనే కేకలు.    “అయ్యో కళ్యాణి మాట మరచాం. దానికేం దెబ్బలు తగల్లేదు కదా!” ఆందోళనగా అన్నాడు నందుడు.    “లేదు.. లేదు. అశ్వం బాగానే ఉంది. నేనే ఎగిరి ముళ్ల కంప లో పడ్డాను. ఆకలికి అరుస్తోంది.” లేవబోయాడు మాధవుడు.    “లేవకు. నేను వెళ్లి గుగ్గిళ్లు వేసొస్తా.” సీతమ్మ లేచింది.    “ఫరవాలేదు. అమ్మమ్మా! మీకు తెలియదు. నే వెళ్లి చూస్తా. ఈ గాయాలు గాలికి ఆరితే తగ్గిపోతాయి త్వరగా.”    మాధవుడు సునాయాసంగా లేచి పెరటి వాకిలి దాటి బైటికి వెళ్లాడు.    గుర్రం మాధవుడిని చూసి నిలువుగా తలూపింది. తన యజమాని ఎలా ఉన్నాడో అని ఆ ప్రాణికి ఆదుర్దా కలిగినట్లుంది.    వెనుకగా వచ్చిన నందునికి కన్నుల నీరు తిరిగింది. ఈ మూగజీవుల కున్న విశ్వాసం మానవులకుంటే ఎంత బాగుండునో అనుకున్నాడు.    మాధవుడు తన అశ్వం దగ్గరగా వెళ్లి, వీపు మెడ నిమురుతూ ఆహారం తినిపించాడు. అంతలో ఒక పక్క నుంచి మే..మే.. అంటూ అరుపులు వినిపించాయి. నందునితో పాటుగా వచ్చిన గౌతమి మొదటగా గమనించింది..    ప్రాకారం పక్కగా.. కిందకి వంగి ఉన్న జామ ఆకులు నముల్తూ ఉన్న రెండు మేక పిల్లలు. ఒకటి తెల్ల మేక. మూతి నల్లగా.. ఒంటి మీద అక్కడక్కడ చిన్న నల్లని మచ్చలు. ఇంకొకటి నల్ల మేక. అక్కడక్కడ చిన్నగా తెల్లని మచ్చలు.    గౌతమి మేకల వంక చూస్తుండడం గమనించి మాధవుడు కళ్యాణి వెనక్కి వెళ్లి దాక్కున్నాడు.. దొంగ చూపులు చూస్తూ. వెన్న దొంగిలించి గోడ వెనుక దాక్కున్న కృష్ణుడిలాగా అనిపించాడు సీతమ్మకి.    “ఇవేమిటయ్యా?” అడగనే అడిగింది గౌతమి.    “కోట పక్కన ముళ్ల పొదల దగ్గర దిక్కులేకుండా తిరుగుతున్నాయమ్మా. అక్కడి నుంచి వాటిని తప్పించ బోయే, పొదల్లోకి పడిపోయాను. అప్పుడే ముళ్లు గీరుకు పోయాయి. వాటిని పట్టుకుని నడిచి వచ్చాను. అందుకే ఆలస్యమయింది.”    ఎలాగా తెలిసి పోయింది కదా.. మాధవుడు మేకల దగ్గరికి వెళ్లి వాటిని సవరించ సాగాడు. గుర్రంకూడా ఆనందంగా తలూపుతోంది.    “బాగుంది నీ పరివారం. ఇప్పుడు ఆ మేకల యజమానులొస్తే.. మన మీద దొంగతనం నేరం మోపరా?” నందుడు అడిగాడు.    “లేదనుకుంటా నాన్నగారూ.. వీటిని చూడలేక వదిలి పెట్టినట్లున్నారు. అక్కడక్కడా మేస్తూ అనాధల్లా తిరుగుతున్నాయి. ఎవరైనా వస్తే అప్పుడే ఇచ్చేద్దాం. మన దగ్గర పెట్టుకుందామా? వాటికి ఖర్చు ఏమంత అవదు. నేను వెళ్లి మేపుకొస్తాను.” గోముగా అడిగాడు.    “వాటివల్ల మనకి ఏం ఉపయోగం?” సీతమ్మ సందేహం..    “ఉపయోగం అంటే.. ఏం లేదు. ఆ.. మేక పాలు చాలా శ్రేష్టం. అమ్మమ్మా! మీ కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి. ఇంక సంవత్సరం లోగా ఆ మేకకి పాపాయి పుడుతుంది.” మేకల గురించి తెలిసిన వాడిలాగ చెప్పాడు మాధవుడు.    “ఛా.. మేక పాలా?” సీతమ్మ మొహం చిట్లించింది.    “మేకపాలకీ, ఆవు పాలకీ తేడా ఏముందమ్మమ్మా? రెండూ తినేవి ఆకులే కదా.. రెంటికీ ఒక దగ్గర్నుంచే కదా పాలు వచ్చేది..”    “ఉండు.. నీ పని చెప్తాను. అంతా అపసవ్యం మాటలూ నువ్వూనూ..” సీతమ్మ ఒక కర్ర పట్టుకునొచ్చింది.    మాధవుడు ఆవిడకి దొరక్కుండా అటూ ఇటూ పరుగెత్త సాగాడు.    నంద, గౌతమిలు నవ్వుతూ చూస్తున్నారు.    అంతలో తెల్ల మేక వచ్చి, మూతి పైకెత్తి గౌతమి చేతికి రాయడం మొదలు పెట్టింది. కిందికి వంగి చూస్తే దాని కాలి నుంచి రక్తం కారుతోంది. మొహం మీద, తోక దగ్గర.. అన్నీ గాయాలే. కళ్లు పెద్దవి చేసి చూసిన గౌతమికి నల్ల మేక పరిస్థితి అంత కంటే ఘోరంగా కనిపించింది. దానికైతే, ఒళ్లంతా రక్తం మరకలే.    “ఇదేమిటి మాధవా?” వణుకుతున్న కంఠంతో అడిగింది.    “అదే తెలీదమ్మా. ఏదైనా పెద్ద జంతువు తరుముతూ వస్తే పొదల్లో పడిపోయాయేమో.. వాటి యజమాని వెదకి వేసారి వెళ్లి పోయుండవచ్చు. అక్కడే ఏటి గట్టున శుభ్రం చేద్దామనుకున్నా కానీ, మీరు ఆందోళన పడుతుంటారని తీసుకొచ్చేశాను. నా శరీరం మీదున్న సగం రక్తం వాటిదే. ఇప్పుడు శుభ్రం చేద్దామా? అమ్మమ్మని అడిగి ఔషధంకూడా రాద్దాం.” మాధవుడు ఆదుర్దాగా చూస్తూ అడిగాడు.    “వీటిని మన దగ్గర ఉంచుకుందామా లేదా అనేది తరువాతి సంగతి.. ముందుగా, వాటి దెబ్బల సంగతి చూద్దాం. వదిలేస్తే అదొక పాపం చుట్టుకుంటుంది.” నందుడు మేకలని బావి వద్దకి తీసుకెళ్లాడు.    నందుడు గాయాలని కడుగుతుంటే సన్నగా మూలుగుతున్నాయి మేక పిల్లలు.    మధ్య మధ్యలో కళ్యాణి సకిలిస్తోంది.    సీతమ్మ, ఇంటి వెనుక నున్న తోటలోకి వెళ్లి ఏవో ఆకులు తెచ్చి నూరి ముద్ద చేసింది.    సీతమ్మకి మూలికల వైద్యం తెలుసు. ఆవిడ తండ్రి తాతలు వైద్యులు. కొన్ని అత్యవసర మైన చిట్కాలు నేర్పించారు. ప్రాధమిక చికిత్స చెయ్య గలుగుతుంది.    “మాధవుడి గాయాలు పైపైనే ఉన్నాయి. అందుకే పసుపు రాస్తే సరి పోతుంది. కానీ, ఈ మేక పిల్లల దెబ్బలు, బాగా లోతుగా ఉన్నాయి. మూలికల చూర్ణం పట్టీ వేస్తే కానీ తగ్గవు.” అలా అంటూనే గట్టిగా పేనిన చాంతాడు చివర అంటించి, నిప్పు చేసి తీసుకొచ్చింది సీతమ్మ.    “అదెందుకమ్మమ్మా?” భయం భయంగా అడిగాడు మాధవుడు.    గాయాల్ని శుభ్రం చేసిన నందుడికి అర్ధమయింది. గౌతమి, కళ్యాణి దగ్గరగా వెళ్లి మెడ కింద, గంగడోలు నిమర సాగింది.    “వీటి వయసెంతుంటుందో?” నిప్పు ఎర్రగా మండేలాగ ఊదుతూ అడిగింది సీతమ్మ.    “నాలుగైదు నెలలు ఉండచ్చు. చిన్న పాపాయిలు.. పాపం. ఎక్కడ్నుంచి వచ్చాయో!” నిప్పు చివరని ఎర్రగా అయేలా ఊదుతున్న సీతమ్మని కళ్లు పెద్దవి చేసి చూస్తూ అన్నాడు మాధవుడు.    “నందా! తయారేనా? ఒక్కొక్క చోట్లో జాగ్రత్తగా పట్టుకో. ఇంకొక చెయ్యి జీవి కదలకుండా..” సీతమ్మ నిప్పుని మేక దగ్గరగా తీసుకు రాబోయింది.    కెవ్వున కేక పెట్టాడు మాధవుడు.    “ఏం చేస్తున్నారు అమ్మమ్మా?”    అప్పుడనిపించింది పెద్ద వాళ్లకి, పిల్లవాడికి అంతా చెప్పి చేస్తుంటేనే నయం అని. నందుడు దగ్గరగా రమ్మని పిలిచాడు.    మేక పిల్ల కాళ్లని చూపించాడు. నాలుగు కాళ్లకీ, వేళ్ల పైనా కిందా.. తొడల దగ్గర చిన్న చిన్న జలగలు అతుక్కుని ఉన్నాయి.    “వీటిని చూశావా? జలగలు. శరీరానికి అతుక్కుని వదలవు. రక్తం అంతా పీల్చేస్తాయి. ఇవి పట్టాయంటే, ఏ జంతువైనా, మనుషులైనా నిర్వీర్యం అయిపోవలసిందే. చూడకుండా వదిలేస్తే ప్రాణాలు కూడా పోతాయి.”    “నిజమే.. కానీ కాలుస్తే మేక కూడా కాలుతుంది కదా? అంతకంటే గోటితో గిల్లేస్తే పోదా?” భయంగా అడిగాడు బాలుడు.    “అది ఇంకా బాధ. కాళ్లు సన్నంగా ఉంటాయి కదా. పట్టు ఉండదు. జాగ్రత్తగా కాలుస్తారు సీతమ్మగారు. మరి నైపుణ్యం అంటే అదే. ఏటికి మంచి నీటికి వెళ్లినప్పుడు అమ్మనీ, అమ్మమ్మనీ కూడా పడ్తుంటాయి. నిప్పు తగలగానే పట్టు వదిలేస్తాయి. ఆ తరువాత కడిగేసి పసుపు అద్దేస్తే తగ్గి పోతుంది. మనం తినంకానీ, ఉల్లిపాయ నూరి పట్టీ వేస్తే కూడా తగ్గుతుంది. కోమటి కొట్టుకెళ్లి తీసు కొద్దాం. ముందు ఈ జలగలన్నీ రాలి పోనీ.” నందుడు మేక కాలు పట్టుకున్నాడు.    విచిత్రంగా మేక కదలకుండా పడుక్కుంది.    జంతువులకి కొన్ని లక్షణాలు అమర్చాడు ఆ దేవుడు. ఎవరైనా తమకు మేలు చేస్తున్నారని నమ్మాయంటే చాలు పూర్తిగా తమ భారాన్ని వారి మీదికి వదిలేస్తాయి. అందులో మేత కోసం ఏటి ఒడ్డున తిరిగే ఏ ప్రాణినైనా జలగలు పట్టకుండా వదలవు. వాటి ఆహారం రక్తం మరి. పైగా.. మేకలు రెంటికీ అంతకు ముందు అలవాటు ఉన్నట్లే ఉంది జలగల్ని పీకించుకోవడం.                                       ……………….                             మాధవుని ఆనందానికి హద్దుల్లేవు. మేకలు రెండూ సీతమ్మ వైద్యం పని చేసి, ఆరోగ్యంగా తయారయ్యాయి. శ్వేత, శార్వరి అని పేర్లు పెట్టాడు మాధవుడు వాటికి. చెంగు చెంగున గెంతుతూ తోటంతా తిరుగుతుంటాయి.. అంది నంత మేర ఆకుల్ని నములుతూ.    సమయం దొరికినప్పుడు బుజ్జి మేకలతో ఆడుకుంటుంటాడు. కళ్యాణి కూడా తల పైకీ కిందికీ ఊపుతూ హర్షాన్ని తెలుపుతుంటుంది.    అదే సమయంలో.. నందుడు ఒక ఆవుని, దూడని కూడా తీసుకొచ్చాడు. మూగ జీవుల పనులన్నీ మాధవుడు సంతోషంగా చేస్తున్నాడు, అమ్మమ్మ సహాయంతో.    ‘కళింగం’ పూటకూళ్ల గృహం వెనుక భాగం అంతా రాజుగారి కోట కిందికి వస్తుంది. అటుపక్క సరిహద్దు గోడలుకానీ, కంచెలు కానీ ఏమీ లేవు. ఒక క్రోసు దాటాక కందకం వస్తుంది. అప్పటి వరకూ ఎవరూ అటు ప్రక్కకే రాలేదు. అసలు ఆ స్థలం అంతా భానుదేవుని తండ్రి, మహాపాత్రుడికి అరణంగా ఇచ్చిందే.    ఎవరైనా వచ్చి అడిగినప్పుడు చూసుకోవచ్చులే అనుకుని, కొంత మేర పశువులకి కంచె వేసి, గ్రాసం పెంచడం మొదలు పెట్టాడు నందుడు.    అక్కడే పశువుల కొట్టం కూడా దించాడు. సీ.     తెలతెల వారగ తెల్లావు తువ్వాయి              ఇటునటు తిరుగుతూ యెగురగాను         దానికి దీటుగా తైయని గెంతేటి              మచ్చల మేకల మైమరపులు         నేనేమి తక్కువనే యశ్వమది గోను               తలతిప్పి కాలెత్తి తకిట యనగ          గోమాత నెమరేస్తు కొండాటముం జెంద               సూరీడు వేవేగ చొచ్చి వచ్చు ఆ.వె.    వింత కాంతు లన్ని వెలుగొందె వెనుకింట            చేరిచేరి యన్ని చెంత నిలువ            మున్ను కనని కళలు మురిపాన పొడచూపె            నందునింటి లోన నాణ్యముగను.    సూర్యోదయానికి ముందే లేచి, అంతా శుభ్రం చేసి, కుడితి తయారుచేసి, గ్రాసం వేసి.. అప్పుడు తన పనులు చేసుకుంటాడు మాధవుడు. అప్పుడే సీతమ్మ, గౌతమి లేచి, వాకిలి ఊడవడం, కళ్లాపు జల్లి ముగ్గులు వేయడం చేస్తారు.    అంతలో నందుడు లేచి, మాధవుడిని తీసుకుని ఏటి వద్దకు వెళ్లి, స్నానం, సంధ్యావందనం కార్యక్రమాలు ముగించుకుని, కావడి మీద మంచినీళ్లు తీసుకొస్తారు. ఆ పిదప, మడికట్టుకుని, పూజ ముగించుకున్న గౌతమి పొయ్యి అంటించి పాలు కాచి అందరికీ క్షీరం అందిస్తుంది.    సీతమ్మ కూడా స్నానాదులు ముగించుకుని, శాకాలు తరగడం మొదలు పెడుతుంది. సాధారణంగా రోజుకు పదిమందికి తక్కువ కాకుండా వస్తుంటారు బాటసారులు. కొందరు ముందురోజే వచ్చి, రాత్రి వసారాలో విశ్రమిస్తారు.    మాధవుడు వచ్చినప్పటి నుంచీ రద్దీ బాగా పెరిగింది. ముఖ్యంగా సైనికుల తాకిడి ఎక్కువయింది, మామూలుగా కంటే బాగా..                                     ……………...   ......మంథా భానుమతి

“అజ్ఞాత కులశీలశ్య….” 7వ భాగం

