గురుదేవో మహేశ్వర

  గురుదేవో మహేశ్వర     ఒక ఊళ్ళో రామయ్య, శివయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. ఇద్దరూ చక్కగా కలిసి మెలసి ఉండేవాళ్ళు. వారిలో రామయ్య కొంత ఉన్నతమైన కుటుంబంనుండి వచ్చాడు. శివయ్యేమో‌ పేద కుటుంబం వాడు. డబ్బులున్న కుటుంబంవాడవటంతో రామయ్య బాగా చదువుకున్నాడు- శివయ్య పై చదువులకు వెళ్ళకనే పనిలోకి దిగాడు. వాళ్ళ ఊరిలో చాలా పేరుగాంచిన శివాలయం ఒకటి ఉండేది. శివరాత్రి సందర్భంగా ఆ గుడిలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతుంటై. ఇద్దరు స్నేహితులూ శివాలయానికి వెళ్ళారు. చిన్నప్పుడు వీళ్లకు చదువు చెప్పిన ఉపాధ్యాయులవారే, ఇప్పుడక్కడ ఒక ఆధ్యాత్మిక ప్రవచనం ఇస్తున్నారు.   రామయ్య, శివయ్య ఇద్దరూ అక్కడే కూర్చొని ప్రవచనంమొత్తం విన్నారు. ప్రవచనం ఇద్దరికీ నచ్చింది. ప్రవచనం ముగియగానే అందరితో బాటు లేచి ,గబగబా దైవ దర్శనం చేసుకొని, ప్రక్కనే ప్రాంగణంలో నిలబడ్డాడు రామయ్య. శివయ్యమటుకు ముందుగా వెళ్ళి తమ గురువుగారిని పలకరించి నమస్కరించాడు. అటుపైన వెళ్ళి దేవుడిని దర్శించుకొని తిరిగి వచ్చాడు. "ఒరే, సోమయ్యా! పెద్దయినా నీకు తెలివి రాలేదురా, అందరికంటే ముందు వెళ్ళి దైవదర్శనం ముగించుకుంటే, ఆ తర్వాత ఇక స్వేచ్ఛగా ఏమైనా చేయచ్చు కదా. అట్లా కాక ముందు ఆ ముసలాయన్ని కలిసి, కబుర్లు చెప్పి, సమయం వృధా చేస్తివి; ఆలోగా అందరూ దైవదర్శనానికి పోయారు, నువ్వు క్యూలో వెనక నిలబడాల్సి వచ్చింది కదా! దేవుడికంటే నీకు ఆయనే ఎక్కువైనట్లున్నాడే?!" అన్నాడు రామయ్య, సోమయ్యను మందలిస్తున్నట్లు.   "దానిదేముందిరా, రామయ్యా! ఒకరు ముందైతే ఒకరు వెనకౌతారు. నువ్వు ముందు దేవుడిని దర్శించుకున్నావు. ఆ దేవుడి దగ్గరికి పోయే దారిని చూపించిన గురువును నేను దర్శించుకున్నాను. ఈయనే లేకపోతే నేను ఏమయి ఉందునో! ఆ దేవుడిని చూసేందుకు కూడా రాలేకపోదునేమో మరి!" అన్నాడు సోమయ్య. కబీరుదాసు గురువును గురించి చెప్పిన మాటలు తలపుకు రాగా సిగ్గుతో తలవంచాడు చదువుకున్న రామయ్య. - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

పులిప్రార్థన

పులిప్రార్థన   దైవభక్తుడు ఒకడు కాలినడకన వెళ్తున్నాడు తీర్థయాత్రలకని. అలా ఒకరోజున అడవిలో నడుస్తుండగా మధ్యాహ్నం అయ్యింది. అక్కడే ఒక పెద్ద చెట్టు కనబడేసరికి, దాని నీడన చేరి కూర్చున్నాడు విశ్రాంతిగా. అకస్మాత్తుగా ఒక పులి వచ్చి అతనికి ఎదురుగా నిల్చున్నది . దైవభక్తుడు భయంతో గజగజ వణికాడు. తప్పించుకునే అవకాశం లేదు. ఎలాగూ పులి తనను తినేస్తుంది. ఆ సమయంలో అతనికి దేవుడు గుర్తుకొచ్చాడు. "స్వామీ! ఇక నా భారం నీదే" అని కళ్ళు మూసుకొని దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఎంతసేపటికీ పులి తన మీదికి దూకదే!? దేవుడు తనని కాపాడాడా? అతనికి అనుమానం వచ్చి కళ్ళు తెరచి చూశాడు.  ఆశ్చర్యం! పులి కూడా చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థిస్తూ కనిపించింది. అతనికి ఏమీ అర్థం కాలేదు. "దైవమహిమ! స్వామీ, నువ్వు నా చెంతే ఉన్నావు" అనుకున్నాడు. ఇంకొంత ధైర్యం వచ్చింది. అడిగాడు-"ఓ పులీ! నేనంటే ప్రాణ భయంతో దేవుణ్ని ప్రార్థిస్తున్నాను. మరి నువ్వెందుకు ప్రార్థిస్తున్నావు?' అని. "మీవల్లనే కదా, మా జాతి రానురాను అంతరించిపోతున్నది?! కొన్ని సంవత్సరాలకు ఇంక ఒక్క పులి కూడా ఈ భూమి మీద కనబడదు. ఇప్పుడు నా దురదృష్టం కొద్దీ నీకు ఎదురు పడ్డాను కదా, నువ్వు నన్ను చంపకూడదని దేవుణ్ని వేడుకుంటున్నాను" అన్నది పులి. మనిషి సిగ్గుతో తల వంచుకొని నిష్ర్కమించాడు అక్కడి నుండి. - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

ప్రయత్నం

ప్రయత్నం   అనగనగా ఒక ఊళ్ళో సోమేష్ అనే కుర్రవాడు ఒకడు ఉండేవాడు. అతను ప్రతిరోజూ ఉదయం క్రమం తప్పకుండా గుడికి వెళ్ళి దేవుడిని భక్తితో ప్రార్థించేవాడు. తనని ఏమీ కోరని సోమేష్‌ని చూస్తే దేవుడికి కూడా ముద్దుగా ఉండేది. అయితే ఒకసారి సోమేష్‌కి చాలా కష్టాలు ఎదురయ్యాయి. డబ్బులతో చాలా ఇబ్బంది అయ్యింది. ఇక తట్టుకోలేక, అతను హడావిడిగా గుడికి వెళ్ళి దేవుడిని ప్రార్థించాడు "దేవుడా! నిన్నెప్పుడూ ఏదీ కోరలేదు. ఇప్పుడు నా కోరిక తీర్చు! నాకొక లాటరీ తగిలేట్లు చెయ్యి"అని.   దేవుడు అప్పటికప్పుడు ప్రత్యక్షమై "సరే!‌ నీ కోరిక తీరుస్తాను" అని చెప్పి మాయం అయిపోయాడు. దేవుడు తన ప్రార్థనను విన్నందుకు, తన కోరిక తీరుస్తానన్నందుకు సోమేష్‌కి చాలా తృప్తి కలిగింది. తర్వాత కొద్ది రోజులు గడిచాయి; రోజులు కాస్తా నెలలయ్యాయి; సంవత్సరం కావస్తున్నది- సోమేష్‌కు ఏమీ లాటరీ తగల్లేదు! అతనికి చాలా కోపం వచ్చింది. "ఏంటి స్వామీ, ఇది! అడగక అడగక ఒక్క కోరిక కోరానే! ఆ ఒక్క కోరికనూ తీర్చలేకపోయావా? మరి మాట ఇచ్చిందెందుకు, తప్పేదెందుకు? నువ్వేం దేవుడివయ్యా!" అని నిలదీశాడు దేవుడిని. దేవుడు మళ్ళీ ప్రత్యక్షమై " చూడు సోమేష్! నీకు 'లాటరీ తగిలేట్లు చేస్తాను' అని నేను మాట ఇచ్చాను, నిజమే. కానీ‌నువ్వు అసలు లాటరీ టిక్కెట్టే కొనకపోతే నేను ఏం చేసేది?" అని నవ్వి, మాయమైపోయాడు. మానవ ప్రయత్నం లేనిది, దేవుడు కూడా ఏమీ చెయ్యడు! - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

న్యాయం

న్యాయం   చాలా కాలం క్రితం ధాన్యకటకంలో సూరయ్య, వరదయ్య అనే వ్యాపారులు ఇద్దరు ఉండేవాళ్ళు. ఇద్దరూ ఒకే రకం వ్యాపారాలు చేసేవాళ్ళు; ఇద్దరికీ సత్సంబంధాలు ఉండేవి. ఒకసారి సూరయ్య, అతని భార్య కాశీకి పోయి రావాలనుకున్నారు. అయితే ఆ రోజులో డబ్బులు దాచుకునేందుకు బ్యాంకులు ఉండేవి కావు; అలాగని సొమ్మును వెంట తీసుకు పోదామంటే మార్గ మధ్యంలో దొంగల బెడద ఉండేది. దారి దోపిడి దొంగలు మాటు వేసి, బాటసారుల్ని దోచుకునే పరిస్థితులు ఎక్కువ. అందుకని ఆ రోజుల్లో ఎవరైనా యాత్రలకు పోవాలంటే ముందుగా తమ డబ్బును, నగల్నీ ఎవరైనా నమ్మకస్తుల దగ్గర దాచుకొని వెళ్ళేవాళ్ళు. "మరి ఎలాగ?" అని ఆలోచించిన సూరయ్య తను అంతవరకూ కూడబెట్టిన డబ్బునూ, భార్య నగల్నీ వరదయ్య దగ్గర దాచి పెడదా-నుకున్నాడు. వరదయ్య కూడా "మీరు తిరిగి వచ్చేంత వరకూ మీ సొమ్మును కూడా నా సొమ్ము లాగానే దాచి ఉంచుతాను, దానిదేమున్నది?" అనటంతో, సూరయ్య తన డబ్బునీ, నగల్నీ ఓ సంచిలో పెట్టి, వరదయ్య చేతికి అందించాడు. ఆనక సూరయ్య దంపతులు నిశ్చింతగా కాశీయాత్ర మొదలు పెట్టారు. అయితే, ఇక్కడ వరదయ్యకు ఆ సంచీని చూడగానే "అమ్మో! చాలా బరువుగా ఉన్నదే, ఎంత సొమ్ము ఉన్నదో!" అనిపించింది. ఎలాగైనా వాటిని కాజెయ్యాలనే దుర్బుద్ధి పుట్టింది. సూరయ్య దంపతులు కాశీకి వెళ్ళిన రెండో రోజునే అతను సంచీని విప్పి చూసి, దానిలోని డబ్బుని, నగల్నీ తీసి తన పెట్టెలో దాచేసుకున్నాడు. ఆరోజు సాయంత్రం చీకటి పడుతుండగా అతను పెరట్లో ఒక గుంట త్రవ్వాడు. ఆ మట్టిలోంచి రాళ్లన్నిటినీ ఏరి, సూరయ్య సంచీలో వేయటం మొదలు పెట్టాడు. సొమ్ముల మూటకు బదులుగా ఈ మూటని గుంతలో పెడదామని అతని ఆలోచన! అయితే అతని దురదృష్టమో, ఏమో గానీ, సరిగ్గా అదే సమయానికి అటువైపుగా వెళ్తున్నాడు ఒక గంధర్వుడు.  ఆత్రంగా రాళ్ళు ఏరుతున్న వరదయ్యను చూసి గంధర్వుడికి ఆశ్చర్యం వేసింది. కొంచెం సేపు అక్కడే ఆగి, వరదయ్య ఉద్దేశాన్ని, దాన్ని నెరవేర్చుకునేందుకై అతను చేస్తున్న పనిని గమనించాడు. గంధర్వుల శక్తికి అడ్డు ఏమున్నది? వరదయ్య దుష్టబుద్ధి అతనికి వెంటనే తెలిసిపోయింది. దాంతో అతను నవ్వుకొని, తన శక్తితో ఆ సంచిలోని రాళ్లలో ఒకదాన్ని అత్యంత విలువైన వజ్రంగా మార్చేసాడు. సంగతి తెలీని వరదయ్య సంచిని అంతా పూర్తిగా రాళ్లతో నింపేసి, గోతిలో పడేసాడు! మెల్లగా మూడు నెలలు గడిచాయి. కాశీ నుండి సూరయ్య దంపతులు తిరిగి వచ్చారు. వరదయ్య ఇంటికి వెళ్ళి తన సొమ్ముల సంచీ అడిగాడు సూరయ్య.   వరదయ్య అతన్ని చూసి సంతోషం నటిస్తూ "ఓహో! తిరిగి వచ్చేసారా, సూరయ్యా?! ప్రయాణం బాగా జరిగిందా? దర్శనాలూ అవీ బాగా ఐనాయా? ఇక్కడ రోజులు ఏమాత్రం బాగుండటం లేదు సూరయ్యా! విన్నావుగా, ఇళ్ళకు కన్నం వేసి దొంగతనం చేసే దొగలు ఎక్కువ అయి పోతున్నారు. అందుకని నువ్విచ్చిన డబ్బునీ, నగల్నీ అన్నిటినీ జాగ్రత్తగా నా పెరడులో పూడ్చి పెట్టాను- నువ్వే తీసుకో, శ్రమ అనుకోకు" అని దూరం నుండే సంచిని పూడ్చిన స్థలం చూపించి, ఇక తను అక్కడ లేకుండా ఇంటిలోకి వెళ్ళిపోయాడు. అక్కడ త్రవ్విన సూరయ్యకు సంచీ కనబడింది. అతను సంతోషంతో దాన్ని తీసుకుని, వరదయ్యకు ధన్యవాదాలు చెప్పి, ఇంటికి వెళ్ళాక గానీ సంచిని విప్పి చూసుకోలేదు. చూసుకుంటే ఏముంది, అందులో నిండా రాళ్ళు ఉన్నాయి! డబ్బు, బంగారం లేనే లేవు!! ఇంకేముంది, సూరయ్య లబోదిబో మంటూ పోయి న్యాయస్థానంలో ఫిర్యాదు చేసాడు. సూరయ్య చేతిలోని సంచీని తీసుకుని అందులోని రాళ్ళను తన ముందున్న బల్ల పైన కుమ్మరించాడు న్యాయాధికారి. ఆ రాళ్ళలో ఒక రాయి ఆయన కంటిని ఆకర్షించింది. దానికి ఏ మూలనో కొంచెం మెరుపు ఉండింది. న్యాయాధికారి ఆ రాయిని కడిగించి, జాగ్రత్తగా పరిశీలించాడు: అది నిఖార్సయిన మేలిమి వజ్రం!   "చూసావా, సూరయ్యా! స్నేహితుడు నిన్ను ఎంత మోసగించాలని చూసినా, నీకు మటుకు మేలే జరిగింది. ఇదిగో, నీ స్నేహితుడు నిన్ను మోసం చెయ్యటం కోసం, తనకు దొరికిన రాయినల్లా సంచీలోకి వేసాడు. అయితే ఆ క్రమంలో అనుకోకుండా చాలా విలువైన వజ్రపు రాయిని కూడా ఒకదాన్ని, సంచీలో వేసి పూడ్చి పెట్టాడు. ఆ ఒక్క వజ్రపు విలువే పది- పదిహేను కిలోల బంగారపు విలువకు సమానం అవుతుంది!" నవ్వుతూ చెప్పాడు న్యాయాధికారి. సూరయ్య ఆశ్చర్యపోతూనే న్యాయాధికారికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. "పోనీలెండి, మరయితే ఇక వరదయ్యను ఏమీ అనక్కర్లేదు- దేవుడి దయ వల్ల నాకు ఏమీ అన్యాయం జరగలేదు! నిజంగానే నా సర్వస్వం పోయిందని కృంగిపోయాను నేను!" అన్నాడు. "అదే మనలోని లోపం, సూరయ్యా! మోసం చేసిన వాడిని ఇప్పుడు వదిలేస్తే, వాడు మరొకరిని మోసం చేస్తాడు. దోషిని అట్లా వదిలి పెట్టకూడదు. అతనికి తగిన శిక్ష అతనికి పడాల్సిందే" అని వెంటనే తన గుమాస్తాను పంపి వరదయ్యను పిలిపించాడు న్యాయాధికారి. "వరదయ్యా! రా! రా!‌ కూర్చో! సూరయ్య డబ్బును అంత చక్కగా, బలే దాచావే! నిజంగా, నీ పెరటి నేలలో బలే మహత్తు ఉందోయ్! మరేం లేదు; నా దగ్గర కొంత బంగారం ఉంది- దాన్ని కూడా కాస్త నీ పెరట్లో పూడ్చిపెడతావా, అది కూడా విలువైన రాయిగా మారుతుంది?" అన్నాడాయన, వరదయ్య రాగానే. న్యాయాధికారి తనని మెచ్చుకుంటున్నాడో, తిడుతున్నాడో అర్థం కాని వరదయ్య గుటకలు మింగాడు.   "నేను చెప్పేది నిజమే సుమా! చూడు, నువ్వు సూరయ్య సంచీని తీసుకెళ్ళి మీ పెరట్లో పూడ్చిపెట్టావా? అవి కాస్తా ఇప్పుడు వజ్రాలుగా మారాయి! అందులో ఇదొక్కటే ఇప్పుడు లక్ష వరహాలు చేస్తుంది. నిజం! నమ్మకం చిక్కట్లేదా? చూడు, కావాలంటే. ఎట్లా మెరుస్తున్నదో చూసావా? సాన పడితే అద్భుతంగా అవుతుందిది" అంటూ ఆ వజ్రాన్ని తీసి చూపించాడు న్యాయాధికారి. "మహాప్రభో! సూరయ్య సొమ్ములన్నీ నా తిజోరీలో భద్రంగా ఉన్నాయి. అతను తమరికి చూపించాడే, ఆ సంచీలోని సామాను అంతా పూర్తిగా నాదే. నా పెరడులో దొరికిన వజ్రాలన్నీ కూడా, మరి నావే అవుతాయి కదా..?!" అని తన దుష్ట బుద్ధిని మరో మారు చూపించాడు వరదయ్య. "నోర్ముయ్! నిన్ను నమ్మి, నీ స్నేహితుడు ఒకడు తను చెమటోడ్చి సంపాదించిన ధనాన్ని కొంతకాలం దాచి పెట్టమని నీచేతికి ఇచ్చి వెళ్తే, దాన్ని మ్రింగేసేందుకు పథకాలు రచించావు. సొమ్ముల స్థానంలో రాళ్ళు వేసి అతనిని మోసం చేశావు. అతని అదృష్టం కొద్దీ ఆ రాళ్లలో ఒకటి విలువైన వజ్రం అయ్యింది. ఆ సంగతి తెలియగానే ప్లేటు ఫిరాయిస్తావా? నీకు తగిన శాస్తి జరగాలి. నీ పాడుబుద్ధిని వ్యక్తం చేసుకున్నావు. మర్యాదగా సూరయ్య డబ్బు, నగలు తెచ్చి ఇవ్వు. ఆ తర్వాత నిన్ను తీరిగ్గా విచారించి, నీ ఆస్తులన్నీ‌ జప్తు చేసుకొని, సంవత్సరం పాటు నిన్ను కారాగారంలో పెట్టిస్తాను నేను!" చెప్పాడు న్యాయాధికారి కఠినంగా. "క్షమించండి, బుద్ధి గడ్డి తిని, తప్పు చేశాను! సూరయ్య సొమ్ములు సూరయ్యకు తెచ్చి ఇస్తాను" అని పశ్చాత్తాపపడి, సూరయ్య సొమ్మును సూరయ్యకు అప్పచెప్పాడు వరదయ్య: "నాకు బుద్ధి వచ్చింది. నన్ను వదిలెయ్యండి చాలు. ఆ వజ్రాలూ వైడూర్యాలూ‌ ఏమీ నాకు అవసరం లేదు. వాటిని మీరు కావాలంటే సూరయ్యకు ఇవ్వండి, లేదా తమరికి తోచిన విధంగా గ్రామాభివృద్ధికై ఉపయోగించండి. నేను మటుకు చాలా మారిపోయాను. ఇకపై ఎన్నడూ దురాశను దరి చేరనీయను" అని కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ లెంపలు వేసుకున్నాడు. "నా సొమ్ములు నాకు దొరికాయి, అదే చాలు. అయ్యా! ఆ వజ్రాన్ని ఇతను అన్నట్లు గ్రామాభివృద్ధికై వినియోగించండి. అదే సబబుగా ఉంటుంది. తమరికి వీలైతే ఈ వరదయ్యను క్షమించండి" అన్నాడు సూరయ్య సంతోషంగా. సూరయ్యకు న్యాయం జరిగినందుకు, వరదయ్య మనసు మారినందుకు, గ్రామాభివృద్ధికి నిధులు ఏర్పడ్డందుకు సంతోషిస్తూ ఆకాశంనుండి వానజల్లులు కురిపించాడు గంధర్వుడు. కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

