తాఖీదు ( అల్లూరి [గట్టు] నరసింగరావు స్మారక కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ)    

తాఖీదు ( అల్లూరి [గట్టు] నరసింగరావు స్మారక కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ)                       “ఊర్లో అందరికీ వస్తున్నాయంట. సామాన్లు సర్దుకోమంటున్నారు.”  “ఏం వస్తున్నాయి అలమేలు తల్లీ?” స్థంభానికి కట్టిన పలుపు తాడు పేనుతూ అడిగాడు శివయ్య.  “తాఖీదులు. మనూరు రాజధానికి దగ్గర్లో ఉందంటగా! అన్నన్ని డబ్బులిచ్చి ఇంకో ఊర్లో పొలాలు కొనుక్కోమని పంపేత్తారంట.” రెండు చేతులూ బార్లా చాపి అంది అలివేలు. చేస్తున్న పనాపి మనవరాలికేసి చూశాడు శివయ్య. కళ్లు పెద్దవి చేసి, ఆశ్చర్యాన్నంతా మొహంలో నింపి చూస్తోంది. గాఢంగా నిట్టూర్చాడు శివయ్య. ఏమీ తెలీని వయసు. కొలనులో చేపపిల్లలా హాయిగా తిరిగి వస్తుంది.  అలివేలుకి పదేళ్లు. శివయ్య, సామ్రాజ్యాల ఒక్కగా నొక్క కొడుకు కూతురు. కొడుకూ, కోడలూ బస్సాక్సిడెంట్ లో పోయారు. నెలల పిల్లగా అలివేలు నాన్నమ్మ గారింటికి వచ్చింది. మళ్లీ బాధ్యత మొదలయింది శివయ్యకి. బెజవాడకీ, ఏలూరుకీ మధ్యలో వాజ్ పాయ్ క్వాడ్రాంగిల్ కి దగ్గరగా ఉన్న చిన్న ఊరు శివయ్యది.  శివయ్యది మూడెకరా వరిపంట. అదీ.. వర్షాధారంతోనే. “ఎవరు చెప్పారమ్మా?” “మా హేమ టీచర్.. మనూరు ఖాళీ చేసి వెళ్లిపోవాలంట కదా అందరం. మరి రాములవారి గుడి కూడా తీసుకెళ్లి పోతామా?” అలివేలు సందేహం.. “టీచరుగారినే అడక్క పోయావా ఆ విషయం?” శివయ్య మళ్లీ తాడు పేనడం కొనసాగించాడు. “అడిగా.. పూజారిగారిని అడగమన్నారు.” నిరుత్సాహంగా అంది అలివేలు. ఆ వూరు పచ్చని చేలతో, ఊరి మధ్య చెరువుతో, చెరువు చుట్టూ కొబ్బరి చెట్లతో కన్నుల పండువగా ఉంటుంది.  ఆ ఊరికి తలమానికంగా నిలిచింది గుట్ట మీది రామాలయం. ముఖ్యంగా అందులో ఉండే ఆంజనేయస్వామి గుడి ముందున్న రావి చెట్టు. తమతమ కష్టాలు తీర్చమని మొక్కుకుని, చిన్నచిన్న మూటల్లో పసుపుబియ్యం కొమ్మలకి కడుతుంటారు. మొక్కు తీర్చుకోడానికి వచ్చినప్పుడు, మొక్కులని బట్టి రెండో మూడో శేర్ల బియ్యంలో ఆ పసుపుబియ్యం కలిపి వండించి అక్కడున్న బిచ్చగాళ్లకి సంతర్పణ చేస్తుంటారు. గుట్ట కిందే, భక్తులు మొక్కులున్నన్నాళ్లూ ఉండడానికి పెద్ద సత్రం కట్టించారు, అక్కడికి దగ్గరలో ఉన్న పట్టణంలోని వణిక్ ప్రముఖులు. ఊర్లో సగం వ్యాపారాలు గుడికి వచ్చే పోయే భక్తుల కోసమే నడుస్తుంటాయి. ఊరి వారికి తమకి కావలసిన పంటలు పండించడం, కిరాణా కొట్టు, తప్ప ఇంకేమీ రాదు. రెండు సినిమాహాళ్లు, నాలుగు పాక హోటళ్లు కూడా ఉన్నాయి. ఒక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, మునిసిపల్ పార్కు.. సదుపాయమైన ఊరు. తాతయ్య తను చెప్తున్నది పట్టించుకోక పోవడం నచ్చలేదు అలివేలుకి.  “తాతయ్యా! నిజంగానేనట. ఏం మాట్లాడవేంటీ?” “ఏం మాట్లాడనమ్మా? నలుగురితో పాటూ మనం..” ఇంక లాభంలేదని, ఇంట్లోకెళ్లింది. నాన్నమ్మ ఎక్కడా కనిపించలేదు. పెరడంతా వెతికింది. నిమ్మచెట్టు దగ్గర నిల్చుని కాయల కేసి చూస్తూ, లెక్క పెడుతున్నట్లుగా వేళ్లు ముడిచి విప్పుతోంది కాంతమ్మ. “నాన్నమ్మా! ఏం చేస్తున్నావూ.. మనం ఊరొదిలెళ్లి పోవాల్ట. తెల్సా?” “నిమ్మకాయల్లెక్కెడతున్నా. వంద కాయలైతే మార్కెట్ కి పంపుదామనీ.. విన్నాలే.. ఇందాకే గుళ్లో చెప్పుకుంటున్నారు.” “మరి గుడెలాగ? కొండంతా కొట్టేస్తారంటకదా?” గట్టిగా నిట్టూర్చింది కాంతమ్మ. ఆహారానికెళ్లొచ్చిన పక్షికి, తన పిల్లలతో సహా గూడు, చెట్టుకింద కనిపిస్తే వచ్చే పక్షి కూతలా ఉందది. కాకపోతే, గూడు పోతుందని పక్షికి ముందు తెలీదు. కాంతమ్మకి తెలిసింది.. అంతే తేడా. అలివేలుకి ఇంకేం చెయ్యలో తోచ లేదు. గబగబా స్నానం చేసేసి, ఉతికిన బట్టలేసుకుని బైటికి పరుగెత్తింది. దిబ్బరొట్టె వేశాను తినెళ్లవే అని నాన్నమ్మ గోలెడుతున్నా విన కుండా. ఒక్క హేమా టీచరే తన సందేహాలు తీర్చేది, తీర్చ గలిగేది. “ఏంటలివేలూ.. అప్పుడే తయారైపోయావా? ఇంకా స్కూలుకి గంట టైముంది. ఏవన్నా తిన్నావా?” హేమ పనులన్నీ ముగించుకుని, జడ వేసుకుంటోంది. హేమకి, అమాయకంగా ఉండే అలివేలంటే ప్రత్యేమైన అభిమానం. తల్లీతండ్రీ లేని ఆ అమ్మాయికే లోటు రానీకుండా పెంచుతున్న శివయ్య దంపతులంటే ఎంతో గౌరవం.  అలివేలు మాట్లాడకుండా నిల్చుంది. అబద్ధం ఆడకూడదు కదా! “నాన్నమ్మ పిలుస్తుంటే వినకుండా పరిగెట్టుకుని వచ్చేశావా? మా ఇంట్లో చల్దన్నవే మరి.. తింటావా? “టీచర్.. మనం వెళ్లిపోతే రాములవారెలా? కొండ తవ్వేస్తే మరి ఆయనెక్కడికెళ్తారు? మొక్కులు తీర్చుకోడానికి ఇక్కడికొచ్చే వాళ్లంతా ఏమైపోతారూ?” ఆవకాయ కలిపిన చద్దన్నం ముద్దలు తింటూ అడిగింది అలివేలు. దానికి రాములవారి ఉనికే పెద్ద సమస్య ఐపోయింది. ఊళ్లో జనం అంతా ఎక్కడికెళ్తారూ, ఏం చేస్తారూ.. మళ్లీ ఇళ్లూ అవీ ఎలా కట్టుకుంటారూ.. ఏం తిని బ్రతుకుతారూ.. ఆ వివరాలేం అక్కర్లేదు. హేమ అదే అడిగింది.  “మనందరి మాటేంటి? ఎక్కడికనెళ్తాం? ఏం తింటాం?” “మనం ఫర్లేదు టీచర్. నడవగలం, మాట్లాడగలం. కావలసింది ఎవర్నైనా అడగ్గలం. కానీ రాములోరికి అన్నీ పూజారిగారే చెయ్యాలి కదా? పరిగెట్టి ఎక్కడికీ వెళ్లలేరు కదా! పాపం.. ఆయన మాత్రం.. తన సామాన్లే తీసుకెళ్తారా, రాములోరివే తీసుకెళ్తారా?”                    హేమ నవ్వాపుకుంది. ఎంతటి అమాయకత్వం? అందుకే పిల్లలూ దేముడూ ఒక్కటే అన్నారు కవి. ఇద్దరూ ఎదుటివారి కష్టాలే పట్టించుకుంటారు. “మరేం చేద్దామంటావూ?” “అదే ఆలోచిస్తున్నా. ఏదో ఒకటి చెయ్యాలి.” కంచం కడిగి బోర్లించి, చూపుడువేలు గడ్డం కింద పెట్టుకుని పైకి చూస్తూ అంది అలివేలు. వరదలో గండికడ్డం పడుక్కుని తన ఊరిని కాపాడిన హాలండ్ కుర్రాడు జ్ఞాపకం వచ్చాడు హేమకి. “తాతయ్యా! మనూరికి బోలెడు కార్లొస్తున్నాయి. సర్పంచి గారు నిన్ను రమ్మన్నారు.” అలివేలు హడావుడిగా వచ్చింది. ఆ రోజు ఆదివారం. అలివేలు రోజూ కంటే తొందరగా లేచి తయారయి వీధులన్నీ తిరిగి అందరినీ పలుకరించి వస్తుంది. ఆ పక్క వీధిలో అత్తయ్య గారి దగ్గర సంగీతం, ఈ పక్క వీధిలో పిన్నిగారి దగ్గర పూలదండలు అల్లడం, సరిగ్గా చూపానక కొంచెం ఆలిశ్యంగా నిద్రలేచే ఎదురింటి దొడ్డమ్మగారికి అవీ ఇవీ అందించడం.. చాలా పనులే ఉంటాయి. తీరిగ్గా అప్పుడొచ్చి, నాన్నమ్మకి కబుర్లన్నీ చెప్తూ.. పన్లో సాయం చేస్తూ ఫలారం చేస్తుంది. మధ్యాన్నించి హేమ టీచర్ ఇంటికెళ్లి, హోవర్కు.. చదువు, కథలు కబుర్లు కానిస్తుంది. “ఎందుకో తెలుసా తల్లీ?” “నువ్వస్సలు పట్టించుకోవట్లేదు తాతయ్యా! ఎన్ని సార్లు చెప్పాను? ఊరంతా గగ్గోలెట్టేస్తున్నారు. మనం ఊరొదిలెళ్లిపోవాలంట. నువ్వేమో తాపీగా తాళ్లు పేనుకుంటూ, చుట్టలు కాల్చుకుంటూ కూర్చుంటావు. అక్కడేమో కొంపలు మునిగి పోతున్నాయి.” నిర్లిప్తంగా బట్టలు మార్చుకుని బైటికి నడిచాడు శివయ్య. గగ్గోలు పడి చెయ్యగలిగిందేముంది? రాజుగారు తలచుకుంటే దెబ్బలకి కొదవా? శివయ్య, అలివేలు వెళ్లేసరికే పెద్దలంతా పంచాయితీ ఆఫీసు దగ్గరున్నారు. సర్పంచ్ కొలువు తీరినట్లుగా కూర్చున్నాడు. తెల్లని పైజామా లాల్చీలతో నలభై ఏళ్ల లోపు వాళ్లు నలుగురు, సూటేసుకున్న యాభై ఏళ్ల వాళ్లిద్దరు.. కొత్త కుర్చీల్లో కూర్చున్నారు. ఎర్ర కుషనున్న కుర్చీలు అరడజను తెప్పించాడు సర్పంచ్.. పంచాయితీ బడ్జెట్ లోంచి.  ఒక లాల్చీకి కనుబొమ్మల మధ్య బొట్టు, ఇంకొకరికి నుదుట విభూతి, మరొకాయనకి టోపీ గడ్డం, నాలుగో పెద్ద మనిషికి సింధూర నామం ఉన్నాయి. సూట్ల వాళ్లిద్దరూ, ఎండకి, చెమటకి టైలు, కోట్లు అసహనంగా సర్దుకుంటున్నారు. ఊర్లో కాస్త ఆస్థి, పేరు ఉన్న వాళ్లంతా వచ్చారు. ఆరెంపీ డాక్టరు, స్కూలు హెడ్ మాస్టరూ కూడా.. వాళ్లకేం పొలాల్లేక పోయినా కూడా వచ్చారు. వచ్చిన కొద్దిమంది ఆడవాళ్లలో హేమ టీచర్ కూడా ఉంది. ఎవరో లేచి, శివయ్యకి ముందు వరుసలో చోటిచ్చారు.. విరిగి పోవడానికి సిద్ధంగా ఉన్న పాత ఇనప కుర్చీలో. అలివేలు హేమ టీచర్ పక్కన కూర్చుంది.. చాప మీద. బొట్టున్న లాల్చీ పెద్దమనిషి, పంచాయితీ రిజిస్టర్లో సంతకం చేస్తూ చూశాడు.. “మీరు కాదా సర్పంచ్?” ఆశ్చర్యంగా అడిగాడు.  సర్పంచ్ వెంకటరెడ్డి కనుబొమ్మలెగరేసి నవ్వాడు. “ఇది ఆడోళ్ల కోటా.. మా ఇంటిదాన్ని నిలబెట్టా. అందుకని రికార్డుల్లో ఆమె పేరే ఉంటాది. ఈ సంగతి అందరికీ తెల్సు. ఆవైతేనేంది నేనైతే నేంది..” మిగిలిన లాల్చీలవాళ్లు కూడా నవ్వారు. సూట్ల పెద్దమనుషులకి నచ్చినట్లు లేదు. పైకేం అనలేక, కంఠనాళాలు బిగించారు. “మరామెగారిని పిలిచారా?” విబూథి లాల్చీ.. “వస్తాది లెండి. సంతకాలెట్టాలిగా.. ఆ టయానికి. మీరంతా రిజిస్ట్రీలో సైన్లు చెయ్యండి. త్వరగా మీటింగైపోతే.. భోయనానికెళ్దాం. మాంచి రొయ్యల కూర చేయించా, భీంవరం నుంచి తెప్పించి.” వెంకటరెడ్డి హడావుడి పెట్టాడు. సంభాషణంతా వింటున్న శివయ్య నిర్వికారంగా చూశాడు. అతనికి రాజకీయాల మీద ఆసక్తి లేదు. చేతికందొచ్చిన కొడుకు పోయినప్పట్నుంచీ, ఏరోజుకారోజు బిగపెట్టుకుని బ్రతుకుతున్నాడు. ఎవరి చేతిలో ఏముంది.. పైవాడు ఆడించినట్టు ఆడడమేగా! సంతకాలయ్యాక సూటాయన లేచాడు.. అరగంట పైగా ఇంగ్లీషులో మాట్లాడాడు. అమెరికాలో చదుకునొచ్చాడు మరి. కొత్త రాజధాని ఆవశ్యకత, దాని నిర్మాణం కోసం తామందరూ పడుతున్న అవస్థలు.. కంటున్న కలలు. అవన్నీ తీర్చడానికి ప్రజలు చెయ్య వలసిన త్యాగాలు. దేశ స్వాతంత్ర్యం రావడానికి ఎందరో మహానుభావులు కష్ట పడినట్లు, ఇప్పుడు రాష్ట్ర ప్రజలు కష్టపడాలని చివరి మాటగా చెప్పి కూర్చున్నాడు. అందరూ శూన్యంలోకి చూస్తూ, మొహాలు అభావంగా పెట్టి విన్నారు. ఎవరికీ ఏమీ అర్ధం కాలేదు.  “సర్పంచ్ గారూ ఆరెవురండీ? ఒక్క ముక్కర్ధమైతే ఒట్టండి.” తెలుగు పల్లెకొచ్చి ఇంగ్లీషులో మాట్టాడితే ఎలా? అప్పుడు సింధూరం బొట్టాయన వివరించాడు తెలుగులో.  ఏతావాతా తేలిందేమిటంటే.. కొత్త రాజధానికి వాళ్లూరు ఆనుకుని ఉంటుంది. అంచేత ఇక్కడంతా అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లొస్తాయి. ఊరివారంతా పొలాలూ, ఇళ్లూ ఖాళీ చెయ్యాలి.  కొండకి అవతలి పక్క అందరికీ స్థలాలిస్తారు. అప్పుడు కొండ ఉండదు. అంతా చదును నేలే. అంచాత పెద్ద తేడా ఉండదు. ఇళ్లు కూడా కట్టిస్తారు తొందరలో. పొలాల బదులుగా, రాబోయే కాంప్లెక్స్ లో వాటికి రెట్టింపు ఖరీదైన షాపులిస్తారు. ఆ షాపుల్లో ఇష్టమైన వ్యాపారం చేసుకోవచ్చును. లేదా అద్దెకిచ్చుకోవచ్చు. అక్కడున్న రైతులందరి మొహాల్లోనూ గాభరా.. తరతరాలుగా ఈ భూముల్ని నమ్ముకుని, తాతలిచ్చిన కొంపల్లో పడుంటున్నారు. చదువులూ లేవు.. వ్యాపారాలు చేసే తెలివీ లేదు. కొండవతల ఇళ్లు కట్టిస్తే.. కట్టించే వరకూ ఎక్కడుండాలి? అదంతా బీడు భూమి. నిలువెత్తు తీసి, నల్లమట్టి నింపుతే కానీ పెరట్లో ఏ కూరా పండదు. అక్కడంతా ఖాళీగా కనిపిస్తోందని వాడుకోవచ్చనుకుంటున్నారు. కానీ ఎందుకూ పనికి రాదని తెలీదు కావాలు.. ఇళ్లు కట్టడానిక్కూడా అంతా లూజు నేల. ఇరవై అడుగులెళ్లాలి పునాదులకి. “తప్పదాండీ?” ఒక బక్కరైతు లేచి అడిగాడు. ఒక సూటాయన, కోటుతీసి వెనక్కి తగిలించి, తల అడ్డంగా తిప్పాడు. భాష రాదాయె మరి. “ఎప్పట్లోగా కాళీ చెయ్యాలండీ?” ఇంకొక రైతు.. “ఆరునెలలు టైముంది. ఈలోగా మీరు ఇళ్లు వెతుక్కోవచ్చు.” “మరి భోయనానికండీ? పనెక్కడ దొరుకుద్దండీ?” ఒక యువకుడు లేచాడు. చాలా మంది యువత హైడ్రాబాడ్, బెంగుళూరు లాంటి సిటీలకెళ్లే పోయారు. ఉన్నవాళ్లు కొద్దిమంది, చదువు కోలేనివాళ్లే. తమకున్న కొద్దపాటి పొలాల్లో..  వ్యవసాయం చేసుకుంటున్నారు. “ఎందుకు దొరకదు? కావలసినంత పని. భవనాలు కడతారు, రోడ్లు వేస్తారు.. కొత్త ఆఫీసులు పెట్తారు. మీరు ఏపని చెయ్యగలుగుతే ఆ పనే చెయ్యచ్చు.” సర్పంచ్ హామీ ఇచ్చాడు. “మాకు వ్యవసాయం తప్ప ఏదీ రాదండీ. మా స్వంత పనులు తప్ప కూలికెప్పుడూ ఎళ్లలేదండీ.” ఒక యువకుడు లేచాడు. “ఇప్పుడెళ్లండి. నామోషీ ఏటీ లేదు. పొట్టగడవాలంతే..” సర్పంచి కేకలేశాడు. “మరి కొండ మీద రాములోరో?” అలివేలు లేచి అడిగింది. తెలుగు సరిగ్గారాని సూట్లవాలాలతో సహా అందరూ నవ్వారు.  “రాములోరికి మీ స్థలాలవతల పెద్ద గుడి కట్టిస్తారు. అక్కడికి మారుస్తారాయన్ని. ఐనా రాములోరెక్కడ లేరు?” “అలా ఎలా? ఆయన ద్వాపరయుగం నుంచీ అక్కడుంటున్నారు. స్వయంగా అర్జనుడు ప్రతిష్ఠించాడుట. మారుస్తే రాములోరిదీ, ఆంజనేయస్వామిదీ మహత్యం తగ్గిపోదూ?” అలివేలు గట్టిగా అడిగింది. అక్కడున్న అంత మంది పెద్దవారికి లేని ధైర్యం ఆ పిల్లకి ఉన్నందుకు, వచ్చిన లాల్చీవాలాలు కూడా మెచ్చుకోలుగా చూశారు. సూటు పెద్దలకి మాత్రం కోపం వచ్చింది. “టెంపుల్.. వేరే ఖడ్తామంఠున్నారు ఖదా? ఐనా ఈ బేబీనా అడిగేది.. అడుగుతే మనం రెస్పాన్స్ ఇవ్వాలా?” “బేబీ కాదు.. మేం అడుగుతున్నాం. చెప్పండి?” ఒక యువకుడు లేచాడు. “అదికాదన్నా! రోడ్డు మధ్యలో ఉన్న వేరే మతం వాళ్ల టెంపుల్ తీస్తుంటే, వాళ్లంతా కోర్టుకెళ్లారుట. అప్పుడు.. ఆ జోలికెళ్లకుండా అలా మధ్యలోనే వదిలేశారు కూడా. మన రాముడెక్కడో దూరంగా గుట్ట మీదుంటే, గుట్టతో సహా లేపేస్తార్ట. ఇదేం బావుంది?” అలివేలు మాటలకి తెల్ల బోయి చూశారందరూ. “ఈ పిల్లని రెచ్చగొట్టి మా మీదికి వదిలేస్తారా? దీన్నేం చెయ్యలేమనే కదా మీ ధీమా?” సర్పంచ్ మొగుడు రెచ్చి పోయాడు. “మేం ఒప్పుకోవండీ. రాములోరి సంగతీ, మా ఇళ్ల సంగతీ తేల్చండి ముందు. ఆర్నెల్లలో చిన్నో చితకో ఇళ్లు కట్టియ్యండి. అప్పుడు కాళీ చేత్తాం. అ ఇళ్లిచ్చి, మీరు ప్రామిస్ చేసినట్లు, కాంప్లెక్స్ లో షాపులు కూడా..” యువకులంతా లేచెళ్లి పోయారు. హేమ టీచర్ మాత్రం కూర్చుంది, అలివేలు చెయ్యి పట్టుకుని. లాల్చీల వాళ్లలోఇద్దరు యమ్మెల్యేలు. ఇద్దరు పార్టీ కార్యకర్తలు. ప్రభుత్వం తరఫున వచ్చామని చెప్తూ, ఆ ఊరిని ఖాళీ చేయించి, తమ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెంచుకోవాలని ఆశిస్తున్న వాళ్లు. సూటు వాలాలు, కాంట్రాక్టర్లు. ప్రభుత్వ సేకరణ అక్కడి వరకూ వచ్చిందో లేదో.. అనుమానమే. “ఏవంటారండీ హెచ్చెమ్ గారూ, టీచర్ గారూ, డాట్రుగారూ?” సర్పంచ్ కాని సర్పంచ్ అడిగాడు. “మేవనేదేవుంది? మాకేవన్నా పొలాలా మీకివ్వడానికి?” హెచ్చెమ్ అన్నాడు. “అంటే.. మీరు చెప్తే తొందరగా పనై పోతుంది గదాని..” అలివేలు హేమ చెవిలో ఏదో చెప్పింది. “ఈ గడుగ్గాయేదో అంటాంది?” విభూది లాల్చీ అడిగాడు. “గవర్న్ మెంటార్డర్ చూడ మంటోంది” హేమ చెప్పింది… ఆరునెలల తరువాత.. చిన్నవే ఐనా తీరుగా కట్టిన ఇళ్లు. అలివేలు పరికిణీ కుచ్చిళ్లు పైకి లేపి పట్టుకుని, వీధిలో ముగ్గులు చెరిగి పోకుండా నడుస్తూ ఇంటింటికీ వెళ్లి అందరినీ పలుకరిస్తోంది. “అందరం ఆంజనేయ స్వామికి ముడుపు కట్టాం కదా.. మరి మన జట్టుండడేంటీ..” గుట్టకవతలివైపు ఆవాసాలు ఇస్తేనే కదులుతామని పట్టుపట్టారు రామాపురం ప్రజలు. మట్టి ఆరడుగులు తీయించి మంచి మట్టి కూడా వేయించాలని, గుట్టమీద గుడి జోలికి కూడా వెళ్ల కూడదనీ.. వెళ్తే కోర్ట్ కెళ్తామనీ చెప్పారు యువకులందరూ కలిసి. వాళ్ల కోరికలన్నీ తీరుస్తే, రాబోయే లాభాల్లో.. ఒక పది శాతం మాత్రమే తగ్గుతుందని మేధావులు సర్ది చెప్పారు, అవతలి వారికి.. పైగా ఇప్పుడు మీడియా ప్రభావం చాలా ఎక్కువ.. ఎందుకొచ్చిన గొడవ, సర్దుకోమని సలహా ఇచ్చారు. బడా బాబులు దిగిరాక తప్పలేదు. ఇంతకీ ఆ గ్రామం, ప్రభుత్వం సేకరించే గ్రామాలలో లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాజకీయ నాయకులతో కలిసి.. హైవేకి దగ్గర్లో ఉందని, విమానాశ్రయానికి పావుగంట ప్రయాణం అనీ, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి.. మల్టిప్లెక్సులూ, గేటెడ్ కమ్యూనిటీలూ, సాఫ్ట్ వేర్ హబ్బులూ వగైరాలు కట్టేద్దామని.. అయిన కాడికి అక్కడి భూములు కొట్టేద్దామనీ ప్రణాలిక వేశారు. పొలాలు పోయినా ఏదో పని చేసుకు బతకచ్చు కానీ, ఉండడానికిల్లు లేకపోతే.. చెట్టుకింద ఉండ లేరు కదా! అలివేలు రాములోరి ఇల్లు గురించి లేవనెత్తిన సందేహం, ఊరందరికీ ఉపకారం చేసింది. “అలివేలూ! ఒకసారి కమ్యూనిటీ హాల్ కి రమ్మన్నారు, మహిళా మండలి వాళ్లు.” పక్కింటి రాము సైకిలు మీదొచ్చి చెప్పి తుర్రుమన్నాడు. పదంగల్లో చేరుకుందక్కడికి. కాలనీ కట్టేప్పుడే, వంద మంది పట్టే కమ్యూనిటీ హాల్ కూడా కట్టించేట్లు చెయ్య మన్నారు సర్పంచ్ ని గ్రామ యువత. “ఇదే నండీ.. మా రాములోరి ప్రతినిధి. ఈవిడ గారి మూలానే మాకీ కాలనీ వచ్చింది.” హాల్లో ఉన్న కొత్తవాళ్లకి అలివేలుని పరిచయం చేశారు, హేమ టీచర్. అలివేలు అందరికీ నమస్కారం పెట్టి, ఎవరన్నట్లు చూసింది టీచర్ గారికేసి. “ఎయిర్ పోర్ట్ కి అటేపుండే ఊరి వాళ్లు. వాళ్ల ఊరి మీద కూడా కన్నేశార్ట. మందగ్గరికి సలహా కొచ్చారు.” హేమ టీచర్ చెప్తుంటే, చిరునవ్వు నవ్వింది అలివేలు, సిగ్గు పడుతూ.                                   -మంథా భానుమతి.

డిసెంబరు పూలు (ఉగాది కథల పోటీలో కన్సలేషన్ బహుమతి పొందిన కథ)

డిసెంబరు పూలు (ఉగాది కథల పోటీలో కన్సలేషన్ బహుమతి పొందిన కథ)     సూర్యకిరణాల్లో వెచ్చదనం తగ్గిపోసాగింది... గాలిలో చిరుచలీ మొదలైంది. సాయంత్రం అయిదు గంటలు అవుతూ ఉండగానే పడమటి కొండల వైపు ప్రయాణం మొదలుపెట్టాడు ప్రభాకరుడు. రైల్లో హైదరాబాదు వెళుతున్నాను. రిజర్వేషన్ సెకండ్ క్లాస్ కే దొరికింది... నేను ఉద్యోగ రీత్యా భువనేశ్వర్ లో, మా వారు ఒక్కరూ హైదరాబాదులో... అబ్బాయి ఉద్యోగం చేస్తూ బెంగుళూరులో... సాయంత్రపు చలికి చిరుగుబులు మొదలైంది గుండెల్లో... అప్రయత్నంగానే ఆ గగుర్పాటులో ఒకప్పుడు  నరసాపురంలోని  మా అద్దింట్లో  పూచిన డిసెంబరు పూలు కనుల ముందు మెదిలాయి. “అమ్మా, ఆకలే... ఇంకా ఎంత సేపూ?” అమ్మని చుట్టుకుని, ఆమె చీర  కుచ్చిళ్ళలో తల దాచుకున్నాడు ఎనిమిదేళ్ళ తమ్ముడు రాజు. “నాన్నగారు వెళ్ళారు కదా, భోజనం తెచ్చేస్తారులే... ఇంకాసేపేరా...” ఊరడించింది అమ్మ వాడిని. ఆ పెద్ద పెంకుటింటిలో వరసగా నాలుగు వాటాలు. పెద్ద పెద్ద కామన్ వరండాలు... మొదటి రెండు వాటాలు ఇంటివారివే. మా వాటా పక్కన చిన్న వాటా మరొకటి ఉంది. ప్రస్తుతం ఖాళీగానే ఉందది. మా వాటా అంటే కేవలం రెండు గదులే. ఒక పెద్ద గది... అదే రీడింగ్ రూమ్, అదే బెడ్ రూమ్ కూడా... దాన్ని ఆనుకొని అడ్డంగా పొడవాటి వంట గది. అందులోనే ఓ ప్రక్కన పూజ, స్టోర్ రూమ్, మరోకప్రక్కన అలికిన మట్టిపొయ్యి. మా వాటా అంతా ఇంగ్లీష్ ‘టీ’ అక్షరంలా ఉంటుంది అన్నమాట! కాకినాడ నుంచి నాన్నకి ట్రాన్స్ఫర్ అయి నిన్న ఉదయం పాసింజరు రైలు ఎక్కి ఈరోజు ఉదయానికి ఈ ఊరు చేరాము.  “ఏమ్మా, మీ సామాను ఎప్పుడు వస్తుందీ?” కళ్ళు చికిలిస్తూ అడిగింది ఇల్లుగల మామ్మగారు. అసలే ఆవిడవి  చాలా చిన్న కళ్ళు... చికిలిస్తే కళ్ళు మూసిందో, తెరిచిందో కూడా తెలీకుండా చింతాకుల్లా కనబడుతున్నాయి. “యస్సారెమ్టీ లారీకి వేసారండి... రేపటికొస్తుంది...” వినయంగా చెప్పింది అమ్మ. ఈలోగా నాన్న రావటంతో అందరం లోపలికి వెళ్ళిపోయాము. ఉడికీ ఉడకని అన్నం, వేగీ వేగని కూర, కాగీ కాగని సాంబారు... విస్తరాకుల్లో ఆ హోటల్ అన్నం తినాలంటేనే వెగటుగా తోచింది. “నాన్నా దోసకాయ ముక్క తొక్కతో సహా వేసేసారు... ఏం బాలే...” ముఖం చిట్లించా విసుగ్గా. “చూసావా మరి? అమ్మ కూరలకి ఇక పేర్లు పెట్టకుండా, పేచీలు పెట్టకుండా తినాలి ఏం?” అనునయంగా అన్నారు నాన్న. తమ్ముడు మాత్రం అన్నం తినేసి నిద్రపోయాడు. నాలో పెద్ద సందేహం... అమ్మ దగ్గరికి వెళ్ళి చెవిలో ఊదాను...  “తమ్ముడు ఆకలికి అంతలా ఏడిస్తే ఆ మామ్మగారు వాడికైనా కాస్త అన్నం పెట్టి ఉండొచ్చు కదే?” “నాన్నకి ఇష్టం ఉండదని నేను అడగలేదు... మనం అడగలేదని ఆవిడ పెట్టలేదు... అన్నం పెడతామని అంటే మనం ఏమన్నా  అనుకుంటామేమో అని అనుకుని ఉంటారు...” అని చెప్పింది... కానీ నాకంతగా అర్థం కాలేదు... ఆ విశాలమైన ప్రాంగణంలో మాకు ఆడుకోడానికి బోలెడంత స్థలం దొరికింది. బయట ఏడు పెంకులాటలూ, ఇంట్లో వరండా మీద చింత పిక్కలూ, అష్టా చెమ్మాలూ, కేరం బోర్డూ ... ముందస్తుగా ‘ఆట అయ్యాక, అన్నీ సర్దేస్తాను’ అని చెప్పి నన్ను ఆటకు పిలిచేవాడు తమ్ముడు... ఆట అయిపోగానే ఎక్కడివి అక్కడ వదిలేసి పరుగు తీసే వాడు. వాడిని తిట్టుకుంటూ, విసుక్కుంటూ అన్నీ డబ్బాలకు ఎత్తుకునే దాన్ని. వేసవి కాలం నా పరీక్షాఫలితాలు వచ్చేవరకూ హాయిగా గడిచిపోయింది. టెన్త్ క్లాసు రిజల్ట్స్ వచ్చేసాయి. సెకండ్ క్లాసు వచ్చింది నాకు. ఇంటర్ లో సైన్సు గ్రూప్ లో చేరాలని అనుకున్నాను. కానీ సీయీసీ లో చేర్చారు. బీకాం చదివితే త్వరగా ఉద్యోగాలు వస్తాయని... నాన్న మాట కాదనేది లేదుగా... అందుకే టైపింగ్ క్లాసు లోనూ జాయిన్ అయ్యాను.  ఏదీ మొదట ఉత్సాహంగా ఉండదు. టైపింగ్ క్లాసూ అంతే... ఏ యస్ డీ యఫ్ ఎక్సర్సైజులు చేస్తూ ఉంటే, అన్ని వరసలూ పూర్తి చేసేసి ఎప్పుడు వాక్యాలు టైప్ చేసేస్తానా అని అనిపించేది... కృషితో నాస్తి దుర్భిక్షం... త్వరలోనే ఆరోజూ వచ్చేసింది... మూడు నెలలు తిరిగేసరికి అలవోకగా ఇంగ్లీష్ పేరాలు టైప్ చేయటం వచ్చేసింది.  మొట్టమొదటి రోజున కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ క్లాస్ లో వందమంది మగ పిల్లల మధ్య ఓ పది మంది అమ్మాయిలం... బిక్కు బిక్కు మంటూ కూర్చున్నాము. చాలా మంది టెన్త్ ఈ ఊరిలో చదివిన వాళ్ళే కాబట్టి ఒకరితో ఒకరికి పరిచయాలు ఉన్నాయి... సిలబస్సూ, కొనుక్కోవలసిన పుస్తకాల లిస్టులతో మొదటి రోజు గడిచింది. ఆరోజే ‘లిడియా’ అనే అమ్మాయి నాకు పరిచయం అయింది. తను మా ఇంటివారికి మనవరాలి వరస అని తరువాత తెలిసింది. తోవ లోనే వాళ్ళిల్లు కావటం తో... ఇద్దరం కలిసి కాలేజీకి రావచ్చు, అని అనుకున్నాం ఇద్దరం...  మర్నాడు క్లాసులో ఇంకో అమ్మాయి పరిచయం అయింది. నవ్వితే సొట్ట పడే బుగ్గలు, ఉంగరాల జుట్టూ... మిగిలిన క్లాస్ మేట్స్ అందరికీ తెలుసు అనుకుంటా... ‘కృష్ణమణి’ మా ఎకనామిక్స్ హెడ్ గారి అమ్మాయి అట... కొత్తవారితో అంతగా కలవలేను నేను... అలాంటిది అతి త్వరగా ఆమె నాకు దగ్గరయింది... నాలో దాగి ఉన్న బెరుకునూ, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నూ పోగొట్టింది తనే... వర్షాకాలం గడచిపోయి హేమంతం మొదలైంది. చదువుతో, టైపింగ్ క్లాసులతో సమయం గడచిపోయేది. ఈ లోగా ఓ సారి ఇంటివారికి కోడలు వరసయ్యే రాజేశ్వరి గారు మా ఇంటికి వచ్చి, నాకు పూలు మాల కట్టటం ఎలాగో నేర్పారు. మొదట్లో సరిగ్గా వచ్చేది కాదు... కనకాంబరాల గొంతులు తెగిపోయేవి. దారం ఎలా పట్టుకోవాలో, పూలు అటూ ఇటూ చేసి ఆ దారం మీద ఎలా అమర్చుకోవాలో, దారాన్ని ఆ పూల చుట్టూ ఎలా మెలిక తిప్పి, వేళ్ళతో ఎలా  ముడి వేయాలో చాలా చక్కగా, ఓపికగా నేర్పించారు... అలా మాల కట్టటం నేర్చుకున్నాను. ప్రతీరోజూ సాయంత్రం కాలేజీ వదిలాక టైపింగ్ క్లాసుకు వెళ్లి, అదయ్యాక, లిడియా ఇంటివరకూ వచ్చి, అక్కడినుంచి దగ్గరి దారిలో ఇంటికి వచ్చేదాన్ని. ఇంటికి రాగానే కాళ్ళూ చేతులూ కడిగేసుకుని, అన్నం వేడిగా తినేసి, తమ్ముడిని చదివించి, నేను కాసేపు చదివేసుకుని, గోదావరి గట్టునున్న కొండాలమ్మ గుడిలోంచి వినిపించే పాటలు వింటూ నిద్రలోకి జారుకునేదాన్ని. ఒక్కో సారి శారదా టాకీస్ నుంచి రెండో ఆటకి ముందు వేసే పాటలూ వినిపించేవి - ‘నమో వేంకటేశా...’ ‘ఏడూ కొండల సామీ...’ అంటూ ఘంటసాల వారి మధురమైన గాత్రంతో... నవంబర్ గడిచి, డిసెంబర్  వచ్చింది... ఇంటి వారి పెరట్లోకి ఏదో పని మీద వెళితే అక్కడ పొదలు పొదలుగా ఉన్న మొక్కల నిండా అరవిచ్చిన మొగ్గలు... గులాబీ రంగులో... ఎంత బాగున్నాయో... “మామ్మ గారూ, ఇవేం పూలు?” అని అడిగితే చెప్పారు... “డిసెంబర్ పూలమ్మా... ఎప్పుడూ చూడలేదా?” స్కూల్లో ఉండగా ఎవరో అమ్మాయిలు  పెట్టుకుంటే చూసానేమో కానీ ఇంత విపులంగా, వివరంగా చూడలేదు మరి... తెల్లవారేసరికి, గులాబీ రంగు నక్షత్రాల్లా ఎంతో అందంగా డిసెంబరాలు! ఓహ్... ఆకు పచ్చని వనానికి అద్దిన గులాబీ రంగు! వారి అనుమతితో పూలు కోసుకుని, మొట్టమొదటి సారిగా స్వంతంగా డిసెంబర్ పూల మాల కట్టాను... మొత్తం పూలకి మూరెడు పూలు అయ్యాయి... నా లావుపాటి రెండు జడలలో కుడివైపు జడకి అమ్మ పిన్నుతో పెట్టింది... ఆ గులాబీ రంగు పూవులకి మాచ్ అయ్యే లంగా, ఓణీ జాగ్రత్తగా వెదికి వేసుకుని కాలేజీకి వెళ్ళిపోయాను... మా క్లాసులోని అమ్మాయిలంతా డిసెంబర్ పూల అందానికి పడిపోయారు... అందరి నోటా ఒకటే మాట... ‘అబ్బా, ఎంత బాగున్నాయో, ఎంత బాగున్నాయో...’  ‘అవునా, ఇవి మా ఇల్లుగల మామ్మగారి దొడ్లోవి... నేనే మాల కట్టాను తెలుసా?’ కించిత్ గర్వంగా చెప్పాను. “మా అమ్మమ్మగారి ఊర్లో కూడా ఉన్నాయి కానీ ఈ రంగువి కావు... తెల్లవీ, వయొలెట్ వీ...” వేణి చెప్పింది అపురూపంగా గులాబీ రంగు డిసెంబర్ పూవుల్ని తాకి మరీ చూస్తూ...     అప్పటినుంచీ ప్రతీరోజూ ఆ మొక్కలకి నీళ్ళు పోసే దాన్ని.  డిసెంబర్ నెలా, జనవరి, ఫిబ్రవరి నెలలూ ఉదయం లేవగానే వాళ్ళ పెరటి తోట మీద దాడి చేసి, పూలు కోసి, దండలు కట్టి నా జళ్ళో పెట్టుకోవడమే  కాకుండా నా ఫ్రెండ్స్ అందరి జడలకీ పంచేదాన్ని... డిసెంబర్ పూల పుణ్యమా అని నాకు మాలకట్టటం అద్భుతంగా వచ్చేసింది... “అక్కా, డిసెంబర్ పూలు తగ్గిపోయాయి...” దిగులుగా చెప్పింది ఆరేళ్ళ చిన్నారి, ఇంటివారి మనవరాలు, నా పూలదండల భాగస్తురాలూ...  చిన్నారి అమ్మా,  నాన్నగారు ఢిల్లీ లో ఉద్యోగం చేస్తున్నారు... ఈ మధ్యనే పాపను ఇక్కడికి తెచ్చుకున్నారు మామ్మగారు వాళ్ళు. “అవునురా... ఫిబ్రవరి అయిపోవచ్చింది కదా మరి?  శీతాకాలం అయిపోయి ఇక వేసవి కాలం వచ్చేస్తుంది... పెద్ద పరీక్షలు అవగానే మీకు సెలవులు ఇచ్చేస్తారు కూడానూ...” ఆ పాప తెచ్చిన గుప్పెడు పూవులనూ దారంతో మాలకడుతూ చెప్పాను...  “అంటే, మళ్ళీ డిసెంబర్ పూలు ఎప్పుడొస్తాయి?”  “మళ్ళీ డిసెంబర్ లోనే... ఈలోగా వేసవిలో మల్లెపూలు, వర్షాకాలంలో చామంతి పూలూ వస్తాయి కదా?” “ఉహు, ఇవే బాగుంటాయి నాకు... మంచి రంగులో అందంగా ఉంటాయి... కదక్కా?” “అవును...” వెంటనే ఒప్పేసుకున్నాను, కట్టిన బుజ్జి దండను ఆ బుజ్జిదాని బుల్లి జడలో అలంకరిస్తూ... “కేరం బోర్డు ఆడుకుందాం అక్కా, కాలేజీ నుంచి తొందరగా వచ్చేయ్...” చెప్పాడు తమ్ముడు... “అలాగే, ఆటయ్యాక అన్నీ నువ్వు సర్దితేనే...” షరతు పెట్టి స్నానానికి వెళ్ళిపోయాను... ఇంకో నాలుగు హేమంత శిశిరాలు శరవేగంతో గడిచిపోయాయి... నేను గ్రాడ్యుయేషన్  రెండో సంవత్సరంలోకి వచ్చేసాను... చదువుకుంటూనే వైజాగ్ లో ఉద్యోగం చేస్తున్న అక్క ప్రోత్సాహంతో, పోటీ పరీక్షలకి తయారవుతూ, కొన్ని వ్రాసాను...  తమ్ముడు ఎనిమిదో తరగతికీ, చిన్నారి ఆరో తరగతికీ వచ్చారు. ఈ నాలుగు శీతాకాలాలూ డిసెంబర్ పూల వసంతాలు మా ముగ్గురినీ ఎంతో ఆనందపరిచాయి... పూల మాలల పంపకం వలన కాలేజీలో నా స్నేహితురాళ్ళతో అనుబంధం కూడా ఎక్కువ అయింది... ఉన్నట్టుండి, జనవరి నెలలో నాకు విశాఖపట్నం నుంచి ఒక బీమా కార్యాలయంలో టైపిస్టు ఉద్యోగానికి ఇంటర్వ్యూ కాల్ లెటర్ వచ్చింది... నా టైపింగ్ స్పీడు, ఆక్యురసీ వాళ్లకి బాగా నచ్చేసి, అప్పాయింట్మెంట్ ఆర్డర్ చేతిలో పెట్టేసారు... నా ఉద్వేగానికి అంతు లేదు...  చదువు పూర్తికాక ముందే సంపాదనాపరురాలిని అవుతున్నాను... గాలిలో తేలిపోతున్న భావన కలిగింది... ఎంతో సంతోషంగా ఇంటికి తిరిగి వస్తే, అదే రోజు నాన్నగారికి గుంటూరుకు  బదిలీ అయిన ఆర్డర్ వచ్చింది. అయితే సెలవులకి ఈ ఇంటికి వచ్చి మళ్ళీ ఆనందించే అవకాశం ఇక లేదన్న మాట... నా స్నేహితులందరినీ... లిడియా, కృష్ణవేణి, శ్యామల, మణీ అబ్బా, అందరూ ఎంత దగ్గరైపోయారో... అందరినీ వదిలి వెళ్ళాల్సిందే... ఈ ఆవరణలోని కొబ్బరి చెట్లూ, తాటి చెట్లూ, గిలకబావీ, మామ్మగారు ఎండబెట్టే కొబ్బరి ముక్కల కమ్మని రుచీ, ఆవిడ చేసి పెట్టే తాటి రొట్టీ, మా వంటగదిని ఆనుకుని ఉన్న సీతాఫలం చెట్టుకు కాచిన తియ్యని పళ్ళూ, తాతగారు మట్టికుండలో వేసి తంపటి పెట్టే తేగల రుచీ, కొద్దిగా మొలక వచ్చిన తాటి టెంకలని కత్తితో పగలగొట్టి తినే కమ్మని బుర్రగుంజూ – వీటన్నిటికీ దూరం కావలసిందేనన్న మాట... ఇంకా మామ్మగారి పాటలూ, తాతగారి కబుర్లూ, చిన్నారి కబుర్లూ... అన్నిటినీ మిస్సవాల్సిందే... మనసుకు చాలా వెలితిగా అనిపించింది... అయ్యో... అసలైనవీ, అపురూపమైనవీ... నా డిసెంబర్ పూలు... బాధతో నా కళ్ళలోకి నీళ్ళు వచ్చాయి...     నన్ను విశాఖపట్నంలో హాస్టల్లో చేర్చటానికి నిర్ణయం జరిగింది... అక్కయ్య ఊరిలోనే ఉంటుంది కాబట్టి భయం లేదు. నాన్నగారు నన్ను జాయిన్ చేయటానికి నాతో బయలుదేరారు... ఆ పైవారం ఆయన మా ఫ్యామిలీ ని గుంటూరు షిఫ్ట్ చేసేస్తానని చెప్పారు...బయలుదేరే ముందు చిన్నారి నన్ను గట్టిగా పట్టుకుని, నా పొట్టలో తలదాచుకుంది. దాని కళ్ళలో బాధ... “అక్కా, నువ్వు వెళ్ళిపోతే డిసెంబర్ పూలు ఎవరు మాల కడతారు?” అంది దీనంగా...  “నీకు నేర్పించాను కదరా... నువ్వే కడతావు... నేను క్రిస్మస్ కి వస్తానుగా, అప్పుడు నువ్వు నాకు మాలకట్టి ఇద్దువు గాని...” ఊరడించాను... “నాకు నీ అంత బాగా రాదుగా? మధ్యలో చాలా పూలు తెగిపోతాయి... దారం ఉండిపోతుంది మధ్యలో... మరి నాకు పాటలు ఎవరు నేర్పిస్తారు? ఎక్కాలు ఎవరు అప్పజెప్పించుకుంటారు? కథలు ఎవరు చెబుతారు? నువ్వు లేకపోతే నాకు తోచదు అక్కా...”  నా కన్నీటి తడి దాని మెత్తని బుగ్గలకు అంటుకుంటుంటే, వాటిని గాఢంగా ముద్దు పెట్టుకున్నాను. తమ్ముడి నుదుట ముద్దు పెట్టుకుని, అమ్మకి, తాతగారికి, మామ్మగారికి పాదాలంటి నమస్కరించి నాన్నగారితో బయలుదేరాను... గేటు దాటే ముందు ఒక్కసారి వెనక్కి తిరిగి తనివితీరా మా ఇంటినీ, ఆ ప్రాంగణాన్నీ చూసుకున్నాను... ఆ తరువాత అవి  సరిగ్గా కనిపించలేదు... కారణం - మా  రిక్షా ఆ ఆవరణ దాటటంతో పాటుగా కనులు మసకబారటం కూడా... “మీకు నైట్ మీల్స్ కావాలా మేడమ్?” పాంట్రీ కార్ వెండార్ మాటలకి ఆలోచనల్లోంచి ఈ లోకంలోకి వచ్చాను.  “వద్దు...” చెప్పి ఎదురుగా చూసాను. కన్నార్పకుండా నా వైపే చూస్తున్న ఒకావిడ “మీరు... వినయ గారే కదా...” అని అడిగింది ఆత్రంగా. “అవును... మీరు...” ఆశ్చర్యంగా ఆమెను పరికించి చూసిన నేను ఆమెను గుర్తుపట్టి, “చిన్నారీ, నువ్వేనా?” అన్నాను ఆరాటంగా... “అవును అక్కా... ఎలా ఉన్నారు,ఎక్కడ ఉన్నారు?” ప్రశ్నల వర్షం కురిపించింది. ఆమె ముఖంలో దాచినా దాగని ఆనందం... నా పక్కకి వచ్చి కూర్చుంది చిన్నారి. ఆమెకి నా వివరాలు అన్నీ చెప్పాను... కానీ, నా మనసులో ఎంతో వేదనగా ఉంది తనని చూస్తూ ఉంటే... కళ్ళలోకి గోదారి పొంగుకు వస్తోంది...  “ఇప్పటివరకూ మన చిన్నతనాన్ని, నిన్నూ తలచుకుంటున్నాను... అదేమిటో, చిత్రంగా వెంటనే నువ్వు కలిసావు... చిన్నారీ, ఏమైందిరా? ఏమిటిది?” తలమీద కప్పుకున్న ముసుగులోంచి కనిపిస్తున్న ఆ ముఖాన్ని చూస్తూ  అడగలేక అడిగాను. ఒక చెంప అంతా కాలిపోయి ఉంది... కుడివైపు జుట్టు కూడా లేదు కొంతమేర...  “చిన్నపుడు  డిసెంబర్ పూలు మాల కడుతూ వాటి గురించి నువ్వు ‘శిశిరంలో వసంతం’ అనే దానివి గుర్తుందా అక్కా? ఇది ‘వసంతంలో శిశిరం...’ కాకపోతే శాశ్వత శిశిరం...” ఆమె గొంతు దుఃఖంతో వణికింది.  “ఒక శాడిస్ట్ భర్త రూపంలో నన్ను కాటేసాడు... నా ఆస్తిపాస్తులూ, కట్న కానుకలూ కాజేసి, ఆపైన నన్ను వదిలించుకోవటానికి నా మీద మచ్చ వేసి, యాసిడ్ పోసాడు... దానికి తగిన శిక్ష కూడా అనుభవిస్తున్నాడనుకో, కటకటాల వెనుక...” “ప్చ్... చిన్నారీ...” ఆమెను దగ్గరగా లాక్కుని గుండెల్లో పొదువుకున్నాను. ప్రస్తుతం ఆమె సీలేరు దగ్గర ట్రైబల్ ఏరియాలో టీచర్ గా చేస్తోంది... పిల్లలు లేరు... తాతగారూ, మామ్మ గారూ కాలం చేసారట. చిన్నారి అమ్మా, నాన్నా తన దగ్గరే ఉన్నారట... తన జీవితాన్ని గిరిజన బాలబాలికల అభివృద్ధి, మానసిక వికాసాల కోసమే  వినియోగించాలని నిర్ణయించుకున్నట్టు చెప్పింది చిన్నారి. “చిన్నారీ, అప్పుడు మనింట్లో డిసెంబర్ పూల తరువాత నేనైతే ఎప్పుడూ ఆ రంగు డిసెంబర్ పూలు చూడలేదు... కానీ చిరుచలి మొదలైన వెంటనే ఆ గులాబీ రంగు పువ్వులూ, నువ్వూ నా మనసులో మెదులుతారు ఇప్పటికీ... ఆ రంగు బుగ్గలతోనే ఉండే మా చిన్నారి కళ్ళలో నిండిపోతుంది నాకు...” ఆర్ద్రంగా చెప్పాను. “అవునక్కా, నేనైతే  ప్రతీ ఏటా చూస్తూనే ఉన్నాను ఆ పూలు... వాటికి పరిమళం లేదని అంటారు కానీ, వాటి నిండా నీ జ్ఞాపకాల పరిమళమే వినయక్కా...” ప్రేమగా చెప్పింది చిన్నారి. “చిన్నారీ, ఇక మనం ఎప్పటికీ కలిసే ఉండాలి... విడిపోవద్దు...” ఆమె చెంపలు తడుముతూ, ఉద్వేగంగా చెప్పాను, కాస్మెటిక్ సర్జన్ గా ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకుంటున్న నా కొడుకు మనసులో మెదులుతూ ఉండగా...   -నండూరి సుందరీ నాగమణి  

త్వరపడి (ఉగాది కథల పోటీలో కన్సలేషన్ బహుమతి పొందిన కథ)

