శ్రీ సు(దుర్)ముఖి కి స్వాగతం !

శ్రీ సు(దుర్)ముఖి కి స్వాగతం !      నెయ్యముజేయగ వచ్చెను, అయ్యారే! దుర్ముఖి గను మనఘ మనముతో, ఉయ్యల పాటలబాడుచు, వయ్యారులు హారతెత్తి, వర్ధిలుమనరే ! ,.............. కెందామర పోలికతో మందానిల సౌరభముల మరువిల్లనగన్, మందాకిని వలె దుర్ముఖి, అందలమున వచ్చెనదిగొ అక్షతలిడరే ! ........... రాయంచ కులుకు నడకల, నా యందము జూడుమనుచు నాదఝరులతో, ఓ యంచు పిలచినంతనె, ఓ యంచును వచ్చె పికము, ఓగితమొప్పన్. ................ రంగవల్లికలతో, రంజిల్లు ముంగిలుల అంగజుడు తోడుగా, అవఘళించెను బాల, వేప కొమ్మలనెక్కి వెయివేల రాగాల అపరిమితగానమొనరించినదియాబాల. రాకాసుధాకరుని అనుజగా ఇటకొచ్చి, క్రీగంట వెన్నెలల క్రీడ సలిపెను మెచ్చి పసరు రెక్కల పక్కి, కొసరుచుండగ తాను మిస మిసలు చిందించె మెరపుతీగై చాన. ...................... తిలకమ్ము ధరియించి, తిరుమేని గంధమ్ము, పూవుల సొబగుతో పూవుబోడి, కస్తూరినలదుకో! కమలజు తల్లివై, కలహంస నడకల కదలి రావె ! కిలకిల రవముల చివురు దిండినివోలె, చెలియరో రావమ్మ చెన్నుగాను, లతల ఊయలలందు లత్తుక పదముల, అలకల కులుకుల అలరు బోడి ! లలిత హృదితోడ సౌభాగ్య లక్ష్మి గొలిచి, నోరు నొవ్వంగ హరినామ స్మరణజేసి, మనము రంజిల్ల నైవేద్య మందజేసి , సుఖము కాంక్షించి తనియరే సుకృతముగను !!!   - Padmini Puttaparthi  

ఉగాది ప్రేమ సఖి (కవిత)

ఉగాది ప్రేమ సఖి     ఈ ఉగాది ప్రేమసఖీ ! నా ఊహల  కంద వేమె ! కలలోనే వచ్చినావు కలలానే కరగినావు !..ఈ ఉగాది ప్రేమ సఖీ !   మధు మాసపు తేరుపైన మృదు గీతుల నాలపించి నిదురవోవు యెద పూవున మధువుగ్రోల వచ్చినావు                         మురిపెము కలవరకేన?                         విరులతేరు తరలివరావె !                         ఓ ఉగాది ప్రేమసఖీ !                         నాఊహకు రూప మీవె !   ఆరు రుచుల ఋతువుల రస ఫల భారము లెగసి పడగ కాలప్రగతి మేలి ముసుగు కళకళ లాడెడి  కాంతుల కల నర్తన మాడ వచ్చి నీ నీలను జూపి యంత నిలువక కలవర పరచే                         మురిపెము కలవరకేన ?                          విరులతేరు తరలి రావె !                          ఓ ఉగాది ప్రేమ సఖీ !                           నాఊహల కందరావె !   చిత్రమైన దీ చైత్ర ప విత్ర కిల ఋతురాగము ఎలకోయిల కూజిత స్వర విలసిత మోహార్ణవము అనురాగాంబర చుంబిత అంతరంగ విహ్వలము ప్రకృతి సహజ  ప్రేమబంధ మున నొదిగే అద్వైతము !                         ఈ ఉగాది ప్రెమసఖీ !                          నాఊహల కందరావె !                         స్నేహామృతమంద రావె ! - NCV Ranganath    

కొన్ని జీవితాలు (కవిత)

రోడ్లపై రోజంతా పచార్లు చేస్తూ నేను స్వేఛ్చాజీవినని చెప్పుకుంటూ అందని ఆకాశానికి అర్రులు చాపుతుంటాం... అరుగు మీద పడుకొని మరునాడు పొద్దులో కలిసిపోయే పండు వెన్నెలను చూస్తూ తెగ సంబరపడిపోతుంటాం... నూతిలో కప్పలా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనుకుంటుంటాం పై నుంచి పడే రాయిని గుర్తించం... చేతగానితనాన్నే కంఫర్ట్ జోన్ అనుకునే పిచ్చి నమ్మకాల్లో చితికిపోతూ ... నిండు సముద్రంలో మునిగిపోతూ ఆఖరి సెకను వరకు ఎవరైనా కాపాడకపోతారా అని ఎదురుచూస్తుంటాం... అర్థంలేని ఆశావాదం లో కొట్టుకుపోతూ.... అనవసర భావాలకు రూపాన్నిస్తూ ఆత్మవంచన చేసుకుంటుంటాం.. నేనింతే అని గొప్పగా చెప్పుకుంటుంటాం.. దానికి మెటీరియలిసమ్ అని గుర్తింపు కుడా ఇస్తాం... ఇంకెన్ని ఆశలను నమ్ముకుంటే.. ఇంకెంత ఆత్మలను అమ్ముకుంటే ... మనం అనుకుంటున్న మెటీరియలిస్టిక్ లైఫ్ కి సార్థకత వస్తుందో... ప్చ్   ..... సరిత భుాపతి