తెలివి

తెలివి   మీర్జాపురాన్ని విజయుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు మంచి రాజే, కానీ "నాకంటే తెలివైన వాళ్ళెవరైనా ఉంటారా?" అని తరచూ మంత్రిని ప్రశ్నిస్తూ ఉండేవాడు. మంత్రికేమో మొహమాటం! "కాదంటే ఆయనకు ఎక్కడ కోపం వస్తుందో" అని "మీకంటే తెలివైన వారు నాకు తెలిసి ఎవ్వరూ లేరు ప్రభూ" అనేసేవాడు. అయితే ఒక రోజున రాజుగారు నిండు దర్బారులో తన గురించి గొప్పలు చెప్పడం మొదలుపెట్టారు. ఊరికే ఉండక, మంత్రిగారిని కూడా అందులోకి లాగసాగాడాయన. "మీరేమంటారు మంత్రిగారూ?!" అని.   మంత్రిగారికి ఊపిరాడలేదు. 'ఎలాగైనా విజయుడిని ఈ అలవాటు నుంచి బయటపడేట్లు చేయకపోతే సమస్యే' అనుకున్నాడు ఆయన. పైకి మటుకు "మన రాజ్యపు పొలిమేరల్లో ఉన్న గోపాలపురంలో చాలామంది తెలివైనవారు ఉన్నారట ప్రభూ. మీరు ఒకసారి కొంచెం సమయం తీసుకొని చూడండి. ఆ ఊరి జనాలకంటే మీరే తెలివైనవారు అని తేలిపోతే బాగుంటుంది. అలా మీ గొప్పతనం మరింత మందికి తెలుస్తుంది.. అయినా వారెవరూ మీ తెలివికి సరితూగరులెండి" అని తప్పించుకున్నాడు మంత్రి.   దాంతో విజయుడికి ఉత్సాహం ఆగలేదు. 'ఏంటి ఈ గోపాలపురం? ఏంటి వీళ్ల తెలివి? చూసొస్తాను' అని నేరుగా అక్కడికే బయలుదేరాడు. ఆయన గోపాలపురం చేరుకుంటుండగా ఊరి మొదట్లో ఉన్న గడ్డి భూముల్లో ఓ పశువుల కాపరి కనిపించాడు. ఆవుల్ని మేపుకుంటూ. "ముందు వీడిని ఓడిస్తాను... నా తెలివి ముందు వీడు ఏపాటి?" అనుకుంటూ దగ్గరికి వెళ్లాడు రాజు. "నేను నిన్ను మూడు ప్రశ్నలు అడుగుతాను. నీకు చేతనైతే జవాబు చెప్పు చూస్తాను." అన్నాడు. పశువుల కాపరి రాజుకేసి వింతగా చూసి "సరే, అడగండి" అన్నాడు. "సృష్టిలో అన్నిటికంటే వేగవంతమైనది ఏది?" అడిగాడు విజయుడు. 'గాలి' చెప్పాడు పశువుల కాపరి. అన్నింటికంటే ఉత్తమమైన జలం? 'గంగాజలం' అన్నింటిలోకి ఉన్నతమైన పాన్పు? 'ఇంకేముంటుంది చందనపు కర్రతో చేసినదే' "భలే భలే! నా మనసులోనూ ఇవే జవాబులున్నాయి!" అన్నాడు విజయుడు అతడిని మెచ్చుకుంటూ. ఆ మాటలకు "హ్హ హ్హ హ్హ" అని ఎగతాళిగా, పగలబడి నవ్వాడు పశువుల కాపరి. "ఎందుకు, అంత నవ్వుతున్నావు?" అడిగాడు విజయుడు చికాకుగా. "తప్పుగా చెప్పిన జవాబుల్ని సరియైనవని మెచ్చుకుంటుంటేనూ... " అని మళ్ళీ నవ్వాడు పశువుల కాపరి. "మరి సరైన జవాబులేమిటో చెప్పు చూస్తాను" అన్నాడు విజయుడు పట్టుదలగా.   "సృష్టిలో అన్నికంటే వేగవంతమైనది మనసు. ఎడారుల్లో ఎండవేళన దొరికేదే ఉత్తమ జలం, ఉన్నతమైన పాన్పు అమ్మ ఒడి..." చెప్పాడు పశువుల కాపరి. "అవును నిజమే" మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడు విజయుడు. "ఇంకో సంగతి చెప్పనా?" అన్నాడు పశువుల కాపరి. "నేను ఇంతకు ముందు చెప్పిన జవాబులూ సరైనవే, ఇవి కూడా సరైనవే- ఏమంటే 'ఒక ప్రశ్నకు ఒకే జవాబు ఉండాలి' అనుకోవటంలోనే అసలు తప్పు ఉంది. ఒక ప్రశ్నకు అనేక జవాబులుండచ్చు. ఒక రాజ్యంలో అనేకమంది తెలివైనవాళ్ళు ఉన్నట్లే"   విజయుడు నివ్వెరపోయాడు. "అవును గదా! నేను ఇలా ఆలోచించనే లేదే?! ఒక రాజ్యంలో అనేకమంది తెలివైనవాళ్ళు ఉండచ్చు గదా, 'అందరిలోకీ తెలివైనవాళ్ళు' అంటూ అసలు ఎందుకుండాలి?" అని ఆయన ఆశ్చర్యంలో మునిగాడు. పశువుల కాపరిని అభినందించి, కొత్తగా అందుకున్న సుజ్ఞానంతో బాటు కోటకి తిరిగి వచ్చాడు విజయుడు. అటుపైన ఆయన తన తెలివితేటల గురించి గొప్పలు చెప్పుకోవటం మానేశాడు! అందరిలోనూ తెలివితేటల్ని గుర్తిస్తూ, కాల క్రమేణా 'మంచి రాజు అందరినీ ప్రోత్సహిస్తాడు' అని పేరు తెచ్చుకున్నాడు. - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

పశువుల కథ

పశువుల కథ   చాలా ఏళ్ళ క్రితం పశువులు, జంతువులు అన్నీ‌ అడవుల్లోనే పెరిగేవి. క్రూర జంతువులు వాటిని చంపేవి. అవేకాక మనుషులు కూడా మాంసం కోసమూ, ఇతర అవసరాల కోసమూ వాటిని వేటాడి చంపేస్తుండేవాళ్ళు. పులులు, సింహాల్లాంటి మాంసాహార, క్రూర జంతువులు వాళ్లకి అంత సులభంగా దొరికేవి కావు గానీ, పశువులు మటుకు, పాపం, అలవోకగా దొరికి పోతుండేవి. అలా రాను రాను అడవిలో తిరిగే శాకాహార పశువుల సంఖ్య తగ్గిపోతూ వచ్చింది. కొన్నాళ్లకు అడవిలోని ఆవులు, ఎద్దులు ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. "మనల్ని మనం కాపాడుకునేది ఎట్లాగ? మన జాతికి భద్రత లేకుండా పోతున్నదే, ఏం చేయాలి?" అని ఆలోచించేందుకు. "మానవులు, పులుల్లాంటి క్రూరజంతువులు మన మాంసాన్ని తింటూ పండగలు చేసుకుంటున్నాయి. అందుకనే మన సంఖ్య తగ్గిపోతున్నది. ఇలా అవుతుంటే చివరికి మనం పూర్తిగా అంతరించేపోతాం. దీనికి ఏదైనా పరిష్కారం వెతకాలి” అనుకున్నాయి అన్నీ. వాటిలో ఉన్న కోదండం అనే ఆవు “నాకు ఒక పరిష్కారం తోస్తున్నది.    నాకు తెలిసిన జింకల జంట ఒకటి ఇక్కడికి దగ్గర్లోనే ఒక ఋషి ఆశ్రమంలో ఉన్నది. ఆ ఋషి మనకు సాయం చేయగలడనిపిస్తున్నది. నేను ఆయన దగ్గరికి వెళ్ళి వస్తాను” అని బయలుదేరింది.జింకల పరిచయంతో అక్కడికి వెళ్ళిన ఆవును నిమురుతూ ఋషి “నువ్వు ఏమి ఆశించి ఇక్కడికి వచ్చావు, కోదండం?” అని అడిగాడు. ఆవు ఆయనకి నమస్కరం చేసి ”స్వామీ! ఈమధ్య మా ఆవుల సంఖ్య, ఎద్దుల సంఖ్య బాగా తగ్గిపోతున్నది. అడవులు మాకు నివాస యోగ్యంగా లేవు. ఒకవైపు నుండి మానవులు, మరొక వైపునుండి క్రూరమృగాలు మమ్మల్ని వేటాడుతున్నాయి. ఇప్పటికే మా సంఖ్య బాగా తగ్గిపోయింది. ఇది గనక ఇలాగే కొనసాగితే 'ఆవులు చూసేందుకు కూడా దొరకని' పరిస్థితి వస్తుంది. మీ సాయం కోరి వచ్చాను. మీరే ఏదైనా చెయ్యాలి” అని ప్రాధేయపడింది. “నీ బాధ నాకు అర్థమైంది తల్లీ! నీ సమస్యను నేను పూర్తిగా పరిష్కరించలేక పోవచ్చు; కానీ మీ జాతికి ఒక వరం ఇవ్వగలను. ఆ వరం కారణంగా మీ జాతి నిలబడుతుంది" అన్నాడు ఋషి, కొంచెం‌ ఆలోచించి. “దయచేసి చెప్పండి’ అని వేడుకున్నది ఆవు.   "ప్రాణులన్నిటికీ ఒక లక్షణం ఉన్నది తల్లీ! ఏ జీవి అయినా సరే, తనకు పాలు ఇచ్చిన తల్లిని గౌరవిస్తుంటుంది, ప్రేమిస్తుంటుంది. మనిషి స్వభావం కూడా దీనికి భిన్నంగా ఏమీ లేదు. ఇకమీద నువ్వు ఇచ్చే పాలను మానవులంతా త్రాగేట్లు ఏర్పాటు చేస్తాను. అప్పుడు నువ్వు ఆ మానవులకు స్వయంగా తల్లివౌతావు. తల్లిని పిల్లలు చంపరు కద! అలా మీ జాతికి నర భయం ఉండదు. అంతేగాక, నీ పాలు త్రాగి ఆరోగ్యవంతులైన మానవులు మీ జాతికి రక్షకులుగా కూడా నిలుస్తారు. మిమ్మల్ని క్రూర జంతువుల బారి నుండి కూడా కాపాడతారు!” అన్నాడు ఋషి.  ఆనాటినుండి ఆవులు,ఎద్దులు మానవులకు దగ్గరయ్యాయి. ఎద్దులు వ్యవసాయంలో మనిషికి సాయం చేస్తున్నాయి; ఆవులు పాలు ఇస్తున్నాయి. మనిషి ఆవుల్ని పెంచుతున్నాడు. వాటికి క్రూరమృగాలనుండి రక్షణ కల్పిస్తున్నాడు. పశుసంపద తోడవ్వటంతోటే మానవ సమాజం గతిశీలమైంది! - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

అమరుకుని కథ

అమరుకుని కథ   మన దేశం జన్మనిచ్చిన అనేకమంది తత్వవేత్తలలో ఎన్నదగినవారు, ఆదిశంకరాచార్యులవారు. అతి చిన్న వయసులోనే వేదాలకు భాష్యాలు వ్రాసిన శంకరుడు, కేరళలోని 'కాలడి'లో జన్మించాడు. దేశమంతటా సంచరిస్తూ, అనేకమంది పండితులతో శాస్త్రచర్చలు జరిపి, గెలిచాడు. "పరమాత్మకు- ఆత్మకు భేదం లేదు" అనే 'అద్వైత' సిద్ధాంతాన్ని నెలకొల్పాడు. ఓ సారి ఈయనకూ, మండనమిశ్రుడనే మరొక తత్త్వవేత్తకూ శాస్త్రాలమీద గొప్ప చర్చ జరిగింది. ఆ చర్చలో మండనమిశ్రుని భార్య ఉభయభారతి కూడా పాల్గొన్నది. చర్చలో మండన మిశ్రుడు వెనుకబడ్డాడు. వాదనలో తన భర్త ఓడిపోతూ ఉండడం చూసి ఉభయభారతి కల్పించుకున్నది; ఆదిశంకరుడిని కుటుంబం గురించీ, పెళ్ళీ పిల్లల గురించీ ప్రశ్నించడం మొదలుపెట్టింది. ఆదిశంకరులవారు చిన్నతనంలోనే సన్యసిం-చినవాడు. పెళ్ళి చేసుకోలేదు; అందువల్ల సాంసారిక విషయాలేవీ ఆయనకు అనుభవంలో లేవు. మరి ఇప్పుడు జవాబు ఏమని చెబుతాడు? ఆయనకు ఎటూ పాలుపోలేదు. అందుకని అయన ఆ దంపతుల వద్ద కొంతకాలం సమయం అడిగాడు. 'ఉభయ భారతి అడిగిన అంశాల గురించిన అనుభవ జ్ఞానం సంపాదించటం‌ ఎలాగ' అని ఆలోచిస్తూ దేశాటనను కొనసాగించాడు. అట్లా పర్యటిస్తూ శంకరాచార్యులవారు, ఆయన శిష్యులు చివరికి ఒక రాజ్యం చేరుకున్నారు. ఆ రాజ్యపు రాజు అమరుకుడు. వీళ్ళు వెళ్ళే సమయానికి అమరకుడు చనిపోయి ఉన్నాడు. అతని శరీరాన్ని దహనం చేయాలని బంధువులంతా చితి పేరుస్తున్నారు.   అది చూడగానే శంకరునికి ఒక ఆలోచన వచ్చింది. ఆ దగ్గరలోనే ఉన్న ఒక గుహలోకి పోయి కూర్చొని, శిష్యులతో "నాయనలారా, చూడండి, ఇప్పుడు నేను నా ఈ శరీరాన్ని విడిచిపెట్టి, అమరుకుని శరీరంలోకి ప్రవేశిస్తాను. కొద్ది కాలం తర్వాత తిరిగి వస్తాను. నేను అలా తిరిగి వచ్చేంతవరకూ నా ఈ శరీరాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుతూండండి" అని చెప్పి, శంకరులు తనకు తెలిసిన 'పర కాయ ప్రవేశం' అనే విద్యని ఉపయోగించుకొని, తన దేహాన్ని విడిచి, అమరుకుని దేహంలోకి ప్రవేశించారు. మరుక్షణం అమరుకుడు లేచి కూర్చున్నాడు. బంధువులందరూ ఆశ్చర్య-పోయారు: 'చనిపోయాడు అనుకున్నాం గానీ, నిజానికి ఈయన ఇంకా ప్రాణాలతోటే ఉండి ఉంటాడు' అనుకున్నారు; రాజవైద్యులంతా నివ్వెరపోయారు, సిగ్గుతో తలదించుకుకున్నారు; ప్రజలంతా 'మా రాజుకు ఏమీ కాలేదు' అని చాలా మురిసిపోయారు. రాణిగారు, పిల్లలైతే మహా సంతోషపడ్డారు. ఇక అక్కడ గుహలో, శంకరుని అసలు శరీరాన్ని కాపాడుకుంటూ, ఎప్పుడు తిరిగి వస్తాడా అని చూస్తూ కూర్చున్నారు ఆయన శిష్యులు. అమరుకుని దేహంలోనికి చేరిన శంకరాచార్యులవారికి ఆ క్షణంనుండే సంసారం ఎదురైంది. ఆ ప్రపంచాన్ని ఆయన తనదైన నిర్లిప్తతతోటీ, నిరాసక్తతతోటీ గమనిస్తూ, తనకు ఎదురౌతున్న ప్రతి అనుభవాన్నీ తన జ్ఞానంలో పొదవుకుంటూ పోసాగాడు. రాజుగా ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ అద్భుతంగాను, వివేక పూరితంగాను ఉండినై తప్ప, గతంలో రాజు అమరకుడు ఇస్తున్నట్లు లేవు. ఈ తేడాని మొదట గమనించింది, అమరకుని భార్య. ఆమె చాలా తెలివైనది. 'తన భర్తకు ఏమైంది? చనిపోయినట్లు ఎందుకయ్యాడు, మళ్ళీ ఎలాగ లేచి కూర్చున్నాడు? ఇంత చక్కగా, ఎవరో రుషి మాదిరి, ఎందుకు ప్రవర్తిస్తున్నాడు?' అని ఆమె ఆలోచిస్తూనే ఉన్నది. చివరికి ఆమెకు అర్థమైంది: "ఇది అసలు తన భర్త కాదు. ఎవరో వేరేవాడు, చనిపోయిన తన భర్త దేహంలో ఉన్నాడు!" అని. మరి ఇప్పుడు ఏం చేయాలి?   "ఇది అందరికీ చేతనయ్యే ఆషామాషీ విద్య కాదు. ఈయన ఎవరో గొప్ప సిద్ధుడు అయి ఉంటాడు. అట్లాంటివాడు ఎందుకనో, అమరుకుని శరీరాన్ని ఎంచుకున్నాడు. త్వరలో విడిచిపెట్టి పోతాడు అట్లా పోనివ్వకూడదు. ఇందులోనే ఉండేట్లు చెయ్యాలి. ఈ సిద్ధ పురుషుని వల్ల రాజ్యమూ, రాజవంశమూ కూడా చల్లగా కొనసాగేట్లు చూడాలి" అనుకున్నదామె.  వెంటనే ఆమె తెలివిగా, రాజుగారికి ఏమాత్రం తెలీకుండానే తమ సైనికులను ఆదేశించింది: "మన రాజ్యంలో ఎక్కడా శవం అంటూ లేకుండా చూడండి. జంతువుల శరీరాలు గానీ, మనుషుల శవాలుగానీ, వెతికి వెతికి అన్నిటినీ తక్షణం కాల్చేయండి" అని. "అట్లా కాల్చేస్తే, అమరుకుని దేహంలో ఉన్న సిద్ధపురుషుడి కళేబరం కూడా కాలిపోతుంది కదా, ఇక అతడు శాశ్వతంగా తమతో ఉండిపోతాడు!" అని ఆమె ఆలోచన. ఇక ఇక్కడ, గుహలో ఉన్న శంకరుడి శిష్యులకు 'గురువుగారి దేహాన్ని కాపాడడం ఇప్పుడింక కష్టం' అని అర్థమవ్వసాగింది. కనిపించిన శవాలనన్నిటినీ కాల్చేస్తున్నారు రాజభటులు. ఏదో ఒక క్షణాన వాళ్ళు గుహ దగ్గరికి రాకపోరు; గురువుగారి శరీరాన్ని కూడా కాల్చేయకపోరు! ఎలాగ ఇప్పుడు?" అని వాళ్ళు కంగారు పడ్డారు. అయితే వాళ్ళకు తెలుసు- తమ గురువుగారు వెళ్ళింది అమరుకుని శరీరంలోకే. అందుకని వాళ్ళు వేషాలు మార్చుకొని గబగబా రాజసభకు వచ్చారు. "తత్త్వమసి, తత్త్వమసి, రాజన్" అంటూ పాటలు పాడటం మొదలెట్టారు. "తత్త్వమసి" అనేది ఉపనిషత్తులలో వాక్యం. "జీవాత్మ అయిన నువ్వే పరమాత్మవు" అని సూచిస్తున్న అద్వైత వాక్యం అది. లౌకికంగా చూస్తే కూడా ఆ వాక్యానికి అర్థం "అదే నువ్వు" అని. "అయ్యో, నీ శరీరాన్ని నువ్వే కాల్చేయమని ఆదేశించావేమి? అది అసలు నువ్వే కదా?" అని రాజుగారి దేహంలో ఉన్న శంకరాచార్యులవారికి అనుచరులు సూచించారనమాట.   దాంతో శంకరులవారికి సంగతి అర్థమైంది. మరుక్షణం ఆయన అమరుకుడి దేహాన్ని వదిలి తన నిజ శరీరంలోనికి ప్రవేశించాడు. అమరుక మహారాజు మళ్ళీ ఓసారి మరణిం-చాడు. తన ఆలోచన ఫలించలేదని గ్రహించిన రాణి విషయాన్ని ఇక పొడిగించలేదు. మళ్ళీ ఓసారి అమరుక మహారాజులవారికి అంత్యక్రియలు మొదలయ్యాయి. అమరుకుని దేహంలో ఉన్నప్పుడు తనకు కలిగిన సంసారానుభవంతో శంకరులవారు అమరుక కావ్యాన్ని రచించారు. ఆ అనుభవం ఆధారంగా ఉభయభారతి అడిగిన ప్రశ్నలన్నిటికీ జవాబులివ్వగలిగారు. మండన మిశ్రుడిని ఓడించారు. అమరుకుడి ఉదంతాన్ని పురస్కరించుకుని సంస్కృతంలో ఒక శ్లోకం చెప్పుకుంటారు. కవి రమరుః కవి రమరః,  అన్యే కవయః కపయః |  కవిర్హి చోరః మయూరశ్చ,  చాపలమాత్రం పరం దధతే ||  "అమరుకుడే కవి. అతడు మాత్రమే 'అమరుడు'- అంటే చావు లేని వాడు.  మిగిలిన కవులు అసలు కవులే కాదు- వాళ్లంతా 'కపులు'- అంటే కోతులు!  ఇంకా ఎవరినైనా కవులు అనాలంటే 'చోరుడు, మయూరుడు' అన్న కవుల్ని కొద్దిగా అలా అనచ్చు.  వీళ్ళు కాక మిగిలిన కవులందరినీ ఏదో చాపల్యంతో అలా 'కవులు' అనచ్చేమోగానీ నిజానికి వాళ్ళెవ్వరూ అసలు కవులు కానే కారు!" అని దీని తాత్పర్యం. - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