త్వరపడి (ఉగాది కథల పోటీలో కన్సలేషన్ బహుమతి పొందిన కథ)   "మమ్మీ సెకండ్ షో  సినిమాకి వెళతున్నాను " అంటూ క్రిందికి వచ్చింది రజిత. "ఇప్పుడా ?  అదీ నువ్వొక్కదానివే వెళతావా ? వద్దులేమ్మా " అంది లక్ష్మి . 'ఒక్కదాన్నే అయితే ఏమైంది మమ్మీ! నాకిప్పుడు సినిమా చూడాలనిపిస్తుంది వెళతానంతే  ! " పంతంగా అంది  . " ఇప్పుడు వద్దని చెపుతున్నాను కదా !" అంతే పంతంతో కార్ కీస్ తీసుకుని చేతిలో బిగించి పట్టుకుంది . "మీ ఆవిడ పేరుకి డాక్టరే కానీ అన్నీ పాతకాలం అమ్మమ్మ భయాలు. ఒక్కదాన్నే సెకండ్  షో కి వెళ్ళకూడదా ! డాడీ? "  అన్న ప్రశ్న నాకు "వెళ్ళకూడదు, నువ్వు ఆడపిల్లవని మర్చిపోతున్నావ్! "  హెచ్చరిస్తూన్నట్లు చెప్పింది లక్ష్మి "తరతరాలగా స్త్రీలు మగ్గిపోయింది యాతనలు పడింది అణగద్రొక్కబడింది చాల్లేదా ?  ఇప్పుడిప్పుడే కదా !  మగవాళ్ళతో సమానంగా చదువులు చదువుతుంది,  ఉద్యోగాలు చేస్తున్నది . అమ్మాయిలని కూడా వాళ్ళ లాగానే  ఎంజాయ్ చేయనివ్వండి మమ్మీ ! ఇలా ప్రతిదానికి ఆంక్షలు పెడితే ఎలా ? " విసుక్కుంది రజిత.  "చిన్ని నిక్కర్ వేసుకుని పైన స్లీవ్ లెస్ టీ షర్ట్ వేసుకుని తిరుగుతుంటే, మగవాళ్ళ చూపులు తాకుతుంటే గర్వంగా ఎంజాయ్ చేసే  ఇప్పటి తరం మీది.   ఒంటి నిండా కిలోల కొద్దీ బట్టలు చుట్టుకుని కూడా మగవాడి చూపులు శరీరమంతా గుచ్చుకుంటుంటే ఇబ్బందిగా, అవమానంగా భావించిన మా తరానికి ఖచ్చితంగా తేడా ఉంది . ఆలోచనల్లో వచ్చినంత మార్పు మన జీవనవిధానంలో రాలేదు.  అమ్మాయిల ఆలోచనా విధానం  మారినంత వేగవంతంగా అబ్బాయిల ఆలోచనల్లో మార్పు రాలేదు.  సమానత్వం సాధించామని  కొన్ని సందర్భాలలో మాత్రమే అనుకోవడానికి బావుంటుంది.జాగ్రత్తగా ఉండాలమ్మా !" "నాకసలు బుద్ధి  లేదమ్మా! నీ పర్మిషన్ అడగడం, నువ్వు కాదనడం ఎప్పుడూ ఉండేవే ! నీ హితబోధ వినే ఓపిక నాకిప్పుడు లేదు" అనుకుంటూ గదిలోకి  వెళ్ళి పెద్ద శబ్దంతో  తలుపులు మూసుకుంది. నా భార్య హితబోధ నా కూతురి చెవి ఎక్కదు.  ఎక్కనీయకుండా ...  ఎక్కువ సౌండ్ పెట్టి "ముసుగు వేయొద్దు మనసు పైన, వలలు వేయొద్దు వయసు పైన" పాటని  కక్ష కట్టి కావాలని పెద్ద సౌండ్ తో మాకు వినిపిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంది . "లక్ష్మీ !ఎన్నిసార్లు చెపుతావ్? పిల్లలకి  విసుగు వచ్చేదాకా చెపితే వాళ్ళింకా మొండివాళ్ళగా తయారవుతారు వదిలేయకూడదు" అన్నాను. "మీకు హాస్పిటల్, సర్జరీ లు తప్ప ఇంకేమి తెలియదు . ఒకసారి మా గైనిక్ విభాగం వైపుకి వచ్చి చూడండి  . రోజూ అబార్షన్ కోసం ఇద్దరు ముగ్గురు అమ్మాయిలైనా వస్తారు . ప్రక్కన భర్తనే వాడు ఉండడు. పోనీ  తల్లి కూడా ఉండదు .. ఏ ఫ్రెండో ఉంటారు . ఇవాళొక  అమ్మాయి వచ్చింది నాలుగు నెలలు దాటాయి కూడా .  అబార్షన్ రిస్క్ అవుతుంది అన్నా వినదు . నేను  అబార్షన్ చేయడం కుదరదని గట్టిగా చెప్పేసాను. వాళ్ళు వెళుతూ  వెళుతూ నన్ను శత్రువుని చూసినట్టు చూసి వెళ్ళారు. "వయాగ్రా దొరికినంత ఈజీగా అబార్షన్ చేయించుకోవడం కుదరదు.అంటే విన్నావా ? థ్రిల్లింగ్ గా ఉంది అంటూ ట్రై చేసావ్ ! ఇప్పుడు ఏడువ్ ... అని  ఆ ఫ్రెండ్ తిడుతూ తీసుకు వెళుతుంది "   ఇప్పటి పిల్లలకి సంప్రదాయం చట్టుబండలు ఏమీ లేవు . నాకు చాదస్తమని అనుకున్నా పర్వాలేదు మన అమ్మాయిని కూడా అలాంటి పరిస్థితుల్లో చూడాల్సి వస్తుందేమోనని భయంగా ఉందండి " అన్న లక్ష్మి మాటలని  "నువ్వు ఎక్కువాలోచిస్తున్నావ్ " అంటూ కొట్టి పడేసాను. మూడు రోజుల పాటు జరిగే మెడికల్ కాన్ఫరెన్స్ కి విశాఖపట్నం వచ్చాను. ఉదయం నుండి సాయంత్రం వరకు రెండు సెషన్స్ లోనూ  కాన్ఫరెన్స్లో పాల్గొని సాయంత్రానికి బీచ్ కి చేరుకోవడం,  మిత్రులతో సందడి చేయడం ఉల్లాసంగా ఉంది. ముఖ్యంగా అరవింద్ తో .  కాకినాడ రంగరాయలో చదువుకునేటప్పుడు  నాకతను జూనియర్.   ఇప్పుడు  హైదరాబాద్లో సొంత హాస్పిటలు నడుపుతున్నాడు. ఆ రెండు రోజుల నుండి భీమ్లీ బీచ్ వెంట, రామకృష్ణ బీచ్ దగ్గర అమ్మాయిలని అబ్బాయిలని చూస్తుంటే మతి పోతుంది. ఎక్కడ చూసినా జంటలు జంటలు. ఏకాంతాన్ని వెతుక్కుంటూ,  దూరంగా వెళుతూ ప్రమాదాల అంచున పయనిస్తున్నారనిపించింది . "ఇప్పుడున్న అమ్మాయిల స్పీడ్ చూస్తుంటే  అబ్బాయిలకేమీ తీసిపోనట్లుగానే ఉన్నారు." అన్నాను  అరవింద్ తో .  "ప్రపంచదేశాలన్నింటి నుండి టెక్నాలజీ ని దిగుమతి చేసుకున్నట్లే వారి సంస్కృతిని సంప్రదాయాలని ఆహార విహారాలని దిగుమతి చేసుకుంటున్నాం. కొన్ని మాత్రమే కావాలి,  కొన్నింటిలో మనం మనలాగే ఉండాలని కోరుకోవడం కూడా స్వార్ధమే అవుతుంది." అన్నాడతను. "మంచికి చెడుకి ఉన్న వ్యత్యాసాన్ని పిల్లలు గుర్తించగల్గేలా చేయడంలో మనం విఫలమవుతున్నాం.  వాళ్ళతో గడిపే సమయం చాలా తక్కువ, వాళ్ళకి లభించే స్వేచ్చ ఎక్కువ. పల్లె పట్టణం  అనే తేడానే లేదు ప్రతి ఒక్కరి జీవితం దృశ్య మాధ్యమం చుట్టూనే తిరుగుతుంది.టీవి అయితేనేమిటి ఇంటర్ నెట్ అయితే ఏమిటీ అన్నట్టుగా ఉంది.  మా రజితని   చూస్తేనూ భయంగా ఉంటుంది. నా మిసెస్ లక్ష్మి కూడా చాలా ఆవేదనగా ఉందీ విషయంలో అన్నాన్నేను.   " మన ఫెయిల్యూర్స్ ఏమిటో మనకి తెలుసు, అయినా పిల్లల ముందు ఒప్పుకోము. పిల్లల్లో మొరాలిటీ తగ్గిపోతుంది ఎదుటివారిని మోసం చేయడం తాము మోసగింపబడటాన్ని తేలికగా తీసుకుంటున్నారు. తల్లిదండ్రులని మోసం చేయడమే కాదు తమని తాము మోసం చేసుకుంటున్నారు". బాధగా చెప్పాడు అరవింద్. నేను మౌనంగా తలూపాను. నా కొడుకు కూడా అంతే ! మేము చెప్పే ఏ మాటని లక్ష్య పెట్టడు. బిట్స్ లో చదువుతున్నాడు . మీకు కావాల్సిన రిజల్ట్స్ మీకిస్తున్నాంగా, మా ప్రతి విషయంలో జోక్యం చేసుకోకండి అంటాడు. ఫ్రెండ్స్,పార్టీలు అన్నీ మామూలే ! అరవింద్ బాధగా చెప్పాడు. ఎదురుగా అనేకమంది యువతని జంటలు జంటలుగా చూస్తూ  వాళ్ళ చేష్టలని గమనిస్తూ ఉంటే  మా పిల్లలు కూడా ఇలాగేనేమోనన్న ఆలోచనల మధ్య   సముద్ర తీరంలో సాయంసమయాల్లో ఉండే సుందర దృశ్యాలని ఆస్వాదించలేకపోయాం.   ట్రైన్  అందుకోవాల్సిన  సమయం దగ్గర పడుతుంది.   ఆరోజు రాత్రికి అక్కడే ఉండి మర్నాడు ఉదయమే ప్లైట్ కి వెళతానన్న అరవింద్  ఎక్కువసేపు నీతో గడిపినట్లు ఉంటుందని అతను కూడా  ట్రైన్ లో వస్తానని నాతో పాటు  బయలుదేరాడు. విజయవాడలో  ట్రైన్  మారొచ్చు , వచ్చేసేయి అన్నాను సంతోషంగా. హోటల్ రూమ్  ఖాళీ చేసేసి  విశాఖపట్నం - చెన్నైసూపర్ ఫాస్ట్  ఎక్స్ ప్రెస్ ఎక్కేసాము.నాకు రిజర్వేషన్ ఉంది.   సోమవారమవడం మూలంగా ఎక్కువ రద్దీ లేకపోవడం మూలంగానేమో అరవింద్ కి కూడా తేలికగానే బెర్త్  దొరికింది. ట్రైన్ బయలుదేరుటకు సిద్దంగా ఉంది ఎనౌన్స్మెంట్ వినబడుతూ ఉండగా ఒకమ్మాయి వచ్చి ఎదురు సీట్ లో కూర్చుంది. తనకన్నా పెద్దగా ఉన్నతను వచ్చి బెర్త్ చెక్ చేసి లగేజ్ సర్దుతూ ... ఎదురుగా కూర్చున్న నన్ను పలకరించి  మీరెక్కడి వరకండీ ? అని అడిగాడు. నెల్లూరు  వరకు  అని చెప్పాను . ఓహ్ .మీరు  కూడా నెల్లూరేనా!  తను నా సిస్టర్ అండీ ! ఒంటరిగా వెళుతుంది కదా ! అందులోనూ రాత్రి ప్రయాణం. పెద్దవారు మీరున్నారు తోడుగా ఉంటారు, ఇక భయమేమీ లేదు అంటూ భరోసా ఇచ్చుకుంటూ ట్రైన్  దిగేసి కదిలే వరకూ  చెల్లెలికి   జాగ్రత్తలు  చెపుతూనే ఉన్నాడు.   ట్రైన్ ప్లాట్ఫామ్ ని వదిలేశాక    " అన్నయ్యండీ ! ఉన్నంత సేపు నస పెట్టి  చంపేస్తాడు . ఇంత పెద్ద ట్రైన్ లో  నేను ఒక్కదానినంటూ భయం కల్గిస్తాడు"  అంటూ విసుక్కుంది.  నాకు నవ్వు వచ్చింది. అరవింద్ నేను మాటల్లో పడ్డాం. కాసేపటి తర్వాత  దువ్వాడ స్టేషన్ లో ఆగినప్పుడు ఆ పిల్ల ప్రక్కన మరొక అబ్బాయి వచ్చి కూర్చున్నాడు. "ఎలాగైతేనేం రిజర్వేషన్ సంపాదిన్చావ్. ఎక్కడ మిస్ అవుతావో అనుకున్నాను." అంటూ  ప్రక్కకి జరిగి  అతనికి చోటిచ్చింది .. క్షణాల్లో అతని కుడి చేతిలో ఆమె ఎడమచేయి కలసి మాట్లాడుకున్నాయి . తర్వాత భుజాలపై చేతులేసుకున్నారు కొద్దిసేపటికి  ఆ చేతులు నడుమును చుట్టేసుకున్నాయి.చిన్నగా దగ్గి మా  ఉనికి తెలియజేయజేసాను.  వాళ్ళిద్దరూ దూరంగా జరిగారు . అరవింద్ కూడా ఆ అమ్మాయిని గమనిస్తూనే ఉన్నాడు. ఎక్కడో ఈ పిల్లని చూసినట్టు ఉంది. గుర్తుకురావడం లేదు అన్నాడు. అనకాపల్లిలో ఒక స్త్రీ ఎక్కింది ఆమె వయసు అరవైకి పైనే ఉంది. ఇంట్లో అసలు రెస్ట్  లేదండీ. మీకు అభ్యంతరం లేకపోతే నేను కాసేపు  పడుకుంటాను అంగీకారం కోసం ఎదురుచూస్తూ నిలబడింది. ఏ సి ఫస్ట్ క్లాస్ నాలుగు బెర్త్ ల కాబిన్ వచ్చింది. కేటాయించిన ప్రకారం కాకుండా   మేమిద్దరం పై బెర్త్  ల పైకి  చేరుకొని విశ్రమించాం. పనిగట్టుకుని చూడాలని కాకపోయినా అప్పుడప్పుడూ నెల్లూరమ్మాయిపై నా దృష్టి పడుతూనే ఉంది. క్రింద బెర్త్ లో పడుకున్నావిడ కాసేపటిలోనే వారిని బాగా గమనించింది .  ఈ కాలం పిల్లలకి హద్దు అదుపు లేదు. ఆడపిల్లలు చదువుకుని వృద్దిలోకి వస్తారు కదా అని చదువులకి పంపిస్తుంటే వీళ్ళు వేసే వెధవ వేషాలు ఇవీ ! ఇలాంటి పిల్లలు నాకుంటే పీక పిసికి చంపెసేద్దునూ .. అసహ్యంగా పైకి అనేసింది. "ఇదిగో అమ్మాయ్.. ఈ కాబిన్ లో నలుగురికే కదా ప్రవేశం. అతనెందుకు ఇందులో ఉన్నాడు  అతన్ని పంపించేయి. అని గట్టిగా కోప్పడింది. ఆ పిల్లతో  నేను చెప్పలేని విషయాన్ని ఆమె అవలీలగా చెప్పేసింది. వాళ్ళిద్దరూ లేచి ఎంట్రన్స్ వైపు  వెళ్ళారు. "అమ్మాయిలున్నారు చూడండి,కన్న వాళ్ళని ఇట్టే మోసం చేసేస్తారు. స్వేచ్చనిచ్చి కాలేజీలకి పంపిస్తే  బాయ్ ఫ్రెండ్ ని వెంటేసుకుని షికార్లు కొట్టడం చూడలేక చస్తున్నాం. వీళ్ళకి నైతిక విలువలేవీలేవు. డ్రెస్ మార్చినట్టు బాయ్ ఫ్రెండ్ ని మార్చేస్తున్నారు. చెడిపోవడానికి మగవాళ్ళతో పోటీ పడుతున్నారు.  ముల్లెళ్ళి  అరటాకుపై పడ్డా అరటాకు వచ్చి ముల్లుపైబడ్డా అరటాకుకే నష్టమని తెలిసినా వెరుపనేది లేదు. మద్రాస్లో కూడా ఇంతే ! తల్లిదండ్రులు మా పిల్లలు బాగా చదువుకుంటున్నారని డబ్బులు పంపించేస్తారు.  తీరా చూస్తే వీళ్ళ బాగోతలివి"నిర్మొహమాటంగా మాట్లాడేస్తుందామె. "సమాజపరంగా వచ్చే అనర్ధాలు కొన్నైతే వీళ్ళు కోరి కొని తెచ్చుకుంటున్నవి మరి కొన్ని.  అమ్మాయిల ఆలోచనలు స్వేచ్చా పిపాస  ఈ సూపర్ ఫాస్ట్ ట్రైన్ వెళ్ళినంత స్పీడ్ గా ఉన్నాయి. సమాజం ప్యాసింజర్ ట్రైన్ నడచినట్టు నత్తనడక నడుస్తుంది. రెండిటికి పొంతన కుదరడం లేదండి " అన్నాను నేను. "నేనేమీ స్త్రీ అభివృద్ధి నిరోధకురాలినికాదండీ ! పాస్ట్ పాసింజర్ లా వెళ్ళాలనుకుంటున్న దానిని.  ఈ సమానత్వాలు చదువులు, ఉద్యోగాలు ఎన్ని చెప్పినా ఆడపిల్లలు అరటాకు లాంటి వారేనండీ ! వారి  జీవితం అందులో వడ్డించిన షడ్రశోపేత భోజనం కావాలి. కానీ వీళ్ళు కుక్కలు చింపిన విస్తరిలా చేసేసుకుంటున్నారు.  మన చుట్టుప్రక్కల జరుగుతున్నవి గమనిస్తుంటే బాధగా ఉంటుందండి. ఊరుకోలేక కలగజేసుకుని చెపుతూనే ఉంటాను.  మా పిల్లలైతే నీతో మాకు సమస్యలొస్తున్నాయ్  అని  నన్నుతమతో  బయటకి తీసుకెళ్లడం మానేశారు. మనకెందుకవన్నీ ? సమాజం ఏమైపోయినా మనం పట్టించుకోకూడదు. కలుగజేసుకుని సుద్దులు చెప్పకూడదు, అవన్నీ వాళ్లకి నచ్చవ్ అని నా నోరు కట్టేస్తుంటారు".  బాధపడుతూ చెప్పింది ఆమె. అరవింద్ వైపు చూసాను  నిద్రలోకి జారుకున్నాడో ఇవన్నీ చూడకూదదనుకుని నిద్ర నటిస్తున్నాడో అర్ధం కాలేదు. రాజమండ్రి దాటింది, ఆ అమ్మాయి  బెర్త్ ఖాళీగానే ఉంది.  ట్రైన్ లో  కాంతి తగ్గుతూ ఉంది. అందరూ నిద్రలోకి జారుకుంటున్నారు.   నేను టాయ్లెట్ వైపు వెళ్ళాల్సి వచ్చింది.  అటువైపు వెళ్ళబోయి అక్కడ కనబడే దృశ్యాన్ని జీర్ణించుకోలేకపోయాను.   బహిరంగంగా చేయకూడనివి రహస్యంగా కూడా చేయకూడదన్నట్టు కంకణం కట్టుకున్నట్టున్నారు ఏకాంతంలో జరగాల్సిన వాటిని నిస్సిగ్గుగా ఎంజాయ్ చేస్తున్న వాళ్ళిద్దరిని చూస్తుంటే  భయమేసింది.  చటుక్కున వెనక్కి తిరిగి బెర్త్ మీదకి చేరుకున్నాను. నా భార్య లక్ష్మి అనే మాటలు, క్రింద బెర్త్ లో నిద్రపోతున్న పెద్దావిడ అన్నమాటల్లో నిజం లేకపోలేదన్నది తెలుస్తూనే ఉంది. చదువులు ఉన్నత ఉద్యోగాలున్న యువతకన్నా సంస్కారం, నైతిక విలువలున్న యువత కావాలి. తెర  మీద చూసిన దృశ్యాల కన్నా వాస్తవ ప్రపంచంలో కనబడుతున్న దృశ్యాలే కలవరపెడుతున్నాయి. పార్క్, బీచ్, దియేటర్, బస్, ట్రైన్, ఆఖరికి గుడి ... అన్నిచోట్లా స్వేచ్చగా విహరిస్తున్నయువతే ! ఈ తప్పు ఎవరిది ? సినిమాల దా? పోర్న్ సైట్ లదా? సెల్ ఫోన్ వచ్చాక పల్లెటూర్లలో పిల్లలు కూడా ప్రేమ ఊబిలో చిక్కుకుని మోసపోయే తీరుని చూస్తూనే ఉన్నాం.   చిన్న చిన్న పట్టణాలలో పెరిగిన పిల్లలే ఇలా ఉంటే  ఇక మహానగరాలలో పుట్టి పెరిగిన వారు ఎలా ఉంటారో! రజిత కూడా ఇలాగే అడ్వాన్స్ అవుతుందేమో ! ఊహకే  భయమేస్తుంది. విజయవాడలో అరవింద్ దిగినప్పుడు నేను ట్రైన్ దిగి అతనికి వీడ్కోలు చెప్పి టీ  త్రాగుతూ నిలబడ్డాను. నెల్లూరమ్మాయి తన బాయ్  ఫ్రెండ్ తో  ప్లాట్ఫామ్ పై  చక్కర్లు కొడుతూ కనిపించింది.అయిష్టంగా ముఖం తిప్పేసుకున్నాను .  ట్రైన్ ఎక్కేసి అలారం నాలుగున్నరకి సెట్ చేసి పడుకున్నాను. అలారం మ్రోతకి  మెలుకువ వచ్చింది. కాసేపు కళ్ళు మూసుకునే ఉన్నాను . రాత్రి జరిగిన విషయాలు కళ్ళ ముందు మెదిలాయి. చటుక్కున కళ్ళు తెరిసి చూసాను. ఆ పిల్ల ఒక్కటే కూర్చుని ఉంది. బాయ్ ఫ్రెండ్ ఒంగోల్ లో దిగిపోయి ఉంటాడేమో!   రైలు  పెన్నా బ్రిడ్జ్ మీదుగా వెళుతున్న శబ్దం.   ఆలస్యమేమి లేకుండానే సమయానికే స్టేషన్ ని చేరుకుంది. లగేజ్ తీసుకుని క్రిందికి దిగాను .  ఆ అమ్మాయి నా కన్నా ముందే రైలు  దిగి ముందుకు నడుస్తుంది . "అమ్మా ..సరితా ఇదిగో ఇక్కడ  అంటూ నా వయసున్నతను ఆ అమ్మాయి  వెనుక నుండి పిలుస్తూ దగ్గరకి చేరుకున్నాడు. ఆ అమ్మాయి  డాడీ ... అంటూ తండ్రిని హగ్ చేసుకుని .. ఐ మిస్ యూ అలాట్ డాడీ .. ఐ లవ్ యూ అంటూ గారాలు పోతుంది. నేను ఆశ్చర్యపోయాను. ఎంత నటిస్తుందీ అమ్మాయి . ఆ అమ్మాయి అంతకు ముందు ఎలా ప్రవర్తించిందో ఆ తండ్రి తెలియదు . ఒకవేళ నాబోటి వాడు చెప్పినా ఆ తండ్రి నమ్మడు కాక నమ్మడు అలా నంగనాచిలా ప్రవర్తిస్తూ  ఉందామ్మాయి.  నా టికెట్ చెకింగ్ అయింది. ఆ అమ్మాయి టికెట్ చెకింగ్ లేట్ అయింది.  నేను ఆ తండ్రి  వంక చూస్తున్నాను. ఎక్కడో చూసినట్టు ఉంది . ఆగి గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. తండ్రి కూతురు నన్ను దాటుకుని ముందుకు వెళుతూ అతను నన్ను చూసి దగ్గరకి వచ్చి " నువ్వు మాధవ్ వి కదూ ! నన్ను గుర్తు పట్టలేదా ? ఈశ్వర్ ని "  అంటూ వచ్చి   సంతోషంగా నా చేయి పట్టుకున్నాడు .   "గుర్తుంది.  ఎంత మారిపోయావ్ ఈశ్వర్,  నిన్నసలు పోల్చుకోలేకపోయాను, ఇక్కడే ఉంటున్నావా ?"  అడిగాను .  'అవును, ఏవేవో  బిజినెస్ లు చేస్తూ అక్కడా ఇక్కడా తిరిగి మళ్ళీ ఇక్కడికే వచ్చిపడ్డాను . ఇదిగో నా కూతురు  సరిత . నాలా చదువులో మొద్దు కాదు. బిట్స్ లో  చదువుతుంది. ప్రాక్టీస్ స్కూలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఇచ్చారు  పూర్తీ చేసుకుని తిరిగి వస్తుంది. "  పరిచయం చేస్తున్నతని కళ్ళల్లో గర్వం తొణికిసలాడింది . తల ఊపి  ఊరుకున్నాను. "ఎక్కడ ఉంటున్నారు .. హాస్పిటల్ ఎక్కడ ? అడిగాడు ఈశ్వర్ . విజిటింగ్ కార్డ్ తీసి ఇచ్చాను .  ఆ అమ్మాయికి తండ్రితో నేను మాట్లాడటం అస్సలు ఇష్టం లేదని తెలుస్తూనే ఉంది . ట్రైన్ లో నేను చూసిందల్లా తండ్రికి చెపుతాననే భయం కావచ్చు.  అక్కడి నుండి ఎంత తొందరగా బయటపడదామా అని చూస్తుంది .  నేను బయటకి వచ్చి కార్ కోసం ఎదురుచూస్తున్నా ! "ఇప్పుడు నువ్వు మాట్లాడినాయన నీ ఫ్రెండా నాన్నా"  అడుగుతుంది. "అవునమ్మా .. తిరుపతిలో పదేళ్ళపాటు కలసి చదువుకున్నాం." "అవునా ! కల్చర్లెస్ బ్రూట్ . ట్రైన్ లో ఎంత మిస్ బిహేవ్ చేసాడో, ఆ అంకుల్స్ ని అస్సలు నమ్మకూడదు. ఆడపిల్లలు ఒంటరిగా కనబడితే చాలు "  ఇంకా ఏవేవో చెపుతుంది . వింటున్న నేను మ్రాన్పడిపోయాను. ఆటో ఎక్కుతూ  ఈశ్వర్ అసహ్యంగా నా వైపు చూసిన చూపు జీవితంలో మర్చిపోలేను.  నేను మాట్లాడాలనుకున్నా అతని ఫోన్ నంబర్ తీసుకోలేదు. ఆ పిల్ల నాపై వేసిన అంత పెద్ద అపవాదుని పోగొట్టుకోవడం ఎలా ! అవమానంగా ఫీల్ అయ్యాను. ఆ మధ్యాహ్నమే అరవింద్ కి కాల్ చేసి ఆ పిల్ల అలా అందని చెప్పాను. గట్టిగా నవ్వేసాడు .  "ఆ పిల్లని ఎక్కడ చూసానోనన్నది గుర్తొచ్చింది. నా కొడుకుతో పాటు పిక్స్ లో చూసాను. వాడి క్లాస్మేట్ అనుకుంటాను అని చెప్పాడు."  ఖాళీ దొరికినప్పుడల్లా ఈశ్వర్ గురించి వాకబు చేస్తూనే ఉన్నాను. ఫోన్ నంబర్ దొరికినా మాట్లాడాలని ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఈ విషయాన్ని నా భార్య లక్ష్మితో చెప్పాలనుకుని పెదాలపై వచ్చిన మాటని నొక్కేసాను.   "రోజూ నేను చెపుతున్న విషయాలు అవేగా ! మీరసలు వినిపించుకోరు ఇప్పుడర్ధమైందా? " అని క్లాస్ తీసుకోవడంతో పాటు ఆడపిల్ల తల్లిగా మరింత భయపడుతుందని మనసులోనే దాచుకున్నాను.  ఓ నెలరోజుల తర్వాత  ఈశ్వర్ నుండి ఫోన్. నాకతనితో మాట్లాడటం ఇబ్బందిగానే తోచింది.  డా॥ అరవింద్ అనే ఆయన నాకు ఫోన్ చేసి ఆ రోజు ట్రైన్ లో మా అమ్మాయితో  కలసి ప్రయాణించినప్పుడు మీరిద్దరూ  ఎలాంటి మిస్ బిహేవ్ చేయలేదని చెప్పాడు.  నా కూతురెందుకు  అలా చెప్పిందా అని ఆలోచించాను. నిశితంగాకూడా గమనిస్తున్నా !  ఎవరెవరితోనో  ఫోన్ లో మార్చి మార్చి మాట్లాడుతూ ఉంటుంది. నా దగ్గర నటిస్తుందని అర్ధమయింది.  నా కూతురు మాటలు నమ్మి నిన్ను తప్పుగా అనుకున్నాను, నన్ను క్షమించాలి "అన్నాడు.   అరవింద్ ఈశ్వర్ నంబర్ ఎలా సేకరించాడో? తన కొడుకు సూర్య  హెల్ప్ తీసుకుని  ట్రై చేసి ఉంటాడని అనిపించింది. మొత్తానికి నన్ను రక్షించాడు. లేకపోతే ఈశ్వర్ దృష్టిలో నేనెంత  చెడ్డవాడిగా మిగిలిపోయే వాడినో కదా!  అనుకున్నాను. మరి కొన్నాళ్ళ తర్వాత  ఈశ్వర్  స్వయంగా కలవడానికి వచ్చాడు. ఆతను చాలా దిగులుగా కనిపించాడు.   ఎందుకలా ఉన్నావ్ ? ఏమైనా సమస్యలా అడిగాను . "అన్నింటి కన్నా పెద్ద సమస్య పిల్లలే ! నా కూతురు నా దగ్గర ప్రేమ కురిపిస్తూ గారాం  పోతుంటే ఇంకా చిన్న పిల్లే అనుకున్నాను. అడిగినవన్నీ కొనిస్తూ  నా స్తోమతకి మించి  ఖర్చు చేసైనా ఏమీ తక్కువకాకుండా చూస్తున్నాను. అబ్బాయి కన్నా అమ్మాయే ముఖ్యమనుకున్నట్టు పెంచుకుంటూవచ్చాను.తను  ఇంత స్వేచ్చగా విహరిస్తుందని, తల్లిదండ్రులని కూడా మోసం చేస్తుందని అనుకోలేదు.  ఇన్నాళ్ళు తను క్లోజ్ గా  తిరిగినతనని పెళ్ళి చేసుకోనంటుందని ఈ ఫోటోలు బయటపెడతానని బెదిరిస్తూ  ఎవరో అబ్బాయి నాకు కొరియర్లో ఈ ఫోటోలు పంపాడు.  అవి తీసుకుని  కాలేజ్ కి వెళ్ళి నా కూతురికి చూపించాను. ఏమిటమ్మా  ఇవి అని అడిగితే  "ఆడమగ కలసి చదువుకుంటున్నాం. జస్ట్ ఫ్రెండ్లీగా ఉన్నంత మాత్రానే పెళ్లి చేసుకుంటానని అతననుకుంటే  తప్పు   నాదెలా అవుతుందని నాన్నా  అంటుంది ?  అంత  క్లోజ్ గా అతుక్కుని ఫోటోలు  దిగడాన్ని   ఫ్రెండ్షిప్  అంటారా?  తల్లీ అని అడిగాను. "కోడ్ ఆఫ్ కండక్ట్" పెడుతున్నారా ? అంది. అంటే ఏమిటో  నాకేమీ అర్ధం కావడంలేదు. నువ్వేదైనా సలహా చెపుతావని వచ్చాను  అంటూ నా చేతిలో ఒక కవర్ పెట్టాడు. నాక్కూడా ఏం మాట్లాడాలో  తోచలేదు "కోడ్ ఆఫ్ కండక్ట్ " అన్నమాట గురించి   ఆలోచిస్తూనే కవర్  ఓపెన్ చేసాను. ఈశ్వర్ కూతురు ఒక అబ్బాయితో చాలా క్లోజ్ గా ఉన్న చిత్రాలు. ఆ చిత్రాలలో ఉన్న అబ్బాయి ఆ రోజు ట్రైన్ లో కలిసి ప్రయాణం చేసిన అబ్బాయి ఒకటి కూడా కాదు.  అదేంటి ? ఈ అబ్బాయి వేరే అబ్బాయా ? అని అనబోయి క్షణాల్లో తమాయించుకున్నాను.   మీరు ట్రైన్ లో చూసిన అబ్బాయి ఈ అబ్బాయే  కదూ  ? అడిగాడు. కాదని అంటే   గుండె పట్టుకుని  నా  కళ్ళ ముందే కుప్ప కూలి పోయేటట్టున్నాడనుకుని  అవునని  తలూపాను. ఆ రాత్రంతా ..ట్రైన్ లో మాతో పాటు ప్రయాణం చేసిన పెద్దామె మాటలు గుర్తుకొస్తూనే ఉన్నాయి. అతి కొద్దీ మంది  అమ్మాయిలు అతి స్వేచ్ఛతో ప్రవర్తించడం వల్ల  పద్దతిగా ఉండే మిగతా అమ్మాయిలకి కూడా ఇబ్బంది వస్తుంది. అందరూ ఆడపిల్లలు అలాగే ఉంటున్నారని జమ కట్టే వాళ్ళు ఉన్నారు. ఎవరు త్వరపడి ఎవరు పొరబడి జీవితాలని నాశనం చేసుకుంటున్నారో తెలుసుకోవడం కూడా కష్టంగానే ఉంది. ప్రతి తల్లిదండ్రులు పిల్లలని అనుమానంగా చూడాల్సొచ్చిన రోజులివి. ప్రశాంతంగా నిద్రపోలేని రోజులివి . కొద్దీ నెలల తర్వాత  అర్ధరాత్రి సమయంలో ఆత్మహత్యా ప్రయత్నం చేసి సృహలేని స్థితిలో ఉన్న కూతురిని చేతుల్లో వేసుకుని నా హాస్పిటల్ కి వచ్చారు ఈశ్వర్ అతని భార్య. సేవ్ చేసిన తర్వాత  ఈశ్వర్ భార్యకి ఇంకో విషయాన్ని చెప్పే బాధ్యతని  నా భార్య లక్ష్మీ పై ఉంచాను. ఆమె అభావంగా నావైపు చూసింది.   -వనజ తాతినేని

అతను (ఉగాది కథల పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ)

అతను      మొన్న ఏప్రిల్ లో డిగ్రీ అయిపోయింది. నా వయసు ఇప్పుడు పందొమ్మిది సంవత్సరాలు,దసరా వస్తే ఇరవై పడతాయి. నాకు ఇంకా చదువుకోవాలని ఉంది. అమ్మకు కూడా చదివించాలని ఉంది. ఇరుగు పొరుగు వాళ్ళు మాత్రం లక్ష్మీ మంచి సంబంధం వస్తే పెళ్ళి చేసేయ్,బాధ్యత తీరుతుందని అమ్మతో అంటున్నారు. అదిగో సరిగ్గా ఆ సమయంలోనే బాబాయి ఒక సంబంధం తెచ్చాడు. పిన్ని కూడా మంచి వాడని చెప్పింది. ఈ రోజు కాలేజీ గ్రౌండ్స్‌లో అన్నయ్య సైకిల్ తీసుకుని చాలా సేపు తొక్కాను. సైకిల్ స్టాండ్ వేసి చక్కగా ఎగురుకుంటూ ఇంట్లోకి వచ్చాను. ఎవరో కొత్త వ్యక్తి కుర్చీలో కూర్చుని ఉన్నాడు. హా ఎవరో kkg అమ్మకొసమో,అన్నకోసమో పని మీద వచ్చాడు అనుకుని,అతని ముందే అమ్మను గట్టిగా పిల్చుకుంటూ వంటగది గుండా ఇంటి వెనకాలకు వెళ్ళాను. ఆశ్చర్యం వేసింది,అక్కడ,అన్నా,వదిన, అమ్మమ్మ అందరూ ఉన్నారు. అమ్మ ఎప్పటి నుంచి సిద్ధంగా పట్టుకుని ఉందో పట్టులంగా,ఓణి,తువ్వాలు నా చేతికిచ్చి నవ్వుతూ స్నానం చేసి రమ్మంది. బుద్ధిగా చేసి రాగానే వదిన తల దువ్వి రెండు జడలు వేసింది. అమ్మమ్మ పూలు పెట్టి అలంకరించింది. ఏంటిదమ్మా?అంటే ఎవరూ ఏం చెప్పలేదు. కొద్ది సేపటి తరువాత నీకు పెళ్ళి చూపులు అన్నారు,గంభీరంగా. నేను ఏదో అనబోతే చెప్పినట్లు విను అని అన్న అన్నాడు. వదినతో బాటు నన్ను తీసుకెళ్ళి అతని ముందర క్రింద చాపలో కూర్చోబెట్టారు. "అతను"అన్నాడు,కుర్చీలో కూర్చొమ్మని. హమ్మయ్య,సైకిల్ తొక్కి తొక్కి కాళ్ళు నొప్పెడుతున్నాయి అని మనసులో అనుకుంటూ చటుక్కున కుర్చీలో కూర్చున్నాను. అమ్మ ఒక్క చూపు చూసింది,తీక్షణంగా నన్ను. నేను మనసులోనే నవ్వుకున్నాను I am the boss రుద్రమదేవి. kkg మొదలు పెట్టాడు మీ పేరు రవళి కదా అన్నాడు. "తొక్కేం కాదు"అనుకోలేదు మనసులో,ఎందుకంటే ఆ పదం ఇరవై ఏండ్ల క్రితం వాడుకలేదు మరి. ఏదో ఒకటి అనుకోవాలి కదా? నేననుకున్నాను మనసులో," ఈ రుద్రమదేవిని రవళి అంటావ్ బే." కాదండీ, రుద్రమదేవి అన్నాను మెల్లగా. నా మాటలు నాకే వింతగా తోచాయి. అంత లోస్వరంతో,నేనింతవరకు మాట్లాడలేదు ఎవరితో మరి. లెక్చరర్ ముందు విద్యార్థిలా బుద్ధిగా సర్దుకుని కూర్చున్నాను. అతను అన్నాడు నా పేరు వెంకటేశ్వర్లు. నేను బి.ఎ.చదివాను. మీరేం చదివారు అన్నాడు? మనసులో చిన్న చూపు వీడు ఆర్ట్స్ వాడు. నేను అతిశయంతో చెప్పాను, బి.యస్సి అని. ఇంకా చదువుతారా అన్నాడు. చెంగున లేడి పిల్లలా లేచి, నా పుస్తకాల కోసం ప్రత్యేకంగా ఉన్న అర నుండి సర్టిఫికేట్లు తీసి నేను స్కూలు ఫస్ట్,కాలేజి ఫస్ట్ అని ఆగకుండా చెబుతున్నాను. అతను పెళ్ళి చూపుల కోసం వచ్చాడన్న సంగతి నేను మరచిపోయి చాలా సేపయింది. నేను పుస్తకాలు తీస్తుంటే అతను నా ప్రక్కన నిల్చున్నాడు. అతను అన్నాడు మెల్లగా,మీరు నాకు నచ్చారు.నన్ను పెళ్ళి చేసుకోవడం ఇష్టమేనా అని? మా అమ్మను అడిగి చెబుతాను అన్నాను కొద్దిగా బుంగమూతి పెట్టి. అతను,మీ అమ్మ సరే అంది అన్నాడు. మా ఫ్రెండ్స్ ను అడిగి చెబుతానన్నాను. అతను ఒకరకపు వెటకార స్వరంతో"ఫ్రెండ్స్ ను అడిగి చెబుతావా అన్నాడు". హా అవును అన్నాను. నా నుండి భయం సిగ్గు పరారయ్యాయి. నాకు పుట్టుకతోనే ఎదుటి వారి కళ్ళలోకి చూస్తూ మాట్లాడటం అలవాటు,అయినా నేను లీడర్ని,రుద్రమను. అతన్ని కళ్ళతోనే స్కాన్ చేశాను. ఎత్తు 5'11", రంగు...చామన ఛాయ, శరీరం బాగానే ఉంది. తలకట్టు నిండుగా చక్కగా ఉంది. ముక్కు చక్కగా ఉంది. చిన్న,సన్న,పెదవులు. కళ్ళున్నాయి చూశారూ, అవి కమలాలు,శక్తివంతమైన కందర్పుని కళ్ళు. నేను ఆ క్షణం పాటు, కళ్ళలోకి,కళ్ళు పెట్టి చూసే లక్షణం కోల్పోయాను. కానీ నా మనస్సులోకి సర్రున చదువు గుర్తుకు వచ్చింది. ముభావంగా మారిపోయాను. అతను వెళ్ళపోయాడు. రౌండ్ టేబుల్ సమావేశం మొదలైంది. ఎవరికి తోచిన విధంగా వారు,పెళ్ళి,చెయ్యాలి,వద్దు అంటున్నారు. అబ్బాయి బాగున్నాడు,పైగా ప్రభుత్వ ఉద్యోగి మెజారిటీ అభిప్రాయం. నేను ఆ రోజు పడుకుని అన్నం ఎలా తినాలి అని,విష్ణుమూర్తి లా ఫోజు పెట్టి మా అన్న,చిన్నమ్మ పిల్లలకు నేర్పిస్తున్నాను,కంచం ముందర పెట్టుకుని. అతను వచ్చాడు. వీడు మళ్ళీ వచ్చాడ్రా దేవుడా అనుకుని దిగ్గున లేచి నిలబడ్డాను. అమ్మ అబ్బాయికి మంచినీళ్ళు ఇవ్వంది. తెచ్చిచ్చాను,వీడి కళ్ళ వైపు చూడొద్దురా బాబూ అనుకున్నాను. చిన్నగా నవ్వాడు. చూసి తలతిప్పుకున్నాను మెల్లగా. పెళ్ళంటే అర్థం తెలియదు నాకు అప్పటికి. అమ్మ,అన్న చెప్పినట్లు వినడం,కాలేజికి పోయి చదువుకోవడం. కావలసినవన్నీ అమ్మా,అన్నలు ఇచ్చేవారు. సంతోషం తప్ప,ఇంకేమీ తెలియని జీవితం. నిజం చెప్పాలంటే నాకు అప్పటికి ఆడ,మగ ఆకర్షణ,సిగ్గు,బిడయం ఇవేవీ తెలియవు. మా కాలేజీలో అమ్మాయిలతో ఎలామాట్లాడేదాన్నో,అబ్బాయిలతోనూ అలాగే మాట్లాడేదాన్ని. మా క్లాసు వాళ్ళతో పోలిస్తే రెండేళ్ళు చిన్నదాన్ని. అమీబాకి సార్లతో పాఠాలు చెప్పించుకోవడం,ఫస్ట్ రావడం తప్పితే దానికి ప్రేమ తెలియదురా అనే వాళ్ళు మగ పోరగాళ్ళు. పైగా నాగలక్ష్మిని,శ్రీలతను,ఇంకా ఇతర అమ్మాయిలను పిలవవా రుద్రమ అనేవాళ్ళు. దామోదర్ గాడు,భూమి పుట్టినప్పుడు పుట్టిండు. మా బాబాయి క్లాస్మేట్,ఫెయిల్ అవుతూ,అవుతూ నా క్లాస్ మేట్ అయిండు గాడిద. నన్ను ఎన్నిసార్లు కొట్టాడో తలమీద బుచ్చిపాప అంటూ. అదిగో అలాంటి దాన్ని నాకు వీడిని అదే పెళ్ళి చూపుల కమలేక్షణుడిని చూస్తే ఏదో వీడు నా దగ్గరివాడు అనిపించింది. నెల తిరిగే సరికల్లా పెళ్ళయింది. అతనికి ఏదో ట్రైనింగట,పెళ్ళైన రెండో రోజే వెళ్ళపోయాడు. మా అమ్మ,వాళ్ళమ్మ,మా వదిన,వాళ్ళక్క మమ్మల్ని చూసి ముసిముసిగా నవ్వుకున్నారు. అతను టాటా చెబుతూ ఎంతో బాధగా వెళుతున్నాడు.మళ్ళీ,మళ్ళీ వెనక్కి వచ్చి నా చేయి పట్టుకుని నొక్కుతూ వెళ్ళొస్తా అంటూ వెళుతున్నాడు. మా అమ్మ ఆర్డర్ అతను నన్ను పట్టుకుంటే ఏమన వద్దని,ఏం చేయాలి దేవుడా. నా మనసులో నొక్కిన కాడికి సాలు గానీ వెళ్ళరా బాబు,జీటీవీలో మై డార్లింగ్ అన్న షారుఖ్ ఖాన్ పాటలు చూడాలని తొందర. అతను అలా వెళ్ళాడో లేదో నేను ""జాదూ తేరీ నజర్ ఖుష్బూ తేరా బదన్ ""అని పాడుతూ లోపలికి వస్తుంటే మా అత్త అనే ఓ కొత్త వ్యక్తి నావైపు సీరియస్ గా చూసింది. వెంటనే మా అమ్మ నా తలపై మొట్టికాయ వేసింది.నాకర్థమైంది ఏదో తప్పు చేశానని. అత్త,ఆడపడచు ఉన్న రెండు రోజులు రుద్రమ మూగదైంది పాపం. ఏమే రుద్రమ మీ ఆయన ట్రైనింగుకు పోయిండట కదా అంటూ కిసుక్కుమనటం అలవాటైంది మా బజార్లో ఆడముఖాలకి. ఒకసారి పక్కింటి రమ పిన్నిఅలాగే అంటే అన్నాను.నిన్నే పిలుస్తుండు పోరాదు ట్రైనింగ్కు తోడుగా అన్నాను. చూశావా లక్ష్మక్కా నీ బిడ్డ ఎంత మాటందో అంటూ మూతి మూడు వంకర్లు తిప్పింది. మా అమ్మ తనతో చిన్న పిల్ల తెలియదులే చెల్లె అన్నది. నేను ఉక్రోశం ఆపుకోలేక ఎందుకమ్మా నన్ను ఇట్లా అంటుండ్రు అంటే? మధ్యలో మా వదిన కల్పించుకుని మా తమ్ముడొచ్చాక తెలుస్తుందిలే అంది కిసుక్కున నవ్వుతూ. వెధవ సంత అందరికీ పిచ్చెక్కింది అనుకున్నాను. ఈ రెన్నెళ్ళ కాలంలో నేను మూడు వ్యాసరచనపోటీళ్ళో బహుమతులు గెలిచాను. అతను ఉత్తరాలు వ్రాశాడు మాఇంటికి. నేను రోజూ గుర్తుకు వస్తున్నానట. అతను నేను కలిసి పెరిగినట్లు,కలిసి చదివినట్లు నేను గుర్తుకురావడమేంటి నాన్సెన్స్ ఓవర్ యాక్షన్ కాకపోతే, వాడికి నేనెందుకు రిప్లై వ్రాయాలంటూ ఉత్తరాలను టేబుల్ సొరుగులోకి వేశాను. రెన్నెళ్ళపోయింది అతను వేంకటేశ్వర్లు  ట్రైనింగ్ నుండి సరాసరి మా ఇంటికి వచ్చాడు కొంపలు మునిగిపోయినట్లు. ఆరోజు మాఅమ్మ అయ్యగారిని పిలిపించింది. అయ్యగారు ఈ రోజురాత్రి తొమ్మిది గంటలకు దివ్యమైన ముహూర్తం ఉంది అని అమ్మ ఇచ్చిన దక్షిణ తీసుకుని వెళ్ళొస్తానే రుద్రమా అంటూ బోసినోరుతో నవ్వుతూ వెళ్ళాడు. ఆ రోజు మా అత్తమ్మ,ఆడపడచు వచ్చారు మధ్యాహ్నానికి. అమ్మ,అత్తమ్మ,అందరూ కలిసి నన్ను వింతగా అలంకరించారు,నా పుస్తకాల గదినీ అలాగే అలంకరించారు. వెంకీ ముందేబోయి గదిలో తొంగున్నాడు. వాడు నా గదిలో,పైగా ఈ రుద్రమ మంచం మీద కూర్చున్నాడు పాత సినిమాల్లో చూశాను నాగేశ్వరరావు, రామారావు అలాగే కూర్చునే వారు. నేను వెళ్ళనంటుంటే బలవంతంగా లోపలికి పంపి తలుపేశారు. అమ్మ ఆర్డర్ ఆ వెంకీగాడి కాళ్ళకు దండం పెట్టమని. పెడ్తేపోలా పెళ్ళిలో అయ్యగారు ఎన్ని సార్లు మొక్కించాడనీ,వెంటనే వెంకీకి దండం పెట్టాను. అతను భుజాలు పట్టుకుని లేపి మంచం మీద కూర్చో పెట్టాడు. అతను నాకు ఫ్రెండైనాడు,భయం పోయింది కదా,అతనికి నాకు ఒకటవ తరగతి నుండి డిగ్రి వరకున్న అందరు స్నేహితుల గురించి చెప్పాను. చివరకు పక్కింటి శీనుగాని గురించి చెబుదామని...ని....దు...ర..లోకి జారి పోయాను. అతను నాకు మంచినీళ్ళు తాపించి పడుకోబెట్టాడు,తలపై చెయ్యేసి నిమురుతూ... నా కలలో నాన్నతో విహరిస్తున్నాను. తెల్లవారింది. అమ్మ,అత్తమ్మ,ఆడపడచు, వదిన అందరూ ఏమీ మారలేదు అంటూ గుసగుసలు పెట్టుకున్నారు. అత్తమ్మ పెద్ద గొంతుతో అరుస్తుంటే వెంకీ అబ్బ నీకెందుకమ్మా,నేను చూసుకుంటా కదా అంటున్నాడు. ఇంట్లోవాళ్ళంతా అసంతృప్తిగా ఉన్నారు,నేను,వెంకీతప్ప. ఈరోజు మా అత్తగారింటికి వెళ్ళి,అక్కడనుండి వెంకీ పనిచేసే ఊరికి వెళ్ళాలట. The great Rudrama అమ్మా,అన్నలను వదలి వెళ్ళడమా? కుదరదుగాక కుదరదు. నేను మొండికేశాను. వదిన అన్నది ప్రేమగా "నేను మా వాళ్ళను వదిలేసి రాలేదూ". అమ్మ బతిమిలాడింది,కేవలం మూడు రోజులే నాలుగవ రోజు సాయంత్రం ఇక్కడే ఉంటావు అంది. మా అత్తమ్మ మొదలుపెట్టింది రాగాలు ఆ సూర్యపేట పిల్లను చేసుకుంటే ఈ బతిమిలాడటాలు ఉండేవా అంటూ. అతను వాళ్ళమ్మతో"అమ్మా నువ్వు కాసేపు ఉంటావా""అన్నాడు విసుగ్గా. అన్నయ్య,అమ్మ చెరోపక్క ప్రేమగా చేతులుపట్టుకుని బస్సు ఎక్కించారు. అత్తమ్మ ఏమీ అనలేదు బాదానే చూసుకుంది. ఇంటిప్రక్కలవాళ్ళు వచ్చి సుజాత అదృష్టం బంగారు బొమ్మ కోడలిగా దొరికింది అని మాట్లాడి వెళ్ళారు. అత్తమ్మ మురిసిపోయింది. మొగుడిగారి గురించి చెప్పక్కరలేదు.మధ్యమధ్యలో నా దగ్గరకు వచ్చి ఏమైనా కావాలా అని అడిగిపోతున్నాడు. రాత్రయింది,నేను తెలివిగా అత్తమ్మ పక్కన పడుకున్నాను. నన్ను నిద్రపోయాక నడిపించుకు తీసుకువెళ్ళి ఆ గదిలో పడుకోబెట్టారు. నేను అలా నడిచేటప్పుడు కళ్ళు తెరవను ఎందుకంటే మళ్ళీ త్వరగా నిద్రపట్టదు. ఆ రాత్రీ ఎప్పటిలాగే నాకు స్వర్గంలా,తనకు నరకంలా గడచిపోయింది. వెంకీ పనిచేసే ఊరికి వెళ్ళేసరికి మధ్యాహ్నం ఒంటిగంటయింది. సినిమా టాకీస్  ప్రక్కనే ఉంది ఇల్లు. ఒక్కటే పెద్ద గది,మూడు గదులంత స్థలంలో ఉంది. డిప్యూటీ కలెక్టరు గారు ఆతిథ్యం ఇచ్చే గదట. సోఫాలు,కుర్చీలు,డైనింగ్ టేబుల్,రెండు సింగిల్ కాట్ మంచాలు బాగున్నాయి.  అన్నీ జిట్రేగు కర్రతో చేసినవి చాలా బాగున్నాయి. పరుపులు,టీవీ ఇంకా ప్యాక్ విప్పలేదు. తను డ్యూటీలో రిపోర్ట్ చేసి వచ్చేటప్పుడు,కేబుల్ అతన్ని కూడా తీసుకువచ్చాడు. టీవీ రిమోట్ చేతికి ఇచ్చి నాతో ఆన్ చేయించాడు. అత్తమ్మ అన్నది ఈ పరుపులు కొని ఆరు నెలలు అయింది. పోయినసారి నేనొచ్చినప్పుడు సీల్ తీయరా అంటే,తరువాత తీస్తాలే అని తప్పించుకున్నాడు. తను ఈ రోజు పరుపులకున్న కవర్లు తీసి కొత్త బెడ్షీట్లు,తలగడకు కవర్లు ఇద్దరం కలిసి తొడిగాము. రాత్రి ముగ్గురం కలిసి భోజనాలు చేశాము. అత్తమ్మ నాకు ఇష్టమైన ఆహారపదార్థాలు ఏమిటని అడిగింది. నేను చెప్పాను పులిహోర,దద్యోదనం,అప్పడాలు,పప్పుచారు,ఏదో ఒక వేపుడు,మొక్కజొన్న అన్నాను. అయితే మా వాడికి తిప్పలు తప్పవన్నమాట,వాడికేమో చికెన్,మటన్,చేపలు,రొ్య్యలు ఇష్టం అన్నది. అతను నావైపు ఆర్తిగా చూశాడు. నిద్రాదేవి అందరినీ ఆవహించింది. తెల్లవారాక టిఫిన్ చేసి అత్తమ్మ ఊరికి వెళ్ళిపోయింది. అతను నాతో సాంబారు,ఆలుగడ్డ వేపుడు చేయమన్నాడు. టీ తప్ప ఏమీ చేయడం రాని నేను తెల్ల ముఖం వేశాను. అన్నం మాడిపోయింది. మంచం క్రిందకు నెట్టాను. సాంబారు పుల్లగా ఉంది,ఆలుగడ్డ ఉడకలేదు. అతను మధ్యాహ్నం వచ్చి మా పై అధికారి ఊరికెళ్ళాడు,ఆఫీస్ లో పెద్దగా ఉండదు అన్నాడు. ఇంట్లోకి రాగానే తన చక్కటి ముక్కుతో అన్నం మాడిన వాసన కనిపెట్టి నా వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. నేను నిశ్శబ్దంగా మంచం కింది నుండి అన్నం గిన్న బయటకు తీశాను.అతను అన్నీ రిపేరు చేశాక కలిసి భోజనం చేసి నడుం వాల్చాం మంచంలో. మా ఇద్ధరి మధ్యలో దిండు పెట్టాను. టేపు రికార్డర్ కం రేడియో ఆన్ చేశాడు. రేడియోలో పాట వస్తుంది. ""నేలతో నీడ అన్నదీ నను తాకరాదనీ"" . అతను గొల్లున నవ్వాడు. నాకు కోపం వచ్చింది. తప్పయింది మేడం అన్నాడు. సాయంత్రం ఇంట్లోకి కావలసిన వస్తువులతో బాటు,మల్లెపూలు తెచ్చాడు. స్నానం చేసి తయారై గుడికి వెళ్ళి వస్తుంటే గుడిదగ్గర ఒక పెద్దవయసావిడ ఎదురైంది. తను వెంకీ స్నేహితునికి బామ్మట.తను నమస్కరిస్తే ఆమెకు నేనూ దండం పెట్టాను. మీకు రామచంద్రుని వంటి కొడుకు పుడతాడని మామిడిపండు చేతిలో పెట్టింది. ఇంటికి వచ్చాము.అతను మెల్లగా నా చేయి పట్టుకుని నీ చేతులు బాగున్నాయి. అరచేయి విశాలంగా ఉంటే అదృష్టమట,గోళ్ళు పొడవుగా ఉంటే మంచి కళాభిరుచి ఉంటుందట అన్నాడు. అవును మాతాతయ్య ఎప్పుడో చెప్పారన్నాను. అతనికి చాలా విజ్ఞానం ఉంది.ఏ విషయం గురించి అయినా అనర్గళంగా మాట్లాడగలడు. చాలా సేపటి తరువాత నాతో అన్నాడు.మనమిద్దరం భార్యాభర్తలం.నీతో మాట్లాడిన పది నిముషాల నుండే నిన్ను ప్రేమించడం మొదలు పెట్టాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం నిన్ను జీవిత పర్యంతం బాగా చూసుకుంటా అన్నాడు. నాకు మీమీద గౌరవం ఉంది, కానీ మిమ్మల్ని మా కుటుంబ సభ్యునిగా భావించడానికి ఇంకొద్దిగ సమయం కావాలన్నాను. అతను సరే అలాగే కానీ అన్నాడు. రోజులు గడుస్తున్నాయి. అతని మంచి తనం ముందు నేను చాలా చిన్నగా తోచాను, నాకు నేనే. [1/29, 17:34] Guruji: పడుకుని అనుకున్నాను,రేపు ఉదయం నా సంసిద్ధతను తెలియచేయాలి అని. అతను తల స్నానం చేసి బయటకు వచ్చాడు. నేను స్నానాల గదిలోకి వెళ్ళి,గడియ పెట్టకుండానే(అతని వలన ఎటువంటి హాని జరగదని భయం లేదు మరి) బట్టలు విప్పి పైకి చూశాను,గుండె ఆగినంత పనైంది.ఇంతింత మిడిగుడ్లేసుకుని.... చూస్తుంది గోడమీద బల్లి. ఒకరకమైన భయంతో కూడిన జుగుప్సతో కెవ్వున అమ్మా అని అరిచాను. అతను లుంగీ సర్దుకుంటున్న వాడల్లా పరుగెత్తుకు వచ్చాడు.గట్టిగా అతన్ని వాటేసుకున్నాను. తొలిసారి పురుష స్పర్శ తనువెల్లా తాకగానే వెయ్యిఓల్టుల విద్యుత్ తాకిన భావన నాకుకలిగింది.అటువంటి భావనే తనలోనూ కలిగిందని నాకు అర్థమైంది.అతను వెనకకు జరగబోతుంటే అతను నేర్పిన మూగవారి భాషలో అతని అరచేతిని సున్నితంగా తాకాను. ఏం జరిగిందట? తొలి ఉదయం... ఆపై ప్రతి ఉదయం, ప్రతి పగలు,ప్రతి రేయి. యవ్వనంలో ఉన్నప్పుడు ప్రేమను భర్త,భార్యలు వ్యక్తం చేయడానికి అత్యుత్తమ సాధనం అదేనేమో. అతను నాకు భర్తగా లభించడం, నా పూర్వజన్మ సుకృతం అనిపించింది ఈ క్షణం వరకూను. నాకున్న గొప్ప స్నేహితుడు,గురువు,తండ్రి, అన్న ఇంకా సర్వం తానే.అతని ఒడిలో తలపెట్టుకుని అతని కంటే ఒక్క క్షణం ముందు అనంతలోకాలకు వెళ్ళాలనేది నా అభిలాష అన్నాను (నా కొడుకు అత్యంత ప్రేమగా,తనకూతురుకు పెట్టుకున్న పేరు) రుద్రమతో. ప్రేమే కదా జీవన మాధుర్యం, ప్రేమే కదా శాశ్వతం, ప్రేమే కదా సత్యం, శివం,సుందరం.   -ఇందిర.వెల్ది

స్పూర్తి ( ఉగాది కథల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ)