“అజ్ఞాత కులశీలశ్య….” 7వ భాగం                                                      కం.   నిలిచియు నుండెడి దేదీ                    యిలను కనబడదు గనెపుడు, యేది మనదనే                    తలపులు మనమున వలదని                    పలికెదరు గురువులెపుడును బాగుగ వినగా.    సాధారణంగా గురువులు చెప్పేది వినడానికి మాత్రమే అనుకుంటారు... ఆచరణ కొచ్చే సరికి మాయ కమ్మేస్తుంది.    అందరు మత ప్రవక్తల బోధలూ అవే. తాత్కాలికమైన ఈ సుఖాల కోసం తాపత్రయాలెందుకు? కావలసినంత తినగలగడం, నచ్చిన ఆహార్యం ధరించగలగడం, పెద్ద భవంతిలో నివాసం.. ఇవే సుఖాలనుకుంటే ఎంత బాగుండును! అవే సరిపోవు. ఇంకా ఇంకా.. ఏదో కావాలి.    కొద్ది విచారంగా, మతాల సారాన్ని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ, పంచలో కూర్చుని కూరగాయల తీగెలకి పందిరి కోసం, తాళ్లు పేనుతూ ఆలోచిస్తున్నాడు నందుడు.    తాము ఇక్కడ, తల్లీ, తమ్ముడూ బాలేశ్వర్ లో, ఉండవలసిన పరిస్థితుల గురించి.. తన తాతగారు చెప్పిన విషయాలు, తను చూస్తున్న సంఘటనలు తలుచుకుంటే విరక్తి కలుగుతుంది.. జీవితం మీద.    పోరు.. పోరు.. పోరు.    కళింగ సామ్రాజ్యం తూర్పు గాంగేయుల అధీనంలోకి వచ్చి నాలుగు శతాబ్దాలు గడుస్తోంది. కళింగపురం రాజధానిగా (ఇప్పటి శ్రీకాకుళం దగ్గరున్న శ్రీముఖలింగం) అనంతవర్మ చోడగంగుడు స్థాపించాడు. దక్షిణ భారత దేశం నుంచి వచ్చిన వారు కనుక అక్కడి సంస్కృతి, భాషలు కళింగంలో బాగా ప్రాచుర్యం పొందాయి.    పండితులకి కనీసం నాలుగు భాషలు వచ్చి ఉండేవి. అష్టభాషా కోవిదులు అడుగడుగునా కానవచ్చే వారు.    సామ్రాజ్యాన్ని స్థాపించిన అనంతవర్మ చోడగంగుడు, ఉత్తరాన గంగా నది నుంచీ దక్షిణాన గోదావరి వరకూ పాలించాడు. ఉత్కళ, కోసల, కళింగ రాజ్యాలన్నీ కలిపి, త్రికళింగాధిపతిగా రాజ్యాన్నేలాడు. ఆహార ఆహార్య వ్యవహారాలన్నింటిలో సామీప్యము సామాన్యమే. వివాహాది శుభకార్యాలకీ రాకపోకలు జరుగుతూనే ఉన్నాయి, సంపన్నుల గృహాలలో.    అనంతవర్మ రాజ్యాన్ని విస్తరించడం ఒక పక్క, కళింగలో ఆలయాల నిర్మాణం ఒక పక్క చేపట్టాడు. జగత్ప్రసిద్ధి చెందిన పూరీ జగన్నాధుని ఆలయం అతడి కాలం లోనే నిర్మించారు.    తరువాతి రాజులు, ముసల్మానుల దండయాత్రలని ఎదిరించ లేక లొంగిపోయి, సామంతులైనా, ఒకటవ నరసింహ దేవుడు పుంజుకుని, దక్షిణ వంగ రాజధానిని చేజిక్కించుకుని అక్కడి సుల్తానుని ఓడించాడు.    ఇతడి తండ్రి, మూడవ అనంగ భీమదేవుడు, తన కాలంలో రాజధానిని కటకం పట్టణానికి మార్చాడు. ఆ మార్పుకి, దక్షిణ వంగదేశం దగ్గరగా ఉండటం, కటకం నైసర్గికంగా రాజధానిగా ఉండటానికి, కోట నిర్మాణానికి అనుకూలమవడం కారణమై ఉండవచ్చు. వెనువెంటనే కోట నిర్మాణం కూడా మొదలు పెట్టారు. అదే.. ప్రపంచ ప్రసిద్ధమైన “బారాబతీ కోట.”    ఒకటవ నరసింహ దేవుడే కోణార్క్ లో సూర్య దేవాలయాన్ని కట్టించాడు.       కానీ.. ఆ నరసింహదేవుడి తరువాత గాంగేయుల పతనం ఆరంభమయింది. ఉత్తరాన ఢిల్లీ సుల్తాను, ఆ తరువాత దక్షిణమున విజయనగర రాజులతో పోరులు జరుగుతూనే ఉండేవి.. వంగదేశంలోని అంతర్గత కలహాల వల్ల ప్రస్తుతానికి కటకం ప్రశాంతంగా ఉన్నట్లే ఉంది.    మాధవుడు కటకం చేరిన సమయంలో నాల్గవ నరసింహదేవుడి కొడుకు భానుదేవుడు కళింగనేలుతున్నాడు.    గాంగేయ రాజులందరిలోనూ అసమర్ధుడుగా పేరు తెచ్చుకున్నవాడు ఈ నాల్గవ భానుదేవుడు. తండ్రి పాలనలోనే అస్తవ్యస్తంగా తయారైన రాజ్య పరిస్థితి మరింత అధ్వాన్నంగా దిగజారింది. ఇతడు చంచల మనస్కుడిగా పేరు పొందాడు. అంతే కాదు.. ప్రజల చేత పిచ్చి రాజుగా పిలవ బడేవాడు.    నందుడి తండ్రి, నాల్గవ నరసింహదేవుని వంటశాలలో ప్రధాన పాక నిపుణుడుగా ఉండే వాడు. అతడిని యుద్ధ భూమిలో వంటలు చేయించడానికి తీసుకెళ్లాడు రాజు. అది అతని చివరి యుద్ధం.. అదీ వంగ దేశంతో.    ఆ సమయంలో పోరు మాని, సంధి చేసుకుని వచ్చే టప్పుడు.. కొందరు ప్రతిభ ఉన్న పని వారిని వదిలేయ వలసి వచ్చింది. అప్పుడే మహా పాత్రుడిని వంగ రాజుకి ఇచ్చేశాడు నరసింహ దేవుడు.    పనివారు కూడా మనుషులే.. వారికీ భార్యా పిల్లలుంటారు, అనే మానవత్వం మృగ్యం రాజులకి.. అదీ, యుద్ధనీతికొచ్చే సరికి. అశ్వాలనీ, గజాలనీ మార్చుకున్నట్లే మనుషుల్ని కూడా!    బాలవ్వ కటకం నుండి, సరిహద్దు ప్రాంతమైన బాలేశ్వర్ చేరుకుని, అక్కడ పూటకూళ్ల ఇల్లు నడప సాగింది. ఎప్పటికైనా భర్త రాకపోతాడా అని. అది అత్యాశే అని తెలిసినా కూడా..    నంద మహాపాత్రుడి వంశంలో భాష, వేదం మొదలైనవి మొదట్లో.. మూడు తరాల ముందు వరకూ ఉండేవి.. కానీ, కాలక్రమేణా, ఉదర పోషణార్ధం వంటవారి కింద మారక తప్పలేదు. కాలగమనంలో మార్పు సహజమే కదా!    గాంగేయ రాజులు ఆలయ నిర్మాణాల మీద, రాజ్య విస్తరణ మీద పెట్టిన శ్రద్ధ సాహిత్యం మీద పెట్టినట్లు లేదు.      ఎంతటి వారికైననూ సమయమునకు పొట్ట నింపుకొనవలసినదే.. రాజ్యంలో ఎన్నెన్ని యుద్ధాలైనా, ఎంత అల్ల కల్లోలం వచ్చినా కడుపు నింపే వారి జోలికి పోరు.    “క్షుద్బాధ.. సృష్టి కర్త జీవుల కొసగిన వరమూ శాపమూ కూడా!” అనుకున్నాడు నందుడు.                                            ……………….    “అదే విధముగా నాన్నగారూ?” మాధవుడు మరునాడు అడిగాడు నందుడిని.    తమ వంశం గురించి చెప్తూ.. నందుడు ఆకలి ప్రాణికోటికి కొంత చెడూ, కొంత మంచీ కలిగించిందని చెప్పగానే.                        “ఉ. ఆకలి గొన్నయా మెకము నల్పుల నేమరచిన్ వధించునే          ఆకడ వేటగాడెపుడు నామెకమున్ కని చంపుగా నదే          తేకువ యున్నవారి కడ తేర్చుకదా బలిమిన్ బుభుక్షకై          పోకడ నేకదా సతము భూమము నుండెడి దీ కతమ్మునన్.”                                 జన్మత: మాంసాహారి..  వేట ఒక క్రీడ ఆయిన రాజవంశంలో పుట్టిన మాధవుడు అర్ధం కానట్లు చూశాడు.    “అవును మాధవా! ఆకలి లేకున్న ఒకరినొకరు చంపుకోవడం ఉండదు కదా ఈ భూమ్మీద.”    “ఏమో నాన్నగారూ! అది కూడా ప్రాణుల సమ తుల్యానికి కావలసిందే అనే వారు మా గురువుగారు. అలా పెంచుకుంటూ పోతే, నిలబడ్డానికి కూడా చోటు సరిపోదేమో!” మాధవుడు సంకోచంగా అన్నాడు.    పుత్రుని మాటల్లో కొంత నిజం కూడా కనిపించింది నందుడికి.    “నిజమే.. కానీ ప్రాణం ఉన్న జీవిని చంపడం అమానుషం కాదా?”    విరక్తిగా నవ్వాడు మాధవుడు.    “ఆకలి వేస్తే కడుపు నింపుకుందుకు, ప్రాణాలు నిలుపుకోవడానికి చంపడం పాపం కాదు తండ్రీ. రాజ్యాల కోసం, మతం మార్చుకోమనీ, భోగాల కోసం చంపడం అమానుషం. ఏ జంతువైనా కడుపు నిండితే ఇంకొక జంతువు జోలికి వెళ్లదు. కానీ.. మనిషి? అన్నీ ఉండి కూడా మారణహోమం చేస్తాడు. ఎందుకు?” మాధవుని ప్రశ్నకు తక్షణం జవాబివ్వలేకపోయాడు నందుడు. కొంచెం ఆలోచించి చెప్పాడు.    “పాలకుడనే వాడు ఏ ప్రాంతానికైనా అవసరమే. ఒక క్రమశిక్షణలో జీవనం నడపాలంటే అతడికి అధికారం.. తప్పుచేస్తే దండన ఉంటుందన్న భయం ప్రజలకి ఉండాలి. లేదంటే ఆటవిక న్యాయం అయిపోతుంది. అది మానవులకి క్షేమం కాదు. కానీ.. సుభిక్షంగా ఉన్న దేశాలని ఆక్రమించుకోవడం, యుధ్ధాలు... వేల ప్రాణాలు తియ్యడం.. అదంతా అన్యాయమే. మనం అంత పెద్ద విషయాలు చర్చించడం అనవసరమేమో..” నవ్వుతూ వాతావరణం తేలిక చేశాడు నందుడు.    “మరి.. భగవంతుడు ఆకలి వల్ల మంచి కూడా చేశాడన్నారు కదా? అదే విధంగా?” మాధవుడు అడిగాడు.    “ఏ జీవికైనా జీవించడానికి ఒక ధ్యేయం ఉండాలి. ఆ ధ్యేయం.. ప్రప్రథమంగా ఆకలి. అది తీర్చుకోవడానికి ఏం దొరుకుతుందా అని వెతుకులాట మొదలు పెట్టడం, ఆ తరువాత అది పంచుకోవడానికి ఎవరైనా దొరుకుతారా అని చూడ్డం.. సమూహం ఏర్పడడానికి దోహదం అయింది. అదే.. ఆకలి లేదనుకో! ఏం పనుంటుంది? ఏమీ తినకుండా జీవులు పెరిగి పెద్దయి సమయం వచ్చినప్పుడు రాలిపోయి.. యాంత్రికం అయిపోదా?”    మాధవుడు నిజమే అన్నట్లు తలూపాడు.    “అదే విధంగా.. కాల్చో, ఉడికించో తినడం.. రకరకాల రుచులు, వానికోసం ఇంకా శ్రమించడం. ధ్యేయం వరకూ బాగనే ఉంది .. అలాగే సమూహాలు ఏర్పడ్డం, ఒకరి కోసం ఇంకొకరు తాపత్రయపడ్డం, బంధాలు, అనుబంధాలు.. అక్కడితో ఆగిపోతే బాగుండేది. ఆడంబరమైన ఆహార్యం, అలంకరణ.. సుఖాలు, అత్యాశ.. ఇవన్నీ జీవనాన్ని ప్రభావితం చేస్తున్నాయి. మీ తాతగారు ఆ విధంగానే మాకు దూరమైపోయారు.”    కుతూహలంగా చూస్తున్న మాధవునికి తన తండ్రిగారి గురించి చెప్పాడు నందుడు.    “ఒక విధంగా మనం వంటల వాళ్లుగా ఉండడం వల్లే ప్రాణాలు నిలుపుకో గలుగుతున్నాము. నువ్వు మాత్రం వేరే విద్యలు కూడా నేర్చుకోవాలని నా అభిలాష. మీ పూర్వీకుల వృత్తి ఏమిటో నాకు తెలియదు.. నీకు బలవంతంగా ఏ విద్యనీ అభ్యసింప చెయ్యటం నా అభిలాష కాదు. నీకు ఎందులో అభిరుచి ఉందో చెప్పు.”    “నాకు పాక శాస్త్రం మీద కూడా ఆసక్తి ఉంది నాన్నగారూ. మా జనకులు కోటలో సలహాదారుగా ఉండేవారు. రాజుగారికి ఆప్తులు. నాకు రాజకుమారులతో కత్తియుద్దం, గుర్రపు స్వారీ, ధనుర్విద్య ఆ విధంగానే పట్టుబడ్డాయి. వాటిమీద ఆసక్తి కూడా మెండు. అది కాక.. భాష కూడా. ఆంధ్ర, వంగ, సంస్కృతాలు చిన్న చిన్న గ్రంథాలు చదవడం వరకూ వచ్చింది.”    బాలుని బహుముఖ ప్రజ్ఞాపాటవాలకి ఒకరకంగా ఆనందం, మరొక విధంగా విచారం కలిగాయి నందుడికి.    ఇటువంటి పుత్రుడు తమకి లభించినందుకు ఆనందం.. ప్రజ్ఞాశీలుడే కాదు, మాధవుడు వినయ సంపన్నుడు కూడా.    అతడి కత్తి, గుర్రపు స్వారీల ప్రతిభ చూస్తే కోటలోని వారు ఊరుకుంటారా? నిస్సందేహంగా ఊరుకోరు.    తప్పని సరిగా సైన్యంలోకి తీసుకుంటారు. పుత్రోత్సాహం మూడునాళ్ల ముచ్చటే అవుతుందా? గురువుల వద్దకు పంపి విద్యలు నేర్పించడం ఎంత వరకూ సబబు? మాధవుని తల్లి ఏం కోరుకుంది?    ఆలోచనలో పడ్డాడు నందుడు.    తండ్రి తటపటాయించడం చూసి అన్నాడు మాధవుడు..   “ఆ. వె.  బుడుతడి నని నీకు పుయిలోటము వలదు             వడివడిగ పరుగిడి వాటముగను             డంబరమున నేను డంకతనముతోను             సాయ పడెద తండ్రి శౌర్యమునను.”    ఆనందంతో దగ్గరకు తీసుకుని మనసారా హత్తుకున్నాడు, స్వయందత్తుడైన  పుత్రుడిని నందుడు.    ఏది ఏవిధంగా జరగాలో.. ఎవరి చేత నుంది? విధి వ్రాత ననుసరించే కదా సాగేది జీవన యానం.                                          …………….. *బుభుక్ష = ఆకలి;    *సతము = శాశ్వతము;     *భూమము= భూమి;  *పుయిలోటము = సంకోచము; *డంబరము = విజృంభణము; *డంకతనము = దార్ఢ్యము.   ......మంథా భానుమతి  

“అజ్ఞాత కులశీలశ్య….” 6వ భాగం