పరివర్తన

పరివర్తన   అనగనగా, చాలా కాలం క్రితం జపాన్‌ దేశంలో 'షిచిరి కోజున్' అనే గొప్ప బౌద్ధ అధ్యాపకుడు ఒకాయన ఉండేవాడు. "షిచిరి బాగా చదువుకున్నవాడు. బౌద్ధ తత్వాన్ని లోతుగా అర్థం చేసుకున్నవాడు" అని చెబుతారు. అనేక మందిని ధర్మమార్గంలో నడిపిన షిచిరికి, జపాన్‌ దేశం అంతటా శిష్యులు ఉండేవాళ్ళు. ఎంత గొప్పవాడైనా, షిచిరి అందరు భిక్షువుల మాదిరి అతి సాధారణంగా జీవించేవాడు. ఏకవస్త్రం ధరించి, గుండు చేసుకొని, ఒంటరిగా ఒక గుడిసెలో నివసించేవాడు. ఆయన నడిపే గురుకులానికి వచ్చే విరాళాలకు సంబంధించిన గల్లాపెట్టె ఒకటి, ఆ గదిలోనే ఒక మూలగా ఉండేది. ఒక రోజు సాయంత్రం అవుతుండగా షిచిరి కళ్ళు మూసుకొని తను రోజూ వల్లించే ధర్మసూత్రాలు అన్నింటినీ బిగ్గరగా వల్లిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అకస్మాత్తుగా దొంగవాడు ఒకడు ఆయన ఉండే గదిలోకి ప్రవేశించాడు. "మర్యాదగా నీ దగ్గర ఉన్నది అంతా ఇచ్చేయ్- డబ్బులు, నగలు- ఏవి ఉంటే అవి! మర్యాదగా ఇచ్చేస్తావా, ప్రాణాలు తీయమంటావా?" అంటూ పదునైన కత్తిని షిచిరి గొంతుకు ఆనించాడు దొంగ.   ధర్మంలో ఉన్నత శిఖరాలను అంది పుచ్చుకున్న గురువు షిచిరి. ఆయనకు దొంగంటే ఏ మాత్రం భయం వెయ్యలేదు. పైపెచ్చు ఎక్కడ లేని చికాకూ పుట్టుకొచ్చింది: "ఇదిగో అబ్బాయ్! నువ్వు నన్ను ఊరికే డిస్టర్బు చేస్తున్నావు! డబ్బులు కావాలంటే అదిగో, నా వెనకాల ఆ గల్లాపెట్టెలో ఉన్నాయి. పోయి తీసుకొచ్చుకో. మాటల్ని ఊరికే వృధా చేసుకోకు" అంటూ అటువైపు చూపించాడు- "విను నాయనా! అన్నీ వెతుక్కో, ఏవి కావాలంటే అవి తీసుకో. ఊరికే నన్ను కష్టపెట్టమాకు. ఇక్కడ అందరూ ఎవరి పనులు వాళ్లు చేసుకుంటారు" అంటూ మళ్ళీ తను సూత్రాలు వల్లించటంలో మునిగి పోయాడు. దొంగవాడు కొంచెం అనుమానంగానే గల్లాపెట్టె వైపుకు నడిచాడు. 'షిచిరి ఎక్కడ పారిపోతాడో' అన్నట్లు వెనక్కి వెనక్కి తిరిగి చూసుకుంటూ పోయాడు. చివరికి గల్లాపెట్టెలోని డబ్బుని ముట్టుకొని చూసుకునేవరకూ అతని మనసు మనసులో లేదు. ఒకసారి ఆ మొత్తం అతని చేతికి తగిలాక, అప్పుడు వాడు ఊపిరి పీల్చుకొని ఆ డబ్బు మొత్తాన్నీ తను తెచ్చుకున్న మూటలోకి వేసుకోబోయాడు. అంతలో అకస్మాతుగా షిచిరి గొంతు వినపడింది: "ఓయ్, హలో! అక్కడ ఉన్నది మొత్తం తీసుకోవద్దమ్మా, దయచేసి! రేపు నేను కొంచెం పన్నులు అవీ కట్టేది ఉన్నది- అక్కడున్న వాటిలో కాసిన్ని డబ్బులు అట్లాగే మిగిల్చి ఉంచావంటే, రేపు ఆ పన్నులను కట్టే బెడద కూడా వదిలిపోతుంది నాకు!" అని.   దొంగకు ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు- "వీడేంటి?! ఏదో వింతగా ఉన్నాడే!" అనుకున్నాడు. "సరే, కానీలే, ఏం పోతుంది?!" అన్నట్లు గల్లాపెట్టెలో డబ్బుల్ని కొన్నిటిని మటుకు వదిలేసి, మిగితాదంతా సంచిలో వేసుకున్నాడు: "సరేలే. నువ్వు చెప్పినట్లు కొన్ని డబ్బులు ఆ డబ్బాలోనే వదిలేసాను" అంటూ. "ధాంక్యూ!‌ నువ్వు చాలా మంచివాడివల్లే ఉన్నావు" అన్నాడు షిచిరి, మంత్రాల మధ్యలోంచే. దొంగవాడు వెనక్కి తిరిగి పోబోయాడు- అయితే అతను ఇంకా గడప దాటకనే వెనకనుండి షిచిరి గొతు వినిపించింది గట్టిగా: "హలో! నువ్వు నా డబ్బులు తీసుకున్నావు; కనీసం థాంక్స్‌ కూడా చెప్పిపోవట్లేదు! అంత అమర్యాద దేనికి, కొంచెం థాంక్స్ చెప్పి పోతే నీకేం పోతుంది?!" అని. ఈసారి దొంగ ఉలిక్కి పడ్డాడు కొంచెం ఆశ్చర్యం తోటి, మరికొంత భయం తోటీ షిచిరినే చూస్తూ నిలబడ్డాడు. సగం లోపల, సగం బయట నిలబడ్డ అతని శరీరాన్ని స్పృశిస్తూ ఎక్కడినుండో గాలి చల్లగా వీచింది. తను కూర్చున్న చోటు నుండి కదల్లేదు షిచిరి. ఆయన కళ్ళు మాత్రం చిలిపిగా మెరుస్తూ దొంగ కేసి చూసాయి. ఎందుకనో దొంగ వెన్నులోంచి వణుకు పుట్టుకొచ్చినట్లయింది. తెలీని భయమేదో వాడిని ముంచెత్తింది. అయితే రెండో క్షణానికి తేరుకున్నాడు వాడు. "థాంక్స్‌" అని పొడిగా, రెండు ముక్కల్లో చెప్పేసి, తను నింపుకున్న మూటతో ఇక వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాడు. ఆ తరువాత వాడు తన స్నేహితులకు ఈ సంగతంతా చెప్పాడు- "ఆ క్షణంలో నాకు ఆ మనిషి అంటే ఎందుకనో, తెలీని భయం వేసింది. ఇంతమంది జనాలలో ఏనాడూ- ఎవ్వరినీ- చివరికి పోలీసుల్ని- చూసి కూడా నేను అంతగా భయపడలేదు. నిజం!" అని. అయితే ఇంకో వారం గడవకనే మరో చోట దొంగతనం చేస్తూ పట్టుబడి పోయాడు ఆ దొంగ. పోలీసులు వాడిని పట్టుకెళ్ళి, వాడు గతంలో -ఎక్కడెక్కడ- ఎంతెంత మొత్తాలు- దోచుకున్నాడో, ఆ వివరాలన్నీ కక్కించారు. మొట్ట మొదట్లోనే దొంగ 'షిచిరి కోజోన్‌' పేరు చెప్పాడు; ఆయన నుండి ఎంత దోచుకున్నాడో చెప్పాడు. వివరాలు అన్నీ రాసుకున్నాక, పోలీసులు వాడిని కోర్టులో హాజరు పరిచారు. కోర్టువారు షిచిరిని పిలిచి, సాక్ష్యం చెప్పమన్నారు: "వీడు మీ నుండి ఇంత సొమ్ము దోచుకున్నానని చెబుతున్నాడు. నిజమేనా?" అని అడిగారు. షిచిరి దొంగకేసి చూస్తూ ప్రశాంతంగా చెప్పాడు: "నిజానికి ఇతను నానుండి ఏదీ దోచుకోలేదు. ఆ డబ్బుల్ని నేనే తీసుకొమ్మన్నాను అతన్ని" అని. ఆ వెంటనే ఉత్సాహంతో మెరిసే కళ్ళతో చెప్పాడాయన- "డబ్బులు తీసుకొని వెళ్తూ ఇతను నాకు ధాంక్స్‌ కూడా చెప్పాడు!" అని.   అయినా, తను చేసిన ఇతర నేరాలకుగాను దొంగకి కొన్నేళ్ళపాటు జైలు శిక్ష పడింది. జైల్లో ఉన్నంతకాలమూ ఎందుకనో, దొంగ షిచిరిని మర్చిపోలేకపోయాడు. నిజానికి షిచిరిని, ఆయన మాటల్ని గుర్తు చేసుకోని రోజే లేకుండింది అతనికి! సంవత్సరాలు గడిచాక, షిచిరి ఇంకా ముసలివాడైన తరుణంలో- ఎవరో ఆయన ఇంటి తలుపు తట్టారు. తలుపు తెరిచి చూస్తే ఎదురుగా నిలబడి ఉన్నాడు, ఆ దొంగ! అప్పుడే జైలులో నుంచి బయటకు వచ్చినట్లున్నాడు- భుజానికి వ్రేలాడుతూ ఒక చిన్న బట్టల మూట. పెరిగిన వయస్సు; కళ్ళనిండా నీళ్ళు. "ఆహా! వచ్చావా! నువ్వు ఇంకా రాలేదే అనుకుంటూన్నాను" నవ్వాడు షిచిరి "రా! రా! లోపలికి రా!" అని తలుపు తెరుస్తూ; ఒకనాడు దొంగగా తనను కత్తి చూపించి బెదిరించిన ఆ వ్యక్తిని మనస్పూర్తిగా తిరిగి ఇంటిలోనికి ఆహ్వానిస్తూ. మారిపోయిన ఆ దొంగ షిచిరి సాహచర్యంలో తన జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు. - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

రైతు-కుక్క

రైతు-కుక్క   అనగనగా ఒక ఊళ్లో అమాయకపు రైతు ఒకడు ఉండేవాడు. అతనికి నాలుగు ఆవులు ఉండేవి. రోజూ అవి ఇచ్చే పాలని అమ్ముకునేందుకు గాను రైతు పట్టణానికి వెళ్ళి వచ్చేవాడు. ఒకసారి అతను అట్లా వెళ్తుంటే కుక్క ఒకటి వచ్చి అతని ఎదురుగా నిల్చున్నది. పాల క్యాన్ వంకే చూస్తూ "భౌ.. భౌ.." మని మొరగటం మొదలెట్టింది. కొంచెం సేపటికి దాన్ని చూసిన రైతు "పాలు కావాలా? ఎన్ని కావాలి?" అన్నాడు దానితో.ఆ కుక్క మళ్ళీ "భౌ..భౌ.." అన్నది. "ఓహో! ఒక లీటరు కావాలా?!" అన్నాడు రైతు. కుక్క మళ్లీ "భౌ..భౌ" అని, ముందుకొచ్చి క్యాన్‌ని నాకింది.   "ఉండవే! నువ్వూ, నీ తొందరా!" అన్నాడు రైతు మురిపెంగా, ఒక ఆకుని తీసుకుని, దోనెలాగా చేసి, అందులో పాలు పోసి, కుక్క ముందర పెడుతూ. కుక్క గబగబా పాలన్నీ త్రాగేసి వెళ్ళిపోబోయింది నిశ్శబ్దంగా- "ఏయ్! డబ్బులు ఇవ్వకుండానే పోతున్నావే?!" అని అరిచాడు రైతు. కుక్క ఆగి, అతనికేసే చూస్తూ నాలిక బయట పెట్టింది. "చూసింది చాలు. పాల డబ్బులు కట్టి, కదులు!" అన్నాడు రైతు. కుక్క మళ్ళీ "భౌ..భౌ.." అన్నది. "ఓయ్! నీ దగ్గర డబ్బులు లేవా?! ఐతే పర్లేదులే, రేపు తెచ్చి ఇవ్వు!" అంటూ రైతు తన దారిన తాను పోయాడు. మర్నాడు కూడా అదే సమయానికి కుక్క రైతుకు ఎదురు వచ్చి, "భౌ..భౌ" అని అరిచింది. "‌వచ్చావా! నిన్నటి పాల డబ్బులు- ఇస్తావా?" అన్నాడు రైతు.   కుక్క అతని చుట్టూ‌ తిరుగుతూ "భౌ..భౌ.." అంది మళ్ళీ. "ఓహో! ముందు ఒక లీటరు పాలు ఇవ్వమంటావా?! సరే, కానివ్వు!"‌ అని క్రితంరోజు లాగానే ఇంకో లీటరు పాలు తాగించాడు రైతు. పాలు త్రాగాక తన వైపే చూస్తూ కూర్చున్న కుక్కను చూసి విసుక్కుంటూ "ఇంకా ఏం చూస్తావు? చూసింది చాల్లే, డబ్బులు ఇచ్చెయ్యి ఇంక!" అన్నాడు. కుక్క మౌనంగా‌పడుకుంది. "ఏంటి, డబ్బులు ఇవ్వకుండా పడుకున్నావు?! లే, లేచి డబ్బులు ఇవ్వు!" అన్నాడు రైతు దాని దగ్గరికి వెళ్ళి. కుక్క బద్ధకంగా కళ్ళు తెరిచి చూసి, మళ్ళీ పడుకుంది. "ఏంది వేషాలేస్తున్నావా? డబ్బులు ఇవ్వకుండా పడుకున్నావు?! లే, ముందు!" అన్నాడు రైతు కోపంగా. కానీ కుక్క కదలలేదు. కనీసం కళ్ళు కూడా తెరిచి చూడలేదు. దాంతో‌ కోపం పట్టలేని రైతు చేతికందిన కర్ర ఒకటి తీసుకుని దాన్ని కొట్టేందుకు ముందుకు దూకాడు. అది గ్రహించిన కుక్క చటుక్కున లేచి పరుగు పెట్టింది. రైతు దానివెంట పడ్డాడు. అతనికి దొరకకుండా తప్పించుకునే ప్రయత్నంలో కుక్క పరుగెత్తుకుంటూ కొండ క్రింద ఉన్న పొదల్లోకి వెళ్ళింది. అయితే సరిగ్గా ఆ సమయానికి ఆ పొదల్లోనే ఒక దొంగ కూర్చొని ఉన్నాడు. అంతకు ముందు రోజు రాత్రి దొంగతనం చేసి తను తెచ్చుకున్న డబ్బుని అక్కడ కూర్చొని లెక్క పెట్టుకుంటున్నాడు వాడు. దొంగని చూడగానే కుక్క ఆగిపోయి "భౌ..భౌ" మంటూ అరిచింది. దాని వెనకనే పరుగెత్తుకొస్తున్న రైతు "ఏయ్! ఆగు! నా డబ్బులు ఇచ్చెయ్యి మర్యాదగా!" అని అరుస్తున్నాడు. మరుక్షణం ఆ దొంగవాడు డబ్బునంతా అక్కడే వదిలేసి ఉన్నపళంగా పరిగెత్తి పోయాడు. కుక్క ఆ డబ్బుల చుట్టూనే తిరిగి వాసన చూడటం మొదలు పెట్టింది. అంతలో అక్కడికి చేరుకున్న రైతుకు చాలా సంతోషం వేసింది. కుక్క అంటే మళ్ళీ ఓసారి ప్రేమ పుట్టుకొచ్చింది. "ఓహో! ఇదా, నువ్వు ఇందాకటినుండీ చెబుతున్నది! 'నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, ఇక్కడ దాచిపెట్టాను' అని చెబుతున్నావా?‌ నాకు అస్సలు అర్థమే కాలేదు. 'డబ్బులు ఇవ్వను' అంటున్నావేమో, అని నిన్ను అపార్థం చేసుకున్నాను" అంటూ‌ వంగి ఆ డబ్బునంతా తీసుకొని మూటలో పెట్టుకున్నాడు "రెండు లీటర్ల పాలకే చాలా డబ్బు ఇచ్చావే, ఎలాగ మరి?" అంటూ. కుక్క తోక ఊపుతూ "భౌ..భౌ" అన్నది. "సరేలే! నీ బాకీ‌ ఉంచుకోనులే. నీ బాకీ తీరేదాకా రోజూ నీకు పాలు పోస్తానులే, సరేనా?!" అని తృప్తిగా నవ్వుకుంటూ‌ ఇంటి దారి పట్టాడు రైతు. అయితే ఆ తరువాత మళ్ళీ రైతుకు ఆ కుక్క కనబడనే లేదు. "పాపం పిచ్చిది! తన దగ్గర డబ్బులు లేవని, మళ్ళీ డబ్బులు సంపాదించుకునేందుకు వెళ్ళి ఉంటుంది! దాని డబ్బులు నా దగ్గర ఉన్నాయని అర్థం కాలేదేమో, దానికి!" అని ఇప్పటికీ‌ అనుకుంటూనే ఉన్నాడు రైతు. కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