స్పూర్తి ( ఉగాది కథల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ)          " పంతులమ్మా యేటి బాగున్నావా ? " అన్న పలకరింపు కి ముప్పై సంవత్సరాల వెనక్కి వెళ్ళింది అశ్విని మనస్సు . పెళ్ళికాక ముందు తను స్కూల్లో చదువు కొనేటప్పుడు చాలా మంది తనని అలానే పిలిచేవారు . బాపనమ్మ అని , కొందరు మర్యాదాగా పంతులమ్మ అని పిలిచేవారు . తరవాత తరవాత పల్లె పల్లెకి ఆధునికత అడుగు పెట్టడం తో యిలాంటి పిలుపులు తగ్గి పోయేయి . " అతను నీకు తెలుసా ? " అన్నవదిన  పిలుపుతో యీ లోకం లోకి వచ్చింది అశ్విని . " చిన్నప్పుడు మా నాన్నగారు పూరీ లో పని చేసేటప్పుడు అక్కడ అందరూ నన్ను యిలాగే పిలిచేవారు , మరి యిక్కడ యీ పిలుపు ..... " అంటూ టీ కప్పులు అందిస్తున్న అతనిని పరీక్షగా చూసింది అశ్విని , అందరికి టీ అందించి వో పక్కగా నిల్చున్న అతను " రామారావు పంతులగారి అమ్మాయివి కదమ్మా నివ్వు , నన్ను గుర్తు పట్టనేదా ? నాను .... ", " వుండు ..... వుండు .... నన్ను చెప్పనీ , ఆ ... ఆ. ....అప్పలరాజుకదూ ! , నువ్వేంటి యిక్కడ " అంటున్న అశ్వినిని వారించి " పంతులమ్మ వుప్పుడు పనుంది గాని రేత్రొచ్చి కలుత్త " అని ఖాళీ కప్పులు తీసుకొని వెళ్లిపొయేడు  . ఎక్కడి ఒరిస్సా లోని పూరీ  , యెక్కడి పాకిస్తాను బొర్డరుకి దగ్గరగా వున్న ద్రాస్ . రమారమి నాలుగు వేల కిలోమీటర్ల దూరం వుండదూ ? ఏమో యింకా ఎక్కువే ఉంటుందేమో ? , యింతదూరం పొట్ట కోసమే వచ్చాడా ? , కను చూపు మేర వరకు వొక చెట్టుగాని , పచ్చని గడ్డి గాని కనిపించని ఎడారి లాంటి చోట ఏం బ్రతుకు తెరువు దొరుకుతుంది ? , పొట్టకోసం యింత దూరం రావాలా ? అప్పలమ్మ యేమైనట్లు , చంటి పిల్లెమీ కాదుగా పోయిందేమో ? . యిదొక మిలిటరీ స్థావరం . అశ్విని చిన్నాన్న కొడుకు కల్నల్ ఆవడం తో , కార్గిల్ , ద్రాస్ చూడాలని పట్టుబట్టి వచ్చిందే గాని చెట్టూ , చేమా లేని ఎత్తైన కొండల పైన మిలిటరీ బళ్ళల్లో ప్రయాణం , బల్తాల్ నుంచి మూడురోజుల ప్రయాణం లో ఒళ్ళు హునమై సగం కుతూహలం చంపేస్తే రాత్రి గస్ట్ హౌస్ గా పిలువబడే టెంట్స్ బయట వినిపించే ఫైరింగ్ శబ్దాలు ప్రాణభయం అంటే ఏమిటో చెప్పేయి . భగవంతుడా బతికుంటే మరెప్పుడు యిలాంటి కోరిక కోరను దేవుడా .... దేవుడా .... అని మనసు ప్రార్ధనలు చేస్తూ వుంటే అలసిన శరీరం నిద్రకి వొరిగేది . బతికుంటే బలుసాకు కూర తిని బతకొచ్చు కాని ఇలాంటి చోట పరమాన్నం  దొరికినా .... , అయినా అప్పారావుకి ఆరుగురు పిల్లలు వుండాలి కదా వారేమయినట్లు ? . పిల్లలు కుడా బుద్దిగా చదువుకుని వృద్ధి లోకి వచ్చేరని కదా వింది . ఓ యిది కుడా పాత కధే అన్న మాట , మంచి వుద్యోగాల్లో చేరి కట్టూ , బొట్టూ , భాష మారిన తరువాత పాచిపని చేసి పెంచిన తల్లి , మట్టి పనిచేసి చదువులు చెప్పించిన తండ్రి భారంగా అనిపించి వుంటారు , సరి అయిన తిండిలేక , జబ్బు చేస్తే పిల్లలు మందులు యిప్పించక అప్పలమ్మ  కన్ను మూసి వుంటుంది . పిల్లల ప్రవర్తనతో , భార్య మరణం తో విరక్తి చెందిన అప్పారావు బ్రతుకు తెరువు కోసం యిక్కడకి వచ్చి వుంటాడు . కొడుకులు సరే కూతుళ్ళ సంగతేమిటి ? వారైనా చేరదియ్యలేదా ? డెబ్భై , డెబ్భై అయిదు సంవత్సరాలు వుండవూ ? యింకా యెక్కువే వున్నాయేమో ? కాయ కష్టం చేసే వొళ్ళేమో యాబ్భై యేళ్ళ వాడిలా వున్నాడు .  పిల్లలో పిల్లలో అని వాళ్ల తోటిదే లోకమన్నట్లుగా బతకడం వారు నిరాదరిస్తే యేడవడం , తరతరాలుగా జరుగుతున్నా , యీ పాశంలో మార్పులేదు .  సంసారికి వున్నది సన్యాసికి లేనిది యీ పాశమేనేమో కదూ . రెక్కలు ముక్కలు చేసుకొని  పిల్లల్ని పెంచేం అని చెప్పే మాటలు అప్పారావు విషయంలో నిజంగా నిజం . అందరు వలస కూలీల కధే యితనిది కుడా ! వున్న ఊర్లో తినడానికి తిండిలేక , చేసుకోడానికి పని లేక పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన వందల కుటుంబాలలో అప్పారావుదీ వొకటి . అశ్వినికి ఆరేళ్ళు వున్నప్పుడు యింటి ముందున్న తోటలో వున్న చెత్తా చెదారం అప్పారావు కుటుంబం శుబ్రం చేస్తూ కనిపించేరు . చేసిన పనికి కూలి యెంత కావాలి అన్న నాన్న గారి ప్రశ్నకు తను చేసిన పని నచ్చితే తన భార్యా పిల్లలకు పట్టెడు అన్నం పెట్టించండి అనే  మాట తో అందరి మనసులలో స్థానం సంపాదించేడు అప్పలరాజు  .  పూరీ లోని రైల్వే కాలనీ లో అతి తక్కువ సమయం లోనే  అందరికి తలలో నాలుకై పోయింది అప్పారావు కుటుంబం . అప్పలరాజు , అప్పలమ్మ  , తాము చేసిన పనికి యింత అని యెన్నడూ వెలకట్టి అడిగినది లేదు నువ్వు చేసిన పనికి  నీకు యింతే వస్తుందని కాలనీ వాసులు లెక్క కట్టిందీ లేదు . అందరిళ్ళల్లో కష్ఠసుఖాలు అతనివి , అతని కష్ఠసుఖాలు ఆ కాలనీ వాసులవి . అలాగే ఆడుతూ పాడుతూ కాలం ముందుకి దూసుకు పోయింది  పిల్లలంతా పెద్దవారయి , వుద్యోగాలు , పెళ్లిళ్లు అని ఆ ఊరిని వదిలి పోయేరు , పెద్దవారు ఉద్యోగ విరమణ చేసి సొంత వూర్లకో , పిల్లల దగ్గరకో వెళ్లి పోయేరు . అశ్విని తండ్రి విధులలో వుండగా పోవడం తో అన్నకు రైల్వే లో వుద్యోగం రావడం తో చుట్టం చూపుగా పూరీ వెళ్లగలిగేది . అలా వెళ్లి నప్పుడు అన్నతో మాటలలో అప్పారావు పిల్లలు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలలో స్థిరఅడ్డారని ఆడపిల్లలకు మంచి సంబంధాలు కుదిరి పెళ్లిళ్లయాయని తెలుసుకొని సంతోషించేది . మరి యిదేమిటి అప్పలరాజు యిక్కడ యీ ప్రతికూల పరిస్థితులలో యీ వయసులో కష్ట పడుతూ వుండడం చూసి తట్టుకోలేక పోయింది అశ్విని . అన్య మనస్కం గా భోజనం పూర్తి చేసుకొని పడక మీద వాలింది . అర్ధ రాత్రి దాటితేనేగాని పడక చేరని నగర నాగరికతకు అలవాటైన శరీరం ఎనిమిదింటికి నిదుర రానంటోంది . ఆ చీకటిలో చేసే పనేమీ లేక  . అప్పలరాజు రాకకోసం యెదురు చూస్తున్న అశ్వినిని  యెడతెగని ఆలోచనలు చుట్టు ముట్ట నారంభించేయి  .  వుమ్మడి కుటుంబ వ్యవస్థ విఛ్చిన్న మయిన తరువాత వుత్పన్న మయిన సమస్యలలో ముఖ్యమైనది , జవాబు లేనిదీ యిదేనేమో ? ఏ విద్యావేత్తలు యీ సమస్యకు పరిష్కారం సూచించలేరేమో ?  అంతూ పొంతూ లేని ఆలోచనలలో యెంత సేపు వుండేదోగాని చల్లని చెయ్య తన కాళ్లని వత్తడం తో యీలోకం లోకి వచ్చి గబుక్కున " వద్దు వద్దు " అంటూ కాళ్ళు లాక్కుంది . " ఏం పర్నేదు పంతులమ్మ వుండు కాల్లు మాలీసు చేత్తాగా , నేప్పులన్ని సిటికేలో పోతాయి గందా ? " అంటున్న అప్పలమ్మని చూసి గిల్టీగా నవ్వింది అశ్విని .  " బాగున్నావా అప్పలమ్మా "  " ఆ అదేబాగు మరేటి ...... యేదో యినాగున్నాం " అశ్విని కడుపులో సుళ్లు తిరుగుతున్న ప్రశ్నలన్నీ గబగబా తుటాల్లా అప్పలమ్మ పైకి వదిలింది .  అన్ని ప్రశ్న లకి చిరునవ్వే సమాధానంగా నవ్వింది అప్పలమ్మ .  " వోలమ్మ వోలమ్మ యేటి తల్లీ యిన్ని పశ్నలు వొణ్ణమ్ తినకుండా పెశ్నలు తినీసినావేటి ?" ప్రశ్నల తీవ్రతకి తట్టుకోలేక ఆమె తన దుఃఖాన్ని తనతో పంచుకుంటుంది అనుకున్న అశ్వినికి  నిరాశే యెదురయ్యింది . తనకి కేటాయించిన పనులు పూర్తి చేసుకొని  వచ్చి వీళ్ల దగ్గర కూర్చున్నాడు అప్పలరాజు  . " ఏం జరిగింది రాజూ , నువ్వేనా చెప్పు ? మీ పిల్లలు మిమ్మల్ని బాగా చూసుకోలేదా ? పిల్లలు ఏదో చిరాకు పడితే మాత్రం యిలా యిల్లు వూరు వదిలేసి యింతదూరం రావాలా ? యీ వయసులో పిల్లలు పెట్టింది తిని కృష్ణా రామా అనుకుంటూ గడిపేస్తే జీవితం  గడిచి పోదా ? దిన దిన గండం నూరేళ్ళాయిష్షు అన్నట్లు వుండే యిలాంటి చోటులో గడపడం యేమిటి ? మీ పిల్లలతో వుండడం యిష్టం లేకపోతే నాతో వచ్చెయ్యండి , అంతేకాని యిలాంటి చోట ఉండడానికి వీల్లేదు , రాక పొతే నామీదొట్టె........ ఆ..... " . " నా తల్లి నాతల్లి అంతమాటొద్దు గాని , నేను సేప్పేదిను తల్లీ " అశ్వినిని వారిస్తూ అప్పలరాజు  చెప్పింది విని అవాక్కయింది . ఇలాంటి కోరికలు కోరుకొనే వారు కూడా ఉంటారా ? వుంటే దాన్ని తీర్చుకోడానికి యింత దూరం వచ్చి యిన్ని కష్టాలని సంతోషంగా భరిస్తారా ? అని ఆలోచిస్తున్న  అశ్విని దృష్ఠి లో అప్పలరాజు దంపతులు యెంతో యెత్తుకు యెదిగి పోయేరు . విద్య లేని వాడు వింత పశువు అని అన్నది ఎవరో గాని వారు అప్పలరాజు నిర్ణయం వింటే , అతనితో వొక్కసారి మాట్లాడితే ఆ సామెతని మార్చి పారేస్తారు .  " అందరి తల్లితండ్రులలానే కొడుకుల పంచన చేరిన తరవాత ఏటో పనికి రాని వస్తువుల మయిపోనామేమో ? అని గుబులు మొదలయినాది . పనిపాట్లు చేసుకొనే వొళ్ళం ఊరికే కూకోవాలంటే ఏటీ తోచీది కాదు . మా మాట , కట్టూ  బొట్టూ  , సదూ కున్న పిల్లోల్లకి నచ్చీది కాదు . పక్కింటోల్లకో యెదురింటోల్లకో మొక్కలు యెయ్యడానికో మరేదేనా సాయం సేసే దానికి పొతే పిల్లలు  అవుమానం అంటారు , అనాగని వూరికే కూకోని తినాలంటే పానం మీదికొత్తాది , తిండి పెడతన్నాం గందా మరింకేటి కావాలా ? అంటే నానేటి సేప్పనేను గాని పని పాటు లేని శరీరం బూజెక్కిపొదా ? మనుమల్ని సేరతీద్దారంటే నా పిల్లలే మట్టిపిసికే సేతులతో బిడ్డని తాకొద్దంతారు , యీ సేతుల్తోనే గదేటి ఆళ్ళని సాకినాము .అప్పుడు అక్కరకొచ్చిన సేతులు యిప్పుడు పనిరాకుండా పొనాయా ? ఊరికే కూకున్తే మన కొలనీ లో హరిదాసుగోరు సెప్పిన మాటలు సెవ్విలొ తిరిగీవి . రామాయణం , భారతంలో రాజులు రాజ్యాలేలి , యువరాజు కి పట్టాభిషేకం సేసేసి వనాలలోకి యెల్లి పూజలు పునస్కారాలు సేసుకుంటా గడిపేవోరంట , పులులు ,సింమ్మాలు ఆ అడవుల్లోంచి ఎల్లే బాటసారుల్ని బాధిస్తావుంటే మాత్రం అస్తరాలు యెత్తి జంతువులని సంపెవోరంట యీస్వరుని సృష్టి లో మనిషి తప్ప మరే జీవి కుడా తను కన్న పిల్లలమీద ఆధారపడి బతికెయ్యాలని అనుకోదు . నిన్ను కన్నందుకు నీకు రెక్కలొచ్చినంకా  నన్ను మొయ్యి అని ఏ పచ్ఛీ తన పిల్లని అడుగదు . ఏ జంతువా  ముసలి కాలంలో తన కోసం ఏటకి మరో జంతువని ఎల్లి  ఏటాడమని సెప్పదు  . మరి మనిసేటి  తన జబ్బలో సక్తి వున్నా ఎందుకు పనికి రానోడిలా గోల్లు  గిల్లుకుంటా కుకుంతాడు అంతే జవాబు నేదు . పిల్లలు సిన్నగున్నప్పుడు ఆళ్ల పొట్టలు నింపేదానికి కట్టపడ్డా , యిప్పుడు నాకేటి బంధకాలు నేవు , యిప్పుడు నాకోసం నాను బతకాలని తలచి మా యావిడని అడిగినా నా కూడా వోత్తావా ? పిల్లల కాడుంతావా? అని అడిగితే  నువ్వెక్కడుంతే  నానూ అక్కడే అనీసినాది . పిల్లలకి సెప్పి బండెక్కీసినాము . మా కాయ కష్టం   మాము సేసుకుంటా హరద్వార్ సేరినాము . మా యిద్దరి పొట్టలకి యెంత కావాలేటి ? రాయివాలా లో వున్న మిలిటరీ యిళ్ళల్లో పనులు సేసేటప్పుడు హింది మాస్టారు గారు పిల్లలకి సెప్పే పాఠం గమనానికొచ్చింది . నివ్వు సదివే వుంతావు  వో పువ్వు  తన అభిలాస సెప్తాది అదేటంటే ఆపువ్వుకు దేవుడి పాదాల  కాడ పడుండాలని గాని ఆడోల్ల కొప్పులో సేరాలని గాని వుండదంట దేసభక్తులు నడిచే దారిలో తనను పడేయ మంటది . దేసభక్తుల కాళ్ళ కింద నలిగిపోయినా జన్మ ధన్య మౌతాది అని అంటది . ఆ పాఠం గమనానికొచ్చీ దేశ రచ్చన లో పానాలు యిడిచి పెడుతున్న మిలటరీ వోల్లకి సేవసేసుకోవాలని అనిపించినాది . అందుకే పది సమ్మత్సరాల కింద యిక్కడికి వొత్తున్న వో బెటాలియన్ తో వొచ్చీసినాము . అప్పటినుంచి యిక్కడే వున్నాము తల్లీ ".అని ముగించేడు అప్పారావు . " యీ చలిలో , ఎప్పుడు శత్రువు గుండు గుండెల్లో దూసుకు పోతుందో తెలీని చోట వుండడం అవుసరమా ? " " పానాలకి తెగించి సరిహద్దు కాపాడడం అవుసరమా అని యీ సైనుకులు అనుకుంటే యీ దేసం ఎటవుతాది ? సావా ? టైమొచ్చినపుడు వొత్తాది , నా టైమురాకపోతే గుండ్రాయిలా గుంతాను , యిక్కడ రోజూ  యుద్ధమే  . అదిగదిగో అల్లా కొండ మీద పాకిస్తానీ వోల్ల పోస్ట్ అక్కడనుంచి ఆల్లు కాలుత్తావుంటారు . మనోళ్ళు వున్నది కింద , ఆల్లకి మనని కాల్చడం సులువు కాని మనోళ్ళకి ఆళ్ళని కాల్చడం కష్టం  . ఆళ్ల కాల్పుల్లో యెందరు సైనుకులు సనిపోనేదు . యెవ్వురైనా పోవలసినొళ్లెమే  యీ పొద్దు కాకుంటే రేపు , యింతోటి దానికి భయ మెందుకు " . " మీ పిల్లలకి తెలుసా మీరిక్కడ వున్నట్లు "  . "  యింటి కాడ బయలెల్లి నపుడు సెప్పినాము , యినగినాగా మా వొంట్లో శక్తి వున్నంత దాక పని సేసుకొని బతుకుతాము అని సేప్పినాము . ఆళ్లు పల్లకున్నారు గాని యెప్పుడొత్తారనీ అడగనేదు , వో కార్డు ముక్క రాయించు అని సేప్పనేదు . వొల్లు పాడయితే మా కాడకి ఎలిపిరండి అనీ అననేదు . మరి ఆల్లకి మా అవుసరం నేదు , మరింకేలా ఆళ్లతొ బంధాలు , యీల్లకి కూడా మాకెవురూ  నేరు అనే సేప్పినాము . యీళ్లకి సేవ సేసుకుంటా బతికేత్తాము , పోయినంక యిక్కడే బుగ్గయి పోతాము .  యినాయక సవితి పూజలప్పుడు  హరి దాసు గారు సెప్పినట్టు నా ఇల్లు నా పిల్లలు అనే బంధకాలు యెట్టుకుంటే పెపించికం  సిన్నదయిపోతాదంట , బంధకాలు తెంచుకుంటే పెపించికం అంతా నాదే . మనూర్లో ఉండేతప్పుడు నాకు ఆరుగురు పిల్లలు కాని యిప్పుడు ఇక్కడున్న అందరూ నా పిల్లలే , యిక  సలి అంతావా ? యీల్లందరికీ లేని సలి మాకేటి ? కట్టెపుల్లల్లో కాలిపోయే శరీరాలకి సూకరాలెందుకు తల్లీ , మట్టిలోంచొచ్చనాము మట్టిలో కలిసిపోతాం ? యింతోటిదానికి యిన్ని ఆలోచనలెందుకు తల్లీ , సర్లే అమ్మ తొంగో సనా అలసి పోయునావు రేపు మల్లా పొద్దుటే బయలెల్లాల " అని యిద్దరూ నిష్క్రమించేరు . నాలుగు రోజులుగా గుబులు గుబులు గా వుంటూ చిన్న శబ్దానికే హడలి పోయి ప్రాణాలు అరచేతిలో వున్నట్టుగా గడిపిన అశ్విని ఆరోజు నిశ్చింతగా నిద్ర పోయింది .          " పల్లు దోమీసినావేటి ?" అంటూ టీ కప్పుతో నిలబడ్డ అప్పలరాజు ని చూసి చిరు నవ్వు నవ్వింది .  " వోర్నాయినో పంతులమ్మగోరు తానం కుడా సేసేసి తయారయిపొనారు " అంటూ టీ కప్పు అందించి వెళ్లిపోయేడు అప్పలరాజు . " ఇతను మీ వురి వాడా ? " ఆ బెటాలియన్ ఇంచార్జ్ కేప్టన్ మెహరా అడిగేడు . ఔను అన్నట్లుగా  తలూపింది అశ్విని .  " అతని వాళ్లెవరైనా వుంటే వారి ఎడ్రస్ యిస్తే వీళ్లకి ఏమైనా అయితే వాళ్ళ వాళ్ళకి తెలియ జేయ్యడానికి వీలుంటుంది . అతనిని యెప్పుడడిగినా మాకేవ్వరు లేరు అనే చెప్తున్నాడు . మీకేమైనా అయితే యెలాగా అంటే అనాధలకి మీరు దహన సంస్కారాలు యెలా చేస్తారో అలా చేసెయ్యండి అన్నాడు . ఏడాది కిందట భార్యా భర్తలు యిద్దరూ అవయవ దానం చేసేరు . యీ పని ఆ పని అని లేకుండా చేస్తూనే వుంటారు మహాను భావులు . ఇలాంటి వారు యేకొద్దిమందో వుంటారు "  " ఔను యే కొద్ది మందో వుంటారు వీరి లాంటి వారు . వాళ్లు చెప్పినట్లు వారికెవరూ  లేరు కాదు.....కాదు ..... మీ రంతా వారి పిల్లలే , ఎక్కడో దురాన వున్న మీ తల్లి తండ్రులని వీళ్లల్లో చూసు కోండి .  మీ ఆథిధ్యానికి కృతజ్ఞతలు తెలియ జేసుకుంటున్నాను " అని రెండు చేతులు జోడించి అక్కడ వున్న అందరి వైపు తిరిగి పదేపదే జేతులు జోడిస్తూ , ధన్యవాదాలు చెప్పుకుంటూ శలవు తీసుకొని జీపెక్కింది అశ్విని .   -కర్రా నాగలక్ష్మి

దేవుడు ( ఉగాది కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ)

దేవుడు ( ఉగాది కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ)   అసలే ఖాళీ రోడ్డు, పెద్ద ఎండ కూడా లేదు, పైగా చల్లని గాలి, వెనక్కాల గట్టిగా పట్టుక్కూచున్న భార్య, దాంతో తెగ స్పీడుగా డ్రైవ్ చేసుకుంటా వెళ్తున్నాడు హరికృష్ణ. ఆళ్ళ మావగారు మార్కెట్లోకి కొత్తగా వచ్చిన లేటెస్టు మోడలు కవాసాకీ నింజా బైకు కొత్తల్లుడికి ఉగాది కానుకగా ఇచ్చేరు.  కాకినాడలోని మావగారింట్లో ఉదయాన్నే బండికి పూజ చేయించి, పచ్చడి తిని తల్లిదండ్రులు ఉండే పిఠాపురానికి బయల్దేరాడు. దేవరపల్లి వీధి దాటి కుంతీమాధవస్వామి గుడి దగ్గరకొచ్చేసరికి ఎక్కణ్ణుంచొచ్చిందో ఓ సూడిగేదె అడ్డొచ్చేసరికి సడన్ బ్రేకు వేసాడు హరికృష్ణ. దాంతో నూటిరవై కిలోమీటర్ల స్పీడులో వస్తున్న బండికాస్తా స్కిడ్డైపోయి భార్యాభర్తలిద్దరూ కిందడిపోయేరు. ఒళ్ళంతా గీరుకుపోయి ఒకటే రక్తం, చెయ్యిరిగిపోయిందంటూ ఆ హరికృష్ణ భార్య హరిత ఒకటే ఏడుపు.  రోడ్డు పక్కనే ఉన్న పాకల్లోంచొచ్చిన జనం వీళ్ళిద్దరినీ లేవదీసి బండిని పక్కన నిలబెట్టి, బొట్టు బీదరాజు గాడి ఆటోలో పక్కీధిలోనున్న వెంకట్రాజుగారాసుపత్రికి తీసుకెళ్లిపోయేరు.  బంగళా పెంకేసున్న ఆ చిన్న ఇంటి ముందు డాక్టర్ వెంకట్రాజు, ఆరెంపీ అని రాసుంది. అంత ఏడుపులోనూ ఆ బోర్డు చూసిన హరిత 'షిట్.. ఇన్ని ఇంజ్యూరీస్ తో సఫర్ అవుతూంటే ఆరెంపీ డాక్టర్ దగ్గిరకా? ఈ ఊళ్ళో అపోలో గానీ కేర్ గానీ లేవా' అంటూ అరిచినా వీళ్ళని తీసుకొచ్చిన జనం పట్టించుకోకుండా ఇద్దరినీ వెంకట్రాజు గారిదగ్గిరకట్టుకెళ్ళిపోయి ' డాట్రారండీ.. మరేమోనండీ.. ఈళ్ళిద్దరికీ యాక్సిడెంటైపోనాదండి' అంటూంటే ఆ వెంకట్రాజు గారు మీరందరూ బయటుండండి అని అందరినీ బయటకంపేసి, ఇద్దరి దెబ్బల్నీ శుభ్రం చేసేసి పైన టింక్చర్ అయోడిన్ పూస్తూ చెప్పేడు ' కొద్దిగా మంటగానుంటుంది.. కానీ ఓర్చుకోండి.. గాలికి ఒదిలేసి కొద్దిగా పచ్చిదనం పోయిన తర్వాత ఈ దెబ్బల మీద కొబ్బరి నూనె రాయండి చాలు.. త్వరగా ఎండిపోతాయి.. ఇప్పుడు మీ ఇద్దరికీ టెటనస్ ఇంజక్షన్ ఇస్తాను'..  హరిత ఏడుస్తా అరిచింది' ఐ డోంట్ నో హౌ క్వాలిఫైడ్ హీ ఈజ్.. ఎట్లీస్ట్ ఆస్క్ హిమ్ టు యూజ్ ఎ స్టెరిలైజ్డ్ సిరంజ్' వెంకట్రాజు నవ్వుతూ బదులిచ్చాడు 'మేడమ్.. ఐ మైట్ లుక్ చీప్.. బట్ మై ట్రీట్మెంట్ ఈజ్ నాట్ చీప్.. నేను స్టెరిలైజ్డ్ మాత్రమే కాదు.. ప్రతీ పేషంటుకీ కొత్త సిరంజీ వాడతాను' అని కొత్త సిరంజీలతో ఇద్దరికీ ఇంజక్షన్లు చేసేడు.  లేవడానికి ఇబ్బంది పడుతున్న హరిత పాదం పట్టుకుని పెయిన్ ఎక్కడుందీ అని అడుగుతూంటే 'మోకాలు దగ్గర చెప్పలేనంత నొప్పి, అయినా నేను కాకినాడెళ్ళి అపోలో లో స్కాన్ చేయించుకుంటాను' అంది ఆ అమ్మాయి మాటల్ని పట్టించుకోకుండా మోకాలి దగ్గర పరీక్ష చేసిన వెంకట్రాజు గారు చెప్పేరు 'మీ మోకాలి దగ్గర చిన్న డిస్ లొకేషన్.. పాటెల్లా డిస్ లొకేషన్ అంటారు.. ఇప్పుడే ఫిక్స్ చేస్తాన' ని ఆ పిల్ల అరుపులు పట్టించుకోకుండా మోకాలి దగ్గర చిన్నగా తిప్పేడు. ఆ హరిత ఒక్కసారే అరుపులూ, ఏడుపూ ఆపేసి 'ఇదేంటీ.. నెప్పి అలా ఎలా పోయిందీ' అని ఆశ్చర్యపోయింది.  'ఏమీలేదమ్మా.. చిన్న డిస్ లొకేషన్..పాటెల్లా డిస్ లొకేషన్ అంటారు.. ఫిక్స్ చేసేసేను.. మీ వారికి కాళ్లూ చేతులూ కొట్టుకుపోవడం తప్ప పెద్ద ఇన్జ్యూరీస్ ఏవీ లేవు.. పెయిన్ కిల్లర్ వాడండి.. రాస్తాను ' అని ప్రిస్క్రిప్షన్ రాస్తూంటే ఆ హరిప్రసాదు అడిగేడు' మీ ఫీజెంతండీ? ' '  ంజక్షన్లకీ, అయోడిన్ కీ కలిపి డెబ్భై రూపాయలివ్వండి చాలు' అని బదులిచ్చిన వెంకట్రాజు గారి కాళ్ళకి దణ్ణం పెట్టి, ఫీజు చెల్లించుకునెళ్ళిపోయారా దంపతులు  ఏ ఊరినుంచొచ్చాడో ఎవరికీ తెలీదు కానీ దేవరపల్లి వీధి లో ఇల్లద్దెకు తీసుకుని ప్రాక్టీసు మొదలెట్టేడా వెంకట్రాజు. ఈయన ఉత్త ఆరెంపీ అంటెహె అనుకుంటూ మొదటెవరూ ఆయన క్లీనిక్ వేపు కన్నెత్తి చూసేవోరు కాదు. ఈయనే ఓ చిన్న పెట్టట్టుకుని ప్రతీ పాకమ్మటా తిరిగి అందరి ఆరోగ్యం వాకబు చేస్తూండేవోడు.  ఎవరికైనా వైద్యం చేసినప్పుడు డబ్బివ్వబోతే 'డబ్బులక్కరలేదు.. ఇవ్వాళ మీ ఇంట్లో భోజనం పెట్టండనేవోడు.. ఊళ్లో వేరే డాక్టర్లు లా కాకుండా టెస్టులూ అయీ ఎంతో అవసరమైతే తప్ప రాసేవోడు కాదు. ఏ రోగినైనా మనిషిని క్షుణ్ణంగా పరిశీలించి రోగమేంటో తేల్చేసేవోడు.  శివాలయం పూజారి ఏకాంబరశాస్త్రి గారి కోడలు కాన్పయ్యిన తర్వాత కాకినాడ డాక్టర్లు ఏవో బోలెడు మల్టీ విటమిన్ టాబ్లెట్లూ గట్రా రాసేసేరు. అసలే ఇంతింత ఆదాయం తో అంత మందుల ఖర్చు ఎలా భరించాలిరా దేవుడా అని ఆయన బాధ పడుతూంటే 'అయ్యో.. భలే వారండీ.. ఆ టాబ్లెట్లయీ ఏమఖ్ఖర్లేదు.. శుభ్రంగా రోజూ తెలగపిండి కూర మునగాకేసి వండి పెట్టండి.. తల్లికీ బిడ్డకీ మేలని' చెప్పేడు. ఈయన చెప్పింది కరెక్టుగా పనిచెయ్యడంతో ఆ ఏకాంబరశాస్త్రి గారి పరివారం అంతా వెంకట్రాజు మీద నమ్మకం పెంచేసుకున్నారు.  అలాగే ఎవరికైనా పాలేళ్ళకీ, రిక్షా వాళ్ళకీ అందుబాటులో ఉన్న పసుపు, మెంతులు, జీలకర్ర వంటివి ఉపయోగించి  చిట్కా వైద్యం నేర్పించేసేడు. దాంతో చుట్టుపక్కల జనం ప్రతీదానికీ ఊళ్లో ఉన్న అల్లోపతీ డాక్టర్ల దగ్గరికి పరిగెత్తేవారు కాదు పైగా వెంకట్రాజంటే ఆళ్ళందరి దృష్టిలో దేవుడితో సమానంగా చూసుకునేవారు అదేంటండీ డాక్టర్ గారూ ఇంకా పెళ్లి చేసుకోలేదేంటండీ అని ఎవరైనా అడిగితే మనకయన్నీ ఎందుకండీ.. మీరందరూ నా కుటుంబంలాంటోరే కదా.. మళ్ళీ నాకు వేరే కుటుంబం గట్రా ఎందుకండీ అని నవ్వేసేవోడు.  ఓసారి కాకినాడ పచ్చిగోళ్ళ వాసు గారి హోల్సేలు మందుల షాపులో తనక్కావలసిన మందులవీ కొనుక్కుని తిరిగి పిఠాపురం వెళ్ళడానికి సర్పవరం జంక్షన్లో షేర్ ఆటో కోసం చూస్తూండగా 'డాక్టర్ గారూ' అని గట్టిగా ఎవరో పిలిచేసరికి ఎవరా అని చూడగా రోడ్డవతల కారాపినుంచున్న ఆ హరికృష్ణ దంపతులు కనబడ్డారు.  వెళ్లి బాగున్నారా అని పలకరిస్తే 'బావున్నామండీ.. ఆ రోజు మీరు చేసిన సహాయం మర్చిపోలేము.. మళ్ళీ మాకు పిఠాపురం వచ్చే పని పడక అటువేపు రాలేకపోయేము. మీరేమనుకోకుండా మా ఇంటికి భోజనానికి రావాలిప్పుడురావాలిప్పుడు' అంది హరిత.  'నేను చేసిందేముందమ్మా.. ఇంకోసారొస్తాను మీ ఇంటికి ' అంటున్నా పట్టించుకోకుండా ' మీరు రాకపోతే నా మీద ఒట్టేనండి ' అని బలవంతంగా వెంకట్రాజుని వాళ్ళింటికి తీసుకెళ్లిపోయారా దంపతులు. దారిలో చెప్పింది హరిత' మా నాన్నగారు కూడా డాక్టరేనండి మీలాగే.. కాకపోతే ఎండి.. కార్డియాలజీ'  'అవునా.. మంచిదండి' బదులిచ్చాడు వెంకట్రాజు 'ఇక్కడ అపోలో హాస్పిటల్ లో మా మావగారు కార్డియాలజీ ఛీఫ్ అండి' కారు డ్రైవ్ చేస్తూ చెప్పాడు హరికృష్ణ  హరిత వాళ్ళింటికెళ్ళేసరికి గట్టిగా అరుపులు వినిపిస్తున్నాయి. లోపలికెళ్ళి చూసేసరికి హరిత తండ్రి రాజేశ్వరరావు గారు కుప్పకూలిపోయున్నారు.  ఆయన భార్య శాంత అంబులెన్స్ పిలవమని కేకలు పెడుతూ ఏడుస్తూంది. హరిత ని చూడగానే 'నీకిందాకటి నుంచి ఫోనచేస్తున్నాను.. తియ్యవేం?' అని అరిస్తే 'అయ్యో.. ఫోను మ్యూట్ లో పెట్టి మర్చిపోయేను' బిక్కమొహం వేసుకుని బదులిచ్చింది హరిత  'మీరు కంగారు పడకండత్తయ్యా.. నేను అంబులెన్స్ కి ఫోన్ చేసాను.. వెంటనే వస్తుంది' అని హరికృష్ణ ఆశ్చర్యంగా చూసేడు.  అప్పటికే రాజేశ్వరరావు గారి ఛాతీ మీద మోదుతూ మధ్య మధ్యలో ఆయన నోట్లో నోరెట్టి ఊదుతూ కనిపించాడు వెంకట్రాజు.  'ఈయనెవరే? ఏం చేస్తున్నాడు మీ నాన్న గారిని? ' అని అడిగిన శాంత గారిని' ఆయన ఏం చేస్తున్నారో ఆయనకి తెలుసు.. నువ్వు ఆట్టే టెన్షన్ పడకు మమ్మీ ' అంది హరిత  కాస్సేపటికి ఆయన గుండె కొట్టుకోవడం ప్రారంభించింది.' సిపిఆర్ చేసేను.. డేంజరు తప్పినట్లే.. కాకపోతే ఈయన్ని వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్దాం' అని ఆ రాజేశ్వరరావు గారిని అపోలో లో చేర్పించి వెళ్లిపోయాడు వెంకట్రాజు.  కొన్నాళ్ళకు వెంకట్రాజు ఇంటి ముందు కారాగింది. హరిత తన తండ్రిని వెంకట్రాజు క్లినిక్ లోకి తీసుకొచ్చి చెప్పింది 'నాన్నగారు కోలుకుంటే అన్నవరం లో వెయ్యిన్నొక్కటి కొబ్బరి కాయలు కొడతానని అమ్మ మొక్కుకుంది.. వెళ్తూ మీకు కనిపించెళ్దామని తీసుకొచ్చేను'  వెంకట్రాజు ' నమస్కారమండీ.. బాగున్నారా?' అని పలకరించేడు. రాజేశ్వరరావు గారు తల పంకించి క్లినిక్ అంతా చూసి మాట్లాడకుండా 'ఇంక మనం వెళ్ళాలి.. లేకపోతే గుడి కట్టేస్తారు' అన్నారు  వెంకట్రాజు చిరునవ్వుతో చూస్తూండగా వారంతా కారెక్కి వెళ్లిపోయేరు.  అన్నవరం కొండెక్కిన తర్వాత హుండీ లో ఓ కవరు వేసి వెళ్లిపోయారు రాజేశ్వరరావు గారు. ఆ తర్వాత ఎప్పుడూ తను డాక్టర్నని చెప్పుకోలేదు, ప్రాక్టీసూ చెయ్యలేదు.  స్వామి వారి హుండీ లో వేసిన కవర్లో చించేసిన ఆయన ఎండీ సర్టిఫికెట్, కార్డియాలజీ లో ఆయన సాధించిన గోల్డ్ మోడల్స్ తో పాటు వెంకట్రాజు ( బ్రాకెట్లో దేవుడు) ని కులపిచ్చి తో ఏడుసార్లు కార్డియాలజీ సబ్జెక్టు లో ఫెయిల్ చేసి మెడిసిన్ వదిలెళ్ళిపోయేలా చేసి తప్పు చేశానని క్షమాపణ కోరుతూ రాసిన ఉత్తరం కూడా ఉంది.   - రవీంద్ర కంభంపాటి

జీవిత సహచరి

  జీవిత సహచరి     విశాఖపట్నం లోని బీచ్ రోడ్ లోంచి, భీమిలీ వైపు దూసుకుపోతోంది, శ్రీహరి ఎక్కిన టాక్సీ... పదిరోజుల క్రితమే సింగపూర్ నుండి వచ్చిన శ్రీహరి, ముంబయి లో బిజినెస్ పన్లు చూసుకొని, తన మిత్రుడు అమర్ ను కలవటం కోసం వైజాగ్ వచ్చాడు. అమర్ ది విశాఖపట్నం పక్కనే ఉన్న భీమిలి. చెన్నైలో ఉద్యోగ విరమణ చేసిన తరువాత తన ఊరిలోనే స్థిరపడిపోయాడు. ఏడాది క్రితం అతని భార్య పోయిందన్న సంగతి ఇటీవలే తెలిసిన శ్రీహరి చాలా బాధ పడ్డాడు. అందుకే, రెండు రోజుల క్రితమే సింగపూర్ కి వెళ్ళిపోదామని అనుకున్నవాడు కాస్తా, అమర్ ను కలవటానికని తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నాడు. అకస్మాత్తుగా కారు వేగం తగ్గటంతో, “ఏమైంది?” డ్రైవర్ ను ఉద్దేశించి అడిగాడు, శ్రీహరి.   “ఏటైనాదోనండి మరి, చూడాలి...” అంటూనే రోడ్ పక్కగా కారాపి, దిగి చూసి, “సారీ సార్, టైర్ పంచర్ అయిపోనాది... స్టెప్నీ ఉన్నాదిలెండి...మీరు కారు దిగమాకండి బాబూ, పావుగంటలో పనైపోతాది...” అంటూనే కావలసిన సామాన్లు డిక్కీ లోనుంచి తీసుకొని పనిలోకి దిగాడతను. ఏమీ తోచక తాను కూడా కారు దిగి నిలబడ్డాడు, శ్రీహరి.    సాయం సంధ్య తన నీరెండ చీర కొంగును నీలి సముద్రం మీద అలవోకగా కప్పేసిందేమో, నారింజ రంగులు సంతరించుకుంటున్న సాగరం వింతసొగసులతో మెరిసిపోతోంది. రెండు నిమిషాలకో సారి, ఏదో ఒక వాహనం రివ్వున దూసుకుపోతోందా దారిలో... సాగర సౌందర్యాలు గమనిస్తూ, టీ తాగాలనిపించి, అక్కడికి దగ్గర్లోనే ఉన్న బడ్డీ కొట్టు వైపుగా నడిచాడు, శ్రీహరి. అతను కొంచెం ఇటుగా రావటంతో, అప్పటికి ఏకాంతం దొరికిన డ్రైవర్ సింహాచలం తన జేబులోంచి సెల్ ఫోన్ తీసి, భార్యకు ఫోన్ చేసాడు. గాలివాటుకు అతని మాటలు శ్రీహరికి అస్పష్టంగా వినిపించసాగాయి... “ఏటే బంగారమా, ఫోను సెయ్యలేదని కోపమొచ్చీసినాదేటి? మజ్జానం నుంచీ, టయిం దొరకనేదే... బండి నడుపుతానే ఉండిపోనాను.... ఇదిగో, ఈ అయ్ గార్ని బీమిలిలో ఒగ్గేసి, రేత్తిరి తొమ్మిదయ్యేతలికి ఇంటికొచ్చేత్తానుగా... దూరమేలేయే... దూరం దూరమని బేరాలొదిలీసుకుంతే డబ్బులెలాగొత్తాయి? నువ్వు నాకోసం తెలివేసి కూచోకుండా, మాయమ్మ ఇంత ముద్దెడితే తినేసి నిద్దరపో... అసలే ఉట్టి మడిసివి కూడా కాదు...” మాట్లాడుతూనే చకచకా టైర్ మార్చి, శ్రీహరి వైపు అయిపోయిందన్నట్టు సైగ చేసాడు. చేయి ఊపి టీ తాగటానికి రమ్మని పిలిచాడు, శ్రీహరి. అతను టీ తాగుతుంటే, “ఎవరితోనోయ్ మాట్లాడుతున్నావ్, మీ ఆవిడా?” అనడిగాడు, నవ్వుతూ... “అవునండి, దానికి ఊళ్ళో బేరాలు కాకండా, ఇలా దూరం ఎల్తే నచ్చదండి...సాయంత్రమయ్యేతలికి ఇంటికి ఎల్లకపోతే ఊరుకోదు. జట్టీ యెట్టేస్తది. నేనంటే పేణం దానికి...” ముసిముసిగా నవ్వుతూ చెప్పాడు, సింహాచలం. “పెళ్ళాలంతా అంతేలే, వట్టి సెంటిమెంటల్ ఫూల్స్...” తనూ నవ్వాడు, శ్రీహరి. భీమిలీ ఊరి చివరనున్న అమర్ బంగ్లా దగ్గరకు చేరేసరికే బాగా చీకటి పడిపోయింది. గేటు దగ్గర ఉన్న గూర్ఖాకు తానెవ్వరో చెబితే, అతను ఇంటర్ కమ్ లో అమర్ తో మాట్లాడి, గేటు తెరిచాడు. ఇంటి ముందు కారు ఆగగానే, ఇద్దరు నౌకర్లు పరుగుపరుగున వచ్చి, శ్రీహరి చేతిలోని సూట్ కేసును అందుకున్నారు. వరండాలో నిలబడి, ఆత్రంగా ఎదురు చూస్తున్న అమర్, శ్రీహరి క్యాబ్ లోంచి దిగగానే ఒక్క ఉదుటున ముందుకు వచ్చి, సజల నేత్రాలతో అతన్ని కౌగలించుకున్నాడు. ఆ పరిష్వంగం లోని ఆత్మీయానురాగాలను ఆస్వాదిస్తూ, “అమర్...అమర్...” అన్నాడు, ఆర్తిగా శ్రీహరి. ఏదో తెలియని ఉద్వేగంతో భారమైపోయింది అతని గొంతు. క్యాబ్ ను పంపించేసి, మిత్రుడి భుజాల చుట్టూరా చేయివేసి, ఆప్యాయంగా నడిపిస్తూ, ఇంటిలోపలికి తీసుకు వెళ్ళాడు, అమర్. ఇద్దరూ హాల్లో సోఫా మీద పక్కపక్కనే కూర్చున్నారు. అమర్, శ్రీహరి చేయిని వదలకుండానే...పనిమనిషిని పిలిచి మంచి నీళ్ళు తెప్పించాడు. హాలంతా కలయజూస్తున్న శ్రీహరి చూపులు ఎదురుగా కనిపిస్తున్న ఫోటో మీద ఆగిపోయాయి. లైఫ్ సైజ్ లో ఎదురుగా సజీవంగా నిలబడినట్టే ఉంది, భవానీ రూపం. నుదుట గుండ్రంగా తీర్చిదిద్దిన ఉదయ భానుడి లాంటి కుంకుమ బొట్టుతో, కళకళ లాడే పూర్ణ చంద్రబింబం వంటి ప్రసన్న వదనంతో, లక్ష్మీదేవిలా చిరునవ్వుతో చూస్తోందామె. ఆ ఫోటోకి వేసి ఉన్న గుబాళించే గులాబీల దండ, నిశ్చలంగా స్టాండ్ లో వెలుగుతున్న దీపకళిక, సుగంధ ధూపాలు వెదజల్లుతున్న అగరు వత్తులు మాత్రం, ఆమె స్వర్గస్థురాలైందని అన్యాపదేశంగా చెబుతున్నట్టున్నాయి. “చూడరా... చూడు...హరీ... నా భవానీ నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయింది...” శ్రీహరి భుజమ్మీద తలపెట్టుకొని ఒక్కసారిగా భోరుమన్నాడు, అమర్.  చెట్టంత మనిషీ అలా కుదేలైపోయి కుమిలిపోతుంటే, శ్రీహరి గుండె చెరువైపోయింది... “ఛ! ఊరుకోరా... ఇదేమిటీ చిన్నపిల్లాడివా? పుణ్యాత్మురాలురా... పిలుపు వచ్చింది, వెళ్ళిపోయింది... ఇవ్వాళ తను, రేపు మనమైనా అంతే కదరా?” మెత్తని మాటలతో మిత్రుణ్ణి ఓదార్చసాగాడు, శ్రీహరి. “ఒరేయ్ హరీ, రాక రాక నా దగ్గరకు వచ్చావు... ఒక్క రెండురోజులు నాతోనే ఉండి వెళ్ళవూ, నేను నీతో చెప్పుకోవలసినవి చాలా ఉన్నాయి...” దిగులుగా అడుగుతున్న మిత్రుడిని చూస్తూంటే మనసు మూగవోయింది, శ్రీహరికి. అప్రయత్నంగా తలూపాడు, అంగీకార సూచకంగా. “రారా, భోజనం చేద్దాం... ఎప్పుడనగా తిన్నావో, ఏమిటో... ఆ...పైడమ్మా, వంటంతా పూర్తయిందా? త్వరగా ఏదైనా స్వీట్ చెయ్యి...” అంటూ హడావుడి పడుతున్న అమర్ ను పరిశీలనగా చూసాడు శ్రీహరి.  అధికారిక హోదా తెచ్చిన ఠీవితో, నిండుగా, ఆరోగ్యంగా ఉండే ఆజానుబాహుడైన అమర్, ఈనాడు ఒరుగులా ఎండిపోయినట్టైపోయాడు. ప్రతిరోజూ మద్యం సేవిస్తున్న సూచనగా, కంటి కింద నల్లని వలయాలు, ‘ఉబ్బు సంచులు’ ఏర్పడ్డాయి. ముఖంలో జీవకళ అసలే లేదు. ‘భవానీ మరణం వీడిలో ఇంత శూన్యాన్ని సృష్టించిందా?’ బాధగా అనుకున్నాడు, శ్రీహరి. భోజనాలు పూర్తయ్యాక, బాల్కనీలో కూర్చున్నారు మిత్రులిద్దరూ... ఎదురుగా అనంత జలరాశి... అమావాస్య దగ్గర పడుతున్నదేమో, సాయంత్రం అంతగా మనసును అలరించిన సింధువే, ఇప్పుడు చిమ్మ చీకట్లో నల్లని భూతంలాగా కనిపిస్తూ, భయోత్పాతాన్ని కలిగించేలా ఉంది. ఆ కెరటాల హోరు ఓ ఉన్మాదపు స్త్రీ దుఃఖంతో చేస్తున్న హాహాకారాల్లా వినిపిస్తోంది.     “ఏరా, అమర్ ఏమిటిలా అయిపోయావు? భవానీ మీద బాగా బెంగ పెట్టుకున్నావు కదూ?” లాలనగా అడిగాడు, శ్రీహరి.     “అవునురా, హరీ... భవానీ విలువ తను ఉన్నప్పటికన్నా, వెళ్ళిపోయాకే నాకు బాగా తెలిసింది. ‘పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు’ అన్నారు ఆత్రేయ గారు. కానీ బ్రతికున్నప్పుడు కూడా భవానీ మంచిదే. ఆ మంచితనాన్ని గుర్తించలేని గుడ్డివాణ్ణయ్యాను నేను. నిజానికి భవానీ అనారోగ్యంతో మరణించిందని అనే కన్నా, నిర్లక్ష్యంతో హత్య చేయబడిందని అనటమే మేలు... ఆ హంతకుడిని నేనే...” అపరాధిలా తలదించుకున్నాడు, అమర్. “ఏమిట్రా, నీ పిచ్చికాని...కాలం తీరిపోయింది, చెల్లాయి వెళ్ళిపోయింది... అంతే! ప్రతీదీ నీకు ఆపాదించుకొని,  మానసికంగా క్రుంగిపోతే ఎలారా? గుండె దిటవు చేసుకొని, ఆ విషాదం లోంచి బయటపడకపోతే చాలా కష్టం కదరా?” అనునయించాడు, శ్రీహరి.     “హరీ... నా మనసును చాలా కాలంగా కొండంత బరువు అదిమివేస్తోంది. అది ఎవ్వరి దగ్గరా విప్పి చెప్పేది కాదు. నీకు మాత్రం చెప్పాలని అనిపిస్తోందిరా... వింటావా?” “అమర్, నిన్ను ఈ దుఃఖ భారం లోంచి లాగేందుకు ఏమైనా చేస్తానురా, చెప్పు... వింటాను...” *** “హరీ, భవానీకి కాన్సర్ అని, త్వరలో ఆమె నాకు దూరమైపోబోతుందన్న విషయం తెలిసిన క్షణాన నేను మంచులా ఘనీభవించిన సముద్రాన్నే అయిపోయానురా...నా మెదడు పూర్తిగా మొద్దుబారిపోయింది. తనకు చికిత్స చేస్తున్నా, అది కేవలం తాత్కాలిక ఉపశమనం కోసమేనని, చివరి రోజుల్లో తను ఎంతో ప్రశాంతంగా ఉండాలని డాక్టర్లు చెప్పారు. అది విన్నాక నా మనసులో భరించలేని ‘అసహనం’... ఏమీ చేయలేని ‘అసహాయత’...అసలే నాకు కోపం చాలా ఎక్కువ అని నీకు తెలుసుగా? పిల్లలు ఇద్దరూ మన దేశంలో లేరు... ఇక్కడ మేము ఇద్దరమే... ఇంకొన్నాళ్ళు పోతే...నేను ఒక్కడినే... ఇలా చేయటం ఆ దేవుడికి న్యాయమేనా? ఏదో తెలియని ఉక్రోషంతో దేవుడి గదిలోకి వెళ్ళి, ఆయనపై గట్టిగా అరిచాను... నిలదీసాను... ఏడ్చాను... భవానీ తన ఆరోగ్య పరిస్థితి తనకు తెలిసి కూడా ధైర్యంగానే ఉంది కాని, నేను మాత్రం అలా ఉండలేకపోయాను.     ఉదయం కాసేపు, సాయంత్రం కాసేపు...భవానీ గదిలో తన దగ్గరే పెద్ద విషాద పర్వతాన్ని మోస్తూ కూర్చునే వాడిని. భవానీయే ఏవో కబుర్లు చెబుతూ ఉండేది కానీ అవి నా మనసుకు ఏ మాత్రం ఉల్లాసాన్ని కలిగించేవి కాదు... ఒక రోజు రాత్రి భవానీకి ‘గుడ్ నైట్’ చెప్పి, ఆమెను చూసుకునే పైడమ్మకు జాగ్రత్తలు చెప్పి, నా గదిలోకి రాబోతుంటే, నన్ను వెనక్కి పిలిచిన భవానీ నాకు ఓ కేసెట్ ఇన్ సర్ట్ చేసిన తన పాకెట్ టేప్ రికార్డర్ నా చేతికిచ్చి, వినమని కోరింది.     భవానీ దగ్గర ఎప్పటెప్పటివో ‘ఆడియో కేసెట్స్’ ఉండేవి. వాటిని ఎప్పుడూ తన మినీ టేప్ రికార్డర్ లో పెట్టుకొని వింటూ ఉండేది. ఎంపీత్రీ లు, డీవీడీ ప్లేయర్లు వచ్చిన తర్వాత కూడా వెనుకటి కాలం లో లాగ ఈ కేసెట్లేమిటని ఆమె మీద విసుక్కునే వాడిని. ‘ఇప్పుడు ఈ కేసెట్ లో ఏముందో?’ అనుకుంటూ, ‘ప్లే’ బటన్ నొక్కాను. నిశ్శబ్దంగా తిరుగుతోంది టేప్... రెండు నిమిషాలు గడిచాయి... ఏం రావటం లేదు... అసహనంగా ఆఫ్ బటన్ నొక్కబోతుండగా భవాని గొంతు వినిపించింది. ‘అమ్మూ!’ మృదు మధురంగా వినిపించిన ఆ పిలుపుకు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను నేను. “అమ్మూ... అబ్బ, ఎంతకాలమైంది అమ్మూ, నిన్నిలా పిలిచి? నన్ను మనసారా ప్రేమించి, నన్ను స్వంతం చేసుకోవటం కోసం తన అమ్మానాన్నల్ని సైతం ఎదిరించిన నా ప్రేమికుడిని నేను ముద్దుగా పిలుచుకొనే పేరిది.  చాలా కాలంగా నా మనసులో పేరుకుపోయి, నోరు తెరిచి ఇప్పటివరకూ నీకు చెప్పలేకపోయిన విషయాలను ఇప్పుడు చెప్పుకోవాలని అనిపిస్తోంది. దయచేసి, ఈ టేప్ చివరివరకూ వింటావు కదూ?     ఎంత బాగుండేవి అమ్మూ, ఆ రోజులు? ఒకరి కళ్ళలోకి మరొకరం చూసుకుంటూ, ఒకరి కోసం మరొకరమై బ్రతికిన ఆ బంగారు రోజులు... పిల్లలు పుట్టే వరకూ మన అనురాగం అలా అపురూపంగానే ఉన్నది.  నాకోసం నువ్వు అల్లాడిపోయిన ఆ రోజులను తలచుకుంటే, ఇప్పటికీ అదే ఇష్టం తో నా మనసు పులకరిస్తోంది.  ఆ రోజులలో అలా రెప్పవేయకుండా నీవు నా వైపే చూస్తూంటే, నీ కళ్ళలోంచి ప్రేమ సుధాధార ఉవ్వెత్తున పొంగి, పొరలి నన్ను తడిపివేసేది.     వింటావు తర్వాత నీ ఉద్యోగంలో నువ్వు మెల్లగా ఎదగటం మొదలైంది. పదోన్నతులకోసమని ఎప్పుడూ పరీక్షలకు చదువుకోవటం, ఇంటర్ వ్యూలకు తయారవటం... వీటితో చాలా శ్రమ పడుతూ ఉండేవాడివి. నువ్వు చదువుకొనేటప్పుడు నీతో కలిసి నేనూ మేలుకొని ఉండటం, నీకు నిద్ర రాకుండా ఉండేందుకు ‘టీ” కాచి ఇవ్వటం లాంటి పనుల్లో ఎంతో ఆనందాన్ని అనుభవిస్తూ ఉండేదాన్ని. నీ నిరంతర కృషి ఫలితంగా వరుసపెట్టి నీకు ప్రమోషన్లు రావటం మొదలైంది.     నీ హోదా, అధికారం పెరిగే కొద్దీ, నువ్వు నాకు మెల్లమెల్లగా దూరమవటమనేది ఆరంభమైంది. అసలు నీ ప్రమేయమంటూ ఏమీ లేకుండానే అలా జరిగిపోయింది. నువ్వు నీ సిబ్బందిపై చూపించే ‘అధికారం’ ఇంట్లో కూడా ఆరంభమై, ‘మమకారం’ మరుగున పడిపోవటం మొదలైంది. ఇంట్లో నువ్వున్నంతసేపూ, నేను నీ చుట్టూనే తిరుగుతూ, నీకు కావలసినవన్నీ అమర్చుతూ, నీకు ఇష్టమైన వంటకాలు వండి, కొసరి కొసరి తినిపిస్తూ ఉండేదాన్ని. నీ పనుల వత్తిడికి, ఆఫీసులోని సమస్యలకూ నీలో కోపం, అసహనం బాగా పెరిగిపోయేవి. ఏ విషయంలోనైనా సరే, అడిగినది వెంటనే చేయకపోయినా, కావలసినది తక్షణమే అందించకపోయినా కోపంగా గట్టి గట్టిగా అరిచేయటం, చేతిలోని వస్తువులను విసిరికొట్టటం మొదలుపెట్టావు... ఒళ్ళు తెలియని కోపంలో ఒక్కోసారి నా మీద చేయి చేసుకోవటం కూడా...     సారీ అమ్మూ! నేను నిన్ను నిందించటం లేదు... నా ఆవేదన చెబుతున్నానంతే... అప్పట్నుండీ నాకు నీ మీద ఉన్న ప్రేమ, ఆరాధనలతో పాటుగా వాటిని అధిగమించేంత అధికమైన భయం, బెంగ కూడా మొదలయ్యాయి.     మన పిల్లలను నువ్వు క్రమశిక్షణ పేరుతో, ఏనాడూ నీ దగ్గరకు రానీయలేదు. అందుకే, ఇప్పుడు వాళ్ళిద్దరూ విదేశాల్లో స్థిరపడిపోయి, మనలను తలవటం కూడా మానేసారు... అయితే, నీ కాఠిన్యం వల్ల మాలో చనువు తగ్గిపోయి, భయం మొదలైంది.  నీ చుట్టూ, నువ్వొక ‘వలయం’ గీసుకొని అది దాటి బయటకు నువ్వు రాకుండా, మమ్మల్ని లోపలికి రానీయకుండా ఉంచటం... ‘కూడనిది’ అని చెప్పాలని నేను ఎంత ప్రయత్నించినా నువ్వా అవకాశం సైతం ఇచ్చేవాడివి కాదు.     అసలు మన అలవాట్లేమో పరస్పర విరుద్ధాలు... నాకేమో రాత్రి పదిగంటలకల్లా పడుకొని, తెల్లవారు ఝామునే లేవటమంటే చాలా ఇష్టం, అలవాటు. నీకేమో రాత్రంతా కంప్యూటర్ లో పని చేసుకొని, ఉదయం ఆలస్యంగా లేచి హడావుడిగా ఆఫీసుకు పరుగు తీయటం అలవాటు. ఇంటి పనులయ్యాక, కాస్త సమయమంటూ దొరికితే, ఏదైనా పుస్తకం చదవటమో, లేక పాటలు వినటమో నాకు అలవాటు... నీకైతే సమయం దొరకటమే అపురూపం, దొరికినా టీవీకి అతుక్కుపోవటమంటే చాలా ఇష్టం.     నీకు విపరీతమైన కోపం... కోపమంటే కేవలం అరవటమే కాదు... ఆ పనైపోయాక, రోజుల తరబడి మాటలు మానేస్తావు. అసలు నువ్వు ఎందుకు ముభావంగా ఉన్నావో, నా అపరాధమేమిటో తెలియదు, తెలియనీయవు. ఆ ముభావత ఎన్నిరోజులు కొనసాగుతుందో కూడా తెలియదు. మాటకలపబోతే కసిరి కొడతావు. జన్మ జన్మల తరబడి మన మధ్య ఏదో బద్ధ శత్రుత్వం ఉన్నట్టే ప్రవర్తిస్తావు. ప్రసన్నంగా పలకరించబోతే, ‘ఒంటరిగా ఉండనీ’ అంటూ కస్సుమంటావు... నా మనసు ముడుచుకుపోతుంది, దుఃఖం ముంచుకొస్తుంది. అసలు నీ మూడ్ ఎందుకు పాడైందో, ఆఫీసులో ఏదైనా సమస్య వచ్చిందో ఏమీ చెప్పవు, నాకు తెలియనీయవు. మళ్ళీ నీ అంతట నీవు అందులోంచి బయటకు వచ్చి, మామూలుగా మారవలసిందే తప్ప, అందులోంచి నిన్ను లాగటం మాత్రం నా తరం కానే కాదు.     ఆలుమగల మధ్యన ఉండవలసింది, ‘పరస్పర స్నేహం’ అమ్మూ... ప్రేమించి, పెళ్ళాడిన నీకు అది తెలియదా? ఉహు, తెలియక కాదు కానీ, ‘ఆగ్రహం’ అనే నీ పెద్ద బలహీనతను నీవు జయించలేకపోతున్నావు...అంతే...     అలాగే, నేనెప్పుడూ నవ్వుతూ ఉంటాననీ, ఇంట్లో ఉండి రిలాక్స్ అయిపోతున్నాననీ, నువ్వేమో ఆఫీసులో ఉంది చాలా భారం మోసేస్తున్నావని నీకో పెద్ద ఫీలింగ్. నీకున్న వత్తిడి నాకు లేదని నా మీద ‘అసూయ’. నువ్వు ఆఫీసులో కష్టపడి జీతం సంపాదించి తెస్తున్నావు. నేను పిల్లల్ని పెంచుతూ, ఇల్లు చూసుకుంటూ, మీకు కావలసినవి అమరుస్తూ... నేను... నేను కూడా కష్టపడుతున్నాను అమ్మూ... ‘మనమిద్దరమూ ఒక్కటే...’ అన్న భావన నీకెందుకు కలగదు?     నేను జడలో పూలు పెట్టుకుంటే పల్లెటూరి బైతునని ఎగతాళి చేస్తావు... చేనేత చీర కట్టుకుంటే పనిమనిషిలా ఉన్నానని వెక్కిరిస్తావు... కారణం అవి నీకు నచ్చవు కాబట్టి... పెళ్ళికి ముందు, నేను ఓ ‘అక్షరం’ వ్రాసినా అదో గొప్ప వాక్యమని నన్ను ఆకాశానికి ఎత్తేసిన నువ్వే...ఈ మధ్య నా కవిత ఒకటి పత్రికలో పడిందని చూపించబోతే చదవలేదు సరికదా, ‘తెలుగు పత్రికలకు ఎంత గ్రహచారం పట్టింది?’ అని వెటకారంగా ఓ నవ్వు నవ్వి, అక్కడినుంచి వెళ్ళిపోయావు... నీకు తెలుసా, ఆ క్షణం నేనెంత నరకయాతనతో విలవిలలాడిపోయానో... కాలం నీలో ఎంతటి రాక్షసుడిని పెంచింది?     అసలు, అకారణంగా నువ్వు నన్ను తిట్టినా నీ దగ్గర సాధ్యమైనంత మౌనంగానే ఉంటాను... కోపం చల్లబడితే నువ్వే మామూలుగా అయిపోతావని... కానీ ఆ శాంతం కూడా నీకు నా బలహీనతలాగానే కనబడి, అదో ‘నిర్లక్ష్య ధోరణి’ అనుకునే స్థితికి వచ్చి, మాటల ఈటెలతో మరింతగా నన్ను బాధిస్తున్నావు. నిజానికి అపర దూర్వాసుడి లాంటి వాడి పెళ్ళాం కన్నా, పచ్చి తాగుబోతువాడి పెళ్ళామే ఒకింత అదృష్టవంతురాలు... ఎందుకంటే, తాగుడు వల్ల వచ్చే విపరీత ప్రవర్తన ఆ ‘మత్తు’ దిగేదాకానే... కోపిష్టివాడి వాచాలతో? అది నిత్యాగ్నిహోత్రం...మమ్మల్ని దహించేందుకు.     నీ ఆఫీసు టూర్లు, మీటింగులు, సుపీరియర్లు, సబార్డినేట్లు... క్రమంగా నువ్వు ఎక్కే మెట్లు... ఈ ‘విజయపరంపర’ లో పయనిస్తూనే ఉన్నావు... నన్నూ నీతో ఉండనిచ్చావు... అయితే అది నీ సంతోషాన్ని నాతో పంచుకోవటం కోసం మాత్రం కాదు. నీ అవసరం కోసం.... నువ్వు క్యాంప్ కి వెళ్ళాలంటే, నేనే నీ సూట్ కేసును సర్దాలి... నీ ఆఫీసు ఫంక్షన్స్ లో నీ భార్యగా పక్కనే ఉండాలి... నీ స్టాఫ్ తో పిక్నిక్కులకు నేను కూడా రావాలి... అందరికోసం, పెదవులపై ప్లాస్టిక్ చిరునవ్వులు అతికించుకొని నటించాలి... ఇవన్నీ నీకోసం నేను చేయాలి...     కానీ, నాతో గుడికి రమ్మంటే నీకు తీరిక దొరకదు. ఏదైనా ఊరు ఇద్దరం కలిసి వెళదామంటే నీకది బోర్ అంటావు. నా ఇష్టాలను మన్నించటమనేది నీకెప్పుడూ అయిష్టమే...     ఎన్నెన్ని ఉదయాలు? చెన్నై లోని మన ఇంటి బాల్కనీలో కూర్చుని, పొగలు కక్కే కాఫీ రుచిని ఆస్వాదిస్తూ, సముద్రగర్భంలోంచి ఉదయించే బాలభానుడి సౌందర్యాన్ని  ఇద్దరం కలిసి చూడాలని, ఆ మధుర క్షణాలను హృదయంలో పదిలపరచుకోవాలని ఎంతగా తపించిపోయేదాన్నో తెలుసా నీకు? కానీ, ఆ ఆస్వాదన ఎప్పుడూ నే ఒంటరిగానే...     ఇష్తమైన పాటను వినాలన్నా, నేనొక్కదాన్నే... మంచి పుస్తకం చదవాలన్నా, నేనొక్కదాన్నే... పిల్లలకు ఆరోగ్యం బాగుండకపోతే... హాస్పిటల్ కి వాళ్ళతో నేనొక్కదాన్నే... స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ కీ నేనొక్కదాన్నే... చివరికి మన పుట్టినరోజులకూ, పెళ్ళిరోజులకూ ఇద్దరం కలిసి, ఏ అనాథశరణాలయానికో, వృద్ధాశ్రమానికో వెళ్ళి వాళ్ళకేమైనా ఇవ్వాలని నాకు అనిపిస్తే, అలాంటి ప్రదేశాలకి రావటం నీకు చికాకు కాబట్టి, నీ ఔదార్యం కొద్దీ నన్ను మాత్రం అభ్యంతరపరచవు కనుక అక్కడికీ, నేనొక్కదాన్నే...     అసలు నేనంటే నీకు ప్రేమ లేదు... అదిగో వచ్చేసింది నీకు...కోపం... ఎదురుగా ఉంటే అనేవాడివి... ‘అదేమిటి భవానీ, నువ్వంటే ప్రేమ లేదా నాకు? నేనసలు నిన్ను ప్రేమించనే లేదా? ఎన్ని సార్లు నిన్ను డిన్నర్లకు బయటకు తీసుకు పోలేదు? ఎంతెంత విలువైన డైమండ్ నగలను కొనివ్వలేదు?’ అని. నిజమే, నీకు నేనంటే చాలా ప్రేమ.. చాలా చాలా ప్రేమ! నాకు బ్యాంక్ లో ఓ పదిలక్షల రూపాయల డిపాజిట్ ఉండి, ఏం లాభం చెప్పు, నా చేతిలో పదిరూపాయలు లేకపోయాక? నీ మనసులో నామీద ఎంత ‘ప్రేమ’ ఉండీ ఉపయోగమేమిటీ, దాన్ని నీవు ‘వ్యక్తపరచలేకపోయాక’? పదిమందితో పాటుగా నీ హోదాలో నన్ను స్టార్ హోటల్స్ కి తీసుకుపోయి తిండి తినిపిస్తే నాకు కలిగే ఆనందం కన్నా, ఇదిగో, ఈ బాల్కనీలో కూర్చుని పెరుగన్నంలో పచ్చడి నంజుకుంటూ ఇద్దరం ‘కలిసి’ తినటమే నాకు ఎనలేని తృప్తిని ఇస్తుంది.     అసలు నిజానికి నువ్వో అద్భుత ప్రేమికుడివి. కాని, నువ్వు ప్రేమించేది నన్ను కాదు... ‘నిన్ను’! అవును నిన్ను నీవు ప్రేమించుకోవటమనేది నీకు చాలా ఇష్టమైన వ్యాపకం... నన్ను నీతో బయటకు తీసుకువెళ్ళాలని నీకు బలంగా అనిపిస్తే, ఆ సమయంలో నాకు ఇష్టం లేకున్నా, తీరిక లేకున్నా, అలసటగా అనిపించినా సరే... అది నీకిష్టమైన పని కనుక తీసుకెళ్ళి తీరతావు. అలా... ‘నన్ను నీవు ప్రేమిస్తున్నావు...’ అనే భావనను నువ్వు మరింతగా మనసారా ప్రేమిస్తున్నావు... నీ అంతరంగాన్ని సంతుష్టి పరచేందుకు మాత్రమే కాని నీ ఎదుటనున్న నాకోసం మాత్రం కాదు.     ఇప్పుడు నీకు కోపం, బాధ కలుగుతున్నాయి... నాకు తెలుసు.... కాని... కాని ఒక్కసారి నీ మనిషిని అయిన నాగురించి, మనసుతో ఆలోచించు... అప్పుడు నీకు నా మీద అంతులేని ప్రేమ, ఆప్యాయత, కరుణలు కల్గుతాయి.. ఇన్నాళ్ళు నేనేం కోల్పోయానో అర్థమౌతుంది... నీ పదవీవిరమణ కోసం వేయి కళ్ళతో ఎదురుచూసాను. ఇన్నాళ్ళు నీ పని వత్తిళ్ళ వల్ల, ఊపిరాడని నీ దినచర్య వల్ల నాతో కలసి గడపలేకపోయావు.... ఇక ఫరవాలేదు... మనమిద్దరం, ఈ జీవనసంధ్యలో హాయిగా మళ్ళీ పాత రోజులను పొందవచ్చనీ, హాయిగా గడపవచ్చనీ ఎన్నెన్నో కలలు కన్నాను... ఆ ‘అదృష్టం’ ఎక్కడిదీ నాకు? నేను శాపగ్రస్తను అమ్మూ... అల్పాయుష్కురాలిని... ఏ జన్మలో ఏ పాతకానికి ఒడిగట్టానో మరి, ఆ మహా పాపం ఈ జన్మలో ఇలా కాన్సర్ రూపంలో నా ప్రాణాలు లాక్కెళ్ళిపోతోంది... నా ప్రాణానికి ప్రాణమైన నిన్ను నాకు దూరం చేసేస్తోంది... భగవంతుడు ఒక్క అవకాశమిచ్చి, ఒక్క రెండేళ్ళైనా నన్ను నీతో ఉండనీయకూడదు? ఉహు, అది జరగదని సుస్పష్టంగా తెలిసినా ఏదో ఒక పిచ్చి ఆశ!     ఒక ప్రార్థన అమ్మూ... ఒకరకంగా చివరికోరికని అనుకో... చంద్రుడిలోని మచ్చల్లా నీలో ఆ ‘ఆగ్రహం’, ‘అసహనం’... వీటిని సాధ్యమైనంతవరకూ నీలోనుంచి తొలగించుకోవటానికి ప్రయత్నించు... ‘ధ్యానాభ్యాసం’, నిరంతర సాధన చేయటం ద్వారా అది సాధ్యమే.. ఇప్పటివరకూ నా మాట వినకపోయినా, ఇప్పుడైనా దయచేసి మొదలుపెట్టు... ఎందుకంటే, రేపు నేను వెళ్ళిపోయాక, నిన్ను చూసుకోవటానికి మన బంధువులు కాని, నౌకర్లు కాని నిన్ను తిట్టుకుంటూ కాకుండా, నీ మంచితనం గుర్తించి, మనస్ఫూర్తిగా ముందుకు రావాలి... ‘నోరు’ మంచిదైతేనే కదా ఊరు మనదయేది? నీ కోపాన్ని భరించే శక్తి నీ ఇల్లాల్నైనందుకు నాకు మాత్రమే ఉంటుంది, కాని అందరికీ ఎందుకుంటుంది? అదొక్కటి గమనించుకో...     చివరగా ఒక విన్నపం... ఈ అస్తమయ సమయంలో... నన్ను నొప్పించే విధంగా కాకుండా, కొంచెం సౌమ్యంగా, శాంతంగా ఉంటూ, సాధ్యమైనంత ఎక్కువ సమయం నాతో గడపవూ? అది నాకు ఎంతో సాంత్వన ను కలిగిస్తుంది అమ్మూ... నీ మెడ చుట్టూ నా చేతుల్ని హారం లాగా వేసి, నీ భుజమ్మీద తలవాల్చి, నీ చెవిలో గుసగుసగా చెప్పాలని ఉంది... ఐ లవ్ యూ! యస్... ఐ లవ్...యూ...” టేప్ లో మాటలు ఆగిపోయి, సన్నగా వెక్కిళ్ళు వినబడసాగాయి... భవానీ ఏడుస్తోంది... నా భవానీ దుఃఖిస్తోంది. ఆ తర్వాత టేప్ ఆగిపోయింది.     అప్పుడు మొదలైందిరా హరీ, నాలో పశ్చాత్తాపం...నాలోని బలహీనతలను జయించి తీరాలన్న పట్టుదల కూడా... కాలాన్ని ఒక్కసారి ‘రీవైండ్’ చేయగలిగే వరాన్ని భగవంతుడు నాకు అనుగ్రహిస్తే, భవానీకి నాతో కలిసి నడిచిన దారంతా పూలబాటను చేయగలను... నాతో గడపిన జీవితమంతా ఆనంద లహరి చేయగలను... కాని... కానీ... ఇటీజ్ లేట్... టూలేట్!     ఆ తర్వాత నేను ఒక్క క్షణాన్ని కూడా వృధా చేయలేదురా హరీ... ప్రతీ క్షణం ఆమెతో ఆనందంగా గడిపాను... భవానీకి ఆనందం కలిగించే పనులన్నింటిలోను భాగాన్ని పంచుకున్నాను... ఆమె ఎప్పటినుండో వెళ్ళాలని అనుకుంటున్న ‘కన్యాకుమారి’ కి తీసుకు వెళ్ళాను... అక్కడినుంచి వచ్చిన వారం రోజుల తరువాత నిద్రలోనే ప్రశాంతంగా వెళ్ళిపోయిందిరా నా భవానీ...” సజల నేత్రాలతో చెప్పటం ముగించాడు, అమర్.     వింటున్న  శ్రీహరి హృదయం ఎంతో ఆవేదనకు లోనయింది. ఆ విషాదగాథ వింటూ ఉంటే, అప్రయత్నంగా తన భార్య రమణి మనసులో మెదిలింది... తను మాత్రం, అమర్ కన్నా ఏ విధంగా మెరుగని? రమణి అభిరుచులన్నీ తనకు ‘సిల్లీ’గానే అనిపిస్తాయి...ఆమె ఇంటర్నెట్ లో పాత ‘చందమామ’లు చదువుకొంటూ ఉంటే అది తనకు చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది... చిన్నప్పటి జ్ఞాపకాలు నెమరువేసుకుంటుంటే మూర్ఖత్వమనిపిస్తుంది... ఓహ్... ‘భార్యలు’ కూడా తమలాంటి వారేనన్న సత్యం భర్తలకు ఎందుకు తోచదు? తనలోనికి తాను తరచి చూసుకుంటూ, తల విదిలించాడు శ్రీహరి.     “ఏమిట్రా హరీ, నీ స్నేహితుడి మీద నీకు చాలా అసహ్యంగా ఉంది కదూ?” పేలవంగా నవ్వుతూ అడిగాడు, అమర్. “ఛ! అదేంటి అమర్... ఆ మాటకొస్తే నూటికి డెబ్భయ్ శాతం భర్తలం అలాగే ఉంటాము... మన నాన్నల కాలం నుండీ అంతే... ఏది ఏమైనా, చివరికి నీ తప్పు నీవు తెలుసుకున్నావు... చివరి రోజుల్లో భవానీ మనసును ఆహ్లాదపరచావు... కానీ, జరిగినదానికి నీవు బాధపడుతూ, తాగుడుకు బానిస కావటమే నాకేమీ నచ్చటం లేదు... నువ్వు వ్యసనానికి లోనవటం భవానీకి నచ్చే విషయమా?” కించిత్ మందలింపుగా అన్నాడు, శ్రీహరి.     “కాదులేరా, నా భవానీని మర్చిపోలేక, ఆమె లేదన్న బాధను తట్టుకోలేక తాగుతున్నానంతే... మానెయ్యటానికి ప్రయత్నిస్తానురా.. అయినా, ఇప్పటివరకూ నాలో  ఉండి, నన్ను తొలిచివేస్తున్న నా ‘అపరాధభావన’ అంతా నీతో చెప్పేసాక మనసు చాలా తేలికైపోయినట్టుందిరా... నేను ఇక్కడే మా పొలాలున్న స్థలంలో ఒక వార్థక్య ఆశ్రమాన్ని నిర్మిస్తున్నాను. అది పూర్తి అయ్యాక, అక్కడికే తరలి వెళ్ళిపోయి, నాలాంటి వారి మధ్యే, ఆధ్యాత్మిక జీవనాన్ని కొనసాగించాలని అనుకుంటున్నానురా...” చెప్పాడు, అమర్. మిత్రుడి నిర్ణయానికి ఎంతో సంతోషించాడు, శ్రీహరి. ***     శ్రీహరి ప్రయాణిస్తున్న విమానం సింగపూర్ లోని ‘ఛాంగీ అంతర్జాతీయ విమానాశ్రయం’ లో ల్యాండ్ అవబోతోంది. త్వరగా ఇంటికి చేరుకోవాలనీ, తాను భారతదేశం నుండి తెచ్చిన ‘కానుక’ ను భార్యకు అందించి, దాన్ని చూడగానే ఆమె కళ్ళల్లో దేదీప్యమానంగా వెలిగే దీపావళి కాంతుల్ని తనివితీరా చూసి, మురిసిపోవాలని ఆరాటంగా ఉందతనికి... తన ఒడిలో ఉన్న హ్యాండ్ బ్యాగేజ్ లోని ‘శరత్ సమగ్ర సాహిత్యం’ పుస్తకాల బంగీని ఆప్యాయంగా తడుముకున్నాడు శ్రీహరి, తన రమణిని  ప్రేమగా తలచుకొంటూ...  - నండూరి సుందరీ నాగమణి    

గుండెకీ గుబులెందుకు!

  గుండెకీ గుబులెందుకు!     "అదేమిటి అట్లా కూర్చున్నావు?" బాత్ రూం నుంచి వస్తూ, మంచం మధ్యలో గడ్డం కింద చేయి పెట్టుకొని మూడీగా కూర్చున్న సుజాతను అడిగాడు అర్జున్. అతని ప్రశ్న ను పట్టించుకోకుండా "పాపం మీకు మీ నాన్న అన్యాయం చేసారు కదూ ?"విచారంగా అంది సుజాత. "మా నాన్న నాకేమి అన్యాయం చేసాడు ? పొద్దున్నే లేవగానే నీకా అనుమానం ఎందుకు వచ్చింది?"అడిగాడు అర్జున్. "మీ అన్నయ్య కేమో తెలివిగల, పనిమంతురాలైన అమ్మాయిని ఇచ్చి పెళ్ళిచేసారు.అందరూ ఆమె తెలివితేటలని మెచ్చుకుంటున్నారా లేదా? మీ తమ్ముడి కేమో అదృష్ఠవంతురాలిని ఇచ్చి చేసారు. అందరూ ఆమె వచ్చినప్పటి నుంచి మీ తమ్ముడి దశ తిరిగిందని అన్నీ కలిసొస్తున్నాయని అంటున్నారాలేదా? మరి మీకేమిటి నాలాంటి తెలివితక్కువదాన్ని, అయోమయాన్ని ఇచ్చి చేసారు?" "ఏమి చేస్తాం ఒకొక్కరి తలరాత. ఐనా ఇప్పుడనుకొని ఏమిలాభం.ఎందుకిలా చేసాడో అడుగుదామంటే మానాన్నా లేడు."నవ్వుతూ అన్నాడు అర్జున్. "అంతే కాని , నువ్వూ తెలివిగలదానివే , అదృష్ఠవంతురాలివే అనరన్నమాట. అంతేలెండి , నేనంటే మీకు అలుసైపోయాను."కోపం గా అంటూ బాత్రూం లోకి వెళ్ళి ధఢాం అని తలుపేసుకుంది సుజాత. ఏదో జోక్ అనుకుంటే నిద్ర మంచం మీదే ఈ గొడవేమిటి అని బిత్తరపోయాడు అర్జున్. కాఫీ తెచ్చి ఇచ్చిన సుజాత ముభావంగా ఉండటం చూసి, "ఏమిటి సుజా జస్ట్ జోక్ చేసాను. ఐనా ఇంకా కోపం తగ్గలేదా?"అనునయంగా అడిగాడు అర్జున్. "మీకు నేనంటే జోక్ గానే ఉంటుంది.ఐనా మీకు నేనంటే ఎప్పుడు విలువ ఉంది గనుక."ఉక్రోషం గా అంటూ లోపలికి వెళ్ళిపోయింది. సెల్ రింగవుతుంటే అనాసక్తిగా అందుకుంది సుజాత. "హాయ్ అమ్మా ఏమి చేస్తున్నావు?" అటునుంచి అడిగింది అఖిల. "చేసేందుకు నాకేమైనా పనాపాడా .బాల్కనీ లో కూర్చొని ఏదో ఆలోచించుకుంటున్నాను."అంది సుజాత. "ఏమాలోచిస్తున్నావు? అడిగింది అఖిల. "పొద్దున్నే మీ డాడీ తో గొడవైంది. పాత గొడవలన్నీ గుర్తొచ్చి మూడ్ అంతా పాడైపోతోంది.అసలు నేనంటే ఎవరికీ అభిమానం , ప్రేమ , విలువ లేవు."దిగులుగా అంది సుజాత. "అమ్మా అట్లా ఎందుకనుంటావు?పాజిటివ్ గా ఆలోచించమని నీకెన్ని సార్లు చెప్పాను. గొడవలు కాదు , మంచి సంగతులు గుర్తు తెచ్చుకో."అంది అఖిల. "మంచి సంగతులా ఏమున్నాయి?" అంది సుజాత. "ఏమీ ఎందుకుండవు ?నీ చిన్నప్పటి సరదాలు, మేము పుట్టిన్నప్పటి వి , నీ పెళ్ళైన కొత్తల్లోవి , ఇలా గుర్తు తెచ్చుకోవాలే కాని ఎన్నైనా ఉంటాయి."నచ్చచెబుతున్నట్లు అంది అఖిల. ఏమి జవాబివ్వలేదు సుజాత. "ఒకే అమ్మా పని ఉంది ఉంటాను ." కాల్ కట్ చేసింది అఖిల. అఖిల చెప్పినట్లు సంతోషం కలిగించే విషయాలు ఆలోచిస్తూ ఉంటే, ఒక్కసారి అఖిల చిన్నపాపగా వున్నప్పటి సంగతులు గుర్తొచ్చాయి సుజాతకి. "మా బంగారు తల్లి ఎక్కడుందీ?"చేతిలొ వెండిగిన్నె పట్టుకొని, అఖిలను వెతుకుతూ పడకగది లోకి వచ్చింది సుజాత. మంచం కింద నుంచి "హంతీ దంతీ సాత్ ఆన్ ఏ వాల్" అని పినిపించింది. మంచం కిందికి తొంగి చూసింది. మంచం కింద , కాలు మీద కాలేసుకొని దర్జాగా పడుకొని రైం పాడుతోంది ఏడాదిన్నర అఖిల. "అమ్మలూ బయటకు రారా , ఆం తిందువుకాని."గారంగా పిలిచింది సుజాత. "ఊమ్హూ హంతీ , దంతీ సాత్ ఆన్ ఏ వాల్." అంది ముద్దుగా అఖిల. "బంగారుతల్లీ బయటకు వచ్చి పాడుకోరా."అని చిన్నగా బయటకు తీసింది. ఏడాదికే మాటలన్నీ వచ్చేసాయి .దాని వాగుడు చూసి ఎవరూ ఏడాది పిల్ల అని చెబితే నమ్మేవాళ్ళు కాదు. ముద్దు ముద్దుగా వసపోసిన పిట్టలా ఎన్నిమాటలు మాట్లాడేదో బుజ్జిపిట్ట. మురిపెంగా కూతురు గురించి అనుకుంటూ ఉంటే పెదవులమీదికి అలవోకగా చిరునవ్వు వచ్చింది సుజాతకు. "ఏమిటి మమ్మీ నీలో నువ్వే నవ్వుకుంటున్నావు?"అన్న అఖిల పలకరింపుకు ఈలోకం లోకివచ్చింది సుజాత."నువ్వెప్పుడొచ్చావు ? నేను చూడలేదు.రా కూర్చో.ఆఫీస్ లేదా?" అడిగింది. "ఉందమ్మా. ఈ రోజు కొంచం టైం ఉంది అందుకని ఇటొచ్చాను. "కూర్చుంటూ అడిగింది. "ఏమి లేదు నువ్వేగా చెప్పావు , ఎప్పుడూ పాజిటివ్ గా ఆలోచించు. సరదా సంగతులు , మంచి విషయాలు గుర్తు తెచ్చుకో అని. అదే ప్రయత్నం చేస్తున్నాను."అంది సుజాత. "గుడ్. " అంది అఖిల. "నువ్వెప్పుచ్చావురా..అమ్మలూ?నాకు మీటింగ్ ఉంది వెళ్ళాలి , ఇప్పుడు నీతో మాట్లాడలేను."అన్నాడు అర్జున్ బయటకు వస్తూ . "పర్లేదు డాడీ నేను కాసేపు కూర్చొని ఆఫీస్ కు వెళ్ళిపోతాను."అంది అఖిల. "మనం సాయంకాలం పరమేశ్వరావు ఇంట్లో పెళ్ళికి వెళ్ళాలి గుర్తిందిగా!"అని సుజాత కు చెప్పి వెళ్ళిపోయాడు అర్జున్.  కాసేపు తల్లి దగ్గర కూర్చొని కబుర్లు చెప్పి అఖిల కూడా వెళ్ళిపోయింది. సాయంకాలం పరమేశ్వరరావు గారి ఇంటి నుంచి వస్తూ "పెళ్ళి బాగా జరిగింది కదూ ? మనకు బట్టలు కూడా పెట్టారు."అన్నాడు అర్జున్. "ఊ"అంది ముక్తసరిగా సుజాత. "ఏమైంది?అలా ఉన్నావు. ఎవరైనా ఏమైనా అన్నారా?" "నన్నెవరేమంటారు? "విసురుగా అంది సుజాత. "మరి?"ప్రశ్నార్ధకంగా చూసాడు అర్జున్. "నేను..పెద్దదానిగా..కనిపిస్తున్నానా?అందరూ ఆంటీ ఆంటీ అనటమే.ఈ ఆంటీ పిలుపు ఏమిటోగాని పూలవాడి దగ్గర నుంచి దగ్గరవాళ్ళు..కూడా..ఆంటీనే! అంత పెద్దగా ఉన్నారు , వగలుబోతూ ఆంటీ అంటుంటే చిరాకొస్తుంది. "చికాగ్గా అంది సుజాత. "ఓస్ దానికేనా?నేనింకేమిటో అనుకున్నాను."అన్నాడు అర్జున్. "పైగా ఎక్కడికెళ్ళినా పార్వతీపరమేశ్వరుల్లా ఉన్నారు అని ఓ టాగ్ తగిలించేస్తారు.జరీ చీరలు పెడతారు.నేనంత పెద్దపేరమ్మలా ఉన్నానా ?"ఉక్రోషం గా అంది సుజాత. "అబ్బా దానికీ కోపమేనా ? అది మర్యాద.మనకు గౌరవం ఇస్తున్నారు.నీ కిష్టం లేకపోతే ఆ చీరలు కట్టుకోకు."అన్నాడు అర్జున్. "పెట్టేవాళ్ళంతా మనవాళ్ళు. కట్టుకోకపోతే బాధపడతారు.వెయ్యిరూపాయలకు తక్కువకాని చీరలు పెడుతారు.అలా అని కట్టుకోలేను, వేరే వాళ్ళకు పెట్టలేను. ఇన్ని కొత్త చీరలుండగా నా కిష్టమైనవి కొనుక్కోలేను." నిస్పృహగా అంది సుజాత. ఇదీ సమస్యేనా అన్నట్లు విచిత్రంగా చూసాడు అర్జున్. పొద్దున్నే సుజాత అరుపులతో మెలుకువ వచ్చింది అర్జున్ కు. లేచి బయటకు వచ్చి ఏమైందా అని చూసాడు.సుజాత పనిమనిషి మీద గట్టిగా అరుస్తోంది.లోపలికి వచ్చిన సుజాతతో "ఏమైంది సుజా అలా అరుస్తున్నావు ?"అని అడిగాడు. "చూడండి రెండు రోజులుగా రాలేదు. ఏమైంది అంటే పిల్లవాడి కి జ్వరం అంటూ ఏవో కథలు చెబుతోంది"అంది. "నిజంగానే పిల్లవాడి కి జ్వరమేమో"నచ్చ చెప్పబోయాడు అర్జున్. "మీరూరుకోండి మీకేమీ తెలియదు.ఐనా పని మనిషి సంగతి మీకెందుకు?"తీవ్రంగా అంది సుజాత. సుజాత వైపు సాలోచనగా చూసి భుజాలెగరేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అర్జున్. ఆఫీసుకెళుతూ అఖిలకు కాల్ చేసాడు అర్జున్. "ఏమిటి డాడీ?"అడిగింది అఖిల. "నువ్వు సాయంకాలం ఆఫీసు నుంచి వెళుతూ ఓ అరగంట నాకు స్పేర్ చేయగలవా?"అడిగాడు అర్జున్. "అలాగే డాడీ , ఇంటికి వస్తాను ."అంది అఖిల. "వద్దు తాజ్ కు రా. నువ్వు బయిలుదేరే ముందు నాకు కాల్ చేయి."అన్నాడు అర్జున్. సాయంకాలం తాజ్ లో కలిసారు అర్జున్, అఖిల.కాఫీ కి ఆర్డర్ చేసి ఏదో ఆలోచిస్తూ ఉన్న అర్జున్ చేతి మీద చిన్నగా తట్టుతూ "డాడ్ , ఏనీ ప్రాబ్లం?" అని అడిగింది అఖిల. "ఏమీ లేదమ్మా మీ అమ్మ గురించే . ఈమధ్య విచిత్రంగా మారిపోయింది. కోపం ఎక్కువైంది. ఐనదానికీ కానిదానికీ కోపం తెచ్చుకుంటోంది. గట్టిగా అంటే ఏడుస్తోంది.అర్ధం పర్ధం లేకుండా మాట్లాడుతోంది.ఏమి అయ్యిందో అర్ధం కావటం లేదు ."అన్నాడు అర్జున్. "ఏమి లేదు డాడీ, నేనుకోవటము దీనిని ఒకరకముగా 'మిడిల్ ఏజ్ క్రైసిస్ ' అనవచ్చు.ఈ వయసు లో చాలా మందికి వస్తుంది.దానికి దానికి చాలా కారణాలు ఉంటాయి. అమ్మ విషయములో అకస్మాత్తుగా అమ్మావాళ్ళనాన్న తాతయ్య చనిపోవటము, తమ్ముడు వినీల్ అమెరికా వెళ్ళటము, నువ్వు , నేను బిజీ ఐపోయి తనతో గడపకపోవటమూ తో వంటరిగా ఐపోయిన ఆలోచన వచ్చి డిప్రెషన్ వచ్చినట్లుంది అనిపిస్తోంది. దానితో కొన్ని భయాలు కూడా ఎక్కువయ్యాయి. మనం ఓర్పుతో తనను మామూలుగా చేయాలి."అంది అఖిల. "ఎవరైనా సైక్రియాటిస్ట్ కు చూపిద్దామా?"అడిగాడు అర్జున్. "అవసరం లేదనుకుంటాను. అంత సీరియస్ గా ఏమీలేదు. నేను చూసుకుంటాను, మీరు కంగారు పడకండి.కాకపోతే మీరు నా ప్రయత్నం లో సహకరించండి."అంది అఖిల. "సరే మరి ."అని వేయిటర్ కు బిల్ పే చేసి లేచాడు అర్జున్. * * * * * * "హాయ్ అమ్మా "అంటూ వచ్చింది అఖిల. "ఏమిటీ పొద్దున్నే వచ్చావు .ఆఫీస్ లేదా?" అని అడిగింది సుజాత. "ఉంది కాని పొద్దున పనిలేదు .అందుకని నిన్ను చూసిపోదామని వచ్చాను.ఏమి చేస్తున్నావు?బిజీనా?"అడిగింది అఖిల. "ఆ నేనేమి బిజీ ,డాడీ కూడా ఆఫీస్ కెళ్ళిపోయారు .ఇక నాకేమి పని ఉంది?" అంది సుజాత. "ఐతే బయటకు వెళుదాం రా."పిలిచింది అఖిల. "అబ్బ నేను రాను నాకు ఓపిక లేదు." నిరాసక్తిగా అంది సుజాత. "ఓపిక లేదు అనకు , లే చీర మార్చుకో."అని  అలమారాలో నుంచి చీర తీసి సుజాత చేతిలో పెట్టింది అఖిల. ఇక తప్పదా అని గొణుక్కుంటూ తయారైంది సుజాత. బజారులో ఓ బిల్డింగ్ దగ్గర కార్ ఆపించి దిగింది అఖిల.తలెత్తి ఆ బిల్డింగ్ పేరు "న్యూ కంప్యూటర్ ఇన్స్టిట్యూషన్ ."అని వ్రాసి ఉన్నది చదివి "ఇదేమిటి ఇక్కడకు తీసుకొచ్చావు?"అడిగింది సుజాత. "నిన్ను చేర్పిద్దామని ."నవ్వుతూ అంది అఖిల. "ఇదేమిటి? నేను చేరను ."అంటూ కారెక్కబోతున్న సుజాతను చేయిపట్టి ఆపి, పక్కన ఉన్న కాఫీ షాప్ లోకి తీసుకెళ్ళింది అఖిల.రెండు కప్పులు కాఫీ తీసుకొని ఓ టేబుల్ దగ్గర కూర్చొని సుజాతను కూడా కూర్చోబెట్టింది. "ఊ ఇక చెప్పు. కొత్త కొత్తవి నేర్చుకోవటం నీకు ఆసక్తి కదా మరి కంప్యూటర్ ఎందుకు నేర్చుకోవు?"అడిగింది అఖిల. "అది ఒకప్పుడు.ఇప్పుడు నాకు దేనిమీదా ఆసక్తి లేదు ."అంది సుజాత. "ఎందుకు లేదు?"అడిగింది అఖిల. "ఎందుకు లేదు అంటే ఏమి చెబుతాను ?లేదు అంతే."ఒక్కసారిగా బరెస్ట్ అయ్యింది సుజాత."ఈ మధ్య నాకు దేని మీదా ఆసక్తి లేదు. ఏపనీ చేయాలనిపించటం లేదు.చాలా చికాగ్గా ఉంటోంది.సడన్ గా భయమేస్తుంది.రాత్రిళ్ళు నిద్రపట్టదు. నిద్రపట్టినా పిచ్చి పిచ్చి కలలు. డాడీ నన్నొదిలేసి వెళ్ళిపోతున్నారనిపించి లేచి కూర్చొని డాడీ చేయి పట్టుకుంటాను.ఒక్కసారిగా అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారన్న భావన వస్తుంది.గతం లో జరిగిన కొన్ని ఇబ్బందులు గుర్తొచ్చి చాలా బాధ అనిపిస్తుంది. ఏడుపొస్తుంది.  ఇలా ఎన్నని చెప్పను ? పిచ్చెక్కుతుందేమో అనిపిస్తోంది.ఇలాగే కొన్ని రోజులు ఉంటే నన్ను పిచ్చాసుపత్రిలో చేర్పిస్తారేమో అని భయం గా ఉంది." దిగులుగా అంది సుజాత. "పిచ్చిలేదు ఏమీ లేదు ఇదంతా నీ మనసు చేస్తున్నగారడి.దాని గారడీ కి లోబడకు. దాని తో యుద్దం చేసి గెలువు.నీకే కాదు కొన్ని సార్లు అందరికీ ఏదో ఒక స్టేజ్ లో ఇలా శూన్యంగా , గాలి తీసిని బెలూన్ లా అనిపిస్తుంది.నీ మనసును ఏదైనా వ్యాపకం మీదికి మళ్ళించుకో.బుర్రను ఖాళీగా ఉండనీయకు . హాయిగా కంప్యూటర్ నేర్చుకో."అంది అఖిల. "కంప్యూటర్ నేర్చుకొని నేనేమి చేయను?ఉద్యోగం చేసేఓపిక లేదు. కుట్లూ అల్లికలూ మొదలైన వాటి మీద ఇంటెరెస్ట్ తగ్గింది.అసలు పుస్తకాలే చదవాలనిపించటం లేదు .ఎట్లా చదివేదానిని."అంది సుజాత. తన లాప్ టాప్ ఓపెన్ చేసి , సుజాత పక్కకు వచ్చి కూర్చొని "కంప్యూటర్ నేర్చుకొని ఉద్యోగమే చేయనవసరం లేదు. వినీల్ కు నువ్వు ఉత్తరం వ్రాసావనుకో అది వాడికి చేరి , వాడు జవాబిచ్చేసరికి నెల పడుతుంది. అదే మేయిల్ ఇచ్చావనుకో నిమిషం లో చేరుతుంది.అంతెందుకు ఇదిగో చూడు , వినీల్ పేరు పక్కన ఆకుపచ్చ చుక్క కనిపిస్తోందా ?అంటే వాడు ఆన్ లైన్ ఉన్నాడన్న మాట .నువ్వు వాడి తో ఇప్పుడు ఆన్ లైన్ మాట్లాడవచ్చు. ఇక్కడ ఉన్నప్పుడులాగే వాడు నీ పక్కనే కూర్చొని పని చేసుకుంటున్నాడనుకో!దీని మేయిల్, చాట్ అంటారు. ఇంకా నీకు ఏదైనా వంటకం గురించి కావాలి , లేదా నీ ఏదైనా మందు గురించి తెలుసుకోవాలనుకున్నావు ఇక్కడ టైప్ చేయి నీకు కావలసిన సమాచారం క్షణాలల్లో వస్తుంది.ఇక్కడ తెలుగులో వ్రాయవచ్చు. ఇవి బ్లాగ్ లు. నువ్వూ ఓ బ్లాగ్ ఓపెన్ చేసుకొని నీకు కావలసింది వ్రాసుకోవాచ్చు.మాకు చిన్నప్పుడు చెప్పిన కథలు , నీ కవితలు అన్నీ ఇక్కడ తెలుగులో వ్రాసుకోవచ్చు.ఎపత్రికల వాళ్ళో పబ్లిష్ చేయనవసరంలేదు. నువ్వే చేసుకోవచ్చు.పది మందీ చదువుతారు. వాళ్ళ అభిప్రాయాలు చెపుతారు. చూడు ఇవన్నీ తెలుగు బ్లాగ్ లు. ఇందులో నీ అభిరుచులకు తగ్గవాళ్ళు నీకు స్నేహితులు కావచ్చు.హాయిగా ఇంట్లో నుంచే వాళ్ళ తో నీ అభిప్రాయాలు పంచుకోవచ్చు.ఇది యూట్యూబ్. ఇక్కడ నీకు కావలసిన పాత సినిమాలు చూడవచ్చు.పాటలు వింటూ చూడవచ్చు..అన్నమాచార్య కీర్తనలు, అమ్మవారి గీతాలు అన్నీ ఉంటాయి.ఇక్కడ నవలలు ఉంటాయి .పత్రికలు ఉంటాయి. న్యూస్ పేపర్ లు ఉంటాయి. ఏవైనా చదువుకోవచ్చు.అంతెందుకు ప్రపంచం అంతా ఈ చిన్నిపెట్టలో ఉంది.చక్కగా సమయం గడిచిపోతుంది." ఒకొక్కటీ చూపిస్తూ వివరించింది అఖిల. ఒక స్నేహితురాలిలా కాఫీషాప్ కు తీసుకొచ్చి అఖిల మాట్లాడటం చూస్తుంటే,ఈ మధ్య ఎవరో నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరూ అంటే , నా పిల్లలు , మా ఏమండీ నే నా బెస్ట్ ఫ్రెండ్స్ అని తను చెప్పిన జవాబు గుర్తొచ్చి నిజమే కదా అనుకుంటూ అఖిలను మురిపెంగా చూసుకుంది. "సరే చూద్దాం.ఇదీ ప్రయత్నిస్తాను ."అని అంగీకారం తెలిపింది సుజాత.అఖిల తో పాటు సుజాత ఆ బిల్డింగ్ లోకి నడిచింది.అక్కడ ఆఫీస్ అని వ్రాసి ఉన్న గదిలోకి నడిచింది అఖిల.అక్కడ ప్రిన్సిపాల్ అని వ్రాసి ఉన్న చోట , కూర్చొని ఉన్న ఆయనతో,"నమస్కారమండి . నా పేరు అఖిల. ఇందాక మీకు కాల్ చేసాను."అంది అఖిల. "అవును కూర్చోండి. మీ అమ్మగారిని తీసుకొస్తానన్నారు , ఈవిడేనా ? "అని అడిగారు ఆయన. "అవునండి.అమ్మ కంప్యూటర్ నేర్చుకుంటుంది.బేసిక్ నేర్పిస్తే చాలు."అంది అఖిల. "చాలా సంతోషమమ్మా . ఈ వయసులో ఆసక్తిగా నేర్చుకుందామని వచ్చారు."అని పక్కన నిలబడ్డ అబ్బాయిని చూపిస్తూ "ఇతని పేరు సురేంద్ర.మీకు మిగితా విధ్యార్ధులతో కాకుండా విడిగా నేర్పిస్తాడు."అని పరిచయం చేసాడు. "రండి మేడం."అని ముందుకు దారి తీసాడు సురేంద్ర. "నువ్వెళ్ళమ్మా నేను ఫాం నింపి ఫీజ్ పే చేసి వెళుతాను."అంది అఖిల. సురేంద్రను అనుసరించింది సుజాత. సురేంద్ర ఓ కారిడార్ లొ నుంచి నడిచాడు.ఆ కారిడార్ మసక చీకటిగా ఉంది.అతనిని అనుసరించింది సుజాత.అతను ఓ గది తలుపులు తీసి లోపలికి వెళ్ళాడు. గది అంతా చీకటిగా ఉంది. అడుగు ముందుకు వేసిన సుజాత చీకటి చూసి "అమ్మో చీకటి లో నేర్చుకోవాలా నేను నేర్చుకోను ."అంది భయంగా. సురేంద్ర మాట్లాడకుండా తలుపు పక్కన ఉన్న స్విచ్ లు వేసాడు. గదంతా తెల్లని వెలుతురు నింపుతూ నాలుగు పక్కలా ట్యూబ్ లైట్ లు వెలిగాయి. గది చాలా విశాలంగా ఉంది.కుర్చీలు , బల్లలూ విధ్యార్ధులు కూర్చునేందుకు వీలుగా వేసి ఉన్నాయి.ఎదురుగా గోడ మీద పెద్ద తెర కనిపిస్తోంది.సురేంద్ర ఆ తెర దగ్గరకు వెళ్ళి స్విచ్ వేసాడు. తెర మీద "వెల్ కం "అని అక్షరాలు నీలి రంగులో తిరుగుతూ వచ్చాయి.ఆ తరువాత ఆకుపచ్చని పచ్చిక బయిళ్ళు, నీలాకాశం,పచ్చిక లో మేస్తున్న జీవాలు తెర మీద ప్రత్యక్షం అయ్యాయి.తెరకు ఎడమ వైపుగా కొన్ని గుర్తులు కనిపించాయి.అందమైన ఆ ప్రకృతి దృశ్యం చూడగానే సుజాత  మనసు ఆనందం తో నిండిపోయింది.ఓ విధమైన ఉద్వేగానికి గురైంది. సురేంద్ర "రండి మేడం ." అని పిలిచాడు.ఆ పిలుపు , ఆ ప్రకృతి,గదిలో పరుచుకున్న తెల్లని వెలుతురు తన మనసు పొరలల్లో ఉన్న చీకటి ని పారద్రోలి వెలుతురు నిపేందుకు ఆహ్వానంలా అనిపించింది.తన మనసు చేస్తున్న గారడీ నుంచి బయటపడగలను అన్న ఆత్మ విశ్వాసంతో  ఆ కొత్తప్రపంచం లోకి అడుగు వేసింది సుజాత. క్లాసు తర్వాత ఆటో తీసుకుని ఇంటికెళ్లగానే సుజాత తన కూతురుకు ఫోన్ చేసింది.” అఖిలా! నీకు ఇన్ని విషయారు ఎలా తెలుసు? నా పరిస్థితిని ఎలా అర్ధం చేసుకోగలిగావు. చాలా థాంక్స్ రా. “ “అమ్మా! నేను నీ కూతురుని కాదు.. ఫ్రెండ్ ని కదా. అందుకే నిన్ను అర్ధం చేసుకోగలిగాను. అంతే”అంది నవ్వుతూ.. “థాంక్స్ రా ఫ్రెండ్… మళ్లీ నిన్ను మెయిల్ తో నే మాట్లాడతాను. పోన్ చేయను. “ అఖిల సంతోషంగా ఈ విషయం చెప్పడానికి తండ్రికి కాల్ చేసింది.. -మాలా కుమార్  

పుట్టిల్లు

 పుట్టిల్లు                                                                    ఆమె తనకేమీ కాదు! తమ కారిడార్ లోనే చివరి అపార్ట్ మెంట్ వాళ్ళది. వాళ్ళు వచ్చి ఆర్నెల్లయింది గాని ఆమె ఎవరితోనూ అంతగా కలవదు. తనే చొరవ తీసుకుని పలకరించి, వివరాలడిగితే 'ప్రేమ పెళ్ళి అనీ, రెండు వైపుల వాళ్ళూ అంగీకరించక పోవడంతో ఎదిరించి పెళ్ళిచేసుకున్నా'మనీ చెప్పింది. పేరు సమీర. వస్తూనో, వెళ్తూనో ఎదురుపడినా, కారిడార్లో పక్క ఫ్లాట్స్ వాళ్ళు ఇద్దరు ముగ్గురు కలిసి కబుర్లు చెప్పుకుంటున్నా మాటలు కలపదు. మొదట్లో పొగరు అనుకుంది తను.  వారం క్రితం తను చెత్తబుట్ట బయట పెట్టడానికి వెళ్ళినపుడే ఆ అమ్మాయి కూడా వచ్చింది. కంటి దగ్గర కమిలిపోయి నల్లగా కనిపించింది. కుడి చెంప వాచి వుంది. బుట్ట కింద పెడుతూ అప్రయత్నంగా ముఖం చిట్లించి ‘ఇస్స్‘ అంటూ వింత శబ్దం చేసింది. ఆ శబ్దం తనలో ఏవో జ్ఞాపకాలని తట్టి లేపింది. కాలో, కీలో, నడుమో …ఎక్కడో ఉన్నట్టుండి కలుక్కుమన్నపుడు పూర్ణత్త నాలుకతో ‘ఇస్స్’ అనే శబ్దం చేస్తూ ముఖం చిట్లించేది. మొదట్లో అ శబ్దం ఏమిటో అర్ధం కాకపోయినా తర్వాతెపుడో తెలుసుకునే సందర్భం వచ్చింది.   అదే శబ్దం ఇప్పుడు వినపడగానే తను చటుక్కున సమీర దగ్గరకెళ్ళి, మొహంలోకి తేరిపార చూస్తూ, "సమీరా! అదేమిటలా వుంది కన్ను? ఒంట్లో బానే వుందా?" అనడిగింది. ఆమె గిరుక్కున తిరిగి లోపలికి వెళ్ళిపోతూ  ”ఆఫ్ కోర్స్ బానే ఉన్నాను ...పొద్దున్నే కొంచెం కళ్ళు తిరిగి గుమ్మానికి కొట్టుకున్నా" అంది . తను వదలకుండా గుమ్మం దాకా వెళ్ళి " సమీరా! నే చెప్పేది ఒక్క మాట వినండి. ఏదైనా సమస్య వుంటే దాన్ని చిన్నతనంగా భావించి దాచి పెట్టకండి. నామోషీ గా అనుకోకండి. ప్రతి మనిషికీ ఉన్నంతలో గౌరవంగా, భద్రత గల జీవితాన్ని గడిపే హక్కుంది కదా! మీకేదైనా సాయం అవసరమైతే పక్కనే మేమున్నామని గుర్తుంచుకోండి" అని చెప్పి వచ్చేసింది.  చుట్టుపక్కల అందరితో కలుపుగోరుగా ఉంటూ అందరితో కలిసిపోయే మనస్తత్వం తనది. వేణు కూడా ‘మధూ! మధూ ‘ అంటూ ఇంట్లో ఉన్నంతసేపూ తన సాన్నిధ్యాన్ని ఆస్వాదిస్తూ, తన అభిప్రాయాలకి విలువనిస్తూ ఉంటాడు. అతని సహకారం ఉండబట్టే తనూ తోటివాళ్ళ సమస్యలకి స్పందిస్తూ, ఎవరికైనా సాయం అవసరమైనపుడు ముందుకడుగేయగలుగుతోంది. ఒకవేళ తను చేసే పని అతనికి నచ్చకపోయినా, తన వ్యక్తిత్వాన్ని గౌరవించి తోడుగా నిలబడతాడని తెలుసు. ఆ ధీమా తోనే సమీర విషయంలో స్వతంత్రించి, సాయం అవసరమైతే చేస్తానని మాట ఇచ్చింది. అయినా తన సాయాన్ని అంత తొందరగా సమీర స్వీకరిస్తుందని మాత్రం ఊహించలేదు. సరిగ్గా వారం కూడా కాకముందే ఆదివారం పొద్దున్నే వేణు ఉదయపు నడక  కోసం వెళ్తూ తెరిచి వదిలేసిన తలుపు గుండా సుడిగాలిలా లోపలికొచ్చింది సమీర. ఒంటి నిండా దెబ్బలు, సగం ఊడిన జుట్టు, ఎర్రబడ్డ కళ్ళనిండా కసి, దు:ఖం ....ఆమెని సముదాయించి, కాస్త కాఫీ తాగించి, రెండో పడగ్గదిలో విశ్రాంతి తీసుకోమని చెప్పి వంట పనిలో పడింది.   వేణు వచ్చాక జరిగిందంతా విని " ఏమిటిది మధూ? మనమేం చెయ్యగలుగుతాం?” అన్నాడు తెల్లబోతూ. “ఏమో..ఏం చెయ్యగలుగుతామో తెలుసుకోవాలి! ఆ అమ్మాయికి దగ్గరివాళ్ళెవరూ లేరు. కిందటి మాటు మన పక్కవాళ్ళతో సమీర వొంటి మీద కమిలిన గుర్తుల గురించి చెపితే అంతా వాణ్ణి చీదరించుకున్నారు. ఎవరూ అండగా లేరు కదా అని పెళ్ళాంతో ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించినా, సంఘ భయం కూడా లేకుండా ఉంటాడంటావా వేణూ?" అంది జాలిగా మొహం పెట్టి. ఎప్పుడూ ఎదుర్కోని విషయం కావడంతో వేణుకి ఏమనడానికీ తోచలేదు. “ఆ అమ్మాయి ఎవరో, అసలు వాళ్ళిద్దరికీ పెళ్ళయిందో లేదో, వాళ్లెలాంటి వాళ్ళో ఏమీ తెలీకుండా ఇంత తొందరపాటేమిటి మధూ నీకు?” అన్నాడు కోపమూ, అమెనేమీ అనలేని నిస్సహాయతా కలిపి. “ఏమీ తెలీదు కనక అలాంటి స్థితిలో ఉన్న సాటి ఆడ మనిషిని బయటికి తోలేయలేను కదా వేణూ! కొంచెం అర్థం చేసుకో. రెండు రోజులు ఆశ్రయమిస్తే తనకి కొంచెం ఆలోచించుకునే వ్యవధి వస్తుంది కదా! మనమేం తనకి బాండు రాయడం లేదు కదా ఎప్పటికీ చూస్తామని! కొంచెం తోడుండి ఒక పోలీసు కంప్లైంట్ ఇప్పిస్తే  పరిస్థితిలో మార్పొస్తుందేమో!"అంది అభ్యర్ధనగా. వేణు ఆలోచిస్తూ మాధవి మొహంలోకి చూశాడు.  స్పందన కోల్పోయి, ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క ద్వీపంగా బతుకుతున్న సమాజంలో మాధవి వేరుగా కనిపించింది. అతనికి తెలియకుండానే పెదవిపై చిన్న నవ్వు కదలాడింది. అతని ప్రతిచర్య కోసం ఎదురుచూస్తున్న మాధవికి ఆ నవ్వు సుశీల నవ్వులా కనిపించింది.                                                  *** పప్పు రుబ్బుతున్న సుశీల మనసు పరి పరి విధాల పోతోంది. అత్తగారలా ఎందుకు చేశారో ...మొన్న సాయంత్రం మునిమాపు వేళ పొలం నించి ఇంటికొస్తూనే తన దగ్గరేమైనా డబ్బుందేమోనని అడిగాడు రామారావు. వంగతోటలో కలుపు తీయడానికొచ్చిన పనివాళ్ళకి తప్పనిసరిగా కూలి డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి..అప్పటికే అరకొరగా ఉన్న సరుకులతో ఇల్లు నడుస్తోంది. ఇంటి నిండా వేసవి సెలవులకని వచ్చిన పిల్లలు...రామారావు అక్కచెల్లెళ్ళ, తమ్ముళ్ళ పిల్లలు.  మెరకపొలం. వర్షాధారం! సాగు కోసం తవ్విన బావుల్లో నీటి ఆధారంగానే, అంతంత మాత్రంగా వ్యవసాయం సాగుతోంది. ఈ సారి టొమాటోలు విరగ కాశాయి. కూలీల్ని పెట్టి, బస్తాల నిండా నింపి, మార్కెట్టుకి తోలించడానికి అయిన ఖర్చు కూడా కిట్టలేదు. ఇటు వంగతోట నిండా కలుపు పెరిగి ఎన్ని నీళ్ళూ దానికే చాలడం లేదు. మూడు రోజుల పాటు పదేసి మంది కూలీలని పెట్టి తను కూడా పని అందుకుంటూ మొత్తం కలుపు తీయించాడు రామారావు. మొన్నటికి కలుపు తీత పూర్తయింది. పని చేసిన కూలీలకి డబ్బిచ్చి పంపించాలి. అప్పటికే రెండు రోజులు వాయిదా వేసినందుకు ఏ రోజు కూలితో ఆ రోజు గడుపుకునే కష్ట జీవులు గట్టిగా ఏమనలేక గొణుక్కున్నారు. ఒక్కోసారి వాళ్ల జీవితమే నయమనిపిస్తుంది....చేసిన పనికి కూలి తీసుకుని వెళ్ళిపోతారు. మార్కెట్టు లాభ నష్టాలతో పనిలేకుండా, పెట్టుబడీ, బాంకు లోన్లూ, వాయిదాలతో సంబంధం లేకుండా! బయటెంత ప్రయత్నించినా అప్పు పుట్టక తననడిగాడతను. సరుకులు తెచ్చాక రూపాయి కూడా మిగల్లేదు తన దగ్గర. ఇక తప్పనిసరై అత్తగారి దగ్గర కెళ్ళి"అమ్మా! నీ దగ్గరేమైనా డబ్బుందా?"అనడిగాడు ఇబ్బంది పడుతూ. ఆవిడ విస్తుపోతూ "నా దగ్గరెక్కణ్ణుంచి వస్తుందిరా? అబ్బే.."అంది. అంతకు ముందే ఏదో మాటల మధ్య "వాడికెంత డబ్బూ చాలదు"అనడం గుర్తొచ్చి చివుక్కుమంది తన మనసు. వర్షాధారమైన మెరకపొలమయ్యె. అన్నదమ్ముల ఉమ్మడి ఆస్తి అయినా మిగిలిన ముగ్గురూ పట్నంలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇక్కడేమో విత్తనాలూ, ఎరువులూ, పురుగు మందులూ, కూలీలూ, ఎప్పుడు చూసినా సరిగ్గా ఉండని కరెంటుతో మోటార్లు కాలిపోయో, పైపులు పాడయ్యో ఏదో ఒక రిపైరు రావడం....అన్నీ ఖర్చులే! అకాలంగా వర్షం వచ్చినా , రావాల్సినపుడు రాకపోయినా నష్టమే నష్టం. నెలలతరబడి కాపాడుకుంటూ వచ్చిన పంట నేల పాలైపోతుంది. ఒకవేళ సమృద్ధిగా పండి మార్కెట్ చేరినా ధర పలకదు! తనకు తెలిసినంతలో అతనేనాడూ తన కోసం పది రూపాయలు ఖర్చు పెట్టుకున్నది లేదు. ఆయన చేసే ఖర్చంతా పొలం కోసమే. అదెవరికి అర్థమవుతుంది? నిట్టూర్చింది సుశీల పొత్రాన్ని ఎడం చేతిలోకి మార్చుకుని, మెత్తగా పొంగుతున్న పిండిని కుడిచేత్తో తోసుకుంటూ. మొన్న తన దగ్గర డబ్బు లేదన్న ఆవిడ, ఇవ్వాళ మధ్యాహ్న భోజనాల తర్వాత పూర్ణ కుటుంబం తిరుగు ప్రయాణమై వెళ్తూ, కాళ్ళకి దండం పెట్టినపుడు పిల్లలు ముగ్గురికీ పదేసి రూపాయలివ్వడమే గాక పూర్ణకీ, చలపతి అన్నయ్య గారికీ చెరో వందా ఇచ్చి బట్టలు కొనుక్కోమనడం సుశీలకి మింగుడు పడలేదు. అసలు పూర్ణ ని చూసినా తనకి ఆశ్చర్యమే. ఉన్నట్టుండి వస్తుంది పిల్లలతో. రెండు రోజులుండి వెళ్తుంది. ఈ సారి ఏకంగా వారం రోజులుండిపోయింది. అప్పటికే వేసవి సెలవులకి వచ్చిన పిల్లల్తో ఇల్లంతా ఒకటే సందడిగా ఉంది. పొలం లో ఇల్లు కావడంతో పొలం పనివాళ్ళే గాని ఇంటి పనికి ఎవరూ రారు. పొద్దున్నే వండుకుని అన్నం మూట గట్టుకుని కూలి పన్లకి పోతారు ఆడా మగా అంతా. మండే ఎండల్లో తనకీ, అత్తగారికీ ఎడతెరిపిలేని పని. తెల్లవారక ముందే లేచి, కసవూడ్చి, కళ్ళాపి జల్లి, ముగ్గులు తీర్చి, ఆవులూ, గేదెల పాలు పితికి, పిల్లలందరికీ ఆవుపాలు కాచిచ్చి, తమకి కాఫీలు కలిపి, మసిబారిన గిన్నెలూ, దేవుడి సామానూ, విడి విడిగా తోముకుని, పిల్లలకి చద్దెన్నాలు పెట్టి తోటలోకి పంపి, స్నానం , పూజ ముగించుకుని, కట్టెపుల్లల పొయ్యి మీద వంట కానిచ్చి, పిల్లల ఆటలూ పాటలూ అయి తిరిగొచ్చి స్నానాలు కానిచ్చాక వాళ్ళకి హాల్లో వరసగా అరిటాకుల్లో భోజనాలు వడ్డించి, వాళ్ళ తగవులు తీర్చి, తమ భోజనాలు కానిచ్చాక అరగంటైనా ఆయాసం తీర్చుకునే వెసులుబాటు ఉంటుందో లేదో..మేటెడు బట్టలు పెరటి బావి దగ్గర  పడేసుకుని నీళ్ళకి బోరు పంపు కొట్టుకుంటూ మేనకోడళ్ళు రేవతినీ, సుమతినీ అడ్డం వేసుకుని చాకి రేవులా బట్టలుతికి ఆరేయడం... ఇంతట్లోకే కాఫీ, టీలకోసం జనమంతా ఎదురు చూపులు!  పొలంలో పండిన బియ్యంతో అన్నం వండి అందులోకి, రకరకాలు లేక పోయినా తోటలో ఏ కూరగాయలు పండిస్తే వాటితోనే మార్చి మార్చి పులుసూ, కూరా, పచ్చడీ అమరుస్తూ నెట్టుకొస్తున్నారు తానూ అత్తగారూ కలిసి. ఇంతమంది వస్తే తమ పశువుల పాడి సరిపోదు. పాల కేంద్రం నించి పాలు కొనాల్సిందే.. ఆవిడకి తెలియందేముంది? ఇలాంటి పరిస్థితుల్లో పూర్ణకి అంత డబ్బు చులాగ్గా ఎలా ఇచ్చేశారు? రామారావు తప్పనిసరై డబ్బడిగితే 'నాదగ్గరెక్కడుందిరా ?' అన్నావిడకి ఇంతట్లోకే ఎక్కణ్ణుంచి వచ్చింది ఇంత డబ్బు? ఆలోచిస్తూ గిన్నెలోకి రుబ్బిన పిండి తీస్తున్న సుశీలకి మనసొప్ప లేదు ఆవిడ అబద్ధం చెప్పిందనుకోవడానికి. ఇంతా చేసి పూర్ణ ఆవిడ సొంత కూతురైనా కాదే. అక్క కూతురు. పూర్ణ పాపం మంచిదే. మొగుడు అనుమానం మనిషని చూచాయగా తెలుసు గాని భార్యనలా కొడతాడని ఇన్నాళ్ళూ తమకి తెలియదు. ఎప్పుడొచ్చినా అన్ని పనుల్లోకీ సాయం వచ్చే మనిషి ఈ సారి రెండు రోజులు జ్వరంతో మంచం మీదే ఉంది. ఎంతో మొహమాట పడింది పాపం. తగ్గాక కూడ మొహం చిట్లిస్తూ ‘ఇస్స్ …ఇస్స్’ అంటూ వింత శబ్దాలు చేస్తుంటే ఏమిటో అనుకుంది తను. అత్తగారు నిలదీసి అడిగి, ఒత్తిడి పెడితే, వీపు మీద జాకెట్టు పైకెత్తి చూపించింది  వీపంతా ఎర్రని చారలూ, సిగరెట్టుతో కాల్చిన మచ్చలూ. తనకైతే ఒళ్ళు జలదరించింది. ఆ నెప్పికే కాబోలు మొహం చిట్లిస్తూ వింత శబ్దాలు చేస్తూ ఎవరికీ తెలియకుండా భరించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అంత బాధలోనూ అతికించుకున్న చిరునవ్వు మాత్రం చెదరదు.. ఆశ్చర్యమే! ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా ఇలాంటి దెబ్బలు దాచుకునే వచ్చిందేమో పాపం! మనసు కరిగి, ఏవైనా చేతిలో పెట్టాలనిపించి ఇచ్చారేమో అత్తగారు. ఇస్తే తనకేం బాధ లేదు గాని , ఆ డబ్బు ఉండీ లేదని ఆవిడెందుకు చెప్పారో… తల్చుకుంటే వింత గానూ, ఒకింత బాధగానూ ఉంది. రోలు శుభ్రం చేసి పిండి గిన్నె తీసుకుని లోపలికి నడిచింది సుశీల. చీకటి పడుతోంది.  వీధి వరండాలోనూ, హాల్లోనూ పిల్లలగోల. ఇంక ఆకలి అంటూ నిలవనియ్యరు అనుకుంటూ గబగబ పోపుకి కావల్సినవి సిద్ధం చేసి ఉప్మా తయారు చేసి, బయటికి వచ్చింది. పిల్లలంతా ‘అత్తా! దొడ్డమ్మా!'అంటూ చుట్టుముట్టారు. "ఇవాళ పౌర్ణమి కదా..అంతా వరండా బైట వెన్నెల్లో తిందాం"అంటూ గోల. రేవతీ, సుమతీ “నువు కూర్చో అత్తా! మేం అందిస్తాం”అన్నారు.  “సరే అయితే” అని వెళ్ళి, రెండు చెంబులు నీళ్ళు దిమ్మరించుకుని, స్నానం కానిచ్చి, మెత్తని నూలు చీర చుట్టుకుని వచ్చేసరికి బయట ఆవరణలో నవారు మంచాలు వాల్చి ఉన్నాయి, అరుగు దగ్గరగా. రామారావుతో సహా అంతా మంచాల మీదా, అరుగు గట్ల మీదా కూర్చుని కబుర్లాడుతున్నారు. రేవతి పెద్ద పెద్ద బాదం ఆకుల్లో ఉప్మా పెట్టి, నల్చుకుందుకు నిమ్మకాయ బద్ద వేసి ఇస్తుంటే, తన కూతుళ్ళు పదేళ్ళ మాధవీ, తొమ్మిదేళ్ళ భార్గవీ అందరికీ అందిస్తున్నారు. పుచ్చ పువ్వులా మెరిసి పోతున్న వెన్నెల్లో పిల్లలంతా దేవదూతల్లా కనిపిస్తున్నారు! వాళ్ళ మధ్య కూర్చుని ఉన్న రామారావు ఆలమంద మధ్య గోపాలుడిలా ఉన్నాడు. వరండా మెట్లు దిగి మంచాల దగ్గరకొచ్చింది సుశీల. పిల్లలు పక్కకి జరిగి చోటిచ్చారు. చల్లగాలి హాయిగా మేను తాకుతుంటే, కురిసే వెండి వెన్నెల మనసు నాహ్లాద పరుస్తుంటే ముగ్ధురాలై కూర్చుంది. రోజంతా పని చేసి అలసిపోయిన సుశీల మీద రామారావు చూపుల వెన్నెల పరుచుకుంది! చిలికిన మజ్జిగ గిన్నె, నాలుగు గ్లాసులూ పట్టుకొచ్చింది సుమతి. కబుర్ల మధ్య ఉప్మా కరిగిపోయింది. గ్లాసుల్లో అందరికీ మజ్జిగ అందింది. పిల్లలేవో పాటలు పాడారు.వీళ్ళందరినీ చూస్తూ జాబిల్లి తీరిగ్గా ప్రయాణం సాగించాడు. నిద్ర ముంచుకొస్తుంటే ఒక్కక్కళ్ళే ముందుగా పరుచుకున్న పక్కలమీదికి చేరారు. అరుగు మీది పెద్ద మంచం మీద మనవరాలి పక్కనే పడుకున్న రుక్మిణమ్మ దగ్గరకొచ్చి, పక్కనే కూర్చున్నాడు రామారావు. లోపలికెళ్ళబోతున్న సుశీల కూడా ఆగి, పక్కనున్న గట్టు మీద కూర్చుంది. “నిద్ర పట్టిందా అమ్మా?" అడిగాడు రామారావు మృదువుగా. "లేదురా ఇంకా"అంది రుక్మిణమ్మ. "పూర్ణక్క వెళ్ళింది పాపం"అన్నాడు సాలోచనగా. "అవునురా!..అదొట్టి పిచ్చిది. ప్చ్...వారం క్రితం అదొచ్చినప్పుడు చెప్పద్దూ ...నాక్కొంచెం విసుగే వచ్చింది. ఇటు చూస్తే చేతిలో రూపాయి ఆడడం లేదు. అటు చూస్తే ఇంటి నిండా పిల్లలు..సెలవులు మామయ్యింట్లో గడపాలని ఆశతో వచ్చారు. అది(సుశీల) మాత్రం ఎంత పనని చేస్తుందీ? ఇంటినుంచి బయల్దేరి, ఇక్కడికి రావాలనుకున్నది పెందరాళే తెమిలి రావాలా? ఈ అడవిలో అత్యవసరమైతే రెండిడ్లీలు పొట్లం కట్టించుకు రావాలన్నా వీలవదుగదా! ఆఖరి వరసకి సుశీలా, నేనూ, అక్కయ్య గారి పిల్లలిద్దరూ కూర్చుని రెండు ముద్దలు కతికేసరికి వచ్చింది ముగ్గురు పిల్లల్నేసుకుని. అప్పుడిది నాలుగు ముద్దల్లో భోజనం ముగించి, మళ్ళీ పొయ్యి వెలిగించి, అన్నం వండి పెట్టింది పాపం" మౌనంగా కూర్చుని వింటున్న సుశీల కల్పించుకుని " అదేమిటత్తయ్యా! అదేమంత కష్టమనీ…. ఆడపడుచుకి అంత మాత్రం చెయ్యమా ఏమిటి?" “ చేస్తావు లేవే..నాకే కొంచెం విసుగొచ్చింది అంత మాత్రం ఇంగితం లేదేమా అని. ...అదేమో వస్తూనే జ్వరపడిందా..పిల్లల పని నీ మీదే పడిందయ్యె సగం!" ఒక్కనిముషం ఆగి "రాముడూ! దాని మొగుడొట్టి అనుమానపు వెధవరా. ఏదో కోపిష్ఠి వాడు తిడతాడు, సాధిస్తాడనుకున్నాను గాని ఇలా ఉచ్ఛం, నీచం తెలీకుండా పెళ్ళాన్ని, ముగ్గురు పిల్లల తల్లిని కొడతాడనుకోలేదు. వీపు మీద వాతలూ..సిగరెట్టు దెబ్బలూను..ఉన్నట్టుండి బయల్దేరి వచ్చేసినట్టుంది..ఏం చెప్పిందో ఏమో..పిల్ల వెధవలు కూడా ఇంటి విషయాలు నోరిప్పి చెపితే వొట్టు" అంది. "అవునమ్మా! నాకూ తెలిసిందిలే...సుశీల చెప్పింది. నిన్న తోటలో మామిడి కాయల దొంగని పట్టుకున్నాం కదా..కాశిగాడూ, వీరయ్యా వాణ్ణి రెక్కలు వెనక్కి కట్టి ఇంటి దాకా లాక్కొచ్చారు. పెళ్ళాం పిల్లల్ని తీసుకెళ్ళడానికి పూర్ణక్క మొగుడూ అప్పుడే వచ్చాడు. ఆ దొంగని ఎడా పెడా వాయిస్తుంటే వణుక్కుంటూ చూశాడు"అన్నాడు రామారావు చెయ్యి మడిచి, పిడికిలి బిగించి, కండలు చూసుకుంటూ. రుక్మిణమ్మ నవ్వింది."రెండ్రోజుల క్రితం వాడు కార్డు రాసి పడేశాడుగా వస్తున్నానూ, పూర్ణనీ పిల్లల్నీ తీసుకెళ్ళడానికనీ? ఇంట్లో గడవద్దూ పెళ్ళాం లేకుండా? నిన్న ఆ కార్డు చదివాక పూర్ణ ఏం చేసిందనుకున్నావ్ ? నాచేతికి రెండొందల ముప్ఫై రూపాయలిచ్చింది" అంటూ కొడుకు వైపు, కోడలి వైపు చూసింది ఉత్కంఠ నింపుతూ. రామారావు తెల్లబోయి “ఆ! అదేమిటి?"అన్నాడు. "అదే మరి! ఆ డబ్బు పిల్లలు ముగ్గురికీ, తమ ఇద్దరికీ ఇచ్చి బట్టలు కొనుక్కోమని చెప్పమంది. ఏం చెయ్యను? మనంత మనం అలా ఇవ్వగలిగేలా లేదు గదా పరిస్థితీ? సరేనని తీసుకున్నా" పొట్టమీదున్న మనవరాలి చేతిని నిమురుతూ అంది రుక్మిణమ్మ. "అదా సంగతీ?" ఆలోచిస్తూ ఆగాడు రామారావు. "ఎందుకలా చేసిందో ఏమోరా" "ఎందుకేమిటమ్మా? దానికి పుట్టిల్లు లేదు. అది వెళితే గౌరవంగా చూసే దిక్కు లేదు. వాడికి పెళ్ళాం అంటే అలుసు. నాలుగు తన్నినా అడిగే వాడు లేడని ధీమా. తన్నులు తిని అది బయల్దేరి మనింటికి వచ్చినా ఒకరోజో, రెండు రోజులో అయాక ఇక్కడుండే వీల్లేక అదే తిరిగొస్తుందని వాడి నమ్మకం. అలా వెంటనే వెళ్ళక పోయే సరికి వాడే వచ్చాడు. వచ్చిన వాడికి ఇంకోడి దేహ శుద్ధి చేస్తూ నేను కనపడ్డాను. అది యాదృచ్ఛిక మనుకో ..అప్పటికే విషయం తెలుసు గనుక వెధవ్వేషాలు వేస్తే కాళ్ళు విరిచి చేతికిస్తానని చెప్పా. ఎవరిని ఉద్దేశించి అన్నానా అని చలపతి బావక్కూడా అనుమానం వచ్చే ఉంటుంది” "అది సరే ..దాని డబ్బే నాకిచ్చి, వాళ్ళకి మళ్ళీ ఇమ్మనడం ఎందుకూ?" "అదేనమ్మా...ఏదో దిక్కులేక వస్తే ఓ మూల ఉండనిచ్చామన్నట్టు కాకుండా ఆప్యాయంగా, ఆదరణగా, ఇంటి ఆడపడుచుగానే చూసుకుంటామనే భావం అతనిలో కలగాలని అలా చేసి ఉంటుంది. అది దాచుకున్న డబ్బేదో తెచ్చుకుని ఇలా ఖర్చు పెట్టిందనుకుంటా. మన ఆర్ధిక పరిస్థితి దానికీ తెలుసుగా. ఇలా స్థాన బలం, దేహ బలం , బంధు ప్రీతీ అన్నీ ఉన్న తమ్ముడు తనకి అండగా ఉన్నాడని చూపించుకుందుకు ఇలా చేసిందన్న మాట!” "నిజమేరా..పోనీలే....కాస్త వాడు తిన్నగా ఉంటే చాలు. అంతకంటే ఏం కావాలి?"అంది రుక్మిణమ్మ నిట్టూరుస్తూ. "ఉంటాడమ్మా..నాకేం అనుమానం లేదు" అని, “వొట్టిదో, గట్టిదో ఆడపిల్ల కొక పుట్టిల్లు ఉండాలమ్మా! తనని గౌరవంగా చూస్తూ, కష్టం వస్తే 'నీకు మేమున్నాం తల్లీ' అని ఆసరా ఇచ్చే చోటుండాలి. పట్టు పీతాంబరాలు పెట్టక పోయినా, ప్రేమగా పలకరించి, ఆదరణగా, ఆప్యాయంగా  ఓ ముద్ద అన్నం పెట్టే చోటుండాలి! చదువూ సంధ్యా చెప్పించకుండా నలుగురాడపిల్లల్లో పెద్దదని చిన్నప్పుడే పెళ్ళి చేసి, బరువొదిలించుకుంది దొడ్డమ్మ. ఇప్పుడు చూస్తే తోడ బుట్టిన వాళ్లందరిలో హీన స్థితిలో ఉంది. అక్కలెవరూ పెద్దగా ఆదరించరు దీన్ని. ముగ్గురు చిన్నపిల్లల్తో ఎక్కడికి పోతుంది?"అన్నాడు. “మరే...పోన్లే నాన్నా! అందరికీ నువ్వే అండ. నీకు ఆ రామచంద్రుడే అండగా ఉండాలిరా..ఇంక పడుకోండి . బాగా పొద్దుపోయింది"అంది రుక్మిణమ్మ. పక్కన పడుకున్న మనవరాలు మాధవి పక్కకి తిరిగి, మామ్మమీద కాలు వేసి, విన్న మాటల్ని మననం చేసుకుంటూ నిద్రలోకి జారింది. భర్త వెనకే లోపలికి నడిచిన సుశీల పెదవుల మీద చిరునవ్వు కదిలింది.    *** సమీర పడుకున్న తలుపు దగ్గరగా వేసి బయటికి వస్తూ గోడ గడియారం వైపు చూసింది మాధవి. రాత్రి పదిన్నరయింది. ఆదివారం! మంచం మీద దుప్పటి కప్పుకుని పడుకుని, పైకప్పు చూస్తున్న వేణు ఆమెని చూడగానే ఉక్రోషంగా "అయిందా దేశసేవ? వెధవ మొగుడు ఎప్పుడూ ఉంటాడుగా..ఎంత సేపన్నా ఎదురుచూస్తాడు! వాడికి పనేం ఉందీ? ఆపదల్లో ఆడవాళ్ళంటే ఎప్పుడో గాని దొరకరు! వాళ్ళకి అండా దండా అందిస్తే  పేరుకి  పేరూ, పుణ్యానికి పుణ్యం!" అన్నాడు. మాధవి నవ్వింది. సీసా మంచం పక్కనున్న బల్ల మీద పెట్టి అతని పక్కనే కూర్చుని, వేళ్ళతో అతని జుట్టు సవరించి, చెంప మీద ప్రేమగా రాస్తూ “అంత కోపమెందుకురా నాన్నా! అది మాత్రం ఏం చేస్తుందీ పాపం...సాటి మనిషికి కాస్త ఆసరా అందించడం తప్పు కాదమ్మా!" అంది వణుకుతున్న గొంతుతో. వేణుకి నవ్వొచ్చింది. ఆ గొంతు అతని బామ్మది. ఆవిడకి మాధవి అంటే విపరీతమైన ఆపేక్ష. వేణు అంటే ఒకటే గారం. మొదట్లో ముద్దుల మనవడి భార్యగా మాధవిని అపురూపం చేసినా, ఆమె వ్యక్తిత్వం గమనించాక అభిమానం పెంచుకుంది. ఆవిడ ప్రస్తావన వస్తే వేణు త్వరగా చల్లారతాడని మాధవికి తెలుసు.  “చాల్లే వేషాలు!..ఏమిటీ పిచ్చి చెప్పు?! ఆ అమ్మాయెవరు? మనమెవరు? మనకేం సంబంధం? ఇంకా మన పెళ్ళై మూడేళ్ళైనా కాలేదు. అప్పుడే నామీద ఇంత నిర్లక్ష్యం! ఆదివారమనైనా లేదు. ఆఫీసు నించి అలిసిపోయి వచ్చాడే పిచ్చి వెధవ అని గ్రహింపు లేదు” అన్నాడు మళ్ళీ అలుగుతూ. "అబ్బ క్షమించెయ్యరా బాబూ! ఇవాళ్టికిలా కానిచ్చేద్దూ!" మెరిసే కళ్లతో అంది, పెదవుల్లోంచి మల్లెలు దొర్లిస్తూ.   ముగ్ధుడైపోయి "సరే అలాక్కానీ" అనేశాడు వేణు. కాసేపటి తర్వాత అతని కైదండ మీద తలానించి  పడుకున్న మాధవి మెల్లిగా చెప్పింది"వేణూ! ఎందరో ఇలాంటి ఆడవాళ్లు! ఇవాల్టి ఈనాడులో చదివాను స్త్రీల మీద జరిగే నేరాల్లో యాభై శాతం అత్తింట్లో భర్త, అత్త మామలు, వాళ్ళ బంధువుల నుంచేట! తెలుసా? ఎవరైతే తనకి అండగా నిలబడతారని ఆశించి పెళ్ళి చేసుకుంటుందో, ఎవరికోసమైతే అన్ని రకాలు గానూ సర్దుకుందుకు సిద్ధపడుతుందో, వాళ్ల నించే ప్రత్యక్షంగా, పరోక్షంగా దాడి ఎదురైతే ఆ అమ్మాయి ఏమవాలీ?" మంద్ర స్థాయిలో ఆమె అన్న మాటలు అతని చెవిలోకి తరంగాలుగా వ్యాపించాయి. ఆమె చేతిని తన పెదవికానించుకుంటూ " మధూ! దీన్ని బట్టి మన దేశంలో ఎంత మంది మూర్ఖులున్నారో తెలియడం లేదూ? అందచందాలూ, తెలివితేటలూ, గొప్ప చదువూ ..ఏవి వున్నా, లేకపోయినా సహజంగా ఆడవాళ్ళు ఇంటిని స్వర్గంగా మార్చగల శక్తి ఉన్నవాళ్ళు. అయినా వాళ్ళని హింసించి, పైశాచికానందం పొందే వాళ్ళని మూర్ఖులనక ఏమంటాం?"అన్నాడు నిద్ర కంఠంతో. "అలాంటి హింస ఎక్కువగా ఎక్కడ జరుగుతుందో తెలుసా? ...ఎక్కడైతే ప్రతిఘటన బలహీనంగా ఉంటుందో, ఎక్కడైతే స్త్రీకి అండా, దండా దొరికే అవకాశం లేదో, ఎక్కడైతే నేరానికి తగిన శిక్ష వెంటనే పడదో .......అక్కడ" మృదువుగా అంది. "నిజమే కావచ్చు మధూ! కానీ నేరాలన్నిటికీ శిక్షలు మనం వెయ్యలేం  కదా!" “వెయ్యలేకపోవచ్చు..కానీ సమాజమే బాధితులకి అండగా నిలబడాలి వేణూ! నాన్న ఎప్పుడూ అనేవారు ‘వొట్టిదో గట్టిదో ఆడపిల్లకో పుట్టిల్లు ఉండాలమ్మా'అని. మనసుకి చాలా కష్టం కలిగినపుడు 'నే పుట్టింటికి పోతా'అనగలిగే అవకాశం ఉండాలనే వారు! జీవితాంతం తోడుంటానని ప్రమాణంచేసి పెళ్ళి చేసుకున్న వ్యక్తితో, బతుకు కన్నా చావే మేలనిపించే స్థితి వస్తే 'అమ్మలూ! నీకు మేమున్నాం’ అనే పుట్టిల్లో, దానికి సమానమైన చోటో లేకపోవడమే బాధాకరమైతే, ఉండి కూడా అక్కడ అండా, ఆదరణా దొరకని పరిస్థితి ఇంకా దారుణం!  “అసలు  ఆడపిల్లకి పుట్టింట్లో తగిన అండ ఉందని తెలిస్తే చాలా మటుకు కేసుల్లో గృహ హింస తగ్గు ముఖం పడుతుంది. చట్టం ఆడవాళ్ళ వైపే ఉన్నా కూడా ఇంకా సొంత ఇంట్లోనే ఆడవాళ్లమీద దాడులు జరగడానికి ముఖ్య కారణం ఒక్కటే...పుట్టిల్లే లేకపోవడం, లేదా తల్లిదండ్రులూ, అన్నదమ్ములూ ఇంటి ఆడపడుచుకి అండగా నిలబడక పోవడం! .." మెల్లగా చెప్పుకు పోతున్న మాధవి వేణు నిద్ర పోతున్నట్టు గమనించి ఆగిపోయింది. అతని దుప్పటి సరిచేసి, తనూ పక్కకి తిరిగి పడుకుంది. ఒంటి నిండా దెబ్బలతో ఉన్న సమీర స్థానంలో ధైర్యంగా స్వతంత్రంగా బతుకుతున్న సమీరని ఊహించుకుంటూ నిద్రలోకి జారుకుంది.                                                            *** వారణాసి నాగలక్ష్మి  

ప్రేమా పిచ్చీ ఒకటే...

  ప్రేమా పిచ్చీ ఒకటే...     “పిచ్చిదాన్ని కాపరానికి తీసుకొస్తానంటావేంట్రా.. దాని పిచ్చి నీక్కూడా అంటుకుందేంటీ?” గొంతెత్తి గట్టిగా అరుస్తున్న జానకిని చూసి ఆమెని యెప్పుడూ అలా చూడని కొడుకు వినయ్, భర్త శేఖర్ తెల్లబోయారు. వాళ్లని అలా చూసి అపరశాంతమూర్తిగా పేరు తెచ్చుకున్న జానకి తనని తాను సంబాళించుకుంది. గొంతు తగ్గించి నెమ్మదిగా అంది. “ మొన్ననేకదా మనం వినూని చూసి వచ్చాం. భద్రకాళిలా మీద పడిపోతుంటే ఎంత భయపడ్డామో అప్పుడే మర్చిపోయావా? దాన్నింటికి తెస్తే ఎప్పుడొచ్చి మీద పడుతుందో ననుకుంటూ గదిలో పెట్టి తాళం వెయ్యాలి. వేళకి దాని తిండీతిప్పలూ చూడాలి. అవన్నీ ఒక యెత్తైతే రోజుల పసిగుడ్డు ఆ చంటిదాన్ని క్షణక్షణం చూసుకోవాలి. ఇవన్నీ మనం చెయ్యగలవనే అంటున్నావా?”      యదార్థాన్ని అంత స్పష్టంగా వివరించిన జానకి మాటలకి తండ్రీకొడుకులిద్దరూ కాసేపు ఏమీ మాట్లాడలేకపోయేరు. పదిహేనురోజులక్రితం పాప పుట్టిందనే సంబరంతో వినీతని చూడడానికి వియ్యాలవారింటికి వెళ్ళినప్పటి సంగతి ఒక్కసారి గుర్తొచ్చింది ముగ్గురికీ.     జానకి, శేఖర్ లకి వినయ్ ఒక్కడే కొడుకు. తల్లితండ్రులదగ్గరినుంచి చదువు, సంస్కారం చక్కగా అందుకున్నాడు. మంచి ఉద్యోగంలో వున్నాడు. సంప్రదాయంగా తల్లితండ్రులు యెంచి, మెచ్చిన వినీతని సుముహూర్తంలో తన జీవితంలోకి ఆహ్వానించాడు. ఏవో చిన్న చిన్న తేడాలు తప్పితే రెండు కుటుంబాల మధ్యా ఏ విధమైన గొడవలూ లేవు. అలాగ చక్కగా సాగుతున్న సంసారంలోకి ఓ చిన్నప్రాణి అడుగిడబోతోందనే వార్త వారందరినీ ఎనలేని ఆనందంలో ముంచెత్తింది. రెండు దశాబ్దాల తర్వాత మళ్ళీ ఇంట్లో చంటిపాప పారాడబోతోంది. రెండిళ్ళలోనూ ఎంతో ఉత్సాహం. వేడుకలు, విందులతోబాటు ప్రతీనెలా మెడికల్ చెక్ అప్కి ఖచ్చితంగా తీసికెళ్ళేవాడు వినయ్. ఏడోనెలలో పురిటికి పుట్టింటికి హైద్రాబాదు వెళ్ళింది వినీత. అప్పటినుంచి పురుడొచ్చేవరకూ ప్రతిరోజూ ఫోన్ లో మాట్లాడుకునేవారు వినయ్, వినీతా కూడా. అంతా బాగుందన్నారు డాక్టర్లూ, పెద్దలూ కూడా.       ఒక రోజు ఉదయాన్నే పాప పుట్టిందన్న శుభవార్త వినగానే ఏనుగెక్కినంత ఆనందపడిపోయాడు వినయ్. జానకీ, శేఖర్ల ఆనందానికింక అవధులే లేవు. పదకొండోరోజు బారసాల చేసుకుంటామంటే , సిజేరియన్ ఆపరేషన్ అయింది కనుక వినీత పీటల మీద కూర్చోడం కష్టం కనుక, బారసాల మూడో నెలలో చేసుకుందామన్న వియ్యాలవారి మాటను కాదనలేకపోయారు. కానీ, మనవరాలిని చూడడానికి మూణ్ణెల్లు ఆగలేక పురుడొచ్చిన పదిహేనురోజులకి నక్షత్రం మంచిదే కనుక పాపని చూస్తామంటూ చెన్నై నుంచి ముగ్గురూ హైద్రాబాదు వియ్యాలవారింటికి వచ్చారు. వీళ్ళని చూసి కాస్త ఇబ్బంది పడుతూనే ఆహ్వానించారు వినీత తల్లితండ్రులు భాస్కర్, సుగుణ. “ఏదీ మా మనవరాలూ?” అంటూ ఇంట్లో అడుగుపెడుతూనే చొరవగా బెడ్రూమ్ల వైపు వెళ్ళబోతున్న జానకిని వినీత వున్నరూమ్ వైపు తీసికెళ్ళింది సుగుణ. చంటిపిల్ల పడుకుందేమో అనుకుంటూ చప్పుడు చెయ్యకుండా నెమ్మదిగా తలుపులు తోసింది జానకి.       చీకటిగా వున్న గదిలోకి సన్నగా పడిన వెలుతురు గీతని చూసిన వినీత పక్కమీంచి ఒక్క ఉదుటున లేచింది. నెమ్మదిగా తలుపు తోసుకు తొంగిచూస్తున్న అత్తగారిని చూసింది. అంతే.. ఒక్కసారిగా పక్కనే పడుకోబెట్టుకున్న చంటిపాపని అమాంతం గుండెలకి హత్తుకుంది. “ఫో.. ఫో.. నేను నా పాపని యివ్వను.. ఫో బైటకి.” అంటూ గట్టిగా అరవడం మొదలెట్టింది. స్థాణువయ్యింది జానకి. గట్టిగా అరుపులు వినిపించి వెనకనే వున్న శేఖర్, వినయ్ కాస్త తొంగి చూసారు. చెదిరిపోయిన జుట్టుతో, బెదురుతున్న కళ్ళతో, తెచ్చిపట్టుకున్న కోపంతో గట్టిగా అరుస్తున్న వినీతని చూసి తెల్లబోయారు. హడిలిపోయిన జానకి వెంటనే తలుపులు మూసేసి వెనక్కి తిరిగింది. పాలిపోయిన మొహాలతో భాస్కర్, సుగుణలు క్షమించమన్నట్టు చూసారు వీళ్లని. అప్పుడే అక్కడికొచ్చిన ఫామిలీడాక్టర్ మహేష్ జరిగింది గ్రహించి అందరినీ ఉద్దేశిస్తూ..”రండి, కూర్చుందాం” అంటూ వాళ్ళని హాల్లో సోఫాలవైపు నడిపించాడు. “డాక్టర్ గారూ, ఇప్పుడే ప్రయాణం చేసొచ్చారు. కాస్త కాఫీలు తాగాక అంతా చెపుదురుగాని..”  అంది వినీత తల్లి సుగుణ. “అవునండీ, ముందు కాస్త రిలాక్స్ అవండి. అప్పుడు మాట్లాడుకుందాం.” అంటున్న డాక్టర్ మాటలు అర్ధం కాక ఒకరి మొహాలొకరు చూసుకున్నారు జానకి, శేఖర్, వినయ్.  వరాల మొలక చంటిపాపని చూడడానికి ఉప్పొంగుతున్న ఉత్సాహంతో  వచ్చిన  ఆ ముగ్గురూ రాక్షసిలా అరుస్తూ మీదపడుతున్న వినీతని చూసి స్థాణువులయ్యారు.  వారికసలు నోటమ్మట మాటనేదే రాలేదు.    భాస్కర్, సుగుణల బలవంతం మీద స్నానాలు చేసి, కాఫీ. టిఫిన్లు ముగించి అందరూ హాల్లో కూర్చుని స్థిమితపడ్డాక భాస్కర్ వాళ్ళ ఫామిలీడాక్టర్ మహేష్ నెమ్మదిగా మాట్లాడడం ప్రారంభించాడు. ముందుగా జానకిని చూసి,  “అమ్మా, మీరు ఖంగారు పడకండి. అంతా వివరంగా చెప్తాను..” అంటూ అందరినీ ఉద్దేశించి చెప్పసాగాడు.  “మొదటినుంచీ జరిగిందంతా చెప్తాను.  చదువు, సంస్కారం వున్నవారు, అర్ధం చేసుకుంటారనే అనుకుంటున్నాను.     మామూలుగా తొమ్మిదినెలలూ నిండాక మీ కోడలు వినీతని చెకప్కి తీసికెళ్ళినప్పుడు బేబీ బాగా తయారయిందనీ, ఎప్పుడైనా పురుడు రావచ్చనీ గైనకాలజిస్ట్ చెప్పింది. అలా చెప్పాక కూడా వారం గడిచినా నెప్పులు రాక అనీజీగా అనిపిస్తే హాస్పిటల్ లో జాయిన్ చేసుకుంది. మామూలుగా నొప్పులొస్తే ఫరవాలేదు, లేకపోతే పరిస్థితిని బట్టి సిజేరియన్ చేస్తాను అంది. అదంతా మీకు తెలిసిందే కదా.. కానీ అప్పుడే వినీత మనసులో ఒక సందేహానికి ఒక బీజం పడింది, అదేవిటంటే సిజేరియన్ చేసినప్పుడు తనకి మత్తుమందు ఇస్తారనీ, అలా ఇచ్చినప్పుడు తనకి తెలీకుండా తన పాపని తీసికెళ్ళి పోతారనీ ఒక విధమైన భయోద్వేగానికి లోనయింది. మరి అలా ఎందుకనుకుందో మాకు తెలీలేదు కానీ అలా జరగదని మేమెంత నచ్చచెప్పినా వినలేదు. ఆపరేషన్కి కానీ, మత్తుమందు ఇవ్వడానికి కానీ ఒప్పుకోలేదు. ఇంక సిజేరియన్ చెయ్యకతప్పని పరిస్థితుల్లో ఒకవిధంగా బలవంతంగానే వినీతకి అనస్తీషియా ఇవ్వవలసొచ్చింది. ఆపరేషను అంతా బాగానే అయిందీ, పాప కూడా హెల్దీగానే వుందీ అని అందరం సంతోషిస్తున్న టైమ్ లో తెలివిలోకి వచ్చిన వినీత ప్రవర్తన విచిత్రంగా  మారిపోయింది.  పాపని ఒక్కక్షణం వదిలి పెట్టటం లేదు. ఒక్క క్షణం వదిలినా ఎవరో తీసికెళ్ళిపోతారేమోననే భయం ఎందుకో తనలో ప్రవేశించింది.  తన దగ్గరికి ఎవరైనా వస్తే చాలు తన పాపని తీసికెళ్ళిపోతారనే భయంతో చంటిపిల్లని మరింత దగ్గరికి తీసుకుని గట్టిగట్టిగా అరిచేస్తోంది. ఎందుకిలా చేస్తోందో మాకేమీ అర్ధం కావటం లేదు. ఆపరేషనంతా బాగా అయి, తల్లీ, బిడ్డా క్షేమంగా వున్నారని సంతోషపడుతుండగానే ఏవిటో వినీత ప్రవర్తన ఇలా మారిపోయింది. “ వింటున్న శ్రోతలు నిశ్చేష్టులయ్యారు. డాక్టర్ చెప్పడం ఆపగానే కళ్ళనీళ్లపర్యంతమౌతూ.  “తనకి తెలీకుండా మత్తుమందు ఇచ్చేసామని మామీద కూడా నమ్మకం పోయి, పాపని మా చేతికి కూడా ఇవ్వటం లేదు. ఎవరొచ్చి తన పాపని తీసేసుకుంటారో అన్నట్టు గాలి కూడా రాకుండా తలుపులు, కిటికీలు మూసేసుకుని ఆ చంటిదాన్ని ఒళ్ళో పెట్టుకు కూర్చుంటుంది. అందుకే ఇప్పుడు మీరు వెళ్ళగానే పాపని తీసేసుకుంటారేమోనని అంత గట్టిగా అరిచేసింది.” అంది సుగుణ.       వింటున్న శేఖర్ కుటుంబం తెల్లబోయింది.  వినయ్, వినీతల వివాహం జరిగి అప్పటికి నాలుగేళ్ళయింది. అత్తగారిని తల్లి స్థానంలో నిలబెట్టుకుని, ఆవిడ చెప్పినట్టే వినయ్ వాళ్ళ కుటుంబ పధ్ధతులకీ, సాంప్రదాయాలకీ చాలా తొందరగా అలవాటు పడిపోయింది వినీత. ఇప్పటి రోజుల్లోని ఆడపిల్లల్లా విరగబాటు లేకుండా ,ఇంట్లో అందరితో చక్కగా కలిసిపోయిన  వినీత అంటే అత్త జానకికి చాలా అభిమానం. మామూలుగానే ఆడపిల్లలంటే కొంచెం ఇష్టపడే జానకి వినీత కోడలయ్యాక తనకి కూతురు లేని లోటు తీరినట్టే అనుకుంది.  గర్భవతి అయ్యి ఏడోనెల వెళ్ళిపోతుందనగా  ఇంక తప్పదన్నట్టు పురిటికి పుట్టింటికి వచ్చింది. అలా వచ్చిందన్న మాటేకానీ, రోజూ ఉదయం, సాయంత్రం చెన్నై ఫోన్ చేసి, వినయ్ తోనూ, జానకితోనూ మాట్లాడి, అక్కడి ఇంట్లో ఆరోజు ఏం జరిగిందో తెలుసుకుంటూనే వుండేది వినీత. అంతగా తమ ఇంట్లో కలిసిపోయిన వినీత ఇలా రాక్షసిలా అరుస్తూ మీద పడిపోవడమేవిటో అస్సలు అర్ధం కాలేదు వాళ్ళ ముగ్గురికీ. అందులోనూ ఇప్పుడు డాక్టర్ చెప్తున్నది వింటుంటే పాపని వాళ్ళ అమ్మానాన్నలకి కూడా ఇవ్వట్లేదనీ, ఎవ్వరినీ దగ్గరికి కూడా రానివ్వటంలేదనీ తెలిసి ఇంకా ఆశ్చర్యపోయారు.   జరిగినదంతా శ్రధ్ధగా వింటున్న శేఖర్ కాస్త తేరుకుని, “మరి స్పెషలిస్ట్ ఎవరికీ చూపించలేదా? ఇదంతా మాకెందుకు చెప్పలేదూ?” అనడిగాడు. సుగుణ నెమ్మదిగా చెప్పింది.. “రెండు రోజులు మధ్యమధ్యలో తెలివొచ్చి అలా అంటున్నా మేమేవీ పట్టించుకోలేదు. మూడోరోజు నుంచీ ఈ ప్రవర్తన ఏదో వింతగా అనిపించి డాక్టర్ ని అడిగాము. వాళ్ళన్నారూ.. కొంతమంది ఆడవాళ్లకి డెలివరీ అయ్యాక నరాల బలహీనత వల్ల, శరీరంలో జరిగే విపరీతమైన హార్మోన్ల మార్పులవల్ల ఇలాగ ప్రవర్తిస్తుంటారనీ, నాలుగురోజుల్లో సరైపోతుందనీ చెప్పారు. “ “నాలుగురోజులేవిటి? అప్పుడే పదిహేనురోజులైపోయింది కదా..” అడిగింది జానకి. భాస్కర్ అందుకున్నాడు. “అవునండీ.. వారందాకా ఓపిక పట్టాము. తర్వాత మాకు భయం వేసి స్పెషలిస్ట్ని కలిసాము. వాళ్ళు టెస్ట్ లు చేసి, హార్మోన్లమార్పు ప్రభావం చాలా ఎక్కువగా  వుందని చెప్పి, దానికి తగ్గ మందులు ఇచ్చారు. ఈ వారమంతా వాడాము. రోజురోజుకీ వినూ ధోరణి విపరీతమైపోడం తప్పితే ఎక్కడా ఆ మందుల ప్రభావం కనిపించలేదు.” “మరిప్పుడెలా?” ఆతృతగా అడిగాడు వినయ్. డాక్టర్ మహేష్ వినయ్ వైపు తిరిగి చెప్పాడు.  “ఖంగారు పడకండి. ఇది ముందు నరాల బలహీనత అనుకున్నాం. తర్వాత హార్మోన్ల ప్రభావం అనుకున్నాం. ఏదీ ఇదమిథ్థంగా తేలలేదు. రేపు ఇంకో స్పెషలిస్ట్ దగ్గర అపాయింట్ మెంట్ తీసుకున్నాం. మీరెలాగూ వచ్చారు కనుక ఆ స్పెషలిస్ట్ దగ్గరికి మీరూ రండి. ఈ రోజుల్లో వైద్యం బాగా అభివృధ్ధి చెందింది. అసలు రోగమేవిటో తెలియాలి తప్పితే అన్నింటికీ చక్కటి మందులున్నాయి. వినీత మామూలుగా అరోగ్యవంతురాలే కనుక ఇదేదో తాత్కాలిక సమస్యే అయుంటుంది. రేపు ఆ డాక్టర్ ని అందరి సందేహాలూ అడుగుదాం. “ డాక్టర్ మాటలు విన్న శేఖర్, జానకి, వినయ్ లకి ఏం మాట్లాడాలో తోచలేదు. భాస్కర్ కల్పించుకుని, “బావగారూ, దయచేసి రేపు మీరు కూడా మాతో రండి. మాకసలే ఈ పిల్ల ఇలా అయిందేమిటా అని బెంగగా వుంది. మీరు పక్కనుంటే కాస్త ధైర్యంగా వుంటుంది.” అన్నాడు.        “అంతకన్నానా.. అసలు రేపు విషయమేవిటో కనుక్కుందాం.” ఏం మాట్లాడాలో తెలీని పరిస్థితిలో వున్న శేఖర్ భాస్కర్ కి మాటిచ్చేసేడు.       వినయ్ కయితే అంతా అయోమయంగా అనిపించింది. ఈ వినీత తన వినీతేనా అన్న అనుమానం వచ్చింది. ఎప్పుడూ చక్కగా తయారయి, నెమ్మదిగా మాట్లాడుతూ, నవ్వుతూ చలాకీగా వుండే ఆ వినీతెక్కడ? ఇలా చిందరవందరగా వున్న జుట్టుతో, ఎర్రబడ్దకళ్ళతో, గట్టిగా అరుస్తూ, రాక్షసిలా మీదపడిపోతున్న ఈ వినీత ఎక్కడ? అసలెక్కడైనా పోలికంటూ వుందా? మొన్నటిదాకా తనూ, వినీతా పుట్టబోయే పాప గురించి ఎన్ని కలలు కన్నారు? ఎన్ని కబుర్లు చెప్పుకున్నారు.. ఇప్పుడా పాపని చూడడానికే  కుదరటం లేదే..ఎందుకిలా జరిగింది? తలపట్టుకుని కూర్చున్నాడు.  జానకి నెమ్మదిగా కొడుకు దగ్గరికి చేరింది. “ఖంగారు పడకు నాన్నా..రేపు డాక్టర్ దగ్గరకి వెడతారుగా.. ఆయన కంతా తెలుస్తుంది..” అంటూ కొడుకుని ఓదార్చింది కానీ, ఆమెకి మటుకు ఇదంతా  యేదో సీరియస్ విషయమే అయ్యుండాలనిపించింది. ఎంతమంది పురుళ్ళు  పోసుకోవటంలేదూ.. అందరికీ హార్మోన్లమార్పులు ఇంత విపరీతంగా వుంటాయా.. ముఖ్యంగా పాప దగ్గరికి ఎవర్నీ రానీకపోవడమేంటి? ఎంత సర్దుకుందామనుకున్నా సర్దుకోలేకపోతోంది జానకి.    మర్నాడు స్పెషలిస్త్ దగ్గరికి వినీత రిపోర్ట్ లు తీసుకుని అందరూ వెళ్ళారు. ఆయన కేసునంతా క్షుణ్ణంగా పరిశీలించారు. వీళ్ళందరినీ కూచోబెట్టి వివరించారు.      “చూడండీ.. మీరందరూ చదువుకున్నవారు. ప్రపంచంజ్ఞానం వున్నవారు. ఇప్పుడు మీకందరికీ తెలిసున్నదైనా ఒక విషయం వివరించాలి. మన పెద్దవాళ్ళు కూడా అంటుంటారు.. ఆడదానికి  ప్రసవమన్నది మరో జన్మలాంటిదని.. ఆ సమయంలో స్త్రీ శారీరకంగానూ, మానసికంగానూ చాలారకాల మార్పులకి, ఒత్తిడులకీ లోనవుతుంది. కొత్తగా తల్లి అయ్యే స్త్రీ గురించి  మన దేశంలో కన్నా విదేశాల్లో  చాలా పరిశోధనలు చేసారు. శరీరం, మనసూ కూడా ఎన్నెన్ని రకాల మార్పులకీ, ఉద్వేగాలకీ లోనవుతుందో చెప్పారు. అందుకే మనవాళ్ళు కూడా తల్లి అయ్యే ప్రతి స్త్రీ మనస్సూ ప్రశాంతంగా, సంతోషంగా వుంచాలని కుటుంబసభ్యులందరికీ చెపుతుంటారు. మెడికల్ సైన్స్ ఇంతగా అభివృధ్ధి చెందిన ఈ రోజుల్లో నెల తప్పినప్పట్నుంచీ గర్భవతి అయిన మహిళ డాక్టర్ల పర్యవేక్షణలోనే వుంటోంది. ఈ విషయంలో వినీత విషయంలో మీరంతా ఏమీ తక్కువ చెయ్యలేదు. అమ్మానాన్నలకన్న ఎక్కువగా అత్తమామలూ, భర్తా ఆమెని చూసుకున్నారు. మానసికంగానూ, శారీరకంగానూ కూడా ఆమెకి ఏ లోటూ లేదు. కానీ ప్రసవం తర్వాతే వినీత ఇలా ప్రవర్తిస్తోందంటే ఎందుకని మనం  ఆలోచించాలి. “ ఆసక్తిగా వింటున్న శ్రోతలు కుర్చీల్లో కాస్త ముందుకి జరిగారు. “మెడికల్ సైన్స్ ప్రకారం చెప్పాలంటే ప్రసవమయిన స్త్రీలలో తొంభైశాతంమంది ఆ తర్వాత జరిగే ప్రసవానంతర రక్తస్రావానికి  ఒకవిధమైన మానసిక బలహీనతలకి  గురవుతారు. కానీ అందులో యాభైశాతం మంది ఆ తర్వాత నాలుగురోజుల్లోనే మానసికంగా దానిలోంఛి బైటపడతారు. మరో ఇరవైశాతంమంది ప్రసవమయిన రెండువారాల్లో మామూలు మనుషులవుతారు. కానీ ఇరవైశాతం మందిలో మటుకు  ఈ మానసిక రుగ్మత అన్నది రెండువారాలయినా పోదు. ఆ కోవలోకే వచ్చింది ఇప్పుడీ వినీత.” “ఎందుకంటారండీ?” ఆతృతగా అడిగింది సుగుణ. అడగడమయితే సుగుణే అడిగింది కానీ జవాబు వినడానికి అక్కడున్న అందరూ అంతే ఆతృతతో చూస్తున్నారు.     “దానికి చాలా కారణాలుంటాయి. ప్రసవానికి ముందు వినీత చాలా సంతోషంగానే వున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ కూడా అంతా బాగానే అయింది. ఆ తర్వాతే ఆమెలో ఈ వింత ప్రవృత్తి కనపడుతోందంటే దాని వెనకాల ఏదైనా బలమైన కారణం వుండుండాలి. ఆమె మనసుమూలల్లో ఎక్కడో ఆమెకే తెలీని ఒక భయం, భీతి వుండుండాలి. స్వంత తల్లితండ్రులకి కూడా పాపని ఇవ్వటం లేదంటే ఆమె మనసులో వున్న భయమేమిటో మనకి తెలియాలి. అప్పుడు కానీ మనం దాని గురించి ఏమీ చెయ్యలేం.” డాక్టర్ మాటలు వింటున్నవాళ్లకి  విషయం మరింత అయోమయంగా అనిపించింది. డాక్టర్ మళ్ళీ అన్నాడు. “దీనికి మెడికల్ భాషలో చాలా పెద్ద పదమే వుంది. ఇటువంటిదానిని మా వైద్యపరిభాషలో “పోస్ట్పార్టమ్ డిసార్డర్” అంటాం. మామూలుభాషలో చెప్పాలంటే “ది బేబీ బ్లూస్”. పదిశాతం కేసుల్లో ప్రసవమయిన తర్వాత కలిగే శారీరక, మానసిక అస్థిరత్వం వల్ల, శరీరంలో విపరీతంగా జరిగే హార్మోన్ల మార్పులవల్ల మనసు మూలల్లో ఎప్పుడో దాగున్న భయాలన్నీ బయటపడతాయి. ఇప్పుడు వినీత పదిశాతం మహిళల్లో వచ్చే మానసికరుగ్మతలో వుంది. దానికి కారణాలేమిటో కనుక్కోవాలి.” “ఎలా తెలుస్తుంది డాక్టర్?” భాస్కర్ వెంటనే అడిగాడు. “మీరు ఖంగారు పడకండి. నాకు తెలిసిన సైకియాట్రిస్ట్ వున్నాడు. నేను స్పెషల్ కేస్ గా చెప్తాను. మీరు వెళ్ళి ఆయన్ని కలవండి. ఖంగారేంలేదు. అంతా సరైపోతుంది.” అంటూ ఆ సైకియాట్రిస్ట్ పేరూ, నంబరూ రాసి భాస్కర్ కి ఇచ్చాడు. సైకియాట్రిస్ట్ అన్న మాట వింటూండగానే అందరి మొహాల్లోనూ మార్పులొచ్చేసాయి. సుగుణ మొహంలో ఖంగారు కనపడితే, శేఖర్ మొహంలో ఆశ్చర్యం కనపడింది. వినయ్ మొహం పాలిపోయింది. జానకికి నోట మాట రాలేదు.యాంత్రికంగా నమస్కారం చేస్తూ డాక్టర్ దగ్గర శెలవు తీసుకున్నారందరూ.     ఆ రాత్రే బయల్దేరి వెనక్కి చెన్నై వచ్చేసారు శేఖరం కుటుంబసభ్యులు. అప్పటికప్పుడే అది జరిగి పదిహేనురోజులయింది. అదంతా గుర్తొచ్చింది జానకికి. ఆ తర్వాత వియ్యాలవారిద్దరిమధ్యా రోజూ వినీత విషయమై ఫోన్ లో సంభాషణలు జరుగుతూనే వున్నాయి. శేఖరూ, వినయ్ రోజూ భాస్కర్ నుంచి వివరాలు తెలుసుకుంటున్నారు. జానకి మటుకు స్తబ్ధుగా అయిపోయింది. కోడలికి ఈ పిచ్చేవిటో.. ఆ చంటిది ఎలా పెరిగి పెద్దవుతుందో, నిండా ముఫ్పైయేళ్ళు కూడాలేని వినయ్ భవిషత్తేవిటో ఆమెకి అస్సలు అర్ధంకావటంలేదు.     అంత టెన్షన్ లో వున్న జానకి దగ్గరికి వినయ్ వచ్చి, “అమ్మా, మనం వినూని ఇంటికి తెచ్చేసుకుందాం..” అనగానే అందుకే అంత గట్టిగా అడిగింది. “పిచ్చిదాన్ని కాపరానికి తీసుకొస్తానంటావేంట్రా.. దాని పిచ్చి నీక్కూడా అంటుకుందేంటీ?” అంటూ. వినయ్ ఏమీ మాట్లాడలేక  అలా నిలబడిపోయాడు. శేఖర్ గబగబా జానకి దగ్గరికి వచ్చాడు. “ముందు నువ్వు కూర్చో..” అంటూ డైనింగ్ టేబిల్ దగ్గర కుర్చీలో కూర్చోబెట్టాడు. “చూడు, జానకి వినూ పిచ్చిదేమీ కాదు. నువ్వు ముందా మాట మానెయ్యి.” అన్నాడు. “పిచ్చిది కాకపోవడం ఏంటండీ.. మనం కళ్ళారా చూసాం. డాక్టరే అన్నాడు కదా సైకియాట్రిస్ట్ ని కలవమని. సైకియాట్రిస్ట్ దగ్గరికి ఎవరెడతారో నాకు తెలీదంటారా?” ఎదురు ప్రశ్నించింది జానకి.    వినయ్ ముందుకొచ్చాడు. “అమ్మా, ముందు నువ్వు విషయమంతా విను. ఈ పదిహేనురోజుల్లోనూ మామయ్యగారూ వాళ్ళూ ఎంతమందిని కలిసారో, వాళ్ళేం చెప్పారో అన్నీ చెప్తాను.” అంటూ తల్లి పక్కన కుర్చీలో కూర్చుని వినయ్ నెమ్మదిగా వివరించాడు.  “మామయ్యగారికి లక్ష్మి అని ఒక చెల్లెలు వుండేదిట. అంటే వినూకి మేనత్తన్నమాట. ఆవిడ పెద్దింట్లో మెట్టి సుఖపడాలని వాళ్ల అమ్మా,నాన్న బోలెడు కట్నమిచ్చి సంపన్నుల ఇంటి కోడలిని చేసారుట. కట్నకానుకలతో సరిపెట్టుకోకుండా వాళ్ళు అస్తమానం ఆవిడని ఇంకా ఇంకా డబ్బు తెమ్మని పుట్టింటికి పంపుతుండేవారుట. ఆ సమయంలోనే మామయ్యగారి తండ్రికి వ్యాపారంలో నష్టం వచ్చిందిట. అందుకని వియ్యాలవారు అడిగినవి ఇవ్వలేకపోయారుట. అప్పుడే ఆ వినూ మేనత్త లక్ష్మికి మగపిల్లాడు పుట్టాడుట. లక్ష్మి అత్తవారొచ్చి, పాలుతాగుతున్న పురిటికందుని  లక్ష్మి వద్దని వేడుకుంటున్నా వినకుండా, “వీడు మా వంశాంకురం. నువ్వు డబ్బు తీసుకుని మా ఇంటికొచ్చాకే వీణ్ణి చూసేదీ” అంటూ బలవంతంగా లాక్కుపోయారుట. ఆ బాధ  భరించలేక  పచ్చిబాలెంతరాలు లక్ష్మి అస్తమానం పిల్లవాడికోసం ఏడుస్తూ వుండేదిట. ఆ ఏడుపే ఆ పచ్చిబాలింతరాలిని ఉన్మాదంలోకి దింపిందిట. ఒక గుడ్డలమూట పట్టుకుని “నా బాబుని నేనివ్వను.. నేనివ్వను..” అంటూ తిండీతిప్పలూ లేకుండా హృదయవిదారకంగా ఏడ్చేదిట. ఎవ్వరినీ ఆఖరికి వాళ్ల అమ్మానాన్నల్నికూడా ఆ గుడ్డలమూటని పట్టుకోను కూడా పట్టుకోనిచ్చేది కాదుట. ఆ గుడ్డలమూటే తన బిడ్డ అన్న భ్రమలో =నే వుండేదిట.  డబ్బు సమకూర్చలేక ఆమెని అత్తింటికి పంపలేకపోయారుట తల్లితండ్రులు. తను కన్నబిడ్డని మళ్ళీ చూడలేకపోయిందిట వినూ మేనత్త లక్ష్మి. ఆ భ్రమలోనే ఆవిడ చనిపోయిందిట. ఇదంతా సరిగ్గా వినూకి ఎనిమిదేళ్ళప్పుడు జరిగింది. తెలిసీతెలీని వయస్సులో ఇంట్లో మేనత్త పిల్లవాడికోసం ఏడిచే ఏడుపు వినూ మనస్సులో ముద్రపడిపోయింది. ఆ విషయం ఆమె మనసుపొరల్లో ఎక్కడవుందోకానీ మళ్ళీ వినూకి డెలివరీకోసం మత్తుమందు ఇస్తారన్నప్పుడు గుర్తొచ్చింది. తనకి మత్తుమందిచ్చేసి తన పాపని తీసికెళ్ళిపోతారనే దృఢమైన అభిప్రాయం కలిగింది వినూకి. సాధారణంగా డెలివరీ అయ్యాక ఆడవారిలో కలిగే హార్మోన్లమార్పువల్ల, నరాల బలహీనతవల్ల, ఎక్కువగా మానసిక ఆందోళనకు గురవ్వడం వల్లా వినూ తనని తాను సంబాళించుకోలేకపోయింది. అందుకని అలా ప్రవర్తించింది. అంతే కానీ, వినూ పిచ్చిది కాదమ్మా..” వినూ గురించి అంత వివరంగా చెపుతున్న వినయ్ని విచిత్రంగా చూసింది జానకి.   శేఖర్ ముందుకొచ్చాడు. “అవును జానకి. ఈ పదిహేనురోజుల్లోనూ రోజూ బావగారితో మాట్లాడుతున్నాను కదా.. ఆయన చెప్పారు. సైకియాట్రిస్ట్ వినూని బాగా పరీక్షించి కారణం ఇదీ అని చెప్పగానే, స్పెషలిస్ట్ వినూ తొందరగా కోలుకోడానికి మంచిమందులు ఇచ్చాడుట. కానీ మందులతో మాత్రమే పని జరగదనీ, దానితోపాటు ఇంట్లోవారి సహకారం వినూకి చాలా కావాలనీ చెప్పాడుట. వాళ్ళు కౌన్సిలింగ్ లో ఎలా చెప్పారో అలాగే జాగ్రత్తగా వినూ మనసు కుదుటపడేటట్టు చూసుకున్నారుట ఇన్నాళ్ళూ. నెమ్మది నెమ్మదిగా మార్పు కనపడుతోందిట. ఇప్పుడు పాపని వాళ్ల అమ్మానాన్నలకి అందిస్తోందిట వినూ. వాళ్లతోపాటే మన సహకారం కూడా వుంటే తొందరగా మనుషుల్లో పడుతుందని డాక్టర్లు చెప్పారుట. అందుకనే  వినూని ఇక్కడికి తీసుకొస్తున్నామని చెప్పారు బావగారు..” అన్న శేఖర్ మాటలకి తలెత్తి చూసింది జానకి.     వినయ్ తల్లి కాళ్ల దగ్గర కూర్చున్నాడు. “అమ్మా,. భార్యని ఎలా చూసుకోవాలో నువ్వే ఇదివరకు ఎన్నోసార్లు చెప్పావు. ఏ తండ్రీ కూడా కూతురికి తిండి పెట్టుకోలేక పెళ్ళి చేసి పంపించడూ, మన వంశం నిలబెట్టడానికి  ప్రాణంలా పెంచుకున్న కూతుర్ని మన ఇంటికి పంపుతాడూ,  మన ఇంటికొచ్చిన లక్ష్మిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి అని నాతో ఎన్నిసార్లు చెప్పలేదమ్మా నువ్వూ.  మన ఇంటి లక్ష్మికి ఇప్పుడు నిజంగా మన సహకారం కావాలమ్మా. ఇలాంటి పరిస్థితుల్లో వున్న భార్యని రావద్దనడం ధర్మమేనంటావా.. నువ్వే చెప్పు?” అనడిగాడు.    “కానీ..” అనబోతున్న జానకిని మరి మాట్లాడనివ్వకుండా, “వాళ్ళు రేపొస్తున్నారు.. అత్తవారింట్లోవారు కూడా వినూ కోలుకోడానికి సహకరించాలని డాక్టర్ చెప్పారుట. మనింటి కొచ్చిన పిల్లని మనం చూసుకోవాలి కదా జానకీ.” అన్నాడు శేఖర్. “కానీ..నాకు తెలీదే.. భయమేస్తుంది..” అంది ఖంగారుగా జానకి ఆరోజు వినూని చూసిన దృశ్యం మర్చిపోలేకపోతోందామె. “ఏం ఫరవాలేదు. వినూ అమ్మానాన్నా కూడా వస్తున్నారు. అంతా వున్నాం కదా..” అన్నాడు శేఖర్. జానకి మనసుకి సర్దిచెప్పుకుందుకు ప్రయత్నిస్తోంది.     మర్నాడు సాయంకాలం ఫ్లైట్కి చంటిపిల్లని, వినూని తీసుకుని వచ్చారు భాస్కర్, సుగుణలు. భయంభయంగా  కోడలిని పరిశీలించింది జానకి. పదిహేనురోజులక్రితం కన్న కాస్త మార్పు కనపడుతోంది కానీ వినూ కళ్ళల్లో ఆ బెదురూ, భయం పోలేదు. తల్లి భుజాలచుట్టూ చెయ్యివేసి నెమ్మదిగా నడిపిస్తూ లోపలికి తీసుకువస్తే అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చింది. నాలుగేళ్ళపాటు మసిలిన ఇంటిని కూడా కొత్త ఇంటిని చూస్తున్నట్టు గోడలూ, కప్పూ చూడడం మొదలుపెట్టింది. క్షణక్షణం చంటిపిల్లని తనకి మరీ దగ్గరగా పొదువుకుంటోంది.    డాక్టర్లు హారతివ్వడం, దిష్టి తియ్యడంలాంటివి చెయ్యొద్దనీ,  దానివల్ల అనుమానాలు తలెత్తవచ్చు అన్నారని భాస్కర్ దగ్గర విని  ముందే శేఖరం చెప్పడం వలన జానకి అలాంటివేమీ చెయ్యలేదు. సుగుణ నెమ్మదిగా వినూని ఆమె గదిలోకి తీసికెళ్ళింది. ఒక్క సుగుణకి తప్పితే మరింకెవ్వరి చేతికి పాపనివ్వటంలేదు వినూ.   శేఖర్ కుటుంబసభ్యులందరికీ భాస్కర్ డాక్టర్ చెప్పినవన్నీ వివరించాడు. వినీతతో ఏం మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో అన్నీ విపులంగా చర్చించాడు. అవన్నీ విన్న జానకి భయపడింది.    అది చూసిన సుగుణ “వదినగారూ, వినూకి పూర్తిగా నయమయ్యేదాకా మేం కూడా ఇక్కడే వుంటామండీ. డాక్టర్లు అమ్మానాన్నలతో పాటూ, భర్తా, అత్తమామల సహకారం కూడా వుంటే తొందరగా కోలుకుంటుందని అన్నారని ఇలా తీసుకొచ్చాం. అసలు ఇలా వస్తామని అడగడానికి మేం చాలా భయపడ్డాం. చాలమంది ఈ పిల్ల పిచ్చిదైపోయిందీ, మాకొద్దూ అని మీరు అంటారని చెప్పారు. కానీ మీరు పెద్దమనసు చేసుకుని  మాకు ఈ అవకాశం ఇచ్చారు. మీకు ఎన్ని దండాలు పెట్టినా తక్కువే…” అంటూ కళ్ళనీళ్ళతో రెండుచేతులూ ఎత్తి దండం పెట్టింది.  జానకి ఖంగారుగా..”అయ్యయ్యో ..అలా అనకండి. వినూ ఈ ఇంటికోడలు. మా వినయ్ మనసులో వున్న వినూ కోసం ఏదైనా చేస్తాను. కానీ, ఏం చెయ్యాలో ఏమిటో కాస్త మీరు చెపుతుండండి.. అంతే..” అంది.     జానకి మాటలకి సుగుణ మనసు నిండిపోయింది. ఇంత మంచి అత్తగారు వినూకి దొరికినందుకు పొంగిపోయింది. “ఏమీలేదండీ. ఎవరైనా పాపని తన దగ్గరినుంచి తీసికెళ్ళిపోతారనే భయం వినూలో పోవాలంటే ఇంట్లోవున్నవాళ్లమీద వినూకి నమ్మకం కలగాలని  డాక్టర్ చెప్పాడు. ఈ వారంరోజుల్లోనూ మామీద నమ్మకం కలిగింది వినూకి. ప్రసవానంతరం ఇలా నరాల బలహీనతకీ, హార్మోన్లమార్పుల్లో వచ్చే మానసిక రుగ్మతలకీ  మందులు వాడుతున్నప్పుడే, చుట్టు వున్నవాళ్ళు కూడా వినూకి మానసిక ధైర్యం అందిస్తే తొందరగా కోలుకుంటుందని డాక్టర్ చెప్పారు. వినూకి కన్నబిడ్ద పాపమీదున్న మమకారం శారీరక, మానసిక బలహీనతల వల్ల ఇలా పిచ్చిలా మారిందని అన్నారు..”   సుగుణ మాటలు వింటున్న జానకి ఆమె మాటలని మధ్యలోనే ఆపింది.. “పిచ్చి అనకండి వదినగారూ. అది కన్నకడుపుమీద ప్రేమ. ఆ ప్రేమ వ్యక్తపరిచే తీరు మనకి పిచ్చిలా కనిపిస్తోందంతే. మీరు వినీతని తీసుకుని వస్తున్నారన్న విషయం తెలిసి శ్రేయోభిలాషుల మనుకునే కొంతమంది మమ్మల్ని కూడా హెచ్చరించారు. సైకియాట్రిస్ట్ దగ్గర వైద్యం చేయించుకుంటున్న పిల్లని మీరు ఇంటికి తెచ్చుకోక్కర్లేదూ, పిచ్చిదంటే ఏ కోర్టైనా సులభంగా విడాకులు ఇచ్చేస్తుందీ. ఆ పిచ్చిదాన్ని వదిలించుకుని మరో అమ్మాయిని తెచ్చుకోండీ అంటూ ఉచితసలహాలు చాలా ఇచ్చారు. అలా కుదరదన్నామని మమ్మల్నీ పిచ్చివాళ్లనే అన్నారు. లోకంతీరు అంతేనండీ. పిచ్చికీ, ప్రేమకీ తేడా తెలుసుకోలేరు.  నాకేదో గొప్ప మనసుందని మీరు అంటున్నారు కానీ..కాదండీ.. నేనూ అమ్మనే.. నా కొడుకు మీద నాకూ పిచ్చిప్రేమే. అందుకనే ఆ కొడుకు కోసమే వినూని దగ్గరికి రానిచ్చాను. ఆ కొడుకు సంతోషం కోసం ఏవైనా చేస్తాను. ఆ ప్రేమకి మీరు మరో పేరు పెట్టుకుంటే పిచ్చి అనే అనుకోండి.  ప్రేమ పిచ్చీ ఒకటే... “ అంటున్న జానకికి చేతులెత్తి దండం పెట్టింది సుగుణ. - జి.ఎస్.లక్ష్మి    

స్వయంసిద్ధ

స్వయంసిద్ధ   సెల్ ఫోన్  మోగుతోంది. ఎవరా? అని చూస్తే సత్యం మావయ్య దగ్గర్నుంచి. “హలో మావయ్యా,చెప్పు  ఏమిటి విశేషం” అన్నాను కొన్ని క్షణాల  పాటు మౌనం, నేను మళ్ళీ మాట్లాడే లోపలే  “మీ అత్తయ్య,ఇల్లు వదిలి వెళ్ళిపోయింది రూపా,” ఒక్క క్షణం  నా మెదడు మొద్దు బారిపోయింది “మావయ్యా! ఏం మాట్లాడుతున్నావు,వదిలేసి వెళ్ళడం…. నువ్వు చెప్పేది ఏమి అర్ధం కావటం లేదు, ఎక్కడికి వెళ్ళింది?ఎందుకు వెళ్ళిపోయింది? కాస్త అర్థమయ్యేలా చెప్పు” “ఇంక ఇంతకంటే  వివరంగా ఏమి చెప్పలేను రూపా!”,ఆయన గొంతు వణికింది. “సరే మావయ్యా,నేను ఇప్పుడే మీ ఇంటికి వస్తున్నాను” అని ఫోన్ పెట్టేసి,మావయ్య ఇంటికి బయలుదేరాను. అత్తయ్య గురించి ఆలోచిస్తూనే డ్రైవ్ చేస్తున్నాను. ఎందుకిలా జరిగిందా అని. అత్తయ్య అందరి లా కాదు తనకంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్త్విత్వం గల స్త్రీ.బంధువులందరూ కూడా సత్యం పెళ్ళాం ఎక్కువగా మాట్లాడదు,పొగరు అహంభావి అనుకునే వారు. కాని  చాల మందికి తెలియని విషయం ఆవిడ ఒక విజ్ఞాన ఖని అని.అత్తయ్య చదవని పుస్తకం లేదు.ఆవిడకి ఇష్టమైన పుస్తకం భగవద్గీత. ఆవిడ ఎన్నో సార్లు చదువుతుండగా  చూసాను. “అత్తయ్యా నీకు బోర్ కొట్టదా అస్తమాటు ఇదే చదువుతావు?”అని అడిగేదాన్ని. దానికి అత్తయ్య ఒక్కటే మాట అంది  “ఆ శ్రీకృష్ణ భగవానుడు  మనకు ఇచ్చిన అపురూపమైన కానుక గీత. మన దేహం ఒక మెషిన్ అయితే గీత దాని మాన్యువల్,ఆ భాగాలను ఎలా ఉపయోగించు కోవాలో అన్నది ఇందులో నిక్షిప్తమై ఉన్నాయి. అందుకే గీత  మనకి మార్గనిర్దేశకం. మనకే కాదు ప్రపంచదేశాలు కూడా అది నిజమే నమ్ముతున్నారు” అని అంది స్త్రీల సమానత్వం జీవితంలో, స్వేఛ్చ ,  తోటి మనిషికి సాయపడటం. సాటి మనుషులను అర్ధం చేసుకోవడము తరచూ వీటి గురించే మాట్లాడేది.. “పెళ్లి, పిల్లలు చీరలు నగలు, నోములు పేరంటాలు, ఒకప్పుడు ఇవన్నీ స్త్రీ ముఖ్యావసరాలే, కాని ఇప్పుడు కాలం మారింది! స్త్రీలు అన్ని రంగాలలో ముందంజ వేస్తున్నారు. ముఖ్యంగా అట్టడుగు వర్గాల వాళ్ళకోసం, అణచి వేయబడే వాళ్ళకోసం, ఎన్నో కష్ట నష్టాల గూర్చి ఎంతో శ్రమ పడుతున్నారు. అలాంటి వాళ్ళ కోసము మన వంతు  సాయం చెయ్యలేమా, కొంచెము కూడా మానవత్వం చూపలేమా?అని అనిపిస్తుంది. అందుకు ముఖ్యకారణం అలసత్వం. దేనికి ముందుకు రాక పోవడం. మన చేతులు  మనమే ముడుచుకొని ఉండటం.  ఇలా అన్నానని తెలిసి’ఎవరో అడిగారు నన్ను  అదేంటి  శారదా? మన ఆడవాళ్ళకుండే బాధ్యతలు,బంధనాలు,ఇబ్బందులు అన్నితెలిసే మాట్లాడుతున్నావా?’  అంటే దానికి నా జవాబు అవును మనకి ఎన్నో ఇబ్బందులు,బంధనాలు,భాద్యతలు ఉన్నాయి. కాని వాటిని అధిగమించి మన కంటూ ఒక స్పేస్ (చోటు) ని సృష్టించుకోవాలి.అప్పుడు ఇలాంటివన్నీసాధ్యపడుతాయి.అందుకు ఇంట్లో వాళ్ళ సహకారం కూడా కావాలి. కాని మనందరికీ ఆ సహకారమే లోపిస్తోంది” అనేది. ఇంత విప్లవాత్మక భావాలున్న అత్తయ్య పనిమనిషి సాయం లేకుండానే ఇంట్లో పన్లన్నీచేసుకొనేది. ఇప్పటి దృష్ట్యా చూస్తే వాళ్లది పెద్ద ఫ్యామిలీ . అయితేనే అన్ని పనులు అలసట లేకుండా చిరునవ్వుతో చేసుకుపోయేది. విసుగన్నది ఏ కోశానా కనిపించేది కాదు. ఈవిడ ఒక్క రోజు ఇంట్లో లేక పోతే అందరూ ఎలా ఉంటారబ్బాఅనుకొన్నా? ఆ ముచ్చటా జరిగింది. ఒకసారి అత్తయ్య వాళ్ళ పుట్టింట్లో ఏదో శుభకార్యం ఉంటే వెళ్ళింది. ఇక చూసుకో ఇల్లు ఒక కిష్కింధకాండ అయిపో యింది. వెంటనే వచ్చెయ్యమని మావయ్య ఫోన్ల మీద ఫోన్లు పాపం  …అత్తయ్య తిరుగు టపాలో   పరుగులు పెట్టుకుంటూ వచ్చేసింది. అప్పుడు అత్తయ్యతో  కోపంగా అన్నాను“నువ్వే నేర్పుతున్నావు వీళ్ళకి ఈ సోమరితనం అంతా”అని. అప్పుడు అత్తయ్య మొహం లో ఒక చిత్రమైన నవ్వు కనిపించింది. నాకు అర్ధం కాలేదు.మావయ్య వాళ్ళ ఇల్లు రావడం తో నా ఆలోచనలకి బ్రేక్ పడింది. నేను వెళ్లేసరికి  మావయ్య ఎవరి తోనో ఫోన్ మాట్లాడుతున్నాడు.మావయ్య కొడుకు నితీష్  ఇంకో పక్కన సెల్  ఫోన్ లో మాట్లాడుతున్నాడు. నితీష్ భార్య,నీనా సింధీ అమ్మాయి . నా రాకను గమనించి కూర్చోమని సైగ చేసింది. అక్కడ  వాతావరణం, చాలా గంభీరంగా ఉంది .మావయ్య వంద ఏళ్ళు వార్ధక్యం పై బడ్డట్టు ఉన్నాడు. నేను కిందటి సారిచూసినప్పుడుఎంతో హుషారుగా ఉన్నాడు. వారం లో ఎంత తేడా! మావయ్య గురించి ఆలోచిస్తున్న నేను, నితీష్   పలకరింపు తో,తేరుకొని అటువైపు చూసాను. నా కళ్ళలో కనిపించిన ప్రశ్నలని చూసి నితీష్ “అమ్మ అన్ని బంధనాలు తెంచుకొని వెళ్ళిపోయింది రూపా!”,అనిఅన్నాడు. “మిగతా చోట్ల వింటున్నాము.తల్లితండ్రులను ఆశ్రమం లో చేర్చిన  పిల్లలు అని,  కాని మా ఇంట్లో వింత ఏమిటంటే  మా అమ్మే తనంత తానుగా ఆశ్రమ జీవితానికి వెళ్ళిపోయింది.” “దానికి కారణం నేను చెబుతాను” అంది నీనా ఇంగ్లీష్ లో. “ఆంటీ, హైలీ ఇండిపెండెంట్,ఇన్ని రోజులు తన స్వాభిమానాన్ని బహిర్గతం చెయ్యలేదు.కాని ఇప్పడు ఆ సమయం వచ్చింది.తను ఎలా ఉండాలని కోరుకుందో ఆ జీవితం లోకి వెళ్ళిపోయారు.  రూపా” అని అంది.   “ఆ !ఆ! అలాగే, నేను మాట్లాడి మీకు ఏ సంగతి చెబుతాను,నమస్కారం’ అని ఫోన్ పెట్టేసి నా వైపుకి తిరిగి,నా కళ్ళలోని ప్రశ్నలు చూసి“రా,రా ఇది గో చూసావా,ఈ వయసు లో నన్ను మీ అత్తయ్య వది లేసి వెళ్ళిపోయింది”. అంటూ నన్ను పట్టుకొని బావురుమన్నాడు.వెంటనే నేను ఆయన చెయ్యి పట్టుకొని సోఫా లో కూర్చో బెట్టి లోపలకు వెళ్లి మంచి  నీళ్ళు తెచ్చి ఇచ్చాను. ఆయన కొంచెం తేరుకున్నాక“మావయ్యా,అసలు సంగతి ఏంటి,అని” అడిగాను “నేను నోటి తో ఏది చెప్పలేను, ఇదిగో,  అత్తయ్య  రాసిన ఉత్తరం, చదువు”అంటూ,తన జేబులోంచి తీసి ఇచ్చాడు. ఆ ఉత్తరం అందుకొని గబగబా చదివి మడిచి నా బాగ్ లోకి తోసేసాను. “సరే మావయ్యా,!ముందు భోజనం చెయ్యి  రా”అంటూ, ఒక రకంగా ఆయనను బలవంతంగానే డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకొని వెళ్ళాను. ఇంటికి ఫోన్ చేసి,శ్రీకాంత్ కి చెప్పి ఈ పూట నేను ఇంటికి రాను. ఇంట్లో కొంచెము మేనేజ్ చెయ్యి అని చెప్పాను. అవతలనుంచి  శ్రీకాంత్, “ఓకే ఓకే, నా సాయం ఏమన్నా కావాలంటే చెప్పు,మనం కలిసి చేద్దాము”అని అన్నాడు. “అలాగే  శ్రీకాంత్ తప్పకుండా,ఇదిగో ఇప్పుడు నేను, నితీష్,నీనా మాట్లాడుకొని  అవసరం అయితే నీకు చెబుతాను”అని ఫోన్ పెట్టేసాను. ఇంతలో మావయ్య పైకి తన రూమ్ లోకి  వెళ్ళడం చూసి, “అసలు ఏమైంది వాళ్ళిద్దరి మధ్య, ఎందుకు శారద అత్తయ్య ఇంతటి కఠోర నిర్ణయం తీసుకున్నారు ,అదీ ఈ వయసు లో” అన్నాను నితీష్ తో అంతవరకు  ఏ మాట్లాడని నితిన్ “  అమ్మ బాగా  ఆలోచించే  తీసుకుంది ఈ నిర్ణయం రూపా!అన్నాడు. నీకు నాన్న సంగతి  తెలుసు కదా! ఆయన ఇలాంటి మనిషి అంటే ఎవరూ నమ్మరు. బయట ప్రపంచం లో ఆయనకు బోలెడంత పరపతి, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. నిజానికి, నా దృష్టిలో నాన్న  ఒక సాంప్రదాయ ముసుగు వేసుకున్న మూర్ఖుడు. ఇన్నేళ్ళు అమ్మ ఆయన మూర్ఖత్వానికి బలి అయిపోయినా గాని, పల్లెత్తు మాట మాట్లాడ లేదు. అది ఆవిడ సంస్కారం.  కాకపొతే ఎప్పుడో అప్పుడు  అగ్నిపర్వతం బద్దలవక తప్పదు అదే జరిగింది .ఇది నాన్న కలలో కూడా  ఊహించని పరిణామం, ఈ వయసులో,దాన్ని ఆయన తట్టుకో లేకపోతున్నాడు”.అనిఆవేశంగా అన్నాడు.ఆ మాటలో నితిన్ కి తండ్రి అంటే ఎంత కోపము ఉందో అర్దమవుతోంది. “అయితే ఆంటీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినట్లు,” అని నీనా అంది “నా అంచనా ప్రకారం అమ్మ ఎక్కడికి వెళ్లి ఉంటదో నాకు తెలుసు.అమ్మ బెస్ట్ ఫ్రెండ్  సుధా ఆంటీ ఒక ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు.అమ్మ ,అక్కడికే  వెళ్లి ఉంటుంది”.అని అంటూ ఆవిడకి ఫోన్ ట్రై చేస్తున్నాడు. నేను అక్కడ పుస్తకాల షెల్ఫ్ లో  ఉన్న  స్నేహ హస్తాలు అనే  సంకలనం చేతిలోకి తీసుకున్నాను .ఆ పుస్తకం  అత్తయ్య నన్ను చదవమని ఇస్తూ  “సుధ చాలా  మహా గొప్పమనిషి ఎన్నో కష్టాలకు ఓర్చి, ఆత్మవిశ్వాసంతో నిలబడి, ఎంతో మందికి సహాయపడుతోంది. ఎన్నో విద్యాసంస్థలు. ప్రతిఫలాపేక్ష లేకుండా నడుపుతోంది.అందులో ముఖ్యంగా కొన్ని బాలికల కోసం ఉన్నాయి.అలాగే వారి కుటుంబ సభ్యుల సాయంతో ఒక ఆశ్రమం కూడా నడుపుతోంది..అని తన స్నేహితురాలు గురుంచి ఎంతోగొప్పగా చెప్పుకునేది. అవును నితిన్ అనుకునేది కరెక్టే అత్తయ్య అక్కడికే వెళ్లి ఉంటుంది అని అనుకున్నాను “ఆంటీ, ఫోన్ తీయటం లేదు.” “బహుశా బిజీ గా ఉన్నారేమో?” ఇంతలో నితిన్ ఫోన్ రింగ్ అయ్యింది. “ఆంటీ దగ్గర్నుంచే”అని అంటూ,నెమ్మదిగా మాట్లాడసాగాడు.నేను, నీనా నితిన్ వైపు ఉత్కంఠ తో  చూస్తున్నాము. దాదాపు ఒక ఇరవయి నిముషాలు మాట్లాడిన తరువాత, “ఆంటీఎలాగు రేపు ఆదివారం కాబట్టి నేను, వస్తాను మీ దగ్గరకి” అని చెప్పి ఫోన్ పెట్టేసాదు. “అమ్మయ్య ఒక దిగులు తీరింది. అమ్మ  ఎక్కడ ఉందో తెలిసి పోయింది” అనుకుంటూ  నితిన్,నా వైపు నీనా వైపు చూసాడు. ఇదంతా పై నుంచి మావయ్య విన్నాడు. వెంటనే నేను ఇంటికి ఫోన్ చేసి శ్రీకాంత్ కివివరంగా అన్నీచెప్పాను. దానికివెంటనే స్పందిస్తూ  “అలాగే,శారద పిన్ని అంటే నాకు చాలా ఇష్టం, అబిమానంకూడా. పిల్లలని నేను చూసుకుంటాను నువ్వు వెళ్లి రా” అని చెప్పాడు. ఆమరునాడు మేం ముగ్గురం  బయలుదేరుతుండగా మావయ్య“నేనూ వస్తాను నితిన్” అంటూ వాడిపోయిన మొహంతో మౌనంగా కారులోకూచున్నాడు. కారు బయలుదేరింది. నేను  బ్యాగు లోంచి అత్తయ్య,మావయ్యకి రాసిన ఉత్తరం తీసి మళ్ళీ మొదటినుంచి చదవడం మొదలుపెట్టాను.అక్షరాల వెంట కళ్ళు పరుగులు తీసాయి. ప్రియమైన శ్రీవారికి,నమస్కరించి రాయునది. పెళ్ళైన ఇన్నేళ్ళలో నేను తీసుకొన్న స్వంత నిర్ణయం ఇది. కొత్త పెళ్లి కూతురుగ అత్తవారింట్లో కాలు పెట్టింది.మొదలు ఇప్పటి వరకు ఎప్పుడూ మీ మాటకు ఎదురు చెప్పలేదు. అంతకు మించి మిమల్ని ఏది అడిగింది లేదు. నా వ్యక్తి గత స్వేచ్ఛను నేనే  అణిచేసుకుని మీతో,జీవితంతో కూడా రాజీ పడిపోయాను. కానీ ఇప్పుడు ఈ జీవిత చరమాంకం లో నాకు ఇష్టమైనట్లుగా,స్వేచ్ఛగా ఉండాలని ఉంది. అది మీకు బాధని,కోపాన్నికలిగించవచ్చు.అందుకు నన్ను క్షమించండి. నితిన్ ఒక ఇంటి వాడు అయ్యాడు. మీపనులు చూసుకోవడానికి నౌకర్లు ఉన్నారు.మీరు,మీ బిజినెస్ తో ఎప్పుడూ బిజీనే . మనకు డబ్బుకు లోటు లేదు. ఇప్పుడు ఇంక ఈ శేష జీవితాన్నినలుగురికి ఉపయోగ పడేలా జీవించాలని ఉంది. మీకు తెలుసు నేను ఎక్కడికి వెళతానో. సెలవు ……..ఇట్లుశారద అత్తయ్య మనసు నాకు అర్దమయింది. ఒక్కసారి గతం లోకి వెళ్ళింది నా మనసు సత్యం మావయ్య పెళ్లి జరిగింది. మేమందరం వెళ్ళాము .కొత్త పెళ్ళికూతురు గా అత్త్తవారింట్లో అడుగు పెట్టిన అత్తయ్య సన్నగా ,నాజుకుగా ,కళ్ళలోఅభిమానం,ప్రేమ ఇంకా  ఏదో తెలియని భావం,అప్పట్లో దాని అర్ధం తెలియదు,అవి దయ,కరుణ అని పెద్దయ్యాక తెలుసుకున్నాను.నేను మా పిన్ని కొడుకు మురళి  కొత్త అత్తయ్య తో పరిచయం పెంచుకున్నాము. చదువు వల్ల కలిగే లాభాలు. చదువుకుంటే ఎంత గొప్ప వాళ్ళగ మారచ్చో లాంటి విషయాలు కూడా మాకు అర్థమయ్యే తీరులో చెప్పేది. “నువ్వే మా టీచర్ అయ్యింటే చాల బాగుండేది అత్తయ్యా” అనే దానిని.అది విని మెత్తగా నవ్వి,”ఇప్పుడు మాత్రం ఏమైంది మీ టీచర్నే అనుకో” అనేది. అప్పటి నుంచి అత్తయ్య అంటే ఇష్టం కన్నా భక్తి,అలాంటి అత్తయ్య చాల కష్టాలు పడింది.కష్టాలు అంటే భౌతికం కాదు మానసికంగా,చిన్న చిన్న విషయాలే, ఉదాహరణకు కాఫీ ఇస్తే ఇందులో  ఏదో తక్కువైంది అనేవారు,అమ్మమ్మ,మావయ్య,“ఏది తక్కువైందో చెప్పండి రేపటి నుంచి ఆ ప్రకారమే ఇస్తాను” అనేది,అలాగే  వంట దగ్గర “ఈ కూర కారం లేదు ఈ పచ్చడి లో ఉప్పు లేదు,అన్నం బాగా బిరుసుగా ఉంది” ఇంచుమించుగా ఇలాంటివే.  సరే,ముందు రోజు వన్ని గుర్తుంచుకొని మరుసటి రోజు వాళ్ళు చెప్పినట్లు చేస్తే, “అబ్బే అన్నం మరి ముద్ద  అయిపొయింది,కూరలో కారం ఎక్కువ,పచ్చడిలో ఉప్పు ఎక్కువ అనిదేప్పేవారు”. వాళ్ళని  ఎలా అర్ధం చేసుకోవాలోతెలిసేదికాదు. ఓ పక్కకు వెళ్లి కళ్ళ నీళ్ళు పెట్టుకునేది. అమ్మమ్మ వాళ్ళు డబ్బు గల వాళ్ళే. కానీ, ఇంటి పని అంతా కోడలే చెయ్యాలనే ఒక రకమైన మూర్ఖత్వం. అత్తయ్య చేసే ప్రతి పనిని,సాధించడమే ధ్యేయంగా పెట్టుకునేది అమ్మమ్మ. ఇంకా మావయ్యకైతేఅయ్యో!,తన భార్య తనను నమ్ముకొని వచ్చింది.ప్రేమగా,గౌరవంగా చూసుకోవాలి అని అస్సలు తోచేది కాదు. దానికితోడూ అన్ని తనకే తెలుసన్న అహంకారం. అన్నట్లు చెప్పడం మరచాను అత్తయ్య డిగ్రి చేసింది,సంగీతం,సాహిత్యం రెంటిలోనూ బాగా ప్రవేశముంది.   సంగీతం పాడుకుంటూ ఉంటే నువ్వు వీధెక్కి కచేరీలు చెయ్యక్కర లేదు,అనేవారు,పోనీ మనసులో వచ్చిన భావాలు పేపరు మీద పెట్టుకుంటూ ఉంటే ఏంటి  కధలు రాస్తావేంటి ఖర్మ,ఇంకా నా పేరు ఆ ఫలానా రచయిత్రి మొగుడుగా అంటారు. అందు చేత నువ్వు ఎట్టి పరిస్థితి లో రాయొద్దని అనేవారు. ఇలా అత్తయ్య ,ఆశలు,ఇష్టాలు కోరికలు అన్నీ మడతపెట్టి మనసు పొరలలో దాచేసుకుంది. కాని కొడుకు పెళ్లి విషయం లో మాత్రం పట్టు పట్టి అతని ప్రేమను గెలిపించింది.ఆ కోపం ఇంకా మావయ్య మనసులో ఉంది అంటుంది నీనా. మళ్ళీ  తనే “She is a great lady రూపా!,పరాయి బాష,సంస్కృతి నుంచి వచ్చిన నన్ను కన్న తల్లిలా, నితిన్ కంటే నన్నే  ప్రేమగా ఆదరంగా చూసుకుంటుంది”. అని అత్తయ్యను  తెగ అభిమానిస్తుంది. ఆలోచనలలో పడి కొట్టుకుపోతున్న నాకు, సుధా ఆంటీ నడిపే ‘వసుధైక కుటుంబం” బోర్డు కనబడగానే “ఇదే అయుంటుంది నితిన్”అని అన్నాను.అక్కడకి మొదటిసారి రావడం మా అందరికి . అంతకు ముందే ఫోన్ లో ఆంటీ కి చెప్పడం తో ఆవిడ కూడా వచ్చారు. అక్కడ ఆశ్రమం లో ఉండే  ఒక అమ్మాయి మా అందరికి మంచి నీళ్ళు,కాఫీ ఇచ్చింది. కాఫీ చాల రుచిగ ఉంది.అప్పుడు సుధా ఆంటీ’ అన్నారు“సిటికీ దూరంగా ఉండటం వల్ల పాలు అందడం లేట్అవుతుందని అందరూ కలిపి ఒక నిర్ణయానికి వచ్చారు. ఆశ్రమం లో గోవుల సంరక్షణ చేపట్టారు అది ఒక వ్యాయామం,తద్వారా చక్కటి పాలు పెరుగు అందుతున్నాయి. అందరికి చక్కటి ఆరోగ్యం కూడా”అని చెప్పారు. కొంచెము  లోపలకి వెళ్ళాము పెద్ద ఆశ్రమం, చల్లగా చెట్లు,కళ్ళకి ఇంపుగా రంగురంగుల పూవులు, పక్కనే గుడి .అంతా ప్రశాంత వాతావరణం.రెగ్యులర్ డాక్టర్ చెకప్ జరుగుతుంది.అక్కడ పనిచేసే వాళ్ళకి కూడా క్వార్టర్స్ ఉన్నాయి. టీవీ లు ఉన్నాయి. అవి టైమింగ్ ప్రకారం పెడతారు.రేడియో ని మైకు ద్వార అరేంజ్   చేసి  భక్తి రంజనితో మొదలుపెట్టి  వార్తలు,చక్కటిసంగీతం,భావ గీతాలుతో పాటు  నాటికలు కూడా వినిపిస్తారు అని అక్కడే ఉండే ఒక యువతి మాకు చెప్పింది. కొంచెము ముందుకు వెళ్లేసరికి అక్కడ పెద్ద వరండాలో అత్తయ్య  మధ్యలో కూర్చొని ఉంది చుట్టూరా ఒక ఇరవయి మంది అత్తయ్య చెప్పేది వింటున్నారు. అప్పుడు సుధా ఆంటీ అన్నారు నితిన్ తో “మీరు వస్తున్నట్లు చెప్పలేదు నేను. అది ఇప్పుడు సంసార బంధాలనుంచి విముక్త అయి,  మానవసేవ చేయాలనే దృఢ సంకల్పంతో వచ్చింది. ఇప్పుడు ఈ ఆశ్రమన్ని అదే చూసుకుంటుంది.మీ గురించి దాని మనసులో ఏముందో తెలియదు.మీరే వెళ్లి పలకరించండి.చూద్దాము.”అని అన్నారు. నితిన్ దగ్గరకు వెళ్లి అత్తయ్యని చుట్టేసాడు. అప్పుడు  “వెఱ్రినాన్నా! అమ్మ ఎక్కడున్నా నీకు అమ్మే,నిన్ను విడిచి ఎక్కడకి పోలేదు ఇక్కడే ఉంటున్నాను.నీకు తెలుసు కదా నా ఆశయం.దానిని సాకారం చేసుకుంటున్నాను.” అని అత్తయ్యఅంది . నన్ను,నీనాని దగ్గరకు పిలిచి ‘ఏంటి అందరూ రెండు రోజుల్లో ఇలా తోటకూర కాడల్లా వేలాడిపోయారు.హుషారుగాఉండాలి,శుభ్రంగా తిని చురుకుగా పనులు చేయాలి,అని అంటూ నావైపు తిరిగి శ్రీకాంత్,పిల్లలు అందరు బావున్నారా” అని అడిగింది.” ఆ ఆ అని తల ఊపాను” నీనా అయితే అత్తయ్య కొంగు పట్టుకొని వెనక వెనకే ఉంది ఇంతలో సుధా ఆంటీ వచ్చి శారదా “ఒక సారి ఇలారా!, మన వసుధైక కుటుంబం లోకి మరో కొత్త మెంబెర్ వచ్చారు వివరాలు అన్నీ తీసుకోవాలి”  అని పిలిచారు.సుధా ఆంటి,శారద అత్తయ్య ఇద్దరూ ఆఫీస్ రూమ్ లోకి వెళ్లారు. వాళ్ళ వెనకాలే నేను, నీనా చెయ్యి పట్టుకొని .వెళ్ళాను. మా కంటే ముందరే అక్కడకి వెళ్ళాడు నితిన్. మేమందరం బయటే ఉన్నాము ఆఫీస్ రూమ్ లో మావయ్యను చూసి,శిలలా నించుండి పోయిన అత్తయ్యతో సుధా ఆంటీ అన్నారు, “శారదా!, సత్యం గారికి  ఈ ప్రశాంత వాతావరణం నచ్చిందిట.ఇక నుంచి ఆయనకూడా ఇక్కడే ఉంటారుట”అని అంటుంటే అత్తయ్య మావయ్య వైపు నమ్మలేనట్లుగా ఆశ్చర్యంగా,ఇది నిజామా అన్నట్లు గా చూసింది. కాని మావయ్య చూపులో మాత్రం  తప్పిపోయిన పిల్లవాడు తల్లిని చూసినప్పుడు కలిగే ఆనందం కనిపించింది.నీనా కూడా నిర్ఘాంతపోయింది. ఈ హటాత్తు నిర్ణయానికి, నితిన్ పరిస్థితి, నాది అయితే  ఒక్కటే .చేష్టలు దక్కి ఉండిపోయాము. ఇంతలో మావయ్య నితిన్ పిలిచి అతని భుజం చుట్టూ చేతులు వేసి యేవో డాక్సుమెంట్స్ తీసుకుని రమ్మనమని చెపుతున్నాడు. .అప్పుడు నాకు ఒక్కటే అనిపించింది. మావయ్యని  ఇన్ని రోజులు అత్తయ్య  ఛాయ లా అంటి పెట్టుకొని ఉంది. అప్పుడు ఆయనకి ఆమె యొక్క విలువ తెలియలేదు.ఎప్పుడయితే అత్తయ్య ఇంటినుండి బయటకు వచ్చిందో అప్పుడు  ఆయనకి అర్దమయింది  తను పోగొట్టుకున్నదేమిటో   .అందుకనే ఆమె నిర్ణయాన్ని అర్ధం చేసుకొని  ఈ జీవిత చరమాంకంలో ఆమెతో కలిసి నడవాలని నిశ్చయించుకున్నాడు.*     రచన:- మణి వడ్లమాని

వ్యక్తిత్వవాదం

వ్యక్తిత్వవాదం     "శకూ, ఏమయింది?? ఆర్ యూ ఓకే??" కళ్ళూ, ముఖమూ ఎర్రబడి ఏడుస్తున్నట్టుగా ఉన్న స్నేహితురాలిని చూస్తూ అడిగింది మంజుల. " ఏమీ లేదు లే, మంజూ! ఐ యాం ఫైన్" అంది శకుంతల స్నేహితురాలిని చూస్తూ నవ్వడానికి ప్రయత్నిస్తూ. " లేదు, నువ్వేదో దాస్తున్నావు. ఆనందం పంచుకుంటే పెరుగుతుంది, బాధ పంచుకుంటే తగ్గుతుంది. నీ కభ్యంతరం లేకపోతే,  నిన్ను వేధిస్తున్న విషయమేమిటో చెప్పు. నాకు వీలైతే సలహా చెప్తాను. లేదా కనీసం నీ బాధ తగ్గి మనసు తేలిక పడుతుంది" అంది మంజుల అంతకంటే బలవంత పెట్టడం ఇష్టం లేదు ఆమెకి. " నాకూ, శంకర్ కీ" అంటూ ఆగిపోయింది శకుంతల. ఆమె కళ్ళ నిండా నీళ్ళు. " ఏమయింది నీకూ, శంకర్ కీ? ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. హాయిగా మూడేళ్ళనించీ ఆనందంగా కాపురం చేస్తున్నారు." అంటూ చెప్తున్న స్నేహితురాలి మాటలకి అడ్డువస్తూ అంది శకుంతల. " అలాగే అనుకున్నాను నేను కూడా. కానీ ఈ మధ్యన ఎందుకో అలా అనిపించడం లేదు" అంది బాధగా. " ఈ మధ్యనా? అంటే?" అంది మంజుల. " దాదాపుగా సంవత్సరం నించీ!" అంది శకుంతల. "వాట్!! అవునా?? ఏమయింది" అంది మంజుల. "ఇదీ,  అని చెప్పలేను మంజూ, ఏమిటో దేనిలోనూ మా ఇద్దరికీ కుదరడం లేదు. అలా అని రోజూ పోట్లాడుకుంటామని కాదు. ఇదీ అని చెప్పలేని భావన, కానీ మా మేరేజ్ వర్క్ అవుట్ మాత్రం కావడం లేదు. ప్రతి రోజూ నా మనసులో మెదులుతున్న భావాలు ఇవి. " శంకర్ కేమైనా కొత్త అలవాట్లు" మొహమాటంగానే అడిగింది మంజుల. " ఛా అలాంటివేమీ లేవు. తనూ ఎప్పటిలాగే ఉన్నాడు. నేనూ ఎప్పటిలాగే ఉన్నానని అంటాడు. అంటాడు. కానీ ఎంతో మంచి స్నేహంతో  మొదలైన మా బంధం అప్పటిలా కొనసాగడం లేదన్నది మాత్రం వాస్తవం. అప్పుడు ఎంతో బాగా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఒకరికోసం మరొకరికి సమయం లేనట్టుగా అయిపోయాము. ‘దేర్ ఈజ్ నతింగ్ ఇన్ కామన్ ఫర్ అస్.’ అంది శకుంతల బాధగా. " అరే,అవునా? బిజీ వర్క్, స్త్రెస్. వీటివల్ల అలా అనిపిస్తోందేమో, పోనీ ఒక వారమో, పదిరోజులో పాటు శెలవు పెట్టి మీరిద్దరే ఎక్కడికైనా వెళ్ళి వస్తే! అంటే రోజువారీ జంఝాటాలన్నీ లేకుండా ఉంటే".. అని అర్దోక్తిలో ఆపింది మంజుల. " లేదు మంజూ, అన్నీ ప్రయత్నించాం కానీ ఏమిటో తెలీదు.నాకు మరో దారి కనబడడం లేదు. ఒకే ఇంట్లో ఉంటూ ఇలా అపరిచితుల్లా ఉండడం చాలా బాధాకరం.” అంది శకుంతల. " మరి ఎందుకు బాధపడుతున్నావు? ఏడుస్తున్నావు కూడా!!" అంది మంజుల బాధగా. ంత చదువుకుని, అన్నీ తెలిసికూడా. ఒక్క బంధాన్ని నిలబెట్టుకోలేకపోయామా? అని బాధగా ఉంది. మంచి స్నేహితుల్లా మొదలుపెట్టాము. అలా మొదలయిన మా బంధం ఇలాంటి స్థితి కి రావడం అనేది నేను అస్సలు ఊహించని విషయం. ఎక్కడ తేడా వచ్చిందా?  అని అనుకుంటూ ఉంటేనే బాధగా అనిపిస్తోంది. అంతే!" అంది శకుంతల.                              -------------------- నాలుగేళ్ళ క్రితం.. కాచిగుడా, బెంగుళూరు ల మధ్యన ప్రయాణించే కాచిగుడా ఎక్స్ ప్రెస్ లో కూర్చుని ఉంది శకుంతల. ఏ.సీ టూ టయర్ కోచ్ లో కింది బెర్త్ ఆమెది. కూర్చుని పుస్తకం చదువుకుంటోంది ఆమె. ‘ఇంక బయలుదేరాలి ట్రెయిన్ ‘అనుకుంటూ ఉంది ఆమె. అంతలో గబ గబా వచ్చాడు ఒకతను. జీన్స్ పైన కుర్తా వేసుకున్నాడు. నీట్ గా షేప్ చేసుకున్న గడ్డం. చేతిలో ఐ పాడ్,వాటర్ బాటిల్. భుజానికి బాక్ పాక్. పరిగెడుతూ వచ్చినట్టున్నాడు. కూర్చుని మంచినీళ్ళు తాగి చుట్టూ చూశాడు. వెంటనే ట్రెయిన్ మొదలయింది. " ఓ నైస్!!" అన్నాడు. శకుంతల అప్పుడు గమనించింది అతన్ని. తన వయసే ఉంటుందేమో అతనికి. ప్రపంచంతో తనకి సంబంధం లేనట్టుగా, ఆనందం అంతా తన సొత్తయినట్టుగా ఉన్నాడు. చేతిలోని ఐ పాడ్ లో ఏదో చదువుకుంటున్న్నాడు, మధ్య మధ్యలో ఫోన్ లు మాట్లాడుకుంటున్నాడు. అతను ఫోన్ లో చెప్పిన మాట వింటే ఆశ్చర్యం వేసింది ఆమెకి. " యెస్. ఐ మేడ్ ఇట్, ట్రెయిన్ ఆఖరి నిమిషంలో ఎక్కితే ఆ ఆనందమే వేరు" అన్నాడు. " అంటే కావాలనే ఎక్కారా?” మనసులో అనుకుంటున్నాననుకుంటూనే పైకే అనేసింది అప్రయత్నంగా. " ఓ! మీరు విన్నారా? అవును. నాకు చిన్నప్పటినించీ ఆఖరినిమిషంలో కదలడానికి సిధ్ధంగా ఉన్న రైలు ఎక్కడం అంటే చాలా ఇష్టం. ట్రైన్ బయలుదేరడానికి అరగంట ముందే స్టేషన్ కి వచ్చి కూర్చోవడం లాంటివి చాదస్తం లా అనిపిస్తాయి నాకు. ఇలాంటి ఇష్టాలు నాకు చాలా ఉన్నాయి లెండి. ముఖ్యంగా ఏ బంధనాలు లేకుండా జీవితాన్ని నాకు నచ్చిన రీతిలో జీవించడం అంటే నా కు చాలా ఇష్టం." అన్నాడు నవ్వుతూ. " సారీ, వినాలని వినలేదు" అంది శకుంతల. " పరవాలేదు. నా జీవితం ఒక తెరిచిన పుస్తకం. మక్కికి మక్కీగా అనువదించాను కదూ! . మై లైఫ్ ఈజ్ ఏన్ ఓపెన్ బుక్!  “ అని నా భావన అన్నాడు నవ్వుతూ.  ఆతర్వాత ఇద్దరూ కబుర్లలో పడ్డారు. అతని సమక్షంలో కాలం ఎలా గడిచిందో తెలియలేదు అనుకుంది. రెండు పేజీలకి మించి పుస్తకం కదలలేదు ఆమెకి. ఇద్దరూ నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ కాలాన్ని అనాయాసంగా కరిగించారు. " వెరీనైస్ మీటింగ్ యూ. మనం మళ్ళీ కలవాలి “ అంది శకుంతల దిగేముందు అతనితో." " ఓ యస్, తప్పకుండా. మీతో గడిపితే సమయమే తెలియలేదు నాకు. ఐ మస్ట్ బీ ఆనెస్ట్ విత్ యూ" అన్నాడు. ఇద్దరూ ఫోన్ నంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు. ప్రత్యేకంగా ఫోన్ చేసి కలవలేదు కాని, ఆ తర్వాత కూడా అతను చాలా సార్లు గుర్తొచ్చాడు ఆమెకి. ఒకనాటి సాయంత్రం అతనే ఫోన్ చేశాడు. ఇంచుమించుగా అవే భావాలు అతనూ వ్యక్తపరిచేసరికి ఆమెకి ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలిగింది. అలా పెరిగిన పరిచయం ప్రేమగా మారడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. " నన్ను నన్నుగా చూసి ఇష్టపడేవాడిని మాత్రమే నేను ఎప్పుడూ కోరుకున్నాను. స్త్రీల పట్ల శంకర్ కున్న ఉన్నతమైన అభిప్రాయాలు, వారి వ్యక్తిత్వానికిచ్చేవిలువా నన్నెంతో ఆకట్టుకున్నాయి” అని చాలాసార్లు మంజుల తో చెప్పింది శకుంతల.  మరొక ఆరునెలల తర్వాత తమ బంధానికో సంబంధాన్నివ్వాలని అనుకున్నారు శంకర్, శకుంతల. చాలా సింపుల్ గా ముఖ్యమైన బంధుమిత్రుల మధ్యన వారి పెళ్ళి జరిగి మూడేళ్ళు కావస్తోంది.  మొదట్లో ఇద్దరూ చాలా బాగా ఉండేవారు. రాను రాను ఏదో తెలియని దూరం పెరిగినట్టసాగింది. పుస్తకాలు చదువుకుంటూ అతనూ, ఇంటి పనీ, ఆఫీసు పనీ చేసుకుంటూ తనూ ఇలా ఒకరికోసం ఒకరికి సమయం లేనంతగా అయిపోయింది. మొదట్లో గొప్పగా కనిపించిన రెండో వాళ్ళ అభిప్రాయాలు ఇప్పుడంత గొప్పగా కనిపించడం లేదు, అనిపించడం లేదు. మన జీవితాన్ని కేవలం మన కిష్టమైనట్టుగా జీవించాలి అని అతను చెప్పే మాటలని మొదట్లో ఎంతో ఇష్టపడిన శకుంతల ఇప్పుడు అతనన్నింటికీ అలాగే మాట్లాడుతుంటే మెచ్చేది కాదు.  అలాగే ఆమె చెప్పిన విషయాలు కూడా. నువ్వు చెప్పిన మాటలు విని నువ్వెంతో ధైర్యవంతురాలివనుకున్నాను. ఇలా ఆఫీసు లో అరగంట లేటయిత నన్ను తోడు రమ్మనడం కరెక్ట్ కాదు. నేను బొమ్మ వేసుకుంటున్నాను అనేవాడు ఫోన్లో. ఇలా చిన్న విషయాలనించి మొదలైన అభిప్రాయ భేధాలు ఇద్దరిమధ్యా పెరుగుతున్న దూరాన్ని మరింత పెంచాయి.   " అంతే మంజూ! పెద్ద విషయాలా?  అంటే కాదు, కానీ ఒక్క విషయం మాత్రం నిజం. తెంచుకునేంత పెద్ద కారణాలు లేవు, పెంచుకుందామనేంత గొప్ప బంధమూ లేదు అని చెప్పాలి. చేదైనా ఇది మాత్రం నిజం" అంది శకుంతల గతంలోంచి వర్తమానంలోకి వస్తూ. "ఐతే ఇప్పుడేమిటి దారి?" అంది  మంజుల ఆదుర్దాగా. “ఏమీ లేదు. ఇలా కలిసి ఉండడం కంటే విడిగా ఉండడం లేదా విడిపోవడం మంచిదనిపిస్తోంది.” అంది " వాట్! ఆలోచించే మాట్లాడుతున్నావా?" అంది మంజుల. " అవును, వినడానికి బాధగా ఉన్నా వాస్తవం ఇది". సర్దుకుపోవడం అనేది నా మనసుకు నచ్చనిది. రాజీ పడలేని మనస్థత్వం అతనిది. మమ్మల్ని కలిపినవీ అవే, ఇప్పుడు కలిసుండనీకుండా అడ్డుపడుతున్నవీ అవే. పరస్పర అంగీకారంతో విడిపోదామని అనుకుంటున్నాం, కానీ జీవితాంతం ఫ్రెండ్స్ గా మాత్రం ఖచ్చితంగా ఉంటాం" అంది. ఆశ్చర్యంగా వింది మంజుల. "కనీసం నువ్వైనా ఇంకొక అవకాశం ఇవ్వచ్చు కదా!" అంది మంజుల. " ఇవ్వాలా? నేను మాత్రమే ఇవ్వాలా? ఎవరికి? నాకా, అతనికా? చెప్పు మంజు. ఇద్దరు వ్యక్తులను కలిపే ఏ బంధమైనా ఆ ఇద్దరి మీదా ఆధారపడి ఉంటుంది కదా! అలాంటప్పుడు నేను మాత్రమే ఎవరికైనా ఇంకో అవకాశాన్ని ఎందుకివ్వాలి? చెప్పు!" అంది శకుంతల ఆవేశంగా. ఒక క్షణం సేపు మాట్లాడలేదు మంజుల. ఆ తర్వాత అంది " అయితే డిసైడ్ చేసేసుకున్నారన్నమాట" అంది. “దాదాపుగా!! “అంది శకుంతల. ఆ తర్వాత వ్యవహారాలన్నీ చక చకా జరిగాయి సినిమాలో రీళ్ళలాగ. ఇది జరిగిన కొన్నాళ్ళకి ఒకరోజు ఆఫీసుకు వస్తూనే "ఆలీమోనీ/మనోవర్తి వద్దన్నావా? ఎందుకు? హీ ఈజ్ వెరీ రిచ్, నిన్ను సపోర్ట్ చేసినంత మాత్రాన అతని ఆస్థి రవ్వంత కూడా కరగదు తెల్సా! సిరి రా మోకాలొడ్డడమంటే ఇదే" అంది మంజుల చిరుకోపంతో స్నేహితురాలిని చూస్తూ.  " మంజూ నువ్వు కూడా ఇలానే అంటున్నావా?" అంది శకుంతల రవ్వంత బాధతో. " కాక, ఎలా అనమంటావు? నువ్వేమీ అతన్ని కష్టపెట్టడం లేదు కదా. చట్టపరంగా నీకు రావాల్సింది తీసుకుంటే తప్పేమిటి చెప్పు?" అంది. " చట్టపరంగానా? ఎలా?" అంది. " అదేమిటి భార్యకీ, పిల్లలకీ రక్షణ కల్పించేవాడే భర్త. ఏదైనా కారణం వల్ల విడిపోవలసి వస్తే వాళ్ళని జీవితాంతం ఆదుకుని పోషించవలసిన బాధ్యత అతనిదే కదా!" అంది మంజుల. " కరక్టే మంజూ!.. అది ఒకప్పుడు భర్త మీదే ఆధారపడి జీవితాన్ని గడిపే ఆడవాళ్ళకి నూటీకి నూరుపాళ్ళూ వర్తిస్తుంది.కానీ సర్వ స్వతంత్రులమంటూ చెప్పుకునే మనలాంటివారికి వర్తిస్తుందా? నువ్వే చెప్పు. స్త్రీ స్వేచ్చ, సమానత్వం, మేము ఎందులోనూ మగవారికి తీసిపోము అంటూ నినాదాలు చేసే మనమే ఇలాంటివి ఆశించవచ్చా?  నా సంగతే చూడు. అమ్మా, నాన్నలు లేరు. నానా సంపాదనని ఆశించేవారు కానీ, దానిమీద ఆధారపడినవారు కానీ ఎవరున్నారు? ఒక వేళ ఉన్నా,  వాళ్ళు నా బాధ్యత అవుతారు కానీ శంకర్ కేం సంబంధం ఉంటుంది దీంట్లో? పిల్లలూ లేరు, తండ్రిగా వారి బాధ్యత వహించడానికి. అలాంటప్పుడు నేను అతన్నుంచి ఏదైనా ఎలా ఆశించగలను?  ఇవన్నీ పక్కన పెడితే మొదటినించీ స్థిరమైన భావాలతో పెరిగాను, వ్యక్తి స్వేచ్చను, ముఖ్యంగా స్త్రీ స్వేచ్హను ప్రేమించే నేను నా వ్యక్తిత్వాన్ని పక్కకు పెట్టి అతనిదగ్గరనుంచి ఎదైనా ఆశిస్తానని ఎలా అనుకున్నావు? మనకిష్టమైనప్పుడు స్త్రీవాదపు మాటలు చెప్పి, లేనప్పుడు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ వారిమీద ఆధారపడి ఉండడం నా వల్ల కాదు. ప్రేమ పేరుతో అబ్బాయిలని మోసపుచ్చి తమ అవసరాలు గడుపుకుంటున్న అమ్మాయిల గురించి వింటున్నాము, పెళ్ళి చేసుకుని ఆ తర్వాత వారిని సాధించి విడాకుల పేరిట లక్షలూ, కోట్లూ గుంజుతున్న యువతుల గురించి చదువుతున్నాం. గృహ హింస లాంటి చట్టాల్ని తమ స్వార్ధం కోసం వాడుకుంటున్న వీర వనితలెందరో నీకూ తెలుసు. ఇవన్నీ చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? ఇది  కాదు, అవకాశ వాదం అని. మనిషెప్పుడూ అవకాశ వాదే కాదనను కానీ నేను మాత్రం అలా కాలేను. నా ఉద్యోగం, నా వ్యాపకాలు, నా స్నేహితులూ నాకున్నంతకాలం నాకేమీ ఎదురులేదు. అన్నట్టు నా స్నేహితుల్లో శంకర్ కూడా ఉంటాడు సుమా!  ఇది స్త్రీవాదం కాదు మంజూ, వ్యక్తిత్వవాదం.అంది నవ్వుతూ.   రచన:- సుభద్ర వేదుల

భూల్ భులయ్యా..

  భూల్ భులయ్యా...     'యేటండీ! ఇట్టా పడుకుంటే యెట్టా వేరేవోళ్ళ బెర్త్ మీద? లెగండి లెగండి...మా సామాన్లు మేము సర్దుకోవద్దా యేటి? ' కరుకైన గొంతు. బెర్త్ పై అలా ఒరిగి మాగన్నుగా నిద్రపోతున్న మనస్విని ఒక్క దెబ్బతో లేచి కూచుంది. అసలే వేసవి కాలం. లక్నో నుంచీ హైదరాబాద్ కు స్లీపర్ క్లాస్ లో ప్రయాణం. ఏ. సీ. లో దొరకలేదు రిజర్వేషన్.విధిలేదు మరి..ఆఫీస్ కు సంబంధించి - ఓ వర్క్ షాప్ అటెండ్ అయి తిరుగు ప్రయాణమైంది స్లీపర్ కోచ్ లోతను ! ఒకటే వుక్కపోత.యేదో ముందు స్టేషన్ లోదొరికిన లంచ్ తో కడుపు నింపుకుని, అలసటగా అలా కాసేపు మాగన్నుగా పడుకుందో లేదో, యీవిడెవరో ఇలా బెదరగొట్టేసింది! అంధ్రా బార్దర్లోకి వచ్చేశామన్న మాట! విధిలేక లేచిపోయింది. ఆ వచ్చినావిడ ఇద్దరు చిన్న పిల్లల తల్లి. పాపకు సంవత్సరం ఉంటుందేమో! కొడుకుకు మూడు నాలుగేళ్ళుంటాయి. రైలు ఓ రెండు మూడు నిముషాలాగి బైలుదేరింది. స్టేషన్ యేదో చూడనూ లేదు. ఆ వచ్చినావిడ తన సామాను సర్దుకోవటానికీ ఒక యుద్ధమే చేసింది. ' యీ సామాన్లెవరివండీ. .ఇట్టా కిందంతా పరిచి పెట్టీసుకుంటే, మేమెక్కడెట్టుకోవాలండయ్యా? ' అని అరవటం మొదలెట్టింది. యెదురు సీట్లోఉన్నఒకతను 'యేంటమ్మానీ గొడవ..ఉండు..తీస్తాంగానీ కొంచెమాగు..నువ్వు వచ్చిన వెంటనే తీసి రెడిగా పెట్టాలా మేమంతా? ఒకటే హడావిడి పడిపోతున్నావ్? ఇప్పుడొచ్చి ఇంత గలభా చేస్తున్నావ్? లక్నో నుంచి వస్తున్నాం మేమంతా! ' అన్నాడు కాస్త గట్టిగానే.. ఆవిడేమీ వూరుకునే రకంలా లేదు. ' మీరెక్కణ్ణుంచొస్తే నాకేటండి. మీ అందరికి మల్లే నేనూ రైల్లో బెర్త్ రెజర్వ్ చేసుకున్నానండీ..ఆయ్..తొరగా నాక్కాస్త చోటిస్తే, సర్దుకుని మా బుడ్డోడికి వణ్ణం పెట్టుకుంతనండీ..పిల్లల తల్లనైనా వుండదేటండి మీకు? ఒంటిగా ఆడొల్లుంటే, ఇట్టాగే మాట్టాడతారండీ అందరూనూ! మావోడు రావయ్యా మగడా అంటే, ఓ యేదో కొంపలంటుకునే పన్లున్నట్టు, నన్నొక్కదాన్నీ రైలెక్కించేశాడండి! ఆడుండి ఇట్టాంటివన్ని జూసుకోవాలిగదండీ? యేతంతారండీ? ' సపోర్ట్ కోసమన్నట్టు మనస్వినికేసి చూసిందావిడ - మనస్వినినంతకు ముందు కసురుకున్న సంగతి ఆమెకు గుర్తులేదనుకుందేమో మరి! మనస్విని యేమీ మాట్లాడకండా, కిటికీలోంచీ బైటకు చూస్తూ కూచుంది! కాసేపట్లో, ఆవిడ, సామాను యెలాగో సర్దుకోవటం, ఆ చిన్నపిల్లకు అలాగే పైటకిందనుంచీ పాలు తాగిస్తూనే, తను తెచ్చుకున్న టిఫిన్ బాక్స్ విప్పింది. అప్పటికి యేడున్నరవుతూందేమో! తనోవైపు ఆ బాక్స్ లొ వున్న పులిహోర లాంటిదేదో తింటూనే, తన కొడుకుకూ తినిపించే ప్రయత్నం చేస్తోంది తన పక్క సీటావిడ. కానీ, వాడు తినటానికి మొండి చేస్తున్నాడు. వాళ్ళమ్మ నోట్లో పెట్టబోతుంటే, మొహం తిప్పేసుకుని చిన్నగా ఓ సారీ, పెద్దగా ఓ సారి, యేడుపు మొహంతో ఓ సారీ..ఆఖరున ఆరున్నొక్క రాగంలో. ' బిరియానీ ' అనే అంటున్నాడు. ఆవిడేమో, అట్లా బిరియానీ అని వాడన్నప్పుడల్లా, కసురుకుంటూనే వుంది. యీలోగా ఆమె దగ్గర పాలు తాగుతున్న చంటిపిల్ల సోలిపోతుంటే, బెర్త్ మీద ఓ పాత చీరెలాంటిది వేసి పడుకోబెట్టి, పనిలో పనిగా వాడికి రెండు తగిలించింది. మనస్వినికి జాలేసింది ఆ చిన్న కుర్రాడిమీద! బట్టలు మురికిగా వున్నా, చామన చాయా, పెద్ద కళ్ళతో చూడటానికి బాగానే ఉన్నాడు వాడు. చెప్పొద్దూ, ఆవిడా, పీలగా ఉన్నా, కళ్ళూ ముక్కూ బాగానే ఉన్నాయి. కాస్త రంగూ ఉంది. ఆ పిల్లాడికి తల్లి కళ్ళూ, తండ్రి చాయా వచ్చాయేమో! తను తెచ్చుకున్న తెలుగు నవల చదువుకుంటున్నట్టే వుంటూ, మధ్యలో యీవిడ కెసి అప్పుడప్పుడూ చూస్తూంది మనస్విని. ఆవిడేమో, మరో డబ్బాలోని పెరుగన్నం తను తింటూ కొడుకుకు తినిపించే ప్రయత్నం చేసింది. అమ్మ తన మాట వినకపోయేసరికి, వాడు ఆమె చేతినో తోపు తోశాడు. చేతిలోని పెరుగన్నం బెర్త్ మీద పడింది. ఇక చూడాలి ఆమె ఆక్రోశం! తిట్లకు లకించుకుంది. యెడ పెడా వీపుమీద బాగానే బాదేసింది. వాడి యేడుపుతో కంపార్ట్ మెంటంతా ప్రతిధ్వనిస్తోంది.మనస్విని రైల్లో ఆవిడెక్కినప్పటినుంచీ, వాళ్ళనే గమనిస్తున్నదే తప్ప, తక్కిన వాళ్ళవైపు చూడటమే లేదు. కారణం ఆ పిల్లవాడి కళ్ళల్లొ ఉన్న స్పార్క్. ' యెందుకమ్మా అలా కొడతావు? అ బిరియానీ యేదో కొనివ్వొచ్చుగా? ' అంది జాలిగా వాడికేసి చూస్తూ..' ఆ...మీకేటండి అంతారలాగే ..నలభై రూపాయలు.మీరిత్తారేటి?' విసురుగా అనేసింది - చెంప మీద ఫెళ్ళున కొట్టినట్టే! అలాగే 'ఊరుకోరా యెదవ నాయాలా?' అంటూ మళ్ళీ నాలుగు తగిలించింది వాడి వీపు మీద! ఈ దెబ్బతో మనస్విని దిమ్మ తిరిగిపోయింది. నిశ్శబ్దంగా, తన మానాన తాను కిటికీలోంచీ బైటికి చూస్తుండిపోయింది - తనకెందుకీ గొడవ అనుకుంటూ, మనసులోనే చెంపదెబ్బలు వేసుకుని! ఇంతసేపూ కూర్చుని కూర్చుని కాళ్ళు, తిమ్మిరెక్కినట్టుంటే, అలా లేచి డోర్ దగ్గర నిలబడదామని అటుకెసి వెళ్ళింది మనస్విని. అలాగే బాత్ రూం కీ వెళ్ళొచ్చేసరికి, తనపక్కనున్నఆ పిల్లల తల్లి, అటువేపు కింద బెర్త్లో ఉన్న ఇదివరకటి మధ్య వయసాయన్ని ఒప్పించుకున్నట్టుంది- మనస్విని బెర్త్ పైనున్న తన మధ్య బెర్త్ లోకి అతను మారి, యెదుటి కింది బెర్త్ లో పిల్లలతో తాను పడుకునేందుకు ! ఎదుటి బెర్త్ పైన తన పాత చీర పరచి, పిల్లని పడుకోబెట్టేసిందప్పుడే! మనస్వినినడిగితే, ఒప్పుకోదనుకుందో యేమో! ఆమాత్రం యెవరైనా సాయం చేస్తారు కదా ! పైగా పిల్లల తల్లాయె కూడా! అప్పటికే కంపార్త్ మెంట్ లో అందరూ యెవరి కుటుంబాలతో వాళ్ళు రాత్రి భోజనాలు కానిచ్చేశారు. తొమ్మిదవుతుండగా, మధ్య బెర్త్ లో పడుకుంటున్నతనూ వచ్చేసరికి, మనస్వినీ బెడ్ షీట్ సరిజేసుకుంది. ఇందాక స్టేషన్లో కొన్న రెండరటిపళ్లు అన్యమనస్కంగానే తిని, ఏర్ పిల్లో సరిజేసుకుని ,షాల్ తీసి కప్పుకుని బెర్త్ పై వాలిపోయింది. కళ్ళు మూసుకుని, ఆలోచనల్లో పడింది మనస్విని. లక్నో అసలు రాముని తమ్ముడు లక్ష్మణుడు కట్టించిన ప్రదేశ0. అప్పట్లొ దీని పేరు లక్ష్మన్ పురా ! పోను పోనూ, లక్నోగా మారింది. చరిత్రలోనూ ఇలాగే పేర్లు మారిపోతుంటాయా! రూమీ దర్వాజా, బ్రిటిష్ రెసిడెన్సీ, అక్కడ 1857 నాటి సిపాయిల తిరుగుబాటుకు సంబంధిన బరువైన జ్ఞాపకాలూ, ఇవన్నీ చూసుకుని చివర్లో భూల్ భులయ్యాకి వెళ్ళారంతా! దీన్నే బడా ఇమాంబారా అనికూడా పిలుస్తా రు. 18వ శతాబ్దంలో, కరువు రక్కసి కాటేసినప్పుడు, అవధ్ రాజు అసఫుద్దౌలా యీ నిర్మాణం చేయించాడు. ఆ కరువు సమయంలో ప్రజలకు పని కల్పించి, జీతమిచ్చి, తద్వారా, వాళ్ళను ఆదుకునేందుకు రాజు ఉదయం పనివాళ్ళు కట్టి వెళ్ళిన భాగాలనన్నిటినీ, రాత్రి వేరే పనివాళ్ళను పెట్టి కూల్చేయించేవాడట! అలా దాదాపు పది సంవత్సరాలు ప్లాన్ చేసి చేసి, పనివాళ్ళకు కూలీ గిట్టుబాటయ్యేలా సంవత్సరాల తరబడీ, కరువు ముగిసేవరకూ కట్టించినదీ కట్టడం ! మొగల్ శిల్ప శైలిలో, కట్టడం విశాల మధ్య భాగంలో, అసఫుద్దౌలా సమాధి కూడా వుంది. అంటే, రాజులు తాము బతికి వున్నప్పుడే తమకోసం కూడా సమాధులు ముందే కట్టించుకునే పద్ధతి అప్పుడుండేదట మరి! 15, 16 మీటర్ల యెత్తైన ఆ సీలింగ్ కు యెలాంటి ఆధార స్థంభాలూ లేకపోవటం నిజంగా ఆశ్చర్యమే! అప్పటి నిర్మాణ కౌశలానికి జోహారులంటూనే, భూల్ భులయ్యా లోకి ప్రవేశించారందరూ! అక్కడక్కడ, స్థానిక యువకులు అల్లరిగా మాట్లాడుకుంటూ యాత్రికులను తప్పు దారికూడా పట్టిస్తారని ముందు జాగ్రత్తగా స్థానికులు చెప్పినా వీళ్ళు వినిపించుకోనందుకు, తగిన బుద్ధొచ్చిందందరికీ! నాలుగైదుసార్లు తప్పిపోయి, మళ్ళీ, గైడ్లతో వచ్చిన వేరే టూరిష్టుల సాయంతో యెలాగో బైటికొచ్చారందరూ! యెప్పుడో చిన్నప్పుడు చదివిన లెక్కలూ, చరిత్ర పాఠాల్లాగే ఇప్పుడీ యీ భూల్ భులయ్యా కూడా మనసులో హత్తుకుపోయింది! భ్రాంతి కలిగించేదే ఐనా, యేదో ఆకర్షణ ! ఇవన్నీ గుర్తు చేసుకుని, మళ్ళీ, రేపు ఇంటికి చేరుకోగానే చేయాల్సిన పనులు గుర్తు చేసుకుంటూ, కుడివైపు ఒత్తిగిలి, ఆ పిల్లలతల్లి యేంచేస్తుందోననుకుంటూ అటుకేసి చూసింది మనస్విని. ఆవిడైతే, చిన్నటి గుర్రు కూడా పెడుతూ నిద్ర పోతూంది, అటు తిరిగి పడుకుని! పిల్లాణ్ణి కాళ్ళ దగ్గర పడుకోబెట్టుకుందేమో కానీ, వాడు, లేచి ఆ ఇరుకు జాగాలోనే దిగులుగా కూర్చుని అటూ ఇటూ చూస్తున్నాడు. వాడిని చూస్తే జాలయింది. ఐనా, ఆ తల్లేంటి, బొత్తిగా కొడుకును పట్టించుకోకుండా, హాయిగా మైమరచి నిద్ర పోతూంది. వాడు దిగి యెటైనా వెళ్తేనో? మనస్వినికి వాడెందుకలా అటూ ఇటూ చూస్తున్నాడబ్బా అని అనుమానమొచ్చింది. తానిందాకటినుంచీ వినలేదు కానీ, యేదో స్టేషన్లో ఆగి వుంది రైలు. తలుపు కూడా తీసే వున్నట్టుంది. యెవరో దిగినట్టున్నారు కూడా! దూరంగా, బిరియానీ బిరియానీ అని యెవరో అమ్మడం వినిపించిందింతలో! అయ్యో పాపం, యీ పిల్లాడు బిరియానీ కోసం కూర్చున్నాడో యేమో! పోనీ, వీడికో పాకెట్ కొని పెడితేనో? తన ఆలోచనకు తనకే నవ్వొచ్చింది. ఆ తల్లేమో, ఆదమరచి, వీణ్ణిలా వదిలేసి నిద్రపోతుంటే, తానేమో వాడికే అత్తో లేదూ, యే పెద్దమ్మో ఐనట్టు, వాడికి బిరియానీ కొనిపెడదామనుకోవటం! ఐనా, వాడి పట్టుదల చూస్తే ముచ్చటౌతూంది మనస్విని కి! మెల్లిగా లేచింది బెర్త్ లోంచీ! ఇంకెంతసేపీ స్టేషన్లో ఉంటుందో రైలు? తను డోర్ దగ్గరికెళ్ళి, ఆ బిరియానీ అమ్మేవాణ్ణి పట్టుకుని కొనేంతలో కదిలిపోతేనో? ట్రైచేసి చూద్దాం అనుకుంటూ, మెల్లిగా డోర్ వైపు అడుగులేస్తూనే వుంది-ఇంతలో రైలు కదిలే పోయింది. బైటే నిలబడున్నతనెవరో పరుగులు పెడుతూ రైలెక్కాడు. వుసూరనుకుంటూ మనస్విని బెర్త్ దగ్గరికొచ్చింది. పిల్లాడేడీ? లేడే! మనస్విని గతుక్కుమంది. తను అటుకేసి వెళ్ళడం చూసి వాడూ వెళ్ళాడా యేంటీ? ఐనా, తానేదో ఒకటి రెండు సార్లు వాడికేసి ప్రేమగా చూసినంత మాత్రాన, వాడట్లా తన వెనకే వస్తాడనేంటీ? మనసాగలేదు మనస్వినికి..అటువైపు డోర్ కేసి వెళ్ళాడేమో? కంగారుగా వెళ్తుంటే, మధ్యలోనే కనిపించాడు - అక్కడొకతను, యేదో తింటుంటే చూస్తూ నిలబడున్నాడు. భలే జాలేసింది.పాపం, ఆకలేస్తూందో యేమోనని! వాణ్ణి పిలిచింది 'రా, నేను కొనిపెడతా బిరియానీ నీకు ' అంటూ! బిరియానీ మాట వినబడగానే వాడు ఠక్కున మనస్వినికేసి చూసి, వెనకే వచ్చేశాడు. ఇంక వాళ్ళమ్మ కాళ్ళ దగ్గర కూర్చున్నాడే కానీ, చూపులన్నీ మనస్విని వైపే! తనకిదేమి కొత్త బంధం యేర్పడింది బాబూ అనిపించినా, పిల్లాడి మీద జాలి మరి ఆలోచించనివ్వలేదు. మధ్యలో ఒకసారి ఆతల్లి, లేచి, పిల్లాణ్ణి, దగ్గరికి లాక్కుని, నిద్రలోనే అరటిపండొకటి సంచీలోనుంచీ తీసి, వొలిచి చేతిలోపెట్టి, తినమని చెబుతూ చెబుతూనే నిద్రలోకి జారుకుంది మళ్ళీ! పాపం, యెంత అలిసిపోయిందో యేమో! బహుశా యేదో పొలం పనులు చేసుకునే కుటుంబం లో ఇల్లాల్లాగే వుంది ఆవిడా కట్టూ బొట్టూ చూస్తుంటే! మనస్వినికి తన ఆలోచనలకు లోలోపల నవ్వొచ్చింది. రైలెక్కినప్పటినుంచీ, ఆవిడ వాలకం చూసి, యీవిడతో తనకెందుకులెమ్మనుకుంది కానీ, ఇప్పుడీ పిల్ల వెధవ వల్ల, తల్లి గురించీ ఆలోచిస్తూంది తను! ఇంతలో బోగీ చివరినుంచీ కాబోలు, 'బిరియానీ' అన్న కేక వినబడింది. ఆ కేక వినగానే పిల్లాడు గబుక్కున బెర్త్ నుంచి దిగబోయాడు. మనస్విని ఇది గమనించింది..'ఒరే నాయనా..నువ్ దిగకు. నేను కొనిపెడతాలే బిరియానీ'..అని అక్కడే కూర్చోమని చెప్పి, తను లేచి, బిరియానీ అమ్మే అతనికోసం యెదురుచూస్తూ కూచుంది.థాంక్ గాడ్! వాడికి తను చెప్పేది అర్థమౌతోంది. . టైం పదిన్నరైవుంటుంది. మిగిలిపోయిన ఫుడ్ పాకెట్లు ఇలా లేట్ నైట్ లోనూ అమ్ముతుంటారు వీళ్ళు. రెండు నిముషాల్లో, బిరియానీ అమ్మే అతను వచ్చాడు. మనస్విని ముప్ఫై రూపాయలకు బిరియానీ పాకెట్ కొని, ఆశగా చూస్తున్న పిల్లాడి దగ్గర పెట్టింది పాకెట్ ఓపన్ చేసి! వాళ్ళమ్మ, అక్కడే టేబుల్ పై పెట్టేసిన నీళ్ళ బాటిల్ కూడా దగ్గర పెట్టింది! వాడు ఆబగా రెండు మూడు సార్లు చేతిలోకి తీసుకుని తిన్నాడో లేదొ, దగ్గు మొదలైంది వాడికి! వాడలా పొర పోయినట్టు దగ్గటం విని, ఆ తల్లి, కంగారుగా లేచింది నిద్రలోంచీ! పిల్లాడి దగ్గు ఆపేందుకు నీళ్ళు తీసి తాగించింది ముందు. తరువాత, వాడి దగ్గర బిరియానీ పాకెట్ చూసి ' ఓలమ్మో! యెట్ట వచ్చిందిరా బిరియానీ నీకు? అడుక్కున్నావా యెవర్నైనా? ' అని కసురుకుంటూ అడిగేసరికి, బిక్క మొహమేసుకుని వాడు మనస్వినికేసి చూపించాడు. అప్పుడావిడందుకుంది..'యేమమ్మో! వచ్చిన కాణ్ణించీ చూస్తున్నా? మేమేం బిచ్చపోల్లనుకుంతన్నవా యేంది? వాడేదొ బిర్యానీ బిర్యానీ అంతున్నడు, నాకాడ పైసల్లేవని కొనివ్వడం లేదని అనుకుంతున్నావేమో! మా కాడా బాగనే డబ్బులున్నయ్, మీకాడే కాదు. రాత్రిపూట తింటే పిల్లోనికి అరగదని కొనియ్యలేకానీ, నా కాడ, డబ్బుల్లేక కాదమ్మో తల్లీ! ఇట్టగే, పిల్లోన్ని బుట్టలొ యేసుకోని మాయచేసే వాళ్ళుంతారని యిన్నాగానీ, నీ అసుంటి డాబుసరోల్లూ ఇట్టాంటి పనిజేస్తారనుకోలే? నా పిల్లోని బాగనేజూసుకున్నవ్ గానీ, ఇంగ నిద్రపో మాతల్లే! ' అంటూ, ఆ బిరియానీ పాకెట్నీ ఉండ చుట్టి, కిటికీలోంచీ బైటికి విసిరేసింది. వాడి వీపుపై మరో నాలుగు వడ్డించింది. వాడేడుస్తూ వుండగానే అరటి పండు బలవంతంగా నోట్లో కుక్కి, కాళ్ళు వాడి చుట్టూ కదలనీకుండా వేసి, పడుకోబెట్టిందికాక, ఇంకా యేదేదో గొణుగుతూనే వుందావిడ ఉక్రోషంగా! అయోమయంలో మనస్విని నోట మాట రాలేదు.!!! ఇంతకూ, పెళ్ళై ఇరవై యేళ్ళైనా, పిల్లల్లేని తనలో, యీ పిల్లాడి పట్ల కలిగిన యీ క్షణికానురాగం ఓ భూల్ భులయ్యానేనేమో! నిట్టూరుస్తూ, అటుతిరిగి పడుకుంది. చెక్కిళ్ళపై కన్నీటి చారికలు! ! ( ఈ కథ నా సొంతం. దేనికీ అనువాదం కానీ, అనుసరణ కానీ కాదని హామీ ఇస్తున్నాను..)   కలం పేరు: పద్మిని-హర్ష (డా. పుట్టపర్తి నాగపద్మిని.)

అనసూయ

అనసూయ       ఆలోచిస్తోంది అనసూయ. తనలో తనే తెగ మధనపడుతోంది. మనసులో ఆందోళన. ఏం చేయాలి? కరుణకి చెప్పాలా? వద్దా? చెప్తే తనని అసహ్యించుకుంటుందేమో! కానీ ఇప్పటికీ చెప్పకపోతే ఎలా? దుఃఖం తన్నుకొస్తోంది. సన్నగా తలనొప్పి మొదలయింది. ఇంక చేసే పని వదిలి కూర్చుండిపోయింది. కళ్ళమ్మట కన్నీరు ధారగా కారసాగింది. రాఘవరావు పూజ కానిచ్చి ప్రసాదం తీసుకుని నెమ్మదిగా భార్య దగ్గరికి వచ్చాడు. ఉలుకూ, పలుకూ లేని భార్యని చూసి అతని హృదయం ద్రవించింది. భార్య చేతిలో ప్రసాదం పెట్టి, పక్కనే కూర్చున్నాడు. అలవాటుగా ప్రసాదాన్ని తీసుకున్నా ఆమె మనసు మాత్రం అక్కడ లేదు. ఎలా? కరుణకి చెప్పడం ఎలా? చెప్పాలని ఊహించుకుంటూంటేనే గొంతుక్కేదో అడ్డం పడ్డట్టు ఉంది. ఇంక చెప్పడం ఎలా? అసలు చెప్పినా అర్ధం చేసుకుంటుందా? భార్య భయాన్ని, ఆలోచనల్నీ అర్ధం చేసుకున్న రాఘవరావు, నెమ్మదిగా ఆమె భుజంమీద చెయ్యివేసి అనునయంగా తట్టాడు. “అనసూయా! తప్పనప్పుడు ధైర్యం తెచ్చుకోవాలి. దేనికైనా సంసిధ్ధంగా ఉండాలి.” అన్నాడు ధైర్యం చెబుతూ. సాయంత్రందాకా అలానే కూర్చుని, నెమ్మదిగా మనసుని కూడదీసుకుని లేచి దీపం వేసింది అనసూయ. ఆరు అవుతూంటే కాలేజీనుంచి వచ్చింది కరుణ. తలుపు తీసిన అనసూయని చూస్తూనే, “ఏమిటమ్మా అలా ఉన్నావు? ఒంట్లో బాలేదా?” అని అడిగింది. “ఏమీ లేదే! కాఫీ ఇస్తాను ఉండు,” అంటూ వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలపసాగింది. ఏమిటో! అమ్మ వారం రోజులనించి ఏదోలా ఉంది. ఏమయింది? అడిగితే ఇలాగే మాట దాటేస్తుంది. పోనీలే, రేపు మాధవీఆంటీ వస్తోందిగా, ఇంక అమ్మకి సందడే సందడి. ఎందుకో చుట్టాలందరిలోకీ మాధవీఆంటీ అంటే అమ్మకి ఎంతో ఇష్టం. బహుశా చుట్టరికం కంటే స్నేహం ఎక్కువ మూలాన కాబోలు! ఆలోచిస్తూ కరుణ పెరట్లోకి వెళ్ళి మొక్కలకి పైపుతో నీరు పెట్టసాగింది. మొక్కలన్నా, చెట్లమీద వాలే పిట్టలన్నా కరుణకి ఎంతో ఇష్టం. ఇల్లంటే మరీ ఇష్టం. ఇంక అమ్మానాన్న అంటే చెప్పలేని ప్రేమ! ఇప్పటికీ అమ్మ ముద్దలుచేసి నోట్లో పెడితేనే అన్నం తినడం ఇష్టం. తెల్లవారింది. ఆరుగంటలికి రాజమండ్రినించి మాధవి వస్తోంది. రాఘవరావు స్టేషనుకి వెళ్ళాడు తీసుకురావడానికి. అనసూయ పాలుకాచి, డికాక్షనువేసి, ఉప్మాకి అన్నీ సిద్ధం చేసుకుంటోంది. ఆదివారం మూలాన కరుణ ఇంకా పక్కమీంచి లేవలేదు. మాధవి చాలా చలాకీ మనిషి. అందరికీ సహాయం చేయాలనే ఆలోచనే ఎక్కువ. వాళ్ళ కాలనీలో అందరి సమస్యలూ తెలుసుకోవడం, అందరూ కలిసి ఎలా వాటిని పరిష్కరించుకోవాలో చర్చించుకోవడం, దానికోసం అవసరమైన వారిని కలిసి చక్కని వాక్చాతుర్యంతో వారిని మెప్పించి కార్యం సాధించుకురావడం ఆమె గొప్పతనం. అందరి దగ్గిరా పోగుచేసిన వస్తువులని, బట్టలని అనాధశరణాలయాలలో అందించడం కూడా ఆవిడ కార్యక్రమాలలో ఒకటి. ఎంతటి త్యాగానికైనా, శ్రమకైనా వెనుకంజవేయదు. ఏడుగంటలయింది. కారులో రాఘవరావుతో వచ్చిన మాధవి ఇంటిముందు దిగింది. కాలింగ్ బెల్లు శబ్దం వినగానే అనసూయ వడివడిగా వచ్చి తలుపుతీసింది. ఆప్యాయంగా అనసూయని హత్తుకుంది మాధవి. ఆ కౌగిలిలోని భరోసాతో మనసు తేలికబడింది అనసూయకి. ఏదీ కరుణ? ఇంకా లేవలేదా? అంది సోఫాలో కూర్చుంటూ మాధవి. ఇంకా లేచినట్టులేదు, ఆదివారం కదా! అంది అనసూయ ఉప్మాకి పోపు వేస్తూ. కరివేపాకు, అల్లం, ఉల్లిపాయ సువాసనకు మాధవికి ఆకలి గుర్తొచ్చి కడుపులో ఎలకలు పరిగెట్టడం మొదలయ్యింది. మాధవికి ఉప్మా అంటే చాలా ఇష్టం! అదీ హోటల్ తాజ్ లోలా జారుగా నెయ్యి, జీడీపప్పులతో ఘుమఘుమలాడుతూ ఉండాలి. అందుకే అనసూయ ఈరోజు ఉప్మా చేస్తోంది. కాళ్ళూ, చేతులూ కడుక్కుని వంటింట్లోకి వచ్చి కూర్చుంది మాధవి. కాఫీకప్పు మాధవి చేతిలో పెట్టి, ఇంకొక్క పది నిముషాలలో ఉప్మా రెడీ అంది నవ్వుతూ అనసూయ. అనసూయ మొహంలోకి పరిశీలనగా చూసింది మాధవి. మొహమంతా పీక్కుపోయినట్టయి తనకంటే పదేళ్ళు పెద్దదానిలా ఉన్న అనసూయతో, “బెంగపడకు, ఏంకాదులే! ఎప్పటికైనా తెలియవలసినదేగా?” అంది భుజంమీద చెయ్యి వేస్తూ. బెంగని మనసులోనే అణుచుకుని పైకి నవ్వింది అనసూయ. సాయంత్రం అందరూ కలిసి పార్కుకి వెళ్ళారు. దారి పొడూగునా తనతో కాలేజీ కబుర్లు చెప్తూనే ఉన్న కరుణని చూస్తుంటే ఒక్క నిముషం మనసు చలించింది మాధవికి. మరునిమిషంలోనే సర్దుకుంది. “రాధని, రవిని కూడా కూడా తీసుకుని రావలసింది”, అన్నాడు రాఘవరావు పార్కులోని గడ్డిలో చతికిలబడుతూ. అనసూయ, మాధవి, కరుణ కూడా కూర్చున్నారు. “లేదు, అన్నయ్య! దానికి డిగ్రీ పరీక్షలూ, వాడికి ఏవో జాబ్ ఇంటర్వ్యూలు, తీరికలేకుండా ఉన్నారు”, అంది నవ్వుతూ మాధవి. అనసూయకి పన్నెండేళ్ళప్పటి నించే మాధవితో స్నేహం. మాధవి అనసూయకి దూరపుబంధువే కానీ, రాజమండ్రిలో ప్రక్కఇంట్లోనే ఉండడం వలన బంధుత్వం కన్నా స్నేహమే ఎక్కువ! ఇద్దరూ ఒకే ఈడు, ఒకే స్కూలు, ఒకే క్లాసు అవడంతో ఆ స్నేహం ఇంకా బలపడింది. ఇద్దరూ పంచుకోని విషయాలు లేవు, ఏ అరమరికలు లేవు. కబుర్లు, ఆటలతో స్కూలయాక సాయంత్రం కూడా కలిసిమెలసి ఉండేవారు. ఇద్దరూ కలిసి ఒకళ్ళింట్లో టిఫిను తింటే ఇంకొకళ్ళింట్లో భోంచేశేవారు. పరీక్షల్లో కలిసి చదువుకోవడం .... మరి పడుకోవడం కూడా ఒక చోటే! డిగ్రీ దాకా చదువుకున్న వీళ్ళిద్దరికీ ఒకటి రెండు సంవత్సరాల తేడాలో పెళ్ళిళ్ళుకూడా అయిపోయాయి. అనసూయ, భర్త రాఘవరావుతో పాటు హైదరాబాదు వస్తే, మాధవి, తన భర్త నారాయణకి ఉద్యోగం అక్కడే ఉండడం మూలాన రాజమండ్రిలోనే ఉండిపోయింది. ఆ రోజుల్లో ఉత్తరాలతోనేగా కబుర్లు! తెగ రాసుకునేవారు. పండగలకి శలవులకి వెళ్ళినప్పుడల్లా కలుసుకోవడం, సరదాగా గడపడం మామూలు అయిపోయింది. ఒక ఏడాది ఇట్టే గడిచిపోయింది. తరవాత ఏడాదికి మాధవికి కొడుకు పుట్టాడు. ఇంకో రెండేళ్ళకి కూతురు కూడా పుట్టింది. అప్పుడు శలవలలో పుట్టింటికి వచ్చిన అనసూయ మాధవి ఇంటికి వెళ్ళింది. దిగులుతో చిక్కిపోయిన అనసూయని చూసి మాధవి కంగారుపడింది. నెమ్మదిగా ఒకరోజు కారణమేమిటని అడిగింది. అనసూయకి పిల్లలు లేరని అత్తగారు తెగ సాధిస్తోందిట. ఆడబొడుచులు కూడా సూటీపోటీ మాటలు అంటున్నారని కళ్ళనీళ్ళు పెట్టుకుంది అనసూయ. మూడేళ్ళేగా, కొంతమందికి కొద్దిగా ఆలస్యమవచ్చు బెంగపెట్టుకోకని ఓదార్చింది మాధవి. ఇంకో ఏడాది గడిచింది. డాక్టర్ని కలిసి అన్ని  పరీక్షలు చేయించుకున్న రాఘవరావు, అనసూయలకి రాఘవరావుకి పిల్లలు పుట్టే అవకాశంలేదని తెలిసింది. ఇంటికి వచ్చి ఏడ్చి, ఏడ్చి సొమ్మసిల్లిపోయింది అనసూయ. అత్తగారికి బెంగ ఎక్కువయింది. చుట్టుపక్కల పిల్లల్ని చూస్తూంటే బాధ ఇంకా ఎక్కువవుతుంది. ఎవరినైనా పెంచుకుందామంటే తెలీని కుటుంబం నించి తెచ్చుకోవడానికి అత్తగారూ, భర్తా ససేమిరా ఒప్పుకోవడంలేదు. ఎదురు చెప్పలేని అనసూయ బెంగతో చిక్కి సగమయింది. తల్లి దగ్గిరకి వచ్చిన అనసూయని చూసిన మాధవికి మతిపోయింది. ఏమిటే ఇది? ఇలా అయిపోయావే? అంది అనసూయని కౌగిలించుకుంటూ. కడుపులోని బాధంతా ఉబికివచ్చింది అనసూయకి. అన్ని విషయాలు తెలుసుకున్న మాధవి ఆ తరవాత చాలారోజులు ఆలోచిస్తూనే ఉంది. చివరికి ఒక నిర్ణయానికి వచ్చి నారాయణతో చెప్పింది. ఇద్దరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చాకా హైదరాబాదు బయల్దేరారు. ఆ దంపతుల నిర్ణయం విన్న అనసూయ ఆనందాశ్చర్యాలతో తలమునకలయ్యింది. రాఘవరావు నమ్మలేనట్టు చూశాడు. “నిజంగానేనా?”, అంది అనసూయ మాధవి పట్టుకుని. “అవును, ఇప్పుడు నాకు మూడవనెల. మాకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. అందుకని ఈ పుట్టబోయే బిడ్డని నీ కోసమే కంటాను”, అంది మాధవి అనసూయని దగ్గిరకి తీసుకుంటూ. అలాగే స్నేహితురాలి కోసం తొమ్మిదినెలలూ మోసి చక్కని పాపని కన్నది ఆ త్యాగమూర్తి! స్నేహానికి మారురూపు ఆమె. ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? జన్మజన్మల రుణానుబంధమే ఇది, అనుకుంది అనసూయ. పాపకి మూడవనెల రాగానే మంచి ముహూర్తం చూసి శాస్త్రప్రకారం దత్తత చేసుకున్నారు రాఘవరావు, అనసూయ. అనసూయ మొహంలోని సంతోషాన్ని చూస్తే తృప్తిగా అనిపించింది మాధవికి. అలా తీసుకువచ్చిన పాపకి కరుణ అని పేరుపెట్టుకుని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు అనసూయ, రాఘవరావు. రాకపోకలున్నా, ఎప్పుడూ ఆ రెండు కుటుంబాల మధ్య ఈ ప్రస్తావనే మళ్ళీ రాలేదు. మాధవీ నారాయణలు అంత సంయమనంతో ఉండబట్టి కరుణకి కూడా ఇంతవరకూ ఈ విషయం తెలియలేదు. ఇంక ఎవరి ద్వారానో, ఎప్పుడో అకస్మాత్తుగా తెలుసుకుని ఆందోళన పడేకంటే అర్ధం చేసుకునే వయసు వచ్చింది కనుక ఇప్పటికైనా చెప్పడమే మంచిదని ఆలోచించిన రాఘవరావు అనసూయ, ఆ సమయంలో మాధవి కూడా ఉంటే బావుంటుందని పిలిపించారు. గతమంతా ఆ రోజు కరుణకి వివరించిన అనసూయ తన కూతురుకేసి ఆందోళనగా చూసింది. కొద్ది నిముషాలు కరుణకి ఇది తన జీవితమేనా? కధ కాదు కదా? అనిపించింది. ఇది నిజమే అని అర్ధమయ్యాకా, మాధవి వైపు చూసింది. ఆమె ప్రశాంతవదనంతో ఎంతో ఉన్నతంగా కనిపించింది. తనని కన్న మాతృమూర్తిలో ఎంత త్యాగం ఉంది! ఒక స్నేహితురాలి కోసం ఇంత త్యాగాన్ని ఎవరైనా చేయగలరా? మమ్మల్ని కలుసుకుంటూనే ఉన్నా ఆమె మనసుకి, మాటకి, కట్టుబడి ఎంత నిగ్రహంగా ఉంది! ఒక్కసారిగా మాధవిని కౌగిలించుకుంది కరుణ. కరుణ కళ్ళనుండి కన్నీరు ఉబికింది. మాధవి కరుణ వీపు నిమురుతూ అంది, “అమ్మని చూడు కరుణా! నిజం తెలిసాక నువ్వు ఏమయిపోతావో అని ఎంత బెంగ పెట్టుకుందో!” “అమ్మా!” అంటూ అనసూయని కౌగిలించుకుని వెక్కివెక్కి ఏడుస్తూ ఒడిలో వాలిపోయింది కరుణ. ఆ ఒక్క పిలుపుతో మనసు కుదుటపడ్డ అనసూయ ఆశృనయనాలతో తన ప్రాణస్నేహితురాలి కేసి చూసంది. -కామేశ్వరీ చెల్లూరి  

దేశ వంచితులు

          దేశ వంచితులు                            రమ తల మీదుగా కప్పుకున్న రజ్జాయిలో కుళ్లి కుళ్లి యేడుస్తోంది . ఒక్కగానొక్క  కొడుకు కమల్ అనాలోచితంగా అన్న మాటలు  రమకి సూటిగా తగిలి పిడికెడంత గుండెని వెయ్యి ముక్కలు చేసేయి .          ఆ మాటలు అంటున్నప్పుడు తల్లి అంత బాధపడుతుందని వూహించి వుండడు కమల్ . అసలు ఆ విషయం చర్చకు వచ్చినపుడు కూడా రమ అనుకోలేదు సంభాషణ అటుతిరిగి యిటుతిరిగీ తన గుండెల్లో గునపాలు గుచ్చుతుందని .         తన మాటలు తల్లిని అంత బాధపెడతాయని తెలిస్తే ఆ చర్చని మధ్యలోనే ముగించెవాడే కమల్ .         సాయంత్రం యెర్రబడ్డ కళ్లతో తిరుగుతున్న తల్లి ని చూసి సున్నిత మనస్కురాలు అనుకున్నాడు కాని  తన అనాలోచిత వ్యాఖ్యలు తల్లి గుండెలను చీల్చేయని తెలుసుకోలేకపోయేడు .        ముప్పైఅయిదు సంవత్సరాలుగా ఒకే ప్రాణంగా బతుకుతున్న  తన భర్తకి కూడా తెలియకుండా  గుండెల్లోనే సమాధి చేసిన రహస్యం , యిన్నేళ్ల తరవాత  తనను అల్లకల్లోల పరుస్తుందని వూహించలేక పోయింది రమ .           ముప్పైఅయిదేళ్ల కిందట పురిటిగదిలో కేరు కేరు మంటూ యేడుస్తూ వేలకత్తులతో తన కడుపు చీల్చుకొని పుట్టిన బిడ్డ కొద్ది నిముషాలలో తెల్లని బట్టలో చుట్టి శ్మశానానికి తరలిస్తూ వుంటే నమ్మలేని తల్లి పేగు బిడ్డని తనచేతులలో కి తీసుకొని అణువణువు తడిమి బిడ్డలో ప్రాణం పోయాలనే తపనకు అడ్డు పడిన  అమ్మానాన్నలను అనుమానంగా చూసింది .        తొమ్మిదినెలలు తనలో పెరిగి మురిపించినది బాబా  ?  పాపా ? , తెలుసుకోవాలని చేసిన ప్రయత్నం ఫలించలేదు . ఒక రోజు బాగా విసిగిపోయిన తల్లి ' బతికి తల్లితంద్రులను విడదీసే దెయ్యంపిల్ల గురించి ఆలోచించకు , వచ్చేయేటికి మంచి బిడ్డని యెత్తుకుందువులే '      దెయ్యంపిల్ల అనేమాటకి చాలా రోజుల తరవాత అర్ధం తెలిసింది . అమ్మా నాన్నలకి గోల్కొండ చూపించడానికి తీసుకు వెళితే అక్కడ అడుక్కుంటున్న  ' హిజరా ' ని చూసి  " పాపపుణ్యాలు లెక్కవేస్తూ వూరుకొనుంటే నీ కడుపున పుట్టిన దెయ్యంపిల్ల బతుకూ యిలాగేవుండును " . అన్న అమ్మ మాటలకు వులిక్కి పడింది రమ . అడుక్కోడానికి అలా వేషం వేసుకుంటారని భావిస్తున్న రమకి అది పుట్టుకతో వచ్చేలోపమా ?  అని మొదటిసారిగా అనిపించింది . తన కడుపున అలాంటి శిశువు జన్మించడం నామోషీగా అనిపించి ఆ విషయాన్ని శాశ్వతంగా తనలో సమాధి చేసేసింది .       దేశం కాని దేశంలో యెప్పుడో మరచిపోయిన విషయం యివాళ చర్చకు వస్తుందని రమ కలలో కూడా అనుకోలేదు .        నాలుగు రోజులుగా వాకింగు కూడా మానేసి బెదురుగా తిరుగుతున్న రమ నుంచి విషయం తెలుసుకోవాలని కమల్ దంపతులు నిర్ణయించుకున్నారు .      మౌనంగా భోజనం చేస్తున్న రమని చూసి నిట్టూర్చేడు కమల్ , డైనింగ్ టేబుల్ దగ్గర యింత నిశ్శబ్దమా ? ఎప్పుడూ  లేదు . అందరి వంతు తనే మాట్లాడే రమ మౌనంగా భోజనం చెయ్యడం అంటే అదో పెద్ద వింతే  మరి . స్వరూప భర్త సౌజ్ఞ అందుకొని " వంట్లో బావుండటం లేదా ? అత్తయ్యా " అంది .      " బావుందే " యెంత నార్మల్ గా అందామన్నా రమ గొంతులో సంశయం ధ్వనించింది .      " మీలొ ఏదో మార్పు కనిపిస్తోంది , అలసటగా కనిపిస్తున్నారు , యిన్నాళ్లు మామగారిని వొంటరిగా వదలి వుండలేదేమో కదా ? యిండియా వెళ్లి పోదామనిపిస్తోందా?, నిద్ర పట్టడం లేదా ? " చాలా కేరింగ్ గా అడిగింది స్వరూప .     " అబ్బే అదేమీ లేదు "      "యేమీ లేదా ? మరి మూడు రోజులుగా ఆ మౌనం , శుభా గాడితో ఆటలు పాటలు లేవు , నీ కిష్ట మైన వాకింగ్ కుడా మనేశావు ఏం జరిగిందో చెప్పక పొతే మాకేలా తెలుస్తుంది " కమల్ తల్లిని పరిశీలనగా చూస్తూ అన్నాడు .        " వారంరోజుల కిందట వాకింగుకి శుభా గాడితో  వెళ్లానా ? అక్కడికి వీడి వయసు అబ్బాయిని తీసుకొని ఒక స్వీడన్ దేశస్థుడు వచ్చాడు . ఆ పిల్లాడిని వాళ్లు పెంచుకుంటున్నారని పిల్లల పెంపకం గురించి అతని భార్యకి సలహాలు కావాలని చెప్పేడు . మరునాడు మరో మగాడిని తెచ్చి వాళ్లావిడగా పరిచయం చేసేడు . వాళ్లడిగినవాటికి సమాధానాలు చెప్పేను గాని వాళ్లిద్దరిని భార్యాభర్తలు గా అంగీకరించలేకపోయేను . ఎంత తొందరగా అక్కడనుంచి బయటపడదామా ? అని యెదురు చూసేను . వాళ్లు వెడుతూ మళ్లా యిక్కడే కలుద్దామని ఈ సారి నన్ను వాళ్లింటికి తీసుకు వెళతామని అన్నారు . అందుకే వాకింగుకి వెళ్లడం మానీసేను " అంది రమ .           " ఈ దేశం లో యిలాంటివి మామూలే అమ్మా "       " మామూలేంటిరా వాళ్లు ప్రకృతికి విరుద్దంగా నడుస్తూ వుంటే మీకెవరికి చీమ కుట్టినట్టు కూడా లేదు , యిలాంటివి సమాజంపై యెంతటి ప్రభావం చూపిస్తాయో మీకెమైనా అవగాహన వుందా?, వీళ్లలాగే అంతా ఆడ ఆడ , మొగమొగ పెళ్లిళ్లు కాపరాలు అంటూ వుంటే మానవ జాతి అంతరించి పోదూ , వాళ్లు పెంచుకున్న పిల్లలని సమాజం అంగీకరిస్తుందా ? వాళ్ల భవిష్యత్తు అంతా జవాబు లేని ప్రశ్నలే , ప్రశ్నలతో మొదలు పెట్టిన బతుకు భవిష్యత్తు లో పెద్ద ప్రశ్నగా మారదూ ? , మన దేశంలో పెళ్లిళ్ల లో డబ్బులు దండుకోడానికి వచ్చేవాళ్లలా కుడాలేరు , మాములుగా మగవాళ్ళ లాగే వున్నారు , ఆ పెంచుకోనేదేదో శుభ్రమైన పెళ్లి అంటే నా వుద్దేశ్యం శుభ్రంగా యిద్దరు ఆడవాళ్ళని  పెళ్లి చేసుకొనే చెయ్యొచ్చు కదా అని " . దుఃఖం తో  సన్నగా వణుకుతున్న గొంతు తో అంది రమ .          " నే చెప్పలే మా అమ్మ వూరికూరికే భయ పడుతుందని , నువ్వు వెళ్లి నీ కొడుకు దగ్గర రెస్ట్ తీసుకొ ,  నేను మా అమ్మని కొంచం ఎడ్యుకేట్ చేసి వస్తా " . స్వరుపతో అని రమ వైపు తిరిగి           " అమ్మా ఈ సమాజం లో తాగుబోతులు , తిరుగుబోతులు , దొంగలు , మహిళల పై అత్యాచారం చేసే మానవ మృగాలు వుండగా జరుగని నష్టం ప్రపంచ జనాభాలో ఒక శాతం కూడాలేని వీళ్ల వల్ల జరుగుతుందా ? .  తెలిసి అన్నావో తెలీకే అన్నావో గాని మానసిక రోగులని అది నిజంగా నిజం , వాళ్ళు మానసిక రోగులే .  వాళ్ళకీ తెలుసు తమలో జరుగుతున్న సంఘర్షణ ప్రకృతికి విరుద్దమని , దానిని అణిచి వుంచడానికి చెయ్యగలిగిన ప్రయత్నాలన్నీ చేస్తారు .ఎప్పుడైతే ఆ సంఘర్షణ అగ్నిపర్వతమై బద్దలౌతుందో అప్పుడు వాళ్లు యిలాంటి నిర్ణయం తీసుకొడం జరుగు తుంది . ఇలాంటి ప్రకృతి విరుధ్ద మైన పెళ్ళిళ్ళలో పిల్లలు పుట్టరు , కాని వారికి పిల్లలని పెంచి పెద్ద చెయ్యాలనే కోరిక వుంటుంది , వాళ్లు అడాప్షన్ సెంటర్ నుంచి పిల్లలని తెచ్చుకుంటారు . అనాధ పిల్లలని పెంచుకొని వొక రకంగా వీళ్లు సమాజానికి సేవ చేస్తున్నట్లే కదా ? అన్నాడు కమల్  .         " యిది సమాజం మీద యెంత చెడు ప్రభావం చూపుతుందో......... ? వీళ్లని చూసి అందరూ యిలాగే చేస్తే " .       " అందరూ అలా చెయ్యరమ్మా కొందరే యిలాంటి వాళ్లు వుంటారు ".      " మగాడు  తల్లెంటిరా ? "      " అమ్మ తనాన్ని లింగభేదం తో కాకుండా మనసు తో చూస్తే నీకు అర్ధం అవుతుంది , యిక మనదేశంలోని హిజరాలు అని పిలువబడే వాళ్లు కూడా నాలాగ , నీలాగ అమ్మ కడుపులోంచి పుట్టినవాళ్లే కాని ఆకాశం మీంచి వూడిపడరమ్మా " .     " వీళ్లని యిలా దేశం మీద వదిలేసే బదులు పురిట్లోనే గొంతునులిమి చంపేస్తే దేశానికి సగం దరిద్రం తీరుతుంది " కొడుకు తర్కం తో యేకీభవించలేని రమ అంది .     " దేశదరిద్రం వీళ్లని చంపితే తీరదమ్మా ,  దేశ సంపదను పందికొక్కుల్లా తినేస్తున్న అవినీతిపరులను చంపాలి . వీళ్లవల్ల సమాజానికి కీడు అనుకుంటున్న నీఆలోచలని చంపాలి . వికలాంగుల కోటా వీరికందకుండా చేస్తున్న అధికారులని చంపాలి , సంఘవిద్రోహులకు , అతి తెలివిగా దేశ ఆర్ధిక వ్యవస్థకి గండి కొట్టి తమ ఖజానా నింపుకుంటున్నవారిని , వారికి అండగా నిలిచి రాజ్యాంగాన్ని తిరగరాయగలిగే ప్రభుద్దులను చంపాలి , వీరి శక్తి సామర్ధ్యాలని వుపయోగించుకో లేకపోయిన  మన దౌర్భాగ్యపు ఆలోచనలను చంపాలి ,  జంతువుల హక్కుల కోసం పోరాడు తున్న వారు వీరు జంతువులు కారు కాబట్టి వీరిని పట్టించు కోలేదు . మా పోరాటం కేవలం మహిళలకే అన్నాయి మహిళా సంఘాలు . తరతరాలుగా వంచింపబడుతున్న జాతి యేది అంటే ఈ మూడో జాతే . కన్న తల్లితంద్రులే మీరు మాకు బరువు అని వదిలేస్తే వారినియే సంఘాలు మాత్రం వుధ్దస్తాయి . శారీరిక , మానసిక యెదుగుదల లేక పుట్టిన పిల్లలను అక్కున చేర్చుకోగలిగే సహనం గల అమ్మ యిలాంటి బిడ్డ పుట్టేడని తెలియగానే గుట్టు చప్పుడు కాకుండా వదిలించుకుంటోంది అంటే అది ఆ అమ్మ తప్పా ? , లేకపోతే తమ పుట్టుకలోని లోపం యేమిటో  తెలియని ఆ పురిటి గుడ్డుది తప్పా , లేక పోతే మనలో మనకు తెలియకుండా పాతుకు పోయిన మూఢనమ్మకందా ?  చెప్పమ్మా చెప్పు . " కమల్ గొంతులో ఆవేదన తొంగి చూసింది .         " ఇలాంటి పిల్లలు యే వూరిలో పుడితే ఆ వూరికే అరిష్టం , యే తల్లి కడుపున పుడితే ఆ తల్లిని అమ్మవారికి బలియిచ్చెస్తారుట తెలుసా ? " నరనరానా జర్ణించుకు పోయిన మూఢనమ్మకం రమ నోటంట పలికింది .      " పుట్టిన బిడ్డ గుడ్డివాడని తెలియగానే బ్రెయిలీని అతని తల్లి గొంతునులిమి చంపేసి వుంటే  ప్రపంచంలోని గుడ్డివారికి చదువుకొనే అవకాశం కలుగకపోను కదమ్మా ? . ఏ కాలంలో వున్నామమ్మా మనం , ' సంపన్న దేశాలకన్నా మన ఆర్ధిక వ్యవస్థ బలమైనది ' అని గుండెలు బాదుకుంటే రాదమ్మా ప్రగతి . ఇప్పటికైనా మనం కళ్లు తెరిచి యిలాంటి వారికి వృత్తి విద్యలలో శిక్షణ యిచ్చి మనదేశం మరచిపోయిన ఒక జాతికి  చేయూత నివ్వాలి . విద్యావకాశాలు కల్పిస్తే వారిలో యెందరో డాక్టర్లు , యింజనీర్లు అయి దేశ సేవ చేసేవారు " . పెద్దగా వినిపించిన వెక్కిళ్ల శబ్దానికి యీలోకం లోనికి వచ్చిన కమల్ నోటికి కొంగు అడ్డం పెట్టుకొని బెడ్రూము లోకి వెళ్లి తలుపేసుకున్న తల్లిని బిత్తరపోయి చూసేడు .         ------                            ---------                   ----------       ఆరు నెలలు మనవడితో ఆడుకుంటానని వచ్చిన తల్లి తిరుగు ప్రయాణానికి సిధ్దపడుతూవుంటే యెలా వారించాలో తెలీక తికమక పడుతున్న కమల్ ని చూసి చల్లగా నవ్వింది రమ .      " నీ మీద కోపం తో వెళ్లటం లేదు నాన్నా , చిన్నవాడవయినా నా కళ్లు తెరిపించి యెంతో యెత్తుకి యెదిగిపోయేవురా ? నాన్న రిటైర్ అయ్యాకా కాలక్షేపం కోసం గోసేవ చేసుకుంటూ పుణ్యం సంపాదించుకొని పునర్జన్మ లేకుండా చేసుకుందామనుకొన్న సంగతి నీకు తెలిసిందే కదా ? నిన్న నీ మాటలతో నా కళ్లు తెరచుకున్నాయి . యెవరో వచ్చి యేదో చెయ్యాలని  యెదురు చూసే బదులు , ఆ చేసేదానికి నేనే నాంది పలకాలి అని నిర్ణయించుకున్నానురా , నాన్న తో కూడా మాట్లాడేను , నాన్నకూడా సరే అన్నారు . మంచి పనికి ఆలస్యమెందుకని బయలుదేరుతున్నాను నాన్నా " అంటున్న రమని చుట్టుకుపోయి " నువ్వెంత మంచి దానవమ్మా , దేశం మరచిపోయిన జాతి కోసం నడుం బిగించిన నువ్వు చాలా గ్రేట్ , ఐ యాం ప్రౌడాఫ్ యూ అమ్మా , ఐ యాం ప్రౌడాఫ్ యూ " అంటూ వంగి తల్లికాళ్లు కళ్లకద్దుకున్నాడు కమల్ .        కొడుకు తల పై చెయ్యి వేసి ఆశీర్వదించి పెట్టె సర్దుకోడంలో మునిగి పోయింది రమ .    " నువ్వనుకుంటున్నంత గొప్పదానను కానురా నాన్నా , నీ దగ్గర నిజం వొప్పుకోలేని యీ పిచ్చి తల్లిని క్షమించు తండ్రీ " అని మనసులో అనుకుంటూ సామాను సర్దుకోడంలో మునిగిపోయింది .   రచన: కర్రా నాగలక్ష్మి

అవును వాళ్ళు క్షమిస్తారు 

   అవును వాళ్ళు క్షమిస్తారు    పెద్ద గా కుయ్యి  కుయ్ మని   పెట్రోలింగ్ వాన్ పోలీస్ వాన్  వెనకే పోలీస్ జీపు పోలీస్ స్టేషన్ ముందు ఆగాయి సిఐ రాజారావు జీపు దిగి చకచకా నడుచుకుంటూ తన రూమ్ లోకి దారి తీసాడు.వెనకాలే దిగిన కానిస్టేబుల్స్ యాదగిరి ఆనంద్ నర్సింహ్మ రుక్మయ్య. పోలీస్ వాన్ లో ఉన్న ఆడా మగా అందరినీ దిగమని  వాళ్న ని మెట్టుకో తిట్టు తో స్వాగతాలుచెప్తున్నారు  వెనకాలే కానిస్టేబుల్ ఆనంద్ వాన్ లో నుండి దిగిన వాళ్లందరినీ అదిలిస్తూ అందరూ దిగాకా "నడవండి !"ఏమి అడుగులు పడలేనంతగా పాటు పడ్డారా ! బొత్తిగా బరితెగించి తిరుగుతున్నారు ఛీ ఛీ మీవీ ఒక బ్రతుకులేనా ధూ! ఆంటూ ఒక్కక్కళ్లని లాఠీతో కొట్టినంత పని చేస్తూ లోపలికి  తీసుకెళ్లి రైటర్ వీరాస్వామికి వాళ్లందరినీ చూపిస్తూ "ఇదిగో సారూ ఈల్లందరి పేర్లు రాసుకో"అల్లదిగో! అక్కడ వెనకున్నారే" ఆ మూడు జంటలూ ఆళ్లంతా ఒకే ఫ్యామిలీ అంట ఆల్ల పాపం ఇయ్యాల పండింది ఒకల్ల గుట్డు ఒకల్లకి బాగా అర్దమయపోయినాది.పెపంచం అందుకే ఇట్టా నాశనమయిపోయింది ధూ" వీల్లవ్వ నాకే సిగ్గేస్తన్నాది.ఈళ్ల యవ్వారం చూస్తే" అని ఇంకా ఏదో అంటున్న ఆనంద్ సిఐ గారు పిలత్తన్నారు" అంటూ వచ్చిన పానకాలు మాటకి ఎలర్టయి వెంటనే సిఐ రాజారావు రూమ్ కి వెళ్లాడు రాజారావు "ఏంటి ఆనంద్ నీ పంచాయితీ అక్కడే మొదలెట్టావా! వాళ్ల గురించి ఏదీ వాగొద్దని చెప్పానా మిగతా వాళ్లందరినీ వార్నింగ్ ఇచ్చి పంపించు  ఆ ఆనంద్ ని  కల్పన రమ్య ను  మాత్రం వేరే వేరే కూర్చోపెట్టు మీడియా వాళ్లనెవరినీ వాళ్లతో మాడ్లాడనీయద్దు ఒక అరగంట తర్వాత వాళ్లని తీసుకురా" ఈ లోగా వాళ్లేమయినా తింటారో త్రాగుతారో చూడు, మనకి  బాగా తెల్సున్న వాళ్లు ! అనిపర్స్ లోంచి అయిదొందలు తీసి ఇచ్చాడు   ఆనంద్ కి ఆశ్చర్యంగా ఉంది మనసులో""సిఐ సాబ్ కి తెల్సున్నవారే ఇలా పబ్లిక్ గా పార్క్ లో పచ్చిగా రొమాన్స్ చేస్తూ దొరికి పోవడం ""ఆయన్ని చూసి వాళ్ల కు షాక్ వాళ్లను  చూసి ఈన గారికి షాక్""దొరికిపోయిన పెద్దాయన ఒకాయన ఒకచిన్నామె మరో పెద్దామె ఒకళ్లను చూసి ఒకళ్లు బద్ద శత్రువుల్లా ఏదేదో ఇంగ్లీష్ లో తిట్టకుంటుంటే ‘అసలు వాళ్లంతా ఒకింట్లో వాళ్లో ఒకే యాపారమేమో! అదడిగితే సిఐ సాబ్ గరమయి "నీకెందుకో వెళ్లి పని చూడు!  అని చెప్పి ఆ ముగ్గరుని వేరే వేరే కూర్చో పెట్టాడు పాపం బాగా పరేషాన్ అవుతున్నాడు సిఐ సాబ్ అనుకుని "సార్ ఛాయ్ తెమ్మంటారా ?అనడిగాడు "సరే తీసుకురా" అంటూ కుర్చీలో వెనక్కి వాలాడు రాజారావు. అతనికిదంతా కలా నిజమా అన్న విభ్రమా కలుగుతోంది  కల్గిన షాక్ కి తనను తాను కంట్రోల్ చేసుకోవడానికే ఇలా ఒక అరగంట టైమ్ తీసుకున్నాడు ప్రపంచం తగలడిపోయింది అని అందరూ అంటుంటే ఇంత తగలడిపోయింది అనుకోలేదు ‘రామ రామ మానవ సంబంధాలు ఇంత దిగజారి పోతున్నాయి. ‘ఇప్పుడెలాగ వాళ్లని ఏమనాలి? ముందే చూస్తే ఎవరి దారిని వాళ్లని పొమ్మనేవాడు కాని వాన్ ఎక్కిస్తుంటే కాని చూడలేదు.నిండా ఇరవయ్యేళ్లు లేని రమ్య ఒక ఏభయ్యేళ్ల అంకుల్ తో రొమాన్స్! తన కళ్ల ముందు పెళ్లయిన తన. పక్కింటి ఫ్రెండ్ నలభై అయిదేళ్ల కల్పన. కి ఆమెకన్నా పదేళ్లు చిన్న వాడి తో ఎఫైర్ పట్టపగలు ఒక. రిస్సార్ట్ లో ఇలా తెగబడి పట్టుపడటం సిగ్గు తో తల వంచుకునేలా ఉంది. ఇంక అ ఆనంద్ తన ఆఫీసు లో పనిచేసే అమ్మాయి అతని కన్నా కనీసం ఇరవయ్యేళ్ల చిన్నది అయుంటుంది. రకంగా బరితెగించి పట్టు బడటం ఆశ్చర్యం కలుగుతోంది ఒక వరసా వావి లేకుండా ఇలా సెక్స్ కోసం ఎక్కడెక్కడో తిరగడమేమిటి? "ఛీ "ఛీ " అసలు అన్నిటి కన్నా బాధాకరమేమిటంటే  ఆనంద్ కల్పన మొగుడు.రమ్య కల్పన కూతురు ఇలా పట్టుబడటం ఒకెత్తు అవమానం.వాళ్ల గుట్టు రట్టు అయి సంసారం కూలిపోయిందన్న ఆక్రోశం వాళ్ల ముగ్గురిలోనుచోటు చేసుకుంది ఇప్పుడెలా ? వీళ్ల సమస్యను ఎలా పరిష్కరించాలి?? నైతిక విలువలు బోధించాలా?సంసారం ఇంత దరిద్రంగా తగలెట్టుకున్నారని తిట్టాలా? ఒకళ్ల గురించి ఒకళ్లకి తెలిసిపోయాకాఎలా కలిసి కాపురం చేస్తారు ఆ రమ్య భవిష్యత్ ఏమవుతుంది? ఇలా బుర్ర వేడెక్కి పోయి సతమతమవుతున్నరాజారావుకి టీ పట్టుకొచ్చి ఇస్తూ ఆళ్లని పిలమంటారా అనడిగాడు కానిస్టేబుల్ సరే పిలు మిగతా వాళ్లందరినీ ఛలాన్ కట్టించుకుని పంపించేసారా? అనడిగాడు "ఆ పనే చేస్తున్నారు ఎస్ ఐ బాలక్రిష్ణ గారు " అని జవాబిచ్చాడు ‘సరే వాళ్ల ముగ్గురు ని పంపు కాని నేను చెప్పేదాకా ఎవరినీ పంపొద్దు’ అన్నాడు రాజారావుదోమలు రాకుండా పెట్టిన మెష్ డోర్ తెరుచుకుని ఒకరి తర్వాత ఒకరుగా ముగ్గురూ లోపలకి వచ్చారు కల్పన ఆనంద్ రమ్య రమ్య కల్పనమొహాలు బాగా ఏడ్చినట్లుగా కళ్లు మొహం వాచి ఉన్నాయి రాజారావు ని చూసి మళ్లీ భోరుమంది కల్పన అది చూసి రమ్య కూడా ఏడ్వడం చూసి "కూర్చోండి కల్పన గారు ఏడవకండి అసలు ఏమయిందో ఎందుకిలా జరిగిందో ఒకరి తర్వాత ఒకరుగా చెప్పండి" అంటూ ముగ్గురికీ తనెదరుగా ఉన్న కుర్చీలు చూపించాడు .కుర్చీ లో కూర్చుంటూ కల్పన వైపు అసహ్యంగా చూసి "చేసేవన్ని చేసి ఇప్పుడు ఈ ఏడ్పులు దేనికి?ఆడాళ్లన్న విషయమే మర్చిపోయి బరితెగించిన ముండలు ఛీ " అన్న ఆనంద్ మాటలకు దెబ్బతిన్న నాగులా రోష కషాయితనేత్రాలతో’""నీ బండారం బయట పెట్టాలనే వచ్చాను నేనొక్క దాన్ని వస్తే బాగుండదని తెలుసున్నతని సహాయం తీసుకున్నాను.’ కాని మీలా మీ కూతురు వయసున్న దాంతో కధలు నడపలేదు" అన్న కల్పన మాట పూర్తి కాకుండానే "రంకు నేర్చినమ్మ బొంకు నేర్వదా! అన్నట్లు ఇంకా ఎలా బుకాయిస్తోందో "  అందుకే ఈ రమ్య ముండ కూడా నీలాగే తయారయింది  అయిపోయింది .మన కుటుంబం మర్యాద పరువు మంటకలిసి పోయాయి .ఇలా రిస్రార్ట్ వెంట తిరగండి ఈ బిజినెస్సే మంచిది మీలాంటి చెత్తముండలకి ""అన్న ఆనంద్ మాటలు విని "చూడండి  మిస్టర్ ఆనంద్!ఇది మీ ఇల్లు కాదు మీరు అరవడానికి మీరు సరిగ్గా ఉంటే మీకీ పరిస్తితి వచ్చేది కాదు .’కల్పన ఎటువంటిదో నాకు తెలుసు ఆమె కుటుంబం ఎంత ఉన్నతమైందో తెలుసు ఆమె మొహం చూసి ఈ రోజు రమ్య ని మిమ్మల్ని ఈ మాత్రం గౌరవంగా చూస్తున్నాము లేకుంటే మీలాంటి బిజినెస్ మాగ్నెట్  పట్టుబడినందుకు మీడియాకి బోలెడు న్యూస్ !ఈ పాటికి మీ రాసలీలలు గురించి అన్ని న్యూస్ ఛానల్స్ లో వచ్చేది ‘ అని రాజారావు అంటే నేను మగాడ్ని! ఏదో ఆమె ఏదో కష్ట సుఖాలు చెప్పుకుంటానంటే ఇక్కడికి వచ్చాము అనుకోకుండా ""మీ రైడింగ్ జరిగింది మా ఖర్మ బాగోక మీ అందరికీ ఇలా దొరికాము"""అనంటున్బ ఆనంద్ ని ""బుకాయించకండి మీరు ఆమె ఎటువంటి పరిస్తితి లో పట్టుబడ్డారో !మా దగ్గర మా వాళ్లు తీసిన ఫొటోస్ ఉన్నాయి మీ ముగ్గురి లో మీరే అసభ్యంగా ఉన్నారు అని "రమ్యా! నువ్వెందుకమ్మా! ఇలా వచ్చావు నీకెంతో భవిష్యత్ ఉంది ఇలా పిచ్చి స్నేహాలు చేసి ఇలా అల్లరిపాలు అయితే అసలు తలెత్తుకు తిరగ్గలవా? అదృష్టవశాత్తు మేము కాబట్టి సరి పోయిందివేరే ఎవరి చేతికి చిక్కినా ఏమయ్యెది?అని అంటున్న రాజారావు మాటలకి ""లేదంకుల్ మా అమ్మ కి నాకుతెలిసింది మా నాన్న ఈ రోజు నాన్న వాళ్ల ఆఫీసు కొలీగ్ తో ఇక్కడికి వస్తున్నాడని, ""ఆయన ఫోన్ మేము చెక్ చేస్తూనే ఉంటాము .అప్పుడప్పుడు ""అలాగే మార్నింగ్ చూస్తే వాట్సప్ మెసేజ్ లో వీళ్ల ప్రోగ్రామ్ వివరాలు చదివి అమ్మకు చెప్పాను. "అమ్మ ఫ్రెండ్ కొడుకు రాజేష్ హెల్ప్ తీసుకుని ఇక్కడికి వచ్చి రెడ్ హేండ్ డ్ గా వాళ్లను పట్టాలని వచ్చింది. ""నేను కాలేజ్ కి వెళ్లి మా ఫ్రెండ్ నిమ్మీని తీసుకుని వస్తానని అమ్మకు మెసేజ్ చేసాను" కావాలంటే అమ్మ ఫోన్లో నాన్న ప్రొగ్రామ్ వివరాలు ఫార్వర్డ్ చేసిన టైమ్ నేను వస్తున్నాను!" అని పెట్టిన మెసేజ్ ల టైమ్ చూడండి!""ఈ రిస్సార్ట్ దూరం అని నిమ్మీ నేను వాళ్ల నాన్న కారులో వచ్చాము అమ్మా వాళ్ల కోసం వెతుకుతూ మేను ముగ్గురం తిరుగుతుండగా మీ వాళ్లు మమ్మల్ని బలవంతంగా వాన్ ఎక్కించారు! ""మాకోసం వెయిట్ చేస్తున్నఅమ్మ రాజేష్ ని కూడా  మేమెంత చెప్తున్నా  వినకుండా ఎన్ని మాటలన్నారో! అని చెప్తూనే భోరున ఏడ్చిన రమ్యను పట్టుకుని కల్పన కూడా ఏడ్వటం చూసి రాజారావు మనసు ద్రవించింది అసలు కారణం విన్న ఆనంద్ పట్టుబడిన దొంగలా గుటకలు మింగుతున్నాడు .అది చూసి రాజారావు " చూడవయ్యా నీ వల్ల వీళ్లిద్దరి జీవితాలు ఏమయ్యాయో! నీ విచ్చలవిడి జీవితం గురించి మా అందరికీ ఎపుడో తెలుసు కాని వీళ్లిద్దరూ కూడా ఇలా విడి విడి గా రైడింగ్ లో దొరికితే ఎంత తల్లడిల్లానో! బంగారమంటి కాపురం ఇలా బుగ్గిపాలు అయిందేమిటి?  ఈ సొసైటీ ఇంత దిగజారిపోయిందేమిటి అని ఆవేదన పడ్డాను కాని కల్పన వ్యక్తిత్వం మీద నేను పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదు. అలాగే రమ్య కి కూడా ఆమె పెంపకంలో తల్లి తరపున నిలబడేంత పరిణతి ఉంది నీ మూలంగా వాళ్లు రాకూడని ప్లేస్ కివచ్చి భయంకరమయిన పరిస్తితి లో ఇరుక్కున్నారు.వాళ్లేమిటో నా ఒక్కడికే తెలుసు కాని మా సిబ్బంది మీ అందరినీ కలిపి ఎంత నీచంగా మాట్లాడారు తాటి చెట్టు క్రింద కూర్చుని పాలు త్రాగినా కల్లు అనే అనుకుంటారు ఈ నిజం వాళ్లకి చెప్తే నమ్ముతారా? చెయ్యని నేరానికి శిక్ష అనుభవించేలా చేసావు నీ ఇల్లాలు కి కూతురికి ఒక ఇంటి యజమానిగా ఇదేనా  వాళ్లకి నువ్వు ఇచ్చిన భద్రత సిగ్గుండాలి " అని గట్టిగా అన్న రాజారావు మాటలకు "అసలు మెసేజ్ చూసాకే నిలదీయాల్సిందిగా ఇక్కడెవరికి రమ్మన్నారు? అయినా వాళ్లకి ఏ లోటు చేసాను ఏదో నా ఆనందం కోసం రిలాక్సేషన్ కోసం నన్ను కోరుకునే వాళ్ల తో ఎంజాయ్ చేస్తే తప్పేంటి? మగాళ్లెవరూ చేయరా! అని సమర్ధించుకుంటున్న ఆనంద్ మొహం మీద కొట్టాలన్నంత ఆవేశం తో సీటు లోనుండి లేచాడు రాజారావు మళ్లీ తమాయించుకుని ఆనంద్ కి కోపంగా తర్జని చూపిస్తూ "  యూ స్టుపిడ్! నైతిక విలువలు మంట కలిపి  భార్య కు అన్యాయం చేసి కూడా ఇంకా సమర్ధించుకుంటున్నావా! ఇడియట్!" తనయుడు చెడితే తండ్రి తప్పుతనయ చెడితే తల్లి తప్పు  భార్య చెడితే భర్త తప్పు " అలా కుటుంబం పాడయింది అంటే ఇంటి యజమాని తప్పు" నీ మీద నిఘా పెట్టేంత గా నువ్వుండబట్టే ఇంట్లో పరువుగా ఉండాల్సిన ఆడాళ్లు ఇలా పోలీస్ స్టేషన్ కి రావాల్సి వచ్చింది.ఇప్పటికయినా మీరు మారకపోతే నష్టపోయేది మీరే! ఇప్పటికయినా ఇలాంటి పిచ్చి తిరుగుళ్లు మాని కల్పన ని రమ్యని బాగా చూసుకుంటారా మీ రాసలీల లు మీడియాకి ఇచ్చేయమంటారా?సూటిగా అడిగాడు రాజారావు. ఆ మాటకు కంగారు పడి" నో నో! అంత పని చేయకండి సార్ ప్లీజ్  నేను తప్పే చేసాను కాని అదే తప్పు నా భార్య కూతురు కూడా చేసారనేసరికి నా కంట్రోల్ తప్పి మాట్లాడాను ఇలాంటి పరిస్తితి ఎవరికీ రాకూడదు.. నా అలవాట్లు మానుకుంటాను ప్లీజ్ "అన్నాడు ఆనంద్ ఆ విషయం నాకు కాదు మీ భార్య కు కూతురికి చెప్పుకోండి వాళ్లు ఒప్పుకుంటే మీరు అల్లరి కారు.అధర్ వైజ్ మా ఏక్షన్ మేము స్టార్ట్ చేస్తాము.’.అని కల్పనా మీరు రమ్య ఇదంతా ఒక పీడకలగా మర్చిపోండి! మీకు నా హెల్ప్ ఎప్పడూ ఉంటుంది పక్క రూమ్ కి వెళ్లండి అక్కడ మీ  ఆయనతీ మాట్లాడాక మీ నిర్ణయంచెప్పండి.అన్నాడు టేబిల్ మీద ఉన్న బెల్ కొడ్తూ వెంటనే లోనికి వచ్చిన కానిస్టేబుల్ యాదగిరిని వీళ్లని కౌన్సిలింగ్ రూమ్ లో కూర్చో పెట్టు!మేడమ్ చెప్పాక మళ్లీ ఇక్కడికి తీసుకురా! అన్నాడు దర్పంగా కల్పన రెండు చేతులు జోడించింది. కృతజ్ఞతభావం ఆనె గుండె నిండా నిండి కన్నుల లోప్రతిఫలించింది  గద్గదమయిన స్వరంతో" ""మీ మేలు ఎప్పటికీ మరువలేను రాజారావు గారు" అంది కుర్చీ లోంచి లేస్తూ రమ్య కూడా తల్లిని అనుసరిస్తూ ఇంచుమించుగా  ఏడుస్తూ " నాకు మాటలు రావటం లేదు సర్ పోలీసులు అంటేనాకెంతో భయం! కాని ‘మీడ్యూటీలో మానవత్వం నిండి ఉంది’ ధాంక్యూ వెరీమచ్ సర్ !అంది వారిద్దరి వెనకే తను కూడా వెడ్తూ ""సారీ సర్ !అన్న ఆనంద్ ని ""ఇవన్నీ వాళ్లకు చెప్పండి!"వాళ్లకు మీ మీద నమ్మకం కల్గించుకోండి ! అన్నాడు రాజారావు వెడ్తున్న వాళ్లను చూసి నవ్వుకున్నాడు ఎందుకంటే అతనికి వాళ్ల మాటల రిజల్ట్ తెలుసు! ఎన్నో కేసుల్లోలాగానే ఈ కేసులో కూఢా మగాడు( మొగుడు) క్షమింపబడతాడు అవును వాళ్లు క్షమిస్తారు.                                                                                  రచన: కామేశ్వరి చెంగల్వల 

రాజీ

   రాజీ              “వెడదామా“ అంది శ్రావణి భర్తనుద్దేసించి. మాట్లాడలేడతను! ఐదునిముషాల తరువాత నెమ్మదిగా లేచాడు. షర్టు వేసుకునేతీరే చెబుతోంది అతనిలోని అయిష్టతను. ఇద్దరు కలిసి క్లినిక్ కు వెళ్లారు. డాక్టరు “రండి” అంటూ లోనికి తీసుకెళ్ళింది. ఆరోజు శ్రావణికి కృతిమ ఫలదీకరణకు [artificial insemination ]అనువైన దినం. అంతా టైం ప్రకారం నడవాలి... సాయంకాలం క్లినిక్ బయటకు వచ్చిన శ్రావణి లో ఓ ఆనందం! తనూ అందరిలాగా తల్లి కాగలను అన్న ఆశ ఆ ఆనందానికి కారణం. భర్త సాగర్ ను చూడగానే అతనెంత అసహనంగా వున్నాడో తెలిసిపోతుంది. ఆమె ముఖంలో ఆనందం చటుక్కున మాయమైంది. అతను శ్రావణి వంక చూడకుండా బయటికి నడిచాడు. ఆటోలో ఇంటికి వచ్చారు. దారి పొడుగునా ఒక్క మాట కూడ మాట్లాడలేడతను. శ్రావణి వంక ఒకసారి కూడా చూడలేడతను. ఇంట్లోకి రాగానే “నాకు ఆకలిగా లేదు. నువ్వు భోన్చేయి” అని వెళ్ళి పడుకున్నాడు. అతనిలో అసహనతను అర్థం చేసుకుంది శ్రావణి. అతన్ని ఒత్తిడి చెయ్యకుండా వెళ్ళి తను భోంచేసి౦ది. క్లినిక్ లో జరిగిన కార్యక్రమం తరువాత తనకోసం కాకపోయినా తన శరీరంలో వచ్చే మార్పుకోసమైన తినాలి అనుకుంది. తిన్నాక మెల్లిగా సాగర్ ప్రక్కన పడుకుని గడచిన రోజుల్ని గుర్తుకు తెచ్చుకుంది .  ************************************************                            పెళ్లి అయిన ఈ రెండేళ్లకాలం లో పిల్లలకోసం తనూ పడ్డ తపన అంతా ఇంతా కాదు. పిల్లలంటే అంతా ఇష్టం తనకు మరి!  “ఏదైనా విశేషమా “ అని అడిగే అత్త గారి ప్రశ్నకి ”ఇదో ఇన్నోనెల అత్తయ్యా” అని సమాధానం చెప్పాలని చాలా వున్నా అది సాధ్యపడలేదు. డాక్టరును కలుద్దామని అడిగితే సాగర్ సహకరించలేదు. ఎంతో పోరిన తరువాత అతను అంగీకరిస్తే డాక్టరు దగ్గరికి వెళ్ళి టెస్టులు చేయించుకున్నారు. అక్కడ తేలిన ఫలితాలకు షాకు తినాల్సి వచ్చింది. పిల్లలు పుట్టక పోవడానికి కారణం సాగర్ లో స్పెర్మ్ కౌంటు [sperm count]చాలా తక్కువ వుండటం అన్న నిజం జీర్ణించు కోవడం కష్టం ఇయ్యింది. అతని స్పెర్మ్ తో ఫలదీకరణ [fertilization] సాద్యం కాకపోవచ్చు అన్న సందేహం వ్యక్త పరిచింది డాక్టరు . తరువాత కొన్ని రోజులు స్తబ్దత.... ఎందుకిలా జరిగింది..అన్న ప్రశ్నకి జవాబు లేదు  మాకే ఈ సమస్య రావాలా అన్న ఆవేదన.... ఆ తరువాత “ఏమీ చెయ్యాలి?” అన్న ప్రశ్న జవాబుగా ఎంతో పరిశోధన...తేలింది ఒక్కటే A I [artificial insemination]అన్న శాస్త్ర సాధికారత.. “తప్పేమిటి?“ అన్నది శ్రావణి ప్రశ్న.  జవాబు చెప్పని సాగర్.  అలాగైనా సంతానాన్ని పొందవచ్చు అన్న శ్రావణి ఆశ. దాని వెనుక సాగర్ లోని దోషం లోకానికి తెలియక్కర లేదు కదా అన్న ఆలోచన.. “ప్లీజ్  ఒప్పుకొండి“ అంటూ శ్రావణి అభ్యర్థన! తన దోషాన్ని ఒప్పుకోలేక పోతున్న సాగర్ మనసు.. శ్రావణిని దగ్గరకు తీసుకున్నప్పుడల్లా గుర్తుకు వచ్చేది  తను ఆమెను తల్లిని చెయ్యలేనన్న బాధ.. “వంశాంకురం తో ఎప్పుఆడుకోనిస్తారు?“ ఆశగా అడిగే సాగర్ తల్లి .. భగవంతుడు నన్ను ఎందుకిలా చేసాడు? ఏమాత్రం అనుమానం వున్నా పెళ్లి చేసుకునేవాడు కాదు కదా. కాని ఇప్పుడు పిల్లలు పుట్టలేదనుకోవడంతో సరిపోదు. తండ్రిని కాలేను అన్న నిజం శాపంలా వెన్నాడదా? సాగర్ ఆలోచించ లేకపోతున్నాడు.......ఎంతో మానసికసంఘర్షణ తరువాత  శ్రావణి చెప్పిన విధంగా A I [artificial insemination ] ద్వారా సంతన సాపల్యానికి మొగ్గు చూపాడు. అలాచేస్తే అందరు తనను తండ్రిగా గుర్తిస్తారని అనిపించింది. కాని ఎక్కడో బాధ..ఆ బాధల ఛాయలు అతని ముఖం లో, నడవడి లో కనిపిస్తూనే వున్నాయి. అయినా ఆరోజు క్లినిక్ కార్యక్రమానికి సహకరించాడు. *************************                                మరురోజు శ్రావణి ఒడిలో తల పెట్టుకుని నిశ్శబ్దంగా రోదించాడు. తాము చేసిన పని తప్పు కాదని అనునయించింది శ్రావణి. తమలాటి వారికి ఇలా సంతానం పొందటం ఒక వరం అంది. మీ భార్యగా నా గర్భం లో వూపిరి పోసుకునే ఓ ప్రాణికి తండ్రిగా ఆప్యాయత ఇవ్వలేరా అని అడిగింది. సమాధానంగా కళ్ళు మూసుకున్నాడు సాగర్. సైన్సు ఇంత అడ్వాన్సు అయినా తనలాటి వాడి మనసు అడ్వాన్సు అవుతుందా? నిజంగా శ్రావణి కడుపులో పెరిగినంత మాత్రాన ఆ బిడ్డని తన బిడ్డగా చెప్పుకునే మనస్త్యర్యం తనకుందా???? ఎలా సమాధాన పరచుకోవాలన్నా సాద్యం కాలేదు అతనికి . *********************                      మరో నెల రోజులు ప్రతి రాత్రి శివరాత్రే అయ్యింది.. సాగర్, శ్రావణి ల మద్య మాటలు కరువైనాయి. శ్రావణిని సాగర్ ముట్టుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు. ఇలా దూరం పెరుగు తున్న కొద్ది శ్రావణి లో అంతర్మధనం ప్రారంభమైంది. తను చేస్తున్న పని మంచిదేనా? అన్న అనుమానం వచ్చింది. తల్లిని కావాలన్న తీవ్రమైన కోరికకు బానిసై తనూ సాగర్ ని పోగొట్టు కుంటుందా? అలా నిజంగా జరిగితే జీవితానికి అర్థం ఏమిటి? కేవలం తల్లి కాగల్గితే చాలా? అదే సంతోషంతో జీవితమంతా గడపగలదా? సాగర్ లోని దోషాన్ని కప్పి పుచ్చడానికే తనూ ప్రయత్నిస్తోందా? లేక తనూ గొడ్రాలు అనిపించుకో కూడదనే  తపనే ఎక్కువగా వుందా? ఇలా సాగిన శ్రావణి ఆలోచనతో మనసు చాలా బాధకు గురి అయింది. ఒక వైపు శ్రావణి, మరో వైపు సాగర్...తమవైన ఆలోచనలతో చాలా బాధ పడుతూ ఇంట్లో శాంతి కరువైపోయేలా  చేసుకున్నారు. ఇక ముందు ఆ ఇంట్లో పాప పుట్టినా సంతోషకరమైన వాతావరణం వుంటుందని నమ్మకం లేకుండా పోయింది.. ఈ అంతర్మధనం లో దేవుడు తనదైన శైలి లో సహాయం చేసాడు. అత్యంత మానసిక క్షోభకు గురి అయిన శ్రావణికి అబార్షను అయింది మూడవ నెలలోనే.  ఒక్కసారిగా బరువు దించుకున్నట్టయ్యింది  శ్రావణికి. సాగర్ ముఖంలో సంతోషం వ్యక్తమైంది! మరో వారం రోజుల్లో వారి జీవితాలు నార్మలుకు వచ్చాయి. ఎంతమందికో జీవిత పరమావధి అనిపించేది సంతానం. భార్య ,భర్త లలో ఎలాటి దోషం వున్నా సరి చేసి సంతానం కలిగేలా చేయ గలదు సైన్సు. సంతాన సాఫల్య క్లినిక్స్ అద్భుతాలు సృష్టిస్తున్నా వాటి సాధికారతని జీర్ణించుకునే మానసిక స్థైర్యం లేని సాగర్ శ్రావణి లాటివారూ వుంటారు. భార్య భర్త లు నిజానికి మానసికంగా ఎంతో ఎదగాలి. లేకపోతె ఆవిధంగా పొందే సంతానం వల్ల సంతోషం కన్న ఆవేదనే మిగిలుస్తుంది. పూర్తీ మానసిక సంసిద్ధత వున్నప్పుడే అన్నీ సానుకూలంగా జరుగుతాయని సాగర్ శ్రావణి ల అంతర్మధనం చెబుతుంది. *********************         కొస మేరుపెమిటంటే...... మరో నెల లోనే ఓ అనాధ శరణాలయం లోని పసి పాపను దత్తత తీసుకున్నారు సాగర్ శ్రావణి లు. తమకు పిల్లలు పుట్టలేదని బాధ లేదు. ఓ అనాధకు  ఆశ్రయం కల్పించాలని సంతోషంగా రాజి పడ్డారు.. ఆలోచిస్తే...... తన లోపాన్ని కప్పి పుచ్చుకునేందుకు తన భార్య కడుపున పెరిగే బిడ్డ కన్న ఓ అనాధకు తండ్రిగా వుండటానికే ఇష్టపడ్డాడు సాగర్.....తల్లి కావాలనే ఘాడమైన కోరికకు సమాధి కట్టి భర్త సంతోషానికే రాజీ పడింది శ్రావణి. లోపం శ్రావణి లో వుండి వుంటే సాగర్ ఎలాటి నిర్ణయం తీసుకునేవాడు? సగటు భారతీయ భార్యగా  దాని గురించి ఆలోచించ దల్చుకోలేదు శ్రావణి! *************************** రచన- డా. లక్ష్మీ రాఘవ 

లేని దయ్యాలు (కథ)

లేని దయ్యాలు (కథ) రచన: కె. నాగలక్ష్మి, 9వ తరగతి, అరవిందాహైస్కూల్, కుంచనపల్లి, గుంటూరుజిల్లా.   హైదరాబాదులో డిగ్రీ చదువుతున్న నవ్య, సుమ ఇద్దరూ మంచి స్నేహితురాళ్ళు. ఇద్దరికీ పుస్తకాలంటే ఇష్టం; టి.వి.చూడటం అంటే చాలా ఇష్టం. వాళ్ళు చదివే పుస్తకాలు, చూసే టి.వి.కార్యక్రమాలు అన్నీ మామూలువి కావు- దయ్యాలవి. నవ్యకి, సుమకి ఇద్దరికీ దయ్యాలంటే ఆసక్తి. దయ్యాల కథలు చదవడం అంటేనూ, దయ్యాల గురించి తెలుసుకోవడం అంటేనూ వాళ్లకి చాలా ఇష్టం. అట్లా విని విని కొత్తగా కథలు రాయడం కూడా నేర్చుకున్నారు వాళ్ళు. అట్లా ఎన్ని కథలు వ్రాస్తూన్నారంటే, చివరికి వాళ్ళ చదువును కూడా పట్టించుకోలేదు వాళ్ళు. ఇంటి నిండా అట్లాంటి పుస్తకాలే పెట్టుకున్నారు ఇద్దరూనూ. వాళ్ళ అమ్మానాన్నలు వాళ్ళకు చాలా రకాలుగా చెప్పి చూశారు- "తల్లీ! ఎందుకమ్మా, ఇంత పిచ్చి? కథలే రాయాలంటే మంచి మంచి విషయాలు ఎన్ని లేవు? ఎప్పుడూ దయ్యాలేనా?" అని. అయినా గాని వాళ్ళు వింటేగా? ఎనిమిదో తరగతికి వచ్చేసరికి, ఇద్దరూ హాస్టలులో‌ఉండి చదువుకోవాల్సి వచ్చింది. హాస్టలులో ఇద్దరిదీ ఒకటే గది. ఇంకేముంది?-ఇద్దరూ తమ గదిని దయ్యాల కథలతో నింపేశారు.   ఒక రోజు రాత్రి నవ్య, సుమ నిద్రపోతున్నప్పుడు నవ్యకు ఒక దయ్యం కల వచ్చింది. మనకుండే ఆసక్తులే మన కలలకు ప్రేరణనిస్తుంటాయి కదా. మనం ఎప్పుడూ దయ్యాలగురించే ఆలోచిస్తూంటే మనకొచ్చే కలలు కూడా దయ్యాలవే వస్తుంటాయి. అట్లా నవ్యకు వచ్చిన ఆ కలలో- నవ్య, ఆమె భర్త ఇద్దరూ నిద్రపోతున్నారు. అంతలో ఒక దయ్యం సుమ వేషం వేసుకొని వచ్చి నవ్య భర్తను చంపేసింది. అప్పుడు లేచి చూసిన నవ్య దయ్యాన్ని గుర్తుపట్టి, తన చేతిలో ఉన్న చాకుతో దాన్ని పొడిచేసింది- పెద్దగా అరుస్తూ నిద్రలేచింది నవ్య. ప్రక్కనే ఆపిల్ కోసుకునే కత్తి ఒకటి ఉంటే దాన్ని చేత పట్టుకున్నది. ఆ అరుపులకు నిద్రలేచింది సుమ- "ఏమైంది ఏమైంది?" అంటూ నవ్యను పట్టుకొని కుదిపింది. కానీ నవ్యకు అక్కడ సుమ కనిపిస్తేనేగా, ఆమె బదులు దయ్యమే కనబడుతున్నదాయె! దయ్యం తనను పట్టుకుంటున్నదన్న భ్రమలో స్నేహితురాలినే కత్తితో పొడిచేసింది నవ్య! అందరూ పరుగున వచ్చి, సుమను ఆసుపత్రిలో చేర్పించారు. నవ్య ను పోలీసులకు అప్పగించారు. ఆమె తన అమాయకత్వాన్ని నిరూపించుకునేసరికి తల ప్రాణం తోకకు వచ్చింది. వెనక్కి వచ్చాక సుమ, నవ్య ఇద్దరూ క్రొత్త మనుష్యులయిపోయారు- ఇప్పుడు వాళ్ళ గదిలో ఒకటంటే ఒక్క దయ్యం కథ కూడా లేదు. గదిలోనే కాదు- వాళ్ల ఆలోచనల్లోనూ లేవు, దయ్యాలు!   Courtesy.. kottapalli.in

మోసకారి గంగన్న

మోసకారి గంగన్న   గంగన్న చూసేందుకు పిల్లవాడిలాగా ఉంటాడు. తన రూపాన్ని ఆసరాగా చేసుకొని వాడు ఘరానా మోసాలు చేసేవాడు. ఒకసారి వాడి చూపు రామాపురం ప్రాంతంపై పడింది. పాడి పంటలతో, సౌభాగ్యంతో తులతూగే రామాపురంలో తనకు లభించనున్న డబ్బు వాడిని ఊరించింది. రామాపురం వెళ్ళిన గంగన్న ఒక దుకాణం ముందు కదలకుండా కూర్చుని ఉండిపోయాడు. చాలా సేపు అక్కడే కూర్చున్న పిల్లవాడిని చూసి ఆ అంగడి ఆమె అడిగింది- "ఎవరు నువ్వు బాబూ, ఎక్కడినుండి వచ్చావు? నీ పేరేమిటి?" అని. ’మాది ఫలానా ఊరు. నా పేరు ’అప్పిచ్చినవాడు’ అన్నాడు గంగన్న. ’ఓహో అలాగా’ అని ఊరుకున్నది అంగడి ఆమె. తరువాత కాసేపటికి ఆమెకు ఏదో పని గుర్తుకు వచ్చి " నేను ఇక్కడిదాకా పనిమీద వెళ్ళివస్తాను. నా దుకాణాన్ని కొంచెం గమనించుకుంటూ ఉండు’ అని చెప్పి వెళ్ళింది. గంగన్న కాసేపు అలాగే కూర్చొని, అటూ ఇటూ చూసి, అంగడిలోని డబ్బునంతా జేబులో వేసుకొని, తినుబండారాలు మూటగట్టుకొని లేచి ఉడాయించాడు. కొంతసేపటికి తిరిగివచ్చిన అంగడి ఆమె పరిస్థితిని చూసి లబోదిబోమంటూ గ్రామాధికారి దగ్గరకు పరుగెత్తింది. "వాడు మా అంగడిలోని డబ్బు, సరుకు ఎత్తుకెళ్ళాడు మొర్రో" అని ఏడ్చింది. గ్రామాధికారి "ఎవరమ్మా ఎత్తుకెళ్ళింది?’ అని అడిగాడు. ’వాడే, "అప్పిచ్చినవాడు" ’ అంది అంగడి తల్లి. "అప్పిచ్చినవాడా? నువ్వు అప్పుచేసి తీర్చకపోతే వాడొచ్చి నీ డబ్బు, సామాను తీసుకెళ్ళాడు. దీనిలో నేను చేసేదేముంది?" అన్నాడు గ్రామాధికారి. "లేదు నాయనా, వాడు మాకు అప్పివ్వటమేంటి, వాడు ఎవరో నేను ఈరోజు వరకు చూడనేలేదు’ అని భోరుమన్నది అంగడి వనిత. "అప్పిచ్చినవాడు నీ సరుకు ఎత్తుకెళ్తే మేమేం చెయ్యాలి, పో ఫోమ్మా" అని ఆమెను పంపివేశాడు గ్రామాధికారి. ఈలోగా గంగన్న ఆ డబ్బుతో ఒక గుర్రాన్ని కొన్నాడు. హుషారుగా గుర్రమెక్కి యువరాజులా స్వారీచేస్తూ ఇంకొకరిని మోసం చేయటం ఎలాగా అని ఆలోచిస్తున్నాడు. కొంచెం దూరంగా పెద్ద చెట్టు, చెట్టుకింద నీడ బాగా ఉన్న స్థలం కనిపించింది. అక్కడికెళ్ళి గుర్రాన్ని కట్టేసి, తను తెచ్చుకున్న తినుబండారాలు నెమరువేస్తూ కూర్చున్నాడు వాడు కులాసాగా. ఆ చెట్టుకు కొంచెం దూరంలో చాకలివారు బట్టలు ఉతికి ఆరవేస్తున్నారు. వాళ్ళు చెట్టుక్రింద గుర్రం నిలిపిఉండటం చూసి దగ్గరకు వచ్చారు. ఇతన్ని చూసి పలకరించారు. ఆమాటా, ఈమాటా కలిపి ’నువ్వెవరు, నీ పేరేమిటి?’ అని అడిగారు. అప్పుడు గంగన్న "మాది ఫలానా ఊరు. నాపేరు సుడిగాలి" అన్నాడు. "ఓహోఁ అలానా" అన్న చాకలి వాళ్ళు గంగన్నగుర్రాన్ని మెచ్చుకుని, ఆ గుర్రం ధర ఎంతైందో అడిగారు. అలాంటి గుర్రాలు తమకు పనిలో గాడిదలకంటే ఎంతో ఉపకరిస్తాయని వాళ్ళకు అనిపించింది. "ఇదా, మీకింకా తెలీదా? ఇక్కడే పక్కనున్న గంగాపురంలో ఒక మహానుభావుడు అందరికీ గుర్రాలను పంచుతున్నాడు ఉచితంగా. మీరూ వెళ్ళండి. మీకూ ఇస్తాడు" అన్నాడు గంగన్న నమ్మబలుకుతూ. "బాబ్బాబు నీకు పుణ్యముంటుంది. మా బట్టలు కొంచెం చూస్తూండు, మేం వెంటనే వెళ్ళి, ఉన్నపళాన్న తిరిగి వస్తాం’ అని చాకలివాళ్ళు తమ బట్టలన్నీ గంగన్నకు అప్పగించి గంగాపురం పరుగెత్తారు. వాళ్ళు అటు వెళ్ళగానే గంగన్న మంచి మంచి బట్టలు అన్నీ మూటగట్టుకొని గుర్రమెక్కి వెళ్ళిపోయాడు. గంగాపురం వెళ్ళి మోసం జరిగిందని గ్రహించిన చాకలివాళ్ళు వెనక్కితిరిగివచ్చి లబోదిబోమని గ్రామాధికారి దగ్గరకు పరుగుపెట్టారు. "ఎవరెత్తుకెళ్ళారు?" అడిగాడు గ్రామాధికారి. "సుడిగాలి బాబూ" అని వాళ్ళు భోరుమన్నారు. ’సుడిగాలా?’ ఆశ్చర్యంగా అడిగాడు గ్రామాధికారి. ’అవును, సుడిగాలే’ అన్నారు వాళ్ళు. "సుడిగాలికి మీరు ఆరేసుకున్న బట్టలు ఎగిరిపోతే నన్నేం చేయమంటారురా? ఈరోజున అందరూ ఇలాంటి తిక్క జనాలే వస్తున్నట్లున్నారు నాదగ్గరికి. పోతారా లేదా?" అని వారిని గద్దించి పంపివేశాడు గ్రామాధికారి. చేసేదేమీ లేక వాళ్ళు బిక్క ముఖం వేసుకొని వెళ్ళిపోయారు. కానీ తెలివైన గ్రామాధికారి ఆలోచనలో పడ్డాడు. " ఈ రెండు సంఘటనలకూ సంబంధం లేదు గదా?" అని. ఇక గంగన్న మగధీరునిలాగా గుర్రంమీద ఆ బట్టలమూటను పెట్టుకొని, కొత్తబట్టలు ధరించి, రాజ మార్తాండుని మాదిరి వీరపోజులో వెళ్తూ ఆనంద పరవశుడౌతున్నాడు. అలా వెళ్తూ వెళ్తూ చీకటి పడే సమయానికి ఒక ఊరి చివర్న ఉన్న గుడిసెను చేరుకున్నాడు. అక్కడికి వెళ్ళి గుర్రం ఆపి గుడిసెలోకి తొంగిచూసి "ఎవరున్నారు, ఇంటిలో?" అని వాకబు చేశాడు. ఒక ఫూటకూళ్ల అవ్వ బయటికి వచ్చి "ఎవరునాయనా, నువ్వు? చూస్తూంటే మహరాజులా ఉన్నావే?" అన్నది. "ఆఁ.." అని చిరునవ్వు నవ్వాడు గంగన్న. లోపలికి వెళ్ళిన గంగన్నకు కళ్ళు చెదిరే ఆభరణాలు ధరించిన అవ్వమనమరాలు కనబడింది. ఎలాగైనా ఆమెను ఎత్తుకెళ్ళి ఆభరణాలన్నింటినీ దోచుకోవాలని గంగన్నకు ఉబలాటం మొదలైంది. పైకి అవ్వతో "నేను ఈ రాత్రికి ఇక్కడే ఆగచ్చా?" అని అడిగాడు. సరేనంది అవ్వ. "నీ పేరేమిటి నాయనా" అని అడుగుతూ. నాపేరు ’దాని మొగుడు’ అన్నాడు గంగన్న. "ఓహో, మనిషేకాడు, అతని పేరుకూడా గమ్మత్తే" అనుకుంది అవ్వ. ఆ రాత్రికి ఆ గుడిసెలో పడుకొని, తెల్లవారు ఝామున గుట్టుచప్పుడు కాకుండా అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయాడు గంగన్న. అవ్వ లేచి తన మనమరాలు, ’దాని మొగుడు’ ఇద్దరూ కనబడకపోవటంతో లబోదిబోమంటూ గ్రామాధికారి దగ్గరకు పరుగెత్తింది. "ఎవరెత్తుకెళ్ళారని" ప్రశ్నించిన గ్రామాధికారి ’దానిమొగుడు’ అన్న సమాధానం విని నివ్వెరపోయాడు. "ఏమిటి, దానిమొగుడా? పిల్లను దాని మొగుడుఎత్తుకెళ్తే నువ్వు ఫిర్యాదు చేసేందుకు వచ్చావా? ఫోమ్మా " అని తిడుతుండగానే ఆయనకు ఇది ఎవరో తెలివిగా చేస్తున్న మోసమని తెలియవచ్చింది. ఈ మూడు మోసాలూ జరిగిన ప్రాంతాలను బట్టి, మోసగాడు గుర్రంమీద వెళ్తున్నాడన్న వాస్తవాన్ని బట్టి ఆయన లెక్కగట్టి, గంగన్న దొరికే ప్రదేశాన్ని నిశ్చయించి అక్కడి గ్రామసేవకులకు కబురు పంపాడు, ’ఏం చేయాలి’ అన్న సూచనలతో సహా. అడవిలో ముసలమ్మ మనమరాల్ని వదిలించుకున్న గంగన్న గుర్రంపై ఇంకా ముందుకు పోతుండగా ఒక్కసారి గుర్రం ముందుకాళ్లపై లేచి నిలబడి సకిలించింది. కట్టె పట్టుకున్న వ్యక్తి ఒకడు గంగన్న తలపై బలంగా నాలుగు దెబ్బలు అంటుకున్నాడు. కళ్ళు బైర్లు గ్రమ్మిన స్థితిలో గంగన్న "ఎవరు నువ్వు? నన్నెందుకు కొడుతున్నావు?" అని అడిగాడు. "నేను సమాజాన్ని. నీ మోసాలకు గాను నిన్ను దండిస్తున్నాను" అన్నాడా వ్యక్తి, గ్రామాధికారి చెప్పమన్నట్లు. వింటూ స్పృహ తప్పిన గంగన్న "సమాజం నన్ను దండించాడు. నామోసాలకుగాను సమాజం నన్ను దండించాడు" అని గొణుగుతున్నాడు. గంగన్నను బంధించిన గ్రామసేవకుడు అతన్ని నేరుగా గ్రామాధికారి దగ్గరకు తీసుకువెళ్ళాడు. గంగన్న తన మోసాల్ని అంగీకరించాడు. గ్రామాధికారి అతనిచే ఎవరి సామానులు వారికి ఇప్పించాడు. ’మోసాలు ఎక్కువకాలం సాగవు’ అని ఊళ్లోవాళ్లంతా చెప్పుకున్నారు.   Courtesy.. kottapalli.in

“అజ్ఞాత కులశీలస్య..” 41వ భాగం

“అజ్ఞాత కులశీలస్య..” 41వ భాగం    పాలకులు ఎవరైనా సుంకాలు మాత్రం క్రమం తప్పకుండా వసూలు చెయ్యడంలో నిష్ణాతులయ్యారు.    అది, కృష్ణా తీర ప్రాంతాలలోని బొడ్డుపల్లి గ్రామం.    మాధవుడు కొద్దిపాటి సైన్యంతో దక్షిణ దిశగా వెళ్తున్నాడు, సైన్యాన్ని వృద్ధి చెయ్యడానికి. నల్లమల అడవుల్లో గజాలు సమృద్ధిగా ఉన్న వార్త తెలిసింది. ఆ ఏనుగులని మచ్చిక చేసుకుని, గజ బలగం పెంపొందించటం కూడా అతని ముఖ్యోద్దేశం..    ఇంక హంవీరునితో సమరానికి సర్వ సన్నద్ధమయినట్లే. కపిలేంద్ర దేవుడు స్వర్గానికేగి నాలుగు సంవత్సరాలు దాటింది.    గ్రామంలోని ప్రధాన రహదారిలో కనిపించిందా దృశ్యం.    ఒక వృద్ధుని కాళ్లకీ, చేతులకీ సంకెళ్లు వేశారు. భుజాల మీద ఊరి వాకిట్లో వేళాడవలసిన నల్ల ఇనుపగుండు ఎక్కించారు. చేతిలో వెదురు కర్ర. మెడలో పల్లేరు పూల దండ వేళాడుతోంది.    ఎండ మండిపోతోంది. వృద్ధుని వెనుక నున్న సైనికులిరువురు, కర్కశంగా అదిలిస్తున్నారు.    కాళ్లకున్న సంకెళ్లు నడకని నిరోధిస్తుంటే, మెళ్లోని బొగడదండ గుచ్చుకుంటుంటే, భుజాల మీద బరువుతో నడుం వంగిపోయి, మండుటెండలో చెమటలు కక్కుతూ ఆ వృద్ధుడు నడుస్తున్నాడు.    నోటినున్న పళ్లు ఊడినా, స్పష్టత చెడని పలుకులతో, కంచుకంఠంతో పద్యం రాగయుక్తంగా చదువుతున్నాడు.             *సీ.    “కవిరాజు కంఠంబు కౌగిలించెను కదా                             పురవీధి నెదురెండ బొగడ దండ                     ఆంధ్ర నైషధ కర్త యంఘ్రియుగ్మంబున                             దగిలి యుండెను కదా నిగళయుగము                     వీరభద్రారెడ్డి విద్వాంసు ముంజేత                              వియ్యమొందెను కదా వెదురుగొడియ                     సార్వభౌముని భుజస్కంధ మెక్కెను గదా                              నగరి వాకిటనుండు నల్లగుండు                                      తే.గీ.   కృష్ణవేణమ్మ గొనిపోయె నింత ఫలము                        బిలబిలాక్షలు దినిపోయె దిలలు పెసలు                        బొడ్డుపల్లెను గొడ్డేరి మోసపోతి                        నెట్లు చెల్లింతుడంకంబు లేడు నూర్లు?”                 (* శ్రీనాధ మహాకవి విరచితము..)    హృదయం కదిలించేలాఉందా పద్యం. తన నిస్సహాయ స్థితిని చెప్తూనే, తనెవరో, తన గొప్పదనమేంటో తెలియజేస్తోంది.    మాధవుడు అశ్వం దిగి, పరుగున వృద్ధుని ముందుకు వెళ్లాడు. తను భయపడినట్లే అయింది.    అతడు కవి సార్వభౌముడు శ్రీనాధుడే.               సీ.       పండువెన్నెల లోన మెండైన భామినీ                          నాట్యాల కనిన శ్రీ నాధు డతడె                      మండుటెండ నిలిచి మలమల మాడుతూ                          చెమటను కన్నీట చేర్చి నిలిచె                      పటిక బెల్లము వంటి  పలుకుల నొసగిన                          కవిసార్వ భౌముని కంఠ మదియె                      బొగడ పూదండయే బిగిసి పట్టుకొనగ                          కంబుక మదియేను కంది పోయె         ఆ.వె.       నల్ల గుండు బరువు నడుమును వంచగా                       చరణములు తడబడె సంకెల పడి                       తెనుఁగు సాహిత్యమును తేరుపై నెక్కించి                       వెలిగి నతడె నొరిగె వెతను నేడు.    అయ్యయ్యో.. ఎం కష్ట మొచ్చింది?    మాధవుడు మారు ఆలోచించలేదు. సైనికులకు సైగ చేసి నల్లగుండు దింపి, బొగడ దండని తెంపి వేశాడు. కాళ్లకున్న సంకెలలను తెంచి వేశాడు.    శ్రీనాధులవారు వణికి పోతున్నారు. తొంభై సంవత్సరాల వృద్ధుడనైనా కనికరం లేక ఇంతటి దారుణ మైన శిక్ష వేయడానికి ఏం చేశారు? ఏం జరిగింది?    ఆ శిక్షను అమలు జరుపుతున్న వారు పరుగున వచ్చారు.    “సామీ! మీరిలా చేస్తే మాకు పడతాయి శిచ్చలు. మేం రాజాజ్ఞ పాటిస్తన్నాం.”    “ఎందుకింత కఠినంగా చేస్తున్నారు?” తన దగ్గరున్న రాజముద్రికని చూపిస్తూ ఆడిగాడు.    “ప్రభూ! సామి వారు ఏడునూర్ల టంకాలు సుంకం చెల్లించాలి. వారి దగ్గర రొక్కం లేదు. ఏ శిచ్చయినా ఏసుకోండన్నారు. అందుకని సైన్యాధికారి ఈ శిక్ష ఏశారు. ఇప్పుడు మీరు ఇడిపించి తీసికెల్తే మమ్మల్ని కొరతేస్తారు.”    “సరే! నేను చెల్లిస్తాలే సుంకం. జమ చేసుకోండి.”    “గురువుగారూ! ఏమిటీ ఘోరం? తమరు ఈ స్థితిలో.. సాక్షాత్ సరస్వతీ స్వరూపులే..”    శ్రీనాధుడు చూసిన చూపుకి మాధవుని గుండె కదిలి బైటికి వచ్చినంత పనయింది. మాధవుడు తన ఇంటికి తీసుకుని వెళ్లాడు మహాకవిని.    “ఎవరు నాయనా నువ్వు?”    మాధవుడు తానెవరో.. ఇది వరకు తాము కలిసిన వైనం చెప్పుకొచ్చాడు.    “జ్ఞాపకం రావట్లేదు నాయనా! నేల తల్లిని నమ్ముకుంటే నాలుగు వేళ్లూ నోట్లో కెళ్తాయని, భూమి కౌలుకు తీసుకుని, వ్యవసాయం మొదలు పెట్టాను.. అవపాన దశలో. సాహిత్యాన్ని, కవిత్వాన్నీ ఆదరించే వారే కరవైపోయారు. నన్నాదరించిన వీరారెడ్డి, మైలార ప్రభువు, రాయలు, విస్సన్న మంత్రి.. అందరూ స్వర్గస్థులయ్యారు.                        * సీ.    కాశికావిశ్వేశు గలసె వీరారెడ్డి                                      రత్నాంబరంబు లే రాయడిచ్చు?                                కైలాసగిరి బండె మైలారువిభుడేగె                                     దినవెచ్చ మేరాజు దీర్పగలడు?                                రంభ గూడె తెనుంగురాయరాహుత్తుండు                                     కస్తూరి కేరాజు ప్రస్తుతింతు,                                స్వర్గస్థుడయ్యె విస్సన్నమంత్రి మరి హేమ                                      పాత్రాన్న మెవ్వని పంక్తి గలదు?              తే.గీ.          భాస్కరుడు మున్నె దేవునిపాలి కరిగె                                కలియుగంబున నిక నుండ కష్టమనుచు                                దివిజకవివరు గుండియల్ దిగ్గురనగ                                నరుగుచున్నాడు శ్రీనాథు డమరపురికి.                                     (* శ్రీనాధ మహాకవి విరచితము.)    అంతే నాయనా! ఎన్ని భోగములనుభవించాను. చివరికి ఈ స్థితిలో.. ఎక్కడో, ఎవరి వద్దో.. ఈ విధంగా” శ్రీనాధుడు రొప్పుతూ ఆపేశాడు.    “గురువుగారూ! నావంటి అభిమానులింకా ఉన్నారు. మిమ్మల్ని కళ్లలో పెట్టి చూసుకుంటాను. నా వద్దనే ఉండండి. మీకు ఏలోటు రానియ్యను. మీరు పరమ శివుని భక్తులు. మీకు నేను చెప్పగల వాడను కాను. అంతా ఆ చిదానంద స్వరూపమే కదా! ఆదిశంకరులు తమ నిర్వాణషట్కంలో సెలవిచ్చినదదే కదా!    న పుణ్యం న పాపం న సౌఖ్యం న దు:ఖం న మంత్రో న తీర్ధం న వేదా న యజ్ఞ    అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా చిదానంద రూప శ్శివోహం శివోహం   సీ.    పుణ్యమనేది నెపుడు నాకు లేదుగ                  పాపమనేది నా వద్ద లేదు           సుఖ దుఃఖములనేను చొరగొననెపుడును                  మంత్ర తీర్ధము లను మాట లేదు           వేదము యనగనే పేర్మియు కనరాదు                  యజ్ఞ యాగములును యవియు లేవు           అనుభవమ్మన నాకు అసలు తెలియదుగ                 అనుభవించే వాడ నైన కాదు   తే.గీ.   నే చిదానంద రూపుడ నే శివోహ             మంటు మనన సేయవలెను మనసు దీర             నిత్యము నిరతము నెపుడు సత్యముగనె             సాధన శివోహమనెపుడు స్మరణ సేయి!    ఆ పరమాత్ముని ధ్యానంలో సమయం గడపండి. మిమ్మల్ని సేవించుకునే భాగ్యం కలిగినందుకు నేను ధన్యుడను.”    ఎన్నెన్నో భోగాలననుభవించి నింగినేలు దివాకరుని ప్రకాశముతో జీవితం గడిపిన కవిసార్వభౌముడు, చివరి రోజులలో పడరాని కష్టాలు పడి, పరమశివుని ధ్యానంలో తనువు విడిచాడు.    శ్రీనాధులవారిని మరల కలుసుకోవాలని ఎంతగానో ఆశపడ్డ మాధవునికి చివరి చూపు దక్కింది.    ఒకరకంగా మాధవుని ఆశ నెరవేరింది.    శ్రీనాధ మహాకవి కూడా మండుటెండలో రహదారి నడుమ, దిక్కులేని వాని వలె, కాకుండా, నీడ పట్టున పరమేశ్వరుని ధ్యానిస్తూ ప్రశాంతంగా ప్రాణాలు విడిచారు.    తెలుగు సాహిత్యాకాశం లోని ఒక ధృవతార, నింగికెగసింది నిశ్సబ్దంగా.    పురుషోత్తమ దేవుడు ఎట్టకేలకు, హంవీరుని జయించి, కళింగ సింహాసనాన్ని ఆక్రమించాడు. కటకం కోటలో ఆనందోత్సాహాలు వెల్లి విరిశాయి.                                            మాధవుడు మంత్రిగా, ఆంత రంగికునిగా మహరాజు వెనువెంట ఉండి పరిపాలన ప్రజారంజకంగా ఉండేటట్లు తన వంతు సహకారాన్ని అందించారు.    హంవీరుడు, కుమారునితో కలిసి కిమిడి సంస్థానాన్ని పాలిస్తూ ఉండిపోయాడు.    పురుషోత్తమదేవుని పరిపాలనలో, సాహిత్యం, సంగీతం అభివృద్ధి చెందాయి బాగా.      గజపతుల యుగంలో పురుషోత్తమదేవుడు ఏలిన కాలం అత్యున్నతమైనది అని చెప్పవచ్చు.    మాధవుడు తానెవరో ఎవరికీ తెలియకుండా, అజ్ఞాత కులశీలుని లాగానే, నంద పుత్రుని వలే, మహారాజుకి ఆప్త మిత్రుని వలే ఉండిపోయాడు.                                  *---------------------------*                                            సమాప్తం.                                          “నవల వెనుక కథ”    “అజ్ఞాత కులశీలస్య..” నవల సమాప్త మయింది. ఆదరించిన పాఠకులకి వందనములు.    ప్రోత్సాహమిచ్చి, ప్రచురించిన తెలుగువన్.కామ్ సంపాదకులకు ధన్యవాదములు.    చారిత్రిక నవలలు వ్రాయడం కొంచెం కత్తి మీద సాము అయినా, ఆ నాటి స్థితి గతులు శోధన చేస్తుంటే ఆసక్తి, సంభ్రమము కలుగుతూ ఉత్సాహంతో ముందుకు సాగుతాము. కల్పనలుంటాయి, కానీ సంఘటనలను మార్చకుండా జాగ్రత్త తీసుకోవాలి.    సాధ్యమయినంత వరకూ ఆవిధంగానే ఈ రచన కొన సాగించాను.    ఆరుద్రగారి “సమగ్రాంధ్ర సాహిత్యం” లో “గజపతుల యుగం” అని ప్రత్యేకంగా ఒక విభాగం కేటాయించారు. చదువుతుంటే ఆసక్తికరమైన విషయాలెన్నో తెలిశాయి. అక్కడి నించి ప్రారంభించి శోధన సాగిస్తుంటే.. వారు చేసిన సాహిత్యసేవ, కట్టించిన, పునరుద్ధరించిన ఆలయాలు.. ప్రజల కందించిన మంచి పరిపాలన గురించి తెలిసింది. మంచిపనులన్నీ శ్రీకృష్ణదేవరాయల కాలంలో జరిగిన యుద్దాలలో మరుగై పోయాయి.    ముఖ్యంగా, గజపతుల కాలంలో.. కవి సార్వభౌముడు, మహాకవి శ్రీనాధుని గురిచేసిన ఇబ్బందులు, శిక్షల గురించి బాగా ప్రాచుర్యం చెంది, చరిత్ర లో వారి మీద చెడు అభిప్రాయం కలిగింది.    ఆరుద్ర గారు శ్రీనాధుని గురించి రాసిన వివరాలలో, గజపతుల సేన లోనే ఎవరో ఒక మంచివాడు ఆ మహాకవి శృంఖలాలు ఛేదించి మండుటెండ లోనించి తప్పించి కాపాడి తీసుకెళ్లి ఆశ్రయమిచ్చి ఉంటారని చెప్పారు.    ఆ విషయం చదువుతుంటేనే ఆ ‘మంచివాని’ పాత్ర సృష్టించి, ఆ పాత్ర ద్వారా, గజపతుల పాలన, వారి మంచి పనులు, చరిత్ర గురించి ఏదైనా వ్రాయాలనే సంకల్పం కలిగింది. వారి గురించి వివరంగా నవల రూపంలో వచ్చినట్లు ఎక్కడా నా పరిశోధనలో కనిపించలేదు.    శ్రీనాధుని పుట్టుక, మరణ సమయం గురించి కూడా పలు అభిప్రాయాలు వెలిబుచ్చారు చరిత్ర కారులు. ఆ వివరాలలో, నా నవలకి అనుకూలమైన కాలాలు తీసుకొనడం జరిగింది.    ఆ విధంగా మాధవుని పాత్ర సృష్టించి, గణేశుల, గాంగేయుల కాలం నుంచీ గజపతుల పరిపాలన ఉన్నత దశ చేరుకునే వరకూ నా శక్తి కొలదీ వివరించడానికి ప్రయత్నించాను.    ఎక్కడయినా సందిగ్ధంగా ఉన్న విషయాలని తప్పించి, తేలికగా చెప్పడానికి ప్రయత్నించాను.    ఈ నవలలో, ఛందో బద్ధమైన పద్యాలతో కొంత కథని నడిపించాను. అచ్చంగా తెలుగు బృందంలో చేరాక, శ్రీ కట్టుపల్లి ప్రసాద్ గారి ప్రోత్సాహంతో ఛందస్సు మీద అభిరుచి కలిగి ఆవిధంగా సాహసించాను. కొన్ని పద్యాలు అరుదుగా కనిపించే ఛందస్సులో కూడా వ్రాసి, వారి చేత సరి అనిపించుకుని నవలలో ఇమిడ్చాను.  కట్టుపల్లి వారికి కృతజ్ఞతలు.    అందరికీ కృతజ్ఞతాభివందనలు. మంథా భానుమతి.     ......మంథాభానుమతి