మరో కోణం

మరో కోణం   “నువ్వు యెన్నయినా చెప్పు సురేష్ బాబు, వాడి గతం తెలిసినవారెవరికి వాడిపై ప్రేమ, అభిమానం ఉన్నట్టుండి పుడుతాయా?”  సురేష్ రాముడిని ఆనందంగా మెచ్చుకుంటుంటే చిరాగ్గా ముఖంపెట్టి తన విసుగునంతా మాటలలో ప్రదర్శించాడు సాంబశివయ్య. ‘రాముడంటే ఎవరు?ఒకప్పుడు తమ ముందు మురుకులు,కోవా బిళ్లలు చేయించి, అంగడిలో పెట్టి అవే జీవనాధారంగా అమ్ముకుని బ్రతికినవాడు.’ రాముడంటే అందరికీ ఉన్న అభిప్రాయమిది. ఎలాగైనా డబ్బు బాగా సంపాదించాలి అని ఎవరికీ తెలియకుండా ముంబయికి వెళ్లిపోయినవాడు. ఎంత సంపాదించాడో,ఎలా సంపాదించాడో కాని అనుకోకుండా ఒకనాడు ఉరుకులు పరుగుల మీద వచ్చి చెరువు కట్ట దగ్గర భూమికొని చదును చేయించి మళ్లీ వస్తానని చెప్పి మూడేండ్లయినా తన గ్రామంవైపు తిరిగి చూడనివాడు,ఈ రోజు ఆ స్థలంలో గుడిని కట్టించి  విగ్రహప్రతిష్ఠకు ఏర్పాట్లు చేస్తుంటే, అది చూసి  తెలుగుమేష్టారు సురేష్  రాముడి దయార్ద్ర హృదయాన్ని, దానగుణాన్ని విడవకుండా పొగడుతుంటే వినడానికి కంపరంగా ఉందనుకుంటున్నాడు ఆ ఊరి మోతుబరి రైతు సాంబశివయ్య. పేదరికం పుట్టించిన కసితో ముంబయికి పారిపోయి ఈ రోజు పట్టు పంచె,చొక్కాలతో నున్నగా తయారయి తిరుగుతుంటే,బక్కమనిషి పాపాలన్నో చేసికాని ఇంత సంపాదించలేడని ఊరంతా  నోటి దండోరా వేస్తున్న అందరికీ తెలుసు అమ్మకాలు,కొనుగోలులో రాముడు ఆరితేరినవాడని,ఇప్పుడదే సూత్రాన్ని నిర్మాణాల్లో కూడా ప్రయోగించే ఉంటాడని,అందుకే చేసిన పాపాలకు పరిహారంగా తన ఊరిలో రామాలయాన్ని నిర్మించి పాపాలు కడిగేసుకోవాలని చూస్తున్నాడని చాటుమాటుగా చెవులకు తగినంత వనరులందిస్తున్నారు.మరి చెవిన పడిన మాట నోరు రిమోట్ లేని నాలుక సహాయంతో విశ్వవ్యాప్తం చేయాలని ప్రయత్నిస్తోంది. “చూడండి సాంబశివయ్యగారు,అతడీరోజు ముంబయిలో పెద్ద బిల్డరు.నాలుగు బహుళ అంతస్థుల భవనాలకు అధిపతి.అందరు ఆశ్చర్యపడేలా భూమినుండి ఆకాశానికి ఎగసిన రాకెట్ లా పేదరికంనుండి ధనవంతుడిగా తనను తాను రూపుదిద్దుకున్నాడు.” “ఎన్నిపాపాలు చేసుంటాడో! సాంబశివయ్య గొంతులోవ్యంగ్యం తారస్థాయిలో పలికింది. ‘ ఇతడికి గుడి కట్టించిన రాముడి గురించి చెప్పేకన్నా గుడిలో రాముడి గురించి చెప్పటం మేలు’ అనుకున్నాడు సురేష్. “ ఇంతకీ మీరు విగ్రహప్రతిష్ఠకు వస్తున్నారా లేదా?”అనుమానంగా అడిగాడు సురేష్. “ ఏం మాటయ్యా అది,ఎందుకురాను? దేవుడేం చేస్తాడు, పాపాలు చేసి సంపాదించి నాకు డికట్టమని అడుగుతాడంటావా?” “ సరే మరి, బయలుదేరుదాం లేవండి.”  వీరు లేవడం చూసి మరికొందరు రైతులు కూడా వీరివెంట నడిచారు. అందరిలోను  పాపపుణ్యాల మథనమే.ఏదైనా మాట్లాడాలన్నా మాటలు తిరిగి తిరిగి అదే చర్చకు వేదికవుతున్నాయి. “ మీకు నాకు మధ్య వాదనలెందుకుగాని, పదండి అందరు అప్పుడే వచ్చేసారు.” బశివయ్యను చూసి ఆప్యాయంగా దగ్గరకు వచ్చాడు రాముడు. “ పెద్దవారు క్రింద కూర్చోగలరా ప్రతిష్ఠ పూర్తయేవరకు?” ఆతృతగా అడిగాడు రాముడు. “నీకంటే పెద్దవాడిని కాదులే!” అంటూ క్రిందపరచిన చాపపై కూర్చున్నాడు సాంబశివయ్య. కలుక్కుమన్నమనసుతో మౌనంగా ముందుకు కదిలాడు రాముడు. “ పనేదైనా ఉందా రాముడూ..” అని ఆప్యాయంగా పిలుస్తూ రాముడిననుసరించాడు సురేష్. “ మీరొక్కరే మాస్టారూ రాముడూ, అంటూ ఆప్యాయంగా పిలుస్తున్నారు. అందరు రాముడుగారూ అని పిలుస్తూ ప్రక్కకు జరిగిపోతుంటే ముంబయికి వెళ్లి నా ఆత్మీయులకు దూరమయానా అనే బాధ కలుగుతోంది.” “ దానికి బాధెందుకు రాముడూ నువ్వు పట్టుదలతో ఎదిగావు, కావలసినదానికన్నా ఎక్కువే సంపాదించుకున్నావు.నువ్వు పుట్టిన ఊరికి చక్కటి దేవాలయాన్ని కట్టించి విగ్రహప్రతిష్ఠ చేయిస్తున్నావు.ఇంతకన్నా భాగ్యం ఉంటుందా.పద అటు హోమం దగ్గర కూర్చుందాం.”   కాంతివంతంగా వెలుగుతున్న హోమాన్నే తదేకంగా చూస్తున్నాడు రాముడు. ‘ పాపాలు  తోడిపోస్తున్నాడేమో’ మనసులోనే విమర్శను నాటుకుని అటుతిరిగి నవ్వుకున్నాడు సాంబశివయ్య. అలా తిరిగినపుడు  మరోకోణంలో కనబడ్డ దృశ్యాన్ని ఆసక్తిగా చూసాడు. పూల మాలలు,విడి పూలు  తన మనుషులద్వారా అమ్మిస్తున్నాడు పూలతోటవేసి అమ్మకాలు లేక విలవిలలాడిన క్రిష్ణప్ప. కొబ్బరికాయలు, కర్పూరం, సాంబ్రాణి, వత్తులు, పసుపు, కుంకుమ వంటి పూజసామాను అమ్ముతున్నాడు మొన్నటి దాకా  గోలీలాడుకుంటూ తండ్రి దగ్గర చీవాట్లు తిన్న మల్లన్న. ప్రసాదంగా లడ్డు,పులిహోర అందంగా ఆకు దొన్నెలలో నోరూరిస్తున్నాయి. విగ్రహప్రతిష్ఠ జరుగుతోంది.భక్తిభావంతో అందరు లేచినిలబడి తన్మయత్వానికి లోనవుతున్నారు.తమకీ అవకాశం కల్పించిన దేవుడికి నమస్కరిస్తూ తీర్థప్రసాదాలకు వేచి చూస్తున్నారు.అయితే అటు పూలు అమ్మే క్రిష్ణప్ప, కొబ్బరికాయలు,పూజసామాను అమ్మే మల్లన్న,చివరకు గుడి బయట వదలిన చెప్పులకు కావలి ఉండే కుర్రాడు చంద్రం గుడిలోని రాముడినే కాదు,తమకింత ఆధారం కల్పించిన గుడిని నిర్మించిన రాముడినీ మనసారా దీవిస్తూ మనసులోనే నమస్కరించుకుంటున్నారు. ప్రసాదాన్ని కళ్లకద్దుకుని ఆప్యాయంగా తింటున్నారు భక్తులు. ప్రసాదానికై అప్రయత్నంగా చెయ్యి చాచాడు సాంబశివయ్య.లడ్డులోని మాధుర్యం అతడి ఆలోచనలోని చేదు భావాలకు తియ్యదనాన్ని అలదుతోంది. రామనామస్మరణతో దేవాలయ ప్రాంగణం మార్మ్రోగిపోతోంది. “ ఇప్పుడు మన ఇష్టదైవం రాముడికి గుడి కట్టించిన మన రాముడు గారు మాట్లాడుతారు.” పూజారి చేతినుండి మైకందుకున్న రాముడు  చిన్న చిరునవ్వే పలకరింపుగా  అందరినీ ఓ మారు చూసాడు.కొందరి కళ్లలో ప్రశంస,మరికొందరి కళ్లలో అనుమానాలు, అయితే అందరిలోను అదోరకమైన ఉత్సుకత! “ఈ దేవాలయ నిర్మాణాన్ని ఎలా చేయగలిగాడనే ప్రశ్న మీ అందరిని తొలుస్తోంది.అవునా ?”రాముడి గొంతు గంభీరంగా పలికింది. “దీనికి సమాధానం చెప్తాను కాని మీరు నన్ను మునుపటిలాగే ఆప్యాయంగా రాముడూ అని పిలవాలి మరి.” అందరు చిరునవ్వుతో తలలూపారు. ముంబయిలో నేను ముందు నేర్చుకున్నది వ్యాపార లక్షణాలు.అందులో మొదటిది కష్టపడటం,ఆ తరువాతది కష్టపడటమే,అలా అలా చివరివరకు కష్టపడటమే!అయితే నా కష్ట ఫలితాన్ని నాకు జన్మనిచ్చిన గ్రామంతో పంచుకోవాలనిపించింది.  ఆ కోరికే రామాలయమైంది. మీరనుకున్నట్లు అక్రమాలు,మోసాలు,కుతంత్రాలు లేని సంపాదనే ఇది. సంపాదించుకున్నవారిని చూసి సులభంగా ఎందరిని మోసం చేసాడో అంటారు. కష్టపడే తత్వం ఉన్నవాడికి ఒకరిని మోసం చేయాల్సిన పనిలేదు, పని చేయాలన్న వ్యామోహం ఉంటే చాలు. నా ఆరాధ్య దైవం రాముడి దయతో నేను దేవాలయ నిర్మాణం కావించగలగడం నా పూర్వజన్మ సుకృతంగానే భావిస్తున్నాను. సురేష్ మాస్టారి సలహాలు నాకు రామబాణాలే! ఇక చేయాల్సిందేమీలేదు అనుకోవడంలేదు. పాతబడిన మన బడికి అదనపు గదులు,గుడి పూజారులకు వసతి గృహాలు,గుడి ప్రాంగణంలోనే చక్కని వివాహవేదిక కట్టించాలని నా కోరిక. ఇప్పటికిప్పుడు కాకపోవచ్చు. మీ సహకారముంటే త్వరలోనే ఆ పనులు కూడా పూర్తి చేస్తాను.” “మా సహకారం నీకెప్పుడు ఉంటుంది. మనుషులెపుడు తమకలవాటైన ఒకే కోణంలో ఆలోచిస్తారు. కాని మరో కోణంలో ఆలోచించగలిగితే ఇన్ని అపోహలు, అపార్థాలు ఉండవు,అనుమానాలు దరిచేరవు. శ్రమపడే నీ తత్వం మన ఊరి యువతకు ఆదర్శం కావాలి రాముడూ. అంటూ రాముడి భుజాన్ని ఆప్యాయంగా  చరిచాడు సాంబశివయ్య. సురేష్ ముఖంలో ఆనందం,రాముడి కళ్లలో ఆనందభాష్పాలు. రామ రామ జయ రాజారామ  రామ రామ జయ సీతారామ రఘుపతి రాఘవ రాజా రామ  పతితపావన సీతా రామ. రామనామ స్తోత్రాలు ప్రతిధ్వనిస్తున్నాయి. - సి.ఉమాదేవి.    

చిలక పలుకులు

అనగనగా ఒక మంచాయన ఉండేవాడట. వాళ్ళ ఊరికి దగ్గర చాలా పండ్ల తోటలు ఉండేవి. పండ్లని తినేందుకు చిలకలు, వగైరా పక్షులు వచ్చేవి. అందుకని వాటిని పట్టుకునే వేటగాళ్లు కూడా చాలానే మంది తిరుగుతూ ఉండేవాళ్లు, ఆ ప్రాంతంలో. మంచాయనకి ఎప్పుడూ ఈ చిలకల్ని చూసి జాలి వేసేది- "ఇంత ముద్దు ముద్దు చిలకలు, అన్యాయంగా వేటగాళ్ల పాలవుతున్నాయే!" అని బాధ పడగా పడగా, చివరికి ఆయనకు ఓ ఉపాయం తట్టింది. చిన్న వయసులో ఉన్న ఓ ఇరవై చిలుకల్ని పట్టుకొచ్చి, వాటికి ఈ పాట నేర్పించటం మొదలు పెట్టాడు శ్రద్ధగా : "వేటగాడు వస్తాడు, జాగ్రత్త- దొరకద్దు! వల విసురుతాడు, జాగ్రత్త- అటుపోకు! గింజలు చల్లుతాడు, జాగ్రత్త- తినకు! అసలు ఏమాత్రం ఆశపడకు!" అని. చిట్టి చిలకలు అన్నీ ఆ పాటని బాగా నేర్చుకున్నాయి. ఏ కొంచెం ఖాళీ సమయం దొరికినా, అవన్నీ చక్కగా గొంతెత్తి పాడేవి- "వేటగాడు వస్తాడు, జాగ్రత్త. దొరకద్దు..." అంటూ. ఇట్లా ఓ ఏడాది పాటు ట్రెయినింగ్‌ ఇచ్చాక, మంచాయన వాటిని అడవిలోకి తీసుకెళ్లి వదిలేసాడు. 'అక్కడ అవి ఎట్లా ఉంటాయో చూద్దాం' అని, వాటికి కనబడకుండా ఒక మూలన నక్కి కూర్చున్నాడు.     అంతలోనే అటుగా వచ్చాడు, ఒక వేటగాడు- గింజలు, బుట్టలు, వలలు అన్నీ పట్టుకొని వచ్చాడు. చెట్టు మీద వాలి ఉన్న చిలకల్ని చూసి చిరునవ్వు నవ్వాడు. అక్కడికి దగ్గర్లోనే వల పరచటం మొదలు పెట్టాడు. వెంటనే చెట్టుమీది చిలకలన్నీ ఒక్క గొంతుతో పాడటం మొదలు పెట్టాయి. "వేటగాడొస్తాడు, జాగ్రత్త! దొరకద్దు, జాగ్రత్త! వల విసురుతాడు, జాగ్రత్త! అటుపోకు! గింజలు చల్లుతాడు, జాగ్రత్త! తినకు! అసలు ఏమాత్రం ఆశపడకు!" అని. అది వినగానే వేటగాడి ముఖం వాడి పోయింది. "అయ్యో! చేతికందే చిలుకలు చేజారినయ్యే! వీటికి నా గురించి అంతా తెలిసిపోయింది!" అనిపించి ఏడుపు వచ్చినంత పనైంది. నిరాశగా వాడు తన వలని ఎత్తేసి వేరే చోటికి పోబోయాడు. అప్పటివరకూ పొదల చాటున కూర్చున్న మంచాయనకి వేటగాడి ముఖం చూసి నవ్వు వచ్చింది. 'తను చేసిన పని వల్ల ఇన్ని చిలుకలకు మేలు జరిగింది కదా!' అని కొంచెం గర్వంగా కూడా అనిపించింది. మాటులోంచి బయటికి వచ్చి ఆయన వేటగాడితో అన్నాడు: "ఇన్ని సంవత్సరాలుగా వీటి అజ్ఞానాన్ని ఆసరాగా చేసుకొని బ్రతికాం; ఇప్పుడు వీటికి అసలు సంగతి తెలిసిపోయింది! ఇక ఇవి ఎవ్వరికీ దొరకవు- అయినా ఒక పని చెయ్యి. నీ దగ్గర ఉన్న కాసిని గింజలు కూడా చల్లెయ్యి. నాకు తెలిసి అవేవీ నీ వలలో పడవు; నువ్వు చల్లే గింజలు వృధానే అవుతాయి! అయినా చింతలేదు- నువ్వు వేసే శేరు గింజలకు గాను నేను నీకు నాలుగు శేర్ల గింజలు ఇస్తానులే, ఈ ఒక్కసారికీ. నేను ఊళ్ళోనే ఉంటాను- తర్వాత నీకు వీలు కుదిరినప్పుడు ఎప్పుడైనా వచ్చి, గింజలు పట్టుకుపో!" అట్లా అని, ఆయన నవ్వుకుంటూ ఇంటిదారి పట్టాడు. వేటగాడు మరింత కృంగిపోయాడు. నిరాశతో వలని ఎత్తేయబోయిన వాడల్లా ఆగి, "సేరుకు నాలుగు సేర్లు గింజలు ఇస్తానంటున్నాడు కదా, ఈ మంచాయన? గింజలు చల్లే పోతానులే!" అని వలమీద అట్లా అట్లా కొన్ని గింజలు చల్లాడు- అంతే- మరుక్షణం చిలకలన్నీ గబగబా ఎగురుకుంటూ వచ్చి వలమీద వాలాయి! ఆశగా గింజల్ని తినబోయాయి! అన్నీ వలలో చిక్కుకున్నాయి! కొద్ది సేపు గందరగోళం తర్వాత అన్నీ వలలోంచే పాడసాగాయి : "వేటగాడు వస్తాడు జాగ్రత్త... వల విసురతాడు. జాగ్రత్త,.. అటుపోకు..." అని!     వేటగాడు గింజలు ఇప్పించుకునేందుకు మంచాయన దగ్గరికి వెళ్ళి, ఏం జరిగిందో చెప్పాడు. చెప్పి చిలుకల్ని చూపించాడు మంచాయనకు. ఆయన నిర్ఘాంతపోయాడు: "నేను ఇన్ని జాగ్రత్తలు చెప్పానే; అవన్నీ వాటికి నోటికి వచ్చాయి కదా చక్కగా?! అయినా మరి వేటగాడికి ఎలా చిక్కాయి?! నోటికి రావటం, నిజంగా తెలీటం రెండూ వేరా?" అని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. చాలాసార్లు మనమూ ఇట్లా చిలుకలలాగా ప్రవర్తిస్తాం. మనం నేర్చుకున్న సంగతులని ఎప్పటికప్పుడు మన జీవితాలకు అన్వయించుకోం. చిలుక పలుకులలాగా నేర్చుకొని మాటల్లో వెలువరించేవి ఎంత గొప్ప సంగతులైనా గానీ, రోజువారీ జీవితంలో మన ప్రవర్తనకు అంటలేదంటే, ఇక వాటివల్ల అంతిమంగా ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

ఒక వాహన చోదకుడి కథ

  కొద్ది సేపటి లో ప్రారంభమయ్యే నా ఉపన్యాసానకి రంగం సిద్ధం చేసుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత, తెలుగు గడ్డపై తెలుగులో మాట్లాడబోతున్నాను. పైగా ముఖ్య అతిథి ఎవరో కాదు ముఖ్యమంత్రి గారు.  “నా విజయానికి ముఖ్య కారణం - నా శ్రమ, పట్టుదల ఇంకా వీటికి తోడు.. ధనూక వారి పురుగుల మందు...” చి ఛీ ఇది చిన్నప్పుడు ఆకాశవాణి లో వచ్చిన వాణిజ్య ప్రకటన.   అలా కాదు “నా విజయానికి ముఖ్య కారణం నా శ్రమ, పట్టుదల, ఇంకా నా బలహీనత. బలహీనత లేకపోతే సమాజానికి ప్రగతి ఉండదు”..  అవును నా బలహీనతే నన్ను ముందుకు నడిపించింది, ఈనాడు నన్ను మీ ముందు ఇలా నిలబెట్టింది. అదేమిటో తెలుసుకోవాలంటే నా ఏడో తరగతికి వెళ్ళాల్సిందే. అప్పుడు నా పుట్టిన రోజుకి నాన్న బహుమతిగా సైకిల్ కొనిచ్చారు. ఆ రోజు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయిపోయాను.  మేము అప్పుడు ఒక పల్లెటూరిలో డాభా ఇంట్లో ఉండే వాళ్ళం. సైకిల్ కొన్నాక, నాన్న రోజూ మా పల్లెటూళ్ళో చిన్న రోడ్డు మీదకి సైకిల్ నేర్పటానికి తీసుకుని వెళ్ళేవారు. నేను భయంతో గట్టిగా తొక్కి వేగంగా వెళ్లి పోయేవాడిని. ఎవరైనా మనిషి కనిపిస్తే మటుకు చేతులు వణికిపోయి, వెంటనే బ్రేక్ పడిపోయేది. ఆ వెంటనే భళ్ళు మన్న శబ్దం. మోచిప్పలూ, మోకాళ్ళు కొట్టుకు పోయేవి. ఒక వారం తేరుకున్నాక మళ్ళీ అదే పరిస్థితి పునరావృతం అయ్యేది.  ఇలా అయితే లాభం లేదు అనుకుని, ఒక ఆదివారం నాడు మా నాన్న మనుషులు ఎవరూ కనిపించని ప్రభుత్వ బడికి తీసుకువెళ్లారు. అక్కడ స్కూల్ చుట్టూ రౌండ్లు వేయమని వదిలేశారు. నేనేదో నా తిప్పలు పడుతుంటే, ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఒక అమ్మాయి పెద్ద సైకిల్ వేసుకుని వచ్చింది. ఆమె వయసు ఒక పదేళ్లు ఉంటాయేమో! నా ముందరే వేగంగా రౌండ్లు వేస్తూ, “నీకు రాదా!” అన్నట్టు నా వైపు చూసి పకపకా నవ్వింది.  అంతే, నాకు పౌరుషం పొడుచుకు వచ్చింది. మనుషులు కనిపిస్తుండగా నేను డ్రైవింగ్ నేర్చుకోనని మొరాయించాను.  “నర మానవుడు కనిపించకూడదంటే ఎలాగ రా?” అని నాన్న అడిగితే,  డాభా వైపు చూసాను.  మర్నాడు సైకిల్ ఇంటి డాభా మీద ప్రత్యక్షం అయ్యింది.  అప్పటి నుండి మగ మహారాజు సినిమా లో చిరంజీవి లాగా మూడేళ్లు మేడ మీద సైకిల్ తొక్కుతూనే ఉన్నాను.  ఎట్టకేలకు పదవ తరగతిలో ఒక రోజు ధైర్యం చేసి సైకిల్ తొక్కుకుంటూ రోడ్డు మీదకి వెళ్ళాను. ఒక అర కిలో మీటర్ బాగానే నడిపాను. అప్పుడే ఒక చిక్కు సమస్య ఎదురయ్యింది. రోడ్డు దాటటం కోసం సిగ్నల్ ఇవ్వాలి అంటే చేయి ఎత్తాలి. చేయి ఎత్తగానే బ్యాలెన్స్ తప్పి పడిపోవటం, వెనుక నుండి వస్తున్న కార్ సడన్ బ్రేక్ వేసి ఆగిపోవటం - అన్నీ క్షణాల్లో జరిగిపోయాయి.   చావు తప్పి కన్ను లొట్టబోయి, సైకిల్ ఈడ్చుకుంటూ ఇంటికి వచ్చిన నన్ను చూసి మా నాన్న “నువ్వు మళ్ళీ సైకిల్ ఎక్కితే ఊరుకోను” అని గట్టిగా కేకలేశాడు.  అయినా వెధవది, సైకిల్ ఎక్కాలి, తొక్కాలి, బ్యాలెన్స్ చేయాలి – అది నా వల్ల కాదులే అని ఈ సారి పూర్తిగా చేతులెత్తేశాను.  అప్పటి నుండి బయట తిరుగుళ్ళు లేకపోవడం తో శ్రద్ధగా చదివి మెకానికల్ ఇంజనీరింగ్ లో చేరాను.  కాలేజీలో చేరాక రోజూ కొంత మంది  కాలేజీ  అబ్బాయిలు సైకిల్ మీద చేతులు ఎత్తేసి తొక్కుతూ, అమ్మాయిల ముందు ఫోజు కొట్టేవారు. ఇంకొంత మంది రయి రయి మంటూ బైక్ తో ఫీట్లు చేసేవారు. నేను ఆ సౌభాగ్యానికి నోచుకోక పోవటం తో నాకు  ఒక్క గర్ల్ ఫ్రెండ్ కూడా తగలలేదు. రోజూ కాలేజీకి బస్ లోనే వెళ్ళి వచ్చేవాడిని. అలా రెండు సంవత్సరాలు బస్సు రాకపోకలతో గడిచిపోయింది. ఒక రోజు నేను ఎక్కాల్సిన బస్ దూరం నుండే కదిలిపోవడం గమనించాను. అయ్యో, ఆలస్యమైపోయిందే అని నెత్తిన చేతులు వేసుకుని నుంచున్నాను. కొద్ది సెకను లలో బస్ ఆగిపోయింది. బస్ లో నుండి ఒక అమ్మాయి వంగి రమ్మన్నట్టు చూసింది. అంతే, ఆ క్షణంలో ఆమె నాకు బాహుబలి లో అవంతిక లాగా కనిపించింది. నా శక్తినంతా కూడదీసుకుని పరుగు అందుకున్నాను. ఆమె నాకు చేయి అందించి బస్ లోపలికి లాగింది.  నాకు ఖాళీ సీట్ చూపించి, ఆ అమ్మాయి ఫుట్ పాత్ దగ్గరే ఉండిపోయింది. అంత ధైర్యం, దర్జాగా ఉన్న ఆమెని అలా చూస్తూనే ఉండిపోవాలని అనిపించింది.  ఆమె సరిగ్గా మా కాలేజీ ముందే దిగి లోపలికి వెళ్లిపోతుంటే కొందరు పోకిరి వెధవలు అడ్డుకున్నారు.  “ఏంటి ఫ్రెషర్ నా? స్వంత డబ్బా చెప్పి లోపలికి వెళ్లాలని తెలీదా?” అని చేయి అడ్డు పెట్టి ఆపేశారు.  “పేరు రంహిత, కరాటే బ్లాక్ బెల్ట్, కంప్యూటర్ ఇంజనీరింగ్. ఇంకా ఏమైనా కావాలా?” అని గుడ్లురిమి చూస్తూ, చేతుల గాజులు వెనక్కి పెట్టింది.  అంతే, వెంటనే ఆమెకి అడ్డు తొలగి లోపలికి వెళ్ళిపోయింది.  “అమ్మాయి బాగా ఫాస్టు రోయ్, “ అని ఒకడు, “రంహిత ట రోయ్, మంచి రమ్ము తాగే దమ్ము ఉన్న పిల్ల” అని ఇంకొకడు ఆ కుర్ర వెధవల కామెంట్లు. అయినా నాకు తెలీక అడుగుతాను - అమ్మాయి ఫాస్టుగా ఉంటే తప్పేమిటి ట? ఆ క్షణంలోనే ఆమె నా హృదయాన్ని తడిమింది.  మర్నాడు తొందరగా బస్ ఎక్కి ఆమె కోసం ఎదురు చూశాను. బస్ కదిలిపోయినా ఆ అమ్మాయి కనిపించలేదు. ఉసూరు మానుకుంటూ సీట్లో కూర్చున్నాను. కొద్ది సేపటికి కిటికీ లో నుండి ఆమె వేగంగా స్కూటర్ మీద వెళ్ళిపోవటం కనిపించింది. ఆ నిమిషం లోనే ఆ అమ్మాయి వాయువేగంతో నా గుండెల్లొకి దూసుకెళ్లిపోయింది.  ఇంక తప్పదు అనుకుని ఒకరోజు మా ఫ్రెండ్ స్కూటర్ అడిగి తీసుకున్నాను. “ఇలా కిక్ చేస్తే స్టార్ట్, అలా వెళ్ళిపోవటమే” అన్నాడు. సరే కదా అని స్టార్ట్ చేశాను. స్కూటర్ అలా వేగంగా వెళ్లిపోతోంది. “మేఘాలలో తెలిపోతున్నది” అని పాట పాడుకుంటూ, ఆమెను ఊహించుకుంటూ కొద్ది దూరం వెళ్ళాను. ఇంక ఆపేద్దాం అనుకుంటే ఎలా ఆపాలో తెలీలేదు. భయంతో హ్యాండిల్ తిప్పటం వల్ల స్కూటర్ వేగం ఇంకా ఎక్కువ అయ్యింది.  సైకిల్ అయితే బ్రేక్ వేసే పని, మరి స్కూటర్ కి ఏమి చేయాలబ్బా?  ఆ గందరగోళం నుండి బయట పడటానికి కాలు క్రిందకు పెట్టి కాలు తో ఈడుస్తూ స్కూటర్ని వదిలేసి దూకేశాను. స్కూటర్  నేల మీద పడి పల్టీలు కొడుతుంటే, మా ఫ్రెండ్ గాడు ఎక్కడి నుండో పరుగున వచ్చి బండి ఆపేశాడు. “ఒరేయ్ చెప్పడం మర్చిపోయాను, ఈ స్విచ్ నొక్కితే బండి ఆగిపోతుంది రా” అన్నాడు. అదేదో వాడు ముందే అఘోరిస్తే బాగుండేది కదా. వాడు అప్పటికే బండి నిండా సొట్టలు పడ్డాయని గుడ్ల నీళ్ళు గుడ్ల కుక్కుకున్నాడు, ఇంకేమనేది పాపం. ఇంక నేను మళ్ళీ ఎవరినీ స్కూటర్ అడిగిన పాపాన పోలేదు.   అప్పుడే సరిగ్గా రంహిత నవ్వు వినిపించింది. అది ఎక్కడో బాగా తెలిసిన నవ్వులా అనిపించింది. ఈ సారి నవ్వులో వెటకారం లేదు, జాలి ఉంది. ఆ నవ్వు నా గుండెని కుమ్మేసింది.   అయినా ఉద్యోగం పురుష లక్షణం అన్నారు కానీ డ్రైవింగ్ పురుష లక్షణం అన్నారా? అందుకే ఈ డ్రైవింగ్, అమ్మాయిలు గొడవ మానేసి కొన్నాళ్ళు బుద్ధిగా చదువుకుందామనుకున్నాను. కాలేజీ చివరి సంవత్సరంలో కార్ల గురించి, వాటి డిజైన్ ల గురించి తెలుసుకుని, కార్ల మీద మమకారం పెరిగింది. కార్ అయితే లోపల కూర్చుంటాము కాబట్టి  మనకి దెబ్బలు తగలవు, ప్రమాదం ఉండదు. ఇక బ్యాలెన్స్ గోల అసలే ఉండదు.  రాత్రి పగలు కష్టపడి, ఒక కార్ల కంపనీలో ఉద్యోగం తెచ్చుకున్నాను. యూనివర్సిటీ లో గోల్డ్ మెడల్ కూడా సంపాదించాను. ఉద్యోగంలో చేరిన మొదటి నెల డ్రైవింగ్ స్కూల్ లో చేరాను.  డ్రైవరు నన్ను స్టీరింగ్ పట్టుకోమన్నప్పుడు మహారాజా వారి సీట్ ఎక్కినంత సంబర పడ్డాను. కానీ స్టీరింగ్ పట్టుకోగానే నా చేతులు వణకటం మొదలు పెట్టాయి. అయినా పక్కన అతడు ఉన్నాడన్న ధైర్యం తో నడపటం మొదలు పెట్టాను. కార్ ముందు నడుస్తున్న వాళ్ళు దగ్గరగా ఉన్నారో, దూరంగా ఉన్నారో అర్థం కాని అయోమయం లో ఒకరిద్దరిని గుద్దబోయాను. డ్రైవరు బాబు ప్రక్కనే ఉండబట్టి వెంటనే అపాయాన్ని ఆపాడు.   అయినా అందరూ మొదట్లో ఇంతేగా అనుకున్నాను, కానీ అది ఆ ఒక్క రోజుతో ఆగలేదు సుమా! అలా మూడు గేరులు, ఆరు బ్రేక్లుగా సాగిపోతున్న నా ప్రయాణానికి ఒక రోజు హ్యాండ్ బ్రేక్ పడింది.  మరునాడే డ్రైవింగ్ టెస్ట్. అదే రోజు డ్రైవర్ కారుతో ఎనిమిది అంకె వేయమని చెప్పాడు. నేను కారుని అష్ట వంకర్లు తిప్పుతూ,  కారుకి ఢక్కా మొక్కీలు తినిపించే సరికి, డ్రైవరు లబోదిబో మన్నాడు.  “ఎనిమిది వేయడం అంటే ఇలా కాదు” అని వాపోయాడు.  చివరకు పరీక్ష రోజు రానే వచ్చినది. నేను పరీక్షకు సన్నద్ధమవుతుండగా, డ్రైవరు ఎవరితోనో మాట్లాడుతూ డబ్బులు ఇవ్వటం చూశాను.  అతడు లోపలికి వచ్చి “ఇక వెళ్దాం పదండి” అన్నాడు. “అదేమిటి? మరి నా లైసెన్సు?” అన్నాను.  “అది వస్తుంది లెండి” అని స్టీరింగ్ పట్టుకున్నాడు.  “పరీక్ష ఇవ్వకుండా ఎలా వస్తుంది?” అని నిలదీశాను.  కారు వెనక్కి తిప్పి “మీరు ఒక రెండు వేలు మీవి కాదు అనుకోండి” అన్నాడు.  “అదేమిటయ్యా, నేను ఎనిమిది అంకె  వేసి టెస్ట్ పాస్ అయ్యే వాడిని కదా” అని కోపంగా అరిచాను.  నా వైపు చూసి “అప్పుడు మీకు సున్నా వస్తుంది సారు! ఆ కష్టం మీకు ఎందుకండి, అయినా మీకు లైసెన్సు కదా కావాలి నేను ఇప్పిస్తా” అని నవ్వాడు.  అవమానంతో నా తల కొట్టేసినట్టు అయ్యింది. పరీక్ష రాయకుండా లైసెన్సు తీసుకోవడానికి నా నిజాయితీ అడ్డు వచ్చింది. ఇంటికి వచ్చాక సోఫాలో విసురుగా కూర్చుని, టివి పెట్టాను. టి వి లో విరాట్ కోహ్లీ వాణిజ్య ప్రకటన చూసి పుండు మీద కారం చల్లినట్టు అయ్యింది. కోహ్లీ కారు తోలుతుంటే, అమ్మాయిలు నోరు తెరిచి చూస్తున్నారు.  నేను కోపం తో కళ్ళు మూసుకుంటే కారులో రంహిత, ఆమె చుట్టూ నోరు వెళ్లబెట్టుకుని చూస్తున్న మగవాళ్లు కనిపించారు. నా కోపం నశాలంకి అంటి రిమోట్ విసిరి పుచ్చుకుని పారేశాను.  కాసేపటికి అమెరికా లో ఉన్న మా ఫ్రెండ్ ఫోను చేశాడు. వాడు కొన్న కొత్త కారు చూపిస్తూ “ఒరేయ్ ఇక్కడ అమెరికాలో డ్రైవింగ్ చాలా సులువు, ట్రాఫిక్ పెద్దగా ఉండదు” అని బడాయిలు పోయాడు.  రెండు సంవత్సరాల తరువాత నాకు అమెరికా వెళ్లాల్సిన అవకాశం వస్తే వదులుకోలేదు. డాలర్ ల కోసం కాదు, డ్రైవింగ్ కోసం.  తీరా అమెరికా వెళ్ళాక వాడు చెప్పింది అబద్ధం అని అర్థం అయ్యింది. కుడి ఎడమైతే పొరపాటు లేదు అని దేవదాసు చెప్పాడు కానీ ఇక్కడ డ్రైవరు ఎడమ వైపు, కార్ కుడి వైపు. మన దేశంలో తోలేదానికి పూర్తి వ్యతిరేకం. మళ్ళీ అయోమయం, గందరగోళం షరా మామూలే. ఎలాగో కుస్తీ పడి నేర్చుకుని తోలితే, డ్రైవింగ్ రూల్స్ సరిగ్గా పాటించలేదు అని ట్రాఫిక్ పోలీసులు నా వెంట పడి ఐదు వందల డాలర్లు వసూలు చేశారు. అక్కడితో నా డ్రైవింగ్ జబ్బు వదిలి పోయింది.  అలా నేను సతమతమవుతున్న సమయంలో బుగుల్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఒక్క ఐడియా నా జీవితాన్నే మార్చేసింది.  “ఇప్పుడు  పెస్లా కంపెనీ అధనేత సుబ్బారావ్ గారు ప్రసంగిస్తారు” అని ఎవరో వేదిక మీదకి పిలిచేసరికి వర్తమానం లోకి వచ్చాను. స్టేజ్ మీదకి వెళ్ళి నా ప్రసంగం మొదలు పెట్టాను.  “ఒకప్పుడు డ్రైవింగ్ అంటే భయ పడ్డ  నేను, ఇప్పుడు భారత దేశం లో ఏ మూలలో నైనా అవలీలగా డ్రైవింగ్ చేయగలను. నా వంటి రోడ్డు భీతి ఉన్న వాళ్లందరికీ ఉపయోగపడాలనే సంకల్పంతో నేను మన దేశానికి వచ్చి, ఈ పెస్లా సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. బుగుల్ లో నేను నేర్చుకున్న పరిజ్ఞానాన్ని అంతా ఉపయోగించి, మన దేశానికి సరిపోయేలాగా ఈ కార్లు తయారు చేశాను.  ఇంక మన దేశం నలుమూలలా దూసుకెళ్లి పోదాం రండి” అన్న నినాదంతో ముగించాను.  కరతాళ ధ్వనుల మధ్య ముఖ్యమంత్రి గారు వచ్చి మొదటి కారు రిబ్బన్ కత్తిరించారు. నేను కారులో ఎడమ వైపు కూర్చున్నాను. నా శ్రీమతి, అతిధులు  అందరూ నా వెనుకే కూర్చున్నారు. సీటు బెల్ట్ పెట్టుకున్నాక శరవేగంతో సాగిపోతోంది, డ్రైవరు అవసరం లేని, కృత్రిమ మేధస్సుతో చేసిన స్వయం చోదక కారు.  “వావ్ సుబ్బారావ్, కొత్త భార్య, కొత్త కారు..” వెనుక నుండి ఎవరో అన్నారు. భార్య క్రొత్తదే  కానీ పరిచయం పాతదే. ఒకప్పుడు ఏడో క్లాస్ లో నన్ను వెక్కిరించిన పిల్ల, కాలేజీలో నన్ను కవ్వించిన రంహిత, తరువాత బుగుల్ లో నా సహోద్యోగి - ఈనాడు నా జీవిత భాగస్వామి, ఇంకా నా వ్యాపార భాగస్వామి. మరి మిగిలిన అతిథులు ఎవరంటారా? ఇంకెవరు? మా నాన్న, నాకు బైక్ ఇచ్చిన ఫ్రెండ్, ఇంకా నాకు కార్ డ్రైవింగ్ నేర్పిన డ్రైవరు.  (మనలో మన మాట – ఇప్పుడు ఈ కారు కి ఏ సమస్య వచ్చినా వీళ్ళు అందరూ నా వెనుక ఉన్నారనే ధైర్యం.)  -   సౌదామినిశ్రీపాద  

రోడ్డుమీదపాప

రోడ్డుమీదపాప   ఐరోపా ఖండంలో ఇటలీ దేశం ఉంది. అక్కడ అలెస్సాండ్రో, రెవిల్డె అనే దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ల పాప పేరు మరియా. పన్నెండో తరగతి ఐపోగానే 'నేను డాక్టరునవుదామనుకుంటున్నాను, డాక్టరు చదువులు చదువుతాను' అన్నది మరియా. ఈ కథ ఎప్పటిదనుకుంటున్నారు?- 1880ల నాటిది! అంటే నూట ముఫ్పై సంవత్సరాలనాటి మాట! ఆ రోజుల్లో ఇటలీ దేశం మొత్తం వెతికినా ఒక్క అమ్మాయి కూడా‌ డాక్టరు చదువు చదవలేదు. మరి ఆ పాప అమ్మా నాన్నలు మాత్రం అందుకు ఎట్లా ఒప్పుకుంటారు? కానీ మరియా పట్టుదల మనిషి. ప్రాధేయపడి, పోరాడి చివరికి వాళ్ళ అమ్మానాన్నలను ఒప్పించింది. అటుపైన వాళ్లందరూ కలిసి కాలేజీ వాళ్లనీ‌ ఒప్పించాల్సి వచ్చింది!‌ ఎందుకంటే అప్పటివరకూ వాళ్ల కాలేజీలో వైద్యం చదివేవాళ్లందరూ‌ అబ్బాయిలే మరి! 'అంతమంది అబ్బాయిల మధ్య, ఈ ఒక్క అమ్మాయినీ ఎలా సంబాళిస్తాం, వీలు కాద'న్నారు వాళ్ళు. ఈపాప పట్టుదల చూసి చివరికి వాళ్ళూ 'సరే చూద్దాం' అన్నారు. వైద్య విద్యలో భాగంగా విద్యార్థులు అందరూ మానవ శరీరాన్ని పరీక్షించాలి. దానికోసం కాలేజీల వాళ్ళు శవాలను తెచ్చి పెడతారు. వైద్య విద్యార్థులందరూ ఆ శవాలను జాగ్రత్తగా సరైన పద్ధతిలో కోసి, శరీరంలో ఏ భాగం ఎక్కడ ఉండేదీ, ఎట్లా ఉండేదీ చూసి నేర్చుకుంటారు. ఆపరేషన్లు చేసేందుకు కావలసిన అనుభవమూ అట్లాగే కద, వచ్చేది!? అయితే అబ్బాయిలందరూ శవపరీక్షలు చేసే చోట ఈ ఒక్క అమ్మాయినీ ఉండనిచ్చేది లేదన్నారు కాలేజీవాళ్ళు. అట్లా అని శవ పరీక్షలు చెయ్యకుండా డాక్టరు ఎలా అవుతారు, ఎవరైనా? 'అందరూ వెళ్ళిపోయాక, సాయంత్రం పూట ఆమె ఒక్కతే వచ్చి శవపరీక్ష చేసుకునేట్లయితే పర్వాలేదు' అన్నారు పెద్ద డాక్టరు గారు. మరియా చాలా ధైర్యం ఉన్న పాప. 'సరేలెండి అట్లాగే కానివ్వండి' అన్నది. ఆరోజు సాయంత్రం కాగానే చక్కగా ఒక లాంతరు చేతపట్టుకొని, కాలేజీకి చేరుకున్నది.  (మీకు అనుమానం వచ్చిందా, 'లాంతరు ఎందుకు?'అని? ఎందుకంటే అప్పటికి ఇంకా కరెంటు దీపాలు కనుక్కోలేదు మనుషులు! రాత్రి అవ్వగానే ఎవరికి వాళ్ళు దీపాలు, లాంతర్లు వెలిగించుకోవాల్సిందే! అందుకని!) సరే, ఈ పాప కాలేజీకి చేరుకునేసరికి చీకటి పడుతున్నది. కాలేజీలో ఎవ్వరూ లేరు. ప్రయోగశాలలో చుట్టూ సీసాలు..సీసాల్లో ఫార్మాలిన్ ద్రవంలో- ఒక్కోదానిలో ఒక్కో శరీర భాగం తేలుతూ ఉన్నది- ఒక సీసాలో మెదడు, ఒక సీసాలో కాలు, ఒక దానిలో చెయ్యి, ఒకదానిలో గుండె- ఇలాగ. అంతటా నిశ్శబ్దం అలుముకుని ఉన్నది. మధ్యలో బల్లమీద మానవ కళేబరం పెట్టి ఉంది, కదలకుండా పడి ఉన్నది ఒక శవం! ఆ వాతావరణాన్ని పాపం, ఊహించలేదు మరియా. క్షణంలో ఆ పాపకు విపరీతమైన భయం వేసింది. గుండెల్లోంచి తన్నుకొచ్చింది వణుకు. కళ్ళు తిరిగినట్టు, మూర్ఛ వచ్చినట్టు అనిపించింది. వెంటనే బయటికి పరుగెత్తుకుంటూ వచ్చింది. వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి పరుగు తీసింది. ఆయాసంతో ఇక పరుగెత్తలేనంత వరకూ పరుగు. అటుపైన మెల్లగా, నీరసంగా నడక. అప్పుడు గమనించింది మరియా- రోడ్డు ప్రక్కన ఒక పాప కూర్చొని ఆడుకుంటున్నది. పాప చుట్టూ అంతా మురికి, రోత, ఈగలు. అటూ ఇటూ వేగంగా పరుగులు పెడుతున్న వాహనాలు, గుర్రపు బళ్ళ శబ్దాలు. అంగళ్ల వాళ్ళు, బండ్లవాళ్ళు అరుస్తున్నారు, రొద- చీకటి. కానీ ఆ అమ్మాయి ఆడుకుంటున్నది- సంతోషంగా ఉంది. ఆ పాప చేతిలో ఉన్నది ఒక రంగు కాగితం! దాన్ని చూసుకొని మురిసిపోతున్నది ఆ పాప. చుట్టు ప్రక్కల ఏం జరుగుతున్నా, ఎంత జుగుప్సాకర వాతావరణం ఉన్నా పట్టించుకోవటం లేదు- పూర్తిగా తన ఆటలో నిమగ్నమైపోయి ఉన్నది. మరియా అక్కడే నిల్చున్నది కొంత సేపు. ఆడుకుంటున్న చిన్న పాప లోని సంతోషం, ఆ చీకటి తెరల్లోంచి కూడా దూసుకు వచ్చి మరియా కళ్ళు తెరిపించింది. తన కర్తవ్యం ఏంటో గుర్తుచేసింది.    పారిపోతున్న మరియా ఒక నిశ్చయానికి వచ్చింది. వెనక్కి తిరిగి ధైర్యంగా కాలేజీ చేరుకున్నది. ప్రయోగశాలలోకి వెళ్ళి శవాన్ని కోసి పరీక్షించింది. లాంతరు వెలుగులో వివరంగా నోట్సు తయారు చేసుకున్నది. రాత్రి బాగా చీకటి పడ్డాక ఇల్లు చేరుకున్నది. ఆ తరువాత ఇక ఆమె వెనక్కి తిరిగి చూడలేదు. ఆమె నిశ్చయం ముందు నిలువలేక భయమే పారిపోయినట్లయింది. మరియా మాంటిసోరీ ఆ విధంగా ఇటలీ దేశపు మొట్ట మొదటి మహిళా డాక్టరైంది. తనకు కర్తవ్యాన్ని బోధించిన చిన్న పాపను ఆమె మర్చిపోలేదు. ఎంతోమంది మహిళలకు, పిల్లలకు మానవత్వంతో కూడిన వైద్యసేవలు అందించింది మరియా. ఒకవైపున డాక్టరుగా సేవలు అందిస్తూనే, మరోవైపున గొప్ప విద్యావేత్తగా ఎదిగి చిర స్మరణీయురాలైంది మరియా మాంటిసోరీ. - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