తల్లి ప్రేమ

తల్లి ప్రేమ   అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో ఒక ఊరు. ఆ ఊరిలో ఒకాయన తన ఇద్దరు భార్యలు- అమల,కమల లతో నివసిస్తూ ఉండేవాడు. వారిద్దరూ ఒకేసారి గర్భవతులయ్యారు, ఒకేసారి ప్రసవించారు కూడా. పెద్ద భార్య అయిన అమలకు మగపిల్లాడు పుట్టాడు. రెండవ భార్య అయిన కమలకు ఆడపిల్ల పుట్టింది.  ఆ రోజుల్లో కూడా కొడుకంటేనే అందరికీ ప్రీతి. కమల తనకు ఆడపిల్ల పుట్టటాన్ని భరించలేకపోయింది. "తనకే మగ పిల్లాడు పుట్టాడు, కానీ అమల పిల్లలను మార్చి తనకొడుకును కాజేయజూస్తున్నద"ని గొడవ మొదలు పెట్టింది. ఈ సమస్య రానురాను పెద్దదైపోయింది. ఎవ్వరికీ దీని పరిష్కారం తెలీలేదు.  చివరికి సమస్య మర్యాద రామన్నగారి దగ్గరకు చేరుకున్నది. మర్యాద రామన్న ఆ ఇద్దరినీ పిల్లలను తీసుకొని రాజభవనానికి రావలసిందిగా ఆదేశించాడు. రామన్నగారి ఆజ్ఞ ప్రకారం వారిద్దరూ పిల్లలను తీసుకొని కచేరీకి వెళ్ళారు. అక్కడ రామన్న "అబ్బాయి ఎవరికి కలిగాడు" అని అమలను అడిగాడు. "తనకే బాబు పుట్టాడ"ని చెప్పింది అమల. అంతలోనే కమల "లేదు లేదు, బాబు నాకే పుట్టాడు!" అని గట్టిగా ఏడుస్తూ మొత్తుకున్నది. సభలోని వారందరూ రామన్నఈ సమస్యను ఎలా పరిష్కరిస్తాడోనని కుతూహల పడ్డారు. అప్పుడు రామన్న కొంచెం ఆలోచించి, అన్నాడు- "సరే! మీరిద్దరూ బాబు మీవాడే అంటున్నారు కదా! బాబు మీ ఇద్దరికీ దక్కాలి. అలా ఇద్దరికీ దక్కాలంటే వేరే మార్గం లేదు. ఆ అబ్బాయిని రెండు ముక్కలు చేస్తే సరిపోతుంది. చెరొక ముక్కా తీసుకోవచ్చు" అని తన కత్తిని ఒర నుండి బయటికి లాగాడు. సభ అంతా నివ్వెరపోయింది. మరుక్షణంలో అమల గట్టిగా అరిచింది: "వద్దు, వద్దు! నా బాబును ఏమీ చేయకండి! కావాలంటే బాబును కమలకే ఇచ్చేయండి. ఎక్కడున్నా నాబాబు క్షేమంగా ఉంటే నాకంతే చాలు" అని గట్టిగా ఏడ్చింది.   రామన్న కమల వైపుకు చూశాడు. తలవంచుకున్న కమల మారుపలకలేదు. "నిజమైన తల్లి ఎవరైనా కొడుకు మరణాన్ని భరించదు. ఎక్కడున్నా తన కొడుకు బాగుండాలనే కోరుకొంటుంది. అమల కూడా అదే చేసింది. కాబట్టి ఆ అబ్బాయి అమల కొడుకే" అని తేల్చిచెప్పాడు రామన్న. అవాక్కైన కమల తన తప్పును ఒప్పుకుంది. తప్పూ తేలింది న్యాయమూ జరిగింది రామన్నగారి ఖ్యాతీ పెరిగింది.   కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

రాజు మంగలి

రాజు మంగలి   అనగననగా ఒక రాజు ఉండేవాడు. ఆరాజుకు గడ్డం పెరిగిపోయింది. గడ్డం తీయించుకోవాలనుకున్నాడు. సేవకులను పిలిచి మంగలిని పిలుచుకొని రమ్మని చెప్పినాడు. సేవకులు మంగలిని పిలుచుకు రావడానికి పోయి చాలా సేపటికి కూడా రాలేదు. రాజు కూర్చున్న చోటే నిద్రపోయినాడు. మంగలి నిద్రపోతున్న రాజును లేపితే ఏమంటాడో, ఏమి శిక్ష విధిస్తాడో అని భయపడి రాజుకు మెలుకువ రాకుండా గడ్డం తీసేసినాడు. గడ్డం తీయడానికి కావలసిన నీళ్లను వెండి గిన్నెలో ఇచ్చినారు సేవకులు. గడ్డం తీసేటపుడు ఆ మంగలికి ఒక దుర్బుద్ధి పుట్టింది. అది ఏమంటే, వెండి గిన్నె తీసుకు పోదామని . గడ్డం తీసేలోపు పూర్తిగా నిర్ణయించుకొని, వెండి గిన్నెను సంచిలో పెట్టుకొని మంగలి వెళ్ళి పోయినాడు. ఇంటికి పోయిన తరువాత మంగలికి భయం వేసింది. ’వెండి గిన్నెను నేనే తీసుకున్నానని రాజుకు తెలిసి ఉంటుందేమో , ఉరి శిక్ష వేస్తాడేమో’ అని రకరకాలుగా ఆలోచిస్తున్నాడు. మంగలికి ఈ ఆలోచనలతో ఊర్లో ఉండాలనిపించలేదు. అడవిలోకి పోయినాడు. పగలంతా అడవిలో ఉండి , రోజూ రాత్రికి ఊళ్ళోకి వచ్చేస్తున్నాడు . అడవిలోఉన్నాగాని అతని మనస్సు మాత్రం భయం భయంగా ఉంది. ఎవరన్నా కనిపిస్తే "ఊళ్ళో ఎవరన్నా ఏమన్నా అనుకుంటున్నారా?"అని అడుగుతాడు. అలా భయపడుతూనే ఒక తంగేడు చెట్టుకింద గుంత తీసి వెండి గిన్నెను ఆ గుంతలో పూడ్చిపెట్టినాడు. మళ్ళీ ఎవరన్నా కనపడితే "ఏమన్నా, వెండిగిన్నె -గిండి గిన్నెఅనుకుంటూ వుండిరా ఊర్లో ! తంగిడి చెట్టు గింగడి చెట్టు అనుకుంటాండారా ఊర్లో?" అంటూ భయంగా అడిగేవాడు. అయితే నిద్రపోతున్న రాజుకు మెలుకువ వచ్చేసి చూస్తే, గడ్డం లేదు! బాగా నున్నగా ఉంది! "అరే నాకు మెలుకువ రాకుండా గడ్డం తీసేసినాడంటే ఆ మంగలికి ఎంతో నైపుణ్యం ఉంది. ఖచ్చితంగా అతనికి బహుమానం ఇవ్వాల"ని రాజు నిర్ణయించుకున్నాడు. సేవకులతో మంగలిని పిలుచుకురమ్మని చెప్పి పంపాడు. సేవకులు ఊరంతా వెతికినా ఎక్కడా మంగలి కనిపించలేదు. ఆ విషయాన్ని రాజుకు చెబితే, "మీరు మంగలిని ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుని రావాల్సిందే" అని చెప్పినాడు. సేవకులు ఊరంతా మరోసారి వెతికి అడవిలోకి పోయారు. అడవిలో సేవకులు పోతుంటే మంగలికి గుండె దడదడ అంటోంది. పట్టుకొని పోతారని, ఏమి చేస్తారోనని భయం వేసింది . చివరికి వారి చేతుల్లో చిక్కక తప్పలేదు మంగలికి. ఎన్నిరోజులు దాగగలడు? రాజు పిలుస్తున్నాడని సేవకులు మంగలిని పిలుచుకుపోయినారు. రాజు దగ్గరకు పోతావుంటే మంగలికి చాలా భయం వేస్తా వుంది. కాని మంగలి అనుకున్నట్లు రాజుకు వెండి గిన్నెమీద ఆలోచనలేదు. రాజుకు ఎన్నో వెండి గిన్నెలు ఉంటాయి. కాని మంగలికి అనుమానం పోలేదు. రాజు మంగలితో "నాకు మెలుకువ రాకుండా గడ్డం తీశావు. నీలో చాలా నైపుణ్యం ఉంది. ఇదిగో ఈ బంగారు హారం బహుమానంగా ఇస్తున్నాను తీసుకో" అని బంగారు హారం బహుమానంగా ఇచ్చినాడు.  రాజు ప్రవర్తనకు మంగలికి నోటమాట రాలేదు. కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

భూతాలు చేసిన మేలు

భూతాలు చేసిన మేలు !   అనగనగా అడవిని ఆనుకొని ఒక ఊరు ఉండేది. ఆ ఊళ్ళో నరసయ్య, నరసమ్మ అనే దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళ కొడుకు భరత్ చాలా మంచివాడు. ఒకరోజున అతను అలా సరదాగా తోటలో తిరుగుతూ ఉంటే అందమైన సీతాకోకచిలుక ఒకటి కనబడ్డది. అది చాలా అందంగా ఉంది; ఒకసారి వచ్చి అతని చెయ్యి మీదనే వాలి, మళ్ళీ దూరంగా ఉన్న పువ్వుల మీద వాలి, హడావిడిగా అటూ-ఇటూ తిరుగుతూ సందడి చేసిందది. దాన్నే కొద్ది సేపు చూసిన భరత్‌కి 'ఇక దాన్ని పట్టుకుందాం' అనిపించింది. ఆ సీతాకోక-చిలుక వెంట పడ్డాడు. అయితే అది ఎంత సేపటికీ అతన్ని ఊరిస్తూ పోయింది గానీ, చేతికి మాత్రం చిక్కలేదు. తెలివి వచ్చి చూసుకునే సరికి, భరత్ తమ తోటను ఎప్పుడో దాటిపోయి ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడో, అడవిమధ్యలో ఉన్నాడు. వెనక్కి వెళ్ళే దారేది?! అడవిలో కనబడిన దార్లను పట్టుకొని పోబోయాడు భరత్. అయితే ఎటు పోయినా మళ్ళీ తను వచ్చిన చోటికే వస్తున్నాడు! అతను అట్లా కంగారు పడుతూ ఉంటే దగ్గరలో ఉన్న మర్రి చెట్టు తొర్రలోంచి గుసగుసగా ఏవో మాటలు వినవచ్చాయి. ఆ మాట్లాడుకుంటున్నవి మూడు దయ్యాలు! ఆ సంగతి మొదట వాడికి తెలీలేదుగానీ, ఆ తొర్ర దగ్గర చెవి పెట్టి జాగ్రత్తగా వింటే తర్వాత తర్వాత అర్థమైంది. వాటిలో ఒక దయ్యం అంటున్నది: "నేను చనిపోక ముందు ఓ మందు కనిపెట్టాను. ఎవరికైనా పిచ్చి పడితే వాళ్ల చేతులకు ఆ మందును ఆరు రోజుల పాటు పట్టిస్తే చాలు- పిచ్చి పూర్తిగా నయమౌతుంది" అని. అప్పుడు రెండో దయ్యం అన్నది: "నేను చనిపోకముందు నా దగ్గర మహిమగల కత్తి ఒకటి ఉండేది. దాంతో ఎవరు యుద్ధం చేస్తే వాళ్లదే విజయం!" అని.   ఇక మూడో దయ్యం అన్నది: "నా దగ్గర ఒక ప్రతిమ ఉంది. ఆ ప్రతిమను పూజించి ఏ వస్తువును కోరుకుంటే దాన్ని ప్రసాదిస్తుందది!" అని. "ఏదీ, చూపించు - చూపించు" అని ముచ్చట పడ్డాయి మొదటి దయ్యాలు రెండూ. మూడోది వాటికి తన దగ్గరున్న ప్రతిమను చూపించింది. "భలే ఉంది, మేమూ తెస్తాం, ఆగు- మేం చెప్పిన వస్తువుల్ని కూడా మాకు అందుబాటులోనే ఉంచుకున్నాం మేము!" అంటూ అవి రెండూ ఎగిరివెళ్ళి, క్షణాల్లో తమ తమ వస్తువులతో తిరిగివచ్చాయి. అన్నీ అట్లా ఆ వస్తువులను చూసుకొని మురిసిపోయాయి. ఇదంతా వింటున్న భరత్‌కి ఏం చెయ్యాలో తోచలేదు. 'దూరంగా పారిపోదాం' అని ఎంత ప్రయత్నించినా మళ్ళీ అక్కడికే వస్తున్నాడాయెను! అంతలోనే దయ్యాలు మూడూ తొర్రలోంచి బయటికి వచ్చి, ఏవో కబుర్లు చెప్పుకుంటూ భరత్‌ను గమనించకనే ఎటో ఎగిరిపోయాయి. అప్పుడుగాని భరత్‌కి భయం తగ్గలేదు. అవి ఇక దగ్గరలో లేవు గనక, అతని మెదడు మళ్ళీ ఓసారి చురుకుగా పనిచేయటం మొదలు పెట్టింది. అతను వెంటనే ఆ తొర్రలోకి దూరి, అక్కడున్న మూడు వస్తువులనూ అందుకొని, ప్రతిమకు నమస్కారం పెడుతూ "మా ఇంటికి దారి తీసే చెప్పుల్ని ప్రసాదించు" అని కోరుకున్నాడు. వెంటనే అతని ముందు రెండు చెప్పులు ప్రత్యక్షం అయ్యాయి. అతను వాటిని వేసుకోగానే అవి అతన్ని వాళ్ళ ఇంటికి చేర్చాయి! ప్రతిమ సహాయంతో నరసయ్య, నరసమ్మ, భరత్ ముగ్గురూ త్వరలోనే గొప్ప ధనవంతులైపోయారు. వాళ్ళకిప్పుడు గొప్ప గొప్ప వాళ్లతో పరిచయాలూ, సంబంధాలూ ఏర్పడ్డాయి. అంతలోనే ఆ దేశపు రాజుగారికి ఒక సమస్య వచ్చింది. రాజ కుమారికి అకస్మాత్తుగా ఏదో అయ్యింది. పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నది. ఆమె పిచ్చిని కుదిర్చేందుకు ఆయన అనేకమంది వైద్యులను పిలిపించాడు; కానీ ఎవ్వరూ ఆమెను బాగు చేయలేకపోయారు. ఆ వైద్యులలోనే ఒకడు, మాటల సందర్భంలో ఈ సంగతిని తెలియజేశాడు భరత్‌కు.   భరత్ వెంటనే బయలుదేరి వెళ్ళి నేరుగా రాజుగారిని కలిసి, రాకుమారికి వైద్యం చేసే అవకాశం ఇవ్వమని వేడుకున్నాడు. "నువ్వు వైద్యుడివి కావు గదా" అన్నారు రాజుగారు. "అయినా ఒక అవకాశం ఇచ్చి చూద్దాం" అని 'సరే'నన్నారు. భరత్ తన దగ్గరున్న పసరు మందును రాకుమారి చేతులకు పట్టిస్తూ వచ్చాడు. రాకుమారి క్రమంగా బాగైంది. ఆరవనాడు మందును పట్టించాడో, లేదో- వాడి ముందు మూడు భూతాలు ప్రత్యక్షం అయ్యాయి: "ఒరే, నువ్వు మా వస్తువుల్నే ఎత్తుకెళ్తావురా?! 'మేం కనుక్కోలేం' అనుకున్నావా?! నిన్ను రప్పించేందుకేరా, ఇంత నాటకం ఆడింది!" అన్నాయి చేతులు చాపి వాడిని పట్టుకోబోతూ. భరత్ చిటికెలో తప్పించుకొని, తన దగ్గరున్న కత్తిని బయటికి లాగి వాటితో యుద్ధం మొదలు పెట్టాడు. దీన్ని అక్కడున్న వాళ్లంతా నోళ్ళు వెళ్లబెట్టి చూస్తూ ఉండిపోయారు. సహజంగానే, ఆ యుద్ధంలో భరతుడే గెల్చాడు! "ఒరే, కత్తి కూడా ఉంది కాబట్టి గెల్చావు. లేకపోతే నీ ప్రాణాలు తీసి ఉందుము!" అన్నాయి భూతాలు, ఓడిపోయాక. వెంటనే భరత్ తన కత్తిని, మిగిలిన పసరును, ప్రతిమను కూడా వాటి ముందు పెట్టి, చేతులు జోడిస్తూ "ఇవి మీవే, నన్ను మన్నించండి. వీటిని నేను అసలు తీసుకునేవాడిని కాదు. కానీ వేరే దారి లేక అలా చేయాల్సి వచ్చింది. నాకుగా వీటితో ఏలాంటి అవసరమూ లేదు. ఇప్పుడు మీకెలా తోస్తే అలా చెయ్యండి" అన్నాడు నిజాయితీగా. దయ్యాలు మూడూ నవ్వి, "నువ్వు నిజంగానే మంచి వాడివిలాగున్నావు. నిజానికి ఈ వస్తువులు మాకూ అవసరం లేదు. నీ దగ్గరే ఉంచుకో, కానీ వీటిని ఎక్కువ వాడకు. నీ శక్తిమీద నువ్వు ఆధారపడటమే మంచిది ఎప్పటికైనా" అని చెప్పి మాయం అయిపోయాయి. ఆ తర్వాత రాజుగారు భరత్‌ను సన్మానించి, రాకుమార్తెనిచ్చి పెళ్ళి చేస్తానన్నారు. "నాదంటూ సొంత ధనమూ లేదు; సొంత వైద్యమూ లేదు; సొంత బలమూ లేదు- నాకేమీ వద్దు" అన్నాడు భరత్. "ఇవేవీ‌ లేకున్నా కొండంత ధైర్యం ఉంది; కొండంత నిజాయితీ ఉంది- అవి చాలు. నేను ఇతన్ని పెళ్ళి చేసుకుంటాను" అన్నది రాకుమారి. ఇంకేముంది, భరత్ రాజైపోయాడు! అటు తర్వాత అతను సొంతగా విద్యలన్నీ నేర్చుకొని, 'చక్కని రాజు' అని పేరు తెచ్చుకున్నాడు. కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

మూఢ నమ్మకం

మూఢ నమ్మకం   రాఘవపురం ప్రక్కనే చక్కని సెలయేరు ఒకటి ప్రవహిస్తూ ఉండేది. ఊళ్ళోవాళ్ళంతా మంచినీళ్ళకోసం ఆ సెలయేరు పైనే ఆధారపడేవాళ్లు. ఐతే ఒకసారి అకస్మాత్తుగా సెలయేటిలోని చేపలన్నీ వరసగా చనిపోవటం మొదలు పెట్టాయి. నీళ్లపైన తేలుకుంటూ ఎక్కడెక్కడినుండో కొట్టుకు రాసాగాయి కూడా. అయినా ఊళ్ళో‌వాళ్ళకు ఆ నీళ్ళే గతి! దాంతో జనం అనారోగ్యం పాలవ్వసాగారు. తెలీని జబ్బులు వ్యాపించసాగాయి. ఒకరొకరుగా జనాలు చనిపోవటం మొదలైంది. ఐతే 'తమ రోగాలకు కారణం ఏమిటి' అని ప్రజలెవ్వరూ ఆలోచించలేదు. వాళ్ళంతా ప్రథానంగా భయపడ్డారు- భయపడి, తమ సర్పంచ్‌తో మొరపెట్టుకున్నారు. సర్పంచ్‌ తనకు తెలిసిన మంత్రగాళ్లను అడిగాడు- "మీ ఊరికి పాపం చుట్టుకున్నది. దేవుడు మీ మీద కోపంగా ఉన్నాడు. దుష్ట శక్తులన్నీ‌ మీ ఊళ్ళో‌ తాండవం చేస్తున్నాయి" అని వాళ్ళంతా నమ్మకంగా చెప్పేసారు. అప్పటికే కంగారు పడుతున్న ప్రజలు మరింత బెదిరిపోయారు. వాళ్ల భయాలకు సర్పంచ్‌ వత్తాసు పాడాడు. అందరూ ప్రాణాలను అరచేత పట్టుకొని, 'పూజలు-శాంతులు-యజ్ఞాలు' అంటూ పంచాయితీ ధనాన్ని, తాము కూడబెట్టిన డబ్బుల్ని కూడా ఖర్చుచేసారు.   అయినా పరిస్థితిలో మార్పు లేదు- రోగాలు మరింత వ్యాపించటం మొదలు పెట్టాయి. అంత జరిగినా ఏ ఒక్కరూ ఆసుపత్రికి వెళ్ళే ప్రయత్నం చేయలేదు. కారణం వాళ్ళకున్న మూఢనమ్మకం: "ఆసుపత్రులకు వెళ్తే దేవతలకు, దుష్టశక్తులకు మరింత కోపం వస్తుంది" అని! సరిగ్గా ఆ సమయంలోనే, సర్పంచ్‌ ఇంటికి చుట్టపు చూపుగా వచ్చాడు, శ్రీశైలం. అతను బాగా చదువుకున్నవాడు; మంచి-చెడు తెలిసినవాడు. రాఘవపురంలో ఏం జరుగుతోందో చూసి, సంగతి అర్థం చేసుకున్నాడు. తన స్నేహితుడైన డాక్టర్‌ శివకు ఉత్తరం రాసాడు: "ఈ ఊరిని ఎలాగైనా కాపాడాలి. అందుకు నీ సహాయం కావాలి" అని. డాక్టర్‌ శివ కూడా వెంటనే బయలుదేరి వచ్చాడు. ఐతే ఆయన చేత వైద్యం చేయించుకునేందుకు ఊళ్ళోవాళ్ళు ఎవ్వరూ ముందుకు రాలేదు! "ఇది దేవుడి మాయ! దుష్ట శక్తుల ప్రభావం!‌ దీనికి వైద్యం చేయించుకుంటే పరిస్థితి మరింత వికటిస్తుంది" అని గట్టిగా చెప్పారు అందరూ. ఐతే డాక్టర్ శివ తెలివైనవాడు. పల్లెల్లో పరిస్థితి తెలిసిన వాడు. "మీలో చాలామందికి బాగా లేదు కదా; అందుకని ముందుగా నేను ఒక్క నలుగురికి మాత్రం వైద్యం చేస్తాను. నా వైద్యం మూలంగా వాళ్ళు బాగైనారనుకోండి, అటు తర్వాత మిగిలిన వాళ్లకి వైద్యం చేయిద్దురు. అట్లా జగగకపోతే నేను ఇక మిమ్మల్ని ఒత్తిడి చేయను. నిశ్శబ్దంగా ఇక్కడి నుండి వెళ్ళిపోతాను" అని, అందుకు అంగీకరించిన నలుగురైదుగురికి మాత్రం మందులిచ్చాడు. నాలుగు రోజులు గడిచేసరికి వాళ్ళంతా కోలుకోసాగారు. దాంతో ఊళ్ళో జనాలందరికీ అపనమ్మకం వదిలిపోయింది. ఒక్కరొక్కరుగా డాక్టరు దగ్గరికి వచ్చి, మందుల వాడకం మొదలుపెట్టారు. డాక్టరుపట్ల, విజ్ఞానం పట్ల, చదువు పట్ల వాళ్లకు ఒక నమ్మకం ఏర్పడింది.   "అసలు ఎందుకిలా జరిగింది?" అని డాక్టరుగారిని అడిగాడు శ్రీశైలం. "సాధారణంగా ఇట్లాంటి సమస్యలు నీళ్ళతోటే వస్తుంటాయి- ముందుగా వీళ్ళు త్రాగే నీటిని పరీక్షించాలి" అంటూ సెలయేటి లోని నీటిని రెండు బాటిళ్లలో నింపి పరీక్షకోసం ప్రభుత్వం వారి ల్యాబుకు పంపించాడు డాక్టర్ శివ. మరో వారం గడిచే సరికి పరీక్షా ఫలితాలు వచ్చాయి. జనాల సమక్షంలో రిపోర్టులను పరిశీలించిన శివ, శ్రీశైలం ఇద్దరూ దిగులుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. "మీ ఊరికి దగ్గర్లో ఏమైనా ఫ్యాక్టరీలు ఉన్నాయా?" అడిగాడు డాక్టర్ శివ. "ఉన్నాయి. మన ఊరునుండి ఏడు కిలోమీటర్ల దూరంలో ప్లాస్టిక్ ఫ్యాక్టరీ ఒకటి ఉన్నది. ఏమి?" అడిగాడు సర్పంచ్. "దాని ప్రభావమే ఇదంతా. ఆ కంపెనీ విడుదల చేసే హానికరమైన రసాయనాలు ఈ సెలయేటిలో కలుస్తున్నాయి. వాటి మూలంగా నీటిలో ఉన్న జలచరాలు చనిపోతాయి. వాటిని ఆశించే క్రిములవల్ల నీరుమొత్తం మరింత విషపూరితం అవుతుంది. ఆ నీళ్లని త్రాగేవారికి అందరికీ పలు రకాల వ్యాధులు సంక్రమిస్తాయి, మనుషులు చనిపోవచ్చు కూడా. ఇది దేవుడి మాయ కాదు; దుష్టశక్తుల ప్రభావం కూడా కాదు: ఇవన్నీ మనిషి తెలిసి చేస్తున్న తప్పులు!" వివరించాడు డాక్టర్ శివ. దాంతో ఊరి ప్రజలకు భయం పోయి, దిగులు పట్టుకుంది. 'గాలి,భూమి, అడవి, నీరు- ఇట్లా అన్నీ కలుషితం అయిపోతుంటే, ఇక మనమూ, నోరులేని జీవాలు ఎట్లా బ్రతికేది?!' అంటూ వాపోయారు. శ్రీశైలం అన్నాడు- "దిగులుపడి ప్రయోజనం లేదు. మన వనరుల్ని మనమే కాపాడుకోవాలి. హానికరమైన రసాయనా-లను వదిలే కంపెనీలను మూయించాలి, చెట్లను బాగా నాటాలి. చిన్న పిల్లలకి, అనారోగ్యంతో ఉన్నవారికి కాచి వడగట్టిన నీటిని త్రాగించాలి. మనకు హాని చేస్తున్న ఈ కంపెనీకి నోటీసులు పంపాలి. దాన్ని మూయించాలని ప్రభుత్వానికి వినతిపత్రాలు అందజేయాలి" అని. అందరూ కదిలి, తమ తమ స్థాయిలలో పోరాటం చేసారు. చివరకు ఆ ఫ్యాక్టరీ మూత పడింది. ఐదు సంవత్సరాల తరువాత రాఘవపురంలో పిల్లలంతా బడికి పోసాగారు. చాలా మంది పెద్దవాళ్ళు కూడా చదువు నేర్చుకున్నారు. దుష్టశక్తుల్ని నమ్మి చేతులు ముడుచుకొని కూర్చోవటం లేదు- అందరూ వికసించిన బుద్ధితో కార్యతత్పరులయ్యారు! కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

కాకమ్మ-గువ్వమ్మ

కాకమ్మ-గువ్వమ్మ   ఒక ఊళ్లో ఒక కాకమ్మ, ఒక గువ్వమ్మ ఉండెనంట. కాకమ్మకేమో పేడ ఇల్లంట. గువ్వమ్మకేమో ఇటుక ఇల్లంట. ఒకసారి పెద్దగా గాలివాన వచ్చిందట. ఆ వానకు కాకమ్మ పేడ ఇళ్లంతా కరిగిపోయిందంట. దూరుకునేకి ఇల్లు లేక కాకమ్మ గువ్వమ్మనన్నా అడుగుదామని గువ్వమ్మ దగ్గరకు పోయి- "గువ్వమ్మా! గువ్వమ్మా! నాకు రవ్వంత తావివ్వవా, పడుకునేకి?" అని అడిగిందంట. "ఎహె, ఫో!నేను నా మొగునికి నీళ్లు పొయ్యల్ల!" అన్నదంట గువ్వ. మళ్లీపోయి అడిగిందంట కాకమ్మ-"గువ్వమ్మా! గువ్వమ్మా! నాకు రవ్వంత తావివ్వవా, పడుకునేకి?" అని. "ఎహె, ఫో! నా మొగునికి బట్టలు తొడగాలి నేను!" అన్నదంట గువ్వమ్మ. మళ్లీ ఇంకోసారి పోయి అడిగిందంట కాకమ్మ-"గువ్వమ్మా! గువ్వమ్మా! నాకు రవ్వంత తావివ్వవా, పడుకునేకి?" అని. "ఎహె, ఫో! నా బిడ్డలకు నీళ్లుపొయ్యాలె!" అన్నదంట గువ్వమ్మ. మళ్లీ పోయి గువ్వమ్మను అడిగిందంట కాకమ్మ- "గువ్వమ్మా! గువ్వమ్మా! నాకు రవ్వంత తావివ్వవా, పడుకునేకి?" అని. "ఎహె, ఫో! నా పిల్లలను బడికి పంపాలి!" అన్నదంట గువ్వమ్మ. మళ్లీ పోయి గువ్వమ్మను అడిగిందంట కాకమ్మ- "గువ్వమ్మా! గువ్వమ్మా! నాకు రవ్వంత తావివ్వవా, పడుకునేకి?" అని. "సరే ఇస్తాగానీ, నువ్వు పప్పుల గూట్లో పడుకుంటావా? లేక మిక్స్చరు గూట్లో పడుకుంటావా?" అని అడిగిందంట గువ్వమ్మ. "పప్పులగూట్లోనూ పడుకుంటాను, మిక్చరు గూట్లోనూ పడుకుంటాను గువ్వమ్మా!" అన్నదంట కాకమ్మ. "సరేలె"మ్మని కాకమ్మకు ఆ గూళ్లను చూపిందంట గువ్వమ్మ. గువ్వమ్మ ఇంట్లో పడుకున్న కాకమ్మ ఆ గూళ్లలో ఉన్న పప్పులు, మిక్స్చరు మొత్తాన్నీ తినేసి, గూడంతా పెంటనేసి, తెల్లారకనే అక్కడినుండి ఎగిరిపోయిందంట. ఇక తెల్లారగానే "ఆకలమ్మా! ఆకలి" అన్నాయంట గువ్వమ్మ పిల్లలు. ఏమైనా ఇద్దామని పప్పుల గూడుకీ, మిక్చరుగూటికీ వెళ్లి చూస్తే కాకమ్మ చేసిన పనంతా కనబడింది గువ్వమ్మకు. "అయ్యో! ఎంతపని చేసింది కాకి, ఎక్కడకెళ్ళిందిది?" అని దాన్ని వెదుకుతూ పోయిందంట గువ్వమ్మ. పోతావుంటే దానికి ఎద్దును పట్టుకుని ఒకాయప్ప కనిపించినాడంట. "ఒకెద్దాయప్పా! ఒకెద్దాయప్పా! నీకేమన్నా కాకమ్మ కనిపించెనా ఈ పక్కన?" అని అడిగిందట.    "లేదు లేదు, గువ్వమ్మా! అదిగో ఆ...డ రెండెద్దులాయప్ప ఉన్నాడు. ఆయప్పకేమైనా కనపడినాదేమో, పొయ్యి అడుగు" అని చెప్పెనంట ఒకెద్దాయప్ప. రెండెద్దులాయప్పేమో మూడెద్దులాయప్పను, ఆయప్పేమో నాలుగెద్దులాయప్పను , ఆయప్పేమో ఐదెద్దులాయప్పనూ, ఐదెద్ద్దులాయప్పేమో అరెద్దులాయప్పనూ చూపిచ్చిరంటగానీ, కాకి జాడమాత్రం తెలీలేదంట గువ్వకు. అయినా అంతపని చేసినదాన్ని ఊరికే వదిలితే ఎలాగని ఓపికగా వెదుకుతూనే ముందుకుపోయిందంట గువ్వమ్మ. ఆరెద్దులాయప్ప కూడ ఏడెద్దులాయప్పను చూపిచ్చెనంట. చివరికి ఏడెద్దులాయప్ప "అదిగో గువ్వమ్మా! ఆ నేరెడుమాన్లో, నేరేడుకాయలు తింటావుంది చూడు, కాకమ్మ!" అని కాకిజాడ చెప్పెనంట. నేరేడుమాను దగ్గరకుపోయి "కాకమ్మా! కాకమ్మా! నాకు ఆకలవుతాంది. చెట్టెక్కేటంత బలం నాకిప్పుడులేదు, తినేకి కొన్ని నేరేడుగాయలు పీకెయ్యవా?" అని అడిగిందంట గువ్వమ్మ. అప్పుడు అన్నీ కుళ్లిపోయిన కాయలను కిందకేసిందంట కాకమ్మ. "ఆహా! నీ పనిచెబుతానుండమని, ఏదీ కాకమ్మా, నీ పళ్లు ఎలా ఉన్నయో చూపించవా కాస్త?" అని అడిగిందంట గువ్వమ్మ. "దానికేం చూడు" అని నోరు తెరిచిందంట కాకమ్మ. కాకి నోరు తెరవగానే, సిద్దంగా ఉన్న గువ్వమ్మ ఎగిరి వెళ్లి, తను తెచ్చుకున్న గుండ్రాయితో కాకమ్మ పళ్ళను ఊడగొట్టి, నోట్లో కారం వేసి, పట్టుకుని బావిలోకి విసిరేసిందంట. కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కథ

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కథ   ఒకసారి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీరు సెలవల్లో దేశాటనకు వెళ్ళాడు. అట్లా అతను ఒక పర్వత ప్రాంతంలో పోతుండగా, గొర్రెల కాపరి ఒకడు ఎదురయ్యాడు. అతని వెంట ఒక పెద్ద గొర్రెల మంద ఉన్నది. ఆ మందలో చిన్న చిన్న, బొచ్చు బొచ్చు గొర్రె పిల్లలు- చాలా ముచ్చటగా వున్నాయి. కంప్యూటరు బొమ్మల్లో తప్ప, నిజ జీవితంలో ఏనాడూ వాటిని చూసి ఉండని ఇంజనీరు ఆ దృశ్యానికి పరవశించి పోయాడు. "ఎలాగైనా ఒక గొర్రె పిల్లను సంపాదించాలి" అనే కోరిక ఒకటి అతని మనసులో మొలకెత్తి, కొమ్మలు రెమ్మలు వేసేసింది. దాంతో అతను ఆ గొర్రెల కాపరి దగ్గరికి వెళ్ళి "చూడు గోపన్నా, నేను నీ గొర్రెను ఒక దాన్ని కొనాలనుకుంటున్నాను. ఖరీదెంతో చెప్పు!" అన్నాడు. దానికి ఆ గొర్రెల కాపరి "ఈ గొర్రెలు అమ్మేవి కావు!" అని ముక్తసరిగా జవాబిచ్చాడు. ఇంజనీరు గొర్రెలతనిని ఎంతగానో బ్రతిమిలాడాడు. అయినా ఫలితం లేదు. గొర్రెను అమ్మేందుకు కాపరి ఏ మాత్రం ఇష్టపడలేదు. "ఎంత ఖర్చయినా పర్లేదు- మిగతా ప్రపంచానికి ఏమి జరిగినా పర్లేదు- అనుకున్నదాన్ని సాధించాల్సిందే" అనుకునే ఇంజనీరుగారికి ఇది అస్సలు ఏమాత్రం మింగుడు పడలేదు. చివరికి అతనికో ఆలోచన తట్టింది. గొర్రెల కాపరిని ఉద్దేశించి "చూడు గోపన్నా! నువ్వెంత చెప్పినా నిన్ను, నీ గొర్రెల్ని వదిలి పోబుద్ధి కావట్లేదు. అందుకని నేను ఒక పని చేస్తాను. ఎంత శ్రమ అయినా పర్లేదు; నీ మందలో ఉన్న గొర్రెలను ఒక్కొక్కదానినీ లెక్క పెట్టకుండానే, అవి మొత్తం ఎన్ని గొర్రెలో చెబుతాను నేను. నేను చెప్పే ఆ సంఖ్య గనుక సరిపోతే, నా తెలివి తేటలకు బహుమానంగా నువ్వు ఒక గొర్రెను ఇద్దువు. సరేనా?" అన్నాడు.   గొర్రెల కాపరికి అది ఇష్టం కాలేదు. "నా గొర్రెలు ఎన్ని ఉన్నాయో నాకు తెలుసు కదా, అది చెప్పేకి ఈయనెందుకు?" అనుకున్నాడు. "అయినా ఒక్క అంకె చెబితే గొర్రెనెందుకు ఇవ్వాలి, అనవసరంగా?" అని కూడా అనుకున్నాడు. అయినా అతను అడిగిన తీరు నచ్చి, ఓమాటు నవ్వి "సరే" అన్నాడు.  వెంటనే ఇంజనీరు మందలోని గొర్రెల్ని అన్నిటినీ ఒకసారి తన మొబైల్ ఫోనుకు చూపించాడు. గూగుల్ మ్యాప్స్ నొక్కాడు. తనున్న ప్రాంతాన్ని జూం చేసాడు. అందులో కనబడ్డ గొర్రెల్ని లెక్క పెట్టేందుకు అర్జంటుగా ఒక యాప్ తయారు చేసాడు. చివరికి చెప్పాడు "ఇవి డెభ్భై రెండు " అని. మీరు చెప్పింది నిజమే ! ఇవి డెభ్భై రెండు" ఒప్పుకున్నాడు గొర్రెల కాపరి. "సరే ... మీరు పందెంలో నెగ్గారు గనుక ఈ మందలోంచి ఒక గొర్రెను తీసుకెళ్ళండి" అన్నాడు.  సంతోషంతో ఉబ్బిపోయాడు ఇంజనీరు. వెంటనే మందలోకి వెళ్ళాడు. ఓ జీవాన్ని ఎంచుకున్నాడు. దానిని తన భుజాల పైకి ఎత్తుకున్నాడు. ఆ విధంగా తను కోరిన దాన్ని చేజిక్కించుకొని తిరిగి వెళ్ళేందుకు ఉద్యుక్తుడవుతుండగా గొర్రెల కాపరి ఆయనకు అడ్డు వచ్చాడు- "ఒక్క నిమిషం ఆగండి! నేను కూడా ఒక పందెం కాయాలనుకుంటున్నాను మీతో" అన్నాడు. "అవునా?! ఏమిటా పందెం?!" అడిగాడు ఇంజనీరు. "తమరి వృత్తి ఏంటో చెప్పేస్తాను నేను. నేను చెప్పింది గనుక నిజమైతే, మీరు గెల్చుకున్న ఆ జీవాన్ని నాకు తిరిగి అప్పగించాల్సి ఉంటుంది" అన్నాడు గొర్రెలకాపరి, సీరియస్‌గా ముఖం పెట్టి. అతని అమాయకపు మాటలకు బిగ్గరగా నవ్వాడు ఇంజనీరు. "మన పల్లెల్లో వాళ్లకి కాపీ కొట్టటం బలే వచ్చు" అనుకున్నాడు. చులకన భావంతో అతని మనసు తేలికై, అలా అలా గాలిలో ఊగింది. "ఇతన్ని ఆట పట్టించేందుకు మరో అవకాశం ఇస్తున్నాడు- భలే" అనుకున్నాడు. పైకి మటుకు "సరే,.. అలాగే.. నువ్వడిగింది కూడా న్యాయంగానే వుందిగా?! కానివ్వు...!" అన్నాడు.   "మీరు ఒక సాప్టువేరు ఇంజనీర్!" టక్కున చెప్పాడు గొర్రెల కాపరి. ఊహించని ఈ జవాబుకి ఇంజనీరుకు దిమ్మ తిరిగినట్లయింది. వెంటనే తేరుకొని "నీకెలా తెలిసింది...?" అని అడిగాడు. గొర్రెల కాపరి చిరునవ్వు నవ్వాడు. "సార్!‌ నా గొర్రెలు ఎన్ని ఉన్నాయో నాకు తెలుసు. లెక్క పెట్టుకునేందుకు ఏమంత సమయం‌ పట్టదు కూడాను. అయినా దాని కోసం మీరు సెల్‌ఫోను బయటికి తీసారు. దాన్ని బట్టే మీరు ఎవరో అర్థమైపోయింది నాకు. ఇక రెండోది, నా గొర్రెలు ఎన్ని ఉన్నాయో నాకే చెప్పి, కనుక్కున్నందుకుగాను మీకు బహుమతిని ఇమ్మన్నారే, అట్లా అనగలిగే సామర్థ్యమూ, తెలివితేటలూ, అసలు అలాంటి బుద్ధి అంతా సాప్టువేరు ఇంజనీర్లకు మాత్రమే ఉంటుంది. దాని నుండి కూడా మీరెవరో తెలిసిపోయింది నాకు. ఇక మూడో సంగతి ఏంటంటే, మీకు ఏ మాత్రం అనుభవం లేని పనిని కూడా మీరు 'అవలీలగా చేయగలరు' అనుకుంటున్నారు. నిజానికి మీరు గొర్రెల్ని చూడలేదు; వాటి అలవాట్లేంటో‌ మీకు తెలీదు; వాటిని ఎట్లా పెంచాలో మీకు తెలీదు; అయినా అన్నీ‌ తెలిసినట్లు పందెం కట్టారు. అట్లాంటి శక్తి కేవలం సాప్టువేరు ఇంజనీర్లకు మాత్రమే ఉంటుంది తప్ప, ఇతరులకు అది సాధ్యమే కాదు. అట్లా మీరెవరో నాకు మూడు రకాలుగానూ తెలిసిపోయింది. అయినా మీకు గొర్రెల గురించి తెలీదని నాకు ఎట్లా తెలిసింది అంటారేమో.. మీరు ఎత్తుకెళ్తున్నది గొర్రె కాదు; అది నా పెంపుడు కుక్క! దయచేసి నా కుక్కను నాకు వదిలి వెళ్ళండి!" అన్నాడు చిరునవ్వుతో. సిగ్గు పడిన సాప్టువేరు ఇంజనీరు కుక్కను నేలమీదికి జారవిడిచి, ఎర్రబారిన ముఖంతో తన కారువైపుకు అడుగులు వేసాడు. కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

వెంగళప్ప భార్య

వెంగళప్ప భార్య అనగనగా ఒక ఊళ్ళో ఓ వెంగళప్ప ఉండేవాడు. ఏవేవో కబుర్లు చెప్పి అందరినీ నవ్విస్తూ, తనూ నవ్వుతూ ఉండే వెంగళప్ప అంటే పడి చచ్చేవాళ్ళు ఊళ్ళోని కుర్రకారు. ఎనభై ఏళ్లకు పైబడ్డా వెంగళప్పలోని ఉత్సాహం, హాస్యం ఏమాత్రం తగ్గలేదు మరి. ఒకసారి అట్లా చుట్టూ చేరిన కుర్రవాళ్ళకు తను సొంతగా చేసిన 'టీ' తెచ్చి ఇస్తుంటే ఓ కుర్రవాడు అడిగాడు- "తాతా! ఇన్నేళ్ళుగా నువ్వు మాకందరికీ ఇన్నిన్ని సంగతులు చెబుతున్నావు. అయితే మొహమాటం కొద్దీ ఇంతకాలంగా మేం ఎవ్వరమూ అడగని ప్రశ్న ఒకటుంది- 'నీదంటూ ఒక కుటుంబం ఎందుకు లేదు? నీ భార్య ఏమైంది? నీ పెళ్ళి ఎలా జరిగింది? ఇప్పుడైనా చెప్పు!'అని.  "ఓ, దానిదేముంది, చెబుతాను- ఐతే ఆది చాలా పెద్ద కథ!"అని మొదలెట్టాడు వెంగళప్ప. "ఒకసారి నా చదువు పూర్తై, పనిలో చేరాక- మీ అంత వయస్సులో ఉన్నప్పుడు- పెళ్ళి చేసుకోవాలని చాలా గట్టిగా అనుకున్నాను. "ఎలాంటి భార్య కావాలి? ఆ అమ్మాయి ఎలా ఉండాలి? ఏ ప్రాంతపు మనిషి అయి ఉండాలి?..." అని రకరకాలుగా ఆలోచించాను.. "అమ్మాయి సన్నగా, నాజూకుగా ఉండాలి; పొడుగ్గా ఉండాలి కూడాను- ఆమె నల్లటి కళ్లు విశాలంగా, నక్షత్రాల్లా మిల మిలా మెరుస్తూ ఉండాలి. ఆమె చర్మం ఎలాగైనా తెల్లగా ఉండాల్సిందే; దాంతో పాటు పొడవాటి జుట్టూ ఉండాలామెకు.    బాగా చదువుకొని ఉండాలి; సంగీతం వచ్చి ఉండటమే కాక ఒకటో రెండో సంగీత సాధనాలు వాయించగలిగి ఉండాలి- సాయంత్రం వేళల్లో నేను అలా కూర్చొని ఉంటే నేపధ్యంలో‌ సంగీతం వాయించేట్లుండాలన్నమాట! ఇక ఆమె మంచి వంటకత్తె కూడా అయి ఉండాలి కదా, లేకపోతే నాకు వంట ఎలాగ?! ఇంకా ఆమె వంశం గొప్ప పేరెన్నిక గన్న వంశం అయిఉండాలి. ఆమె ఎక్కువ సీరియస్‌గా ఉండకూడదు; పెద్దలంటే గౌరవం, మర్యాద ఉండాలి. ఆమె ముక్కు మరీ‌ పెద్దగా ఉండకూడదు- ఇంకా ఆమెకు సొంత తెలివితేటలు ఉండాలి- ఎప్పుడూ ఇతరులకు లోబడి ఉంటే ఎలాగ..? నాకు కాబోయే భార్య సకల సద్గుణ సంపూర్ణ అయి ఉండాలి" "అట్లా అన్నీ ఆలోచించాక, నేను నా గుర్రాన్నెక్కి బయలుదేరాను- దేశమంతటా తిరిగి, నాకు కాబోయే భార్యను వెతుకుదామని.    'నా కలల రాణి, పరిపూర్ణ సులక్షణ- ఎక్కడో ఉండి ఉంటుంది; నాకోసమే ఎదురు చూస్తూ ఉంటుంది" అని నాకు చాలా గట్టిగా అనిపించింది. నేను ఆగిన మొదటి పట్టణంలోనే ఒక అమ్మాయి కనిపించింది నాకు. అద్భుతమైన అందం! నల్ల కలువల్లాంటి కళ్ళు. ఎత్తుగా, చాలా తెల్లగా ఉంది. గొప్ప వంశంలో పుట్టింది, చాలా ఆకర్షణీయంగా ఉందామె-" "ఓహో!" సంతోషంగా అరిచారందరూ. "మొత్తానికి త్వరగానే దొరికిందన్నమాట!" అని. "అయ్యో, అట్లాంటిదేం లేదు. ఆమెకు సంగీతమే రాదు! నిజానికి, ఆమె ముక్కు కూడా కొంచెం దుబ్బగానే ఉండింది.." "అందుకని నేను మరో పట్టణానికి వెళ్ళాను. అక్కడున్న మిత్రులు కొందరు నన్ను మరో కుటుంబానికి పరిచయం చేశారు- చాలా గొప్ప కుటుంబం, చక్కని అందమైన కూతురు! ఆమె ఎంత చక్కగా ఉందంటే, ఎంత ఉన్నతమైన ప్రవర్తన- చెప్పలేం. ఇక సంగీతం అయితే, ఆమెకు దేవుడిచ్చిన వరమే! అన్నిటినీ మించి, ఆమె తల్లిదండ్రులు నాకు పూర్తి భరోసా ఇచ్చారు- ఆమె అద్భుతమైన వంటగత్తె కూడా!    "భలే భలే!" చప్పట్లు చరిచారు కుర్రవాళ్ళు "ఇంక ఏమైంది అప్పుడు?" "ఏమీ కాలేదు!" చెప్పాడు వెంగళప్ప- "ఆ అమ్మాయి, నిజానికి కొంచెం‌ దుబ్బగా ఉండింది- కొంచెం పొట్టిగా కూడా" "అయ్యో!" అన్నారంతా "మరి ఇంకేం చేశావు?" "ఏముంది, గుర్రమెక్కి బయల్దేరాను మళ్ళీ. ఈసారి మా సొంత ఊరుకెళ్ళాను. అక్కడ మా బంధువులు నన్నొక అద్భుతమైన యువతికి పరిచయం చేశారు- ఆమెను గురించి చెప్పాలంటే మాటలు చాలవు! ఏం అందం, ఏం చందం, ఏం వ్యక్తిత్వం! ఎంత చురుకుదనం, ఎంత ప్రశాంతత, ఎత్తుగా, హుందాగా, తెల్లగా దేవకన్యలాగా మెరిసిపోతూ! చక్కని సంగీతం, చదువు- నా భార్యలో నేను కోరుకునేవన్నీ ఉండినై ఆమెలో! ఎట్టకేలకు నాకు నేను మెచ్చిన యువతి ఎదురైంది!  "అద్భుతం! అదృష్టం అంటే నీదే" అరిచాడో కుర్రాడు. కానీ‌ వెంగళప్ప ముఖం దిగాలుగా వేసుకొని కూర్చున్నాడు- ఇంకేమీ చెప్పలేదు.  "ఏమైంది!? ఏమైందప్పుడు? చెప్పు, ఇట్లా ఆత్రంలో ముంచి వదిలేస్తే ఎలాగ?" రకరకాలుగా అరిచారు కుర్రాళ్లంతా. "కానీ ఏం చెప్పాలి, ఆమె కూడా తన కలల రాజు కోసం ఎదురు చూస్తున్నదట మరి!" అన్నాడు వెంగళప్ప, చల్లగా! కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