నందుడు అస్థిమితంగా పచార్లు చేస్తున్నాడు, పంచలో.. ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. మాధవుడు ఒక స్థంభాన్ని ఆనుకుని కూర్చుని చూస్తున్నాడు. సమస్య ఏమిటో తెలియడం లేదు..    తనేమైనా సహాయం చెయ్యగలడేమో..    మధ్యాహ్న భోజనాలయి, బాటసారులందరూ నిష్క్రమించారు, వారి వారి దిశలలో. అంతా సవ్యంగానే ఉంది కదా! మరి..    మనసులో తలపోస్తున్నాడు.. జన్మ కారకుడు కాకపోయిననూ, తనని ఆదరించి అక్కున చేర్చుకున్న తండ్రికి ఏవిధంగా ఉపశమనం కలిగించ గలనా యని..                  కం.   వ్యాకులిత మనము నటుయిటు                          ఏకాగ్రతతో నడచుచు భృకుటి ముడిచెనే                          నే కారణమో తెలిపిన                          నీ కలతను మాన్పగలను నిక్కముగానున్.    “ఏమయినది తండ్రీ?” ఆగలేక దగ్గరగా వెళ్లి అడిగేశాడు.    మాధవుడిని పరికించి చూశాడు నందుడు.    ఈ పసివాడు తన సమస్యని పరిష్కరించగలడా?    కానీ గౌతమికి నమ్మకం కలిగింది బుడుతని మీద. అతడి వయసు చిన్నదైనా మానసిక వయసులో పెద్దే.    “నీకు ఉపనయనం, జగన్నాధ పాత్రునికి పెళ్లీ చెయ్యాలని సంకల్పించాము. జగన్నాధునికి పదునెనిమిది వత్సరాలు వచ్చాయి. అలాగే నీక్కూడా..”    “అవ్వ వస్తుందా?” ఉత్సాహంగా అడిగాడు బాలుడు.    నందుడు నిస్సహాయంగా చూశాడు గౌతమిని. ఆవిడ అదేమీ పట్టించుకోలేదు. అంతే ఉత్సాహంతో సమాధానం చెప్పింది.    “వస్తుంది మాధవా. ఇంకా బంధువులు కూడా వస్తారు. ఇంక పదిహేను దినములలోనే ముహూర్తం. అమ్మాయి వాళ్లు ఇక్కడి వారే. శుభకార్యాలు ఇక్కడే జరుగుతాయి.”    అప్పుడు అర్ధమయింది మాధవుడికి, నందుడి చింతకి హేతువు.    “దిగులెందుకు తండ్రీ? మన వద్ద నాణెములున్నవి కదా! సరిపోవా?”    నిజమే ఉన్నవి.. కానీ అవి వాడుట సముచితమేనా? తటపటాయించాడు నందుడు. ఉపనయనం చెయ్యడం తన బాధ్యత. దానికి పిల్లవాని వద్ద ధనం తీసుకొనడమా! తల విదిలించాడు.    ఎవరైనా ఉన్నారేమోనని ఒకపరి అంతా పరికించి అన్నాడు మాధవుడు..    “నేనే మీ పుత్రుడనే! నా ధనము మీది కాదా? సంకోచము వద్దు. మనం త్వరలో అంతకు అంతా సంపాదించుకోవచ్చు. ఇప్పటికి ఆ నాణెములను ఉపయోగించెదము.”    సంతోషంగా కుమారుని కౌగిలించుకుని నుదుటి మీద ఆదరంగా చుంబించాడు నందుడు.    “వెంటనే దిష్టి తీయ వలసిందే..” అప్పుడే లోనికి అడుగు పెడుతున్న సీతమ్మ అంది, ఆనందంగా.                                         …………………    మహా పాత్రుల గృహము కళకల్లాడిపోతోంది.    మాధవుని సహాయంతో నందుడే ఇంటికి వెల్లలు వేశాడు.    గోడల మధ్య అక్కడక్కడ ఎర్ర మట్టి రాసి కొన్న భాగాలని వదిలేశారు, గౌతమి సూచనమేరకు. ఆ భాగాల మీద, చక్కని రంగవల్లులు దిద్దారు, సీతమ్మా తనూ కలిసి.            ఆ.వె.   ఇరుగు పొరుగు వారు నిష్టులందరు కూడి                   పసుపు నంత దంపి బాగ చెరగి                   మామిడాకులన్ని మలచి తీరుగ కట్టి                   తోరణములు చేసె తొణగు నంత.    పసుపు రాసిన గడపలకి బొట్లు పెట్టే వారు, అరిశలకి పిండి దంచే వారు, పొయ్యిల మీద బాణలి పెట్టి చక్కిలాలు చేసే వారు, పువ్వుల మాలలు కట్టే వారు.. కన్నుల విందేను చూచువారందరికీ.    “ఈ అరటి చెట్టు ఎక్కడ పెట్టించాలి అమ్మమ్మా?” మాధవుడు, నుదుట నామముతో, బుగ్గను దిష్టి చుక్కతో, కొత్త పంచెను గోచీ పోసి కట్టి, ఉత్తరీయాన్ని నడుముకి బిగించి వచ్చాడు. పక్కనే గెలతో నున్నపెద్ద అరటి చెట్టు పట్టుకుని శ్రేష్ఠి గారి కొడుకు నాగయ్య నవ్వుతూ..   “అయ్యయ్యో.. ఎంత పని చేశావురా?” గట్టిగా అంది సీతమ్మ. ఒక్క సారిగా అందరూ పనులు ఆపేసి అటు చూశారు.    ఏం తప్పుచేశానా అని మాధవుడు అయోమయంగా చూస్తున్నాడు.    ఇంటిలోనుండి గౌతమి పరుగెత్తుకుంటూ వచ్చింది.    “ఏమయిందేమయింది?”    “పెళ్ళికొడుకుని చేసి పారాణి పెట్టాక ఇల్లు కదల వచ్చునా? వీడేమో.. పనులన్నీ చేసేస్తున్నాడు. అసలే ముహుర్తం లేదని, ఇన్నాళ్లూ వీడిని పెంచిన బామ్మ లేకుండానే చెయ్య వలసి వచ్చింది. ఆవిడేమనునో అని హడలుతుంటే వీడెక్కడ దొరికాడమ్మా!” సీతమ్మ మాటలకి అందరూ నవ్వేశారు.    అమ్మయ్య అనుకున్నాడు మాధవుడు.    “అమ్మమ్మా! నేనెక్కడికీ వెళ్లేదు. మన పెరటి లోనివే. నువ్వు ఆయాస పడవద్దు. నెమ్మదిగా నుండు.” మాధవుడు పరుగెత్తుకుని వచ్చి సీతమ్మ నడుం పట్టేసుకున్నాడు.    సరిగ్గా అదే సమయానికి, ఎడ్ల బళ్లు వచ్చి ఆగాయి వాకిలి ముందు.    ముందుగా, జగన్నాధుడు దిగి, తల్లికి చెయ్యందించాడు.    బాలవ్వ దిగుతూనే కళ్లప్పగించి అంతా పరికించింది. సంతోషంతో మొహం విప్పారింది.    పదంగల్లో మాధవుడు గెంతుకుంటూ వచ్చి, గుమ్మం దాట బోయి ఆగిపోయాడు.. సీతమ్మ మాటలు గుర్తుకొచ్చి.    బాలవ్వ, కళ్లారా బాలుడిని చూస్తూ, లోపలికి వచ్చి, హత్తుకుంది గాఢంగా.    కన్నుల నుండా నీళ్లు.. బుగ్గల మీదుగా కారి పోతున్నాయి.    మాధవుని స్థితి కూడా అంతే. అయితే..ఇద్దరివీ వేర్వేరు కారణాలు!                                    …………………    మామ్మా, మనవలని చూస్తున్న వారికి ఆ దృశ్యం ఎంతో అపురూపంగా అనిపించింది. ఎప్పటి అనుబంధమో అని కూడ అనుకున్నారు.    తాను చొరవ తీసుకుని పంపిన పసివాడు ఆనందంగా ఉన్నాడని బాలవ్వ, తనకి మాతా పితరులను, రక్షణను ఏర్పరచినందుకు మాధవుడు.. ఒకరి కొకరు అన్యోన్య ఆత్మీయతా భావనలో తాదాత్మ్యం చెంది పోయారు.    “అవ్వా! కులాసానా? చిన్నాన్న బాగా చూసుకుంటున్నాడా? లేదంటే చెప్పు, నేను వచ్చేస్తాను.” మాధవుడి మాటలకి ఫక్కున నవ్వి, నెత్తి మీద ఆప్యాయంగా తట్టాడు జగన్నాధుడు.    “చిన్నమ్మ ఎంతో బాగుంది అవ్వా! అచ్చంగా అమ్మలాగనే నవ్వుతూ ఉంటుంది. నేనే ముందు చూశాగా! చిన్నాన్న గురించిన విశేషాలన్నీ చెప్పేశా.” మాధవుడు చిన్నాన్నని ఆట పట్టించాడు.    “అమ్మయ్య. నీకు నచ్చింది కదా? ఐతే నాకునూ..” జగన్నాధుడు బండిలో నుండి అన్ని వస్తువులనూ దింపి లోపలికి తీసుకుని వచ్చాడు.    “త్వరగా స్నానం, భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకోండి. సాయంత్రమే పెళ్లికొడుకుని చేస్తాము.” గౌతమి, బాలవ్వ చెయ్యి పట్టుకుని తీసుకెళ్తూ జగన్నాధునికి చెప్పింది.      బాలవ్వ ముంగిలి లోనే కాళ్లు చేతులూ కడుగుకొని ఇల్లంతా తిరిగి, తృప్తిగా తల పంకించింది. ప్రతీ ముగ్గునీ పరికించి చూసింది.    స్నాన, భోజనాది కార్యక్రమాలయ్యాక, విశ్రాంతిగా పంచలో కాళ్లు చాచుకుని, స్థంభానికానుకుని కూర్చుంది బాలవ్వ.    మాధవుడు నెమ్మదిగా ఆవిడ పక్కనే చేరాడు.    కాళ్లు రాస్తూ, ఒళ్లో తల పెట్టి పడుక్కున్నాడు.. మొహం లోకి చూస్తూ.    “ఏమిటి చూస్తున్నావు కన్నయ్యా?”    “నీ నుదుట కుంకుమ సంధ్యా సమయంలో సూర్యుడిలా మెరుస్తోందవ్వా. తాతగారు..”    అటూ ఇటూ చూసింది బాలవ్వ కలవరంతో.. ఎవరైనా ఉన్నారేమోనని.    అందరూ పనులు ఆపేసి వెళ్లిపోయారు ఇళ్లకి. మధ్యాహ్న కార్యక్రమాలకి. గౌతమి లోపల ఏదో పనిలో ఉంది. మగవాళ్లిద్దరూ బైటికి వెళ్లారు.    మాధవునికి బాలవ్వ వద్ద నున్నప్పుడు ఆ విషయం అడగాలని తోచ లేదు.. అప్పుడు ఎక్కడ నీడ దొరుకుతుందా అనే వ్యాకులముతోనే సరి పోయింది. ఇప్పుడు అంతా సవ్యంగా స్థిరమయింది కదా.. కుతూహలం వచ్చింది.    “తాతగారు, ఇప్పటి రాజు గారి తండ్రిగారితో యుద్ధానికి వెళ్లిపోయాడు.. వారిని వదిలి ఆ తండ్రిగారు వచ్చేశారు. అప్పటి నుంచీ జాడ లేదు. చాలా ఇళ్ళలో గాధలంతే.. యుద్ధాలకో, యాత్రలకో వెళ్లి పోతారు ఇంటి మగవారు. ఆడవారు నిత్య ముత్తైదువులుగా ఉంటారు.. వారి వర్తమానం తెలియక. అలాగే జీవితాలు గడిచి పోతుంటాయి.” బాలవ్వ నిట్టూర్చింది.    “మరేమీ భెంగ పడకవ్వా! మాధవుడున్నాడుగా చూసుకుంటాడు.” గోముగా అన్నాడు.    బాలవ్వ చటుక్కున ముందుకు వంగి బాలుడి నుదుట ముద్దు పెట్టింది.    అలాగే స్తంభానికి ఆనుకున్న బాలవ్వ కిందికి జారి కళ్లు మూసుకుంది తృప్తిగా. ఆమె ఒడిలో మాధవుడు..                   కం.  అనుబంధం ముడివడుటకు,                          కనికరమును జూపుటకును కావలె మరియా                          జనమానువేధ మింకను                          మనసు మనసు కలిసినంత మనును నిబంధం.    జీవన యానంలో ఎవరు, ఎప్పుడు, ఎందుకు, ఎదురు, పడతారో.. ఏ బంధాలు ఏర్పడతాయో, అవి ఏ విధమైనవో ఆ విధాతకే తెలియాలి.                                            …………..    గాఢ నిద్రలో నున్న బాలవ్వ ఉలిక్కిపడి లేచింది. అంతా హడావుడిగా అటూ ఇటూ తిరుగుతున్నారు. ఆడవారు చీనాంబరాలు ధరించి ఒద్దికగా ఒక దగ్గర కూర్చుని పూల మాలలు కడుతున్నారు.    వసారాలో ఆ పక్కన ముగ్గులతో అలంకరించిన పీట.. దాని ముందు పసుపురాసి, బొట్లుపెట్టిన రోలు, రోకలి. స్తంభాలకి అల్లుకున్న పువ్వుల తీగలు సహజ తోరణాలు. పైనుంచి మామిడి తోరణాలు కూడా కట్టారు.    బాలవ్వ ఒడిలో తల పెట్టి అడ్డంగా కాళ్లు జాపి పడుకున్న మాధవుడు కూడా లేచాడు, కళ్లు నులుముకుంటూ.    “లేచారా? రండి, అలా వెళ్లి ముఖము, కళ్లు చల్లని నీళ్లతో కడుక్కుని రండి. వేడి పాలు తాగుతే అలసట తగ్గుతుంది. కన్నయ్యకి నాయనమ్మ ఒడి, వెచ్చగా, హాయిగా ఉన్నట్లుంది. ఒడలెరుగక నిద్రించాడు.” గౌతమి, బాలవ్వకి చెయ్యందించి లేపింది.    అంతలో జగన్నాధుడు, నామం, బుగ్గన చుక్కతో వెళ్లి పీట మీద కూర్చున్నాడు. అతడి పక్కన బంధువుల అబ్బాయిని తోడు పెళ్లి కొడుకుగా కూర్చో పెట్టారు.    బాలవ్వ, మాధవుడు క్షణాలలో పెరటి వాకిట్లో పనులు ముగించుకుని, పరుగున వచ్చేశారు.    ముత్తయిదువలు, పెళ్లి కొడుకుకి, తోడుకీ నెత్తి మీద నూనె పెట్టడం, అక్షింతలు వెయ్యడం ఆశీర్వదించడం జరిగాక, ఇద్దరికీ అభ్యంగన స్నానం చేయించి.. కొత్త వస్త్రములు కట్టారు.    కొడుకుని నిండుగా చూసుకుంటూ కోడలు చేతనే మొదటగా పసుపు కొమ్ములు దంపించింది బాలవ్వ. నంద, గౌతమిలు ఆశీర్వదించాక.. మిగిలిన ఆడ వారందరూ పసుపు కొమ్ముల మీద మూడూ పోట్లు వేసి అక్షింతలు వేశారు.    చివరిగా బాలవ్వ వెళ్లి, జగన్నాధుని ఆశీర్వదించింది.    ఆ తరువాత, పందిరికి రాట పాతడం, అందరూ పాటలు పాడడం..    ఒకరి నొకరు పరిహాసాలు..    “వదినా! ఇంక మేము ఎంతసేపు కూర్చోవాలి?” జగన్నాధుని పిలుపుకి అటు తిరిగిన గౌతమి.. హారతి పళ్లెం తీసుకు వచ్చి, హారతిచ్చి లేపింది పెళ్లి కొడుకునీ తోడు పెళ్లికొడుకునీ.                                     …………….    మాధవుని ఉపనయన మహోత్సవం జరుగుతోంది.    గౌతమీ, నందులు  పీటల మీద కూర్చుని శ్రద్ధగా చేస్తున్నారు.    “బ్రహ్మ దేవునకు సహజంగా లభించిందీ మొదట పుట్టినదీ అయిన ఈ పవిత్ర యజ్ఞ ఉపవీతాన్ని నేను ధరిస్తున్నాను ఈ యజ్ఞ ఉపవీతం నాకు తేజస్సు, బలం, దీర్ఘాయువు, నిర్మలత్వం మరియు పుష్టిని ఇచ్చుగాక”      మంత్ర యుక్తంగా మాధవుని చేత పలికించి యజ్ఞోపవీతాన్ని ధరింప జేశారు ఆచార్యుల వారు.       “వటువు వయసెంతన్నారూ?”    “పది సంవత్సరాలు నిండాయండీ గురువు గారూ!” మాధవుడు అనేశాడు. అసంకల్పితంగా.    చిన్నపిల్లవాడి చలాకీతనం.. అందరూ నవ్వుకున్నారు.    “మరి ఇంతకాలం ఆగారెందుకూ? బ్రాహ్మణ బాలురకు ఉపనయనం ఎనిమిది సంవత్సరాలకి చెయ్యాలి. పదకొండు వత్సరాలంటే క్షత్రియ బాలురకు చేసే వయసు.” నిష్ఠూరంగా అన్నారు ఆచార్యులవారు.    మాధవుని మొహం విప్పారింది ఆ మాట వినగానే..    “నేను క్షత్రియ బాలుడినే కదా. ఔచిత్యంగానే ఉంది..” నోటి వరకూ వచ్చిన మాటని వెనక్కి తోసేశాడు, అమ్మ చెప్పిన జాగ్రత్తలు గుర్తుకొచ్చి.    “నీ కుల గోత్రాలు ఎట్టి పరిస్థితుల లోనూ బయట పెట్టద్దు. అజ్ఞాతంగానే ఉండనీయాలి.” గుర్రం పరుగు తీయబోయే ముందు అమ్మ చెప్పిన మాట.. మాధవుని కన్నులలో నీరు తిరిగింది అప్రయత్నంగా.    “ఇన్ని సంవత్సరాలు, అమ్మ వద్ద పెరిగాడు. అందుకే మాకు అవకాశం రాలేదు స్వామీ. ఏదైనా ప్రాయశ్చిత్తం..” నందుడు వినయంగా అన్నాడు.    “అయ్యో.. నేనేం అనలేదు. విచారం వలదు నాయనా. అప్పుడైతే మంచిదని అన్నాను. ఇప్పుడైనా గాయత్రీ మంత్రం నిష్ఠగా త్రికాలములందూ పఠిస్తే దోషం పోతుంది.”మాధవుని పెద్ద పెద్ద కన్నుల నిండా నీరు చూసిన ఆచార్యులు గాభరాగా అన్నారు.    గౌతమి, మాధవుని దగ్గరగా తీసుకుని తల నిమిరింది. పంచ శిఖలూ.. మధ్య మధ్యలో నున్నని గుండూ మెత్తగా తగిలాయి.    అమ్మ నడుం గట్టిగా పట్టుకుని కన్నీళ్లని లోనికి తరిమేశాడు మాధవుడు.    దండం ధరించి, పచ్చని పంచ కట్టుకుని, ముందుగా మాతృమూర్తిని, పితృదేవుడిని భిక్ష అడిగి, అందరినీ వరుసగా యాచించాడు మాధవుడు.                                                      “అచ్చంగా ఆ వామన మూర్తి లాగనే ఉన్నాడు నా చిట్టి తండ్రి..” నాన్నమ్మ మెటికలు విరిచింది.    “పోలిక బావుంది. మూడడుగులూ అడిగి చక్రవర్తిని ముంచకుండా చూసుకో బాలవ్వా!” నవ్వుతూ అన్నారు ఆచార్యులవారు.    “నా కన్నయ్య ఆ విధంగా ఎందుకు చేస్తాడు.. సార్వభౌముని రక్షిస్తాడు కానీ.” గౌతమి రోషపడింది.    “కోపం వద్దు తల్లీ. పరిహాసానికన్నాను. ఆ వామనుడు లోక రక్షణకే కదా ఆవిధంగా చేసింది. ఈ బాలునిలో ఆ కళే ఉంది. మంచి పనులు చేస్తూ తప్పక వృద్ధిలోకొస్తాడు.”    వచ్చిన ఆహూతులందరూ మాధవుని ఆశీర్వదిస్తూ అదే అనుకున్నారు.. బాలునిలో ఏదో శక్తి నిక్షిప్తమై ఉందని.                                      …………………..    “అమ్మా! ఈ తల ఇంతేనా?” తడుముకుంటా అడిగాడు మాధవుడు. పంచ శిఖలూ తీసేసి, నున్నగా గుండు చేసి, వెనుక మాత్రం చిన్న శిఖ ఉంచారు.    ఉపనయనం అయి, వచ్చినవారందరూ వెళ్లి పోయారు.    రోజూ గాయత్రి జపిస్తున్నాడు మాధవుడు.    “అంతే కద మాధవా! ఒడుగయ్యాక బ్రాహ్మణ బాలురు ఈ విధంగానే ఉంటారు.  వచ్చే వారం నుంచీ గురువుగారి వద్దకు వెళ్లి, భాష, వేదం, స్మార్తం నేర్చుకోవాలి. అసలు గురుకులం లో పెట్టేద్దామనుకున్నాం కానీ, ఇన్నేళ్లకి మా వద్దకొచ్చావని దగ్గరే ఉంచుకుందామనుకున్నాం.” గౌతమి వివరించింది.    “మరి వేదం, భాష అంటున్నారు కదా.. మనం వంటలు ఎందుకు చేస్తున్నాం? రాజుగారి కొలువులోనో, విద్వత్ సభల్లోనో తండ్రిగారు వేదాలు చదవచ్చు కదా? వారు చదువుకొన లేదా?” మాధవుని సందేహం సరైనదే. కానీ జవాబు చెప్ప వచ్చులో లేదో.. నందుని వంక చూసింది గౌతమి.    “ఫరవాలేదు. బాలుడు విషయాలు గ్రహించాలి. చెప్తాను.. అలా వ్యాహ్యాళి కెళ్లినప్పుడు.” నందుడు నెమ్మదిగా అన్నాడు.    “అయ్యో నా ఉంగరాల జుత్తు..” తల మళ్లీ తడుముకుంటూ కినుకగా అన్నాడు మాధవుడు. అప్పుడప్పుడు అతడి లోని పసి బాలుడు పైకొస్తుంటాడు.. అనుభవాలు ఎంత పెద్దరికాన్ని తెచ్చినా.    “అంతే.. అంతే. నేను కూడా చాలా ఏడ్చాను. ఎనిమిదో ఏడు వరకూ ఆగారు మా తల్లిదండ్రులు. శరీరంలోంచి ఒక భాగం కోల్పోయినంత బాధ కలిగింది. సాంప్రదాయం మరి.. తప్పదు.” ఓదార్చాడు నందుడు.    “చాలా రోజులయింది. కళ్యాణినొక పరి తిప్పి రానా నాన్నగారూ?”    నిజమే.. వారం పైనయింది. ఎవరూ బాడుగకి కూడా తీసుకోలేదు. వెనుక భాగాన కాసేపు వదులుతున్నారంతే. గుర్రాలకి స్వారీ చాలా ముఖ్యం.. లేకున్న శరీరం బరువు పెరిగి పోయి కదల లేవు.    మాధవుడు నాలుగంగల్లో పెరటిలోనికి వెళ్లి, కళ్యాణిని మాలీషు చెయ్య సాగాడు. పావుగంట పైగా చేసి, కాసిన్ని గుగ్గిళ్లు తినిపించి, బంధనం విప్పి, జీనునమర్చి, స్తంభం పట్టుకుని పైకెక్కి.. నాలుగు క్షణాల్లో ఇల్లు వదలి వెళ్లి పోయాడు.    గౌతమీ నందులు, మాధవుడు కనిపించే వరకూ చూస్తూ నిలిచి ఇంట్లోకి వెళ్లి పోయారు.   ......మంథా భానుమతి

“అజ్ఞాత కులశీలశ్య….” 5వ భాగం

“అజ్ఞాత కులశీలశ్య….” 5వ భాగం “కళింగం”.. దేశంలోనూ, గృహంలోనూ కూడా అతి త్వరలోనే ఇమిడి పోయాడు మాధవుడు. నదీ జలాల పాయలు నేలనంతా సస్య శ్యామలం చేస్తున్నాయి. ఏటి ఒడ్డున కొబ్బరి చెట్లు, ఇళ్ల వెనుక అరటి తోటలు. అంబరాల్లా నీడనిచ్చే వృక్షాలు. అందులో ఫల వృక్షాలు ఎన్నెన్నో.. మాధవుడికి వంగదేశానికీ, కళింగ దేశానికీ పెద్ద వ్యత్యాసమేమీ కనిపించలేదు.    ఇంటిలోని వారికి తలలో నాలుకలా, పూటకూళ్ల అతిధులకి ఆహ్లాదాన్ని పంచే చిన్ని కృష్ణునిలా కలిసిపోయాడు. ఒక్క క్షణం కనిపించకపోతే అందరి నోటా మాధవుని పేరే..        సీ. తొలిపొద్దు రాకమున్ దోటలో కలకలం                మాధవుఁ కదిలించి మత్తు తీర్చ;         నిదురని వదిలించి నేరిమి చూపించ                 దినకృత్యములకేగి దీక్ష జూపు.         లేలెమ్మనుచునమ్మ లేబుగ్గ నిమురగా                 గారాల బాలుండు గరిమ జూపె.         అంతట యరుదెంచె నతడు, తండ్రియు కూడ,                 నట్టింట చెలరేగె నవ్వులెన్నొ.  ఆ.వె. అలికిడి వినగానె నమ్మమ్మ సీతమ్మ           మురిపె మంత జూపె ముదము తోను           ఒక్క బుడుత డొచ్చి యూపెను యిల్లంత           సంతసంబు నంత సరస మాడ.      మాధవుని అశ్వం, కళ్యాణికి కూడా కటకం బాగా నచ్చింది. తన చిన్ని యజమాని బాధ్యత తనదే నన్నట్లు ప్రవర్తిస్తుంటుంది. అతడు ఆనందంగా ఉంటే.. అంతకన్న ఇంకేమి కావాలి?    కళ్యాణిని బాడుగకి కూడా బాగానే తీసుకెళ్తున్నారు. గుర్రపు స్వారీ నేర్పించడానికి తప్ప, దూరా భారాలు పంపడం మాధవుని ఇష్టం లేదు. ఆ సంగతి గ్రహించిన నందుడు కూడా అర్ధం చేసుకుని, ఆ పనికే నియోగిస్తున్నాడు. పైగా ఆ ఆదాయం మీదనే ఆధార పడి లేరు కదా! అవసరమొస్తే మాధవుని ధనమే బోలెడుంది.    వారానికి మూడు రోజులు, రోజంతా కళ్యాణిని తీసుకెళ్తారు రెండు క్రోసుల దూరంలో ఉన్న విద్యాలయం వారు. మొదట్లో మాధవుడు కూడా వెళ్లేవాడు. మధ్యాహ్నాలు, గుగ్గిళ్లు తినిపించడం, మాలిశ్ చెయ్యడం వంటి పనులు చేసి అలవాటు చేశాడు.    మరీ వెంటపడుతుంటే నిఘా చేసినట్లుగా ఉంటుందని నందుడు, గుర్రంతో వెళ్లద్దని మాధవుడికి చెప్పాడు. ఆ మాటే కళ్యాణికి నాలుగు రోజులుగా చెప్పి.. తనతో వెళ్లడం మానేశాడు. అశ్వాలకి ఆకళింపు చేసుకునే శక్తి ఎక్కువే. ఏ మాత్రం ఎదురు తిరగకుండా వెళ్లి వస్తోంది.    మిగిలిన రోజుల్లో, మాధవుడు ఐదారు ఘడియలపాటు, సవారీ చేసి వస్తున్నాడు. కోట చుట్టూ తిరగడం, దగ్గరలో నున్న అడవికి వెళ్లడం.. స్వారీ చేస్తూనే కత్తి తిప్పడం వంటివన్నీ సాధన చేస్తున్నాడు.    యుద్ధ విద్యలు నేరుస్తూ ఉండక పోయినా. తను నేర్చుకున్నది మరచి పోకుండా ఉండాలని ఆ బాలుని ఆలోచన.    కోట చుట్టూ తిరుగుతూ అనుకుంటాడు.. ఎప్పటికైనా లోపలి కెళ్తానా అని..    ఏమో! ఎవరు చెప్ప గలరు? ఏం జరగబోతోందో!                                      ……………..                                            మాధవుడు కళింగం వచ్చి నెల దాటింది.    జన్మతః తనకున్న కుతూహలం కొద్దీ, కోట చుట్టూ తిరిగేటప్పుడు, లోపల జరిగేదేమైనా కనిపిస్తుందేమోనని గోడ సందుల దగ్గరొక క్షణం ఆగి చూస్తాడు.    రాజుగారి లాగా దుస్తులు ధరించిన ఒక ఆజాను బాహుడు రోజూ లోపలికి వెళ్లి రావడం చూస్తున్నాడు. అతని వెంట గుర్రాల మీదా, నడుస్తూ సైనికులు..    అప్పుడప్పుడు నందుడు కూడా మాధవునితో స్వారీకి వెళ్తుంటాడు.    “వారేనా రాజు గారు తండ్రీ?” ఒకరోజు అడిగాడు మాధవుడు, ప్రముఖంగా కనిపిస్తున్నఆ వ్యక్తిని చూపించి.    “రాజుగారు కోటలో ఉంటారు. బైటెందుకు తిరుగుతారు? అతడు సామంత రాజులలో ముఖ్యుడు. పేరు కపిలేంద్ర దేవుడు. ప్రస్థుతం పరిపాలనంతా వారే చూస్తున్నారు. రాజు గారికి నమ్మకమైన సామంతులు.”    “నిజమా! వారే మహారాజులనుకున్నా..” మామూలుగా అనేసి అటూ ఇటూ చూడ సాగాడు మాధవుడు.    ఉలిక్కి పడ్డాడు నందుడు. బాలవాక్కు బ్రహ్మ వాక్కంటారు. ఆందోళనగా చూశాడు.. ఎవరైనా వింటే..    కను చూపు మేర ఎవరూ లేరు.    “నీకు ఈ రాచ విద్యలన్నీ బాగా అబ్బాయే?” మాట మార్చాడు.    “అవును తండ్రీ. రాజుగారి అబ్బాయి కంటే నేనే బాగా స్వారీ, కత్తి తిప్పడం చేస్తా తెలుసా!” అంతలో అమ్మ వారింపు గుర్తుకొచ్చి, కళ్లు గట్టిగా మూసుకుని మనస్సును స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు.    “ఎవరా రాజు గారు?”    “వారు వంగ దేశ రాజు గారి వద్ద సామంతులు.” తనకి తెలిసిన అంత పా్రముఖ్యత లేని పేరు చెప్పాడు మాధవుడు.    “ఈ విద్యలన్నీ సరే, రేపటి నుండీ, సూరి సోమయాజి గారి దగ్గరకు పంపుతున్నా నిన్ను. అక్షరాలు, మంత్రాలు, వీలైన భాషలు నేర్చుకోవాలి. బ్రాహ్మణ బాలునికి పాండిత్యం ప్రధానం.”    “అలాగే నేర్చుకుంటాను నాన్నగారూ! సంస్కృతం, ఆంధ్రం, వంగ భాషలు అక్షరమాలలు, మాటలు, పదాలు రాయడం వచ్చు నాకు. ఓడ్రమే రాదు.”     “ఫరవాలేదు. మూడు భాషలు చాలు. కళింగ, ఉత్కళాలలో ఓడ్రం సంభాషణ జరపగలుగుతే సరి పోతుంది.” నందుడికి ఆశ్చర్యమేసింది, మాధవుని ప్రతిభ చూస్తుంటే.                                            ……………    “అసలు మాధవుడు మీ కన్న కొడుకేనా?” సీతమ్మ ప్రశ్నకి ఉలిక్కి పడ్డారు ముగ్గురూ. అందరూ పెరటి వాకిలిలో ఉన్నారు.    సూర్యోదయం అయి నాలుగు ఘడియలయింది. మాధవుడు కళ్యాణికి ఆహారం తయారు చేస్తున్నాడు. తల ఎత్తి గౌతమిని చూశాడు. వంట పాత్రలు శుభ్రం చేస్తున్న గౌతమి మొహం పాలిపోయింది.    అరటి మొక్కలకి, వాడిన నీళ్లు వెళ్లడానికని, కాలువలు చేస్తున్న నందుడు ఏదో అనబోయి ఆగిపోయాడు.. సీతమ్మ ప్రశ్నలోని అర్ధాన్ని వెతకడానికి ప్రయత్నిస్తూ..    గౌతమి ఒకసారి మాధవుడిని పరకాయించి చూసింది.    నిజమే..    మాధవుడు తమ బిడ్డడి లాగ లేడు. ఆచ్ఛాదన లేని వక్షము, నీరెండలో పచ్చగా, నున్నగా మెరిసిపోతోంది. తీర్చి దిద్దిన నాసిక, విశాల నేత్రాలు, ఎప్పుడూ నవ్వుతున్నట్లుండే పెదవులు.. నలకూబరుడు చిన్నతనాన ఈ విధంగానే ఉండే వాడేమో! ‘దిష్టి తగులగలదు..’ అని తనకు తనే వారించుకుని నందుడిని చూసింది.    నందుడు కూడా అందగాడే.. నున్నని గుండు, ముడి వేసిన పిలక. పచ్చని పసిమి ఛాయ. ఆ శరీర ఛాయే ఇద్దరినీ తండ్రీ కొడుకులంటే నమ్మ బలుకుతుంది.    అంతే.. కానీ… ఏమిటి తేడా?    ఒక్కసారిగా సీతమ్మ ప్రశ్నకి కారణం అర్ధమయింది గౌతమికీ, నందుడికీ కూడా.             ఇంకా అయోమయంగానే చూస్తున్నాడు మాధవుడు...    వారు ఏమని సమాధానం చెప్తారా అనుకుంటూ. ఇన్ని రోజులుగా రాని అనుమానం ఇప్పుడు.. తాను ఏమైనా అనుచితంగా ప్రవర్తించలేదు గద..    ఒక్క సారిగా అమ్మ గుర్తుకొచ్చింది మాధవునికి. ఆపుకోలేని ఏడుపొచ్చేసింది. పరిస్థితుల పాబల్యం కానీ, ఆటలాడుకుంటూ అమ్మ ఒడిన నిదురించే వయసు..    ఏం చెయ్యాలి?    అమ్మ కావాలి.. ఎక్కడుంది?    మమకారంతో తననే చూస్తున్న గౌతమి కనిపించింది.             మ.   అటు చూస్తే మరి రక్కసుల్ వలెను తన్నాఘా తమున్చేయనే            కటువున్ కంటకులందరూ తరుముతూ కారుణ్యమున్ జూపకన్            ఎటుపో యేవని క్రోధమున్ వదలకా యీ బాలునిం రూపు బా            పుటకే వేచియు నుండ నమ్మకడకే పోవంగ దుఃఖింపనున్. పరుగెత్తుకుంటూ వెళ్లి ఆమె ఒడిలో దూరి భోరుమన్నాడు. ఆ మట్టి నేల మీదే, తడి చీరతోనే, హత్తుకుని తల నిమురుతూ ఉండి పోయింది గౌతమి, మాధవుని గిరజాల జుట్టులో వేళ్లు జొనిపి నిమురుతూ.    అవును.. మాధవుడు వచ్చిన నాటినుండీ వానికి పరిసరాలనీ, ఊరిలోని పరిచయస్థులనీ, బంధువులనీ చూపడం,  పూటకూటింటికి వలసిన సంభారాలన్నీ సమకూర్చుకోవడంలోనూ కాలం వేగంగా గడిచి పోయింది.    కొన్ని సున్నితమైన అంశములను పట్టించుకోలేదు. ముఖ్యంగా మాధవుని కేశములు..    భుజాలు దాటి, ఉంగరాలు తిరిగిన దట్టమైన శిరోజములు, పాల భాగాన్ని సగం పైగా కప్పుతున్న ముంగురులు.. మాధవుడు క్షత్రియ బిడ్డడేమో అనే సందేహము కలుగక మానదు చూసిన వారికి.    వెక్కుతూనే నిద్రలోకి జారుకున్నాడు మాధవుడు. నందుడు వచ్చి పిల్లవాడిని భుజం మీదికి వేసుకుని తడిసి పోయిన పంచని అలాగే విప్పి సావడిలోనికి తీసుకెళ్లి చాప మీద పడుక్కో బెట్టాడు. గౌతమి వచ్చి, పొడి వస్త్రం కట్టి కంబళీని కప్పింది.    సీతమ్మ కొద్దిగా బెదురుతూ లోపలికి వచ్చింది..    “ఇలా అవుతుందనుకో లేదు నందా! మీకు ఏదో చెప్పాలని, ఉపోద్ఘాతంగా అన్నాను. మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను. ఏమనుకోకండి. కావాలని చెయ్యలేదీ పని.”    “ఫరవాలేదు సీతమ్మగారూ. మాధవుడు అసలే నాన్నమ్మ మీద బెంగ పెట్టు కున్నాడు. ఇంతకాలం అక్కడే ఉన్నాడు కదా! మీరలా అడగడం వలన ఆవిడ జ్ఞప్తికి వచ్చింది. అందుకే అమ్మ ఒడిలోకి పరుగెత్తాడు.” నందుని మాటలకి తలూపింది సీతమ్మ, అర్ధం చేసుకున్నట్లుగా.    “ఇంతకీ మీరు ఏదో చెప్పాలని అన్నారు, ఏమిటదీ” గౌతమి అడిగింది.    సీతమ్మ మొహమాటంగా చూసింది.    “చెప్పండమ్మా! ఏమనుకోము.”    “ఏం లేదు, మాధవునికి ఉపనయనం చెయ్యాలి కదా అని. పదేళ్లు నిండాయన్నారు.. అందుకని. బోసిగా ఉన్న వాని వక్షం చూడగానే అనిపించింది.. ఆ విషయం మరచారని ఆ విధంగా మాట్లాడాను.” సీతమ్మ మొహమాటంగా అంది.    నంద, గౌతమిలు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు.    నిజమే.. ఉత్తరాయణ పుణ్యకాలంలోనే చెయ్యాలి కదా! చెయ్యకపోతే సీతమ్మలాగే అందరూ అనుకునే ప్రమాదం ఉంది. ఈ మాసంలోనే..    “అలాగే సీతమ్మా! రేపే పురోహితుల వారిని కలుస్తాను. అమ్మనీ, తమ్ముడినీ కూడా రప్పించుకోవాలి. పనిలో పని, మా జగన్నాధుడికి మంచి పిల్ల ఎక్కడైనా ఉందేమో చూడు. వీని ఒడుగూ, వాని పెళ్లీ కలిపి చేసేద్దాము.” నందుని మాట వింటూనే సీతమ్మ మొహం ఆనందంతో విప్పారింది.    తనమాటకి విలువ ఇచ్చారు.. యజమాని అనే భావమే కలగనియ్యరు ఎన్నడూ. వీరి అండ దొరకుట నిజంగా తన అదృష్టమే.    “అదెంత పని. నీటి కోసం ఏటికి పోయినప్పుడొక మాట వేశానంటే రేపే మన ఇంటికి వస్తారు కన్యాదాతలు.” సీతమ్మ ఉత్సాహంగా బైటికి వెళ్లింది, బిందె పట్టుకుని.                                     ……………………   ......మంథా భానుమతి “అజ్ఞాత కులశీలశ్య….” 4వ భాగం

“అజ్ఞాత కులశీలశ్య….” 4వ భాగం

                                         “అజ్ఞాత కులశీలశ్య….” 4వ భాగం    “గుర్రాన్నేమి చేద్దామమ్మా?” నంద మహాపాత్రుడు అడిగాడు, నూతిలోనుంచి నీళ్లు, తొట్టిలోకి  తోడుతూ. నందుడు, అతని భార్య గౌతమి, బాలవ్వ దగ్గరకు వచ్చి రెండు రోజులయింది.    తొట్టిలో నీళ్లని కూర గాయల మళ్లలోకి పోస్తున్నాడు మాధవుడు. గత మూడు నెలలుగా బాలవ్వ పూటకూళ్ల ఇల్లు నడపడంలో మెళకువలు నేర్పిస్తోంది ఆతడికి.    మొదటిదీ, ముఖ్యమైనదీ పెరటి తోట పెంచడం. ఏ రోజుకారోజు తాజాగా తోటలోనుంచి తెంపిన కూరలు వాడటం వల్లనే, బాటసారులే కాక, పల్లెలో వారుకూడా బాలవ్వ భోజనం చెయ్యడానికి వస్తుంటారు వారికి అవసరమైనప్పుడు.    స్వతహాగా చురుకైన మాధవుడు అన్ని పనులనూ త్వరితగతిని నేర్చేసుకున్నాడు.    అత్యవసరమైతే అత్తెసరు వేసి, చారు పెట్టి, అరటికాయ వేపుడు కూడా చెయ్యగలడు. ఏ పని చెయ్యాలన్నా నిస్సంకోచంగా చేసేస్తాడు.    నందుడు,  గౌతమి కూడా మాధవుడినీ అతని కలుపుగోలు తనాన్నీ మెచ్చుకుని, పెంచుకుందుకు సంతోషంగా వప్పుకున్నారు.     బాలవ్వ హాయిగా నిట్టూర్చింది. ‘క్రిందటి జన్మలో వీడు నిజంగానే నా మనవడై ఉంటాడు’ అనుకుంది. రోజూ తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్తూనే ఉంది.    పూటకూళ్ల ఇల్లన్నాక రకరకాల మనుషులు వస్తుంటారు. అందరితో నేర్పుగా మసలుకోవాలి. ఎన్నెన్నో వదంతులు.. ఒక్కోసారి ఎవరికీ చెప్పకూడని నిజాలు కూడా చెవుల బడుతుంటాయి.    ఏదీ పట్టించుకోకుండా, అందరినీ సమ దృష్టితో చూడాలి.    అవన్నీ మాధవునికి సమస్య కానే కాదు. రాజాంతఃపురంలో అలవాటే. అక్కడైతే మరీ కష్టం. ఎవరు మిత్రులో, ఎవరు శత్రువులో తెలియదు. సరిహద్దు దేశాల గూఢచారులు కూడా తిరుగుతుంటారు. అందులో.. హిందువైతే ఒకరకంగా, ముసల్మానైతే మరొకరకంగా ఉంటుంది వ్యవహారం.    బాలుడిని  సాగనంపడానికి వ్యాకుల పడుతున్న బాలవ్వతో అదే అన్నాడు వయసుకి మించిన అనుభవాలను ఎదుర్కొన్న మాధవుడు.   ఉ.మా||  “అందరి తోడనే కలసి యండగ నుండమ నంటు నే సదా                కొందరి మాటనే పనుచు కొందును నొవ్వను గాద నేన్నడున్                పందను గాదునే నెపుడు పంకము లో కడకాలువే యగా                 కొందల మేలనో వలదు కొంచెము యూరడి లమ్మ హాయిగన్.    మాధవుని పద్యాన్ని గుర్తు చేసుకుంటూ, వాడి ముందు చూపుకి, సమయస్ఫూర్తికి మురిసిపోతున్న బాలవ్వ కడుగుతున్న వంటపాత్రలను పక్కన పెట్టి ఆలోచనలో పడింది..    “అవ్వా! గుర్రాన్ని నాతో తీసుకెళ్ల వచ్చా?” మాధవుని ప్రశ్నకి ఉలిక్కి పడ్డారు నందుడు, గౌతమి.    తీసుకెళ్లడానికే ఇబ్బందీ లేదు. ఇంకా ఒక గుర్రాన్ని తగ్గిస్తే ప్రయాణపు వ్యయం తగ్గుతుంది కూడా. కానీ.. తీసుకెళ్లాక బాలుడు గుర్రాన్ని అమ్మడానికి వప్పుకోకపోతే? కటకంలో వారు చేసే పనికి హయం అవసరం లేదు. పోషించడానికి తగిన ధనం వారు సమకూర్చుకోలేరు.    కానీ, మాధవుడు లేకున్న అశ్వం ఏ విధంగా ఉంటుందో అనుమానమే. వారిరువురికీ ఉన్న భంధం అటువంటిది.    “అలాగే తీసుకెళ్లు కన్నయ్యా!”    మాధవుడు ఆనందంతో ఎగురుకుంటూ వెళ్లాడు గుర్రానికి దాణా వెయ్యడానికీ, తన నేస్తానికీ శుభవార్త చెప్పడానికీ.    “అశ్వాన్ని పోషించగల శక్తి మనకి లేదమ్మా. యుద్ధ భయాలతో కటకం కూడా అట్టుడికి పోతోంది. వచ్చిన ఆదాయం బొటాబొటీగా సరిపోతోంది. ఇప్పుడు బాలుని కూడా పోషించాలి. వానికి చదువు సంధ్యలు నేర్పించాలి. మా అబ్బాయని చెప్తాము కనుక పనివానిలా చూడలేము. మాధవుని చూస్తే విధివశాన వీధిన పడిన రాకుమారుని వలె ఉన్నాడు” నందుడు ఆందోళనగా అన్నాడు.    బాలవ్వ చిరునవ్వు నవ్వింది.    “వ్యయం గురించిన చింత వద్దు నందా. రాకుమారుడన్నావు కదా.. మరి సంపద ఉండదా? బాలుడు యుక్తవయస్కుడయ్యే వరకూ సరిపోయే టన్ని నాణాలున్నాయి వాని వద్ద. అందులోనూ సువర్ణ నాణాలెక్కువ. వాటి విలువ ఎంతో కూడా తెలియని అమాయకుడు మాధవుడు. అతడికి, అశ్వానికీ కూడ పోషణకి సరిపోతాయి. మీకు కూడనూ సౌలభ్యంగా ఉంటుంది.”    తల్లిని సాలోచనగా చూశాడు నందుడు.    “ఇంకేమి సందేహము? మాధవుడు చాలా అణకువగల పిల్లడు. ఇంత చిన్న వయసులో అంతటి అవగాహన ఉండటము అరుదు. ఏ బెంగా లేకుండా హాయిగా వెళ్లి రండి. అప్పుడప్పుడు జగన్నాధుని పంపుతుంటాను.”    “నా ఆదాయం అశ్వాన్ని కొని, పోషించగల స్థాయిలో లేదు కదా మరి ఏ విధంగా చుట్టుప్రక్కల వారికి సమాధానము చెప్పగలను? వారి అసూయా దృక్కులను ఎదుర్కొనేదెలా?”    అదీ నిజమే.. బాలవ్వకి ఏమనాలో పాలుపోలేదు.    “అవ్వా, నేనొక ఆలోచన చెప్పనా?” అప్పుడే అక్కడికి వచ్చిన మాధవుడు సంకోచంగా అడిగాడు.    తలూపింది బాలవ్వ.    “గుర్రాన్ని మీరు మాకిచ్చారని చెప్దాము. నన్ను కూడా అక్కడి వారెవరూ చూడ లేదు కదా? నా తోడని చెప్పవచ్చును. ఇంక దాని పోషణకి.. అక్కడక్కడే బాడుగకి ఇవ్వ వచ్చును కదా? నేను చెప్తే నా కళ్యాణి వింటుంది. మరీ దూరం కాకుండా, ఒకటి రెండు దినాల్లో వచ్చేలాగున..” ఆశగా నందుని కేసి చూశాడు మాధవుడు.    నిజమే.. గుర్రాలను బాడుగకి తీసుకుంటారు. అందరూ కొన లేరు కదా! నందునికి బాలుని సూచన నచ్చింది. పైగా పట్టణం కనుక అద్దె కూడా ఎక్కువే కటకంలో.    “ఇంక రెండు దినములలోనే మన ప్రయాణం. అన్నీ సర్దుకో మాధవా.” నందుడు అనుమతి ఇచ్చినట్లు తలూపి అన్నాడు.    అవ్వని వదిలి వెళ్లడం బాధ గానే ఉన్నా మాధవుడికి కటకం వెళ్లక తప్పదు. అది అమ్మ కోరిక. వంగ రాజ్యానికి వీలైనంత దూరంగా వెళ్లాలని దుర్గాదేవి ఆశించింది. ఆ విధంగానే నడుచుకోవాలని నిర్ణయించుకున్నాడు మాధవుడు.                                                   2                                           మలి జీవనం    “ఒక్కనివీ రాగలవా మాధవా? మీ అమ్మ నేను లేకుండా గుర్రం మీద కూర్చొనుటకు భయపడుతుంది.”    మాధవుడు తలూపాడు మౌనంగా, రెండు కారణాలతో.. ‘మీ అమ్మ’ అని నందుడు అనగానే అమ్మ కన్నుల ముందు మెదిలి దుఃఖంతో గొంతు పూడుకు పోయింది. అనుకోకుండా ఇంకొక అమ్మ, ఇంత త్వరలో దొరికినందుకు ఆనందోద్వేగాలతో కూడా మాట రాలేదు.    ఆ పసివాని కన్నులలో నీటి పొర చూడగానే అసంకల్పితంగా గౌతమికి మాతృ భావన ఉప్పొంగింది. స్త్రీకి సహజ లక్షణం కదా అది! దగ్గరగా వెళ్లి అదుముకుని తల మీద ఆప్యాయంగా రెండు చేతులతో నిమిరింది.    ఆ దృశ్యం చూస్తున్న బాలవ్వ నిశ్చింతగా నిట్టూర్చింది, బాలకృష్ణుడిని నందుడి ఇంటికి చేర్చిన వసుదేవుని లాగ.. కొద్ది మాసములలోనే మాధవుని మీద ఎంతో వాత్సల్యాన్ని పెంచుకున్న బాలవ్వకి, తీసుకెళ్తున్నది తన కొడుకే ఐనా తన శరీరంలోని ఒక భాగం వెళ్లిపోతున్నట్లే అనిపించింది. అదే... విశ్వప్రేమ నిర్వచనం.    కళ్లు తెరవని పసిగుడ్డును ఎచటికో.. ఎరుగని చోటికి తీసుకెళ్తుంటే దేవకీదేవి మనసు ఎంత క్షోభించి ఉండాలి! బాలవ్వ కన్ను ముందు పచ్చి బాలింత నిలిచింది, కళ్ల నిండా నీళ్లతో..       కం.  కన్నులు తెరవని పాపడు              కన్నయని వదల మనమును గట్టి పరచియున్              దన్నుల నిస్త్రాణమునను              వెన్నుని మీదనె బరువును వేసెను కలతన్||    తెలిసీ తెలియని వయసులో తనయుడిని ఒంటరిగా దూరతీరాలకు పంపవలసి వచ్చినప్పుడు మాధవుని కన్న తల్లి ఎంత క్షోభ పడి ఉంటుందో! కళ్లు తుడుచుకుంటూ, కను చూపు మేర వరకూ, సాగిపోతున్న గుర్రాలని చూసి ఇంట్లోకి వెనుతిరిగింది బాలవ్వ.                                       …………………    నంద, గౌతమిల అశ్వం వేగంగా వెళ్లలేకపోతోంది. అక్కడికీ, బాలవ్వ ఇచ్చిన తినుబండారాలు, కొద్ది సంభారాలు మాధవుడి కళ్యాణికే కట్టేశారు. మాధవునికి కళ్యాణి కళ్లెం పట్టుకుని లాగి కూర్చోవడం కష్టమనిపిస్తోంది. పది ఘడియల ప్రయాణం పిదప కాస్తంత విశ్రాంతి అవసరమనిపించింది రౌతులకి, గుర్రాలకీ కూడా.    చెట్టు నీడన ఆగి, గుర్రాలకి మేత తినిపించి, వానిని రుద్ది, తోమి.. వాటితో మాటలాడి తాము కూడ తెచ్చుకున్నది తిని విశ్రాంతిగా చెట్టు నానుకుని కూర్చున్నారు.    మాధవుడు, గౌతమి పక్కన చేరి కాళ్లు వత్త సాగాడు.    “ఇదేం పని కన్నయ్యా?” ఒక వంక మురిసిపోతూనే అంది గౌతమి.    “అశ్వారూఢ యైన అమ్మకు అలసట తీరే వరకూ కాళ్ళు పట్టడం నాకు అలవాటే కదా! ఇంకా చాలా దూరం పయనం సాగించాలి మనం.” మాట్లాడుతూనే గౌతమి ఒడిలో నిద్ర పోయాడు మాధవుడు.    “ఫరవాలేదు. ఎవరికీ అనుమానం రాదు. మాధవుడు మన బిడ్డే అనుకుంటారు అందరూ. మనసులో నుండీ ప్రేమ వస్తేనే ఈ విధంగా ప్రవర్తిస్తాము. లేకున్న తెచ్చిపెట్టుకున్నట్లే ఉంటుంది.” తృప్తిగా అంది గౌతమి.    ఒక ఘడియ విశ్రాంతి తరువాత జరిగిన ప్రయాణం వేగంగా జరిగింది.    కళ్యాణి మీద మాధవునితో పాటు గౌతమి కూర్చుంది. నందుడి గుర్రం మీదికి కొద్ది సామాన్లను చేర్చారు. బరువు సమానంగా సర్దటం వలన సులువయింది అశ్వాలకి.    సూర్యాస్తమానం లోగా అనుకున్న గ్రామానికి చేరుకో గలిగారు.    రాత్రికి అక్కడి పూటకూళ్ల ఇంటిలో బస చేస్తున్నప్పుడు మొదలయింది పరీక్ష, అందరికీ. అచ్చటి వారికి నంద, గౌతమిలు పరిచయమైన వారే..    “ఈ బాలుడు మీ అబ్బాయా? మరి ఇంతకాలం వదిలి ఏ విధంగా ఉన్నారు?” ప్రశ్నల పరంపర..    అడిగిన వారందరికీ తృప్తి కలిగేటట్లు సమాధానాలు చెప్పి హాయిగా నిట్టూర్చారు ముగ్గురూ. పైగా వారికి ఒకరి మీద ఒకరికి ఉన్న శ్రద్ధ అనుమానాలకి తావీయలేదు.                                        ………………….    రెండు రాత్రుల మజలీల తరువాత కటకం పరిసరాల్లోకి ప్రవేశించింది మహపాత్రుల కుటుంబం. క్రోసు దూరమునుండే బారాబతీ కోట గోడలు గోచరమయ్యాయి. మాధవుని కన్నులు అప్రయత్నంగా విచ్చుకున్నాయి. ముందుకు వంగి కళ్లెం పుచ్చుకున్నవాడు, నిటారుగా అయి అటూ ఇటూ కదిలాడు. వెనుకగా కూర్చున్న గౌతమి ఉలిక్కి పడింది.    “ఏమాయె మాధవా?” ఆతృతగా ప్రశ్నించింది.    తలపైకెత్తి ఎదురుగా కనిపిస్తున్న దృశ్యాన్ని చూపించాడు. కొద్ది దిగువ నుంచి వెళ్తున్నారేమో, ఎత్తుగా చిత్రాకారుడు శ్రద్ధతో గీసిన త్రిమితీయ చిత్రంలా కనిపిస్తోంది. సూర్యాస్తమయానికి ఆకాశం సిద్ధమౌతోంది.    రెండు పాయలుగా విడి పోయిన మహానదీ ప్రవాహం మందంగా సాగుతోంది.  పచ్చని చెట్లకి రంగు రంగుల పువ్వులు. ఫల వృక్షాలకి వేళ్లాడుతున్న కాయలు పళ్లు.  వీటి మధ్య ఠీవిగా నిలుచున్న కోట, మాధవునికి స్వాగతం పలుకుతోంది.    గౌతమికి అందులో వింతేమీ కానరాలేదు. ఎప్పుడూ చూసేదే.. బాలుడు ఎప్పుడూ కోటని చూసినట్లు లేదు, అందుకే సంభ్రమంగా చూస్తున్నాడనుకుంది.    “అది రాజుగారి కోట. కళింగ దేశాన్నేలే గాంగేయ రాజు, నాల్గవ భానుదేవుడు అందులో ఉంటాడు. రాజుగారి కోట ఎప్పుడూ చూడలేదా? ఈ సారి ఎవరైనా వంటవాళ్లు సంభారాలు తీసుకెళ్లేటప్పుడు నిన్ను తీసుకెళ్లమని చెప్తాలే..” గౌతమి మాటలకి నవ్వుకున్నాడు అటువంటి కోటలోనే పుట్టి పెరిగిన మాధవుడు.    ఉ.     కోటకి కాపలా వలెను కూకటి యైన నదీమ తల్లియే            దీటుగ హారమై నిలిచి తీరుగ కన్నుల విందు సేయగా            మాటయె రాని మాధవుడు మానుల రంగుల పూల కాంచుచున్            మేటి కుమారుడై కదలి మీరము దాటెను ధీ పటుత్వమున్.    పుట్టినదాదిగా అనుక్షణం భయాందోళనల అంతరాళం లోనే అందిన విద్యలు నేర్చుకుంటూ పెరిగిన మాధవునికి, స్వత సిద్ధంగా ప్రకృతిని ఆస్వాదించే ప్రకృతిని ప్రసాదించాడు ఆ పరమాత్మ.    కత్తి యుద్దంలో, గుర్రపు స్వారీలో, విలు విద్యలో తన వయసుకి మించి రాణిస్తున్నాడు. . అంతే కాదు, తన భావాలని మాటల్లో వ్యక్తీకరించే నేర్పు, పరిసరాలలో నిశ్శబ్దంగా నీటిలా కలిసిపోయే స్వభావం.. బాలుని ఇతర ప్రతిభలకి, సువర్ణానికి సువాసన అబ్బినట్లు అమరింది.    తెర చాటునుంచి గమనించిన హత్యలు, బలాత్కారాలు.. ఏ పరిస్థితులలో నైనా మొండిగా జీవనం సాగించగలిగే ధైర్యాన్నిచ్చాయి. అయితే, చూడ్డానికి మాత్రం, అమాయకంగా అప్పుడే ప్రపంచాన్ని గమనిస్తున్న పసిబాలుడిలాగే ఉంటాడు.    ప్రతీ విషయాన్నీ కుతూహలంగా, ఉత్సాహంగా పరిశీలించే విశాల నేత్రాలు అదనపు ఆకర్షణ, సుందరమైన ఆ మోముకి. అందుకే చూడగానే మారు ప్రశ్న వేయకుండా ఒప్పేసుకున్నారు నందుడు, గౌతమీ, మాధవుడిని పెంచుకోవడానికి,!           సంజకెంజాయ వెలుగులలో, మహానది ఒడ్డుకు దగ్గరగానున్న పట్టణంలోకి ప్రవేశించగానే కనిపించే “కళింగం” పూటకూళ్ల ఇంటి ప్రాంగణం లోనికి ప్రవేశించారు నందుని పరివారం.    లోపల అంకణం విశాలంగా ఉన్నా, ఇల్లు చిన్నదే. ముందున్న పెద్ద వసారా అన్ని పనులకీ ఆసరా అవుతోంది. అక్కడే పది మంది వరకూ విశాలంగా కూర్చుని భోజనాలు చెయ్యడానికి అనుకూలంగా ఉంది.    “క్షేమంగా వెళ్లి వచ్చారా తల్లీ! చీకట్లు కమ్ము కుంటున్నాయని కొంచెం ఆందోళన పడుతున్నాను. రండి.. స్నానాలు చేసి వచ్చారంటే వేడివేడిగా కుడుములు తినచ్చు.” కొద్ది బొంగురు గొంతుతో యాభై ఏళ్లు దాటిన స్త్రీ ఒకామె ఎదురొచ్చి ఆత్మీయంగా పలుకరించింది.    “అంతా బాగేనా సీతమ్మా?” గుర్రం మీదినుంచి తాను దిగి, గౌతమీ, మాధవులకు చెయ్యందిస్తూ అడిగాడు నందుడు.    నుదుట మెరిసి పోతున్న రాగి నాణమంత కుకుమ బొట్టుతో, కళ్లలో కరుణను, చిరునవ్వులో ఆప్యాయతను కురిపిస్తున్న సీతమ్మని అబ్బురంగా చూశాడు మాధవుడు.    “ఈవిడ నీకు అమ్మమ్మ మాధవా! మన దగ్గరే ఉండి బాగోగులను చూసే దేవుడిచ్చిన తల్లి. వీడు మా అబ్బాయి సీతమ్మా. అమ్మ దగ్గరున్నాడు ఇన్ని నాళ్లూ. ఇంక మా దగ్గరకి తీసుకొచ్చి విద్యలన్నీ నేర్పిద్దామనుకున్నాము.” గుర్రాలకి కట్టిన వస్త్రాలనీ, వస్త్రాలలో కట్టి ఉంచిన కొన్ని సంభారాలనీ ఇంట్లోకి చేరుస్తూ అన్నాడు నందుడు.     క్షణంలో సగంసేపు ముడిచిన కనుబొమ్మల్ని విడదీసి, అభావంగా లోనికి నడిచింది సీతమ్మ, ఆహారం ఏర్పాటు చెయ్యడానికి. ఇంతకాలం ఈ కుమారుని గూర్చి ఒక్క మాటైన అనలేదే అనే సందేహాన్ని మనసులోనే అదిమింది. అనవసరమైన విషయాలలో తల దూర్చడం ఆవిడ స్వభావం కాదు.    నిజంగానే సీతమ్మ, మహాపాత్రుల గృహానికి భగవంతుడు పంపిన బహుమానమే.. అస్తవ్యస్తమైన ఆవిడ జీవితానికి కూడా రక్షణ దొరికింది. పెళ్లయిన కొద్ది సంవత్సరాలకే, యుద్ధానికి బయలుదేరిన రాజుగారి సైన్యంతో, వారికి వంటవార్పులకి వెళ్లిన మొగుడు తిరిగి రాలేదు. శత్రురాజులకి పట్టుబడి, వారితో వెళ్లిపోయాడనే వార్త వచ్చింది. భర్త ఆనుపానులు తెలియని వారు సుమంగళులే.    రంగురంగుల చీరలు పొందిగ్గా రోజూ కట్టి, నున్నగా దువ్వి వేసిన ముచ్చల ముడిలో తెల్లని పూదండ దురిమి, ప్రేమతో ఇంటివారిని చూసుకుంటూ.. బాటసారులకి ఆప్యాయత రంగరించి, అన్నపూర్ణాదేవిలా  భోజనం వడ్డించే సీతమ్మ, ఎంత పుణ్యం చేసుకుంటే లభ్యమౌతుంది! ఆవిడ అండ చూసుకునే ఆరు మాసాలకొక్కసారి ఉత్కళం వెళ్లి అమ్మని చూసి వస్తుంటాడు నందుడు, సతీ సమేతంగా. వారు లేరన్న లోటు తెలియకుండా పూటకూళ్ల గృహాన్ని నడిపిస్తుంది సీతమ్మ.                                      ………………………..     ......మంథా భానుమతి

“అజ్ఞాత కులశీలశ్య….” 3వ భాగం

  “అజ్ఞాత కుల శీలస్య..” 3వ భాగం    కళ్ళు తెరిచిన మాధవుడికి ఒక్క క్షణం తానెక్కడున్నాడో అర్ధం కాలేదు.    “అమ్మా.. అమ్మా!” అరిచాడు. అరిచాననుకున్నాడు.    అప్పుడు గుర్తుకొచ్చింది..    ఇంకెక్కడి అమ్మ… అమ్మ చెప్పిన పనులు చేస్తూ వాటిలో అమ్మని చూసుకోవలసిందే!    లేచి నిలబడడానికి ప్రయత్నించాడు. పక్కనే ముక్కాలి పీట మీదున్న మంచి నీటి చెంబు కింద పడి చప్పుడు చేసుకుంటూ దొర్లి పోయింది.    బాలవ్వ వడివడిగా వచ్చింది.    “ఏమాయె? లేవకు మాధవా! నీకు బాగా ఉష్ణం చేసింది. అడవిలో ఏదో పురుగు కుట్టినట్లుంది. వైద్యులు ఇచ్చిన ఔషధం మరి నాలుగు రోజులు తీసుకోవాలి. ఆ పైన మంచి ఆహారం తీసుకోవాలి. కనీసం ఒక మాసం పట్టచ్చు. అప్పుడే నిన్ను పంపుతా.” మాధవుడిని అవశిష్టాలు తీర్చుకోవడానికి అవతలికి తీసుకెళ్ళి, వేడి వేడి నీటితో మొహం కడిగి, తడి వస్త్రంతో శరీరం తుడిచి బట్టలు మార్చింది.    మాధవుడికి నోట మాట రావట్లేదు. నిశ్శబ్దంగా అవ్వ చెప్పినట్లు చేసి, పాలు త్రాగి, కళ్లు మూసుకుని మంచం మీద పడుకున్నాడు.    మరి అవ్వకివ్వడానికి సరి పోయే నాణాలున్నాయా? అమ్మ తన వీపుకి కట్టిన మూట తీసి చూడనే లేదు. ఆలోచనలకి శిరోభారం ఎక్కువయింది. తల అటూ ఇటూ విదిలిస్తూ భారం తగ్గించుకోవడానికి ప్రయత్నించ సాగాడు.    జాలితో... సేద తీర్చడానికి నిద్రాదేవి ఆ బాలుడిని తన ఒడిలోకి తీసుకుంది.    దూరం నుంచి చూస్తున్న బాలవ్వ గట్టిగా నిట్టూర్చింది.    ఏం చెయ్యాలి ఈ పసివాడిని?    తాను కాపాడగలదా? వయసు సహకరిస్తుందనేది సందేహమే! నిస్సహాయురాలు. బాగా కోలుకునే వరకూ ఉంచుకుని, బాలుడు కోరినట్లుగా కటకం చేరుస్తే.. ఆ పైన ఆ కాళీమాతే చూసుకుంటుంది.    అంతలో..    వాకిలి నుంచీ, పెరటినుంచీ.. ఇరువైపులా గుర్రం సకిలింపులు వినిపించాయి. బాలవ్వ ఉలిక్కిపడి లోపలికి వెళ్ళి, పనివాడికి చెప్పవలసింది చెప్పి, చేతులు తుడుచుకుంటూ వీధి గుమ్మం తీసి అరుగు మీద నిల్చుని కళ్ళ చికిలిస్తూ చూసింది. కళ్ళ మీద చేతులానించి చూస్తే… కనిపించాయి మూడు గుర్రాలు, వాటి మీద నున్న రౌతులు నిశితంగా చుట్టుప్రక్కల పరికిస్తున్నారు.                                     ఒకే ఒక క్షణం బాలవ్వ గుండె ఆగిపోయినట్ల నిపించింది.    వంగ సైనికులు.    మాధవుడిని వెతుక్కుంటూ వచ్చి ఉంటారు. అనుమానం లేదు.    అవ్వ ఆలోచనలో ఉండగానే దగ్గరగా వచ్చేశారు సైనికులు. ఇంక ఇంట్లోకి తిరిగి వెళ్ళడం అసంభవం.    “ఏమవ్వా? భోజనం ఉందా?” ముగ్గురిలో అధికారిలా ఉన్నవాడు అడిగాడు.    “అర ఘడియలో చేసేస్తా. ఆ పక్కనే చెరువుంది. ముఖము, కాళ్లు చేతులు ప్రక్షాళన చేసుకుని రండి. వడ్డిస్తా.” బాలవ్వ ఇంటికొచ్చిన వాళ్లకి అన్నం పెట్టితీరాలి. అది పూటకూళ్ళ సాంప్రదాయం.    లోపలికి వెళ్లి మాధవుడి మంచాన్ని సావిట్లోనే ఒక పక్కగా జరిపింది. గాఢంగా నిద్రపోతున్న మాధవుడి మీద కంబళీ కప్పింది. ఎసరుపెట్టి అది కాగేలోగా పెరటి అరటి కాయలు నాలుగు తరిగి, బూరెల మూకుట్లో వేసి, కొడుకుని పిలిచి కత్తెర చేతికిచ్చి మాధవుడిని చూపించింది.    “సరిగ్గా అర ఘడియలోగా పనైపోవాలి.”    బాలవ్వ వంట ముగించే లోగా సైనికులు వచ్చేశారు.    మాధవుడి మంచానికి కొద్ది దూరంలోనే అవ్వ ఆకులు వేసి వడ్డించింది.    “అవ్వా!” వేడి వేడి వరి అన్నంలో మిరపకాయ పచ్చడి కలిపి, పురుషిడు నెయ్యి వేసిన ముద్ద కలిపి నోట్లో పెట్టుకుంటూ పిలిచాడు అధికారి.    “ఏం బాబూ! భోజనం అయ్యాక కాస్త విశ్రాంతి తీసుకుని వెళ్తారా? అరుగు మీద ఏర్పాట్లు చేయించనా నా కొడుకు చేత?”    అవ్వ కొడుకు జగన్నాధ మహాపాత్రుడు నిర్ఘాంతపోయి చూస్తున్నాడు. పెద్దవయసు వచ్చింది… అమ్మకి మతి స్థిమితం పోలేదు కదా?    “లేదవ్వా. మేము అత్యవసరమైన పని మీద కటకం వెళ్తున్నాము. ఇచ్చటికి  పంచకళ్యాణి గుర్రంమీద ఒక బాలుడు వచ్చాడా? లేదా, అతని జాడ ఏమైనా తెలుసా?”    “అమ్మా!” సరిగ్గా అప్పుడే మాధవుడు కదిలాడు.    “జగన్నాధా! ఒక పరి చిన్నవాడిని చూస్తావా? శిరోభారం ఎక్కువయిందో ఏమో!” కొడుకుని ఆదేశించింది, సంవత్సరాల తరబడి వివిధ పరిజనాలతో మెలగి సందర్భానుసార వర్తనము నేర్చుకున్న బాలవ్వ.    జగన్నాధుడు తల్లి ఆలోచన అర్ధంచేసుకున్నవాని వలె, మాధవుని మీది కంబళి తొలగించి నుదుటిమీద చెయ్యి వేసి చూశాడు.    సలసల మరిగిపోతోంది.    ఆ సావడిలోనే ఒకమూలగా, ఇసుకలో నిలబెట్టిన కుండలోని నీరు తీసి, ఒక అంగవస్త్రమును ఆ నీటితో తడిపి, పిల్లవాని నుదుటి మీద ఉంచాడు. కాస్త ఉపశమనం కలిగిందేమో… గట్టిగా మూలిగి, కళ్లు మూసుకున్నాడు బాలుడు.    “ఎవరవ్వా ఈ బాలుడు?” అడగనే అడిగాడు అధికారి.    ఆ ప్రశ్న ఎప్పుడడుగుతాడా అని ఎదురు చూస్తోంది బాలవ్వ.    “నా మనవడు బాబూ! నా పెద్ద కొడుకు కటకంలో ఉంటాడు. అక్కడ కోడలితో కలిసి పూటకూళ్ల ఇల్లు నడుపుతున్నాడు. వాడి కొడుకే ఈ చిన్నపాత్రుడు. చూసిపోదామని వచ్చారు. క్రిందటి సూర్యాదివాసరమునుండి ఒకటే పులకరం. ఆ వేడి మధ్యాహ్నానికి పెరుగుతోంది. అందుకే పూర్తిగా తగ్గాక  పిల్లవాడిని పంపుతానని కొడుకునీ, కోడల్నీ వెళ్లిపోమన్నా.. ఇక్కడే కూర్చుంటే అక్కడ వ్యాపారం గంటకొడుతుంది. కాస్త కూర వెయ్యమంటారా బాబూ?”    “చాలవ్వా. ఇంక ఏమాత్రం తిన్నా ఇక్కడే తిష్టవేయాలి, భుక్తాయాసంతో.”    “దానికేముందయ్యా? నా కొడుకుల వంటి వారే మీరు. కావలసినన్ని దినములుండచ్చు.”    భోజనం చేసి, ఆకులు పెరట్లో తవ్విన గోతిలో పడేసి, నూతి దగ్గరకెళ్లి, నీళ్ళు చేదుకుని చేతులు కడుక్కున్నారు సైనికులు.    మహాపాత్రుడందించిన వస్త్రంతో చేతులు తుడుచుకుని, మాధవుని మంచం వద్దకు వచ్చారు ముగ్గురూ.    బాలవ్వ నేల శుభ్రం చేస్తూ పక్క చూపులు చూస్తోంది, గుండె గుబగుబ లాడుతుండగా.    మాధవుడి భుజాలు దిగిన ఉంగరాల జుట్టు కుప్పై గంతలో ఎండుటాకుల కింద కప్పబడి ఉంది. ఇప్పుడు అతనికున్నది అప్పడే మొలిచినట్టున్న వరిపైరు లాంటి జుట్టు. అతని విశాల నేత్రాలు జ్వరపు వేడికి ఎర్రబడి ఉబ్బిన మొహంలో కుంచించుకుపోయి గీతల్లా ఉన్నాయి. అందులో… చావడిలో అంతా మసక వెల్తురు. ఉన్న గవాక్షాలు కూడా మూసేసింది బాలవ్వ, చలిగాలి తగుల్తుందని.    పైగా, పెరటిలో కానీ, వీధిలో కానీ ఎక్కడా గుర్రపు జాడ లేదు.    సైనికులు రుచికరమైన భోజనంతో తృప్తిగా ఉన్నారు.    ఆ బాలుడే మాధవుడైతే, ముసలవ్వ తొణక్కుండా బెణక్కుండా... అంత బే ఫికర్ ఉండగలుగుతుందా! కనీసం ఆమె కొడుకైనా తడబడడా తేడా ఉంటే..    వీధివాకిలి వద్దనే నిలబడి మెడ సారించి, మూడుగుర్రాలూ కంటికి కనిపించడం మానేవరకూ చూసి, అరుగు మీదనే కూలబడి పోయింది బాలవ్వ, ఒంట్లో ఉన్న శక్తి అంతా హరించి పోగా.                                      ………………..    మాధవుడు తన సంచీలో ఉన్న నాణాలను మంచం మీద పరచి లెక్కిస్తున్నాడు.    కొన్ని రాజా గణేశుని సువర్ణ గ్రామాలు. అవి ‘దనుజమర్దన’ అనే పేరిట ఉన్నాయి. అవి ఇరువదిరెండున్నాయి. గణేశుని రాజ్యంలో వాని విలువ అధికమే! కానీ ఉత్కళ, కళింగల్లో… అదీ వంగ దేశం జలాలుద్దీన్ ఏలికలో ఉన్నప్పుడు, ఏ మాత్రం విలువ ఉంటుందో అనుమానమే. దుర్గాదేవి నాణాలు సేకరించినపుడు అదే సందేహాన్ని వెలిబుచ్చింది.    వెండి నాణాలలో కొన్ని జలాలుద్దీన్ హిందువుగా ఉన్నప్పటివి. అవి ‘మహంద్రదేవ’ అనే పేరుతో మిక్కుటముగా ఉన్నాయి.ఈ నాణాల విలువ కూడా సందేహాస్పదమే.    మిగిలినవన్నీ ‘జలాలుద్దీన్’ పేరిటనున్నవే. ఆ సమయంలో వంగదేశంలో చెల్లుబడిలో ఉన్నందువల్ల వాటిని చాలా సేకరించింది దుర్గాదేవి. అందులో బంగారు, వెండి, రాగి నాణాలున్నాయి. అవే ఆదుకోవాలి తనని అనుకున్నాడు మాధవుడు.    వానిలో కొన్ని బాలవ్వకివ్వాలి. తను మాసంరోజులు పైగా ఉండిపోయాడు. ఎన్ని నాణాలు తీసుకుంటుందో…. ఏదైనా ఉపాధి కలిగేవరకూ సరిపోతాయో లేదో!    పరిపరి విధాలుగా సాగాయి అ చిన్ని మనసులో ఊహలు.    కానీ తను వంగదేశంలో లేనని మరచాడు. వాటి విలువ కళింగంలో ఎంత ఉండునో..    ముందుగా ఒక షరాయి, కమీజు కుట్టించుకోవాలి. ఉత్కళదేశంలో మగపిల్లల ధాటికి తట్టుకోగలిగిన వస్త్రాలు నేస్తారని విన్నాడు. తమ వంగ దేశంలో అధికంగా సున్నితమైనవే లభిస్తాయి. రాజాంతఃపురంలో జీవనం కనుక సరిపోయింది. ఇప్పటి నుండీ… ఏ విధంగా సాగబోతోందో ఆ కాళీ మాతకే ఎరుక.    “మాధవా! ఏం చేస్తున్నావు? నీ కోసం క్షీరాన్నం చేశాను. వచ్చి తాగిపో. ఇంకా బలం రావాలి.” బాలవ్వ పిలుపు విని, నాణాలని దాచి, లోపలికి వెళ్లాడు.    ఉన్నట్లుండి ఏడుపు వచ్చింది… బాలవ్వ పిలుపు అచ్చు అమ్మ పిలిచినట్లే ఉంది.    కానీ.. ధీరోదాత్త క్షత్రియ బాలుడు కన్నీరు కార్చకూడదు. కళ్ళు చికిలిస్తూ ఏడుపు ఆపుకున్నాడు.    “ఏం చేస్తున్నావు మాధవా?”    “వస్తున్నానవ్వా! సామాను సరుదుకుంటున్నా. ఈ భానువారం కటకం వెళ్దామని యోచిస్తున్నా.”    “ఇంకా నీకు పూర్త స్వస్థత చేకూరలేదు. ఇంకొక మాసం ఉండి వెళ్ల వచ్చును కదా?” బాలవ్వకి మాధవుడ్ని వదలాలని లేదు. ఇంట్లో ఒక బాలుడు తిరుగాడుతుంటే ఆ అందమే వేరు.    కానీ పరాయి పిల్లవాడు… ఏమని ఆపగలదూ? పైగా అతని పూర్తి వివరాలు తెలియవు. ఆవిడకి కూడా  ‘అజ్ఞాత కుల శీలస్య..’ అనే నానుడి గుర్తుకొచ్చింది.చూడబోతే సంపన్న కుటుంబంనుండే వచ్చినట్లున్నాడు. కత్తి యుద్ధం విలువిద్యలలో నేర్పరి. గత రెండు వారముల నుంచీ అభ్యాసం చేస్తుంటే చూసింది.    ఆ ఠీవీ, దర్పం సామాన్యులకుండవు.    అదృష్టం.. వంగ సైనికులు మాధవుని గురించి వెతకడం మాని వేసినట్లుంది. పసివాడిని అడవిలో ఏ జంతువో తిని వేసుండ వచ్చనుకున్నారేమో!    “మీకు భారముగా ఎన్ని దినములు ఉండగలనవ్వా? మా అమ్మ సూచించిన చోటికి ఎన్నటికైననూ చేరవలెను కదా. ఏదైన పని వెత్కుకోవాలి కూడా భుక్తికి.” స్థిరమైన కంఠంతో అన్నాడు. పిల్లవాడు పేలవంగా కనిపిస్తున్నా నిశ్చయం ధృడంగా ఉంది.    “ఒక వారం ఆగు మాధవా! కటకం నుండి పెద్దబ్బాయి, నంద మహాపాత్రుడు వస్తున్నాడు. అతని వెంట వెళ్ల వచ్చును. సైనికుల బెడద కూడా ఉండదు. నీకు ఏదైనా పని కూడా ఇప్పిస్తాడు.”    “అలాగే అవ్వా! నీకు ఎన్ని రూకలు ఇవ్వాలో చెప్తే నా వద్ద నున్నవి కొన్ని సరిపోతాయేమో చూస్తాను.” పెద్ద మనిషిలా మాట్లాడుతున్న మాధవుని చూస్తుంటే బాధతో పాటుగా ముచ్చట కూడా వేసింది బాలవ్వకి.    కాసేపు తటపటాయించింది. ముక్కుపచ్చలారని ఈ పసివాడి దగ్గర ధనం తీసుకోవడమా!    కానీ వైద్యానికీ, సంబారాలకీ చాలా వెచ్చించవలసి వచ్చింది. పూటకూళ్ల రాబడి అంతంత మాత్రమే. తమ తిండి వెళ్లిపోతుందంతే ఖర్చులు పోగా.    “నీదగ్గరెన్నున్నాయో చెప్పు. అందులోనుంచి నేనేరుకుంటా.”    మాధవుడు ఆనందంగా అన్ని నాణాలూ కింద పోశాడు.    బాలవ్వ కళ్లు పెద్దవి చేసి చూసింది. ఎవరి కంటా పడకుండా ఎలా దాచాడో ఇన్ని రోజులు.. ఆశ్చర్యమే! అటూ ఇటూ ఖంగారుగా చూసి, ద్వారం మూసేసి వచ్చింది.    రాచబిడ్డడే అయుండాలీ బాలుడు. ఈ ధనం ఇతడికి పదహారేళ్లు నిండే వరకూ సరి పోతుంది. నిరంతరం వెంటాడే శత్రువుల నుంచి తప్పించుకోవడమే ఇతనికి ఉన్న సమస్య. అప్పటికప్పుడు బాలవ్వ మనసులో ఉభయ తారకంగా ఉండే ఒక పధకం రూపు దిద్దుకుంది.    “చూడు బాబూ నువ్వు ఎవరివో నాకు తెలియదు. కానీ, ఈ వయసులో నీవు ఒంటరిగా బతకాలంటే కష్టమే. నీకు చూస్తే గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం తప్ప ఏ పనులూ వచ్చినట్టే లేదు. కటకంలో బంధువులెవరైనా ఉన్నారా? ఎక్కడి కెళ్తావు? ఎవరి దగ్గరుంటావు? మీ అమ్మగారు ఎవరిదైనా చిరునామా ఇచ్చారా?” మాధవుడిని పక్కన కూర్చోపెట్టుకుని అడిగింది లాలనగా.    తల అడ్డంగా ఊపాడు మాధవుడు. గద్గద స్వరంతో అన్నాడు..      ఆ.వె. “అమ్మ ఎరుక లేదు మమ్మ నన్ను మురిపె             ముంగ పెంచె ముద్దు ముద్దుగ, నను              కన్నతల్లి ఎంతొ కలతతో వీడెను             కృపతొ నాదు కొనిరి కీడు లేక.”    బాలవ్వ హఠాత్తుగా వెళ్లి బాలుడ్ని హత్తుకుంది హృదయం ద్రవించగా.    “నీ గురించి ఏమైనా చెప్తావా మాధవా?”    మాధవుడు ఏం మాట్లాడలేదు. బాలవ్వ నడుం గట్టిగా పట్టుకుని వెక్క సాగాడు.    “వద్దులే కన్నా! అప్పుడు సైనికులతో అన్న మాటనే నిజం చేస్తాను. మా నందుడి కొడుకు గానే కటకం పంపుతా నిన్ను. వాళ్లకి ఎలాగూ పిల్లలు లేరు. కోడలు కూడా సంతోషిస్తుంది. ఐతే.. మా పిల్ల వానిలా మనాలంటే అక్కడికి వెళ్లే లోగా కొన్ని పనులు నేర్చుకోవాలి మరి. సరేనా!”    మాధవుడు నడుం పట్టు మరింత బిగించాడు.. అనుకోకుండా దొరికిన ఆలంబన వదులుకోనన్నట్లుగా.    “మేము కూడా బ్రాహ్మలమే నవ్వా. రాజుగారి కొలువులో మా నాయన పని చేసే వారు. యువరాజు గారి తో కలిసి చదువుకుంటున్నా.. అంతలో కోటలో ఎన్నెన్నో మార్పులొచ్చి.. పెద్ద రాజునీ, మా తండ్రిగారినీ.. అందరినీ చంపేశారు. అమ్మా నేనూ పారిపోయి వస్తుండగా, దారిలో అమ్మని కూడా….” భోరుమన్నాడు మాధవుడు.    బాలవ్వ బాలుడి తల నిమురుతూ ఉండిపోయింది. మాట ఇచ్చేసింది కానీ, కొడుకు కోడలు ఏమనెదరో!                                         …………… “అజ్ఞాత కులశీలశ్య….” 2వ భాగం     ......మంథా భానుమతి

“అజ్ఞాత కులశీలశ్య….” 2వ భాగం

  “అజ్ఞాత కులశీలశ్య….” 2వ భాగం ఎక్కడో పర్షియా దేశం నుంచి భరతావనికి వచ్చి, ఒక్కొక్కటిగా దారిలో దేశాలనాక్రమిస్తూ వచ్చిన ముసల్మానులు భారత దేశంలో స్థిరపడి పోయారు.. రాజులుగా, చక్రవర్తులుగా! ఒకరి వెనుకగా నొకరుగా..    కం.  కొండల కోనల కనుమల           దండుగ దండెత్తి బలిమి దాడిని సలిపీ           దండకమున జనుల నరికి           పండుగ చేసి కొనుమనుచు పర దొర లుడివెన్.  .               ఆ పర దొరలు అన్ని దిక్కులకూ చొచ్చుకుని వచ్చి ఆక్రమించ సాగారు.    పదిహేనవ శతాబ్దపు ఆరంభంలో, వంగదేశాన్ని చేజిక్కించుకుని పాండువా రాజధానిగా  ఘియాజుద్దీన్ అజమ్ షా పాలించాడు. అక్కడ దినాజ్ పూర్ అనే ఊరికి హకీమ్(గవర్నర్)గా ఉన్న  రాజా గణేశు,  ఆ రాజును చంపి వంగదేశ సింహాసనాన్ని  అధిష్టించాడు. కానీ, వెనువెంటనే  సరిహద్దుల్లోని జానుపురం సుల్తాను దండయాత్రనెదుర్కోవలసి వచ్చింది. పరిస్థితుల ప్రాబల్యం వల్ల కొడుకు ‘జాదూ’ని ఇస్లామ్ మతానికి మార్చడానికి ఒప్పుకుని, జలాలుద్దీన్ అనే పేరుతో పట్టం కట్టాడు. జానుపూర్ సుల్తాను వెను తిరిగాడు.   సుల్తాన్ యుద్ధం విరమించుకుని వెళ్ళగానే, మళ్ళీ కొడుకు మతం మార్చి తను సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు. హిందూ పండితులు ఆ మార్పిడిని ఒప్పకోలేక పోయారు, రాజు భయానికి తలలూపినా!   అందుకే కాబోలు.. జాదూకి ఇస్లామ్ మతం అంటేనే గురి కుదిరింది.   సంవత్సరం లోగానే..  జలాలుద్దీన్ అనుచరులు గణేశుడిని చంపి, అతన్ని రాజుని చేశారు.   ఆ పోరుల్లో రాజా గణేశుని అంతఃపురం అంతా అయోమయంలో మునిగిపోయింది. ఎవరు ఏమతాన్ని అనుసరిస్తున్నారో.. పూజలు చెయ్యాలో నమాజు చెయ్యాలో అర్ధం కాని పరిస్థితి.   చిన్నరాణీగారి చెల్లెలు దుర్గాదేవి. ఆవిడ భర్త కూడా గణేశ వంశంవాడే. రాజుకు తమ్ముడౌతాడు, గణేశునికి కుడి భుజమై కనుసన్నలలో ఉండేవాడు.   రాజా గణేశ్ నిస్సహాయ స్థితిని చిన్ననాటి నుంచీ గమనిస్తూనే ఉంది దుర్గాదేవి. అంతఃపురమంతా ముసల్మానులు.. గణేశుని ద్వంద్వ వైఖరిని నిరసించి అతన్ని మట్టుపెట్టిన వారు. జలాలుద్దీన్ సింహాసనమెక్కగానే మతమార్పిడులు ఉధృతంగా మొదలయ్యాయి.   దుర్గాదేవి మతమార్పిడులను నిరసించింది. జన్మతః ఉన్న మతాన్ని ఎందుకు మార్చుకోవాలి? అంతఃపుర స్త్రీలలో యుద్ధ నైపుణ్యం ఉన్నది ఆమెకే! గణేశుని తమ్ముడైన ఆమె భర్త ని, హిందూమతాన్ని బలపరుస్తున్నాడని రాజా గణేశునితో పాటే సంహరించారు.   తప్పని సరిగా.. భర్తలు లేని స్త్రీలంతా ముసల్మాన్ సైనికులకి బీబీలుగా మారిపోయారు. ఇష్టంలేని వారు కొందరు ప్రాణ త్యాగం చేశారు. కొందరిని పారిపోతుంటే మాన ప్రాణాలని కొల్లగొట్టారు.   కొన్ని రోజులు అంతఃపురంలో మహారాణి నీడలో తలదాచుకున్న దుర్గాదేవి కొడుకుని తీసుకుని పారిపోవాలని నిశ్చయించుకుంది.. కానీ ఏ విధంగా? ఎక్కడికక్కడ కాపలా! రోజూ ముస్లిమ్ స్త్రీ లాగానే మేలి ముసుగు వేసుకునే ప్రాసాదం అంతా తిరుగుతూ పరికిస్తోంది. తన చిన్న మందిరంలో మాధవుడికి యుద్ధ విద్యలు నేర్పిస్తూ కర్తవ్యాన్ని బోధిస్తోంది.   అనుకున్న సమయం ఆసన్నమయింది..   ఆ రోజు ఈద్.. అందరూ పండగ పిండివంటలు సుష్టుగా తిని ఆయాస పడుతున్నారు.   “మంచి జీరా పానీ భాయ్.. తిన్నది అరిగి తేలిగ్గా ఉంటుంది. సేవించండి.” అందరికీ మత్తుమందు కలిపిన పానీయాన్ని అందించింది.   మాధవుడు కూడా పొడుగాటి కమీజ్ వేసుకుని పానీయం అందిస్తున్నాడు.   కొద్దిగా ఏమరుపాటుగా ఉన్నారు అందరూ..   మహారాణీకి కూడా చెప్పలేదు..   భర్త తరచుగా వెళ్ళే, కళింగ దేశం లోని ‘కటకం’ పట్టణానికి వలస వెళ్లాలని నిశ్చయించుకుంది. అతడికి ఆ పట్టణంలో స్నేహితులున్నారని అనేవాడు. అక్కడికి ఇంకా శతృవుల బెడద వచ్చినట్లు లేదు. భర్త వాడిన గుర్రాన్నే తయారుగా ఉంచింది.. మగ వేషం వేసుకుని, సర్ది పెట్టుకున్న సామాన్లు తీసుకుని మాధవుడితో సహా గుర్రం ఎక్కి, వంటశాలకి సరుకులు తెచ్చే దారిలోనుంచి కోట దాటింది.   సాధారణంగా అటు నుంచి బైటికి వెళ్ళే వారిని ఆపరు.. ఆ సంగతి గమనించే ఆ మార్గాన్ని ఎంచుకుంది దుర్గాదేవి.   దక్షిణదిశగా పయనం సాగించింది.   బయలుదేరి రెండు రోజులయింది. ఇంక క్షేమంగా తప్పించుకున్నామనే అనుకుంది.   కానీ.. అతఃపురంలో గలగల లాడుతూ తిరిగే మాధవుడు కనిపించకపోతే అనుమానం వచ్చేసింది అందరికీ!   వేట మొదలయింది. స్వయంగా మహారాజు జలాలుద్దీన్ ఆదేశాలిచ్చాడు.         కోట ఆనుపానులన్నీ తెలిసిన దుర్గాదేవి వలన ఎప్పటికైనా అపాయమే..   ఇద్దరు సైనికులకి వాయువేగంతో నడిచే గుర్రాలనిచ్చి పంపించాడు రాజా జలాలుద్దీన్.   వారే.. దుర్గాదేవిని అడ్డుకుని చంపేశారు. కానీ.. ముందుకు వెళ్ళి మాధవుడిని ఆపలేరు. ఏ దేశానికి వెళ్తున్నాడో, ఏ కొండల్లో కోనల్లో దాగి ఉంటాడో ఎవరు చెప్పగలరు?   తమ గుర్రాలని నెమ్మదిగా నడిపించుకుంటూ సమీప గ్రామానికి బయల్దేరారు.   “తల్లీ కొడుకులిద్దరినీ చంపేశామని చెప్దాము. ఇద్దరము ఒకే మాట మీదుండాలి.” ఒకరినొకరు హెచ్చరించుకున్నారు.   ఆనమాలుగా దుర్గాదేవి ఖడ్గాన్ని తీసుకున్నారు. ఆవిడ వీపుకి కట్టుకున్న మూటని విప్పారు. ఏమైనా నాణాలు దొరకచ్చేమో.. జలాలుద్దీన్ పాదూషా నాణాలకి ఏదేశంలో నైనా విలువ ఎక్కువే!   దుర్గాదేవి తెలివి తక్కువ అతివ కాదు.. నాణాలని మాధవుడి వీపుకి కట్టింది. ఏ ఆపద వచ్చినా కుమారుడిని రక్షించడమే ప్రధమ కర్తవ్యం. అవసరమైతే అశ్వం కూడా తన ప్రాణాలనే ముందు వదులుతుందని తనకి అవగతమే!    సైనికులిద్దరూ నిరాశతో వెనుతిరిగారు.. దుర్గాదేవి భుజాలకి కట్టిన మాధవుడి అంగీలని తీసుకుని.. ఖడ్గంతో సరిగా అవి కూడా సాక్ష్యాలే మరి.                                          ………….. మాధవుడు ఒక రకమైన మొండితనంతో ముందుకు సాగుతున్నాడు.అమ్మ దగ్గర గారాలు పోయే వయసులో ఒంటరి పోరాటం.. పరిస్థితులే కావలసిన ధైర్యాన్ని, తెలివినీ ఇస్తాయి. అదే.. బ్రతకాలనే పట్టుదల. సృష్టిలోని ప్రతీ పాణికీ ఉండేది.  కొన ఊపిరితో నైనా పోరాడే శక్తినిచ్చేది ఆ ఆశే!  కం.  వలలో చిక్కిన పులుగులు*             జలధిన్ మునిగిన పశువులు, జారిన ఇలకున్             జల చరములు,  సర్పములు న             కులముల* నోట బడిన నవి  కోరును శక్తిన్.                    చీకటి పడుతూ ఉండగా అడవి చివరనున్న గ్రామానికి వచ్చాడు. ఆ దారిలో అనేకసార్లు మాధవుడి తండ్రిని తీసుకెళ్ళిన గుర్రం, అలవాటుగా ఒక పూటకూళ్ళ ఇంటి వద్ద, అరుగు పక్కగా ఆగింది.   నెమ్మదిగా గుర్రం దిగాడు మాధవుడు. ఎవరితో ఎలా మాట్లాడాలి? బెదురుగా అటూ ఇటూ చూస్తూ నిలుచున్నాడు. ఎన్నడూ అంతంత దూరం ప్రయాణించ లేదేమో.. తూలు వచ్చింది.  సైనికులు వెంటాడుతున్నారేమోనన్న అనుమానం.. వెనుతిరిగి అమ్మ వద్దకు వెళ్దామని ఉన్నా, ఆమ్మ ఆజ్ఞ పాటించవలసిన ఆవశ్యకత ఆపేసింది.   అరుగు మీదనే కూర్చుని, మొహం మోకాళ్ల మీద పెట్టుకుని కుమిలిపోసాగాడు. అమ్మ ఏమయింది? ఎక్కడుంది? ఆ చిన్ని మనసుకు తెలుసు.. ఇంక అమ్మ రాదని. కానీ తట్టుకోగల వయసు లేదు. చిన్న నాటి నుంచీ యుద్ధాలు, చంపుకోవడాలు చూస్తూ ఉన్నా కూడా.. అప్పుడు ఓదార్చడానికి అమ్మ ఉంది. ఇప్పుడూ.. ఎవరున్నారు?   భుజం మీద చెయ్యి పడింది ఎవరిదో! ఉలిక్కిపడ్డాడు మాధవుడు. వెన్నులోంచీ వణుకు వచ్చింది. అమ్మ చెప్పిన జాగ్రత్తలు మర్చిపోయి ఏమరుపాటుగా ఉన్నాడు.   ఒళ్లంతా కుంచింపజేసి అరుగు మీదనుంచి గుర్రం మీదికి దూకి కళ్ళెం లాగాడు.   కానీ గుర్రం కదల లేదు.   ఇంకా ఏడుపొచ్చేసింది.. గుర్రం అలసిపోయింగా? అకలేస్తోందా? మరణమే శరణ్యమా?   “బాబూ! భయం లేదు. కిందికి దిగు.” చల్లని పిలుపు.   ఐనా.. భయంగానే చూశాడు బాలుడు.   తలంతా ముగ్గుబుట్టలా అయిపోయిన ఒక ముసలమ్మ.. నుదుటి మీద పెద్ద కుంకుం బొట్టు. ముఖమంతా ముడుతలు. చిరునవ్వు నవ్వుతూ పిలిచింది.   ప్రసన్నవదనంతో పిలుస్తున్న కాళీమాతలా అనిపించింది మాధవుడికి.   వెంటనే దిగి, ఆవిడ ఒళ్ళో తల పెట్టి బావురుమన్నాడు.   “అమ్మా.. అమ్మా..” వెక్కెక్కి ఏడవసాగాడు.   తన చేత్తో మాధవుడి వీపు నిమురుతూ ఓదార్చింది ఆ పూటకూళ్లమ్మి.   “ఎవరు బాబూ నువ్వు? ఎక్కడికి పయనం?”   “వంగ సైనికుల నుండి తప్పించుకుని వస్తున్నాను. కటకం వెళ్ళాలి. ఇది ఏ గ్రామం? ఇక్కడికెంత దూరం కటకం?” తన పేరు చెప్పి, వెక్కుతున్నా స్పష్టంగా అన్నాడు మాధవుడు.   గుర్రం సకిలిస్తుంటే అటు చూశారు ఇద్దరూ. తల నిలువుగా ఆడించింది అశ్వం.   “ముందు నువ్వూ నీ గుర్రం ఆకలి తీర్చుకుని సేద తీరండి. పిదప మాట్లాడుకుందాం.” అవ్వ, మాధవుడిని తీసుకుని లోపలికి నడిచి, ఎదురైన నడి వయస్కుడికి గుర్రం సంగతి చూడమని చెప్పింది.   “నీ దుస్తులు, పరికరాలు నా కుమారుడు తీసుకుని వస్తాడు మాధవా! ఈ లోగా నిశ్చింతగా స్నానం చెయ్యి. ఎన్నడనగా బయలు దేరావో.. ఇక్కడికి వంగ సైనికులు రారు. ఇది ఉత్కళ దేశం సరిహద్దులో నున్న బాలేశ్వర్ గ్రామం. అడవిని దాటావు కనుక క్షేమమే! ఎందుకైనా మంచిది, గుర్రాన్ని వెనుక భాగంలో కట్టెయ్యమని చెప్తాలే.”   మాధవుడికి ఉన్నట్లుండి నీరసం వచ్చేసింది.   నిలుచున్న చోటే స్పృహ తప్పి తొక్కలా కిందికి వేళ్ళాడి పోయాడు.   “అయ్యో! ముక్కు పచ్చలారని పాపడు.. వయసుకు మించిన అనుభవాలు. ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాడు పాపం..” అనుకుంటూ నెమ్మదిగా లేపి, నడిపించి తల్పం మీద పరుండబెట్టింది బాలవ్వ, వంగ, కళింగ దేశాల మధ్య రాకపోకలు సాగించే వర్తకులకి, సైనికులకీ, యాత్రికులకీ అన్నపూర్ణాదేవిలా ఆదరించే పూటకూళ్ళవ్వ.                                   ……………….. ( *పులుగులు = పక్షులు; *నకులములు = ముంగిసలు)   “అజ్ఞాతకులశీలస్య..”  పార్ట్ - 1           ......మంథా భానుమతి