ఒంటి కన్ను రాక్షసుడి కథ

ఒంటి కన్ను రాక్షసుడి కథ   అనగనగా ఒక ఊళ్లో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. వాళ్ళకొక అందమైన చెల్లెలు ఉండేది. ఆ ఇద్దరు అన్నదమ్ముల పేర్లు రిషి, సాయి. వాళ్ళ చెల్లెలి పేరు వసుంధర. వసుందర అన్నం, ముద్దపప్పు చాలా బాగా చేస్తుంది. అదే ఊరికి అవతల ఒక అడవి ఉండేది. ఆ అడవి చాలా దట్టంగా, బలే అందంగా ఉండేది. అయినా అటువైపుకు అసలు ఎవ్వరూ వెళ్ళేవాళ్ళు కారు. ఎందుకంటే ఆ అడవిలో అనేక కౄరమృగాలు ఉండేవి. వాటన్నిటికంటే ఎక్కువ, అక్కడ ఒక గుహలో ఒంటి కన్ను రాక్షసుడు ఒకడు ఉండేవాడు. వాడు చాలా భయంకరుడు. వాడి చేతికి చిక్కినవాళ్ళెవ్వరూ ఇంత వరకూ తిరిగి రాలేదు. అయితే ఎందుకనో, వాడు మటుకు అడవిని దాటి ఊళ్ళోకి వచ్చేవాడు కాదు. అందుకని ఊళ్ళోవాళ్ళంతా బ్రతికిపోతున్నారుగానీ, లేకపోతే ఒక్కరు కూడా మిగిలే వాళ్ళు కాదు ఒకసారి వసుంధరకు ముద్దపప్పు చేయాలనిపించింది. మంచి ముద్దపప్పు తయారవ్వాలంటే సన్నటి పుల్లల సెగ మీద పప్పుని రెండు గంటలపాటు ఉడకబెట్టాలి. "చాలా పుల్లలు ఏరుకు రండిరా, అన్నయ్యలూ" అని చెప్పింది అన్నలకు. అన్నలిద్దరూ పుల్లలకోసం ఊరంతా వెతికారుగానీ, ఏమన్ని దొరకలేదు. వాళ్ళు తమకు దొరికిన కొన్ని పుల్లల్నీ తీసుకొచ్చి "ఇదిగో, వీటితో సర్దుకో- ఇంక పుల్లలు దొరకవు" అని చెప్పేసారు.   వసుంధరకు కోపం వచ్చేసింది. "పుల్లలు కూడా దొరక్కపోతే ఇదేం ఊరు?" అని అరిచి, చకచకా బయటికి పోయి చూసింది. నిజంగానే ఎక్కడా పుల్లలు లేవు! అట్లా సగం అవసరంతోటీ, సగం కోపంతోటీ విసవిసా నడుచుకుంటూ అడవిలోకి అడుగు పెట్టేసింది. అసలు ఆ అడవిలోకి ఎవ్వరూ మనుషులు పోరు కదా, అందుకని అక్కడంతా చాలా పుల్లలే ఉన్నాయి. సంతోషంగా వాటిని ఏరుకుంటూ ఉండిపోయింది వసుంధర. అకస్మాత్తుగా అక్కడంతా చీకటి ఐపోయింది. ఏంటా అని చూస్తే రాక్షసుడు! వాడు వసుంధరను ఒక్క చేత్తోటే ఒడిసి పట్టుకొని తన గుహవైపుకు నడవసాగాడు! వసుంధర ఎంత పెనుగులాడితే మటుకు, ఏం ప్రయోజనం?! వాడికున్న బలం ముందు తన శక్తి ఎందుకూ పనికిరాలేదు! "చెల్లి ఇంకా తిరిగి రాలేదేమి?" అని అన్నలిద్దరూ ఊరంతా వెతికారు. చివరికి తన కాలి గుర్తుల ఆధారంగా తను అడవిలోకి వెళ్ళిందని గుర్తించారు. ఆవేశంకొద్దీ ధనస్సు, బాణాలు పట్టుకొని, వాళ్ళు కూడా అడవిలోకి దూరారు. ఇంకేముంది? రాక్షసుడు వాళ్ళిద్దరినీ కూడా పట్టుకునేసాడు! పెద్దగా నవ్వుకుంటూ వాళ్ళను కూడా తీసుకెళ్ళి గుహలో పడేసాడు.అటుపైన గుహకు ఒక పెద్ద బండరాయిని అడ్డం పెట్టి, ఉషారుగా ఈల వేసుకుంటూ అడవిలోకి బయలుదేరి పోయాడు! చూస్తే అక్కడ గుహలోనే ఉంది వసుంధర! గుహలోనే ఒక మూలకి పొయ్యి వెలుగుతున్నది. పొయ్యిమీద కుతకుతా ఉడుకుతున్నది, ముద్దపప్పు! అన్నలిద్దరినీ చూసి ఆ పాప చాలా సంతోషపడింది. "మీరొచ్చేసారుగా, ఇంకేమీ పర్లేదు. ఇదిగో, ముందు ముద్దపప్పు తినండి" అన్నది సంతోషంగా.   "ఏమీ ఎట్లా పర్లేదు? అయినా నీ ముద్దపప్పే మనల్ని ఇంత కష్టాల్లోకి తీసుకొచ్చింది. ఇంతవరకూ వచ్చి కూడా నువ్వు నీ ముద్దపప్పుని వదల్లేదు!" అన్నాడు చిన్నన్న కోపంగా. "అట్లా కోపం చేసుకోకురా అన్నయ్యా! ఉదయం అనగా నన్ను ఇక్కడికి తెచ్చి పడేసాడా, చూస్తే ఇక్కడ చాలా కందిపప్పు కనబడింది. వెంటనే నేను ముద్దపప్పు చేసాను. రాక్షసుడు ఇవాళ్ల మధ్యాహ్నం ఆ ముద్దపప్పుతోటే భోజనం చేసాడు. వాడికి అదేదో చాలా నచ్చినట్లుంది- ఇంకా చేసిపెట్టమని మరిన్ని కందిపప్పులూ, కట్టెపుల్లలూ తెచ్చిపడేసాడు! నిజానికి ఇవాళ్ల రోజంతా ఆ పప్పేదో చేసి పెడుతున్నాను కాబట్టే, నన్ను తినెయ్యలేదు వాడు- లేకపోతే ఈ పాటికి నేను వాడి కడుపులో జీర్ణంకూడా అయిపోయి ఉండేదాన్ని! ఇట్లా రాక్షసుడి వంటదాన్ని ఐపోయాను నేను!" అని కళ్ళనీళ్ళు పెట్టుకున్నది వసుంధర. "లేదులే! అంత కష్టం ఏమీ లేదు. మేం వచ్చేసాంగా? రాక్షసుడిని చంపేసి, నిన్ను కాపాడతాం" అన్నారు అన్నలిద్దరూ. అంతలోనే రాక్షసుడు గుహ తలుపు తెరుచుకొని లోపలికి వచ్చేసాడు. అన్నలిద్దరూ ముద్దపప్పు తింటుండటం చూసి ఆశ్చర్యపోతూ నోరు తెరిచాడు. వాడిని చూడగానే అన్నలిద్దరూ చటుక్కున లేచి నిలబడి, గురిచూసి చెరొక బాణమూ వేసారు వాడి ముఖం మీదికి. తమ్ముడు విసిరిన బాణం వాడి నోట్లో గుచ్చుకున్నది. అన్న వేసిన బాణం‌ పోయి వాడి కన్నులో గుచ్చుకున్నది! ఆ రాక్షసుడి ప్రాణం వాడి కన్నులోనే కదా, ఉన్నది?! అందుకని వాడు కాస్తా టపాలున క్రిందపడి, చచ్చిపోయాడు! వసుంధర, అన్నలు అంతా క్షేమంగా వాళ్ళ ఇల్లు చేరుకున్నారు. అంత పెద్ద రాక్షసుడిని ఈ పిల్లలు ఇద్దరూ చంపేసారని తెలిసి ఊళ్ళోవాళ్లంతా ఎంత ఆశ్చర్యపోయారో చెప్పలేము!   - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

అమ్మతనం

అమ్మతనం     “అబ్బా!” తెల్లని డోరియా చీరపై గులాబీలు క్రాస్ స్టిచ్ కుడ్తున్న ప్రతిమ ఉలిక్కిపడింది.సూది ఎడమచేతి బొటనవేలులో కసుక్కున దిగి రక్తపుచుక్క తెల్లటి చీరపైకి ఎగజిమ్మింది. సూది గుచ్చుకున్న బాధకన్నా తెల్లటి చీరపై ఎర్రటి రక్తంమరక ప్రతిమ సహనాన్ని చంపేసింది.అర్ధగంటనుండీ గమనిస్తూనే ఉంది.ఒకరినొకరు కొట్టుకోవడం, తన్నుకోవడం,రిమోట్ లాక్కోవడమో,దాచేయడమో ఏదో ఒకటి జరుగుతూనే ఉంది.ఏదో సెలవులలో టి.వి.ని కాసేమయినా చూడనీ పాపం,ఎందుకు కట్టడి చెయ్యాలి అని ఊరికే వుంది కాని,ఆమె ఓర్పును పరీక్షిస్తున్నారు ఎనిమిదేండ్ల పెద్దకొడుకు సాత్విక్,ఆరేళ్ల చిన్నకొడుకు రుత్విక్. ‘చక్కగా అమ్మాయిలే నయం, ఇంతరొద ఉండకపోను,అయినా చిన్నాడెందుకు అబ్బా అని అరిచాడు? ’   “మీరిద్దరు అన్నదమ్ములేనా,వాలిసుగ్రీవులా? ”అని అరచింది ప్రతిమ. “వాలిసుగ్రీవులు అన్నదమ్ములే మమ్మీ! ”కిసుక్కుమంటూ పెద్దకొడుకు సాత్విక్ తాను నిద్రపోకముందు తండ్రి దగ్గరవిన్న పురాణాల సారాన్ని తల్లికి వివరించబోయాడు. “రామలక్ష్మణులలాంటి అన్నదమ్ములా లేక వాలిసుగ్రీవులలా బద్ధవైరులా అని నా అర్థం.ఆ సంగతి వదిలేయ్,ఇంతకీ వాడినేం చేసావు అంతలా అరిచాడు! ” తీవ్ర స్వరంతో గద్దించి మరీ అడిగింది ప్రతిమ. “నేనేం చేయలేదు”. రోషంగా తలెగరేసాడు సాత్విక్.   -2- “అన్నీ అబద్ధాలే మమ్మీ ఇక్కడ చూడు చేతిమీద గోరుతో గిచ్చాడు. ” గాటుపడిన చేతిని చెయ్యిచాపి చూపించాడు రుత్విక్.  “మరి నా చెయ్యి చూడు మమ్మీ ఎలా కొరికాడో!దద్దురు తేలిన చేతిని తల్లికన్నుల దగ్గరకు చాపి చూపించాడు రుత్విక్.పంటిగాట్లు కూడా లోతుగానే పడ్డట్లున్నాయి.రక్తం రాలేదుకాని గూడు కట్టినట్లయింది. “ఏరా ఒకటివ్వాలా!ఐనా పెద్దవాడివి సర్దుకుపోలేవూ-రిమోట్ దగ్గర గిచ్చి కొరుక్కుంటారా కాట్లు పడేటట్లు! ఛీ..ఛీ మీతోవేగలేకపోతున్నాను” అంటూ టి.వి. ఆఫ్ చేసింది ప్రతిమ. వేసవి సెలవులయినా,పండుగ సెలవైనా పిల్లలకు ఆటవిడుపే కాని పిల్లలతో వేగాలంటే ఒకింత కష్టమే1 ఇక వేసవి సెలవులు ఇచ్చారంటే పిల్లల అల్లరి భరించి మళ్లీ బడికి వెళ్లేదాకా  పిల్లలతో వేగాలంటే  ఇల్లాలికి ఓ తట్టెడు ఓర్పు,బుట్టెడు సహనం ఉండాల్సిందే! “అమ్మా ఇప్పుడు చూడు వాడే కొడుతున్నాడు. ”సాత్విక్ మళ్లీ కేక పెట్టాడు. టి.వి. ఆపేసాక యుద్ధం మరింత సులువయింది.కొట్లాడుకోవద్దని, చక్కగా నెమ్మదిగా ఆడుకొమ్మని చెప్పిచెప్పి విసిగి పోతుంది ప్రతిమ.ఇంకా ఇలాగే ఎన్నాళ్లు వేగాలి? ఏం చేయాలి దేవుడా!అని ఆలోచించసాగింది ప్రతిమ....ఫ్లాష్! అవును ఆపని చెయ్యాలి.అప్పుడువీళ్లఅల్లరి వుండదు ఆగడము ఉండదు. తాత్కాలికంగా ఊరట చెంది ప్రతిమ నిట్టూర్చింది. “ఏమంటున్నారు పుత్రద్వయం?ఎక్కడా సందడే లేదే! ”ఆఫీసునుండి వచ్చిన రఘు ,రోజూ పిల్లల గొంతులనుండి వెలువడే గలగలల ఆహ్వానం వినబడక ప్రతిమను ఆశ్చర్యంగా ప్రశ్నించాడు.                             -3-    డిజైన్ కుట్తున్న చీరను చిరాగ్గా ప్రక్కకు పడేసి “ఇద్దరికీ రెండు తగిలించాను.ఏడ్చి పడుకున్నారు. ” అంది ప్రతిమ. “అయ్యో! ఎండకు తోడు డోలు కూడా వాయించావా మరి నిన్ను నువ్వు కొట్టుకున్నట్టు అలా వున్నావేం? ”నవ్వాడు రఘు  “మీకు నవ్వులాటగానే వుంటుంది.నా అవస్థ మీకేంతెలుసు ? ” “సెలవులుకదా!చిన్నపిల్లలకు తోచదు మరి. ”టై విప్పి టేబిల్ మీద పడేస్తూ బెడ్ రూమ్ లో నిద్రపోతున్న పిల్లలను ముద్దుపెట్టుకున్నాడు రఘు. “మీకేం తీరికగా సాయంత్రానికి వస్తారు.సెలవులనేకాదు,బడి వున్న రోజులయితే మాత్రం ఏమి తక్కువ!బడికి పంపాలంటే యజ్ఞం,బడినుండి వచ్చాక చదువుల హోమం! అన్నీ భుజాన వేసుకుని మోసే భారంనాది. ” నిష్ఠూరమాడింది ప్రతిమ. “సరిసరి దండకమేనా ,కాఫీలాంటిదేమైనా వుందా? ”భార్య మాటలకు అడ్డుకట్ట వేసాడు రఘు. వేడికక్కుతున్న కాఫీకన్నా మరింత మండిపడుతున్నట్టుంది ప్రతిమ.భార్య అందించిన కాఫీ త్రాగుతూ,   “కూల్ డౌన్ ప్రతిమా,ఏమిటి ఈ వేళ వర్క్ లోడ్ పెరిగిందా?పైగా ఎంబ్రాయిడరీ ఎక్స్ ట్రా వర్క్ పెట్టుకున్నావు” సానుభూతిగా అన్నాడు రఘు. “ఆ...... నా మానసికానందానికి చేసే పని మాత్రం మీకు ఎక్స్ ట్రాగా కనబడుతుంది.మీ పిల్లల అల్లరి మాత్రం ముచ్చటగా ఉంటుంది.అసలు ఎగ్జామ్స్ రాయించేసరికి దేవుడు కనబడ్డాడు.ఇక ఈ సెలవులలో నాకు పిచ్చెక్కేటట్లుంది. ”అంది ప్రతిమ విసుగ్గా.        -4- “ఏం చేయమంటావ్ మళ్లీ పాత పాట మొదలెట్తున్నావ్ ”అన్నాడు విసురుగా. ఆ విసురును కాఫీ కప్పు పెట్తున్న వైనంలో చూపాడు రఘు. “నాది పాటలాగే వుంటుంది మీకు.నా పాట్లు మాత్రం అర్థం చేసుకోలేరు.నేను మాత్రం తల్లినికానా? పిల్లలను క్రమశిక్షణలో పెంచాలనుకోవడం తప్పా?ఈ సంవత్సరం నామాట వినండి.ఆ తరువాత చూడండి మన పిల్లలలో మార్పు.! ” అంటూ తన మనస్సులో కోరికను బయటపెట్టింది.భర్త అంగీకారం కోసం ఆశ,అర్థింపు కలగలిపి కోరుతోంది ప్రతిమ. “అబ్బ నీ ఫ్రెండ్ వార్డెన్ అయితే అయింది కానీ నీకు మాత్రం భలే ఉబలాటంగా ఉంది నీ కొడుకులను హాస్టల్ లో చేర్పించాలని” నిష్ఠూరంగా అన్నాడు రఘు. “ఈ ఒక్కసారికి నా మాట వినండి. నా ఫ్రెండ్ వార్డెనే కాదు ఆ స్కూల్ ప్రిన్సిపాల్ కూడా! చాలా స్ట్రిక్ట్ మనిషి.డిసిప్లిన్ కు పెట్టింది పేరు.ఏమంటారు? ”ఆసక్తిగా భర్త వంక చూసింది ప్రతిమ. రఘు ఆలోచనలో పడ్డాడు. ‘కనీసం రోజుకొక్కసారైనా హాస్టలు ప్రసక్తి రాకుండా గడవడం లేదు.ప్రతిమ తనను జీడిపాకంలా పట్టుకుంది.పిల్లల అల్లరి శృతి మించుతోందని తల్లిదండ్రులకు దూరంగా ఉంటేనే క్రమశిక్షణతో పెరుగుతారని నొక్కి మరీ చెప్పే ప్రతిమ భావాన్ని తాను మార్చగలనా! ’ అనుకున్న రఘు,సరే చూద్దాం పిల్లలు మారఢం ఎలా వున్నా ప్రతిమ మారుతుంది,విసుగు,చిరాకు తగ్గుతుంది అనుకుని ప్రతిమను కావాలసిన ఏర్పాట్లు చేసుకోమన్నాడు. ఎట్టకేలకు భర్త ఒప్పుకున్నందుకు ప్రతిమ చాలా సంతోషపడింది.పిల్లలు హాస్టల్లో స్వతంత్రంగా అన్నీ చేసుకోవడం నేర్చుకుంటారని,బుద్ధిగా హోం వర్క్ చేసుకుంటారని,క్రమశిక్షణ నేర్పే స్నేహితురాలు వార్డెన్ గా వుండటం తన అదృష్టం అని ,ఆమెదగ్గర పిల్లల అల్లరి    -5- తగ్గిపోయి,బాగుపడి వృద్ధిలోకి వస్తారని తలపోస్తూ పిల్లల ప్రయాణానికి తగిన ఏర్పాట్లు చేసుకోసాగింది. పిల్లల అల్లరి,ప్రతిమ అరుపులు చర్వితచర్వణంగా సెలవులు గడిచిపోయి స్కూళ్లు తెరిచే టైమయింది.హాస్టలుకువెళ్లాలి అని తల్లి బట్టలు సర్దుతుంటే  పిల్లలు కూడా సంబరంగా సహాయం చేయసాగారు.బట్టలన్నీ సర్దుకుని బ్రష్, పేస్టు, దువ్వెన,సబ్బులు వంటి వస్తువులు ఎవరివి వారు చక్కగా సర్దుకుంటూ ఎవరి వస్తువులు వారికి సమానంగా దొరకుతుంటే సాత్విక్,రుత్విక్ అమితానందపడిపోతున్నారు.పైగా కారులో ప్రయాణం.కొత్త ఊరికెళ్తున్న సంబరం.పిల్లలు కేరింతలు కొడ్తుంటే ప్రతిమకూ సంతోషంగానే వుంది కొద్దిగా బాధనిపించినా  పిల్లల బాగు కోసమే కదా తను వాళ్లను దూరంగా వుంచాలనుకుంటుంది అని మనసుకు సర్ది చెప్పుకుంది.పిల్లల అల్లరి సహజగుణం కదా అన్న అంతరాత్మ ప్రశ్నకు ఉలిక్కిపడి సర్దుకుంది ప్రతిమ. పిల్లలకోసం చాక్లెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు కొని తెచ్చాడు రఘు.ఇద్దరికీ సమానంగా ఇచ్చాడు.రోజూ ఆఫీసునుండి ఇంటికొచ్చేసరికి పిల్లలగొంతులు ఇంట్లో ఇక వినబడవు అని తలచుకుంటేనే రఘుకి ఎంతో బాధగా ఉంది. రుత్విక్,సాత్విక్ మాత్రం రెట్టించిన ఆనందంతో బిస్కెట్లు, చాక్లెట్లు పెట్టెల్లో దాచేసుకున్నారు. ఇవన్నీ దొరుకుతాయని అమ్మ చెప్పినందుకే వాళ్లు హాస్టలుకు వెళ్తామని సిద్ధమయ్యారు. ప్రయాణంలో పాటలు,రైమ్స్ ఒకటేమిటి తల్లి దగ్గర అప్పజెప్పిన పద్యాలు, పాఠాలతో సహా వల్లెవేసి వినిపించేస్తున్నారు.కొత్తబాటలో మరిన్ని  కొత్త పాటలు నేర్చుకుంటారని      -6- ప్రతిమ కలలు కనసాగింది.రఘు మాత్రం పిల్లల ఎడబాటును మౌనంగా దిగమ్రింగుతున్నాడు. పగలంతా ప్రయాణం చేసినట్లే వుంది.ప్రతిమ ముందే ఫోనుచేసినా పెద్దగా వివరాలమీ చెప్పలేదు.భర్తతో,పిల్లలతో వస్తున్నానని ఫ్రెండ్ తో చెప్పింది. “చాలా రోజులకు కనబడ్డావు ప్రతిమా!అయినా మీవారిని,పిల్లలను చూడ్డం  దే ఫస్ట్ టైం. ”ప్రతిమను,రఘును సాదరంగా ఆహ్వానించి ముద్దులు మూటగడ్తున్నట్లున్న రుత్విక్,సాత్విక్ ల బుగ్గలు పుణికి ముద్దెట్టుకుంది ప్రతిమ నేస్తం వెరసి వార్డెన్ ఇందుమతి. “నువ్వలా ముద్దుచెయ్యకు,ఆ తరువాత నీకే కష్టం” ప్రతిమ హెచ్చరించింది. “అదేమిటి! ” అని ఇందుమతి అర్థంకానట్టు చూసింది. “నన్ను కాదు అటు చూడు” ప్రతిమ చూడమన్న వైపు చూసిన ఇందుమతికి రఘు వెంట బరువైన సూట్ కేసులు రెండు మోసుకొస్తున్న వాచ్ మెన్ కనిపించాడు.రఘు తనచేతిలోని బ్రీఫ్ కేస్ ప్రతిమకందించాడు. బ్రీఫ్ కేస్ తెరచి పిల్లల ప్రోగ్రెస్ కార్డులు,ఫోటోలు చూపించింది ప్రతిమ. “ఏమిటి ప్లాన్ మీదున్నావ్” అనుమానంగా అడిగింది ఇందుమతి. “ఇక నీదే భారం వీళ్ల అల్లరిని నేను కంట్రోలు చేయలేకపోతున్నాను. వీళ్లకు క్రమశిక్షణ నేర్పి ఒక దారికి తెచ్చే మార్గం నీవే చూపాలి ”ప్రతిమ వేడుకోలుగా అంది. “అంటే హాస్టల్లో పెట్టేస్తున్నావా” అని ఇందుమతి ఆశ్చర్యంగా అడిగింది. “నీ గురించి అంతా విన్నాను ఇందూ!పైగా కొందరు పేరెంట్స్ మాఊరి వాళ్లు కూడా చెప్పారులే నువ్వు పిల్లలను చాలా స్ట్రిక్ట్ గా కంట్రోలు చేస్తూ అల్లరి చెయ్యనియ్యవని,ఏ          -7- వేళకు చేసే పని ఆ వేళకు మాత్రమే చేయిస్తావని పిల్లలంతా రీడ్ వైల్ యు రీడ్ అన్నట్లు నీ గొంతు వింటేనే పుస్తకాలకు జిగురులా అతుక్కుపోతారని ..... ”నవ్వుతూ చెప్తోంది ప్రతిమ. “ఆ..ఆ...ఇక ఆపు తల్లీ నన్నో వార్డెన్ లా చెప్పావా లేక విలన్ గా చెప్పావా నీ పిల్లలకి” అంటూ ఇందుమతి ప్రతిమ నవ్వుతో శృతి కలిపింది. రఘు స్నేహితురాండ్రనిద్దరినీ గమనిస్తున్నాడు. ‘పాపం పిల్లలు రేపటినుండి తమకు దూరంగా,ఏం చేద్దాం?ప్రతిమకు బి.పి పెరిగిపోతోంది.ఇక ఇలా రాజీ పడక తప్పలేదు.మనసులో దిగులుగా అనిపించింది.ఆఫీసునుండి ఇంటికి రాగానే కనిపించే పిల్లల అమాయక వదనాలిక కరువే’ అనుకుని నిట్టూర్చాడు. తమ కాలేజీ కబుర్లు,తాముండిన హాస్టలు కబుర్లతో కాలాన్నిఐస్ క్రీంలా కరిగించేస్తున్నారు.రఘు పేపరు అడ్డం పెట్టుకుని ఒకటి అరా మాటలలో మాత్రం రెస్పాస్స్ ఇస్తున్నాడు. పిల్లలిద్దరూ తల్లి చెప్పినట్లు అల్లరి చెయ్యకుండా బుద్ధిగా కూర్చున్నారు. కూర్చుని కూర్చుని నిద్రలోకి జారిపోతున్నారు. “మీవారు పిల్లలు అలసిపోయినట్లున్నారు.నేను భోజనాల సంగతి చూస్తాను. ఇక ఈ రాత్రికి రిలాక్స్ అవండి.మీకు గెస్ట్ రూం సిద్ధంగా వుంది.బైదిబై అప్లికేషను ఫారాలు రేప్పొద్దుటే ఇస్తాను.పూర్తిచేసి ఇద్దురుగాని. ”అని కబుర్లకు ఫుల్ స్టాప్ పెట్టింది ఇందుమతి. ఇల్లంతా నిశ్శబ్దంగా వుంది, “మీ వారు, పిల్లలు” అనుమానిస్తూనే అడిగింది ప్రతిమ. “వాళ్లా !వదిలేసా.....అదే ఈ పూటకు వదిలేసా.మా ఆడబిడ్డ ఇంట్లో బర్త్ డే పార్టీకి వెళ్లారు.నువ్వు వినిపించుకోలేదేమో,మీ పిల్లలతో అన్నాగా !కాస్త ముందొచ్చి వుంటే         -8- మీరు పార్టీకివెళ్లి వుండేవారని.వచ్చేస్తార్లే మీరు భోంచేసి రిలాక్స్ అవ్వండి. ”అంటూ డైనింగ్ ఏర్పాట్లకై లేచింది ఇందుమతి. కొత్తవాతావరణం,అసలే ప్రిన్స్ పాల్,పైగా వార్డెన్! సాత్విక్,రుత్విక్ క్యాబేజి కూర ఇష్టంలేకపోయినా వద్దనలేదు.మారాము చెయ్యలేదు. భోజనాలయ్యాయి. ఇందుమతి ఏవో ఫైళ్లు చూసుకుంటోంది .గుడ్ నైట్ చెప్పి వచ్చి పడుకుంది ప్రతిమ.పిల్లలప్పుడే నిద్రలోకిజారుకున్నారు.రఘు నిద్ర నటిస్తున్నాడని తెలుసు. ‘తప్పదు పిల్లలకోసం తనలోని అమ్మ మనసు చంపుకోక తప్పదు. ’ పిల్లలకు బెడ్ షీట్ కప్పింది,తమ వెంట తెచ్చుకున్న జెట్ మ్యాట్ ప్లగ్ లోపెట్టి ఆన్ చేసింది.పిల్లలు రేపటినుండి అన్నీ స్వంతంగా చేసుకుంటారు. రఘు నిద్రలోకి చేరుకున్నట్లు సన్నని గురకే చెప్తోంది.భర్త ప్రశ్నలు ఎదుర్కోవలసి వస్తుందేమోనని అనుకున్నప్రతిమ హమ్మయ్య అని నిట్టూర్చి నిద్రలోకి జారిపోయింది. తెల్లారినట్లుంది.గోలగోలగా ఏడుపులు వినిపిస్తున్నాయి. ఉలిక్కిపడి లేచింది ప్రతిమ.గోడకున్న గడియారం ఎనిమిది గంటలు సూచిస్తోంది. ‘అయ్యో ఇంతగా  నిద్రపొయ్యానా! ’ఇటు తిరిగి చూసింది. పిల్లలింకా మంచి నిద్రలో వున్నారు. ‘ఇదేమిటి ఇలా అయ్యింది? క్రమశిక్షణ ఈ రోజే మొదలవు తుందనుకుంటే తనే  ఆలస్యంగా లేచిందే అనుకుంటూ మెల్లగా లేచివెళ్లి హాల్లోకి తొంగి చూచింది. ఇందుమతి టి,విలో న్యూస్ చూస్తున్నట్లుంది. రఘు ఎప్పటిలానే  పేపరు తిరగేస్తున్నాడు.ఇక పిల్లలు,వార్డెన్ ఇందుమతి పిల్లలు! అల్లరి, ఏడుపు దట్టించి మరీ ఆడుకున్నట్లుంది. హాలంతా రంగు రంగుల కాగితాలు,బెలూన్లు, పిల్లలు ఆడించినట్లు ఆడుతున్నాయి.ఒకరు ఊదిన బెలూన్లు మరొకరు పుల్లతో పొడిచి ఫట్     -9- మనిపిస్తున్నారు.రంగుకాగితాల కంటించిన జిగురు నేలను కూడా ఒలికి హాలంతా అశుభ్రంగా తయారయ్యింది. ఇందుమతివేపు చూసింది ప్రతిమ.క్రాఫ్ట్ క్లాసులో వున్నట్లుగా ఫీలవుతున్నట్లుంది.టి.వి చూస్తూనే పిల్లల అల్లరిని తనే సంభ్రమంగా చూస్తోంది.చిరునవ్వుతో వాళ్ల అల్లరిని ప్రోత్సహిస్తున్నట్లే వుంది.వార్డెన్ లో వున్న నిజమైన అమ్మను చూస్తోంది ప్రతిమ.పిల్లల అల్లరిని మనఃపూర్తిగా భరిస్తోంది. టి.వి ఆఫ్ చేసి ఇటు తిరిగిన ఇందుమతి,ప్రతిమను చూసి నవ్వింది. “లేచావా రాత్రడిగావే ఇదిగో వీళ్లే నా సుపుత్రులు. ”రఘు ప్రక్కనే కూర్చుని వున్న ఇందుమతి భర్త “మా సుపుత్రులు” అని సవరించాడు. అందరు నవ్వుకున్నారు. “ప్రతిమా నేనోగంటలో స్కూలుకు బయలుదేరుతాను.అడ్మిషన్లు చూసుకోవాలి కదా.టీపాయ్ మీద అప్లికేషను ఫారాలు పెట్టాను.ఫిలప్ చేసి స్కూలుకు రండి.వెయిట్ చేస్తుంటాను” అంది ఇందుమతి. ఇందుమతి మాటలను వినిపించుకోనట్లే వుంది ప్రతిమ.ఏదో మార్పు కనబడుతోంది ప్రతిమలో. ఇల్లెగిరిపోయేలా అరుస్తున్న ఇందుమతి పిల్లలవంకే రెప్పవాల్చకుండా చూస్తోంది. ‘తన ఇంటికి ఏమాత్రం భిన్నంగా లేని సన్నివేశం.!ఇంకాస్త అధ్వాన్నంగానే ఉన్నట్లుంది.కొత్తవాళ్లున్నారని కూడాలేదు.తనపిల్లలే నయం. ఎవరింటికెళ్లినా ఎవరైనా వచ్చినా అల్లరి మానేసి బుద్ధిగా ఉంటారు. ’ గదిలోకి వెళ్లి పిల్లలవైపు ప్రేమగా చూసింది.వంగి ఇద్దరి నుదుటి మీద క్రాఫు సవరించి ముద్దులు పెట్టుకుంది. ‘ప్రయాణం సంబరంలో తనవెంటబడి వచ్చారే గాని వీళ్లు తనని వదలి ఉండగలరా?అసలు తనుండగలదా? ’ప్రతిమ ఆలోచనలో పడింది.          -10- “కిటికీ ఊచలకంటుకు పోయి ఆ ఆలోచనలేమిటి ప్రతిమా,నువ్వేం వర్రీ కాకు,నాకప్పచెప్పావుగా ,ఇంతకీ మీ ప్రోగ్రాం ఏమిటి? ”ప్రతిమ భుజంపై చెయ్యివేసి ఆప్యాయంగా అడిగింది ఇందుమతి. “మరోగంటలో బయలుదేరుతాం ఇందుమతీ” అని నిశ్చయంగా అంది ప్రతిమ. “అదేమిటి పిల్లలకు యూనిఫాం,పుస్తకాలు కొనవా? నీవు దగ్గరుండి కొంటే బెటర్ కదా!” ఇందుమతి సలహా ఇచ్చింది. “లేదులే ఇందుమతీ !ఇప్పుడు మేము తయారుగా రాలేదులే” అంది ప్రతిమ. రఘుకేం అర్థం కావడంలేదు.పదివేలు తెచ్చిచ్చాడు.ప్రతిమ మరిలా చెప్తోందేమిటి? ఏదో మాటలాడబోయిన రఘును కళ్లతోనే వారించింది ప్రతిమ. కాఫీ, టిఫన్లు పూర్తయాయి. సాత్విక్, రుత్విక్ లేవగానే గబగబా తయారయిపోయారు.ఇందుమతి పిలల్లు రంగుకాగితాలకై కొట్టుకుంటుంటే తమ అల్లరి గురించి మరచిపోయి చూస్తుండిపోయారు  సాత్విక్, రుత్విక్. కిటికీ ఊచలనుండి తోటలోకి చూస్తోంది ప్రతిమ. సీతాకోక చిలుకలు పువ్వులను పలకరిస్తూ హయిగా విహరిస్తున్నాయి.ప్రతిమ మనసు తేలికై విహంగమైంది. ‘నిద్రపోతున్న పిల్లలను వదలి వెళ్లాలనుకున్న తన కఠిన నిర్ణయాన్ని మనసు వేలెత్తి ప్రశ్నిస్తోంది.కళ్లు తుడుచుకుంది ప్రతిమ.’తన బ్రీఫ్ కేసుతోపాటు పిల్లల సూట్ కేసులను కూడా కారులో తిరిగి పెట్టేస్తుంటే ప్రతిమలో మూసపోసిన అమ్మతనాన్ని కడు వేడుకగా తిలకిస్తున్నాడు రఘు.    రచన: సి. ఉమాదేవి

