గౌరముఖుడి వృత్తాంతం!

కృతయుగంలో సుప్రతీకుడు అనే రాజు ఉండేవాడు. అతడికి ఇద్దరు భార్యలు. వారికి ఎప్పటికీ సంతానం కలగకపోవడంతో సుప్రతీకుడు చిత్రకూట పర్వతంపై ఆశ్రమం ఏర్పరచుకున్న ఆత్రేయ మహర్షిని ఆశ్రయించి, ఆయన అనుగ్రహంతో దుర్జయుడనే పుత్రుణ్ణి పొందాడు. దుర్జయుడు అమిత బలవంతుడు. అపార సేనాసంపత్తితో దిగ్విజయయాత్రకు వెళ్లి, సమస్త భూమండలాన్ని తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. తర్వాత అష్టదిక్పాలకులను జయించి, విజయగర్వంతో తన రాజ్యానికి తిరిగి బయలుదేరాడు. దారిలో గౌరముఖుడు అనే మహర్షి ఆశ్రమం కనిపించింది. దుర్జయుడు తన సేనలను వెలుపలే నిలిపి, తానొక్కడే ఆశ్రమంలోకి వెళ్లాడు. గౌరముఖుడికి నమస్కరించి, ఆశీర్వచనం కోరాడు. గౌరముఖుడు రాజైన దుర్జయుడికి ఆశీర్వచనం పలికి, అతడికి, అతడి సైన్యానికి ఆతిథ్యం ఇస్తానన్నాడు. దుర్జయుడు ఆశ్చర్యపోయాడు. తనకు, లక్షలాదిమంది తన సైనికులకు ఈ ఒంటరి ముని ఎలా ఆహారం పెట్టగలడా అని ఆలోచించాడు. ఇంతలో గౌరముఖుడు సంధ్యావందనం ముగించుకుని వస్తానంటూ దగ్గరే ఉన్న గంగానదికి వెళ్లాడు. గంగలో నిలిచి ఆశువుగా శ్రీమన్నారాయణుడిని స్తుతిస్తూ స్తోత్రం పలికాడు. గౌరముఖుడి స్తోత్రం పూర్తి కాగానే, అతడి భక్తిప్రపత్తులకు అమిత ప్రసన్నుడైన శ్రీమన్నారాయణుడు శంఖ చక్ర గదాధారిగా ప్రత్యక్షమయ్యాడు. పీతాంబరాలతో దేదీప్యమానంగా మెరిసిపోతున్న స్వామిని చూసి గౌరముఖుడు పులకించిపోయాడు. ‘వత్సా! ఏమి కోరిక’ అడిగాడు శ్రీమన్నారాయణుడు. ‘స్వామీ! నా ఆశ్రమానికి రాజు దుర్జయుడు, అతడి పరివారం వచ్చారు. వారికి ఆతిథ్యమిస్తానని మాట ఇచ్చాను. వారందరికీ భోజనం పెట్టగలిగేలా నాకు వరమివ్వు చాలు’ అని కోరాడు గౌరముఖుడు. నారాయణుడు అతడికి ఒక దివ్యమణిని ప్రసాదించి, ‘ఈ మణి నువ్వు కోరినవన్నీ ఇస్తుంది’ అని పలికి అదృశ్యమయ్యాడు. నారాయణుడు ప్రసాదించిన మణితో గౌరముఖుడు తన ఆశ్రమం ఎదుటనే ఇంద్రలోకాన్ని తలపించే మహానగరాన్ని సృష్టించాడు. అందులో రాజు దుర్జయుడికి, అతడి పరివారానికి విలాసవంతమైన విడిది ఏర్పాటు చేశాడు. వారంతా ఆనందంగా ఆ నగరంలోకి ప్రవేశించారు. వారికి సేవలందించడానికి దాసదాసీ జనాన్ని సృష్టించాడు. వారందరికీ షడ్రసోపేతమైన మృష్టాన్న భోజనాన్ని ఏర్పాటు చేశాడు. దుర్జయుడు, అతడి పరివారం సుష్టుగా భోజనం చేసి, వారికి ఏర్పాటు చేసిన విడిది మందిరాల్లో హాయిగా విశ్రమించారు. మర్నాడు ఉదయం అందరూ నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని, స్నానానికి గంగానదికి వెళ్లారు. వారంతా స్నానాలు చేసి తిరిగి వచ్చేసరికి, అంతకుముందు వరకు ఉన్న నగరం లేదు. అందులోని దాసదాసీ జనం ఎవరూ లేరు. కేవలం గౌరముఖుడి ఆశ్రమం మాత్రమే యథాతథంగా ఉంది. దుర్జయుడు, అతడి పరివారం గౌరముఖుడి దివ్యశక్తికి అమితాశ్చర్యం చెందారు.రాజు దుర్జయుడు, అతడి పరివారం గౌరముఖుడి వద్ద వీడ్కోలు తీసుకుని బయలుదేరారు. కొంత దూరం సాగాక దుర్జయుడు, అతడి పరివారం అటవీమార్గంలో కొద్దిసేపు విశ్రాంతి కోసం ఆగారు. అప్పుడు దుర్జయుడికి ఒక దురాలోచన వచ్చింది. ఆశ్రమంగా పర్ణశాల తప్ప మరేమీ లేని బడుగు ముని అయిన గౌరముఖుడు తనకు, తన సమస్త పరివారానికి రాజోచితమైన ఆతిథ్యం ఎలా ఇచ్చాడో అతడికి అంతుచిక్కని రహస్యంగా మిగిలింది. వెంటనే వేగులను పిలిచి, ‘మనందరికీ ఆ ముని గౌరముఖుడు ఎలా ఆతిథ్యం ఇవ్వగలిగాడు? దీని వెనుకనున్న మర్మమేమిటి? ఇందులో ఏదైనా మంత్ర మహిమా ప్రభావం ఉందా? అసలు రహస్యాన్ని తెలుసుకుని రండి’ అని పురమాయించి పంపాడు. రాజాజ్ఞ కావడంతో వేగులు హుటాహుటిన గౌరముఖుడి ఆశ్రమంవైపు బయలుదేరారు. వారు మాటు వేసి గౌరముఖుడి వద్ద ఉన్న మణి మహిమను తెలుసుకున్నారు. తిరిగి వచ్చి, రాజుకు అదే సంగతి చెప్పారు. ‘ఒంటరిగా తపస్సు చేసుకునే మునికి ఎందుకు అంతటి దివ్యమణి? అలాంటిది నావంటి రాజు వద్ద ఉండటమే సమంజసం. ఆ మణిని నాకు ఇవ్వగలడేమో కనుక్కుని రండి’ అంటూ దుర్జయుడు తన భటులను పంపాడు. వారు గౌరముఖుడి వద్దకు వెళ్లి, తమ రాజు ఆ మణిని కోరుతున్న సంగతి చెప్పాడు. గౌరముఖుడు ఆ మణిని ఇవ్వడానికి నిరాకరించాడు. భటులు వెనుదిరిగి, ఈ సంగతిని రాజుకు నివేదించారు. గౌరముఖుడు తన కోరికను కాదనడంతో దుర్జయుడికి పట్టరాని కోపం వచ్చింది. వెంటనే సైన్యాన్ని తీసుకుని గౌరముఖుడి ఆశ్రమాన్ని ముట్టడించాడు. దుర్జయుడు సైన్యంతో వస్తుండటం చూసి, గౌరముఖుడు మణిని చేతిలోకి తీసుకుని శ్రీమన్నారాయణుడిని స్మరించుకున్నాడు. రాజు వల్ల, అతడి సైన్యం వల్ల ఆపదను పోగొట్టాలని ప్రార్థించాడు. ఒక్కసారిగా మణి నుంచి వేలాదిగా సాయుధ సైనికులు ఉద్భవించారు. వారు దుర్జయుడి సైన్యాన్ని ఎదుర్కొని, చంపిన వాళ్లను చంపి, మిగిలినవాళ్లను తరిమికొట్టారు. కొంత సమయం తర్వాత గౌరముఖుడు యుద్ధరంగానికి వెళ్లి, అక్కడే కూర్చుని శ్రీమన్నారాయణుడిని ప్రార్థించాడు. ఆయన ప్రత్యక్షమవగానే, దుర్జయుడి ఆగడాన్ని నివారించమని కోరాడు. శ్రీమన్నారాయణుడు తన చక్రాయుధాన్ని ప్రయోగించి, దుర్జయుడి శిరసును ఖండించాడు.

కథకుడిగా తిలక్ ఫెయిలా? ఏమో!

పార్వతీపురంలో, మా ఇంటి ఎదురుగా రచయిత పంతులజోగారావుగారు ఉండేవారు. ఆనాటికే ఆయన పేరున్న రచయిత. నేనింకా రచనలో ఓనమాలు ఇసుకలో దిద్దుతున్న రోజులవి. ఒకనాడు ఆయన్ని పరిచయంచేసుకుని, కొత్తగా నేను రాసిన కవిత ఒకటి వినిపించాను. విని, నవ్వారాయన.    ‘‘ఏదైనా వ్రాయడానికి ముందు చదవడం అలవాటుచేసుకుంటే బాగుంటుంది. నువ్వేం చదివావు?’’ అడిగారు.   ఏమీ చదవలేదన్నాను.   ‘‘రా’’ అన్నారు. తోడుకునివెళ్ళి, తనరూంలో ఇనప్పెట్టెలాంటి పుస్తకాల అరలోంచి ఓ పుస్తకం తీసి, ఇచ్చారు.   ‘‘ఇది ముందు చదువు. చదివి, నా పుస్తకం నాకు తిరిగిస్తే నీకు మరో పుస్తకం ఇస్తాను. పుస్తకం జాగ్రత్త.’’ అన్నారు.   సరేనని జోగారావుగారిచ్చిన పుస్తకాన్ని భద్రంగా ఇంటికి తెచ్చుకుని తెరిచిచూశాను.   అమృతం కురిసిన రాత్రి  కవితాసంపుటి  దేవరకొండ బాలగంగాధర తిలక్.   పేజీలు తిరగేశాను. ‘నా కవిత్వం’ శీర్షికన తన అక్షరాలు గురించి బలేగా చెప్పుకున్నారాయన.   నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు  నా అక్షరాలు ప్రజాశక్తులు వహించే విజయ ఐరావతాలు  నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు  ఒక్కసారిగా నా శరీరం అంతా చల్లబడిపోయింది. విలవిల్లాడిపోయాను. కాసేపటికి తేరుకున్నాను. అప్పుడనుకున్నాను, ‘ఇదీ కవిత్వం’ అని.   తిలక్ ని నాకు అలా పరిచయంచేశారు జోగారావుగారు.   నాకు తెలిసి, తొలిరోజుల్లో రచయితలంతా కవిత్వాన్నే ఇష్టపడతారు. తర్వాత్తర్వాత వచనం మోజులో పడతారు. అలాగే నేనూ కవిత్వాన్నే ముందు ప్రేమించాను. ఓ అయిదారు కవితలు రాశాను. ఎప్పుడూ కవిగానే బతకాలనుకునేవాణ్ణి.  ‘‘కథలు రాస్తూ కూడా కవిగా బతకొచ్చు. వచనంలోకూడా కవిగా బతికినవాడు తిలక్.’’ అన్నారు జోగారావు.   కథలు కూడా తిలక్ రాశారనిచెప్పి, తన దగ్గర ఆ కథల పుస్తకం లేదన్నారు.   తిలక్ కథలు చదవాలి. ఎక్కడ దొరుకుతాయి? పార్వతీపురంలో వెదకనిచోటులేదు.  నాకెక్కడా ఆ పుస్తకం దొరకలేదు. అప్పుడెవరోచెప్పారు, విజయనగరం హిమాంశుబుక్ డిపో లో ఉన్నదని.   విజయనగరం వెళ్ళాలి. పుస్తకం తెచ్చుకోవాలి అనుకున్నాను. అనుకున్నానుగానీ, విజయనగరం వెళ్ళడం, పుస్తకం కొనుక్కోవడం ఖర్చుతో కూడుకున్న పని. నావల్ల కాలేదు. చాలారోజులు గడచిపోయాయి.   పార్వతీపురంలో ఇంటర్మీడియట్ పూర్తిచేసి, నేను విజయనగరం సంస్కృత కాలేజీలో చేరడానికి ముందు, విజయనగరంలో ‘నవయువక్ మిత్రమండలి’ వారి లైబ్రరీలో లైబ్రరేరియన్ గా జాయినయ్యాను. అక్కడా కూడా తిలక్ కథలకోసం వెదికాను. దొరకలేదు.    హిమాంశు బుక్ డిపోలో ఉంది. కనబడేలాపెట్టి తిలక్ కథలు అమ్మజూపుతున్నారు. రెండుమూడుసార్లు ఆ డిపోకి వెళ్ళి పుస్తకం చేతుల్లోకి తీసుకుని, తృప్తిగా నిమిరానే తప్పా, కొనే స్థోమతలేక వెను తిరిగాను. ఆ రోజుల్లో పాతికో, ముప్పయ్యో దాని ఖరీదు.   లైబ్రరేరియన్ గా మొదటి నెల జీతం అందుకున్నాను. అరవై రూపాయలు ఇచ్చారు. అంతే! అక్కణ్ణుంచి ఎకాఎకీన బుక్ డిపోకి చేరుకుని, తిలక్ కథల పుస్తకం కొన్నాను. వర్షం కురుస్తోంది. పుస్తకం తడిసిపోకుండా, దానిని గుండెల్లో పెట్టుకుని పరుగు పరుగున ఇంటికి వెళ్తున్నాను. పారిస్ కార్నర్ దగ్గర చుట్ట తాగుతూ చాసో కనిపించారు.    ‘‘ఎక్కడికోయ్’’ అని పలకరించారు.  ‘‘ఇంటికి’’ అన్నాను.   ‘‘ఓ కాఫీతాగి పోదూగాని, రా’’ అని గుండెల్లో దాస్తున్న దానిని గమనించి,   ‘‘ఏంటది?’’ అడిగారు.   ‘‘తిలక్ కథలు’’ అన్నాను, చూపించాను.   ‘‘కథకుడిగా తిలక్ ఫైలయ్యా! చదువు, నీకే తెలుస్తుంది.’’ అన్నారు. ఎప్పటినుంచో చదవాలని పొంగిపోతున్న నా ఉత్సాహం మీద గుప్పెడు నీళ్ళు గుమ్మరించారు.    ‘‘రచయితగా నిలదొక్కుకోవాలంటే చదవడం కన్నా పరిశీలన ముఖ్యఁవయ్యా! కవిత్వంకోసం, కథలకోసం క్షణక్షణాన్నీ పరిశీలించాలి. అవి నీ నిత్యజీవితంలోనే ఉంటాయి. నీ జ్ఞాపకాల్లో ఉంటాయి. నిన్ను ప్రేమించేవారిలో, నిన్ను ద్వేషించేవారిలో, పూలతోటలో, శ్మశానంలో ఎక్కడపడితే అక్కడంతటా ఉంటాయి. బస్టాపుల్లో, రైల్వేస్టేషన్లలో, విమానాశ్రయాల్లో కవిత్వమూ, కథలూ జమిలిగా ప్రయాణిస్తూ కనిపిస్తాయి. పరిశీలించి, నువ్వు పలకరించాలంతే! పలకరిస్తే పరవశించిపోతాయి.’’ అని నవ్వారు.   కాఫీ ఇప్పించారు. సిగరెట్ కూడా ఇచ్చారు.   ‘‘కానీ’’ అన్నారు. చుట్ట ఇచ్చారు. సిగరెట్ ముట్టించాను. ఓ గంటసేపు మాట్లాడుకున్నాం.   ‘‘ఆధునికత కవిత్వాన్ని చంపేసిందని అంటారుగానీ, నేనొప్పుకోను.  సంప్రదాయబద్ధంగా వచ్చిన పద్యాలనూ, పాటలనూ మరచిపోవడం ఎవరితరం?  శతాబ్దాలుగా తెలుగునేల కవిత్వాన్ని కౌగలించుకుని ఉంది. ఈ నేలలో వేళ్ళూనిన కవిత్వాన్ని ఎటువంటి ఆధునికతా హానిచెయ్యలేదు. చేసిందని అనుకోవడం పొరపాటు.’’ అన్నారు చాసో.   రాత్రి తొమ్మిదయింది. చాసో ఇంటికి బయల్దేరారు. నేనూ అక్కణ్ణుంచి బయల్దేరి ఇంటికి చేరుకున్నాను. భోజనం చేశానో లేదో గుర్తులేదు. తిలక్ కథలు చదువుతూ కూర్చున్నాను. ఊరిచివరి ఇల్లు, నల్లజెర్లరోడ్డు, ఓడిపోయిన మనిషి, సీతాపతికథ, నిర్మల మొగుడు, దేవుణ్ణి చూసిన వాడు...తిలక్ కథలు చదువుతూ ఉంటే...సముద్రాలకు సముద్రాలే ఇంకుగామారినట్టనిపించింది. రచన పక్షిలాంటిది. దానికి సరిహద్దులులేవనిపించింది. చాసో అభిప్రాయంతో విభేదించాను. తిలక్ కథకుడుగాకూడా పాసే అనుకున్నాను.   తిలక్ కథలూ, కవితలూ కంఠతః పట్టాను. చర్చల్లో, సభల్లో ఎక్కడపడితే అక్కడ అందరికీ వాటిని వినిపింనచడం మొదలెట్టాను. తిలక్ ని తెగ ప్రేమించాను. ఆ ప్రేమతో ‘జ్వాల’ లిఖిత పత్రికను తిలక్ ప్రత్యేక సంచికగా తీర్చిదిద్దాను. ఆ పత్రికను ఓలేటి శ్రీనివాసభాను ముస్తాబుచేస్తే వారి అన్నగారు కీర్తిశేషులు శ్రీ ఓలేటి బుచ్చిబాబుగారు మా ఊరి సీతారామస్వామివారి ఆలయంలో ఆవిష్కరించారు.   నవ్యవార పత్రిక సంపాదక బాధ్యతలు స్వీకరించాక తిలక్ గారి తమ్ముడు శ్రీ దేవరకొండ గంగధరరామారావుగారు మా కార్యాలయానికి ఓసారి వచ్చారు. కబుర్లలోపడ్డప్పుడు అమృతం కురిసిన రాత్రిలోని పద్యాలు నేను అప్పజెబుతూంటే...ఆశ్చర్యపోయారాయన. కళ్ళు చెమర్చుకున్నారు.   ‘‘అన్నయ్య బతికి ఉంటే బాగుండేది. మీరిలా అప్పజెబుతోంటే ఆశ్చర్యపోయేవాడు. వచనకవిత్వాన్ని, అందులోనూ తిలక్ కవిత్వాన్ని ఇలా కంఠస్థం చేసిన వ్యక్తిని మిమ్మల్నే చూశాను.’’ అని నన్నెంతగానో మెచ్చుకున్నారాయన.   ఇప్పుడు ఇదంతా ఎందుకంటే...ప్రతివ్యక్తి జ్ఞాపకం, అది వారి ప్రైవేటు సాహిత్యంట! ఎక్కడో ఎప్పడో చదివాను. అందుకు... -జగన్నాథశర్మ అయలసోమయాజుల

పలుకుబడులు నుడికారాలకు పుట్టిల్లు తెలుగు భాష

తెలుగుజాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్లకు తెలుగే ఒక మూలదనం… తల్లితండ్రి నేర్పినట్టి మాతృ భాషరా… తెలుగు మరిచిపోతే, వాళ్ళని నువ్వు మరిచనట్టేరా… ఈ పాట నిజమే కదా…! మన తెలుగు భాష మన అమ్మ దగ్గర నుండే మనకు మొదలు అవుతుంది. తెలుగువారమైన మనకు మన అమ్మ భాష తెలుగే ఉంటుంది… కాబట్టి అమ్మ దగ్గర నుండే తెలుగులో మాట్లడడం, తెలుగులో వినడం ప్రారంభం అవుతుంది. అందుకే తెలుగు భాష మనకు మాతృభాష… ఎవరి అమ్మవారికే గొప్ప అన్నట్టుగా ఎవరి మాతృభాష వారికే గొప్ప… కానీ తెలుగు భాషకు ప్రత్యేకత ఉంటుందని అంటారు. ఎప్పుడో చరిత్రలోనే రాజుల కాలంలోనే దేశభాషలందు తెలుగు లెస్స అని చెప్పబడింది. వ్యాకరణం దీని ప్రత్యేకత… అది ఎంత ప్రత్యేకమో అంత సాధన కూడా అవసరం అంటారు… లేకపోతే తెలుగు వ్యాకరణం నేర్చుకోవడం అంత సులువు కాదని అంటారు. మన మాతృభాష అయిన తెలుగు భాషలో అనేక పద్యాలు, కవితలు, గద్యములు, సామెతలు, సూక్తులు, పురాణాలు ఇంకా అనేక రచనలు లభిస్తాయి.  కనీసం గత వెయ్యి సంవత్సరాలుగా ఒక వెలుగు వెలుగుతున్న మన తెలుగు భాష యొక్క విశిష్టత గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. భాష యొక్క విశిష్టత బహుముఖాలుగా ఉంటుంది.  ఒక భాషయొక్క ఔన్నత్యాన్ని  పరిక్షించాలంటే  ఆ భాష సాహిత్యపరంగా ఎంత పరిణితి చెందింది అన్న విషయం పరిశీలించాలి.  ఆ కోణంలో చూస్తే తెలుగు భాషకి అగ్రతాంబూలం ఇవ్వచ్చు.  ఛందోబద్ధమైన పద్యం తెలుగు భాషలో పరిణితి  చెందినంతగా ఇతర భాషల్లో చెందలేదనే చెప్పచ్చు. తెలుగులో ఒక్క  పద్యంలో ఒకే అలంకారం కాకుండా  రెండు, మూడు, నాలుగు అలంకారాలు కూడా చోటు చేసుకుంటాయి.  శబ్దాలంకారాలకీ, చమత్కారాలకీ చేమకూర వేంకట కవి గారి “విజయ విలాసం”   భాషా సౌందర్యం కోసం రామరాజభూషణుని “వసుచరిత్రము”, తెలుగు భాష లాలిత్యం, సౌకుమార్యం తెలియాలంటే అల్లసాని వారి “మనుచరిత్రము”; పద గుంఫనం, విరుపుల కోసం తెనాలి వారి “పాండురంగ మాహాత్మ్యం”,  భాషా మాధుర్యం, భక్తి భావాల కోసం పోతన గారి భాగవతం ఒక సారి తిరగేస్తే  చాలు. తెలుగు భాషలో గల పద్యములందు ఉండు అర్ధములు విశేషమైన విషయమును తెలియజేస్తూ ఉంటాయి. చిన్న చిన్న పదాలతో నాలుగు లైన్లలో ఉండే ఈ పద్యాలలో ప్రతిపదార్ధము వచనంలో ఎక్కువగా ఉంటుంది. వీటి భావాలు విశేషమైన అర్ధమును తెలియజేస్తాయి. దైవచింతన, తత్వచింతన, సామాజిక పోకడలు ఇలా అన్నింటపైనా తెలుగు భాషలో తెలుగు పద్యాలు విశేషమైన భావాలను వ్యక్తపరుస్తాయి. ఇంకా ఇవి చాలా తక్కువ నిడివి గలిగిన వ్యాక్యాలతో ఉంటాయి… అవి కూడా మూడు వ్యాక్యాలు ఇంకా ఒక మకుట వ్యాక్యం కలిగి ఉంటాయి. తెలుగు భాషలో గొప్ప గొప్ప కవులు ఉన్నారు. గొప్ప గొప్ప ఇతిహాస, పురాణాలను అనువదించినవారు ఉన్నారు… అవి అన్ని కూడా సంస్కృత భాష నుండి తెలుగుకు తర్జుమా చేసినవే… తెలుగు భాషలో కవులకు లోటు లేదు పదాలకు లోటు లేదు… చక్కని పలుకుబడులకు, నుడికారములకు తెలుగు బాషయే పుట్టినిల్లు ”. చక్కని కవితలల్లిక లో జిగిబిగిని ప్రదర్శించిన నేర్పు ఈ బాషలోనే వీలైనది. అంతేగాక, అనేక బాషలు ఈ బాషలో చోటు చేసుకున్నాయి. సంస్కృతము, తమిళము, పారసి మున్నగు బాషలు తెలిసిన రాయలు “దేశబాషలందు  తెలుగులెస్స” అనుట ఆశ్చర్యం గాదు. బ్రౌనుదొర కూడాఈ బాషను గూర్చి వేనోళ్ల పొగుడుట మన తెలుగు వారి, తెలుగు బాష యెక్క గౌరవము. తెలుగు  బాష మాధుర్యం:   తెలుగు భాషకి ఉన్న మరొక విశిష్ట  ప్రక్రియ అవధానం. ఇది తెలుగు భాషలో వికసించినంతగా మరే భాషలోనూ వికసించ లేదు. అష్టావధానం, శతావధానం, సహస్రావధానం, ద్విసహస్రావధానం, పంచ సహస్రావధానం – ఇలా విస్తరిస్తూ పోతోంది.  తెలుగులో పదాలు అజంతాలు, అంటే అచ్చులతో అంతం అవుతాయి. అందుచేత తెలుగు వినడానికి శ్రావ్యంగా  ఉంటుంది.   మన పురాణాల్లోనూ, కావ్య-ప్రబంధాల్లోనూ వాడబడిన తెలుగు భాష ఎంత ఉత్కృష్టంగా, మహోన్నతంగా   ఉంటుందో మనందరికీ తెలిసినదే.  తెలుగులో ఒక పదానికి ఎన్నెన్నో పర్యాయ పదాలు ఉంటాయి.  ఇలా ఉండటం ఆ భాష యొక్క ఔన్నత్యానికి  నిదర్సనం. తెలుగు బాష  కోటి కిటికీల గాలి మేడ:  తెలుగు బాష   కొల్లలుగా క్రొత్త పదాలను తనలో కలుపుతుంది.తెలుగు బాష  కోటి కిటికీల గాలి మేడ. అన్నీ వైపుల నుండి వీచే గాలులను ఆహ్వానించి, ఆతిధ్యమిచ్చి గౌరవించింది. తెలుగుకి గల హృదయ వైశాల్యము అనన్యము. తెలుగు,సంస్కృత పదాలు క్షీరనీర న్యాయంలో కలిసిపోతాయి. అదే తెలుగు బాష విశిష్టత. తెలుగులో ద్వర్ధి కావ్యాలు అని ఉన్నాయి. అంటే ఒకే గ్రంథంలో అవే పద్యాలు రెండు కథలు చెబుతాయి.  అలాగే  త్ర్యర్థి కావ్యాలు  ఉన్నాయి. అంటే ఒకే గ్రంథంలో మూడు కథలు.  ఇలాంటి క్లిష్టమైన ప్రక్రియలు  మరే ఇతర భాషలోనూ లేవేమో.   ఇంక పద్యాల విషయానికొస్తే ఒకే పద్యానికి, రెండు, మూడు, నాలుగు అర్థాలు మాత్రమే కాక   ఒకే పద్యానికి 64 అర్థాలు చెప్పిన సందర్భo కూడా ఉoది.  రామరాజభూషణుని “వసుచరిత్రము” లో “స్వైర విహార ధీరలగు.... అనే పద్యానికి పెద్దాపుర సంస్థానంలోన విద్వత్కవి, వైణికులు శిష్టా కృష్ణమూర్తి శాస్త్రి గారు 64 రకాల అర్థాలు చెప్పారట.  ఇంక తెలుగులో చిత్రకవిత్వం అని ఉంది.  పద్యం మొదటి పాదం మొదలుకొని చివరిదా చదివితే ఒక అర్థం, అదే పద్యాన్ని చివరినుండి మొదటిదాకా చదివితే మరొక అర్థం వచ్చే ప్రక్రియ ఉంది. అలాగే “వికటకవి” లాగ పద్య చరణాలన్నీ  ముందునుంచి వేనుకకీ, వెనుకనుండి ముందుకీ చదివినా ఒకే లాగ ఉండే పద్యాలు కూడా ఉన్నాయి.  పద్యమంతా ఓష్ఠ్యాలతో, అంటే పెదవులు కలుపుతూ ఉచ్ఛరించే పదాలతో   (పఫబభమ-లు)  రాయడం లేదా నిరోష్ఠ్యంగా (పఫబభమ-లు లేకుండా) రాయటం;   ఈ పద్ధతిలో కావ్యమంతా రాయటం అధ్భుతం కదా. ఈ విధంగా తెలుగు భాష ఔన్నత్యంగురించీ, విశిష్టత గురించీ ఎంతైనా చెప్పవచ్చును. మన తెలుగు కవులు: నన్నయ, తిక్కన, ఎఱ్ఱన తెలుగు పాండిత్యము తో మెప్పించిన ఉద్ధండ కవులు. మన తెలుగు కవులు అపార ప్రజ్ఞాధురీణులు. సంస్కృతాంధ్ర పదములు ప్రయోగించటం లో నేర్పరులు. పోతన సంస్కృతాంధ్ర పధములు; పెద్దన మనుచరిత్ర లోని తేట తెనుగు నుడికారపు సొంపులు, వంపులు, తామర తంపరలు, అల్లసాని వారి ఆ అల్లికజిగిబిగి లో తెలుగు పదములు, సంస్కృత శబ్ధములు పడుగుపెకల వలె అల్లుకుంటాయి. మన తెలుగు కవులంతా ఈ విధ్యలో నేర్పరులే. తెలుగు కవులకు జరిగిన సత్కార గౌరవములు ప్రపంచములో ఏ దేశంలో ఏ కవులకూ జరగలేదు. తెలుగువారి సహృదయత, సాహితీ రసికత, నిరుపమానములు. తెలుగు బాష వాజ్మయము లో ప్రాతఃస్మరణీయులు కవిత్రయము, నన్నయ్య ను రాజరాజు ఆదరించాడు. తిక్కన ను మనుసిద్ది, ఎఱ్ఱప్రెగడను వేమారెడ్డి గౌరవించారు. శ్రీనాథుడు రెడ్డి రాజుల కవిగా మహాభోగాలు అనుభవించాడు. ఆయనకు ప్రౌఢధేవరాయులు కనకాభిషేకం చేశాడు. పోతన మహాకవికి తమ హృదయంలోనే దేవాలయాలు కట్టి తెలుగువారు నేటికీ ఆరాదిస్తారు. సాహితీ బొజుడైన కృష్ణదేవరాయులు కవులను పూజించిన విషయము జగత్ ప్రసిద్దము. పెద్దన కవికి రాయులు గండపెండేరము తొడిగి గౌరవించాడు. తెలుగు బాష సంగీతానికి అనువైన అజంత బాష. తెలుగు ఆజన్మ సంగీత కవచకుండలాలతో భాసించింది. సంగీత కళారాధనలో మన తెలుగు వారికి కలసి వచ్చిన గొప్ప అదృష్టం మన మాతృ బాష తెలుగు.  తరిపి వెన్నెల! ఆణిముత్యాల జిలుగు పునుగు జివ్వాజీ! ఆమని పూల వలపు మురళి రవాళులు! కస్తూరి పరిమళములు కలిసి ఏర్పడే సుమ్ము మన  తెలుగు బాష” ఈ తెలుగు నేలపై జన్మించడం ఒక గొప్ప వరం ఒక గొప్ప అదృష్టం  పుడమి జడలో పరిమళ పద కుసుమం  విశాల జగత్తులో ప్రశాంత భావ సంద్రం  హరివిల్లెరుగని మనోహర మది వర్ణం  మధురిమ లిఖితం కమనీయ వాచనం  మన హృదయ సంధాన భాషా వనం  సొగసైన రాగం రమణీయ శ్రవణం  మన యెద పలికే సాహిత్య గాంధర్వ గానం  ఇది నే తెలుపగలిగిన నా తెలుగు గొప్పదనం

ఆకు కూరలు

రవి సాఫ్ట్ వేర్ ఇంజినీర్.  భార్య డెలివరీకి వెళ్ళింది.  అప్పటిదాకా తాముంటున్న సింగిల్ బెడ్ రూమ్ ఇంటిని ఖాళీ చేసి ఊరికి కొంచెం దూరంగా గేటెడ్ కమ్యూనిటీలో డబల్ బెడ్ రూమ్ ఇల్లు అద్దెకు తీసుకుని చేరాడు, స్వయంపాకం చేసుకుంటాడు. ఆరోజు ఆదివారం.  పోర్టికోలో కూర్చుని కాఫీ తాగుతున్నాడు. ఆకు కూరలు, ఆకు కూరలు అని కేక వినిపించింది.  డెబ్బై ఏళ్ల వృద్ధురాలు తలపై కూరల గంప పెట్టుకుని కనిపించింది, పిలిచాడు. "కాస్త గంప దించయ్యా" అన్నది ఆమె. "పాలకూర కట్ట ఎంత?" అడిగాడు.* "పది రూపాయలకు మూడయ్యా" చెప్పింది అవ్వ. "మరీ అన్యాయం... బయట అయిదు ఇస్తున్నారు."  అన్నాడు చిరుకోపంగా "నాలుగు తీసుకో నాయన.." కట్టలు తీసింది అవ్వ పదిరూపాయలు ఇచ్చాడు.  "గంప కాస్త పట్టయ్యా" అన్నది అవ్వ తనవైపు పట్టుకుని. గంపను పైకి లేపుతూ రెండు కట్టలు పాలకూర తీసి ఇంట్లోకి విసిరాడు రవి .... *అవ్వ వెళ్ళిపోయింది. "ఎంత ఆశో ఈ ముసలిదానికి,ఇవాళో రేపో చావబోతుంది, ఇంకా మూటలు కడుతున్నది"ముసిముసిగా నవ్వుకున్నాడు.* అప్పటినుంచి అవ్వ వచ్చినపుడల్లా గంప ఎత్తడానికి సాయం పడుతూ ఒక బీరకాయో, రెండు వంకాయలో, ఒక దోసకాయో, చిన్న సొరకాయో లాఘవంగా తీయడం మొదలుపెట్టి ముసలిదాని రోగం కుదిర్చానని సంతోషపడసాగాడు. కొన్నాళ్ల తరువాత ఎప్పటిలాగే గంప పైకెత్తుతూ రెండు కొత్తిమీర కట్టలు లేపేశాడు.  అంతలోనే ఎవరిదో ఏడుపు వినిపించింది. ఎనిమిదేళ్ల అమ్మాయి పుస్తకాల సంచీని మోస్తూ "నానమ్మా.. నన్ను స్కూల్ నుంచి పంపేశారు..." ఏడుస్తూ వచ్చింది. అవ్వ కంగారుగా "అయ్యో నా బిడ్డ.. బాబూ...కాస్త గంప కిందికి దించు!" అన్నది రవితో. "ఏడవకమ్మా...నేనొచ్చి చెబుతాలే.  రేపు ఫీజు కడతాలే..నా తల్లే... ఇంటికిపొదాం పద"  అన్నది పిల్లను వాటేసుకుని ధారాపాతంగా నీరు స్రవిస్తున్న ఆ చిన్నారి నయనాలను తుడుస్తూ. రవికి అర్ధం కాలేదు.  "ఎవరీ పిల్ల?"  అడిగాడు అవ్వను.* "నా మనవరాలు బాబూ...ఆడపిల్ల పుట్టిందని అల్లుడు నా కూతురును వదిలేసి వెళ్ళిపోయాడు. చుట్టుపక్కలవారు సూటిపోటి మాటలు అంటుంటే తట్టుకోలేక కూతురు ఎలుకలమందు మింగి చచ్చిపోయింది.  మా ఆయన మూడేళ్ళబట్టీ మంచం మీదున్నాడు.   ఈ నలుసును సాకడానికి చిల్లిగవ్వ లేదు. ఎప్పుడూ బయటకు వచ్చి ఎరగని నేను రోజూ తెల్లారుజామునే లేచి పొలాలకెళ్లి ఇరవై కిలోల కూరలు అరువు మీద తీసుకుని  మోస్తూ ఇల్లిల్లూ తిరుగుతూ  అమ్ముకుంటూ పైసాపైసా కూడబెట్టి దీన్ని చదివిస్తున్నా.  మొన్న ఫీజు కట్టడానికి వెళ్తే వెయ్యి రూపాయలు పెరిగిందని చెప్పారు. నెలరోజుల్లో కడతానని చెప్పి బతిమాలితే సరే అన్నారు.  ఈరోజు చూడు బాబు... పసిపిల్ల అనే కనికరం కూడా లేకుండా బయటకి పంపించారు." అన్నది కళ్ళు తుడుచుకుంటూ. రవి నరాలు మొత్తం బిగుసుకుని పోయాయి.   రక్తప్రవాహం స్తంభించి పోయింది. గిరుక్కున తిరిగి హాల్లోకి వచ్చాడు.  అతని హృదయం ఆకాశం చిల్లులు పడేలా ఏడుస్తున్నది.  మనసంతా ఉష్ణ జలపాతం  అయింది.  ఎంత నిగ్రహించుకున్నా కళ్ళు  ధారలు కట్టాయి.  "ముసల్దానికి ఎంత డబ్బాశ" అనే తన వెకిలి మాట వెయ్యి గునపాలై దేహాన్ని కుళ్ళబొడిచింది.  ప్రతి కష్టం వెనుకా ఒక కన్నీటి గాధ ఉంటుందని తెలియని తన అజ్ఞానానికి తనను తానే శపించుకున్నాడు ... *పర్సులో చెయ్యి పెట్టాడు.  బయటకొచ్చి "అవ్వా ... ఈ ఐదువేలు తీసుకుని మనవరాలి ఫీజ్ కట్టెయ్యి"  అన్నాడు.   బలవంతంగా అవ్వ చేతిని తీసుకుని. హంపి మొహంజదారో శిధిలాలకు  ప్రతీకలాంటి   అవ్వ వృద్ధశరీరం భూకంపం వచ్చినట్లు కంపించింది*. "బాబూ ....ఇంత అప్పు తీర్చాలంటే నాకు ఏడాది పడుతుంది"  అన్నది వణుకుతూ. "అప్పని ఎవరు చెప్పారు?  చనిపోయిన మా అమ్మ ఆత్మశాంతి కోసం ఇస్తున్నాను ....  ఇప్పుడే కాదు .... నీ మనవరాలి చదువు అయ్యేంతవరకు నేనే ఫీజ్ కడతాను .... రేపటినుంచి రోజూ  నేను ఉన్నా లేకపోయినా  పది రూపాయల ఆకు కూరలు ఇచ్చేసి వెళ్ళు" గంప పైకెత్తాడు రవి. మరునాడు రవి నిద్రలేచి తలుపు తీశాడు.  వాకిట్లో ఆరు ఆకు కూర కట్టలు కనిపించాయి!

కడివెడు తెలివి

ఒకసారి అక్సర్‌కు ఎందుకో బీర్బల్‌ మీద బాగా కోవం వచ్చి అతణ్జి తక్షణమే ఆగ్రా నుంచి వెళ్ళిపొమ్మని ఆజ్ఞాపించాడు. బీర్బల్‌ మారు మాట్లాడకుండా సామాన్లన్నీ సర్దుకుని దూర ప్రాంతంలో వున్న ఒక మారుమూల పల్లెకు చేరుకున్నాడు. అతడు ఏ వూరికి వెళ్ళింది ఎవరికీ తెలియదు. కొన్ని వారాలు గడిచాక అక్బర్‌కు ఒక దేశం రాజు నుంచి ఒక వింత అభ్యర్థన వచ్చింది. “దయచేసి ఒక కడివెడు తెలివి వెంటనే పంపించండి” అని. చక్రవర్తికి ఆ రాజు ఏం కోరుతున్నాడో అర్ధం కాక తికమక పడ్డాడు. చింతాక్రాంతుడు కూడా అయ్యాడు. అన్నీ వున్న మొఘల్‌ చక్రవర్తి తాను. కానీ 'కడి వెడు తెలివి' అంటే ఏమిటి? ఒకవేళ తాను అదిపంపిచకపోతే రాజుల దృష్టిలో చులకనైపోతాడు.  “ఈ నమయంలో బీర్బల్‌ వుంటే ఎంత బాగుండేది. ఎలాగైనా. ఆతణ్జి వెంటనే వెనక్కి రప్పించాలి” అనుకున్నాడు. అక్చర్‌ ఒక ఉపాయం ఆలోచించి ఒకో వ్యక్తికి ఒకో మేకను, ఒకో సందేశాన్ని యిచ్చి అన్ని గ్రామ పెద్దలకు పంపించాడు. “ఈ మేకను ఒక నెల రోజులు వుంచుకోండి. దాని పోషణ ఖర్చులు నేను యిస్తాను. సరిగ్గా ఒక నెల తర్వాత ఆ మేకను వెనక్కి పంపండి. అయితే ఈ నెల రోజులలో అది ఏ మాత్రం బరువు పెరగకూడదు, తగ్గకూడదు. లేకుంటే మీకు కఠిన శిక్ష పడుతుంది" అనేది ఆ సందేశం. ఆ సందేశం అందులోని అన్ని గ్రామాల పెద్దలు ఆశ్చర్యపోవటమే. గాక విచారగ్రస్థులయ్యారు. ఆ సందేశం తాను నివాసం వుంటున్న వారి పెద్దకు కూడా రావటంతో బీర్చల్‌, “అసాధ్యమేం కాదు: ప్రత్తిర్లోజూ సరిగ్గా ఒకే పరిమాణంలోనే మేత వేయండి. దాన్ని బాగా పోషించండి. ఆ తర్వాత దాన్ని ఒక బోనులో వుంచిన పులి ఎదురుగా కట్టెయ్యండి. నిరంతరం ప్రాణ భయంతో అది లావెక్కదు” అన్నాడు బీర్బల్‌. అక్బర్ కు వెంటనే అర్థమైంది. బీర్బల్‌ సలహా వల్లనే ఆ గ్రామ పెద్ద అలా చేయగలిగాడని. వెంటనే ఆ గ్రామానికి మనుషులను పంపించాడు. ఆ తర్వాత పొరుగు దేశం రాజు కోరిన కోరిక గురించి చెప్పాడు. “ఓస్ అదెంత పని! నాకు కొద్ది వారాల సమయం యివ్వండి” అన్నాడు బీర్బల్‌.  ఇంటికి వచ్చి తమ తోట మాలిని పిలిచి ఒక గుమ్మడి గింజ తెచ్చివ్వమన్నాడు బీర్బల్‌. దాన్ని నాటి, ప్రతి దినం సక్రమంగా నీరు పెట్టాడు. త్వరలోనే ఆ గింజ మొలకెత్తి, కొన్నాళ్ళు తర్వాత ఆ మొక్క పూలు పూసింది. క్రమక్రమంగా ఆ గింజలు, లేత గుమ్మడి కాయలయ్యాయి. ఒక పిందెను ఒక మట్టి కుండలోకి పంపి దాన్ని అలాగే కొద్దిరోజులుంచాడు. అలా అలా ఆ పిందె బాగా పెరిగి ఆ కుండ నిండా అయింది. అప్పుడు బీర్బల్‌ చెట్టు నుంచి దాని కాడను తెంపేసాడు. తర్వాత ఆ కుండ మూతి చుట్టూ ఒక గుడ్డ చుట్టి అక్బర్‌ దగ్గరికి తీసుకెళ్ళాడు. “అయ్యా, ఇదిగోండి కడివేడు తెలివి. దీన్ని ఆ రాజుగారికి ఒక చిన్న సందేశంతో పంపండి “మీరు కోరిన కడివెడు తెలివి స్వీకరించండి. దయచేసి దాన్ని తీసుకుని ఖాళీ కడవ మాకు పంపించండి. కాని మీరు కుండెను గానీ, గుమ్మడి కాయను గానీ పగుల గొట్టొద్దు” అని అన్నాడు బీర్బల్‌.  ఆ సందేశం అందుకున్న ఆ రాజు ఉరుకులు పరుగుల మీద అక్చర్‌ను , “మీ తెలివిని తక్కువగా అంచనా వేసినందుకు క్షమించండి” అని వేడుకున్నాడు. బీర్చల్‌ తెలివి తనను కాపాడినందుకు ఆనందించాడు అక్బర్‌.

భూమి పుత్రుడు

దేవరకొండ దుర్గాన్ని పాలిస్తున్స మత్స్యవల్లభుడనే రాజుకు వీపుమీద రాచపుండు ఏర్బడింది. ఆస్థాన వైద్యులు ఎన్ని చికిత్సలు చేసినా, ఎన్ని మందులు ప్రయోగించినా పుండు మానడం లేదు. ఆ వ్రణం బాధతో మత్స్యవల్లభుడికి మనశ్శాంతి అనేది లేకుండా పోయింది. ఇక లాభం లేదని రాజు ఇతర రాజ్యాలలో కూడా తన పేరిట దండోరా వేయించాడు. దేవరకొండ మహారాజు మత్స్యవల్లభుడి వ్రణం నయం చేసిన వైద్యుడికి రాజకుమార్తె స్వాతిని ఇచ్చి పెళ్లి చేయడమే గాక, అర్ధరాజ్యాన్ని కానుకగా ఇచ్చి పట్టాభిషేకం చేస్తారు. ఈ ప్రకటనతో ఇరుగుపొరుగు దేశాలలోని పేరొందిన ఆస్థాన వైద్యులు ఎందరో దేవరకొండకు వచ్చి మత్స్య వల్లభుడికి వైద్యం చేశారు. రకరకాల మూలికాపసురు వేసి కట్టుకట్టి చూశారు. అయినా ఆ వ్రణం మానడం ఎవరి వల్లా సాధ్యం కాలేదు. చివరకు విజయపురి నుంచి శ్రీముఖుడనే యువకుడు నల్లమల అరణ్యంలో సేకరించిన సంజీవనీ పత్రాల లేపనంతో మత్స్యవల్లభుడి రాచపుండును నయంచేశాడు. మహారాజు పూర్తి ఆరోగ్యవంతుడై స్వస్థత పొందాడు. ప్రకటించిన విధంగా యువరాణి స్వాతిని ఇచ్చి పెళ్తి చేయడానికి, దేవరకొండలో అర్ధరాజ్యానికి రాజుని చేయడానికి సిద్ధపడ్డాడు మత్స్యవల్లభుడు. కాని అందుకు శ్రీముఖుడు తిరస్కరించాడు. “మహారాజా! నాకు తాతల నుంచి నేర్చుకున్న వైద్యం మీకు రాచకురుపు మానడానికి ఉపయోగపడింది. అందుకు ఎంతో ఆనందంగా ఉంది. నేను ప్రతిఫలం ఆశించి వైద్యం చేయలేదు. నేను వ్యవసాయం చేసుకుంటూ సంతోషంతో జీవిస్తున్నాను. మీ సత్కారాలు ఏమీ వద్దు, అన్నాడు. “శీముఖా, నీ ధోరణి నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. సంపద కోసం అందమైన స్త్రీ కోసం ఎందరో రాజులు యుద్దాలు చేస్తారు. తమ సైనికులను గుర్రాలను, ఏనుగులను బలి ఇచ్చి రక్తం ఏరులై పారిస్తారు. అటువంటి అగ్నిపరీక్షలు ఎమీ లేకుండా సునాయాసంగా యువరాణి నీ భార్యగా వస్తుంటే, రాజ్యానికి రాజయ్యే అవకాశం కాళ్ల దగ్గరికి వస్తే తిరస్కరిస్తున్నావు. ఇది లొక విరుద్ధం కాదా? నువ్వు ఎందుకు ఈ అవకాశాన్ని కాదంటున్నావో తెలుసు కోగోరుతున్నాను, అన్నాడు మత్స్యవల్లభుడు. “మహారాజా! మీరే చెప్పారుగా, రాజ్యం కోసం, అందమైన యువతుల కోసం  రాజులు రకాన్ని ఏరులై పారిస్తారని, అటువంటి రాజులతో వియ్యం నాకేల? ఒక వేళ మీరు ఉదార బుద్దితో నాకు అర్థరాజ్యం ఇచ్చినా మీ కుమారుడు, రాజ బంధువులు ఊరుకుంటారా? పైగా నా వంటి సామాన్యుడిని వివాహం చేసుకుని యవరాణి జీవితాంతం సంతృప్తిగా కాపురం చేస్తుందా? రాచరికం కత్తిమీద సాము. ఎప్పుడు ఇరుగు పొరుగు రాజులు దండెత్తి వస్తారో తెలీదు. బావమరుదులు, మేనమామలతో మంత్రులు అంతఃపురంలో కుట్రలు చేసి వెన్నుపోటు పొడిచి ఎప్పుడు చంపుతారో తెలీదు. అటువంటి రాచరికపు జీవితం నాకు వద్దు ప్రభూ! నేను భూమిని నమ్ముకున్న భూమి పుత్రుడను. నాకు ప్రశాంతంగా బతకడమే ఇష్టం, అన్నాడు శ్రీముఖుడు. మత్స్యవల్లభుడు శ్రీముఖుడి అభిప్రాయాన్ని గౌరవించి విలువైన కానుకలిచ్చి విజయపురికి పంపించాడు.

నిజాల వేట!

మహారాజు సింహాసనం అధిష్టించి పది సంవత్సరాలు పూర్తి అయింది. దాంతో తన పరిపాలన ఎలా ఉందో తెలుసుకోవాలనుకున్నాడు. అంగరంగ వైభవంగా సమావేశం ఏర్పాటు చేశాడు. సామంతులు, సైన్యాధికారులు, వ్యాపారులు, కళాకారులు, పుర ప్రముఖులు అందరినీ ఆహ్వానించాడు. మహారాజు వచ్చిన వాళ్లందరినీ చిరునవ్వుతో చూస్తూ  నా పాలనలో రాజ్యమంతా సుభిక్షంగా ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ సభ ఏర్పాటు చేశాను. బాగుంటే బాగుందనండి. లేదంటే లేదనండి. సరిదిద్దుకోలసిన అంశాలుంటే తెలియచేయండి. రాజ్యం మరింత సుసంపన్నం కావడానికి సలహాలు ఇవ్వండి అన్నాడు.  మహారాజా.. మీరు మాకు దేవుడిచ్చిన వరం. ఎన్ని జన్మలైనా మీరే మాకు రాజుగా ఉండాలి  అంటూ నోరు విప్పారు సామంతులు.  మీ పాలనలో ఎటువంటి తిరుగుబాట్లు లేవు. రాజ్యమంతా ప్రశాంతంగా సుఖసంతోషాలతో  వర్ధిల్లుతోంది  అన్నారు సైన్యాధికారులు.  వ్యాపారాలు పుష్కలంగా జరుగుతున్నాయి. గల్లాపెట్టెలు గలగలలాడుతున్నాయి. రాజ్యంలో దొరకని వస్తువంటూ లేదు. ఎగుమతులూ పుంజుకుంటున్నాయి  అన్నారు వ్యాపారులు. ఎక్కడ చూసినా సభలు, సమావేశాలు, నాటక ప్రదర్శనలు, కవితా పఠనాలు, కొత్త గ్రంథాల ఆవిష్కరణలు, పురస్కారాలు, సన్మానాలతో సందడిగా ఉంది ప్రభూ  అంటూ పొగిడారు కళాకారులు. ఒక్కొక్క మాటకు రాజు మొహంలో కోటి నక్షత్రాల కాంతులు వెదజల్లసాగాయి. వచ్చిన వారందరికీ రకరకాల ఆహార పదార్థాలతో విందు భోజనం ఏర్పాటు చేసి కానుకలతో సత్కరించి పంపించాడు. ఆ రాత్రి అంతఃపురంలో మహారాణితో మహారాజు  చూశావా రాణీ.. నా పరిపాలన ఎలా   కళకళలాడిపోతున్నదో! ఆకలి కేకలు లేవు, తిరుగుబాట్లు లేవంటూ నింగిని తాకేలా కీర్తిస్తున్నారంతా అన్నాడు సంబరంగా. రాణి చిరునవ్వుతో  అలాకాక ఇంకెలా చెబుతారులే మహారాజా మీ వద్ద అంది. ఆ మాటల్లో ఏదో వ్యంగ్యం కనబడింది రాజుకు.  అంటే.. ఆ పొగడ్తలన్నీ కేవలం భయం వల్ల వచ్చినవే అంటావా? అని ప్రశ్నించాడు.  భయం వల్లనే కాకపోవచ్చు. మీతో వారికున్న అవసరాల వల్ల కూడా కావచ్చు. మీ ముందు నిలబడి మీకు వ్యతిరేకంగా మీ కింద పనిచేసే అధికారులెవరైనా నోరు విప్పగలరా?  మనసులో మాట చెప్పగలరా? మీరేం చేసినా ఆహా.. ఓహో.. అని ఆకాశానికి ఎత్తేస్తారు తప్ప విమర్శిస్తారా? అంది రాణి.  అయితే వాళ్ళందరూ నన్నలా ఊరికే పొగుడుతున్నారని నిరూపించగలవా? అన్నాడు రాజు.  తప్పకుండా మహారాజా.. మీకు అసలు రాని కళేదైనా ఉంటే చెప్పండి’  అంది. మహారాజు కాసేపు ఆలోచించి  నీకు తెలుసు కదా.. లలితకళల్లో ఎంతోకొంత ప్రావీణ్యం ఉన్న నాకు అసలు రానిది, ఎప్పుడూ ముట్టుకోనిది చిత్రలేఖనం ఒక్కటే అని  అన్నాడు.  అయితే ఒక పనిచేయండి మహారాజా.. ఒక్కరోజులో చిత్రలేఖనం గురించి తెలుసుకొని మీకు ఎలా తోస్తే అలా రకరకాలుగా చిత్రాలు వేయండి. అవన్నీ ప్రదర్శనకు పెడదాం. ఇప్పుడు పిలిచిన వాళ్లందరినీ అప్పుడూ ఆహ్వానిద్దాం. తెలుస్తుంది ఎవరేమంటారో! అంది. మహారాజు సరేనని ఒక ప్రముఖ చిత్రకారున్ని పిలిపించి ఒక రోజంతా చిత్రకళ గురించి తెలుసుకున్నాడు. తర్వాత రోజు నుంచి బొమ్మలు గీయడం మొదలుపెట్టాడు. కుడిచేత్తో కొన్ని, ఎడంచేత్తో కొన్ని, నోటితో పట్టుకొని కొన్ని, వెనక్కి తిరిగి కొన్ని, ఆఖరికి పడుకొని, కూర్చుని, నుంచుని రకరకాలుగా వారం రోజుల్లో వంద చిత్రాలు పూర్తి చేశాడు. వాటన్నింటినీ ప్రదర్శనకు పెట్టాడు. అందులో కొన్ని చిత్రాలను తిరగేసి కూడా పెట్టాడు. అప్పుడు పిలిచిన వాళ్లందరనీ  ప్రదర్శనకు ఆహ్వానించాడు. ఏ చిత్రం చూసినా రంగులు ఒకదానితో ఒకటి కలసిపోయి కనిపించాయి. దేనిలో ఏముందో, అందులో  ఏ భావముందో ఎంత ఆలోచించినా ఎవరికీ అంతుచిక్క లేదు. అర్థం కానిదంతా అద్భుతమే అని తీర్మానించుకున్నారంతా. అవతల ఉన్నది మహారాజు. తప్పు పట్టినా, బాగా లేదన్నా కొరడా దెబ్బలు తప్పవు. దాంతో ఎందుకైనా మంచిదని ‘ఆహా’ అన్నారు కొందరు. వెంటనే ‘ఓహో’ అన్నారు మరికొందరు. ‘అద్భుతం. మీకు మీరే సాటి’ అంటూ అందుకొన్నారు ఇంకొందరు. ఇలా పొడిపొడి మాటలైతే లాభం లేదనుకొని ఇంకొకరు ముందడుగు వేసి ‘మహారాజా.. ఇంత వేగంగా ఇన్ని చిత్రాలు గీయడం మామూలు మానవులకు సాధ్యం కాదు. మీలాంటి కారణజన్ములు ఏడేడు పద్నాలుగు లోకాల్లో ఎక్కడా ఉండరు. మీకు చిత్రరత్న పురస్కారం కచ్చితంగా ఇచ్చి తీరవలసిందే’ అన్నారు. అది విన్న మరి కొందరు తాము ఎక్కడ వెనుకబడి పోతామేమోనని ‘మహారాజా.. ఈ చిత్రాలు మీరు గనుక మాకు ఇస్తే మా భవనాలలో అలంకరించుకుంటాం. వీటివల్ల మా ఇంటి అందం రెట్టింపవుతుంది  అన్నారు. ఒకరిని చూసి మరొకరు పొగడ్తలలో పోటీపడ్డారు. వాళ్ళలా పొగడ్తల వర్షం కురిపిస్తుంటే మహారాజు తన పక్కనే ఉన్న మహారాణికి మొహం చూపించలేక సిగ్గుతో చితికిపోయాడు. ప్రదర్శన పూర్తయి అందరూ వెళ్ళిపోయాక  అర్థమైంది కదా రాజా ప్రముఖుల సంగతి. మీ పాలన గురించి నిజానిజాలు తెలియాలంటే ధనవంతులను కాదు కలవాల్సింది పేద ప్రజలను. అధికార దర్పంతో రాజుగా కాదు వాళ్లలో ఒకరిగా మారిపోవాలి. అప్పుడే మీ లోటుపాట్లు తెలుస్తాయి. సరిదిద్దుకోవలసినవి అర్థమవుతాయి అంది.  మహారాణి వైపు ప్రశంసాపూర్వకంగా చూశాడు మహారాజు. మరుసటి మహారాజు పల్లెమనిషిగా మారు వేషంలో కాలినడకన సంచారానికి బయలుదేరాడు నిజాల వేటకై!

వరలక్ష్మీ వ్రతం

శ్రావణమాసం అంటేనే నోములు వ్రతాలు గుర్తొస్తాయి. సౌభాగ్యం, సంపదలు, కుటుంబ శ్రేయస్సు కోసం మహిళలు ఈ మాసంలో ఆచరించే వాటిలో శ్రీవరలక్ష్మీ వ్రతం ప్రధానమైనది. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని చేసుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ వ్రతం గురించి సాక్షాత్తూ పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పినట్టు ‘స్కాంద పురాణం’ పేర్కొంటోంది. భక్తుల పాలిట వరాల కల్పవల్లి అయిన వరలక్ష్మి రూప, గుణ విశేషాలన్నీ శ్రీసూక్తంలో ప్రస్తావితమై ఉన్నాయి. మహామాయారూపిణి, శ్రీపీఠవాసిని, దేవతలు నిరంతరం సేవించే లోకమాత, శంఖ, చక్ర, గదల్ని ధరించిన మహాలక్ష్మీదేవి అష్త్టెశ్వర ప్రదాయిని. అష్ట సంపదల్ని అందించే జగన్మంగళ దాయిని. అష్త్టెశ్వరాల్నీ కలగజేసే అష్టలక్ష్మి రూపాన్నే వరలక్ష్మీదేవిగా మనం ఆరాధిస్తాం. భక్తితో పూజించినవారికీ, కొలిచినవారికీ కొంగుబంగారమై వరాలనిచ్చే మహాలక్ష్మే వరలక్ష్మి అమ్మవారు. శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం భారతీయ హిందువుల సాంప్రదాయ ఆచారంగా వస్తున్నది. వరలక్ష్మీ దేవత శ్రీ మహావిష్ణుమూర్తి గారి భార్య. శ్రీమహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణం పేరుతో వచ్చే మానం శ్రావణం. చాంద్రమాన ప్రకారం తెలుగు సంవత్సరాదిలో ఐదో నెల శ్రావణం. ఈ నెలలో నోములు, వ్రతాలు, పూజలకు ప్రశస్తి. ఈ పండగ ముత్తైదువలకు ఎంతో విశిష్టమైనది. వరాలు యిచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు. ఈ పండగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారు. ముఖ్యంగా మంచి భర్త, కుమారులు కలగాలని అమ్మాయిలు కూడా పూజిస్తారు. ఈ అమ్మవారిని పూజిస్తే అష్టైశ్వర్యాలు, సంపద, భూమి, క్రమశిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. ఎందుకు ఈ వ్రతం చేస్తారు :- అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉంటుంది. మిగిలిన లక్ష్మీ పూజలకంటే వరలక్ష్మీ పూజ శ్రేష్ఠమని శాస్త్ర వచనం. శ్రీహరికి ఇష్టమైన, సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాలకోసం, నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీ లక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిదీ ఒక్కటే! సకల శుభంకరమైన, సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం. పురాణ గాధ ఏమిటి :- స్కందపురాణంలో పరమేశ్వరుడు వరలక్ష్మీ వ్రతం గురించి పార్వతీదేవికి వివరించిన వైనం ఉంది. లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలనూ, పుత్రపౌత్రాదులనూ పొందేందుకు వీలుగా ఏదైనా ఓ వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఆది దేవుణ్ని కోరుతుంది. అప్పుడు శంకరుడు, గిరిజకు వరలక్ష్మీ వ్రత మహాత్మ్యాన్ని వివరించాడని చెబుతారు. అదే సందర్భంలో శివుడు ఆమెకు చారుమతీదేవి వృత్తాంతాన్ని తెలియజేసాడంటారు. పూర్వ కాలంలో మగధ దేశంలో కుండినము అనే పట్టణం ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి వినయవిధేయురాలు. దైవభక్తి కలిగిన మహిళ. ప్రతిరోజు ప్రాతః కాలాన నిద్ర లేచి భర్త పాదాలకు నమస్కరించి గృహ కృత్యాలు పూర్తి చేసుకొని అత్తమామలను సేవించుకుంటూ జీవిస్తూ ఉండేది. భర్త పట్ల ఆదరాన్నీ, అత్తమామల పట్ల గౌరవాన్నీ ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది. మహాలక్షీదేవి పట్ల ఎంతో భక్తిశ్రద్ధలు కలిగిన చారుమతి, అమ్మవార్ని త్రికరణ శుద్ధిగా పూజిస్తుండేది. ఆ మహా పతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు దేవదేవి అభయమిస్తుంది. అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదల్ని అందుకుందని ఈశ్వరుడు, గౌరికి విశదపరచాడని పురాణ కథనం. దాంతో పార్వతీ దేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి, వరలక్ష్మి కృపకు పాత్రురాలైందని పెద్దల మాట. లక్ష్మీ పూజ అంటే కేవలం ధన, కనక, వస్తు రూపాలను అర్థించడానికి కాదు... భావ దారిద్య్రాన్ని తొలగించాలని ప్రార్థించడానికి. మంచి గుణాలు, సంపద, ఉత్సాహం, కళాకాంతులు, ఆనందం, శాంతం, పెద్దల పట్ల గౌరవం, సామరస్యం, మంచి మనస్తత్వం, లోకహితాన్ని కోరుకోవడం.. ఇవన్నీ లక్ష్మీప్రదమైన లక్షణాలు. వాటిని కోరుకుంటూ లక్ష్మీ పూజ చేయాలి. మనలో అంతర్గతంగా ఉండే దైవిక శక్తులను చైతన్యపరిచేది పరాశక్తికి ప్రతిరూపమైన శ్రీమహాలక్ష్మి అంటారు పెద్దలు. ఆమె ఆరాధనే వరలక్ష్మీ వ్రతం. కార్యసిద్ధి, సంసారబంధ విమోచనం వల్ల సిద్ధించే మోక్షం, ఆటంకాలను అధిగమించి పొందే జయం, విద్య, సంపద, శ్రేష్టత... ఇవన్నీ వరలక్ష్మీ స్వరూపమైన సద్గుణాలు. ఆ గుణాలను పొందడానికి ఉద్దేశించినదే వరలక్ష్మీ వ్రతం. ఇది అన్ని వ్రతాలలోనూ శ్రేష్టమైనదని పురాణాలు చెబుతున్నాయి. అంతటి విశిష్టమైన ఈ వ్రతాన్ని ఆచరించి, లక్ష్మీ అనుగ్రహాన్ని పొందడానికి తగిన ప్రవర్తన కలిగి ఉండాలని చారుమతి పాత్ర ద్వారా శ్రీ వరలక్ష్మీ వ్రతకథ చెబుతోంది.

మంచితనం

సుమంతపురంలో నారాయణ పండితుడు, శివ పండితుడు అని ఇద్దరు విద్యావంతులు ఉండేవారు. వారు శత్రువులు కాదు మిత్రులు కారు. ఇలా ఉండగా ఆ ఊరి ఆలయానికి అర్చకుని అవసరం కలిగింది.  నారాయణ పండితుడు తన బంధువుల్లో ఒకరిని అర్చకునిగా తీసుకురావాలని అనుకున్నాడు. అలాగే శివ పండితుడు కూడా!.  కానీ జమీందారు విద్యాదత్తుడు అనే యువకుడిని అర్చకునిగా ఆలయానికి పంపించారు. విద్యాదత్తుడు ఆలయంలో పూజలు చక్కగా చేస్తూ ప్రజల మన్ననలు పొందసాగాడు. ఊరిలో ఉన్న నారాయణ, శివ పండితుల వద్ద గౌరవంగా ఉండే వాడు. అతను అందరి వద్ద మెప్పు పొందడంతో ఆ ఇద్దరు పండితులు అసూయపడే వారు.  విద్యాదత్తుడికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. అంత కుటుంబాన్ని పోషించడం కష్టంగా ఉండేది. అందుకని ఊరిలో పూజలు, వ్రతాలు చేసి సంపాదించేవాడు. ఆ ఊరికి నాలుగేళ్ల పాటు వర్షాలు లేక పంటలు సరిగా పండలేదు. ఇదే అదను అనుకుని నారాయణ, శివ పండితులు చేరువయ్యారు.విద్యాదత్తుడిని ఊరి నుంచి పంపించాలని అనుకున్నారు.  ఒకరోజు నారాయణ పండితుడు, శివ పండితుడు జమీందారు వద్దకు బయలుదేరారు. దారిలో వారికి విద్యాదత్తుడు ఎదురయ్యాడు. అతన్ని చూడగానే వారు ఎక్కడినుంచి రాక అని అడిగారు. జమీందారు గారి వద్దకు వెళ్ళాను అని విద్యాదత్తుడు చెప్పాడు. ఏమిటో రాచకార్యం ! హేళనగా అన్నాడు నారాయణ పండితుడు, 'మన ఆలయంలో పూజల గురించి' హేళనకు చిన్నబోతు చెప్పాడు. ఆలయ పూజల గురించి జమిందారు గారితో మాట్లాడటం ఏమిటి? గ్రామంలో మనం ముందు అనుకోవాలి కదా! అంటూ శివ పండితుడు మండిపడ్డాడు. వారి వారి ఇరువురి దురుసుతనం చూసి "జమీందారు గారు మీతో మాట్లాడతామని చెప్పారు" అంటూ గబగబా వెళ్ళి పోయాడు విద్యాదత్తుడు.   "వీడి గర్వాన్ని అణచాలి" అనుకుంటూ ఇరువురు జమీందారు దగ్గరకు వెళ్లారు. వారు వెళ్లేసరికి జమీందారు గారు ఎవరితోనో మంతనాలు జరుపుతున్నారు ఇద్దరూ బయట చాలా సేపు వేచి ఉండవలసి వచ్చింది.  ఇంతలో దివాను రామబ్రహ్మం బయటకు వచ్చాడు "ఒకేసారి ఇద్దరు పండితులు వచ్చారు ఏంటి విశేషం? అని ప్రశ్నించాడు". మా గ్రామంలో నాలుగు సంవత్సరాల నుంచి వర్షాలు లేక పంటలు పండటం లేదు అల్లాడిపోతున్నాము అని చెప్పాడు నారాయణ పండితుడు అవునన్నట్లు శివ పండితుడు తల ఊపాడు.  అయితే ఏం చేద్దాం? అడిగాడు దివానం. "వెంటనే ఆలయ పూజారిని  మార్చాలి" తెలియజేశాడు శివ పండితుడు. ఏం, ఎందుకు ప్రశ్నించాడు దివాను. అతను సక్రమంగా పూజలు చేయడం లేదు అన్నాడు నారాయణ పండితుడు. అవునవును ఆ విద్యావంతుడు సొంత పనులు చూసుకుంటూ ఏదో నామమాత్రంగా పూజలు చేస్తున్నాడు అంటూ శివ పండితుడు వత్తాసు పలికాడు. దివాను పకాలున నవ్వాడు.  కిందటి వారమే జనమంతా ఇక్కడకు వచ్చారు. మా అర్చకుడు బాగా పూజలు చేస్తున్నారు అందుకే మేమంతా ప్రాణాలతో ఉన్నామని చెప్పారు అని అన్నాడు. వాడికి ప్రజల దగ్గర నటిస్తూ ఆకట్టుకోవడం తెలుసు ఇద్దరూ చెప్పారు. నిన్ననే మీ అర్చకుడు విద్యాదత్తుడు వచ్చాడు. వర్షాల కోసం వ్రతాలు చేయాలి. కరువు తొలగాలంటే వరుణయాగం అవసరం వ్రతాల వల్ల గ్రామ సుభిక్షం అవుతుంది అందుకు తగినవారు గ్రామంలోని నారాయణ, శివ పండితులని మీ గొప్పతనం చెప్పాడు మరి మీరేమంటారు? ఎదురు ప్రశ్న వేశాడు దివాను.  "ఇద్దరూ పండితులు బిక్క మొహాలు వేస్తూ" సరే అవునవును అన్నారు. అప్పుడే జమీందారు అక్కడికి వచ్చారు . ఆయన వారితో "మీరు గ్రామ కరువు గురించే మాట్లాడుతున్నారా! వచ్చేవారం ఏర్పాట్లు చేయండి" అన్నారు జమీందారు గారు.  "మీరు అనుమతిస్తే నేను స్వయంగా వెళ్లి అక్కడ యజ్ఞయాగాదులు చేయిస్తాను. వీరిద్దరూ మహాపండితులు కదా! అంటూ జమీందారు ఆజ్ఞ కోరాడు దివాను. సరే అంటూ జమీందారు అనుమతించారు.  పండితులు చేసేదిలేక తిరుగుముఖం పట్టారు తరువాత విద్యాదత్తునితో కలిసి మెలిసి ఉండసాగారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా చివరికి విద్యాదత్తుడి మంచితనమే అతడిని గెలిపించింది.

గంగా స్నానం.. విశ్వాసం

ఒకసారి శివపార్వతులు ఆకాశమార్గంలో కాశీ నగరానికి వెళ్తున్నారు. వారికి గంగానదిలో అనేకమంది యాత్రికులు స్నానాలు చేస్తుండటం కనిపించింది. అది చూసి పార్వతీదేవి ఇలా అన్నది.. ‘‘నాథా! ఇంతమంది గంగలో స్నానాలు చేస్తున్నారు కదా, నిజంగానే వారి పాపాలు తొలగిపోతాయా? అదే నిజమైతే అందరూ పాపాలు చేసి, వాటి ఫలితాన్ని అనుభవించకుండా గంగాస్నానం చేసి పోగొట్టుకుంటారు కదా’’ అని సందేహం వెలిబుచ్చింది. ఈశ్వరుడు చిరునవ్వుతో ‘‘దేవీ! ఇప్పుడు నేను ఒకటి చెబుతాను. నీవు ఆ విధంగా చేయి. అప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది’’ అంటూ ఆమె ఏమి చేయాలో చెప్పాడు. ఆ ప్రకారం పార్వతి, పండు ముతైదువ రూపం ధరించి, గంగలో మునిగిపోతున్న ఒక వృద్ధుణ్ణి చూపిస్తూ, ‘‘దయచేసి నా భర్తను కాపాడండి’’ అంటూ కేకలు వేయసాగింది. ఆ మాటలు విని చాలామంది గంగలో దూకి, ఆమె పతి ప్రాణాలను రక్షించేందుకు సిద్ధమయ్యారు. అది చూసిన వృద్ధురాలు ‘‘అయ్యా! నా భర్తకొక శాపం* ఉంది. పాపాత్ములెవరయినా ఆయనను ముట్టుకుంటే వెంటనే ఆయన ప్రాణాలు పోతాయి. అదేవిధంగా ఆయనను తాకిన వారి తల బద్దలవుతుంది. కనుక మీలో పాపరహితులైన వారు మాత్రమే ఆయనను రక్షించేందుకు పూనుకోండి’’ అని హెచ్చరించింది. ఆ మాటలు విని అందరూ వెనక్కి వెళ్లిపోయారు. ఒకే ఒక వ్యక్తి మాత్రం నదిలో దూకి, కొట్టుకుపోతున్న వృద్ధుడి రెక్క పుచ్చుకుని, తన వీపు మీద ఆయనను మోస్తూ, ఒడ్డుకు తీసుకు వచ్చాడు. వృద్ధురాలు అతనికి కృతజ్ఞతలు చెబుతూనే, నాయనా! నీవు ప్రాణాలకు తెగించి మరీ నా మాంగల్యం దక్కించావు. నీవు పాపరహితుడవా’’ అని అడిగింది. ఆ వ్యక్తి ‘‘అమ్మా! నేను ఇంతకుముందే గంగా స్నానం చేసి పునీతుడినయ్యాను. అందుకే నీ పతి ప్రాణాలు రక్షించేందుకు ప్రయత్నించాను’’ అని చెప్పాడు. పార్వతీ పరమేశ్వరులు ఆ వ్యక్తికి దర్శనమిచ్చి, అంతులేని సంపదలను ప్రసాదించి తిరిగి వినువీధులలో విహరించసాగారు. ‘‘ చూశావా దేవీ! విశ్వాసం ఉంటే గంగ తప్పకుండా వారి పాపాలను ప్రక్షాళన చేస్తుంది’’ అన్నాడు పరమేశ్వరుడు. అర్థమైందన్నట్లుగా పార్వతి చిరునవ్వుతో తల పంకించింది. పని చేస్తుందా లేదా అని అనుమానంతో వేసుకుంటే ఔషధం కూడా పని చేయదు.

రాము తెలివి

పార్వతీపురంలో కార్లు  అమ్మే దుకాణం తెరుద్దామని వ్యాపారవేత్త సుందరం అనుకున్నాడు. ఆ వ్యాపారం చూసుకోడానికి ఆయన కొడుకు వివేక్  అంగీకరించడంతో తగిన ఏర్పాట్లు చేసాడు.   పురోహితుడిని అడిగి ముహూర్తం నిర్ణయించాడు.  ప్రారంభోత్సవ కార్యక్రమానికి   చాలా  మంది అతిధులను పిలిచాడు.   మొదటి కొనుగోలు కోసం మరో వ్యాపారవేత్తని  పిలిచారు.  వచ్చే అతిధులకు  సమోసా, మిఠాయి, చల్లని పానీయం  ఇవ్వాలని ఏర్పాట్లు చేసారు. అరగంటలో అతిథులంతా  వస్తారనగా   పానీయపు సీసాలు చల్లబడలేదని  తెలిసింది.  తెప్పించిన సమోసాలు, మిఠాయిలు , పానీయపు సీసాలు  ఒక గదిలో పెట్టి ప్రారంభోత్సవం కాగానే ఇవ్వాలనుకున్నారు. అయితే  పానీయాలు చల్లబడలేదు.  అసలే మండుతున్న వేసవి.  వాతావరణం వేడిగా ఉంది.   అతిథులకు  చల్లని పానీయాలు అందిస్తే  సంతోషిస్తారన్న సుందరం గారి   ఆలోచన దెబ్బ తినేలా అయింది.    “ అతిథులకు  వేడిగా ఉన్న  పానీయాలను   ఇస్తామా?  ఇంత మంది పనివాళ్లు ఉండీ  ఏం చేస్తున్నారు? ఫ్రీజర్ కి కరెంట్ వెళ్లే  స్విచ్ వేసారో లేదో చూడక్కరలేదా?” అని కోపం అయ్యాడు సుందరం.    “మనది  కొత్తగా ప్రారంభిస్తున్న దుకాణం కావడంతో విద్యుత్ సరఫరాలో లోపం ఉందేమో  స్టెబిలైజర్ కాలిపోయింది. దానిని మరమ్మతు చేయించి పానీయాలు చల్లబరచడానికి  కొన్ని గంటలు పడుతుంది.  ప్రస్తుతానికి   బయటి దుకాణాల నుండి కూల్  డ్రింక్స్ తెప్పిద్దాం. మన దగ్గర మిగిలినవి వెనక్కు పంపేద్దాం” అన్నాడు వివేక్ తండ్రితో.   “ఒకేసారి అన్ని  సీసాలు  ఒకే  దగ్గర  దొరకవు. చాలా  చోట్లకు  పంపాలి. అన్ని సీసాలు చల్లటివి  సిద్ధంగా  ఉంటాయో లేవో” అని సందేహ పడ్డాడు సుందరం.   వాళ్లలా మాట్లాడుతుండగా  అతిథుల్లో ఉన్న  ఎనిమిదో తరగతి కుర్రాడు  రాము విన్నాడు.  రాము నాన్న సందరం దగ్గర పని చేస్తాడు.  ఆ మాటలు వినగానే  రాముకి ఒక  ఆలోచన స్ఫురించింది.  వెంటనే  సుందరం గారితో “అంకుల్ । చల్లని పానీయాల కోసం ఎవరినీ   బయటకు పంపక్కరలేదు. అతిథులు రాగానే  కార్యక్రమాన్ని ప్రారంభించండి. మీరు ప్రారంభోత్సవం  పూర్తి చేసేసరకి  చల్లని పానీయాలను అందించే కిటుకు నాకు తెలుసు. ఇద్దరు  పనివాళ్లని  నాకు అప్పజెబితే చాలు” అన్నాడు.  రాము వాళ్ళ నాన్న వచ్చి సుందరం గారితో “వీడు మావాడే. పేరు  రాము. వాడిని నమ్మండి” అనడంతో  వాళ్లు   సరేనన్నారు.    ముఖ్య అతిథి, ఇంకా    అతిథులు   రావడంతో   ఇద్దరు పనివాళ్లని రాముకి అప్పజెప్పి  వెళ్లిపోయారు సుందరం, వివేక్.  అనుకున్న   ముహూర్తానికే   ప్రారంభోత్సవం జరిగింది.   వచ్చిన అతిథులందరికీ   చల్లటి పానీయాలను  అందించారు  కుర్రాళ్ళు.  కార్యక్రమం అయిపోయాక రాముని పిలిచి ప్రత్యేకంగా అభినందించాడు  సుందరం . “ఇంత తొందరగా పానీయాలను ఎలా  చల్లబరిచావు?’ అనడిగాడు.     “ ఇందులో పెద్ద  రహస్యమేమీ  లేదు.   నేను బడిలో  తెలుసుకున్న  ఫిజిక్స్ సూత్రాన్నే ప్రయోగించాను. మీరేమో కూల్ డ్రింక్స్ తెప్పించాలని చూసారు. కానీ  నేనలా చేయకుండా  ఐస్ ఫాక్టరీ నుండి నలుపలకలు కలిగిన ఐసు దిమ్మలను   తెప్పించాను. ఆ ఐస్ గడ్డలను పానీయపు సీసాలున్న బాక్సుల్లో పెట్టాను. ఆ ఐస్ దిమ్మల  మీద ఉప్పుని చల్లితే ఘనీభవ స్థానం మైనస్ నాలుగు డిగ్రీలకు చేరుతుందని నాకు తెలుసు కదా. ఆ  సూత్రం ప్రయోగించాను. దాంతో    పానీయపు సీసాలు మామూలు కన్నా అతి వేగంగా చల్లబడ్డాయి. ఐస్ క్రీమ్ లేదా కుల్ఫీ తయారీలో ఇదే సూత్రం పాటిస్తారు.   మా ఇంట్లో ఆ   ప్రయోగం చేసి విజయం సాధించాను. దాన్నే  ఇక్కడా అమలు పరిచాను“ అన్నాడు రాము .   రాము తెలివి, సమయస్ఫూర్తిని అభినందించారు వచ్చిన అతిథులు. కార్యక్రమానికి రాముని కూడా తీసుకువచ్చినందుకు వాళ్ళ అమ్మ నాన్నలను  అభినందించారు. 

అనుకరణ

“అమ్మా .. దీన్ని తలకి అతికిస్తే తల పగిలిపోవడం   తగ్గిపోతుంది. ఇదిగో తీసుకుని అతికించు” అని గుండ్రంగా ఉన్న ప్లాస్టర్ రీలు తెచ్చిచ్చాడు  నాలుగేళ్ల   రవి.   “ తలనొప్పి తగ్గడానికి దీన్ని అతికించమని ఎవరు చెప్పారు” అడిగింది   రజని ఆశ్చర్యంగా.  వాడేమి చెప్పాడో సరిగా  అర్ధం కాకపోవడంతో.   “ ఇందాక నీ  తల పగిలి పోతుందని పక్కింటి ఆంటీతో చెప్పావు కదా. అందుకే తెచ్చా. మన ఇంట్లో ఏదైనా కాగితం చినిగితే దీనితోనే అతికిస్తారు నాన్న. నువ్వు కూడ తల పగలకుండా దీనితో  అతికించు”  బదులిచ్చాడు  అమాయకంగా  రవి.  కొడుకు ముద్దు వచ్చే మాటలు విని నవ్వుకుంది. ఊరిలో   తిరునాళ్లు   జరుగుతుండడంతో  రజని  వాళ్ల అమ్మా నాన్నలను,  చెల్లెలు , తమ్ముళ్ల కుటుంబాలను  ఇంటికి ఆహ్వానించింది. వాళ్లంతా ఇంటిలో ఉండడంతో ఆమెకి    రోజూ చేసే పని కంటే  ఎక్కువయింది.    చీకటితోనే  నిద్ర లేచి చేస్తున్నా పని తరగలేదు.  సరిగ్గా అలాంటప్పుడే  నువ్వుల నూనె  అప్పు కావాలని  పక్కింటావిడ వచ్చింది .  “అబ్బబ్బ.. ఎంత చేస్తున్నా పని తరగట్లేదు. చేతులు నెప్పి పుడుతున్నాయి.  తల పగిలిపోతోంది” అని రజని ఆమెతో చెప్పింది. ఆ మాటలు విన్నాడు  రవి. అందుకే .. అమ్మ తలనొప్పి తగ్గించడానికి   అన్నయ్య పుస్తకాలు చినిగిపోకుండా  నాన్న అతికించే ప్లాస్టర్ ని  తెచ్చిచ్చాడు. తలకి    అతికించమన్నాడు.   అప్పటికి విషయం అర్థమైంది రజనికి.  కొడుకు ఉపాయానికి నవ్వింది .  “ఎందుకు నవ్వుతున్నావు? ఇది అతికిస్తే తలనొప్పి  తగ్గదా ?” మళ్ళీ అమాయకంగా అడిగాడు రవి.   “తల పగిలిపోతుందంటే ప్లాస్టర్ వెయ్యకూడదు. తలనొప్పి వచ్చిందని అర్ధం.  అమృతాంజనంతో రాస్తే   తగ్గిపోతుంది” అని  వాడికి అర్థమయ్యేలా వివరించింది  రజని.   కొడుకు చేసిన ఘనకార్యం గురించి ఇంట్లో ఉన్న మిగతా వాళ్ళకి   చెప్పింది రజని. వాళ్లు కూడ సరదాగా  నవ్వుకున్నారు.  ఆ రోజు మధ్యాహ్నం భోజనాలకు కూర్చున్నారు  ఇంట్లో వాళ్లు.  కోడి గుడ్లుతో వండిన   కూర అందరికీ వడ్డించింది రజిని. “అదేమిటి”  అని రవి అడిగాడు. కోడిగుడ్డు అని చెప్పింది రజని.  “నాకు గాడిద గుడ్డు కావాలి” అన్నాడు.   మొదట వాడేమన్నాడో అర్ధం కాలేదు   రజనికి.  అక్కడ ఉన్న మిగతావాళ్ళు కూడా ఆసక్తిగా రవి వైపు  చూసారు.    “గాడిద గుడ్డు ఉండదు.  కోడిగుడ్డు, బాతు గుడ్డు ఉంటుంది” రవిని బుజ్జగించడానికి వాళ్ల అమ్మమ్మ కూడ చెప్పింది.   “ఉహు .. ఉంటుంది. అదే  కావాలి నాకు” అని ఏడుపు అందుకున్నాడు  రవి. ఎన్ని విధాలుగా చెబుతున్నా వాడు ఏడుపు ఆపలేదు.    ‘రవి  ఎందుకలా అడుగుతున్నాడో, ఎవరైనా అంటేనే కదా పిల్లలకి తెలిసేది’ అని  వాళ్ల నాన్నకి అనుమానం వచ్చింది. అసలు సంగతి వాడి ద్వారానే చెప్పించాలని రవిని దగ్గరకు తీసుకుని  బుజ్జగిస్తూ  “గాడిద గుడ్డు అని ఎవరన్నారు? నాతో చెప్పు. నువ్వు చెబితే కదా  తెలుస్తుంది . అలా అన్నవాళ్ళని అడిగి అది తెప్పిస్తాను”   అన్నాడు.  రవి ముఖంలోకి వెలుగు వచ్చింది నాన్న మాటలు వినగానే . వెంటనే తాతయ్య వైపు వేలు చూపించాడు.  అందరి దృష్టి  తాతయ్య మీదకు  మళ్లింది. “మీరే వాడికి చెప్పారా? గాడిద గుడ్డు ఎక్కడైనా ఉంటుందా?” అని అందరూ  తాతయ్యని ప్రశ్నించారు.  “ఆగండర్రా। నేనెందుకు వాడికి చెబుతాను ?  కాసేపు ఆలోచించడానికి టైమ్ ఇవ్వండి “ అని వాళ్ళకి చెప్పేసి  ఆలోచనల్లోకి జారారు.  ఏం జరిగిందో గుర్తుకి  తెచ్చుకోడానికి ప్రయత్నించారు. కాసేపటికి ఆయనకి ఒక విషయం గుర్తొచ్చింది. ఆ రోజు ఉదయం పని వాళ్లలో ఒకరు  చెప్పిన పని తప్పుగా చేసి, బుకాయించడంతో   కోపం వచ్చి  “ ఇలాగేనా చేసేది? గాడిద గుడ్డేం కాదు”  అని తిట్టాడు తాతయ్య. అప్పుడు ఆయన ఒడిలోనే కూర్చున్న  రవి ఆ మాటలు విన్నాడు. వెంటనే తాతయ్యని అడిగాడు ఆ గుడ్డు ఏమిటని?  ఆయన ఉన్న  చిరాకులో వాడికి బదులివ్వలేదు.  తాతయ్య దగ్గిర నుండి అసలు విషయం తెలుసుకున్న  మిగతా కుటుంబసభ్యులు  నవ్వుకున్నారు.   రవి వాళ్ల నాన్న రవిని  ప్రేమగా  బుజ్జగించి  గాడిద గుడ్డు అనేది  ఉండదని, అదొక తిట్టు పదంగా తాతయ్య మాట్లాడారని  చెప్పాడు.    వాడిని ఒప్పించేసరికి    తల ప్రాణం తోకకి వచ్చింది రవి నాన్నకి.    రవికి  అన్నయ్య కూడా  ఉన్నాడు .  వాడి పేరు  రాము. రాముకి  ఎనిమిదేళ్లు.  వాడు బడికి వెళ్ళినప్పుడు , తిరిగి వచ్చిన తరువాత అన్నా తమ్ముళ్ళిద్దరూ   ఏదో ఒక వస్తువు కోసం  గొడవ పడుతుంటారు.   ఒకరోజు పిల్లలిద్దరూ బడి నుండి రాగానే    బ్యాగు పక్కన  పెట్టి,  టీవీ రిమోట్ కోసం గొడవ పడ్డారు.     ఇంటి పనితో  అలసిపోయి ఉన్న    రజనికి వీరి గొడవతో మరింత చిరాకుగా అనిపించింది.   “బడి నుండి రాగానే స్కూల్ యూనిఫామ్ విప్పేసి కాళ్లూ చేతులూ కడుక్కోవాలని చెప్పాను కదా.  టేబుల్ మీద   టిఫిన్   ఉంచాను.అది  తినడం మానేసి  తగాదా ఎందుకు? బుద్ధిగా ఉన్నారా సరే. లేదంటే  పెనం మీద కాల్చిన అట్లకాడతో వాత పెడతాను”  అంది.  “అమ్మా .. నాకది కావాలి. అన్నయ్యకివ్వకు. నాకిప్పుడే వాత  పెట్టు” అమ్మ దగ్గరకు వెళ్లి  మారాం చేస్తూ అడిగాడు  రవి.  “నీకేం అర్ధమైందిరా ? వాత అంటే తెలుసా?” అని చిరాకు  తగ్గించుకుని అడిగింది రజని.  “ఓ తెలుసు.. అది పెనం మీద కాల్చే అప్పచ్చి .  ఆకలిగా ఉంది. తొందరగా వాత పెట్టమ్మా” అన్నాడు రవి అమాయకంగా.  వాడి ముద్దు మాటలు వింటుంటే కోపం, చిరాకు  ఎగిరిపోయింది రజనికి . మనస్ఫూర్తిగా నవ్వుకుంది.  ముద్దొస్తున్న రవి ముఖం మీద ముద్దు పెట్టి  “ ఉండు.  టిఫిన్ తెచ్చి తినిపిస్తాను” అంటూ వంట గదిలోకి పరిగెత్తింది.    “చిన్న పిల్లల ముందు  అనకూడని మాటలు పలకకూడదని,  వాటినే పిల్లలు వేరే విధంగా అర్ధం చేసుకుని పెద్దల దగ్గర,  బడిలో ఇతర  పిల్లల దగ్గర కూడా పలికే ప్రమాదముందని”  తెలుసుకుంది రజని.  అప్పటి నుండి  రవి ముందు జాగ్రత్తగా మాట్లాడడం, ఉండడం నేర్చుకున్నారు .  నారంశెట్టి ఉమామహేశ్వరరావు

రాజుగారి కళా పోషణ

విజయనగర రాజు విజయేంద్రవర్మ మంచి ఇంద్రజాలికుడు. ఎక్కడికి వెళ్ళినా, కళల గురించి గొప్పగా మాట్లాడేవాడు. ఒకసారి తన రాజ్యంలో కళాకారులు ఎంత గొప్పగా జీవిస్తున్నారో, గౌరవించబడుతున్నారో తెలుసుకోవాలన్న కోరిక కలిగింది. వెంటనే మారువేషంలో గుర్రం మీద దేశసంచారానికి బయలుదేరాడు. ఒక ఊరి సంతలో కమ్మటి గానం విని గుర్రాన్ని ఆపి అటు వైపు వెళ్లాడు. అక్కడ నలుగురు సంగీత వాయిద్యాలు వాయిస్తుంటే  మరో ఇద్దరు గానం చేస్తున్నారు. ఆ గానం చేస్తున్న యువతీ,యువకుడు ఇద్దరూ అంధులే! మధురంగా పాడటం ఆపాక సంతలో ఉన్నవారిని దానం చేయమని కోరారు. తన రాజ్యంలో కళాకారులు అడుక్కోవటం చూసి ఆశ్చర్యపోయాడు విజయేంద్రవర్మ.     ‘రాజు గొప్ప కళాకారుడు! ఎప్పుడూ కళాకారుల గురించే మాట్లాడుతాడు! మీరు ఇలా యాచించటం వింతగా ఉంది!’ అంటూ యువతిని అడిగాడు రాజు. ‘రాజు కళాకారుడైనందుకు మా బతుకులు బాగైతాయని సంతోషించాము. అతని మాటలు కోటలు దాటుతాయి కానీ పనులు మాత్రం శూన్యం’ అన్నది ఆమె. విజయేంద్రవర్మ మౌనంగా ఉండిపోయాడు.     గుర్రం ఎక్కి మరో గ్రామం చేరుకున్నాడు. అక్కడొక యువతి నృత్యం చేస్తుంటే .. కొందరు గ్రామ పెద్దలు వెకిలిగా నవ్వుతూ డబ్బులిస్తున్నారు. నృత్యం ముగిశాక ‘చూడమ్మా! రాజు కళాప్రేమికుడు కదా! నువ్వేంటి ఇలా దిగజారి అడుక్కుంటున్నావు?’ అడిగాడు విజయేంద్రవర్మ. ‘రాజు కళాప్రేమికుడే. కాని కళాపోషకుడు మాత్రం కాదు. క్రియా శూన్యుడు. అతను చెప్పేది నిజంగా చేస్తే మాకు ఈ బతుకు ఉండక పోయేది!’ ఆవేశంగా అంది ఆమె.     ఆ జవాబు విని మౌనంగా ముందుకు కదిలాడు రాజు. మరో గ్రామంలో ఒక వయసు పైబడిన ఇంద్రజాలికుడు ఇంద్రజాలం చేస్తూ కనిపించాడు. ఇంద్రజాలికుడిని చూడగానే విజయేంద్రవర్మకు ఎక్కడలేని ఉత్సాహం కలిగింది. రాజు అతనిలో తనని చూసుకున్నాడు. ప్రేక్షకులు చప్పట్లతో అతన్ని ఉత్సాహపరుస్తున్నారు. ఇంద్రజాలికుడి ప్రదర్శన ముగిశాక నెత్తిన ఉన్న టోపి తీసి దానం చేయమని అడిగాడు. ‘తాతా ! రాజు కూడా నీ వలె గొప్ప ఇంద్రజాలికుడు కదా! నువ్వేంటి ఇలా..!’ అడిగాడు రాజు. ‘నువ్వు శంఖాన్ని ఎప్పుడైనా చెవి దగ్గర పెట్టుకొని విన్నావా? వింటే సముద్రపు హోరులా శబ్దం వస్తుంది. ఆ శబ్దం నిరంతరం వస్తూనే ఉంటుంది. అలా శబ్దం చేయడం వల్ల  ప్రయోజనం అటు శంఖానికి, ఇటు మనకు ఉండదు! రాజు గారి ప్రసంగాలు కూడా అంతే!’ అన్నాడు అతను.  కళాకారులు తనని తోటి కళాకారుడిగా, కళల పట్ల విడువకుండా రోజంతా మాట్లాడగలిగే మంచి వక్తగా గుర్తించారే తప్ప మంచి పాలకుడిగా గుర్తించలేదని తెలుసుకున్నాడు విజయేంద్రవర్మ. ఆనాటి నుండి కళాకారులను గుర్తించి, వారికి తగిన ఉద్యోగాలు కల్పించి ఆర్థికంగా ఆదుకున్నాడు. వికలాంగ కళాకారులను గుర్తించి వారికి ప్రత్యేకంగా ఆరోగ్య సౌకర్యాలు, వసతులు కల్పించాడు. పేద కళాకారులను గుర్తించి వీలున్న చోటల్లా వారి సేవలను వినియోగించుకుని ఘనంగా సత్కరించాడు. మాటల్ని డబ్బులంత పొదుపుగా వాడుకుంటూ చేతలను నీళ్ళలా పరోపకారం కోసం ప్రవహింపచేశాడు. అలా కొద్ది రోజుల్లోనే విజయేంద్రవర్మ క్రియా శూన్యుడు కాదు.. క్రియా శూరుడిగా పేరు పొందాడు.

శంకు కర్ణుడి కథ

వ్యాస మహర్షి శిష్యులతో కలసి కాశీ నగరంలో ఉన్న కాలంలో ప్రతిరోజూ అక్కడి తీర్థాలను, ఆలయాలను సందర్శించసాగాడు. ఒకనాడు కృత్తివాసేశ్వరుడిని దర్శించుకున్న తర్వాత వ్యాస మహర్షి శిష్యులతో కలసి కపర్దీశ్వర లింగాన్ని దర్శించుకోవడానికి బయలుదేరాడు. కపర్దీశ్వర లింగానికి సమీపంలోని పిశాచమోచన తీర్థంలో స్నానమాడి, పితృ తర్పణాలు విడిచి, కపర్దీశ్వరుడిని పూజించాడు. వ్యాసుడు, అతడి శిష్యులు అక్కడ ఉండగానే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఒక ఆడజింక కపర్దీశ్వర లింగం చుట్టూ ప్రదక్షిణలు చేయసాగింది. దానిని తినడానికి ఒక పెద్దపులి అక్కడు వచ్చింది. పెద్దపులి జింక మీద పడి, గోళ్లతో చీల్చి దానిని చంపేసింది. వ్యాసుడు, అతడి శిష్య బృందం అటువైపుగా వస్తుండటం గమనించిన పెద్దపులి, చంపేసిన జింకను అక్కడే వదిలేసి పారిపోయింది.  అప్పుడే ఒక అద్భుతం జరిగింది. కపర్దీశ్వరుడి ముందు మరణించిన జింక గొప్ప కాంతితో ప్రకాశించింది. మూడు కళ్లతో, నల్లని మెడతో, తలపై నెలవంకతో ఒక వృషభాన్ని ఎక్కి, అదే ఆకారంలో ఉన్న మరో పురుషుడితో కలసి కనిపించింది. జింక చుట్టూ ఒక జ్వాల వెలిగి, గణేశుడి రూపం పొంది అదృశ్యమైంది. వ్యాసుడి శిష్యులు ఈ పరిణామానికి విభ్రాంతులయ్యారు. ‘మహర్షీ! ఏమిటి ఈ అద్భుతం? దీనికి కారణమేమిటి?’ అని అడిగారు. ఇదంతా కపర్దీశ్వరుడి మహాత్మ్యం. కపర్దీశ్వరలింగం మహా మహిమాన్వితమైనది. దీనిని సేవించినట్లయితే, సమస్త పాపాలూ తొలగిపోతాయి. ఇక్కడే ఉన్న పిశాచమోచన తీర్థంలో స్నానమాడి, కపర్దీశ్వరుడిని పూజిస్తే, ఇహపర సౌఖ్యాలు కలుగుతాయి. ఈ మహాత్మ్యాన్ని వివరించాలంటే, మీకు శంకుకర్ణుడి కథ చెప్పాలి’ అన్నాడు వ్యాసుడు. ‘ఎవరా శంకుకర్ణుడు? అతడి కథ ఏమిటి? తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. చెప్పండి గురుదేవా!’ అభ్యర్థించారు శిష్యులు. శిష్యుల అభ్యర్థనకు సాదరంగా తలపంకించిన వ్యాసుడు శంకుకర్ణుడి కథను ఇలా చెప్పసాగాడు: ‘ఈ కపర్దీశ్వర క్షేత్రంలోనే లోగడ శంకుకర్ణుడనే మహాముని ఉండేవాడు. ఆయన నిరంతరం రుద్రమంత్రాలు జపిస్తూ కపర్దీశ్వరుడిని పూలు, పండ్లతో పూజిస్తుండేవాడు. జపతపాలతో యోగసాధనలో గడిపేవాడు. ఒకనాడు ఆయన యోగసాధనలో ఉండగా, ఆకలితో అలమటిస్తున్న పిశాచరూపంలో ఉన్న ఒక పురుషుడు వచ్చాడు. ఆ పిశాచాన్ని చూసి, శంకుకర్ణుడు ఎంతో జాలిపడ్డాడు. ‘ఓ పిశాచమా! నువ్వెవరు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎందుకొచ్చావు?’ అని ప్రశ్నించాడు. శంకుకర్ణుడు తనను ఆదరంగా ప్రశ్నలు అడగటంతో ఆ పిశాచం కన్నీళ్లు పెట్టుకుని, తన వృత్తాంతాన్ని చెప్పడం ప్రారంభించాడు.  ‘మునీశ్వరా! గత జన్మలో నేను సంపన్న బ్రాహ్మణుణ్ణి. ధనమదంతో బతికినన్ని రోజులూ ఎవరికీ ఎలాంటి దానధర్మాలూ చేయలేదు. మంచి పనులేవీ చేయలేదు. ఒకనాడు వారణాసికి వెళ్లి, అక్కడ కొలువైన విశ్వేశ్వరుణ్ణి పూజించాను. కొంతకాలానికి కాలధర్మం చెందాను. కాశీ విశ్వేశ్వరుణ్ణి ఒక్కసారి పూజించినందున నేను నరకానికి వెళ్లలేదు. అయితే, బతికి ఉన్నన్నాళ్లూ పుణ్యకార్యాలేవీ చేయకపోగా, పాపాలు చేయడంతో ఇలా పిశాచ రూపంలో మిగిలాను. ఆకలిదప్పులకు అలమటిస్తూ దిక్కుతోచక ఇక్కడే సంచరిస్తున్నాను. మహాత్మా! నాకీ పిశాచరూపం నుంచి విముక్తి దొరికే మార్గం ఏదైనా ఉంటే చెప్పు. నువ్వే నాకు దిక్కు’ అని దీనంగా వేడుకున్నాడు. ‘ఓ పిశాచమా! నువ్వు చాలా పుణ్యాత్ముడివి. లోకంలో నీవంటి పుణ్యాత్ములు చాలా అరుదు. పూర్వజన్మలో నువ్వు సకల విశ్వాధినేత అయిన విశ్వేశ్వరుణ్ణి స్వయంగా స్పృశించి పూజించావు. ఆ పుణ్యఫలం వల్లనే తిరిగి ఇదే క్షేత్రానికి వచ్చావు. నీకు వచ్చిన భయమేమీ లేదు. ఇక్కడ కొలువై ఉన్న కపర్దీశ్వరుణ్ణి మనసారా ప్రార్థించి, ఈ పుష్కరిణిలో స్నానం చేయి. నీకీ పిశాచ జన్మ నుంచి విముక్తి కలుగుతుంది’ అని ధైర్యం చెప్పాడు శంకుకర్ణుడు. శంకుకర్ణుడి సూచనతో ఆ పిశాచం కపర్దీశ్వరుణ్ణి స్మరిస్తూ, పుష్కరిణిలో స్నానం చేశాడు. పుష్కరిణిలో స్నానం చేయగానే అతడికి పిశాచరూపం పోయి, గొప్ప తేజస్సుతో దివ్యరూపం వచ్చింది. తనకు పిశాచరూపం నుంచి విమోచన కలిగించిన శంకుకర్ణుడి ముందు మోకరిల్లి, నమస్కరించాడు. వెంటనే దేవతలు పంపిన దివ్యవి మానమెక్కి, దివ్యలోకాలకు వెళ్లిపోయాడు. ఆ అభాగ్యుడికి పిశాచరూపం పోయినందుకు శంకుకర్ణుడు ఎంతో సంతోషించాడు. ఇదంతా కపర్దీశ్వరుడి మహిమేనని తలచి, కపర్దీశ్వరుణ్ణి స్తుతించాడు. తర్వాత ఓంకారాన్ని ఉచ్చరిస్తూ అలాగే నేల కొరిగి పోయాడు. ప్రాణాలు కోల్పోయిన శంకుకర్ణుడి జీవాత్మ కపర్దీశ్వర లింగంలో ఐక్యమైపోయింది. మును లారా! ఇదీ శంకు కర్ణుడి వృత్తాంతం. మరణానంతరం పిశాచరూపం పొందిన బ్రాహ్మణుడికి ఆ రూపం నుంచి విముక్తి కలిగించడం వల్లనే ఈ పుష్కరిణి పిశాచమోచన పుష్కరిణిగా ప్రఖ్యాతి పొందింది. ఈ పుష్కరిణిలో స్నానం చేసి, కపర్దీశ్వరుణ్ణి పూజించేవారికి ఇహపర సౌఖ్యాలు కలుగుతాయి’ అని ముగించాడు వ్యాసుడు.

అల్లుడి అదృష్టం

భద్రయ్య కూతురు సీత పెళ్ళి కుదిరింది. ఊళ్ళోనేవున్న ధర్మయ్య కొడుకు శివయ్య వరుడు. భద్రయ్య పెళ్ళి ఖర్చులకు, కట్నం ఇవ్వడానికి తనువుంటున్న పెంకుటిల్లు అమ్మడానికి పెట్టాడు. ఇంటి పక్కనే వున్నశాంతయ్య తనకి కలిసి వస్తుందనికొనడానికి ముందుకు వచ్చి కొంత డబ్బుబయానాగా ఇచ్చాడు. కాని భద్రయ్యంటే పడనిగోపయ్య ఆ ఇంటికి వాస్తుసరిగ్గా లేదనీ, కొంటే అరిష్టమనీ భయపెట్టాడు. శాంతయ్య భయపడి తను ఆఇల్లు కొనలేనని బయానాగా ఇచ్చిన డబ్బు తిరిగి తీసుకున్నాడు.  భద్రయ్య నిరుత్సాహపడ్డాడు. ధర్మయ్య దగ్గరికి వెళ్ళి పెళ్ళి వాయిదా వెయ్యమని కోరాడు. ఇల్లు అమ్ముడైతే తప్పకట్నం ఇవ్వలేనని అసలు విషయం చెప్పాడు. అప్పుడు వరుడు శివయ్య ముందుకువచ్చి, “నాన్నా! కట్నం బదులు ఆఇల్లు నేను తీసుకుంటాను. పెళ్ళయినతర్వాత అన్నయ్య మీ దగ్గర వుంటాడు. నేను ఆ ఇంట్లో కాపురంవుంటాను” అన్నాడు. “ఆ ఇల్లు చాలాపాతబడింది గదా?” అని సందేహంవెలిబుచ్చాడు ధర్మయ్య, “ఆ ఇల్లు వున్నస్థలం మంచి కూడలిలో గ్రామంమధ్యలో వుంది నాన్నా! నేనుదాన్ని పడగొట్టి ఇంటితో పాటు దుకాణం కట్టిస్తాను. వ్యాపారానికి అనుకూలంగా వుంటుంది” అని తండ్రికి నచ్చజెప్పాడుశివయ్య. ధర్మయ్య కొడుకుఅభిప్రాయంతో ఏకీభవించాడు. పెళ్ళియిన తర్వాత భద్రయ్య ఇంటిని అల్లుడికి అప్పగించి తను పట్నంలో వున్నకొడుకు దగ్గరకు వెళ్ళిపోయాడు. తర్వాత శివయ్య పెంకుటిల్లు పడగొట్టించాడు.. కొత్త ఇల్లు, దుకాణంకట్టించడానికి. పునాదులు తవ్వుతుంటే లంకెబిందె దొరికింది. దొన్నిండా బంగారు కాసులున్నాయి. శివయ్య పట్నం వెళ్ళి మామగారినికలుసుకుని ఇంటి పునాదుల్లో లంకెబిందె దొరికిందనే సంగతి చెప్పాడు. “మావయ్యా! ఆ లంకెబిందె మీ పూర్వీకులదై వుంటుంది. అందులో బంగారం మీకు చెందుతుంది తీసుకోండి” అన్నాడు శివయ్య, భద్రయ్య నవ్వి “అదంతా నీ అదృష్టంఅల్లూడూ, అదే నేనా ఇల్లుశాంతయ్యకు అమ్మివుంటే లంకె బిందె బైట. పడినా, నాకు చెప్పేవాడా? తిరిగిఇచ్చేవాదా? ఇల్లు కొనడానికి బయానాగా డబ్బులు ఇచ్చి తిరిగి తీసుకున్నాడంటే, మా పెద్దల ఆస్తి బైటకు పోకుండావుండటానికే అనుకుంటాను.

ఆలోచన-ఆచరణ (చందమామ కథలు)

ముకుందపురంలో అరవిందుడు అనే యువకుడు వ్యవసాయం చేసుకుంటూనే, గ్రామాభివృద్ధికి ఇతోధికంగా సేవ చేసేవాడు. ఆ గ్రామస్తులు నిత్యమూ గోదావరి మధ్య ఉన్న లంకలో పనులకు వెళ్లి వస్తూండేవారు. గ్రామానికీ ఏటి గట్టుకూ నడుమ కాలువ ఉంది. ఆ కాలువను దాటడానికి తాటిచెక్క వంతెనలా వేయబడింది. ఆ తాటి వంతెన పైన నడుస్తూ అప్పుడప్పుడూ కొందరు కాలు జారి కాలువలో పడిపోవడం కద్దు. అందువల్ల కాలువపైన వంతెన నిర్మించవలసిందిగా గ్రామ పంచాయితీని కోరాడు అరవిందుడు. అందుకు నిధులు లేవన్నారు సభ్యులు. పోనీ గ్రామస్థులంతా చందాలు వేసుకుని వంతెనను తామే నిర్మించుకుందామంటే ఎవరూ ముందుకు రాలేదు. అందువల్ల అరవిందుడు తన స్వంత సొమ్ముతో బల్లకట్టు తయారు చేయించాడు. దాన్ని నడిపేందుకు నియమింపబడ్డ వ్యక్తికి నెలనెలా జీతం ఇచ్చేందుకు ఊరి పంచాయితీ అంగీకరించింది. కాలువ దాటడానికి తాటిచెక్క వంతెన పోయి, బల్లకట్టు రావడంతో గ్రామస్తులు కూడా ఎంతో సంతోషించారు. అదే గ్రామంలో ఉండే నాగేంద్ర అనేవాడికి ఎవరు ఏ పని చేసినా విమర్శించడం అలవాటు. “కాలువపైన వంతెన నిర్మించక, బల్లకట్టు వేస్తే సరిపోతుందా? దానిని నడిపే వాడికి జీతం ఇవ్వడం వల్ల పంచాయితీ నిధులు దండుగే కదా!” అంటూ విమర్శించాడు. ఆ మాట అరవిందుడి చెవికి చేరినా ఏమీ అనలేదు. ఓసారి అరవిందుడు తన ఎడ్ల బండిలో పొరుగూరికి బయలుదేరాడు. ఏటి ఒడ్డమ్మటా వెళ్తూంటే, దారిలో ఎండలో నడిచి వెళ్తున్న తన ఊరివాళ్లు కొందరు కనిపించారు. వారిని పిలిచి బండి ఎక్కించుకున్నాడు అరవిందుడు. వారిలో నాగేంద్ర కూడా ఉన్నాడు. ఎడ్లు పరుగెత్తకుండా నెమ్మదిగా నడుస్తుంటే కమ్చీ కోలతో వాటిని కొట్టి అదిలిస్తున్నాడు అరవిందుడు. అది చూసిన నాగేంద్ర “ఎడ్లను కొట్టి పని చేయించడమూ ఓ గొప్పేనా! వీపు మీద ప్రేమతో నిమిరితే అవే చెప్పిన మాట వింటాయి,”" అంటూ అలవాటు ప్రకారం విమర్శించాడు నాగేంద్ర... అరవిందుడు ఇప్పటికీ ఏమీ అనలేదు. మరికొంత దూరం వెళ్లేసరికి ఎడ్లు నత్త నడకన నడవటం చూసిన అరవిందుడు నాగేంద్రతో “నువ్వు చెప్పింది నిజమేననిపిస్తోంది. నేను వెనక కూర్చుంటాను. నువ్వు ముందుకు వచ్చి బండి నడుపు” అన్నాడు.నాగేంద్ర ఉలికిపడి, “బండి నడపడం నాకు చేతకాదు.” అన్నాడు కంగారుగా. “ఎడ్డను ఎలా మచ్చిక చేసుకోవాలో తెలిసినవాడివి, బండి నడపలేవా?” అన్నాడు అరవిందుడు అచ్చెరపాటుతో. “దారి తెలిసినంత మాత్రాన మోటారు శకటాన్ని నడపటం అందరికీ చేతనౌతుందా?” అన్నాడు నాగేంద్ర. అప్పుడు అరవిందుడు నవ్వి ఇలా అన్నాడు. “ఓ మంచి పని చేయాలన్న ఆలోచనా, ఎలా చేయాలన్న ఊహా అందరిలోనూ ఉంటాయి. వాటిని ఆచరణలో పెట్టడంలోనే ఉంటుంది కష్టమంతాను. ఆలోచన వేరు, ఆచరణ వేరూను. నీటిలో దిగితే కాని లోతు తెలవనట్లే, ఓ పనిని ఆచరిస్తే కాని అందులోని సాధకబాధకాలు తెలిసిరావు. ఇతరులు చేసే పనిని విమర్శించడం తేలికే. ఆ పనిని స్వయంగా చేయడమే కష్టం.. విమర్శ కోసమే చేసే విమర్శలు హాని కలిగిస్తాయి. వాటివల్ల ఓ మంచిపని చేయాలనుకునే వారు వెనక్కి తగ్గే ప్రమాదం ఉంది.” అరవిందుడు తన పారపాటును సున్నితంగా ఎత్తిచూపడంతో, నాగేంద్ర తన తప్పు తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఎన్నడూ ఏ విషయంలోనూ అనవసరంగా అనాలోచితంగా విమర్శలకు పూనుకోకపోవడమే కాక, ఇతరులు చేసే మంచిపనులకు తన వంతు సాయం చేయనారంభించాడు.

మంచి మాట

ఒకరోజు వశిష్ఠుడు విశ్వామిత్రుని ఆశ్రమానికి వచ్చాడు. ఇద్దరూ అనేక విషయాలపై మాట్లాడుకున్నారు. వశిష్ఠునికి వీడ్కోలు పలుకుతూ విశ్వామిత్రుడు కలకాలం గుర్తుండేలా ఒక విలువైన కానుక సమర్పించాలని భావించి, తన వెయ్యేళ్ల తపశ్శక్తిని ఆయనకు ధారపోశాడు. వశిష్ఠుడు దానిని మహదానందంగా స్వీకరించాడు. కొన్నాళ్లకు విశ్వామిత్రుడు వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చాడు. వశిష్ఠుడు ఆయనకు సకలోపచారాలు చేశాడు. పుణ్యానికి సంబంధించిన ఆధ్యాత్మిక విషయాలపై మాత్రమే ఇద్దరూ మాట్లాడుకున్నారు. చివరకు విశ్వామిత్రునికి వీడ్కోలు పలుకుతూ వశిష్ఠుడు, అప్పటి వరకు తాము మాట్లాడుకున్న మంచి విషయాల పుణ్య ఫలాన్ని బహుమానంగా ఇస్తున్నట్టు చెప్పాడు. విశ్వామిత్రుడు చిన్నబోయాడు. తాను కానుకగా ఇచ్చిన వెయ్యేళ్ల తపోఫలానికి ఒక్క పూట సమయంలో మాట్లాడుకున్న మంచి మాటల పుణ్య ఫలం ఏపాటి సాటి వస్తుందని అనుకున్నాడు. అదే విషయాన్ని విశ్వామిత్రుడు వశిష్ఠుడిని అడిగాడు. తపోఫలమా? సత్సాంగత్య ఫలమా? ఏది గొప్పదో తెలుసుకోవడానికి ఇద్దరూ బ్రహ్మ వద్దకు వెళ్లారు. ఆయన విష్ణువు వద్దకు వెళ్లమన్నాడు. విష్ణువు, దీనికి పరమశివుడే సరిగ్గా సమాధానం చెప్పగలడని చెప్పి ఆయన వద్దకు పంపాడు. ఆయనేమో పాతాళంలో ఉన్న ఆదిశేషుడు తప్ప మరెవరూ ఏ ఫలం గొప్పదో చెప్పలేరని తేల్చాడు. ఇద్దరూ కలిసి అక్కడకూ వెళ్లారు. వారిద్దరి సందేహం విన్న ఆదిశేషుడు సమాధానం చెప్పడానికి కొంత వ్యవధి కావాలని అడిగాడు. అప్పటివరకు తాను మోస్తున్న ఈ భూలోకాన్ని మీ ఇద్దరూ మోయాలని షరతు కూడా పెట్టాడు. తలపై పెట్టుకుంటే బరువుగా ఉంటుంది కాబట్టి ఆకాశంలో నిలబెట్టి ఉంచండని సలహా ఇచ్చాడు. విశ్వామిత్రుడు వెంటనే ‘నా వేయి సంవత్సరాల తపోఫలాన్ని ధారపోస్తాను. ఆ తపశ్శక్తితో ఈ భూమి ఆకాశంలో నిలబడుతుంది’ అన్నాడు. అయితే భూమిలో ఏ చలనం లేదు. అప్పుడు వశిష్ఠుడు అన్నాడు ‘ఒక్క పూట సమయంతో పాటు మేం చర్చించిన ఆధ్యాత్మిక విషయాల వలన కలిగిన పుణ్య ఫలం ధారపోస్తున్నాను. ఆ శక్తితో భూమి ఆకాశంలో నిలబడాలని కోరుకుంటున్నాను’ అన్నాడు. వశిష్ఠుడు అలా అనగానే, ఆదిశేషుని తలపై ఉన్న భూమి ఆకాశాన నిలబడింది. ఆదిశేషుడు తిరిగి భూమిని తన తలపై పెట్టుకుని ‘మీ ఇద్దరూ ఇక వెళ్లవచ్చ’ని అంటాడు. అడిగిన దానికి బదులివ్వకుండా వెళ్లమంటే ఎలా? అని ఇద్దరూ ఆదిశేషుడిని ప్రశ్నించారు. ‘మీ ఎదురుగానే రుజువైంది కదా! ఏ తపోఫలం గొప్పదో? ఇక వేరే తీర్పు చెప్పడానికి ఏముంది?’ అని ఆదిశేషుడు అన్నాడు. వేయి సంవత్సరాల తపశ్శక్తి ధారపోసినా కదలని భూమి ఒక్క అరగంట పాటు మాట్లాడుకున్న మంచి మాటల వలన కలిగిన పుణ్య ఫలాన్ని ధారపోయడం వలన ఇట్టే ఆకాశంలో నిలబడిందన్న విషయాన్ని విశ్వామిత్రుడు, వశిష్ఠుడు గ్రహించారు. 

సంతృప్తి

ఒక రాజ్యంలో ఓ అత్యంత తెలివైనవాడుండేవాడు. అతని పేరు సుబ్బన్న. తెలివైనవాడే కానీ తృప్తి, ఆనందం అనే మాట తెలీని వాడు. ఎవరిని చూసినా తానే వాడికంటే గొప్ప అనుకునే  నైజం. దీంతో సుబ్బన్న అహంభావి అనేవారు కొందరు. ఇవేమీ పట్టించుకునేవాడు కాదు సుబ్బన్న. రాజ్యంలో ఓ గుడి కట్టారు. అది రాముల వారి ఆలయం. ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాలకు వెళ్లి ఆనందించాలని సుబ్బన్న అనుకున్నాడు. తన ఊరు దూరం అయినా కాలిబాటన, బండిలో ఇలా ఉత్సవ స్థలానికి చేరుకున్నాడు. మొదటి రోజు రాజుగారు వచ్చారు. అందరూ ఆసీనులై ఉండగా.. ఇద్దరు కళాకారులు వచ్చి పాటలు పాడారు. ఆ పాటలు విని తన్మయత్వం చెందాడు. తాను కూడా అలా పాడితే బావుండునని అనుకున్నాడు. ఎంతో బాధపడ్డాడు. తానూ అలా గాయకుడిని అయితే బావుండును అనుకున్నాడు. రెండో రోజు రాజుగారి ముందు కవులు వచ్చి పద్యాలు పాడారు. పండితులు మాట్లాడారు. వారిలా పద్యాలు రాయలేకపోతినే అనుకున్నాడు. కొన్ని పద్యాలు అర్థమై ఎంతో సంతోషపడ్డాడు. నేను కూడా పండితుడిని అయితే వీరి భాష వచ్చి ఉండేది కదా అని వగచాడు. రానే చివరి రోజు వచ్చింది. మూడో రోజు రామాలయం దగ్గర రామాయణం బొమ్మలు, ఎన్నో విశేషాలను కళాకారులు చిత్రించారు. కాన్వాసుల మీద రాళ్లమీద రామాయణగాథ వివరించబడింది. ఆ బొమ్మలు చూసి నేను కూడా ఇలా గీసి ఉంటే అందరి మెప్పు పొందేవాడిని కదా.. అనుకున్నాడు సుబ్బన్న. బాధతో కోపంతో ఇంటికి పయనమయ్యాడు. మూడోరోజు రాత్రి ఓ ఆశ్రమంలో బస చేశాడు. అక్కడ ముగ్గురు కనపడ్డారు. ఒకడు గుడ్డివాడు, రెండోవాడు చెవిటి, మూడో వాడికి కళ్లు లేవు. అది చూసి సుబ్బన్న ఆశ్చర్యపోయాడు. ‘వీళ్లు ఈ రాముడి గుడి ఉండే ఊరిలోనే ఉన్నారు. అయితే ఏ కళలనూ ఆస్వాదించలేకపోతున్నారే. వారి కంటే నేనే నయం కదా’ అనుకున్నాడు. వెంటనే అతనికి ఆత్మసంతృప్తి కలిగింది. ఎంతో ఆనందపడ్డాడు. నిరంతర ఆనందం బాహ్యపరమైన కోరికలలో లేదు. ఉన్నా అది తాత్కాలికమే. శాశ్వతమైన ఆనందం మన హృదయంలోనే ఉంది. మన ధ్యాస ఎప్పుడూ బహిర్ముఖంగానే ఉంటోంది. అందువల్లే అంతరంగంలో నెలకొని ఉండే నిరంతర ఆనందాన్ని ఆస్వాదించలేకపోతున్నాం. మనిషి మానసిక ఒత్తిళ్లకు లోనైనప్పుడు ఉపశమనం కోసం ప్రత్యామ్నాయ మార్గాలవైపు దృష్టి సారిస్తాడు. కొంతమంది వ్యసనాల వెనక, మరి కొంతమంది ఆధ్యాత్మికత వైపు పరుగులు పెడుతున్నారు. అవసరార్థం తెచ్చి పెట్టుకున్న ఏ కొత్త అలవాటైనా ఎక్కువ కాలం కొనసాగదు. ఈ లోకంలో సదా దాతవై వర్ధిల్లు అన్నారు వివేకానంద. తన వద్ద ఏమీ లేకపోయినా ఇవ్వాలనే భావన కలిగి ఉంటే లేమి అనేది ఉండదు. లేమి లేకపోవడం సంతృప్తికి చిహ్నం. నిజ జీవితంలో మనకు ఎదురయ్యే సమస్యలన్నీ మనకు కొత్త పాఠాలు బోధించే అధ్యాపకులే. ఉదాహరణకు- ఒంటరిగా ఉండాలంటే భయం అనుకోండి... ఒంటరిగా ఉండే పరిస్థితి ఎదురైనప్పుడు ఏదో ఒక వ్యాపకం కల్పించుకొని ఇతరులతో కలిసి ఉండేందుకు ప్రయత్నిస్తాం. తద్వారా ఒంటరితనం వల్ల కలిగే భయాన్ని తాత్కాలికంగా పోగొట్టుకుంటాం. కానీ, సంతోషాన్నీ సమస్థితిని కోల్పోతాం. ధైర్యంగా ఎదుర్కోగలిగే మనో పరిపక్వత అలవరచుకుంటే, ఏకాంతంలో ఉండే ఆనందం అనుభవంలోకి వచ్చి మనోబలం దృఢపడుతుంది. నిశ్శబ్దంగా మౌనంగా ఉండటం, మాటల పొదుపు వల్ల సంతృప్తి లభిస్తుంది. మాటలో కాఠిన్యం ఆవేశ కావేషాలు వ్యక్తి కర్కశ స్వభావాన్ని తెలియజేస్తాయి. వాదోపవాదాలకు అవకాశం ఇవ్వకుండా క్లుప్తమైన సరళమైన మృదు సంభాషణతో భావాలను వ్యక్తీకరిస్తే వాచక సంతృప్తి కలుగుతుంది.  ఒక మంచి పని చేస్తే దాని ద్వారా ఎనలేని మానసిక సంతృప్తి కలుగుతుంది. అది ఉన్నవారి మొహాలు ప్రశాంతంగా ఉంటాయి. అలాంటివారు క్షమాగుణం కలిగి ఉంటారు. మాటల్లో, చేతల్లో సంతోషం సంతృప్తి కలిగి ఉండటం ఆధ్యాత్మిక సాధనలో తొలిమెట్టుగా భావిస్తారు. చీకటి లేని వెలుగుకు విలువ లేదు. అలాగే కష్ట నష్టాలు లేకుండా వచ్చే సంతోషానికి సంతృప్తి ఉండదు. అది ఎక్కువసేపు నిలవదు. ఓర్పు సహనాలతో పరిస్థితులను ఎదుర్కొంటూ తద్వారా వచ్చే విజయంలోనే అసలైన సంతోషం సంతృప్తి లభిస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, ఇతరులకు సహాయపడటం, క్రమశిక్షణ కలిగి ఉండటం, మనసును నియంత్రించుకోవడం వల్లనే జ్ఞాన మార్గంలో పయనించగలం. అది అలౌకిక సంతోషాన్ని సంతృప్తిని ఇస్తుందన్నది బుద్ధుడి మాట. సత్యశీలుడు, సుగుణావతి దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉండేవాళ్ళు. పిల్లలు బుద్ధిమంతులు. వాళ్ళు ఆస్తి పరులు, డబ్బుకు ఏ లోటూ ఉండేది కాదు. ఆరోగ్యం మహత్తరంగా ఉండేది; అన్నీ బాగానే ఉండేవి కానీ ఏదో తెలీని అసంతృప్తి వాళ్లని పీడించేది. 'భగవంతుడిని సేవిస్తే సంతోషం వస్తుంది' అని భార్యభర్తలిద్దరూ పూజలు చేసేవాళ్ళు, తీర్థయాత్రలు చేసేవాళ్ళు, పుణ్యక్షేత్రాలు దర్శించేవాళ్ళు, ఉత్సవాల్లో పాల్గొంటుండేవాళ్ళు. అయితే కేవలం ఆయా సందర్భల్లో మాత్రమే వాళ్ళ మనసుకు ఉల్లాసంగా, తన్మయంగా అనిపించేది. ఆ తరువాత మళ్ళీ వాళ్ళు యధా ప్రకారం అసంతృప్తికి గురయ్యేవాళ్ళు. అట్లానే 'గ్రంథ పఠనం' వల్ల సంతృప్తి వస్తుంది అని ఎవరో చెబితే కొన్నాళ్లపాటు వరస పెట్టి ధార్మిక గ్రంధాలు చదివించుకున్నారు; పురాణ కాలక్షేపాలు అవీ చేయించారు కానీ మళ్ళీ యథాప్రకారం అసంతృప్తే. ఆ సమయంలో వాళ్ళకు చిన్నప్పుడు పాఠాలు చెప్పిన గురువుగారు వాళ్ల ఊరికి వచ్చారు. సత్యశీలుడు,సుగుణవతి ఆయన్ని దర్శించుకొని తమ సమస్య చెప్పుకున్నారు. ఆయన  "చూడు నాయనా! మనిషి సంఘజీవి. 'తనతో బాటు, తన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి' అని కోరుకుంటాడు ఎప్పుడూ. అందు వల్లనే, తను ఒక్కడూ సుఖంగా ఉన్నంతమాత్రాన మనిషికి సంతృప్తి రాదు. ఈ సమాజంలో ఎంతో మంది రకరకాల కష్టాలకు లోనవుతున్నారు. వైద్యం చేయించుకునే శక్తి లేక ప్రాణాలు కోల్పోతున్నారు; జ్ఞానపిపాస ఉన్నా యువకులు చాలామంది చదువులు కొనసాగిం చలేకపోతున్నారు. పలువురు బ్రతుకు తెరువు లేక కష్టపడుతున్నారు. వాళ్లకు మీ చేతనైనంత సాయం, మీ చేతనైన రీతుల్లో చేయండి. అప్పుడు చూడండి ఎంత తృప్తి కలుగుతుందో" అని అన్నారు. గురువుగారి మాటల్లోని సత్యాన్ని అర్థం చేసుకున్న సత్యశీలుడు-సుగుణవతి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తమ గ్రామంలో రోగుల కోసం ఒక వైద్యశాల, యువతరం విద్యను కొనసాగించేందుకు గాను పాఠశాల, కళాశాల నిర్మించారు. ఊళ్ళో అందరికీ బ్రతుకు తెరువులు చూపే వ్యవస్థలు ఏర్పరచారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే కుటుంబాలకు సాయం చేసి, నిలద్రొక్కుకునేట్లు చూసారు. వృద్ధులకు గౌరవాన్నీ, ప్రేమను పంచే కేంద్రాలను ఏర్పాటు చేసారు. ఇక అటుపైన వాళ్ళకు అసంతృప్తి అన్నమాటే గుర్తు రాలేదు!

సింహము- చిట్టెలుక

ఒక అడవిలో పెద్ద సింహం ఒకటి ఉండేది. ఆ అడవికి రాజుగా అది పెత్తనం చెలాయిస్తూ ఉండేది. ఆ అడవిలోనే చిట్టెలుక కూడా ఉండేది. ఒకరోజు సింహం చెట్టు క్రింద పడుకొని ఉండగా, పక్క ఉన్న కన్నంలోనుంచి చిట్టెలుక అటూ, ఇటూ పరుగెత్తుతూ సింహం కాలుపై ఎక్కింది.   అంతే.. సింహానికి పట్టరాని కోపం వచ్చి పంజా విదిలించి, తన కాలు కింద చిట్టెలుకను అదిమిపట్టింది. బాగా భయపడిపోయిన చిట్టెలుక గజగజా వణుకుతూ.. మృగరాజా... నన్ను ప్రాణాలతో విడిచిపెట్టు, ఎప్పుడో ఒకప్పుడు తమరికి ఉపకారం చేసి పెడతానని దీనంగా వేడుకుంది.   చిట్టెలుక మాటలకు సింహం పెద్దగా విరగబడి నవ్వుతూ... "ఏమన్నావు.. నువ్వు నాకు సాయం చేస్తావా..? నా కాలివేలు గోరంత కూడా లేవు. పిసరంత ప్రాణం కలిగిన నువ్వు నాకు ఉపకారం చేస్తావా...? ఎంత విచిత్రం..." అని నవ్వుతూ.. సర్లే బ్రతికిపో.. అంటూ చిట్టెలుకను వదిలిపెట్టింది. దీంతో బ్రతుకుజీవుడా అనుకుంటూ చిట్టెలుక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయింది.   ఐతే ఆ తర్వాత కొద్దిరోజులకు ఓ వేటగాడు జింకలను పట్టుకునేందుకు వల వేశాడు. ఆ వలలో జింకకు బదులు సింహం చిక్కుకుపోయింది. ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది. ప్రయత్నం చేసిచేసీ అలసిపోయింది. ఆకలితో డస్సిపోయి సొమ్మసిల్లింది. అటుగా వచ్చిన చిట్టెలుక సింహం పరిస్థితి చూసి చలించిపోయింది. వెంటనే తన పళ్లకు పని చెప్పింది. పటపటమంటూ వలను కొరికేసింది. సింహంపై చిన్నచిన్నగా చిందులు వేసింది. దీనితో శక్తినంతా కూడదీసుకున్న సింహం కళ్లు తెరిచింది. ఆశ్చర్యం తను ఇరుక్కున్న వల అంతా ముక్కలైపోయింది. ఎదురుగా చిట్టెలుక నిలబడి వుంది. ఎలుక చేసిన సాయానికి సింహం కృతజ్ఞత చెప్పింది. అందుకే శక్తిలో కానీ ధనంలో కానీ ఎంత చిన్నవారయినప్పటికీ వారిని చిన్నచూపు చూడకూడదు.

ఎవరు గొప్ప దాత ?

మహా భారతంలో ఎన్నో సంఘటనలు, ఉంటాయి. ప్రతి కథా మన జీవితానికి ముఖ్యమయిన ఎన్నో విషయములను మనకు తెలియ చేస్తుంది. వాటిలో ఒకటి సక్తుప్రస్తుడు కథ. కురుక్షేత్ర యుద్ధం తరువాత, జరిగిన బంధు వధకు పరిహారంగా ఒక యాగం చేయ తలపెడతాడు ధర్మ రాజు. ఎంతో వైభవంగా దానాలు, ధర్మాలు చేస్తాడు. వచ్చిన వారంతా ధర్మరాజు, దాన గుణాలను ఎంతో పొగుడుతారు, ఇలా  పొగుడుతున్న  సమయంలో, ఎక్కడి నుంచో ఒక ముంగీస వస్తుంది, దాని శరీరం సగం బంగారంతో మెరిసి పోతోంది, వీరందరి మాటలు విన్న ముంగీస, ఎగతాళిగా నవ్వుతుంది, అది చూసి అక్కడున్న పెద్దలు, ‘నీ నవ్వుకు కారణం ఏమిట’ని అడుగుతారు. అప్పుడు ఆ ముంగీస తన నవ్వుకి కారణం చెబుతూ ఇలా అంటుంది.. ’మీరంతా ఈ ధర్మరాజు ఎంతో గొప్ప దానం చేశాడంటున్నారు. ఇతని దానగుణాన్ని పొగుడుతున్నారు.    కానీ, ఓ పేద బ్రాహ్మణుడు చేసిన దానంతో ఈ ధర్మరాజు చేసిన దానధర్మాలు సరిరావు!’ అంటుంది. అలా అంటూ తన అనుభవంలో తాను చూసిన ఓ బ్రాహ్మణుడి గురించి చెప్పడం మొదలుపెడుతుంది.  ఒక ఊరిలో ఒక పేద బ్రాహ్మణుడు వున్నాడు. అతని పేరు ‘సక్తుప్రస్తుడు’.    భార్య, కొడుకు, కోడలు అతని కుటుంబ సభ్యులు. పరిస్థితులు అనుకూలించక వీరికి కొన్ని రోజులపాటు బిక్ష దొరకదు. ఐదు రోజులపాటు పస్తులున్నాక ఒక రోజున ఒక శేరు జొన్న పిండి బిక్షగా దొరుకుతుంది.  ఆ శేరు జొన్నపిండిని కుటుంబ సభ్యులు నలుగురికీ పంచుతాడు ఆ పేద బ్రాహ్మణుడు. వారు తినబోతుండగా ఒక ముసలి బ్రాహ్మణుడు ఆకలంటూ వస్తాడు. సక్తుప్రస్తుడు భక్తిశ్రద్ధలతో అతనిని గౌరవించి, తన భాగానికి వచ్చిన జొన్నపిండిని ఆయనకు ఆహారంగా ఇస్తాడు. ఐనా ఆ ముసలి బ్రాహ్మణుడికి ఆకలి తీరదు. దాంతో మిగిలిన ముగ్గురూ ఒకరొకరుగా తమ భాగాలని అతనికి ఇస్తారు. అప్పుడు ఆ అతిథి కడుపు నిండిందంటూ ఆనందంతో క‌ృతజ్ఞతలు చెబుతాడు. ఆ తర్వాత తన నిజరూపాన్ని చూపిస్తాడు. ఆ అతిథి మరెవరో కాదు... సక్తుప్రస్తుని దానగుణాన్ని పరీక్షించడానికి వచ్చిన ‘ధర్మదేవత’.      అతని అతిథి మర్యాదలకి, దానగుణానికి మహదానందాన్ని పొందిన ధర్మదేవత జీవించినంతకాలం సకల ఐశ్వర్యాలు కలగాలని, జీవితానంతరం స్వర్గలోక ప్రాప్తి కలగాలని వరమిస్తాడు!” అంటూ చెప్పడం ముగించింది ముంగీస. ఇప్పుడు చెప్పండి ఆపేద బ్రాహ్మణుడు చేసిన దానం గొప్పదా? ఈ ధర్మరాజు చేసిన దానం గొప్పదా?”   అని అడుగుతుంది తనకి ఎంతో వుండగా అందులోంచి కొంత భాగాన్ని అందరికీ దానమిచ్చిన వ్యక్తినే గొప్ప దానవంతుడని అంటే, ఆకలితో అలమటించిన క్షణంలో కూడా దానగుణాన్ని విడనాడని   ఆ బ్రాహ్మణుడిని ఏమనాలి?’ అని ప్రశ్నిస్తుంది ఆ ముంగీస. *ఆపేద బ్రాహ్మణుడు జొన్నపిండిని దానం చేసిన సమయంలో గాలికి ఎగిరి కొంత నేలపై పడింది. ఆ పిండిలో దొర్లిన నా సగం శరీరభాగమంతా స్వర్ణమయమైపోయింది. అప్పటి నుంచి మరో సగ భాగం స్వర్ణమయమయ్యేంత గొప్ప దానం చేసే వ్యక్తి కోసం చూస్తున్నాను. ఎవరూ కనిపించలేదు!’ అంటుంది ఆ ముంగీస. ఇదంతా విన్న ధర్మరాజు “నిజమే ఆ పేద బ్రాహ్మణుడి దానగుణం ముందు తన దానగుణం ఏపాటిదని, ప్రేమతో, ఆర్తితో ఒక వ్యక్తి దానం చేయాలికాని, అహంకారంతో కాదు!” అని ఒప్పుకుంటాడు.  మనం దానం చేసిన దాని విలువ అందుకునే వారి అవసరంపై ఆధారపడి నిర్ణయించాలే కాని, ఇచ్చేవారి స్తోమతు పై ఆధారపడి కాదు అని చెబుతుందీ కథ మనకి.