స్వార్థంలో నిస్వార్థం (విక్రమాదిత్య కథలు)

పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగివెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్నిదించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, ‘‘రాజా, భయంకరమైన ఈ శ్మశానంలో నువ్వు స్వార్థం కోసం ఇలా కష్టపడుతున్నావో, లేక నిస్వార్థ చింతనతో ఇంతగా శ్రమపడుతున్నావో నాకు తెలియదు. అయితే, లోక వ్యవహారాలను నిశితంగా పరిశీలించి చూసినట్టయితే స్వార్థం కేంద్రబిందువు గానే మానవులందరూ ప్రవర్తిస్తున్నట్టు తెలుస్తుంది. నిస్వార్థం, పరార్థం, పరులహితం ఇవన్నీ పైపై తొడుగులుగా, అమాయకులను మభ్యపెట్టడానికి నయవంచకులు వాడే మాటలుగా మాత్రమే కనిపిస్తాయి. ఇందుకు ఉదాహరణగా సజీవుడనే వైద్యుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా, విను, అంటూ ఇలా చెప్పసాగాడు.  విరూపదేశంలోని రసపురమనే చిన్న పట్టణంలో ఉండే రత్నాంగుడనే వ్యాపారికి ముగ్గురు కొడుకులు. పెద్దవాళ్ళిద్దరికీ పెళ్ళిళై వ్యాపారంలో తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నారు. చివరివాడు సజీవుడికి ఇరవై ఏళ్ళొచ్చినా వ్యాపారమంటే ఆసక్తిలేదు సరికదా, అడిగినవారికి లేదనకుండా ధనసాయం చేసే దయా గుణం ఉంది. పిన్నలూ, పెద్దలూ అందరూ అతడితో స్నేహంచేసి నాలుగు మంచి మాటలు చెప్పి డబ్బడిగి తీసుకువెళ్ళేవారు. అది ఇంట్లో ఎవరికీ నచ్చేదికాదు. కొడుకునెలా మార్చాలా అని రత్నాంగుడు దిగులు పడితే, పెళ్ళి చేస్తే మార్పురావచ్చునని భార్య చెప్పింది. విషయం తెలిసిన రత్నాంగుడి స్నేహితుడొకడు, ‘‘సజీవుడిది జాలిగుండే కాని లోకజ్ఞానం లేదు. నా కూతురు మనోరమకు జాలిగుండె, లోకజ్ఞానంతో పాటు మంచి తెలివితేటలు కూడా ఉన్నాయి. ఆమెతో పెళ్ళి జరిపిస్తే మీవాణ్ణి దారిలో పెడుతుంది," అన్నాడు. ఆ విధంగా త్వరలోనే మనోరమ సజీవుడి భార్య అయింది. తండ్రి మాటలు నిజం చేస్తూ ఆమె పెళ్ళయిన కొన్ని రోజులకే భర్తను కొంగున ముడేసుకుంది. ఒక రోజున భర్తతో, ‘‘నువ్వు మంచి మనసుతో దానాలు చేస్తున్నా, అవి పుచ్చుకున్న వారిలో ఒక్కరు కూడా సంతోషంగా లేరని ఇంట్లో అంతా అంటున్నారు. అది నిజం కాదని రుజువు చెయ్యి. లేదా నీ పద్ధతి మార్చుకుని ఇంట్లోవారిని సంతోషపరుచు,'' అన్నదామె. సజీవుడది సవాలుగా తీసుకుని, ముందుగా సంజయుడింటికి వెళ్ళాడు. అప్పుడు సంజయుడు తన ఇంటి అరుగు మీద దిగులుగా కూర్చుని ఉన్నాడు. సజీవుణ్ణి చూడగానే, ‘‘నువ్విచ్చిన డబ్బుతో చాలా కాలం తరవాత నిన్ననే మా ఇంట్లో పిండి వంటలు చేసుకున్నాం. మేమంతా బావున్నాం కాని మితిమీరి తిన్న మా నాన్నకూ, నా చిన్న కొడుక్కూ అజీర్ణం చేసింది. వైద్యుడు మందిస్తే అబ్బాయికి నయమయింది కాని, నాన్నకింకా తగ్గలేదని మూడు రోజులు కటికలంఖణాలు చేయమన్నాడు వైద్యుడు. నాన్న ఉక్రోషంతో డబ్బిచ్చిన నిన్నూ, పిండి వంటలు చేయించిన నన్నూ నోటి కొచ్చినట్టు తిడుతున్నాడు,'' అన్నాడు దీనంగా. ఇంట్లో వాళ్ళ మాట నిజమయిందని నిరుత్సాహపడినా, అందరి విషయంలోనూ అలాగే జరగదన్న నమ్మకంతో, సజీవుడు అక్కడి నుంచి సుగ్రీవుడింటికి బయలుదేరాడు. గుమ్మంలోనే ఆ ఇంటివాళ్ళ తిట్లు వినిపించాయి. జరిగిందేమిటంటే-కూతురికీవేళ పెళ్ళిచూపులని నిన్ననే సుగ్రీవుడతణ్ణి నూరు వరహాలడిగి పట్టుకెళ్ళాడు. ఈ రోజు అతడి కూతురికి ఒళ్ళెరుగని జ్వరం వచ్చింది. చూడ్డానికి వచ్చిన మగపెళ్ళివారు పిల్లరోగిష్టిదని చిరాకు పడి వెళ్ళిపోయారు. సంబంధం మంచిదనీ, సజీవుడి డబ్బు అందిన వేళ అచ్చిరాకనే అది తమకు కాకుండా పోయిందనీ ఇంట్లోవాళ్ళు తిట్టుకుంటున్నారు. వెనక్కు తిరిగిన సజీవుడు మరో నాలుగిళ్ళకు వెళితే అన్ని చోట్లా అదే పరిస్థితి. ఏకారణంవల్లనైతేనేం, తన సాయం పొందినవారెవ్వరూ సంతోషంగా లేరని గ్రహించి సజీవుడు ఇంటికి వెళ్ళి జరిగింది భార్యకు చెప్పి, ‘‘స్నేహితులను సంతోషంగా ఉంచడానికి నాది సరైన పద్ధతి కాకపోతేనేం? నావల్ల వారి అవసరాలు తీరుతున్నాయి. అంతకంటే మంచి పద్ధతి ఉంటే చెప్పమను. తప్పక అనుసరిస్తాను,'' అన్నాడు. మనోరమ వెంటనే, ‘‘అయితే నేను చెప్పినట్టు చెయ్‌. మనిషికి నిజమైన సంతోషాన్నిచ్చేది ఆరోగ్యం. ఆరోగ్యం లేనివాడికి ఎన్ని సంపదలున్నా సంతోషం వుండదు. నీ స్నేహితులకూ, తెలిసినవారికీ నిజమైన సుఖసంతోషాలివ్వాలనుకుంటే నువ్వు వైద్యం నేర్చుకో. ఉన్నవారివద్ద డబ్బు తీసుకో. లేనివారికి ఉచితంగా వైద్యం చెయ్‌,'' అన్నది. ‘‘వైద్యం నేర్చుకోవడానికి చాలా ఏళ్ళు పడుతుందికదా?'' అన్నాడు సజీవుడు. ‘‘బృహదరణ్యంలో ఆసవుడనే తపస్వి అర్హతగల శిష్యుడికి ఒక్క సంవత్సరంలో వైద్యం నేర్పగలడట. నువ్వు అక్కడికి వెళితే తొందరగా వైద్యుడివి కాగలవు,'' అన్నది మనోరమ. సజీవుడు అప్పటికప్పుడే బయలుదేరి బృహదరణ్యానికి వెళ్ళి ఆసవుణ్ణి కలుసుకున్నాడు. ఆయన అతణ్ణి శిష్యుడిగా స్వీకరించి ఏడాదిలో వైద్యశాస్త్ర పారంగతుణ్ణి చేశాడు. విద్యాభ్యాసం పూర్తయ్యాక ఆసవుడతడితో, ‘‘వైద్యశాస్ర్తంలో ప్రపంచంలో ఏ వైద్యుడికీ తెలియని చికిత్సావిధానాలు నీకు నేర్పాను. కానీ, మందులకు లొంగని జబ్బులింకా కొన్ని ఉన్నాయి. వాటిని నయం చేయగల మంత్రాలను రూపొందించి గ్రంథస్థం చేశాను. సేవాదీక్షతో నిస్వార్థంగా వైద్యం చేసేవాడికే ఆ గ్రంథాన్ని పొందే అర్హత ఉంటుంది. నీకా గ్రంథం పొందే అర్హత ఉన్నదని నా నమ్మకం. అది రుజువైనప్పుడు నీకు ఎవరో ఒకరు నా పిలుపు అందజేస్తారు. అప్పుడు వచ్చావంటే ఆ గ్రంథాన్ని ఇస్తాను,'' అన్నాడు. సజీవుడు గురువుకు పాదాభివందనం చేసి, రసపురానికి తిరిగి వచ్చి జరిగింది భార్యకు చెప్పాడు. ఆమె చెప్పిన ప్రకారం పేదలకు ఉచితంగానూ, కలిగినవారికి హెచ్చుమొత్తం తీసుకుంటూనూ వైద్యం చేయసాగాడు. ఒకసారి ఒక సాధువు సజీవుడి ఇంటి ముందు, ‘‘భిక్షాందేహి'', అనబోయి సజీవుడొక పేదరోగిని శ్రద్ధగా పరీక్షించడం గమనించి ఆగాడు. అంతలో ఆ ఇంటి ముందు ఆగిన గురప్రు బగ్గీలోంచి దిగిన ఒక భాగ్యవంతుడు సజీవుడి వద్దకు వెళ్ళి, ‘‘వైద్యోత్తమా, తమరు కోరిన ధనమిస్తాను. ముందు నన్ను పరీక్షించండి,'' అన్నాడు దర్పంగా. సజీవుడాయన్ను ఒకసారి తేరిపారజూసి, ‘‘కోరిన ధనమివ్వగలిగితే తప్పక తీసుకుంటానుగానీ, చికిత్సకు ముందు వెనకలు డబ్బుతో కాక, రోగాన్ని బట్టి నిర్ణయించాలి. నీదంత ప్రమాదకరమైన జబ్బు కాదని చూడగానే తెలిసింది. నీవంతు రాగానే నిన్ను నేనే పిలుస్తాను. అంతవరకు ఆ పక్కనే కూర్చో,'' అన్నాడు. భాగ్యవంతుడు వెళ్ళి అరుగు మీద కూర్చుంటూండగా, సజీవుడి దృష్టి ఇంటి ముందు నిలబడ్డ సాధువు మీద పడింది. అతడు సాధువుకు నమస్కరించి, ‘‘తమరీ పూట మా ఇంట భోజనం చేసి మమ్మల్ని అనుగ్రహించండి,'' అన్నాడు. సాధువు చిరునవ్వు నవ్వి, ‘‘పని ముగించుకుని లోపలకురా. ఇద్దరం కలిసి భోంచేద్దాం,'' అంటూ ఇంట్లోకి వెళ్ళాడు. సజీవుడు అక్కడున్న రోగులను పరీక్షించి, మందిచ్చి పంపి లోపలకు వెళ్ళేసరికి బాగా ఆలస్యమయింది. అతడు క్షమాపణ కోరితే సాధువు, ‘‘నీలా రోగులపట్ల శ్రద్ధ, డబ్బుకు లొంగని నిస్వార్థం, సాధుజనుల పట్ల ఔదార్యంగల వైద్యులు అరుదు. ఆసవుడి వైద్యమంత్ర గ్రంథం అందుకునే అర్హత నీకున్నది. వెంటనే బృహదరణ్యానికి వెళ్ళు,'' అన్నాడు. ఆయన్ను ఆసవుడే పంపాడని గ్రహించిన సజీవుడు భార్యకు విషయం చెప్పాడు. ఆమె, ‘‘బృహదరణ్యానికి వెళ్ళిరావడానికి పట్టే వారం రోజులూ రసపురంలో నీ మీద ఆధారపడ్డ రోగులకు ఇబ్బంది అవుతుంది. రోగులు లేని సమయంలో గురువర్యులను కలుసుకోవడం మంచిది,'' అన్నది. ఆ మాటలే సజీవుడు సాధువుకు చెప్పాడు. ఆయన సరేనని భోజనం చేసి వెళ్ళిపోయాడు. ఇలా ఉండగా ఆ దేశపు రాజు భీమసేనుడి తల్లికి భరించలేని తలనొప్పి వస్తే రాజవైద్యుడి మందులేమీ పనిచేయలేదు. రాజమాతకు నయం చేస్తే కనకాభిషేకం చేస్తానంటూ సజీవుడి కోసం దూతను పంపాడు రాజు. భార్య సలహా మీద సజీవుడా దూతతో వినయంగా, ‘‘నేను కదిలితే ఇక్కడ ఎందరో రోగులకు ఇబ్బంది. ప్రజాహితం కోరే మన రాజది హర్షించరు. చికిత్సకు రాజమాతే ఇక్కడికి రావడం మంచిది,'' అని చెప్పి పంపాడు. ఆ మరునాడు సాధువతణ్ణి కలుసుకుని అతడి ధైర్యాన్నీ, నిస్వార్థపరత్వాన్నీ మెచ్చుకుని బృహదరణ్యానికి వెళ్ళి ఆసవుడి వైద్యమంత్ర గ్రంథాన్ని తెచ్చుకోమన్నాడు. కాని సజీవుడు పూర్వంలాగే బదులిచ్చాడు. మరికొన్నాళ్ళకు రసపురంలోకెల్లా భాగ్యవంతుడైన మహేంద్రుడికి పెద్ద జబ్బు చేసింది. సజీవుడికా రోగలక్షణాలు అంతుబట్టక తికమక పడుతున్న సమయంలో సాధువు మనోరమను కలుసుకుని, ‘‘మహేంద్రుడి జబ్బుకు మంత్రాలే పనిచేస్తాయి. ఇకనైనా నీ భర్తను బృహదరణ్యానికి పంపు,'' అన్నాడు. మనోరమ సరేనని భర్తను వెంటనే బృహదరణ్యానికి వెళ్ళి రమ్మన్నది. కాని సజీవుడు అందుకు అంగీకరించలేదు. అప్పుడు మనోరమ సాధువు సలహాపై, తనకూ ఏదో వింత జబ్బు వచ్చినట్టు నటించింది. తనే మందిచ్చినా భార్యకు పనిచేయడం లేదన్న దిగులుతో సజీవుడు తన వద్దకు వచ్చే రోగులకు రోగనిదానం సరిగ్గా చేయలేక పోతుంటే సాధువతణ్ణి కలుసుకుని, ‘‘ఇకనైనా వెళ్ళి ఆసవుడి వైద్యమంత్రగ్రంథం తెచ్చుకో. లేకుంటే నీ భార్య నీకు దక్కదు,'' అని హెచ్చరించాడు. మనోరమ కూడా వెళ్ళిరమ్మని కోరడంతో సజీవుడు బృహదరణ్యానికి వెళ్ళి ఆసవుడి వైద్య మంత్ర గ్రంథాన్ని స్వీకరించి తిరిగి వచ్చాడు. మహేంద్రుడితో పాటు ఎందరికో వైద్యసేవలు అందించి కృతార్థుడయ్యాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, ‘‘రాజా, సాధువు ఎంత చెప్పినా వెళ్ళడానికి నిరాకరించిన సజీవుడు భార్యకు జబ్బు చేయగానే ఆసవుడి వద్దకు వెళ్ళడం స్వార్థం కాదా? తమ వద్ద వైద్యమంత్రగ్రంథం వుంటే మహేంద్రుడు వంటి భాగ్యవంతులకు వైద్యం చేసి ధనం ఆర్జించవచ్చన్న ఆశతో వింత జబ్బు వచ్చినట్టు నటించి భర్తను బృహదరణ్యానికి వెళ్ళిరమ్మని భర్తను ప్రోత్సహించడం మనోరమ స్వార్థంకాక మరేమిటి? ఇలారెండు రకాల స్వార్థంతో వచ్చిన సజీవుడికి ఆసవుడు నిస్వార్థ పరులకు మాత్రమే ఇస్తానన్న వైద్యమంత్ర గ్రంథాన్ని ఇవ్వడం నియమభంగం కాదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది,'' అన్నాడు. దానికి విక్రమార్కుడు, ‘‘అగ్నిసాక్షిగా పెళ్ళాడిన భార్యను కాపాడవలసిన బాధ్యత భర్తగా సజీవుడికి ఉన్నది. ఆమె వైద్యంకోసం అతడు బృహదరణ్యానికి వెళ్ళడం స్వార్థం అనిపించుకోదు. సజీవుడు పేదసాదలకు వైద్యసేవలు అందించడానికి కారణం మనోరమ. అలాంటి ఆదర్శపత్నికి ధనాశ అనే స్వార్థం అంటగట్టడం సమంజసం కాదు. ఆమె అనారోగ్యం పాలయిందని తెలియగానే, ఇతర రోగులకు సరైన వైద్యం చేయలేక సజీవుడు అవస్థపడ్డాడు. అలాంటిది భార్య జబ్బుముదిరి మంచం పడితే, తట్టుకోలేక వైద్యవృత్తినే మానేసే అపాయం లేకపోలేదు. భార్యకోసమని తెచ్చిన వైద్యగ్రంథం మరెందరికో మెరుగైన వైద్యసేవలు అందించడానికి ఉపయోగపడింది. అందువల్ల సజీవుడు బృహదరణ్యానికి వెళ్ళడం నిస్వార్థమే తప్ప, స్వార్థం అనిపించుకోదు. అతనికి వైద్యగ్రంథం ఇచ్చి ఆసవుడు నియమభంగం చేశాడనడానికి ఏమాత్రం తావు లేదు,'' అన్నాడు. రాజుకు ఈవిధంగా మౌనభంగం కలగగానే, బేతాళుడు శవంతో సహా మాయమై, తిరిగి చెట్టెక్కాడు.

రాజుగారి బావమరిది (చందమామ కథ)

ఒకానొకప్పుడు మహాసేనుడనే రాజు భారతదేశం అంతా జయించి చక్రవర్తి అయ్యాడు. మహాసేనుడికి ఓడిన రాజులందరూ అతనికి సామంతులై, అతని నిర్ణయాలను బట్టి పరిపాలించసాగారు. సామ్రాజ్యం స్థాపించటానికి ఎన్నో యుద్ధాలు చేసినప్పటికీ మహాసేనుడు ప్రజాకంటకుడు కాడు. పైగా, ప్రజాక్షేమం గురించి ఆయన చాలా శ్రద్ధగా ఆలోచించేవాడు. అందుకొరకు అనేక ప్రణాళికలు వేసి, సామ్రాజ్య మంతటా అమలు జరిపించేవాడు. అందుచేత మహాసేనుడి సామ్రాజ్యంలో అన్ని దేశాలూ సుభిక్షంగా ఉండేవి. ఒక్క కోసలదేశం మటుకు ఈ విషయంలో వేరుగా ఉంటూ వచ్చింది. తన ప్రణాళికలు అన్ని ప్రాంతాలామంచి ఫలితాలను ఇస్తున్నప్పుడు ఒక్క కోసలలో అవి ఎందుకు నిరుపయోగం అవుతున్నాయో మహాసేనుడికి అంతుబట్ట లేదు. ఈ విషయమై ఎంత సమాచారం సేకరించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. చక్రవర్తికి రాజపురోహితుడుండేవాడు. ఆయనకు దగ్గిర బంధువు గుణనిధి అనే అమాయకుడు ఒకడు ఉండేవాడు. గుణనిధి సంభాషణ అందరికీ నవ్వు పుట్టించేదిగా ఉండేది. మహాసేన చక్రవర్తి కూడా తన మనసుకు విశ్రాంతి కావలసినప్పుడు గుణనిధిని పిలిపించి, అతన్ని వాగించి, అతని అమాయిక సంభాషణ విని ఆనందించేవాడు. గుణనిధికి దైవభక్తి హెచ్చు. భారత దేశంలో ఉండే అందరు దేవుళ్ళ దర్శనమూ చేసుకుని, పుణ్యం సంపాదించాలని అతని ఆశ. కోసల దేశంలో ఊరికొక దేవత ఉన్నదనీ, గుడి లేని గ్రామం లేదనీ, చివరకు కీకారణ్య ప్రాంతాలలో కూడా అతి ప్రాచీన పవిత్ర దేవాలయాలు ఉన్నాయనీ విని గుణనిధి ఆ దేశంలో యాత్రలు చేయాలని బయలు దేరాడు. గుణనిధి ప్రయాణం సుఖంగానూ, శీఘ్రంగానూ సాగగలందులకు రాజపురోహితుడు అతనికి ఒక రథాన్నీ, సారథినీ ఏర్పాటు చేశాడు. కోసల సరిహద్దులో ప్రవేశిస్తూనే గుణనిధి రామపురి అనే గ్రామం చేరాడు. అక్కడ ఈశ్వరుడు నటరాజు రూపంలో వెలిశాడుట. ప్రజలు నటరాజుకు ఒక అందమైన దేవాలయం నిర్మించారు. గుణనిధి ఆ ఆలయాన్ని చూడగానే పులకించి, మందిరం లోపల దేవుని మూర్తిని చూసి పరవశించిపోయి, ‘‘హరహర మహాదేవా!'' అంటూ గట్టిగా అరిచాడు. మరుక్షణమే ఇద్దరు భటులు ఎక్కడి నుంచో ఊడిపడి, ఆయనను పట్టుకున్నారు. గుణనిధి ఆశ్చర్యపోయి, ‘‘ఇదేమిటి?'' అని అడిగాడు. ‘‘గర్భగుడిలో శబ్దం చెయ్యటం నేరం. గ్రామాధికారి దగ్గిరికి వెళదాం పద,'' అన్నారు భటులు. తనకు ఆ సంగతి తెలియదనీ, మొదటి తప్పుగా ఎంచి వదలి పెట్టమనీ గుణనిధి ఎంతో వేడుకున్నాడు. కాని భటులు అతడి మాటలేవీ వినిపించుకోక, గ్రామాధికారి వద్దకు రమ్మని తొందర పెట్టారు. విధిలేక, గుణనిధి వాళ్ళ వెంట పోవటానికి సిద్ధపడ్డాడు. దేవాలయంలోనే ఉండి ఇదంతా చూస్తున్న ఒక యువకుడు నెమ్మదిగా గుణనిధిని సమీపించి, ‘‘ఎందుకయ్యా, వీళ్ళతో గొడవ? ఇద్దరికీ చెరొక రూకా పారేస్తే, నీకే బాధా ఉండదు,'' అని రహస్యంగా చెవిలో చెప్పి పక్కకు తప్పుకున్నాడు. వెంటనే గుణనిధి ఆ భటులకు చెరి ఒక వెండి రూకా ఇచ్చుకున్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. తరవాత గుణనిధి ఆ యువకుడికి తన కృతజ్ఞత చెప్పుకుని, ‘‘గర్భగుడిలో దేవుడి పేరు ఉచ్చరించటం నేరమెలా అయిందీ?'' అని అడిగాడు. ఆ యువకుడు నవ్వి, ‘‘ఈ దేశంలో ఇది తప్పూ, ఇది ఒవ్పూ అని నియమం ఏమీ లేదు. ఎప్పుడు ఏది నేరం అవుతుందో, ఈ ఊరి వాళ్ళం మాకే తెలియదు. మాకు తెలిసినది ఏమిటంటే, రాజభటులు మా మీద నేరం ఆరోపించి పట్టుకున్నప్పుడు వాళ్ళకు లంచం ఇచ్చి వదిలించుకోవటం. గ్రామాధికారి దాకా పోతే, అతడికి ఇంకా పెద్ద లంచం ఇచ్చుకోవలిసి వస్తుంది,'' అన్నాడు. గుణనిధి తెల్లబోయి, ‘‘గ్రామాధికారి కూడా లంచం పుచ్చుకుంటాడా? అలాటప్పుడు మీ రాజుగారికి ఫిర్యాదు చేసుకోవచ్చునే?'' అన్నాడు. ‘‘ఏమి ఫిర్యాదు చేస్తాం? ఆయన రాజుగారి బావమరిది!'' అన్నాడు ఆ యువకుడు. గుణనిధి తాను రాజపురోహితుడి బంధువునని చెప్పిన మీదట ఆ యువకుడు, ‘‘మీరు ఈ సంగతి గ్రామాధికారికి చెప్పుకుంటే, ఇక మీదట మీకు ఏ ఇబ్బందీ ఉండదు,'' అని చెప్పాడు. గుణనిధి అలాగే చేశాడు. అతనికి ఆగ్రామంలో మరి ఎలాటి ఇబ్బందీ కలగలేదు. అంతా సుఖంగా జరిగిపోయింది. మిగతా గ్రామాలలో కూడా అతను అలాగే చేసి తన తీర్థయాత్రలు నిర్విఘ్నంగా కొనసాగించుకున్నాడు. అయితే తాను చూసిన ప్రతి గ్రామంలోనూ, రామపురిలో లాగే, రాజభటులు ప్రజలను అయిన దానికీ, కాని దానికీ భయపెట్టుతూ ఉండటమూ, లంచాలు పుచ్చుకుంటూ ఉండటమూ, అందులో కొంత భాగం తమ పైఅధికారులకు వాటా పెట్టుతూ ఉండటమూ కనబడింది. ఆ అధికారుల మీద ఫిర్యాదు చెయ్యటమంటే ప్రజలకు భయం. ఎందుకంటే, వాళ్ళు అందరూ రాజుగారి బావమరదులే! ప్రతి ఊళ్ళోనూ జనం, ‘‘మా గ్రామాధికారి రాజుగారి బావమరిది అయిపోయాడు! మేమేం చెయ్యగలం?'' అనటం గుణనిధి విన్నాడు. గుణనిధి తీర్థయాత్రలు ముగించుకుని వచ్చినట్టు తెలిసి, మహాసేనుడు అతన్ని పిలిపించి, యాత్రా విశేషాలు అడిగాడు. గుణనిధి చూసిన విశేషాలన్నీ చెప్పి, ‘‘రసికత్వంలో ఆ కృష్ణుడి తరవాత ఈ కోసలరాజునే చెప్పుకోవాలి. ఆయనకు ఎంతమంది బావమరుదులు ఉన్నారో చెప్పలేం!'' అన్నాడు. మహాసేనుడు నవ్వు ఆపుకుంటూ, ‘‘లెక్క పెట్టలేక పోయారా?'' అన్నాడు. ‘‘ఎలా లెక్కపెట్టేది, ప్రభూ? ప్రతి గ్రామాధికారీ రాజుగారి బావమరిదే. రాజ్యానికి సంబంధించిన వ్యవహారాలు చూసేవారంతా రాజుగారి బావమరుదులే,'' అన్నాడు గుణనిధి. ఈసారి మహాసేనుడికి నవ్వు రాలేదు. ఆయన గుణనిధిని ప్రశ్నించి, అతను తనకు చెప్పిన మాట కోసల ప్రజల నోట విన్నదేనని స్పష్టం చేసుకున్నాడు. ఆయనకు ఇందులో ఏదో రహస్యం ఉంటుందని తోచింది. మహాసేనుడికి తెలిసినంత వరకు కోసలరాజుకు ఇద్దరే భార్యలు. వారిలో ఒకతె మహాసేనుడి సొంత చెల్లెలు. మరి, కోసలరాజు వ్యవహారాలన్నీ అతని బావమరుదులు ఎలా నిర్వహిస్తున్నారు? కోసలరాజు రెండో భార్యకు ఇన్ని వేలమంది సోదరులుండటం అసంభవం. గుణనిధిని పంపేసి, మహాసేనుడు ఆలోచనలో పడ్డాడు. తాను తయూరు చేసిన ప్రణాళికలు చాలా యోగ్యమయినవి అని సంతోషించాడేగాని, వాటిని అమలు జరిపే యోగ్యులను గురించి తాను ఆలోచించలేదు. తన ప్రణాళికలు ఒక్క కోసలలో మాత్రమే సత్ఫలితాలు ఇవ్వకపోవటానికి అధికారులలో ఏదో లోపం ఉండటమే కావచ్చునని ఇప్పుడాయనకు తోచింది. వెంటనే నమ్మకస్థులైన ఇద్దరు చారులను ఆయన కోసలదేశానికి పంపాడు. వాళ్ళు చక్రవర్తికి కావలసిన సమాచారం సేకరించారు. గుణనిధి చెప్పినట్టుగానే, కోసలరాజ్యంలో ప్రజాపీడన విచ్చలవిడిగా సాగుతున్నది. అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అందుకు కారణం అధికారుల నియామకం అర్హతలను బట్టి జరగకపోవటం. ఉదాహరణకు, కోసలరాజ్యంలో సైన్యాధిపతిగా ఉన్న శూరసింహుడు అనేవాడు ఎన్నడూ కత్తిపట్టి ఎరగడు. అతని పరాక్రమమంతా అతని పేరులో మాత్రమే ఉన్నది. అతను రాజుగారి బావమరిది! అందుకే కోసల దేశంలో అర్హతలేకుండా, ఇతర కారణాల వల్ల అధికారి అయిన ప్రతి ఒక్కడికీ ‘రాజుగారి బావమరిది' అన్న మాట వాడుకలోకి వచ్చింది. ఇదంతా విన్న మహాసేనుడికి కనువిప్పు కలిగింది. కోసలరాజు తనకు బావమరిది కావటం చేతనే కదా ఇంతకాలమూ కోసలదేశంలో తన ప్రణాళికలు విఫలం కావటానికి సరి అయిన కారణం విచారించక, కోసలరాజు చెప్పిన సాకులు నమ్మి ఊరుకున్నాడు? ఇలాంటి గుడ్డి నమ్మకం ప్రజలకు ఎంత హాని చేస్తున్నదో ఇప్పుడు స్పష్టమయింది. మహాసేనుడు తగిన చర్యలు తీసుకుని, కోసలలో అనర్హులైన అధికారులనందరినీ పదవుల నుంచి తొలిగించేశాడు. కొద్ది సంవత్సరాల్లో కోసలదేశం సుభిక్షమయింది. తరవాత ఆయన ఆ దేశంలో సంచారం చేసినప్పుడు గ్రామాలలో ప్రజలు, ‘‘మా గ్రామాధికారి రాజుగారి బావమరిది కాడు లెండి! అందుకే అందరమూ చల్లగా ఉన్నాం,'' అన్నారు.

ప్రాణాధారం నీరు

గడపలో వాలు కుర్చీలో కూర్చొని దినపత్రిక చదువుతున్న సీతారాం గారి  ఇంటి ముందు  మంచినీళ్ల బాటిల్స్  వ్యాన్ ఆగింది. ఒక కుర్రాడు వచ్చి ఇరవై లీటర్లున్న బాటిల్ అరుగు మీద పెట్టి వెళ్లిపోయాడు.  సరిగ్గా  అప్పుడే ఇంటర్ ట్యూషన్ నుంచి తిరిగొచ్చి దొడ్లో అడుగుపెట్టిన  కొడుకు కనబడ్డాడు సీతారాంకి.   నీళ్ల బాటిల్‌ను లోపల పెట్టమని  కొడుక్కి చెప్పాడాయన.  ‘అలాగే’ అనేసి నీళ్ల బాటిల్ ని సమతలంగా ఉన్న గచ్చు మీద ఉంచి , రెండు కాళ్ల మధ్య బాటిల్ ను  ఉంచి దొర్లించుకుంటూ తీసుకెళ్ళసాగాడు కొడుకు.  తలెత్తి  చూసిన సీతారాంకి  కొడుకు  కాళ్ల మధ్య బాటిల్ దొర్లించడం కనబడింది.  చదువుతున్న పేపర్ పక్కన పడేసి కొడుకు దగ్గరకెళ్లి ఆగమని  చెప్పాడు సీతారాం. ఆ  వాటర్ బాటిల్ ని రెండు చేతులతో పైకెత్తి మోసుకుని వంటగదిలో చేర్చాడు ఆయన.  “నేను తీసుకెళుతున్నాను కదా. మళ్ళీ మీరొచ్చారేం” అనడిగాడు  కొడుకు.   “ప్రాణులకు జీవాధారం నీళ్లు. అవి లేనిదే మనం బ్రతకలేం. పంచభూతాల్లో నీరు కూడా ఒక్కటని తెలియదా? అలాంటి మంచి నీళ్ళని గౌరవించాలి. కాళ్ళ మధ్య దొర్లిస్తూ అవమానించకూడదు. అందుకే రెండు చేతుల మధ్య పెట్టుకుని మోసాను” అని చెప్పాడు సీతారాం.  “అలాగా! అయితే వర్షం పడుతున్నప్పుడు నీటిలో నడుస్తాం. కాళ్లతో తొక్కుతాం. అది తప్పు కాదా? “అనడిగాడు కొడుకు.   “మనం తినే  ఆహారాన్ని, త్రాగే నీటిని పూజ్య భావంతో చూడాలి. నువ్వు చదివే పుస్తకాలను కూడా పూజ్య భావంతోనే  చూడాలి. కాలితో తన్నకూడదు.  అందుకే నీ తప్పు నీకు తెలిసేలా చెప్పాను. ఇక వర్షం సంగతంటావా? వర్షపు నీటిలో కాళ్ళు వేసి నడవడం మనం కావాలని చేయడం లేదు. అక్కడ మరొక ప్రత్యామ్నాయం లేదు. మనం నీటిలో పడుకుని ఈదుతూ వెళ్లేంత  నీరు ఉండదు కాబట్టి  నడిచి వెళ్ళడం తప్ప మరేం చేయలేము. ఇకముందు నీళ్ల బాటిల్ నేను తీసుకెళ్ళినట్టే మోసుకుని మాత్రమే వెళ్ళాలి. ఆ అలవాటు చేసుకోవడం మంచిది” చెప్పాడు సీతారం.  ‘అలాగే నాన్నా’ అని బుద్ధిగా తలూపాడు కొడుకు.   

దివ్యస్త్రోత్రం

ఒకానొకప్పుడు సౌరాష్ట్రంలో ఒక క్షత్రియుడు ఉండేవాడు. బతికినంత కాలం ప్రజలను పీడించుకు తిన్నాడు. నిస్సహాయులైన ప్రజలు అతడిని నేరుగా ఏమీ అనలేక లోలోపలే అతడిని తిట్టుకునేవారు. అతడి ప్రస్తావన వస్తేనే చాలు, చీత్కరించుకునేవారు. జన్మలో ఎలాంటి పుణ్యకార్యం చేయని ఆ క్షత్రియుడు కాలం తీరి మరణించాడు. పూర్వజన్మ పాపకర్మల ఫలితంగా బ్రహ్మరాక్షసుడిగా జన్మించాడు.  నర్మదానది పరిసరాల్లోని అడవుల్లో దొరికిన జీవిని దొరికినట్లే తింటూ తిరుగుతుండేవాడు. పొరపాటున ఆ అడవిలోకి మనుషులు ఎవరైనా అడుగుపెడితే వారిని కూడా తినేస్తూ నరమాంస భక్షకుడిగా మారాడు. బ్రహ్మరాక్షసుడి ధాటికి భయపడి మనుషులు ఆ అడవిలోకి అడుగుపెట్టడమే మానుకున్నారు.  ఒకనాడు ఆ రాక్షసుడు నర్మదా తీరంలో తపస్సు చేసుకుంటున్న మునీశ్వరుడి ఆశ్రమానికి వచ్చాడు. నరమాంసం తిని చాలారోజులు కావడంతో ఆ బ్రహ్మరాక్షసుడు మునీశ్వరుడిని ఎలాగైనా తినేయాలని అనుకున్నాడు. అయితే, మంత్ర యోగ విద్యల్లో ఆరితేరిన ఆ మునీశ్వరుడు సామాన్యుడు కాదు. బ్రహ్మరాక్షసుడి ప్రయత్నాన్ని గ్రహించి, మహా మహిమాన్వితమైన విష్ణుపంజర స్తోత్రాన్ని పఠించడం ప్రారంభించాడు.  స్తోత్ర ప్రభావంతో బ్రహ్మరాక్షసుడు మునీశ్వరుడిని సమీపించ లేకపోయాడు. అయినా, ఆశ చావని బ్రహ్మరాక్షసుడు అదను చూసుకుని మునీశ్వరుడిని తినేయాలనుకుని, ఆశ్రమం బయటే కాచుకుని ఉన్నాడు. అలా నాలుగు నెలలు గడచిపోయాయి. అన్నాళ్లు వేచి చూడటంతో బ్రహ్మరాక్షసుడి శక్తి క్షీణించింది. శరీరం నీరసించింది. అడుగు వేసే ఓపిక లేక అతడు అక్కడే కూలబడిపోయాడు.  ధ్యానం నుంచి లేచిన మునీశ్వరుడు ఆశ్రమం వెలుపల కూలబడిన రాక్షసుడిని చూశాడు. అతడిపై జాలిపడ్డాడు. నీరసించిన రాక్షసుడు నెమ్మదిగా పైకిలేచి, ఓపిక తెచ్చుకుని ‘మహాత్మా! నేను ఎన్నో పాపాలు చేశాను. అడవిలో తిరుగాడే జంతువులనే కాదు, అడవిలోకి అడుగుపెట్టిన ఎందరో మనుషులను కూడా చంపి తిన్నాను. నా పాపాలు తొలగిపోయే మార్గం చెప్పండి’ అని దీనంగా ప్రార్థించాడు.  ‘ఓయీ రాక్షసా! నేను నరమాంసభక్షకులకు ఉపదేశం చేయను. పాపోపశమన మార్గం ఎవరైనా విప్రులను అడిగి తెలుసుకో! ముందుగా నువ్వు నరమాంసభక్షణ మానేయి’ అని చెప్పి మునీశ్వరుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బ్రహ్మరాక్షసుడు ఆనాటి నుంచి మనుషులను చంపి తినడం మానేశాడు. కేవలం వన్యమృగాలను మాత్రమే వేటాడి, వాటిని చంపి తింటూ, తన పాపాలు ఎలా తొలగిపోతాయా అని చింతిస్తూ ఉండసాగాడు. కొద్దిరోజులు రాక్షసుడికి అడవిలో ఆహారం దొరకలేదు. ఆకలితో ఉన్న బ్రహ్మరాక్షసుడు ఆహారాన్వేషణ కోసం అడవికి వచ్చాడు. ఎంతసేపు ప్రయత్నించినా ఒక్క జంతువైనా దొరకలేదు. మధ్యాహ్నం కావస్తుండగా రాక్షసుడికి ఆకలి బాగా పెరిగింది. సరిగ్గా అదే సమయానికి ఒక బ్రాహ్మణ యువకుడు పండ్లు కోసుకోవడానికి అడవిలోకి వచ్చాడు.  ఆకలి తీవ్రత పెరగడంతో బ్రహ్మరాక్షసుడు తన పూర్వ నియమాన్ని పక్కనపెట్టి, బ్రాహ్మణ యువకుడిని భక్షించి ఆకలి తీర్చుకోవాలని భావించాడు. ఒక్క ఉదుటన అతడి వద్దకు చేరుకుని, అతడిని ఒడిసి పట్టుకున్నాడు. ఈ హఠాత్పరిణామానికి బ్రాహ్మణ యువకుడు భయభ్రాంతుడయ్యాడు.        రాక్షసుడి చేతిలో ఎలాగూ చావు తప్పదనే నిశ్చయానికి వచ్చిన బ్రాహ్మణ యువకుడు ‘ఓయీ రాక్షసా! నన్ను ఎందుకు పట్టుకున్నావో చెప్పు. నువ్వు నన్ను వదలాలంటే నేనేం చేయాలో చెప్పు’ అని అడిగాడు. ‘ఓరీ మానవా! నేను నరమాంస భక్షకుడిని. వారం రోజులుగా నాకు ఆహారం దొరకలేదు. చివరకు నువ్వు దొరికావు. నిన్ను విడిచిపెడితే నాకు ఆకలి ఎలా తీరుతుంది?’ అన్నాడు.       ‘రాక్షసా! నేను మా గురువుగారికి ఆహారంగా ఫలాలు తీసుకుపోవడానికి వచ్చాను. నీకు ఆహారమవడానికి నాకు అభ్యంతరమేమీ లేదు. కొద్దిసేపు గడువిస్తే నేను ఈ ఫలాలను నా గురువుగారికి ఇచ్చి వస్తాను’ అన్నాడు బ్రాహ్మణ యువకుడు. ‘దొరక్క దొరక్క దొరికావు. నిన్ను విడిచిపెట్టాక నువ్వు తిరిగి రాకపోతే నా గతేమిటి? అయితే, ఒక పని చేశావంటే నిన్ను విడిచిపెడతాను. నేను ఇంతవరకు చాలా పాపాలు చేశాను. జాలి దయ లేకుండా ఎందరో మనుషులను చంపి తినేశాను. నా పాపాల నుంచి విముక్తి పొందే మార్గం చెప్పావంటే నిన్ను తినకుండా వదిలేస్తాను’ అన్నాడు. బ్రాహ్మణ యువకుడికి ఏమీ తోచలేదు. చివరకు తాను నిత్యం పూజించే అగ్నిదేవుడిని స్మరించుకున్నాడు. అతడి ప్రార్థనకు అగ్నిదేవుడు స్పందించాడు. అతడికి సాయం చేయమని సరస్వతీదేవిని కోరాడు. అగ్ని కోరిక మేరకు సరస్వతీదేవి బ్రాహ్మణ యువకుడికి మాత్రమే కనిపించి, ‘నాయనా భయపడకు. నీ నాలుక మీద నిలిచి ఒక దివ్యస్తోత్రాన్ని పలికిస్తాను. అది విన్న రాక్షసుడు నిన్ను విడిచిపెడతాడు’ అని చెప్పింది.  సరస్వతీదేవి మాటతో ధైర్యం తెచ్చుకున్న బ్రాహ్మణ యువకుడు ‘ఓయీ రాక్షసా! నేనిప్పుడు ఒక దివ్యస్తోత్రం వినిపిస్తాను. ఈ స్తోత్రాన్ని త్రికాలాల్లోనూ పఠించావంటే, నీ సమస్త పాపాలూ నశించి, తుష్టి, పుష్టి, శాంతి కలుగుతాయి’ అని చెప్పి తన నోట నిలిచిన సరస్వతీదేవి అనుగ్రహంతో విష్ణుసారస్వత స్తోత్రాన్ని ఆశువుగా పఠించాడు.  బ్రాహ్మణ యువకుడు దివ్యస్తోత్రాన్ని బోధించగానే బ్రహ్మరాక్షసుడు ఎంతో సంతోషించి, అతడిని తినకుండా వదిలేశాడు. బ్రాహ్మణ యువకుడు రాక్షసుడికి నీతులు బోధించి తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు.

తిరిగొచ్చిన సాయం

శృంగవరం  ప్రక్కనే ఉన్న దట్టమైన అడవుల్లో  ఆశ్రమం నిర్మించుకుని  తపస్సు చేసేవాడు  ముని శతానందుడు.  ఆ ఆశ్రమం చుట్టూ ఎన్నో పూల మొక్కలు, పండ్ల చెట్లు, పొదలు   పెరిగాయి.  అడవిలో కంటే ముని ఆశ్రమం చుట్టూ బాగుండడంతో ఆ ప్రశాంత  వాతావరణానికి అలవాటు పడ్డాయి జంతువులు. అక్కడకు   వచ్చి విశ్రాంతి తీసుకునేవి. అదేమి వింతో కాని అక్కడకు వచ్చే జంతువులకు మరొక జంతువుని చంపాలనే కోరిక ఉండేది కాదు. అక్కడ వాటికి  ప్రాణభయం లేకపోవడంతో  ఎక్కువ   సమయం  గడిపేవి.   ముని కూడా వాటిపట్ల దయతో ప్రవర్తించేవాడు. ఏ జంతువుకైనా గాయమయితే  ఆకులు తెచ్చి  పసరు  పూసి  వైద్యం చేసేవాడు.  వాటికి  స్వస్థత కలిగే వరకూ కనిపెట్టేవాడు. అలా   మునితో స్నేహం కుదిరింది జంతువులకు. ముని తపస్సులో ఉన్నప్పుడు  దూరం నుండే  చూసేవి తప్ప తపోభంగం కలిగించేవి కాదు జంతువులు.  వాటిని చూసి పక్షులు కూడ వచ్చి చెట్ల మీద కొలువుండేవి.    ముని తపస్సులో మునిగి ఒక్కోసారి ఆహారం సంగతి మర్చిపోయేవాడు. అలాంటప్పుడు   తియ్యటి పండ్లను  తెచ్చేవి చిలుకలు. దుంపలను తెచ్చేవి కుందేళ్లు.  తేనె పట్టులను  తెచ్చేవి ఎలుగుబంట్లు.  ఒక ఉదయం శతానందుడు  నదికి వెళ్లి స్నానం చేసేసి,  కందమూలాలతో ఆశ్రమానికి వచ్చాడు. అక్కడ కనబడిన  దృశ్యం  చూసి అడుగు ముందుకు వేయలేక  తన్మయత్వంతో  నిలుచుండి పోయాడు.       ఒక సింహం యొక్క జూలుని  తొండంతో నిమురుతోంది ఏనుగు. ఆ   సింహం మైమరచిపోయి పడుకుంది.  ఒక పెద్దపులి పంజాతో లేడిపిల్లను  పట్టుకుని  ముద్దు పెడుతుంటే అది భయం లేకుండా ఆడుకుంటోంది. ఒక కొండ గొర్రిని  కౌగిలిలోకి తీసుకుని తోడేలు  బుజ్జగిస్తుంటే తల్లి కౌగిలిలో ఉన్నట్టు పరవశిస్తోంది కొండగొర్రె.  గుర్రం మీద కూర్చుని  స్వారీ చేస్తోంది కొండముచ్చు .  బాలింతరాలైన   ప్రియురాలికి పచ్చగడ్డి పసరుని పుక్కిటతో పట్టి నోటికి అందిస్తోంది మగ లేడి . కళ్ళైనా తెరవకుండా తాగుతోంది ఆడలేడి.  కాలిగాయమై కదలలేకుండా ఉన్న ఎలుగుబంటికి చెరుకుగడలు తినిపిస్తోంది  కోతి.  ఆ దృశ్యాలను తనివితీరా చూసిన శతానందుడు  “మీరిలా కలసిపోయి ఆడుకుంటుంటే చూడటానికి ఎంతో ఆనందంగా ఉంది”  అన్నాడు.   జంతువులు సంతోషంగా తలలను ఆడించాయి .   కొన్నాళ్లు గడిచాక  ఒక వర్షాకాలం ఉదయం  నదికి  వెళ్లాడు ముని. స్నానం చేసి  తిరిగి వస్తుండగా  జారుగా ఉన్న చోట  పాదం వేయడంతో జారిపోయి  క్రింద ఉన్న   పెద్ద  గోతిలో పడ్డాడు.  ఆయన   కాళ్ళు  విరిగాయి.   నిలబడలేక   బాధతో అరిచాడు.   స్నానానికి వెళ్లిన ముని ఎంతకీ ఆశ్రమానికి తిరిగి రాకపోవడం గమనించింది ఓ చిలుక. వెంటనే ఎగురుకుంటూ నదివైపు వెళ్లింది. మధ్య దారిలో ఒక గోతిలో పడిపోయి, బాధతో మూలుగుతున్న మునిని చూసింది. అది ముని ఎదురుగా వాలి ఏమి జరిగిందో తెలుసుకుంది. మిగతా జంతువులను పిలిచి మునిని బయటకు రప్పిస్తానని ధైర్యం చెప్పి ఆశ్రమం వైపు వెళ్లింది చిలుక. అప్పటికి   ఆశ్రమం దగ్గర ఉన్న ఏనుగు, ఎలుగుబంటి, గుర్రం, మేక,  కోతి    ఉన్నాయి. చిలుక చెప్పిన విషయం వినగానే మునిని రక్షించాలని  ఆయన పడిపోయిన  గోతి దగ్గరకు పరుగు తీసాయి.  మునిని పరామర్శించి   బయటకి తీసుకువెళతామని, ధైర్యంగా ఉండమని చెప్పాయి.  ముని ఉన్న గోతిలోకి  దారి తయారు చేసింది ఏనుగు.  ముని చుట్టూ  తొండం వేసి నెమ్మదిగా లేపి తమతో వచ్చిన    గుర్రం మీద కూర్చోబెట్టింది.  ఆయన  జారి పడకుండా మిగతా జంతువులు చుట్టూ నడుస్తుండగా ఆశ్రమానికి చేర్చాయి.   “వైద్యం అవసరం కదా .  ఏమి చేద్దాము” అని గుర్రం మిగతా వాటిని అడిగింది.  “ఆయన  మనలో చాలామందికి  వైద్యం  చేసినప్పుడు  చూసాను. ఎలాంటి దెబ్బకు ఏ ఆకులు, మూలికలు వాడాలో నాకు  తెలుసు” అంది  ఎలుగుబంటి నమ్మకంగా.  దానికి సహాయ పడతానని  ముందుకు వచ్చింది కోతి. ఆ రెండూ కలసి  మూలికలు, ఆకులు సేకరించాయి.   ముని కాళ్ళకి పసరుతో వైద్యం చేసింది ఎలుగుబంటి.    మునికి అవసరమైన ఆహారాన్ని జంతువులు, పక్షులే సమయానికి అందించాయి .  అవన్నీ కలసి  ఆయనకు  పూర్తిగా నయమయ్యే వరకు సేవలు చేశాయి. కొన్నాళ్లకు  ముని లేచి నిలబడగలిగాడు, మరి కొంతకాలం తరువాత  నడవగలిగాడు.  అప్పుడు శతానందుడు పక్షులు, జంతువులతో  “నా బంధువులైనా మీరు చేసినట్టు  సేవలు, సంరక్షణ చేయలేరేమో.   నేను కోలుకోడానికి మీరందరూ   సాయపడ్డారు. ప్రేమ చూపారు. మీ మేలు మరువలేను” అన్నాడు.  అది విన్న ఏనుగు ముందుకు వచ్చి  “ ఆశ్రమం దగ్గరకు మేము రాగానే  మీ  ప్రభావం వల్ల జాతి భేదం  మరచిపోయి ప్రాణభయం లేకుండా   బ్రతుకుతున్నాము.    గతంలో  వైద్యం చేసి   మాలో చాల జంతువులను బ్రతికించారు మీరు. అలాంటి మీకు కష్టం వస్తే  సాయపడకుండా  ఉండగలమా?  మీకు సాయపడినందుకు  సంతోషంగా ఉంది” అంది.   ‘అవును’ అన్నాయి  మిగతా జంతువులు. ముని తృప్తిగా నవ్వి “మనుషుల్లా మంచిగా ఒకరికొకరు సాయపడుతూ జీవించమని ఒకప్పుడు మీకు చెప్పేవాడిని. ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు ” అన్నాడు.  -నారంశెట్టి ఉమామహేశ్వరరావు

దుప్పటి

  ఆ రోజుల్లో అమలాపురం నుంచి రాజమండ్రి వెళ్ళడానికి  రెండు మార్గాలు అందుబాటులో ఉండేవి. అమలాపురంలో బస్సెక్కి, బొబ్బర్లంక రేవు దాటి ఆలమూరు మీదుగా వెళ్ళడం ఒకటి, లేదా ముక్తేశ్వరం వచ్చి, రేవు దాటి కోటిపల్లి మీదుగా రాజమండ్రి చేరడం మరొకటి. (అప్పటికి రావులపాలెం వంతెన పడలేదు. అందువల్ల ఇవే మార్గాలు). సాధారణంగా రాముడు ఎప్పుడు అమలాపురం నుంచి రాజమండ్రి వెళ్ళినా ఆలమూరు మీదుగానే వెళ్ళేవాడు. అయితే ఈసారి ఆ బస్సు దాటిపోయింది. అంచేత తప్పనిసరిగా కోటిపల్లి మీదుగా పోవలసి వచ్చింది.  ముక్తేశ్వరం రేవులో బస్ దిగి, రేవు దాటడానికి లాంచీ టికెట్టు తీసుకుంటున్నాడు. ఇంతలో  "ఒరేయ్.. రావుడూ! ఒరేయ్ రావుడూ !” అంటూ పరిచిత కంఠం వినిపించింది.  అతను వెనక్కి తిరిగి చూశాడు. కుంటి సోమన్న! అవును కనిపించేది కుంటి సోమన్నే.  కుంటి సోమన్నది రావుడూ వాళ్ల ఊరే. రావుడు ఎలిమెంటరీ స్కూల్లో చదువుకునేటప్పుడు, వాళ్ల స్కూలు పక్కనే కుంటి సోమన్న పెసరట్ల కొట్టు ఉండేది. ఉదయం పూట పెసరట్లు, మధ్యాహ్నం కొబ్బరి లౌజు వెచ్చ వెచ్చగా బడి పిల్లలకి దొరికేవి. ఏదయినా, ఒక కానీ ఖరీదు!  ఈ పిల్లలకి తోటల్లో దొరికే కొబ్బరిపళ్ళు (రాలిన ముదురు కొబ్బరికాయలు) పట్టుకెళ్ళి కుంటి సోమన్నకే అమ్మేవారు. అప్పుడు కొబ్బరిపండు ఖరీదు కూడా ఒక కానీయే. వీళ్ళు ఇలా కొబ్బరి పండిచ్చి అలా కొబ్బరి లౌజు తీసుకునే వారు. సోమన్నకి ఆ కుంటితనం ఎలా వచ్చిందో తెలియదు కానీ, ఆ కారణంగా అతనికి పెళ్లి కాలేదు.  ఓ అంగవస్త్రం కట్టుకుని పెనం దగ్గర కూర్చునేవాడు. ఈ వ్యాపారంలో లాభం తియ్యాలనే ఆశ కుంటి సోమన్నకి లేదు.  ఆ వీధిలోనే అతని అన్నదమ్ములున్నారు. రోజుకో ఇంట్లో భోజనం చేసేవాడు. కాకపోతే అతనికి నల్లమందు అలవాటొకటి ఉండడంవల్ల.. దానికి రోజూ ఓ అణా కావలసి వచ్చేది. ఈ దుకాణం వల్ల కుంటి సోమన్న ఆశించేది రోజూ ఒక్క అణా మాత్రమే.  అప్పుడప్పుడు పిల్లల దగ్గర డబ్బులు లేనప్పుడు, వాళ్ళకి తినాలని ఉన్నప్పుడు సోమన్న చూడకుండా సరుకులు ఎత్తుకుపోవాలని ప్రయత్నించే వాళ్ళు.  కొందరి కుర్రాళ్ల ప్రయత్నం సఫలమయ్యేది కూడా. అయితే అది సోమన్న దృష్టిలో పడనే పడేది.  "వెర్రి వెధవల్లారా! కావాలని ఏడవకూడదూ? నేనే ఇద్దును కదా!” అంటూ మిగిలినవి తక్కిన కుర్రాళ్ళకి పంచిపెట్టేవాడు. సోమన్న కొట్టు దగ్గరే కాలవ. ఈ కుర్రాళ్ళు ఆ కాలవలో ఈదేందుకు సోమన్న సాయం చేసేవాడు. కుంటివాడనే మాటే కానీ కాలువ ఈ మూలనుంచి ఆ మూలకి నాలుగు బారల్లో ఈదేసేవాడు. పిల్లలందరికీ చిన్న చిన్న గోచీలు పెట్టి ఈత కొట్టడం నేర్పేవాడు.  సోమన్న కొట్టు ఎదురుకుండా ఉన్న చింతచెట్టు కింద ఓపాక వేసి, రాముణ్ణి ప్రతిష్ఠించి, పిల్లలు భజన చేసేవారు. ప్రసాదాలు చేసి, పంచిపెట్టే బాధ్యత సోమన్న తీసుకునే వాడు. ఆ విధంగా రావుడితోపాటు పిల్లలందరి బాల్యజీవితంలోనూ సోమన్న ఓ భాగం అయిపోయాడు.! ఆ సోమన్న రావుడికిప్పుడు కోటిపల్లి రేవు దగ్గర కనిపించాడు.   "ఇలాగ ఎక్కడికి పోతున్నావ్?” అన్నాడు.  "రాజమండ్రి…., ఉద్యోగం చేస్తున్నానక్కడ” అన్నాడు రావుడు.  “అబ్బో! పెద్దవాడవయ్యావురోయ్,” అన్నాడు సోమన్న ఆనందంగా.  “నువ్విక్కడున్నావేమిటీ ?” అంటూ , ఎదురుగా ఉన్న పెనం , పెసరట్ల పొయ్యి చూసి ‘నేను ఎంత తెలివి తక్కువగా అడిగేను’ అని అనుకున్నాడు రావుడు.  రోజులు మారిపోయాయనీ, తన పొట్ట తానే పోషించుకోవలసి వస్తోందనీ, ఓ రోజున పెనం, అట్లకాడా పుచ్చుకుని వాళ్ల ఊరునుంచి ఇక్కడకి వచ్చేసేననీ , ఇప్పుడిక్కడే ఉంటున్నాననీ చెప్పేడు సోమన్న. "పెసరట్టు కాల్చనా? ఇంకా నీకు లాంచికి అరగంట టైముంది.” అంటూ పెనం మీద రెండు పెసరట్లకి పిండి పోశాడు సోమన్న. ఒకసారి మంట ఎగదోసి,  "ఒరేయ్! విశ్వనాథంగాడు ఎక్కడున్నాడురా ఇప్పుడు?” అన్నాడు. విశ్వనాథం రావుడి చిన్ననాటి స్నేహితులలో ఒకడు. మంచి చురుగ్గా ఉండేవాడు.  "వాడిప్పుడు హైదరాబాదులో రైల్వేలో పనిచేస్తున్నాడు” అన్నాడు రావుడు.  “ఎప్పుడూ ఎవ్వరూ కనబడరురా” అన్నాడు సోమన్న పెసరట్టు మీద నెయ్యి పోస్తూ.  "ఒక్క చంద్రమతి మాత్రం రెండు మూడు నెలలకోసారి కనపడుతుందిరా. దాని అత్తారు కోటిపల్లే. ఇద్దరు పిల్లలు…. పలకరించి వెళ్తూంటుంది.” అంటూ పెసరట్లు ఆకులో వేసి అందించాడు సోమన్న. రావుడి మనస్సు తన చిన్ననాటి తరగతి గదిలో విహరిస్తోంది. ఇంతలో లాంచి హారను వినిపించింది. ఉలిక్కిపడ్డాడు రావుడు.  "ఫర్వాలేదులే….ఇంకా పావుగంట ఉంటుంది.” అన్నాడు సోమన్న. ఘుమఘుమలాడే పెసరట్లు రెండు తిని, ఓ అర్ధరూపాయి సోమన్న కివ్వబోయాడు రావుడు. సోమన్న తీసుకోలేదు.  "ఉంచు.” అన్నాడు రావుడు.  "వద్దు…. డబ్బెందుకురా నాకు?” అని క్షణం ఆగి,  "ఒరేయ్ రావుడూ! చలికి మహా బాధపడుతున్నాను–ఈ గోదావరి వార.  దుప్పటీ గుడ్డ ఏదైనా ఉంటే పడేద్దూ.” అన్నాడు సోమన్న. ఆ అడగడంలో యాచనా, దైన్యం ఏమీ లేదు. ఆప్తమిత్రుడు అడిగినట్టే అడిగాడు.  రావుడి చేతిసంచీలో ఓ దుప్పటి ఉంది కూడా. కానీ అది ఒక వారంరోజుల కిందటే కొన్నాడు. దాని ఖరీదు పది రూపాయలు! అది ఇచ్చేద్దామా అని ఒక్కసారి రావుడికి అనిపించినా, అతని నాలుక మాత్రం యాంత్రికంగా,  "ఈసారి వచ్చినప్పుడు తెస్తాలే,” అంది. రావుడు సంచీ పుచ్చుకువచ్చి లాంచీలో కూచున్నాడు. గోదావరి కెరటాల మీద లాంచీ ఉయ్యాలలూగుతూ పోతూ ఉంది. రావుడి మనసు కూడా వివిధ భావాలతో అలాగే ఊగిసలాడుతూ ఉంది. చిన్ననాటి స్నేహితులు ఒక్కొక్కరే జ్ఞాపకానికి రాసాగారు.  ‘చంద్రమతి ఇక్కడే కోటిపల్లిలో ఉందిట. అప్పట్లో వాళ్ల తరగతిలో తనే పెద్దపిల్ల.  ఆదిలక్ష్మి శుద్ధ మొద్దుపిల్ల. తన లెక్కలు చూసి చేసేసేది. మేష్టారితో చెప్తానంటే మొట్టికాయలు మొట్టేసేది. శ్యామలా, మంగాయీ అప్పచెల్లెళ్లు. ఇద్దరూ ఒకే క్లాసు. వాళ్ళింటిదగ్గర మెట్టతామర పువ్వులుండేవి. సుందరికి ఆ పువ్వులంటే ఎంతో ఇష్టం. తను కోసుకొచ్చి ఆమెకిస్తూండేవాడు. సుందరి ఇప్పుడెక్కడుందో? నలుగురు పిల్లల తల్లై ఉంటుంది.  వేసవి వెన్నెల రాత్రుల్లో తన స్నేహితులతో కలిసి, మావిడి చెట్టుకింద కూర్చుని దూరంనుంచి వినిపించే గ్రామదేవత జాతర డప్పులు వింటూ ఎన్నెన్నో కథలు చెప్పుకునే వాళ్ళం! గుయ్యంగాడూ, ఆంజనేయుడి వేషం వేసే ఆ సత్యంగాడూ– వీళ్ళందరూ ఇప్పుడెక్కడికి పోయారో? ఇంక మళ్ళీ జీవితంలో అలా ఆడుకోగలనా?’ కరిగిపోయిన కాలాన్ని గురించి ఆలోచిస్తోంది రావుడి మనస్సు. ఆ మధుర స్మృతులన్నీ అతనిలో తట్టిలేపి, తీయని రోజుల్ని జ్ఞాపకానికి తెచ్చిన వాడు సోమన్న! దానికి కృతజ్ఞతగా సోమన్నకి తనేమిచ్చాడు? ఒక్క దుప్పటీగుడ్డ అడిగాడు. అది కూడా ఇవ్వలేని క్షుద్రుడ్నయ్యాను.  అలా ఆలోచిస్తూ ఒక్కసారి ఒడ్డువైపు చూశాడు రావుడు. సోమన్న ఉండే పాక చిన్నగా కనిపిస్తూనే ఉంది. ఇక్కడ అందరూ సోమన్నని ఎరుగుదురు. లాంచీ దిగి, ఏ పడవ వాడికైనా దుప్పటీ ఇచ్చి పంపిద్దామనుకున్నాడు. కానీ ఆ కొత్త దుప్పటీ సోమన్నకివ్వక వాడే ఉంచేసుకుంటే??  ఇలా ఆలోచిస్తూన్న రావుడికి 'సోమన్న సొమ్ము ఎవడూ అపహరించడులే' అని మాత్రం అనిపించలేదు. పడవ దిగి, బస్సెక్కేడు. రోడ్డుకి ఇరువైపులా ఉన్న సువిశాలమైన సస్యశ్యామల ప్రదేశాలు కన్నులపండుగగా ఉన్నాయి. వాళ్ళ బడికి అవతలిపక్క అలాంటి చేలే ఉండేవి.  పెసర పైరు వేసినప్పుడు పిల్లలందరూ చేలోకి వెళ్ళి పెసర రొట్ట పీకి కాల్చుకుని తినేవాళ్ళు.  రావుడు ఊహాల్లో వుండగానే బస్సు రాజమండ్రి చేరింది. రాజమండ్రిలో దిగి, తనపనిలో తాను కూరుకుపోయినా, ఆ భావోన్మత్తత, అందుకు కారణమైన సోమన్నా రావుడి మనస్సును విడిచిపెట్టలేదు. మరునాటి మధ్యాహ్నానికిగానీ ఆ స్మృతులను మరచిపోలేకపోయాడు. ఓ నెల గడిచింది. ఏదో పనిమీద రావుడికి అమలాపురం వెళ్ళవలసి వచ్చింది. ఈ సారి కోటిపల్లి మీదుగానే వెళ్లాలని నిశ్చయించుకున్నాడు.  తన చిన్ననాటి స్నేహితుడి కోరిక నెరవేర్చడానికి దుప్పటీ కొనాలని అనుకున్నాడు. దుకాణానికి వెళ్ళేడు. రావుడి దగ్గర పుష్కలంగా డబ్బుంది. కానీ ఆ కుంటివాడికి పెద్ద ఖరీదైన దుప్పటి ఎందుకనే పిసినారి భావం ఏదో అతనిలో వచ్చేసింది. ఆరు రూపాయలిచ్చి ఓ దుప్పటీ కొన్నాడు. ఉదయాన్నే బస్సెక్కి బయలుదేరేడు రావుడు. కోటిపల్లి చేరేసరికి తొమ్మిదైంది. లాంచీ గోదావరిలో సగం దూరం వచ్చేసరికి సోమన్న పాక కనపడుతోంది.  తనని చూసి సోమన్న పిలుస్తాడు. పిలవకపోయినా తనే పాకలోకి పోయి, రెండు నేతి పెసరట్లు కాల్పించుకుని తిని సోమన్నకి దుప్పటీ ఇవ్వాలి. రావుడు ఆలోచనలలో ఉండగా లాంచీ ఒడ్డుకు చేరింది. అతను దిగి, సంచీ పుచ్చుకుని ముందుకు నడుస్తున్నాడు. సోమన్న పాక దగ్గర ముగ్గురు నిలబడి ఉన్నారు. అందులో సోమన్నకి అన్నగారైన వెంకటప్పయ్య ఒకడు.  "ఏమోయ్ , ఇల్లావచ్చావ్?” అన్నాడు రావుడు వెంకటప్పయ్యతో. కానీ వెంకటప్పయ్య ఏమీ బదులు చెప్పకుండా పాకలోకి వెళ్ళేడు. రావుడు కూడా వెనకాలే లోపలికి వెళ్ళబోయాడు. ఇంతలో ఒకడు అతని జబ్బ పట్టుకుని ఆపేడు. రావుడు పక్కకి తిరిగి,  "సోమన్న?” అన్నాడు.  "సోవన్నగారు సచ్చిపోయారు. రేత్రి నాలుగు డోకులెళ్ళాయి,” అన్నాడు.  రావుడికి అంతా అర్థమైంది. అలాగే నిర్ఘాంతపోయి చూస్తున్నాడు. వెంకటప్పయ్య సోమన్న శవాన్ని ఇవతలికి తెచ్చాడు. చాలా నీరసించి, పీక్కుపోయి ఉంది ఆకృతి. శవాన్ని గంపలో కూచోబెట్టి,  "ఏదైనా గుడ్డ కప్పాలి,” అన్నాడు వెంకటప్పయ్య. రావుడు తలవంచుకుని, తన సంచీలోంచి కొత్త దుప్పటి తీసి సోమన్నకి కప్పేడు.

కుక్క కాటుకు చెప్పుదెబ్బ

అనగా అనగా మంచుకొండల వద్ద ఒక గ్రామం వుండేది.అ వూళ్ళో వనమయ్య అనే ఆసామి వుండేవాడు.అది చలికాలం వనమయ్యా,అతని స్నేహితులూ యింట్లోనే కుంపటి చుట్టూ కూచుని చలి కాచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వున్నారు.అందరూ తమ తమ ధైర్య సాహసాల గురించి గొప్పలు చెప్పుకుంటున్నారు.వనమయ్య వూరికే వింటూ కూర్చున్నాడు. స్నేహితులంతా ఏమిటి వనమయ్యా నీవేమీ మాట్లాడడం లేదు.నీవేమీ ఘనకార్యం  చెయ్యలేవా?అని ఎగతాళిగా అడిగారు. అప్పుడు వనమయ్య నేనేదయినా చేయగలను.ఏమి చేయ్యమంటారో చెప్పండి చేసి చూపిస్తాను.అన్నాడు. అయితే రాత్రంతా బయట చలిలో నిలబడి వుండాలి.ఏ విధంగానూ వేడి తగలరాదు.పొద్దు పొడిచేవరకూ అలాగే నిలబడి వుండాలి.అని హెచ్చరించారు. సరే అలాగే నిలబడతాను.నేను ఓడిపోతే మీ కందరికీ విందు భోజనం పెట్టిస్తాను.అదీ పందెం.అన్నాడు వనమయ్య. ఇంట్లో  కుంపటి,దీపం ఆర్పేసి బయటకు వెళ్లి నిలుచున్నాడు.అర్ధరాత్రి అయ్యే సరికి చలి బాగా ఎక్కువైంది మంచు కురవడం ప్రారంభ మైంది.పళ్ళు గిట్ట  కరుచుకుని పోయాయి. అటూ యిటూ పచారు చేయటం మొదులు పెట్టాడు..యింతలో దూరంగా ఎవరింట్లోనో దీపం వెలిగింది ఆ దీపాన్నే చూస్తూ ఆ వేడిని ఊహించుకుంటూ వుంటే కొంచెం చలి తగ్గినట్లని పించింది.ఆ వెచ్చని ఊహలతో తెల్లవారింది. స్నేహితులు వచ్చి మొత్తానికి గెలిచావయ్యా అని అభినందించారు.నీ కడుపు బంగారం గానూ!ఎలా ఓర్చుకున్నావయ్యా? అని అడిగారు.అర్ధరాత్రి దూరంగా దీపం కనిపించింది. దాని వేడిని ఊహించుకుంటూ అలాగే రాత్రంతా గడిపాను.అన్నాడు వనమయ్య. ఏ విధమైన వేడీ వుండకూడదు అని చెప్పాము కదా! నీవు ఆ వేడిని ఊహించుకున్నావు కాబట్టి నీవు వోడిపోయినట్టే.నీవు విందు ఇవ్వాల్సిందే అని అందరూ పట్టు బట్టారు. ఎక్కడో దూరంగా వుండే దీపపు వేడి చలిని ఎలా తగ్గిస్తుంది?యిది అన్యాయం అని అరిచి మొత్తుకున్నా వాళ్ళు వినిపించుకోలేదు.విందు ఇవ్వాల్సిందే అని వాళ్ళు పట్టు బట్టారు.వాళ్ళు రేపు విందుకు ఏర్పాటు చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయారు. ఏమి చెయ్యాలో  దిక్కుతోచక న్యాయాధికారి దగ్గరికి వెళ్లి కథంతా చెప్పి నన్నేలాగైనా కాపాడండి అని వేడుకున్నాడు.ఆయన అతనికి ఒక ఉపాయం చెప్పి అలా చెయ్యమని  చెప్పి పంపించాడు. సరే నని యింటికి వెళ్లి మరుదినం ఒక కుండ  లో బియ్యము నీళ్ళు పోసి  చూరుకు వ్రేలాడ దీసి కింద చిన్నదీపం వెలిగించి పెట్టాడు.మధ్య మధ్యలో ఒక చిన్నబల్ల మీద ఎక్కి వుడి కిందా  లేదా అని చూస్తున్నాడు.మధ్యాహ్నానికి స్నేహితులందరూ వచ్చారు.  వంట అయిందా వనమయ్యా? అని అడిగారు. యిదిగో యింకా ఉడుకు పట్టలేదు. పొద్దుననగా పెట్టాను అన్నాడు వాళ్ళు లోపలి వచ్చి చూసి యిలా పెడితే ఎలావుడుకుతుంది?   నీకేమైనా పిచ్చా? అన్నారు.స్నేహితులు. దీపం  చిన్నదైనా,ఎంతదూరంగా వున్నా వేడి తగులుతుందని అన్నారు గదా మీరంతా  మరి యిదీ అంతే అన్నాడు వనమయ్య. వాళ్ళు సిగ్గుపడి వాళ్ళ తప్పు ఒప్పుకొని అందరూ కలిసి ఒక పూటకూళ్ళ అవ్వ యింటి కి  వెళ్లి వనమయ్యకు ఘనంగా విందు  యిప్పించారు.

ఆలోచన.. ఆచరణ (చందమామ కథ)

ముకుందపురంలో అరవిందుడు అనే యువకుడు వ్యవసాయం చేసుకుంటూనే, గ్రామాభివృద్ధికి ఇతోధికంగా  తన వంతు సేవ చేసేవాడు. ఆ గ్రామస్తులు నిత్యమూ గోదావరి మధ్య ఉన్న లంకలో పనులకు వెళ్లి వస్తూండేవారు. గ్రాగమానికీ ఏటిగట్టుకూ నడుమ కాలువ ఉంది. ఆ కాలువను దాటడానికి తాటిచెక్క వంతెనలా వేయబడింది. ఆ తాటి వంతెన పైన నడుస్తూ అప్పుడప్పుడూ కొందరు కాలు జారి కాలువలో పడిపోవడం కద్దు. అందువల్ల కాలువపైన వంతెన నిర్మించవలసిందిగా గ్రామ పంచాయితీని కోరాడు అరవిందుడు. అందుకు నిధులు లేవన్నారు సభ్యులు. పోనీ గ్రామస్థులంతా చందాలు వేసుకుని వంతెనను తామే నిర్మించుకుందామంటే ఎవరూ ముందుకు రాలేదు. అందువల్ల అరవిందుడు తన స్వంత సొమ్ముతో బల్లకట్టు తయారు చేయించాడు.   దాన్ని నడిపేందుకు నియమింపబడ్డ వ్యక్తికి నెలనెలా జీతం ఇచ్చేందుకు ఊరి పంచాయితీ అంగీకరించింది. కాలువ దాటడానికి తాటిచెక్క వంతెన పోయి, బల్లకట్టు రావడంతో గ్రామస్తులు కూడా ఎంతో సంతోషించారు. అదే గ్రామంలో ఉండే నాగేంద్ర అనేవాడికి ఎవరు ఏ పని చేసినా విమర్శించడం అలవాటు. “కాలువపైన వంతెన నిర్మించక, బల్లకట్టు వేస్తే సరిపోతుందా? దానిని నడిపే వాడికి జీతం ఇవ్వడం వల్ల పంచాయితీ నిధులు దండుగే కదా!” అంటూ విమర్శించాడు. ఆ మాట అరవిందుడి చెవికి చేరినా ఏమీ అనలేదు. ఓసారి అరవిందుడు తన ఎడ్ల బండిలో పొరుగూరికి బయలుదేరాడు. ఏటి ఒడ్డమ్మట వెళ్తూంటే, దారిలో ఎండలో నడిచి వెళ్తున్న తన ఊరివాళ్లు కొందరు కనిపించారు. వారిని పిలిచి బండి ఎక్కించుకున్నాడు అరవిందుడు. వారిలో నాగేంద్ర కూడా ఉన్నాడు. ఎడ్లు పరుగెత్తకుండా నెమ్మదిగా నడుస్తుంటే కమ్చీ కోలతో వాటిని కొట్టి అదిలిస్తున్నాడు అరవిందుడు.   అది చూసిన నాగేంద్ర “ఎడ్లను కొట్టి పని చేయించడమూ ఓ గొప్పేనా! వీపు మీద ప్రేమతో నిమిరితే అవే చెప్పిన మాట వింటాయి,”" అంటూ అలవాటు ప్రకారం విమర్శించాడు నాగేంద్ర... అరవిందుడు ఇప్పటికీ ఏమీ అనలేదు. మరికొంత దూరం వెళ్లేసరికి ఎడ్లు నత్త నడకన నడవటం చూసిన అరవిందుడు నాగేంద్రతో “నువ్వు చెప్పింది నిజమేననిపిస్తోంది. నేను వెనక కూర్చుంటాను. నువ్వు ముందుకు వచ్చి బండి నడుపు” అన్నాడు. నాగేంద్ర ఉలికిపడి, “బండి నడపడం నాకు చేతకాదు.” అన్నాడు కంగారుగా. “ఎడ్డను ఎలా మచ్చిక చేసుకోవాలో తెలిసినవాడివి, బండి నడపలేవా?” అన్నాడు అరవిందుడు అచ్చెరపాటుతో. “దారి తెలిసినంత మాత్రాన మోటారు శకటాన్ని నడపటం అందరికీ చేతనౌతుందా?” అన్నాడు నాగేంద్ర. అప్పుడు అరవిందుడు నవ్వి ఇలా అన్నాడు. “ఓ మంచి పని చేయాలన్న ఆలోచనా, ఎలా చేయాలన్న ఊహా అందరిలోనూ ఉంటాయి. వాటిని ఆచరణలో పెట్టడంలోనే ఉంటుంది కష్టమంతాను. ఆలోచన వేరు, ఆచరణ వేరూను. నీటిలో దిగితే కాని లోతు తెలవనట్లే, ఓ పనిని ఆచరిస్తే కాని అందులోని సాధకబాధకాలు తెలిసిరావు. ఇతరులు చేసే పనిని విమర్శించడం తేలికే. ఆ పనిని స్వయంగా చేయడమే కష్టం.. విమర్శ కోసమే చేసే విమర్శలు హాని కలిగిస్తాయి. వాటివల్ల ఓ మంచిపని చేయాలనుకునే వారు వెనక్కి తగ్గే ప్రమాదం ఉంది.” అరవిందుడు తన పారపాటును సున్నితంగా ఎత్తిచూపడంతో, నాగేంద్ర తన తప్పు తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఎన్నడూ ఏ విషయంలోనూ అనవసరంగా అనాలోచితంగా విమర్శలకు పూనుకోకపోవడమే కాక, ఇతరులు చేసే మంచిపనులకు తన వంతు సాయం చేయనారంభించాడు.

మార్పు

  శంకరాపురానికి క్రొత్తగా వచ్చిన టీచర్ శేఖర్. కొద్దికాలంలోనే పిల్లల్ని, గ్రామ పరిస్థితిని గ్రహించాడు. పిల్లలు తెలివితేటలలో ఫర్వాలేదు. కానీ ఇంటివద్ద పుస్తకం తీసే అలవాటు లేదని, ఇంటి దగ్గర చదవరని గ్రహించాడు. పిల్లలెప్పుడూ టి.వి. చూడటంతోనే గడిపేస్తున్నారు. అందరూ గుంపుగా చేరి టి.వి. చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. టి.వి. చూడటం కంటికి మంచిది కాదు. ఈ వయసులో టి.వి. చూస్తే చదువులో వెనకబడి పోతారని, ఇంటివద్ద చదువుకోవాలని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ పిల్లల్లో మార్పు రాలేదు. పిల్లల్లో మార్పు తీసుకురావాలని పథకం తయారుచేసుకున్నాడు శేఖర్. ముందుగా పిల్లల్ని టి.వి. నుండి దృష్టి మళ్ళించాలని, తర్వాత చదువు సంగతి చూడొచ్చని నిర్ణయించుకున్నాడు శేఖర్. సాయంత్రం వరకూ బడిలోనే ఆటలు తనే ఆడించాడు. రోజుకో క్రొత్తరకం ఆట ఆడించాడు, నేర్పించాడు. క్రమేపి పిల్లలు శేఖర్కి చేరువయ్యారు. టి.వి. చూడటం తగ్గించారు. శేఖర్ కోరుకున్నది కూడా అదే. పిల్లల్ని ఆటలనుండి శేఖర్ చీకటి పడగానే కథలతో ఆకట్టుకున్నాడు. సాహస గాథలూ, రాజులు, దొంగలు, నీతికథలు… ఇలా రకరకాల కథలతో చిన్నారులు శేఖర్కి పూర్తిగా దగ్గరయ్యారు. పిల్లల కథల పుస్తకాలను వారికి అందుబాటులో వుంచాడు. వారిలో పఠనాసక్తిని పెంచాడు. స్కూల్లో వున్న కథల పుస్తకాలను వారికి అందించాడు. ఈ క్రమంలో పిల్లలు పూర్తిగా టి.వి.ని మర్చిపోయారు. శేఖర్ ఆనందించాడు. ఇదే సమయంలో కథలనుండి వారి దృష్టిని పాఠ్యపుస్తకాలపై మళ్ళించాడు. అందరికీ చదువుపై ఆసక్తి పెరిగింది. ఇంటివద్ద చదువుకోవడం ప్రారంభించారు. పిల్లల్లో వచ్చిన మార్పును చూసి గ్రామస్థులు శేఖరిన్ని అభినందించారు. ఓ సభ ఏర్పాటు చేసి శేఖర్ను సన్మానించారు. సభలో శేఖర్ వంతు మాట్లాడటం వచ్చింది. మీరందిస్తున్న అభినందనలు నేను స్వీకరించలేకపోతున్నాను. నాకు మీరంతా కలిసి ఓ మాట ఇస్తే అప్పుడు అందుకుంటాను మీ అభినందనలు అనడంతో అందరూ మీరు చెప్పినట్లు చేస్తాం అన్నారు ముక్తకంఠంతో. చదువురాని పెద్దవారంతా రాత్రిపూట పాఠశాలకి వస్తే చదువు నేర్పిస్తాను. ఇందుకు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు వున్నాయి. అందరూ తప్పకుండా రావాలి. నేటినుండే ఆరంభించుకుదాం అని శేఖర్ ముగించాడు. గ్రామస్తులు శేఖరికిచ్చిన మాట ప్రకారం చేసి అందరూ అక్షరాస్యులుగా మారారు. శేఖర్ కల నేరవేరింది. గ్రామస్తులలో, పిల్లల్లో వచ్చిన మార్పుకు శేఖర్ సంతోషించాడు.

చార్వాకుడు

చార్వాకుడు కురు పాండవ యుద్ధం ముగిసిన తరువాత ధర్మరాజు హస్తినాపురానికి వస్తున్నాడని తెలిసి పట్టణమంతా అందంగా అలంకరించారు. రాజవీధిలో ప్రవేశించిన ధర్మరాజు మీద, పరివారం మీద ప్రజలు ముత్యాలూ, అక్షింతలూ, పూలూ చల్లారు. అవన్నీ స్వీకరిస్తూ ధర్మతనయుడు రాజమందిర ద్వారంలోంచి లోపలికి వెళ్ళి ఏనుగు మొగసాలలో రథం దిగాడు. బ్రాహ్మణులకు బంగారం, గోవులు దానం చేసాడు. "ఇతనే మన మహీపతి! కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులకు బుద్ధి చెప్పిన వీరుడితడే - అజాత శత్రువు - ఆడిన మాట తప్పని ధర్మప్రభువు, చల్లని తండ్రి - ఆప్తులను, ఆర్తులను ఆదరించే పుణ్యాత్ముడు" అని జనం వేనోళ్ళ కొనియాడసాగారు.  ఇంతలో ఒక బ్రాహ్మణుడు గబగబ పరుగెత్తుకు వచ్చాడక్కడికి. "ఈ ధర్మరాజేం ప్రభువు? మహా పాపం చేసాడు! తండ్రి, తమ్ముడు, పుత్రుడు, గురువు అనే తారతమ్యం, జంకు లేకుండా బంధుజనులందర్నీ చంపాడు. ఎందుకీ జన్మ! దాయాదులందర్నీ చంపి ఏం భోగాలనుభవిస్తావు?! పాపం మూటగట్టుకున్నావు!" అన్నాడు.  ఆ మాటలు విని అక్కడున్న బ్రాహ్మణులంతా తెల్లబోయి బాధపడుతూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. "ఇదేమిటి?" అని ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. ధర్మరాజు కాసేపు సిగ్గుతో తల వంచుకుని తరువాత ఆ బ్రాహ్మణుల వైపు తిరిగి, "మీకు నమస్కరించి వేడుకుంటున్నాను. మహర్షులందరూ అనుమతించి పంపితేనే రాజ్యం చేయడానికి వచ్చాను. మీరు నన్ను ఆదరించవలసిందని కోరుతున్నాను" అన్నాడు చేతులు జోడించి. విప్రులంతా భయపడిపోయారు. "మహారాజా! మేమెవరమూ ఇలా అనలేదు. అసలు ఇతనెవరో కూడా మాకు తెలీదు. ఉత్తమ క్షత్రియ ధర్మంతో నువ్వు గెలుచుకున్న సిరి శాశ్వతమై ఉండుగాక" అని ధర్మరాజును ఓదార్చి, దివ్యదృష్టి సారించారు. ఆ కపట విప్రుని స్వరూపం బోధపడింది. "మహారాజా! వీడు చార్వాకుడనే రాక్షసుడు. దుర్యోధనుడి స్నేహితుడు. అతనికి మేలు చెయ్యాలని వీడు ఈ రూపంలో వచ్చాడు. ఈ కుక్క మొరిగితే పాలసముద్రం వంటి నువ్వు బాధపడట మెందుకు? ధర్మాత్ములైన తమ్ముల సాయంతో సకల మహీవలయాన్నీ పరిపాలించు" అని ఆ రాక్షసుడివైపు చూసి హూంకారం చేశారు వాళ్ళు.  వాళ్ళ క్రోధాగ్నికి ఆగలేక చార్వాకుడు చచ్చి నేలబడ్డాడు. అజాతశత్రుడు సంతోషించి వాళ్ళను విశేషంగా పూజించాడు. కృష్ణుడు ఇదంతా చూస్తూ- "ధర్మరాజా! వీడు కృతయుగంలో తపస్సు చేసి బ్రహ్మ ప్రత్యక్షమైతే సకల భూతాల వల్ల చావు లేకుండా వరం కావాలని కోరాడు. 'బ్రాహ్మణులకు అపకారం చేసే పనులు మాత్రం చెయ్యకు. అలా ఎప్పుడు చేస్తే అప్పుడే నీకు చావు సంభవిస్తుంది. అంతవరకూ ఎవరివల్లా నీకు చావు లేదని 'బ్రహ్మ వరమిచ్చాడు. అప్పటినుంచీ వీడు లోకాలన్నిటినీ బాధిస్తూనే వున్నాడు. తరువాత దుర్యోధనుడితో స్నేహం చేసి మరింత పెచ్చుమీరాడు. ఆ దురహంకారంతోనే ఇప్పుడు చావును కొని తెచ్చుకున్నాడు. గురువును ఎదిరించడం, గ్రామం పాడు చేయడం, వేదాలూ, ఔషధులూ అమ్ముకోవడం, చెడుస్నేహం చెయ్యడం, రాజధర్మాలూ, అపద్ధర్మాలూ, వర్ణాశ్రమధర్మాలూ పాటించే ఉత్తమ పాలకుణ్ణి తూలనాడడం, ధిక్కరించడం, కూడనిపనులూ చెయ్యరాని పనులూ చేస్తే ఎవరిగతైనా ఇంతే" అని, "ఎవరక్కడ! ఈ కళేబరాన్ని తీసి అవతల పారేయ్యండి" అన్నాడు.  భటులు వచ్చి శవాన్ని ఈడ్చుకుపోయారు. బ్రాహ్మణులు కృష్ణుడికి నమస్కరించారు. తరువాత సభా భవనంలో ఎత్తయిన బంగారు పీఠం వేయించి ధర్మరాజును కూచోబెట్టి సుముహుర్తం సమీపించగానే చక్రధారి వచ్చి "సమస్త పృధ్వికీ అధిపతివై పరిపాలించు" అంటూ శంఖుతీర్థంతో ధర్మరాజుకు అభిషేకం చేశాడు. పంచ మహా వాద్యాలూ మ్రోగాయి. 

కర్ణుడి దాన గుణం!

కర్ణుడిని కృష్ణుడు ఎప్పుడు పడితే అప్పుడు దానకర్ణుడని అభివర్ణించడం అర్జునుడికి నచ్చలేదు. కృష్ణుడితో అర్జునుడు వాదనకు దిగుతాడు. ఈ విషయమై వీరి మధ్య చాలాసేపే మాటలు సాగాయి. ఇక లాభం లేదనుకున్న కృష్ణుడు వెంటనే ఒక బంగారు పర్వతం సృష్టించాడు. అర్జునుడితో కృష్ణుడు ఆ బంగారు పర్వతాన్ని ఈ రోజు సాయంత్రం లోపల ఒక్క ముక్క మిగల్చకుండా దానం చెయ్యాలి ...అలా నువ్వు చేస్తే నేను నిన్ను దానం చేయడంలో కర్ణుడి కన్నా గొప్ప వాడిగా చెప్తాను ...కొనియాడుతాను...సరేనా అని అంటాడు. అర్జునుడు ఈ విషయాన్ని ఊరు ఊరంతా ప్రచారం చేయిస్తాడు. తాను బంగారు పర్వతాన్ని దానం చేయబోతున్నాను అని అంటాడు. అందరినీ రమ్మంటాడు. అలాగే అందరూ వస్తారు. బంగారాన్ని ముక్కలు చేసి దానం చెయ్యడం ప్రారంభిస్తాడు అర్జునుడు. అలా ఇస్తూనే ఉంటాడు అర్జునుడు. అయినా వరస తగ్గుతోంది కాని బంగారం ఇంకా మిగిలే ఉంది. కృష్ణుడు చెప్పినట్టు ఆ రోజు సాయంత్రం లోపల అర్జునుడు దానం చెయ్యలేకపోతాడు. సగం కూడా దానం చెయ్యలేదు. ఇంతలో ఆవైపుగా కర్ణుడు వస్తాడు. కృష్ణుడు కర్ణుడిని పిలిచి "కర్ణా...ఈ బంగారు పర్వతాన్ని రేపు ఉదయం లోపు దానం చెయ్యాలి...నీ వల్ల అవుతుందా" అని అడుగుతాడు. కర్ణుడు "అదేం పెద్ద పని కాదే...ఇది దానం చెయ్యాలి అంతేగా... " అంటూ కర్ణుడు అటు వచ్చిన ఇద్దరిని పిలిచి "ఈ బంగారు పర్వతాన్ని మీ ఇద్దరికీ దానం చేస్తున్నాను...దీనిని మీరిద్దరూ సరిసమానంగా పంచుకుని ఉపయోగించుకోండి" అని వారిద్దరికీ ఆ బంగారాన్ని ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కర్ణుడు. అప్పుడు కృష్ణుడు అర్జునుని చూసి "ఇప్పుడు నీకు, కర్ణుడికి మధ్య ఉన్న తేడా తెలిసిందా...? ఈ బంగారు పర్వతాన్ని పూర్తిగా ఇచ్చేయ్యాలనే ఆలోచన రానే లేదు. మరి నిన్ను దానం చేయడంలో కర్ణుడిని మించిన వాడివని ఎలా కొనియాడను" అని ప్రశ్నిస్తాడు. అర్జునుడి నోటంట మరో మాట లేదు. ఒక్కొక్కరి గుణం ఒక్కొక్కలాంటిది. ఎవరి ప్రత్యేకత వారిది. కర్ణుడు దానం చేయడంలో దిట్ట. ఈ విషయంలో అతనిని మించిన వారు లేరు అని చెప్పడానికి కృష్ణుడు ఆడిన నాటకమిది.

విశ్వనాథవారి ఆగ్రహం

ప్రతివారూ వివేకవంతులే, అవివేకులు ఈ ప్రపంచంలో వుండడు. ఈ వివేకవంతులూ మూడు రకాలుగా వుంటారు. ప్రథములకు అసలు ప్రశ్నయే పుట్టదు, ద్వితీయులకు ప్రశ్న కలుగుతుంది, కానీ సమాధానం స్ఫురించదు, ఉత్తములకు ప్రశ్న పుట్టిన వెంటనే సమాధానం స్ఫురిస్తుందనేవారు విశ్వనాథసత్యనారాయణ గారు.  ఓరోజు ఓ కుర్రాడు ఈ కవిసామ్రాట్టును చూడటానికి వెళ్ళాడట. అక్కడ యింట్లో ఓపెద్దాయన  మామిడికాయముక్కలు కొడుతున్నారు. పనిమనిషేమో ననుకున్నాడు కుర్రాడు.  విశ్వనాథగారున్నారా? అనడిగాడు. ఆ పెద్దాయన కుర్రాణ్ణి ఓసారి పరీక్షగా చూసి లోపలికి  రమ్మన్నారు. నీ పేరేమిటి? అనడిగారు.చెప్పాడాకుర్రాడు. కుటుంబం,వూరు యిలా ఒక్కొక్కటీ అడుగుతుంటే ఆ అబ్బాయికి విసుగొచ్చింది.  ఇంతకీ విశ్వనాథగారు ఎక్కడా? అనడిగాడు. ఆయనతో నీకేం పని?అని ఎదురుప్రశ్న వేశారు ఆ పెద్దాయన. "వూరికే చూసిపోదామని" అన్నాడా అబ్బాయి. అంతే ఆయనకు కోపం తన్నుకొచ్చింది. "వచ్చిన ప్రతివాడికీ నేనేం ధర్మదర్శనం ఇస్తానని చెప్పలేదు. నన్నేమి  చూస్తావు నా పిండాకూడు  ఎలాగూ వచ్చావు నాలుక్కాయలు తరిగేసి పో! నాక్కాస్త సాయం చేసినట్టైనా వుంటుంది." అని గయ్యిమన్నారు. దెబ్బకు కుర్రాడు ఆయన కాళ్ళమీద పడిపోయాడు. క్షమించమని వేడుకున్నాడు.  మరుక్షణంలో విశ్వనాథవారి మనసు వెన్నపూసైపోయింది."లేరా అబ్బాయీ... నువ్వేదో కష్టపడి వచ్చావు గానీ నేను చదవవలిసినవాడినే గానీ చూడవలిసినవాడిని కాదురా" అంటూ అతడిని దీవించారు.

కథకు పట్టం (చందమామ కథ)

కాకడ దేశాన్నేలే కృష్ణ భూపతి పట్టపు రాణి జ్యోత్స్నాదేవి. రాజ దంపతులిరువురూ రాజోచిత విద్యల్లో దాదాపు సమ ఉజ్జీలుగా ఉండేవారు. భానుదేశాధీశుడి ఏకైక కుమార్తె అయిన జ్యోత్స్నాదేవి అందచందాల్లో, గుణగణాల్లో, మేధస్సులో సాటిలేని మేటి అని విన్న కృష్ణభూపతి, ఆమెను ఏరి కోరి వివాహం చేసుకున్నాడు. పట్టపు రాణిగా కాకడదేశానికి వచ్చినది మొదలు జ్యోత్స్నాదేవి, పరిపాలనా విషయాల్లో కూడా భర్తకు చక్కని సలహాలు ఇస్తూ ఉండేది. భార్య ప్రోత్సాహంతో రాజు తరచూ మారువేషంలో వెళ్ళి ప్రజల మంచిచెడ్డలూ, కష్ట సుఖాలూ ప్రత్యక్షంగా తెలుసుకుంటూ ఉండేవాడు. ఒక్కోసారి రాణికూడా మారువేషం వేసుకుని ఆయన వెంట వెళ్ళేది. ఒకసారి కృష్ణభూపతి, నడివయసు పెద్దమనిషిలా వేషం వేసుకుని నగర సంచారానికి బయలుదేరాడు. ఆయన నగరంలోని ఒక సత్రాన్ని సమీపిస్తూండగా, దాని అరుగుమీద మధ్య వయస్కులైన భార్యాభర్తలిద్దరు కూర్చుని మాట్లాడుకుంటూ కనిపించారు. కృష్ణభూపతి గుర్రం దిగి, వారికి కాస్త ఎడంగా అదే అరుగుమీద కూర్చున్నాడు.  నగరానికి వచ్చి నాలుగురోజులు దాటింది. వెంట తెచ్చుకున్న రూకలు తరిగిపోతున్నవిగాని, రాజదర్శనం మాత్రం కాలేదు. అయినా నేను చెబుతూనే ఉన్నాను. కథలు చెప్పడం ఏదో పెద్ద పాండిత్యమన్నట్టు ఇలా బయలుదేర వద్దని  అంటున్నది భార్య నిష్ఠూరంగా. ఆ మాటలకు భర్త కోపం తెచ్చుకోకుండా నవ్వుతూనే,  నేనూ నీకు చెబుతూనే ఉన్నాను. కథల విలువ ఎవరికి తెలిసినా తెలియకపోయినా  మహారాజు కృష్ణభూపతికి తప్పక తెలుస్తుందని. చెప్పవలసిన విషయాన్ని చెప్పవలసిన రీతిలో కథగా మలిచి చెబితే, అది అద్భుతమైన ఫలితాన్ని సాధిస్తుంది. అందుకు పంచతంత్ర కథలే తార్కాణం! నేనా రీతిలో కథ చెప్పగలనన్న విశ్వాసం నాకు ఉన్నది. నీరసపడిపోకుండా రాజదర్శనం కోసం ప్రయత్నించగల పట్టుదలా అధికంగానే ఉన్నది. ఈ రెండూ ఉంటే సాధించలేనిది లేదు. కావాలంటే అందుకు ఉదాహరణగా నాలాగే రాజదర్శనం కోసం వచ్చిన ఒక క్షురకుడి కథ చెబుతాను, విను,'' అంటూ కథ చెప్పడం ప్రారంభించాడు. కథకుడి మాటలు రాజు కృష్ణభూపతిలో కుతూహలాన్ని పెంచాయి. ఆయన కథకుడి ఇల్లాలికంటే ఆసక్తిగా చెవులు రిక్కించి కథ వినసాగాడు: ఒకప్పుడు గౌడదేశంలోని ఒకానొక పల్లెలో సుందరుడు అనే క్షురక యువకుడు ఉండేవాడు. అతడు తక్కిన క్షురకుల్లా ఏదో మొక్కుబడిగా పనిచేసేవాడు కాదు. తన ఎదుట కూర్చున్న వ్యక్తి ముఖంతీరును బట్టి, ఒక శిల్పి శిల్పాన్ని చెక్కుతున్నంత శ్రద్ధగా అతడి తలకట్టును తీర్చిదిద్దేవాడు. వాడిచేత క్షురకర్మ చేయించుకున్న వారి ముఖాల్లో కొత్త అందాలు కనిపించేవి. ఇలా వాడు అందరినీ సుందరంగా తీర్చిదిద్దడం వల్ల, వాళ్ళందరూ వాణ్ణి ‘సుందరుడు' అని పిలవసాగారు. అందరూ తనను మెచ్చుకుంటూవుంటే, సుందరుడిలో చిన్న కోరిక మొలకెత్తి క్రమేణా ప్రగాఢవాంఛగా మారింది. రాజధానికి వెళ్ళి, రాజుగారి తలకట్టును తీర్చిదిద్దాలనీ, ఆయన నుంచి ప్రశంసలు పొందాలనీ కలలు కనసాగాడు. తన పనిలో ఆత్మవిశ్వాసం మెండుగాగల సుందరుడు తన కలను వాస్తవం చేసుకోవాలని నిర్ణయించుకుని, ఒకనాడు సకుటుంబంగా రాజధానికి బయలుదేరాడు. వెళ్ళాడన్న మాటేగాని, రాజధానిలో సుందరుడి కోరిక అంత సులువుగా తీరేట్టు కనిపించలేదు. ‘‘నేను రాజుగారికి క్షురకర్మ అందంగా చేస్తాను. నన్నొక్కసారి ఆయన దగ్గరకు వెళ్ళనివ్వండి,'' అంటూ సుందరుడు చెప్పిన మాటలు విని, వాణ్ణి భటులు పిచ్చివాణ్ణి చూసినట్టు చూశారు. కొందరు నెమ్మదిగా పొమ్మని చెబితే, మరి కొందరు మెడబట్టి గెంటేశారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా, ఇలాంటి అనుభవమే ఎదురుకావడంతో వాడు నిరుత్సాహ పడుతూన్న సమయంలో ఒక భటుడు, అయినా, మహారాజుగారి క్షురకర్మ చేయడానికి గురన్న ఉండగా నీ అవసరం ఏమిటి? అని అడిగాడు. ‘‘గురన్నా? అతడి ఇల్లు ఎక్కడ?'' అని అడిగాడు సుందరుడు. ‘‘జామతోట పక్కన పడమటి వీధిలో ఉంది. అతడు క్షురకర్మలో చాలా నిపుణుడు,'' అన్నాడు భటుడు. సుందరుడు రాజుగారి వాడుక క్షురకుడైన గురన్న వివరాలు సేకరించాడు. అరవైయేళ్ళ గురన్నకు పిల్లా పాపా లేరు. చాలా మంచివాడు. సుందరుడు భార్యకు విషయం చెప్పి, ఆమె ఎలా సహకరించాలో వివరించి, ఉత్సాహంతో సకుటుంబంగా గురన్న ఇంటికి వెళ్ళాడు. గురన్న ఆరుబయట జామచెట్టుకింది తిన్నె మీద కూర్చుని ఉన్నాడు. అతడి భార్య పక్కనే వున్న అరుగు మీద కూర్చుని రాత్రివంటకు కూరగాయలు తరుక్కుంటున్నది. సుందరుడు, ‘‘ఏం బాబాయ్‌, ఎలా ఉన్నావు?'' అని పలకరిస్తూ గురన్న పక్కన కూర్చున్నాడు. వాడి భార్య, గురన్న పెళ్ళాన్ని సమీపిస్తూ, ‘‘అయ్యో! కూరలు కూడా నువ్వే తరుక్కోవాలా, అత్తా! ఏదీ, కత్తిపీట ఇలా తే!'' అంటూ చనువుగా ఆమె దగ్గరినుంచి, కత్తిపీట లాక్కుని చకచకా కూరగాయలు తరగసాగింది. అనుకోని అతిథుల్లా వచ్చిన ఈ కొడుకు-కోడలు ఎవరా అని గురన్న దంపతులు ఆశ్చర్య పోతూండగానే, సుందరుడి నాలుగేళ్ళ కొడుకు, అక్కడున్న జామ చెట్టుకు వేలాడుతున్న కాయలను చూసి, తనకు జామకాయ కావాలని యేడ్వసాగాడు. ష్‌, వస్తూనే అలా గొడవ చేయొద్దు. ఆ చెట్టు మనది కాదు,'' అంటూ సుందరుడు కొడుకును మందలించబోయాడు. కాని పసివాడు వినకుండా, ‘‘మరెవరిది? ఈ తాతదా?'' అంటూ అనుమతి కోసమన్నట్టు నవ్వుతూ గురన్నవైపు చూశాడు. పిల్లాపాపా లేని గురన్న దంపతులకు సుందరుడు, పెళ్ళాం కలిపిన వరసలకంటే, పసివాడి ‘తాత' పిలుపు చెప్పలేనంత ఆనందాన్నిచ్చింది. మరి కాసేపటికల్లా సుందరుడి మంచితనం గురన్ననీ, వాడి భార్య మాట తీరు, పనితనం అతడి భార్యనూ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ తరవాత సుందరుడి పని సానుకూల పడటం అంతకష్టం కాలేదు. గురన్న వారసుడిగా కొలువులో ప్రవేశించిన సుందరుడు, వారం తిరక్కుండా రాజును కూడా తన నైపుణ్యంతో ఆకట్టుకున్నాడు. సుందరుడూ, వాడి భార్యా గురన్న దంపతులను కడదాకా కన్నబిడ్డల్లాగే చూసుకుని పదిమంది చేతా భేష్‌ అనిపించుకున్నారు. కథ పూర్తి చేసిన కథకుడు, ‘‘చూశావా, చదువూ సంధ్యాలేని క్షురకుడే అయినప్పటికీ, ఆత్మవిశ్వాసం, పట్టుదలా ఉన్నకారణంగా సుందరుడు పిన్న వయసులోనే వృద్ధిలోకి వచ్చాడు. నాకూ ఆ రెండూ ఉన్నాయని ముందే చెప్పాను కదా! అందువల్ల సుందరుడికిలాగే నాకూ దైవకృప తోడయితే, రాజదర్శనం లభిస్తుంది,'' అంటూ కృష్ణభూపతి వైపు తిరిగి, ఆయన్ను భార్యకు చూపుతూ, ‘‘ఎక్కడి దాకానో ఎందుకు? ఇదిగో ఈయన కూడా నీతో పాటు నా కథ వినే ఉంటారు. దేవుడి దయ ఉంటే, ఈయనే మహారాజుగారికి నా గురించి చెప్పవచ్చు,'' అన్నాడు. అప్పటిదాకా ఆసక్తిగా కథ విన్న రాజు కృష్ణభూపతి, కథకుడి ఆఖరి మాటలు వింటూనే, అతడికి తను రాజేమోనన్న అనుమానం కలిగిందని గ్రహించాడు. వెంటనే, తలపాగా తీసి పక్కన పెడుతూ, ‘‘అంతేనా... దేవుడి దయ ఉంటే నేనే కృష్ణభూపతినై మీ కథలకు పట్టం కట్టినా కట్టవచ్చు!'' అంటూ మందహాసం చేశాడు.

ప్రాణం మీదికి వచ్చిన విద్య (చందమామ కథ)

ఒక గ్రామంలో శరభుడు అనే పశువుల కాపరి ఉండేవాడు. వాడి ఆస్తి అంతా కలిసి నాలుగు ఆవులు. వాడు వాటిని రోజూ మేతకు తీసుకుపోయి, ఏ చెట్టు మీదనో, గుట్టమీదనో కూర్చుని వేణువు ఊదుకుంటూ కాలక్షేపం చేసేవాడు. ఒక రోజు వాడు ఒక చెట్టు మీద కూర్చుని వేణుగానంలో నిమగ్నుడై ఉండగా సమీపంలో పులిగాండ్రింపు వినిపించింది. వాడు ఉలిక్కిపడి తన ఆవులు మేస్తున్న దిక్కు చూసి, ఒక అపూర్వ దృశ్యం కంటపడే సరికి, నిర్ఘాంతపోయాడు. శరభుడి ఆవులు నాలుగూ ఒక పెద్దపులిని చుట్టుముట్టి దాన్ని కొమ్ములతో భయంకరంగా పొడుస్తున్నాయి. పులి వాటి నుంచి తప్పించుకుని పారిపోయి, ప్రాణాలు దక్కించుకుందామని విశ్వప్రయత్నం చేస్తున్నది. కాని ఆవులు దానికి సందు ఇయ్యక, చివరకు దాన్ని చంపేశాయి. శరభుడు తన ఆవుల పౌరుషాన్ని చూసి పరమానందం చెందాడు; చాలా గర్వపడ్డాడు. ఆవులు, ఏమీ జరగనట్టుగా, తిరిగి మేత మేయసాగాయి. తరవాత కొద్ది కాలానికి శరభుడు ఉండే ప్రాంతంలో వానలు పడక, బీళ్ళు ఎండిపోయి, పశువులకు మేత కరువయింది. తిండిలేక పశువులు ఎండిపోతున్నాయి. తన ఆవులు తిండికి మాడటం చూడలేక, శరభుడు వాటిని తోలుకుంటూ, దూరంగా ఉన్న కొండప్రాంతానికి వెళ్ళాడు. అక్కడి బయళ్ళలో గడ్డి చాలా ఏపుగా పెరిగి ఉన్నది. చాలా రోజులుగా దొంగిలించటానికి పశువులు దొరకక ఇబ్బంది పడుతున్న దొంగ గంగులు ఒకనాడు శరభుడి ఆవులను చూశాడు. అవి బాగా బలిసి ఉన్నాయి. వాటి యజమాని శరభుడు ఒక చెట్టు మొదట్లోచేరి, నిశ్చింతగా వేణువు వాయించుకుంటూ వాడికి కనిపించాడు. గంగులు ఆ ఆవులను కాజెయ్యటానికి నిశ్చయించుకుని, తాను ఏ పొదల మధ్య దాక్కుంటే సులభంగా పని జరుగుతుందో జాగ్రత్తగా చూసుకుని, మర్నాడు పశువులకన్న ముందుగా వచ్చి, ఆ పొదలో కూర్చున్నాడు. శరభుడి ఆవులు ఆ ప్రాంతానికి వచ్చి మేయసాగాయి. శరభుడు వేణువు వాయించటం ప్రారంభించాడు. కొంతసేపు గడిచాక వాడికి పెద్దపులి గాండ్రింపు వినిపించింది. ఆటే కంగారుపడకుండానే వాడు లేచి తన పశువుల కోసం చూశాడు. వాడు అనుకున్నట్టే అవి ఒక పొదకు నాలుగుపక్కలా చేరి, తలలు వంచి, పొదలో నుంచి పులి వచ్చిన మరుక్షణం దాన్ని కుమ్మీ, పొడిచీ, చంపటానికి సిద్ధంగా ఉన్నాయి. శరభుడు వేణువు వాయించడం కట్టిపెట్టి వింత చూస్తూ అలాగే ఉండిపోయూడు. ఈ లోపల గంగులుకు విచిత్రమైన అనుభవం కలగసాగింది. తన అరుపు విని ఆవులు బెదిరి పారిపోకపోగా, తాను ఆహ్వానించినట్టుగా పొద దగ్గిరికి వచ్చాయి. వాటికి పులి అంటే భయం తెలియదు కాబోలుననుకుని, సింహంలాగా గర్జించాడు.ఆవులు ఆ గర్జన విని భయపడకపోగా, బుసలు కొట్టుతూ, గిట్టలతో నేలను గీరి, ‘‘దమ్ము ఉంటే బయటికిరా! నీ ప్రాణం తీస్తాం!'' అన్న ధోరణిలో కనిపించాయి. తనకు ఆవులు దక్కకపోగా, తన ప్రాణానికే ప్రమాదం వచ్చిందని గంగులు తెలుసుకునేటందుకు కొంత వ్యవధి పట్టింది. ఆ తరవాత వాడికి ముచ్చెమటలు పోశాయి. వాడు కాస్సేపు పులిలాగా, కాస్సేపు సింహంలాగా మార్చి, మార్చి అరవసాగాడు. అందువల్ల వాడికి ఏమీ ప్రయోజనం కలగకపోగా, ఆవులు మరింత పెద్దగా బుసలు కొట్టసాగాయి. అయితే, ఆ అరుపులు విని గ్రామం పరిసరాలలో మేస్తున్న పశువులు బెదిరి, అన్ని దిక్కులా పారిపోసాగాయి. కట్టేసి ఉన్న పశువులు కట్టుతాళ్ళు తెంచుకుని మరీ పారిపోయాయి. ఊరి మనుషులు వాటికోసం అటూ ఇటూ పరిగెత్తసాగారు. ఇంతలో శరభుడు గ్రామం కేసి పరిగెత్తుకుంటూ వచ్చి, ‘‘నా ఆవులు పులినీ, సింహాన్నీ పట్టాయి! చూతురుగాని రండి!'' అంటూ కొంత మందిని తీసుకుపోయాడు. వాళ్ళు ప్రాణాలు అరచేత పట్టుకుని శరభుడి వెంట వెళ్ళారు. తన ఆవులు చుట్టిముట్టి ఉన్న పొదకు సమీపంలో శరభుడు ఆగగానే, ఊరి వాళ్ళు అమిత ఆశ్చర్యంగా, ‘‘ఏదీ పులి?'' అని అడిగారు. ‘‘అది ఒకంతట బయటికి వస్తుందా! నా ఆవులు చీల్చెయ్యవూ? మీరంతా ఆ పొద మీదికి రాళ్ళు విసరండి. పులిలాగానూ, సింహంలాగానూ అరవగల జంతువు బయటికి వస్తుంది!'' అన్నాడు శరభుడు. నలుగురూ బలంగా రాళ్ళు విసరటం ప్రారంభించగానే శరభుడి ఆవులు పొద నుంచి ఇవతలికి వచ్చేశాయి. తలకూ, ఒంటికీ గాయూలుతగిలి, రక్తం కారుతూన్న దొంగ గంగులు చావుకేకలు పెడుతూ పొదలో నుంచి వెలుపలికి వచ్చి, మనుషుల కాళ్ళ మీద పడ్డాడు. తమ పశువులను దొంగిలించినవాడు వాడేనని తెలియగానే గ్రామస్థులు వాణ్ణి హెచ్చరించి కొసప్రాణంతో వదిలేశారు. అది మొదలు శరభుడు ఆ గ్రామానికి నాయకుడయ్యాడు. గ్రామంలో పశువులు కొండ కింది బీళ్ళలో మేసి, చక్కగా బలిశాయి

సిరా చుక్కలతో కలిపి అగ్గి రాజేసిన యుగకర్త శ్రీశ్రీ

రాజవీధుల్లోనూ, పండితుల చర్చాగోష్టుల్లోనూ, రాజదర్బారుల్లోనూ మాత్రమే వెలుగుతున్న తెలుగు సాహితీ సౌరభాల్ని, సామాన్యుడి చెంతకూ, మట్టివీధుల వరకూ.. తీసుకొచ్చిన మహాకవి శ్రీశ్రీ. అందుకే ఆయన పేరు తెలియని తెలుగువాడు ఉండడంటే అతిశయోక్తికాదు. పేరు తెలుగు భాష, తెలుగు జాతి ఉన్నంత కాలం చరిత్రలో వెలుగుతూనే ఉంటుంది. తెలుగు సాహిత్యంలో సామాన్యుడి కష్టనష్టాల గురించీ, పేదసాదల జీవితాలని ప్రతిబింబించే కవిత్వాన్ని రాసిన మొదటి కవిగా ఆయన ఆంధ్రులందరికీ చిరస్మరణీయుడు. నేడు ఆ మహాకవి వర్థంతి సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని విశేషాలను తెలుసుకుందాం..  ఆయనరచనల్లో 1950లోప్రచురించబడిన' మహాప్రస్థానం'అనే కవితా సంపుటి తెలుగుసాహితీ అభిమానులమనసుల్లోనే కాకుండా..సామాన్య ప్రజల గుండెల్లో కూడా చిరస్థాయిగా నిలిచిపోతుంది.   ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్నిశాసించిన మహాకవి శ్రీశ్రీ అసలు పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధకవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవరచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా ఆయన ప్రసిద్ధుడు. మహాకవిగా శ్రీశ్రీ విస్తృతామోదం పొందాడు. కనీసం వేయి సంవత్సరాల చరిత్ర ఉన్నతెలుగు సాహిత్యంలో కవితను ఇలానిర్వచించి, ఇంత కవితాత్మకంగా వర్ణించి, ఇంత అద్భుత సృష్టి చేసిన మరో కవిలేనే లేడు. ఇదే అతణ్ణి సాహితీ శిఖరాగ్రాన నిలిపింది అన్న బూదరాజురాధాకృష్ణ గారి మాటలు శ్రీశ్రీ సాహితీ ప్రజ్ఞ్య కి నిదర్శనాలు.  ఏప్రిల్ 30,  1910న పూడిపెద్ది వెంకటరమణయ్య, అప్పలకొండ దంపతులకు జన్మించాడు. శ్రీరంగం సూర్యనారాయణకు దత్తత వెల్లటం వలన ఈయనఇంటిపేరు శ్రీరంగంగా మారింది.1935 లో విశాఖ లోని మిసెస్ ఎ వి ఎస్ కాలేజీ లో డిమాన్స్ట్రేటరు గా చేరాడు. 1938 లో మద్రాసు ఆంధ్ర ప్రభలో సబ్ ఎడిటరు గా చేరాడు. ఆ తరువాత ఆకాశవాణి, ఢిల్లీ లోను, మిలిటరీ లోను, నిజాము నవాబు వద్ద, ఆంధ్ర వాణిపత్రికలోను వివిధ ఉద్యోగాలు చేసారు. 1933 నుండి 1940 వరకు ఆయనరాసిన మహాప్రస్థానం, జగన్నాథుని రథచక్రాలు, గర్జించు రష్యా వంటి గొప్పకవితలను సంకలనం చేసి మహప్రస్థానం అనే పుస్తకంగా ప్రచురించాడు. తెలుగు సాహిత్యపు దశనూ, దిశను మార్చిన పుస్తకం అది.1947 లోమద్రాసు కు తిరిగి వచ్చి అక్కడే స్థిరపడ్డాడు. ఎన్నో సినిమాలకు పాటలు,మాటలు రాసాడు. 1970 లో ఆయన షష్ఠి పూర్తి ఉత్సవం విశాఖపట్నం లో జరిగింది.ఆసందర్భంగానే ఆయన అధ్యక్షుడు గా విప్లవ రచయితల సంఘం విరసం ఏర్పడింది. శ్రీశ్రీ చాలా చిన్న వయసులోనే తన రచనా వ్యాసంగాన్ని మొదలు పెట్టాడు.తన 18 వ ఏట 1928 లో ప్రభవ అనే కావ్య సంపుటిని ప్రచురించారు.ఈ రచనను సాంప్రదాయ పధ్ధతి లోనే రాసాడు. తరువాతి కాలంలో సాంప్రదాయికమైన గ్రాంధిక శైలి, ఛందస్సువంటి వాటిని పక్కన పెట్టి వాడుకభాషలో మాత్రా ఛందస్సులో కవిత్వం రాయడం మొదలు పెట్టారు.  1950 లో మహాప్రస్థానం కావ్యం మొదటిసారిగా ప్రచురితమైంది. ఆధునిక తెలుగు సాహిత్యం లో ఈ కావ్యం అత్యున్నతస్థానంలో నిలిచి శ్రీశ్రీ ని మహాకవి ని చేసింది. తరువాత మరోప్రస్థానం, ఖడ్గ సృష్టిఅనే కవితా సంకలనాలను, చరమరాత్రి అనే కథల సంపుటిని, రేడియోనాటికలు రచించాడు. మహాప్రస్థానం వంటి గీతాలన్నీ మార్క్సిజం దృక్పథం తో రాసినవే అయినా అవి రాసేనాటికి మార్క్సిజం అనేది ఒకటుందని ఆయనకుతెలియదు. 1981 లో లండన్ లో ప్రచురితమైన మహాప్రస్థానం కు ముందుమాటలో ఆయన ఈ విషయంస్వయంగా రాసాడు. తెలుగు వారిని ఉర్రూతలూగించిన ఎన్నో గొప్ప సినిమా పాటలను ఆయనరచించాడు. అల్లూరి సీతా రామ రాజు సినిమాకు ఆయన రాసిన తెలుగు వీరలేవరా.. అనేది శ్రీశ్రీ రాసిన ఆణిముత్యాల్లో ఒకటి. రెండవ భార్య సరోజ తో కలిసి సినిమాలకు మాటలు రాసాడు. ప్రాసకూ, శ్లేషకు శ్రీశ్రీ పెట్టింది పేరు. అల్పాక్షరాల్లో అనల్పార్ధాన్ని సృష్టించడంలోశ్రీశ్రీ మేటి.   ఈ రోజు ఆ మహాకవి జయంతి సందర్భంగా...

విధివ్రాత

విధి వ్రాతను తప్పించుకోవడం ఎవరికీ సాధ్యపడదు అనడానికి నిదర్శనం ఈ కథ.    ఒక దొంగ దొంగతనం చేయడానికి ఒక ఇంటికి కన్నం పెట్టి, లోపలికి ప్రవేశించడానికి చూస్తుంటాడు. ఇంతలో ఆ కన్నం గుండా ఒక నల్లత్రాచు లోపలికి వెళ్లి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళను కాటు వేసి చంపి మెల్లగా దొంగ పక్కనుంచే అతనిని ఏమీ చేయకుండా వెళ్తుంటే ఆశ్చర్య పడిన దొంగ, అలాగే చూస్తుండగానే కొద్దిదూరం వెళ్లిన ఆ నల్లత్రాచు ఒక పెద్ద వృక్షంగా మారుతుంది .   అది చూసిన దొంగ తను వచ్చిన విషయం మర్చిపోయి భయంతో, విస్మయంతో అక్కడే నిలబడి చూస్తుంటాడు.   ఇంతలో ఆ వైపుగా వచ్చిన ఒక బాటసారుల బృందం అక్కడికి వచ్చి ఆ చెట్టు నీడన విశ్రమించడానికి సిద్ధపడి, అందరూ కూర్చుంటారు. అలా కూర్చున్న వారు  బలమైన ఆ చెట్టు కొమ్మలు పడి అందరూ మరణిస్తారు.        అటు తర్వాత ఆ చెట్టు ఒక స్త్రీ రూపం ధరించి వెళ్తుండగా చూసిన ఆ దొంగ ఆ స్త్రీ కి దగ్గరగా వెళ్లి ...         "ఎవరు నువ్వు? ఎందుకు ఇలా చంపుతున్నావు అందరినీ?" అని అడుగుతాడు.     ఆవిడ "నేను మృత్యువును.  ఎవరు ఏ విధంగా ఏ సమయంలో చంపబడాలని రాసి ఉందో,  ఆ ప్రకారం వాళ్ళ ప్రాణాలు తీయడం నా కర్తవ్యం. అందుకే ఆ ప్రకారంగా రూపం మార్చుకుంటూ ప్రాణాలు హరిస్తున్నాను" అని వివరిస్తుంది.           అది విన్న దొంగకు తన మరణం ఎలా, ఎప్పుడో తెలుసుకోవాలని కోరిక కలుగుతుంది.   " అయితే నేను ఎప్పుడు, ఎలా మరణిస్తానో చెప్పమ్మా" అని వేడుకుంటాడు               "నన్ను ఎవ్వరూ చూడలేరు.ఏదో పుణ్య విశేషం వల్ల నన్ను నువ్వు చూడగలిగావు. కాని అలా చెప్పడం కుదరదు" అన్న మృత్యువుతో      "ఆ పుణ్య విశేషాన్ని అడ్డుపెట్టి నా మృత్యువు ఎప్పుడు చెప్పమ్మా" అని ప్రాధేయపడతాడు.          "సరే! ఇంతగా ప్రాధేయ పడుతున్నావు కనుక చెబుతాను.  నీకు ఇంకా సమయం ఉంది. ఆ లోపు మంచి పనులు చేసి బ్రతుకుతూ నీ  జన్మ సార్ధకం చేసుకో. ఈ రహస్యం ఎవరికీ చెప్పవద్దు" అని హితవు పలికి,              సరిగ్గా ఇదే రోజు మరుసటి సంవత్సరం , ఫలానా సమయానికి ఏనుగు చేత తొక్కబడి మరణిస్తావు అని చెబుతుంది.           అది విన్న దొంగ ఆవిడకు ధన్యవాదాలు తెలుపుకుని తన ప్రాంతానికి బయలుదేరుతాడు.                 అప్పట్నుంచి ఆ దొంగ అన్ని దొంగతనాలు మానేసి మంచి పనులు చేస్తూ, అందరికి సాయపడుతూ జీవిస్తుంటాడు.           నేను దొంగగా ఉంటే రాజ భటులకు దొరికి రాజదండనకు గురి కావొచ్చు కదా!  ఇప్పుడు అలాంటి అవకాశం లేదు కాబట్టి నేను  మృత్యువు నుండి తప్పించుకోగలిగాను అనుకుంటాడు.  కానీ...        అనుకోని విధంగా ఇంకెవరో చేసిన దొంగతనానికి ఈ దొంగ పాత నేరస్థుడు అయిన కారణంగా ఇతన్ని అనుమానించి,  తీస్కెళ్ళి రాజు ముందు  నిలబెడతారు.   " నేను ఏ దొంగతనం చేయలేదు. నేను మంచిగా మారాను మహారాజా! మంచి జీవితం గడుపుతున్నాను" అంటాడు. కానీ..         ఆ రాజుగారు  వినకుండా,    "ఇంతకుముందు చేసేవాడివే కదా! ఇప్పుడు మారావని నమ్మకం లేదు" అని ఇతన్ని ఏనుగులతో తొక్కించి చంపండి అని ఆజ్ఞాపిస్తాడు.       మృత్యువు చెప్పిన గడువు దగ్గరికి వచ్చింది. ఇక లాభం లేదని రాజుగారు విధించిన శిక్ష అమలు చేయడానికి తీసుకెళ్తున్న ఆ భటులతో ఇలా వేడుకుంటాడు....         " నన్ను ఇంకేరకంగా అయినా చంపండి. కానీ ఏనుగు ద్వారా మాత్రం వద్దు.  ఇది నా చివరి కోరిక. చివరి కోరిక తీర్చడం మీ ధర్మం కదా" అని అంటాడు.         "అలా రాజాజ్ఞ ధిక్కరించలేము. రాజుగారు ఏ శిక్ష విధిస్తే అది మాత్రమే అమలు చేయాలి మేము" అంటారు వాళ్ళు.            దొంగ ఎంతో బ్రతిమిలాడిన తరువాత...                    "కానీ చివరి కోరికగా అడుగుతున్నావు. కనుక ఒక పని చేస్తాం.కనీసం మొదటగా ఒక ఏనుగు బొమ్మ చేత నిన్ను తొక్కించి, ఆ తర్వాత నీ ఇష్టమైనట్టు చంపుతాం అప్పుడు మాకు రాజాజ్ఞ ధిక్కరించినట్టు అవ్వదు, నీ చివరి కోరికా తీర్చినట్టు అవుతుంది. ఏమంటావ్" అంటారు.           సరే బొమ్మే కదా అనుకుంటాడు. అందుకని ఒప్పుకుంటాడు దొంగ.        కానీ ఆ బొమ్మను దొంగపై పెట్టగానే అదే నిజమైన ఏనుగుగా మారి తొక్కి, ఆ దొంగను చంపేస్తుంది. అలా  విధి నిర్ణయించినట్లుగా, నియమిత సమయానికి దొంగ మరణిస్తాడు          అందుకే ప్రతి చిన్న విషయానికి భయపడవద్దు. జరిగేది ఎలా అయినా జరుగుతుంది అంటారు పెద్దలు.  అలాగని మొండిగా ఇష్టంవచ్చినట్టుగా చేయకూడదు.       మృత్యువు ఎప్పుడో ఒకప్పుడు వచ్చి తీరుతుంది. కనుకనే ఉన్న జీవితాన్ని మంచి పనులతో, పరోపకారబుద్ధి తో, ఇతరులను నొప్పించే మాటలు మాట్లాడకుండా గడుపుతూ జన్మ ను సార్ధక్యము చేసుకోవాలి... 

నేత్రసంజీవని (చందమామ కథ)

కన్నావరంలోని చింతామణి రోగనిర్ధారణకూ, చికిత్సకూ, హస్తవాసికీ పేరుగాంచిన వైద్యుడు. అయితే, యేటా వేసవిలో ఆ చుట్టు పక్కల గ్రామాల ప్రజలను పట్టి పీడించే వింత కంటి జబ్బును నయం చేయలేక బాధపడసాగాడు. ఉన్నట్టుండి కళ్ళు వాచిపోవడం, నీళ్ళుకారడం, మంట ఆ వ్యాధి లక్షణాలు. కొందరికయితే ఆ జబ్బు కారణంగా చూపు మందగించడం కూడా జరిగేది. ఆ వ్యాధికి సరైన వైద్య విధానం తెలిసి కూడా దానికి సంబంధించిన నేత్రసంజీవనీ మూలిక లభ్యం కాకపోవడం వల్ల ఆయన చికిత్స చేయలేక పోతున్నాడు. ఆ మూలిక కన్నావరానికి దక్షిణంగా కొద్ది దూరంలో ఉన్న చంద్రావళి కొండ దిగువ ఉందని ఆయనకు తెలుసు. అయితే, నరభక్షకులైన రాక్షస దంపతులు ఇటీవల అక్కడ చేరడం వల్ల, ఎవరూ ఆ దరిదాపులకు వెళ్ళడానికి సాహసించలేక పోతున్నారు. ఇలా ఉండగా, చింతామణి వద్ద కొత్తగా శిష్యుడిగా చేరిన విజయచంద్రుడనే యువకుడికి ఆ మూలికను ఎలాగైనా సంపాదించాలనే బుద్ధి పుట్టింది. అతడు ఒకనాడు దాపులనున్న మూలికలు తెస్తానని గురువుకు చెప్పి, తిన్నగా చంద్రావళి పర్వతం కేసి నడవసాగాడు. మిట్టమధ్యాహ్నానికి ఆ కొండను సమీపించి నేత్రసంజీవనీ మూలికను కావలసినంత సేకరించుకుని, ఆ దాపులనున్న చెట్ల ఫలాలను తిని, సెలయేటి నీళ్ళు తాగి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఆ సమయంలో, ‘‘ఎవడివిరా నువ్వు?'' అన్న భయంకరమైన కేక వినిపించడంతో, విజయచంద్రుడు ఉలిక్కిపడి తల పైకెత్తి చూశాడు. ఒక రాక్షసుడు తన భార్యతో బండల పక్క నుంచి వస్తున్నాడు. వాళ్ళ భయంకర ఆకారాలను చూసి ఒక్క క్షణం భయపడిన విజయ చంద్రుడు వెంటనే తేరుకుని, భయపడి ప్రయోజనం లేదని గ్రహించి ధైర్యంగా లేచి నిలబడ్డాడు. ‘‘ఇంకా నా ప్రశ్నకు సమాధానం చెప్పనేలేదు. ఎంత పొగరు? నన్ను చూస్తూంటే భయం లేదా?'' అంటూ రాక్షసుడు రెండుఅడుగులు ముందుకు వేశాడు. అంతలో రాక్షసి అడ్డుపడి, ‘‘నీ మొహం చూసి ఎవడు భయపడతాడు? ఆ కురక్రుంక నోటి నుంచి క్షణంలో సమాధానం నేను కక్కిస్తాను చూడు,'' అంటూ ముందుకు ఉరికింది. ‘‘మగాడినైన నావల్ల కానిది, ఆడదానివి నీవల్ల ఏమవుతుంది?'' అంటూ రాక్షసుడు గుడ్లురుముతూ విజయచంద్రుడి కేసి తిరిగి, ‘‘చెప్పు, నన్ను చూస్తే నీకు భయం లేదా?'' అని గద్దించాడు. రక్కస ఆలుమగల మధ్య అంతగా పడడం లేదని వెంటనే గ్రహించిన విజయచంద్రుడు, ‘‘మిమ్మల్ని చూసి భయపడడమెందుకు? ఈ మధ్య మీకన్నా భయంకరమైన ఒక రాక్షసుణ్ణి చూశాను. అతడు నాకు కావలసినంత ధనం కూడా ఇచ్చాడు,'' అన్నాడు విజయ చంద్రుడు. రాక్షసుడు హ హ హ అని నవ్వి, ‘‘కోతలు బాగా కోస్తావురా బాలకా! నాలాంటి రాక్షసుడు నిన్ను చూడడమేమిటి? మింగకుండా వదిలిపెట్టడమేమిటి?'' అన్నాడు. ‘‘అతడికి నా సలహా కావలసివచ్చింది. అందుకే నాతో స్నేహం చేశాడు,'' అన్నాడు విజయచంద్రుడు. ‘‘రాక్షసుడికి నీ సలహా కావలసివచ్చిందా? ఆశ్చర్యంగా ఉందే! ఏమిటా సలహా?'' అని అడిగాడు రాక్షసుడు. ‘‘అలా అడుగు, చెబుతాను. ఆ రాక్షసుడు... ‘మీ మనుషులు చాలా తెలివైన వాళ్ళట కదా! పెళ్ళాలను తమ చెప్పు చేతల్లో ఎలా పెట్టుకుంటారో, నీకేమైనా చిట్కాలు తెలిస్తే చెప్పు' అని అడిగాడు,'' అన్నాడు విజయచంద్రుడు. ‘‘నువ్వు చెప్పావా?'' అని అడిగాడు రాక్షసుడు కాస్త కంఠస్వరం తగ్గించి. ‘‘చెప్పాను. అందుకే కదా ఆ రాక్షసుడు ఎంతగానో సంతోషించి నాకు ధనం, బంగారు కానుకలు కూడా ఇచ్చాడు,'' అన్నాడు విజయ చంద్రుడు ఏమాత్రం తొణక్కుండా. ఆ మాట వినగానే రాక్షసుడు ఆలోచనలో పడ్డాడు. వాడి భార్య పరమగయ్యాళి. చీటికి మాటికి మాటలతో, చేతలతో వాణ్ణి సాధిస్తూ, వేధిస్తూ ఉంటుంది. పెళ్ళాన్ని అదుపులో ఉంచుకునే చిట్కాలు తెలుసుకుంటే మంచిదని అనుకుని వాడు, ‘‘ఒరే బాలకా! ఇలారా,'' అంటూ విజయ చంద్రుణ్ణి బండ చాటుకు తీసుకు వెళ్ళి, ‘‘ఆ చిట్కాలేవో నాకూ చెప్పు. నీకు కానుకలిస్తాను,'' అన్నాడు. విజయచంద్రుడు, ‘‘చెబుతాను, చెబుతాను,'' అంటూండగా వాళ్ళను వెంబడించి వచ్చిన రాక్షసుడి భార్య, ‘‘ఏరా, నన్ను లొంగదీసుకునే చిట్కాలు నా మొగుడికి చెబుతావా? నిన్నేం చేస్తానో చూడు!'' అంటూ హుంకరించింది. ‘‘వాడేం చెబితే నీకేం? నా కాళ్ళ దగ్గర పడి ఉండాల్సిన అధమ రక్కసివి! నువ్వు వాణ్ణి మింగడానికి నేను వదులుతాననుకున్నావా?'' అంటూ అడ్డుపడ్డాడు రాక్షసుడు. ‘‘నీ కాళ్ళ దగ్గర పడి ఉండడమా? అందుకు వేరెవతినైనా చూడు. నేను ప్రాణంతో ఉండగా అది అసాధ్యం,'' అంటూ రెచ్చిపోయింది రాక్షసి. దాంతో వాళ్ళిద్దరి మధ్యా మాటామాటా పెరిగింది. రక్కుతూ, గిచ్చుతూ బాహా బాహీ పోట్లాటకు దిగారు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు కొట్టుకుంటూ, తిట్టుకుంటూ ఉంటే, విజయ చంద్రుడు గుట్టుచప్పుడు కాకుండా మూలికలతో అక్కడి నుంచి తప్పించుకున్నాడు. సాయంకాలానికి నేత్రసంజీవని మూలికలతో తిరిగి వచ్చిన శిష్యుణ్ణి చూసి చింతామణి ఎంతగానో సంతోషించాడు. ‘‘ధైర్యం ఉంటేనే తెలివితేటలు ఉపయోగపడగలవని చక్కగా నిరూపించావు నాయనా. నీ సమయస్ఫూర్తి బహుధా ప్రశంసనీయం. నీ పాటి ధైర్యం లేకే ఇన్నాళ్ళు ఆ మూలికను సంపాదించలేక పోయాను. నీ ఉపకార బుద్ధి వల్ల ఇక్కడి ప్రజల కళ్ళ జబ్బులు తప్పక తొలగిపోగలవు. ఆయుష్మాన్‌ భవ!'' అంటూ ఆయన శిష్యుణ్ణి దీవించాడు.

తండ్రి నేర్పిన పాఠం

రామనాధం గొప్ప ధనవంతుడు. ఆయనకు  చుట్టుప్రక్కల    పట్టణాల్లో కర్మాగారాలు, వ్యాపారాలున్నాయి.  వాటి నుండి  మంచి  లాభాలను గడిస్తున్నాడు.   కొన్ని వ్యాపారాలను  సొంతంగా చూసుకుంటూ.  దూరప్రాంతాలలో వాటికి  నమ్మకస్తులైన అధికారులను  నియమించి  పర్యవేక్షిస్తూ వ్యాపారాలను నడిపేవాడు.  రామనాధంకి  విశ్వనాథం ఒక్కడే  కొడుకు. అతడు గురుకులంలో ఉన్నత  విద్య  పూర్తి చేసి  ఇంటికి వచ్చాడు. తెలివైనవాడిగా  గురు ప్రశంసలు పొందినవాడే విశ్వనాథం.   ఒకరోజు తండ్రీ కొడుకులు భోజనం చేస్తూ మాటల మధ్యన     ‘ఇంకా చదవాల్సింది ఉందా? చదువయ్యాక ఉద్యోగం చేస్తావా ? వ్యాపారంలోకి వస్తావా’ అని కొడుకుని రామనాధం  అడిగాడు.  తన చదువు పూర్తయిందనీ , ఎక్కడా ఉద్యోగం చెయ్యాలని లేదనీ, తండ్రి దగ్గర మెళకువలు నేర్చుకుని వ్యాపారంలో   స్థిరపడతానని  చెప్పాడు విశ్వనాథం.   రామనాధం సంతోషించి “నీకు నచ్చినట్టే చెయ్యు. ఒక్కడినే ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్వహించడం  కష్టంగా ఉంది. ఇకనుంచైనా నీ  సాయం దొరికితే చాలు” అన్నాడు.  ఒకరోజు రామనాధం కొడుకుని  పిలిచి “మన వ్యాపారం ఎలా జరుగుతుందో  నువ్వు  చూడాలి . మనం నియమించిన నమ్మకస్తులైన అధికారుల   పర్యవేక్షణలో పని నడుస్తోంది కొన్ని చోట్ల . అలాంటి  దగ్గరకు  నువ్వెళ్ళి పరిశీలించు. కొత్త  విషయాలు తెలుసుకో. ఏవైనా సందేహాలుంటే అడిగి తీర్చుకో . నాతోనే చెప్పాల్సినవైతే వచ్చి అడిగితే తీరుస్తాను.  ఈ  రోజుకి నూనె మిల్లుకు వెళ్ళు” అని పంపాడు.    విశ్వనాథం తండ్రి చెప్పినట్టే వెళ్ళాడు.  రెండోరోజు  ధాన్యం మిల్లుకు, మూడోరోజున  బెల్లం తయారీ కేంద్రానికి, నాలుగవ రోజున  వస్త్రాల తయారీ  మిల్లుకు వెళ్ళాడు.   నాలుగు రోజుల తరువాత తండ్రీ కొడుకులు  కలసి కూర్చున్నప్పుడు “నువ్వేమి గమనించావో చెప్పు” అనడిగాడు రామనాధం.   “మన కర్మాగారాల్లో పనివాళ్ళకి స్వేచ్ఛ ఎక్కువైంది.  వాళ్ళలో కొన్ని లోపాలు కనిపించాయి. అలాంటివి మనం సహించకూడదు.  వారిలాంటి పని దొంగలతో కఠినంగా వ్యవహరించాలి”  అన్నాడు విశ్వనాథం.   అతడు ఏయే లోపాలు గమనించాడో   చెప్పమన్నాడు  రామనాధం.   ‘కొందరు పనివాళ్ళు పని వేళల్లో  విశ్రాంతి తీసుకుంటూ కనిపించారు.  అక్కడి అధికారులు వాళ్ళనేమీ మందలించడం  లేదు. ఆడవాళ్లయితే   పిల్లలను మిల్లుకే తెచ్చి  ఉయ్యాలలో ఆడిస్తున్నారు. మరికొందరైతే సరుకులు కొనాలనో, సొంత పని చూసుకుని వస్తామనో  పని మధ్యలో బయటకు వెళ్లి వస్తున్నారు. గరిసెల కొద్దీ ధాన్యం బయట ఆరబోసినా వర్షం వస్తుందనే  బెరుకు ఎవరిలోనూ కనిపించలేదు. చెరకు మిల్లులో కూడా కొన్ని సరకులు వృధాగా పారబోశారు. ఇలా చాలానే  కనిపించాయి” అన్నాడు విశ్వనాథం.    కొడుకు చెప్పింది విన్న తరువాత “  అంతేనా?”అన్నాడు రామనాధం తేలిగ్గా.   “అదేంటి నాన్నా. తేలిగ్గా తీసేసావు? అలాగయితే మనకు నష్టం రాదా?” అనడిగాడు విశ్వనాథం చిరాకుగా ముఖం పెట్టి.  రామనాధం చిన్నగా   నవ్వి “మనం కొన్ని విషయాలను  చూసీ చూడనట్లు వదిలెయ్యాలి. ఉద్యోగులు, కార్మికులకూ   కుటుంబం, సమస్యలు, ఒత్తిడి, అప్పులు, అవసరాలు, బాధ్యతలు  ఉంటాయి. మన మిల్లుకి పనికి హాజరు కాని రోజున  వారికి జీతం ఇవ్వము. అలాంటప్పుడు భుక్తి గడవదు. అందుకే పని వేళల్లో  కొన్ని బయటి పనులు పూర్తి చేస్తారు. విశ్రాంతి తీసుకుంటూ నీకు కనిపించిన వాళ్లంతా సంఘ నాయకులు.  ఉద్యోగుల శ్రేయస్సు  కోసం    శ్రమించే వారికి ఆ మాత్రం వెసులుబాటు ఇవ్వాలి. వాళ్లతో తగువు పెట్టుకోవడం మంచిది కాదు. కొన్ని సరకులు వృధా జరగడం మన దగ్గరే కాదు అన్ని  కర్మాగారాల్లో , పని ప్రదేశాల్లో జరుగుతుంది. దాన్ని  తరుగుదలగా భావిస్తాం.  అదసలు పట్టించుకోవద్దు. ధాన్యం కుప్పలు బయట ఉంచినా వాళ్ళెవరూ భయపడలేదంటే  ఋతువుల గమనం వాళ్లకు తెలుసుననీ, వర్షం ఇప్పట్లో కురియదనే నమ్మకంతో అలా వదిలేసారు. ఇన్నేళ్లూ మన  వ్యాపారంలో   లాభాలు గడిస్తున్నామంటే   ఆయా  ఉద్యోగులు, కార్మికుల  పనితనం వల్లనే.  ఇలాంటి సందర్భాల్లో  పెద్దలు  చెప్పిన ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి.   ‘యజమానివైతే కొన్ని సందర్భాలలో చూడనట్లు నటించాలి. సేవకుడైతే చెవిటివానిలా నటించాలి. అది ఇక్కడ మనకూ వర్తిస్తుంది.  సందర్భాన్ని బట్టి  ప్రవర్తించు. అన్ని వేళలా కరకుదనం పనికిరాదు. లౌక్యం అలవరచుకో” అన్నాడు.  విశ్వనాథానికి   విషయం బోధపడింది.  తరువాత కాలంలో తండ్రి బాటలోనే నడుస్తూ  వ్యాపారాలను లాభాల్లో  నడిపించాడు.

వందకు ఒకటి తక్కువ! (చందమామ కథ)

చందన్‌, నందన్‌ ఇరుగుపొరుగున నివసించేవారు. చందన్‌ ధనిక వర్తకుడు. కాని నందన్‌ పొద్దున లేచి వెళ్ళి కాయకష్టం చేస్తే తప్ప పూట గడవని పేదవాడు. చందన్‌కు అన్నిసంపదలూ ఉన్నప్పటికీ అవసరాలకు మించి దమ్మిడీ ఖర్చు పెట్టడు. వాళ్ళ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. నందన్‌ భార్య చారుమతికి బంధుమిత్రులంటే మహా ప్రీతి. అందువల్ల తరచూ వాళ్ళ ఇల్లు బంధుమిత్రులతో, అతిథులతో కళకళలాడుతూ ఉండేది. అతిథులకని ఆమె ప్రత్యేక వంటలు తయూరు చేసేది కాదు. కాని ఆమె చేసిన వంటలను అందరూ ఇష్టపడి తినేవారు. నందన్‌ ఇంట్లో బంధుమిత్రుల సందడి, వాళ్ళు భోజనం చేసేప్పుడు చెప్పుకునే ఉత్సాహపు కబుర్లు విని పొరుగున ఉన్న చందన్‌, అతడి భార్య పరమేశ్వరి ఆశ్చర్యపడేవారు. నందన్‌ సంపాదించే తక్కువ డబ్బులతో వాళ్ళెలా అతిథులకు భోజనాలు పెట్టగలుగుతున్నారా అని విస్తుపోయేవారు. పరమేశ్వరి, చారుమతి కూడా మంచి మిత్రులు. చారుమతి, ఆమె భర్త తక్కువ ఆదాయంతో అంత హాయిగా బంధుమిత్రులతో ఎలా జీవించ గలుగుతున్నారో తెలుసుకోవాలనే ఉత్సాహం పరమేశ్వరిలో కలిగింది. ఒకనాడు మాటల సందర్భంలో ఆ విషయం ప్రస్తావించింది. ఆ మాట వినగానే చారుమతి చిన్నగా నవ్వి, ‘‘మా ఆయన వేళకు అంతమంది అతిథులను ఎలా పిలుచుకు వస్తాడో నిజానికి నాకూ తెలియదు. ఉన్నట్టుండి భోజనానికి ఎంత మంది వస్తున్నారో చెబుతాడు. ఇంట్లో ఉన్నవాటితో వంట సిద్ధం చేస్తాను. అంతే. అంతకు మించి నాకేమీ తెలియదు. బహుశా తెలివైన వర్తకుడు గనక, మీ ఆయనే నీ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పగలడనుకుంటాను,'' అన్నది. పరమేశ్వరి కొన్ని రోజులు ఆగి సరైన సమయం చూసి తనకూ, చారుమతికీ మధ్య జరిగిన సంభాషణ గురించి భర్తకు చెప్పింది. ఆమె ప్రశ్నకు సమాధానం తెలిసిన వాడిలా నవ్విన చందన్‌, ‘‘నీ స్నేహితురాలికీ, ఆమె భర్తకూ తొంభై తొమ్మిది శక్తి అనుభవం లేదు గనక, నిశ్చింతగా హాయిగా బతికేస్తున్నారు. ఒక్కసారి ఆ అనుభవం కలిగితే చాలు. వాళ్ళ జీవన విధానమే ఎదురు చూడనంతగా మారిపోగలదు,'' అన్నాడు. ‘‘తొంభై తొమ్మిది శక్తి అనుభవమా? ఏమిటండీ అది?'' అని అడిగింది పరమేశ్వరి విస్మయంతో. ‘‘ఇప్పుడు దాన్ని అంత సులభంగా వివరించడానికి లేదు. అయితే, ఏం జరుగుతుందో చూసి త్వరలో నువ్వే గ్రహించగలవు,'' అంటూ ఆ విషయాన్ని అంతటితో ముగించాడు చందన్‌. మహేశ్వరి ఆ తరవాత కొన్నాళ్ళ పాటు పొరుగింటి భార్యాభర్తలను గురించి ఆలోచించడం మానేసింది. అయితే, కొన్నాళ్ళుగా పక్కఇంటి నుంచి అతిథుల సందడి తగ్గిపోవడం గమనించి ఆశ్చర్యపోయింది. పైగా, భార్యా భర్తలు ఎప్పుడు చూసినా తుంగ చాపలు అల్లడంలో నిమగ్నులై కనిపించారు. అంటే ఎక్కువ డబ్బు సంపాదించాలనే కోరిక వారిలో వేళ్ళూనిందన్న మాట. ఇవన్నీ ఆలోచిస్తూంటే మహేశ్వరి మనసు ఊరుకోవడం లేదు. మామూలుగా మధ్యాహ్న సమయంలో పిచ్చాపాటీ మాట్లాడడానికి వచ్చే చారుమతి ఇప్పుడు రావడం మానేసింది. ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఉత్సుకతతో, చందన్‌ లేని సమయం చూసి ఒక నాటి మధ్యాహ్నం వేళ ఆమె చారుమతిని చూడడానికి వెళ్ళింది. పరమేశ్వరిని చూడగానే చారుమతి లేచివచ్చి ఆప్యాయంగా పలకరించి, తీసుకు వెళ్ళి పక్కన కూర్చోబెట్టుకుని చాప అల్లుతూ మాట్లాడసాగింది. కుశల ప్రశ్నలు అయ్యాక, ‘‘అవునూ, మా ఇంటికి రావడం సాంతం మానేశావేమిటి చారుమతీ? నువ్వూ, మీ ఆయనా ఎప్పుడు చూసినా చాపలల్లుతూ ఉన్నారు కదా! మీ ఆయనకు బయట పనులు దొరకడం లేదా ఏం?'' అని అడిగింది పరమేశ్వరి. చారుమతి తలెత్తి, ‘‘అదేం లేదు పరమేశ్వరీ. నేనూ, మా ఆయనా మా జీవన విధానాన్ని మార్చుకో వాలనుకున్నాం. అంతే,'' అన్నది. పరమేశ్వరి ఆమె మాటలు నమ్మలేకపోయింది. ఆమె తన నుంచి ఏదో దాచడానికి ప్రయత్నిస్తున్నట్టు అనుమానించింది. ‘‘నేనిలా అడుగుతున్నందుకు అపార్థం చేసుకోకు. డబ్బులకు ఇబ్బందిగా ఉంటే చెప్పు, ఇస్తాను. మీ కష్టాలు తీరడానికి నేను సాయపడతాను. ఆ సంగతి మా ఆయనకు తెలియనివ్వను. నువ్వూ మీ ఆయనకు చెప్పనవసరం లేదు,'' అన్నది ఆప్యాయంగా. తన స్నేహితురాలి నుంచి అంతటి కనికరాన్ని ఎదురుచూడని చారుమతి, ‘‘అలాంటిదేం లేదు, మహేశ్వరీ. మా ఆయనకు కావలసినంత పని దొరుకుతోంది. పైగా, తన సంపాదనను మరింత పెంచుకోవాలనుకుంటున్నాడు,'' అన్నది. ‘‘ఎందుకని? ఆ అవసరం ఎందుకు వచ్చింది?'' అని అడిగింది పరమేశ్వరి. చారుమతి ఆ మాట విని కొంతసేపు మౌనంగా ఆలోచించి, ‘‘సరే, ఆ సంగతి నీకు చెబుతాను. అయితే, దాన్ని నువ్వు మీ ఆయనకు కూడా చెప్పకూడదు. సరేనా,'' అన్నది. ‘‘చెప్పను. నిజం!'' అన్నది పరమేశ్వరి. ‘‘కొన్నాళ్ళ క్రితం మా ఆయన పనికి వెళ్ళి తిరిగివస్తూ మా ఇంటి గుమ్మం ముందు మూతి బిగువుగా కట్టిన చిన్న సంచీని చూశాడు. దాన్ని తీసుకుని లోపలికి వచ్చి కిటికీ దగ్గర పెడుతూండగా గలగలమని నాణాల శబ్దం వినిపించింది. మా ఆయన సంచీ మూతివిప్పి నాణాలను నేలపై కుమ్మరించాడు. అవి నిగనిగలాడే వెండి నాణాలు. లెక్కపెడితే తొంభైతొమ్మిది నాణాలున్నాయి. మళ్ళీ లెక్కపెట్టాడు. ‘చారుమతీ, మొత్తం ఎన్ని ఉన్నాయో చూడు,' అంటూ నన్ను పిలిచాడు. నేను లెక్కపెట్టినా తొంభైతొమ్మిదే ఉన్నాయి. ‘వందకు ఒక్కనాణెం ఎందుకు తగ్గుతున్నది?' అని నన్ను అడిగాడు. ‘ఎందుకు తగ్గింది? ఎందుకు ఒక నాణెం తక్కువ? అని కొంత సేపు తర్జన భర్జన పడ్డ మా ఆయన హఠాత్తుగా ‘ఏం చేయాలో నాకు తెలుసు,' అంటూ ఆ రోజు తను సంపాదించిన దానిలో నుంచి ఒక నాణెం తీసి ఆ సంచీలో వేసి, మూతి బిగించి, పక్కన పెట్టాడు,'' అన్నది చారుమతి. ‘‘ఆ తరవాత ఏమయింది?'' అని అడిగింది పరమేశ్వరి. ‘‘ ఆ తరవాత మా ఆయన రోజూ ఒక నాణాన్ని సంచీలో వేయాలని నిర్ణయించాడు. ఆ క్షణమే పొదుపు చేయడం ప్రారంభించాం. కొన్ని రోజులు పనికి వెళ్ళ కుండా ఇంటి పట్టునే ఉండి చాపలల్లడం మొదలు పెట్టాడు. ఆ విధంగా మరింత ఆదాయం రాసాగింది. దాన్ని సంచీలోని నాణాలతో చేర్చసాగాము,'' అని ఆగింది చారుమతి. ‘‘బావుంది కానీ, మీ బంధుమిత్రుల హడావుడి ఇప్పుడు కొన్నాళ్ళుగా కనిపించడం లేదే! వాళ్ళకేమయింది?'' అని అడిగింది పరమేశ్వరి. ‘‘అదా! వాళ్ళిప్పుడు మా ఇంటికి రావడం లేదు.అందుకు కారణం మేము వారిని పిలవకపోవడం కాదు. కొందరు ఊరు వదిలి వెళ్ళారు. మరి కొందరు మేము ఎప్పుడూ పనుల మీద ఉండడం చూసి ఇటువైపు రావడం తగ్గించారు,'' అన్నది చారుమతి. ‘తొంభైతొమ్మిది' తమ పొరుగు కుటుంబంలో ఎలాంటి మార్పు తీసుకువచ్చిందో పరమేశ్వరికి ఇప్పుడు అర్థమయింది. అయినా, ఆమె తన స్నేహితురాలికి ఇచ్చిన మాటను నిలుపుకుని, ఆ సంగతిని తన భర్తకు చెప్పలేదు. అయినా, అదృష్టవశాత్తు ఆమె భర్తకు పొరుగింటి వారిని గురించి ఆలోచించేటంతటి తీరిక సమయం లేదు. తెలివైనవాడు గనక-తమ పొరుగువారి జీవన విధానంలో మార్పు రావడానికి తనే బాధ్యుడన్న రహస్యాన్ని బయటపెట్ట కూడదని నిర్ణయించాడు. చందన్‌ నందన్‌ మంచి మిత్రులుగా కొనసాగారు. చందన్‌ దాచిన రహస్యం ఏమిటో మీరు ఊహించగలరా?

అమ్మకు కనువిప్పు

అమ్మా !  కొట్టవద్దే   తట్టుకోలేక పోతున్నా.  ఆపవే  అమ్మా   రేపటి నుంచి బాగా చదువుతాను.  నువ్వు చెప్పినట్లే వింటాను   నిద్రలోనే  సునీల్ కలవరిస్తుంటే గభాలున లేచి వాడి దగ్గరకు వెళ్ళాడు రాంబాబు.    “ఏడవకు నాన్న . ఏం భయం లేదు”   కొడుకు పక్కనే కూర్చుని కూర్చొని తల నిమరాడు రాంబాబు.   రాంబాబు ఒక ప్రైవేటు ఉద్యోగి . అతడి భార్య సరోజ.  వారికి ఇద్దరు పిల్లలు.  అబ్బాయి సునీల్ పదో తరగతి చదువుతున్నాడు.  అమ్మాయి ఇందిర ఎనిమిదో తరగతి చదువుతోంది.   సమస్య ఏమిటంటే సునీల్ చదువులో వెనుకబడ్డాడు . పరీక్షలలో కొన్ని సబ్జెక్టులలో ఫెయిల్ మార్కులు వస్తున్నాయి.  వాడు ఎంత కష్టపడి చదువుతున్నా గుర్తుండడం లేదని,  పరీక్షలలో రాయలేకపోతున్నానని చెబుతున్నాడు.   కొడుకు సునీల్ కి పరీక్షలలో తక్కువ మార్కులు  రావడం సరోజకి అస్సలు నచ్చడం లేదు . ఈ విషయమై విపరీతంగా బాధపడిపోతోంది.  రోజూ  సునీల్ దగ్గరే కూర్చొని చదివించడానికి నానా తండాలు పడుతోంది.  వాడిని చితకబాదుతోంది . అయినా వాడికి చదివేదేమీ  బుర్ర కెక్కడం లేదు.   దీంతో సరోజ ప్రతిరోజు సునీల్ ని కొట్టడం,  తిట్టడం చేయకుండా ఉండటం లేదు.  సునీల్ అయితే వాళ్ళమ్మని చూస్తే చాలు ఒణికి పోతున్నాడు. సరోజలో రోజురోజుకు కోపం పెరిగిపోయి కొడుకుని శత్రువులా  చూడడం మొదలుపెట్టింది.   అదే స్కూల్లో సునీల్ తో బాటే చదివే పిల్లలు తమ దొడ్లోంచి వెళుతుంటే వారికి సునీల్ కంటే మంచి మార్కులు వచ్చాయని తెలిస్తే ఆ రోజు పూనకం వచ్చినట్లు ఊగిపోతోంది. కొడుకని కూడా చూడకుండా శాపనార్థాలు పెట్టడం మొదలుపెడుతుంది.   అందుకే సునీల్ నిద్రలో కూడా తల్లి కొట్టే దెబ్బలు గుర్తొచ్చి భయంతో కలవరిస్తున్నాడు.  రాంబాబుకి కొడుకు పరిస్థితి చూస్తే జాలేసింది.   మర్నాడు ఉదయం భార్యతో “ఎందుకు వాడిని గొడ్డును బాదినట్లు బాదుతావు ? వాడు జడుసుకుని నిద్రలో కలవరిస్తున్నాడు.  నువ్వలాగే కొడుతూ పోతుంటే చదువు మాట దేవుడెరుగు..  వాడేదైనా అఘాయిత్యం చేసుకుంటాడేమోనని భయంగా ఉంది”  అన్నాడు.   సరోజ రాంబాబు మీదకు గయ్ మని లేచింది. “ తమరు అంతంత మాత్రం చదవబట్టే అలాంటి ఉద్యోగం తగలడింది.  వీడిని సరైన దారిలో పెట్టకపోతే పెద్దయితే మీలాగే పనికిమాలిన ఉద్యోగం వస్తుంది” అంటూ నోరు మూయించింది.   రాంబాబుని  ఈ విషయాలు కల్లోల పరిచాయి. వాటినే   మనసులో పెట్టుకొని ఆఫీసులో సరిగ్గా పని చేయలేకపోయాడు . అది గమనించిన స్నేహితుడు రమణ విషయం ఏమిటని రాంబాబుని అడిగాడు.   ఇంట్లో కొడుకు  చదువు విషయం,  తన భార్య  వాడిని  దండిస్తున్న విషయం   పూసగుచ్చినట్టు  చెప్పాడు రాంబాబు . అంతా విన్న రమణ కాసేపు ఆలోచన చేశాడు. “మీ ఆవిడకు ఎవరంటే గురి ఉందో వారి చేత ఆమె చేస్తున్న పని తప్పు అని చెప్పించు. తప్పకుండా దారిలోకి వస్తుంది. మీ కొడుక్కి దెబ్బలు తప్పుతాయి” అని   సలహా ఇచ్చాడు .    రాంబాబుకి వెంటనే  ఒక విషయం గుర్తొచ్చింది. సరోజ ప్రతి గురువారం షిరిడి సాయి మందిరానికి వెళ్లి బోధనలు వింటుందని, అక్కడి  గురువు గారు చెప్పే మంచి మాటలు ఆసక్తిగా విని వాటిని ఆచరణలో పెడుతుందని.   అంతే!  రాంబాబు  ఆ సాయంత్రమే షిరిడి  మందిరానికి వెళ్లి  గురువు గారిని కలుసుకున్నాడు.  తానెందుకు వచ్చాడో చెప్పాడు. ఆ సమస్యను పరిష్కరించమన్నాడు.   “ నాయనా ! నీ భార్య  వచ్చినప్పుడు మాట్లాడతాను.  ఆందోళన పడవద్దు”  అని చెప్పి దీవించి పంపించాడు గురువుగారు.   గురువారం రానే  వచ్చింది . సరోజ షిరిడి సాయి మందిరానికి వెళ్ళింది . సాయి దర్శనం చేసుకున్న తరువాత  గురువుగారితో “మా అబ్బాయి బాగా చదవడం లేదు . వాడు చెడిపోతాడని భయంగా ఉంది”  అని తన బాధను ఆయనతో పంచుకుంది.  గురువు గారికి  వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు,  పని  మరీ సులువైంది.   “అమ్మా! చదువుల విషయంలో చాలామంది తల్లిదండ్రులు పిల్లలను తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు.  పిల్లల చదువుల విషయంలో వారు తీసుకునే  శ్రద్ధ ఒక్కోసారి అనర్ధాలకు   దారి తీస్తోంది.  ఒకే వయసు ఉన్న పిల్లలందరికీ ఒకే రకమైన తెలివితేటలు ఉండవు.  తాము ఆశించిన ఫలితాలు పిల్లల నుంచి పొందాలనుకోవడం అత్యాశ అవుతుంది.  పిల్లలను భయపెట్టడం , కొట్టడం, ఒత్తిడి  తీసుకురావడం వల్ల వారు బాగా చదువుతారని,  మంచి మార్కులు సాధించగలరని అనుకోవడం పొరపాటు.  వారి తెలివితేటలకు తగ్గట్టే మార్కులు వస్తాయి.  వారికి గుర్తింపును,  ప్రోత్సాహాన్ని ఇవ్వాలే తప్ప దండించడం వల్ల ప్రయోజనం ఉండదు. పిల్లలపై అతిగా ఒత్తిడి తెస్తే వారికి చదువుపై అయిష్టత ఏర్పడే అవకాశం ఉంది.  వారికి జీవితంపై విరక్తి కూడా కలగవచ్చు.  జీవించడానికి చదువు అవసరమే.  కానీ చదివే జీవితం కాదు.  చదువు లేని వారు,  చదువులో వెనుకబడిన వారు ఎందరో జీవితంలో విజయాలు సాధించారు . ముందుగా నీ ఆలోచన విధానంలో మార్పు రావాలి . అంతకంటే  ముందు మీ అబ్బాయిని ప్రేమగా చూడడం అలవాటు చేసుకో. ఫలితం సంగతి దేవుడెరుగు  నీ కొడుకు బెంగతో అనారోగ్యం పాలవకుండా కాపాడుకో”  అని బోధించారు.   గురువు గారి మాటలతో సరోజకు కనువిప్పు కలిగింది.  సునీల్  విషయంలోతానింతవరకు ప్రవర్తించిన తీరుకు సిగ్గు పడింది. “ అయ్యో పాపం పసివాడి మనసు ఎంత గాయపడి ఉంటుందో. వాడిని సముదాయించాలి”  అనుకుని ఇంటికి బయల్దేరింది.  ఆ రోజు నుండి సునీల్ పట్ల ఆమె తీరే మారిపోయింది.