చిట్టిగాడి ఆకాశయానం

చిట్టిగాడి ఆకాశయానం     చిట్టికి ఆకాశం అంటే ఇష్టం. అది ఎంత చక్కగా నీలం రంగులో ఉంటుందో అని ముచ్చట. ఆకాశంలో ఎగిరే పక్షులంటే ఆశ్చర్యం. 'మనం ఎగరలేమెందుకు?' అని ప్రశ్నలు. ఆకాశం గురించి తెలుసుకోవాలని బలే ఉబలాటం. అస్తమానూ వాళ్ళ అమ్మానాన్నల్ని ఆకాశం గురించి ఏదో ఒకటి అడుగుతూ‌ ఉండేవాడు.   బడికి వెళ్ళి వచ్చాక, కాస్తంత ఏదైనా తిని, మళ్ళీ ఆడుకునేందుకు వెళ్ళేవాడు చిట్టి. ఒకసారి అట్లా ఆడుకుని వచ్చాడు. బాగా అలిసిపోయి ఉన్నాడేమో, వెంటనే నిద్రపట్టేసింది. ఆ వెంటనే వాడు అంతరిక్ష యాత్రకు బయలుదేరాడు. ఎగిరేటప్పుడు మొదట్లో వాడికి రెక్కలు లేవు. కానీ ఒకసారి ఎగిరి మబ్బులలోకి వెళ్తుండగానే వాడికి మబ్బుల్లాంటి రెక్కలు మొలిచాయి. అవి వాడిని ఇంకా పైపైకి తీసుకువెళ్ళాయి.   అట్లా పోతుంటే వాడికి కొంగల్లాగా తెల్లటి రెక్కలు పెట్టుకున్న పక్షులు కలిసి ఎగురుతూ కనపడ్డాయి. చిట్టి వాటి రెక్కలు పట్టుకుని చూశాడు. మెత్తని దూదిలాగా అనిపించినై, అవి. అంతలో వాడి వెనకనుండి నీలం రంగు పక్షులు దూసుకువచ్చాయి. 'ఇదేమి కొత్త పక్షి?!' అన్నట్లు, అవి వాడి వంక కోపంగా చూశాయి. అంతలోనే ఉన్నట్టుండి చిట్టిగాడి శరీరం మరింత తేలికగా అయిపోయింది. 'ఏమిటా' అని చూసుకుంటే వాడి రెక్కలు ఇంకా పెద్దవి అయ్యాయి. ఇప్పుడు రెక్కలు కొంచెం ఊపితే చాలు- చాలా పైకి వెళ్ళిపోతున్నాడు. అట్లా పోతుంటే వాడికి తనలాగే ఎగురుతున్న పెట్టెలు కొన్ని కనిపించాయి. అవి బంగారపు రంగులో మెరుస్తున్నాయి. చిట్టిగాడికి ఆశ్చర్యం వేసింది. 'పెట్టెలు ఎగరటం ఏంటి? వాటిలో ఏముందో మరి, చూడాలి' అనుకున్నాడు. కానీ ఎంత ప్రయత్నించినా వాటి మూతలు తెరుచుకోలేదు. అంతలోనే వాడికి కొంచెం చలి వేయటం మొదలు పెట్టింది. ఒకసారి వణికిపోయాడు; కానీ 'లేదు, అంతరిక్షంలో చలికి తట్టుకోవాలి' అనుకోగానే ఇంక చలి వేయలేదు. అంతలోనే పెద్దగా శబ్దం చేసుకుంటూ ఓ విమానం అటుగా వచ్చింది. 'అది తనని గుద్దుతుందేమో' అని చిట్టిగాడు భయపడ్డాడు కానీ అది చాలా దూరంనుండే మరొక వైపుకు తిరిగి వెళ్ళిపోయింది. చిట్టి "హమ్మయ్య" అని ఊపిరి పీల్చుకున్నాడు.   అప్పుడు వాడు ఉన్న ఆ స్థలం ఏదో తెలిసిన చోటు లాగా అనిపించింది. చూస్తే ఎదురుగుండానే ఇంద్రధనస్సు! వాడికి చాలా సంతోషం వేసింది. వేగం తగ్గించి, ఆ రంగుల ప్రపంచంలోకి దూరాడు. చూస్తూండగానే ఏడు రంగులూ ఒకదాని తర్వాత ఒకటి వాడి మీద కురిసాయి. ఏడేడు రంగులూ వాడికి అంటుకున్నాయి. "అయ్యో, ఈ రంగులు మళ్ళీ వదులుతాయో, వదలవో" అని నవ్వాడు వాడు.   అంతలోనే నెమ్మదిగా వర్షం మొదలయ్యింది. వాడి మీద కురిసిన రంగులన్నీ‌ ఆ వర్షపు నీళ్లలో కొట్టుకుపోయాయి. కానీ ఏమంటే వాడు తడిసి ముద్దయ్యాడు. ఇంకాస్త పైకి ఎగిరేసరికి, వర్షం కాస్తా ఆగిపోయింది. అయితే వాడికి ఇప్పుడు ఒంటరిగా అనిపించసాగింద. "నాతోపాటు నా స్నేహితులు కూడా ఉంటే బాగుండేది" అనుకున్నాడు "మేమందరం కలిసి బంతి ఆట ఆడుకునేవాళ్ళం.. సరే, ఇంక ఎంత సేపని వెళ్తాను ఇట్లా? ఇంటికి వెళ్ళిపోతాను. అమ్మవాళ్ళు వెతుక్కుంటూ ఉంటారు" అనిపించింది వాడికి. "సరే" అని కిందికి చూస్తే ఎక్కడా ఒక్క ఇల్లుకూడా లేదు! "ఎటువైపు పోవాలి ఇప్పుడు?!" అని ఆందోళన మొదలైంది. తికమక మొదలైంది.  అయితే సరిగ్గా అదే సమయానికి నెమ్మదిగా వెలుగు మొదలైంది. ఏవేవో శబ్దాలు వచ్చాయి: "ఒరే చిట్టీ! లెగరా చిట్టీ!" అంటూ, వాళ్ళ అమ్మ గొంతుతోటే. కళ్ళు తెరిచి చూస్తే అమ్మే. నిద్ర లేపుతున్నది: "లేరా చిట్టీ, ఎంతో సేపటినుంచి లేపుతున్నా నిన్ను" అంటూ. చటుక్కున లేచి గడియారం కేసి చూసి "అమ్మో! ఆలస్యం అయిపోయింది" అంటూ బాత్ రూం వైపుకు పరుగు పెట్టాడు చిట్టి.   - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

చేపలు - కప్పలు

చేపలు - కప్పలు   అనగనగా ఒక మడుగులో చాలా కప్పలు, చేపలు ఉండేవి. అవి ఒకదానినొకటి గౌరవించుకుంటూ సంతోషంగా బ్రతికేవి. అయితే ఒక రోజున ఏమైందంటే, ఓ కప్పపిల్ల వెళ్ళి ఒక చేపపిల్లని తినేసింది. దాన్ని చూసింది తల్లి చేప. వెంటనే చేపలన్నీ కలిసి కప్పపిల్లని చుట్టుముట్టాయి. మా చేపపిల్లని ఎందుకు తిన్నావు?" అని నిలదీసాయి. అలా భంగపడిన చేపపిల్ల కోపంతో, సిగ్గుతో ముఖం మాడ్చుకుని ఇల్లు చేరుకున్నది. "ఏమ్మా, ఇంత సేపూ ఎక్కడున్నావు?" అంది తల్లి కప్ప. కప్పపిల్ల చెప్పింది- "నేనేదో ముచ్చటపడి ఒక చేపపిల్లను తినేసరికి చేపలన్నీ నా మీదపడి కొట్టినంత పని చేసాయి" అని. తల్లికప్పకు కోపం వచ్చింది. "ఏమట, మామూలు చేపలకి ఇంత ధైర్యం ఎక్కడినుండి వచ్చింది? ఒక చేపను తింటే అంత రభస ఎందుకు?" అని తన తోటి కప్పలన్నిటినీ పిలువనంపింది. కప్పలు అన్నీ వచ్చాయి. చేపలమీదికి దాడికి వెళ్ళినట్లు వెళ్ళాయి. "ఎవరు, మా కప్ప పిల్లని తిట్టింది? అంత మర్యాద లేకుండా అయినామా?" అన్నాయి. "మీ కప్ప మాచేప పిల్లని తినేసింది- తిట్టకపోతే ఊరుకుంటామా?" అని అన్నది చేప తల్లి. "నాకు ఆకలి వేసింది, కనుక తిన్నాను- ఏం తప్పు?" అంది కప్ప పిల్ల. "అదేం మాట?! మా పిల్లలే మీకు ఆహారమా! ఈ దగ్గరలో వున్న పురుగుల్ని తినచ్చుకదా!" అంది చేప తల్లి, రోషంగా. "జరిగిందేదో జరిగిందిలెండి. ఇక నుంచి మీ జోలికి మేము రాము" అంది కప్పతల్లి, కొంచెం దిగివచ్చి. "మీరు మా జోలికి వస్తే ఊరుకుంటామా?" అన్నాయి చేపలు. "మా చేపపిల్లని తిన్న ఆ కప్పపిల్లను మాకు అప్పగించాలి- అది మేం వేసే శిక్షను అనుభవించాలి. అప్పుడే మేం ఊరుకునేది" అని పట్టు పట్టాయి. "పిల్లవాడు, తెలీక ఏదో చేస్తే దాన్ని పెద్దది చేయకూడదు. ఊరికే శిక్ష-గిక్ష అని మాట్లాడతారేమి?" అన్నాయి కప్పలు. గొడవ పెద్దదయిపోతుండగా కప్ప పిల్ల ముందుకు వచ్చింది అకస్మాత్తుగా- "సరే, కానివ్వండి. మీరు ఏ శిక్ష వేస్తే ఆ శిక్ష భరించటానికి సిద్ధంగా ఉన్నాను. ఊరికే చేపపిల్లను తినటం తప్పే, నేను నా తప్పును ఒప్పుకుంటున్నాను" అన్నది. తల్లికప్పతో సహా కప్పలన్నీ నిశ్శబ్దం అయిపోయాయి. చేపలన్నీ గెలిచినట్లు సంబరపడ్డాయి. కప్పలన్నీ కళ్ళనీళ్ళు పెట్టుకొని, రోషంగా వెనక్కి మళ్ళాయి. అంతలో తల్లిచేప అడిగింది మిగిలిన చేపల్ని-"దీనికి ఏం శిక్ష విధిద్దాం?" అని. "చంపేద్దాం" అన్నాయి కొన్ని. "నీ ఇష్టం- నువ్వు ఏ శిక్షంటే ఆ శిక్ష విధిద్దాం" అన్నాయి కొన్ని చేపలు. ఒక్క ముసలి చేప మటుకు "దాన్నేం చేయద్దు- ఊరికే వదిలేద్దాం" అన్నది. తల్లి చేప ఒక్క క్షణం పాటు ఆలోచించింది- "నిజమే.. దీన్ని వదిలేద్దాం. పశ్చాత్తాప పడింది కదా, అది చాలు. దీని ప్రాణాలు తీసినంతమాత్రాన నా బిడ్డ బ్రతికి వస్తుందా, ఏమి?" అన్నది. ఆ సరికి 'చేపలన్నిటినీ ఎలా చంపెయ్యాలి?'అని వ్యూహం రచిస్తున్నాయి కప్పలు. అకస్మాత్తుగా "ఆగండి! ఆగండి! నేనూ వస్తున్నాను" అని అరుస్తూ వస్తున్న తమ కప్పపిల్లని చూసి అవన్నీ ఆశ్చర్యపోయాయి. దాన్ని ఏమీ చెయ్యకుండా వదిలేసిన చేపలంటే వాటికి చాలా గౌరవం కల్గింది.  వెంటనే వెనక్కి వెళ్ళి చేపలకు ధన్యవాదాలు చెప్పుకున్నాయి.  "ఏమీ పర్లేదులే, తప్పులు అందరూ చేస్తూనే ఉంటారు. తెలివిగా వాటిని దిద్దుకుంటే అంతే చాలు" అన్నాయి చేపలు, హుందాగా. అటుపైన ఆ చెరువులో చేపలు, కప్పలు హాయిగా కలసి జీవించాయి. క్షమించటంలో గొప్ప శక్తి ఉన్నది. - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

మంచికి మంచి

మంచికి మంచి   గిరి వాళ్ళ నాన్న వీరయ్య కష్టజీవి. వాళ్ళు పడే కష్టం తెలుసు గనకనే ఇంటి దగ్గర చాలా పనుల్లో తల్లిదండ్రులకు సాయం చేసేవాడు గిరి. బడిలో కూడా చదువుల్లోను, ఆటపాటల్లోను, ప్రవర్తనలో కూడాను 'మంచి పిల్లవాడు' అని పేరు తెచ్చుకున్నాడు. అలా ఉండగా గిరి వాళ్ల అమ్మకి ఏదో పెద్ద జబ్బు చేసింది. వీరయ్య తన దగ్గరున్న కొద్దిపాటి డబ్బులతో స్థానికంగా ఆమెకు వైద్యం చేయించాడు కానీ ఆమె పరిస్థితి ఏమంత మెరుగు కాలేదు. మెరుగైన వైద్యం కావాలంటే పట్నం వెళ్ళాలి; దానికి డబ్బులు కావాలి. ఆ సమయంలో ఇంక వేరే గతి లేని వీరయ్య ఊళ్ళో వడ్డీకి డబ్బులు ఇచ్చే గురవయ్య దగ్గరకు వెళ్ళి ఐదువేల రూపాయలు అప్పు అడిగాడు. గురవయ్య అతనికి ఐదువేలూ ఇస్తూ "వీరయ్యా! నా ఐదువేల అప్పూ వడ్డీతో సహా కట్టటం నీకు కష్టం అవుతుంది గాని, నా మాటవిని, నీ‌ ఇల్లు నాకు అమ్మేయి. ఈ ఐదువేలు కూడా నేను ఇంటి ధరలో మినహాయించుకోను; అది నీకు అదనపు మేలు అవుతుంది! ఇంతలా ఎందుకు అడుగుతున్నానంటే మరేమీ లేదు- నీ ఇల్లు నా పొలం ప్రక్కనే ఉన్నది కదా; అది ఉంటే నేను ఇంట్లో‌ ఉండి పొలం చూసుకోవచ్చు" అన్నాడు అనునయంగా. "అయ్యా!‌ ఆ ఇల్లు మా తాతల నాటిది. నేను అందులోనే పెరిగి పెద్దయ్యాను. గిరి కూడా అక్కడే పుట్టాడు. ఆ ఇంటితో‌ మాకు అనుబంధం ఎక్కువ. దయచేసి ఏమీ అనుకోవద్దు- కష్టపడి వడ్డీతో సహా మీ బాకీ రీరుస్తాను" అని నమ్రతతో చెప్పి డబ్బు తీసుకొని అప్పుపత్రం రాసిచ్చాడు వీరయ్య. ఈ సంగతి తెల్సుకున్న గిరి కూడా, 'ఇంటి అప్పులు త్వరగా తీరాల'ని, 'అమ్మ త్వరగా కోలుకోవాల'ని అనుకొని, రోజూ బడి అయిపోయాక పని చేసేట్లు ఓ అంగడిలో పనికి కుదురుకున్నాడు. వీరయ్య వద్దంటున్నా వినకుండా ఇంటికోసం కష్టపడ-సాగాడు.   ఇంట్లో కూరగాయలు పండిస్తే, ఇక బయటినుండి కొనే ఖర్చు తగ్గుతుందని, ఇంటి పెరట్లో చిన్న చిన్న పాదులు చేసి, వంగ, బెండ, దొండ, దోస వంటి మొక్కలు, ఆకుకూరలు వేసి శ్రద్ధగా నీళ్ళు పోసి పెంచసాగాడు. మొక్కలు కూడా బాగా ఏపుగా పెరిగాయి. ఇట్లా వీళ్ల ఇంట్లో అందరూ కలిసి కట్టుగా పని చేయటాన్ని గమనించింది ఒక దేవత. వాళ్ళ మంచితనానికి, చిత్తశుద్ధికి ముచ్చటపడిన ఆ దేవి వాళ్లకు తగిన సాయం చేయాలనుకొని, ఒకరోజున పూలమొక్కలు అమ్మే స్త్రీ రూపంలో‌ వీరయ్య ఇంటిముందుకు వచ్చి నిలబడింది. గిరి ఆమెను పలకరించగానే ఆమె "బాబూ, మంచి కూరగాయల మొక్కలు వేసావు. దేవుడి కోసం కొన్ని పూల మొక్కలు కూడా వెయ్యి" అని ఓ‌ పూలమొక్కను ఇచ్చింది వాడికి. గిరి సరేనంటూ దాన్ని తీసుకొని "ఎంతమ్మా?" అని ధర అడిగాడు. "డబ్బులేమీ వద్దు నాయనా! మొక్క ఎదిగి పూశాక, దేవుడికి రోజూ ఐదు పూలు ఇవ్వు చాలు!" అంది పూలమ్మి.   గిరి ఆమెను తల్చుకుంటూ ఆ మొక్కని పెరడులో నాటాడు. పది రోజుల తర్వాత పూలమ్మి వచ్చి, మొక్కని చూసి మెచ్చుకొని, బాగా పెరుగుతున్నది నాయనా! "ఇట్లాగే దీని జతగా నాటు, ఈ‌ మొక్కని కూడా" అంటూ మరో‌ మొక్కని ఇచ్చి వెళ్ళింది. గిరి ఆ మొక్కని నాటేందుకని త్రవ్వబోతే చిత్రంగా అక్కడ ఖంగుమని శబ్దం వచ్చింది! జాగ్రత్తగా చూస్తే అక్కడో కంచు చెంబు, అందులో‌ నిండా బంగారు నాణాలు! పరుగున వెళ్ళి తండ్రిని పిల్చుకొచ్చి చూపించాడు గిరి. "మనకు ఆ దేవుడే దారి చూపించాడు నాయనా! ఇందులోది ఒక్క నాణెం అమ్మామంటే చాలు, మనం గురవయ్య అప్పునూ తీర్చేయచ్చు, మీ అమ్మ ఆరోగ్యమూ బాగు చేయించుకోవచ్చు, నిన్ను బాగా చదివించుకోవచ్చు కూడా" అని రంగయ్య కూడా చాలా సంతోషపడ్డాడు.   తీసుకున్న అప్పును వడ్డీతో సహా అంత త్వరగా తీర్చేసినందుకు గురవయ్య ఆశ్చర్యపోయి "వీరయ్యా! బాకీ తీర్చేసావే! ఎలా వచ్చింది, అంత డబ్బు?" అని అడిగాడు. అమాయకపు వీరయ్య నిజం చెప్పేసాడు- "నిజంగా దేవుడే కరుణించాడు గురవయ్యా! మా పెరట్లో మొక్క పెట్టేందుకని పాదు త్రవ్వామా, ఇంత త్రవ్వగానే దొరికింది, ఓ చెంబు నిండా బంగారు దొరికింది; మా కష్టాలు తీరాయి!" అని. "ఒక్క చెంబేనా, మరి దాని చుట్టూ ఇంకేమీ లేదుగా?!" అన్నాడు ఆశగా, గురవయ్య. "ఏమో, చూడలేదు!‌ నిజంగా మా జన్మకైతే ఇది చాలు గురవయ్యా! మావాడికి కూడా ఇంకేమీ అవసరం ఉండదు. ఆ తర్వాతి కథ తర్వాత ఎప్పుడైనా చూసుకోవచ్చు, కదా!" అన్నాడు వీరయ్య మరింత మురిసిపోతూ.   గురవయ్య లేని సంతోషం కనబరుస్తూ "అవునవును. మంచి వార్త చెప్పావు రంగయ్యా! ఇప్పుడు నీ భార్య కూడా కోలుకున్నది! దీనికంతా దేవుడే కారణం తప్ప మరేమీ కాదు. మీ కుటుంబం అంతా వీలు చూసుకొని ఓ నాలుగు రోజులు చుట్టు ప్రక్కల ఊళ్ళలో గుళ్లన్నీ దర్శించి రండి. అంతా మంచే జరుగుతుంది" అన్నాడు. "మంచి ఆలోచన. ఎప్పుడో ఎందుకు, రేపే బయల్దేరి వెళ్తాం" అంటూ రంగయ్య ఇంటికి వెళ్ళి "ఇట్లా ముగ్గురం కలిసి ఓ నాలుగైదు రోజులు గుళ్లన్నీ దర్శించి వద్దామనిపిస్తున్నది. రేపు బయల్దేరుదామా?" అన్నాడు భార్యతో. భార్య సరేనన్నది; గిరి కూడా సరేననటంతో మరునాడే ముగ్గురూ బయలుదేరి వెళ్ళారు, క్షేత్రాలు తిరిగి వచ్చేందుకు. అసలు గురవయ్య ఆలోచన ఏమంటే, 'ఒక్క చిన్న గుంత త్రవ్వితేనే గిరికి ఒక బంగారు చెంబు దొరికింది. నిజానికి అట్లాంటి చెంబులు ఇంకా ఎన్నో ఉండి ఉండచ్చు అక్కడ! పూర్తి స్థాయి నిథి కూడా ఉండచ్చు! ఏదో ఒక రకంగా వీళ్లను బయటికి పంపితే తనే పెరడును త్రవ్వి చూసుకుంటాడు!' వీరయ్యవాళ్ళు బయలుదేరిన రాత్రే, వాళ్ల పెరడులో ఖాళీ స్థలాన్నంతా అంగుళం వదలకుండా త్రవ్వి చూసాడు గురవయ్య. ఎంత త్రవ్వినా అతనికి ఏ చెంబూ దొరకలేదు! త్రవ్విన ప్రయాస మాత్రం మిగిలింది. అతని దురాశనంతా ఆకాశం నుండి దేవత చూసి నవ్వుకున్నది. నాలుగు రోజుల తర్వాత తిరిగి వచ్చిన వీరయ్య కుటుంబం తమ ఇంటి పెరడంతా త్రవ్వి ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. ఇరుగు పొరుగు వాళ్ళెవరూ దాన్ని గురించి ఏమీ చెప్పలేకపోయారు. "ఇదంతా దేవుని లీల! మనం మరిన్ని కూరగాయలు, పూల మొక్కలు పెట్టాలని, ఆ దేవుడు ఇలా త్రవ్వించి పెట్టాడు" అని రంగయ్య, గిరి పెరడంతా కూరగాయలు, పూల మొక్కలు నాటారు. దేవత కూడా వచ్చి ఆశీర్వదించి వెళ్ళింది.   అటుపైన వీరయ్య కుటుంబం ఏ పని తలపెట్టినా అది తప్పకుండా మంచి ఫలితం ఇవ్వసాగింది. వాళ్ల ఇల్లు కూడా పచ్చగా కళకళలాడింది. దీన్ని గమనించిన గురవయ్యలో అంతర్మథనం మొదలైంది. "మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు జరుగుతాయి" అని అర్థం చేసుకున్న గురవయ్య క్రమంగా మంచి పనులు చేయటం మొదలెట్టాడు. కష్టాల్లో ఉన్నవారికి తన చేతనైనంత సాయం చేయసాగాడు. గతంలోలాగా అధిక వడ్డీలు వసూలు చేయటం మానుకున్నాడు. అతనిలో‌ మార్పును గమనించిన ఊళ్ళో వాళ్ళు అతన్నీ సమధికంగా గౌరవించారు. - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

తల్లిదండ్రుల ప్రేమ

తల్లిదండ్రుల ప్రేమ   ధర్మపురంలో చాలా పేద కుటుంబం ఒకటి ఉండేది. భార్య, భర్త వారి ఒక కూతురు. ఆ పాప పేరు స్వాతి. భార్యభర్తలిద్దరూ రోజూ కూలి పనికి వెళ్ళేవాళ్ళు. ఇద్దరూ రెక్కలు విరిగేట్లు పని చేస్తే తప్ప వాళ్లకు పూట గడిచే అవకాశం లేదు. కష్టం చేసే వాళ్ళు, అభిమానవంతులు కావటంతో, రోజుకింత సొమ్ము వెనక వేసుకుంటూ, అప్పులు చేయకుండా సంసారాన్ని గుట్టుగా నడిపించుకొస్తున్నారు. కూతురి భవిష్యత్తు తమలాగా ఉండకూ-డదని వాళ్ల కోరిక: 'ఆ పాప బాగా చదువు-కోవాలి.. పెద్ద ఉద్యోగం చేయాలి..' అని. చదువు బాగుండాలనే తపనతో స్వాతిని వాళ్ళు పట్నంలో పేరున్న ఓ ప్రైవేటు బడిలో చేర్పించారు. స్కూలు బస్సొకటి రోజూ ఊళ్ళోకి వచ్చి, స్వాతి లాంటి పిల్లల్ని కొంత- మందిని మాత్రం బడికి తీసుకెళ్తుంది. బడిలో మొదటి రోజున టీచరు తనని తాను పరిచయం చేసుకొని, "ఇప్పుడు మీరంతా ఒక్కరొక్కరుగా లేచి నిలబడి, మీ గురించి, మీరు చదివిన పుస్తకాల గురించి, కుటుంబాల గురించి, మీ అమ్మనాన్నలు ఏం చేస్తుంటారు వగైరా వివరాలు చెప్పండి" అని అడిగారు. పిల్లలంతా వరసగా లేచి "మా అమ్మ డాక్టర్, మా నాన్న ఇంజనీర్, మా అమ్మ లాయర్, మా నాన్న సైంటిస్ట్.." ఇట్లా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు స్వాతి వంతు! "మా అమ్మా-నాన్నలు కూలోళ్ళు" అని చెబితే 'వాళ్లంతా నవ్వుతారేమో!’ అని స్వాతికి భయం వేసింది. "అందరూ నవ్వి, ఎగతాళి చేస్తారేమో.. ఇంక నాతోటి స్నేహం చెయ్యరేమో!" అని, ఆ పాప అప్పటికప్పుడు అబద్ధం చెప్పేసింది- "మా అమ్మనాన్నలు ఇద్దరూ అమెరికాలో ఉన్నారు.. నన్నేమో మా ఊళ్ళో ఉంచారు. నన్ను చూసుకునేందుకని ఊళ్ళో ఒక కుటుంబాన్ని చేరదీసారు" అని.   బడిలో పిల్లలంతా అది విని ఆశ్చర్య-పోయారు. కొందరైతే ముందుకొచ్చి స్వాతిని అభినందించారు. "మీ అమ్మ వాళ్లకు మన దేశం అంటే చాలా ఇష్టమేమో! మన పల్లెల్లోని పేదవాళ్లంటే ఇష్టమేమో" అన్నారు. ఆ రోజున స్వాతికి 'రమ' అనే పాప పరిచయం అయ్యింది. రమ తల్లిదండ్రులు పట్నంలో వ్యాపారం చేస్తారు. త్వరలోనే రమ, స్వాతి ఇద్దరూ ఫ్రెండ్స్ అయిపోయారు. రమ స్వాతిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి తల్లిదండ్రులకు పరిచయం చేసింది కూడా. అయితే స్వాతి మటుకు ఆ పాపను తమ ఇంటికి పిలవలేదు. 'పిలిస్తే ఎలాగ? తన రహస్యం బయట పడిపోతే ఎలాగ?" అని అందోళన చెందింది. అందుకనే తన తల్లిదండ్రులకు బడి సంగతులేవీ చెప్పలేదు, రమ గురించీ చెప్పలేదు! అయితే ఒక సెలవు రోజున రమ బయలుదేరి వచ్చింది, స్వాతి వాళ్ల ఊరికి. ఆ రోజున స్వాతి కూడా ఊళ్ళో పిల్లలతో కలిసి నేరేడు కాయలు ఏరుకునేందుకు వెళ్ళి ఉన్నది. రమ వెతుక్కుంటూ స్వాతి వాళ్ల ఇంటికి వచ్చి, స్వాతివాళ్ల అమ్మని "స్వాతి ఉండేది ఇక్కడేనా?" అని అడిగింది. "అవునమ్మా! ఇదే, స్వాతి వాళ్ల ఇల్లు. రా, లోపలికి వచ్చి కూర్చో. స్వాతి వచ్చేసరికి ఇంకా గంట-గంటన్నర అవ్వచ్చు" అన్నది స్వాతి వాళ్లమ్మ. ఇంట్లోకి వచ్చి కూర్చొని అమాయకంగా "స్వాతి వాళ్ల అమ్మానాన్నలు అమెరికాలో ఏం చేస్తుంటారు, ఎప్పుడైనా వస్తుంటారా?" అని అడిగింది రమ. స్వాతివాళ్ళ అమ్మ నవ్వి "నేనే కదమ్మా, వాళ్ల అమ్మని?! మేం ఇక్కడే ఉంటాం. ఎక్కడికి పోతాం? మాకు అవన్నీ ఏం తెలవదు!" అన్నది. రమ నిర్ఘాంతపోయి "మరి స్వాతి అట్లా చెప్పిందే?!" అంటూ బడిలో జరిగిన విషయం అంతా చెప్పింది.   అంతలోనే స్వాతి వాళ్ల నాన్న కూడా వచ్చాడు. వాళ్ళిద్దరూ బాధని గుండెల్లోనే దాచుకొని, "చిన్నపిల్ల కదా, నవ్వులాటకి అట్లా అని ఉంటుందమ్మా! తనంతట తానే స్వయంగా ఈ నిజం చెప్పేంత వరకూ మనం కూడా ఇది తనకు చెప్పద్దు. సరేనా, ఈ సంగతి మనకు తెలిసినట్లు స్వాతికి తెలియకూడదు- అసలు నువ్వు మా ఇంటికి వచ్చిన సంగతి కూడా తనకు చెప్పకు!" అన్నారు. రమ కూడా "సరే అంకుల్! నేను ఇక్కడికి వచ్చినట్లు స్వాతికి గాని, మరే స్నేహితులకు గానీ చెప్పను!" అని వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తరువాత స్వాతికి ఒళ్ళంతా కురుపులై, జ్వరం వచ్చింది. డాక్టరు గారు స్వాతి తల్లిదండ్రులతో "ఇది అంటువ్యాధి. ఒకరినుండి ఒకరికి వస్తుంది. తగ్గిపోతుంది లెండి; కానీ ఒక వారం పది రోజుల పాటు ఎవ్వరూ ఆ పాప ఉన్న గదిలోకి కూడా పోవద్దు. లేకపోతే ఆ వ్యాధి మీకు కూడా రావచ్చు" అని చెప్పారు. "ఇంక నాకు అమ్మ అన్నం కూడా పెట్టదేమో, నాకోసమని ఏ పనులూ చేయదేమో" అనుకొని నీరసపడింది స్వాతి. కానీ తను అనుకునట్లు ఏమీ జరగలేదు. అమ్మ ఎప్పటిలాగానే ఆ రోజు కూడా అన్నం తీసుకొచ్చి పెట్టింది; స్వాతి విడిచిన బట్టలు ఉతికింది; జుట్టు దువ్వి జడ వేసింది. "దూరం ఉండమన్నారు కదా డాక్టరు గారు? నాకొచ్చింది అంటు వ్యాధి అట! మళ్ళీ ఈ వ్యాధి నీకు వస్తే ఎలా?" అన్నది స్వాతి "పర్లేదులే, రాకుండా జాగ్రత్తగానే ఉంటున్నాము. నిన్ను ఒకే చోట ఉంచు-తున్నాం; అంతటా తిరగనివ్వట్లేదు; నీ పనులు చేసాక నేను, నాన్న ఇద్దరం వేపాకుతో స్నానం చేస్తున్నాము. అయినా రోగం అదీ వస్తే ఏమున్నది, ఓ వారం రోజులు మందులు వేసుకుంటూ దూరం ఉంటాము, రోగం అదే పోతుంది" అన్నది అమ్మ. "అయ్యో! నాకోసమని వీళ్ళిద్దరూ తమ ఆరోగ్యాల్ని కూడా లెక్క పెట్టరే, ఇట్లాంటి అమ్మనాన్నల గురించి నేనెందుకు, మా బడిలో అబద్ధాలు చెప్పాను? నిజం చెప్పుకో-లేకపోయానెందుకు?" అని ఏడ్చింది స్వాతి.     "ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకు! ఏడిస్తే వ్యాధి మరింత పెరుగుతుంది. ఏడవ కూడదు!" అని మందలించింది అమ్మ. ఇంక దు:ఖాన్ని ఆపుకోలేని స్వాతి తల్లిదండ్రులకు జరిగిందంతా చెప్పింది. "ఊరుకో! ఈ విషయం మాకు ముందే తెలుసు. రమ మన ఇంటికి వచ్చి చెప్పింది. పిల్లలందరిముందూ మనం పేదవాళ్లమని చెప్పుకోలేక, అట్లా అన్నావు కదా, ఏ‌ం పర్లేదులే!" అని ఓదార్చింది స్వాతి వాళ్ల అమ్మ. స్వాతి బావురుమన్నది. "అవును. ఇదేం పట్టించుకోకు తల్లీ! ఎవ్వరికీ చెప్పుకోకుండా దాచిన రహస్యాలు, మన లోపల కూడా ఊరికే కూర్చోవు- అవి మన ఆరోగ్యాన్ని తినేస్తాయి. అందుకని ఈలాంటి ఆలోచనలన్నీ వదిలేసెయ్యి. నీ‌ చదువులమీద మనసు పెట్టి, బాగా చదువుకో" అన్నాడు వాళ్ల నాన్న. ఆ తర్వాత బడికి వెళ్ళిన స్వాతి సమయం చూసుకొని బడిలో తన స్నేహితురాళ్ళందరికీ నిజం చెప్పేసింది. వాళ్లంతా తనని అర్థం చేసుకున్నారు, తప్పిస్తే ఎవ్వరూ ఎగతాళి చేయలేదు. దాంతో ఆ పాప మనసు కూడా తేలికైంది.  - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

దయ్యం?!

దయ్యం?!   రామయ్య ఒకరోజు రాత్రి భోజనం చేసాక తోటకి బయలుదేరాడు. అవి అమావాస్య రోజులు, దాంతో వెన్నెల కూడా లేదు. కొంచెం దూరం పొయే సరికి 'గాలి కొంచెం బరువెక్కిందా' అనిపించింది. దూరంగా చింత చెట్టు పైన కావచ్చు- నల్ల చీర కట్టుకొని, గజ్జెలు కట్టుకున్న కాళ్లని ఘల్లు ఘల్లున ఊపుతూ చెట్టు మీద కూర్చుని ఉన్నది ఏదో ఆకారం. రామయ్య 'అరే! ఏంటి, ఆ చప్పుడు?!' అని జాగ్రత్తగా చూసాడు. చెట్టు మీద ఏవో ప్లాస్టిక్ పేపర్లు.. మనిషంటూ ఎవరూ కనిపించలేదు. 'కానీ శబ్దం ఎలా వస్తున్నది?' తెలీలేదు. 'దయ్యం‌ కావచ్చు!' రామయ్య భయంతోటే 'చెట్టు మీద దయ్యం నాకేం భయ్యం' అనుకుంటూ ముందుకు సాగాడు. కాసేపటికి పెద్దకొండ వచ్చింది. కొండను చూడగానే రామయ్య ప్రాణం కూడా లేచి వచ్చింది. 'అమ్మయ్య! పెద్దకొండ వచ్చేసింది. దీన్ని దాటేస్తే చాలు మా పొలం వస్తుంది' అని సంతోషం వేసింది.  కొండ మలుపులోనే, ముళ్ల చెట్టు కింద ఓ పెళ్లి కూతురు నిలబడి ఉన్నది- 'అయినా పెళ్ళి కూతురు ఇట్లా చీకట్లో, మలుపు మీద, ముళ్లచెట్టు క్రింద ఎందుకు నిలబడి ఉంటుంది? ఈమె పెళ్ళి కూతురు కాదు- పెళ్ళి కూతురు లాంటి-' "నన్ను కాపాడండి! మీకు పుణ్యం ఉంటుంది" అన్నదామె, అకస్మాత్తుగా. ఒక్కసారిగా వణికి పోయి, మళ్ళీ తేరుకున్నాడు రామయ్య. 'గొంతు మనిషి గొంతులాగానే ఉంది అచ్చం!' అనుకున్నాడు "పుణ్యం అంటోంది చూడు, పుణ్యం! దయ్యాలకు పుణ్యం పాపం తెలుస్తాయా?.." "నన్ను కాపాడండి!‌ మీరెవరో మంచి వాళ్ళలా ఉన్నారు. నన్ను మీ ఇంటికి తీసుకుపొండి. ఇంట్లో‌ దాచండి కొన్ని రోజులు! ప్లీజ్.." ప్రాధేయపడిందది.   "ఇంగ్లీషు వచ్చిన దయ్యం, చూసావా? ప్లీజ్ అంటున్నది'.. పైకి మటుకు "ఏమైందమ్మా?! ఇంత అర్థరాత్రివేళ ఇక్కడేం చేస్తున్నావు? మీది ఏ ఊరు?" అని అడిగాడు. 'మాట్లాడే దయ్యం' అని మనసులో అనుకుంటూ. దయ్యం వలవలా ఏడ్చింది. రామయ్యకు మనసు క్రుంగిపోయింది. కాళ్ళు వణికాయి. "నాకు బలవంతంగా పెళ్లి చేస్తున్నారు. నాకేమో చదువుకోవాలని ఉంది. చదువుకొని పెద్ద ఉద్యోగం చేస్తాను. ఈ‌ పెళ్ళి గిళ్ళి వద్దు. అందుకే నేను రాత్రికి రాత్రి పారిపోయి వచ్చాను. ఇంత వరకూ వచ్చాను గానీ, ఇప్పుడు ఏం చేయాలో తెలీక ఏడుస్తున్నాను" అన్నది. రామయ్య ఆ దయ్యం కాళ్ల కేసి చూసాడు. పారాణి పెట్టుకొని ఉంది ఎర్రగా. కాళ్ళు కొంచెం ప్రక్కకు తిరిగి ఉన్నాయా అనిపించింది. 'దీన్ని ఎట్లా వదిలించుకోవాలి దేవుడా?' అని మనసులోనే ఆంజనేయస్వామిని తలచుకున్నాడు. మాట్లాడకుండా వెనక్కి తిరిగి ఊరివైపు అడుగులు వేసాడు. 'ఇది నా వెంట రాదు- రాదు- రాదు ఆంజనేయా! ఆంజనేయా!' అనుకుంటూ. గజ్జెల శబ్దం అతన్ని అనుసరించింది. రామయ్య వెనక్కి తిరిగి చూడకుండా గబగబా నడిచాడు. గజ్జెల శబ్దం కూడా వేగం పుంజుకున్నది. కొద్ది సేపటికి రామయ్యకు ఒక ఐడియా వచ్చింది. 'దయ్యాలకు నిప్పు అంటే భయం!' తను అగ్గి పెట్టె తీసి, బీడీ వెలిగించుకుంటూ మెల్లగా వెనక్కి తిరిగి చూసాడు. గజ్జెల దయ్యం రెండడుగులు వెనక్కి వేసింది. అతను ఒక్కసారిగా ఊపిరి పీల్చుకొని గబగబా నడక మొదలెట్టాడు. గజ్జెల శబ్దం వెన్నంటే వస్తోంది. కొంచెం దూరంగా ఉన్నట్టుంది. ఊళ్ళోకి వచ్చాక, "ఇప్పుడింక ఇది భస్మమైపోతుంది చూడు!" అనుకుని ఆంజనేయస్వామి గుడి ముందు నిలబడి గట్టిగా మొక్కుకున్నాడు రామయ్య. గజ్జెల శబ్దం ఆగిపోయింది. గట్టిగా నవ్వుకొని, అయినా వణికే కాళ్లతో కంగారుగానే స్వామికి మళ్ళీ ఓసారి మొక్కుకొని, నడక మొదలెట్టాడు రామయ్య. మళ్ళీ మొదలైంది గజ్జెల శబ్దం. ఈసారి అది అతని ప్రక్కనే నడుస్తోంది. రామయ్యకు ఇప్పుడు తల త్రిప్పేందుకు కూడా భయం వేసింది. "ఇంట్లోకి పోవాలా, వద్దా?" అనుకున్నాడు.   నేరుగా పోలీసు కానిస్టేబుల్ వీరాస్వామి ఇంటి తలుపు తట్టాడు. "ఓ సారూ! ఓ సారూ! నేను రామయ్యని. అర్జంటుగా తలుపు తియ్యాల" అంటూ. వీరాస్వామి తలుపు తెరిచి "లోనికి రా! ఏంటి సంగతి?" అన్నాడు. "ద.. దయ్యం వచ్చింది నా వెనకనే!" గుసగుసగా చెప్పాడు రామయ్య. వీరాస్వామి టార్చి వెలుగులో చూసాడు. అవతల మూలగా నిలబడి ఉన్నది ఒక అమ్మాయి, పెళ్ళి కూతురు వేషంలో. "ఈమె దయ్యం కాదు. మనిషే. ఏదో సమస్యలో‌ ఉన్నట్లుంది. లైటు వేస్తాను ఆగు" అని లైటు వేసాడు. "వెలుగులో మాయం ఐపోతుంది" అనుకున్న ఆ పిల్ల నిక్షేపంగా నిలబడి ఉంది అక్కడ, ముఖం అంతా కన్నీళ్ళ చారికలతో. వీరాస్వామి ఆమెను, రామయ్యని కూడా పోలీసు స్టేషనుకు పిల్చుకెళ్ళి, కేసు నమోదు చేయించాడు. తర్వాత పోలీసుల చొరవ వల్ల ఆ అమ్మాయి తల్లిదండ్రులు, బంధువర్గం అంతా ఆమెని పై చదువులు చదివించేందుకు అంగీకరించారు. ఆ అమ్మాయిని ప్రభుత్వ హాస్టల్ లో చేర్చి, కాలేజీలో చదువుకునే ఏర్పాటు చేసాడు వీరాస్వామి. ఆరేళ్ల తర్వాత ఆ పాప పోటీ పరీక్షల్లో నెగ్గి ప్రభుత్వ అధికారి ఐనప్పుడు, వాళ్ల తల్లిదండ్రులు వచ్చి వీరాస్వామికి, రామయ్యకి ధన్యవాదాలు చెప్పుకున్నప్పుడు వాళ్లకి కలిగిన సంతోషం ఇంతా ఇంతా కాదు! "ఐనా ఇట్లా ఏ పాపకీ జరగకూడదు. నేను ఎదురయ్యాను కాబట్టి సరిపోయింది. వేరే ఏ దుర్మార్గులో ఎదురయ్యుంటే ఆ పాప గతి ఏమౌను?!" అన్నాడు రామయ్య, పోలీసు వీరాస్వామితో. కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

పట్టుదల

పట్టుదల రాఘవపురంలో నివసించే సూరయ్య కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. ఆయనకు ఒకే కూతురు. పేరు మీనాక్షి. సూరయ్య చిన్న తనంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు. ఆ రోజుల్లో తనకు సినిమాల పిచ్చి ఉండేది. ఇంట్లోవాళ్ల అనుమతితోటీ, అనుమతి లేకుండా కూడానూ చాలా సినిమాలు చూసేవాడు. బడిని ఎగగొట్టి సినిమాలు చూడటం, బడిలో హాజరు తగ్గి, అధ్యాపకులు దండించటం, వాళ్ల నాన్న మండిపడటం- ఇవన్నీ సూరయ్య ఆలోచనల మీద బాగా ప్రభావం చూపాయి. దానితో ఆయన చాలా స్ట్రిక్టుగా తయారయ్యాడు. ఇంట్లో ఎవ్వరూ ఆయన ముందు నోరెత్తటానికి లేదు. ఇంట్లో ఏవి ఉన్నాయో, ఏవి లేవో చర్చించటానికి లేదు. ఏ పని పడినా ఆయనకు చెప్పే వెళ్ళాలి. సినిమాలు, టివిలు, నవలలు- ఇట్లాంటివి అస్సలు మంచివి కాదు. అట్లా అని ఆయన మరీ కఠినంగా కూడా ఏమీ ఉండేవాడు కాదు. మీనాక్షి బాగా చదువుకోవాలి, సొంత కాళ్ల మీద నిలబడాలి, ఆమెకి మంచి ఉద్యోగం రావాలి అని బాగా ప్రోత్సహించేవాడు కూడా. మీనాక్షి కూడా, వాళ్ల నాన్న కోరికను తీర్చేందుకు పట్టుదలతో కృషి చేసేది. పాఠశాలలో ప్రతి ఒక్క పనిలోనూ తనే ముందు ఉండేది. ఉపాధ్యాయులు చెప్పే మంచి మాటలని పాటించేది. పెద్దలు చెప్పే విషయాల్ని గుర్తుపెట్టుకొని పరీక్షలలో చక్కగా వివరించి రాసేది.   అయిత్తే ఒక్క విషయంలో మాత్రం ఆ పాప తండ్రి ఇష్టానికి భిన్నంగా ఉండేది. తనకు నాట్యం అంటే చాలా ఇష్టం. వాళ్ల బడి అసెంబ్లీలో ఎప్పుడు ఎవరు నాట్య ప్రదర్శన ఏర్పాటు చేసినా తను అందులో తప్పక పాల్గొనేది. నాట్యపోటీలు అనేకాలలో ఆమె బడి తరపున పాల్గొన్నది. పాల్గొన్న ప్రతిసారీ బడికి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆ సంగతులేవీ ఇంట్లో ప్రస్తావనకు వచ్చేవి కాదు. సూరయ్యకు నాటకాలు, నాట్యాలంటే అస్సలు ఇష్టం లేదు మరి! మీనాక్షి నాట్యం చేస్తుందని ఆయనకు తెలిస్తే ఆ పాపను బడి కూడా మాన్పించేసేవాడేమో! ఒకరోజున వాళ్ల ఆర్ట్ టీచరుగారు మీనాక్షిని పిలిచి, "అమ్మా మీనాక్షీ! చదువు లాగే, కళలన్నీ కూడా విద్యలోని విభిన్న భాగాలే. వీటిలో ఒకటి గొప్ప, ఒకటి తక్కువ అని లేవు. అయితే, ఈ రోజుల్లో బ్రతుకు సాఫీగా సాగాలంటే చదువు తప్పని సరి కనుక, తల్లి దండ్రులు చదువు మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. నీలో మంచి కళాకారిణి కూడా ఉన్నది. నువ్వు చదువుకోసం నీలోని కళను అణచి వేస్తావో, లేక నీ చదువుతో పాటు దానికీ న్యాయం చేస్తావో బాగా ఆలోచించుకో. రెండూ చేయాలంటే మటుకు నువ్వు బాగా శ్రమించాలి. అందరికంటే ఎక్కువ సాధన చేయాలి" అని చెప్పింది. "ఇష్టంగా నేర్పేవాళ్ళు ఉంటే శ్రమ పడటం ఏమున్నది టీచర్. నేను చదువుకూ న్యాయం చేస్తాను; నాట్యానికీ న్యాయం చేస్తాను" అన్నది మీనాక్షి నిశ్చయంగా. పదో తరగతిలోనే కాదు, తర్వాత ఇంటర్మీడియట్ లోను, డిగ్రీలో కూడా చదువుల్లో‌ ఫస్టు ఎవరంటే అందరూ మీనాక్షి పేరే చెప్పేవారు. బిడ్డ బాగా చదువుతున్నదని సూరయ్య చాలా సంతోష పడేవాడు. పరీక్షల సమయంలో ఆ పాప వెంట కూర్చొని చదివించేవాడు. విద్యని బాగా నేర్చుకుంటే ఎన్నో విజయాలు సాధిస్తావు తల్లీ" అని చెప్పేవాడు.  ఆ తర్వాత పోటీ పరీక్షలు రాసిన మీనాక్షి మొదటి ప్రయత్నంలోనే బ్యాంకు ఆఫీసరుగా ఉద్యోగం తెచ్చుకున్నది. సూరయ్య చాలా సంతోష పడ్డాడు. ఆయన కలలు నెరవేరినై. "ఇన్నేళ్ళూ నీ గురించి కష్ట పడింది ఇందుకే తల్లీ! నువ్వు నా పేరు నిలబెట్టావు!" అని చాలా మెచ్చుకున్నాడు. కొద్ది రోజులకే రేడియోలో ఒక ఇంటర్వ్యూ ప్రసారమైంది. "జాతీయ నృత్యనాటక పోటీల్లో ప్రథమ బహుమతి సంపాదించి రాష్ట్రానికే వన్నె తెచ్చిన కుమారి మీనాక్షి ఈమధ్యే ఒక బ్యాంకు ఉద్యోగానికి కూడా ఎంపికైంది. చిన్నప్పటినుండీ నాట్యరంగానికి సేవ చేస్తూ, అనేక విజయాలను, పతకాలను సాధించింది మీనాక్షి. మరి ఇప్పుడు తను ఏం చేయనున్నది? ఉద్యోగమా-కళా జీవితమా?" అంటూ. అందులో మీనాక్షి చెప్పింది: "ఉద్యోగాన్నీ, కళల్నీ నేను వేరు వేరుగా చూడను. ఇన్నేళ్ళూ చదువులతో పాటు నా ఇష్టమైన నాట్యాన్ని కూడా కొనసాగించగలిగాను. ఇకమీద కూడా అదే చేస్తాను. ఉద్యోగానికీ, కళాజీవితానికీ రెండింటికీ‌ న్యాయం చేసి చూపిస్తాను".   రేడియోలో మాట్లాడుతున్నది తన బిడ్డ మీనాక్షే అని గుర్తించేందుకు చాలా సేపు పట్టింది సూరయ్యకు. అయితే ఒకసారి గుర్తించాక, ఆమె గొంతులోని స్థిరత్వం, ఆ పాప పరిణతి సూరయ్యను పూర్తిగా ఆశ్చర్యంలోకి నెట్టేసాయి. తన బిడ్డలోని ఈ కోణాన్ని తను ఇన్నేళ్ళుగా ఎందుకు, చూడలేకపోయాడు? తన నమ్మకాలనీ, భయాలనీ బిడ్డమీద ఎందుకు, రుద్దాడు? తన ఇంట్లోనే ఇంతటి ప్రజ్ఞాశాలి ఉన్నదని ఎందుకు, గుర్తించలేకపోయాడు? ఆమె ఇష్టాన్ని ఎందుకు కాలరాసాడు?" ఆ రోజు ఆఫీసునుండి ఇంటికి వచ్చిన మీనాక్షికి కళ్లనీళ్లతో ఎదురైనాడు సూరయ్య "అమ్మా! నీకు నాట్యమంటే ఇంత ఇష్టమని నాకెందుకు చెప్పలేదమ్మా?" అంటూ. కనీసం "టీవి చూస్తా నాన్నా" అన్నా కూడా మీరు తిట్టేవారు.. 'నేను నాట్యం చేస్తాను' అని మీకు చెప్పలేకపోయాను నాన్నా! అయినా నేను నీ ఆశయాలకు భంగం కలగనివ్వలేదు నాన్నా! చదువులకు ఏ లోపమూ రానివ్వలేదు" అన్నది మీనాక్షి. "నన్ను క్షమించు తల్లీ! కళల్ని చిన్నచూపు చూసాను. నీలాంటి కళామతల్లి నా యింట పుట్టటం నిజంగా నేను చేసుకున్న పుణ్యం" అంటూ ఆనంద బాష్పాలు రాల్ఛాడు సూరయ్య.  - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

గులాబీ అత్తరు (కథ)

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి     శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి తెలుగు కథకు, తెలుగు దనానికి నిలువెత్తు నిదర్శనం. సహజత్వంతో నిండిన చక్కటి వర్ణనలతో పాఠకులను అట్టే ఆకట్టుకుంటాయి వారి కథలు. చిన్నచిన్న సంభాషణలతో కథను రక్తి కట్టించగల నేర్పరి శ్రీపాద. దాదాపు వంద కథలు రాశారు. ఏ కథకాకథ ప్రత్యేకమైంది. తెలుగు పలుకుబడులు, నుడికారాలు, సామెతలు, జాతీయాలు వీరి కథల నిండా పొదిగి ఉంటాయి. మార్గదర్శి , అరి కాళ్లకింద మంటలు, కలుపు మొక్కలు, గులాబీ అత్తరు ఇలా చెప్పుకుంటా పోతే ప్రతి కథ ఓ ఆణిముత్యమే. గులాబీ అత్తరు కథ రాజుల కింద పనిచేసే దివానుల కర్కశమైన మనసుకు కళాకారులు బలై పోయిన విధానాన్ని వివరిస్తుంది. కథలో- ఢిల్లీ నుంచి వచ్చిన షుకురల్లీఖాను పెద్దపురం రాజు శ్రీ వాత్సాయి చతుర్భుజ తిమ్మ జగపతి మహారాజను కలవాలనుకుంటాడు. తను ఎంతో శ్రమకోర్చి, కాలాన్ని వ్యచ్చించి తయారు చేసిన గులాబీ అత్తరను రాజుకు ఇచ్చి సన్మానం పొందాలనేది ఖాను కోరిక. కానీ రాజును కలవాలంటే ముందు ఎందరి కటాక్షాన్నో పొందాలి. అదో నిచ్చెన మెట్లలా ఉంటుంది. ఖాను తన అత్తరు మహిమతో అందరి కటాక్షాన్నిపొంది చివరకు దివాన్జీని కలవడానికి వెళ్తాడు. ఒక్క అడుగు వేస్తే దివాన్జీ కలిసే దగ్గర ఆడిపోతాడు. అతని లాంటి వారు ఎందరో అక్కడ అతని కనుసన్నల వీక్షణాల కోసం నిలబడి ఉంటారు. ఖాను తన అత్తరు వాసనను దివాన్జీకి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో తన దుగ్గరున్న ఒక అత్తరు సీసా మూత తీసి వెంటనే బిగిస్తాడు. ఆ వాసన క్షణాల్లోని ఆ ప్రాంతం అంతా వ్యాపిస్తుంది. అక్కడున్న పరివారం, ఠాణేదారు, పెద్దమనుషులు మత్తుతో తుళ్లిపోతారు. కానీ ఆవాసన పీల్చిన దివాన్జీ మాత్రం ' ఏమిటీ కంపు..' అని అడుగుతాడు. ఆ మాటతో ఢిల్లీ నుంచి వచ్చిన ఖానుకు తల కొట్టేసినట్లు అవుతుంది. గోలకొండ నవాబును కలవడానికి రెండు నెలలు కష్టపడ్డాడు, తలప్రాణ తొకకు వచ్చింది. కానీ చివరకు వజీరును కలవగానే ఆ అత్తరు వాసనకు ముగ్దుడై పోయాడు. మెచ్చుకున్నాడు. కానీ ఇక్కడ పెద్దాపురంలో అత్తరు వాసన కంపుగా భావించిన దివాన్జీ మాటకు ఖాను కొయ్యబారిపోయాడు. చివరకు అనేక అనుమానాలతోనే జవాను అనుమతితో దివాన్జీ దగ్గరకు వెళ్తాడు. కానీ దివాన్జీ - ' దివాణంలోకి అంగడి సరుకు తెస్తాడా...' అని ముదలకిస్తాడు. శాస్త్రులు, జవాను, ఠాణేదారు కొంత సర్ది చెప్పడంతో దివాన్జీ మామూలుగా మాట్లాడతాడు. కానీ ప్రతి మాటలో అతనిలోని గర్వం, అధికార దర్పం కనిపిస్తుంది. అయినా ఖాను తను తెచ్చిన మల్లె అత్తరు గురించి చెప్తాడు. అలాగే కష్టపడి కాశ్మీరీ గులాబీలతో అత్తరు చేశానని అది పెద్దాపురం రాజుకోసం తెచ్చానని చెప్తాడు. ఢిల్లీలో గోలకొండ, పెద్దాపురం సంస్థానాల గురించి గొప్పగా చెప్పుకున్నారని, గోలకొండ నవాబు తన అత్తరు మెచ్చుకున్నాడని చెప్తాడు. ఖాను అత్తరు గురించి, అతని అత్తరు వాసనకు అందరూ మంత్రముగ్దులవుతుంటారు. కానీ దివాన్జీ మాత్రం 'ఎంతకి కిట్టింది పాపం' అని అడుగుతాడు. దాంతో ఖాను కళాహృదయం దెబ్బతింటుంది. బాధను హృదయంలోనే అణచుకొని ' రాజుగారు సరసులని విన్నాం వారి దర్శనం కోసం' అని అడుగుతాడు. కానీ దివాన్జీ ' మేము వారి భృత్యులం, మాకు కొన్ని విధులు ఉంటాయి. ఢిల్లీలో ఎవరన్నా వజీర్లు ఎవరన్నా వస్తువు తెస్తే దాని మంచి చెడ్డలు తెలియకుండా పాదుషా సన్నిధికి ఉంచనిస్తారా' అని మాట్లాడతాడు. పెద్దమనుషులు, ఠాణేదారు అత్తరు తెచ్చిని ఖానుకు సర్దిచెప్పి తర్వాత కలువు అని పంపించేస్తారు. ఆ రాత్రి అంతా ఖానుకు నిద్రపట్టదు. తను డబ్బుకోసం ఈ అత్తరు తయారు చేయలేదు. కళాకారుల కళకు డబ్బుతో వెలకడతారా.. అసలు ముక్కు మొగమూ తెలియని చోటుకు రావడం తనదే తప్పు.. అసలు సన్మానం మాట దెవుడెరుగు మర్యాదగానైనా ఇక్కడ నుండి వెల్లగలనా.. అని బాధపడతాడు. తెల్లవారి ఠాణేదారు షుకురల్లీఖానుకు ఒక సలహా ఇస్తాడు. సాహసం చెయ్యగలవా అని అడిగి, 'కోట ప్రాకారం దాటకుండా నువ్వు వారి కళ్లబడాలి, లేదా నీ వట్టివేళ్ల అత్తరు వాసనైనా అతనిని ఆకర్షించాలి' అని చెప్తాడు. ఖాను సిపాయిలు అడ్డగించినా వారికి నచ్చజెప్పలేక నానా యుక్తులు పన్నుతూ వారితో మాట్లాడుతూ కాల యాపన చేస్తూ ఉంటాడు. కానీ దివాన్జీ, రాజుల దర్శనం దొరకదు. సిపాయిలు ఎంత చెప్పినా వారిని అటకాయిస్తూనే ప్రాంగణాన్ని దాటకుండా నిలబడతాడు. అంతలో రాజుకోసం వచ్చే పెద్దమనుషులు, చదరంగం సహచరులు అందరూ అక్కడే గుమిగూడతారు. చివరకు రాజు వచ్చే సమయం సమీపించడంతో సిపాయిలు అతడ్ని అక్కడ నుంచి పంపడానికి ప్రయత్నం చేస్తారు. అది గ్రహించిన ఖాను ' పెద్దాపురం రాజ్యంలో కళాకారులకిదా సన్మానం అంటూ..' ఆవేశంతో మాట్లాడుతాడు. కోపంతో కళ్లు ఎర్రబడి, శరీరం వొణికిపోతుంటాయి. గులాబీ అత్తరు సీసాను చేతిలోకి తీసుకొని 'పెద్దాపురం ప్రభువుకోసం నిద్రాహారాలు మాని తయారు చేశాను. అటు గోలకొండలో, ఇటు పెద్దాపురంలో అంటే దక్షిణదేశంలో నాపేరు నిలిచిపోతుందని పేరాశ పడ్డాను. గులాబీ పువ్వు పరిమళం ఎంత దూరమైనా వ్యాపిస్తుంది. కానీ ముళ్ల ప్రభావం ఉన్నచోటనే వెల్లడి కాదు... దీనిని మహారాజుకు అందించడానికి నాకు మార్గాలు లేవు. నాకు, నా కుటుంబానికి ఇది శిరచ్ఛేదనతో సమానం' అని సీసాను కోటగోడకు విసిరికొడతాడు. సీసా భళ్లుమంటు పగుతుంది. పెంకులు ఘళ్లుమంటాయి. ఆ వాసనకు అక్కడున్న వారు మత్తెక్కిపోతారు. ఆ మత్తు నుంచి కోలుకుని ఖానును చూసే సరికి అతను కొయ్యబారి పోయి ఉంటాడు. పంచకళ్యాణి మీద వస్తున్న రాజు ఆ పరిమళానికి సొక్కి పోయి ఉంటాడు. గుర్రం మాత్రం ఊపిరి తీసుకుంటుూ కనిపిస్తుంది. ఇప్పటికీ ఆ గుళాబీ అత్తరు పరిమళం ఆ ప్రాంతంలో గుబాళిస్తూనే ఉంటుంది అంటూ శ్రీపాద ఈ కథను ముగిస్తారు. 'ఒక్కొక్క జీవితానికి హృదయమే పునాది అయితే, మరొక్క జీవితానికి మేధస్సు ప్రధానం అయ్యి ఉంటుంది. ఎక్కడ మేధస్సు ప్రధానమో అక్కడ అనుభూతి తక్కువయి పోతుంది. అక్కడ సానుభూతిన్నీ పూజ్యమే. ఏ జీవితానికి పునాది హృదయమో అది కళా బంధురం. అక్కడే కళలకు పరిణతి. అక్కడే కళలకు వినియోగం...' 'ఒకరితో మనివి చేసుకోడానికి, సొంతానికి సత్యం గుర్తించడానికీ చాలా అంతరం ఉంది.' ఇలాంటి ఎన్నో గొప్ప సత్యాలు ఈ కథనిండా ఉన్నాయి. ఇక శ్రీ పాద కథాశిల్పం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. కథ చదువితే పాఠకుడి మనుసు చివరకు గడ్డకట్టుకొని పోతుంది. కళాకారుల హృదయంలోని సున్నితమైన పొర ఆర్త్రత ఎలా ఉంటుందో ఇట్టే తెలిసిపోతుంది. అందుకే ఈ కథ ఇంకా పది కాలాలైనా ఇట్టే నిలిచి పోతుంది. - డా. ఎ. రవీంద్రబాబు

రాతి పులుసు

రాతి పులుసు   రష్యన్ సైనికులు ముగ్గురు, ఎక్కడో కొండల్లో ఉన్న సైనిక శిబిరంలో‌ తమ పనులు ముగించుకుని, సెలవుల మీద ఊరికి బయలుదేరారు. అందులో ఒకరు సార్జంట్, మరో ఇద్దరు పీటా, షాషాలు. అట్లా నడిచీ నడిచీ చివరికి అడవిలోంచి బయటపడి, వాళ్ళు ఓ గ్రామంలోకి ప్రవేశించారు. "అబ్బ!‌ మనుషులు ఉండే తావుకు వచ్చాం! ఇంక మనకు చక్కని కాయగూరల భోజనం దొరుకుతుంది! ఊళ్లలో ప్రజలు చాలా మంచివాళ్ళు. మనల్ని చూడగానే వాళ్ళు మనకు స్వాగతం పలికి, వేడి వేడి భోజనం, కడుపు నిండా పెడతారు" అన్నాడు సార్జంట్. నెలలుగా సరైన భోజనం లేక తపించి పోతున్నారు పీటా, షాషాలు. నిజంగానే వాళ్ళ దగ్గర తినేందుకు ఏమీ లేవు. అడవుల్లో కనబడ్డ ఏ జంతువునో‌ పట్టుకొనేందుకు ఒక పెద్ద సంచి, దాన్ని ఉడకవేసుకొని తినేందుకు ఒక పెద్ద గిన్నె తప్ప ఇంక వాళ్ల దగ్గర వేరే ఏమీ లేవు. సార్జంట్ మాటలతో వాళ్ళకు ఆశ పుట్టింది. క్షణాల్లో‌ ఆ ఆశ కాస్తా ఆకలిగా పరిణమించింది. అయితే వీళ్ళు వెళ్ళే సరికి ఊరివాళ్ళెవ్వరూ బయట రోడ్ల మీద లేరు. వీళ్లని చూసిన వాళ్ళు కూడా కొందరు చటుక్కున కిటికీలు మూసుకున్నారు. అలా వాళ్ళు అనుకున్న స్వాగత సత్కారాలలాంటివేవీ వాళ్ళకు దొరకలేదు. "ఏమీ పర్లేదు. చలి బాగా ఉంది కదా! అందుకని తలుపులు మూసుకున్నారు గ్రామస్థులు. మన రాకను ఎవ్వరూ గమనించి ఉండరు కూడా. వాళ్ళు గనక మనల్ని చూసి ఉంటే ఈ పాటికి మనం వేడి వేడి సూప్ త్రాగుతూ చలి మంట ముందు కూర్చొని ఉండేవాళ్లం!" అంటూ‌ ఒక ఇంటి తలుపు తట్టాడు సార్జంట్. "ఎవరూ?!" అని ఒక స్త్రీ లోపలినుంచి అడిగింది. "అమ్మా! మేము ముగ్గురం సైనికులం. చాలా దూరం నుంచి నడచి వస్తున్నాం. మాకు తినేందుకు కొంచెం ఏమన్నా దొరుకుతుందా?"‌ అడిగాడు సార్జంట్. "అయ్యో, తిండి లేదు. ఈ సారి మా పంట పొలం అస్సలు పండలేదు" అంది ఆ గొంతు. ఇంటి తలుపు కొంచెం కూడా తెరుచుకోలేదు.   ఇంకొక తలుపు, మరొక ఇంటి తలుపు తట్టినా తిండి లేదనే‌ చెప్పారు తప్ప, ఎవ్వరూ వాళ్లని లోనికి ఆహ్వానించలేదు, కనీసం కొంచెం వేడి టీనీళ్ళు కూడా పోస్తామనలేదు. "వీళ్లంతా ఎవరో తీవ్రవాదుల తాలూకు అయి ఉంటారు. లేదా సైనికులంటే ప్రేమ లేని సాధారణ ప్రజలైనా అయి ఉంటారు. వీళ్లతో పెట్టుకుంటే మనం ఆకలితో మాడిపోతాం" అన్నాడు షాషా. "కాదు. వీళ్లంతా స్వార్థ పరులు. పేదరికం వీళ్లకు స్వార్థాన్ని నేర్పించింది" అన్నాడు పీటా. "నిజమే అనిపిస్తున్నది. వీళ్ళకి గుణపాఠం చెబుతాను చూడండి.. మన కడుపు నిండాలంటే ఇది తప్పదు. ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి. ఏం జరుగుతుందో చూడండి" అని వాళ్లతో గుసగుసగా ఏదో చెప్పాడు. ఆ తర్వాత అతను ఓ ఇంటి ముందు నిలబడి, లోపలి వాళ్ళకు వినపడేటట్టు గట్టిగా "షాషా, పీటా! మీరు వెళ్ళి మాంచి రాళ్ళు తీసుకురండి.. మనం రాతిపులుసు చేద్దాం!"‌అన్నాడు. "వావ్! సరే! సరే! మాకు రాతి పులుసంటే చాలా ఇష్టం!" అరిచారు పీటా, షాషాలు. ఆ వెంటనే ఇద్దరూ గట్టి గట్టి అడుగులు వేసుకుంటూ, ఉత్సాహంగా మాట్లాడు-కుంటూ అవతల ఉన్న బయలులోకి వెళ్ళి, కొద్ది సేపట్లోనే మూడు చెట్టు కొమ్మల్ని కొట్టుకొచ్చారు. సార్జంట్ వాటిని ఊరి మధ్యలో త్రిభుజాకారంగా నిలబెట్టి, తాము తెచ్చుకున్న గిన్నెను దానికి కట్టాడు. ఆలోగా వాళ్ళిద్దరూ అటు ప్రక్కగా పారుతున్న మంచినీటి కాలువ నుండి నీళ్ళు, కొన్ని చిన్న రాళ్ళు తీసుకువచ్చి, వాటిని ఆ గిన్నెలో ఒక్కటొక్కటిగా వేస్తూ పెద్ద పెద్ద శబ్దాలు చేశారు. "చూసావా! ఇదే, నాకు నచ్చేది, రాతి పులుసులో!" అరిచారు అందరూ. దాంతో ఆ ఎదురుగుండా ఇంట్లో ఉన్న 'డిమిట్రి' ఆనే వడ్రంగికి వీళ్లు తయారు చేయబోతున్న రాతిపులుసు మీద ఆసక్తి పెరిగిపోయింది. "ఏమిటి, చేస్తున్నారు?" తలుపు తీసుకుని బయటికి వచ్చి అడిగాడు వాళ్లని. "మంచి రాతిపులుసు.. నీకు ఏ రకం ఇష్టమో చెప్పు" అడిగాడు సార్జంట్. "రాతి పులుసా? మేము ఎప్పుడూ‌ వినలేదే దాని గురించి?!" ఆశ్చర్యపోయాడు డిమిట్రీ. "వినలేదా? ఊరుకోండి! రాతి పులుసంటే తెలీని సైనికుడే ఉండడు. అంత రుచికరమైన వంటకం మీకు తెలీకపోవటమేమిటి?" అన్నాడు సార్జంట్, డిమిట్రీకి తన ప్రక్కన కూర్చునేందుకు చోటు చూపిస్తూ. ఆలోగా పీటా, షాషాలు ఇద్దరూ గిన్నెలో నీళ్ళు పోసి, దాని కింద మంట పెట్టారు. "రండి, రుచికరమైన రాతిపులుసు రుచి చూడండి మాతో పాటు" అని డిమిట్రీకి, అక్కడే తమ ఇళ్ళ ముందు నిలబడి 'వీళ్ళు ఏం తయారు చేస్తారు' అని ఆసక్తిగా చూస్తున్న మరో ఇద్దరు గ్రామస్థులకీ చెప్పాడు సార్జంట్. అంతలో ఉడుకుతున్న నీళ్లలోంచి ఒక చిన్న రాయిని తీసి నోటిలో వేసుకుని, "అబ్బా ఈ విధమైన రాళ్ళు చాలా‌ రుచికరంగా ఉంటాయి!" అని చెప్పాడు షాషా.   "ఓ మంచి గరిటె తీసుకురా, పులుసును బాగా‌ కలపాలి. కలిపితే వచ్చే పులుసు రుచి భలే ఉంటుంది" తన ప్రక్కనే కూర్చున్న డిమిట్రీకి చెప్పాడు సార్జంట్. డిమిట్రీ చటుక్కున లేచి ఇంట్లోకి వెళ్ళి గరిటె తెచ్చి ఇచ్చాడు. వీళ్ళ హడావుడి విని, చుట్టుపక్కల ఇళ్ళవాళ్ళు కూడా వచ్చి చుట్టూ కూర్చున్నారు. అందరూ రాతిపులుసును గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయారు. "మంచి వాసన వస్తోందా?" అడిగాడు సార్జంట్. గిన్నెకు దగ్గరగా మొహం పెట్టి "చాలా మంచి వాసన వస్తోంది"‌ చెప్పాడు షాషా. "ఒక ఉల్లిపాయ వేస్తే రాతిలోని మరింత రుచిని, వాసనను ఉల్లి బయటకు తెస్తుంది." నవ్వుతూ చెప్పాడు సార్జంట్. "మా ఇంట్లో ఉల్లిపాయలు ఉన్నాయి ఆగండి" అంటూ పరుగెత్తుకెళ్ళి రెండు పెద్ద ఉల్లిపాయలు తెచ్చి ఇచ్చింది ఓల్గా అనే ఆవిడ. "చాలు! ఇవి చాలు! ఇక రాళ్ళలోని వాసన మొత్తం తగులుతుంది ముక్కుకు!" అన్నాడు సార్జంట్, గట్టిగా వాసన పీలుస్తూ. అతన్ని చూసి అందరూ ముక్కులు గట్టిగా పీల్చారు. పాషా కూడా గట్టిగా వాసన పీల్చి. "బాగుంది బాగుంది" అని సర్టిఫై చేసాడు. ఒక నిముషం తర్వాత "క్యారెట్ వేస్తే మంచి ఆరోగ్యం, పులుసుకు మంచి రంగు వస్తుంది కూడా" అన్నాడు కూడా. "దానిదేం భాగ్యం. నా దగ్గర క్యారెట్లు ఉన్నాయి ఆగండి-" అంటూ ఆన్నా అనే ఆవిడ ఇంట్లోకి వెళ్ళి క్యారెట్లు తెచ్చింది. "చాలు! చాలు! ఇక రాతి పులుసుకు చక్కటి రంగు వస్తుంది. చూసారా! అప్పుడే కొద్దిగా రంగు మారింది?!" అంటూ గిన్నెలోని నీళ్లను గరిటతో ఎత్తి పోసాడు సార్జంట్. "ఒకటో, రెండో ఆలుగడ్డలు తగిలితే పులుసుకు నిండుదనం వస్తుంది" చెప్పాడు పీటా, సమయం చూసుకొని.   "మా ఇంట్లో ఆలుగడ్డలు ఉన్నాయండి" అంటూ మార్యా అనే ఆవిడ ఇంట్లోకి వెళ్ళి ఆలుగడ్డలు తెచ్చింది. "మీరు కూడా ఇక్కడే ఉండి రాతి పులుసు రుచి చూడాలి"‌ అని మార్యాతో అన్నాడు పీటా. అవి కొంచెం ఉడికాక "అయ్యో!‌ ఆలుగడ్డలు రాతిలోని సువాసనను అడ్డుకుంటాయి కదా! ఇప్పుడు కొన్ని మాంసపు ముక్కలు వేస్తే చాలు- రాతిపులుసు మహా రుచిగా వస్తుంది" అన్నాడు సార్జంట్. "మా ఇంట్లో కొన్ని మాంసపు ముక్కలు ఉన్నాయిలే, తెస్తాను ఆగు" అని మాంసపు ముక్కలు తెచ్చాడు డిమిట్రి. అప్పటికే అక్కడికి చేరిన మరికొంతమంది గ్రామస్థులు రాతి పులుసునీ, డిమిట్రి సహాయాన్నీ పొగిడారు. రాళ్ళతో పాటు ఉల్లిపాయలు, క్యారెట్, ఆలుగడ్డలు, మాంసపు ముక్కలు ఉడికి నిజంగానే అక్కడంతా మంచి వాసన రాసాగింది. "మీ గ్రామంలో పులుసు తయారు చేయడానికి పనికొచ్చే రుచికరమైన రాళ్ళు ఉన్నాయి. మీ అదృష్టం, వాటితోటి మీరంతా అప్పుడప్పుడూ రాతిపులుసు చేసుకోవచ్చు- ప్రస్తుతం ఈ పులుసు త్రాగడానికి పాత్రలు తెచ్చుకోండి" అని చెప్పారు సార్జంట్, షాషా. "మేమింత వరకూ ఇంత రుచికరమైన పులుసు ఎప్పుడూ తాగలేదు" అంటూ డిమిట్రీ, ఓల్గా, ఆన్నా లతో పాటు మరో నలుగురు గ్రామస్థులు పులుసు ఇష్టంగా తాగారు. వాళ్లకంటే ఇష్టంగాను, ఆకలిగాను త్రాగారు ముగ్గురు సైనికులూనూ! అట్లా కడుపు నిండాక, రాతిపులుసుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ సైనికులు ముగ్గురూ ఇంటి బాట పట్టారు. - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

తులసి

తులసి                                    రాత్రి తొమ్మిది గంటల సమయంలో వంటగది శుభ్రం చేసేసి, తల్లి గదిలోకి వెళ్ళింది తులసి. మంచం మీద కూర్చుని బట్టలు మడతపెడుతున్న సాగరి వెనుకగా కూర్చుని, ఆమె భుజాలని సున్నితంగా నొక్కసాగింది. "అమ్మా, రేపొద్దున్నే చపాతీలకి పిండి కలపాలా? పాలకూర, బంగాళదుంపలు తరగాలా? ఇప్పుడే చేసేస్తే పని అయిపోతుందిగా," అని అడిగింది.  సాగరి తలూపింది. "నీకు అలసటగా అనిపిస్తే, పొద్దన్న మరింతసేపు నిద్రపో. నాతో పాటు లేవద్దు. చపాతీలు, కూర నేను చేసేస్తాలే. మీ నాన్నలా నీక్కూడా మరునాటి పనుల గురించి ముందురోజు నుండే ఆలోచన," అంది కూతురి  నుదిటి ముద్దు పెడుతూ. అమ్మ భుజంపై తల ఆనించి, "అమ్మా... త్వరలో నీ పుట్టిన రోజు వస్తోంది కదా. ఏదైనా నగ కొనుక్కోమ్మా. బావుంటుంది.  బైబిల్ స్కూల్ డిబేట్లలో గెలిచుకున్న నగదుతో, నీకు, నాన్నకి  ఏదైనా  చేయాలని  ఉందమ్మా,”  అంటూ బ్రతిమాలింది. "అలా చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది,”...అంది తులసి. సాగరి నవ్వేసి, కూతురి వైపు తిరిగింది. "మంచి ఆలోచనే బంగారం. నీ వయసులో అమ్మానాన్నల గురించి ఇంతలా ఎవరు ఆలోచిస్తారు? మీ తమ్ముడు సాయి చూడు... సైకిల్  కొనమని ఒకటే సతాయింపు...మన మల్లికకి ఖరీదైన బొమ్మరిల్లు కావాలట. ఒకటే గొడవ... నిజానికి నీకే ఏదైనా కొనిద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే.. ఆ డబ్బు నీ శ్రమకి, నైపుణ్యానికి వచ్చిన బహుమతి తల్లీ..." చెప్పింది సాగరి.  అమ్మ ప్రేమకి తులసి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. కూతురి బుగ్గల మీద కారిన కన్నీరుని తుడిచింది సాగరి.  పక్కన చేరిన నాలుగేళ్ళ చిన్నచెల్లెలు మానసతో కాసేపు ఆడుకుని, అక్కడే అమ్మ మంచం మీద నిద్రపోయింది తులసి. అలిసి నిద్రపోతున్న కూతురి ముఖంలో, తన అమ్మమ్మ పోలికలు కనబడ్డాయి సాగరికి.  అమ్మమ్మ పేరే పెట్టినందుకు, అదే సున్నితమైన వ్యక్తిత్వం, మంచితనం  పుణికిపుచ్చుకుంది తులసి అనుకుంది.     పెంచి పెద్దచేసిన అమ్మమ్మ తాతయ్యలు గుర్తుకి రాగానే సాగరి మనసులో దిగులు కదలాడింది.. పదిహేనేళ్ళ క్రితం, తోటి ఉపాధ్యాయుడైన డేవిడ్ తో తన ప్రేమని, వివాహాన్ని వ్యతిరేకించారని, వారికి దూరమయిన వైనం గుర్తుచేసుకుంది. తను శ్రద్దగా పెంచుతున్న తులసి మొక్కని మాత్రం తీసుకుని, డేవిడ్ చేయందుకుని గడప దాటిన ఆ నాటి సంఘటన, సాగరి కళ్ళ ముందు కదిలింది.  ఆమె పెళ్ళాడిన డేవిడ్ విషయానికొస్తే, కుటుంబ నియంత్రణకి వ్యతిరేకి అతను.  బిడ్డలని దేవుని వరాలుగా భావించాలన్నది అతని వైఖరి.  కొన్ని పటిష్టమైన అభిప్రాయాలున్న డేవిడ్ ని ఎందులోనూ ఎదిరించి ఎరుగని సాగరికి, అన్ని విషయాల్లో పూర్తి స్వేచ్చ స్వాతంత్ర్యాలు కూడా ఉన్నాయి.  పిల్లల నామకరణం నుండి, ఆహారవ్యవహారాల వరకు అన్నీ ఆమె ఇష్టానుసారమే.  వారి మధ్యనున్న పరస్పర ప్రేమానురాగాలు, సర్డుకుపోవడాలే వారి కాపురానికి పునాదులుగా సాగిపోతుంది..  పద్నాలుగేళ్ళ తులసి,  పదేళ్ళ కవలలు మల్లిక, సాయి, ఆ తరువాత ఆరేళ్ళకి పుట్టిన మానస వారి సంతానం. కవలలు పుట్టినప్పటి నుండీ మాత్రం ఆరోగ్యం సరిలేక టీచర్ ఉద్యోగం మానేసి, ఇంటనే ట్యూషన్లు చెబుతుంది సాగరి.  అయినా, పెరుగుతున్న ఖర్చులు, పిల్లల అవసరాలతో, సంసారం గడవడం కాస్త ఇబ్బందిగానే ఉంది ఆ దంపతులకి... “డేవిడ్, నీ కాఫీ తాగడం అయ్యాక, బజారుకి వెళ్లి గోధుమ రవ్వ, జీడిపప్పుతో పాటు ఓ చాక్లెట్ కేక్ కూడా తెస్తావా? ఇవాళ లంచ్ కి శాలిని, జోసెఫ్ వస్తారుగా... బైబిల్ స్కూల్ డిబేట్లు గెలిచినందుకు తులసి చేత కేక్ కోయిద్దామని.  ఇక శాలినికి కేసరి ఇష్టం కదా.  తన కోసం కేసరి చెయ్యాలి,” అంటూ అతనికి కాఫీ కప్పు అందించింది సాగరి.. డేవిడ్ వెళ్ళే స్థానిక బాప్టిస్ట్ చర్చ్ కి.... సాగరి కూడా పిల్లల్ని తీసుకుని బైబిల్ క్లాసులకి వెళుతుంది.  ఆ చర్చ్ ముఖ్య నిర్వాహకులు శాలిని, జోసెఫ్ దంపతులతో  మంచి స్నేహం  ఏర్పడింది వారికి.  “మరో పది నిముషాల్లో వెళతాను గాని, శాలిని అంటే గుర్తొచ్చింది.  చర్చ్ నుండి నిన్ననే లెటర్ వచ్చింది... ఆమె సిఫారసు పై, మన పిల్లల స్కూల్ రిపోర్ట్ కార్డ్స్, నడవడి, స్కూల్లో వారి కార్యకలాపాలు పరిశీలించి, వచ్చే యేడు కూడా ‘స్కాలర్షిప్ ట్రస్ట్’ నుండి వారి చదువుకి ఆర్ధిక సహాయం అందిస్తామని కమిటీ తెలియజేసింది.   అంటే ఇకముందు కూడా పిల్లలు ముగ్గురూ చర్చ్ స్కూల్లోనే చదువుతారు...ఈ విషయమై, శాలిని, జోసెఫ్ ల   సహాయసహకారాలు వెల కట్టలేనివి. దానికితోడు మన తులసి అంటే ఆవిడకి ఎనలేని అభిమానం కూడా.... కాబట్టి, శాలినికి ఎంతో ఇష్టమైన నీ వెజ్జీ కట్లెట్స్, మిరపకాయ బజ్జీ కూడా చేయి. నేనూ సాయం చేస్తాను,” అన్నాడు కాఫీ తాగుతూ డేవిడ్....  “నిజమే, బైబిల్ స్కూల్ డిబేట్లకి, ఈ యేడు నగదు బహుమతులు స్తాపించిందే శాలిని జోసెఫ్ లు.   సంతానం లేని కారణమో ఏమో గాని మన పిల్లల పైన ప్రత్యేక మమకారం వాళ్లకి.  ఇక తులసిని ‘బంగారం’ అని పిలుస్తుంది శాలిని,” నవ్వుతూ డేవిడ్ నుండి ఖాళి కాఫీ కప్పు అందుకుంది సాగరి. “అయితే, మిగతా ముగ్గురం వెండి, ఇత్తడి, ఇనుమా? మేమూ మీ పిల్లలమే కాదా?” ఫిర్యాదు దోరిణిలో అడిగాడు టి.వి చూస్తూ అమ్మానాన్నల మాటలు వింటున్న సాయి. “అక్కలా తెలివితేటలు, మంచితనం, మన్నన చూపగానే, మిమ్మల్ని కూడా ‘మేలిమి బంగారాలే’ అంటామురా బడుద్దాయ్,” సాయి తల మీద తట్టి, అక్కడి నుండి కదిలాడు డేవిడ్.       చేతిలో పూల గుచ్చాలతో ఇంట్లో అడుగు పెట్టిన శాలిని, జోసెఫ్ లని సాదరంగా ఆహ్వానించారు సాగరి, డేవిడ్.  మధ్య  హాల్లోని  సోఫాల్లో ఆశీనులయ్యాక, తులసిని పిలిచి, పూల గుచ్చం అందించి అభినందించాడు జోసెఫ్. "మన తులసిలో  దాగున్న ఈ ప్రావీణ్యం ఇలా బయటపడుతుందని ఊహించలేదు. పది బైబిల్ స్కూళ్ళు పాల్గొన్న స్టేట్ డిబేట్లలో అందరి దృష్టిని ఆకర్షించి, నాలుగు వారాల పాటు తన వాగ్ధాటికి గుర్తింపు పొంది, మొదటి స్థానంలో నిలవడం సామాన్య విషయం కాదు," అంది ఆప్యాయంగా తులసి వంక చూస్తూ శాలిని.  "మేము ఈ రోజు ఇక్కడికి మరో ప్రత్యేక ప్రతిపాదనతో వచ్చాము. మన చర్చ్ సంస్థ నిర్వహించే అమృతవాణి రేడియో కార్యక్రమంలో ‘బాలల బైబిల్ స్టడీ’ భాగానికి, తులసిని వక్తగా ఆహ్వానిస్తూ  ఈ ఉత్తరువు తెచ్చాము,”  అంటూ డేవిడ్ చేతికి కవర్ అందించాడు జోసెఫ్... “తులసి చదువుకి ఎటువంటి ఆటంకం ఉండదు.. వచ్చేవారం నుండి శనాదివారాలు మాత్రమె రెండేసి గంటలు పనిచేస్తే చాలు.  పారితోషికం కూడా మనకి నచ్చేలా ఉంటుందని హామీ ఇస్తున్నా,” అంటూ పక్కనే కూర్చున్న తులసి భుజం చుట్టూ చేయి వేసింది శాలిని. “చర్చ్ వారు పద్దతిగా మూడునెలలకి ఓమారు నీ జీతం అందజేస్తారు,” వివరించింది ఆ అమ్మాయికి. డేవిడ్ దంపతులు ఉప్పొంగిపోయారు. కూతురికి  చర్చ్ నుంచి అధికారిక ఆహ్వానం అందడం వాళ్ళకి ఎంతో సంతోషం కలిగించింది.  “తులసికి చేయూతనిస్తూ ఇలా మాకు సహకారాన్ని అందిస్తున్న మీకు కృతజ్ఞతలు,” చేతులు జోడిస్తూ సాగరి.     “అదేమీ లేదమ్మా, తులసిలా  ప్రతిభ  కనబరిచే యువతకి  సహకారం అందించడానికే మా సంస్థ పనిచేస్తుంది.  అవకాశాన్ని అందిపుచ్చుకుని మీ అమ్మాయి కూడా వృద్దిలోకి రావాలనే మా అభిలాష....,” అన్నాడు జవాబుగా జోసెఫ్... “సరేగాని, తులసి, ఇరవైవేల రూపాయల బహుమతి నగదుతో ఏం చేయాలని నీ ఆలోచన,” అడిగింది శాలిని...  “నాకు సైకిల్, మల్లికకి బొమ్మరిల్లు కావాలని, అమ్మకి చెప్పేసాముగా ఆంటీ,” అన్నాడు అప్పుడే హాల్లోకి వస్తూ, ఆ మాట విన్న సాయి,. “ఔను, మా యువరాజు గారి కోరిక అది... మేము తప్పక తీర్చాలి,” నవ్వుతూ డేవిడ్... “లేవండి మరి, తులసి చేత కేక్ కోయించి, భోజనం చేద్దాము,” అంటూ అక్కడి నుండి కదిలింది సాగరి.             స్కూలు  విరామ  సమయంలో తులసిని స్టాఫ్ రూమ్‌ కి రమ్మని కబురుపెట్టారు లెక్కల టీచరు వాణి మేనన్. తులసి వెళ్ళేప్పటికి, స్టాఫ్ రూమ్ గుమ్మం దగ్గర ఎదురు చూస్తున్నారావిడ. తులసి రాగానే, చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకు వెళ్ళారామె.  "ఏం లేదు తులసి... నువ్వు లెక్కలు బాగా చేస్తావు కదా. స్కూల్ టైం అయిపోయాక, కాసేపు చిన్న తరగతుల పిల్లలకి లెక్కలు చెబుతావా? మన క్లాస్ రూమ్‍లోనే.. నీకు పారితోషికం కూడా ఇప్పిస్తాను. ఆ డబ్బు నీకు ఉపయోగపడుతుంది. ఆలోచించి నీ నిర్ణయం నాకు చెప్పు.." అన్నారు. టీచర్ అడగడం వల్లనే గణితంలో వెనుకబడిన పిల్లలకి  సహాయం చేస్తానని వాళ్ళమ్మని బతిమాలి ఒప్పించింది తులసి. పాఠాలు చెప్పినందుకు డబ్బిస్తారని మాత్రం అమ్మానాన్నలకి చెప్పలేదు. జీతం అందుకున్నాక వారిని ఆశ్చర్యపరచాలని అనుకుంది.  ఇంటిపనిలో తన తోడ్పాటుకి ఎటువంటి లోపం లేకుండానే, సమర్ధవంతంగా బయట పనులు కూడా చక్కబెట్ట సాగింది ఆ అమ్మాయి.                                 ఇటు ‘అమృతవాణి’ రేడియోకి వక్తగా,  అటు స్కూల్లో లెక్కల ట్యూటరుగా ఉత్సాహంగా సాగిపోతుంది తులసి రోజూవారీ జీవనం.  ‘అమృతవాణి’ బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని ఇంచుమించు స్కూల్లో వారందరూ  వింటారు.   అప్పుడే నెలరోజులుగా సాగుతున్న కార్యక్రమాలతో, మంచి వక్తగా గుర్తింపు పొందింది తులసి. ఇక చేతికి అందబోయే జీతంతో అమ్మావాళ్ళకి, ఇంటికి ఉపయోగపడే కొనుగోళ్ళు చేసి, వాళ్ళని ఆశ్చర్య పరచాలన్న ఆలోచనలో ఉంది ఆ అమ్మాయి..                   సాయంత్రమైంది.  రాత్రి భోజనాల కోసమని వంట చేస్తోంది సాగరి.  పిల్లలు స్కూలు నుంచి వచ్చిన హడావిడితో పాటు హాల్లో ఎన్నడూ లేనంత గొడవగా ఉండడంతో,  మధ్య గదిలోకి వచ్చింది.   హాల్లోని సోఫాలో కూచునున్న మల్లిక ముఖం కోపంగా ఉంది. అమ్మని చూడగానే, అసహనంగా బిగ్గరగా మాట్లాడసాగింది. "అమ్మా... స్కూల్లో అందరూ అక్క రేడియో ప్రోగ్రాములు, ట్యూషన్ల గురించే మాట్లాడుతున్నారు. ఇకనుండి నేనూ చర్చ్ ప్రోగ్రాములలో పాల్గొంటాను. లేదంటే అసలు నీ మాట వినను," అని గట్టిగా అరుస్తూ పుస్తకాల సంచీని ఓ మూలకి విసిరేసింది.  "మల్లికా, ఊరికే ఉండు. మన అక్క ఒక వాగుడుకాయ. ఎప్పుడు చూసినా పాడుతూనో, వాగుతూనో ఉంటుంది. పెద్ద తలనొప్పిగా తయారయింది. నువ్వు కూడా అక్కలాగే అవ్వాలనుకుంటున్నావా? వేరే పనేం లేదా," అన్నాడు బూట్లు విప్పుతూ సాయి.  అప్పుడే  లోపలికి వస్తూ ఆ మాటలు విన్న తులసి చిన్నబుచ్చుకుంది.  మల్లిక మాత్రం చప్పట్లు కొడుతూ గట్టిగా నవ్వింది.  ఇదంతా చూస్తున్న వాళ్ళమ్మ కలవరపాటుకి గురయింది.. ఎలా కట్టడి చేయాలో తోచలేదామెకి. "నోరు మూసుకోండి. తిన్నగా మాట్లాడ్డం నేర్చుకోండి. అక్కని మెచ్చుకోవలసింది పోయి, ఇలా హేళన చేస్తారా? అయినా, మల్లికా... సరయిన పని ఏదన్నా చేస్తానంటే నిన్ను వద్దనేదెవరు? ఏదైనా సులువుగా లభించదు. సాధన చేయాలి. అర్థమైందా..." అంటూ క్షణం సేపు మౌనంగా ఉండిపోయింది.. “... సైకిల్ కోసం ఇంకొన్నాళ్ళు ఆగాలి అంటారు,  చేతిలో ఉన్న డబ్బు చాలదు అంటారు. స్కూలుకి ఇక నడవడం నాకు కష్టమే.   వెంటనే సైకిల్ కొనాల్సిందే మమ్మీ,” విసురుగా సాయి... కోపాన్ని అణుచుకుని, "సరే, ఆ ప్రస్తావన ఇప్పుడు అనవసరం. ఇక వెళ్ళి స్నానాలు చేసి రండి..." అని చెబుతూ వంటింట్లోకి నడిచింది సాగరి. తెల్లవారింది. తులసి నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుంది. పెరటి తోటలోకి వెళ్ళి పూజ కోసం పూలు కోసింది.  వాళ్ళమ్మ ప్రేమగా శ్రద్దగా పెంచే తులసివనం లోని తులసి మొక్కలికి నీళ్ళు పోసింది.  దేవుడి గదిని శుభ్రం చేసి, రోజూ చదివే లలితాసహస్ర నామాలు చదువుకుంది. ప్రార్థన పూర్తయ్యాక వంటింట్లోకి వెళ్ళి ఇడ్లీ, పచ్చడి తయారు చేయడానికి ఏర్పాట్లు చేయసాగింది. అందరూ లేచాక, వంటింట్లో అమ్మకి సాయం చేసి ఉత్సాహంగా స్కూలుకి సాగిపోయింది. చేతిలో 1500 రూపాయలతో, స్కూల్ అవగానే, ఉత్సాహంగా ఇంటికి బయల్దేరింది తులసి. ఆమె నెల రోజుల పాటు ట్యూషన్ చెప్పినందుకు వచ్చిన డబ్బది.  ఓ పెద్ద బట్టల కొట్టు... ఆర్.ఎస్. గార్మెంట్స్ లోకి అడుగుపెట్టింది. అమ్మ కోసం పొడవాటి కాటన్ హౌస్‌కోట్ కొంది. డేవిడ్ రోజూ అన్నం తీసుకువెళ్ళే ప్లాస్టిక్ డబ్బా స్థానంలో, ఇంకో షాపులో నాన్న కోసం స్టీల్ లంచ్ బాక్స్ కొంది.  ఇంటికి వెడుతూ దారిలో ఓ స్వీట్ షాప్ దగ్గర ఆగి తమ్ముడు, చెల్లెళ్ళ కోసం జిలేబి కొన్నది.  అందరికీ అన్నీ తీసుకున్నానన్న ఆనందంతో ఇంటి దారి పట్టింది. ఉత్సాహంగా ఇంట్లో అడుగు పెట్టింది  తులసి. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. వంటగది, పూజ గది, పిల్లల గదులు అన్నీ దాటుకుని వాళ్ళమ్మ గదికి వెళ్ళింది. అక్కడి పరిస్థితిని చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చిందరవందరగా ఉన్న గదిని కంగారుగా వెతుకున్న సాగరి, సాయి, మల్లిక, కాస్త దూరంలో వాళ్ళని చూస్తూ కూర్చునున్న మానస కనబడ్డారు.  "అమ్మా, ఏమైంది? ఏం పోయింది?" అని అడిగింది తులసి. అందరూ ఒక్కసారిగా తులసి కేసి, ఆమె చేతిలోని షాపింగ్ బాగ్స్ కేసి చూసారు.  వాళ్ళెవరూ ఏమీ మాట్లాడక ముందే బయటి నుంచి డేవిడ్ గొంతు వినబడింది. "ఏమర్రా... ఎక్కడున్నారు? సాగరి... మల్లికా... ఒక్కరూ కనబడరే.." అంటూ గదిలోకి అడుగుపెట్టాడు డేవిడ్.  గది పరిస్థితి చూసి, అడుగు వెనక్కి వేసాడు. అక్కడి గందరగోళం చూసి తొట్రుపాటుకి గురయ్యాడు. "ఏమైంది సాగరి? ఏమిటిదంతా?" అడిగాడు విసుగ్గా.  సాగరి అప్పటికే బెంబేలెత్తిపోయి ఉంది. వణికిపోతూ.. "ఏవండి.. ఇరవై వేల రూపాయలు ఉంచిన కవర్ కనిపించడం లేదండి.. దేవుడి దగ్గర నుంచి తెచ్చి, అప్పుడే బీరవాలో నా బట్టల కింద ఓ మూలకి నేనే పెట్టాను.." అంటూ మళ్ళీ వెతకసాగింది. ఆమె గొంతులో వణుకు చూసి డేవిడ్, తులసి ఇద్దరూ కంగారుపడ్డారు.  ఇంతలో సాయి వచ్చి తులసి పక్కన నిలుచున్నాడు. "అక్కా, నువ్వు బయల్దేరే ముందు అమ్మని డబ్బు అడిగావా? లేక బీరువా నుండి తీసావా? నీ చేతిలో ఉన్న సంచులేంటి?" అని అడిగాడు. "లేదంటే, ఆ కవర్‌ని మరెక్కడో పెట్టి అమ్మ మర్చిపోయిందంటావా?" మళ్ళీ సాయి.. అవే ప్రశ్నలని తిప్పి తిప్పి అడుగుతూ తులసి చేతిలోని సంచులని లాక్కోడానికి ప్రయత్నించాడు.  "అన్నా.. నువ్వు చెప్పిందే నిజం. నీకూ, నాకూ ఏదైనా కొనడం అక్కకి ఇష్టముండదు. అన్నీ తనకే కావాలనుకుంటుంది. అందుకే డబ్బంతా తీసుకుని తనకి కావల్సినవి కొనుక్కున్నట్లుంది...." అంటూ మల్లిక వచ్చి తులసి చేతుల్లోని సంచీలను లాక్కుంది. సాయి, మల్లిక కలసి సంచీలలోని వస్తువులను మంచం మీద పోసారు.  ఓ కవర్ తోపాటు కొంత డబ్బు, చిల్లర మంచం మీద పడ్డాయి.  అందరి చూపులూ డబ్బు మీద నుంచి తులసి వైపు మళ్ళాయి. వాళ్ళ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఆ కళ్ళల్లో ఎన్నో ప్రశ్నలు... ఉన్నట్టుండి తులసికి దుఃఖం ముంచుకొచ్చింది. మోకాళ్ళ మీద కూర్చుని ఏడవసాగింది.  మరో వైపు సాగరి... తాను మోసపోయినట్లు భావించింది. కోపంతో ఊగిపోయింది. తులసి రెక్క పట్టుకుని తన వైపుకి లాక్కుంది. "నీకేమయినా దెయ్యం పట్టిందా? నీ డబ్బు నువ్వే దొంగతనం చేస్తావా? ఎందుకిలా చేసావు తులసి? నువ్వెంతో మంచిదానివని అనుకున్నాను. నీ గురించి ఎంత గొప్పగా ఊహించుకున్నాను... ఇలా చేసావేమే.." అని అరుస్తూ, చాచి చెంప దెబ్బ కొట్టింది. డేవిడ్ తక్షణమే జోక్యం చేసుకుని వారిద్దరిని విడదీసాడు. సాగరి నేల మీద కూలబడి భోరుమని ఏడవసాగింది.  సాయిని, మల్లికని వాళ్ళ గదికి వెళ్ళమని ఆదేశించాడు డేవిడ్. వాళ్ళు ఆక్కడినుండి కదిలాక, లోపల్నించి గది తలుపులు గడియ పెట్టాడు. మర్నాడు, ప్రతీ ఆదివారం లానే, ఉదయం ఆరుగంటలకే నిద్ర లేచారు సాయి, మల్లిక. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఇంట్లో స్వేచ్ఛగా తిరగడానికి కూడా భయపడ్డారిద్దరూ.  చర్చ్ కి పెందరాలే వెళ్ళాలి కాబట్టి, ధైర్యం చేసి వంటింట్లోకి నడిచారు. అమ్మ, అక్క హాయిగా మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ రొట్టెలు తయారు చేస్తున్నారు. రాత్రి అసలేమీ జరగనట్టుగా, ప్రశాంతంగా ఉన్నారు. కొద్ది సేపటి తర్వాత సాయికి, మల్లికకి తాము చేసిన చపాతీలు, కోడిగుడ్డు కర్రీ కూడా వడ్డించారు.  చర్చ్‌లో సేవ పూర్తయ్యాక, డేవిడ్, జోసెఫ్ ల కుటుంబాలు... అలవాటుగా తాము వెళ్ళే టిఫిన్ సెంటర్ కి వెళ్ళారు.  టిఫిన్ తినేసి పిల్లలు బైబిల్ స్కూల్‌కి,  మానసని తీసుకుని మగవాళ్ళిద్దరు చర్చ్ పార్క్‌లో వాహ్యాళికి వెళ్ళారు. సాగరి, శాలిని మాత్రమే ఉన్నారక్కడ.  తను కూర్చున్న స్థానం నుండి లేచి వెళ్ళి సాగరి పక్కన కుర్చీలో కూర్చుంది శాలిని. ఆమె కేసి చూస్తూ "ఏమైంది సాగరి? దిగులుగా కనబడతున్నావు! వర్షించే మేఘాల్లా ఉన్నాయి నీ కళ్ళు. ఏం జరిగింది? " అని ఆప్యాయంగా అడిగింది.   ఒక్కసారిగా దుఃఖం ముంచుకొచ్చింది సాగరికి. ఆమెని ఓదార్చడానికి ప్రయత్నించింది శాలిని. ఏదో దారుణమైన సంఘటనే జరిగి ఉంటుందని ఊహించింది కూడా..  కాసేపటి సంబాళించుకుని, వణుకుతున్న గొంతుతో జరిగినదంతా వివరించింది సాగరి. చేయని తప్పుకి తాను తులసిని  శిక్షించిన వైనం చెప్పుకొచ్చింది.  "సాయి మాటలకి నేనెలా లొంగిపోయానో నాకే అర్థం కాలేదు. డబ్బు పోయిందనే సరికి కంగారుపడి వాడి మాటలు నమ్మేసాను. ఇంకా దారుణం ఏంటంటే.. అమాయకురాలైన  తులసిని... పాపం... గట్టిగా కొట్టాను. బాగా తిట్టాను.." అంటూ కన్నీరు కార్చింది సాగరి.  ఇదంతా వింటున్న శాలిని విస్తుపోయింది. చివరికి సమస్య ఎలా పరిష్కారమైందో ఆమెకి అర్థం కాలేదు.  "డేవిడ్ ఉండబట్టి సరిపోయింది. లేకపోతే ఇంకేం చేసేదాన్నో.  తులసిని తిట్టకుండా, కొట్టకుండా తెలివిగా ప్రవర్తించారు డేవిడ్. నా నుంచి దూరంగా తీసుకెళ్ళి దాన్ని ఓదార్చారు. తర్వాత మంచం మీద ఉన్న కవర్‌ని తీసి చూసారు. దాని మీద స్కూల్ ముద్ర ఉంది. అందులో ఉన్న డబ్బు లెక్కపెట్టారు. తులసి భుజం మీద చెయ్యేసి, ఆ డబ్బు గురించి అడిగారు." నిట్టూర్చింది సాగరి.  నీళ్ళు నిండిన కళ్ళతో శాలిని వంక ఓ మారు నిశితంగా చూసిందామె. "అప్పుడు నోరు విప్పింది తులసి.. ట్యూషన్ చెప్పినందుకు తనకి స్కూల్లో 1500 రూపాయలు ఇచ్చారని, మాకు ముందే నిజం చెప్పనందుకు క్షమించమనీ, అడిగింది ఆ చిట్టితల్లి. అలా తను  సంపాదించిన డబ్బుతో మాకోసం కానుకలు తెస్తే.. నేనేమో దాన్ని శిక్షించాను," అంటూ వాపోయింది సాగరి. సాగరి చెబుతున్నది వినడం మినహా చేష్టలుడిగి మౌనంగా ఉండిపోయింది శాలిని. “తప్పిదం తెలుసుకుని క్రుంగిపోతున్న నన్ను తల్లిలా దగ్గరికి తీసుకుని ఓదార్చింది నా తులసి. పిల్ల పట్ల అంత క్రూరంగా ప్రవర్తించినందుకు నాకు చాలా సిగ్గుగా ఉంది. కనీసం ఇప్పటి నుంచైనా దానికి ఓ మంచి అమ్మని అవుతాను..." సాగరి బుగ్గల మీద నుంచి కన్నీళ్ళు కిందకి జారాయి.  తులసి మానసిక పరిస్థితి ఎలా ఉండిఉంటుందో అని ఆలోచించింది శాలిని... “ఇకపోతే  ఆ  ఇరవైవేల  రూపాయల  కవర్, ఆఖరికి, నా  పరుపు గలేబు లోపల దొరికింది. ఈ పిచ్చి పని చేసింది మాత్రం  సాయి, మల్లికేనని మా అనుమానం.  సందేహమే లేదు. తులసిని ఎలాగైనా తేలిక పరిచి శిక్ష పడేలా చేయాలన్నది వాళ్ళ ఉద్దేశం.." బాధపడుతూ కన్నీళ్లు తుడుచుకుంది సాగరి.  తనకి కూడా  అదే  నిజమనిపిస్తుందని ఒప్పుకుంది శాలిని.  “ఏమైనా నీ కూతురు మేలిమి బంగారం అని  తెలుసుకో సాగరి. నీ తులసివనంలో తులసి మొక్కంత స్వచ్చమైనదని నమ్మకముంచు. ప్రతికూల పరిస్థితులలో వికసించే పుష్పమే అరుదైనది, అందమైనదీ అని ఎక్కడో చదివిన గుర్తు... మన తులసి అటువంటిదే," అంది శాలిని. ఇంతలో దూరంగా మానస గొంతు వినబడింది. మగవాళ్ళిద్దరూ మానస తో వాళ్ళ  వైపే వస్తూ కనబడ్డారు.                                                          రచన : కోసూరి ఉమాభారతి  

విధివ్రాత

విధివ్రాత   వంగదేశాన్ని ఒకప్పుడు అనంగుడు అనే రాజు పరిపాలించే వాడు. ఆ సమయంలో అక్కడి ఓ పల్లెటూళ్ళో హనుమంతు అనే విద్వాంసుడొకడు ఉండేవాడు. 'జాతకాలు చూడటంలో ఆయనకి ఎదురే లేదు' అని చెప్పుకునేవారు. ఒకరోజున హనుమంతు యథాలాపంగా పుస్తకాలు సవరిస్తూంటే అనంగ మహారాజు జాతక చక్రం కనబడింది. తమ రాజుగారి జాతకం ఎలా ఉందో చూద్దామని లెక్కలు వేసిన హనుమంతుకు ఆ జాతకంలో పెద్ద దోషం ఒకటి కనబడ్డది: 'మరొక నాలుగు ఐదు రోజుల్లో రాజుగారికి ప్రాణగండం ఎదురౌతుంది. ఆయన దాని నుండి తప్పించుకునేందుకు ఎలాంటి అవకాశాలూ లేవు' సంగతి తెలిసాక ఇక హనుమంతు ఊళ్ళో నిలువలేపోయాడు. ఈ విషయాన్ని వెంటనే రాజుగారికి తెలియజేయాలని బయలుదేరాడు. మూడు రోజులపాటు నడిచి, ఎన్నో అవస్థలు పడి, చివరికి రాజధానికి చేరుకున్నాడు. ఉదయాన్నే రాజుగారి ఆస్థానానికి వెళ్ళాడు. "రాజుగారు ఇక్కడ లేరు.    దేశాటనలో ఉన్నారు" అన్నారు ద్వారపాలకులు. "రాజుగారితో ముఖ్యమైన విషయం చెప్పాలి" అన్నాడు హనుమంతు. "ఆ ముఖ్యమైన విషయం ఏమిటో మాకే చెప్పు" అని నవ్వారు ద్వారపాలకులు. అయితే అదే సమయంలో ఒక మంత్రిగారు వచ్చారు అక్కడికి. హనుమంతు మంత్రిగారితో మొరపెట్టు-కున్నాడు- "రాజుగారితో నేనొక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఆలస్యం ప్రమాదానికి దారి తీస్తుంది!" అని. మంత్రి హనుమంతుని ఊరడించి సంగతి కనుక్కొని, ఆయన్ని మహా మంత్రి దగ్గరికి తీసుకెళ్ళాడు. మహామంత్రి అనేక రాచకార్యాలలో వ్యస్తంగా ఉన్నాడు. 'హనుమంతు కేవలం బహుమానాల మీది ఆశతో, ప్రశంసల కోసం ఊరికే ఇలా చెబుతున్నాడు' అని మహామంత్రికి అనిపించింది. "ముందు ఇతన్ని చెరసాలలో బంధించండి. అసలు విషయం ఏంటో చెప్పించండి. రేపటి వరకూ ఇతను అదే మాట మీద ఉంటే, అప్పుడు మన ఆస్థాన జ్యోతిష్యుడిని రమ్మందాం" అన్నాడాయన.   భటులు తక్షణం హనుమంతుని చెరసాలలో బంధించారు. అనేక రకాలుగా ప్రశ్నించారు అతన్ని. ఎన్ని రకాలుగా అడిగినా హనుమంతు తను చెప్పిందే మళ్ళీ‌ మళ్ళీ‌ చెబుతున్నాడు తప్ప మాట మార్చట్లేదు. "ఆలస్యం ప్రమాదానికి దారి తీస్తుంది. బాద్యత గలవారిని ఎవరినైనా రమ్మనండి" అంటాడు; "అసలైనా నాదగ్గరికి వచ్చినవాళ్ళ జాతకాలు చూసుకొని హాయిగా ఉండక, నాకెందుకు వచ్చింది ఈ ఖర్మ? అసలు రాజుగారి జాతకాన్ని చదివి చెప్పేందుకు అస్థాన జ్యోతిష్యులు ఉంటారు కదా?" అని వాపోతాడు హనుమంతు. మరునాడు ఉదయం అస్థాన జ్యోతిష్యుడికి కబురు వెళ్ళింది. "ఇక్కడెవరో ఒకతను వచ్చాడు పల్లె నుండి.    రాజుగారి గురించిన ముఖ్యమైన విషయం ఏదో చెబుతాడట. మీరు రావాలి కారాగారం దగ్గరికి" అని. జ్యోతిష్యుడు "నేను ఒక్క ఐదు నిముషాల్లో వస్తున్నాను- ఆలోగా ఆయన్ని జాగ్రత్తగా చూసుకోండి" అని వెనక్కి కబురు పెట్టి గబగబా ఆస్థానానికి చేరుకున్నాడు. అంతలోకే వార్తాహరుడొకడు దుర్వార్తను మోసుకొచ్చాడు: రాజుగారు ప్రజల కష్టాలు విచారించే క్రమంలో రాజ్య సరిహద్దులో బస చేసారు. అంతకు ముందు రోజు రాత్రి ఆకస్మికంగా శత్రుసైన్యం జరిపిన దాడిలో రాజుగారు వీరమరణం చెందారు! అంత:పురంలోని వారంతా బావురుమన్నారు.   "మనం బంధించిన ఆ పండితుడిని వెంటనే సగౌరవంగా రప్పించండి" అన్నాడు అస్థాన జ్యోతిష్యుడు. భటులు వెళ్ళి చూసే సరికి కారాగారంలో హనుమంతు కూడా చనిపోయి ఉన్నాడు! అక్కడ రాజు చనిపోయిన కొద్దిసేపట్లోనే ఇక్కడ ఈయనా మరణించి ఉంటాడన్నారు వైద్యులు.  "రాజుగారి ప్రాణాలకు గండం ఉందని నాకూ తెలుసు. అయితే ఈ విషయాన్ని వెలువరించిన వారికి కూడా ప్రాణగండం ఉందని తెలుసుకున్నాక, సంగతిని వెలిబుచ్చకుండా సమస్యను ఎలా పరిష్కరించటమా అని ఆలోచిస్తూ ఉండిపోయాను. అంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది" అని ఆస్థానజ్యోతిష్యుడు వాపోయాడు. "పాపం అందరి జాతకాలూ చూసిన హనుమంతు తన జాతకాన్ని తను చూసుకోలేకపోయాడు- విధి వ్రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది" అన్నారు మంత్రిగారు, తనూ విచారపడుతూ, 'రాజుగారి వారసుడిని ఎలా ఎన్నుకోవటమా' అని ఆలోచిస్తూ.   - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

సందేశం

సందేశం   రెజిల్‌ దేశంలో ఒక కోటీశ్వరుడి దగ్గర ప్రపంచంలోకెల్లా అతి ఖరీదైన కారు ఒకటి ఉండేది. ఒకసారి ఆయన తన ఆ కారుని "ఫలానా రోజున పాతి పెట్టబోతున్నాను" అంటూ ప్రకటన ఇచ్చాడు. "నేను ఈ కారుని ఎందుకు పాతిపెట్టేస్తున్నానో‌ కూడా చెబుతాను. ఇప్పుడు వాడుకునేందుకు అయితే నాకు వేరే కార్లు ఉన్నాయి. ఇక ఒకసారి నేను చనిపోయాక, ఇంక ఈ కారు వలన నాకు ఏలాంటి ప్రయోజనమూ లేదు! అందుకని ఈ కారుని ఇప్పుడే పూడ్చిపెట్టటం అన్నివిధాలుగానూ సరైన పని!" అని ఆ ప్రకటనలో తెలియజేసాడు. అందరూ దీన్ని గురించి రకరకాలుగా వ్యాఖ్యానించారు. కొందరు "ఈ కోటీశ్వరుడికి డబ్బులు ఎక్కువైనాయి" అన్నారు. కొందరు "అయ్యో! డబ్బులు ఉన్నాయిగానీ వీడు బలే తెలివి తక్కువ దద్దమ్మ" అన్నారు. "ఇంత విలువైన కారుని వృధా చేస్తున్నాడు. ఎంత పొగరో చూడండి" అన్నారు కొందరు- మొత్తం మీద ఆయన్ని ఎరిగిన వారిలో ఆయనను తిట్టుకోనివారు లేరు. చివరికి కారును పాతిపెట్టే రోజు రానే వచ్చింది. ఆ కార్యక్రమం ఎలా జరుగుతుందో చూడటానికి జనం అంతా వచ్చారు. కారుని పాతిపెట్టడానికి చాలా గొప్ప ఏర్పాట్లు చేశాడు కోటీశ్వరుడు. వచ్చినవాళ్లందరికీ విందు ఏర్పాటు చేసాడు; కారు పట్టేంత పెద్ద గుంత త్రవ్వి ఉంచాడు; ఆ గుంతలోకి కారును దించేందుకు క్రేన్లు వగైరాలు అన్నీ ఏర్పాటు చేసాడు; కార్యక్రమాన్ని చూసేందుకు అక్కడికి చేరిన ప్రజలంతా సుఖంగా కూర్చునేందుకు ఏర్పాట్లు చేసాడు. అందరూ గుమికూడి ఉత్సాహంతోటీ మరియు అశ్చర్యంతోటీ వేచి చూస్తున్నారు. అంతలోనే కోటీశ్వరుడు వచ్చాడు. అక్కడికి చేరిన ప్రజలందరినీ‌ పేరు పేరునా పలకరించాడు. కరచాలనాలు చేసాడు. తనేదో చాలా గొప్ప పని చేస్తున్నట్లు పోజు కొట్టాడు. దాంతో అక్కడికి వచ్చిన వాళ్ళకు అందరికీ రోషం పెల్లుబికింది. అందరూ కోపంతో ఉడికిపోతూ "అయినా మీరెందుకు, ఇంత విలువైన కారుని వృధా చేస్తున్నారు? మీరు చనిపోయాక ఇది మీకు పనికి రాకపోవచ్చు. అంత మాత్రాన దీనిని ఊరికే పాతిపెడతారా?! ఎవరికైనా ఇవ్వచ్చు కదా?! ఇంత విలువైన దానిని నాశనం చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారు?" అని అతన్ని ప్రశ్నించారు. కోటీశ్వరుడు నవ్వి, ఇలా సమాధానం ఇచ్చాడు. "ఇంత విలువైన కారుని సమాధి చెయ్యడానికి నేనేమీ బుద్ధి తక్కువ వాడిని కాను. దీని ద్వారా నేను అందరికీ ఒక సందేశాన్ని ఇవ్వాలనుకున్నాను. చూసారుగా, నిజంగానే ఈ కారు చాలా విలువైనది. అయినా నేను దీన్ని పాతి పెట్టాలని నిర్ణయం తీసుకున్నందుకు మీ అందరికీ నా మీద ఎంత కోపం వచ్చింది?! కదా?!   కానీ మీరెవ్వరూ గమనించని సంగతి ఇంకోటి ఉన్నది. మన శరీరంలో ఎంతో విలువైన గుండె, కళ్ళు, ఊపిరితిత్తులు, మూత్ర- పిండాలు ఇలా ఎన్నెన్ని అవయవాలు ఉన్నాయి? ప్రతి అవయవమూ మానవ సమాజానికి ఉపయోగపడేవే! వెల కట్టలేనంత విలువ వీటిది!‌ అయినా, మనం చచ్చిపోగానే ఈ అవయవాలన్నీ మనతోపాటే అనవసరంగా, వృధాగా మట్టిలో కలిసిపోవట్లేదా? వాటిని గురించి ఎవ్వరికీ ఏ మాత్రం చింత ఎందుకు లేదు? కారు పోయినా, డబ్బు పోయినా మళ్లీ తిరిగి వస్తాయి; కానీ మన అవయవాలు తిరిగి రావు కదా, మరి మనం ఎందుకు, వాటిని ఇతరులకు పనికొచ్చేట్లు బహుమతిగా ఇవ్వట్లేదు? మీకు తెలుసా? ప్రతి ఏటా కొన్ని లక్షల మంది అవయవ దానం కోసం ఎదురు సూస్తున్నారు. మనం అనుకుంటే వాళ్లకు చాలా సాయం చేయచ్చు! ఆలోచించండి! అవయవదానం చెయ్యడానికి నిర్ణయించు-కోండి. అవయవ దానం ఎంత అవసరమో అందరూ గుర్తించేలా చేసేందుకే నేను ఈ నాటకం ఆడాను!" అన్నాడు. - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

తులసి

     తులసి                                                    రాత్రి తొమ్మిది గంటల సమయంలో వంటగది శుభ్రం చేసేసి, తల్లి గదిలోకి వెళ్ళింది తులసి. మంచం మీద కూర్చుని బట్టలు మడతపెడుతున్న సాగరి వెనుకగా కూర్చుని, ఆమె భుజాలని సున్నితంగా నొక్కసాగింది. "అమ్మా, రేపొద్దున్నే చపాతీలకి పిండి కలపాలా? పాలకూర, బంగాళదుంపలు తరగాలా? ఇప్పుడే చేసేస్తే పని అయిపోతుందిగా," అని అడిగింది.  సాగరి తలూపింది. "నీకు అలసటగా అనిపిస్తే, పొద్దన్న మరింతసేపు నిద్రపో. నాతో పాటు లేవద్దు. చపాతీలు, కూర నేను చేసేస్తాలే. మీ నాన్నలా నీక్కూడా మరునాటి పనుల గురించి ముందురోజు నుండే ఆలోచన," అంది కూతురి  నుదిటి ముద్దు పెడుతూ. అమ్మ భుజంపై తల ఆనించి, "అమ్మా... త్వరలో నీ పుట్టిన రోజు వస్తోంది కదా. ఏదైనా నగ కొనుక్కోమ్మా. బావుంటుంది.  బైబిల్ స్కూల్ డిబేట్లలో గెలిచుకున్న నగదుతో, నీకు, నాన్నకి  ఏదైనా  చేయాలని  ఉందమ్మా,”  అంటూ బ్రతిమాలింది. "అలా చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది,”...అంది తులసి. సాగరి నవ్వేసి, కూతురి వైపు తిరిగింది. "మంచి ఆలోచనే బంగారం. నీ వయసులో అమ్మానాన్నల గురించి ఇంతలా ఎవరు ఆలోచిస్తారు? మీ తమ్ముడు సాయి చూడు... సైకిల్  కొనమని ఒకటే సతాయింపు...మన మల్లికకి ఖరీదైన బొమ్మరిల్లు కావాలట. ఒకటే గొడవ... నిజానికి నీకే ఏదైనా కొనిద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే.. ఆ డబ్బు నీ శ్రమకి, నైపుణ్యానికి వచ్చిన బహుమతి తల్లీ..." చెప్పింది సాగరి.  అమ్మ ప్రేమకి తులసి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. కూతురి బుగ్గల మీద కారిన కన్నీరుని తుడిచింది సాగరి.  పక్కన చేరిన నాలుగేళ్ళ చిన్నచెల్లెలు మానసతో కాసేపు ఆడుకుని, అక్కడే అమ్మ మంచం మీద నిద్రపోయింది తులసి.     అలిసి నిద్రపోతున్న కూతురి ముఖంలో, తన అమ్మమ్మ పోలికలు కనబడ్డాయి సాగరికి.  అమ్మమ్మ పేరే పెట్టినందుకు, అదే సున్నితమైన వ్యక్తిత్వం, మంచితనం  పుణికిపుచ్చుకుంది తులసి అనుకుంది.     పెంచి పెద్దచేసిన అమ్మమ్మ తాతయ్యలు గుర్తుకి రాగానే సాగరి మనసులో దిగులు కదలాడింది.. పదిహేనేళ్ళ క్రితం, తోటి ఉపాధ్యాయుడైన డేవిడ్ తో తన ప్రేమని, వివాహాన్ని వ్యతిరేకించారని, వారికి దూరమయిన వైనం గుర్తుచేసుకుంది. తను శ్రద్దగా పెంచుతున్న తులసి మొక్కని మాత్రం తీసుకుని, డేవిడ్ చేయందుకుని గడప దాటిన ఆ నాటి సంఘటన, సాగరి కళ్ళ ముందు కదిలింది.  ఆమె పెళ్ళాడిన డేవిడ్ విషయానికొస్తే, కుటుంబ నియంత్రణకి వ్యతిరేకి అతను.  బిడ్డలని దేవుని వరాలుగా భావించాలన్నది అతని వైఖరి.  కొన్ని పటిష్టమైన అభిప్రాయాలున్న డేవిడ్ ని ఎందులోనూ ఎదిరించి ఎరుగని సాగరికి, అన్ని విషయాల్లో పూర్తి స్వేచ్చ స్వాతంత్ర్యాలు కూడా ఉన్నాయి.  పిల్లల నామకరణం నుండి, ఆహారవ్యవహారాల వరకు అన్నీ ఆమె ఇష్టానుసారమే.  వారి మధ్యనున్న పరస్పర ప్రేమానురాగాలు, సర్డుకుపోవడాలే వారి కాపురానికి పునాదులుగా సాగిపోతుంది..  పద్నాలుగేళ్ళ తులసి,  పదేళ్ళ కవలలు మల్లిక, సాయి, ఆ తరువాత ఆరేళ్ళకి పుట్టిన మానస వారి సంతానం. కవలలు పుట్టినప్పటి నుండీ మాత్రం ఆరోగ్యం సరిలేక టీచర్ ఉద్యోగం మానేసి, ఇంటనే ట్యూషన్లు చెబుతుంది సాగరి.  అయినా, పెరుగుతున్న ఖర్చులు, పిల్లల అవసరాలతో, సంసారం గడవడం కాస్త ఇబ్బందిగానే ఉంది ఆ దంపతులకి... “డేవిడ్, నీ కాఫీ తాగడం అయ్యాక, బజారుకి వెళ్లి గోధుమ రవ్వ, జీడిపప్పుతో పాటు ఓ చాక్లెట్ కేక్ కూడా తెస్తావా? ఇవాళ లంచ్ కి శాలిని, జోసెఫ్ వస్తారుగా... బైబిల్ స్కూల్ డిబేట్లు గెలిచినందుకు తులసి చేత కేక్ కోయిద్దామని.  ఇక శాలినికి కేసరి ఇష్టం కదా.  తన కోసం కేసరి చెయ్యాలి,” అంటూ అతనికి కాఫీ కప్పు అందించింది సాగరి.. డేవిడ్ వెళ్ళే స్థానిక బాప్టిస్ట్ చర్చ్ కి.... సాగరి కూడా పిల్లల్ని తీసుకుని బైబిల్ క్లాసులకి వెళుతుంది.  ఆ చర్చ్ ముఖ్య నిర్వాహకులు శాలిని, జోసెఫ్ దంపతులతో  మంచి స్నేహం  ఏర్పడింది వారికి.  “మరో పది నిముషాల్లో వెళతాను గాని, శాలిని అంటే గుర్తొచ్చింది.  చర్చ్ నుండి నిన్ననే లెటర్ వచ్చింది... ఆమె సిఫారసు పై, మన పిల్లల స్కూల్ రిపోర్ట్ కార్డ్స్, నడవడి, స్కూల్లో వారి కార్యకలాపాలు పరిశీలించి, వచ్చే యేడు కూడా ‘స్కాలర్షిప్ ట్రస్ట్’ నుండి వారి చదువుకి ఆర్ధిక సహాయం అందిస్తామని కమిటీ తెలియజేసింది.   అంటే ఇకముందు కూడా పిల్లలు ముగ్గురూ చర్చ్ స్కూల్లోనే చదువుతారు...ఈ విషయమై, శాలిని, జోసెఫ్ ల   సహాయసహకారాలు వెల కట్టలేనివి. దానికితోడు మన తులసి అంటే ఆవిడకి ఎనలేని అభిమానం కూడా.... కాబట్టి, శాలినికి ఎంతో ఇష్టమైన నీ వెజ్జీ కట్లెట్స్, మిరపకాయ బజ్జీ కూడా చేయి. నేనూ సాయం చేస్తాను,” అన్నాడు కాఫీ తాగుతూ డేవిడ్....  “నిజమే, బైబిల్ స్కూల్ డిబేట్లకి, ఈ యేడు నగదు బహుమతులు స్తాపించిందే శాలిని జోసెఫ్ లు.   సంతానం లేని కారణమో ఏమో గాని మన పిల్లల పైన ప్రత్యేక మమకారం వాళ్లకి.  ఇక తులసిని ‘బంగారం’ అని పిలుస్తుంది శాలిని,” నవ్వుతూ డేవిడ్ నుండి ఖాళి కాఫీ కప్పు అందుకుంది సాగరి. “అయితే, మిగతా ముగ్గురం వెండి, ఇత్తడి, ఇనుమా? మేమూ మీ పిల్లలమే కాదా?” ఫిర్యాదు దోరిణిలో అడిగాడు టి.వి చూస్తూ అమ్మానాన్నల మాటలు వింటున్న సాయి. “అక్కలా తెలివితేటలు, మంచితనం, మన్నన చూపగానే, మిమ్మల్ని కూడా ‘మేలిమి బంగారాలే’ అంటామురా బడుద్దాయ్,” సాయి తల మీద తట్టి, అక్కడి నుండి కదిలాడు డేవిడ్.       చేతిలో పూల గుచ్చాలతో ఇంట్లో అడుగు పెట్టిన శాలిని, జోసెఫ్ లని సాదరంగా ఆహ్వానించారు సాగరి, డేవిడ్.  మధ్య  హాల్లోని  సోఫాల్లో ఆశీనులయ్యాక, తులసిని పిలిచి, పూల గుచ్చం అందించి అభినందించాడు జోసెఫ్. "మన తులసిలో  దాగున్న ఈ ప్రావీణ్యం ఇలా బయటపడుతుందని ఊహించలేదు. పది బైబిల్ స్కూళ్ళు పాల్గొన్న స్టేట్ డిబేట్లలో అందరి దృష్టిని ఆకర్షించి, నాలుగు వారాల పాటు తన వాగ్ధాటికి గుర్తింపు పొంది, మొదటి స్థానంలో నిలవడం సామాన్య విషయం కాదు," అంది ఆప్యాయంగా తులసి వంక చూస్తూ శాలిని.  "మేము ఈ రోజు ఇక్కడికి మరో ప్రత్యేక ప్రతిపాదనతో వచ్చాము. మన చర్చ్ సంస్థ నిర్వహించే అమృతవాణి రేడియో కార్యక్రమంలో ‘బాలల బైబిల్ స్టడీ’ భాగానికి, తులసిని వక్తగా ఆహ్వానిస్తూ  ఈ ఉత్తరువు తెచ్చాము,”  అంటూ డేవిడ్ చేతికి కవర్ అందించాడు జోసెఫ్... “తులసి చదువుకి ఎటువంటి ఆటంకం ఉండదు.. వచ్చేవారం నుండి శనాదివారాలు మాత్రమె రెండేసి గంటలు పనిచేస్తే చాలు.  పారితోషికం కూడా మనకి నచ్చేలా ఉంటుందని హామీ ఇస్తున్నా,” అంటూ పక్కనే కూర్చున్న తులసి భుజం చుట్టూ చేయి వేసింది శాలిని. “చర్చ్ వారు పద్దతిగా మూడునెలలకి ఓమారు నీ జీతం అందజేస్తారు,” వివరించింది ఆ అమ్మాయికి. డేవిడ్ దంపతులు ఉప్పొంగిపోయారు. కూతురికి  చర్చ్ నుంచి అధికారిక ఆహ్వానం అందడం వాళ్ళకి ఎంతో సంతోషం కలిగించింది.  “తులసికి చేయూతనిస్తూ ఇలా మాకు సహకారాన్ని అందిస్తున్న మీకు కృతజ్ఞతలు,” చేతులు జోడిస్తూ సాగరి.     “అదేమీ లేదమ్మా, తులసిలా  ప్రతిభ  కనబరిచే యువతకి  సహకారం అందించడానికే మా సంస్థ పనిచేస్తుంది.  అవకాశాన్ని అందిపుచ్చుకుని మీ అమ్మాయి కూడా వృద్దిలోకి రావాలనే మా అభిలాష....,” అన్నాడు జవాబుగా జోసెఫ్... “సరేగాని, తులసి, ఇరవైవేల రూపాయల బహుమతి నగదుతో ఏం చేయాలని నీ ఆలోచన,” అడిగింది శాలిని...  “నాకు సైకిల్, మల్లికకి బొమ్మరిల్లు కావాలని, అమ్మకి చెప్పేసాముగా ఆంటీ,” అన్నాడు అప్పుడే హాల్లోకి వస్తూ, ఆ మాట విన్న సాయి,. “ఔను, మా యువరాజు గారి కోరిక అది... మేము తప్పక తీర్చాలి,” నవ్వుతూ డేవిడ్... “లేవండి మరి, తులసి చేత కేక్ కోయించి, భోజనం చేద్దాము,” అంటూ అక్కడి నుండి కదిలింది సాగరి.             స్కూలు  విరామ  సమయంలో తులసిని స్టాఫ్ రూమ్‌ కి రమ్మని కబురుపెట్టారు లెక్కల టీచరు వాణి మేనన్. తులసి వెళ్ళేప్పటికి, స్టాఫ్ రూమ్ గుమ్మం దగ్గర ఎదురు చూస్తున్నారావిడ. తులసి రాగానే, చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకు వెళ్ళారామె.  "ఏం లేదు తులసి... నువ్వు లెక్కలు బాగా చేస్తావు కదా. స్కూల్ టైం అయిపోయాక, కాసేపు చిన్న తరగతుల పిల్లలకి లెక్కలు చెబుతావా? మన క్లాస్ రూమ్‍లోనే.. నీకు పారితోషికం కూడా ఇప్పిస్తాను. ఆ డబ్బు నీకు ఉపయోగపడుతుంది. ఆలోచించి నీ నిర్ణయం నాకు చెప్పు.." అన్నారు. టీచర్ అడగడం వల్లనే గణితంలో వెనుకబడిన పిల్లలకి  సహాయం చేస్తానని వాళ్ళమ్మని బతిమాలి ఒప్పించింది తులసి. పాఠాలు చెప్పినందుకు డబ్బిస్తారని మాత్రం అమ్మానాన్నలకి చెప్పలేదు. జీతం అందుకున్నాక వారిని ఆశ్చర్యపరచాలని అనుకుంది.  ఇంటిపనిలో తన తోడ్పాటుకి ఎటువంటి లోపం లేకుండానే, సమర్ధవంతంగా బయట పనులు కూడా చక్కబెట్ట సాగింది ఆ అమ్మాయి.                                 ఇటు ‘అమృతవాణి’ రేడియోకి వక్తగా,  అటు స్కూల్లో లెక్కల ట్యూటరుగా ఉత్సాహంగా సాగిపోతుంది తులసి రోజూవారీ జీవనం.  ‘అమృతవాణి’ బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని ఇంచుమించు స్కూల్లో వారందరూ  వింటారు.   అప్పుడే నెలరోజులుగా సాగుతున్న కార్యక్రమాలతో, మంచి వక్తగా గుర్తింపు పొందింది తులసి. ఇక చేతికి అందబోయే జీతంతో అమ్మావాళ్ళకి, ఇంటికి ఉపయోగపడే కొనుగోళ్ళు చేసి, వాళ్ళని ఆశ్చర్య పరచాలన్న ఆలోచనలో ఉంది ఆ అమ్మాయి..                   సాయంత్రమైంది.  రాత్రి భోజనాల కోసమని వంట చేస్తోంది సాగరి.  పిల్లలు స్కూలు నుంచి వచ్చిన హడావిడితో పాటు హాల్లో ఎన్నడూ లేనంత గొడవగా ఉండడంతో,  మధ్య గదిలోకి వచ్చింది.   హాల్లోని సోఫాలో కూచునున్న మల్లిక ముఖం కోపంగా ఉంది. అమ్మని చూడగానే, అసహనంగా బిగ్గరగా మాట్లాడసాగింది. "అమ్మా... స్కూల్లో అందరూ అక్క రేడియో ప్రోగ్రాములు, ట్యూషన్ల గురించే మాట్లాడుతున్నారు. ఇకనుండి నేనూ చర్చ్ ప్రోగ్రాములలో పాల్గొంటాను. లేదంటే అసలు నీ మాట వినను," అని గట్టిగా అరుస్తూ పుస్తకాల సంచీని ఓ మూలకి విసిరేసింది.  "మల్లికా, ఊరికే ఉండు. మన అక్క ఒక వాగుడుకాయ. ఎప్పుడు చూసినా పాడుతూనో, వాగుతూనో ఉంటుంది. పెద్ద తలనొప్పిగా తయారయింది. నువ్వు కూడా అక్కలాగే అవ్వాలనుకుంటున్నావా? వేరే పనేం లేదా," అన్నాడు బూట్లు విప్పుతూ సాయి.  అప్పుడే  లోపలికి వస్తూ ఆ మాటలు విన్న తులసి చిన్నబుచ్చుకుంది.  మల్లిక మాత్రం చప్పట్లు కొడుతూ గట్టిగా నవ్వింది.  ఇదంతా చూస్తున్న వాళ్ళమ్మ కలవరపాటుకి గురయింది.. ఎలా కట్టడి చేయాలో తోచలేదామెకి. "నోరు మూసుకోండి. తిన్నగా మాట్లాడ్డం నేర్చుకోండి. అక్కని మెచ్చుకోవలసింది పోయి, ఇలా హేళన చేస్తారా? అయినా, మల్లికా... సరయిన పని ఏదన్నా చేస్తానంటే నిన్ను వద్దనేదెవరు? ఏదైనా సులువుగా లభించదు. సాధన చేయాలి. అర్థమైందా..." అంటూ క్షణం సేపు మౌనంగా ఉండిపోయింది.. “... సైకిల్ కోసం ఇంకొన్నాళ్ళు ఆగాలి అంటారు,  చేతిలో ఉన్న డబ్బు చాలదు అంటారు. స్కూలుకి ఇక నడవడం నాకు కష్టమే.   వెంటనే సైకిల్ కొనాల్సిందే మమ్మీ,” విసురుగా సాయి... కోపాన్ని అణుచుకుని, "సరే, ఆ ప్రస్తావన ఇప్పుడు అనవసరం. ఇక వెళ్ళి స్నానాలు చేసి రండి..." అని చెబుతూ వంటింట్లోకి నడిచింది సాగరి. తెల్లవారింది. తులసి నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుంది. పెరటి తోటలోకి వెళ్ళి పూజ కోసం పూలు కోసింది.  వాళ్ళమ్మ ప్రేమగా శ్రద్దగా పెంచే తులసివనం లోని తులసి మొక్కలికి నీళ్ళు పోసింది.  దేవుడి గదిని శుభ్రం చేసి, రోజూ చదివే లలితాసహస్ర నామాలు చదువుకుంది. ప్రార్థన పూర్తయ్యాక వంటింట్లోకి వెళ్ళి ఇడ్లీ, పచ్చడి తయారు చేయడానికి ఏర్పాట్లు చేయసాగింది. అందరూ లేచాక, వంటింట్లో అమ్మకి సాయం చేసి ఉత్సాహంగా స్కూలుకి సాగిపోయింది. చేతిలో 1500 రూపాయలతో, స్కూల్ అవగానే, ఉత్సాహంగా ఇంటికి బయల్దేరింది తులసి. ఆమె నెల రోజుల పాటు ట్యూషన్ చెప్పినందుకు వచ్చిన డబ్బది.  ఓ పెద్ద బట్టల కొట్టు... ఆర్.ఎస్. గార్మెంట్స్ లోకి అడుగుపెట్టింది. అమ్మ కోసం పొడవాటి కాటన్ హౌస్‌కోట్ కొంది. డేవిడ్ రోజూ అన్నం తీసుకువెళ్ళే ప్లాస్టిక్ డబ్బా స్థానంలో, ఇంకో షాపులో నాన్న కోసం స్టీల్ లంచ్ బాక్స్ కొంది.  ఇంటికి వెడుతూ దారిలో ఓ స్వీట్ షాప్ దగ్గర ఆగి తమ్ముడు, చెల్లెళ్ళ కోసం జిలేబి కొన్నది.  అందరికీ అన్నీ తీసుకున్నానన్న ఆనందంతో ఇంటి దారి పట్టింది. ఉత్సాహంగా ఇంట్లో అడుగు పెట్టింది  తులసి. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. వంటగది, పూజ గది, పిల్లల గదులు అన్నీ దాటుకుని వాళ్ళమ్మ గదికి వెళ్ళింది. అక్కడి పరిస్థితిని చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చిందరవందరగా ఉన్న గదిని కంగారుగా వెతుకున్న సాగరి, సాయి, మల్లిక, కాస్త దూరంలో వాళ్ళని చూస్తూ కూర్చునున్న మానస కనబడ్డారు.  "అమ్మా, ఏమైంది? ఏం పోయింది?" అని అడిగింది తులసి. అందరూ ఒక్కసారిగా తులసి కేసి, ఆమె చేతిలోని షాపింగ్ బాగ్స్ కేసి చూసారు.  వాళ్ళెవరూ ఏమీ మాట్లాడక ముందే బయటి నుంచి డేవిడ్ గొంతు వినబడింది. "ఏమర్రా... ఎక్కడున్నారు? సాగరి... మల్లికా... ఒక్కరూ కనబడరే.." అంటూ గదిలోకి అడుగుపెట్టాడు డేవిడ్.  గది పరిస్థితి చూసి, అడుగు వెనక్కి వేసాడు. అక్కడి గందరగోళం చూసి తొట్రుపాటుకి గురయ్యాడు. "ఏమైంది సాగరి? ఏమిటిదంతా?" అడిగాడు విసుగ్గా.  సాగరి అప్పటికే బెంబేలెత్తిపోయి ఉంది. వణికిపోతూ.. "ఏవండి.. ఇరవై వేల రూపాయలు ఉంచిన కవర్ కనిపించడం లేదండి.. దేవుడి దగ్గర నుంచి తెచ్చి, అప్పుడే బీరవాలో నా బట్టల కింద ఓ మూలకి నేనే పెట్టాను.." అంటూ మళ్ళీ వెతకసాగింది. ఆమె గొంతులో వణుకు చూసి డేవిడ్, తులసి ఇద్దరూ కంగారుపడ్డారు.  ఇంతలో సాయి వచ్చి తులసి పక్కన నిలుచున్నాడు. "అక్కా, నువ్వు బయల్దేరే ముందు అమ్మని డబ్బు అడిగావా? లేక బీరువా నుండి తీసావా? నీ చేతిలో ఉన్న సంచులేంటి?" అని అడిగాడు. "లేదంటే, ఆ కవర్‌ని మరెక్కడో పెట్టి అమ్మ మర్చిపోయిందంటావా?" మళ్ళీ సాయి.. అవే ప్రశ్నలని తిప్పి తిప్పి అడుగుతూ తులసి చేతిలోని సంచులని లాక్కోడానికి ప్రయత్నించాడు.  "అన్నా.. నువ్వు చెప్పిందే నిజం. నీకూ, నాకూ ఏదైనా కొనడం అక్కకి ఇష్టముండదు. అన్నీ తనకే కావాలనుకుంటుంది. అందుకే డబ్బంతా తీసుకుని తనకి కావల్సినవి కొనుక్కున్నట్లుంది...." అంటూ మల్లిక వచ్చి తులసి చేతుల్లోని సంచీలను లాక్కుంది. సాయి, మల్లిక కలసి సంచీలలోని వస్తువులను మంచం మీద పోసారు.  ఓ కవర్ తోపాటు కొంత డబ్బు, చిల్లర మంచం మీద పడ్డాయి.  అందరి చూపులూ డబ్బు మీద నుంచి తులసి వైపు మళ్ళాయి. వాళ్ళ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఆ కళ్ళల్లో ఎన్నో ప్రశ్నలు... ఉన్నట్టుండి తులసికి దుఃఖం ముంచుకొచ్చింది. మోకాళ్ళ మీద కూర్చుని ఏడవసాగింది.  మరో వైపు సాగరి... తాను మోసపోయినట్లు భావించింది. కోపంతో ఊగిపోయింది. తులసి రెక్క పట్టుకుని తన వైపుకి లాక్కుంది. "నీకేమయినా దెయ్యం పట్టిందా? నీ డబ్బు నువ్వే దొంగతనం చేస్తావా? ఎందుకిలా చేసావు తులసి? నువ్వెంతో మంచిదానివని అనుకున్నాను. నీ గురించి ఎంత గొప్పగా ఊహించుకున్నాను... ఇలా చేసావేమే.." అని అరుస్తూ, చాచి చెంప దెబ్బ కొట్టింది. డేవిడ్ తక్షణమే జోక్యం చేసుకుని వారిద్దరిని విడదీసాడు. సాగరి నేల మీద కూలబడి భోరుమని ఏడవసాగింది.  సాయిని, మల్లికని వాళ్ళ గదికి వెళ్ళమని ఆదేశించాడు డేవిడ్. వాళ్ళు ఆక్కడినుండి కదిలాక, లోపల్నించి గది తలుపులు గడియ పెట్టాడు. మర్నాడు, ప్రతీ ఆదివారం లానే, ఉదయం ఆరుగంటలకే నిద్ర లేచారు సాయి, మల్లిక. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఇంట్లో స్వేచ్ఛగా తిరగడానికి కూడా భయపడ్డారిద్దరూ.  చర్చ్ కి పెందరాలే వెళ్ళాలి కాబట్టి, ధైర్యం చేసి వంటింట్లోకి నడిచారు. అమ్మ, అక్క హాయిగా మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ రొట్టెలు తయారు చేస్తున్నారు. రాత్రి అసలేమీ జరగనట్టుగా, ప్రశాంతంగా ఉన్నారు. కొద్ది సేపటి తర్వాత సాయికి, మల్లికకి తాము చేసిన చపాతీలు, కోడిగుడ్డు కర్రీ కూడా వడ్డించారు.  చర్చ్‌లో సేవ పూర్తయ్యాక, డేవిడ్, జోసెఫ్ ల కుటుంబాలు... అలవాటుగా తాము వెళ్ళే టిఫిన్ సెంటర్ కి వెళ్ళారు.  టిఫిన్ తినేసి పిల్లలు బైబిల్ స్కూల్‌కి,  మానసని తీసుకుని మగవాళ్ళిద్దరు చర్చ్ పార్క్‌లో వాహ్యాళికి వెళ్ళారు. సాగరి, శాలిని మాత్రమే ఉన్నారక్కడ.  తను కూర్చున్న స్థానం నుండి లేచి వెళ్ళి సాగరి పక్కన కుర్చీలో కూర్చుంది శాలిని. ఆమె కేసి చూస్తూ "ఏమైంది సాగరి? దిగులుగా కనబడతున్నావు! వర్షించే మేఘాల్లా ఉన్నాయి నీ కళ్ళు. ఏం జరిగింది? " అని ఆప్యాయంగా అడిగింది.   ఒక్కసారిగా దుఃఖం ముంచుకొచ్చింది సాగరికి. ఆమెని ఓదార్చడానికి ప్రయత్నించింది శాలిని. ఏదో దారుణమైన సంఘటనే జరిగి ఉంటుందని ఊహించింది కూడా..  కాసేపటి సంబాళించుకుని, వణుకుతున్న గొంతుతో జరిగినదంతా వివరించింది సాగరి. చేయని తప్పుకి తాను తులసిని  శిక్షించిన వైనం చెప్పుకొచ్చింది.  "సాయి మాటలకి నేనెలా లొంగిపోయానో నాకే అర్థం కాలేదు. డబ్బు పోయిందనే సరికి కంగారుపడి వాడి మాటలు నమ్మేసాను. ఇంకా దారుణం ఏంటంటే.. అమాయకురాలైన  తులసిని... పాపం... గట్టిగా కొట్టాను. బాగా తిట్టాను.." అంటూ కన్నీరు కార్చింది సాగరి.  ఇదంతా వింటున్న శాలిని విస్తుపోయింది. చివరికి సమస్య ఎలా పరిష్కారమైందో ఆమెకి అర్థం కాలేదు.  "డేవిడ్ ఉండబట్టి సరిపోయింది. లేకపోతే ఇంకేం చేసేదాన్నో.  తులసిని తిట్టకుండా, కొట్టకుండా తెలివిగా ప్రవర్తించారు డేవిడ్. నా నుంచి దూరంగా తీసుకెళ్ళి దాన్ని ఓదార్చారు. తర్వాత మంచం మీద ఉన్న కవర్‌ని తీసి చూసారు. దాని మీద స్కూల్ ముద్ర ఉంది. అందులో ఉన్న డబ్బు లెక్కపెట్టారు. తులసి భుజం మీద చెయ్యేసి, ఆ డబ్బు గురించి అడిగారు." నిట్టూర్చింది సాగరి.  నీళ్ళు నిండిన కళ్ళతో శాలిని వంక ఓ మారు నిశితంగా చూసిందామె. "అప్పుడు నోరు విప్పింది తులసి.. ట్యూషన్ చెప్పినందుకు తనకి స్కూల్లో 1500 రూపాయలు ఇచ్చారని, మాకు ముందే నిజం చెప్పనందుకు క్షమించమనీ, అడిగింది ఆ చిట్టితల్లి. అలా తను  సంపాదించిన డబ్బుతో మాకోసం కానుకలు తెస్తే.. నేనేమో దాన్ని శిక్షించాను," అంటూ వాపోయింది సాగరి. సాగరి చెబుతున్నది వినడం మినహా చేష్టలుడిగి మౌనంగా ఉండిపోయింది శాలిని. “తప్పిదం తెలుసుకుని క్రుంగిపోతున్న నన్ను తల్లిలా దగ్గరికి తీసుకుని ఓదార్చింది నా తులసి. పిల్ల పట్ల అంత క్రూరంగా ప్రవర్తించినందుకు నాకు చాలా సిగ్గుగా ఉంది. కనీసం ఇప్పటి నుంచైనా దానికి ఓ మంచి అమ్మని అవుతాను..." సాగరి బుగ్గల మీద నుంచి కన్నీళ్ళు కిందకి జారాయి.  తులసి మానసిక పరిస్థితి ఎలా ఉండిఉంటుందో అని ఆలోచించింది శాలిని... “ఇకపోతే  ఆ  ఇరవైవేల  రూపాయల  కవర్, ఆఖరికి, నా  పరుపు గలేబు లోపల దొరికింది. ఈ పిచ్చి పని చేసింది మాత్రం  సాయి, మల్లికేనని మా అనుమానం.  సందేహమే లేదు. తులసిని ఎలాగైనా తేలిక పరిచి శిక్ష పడేలా చేయాలన్నది వాళ్ళ ఉద్దేశం.." బాధపడుతూ కన్నీళ్లు తుడుచుకుంది సాగరి.  తనకి కూడా  అదే  నిజమనిపిస్తుందని ఒప్పుకుంది శాలిని.  “ఏమైనా నీ కూతురు మేలిమి బంగారం అని  తెలుసుకో సాగరి. నీ తులసివనంలో తులసి మొక్కంత స్వచ్చమైనదని నమ్మకముంచు. ప్రతికూల పరిస్థితులలో వికసించే పుష్పమే అరుదైనది, అందమైనదీ అని ఎక్కడో చదివిన గుర్తు... మన తులసి అటువంటిదే," అంది శాలిని. ఇంతలో దూరంగా మానస గొంతు వినబడింది. మగవాళ్ళిద్దరూ మానస తో వాళ్ళ  వైపే వస్తూ కనబడ్డారు.                                                            రచన : కోసూరి ఉమాభారతి  

ఆలోచించాలి

ఆలోచించాలి   నల్లమల అడవుల్లో వీరసముద్రం చెరువు చుట్టుప్రక్కల పెద్ద పెద్ద ఏనుగుల గుంపులు నివసించేవి. దట్టమైన ఆ అడవుల్లో దొరికే మెత్తని పచ్చిగడ్డిని, ఎత్తైన చెట్ల మీద చివురించే లేత ఆకుల్ని నములుతూ, ఎల్లప్పుడూ పుష్కలంగా నీళ్ళుండే ఆ చెరువు మీద ఆధారపడి హాయిగా జీవించేవి. అదే చెరువులో మొసళ్ళు కూడా ఉన్నాయి. నీళ్ళు త్రాగడానికి వచ్చే జింకలు, గాడిదలు మొదలైన చిన్న జంతువుల్ని పట్టి చంపి తినేవి అవి. సామాన్యంగా ఏనుగుల జోలికి వచ్చేవి కావు: పెద్దగా ఉంటాయని కొంత, అన్నీ‌ కలిసి కట్టుగా ఉంటాయని మరికొంత, భయం వాటికి. సాధారణంగా ఏనుగులు గుంపుగా వచ్చి, చెరువులోని నీళ్ళన్నీ‌ కలిసి ఒక గుంపుగా త్రాగి వెళ్లిపోయేవి. అవి అట్లా గుంపుగా వచ్చినప్పుడు చూస్తే మొసళ్ళకి భయం. ఒకసారి ఒక మొసలికి వేరే ఆలోచన వచ్చింది. "అన్ని ఏనుగులు వస్తున్నాయి కదా, ఆ గుంపులోంచి కనీసం ఒక్క ఏనుగునైనా పడితే ఏమౌను?" అనుకొంది.   వెంటనే అది ఓ దుష్టపన్నాగం పన్నింది. పాక్కుంటూ పోయి, ఎక్కడెక్కడో ఉన్న లేత వెదురు పిలకలను, మంచి పచ్చగడ్డిని నోట కరుచుకొని వచ్చి, చెరువు అంచునే ఒక చెట్టు మరుగున దాచి ఉంచింది. ఆరోజు తెల్లవారుతుండగానే తను పోయి, అక్కడికి దగ్గర్లోనే ఇసకలో పడుకున్నది. కొంచెం సేపటికి ఏనుగులగుంపు వచ్చింది. అన్ని ఏనుగులూ నీరు త్రాగి వెళ్ళిపోసాగాయి. మొసలి అదృష్టం కొద్దీ వాటిలో‌ ఒక ఏనుగు మటుకు ఇంకొన్ని నీళ్ళు త్రాగుతూ కొంత వెనక పడింది. "అమ్మయ్య! ఇక దొరికినట్టే, ఏనుగు!" అనుకొని మొసలి తను మరుగున దాచిన గడ్డిని, వెదురు మొలకలను నీళ్ల మధ్యకు చేర్చి అల్లాడించటం మొదలు పెట్టింది. అలా కదలాడుతున్న గడ్డి ఏనుగు దృష్టిని ఆకర్షించింది. వెంటనే దానికి నోరు ఊరింది కూడా.    "లేత వెదురు చిగుర్లు!" అని ఆశ పుట్టింది. చూస్తే అవతల తన మిత్రులందరూ వెనుదిరిగి పోతున్నారు. 'తను ఈ కాస్తంతా తినేసి పరుగు పెడితే వాళ్లను చేరుకోవచ్చులే' అనుకొని నీళ్లలోకి దిగి అటుగా నాలుగడులు వేసింది ఏనుగు. అంతే- మొసలి చటుక్కున దాని కాలు పట్టుకున్నది! ఏనుగు పెనుగులాడింది. మొసలి తన పళ్ళను ఇంకా గట్టిగా దాని కాలులోకి దింపింది. ఇక బాధతో ఘీంకారాలు మొదలు పెట్టింది ఏనుగు. నీళ్లలో పొర్లింది, మిగిలిన కాళ్ళతో ఎగిరేందుకు ప్రయత్నించింది, ఎలాగైనా మొసలిని నీళ్ళ బయటికి ఈడ్చాలని చూసింది, రెండవ కాలితో మొసలి తలమీద మోదేందుకు ప్రయత్నించింది. ఏం చేసినా మొసలి పట్టు వీడట్లేదు.    ఆ ఏనుగు ఘీంకారాలు వినబడినై, మందలోని మిగిలిన ఏనుగులకు. తమ సహచరుడికి ప్రమాదం సంభవించిందని వాటికి అర్థమైంది. అన్నీ గబగబా వెనక్కి తిరిగి వచ్చి, మొసలికి చిక్కిన ఏనుగును చూసినై, ఏనుగుల నాయకుడు వాటికి తక్షణం ఆదేశాలు జారీ చేశాడు- ఒక ఏనుగు వెళ్ళి తొండంతో అక్కడికి దగ్గర్లోని మర్రి చెట్టును ఒకదాన్ని గట్టిగా పట్టుకొన్నది. మరొక ఏనుగు దాని కాళ్లను తొండంతో చుట్టి పట్టింది. మరొక ఏనుగు దాని కాళ్ళను.. అట్లా ఒక ఏనుగుల గొలుసు తయారయింది. ధైర్యశాలులైన ఏనుగులు కొన్ని ఆ క్రమంలో నీళ్లలోకి కూడా దిగినై! అన్నీ‌ కలిసి ఏనుగును మొసలితో సహా బయటికి లాగేందుకు ప్రయత్నిద్దామనుకున్నై.    తెలివైన ఏనుగొకటి వాటిని ఒక్క క్షణం ఆగమన్నది. "నీటిలో మొసలికి అమితమైన శక్తి ఉంటుంది! మీరు ఎందరు కలిసి లాగినా అది మనవాడిని అంత సులభంగా విడచి పెట్టదు. నేను దాన్ని బలహీనపరుస్తాను- ఆగండి" అని అది పరుగున వెళ్ళి, అల్లంత దూరాన పడి ఉన్న ఓ పెద్ద, బరువైన దుంగను తొండంతో చుట్టి ఎత్తుకున్నది; దుంగతోబాటు వేగంగా వచ్చి, మొసలి తలపైన దుంగతో బలంగా ఒక్క పెట్టు పెట్టింది. దెబ్బకు మొసలి కళ్ళు బైర్లు కమ్మాయి! దాని పట్టు కొంచెంగా తప్పింది. అవకాశాన్ని అంది పుచ్చుకున్న ఏనుగుల గొలుసు తమ సహచరుడిని గబుక్కున బయటికి లాగేసింది!    దెబ్బ తిన్న మొసలి, ఏనుగుల్ని తిట్టుకుంటూ, బుడుంగున మునిగి తన దారిన తాను పోయింది. అటుపైన ఏనుగులన్నీ సంతోషంగా పోతున్నప్పుడు, ముసలి ఏనుగు ఒకటి వాటికి సుద్దులు చెప్పింది: "చెరువు మధ్యలో వెదురు మొక్కలు, పచ్చని గడ్డి కనిపించటం అసహజం కదా?! అట్లా సహజంగా లేనివి ఏమైనా కనిపిస్తే గబుక్కున ముందుకు పోకూడదు. ఒక క్షణం ఆగి ఆలోచించాలి తప్పకుండా. మనల్ని మోసం చేయడానికి మొసలి, మనిషి లాంటి జంతువులు రకరకాల ఉచ్చులు పన్నుతుంటాయి. కృత్రిమంగా కనబడిన ఆహార పదార్థాలపట్ల జాగరూకతతో ఉండాలి. అత్యాశతో వాటి జోలికి పోతే ఇట్లా అవుతుంది. అందరికీ అర్థం అయిందనుకొంటాను. 'అత్యాశే అన్ని అనర్థాలకూ మూలం'" అని. ఏనుగులన్నీ తలలు ఊపి, ఘీంకారాలతో తమ సమ్మతిని తెలియజేసాయి.   - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

ఆకు-మట్టిబెడ్డ

ఆకు-మట్టిబెడ్డ   అనగనగా పెద్ద కొండ ఒకటి ఉండేది. ఆ కొండ మీద అనేక రకాల వృక్షజాతులు జీవనం సాగిస్తూ ఉండేవి. ఆ కొండ మొదట్లో చాలా పురాతనమైన చెట్టు ఒకటి ఉండేది. అన్ని చెట్లకంటే అది బలంగాను, చాలా ఎత్తుగాను ఉండేది. దాని ఆకులు కూడా చాలా పెద్దవిగా, చాలా సుందరంగా ఉండేవి. అంతే కాక దాని పూలు, పళ్ళు కూడా చాలా అందంగాను, మధురంగాను ఉండేవి.  ఆ వృక్షరాజపు కొనకొమ్మకు చివరన- అన్నింటికంటే పెద్దఆకు ఒకటి ఉండేది. చల్లటి గాలులు మెల్లగా జోల పాటలు పాడుతుంటే అది హాయిహాయిగా కొమ్మ ఉయ్యాలలూగేది. 'ఇంతకు మించి ప్రపంచంలో మరే ఆనందమూ లేదు. ఇదే స్వర్గం' అనుకుంటుండేది. 'ఎప్పటికైనా తను నేల రాలాల్సిందే'అన్న నిజాన్ని మరిచిపోయి, ఆ తాత్కాలిక సుఖంలో ఓలలాడేది. అదే కొండ శిఖరంమీద మట్టిగడ్డ ఒకటి ఉండేది. ఎత్తైన ప్రదేశంలో ఉండీ ఉండీ , దానిలో 'తాను ఉన్నతమైనది' అన్న భావన స్థిరపడిపోయింది. హోరునవీచే గాలులు దానికి సుమధుర సంగీతంలా తోచేవి. 'తనను మించినది ప్రపంచంలో మరేదీ లేదు' అన్న ఆనందంతో అది ఎప్పుడూ పులకరించిపోతుండేది. ఒక రోజున గాలులు ఉధృతంగా వీచాయి. గాలి తాకిడికి మట్టిపెళ్ల విరిగింది. అంత ఎత్తు నుండి పర్వత పాదం వరకూ పడ్డది. ఉన్నతమైన తన స్థానం కోల్పోయినందుకు, పర్వతాగ్రం నుండి కిందికి దిగి రావల్సి వచ్చినందుకు అది విపరీతంగా బాధపడింది. గాలిని బాగా తిట్టుకున్నది. వీలైనన్ని శాపనార్థాలు పెట్టింది.  ఇంతలో, చెట్టు కొనకొమ్మన ఆనందంలో ఊగిసలాడుతున్న ఆకు కూడా ఆ గాలికి కొమ్మనుండి వేరైంది. అది కూడా నేల రాలింది. తనకు చాలా అన్యాయం జరిగిందనిపించింది దానికి. కోపమూ, ఏడుపూ ఒకేసారి క్రమ్ముకురాగా అది ఎంతో విచారించింది. అలాగే గింగిరాలు తిరుక్కుంటూ కొట్టుకుపోతుంటే, వేరే ఎక్కడినుండో తిట్లు వినబడ్డాయి దానికి. అటు పోయి చూస్తే, అక్కడ ఉన్నది మట్టిగడ్డ! 'ఎందుకు, అంత బాధ పడుతున్నావు?'అని దాన్ని అడిగింది ఆకు. అలా అవి రెండూ ఒకదానికొకటి గత జీవిత వైభవాన్ని గురించీ, ప్రస్తుతకాలపు కష్టాలను గురించీ చెప్పుకున్నాయి.    అట్లా తమ బాధల్ని పంచుకోవటం‌వల్ల, రెండింటి హృదయాలూ కొంత తేలిక పడ్డాయి. త్వరలోనే రెండూ మంచి మిత్రులయ్యాయి. రెండూ ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నాయి: మట్టిపెళ్ల అన్నది, "ఒకవేళ వర్షం వస్తే, నాపైన నువ్వు ఉండి, నేను కరిగిపోకుండా కాపాడు" అని. ఆకు అన్నది, "తీవ్రమైన గాలులు వచ్చినప్పుడు, నువ్వు నామీద ఉండి, నేను ఎటూ కొట్టుకుపోకుండా చూడు" అని. ఇద్దరికీ లాభమే! తమ భద్రతకు ఇక తిరుగులేదనుకున్నాయి రెండూనూ. ఆ ఆనందంలో ఉత్సాహంగా సంబరాలు చేసుకున్నాయి.  కానీ ఏం చెప్పాలి, వాటి సంతోషం మూడు గంటల ముచ్చటే అయ్యింది. కొద్ది సేపటికే ప్రకృతి విలయ తాండవం మొదలెట్టింది. భయంకరమైన గాలివాన ప్రారంభమైంది. ఆ హడావిడిలో ఎవరు ఎవరిని రక్షించాలో మిత్రులిద్దరికీ అర్థం కాలేదు. ఆకు గాలికి కొట్టుకుపోయి, ఎక్కడో చిక్కుకుని చినిగిపోయింది. మట్టి పెళ్ల వానకు ముద్దై పుడమిలో కలిసిపోయింది. మన స్థానాలను మనం ఎంత భద్రంగా పెట్టుకోవాలనుకున్నా, చివరికి అందరి స్థానాల్నీ నిర్ణయించేది ప్రకృతే!   - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

మంచి రైతు

మంచి రైతు     దొండపాడు గ్రామంలో రాజు అనే పిల్లవాడొకడు ఉండేవాడు. వాడికి చదువు అంతగా రాదు. ఆటలు బాగా ఆడతాడు గానీ. ముఖ్యంగా వాడికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. పిల్లలంతా వాడిని 'మొద్దోడు' అని ఎగతాళి చేసేవాళ్ళు. వాళ్ళ అమ్మా. నాన్న కూడా ఎప్పుడూ‌ తిడుతూనే ఉండేవాళ్ళు వాడిని: "నీకు అటు చదువూ రాదు; ఇటు పొలం పనులూ రావు! నువ్వు దేనికీ పనికి రావు!" అంటూ. అయినా అట్లాగే తరగతులు మారుతూ మారుతూ 10వ తరగతికి చేరాడు రాజు.    పదో తరగతికి రాగానే ఇంటి వాళ్లతో‌ పోరాడి, ఆ సంవత్సరం ఇక బడికి ఇంట్లోంచి రాకుండా హస్టల్‌లో చేరాడు. హాస్టల్‌లో వాడిని తిట్టేవాళ్ళు ఎవ్వరూ లేరు. దాంతో వాడు చదువుమీద బాగా ధ్యాస పెట్టగలిగాడు: "నేను ఎట్లా చదువుతాను?!" అన్న ఆలోచన వదిలేసి, "నేరుగా చదవటం" మొదలుపెట్టాడు వాడు. దాంతో పదో తరగతి పాసయ్యాడు! అయితే దానికి ఇంట్లో వాళ్ళు బాధ పడ్డారు: "వీడిని ఇప్పుడు ఇంటర్లో చేర్చాలి, ఖర్మ" అంటూనే ఇంటర్లో చేర్చారు.    అట్లా అట్లా ఇంటర్‌ చదివాడు రాజు. అటుపైన డిగ్రీలో "వ్యవసాయ చదువు" చదివాడు. అయితేనేం లాభం?! తను చదివిన చదువుతో ఉద్యోగం ఏమీ రాలేదు! కానీ‌ వాడికి నిరాశ అనిపించలేదు. "ఇంక చదువు చాలు" అనుకొని, దొండపాడు తిరిగి వచ్చేసాడు. "ఇంకా ఉద్యోగం రాలేదా? నీకెక్కడ వస్తుందిలే!" అని ఎగతాళిగా మాట్లాడారు అందరూ. తర్వాతి రోజున పొలానికి వెళ్ళాడు రాజు. వాళ్ళ నాన్నకు రెండెకరాల పొలం ఉంది. అయితే, దాన్నంతా పండించడం కష్టమయి, ఒక ఎకరంలోనే పంట వేసేవాడు ఆయన.   " నాన్నా! ఆ మరో ఎకరాలో నేను సొంతగా ఏదైనా పంట వేద్దామనుకుంటున్నాను" అన్నాడు రాజు,వాళ్ళ నాన్నతో.  "ఏమీ చేతకానోడివి ఏం పండిస్తావురా?" ఎక్కిరిస్తున్నట్లు అన్నాడు వాళ్ల నాన్న. అయినా రాజు ముఖంలో పట్టుదల చూసి, "సరే! అయినా ఆ ఎకరా ఎట్లాగూ ఖాళీయే! ఏమన్నా చావు! ఇప్పటికైనా నీకు చదువు రాదని ఒప్పుకున్నందుకు సంతోషం! కనీసం కూలీ చేయడమన్నా నేర్చుకో" అని తిట్టాడు. రాజు అవి ఏమీ పట్టించుకోలేదు- తను చదువుకున్న చదువుని ఉపయోగించు-కుంటూ ఆ పొలంలో పంట వేశాడు. రాజు వేసే పంటలు, మందులు, చేసే పనులు అన్నీ కొత్త కొత్తగా అనిపించాయి వాళ్ళ నాన్నకు.    'పిచ్చోడు- ఏంటేంటో చేస్తున్నాడు!' అని బాధ పడసాగాడు. ఊర్లో వాళ్ళు కూడా ఏవేవో‌ ఊహించుకున్నారు. అయితే అట్లా ఆర్నెల్లు తిరిగే సరికి, అందరూ ఒకటే ఆశ్చర్యపోయారు: అందరూ రెండెకరాల్లో పండించే పంటని, రాజు ఒక్క ఎకరంలోనే పండించి చూపించాడు! ఇక ఆ రోజు నుండీ వాళ్ళ నాన్న కూడా రాజుని మెచ్చుకోసాగాడు.    ఈసారి రెండెకరాలూ తననే పండించమన్నాడు. అదనంగా ఆ చుట్టుప్రక్కల వాళ్ల పొలాల్ని కూడా కౌలుకు తీసుకుని అనేక రకాల పంటలు పండించి చూపాడు రాజు. ఆ తర్వాతి ఏడాది రాజుకి పెళ్లి కూడా అయ్యింది. ఇప్పుడు రాజు ఒక మంచి రైతు! ఊళ్ళోవాళ్ళకు వ్యవసాయంలో‌ఎలాంటి సందేహాలొచ్చినా రాజు దగ్గిరికి వచ్చి సలహాలు అడుగుతుంటారు!  - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

సర్కస్ బొమ్మలు

సర్కస్ బొమ్మలు   బాంబే, ఒక హైటెక్ సిటీ. అందులో పేరుమోసిన సర్కస్ ఒకటి ఉంది. అందులో ఎన్నో జంతువులు- రకరకాల ట్రిక్స్ చేసేవి- ఉండేవి. ఉయ్యాలలూగే కోతులు, నవ్వించే ఒరాంగుటాన్, వివ్యాసాలు చేసే పులి- ఇవన్నీ చూసేందుకు పిల్లలు ఎగబడే వాళ్ళు. ఆ సర్కస్ తమ ఊరు వచ్చిందంటే జనాలకు పండుగలాగా ఉండేది. కానీ ఎవరికీ తెలియని విషయం ఒకటి ఉంది: ఆ సర్కస్ లో జంతువులను హింసిస్తారు.   "హింసించకపోతే కౄరమృగాలు మాట వినవు! వాటి చేత మాట వినిపించాలంటే వాటికి అన్నం పెట్టకుండా మాడ్చాలి! కొరడాలతో కొట్టాలి!" అని వాళ్ల నమ్మకం. ఆ నమ్మకంలో కొంత నిజం ఉంది కూడాను. సర్కసులో ఉన్న అనేక జంతువుల్లో ఒక ఏనుగు కూడా ఉండేది. దాని పేరు మోనా. ఒకసారి సర్కస్ నడిపే మాస్టర్ చెప్పిన మాట వినలేదని దాన్ని ఒక మూలన కట్టి పడేసాడు, మేత-నీళ్ళు ఏమీ ఇవ్వకుండా మాడ్చాడు. దాంతో అప్పటికే కడుపుతో ఉన్న మోనా పాపం, ఒక బిడ్డను కని, చనిపోయింది!   ఆ బిడ్డకు 'రాక్' అని పేరు పెట్టారు. చిన్నపిల్ల అని జాలి, దయా కూడా లేకుండా, ఇంకా సరిగ్గా నడవటం కూడా రాకముందే, తాడు మీద, సన్న సన్న గోడల మీద నడిచే శిక్షణనివ్వటంం మొదలు పెట్టారు దానికి. అయితే అది చాలా మంచిది- త్వరలోనే తాడు మీద నడిచే విద్యను నేర్చేసుకున్నది. "ఏనుగుపిల్ల చాలా బాగా నడుస్తుందట!" అవి సర్కస్ వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. దాంతో 'రాక్'ని చూసేందుకే సర్కస్‌కు వచ్చే జనాలు ఎక్కువైనారు. అయినా 'రాక్' కు హింస తప్పలేదు. మరిన్ని కొత్త విద్యలు నేర్చుకోవాలని మాస్టర్లు దాన్ని బలవంత పెడుతూనే ఉన్నారు. విసిగిపోయిన 'రాక్' ఒక రోజున సర్కస్ నుండి తప్పించుకొని పారిపోయింది!   సర్కస్ లోంచి అయితే బయటికి వచ్చింది గానీ, రాక్ కు ఎటుపోవాలో తెలీదు. జనాలు ఎవ్వరికీ దాని భాష, దాని బాధ తెలియదు. అయితే దాని అదృష్టం కొద్దీ అది ప్రముఖ వైల్డ్ ఎక్స్ పర్ట్ 'రాణి' కంట పడింది. రాణికి జంతువులంటే ప్రేమ. వాటి భావం, వాటి కన్నీటికి అర్ధం తెలుసు ఆమెకు. ఆమె 'రాక్' పై ఉన్న వాతల్ని, దాని కన్నీటి చారల్ని చూసి దాన్ని అర్థం చేసుకున్నది. దానితో స్నేహం చేసింది, పరిశోధించి, దాని వివరాలన్నీ‌ కనుక్కున్నది. ఎవ్వరూ దాన్ని హింసించకుండా అడ్డుకున్నది. "దాన్ని, దానిలాంటి ఇతర జంతువులను కాపాడాలి" అని పత్రికల్లో రాసింది.   సర్కస్ కంపెనీలు ఆమెకు వ్యతిరేకంగా చాలా ప్రచారం చేసాయి కానీ, చివరికి రాణి మాటల్లో సత్యం ఉందని అందరూ గ్రహించారు. గవర్నమెంటు వారు కూడా 'ఆనిమల్ రైట్స్'ని గుర్తించారు. 'మానవులు తమ వినోదం కోసం జంతువులను ఆడించరాదు' అని చట్టం వచ్చింది. సర్కస్‌లలో 'జంతువులని వాడుకోవటం' అనే దురాచారానికి తెర పడింది. ఆనాటి నుండీ‌ సర్కస్‌లలో జంతువులను ఆడించి సొమ్ము చేసుకోవటం తగ్గిపోయింది!  - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

అరిసెల కథ

అరిసెల కథ   రామాపురం అనే ఊళ్ళో పుల్లమ్మ, పుల్లయ్య అనే పేద బ్రాహ్మణ దంపతులు ఉండేవాళ్ళు. ఆ రోజు పండుగ రోజు. ఊళ్ళో వాళ్ళంతా మంచి మంచి వంటకాలు చేసుకొని తింటున్నారు. తాము కూడా ఏదో ఒకటి చేసుకొని తినాలనిపించింది పుల్లయ్యకు. అయితే ఇంట్లో ఏం సామానులు ఉన్నాయో, ఏవి లేవో తెలీదు. ఇంకా తెమ్మంటే తెచ్చేందుకు తన దగ్గర డబ్బు కూడా లేదు! అందుకని అనుమానంగానే "ఇదిగో అమ్మీ, నేను యాయవారానికి వెళ్తున్నాను. పండగ కదా, నేను తిరిగి వచ్చేలోగా తినేందుకు ఏ అరిసెలో చేసి పెట్టు" అని చెప్పి, పుల్లమ్మ నోరు తెరిచేలోగా బయటికి వెళ్ళి పోయాడు. "అరిసెలు తినాలనిపిస్తున్నట్లుంది, పాపం" అని పుల్లమ్మ డబ్బాల్లో వెతికింది. ఓ పది పన్నెండు అరిసెలకు సరిపడ సామాన్లు మాత్రం ఉన్నాయి ఇంట్లో.      "ఊరికే ఇంతింత ఖర్చు పెట్టుకోకూడదు. ఒక్క నాలుగు అరిసెలు మాత్రం చేస్తాను- చెరి రెండూ వస్తాయి, చాలు!" అని కొంచెం బియ్యప్పిండి మాత్రం తీసుకొని, దానిలోకి కొంచెం బెల్లం పాకం వేసి కలిపింది పుల్లమ్మ. ముందుగా ఒక అరిసె చేయగానే, ఆ ఘుమఘుమలకి ఆమె నోరు ఊరింది. "ఎట్లా ఉందో, ఏమో- చూడకపోతే మిగతా అరిసెలు పాడౌతాయి" అంటూ ఆ అరిసెను తినేసింది ఆమె. చూస్తే అందులో బెల్లం ఎక్కువైంది! "అయ్యో! తీపి ఎక్కువైతే బాగుండదు!" అంటూ ఇంకొంత బియ్యప్పిండి తెచ్చి కలిపి, మరొక అరిసె చేసింది. ఆ అరిసె తిని చూస్తే తెలిసింది. తీపి తక్కువ ఉంది! అందుకని ఇంకొంత పాకం పట్టి, దానికి కలిపి, ఇంకో అరిసె చేసి, రుచి చూసింది. ఈసారి చేసిన అరిసె చాలా తియ్యగా అయింది. మళ్ళీ పిండి పోసింది. ఈసారి మళ్ళీ పాకం తక్కువ అయ్యిందని పాకం; తీపి ఎక్కువైందని పిండి- ప్రతిసారీ ఒక అరిసె చేస్తూ, దాన్ని రుచి చూస్తూంటే పిండి మొత్తం దగ్గరపడింది. అంతా బాగుంది అనుకునే సరికి, చివరికి కొంచెమే పిండి మిగిలింది! ఆ పిండితోటి రెండే అరిసెలు తయారయ్యాయి! కొద్దిసేపటికి పుల్లయ్య వచ్చాడు. "వాసన ఘుమ ఘుమలాడుతున్నది. ఏం చేసావే?" అని అడిగాడు సంతోషంగా, నవ్వుకుంటూ.      "అరిసెలు చేశానండీ! మీరు అరిసెలేగా, చెయ్యమన్నది?! అవంటే నాకు కూడా ఇష్టమాయె!" అన్నది పుల్లమ్మ. "తొందరగా తీసుకురావే, నోరు ఊరుతున్నది. కడుపులో ఆకలి దంచేస్తున్నది!" అన్నాడు పుల్లయ్య, కంచం ముందు కూర్చుంటూ. "సరేనండీ!" అని తను చేసిన ఆ రెండు అరిసల్నీ పట్టుకొచ్చేందుకు లోపలికి వెళ్ళిన పుల్లమ్మ, అక్కడి అరిసెల్ని చూస్తూ ఆగలేకపోయింది: "సగం నా వాటా, కదా?!" అంటూ తన వాటా క్రింద వచ్చే ఒక అరిసెనూ దారిలోనే తినేసింది- మిగిలిన ఒక్క అరిసెను మాత్రం కంచంలో పెట్టి భర్త ముందు పెట్టింది. పుల్లయ్య ఆ అరిసెను చూసి విస్తుపోయాడు- "ఒక్కటేనా?! అదేనా, వొచ్చింది?!" అన్నాడు ఏడుపు మొహం పెట్టి. "లేదండీ! మొత్తం 12 అరిసెలు వచ్చాయి; కానీ మిగితా పదీ రుచి చూడటానికే సరిపోయాయి!" అన్నది పుల్లమ్మ అమాయకంగా. "అన్నేసి అరిసెలు ఎలా తిన్నావే?!" అన్నాడు పుల్లయ్య "అది.. ఎలా తిన్నానంటే...ఇలా!" అని ఆ ఒక్క అరిసెను కూడా తీసుకొని తినేసింది పుల్లమ్మ!   - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

ఏనుగు-కుక్క

ఏనుగు-కుక్క     అనగనగా ఒక రాజుగారికి ఒక ఏనుగు ఉండేది. ఆ ఏనుగును చూసుకునే మావటి వాడికి ఒక కుక్క ఉండేది. మావటి వాడితో కలిసి ఏనుగు దగ్గరకు వెళ్ళేది కుక్క. ఏనుగు, కుక్క చాలా స్నేహంగా ఉండేవి. కలిసి ఆడుకునేవి.  ఒక సారి డబ్బు అవసరమయ్యి. మావటి వాడు తన కుక్కను అమ్మేశాడు. బాధపడుతూనే కుక్క కొత్త యజమాని వెంట వెళ్లింది. కుక్క రాకపోయేసరికి, ఏనుగు ఆహారం తీసుకోవటం మానేసింది. నీళ్ళు కూడా తాగటం లేదు.  దానిని పరీక్షించిన వైద్యుడు "ఏనుగుకి ఏ జబ్బూ లేదు. ఇది ఎవరి మీదో బెంగతో ఉంది" అన్నాడు. "ఈ ఏనుగు రోజూ ఒక కుక్కతో ఆడుకునేది కదా? ఆ కుక్క కనిపించట్లేదు! ఏమైంది దానికి? వెంటనే ఇటు తీసుకుని రండి దాన్ని!" అన్నాడు రాజు. కొత్త యజమానికి ఆ సంగతి తెలిసి వెంటనే కుక్కను పంపించాడు. కుక్కను చూడగానే ఏనుగు లేచి నిల్చున్నది. కుక్క సంతోషంతో గంతులు వేసింది.    - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో