తేట తేట తెలుగు భాష

  తేట తేట తెలుగు భాష   తెలుగు భాష తెల్లవారి ఉదయించే భాష మధుర భాష మమతల పొదలో వెన్నెల వాకిట సింగారమైన ముగ్గులోని చుక్కల ఒద్దిక|| సురగంగ గంగ తరంగ జలపాతాల జోరు అక్ష్రమాల తీరు! తెలుగు భాష తెలుగు భాష తెల్లవారి ఉదయించే భాష|| తెల్లతామర తుమ్మెదలో జాలువారు అక్షర ఒత్తుల, గుణింతాల గమ్మత్తుగా..... కూర్చిన కూరుపు - చక్కని కూరుపు! తెలుగు భాష తెలుగు భాష తెల్లవారి ఉదయించే భాష|| రాయల తెరతీసిన తొలిపలుకుల జిలిబిలి వెలుగుల తెరపడని, దేశ భాషలలో గొప్పగా చిక్కిన తీరైన భాష తెలుగు భాష తెలుగు భాష తెల్లవారి ఉదయించే భాష|| ఆంధ్రబిడ్డలకి అమృత వాక్యాలను రంగరించిన ఉగ్గుపాల భాష తల్లి గురుతులతో పెనవేసుకున్న, పట్టుసదలని భాష తెలుగు భాష తెలుగు భాష తెల్లవారి ఉదయించే భాష|| తెలుగువారికే సొంతమైన అందరాని అందలాల చిక్కుకున్నా-------అందుకునే కొందరికే తెలిసిన భాష తెలుగు భాష తెలుగు భాష తెల్లవారి ఉదయించే భాష|| గొప్పవారికే కాదు పేదవాడి పలుకుల్లోను పరవళ్ళు తొక్కించి చిందేసిన చిన్ననాటి భాష తెలుగు భాష తెలుగు భాష తెల్లవారి ఉదయించే భాష|| సంధుల,సమాసాలలో వాగుల వంకల నడుమ తుషార బిందువై కలువపూలను తడిమిన భాష తెలుగు భాష తెలుగు భాష తెల్లవారి ఉదయించే భాష|| - Manohara Boga

ఆకాశం

  ఆకాశం   ఆకాశంలో ఆ కారుమబ్బులేమిటి? ఆ ఉరుములు మెరుపులు ఎందుకో? కుంభవృష్టివర్షమా! కాదు! కాదు! మరి? కారుమబ్బులు కావు అవి ఛిద్రమైన అబల  బ్రతుకులో మనసులో నిండిన కారుమబ్బులా లేక పిడుగుపాటువలన వచ్చిన కారుచిచ్చులా? అబల అనే విశ్వంలో కండ్లు అనే ఆకాశంలో కారుమబ్బులు వ్యాపించి వర్షిస్తున్నాయా ఆమె ఆర్తనాదాలనే ఉరుములు ఏమీ చెయ్యలేక గర్జిస్తున్నాయా! ఆమె కండ్లలోని మెరుపులు మబ్బు చాటున మెరుపుతీగలా భయంభయంగా చూస్తున్నాయా? ఓహో! ఉదయించే  సూర్యుడికన్నా అస్తమించే సూర్యుడు ఎర్రగా వున్నాడా? ఆకాశం రక్తసిక్తమై వీక్షిస్తున్నదా! యుగపురుషుడు వస్తాడని సబలుడై అబలలను రక్షిస్తాడని ఎగతాళి చేసి  నవ్వుతున్నదా.. ఎస్‌.కె.పద్మావతి సాహితీ కిరణం మాసపత్రిక సౌజన్యంతో

అంతా 'ఆకలి' మయం

  అంతా 'ఆకలి' మయం ఆకలి.. ఆకలి.. ఆకలి అంతంలేని ఆకలి అంతుచిక్కని ఆకలి అనుక్షణం ఆకలి కళ్ళల్లో ఆకలి చేతుల్లో ఆకలి చేతల్లో ఆకలి చెక్కుచెదరని ఆకలి బతికించే ఆకలి చంపేసే ఆకలి నిలువెల్లా ఆకలి నిప్పును మించిన ఆకలి ఎదిరించే ఆకలి 'ఎవర్‌ గ్రీన్‌' ఆకలి తరగని చీకటిలా ఆకలి తప్పని మృత్యువులా ఆకలి కనిపించని ఆకలి, కనికరంలేని ఆకలి ప్రతిజీవికి ఆకలి,  ప్రపంచాన్ని ఏలే ఆకలి రుధిరం చిమ్మే ఆకలి విశ్వమంతా ఆకలి విశ్వాసం చూపే ఆకలి దేహమంతా ఆకలి దేన్నీ లెక్కచేయని ఆకలి అబద్ధాలాడించే ఆకలి అవమానాల్ని దిగమింగే ఆకలి దరిద్రుడికి ఆకలి ధనవంతుడికి ఆకలి అసమానతలు ఎన్నున్నా అందరికీ సమానమీఆకలి బొమ్మరాత యల్లయ్య సాహితీ కిరణం మాసపత్రిక సౌజన్యంతో

ఉగాది గీతం

  ఉగాది గీతం   ఆమని అదిగో పిలిచెనదే, ఓ యని నా మది పలికెనదే ఆనంద తరంగాల హేలలో, యీ వని నాట్యములాడినదే        (..ఆమని..)           1) కలికి చిలక తన కొసరు గొంతుతో అడుగుతున్న కతలేమిటే? కోకిల పంచమ స్వరమున తెలిపిన తీయని కబురది తెలియదటే? మల్లెల  తెల్లని సొబగులలోని మర్మమదే వాసంత వేదికా  (..ఆమని....) 2) గున్నమామిడీ గుబురుల దాగిన మధురస ఫలముల చూడవటే? మిన్నులనంటెడి విహంగ గానము  సుధా సమీరము తెలియదటే? కన్నులందు కనిపించు కాంతులూ పూలకారు సుమ రథమునవే!!.......  (..ఆమని..) 3) మన్మథ వత్సర వేడుక వేళల మది పులకింతల కేతనమే వసంత కాహళి ధ్వనించు  సీమలు నవ తారుణ్య సుయోజితమే... జీవన గీతిక సమ శ్రుతి లయలకు సప్త స్వర జీవామృతమే..............  (....ఆమని..)   -పుట్టపర్తి నాగపద్మిని  

మహిళా మేలుకో

  మహిళా మేలుకో   నువ్వు పుట్టకముందే నీ ఆనవాళ్ళను యంత్రంతో తడిమి భ్రూణ హత్యకు ఉరుకులాడుతుంటారు   చచ్చీచెడీ భూమ్మీద పడ్డాక అస్తిత్వాన్ని అర్పేయాలని ఆరాట పడతారు సీతాకోక చిలుకలా ఎగురుతున్నపుడు వందల చూపులతో నీ దేహాన్ని తూట్లు పొడుస్తారు   పసితనం నుంచే పోరాటం మొదలు వివక్షత నదిలో ఈదుతూనే హక్కుల కోసం గర్జించావు అని మెళ్ళో గంట కట్టి పిల్లిలా ఊరేగిస్తారు   ఆకాశంలో సగమంటూ అరచేతిలో వైకుంఠం చూపి వంట గదిలో బందీని చేస్తారు   నడి రాత్రి కాదు పట్టపగలే తెగబడ్డ మగమృగాల క్రీడల్లో బలి కాబడుతున్న లేడిని చేస్తారు   అంతరిక్షంలో దూసుకు పోతున్నా అభివృద్ధితో అందలం ఎక్కిస్తున్నా ప్రపంచాన్నే నడపగల శక్తి ఉండి కూడా అణిగి మణిగి ఉండాలని అణిచి వెయ్యాలని చూస్తున్నారు   ఈ దాస్య విముక్తికై అలుపెరగని పోరాటానికి సిద్ధం కావాలి పితృస్వామ్యపు భావజాలానికి చరమ గీతం పాడాలి మహిళా... రేపటి శతాబ్దానికి నీవే అడుగులు వెయ్యాలి ప్రతి దినం మహిళా దినోత్సవమే అవ్వాలి   -పుష్యమి సాగర్ ksr.sweet@gmail.com