శిడిమాను

శిడిమాను   ఎడ్లబండి పల్లంలోకి వచ్చింది. ఒక్కసారిగా జోడెద్దులు జోరందుకున్నాయి. దాంతో పట్టుతప్పిన కావేరి వెనక్కి తూలింది. రామచంద్ర పట్టుకోనట్లయితే కింద పడిపోయేదే. "అమ్మో" అంటూ రామచంద్ర గుండెల మీద తలవాల్చి అతన్ని గట్టిగా పట్టేసుకుంది. అబ్బాయిని గట్టిగా పట్టుకొని కూర్చో అమ్మాయ్" అన్చెప్పింది రామచంద్ర తల్లి రత్నాంబ. సిగ్గుపడింది కావేరి. సరిగా కూర్చొని, పక్కనే ఉన్న కర్రను పట్టుకుంది. బండిలో కూర్చొని ఉన్న మిగతా ఆడాళ్లు ఆ జంటను చూసి ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. ఆ బండే కాదు, ఎన్నో బళ్లు వరుసగా ఒకదాని తర్వాత ఒకటిగా పోతున్నాయి, నాగార్పమ్మ శిడి ఉత్సవాన్ని చూడ్డానికి. నాగార్పమ్మ (నాగవరపమ్మ) అంటే గ్రామ దేవత. రైలుకట్ట మీదుగా కొత్త కాల్వ బ్రిడ్జి దాటి జీడిమామిడి తోటల మధ్య నుంచి ఇసుకలో పోతే అల్లంత దూరంలో మామిడి తోటల మధ్య కొలువు తీరిన నాగర్పమ్మ గుడికెళ్లాలంటే సొన దాటుకుని పోవాలి. ఎంత ఎండాకాలమైనా నీళ్లుండటం ఆ సొన విశేషం. ఎడ్ల బళ్లు సొన అవతల ఆగిపోయాయి. బళ్లు తోలేవాళ్లు బళ్లనీ, ఎద్దుల్నీ అక్కడి మామిడి చెట్లకి కట్టేసి, ఎద్దుల ముందు గడ్డిమోపులు పడేస్తున్నారు. మగాళ్లు ఫ్యాంట్లు, ఆడాళ్లు చీరలు మోకాళ్ల దాకా ఎత్తి పట్టుకుని సొనలో దిగారు. చీరెత్తి పట్టుకోవాలంటే ఎక్కడ లేని సిగ్గూ, బిడియం ఆవరించాయి కావేరిని. "నా వల్ల కాదు" అంది చిన్నగా రామచంద్రతో. "అయితే చేతుల్లో ఎత్తుకొని తీసుకెళ్లేదా?" అన్నాడు సరదాగా కన్నుగీటుతా. "ష్" అంటా కళ్లతో కాస్త కోపాన్ని అభినయించి, చీర కుచ్చిళ్లు కాస్త ఎత్తి పట్టుకుని నీళ్లలోకి దిగింది. చల్లగా తగిలాయి నీళ్లు. ఆమె చేయి పట్టుకొని, చిన్నగా నడిపిస్తూ ఇవతలకి తీసుకు వచ్చాడు రామచంద్ర. "అబ్బా" అంది కావేరి. "ఏంటి?" కంగారుగా అడిగాడు. "కాలిమీద ఏదో కుట్టింది." ఏదో అర్థమైనట్లు ఆమెను అక్కడే ఉన్న బండరాయి మీద కూర్చోబెట్టి, ఆమె కాలిని చేతుల్లోకి తీసుకుని చూశాడు. పిక్కమీద నల్లగా జలగ! గట్టిగా లాగేసి, టక్కున నీళ్లలోకి విసిరేశాడు. అప్పటికే అది నెత్తురు తాగిన దానికి గుర్తుగా ఎర్రటి చార. "ఏంటది?" అడిగింది. "అది జలగ. సిటీ అమ్మాయివి కదా, ఇప్పటి దాకా చూసుండవు. అవునా" అన్నాడు. అవునన్నట్లు తలూపింది. "ఏం కాదుగా?" అడిగింది, కాలివంక చూసుకుంటా. "ఏం కాదు. నేనున్నానుగా" ధైర్యం చెప్పాడు. గుడివద్ద గోలగోలగా అరుపులూ, "నాగార్పమ్మకీ జై" అన్న కేకలూ వినిపించాయి. "రా.. రా..." అంటూ అమెను అటు తీసుకుపోయాడు. శిడిమానును పైకి లేపుతున్నారు. పెద్ద దూలానికి చివర బోను, ఆ బోనులో మేక. దూలాన్ని పూర్తిగా పైకిలేపారు. పూజారి ఏవో మంత్రాలు చదివి, "కానీయండి" అనగానే అక్కడున్న జనం చేతుల్లోని పూలు, అరటిపళ్లు పైకి విసిరి వేస్తున్నారు. వాటిలో కొన్ని బోనుకీ, దాని లోపల ఉన్న మేకకీ తగులుతున్నాయి. రామచంద్ర, కావేరి కూడా పూలు విసిరారు. "భలే ఉంది ఈ ఆచారం. ఆ మేకనే చేస్తారు?" అడిగింది కావేరి. "అమ్మవారికి బలిస్తారు. అలా చేస్తే ఊళ్లో బాగా వానలు పడతాయనీ, కరువు కాటకాలు ఉండవనీ జనం నమ్మకం" చెప్పాడు. "అయ్యో పాపం మేక" అంది జాలిగా. "ఇప్పుడు నయం. దాని మీదకు పూలు విసిరేస్తున్నారు. ఒకప్పుడైతే టెంకాయలు విసిరేసేవాళ్లు. అవి తగిలి ఆ మేక ఎంత నరకం అనుభవించేదో." "మరి టెంకాయల బదులు పూలెందుకేస్తున్నారు?" "దానికో చిన్న కథుంది. వింటానంటే చెబుతా." "సరే" వాళ్లమ్మకు చెప్పి కావేరిని గుడి వెనకున్న మామిడి తోటలోకి తీసుకుపోయాడు రామచంద్ర. ఒక చెట్టుకింద శుభ్రం చేసుకుని కూర్చున్నారు. "ఇంత ఎండలోనూ ఎంత హాయిగా ఉందిక్కడ. ఇలాంటి చోట ఇల్లు కట్టుకొని ఉంటే ఇంకెంత బావుంటుందో" అంది కావేరి, అతడి భుజం మీద తలవాల్చి. "అమ్మాయిలో భావుకత్వం ఉబుకుతుందే" అన్నాడు, గాలికి ముఖం మీద పడుతున్న ఆమె ముంగురుల్ని సరిచేస్తా. "సరే సరే. ఇందాకటి కథ చెప్పు" అంది, అతడి చేతిమీద గీతలూ గీస్తా. గొంతు సవరించుకున్నాడు రామచంద్ర. "దాదాపు ఇరవై ఏడేళ్ల కింద జరిగిన కథ.. కాదు సంఘటన ఇది.." అంటా మొదలు పెట్టాడు. *   *   * పదేళ్ల కొడుకు చిన్నాని వెంటబెట్టుకుని వెళ్లాడు మల్లయ్య, నాగార్పమ్మ శిడి ఉత్సవానికి. శిడిమాను తిప్పడానికి కొంత సమయం పడుతుందని తెలిసి గుడెనక ఉన్న తమలపాకుల తోటలోకెళ్లారు తండ్రీ కొడుకులు. వాళ్లమాదిరే కొంతమంది ఆ తోటలో తిరుగుతూ కాలక్షేపం చేస్తుంటే, ఇంకొంతమంది పేకాడుతూ కూర్చున్నారు. చిన్నాకి ఆ తోటలో ఉంటే చాలా హాయిగా అన్పిచ్చింది. తమలపాకుల పాదులు, పందిళ్లకు పాకిన తమలపాకుల తీగలు, మధ్యమధ్యలో మామిడి చెట్లు, ఆ పాదులకు ఆనుకొని మొదలైన అరటి తోటలు.. బయట మండిపోతున్న రోహిణీ కార్తె ఎండలకు విరుద్ధంగా చల్లటి వాతావరణం. అక్కణ్ణించి కదలాలనిపించలేదు. "నాన్నా. నాకా మావిడికాయ కావాలి" అనడిగాడు చిన్నా, ఓ చెట్టుకు కనిపిస్తున్న మామిడికాయను చూపిస్తా. తిరనాళ్లకొచ్చే జనం దులిపేస్తారనే భయంతో తోటలోని మామిడికాయల్ని రెండు రోజుల ముందే యజమాని కోసేశాడు. కనిపించలేదేమో ఆ ఒక్క మామిడికాయ మిగిలిపోయింది. మల్లయ్య ఎగిరాడు కానీ ఆ కాయ అందలేదు. "చెట్టెక్కి కోస్తా" అన్నాడు చిన్నా. "సరే"నని కొడుకుని చెట్టెక్కించాడు మల్లయ్య. కష్టపడి ఆ కాయని ఎట్లాగో పట్టుకొని కోశాడు చిన్నా. కిందకు దిగుతున్న అతడికి గుడి దగ్గిర శిడిమాను పైకిలేస్తున్న సన్నివేశం కనిపించింది. "నాన్నా. అక్కడ మేకను పైకి లేపుతున్నారు" అని చెప్పాడు. "అదేరా శిడి. తొందరేం లేదులే. నెమ్మదిగా దిగు" చెప్పాడు మల్లయ్య. కానీ అప్పటికే ఆలస్యమైంది. ఆదరాబాదరాగా దిగేంతలో కాలు పట్టుతప్పింది. సర్రున జారిపోయాడు చిన్నా. నయం. కిందపడలేదు. మొదలు నుంచి కొమ్మలు వేరయ్యే చోట పడ్డాడు. ఒక కొమ్మని గట్టిగా పట్టుకున్నాడు, కిందపడకుండా. "అరెరే..." అంటా కొడుకుని కిందికి దించాడు మల్లయ్య. చేతిమీద చల్లగా ఏదో పడింది. చూస్తే నెత్తుటి చుక్క. అప్పటికే చేయి చూసుకుంటున్నాడు చిన్నా. ఎడమచేయి మధ్యలో చర్మం చీరుకుపోయి ఎర్రగా కనిపిస్తోంది. ఆ నెత్తుటి వెనుక తెల్లటి చర్మం. గబగబా దగ్గర్లో ఉన్న ఏదో మొక్క ఆకుల్ని కొన్ని తుంచి, వాటిని గట్టిగా వొత్తాడు. రసం బొట్లు బొట్లుగా గాయం మీద పడ్డాయి. మంటతో "అమ్మా" అన్నాడు చిన్నా. "ఓర్చుకో. దెబ్బ తొందరగా మానిపోతుంది ఈ రసంతో" ధైర్యం చెప్పాడు మల్లయ్య. ఇద్దరూ శిడిమాను కాడికి పోయారు. శిడి పూర్తిగా పైకిలేచింది. దూలాన్ని కింద స్తంభానికి గట్టిగా కట్టేశారు. బోనులో ఉన్న మేక మొహాన పసుపు, కుంకుమ బొట్లు. మెడలో దండ. ఏవో మంత్రాలు చదువుతా "కానియ్యండి" అన్నాడు పూజారి. మరుక్షణం అక్కడే ఉన్న ఒక పెద్దాయన, చేతిలోని టెంకాయని గట్టిగా విసిరాడు. అది మేక మొహంవేపు బోనుకు గట్టిగా తగిలింది. ఠప్పున పగిలింది కాయ. ముక్కలు చెల్లా చెదురుగా పడ్డాయి. మేక భయంతో "మే.. మే.." అనరిచింది. ఆ తర్వాత అక్కడున్నవాళ్లంతా టెంకాయలు మేకమీదికి విసురుతున్నారు. విపరీతమైన భయంతో మేక అదేపనిగా అరుస్తోంది. బోనుకు తగిలి పగిలిన కొబ్బరి చిప్పలు కొన్ని దాని వొంటికి తగులుతున్నాయి. అది కేకలు పెడుతుంటే కిందనున్న జనం కేరింతలు కొడుతున్నారు. రాక్షసానందంతో ఈలలు వేస్తున్నారు. చూసిన చిన్నా "అయ్యో పాపం మేక" అన్నాడు జాలిగా. మేక పడుతున్న బాధ చూస్తుంటే చిన్నారి చిన్నా గుండెను ఎవరో మెలి తిప్పుతున్నంత బాధగా ఉంది. పొట్టలో దేవినట్లుగానూ ఉంది. కళ్లముందు ఒక ప్రాణమున్న మేకని అట్లా కొట్టి హింసిస్తూ అక్కడి జనం ఎట్లా ఆనందం పొందుతున్నారో అతడికి అర్థం కావడం లేదు. "నాన్నా, పాపం ఆ మేకని అట్లా బాధపెట్టడమెందుకు? చూడు అదెట్లా వొణికిపోతోందో. ఒకేసారి దాన్ని చంపెయ్యొచ్చు కదా?" అడిగాడు తండ్రిని బాధగా. కొడుక్కి ఏమని చెబుతాడు మల్లయ్య. "అది ఆచారంరా అబ్బాయ్. మనం ఏమీ చెయ్యలేం. ఆచారాన్ని మార్చలేం" అన్నాడు. తండ్రి మాటలు చిన్నాకి నచ్చలేదు. కానీ తండ్రి ఈ విషయంలో ఏమీ చెయ్యలేడనే సంగతి అర్థమైంది. మేక పడుతున్న కష్టం, దాని కదలికల్లో తెలుస్తున్న మరణ భయం అతడి చిట్టిగుండెని నిలవనీయకుండా చేస్తోంది. ఆ పనిని ఎట్లాగైనా అడ్డుకోవాలి. మేకని కాపాడాలి. కానీ ఎట్లా? కింద వందలమంది జనం.. ఎక్కడెక్కణ్ణించో వొచ్చి ఈ దారుణమైన పనిని చూస్తా ఆనందం పొందుతున్న వాళ్లని ఎట్లా ఆపడం? చిన్నా ప్రాణం కొట్టుకుపోతోంది. ఒకటే ధ్యాస. ఆ దారుణాన్ని ఆపాలి. మేకని ఆ హింస నుంచి కాపాడాలి. ఎక్కణ్ణించి వొచ్చిందో అంత మొండి ధైర్యం! తండ్రి చేతిని వొదిలించుకుని సర్రున పరిగెత్తాడు. మల్లయ్య తేరుకునేలోపే శిడిమాను దూలం వొద్దకు చేరుకున్నాడు. "రేయ్ చిన్నా.. అబ్బాయ్.. ఆగరా.. ఎక్కడికి?" అంటా వెంటపడ్డాడు మల్లయ్య. అక్కడి జనం ఆశ్చర్యంగా, కళ్లు పెద్దవి చేసుకుని చూస్తున్నంతలోనే దూలం మీదికి ఎగిరి, పైన పడుకుని, గట్టిగా పట్టుకున్నాడు. బల్లిలా దానిపై పాక్కుంటూ పోయాడు. మల్లయ్య గుండె గుభేల్మంది. ఓవైపు జనం శిడిమాను మీదికి టెంకాయలు విసిరి కొడుతూనే ఉన్నారు. అవి చిన్నాకి తగిలితే.. వొణికిపోయాడు. వొళ్ళంతా చెమట్లు పట్టేశాయి. "రేయ్ అబ్బాయ్. ఏం చేస్తున్నావ్. కిందికి దిగరా. ప్రెమాదంరా. దెబ్బలు తగుల్తాయిరా" అని కేకలు పెట్టాడు. జనం గోలలో అతడి మాటలు చిన్నాకి వినిపించలేదు. వినిపించినా పట్టించుకునే స్థితిలో లేడు. దూలంపైన పాక్కుంటూ బోను దగ్గరకు చేరుకున్నాడు చిన్నా. అసలే అంతకుముందు చెట్టుమీద జారి చీరుకుపోయిన చెయ్యి. పాకుతుంటే రాపిడై నెత్తురు కారుతోంది. బాధను పంటి బిగువున ఓర్చుకుంటా బోనుని పట్టుకున్నాడు. టెంకాయలు విసరొద్దని అడ్డంగా చేయ్యి ఊపాడు. అతణ్ణి చూస్తున్నా, జనం టెంకాయలు విసరడం ఆపలేదు. "అయ్యా ఆపండి. టెంకాయలు విసరమాకండి" అని గట్టిగా అరుస్తున్నాడు మల్లయ్య ఏడుస్తా. అంతలోనే జరగరానిది జరిగిపోయింది. ఒక టెంకాయ నేరుగా చిన్నా తలని బలంగా తాకింది. "అమ్మా" అని కేకేశాడు. అతడి చేతులు బోనుని వొదిలేశాయి. పట్టు తప్పిపోయింది. ఆమైనే కిందపడ్డాడు. "అబ్బాయ్ చిన్నా" అని పెద్దగా అరుస్తా చేతులు చాపాడు మల్లయ్య. నేరుగా అతడి చేతుల్లో పడ్డాడు చిన్నా. అంత పైనుంచి పడటంతో, ఆ బరువుని తట్టుకోలేక మల్లయ్య కిందపడ్డాడు. నయం. రాయిపై పడకుండా ఇసుకలో పడ్డాడు. ఒక్కసారిగా అక్కడ కోలాహలం. ఎవరో ఆపినట్లే టెంకాయల ప్రవాహం ఆగిపోయింది. అంతా ఆ తండ్రీకొడుకుల చుట్టూ మూగారు. చిన్నా నుదుటి మీంచి ధారగా నెత్తురు. అతడు స్పృహలో లేడు. ఒకాయన నాడి చూశాడు. "పిల్లాడు బతికే ఉన్నాడు" అన్నాడు. ఇంకొకతను గబగబా ఏదో ఆకుపసరు చిన్నా తలపై పిండాడు. మంటకి అటూ ఇటూ కదిలాడు చిన్నా. "వేలెడంత లేడు. ఎంత పని చేశాడు. ఎందుకెక్కాడు శిడిమీదికి?" అందరి నోటా ఇవే మాటలు. *     *     * "ఆ రోజుతో శిడిమాను మీదికి టెంకాయలు విసరడం ఆగిపోయి, పూలదండలు విసరడం మొదలయ్యింది. అప్పట్నించీ ప్రాణభయంతో మేక అరుపులు లేవు. దాని బలి ఆగిపోకపోవచ్చు. కానీ గంటలకొద్దీ అది పడే హింస మాత్రం ఆగింది" చెప్పి ఆగాడు చతుర్వేది. "ఇదంతా నీకెట్లా తెలుసు? అంతా చూసినట్లే చెప్పావు" అడిగింది కావేరి. "నాకు తెలుసు. నేను చూశా" అన్నాడు సన్నగా నవ్వుతూ. ఏదో గుర్తుకు వొచ్చినట్లు అతడి నుదుటి వొంక పరీక్షగా చూసింది. నుదుటిపై జుట్టు మొదలయ్యే చోట నల్లటి గాయం మచ్చ. గబుక్కున అతడి డమ చెయ్యి పట్టుకొని చూసింది. మోచేతి పైభాగంలో పెద్ద గాయం గుర్తు. "అమ్మదొంగా.. చిన్నా.." అంది కావేరి అతడి జుట్టులోకి వేళ్లు పోనిచ్చి అటు ఇటూ కుదుపుతా.. - బుద్ధి య‌జ్ఞ‌మూర్తి  

స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్‌...

స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్‌...   అవును, అది కేవ‌లం బుర‌దే. ఎవ‌రూ గ‌మ‌నించ‌ని విధంగా గ‌డ్డి కింద క‌న‌ప‌డ‌కుండా ఉంది. పొర‌పాటున దానిమీద కాలు వేశారంటే "ఛీ.. ఛీ" అంటూ ప‌క్క‌కు త‌ప్పుకోవ‌డం ఖాయం. అంద‌రూ అంత‌లా చీర‌ద‌రించుకొనే బుద‌ర‌ని ఒక ఉల్లాస‌భ‌రిత‌మైన సాధ‌నంగా చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాం. ఒక‌సారి మాలో చాలామందిమి మ‌మ్మ‌ల్ని మేం తెలుసుకోవాల‌నే ఉద్దేశంతో ఒక సెల్ఫ్‌-డిస్క‌వ‌రీ క్యాంపుకి వెళ్లాం. లౌడ్ స్పీక‌ర్ల నుంచి బిగ్గ‌ర‌గా వినిపిస్తున్న మ్యూజిక్ వింటూ బుర‌ద‌లో య‌థేచ్ఛ‌గా నాట్యం చేస్తూ ఆనందంతో కేరింత‌లు కొడుతున్న‌ప్పుడు మాలో ఉన్న చిన్న‌పిల్ల‌ల్ని తిరిగి గుర్తించ‌గ‌లిగాం. అస‌లు ఇదంతా కుర్రాళ్లు వ‌ర్షంలో స‌ర‌దాగా ఫుట్‌బాల్ ఆడుతున్న‌ప్పుడు మొద‌లైంది. వాళ్లంతా కొంచెంసేప‌టికి కాళ్ల‌తో ఒక‌రిపై ఒక‌రు బుర‌ద చ‌ల్లుకోవ‌డం మొద‌లుపెట్టారు. అక్క‌డ్నుంచి ఇక ఎవ‌రూ వెన‌క్కి తిరిగి చూడ‌లేదు. ఎటూ చూడాల్సిన అవ‌స‌ర‌మూ రాలేదు. అంతా బుర‌ద‌మ‌యం అయిపోయింది. మెడ‌, జుట్టు, వేసుకున్న తెల్ల‌బ‌ట్ట‌లు ఒక‌టేంటి.. అన్నీ బుర‌ద‌లో మునిగి తేలుతున్నాయి. పంది బుర‌ద‌లో ప‌డి దొర్ల‌డం చూశాను గాని, ఏదో ఒక‌నాటికి నేను కూడా దానిలా ప్ర‌వ‌ర్తిస్తూ అలానే బుర‌ద‌లో దొర్లుతాన‌ని ఎప్పుడూ ఊహించ‌లేదు. ఏదేమైనా స్వ‌చ్ఛంగా, అతి సాధార‌ణంగా క‌నిపిస్తున్న ఈ బుర‌ద నాట్యాన్ని వ‌ర్ణించ‌డానికి 'ఉల్లాసం' అనే ప‌ద‌మే స‌రైన‌ది. నిజ‌మే, అది కేవ‌లం బుర‌దే. కానీ అదే ముప్పైల్లో, న‌ల‌భైల్లో, డెబ్భైల్లో ఉన్న‌వాళ్లు కూడా త‌మ‌లో దాగున్న మూడేళ్ల చిన్న‌పిల్లాడిని చూసుకునేట‌ట్లు చేసింది. *   *   *   * అది ఒక సాదాసీదా ఉసిరి చెట్టు. ఎవ‌రూ దాన్ని గ‌మ‌నించ‌లేదంటే, ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌ర‌మేమీ లేదు. అలాంటిది, మా పెద్ద‌క్క నిధి దృష్టిని మాత్రం అది త‌ప్పించుకోలేక‌పోయింది. ఆ చెట్టును చూడ్డంతోటే పింక్ క‌ళ్ల‌జోడు ఫ్రేములోని త‌న పెద్ద‌క‌ళ్లు వ‌జ్రాల్లా ధ‌గ‌ధ‌గా మెరిసిపోయాయి. ఆ మెరుపును మా పిల్ల‌లంద‌రం వెంట‌నే ప‌సిగ‌ట్టేశాం. ఈ సంఘ‌ట‌న మా కుటుంబం మొత్తం స‌ర‌దాగా అర‌కులోయ విహార‌యాత్ర‌కు వెళ్లిన‌ప్పుడు జ‌రిగింది. అక్క‌డ మా కాలేజీ ఎదురుగానే ఈ పెద్ద ఉసిరిచెట్టు ఉంది. ప‌ది నుంచి ఇర‌వై ఐదు సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌సున్న మా కుర్ర బ్యాచ్ మొత్తం గ‌బ‌గ‌బా కాటేజీ లోప‌ల‌కు ప‌రిగెత్తి ఒక పెద్ద దుప్ప‌టి తీసుకొచ్చి ప‌ట్టుకొని ఆ చెట్టుకింద నిల్చున్నాం. మా అంద‌రిలోకి సైజులో చిన్న‌వాడిని కోతిని చేసి చెట్టు పైకెక్కించి కొమ్మ‌ల్ని నెమ్మ‌దిగా క‌దిలించ‌మ‌న్నాం. అంతే! ఆ మ‌రుక్ష‌ణం మేం స్వ‌ర్గంలో ఉన్న‌ట్లుగా ఫీల‌య్యాం. ఆకుప‌చ్చ‌-ప‌సుపు మిశ్ర‌మ రంగులోని ఉసిరికాయ‌లు చిన్న‌వి, పెద్ద‌వి ఒక‌చోట అనేమిటి అన్నిచోట్లా ప‌డుతున్నాయి. మేం వాటిన‌న్నింటినీ ప‌ట్టుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తూ, దుప్ప‌టిని ప‌ట్టుకొని అటూ ఇటూ ప‌రిగెత్తుతున్నాం. ఈ దృశ్యం.. స్వ‌ర్గం నుంచి చిన్న‌చిన్న చుక్క‌లు ప‌డుతున్న‌ట్లుగా క‌నిపిస్తుంది. వాటిలో ఏ ఒక్క‌దాన్నీ వ‌దులుకోవ‌డానికి మేం సిద్ధంగా లేం. బిగ్గ‌ర‌గా వినిపిస్తున్న మా న‌వ్వులు, అరుపులు విని అక్క‌డ వున్న మాకు తెలీని అప‌రిచితులు కూడా మా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి, మా సంతోషంలో వారు కూడా పాలుపంచుకొని, అమూల్య‌మైన మా సంప‌ద‌లో వాటాను కోరారు. త‌మ చేతుల నిండా ఉసిరికాయ‌ల్ని తీసుకొని సంతోషంగా వాళ్ల కుటుంబాల ద‌గ్గ‌ర‌కు వెళ్లారు. మొత్తానికి, ఇది నా జీవితంలో ఒక మ‌ధుర జ్ఞాప‌కంలా నిలిచింది. నిజ‌మే, అది కేవ‌లం ఉసిరిచెట్టే మ‌రి! *  *  *  * త‌న‌తో నాకు పెద్ద‌గా ప‌రిచ‌యం లేదు. మా అమ్మ చేసే క‌ర‌క‌ర‌లాడే ప‌ల్చ‌ని నేతి దోశ‌ల్ని తిన‌డానికి త‌న‌ని మా ఇంటికి ఆహ్వానించిన‌ప్పుడు, సందేహిస్తూనే రావ‌డానికి ఒప్పుకుంది. త‌ను మా ప‌క్క బిల్డింగ్‌లోనే ఉంటుంది. ఇద్ద‌రం ఒకే స్కూలుకు వెళ్తున్నాం. ఏడు సంవ‌త్స‌రాలుగా క‌లిసి చ‌దువుకుంటున్నాం. కానీ మా ఇద్ద‌రి మ‌ధ్యా పెద్ద‌గా ప‌రిచ‌యం లేదు. త‌ను మా క్లాసుకి మెద‌డు లాంటిదైతే నేను క‌మెడియ‌న్ లాంటిదాన్న‌న్న మాట‌. ప్ర‌తిరోజూ ఇద్ద‌రం ఎదురుప‌డేవాళ్లం. కానీ వెంట‌నే ముక్కులెగ‌రేసి త‌ల తిప్పేసుకునేవాళ్లం. అయితే ఎప్పుడూ త‌న చూపుల్లో క‌నిపించే (తొంగిచూసే) ఏదో తెలీని ఆందోళ‌న‌, విచారం న‌న్ను త‌న‌ని మా ఇంటికి ఆహ్వానించేలా చేసింది. దోశ‌లు తింటూ మాట్లాడుకోవ‌డం మొద‌లుపెట్టిన మేం, చాలాసేపు అలా మాట్లాడుకుంటూనే ఉండిపోయాం. మా ఇద్ద‌రి అభిరుచులు, భావాలు చాలావ‌ర‌కు ఒకేలా ఉండ‌టాన్ని న‌మ్మ‌లేక‌పోయాను. నేను వేసిన కొన్ని ప్ర‌శ్న‌ల‌కే త‌న స‌మ‌స్య‌ల్ని నాతో పంచుకుంది. వాట‌న్నింటికీ నేను ప‌రిష్కారాలు చూపించ‌లేక‌పోయినా, త‌న‌ని గ‌ట్టిగా హ‌త్తుకొని, త‌న చేయి ప‌ట్టుకొని ప్రేమ‌గా మాట్లాడాను. అది త‌న‌కు చాలా సంతోషాన్నిచ్చింది. ఈ సంఘ‌ట‌న జ‌రిగి కొన్ని సంవ‌త్స‌రాల‌వుతుంది. ఇప్పుడు మేమిద్ద‌రం మంచి స్నేహితులం. ఒక‌రి ఆలోచ‌న‌ల్ని, భావాల్ని త‌ర‌చుగా ప‌ర‌స్ప‌రం పంచుకుంటూ ఉంటాం. నిజానికి ఆ దోశ‌తో అప్పుడే అంతా ముగిసిపోయుండొచ్చు. కానీ అలా కాలేదు. అప్ప‌ట్నుంచి మా మ‌ధ్య బ‌ల‌మైన స్నేహ‌బంధం చిగురించింది. *  *  *  * నేను ఒక‌టో త‌ర‌గ‌తి చ‌దువుతున్న‌ప్పుడు మొట్ట‌మొద‌టిసారిగా కొన్ని ప‌దాలు రాశాను. అది కూడా స్కూల్లో కాదు. నేను క్లాసులో స‌రిగ్గా రాయ‌డం లేద‌ని మా క్లాస్ టీచ‌ర్ అమ్మ‌కి కంప్ల‌యింట్ చేసినంద‌కు కూడా కాదు. మా నాన్న ముంబై వెళ్తూ అక్క‌డ్నుంచీ నీకేం తీసుకురావాలో లిస్ట్ రాసివ్వ‌మ‌ని అడిగిన‌ప్పుడు మొద‌టిసారిగా రాశాను. నాన్న త‌న కూతుర్ని త‌క్కువ‌గా అంచ‌నా వేశారు. నేనేమో పెన్సిలు, పేప‌రు తీసుకొని టెడ్డీ బేర్లు, అంద‌మైన షూస్‌, బార్బీ బొమ్మ‌లు, స్నో ఫ్లేక్స్‌, చాక్లెట్ ఐస్‌క్రీమ్‌.. ఇంకా చాలా కావాల‌ని పెద్ద లిస్టే రాసిచ్చాను. అది మొద‌లు ఇక ఆ త‌ర్వాత నుంచి నేనెప్పుడూ రాస్తూనే ఉండేదాన్ని. అయితే అది స్కూల్లో మాత్రం కాదు. చీజ్ టోస్ట్ తినేట‌ప్పుడు త‌మ్ముడు నాకు చిన్న ముక్క ఇచ్చి త‌ను పెద్ద ముక్క తీసుకున్న‌ప్పుడు, నేను తీవ్ర‌మైన భావోద్వేగానికి గురైన‌ప్పుడు, అమ్మానాన్న‌లు నాపై చూపించిన ప్రేమ గురించీ, అలాగే నాకు ఆనందాన్ని, విచారాన్ని ఇచ్చిన ప్ర‌తి విష‌యం గురించీ రాశాను. అవి అప్పుడు కేవ‌లం ప‌దాలే - ఒక తెల్ల కాగితం మీద న‌ల్ల‌టి ఆకారాలు మాత్ర‌మే. నాకు ఆ ప‌దాల క‌న్నా వాటి వెనుక‌వున్న భావోద్వేగాలే ముఖ్యం. ఇవాళ నా జీవితం, కెరీర్‌, క‌ల‌లు.. అన్నీ ఈ ప‌దాల‌పైనే ఆధార‌ప‌డి వున్నాయి. ఇప్పుడు ఆ ప‌దాలే నాకు అన్నీను. ఆ ప‌దాల‌పై ప‌విత్ర‌మైన భావ‌నేదో క‌లుగుతోంది. *  *  *  * మ‌న‌కు వాటిలో అవ‌స‌ర‌మైన‌దేదీ క‌నిపించ‌లేదు కాబ‌ట్టి అవి ఇక ఎందుకూ ప‌నికిరానివ‌ని భావించ‌కూడ‌ద‌ని తెలుసుకున్నాను. బుర‌ద నాకు ఉల్లాసాన్నిచ్చింది. ఉసిరిచెట్టు నా జీవితంలోనే అత్యంత మ‌ధుర‌మైన జ్ఞాప‌కాల‌నిచ్చింది. దోశ ఒక మంచి స్నేహితురాలినిచ్చింది. ఇక అతి సామాన్యంగా క‌నిపించే ప‌దాలైతే నాకు సర్వ‌స్వం అయిపోయాయి. ఏమీ లేద‌ని అనుకున్న దాంట్లో కూడా ఏదో ఒక‌టి ఉంటుంద‌ని అర్థ‌మైంది. జీవితం మొత్తం మీద ఏదో ఒక రోజును తీసుకుని చూస్తే, అది కేవ‌లం ఒక మామూలు రోజు లాగే క‌నిపిస్తుంది. కావాల‌నుకుంటే నేను ఆ రోజును నా జీవితాన్నే మార్చ‌గ‌ల ఒక అద్భుత‌మైన రోజుగా మార్చుకోగ‌ల‌ను. ఒక క్ష‌ణ‌కాలం గురించి పెద్ద‌గా గుర్తు పెట్టుకోవ‌టానికి ఏమీ ఉండ‌క‌పోవ‌చ్చు. కానీ అదే క్ష‌ణ‌కాలాన్ని జీవితంలో ఎప్ప‌టికీ గుర్తుండిపోయే ఒక మ‌ధుర జ్ఞాప‌కంగా చేసుకోగ‌ల‌ను.  ప్రియ‌మైన వ్య‌క్తితో గ‌డిపిన సంధ్యా స‌మ‌యం ఏ ప్ర‌త్యేక‌తా లేని ఒక మామూలు సాయంత్రంలా మిగిలిపోవ‌చ్చు.. లేదంటే ఒక మ‌ధుర జ్ఞాప‌కంలా మారిపోనూవ‌చ్చు. ప్రియ‌మైన‌వాళ్ల‌తో అర్ధ‌రాత్రివేళ డాన్సు చేస్తూ సంతోషంగా గ‌డిపిన స‌మ‌యం సూర్యుని తొలికిర‌ణాల‌తో మ‌ర్చిపోనూవ‌చ్చు.. లేదంటే దాన్ని ఒక తియ్య‌టి జ్ఞాప‌కంలా రోజూ నిద్రించే స‌మ‌యంలో గుర్తుచేసుకొని మ‌ధురానుభూతిని పొంద‌వ‌చ్చు. మ‌న చుట్టూ జ‌రిగే ఎన్నో విష‌యాల్ని మ‌నం గుర్తించం. కానీ కొద్దిపాటి శ్ర‌ద్ధ‌, సృజ‌నాత్మ‌క‌త‌, ఆలోచ‌న‌తో వాటిని ఎంతో గొప్ప‌గా మ‌లుచుకోవ‌చ్చు. ఎంత‌లా అంటే అవే మ‌న‌కు స‌ర్వ‌స్వం అయ్యేలాగా! - వ‌న‌మాలి