వినాయకుడి పెళ్లి

వినాయకుడి పెళ్లి   వినాయకుడి తమ్ముడు సుబ్రమణ్యం చాలా అందంగా ఉంటాడు. అన్నకంటే ముందు తమ్ముడి పెళ్ళే కుదిరింది. అంగరంగ వైభోగంగా జరిగింది పెళ్ళి. ఎక్కడెక్కడి దేవతలూ సుబ్రమణ్యం పెళ్ళికి విచ్చేశారు. దాన్ని చూసిన తర్వాత వినాయకుడికీ అనిపించింది- 'తనకూ పెళ్ళైతే బావుంటుంది కదా' అని. పెళ్ళి హడావుడి తగ్గే వరకూ ఆగి, ఆనక అమ్మ పార్వతి ఖాళీగా కూర్చున్నప్పుడు దగ్గరికెళ్ళి నిలబడ్డాడు- "అమ్మా! తమ్ముడి పెళ్ళి చేశావు కదా! మరి నా పెళ్ళి ఎప్పుడు చేస్తావు?" అని అడిగేశాడు. పాపం పార్వతమ్మ! దిగాలుగా తన ముద్దుల పెద్ద కొడుకు వైపు చూసింది. లోలోపలే బాధపడింది. "చిన్నవాడు సుబ్రమణ్యమేమో ఎంతో అందంగా ఉంటాడాయె! దాంతో వాళ్ళు పిలిచి పిల్లనిచ్చిరి! మరి, నువ్వేమో ఏనుగు తలతో, పొడవాటి తొండంతో ఉంటివాయె! పోనీలే అంటే, మేం ఎంత చెప్పినా వినక, అందరూ పెట్టిన కుడుములూ ఉండ్రాళ్ళు,వడపప్పు తిని-తిని, అందరూ పోసిన పానకం తాగి-తాగి బొజ్జ పెంచావాయె ! నీకు పిల్లనిస్తామని ఇప్పుడు ఎవరూ ముందుకు రావట్లేదు కద నాన్నా!" అని మనస్సులోనే బాధపడింది. అయినా ఈ సంగతి పిల్లవాడికి ఎట్లా చెబుతుంది; చిన్నబుచ్చుకుంటాడు గదా. అందుకని పైకి ఏమన్నదంటే- "మరేఁ బాబూ! నువ్వెళ్ళి, పెళ్ళికూతురి కోసం ఒక కొత్త కోక, మంగళ సూత్రాలూ పట్టుకు రా నాయనా! నేనేమో ఈలోగా పిల్లను చూస్తాను" అని బుజ్జగించి పంపేసి, ఊపిరి పీల్చుకున్నది- "అమ్మయ్య! ఇప్పటికైతే సమస్య తప్పింది!" అనుకుంటూ. అయితే వినాయకుడికి ఇదేమీ తెలీదు కదా; వెంటనే ఆనందంగా తన ఎలుక వాహనమెక్కి, భూలోకానికి వచ్చేశాడు. వచ్చి అలసిపోయి, ఒక చెట్టు క్రిందున్న అరుగు మీద కూర్చున్నాడు. ఆ అరుగు చుట్టూతా ఏవేవో గింజలు పడి ఉన్నాయట. ఆ సమయంలో అక్కడి గింజలు ఏరుకు తినేందుకు అక్కడికి ఒక కోడిపుంజు వచ్చింది.   వినాయకుడు దాన్ని చూసి "ఓ కోడిపుంజూ! ఒక సారి ఇలా రా!" అని పిలవగానే , 'నన్ను పేరు పెట్టి పిలుస్తున్నారు ఎవరా?'అని దగ్గగకొచ్చింది కోడిపుంజు. చూడగా, అక్కడ అరుగు మీద వినాయకుడు కూర్చొని ఉన్నాడు! దాంతో అది సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోతూ గభాల్న దగ్గరికి వచ్చి, రెక్కలు మడిచి నమస్కరిస్తూ "చెప్పండి స్వామీ! కులాసానా? నన్ను పిలిచా-రెందుకూ?" అని అడిగింది. "ఓహో, కోడిపుంజూ! నీ రెక్కలు ఎంత అందంగా ఉన్నాయ్! నీజుట్టు కిరీటంలాగా ఎంత బావుంది! నువ్వు చెప్పిన పనల్లా చాలా చక్కగా చేస్తావనీ, సమయ పాలన అంటే ఏంటో నీనుండే నేర్చుకోవాలనీ అందరూ చెబుతుంటారు! మరి నువ్వు నాకూ ఓ పని చేసి పెడతావా? చక చకా వెళ్ళి, నాకో కొత్త కోక తెచ్చిపెట్టు; మా అమ్మ నాకు పెళ్ళి చేస్తుందిట!"అన్నాడు. "అంత పెద్ద స్వామి తనను పొగిడాడే!" అని కోడిపుంజు చాలా సంతోషించింది. "దానిది ఏముంది స్వామీ! ఒక్క నిముషంలో పెద్ద బజారు కెళ్ళి, 'వినాయకుడి పెళ్ళికి కొత్త కోక కావాలి' అని అడిగి తెచ్చేస్తా స్వామీ! ఇక్కడున్నట్లే వచ్చేస్తాను" అని వేగంగా వెళ్ళిపోయింది కోడి! . అంతలో అక్కడ మొలిచి ఉన్న పచ్చగడ్డిని తినేందుకు గొర్రెపోతు ఒకటి అటుగా వచ్చింది. దాన్ని చూసి వినాయకుడు బలే మురిసిపోయాడు- 'ఈరోజు అన్నీ మంచి శకునాలే! నేను తిరక్కుండానే అన్ని పనులూ ఎట్లా అయిపోతున్నాయో చూడు!" అని సంతోషపడ్డాడు. "ఓ గొర్రెపోతూ! నాకో పని చేసి పెట్టరాదూ? త్వరలో నా పెళ్ళి జరగనున్నది! దానికోసం నువ్వు కంసాలి దగ్గరికెళ్ళి మంగళ సూత్రాలు చేయించుకురా, వెంటనే వెళ్ళు!" అని చెప్పాడు. గొర్రెపోతు "ఓహో! అట్లానా స్వామీ! అయితే మాకు పప్పన్నం దొరుకుతుందన్నమాట! ఇదిగో! ఇప్పుడేవెళ్ళి తెస్తాను. అదెంతలోకి!మీరడిగారని చెప్పి ఇప్పుడే కంసాలి దగ్గరికి వెళ్ళి పట్టుకు వచ్చేస్తాను చూడండి!" అంటూ వెళ్ళింది. వినాయకుడు అక్కడే ఓ కునుకు తీసాడు. ఆయన లేచి చూసేసరికి సాయంకాల-మైంది. పోయిన వాళ్ళు ఇద్దరూ ఇంకా తిరిగి రాలేదు! ఇక దాంతో వినాయకుడే మెల్లిగా ఎలుక వాహనం ఎక్కి బయల్దేరాడు- ఇద్దర్నీ వెతుక్కుంటూ. కొంతదూరం వెళ్ళే సరికి కోడిపుంజు కనిపించింది. "ఏమే, కోడిపుంజూ ! నా కొత్త కోక ఎక్కడ?" అని అడిగాడు దాన్ని. అదన్నది- "స్వామీ! మీకోసం కొత్త కోక తీసుకు వస్తున్నానా, అంతలో అక్కడ నాకు ఒక జొన్నకంకి కనిపించింది. దాన్ని చూడగానే విపరీతంగా ఆకలేసింది. 'ఒక్క కంకి తినేసి వద్దాం' అని మీ కొత్త కోకను పక్కన పెట్టి, కంకి తినేసి వచ్చాను- చూస్తునుగదా, కోక లేదు! దాంతో ఇక మధ్యాహ్నం నుండీ దాన్నే వెతుకుతూ తిరుగుతూ ఉన్నానయ్యా" అని. వినాయకుడన్నాడు- "చూడు కోడిపుంజూ, నువ్వు కొత్త కోక తీసుకువస్తేనే నా పెళ్ళి! అందుకని త్వరగా వెళ్ళి వెతుక్కు రా! లేకపోతే ఎలుక చేత నిన్ను కొరికించేస్తా, జాగ్రత్త!" అని బెదిరించాడు. దాంతో కోడిపుంజు 'కొత్తకోకో'అని అరుచుకుంటూ, ఆ కొత్తకోక కోసం ఈనాటికీ వెతుకుతూనే ఉంది, పాపం! ఆ అరుపేనట, మనకు 'కొక్కొరోకో' అని వినబడేది! కోడిపుంజు కోక తేకపోయేసరికి, 'ఇక సరేలే' అని వినాయకుడు గొర్రెను వెతుకుతూ ఆ బజారూ ఈ బజారూ తిరిగాడట. అనుకున్నట్లుగానే, గొర్రెపోతు ఎదురైంది. స్వామి కోపంగా "ఏయ్ గొర్రెపోతూ! నా తాళి బొట్టెక్కడ?" అనగానే, అది వణికిపోతూ "స్వామీ! తమరు అడిగారని చెప్పగానే కంసాలి కనకయ్య తాళిబొట్టు చేసి ఇచ్చేశాడు; ఆ తర్వాత వస్తూ వస్తూంటే నాకు ఆకలేసింది; ఆ సజ్జచేలో గడ్డి తింటూ ఒక్క క్షణం ఏమారాను- అంతలోనే ఎవరో ఆ తాళిబొట్టు కాజేశారయ్యా" అని భయపడుతూ చెప్పింది గొర్రెపోతు. వినాయకునికి మహా కోపం వచ్చేసింది. "నువ్వు త్వరగా వెతికి తెచ్చివ్వు. నా పెళ్ళి జరగాలంటే ఆ తాళి కావాల్సిందే!" అనేశాడు హుంకరిస్తూ. "అట్టాగే స్వామీ!" అని గొర్రెపోతు పాపం, ఆనాటి నుండీ ఈనాటి వరకూ వంచిన తల ఎత్తకుండా ఆ తాళిబొట్టు కోసం వెతుకుతూనే ఉంది. అయినా ఏం చేస్తాం, ఈరోజు వరకూ కూడా అటు తాళిబొట్టు కాని, ఇటు కొత్తకోక గానీ రానే లేదు! దాంతో మరి వినాయకుడి పెళ్ళి జరగనే లేదు. పైపెచ్చు 'వినాయకుని పెళ్ళికి వెయ్యి విఘ్నాలు’ అన్న సామెత పుట్టింది. మరి మీకేమైనా కొత్తకోక గానీ తాళిబొట్టు కానీ దొరికితే తెచ్చివ్వండేం! అప్పుడు జరిగే వినాయకుడి పెళ్ళికి మనమూ వెళ్లచ్చు; కావల్సినన్ని కుడుములూ ఉండ్రాళ్ళూ బలేగా తినచ్చు! కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

స్నేహం

స్నేహం   రామాపురపు భూస్వామి రంగయ్య వడ్డీ వ్యాపారం లోను, భూముల మీదను బాగా సంపాదించాడు. ఆ డబ్బుతో ఒక పెద్ద స్థలాన్ని కొన్నాడు. ఆ స్థలంలోనే ఒక సరస్సును, దాని ఒడ్డునే ఒక పెద్ద భవంతిని నిర్మించుకొని, అక్కడ దర్జాగా నివసించటం మొదలు పెట్టాడు. రంగయ్య భవంతి ప్రక్కనే నివసిస్తుంటాడు, దళితుడు సోమయ్య. రంగయ్యకు సోమయ్యను, అతని కుటుంబాన్ని చూస్తే రోతగా ఉండేది. ఆ కుటుంబాన్ని వెళ్ళగొట్టాలని, ఆ స్థలాన్ని కూడా తానే కొనుక్కోవాలని చాలా సార్లు ప్రయత్నించాడు అతను. కానీ కుదరలేదు. పాపం, సోమయ్యకు ఆ ఇల్లు తప్ప ఇంక వేరే ఏ ఆస్తీ లేదు. "రెక్కల కష్టం చేసుకొని ఎలాగో ఒకలాగా బ్రతికితే, విలువ పెరుగుతున్న భూమిని కనీసం నిలుపుకోవచ్చు" అని వాళ్ళ ఇంటిల్లిపాదీ ప్రొద్దుటినుండి రాత్రి వరకూ శ్రమిస్తూనే ఉంటారు. "ఒక మామూలు దళితుడికి అంత గర్వమా? నేను అడిగినా ఇవ్వడా, భూమిని?" అని రంగయ్యకు కోపం. సోమయ్యను ద్వేషించే రంగయ్య, వాళ్ల కుటుంబంలోని వాళ్ళను ఎవ్వరినీ తన ఆవరణలోకి కానీ, తన సరస్సు దగ్గరకు కానీ రానిచ్చేవాడు కాదు. రంగయ్య కొడుకు రాము, సోమయ్య కొడుకు రాజు- ఇద్దరూ ఒకే బడికి వెళ్ళేవాళ్ళు. కానీ వేరు వేరు సెక్షన్ల పిల్లలు కావటంతో, ఇద్దరూ ఎప్పుడూ మాట్లాడుకోలేదు. ఒక రోజున వాళ్ళిద్దరూ బడినుండి ఇంటికి తిరిగి వస్తుండగా నీళ్ల కావడి మోసుకొని అటువైపే పోతున్న సోమయ్య కనిపించాడు.   ఆ కావడి బరువుకు, వీళ్ళు చూస్తూండగానే సోమయ్య దఢాలున కూలబడిపోయాడు. రాము వెనకనే నడుస్తున్న రాజు గబుక్కున అటుగా పరుగెత్తి, తండ్రిని లేపి కూర్చోబెట్టి, కడవలోని నీటిని త్రాగించాడు. ఆ సమయంలో రాము వాళ్ళ దగ్గరకు వెళ్ళి పలకరించి, "రాజూ! మీరు మా సరస్సులోని నీళ్ళు తీసుకోవచ్చుకదా? ఎందుకు, ఇంత దూరం నుండి నీళ్ళు మోసుకోవటం?" అని అడిగాడు. సోమయ్య, రాజు ఇద్దరూ నవ్వి ఊరుకున్నారు. ఆ రోజు సాయంత్రం వాళ్ల నాన్నని అడిగాడు రాము - "రాజు వాళ్ళు మన సరస్సులోంచి నీళ్ళు ఎందుకు తీసుకోరు?" అని. "వాళ్ళు దళితులు. వాళ్లు మన ఇంటి దగ్గరికి రాకూడదు; మనవి ఏమీ ముట్టుకోకూడదు- నువ్వు కూడా వాళ్ళతో ఏమీ మాట్లాడకూడదు- తెలిసిందా?!" కోపంగా అన్నాడు రంగయ్య. ఆ మాటలు విని రాము చాలా బాధపడ్డాడు. కానీ ఊరుకున్నాడు. ఒకరోజున రాము స్కూలు నుండి తిరిగి వస్తున్నప్పుడు, దారిలో ఒక పాము కనబడింది. అది అప్పుడే ఒక కప్పను మింగుతున్నది. రాము ఊరుకోకుండా దాన్ని ఒక కర్రతో కలబెట్టాడు. కప్పను వదిలిన పాము ఎంచక్కా రాము వెంటపడింది. ఆ సమయంలో రాము వెనకనే వస్తున్న రాజు వేగంగా కదిలి, పక్కనే ఉన్న కర్ర ఒకదానితో పామును కొట్టి చంపేసాడు; భయంతో వణికిపోతున్న రాముని ఓదార్చాడు.  ఆ రోజునుండి వాళ్ళిద్దరూ మంచి స్నేహితులయ్యరు. ఇక ఆ నాటి నుండి ఇద్దరూ కలసి స్కూలుకి వెళ్ళేవాళ్ళు; కలసి వచ్చేవాళ్ళు. ఎన్నో సార్లు వాళ్ళ నాన్నకు తెలియకుండా తన దగ్గరున్న పుస్తకాలు, పెన్నులు ఇచ్చేవాడు రాము. ఇద్దరూ కలసి దూరంగా ఓ తోటలో ఆడుకునేవాళ్ళు. ఒకసారి అట్లా తోటలో ఆడుకుంటున్న పిల్లలిద్దరినీ చూశాడు రంగయ్య. కోపంతో అతని కళ్ళు ఎర్రబడ్డాయి. గబగబా రాముని ఇంటికి లాక్కెళ్ళాడు.  సోమయ్యను పిలిపించి పోట్లాటకు దిగాడు. ముందు కొద్దిసేపు తగ్గి ఉన్నాడు సోమయ్య- అటుపైన, అణకువగా ఉంటే కుదరదని గ్రహించినట్లు, అతనూ గొంతు పెంచాడు. ఇద్దరూ ఒకరిని మించి ఒకరు తిట్టుకోవడం భరించలేకపోయారు పిల్లలిద్దరూ. వాళ్లని ఆపడానికి ప్రయత్నించారు. వాళ్లు ఆవేశంగా పిల్లలని తోసివేసారు. కొద్దిసేపు అట్లాగే నిలబడి, రాము మెల్లగా తోట వైపు నడవటం మొదలెట్టాడు. అది చూసిన రాజు అతని వెనకనే వెళ్ళాడు. కొద్దిసేపు పోట్లాడుకున్నాక, ఇక్కడ తండ్రులి-ద్దరూ గొడవ చాలించుకున్నారు. చీకటి పడింది; కానీ పిల్లలు మటుకు ఇళ్ళకు రాలేదు.    రంగయ్య, సోమయ్య ఇద్దరూ పిల్లల కోసం కంగారు పడసాగారు. ఊళ్ళోవాళ్ళంతా చేరి రంగయ్యను, సోమయ్యను చీవాట్లు పెట్టారు. అప్పటికప్పుడు దివిటీలు వెలిగించి పిల్లలను వెతకడానికి బయలుదేరారు అందరూ. రెండు గంటలు గడిచాయి. చంద్రుడి వెలుగులో దూరంగా రెండు ఆకారాలు కనిపించి అందరూ అటు పరుగెత్తారు. అక్కడ, రాము నడుములోతు బురదలో కూరుకుపోయి కనబడ్డాడు. ఇంకా లోనికి జారిపోకుండా అతని నడుముకు గడ్డితో‌అల్లిన త్రాడు ఒకటి కట్టి ఉన్నది. ఆ త్రాడు కొసను పట్టుకొని, బయటికి లాగుతూ అవస్థ పడుతున్నాడు రాజు! ఊళ్ళోవాళ్ళంతా పరుగున వెళ్ళి, వాడికి సాయం చేసి, రాముని బయటికి లాగారు. ఆలోగా రంగయ్య అహంకారం తగ్గి, పశ్చాత్తాపం మొదలైంది. 'మేము మనుషులం కాదా?' అని సోమయ్య అడిగిన మాటలు గుర్తుకు వచ్చాయి.  తన కొడుకుని కాపాడటం కోసం ఆ పిల్లవాడు-రాజు- పడ్డ శ్రమ కళ్ళముందే కనిపిస్తూ ఉన్నది. 'వాళ్ల మానవత్వం ముందు తనెంత?' అన్న ఆలోచనతో రంగయ్య తల వాలి పోయింది. "నాన్నా! నేను ఈ రోజు బ్రతికి ఉన్నానంటే, దానికి కారణం రాజు. అతను ఇంతకు ముందు నన్ను పాము కాటు నుండి కాపాడాడు; ఇప్పుడు ఊబిలోంచి కాపాడాడు. కానీ మీరు మాత్రం వాళ్ళని మనుషులుగానే చూడరు. ఎందుకు నాన్నా, ఇలా క్రూరంగా ప్రవర్తిసారు?" అన్నాడు రాము మెల్లగా, అతని దగ్గరకి వచ్చి నిలబడి. రంగయ్య కళ్ళలో నీళ్ళు వచ్చాయి. "అందరూ నన్ను క్షమించండి బాబూ! అహంకారం కొద్దీ‌ మానవత్వాన్నే మరచాను. ఇంకెప్పుడూ ఇలా చెయ్యను" అన్నాడు. అనటమే కాదు, తన మాటని నిలుపుకున్నాడు రంగయ్య. అందరితోటీ ప్రేమగా మెలగుతూ 'మంచివాడు' అనిపించుకున్నాడు. రాము-రాజుల స్నేహం కలకాలం వర్ధిల్లింది. కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

వెంగళ్ సేనాని

వెంగళ్ సేనాని   అనగనగా ఒక రోజు రాత్రి వాన పడింది. ఆ వానలో ఒక పులి తడిసి ముద్దై, వణుక్కుంటూ ఒక ఇంటి దగ్గరకు వచ్చింది. అప్పట్లో వెంగళప్ప ఒక చాకలిగా ఉండేవాడు. తాగి ఉన్న వెంగళప్ప ఆ పులిని చూసి తన గాడిదే అనుకున్నాడు. "నువ్వు ఇక్కడున్నావా, నీకోసం నేను ఊరంతా‌ తిరిగానే!" అని దాన్ని తిట్టి, చెవి పట్టుకుని ఇంటికి లాక్కెళ్ళాడు. అసలే సగం చచ్చి ఉన్నది పులి. దానికి తిరగబడేంత శక్తి కూడా లేదు. ఇంకేమీ చెయ్యలేక అది నోరు మూసుకొని వాడి వెంట వెళ్ళి, గాడిద స్థానంలో కూర్చున్నది. తెల్లవారు జామున వెంగళప్ప భార్య తలుపు తెరిచి, గాడిద స్థానంలో కూర్చొని ఉన్న పులిని చూసి, భయంతో కేకలు వేసింది. వెంగళప్పని లేపి, "పులిని కట్టేసావేంటి?" అని అడిగింది. రాజ భటులకు, జంతుశాఖ వారికి కబురు వెళ్ళింది. వాళ్ళు వచ్చి పులిని బంధించి తీసుకెళ్ళారు. అంతలో రాజుగారికి మన వెంగళప్పని చూస్తే ముద్దు వేసింది.   "అంత పెద్ద పులిని ఆయుధం లేకుండా పట్టుకొచ్చాడు! ఇక వాడి దగ్గరే ఆయుధం ఉంటే, ఇంక ఎదురేముంటుంది?!" అనుకున్నాడు. వెంటనే వెంగళ్‌ని తన సేనాధిపతిగా చేసుకున్నాడు. ఐదు రోజులకే శత్రువులు పెద్ద సైన్యం వెంటపెట్టుకొని యుద్ధానికి వచ్చారు. రాజుగారు కులాసాగా నవ్వి, "మా సేనాధిపతి ఒక్కడే చాలు- వాళ్లందరికీ బుద్ధి చెప్పేందుకు!" అని వెంగళప్పకి ఓ గుర్రం ఇచ్చి, దీవించి, "ఇకపోయి, విజయంతో తిరిగి రా!" అని పంపించేసాడు. వెంగళప్పకేమో, మరి, గుర్రం ఎక్కటం కూడా రాదు. నానా కష్టాలు పడి, చివరికి ఎట్లాగో వెనక్కు తిరిగి ఎక్కి, కళ్ళు మూసుకొని, కళ్ళెం గట్టిగా పట్టుకొని కూర్చున్నాడు. గుర్రం తన అలవాటు కొద్దీ యుద్ధరంగం వైపుకు పరుగు తీసింది. కళ్ళు తెరిచిన సేనాపతి ఇప్పుడు దాన్ని ఆపేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నాడు. అంతలో అది ఒక తాడిచెట్టు క్రిందుగా వెళ్ళింది.   ధైర్యం తెచ్చుకున్న వెంగళ్ గుర్రం మీది నుండి తాటి చెట్టు మీదికి దూకి, దాన్ని కౌగలించుకున్నాడు. ఆ అదురుకి తాటిచెట్టు ఊగటం, దాని పైనున్న కల్లుకుండ ఒకటి జారి గుర్రం తలమీద పడటం అకస్మాత్తుగా జరిగిపోయాయి. కళ్ళు కనపడని గుర్రం గిరగిరా‌ తిరుగుకుంటూ శబ్దం ఎటు వినబడితే అటు దూక్కుంటూ పోయింది. శత్రువులు దాన్ని చూసి జడుసుకున్నారు. "రాక్షసుడురోయ్! పారిపోండి!" అని చెల్లా చెదరైపోయారు. నడుచుకుంటూ వెనక్కి తిరిగొస్తున్న సేనాపతిని చూసి ఊళ్ళోవాళ్లంతా పూలవర్షం కురిపించారు. కానీ ఆ సరికి బుద్ధి వచ్చిన వెంగళప్ప రాజుగారికి దండం పెట్టి, ఏం జరిగిందో వివరిస్తుంటే సభలో వాళ్లంతా కడుపుబ్బ నవ్వారు. "ఆ శత్రువులెవరో పిరికివాళ్ళు కాబట్టి సరిపోయింది- లేకపోతే ఇంకేమీ ఉండకపోవును! నాకు ఇంక ఈ పని వద్దు ప్రభూ! నన్ను వదిలేస్తే వెళ్లి బుద్ధిగా నా చాకలి పని నేను చేసుకుంటాను" అని ప్రాథేయపడ్డాడు వెంగళప్ప! అర్థం చేసుకున్న రాజుగారు కూడా నవ్వుతూ సరేనన్నారు! కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

ఒక్క సుగుణం

ఒక్క సుగుణం   రంగడు ఓ గజదొంగ. దొంగతనాలే వృత్తి, ప్రవృత్తులు వాడికి. రక్షకభటులకు దొరకకుండా తిప్పలు పెడుతూ, ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నాడు. ఒక రకంగా చూస్తే అవసరమే ఆ యువకుడిని దొంగగా మార్చింది అనచ్చు. అతను చక్కగా చదువుకుంటున్న రోజుల్లో తండ్రి పోయాడు; కుటుంబ భారం మొత్తం అతని తలపై పడింది; సంపాదనా మార్గాలు గగనమయినాయి. సరిగ్గా ఆ సమయంలోనే అతనికి ఒక గజదొంగతో స్నేహం కుదిరింది. దొంగదారి పట్టాడు; పుష్కలంగా ధనం సంపాదించాడు. వాడి సంపాదనని చూసిన తల్లికి అర్థమైంది- కొడుకు దారితప్పాడని. అయినా ఆమె ఉదాసీనంగా ఉండిపోయింది తప్ప, కొడుకుని సంస్కరించడానికి ప్రయత్నించలేదు. అవి పండుగ రోజులు. ఊరు అంతా సంబరాల్లో‌ మునిగి ఉంది. ఇళ్ళు దోచుకోవడానికి చాలా అనువైన సమయం‌. రాత్రి తొమ్మిదిగంటల ప్రాంతాన ఒక సంపన్నుడి ఇల్లు దోచుకొని, ఇంటి కప్పులమీదనుంచి పారిపోతూ ఉన్నాడు రంగడు. అనుకోకుండా వాడి కాలు జారింది! దొర్లుకుంటూ‌ పోయి ఒక దేవాలయ ప్రాంగణంలో పడ్డాడు. ఆ పడటంలో వాడి కాలు బెణికింది; మోకాళ్లు దోక్కుపోయాయి. అయినా వాడు పడిన చోటు చీకటిగా ఉండటం వల్లనో ఏమో, ఎవరూ వాడిని గమనించలేదు.  ఆ సమయంలో మహాత్ముడొకాయన గుడిలో భాగవతం చెబుతున్నాడు. "భగవంతుడిని శరణుజొచ్చిన వాడికి ఇక దు:ఖం ఉండదు. సంపూర్ణ శరణాగతి మనిషిని అన్ని బంధాలనుండి విడుదల చేస్తుంది.." అంటూ. రంగడికి దొంగతనాలు నేర్పిన గురువు వాడికి ఏనాడో చెప్పి ఉన్నాడు: "ఎట్టి పరిస్థితుల్లోనూ నీతి బోధలు జరిగే ప్రదేశాలకు వెళ్ళొద్దు" అని. అయినా అసంకల్పితంగా కొన్ని నీతి వాక్యాలు, ఇలా వాడి చెవిన పడ్డాయి. అట్లాంటి మంచి సంగతులు జీవితంలో ఏనాడూ విని ఉండని రంగడికి అవన్నీ అద్భుతంగా అనిపించాయి! కొంత సేపటికి ప్రవచనం పూర్తయింది. జనాలు ఇళ్ళకు వెళ్ళిపోయారు. ఎవ్వరూ లేని జాడ చూసి, రంగడు మెల్లగా కుంటుకుంటూ ఆ మహాత్ముడి దగ్గరికి పోయాడు. వాడిని చూసి ఆదరంగా నవ్వాడాయన. రంగడు ఆయనతో " అయ్యా! అనుకోకుండా నేను ఇవాళ్ల మీ ప్రవచనం విన్నాను. భగవంతుడికి పాపాత్ములు, పుణ్యాత్ములు అనే తేడా లేదన్నారు. ఎవరు శరణాగతి చెందితే వారిని ఆయన అనుగ్రహిస్తాడన్నారు. నిజమేనా?" అని అడిగాడు. ఆయన తల ఊపుతూ "పూర్తిగా నిజం నాయనా! కానీ ఆయన అనుగ్రహం కావాలంటే మనలోని దుర్గుణాలను వదిలిపెట్టాలి" అన్నాడు. రంగడు గట్టిగా నవ్వి, ఆయనతో "స్వామీ! నా పేరు రంగడు. నేనొక పెద్ద దొంగను. రాత్రిళ్ళు ప్రజల్ని దోచుకుంటాను; పగటి పూట జూదగృహానికి వెళ్ళి జూదం ఆడుతాను; ఇష్టం వచ్చినప్పుడల్లా సారాయి తాగుతూ విలాస జీవితం గడుపుతాను. విపరీతంగా అబద్ధాలు చెప్తాను. మీరు చెబుతున్న ప్రకారం చూస్తే మరి నాలాంటి దుష్టుడిని దేవుడు కూడా ఉద్ధరించలేడన్న మాట!" అన్నాడు. "అంత నిరాశ అవసరంలేదు నాయనా! చింత పడనక్కర్లేదు. నీ ఈ దుర్గుణాల్లో ఏ ఒక్కదాన్నైనా దైవం కోసం ఒదులుకోగలవా, నువ్వు?" అని అడిగాడు మహాత్ముడు. "మిగతావేవీ ఒదులుకునే అవకాశం లేదు స్వామీ, నాకు- కానీ ఒక్క అబద్ధాల్ని మటుకు మానేస్తాను. నిజం చెప్పాలంటే అబద్ధాల వల్ల నాకు వస్తున్న లాభం ఏమీ లేదు; నిజం చెప్పడం వల్ల నాకొచ్చే నష్టం కూడా ఏదీ లేదు" అన్నాడు రంగడు, కొద్దిగా ఆలోచించి. "అది చాలు నాయనా! భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు. ఈ రోజునుండి ఎల్లప్పుడూ సత్యమే పలుకు!" అన్నాడు మహాత్ముడు. "భగవంతుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను- ఈ రోజు నుండీ ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడతాను" అని ఆయనకు మాటిచ్చి, వెడలిపోయాడు రంగడు. తరువాత కొద్ది రోజులకే వాడు రాజుగారి ఖజానాకు కన్నం వేసాడు! ఖజానా నిండుగా బంగారు నాణాలు, నగలు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి. ఎక్కడా ఎలాంటి అలికిడీ లేదు. 'ఇంత సొమ్మును తీసుకెళ్ళటం వృధా. మొత్తం ఎత్తుకెళ్తే భటులనుండి తప్పించుకోవటం కూడా కష్టమౌతుంది' అని ఆలోచించి, వాడు కొన్ని బంగారు నాణాలను, నగలను మూటగట్టి తీసుకుపోబోతూ, తలుపు ప్రక్కగా ఓ పీఠం మీద ఉంచిన బంగారు పెట్టెనొకదాన్ని చూసాడు. దాన్ని తెరిచి చూస్తే ధగధగా మెరుస్తూ కనిపించినై, నాలుగు వజ్రాలు! వాటిలోంచి కూడా రెండింటిని తీసి జేబులో వేసుకొని, చప్పుడు చేయకుండా బయటికి నడిచాడు రంగడు. వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు కూడా వాడికి కావలివాళ్ళెవ్వరూ ఎదురుపడలేదు గానీ, తను వేసిన కన్నం పరిసరాలలోనే అపరిచితుడొకడు కనపడ్డాడు. చూసేందుకు వాడూ ఓ చిన్నపాటి దొంగలాగా ఉన్నాడు- వాడు రంగడిని ఆపుతూ "ఎవరు నువ్వు? ఇక్కడికి ఎలా వచ్చావు? ఏంచేసావు?!" అని అడిగాడు గద్దిస్తూ. "నువ్వెవరసలు, నన్ను ఆపేందుకు?" ఒకింత భయంగాను, ఒకింత కోపంతోటీ ప్రశ్నించాడు రంగడు. "నీలాగే నేనూ ఒక దొంగను. కనిపించట్లేదా? మర్యాదగా నువ్వు దోచుకున్న దానిలో సగం నాకివ్వు. లేకపోతే ఇప్పుడే అరిచి రాజభటుల్ని రప్పిస్తాను!" బెదిరించాడు వాడు. "సరేలే, ఈ సొమ్ములో నీదీ ఒక సగం! సరేనా? ఇక అరవకు. కావలివాళ్ళు వస్తుంటారు.. చప్పుడు చేయకుండా బయట పడదాం ఇద్దరం!" అన్నాడు రంగడు వాడితో చేతులు కలుపుతూ.   తోడుదొంగలు ఇద్దరూ చకచకా కన్నంలోంచి బయటపడి, రంగడి ఇల్లు చేరుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం రంగడు తను దోచుకొచ్చిన సొమ్మును రెండు సమాన భాగాలు చేసాడు. నీకు ఏది కావాలో అది తీసుకో, రెండవది నాది. తీసుకున్నాక ఇక వెనుతిరిగి చూడకుండా వెళ్ళిపోవాలి. నీకు-నాకు ఇక ఏలాంటి సంబంధమూ ఉండదు" చెప్పేసాడు. వాడు ఒక భాగాన్ని ఎంచుకొని అక్కడినుండి సంతోషంగా వెళ్ళిపోబోయాడు. రంగడు వాడిని ఆపి- "ఈ సొమ్ములు కాక నేను ఇవిగో, ఇంకో రెండు వజ్రాలు కూడా తెచ్చాను- అక్కడినుండి. ఒకటి నీకు, ఒకటి నాకు. సరిపోయింది. ఇక వెళ్ళు!" అని వజ్రాలు రెండూ వాడికి చూపి, ఒక వజ్రాన్ని వాడి చేతిలో పెట్టి పంపించాడు. తర్వాతి రోజు ఉదయాన్నే రాజభటులు రంగన్న ఇంటిని చుట్టు ముట్టి అతన్ని బంధించారు. సొత్తుతో సహా రాజుగారి ముందు ప్రవేశ పెట్టారు. "నువ్వేనా రంగడివి? మా కోశాగారానికి కన్నం వేసిన దొంగవు నువ్వేనా?" అడిగారు రాజుగారు. రంగడు తల ఊపాడు. "నేనే రంగడిని. ఖజానాకు కన్నం వేసిందీ నేనే" అన్నాడు. "వీడు ఎత్తుకెళ్ళినవి మొత్తం దొరికాయా?" కోశాధికారిని అడిగాడు రాజు. "ఇంకా చాలా ఉండాలి ప్రభూ!" పట్టికనందిస్తూ చెప్పాడు కోశాధికారి. "ఏం చేసావు మిగిలినవాటిని?" రాజు అడిగాడు రంగడిని. రంగడు ఒక్క క్షణం ఆగాడు- "అవి మీకు దొరకవు. మొత్తానికీ‌ శిక్ష నాకే వేయండి" అన్నాడు తాపీగా. "ఎందుకు దొరకవు?" అడిగాడు రాజు. "నీ తోడుదొంగలతో పంచుకొని ఉంటావు. అంతేగా? వాళ్లనీ‌ పట్టుకుంటాం! ఎవరు వాళ్ళు? ఎక్కడుంటారు?" గర్జించాడు. "ఒక్కడే ఉన్నాడు- అయినా వాడెవడో నాకు తెలీదు- సొత్తుని మేమిద్దరం సమానంగా పంచుకున్నాం" చెప్పాడు రంగడు. సభలో అధికారులంతా నవ్వారు. "నీ తోడుదొంగ ఎవరో నీకు తెలీదా? ఒరే, మర్యాదగా వివరాలు అందించు, ప్రభువులవారికి కోపం తెప్పిస్తే ఏమౌతుందో నీకు తెలీదు" హెచ్చరించాడు కోశాధికారి. "నేను అబద్ధాలు చెప్పనని ప్రమాణం చేసాను. అబద్ధం ఆడను. నిజంగానే వాడెవరో నాకు తెలీదు" అన్నాడు రంగడు. "దొంగట! అబద్ధాలు చెప్పడట! నీతిమంతుడు!!" వెటకరించారొకరు. "ప్రభూ! వీడిని మాకు అప్పగించండి. నిజం కక్కిస్తాం!" ఆవేశంతో ఊగిపోయాడు కోశాధికారి. "అవసరం లేదు. ఎవరక్కడ- మా మందిరంలో మూలగా ఒక మూట ఉంటుంది- దాన్ని తీసుకురండి!" భటుల్ని ఆదేశించారు రాజుగారు. నిజంగానే రాజమందిరంలో ఒక మూట కనబడింది. భటులు దాన్ని తీసుకొచ్చి రాజుగారి ముందు పెట్టారు. "ఇదేగా? నీ తోడు దొంగతో పంచుకున్నది?!" వెటకారంగా నవ్వి, "దీన్ని కూడా కలుపుకొని లెక్క సరిచూడండి!" కోశాధికారిని ఆదేశించాడు రాజు. "ఇది మీకెక్కడ దొరికింది?" రాజుగారిని పరిశీలనగా చూసి ఆశ్చర్యంతో నోరు తెరిచాడు రంగడు. అంతలో కోశాధికారి లెక్క చూసి చెప్పాడు- "ఇంకో మూడు వజ్రాలుండాలి ప్రభూ!" అని. రాజుగారు రంగడితో కఠినంగా "నువ్వు ద్రోహివి, అబద్ధాలకోరువి కూడా! మిగిలిన రెండు వజ్రాలూ ఏవి?" అన్నాడు. "ప్రభూ! మూడు వజ్రాలు!" సరిచేసాడు కోశాధికారి. "లేదు- నేను తీసుకెళ్ళింది రెండే వజ్రాలు! నేను అబద్ధాలు చెప్పను! రెండు వజ్రాల్ని అక్కడే పెట్టెలో వదిలేసి వెళ్ళాను!" మొండిగా అన్నాడు రంగడు. "ఒకటే దొరికింది. ఇంకా నువ్వు ఎత్తుకెళ్ళినవి మూడు వజ్రాలు రావాలి!" అరిచాడు ఒక భటుడు. "వీడిని మాకు అప్పగించండి ప్రభూ! అన్నింటినీ‌ కలిపి కక్కిస్తాం!" కోపంగా అరిచాడు కోశాధికారి. సభలో వాళ్లంతా "అవును!‌అవును!" అని అరిచారు. "అవసరం లేదు. ఇదిగో, మరొక వజ్రం! ఇక మీరు దొంగిలించిన రెండు వజ్రాలనూ తక్షణం మాకు సమర్పించండి!" తన జేబులోనుండి ఒక వజ్రాన్ని తీసి ఇస్తూ కోశాధికారిని ఆజ్ఞాపించారు రాజుగారు. నోటమాటరాని కోశాధికారి బిత్తరపోయాడు. తల వంచుకొని నిలబడిపోయాడు. అకస్మాత్తుగా సభలో‌ నిశ్శబ్దం అలుముకున్నది. భటులు కోశాధికారిని సోదా చేస్తే మిగిలిన రెండు వజ్రాలూ బయటపడ్డాయి. "గాదె కింద పందికొక్కు, మన ఈ కోశాధికారి! ఇలాంటి ఇంటి దొంగలను క్షమించకూడదు. ఇతనికి పదేళ్ల కారాగార శిక్ష విధిస్తున్నాం" తీర్పునిచ్చారు రాజుగారు. నిర్ఘాంతపోయిన సభికులకు సంగతి యావత్తూ వివరించారు రాజుగారు- "ఈ రంగడు దొంగే అయినా నిజంగా సత్యవాది. కొన్నాళ్ళ క్రితం మన గుడిలో గురువుగారిచ్చిన ప్రవచనం విన్నాక, వీడి మనసు కరిగింది. 'మిగిలిన తప్పులు ఏవైనా చేస్తానుగానీ, అబద్ధం మటుకు ఆడన'ని ప్రమాణం చేసాడు ఇతను! ఆ సమయంలో నేను మారువేషంలో అక్కడే ఉన్నాను; నాటినుండీ ఇతన్ని గమనిస్తూ వచ్చాను! నిజంగానే వీడు అబద్ధాలు ఆడటంలేదని గ్రహించాను. వాడిని పరీక్షించేందుకే, మన ఖజానాకు వాడు కన్నం వేయబూనినప్పుడు, ఆ మార్గాన్ని కూడా సుగమం చేసాను. దొంగిలించి బయటికి రాగానే వాడికి ఆగంతకుడిగా ఎదురై, తోడుదొంగ వేషం వేసిందీ, ఇంటికి వెళ్ళి వాడితో వాటాలు పెట్టుకున్నదీ కూడా నేనే. ఆ సమయంలో కూడా వాడు మాట నిలుపుకొని, సొత్తుని సమానంగా పంచి ఇచ్చాడు. వాడు దొంగిలించింది రెండు వజ్రాలేనని నాకు ఆ సమయంలోనే తెలుసు! ఇక కొద్ది కాలంగా మన ఖజానా లెక్కల్లో తేడాలు వస్తున్నాయి.. కోశాధికారిలో నిజాయితీ కొరవడిందని అనుమానం ఉండింది. రంగడిని సాకుగా చేసుకొని, అమూల్యమైన వజ్రాలను రెండింటిని దోచుకోబోయి, అడ్డంగా దొరికిపోయాడు మన ఇంటిదొంగ!.. ఇప్పుడిక ఈ రంగడికి శిక్ష విధించాల్సి ఉంది" అగారు రాజుగారు. అందరూ ఆసక్తిగా చూసారు.    "నిజాయితీగల రంగడిని మన ఖజానాకు ముఖ్య కాపలా అధికారిగా నియమిస్తున్నాం. కాలాంతరంలో మనకు కోశాధికారి కూడా అయ్యే అవకాశాన్నిస్తాం. అతనికి ఈ శిక్ష నేటినుండే అమలులోకి వస్తుంది" ప్రకటించారు రాజుగారు. సభికులంతా హర్షధ్వానాలు చేసారు. ఈసారి ఆశ్చర్యపోవటం రంగడి వంతయింది. "ఒక్క దుర్గుణం దూరం చేసుకుంటేనే భగవంతుడు తనకి ఇంతటి అవకాశం ఇచ్చాడే, మరి పూర్తిగా సన్మార్గం అవలంబించి, సంపూర్ణంగా శరణాగతి చెందితే మరెంత కృపావర్షం కురిపిస్తాడో కదా!" అనిపించింది వాడికి. సంతోషంతో కన్నీళ్ళ పర్యంతమై చేతులు జోడించాడతడు. ఆ క్షణాన అతనిలో మొదలైన పరివర్తన అతన్ని ఆదర్శప్రాయుడయిన పౌరునిగా మార్చింది! కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో