డైరీ (కవిత)

//డైరీ//   గుండెల్లో బాధ గొంతుకు అడ్డుపడి మాట పెగలనపుడు కష్టాన్నంతా ఒంపేసి భారం తగ్గించుకోవడానికి దొరికిన ఏకైక నేస్తం నువ్వు.. ఎంత చెప్పినా ఓపిగ్గానే వింటూ కదలక మెదలక సహకరిస్తూ పెన్ నిబ్ ల ఒత్తిడిని మౌనంగానే భరిస్తూ నా జీవితాన్ని లిఖించుకుంటూనే నాకు పాఠాన్ని నేర్పుతుంటావు... నా జ్ఞాపకాలన్నీ భధ్రంగా దాచుకుంటూ నాకు నన్నే కొత్తగా పరిచయం చేస్తుంటావు నేను ఒంటరిగా ఉన్నపుడు నా మనసులో భావాలను వింటూ నాకో తోడువవుతావు.. నాకు తెలుసు నువ్వేమీ చెప్పలేవని కానీ ఏం చెప్పినా శ్రద్ధగా వింటూ నా ఒంటరి భావాలను కన్నీళ్ళను,కష్టసుఖాలను పంచుకుంటూ ఎప్పటికీ నా ప్రతిరూపంగా మిగిలిపోతావు           ...సరిత భూపతి

మేమింతే (కవిత)

  మేమింతే (కవిత)   కూటి కోసం లేలేత బాల్యం కటిక చాకిరి చేస్తూ... కమిలిపోయిన రక్తపు చేతుల్లో మొహం దాచుకొని కన్నీరొలికించటం మనకు కొత్తేమీ కాదు... రోజూ ఎక్కడోచోట చూస్తూనే ఉంటాం... అయితే మనకేంటండి... మన పిల్లలు ఏ.సి కారుల్లో స్కూల్ కి వెళ్తారు... ఉదయాన్నే శాండ్విచ్లు మధ్యాహ్నం వాళ్ళు తిన్నా తినకపోయినా నాలుగైదు రకాలతో భోజనం... సాయత్రం పిజ్జాలు, బర్గర్లూనూ... ఇంటికొచ్చి మరీ ట్యూషన్లు చెప్పే ఉపాధ్యాయులునూ ... మన పిల్లలైతే సుఖంగా ఉన్నారు అది చాలండి మనకు... భలే తృప్తికరమైన జీవితాలు సుమీ!   రోడ్డు మీద ఎవడికివాడే సినిమాల్లో రౌడీల్లా ఫీలయిపోయి... కత్తులతో నరుక్కోవడాలు, రేపులు చేయడాలు... అది మనం నిజంగానే సినిమా చూస్తున్నట్టు మస్తు ఇంట్రెస్టింగ్గా చూస్తాం... ఇంకా కొంత మందిమి అయితే మరింత క్యూరియాసిటీతో... వీడియోలు తీసి యూట్యూబ్లో అప్లోడ్ కూడా చేస్తాం... మళ్ళీ మనమే అన్యాయం అమానుషం అంటూ పోస్ట్లు పెడతాం... ఎంత గొప్ప సామాజిక సేవో కదా! వియ్ ఆర్ వెరీ రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఇన్ ది సొసైటీ యు నో...   పెళ్ళాంతో షికార్లు చేస్తూ పక్కింటావిడ గురించి ఆలోచనలు... నేను శ్రీరామచంద్రున్ని సుమీ! (పాపం సీతమ్మను అడవులకు పంపినందుకు ఆయనకు పాపం చుట్టుకుందేమో... ప్రతీ వాడు ఆయన పేరు వాడేస్కోవటమే... ) మరేమో మావి చాలా పవిత్రమైన జీవితాలండి....   కష్టపడి చదివించి, ఉద్యోగం వచ్చాక, పెళ్లి చేసేంత వరకే తల్లితండ్రులతో పని... ఆ తర్వాత పెళ్ళాం, పిల్లలు, ఉద్యోగాలు... ఇంకా ఆ ముసలి వాళ్లకు సేవ చేస్తూ కూర్చుంటే మా జీవితం ఏమైపోనూ... కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించండి... అపుడు వాళ్ళు కూడా ఇలాగే అనుకుంటే మీ పరిస్థితి ఏంటి అంటారా? ఎవరండీ అది యెదవ ఫిలాసఫీలు మాట్లాడేది? అపుడు అది వాళ్ళ భాద్యత... ఇపుడు మాకిది బరువు... మేమేదో పాపం చేసినట్లు మాట్లాడతారేం... సంవత్సరానికోసారి ఉన్నారో, లేదో చూసొస్తున్నాంగా... మావెంత రెస్పాన్సిబుల్ బతుకులో మీకేం తెలుసు... మేమింత గిరిగీసుకొని ఎవరిని కష్టపెట్టకుండా బతికేస్తుంటే మమ్మల్నే ఆడిపోస్కున్టారేం... ....సరిత భూపతి

అస్థిత్వ పోరాటం (కవిత)

  అస్థిత్వ పోరాటం  తిండికోసం అల్లాడుతున్న చీమలకు పసుపు నీళ్ళు గుమ్మరిస్తే విలవిల్లాడిపోతున్న జీవాల్లా తరతరాల ఆచారపు అణిచివేతల్లో కొట్టుమిట్టాడుతున్న ఒక విగతజీవిని... ఆత్మీయతల ఉచ్చులో అస్తిత్వాన్ని కోల్పోయి బావిలో కప్పలా ఇదే జీవితమని మురిసిపోయే నామమాత్రపు మనిషిని... రెండు సూత్రాల తాడు వెనుక బిగుసుకుపోయే ఉరితాళ్ళెన్నో పైకి ప్లాస్టిక్ నవ్వుతో ప్రీమోల్టన్లా స్రావాన్ని ఆపుతూనే అరిగిపోయే నడుము ఎముకల్లా వెనుక చిచ్చుపెట్టే సో కాల్డ్ బంధాలెన్నో.. కొత్త బంధాల పేరుతో అరువు తెచ్చుకున్న నవ్వుల్లో నన్ను నేను కోల్పోయిన ఈ అహంకారపు అడవిలో బానిసత్వపు కన్నీటి మంటల్ని ఆర్పలేని నిశిరాత్రులెన్నో...           ...సరిత భూపతి

గురుపూజోత్సవం

  గురుపూజోత్సవం   ఇది గురుపూజోత్సవం జ్ఞానానికే  ఉత్సవం ! ఇది  చదువులకె సంబరం ఇది గురువుల సందోహం ! గురువుల మెచ్చినదీ రోజు గురుతర  బాధ్యత  హెచ్చిన  రోజు తరతరాల సత్  సంప్రదాయములు విరిసీ మెరిసిన రోజు ! ప్రతిభకు  పట్టం కట్టిన  రోజు ప్రభుతయె  గురువుల  మెచ్చిన  రోజు ! దేశ ప్రగతి సాధించగ  చదువులు దేశమె కాంక్షించిన రోజు ! తరతరాల సంస్కృతీ  భారతిని తనయుల  కెరిగింపు మను రోజు ! పేరాశలకే  దూరమ్మగుచూ బోధించే  పరహితమను   రోజు! ఉత్సాహం ,ఉపకారం , ప్రజ్ఞ, సత్సంగం,సత్యం,సమభావం  గోరుముద్దలుగు మన పాపలకిడి పేరు గాంచుడను నీ రోజు ! భావి భారత  సత్పౌరులనూ చేవగల వివేకానందులనూ తీర్చి దిద్దిన స్వతంత్ర భారతిని తిరిగి కూర్చమన నీ  రోజు !   రచన :- నల్లాన్ చక్రవర్తుల వేంకట రంగనాథ్.

నేస్తమా! (కవిత)

     నేస్తమా! నీవు లేకపోతే నేను లేనని ప్రత్యేకించి చెప్పాలా? నా చిన్ని కాగితప్పడవలు నడిపి నాకు నేనే గొప్పగా కేరింతలు కొట్టేలా చేసావ్.. ఇంటికొచ్చే బంధువుల నడక శబ్దాన్ని గుమ్మంలోకి అడుగుపెట్టే ముందే గుర్తించినట్టుగా నీ రాకను గుర్తించి సంబరంగా పరిగెత్తుకొచ్చేదాన్ని.. పెరటి మెుక్క మౌనంగా రాలుస్తున్న ఆనందభాష్పాలకు వంతపాడుతున్నట్టుగా కేరింతలు కొడుతూ నీలో కలిసిపోయేదాన్ని.. ఒంటరినై దిగాలుగా ఆలోచనల్లో మునిగినపుడు నేనున్నానంటూ తల్లిలా దరికి చేరి వెచ్చగా నా బుగ్గలు స్పృశిస్తావు .. నన్ను తడిపి నా మనసునూ శుద్ధి చేస్తావు.. కరువుతో అన్నదాత కన్నీరొలికిస్తుంటే కళ్ళు కడిగి ముత్యాల సిరులు కురిపిస్తావు.. ప్రాణవాయువునిచ్చే పచ్చదనానికి పురుడు పోసి మాకు జీవనాధారం అయ్యావు.. నేస్తమా! ఏమిచ్చి నీ బుుణం తీర్చుకోనూ.. మళ్ళీ పసిదాన్నై నీతో ఆడుకోవటం తప్ప!! (చిన్ననాటి నేస్తం వానకు అంకితం)           ...సరిత భూపతి

కలికాలం (కవిత)

కలికాలం వస్తాయ్ .. వస్తాయ్ బూతుల్.. రోతల్ రాతల్ .. చేతల్ చూస్తాం .. చూస్తాం కళ్ళు తెరిచి .. సొల్లు గార్చి ఒళ్ళు మరచి .. సిగ్గు విడిచి తెర మీద బొమ్మ నగ్నంగా ఎగిరితే ఎంటర్టైన్మెంట్ ... రోడ్డు మీద వెళ్ళే అమ్మాయి చీర తప్ప మరే బట్ట కట్టినా అది రేప్ కు ఉత్ప్రేరకం ... పదేళ్ళ కుర్రాడు అమ్మాయి ఒంటి కొలతల గురించి మాట్లాడితే అది పగలబడి నవ్వే జోకు ... ఐటమ్ సాంగ్లంటూ ఆడదాని ఒంటి మీద డబుల్ మీనింగ్ పాటలు పెడ్తే కళ్ళకు , చెవులకు కిక్కే కిక్కు ... పురాణాల్లో తప్పు చేసినోడు దుస్శాసనుడు అదే తప్పు అందంగా చేస్తే హీరో ... రేప్ చేస్తే చేయించుకోవాలి అన్నోడికి సపోర్ట్ చేసే చదువు'కొన్న' లాయర్లు ... ఆడదానికి ఆడదే శత్రువై ఉన్నత స్త్రీ పై పిచ్చి రాతలు, గీతలతో ఆడ జర్నలిస్ట్ పత్రికా వ్యభిచారం సారీ .. వాళ్ళు దాన్ని పత్రికా స్వేఛ్చ అంటారేమో... తోటి విద్యార్థినిని అర్ధనగ్నంగా తిప్పి ఆత్మహత్య చేసుకునేలా చేసిన విద్యార్థిని .. మరేమో ఉన్నతమైన చదువులు కదండీ .. అంతా గురుదేవుల చలవే ... కాషాయం కట్టినోడు కడుపులో తంతే పిల్లలు పుడుతారు .. మా నమ్మకాలు మావి .. డిస్టర్బ్ చేయకండి... కరడు గట్టిన ఉగ్రవాదిని ఉరితీసినా ఊరుకోం ... ఎందుకంటే మా మతం ... చచ్చిపోయిన వందలాది మంది భరతకులమైతే మాకేంటి ? మాకు మా మతమే గొప్ప ... ఒరేయ్ చంటి! పెద్దయ్యాక ఏమవుతావ్? రాజకీయ నాయకున్నవుతా ... ఎన్ని నేరాలు చేసినా శిక్షలుండవ్ .. జైలుకెల్లినా రాజభోగాలే ... ఓటుకు నోటు , మందు చూపిస్తే కుక్కకైనా ఓటేస్తాం .. హహ్హహ్హ ..ప్రజాఆఆఆస్వామ్యం ... నాకో డౌటు ... కీచకపర్వం ఆనాడు భారతంలో జరిగినదా? .. నేడు కలియుగంలో జరిగేదా? పాపం ఇంకా దుర్యోధన, దుస్శాసనులను ఆడిపోస్కోవటం అన్యాయం కదూ !       ...సరిత భూపతి

కవిత్వం

  కనీ కనిపించని అలజడులే గుప్పెడు మనసును స్పృశించినపుడు ఉప్పెనలా పొంగుతున్న భావాలను తెల్లకాగితంపై ఒంపుకోవాలనుకున్నపుడు మది చెందే ఉద్వేగానికి పసివాడైపోతాడు కవి.. నాలుగు గోడల నడుమ నిశ్చేష్టుడై నిదురించే నిశిరాత్రిలో మనసు ముసుగులో నిశాచరాలై విహరించే భావాలు అనేకం.. కవి ఒక నిరంతర మానసిక శ్రమైక జీవి.. కవిత్వం ఎంత త్రవ్వినా తరగని విజ్ఞానఖని.. రెండు చప్పట్లు.. నాలుగు మెచ్చుకోళ్ళు.. పదిమంది అభిమానులు కాదు కవి అంటే... ఆపదొచ్చినప్పుడు నాలుగు తిట్లు.. అరముక్క కూడా అర్థంకాని కొన్ని అతితెలివి మాటలు.. పబ్లిసిటీ,డబ్బుకోసం చేసే వ్యాపారం కాదు కవిత్వమంటే... విజ్ఞానపు పొదరింట్లో పురుడు పోసుకున్న అగ్నిపూల్లాంటి అక్షరాలు కవిత్వమంటే.. సమాజంలో యుద్ధం అవసరమైనపుడు కలాన్ని ఆయుధంగా వాడి పోరాడేవాడు కవి అంటే.. చదువుతున్న కళ్ళు ధీర్ఘంగా విప్పారి గుండెకు తగిలిన అక్షర తూటాలకు బానిసై భాద్యతను గుర్తుచేసేది కవిత్వమంటే... మనసులోని భావాలను సిరాగా పోసి సమాజ అభ్యుదయానికి అజరామరంగా కృషి చేసేవాడు కవి అంటే .. రెక్కలు లేకున్నా అనంతానంత లోకాల్లో తన్మయత్వంతో విహరింపజేసేది కవిత్వమంటే.. నీకు నిన్ను పరిచయం చేసేది కవిత్వమంటే.. కవిత్వమంటే విజ్ఞానం.. కవిత్వమంటే ఆదర్శం.. కవిత్వమంటే ఆనందం.. కవిత్వమంటే తపన.. కవిత్వమంటే " జీవితం" ..       ......... సరిత భూపతి

నాలో నేను (కవిత)

  మట్టిరేణువులను పోగేసుకొని సుడిగుండంలా గాలితో కలిసి నిన్ను చుట్టేయాలన్నంత తాపత్రయం నాది... నాకు చేరువలో ఉన్నట్టున్నా ఎప్పుడూ తీరం చేరని కెరటంలా ఎగిసి.. పడిపోయే నిట్టూర్పు నీది.. మస్తిష్కంలోని భావాలను మనసుకొయ్యపై ఆరేసుకున్న ప్రతీ నిశిరాత్రి మదిరాల్చే మౌనపు కన్నీటిలో పదే పదే నానిపోయి పచ్చిగానే తెల్లారేది.. పెదవులపై ఎండిపోని మౌనాలు మనసును ఉబలాటపెడుతున్నపుడు నీ నిశ్శబ్ధాలే మదిలో శబ్ధాలై ఆ భావాలు నిన్ను చేరాలని ఆశపడేవి.. ఎటువైపునుంచి ఏ అపాయం వస్తుందోనని అన్నివైపులా కాచుకొని ఎప్పుడూ ఎగిరిపోవటానికి సిద్ధంగా ఉండే పక్షిని చూస్తే ఇప్పుడు నన్ను అనుక్షణం దాటేయాలనుకునే నీ చూపులే కళ్ళల్లో మెదులుతాయి.. ఆ చూపులు కరిగి రాలిపోకుండా బలవంతంగా కుక్కుకుంటున్న ఆ కన్నీళ్ళకేం తెలుసు... దగ్గరే కనిపిస్తున్నట్టుండే కొండలా మనమెప్పుడూ దగ్గరవ్వలేని దూరాలమని!       ----- సరిత భూపతి

ఆమ్ ఆద్మీ

ఆమ్ ఆద్మీ నేను అనుకున్నదేది నేను కానప్పుడు మరి నేనెవరు? నేను తుఫానుకు ఎగిరిపోతున్న మట్టి రేణువులా ఆనందం కోసం అనుక్షణం పరిగెడుతున్న వాడ్ని.. జీవితంలో చల్లుకున్న ఆశల విత్తుల్లో మెులకెత్తని విత్తనాన్ని... వాన వెలిసిన తర్వాత సుారు మీద నుంచి జారే నీటిబిందువులా కష్టం తీరినపుడు వచ్చే ఒక ఆనందభాష్పాన్ని ... ఆకలితో అలమటిస్తున్న వాడికి కడుపునిండా తిండి దొరికినపుడు వాడి కళ్ళల్లో కదలాడే కృతజ్ఞతాభావాన్ని... వంగిపోయిన నడుముకు ఊతాన్నిచ్చే చేతికర్రలా నా లాంటి నిస్సహయులకు ఆత్మీయపలకరింపుని... కష్టాల సాగరంలో కాలం కెరటంలా నెట్టేస్తున్న ఒక అలను ... ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకుాడదో అర్థంకాక ఐదేళ్ళకోసారి కళ్ళు ముాసుకొని ఓటు గుద్దుతున్న ఒక ఓటర్ని అవును నేనే... ఆమ్ ఆద్మీ ...       ---- సరిత భూపతి

మరుజన్మ

  మరుజన్మ కురిసే ప్రతి చినుకు ఏ ప్రకృతి అందాన్ని ముద్దాడుతుందో తెలియదు.. కానీ నువ్వేచోటనున్నా నీ చూపులు నా తలపులను ముద్దాడుతాయి .. ప్రతీ కన్నీటిబొట్టు కష్టానికే రాలకపోవచ్చు కానీ నీ సహవాసానికి నోచుకోని మనసు మౌనంగా రాలుస్తున్న కన్నీటిబొట్లు అనంతం .. నిశిరాత్రి నిశ్శబ్దంలో పిల్లతెమ్మెరలా తాకిన ప్రతీ కల కవ్వించకపోవచ్చు.. కానీ నీకోసం వేచి చూస్తూ రెప్పవేయని కలల వెనక నువ్వు రాలేవన్న నిజమెప్పుడూ జడిపిస్తుానే ఉంటుంది.. నిన్ను ఈ జన్మకు చేరుకోలేనని తెలిసాక ఉంటుందో లేదో తెలియని మరుజన్మను పొందాలనుందిప్పుడు.. మనిషెంత ఆశాజీవో కదూ! నిన్ను చేరే ఆ క్షణం కోసం నన్ను నేను వృథా చేసుకున్న సరే! మరుజన్మంటూ ఉంటే నిన్నక్కడ కూడా కోల్పోలేను..       ..... సరిత భూపతి

నువ్వు నేను

    కల్మషంలేని పసిపాపవంటి కనుపాపవు నీవు నీ వాకిట్లో జారే కన్నీటి బిందువు నేను... నా హృదయ వీణవు నువ్వు నువ్వు మీటే వలపు తంత్రిని నేను... ఉదయాన్నే వికసించే చిరునవ్వుల పుష్పానివి నువ్వు.. నాకంటుా గుర్తింపు లేకపోయినా నీ వెనకే ఉండే ముల్లుని నేను... ఆనందంతో దుాకి వచ్చిన వానమబ్బును నీవు నీ ఆనందంలో అవనినై తడిసి ముద్దవుతా నేను ... ప్రపంచానికే వెలుగువు నీవు నిన్ను వెలిగించటానికే కొవ్వొత్తినై కరిగిపోతా నేను .. రాగహేళిలో ఓలలాడించే వేణువు నీవు నీపై రాగాన్ని పలికించే గాయాన్ని నేను ... తొలకరిజల్లుకు పరవశించి నాట్యమాడుతుా ఆనందభాష్పాలు రాల్చే మయుారానివి నీవు... నీ అశ్రువులు తాగి పరిపుార్ణమైన మయుారిని నేను సృష్టికి తేజం నీవు సృష్టికి ముాలం నేను మనమెుకటైతేనే సృష్టికి అర్థం ... పరమార్థం ...         ........సరిత భూపతి

స్నేహం

స్నేహం (Friendship Day Special) కలతలు కమ్ముకున్న వేళ ఉసురు ముసుర్లు ఉరులై గుబులు గుండెల నిండి కన్న కలలు కన్నీరై కరిగి ఆవిరైన వేళ మనకుంటే ఒక నేస్తం ఆదుకునే ఆపన్న హస్తం చేసె అత్యవసర వైద్యం కష్టంలో కాచుకునే దైవం కలిసి చదువుకునే పుస్తకం అదొక నిజమైన స్వప్నం లేదు స్నేహాన్ని మించిన ధనం బతుకు పోరాట దారుల్లో నీడనిచ్చి సేదదీర్చు వృక్షం. స్నేహమంటే కరగని కల నేస్తమంటే విరగని అల శూన్యమైన జీవితాన విరిసే నవ్వుల వాన తనువులు వేరైనా తలపులు మారేనా మతమేదైనా, కులమేదైనా రాజైనా, పేదైనా అవుతారా అనర్హం పంచుకుందుకు స్నేహం ఎల్లలెరుగక, కల్లలు లేక కలకాలం నిలిచేదే స్నేహం జన్మకి చెప్పేవరకూ వీడుకోలు కమ్మని బంధమై విడిపోదు. నమ్మకాన్ని కొంత అమ్మతనాన్ని కొంత రంగరించి నాన్నలా లాలించేది నేస్తం మనువైన మనుగడ సంసారం నేస్తమున్న జీవితం బంగారం చెప్పాలంటే స్నేహం గొప్పతనం సరిపోదొక స్నేహితుల దినం మరువకుమా ఓ నేస్తం ప్రాణమున్నంతవరకూ స్నేహం.         .....శారద శివపురపు       Click here for more Friendship Day Special articles Trends in Friendship Long live - friends! A True Friendship is good for your Health ! Rules in Friendship?? స్నేహం పేరుతో ఒక దేవుడు

" అతడు......నింగి కెగసిన భారత మిసైల్ "

" అతడు......నింగి  కెగసిన  భారత  మిసైల్ ".    ॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰    అతడు నింగి కెగసిన మిసైల్ .    అతడు ఎనభై నాలుగేళ్ళ నవ యువకుడు.    పిల్లల్లో పిల్లడైన పెద్ద మనుష్యుడు .    యువ స్వప్నం స్వాగతించిన సాహసికుడు !    పల్లె నుంచి పై కెగసిన పారమార్ధికుడు.    ఓటమిన  గెలిపించిన మహా సాధకుడు !    పేదల ఆరోగ్యానికి శాస్రీయ రక్షకుడు !    మార్మికుడుగ కనిపించిన బోళా శంకరుడు !    భీకర క్షిపణులనే శృతిజేసిన వైణికుడు !    ఎడారి నన్వస్త్రములను పేల్చిన స్మైలింగ్ బుద్ధుడు !    పనిలో విశ్రాంతి వెదుకుకున్న నిత్యసత్య శ్రామికుడు !    రామేశ్వర గృహమునుండి రాష్ట్రపతీ భవన్ వరకు    రాజపథము పై నుండి దూసుకొచ్చిన "భారత రాకెట్టు" !    శత్రువుల్నిల ఓడించుటలో...మిత్రుల్నీ పొందుటలో-    ఆయన చేసిన మిసైల్ కంటె ,ఆయన నవ్వే పవర్ ఫుల్ !    అతడో గొప్ప ప్రొఫెసర్ !.. అతడో గొప్ప సైంటిస్ట్ !    అతడో గొప్ప స్పీకర్ !..అతడో గొప్ప లీడర్ !    అతడో గొప్ప స్వాప్నికుడూ..అతడో గొప్ప ప్రేమికుడూ..    అతడో నిత్య విద్యార్ధీ ....అతడు నిరంతర బోధకుడూ !    అతడు సామాన్యునిగ కన్పించే.. గొప్ప అసామాన్యుడూ..    గొప్ప అనితర సాధ్యుడూ .....!    ఆత డన్నిటి కంటే మించిన పరమ దేశ భక్తుడు !    భరత మాత సేవకే తన తనువంతా నర్పించిన    భారతరత్నే ! మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం !    భారతీయుల  అశ్రుతర్పణ అందుకో ఆఖరి సలాం !!    భారతజాతిది ఉండు వరకు నిన్ను మరువము యిది నిజం !!!    జయహింద్ ! జయహింద్ ! జయహింద్ !!! ॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰ నల్లాన్ చక్రవర్తుల వేంకట రంగనాథ్

ఆదర్శ దాంపత్యం

  ఆదర్శ దాంపత్యం   హైస్కూల్ నుండి నిన్నటి వరకూ తన గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్ చెప్పేసిన జెనూఇన్ హస్బండ్ ట్రూత్ ఫుల్నెస్ తో మొదలయిన మీ ఫస్ట్ నైట్ సాక్షిగా నీది ఆదర్శ దాంపత్యమే నిన్నారుగజాల చీరలో చుట్టేసి తను మాత్రం అర్ధనగ్న భామల అందాలను ఆబగా చూ స్తూ నాకేసిన నీ వంటకం రుచికి మెచ్చుకోలు సాక్షిగా నీది ఆదర్శ దాంపత్యమే ఆఫీస్ లో ఎ ఫైర్స్ ఉన్న సుందరాంగుల్ని ఓపెన్ గా ఇంటికాహ్వానించినప్పుడు అవమానాలను, అనుమానాలను కొంగుతోపాటు దోపేసి చిరునవ్వులు చిందిస్తూ వారితో పరాచికాలాడిన నీలో లోపలి (ఘోస్ట్) హోస్టెస్ అద్భుత ఆతిధ్యాల సాక్షిగా నీది ఆదర్శ దాంపత్యమే పదిమందిలో నీ అభిమానాన్ని దెబ్బ తీస్తూ నిన్ను చిన్నబుచ్చినప్పుడు, కళ్ళలో తేలుతున్న నీటి బుడగల్ని చప్పుడు లేండా పేల్చేసి నీ ఎంసీపీ (MCP) హస్బండ్ ఆధిపత్యాన్ని నవ్వుతూ అంగీకరించిన నీ నటనా చాతుర్యం సాక్షిగా నీది ఆదర్శ దాంపత్యమే పండగ ముందు రోజు రాత్రి పట్టు చీర కొనిచ్చి, నిన్ను మురిపించి నీ కిష్టం లేకున్నా బలవంతంగా నిన్ను మంచం మీదకి లాగినపుడు నువ్వేవగించుకునే పడుపుగ త్తె జ్ఞాపకం సాక్షిగా నీది ఆదర్శ దాంపత్యమే అ త్తగారి ఆరళ్ళు, ఆడపడుచుల ఈసడింపులు మామగారి వేధింపుల మధ్య నువు నలుగుతుంటే తనకు మాత్రం అ త్తగారింట గౌరవ మర్యాదల్లో లోపం ఉందని, నిన్ను పుట్టింటికి పంపక పోతే ఈ జన్మ కింతేనని సరి పెట్టుకున్న నీ రాజీ మన స్తత్వం సాక్షిగా నీది ఆదర్శ దాంపత్యమే ఇక వల్లకాదని తెగింపు వచ్చిన ఒక బలహీన క్షణంలో ఎదురు చెప్పినపుడు నీ చెంప ఫెడేల్మనిపించిన తర్వాత అమ్మవారి బొమ్మ ముందు మోకరిల్లిన నీ పతి దైవభ క్తి సాక్షిగా నీది ఆదర్శ దాంపత్యమే తన సక్సెస్ లన్నిటికీ క్రెడిట్ ఇవ్వకపోయినా తన పార్టీస్ కి, ఫంక్షన్స్ కీ నిన్ను వెంట తిప్పుకుంటూ సహధర్మ చారిణిగా నీపట్ల పబ్లిక్ గా గౌరవం నటించే నీ మొగుడు కోపంలో చూపే బూతు సంస్కారం సాక్షిగా నీది ఆదర్శ దాంపత్యమే నన్ను కాదంటే పూట తిండికి గతి లేదని నీ మొగుడు ఈసడించినప్పుడల్లా స్వేచ్చగా బ్రతికే పక్కింటి డైవొర్సీ ని సీక్రెట్ గా ఎడ్మైర్ చే స్తూ , నీ పట్టు చీరలు, నగలు ముందు ఆమె సాదా సీదా జీవితం వెలా తెలా అనుకునే నీ హిపొక్రసి సాక్షిగా నీది ఆదర్శ దాంపత్యమే గృహిణిగా, తల్లిగా నీ క ర్తవ్య నిర్వహణ కోసం నువు చంపుకున్న నీ కళలు, నీ అభిరుచులు, పెట్రియార్కల్ ఇన్సెన్సిటివిటీస్ పుణికి పుచ్చుకున్న నీ సుపుత్రులు నీ పట్ల చూపే అవసరార్ధ ప్రేమలు, నిన్నొక డెపెండెంట్, సెంటిమెంటల్, ఇడియాటిక్ లూసర్ గా నిలబెట్టినా, ఈ సమాజం నిన్నెపుడూ ఒక ఆదర్శ గృహిణిగానే గౌరవి స్తుంది అవును నీది ఆదర్శ దాంపత్యమే, నువు ఆదర్శ గృహిణివే.       ....శారద శివపురపు

గోదావరి పుష్కరాల కవితలు

  గోదావరి పుష్కరాల కవితలు గోక్షీర సమామృత సుజల గోదావరి దాహార్తికి హారతిచ్చి స్వాగతించు తన దరి వడి వడి జల గల గలలు ఓ విభావరి రివాజుగా వచ్చె పన్నెండేళ్ళ పుష్కరాలు ఈ సారీ ... Srikanth Vetsa // మేం మనుషులం // గోదాములు నిండుతాయని గోదావరి పుష్కర తీర్థానికి పయనిస్తాం.. దానవ దుష్కృతులనంతము చేసి పాప నిష్కృతికై మునకలు వేస్తాం.. వరమో శాపమో తెలియని మోక్షం కోసం ఏడుస్తూ తొక్కిసలాటలో చస్తాం... రివాజుగా మారిన అలసత్వం, అవినీతి, కామాంధత్వాలను మాత్రం కడిగేసుకోం - మేం మనుషులం.. --- Bhargav Kumar Burugupalli గోదావరి శోభలు, పుష్కరాల గోలలు, గో దావరిలో స్నానం,దానములిచ్చు జనం, గోదా వరిలో నావ, చూపించు నాకు త్రోవ,  గొదావ రిఝరి,కోరి వెళ్ళిరి లోకులు మరీ మరీ ... Rambabu Kaipa "గో"రు ముద్దలు పెడుతూ ముద్దాడింది అమ్మ , "దా"యిదాయి అంటూ దగ్గరకి తీసుకుంది అమ్మ ! "వ"టపత్రశాయికి వలె నిదురపుచ్చింది అమ్మ , "రి"వాజుగా వచ్చే పుష్కర పుణ్యాన్ని పంచింది  గోదారమ్మ !! ... Vadlamani Lalitha Swapna గోరింటాకు పెట్ట అర చేయి మెరిసె, మన గో దావరి తల్లి ఈనాడు పుష్కరము న మెరిసె !! వరముల యమ్మ మన ముందు నిలిచి మన ప రివారముల్ జేరి కొలవంగా ఆ తల్లి మురిసె .... Viswanath K గోమాత సేవలో వచ్చు పుణ్యంబు దానము వల్ల వచ్చు విశేషంబు వందనము వలన వచ్చు గౌరవంబు రిప్త హరిణి గోదావరి పుష్కరంబో రవీంద్రా ! .. Ravindra Tanugula   .....Telugu Velugu Samithi Infosys Hyderabad