వెంకటరమణీయం

తెలుగువ‌న్‌-అక్ష‌ర‌యాన్ సంయుక్తంగా నిర్వ‌హించిన ఉగాది క‌థ‌ల పోటీలో క‌న్సొలేష‌న్ బ‌హుమ‌తి రూ. 516 గెలుపొందిన క‌థ    ‘‘మూడు రోజ్నుంచీ చావబాదుతున్నావ్‌.. నీకిదేమన్నా న్యాయంగా వుందా?’’ నీరసంగా అడుగుతున్నాడు మా బాస్‌గారు మేడంబాస్‌గారిని. ఆవిడ విలాసంగా కాలు మీద కాలేస్కుని కూచుని... ‘‘పురుషుండు, గార్దభమునున్‌ స్థిరమగు దండనములేక చెడిపోవుదురిలన్‌... కరుణ దంపక నెలకొక పరిమైనం గొట్టవలయు పత్ని పురుషునన్‌...’’ పద్యం చెప్పి నిన్ను కొట్టడంలో తప్పు లేదన్నట్లు చూసింది. ‘‘ఆ! మహా చెప్పావులే గొప్ప. పెళ్లాన్నీ పేడతట్టనీ వారానికోసారి దులపమన్నారు పెద్దలు. నేనెప్పుడన్నా కొట్టానా...?’’ ఏడుపు ఆపుకుంటూ అన్నాడాయన. ‘‘ఆపండి మీ ఏడుపుగొట్టు వేషాలు. ఒట్టి నంగనాచి తుంగబుర్రవి మరి. అసలు నువ్వు చేసిన పనికి...’’ కోపం ఆపుకోలేక చీపురుకట్ట విసిరిందాయన మీదకు.  ‘‘ఇప్పటికి మూడు చీపురుకట్టలు విరిగినై మూడు రోజులల్ల. ఇంకా ఎన్ని విరిగితే సారుకు విముక్తి వస్తుందో పాపం..!’’ బైట నిలబడి సానుభూతి చూపిస్తూ కళ్లు వత్తుకుంది నా పెళ్లాం. మా యజమాని గారింట్లో ఇంటి మనిషిలాంటి పనిమనిషి తను. నేనేమో ఆఫీసులోనూ, ఇంట్లోనూ అయ్యగారికి అనుంగుబంటుని. బండికి చోదకున్నీ... అంటే డ్రైవర్‌గిరీ కూడా నాదే. అసలు మా అయ్యగారికి ఈ దురవస్థ రావడానికి ఒక రకంగా నా అజ్ఞానమే కారణమేమో. గత ఇరవై రోజులుగా జరిగిందంతా నాకు సినిమా రీలులాగా రింగా... రింగా... రింగా... * అయ్యగారూ నేనూ మామూలుగానే ఆఫీసుకెళ్లాం. వెళ్లగానే ఆఫీసు రూం టేబుళ్లు, కుర్చీలు తుడిచి అయ్యగారిని సుఖాసీనులను చేయడం నా విధి. అంతలోనే మోగింది ల్యాండ్ లైన్ ఫోన్‌. ‘‘హలో! హలో!’’ మామూలుగా మా బాస్‌ అరచినట్లే మాట్లాడుతాడు.  అవతలి వారెవరోగానీ మళ్లీ... ‘‘హలో! హలో!’’ అన్నారు తీయగా. టేబుల్‌ మీద కాగితాలూ, ఫైళ్లూ సర్దుతూ దుమ్ము తుడుస్తున్న నాకు అవతలి వారి గొంతు లీలగా వినిపిస్తూనే ఉంది. ‘‘హలో! కల్యాణ్ గారున్నారాండి’’ దీర్ఘంగా, తీయగా, మూలుగులాగా అదేంటో సన్నగా వినిపిస్తోందా గొంతు.  మా బాస్‌ సీట్‌లో కాస్త నిటారుగా కూర్చుని... ‘‘కల్యాణగారా! ఆ పేరుతో ఎవరూ లేరండిక్కడ’’ అన్నాడు. అవతలి వారు ఆడవారైనందుకేమో అంత మర్యాద! లేకపోతే, మా అయ్యగారికి ల్యాండ్‌లైన్‌ ఫోనంటేనే చిరాకు. బాస్‌గారు ఆశ్వమేధ యాగాలకు వెళ్తున్న సంగతిని మేడంగారు కనిపెట్టి... నిఘా కోసం పెట్టిందా ల్యాండ్‌లైన్‌. ఎప్పుడు ఫోన్‌ చేసినా సీట్లో ఉండాల్సిందే. లేకపోతే, లక్షలకు లక్షలు తగలేసినందుకు ఆవిడ చేతిలో పిండికొట్టబడిన చరిత్ర మా అయ్యగారిది. అలవాటుగా పదకొండున్నరకు కాంటిన్‌ నుండి టీ తెచ్చి కప్పులో పోసి బాస్‌కిద్దామని లోపలికెళ్లానా... ఇంకా ల్యాండ్‌లైన్‌లో మాట్లాడుతూనే ఉన్నారు. ఇందాకటి గొంతే తీయగా, ముద్దగా. ఆనందిస్తూ ఆరాలు తీస్తున్నాడీయన ఇవతల్నుంచి. ‘‘మీరేం చేస్తుంటారండీ...’’ ‘‘ఇదివరకేదో చేసేదాన్నండీ... ప్రస్తుతానికి ఖాళీ’’ చెప్పిందా స్వరం. ఎంత ల్యాండ్‌లైన్‌ అయినా నావి పాముచెవులని మా బాస్‌కి తెలుసు. అందుకే నన్ను బైటికి వెళ్లమన్నాడు. అయినా అవతలి వాళ్లేం మాట్లాడుతున్నారో తెలుసుకోవడానికి ఇవతలి వాళ్ల హావభావాలు చూస్తే సరిపోదా? ఎన్నిసార్లు అమ్మగారితో తిట్లు తిని అవి జీర్ణంకాక ఇక్కడీయన మా మీద అరచి శాంతి చేసుకోలేదూ! మరో అరగంటకు విజిటర్స్‌ ఎవరో వస్తే స్లిప్‌ తీసుకుని లోపలికెళ్లాను చూపిద్దామని. ఇంకా ల్యాండ్‌లైన్లోనే ఉన్నాడాయన. అవతలి వారెవరో జీవితచరిత్ర చెప్తున్నట్టు. ఇవతల ఈయన భక్తిగా మూలుగుతూ వింటున్నాడు. కాసేపయ్యాక పిలుస్తానని చెప్పమన్నాడు. కానీ గంటసేపటి తర్వాత బెల్లు కొట్టాడు. వాళ్లను పిల‌వమని పీలగొంతుతో చెప్పాడు. ఎంత రాంగ్‌ కాల్‌ ఫోనైనా రెండు గంటలు ఏకబిగిన మాట్లాడితే అల్సి పోరామరి! మధ్నాహ్నం భోజనం ముగించి లేస్తుంటే మళ్లీ మోగిందా ల్యాండ్‌లైన్‌. ‘‘హలో...’’ అంది తీయగా. ‘‘హలో... మీరేనా... చెప్పండి’’ మళ్లీ చెక్కరధారకి అతుక్కుపోయాడు బాస్‌.  అకౌంట్స్‌ చూస్తూ బుర్రవేడెక్కి కాఫీలూ, గ్రీన్‌ టీ లూ మార్చి మార్చి తాగే ఆయన ఇవ్వాళ ఆ ఊసే లేదు. గంట కొట్టడమే లేదు. ఫైళ్లు ముట్టుకోనే లేదు. ఆఖరికి ఐదున్నరకు ఆ ఫోన్‌ వదిలి... పెదరాసి పెద్దమ్మ కథలన్ని వరసపెట్టి విన్నవాడిలాగా, ఏదో పోగొట్టుకున్నవాడిలాగా, అన్యమనస్కంగా రెండు ఫైళ్లేవో చూసి, ఇంటికి బయల్దేరాడు ఏడుగంటలకు. * మర్నాడు మామూలుగానే వచ్చాడాఫీస్‌కు. నేను బాటిల్‌లో వాటర్‌ నింపుతున్నా, ఫ్రిజ్‌లో పెడదామని. ల్యాండ్ లైన్ ఫోన్‌ మోగింది. ‘‘హలో! ఆ! రమణిగారా... రాత్రంత బాగా నిద్రపోయారా. మీ బాధంతా విన్నందుకేమో నేను మాత్రం పడుకోలేక పోయాను. ఎనీ హావ్‌! ఇప్పుడెలా ఉంది మీకు? జలుబు తగ్గిందా?’’ మళ్లీ మొదలైంది. అవతలి తేనె ఊటలూ... ఇవతల చప్పరింతలూ. ఈ రోజూ గడిచింది నిన్నటిలాగే. ముచ్చటగా మూడో రోజు. ఆఫీసుకు రాగానే నన్ను పిలిచి ఒక చెక్కు నాచేతికిచ్చి... ఫలానా ఎకౌంట్‌లో వేయమన్నాడు. పేరు చూస్తే... వెంకటరమణ.. యాభైవేలు...  నాకు తెలిసి మా కంపెనీ రిటైల్‌ డీలర్‌లలో వెంకటరమణ పేరు ఎవరికీ లేదు. ఒకవేళ ఉన్నా రిటైల్ డీల‌ర్‌ మా కంపెనీకి పెద్దమొత్తాలు కడితే... మేము చిన్నమొత్తాలు కమీషన్‌గా ఇస్తుంటాం. ఏదో కీడు శంకిస్తున్నా పని పూర్తి చేసుకొని ఆఫీస్‌కు వస్తే అయ్యగారప్పటికీ రిసీవర్‌కూ చెవికీ ముడేసుకున్నారు. మధ్యాహ్నం లంచ్‌ టైంకి మాట్లాడ్డం ఆపి తినడానిక్కూర్చున్నాడు. అప్పుడు మోగింది ఫోన్‌, అమ్మగారి నుండి. ‘అదే పనిగా ఫోన్‌ ఎంగేజ్‌ వస్తోందీ. ఏం మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నార‘ని ఆరాలు తీసింది. బిగుసుకుపోయాడీ మహానుభావుడు. తిట్లు తిని పెట్టేసాడప్పటికి. మళ్లీ మూడు గంటకు మోగిందా ల్యాండ్‌లైన్‌. ‘‘హలో... రమణిగారూ... నా సెల్‌ నంబర్‌ చెప్తా. రాస్కోండి’’ సెల్‌ఫోన్‌లో మొదలైందింక తేనె ఊట. మరుసటి రోజు మధ్యాహ్నం ల్యాండ్‌లైన్‌ మోగింది. మా బాసయ్యగారు సెల్‌ఫోన్లో వగలుపోతున్నాడయ్యె. ‘‘ఐ విల్‌ మీట్‌ యూ, వెరీ షార్ట్‌లీ’’ అనుకుంటూ... ఇంక తప్పదని నేను ఫోనెత్తాను. అమ్మగారు... అయ్యగారి సెల్‌ ఎంగేజొస్తుందేమని. రిసీవర్‌ ఆయనకిచ్చాను. ‘‘ఇప్పుడే... ఇప్పుడే... డియర్‌. ఫ్రెండ్‌ చాలా రోజుల తర్వాత ఫోన్‌ చేస్తేనూ...’’ బుకాయిస్తున్నాడు. మరో నాలుగు రోజులూ ఇదే తంతు. మొత్తం వారం దాటింది ఈ రాంగ్‌ కాల్‌ కనెక్టయ్యి. ఇద్దరు మనుషులు ఎడతెగకుండా వారంపాటు మాట్లాడుకుంటే ఎన్ని అబద్ధాలు చెప్పుకొని ఉంటారూ... బడాయికాకపోతే... ముచ్చటగా మరో మూడు రోజుల తర్వాత మరో లక్ష రూపాయల చెక్కు రాసి చేతికిచ్చాడు. మళ్లీ అదే పేరు... వెంకటరమణ. బ్యాంకులో వేసొచ్చాను కానీ... ఈ వెంకటరమణకు, ఆ రమణికీ ఏదో సంబంధం ఉందనిపించింది. అమ్మగారి దృష్టిలో పెట్టాలా... అనిపించిందొకసారి. అర్థమో, అనర్థమో ఎందుకైనా మంచిది వేచిచూస్తేనే మంచిదని సరిపెట్టుకున్నానారోజుకు. మరుసటి రోజు ఫోన్లు... తేనె ఊటలూ. ఈయనగారి సొల్లు. ‘‘ఉయ్‌ విల్‌ మీట్‌ టుడే ఈవెనింగ్‌. ఇహి... హిహి...’’ సాయంత్రం తొందరగా బయల్దేరి ఒక రెస్టారెంట్‌కు పోనివ్వమన్నాడు. ఒక్కడే ఒక టేబుల్‌ దగ్గర కూచుని ఎవరి కోసమో ఎదురుచూస్తున్నట్లు దిక్కులు చూసి చూసి చివరికి ఒక్కడే వచ్చి కార్లో కూచున్నాడు. మళ్లీ సెల్‌ఫోన్లో సొల్లు, ‘‘రాలేదేం డియర్‌... ఓహో... ఓహో... పర్లేదు... వుయ్‌ విల్‌ మీట్‌ అనెదర్‌ టైం. హి... హి... హి...’’ మరో రెండు రోజు తర్వాత అయ్యగారు రాంగ్‌ కాల్‌ రమణికి కనెక్టయ్యి ఉండగా ఇంటి నుండి అమ్మగారి ఫోన్‌... ఎవరితో అదే పనిగా ఫోన్లో మాట్లాడుతున్నారనీ. ఎంత ప్రయత్నం చేసినా కంపెనీ వాళ్లకి ఫోన్లో దొరకట్లేదట ఎందుకనీ? వాళ్లకు పంపాల్సిన చెక్కును బ్యాంకులో ఎందుకు జమ చేయలేదనీ? వాళ్లు ఇంక ఆగలేక అమ్మగారికి ఫోన్‌ చేశారనీ... అరచి కరిచేసింది. దుమ్ము దులపటం అయిపోయాక ఆ పూట మాత్రం బుద్ధిగా ఎకౌంట్స్‌ చూసి కంపెనీకి జమ చేయాల్సిన డబ్బులో ల‌క్షన్నర తగ్గినా... ‘‘ఐ విల్‌ అరేంజ్‌ సూన్‌... హి... హి... హి...’’ అని చెప్పి సర్దుకున్నాడప్పటికి. * తెల్లారిన్నుండి అయ్యగారి వంకరతోక... ల్యాండ్‌లైన్‌ నుండి రాంగ్‌కాల్‌ రమణమ్మకు తగులుకుండు. అమ్మగారు మధ్యాహ్నం సెల్‌ఫోన్‌కు ఫోన్‌ చేసి, ల్యాండ్‌ లైన్‌కు అదే పనిగా ఎందుకు తగులుకున్నావంది? ఒకసారి నాతో మాట్లాడించుకొని అర్జంటుగా ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ను శుభ్రంగా కడిగెయ్యమంది కోపంగా. కనెక్షన్‌ తీసి మూలకు ఉంచిన బకెట్‌ నీళ్లలో పడేసానాఫోన్‌ని. ఖిన్నుడయిపోయి చూస్తున్నారు అయ్యగారు. కిక్కురుమనలేదు. ముభావంగా కారెక్కారు. మధ్యలో రోడ్డు పక్కన కారాపమని, ఒక చెట్టుకింద చేరగిలపడి సెల్‌ఫోన్‌లో తీయగా మాట్లాడే వారి బాధలన్నీ విన్నాడేమో... పొద్దున్నే ఆఫీస్‌కు రాగానే మరో లక్షన్నర చెక్కు రాసిచ్చి బ్యాంకుకు పొమ్మన్నాడు. నేను బ్యాంకుకు పోలేదు. చక్కగ ఇంటికొచ్చి అమ్మగారికిచ్చిన ఆ చెక్కును.  అదిగో అప్పటి నుండి అయ్యగారీ గదిలో బందీ అయ్యి.... మూడు చీపుర్లూ విరిగేటన్ని తన్నులు తింటున్నారు, మూడు రోజులుగా. రింగా... రింగా... రింగులై పోయినయి. * అమ్మగారూ... అమ్మగారూ... నా పెండ్లాం పరిగెత్తుకొస్తుంది ఈ మూల స్టోర్‌ రూం దగ్గరికి. ‘‘అయ్యగారికి ఫోన్‌ వస్తుంది. ‘హలో’ అంటున్నరు తీయగా. ఎవరని దబాయిస్తే పెట్టేస్తున్నరు’’ అని చెప్పింది. ఎట్లా పట్టుకోవాలి ఈ రాంగ్‌కాల్‌ రమణినీ అని ఆలోచించి, అమ్మగారు వాళ్ల చెల్లెలి కొడుకు గోపిని పిలిపించింది. విషయమంతా గోపీబాబుకు చెప్పి, భర్త చేసిన నిర్వాకం బైట పెట్టుకొని రాంగ్‌కాల్‌ రమణిని వేటాడమని వేడుకొంది. మూడు రోజుల తర్వాత గోపిబాబు ఇంటికొస్తూనే అమ్మగారిని తీసుకొని డాబా మీదకెళ్లాడు. అయ్యగారి సెల్‌ఫోన్‌తో రాంగ్‌కాల్‌ రమణికి ఫోన్‌ కలిపి ఫోన్‌ను అమ్మగారి చెవికి ఆనించి వాటర్‌టాంక్‌ వెనక నిలబడమన్నాడు. పక్కింటి డాబా మీద పెంట్‌హౌస్‌లో రెంట్‌కు ఉండే ఇద్దరు కుర్రాళ్లలో ఒకడు ఓరగా వీళ్ల డాబా మీదకు చూస్తూ ఆడగొంతుతో మెల్లగా, తీయగా ‘‘హలో’’ అన్నాడు. ‘‘హలో...’’ తియ్యగా. ఇంకా తియ్యగా ‘‘హలో...’’ అర్థమైపోయింది అందరికీ. కాసేపటికి పక్కింటి ఓనర్‌గారి హాల్లో అందరం కలిసి పైన పెంట్‌హౌస్‌ రెంట్‌ కుర్రాళ్లని పిలిపించాం. 'ఏంటి బాబూ ఈ మోసం?' అని కడిగేయబోయింది అమ్మగారు. వాళ్లు ఏమాత్రం తొణక్కుండా, బెణక్కుండా ‘‘ఆంటీ! లాస్ట్‌మంత్‌ మా చెల్లెలు మా దగ్గర నాలుగు రోజులుందామని ఊర్నొండొచ్చింది. మీ వారు వాకింగ్‌ వంకతో డాబా మీదకొచ్చి మా చెల్లిని తినేసేలాగా చూడ్డం... మొక్కకు నీళ్లు పోసే వంకతో పైపుతో మా చెల్లి మీద నీళ్లు పోయడం లాంటి వికృతాలు చేసాడు. అందుకే మీ ఆయన్ని ఒక ఆట ఆడిద్దామని రమణి పేరుతో మిమిక్రీ చేశా. బై ది బై నా పేరు వెంకటరమణ. వచ్చీ పోయే ప్రయివేట్‌ ఉద్యోగాలకు గాలం వేసే నిరుద్యోగులం’’ చెప్పుకొచ్చాడతను. ‘‘మరి వెంకటరమణ పేరుతో డబ్బు గుంజారుగా...’’ ఆవేశపడ్డాడు గోపీబాబు. ‘‘నిజమే. డబ్బు తీసుకున్నాం. అసలు వెంకటరమణ అనే పేరులోనే మహత్తుంది. ఆడో... మగో... తెలియకుండా ఆట ఆడిస్తుందాపేరు. ముందు మీరు స్టేషన్‌కు వెళ్లి కంప్లయింట్‌ చేయండి. మేమొచ్చి లొంగిపోతాం’’ అన్నారు నిశ్చయంగా.  ఆ స్టేషన్‌ ఇన్స్‌పెక్టర్‌ మా అమ్మగారికి అయ్యగారికి ఏకైక సంతానం... అమ్మాయిగారి మొగుడుగారు. అయ్యో! చెప్పకూడని చోట పుండు. అల్లుడు వైద్యుడు అంటే ఇదేనేమో. లబలబ లాడుకుంటూ ఇంట్లోకొచ్చిన అమ్మగారు... అయ్యగారిని ఇంకో రెండు చీపుర్లు విరిగేదాకా కొట్టారని సవివరంగా చెప్పనవసరం లేదనుకుంటా. రంగా... రంగా... అంతా వెంకటరమణీయం. వెంకటరమణా... గోవిందా! సంకట హరణా... గోవిందా!!   - కోట్ల వ‌న‌జాత‌

శంఖారావం

తెలుగువ‌న్‌-అక్ష‌ర‌యాన్ సంయుక్తంగా నిర్వ‌హించిన ఉగాది క‌థ‌ల పోటీలో క‌న్సొలేష‌న్ బ‌హుమ‌తి రూ. 516 గెలుపొందిన క‌థ‌     హమ్మయ్య  ఎన్నాళ్ళకి నాకు ఇష్టమైన బెర్త్ దొరికింది.  సూట్ కేసు సీటు కిందకి తోసి అవతలి వైపు సీటు కూడా సరిచేసి కాళ్ళు జాపుకుని సెటిల్ అయాను. తరచుగా ప్రయాణాలు చేయవలసిన ఉద్యోగం నాది.  నాకు సాధారణంగా ఆర్ ఏ సి తప్ప కన్ఫర్మ్  బెర్త్ దొరకడం చాలా తక్కువ. కారణం ఎప్పుడు మూడ్ వస్తే అప్పుడే నువ్వు వెంటనే వైజాగ్ బ్రాంచ్ కి వెళ్ళాలి. “శ్రీకాంత్ అక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది.... ఇవాళ రాత్రికే ప్రయాణం అవు”  అంటూ ఉన్న పళంగా వెళ్ళమని ఆజ్ఞలు జారీ చేస్తాడు మా డైరెక్టర్.. ఆయన నోటి నుంచి ఎప్పుడు వస్తుందా ఆజ్ఞ అని ఎదురుచూస్తూ ఉండే నేను ఆయన మాట పూర్తికాకుండానే మరో బ్యాగ్ సర్దుకుని సిద్ధం అవుతాను.  “ఒక పండగ, పబ్బం, పిల్లల పుట్టినరోజులు, మన పెళ్లి రోజు ఏమి ఉండవు.. ఎప్పుడూ ఈ క్యాంపు లేంటి? మీరే ఉన్నారా ఆఫీసులో ... వేరే వాళ్ళని పంపమని చెప్పచ్చుగా" అంటుంది నా భార్య అసహనంగా.  "నాకా సెంటిమెంట్స్ ఏమి లేవు.. ఉన్నా అన్నీ కాదని మా డైరెక్టర్ ఆజ్ఞ పాటించడం నా కర్తవ్యం కదా!"  అంటాను నన్ను నేను మోసం చేసుకుంటూ.  భారతదేశంలో ఉన్న మా బ్రాంచెస్‌కి తరచూ ప్రయాణం చేస్తూ ఉండడమే నా ఉద్యోగం.. నా వృత్తి ధర్మం...అందులో ఉండే లాభాలు బోలెడు.. అవన్నీ ఆవిడకి ఏం తెలుసు? నా చేతినుంచి రూపాయి ఖర్చు లేకుండా అన్ని ఊళ్లు చూడచ్చు... టి.ఏ., డి.ఏ పేరుతో వచ్చే డబ్బు వెనకేసుకోవచ్చు.. అన్నిటికీ మించి బాస్ దగ్గర మంచి పేరు కొట్టేసి అందరికన్నా ముందు ప్రమోషన్ కొట్టచ్చు.  ఇన్ని లాభాల మధ్య ఉన్న ఇబ్బంది ఒకటే.. ఎప్పుడూ నేను కోరుకున్న బెర్త్ దొరకదు. తత్కాల్ లో రిజర్వ్ చేసుకునే సమయం కూడా ఉండదు కాబట్టి భోగాలు ఆశించకుండా దొరికిన దానితో తృప్తిపడి ఎలాగోలా ప్రయాణం చేయాల్సిందే. అయినా కోరుకుని ఈ పదవిని పొందినప్పుడు భోగాలు దేనికి? నాకు భోగాలకన్నా కావాల్సింది స్వేచ్ఛ‌.. నాకు కావాల్సినట్టు బతకడానికి ఎవరి అడ్డు లేని స్వేచ్ఛ‌.. అందుకే కోరి, కోరి, అడ్డు వచ్చిన వాళ్ళని తోసి, తొక్కి ఈ పదవి దక్కించుకున్నాను.  ఇది కూడా అలాంటి ప్రయాణమే.. "పండగ ఇంకా రెండు రోజులు.. మీరు ఇప్పుడు క్యాంపు కి వెళ్ళకపోతే నష్టం ఏమిటి? పండగ పూట భార్యా, పిల్లలతో ఉండనీకుండా ఇంకోసారి ఇలాంటి ఆజ్ఞలు జారీ చేయకుండా మీ డైరెక్టర్ కి ఒక స్ట్రాంగ్ క్లాస్ పీకుతాను..” అంటూ రుస,రుసలాడిన నా శ్రీమతి మాటలు నన్ను ఆపలేదు.  ఆవిడ మాటలు ఎప్పటిలాగే పెడచెవిన పెట్టి మా ఆఫీస్ బాయ్ ని టికెట్ కోసం పంపిస్తూ మరీ, మరీ చెప్పాను.. 'సైడ్ లోయేర్ కావాలి... ఎట్టి పరిస్థితుల్లో అయినా ఆ టికెట్ కోసమే ప్రయత్నం చేయి' అని.. నా అదృష్టం బాగుంది నేను కోరుకున్నదే దొరికింది.  సైడ్ లోయర్ బెర్త్ అంటే ఇష్టం ఉండడానికి ఒక కారణం ఉంది.  నిశ్చింతగా కాళ్ళు జాపుకుని కూర్చోవచ్చు. పడుకోవచ్చు. మధ్య, మధ్య లేచి కూర్చుని కిటికీలోంచి  జారిపోతున్న దృశ్యాలు చూడచ్చు. లేదంటే తలగడాలు నడుం వెనక పెట్టుకుని దర్జాగా కూర్చుని పుస్తకం చదువుకోవచ్చు. అన్ని విధాలా నాకు  స్వేచ్చని, స్వాతంత్ర్యాన్ని ఇచ్చే ఆ సీటు దొరకడం అంటే మామూలు విషయం కాదు.. ఆర్ ఏ సి లో టికెట్ తీసుకుంటే, కన్ఫర్మ్ చేసినప్పుడు ఆ సీటు ఇస్తాడు టి సి. అది కూడా అదృష్టం బాగుంటేనే.. కానీ మా వాడు ఏం చేసాడో, ఎలా పట్టాడో నాకు కోరుకున్న  సీట్ దొరికింది.  ఇవాళ నా అదృష్టం పండినట్టే.. ఓ విశాలమైన సామ్రాజ్యాన్ని గెలిచి సింహాసనం అధిష్టించినట్టు ఉంది.  బ్యాగ్ లో నుంచి చిప్స్ పాకెట్ తీసి పారవశ్యంతో తినసాగాను. ఇంకా బండి కదలలేదు. వాచీ చూసుకున్నాను... ఇంకో పది నిమిషాలుంది కదలడానికి.  చాలా మంది ఎక్కుతున్నారు.. వాళ్ళ వెనక సెండాఫ్ చెప్పడానికి వచ్చిన వాళ్ళు కూడా ఎక్కి పరామర్శలు చేస్తూ అడ్డంగా నిలబడ్డారు.  వాళ్ళని దాటుకుంటూ సూట్ కేసులు లాక్కుంటూ వస్తున్న వాళ్ళు  “ బాబూ కొంచెం తప్పుకోండి “ అంటూ మర్యాదగా కొందరు,  “ ఏందయ్యా...ఇట్లా అడ్డం నిలబడితే ఎక్కేవాళ్ళు ఎట్లా ఎక్కుతారు”  అంటూ దబాయించే వాళ్ళు  కొందరు వాళ్ళని అదిలిస్తుంటే, "సరేలే....జాగ్రత్త... నేను దిగుతున్నాను" అంటూ ఒక్కొక్కరే వారి, బంధువులు, స్నేహితుల దగ్గర సెలవు తీసుకుని దిగుతున్నారు. మొత్తానికి చాలా గొడవ, గొడవగా ఉంది కంపార్ట్ మెంట్ .. “ ఎలా ఉంటే నాకేం నేను హాయిగా, సుఖంగా ఉన్నాను”  అనుకుంటూ సన్నగా హమ్ చేస్తూ చిప్స్ తినసాగాను. నాకు డబ్బు ఖర్చు పెట్టడం కన్నా, దాచుకోడం ఇష్టం... కానీ మా ఆవిడకి డబ్బు కనిపిస్తే ఖర్చు పెట్టిందాకా నిద్రపట్టదు. 'చిన్నదానికి పుట్టిన రోజుకి జూకాలు చేయించాలి... పెద్దది పెద్ద మనిషి అయే వయసు వచ్చింది... నెక్లస్ చేయించాలి.. మా తమ్ముడి పెళ్లి.. కనీసం పదివేలన్నా వాడికి చదివించాలి.. నా సూత్రం గొలుసు పెరిగింది.. మార్చాలి... దీపావళికి నాకు పట్టుచీర కావాలి... మిక్సీ పాడైంది మార్చాలి.. కొత్త సోఫా కొనాలి'... ఇలా అనేక వంకలతో ప్రతి నెలా అదనపు ఖర్చులు పెట్టిస్తూ వేయి రూపాయలు కూడా బ్యాంక్ లో ఉండనివ్వదు. అందుకే ఆవిడకి కనిపించకుండా తప్పించుకు తిరుగుతూ ఉంటాను... అయినా ఖర్చులు తప్పవు. అది వేరే విషయం... చిప్స్ తినడం అయింది.. బిస్కట్ పాకెట్ తీయబోతూ టైం చూసాను. ఇంకా నాలుగు నిమిషాలుంది ట్రైన్ కదలడానికి. ప్రయాణీకులు ఎక్కడి వాళ్ళు అక్కడ స్థిరపడ్డారు. నా పక్కన ఉన్న త్రీ టైర్ బర్త్ లో ఒకమ్మాయి విండో సీటులో  కాలు ఖాళీగా ఉన్న ఎదురు సీటు మీద పెట్టుకుని కూర్చుని  మొబైల్ లో వీడియో చూస్తోంది.. ఒక నలభై ఏళ్ల వ్యక్తీ హడావుడిగా వచ్చి ఆ అమ్మాయిని తెచ్చిపెట్టుకున్న సహనంతో కాలు తీయమని చెప్పి మరోవైపు విండో సీటు దగ్గర స్థిరపడ్డాడు. వాళ్ళు కాక మరో ఇద్దరు ఉన్నారు. వారిలో ఒక డెబ్భై ఏళ్ల వృద్ధుడు, ఒక కుర్రాడు. ఆ కుర్రాడు గబుక్కున అప్పర్ బెర్త్ ఎక్కి పడుకుని మొబైల్ ఆన్ చేసాడు.  అప్పుడు ఎక్కారు వృద్ధ దంపతులు. ఆయాసపడుతూ వచ్చి చేతుల్లో ఉన్న ఎయిర్ బ్యాగులు కింద పెట్టి ఒక్క క్షణం ఊపిరి పీల్చుకుని అటు, ఇటూ చూస్తూ వాళ్ళ బెర్త్ ల కోసం వెతుక్కుంటూ..  వాళ్ళ బెర్త్ నెంబర్  చూసుకుని ఇదే మనది అని ఒకరికి ఒకరు చెప్పుకుని చేతుల్లో ఉన్న బ్యాగులు సీటు కిందకి తోసి అయిష్టంగా కూర్చుని అటూ, ఇటూ చూడసాగారు కూర్చున్నారు. వాళ్ళతో పాటు ఇంకో వ్యక్తీ వచ్చి నా దగ్గరకు వచ్చి "అప్పర్ బెర్త్ నాది సార్ కాలు తీస్తారా" అన్నాడు. చచ్చినట్టు జాపుకున్న కాలు కొంచెం ముడుచుకుని అతనికి కూర్చోడానికి ఎంతో ఉదారంగా చోటిస్తున్నట్టు ఫీలయాను.  నా సుఖంలో కొంత అంతరాయం కలిగినందుకు మనసులోనే ఆ వ్యక్తిని తిట్టుకోకపోతే ఎలా?  ట్రైన్ కదిలింది. ఆయాసం తీర్చుకున్న వృద్ధ  జంటలో ఆయన ఒక్కసారి అందరినీ కలయచూసాడు.  ఆయనకి డైబ్భై ఏళ్ళు ఉంటాయి. ఆవిడకి అరవై దాటాయి.. అందరి వైపు చూసి ఆయన నిట్టూర్చడం స్పష్టంగా కనిపించింది. నెమ్మదిగా రైలు వేగం పుంజుకుంది.  ఆ భార్యాభార్తలు ఒక విధమైన టెన్షన్తో చూస్తున్నారు అందరినీ. తిరిగి ఒకరినొకరు చూసుకుంటూ  ఏవో సైగలు చేసుకున్నారు.. ఆవిడ ఏదో  గొణిగింది.  ఆయన నెమ్మదిగా మర్యాదగా విండో దగ్గర కూర్చున్న యువతిని చూస్తూ అడిగాడు  "నీదే బెర్త్ అమ్మా...". ఆ అమ్మాయి ఐ ఫోన్ లోంచి తలెత్తకుండా "లోయర్" అని  చెప్పింది. ఆయన భార్యవైపు చూసాడు. ఆవిడ అడగండి అన్నట్టు తలాడిస్తూ సైగ చేసింది. ఆయన మొహమాటంగా అడిగాడు ఆ అమ్మాయిని ... "నీకు అభ్యంతరం లేకపోతే పై బెర్త్ మీదకి వెళ్తావా.. ఆంటి పైకి ఎక్కలేదు.." వాళ్ళిద్దరి హావభావాలు చూస్తుంటే నాకు అర్థం అయిపొయింది ఇలాంటిదే ఏదో ఉంటుందని.. ఆ అమ్మాయి ఏమంటుందో అని ఆసక్తిగా చూసాను.  ఆ అమ్మాయి నిర్లక్ష్యంగా అంది  “మా ఆయన  లోయర్ బెర్త్ కోసం నెల రోజుల ముందు బుక్ చేసారు.”   ఆ మాటల్లో ఇవ్వను అని వినిపించిన శబ్దానికి ఆయన మౌనంగా ఉండిపోయాడు.  ఆవిడ కళ్ళల్లో బాధ స్పష్టంగా కనిపించింది. ఆయన ఓదారుస్తున్నట్టు ఆవిడ చేయి మీద చేయి వేసాడు. ఆవిడ మళ్ళి ఏదో గొణిగింది ... ఆయన తలూపుతూ  దాదాపు తన వయసే ఉన్న  ఇంకో వ్యక్తిని  చూసాడు. “నాకు డెబ్భై  ఏళ్ళు పైకి ఎక్కలేనండి.” అన్నాడాయన నిస్సహాయంగా.  ఆయన “ఫర్వాలేదండి” అన్నాడు.  ఇప్పుడు ఇంకో వైపు విండో సీటు వ్యక్తి వంతు అనిపించింది నాకు.. అన్నట్టే అయింది.. అతను కొంచెం అసహనంగా చూసి “ దొరక్క, దొరక్క దొరికింది నాకు లోయర్ బెర్త్... సారీ సార్" అన్నాడు.  ఆయన తీవ్రమైన ఆశాభంగం తో ఆవిడ వైపు చూసాడు. “ టికెట్ ఇచ్చే వాళ్లకి ఆ మాత్రం బుద్ధి, జ్ఞానం ఉండదా.. మనం వయసు కూడా రాస్తాము కదా కాగితంలో ఎలా ఇస్తాడు అప్పర్ బెర్త్” అంది ఆవిడ గట్టిగా.. “మనం ఆలస్యంగా టికెట్ బుక్ చేసుకున్నాం తప్పు మనది... వాళ్ళు ఏం చేస్తారు” అన్నాడు ఆయన నా వైపు చూసి.  నా గుండె దడ, దడ లాడింది.. నెక్స్ట్ బకరా నేనే అనుకుంటూ పని ఉన్నట్టు మొహం తిప్పుకుని మొబైల్ లోకి చూడసాగాను.  'ఇప్పుడు వీళ్ళు కచ్చితంగా నన్ను అడుగుతారు.. నాకు తెలుసు.. ఎందుకంటే వాళ్లిద్దరి  తరవాత నాదే లోయర్ బెర్త్.. అయ్యో.. దొరక్క, దొరక్క దొరికిన స్వర్గం.. వాళ్ళ కోసం త్యాగం చేసేంత ఉదార హృదయం నాకు లేదు.. త్యాగం పేరుతో  నా ఎంజాయ్‌మెంట్ ఎలా వదులుకోను! ఊహు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవద్దు'.. గట్టిగా నిర్ణయించుకున్నా.   ఆ అమ్మాయి వాళ్ళాయన మీద నెపం నెట్టింది. మధ్య వయసు వ్యక్తీ నిర్మొహమాటంగా ఇవ్వనని చెప్పాడు. నేను రెండూ చేయలేను.. నేను ఎవరిమీద నెపం  నెట్టాలి! అబద్ధం చెప్పాలి.. అదేం పెద్ద విషయం కాదు నాకు.. కాకపొతే గోడ కట్టినట్టు ఉండాలి కదా!  ఆలోచిస్తుంటే వచ్చింది ఒక ఐడియా.. వావ్ అని  నన్ను నేనే అభినందించుకుంటూ అలా మొబైల్ లోకే చూస్తూ కూర్చున్నా.. పాపం నా వాలకం గమనించాడేమో ఆయన తటపటాయించాడు. కానీ అవసరం ఆయన మొహమాటాన్ని, ఇబ్బందినీ పక్కకి తోసేసింది..  సీటు అంచు దగ్గరకు జరిగి కొంచెం నా వైపు ఒంగి  సంకోచంతో పిలిచాడు  “బాబూ! ”   కెమెరా ఆన్ అయింది.. నేను యాక్షన్ మొదలుపెట్టాలి..  ముడుచుకున్న కాలు అతి బలవంతంగా కొంచెం కదిల్చి, బాధ కళ్ళల్లో ప్రదర్శిస్తూ మొబైల్ లో నుంచి తలెత్తి  “చెప్పండి” అన్నాను. ఆయన నా వైపు ఆందోళనగా చూస్తూ “అయ్యో ఏమైంది బాబూ అలా ఉన్నారేం ” అన్నాడు. నేను బాధ పళ్ళ బిగువున నొక్కి పట్టి అన్నాను.. “నిన్న ఆఫీస్ కి వెళ్తుంటే చిన్న యాక్సిడెంట్ అయిందండీ. పెద్దగా దెబ్బలు తగల్లేదు కానీ, కాలే కొంచెం వాచింది .. అందుకే" అబద్ధం గోడ కట్టినట్టు ఉండాలి కదా.. అని నా ప్రతిభ చూపించాను.  “అయ్యో పాపం ఇలాంటి స్థితిలో ప్రయాణం వాయిదా వేసుకోకపోయావా మరి ” పెద్దవాడిగా సలహా ఇచ్చాడు. “ఆఫీస్ పనండి తప్పదు ...” అన్నాను నిజాయితీకి నేనే ప్రతినిధిని అనే భావం వ్యక్త పరుస్తూ.  “అయ్యో! అలాగా... సరేలే సరిగా కూర్చో... ఇబ్బంది పడకు" అంటూ సరిగా సర్దుకుని కూర్చున్నాడు.  ఆవిడ ఏదో అన్నట్టు పెదాలు కదిలాయి.. “ పాపం ఈ కాలం పిల్లలు చాలా కష్టపడుతున్నారు ఉద్యోగాలు అలాంటివి..” సానుభూతిగా అన్నాడు.  ఆవిడ కూడా సానుభూతిగా నా వైపు చూసింది.  ప్రయాణం సాగుతోంది. రైలు వేగంగా సాగిపోతోంది.. మైదానాలు, పెద్ద పెద్ద చెట్లు, మధ్య, మధ్య కాలవలు.. అన్నీ కదిలిపోతున్నాయి కాలం లాగా. సంధ్య  వెలుగులో  రైలు  ఎక్కాను... చీకటి పడింది. ప్రయాణీకులు అందరూ వెంట తెచ్చుకున్న ఆహరం పొట్లాలు విప్పారు.. నా ఎదురుగా ఉన్న అతను నా ఓవర్ యాక్షన్ చూడలేకనేమో తన బెర్త్ ఎక్కేసాడు. హమ్మయ్య హాయిగా కాలు జాపుకున్నాను.  అందరూ పాకెట్లు విప్పి భోజనాలు కానిచ్చారు.  ఆవిడ మూడు పేపర్ ప్లేట్స్ తీసి ఒక దాన్లో నాలుగు పూరీలు, కూరా వేసి ఆయనకీ ఇచ్చింది.. ఆయన ఆ ప్లేట్ నా వైపు జాపి "తిను బాబూ" అన్నాడు.. నా గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్నట్టు అయింది..  “వద్దండి నేను ఆల్రెడీ ఆర్డర్ చేసాను వస్తుంది” అన్నాను మరో అబద్దం చెబుతూ.  “పర్లేదు తిను” అన్నాడు మళ్లీ ఆయన.  అప్పుడే నా పాలిట ఆపద్బాంధవుడిలా వచ్చాడు బాయ్ ... "డిన్నర్ సార్ ... డిన్నర్”  అంటూ. దగ్గరకు పిలిచి నెమ్మదిగా చెప్పాను  బ్రెడ్ ఆమ్లెట్ తీసుకురమ్మని. ఆయన ఆ ప్లేట్ లో పూరీ తినడం మొదలు పెట్టాడు.. ఆవిడ కూడా మరో ప్లేట్ లో పెట్టుకుని తినసాగింది. లోయర్ బెర్త్ శాల్తీలు ఇద్దరూ గబ, గబా తినేసి పక్కన కూర్చున్న వాళ్ళంతా వారి, వారి మిడిల్, అప్పర్ బెర్త్ లకు ఎప్పుడు వెళ్తారా అన్నట్టు చూడసాగారు. వాళ్ళిద్దరూ తినడం  పూర్తీ చేసి చేతులు కడుక్కుని వచ్చారు. ఆవిడ అన్నీ సర్దేసి బ్యాగ్ సీటు కిందకి తోసింది. ఆయన పక్కన కూర్చున్న పెద్దాయనతో కబుర్లు మొదలు పెట్టాడు.. “ఎక్కడికి వెళ్తున్నారు?” “ మా అబ్బాయి వైజాగ్ లో ఉంటాడు.. నేను హైదరాబాద్ లో అమ్మాయి దగ్గర ఉంటాను...అబ్బాయి  ఉగాదికి రమ్మని ఫోన్ల మీద ఫోన్ లు.. అమ్మాయికి, అల్లుడికి సెలవు దొరకలేదు.. ఒక్కడినే బయలుదేరాను. మీరు?” అడిగాడు ఆయన.  “ హైదరాబాద్ లో మేమిద్దరమే ఉంటామండి.. మాకు మగపిల్లలు లేరు.. ఒక్కతే అమ్మాయి.. వాళ్ళాయన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ లో పెద్ద ఉద్యోగం.. ఎప్పటి నుంచో రమ్మని పోరు ఇద్దరూ.. సరే పండగ వస్తోంది కదా అని బయలుదేరాము.. టికెట్ తెచ్చేవాళ్ళు సమయానికి ఎవరూ దొరకలేదు.. నేనే తిప్పలు పడి వెళ్లి రిజర్వ్ చేయించాను. అప్పటికే ఖాళీలు లేవని ఒకటి మిడిల్, ఒకటి అప్పర్ ఇచ్చాడు..”  అంటూ మిడిల్ బెర్త్ వైపు చూసాడు.  “నాకూ అంతే మిడిల్  బెర్త్ ఇచ్చాడు.. ఏం చేస్తాం ... కాస్త వాకింగ్ అదీ చేస్తాను కాబట్టి కానీ లేకపోతే నాదీ మీ పరిస్థితే. ఓ పని చేయండి.. నేను మీ బెర్త్ తీసుకుంటాను.. మీరు మిడిల్ బెర్త్ తీసుకోండి”  అన్నాడు.  “ అయ్యో మీకూ ఇబ్బందేగా .. పర్లేదండి.. ఎక్కుతాను” అన్నాడు ఆయన. “నాకేం ఇబ్బంది లేదు.. పాపం మీరు పైకి ఎక్కలేరు అక్కడ పడుకోండి." వాళ్ళిద్దరూ సమవయస్కులు కాబట్టి ఒకరికోసం ఒకరు త్యాగం చేసుకుంటున్నారు... నాకేంటి.. బహుశా మిగతా వాళ్ళు కూడా నాలాగే అనుకుంటున్నారు కాబోలు ఏమి మాట్లాడడం లేదు.  ఆవిడకి నిద్ర వస్తున్నట్టుంది. ఆవలిస్తూ ఆయన వైపు చూసింది. “ పడుకుంటావా! ఎక్కు... సాయం చేస్తాను” అన్నాడు ఆయన. ఆవిడ మళ్ళి ఒక్కసారి లోయర్ బెర్త్ ల వైపు ఆశగా చూస్తూ బలవంతంగా మిడిల్ బెర్త్ ఎక్కడానికి ప్రయత్నిస్తుంటే ఆయన ఆవిడకి సాయం చేసి అత కష్టం మీద ఎక్కించాడు. లోయర్ బెర్త్ వాళ్ళ మొహాల్లో అసహనం గుర్తించారేమో పెద్ద మనుషులు ఇద్దరూ కూడా ఒకరికి ఒకరు థాంక్స్ చెప్పుకుని వాళ్ళ బెర్త్ ల మీదకు వెళ్ళిపోయారు. లోయర్ బెర్త్ శాల్తీలు హమ్మయ్య అనుకుంటూ దుప్పట్లు పరిచారు.   ఆ ముగ్గురినీ చూస్తుంటే నాకు కొంచెం జాలి అనిపించినా ఆ జాలిని నిర్దయగా  పక్కకి నెట్టేసి నా లోయర్ బెర్త్ కి ప్రమాదం తప్పిందని ఆనందిస్తూ హాయిగా బ్రెడ్ ఆమ్లెట్ తినేసి పడుకున్నాను. అందరూ బెర్త్ లలో స్థిర పడ్డాక లైట్స్ ఆఫ్ చేసారు.  తెల్లవారింది. రైలు లాస్ట్ స్టేషన్ విశాఖపట్నంలో ఆగింది. అందరూ వారి, వారి లగేజ్ తీసుకుని దిగి వెళ్లిపోయిందాకా పెద్ద వాళ్ళు ముగ్గురూ ఎదురుచూస్తూ కూర్చున్నారు.  నేను లేచి కూర్చున్నాను.  వాళ్ళ ముందు నుంచి దిగానంటే నా అబద్ధం బయట పడుతుంది.. అందుకే నేనూ అలాగే కూర్చున్నాను. అందరూ దిగిపోయారు.. పెద్దవాళ్ళు ముగ్గురూ బ్యాగులు పట్టుకుని లేచారు. నేను కూడా ఒంగి సీటు కింద బ్యాగు తీసుకోబోయాను. దెబ్బ తగలని కాలు నటించలేక కొంచెం తిరగబడింది.. పడబోయాను.  పెద్దాయన గబుక్కున నన్ను ఆపి ఒంగి తను నా బ్యాగ్ తీసిచ్చాడు. “జాగ్రత్త బాబూ.. నెమ్మదిగా దిగు.. సాయం చేయమంటావా ”  అన్నాడు.   చెళ్ళున కొట్టినట్టు అనిపించింది... అపరాధభావనతో   “థాంక్ యూ అండి ఒద్దు.. నేను దిగుతాను.”  అన్నాను. ఆయన చిరునవ్వు నవ్వి “రావే" అంటూ ఆవిడ చేయి పట్టుకుని ఎంట్రన్స్ వైపు వెళ్ళిపోయాడు. రెండో పెద్దాయన ముందుకు నడుస్తూనే ఒకసారి తలతిప్పి నా వైపు చూసి ముందుకు సాగిపోయాడు. ఆ చూపులో నాకేవో అర్థాలు కనిపించి కొంచెం ఉలిక్కిపడ్డాను.  అది కూడా కొన్ని క్షణాలే.. నా భార్య దగ్గర రక,రకాల నటనలు ప్రదర్శించే నాకు ఇదో లెక్కా!  ఆఖరుగా నేను  ఊపిరి పీల్చుకుని బ్యాగు  పట్టుకుని నిటారుగా నిల్చుని దర్జాగా  రైలు దిగాను. ఒకసారి చుట్టూ చూసి, చక చకా ప్లాట్ ఫారమ్మీద నడవసాగాను.  "నెమ్మదిగా నడువు... అల్లుడు వచ్చే ఉంటాడు.. సామాను అలా పక్కన పెట్టి ఫోన్ చేద్దాం" ఆయన స్వరం.. ఆయాసపడుతూ ఆవిడ  “రండి ఇలా ఆగుదాం" అంటూ ప్లాట్ ఫాం వైపు నడిచింది. ఉలిక్కిపడ్డాను.. ఇంత జనంలో గుర్తు పట్టరులే అనుకుంటూ కొంచెం వేగం పెంచాను నడకలో.  ఆవిడ స్వరం వినిపించింది.. “ ఆ నడిచి వెళ్తున్నది ఆ కుర్రాడే కదండీ.. కాలికి దెబ్బ తగిలిందన్నాడుగా.. బానే నడుస్తున్నాడే..”  “పడుకుని లేచాడుగా సర్దుకుందేమో ... ఆ, ఆ జాగ్రత్త నెమ్మదిగా నడువు.. ఆ బ్యాగ్ కూడా ఇలా ఇవ్వు నువ్వు మోయలేవు.” “ఆ.. మీరు మోస్తారు .... పెద్ద బలవంతులుకదూ! పదండి  ఇంటికెళ్ళి రెండు మాత్రలు మింగితే అన్నీ తగ్గుతాయి”  భార్యాభర్తల అనుబంధానికి ఇంతకన్నా ఉదాహరణ ఇంకేం కావాలి?  డెబ్భై ఏళ్ల వయసులో కూడా భార్య నిస్సహాయతని భర్త, భర్త నిస్సహాయతని భార్య గమనించుకుంటూ, ఒకరికి ఒకరు సహకరించుకుంటూ, సహాయం చేసుకుంటూ, ఒకరి కష్టాన్ని మరొకరు స్వీకరిస్తూ బరువులు మోస్తూ, బాధలు పడుతూ సాగించిన సుదీర్ఘమైన జీవితం ...  నా చెవుల్లో పదిహేనేళ్ళ క్రితం నా చేత పెళ్లి పీటల మీద పురోహితుడు చెప్పించిన ధర్మేచ, మోక్షేచ, అర్ధేచ నాతి చరామి మంత్రాలు ఎకోలో వినిపించసాగాయి.. నా స్వార్ధం,  ఎవరెలా పోయినా నేను బాగుంటే చాలు అనుకునే అమానవీయత నా ముందు వికృతమైన రూపాలతో నిలబడ్డాయి.  పుట్టిన దగ్గర నుంచి నా జీవితంలో అబద్ధం చెప్పడం ఒక హాబీ అయింది. అమ్మకి, నాన్నకి చెప్పిన అబద్ధాలు ఒకటా! రెండా! పాలు పారబోసి తమ్ముడు పారబోసాడని అబద్ధం చెప్పాను. నాన్న జేబులో పదిరూపాయలు తీయడం తమ్ముడు చూసాడని నాన్నకి వాడే తీసాడని చెప్పాను. ఆ రోజు నాన్న వాడిని కొడుతుంటే నిస్సహాయంగా వాడు చూసిన చూపు నాకు గుర్తు ఉండి ఉంటే! గుర్తు లేదు కాబట్టే.. ప్రతి వాళ్లకి, ప్రతి నిమిషం అబద్ధం చెబుతూ బతికాను. అబద్ధం నా జీవితంలో ఒక భాగం అయిపొయింది.  ఆఫీస్ లో నా బాస్ కీ అబద్ధం చెప్పాను. నేను తప్ప మరొకరు తరచూ కాంప్ కి వెళ్ళే అర్హత లేనివాళ్ళు అని ఆయనలో నా పట్ల ఒక గొప్ప అభిప్రాయం కలిగించాను. దాని వల్ల కలిగే లాభాలు ఏమున్నా అవి నాకు మాత్రమే దక్కాలన్న స్వార్ధం.. వృత్తిలో ఇవన్నీ సర్వసాధారణం కావచ్చు. కానీ తాళి కట్టిన భార్యని మోసం చేసాను.  భార్యంటే అర్థం తెలుసా నాకు.. ఎన్నో సార్లు, ఎన్నో విషయాల్లో తనకి అబద్ధం చెప్పాను. మోసం చేసాను.. ఎప్పుడూ తను చెప్పిన దానికి వ్యతిరేకంగా చేయడం తప్ప ఆమెని సంతోషపెట్టే పని ఎప్పుడూ చేయలేదు.  ఆరోజు పెళ్లి పీటల మీద పురోహితుడు మంత్రాలు చెప్పిస్తుంటే  చెప్పిస్తుంటే వాటి అర్థం తెలియకపోయినా చాలా యాంత్రికంగా, మొక్కుబడిగా  చెప్పాను.. అరుంధతి నక్షత్రం అదిగో చూడు అంటే కనిపించకపోయినా "చూసాను" అని అబద్ధం చెప్పాను. మొదటి రాత్రి ఆమె చేతిలో పాయసం గ్లాసు అందుకుని మొత్తం తాగేసి, “అదేంటండి చెరిసగం తాగమన్నారు అత్తయ్యగారు.. మీరు మొత్తం తాగారేంటి” అని ఆమె బిక్కమొహం వేసి అడిగితే “ అవునా! నాకు తెలియదు.. మొత్తం నాకే అనుకున్నాను” అని సునాయాసంగా అబద్ధం చెప్పాను. అబద్ధాలు చెప్పడం అలవాటు అయిపొయింది. అబద్ధం చెప్పడం అంటే మోసం చేయడం కదా! ఇంత మందిని మోసం చేసిన నాకు  ఆ దంపతులను మోసం చేయడం పెద్ద కష్టమేమి కాదు కదా..! అందుకే ఆ దంపతులను కూడా మోసం చేసాను. నేను మోసం చేశానని వాళ్లకి తెలియదా! తెలుసు.. కానీ, ఆ మాట అనకపోవడం వాళ్ళ సంస్కారం.  నా పాదాల నుంచి మొదలైన సిగ్గు, పశ్చాత్తాపం, అపరాధభావన తలదాకా విద్యుత్ పాకినట్టు పాకాయి. అబద్దాలతో, మోసాలతో నేను అపురూపంగా, పదిలంగా  కాపాడుకున్న నా స్వేఛ్చ నన్ను చూసి వికటంగా నవ్వింది. ఉన్నట్టుండి నా కాళ్ళల్లో శక్తి సన్నగిల్లినట్టు అయి నడకలో తడబాటు వచ్చింది.. “ రెండు రోజుల్లో పండగ వస్తోంటే ఈ ఆఫీస్ క్యాంపు ఏంటండి... పైగా ఉగాది కూడానూ.. ఉగాది నాడు ఏం చేస్తే అదే ఏడాదంతా చేస్తాముట.. మీరు ఆరోజు మాతో లేకుండా పొతే ఈ ఏడాది అంతా ఏ పండక్కి ఉండరేమో అని భయం వేస్తోంది.. పండగ అయాక వెళ్ళచ్చుగా ” నా భార్య ఆవేదనతో అన్న మాటలు చెళ్ళున కొడుతున్నాయి...  “నాకు తెలుసు.. మీరు ఎప్పుడూ అబద్దాలతో ఎదుటి వాళ్ళను మోసం చేస్తూ బతుకుతున్నారు.. అయినా నేనెప్పుడూ మిమ్మల్ని ఏమి అనలేదు.. ఏదో ఒకనాడు మీరు మారతారని ఆశ పడ్డాను. కానీ పాపం వృద్ధ దంపతులను, కేవలం ఒక బెర్త్ కోసం మోసం చేస్తారా! ఎంత తప్పో ఇప్పుడన్నా తెలుసుకోండి.. లేకుంటే ఎప్పటికీ తెలుసుకోరు.. 'సొంతలాభం కొంత మానుకు పొరుగువాడికి తోడుపడవోయ్' అని మానవత్వపు విలువలు నేర్పి వెళ్ళిన గురజాడ గారిని ఓ సారి తలచుకోండి.. లేకుంటే ఏదో ఒకనాటికి మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటారు.."  చెవుల్లో మారుమోగుతున్న ఆ స్వరం ఎవరిదో కాదు.. సాక్షాత్తూ నా అర్ధాంగిది.. ఎక్కడినుంచో కోయిల కూసినట్టు, వేయి వీణలు ఒకేసారి మోగినట్టు వినిపిస్తున్న ఆ స్వరం కచ్చితంగా ఆమెదే.  మొదటిసారిగా ఆమె మాటలు నాకు మంత్రాల్లా, శంఖారావంలా  వినిపించాయి... కాదని ఇంక నన్ను నేను మోసం చేసుకోలేను కదా!  నా కళ్ళు నడవలేక, నడుస్తూ, మధ్య, మధ్యలో ఆగుతూ చేతుల్లో ఉన్న బరువుని లాగుతూ వెళ్తున్న ఆ జంట వైపు తిరిగాయి.. అప్రయత్నంగా నా కాళ్ళు పరుగు అందుకున్నాయి. తమ చేతుల్లోంచి ఎవరో బ్యాగులు లాక్కొంటుంటే భయంగా వెనక్కి తిరిగి చూసిన ఆ దంపతుల మొహాల్లో విస్మయం ... నా  మొహంలో బహుశా  దరహాసం. - అత్త‌లూరి విజ‌య‌ల‌క్ష్మి

సైనికులు కావాలి

తెలుగువ‌న్‌-అక్ష‌ర‌యాన్ సంయుక్తంగా నిర్వ‌హించిన ఉగాది క‌విత‌ల పోటీలో క‌న్సొలేష‌న్ బ‌హుమ‌తి రూ. 516 గెలుపొందిన క‌విత‌ దేశ సరిహద్దులను కాపాడే సైనికుడు కాదు దేహసరిహద్దులను కాపాడుకునే సైనికుడు కావాలి మారణాయుధాలు చేత పట్టే సైనికుడు కాదు మారణాయుధాన్ని తరిమికొట్టే సైనికుడు కావాలి మందీ మార్బలం లేకుండా ఒంటరిపోరుచేసే సైనికుడు కావాలి ఎడారులలో, మంచుకొండల్లో నక్కక్కర్లేదు ఆత్మీయుల ఎడబాటుతో బ్రతకక్కరలేదు అనుబంధాల లోగిలిలో హాయిగా బ్రతకొచ్చు నీ ఎదురుగా ఉన్నది వేల ప్రత్యర్థులు కాదు ఉన్నది ఒక్కడే ప్రత్యక్షంగా వాడిని ఎదిరించలేము అందుకే వాడిని తప్పించుకు తిరగాలి ప్రాణత్యాగం చేయని దేశ రక్షకుడవై ఉచ్ఛ్వాస నిశ్వాసలకు తెరలు కట్టి మంది మార్బలంకు దూరంగా ఉంటూ తరచూ చేతులను శుభ్రపరచుకునే సైనికుడివి కావాలి దేహ రక్షకుడవై దేశాన్ని కాపాడాలి కరోనాను కాలరాసే సైనికుడు కావాలి - ల‌లిత ప్ర‌వ‌ల్లిక‌

సిందూరం

తెలుగువ‌న్‌-అక్ష‌ర‌యాన్ సంయుక్తంగా నిర్వ‌హించిన ఉగాది క‌థ‌ల పోటీలో క‌న్సొలేష‌న్ బ‌హుమ‌తి రూ. 516 గెలుపొందిన క‌థ‌    కార్తీక పౌర్ణమి, చందమామ ఆకాశంలో చుక్కల రాజ్యాన్నేలుతున్న చక్రవర్తిలా వెలుగులీనుతున్నాడు. మేడమీద వెన్నెల ఊదారంగు చీరకట్టుకుని మల్లెపందిరి నీడలో ఊయల ఊగుతూంది. ఇంటి వాకిలిలో ఉన్న పారిజాత చెట్టు కొమ్మలు మేడమీద వరకు విస్తరించాయి.                     ప్రతి కొమ్మకు గుత్తులు గుత్తులుగా పూసిన పారిజాతాల పరిమళం వెన్నెల  శరీరాన్నీ, మనసుని స్పృశిస్తూన్న ప్రతిసారి  "నిన్న రాత్రి నీ నవ్వులు  మన  వాకిలిలో ఎలా వాలాయో చూడు?" అని తన కళ్ళు మూసి వాకిలంతా పరచి వున్న పారిజాత పూవులను చూపించిన ఆ చిలిపికళ్లే తన కళ్ళముందు కదలాడుతున్నాయి. మల్లెపూలంటే తనకిష్టమని మేడమీదవరకు తీగను పాకించి ఎంతో అందంగా మల్లెపందిరితో తనకి ప్రేమ మందిరాన్ని కట్టిన ప్రేమికుడు. తప్పదు నీకు, నువ్వు నా ఊహల్తోనే  ఊరేగాలని అందులోనే ఊయల కూడా పెట్టిన రసికుడు ఆ సూర్య.           "వస్తే, మూడునెలల తర్వాత వస్తాను, జాగ్రత్త‌!!" అని చెప్పి వెళ్ళాడు. ఆ లెక్క ప్రకారమైతే గురువారం రావాలి, ఈ రోజు ఆదివారం. వెన్నెల ఎదురుచూస్తూనేవుంది. మనసైన  వారి కోసం చూసే ఎదురుచూపులు మరింత అందంగా ముస్తాబవుతాయ్. అందుకే ఆ ఊదాచీర.            "అమ్మా! కిందకి వెళ్దాం" అంటూ కొంగు పట్టుకు లాగుతోంది నాలుగేళ్ల హాసిని. " రా!" అని హాసిని వేలు పట్టుకుని నెమ్మదిగా మెట్లు దిగుతోంది వెన్నెల.           " అర్థమౌతుందా ! ఇప్పుడు నీకు ఏడో నెల. ఆ చీర కట్టుకోవడం అవసరమా? తగుదునమ్మా అని మెట్లు ఎక్కడం, దిగడం. ఎందుకొచ్చింది ఆ బాధ? నైటీ వేసుకోవచ్చు కదా!?" కిందనుంచి గదమాయించింది రత్నం. "ఈ ముసలిదానికి అన్నీ కావాలి"  మనసులో  అనుకుని   పైకి మాత్రం "అలాగే అత్తమ్మా!"  అన్యమనస్కంగా సమాధానం చెప్పి ఇంటిలోనికి వెళ్ళింది.        "నా పెద్దకోడలేదే!" వెనక నుంచి చిన్న అరుపులాంటి విరుపు.          అసలే సూర్య ఇంకా రాలేదన్న దిగులుతో ఉన్న  వెన్నెలకి, పెద్ద‌కోడలేదే! అని అనేసరికి  "చూడలేదత్తమ్మా!" కాస్త విసురుగా చెప్పి తన గదిలోకెళ్ళింది హాసినిని తీసుకుని. గడియారం తొమ్మిది గంట గొట్టింది.            సూర్య పెళ్లికి ముందు, "ఇదే నీ కోడలు" అని ముద్దు చేసి మరీ తన అమ్మ చేతిలో పెట్టింది దానినే. అదే  "నైసీ" పేరుకి తగ్గట్టే నైస్ గా, అందంగా, తెల్లగా తోకూపుకుంటూ ఇల్లంతా తిరుగుతూంది ఇంటి పెత్తనం దానిదే అన్నట్టు.            "ఎంతైనా పెద్దకోడలు పెద్ద కోడలే దానికి అణకువ ఎక్కువ, ఇదెక్కడికెళ్ళింద"ని గొణుగుతూ  నైసీనీ వెతుకుతోంది రత్నం.            హాసిని తన నాన్నిచ్చిన టెడ్డిని, వాళ్ళమ్మ చేతిని గట్టిగా పట్టుకొని ఎడమ ప్రక్కగా పడుకుంది. తన కూతురి చిట్టి చేతులలో బందీగా వున్న చేతిని నెమ్మదిగా తీస్తూ   నిదరపోతున్న తన కూతురు కళ్ళవైపు చూసింది. అచ్చం వాళ్ళనాన్నలాగే నిశ్చలమైన జలపాతంలా  అందంగా నిదురపోతోంది హాసిని. సూర్యని కళ్ళలో నింపుకుని హాసిని వైపు చూస్తోంది వెన్నెల.          ‌‌"దీనికి దానికన్నా పొగరెక్కువైంది లోపలికి రమ్మంటే రానంటుంది ఆ గేటు దగ్గరే వుంటానంటుంది"   రుసరుసలాడుతుంది రత్నం నైసీ వైపు చూస్తూ.          "ఏవే రత్నం!  ఆ నోరులేని దానితో నీకెందుకే, నువు రావే లోపలికి"  అనునయంగా పిలుస్తున్నాడు నాయుడు.        ‌‌"అవును! నీ కొడళ్ళకి నీకు నోరెక్కడిది. నోటిలో వేలు పెడితే కొరకలేని అమాయకులు మీరు. నేనేగా నోరేసుకుని ఊరిమీదపడిపోయేది"  నిష్ఠూరాలాడుతూ ఇంటి తలుపేసి  లోపలికి వెళ్ళి  గదిలో వున్న నాయుడు దగ్గరకెళ్ళి నీళ్ళందించింది. గేటు దగ్గర ఒకటే మొరుగుతోంది నైసీ.        "దానికీ చెవిలో వూదుంటాడు మహానుభావుడు మూడునెలల తర్వాత వస్తానని, అందుకే అది అలా మొరుగుతోంది. అయినా ఈ మహాతల్లి  మల్లెపూవులా తెల్లని  యూనిఫాంలో వచ్చే నా మొగుణ్ణి గేటు దగ్గరే ఆపి, పైకి ఎగిరి ఒళ్ళంతా నాకేసి తన ప్రేమంతా ఒలికించి నలిపేసిన తర్వాత గాని నా దగ్గరకి పంపదు. నిజమే అదే మొదటి భార్య మా ఆయనకి" మనసులో అనుకుని గదినుంచి బయటికొచ్చి ఇంటి తలుపు తీసింది. "నైసీ! ఇలా రావే ఈ మెట్లు దగ్గరికి వచ్చి పడుకో " అంది.            వెన్నెల మనసు నైసీ పసిగట్టగలదు. అందుకే‌ అది వెన్నెల కాళ్ళ దగ్గర వరకు చేరుకుని తన ముందరి రెండు కాళ్ళని పైకిలేపి వెన్నెల కళ్ళ వైపు  చూసింది తదేకంగా. ఆ చూపులని అర్థం చేసుకున్న వెన్నెల దాని తల  నిమిరి " ఏమోనే నాకు తెలీదు! ఎందుకు రాలేదో ....వస్తారులే!. వెళ్ళి పడుకోవే" అంది లాలింపుగా. లేపిన  ముందరి రెండు కాళ్ళు కిందకి దింపి  తోకూపుకుంటూ మెట్లదగ్గరకెళ్ళి కూచుంది ముభావంగా.           వెన్నెల హాసిని మీద చేయేసి సూర్య గురించి ఆలోచిస్తూ నెమ్మదిగా నిద్రలో కి జారుకుంది.  ఫోన్ రింగ్ అయిన శబ్దం. ఫోన్ తీసి "హాలో" అంది నిద్రమత్తులో "భాభి మై శుక్లా! కైసే హో?  భేటి కైసీ హే" (వదిన మీరెలా వున్నారు, పాప ఎలా వుంది). "సబ్ కుచ్ ఠీక్ హే..ఆప్ కైసే హే". (అందరూ బాగున్నారు....మీరెలా వున్నారు) అంది వెన్నెల. "భాభి భయ్యా కౌన్సీ షిప్ మే గయా ?" ( అన్నయ్య ఏ షిప్ లో వెళ్ళారు?) అడిగాడు శుక్లా. "మేరేకో నయీ మాలుమ్. వో బాత్  ఆప్ హమ్ లోగ్ సే నయి బాతాయెంగేనా?" (నాకు తెలీదు ...అయినా మీరు  మాతో అవేం చెప్పరుగా!?) అంది వెన్నెల. "టికే భాభి టేక్ కేర్" (అలాగే వదినా, జాగ్రత్త!!) అని కాల్ కట్ చేశాడు శుక్లా.    వెన్నెల ఫోన్ స్క్రీన్ పై ఫ్లాష్ అవుతున్న టైం చూస్తే అది 2:30 A.M చూపిస్తోంది.  ఏంటి? ఈ టైం అప్పుడు ఫోన్ చేసి భయ్యా ఏ షిప్ మీద వెళ్ళాడు అని అడుగుతున్నాడు. సాధారణంగా ఎక్కడికి, ఏ షిప్ అన్న విషయాలు ఎవరికి చెప్పరుగా, మరెందుకు ఈ టైంలో ఫోన్ చేసి అంత ఆతృతగా అడుగుతున్నాడు ‌..... జరగరానిదేదైనా జరిగిందా  అనే ఆలోచన  వచ్చేలోపే కళ్ళనుండి నీళ్ళు కారిపోతున్నాయి. ఒళ్ళంతా చల్లబడి వణుకుతూ గుండె ఒక్కసారి బరువెక్కుతుండగా  వెంటనే శుక్లాకి ఫోన్ చేసి, "శుక్లా, జస్ట్ టెల్ మి....ఐ కెన్ టేకిట్"  (శుక్లా, విషయం చెప్పండి నేను తీసుకోగలను) అని అంది కాని వెక్కి వెక్కి ఏడుస్తోంది. "భాభి  నథింగ్ హేపెన్డ్...... టేక్ కేర్ "  ( వదినా ఏమి అవలేదు జాగ్రత్తగా ఉండు) అన్నాడు శుక్లా ఓదార్పుగా.                    బాధో , దుఃఖ‌మో, భరించలేని నొప్పో వచ్చినప్పుడు "అమ్మా!" అంటూ  మన ఆత్మను అక్కున చేర్చుకుని తన మాటలతో ఓదార్చి లాలించేది అమ్మభాషే.  అందుకేనేమో ఆ పిచ్చితల్లి తెలుగే తెలియని వాడితో వెర్రిగా గుండెలని అరచేతిలో పెట్టుకొని  "నిజం చెప్పు ...ఆయన....ఎలా వున్నారు? ... నేను ధైర్యం గానే వుంటాను ...." అంటోంది అధైర్యంగా ఊపిరి బిగపట్టి తన్నుకొచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ.                బాధకి మించిన  భాషేది, కన్నీటికి మించిన లిపేది.  "భాభి ఆప్ మత్ రోయియే ...మే థోడా డౌట్ సే కాల్ కియా . సబ్ కుచ్ టీక్ హోగా...భయ్యా కో కుచ్ నయి హోగా...సమ్మాల్ కే రహో "  ( వదినా నువ్వు ఏడవద్దు ...నేను  చిన్న అనుమానంతో కాల్ చేసానంతే..అక్కడ అంతా బాగానే ఉండి ఉంటుంది ... అన్నయ్యకి ఏమి అవ్వదు..నువ్వు ధైర్యంగా, జాగ్రత్తగా ఉండు) గొంతు గద్గదమై కాల్ కట్ చేశాడు శుక్లా.                  వెన్నెల గొంతు తడారిపోతోంది.. అమ్మ పడే వేదన  భరించలేక  కడుపులోని బిడ్డ గట్టిగా తన్నుతుంది.  చేతులతో కడుపుని నిమిరి లోపలి బిడ్డను స్థిమితపరిచి, మంచం ప్రక్కనే రాగి చెంబులో వున్న నీటిని తాగింది. గుండె వేగం కాస్త నెమ్మదించింది. మనసు మట్టుకు అతి వేగంగా సూర్యని వెతుక్కుంటూ గుండెలోతులను తవ్వుతూ వెళుతోంది . *   *   *                     "చూడండి వెన్నెల గారు, మా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని ఈ పెళ్లి చూపులకి వచ్చాను. పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పలేను కాని నా ప్రాణాన్ని దేశానికి రాసిచ్చి,   నీతో ప్రేమను, జీవితాన్నీ పంచుకుంటాను అని అబద్ధం చెప్పి  ఒక అమ్మాయి మెడలో తాళి కట్టలేను. అందుకే, నిజం చెప్తున్నాను. నేను ఇండియన్ నేవిలో సర్వీస్ చేస్తున్నాను. ఇన్ని పనిగంటలు , ఇన్ని సెలవులు అని  ఏమి ఉండవు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి. ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.  మీరు నన్ను ఎప్పుడూ ఎక్కడికి వెళ్తున్నారు అని అడక్కూడదు నేను ఏమి చెప్పకూడదు. ఒక్కోసారి యుద్ధనౌక లో ఏమైనా అయినా మీ దగ్గరకి అధికారకంగా సమాచారం రావడం ఆలస్యమవచ్చు . ఒక్కోసారి అంతుచిక్కని కారణాల వల్ల నిర్దిష్ట సమాచారం లేకపోతే ఏడు సంవత్సరాల వరకు కూడా మీకు సరియైన సమాచారం అందించడం కుదరకపోవచ్చు. మేం సర్వీస్ లో వున్నప్పుడు సెల్ ఫోన్ వాడకూడదు. మీరు ఎంతటి విపత్కర పరిస్థితుల్లో వున్నా  నేను మీతో ఉండటానికి కుదరకపోవచ్చు. ఇలా వుంటుందండి మా జీవితం.                 మీరు పర్లేదు. అందంగానే వున్నారు.  దాని కన్నా మీ కళ్ళల్లో  కనిపించే  దైర్యం నాకు నచ్చింది. ఎందుకంటే నా కన్నా మీరే ఎక్కువ ధైర్యంగా ఉండి కుటుంబాన్ని నడిపించాల్సి వస్తుంది. మీరు నేను చెప్పిన నా జీవితం గురించి ఆలోచించే ఒక నిర్ణయానికి రండి. కంగారులేదు మీ అమ్మగారు, నాన్నగారు చెప్పారని వప్పుకోకండి..." అన్నాడు సూర్య వెన్నెల వైపుచూస్తూ...                 కోటి ఆశలతో కళ్యాణ జీవితం గురించి కలలు కనే  కన్నెపిల్లకు ఆహ్లాదం కలిగించే మాటలకు బదులుగా, అతడినుండి తూటాల్లాంటి మాటలు తగిలినయి. వెన్నెల మనసు బాధతో విలవిల లాడింది. కానీ... తరువాత స్థిమితపడి ఆలోచించే కొలది అతనిలోని ఫ్రాంక్ నెస్, స్థిర నిర్ణయాలు, దేశం పట్ల అంకితభావం, ఇవన్నీ అతన్ని ఇష్టపడేలా చేశాయి. ఇటువంటి భర్త నీడలో జీవితానికి ఓ సార్ధకత ఏర్పడుతుందని భావించింది. వెన్నెల సూర్య వైపు ఆరాధనగా చూడసాగింది.             "ఏంటండీ వెన్నెల గారు అలా చూస్తున్నారు? నా గురించి మీకు అన్నీ చెప్పి, మీ గురించి నేను ఏమి అడగలేదనా!?. నన్ను పెళ్ళి చేసుకుంటే ఎక్కువగా సర్దుకుపోవలసింది, ప్రేమను మోయాల్సింది, పెంచాల్సింది కూడా మీరే!!. అందుకనే నా గురించి మీకన్నీ చెప్పాను కాని నేను మీతో సర్దుకుపోను, మీరు ఎలా ఉంటే అలానే కలిసిపోతాను. మీరు సైన్స్ స్టూడెంట్ అని విన్నాను మీ భాషలో  చెప్పాలంటే  ఐ విల్ బి కెటలిస్ట్ టు యువర్ లైఫ్ బట్ యు ఆర్ మై లైఫ్ ఆఫ్టర్ కంట్రీ (మీ జీవితంలో నేనో ఉత్ప్రేరకాన్ని  కాని నా జీవితమే మీరు దేశం తర్వాత). ఇవి నా మనసులోని నా మాటలు. నా జీవితం నా భార్యతో ఇలానే ఉంటుంది. ఇలా చెప్పానని సినిమాటిక్ గా ఆలోచించి నిర్ణయం తీసుకోకండి. ప్రాక్టికల్ గా ఆలోచించి నిర్ణయానికి రండి..... నాతో జీవితం పంచుకోవడం అంటే  వర్షంలో సింధూరం నుదుటికి  అద్దుకున్నట్టే, అందుకనే చెప్తున్నాను బాగా ఆలోచించే ఒక నిర్ణయానికి రండి."  అన్న సూర్య మాటలు గుర్తుకు వచ్చిన వెంటనే అద్దం దగ్గరకెళ్ళి సింధూరం సరిచేసుకుంది వెన్నెల. వెనువెంటనే  నీకు  తోడున్నామంటూ కన్నీళ్ళు మళ్లీ మొదలయ్యాయి.                "శుక్లా ఎందుకు ఫోన్ చేసాడు?నౌక మీద దాడి  జరిగింది!? ... సూర్య దాడి జరిగిన నౌకలో వున్నాడన్న అనుమానంతోనా !!... సూర్యకి ఏదైనా జరిగిందేమోనన్నా సందేహంతోనా!. ఒకవేళ ఏదైనా జరిగి వుంటే నన్ను సంసిద్ధం చేద్దామ‌నా... ఎందుకు చేసినట్టూ...ఏం జరిగినా, నేనేంత ఏడ్చినా దేశ రక్షాణార్థం శుక్లా ఏం చెప్పడు, చెప్పలేడు,చెప్పకూడదు." అని తనలో తానే మాట్లాడుకుంటోంది వెన్నెల.               అంతులేని, అవగతమవని నిస్స‌హాయ దుస్థితిలో ఉన్నప్పుడు మనిషికి స్ఫురణకొచ్చేది శరణాగతే. ఏదో అతీతమైన, అద్భుతమైన  శక్తుంది అది నన్ను నడిపిస్తుంది, కాపాడుతుంది అని అనుకుంటే అది నమ్మకం. ఆ నమ్మకంపై దృష్టి నిలిపితే భక్తి. నీవు తప్ప దిక్కులేదు అని ఆ నమ్మకాన్నే భక్తితో అర్ధిస్తే అదే శరణాగతి.                 "భగవంతుడా... నువ్వే నాకు శరణు... నా చెంతన సూర్య లేకపోయినా పరవాలేదు... భారతమాత ముద్దుబిడ్డగా అతడికి ఇష్టమైన యుద్ధ‌రంగం లోనే ఉండనీ... ఎక్కడున్నా ఆయన నిండు నూరేళ్లు క్షేమంగా ఉండాలి. ఆ విషయం నాకు తెలిస్తే చాలు...." అని వేడుకుంది.         ‌‌     ఎంతటి ఎదురు దెబ్బ తగిలినా కాస్త వేగాన్ని పెంచుతుందే కాని విశ్రమించదు గుండె. అదే గుండెనిబ్బరం. చిన్న పాటి అదిరిపాటుకే భయపడి మూసుకునే కళ్ళు, గుడ్లు కక్కుకునేలా ఏడ్చి, ఏడ్చి ఎప్పుడు విశ్రమించాయో తెలియనేలేదు వెన్నెలకి.               ఆ నిదురన్నదే లేకపోతే ఊపిరాడని మనసులకు  ఊరట లేక ఎన్ని ప్రాణాలు ఉస్సూరుమనేవో!!. ఆవేధన భరించలేక ఎన్ని ఆక్రందనలు గాలిలో కలిసేవో. నిజమే.. నిదుర మరణం ఎన్నో కఠోరమైన నిజాలకి, నిట్టూర్పలకి, నిరాశా నిస్పృహలకి. ఉదయం జననం ఎన్నో ఆశలకీ, అవకాశాలకి, బ్రతికి నిరూపించాలన్న ఆశావాహా దృక్పథానికి.             "ఏమే వెన్నెల, వెన్నెల" అని తలుపు తడుతోంది రత్నం. ఎంత సేపటికీ తలుపు తీయలేదు వెన్నెల.              ఒక అరగంట తర్వాత మళ్ళీ " ఏమేవ్! వెన్నెల ఈ రోజు కార్తీక సోమవారమే దాన్ని స్కూలుకి కూడా పంపాలి ...లే! లే!" అని ఒక చేతిలో ముగ్గు గిన్నె పట్టుకొని మరో చేత్తో తలుపు తడుతోంది రత్నం‌. "వస్తున్నా" అని హాసినిని తీసుకుని బయటకొచ్చి పళ్లు తోమించి, స్నానం చేయించి జడ వేస్తోంది వెన్నెల. "మతి గాని పోయిందేంటే వెన్నెల.. ఒంటి జడ వేస్తున్నావు దానికి" అని వంట గదిలోకెళ్ళింది రత్నం. "ఏమ్మా! ఇంకా రెడీ చేయలేదా... హాసిని తల్లి రా..రా" అని  బైక్ స్టార్ట్ చేసాడు నాయుడు. "అమ్మా బై‌...బై" అని వాళ్ళ తాత బైక్  ముందెక్కి కూచొని స్కూల్ కెళ్ళింది హాసిని.               " వెన్నెల!  నేను,  మావయ్య సత్యవతమ్మ  గారింటికి వెళ్తున్నాం. ఆవిడ  ఆరోగ్యం  బాగులేదంట.  మధ్యాహ్నం వచ్చేస్తాం. భోజనం రెడి చేసి వుంచు" అని చెప్పింది రత్నం.             "కడుపుతో వున్న పిల్ల ఏంచేస్తుంది. నువ్వే భోజనం రెడి చెసెయ్యవే రత్నం. కాసేపాగి బయల్దేరదాం" అన్నాడు నాయుడు.            "ఆ... మీకే వుంది కోడలు మీద  ప్రేమ. కానుపు సుఖంగా అవ్వాలంటే ఆమాత్రం పనిచేయాలి. తప్పేం లేదు. అయినా నేను కాయగూరలు కోసి వుంచాను. స్టౌ మీద పెడితే సరిపోతుంది...రండి...రండి." అంటూ ఇంటి నుంచి బయటికి నడిచి నాయుడి గారి బైక్ దగ్గర నుంచుంది. "అమ్మా! జాగ్రత్తా" అని వెన్నెల వైపు చేయూపుతూ నాయుడు గారు వాళ్ళావిడని అనుసరించారు. " ఏమే వెన్నెల! నైసీకి తినడానికేమైనా పెట్టు"  నాయుడు గారి బైక్ మీద వెళ్తూ కోడలికి ఉత్తర్వు జారీ చేసింది రత్నం.          "ఇదిగో తిను" అని కంచంలో నాలుగు బిస్కెట్లు పెట్టి  నైసీ ముందుంచి తాను సోఫా మీద కూచుంది  వెన్నెల.          నైసీ బిస్కెట్ల వైపు చూడకుండా వెన్నెల కళ్ళు కారుస్తున్న కన్నీటి వైపే చూస్తోంది. నైసీ  సోఫా మీద కెక్కి దాని ముందరి రెండు కాళ్ళు వెన్నెల భుజం మీద పెట్టి తన నోటితో కరుచుకు వచ్చిన నాప్కిన్ తో వెన్నెల చెంపలు తుడవడానికి ప్రయత్నిస్తుంటే వెన్నెల మరింత ఉద్వేగానికి గురైంది.   నైసీ తల మీద చెయి వేసి నిమిరుతూ.. "ఏమే నైసీ,  మీ ఆయనెక్కడున్నాడే ? ఎలా వున్నాడే? నువ్వైనా చెప్పవే నాకు దిక్కు తోచట్లేదే" అని ఏడుస్తుంటే నైసీ సోఫా మీద నుంచి దిగి వెన్నెల చీరకొంగు లాగుతూ డైనింగ్ టేబుల్ దగ్గర కి తీసుకెళ్ళి కూచోబెట్టి టిఫిన్ ఉన్న  గిన్నెని వెన్నెల వైపుగా జరిపి తినమన్నట్టుగా సైగ చేసింది. అప్పుడు కూడా వెన్నెల  కన్నీళ్ళే కారుస్తోంది కాని  నైసీ అందించిన ప్రేమ వల్లనేమొ ఆ  కన్నీటిలో కాస్త  తియ్యదనం కలిసింది. కాస్త వూరట లభించి గుండె బరువు తగ్గింది. *           "ఏంటే వెన్నెల వారం రోజులనుంచి చూస్తున్నాను..... ఎందుకలా వుంటున్నావ్... ఒక సారి డాక్టర్ గారి దగ్గరకి తీసుకెళ్ళనా"  అనునయంగా అడిగింది రత్నం.              "ఏమి లేదత్తమ్మా!"  ముభావంగా సమాధానం చెప్పి "రా! హాసిని పడుకో" అని తీసుకెళ్ళి తన గదిలోకి  నిద్రబుచ్చుతోంది హాసినిని. బయట నైసీ ఒకటే మొరుగుతోంది.            "నైసీ అరవకు ....హాసిని పడుకుంటుంది " అని అరుస్తూ బయటకొచ్చి చూసేసరికి వెన్నెలకి ఒక్క క్షణం ఏమౌతోందో అర్థం కాలేదు.         నైసీ సూర్య మీదకెక్కి తన ఒళ్ళంతా నాకుతూ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.        వెన్నెల కి నోట మాట రాలేదు. గుండె తేలికయ్యి  తన  కళ్ళల్లో తియ్యని గోదారి సుడులు తిరుగుతున్నాయి. మన సంస్కృతిలో జంతువులకున్నంత  స్వేచ్ఛ‌ మనుషులకి లేదు. భార్యాభర్తల మధ్య  అభిమానం, ఆకర్షణ, అనురాగం ఆ నాలుగు గోడలకే పరిమితమై అక్కడినుంచి సరాసరి గుండె నాలుగు గదులలో తిష్ట వేసుకుని కూచుంటాయెమో అవి తమ వారిని చూసిన వెంటనే  కట్టతెచ్చుకుని‌ పరిగెట్టిస్తాయి మనసుని, మనిషిని.            వెన్నెల సూర్య వైపు వెళ్తుండగా... మెట్ల మీద నుంచి దిగుతున్న రత్నం "బాబు ఎప్పుడు వచ్చావు రా, ఎలా వున్నావురా"  అనడుగుతూ సూర్యకి దగ్గరగా వెళ్తుంది. కానీ సూర్య కళ్ళు ఇంటి లోపలినుంచి వస్తున్న వెన్నెలను చూస్తున్నాయి. వెన్నెల తన కన్నీరు వాళ్ళత్త చూస్తుందేమొ అని వెంటనే తన గదిలోకి వెళ్లిపోయింది.      "రారా!! "అంటూ సూర్య చేయిపట్టుకుని నాయుడిగారి  దగ్గరకి తీసుకెళ్ళింది రత్నం.        " నాన్నా!! బాగున్నావా ?. వెన్నెల ఎందుకో   కొన్ని రోజుల నుంచి చాలా దిగులుగా ఉంటుంది చూడరా"  కొడుకుని తనివితీరా  చూసుకుని, తల నిమురుతూ అన్నాడు నాయుడు. "నెలలు నిండుతున్నకొద్ధి అలాగే ఉంటుంది లెండి" అని  జ్యూస్ తో  వున్న గ్లాసుని సూర్యకి అందించింది  రత్నం.           "అలా కాదే రత్నం .. వెన్నెల ఏదో బాధపడుతుందే" సూర్యవైపు ఆ సంగతేంటో చూడు అన్నట్టు సైగ చేస్తూ అన్నాడు నాయుడు.           "నేనొచ్చాను కద నాన్నా.... చూసుకుంటానులే" అని అక్కడ నుంచి  తన గదిలో కెళ్లేటప్పటికి వెన్నెల అటు వైపుగా కూర్చుని ఉంది.            "ఎంతైనా మొదటి భార్య మొదటి భార్యే నేనొచ్చిన వెంటనే ముద్దుల్లో  ముంచేసి, నలిపేసి తన ప్రేమలో తడిపేసింది. నువ్వు చూడు ఎంత వూరిస్తున్నావో" అని  సూర్య‌ వెన్నెల వైపు చూస్తున్నాడు.             వెంటనే వెన్నెల  సూర్య వైపు విసురుగా తిరిగి "అవును మీ లాంటోళ్ళకి మనుషులెందుకు, కుక్కలే కరెక్ట్" అని కన్నీటిని తుడుచుకుంది. " ఏమైంది వెన్నెలా" అంటూ‌ దగ్గర కి తీసుకున్నాడు సూర్య.          "శుక్లా పోయిన ఆదివారం అర్థరాత్రి ఫోన్ చేసి నువ్వే షిప్ లో  వెళ్ళావని అడిగాడు. అప్పటినుండి  నేనెలా బ్రతుకుతున్నానో  నాకే అర్థం కావట్లేదు" అని సూర్యని గట్టిగా హత్తుకుంది.                "వాడికేదో డౌట్ వచ్చి వుంటుంది. అంతేగాని ఏమి అవలేదు. అయినా నువ్వింత పిరికిదానివనుకోలేదు. అనవసరంగా చేసుకున్నాను ఈ పిరికి పిల్లని"  మొట్టికాయ వేస్తూ అన్నాడు.             "నీ కోసం ఒకటి తెచ్చాను" అని తనజేబులో వున్న మల్లెపూలు తీసి ఇవ్వబోతుండగా  "వెన్నెల ఒకసారి రా " అని బయట నుంచి రత్నం పిలిచింది. "ఆ!! వస్తున్నా" అని బయటికెళ్లి రత్నం వైపు చూసింది.                "ఏడో నెల జాగ్రత్త!!" అని చెప్పి వెన్నెల చేతికి నీరు నింపిన రాగి చెంబునిచ్చి తన గదిలోకి వెళ్లి పోయింది రత్నం.               "మా అమ్మ  ఎందుకు పిలిచింది?"  వెన్నెల చేతిలో మల్లెపూలు పెడుతూ అడిగాడు సూర్య.            "మీ మల్లె పూలు ఇప్పుడు పెట్టుకోకుడదట"  మల్లె పూవులా నవ్వుతూ అంది వెన్నెల. ఎన్నో రోజుల తర్వాత ఆ గదిలో సూర్యుడు వెన్నెలలు కురిపిస్తున్నాడు. *   *    *              " అమ్మా! నేను  వెన్నెలని హాస్పిటల్ కి తీసుకెళ్తున్నాను. నాన్నని హాసినిని స్కూలునుంచి తీసుకురమ్మను.  స్కాన్ తీయాలంటున్నారు  సాయంత్రం వచ్చేసరికి లేటవ్వచ్చు." అని సూర్య , వెన్నెలని తీసుకుని బయటకెళ్ళాడు.               "ఏంటి అత్తమ్మకి అబద్ధం చెప్పావ్" కారు సీటు బెల్టు పెట్టుకుంటూ అడిగింది వెన్నెల.               "నిజం చెప్తే బోలెడు సెంటిమెంట్ లు చెప్తుంది మీ అత్త. అయినా నిన్న నేనొచ్చినప్పుడు నీ మొహం చూసి నాకు దిగులు పట్టుకుంది. అందుకే ఈ రోజు నిన్ను అలా బయట తిప్పుదామని నిర్ణయించుకున్నాను. ఎక్కడకి వెళ్తాం చెప్పు?"   కార్ స్టార్ట్ చేస్తూ అడిగాడు సూర్య.             భర్త బయటికి తీసుకెళ్తున్నాడు అన్నదానికన్నా తన బాధని, మనసుని అర్థం చేసుకున్నాడన్న ఆనందం వెన్నెల కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తోంది.             "మీ ఇష్టం అండి. ఎక్కడికైనా పర్లేదు చివర్లో ఆర్.కే. బీచ్ కి మట్టుకు ఖచ్చితంగా తీసుకెళ్లాలి" ముద్దుగా అడిగింది వెన్నెల.                  "నిన్నటి వరకు ఆ సముద్రంలోనే ఉన్నానే వెన్నెల, మళ్ళీ సముద్రానికే తీసుకుని వెళ్లమంటే ఎలా?" అని జాలిగా మొహం పెట్టాడు సూర్య.                  "అందుకే ఆ సముద్రం దగ్గరకి తీసుకుని వెళ్లమంటున్నాను. నిన్నెప్పుడు తన దగ్గర వుంచుకుంటుందిగా కాస్త జాగ్రత్తగా చూసుకోమని చెబుదామని"  సూర్య వైపు ప్రేమగా చూస్తూ అంది.             "అంటే తప్పదంటావ్,  ఏదేమైనా బీచ్ కి వెళ్ళాలి అంతేగా!!" అని కారు స్పీడ్ చిన్నగా పెంచాడు సూర్య. *   *    * "ఆ! జాగ్రత్త " అంటూ వెన్నెలకి చేయందించాడు. కారు దిగింది వెన్నెల. సూర్య, వెన్నెల సముద్రపు ఒడ్డున నడుస్తున్నారు. "కాస్త నెమ్మదిగా నడవండి" సూర్య చేయి గట్టిగా పట్టుకుని ఆపింది . "పోనీ కూచుందామా వెన్నెల"  అలల గాలికి చెదిరిన వెన్నెల ముంగురులను సవరిస్తూ అన్నాడు. "నేనిప్పుడు కింద కూర్చోలేను సూర్యా " నీరసంగా అంది వెన్నెల.                   "చూడు,  ఆ చివరన సోఫాలు, కుర్చీలు అద్దెకు  ఏర్పాటు చేశారు .. నాలుగు అడుగులేస్తే చాలు " వెన్నెల చేయి పట్టుకొని ముందుకు నడిపించాడు  సూర్య.                 " వెన్నెల మా అమ్మతో ఎలా ఉంటున్నావో  ఏంటో ? ఆవగింజంత విషయానికి కూడా ఆకాశమంత అరుస్తుంది"   నవ్వుతూ అడిగాడు సూర్య.                 "అమ్మ అంటే ఆకాశమేగా మరి; అందుకే అలా అప్పుడప్పుడు  ఉరుముతూ ఉంటుంది ప్రేమగా " అంది వెన్నెల కూడా అంతే అందంగా నవ్వుతూ. "ఇలాంటి మాటలతోనే మా అమ్మతో నెగ్గుకొస్తున్నావే, ఎంతైనా గడసరి కోడలివే "  అని వెన్నెల బుగ్గలని పుణికాడు.              "ఆ! మరే మీరు మీ అమ్మ అమాయకులు. మీరు యుద్ధం గెలవాలంటే అస్త్రాలు ఉపయోగించాలి. మరి మొగుడు పక్కన లేకుండా అత్త ప్రేమను  గెలవాలంటే  మాటలే ఆయుధాలు"  అని చిన్నపాటి గర్వం తో  వెన్నెల చెప్తుండగా  సూర్య తన  ఫోన్ వైపు తదేకంగా చూస్తున్నాడు.                వెన్నెల "ఏంటి అంతలా చూస్తున్నారు" సూర్య చేతితో ఉన్న  ఫోన్ ని తీసుకుని స్క్రీన్ పై వున్న ఫోటోని చూసి  "అబ్బా! ఎంత బాగుంది ?  ఎవరీ చిట్టీ తల్లి చాలా బాగుంది.‌అయినా ఇంత ముద్దులొలికే ఫొటో చూస్తూ మీరెందుకు విచారంగా మొహం పెట్టారు" అని ప్రశ్న మీద ప్రశ్న వేసింది వెన్నెల.                "వెన్నెల  హాసిని డెలివరీ అప్పుడు నేను రాలేదని బాధపడ్డావ్ అప్పుడు నేను నీకో విషయం చెప్పాను గుర్తుందా  మా ఫ్రెండ్ బెహ్రాకి పాప పుట్టిందని"  చెప్తుండగా మధ్యలో మాట అందుకుని వెన్నెల "అవునండి గుర్తుంది. మీ ఫ్రెండ్ భార్య డెలివరీ టైం లోనే చనిపోయిందన్నారు.....ఆ పాపేనా? పాపం తల్లి లేకుండా చేసాడు దేవుడు" దైన్యంగా  సూర్య వైపు చూసింది.               "తల్లే కాదు వెన్నెలా... ఇప్పుడు తండ్రి కూడా....." గొంతు గద్గదమైంది, కంటి వెంట కన్నీటి జీర  మాట్లాడలేక పోయాడు సూర్య. "ఏమైందండి!?" భర్త భుజం మీద చెయ్యి వేసింది.                  "నువ్వన్నది నిజం వెన్నెల.  మాలాంటి వాళ్ళకి మనుషులతో పెళ్లిళ్లనవసరం నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్లిపోతాం మిమ్మల్ని" అన్నాడు సూర్య, వెన్నెల కళ్ళల్లో కి చూస్తూ.               "మీరు నేను నిన్న రాత్రి అన్న మాటని  సీరియస్ గా తీసుకున్నారా! అది నాకు మీ మీదున్న ప్రేమండి. మీరెందుకు రాలేదోనన్న భయం. ఏ విషయం ఎవరిని అడగలేని, అడగకూడని నిస్సహాయత. మీరెలా వున్నారో తెలీయక నేను పడిన ఆందోళనలో అలా అన్నాను. నిజం చెప్పనా సూర్య, నీతో క్షణకాలం సహచర్యానికైనా కోటి జన్మల తపస్సు చేయాలి. ఎంతో అదృష్టం నీ ఇల్లాలినయ్యాను"  సూర్య చేతిలో చేయి వేసి గట్టిగా వత్తుతూ అంది.                   "ఏదేమైనా నువ్వన్నదాంట్లో నిజం ఉంది.  నిన్న చెబితే నువ్వు భయపడతావని, బాధ పడతావని చెప్పలేదు. శుక్లా అనుకున్నది నిజమే. మా నౌకపై దాడి జరిగింది. శత్రువుపై ప్రతిదాడి చేస్తున్నప్పుడు నన్ను కాపాడబోయి తను.... తను.... మిగిలిన వివరాలు నేను చెప్పకూడదు. కాని...... ఇప్పుడు ఆ చిట్టితల్లికి ఒక మామ్మ తప్ప ఎవరూ లేరన్నది నిజం" మాట.. మాట కూడబలుక్కుని వచ్చే కన్నీటిని ఆపుకుంటూ చెబుతున్నాడు సూర్య.          "ఆ పాపను మనం పెంచుకుందాం. ఆ మామ్మను కూడా మనమే చూసుకుందాం. మనింటికి తీసుకొచ్చెయండి" అంది వెన్నెల చెమ్మగిల్లిన కళ్ళతో. "నిజంగా అంటున్నావా వెన్నెలా!!"  ఆశ్చర్యంగా, విస్మయంగా చూసాడు సూర్య.              "అతడు ప్రపంచానికి దేశం కోసమై ప్రాణాలు విడిచిన భరతమాత ముద్దుబిడ్డడైతే నాకు నా ప్రాణమైన మిమ్మల్ని కాపాడిన దేవుడు. ఆ దేవుడు కన్నబిడ్డని పెంచడం, అతనిని కన్నతల్లిని చూడడం నా కర్తవ్యం.. అంతకు మించిన అదృష్టం." అంది నిశ్చయంగా వెన్నెల.               "రెప్పొద్దున్న నాకే ఏమైనా అయితే" అని  అనబోతున్న సూర్య నోటిని  తన అరచేతితో  మూసింది వెన్నెల.               "ఎన్నో సార్లు చెప్పాను మీరీ మాట అనొద్దని. ఏమౌతుందండి!?  నా నుదుటి కుంకుమ దేశసౌభాగ్యాన్ని  కాపాడడానికి రక్త సింధూరమై భరతమాత నుదుటిపై చేరుతుంది అంతేగా!!..మీరు దిద్దిన ఈ సింధూరం ఎన్నటికీ వాడని మందారం"  అని సూర్య చేతిలో చేయివేసి అతని కళ్ళలోకి చూస్తూ చెబుతున్నప్పుడు ఒక్కసారిగా ఇద్దరి కనుల చివరి కన్నీటి చుక్కలు రాలుతున్నాయి మనదేశపు పచ్చద‌నానికై కురిసిన తొలికరిలా...... - భాగ్యలక్ష్మి  అప్పికొండ

ఆన్లైన్ విందు

  తెలుగువ‌న్ - అక్ష‌ర‌యాన్ సంయుక్తంగా నిర్వ‌హించిన ఉగాది క‌థ‌ల పోటీలో తృతీయ బ‌హుమ‌తి రూ. 1,116 పొందిన క‌థ‌   పట్టు చీర కట్టుకుని, మొహమంతా మేకప్ వేసుకొని, అద్దంలో అటు ఇటూ చూసుకుంటోంది సుందరి. సుందరి అవతారాన్ని, హడావిడిని చూసి షాక్ అయిన భర్త బ్రహ్మం. "ఏంటే ఇలా రెడీ అయ్యావు?" అని అడిగాడు. "మారెజ్ కి అటెండింగ్ అవుతున్నా! సరే కానీ ఎలా ఉన్నాను చెప్పండి. టెల్లండి?" అనడిగింది సుందరి. "హా నీకేమి బాగానే ఉన్నావు, అది సరే కానీ అటెండింగ్ కాదు, అటెండ్ అనాలి అంతే!" అన్నాడు. "ఓహ్ అలాగా, ఒకే ఒకే అప్పర్ స్టాండ్.." "ఒసేయ్, అప్పర్ కాదు అండర్ స్టాండ్. నీ ఎంగిలి ఇంగ్లీషుతో చంపుతున్నావు కదే!" "అబ్బబ్బా , నేనెప్పుడూ పైనే ఉండాలి అందుకే అప్పర్ స్టాండ్ అన్నాను. అర్థ‌మైందా?" అంది సుందరి. ఇంకేమనాలో తెలీని బ్రహ్మం నెమ్మదిగా బయటకి బయలుదేరుతూ, "సరే. నేను బయటకి అలా వెంకట్రావు ఇంటిదాకా వెళ్తున్నా, భోజనానికి వచ్చేస్తా, ఏమైనా తెమ్మంటావా వచ్చేప్పుడు?" అడిగాడు. అప్పుడే అసలు విషయం గుర్తు వచ్చి, "అన్నట్టు మర్చిపోయాను అండి, ఈరోజు మా ఫ్రెండ్ కొడుకు పెళ్ళి అన్నాను కదా, భోజనాలు వాళ్ళవే. తొందరగా వచ్చేయండి" అంది సుందరి. "భోజనాలు ఏంటే, పెళ్లికి మనం వెళ్ళటం లేదు కదా! ఈ కరోనా తగ్గేంతవరకు నువ్వూ ఎక్కడకి వెళ్లొద్దు అంతే!" "అయ్యో రామా! నేనెక్కడికి నాట్ గోయింగు, భోజనాలే మనింటికి కమింగు. మీరు తొందరగా కం, ఇద్దరం ఈటుదాం ఒకేసారి అందరితో కలిసి..." అంది సుందరి. "ఒసేయ్ నీ భాష ఒక్క ముక్క కూడా అర్థం అయితే ఒట్టు. ఏం చెప్తున్నావ్ అసలు?" అడిగాడు ఆశ్చర్యంగా, ఒకింత అనుమానంగా.. "అయ్యో, ఇదుగో చూడండి, మా గుణ లేదూ అదే మా క్లాస్మేట్ గుణసుందరి తన కొడుకు వర్షిత్ పెళ్ళి ఈరోజు. అదీ లైవ్ వస్తుంది అండి. మీరు తొందరగా రండి, తాళి కట్టే టైంకి ఉండకపోతే బాగోదు వచ్చాక అన్ని విషయాలు చెప్తాను. సరేనా.. నేను పెళ్ళికొడుకు స్నాతకం ఫంక్షనుకి అటెండింగ్ అవ్వాలి. మీరు వెళ్ళండి" అంటూ సిస్టెంలో దూరిపోయింది సుందరి. బయటకి నడిచాడు బ్రహ్మం. చెయ్యగా చెయ్యగా, పావుగంటకి ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యింది. అప్పటికి జూమ్లో సుందరి ఫ్రెండ్స్, పెళ్ళికొడుకు బంధువులు అందరూ రెడీగా ఉన్నారు. సుందరికి గుణ బంధువుల, స్నేహితురాళ్ల అందరి పలకరింపులు అయ్యాయి. "అవును గుణా, ఇంతకీ పెళ్లికూతురు ఫోటో కూడా పెట్టలేదు, శుభలేఖలో కూడా వేయించినట్లు లేరు? ఏమిటీ అంత సీక్రెట్టు?" అని అడిగింది సుందరి. "సీక్రెట్టు లేదు, చీపురు కట్టా లేదు. ఫోటో ఏం కర్మ, పెళ్లికూతురు కూడా లైవ్ లో ఉంది. అదుగో అక్కడ ఆ మూడో లైన్లో, నాలుగో వీడియోలో ఉంది చూడు, తనే నాక్కాబోయే కోడలు దీక్ష!" అని పరిచయం చేసింది గుణసుందరి. ఆ అమ్మాయి అందరికి ఒక హాయ్ చెప్పింది. అందరూ అమ్మాయి చాలా బాగుందని మెచ్చుకున్నారు. గుణసుందరి పొంగిపోయింది. "సరే ఈవెనింగ్ సంగీత్ ఉంది, ఆ తర్వాత భోజనాలు అయ్యాక పెళ్ళి ముహూర్తం. ఎవ్వరూ మిస్ కావద్దు మరి. అబ్బాయి బట్టలు మార్చుకోవాలి. ఇంకా ఏర్పాట్లన్నీ చూడాలి ఉంటాను మరి. కొరియర్ రిసీవ్ చేసుకున్నాక వాట్సాప్ గ్రూప్లో పెట్టడం మర్చిపోకండి." అని అందరి దగ్గరా సెలవు తీసుకుంది గుణ. సాయంత్రానికి అందరిళ్ళకి భోజనాల పార్సెళ్లు వచ్చాయి. సంగీత్ కార్యక్రమానికి టైం అవుతుందని వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ రావటంతో అందరూ మరలా రెడీ అయ్యి సిస్టం ముందుకు వచ్చేరు. మళ్ళీ కొత్తగా రెడి అయిన సుందరిని చూసి," ఏమిటోయ్ పూటపూటకి అన్ని అవతారాలు మారుస్తున్నావు? నిజంగా పెళ్లిలో కూడా ఇన్ని చీరలు మార్చి ఉండేవేమో! హ హ" అంటూ నవ్వాడు బ్రహ్మం. "చాల్లే ఊరుకోండి, సరేకానీ మీరు కూడా వస్తారా సంగీత్ జరుగుతోంది?" అడిగింది సుందరి. "వద్దు తల్లో, నీ ఒక్కదాని కుప్పిగెంతులు, కూని రాగాలే వినలేక చస్తున్నా, ఇంకా అందరివీ కూడా నే చూడలేను. నన్నొదిలేయ్!" అంటూ అక్కడినుంచి బయటకి వెళ్ళిపోయాడు బ్రహ్మం. అందరూ కాసేపు సంగీత్ కార్యక్రమాన్ని ఆన్లైన్లో చూసారు. అక్కడ పాటలకు ఇక్కడ వీళ్ళు స్టెప్పులెయ్యటం, పాటలు పాడటం చేశారు. తర్వాత మళ్ళీ భోజనాల కోసం ఫ్రెష్ అవ్వటానికి వెళ్లారు. ఉదయం లేట్ అయ్యిందని ఈసారి మీటింగుకి 10 నిముషాల ముందే సిద్ధంగా ఉంది సుందరి. భోజనాల సమయానికి అందరూ కనెక్ట్ అయ్యాక పార్సెల్ విప్పమంది గుణసుందరి. అందరూ పార్సెల్ విప్పి చూసి ఆశ్చర్యపోయారు. అందులో ఒక కారియర్, చిన్న బాక్సులు, అరటి ఆకులు, ప్లాస్టిక్ అరటి ఆకుపై ఏవో రాసి ఉన్నాయి. అందరూ ఓపెన్ చేసాక, ప్లాస్టిక్ ఆకుని పట్టుకుని చూపిస్తూ, "ఇదుగో ఇక్కడ నెంబర్లు ఉన్నాయి చూడండి, ఏ ఐటెం ఎక్కడ వడ్డించుకోవాలో, అదే నంబరింగ్ ప్రకారం అందరూ ఐటమ్స్ సర్దుకొండి. ఎలా అంటే, 1 ఉన్న చోట స్వీట్ కాజా, 2- లడ్డు, 3 - పులిహోర అలా. అందరూ తొందరగా సర్దుకొండి." అంది గుణసుందరి. అందరూ ఎవరి ఆకులో వాళ్ళు సర్దుకోవటం మొదలెట్టారు. అప్పుడే వచ్చి ఇదంతా చూసిన సుందరి భర్తకి మతి పోయినట్టు అయ్యింది. "ఏమిటే ఇదంతా?" అన్నాడు సుందరితో. "ష్! మాట్లాడకండి. మీరు కూడా ఇక్కడ కూర్చొని మీ ఆకులో భోజనం సర్దుకొండి" అంది సుందరి. అందరూ ఆకుల్లో సర్దుకున్న ఐటమ్స్ ఫోటో తీసి పెట్టారు. ఒకేసారి కౌంట్ డౌన్ స్టార్ట్ చేసి 3, 2, 1 అని అందరూ తినటం ప్రారంభించారు. "ఇదెక్కడి సంతరా బాబు?" అని తల గోక్కుంటూ ఎదో తిన్నా అనిపించాడు బ్రహ్మం. సుందరి మాత్రం ఆకుతో సహా అన్నీ ఖాళీ చేసేసి, బ్రేవ్ మని త్రేన్చింది. భోజనాల అనంతరం ముహూర్తం వేళకి అందరూ మళ్ళీ మీట్ అయ్యారు జూమ్లో. అప్పటికే ఐటెంస్ అన్ని పూర్తిగా తినటం వల్ల, భుక్తాయాసంతో, ఉదయం నుంచీ మార్చి మార్చి మీటింగులో కూర్చోవడం వలనా వాలిపోయారు అందరూ. రాత్రవ్వటం వల్ల మేకప్పులు పోయి నిద్ర మొహాలతో ఉన్నారు. నెమ్మదిగా ఒక్కొక్కరూ కునుకు తీయ్యటం మొదలెట్టారు. సరిగ్గా తాళి కట్టే వేళకి అంతా మంచి నిద్రలోకి జారుకున్నారు. సుందరి చెప్పిన "తాళి కట్టే సమయానికి ఉండండి" అన్న మాట గుర్తు తెచ్చుకుని తాళి కట్టే సమయానికి సుందరిని లేపాడు బ్రహ్మం. ఆన్లైన్ లోనే అక్షింత‌లు వేసి, ఆశీర్వదించారు అందరూ ఆ కొత్త జంటని. "సుందరీ అలా ఊరికే ఆశీర్వదిస్తే ఏం బాగుంటుంది, ఏమైనా చదివింపులు కూడా ఉండాలి కదా! పాపం వాళ్ళు ఇంత ఖర్చు చేసి మనకి భోజనాలు కూడా పంపించారు మరి. ఏమీ ఇవ్వకపోతే ఏం బాగుంటుంది చెప్పు?" అని అడిగాడు అమాయకంగా బ్రహ్మం. "దానికేం, అవి కూడా అయ్యాయి అండి, అందరం తలా పదివేలు వాళ్ళ అకౌంటుకి ట్రాన్స్ఫర్ చేసాం మొన్ననే" తీరిగ్గా చెప్పింది సుందరి. "ఏంటి పదివేలా, నీ దగ్గర అంత డబ్బు లేదు కదే? మరెలా ఇచ్చావు?" అడిగాడు బ్రహ్మం సందేహంగా. "నా దగ్గర లేకపోతేనేం.. మీరున్నారు కదా. ఇంకెలా ఇస్తాను. మీ కార్డ్ లో నుంచే" అంది సుందరి. "నా కార్డులో నుంచీ ఎలా తీసావు? అసలేలా పంపేవు? నీకసలు ఎలా ఓపెన్ అయ్యింది?" అంటూ తన సందేహాన్ని వెళ్లబుచ్చాడు బ్రహ్మం. "ఇందాక మీరు విడిచిన లాల్చీ జేబులో ఉందిగా మీ కార్డు.. అందులో నుంచే తీసాను. అయినా మీకు మతిమరుపు గానీ వచ్చిందా ఏంటి? అలా కార్డు వెనుకే రాసుకున్నారు పిన్ను. ఎవరైనా తీసేస్తే ఏంటి పరిస్థితి? మీ క్రెడిట్ కార్డ్ నెంబర్ మా ఫ్రెండుకి ఇచ్చాను. దాంట్లో నుంచీ తను పదివేలు డ్రా చేసి, నా పేరుతో ట్రాన్స్ఫర్ చేసింది అంతే!" అసలు విషయాన్ని బయట పెట్టింది సుందరి. ఆ మాటకి "చచ్చాం పో, ఆ కార్డు నాది కాదే, నా ఫ్రెండు వెంకట్రావుది. నా కార్డు పోయిందని కంప్లైంట్ ఇచ్చాను, ఇందాక ఎదో అవసరానికని వెంకట్రావు కార్డు నా చేతికిచ్చాడు" అని హతాసుడయ్యాడు బ్రహ్మం. - ప‌రిమ‌ళ క‌ళ్యాణ్‌

రావోయి అతిథి

తెలుగువ‌న్‌-అక్ష‌ర‌యాన్ సంయుక్తంగా నిర్వ‌హించిన ఉగాది క‌థ‌ల పోటీలో తృతీయ బ‌హుమ‌తి రూ. 1,116 పొందిన క‌థ‌ "సుగుణా ఏం ఆలోచించావ్?"  "కాస్త టైమ్ కావాలి ధీరజ్." "సరే ... నువ్వు చైత్ర పుట్టిన రోజు నాటికి నీ ఒపీనియన్  చెప్పు .... నేను చాలా ఏర్పాట్లు చేసుకోవాలి ... సరిగ్గా పదిరోజులు టైమ్ ఉంది.. ఆలోచించు... అది నీకు, నాకు కూడా మంచిది... మనం చైత్రని అపురూపం గా చూసుకోవలసిన అవసరం ఉంది... దానికోసం, మనకోసం కూడా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నా. అంతేకాదు నేను ఒక భాద్యత గల పౌరుడిని కూడా. నీకు నా గురుంచి తెలుసుగా... నీకు సామాజిక భాద్యత కూడా ఎక్కువే అని.. అది నచ్చే నువ్వు నన్ను ఇష్టపడి  పెళ్లి చేసుకున్నావ్ కదా.. నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది.. కాస్తా మనస్సు పెట్టి ఆలోచించు." "అలాగే ధీరజ్" అంది ముభావంగా సుగుణ.  "హాపీ బర్త్ డే చైత్రా"  "థాంక్యూ అమ్మా" "పుట్టిన రోజు శుభాకా౦క్షలు తల్లీ.. ఇక లే.. స్నానం చెయ్యాలి , కొత్తబట్టలు వేసుకోవాలి, గుడికి వెళ్ళాలి, అక్కడ నుంచి మీ స్కూల్ కి వెళ్ళాలి. అక్కడ మీ నేస్తాలుంటారు,  అందరికీ స్వీట్స్ ఇవ్వాలి. సాయంత్రం పార్టీకి మీ నేస్తాలను పిలవాలి. మా నేస్తాలని కూడా. అయ్యబాబోయ్ చాలా పనులున్నాయ్. నువ్వు తొందరగా లే తల్లీ" అంటూ మురెపంగా నుదుటి మీద ఒక ముద్దు ఇచ్చి మంచం దిగాడు ధీరజ్.  "నాన్నా నీ నేస్తాలు ని కూడా పిలుస్తావా!" "యెస్" "అదేంటి ఎప్పుడూ పిలవవు కదా.. ఈ సారి ఎందుకు?" అని అడిగింది అయిదో  క్లాస్ చదువుతున్న చైత్ర.  "నా నేస్తాలే కాదు, అమ్మ నేస్తాలు కూడా." "అదే ఎందుకు అంటున్నా" "ఈ మహారాణి పుట్టిన తరువాత మమ్మల్ని మర్చిపోయావ్ నువ్వు అని, మా స్నేహితులు, అమ్మ స్నేహితులు కూడా  అడుగుతున్నారు...అందుకే పిలుస్తున్నా." "ఓ అదా సంగతి.. అయినా నాకు ఈ పుట్టిన రోజు నచ్చలేదు నాన్నా." "ఏం ఎందుకని?" "నానమ్మ లేదుగా.. ఉంటే ఎంచక్కా... ఈ పాటికి నేను నానమ్మ గుడికి వెళ్ళి వచ్చేసేవాళ్లం." "అవును కదా.. ఏం చేస్తాం.. దేవుడి దగ్గరికి వెళ్లిపోయింది నానమ్మ." "అయితే నేను ఒక్కసారి దేవుడి  దగ్గరకి వెళ్ళి నానమ్మని  చూసి రానా! నానమ్మ కాళ్ళకి దండం పెట్టి చాక్లెట్ నోట్లో పెట్టి వచ్చేస్తా." అన్నది చైత్ర.  "నోర్మూసుకో ....మొదల పెట్టింది నానమ్మ పురాణం ... ఇక మంచం మీద నుంచి లేవండి... పుట్టిన రోజు పూట అపశకునం మాటలు మీరు." అని కోపంగా అంది సుగుణ.  "అబ్బా ఎందుకు సుగుణ అంత కోపం .. ఏదో చిన్నపిల్ల." అని వెనకేసుకొచ్చాడు ధీరజ్.  "ఏంటి చిన్నపిల్ల... మీరు, మీ మాటలు." అని కసిరింది సుగుణ.  "అంతరార్థం అర్థ‌మైందిలే సఖీ.. మరి నా ఏర్పాట్లు నేను చేసుకోవచ్చా... నువ్వు  సిగ్నల్ ఇచ్చినట్టేనా" అన్నాడు ధీరజ్ ఓరకంట సుగుణని చూస్తూ. "ఏది చేసినా మన చైత్ర గురుంచే కదా... ఉన్న ఒక్క గా నొక్క బిడ్డ ఆనందగా, సంతోషంగా ఉండాలి .. నాకెలాంటి ఇబ్బంది లేదు.. కాని మనతో కలుస్తుందో, లేదో. చిన్న బెంగ ఉంది." అంది  సుగుణ.  "నీ మనసు నాకు తెలుసు. అది నాకు వదిలేయ్, నేను చూసుకుంటా కదా, ఐ లైక్ ఇట్ డియర్" అంటూ బుగ్గ గిల్లి.. "హమ్మయ్య, ఇప్పుడు నాకు కాస్త ప్రశాంతం గా ఉంది." అంటూ స్నానానికి బయల్దేరాడు ధీరజ్. 'సుగుణ తొందరగానే ఒప్పుకుంది.. అల్లరి చేస్తుందేమో అనుకున్నా.. నాట్ బేడ్..' అనుకుంటూ బాత్ రూంలో కమోడ్ మూత వేసి దాని మీద కూర్చొని ఒక్కసారి గతంలోకి తొంగి చూశాడు ధీరజ్   లాస్ట్ ఇయర్ చైత్ర పుట్టినరోజు కి రెండు రోజుల ముందు.... "ఒరే ధీరు, మన వంశంలో  ఆడపిల్ల అనగానే వడ్ల గింజ వేసి చంపేస్తుంటారుట. అందుకే ఎక్కువ మగ సంతానమే. అబ్బాయి కావాలంటే మా దగ్గరకి రండి.. అని మీముత్తాతలు  సవాలు విసిరేవారట.. ఆ దేవుడికి కోపం వచ్చినట్టుంది, మా ముందర  తరంలో గాని, మాతరంలో గాని ఆడపిల్లలే లేకపోయే. ఇకపోతే మా తాత కూడా మూర్ఖుడే.. నేను కడుపులోనుంచి బయటకు రాగానే ఆడపిల్ల అని చెప్పగానే, వడ్ల గింజ వేసేశారట.. కానీ మా అమ్మమ్మ  సాయంతో, మా అమ్మ  దయవల్ల అలా వడ్ల గింజకి  కూడా చావకుండా బతికి బట్ట కట్టాను నేను. కానీ ఆడపిల్ల అనగానే ఎందుకో అసలు మనిషిలాగానే చూడరు ఎందుకో ? .. నాకు చాలా సార్లు చనిపోవాలని కూడా అనిపించేది. కానీ మా అమ్మ ఉంది చూసావు ... తను మాత్రం నన్ను చూసి మురిసిపోయేది. నువ్వు చచ్చిపోతే ఎలా రాముడూ..! నువ్వు బతికితే, ఒక తరం బతికినట్టే అనేది. ఆడపిల్ల ఇంటికి ఎంత అందమో, ఏమీ ఆశించకుండా ఈ ఆడపిల్ల.. ప్రేమని , అనురాగాన్ని పంచి,  పెళ్లి అనే అపురూపమైన బంధాన్ని కలిపి ఒక కుటుంబాన్ని పరిచయం చేస్తుంది. ఇది తెలుసుకోవడానికి మీ మగాళ్ల‌ జీవితాలు సరిపోవురా.. ఒక ఆడపిల్ల ఆడపిల్ల‌యి ఒక  వంశాన్ని వృద్ది చేస్తుంది, ఈ ఆడపిల్లని అపురూపంగా మహారాణిలా పెంచాలిరా.. అమ్మ నాన్న దగ్గర మాత్రమే ఆ మహారాణి మురిపాలు, ముద్దులు. మెట్టినింట అన్నీ భాద్యతలు, బరువులే... అయినా, ఆనందంగా భరించే శక్తి ఆడపిల్లకి మాత్రమే  సొంతం.. భర్త కుటుంబాన్ని తన కుటుంబంగా భావించి, ప్రేమించే గుణం ఒక్క ఆడపిల్లకి మాత్రమే చేతనవుతుంది తెలుసా.. ఒరే ధీరు.. ఈ మహారాణిని అపురూపంగా చూసుకోరా.. నీ దగ్గరున్నంత వరకు గుండెల్లో పెట్టుకుని చూసుకో.. పాపాయి చేసే ప్రతి అల్లరి నీకు ఏదో ఒకటి నేర్పించి తీరుతుంది. నీకున్నంతలో ఏ లోటు లేకుండా చూసుకో ధీరు.. ఒకవేళ‌ ఏ లోటున్నా భర్తీ చేసెయ్యరా సాధ్యమైతే.. భవిష్యత్తు అందంగా ఆలోచించి తీర్చిదిద్దరా.. నీకు అమ్మవుతుంది, తోడవుతుంది.. నీకు హద్దులు లేని ప్రేమని కురిపిస్తుంది... ప్రతి ఒక్కడికి ఒక కూతురుండి తీరాలిరా.. అప్పుడు మాత్రమే ఒక అమ్మ విలువ తెలుస్తుంది." అని చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.  మరో రెండు రోజుల తరువాత...  ఆ రోజు సాయంత్రం చైత్రని.. స్కిన్ ఎలర్జీ వచ్చిందని  హాస్పిటల్ కి తీసుకుని వెళ్లింది అమ్మ... తిరిగి వస్తున్న ఆటోని ఒక లారీ బలంగా గుద్దెయటంతో అమ్మ అక్కడికక్కడే చనిపోయింది.. చైత్ర చిన్న చిన్న దెబ్బలతో బతికింది.. ఆ రోజు త‌న‌ జీవితంలో మర్చిపోలేని రోజు.. ఏక్సిడెంట్ లో అమ్మ పోయింది.. కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్టైంది.  చైత్ర అంటే అమ్మకి చాల ఇష్టం. చైత్ర పుట్టిన తరువాతే అమ్మ త‌మ‌ వూరు నుంచి వచ్చి త‌న‌ దగ్గరకి వచ్చి ఉంది. అమ్మ ప్రపంచమే చైత్ర అయిపోయింది. చైత్రని విడిచి ఒక్క క్షణం ఉండదు. దాని పుట్టిన రోజు  ప్రతిసంవత్సరం పండగలా చెయ్యాలి. లేకపోతే అసలు ఒప్పుకునేది కాదు.  ఒక్కోసారి సుగుణ ఉడుక్కునేది... 'అత్తయ్యను చూడండి నా కూతుర్ని తన వశం చేసేసుకుంది' అని.. కానీ 'అది తప్పు... నా కూతురే అమ్మని వశం చేసుకుంది' అనేవాడు. ఇలా, సుగుణ ఆరోపణ చేసిన ప్రతీసారి,  'అమ్మ ఉండబట్టే టెన్షన్ లేకుండా ఉద్యోగం చేసుకుంటున్నావ్ .. లేకపోతే చిన్నపిల్లని .. ఆడపిల్లని చూసుకోవాలంటే ఎంత కష్ట‌మో నీకు తెలీదు' అనేవాడు త‌ను.  అందులో కూడా నిజం ఉండడంతో.. సుగుణ కిమ్మనేది కాదు.. నాన్న త‌న‌ చిన్నప్పుడు పోవడంతో అమ్మ... త‌న‌ను అల్లారుముద్దుగా పెంచింది... ఒక బ్యాంక్ ఉద్యోగిని చేసింది.. త‌న‌ ఇష్ట‌ప్ర‌కార‌మే  ఒక పేదింటి పిల్లని.. బ్యాంక్ ఉద్యోగిని త‌ను ఇష్ట‌పడ్డానని పెళ్లి చేసింది. సుగుణని కూడా ఊరు వెళ్లినప్పుడు అమ్మ కూతురులాగానే చూసుకుంటుంది అని  సుగుణ చాలా సార్లు త‌న‌కు చెప్పింది.  నానమ్మ మీద బెంగతో చైత్ర ఇంకా తేరుకోలేదు.. చాలా రోజులు త‌మ‌తో మాట్లాడేది కాదు. నానమ్మ కావాలని అల్లరి చేసేది. అమ్మ ఉన్నప్పుడున్న కలివిడితనం మళ్ళీ చూస్తానో లేదో చైత్రలో అని త‌న‌కు బెంగగా ఉండేది ....  "చైత్ర మనతో బాగా ఉండటం లేదు ధీరు.. మామూలు మనిషి ఎప్పుడవుతుందో.." అని సుగుణ కూడా బాద పడేది. చైత్రని ఎలా చూసుకోవాలో అని.. అమ్మ చెప్పిన మాటలు త‌న‌ చెవుల్లో ఇంకా మారుమోగుతున్నాయి.. చైత్రని చూసినప్పుడల్లా అమ్మ త‌న కళ్ళముందున్నట్టే అనిపిస్తుంది ... అమ్మ చెప్పింది నిజం. ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్ల ఉండాలి, ఆడపిల్లలో  అమ్మ కనపడుతుంది" అని ఒకసారి మనసులో అమ్మని తలచుకున్నాడు ధీరజ్. ఇంతలో, "ఏంటండీ.. .బాత్రూమ్ లో ఉండిపోయారు.." అంటూ సుగుణ పిలిచిన పిలుపుకి స్నానం పూర్తి చేసి బయటకు వచ్చాడు. వస్తూనే... "సుగుణ కాటరింగ్‌కు ఆర్డర్ ఇచ్చేశాను. ఇల్లు అలంకరించడానికి వస్తున్నాడు... కాస్త దగ్గర ఉండి చూసుకో.. మా ఆఫీసు నుంచి వచ్చిన వారికి బహుమతులు ఆ రూంలో ఉన్నాయి.. ఆ ... చైత్రని రెడీ చేసేస్తే గుడికి వెళ్ళి .. స్కూల్ లో పిల్లలకి చాక్లెట్స్ ఇచ్చి, మరో సారి చైత్ర స్కూల్ టీచర్స్ ని ఆహ్వానించి వచ్చేస్తా.. అన్నట్టు మీ స్నేహితులకు ఫోన్ చేసి చెప్పావా లేదా... చూడు చూడు ఎవర్ని మరచిపోయినా ... దండయాత్రకు వచ్చేస్తారు నీ హితులు." అని ఆట పట్టించాడు ధీరజ్ . "అన్నట్టు పంతులుగారిని సాయంత్రం నాలుగయ్యేసరికి ఉండమని ఫోన్ చెయ్‌." ... అంటూ రెడీగా ఉన్న కూతుర్ని వెంట బెట్టుకుని గుడికి బయలుదేరాడు ధీరజ్.     ** సాయంత్రం నాలుగు గంటల సమయం .... ధీరజ్ ఇంట్లో సందడి. ఇంటి గుమ్మాలకి పూలతో, మావిడి తోరణాలతో అందమైన అలంకరణ, బంధువులు, స్నేహితుల పలకరింపులు, ఇరుగు పొరుగు అమ్మలక్కల మూతివిరుపులు, పవిత్ర మైన వేదమంత్రాల ఉచ్ఛారణ మద్య “రావోయి అతిధి” కార్యక్రమం  సందడి సందడి గా మొదలైంది .... చిత్రం కదా అని విచిత్రంగా చూస్తూ .....సమాధానం ఎవరు ఏ విధంగా చెబుతారో అని ఒకరి ముఖాలలో  ఒకరు ప్రశ్నలు – సమాధానాలు వెతుక్కుంటున్నారు అతిథులు.. వీటిని భంగపరుస్తూ ధీరజ్ స్నేహితుడు కిరీటి అక్కడకి వచ్చాడు .. "నోరెళ్ళ బెట్టుకుని చూస్తున్నారేంటి ఆసీనులవ్వండి." అంటూ అందర్నీ ఉద్దేశించి చెప్పడంతో అక్కడ జరిగిన తంతు క‌ళ్లార్ప‌కుండా కూర్చొని  చూస్తున్నారు. ఇంతలో ఒకామె .. వయస్సు సుమారు యాభై -అరవై  మధ్య‌లో .. లేత ఆకుపచ్చ చీరతో కాస్త పొట్టిగా తెల్లగా కాస్త బక్కగా ఉన్న ఆమెని చైత్ర తీసుకుని వచ్చి ధీరజ్, సుగుణ పక్కనే కూర్చోబెట్టింది.. ఆమె మెడ చుట్టూ చేతులు వేసి "నానమ్మా" అంటూ చైత్ర గారాలు పోతోంది.  "ఆమెని.. సుగుణ ధీరజ్ లు దత్తత తీసుకుంటున్నారట" అన్నారు ఎవరో మెల్లిగా..... "ద....త్త......త...... అదేంటి పిల్లలని దత్తత తీసుకున్న పెద్దవాళ్లని చూశాం గాని, పెద్దలని దత్తత తీసుకున్న పిల్లలని ఎక్కడా చూడాలేదమ్మా విడ్డూరం కాకపోతే.." అన్నారెవరో. "ఆవిడని ఓల్డేజ్ హోమ్ లో నుంచి తెచ్చి మరీ దత్తత తీసుకుంటున్నారు, దానికేమో “రావోయి అతిధి” అని క్యాప్షన్ ఒకటి, చోద్యంగా లేదు! అదే కదా....అంటున్నా.." అంది ఒకామె. "ఈ రోజుల్లో అమ్మానాన్నలే  బరువైపోతున్నారు... ఉన్న‌వాళ్ళు  ఎప్పుడు చనిపోతారా అని ఎదురుచూస్తున్నారు. అయినా సుగుణకి బుద్ది లేదు గాని మొన్నీ మద్య అత్తగారు ఏక్సిడెంట్ లో చనిపోయింది .... హాయిగా ఉండక ఇదేం పని.. మళ్ళీ ఒక ముసలిదాన్ని తెచ్చుకుంటోంది  బుర్ర లేకుండా. పుట్టినవాళ్ళు, చావకుండా ఉంటారా ఏమి, మొన్న ఆమె, ఈ రోజు ఇంకొకరు ...పుట్టడం, చావడం కామన్ కదా" అంది ఒకామె. "ఆ.. ఏముంది.. బిల్డప్... కూతుర్ని చూసుకోవడానికి ఒక మనిషి కావాలి కదా.. ఇద్దరూ ఉద్యోగులాయె... ఒక మనిషి ఉంటే ఎంత ఖర్చు ఈ రోజుల్లో"... అని రకరకాలుగా అనుకుంటున్నారు అక్కడున్నవాళ్ళు. అన్నిటికి తెర దించుతూ.. "అమ్మ దత్తత స్వీకారానికి.. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ కృతజ్ఞ‌తలు"... అంటూ... "ఈమె పేరు సత్యవతి కానీ అతికొద్దికాలంలోనే నా కూతురు చైత్ర  రాముడమ్మగా మార్చేసింది.... ఈమె భగవంతుడు నాకిచ్చిన మరో అమ్మ, మా అమ్మ, నా భార్యకి అత్తగారు, నా ముద్దుల కూతురికి నానమ్మ.."  అని పరిచయం చేశాడు ధీరజ్. ఆమె హుందాగా తలవంచి అందరికీ నమస్కారం చేసింది. ఆమె కళ్ళల్లో ఉన్న కన్నీటి పొర లీలగా ఆనందాన్నివ్యక్తపరిచింది. వచ్చిన ఆహుతులందరిలో ఎన్నో ప్రశ్నలున్నాయి.. "ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావో కాస్తా వివరిస్తావా?" అన్నాడు స్నేహితుడు కిరీటి. "ఎస్... చెబుతా.. సరిగ్గా అమ్మ చనిపోయి ఎనిమిదినెలలయింది. నా కూతురు ఇంతవరకు మాతో మాట్లాడి౦దే లేదు. ఒక పదిహేను  రోజుల నుంచి మునుపటి చైత్ర లా మాట్లాడుతోంది.. ఆ చిన్నారికి నానమ్మ పోయిన తరువాత తేరుకోవడానికి ఇన్ని రోజులు పట్టింది అన్నమాట అనుకున్నాం.. ఈ మద్య  ఒక సంఘటన కూడా జరిగింది. నా కూతురు స్కూల్ కి రాలేదని టీచర్ నుంచి ఫోన్ వచ్చింది. వాకబు చేస్తే నా కూతురు స్కూలుకి దగ్గరలో ఉన్న ఒక ఓల్డేజ్ హోమ్ లో దిగినట్టు రిక్షా వాడు చెప్పాడు. అక్కడకి ఎందుకు వెళ్లి౦దో అర్థం కాలేదు. మరుసటి రోజు కూడా అదే జరిగింది. అదెలా చూసిందో తెలీదు. ఎవరనుకుందో తెలీదు. అక్కడ ఒకామెతో పరిచయం. పిల్లలు ఎక్కువగా పెద్ద వాళ్ళతో కనెక్ట్ అవుతారు. ఎందుకంటే మా అమ్మతో చైత్ర బాగా కనెక్ట్ అయింది. బహుశా అలా కనెక్ట్ అయి ఉంటుంది. మా అమ్మ చనిపోవడం చాలా పెద్ద లోటు చైత్రకి. బహుశా ఆమెలో నానమ్మని చూసి ఉంటుంది  చైత్ర.  నేను అప్పటినుంచి కాస్తా దగ్గరగా ఆబ్జెర్వ్ చేసి చూసా.. వారం రోజుల తరువాత మా అమ్మ చీరలన్నీ ఒక సంచిలో పెట్టి తీసుకుని వెళ్ళి ఆమె కిచ్చింది.. మెల్లి మెల్లిగా చైత్రలో మార్పు వస్తోంది.. ఆమె కూడా చైత్ర కాస్త లేట్ అయితే చాలు వాచ్ మెన్ బుర్ర తినేస్తుంది.. ఆమెకి లంచ్ లో పెట్టిన గుత్తి వంకాయ కూర ఓ రోజు దాచి ఉంచి చైత్రకి తినిపించింది.. ఆమెని "నానమ్మ" అని పిలవటం నా చెవులతో నేను విన్నా... 'ఇక్కడెందుకు ఉండిపోయావ్... నాన్న దగ్గరికి వచ్చేస్తే బాగుంటుంది' అని అడిగింది. దానికి సమాధానంగా ఆమె ఏడ్చింది. 'నాకు ఎవరూ లేరు తల్లీ.. నా కోసం రోజు వస్తావా' అని అడిగింది ఆమె.  'ఓ ఎందుకు రాను..  రోజు నేను వస్తా'.. అని ముద్దుగా తల మీద చెయ్యి వేసి చెబుతున్న చైత్రని ముద్దులతో ముంచెత్తింది ఆమె.  ఆ రోజునుంచి నా కూతురిలో పాత చైత్రని చూసా.. మా అమ్మ చనిపోయిన తరువాత చైత్రలో ఇదివరకటి ఉత్తేజం లేక చురుకుగా ఉండేది కాదు.. ఈవిడని కలిసిన తరువాత మునుప‌టి చైత్రలా మారిపోయింది. హుషారుగా మారిపోయింది. అప్పుడు మా అమ్మ చెప్పిన మాట నాకు గుర్తుకు వచ్చింది. చైత్ర జీవితంలో “ఏదైనా లోటు ఉంటే భర్తీ చేసెయ్యరా......సాద్యమైతే” అనేది మా అమ్మ. పిల్లలు పుట్టకపోయినా, పుట్టిన వాళ్ళు చనిపోయినా దత్తత తీసుకుంటాం.. మరి పెద్దవాళ్లను కోల్పోయాక వాళ్ళని  ఎందుకు దత్తత తీసుకొని పెంచుకోకూడదు అన్న ఆలోచన వచ్చింది.. సుగుణతో చర్చించా.. 'పెద్దవాళ్ళ చాదస్తం భరించటం కాస్త క‌ష్ట‌మైన పనే.. కానీ మన అల్లరిని వాళ్ళు భరించినప్పుడు వాళ్ళ చాదస్తాన్ని మనం కూడా  భరించాలి. వచ్చినావిడ మనతో సర్దుకుపోతుందో లేదో' అన్న అనుమానం వ్యక్తం చేసింది సుగుణ.. 'మనం ప్రేమిస్తే ఆమె కూడా మనల్ని ప్రేమిస్తుంది. ప్రేమ ఉంటే సర్దుకోవటం పెద్ద క‌ష్టం కాదు' అనుకున్నాం. వెంటనే ఓల్డేజ్‌ హోమ్ వాళ్ళతో మాట్లాడాం.. వాళ్ళ అంగీకారం, ఆమె అంగీకారం తీసుకున్నాకే ఈ దత్తత కార్యక్రమం ఏర్పాటుకి శ్రీకారం చుట్టా.    ఆమె కళ్ల నిండా కన్నీళ్లు ఆనంద భాష్పాలై చెక్కిళ్ల‌పై జాలువారుతున్నాయి. మనసు ఆనంద డోలికలలో తేలియాడుతోంది. నాకూ ఒక కుటుంబం ఉందని తెగ సంబరపడింది సత్యవతి . 'వెళ్ళు వెళ్ళు అదృష్ట‌వంతురాలివి.. భగవంతుడు నీకు ఒక మనవరాలిని, కొడుకుని, కోడలిని ఇచ్చాడు. నువ్విప్పుడు మాలా అనాథ‌వు కాదు' అని తోటి ముసలివాళ్లు అంటుంటే  తెగ సంతోషపడింది.. అంతేకాదు, అలా ఎవరైనా వచ్చి మమ్మల్ని తనవాళ్లలా చూసుకునే వాళ్ళు దొరికితే ఎంత బాగుండు కదా అని బాధ‌పడ్డవారు కూడా ఉన్నారు. ఇక్కడ నా స్వార్ధం కూడా ఉంది .. నా చిట్టితల్లి సంతోషం.. నానమ్మ పోస్ట్ ఖాళీ అయిపోయింది.. ఇలా కొత్త అతిథితో భర్తీ చేసుకుంటున్నా.. ఈమె మాకు శాశ్వత అతిథి కావాలనుకుంటున్నాం.  భగవంతుడి దయవల్ల మేమిద్దరం మంచి పొజిషన్ లో ఉన్నాం.. మాకున్నది ఒక్క కూతురు. ఒక మనిషిని మా మనిషిగా చూసుకోవడానికి మేము అంత ఆలోచించక్కర్లేదనిపించింది.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. మనస్ఫూర్తిగా సత్యవతిని నాకు తల్లిగా స్వీకరిస్తున్నా.. ఆమె నా బాధ్య‌త‌. ఆమె నాకెప్పుడూ బరువు కానేకాదు. నాకు భగవంతుడు మళ్ళీ తల్లినిచ్చాడు.. ఆయనకి నేనెప్పుడూ రుణపడి ఉంటాను."  అన్నాడు ఉద్వేగంగా ధీరజ్.  "హేట్సాఫ్ ధీర‌జ్‌.. నువ్వు చేసిన ధైర్యం మేమంతా చేస్తే.. ఓల్డేజ్‌ హోంల అవసరం ఉండేది కానే కాదు.. వృద్దులు మన సంపద.. వాళ్ళ అనుభవాలు, ఆశీస్సులు మనబిడ్డల జీవితాలను సుసంపన్నం చేస్తాయి, పక్కదారి పడకుండా కాపాడుతాయి".. అంటూ అక్కడనుంచి మిగిలిన వాళ్ళతో పాటు సంతృప్తి చెందిన మనసుతో ఓల్డేజ్ హోమ్ వైపు కదిలాడు కిరీటి.. *   *   * "అత్తయ్యా.. దాన్ని మీరు మరీ గారం చేసేస్తున్నారు.. ఇలా అయితే ఎలా చెప్పండి.. మొండితనం పెరిగిపోదు".. అంటూ వంటిట్లో నుంచి సుగుణ కేకలు "అబ్బా సుగుణా.. అది చిన్నపిల్ల... ఉదయం నుంచి చదువులు, గిదువులని ఉరుకులు, పరుగులే కదా ! అచ్చటైనా ముచ్చటైనా పుట్టింటి దగ్గరే కదా.. కాసింత టైమ్ దొరికింది పడుకోనీ పాపం.. ఇదిగో ఈ టీ తాగు." అంటూ కొడలికి టీ కప్పు అందించింది  రావుడమ్మ. "అమ్మా.. ఇక్కడొక మగవెధవనున్నాను.. నాకు కూడా టీ ఇవ్వాలన్న ఇంగితం లేకపోయే నీకు, నీ కొడలికి.." అన్నాడు ధీరజ్. "అబ్బా.. నీ దెప్పుడ్లు పాడుగాను.. వేడి వేడి పకోడీలతో.. అదిగో చిక్కటి కాఫి కలిపి ప్లాస్కు లో పోసి ఉంచింది నా కోడలు.. వెళ్ళి తిను.. అనవసరంగా కేకలు వేసి నా మనవరాలు నిద్ర పాడు చెయ్యకండి.. అంటూ ఇదిగో సుగుణా నా మనవరాలు లేచాక వేడిగా పకోడీలు వెయ్యి లేకపోతే చల్లారిపోతాయి." అంటూ  గదిలోకి వెళ్లిపోయింది రాముడమ్మ. - బంటుపల్లి శ్రీదేవి

దృక్ప‌థం

  తెలుగువ‌న్‌-అక్ష‌ర‌యాన్ సంయుక్తంగా నిర్వ‌హించిన ఉగాది క‌థ‌లో పోటీలో తృతీయ బ‌హుమ‌తి రూ. 1,116 పొందిన క‌థ "దృక్ప‌థం" "అమ్మా! తొందరగా! టిఫిన్... పరీక్షకు బయల్దేరాలి" హడావుడి చేస్తున్న కాశ్యప్ ని చూస్తూ "ఆగరా! బాబూ! హాల్ టికెట్ అవి సర్దుకున్నావా? వంటింట్లోంచి తల్లి "ఆ! ఆ! అన్నీ రెడీ! మేమంతా డైనింగ్ టేబుల్ దగ్గర రెడీ!" రాగయుక్తంగా పాడుతున్న ప్రసాద్ మాటలు వింటూ "వస్తున్నా! వస్తున్నా!" వేడివేడి ఇడ్లీలు తెచ్చింది. ముందే సిద్ధంగా ఉన్న కారంపొడి, కొబ్బరి చెట్నీలు ప్లేట్లలో వేసుకుంటున్నారు తండ్రి కొడుకులు. "ఉండండి. నెయ్యి మరిగించి తెస్తాను". మళ్లీ వంటింట్లోకి పరిగెత్తింది సుధ టిఫిన్ పూర్తికాగానే దేవుడి గదిలోకి వెళ్లి దండం పెట్టి వస్తూ అమ్మానాన్నలకు నమస్కరించాడు. కొడుకుని దగ్గరకు తీసుకుంటూ "జాగ్రత్త నాన్నా! అన్నాడు ప్రసాద్. "పోనీ నాన్నగారిని దింపమంటావేమిటి? అడిగింది సుధ "ఫరవాలేదు అమ్మా! వెళ్ళొస్తా! బైక్ స్టార్ట్ చేశాడు. వెంటనే అప్రయత్నంగా నోటినుండి " శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే...  అదేం అలవాటు అయిందో ఎప్పుడు అయిందో తెలీదు. నెక్స్ట్ జంక్షన్ వస్తోంది అంటే ముందుగానే చాలా అలర్ట్ అవుతూ ఉంటాడు. కాసేపు సిగ్నల్ లైట్లు వెలుగుతాయి. చాలాసార్లు ఆరెంజ్ రంగు ఉండిపోతుంది.  పోలీస్ కూడా అప్పుడప్పుడు నాలుగువైపులా చేతులూపుతూ, చెమటలు కారిపోతూ, ట్రాఫిక్ నియంత్రిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఏమవుతుందో తెలియదు. ఎవరూ ఉండరు. మనమే జాగ్రత్తలు తీసుకోవాలి. అనుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో వెనుక నుండి స్పీడ్ గా తనను దాటుకుంటూ ఒక బైక్ ముందుకు పోవడం  వేరే వైపు నుంచి ముగ్గురితో కూడిన పెద్ద బండి అతడిని ఢీ కొట్టడం క్షణాలలో జరిగిపోయాయి. అయ్యో! అనుకుంటూ అంతా మూగారు ఆక్సిడెంట్! ఆక్సిడెంట్! అంటూ అందరూ మూగారు.  ఆ పెద్ద బండి అబ్బాయిలు ఈ హడావుడిలో బండి అక్కడే వదిలేసి జారుకున్నారు. ముందు వెళుతున్న వాడి స్పీడూ పక్క నుండి వచ్చి ఢీ కొట్టిన వాడి స్పీడూ ఎంత ఉండవచ్చు? అని అంచనా వేస్తున్నారు కొందరు. 108 కి ఫోన్ చేయండి అంటున్నారు కొందరు.  కానీ చేసేవారు కనపడలేదు. పడిన వ్యక్తి లేవలేదు. ఎర్రటి రక్తం చిక్కగా రోడ్డుమీద పారుతోంది. చూడగానే అందరూ "అయిపోయాడు" అంటూ ఒక్కొక్కరుగా వాళ్ళ వాళ్ళ వాహనాలు ఎక్కి వెళ్ళిపోతున్నారు. కాశ్యప్ కి కాళ్ళు చేతులు ఆడలేదు. వెంటనే స్కూటర్ పక్కకి తీసి, తాళం వేసాడు.  "అతనిలో ప్రాణం ఉంటే రక్షించే ప్రయత్నం చేయాలి. అతనికి సహాయం చేద్దాము." అంటూ ఇద్దరు ముగ్గురిని అడిగాడు. ఒకతను ధైర్యంగా ముందుకు వెళ్లి తల పక్కకి పడి ఉన్న అతడిని వెల్లకిలా తీసి ఆ మొహం చూసి అమ్మో! అంటూ వెనక్కి వెళ్ళిపోయాడు. ఆటో వాళ్ళని బతిమాలాడాడు. వాళ్లలో వాళ్లు అనుకుని  "ఆటోలో ఎక్కించుకుంటాం. హాస్పిటల్లో చేర్చడానికి నువ్వు వస్తావా?" అని అడుగుతున్న వారికి సరే! అని బుర్ర ఊపాడు. ఆటోలో ఎక్కించుకొని హాస్పిటల్ లో ఎమర్జెన్సీ లో చేర్చి ఆటో వాడికి 200 ఇచ్చాడు. డాక్టర్లు ఎమర్జెన్సీ సర్వీసు ప్రారంభించారు. కంటి దగ్గర కుట్లు వేసి, ఫ్రాక్చర్ అయిన కాలుకి సిమెంట్ కట్టు వేసి ప్రమాదం లేదు అనేంతవరకు తను ట్రాన్స్ లో ఉన్నట్లు అలా వాళ్ళు అడిగిన మందులు అవి తెచ్చి అందిస్తున్నాడు. "ప్రమాదం నుండి బయటపడ్డాడు". అని డాక్టర్లు చెప్పేసరికి బయటకు వచ్చి చూశాడు. చీకటి పడుతోంది. సాయంత్రం ఆరుగంటలు అవుతోంది. చీకటి పడుతోంది. బయటకు వచ్చి ఆటో ఎక్కాడు. ఉదయం తాను ఎక్కడ తన స్కూటర్ ని ఆపాడో అక్కడకు చేరుకుని, బండి తీసుకుని నెమ్మదిగా ఇంటి ముఖం పట్టాడు.  అప్పుడు గుర్తొచ్చింది. "అమ్మో! తను ఇవాళ పరీక్ష రాయాలి. రాయలేదు. అమ్మానాన్నా ఎంత కంగారు పడతున్నారో? ఇల్లు చేరేసరికి తల్లి తండ్రి వీధి గుమ్మం లోనే కంగారుగా నిలుచున్నారు.  "నాన్నా! కాశ్యప్ ఏమైందిరా? ఎక్కడికి వెళ్లావు? పరీక్ష బాగా రాసావా? ఇంత చీకటి పడే వరకు ఎక్కడున్నావు?" ప్రశ్నల పరంపర కురిపిస్తున్న తల్లిదండ్రులను చూస్తూ లోపలకు అడుగు వేశాడు మౌనంగా. "బాబూ! కాశ్యప్ ఏమైందిరా?" అని ఆతృతగా అడుగుతున్న అమ్మ మొహం చూస్తూ ఒక తల్లి నుదుటి కుంకుమ నిలపడానికి భగవంతుడు నన్ను ఎన్నుకున్నాడు అనుకుంటూ అమ్మా! అంటూ భుజంపై వాలి వెక్కి వెక్కి ఏడుస్తున్న కొడుకుని చూస్తూ ఉంటే ఆమెకూ కన్నీరు ఆగలేదు. "అమ్మా! అమ్మా! నేనివాళ పరీక్ష రాయలేదు." వింటున్న ప్రసాద్ తుళ్లి పడి భగ్గుమన్న కోపంతో ప్రళయకాలరుద్రునిలా ఏదో అనబోతుంటే ఆపేసింది సుధ. "ఏమండీ ప్లీజ్! ఏమైందో? కనుక్కోండి పిల్లవాడిని పూర్తిగా చెప్పనివ్వండి." అంది "ఉండు నాన్నా! ఉదయం అనగా వెళ్లావు రెండు ఇడ్లీలు తిని. కాళ్ళు కడుక్కుని రా! అన్నం పెడతా! అప్పుడు చెపుదువు గాని." అంటుంటే తల అడ్డంగా ఊపాడు.  "సరే! ఉండు" అంటూ వంటింట్లోకి వెళ్లి అన్నం కలిపి తెచ్చింది. ఒక్కో ముద్ద నోట్లో పెడుతూ శాంతపరిచింది. "అమ్మా! మరి…. నేను ఉదయం వెళ్తుంటే... జరిగినదంతా చెప్పుకొచ్చాడు వింటున్న ప్రసాద్ ఒకే ప్రశ్న అడిగాడు సూటిగా  "అక్కడ అంత మంది ఉంటే నీకెందుకు అంత శ్రద్ధ!!" వెటకారం మిళితం చేసి అడుగుతుంటే తండ్రి వైపు చూస్తూ  నాన్న….‌ అస్పష్టంగా అంటూ మరి మాట్లాడలేకపోయాడు.  "చెప్పు మరీ… రెట్టిస్తున్న  తండ్రి వేపూ, తల్లి వేపూ చూస్తూ "నాకు మీరే గుర్తొచ్చారు నాన్నా! మీరే అలా పడి ఉంటే నేను వెళ్లిపోగలనా?" అరనిమిషం నేను ముందుకు వెళ్ళి ఉంటే????? ప్రాణమా?పరీక్షా? అని ఆలోచించడానికి పరీక్ష నా మనసులోకి రానే లేదు." వింటున్న సుధా ప్రసాదు నివ్వెరపోయారు. ఆ రాత్రి ముగ్గురు అన్యమనస్కంగా కలత నిద్ర లోనే కాలం గడిపారు. కాశ్యప్ ఉదయం లేస్తూనే తయారై "నాన్నా! మా ప్రిన్సిపాల్ కి లెటర్ రాశాను. సంతకం పెడతావా? అంటూ కాగితం తెచ్చి ముందు పెట్టాడు. జరిగినదంతా యథాతథంగా రాసాడు. మిగిలిన పరీక్షలు రాయడానికి అనుమతించమని కోరుతూ ముగించాడు. తండ్రిగా సంతకం పెడుతున్న ప్రసాదుకి మనసులో బాధగా ఉన్నా కొడుకు చేసిన పనికి మనసులో ప్రశంసించకుండా ఉండలేకపోయాడు.         - శ్రీలక్ష్మి చివుకుల

యుగ‌ళిధార‌

    తెలుగువ‌న్‌-అక్ష‌ర‌యాన్ సంయుక్తంగా నిర్వ‌హించిన ఉగాది క‌విత‌ల పోటీలో తృతీయ బ‌హుమ‌తి రూ. 1,116 గెలుపొందిన క‌విత‌ యుగ‌ళిధార‌ సీ. యుగయుగాలయుగాది యుజ్వలభవితలో                          ప్రజలలోనిండుగా రమ్యతొసగి  తీపిచేదువగరు చింతమామిడిపులుపు                        సమపాళ్ళయందన సకల మయెను అందరూ యాత్మీయ యనురాగ మందున                         పంచారు పచ్చడి  మధురిమలయి  పేదగొప్పాయని బేదము లేదు యు                         గాది హిందువుల యుగ్మమునయేగ తే భానుడుదయించ కమునుపే బండ్ల కట్రి  కర్షకులయి యారుకొనుచు కాంతులిరిసి  ఉత్సహమయులు నిలిచారు యున్న తముగ  పుడమి నిండుగా యుండాలి పులకరించి.  .ఆ. పసిడి పంట నిలుపు పైరుపచ్చధనము  పండితంబు నిలిచె పలుకు లల్లి  వేద విజ్ఞు లందు విజ్ఞాన మందించి  దేశ భవిత యెటుల దివ్య ముగను.  ఆ. విజయ మయ్యె నిలిచి విజ్ఞాన మందించి  హృథయ దీప్తి లోన హృదయు లయిరి  మాట లాడి నట్టి పంచాగ శ్రవణులు  దేశ భవిత నిలుపు తేజమొసగి  ఆ. యుగయుగాలచరిత యుర్విలో మెరిసెను  దరణి ధర్మబొసగె ధార్మికతను  రుధిర చిందియించె లోకమే తానయ్యి  కష్టపడుట లోన  కర్షకుడయి  ఆ. భవిత మెరుపు తీగ  భావితరాలలో  నిలిపి యుంచినాడు నిండుగాను  మెతుకు తోని బతుకు మోస్తున్న కర్షక  బందు వయ్య నీవు భవిత లోన  - వి. సంధ్యా రాణి 

స‌భ‌కు న‌మ‌స్కారం

తెలుగువ‌న్‌-అక్ష‌ర‌యాన్ ఉగాది క‌థ‌ల పోటీలో ద్వితీయ‌ బ‌హుమ‌తి రూ. 3,116 పొందిన క‌థ 'స‌భ‌కు న‌మ‌స్కారం' ''సభకి నమస్కారం... అందరికీ ఆహ్వానం !'' అంటూ మొదలెట్టాడు సచ్చిదానందరావు. ''రాన్రాను మన సమాజంలో 'బుక్‌ కల్చర్‌' కనుమరుగై, 'లుక్‌ కల్చర్‌' పెరిగిన విషయం అందరికీ తెలిసిందే! సాహిత్యానికీ, సాహితీవేత్తలకీ గుర్తింపు తగ్గిపోతున్న ఈరోజుల్లో... ఒక కవీ, లేదా కవయిత్రికి సంబంధించి ఐదంటే ఐదు కవితలైనా పత్రికల్లో అచ్చయ్యే అవకాశమే లేని ఈ కష్ట పరిస్థితుల్లో... పది కవితలు పత్రికల్లో ప్రింటవడమంటే మాటలు కాదు. అలాంటిది- గతవారమే ప్రముఖ మాసపత్రిక 'కౌజుపిట్ట'లో తన పదవ కవిత ప్రచురింపబడ్డ 'ప్రఖ్యాత' కవయిత్రి, 'చిరుజల్లు' అవార్డు గ్రహీత, 'సాహితీ సరస్వతి' బిరుదాంకిత, 'పారాణి' అనే కలంపేరుతో ప్రసిద్ధి గాంచిన శ్రీమతి 'పాముల ప్రసన్నరాణి' గారికి మా 'మనస్విని' సంస్థ తరపున ఇలా 'ఘనసత్కారం' చేయగల అవకాశం కలగడం మా అదృష్టంగా భావిస్తూ... మేడమ్‌గారి 'సాహితీసేవ'కి గుర్తింపుగా 'అభినవ మొల్ల' అనే బిరుదుని ఆవిడకి బహూకరిస్తున్నామని తెలుపడానికి సంతోషిస్తున్నాం!'' 'మనస్విని' సాహితీ, సాంస్కృతిక, సాంఘిక, సామాజిక, రాజకీయ, స్వచ్ఛంధ సంఘసేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడూ- కార్యదర్శీ- కోశాధికారీ- ప్రొప్రయిటర్‌, కమ్‌ 'హోల్‌ అండ్‌ సోల్‌- ఆల్‌ ఇన్‌ వన్‌' అన్నీ తానే అయిన సచ్చిదానందరావు వేదికపై మైకులో వీరావేశంతో ప్రేక్షకుల నుద్దేశించి చెప్తున్నాడు. అలా... చిన్నాచితకా పత్రికల్లో 'పది' కవితలు ప్రచురింపబడిన 'ప్రఖ్యాత కవయిత్రి పారాణి' మొదలు- ఏడాదికోసారి వెలువడే 'ఎక్కడా కనిపించని' ఓ చిన్నపత్రికలో తన ప్రథమ కవిత ప్రచురింపబడటం ద్వారా 'అసమాన ప్రతిభాపాటవాలను' ప్రదర్శించి 'అభినవ అల్లసాని' బిరుదుతో 'సముచిత సత్కారం' పొందనున్న 'ప్రముఖకవి ప్రవరాఖ్య' (కలంపేరట అది!) వరకు ఓ పాతిక మంది దాకా 'ప్రముఖ, ప్రఖ్యాత, ప్రసిద్ధ, సుప్రసిద్ధ' కవుల 'ప్రతిభ'ను తనదైన శైలిలో మైక్‌లో ఊదరగొట్టేశాడు... సంస్థ ప్రెసిడెంట్ కమ్‌ సెక్రెటరీ కమ్‌ ట్రెజరర్‌ కమ్‌ ఎట్సెట్రా... ఎట్సెట్రా! నాకు మహా చిరాకుగా వుంది. సాధారణంగా నేను 'ఇలాంటి' సభలకి రాను. కానీ, తనకు 'ఘనసత్కారం' చేస్తున్నారనీ, ఈ సత్కారసభకి నేనొస్తే తానెంతో సంతోషిస్తాననీ 'పారాణి' ఎంతో గారాలుపోతూ రిక్వెస్ట్‌ చేస్తే- వచ్చాన్నేను. ఇంతలో- స్టేజ్‌ పైన అనౌన్స్ మెంట్...... కాసేపట్లో ముఖ్యఅతిథిగారు వచ్చేస్తారు. ఆయన రాగానే సభని ప్రారంభించేద్దాం. అప్పటివరకూ ప్రేక్షకుల ఆహ్లాదం కోసం ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి...'' *** ''నాకో డౌటు సార్‌...'' నా ప్రక్కనే కూర్చున్న 'పారాణి' పలకరింపుకి తలతిప్పి 'ఏమిట'న్నట్లుగా చూశానామె వంక. ''దాదాపు పదిహేనేళ్లకు పైబడే మీరీ ఫీల్డ్‌లో ఉన్నారు కదా- మరి, ఇంతగా సాహితీసేవ చేసినా... మీకు ఒక్క అవార్డు కూడా రాలేదెందుకండీ?'' ఉలిక్కిపడ్డానామె ప్రశ్నకి. నా సమాధానం కోసమేనన్నట్లు నావైపే అమాయకంగా, ఆసక్తిగా... కాస్త 'జాలి'గా, ఇంకాస్త 'సానుభూతి'గా చూస్తున్న ఆమెని చూసి ఏమనాలో తెలీలేదు నాకు. ''అవునూఁ... ఇప్పటివరకూ పత్రికల్లో మీ కవితలెన్ని అచ్చయ్యుంటాయ్?'' అనడిగాను. తన ప్రశ్నకు నేను బదులివ్వకుండా తానూహించని ప్రశ్న నేనడిగేసరికి- కాసేపు 'అర్థంకాని అడ్వర్టయిజ్మెంట్' చూస్తున్నట్లు అయోమయంగా చూసింది 'పారాణి' నావంక. ''ఇందాకాయన మైకులో చెప్పారుగా... మొన్నటి కవితతో కలిపి మొత్తం పది !'' సందిగ్ధంగా బదులిచ్చినా, అందులో తన 'సాహితీప్రతిభ' తాలూకు దర్పం ధ్వనించిందామె స్వరంలో. ''సభ మొదలయ్యేలోపు నా కవితొకటి వినిపిస్తా... వినండీ!'' అంటూ నా అంగీకారం లేకుండానే మొదలెట్టేసింది –               ''ఎముకలు పిడుగుల్లా విరుచుకు పడుతూంటే...                                                                 నరాలు ఉరుముల్లా ఉక్కిరిబిక్కిరి చేసేస్తూంటే...                                                                 వర్షించే వర్షంలా గర్భాశయగోడలు చీలుస్తూంటే...                                                                 తనకోసం నడిచొచ్చే నక్షత్రానికి పురుడు పోస్తూ...                                                                 ఊపిరికే ఊపిరులూదుతూ- రాలే కన్నీటికూర్పును                                                                 ఆనందబాష్పాలుగా అనుభవిస్తూ...                                                                 తన కడుపుని చీల్చే కెరటం కోసం                                                                 అరుపుల ఆరాటంతో నెత్తుటి పోరాటం చేస్తూ...                                                                 అమృతం కోసం పర్వతం మోసిన కూర్మంలా                                                                 తనలోంచి చీల్చుకు వచ్చిన రక్తపుముద్దను చూస్తూ                                                                 కాన్పు కష్టాన్ని కాలుతున్న కాష్టంలా మోస్తూ...                                                                 అమ్మతనంలోకి అడుగేస్తుంది 'ఆడతనం'...                                                                 'ఆడతనం- అమ్మతనమే' కదా సృష్టికి మూలం !!'' మాతృత్వాన్ని ఎంత భీకరంగా వర్ణించొచ్చో మొదిసారి అర్థమై... భయమేసింది నాకు. 'ఎలావుంది?' అన్నట్లు కనుబొమలు ముడిపెట్టి చూస్తూన్న ఆమెని చూస్తూ- ''కడుపులో వేళ్లు దూర్చి పేగుల్ని మెలిపెట్టి తిప్పినట్లుంది!'' అన్నాను. ''థాంక్యూ సర్‌!'' అంటూ మురిసిపోతూ- ''ఇంతకీ మీకొక్క అవార్డైనా ఎందుకు రాలేదో చెప్పనేలేదు?!'' అంది నాపై జాలి కురిపిస్తూ. టీవీ ఛానెళ్ళలో తెలుగు డబ్బింగ్‌ సీరియళ్ళని రెగ్యులర్‌గా ఫాలో అయ్యే అమాయకురాళ్ళ పట్ల నాకున్న 'సింపతీ ఫీలింగ్‌'తో చూశానామె కళ్ళలోకి - ''నిజమే! మూడ్నెల్ల క్రితమే మొదలెట్టి పది కవితలు పూర్తిచేసిన మీకే ఇన్నిన్ని అవార్డులూ, రివార్డులూ, బిరుదులూ వచ్చేస్తుంటే... పదిహేనేళ్లుగా ఈ రంగంలో ఉంటూ- రెండొందల కథలు రాసి, ఏడు పుస్తకాలు అచ్చేసిన నాకు ఒక్క అవార్డయినా రాకపోవడం వింతగానే ఉంటుంది... మీవంటి వారికి!'' అని, నా మాటల్లోని అర్థం ఆమెకి అర్థంకాదన్న విషయం గుర్తొచ్చి, దీర్ఘంగా నిట్టూర్చి- ''...మీ ప్రశ్నకు సమాధానం నేను చెప్పడం కంటే మీరే స్వయంగా తెలుసుకునే రోజు త్వరలోనే వస్తుందని నేననుకుంటున్నాను. ఒకవేళ రాకపోతే...'' అంటూ అసంపూర్తిగా ఆపేశాను. ''ఊఁ... చెప్పండి సార్‌! నేను తెలుసుకునే రోజు ఒకవేళ రాకుంటే?'' అడిగింది ఉద్వేగంగా. అది విని నాకు మళ్లీ నవ్వొచ్చింది- ''ఏముందీ... ఆరోజు రాకపోతే మీరు చాలా అదృష్టవంతులన్నమాట! మీరెప్పటికీ ఆనందంగా ఉంటారు!'' అంటూ ప్రశాంతంగా నవ్వేశాను. ''ఏంటో... మీ మాటల్లో ఒక్క ముక్క కూడా నాకర్థం కాలేదంటే నమ్మండి!'' అంది. ''ఆ విషయం నాకు తెలుసులెండి!'' అని, ''అదిగోండి... అతిథులంతా వేదిక ఎక్కేశారు!'' అన్న నా మాటలకి తలతిప్పి స్టేజీవైపు చూసిన 'పారాణి'- గబుక్కున సీట్లో సర్దుకొని కూర్చుంది. *** ''ఇప్పుడు ముఖ్యఅతిథి డా|| కవిశ్రీ (ఇదీ కలంపేరే కాబోలు!)గారు తమ సందేశాన్ని వినిపిస్తారు!'' అని ప్రకించాడు సభాధ్యక్షుడూ కమ్‌ సంస్థాధ్యక్షుడూ అయిన సచ్చిదానందరావు. డా|| కవిశ్రీగారు సీట్లోంచి స్టైలుగా లేచి, విలాసంగా నడుస్తూ మైకు ముందుకొచ్చారు. ''...సభాసరస్వతికి వందనం- సదస్యులందరికీ నా అభినందనం! మీకందరికీ తెలుసు... మన దేశంలోని అత్యున్నత స్థాయి నుంచి అతిచిన్న స్థాయి వరకూ ఉన్న అవార్డులూ, పురస్కారాలూ, సత్కారాలూ, బిరుదులన్నీ... కాస్త పేరూ, అనుభవమున్న వాళ్ళకీ, పండితులకీ, పెద్దవాళ్ళకే తప్ప- కొత్తవాళ్ళకి గాని, వర్ధమానులకి గాని ఎప్పుడూ వచ్చిన దాఖలాలు లేవు. అలాంటప్పుడు మరి కొత్తవాళ్ళను గుర్తించేదెవ్వరు? వర్ధమానులను ప్రోత్సహించే దెవ్వరు? ఈ అవార్డులూ, బిరుదులూ కొత్తగా రాస్తున్న వాళ్ళకెలా వస్తాయి? వర్ధమాన కవులకు సన్మానాలూ, సత్కారాలూ చేసేదెవ్వరు? ఈ ఆలోచనే ఆవేదనగా మారి మిత్రుడు సచ్చిదానందరావు మనసుని కొన్నేళ్లుగా కలచివేసింది...'' డా|| కవిశ్రీగారి 'లాజిక్‌' వింతగా అన్పించేసరికి- మరింత శ్రద్ధగా వినసాగాన్నేను. ''...అందుకే- చీకటిని తిడుతూ కూర్చునేకంటే చిరుదీపం వెలిగించడానికి తానే పూనుకున్నాడు మన సచ్చిదానందరావు. వర్ధమానులను ఉద్ధరించడానికి తానే నడుం బిగించాడు!'' ప్రేక్షకుల్ని చప్పట్లు కొట్టుకోమన్నట్లు తన స్పీచ్‌లో కాస్త 'టైమ్‌ గ్యాప్‌' ఇచ్చారు డా||కవిశ్రీ. పురస్కారాలు 'పుచ్చుకోవడాని'కొచ్చిన పాతికమందీ, వాళ్ళలో ఒక్కొక్కరి తరపు నుంచి కనీసం ఇద్దరు చొప్పున ఆ 'సత్కార సంబరాన్ని' చూసి తరించాలని వచ్చిన వారి కుటుంబసభ్యులు ఓ యాభైయ్యరవై మందీ, నాలాగా 'అబ్లిగేషన్‌'తో వచ్చిన జనరల్‌ వ్యక్తులు పదీ, పదిహేను మందీ... వెరశి హాల్లోని వందమంది ప్రేక్షకులు- ముఖ్యఅతిథిగారి 'ఆంతర్యం' అర్థమై 'తప్పట్లు' చరిచారు. ఆ తర్వాత డా|| కవిశ్రీగారు సాహితీరంగంలో కొత్తగా రచనలు చేస్తున్న కవుల పట్ల, వారికి 'అందుబాటు'లో లేని 'అవార్డులూ, అవకాశాల' పట్ల తన తీవ్ర ఆవేదనని వ్యక్తంచేస్తూ వీరావేశంతో ప్రసంగించి, చివరికి- ''... కాబట్టి నేన్చెప్పేదేమిటంటే... వీరులలో వర్ధమాన మహావీరుడు ఎంతి గొప్పవాడో- కవులలో కూడా వర్ధమాన మహాకవులే గొప్పవారని నా ఉద్దేశ్యం. అలాంటి వర్ధమాన కవులను సన్మానిస్తూ, బిరుదులిచ్చి సత్కరిస్తూ, వర్ధమాన మహాకవుల అభ్యున్నతి కోసమే అహర్నిశలూ శ్రమిస్తున్న 'సాహితీబ్రహ్మ' సచ్చిదానందరావుని మనసారా అభినందిస్తూ... వర్ధమాన కవుల 'మనసు విని' తన 'మనస్విని' సంస్థ ద్వారా ఆయన చేస్తున్న 'సాహితీకృషి'ని అభినందిస్తూ మీ దగ్గర సెలవు తీస్కుంటున్నాను!'' అంటూ ముగించారు. ఉలిక్కిపడ్డాన్నేను... జైనమతాన్ని స్థాపించిన వర్ధమాన మహావీరుడికీ, ఇప్పటి ఈ వర్ధమాన మహాకవులకీ మధ్య పొంతన చూపించిన ఆయన 'విజ్ఞానాన్నీ', ఆయన చూపిన 'పోలిక'నీ విని ! కానీ, ఆయన ప్రసంగాన్ని అంతగా పట్టించుకోని, పట్టించుకున్నా అర్థంచేసుకోలేని ప్రేక్షక 'యువకవులు' తప్పట్లతో తమ ఆనందాన్నీ, అంతకుమించిన అమాయకత్వాన్నీ ప్రదర్శించారు. ''ఇప్పుడిక అవార్డుల బహూకరణ కార్యక్రమం మొదలౌతుంది!'' అనౌన్స్‌ చేశాడు సదరు సంస్థకీ, ఆ సభకీ 'హోల్‌ అండ్‌ సోల్‌' అయిన సచ్చిదానందరావు. దానికోసమే ఎంతోసేపట్నుంచి ఎదురుచూస్తున్న వర్ధమాన కవిప్రేక్షకులంతా తప్పట్లతో మరోసారి హాలంతా మార్మోగించారు. ఆశ్చర్యపోయాన్నేను- 'అవార్డుల ప్రదానం' అనే మాట విన్నానుగానీ, ఈ 'అవార్డుల బహూకరణ' అన్నమాట ఇప్పుడే వింటున్నాను. బహుశా... ఈ యువకవుల కోసమే కొత్తగా కనిపెట్టిన 'నూతన సాహితీ పదప్రయోగం' కాబోలు! నిజమే... ఇదంతా 'సత్కారాల సంతర్పణే' కదా మరి!! ఆ తర్వాత 'సత్కారాల సంతర్పణ- బిరుదుల బహూకరణ' కార్యక్రమం మొదలైంది. 'అభినవ అల్లసాని, అపర తిక్కన, కలియుగ కాళిదాసు, నవయుగ నన్నయ, ఆధునిక అన్నమయ్య, అభినవ మొల్ల, వర్తమాన వాల్మీకి, కవికుల క్షేత్రయ్య, నవతరం వేమన, సాహితీ సరస్వతి, సాహితీ విశారద, కవికోకిల... వగైరా, వగైరా' బిరుదుల్ని- వికసిత విస్ఫారిత విచలిత దరహాస ముఖారవిందాలతో 'పుచ్చుకుంటున్న' కవుల్నీ, కవయిత్రుల్నీ చూస్తూవుంటే... నోట మాట రాలేదు నాకు. వాళ్ళలో కొందరికైనా 'తాము ఎవరి పేరుపై వున్న బిరుదుల్ని అందుకుంటున్నారో ఆ మహనీయుల గురించి కాస్తయినా తెలిసుంటుందా..?' అన్న అనుమానమూ కలిగింది. అసలు... 'ఇలాంటి' సభలకు రావటం ఇదే మొదిసారి నాకు. 'పారాణి' ఉరఫ్‌ 'పాముల ప్రసన్నరాణి' నాతో మాట్లాడే సమయాల్లో ''మా యువకవులూ, యువ కవయిత్రులూ'' అనే పదాలు తరచుగా ఆమె మాటల్లో దొర్లుతూంటే... 'బహుశా కొత్తగా కవిత్వం రాసిపారేస్తున్న వీళ్ళంతా నిజంగానే 'నవయువతే కాబోలు!' అని అపోహ పడి- 'స్త్రీసహజ లక్షణం' కొద్దీ నలభయ్యో పడిలో వున్న 'పారాణి' తనని కూడా 'యువత'లో కలుపుకుని అలా మాట్లాడేదేమోనని అనుకున్నాను. కానీ, ఇక్కడి 'తతంగం' చూస్తూంటే... ఈ 'యువ'కవుల్లో అందరూ నడివయస్సు దాటిన వాళ్ళూ, ఉద్యోగాల్నుంచి రిటైరై ఉబుసుపోక 'కపిత్వం' గీకేస్తున్న- సారీ... రాసేస్తున్న వాళ్ళేనని అర్థమైంది నాకు. ఈ 'కోణం'లోంచి చూస్తే... 'పారాణి' నిజంగానే 'యువ' కవయిత్రే! కాబట్టి 'యువ' లేదా 'వర్ధమాన' అనే పదప్రయోగాలు వీళ్ళ 'వయసు'కి వర్తించవనీ, వీళ్ళ 'రచనా వ్యాసంగానికి' మాత్రమే అన్వయించుకోవాలన్న అతిగొప్ప 'సాహిత్య జ్ఞానోదయమూ' నాకిప్పుడే కలిగింది. అయినా, నా పిచ్చిగానీ... ఈనాటి 'నిజమైన యువత'కి తెలుగులో 'మాట్లాడ్డమే' సరిగ్గా రాదు- ఇక 'కవిత్వం రాయడం' కూడానా?! మరోవిషయం కూడా గమనించాన్నేను- వేదికపై జరుగుతున్న 'సన్మాన, సత్కార, పురస్కార, బిరుద బహూకరణ సభ'ని హాల్లో అందరి మధ్య సాదాసీదా ప్రేక్షకుడిలా చూస్తున్న నన్ను- ఒక్కరు కూడా పలకరించలేదు. కనీసం నన్ను గుర్తుపట్టిన దాఖలా కూడా కనిపించలేదు. సాధారణంగా మార్కెట్లో కనిపించే ప్రముఖ దిన, వార, మాస పత్రికల్లో ప్రతినెలా రెండుసార్లయినా నా కథలూ, వ్యాసాలూ పబ్లిష్‌ అవుతుంటాయి కాబట్టి 'కథా సదస్సులు' లేదా కథాసంపుటుల, నవలల 'ఆవిష్కరణ సభ'లకి నేను వెళ్లినప్పుడు యువ రచయితల్లో కనీసం నలుగురైదుగురైనా నన్ను గుర్తుపట్టి పలకరించేవారు. కానీ, వర్ధమాన 'యువ మహాకవు'లతో నిండిన ఈ సభలో అంత 'సీన్’ ఏమీ లేదు. ఏంటో... వీళ్ళ లోకమే వింతగా వుంది, ఈ 'కవి ప్రపంచమే' కొత్తగా వుంది. పైగా, వీళ్ళలో నేను గుర్తుపట్టగలిగే కవులు కూడా ఎవరూ లేరు. అన్నీ ఎన్నడూ చూడని ముఖాలే... ఎప్పుడూ వినని పేర్లే ! అలాగని నా మిత్రుల్లో కవులెవరూ లేరని కాదు. కథారచయితగా నేను రచన్లు మొదలెట్టిన రోజుల్లోనే 'కవితాప్రక్రియ' వైపెళ్లి ఇప్పటికీ కవిత్వమే రాస్తూ కొనసాగుతున్న కవిమిత్రులున్నారు నాకు. అలాంటి మిత్రుడొకడు ఈమధ్యే నాతో అన్న మాటలు- అకస్మాత్తుగా గుర్తొచ్చాయ్‌... '' ఏంటోరా వంశీ... రాన్రాను తెలుగుభాషా- సాహిత్యాలు ఏమైపోతాయోనన్న ఆందోళన పెరిగిపోతోంది నాలో! తెలుగులో టీవీ ఛానెల్సూ, రేడియోలో ఎఫ్‌.ఎమ్. స్టేషన్లూ ఎక్కువౌడంతో వాటిల్లో యాంకర్లుగా, జాకీలుగా వస్తున్న కుర్రాళ్ళ మాటల్లో తెలుగుభాష ఎలా ఖూనీ అవుతోందో తెలుసు కదా! అందమైన మన తెలుగుని ఇంగ్లీషూ, హిందీలతో కలిపేసి మాట్లాడేస్తూ... 'తెహింగ్లీషు' అనే 'అవాంఛిత సంకరభాష'గా ఎలా మార్చేస్తున్నారో చూస్తూవుంటే... భాషాభిమానులుగా మనలాంటోళ్ళకి ఎంత బాధగా, ఆవేదనగా ఉంటుందో నీకూ తెలుసుగా ?! ప్రసార మాధ్యమాలూ, సోషల్‌ మీడియాల ద్వారా 'కుర్ర యువత' తెలుగుకి ఇలాంటి 'చేటు' కలిగిస్తూంటే... గత రెండు మూడేళ్ల క్రితం సాహిత్యంలో- ముఖ్యంగా 'కవితాప్రక్రియ'లో ఓ కొత్త 'వృద్ధ యువతరం' పుట్టుకొచ్చి కవితాలోకాన్నంతా అతలాకుతలం చేసేస్తోంది. వీళ్ళ వయస్సు ముప్ఫయ్యైదూ, నలభై నుంచి అరవై, డెబ్భయ్యేళ్ల దాకా వుంటుంది. ఏవో రెండు మూడు పిచ్చి కవితలూ, మినీ కవితలూ రాసిపారేసి- చిన్నాచితకా పత్రికల్ని పట్టుకుని అచ్చేయించుకుంటారు. అంతే... ఇహఁ అప్పట్నుంచీ మొదలౌతుంది వీళ్ళ దండయాత్ర! తెలుగు సాహిత్యంలోనే తమని మించినోళ్ళెవరూ లేరనుకుంటారు. తమకంటే ముందునుంచీ రచనలు చేస్తున్న కవులూ, పండితులూ ఏమాత్రం ప్రతిభ లేకుండానే పైస్థాయికి వెళ్లారనీ, ''తమకున్న ప్రతిభాపాటవాలతో పోలిస్తే ఈ సీనియర్లు ఏపాటి?'' అన్న ' మైండ్ సెట్ ' ఏర్పరచుకుంటారు. ''ఇంతకాలం తాము రాయలేదు కాబట్టే గొప్పగొప్ప అవార్డులు-రివార్డులు-బిరుదులన్నీ ఈ సీనియర్లు కొట్టేశారనీ, తాము రాయడం మొదలెట్టారు కాబట్టి- ఇక సీనియర్లు తోకముడిచేయాల్సిందే!'' అన్న భ్రాంతిలో ఉంటారు వీళ్ళంతా. ఏజ్‌లో కొంచెం లేటైనా నిన్న సాయంత్రమే నిద్రమేల్కొని తాము రాసిపారేసిన పిచ్చిరాతలకి రేపుదయానికల్లా దేశంలోని అన్ని అవార్డులూ, పురస్కారాలూ తమకే వచ్చేయాలనీ, వచ్చేస్తాయనీ భావిస్తూ... ఒక రకమైన 'మెంటల్‌ డిజార్డర్‌'లో పడిపోతారు. ఇదిగో... సరిగ్గా 'ఇలాంటి'వాళ్ళ కోసమే మన రెండు తెలుగురాష్ట్రాల్లో జిల్లాకు పది చొప్పున 'సాహితీసేవా సంస్థలు' పుట్టుకొచ్చాయ్‌. వయసు మీరిన ఈ యువకవుల దగ్గర ఐదువేల నుంచీ ఐదొందల దాకా అందినంతమేర డబ్బు దండుకొని- వీళ్ళకి సన్మానాలూ, సత్కారాలు చేయడమే కాక- ఆదికవి నన్నయ నుంచీ నిన్నమొన్నటి ఆధునిక సాహితీవేత్త వరకూ ; మహాత్మాగాంధీ నుంచి మదర్‌ థెరెస్సా దాకా చనిపోయిన వాళ్ళందరి పేర పురస్కారాలు ఏర్పాటుచేసి బిరుద ప్రదానాలు కూడా చేసేస్తున్నారు. ఈ అభినవ కవివరేణ్యులు తమకున్న ఆర్థిక స్థాయీ, స్తోమతలను బట్టి సన్మాన, సత్కారాలు చేయించుకొని, తమకు నచ్చిన బిరుదులు కొనేసుకుంటున్నారు. ఓపెన్‌ మార్కెట్లో 'తమలాంటి'వాళ్ళ కోసమే ఏర్పాటుచేసిన పురస్కారాలన్నీ కొనేస్కుని తమ బయోడేటాలో 'అవార్డుల లిస్టు' పెంచుకోవాలన్న 'యావే' తప్ప- నిజంగా కష్టపడి 'రాసి', తమ ప్రతిభను 'రచన'లో చూపి 'పేరు' తెచ్చుకుందామన్న బుద్ధి, ఆలోచన వీళ్ళలో మచ్చుకైనా కనిపించవు. వీళ్ళలో చాలామంది రచనల సంఖ్య రెండంకెలకు కూడా చేరదు కాని- వీళ్ళు పుచ్చుకునే పురస్కారాల సంఖ్య మాత్రం మూడంకెలకు దగ్గరగా ఉంటుంది. అంతెందుకు- చెపితే నమ్మవుగానీ... వీళ్ళలో 'శతాధిక అవార్డుల గ్రహీత'లు కూడా వున్నారు తెలుసా?'' *** ''ఇప్పుడు 'శతాధిక అవార్డుల గ్రహీత' శ్రీ గున్యారం గున్నేశ్వర్రావుగారికి ఘనసత్కారంతో పాటు మా 'మనస్విని' సంస్థ ద్వారా ఆయనకు 'అభినవ భోజ' బిరుదును బహూకరిస్తున్నాం. ఇది శ్రీ గున్నేశ్వర్రావుగారు అందుకునే 'నూట అరవైనాలుగో అవార్డు' అని మనవి చేస్తున్నాను!'' మైక్‌లో సచ్చిదానందరావు ప్రకటనకి 'ఫ్లాష్‌బ్యాక్‌' లోంచి తేరుకుని వేదిక పైకి చూశాను. 'గున్యారం గున్నేశ్వర్రావు' కాబోలు- మెడనిండా బోలెడు మెడల్స్‌ వేలాడేసుకుని, 'టూత్‌పేస్ట్‌ అడ్వర్టయిజ్మెంట్'లో లాగ ముఖంనిండా నవ్వులు చిందిస్తూ వేదిక మీదకొచ్చి, సన్మానం జరిపే భారీ 'ఆసనం'పై నిజంగా 'భోజ మహారాజు'లా దర్జాగా కూర్చున్నాడు. అతడి మెడలోని ఆ 'మెడల్స్‌' చూడగానే ఠక్కున గుర్తొచ్చింది నాకు- పత్రికల్లోని 'సభలూ- సమావేశాలు' శీర్షికల్లో ఇతగాడు ఇలాగే మెడల్స్‌ తగిలించుకుని సన్మానం చేయించుకుంటున్న ఫోటోలు నేను చాలాసార్లు చూశానని! అంతేకాదు- ప్రతీసారి ఇతడికి సన్మానం చేసి- అవార్డులూ, బిరుదులూ 'బహూకరించేది'... ఈ 'మనస్విని' సంస్థ ద్వారా ఈ సచ్చిదానందరావేనని చాలాసార్లు చదివిన విషయం కూడా జ్ఞాపకం వచ్చింది నాకు. వెంటనే ఓ 'అవాంఛిత ధర్మసందేహం' నా మనసులో అకస్మాత్తుగా ఉదయించింది. అప్పటివరకూ మౌనంగా ఉన్న నేను- నా సందేహాన్ని నివృత్తి చేసుకునే నిమిత్తం... నాకు ఇటుప్రక్క కూర్చున్న ఓ 'వర్ధమాన వృద్ధకవి'ని కదిపాను - ''ఏమండీ! ఇంతకీ ఆ గున్నేశ్వర్రావుగారు ఎన్ని రచన్లు చేశారు? ఏమేం రాశారు?'' అని. గర్భగుడిలో దేవుడి కల్యాణాన్ని కళ్ళార్పకుండా అత్యంత భక్తిప్రపత్తులతో వీక్షించే అపర భక్తాగ్రేసరుడిలా- వేదికపై జరుగుతున్న గున్నేశ్వర్రావు 'సన్మాన సంరంభాన్ని' తన్మయత్వంతో, తాదాత్మ్యతతో తిలకిస్తున్న ఆ 'నడివయసు దాటిన' యువకవి- వేదిక పైనుంచి తన చూపులు తిప్పకుండానే- ''ఏమో సార్‌, నాకూ తెలీదు. అయినా... ఎన్ని రాస్తే, ఏమేం రాస్తే మనకెందుకండీ! ఆయన అందుకున్న అవార్డులు చూడండి... నూట అరవైనాలుగంటే మాటలా? సెంచరీ క్రాస్‌ చేసి, డబుల్‌ సెంచరీ వైపు దూసుకెళ్తున్నాడు మహానుభావుడు! ఆయన రికార్డెవ్వరూ 'బ్రేక్‌' చేయలేరు. మన రెండు రాష్ట్రాల్లోనూ ఇన్ని అవార్డులు తెచ్చుకున్నోళ్ళెవరూ లేరు తెలుసా సార్‌!'' అన్నాడు. ''అవును... అవార్డులు 'వచ్చినవాళ్ళుంటారు గాని- ఇలా 'తెచ్చుకున్నవాళ్ళు' నాకు తెలిసి దేశంలోనే లేరనుకుంటా!'' అన్నాను- మాటల్లోని 'శ్లేష' అతనికి గ్యారంటీగా అర్థంకాదన్న నమ్మకంతో. నా నమ్మకం వమ్ముకాలేదు. అతడు ఉత్సాహంగా తలతిప్పి నావైపు చూస్తూ- ''ఔను కద్సార్‌! అసలు అన్ని అవార్డులంటే మాటలా? తక్కువలో తక్కువగా ఒక్కోదానికి మూడువేలు వేసుకున్నా...'' అంటూ గాల్లోనే ఏవేవో లెక్కలు వేస్కుని, ''హమ్మోఁ... వందకే మూడు లక్షలౌతుంది సార్‌!'' అంటూ గుండెల మీద చేయి వేసుకుని- ''కవిత్వానికి అంతంత పెట్టడమంటే... ఆయనకు కాబట్టి చెల్లింది! మనలాంటి సామాన్యులకి సాధ్యమా సార్‌?!'' అన్నాడు. ఏమనాలో నాకర్థంకాలేదు కానీ, ఒక్కటి మాత్రం బాగా అర్థమైంది- ఈ 'నవతరం వృద్ధ కవు'లందరికీ ఆ 'గున్యారం గున్నేశ్వర్రావే' స్ఫూర్తీ, ఆదర్శం, మార్గదర్శి, అండ్‌ 'హీ-మ్యాన్‌' అని ! *** వేదికపై 'సత్కారాల సంరంభం- బిరుదుల బహూకరణల సంబరం' ముగిసింది కాబోలు- 'అవార్డు గ్రహీత'లంతా కలసి 'గ్రూప్‌ ఫోటో' తీయుంచుకుంటూండగా... 'మనస్విని' సంస్థ 'హోల్‌ అండ్‌ సోల్‌ ప్రొప్రయిటర్‌' సచ్చిదానందరావు మైక్‌లో 'వందన సమర్పణ' చేయసాగాడు - ''అవార్డు లందుకున్నవారికి అభినందనలు... సభలో పాల్గొన్నవారికి ధన్యవాదాలు! ఒక ముఖ్య ప్రకటన... వివిధ రంగాలలో విశేషకృషి చేస్తున్న ఎందరో 'కొత్తవాళ్ళ' కోరిక మేరకు మా 'మనస్విని' సంస్థ ద్వారా ప్రతినెలా సాహిత్యంలో రెగ్యులర్‌గా మేమిచ్చే అవార్డుల్తో పాటు వచ్చేనెల నుంచి 'రాజకీయ, సంఘసేవ, క్రీడారంగా'లను కూడా కలుపుకొని జాతీయస్థాయిలో 'పద్మశ్రీ, పద్మభూషణ్‌, పద్మవిభూషణ్‌, అర్జున, ద్రోణాచార్య, భీష్మ' అవార్డుల్ని కూడా బహూకరించబోతున్నాం. ఆసక్తి గలవాళ్ళు తమ పేరూ, బయోడేటా, ఫైనాన్షియల్‌ స్టేటస్లు తెల్పుతూ తమ కలర్‌ఫోటోని జతచేసి మా అడ్రస్‌కి పంపించండి. 'మిగతా విషయాలు' నా సెల్‌నంబర్‌కి రింగ్‌ చేసి 'మాట్లాడుకోవచ్చు!' అన్నట్టూ... బిజినెస్‌, రియల్‌ ఎస్టేట్, సినిమా రంగాల వాళ్ళు కూడా అప్లయ్‌ చేస్కోవచ్చు- 'ముందుగా అప్లయ్‌ చేసినవాళ్ళకి మొదటి ప్రాధాన్యత' అన్న విషయం మర్చిపోవద్దు!'' అంతే... ఆ ప్రకటన వింటూనే వేదిక పైనున్నవాళ్ళూ, హాల్లోని ప్రేక్షకులూ ఒక్కసారిగా తమ తమ సీట్లలోంచి లేచినిలబడి చప్పట్లతో, విజిల్స్‌తో హాలంతా మార్మోగిపోయేట్లు తమ హర్షాన్ని ప్రదర్శిస్తూంటే... ఆ గోలలో, గందరగోళంలో- ''అదేంటీ... అవి ప్రభుత్వం మాత్రమే ఇచ్చే పురస్కారాలు కదా! ప్రైవేటు వ్యక్తులూ, సంస్థలూ ఇవ్వకూడదు- పైగా, ఆ పేర్లు కూడా వాడకూడదు కదా!'' అంటూ అసంకల్పితంగా, ఆందోళనగా నా నోటినుంచి వెలువడిన మాటల్ని కనీసం నా ప్రక్కనే నిల్చున్న 'పారాణి' కూడా పట్టించుకోలేదు. అలా అందరూ తమ ఆనందాన్ని వ్యక్తంచేసుకోవడానికి రెండు మూడు నిమిషాలు టైమ్‌ ఇచ్చిన సచ్చిదానందరావు- ఆ హర్షాతిరేకాల మధ్య మరో 'కొసమెరుపు ప్రకటన' చేశాడు - ''మీరు అందిస్తున్న ఈ ప్రోత్సాహానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు! నాపట్ల, నా 'మనస్విని' సంస్థ పట్ల మీ ఆదరాభిమానాలు ఇలాగే కొనసాగుతాయని ఆశిస్తూ... అతిత్వరలో మా సంస్థ ద్వారా 'మెగసెసే, బుకర్‌, ఆస్కార్‌, నోబుల్‌'లాంటి 'అంతర్జాతీయ అవార్డులు' కూడా బహూకరించబోతున్నామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.'' అంతే... అది వింటూనే నా కళ్ళు బైర్లు కమ్మి, స్పృహ తప్పినట్లవడం వల్ల- హాల్లో మళ్లీ ఊపందుకున్న చప్పట్లూ, ఈలలూ ఎంతసేపు కొనసాగాయో నాకు తెలియనే తెలియదు. రచన : ఎస్వీ.కృష్ణజయంతి ************  

..తరవాతే నేను

  తెలుగువ‌న్‌-అక్ష‌ర‌యాన్ ఉగాది క‌థ‌ల పోటీలో ద్వితీయ బ‌హుమ‌తి రూ. 3,116 గెలుపొందిన క‌థ‌ .. త‌ర‌వాతే నేను   “నివి, ప్రాజెక్ట్ ఈ వీకే సబ్మిట్ చేయాలి. శనివారందాకా అస్సలు కుదరదు. ముందే చెబుతున్నాను మళ్లీ అలగొద్దు. పొద్దున కావాలంటే బ్రేక్ఫాస్టుకి వస్తాను ఓ అరగంట. అదీ 8 లోపలయితేనే. డిసైడ్ చేసుకొని మెసేజ్ పెట్టు, కాల్ చేయలేను. ఇంతకీ స్లాట్ మార్చడా?” ఫోన్లో అన్నాడు ఆర్య. “మార్చలేదు. వద్దు ఆర్యా, ఆలోచించేదేమీ లేదు, నువ్వు ప్రాజెక్ట్ చూసుకో, ఆల్ ద బెస్ట్”  ఫోన్ పెట్టెయబోయింది నివేదిత. “సరే, నీ ఇష్టం. మరి అమ్మకి ఫోన్...”   “చేస్తాలే ఎప్పుడో, ఇన్ని టెన్షన్స్లో ఇంకో టెన్షన్ పెట్టకు” “అయిదు నిమిషాలు టైములేదా?” “డిసైడ్ చేసుకొని చెప్పమన్నావు కదా ఇందాక, తర్వాత ఫోన్  చేస్తాను, ఓ ఐదు నిమిషాలు నాతో మాట్లాడుతావా, నీ దగ్గర టైముందా?” “ఓగాడ్! ఎక్కడికి తీసుకువెళ్లి ఎక్కడ లింకు పెడుతున్నావ్ చూడు” “అవును, నేను పెడితే లింకులు. నువ్వు చెబితే రీజనింగులు, లాజిక్కులు”  “నివి డియర్, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నేనిప్పుడు మూడు ఆఫ్ చేసుకోదలుచుకోలేదు”     “గుడ్, నేను నీకు ఆల్ ద బెస్ట్ చెబుతున్నాను. నువ్వు నన్ను ‘మూడు ఆఫ్ చేస్తున్నాను’ అంటున్నావు. బాగానే డెసిఫర్ చేస్తున్నావు. నీ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందిలే” “నీ ఎగ్జిబిషన్ ఫ్రస్టేషన్ నామీద చూపిస్తున్నావా?” “మరి నీ రీజనింగ్ ఎలా ఉంది. అరగంటలో కలవడమూ, బ్రేక్ఫాస్ట్ చేయడమూ కుదురుతుందా?” “ఎనఫ్, అమ్మకి కాల్ గుర్తుచేద్దామని చేశాను. చేస్తే చెయ్, లేకపోతే లేదు”  “అమ్మ, అమ్మ, అమ్మ” మనసులోనే కేకలు పెట్టింది నివేదిత, “నీకొక్కడికే ఉందా అమ్మ, నాకు లేదా” అందామని, ఆపుకొని, “నాకు మూడాఫ్ అయ్యింది” అని పెట్టేసింది.  *** “పార్టీ అని  పిలిచి నువ్వే డల్లుగా కూర్చుంటే ఎలా?” “కొత్త కదా, అలాగే ఉంటాడులే. అయినా, అంతా నీ చేతిలోనే ఉంది” “పెళ్లయ్యాక కూడా ‘అమ్మ అమ్మ’ అంటే చాలా కష్టం” “కొంతమంది అమ్మలు కొడుకులను వదలరు” “ఎంత మంచిదైనా, ‘అమ్మ’ అత్తగా మారిన తరువాత మారిపోతుంది” “మొదట్లోనే తుంచేస్తే మంచిది” నివేదిత తన పెళ్లి సందర్భంగా ఫ్రెండ్స్ కి కజిన్స్ కి ఇస్తున్న పార్టీలో, ఇలా చాలాసేపు చర్చించుకున్నారందరూ.  బెంగళూరువాసి పెయింటర్ నివేదిత, వైజాగ్ నుంచొచ్చి ఐబీఎంలో జాబ్ చేసే ఆర్య మధ్య ప్రేమ, పెళ్లిదాకా వచ్చింది. రెండు వారాల్లో పెళ్లనగా, ఇద్దరికీ బిజీ షెడ్యూల్ అయిపోయింది.  పెయింటింగ్ ఎగ్జిబిషన్ గ్యాలరీలో నివేదితకి హాల్లో వాష్రూముకెళ్లే కార్నర్ స్లాట్ ఆలాట్ అవ్వడంతో, ‘ఆర్ట్ ఎక్సిబిషన్, వెంటనే పెళ్లి’ అనే ఉత్సాహమంతా నీరుకారిపోయింది. ముందు స్లాట్  ఇవ్వమని బతిమాలితే 'నాలుగు పైటింగ్సుకే ఇస్తాను, ఓకేనా?' అన్నాడు నిర్వాహకుడు. ఆర్య ఏమైనా ఊరడిస్తాడేమో అనుకుంటే, ‘అమ్మకు కాల్ చేయడమే ముఖ్య’మన్నట్టుగా మాట్లాడితే, ఆ సాయంత్రం, మూడ్ లేకుండానే పార్టీ కానిచ్చింది. *** కొన్నిరోజుల ముందు, ఫోటో షూట్లు,  ఫ్రీవెడ్డింగ్ ప్లాన్ల రొటీన్ కాకుండా, ‘పెళ్లి వెరైటీగా ఎలా?’ అనుకున్నప్పుడు, ‘అమ్మ ఐడియాలు బాగుంటాయి, అడుగుదా’మని ఆర్య అనడంతో, ఇద్దరు కలిసి ఆర్య అమ్మ, మంజులకి ఫోన్ చేశారు. కాబోయే అత్తగారిని ఇంప్రెస్ చేయడానికి “మీరే చెప్పండి, ఎలా?” అన్నది నివేదిత.  “మీ పెళ్లి ఎలా చేసుకుంటే అపురూపంగా ఉంటుందో మీరే ఆలోచించుకోలేదా” అని “డెస్టినేషన్ వెడ్డింగే కానీ, రిసార్టులో కాకుండా ఇక్కడ అరకులోయలో, అడవుల్లో, ఆదివాసీల మధ్యలో” అన్నది మంజుల.  మంజుల ఫారెస్ట్ డిపార్ట్మెంటులతో కలిసి నేచర్ క్యాంపులు చేస్తూంటుంది. “అందరికీ గెస్టవుసులో బస, ఏర్పాట్లు చూసుకుంటాను” అన్నది. అందరికీ నచ్చడంతో “పట్టుచీరల పరపరలు, బంగారునగల తళుకుబెళుకులు లేకుండా ప్రకృతి ఒడిలో సరదాగా చేసుకుందా”మని నిర్ణయించేసారు.  షాపింగ్ కూడా థీమ్ కి తగ్గట్టు అక్కడే చేస్తానంది. మొదట్లో నివేదతకీ ఐడియా చాలా ఎక్సైటింగ్ అనిపించింది. కానీ ప్రతిదానికీ ఆర్య “అమ్మ, అమ్మ” అంటూడడంతో చిరాకు, రానురాను భయం మొదలైంది. అత్తగార్లు పెట్టే ఆరళ్ళు, ‘అమెరికాలో ఉన్నా, అండమాన్లో ఉన్నా” కొందరబ్బాయిలు బెడ్రూమ్ విషయాలు కూడా అమ్మలతో చర్చించుకుంటారని, వాళ్ళనడిగే అన్ని డెసిషన్లు తీసుకుంటారని, ప్రేమపెళ్లిళ్లయినా భార్యతో కన్నా, అమ్మతో రహస్యాలు మైంటైన్ చేస్తుంటారని, ఇంకా చాలా విన్నది.     ఆర్య మంచివాడే, ‘అర్థం చేసుకుని ఆనందంగా లైఫ్ ఎంజాయ్ చేసే మనిషి’ అనిపిస్తాడు, కానీ ఈ ‘అమ్మ’ గోలేంటో అర్థంకావడం లేదు. ఎమన్నా అందామంటే, పెళ్లి గురించి అస్సలు పట్టించుకోని తన కుటుంబం గుర్తుకొచ్చి ఊరుకుంటుంది. నాన్న రాజకీయాల్లో బిజీ, అమ్మ శోభిత నృత్యకళాకారిని. ఎక్కువ తన నృత్యాలయంలోనే గడపటం, ప్రదర్శనలంటూ దేశవిదేశాలు తిరుగూతూండడంతో, నివేదిత ఒంటరిగానే ఆయా పెంపకంలో పెరిగింది. అమ్మ ‘అసలు పెళ్ళికి అరకు రాగలుగుతానో లేదో’ అన్నది. గ్యాలరీ విషయంలో నాన్న ‘ఓ  మాట’ చెపితే పనౌతుంది కానీ, ‘కళ ఎక్కడున్నా గుర్తింపబడాలి’ అని వాదించే తను, ఎలా అడుగుతుంది. ఇన్ని ఆలోచనలతో అన్యమనస్కంగా వుండి గుర్తున్నా ఫోన్ చేయలేదు నివేదిత. రెండోరోజు మంజులే ఫోన్ చేసింది. "ఏంటీ.. ఆంటీ.. మీరా.. నిజంగానా.. ఆర్యకి తెలియకుండానా.. ఎప్పుడు.. రెండ్రోజులా.. చెప్పొద్దా.. ఏర్పోర్టుకా.. సరే" అన్నీ ప్రశ్నలే నివేదితకి. మంజుల సిటీ దాటిఉన్న కనకపురకి క్యాంపుకని వచ్చింది. బట్టలు సర్దుకొని, ఆర్యకి చెప్పకుండా, ఏర్పోర్టుకి రమ్మన్నది నివేదితని. క్యాంపుకొచ్చినవాళ్ళని ఏర్పోర్టులో దింపేసిన వ్యానులో ఒక్కతే కూర్చొని నివేదిత సిటీ దాటడం, అడవిలోకి వెళ్లడం, ఆర్యకి చెప్పకుండా వాళ్ళమ్మని కలవడం అడ్వెంచర్లాగా అనిపించింది. "ఏంటీ, పెళ్లికూతురు ముఖం సరిగ్గా పెయింట్ చేయలేదు, డల్ షేడ్ వేసావు"  "ఆంటీ.." అంటూ బిక్కమొహం వేసి గ్యాలరీ విషయం, ఆర్య అస్సలు ఊరడించకపోవడం చెప్పింది. కలవగానే మంజుల గట్టిగా వాటేసుకోని, తాజా పళ్ళరసం, పేరు తెలియని స్వీటెదో పెట్టి ప్రేమగా మాట్లాడడంతో, అంత ఆత్మీయత అమ్మతో కూడా లేని నివేదితకి ఆశ్చర్యంగా, చనువుగా అనిపించి, అన్నీ చెప్పేసింది, ఆర్యతో గొడవలతో సహా.    “ఏం చేయదలుచుకున్నావ్ మరి”    “తెలియడం లేదాంటీ, ఆలోచిస్తున్నా” “ఎన్ని రోజులాలోచిస్తావ్? సరే, ప్రదర్శన ముఖ్యమా, బెంగళూరులోనే జరగడం ముఖ్యమా?” “అంటే?”  “అంటే, అడ్వాన్సు తిరిగితీసేసుకో. పెళ్లి తరవాత విశాఖ సాగరతీరంలో చిన్న విందు అనుకున్నాం కదా, అందులోనే నీ ఒక్కదాని పెయింటింగ్స్ ఎక్సిబిట్ చేద్దాం. ఐడియా నీకు నచ్చితే” “నచ్చడమా, నా ఒక్కదాని పైంటింగ్సా, అదీ సాగరతీరంలోనా, ఇది కలా, అయ్యో! అంటీ వ్యానెక్కినప్పటినుండే నా బ్రెయిన్ తిరుగుతుంది. ఇప్పుడు స్పీడందుకుంది”  “అదేంలేదు,  స్ట్రెస్ రిలీజ్ అవుతుంది నీకంతే. పద, క్యాంపు ఫైర్ కి కర్రలేరడంలో బసప్పకి సహాయం చేద్దాం” వణికించే చలిలో వెచ్చని మంట దగ్గర కూర్చొని, కళ్ళుమూసుకొని సన్నగా పాటపడుతున్న మంజులని, మళ్ళీ పేరు తెలియని సూపేదో తాగుతూ కన్నార్పకుండా చూసింది నివేదిత. కావలసినంత మాత్రమే సౌకర్యాలున్న అందమైన క్యాంపు. భోజనం తరవాత గుడారాల్లో పడక. రాత్రంతా కబుర్లు చెప్పుకున్నారు. చీకట్లోనే లేపాడు బసప్ప. ఫ్రెషయ్యి, అడవిలో నాలుగైదు కిలోమీటర్లు నడిచి కొండపైకి చేరుకున్నారు. కళ్ళు మూసుకొని కూర్చోమంది మంజుల. అక్కడలా ఎంతసేపు కూర్చుందో తెలియలేదు నివేదితకి. "నెమ్మదిగా కళ్ళు తెరువు" మంత్రంలా వినిపించాయి మంజుల మాటలు.  ఆకాశానికి ఎర్రని బొట్టు పెడుతున్నట్టు ఎదురుగా, దూరంగా, తనొక్కదానికోసమే ఉదయిస్తున్నట్టుగా సూర్యుడు, పెయింటింగ్ లాగా అనిపిస్తున్నాడు. తదేకంగా చూస్తుంటే నివేదిత కళ్ళనీళ్ళు జలజలా రాలాయి. దగ్గరకొచ్చి కాసేపు తలనిమిరి “పద” అన్నది మంజుల.  తిరుగుదారిలో చిన్న జలపాతం దగ్గర చాలాసేపు ఆడుకొన్నారు.  తినడానికి పళ్ళు ఇచ్చాడు బసప్ప.  రకరకాల పక్షులూ, చెట్లూ, పువ్వులూ, పిల్లకాలువలూ చూస్తూ క్యాంపుకొచ్చేసరికి వేడివేడి లంచ్ సిద్ధంగా  ఉంది. ఆవురావురుమంటూ తిని పడుకుంది. సాయంత్రమెప్పుడో లేచేసరికి "మరుగళు" (చెట్లు) వర్కుషాపుకు వచ్చిన ఒక గ్రూపుని సాగనంపి మంజుల ఉయ్యాలలో కూర్చుంది. నివేదిత ఇంకో ఉయ్యాలలో కూర్చుని పోటీలుపడి ఊగారిద్దరు. ఈ మనోహరమైన దృశ్యాలూ, అనుభూతులన్నీ అప్పటికప్పుడు చిత్రించాలని నివేదిత కళాహృదయం ఉవ్విళూరింది. రాత్రి క్యాంపుఫైర్ దగ్గర పాటలు పడుతూ డాన్సు చేసారు. నివేదిత మంజులని గట్టిగా హత్తుకొని ముద్దుపెట్టుకుంది. ఎమోషనలయిపోయి ఏడ్చేసింది.  "మీ గురించి చాలా తప్పుగా అనుకున్నా, ఎలాగైనా సరే, ఆర్య బ్రెయిన్లోనుండి మిమ్మల్ని తీసెయ్యమని అందరు సలహా ఇచ్చా"రని చెప్పేసింది.  "పిచ్చిపిల్ల" నవ్వి మొట్టికాయిచ్చింది మంజుల. “ఇద్దరి పేరెంట్స్ బ్రోకెన్ మ్యారేజ్, మీరు ఎలా ఉంటారు, అని డిస్కస్ చేసుకున్నారు కదా, ఆర్యాని మీ పేరెంట్స్ కి పరిచయం చేసినప్పుడు?” “ఆర్య చెప్పాడా?”  “శోభిత చెప్పింది” “వ్వాట్? అమ్మా?” “అమ్మనాన్న ఇక్కడికొచ్చారు మొన్నొకరోజు” “నేనస్సలు నమ్మలేకపోతున్నా, అమ్మ పెళ్ళికే రాననిందాంటీ ”  “వస్తుంది నివి” “ఆంటీ, ఆమె స్వార్ధపరు...”  ఆవేశంగా అనబోయింది నివేదిత. “నివి, అమ్మ అయినంత మాత్రాన ఆడదానికి పిల్లల్ని పెంచడం ఒక్కటే ప్రపంచం కాదు. తనకీ ఆశలూ, కోరికలూ ఉంటాయి. కళారంగంలో ఉండి ఒక కళాకారిని మనసర్థం చేసుకోవాలని ప్రయత్నించలేదు నువ్వు” “మీకు తెలియదాంటి నా బాధ. నాకు అమ్మ ప్రేమ ఎప్పుడూ దొరకలేదు”    “నివి, కొండపైన ఎందుకు ఏడ్చావు... తెలియదు కదా. నీలాగే మీ అమ్మ కూడా ఏడ్చింది. నేను నిన్ను ఓదార్చినట్టు నాన్న తనని చూసుకున్నారు. చిన్నపిల్లలై జలపాతంలో ఆడుకున్నారు. నాన్న నాలుగు రోజులు పనులు పక్కనపెట్టి పెళ్ళికి వస్తాన్నన్నారు. చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్ నివి, జీవితాలని కలవలేనంత దూరం విసిరేస్తాయి” నివేదిత ఆవేశమర్థం అయ్యి అనునయంగా అన్నది మంజుల. “అత్తగారిలో అమ్మను చూడమని అంటారు, నేను పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నాను. నాకూ అమ్మకి అసలు స్నేహం లేదు, మీకు ఆర్యకు మధ్య స్నేహం నేను భరించలేక పోతున్నాను” అప్రయత్నంగా మంజుల ఒడిలో తలపెట్టి అన్నది నివేదిత. “వద్దు, అత్తగారిలో అమ్మని చూడొద్దు. అత్తగారు-అమ్మ, ఇద్దరిలోనూ ఆడదాన్ని చూడు. వాళ్ల మనసర్థమవుతుంది. సరే కానీ, మీ అమ్మ ఇన్నాళ్ళ ప్రేమనంతా పెళ్లిలో నీకు గిఫ్ట్ ఇవ్వబోతుంది. తన ట్రూపుతో వచ్చి,  “గొరవ, ధింసా” కలిపి ట్రైబల్ డాన్సు ఫ్యూషన్ చేస్తాననింది”    “ఇప్పుడే వెళ్లి అమ్మను చూడాలని ఉంది. ఇదంతా ఎలా చేసారాంటీ?” నివేదిత ఎక్సయిట్మెంట్ ఆపుకోలేకపోతుంది. “ఇప్పుడొద్దు. నీ ప్రేమ అమ్మకెలా చూపిస్తావో ఆలోచించుకో. ఎన్ని చిత్రాలు వేస్తావో, సాగరతీరమంతా నీదే. నువ్వు చిత్రాలు ఎంత శ్రద్ధతో, ప్రేమతో వేస్తావు, అదే డెడికేషన్తో జీవితాన్ని చిత్రించుకో. అన్నింటికీ సమాధానాలు దొరుకుతాయి”  ఇంత సున్నితంగా ఉన్న మంజుల, శాడిస్టూ ఇగోయిస్టూ అయిన భర్తతో ఎంత నరకమనుభవించి బయటపడిందో ఆర్య చెప్పడం గుర్తొచ్చి, ఏడుపొచ్చింది. అదే అడిగింది. "ఆ బంధాన్ని నిలుపుకోవాలని ఎంత ప్రయత్నించానో, వదులుకోవటానికి అంత కష్టపడ్డాను నివి" మంజుల నిర్మలంగా అన్నది. “మీది పూర్తిగా ప్రేమనిండిన మనసు, మరి బాధనెలా..”   నివేదిత వాక్యం పూర్తి కాకుండానే చెప్పింది మంజుల, "కాలం అన్నీ మరిపిస్తుంది అంటారు కదా. ప్రకృతి, నాకు అది కూడా తోడైంది. కాలం కన్నా తొందరగా ప్రకృతి గాయాల్ని మరిపించి కొత్త శక్తిని నింపింది" ఆర్య అమ్మతో స్నేహంగా ఉండడంలో అర్థం కనిపించింది. ‘అమ్మంటే చేదు’ భావన ఉన్న నివేదితకి ఇలాంటి ‘అమ్మ’ కూడా ఉంటుందని తెలిసింది. మళ్ళీ గట్టిగా హత్తుకుంది. ఎగ్జిబిషన్, అమ్మ ప్రేమ, పెళ్లి తలుచుకుని, ఆనందంతో వస్తున్న కన్నీళ్లను ఆపుకొని “ఆంటీ, మా ఫ్రెండ్స్ కి ఒక కౌన్సిలింగ్ ప్రోగ్రాం చెయ్యండి” అన్నది నివేదిత.   “అమ్మో, వద్దమ్మా. నేను చెప్తే వింటారా మీరు. మమ్మల్నే తప్పించాలని చూస్తారు. కావాలంటే క్యాంపుకు రమ్మను కొండపైకి తీసుకెళ్తా” ఇద్దరూ నవ్వుతూ డిన్నర్ చేయడానికి వెళ్లారు.  “పెళ్లిలో కలుద్దా”మనుకుంటూ, తెల్లవారిద్దరూ తిరుగు ప్రయాణమయ్యారు. తన కొత్త అత్త-అమ్మలను తలుచుకుంటూ నివేదిత బెంగళూరుకి, ఆర్యనొకసారి కలిసి, మంజుల వైజాగ్ వెళ్లడానికి. *** అరగంట మాత్రమే ఆర్యని లంచ్ కి కలిసి, నాలుగు మాటలు చెప్పి, ముద్దులుపెట్టి వెళ్ళిపోయింది మంజుల. "ఆర్యా, అమ్మతో ఇకమీద నీకు స్నేహం మాత్రమే. దేనికైనా ముందు నివేదిత, తరవాతే నేను. తనని ప్రేమగా చూసుకో, ఆటోమాటిక్ గా తను నన్నూ ప్రేమిస్తుంది, అప్పుడే తనకు నేను నచ్చుతాను. తనలోనే అమ్మని చూసుకో. 'మా అమ్మ గ్రేటు, అమ్మకన్నీ తెలుసు, అమ్మని అడుగుదాం లాంటి' సుత్తి మాటలెప్పుడూ అనకు. 'నువ్వంటే నాకిష్టం, సారీ, ఓకే' లాంటి మాటలనడానికి ఎప్పుడూ వెనకాడకు."   - కవిత బేతి

శిశిరంలోవిరిసిన కుసుమం

తెలుగువ‌న్‌-అక్ష‌ర‌యాన్ ఉగాది క‌థ‌ల పోటీలో ప్ర‌థ‌మ బ‌హుమ‌తి రూ. 10,116 పొందిన క‌థ‌ శిశిరంలోవిరిసిన కుసుమం ఇంట్లో అంతా బయటికి వెళ్లడంతో బాల్కనీలో కూర్చుని కరువుదీరా ఏడ్చి, కొంగుతో కళ్లనీళ్లు తుడుచుకుని లోపలికి వచ్చింది కుసుమ. పొద్దున్నే మనవడు ఆనంద్ కోసం పెళ్లివారొచ్చారు. పలకరింపులయ్యాక లోపల్నించి కుసుమని పిలిచి ‘మా అమ్మగారు’ అంటూ పరిచయం చేసింది రమ. ఇరువైపుల తల్లిదండ్రులూ ముందు హాల్లో కూర్చుని కొంతసేపు మాట్లాడుకున్నారు. ఇక వెళ్తామని వాళ్లంటే ‘తాంబూలం తీసుకుందురు గాని రండి’ అని పిలిచి ఇల్లు చూపించింది రమ. డైనింగ్ హాల్లో కూర్చుని అష్టోత్తరమేదో చదువుకుంటున్న కుసుమని చూసి “మీ అమ్మగారు మీ దగ్గరే ఉంటారా?” అనడిగింది అమ్మాయి తల్లి. “మా అన్నయ్యది కూడా ఈ ఊరే అండీ. ఇద్దరి దగ్గరా ఉంటుంది. ఇంక మాకు మిగిలిన పెద్ద దిక్కు ఆవిడే” అంది రమ. కుసుమ విననట్టుగా నటించినా ఆ మాటలు ఆవిడ మనసులో గుచ్చుకున్నాయి. భర్త ఆరోగ్యంగా ఉన్నన్నాళ్లూ తమ ఇంట్లో తాము స్వతంత్రంగా గడిపిన జీవితం తలచుకుంటే ఆవిడకి దుఃఖం ముంచుకొచ్చింది. ** పిల్లల చదువు సంధ్యలూ, పెళ్ళి పేరంటాలూ, పురుళ్లూ సక్రమంగా పూర్తిచేసి, మనవల పెంపకంలో ఆసరా అందించి, ఏ అనారోగ్యమూ లేకుండా విశ్రాంత జీవనం గడుపుతుండగా రంగారావుగారికి హఠాత్తుగా గుండెపోటు రావడం, హైదరాబాద్ లో స్థిరపడి ఉన్న కొడుకు రామచంద్రా, కూతురు రమా ఉన్నపళాన వచ్చి, ఆ మారుమూల పల్లెటూర్లో ఉండడానికిక  వీల్లేదని  హైదరాబాద్ తీసుకురావడం గుర్తొచ్చాయి. ఆసుపత్రిలో సరైన వైద్యం అంది, తండ్రి కాస్త కోలుకున్నాక, డిశ్ఛార్జి చేయించి, ముంబైలో తనకేదో కాన్ఫరెన్స్ ఉండడంతో తల్లినీ తండ్రినీ చెల్లెలింట్లో దింపాడు రామచంద్ర. కోడలు శిరీష కూడా ఆవేళ అతనితో పాటు వచ్చి కాసేపుండి వెళ్లింది. పూర్వం అడపా దడపా వచ్చివెళ్తూ ఉన్నా ఈసారి పూర్తిగా తరలి వచ్చేసిన భావన వల్ల రంగారావుగారికి కొన్నాళ్లు పట్టింది సర్దుకుందుకు. కుసుమ మాత్రం కూతురికి వంటింట్లో కాస్తో కూస్తో సాయపడుతూ, కూతురి సాయంతో భర్తకి కావలసినవి అమరుస్తూ, మధ్యమధ్య కాసేపు విశ్రాంతి తీసుకుంటూ, కాలక్షేపం చేసుకుంటూ వచ్చింది. కూతురూ, అల్లుడూ, మనవడు ఆనంద్ ల సమక్షంలో ఇద్దరూ మానసికంగా కోలుకున్నారు. పెళ్లి అయి భర్తతో అమెరికాలో స్థిరపడిన రమ కూతురు పుష్యమి అపుడపుడు వీడియో కాల్స్ లో పలకరిస్తూ ఉండేది. వయసు మీదపడిన పెద్దల సంరక్షణ తమకి కష్టమవుతుందని అనుకున్నారో ఏమో రామచంద్రా, శిరీషా అపుడపుడు వచ్చిపోతున్నారు గాని, ఇదివరకట్లా రంగారావుగార్నీ, కుసుమనీ తమ ఇంటికి రమ్మని పిలవడం లేదు. పండగా పబ్బం వస్తే భార్యా భర్తలిద్దరూ వచ్చేవారు. ఉద్యోగపూళ్లనించీ పిల్లలొస్తే వాళ్లని కూడా తీసుకొచ్చేవారు. కాసేపు కూర్చుని, తెచ్చిన పళ్లు తల్లిదండ్రుల చేతిలో పెట్టి, కాళ్లకి నమస్కారం చేసి ‘వెళ్లొస్తాం అమ్మా’అని రామచంద్రా, ‘ఆరోగ్యం జాగ్రత్త అత్తయ్యా’ అని శిరీషా చెప్పి వెళ్ళిపోయేవారు. ఇదంతా గమనించి కుసుమ మనసులో గుంజాటన పడింది గాని పైకి ఏమీ అనలేకపోయింది. ‘వీడు రమ్మని పిలవడం లేదేమిటి కుసుమా?’ అని రంగారావుగారు భార్యని అడగడం, గుండెపోటు తర్వాత బలహీనంగా ఉన్న ఆయనతో పూర్వంలా అన్నీ చెప్పలేక ఆవిడ సతమతమైపోవడం రమ గమనిస్తూనే ఉంది. ఇక ఉండబట్టలేక ఒక రోజు “ఏమిటే రమా వీడిలా అయిపోయాడు? శిరీష కూడా వచ్చి వెళ్తున్న ప్రతిసారీ ‘ఆరోగ్యం జాగ్రత్త అత్తయ్యా’ అంటుందేమిటి? అంటే ఏం చెయ్యాలిటా? ఇద్దరికిద్దరూ మనింటికి వెడదాం రమ్మని అనడమే మానేశారు?” అంటూ తడికళ్లతో ప్రశ్నించిన తల్లిని చూస్తూ “పోనీలే అమ్మా. వాళ్లకేం ఇబ్బందులున్నాయో… నేనొకర్తెనే మీకు బిడ్డనైతే ఏం చేస్తామో ఇపుడూ అలాగే చేద్దాం. అనవసరంగా బాధపడకు” అని సర్దిచెప్పింది రమ. కూతురింట్లో ఎంత సౌకర్యంగా ఉన్నా, పెళ్లయిన దగ్గర్నుంచీ అత్తగారింటికే అంకితమైపోయి పెద్దకోడలిగా తన బాధ్యతలన్నీ శ్రద్ధతో నెరవేర్చిన కుసుమకి, కొడుకు తనని పట్టించుకోకపోవడం, రమ్మని తీసుకెళ్లకపోగా కనీసం నాలుగైదు రోజులకి ఒకసారైనా ఫోన్ చేసి మాట్లాడకపోవడం చాలా మనస్తాపానికి గురిచేశాయి.  అలా ఆర్నెల్లు గడిచాయి.  ఒకరోజు మధ్యాహ్నభోజనం తర్వాత రంగారావుగారికి ఫిట్ లాగా వచ్చి, మళ్లీ ఆసుపత్రికి తీసుకెళ్ళవలసి వచ్చింది. చెల్లెలి ఫోనందుకుని ఆఫీసునించి తిన్నగా ఆసుపత్రికి వచ్చాడు రామచంద్ర. రెండు రోజులు ఆసుపత్రిలో ఉండాలన్నారు. ఆసుపత్రివాళ్లిచ్చిన గది సదుపాయంగా ఉంది. కాఫీ టిఫిన్లూ, భోజనమూ ఇంటినించి తెచ్చే పనిలేకుండా వాళ్లే ఇస్తారు. కుసుమ తానెలాగూ భర్తతో ఉండాలి కనుక రమని ఇంటికి వెళ్లిపొమ్మంది. ఆసుపత్రి మంచం మీద నీరసంగా పడుకుని ఉన్న రంగారావుగారు, ఎదురుగా కుర్చీలో కూర్చున్న కొడుకు కళ్లలోకి చూస్తూ “నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళు నాన్నా” అన్నారు వేడుకుంటున్నట్టు.  సాధారణంగా రామచంద్ర తండ్రి కళ్లలోకి సూటిగా చూడడు. తల్లిదండ్రుల దగ్గరున్నపుడు అతని చూపులు దేన్నో తప్పించుకుంటున్నట్టుంటాయి. బలహీనంగా, తలభాగం పైకెత్తిపెట్టిన ఆ ఆసుపత్రి మంచం మీద పడుకుని, తన కళ్లలోకి చూస్తూ తండ్రి అలా అడిగేసరికి రామచంద్రకి మాట రాలేదు. ఒక క్షణం తర్వాత తేరుకుని, “సరే నాన్నగారూ, నాలుగైదు రోజుల్లో తీసుకెళ్తాను” అన్నాడు. మరో పదినిముషాలు కూర్చుని అతను ఇంటికి వెళ్ళిపోయాడు. పిల్లలిద్దరూ వెళ్లాక, అలసిపోయి నిద్రలోకి జారుకున్న భర్తనే చూస్తూ, పక్కన తనకోసం ఉన్న సన్నని బెడ్ మీద కూర్చుంది కుసుమ. చుట్టపక్కాలందరికీ ఆశ్రయమిచ్చే వటవృక్షంలాగా ధీర గంభీరంగా, తల్లిదండ్రులని చివరిదాకా గౌరవాదరాలతో చూసుకున్న పుత్రుడిగా, జీవితపు ఒడిదుడుకుల్లో తనకు మార్గదర్శిగా, పిల్లాపాపలని గుండెమీద పెట్టుకు పెంచిన ప్రేమమూర్తిగా ఇన్నాళ్లూ కనపడిన భర్త, అలా నిస్సహాయంగా ఆసుపత్రి మంచంమీద పడుకుని ఉంటే చూసి విలవిలలాడిపోయింది ఆమె మనసు. నాలుగైదు రోజుల్లో తన ఇంటికి తీసుకెళ్తానన్న కొడుకు మాట గుర్తొచ్చి ‘రమ ఇంట్లోలాగా మనిషి సాయం ఉండదు అక్కడ. చెట్టంత మనిషికి స్నానపానాలూ ఇతర అవసరాలూ తనొకర్తీ చూసుకోవాలంటే ఎలాగో’ అని బెంగ పడింది. పొద్దున్నే రామచంద్ర వచ్చి డాక్టర్ తో మాట్లాడి, ఆఫీసుకి వెళ్లబోతుంటే “ఈ వయసులో ఇక నాన్నగారికి అన్నిపనులూ చేయాలంటే కష్టమే నాన్నా. రమ ఇంట్లో అయితే అది కాస్త సాయానికి వస్తుంది. మీ ఇంట్లో అలా కుదరదు కదా. ఎవరైనా కాస్త సాయానికి ఉండేలాగా దొరికితే ఒక మనిషిని చూడాలి” అంది. “సరే అమ్మా. సరైన మనిషిని వెతకాలంటే కొంచెం టైమ్ పడుతుంది కదా. రేపు డిశ్చార్జ్ అవగానే రమ ఇంట్లో దింపుతాను. మనిషి దొరికాక మనింటికి తీసుకువెళ్తాను” అన్నాడు.‘బావగారితో చెప్పావా’ అని అడగబోయి మానేసింది కుసుమ. హాస్పిటల్ ఇంటికి దగ్గర్లోనే ఉన్నా ఒక్కసారైనా కోడలు రాలేదని మనసు గుర్తు చేస్తుంటే, దాన్ని ఊరుకోబెట్టింది. ఆపేక్షగా, భరోసాగా దగ్గర కూర్చుని, చేతిస్పర్శతో కొద్దిపాటి సాంత్వననైనా అందించని కొడుకుని చూస్తూ, అంటీ ముట్టనట్టున్న అతని ధోరణి గమనిస్తూ, ‘అలాగే’ అని తలూపింది. చిన్నపుడు తన కొంగు పట్టుకు వదలకుండా తిరిగి, ఎదుగుతున్న క్రమంలో తనతో ఆప్యాయంగా ఉంటూ, మనసుకి దగ్గరగా మసలిన ఎన్నో సందర్భాలు గుర్తొచ్చి, ‘అలాంటివాడు ఎలా మారిపోయాడో’ అనుకుంది. రామచంద్ర వెళ్లిపోయాడు.  రాబోయే కాలం కాలనాగులా కనిపిస్తుంటే ఆసుపత్రి గదిలో నిస్సహాయంగా నిలబడిపోయింది కుసుమ. ** మరో నెల గడిచింది. రామచంద్ర ‘మనిషి దొరికిం’దని చెప్తూ ఫోన్ చేశాడు. చెప్పినట్టే ఆ వేళ చీకటి పడ్డాక రమ ఇంటికి వచ్చి, తల్లినీ తండ్రినీ తీసుకెళ్ళాడు. కొడుకు ఇంట్లోనే అంతిమ శ్వాస విడవాలని నిర్ణయించుకున్నారో ఏమో ఆ ఇంటికి వెళ్లాక మళ్లీ రంగారావుగారు గుమ్మం బయటికి రాలేదు. మంచం మీంచి దిగలేదు. పసిపిల్లలకి పెట్టే సెరిలాక్ పరిమాణంలో మెత్తని గుజ్జులాంటి పెరుగన్నం మాత్రమే తీసుకుంటూ తొమ్మిదిరోజులు గడిపి, పదోరోజు ఆఖరిశ్వాస విడిచారు. కుసుమ మనసులో పొంగిన దుఖ సముద్రానికీ, ఆమె కార్చిన దోసెడు కన్నీటికీ సంబంధం లేదు. రాయైన మనసుతో నిర్వేదంగా తర్వాతి కార్యక్రమాలన్నిటినీ కానిచ్చి, ‘అమ్మా, దా వెడదాం’ అన్న కూతురితో వాళ్లింటికి వెళ్లడానికి సిద్ధపడింది. ‘అన్నా, అమ్మ వెంట ఒక మనిషి తోడుండాలి ఇపుడు… నాతో తీసుకువెడతాను’ అని చెల్లెలు చెప్తే సరేనన్నాడు రామచంద్ర. మొదటి సంవత్సరం చాలా భారంగా గడిచింది. పల్లెటూళ్లో ఉన్న ఇంటి బాగోగులు చూసుకోవడం కష్టమనీ, జవసత్వాలుడిగిన కుసుమ ఒంటరిగా అక్కడ ఉండే అవకాశం లేదనీ చర్చించుకుని, ఊళ్లో ఇల్లు అమ్మేశారు. ఆ డబ్బు ఆవిడ పేర ఫిక్సెడ్ డిపాజిట్ లో వేశారు. డబ్బున్నా తనదైన ఇల్లులేదన్న చింతా, పరాయిగా కనిపిస్తున్న కొడుకింట్లో తనకి చోటు లేదన్న విచారం ఆవిడని చుట్టుముట్టేశాయి.  ** ఆనంద్ కి పెళ్లిచూపులంటూ వెళ్ళేటపుడు ‘నువ్వూ రామ్మా’ అనేది రమ. “నేను రానమ్మా. నన్ను అడగద్దు” అని తప్పించుకునేది కుసుమ. వాళ్లటు వెళ్లగానే ఆలోచనల్లో మునిగిపోయేది. భర్తతోపాటుగా సంతోషంగా, పట్టుబట్టలూ అలంకారాలతో అన్ని శుభకార్యాల్లోనూ ముందు నిలబడిన తాను, ఇపుడిలా వెనకగా ఆగిపోవలసిన పరిస్థితికి ఆవిడ కళ్లు తడి అయేవి.  ఆ వచ్చే పిల్ల అత్తమామలతో కలిసి బతకడానికే ఇబ్బంది పడచ్చు. వాళ్ళే కాక తను కూడా అక్కడే గుదిబండలా వాళ్ల నెత్తిన ఉండాల్సి వచ్చిందని మథన పడేది. మళ్లీ మనసు సర్దుకుని వెళ్లినవాళ్లు వెనక్కి వచ్చేసరికి వేడి వేడి కాఫీ కమ్మగా కలిపిచ్చి, ‘అమ్మాయి ఎలా ఉందర్రా?’ అంటూ చిరునవ్వుతో పలకరించేది. ఒకరోజు అలా పెళ్లిచూపులై ఇంటికొచ్చాక పిల్ల గురించీ, ఆ కుటుంబం గురించీ మాట్లాడుకుంటుంటే కూర్చుని వింది కుసుమ. మధ్యతరగతి కుటుంబవివరాలన్నీ బానే ఉన్నాయి. అమ్మాయి పనిచేసే ఆఫీసు కూడా ఆనంద్ ఆఫీసుకి దగ్గర్లోనే. అబ్బాయి రంగు పచ్చని పసిమి అయితే అమ్మాయి రంగు చామనచాయ. పెద్ద పొడుగూ కాదు. ఆరడుగుల ఆనంద్ పక్కన పిట్టలా ఉంటుంది. రూపంలో కూడా అబ్బాయిదే పైచెయ్యి. ‘ఏమంత వయసు మించిపోయిందీ, ఇంకొన్ని సంబంధాలు చూద్దా’మన్న మాట వినబడి, ఈ సంబంధం కూడా కుదిరేలా లేదనుకుంది కుసుమ. అయితే మర్నాడు ఆ అమ్మాయి మెసేజ్ చేసిందనీ, అవేళ మళ్లీ కలిసి మాట్లాడతాననీ ఆనంద్ చెప్పడం, ఆరోజే కాక తర్వాత రెండు మూడుసార్లు అఫీసు దగ్గర్లో ఉన్న కాఫీ షాపులో ఇద్దరూ మాట్లాడుకోవడం జరిగింది. నచ్చని పక్షంలో అలా పదే పదే మాట్లాడడం మంచిది కాదని తండ్రి అనడంతో ఆలోచనలో పడ్డాడు ఆనంద్. రమ మాత్రం “పనిపాటలు తెలిసిన పిల్ల, మనలాంటి కుటుంబంలోనే పెరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా… నిన్ను ఇష్టపడింది. ఒప్పేసుకో నాన్నా” అంది.  ఆ రాత్రి ఆనంద్ గదిలోకి వెళ్లిన కుసుమకి “కూర్చో అమ్మమ్మా!” అంటూ మంచం చూపించాడు ఆనంద్. మనవడి కళ్ళలో ఏదో సందిగ్ధతా, ఎన్నో సందేహాలూ కనబడ్డాయి ఆవిడకి. కుసుమ మంచం మీద కూర్చోగానే, లాప్టాప్ మూసేసి వచ్చి, ఆవిడ దగ్గరగా కింద కూర్చుని ఒడిలో తలపెట్టుకున్నాడు ఆనంద్. పొత్తిళ్లలో పసిగుడ్డుగా ఉన్నప్పటి నుంచీ ఆలనా పాలనా చూసిన కుసుమకి ఆనాటి పసిబాలుడిలాగే కనిపించాడు ఆనంద్. కొడుకు పెళ్లిచూపులకి వెళ్లిన నాటి జ్ఞాపకాలు చుట్టుముట్టాయి. కొడుకు కోసం అమ్మాయిని చూసి రావడం, తానూ భర్తా చర్చించుకోవడం గుర్తొచ్చాయి. నూనె లేక బిరుసెక్కిన వత్తైన జుట్టు సవరిస్తూ “ఏం ఆలోచిస్తున్నావురా కన్నా?” అంది ఆపేక్షగా.  “ఏమో అమ్మమ్మా? సరైన అమ్మాయిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలియడం లేదు. ఇలా చూసి ‘నచ్చలేదు’ అనడమూ నచ్చడం లేదు. ఈ అమ్మాయిలో కొన్ని బావున్నాయి. కొన్ని బాలేవు” అన్నాడు. “ఏం బావున్నాయో చెప్పు ముందు” “తెలివైనది. జోవియల్ గా సరదాగా మాట్లాడుతుంది. కానీ…లుక్స్…”  “చూడ్డానికి బాలేదా? ఫొటో తీసుకురావాల్సింది. నేనూ చూసే దాన్ని”  “అసలు బాలేకుండా లేదు. అలా అని పూర్తిగా నచ్చడం లేదు….. ఫొటో ఎందుకూ,  రేపు నిన్ను తీసుకెళ్ళి చూపిస్తా. వస్తావా?” అన్నాడు. కుసుమ మనసు ఊగిసలాడింది.  “ఎక్కడ… ఎలా చూపిస్తావు?”   “నీకు మంచి కాఫీ ఇష్టం కదా! బ్రహ్మాండమైన కాఫీ దొరికే చోటొకటుంది మా ఆఫీస్ పక్కనే. అక్కడికి రమ్మంటే తనూ వస్తుంది. రేపు సాయంత్రం త్వరగా వచ్చి తీసుకెళ్తా వస్తావా?”  “చూద్దాంలే” అని చెప్పి వెళ్లి పడుకుంది కుసుమ.  మర్నాటి తిథి వారాలూ, నక్షత్రమూ లెక్కేసుకుంది. మనవడితో కార్లో కాఫీ షాపుకి వెళ్లడం తలుచుకుని ఉత్సాహపడింది. ఆ పిల్ల తనని చూసి ‘ఊళ్లోనే కొడుకున్నా, ఈవిడ వీళ్లతో ఉంటుందెందుకూ’ అనుకుంటుందేమో అని దిగులుపడింది. వీడి పెళ్లై, ఆ పిల్ల కాపురానికి వస్తే, ఎప్పుడూ ఇక్కడే ఉండే తనని చూసి ఏమనుకుంటుందో అనుకుంది.  ‘ఆ పిల్ల సరే.. ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా వస్తూ పోతూ ఉంటారుకదా. చిన్నతనంగా ఉండదూ’ అని చిన్నబుచ్చుకుంది. ‘అమెరికా నించి మనవరాలూ, భర్తా వస్తే తనెక్కడ ఉంటుందీ’ అని ఆలోచించింది. ‘ఇలా మూడు బెడ్రూమ్ ల ఫ్లాట్స్ పక్కనే వన్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కూడా కట్టకూడదూ? ఒకటి కొనుక్కుంటే కూతురింట్లో ఉన్నట్టుండకుండా కాస్త హాయిగా ఉండేది. అలా ఎందుకు కట్టరో’ అనుకుని విచారించింది. పరిపరి విధాల పరుగెత్తుతున్న ఆలోచనల మధ్య నిద్రలోకి జారుకుంది. ** మర్నాడు ఆఫీసుకి పరుగెడుతూ “అమ్మమ్మా, శిశిర మెసేజ్ చేసింది వస్తానని. సాయంత్రం త్వరగా వచ్చి నిన్ను తీసుకెళ్తా. రెడీగా ఉండు” అన్నాడు ఆనంద్. “అమ్మా! నువ్వు చేసుకోమంటే చేసేసుకుంటాడులా ఉంది. చూసుకో మరి!” అంది రమ నవ్వుతూ. అక్కడే ఉన్న అల్లుడిని చూస్తూ “ఇంకా నయం. వాడు నన్ను తీసుకెళ్లి చూపిస్తాననడమూ బావుంది. నేను తగుదునమ్మా అని తయారవడమూ బావుంది” అంది మొహమాటంగా.“భలేవారే. దగ్గరుండి పురుడు పోసి, బారసాల చేశారు. పిల్లలతో మాకు ఎప్పుడవసరమైనా వెంటనే వచ్చి అండగా నిలబడ్డారు. మీకు దగ్గర్లో ఇంజనీరింగ్ సీటొస్తే నాలుగేళ్లు దగ్గరుంచుకుని వండి పెట్టి చదివించారు. చూసి రండి. మీకన్నా వాడి క్షేమం ఎవరు కోరుకుంటారు?” అన్నాడు సతీష్ నవ్వుతూ. కుసుమ మనసు పొంగిపోయింది. “అందరూ చేసేదే నేనూ చేశానయ్యా” అంది. ‘కారాపగానే గభాలున దిగేసెయ్యకు. నేను అటొచ్చి దింపుతా’ అని మనవడు చెప్పడంతో షాపు ముందు కారాగినా సీట్లో కూర్చుని ఉంది కుసుమ. ఆనంద్ కారు దిగే లోగానే “అమ్మమ్మగారూ!” అంటూ వచ్చి, తలుపు తెరిచింది శిశిర. మెల్లిగా ఆవిడ దిగుతుంటే చెయ్యి పట్టుకుంది. ‘తనకన్నా గుప్పెడు ఎత్తుందేమో …నలుపే. కళ్లు పెద్దవే గాని రూపు రేఖలు సామాన్యం. రాజకుమారుడిలాంటి తన మనవడి పక్కన ఈ పిల్ల తేలిపోతుందేమో’ అనుకుంది శిశిరని చూసి. అటూ ఇటూ ఇద్దరూ ఉండి, ఆవిడని జాగ్రత్తగా లోపలికి తీసుకెళ్లారు. ఆనంద్ కి ఎదురుగా  కుసుమ కూర్చుంది. పక్క సీట్లో శిశిర కూర్చుంది. కాస్త స్థిమితపడి కాఫీ వచ్చేలోగా కుసుమ శిశిరని పరికించి చూసింది. శిశిర ఆవిడ చూపులకి సిగ్గు పడలేదు. ఇబ్బంది పడలేదు. అందంగా కనపడాలని ప్రయత్నించనూ లేదు. సొంత అమ్మమ్మని చూస్తున్నట్టు చూస్తూ ‘ఇదే ఫస్ట్ టైమా అమ్మమ్మ గారూ, మీరిలాంటి కాఫీ షాపుకి రావడం?’ నవ్వుతూ అడిగింది.  తెల్లని తీరైన ఆ పలువరసని చూస్తూ “అవును తల్లీ. హొటళ్లకి వెళ్లాను గానీ కాఫీ షాపులెపుడూ చూడలేదు. నా మనవడికి నాకన్నీ చూపించాలని తాపత్రయం. లేకపోతే అబ్బాయీ, అతని తల్లిదండ్రులే కాకుండా ఈ ముసలమ్మ కూడా నిన్ను చూస్తానని రావడమేమిటీ?” అంది.  శిశిర కళ్లలో ఒక్క క్షణం కలవరం కనపడింది. “అమ్మమ్మగారూ, అలా అన్నారేమిటి? ఆనంద్ అమ్మగారికే అమ్మగారు మీరు. నన్ను చూడడానికి వచ్చారు. నాకెంతో నచ్చింది ఇలా” అంది, ఆవిడ చేతిమీద చెయ్యి వేస్తూ. తెల్లని ముడతలు పడ్డ ఆవిడ చేతిమీద ఆ అమ్మాయి లేత వేళ్లు చాయ తక్కువగా కొట్టొచ్చినట్టు కనపడ్డాయి. కుసుమ కళ్లెత్తి శిశిర మొహంలోకి చూసింది. ‘నిర్మలమైన కళ్ళు ఈ పిల్లవి’ అనుకుంది. ఆనంద్ ని చూస్తున్నపుడు ఆ పిల్ల కళ్లలో కనపడే ఇష్టాన్ని ఆవిడ పసిగట్టేసింది. ఇద్దరూ మాట్లాడుకుంటుంటే రాలిపడుతున్న నవ్వుల పువ్వులు పరిమళభరితంగా తోచాయి ఆవిడకి. బయట కారెక్కేదాకా చెయ్యి పట్టుకుని తీసుకొచ్చి, ఎక్కాక చీర కుచ్చిళ్లు లోపలికి సర్ది, తలుపు వేసింది శిశిర. ఆ పిల్ల తన స్కూటీ ఎక్కి, చెయ్యూపి రయ్యని వెళ్లిపోగానే ఆనంద్ వైపు చూసింది కుసుమ. స్టీరింగ్ వీల్ మీద చేతులు పెట్టి అమ్మమ్మనే చూస్తున్నాడు ఆనంద్.  “నాకు నచ్చిందిరా పిల్ల” అంది కుసుమ.  “ఏం నచ్చింది చెప్పు” అన్నాడు కారు స్టార్ట్ చేస్తూ.  “ఏమో… ఏదో ఉందిరా ఆ పిల్లలో. మనసుని ఆకట్టుకునేదేదో ఉంది. ఆ స్పర్శలో… ఏదో ఆత్మీయత ఉంది నాన్నా. నిన్ను బాగా చూసుకుంటుంది” అంది. ఆనంద్ డ్రైవ్ చేస్తూనే క్షణకాలం కళ్లు తిప్పి ఆవిడ కళ్లలోకి చూస్తూ “నాకూ అదే అనిపించింది అమ్మమ్మా!” అని, “కృష్ణుడికి సత్యభామ అంటే ఎందుకిష్టమో తెలుసా అని తాతగారొకసారి అమ్మతో అంటుంటే విన్నాను…. ఆవిడ మాటకారిట. ఆవిడ సంభాషణా చాతుర్యం అంటే ఆయనకి చాలా ఇష్టంట” అన్నాడు. “అబ్బో .. అంత గుర్తుందిరా? అలా తాతగారన్నారా? నాకు గుర్తే లేదురా”  “నాకూ ఇపుడే గుర్తొచ్చింది అమ్మమ్మా. శిశిరతో మాట్లాడుతుంటే ” అన్నాడు ఆనంద్ కారు గేరు మారుస్తూ. ** పెళ్ళి ముచ్చటగా జరిగింది. హనీమూన్ కి వెళ్లి తిరిగొచ్చారు కొత్త దంపతులు. శిశిర కాపురానికి వచ్చింది. మర్నాటి నుంచి ఆఫీసుకి వెళ్లాలి.తెల్లవారాక  తొమ్మిది దాటుతుంటే గది తలుపు తెరిచి బయటికి వచ్చింది శిశిర. స్నానం అయిపోయినట్టుంది. లేత నీలంరంగు నూలు చుడీదార్ కుర్తాలో బయటికి వస్తూనే బాల్కనీ దగ్గర కుర్చీలో కూర్చుని ఉన్న కుసుమని చూసింది. దగ్గరకొచ్చి ఆవిడ బుజం చుట్టూ చెయ్యేసి మొహాన్ని ఆవిడ చెంపకానించి “ గుడ్మార్నింగ్ అమ్మమ్మ గారూ” అంది. పెళ్లికి ముందే అడపా దడపా కలుస్తూ ఉండటంతో ఇద్దరికీ మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. కుసుమకి మనసులో ఆనందంగా అనిపించినా “ముందు మీ అత్తగారిని పలకరించాక రావాలి నాదగ్గరకి” అంది. “ఎందుకలా? పొద్దున్నే మీరిలా కనిపిస్తే నాకెంతో బావుంటుంది. రోజంతా హాపీగా గడుస్తుంది… మా మామ్మతో నాకలా అలవాటైపోయింది మరి… మీ చేతులెంత మెత్తగా ఉంటాయో! మీ బుగ్గలు కూడా!” అంది బుగ్గలు పుణుకుతూ. కుసుమకి నవ్వొచ్చింది. మెల్లిగా పెళ్లి బడలికలు తీరి రొటీన్లో పడ్డారు అంతా. రోజూ పొద్దున్నే తనని వెతుకుతూ వచ్చి శుభోదయం చెప్పే శిశిరని కోప్పడుతూ “నాలా బొట్టు లేని వాళ్లని  పొద్దున్నే చూడకూడదు” అంది కుసుమ.  “నేనలాంటివి నమ్మను అమ్మమ్మ గారూ…ఆనంద్ చెప్పాడు, మీరు తాతగారికి ఎంత సేవ చేశారో. తను కూడా మీదగ్గర ఉండి చదువుకున్నాట్ట కదా. జీవితమంతా కుటుంబానికి సేవలు చేశారు, ఆఖరివరకూ తాతగారిని కనిపెట్టుకుని ఉన్నారు. మీకన్నా పుణ్యస్త్రీ ఎవరుంటారు? తన తర్వాత భర్త పడే కష్టాలు పట్టించుకోకుండా ముందే వెళ్లిపోతే ఆ స్త్రీ పుణ్యస్త్రీ ఎలా అవుతుంది?” అంది.  “ముందు వెళ్లడం, తర్వాత వెళ్లడం మన చేతుల్లో ఉంటాయిటే పిచ్చిపిల్లా?” అంది కుసుమ. “మరి మన చేతుల్లో లేనిదానికి మనని జవాబుదారీ చెయ్యకూడదు కదా అమ్మమ్మ గారూ?” అంది శిశిర. కుసుమ తెల్లబోయింది. ఆ మాటలు రమక్కూడా వినబడ్డాయి. ‘కోడలుపిల్ల మంచి మనసున్నదే కాదు, మనసులో భావాల్ని బాగా ప్రకటించగలదు కూడా! ఈ పెద్దావిడ కూతురు చెప్తే వినేది కాదు.. ఇపుడు మనవరాలు చెప్తే, వింటుందేమో చూడాలి’ అనుకుంది. కొత్త కాపురం, సాఫ్ట్వేర్ ఉద్యోగం కావడంతో రాత్రి ఆలస్యంగా పడుకుని, ఆలస్యంగా లేస్తుంది శిశిర. రమా, సతీశ్ పెందరాళే లేస్తారు. కుసుమకి మొదటినించీ నాలుగున్నరా అయిదింటికి లేచేయడం అలవాటు. పొద్దున్నే కాఫీ తాగుతూ సతీశ్ “ఏమిటో ఈ కాలం పిల్లలు! బారెడు పొద్దెక్కాక గానీ లేవరు” అని విసుక్కోవడం వినబడింది కుసుమకి. కోడలు ఆలస్యంగా లేవడం అతనికి నచ్చడం లేదని  తెలుస్తూనే ఉంది. అడపాదడపా అలాంటి విసుర్లు వినపడుతూంటే ఒకరోజు వంటింట్లో రమతో “ఈ కాలం ఆడపిల్లలకి సుఖం లేదే రమా! పరుగులతో ఆఫీసుకీ, అలసిపోయి ఇంటికీనూ. రోజంతా ఆ కంప్యూటర్ తెరలకి కళ్లప్పగించి పనిచేస్తుంది పిల్ల. దానికి తోడు కొత్త కాపురం! ఈ రోజులు మళ్లీ వస్తాయా వాళ్లకి? ఓ పిల్లో పిల్లాడో పుడితే హాయిగా పడుకోడానికి ఎలాగూ కుదరదు. ఇప్పుడది పెందరాళే లేచేయడం ఎందుకే? మనమిద్దరం ఉన్నాం కదా. అవసరమైతే కాస్త కూరలు తరిగిచ్చేందుకూ, బట్టలారేసి మడతలేసేందుకూ  వేరేమనిషిని పెట్టుకుందాం” అంది. రమ తల్లిని చూసి నవ్వుకుంటూ “అలాగేలే” అంది.  ** సాధారణంగా ఆనంద్, శిశిర ఆఫీసుకి కలిసి వెళ్ళి కలిసే ఇంటికొస్తారు.  ఆవేళ శిశిర ఒకర్తే వచ్చింది కాస్త త్వరగా. రమ, సతీశ్  ఇంట్లో లేరు. కుసుమ డ్రాయింగ్ రూం లో సోఫామీద పడుకుని ఉంది. ఎపుడేనా అల్లుడు ఇంట్లో లేకపోతే అలా సోఫా మీద వాలి టీవీ చూస్తుంది. బోల్ట్ చేసి లేదేమో, శిశిర తలుపు తెరిస్తే తెరుచుకుంది.  “అపుడే వచ్చేశావేమ్మా” అంది కుసుమ, అనుకోకుండా మనవరాలు త్వరగా రావడంతో సంతోషంగా. “ఇవాళ కొలీగ్ ఇంట్లో ఫంక్షనుందని వెళ్లి, అక్కడ్నుంచి వచ్చేశా అమ్మమ్మ గారూ. కాళ్లు కడుక్కుని బట్టలు మార్చుకుని వస్తా” అంటూ లోపలికి వెళ్ళింది. కుసుమ లేచి ఇద్దరికీ టీ పెట్టింది.  శిశిర వచ్చేసరికి కప్పుల్లో టీ పోస్తోంది కుసుమ. వెనక నించి ఆవిడ బుజాలమీద వాలిపోతూ “మంచి టీ వాసన! మా బంగారు అమ్మమ్మ! అయినా మీరెందుకు పెట్టారూ? నేను పెడతా కదా?” అంది. కుసుమ నవ్వుతూ “ఇప్పుడు మాత్రమేమైంది? నువ్వు తాగిపెట్టు” అంది. “ఓకే.. మీరు చెప్పినట్టే తాగిపెడతాలెండి” అని వంటగట్టు మీదున్న చిన్నగిన్నె మూత తీసి చూస్తూ, “మధ్యాహ్నం కాఫీ తాగలేదా మీరు? ఈ డికాక్షనంతా అలాగే ఉంది?” అడిగింది.  “ఏమిటో ఒకర్తెకీ తాగాలనిపించలేదు” అంది. కుసుమ మొహంలోకి చూస్తూ “ఏమయింది అమ్మమ్మగారూ? ఒంట్లో బాలేదా?” అడిగింది. కుసుమ కళ్లు మామూలుగా లేవు.   “రండి బాల్కనీలో హాయిగా టీ తాగుదాం” అంది మాటమారుస్తూ. ఇద్దరూ బాల్కనీలో కూర్చుని ఎదురుగా కనబడే పార్కులో పిల్లలాటలు చూస్తూ టీ తాగారు.  “అమ్మమ్మగారూ, ఏమిటాలోచిస్తున్నారు?” అడిగింది మెత్తగా. “ఏమీ లేదమ్మా…ఎంత చిన్నదైనా నాకంటూ వేరే ఒక ఇల్లూ వాకిలీ ఉంటే బావుండేదనిపిస్తుంది. ఇలా కూతురింట్లో ఉండాలని ఎవరికుంటుంది చెప్పు?” అంది కుసుమ.  “ఎందుకలా అంటున్నారు? ఎవరన్నా ఏమన్నా అన్నారా?” “ఎవరూ ఏమీ అనలేదే. నాకే అలా అనిపించింది. అనిపిస్తూ ఉంటుంది అపుడపుడు”  “ఏం కాదు. ఎవరో ఏదో అన్నారు. చెప్పండి ఎందుకలా ఉన్నారు?” “చెప్పేందుకేం లేదే తల్లీ. పక్కింట్లోకి కొత్తగా వచ్చారు కదా. ఆ పెద్దావిడ వచ్చింది మధ్యాహ్నం. ‘మీరు రమ అత్తగారా’ అంది. ‘కాదు అమ్మని’ అన్నాను. ‘ఇక్కడే ఉంటారా మీరు’ అనడిగింది. అలా ఇక్కడే ఉంటారా అనడిగినపుడల్లా నాకు మనసులో గుచ్చుకున్నట్టవుతుంది. ఎక్కడికి వెళ్తాను మరి? నాకు వేరే ఇల్లు లేదుకదా!” బయటికి మామూలుగా ఉన్నట్టున్నా, ఆవిడ మనసులో కారుతున్న కన్నీరు కనపడినట్టై శిశిర కళ్ళు చెమర్చాయి.  “ఇలాంటి ప్రశ్నలు విన్నపుడు నాకేదైనా వృద్ధాశ్రమంలో చేరిపోతే బావుండుననిపిస్తుంది” “ఏ వృద్ధాశ్రమంలో చేరాలని ఉంది మీకు?” యధాలాపంగా అడిగినట్టు ప్రశ్నించింది శిశిర. అనుకోని ఆ ప్రశ్నకి తెల్లబోయి, “ఆనందకుటీరం” నోటికొచ్చిన పేరు చెప్పింది కుసుమ.  “ఇవాళే ఒక బోర్డు మీద ఆనందకుటీరం అని రాసి, మన వీధి తలుపుకి పెట్టేస్తా” అంది శిశిర. ఫక్కుమని నవ్వింది కుసుమ. నవ్వుతుంటే గులాబీరంగులో మెరిసిపోతున్న ఆవిడ మొహాన్ని చూస్తూ “ఇక్కడే ఉంటారా మీరు అని ఎవరైనా అడిగితే ‘వీళ్లు నన్ను ఎక్కడికీ వెళ్లనివ్వరండీ. ఎక్కడికి వెళ్లినా మర్నాడే తీసుకొచ్చేస్తారు’ అని చెప్పాలి!” అంది ఆపేక్షగా. మళ్లీ వెంటనే కోపం తెచ్చుకుంటూ “అయినా వాళ్లకెందుకు అవన్నీ?” అంది.  “పోన్లే.. ఆవిడేమంటే ఏం గాని, ఇపుడు పుష్యమీ, శ్రీధర్ వచ్చారనుకో... వాళ్లెక్కడ పడుకుంటారు? నాకంటూ వేరే ఇల్లుంటే ఇలా నాకోసం మీరంతా సర్దుకోనక్కర్లేదు కదా” అంది.  “పుష్యమి అమెరికా నించి వచ్చి ఇక్కడ ఎన్నాళ్లుంటుంది అమ్మమ్మగారూ? మా పెళ్లికోసం మొన్న వచ్చి వెళ్లింది కదా! మళ్లీ అలా వచ్చినపుడు నేనూ తనూ హాయిగా హాల్లో పక్కలు పరుచుకుని టీవీ చూస్తూ పడుకుంటాం. అలా తనకిష్టం లేకపోతే హొటల్లో చక్కగా ఏసీ రూమ్ తీసుకుంటాం. రాత్రి భోజనాలయ్యాక వెళ్లి పొద్దున్నే వచ్చెయ్యచ్చు”  “నాకోసం మీరంతా ఎందుకు సర్దుకోవడం?”  శిశిర లేచి కుసుమ కుర్చీముందు కింద కూర్చుని, మౌనంగా ఆవిడ చేతులు నిమురుతూ ఉండిపోయింది.  తర్వాత నెమ్మదిగా “అమ్మమ్మగారూ, ఒకడుగుతా చెప్పండి. అత్తయ్యగారూ వాళ్లకి ఇంత ఫ్లాట్ ఉంది కదా. అయినా మేం ఉద్యోగం మారి బెంగుళూరులోనో, అమెరికాలోనో ఉంటే వాళ్లు అక్కడ కూడా ఇంకో ఇల్లు కొనుక్కుంటారా? కొనుక్కోరు కదా. మాతోనే ఉంటారు. ఇంత ఇల్లున్నా పెద్దయ్యాక వాళ్లు పిల్లల ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. అపుడు ఎవరొచ్చినా వేరే అరేంజ్ మెంట్ చేసుకుంటారు గాని, పెద్దవాళ్లుండడం వల్ల ఇబ్బంది అనుకోరు” శిశిర మాటలు వింటూ మౌనంగా పార్కువైపు దృక్కులు సారించి కూర్చున్న కుసుమ ‘లోకరీతి తెలియని వెర్రిదానా’ అన్నట్టు శిశిర వైపు చూసి, పేలవంగా నవ్వింది. “అంతదాకా ఎందుకు అమ్మమ్మగారూ! అత్తయ్యా మామయ్యా పుష్యమి దగ్గరకి వెళ్లారనుకోండి. వాళ్లది రెండు బెడ్రూముల ఫ్లాట్ కదా. మరి ఎవరన్నా గెస్ట్ వస్తే ఏంచేస్తారు? హాల్లో కింద పక్కలేర్పాటు చేస్తారు గానీ అమ్మా నాన్నా వచ్చారు కనక ఇబ్బందిగా ఉందనుకుంటారా? కన్నపిల్లలు పసివాళ్లుగా ఉన్నపుడు వాళ్లే ఇంటికి చక్రవర్తులన్నట్టు, వాళ్ల సౌకర్యమే ప్రధానమన్నట్టు చూస్తారు కదా అమ్మా నాన్నా? మరి ఆ అమ్మానాన్నా పెద్దవాళ్లైపోతే, వాళ్ల అవసరాలే ఫస్ట్ ప్రయారిటీ కావాలి పిల్లలక్కూడా!” కుసుమ అరచేతులు రెండిటినీ పట్టుకుని తన చెంపలకి చేర్చుకుంటూ “అమ్మమ్మ గారూ! పిల్లలు చిన్నగా ఉన్నపుడు అమ్మా నాన్నల ఇంట్లో ఎంత హాయిగా ఉంటారు! అది తమ సొంతం అనుకుంటారు గాని మాకు వేరే ఇల్లులేదని అనుకుంటారా? అలాగే పిల్లలు పెద్దయ్యాక, తల్లిదండ్రులు కూడా పిల్లల ఇంట్లో ఉండాలి స్వేచ్ఛగా, స్వతంత్రంగా. మాకు వేరే ఇల్లులేదని అనుకోకూడదు” అంది శిశిర. కుసుమ విభ్రాంతిగా చూసింది నిండా ఇరవైమూడేళ్లు లేని మనవరాలివైపు. మూగబోయిన మనసుతో ఆ పిల్లని దగ్గరగా లాక్కుని “నీకెందుకే నామీద ఇంత ప్రేమా?” అంది గొంతు రుద్ధమవకుండా జాగ్రత్త పడుతూ.  “మీరు నాకు ‘ఆనందా’న్నిచ్చారు. అందుకే!” మిస్చివస్ గా నవ్వుతూ అంది శిశిర. “నీకు ఏదిచ్చినా రెట్టింపై తిరిగొస్తుందే అమ్మలూ. అందుకే మా ఆనందాన్ని నీకిచ్చాం, మళ్లీ రెట్టింపు చేసి మాకిస్తావని!” అంది కుసుమ మనసారా నవ్వుతూ. ఎప్పుడొచ్చిందో తలుపు దగ్గర నిలుచున్న రమ నవ్వుతూ “అప్పుడే కాదులే…ఓ రెండు మూడేళ్ల తర్వాత” అంది.  “అన్ని రోజులెందుకూ? ఇప్పుడే ఇస్తా” అంది శిశిర.  “పిచ్చిపిల్లకి అర్ధమైనట్టులేదు” అంటూ కుసుమ పకపకా నవ్వుతుంటే, రమ నవ్వాపుకుంటూ లోపలికి పోయింది. ర‌చ‌న‌:  డా. వార‌ణాసి నాగ‌ల‌క్ష్మి

పుల్లప్ప మాట

  పుల్లప్ప మాట     అనగనగా ఒక ఊళ్లో ఒక బిచ్చగాడు ఉండేవాడు. అతని పేరు పుల్లప్ప. పుల్లప్ప పుట్టు గ్రుడ్డి. రోజూ బస్టాండులో ఆగే బస్సుల దగ్గరికి వెళ్ళి అడుక్కునేవాడు. అట్లా వచ్చిన డబ్బులతో ఏదో ఒకటి కొనుక్కుని తినేవాడు.  ఒకరోజున బస్టాండులో బస్సు ఒకటి వచ్చి ఆగింది. అక్కడ అడుక్కోవటం మొదలుపెట్టాడు పుల్లప్ప. బస్సు దిగిన ప్రయాణీకులు కొందరు అతనికి తలా ఒక్క చిల్లర డబ్బు ఇచ్చారు. అంతలోనే గుప్పుమని సారాయి వాసన వచ్చింది. ఎవరో మందు తాగిన వ్యక్తి ఒకడు, బస్సులోంచి దిగాడు. పుల్లప్పకి కళ్ళు లేవు, కానీ ముక్కు పని చేస్తూనే ఉందిగా, ఆ సంగతి అర్థమయ్యింది.   సాధారణంగా త్రాగినవాళ్లెవ్వరూ మన లోకంలో ఉండరు. బిచ్చగాళ్లని కసరుకుంటారు. అందుకని పుల్లప్ప అతనికి దూరంగా జరిగాడు. ప్రక్కకి తప్పుకొని అతను వెళ్ళేందుకు బాగా దారి వదిలాడు. తిరిగి వెళ్ళిపోదామని వెనక్కి కూడా తిరిగాడు. అంతలోనే ఆ త్రాగినతను పుల్లప్పని పిలిచి ఒక రూపాయి దానం చేసాడు. పుల్లప్ప అందరికీ పెట్టినట్టే అతనికీ దండాలు పెట్టాడు. మరుసటి రోజున కూడా ఇలాగే జరిగింది. త్రాగుబోతువాడు పుల్లప్పని పిలిచి ఒక రూపాయి ఇచ్చాడు. పుల్లప్ప దండం పెట్టాడు. ఇట్లా పది రోజుల పాటు వరసగా జరుగుతూ పోయింది.    పదకొండో రోజున త్రాగుబోతువాడు పుల్లప్పకి పదిరూపాయల నోటు ఇచ్చాడు. కానీ పుల్లప్ప దానికోసం‌ ఆశ పడలేదు. అతని నోటును అతనికి తిరిగి ఇస్తూ "అయ్యా! మీరు మరిచిపోయి నాకు పదిరూపాయలు ఇచ్చారు. ఇదిగో ఇది తీసుకోండి" అన్నాడు. "మరిచిపోయి కాదులే. చూసే ఇచ్చాను. నా దగ్గర ఇవాళ్ల చిల్లర లేదు" అన్నాడు అతను. "పర్లేదులెండయ్యా! చిల్లర ఉన్నప్పుడు ఇద్దురులే. లేకపోతే తమరు మాత్రం‌ ఏం చేస్తారు" అన్నాడు పుల్లప్ప, నిజాయితీతో. "అవును అయినా ఇది పది రూపాయలని నీకెట్లా తెలుసు?" అని అడిగాడు. "కొత్త నోట్లకు చివర గీతలుంటాయి స్వామీ, ఉబ్బెత్తుగా ఉంటాయి.    జాగ్రత్తగా చూస్తే ఆ గీతల్ని బట్టి అది ఏం నోటో కనుక్కోవచ్చు" అన్నాడు పుల్లప్ప. ఆ త్రాగుబోతు వాడు ఆశ్చర్యపోయాడు. "బాగా తెలివైన వాడివేనే! ఇదిగో, ఇవాల్టికి ఈ పది ఉంచుకో, పర్లేదు" అన్నాడు. పుల్లప్ప తీసుకోలేదు. "అయ్యా! తమరు త్రాగిన మత్తులో ఉన్నారు కాబట్టి, నాకు ఇన్ని డబ్బులు ఇస్తున్నారు. నాకు అనిపిస్తుంది, 'ఈ డబ్బులు ఇస్తున్నది తమరు కాదు, తమరు త్రాగిన మందు' అని. ఒకసారి ఆ మందు ప్రభావం తగ్గాక, తమరే నన్ను తిట్టుకుంటారు, 'మోసం చేసాడు గుడ్డోడు' అని. అందుకని, వద్దు స్వామీ- ఎక్కువ డబ్బులు ఇవ్వకండి.    ఏదో మీకు బుద్ధి పుడితే ఒక రూపాయో, రెండు రూపాయలో ఇవ్వండి చాలు" అన్నాడు. "లేదులే! నేను ఎంత త్రాగినా కంట్రోలులోనే ఉంటాను. అట్లా ఏమీ అవ్వదు" అన్నాడు అతను, కొంచెం తగ్గి. "అయినా వద్దులెండి అయ్యగారు-" అన్నాడు పుల్లప్ప. ఆపైన కొంచెం సంకోచిస్తూనే "తమబోటి పెద్దలకు నేనేం చెబుతాను గాని, అయినా వయసులో పెద్దోనిగా నేనో మాట చెప్పనా, అయ్యగారు?" అని అడిగాడు. "చెప్పు!" అన్నాడు ఆ మనిషి. "అయ్యా! రోజూ చూస్తున్నాను; తమరు రోజూ త్రాగుతున్నారు; ఇలా తాగే బదులు, ఆ డబ్బులతో మీ పిల్లలకు ఏదైనా కొని ఇవ్వచ్చు కదా?!" అని చెప్పాడు పుల్లప్ప. అతను ఏమీ‌ మాట్లాడలేదు. నిశ్శబ్దం అయిపోయాడు.   "అయ్యా క్షమించండి- ఏదో మనసులో మాటని పైకి అనేసానండయ్యా. మీ పరిస్థితి ఏమిటో నాకు తెలీదు. మీకు పిల్లలు ఉన్నారో‌, లేదో కూడా తెలీదు.. క్షమించండి. నేను చిన్న మనిషిని..." పుల్లప్ప ఇంకా ఏదో అంటుండగానే ఆ మనిషి అక్కడినుండి వెళ్ళిపోయాడు. తను చేసింది మంచి పనో, తప్పుడు పనో అర్థం కాలేదు పుల్లప్పకు. అయితే తను అనుకున్నట్లుగానే మరుసటి రోజునుండీ బస్సులో ఆ త్రాగుబోతు అతను రాలేదు; తనకు రోజూ వచ్చే రూపాయి కూడా పోయింది! కొన్ని రోజుల తర్వాత ఎవరో పుల్లప్ప చేతికి గుడ్డివాళ్ళు పట్టుకునే ప్లాస్టిక్ కట్టెను ఒకదాన్ని అందించారు- "తీసుకో! నీవల్ల నేను మారాను. ఇప్పుడు నా పిల్లలు కూడా సంతోషంగా‌ ఉన్నారు. చాలా ధన్యవాదాలు!"‌ అని. అతని గొంతును గుర్తుపట్టి దండం పెట్టాడు పుల్లప్ప. అతని పేరేంటో తెలీదుగానీ, ఆ త్రాగే ఆయన దగ్గరినుండి ఇప్పుడు సారాయి వాసన రావట్లేదు. - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

ఈకలకు వచ్చిన కళ్ళు..

ఈకలకు వచ్చిన కళ్ళు..   అనగనగా ఒక పక్షి రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి రాజు నెమలి. అప్పట్లో నెమలి ఈకల మీద ఇంత చక్కని కళ్ళు ఉండేవి కావు. అయినా కూడా అది చూసేందుకు బాగానే ఉండేది. రాజ్యంలోని పక్షులన్నీ రోజంతా బాగా కష్టపడి తమ తమ చేన్లలో పంటలు పండించేవి. అందరూ ఆనందంగా నివసించేందుకు అవసరమైనన్ని గింజల్ని సంపాదించేవి. ఒకసారి సూర్య భగవానుడికి ఒక అనుమానం వచ్చింది: 'భూలోకంలో ఇన్ని రాజ్యాలు ఉన్నాయి కదా, ఎక్కడైనా మంచితనం అనేది ఉన్నదా?' అని.   అందుకని ఆయన మారువేషం వేసుకొని, ఈ ప్రపంచంలోని అన్ని రాజ్యాలూ తిరిగి, అక్కడి ప్రజల్ని, రాజుల్ని పరీక్షిద్దామని బయలుదేరాడు. కానీ ఏ రాజ్యంలో చూసినా అక్కడి ప్రజలలో గాని, రాజుల్లో గానీ ఎక్కడా మంచితనం కనబడలేదు సూర్యభగవానుడికి. అట్లా తిరుగుతూ తిరుగుతూ నిరాశపడి, చివరికి మన పక్షి రాజ్యం చేరుకున్నాడు ఆయన.‌   రాజ్యంలోకి అడుగు పెట్టిన వెంటనే అనిపించింది: "ఇక్కడ ఎవరికో ఒక్కరికి మంచితనం ఉంది ఖచ్చితంగా!" అని. కానీ ఆ మంచివాళ్ళెవరో కనుక్కునేదెట్లా? అందుకని ఆయన మళ్ళీ వేషం మార్చాడు. ఈసారి ఆరోగ్యం బాగా లేని పక్షిగా మారాడు. ఇంద్రుడికి చెప్పి, ఒక పెద్ద గాలి వానను కూడా తెప్పించాడు. ఆ పైన ఆయన "తుఫాను వస్తోంది- తల దాచుకునేందుకు కొంచెం తావు ఇవ్వండి తల్లీ!" అంటూ గూడు-గూడు తిరిగాడు.   కొత్త పక్షిని చూడగానే రాజ్యంలోని పక్షులన్నీ‌ తలుపులు వేసేసుకున్నాయి. "మా ఇల్లు చిన్నది" అని ఒకటి అంటే, "పిల్లలు నిద్రపోతున్నారు" అని ఒకటి అన్నది- తప్పిస్తే, "లోపలికి రా, పర్లేదు" అని ఏ పక్షీ అనలేదు. "అన్ని గూళ్ళూ తిరిగేసాను- ఇప్పుడు ఇక మిగిలింది నెమలి ఒక్కటే"అని, సూర్యభగవానుడు నెమలి దగ్గరికి వచ్చాడు. రాజభవనం దగ్గరికి చేరుకున్నాడో లేదో, నెమలి తనంతట తానే ఆయన్ని లోపలికి పిల్చి, తల తుడుచుకునేందుకు తువ్వాలు ఇచ్చింది. "ఇంత గాలివానలో బయటికి ఎందుకు వచ్చావు?" అని అడిగి, "ఈ పక్షికి భోజనం ఏర్పాట్లు, పడక ఏర్పాట్లు చేయండి; డాక్టరుగారిని ఒకసారి వచ్చి చూడమనండి" అని ఆదేశించింది పనివాళ్లను.    అప్పుడు సూర్యభగవానుడు తన సొంత రూపం ధరించి "ఓ నెమలీ! ఇప్పటి వరకూ నేను ప్రపంచంలోని అన్ని రాజ్యాలూ తిరిగాను. ప్రతిచోటా సమస్యల్లో ఉన్న పౌరుల వేషం వేసాను. రాజ్యంలో ఎవరైనా అట్లాంటివాళ్లని 'గమనిస్తారా, పట్టించు-కుంటారా, కొంచెమైనా కాపాడతారా' అని పరీక్షించి చూసాను. ఎవ్వరూ పట్టించుకో-లేదు. ప్రతివాళ్ళూ "మేం చాలా కష్టాల్లో ఉన్నాం; మా సమస్యలే తీర్చేవాళ్ళు లేరు" అనుకుంటూ తమలో తాము మునిగి ఉన్నారు కానీ, ఇతరుల బాధల పట్ల కరుణను వ్యక్తం చేసిన వాళ్ళు లేరు. నాకు నిన్ను చూస్తే చాలా గర్వంగా అనిపించింది. రాజుగా నువ్వు నీ బాధ్యతని విస్మరించటం లేదు. నీకేదైనా వరం ఇవ్వాలని ఉంది. ఏం కావాలో కోరుకో!" అన్నాడు. నెమలి ఆయనకు నమస్కరిస్తూ "స్వామీ! నాకు వేరే ఏ కోరికా లేదు- నా రాజ్యంలో ఎవరికీ‌ కష్టం కలగకుండా చూసుకోవటం తప్ప. అయితే నాకున్న ఈ రెండు కళ్ళూ సరిపోవట్లేదు ఇంత పెద్ద రాజ్యాన్ని పరిపాలించటానికి. అదొక్కటే నాకు కనిపించే వెలితి" అన్నది.   సూర్యభగవాడు "ఓ! సరే! ఇదిగో తక్షణం నీ ఈకల మీద కళ్ళు ప్రసాదిస్తున్నాను. నీ రెండు కళ్ళతో నువ్వు ప్రపంచాన్ని చూస్తావు; అదే సమయంలో నీ‌ ఈ వెయ్యీ కళ్ళనీ ప్రపంచం చూస్తుంది. నీ ఈకలకున్న ఈ కళ్ళు పక్షులకు ఆదర్శంగా నిలుస్తాయి" అని మాయమైపోయాడు. అట్లా వచ్చాయి, నెమలి ఈకలకు ఇంత చక్కని కళ్ళు! కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

సుఖం ఎక్కడ

సుఖం ఎక్కడ     కొత్తపల్లిలో రాజు అనే పిల్లవాడు ఉండేవాడు. వాడికి పక్షులన్నా, జంతువులన్నా, చెట్లన్నా చాలా ఇష్టం. రోజూ అడవికి పోయి పాటలు పాడుకుంటూ తిరగటం, వాగుల్లోకి దిగి ఈతకొట్టటం చేస్తుంటాడు. ఒకసారి వాడికి జ్వరం వచ్చింది. ఎటు పోయేందుకూ శక్తి లేకుండింది. అమ్మానాన్నలు పనులు మానుకొని కూర్చుంటే ఎట్లా? రాజును ఇంట్లోనే వదిలి వాళ్ళు కూలికి పోయారు. ఒంటరిగా ఉన్న రాముకు అడవి గుర్తుకొచ్చింది. 'అడవిలో పక్షులు, జంతువులు ఎంత హాయిగా బ్రతుకుతాయో! వాటికి ఇన్ని కష్టాలుండవు. చక్కగా ఎగురుకుంటూ, పాడుకుంటూ తిరుగుతాయి; ఆకలి వేస్తే దొరికిన పండ్లను తింటాయి, అలసిపోతే నిద్రపోతాయి! మనిషి బ్రతుకే కష్టం. నేను ఇట్లా మనిషిలాగా కాకుండా ఏ కుందేలు లాగానో పుడితే ఎంత బాగుండేది! చక్కగా అటూ ఇటూ గెంతుకుంటూ, తోటి కుందేళ్లతో‌ఆడుకుంటూ, అడవిలో దుంపలన్నీ త్రవ్వుకుంటూ, దొరికిన పండునల్లా రుచిచూసుకుంటూ..ఓహ్! భలే ఉండేది!' అనుకున్నాడు. అలా అనుకున్నాడో లేదో- వాడు అడవిలో కుందేలైపోయాడు! రాజు కుందేలుకు ఎంత ఉత్సాహం కలిగిందంటే చెప్పలేము. అటూ ఇటూ చెంగు చెంగుమని దూకి, గంతులు వేసి, బొర్లాడి- రకరకాలుగా పరుగులు పెట్టి చూసింది. దగ్గర్లోనే గెన్సుగడ్డల పొద ఒకటి కనబడింది. ఇంకేముంది?! రాజు కుందేలు కడుపారా చిలకడ దుంపలు మెక్కి, హాయిగా నిద్రపోయింది. అంతలో దానికి కుందేళ్ల గుంపొకటి కలిసింది. ఆ కుందేలు పిల్లలతో కలిసి ఇదీ కుందేలు ఆటలు ఆడింది. ఇట్లా ఎన్ని రోజులు గడిచాయో! కుందేలు పిల్ల లెక్కపెడితే గద! అయితే అట్లా సంతోషంగా బ్రతుకుతున్న కుందేలు పిల్లను ఒకరోజున నక్క ఒకటి తరిమింది. దాన్నుండి తప్పించుకునేందుకు పాపం, రాజు కుందేలు చెమటలు క్రక్కుకుంటూ‌ప్రరుగుపెట్టాల్సి వచ్చింది. అట్లా పరుగెత్తుతుంటే దానికి ముళ్ళు గుచ్చుకొని పోయాయి; చర్మం చీరుకుపోయి రక్తం వచ్చింది. ఆ తర్వాతిరోజుకల్లా దానికి జ్వరం వచ్చేసింది. దగ్గర్లో ఒక్క డాక్టరు కూడా లేడాయె. కుందేలుకు పాపం నడిచేందుకు కూడా శక్తిలేక కూలబడిపోయింది. "అబ్బ! ఈ కుందేలు బ్రతుకు కష్టమే. ఎప్పుడు నక్కలు వెంటబడతాయో చెప్పలేం. జ్వరం వస్తే ..? ఇక చెప్పనవసరమే లేదు. అసలు ఈ జన్మ వద్దు నాకు. హాయిగా ఏ చెట్టు లాగానో ఉంటే ఎంత బాగుంటుంది! అసలు కదలాల్సిన పనే లేకుండా, గాలికి చక్కగా కొమ్మల్ని ఊపుకుంటూ, అందరికీ‌ మేలు చేసే ఆక్సిజనును అందిస్తూ..భలే ఉంటుంది. బ్రతికితే చెట్టు లాగా బ్రతకాలి." అనుకున్నది రాజు కుందేలు. అట్లా అనుకున్నదో లేదో- ఇట్లా అది చెట్టయిపోయింది! రాజు చెట్టు సంతోషంగా ఊగింది. కొమ్మల్ని అటూ ఇటూ తిప్పింది. దానిమీదికి పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకుంటే మురిపెంగా చూసింది. పక్షి పిల్లలకు పండ్లు తినిపించింది. "జన్మంటే ఇదే! చెట్టు జన్మ ధన్యం. ఎప్పటికీ నేను చెట్టులాగానే ఉంటాను" అనుకున్నది. అయినా ఆ సంతోషం ఎన్నో రోజులు నిలవలేదు. అనుకోకుండా వచ్చిన పెను తుఫాను దెబ్బకు రాజు చెట్టు కొమ్మలన్నీ విరిగిపోయాయి. మొండిదైపోయిన రాజు చెట్టు మళ్ళీ ఇగుర్లు వేద్దామనుకునేలోపల, కట్టెలు కొట్టేవాళ్ళు కొందరు దాని ముందు నిలబడి ఆ మాను గురించీ, దానిలో ఉండే చేవ గురించీ మాట్లాడుకున్నారు! "ఇలా కదలలేని పరిస్థితి దుర్భరం. నేను గాలిలో ఎగిరే పక్షినైతే ఎంత హాయిగా ఉందునో! ఎంత గాలి వీస్తే అంత గొప్పగా గింగిరాలు కొడతాను. స్వేచ్ఛాజీవితం పూర్తిగా నా సొంతం అవుతుంది" అనుకున్నది రాజు చెట్టు. మరుక్షణం‌ అది పంచవన్నెల రామచిలుక ఐపోయింది. రాజు చిలక అటూ ఇటూ‌ ఎగిరింది. సంతోష పడింది. తోటల్లో తిరిగింది. జామ పళ్ళూ, దానిమ్మ పళ్ళూ కొరికి తిన్నది. కోయిలతో సమానంగా కూసింది. తోటి పక్షులతో కలిసి ఆడింది. "ఇలా బాగుంది స్వేచ్ఛగా" అనుకున్నది. అయినా ఎంతకాలం? ఒకరోజున అది పొలంలో జామచెట్టు మీద వాలేసరికి, ఆ చెట్టుమీదే రైతు పరచి ఉంచిన వలలో చిక్కుకున్నది. "అయ్యో మనిషిగా ఉంటే సరిపోయేదేమో, కనీసం ఇలాంటి కష్టాలు ఉండేవి కావు" అనుకున్నది. అట్లా అనుకున్నదో‌లేదో- ఇట్లా మనిషైపోయింది మళ్ళీ. ఆ సరికి రాజు జ్వరం తగ్గిపోయింది- కొంచెం నీరసంగా ఉందంతే. ఆ నీరసంలో మంచి కల వచ్చినట్లుంది- రేపటినుండీ‌ మళ్ళీ అడవికి వెళ్ళి ఆడుకోవచ్చు!   - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో