నాకు ఇష్టమైన కథకుడు ఆశారాజు

కవులు కథలురాస్తే బాగుంటుంది. అందులో కవిత్వం ఉంటుంది. కథల్లో కవిత్వం నాకు బలే ఇష్టం. శ్రీశ్రీ, తిలక్, ఇంద్రగంటి, సోమసుందర్, ఆరుద్ర...కథలను ఎన్నిసార్లు చదివానో! కవి ఆశారాజుకథలను కూడా అలాగే వెదకి వెదకి చదివాను.  తొలిరోజుల్లో ఆశారాజు వీనస్, వెన్నెలతో నా కన్నులు కడిగావు, పారేసిన బతుకులు...అని ఓ ఇరవై కథలు వ్రాసినట్టు గుర్తు. అయితే అవి కథలుకావు, కవిత్వమే! ఆ కథల్లో ‘పారేసిన బతుకులు’ నాకు చాలా ఇష్టమైనకథ. ఆ కథతోపాటు ఆశారాజు కూడా నాకిష్టమైనవ్యక్తే!   1970 వ దశకం చివరిరోజుల్లో, ఏజీ ఆఫీసువారి రంజనిసభ్యులు, ఓ కార్తీకఆదివారం ఇందిరాపార్కులో విందుచేశారు. నేను వారి ఆఫీసువాడిని కాకపోయినా ఆ ఆఫీసులోని రచయితలందరికీ ఇష్టుణ్ణి కాబట్టి నన్నక్కడకి ఆహ్వానించారు. కథలపోటీ నిర్వహించారక్కడ. కథలు చదివి వినిపించాలి. బాగుంటే బహుమతి ఇస్తామన్నారు. కెకె మీనన్, వారాల కృష్ణమూర్తి, పాలకోడేటి సత్యనారాయణరావు...ఇలా చాలా మంది, తామురాసిన కథలు చదివి, వినిపించారు. అలాగే నేనూ ఓ కథ వినిపించాను. కథపేరు దండోరా. బాగుందని మెచ్చుకున్నారంతా. నా కథకి ప్రథమబహుమతి ప్రకటించారు. నూటపదహార్లు డబ్బు ముట్టజెప్పారు.   భోజనాలుచేస్తున్నప్పుడు ఆశారాజుని కెకెమీనన్ పరిచయంచేశారు. బూట్లూ, ఇన్ షర్ట్, రాజేష్ ఖన్నా హెయిర్ స్టయిల్ గమ్మత్తుగా కనిపించాడు రాజు. మీ కథలు బాగుంటాయి శర్మాజీ అన్నాడు. థాంక్యూ అని రాజుతో చేయికలిపాను.    తర్వాత ఓ సాయంత్రం ఏడుగంటలవేళ...ద్వారాకాహోటల్ లో గురువుగారు  శివారెడ్డిగారి కోసం చూస్తూంటే...రాజువచ్చాడక్కడకి. గురువుగారింకా రాలేదా? అడిగాడు. రాలేదన్నాను. రండి! ఓ సిగరెట్ వేస్కోండి అన్నాడు. నాకు సిగరెట్ కొనిచ్చి, తాను జర్దాపాన్ వేశాడు రాజు. ఇద్దరం కబుర్లలోపడ్డాం. ఎంతసేపూ నేను మాట్లాడడమేగాని, రాజు పెద్దగా మాట్లాడలేదు. మాటలు దాస్తున్నట్టనిపించింది. కవులకు దాపరికాలు పనికిరావన్నాను, దాస్తే గీస్తే పబ్లిక్ లోనే దాచాలి అన్నాను.  మాట్లాడరేంటి? అన్నాను. ఆమాటకి వచ్చిన నవ్వును ఆపుకున్నాడు రాజు. వెళ్లి, నోట్లో పాన్ ఉమ్మివేసి వచ్చాడు. పాన్ నోట్లో ఉన్నప్పుడు మాట్లాడడం కష్టం కదా? అన్నాడు. సారీచెప్పాడు. అక్కణ్ణుంచి ఇద్దరం స్నేహితులం అయిపోయాం.      రాజు పాన్ తింటే నాకు సిగరెట్, రాజు ఉస్మానియాబిస్కట్స్ తింటే నాకు ఇడ్లీవడ, రాజు టీ తాగితే, నాకు కాఫీ...అలా రోజులు గడిచిపోయాయి. నేను కథలురాసేవాణ్ణి. రాజు కవిత్వం రాసేవాడు. ఎవరేదిరాసినా అందులో కవిత్వం ఉండాలనేవారు శివారెడ్డి. ద్వారకాహోటల్ లో వినిపించాలనేవారు. వారు కూడా తన కవిత్వాన్ని అందరికీ వినిపించేవారు. బాగోగులగురించి చర్చలు జరిగేవి. ఒక ఊహను కథగానో, కవితగానో మార్చడం ఎంతకష్టం? గనిలో వనిలో కార్ఖానాలో కార్మికుడు పడే కష్టంతో సరిసమానం అనుకునేవాళ్లం. కథకోసంనేనూ, కవితకోసం రాజూ ద్వారాకాహోటల్ లో, పిచుకులువాలిన చెట్టునుచూస్తూ ఆలోచించని రోజంటూ ఉండేదికాదు.    వేసవిసెలవులు. నా భార్యా్బిడ్డలూ, రాజుభార్యాబిడ్డలూ వారివారి తాతగారి ఇళ్లకు వెళ్లారు. పదిరోజులు ఉండి వస్తామన్నారు. వాళ్లు లేకుండా ఆ పదిరోజులు తట్టుకోవడం ఇద్దరికీ కష్టమయ్యింది. అప్పుడే రాజు పద్యం అందుకున్నాడిలా.   తలుపుతీసి లోనికెళితే ఏకాంతభయం  గదిలో మనుషులెవరూ ఉండరు  అడుగులుమాత్రం కనబడుతుంటాయి.  ఎవరిమాటలూ వినిపించవు  పరిమళం మాత్రం వీస్తూ ఉంటుంది.   లైటు వేసి చూసుకుంటే  కళ్లనిండా జ్ఞాపకాలు  గోడలమీదా, సోఫాలమీదా, కుర్చీలమీదా  రంగు పెన్సిళ్ల పిచ్చిగీతల మరకలు  పరదాల అంచునా, టీవీస్టాండుమీదా   పసివేళ్లు ముట్టుకున్న తీపి గుర్తులు....  ఇద్దరికళ్లూ చెమ్మగిల్లాయి. నేను రాజుని పట్టుకుని, కవిత్వం ఎక్కడలేదయ్యా? ఎక్కడ పడితే అక్కడ ఉంది. ఖాళీ ఇళ్లలో ఉంది. జ్ఞాపకాల్లో ఉంది. నీలో ఉంది. నాలో ఉంది అన్నాను. నువ్వు గొప్పకవివయ్యా అన్నాను. థాంక్యూ శర్మాజీ అన్నాడు రాజు.   సెలవులకు భార్యాబిడ్డలు ఊరికి వెళితే నాకు పట్టపగ్గాలు ఉండేవికావు. నాగా లేకుండా ఆ పదిరోజులూ బీరు తాగేవాణ్ణి. పండగచేసుకునేవాణ్ణి. నాతోసహా రాజూ, గురువుగారూ అంతా తాగాల్సిందే! తాగించాల్సిందే! రాజు గ్యాపిద్దామంటే ఒప్పుకునేవాణ్ణికాను. తాగనీ! ఈ పదిరోజులేగదా శర్మ సరదా అంతా! తర్వాత ఎలాగూ తాగడనేవారు శివారెడ్డిగారు. ‘పా పా’ అంటూ బార్ కి దారితీసేవారు.   ఈనాడులో ఉద్యోగం మానేశాను. ఈవారంలో జాయినయ్యాను. ఈవారం మేనేజ్ మెంట్ తో కూడా పడలేదు. అక్కడా మానేశాను. ఉద్యోగంలేదు. ఇంట్లో ఉద్యోగం లేదనే విషయం తెలియకూడదని, లంచ్ బాక్స్ పట్టుకుని ఆఫీసుకి వెళ్తున్నట్టుగా పబ్లిక్ గార్డెన్ కి పొద్దున పదింటికి వెళ్లిపోయేవాణ్ణి. సాయంత్రందాకా అక్కడే ఉండి, తర్వాత ద్వారకకు చేరుకునేవాణ్ణి. రాజూవాళ్లతో ద్వారకలో రాత్రి తొమ్మిది పదిదాకా కాలక్షేపంచేసి, ఎప్పటిలాగానే ఇంటికి చేరుకునేవాణ్ణి. ఇంటిలోనేకాదు, మిత్రులెవరికీ ఈ సంగతి తెలియకూడదని నా ప్రయత్నం. కాని ఎలా తెలుసుకున్నాడో రాజు తెలుసుకున్నాడు. ఆనాడు ఓ పద్యాన్ని వినిపించాడిలా.     అన్నిటినీ మరచిపోతున్నాం  గాయాలకు అలవాటుపడ్డాం  బాధలు మనలో భాగమైపోయాయి.   ఇంట్లోని వస్తువులు పోయినా తెలియదు  పక్కన నడుస్తున్న మనిషి,   అకస్మాత్తుగా ఆగిపోయిందికూడా స్పృహ ఉండదు.  రాజుని గట్టిగా కౌగలించుకున్నాన్నేను. ఏం రాశావయ్యా అన్నాను. అనుభవాలతో బాగా పండిపోయావు. వాటిని దోసిళ్లతో మాకు దోచిపెడుతున్నావన్నాను. రాజు ఆనందించలేదు సరికదా, అడిగాడిలా.   ఉద్యోగంపోయిందన్న సంగతి ఎందుకు దాచిపెట్టావు శర్మాజీ?  అవునయ్యా! అదేమైనా చెప్పకూడని విషయమా? గదమాయించారు గురువుగారు.   అంటే...అని నేను నీళ్లు నములుతుంటే...పిచ్చా? ఉద్యోగం లేదన్న సంగతి ముందు అమ్మాయి(భార్య రమణి)కి చెప్పు. తిరిగినపార్కులుచాలు! ఇంట్లోనే ఉండు అన్నారు గురువుగారు. ఆ రాత్రి నాతో ఖైరతాబాద్ వరకూ వచ్చి, నా జేబులో కొంత డబ్బుంచాడు రాజు. ఎందుకయ్యా అంటే? సిగరెట్ల ఖర్చుకి ఉంచుశర్మాజీ అన్నాడు.  ఉగాది వారపత్రికకు నేను సంపాదకుణ్ణి అయ్యేంతవరకూ అంటే...ఒక ఏడాదిపాటు నా ఖర్చంతా రాజే భరించాడు. అలాగే నేను ఇంటికి వెళ్లననే భయమేమో! రాత్రిపూట ఖైరతాబాద్ వరకూ నాతోపాటుగా వచ్చి, నేను కాలనీలోనికి వెళ్తున్నదీ లేనిదీ చూసి మరీ తాను బస్సెక్కి ఏజీకాలనీకి వెళ్లేవాడు రాజు. ఆనాటికి రాజు జుబ్బా, జులపాలజుత్తులో ఒదిగిపోయాడు. ఆ ఆహార్యంలో సాయంత్రంవేళ ద్వారకలో పిచికలువాలిన చెట్టుదగ్గరగా నిలుచుని, ఓ పెయింటింగ్ లా కనిపించేవాడు రాజు. ఓ నిశ్శబ్దకవిత అనిపించేవాడు.   నేనూ రాజూ గత నాలుగుదశాబ్దాలుగా స్నేహితులం. వారానికి ఓ సారైనా నాకు ఫోన్ చెయ్యకుండా ఉండలేడు రాజు. ఫోన్ చేసిన ప్రతిసారీ ఏం రాస్తున్నావు శర్మాజీ? అనడుగుతాడు. ఏమీ రాయట్లేదంటే...అలా ఎలా? చెరువులో గులాబీరేకునువేసి, దాని ప్రతిధ్వనికోసం చెవులప్పగించేవాడివి. నువ్వేదీ వినడంలేదన్నా, రాయట్లేదన్నా నేను నమ్మనంటాడు. నీడతోనృత్యంచేయిస్తావు. నీకన్నీ సాధ్యమేనంటాడు. కవిత్వమే మాట్లాడతాడు రాజు. ఎప్పుడూ నాలాంటి పామరులతోనే ఉంటాడు. పండితుల ఊసెత్తడు. ఎందుకంటే...పండితులదగ్గర కవిత్వానికి ఊపిరాడదు. చచ్చిపోతుందంటాడు. నవ్వుతాడు రాజు. కన్నీటిని ఎనిమిదవ సముద్రం అంటాడు. ఆ సముద్రతీరం మనకొద్దంటాడు. అందుకే రాజు అంటే నాకిష్టం. కథలాంటి అతని కవిత్వం అంటే ఇంకా ఇంకా ఇష్టం.   -జగన్నాథశర్మ

చూడుచూడు నీడలు! ‘కథ’ నవీన్ జాడలు!

 ప్రారభ్యతే న ఖలు విఘ్నభయేన నీచైః  ప్రారభ్య విఘ్న నిహతా విరమంతి మధ్యాః  విఘ్నైః ముహుర్ముహరపి ప్రతిహన్య మానాః  ప్రారబ్ధం ఉత్తమ జనాః న పరిత్యజంతి   ఈ శ్లోకానికి అర్థం...ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు, ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెరువక, తుదికంటా లక్ష్యంకోసం శ్రమించడమే కార్యసాధకుడి నైజం. అలాంటివారు ఉత్తములు. ఎప్పుడో ఎదురయ్యే అడ్డంకులను తలచుకుని, ఏ పనీ చేపట్టనివారు అధములు. ఏదో చెయ్యాలన్న తపనతో మొదలుపెట్టినప్పటికీ మధ్యలో ఆటంకాలు ఎదురవగానే పనిని వదిలివేసేవారు మధ్యములు అని.  ఏ పనినయినా ఎవరైనా మొదలుపెడుతున్నారంటే...ఈ పద్యాన్ని వారికి అన్వయించి చూడడం నాకో పెద్ద బ్యాడ్ హ్యాబిట్! ఏ మేరకు ఎంచుకున్నపనిలో ఆ వ్యక్తి కృతకృత్యుడయిందీ ఓ కంట గమనిస్తాను. ఆ గమనింపులో అతడు కార్యసాధకుడూ, ఉత్తముడూ అనిపిస్తే, ప్రత్యక్షంలో తెగిడినా, పరోక్షంలో అతనికి జేజేలు పలకడం నాకో సరదా! నీ జేజేలు ఎవడికి కావాలి? అంటే...నేనేం చెయ్యలేను.   విషయానికి వస్తే...1979లో అనుకుంటాను...ఓ సాయంత్రం వేళ, విజయనగరం గంటస్తంభం దగ్గర నేనూ, కొడవంటికాశీపతీరావూ, దాట్లనారాయణమూర్తిరాజూ, పెద్దలు శ్రీ శీలావీర్రాజుగారూ నిల్చున్నాం. మాట్లాడుకుంటున్నాం. సంక్రాంతి ముందు రోజులవి. చలిచలిగా ఉంది వాతావరణం.    తెలుగుకథమీద నేను ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాను. నా మాటలకి వీర్రాజుగారు సన్నగా నవ్వుతున్నారు. అంతలో పొట్టిగా, తెల్లగా, ఫారెక్స్ బేబీలా ఉండే ఓ కుర్రాడు వచ్చాడక్కడకి. చూస్తే ‘ఖాళీసీసాల స్మై్ల్’ తమ్ముడిలా అనిపించాడు. కాని కాదట! అతనిపేరు వాసిరెడ్డి నవీన్ ట! కెనరా బ్యాంకులో పనిచేస్తున్నాడన్నారు. హైదరాబాద్ నుంచి వీర్రాజుగారు వచ్చారని తెలిసి, వారిని కలిసేందుకు వచ్చాట్ట!   కథలగురించీ, పత్రికలగురించీ చాలా సీరియస్ గా మాట్లాడాడు నవీన్. పార్వతీపురం చుట్టుపక్కల చెలరేగిన నక్సల్బరీ గురించీ కూడా చాలా వివరాలు తెలియజేశాడు. సరుకుంది ఇతనిలో అనిపించాడు. కాసేపటికి వెళ్లిపోయాడు. తర్వాత బొంకుల్దిబ్బ దగ్గర కలిశాం ఓసారి. చాసోగారూ, ట్వంటీఫస్ట్ సెంచరీ రైటర్స్...ఉన్నారప్పుడు. తమ కథల సంకలనాన్ని ట్వంటీ ఫస్ట్ సెంచరీ రైటర్స్ ఇస్తే...తీసుకుని, డబ్బులు చెల్లించాడు నవీన్. డబ్బులొద్దులెండి అంటే...పుస్తకాన్ని ఎప్పుడూ ఉచితంగా ఇవ్వకండి! ఇస్తే దాని విలువ తెలియదన్నాడు. నవీన్ మాటలకు రైటర్స్ ప్రెసిడెంట్ నిష్ఠల వెంకటరావు పొంగిపోయాడానాడు.      ఎలా తెలిసిందో తెలిసింది, నేను హైదరాబాద్ ఈనాడులో జాయినవుతున్నానని. అందుకు ఆనందించాడు నవీన్. జాగ్రత్త అని హెచ్చరించాడు. త్వరలో తానూ హైదరాబాద్ చేరుకుంటున్న సంగతి చెప్పాడు.     కొన్నాళ్లకు హైదరాబాద్ లోని ద్వారకాహోటల్లో శివారెడ్డి నీడన ఇద్దరం మళ్లీ కలిశాం. కాఫీలు తాగాం. కబుర్లాడుకున్నాం. ఆనాటికి నేను ఈనాడు మానేసి, ఆంధ్రజ్యోతిలో చేరాను. రెండుచేతులా కథలు రాయడం మొదలుపెట్టాను. ‘రంజిని’వారు నిర్వహించిన కథలపోటీకి ‘పేగుకాలినవాసన’ కథ పంపాను. ఆ పోటీకి పోరంకి దక్షిణామూర్తిగారూ, శీలావీర్రాజుగారుసహా నవీన్ కూడా న్యాయనిర్ణేతగా వ్యవహరించాడు. ప్రథమబహుమతి వచ్చింది ఆ కథకి. అయితే ప్రథమబహుమతికి అర్హతలేదంటూ, ఆ కథకి తాను తక్కువ మార్కులు వేశానంటూ వేదికమీదే ధైర్యంగా చెప్పాడు నవీన్. అర్హత ఎందుకు లేదో వివరించాడు.   బాధపడ్డావా? అడిగాడు తర్వాత.   సమాధానంగా నవ్వి ఊరుకున్నాను.   ఆ కథతోనే ఆంధ్రజ్యోతివారపత్రిక ‘ఈవారం కథ’ శీర్షిక ప్రారంభమయింది. అలాగే పాపినేని, నవీన్ ల సంపాదకత్వంలో ‘కథ’ ప్రారంభ సంకలనంలో ఆ కథ చోటు చేసుకున్నది. ఈ రెండూ కాకతాళీయం ఎంత మాత్రమూకాదు.    ‘కథ’ ప్రారంభానికి ముందు ఒక రోజు ద్వారకలో నవీన్ తో అన్నానిలా.   సంవత్సరానికి ఓ మంచికథను ఎన్నికచెయ్యి. ఓ పదివేలు అవార్డిద్దాం. నేను ఓ అయిదువేలు స్పాన్సర్ చేస్తానన్నాను.   డబ్బులు ఎక్కువయ్యాయా? అని నవ్వాడు నవీన్.   అవార్డు కాదుగాని, ఓ సంవత్సరంలో వచ్చిన కొన్ని మంచికథల్ని సంకలనంగా తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కంగారుపడకు అన్నాడు.   త్వరలోనే ‘కథ’ రూపుదిద్దుకున్నది. చాలామందికి ప్రేరణ అయిందది. ‘కథ’లో తమ కథ ఉండాలన్న పట్టుదలతో చాలామంది కథకులు కథలు రాయడం నాకు తెలుసు.   ‘కథ’లో కథ రావాలంటే...ఆ కథ ఏదేని పత్రికలో ముందు అచ్చయి ఉండాలి. అది ఓ నిబంధన. ఆ నిబంధనతో చాలామంది రచయితలు, సంవత్సరాంతంలో తమ కథ పత్రికల్లో వచ్చేందుకు నానా తంటాలుపడడం నేను కళ్లారాచూశాను.   కొన్నేళ్లపాటు ఒంటరి పోరాటంచేశాడు నవీన్. పదేళ్ల తర్వాత అనుకుంటాను, ఆ పోరాటానికి తానావారి మద్దతు లభించింది. వారి ఆర్థికసహకారంతో ‘కథ’ బలోపేతం అయింది.     ఈటీవీలో జాయినయ్యాను. కథలు రాయడం మానేశాను నేను. ఓసారి మా షూటింగ్ స్పాట్ కి వచ్చాడు నవీన్. నా హడావుడి చూసి సంతోషించాడు. మా స్పాట్ పక్కనే వాళ్ల తమ్ముడు కట్టిన ఇల్లు చూపించాడు.   నువ్వు కూడా ఓ ఇల్లు ప్లాన్ చెయ్యి. అక్షరం అక్షరం రాసిమరీ సంపాదిస్తున్నావు. పొదుపుచెయ్యి అని హెచ్చరించాడు.   కథలు రాయలేకపోతున్నానని బాధపడితే...  బాధపడుతున్నావుకదా! త్వరలోనే రాస్తావు అని నవ్వాడు నవీన్.   మా ఇద్దరిమధ్యా చెప్పుకోదగినంత స్నేహమూలేదు. శత్రుత్వమూలేదు. కాకపోతే చిన్నచిన్న అభిప్రాయభేదాలు ఉన్నాయి. ఆ భేదాలను ఇద్దరం ఎన్నడూ బాహాటంగా చర్చించలేదు. అంటే...ఒకరిపట్ల ఒకరికి కనిపించని అభిమానం ఉన్నట్టేనని నేననుకుంటాను.   నాకు ఒకే ఒక ఉపకారం చేసి పెట్టాడు నవీన్. అది కీర్తిశేషులు డాక్టర్ వి. చంద్రశేఖరరావుని పరిచయం చేయడం. చంద్రశేఖరరావు స్నేహంలో నేను అనేక పుస్తకాలను చదివాను. ఎవరికీ తెలియని విషయం...చంద్రశేఖరరావు నన్ను కలిసినప్పుడల్లా ఏదో ఒక కథలపుస్తకం(ఇంగ్లీషు) తెచ్చి ఇచ్చేవాడు. ఇద్దరం బాగా స్నేహంగా ఉండేవాళ్లం. ఆయన కూడా ఒకానొక సందర్భంలో ‘కథ’ లో కథ రావాలని, తను రాసిన కథని అర్జంట్ గా ప్రచురించమని ఒత్తిడిచేశాడు.  చిర్రెత్తుకొచ్చింది నాకు.   ఏంటిసార్ ఇది? ఏభైవేల సర్క్యులేషన్ గల మా వారపత్రిక కంటే రెండుమూడువేలు ప్రచురించే ‘కథ’కే మీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. నాకిది నచ్చదు అన్నాను.   ప్లీజ్ అన్నాడు. ఆనాడు తెలిసింది, రచయితకి ‘కథ’ అంటే ఎంత క్రేజో!   ఎన్నిసార్లు దుఃఖించామన్నదే గుర్తు ఉంటుందిగాని, ఎన్నిసార్లు ఆనందించామన్నది ఎవరికీ గుర్తుండదు. బాధల్ని ప్రేమించినట్టుగా సంతోషాల్ని ప్రేమించకపోవడమే దానికి కారణం అని ఎక్కడో చదివాను. అది ‘కథ’ సంకలనాల విషయంలో రచయితలకు సరిగా సరిపోతుంది. ఆ సంకలనంలో కథ వస్తే నవీన్ ఇష్టుడు. రాకపోతే అయిష్టుడు. ఆ అయిష్టతతో నవీన్ ని తెగిడేవారెంతమందో! ఎవరెంతగా తెగిడినా, విమర్శించినా నవీన్ పల్లెత్తుమాట అనేవాడు కాదు.    క్షమా దానం క్షమా యజ్ఞః క్షమా సత్యం హి పుత్రికాః   క్షమా యశః క్షమా ధర్మః క్షమయా విష్ఠితం జగత్!  ఓర్పే నిజమైన బలం. ఓర్పే ఉత్తమదానం. ఓర్పే యజ్ఞం. ఓర్పే కీర్తి. ఈ జగత్తంతా  క్షమ కారణంగానే నడుస్తున్నది అని దీని అర్థం.   నవీన్ ని చూసినప్పుడల్లా ఈ శ్లోకం నాకు గుర్తొస్తుంది. అలాగే గత ముప్పయిమూడేళ్లుగా ‘కథ’ను వెలువరించడంలో కార్యసాధకుడూ, ఉత్తముడూ నవీన్ ను కలసినప్పుడల్లా పైన పేర్కొన్న భర్తృహరి శ్లోకం కూడా గుర్తుకువస్తుంది. ఇలా రెండు గొప్ప శ్లోకాలను గుర్తుచేసే నవీన్ కి చేతులెత్తి నమస్కరించడం తప్ప, చేసేదేముంది? ఏమీ లేదు! *                                *                                  *  అన్నట్టు మరచిపోయాను!   ఇటీవల సినిమాదర్శకుడు వంశీ ఫోన్ చేశాడు. మాటలో మాటగా ఓ మాట నాకు చెప్పాడు.   మంచి కథా రచయితలను ఇంటర్వ్యూచేసి, వారిచేత వారికి నచ్చిన కథను ఒకటి చదివించి, ఆ రెంటినీ తన యూట్యూబ్ చానెల్లో పెడదామనుకుంటున్నట్టుగా నవీన్ కి చెప్పాట్ట వంశీ.   ఇంటర్వ్యూకి ఓకే! రచయిత చేత కథ చదివించడం సక్సస్ కాదేమో అన్నాట్ట నవీన్. ఎందుకు కాదంటే...కథ చదవడం ఒక ఆర్ట్. ఆ ఆర్ట్ కొందరికే తెలుసు. మీ మిత్రుడు కంఠు(జగన్నాథశర్మ)కి కథ చదవడం తెలిసినట్టుగా చాలామందికి తెలియదు. వేదిక మీద కంఠు కథ చదువుతుంటే...నాటకం నడుస్తున్నట్టుగా  ఉంటుంది. కథ కళ్లకు కడుతుంది అన్నాట్ట నవీన్.  నిజమా? ఆశ్చర్యపోయాట్ట వంశీ.   ఏరా కంఠూ! నాకు తెలియని విద్యలు నీ దగ్గర చాలా ఉన్నాయయితే, గొప్పోడివే అన్నాడు.   ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినట్టుగా, ఎక్కడ తెగడాలోకాదు, ఎక్కడ పొగడాలో కూడా నవీన్ కి బాగా తెలుసు. -జగన్నాథశర్మ

సా హితాన అంగరంగ అభినివేశం... అంగలకుదిటి

'సలలిత సుధారస సారం అన్నట్లు' ఇచ్చుటలోని అనంతమైన హాయిని అనుభవింపగల్గిన రసజ్ఞమైన మూర్తిమత్వం! సాహిత్యాన్ని, సా'హితం' తాలూకు విస్తారమైన ఆత్మసౌందర్యాన్ని ఆత్మ సాక్షాత్కారాలను తనవిగా జేసుకొని అక్షరాల అల్లికకు దారం తానవుతూ, భాష, భాస తాలూకు సాహిత్య పరిమళాలకు పట్టుగొమ్మ తానవగల్గిన మహోన్నత మహతీ మయమూర్తితత్వం అంగలకుదిటి సుందరాచారిది అన్నది నా ప్రగాఢ విశ్వాసం. వర్తమానాన్ని సాహితీమూలాలతో బేరీజువేసుకొని, చరిత్రలో అన్వయించుకొని తానే ఓ వర్తమానంగా, చరిత్రగా సాక్షాత్కరింపగలిగే వారాయన. చెప్పాలంటే సాహితీవేత్తగా, గొప్ప సాహితీ ప్రియునిగా జీవనోపాధి కోసం నెలకొల్పుతున్న ముచ్చటయిన మూడు రైసు మిల్లుల వ్యాపారాలలో కూడ సాహిత్యం తాలూకు హితాన్ని తనదిగా చేసుకున్న చరితార్థులు అంగలకుదిటి.  అంగలకుదిటి సుందరాచారి సాహితీ సంస్కృతులకు, కళాభిజ్ఞతలకు ఆలవాలమయిన ప్రకాశం జిల్లా వేటపాలెం నివాసి. ఆనాడూ ఈనాడూ కూడా లక్ష్మీసరస్వతులు కొలువు దీరిన ధీరవంశంగా వీరి అంగలకుదిటి వంశం ప్రాచుర్యం పొందగల్గింది. చిత్రలేఖనం తాలూకు ప్రతిభ, శిల్పకళా పాటవాలతో పునరుత్తేజం పొందిన వంశం వీరిది. తల్లి శేషమ్మ చిత్రలేఖనాన, తండ్రి మల్లికార్జునాచార్యులు శిల్పకళలలోను అందెవేసిన చేతులయి, ఆనాటి కాల ప్రభాలను తమ దోసిలినందిట కాంతులీనుట్లు చేయగల్గిన దివ్యమూర్తులు. సుందరాచారి జననీజనకుల అభినివేశాలను తనకు సొంపైన సాహితీ ప్రక్రియలతో అన్వయం చేసుకోగలిగారు. తెలుగు శారదాంబ దివ్య వీక్షణ కటాక్షాలతో తన మిల్లులలో పరుచుకున్న మేలు రకపు ధాన్యరాశులాగానే అక్షరరాశుల్ని సైతం పొంది చేసుకున్న ఆ తరపు మానవేతిహాసపు మహోత్కృష్ట నిర్వచనం ఆయన. సాహిత్యం తన ఊపిరిగా... సాహిత్యమే తపనగా... సాహితమే తన అనుశ్వాసగా చేసుకొని ఎందరెందరో వర్ధమానులనుండి లబ్ద ప్రతిష్టల దాకా సాహిత్యకారుల అక్షర తృష్ణకు తాను ఆలంబనగా నిలిచిన సంపూర్ణ మానవుడాయన. భాష మీద మక్కువతో భాషా పునరుజ్జీవనాన్ని ఒక సామాజిక బాధ్యతగా చేసుకొని స్వంత ధనాన్ని మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు చేసుకొని అనేకమంది చిన్న పెద్ద కవులు సృష్టించిన కవిత్వాన్ని వెలుగు చూసేలా చేసిన మహనీయుడాయన. ఆ సందర్భంగా అనేకమంది గ్రంథాలను ముద్రించి ప్రోత్సహించిన వదాన్య మూర్తిమత్వం అంగలకుదిటి సుందరాచారిది. వీరు నిత్య చైతన్యశీలి. అక్షరార్చనలో పునీతం కాగల్గిన సువర్ణ శోభితుడు. తరచూ తమ ప్రాంతాలలో ఎన్నెన్నో కవి సమ్మేళనాలను నిర్వహించడం ద్వారాను, ప్రముఖ కవివరేణ్యులను తమ ఊరికి ఆహ్వానించి వారి ప్రతిభకు పట్టాభిషేకం చేయడం ద్వారాను, సత్కరించడం ద్వారాను ఒక ఉన్నతమైన ఒరవడికి తెరతీయగలిగారు. ఉత్తమమయిన సందర్భానికి అనుసృజన కాగలిగారు. తమ కుటుంబంలో జరిగే వివాహాది శుభకార్యాలలోను, ఆనందకరమైన సందర్భాలలోను, వేడుకలలోను పదిమందిని పిలిచి అత్యంత భక్తి భావనలతో సాహితీగోష్టులను, కవి సమ్మేళనాలను నిర్వహించేవారు. ముఖ్యంగా తమ వ్యాపార కూడలి అయిన మూడు రైసు మిల్లుల ప్రారంభ సమయాలలోను,  తమ ఇద్దరు చిరంజీవుల వివాహ వేడుకలలోను, అక్షరాభ్యాస సమయాలలోను అత్యున్నతమైన రీతిలో సాహిత్య కార్యక్రమాలను ఏర్పాటు చేయడం ద్వారా అరుదైన సత్ సంప్రదాయానికి అంకురార్పణ చేయగలిగారు. ఆ వారసత్వం ఈనాడు చీరాల, వేటపాలెం ప్రాంతాలలో చిరాయువుగా వర్ధిల్లుతోంది. చెప్పాలంటే శ్రీమాన్ అంగలకుదిటి సుందరాచారి మానవీయ విలువలు తెలిసిన మనిషి, మర్మాలు ఎరుగని వ్యక్తి. తెలిసిన విలువలను మనసా వాచా ఆచరింపగలిగిన మనిషి. అందుకే వారు విలువల రాజీవనాన విలక్షణ సంతకమై అలరారుతున్నారు. పరమార్థాలను తనవిగా చేసుకోగల్గిన ఆయనకు ఉత్థానమే తప్ప పతనం అనేది ఎరుగకపోవడానికి కారణం వారిలోని ధర్మనిరతి, అంకితభావం,  మంచి ఆలోచనా అనురక్తి అని చెప్పక తప్పదు. సామాజికంగాను, సాంకేతికంగాను ఎన్నేసి మార్పులొస్తున్నా తన వ్యాపారాలలో నిబద్ధతను విడనాడని, విచక్షణతో అడుగులెడగల్గినవారు. జీవితాన్ని చిత్రికపట్టి పదును తేల్చడంలో వారు చేసిన కఠోరకృషి వారి జన్మసంస్కారాన్ని తేటతెల్లం చేయగల్గుతుంది. జన్మతః అబ్బిన సాహిత్యం తాలూకు సంస్కారాన్ని ఆయన అలవోకగా తీసుకోలేదు కాబట్టే, దానిలో అలౌకికమైన ఆనందాన్ని అనుభవింప తేటతెల్లం చేయగలిగేవి. పంతొమ్మిది వందల డెబ్భై దశకంలోనే 'అంగలకుదిటి సుందరాచారి చారిటీస్' అనే స్వచ్ఛద సంస్థను స్థాపించి దాని ద్వారా ఏటా అనేకమంది కళాకారులను ప్రోత్సహించేవారు. కవులను సత్కరించేవారు ఆంధ్రదేశంలో మంచి అరుదైన సంస్థగా ప్రాచుర్యం పొందిన దీనిలో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డా॥ రావూరి భరద్వాజ, డా॥ నాగభైరవ, నందమూరి లక్ష్మీపార్వతి, ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ, వి.వి.యల్ నరసింహరావు, ఎర్రోజు మాధవాచారి, కొండూరి రాఘవాచారి,  భుజంగరాయ శర్మ, పులివర్తి శరభాచార్యులు, వంగవోలు ఆదిశేషశాస్త్రి, పూసలపాటి నాగేశ్వరరావు వంటి ప్రముఖులు ఎందరో ఉన్నారు.  అంగలకుదిటి వారిని ఒక వ్యక్తి అని చెప్పడం కన్నా ఒక వ్యవస్థ అని చెప్పుకుంటే సముచితంగా ఉంటుంది. వీరు మంచి గంధం లాగా చుట్టూరా సుగంధ పరిమళాలను వెదజల్లడమే గాదు కస్తూరి లాగా కలకాలం ఆ సుందర సువాసనలను పంచిపెడుతూనే ఉన్నారు. లలిత మర్యాదస్తులు, పరులలోని గోరంత ప్రతిభను గుర్తించి దానిని వెలికితీసి కొండంత ప్రోత్సాహాన్ని, ప్రాచుర్యాన్ని అందింపగల్గిన వదాన్యశేఖరులు, కారణజన్ములు కూడాను. కొవ్వొత్తి తానవుతూ వెలుగుతూ వెలుతురులను దశదిశలా ప్రసరింపజేస్తూ సంస్కృతికి, సంస్కారానికి, సమన్వయానికి, సృజన శీలతలకు వెలకట్టలేని సుహుృల్లేఖితానవుతూ సుందర శోభితమైన వెలుతురు సెలయేరు, వెలుగురేఖల ఇంద్రధనస్సులా ప్రాచీన ప్రకాశాన తానో ప్రాతః స్మరణీయుడన్న నా వాచనతో అనేకమంది ఏకీభవింపగలరన్న నమ్మకముంది నాకు. యశోధర కావ్యాన్ని వెలుగులోకి తెచ్చిన సందర్భంలో విశ్వనాథ వారి ప్రశంసలు అందుకున్న ఈ సాహితీ రాజపోషకుడు ఎన్నో సాహిత్య, సాంఘిక కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా, సభాధ్యక్షునిగా కొలువు దీరి సభను జనామోదం చేయగల్గిన ప్రతిభామూర్తి వీరు. ఆంధ్ర విశ్వవిద్యాలయ వయోజన కార్యక్రమాలలో తన కుమార్తె సులోచనా రాణితో పాటు పాల్గొని చీరాల వై.ఎ. ప్రభుత్వ మహిళా కళాశాల తరఫున ఎంతగానో సేవలందింపగలిగారు. తమ ఛారిటీస్ ద్వారా ప్రతి సంవత్సరము ఎందరో పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్పులను అందించేవారు. వారిలో అనేకమంది ఈనాడు అత్యున్నతమైన ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్న అధికారులూ ఉన్నారు. అంగలకుదిటి సుందరాచారి ముర్తిమత్వానికి అరుదైన సందర్భం కీర్తి పురస్కార ప్రదానం. దాతలు అందజేసిన ధర్మనిధిలో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయము బాలసాహిత్య ప్రక్రియలో వీరి పేరు మీద కీర్తి పురస్కారము ఏటా అందజేస్తోంది. దానికి వీరి తనయ కందేపి రాణీప్రసాద్, అల్లుడు, ప్రముఖ చంటిపిల్లల వైద్యులు అయిన కందేపి ప్రసాదరావు దంపతులు విశ్వవిద్యాలయాన లక్ష రూపాయలతో ధర్మనిధిని ఏర్పాటు చేయడం ముదావహం. అంగలకుదిటి సుందరాచార్య స్మారక బాలసాహిత్య కీర్తి పురస్కారాన్ని తొలిసారి ప్రముఖ బాలసాహితీవేత్త శ్రీ టి. వేదాంతసూరికి అందజేయడం జరిగింది. వదాన్యశేఖర, అభినవ సమాజభోజ, కవిపోషక బిరుదులలో సత్కరింపబడిన సుందరాచార్యులు సాహిత్యకారులతో బాటు, చిత్రలేఖకులకు కూడ ఎంతగానో ప్రోత్సహించేవారు. మద్రాసు నగర ప్రధాన కూడలి, ఫోరల్ డిజైన్, కంచి కామాక్షీదేవి అమ్మవారు మొదలైన భారీ పెయింటింగులను వేయించి తన బియ్యం మిల్లులను అలంకరింప జేసుకున్నారు. బహుమతులు, అనేక ప్రశంసా ఫలాలను పొందగలిగారు. స్వాతంత్య్ర సమర యోధులకు గుర్తింపుగా ప్రభుత్వం ఇచ్చిన పది ఎకరాల పొలాన్ని మాత్రమే తీసుకొని పించను మాత్రం తిరస్కరించిన విశాల హృదయ సంపన్నుడాయన. కాంగ్రెస్ పార్టీలో చేరి వేటపాలెం కాంగ్రెస్ అధ్యక్షునిగా కొనసాగినా, తన మూలాలను ఏనాడూ విడనాడింది లేదు. శ్రీశైలం, బ్రహ్మంగారి మఠం, చీరాల కంచి కామాక్షీదేవి ఆలయాలలో ప్రత్యేక వసతి సదుపాయాలను ఏర్పాటు చేసి భక్తులకు ఎంతో సహాయం చేయగల్గిన మహనీయుడు అంగలకుదిటి సుందరాచారి. వీరు ఎప్పుడూ తన నడవడికలో క్రియాశీలతను సాధించారే తప్ప హద్దులు దాటింది లేదు. తన చుట్టురా నెలకొని ఉన్న సమాజాన్ని సునాదవినోదినిగా తీర్చిదిద్దగలిగారే తప్ప... మూలాలకు, వాటి తాలూకు సాంప్రదాయాలను ఏనాడు విఘాతం కలిగించలేదు. ఆరోహణే తప్ప అవరోహణలేని జీవితాన్ని వర్ణరంజితంగా, అలంకారమయంగా తీర్చిదిద్దుకోగలిగారు. సంవాదిత్వం ఎరుగనివానిగా, వివాదిత్వానికి వెరవనివానిగా తలవంచని వీరునిగా నెగ్గుకురాగల్గిన అంగలకుదిటి సుందరాచారిది 'సాహితాన' అంగరంగమైన అభినివేశం అనగల్గడం ఏ మాత్రం సత్యదూరం కాబోదు. -వడలి రాధాకృష్ణ

వీడుకోలు

జీవితం అర్థం కావాలంటే...చదవాలి. చూడాలి. పాడాలి. ఆడాలి. కిందపడాలి. పడితేనే లేస్తారు.   ఆ ప్రయత్నంలోనే...ఒకరినొకరం ప్రేమించుకున్న నేనూ, ప్రమీలా లేచిపోవాలనుకున్నాం.    రాత్రి ఒంటిగంటయింది.   పావుగంటలో రైలుంది. అదెక్కితే నేరుగా హైదరాబాద్ చేరుకుంటాం. ఆశ్రయం కల్పించేందుకు స్నేహితులు ఉన్నారక్కడ.      గంట ముందుగానే స్టేషన్ కి చేరుకున్నాన్నేను. ప్రమీలే రాలేదింకా. వెయిట్ చేస్తున్నాను.    అదిగో రైలు!   ఇదిగో ప్రమీల!   నన్ను చూసింది. చేయి ఊపింది. పరుగన చేరుకుంది. ఇద్దరం రైలెక్కేశాం. ఒకరిచేయి ఒకరుపట్టుకుని కూర్చున్నాం. మాటల్లేవు. ఇద్దరమూ మూగబోయాం. దగ్గరగా ఉన్నా ఒకరికొకరు డిస్ కనెక్టయి, ఎవరికివారుగా కనెక్టయ్యాం. భయపడుతూ, కలలుకంటూ కూర్చునే నిద్రపోయాం.  హైదరాబాద్ చేరుకున్నాం. పెళ్లిచేసుకున్నాం.  నలభై ఏళ్లు గడచిపోయాయి.    ఆనాడు ఎక్కిన రైలును, ఈనాడు చూడాలనిపించింది ప్రమీలకు.   ఊరికి వెళ్దాం, పద అంది.   బయల్దేరి ఊరికి చేరుకున్నాం. ఊరిలో నా వంకవారుగానీ, ఆమె వంకవారుగానీ ఎవరూ లేరు. పోయారంతా. కామన్ ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు. ఒకరేమో కిరాణా వ్యాపారం చేస్తున్నాడు. మరొకరు స్కూలు టీచర్ గా చేసి, రిటైరయ్యారు.    ఊరికి మేము వచ్చిన సంగతి వారికి తెలియదు. కలసి అబ్బురపరచాలనుకున్నాం.   పాత పుస్తకాలూ, పాత స్నేహితులూ ఎప్పుడూ గొప్పవే! ముందుగా టీచర్ ని కలిశాం. వంట చేసుకుంటోందామె. పిలవగానే ‘ఎవరూ’ అంటూ వచ్చింది.   నన్నూ ప్రమీలనూ ముందు గుర్తుపట్టలేదు. తర్వాత గుర్తుపట్టింది. ప్రమీలను కౌగలించుకుంది. కన్నీరుపెట్టింది.   పిల్లలేం చేస్తున్నారు? అడిగింది.   లేరన్నాం.   లేకపోవడమే మంచిది! ఉండి మేము నానా ఇబ్బందులూ పడుతున్నాం. గవర్నమెంట్ రిటైర్ చేసినా, వీళ్లు రిటైర్ చెయ్యట్లేదని నవ్వింది.   మా ఇంటికి వెళ్తున్నానని చెప్పి, ఈయనతో ఆనాడు నువ్వు పారిపోయావు. నన్ను ఇరికించావు. మీ వాళ్లకి శత్రువుని అయిపోయాను అంది.     సారీ చెప్పింది ప్రమీల.   నీకు నెమలికంఠం రంగు పట్టుచీరంటే ఇష్టంకదా, తీసుకో అని కొత్తపట్టుచీర బ్యాగులోంచి తీసి టీచర్ కి అందించింది.   ఇద్దరూ లంచ్ చేసి వెళ్లాలి పట్టుబట్టింది టీచర్.   ఆయన చేస్తారు, నేను చెయ్యను. శనివారం కదా! ఉపవాసం అంది ప్రమీల.   నీకింకా, శనివారాలూ, ఉపవాసాలూ పోలేదయితే అంది.  లేదని నవ్వింది ప్రమీల.  పాయసం, పెరుగువడతో లంచ్ అదిరిపోయింది.   సాయంత్రం కిరాణా దుకాణానికి చేరుకున్నాం.   కిలో జీడిపప్పు ఎంతండీ? అడిగాం.   తొమ్మిదివందల యాభై అంటూ...నన్ను గుర్తించి, ‘ఒరేయ్’ అంటూ నన్ను గట్టిగా వాటేసుకున్నాడు దుకాణం యజమాని.   ఎన్నాళ్లయిందిరా మిమ్మల్నిచూసి అన్నాడు. పొంగిపోయాడు.   ఏంటిలా వచ్చారు? అడిగాడు.   ప్రమీలకు ఈ ఊరి వేంకటేశ్వరస్వామి ఆలయం, నవరత్న సినిమాహాలూ, రాత్రి హైదరాబాద్ వెళ్లే రైలూ చూడాలనిపిస్తే వచ్చాం అన్నాను.   ఆ రైలు అక్కడే హైదరాబాద్ లోనే చూడొచ్చుగదా? అని నవ్వాడు మిత్రుడు.   చూడొచ్చుగానీ...ఇక్కడ ఈ ఊరి ప్లాట్ ఫారంలో...చలిలో...రాత్రి ఒంటిగంటకు వచ్చే రైలుని చూడడంలో ఓ ఫీల్, ఒక థ్రిల్ ఉంది. దాన్ని అనుభవించాలనుకుంటున్నాం అంది ప్రమీల.  ఓకేకానీ, నవరత్న సినిమాహాలు లేదు. తీసేశారు. ఇప్పుడది పెద్ద పంక్షన్ హాలయిపోయింది అన్నాడు మిత్రుడు.    అయ్యో అంది ప్రమీల. బాధపడింది.    వేంకటేశ్వరస్వామి ఆలయం ఎలా ఉంది? అడిగింది.   బ్రహ్మాండంగా పుంజుకుంది. చిన్న తిరుపతి అంటున్నారు. భక్తులకి కొదవలేదు అన్నాడు మిత్రుడు.   ఈ రోజు శనివారం కదా! జనం తొడతొక్కిడిగా ఉంటారు అన్నాడు.   టీ తెప్పించాడు. తాగాం.   ఎన్ని కిలోల జీడిపప్పు కావాలో చెప్పు, పైసా ఇవ్వక్కర్లేదు. పార్శిల్ చేసి పెడతాను అన్నాడు మిత్రుడు.   మీ మాటలే జీడిపప్పు. మాకది చాలు అంది ప్రమీల.   కలుస్తాం అని బయల్దేరాం అక్కణ్ణుంచి. రూపాంతరం చెందిన నవరత్న సినిమాహాలుకి చేరుకున్నాం. ఎవరిదో పెళ్లి జరుగుతోందందులో. వెళ్లి లోపలంతా చూశాం.   ఇప్పుడు మేము నిల్చున్న చోటు, ఒకప్పడు ఛైర్ క్లాస్. ఆ క్లాసులో కూర్చుని నేనూ, ప్రమీలా ఎన్ని సినిమాలుచూశామో!ఎన్ని కబుర్లు చెప్పుకున్నామో! ఒకరిచేతుల్ని ఒకరు ఎన్నిసార్లు ముద్దుపెట్టుకుని, ఒళ్లో దాచుకున్నామో! సీనియర్ ఎన్టీఆర్ ‘అడవిరాముడు’ నాలుగైదుసార్లు చూశాం. ‘కోకిలమ్మ పెళ్లికి కోనంతా పందిరి’ పాటకి ఎంతగా పరవశించి, పులకించిపోయామో!  పెళ్లివారు కూల్ డ్రింక్ ఇస్తే వద్దని, బయటపడ్డాం. నడుస్తూ నడుస్తూ ప్రమీల తూలిందక్కడ. కిందపడబోయింది. కంగారుపడ్డాను. గట్టిగా పట్టుకున్నాను.    డోంట్ వర్రీ అంది ప్రమీల.    వేంకటేశ్వరస్వామి ఆలయానికి చేరుకున్నాం. మొదటిసారిగా మా చూపులు కలిసిందిక్కడే! వాళ్ల పిన్ని కూతురితో వచ్చింది ప్రమీల. మా ఫ్రెండ్ తో వెళ్లాన్నేను.    శనివారం సాయంత్రం స్వామివారి ఆలయం దగ్గరే కుర్రకారంతా ఉండేది. నచ్చిన అమ్మాయికి మనసివ్వడంలో పోటీలుపడేది.   ఆరుగురితో పోటీపడి ప్రమీలను దక్కించుకున్నాను నేను.   అమ్మవారి ఆలయం వెనుక ప్రమీలను ఎన్నిసార్లు కౌగలించుకున్నానో! మరెన్నిసార్లు ముద్దుపెట్టుకున్నానో! ప్రేమిస్తున్నానని చెప్పడానికి పెద్దపెద్ద ప్రేమలేఖలు రాయనక్కరలేదు. ఒక్క ముద్దుచాలు! ఆ ముద్దులో వందలు వేలు ప్రబంధాలు ఘోషిస్తాయి.   ఆలయానికి ఇరువైపులా పెద్దపెద్ద అశోకచెట్లుండేవి. ప్రతిచెట్టుకిందా సిమెంట్ బెంచీ ఉండేది. ఆ బెంచీకోసం తెగ ఆరాటపడేవారు ప్రేమికులు. స్వీట్ నథింగ్స్ చెప్పుకునేందుకు అంతకుమించిన స్థలంలేదు.    ఇప్పుడు ఆ చెట్లూ, బెంచీలూ లేవు. అంతా తిరువీథి అయిపోయింది. చాలా మార్పు కనిపించింది. కదలికలన్నీ ముందుకు సాగవన్నట్టే...మార్పంతా అభివృద్ధికాదనిపించింది ఎందుకో!  వందలాదిమంది భక్తులు బారులుతీరి ఉన్నారు. స్వామివారిదర్శనం కష్టం అనిపించింది. క్యూలో నిల్చునే ఓపిక లేదు. ఏం చెయ్యాలి? అనుకుంటుండగా...ఆలయపూజారి గుర్తుపట్టి పలకరించారు.     మీరు ప్రమీలగారు కదూ? వీరితో మిమ్మల్ని మీ అన్నగారు చూస్తే ప్రమాదం అని, మీరానాడు భయపడుతుంటే...మిమ్మల్నిద్దరినీ ఆంజనేయస్వామి ఆలయంలో దాచింది నేనే! గుర్తుందా? అడిగారు.   ఉందన్నది ప్రమీల.    స్వామివారి దర్శనానికేనా? రండి! నేను తీసుకెళ్తాను అని ఆయనతోపాటుగా మమ్మల్ని ఆలయంలోనికి తీసుకెళ్లారు.   కంటినిండుగా స్వామిని దర్శింపజేశారు.   హారతి పళ్లెంలో పదివేలరూపాయలను దక్షిణగా వేసింది ప్రమీల. చూసి ఆశ్చర్యపోయారు పూజారి.    ఆనాడు మీరు చేసిన సాయం మరచిపోలేనిది అంది ప్రమీల. నమస్కరించింది ఆయనకి.    రాత్రి ఒంటిగంటయింది.   ప్లాట్ ఫారమ్మీదికి చేరుకున్నాం.   ఇంకాసేపట్లో రైలొస్తుంది.   ఈ చలిలో...ఈ రాత్రి...నువ్వు కోరుకున్నట్టుగానే రైలును చూస్తున్నావు అన్నాను.    అవునన్నట్టుగా తలూపుతూ, నా చేయి అందుకుంది ప్రమీల. తన గుండెల్లో దాచుకుంది.   చెప్పడం ప్రేమకాదు, చేసి చూపించడం ప్రేమ. నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు తెలుసు అంది.   ప్రేమించడం, ప్రేమించబడటాన్ని మించిన ఆనందం జీవితంలో ఇంకొకటి లేదు. ప్రేమని కంటితోకాదు, గుండెతో చూడాలి అని నవ్వింది.    రైలొచ్చింది.   ఆగింది.   రైలాగిందో లేదో...పరిగెత్తింది ప్రమీల. ఒకొక్క కంపార్ట్ మెంట్ నీ చేత్తో నిమురుతూ ఇంజిన్ వైపుగా నడవసాగింది.   ఒకటి...రెండు...మూడు...నాలుగు...అయిదు నిమిషాలయింది.  గార్డ్ విజిల్ వేశాడు. రైలు కదిలింది. కదులుతున్న రైలు ఎక్కింది ప్రమీల. నన్నుచూస్తూ...చేయి ఊపుతూ...నవ్వుతూ వెళ్లిపోయింది. అదృశ్యమయిపోయింది.   ప్లాట్ ఫారం ఖాళీ అయిపోయింది. చలిగాలి వీస్తోంది. మంచు కురుస్తోంది. బెంచీమీద నేనూ...నా ఒళ్లో ప్రమీలా ఉన్నాం. ప్రమీల ఉందికాని, ప్రాణంతో లేదు. చనిపోయి ఉంది.  క్యాన్సర్!   చివరిరోజులు!  ఏ క్షణం ప్రమీల మరణిస్తుందో తెలీదు. కాని బతికి ఉన్న ప్రతి క్షణాన్నీ అనుభవించాలనుకుంది. అనుభవించింది.    కథ అయినా, జీవితం అయినా ఏది ఎన్నాళ్లు నిలిచిందన్నదికాదు, ఎవరిని ఏ మేరకు ప్రేరేపించిందన్నదీ, కూడా ఎంతకాలం స్నేహంగా మనగలిగిందన్నదే చెప్పుకోవాలి. ఆ సంగతే  చెప్పానిక్కడ.  జగన్నాథశర్మ

డ్రామా ఈజీ! కామెడీ కష్టం!!

ఉషాకిరణ్ మూవీస్   మంచికథకోసం వెదుకులాడింది. సినిమాకు అనుగుణంగా చతుర మాస పత్రికలో ఏదేని నవల వచ్చి ఉంటే...సూచించమన్నది. అయ్యవారు అడిగితే సంపాదకవర్గం ఊరుకుంటుందా? కిందా మీదా పడింది. నవలలన్నీ ఒకటికి రెండుసార్లు చదివింది. ఆఖరికి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మిగారి నవల ‘ప్రేమలేఖ’ను సూచించింది.   ప్రేమలేఖను చదివారంతా. బాగుంది అంటే బాగుంది అన్నారు. సినిమాకు సరిపోతుందన్నారు. సినిమా తీశారు. సూపర్ హిట్టయిందది. విజయోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఆ సందర్భంగా రచయిత్రిని ఆహ్వానించారు. ఈనాడు కార్యాలయానికి అప్పుడొచ్చారు పొత్తూరి విజయలక్ష్మి. ఆమెను నేను అదే మొదటిసారి చూడడం. తెల్లగా అంతెత్తున ఉన్నారామె. మఫ్టీలో ఉన్న లేడీ పోలీస్ ఆఫీసర్ లా ఉన్నారు. ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీ అట్లూరి రామారావుగారితో మాట్లాడి, వారితో సహా ఛైర్మన్ గారిని కలిశారు.     వెను తిరిగి వెళ్లిపోతూ విపుల, చతుర సెక్షన్ లోకి వచ్చారు. అందరినీ పలకరించారు. నన్ను పరిచయం చేశారామెకు.   ‘‘మీ పేరు జగన్నాథశర్మా? మీరు కథలు రాస్తారు కదూ?’’ అడిగారామె. అవునన్నాను.   ‘‘మీ కథలు చాలా సీరియస్ గా ఉంటాయి. మనకంత సీరియస్‌నెస్ పడదు.’’ అని నవ్వారు.   ఈ సంఘటన 1983 లో జరిగింది. తర్వాత 1995 వరకూ విజయలక్ష్మిగారిని కలిసే భాగ్యం నాకు లభించలేదు. పుష్కరకాలం అయింది. చూపులు తప్పిపోయాయి అనుకున్నాను. కాని తప్పిపోలేదు. ఈ టీవీలో చీఫ్ స్క్రిప్ట్ రైటర్ గా నేను జాయినయ్యాను. అప్పుడు మళ్లీ విజయలక్ష్మిగారిని చూశాను.     కామెడీ సీరియల్ కోసం మంచి కథ కావాలంటే...చెప్పేందుకు వచ్చారామె. సోమాజీగూడ ఈటీవీ కార్యాలయానికి ఎదురుగా సెంట్రల్ కోర్ట్ లో నాకు కథ వినిపించారు. కథ బాగుంది.   ‘‘తీస్తారా?’’ అడిగారామె.   ‘‘తియ్యం’’ అన్నాను. ఆశ్యర్యంగా చూశారామె.   ‘‘ఇక్కడ కామెడీ యాజమాన్యమే రాసుకుంటుంది. ఇతరులు రాస్తే ఒప్పుకోదు. ఒకవేళ ఒప్పుకున్నదనుకుంటే... మాదే అంటుంది తర్వాత.’’ అన్నాను. పగలబడి నవ్వారామె.   ‘‘నీ కడుపు చల్లగుండ! ముందే చెప్పావు.’’ అని వెళ్లిపోయారు. ఆ వెళ్లిపోవడం వెళ్లిపోవడం మళ్లీ మేము కలుసుకోలేదు. ఓసారి కలిసే అవకాశం వచ్చింది. వారి స్థలాన్ని డెవలప్ మెంట్ కి తీసుకుని అపార్ట్ మెంట్స్ కడుతున్నారంటే...ఓ అపార్ట్ మెంట్ కొనుగోలుచేసేందుకు వెళ్లాను. విద్యానగరో ఎక్కడో...అది! పెద్దగా గుర్తులేదు. బిల్డర్స్ తో బేరం కుదర్లేదు, మానుకున్నాను. నేను కారెక్కి వెళ్లిపోతుంటే...విజయలక్ష్మిగారు అక్కడికి వచ్చారు. పలకరిద్దామనుకున్నానుగాని, ఆఫీసునుంచి ఫోన్ వస్తే పరిగెత్తాను.   చాలా ఏళ్ల తర్వాత, నవ్య వీక్లీకి సంపాదకుణ్ణి అయిన తర్వాత వారిని మళ్లీ నేను కలుసుకునే అవకాశం లభించింది.   నవలల పోటీకి పోరు పెడితే నవల రాశారామె. మంచి నవల. ఒకరకంగా ఆత్మకథ. బహుమతి ఇచ్చాం. బహుమతి చాలా చిన్నమొత్తమేగాని, ఆ నవలతో నవ్య సర్క్యులేషన్ పెద్దమొత్తంలో పెరిగింది.  ఆ సంగతి చెప్పి, థాంక్స్ అంటే...  ‘‘థాంక్స్ అని చెప్పి తప్పించుకోకు శర్మా! రాయడం మానుకుందామనుకునే వేళ మళ్లీ రాయించావు. తెగ రాయాలనిపిస్తున్నదిప్పుడు. రాసిందంతా నువ్వే వేసుకోవాలి.’’ అన్నారు.   ‘‘అంతకంటే భాగ్యం ఉందా?’’ అన్నాను.   రెండేళ్లయినా నవల ఊసే లేదు. అడిగితే ఇదిగో రాస్తున్నా! అదిగో రాస్తున్నానంటూ తప్పించుకునేవారు విజయలక్ష్మి.   ‘‘ఏమైంది మేడం! ఎందుకు రాయట్లేదు??’’ అనడిగితే...  ‘‘ఆలోచిస్తే అంతటా హాస్యమేగాని, అనుభూతిస్తే అంతటా విషాదమేనయ్యా.’’ అన్నారు.   ‘‘డ్రామా రాయడం ఈజీనయ్యా! కామెడీ రాయడమే కష్టం.’’ అన్నారు.   ఒకప్పుడు ఇవే మాటలు నేను ప్రముఖ రచయిత డి.వి. నరసరాజుగారిదగ్గర విన్నాను. బాగా చదువుకున్నవారూ, జీవితాన్ని బాగా వడబోసినవారు మాత్రమే అలా మాట్లాడగలరు.   మునిమాణిక్యం కథలు, రంగనాయకమ్మగారి స్వీట్ హోం తర్వాత సంసారపక్షమైన హాస్యం, పొత్తూరి విజయలక్ష్మిగారి రచనల్లోనే నేను మళ్లీ చూశాను. లేడీ మునిమాణిక్యం మా విజయలక్ష్మిగారు. కీర్తిశేషులు శ్రీరమణగారూ, నేనూ ఈ విషయమై చాలాసార్లు చర్చించుకున్నాం.       నేను అధ్యక్షుణ్ణయితే విజయలక్ష్మిగారు ముఖ్య అతిథిగానూ, ఆమె అధ్యక్షురాలయితే, నేను ముఖ్య అతిథిగానూ చాలా వేదికలు ఇద్దరం పంచుకున్నాం.   ‘‘చేతిగోళ్లు తీసుకుంటున్నప్పుడు, వేలికి గాయం అవ్వడం పెద్ద ట్రాజెడీ. అదే మార్నింగ్ వాక్ కి వెళ్ళి, మ్యాన్ హోల్ లో పడి మనిషి చనిపోవడం పెద్ద కామెడీ.’’ అన్నారోసారి విజయలక్ష్మిగారు. ముఖ్యఅతిథిగా ప్రసంగించారు.   ‘‘కామెడీ జనాన్ని ఏడిపించాలి. నవ్వించిందంటే...అది ధర్డ్ క్లాస్ కామెడీ.’’ అన్నారు. వాటిని సమీక్షించలేకపోయాను. అధ్యక్షునిగా నాకప్పుడు మాటలు కరువయ్యాయి. నవ్వుతూ మాట్లాడతారుగానీ, అమ్మో! విజయలక్ష్మిగారిలో చాలా విషయం ఉందనుకున్నాను.    నా శ్రీమతి రమణితో చాలా చనువుగా ఉంటారామె. పెళ్లిభోజనాల్లో రమణి సరిగా వడ్డించుకోలేనప్పుడు...కల్పించుకుని, రమణి విస్తరినిండా వడ్డించడం విజయలక్ష్మిగారికి సరదా!  ‘‘ఎంత బాగా తింటే అంత మంచిది రమణీ! బాగా తినడం బ్యాంక్ అకౌంట్ లాంటిది. ఎంత బాగా తింటే...అంతగా ఇన్ వెస్ట్ చేసినట్టనుకో!’’ అన్నారు.   ‘‘అన్నాన్ని ప్రేమించగలవారే అందరినీ ప్రేమించగలరు.’’ అని నవ్వారు.   విజయలక్ష్మిగారి భర్తపోయినప్పుడు, నేను వెళ్లి ఆమెను పరామర్శించలేదు. ఎందుకో నాకు అలా పరామర్శించడం ఇష్టం ఉండదు. చాలా రోజులపాటు నేనూ, ఆమే ఫోన్లో కూడా మాట్లాడుకోలేదు. ఒకరోజు రమణి చెబితే ఫోన్ చేశాను. విజయలక్ష్మిగారు మాట్లాడారు.   ‘‘అది కాదుశర్మా! అన్నిటికీ ఎక్స్ పెయిరీ డేట్ ఉంటుంది. స్పష్టంగా పేర్కొని హెచ్చరిస్తారు కూడా. మనిషి విషయంలో ఎందుకు ఆ సౌలభ్యంలేకుండా పోయింది? తెలిస్తే జాగ్రత్తపడతాం కదా!’’ అన్నారు. తర్వాత మరి మాటలు లేవు. ఏడుస్తున్న ధ్వని వినవచ్చింది.   ‘‘మేడం’’ అన్నాను, ఓదార్పుగా.   ‘‘హాస్యం అనేది నవ్వించి పేలిపోయే డైనమైటయ్యా! నా హాస్యం నన్నే పేల్చేసింది.’’ అన్నారు.   ‘‘ఊరుకోండి మేడం.’’ అన్నాను.   ‘‘ఒకటి నిజం శర్మా! ఎంతటి దుర్దినానికైనా ఇరవై నాలుగుగంటలే టైం. ఆ రోజు గడిచిపోయిందీ...చీకటిపోయి వెలుగొస్తుంది. మళ్లీ  అంతా మామూలే!’’ అన్నారు.          మామూలయ్యారు కొద్దిరోజులకి. నాకు కావాల్సింది అదే! మెదడుతో ఆలోచించేవారే భయస్తులు. హృదయంతో ఆలోచించేవారికి ఏ భయాలూ ఉండవు.  విజయాలు వారివే! అందుకే విజయలక్ష్మిగారంటే నాకు చాలా చాలా ఇష్టం. వారి రచనలంటే ఇంకా ఇంకా ఇష్టం.  -జగన్నాథశర్మ

గొప్ప విలువలకు పట్టంగట్టిన కారా మాస్టారు

కథా రచనలోనూ, నిజజీవితంలోనూ కాళీపట్నం రామా రావు మాస్టారికి గొప్ప విలువలు ఉన్నాయి. వాటిని ప్రతి వ్యక్తి అలవర్చు కోవాలి.  శ్రీకాకుళం సాహితి, సాహితీ స్రవంతి సంస్థలు ఆదివారం స్థానిక బాపూజీ కళామందిర్ లో ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కాళీపట్నం రామారావు శత జయంతి కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా డాక్టర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం (ఎచ్చెర్ల) ఉప కులపతి కె.ఆర్. రజని పాల్గొన్ని ప్రసంగించారు.  అక్షరమే దైవంగా భావించిన కారా మాస్టారి జీవితం, చేసిన రచనలు ఎన్నటికీ ఆదర్శనీయమని రజజని అన్నారు. జ్ఞానం, విజ్ఞత, విలువలు, ధీరత్వం వంటి సుగుణాలు కారా మాస్టారు నుంచి నేటి తరం గ్రహించాలని, ఇవి ప్రతి ఒక్కరికీ ఉపయోగపడాలన్నారు. తల్లి లాంటి మాతృభాషా పరిరక్షణకు, అందులోని రచనలను భావితరాలకు అందించేందుకు కృషి జరగాలని సూచించారు.  మాజీ  ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్. శర్మ మాట్లాడుతూ ఆంగ్ల మాధ్యమం ప్రభావంతో రచయితలకు కూడా ప్రాంతీయ తత్వాన్ని అంటగడుతు న్నారని, తెలుగు వారు విడిపోతున్నారని అన్నారు. ప్రముఖ కథా రచయిత అట్టాడ అప్పలనాయుడు మాట్లాడుతూ కారా లాంటి కథకుడు లేరని, తన జీవిత సార్థకతకు కొన్ని నియమాలను ఆయన పెట్టుకున్నారని చెప్పారు. ఎవరూ చెప్పని గొప్ప విషయాలు సాహిత్యం చెప్పిందని భావించి సాహిత్యానికి అంకితమైనటువంటి గొప్ప వ్యక్తి కారా మాస్టారు అని కొనియాడారు. ప్రకృతి నియమాలు, సమాజ నియమాలు పాటించాలన్న నియమాన్ని ఆయన  జీవితాంతం ఉల్లంఘించలేదని తెలిపారు. రాజాం రచయితల వేదిక నిర్వాహకుడు గార రంగ నాథం మాట్లాడుతూ సమాజంలోని సమస్యల మూలాలను తెలుసుకోగలిగితే మంచి కథలు రాసి సమస్యలకు పరిష్కారం అన్వేషించ గలమని కారా మాస్టారు చెబుతుండేవారని అన్నారు. ముఖ్య అతిథిగా హాజరయిన శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ కథానిలయంను పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ చేసి రచనలను ప్రపంచానికి పరిచయం చేయడమే కారా మాస్టారుకు మనం ఇచ్చే నివాళి  అన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రముఖ రచయిత చీకటి దివాకర్ మాట్లాడుతూ తెలుగు కథకుల్లో మూడు తరాలు వారికి ప్రతినిధిగా కారా మాస్టారు నిలిచారన్నారు. గోనె సంచులు పట్టుకుని ఊరురా తిరిగి కథలు సేకరించారని అన్నారు. విశ్వసాహితి అధ్యక్షులు పొన్నాడ వరాహ నరసింహులు, సాహితీ స్రవంతి సంస్థ అధ్యక్షులు కె.శ్రీనివాస్, కారా మాస్టారి కుమారుడు కె.సుబ్బారావు, గరిమెళ విజ్ఞాన సమితి అధ్యక్షుడు వి.జి.కె.మూర్తి తదితరులు పాల్గొన్నారు.  కార్యక్రమం కొనసాగింపులో భాగంగా ప్రత్యేక సదస్సు జరిగింది. కారా మాస్టారు రచనలు, కథలపై రచయితలు, ఉపాధ్యాయులు దుప్పల రవికుమార్, కంచె రాన భుజంగరావు, మల్లిపురం జగదీష్, డా. కె. ఉదయ్ కిరణ్, ఎ.మోహనరావు, బాడాన శ్యామలరావు, బాల సుధాకర మౌళి, చింతాడ తిరుమలరావు, పూజారి దివాకర్ పత్ర సమర్పణ చేశారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరిగిన ఈ శత జయంతి కార్యక్రమంలో అనేకమంది సాహితీవేత్తలు, భాషాభిమా నులు, అనుచరులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మర్రిచెట్టు

ఒక నది ఒడ్డున ఒక మర్రి  చెట్టు ఉండేది. ఆ మర్రి చెట్టు చాలా కొమ్మలతో  విస్తరించి ఉండేది. కాని దానికి గర్వం ఎక్కువ నేనే అందరికన్నాగొప్ప అని అనుకుంటూ ఉండేది. ఒక రోజు నదిలో ఉన్న చిన్న మొక్కలతో మాట్లాడుతూ మీరు నాకు రోజు తలొంచి నమస్కారం చేయాలి, ఎందుకంటే మీరు నాకన్న బలహీనమైన వారు అంటుంది. అందుకు ఆ చిన్న  మొక్కలు మేము నీకన్నా చిన్నవారమే కాని ఎవరి గొప్పదనము వారికి ఉంటుంది.   మేము నీకు తలొంచి నమష్కారము చేయము అంటాయి. దానికి మర్రి చెట్టు ఆగ్రహిస్తుంది. ఆలోపే ఒక్క పెద్ద గాలి రావడంతో ఆ చిన్న మొక్కలు గాలికి తలొగ్గుతాయి  అది చూసిన మర్రి చెట్టు పెద్దగా నవ్వి మీరు చిన్న గాలికే నిలబడలేకపోయారు నేను చూడండి ఎంత గాలి వచ్చినా గర్వంగా తల దించకుండా నిలబడగల్గుతాను అని చెప్తుంది.   ఆ చిన్న మొక్కలు అవును మేము గాలికి భక్తితో తల దించాము నీవు కూడా గాలి దేవుడికి నమస్కరిస్తూ నీ కొమ్మలతో పలకరించు లేకపోతే తన ఆగ్రహానికి గురి అవుతావు అని అంటాయి. లేదులేదు నేను ఎవరికీ భయపడను నేను అందరికంటే బలవంతుడిని నన్ను ఎవరు ఏమి చేయలేరు అని విర్రవీగుతుంది మర్రిచెట్టు.  ఆ లోపే గాలి పెద్దగా వీస్తుంది కాని మర్రి చెట్టు అలాగే నిలబడి ఉంటుంది. కాసేపు అయ్యాక గాలి తాకిడి ఎక్కువ కావడంతో మర్రి చెట్టు నదిలోకి కూలి పోతుంది. చిన్న మొక్కలు చూశావా మేము ముందే చెప్పాము ప్రతి ఒక్కరు పెద్దవారిని గౌరవించాలి అహంకారం ఉండకూడదు నీ అహంకారమే నీ ప్రాణాలు తీసింది.

పొగడపూల పరిమళమే.. విమల వగరు జ్ఞాపకాల నవ్వు

కల్లోలిత ప్రాంతాలను కవిత్వంగా మార్చగలదు.  విరిగిపోయిన కలలకు కట్టు కట్టగలదు.  నిరాశల నీడల మీద నీలిపూల వాన కురిపించగలదు.  పాడులోకపు శోకాన్ని తన గొంతులో పలికించగలదు. ఎండిన కన్నీటి చారికల వెనక దాగిన విషాదాన్ని గొంతెత్తి పాడగలదు.  అమర వీరుల సమాధుల మీద పున్నాగ పూలై పరిమళించగలదు. అడవి దారుల్లో చీకటి రాత్రుల్ని అక్షరాల వెన్నెల దీపాలతో వెలిగించగలదు.  ఈ బతుకున్నదెందుకు? బతకడానికేగదా అని నిట్టూర్పో, వోదార్పో తెలియకుండా రాయగలదు. భాషా సౌందర్య రహస్యాన్ని ఏనాడో కనిపెట్టిన ఈ కవి, అమోఘమైన, ఇంద్రియాతీతమైన అనుభూతి ఇవ్వగలిగే రచయిత్రి... ఇంతకీ కవిత్వం అంటే ఏమిటి? అని మన కళ్లల్లోకి సూటిగా చూస్తూ అడగ్గలదు.  కవిత్వం ఒక కల. ఆ కల పేరు విమల.  ఇక్కడే హైదరాబాదులోనే పుట్టింది. ఈ నగరంలోనే చదువుకుంది. ఉద్యమాలై ప్రవహించిన ఒక తరంతో కలిసి నడిచింది. నినాదాలై గొంతు చించుకుంది. ఆగ్రహ ప్రదర్శనల్లో పిడికిలి బిగించింది. యోగ్యతా పత్రంలో చలం అన్న రైటియస్ ఇన్డిగ్నేషన్ కి నిజమైన అర్థంలా తిరుగుబాటు కవిత్వంతో షాక్ చేసింది. ‘సౌందర్యాత్మక హింస’ రాసి రెబెల్ గా, ఫైర్ బ్రాండ్ ఫెమినిస్టుగా, బాధితులకు బ్రాండ్ అంబాసిడర్ గా పేరుతెచ్చుకుంది.  2009లో వెల్లువలా వచ్చిన విమల కవిత్వం ‘మృగన’ చదివారా? అందులో చివరి కవిత  ‘ఓ నా ప్యారీ జాన్’ గుర్తుందా?  ‘అడవి ఉప్పొంగిన రాత్రి’లోని కవితలు అనుభూతి గీతాలై మిమ్మల్ని అల్లుకున్నాయా?  ఇపుడు వచ్చిన కొత్త పుస్తకం ‘వగరు జ్ఞాపకాల నవ్వు’... ఎంత చక్కని పేరు!   ఎన్ని కన్నీళ్లను దాచుకున్న బాధో ఇది!  గాయపడిన జ్ఞాపకాల్ని గుర్తుచేసుకున్న వేదనకి అక్షర రూపమే విమల కవిత్వం. నిస్సహాయతనీ, నిరసననీ, మండుతున్న నిప్పులుగా మార్చిన కవి మద్దూరి నగేష్ బాబుకి అక్షరాలా ఫిమేల్ కౌంటర్ పార్ట్ విమల.  సత్యమూర్తి వాగ్దానం చేసిన రేపటి సూర్యోదయపు తొలి వెలుగు విమల.  ఎర్ర శాలువా కప్పుకుని, రివాల్వర్ పట్టుకుని  మన మధ్యే తిరుగుతున్న కవి దొంగ  కామ్రేడ్ కృష్ణశాస్త్రి విమల!                                                                                                      *** విమల గారు నాకు కొద్దిగా తెలుసు. పరిచయం మాత్రమే! రక్తాశ్రువులతో రాసే ఆమె కవిత్వం మాత్రం బాగా తెలుసు. హైదరాబాద్, ఆనంద్ నగర్ కాలనీలో మా ఇల్లు... ఖైరతాబాద్ దగ్గర్లో ఆర్టిస్టు మోహన్ ఆఫీసు...ఆ మధ్యలోనే విమలగారిల్లు. ఆమె ‘మృగన’ కవితా సంపుటికి బొమ్మల కోసం మా ఆఫీసుకు వచ్చేది. ఒక పెద్ద కవినీ, ఒక పెద్ద ఆర్టిస్టునీ చూసి నేనెంతో మురిసిపోయేవాడినని విమలగారికి కానీ, మోహన్ కు కానీ నేనెప్పుడూ చెప్పలేదు. మృగన కవర్ పేజీ మోహన్ ఎంతో ప్రేమతో వేశాడు. ప్రపంచ ప్రఖ్యాతమైన జపాన్ లెజండరీ ఆర్టిస్టు హొకుసాయ్ వేసిన కల్లోల సముద్ర కెరటాన్ని మోహన్ కాపీ చేశాడు. ఆ కెరటం మీద ఒక చిన్న సీతాకోక చిలకని వేశాడు. ఎగసిన విప్లవోద్యమ కెరటం మీద రెక్కలల్లార్చుతూ వాలుతున్న కవిత్వమే విమల.  అయ్యో, నేను కూడా తక్కువాడినేమీ కాదు. విమల అనే మహాకవికి మంచినీళ్లిచ్చిన అదృష్టవంతుడిని. టీ కూడా ఇచ్చానులెండి. ఓ రోజు, మద్రాసులో కవి అజంతా రోడ్డు మీద నడిచి వెళుతున్నాడు. ఎదురుగా వస్తున్న వ్యక్తిని దూరం నుంచే చూసి గుర్తుపట్టాడు. చటుక్కున తిరిగి పక్క వీధిలోకి తప్పుకున్నాడు అజంతా. ఎందుకలా? అని ఒక మిత్రుడు అడిగితే, ఎదురుగా వస్తున్నవాడు శ్రీశ్రీ అని చెప్పాడు అంజంతా.  అంత కాంతిని భరించడం కష్టం కదా మరి!  విమల గారి కవిత్వం అంటే ఎంత ఇష్టం వున్నా, ఆమెకు దూరంగా ఉండటానికే ఇష్టపడ్డాన్నేను. నిలువెల్లా కవిత్వమై నడిచి వచ్చే విమలగార్ని చూడటమే చాలు కదా!  హియాలయాల్లో వందేళ్లకోసారి పూసే అరుదైన కవితా పుష్పం పేరే విమల మోర్తల!  ఎం.ఎస్.నాయుడి కవిత్వం గురించి ఒక సభలో విమల మాట్లాడారు. మోహన్ సంతాప సభలో ఆమె ఉద్వేగం నన్ను కకావికలు చేసింది. మొన్నటికి మొన్న కృపాకర్ మాదిగ సభలో విమల ప్రసంగం ఒక అద్భుతం. ఎంత క్లారిటీ!  ఎంత కన్సర్న్! ఎంత గొప్ప ఎక్స్ ప్రెషన్ ఆమెది, రాసినా... మాట్లాడినా... ప్రొటెస్ట్ చేసినా!                                                                                                      *** పుచ్చలపల్లి సుందరయ్య అనే పెద్ద నాయకుడు తాను రెడ్డినని ఎప్పుడూ చెప్పుకోలేదు. పేరు నుంచి ఆ రెండక్షరాల్ని తొలగించారు. ఈ మోర్తలోళ్ల అమ్మాయి విమల కూడా ఏనాడూ రెడ్డినని చెప్పదు. అలా చెప్పుకోడానికి ఇష్టపడదు. చివర కులం పేరు తగిలించుకోవడానికి సిగ్గుపడే, చిరాకుపడే ఒక పాత తరానికి చెందిన మనిషి ఆమె. ఆదర్శంగా నిలవాలనే తపన ఆమెది.  విమలంటే కేవలం కవిత్వమే కాదు. ఎన్నెన్నో వ్యాసాలు రాసింది. ఇప్పటికీ రాస్తోంది. నిరుపేద పాకీ వాళ్ల బతుకుల్ని అధ్యయనం చేసింది. ‘మాకొద్దీ ఛండాలం’ అనే పుస్తకం రాసింది.  ‘కొన్ని నక్షత్రాలు కాసిన్ని కన్నీళ్లు’ అంటూ పదమూడు కథలతో పుస్తకం వేసింది. చదివి తీరవలసిన కధలవి. గాఢమైన తాత్వికావగాహనతో ప్రొఫౌండ్ గా చెప్పగలగడం, ఒక ఎమోషనల్ టర్మాయిల్ని శక్తిమంతమైన అక్షరాలుగా మలచడం విమల సూపర్ స్పెషాలిటీ. ఆ భావ మాలికలు, భాషా సోయగంతో మన హృదయాల మీద చెరగని సంతకం చేస్తుందీ రచయిత్రి. శిల్ప నైపుణ్యం వల్లా, ప్రాథమిక మానవతా స్పర్శ వల్లా కథనైనా, కవిత్వాన్ని అయినా అలవోకగా అనుభూతి కావ్యంగా మార్చి మెస్మరైజ్ చేయగల మన కాలపు మంత్రగత్తె విమల.                                                                                                      *** అలనాటి మరాఠీ కవయిత్రి బహినా బాయి చౌదరి ఫెమినిస్టు కవిత్వం గుర్తుందా?  మలయాళీ కమలాదాస్, పంజాబీ అమృతాప్రీతం కవిత్వం మిమ్మల్ని డిస్టర్బ్ చేసిందా?  ఇంగ్లీషులో రాసే సుజాతా భట్, యూనిస్ డిసౌజాల కవితావేశం మీ రక్తనాళాల్లో కలిసి ప్రవహించిందా? బెంగాలీ కవి  మౌమితా ఆలం అక్షరాలకి నా లాగా మీరూ బానిసలేనా?  భారతీయ కళాత్మక కవితాత్మని కళ్ల ముందు కాగితాల మీద పరిచిన వీళ్లెవరికీ తీసిపోని కవి మన విమల.  పొయిట్రీ ఈజ్ ది బ్లడ్ ఆఫ్ ది సోల్ అన్న పాబ్లో నెరుడా మాటలకి నిజమైన రుజువులూ, సాక్ష్యాలూ ఈ ‘వగరు జ్ఞాపకాల నవ్వు 'లోని  64 కవితలూ! కవిత్వం ఒక అల్కెమీ... ఆ రహస్యం విమలకు తెలుసని ఇందులో ఏ ఒక్క కవిత చదివినా ఇట్టే తెలిసిపోతుంది. నినాద ప్రాయం అయిపోతున్న వామపక్ష రొడ్డ కొట్టుడు పోరాట కవిత్వాన్ని కన్నీళ్లతో శుద్ధి చేసి, ఒకింత వెన్నెల అద్దిన సంరక్షకురాలు విమల.  రెక్కలు చాపి రివ్వున ఎగిరే పక్షుల్నీ సీతాకోక చిలుకల్నీ, తూనీగల్నీ ప్రేమించాను.  ఇంకా ఇసుక రేణువుల్నీ, పువ్వుల్నీ తీరానికి కొట్టుకువచ్చే గవ్వల్నీ ప్రేమించాను....  అని రాసిన విమల విప్లవకవేనా అసలు!  ఒకప్పుడు ఆమె కవితల్లో ఎక్కడో ఓ చోట ఎర్రజెండా ఎగిరేది. నక్షత్రాలు ఎరుపెక్కేవి. చీలికలు పేలికలై ఉద్యమం వూపు తగ్గాక, ఆవేశం చల్లారినాక, తెల్లవారుజాము కలలన్నీ తలుపు సందుల్లోంచి నిశ్శబ్దంగా వెళ్లిపోయాక, ‘జ్ఞాన దిగంబరత్వపు దారి’లోకి వచ్చినట్లున్నారు విమల. హౌ మచ్ లాండ్ డస్ ఏ మాన్ నీడ్ అన్న టాల్ స్టాయ్ కథను గుర్తుచేసుకుంటూ...  నాకప్పుడు.... భూమిని సొంతం చేసుకునేందుకు  పరుగెత్తి పరుగెత్తి సూర్యుడు అస్తమించే వేళ కల్లా నేలపై పడి మరణించిన వాడి కథ గుర్తొచ్చింది.  అచ్చం వాడిలానే నేను  జ్ఞానం కోసం వెంపర్లాడి, వెంపర్లాడి తెగనరికిన మహావృక్ష కాండంలోని  అసంఖ్యాక కాలపు వలయాల్లా  ఎన్నెన్ని జ్ఞాపకాల్నో నాలోపల  పొరలు పొరలుగా చుట్టుకొని  ఊపిరాడక మరణించినట్లు ఒకనాడు కలగన్నాను... అని రాసుకన్నారు విమల.  రాసి, తుడిపి, మళ్లీ రాసినప్పుడే  వాక్యాలు పక్షులై ఎగురుతాయ్.  అనే అద్భుతమైన మాటలతో ఈ కవిత ముగుస్తుంది.                                                                                                      *** ఒక అట్టర్ డిసప్పాయింట్ మెంట్ తో కుంగి, పెను చీకటిలాంటి నిరాశలో కూరుకుపోయినపుడు ఒంటరిగా, మౌనంగా మిగిలిపోయారు విమల.  పొయిట్రీ ఈస్ ది డివైన్ సైలెన్స్ దట్ ఫాలోస్ ది థండర్ అన్నారు డెరిక్ వాల్కాట్.  ‘మౌనం ఒక రహస్య సంభాషణ’ అన్నారు విమల. కవిత్వం ఒక మౌన సంభాషణే కదా మరి!  ఉద్యమ వైఫల్యమూ, అడవి తగలబడిన విషాదమూ వెన్నాడి, దగ్ధగీతమై రగిలిన విమల రాసిన నిరాశ పద్యాలు, తెలుగు ఆధునిక కవితా వికాసపు రహదారుల వెంట పరిమళాలు వెదజల్లే మంచి గంధం చెట్లుగా కలకాలం నిలిచి వుంటాయి.  సముద్రమూ, నేనూ ఒకేసారి కలిసి జన్మించిన కవలపిల్లలమేమో...  అంటున్నారీ కవి.  అనుమానం లేదు. సందేహమూ లేదు.  కవితా సముద్రమూ, విమలా  కవల పిల్లలే.  విమల- అపురూపమైన వ్యక్తి ఆమెది- అరుదైన అభివ్యక్తి.  -తాడి ప్రకాష్ 

అవిటితనం శరీరానికే కానీ మనసుకు కాదు!

శాతవాహన ఎక్స్ ప్రెస్  స్టేషన్లో  వచ్చి ఆగింది.  ఖమ్మంలో అది ఎక్కువసేపు  ఆగదు. వేగంగా కదిలి ఆఖరి  బోగి ఎక్కింది చిత్ర.  ఇంటర్మీడియట్ స్పాట్ కి  అందుకోవాలంటే,    ఆ ట్రైన్ లో  వెళితేనే టైంకి  స్పాట్ సెంటరుకి  చేరు కోగలదు. ఆ బోగి లో కూడా సీట్స్ ఏమి ఖాళీగా లేవు.  ఇంత లో ఎవరో  మాడం అని పిలిచినట్లు వినిపించింది. మీరు ఇక్కడ కూర్చోండి  అంటూ సీట్ ఆఫర్ చేసిన ఆ వ్యక్తి కేసి చూసింది. ఇరవై ఏళ్ళు ఉంటాయేమో. సన్నగా, ఎండుపుల్లలా వున్నాడు. అంత సన్నటి మనిషిని చిత్ర ఎప్పుడు చూసి వుండలేదు. చిత్ర వెంటనే తేరుకొని,  వెళ్లి  కిటికీ ప్రక్కన సీట్లో కూర్చొని, "నిలబడ్డావెందుకు,  నువ్వు కూడా వచ్చికూర్చో" అన్నది   సీట్ ఆఫర్ చేసిన అతని కేసి చూస్తూ.   మామూలువాళ్ళు అంత ఈజీగా తేరుకునేవాళ్ళు కాదు. చిత్ర టీనేజ్ పిల్లల టీచర్.   అందుకే అతనిని  చూడగానే కలిగిన భావాలను దాచుకోగలిగింది. ఆ  అబ్బాయి, ఫర్వా లేదు మాడం, మీరు కూర్చోండి అన్నాడు నమ్రతగా. “సీట్ వున్నప్పుడు నువ్వు నిల్చోవడం దేనికి?  వచ్చి కూర్చో" ఆ అబ్బాయి సంకోచంగా వచ్చి తనకు  తగలకుండ కూర్చున్నాడు మేడం నన్ను ఎవరు పక్కన కూర్చోనివ్వరు, కూర్చోరు మేడం మా నాన్న తప్ప అతన్ని చూస్తూ, ఎదుట కూర్చున్న వ్యక్తికేసి చూసింది. ఏదో జుగుప్స లాంటి భావం   అతని మొహంలో  కదలాడింది. మనిషి బాహ్య రూపానికి  ఎంత ప్రాధాన్యం ఈ లోకంలో !  అనుకొన్నది చిత్ర. “నీపేరేమిటి?" "నిశాంత్   మేడమ్" “ఎవరైనా ఏమయినా అడిగినప్పుడు వాళ్ళకేసి చూస్తూ మాట్లాడాలి!" నవ్వుతూ అన్నది....      సరే మేడం ఆతను తలెత్తి ఆమె కేసి చూశాడు. అతని కళ్ళల్లో  యేదో తెలియని బాధ. చిత్ర అతన్ని పరీక్ష గా చూసింది. ఎండుపుల్లలాంటి, నల్లటి శరీరం లోతైన కాంతి లేని కళ్ళు,  సన్నని ఎముకలాంటి ముక్కు.  ముందుకు పొడుచుకు వచ్చిన చెవులు, ఏ కోశాన ఇరవైఏళ్ళ యవ్వనపు ఛాయలేని , మెరుపు లేని శరీరం.  జాలేసింది చిత్రకు. ఎటువంటి  భావాలు  తన మొహం లో కనపడనీయకుండా, "డిగ్రీ చేస్తున్నావా?” అని అడిగింది. "అవునండి,  బి.ఏ ఇంగ్లీష్ లిటరేచర్" “గుడ్, తెలుగు సాహిత్యం చదువుతావా,! ఇంగ్లీష్ ఒక్కటేనా ?"      "అప్పుడప్పుడు తెలుగు సాహిత్యం చదువుతుం టానండి." 'అలా కాదు, మాతృ భాష రానివారు పర భాషలో ప్రావీణ్యం సాధించలేరు" అంటూ ఏ ఏ రైటర్స్ సాహిత్యం చదవాలో అతనికి సజెస్ట్ చేసింది. అతను ఎంతో శ్రద్దగా ఆమె చెప్పిన పేర్లన్నీ నోటుబుక్ లో  నోట్ చేసుకొన్నాడు. అతను వరంగల్ డిగ్రీ కాలేజీలో చదువుతున్నాడు. హాస్టల్లో తోటి విద్యార్థులెవరూ అతనితో స్నేహం చేయటానికి సుముఖత చూపించే వారు కాదు. ఇంట్లో కూడా అంతే.  అక్క , అన్న తనని దగ్గరకు రానివ్వరని, తమ్ముడని చెప్పుకోవటానికి సిగ్గుపడతారని చెప్పాడు. ఆ మాట చెబుతున్నప్పుడు అతని కళ్ళల్లో నీళ్లు! చాల బాధ అనిపించింది చిత్రకు "మీ అమ్మా, నాన్న ఎలా వుంటారు నీతో?” అడిగింది. “అమ్మ తరచూ తిట్టిపోస్తుంది.  నన్నెక్కడికీ తీసుకు పోయేదికాదు. తిట్టినందుకు మళ్లీ ఏడుస్తుంది." "నాన్న ఎలా వుంటారు నీతో?" “మా నాన్నకి  చాలా ప్రేమ నేనంటే   నాన్న నన్ను బాగా చదువుకోమని చెబుతారు.” తండ్రి గురించి చెబుతున్నప్పుడు అతని  కళ్ళల్లో వెలుగు.  “అసలు నేను పుట్టగానే పాలివ్వకుంటే, వాడే పోతాడు అని  ఇరుగు,పొరుగు వారు అందరూ మా అమ్మకు సలహా    ఇచ్చారట కానీ నాన్న అందుకు ఒప్పుకోలేదు ‘వాడలా పుట్టడానికి వాడు కారణం కాదు’ అంటూ  నన్ను మా అమ్మ దగ్గిర పడుకోబెట్టారట.  అసలు నేను బ్రతుకుతానని ఎవరూ అనుకోలేదట మేడం, అంత బలహీనంగా వుండేవాడినట.” "మాడం, అన్నీ ఉన్న పిల్లల్ని ఎవరైనా ప్రేమిస్తారు, నాన్న ప్రేమే లేకపోతే నేనెప్పుడో చనిపోయేవాడినండి. మా నాన్న ఇంట్లో వున్నప్పుడు నన్ను ఎవరూ ఏమీ అనరు మేడమ్. నాన్న మాత్రం నన్ను చాలా ప్రేమగా చూస్తారు." "మొదట నన్ను నాన్న హాస్టల్ లో జాయిన్ చేసారు, కాని నాతో ఎవ్వరూ ఫ్రెండ్షిప్ చేసేవారు కాదు. నా రూమ్మేట్ గా ఉండటానికి ఎవరూ ఇష్ట పడలేదండి. నాన్న నా బాధ చూడలేక ఆయన ఫ్రెండ్ ఇంట్లో ఒక రూమ్ రెంట్ కి  తీసుకొన్నారు. నన్ను బాధపడవద్దని, బాగా చదువుకోమని చెబుతారండి. నాకు చాలా సార్లు నేను బ్రతికి ఏమి సాధించాలి ఈ శరీరంతో  అని అనిపిస్తుందండి." "అలా అనకూడదు”, చిన్నగా మందలించింది. రంగల్ వచ్చేదాకా ఆ అబ్బాయి యేదో ఒకటి చెబుతూనే వున్నాడు. చిత్ర  స్టేషన్ దాటి ఆటో ఎక్కుతుండగా అడిగాడు, “సాయంత్రం మళ్ళీ ఇదే ట్రైన్ కి వెళతారా  మేడమ్" అని! "అవును", ఒక నిమిషం ఆలోచించి "సాయంత్రం కలుద్దాం", అన్నది.    నిశాంత్ మొహం పువ్వులా విచ్చింది.                      **                                                                               సాయంత్రం అతను నిజంగానే ఆమెకోసం ఎదురుచూస్తూ కనిపించాడు. చిత్ర “ట్రైన్ లేట్  అట కదా" అన్నది. “అవును, మేడం” "కాంటీన్ కి వెళదామా?" "నేనా ! మీతోనా ?" “ఏం?     వెళదాం  పద!"    కాంటీన్లో అందరూ ఆమెకేసి విచిత్రంగా చూడసాగేరు స్నాక్స్, కాఫీ  కి  ఆర్డరుచేసి బిల్  పే చేసింది. "ఈ స్కెలిటన్ ఫ్రెండ్ ఎక్కడ దొరికాడు నీకు" అంటూ తోటి లెక్చరర్స్ ఎగతాళి చేసినా చిత్ర పట్టించుకోలేదు. ఆమెతో స్పాట్ పూర్తయ్యేవరకు  నిశాంత్ ఆమెతో రోజూ ట్రావెల్ చేసాడు. ఓ రోజు ఒక సుభాషితాన్ని ఆమెకి చూపించి దాని  అర్ధం అడిగాడు. "వ స్స్త్రేణ  వపుషా వాచ విద్యయా వినయేనచ వ కారః  పంచభిర్యుక్తః నారో భవతి పూజితః" చిత్ర ఆ ఐదు ‘వ’ కారాలు  గురించి చెప్పింది అతనికి. పరిశుభ్రమైన వస్రాలు, ఆరోగ్యవంతమైన మంచి శరీరాకృతి, మంచి మాట, వినయము తో కూడిన విద్య , ఈ ఐదు ‘వ’ కారాలు  కలిగిన వ్యక్తి ఈ సమాజంలో గౌరవింపబడతాడు అని వివరించి చెప్పింది. ఆమె వివరిస్తున్నప్పుడు నిశాంత్ ఆమెకేసి తదేకంగా చూడసాగేడు . "ఏమిటి, అలా చూస్తున్నావు?" "మీరు ఈ సుభాషితానికి బాగా సరిపోతారు మేడమ్!” చిత్ర అతని లోని ఆత్మన్యూనతా భావాన్ని పసిగట్టింది."మీ స్కూల్ లో, కాలేజీ టీచర్స్ అంతా చాలా అందంగా వున్నారా?” అడిగింది.  "లేదు” అన్నట్టు తలూపాడు. "అందంగా లేకపోయినా, వాళ్ళ లోని విద్వత్తు ను  కదా మనం గౌరవించేది, నువ్వు ఇంతవరకు డిస్టింక్షన్ స్టూడెంట్ వి. వినయము, వివేకం తో కూడిన జ్ఞానం  ప్రపంచాన్ని జయింపచేస్తుంది నిశాంత్,   నిన్ను నువ్వు   తక్కువ చేసుకొని బ్రతకకు, అందరికీ అన్నీ లభించవు, ఆ అయిదు ‘వ’ కారాల్లో నీకు  లేనిది ఆ రెండోది.  అని నువ్వు బాధపడుతున్నావు, నీ చుట్టూ వున్న ప్రపంచం ఆ ఒక్క లోపాన్నికూడా విస్మరించేలా ఎదగాలి నువ్వు." అన్ని వున్నా ప్రేమ ఫలించలేదనో, యేవో చిన్న అపజయాలకు కూడా ఆత్మహత్యలు చేసుకునేవారు ఎంతోమంది. నీ కింకా నీ మీద నీకు కోపం కానీ, సమాజం పట్ల వ్యతిరేకత కానీ లేదు. ఈ ప్రపంచాన్ని నీ దారికి తెచ్చుకోవాలంటే నువ్వు బాగా చదువుకోవాలి. అందగాళ్ళకే ఈ సమాజంలో స్థానం అనుకొంటే అంతకంటే పిచ్చి ఆలోచన ఇంకొకటి ఉండదు. అలెగ్జాన్డర్ పొప్ , నియో  క్లాసికల్ ఏజ్ పోయెట్, మూడు అడుగులు  కూడా ఉండేవాడు కాదు, కాని ఎంత గొప్ప కవి అతడు! మన చుట్టూ మనకు స్ఫూర్తినిచ్చేవాళ్ళు చాలా మంది వుంటారు నిశాంత్, నువ్వు గమనించాలి, ఆ స్ఫూర్తి నీ గమనాన్ని నిర్దేశిస్తుంది " నిశాంత్ కాసేపు తలవంచుకుని ఆలోచిస్తూ   కూర్చున్నాడు నిశాంత్ ఆమెతో అలా పదిహేను రోజులు ట్రావెల్ చేసాడు. ఎన్నో విషయాలు షేర్ చేసుకొన్నాడు. ఒక తల్లి చుట్టూ తిరిగే పసివాడిలా ఆమె చెప్పే ప్రతి మాటను శ్రద్దగా వినేవాడు.                 **                     నిశాంత్, " రేపటినుండి నేను రాను, త్వరలో నాపెళ్లి , తను   ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో   పని చేస్తారు." ఈ రోజే ఆఖరి  రోజు అని చెప్పింది. ఆమె ఇంక తనకు కనపడదని అర్ధమయ్యింది నిశాంత్ కు కళ్ళలో నీరు చాలా బాదేసింది... "మీతో ఒక సెల్ఫీ తీసుకోవచ్చా అమ్మా " మేడం “అమ్మా” అనడం లో అతనిలోని ఆర్తి అర్ధమై, "వై నాట్'" అంటూ సెల్ఫీ దిగింది. ఆమె రైల్ దిగి వెళ్లిపోతుంటే, నీళ్లు నిండిన కళ్ళతో  చూస్తూ ఉండి పోయాడు నిశాంత్. .                      * పదేళ్ల కాలగమనంలో చిత్ర ఇద్దరు బిడ్డల తల్లి అయ్యింది. భర్త తోపాటు దేశంలో ఎక్కడ పోస్టింగ్స్ వస్తే అక్కడ ఉండాల్సి వచ్చేది.     నేవీ స్కూల్స్ లో ఉద్యోగం చేసేది.   భర్త ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చారు.   ఆ రోజు ఆడబిడ్డ కొడుకు రాహుల్ వచ్చి, "మంచి మోటివేషనల్ స్పీచ్ వుంది వస్తారా " అంటూ వచ్చాడు. ఆ రోజు భర్తతో కలిసి ఆ ప్రోగ్రాముకి వెళ్ళింది. హాల్ అప్పటికే దాదాపు నిండిపోయింది. లాస్ట్ రోలో సీట్స్ దొరకాయి, వక్త అప్పటికే స్టేజీమీద ఉన్నాడు. పరిచయ  కార్యక్రమంలో యువత హోరులో అతనిపేరు సరిగ్గా వినబడలేదు. యధాలాపంగా తలెత్తిన చిత్ర వక్త ని చూసి ఆశ్చర్య పోయింది. కాషాయ  దుస్తుల్లో నిశాంత్!  సందేహ నివృత్తికోసం "అతని పే రేమిటి?” “నిశాంత్ కృష్ణ ప్రభు!" చెప్పాడు రాహుల్. సందేహం లేదు, ఆతను నిశాంత్, ఆహార్యం మారింది, అతని శరీరం మారలేదు. ఇస్కాన్ సభ్యుడయ్యాడు. తన జీవితాన్ని సవ్య దిశలో మళ్ళించాడు. దేశ,  విదేశాల్లో మోటివేషనల్ స్పీకర్ గా పేరుతెచ్చుకొన్నాడు.   అతని స్పీచ్ మొదలయ్యింది. ఒక్కొక్క పరిచయం, మాట, జీవిత గమనాన్ని  ఎలా  మారుస్తాయో చెబుతూ అన్నాడు, "ఆ తల్లి పేరు ముఖ్యం కాదు,  పదేళ్ల క్రితం,  ఒక్క పదిహేను రోజుల ప్రయాణంలో నాలోని ఇన్ఫిరియారిటీ  కాంప్లెక్స్ ని  తొలగి పోయేలా  చేసి ,  దిశా నిర్దేశం చేసిన తల్లికి వందనం”ఆమె నాపాలిట దేవత,నా మొదటి గురువు చిత్ర మేడం అంటూ,తల్లి తండ్రులకు ఇంకా ఇస్కాన్ గురువు కు   కూడా నమస్కరించుతూ   ప్రోగ్రాం ఆరంభించాడు. ఆద్యంతం సభ నవ్వులతో ముంచెత్తుతోనే , యువతరానికి కావాల్సిన మార్గదర్శకాలు సూచించాడు. నైతిక విలువలు పాటించడం ఎంత  ముఖ్యమో చెప్పాడు. . సామాజిక బాద్యతలు ఏమిటో అవి ఎందుకు, ఎలా స్వీకరించాలో తెలియచేసారు.    చిత్ర కన్నీళ్లు బయటపడకుండా ఆపు కొని, అనుకొన్నది  అతన్ని కలవాల్సిన అవసరమే ఇంక లేదు. ఆతడు తనకి గొప్పతనమంతా ఆపాదించాడు కానీ తాను చేసింది అణువంత.  అతను  ఆకాశమంత ఎత్తు ఎదిగాడు, ఇప్పుడా సుభాషితం లోని బాహ్య స్వరూపానికంటే అతని  అంతర్ స్వరూపం   విశ్వ  విఖ్యాత మై,  అతన్ని విశ్వ విజేతను  చేసింది. సభలోనుంచి బయటకు వెలుతున్నది నిశాంత్ చూసి మేడం అన్నాడు ఆగిపోయింది చిత్ర! మేడం మీకోసం ఎప్పుడూ నా మనస్సు వెతుకుతూనే ఉన్నది మేడం ఒక్కసారి మీ పాదాభివందనం తీసుకుంటాను మేడం నేను ఈ స్థాయికి రావడం మీరే . కళ్ళలో నీరు తిరిగాయి చిత్రకు ! మేడం మీలాంటి వారు సమాజం లో వేలల్లో ఒక్కరు ఉన్నా అవిటి వాళ్ళు ఎవరు వుండరు మేడం,అవిటి అనేవి శరీరానికి కానీ మనస్సుకు కాదని మీరు నిరూపించారు  మేడం అంటూ చేతులు జోడించాడు.

అంబరీషుడు.. సుదేవుడు!

ఇక్ష్వాకు వంశానికి చెందిన మహారాజుల్లో అంబరీషుడు పరమ భాగవతోత్తముడు. విష్ణుభక్తుల్లో అగ్రగణ్యుడు. అంబరీషుడు ఎన్నో యజ్ఞయాగాదులు చేశాడు. దానధర్మాలు చేశాడు. ప్రజలకు ఏ లోటు లేకుండా, రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించాడు. ఆయువు తీరిన తర్వాత అంబరీషుడు స్వర్గానికి చేరుకున్నాడు. స్వర్గంలో అడుగుపెట్టిన అంబరీషుడికి ఇంద్రుడు స్వయంగా ఎదురేగి స్వాగతం పలికాడు. ‘అంబరీషా! స్వాగతం! ఎన్నో యజ్ఞయాగాదులు, పుణ్యకార్యాలు చేసి దేవలోకానికి వచ్చిన ఉత్తముడివి నువ్వు. నీ రాక సమస్త దేవతలకు మహదానందకరం’ అన్నాడు. అంబరీషుడు ఇంద్రుడిని సాదరంగా పలకరించి, చుట్టూ కలయజూశాడు. స్వర్గలోకం దేదీప్యమానంగా ఉంది. నయనానందకరంగా ఉంది. వైభవానికి ఆలవాలంగా ఉంది. అప్సరకాంతలు వొయ్యరాలు చిందిస్తూ నృత్యం చేస్తున్నారు. గంధర్వులు శ్రావ్యంగా గానం చేస్తున్నారు.  ఒకచోట పుష్పకవిమానంలో అప్సరసలతో పరాచకంగా సల్లాపాలాడుతున్న విలాసపురుషుడు కనిపించాడు. అతడు దివ్యతేజస్సుతో వెలిగిపోతున్నాడు. అంబరీషుడు అతణ్ణి తేరిపార చూశాడు. కొద్ది క్షణాలకు అతడెవరో గుర్తుపట్టాడు. ‘వాడు సుదేవుడు కదూ?’ అని పక్కనే ఉన్న ఇంద్రుణ్ణి అడిగాడు.  ‘ఔను, అంబరీషా! అతడు సుదేవుడే!’ బదులిచ్చాడు. ‘అయినా, వాడెలా స్వర్గానికి వచ్చాడు? వాడు నా సేవకుడు. నాకు తెలిసినంత వరకు బతికి ఉన్న కాలంలో అతడు పెద్దగా పుణ్యకార్యాలేవీ చేయలేదు. వాడికి ఇంతటి సుకృతం ఎలా కలిగింది?’ ఆశ్చర్యంగా ఇంద్రుణ్ణి ప్రశ్నించాడు అంబరీషుడు.  ‘అంబరీషా! ఏ సుకృతమూ లేకుండా, ఇక్కడకు ఎవరూ రాలేరు. సుదేవుడు గొప్ప సుకృతమే చేశాడు. అందుకే ఇక్కడకు వచ్చాడు. అతడు ఏం చేశాడో నీకు తెలియదు. నేను చెబుతాను విను’ అని ఇంద్రుడు– ‘ఒకసారి శతశృంగుడు అనే రాక్షసుడి కుమారులు సదముడు, విదముడు, దముడు అనేవారు నీ రాజ్యంపై దండెత్తారు కదూ!’ అని అంబరీషుణ్ణి ప్రశ్నించాడు.  ‘ఔను! ప్రజలను పీడించుకు తినే ఆ రాక్షసులు నా రాజ్యంపై దండెత్తారు. అప్పుడు నేను ఈ సుదేవుణ్ణి పిలిచి, ఆ రాక్షస కుమారులను హతమార్చు. విజయం సాధించకుండా వస్తే మాత్రం నీ తల నరికి కోట గుమ్మానికి వేలాడగడతాను అని చెప్పి, తగినంత సైన్యాన్ని తోడిచ్చి పంపాను, సరేనని వెళ్లాడు. తర్వాత వాడి జాడ తెలియలేదు. ఇన్నాళ్లకు ఇక్కడ కనిపించాడు’ చెప్పాడు అంబరీషుడు.   ‘నువ్వు చెప్పినట్లే అతడు సైన్యంతో వెళ్లి, ఒకచోట విడిది చేశాడు. శత్రువుల బలం తెలుసుకుని రమ్మని గూఢచారులను పంపాడు. వాళ్లు తిరిగి వచ్చి, శతశృంగుని కుమారులతో తలపడటం మంచిది కాదని చెప్పారు.  ఎదుటివాడి బలం ఎక్కువని తెలిశాక తలపడటం వల్ల ప్రయోజనం ఉండదు. అనవసరంగా సైన్యం ప్రాణాలు కోల్పోవడం తప్ప ఒరిగేది ఉండదు. వెనుదిరిగి వెళితే ప్రాణాలు దక్కవు. ఎలాగూ అంబరీషుడి చేతిలో శిరచ్ఛేదం తప్పదు. అందువల్ల తన తలను తానే పరమేశ్వరుడికి అర్పించుకోవడం మేలని తలచి, సైన్యాన్ని వెనక్కు పంపేశాడు. నేరుగా మరుభూమికి వెళ్లి, పరమశివుడిని స్మరిస్తూ, తన తలను తానే తెగ నరుక్కోవడానికి కత్తి దూసి, మెడ మీదకు తెచ్చాడు. వెంటనే పరమశివుడు ప్రత్యక్షమై, అతడి ప్రయత్నాన్ని వారించాడు. మెడ మీద పెట్టుకున్న కత్తిని తొలగించాడు.  పరమశివుడు ప్రత్యక్షమవడంతో సుదేవుడు ఉద్వేగభరితుడై, ఆనందబాష్పాలు రాల్చాడు. ‘దేవదేవా! శతశృంగుడి కుమారులను జయించకుండా తిరిగి వస్తే, శిరచ్ఛేదం చేస్తానన్నాడు మా అంబరీష మహారాజు. ఆ రాక్షస కుమారులు జయించరాని వారుగా ఉన్నారు. ఎలాగైనా చావు తప్పనప్పుడు నా తలను నీకే అర్పించడం మంచిదనుకుని, ఈ పనికి పూనుకున్నాను’ అని చెప్పాడు. సుదేవుడి పరిస్థితికి పరమశివుడు జాలిపడ్డాడు. ఒక దివ్యరథాన్ని, విల్లమ్ములను సుదేవుడికి ఇచ్చాడు. ‘ఇక నిన్ను యుద్ధంలో దేవదానవులెవరూ గెలవలేరు. ఒక విషయం గుర్తుపెట్టుకో– యుద్ధంలో రథం నుంచి కిందకు మాత్రం దిగవద్దు’ అని హెచ్చరించాడు. పరమశివుని అనుగ్రహానికి సుదేవుడు పరమానందం చెందాడు. దివ్యరథాన్ని అధిరోహించి, ఒక్కడే రణరంగానికి దూసుకెళ్లాడు. తనపైకి ఆయుధాలతో దాడికి వచ్చిన రాక్షస సేనలను తన శర పరంపరతో చెల్లాచెదురు చేశాడు.  హోరాహోరీగా సాగిన యుద్ధంలో సదముడిని, దముడిని తెగటార్చాడు. సోదరులిద్దరి మరణాన్ని కళ్లారా చూసిన విదముడు పట్టరాని క్రోధంతో చెలరేగిపోయి, సుదేవుడి మీదకు దూసుకొచ్చాడు. సుదేవుడి బాణ ప్రయోగానికి విదముడి విల్లు ముక్కలైంది. అతడు కత్తి పట్టుకుని, రథం మీద నుంచి నేల మీదకు దూకి, సుదేవుడి మీదకు వచ్చాడు.  యుద్ధావేశంలో సుదేవుడు పరమశివుడు చెప్పిన మాట మరచి, తాను కూడా కత్తి పుచ్చుకుని రథం మీద నుంచి నేల మీదకు దూకాడు. వారిద్దరి ఖడ్గయుద్ధం కళ్లు మిరుమిట్లు గొలిపేలా సాగింది. చాలాసేపటి వరకు ఇద్దరూ సమ ఉజ్జీలుగా పోరాడారు. ఒకే సమయంలో ఇద్దరూ ఒకరినొకరు పొడుచుకున్నారు. అక్కడే కుప్పకూలి ప్రాణాలు వదిలారు. సుదేవుడు అలా శత్రుసంహారం చేయడం వల్లనే నీ రాజ్యం గొప్పగా ఉంది. యుద్ధంలో వీరమరణం పొంది వచ్చేవాడు స్వర్గంలో పొందే సత్కారానికి సమానమైనది మరేదీ లేదు’ అని జరిగినదంతా వివరించాడు ఇంద్రుడు. తన కోసం సుదేవుడు ప్రాణత్యాగం చేసిన సంగతి తెలుసుకుని, అంబరీషుడు అశ్రుతప్తుడయ్యాడు. వెంటనే, సుదేవుడి వద్దకు వెళ్లి, అతణ్ణి గాఢాలింగనం చేసుకుని అభినందించాడు. 

చేత అన్నం ముద్ద

అమ్మానాన్న, అయిదుగురం అన్నదమ్ములు, ఇద్దరు అక్కచెల్లెళ్ళు వెరసి తొమ్మిదిమంది కుటుంబసభ్యులం. నాన్నొక్కరే సంపాదనాపరుడు. వారికి నలభైరూపాయలే జీతం. ఆ జీతం నెల మొదటివారానికే మాకు సరిపోయేది. తర్వాత? అమ్మ అప్పు చేసేది. రెండురూపాయలూ, మూడురూపాయలు అప్పుచేసి, నూకలు కొని, వండి వార్చేది. అందరికీ జావపోసేది. ఆ జావకూడా ఒకొక్కసారి కరువయ్యేది. అప్పుడు ఆకలికి తట్టుకోలేక ఏడ్చేవాణ్ణి. నన్ను ఓదార్చేందుకు, నా ఆకలి తీర్చేందుకు మా చిన్నక్క, ఆచార్లగారింటికి వెళ్ళి ఓ చందమామ తెచ్చింది. కథలపుస్తకం అది. రంగురంగులబొమ్మలుకూడా ఉన్నాయందులో.  ‘‘ఈ కథలు చదువుతూ ఆ బొమ్మలు చూసుకో! ఆకలే అనిపించదు.’’ అన్నది అక్క.  నిజమా! అని ఆశ్చర్యపోయి కథలు చదవడం ప్రారంభించాను. అక్క చెప్పింది నిజమే! నాకు ఆకలివెయ్యలేదు. ఏడుపుకూడా రాలేదు. అప్పుడు అనిపించింది. పుస్తకాలు ఆకలి తీరుస్తాయని. తర్వాత ఇంకో విషయం కూడా తెలిసింది, పుస్తకాలు చదవడం అలవాటుచేసుకుంటే బోరనేది ఉండదు. ఒంటరితనంకూడా ఉండదు.    అక్క అలవాటుచేసిన పుస్తక పఠనం నిరాఘాటంగా సాగుతూవచ్చింది. మా మున్సిపల్ లైబ్రరీలో పుస్తకాలు చదివేశాను. జిల్లా గ్రంథాలయంలోని పుస్తకాలు చదివేశాను. ఆఖరికి కన్యకాపరమేశ్వరి ఆలయంవారు ఏర్పరుచుకున్న లైబ్రరీలోని పుస్తకాలన్నీ కూడా చదివేశాను. ఇక నేను పుట్టి పెరిగిన పార్వతీపురంలో పుస్తకాలులేవు. నాకు పుస్తకాలు కావాలి. ఎలా? శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో, బుద్ధికీ, మనసుకీ పుస్తకం అంత అవసరం. పిచ్చెక్కిపోయేవాణ్ణి.    విజయనగరం సంస్కృత కలాశాలలో జాయిన్ చేశారు నన్ను. విజయనగరం పెద్ద ఊరు. పెద్దపెద్ద లైబ్రరీలు ఉండేవి అక్కడ. వాటితోపాటు చాసో, దాట్ల నారాయణమూర్తిరాజు, కొడవంటి కాశీపతిరావుల పరిచయం అయింది. ఇంకేం ఉంది? పుస్తకాలే పుస్తకాలు. అడగడం, తెచ్చుకోవడం, చదువుకోవడం, ఇచ్చేయడం జరిగేది. చాసో దగ్గర సరికొత్త పుస్తకాలు చాలా ఉండేవి. అడిగిన వెంటనే ఇచ్చేవారు కాదాయన. ఊరించి ఊరించి ఇచ్చేవారు. జాగ్రత్తలు చెప్పేవారు. అలాగే  పుస్తకాన్ని ఎలా చదవాలో చెప్పారు. అంతవరకూ నేను చదివిన పద్ధతి వేరు. నా ఆలోచనా తీరు వేరు. చాసో చెప్పిన తర్వాత నేను చదివిన పద్ధతివేరు. నా ఆలోచనా తీరు వేరు. అప్పుడు పుస్తకం నాకు రోడ్డయింది. సైకిలయింది. బస్సయ్యింది. నా ప్రయాణాన్నీ, నా గమ్యాన్నీ మార్చేసింది.   భాషా ప్రవీణ ముగించి, పార్వతీపురంలో డిగ్రీ కాలేజీలో జాయినయ్యాను. పుస్తకపఠనం కొంచెం దూరం అయింది. అంతే! అనేక రకాల గొడవల్లో ఇరుక్కున్నాను. అప్పుడు ఏ రకంగా చూసుకున్నా మనుషులకంటే పుస్తకాలే గొప్పవనుకున్నాను. సేఫ్ కూడా అనిపించింది. మళ్ళీ పుస్తకాలు చదవడంలో పడ్డాను.   కొన్నాళ్ళకు హైదరాబాద్ చేరుకున్నాను. ఈనాడులో జాయినయ్యాను. పుస్తకాలే పుస్తకాలక్కడ. నాలుగు కూరలూ, నాలుగు పచ్చళ్ళతో విస్తరి నిండిపోయినట్టుండేది.  శివారెడ్డిగారు పరిచయ భాగ్యం కలిగింది. పుస్తక సముద్ర తీరంలో నిల్చున్నట్టనిపించింది. హెమింగ్వే, ఇటాలో కెల్వినో, మార్క్వజ్, బెన్ ఓక్రీ, మిలన్ కుందేరా...రకరకాల రచయితలను పరిచయం చేశారాయన. నేను రోల్డ్ డాల్ నీ, రస్కిన్ బాండ్ నీ, జెఫ్రీ ఆర్చర్ నీ పరిచయం చేసుకున్నాను. వారి పుస్తకాలు చదివి పొంగిపోయేవాణ్ణి. ఆదివారం అబిడ్స్ లో ‘రారారా! నన్ను తీసుకో! నన్ను పొదువుకో’ అంటూ ప్రపంచ ప్రఖ్యాత రచయితలంతా చేతులు సాచేవారు. అడిగిన మేరకు అందరినీ కొన్నాను. ఇల్లంతా నిండిపోయారు. అయినా చాలన్నది లేదు. కొత్త వారి కోసం వాల్డన్, బుక్ పాయింట్, జూబ్లీహిల్స్ ఆంధ్రజ్యోతి రోడ్డులో ఉన్న బుక్ షాపులను చుట్టేసేవాణ్ణి. స్వర్గం ఎలా ఉంటుందో, ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు. నాకు తెలిసిన స్వర్గం ఒకటే! అది నా పుస్తకాలగది. ఆ గదిలో ఫ్యాను గాలికి పుస్తకం పేజీలు రెపరెపలాడుతుంటే...నాకు హార్మోనియం విన్నట్టు ఉంటుంది.   అసలు విషయం చెప్పడం మరచిపోయాను. గత పాతికేళ్ళుగా నాకు బెస్ట్ బుక్ పాపుతో పరిచయం ఉంది. ఈ బుక్ షాప్ లకడీకాపుల్ లోని అశోకా హోటల్ పక్కన మేడ మీద ఉంటుంది. అందులో ఎన్ని పుస్తకాలు కొన్నానో, కొనలేక ఎన్ని పుస్తకాలు అక్కడే చదివానో నాకు గుర్తులేదు. రేడియో స్టేషన్ వారు నన్ను పిలిచినప్పుడల్లా రేడియో పనిచూసుకుని, తర్వాత తప్పకుండా అక్కడకు వెళ్ళేవాణ్ణి. నాతోపాటుగా మిత్రుడు రాంబాబుని కూడా లాక్కేళ్ళేవాణ్ణి. అలా పాతపుస్తకలు కొనడం, వాటి పఠనాన్నీ వారికీ అలవాటుచేశాను. ఒకవేళ ఆ అలవాటు వారికి అంతకు ముందే ఉంటే...దానిని నేను పెంపుచేశాను. పుస్తకం అద్దంలాంటిది. అది నిన్నేకాదు, నీ గుండెల్లో ఏఁవుందో అది కూడా చూపిస్తుంది. అందుకని పుస్తకాన్ని పవిత్రంగా, భయం భయంగా చూడడం  అలవాటయింది. ఎన్నిపుస్తకాలు చదివితే అన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. తెలిసిన విషయాల్తో బతకడం చాలా ఈజీ. అందుకే నాకు పుస్తకాలంటే ఇష్టం.  -జగన్నాథశర్మ

కొన్ని కథలు: మరిన్ని జ్ఞాపకాలు

ప్రార్థన  చిన్నప్ప లేచిందంటే...తెల్లారినట్టే! తెల్లారినదగ్గరనుంచీ ఒకటే దండకం. శివయ్యతో పేచీ పడుతూనే ఉంటుందామె. తొందరగా నిర్మాల్యాన్ని తొలగించమంటాడు శివయ్య. అభిషేకం చెయ్యమంటాడు. చిన్నప్ప వినదు. ఆగంటుంది. దంతధావనం చెయ్యలేదంటుంది. స్నానంచేసిగాని ముట్టుకో నంటుంది. శివయ్య మారాముచేస్తుంటే...తప్పు! అల్లరిచెయ్యకూడదు అంటుంది. కేకలేస్తుంది. శివయ్య మీద అలా కేకలేస్తూనే కోనేటికి చేరుకుంటుంది చిన్నప్ప. అక్కడ స్నానాదికాలు ముగించి, మడిగామంచినీరు పట్టుకుని తిరిగి ఆలయానికి చేరుకుంటుంది. ఆ ఆలయం, అక్కడ కొలువుదీరిన శివయ్య సొంతమే కాదు, చిన్నప్ప సొంతం కూడా.      అగ్రహారానికి దూరంగా కొండకోనల్లో ఈ శివాలయాన్ని ఎవరు నిర్మించారో నిర్మించారు. నిర్మించిన తొలిరోజుల్లో శివయ్య వైభవోపేతంగా వెలిగాడో లేదో తెలియదుగాని, చిన్నప్ప నాటికి దిక్కూ, దీపంలేకుండా తయారయ్యాడు శివయ్య. నెత్తిన ఇన్ని నీళ్ళుపోసే వారు లేరు. ఇంత ప్రసాదంపెట్టేవారు లేరు. అప్పడు చిన్నప్ప కలుగజేసుకుంది. మొగుడూ మొద్దులూ లేని ఆమె అగ్రహారాన్ని విడచిపెట్టి, ఆలయానికిచేరుకుంది. బూజు దులిపింది. అయ్యకి అభిషేకంచేసి, ఇంత ప్రసాదం పెట్టింది. నీకు నేనూ, నాకునువ్వూ తోడంది. నీడయి నిలిచింది.     శివయ్యమీద కేకేలేసే చిన్నప్పను చూసి, చాలామంది భక్తులు చిరాకు పడ్డారు. ఏంటమ్మా! దేవుణ్ణంతలా విసుక్కుంటావన్నారు. అది విసుక్కాదయ్యా! ప్రార్థన. ప్రార్థనెప్పుడూ మనలో మనం మాట్లాడుకున్నట్టుగా ఉండకూడదు. ఇతరులతో మాట్లాడుతున్నట్టుగా ఉండాలి. ముఖాముఖీ మాట్లాడాలి. అయినా శివయ్యకు లేనిబాధ మీకెందుకయ్యా? అన్నది. వారి నోరు మూయించింది.  పుట్టిన దగ్గర నుంచీ దరిద్రమే! పాతికేళ్ళొచ్చినా కడుపు నిండాతిన్నపాపాన పోలేదు. ఉద్యోగం లేదు. సద్యోగం లేదు. కట్టుకునేందుకు సరైన బట్ట కూడా లేవు. చింకిపాతతోనే శివాలయానికి చేరుకునేవాడు శాస్త్రి. చేతులుజోడించి, దేవుణ్ణి ధ్యానిస్తూ కూర్చునేవాడు. ఏడాది తిరిగింది. అయినా అతని మీద శివయ్యకు జాలి  కలగలేదు. ఆ మాటే చిన్నప్పకు చెప్పుకుని బాధపడ్డాడతను. అప్పుడు చిన్నప్ప ఏమన్నదో తెలుసా? ఒరేశాస్త్రీ! సినిమాల్లో చూపిస్తారు చూడు, అవన్నీ నిజాలే! నీ ప్రార్థన కొండలను కరిగిస్తుంది. సముద్రాలను కలిచేస్తుంది. లోకాలను ఊపేస్తుంది. ఆఖరికి శివయ్యను చేరి, అతని పిలకపట్టుకుని నీ దగ్గరకు లాక్కొస్తుంది. ఇదినిజం. నామాట నమ్ము. నీకు త్వరలోనే మంచిరోజులు వస్తాయి అన్నది.   వస్తాయా? వస్తే బాగుణ్ణనుకున్నాడు శాస్త్రి. చిన్నప్ప చెప్పిందే నిజమైందాఖరికి. మంచిరోజులు వచ్చాయి. శాస్త్రికి మంచి ఉద్యోగం దొరికింది. పెళ్ళయింది. ఇద్దరు పిల్లలు. దరిద్రం అన్నదే లేదు. నాలుగు వేళ్ళూ నోటికి వెళ్తున్నాయి. ఇప్పుడు జీవితాన్ని ప్రార్థన ఒక్కటే మార్చగలదంటాడు శాస్త్రి. ఆ నమ్మకంతో ఇల్లూవాకిలీలేనివాడు, బిచ్చమెత్తుకుని తిరిగేవాడు, ఎగుడూ దిగుడూకన్నులవాడు, జంగదేవరడు అని శివయ్యను ఎవరైనా తూలనాడితే ఇంతెత్తున లేస్తాడతను. వారిని కొట్టేందుకుకూడా వెనుకాడడు. అదితప్పంటుంది చిన్నప్ప. వాళ్ళూ నీలాగే శివయ్య భక్తులేరా! ప్రార్థన అంటే ఏమిటి? దేవునితో స్నేహంలాంటిది. దేవునితో వారికి బాగా స్నేహం పెరిగిందేమో! పెరిగి దేవుణ్ణి వాళ్ళు సరదాగా నాలుగు మాటలంటున్నారు. శివయ్యకు అది ఆనందంగానే ఉంది. ఇందులో నీకొచ్చిన కష్టం ఏమిటో నాకు అర్ధంకావట్లేదు. పద్ధతికాదన్నది శాస్త్రిని.   పిల్లలను స్కూళ్ళకు పంపించి, భర్తని కచేరీకి పంపించి, స్నానించి, కడుపులో ఇంత కాఫీపోసుకుని, వీలయితే నాలుగు అట్లు తిని, ఆలయానికి చేరుకునేది సుమతి. ఆసరికి మిట్టమధ్యాహ్నం అయ్యేది. అప్పుడు శివయ్యకు తీరిగ్గా అభిషేకం చేస్తానని కూర్చునేది. మహా నైవేద్యంవేళ అభిషేకిస్తానంటావేంటే సుమతీ! అయ్య కంచంలో నీళ్ళుపడేను. పూజలూ, ప్రార్థనలూ ఎలా ఉండాలో తెలుసా? అవి తొలి వెలుగులకి తాళం తీసినట్టుగా ఉండాలి. అలాగే సాయంత్రంవేళ చీకటి చినుకులకి తాళం వేసినట్టుగా ఉండాలి. అంతేగాని అపరాహ్నం వేళ అయ్యకు పూజా, అమ్మకుసేవా అచ్చిరావనేది. నీకు అచ్చివస్తాయా పిన్నీ? అంటే...నేను ఉన్నదే అయ్యకోసం, అయ్య ఉన్నదే నాకోసం! నా ఈ కోరిక తీర్చు, నా ఆ కోరిక తీర్చు అని నేను శివయ్యను ఏనాడూ కోరను. ఎందుకంటే...అయ్య ఉన్నదే నా కోరికలు తీర్చడానికి అని నవ్వేది చిన్నప్ప.  ఒకరోజు శివలింగానికి పంచామృతాలతో స్నానంచేసి, ఆ తర్వాత మంచినీటితో దానిని అభిషేకించింది చిన్నప్ప. చీరకొంగుతో లింగాన్ని తుడుస్తూ తుడుస్తూ, కళ్ళు తిరిగినట్టనిపిస్తే, ఆ లింగంమీదే తలాన్చి కళ్ళు మూసుకుంది. మరి కళ్ళు తెరవలేదు. చిన్నప్ప శివైక్యం చెందిందన్నారంతా. చిన్నప్ప మనసుపాడేపాట, శివయ్యకు నేరుగా వినిపించిందేమో! తనలో ఐక్యంచేసుకున్నాడు. ఎప్పుడు ఎవరికి ఏదివ్వాలో దేవుడికి బాగా తెలుసు.  -జగన్నాథశర్మ

అప్రశిఖ

ధారా నగరం లో మాధవుడు,నందుడు అనే ఇద్దరు మిత్రులు వుండేవారు. వారిద్దరూ దూరంగా వుండే గురుకులం లో విద్య అభ్యసించదానికి వెళ్ళారు. వారిలో మాధవుడు అత్యంత మేధావి. నందుడు కాస్త మందుడు.(తక్కువ తెలివి గలవాడు) వారు విద్యాభ్యాసము పూర్తి చేసుకొని తమ వూరికి బయల్దేరారు. మధ్య దారిలో వచ్చే రాజుల దగ్గర తమ విద్య ప్రదర్శించి డబ్బు గడించారు.  అందులోఎక్కడికి వెళ్ళినా మాధవుడికి ఎక్కువ గౌరవం డబ్బు లభించేవి. అతని కవిత్వాన్ని అందరూ  మెచ్చుకునే వారు. నందుడి కవిత్వం కాస్త పేలవంగా వుండి ఎక్కువ ధనము లభించేది కాదు.  వారిద్దరూ కలిసి ధారా నగరానికి దగ్గరలో వున్న అడవిగుండా ప్రయాణం చేస్తున్నారు. దారిలో ఒక చెట్టు నీడన విశ్రాంతి తీసుకోడానికి పడుకున్నారు. మాధవుడికి బాగా నిద్ర పట్టింది కానీ నందుడు మాత్రం అసూయతో రగిలి పోతున్నాడు. వూరికి వెళ్ళినా మాధవుడినే అంతా గౌరవిస్తారు. వాడే ఎక్కువ డబ్బు సంపాదిస్తాడు. వీడినెలాగైనా యిక్కడే చంపేసి నేను ఒక్కడినే నగరానికి వెళ్తాను.  పులి వాడిని చంపేసిందని వాడి తల్లిదండ్రులకు చెప్పేస్తాను అని అనుకోని మాధవుడి తలను కాళ్ళ తో నొక్కి పట్టి గొంతు నులమ సాగాడు. మాధవుడికి మెలుకువ వచ్చి నన్ను చంప వద్దని,ఈ విషయము ఎవ్వరికీ చెప్పనని నా ధన మంతా తనకే యిచ్చేస్తానని బ్రతిమాలినా నందుడు పట్టు సడలించ లేదు. వీడు తనను చంపక మానడని సరే మా తల్లిదండ్రులకు నా మాటగా 'అప్రశిఖ' అనే మాటను మాత్రం చెప్పు అని చెప్పాడు.  నందుడు మాధవుడిని చంపి  ధారా నగరానికి వెళ్లి దొంగ ఏడుపు ఏడుస్తూ వాడి తల్లిదండ్రులకు పులి మాధవుడిని తిని వేసిందని వాడు చనిపోయే టప్పుడు మీకు 'అప్రశి ఖ' అనే మాటను చెప్ప మన్నాడని చెప్పాడు. వారికి వీడే తమ కొడుకును  చంపేసి ఆపద్ధ మాడు తున్నాడని అనిపించింది. వారు భోజరాజు దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేశారు. కానీ మా దగ్గర సాక్ష మేమీ లేదు.  కానీ వాడు చనిపోయే టప్పుడు 'అప్రశిఖ' అనే మాటను మాకు చెప్పమని చెప్పాడట. దాని అర్థం మీ ఆస్థానంలోని కవులేమైనా వివరించగలరేమోనని వచ్చామని అన్నాడు. భోజరాజు కాళిదాసును దీని అర్థమేమో మీకు తెలిసిన వివరించమన్నాడు. అప్పుడు కాళిదాసు వృద్దు లారా మీ కొడుకును మానవ మృగమే చంపినది . మీ కొడుకు తెలివిగా శ్లోకము లోని ప్రతి పదములోని మొదటి అక్షరమును మీకు సందేశం గా పంపినాడు ఆ శ్లోకము "అనేన తవ పుత్రస్య ప్రసుప్త వనాంత రే శిఖా మాక్రమ్య పాదేవ ఖడ్గే నాభి హతం శిరః  అర్థము:-- మీకొడుకు వనాంతరామున నిద్రించునప్పుడు ఈ నందుని చే కాలితో తొక్కిచంప బడినాడు. అక్కడి పండితులు యెక్కడో  జరిగినది మీకెలా తెలుసును?నిరూపించండి అని వాదించిరి. అపుడు కాళిదాసు అడవి నుండి ఆ మాంస ఖండములను తెప్పించి భువనేశ్వరీ దేవిని ప్రార్థించి మాధవుడిని బ్రతికించెను. అపుడు అందరూ 'అప్రశిఖ'అను దానికి అర్థ మేమని అడిగిరి. మాధవుడు కాళిదాసు చెప్పిన శ్లోకమునే చెప్పెను. అప్పుడు రాజు నందుడిని శిక్షించి, మాధవుడిని తన ఆస్థాన కవిగా నియమించాడు. . అప్పటినుండి ఏదైనా రహస్య మైన మాటకు కవులందరూ 'అప్రశిఖ'అని సంకేతముగా వాడు చుండే వారు.

నీటిచుక్క

రెండేళ్లయింది. రాజ్యంలో వర్షాల్లేవు. నీరే తల్లి, నీరే తండ్రి, నీరే తిండి, నీరే జీవితం అయినప్పుడు, జీవితం లేదంటే...రాజ్యంలో ఎవరు ఉంటారు? ఉండరు కదా! అందుకే పక్షులూ, పశువులూ వలసపోయాయి. ప్రజలుకూడా చాలామంది వలసపోయారు. వెళ్లలేనివారు ఎండినచెట్లూ, నీరడుగంటిన చెరువులూ, బావులూ, బీటలువారిన భూమిసహా ఉండిపోయారు. ఉన్నవారు కూడా రోజుకి పదీ, పాతిక మందివరకూ ప్రాణాలు కోల్పోతున్నారు.  ఎండని తట్టుకోలేకపోతున్నారు జనం. మాడి మసైపోతున్నారు. చనిపోతున్నారంతా. రాజ్యం అల్లకల్లోలంగా ఉంది. రాజుగారికి ఏం చెయ్యాలో తోచలేదు.   పొరుగురాజు మంచివాడు. అదృష్టవంతుడు. అతని రాజ్యంలో నీరున్నది.  దయతో వంద బళ్లతో ప్రతిరోజూ నీరు పంపుతున్నాడు. దాంతో గట్టెక్కుతున్నారుగాని, లేకపోతే ఇరుగు రాజుగారు ఏనాడో వలస పోయే పరిస్థితి.    నోములు నోచారు. వ్రతాలు చేశారు. యజ్ఞాలూ, యాగాలూ చేశారు. అయినా ఫలితం లేదు. వాన రాలేదు. తప్పని సరైంది. జాంగులిని పిలిచారప్పుడు. అతను ఓ పెద్ద తాంత్రికుడు.   ‘‘నువ్వు ఏ తంత్రం చేస్తావో చెయ్యి. రాజ్యంలో వాన పడాలి. పారితోషికంగా ఎన్ని వరహాలు కావాలో తీసుకెళ్లు.’’ చెప్పారు రాజుగారు.   ‘‘ఈ వేడి నశించాలి. చల్లగా చినుకుపడాలి. ఎప్పటిలాగే నా మందిరం మేలుకట్టుమీద పావురాలు ఎగరాలి.’’ అన్నారు రాజుగారు.   ‘‘జాంగులికి కావాల్సినవన్నీ ఏర్పాటుచేయండి.’’ రాజసేవకులకు ఆజ్ఞాపించారు.   అనేక తత్వశాస్త్రాలను శోధించాడు జాంగులి. తాంత్రికవిద్యలను పునః పరిశీలించాడు. వారంరోజులపాటు కిందుమీదులయి, తొమ్మిదేళ్లపాపను అమ్మవారికి బలి ఇస్తే వర్షం పడుతుందని తెలుసుకున్నాడాఖరికి. ఆ మాటే విన్నవించాడు రాజోద్యోగులకు.   ‘‘అయ్యా! మర్రిచెట్టు దగ్గరి అమ్మవారికి తొమ్మిదేళ్ల పాపను బలిస్తే వర్షం పడుతుంది. ముందు మనకి పాప కావాలి.’’ అన్నాడు జాంగులి.   తొమ్మిదేళ్లపాప కావాలి? ఎక్కడ ఉంది? *                                   *                                     గుడిసె బయటకు వచ్చింది పాప. ఆ పాపకి తొమ్మిదేళ్లు. చుట్టూ ఉన్న శ్మశానాన్ని కలయజూసింది.   అయ్య ఎక్కడ ఉన్నాడు?  వెదకింది. శవాన్ని కాలుస్తూ కనిపించాడు కాటికాపరి శివపాడు.   కట్టుకున్న లంగాని ఎత్తిపట్టుకుని పరుగుదీసింది అతని దగ్గరకి.   ‘‘అయ్యా’’ అని పిలిచింది. ఆ పిలుపుకి ఇటు తిరిగి పాపను చూశాడు శివపాడు.   మధ్యపాపిడితీసి తలదువ్వుకున్నది పాప. లంగా, జాకెట్టుమీద ఉన్నది. బొమ్మలా ఉన్నది.  ‘‘ఏటమ్మా?’’ అడిగాడు.   ‘‘కాసేపు అమ్మోరి దగ్గర ఆడుకుని వస్తానేఁ.’’ అన్నది పాప.  ‘‘ఎల్లిరా’’ అన్నాడు శివపాడు. కాలుతున్న శవం కాలు పైకిలేస్తే, కర్రతో దానిని అదిమాడు. మంటలోకి ఎగదోశాడు.   పాడెకు వేలాడుతున్న కొబ్బరి ఆకును తీసుకున్నది పాప. దానిని బూరచేసింది. ఊదుతూ పరుగుదీసింది అక్కణ్ణుంచి. దగ్గరగా ఉన్న మర్రిచెట్టును చేరింది.  మర్రిచెట్టు మొదలు ఓ రాయి ఉంది. ఆ రాయికి పసుపూ, కుంకుమా, కాటుకా పూసి ఉన్నాయి. పువ్వులూ, ప్రసాదాలూ భక్తులు సమర్పించినట్టున్నారు. రాయిచూట్టూ ఉన్నాయవి.   వాటిని తొలగించింది పాప. అమ్మవారిని నిండుగా చూసింది. చేతులు జోడించింది. నమస్కరించింది.   ‘‘అమ్మోరూ! నువ్వే నా తల్లివి! నీ ఒళ్లో పడుకోవాలని ఉంది. నా కోరిక తీర్చవూ.’’ అని ప్రార్థించింది.   నేస్తురాళ్ళొచ్చారు ఆసరికి. వారితో ఆటలాడుకోసాగింది పాప.   *                                *                                    *  ‘‘కాటికాపరి శివపాడుకి ఓ పాప ఉంది. ఆ అమ్మాయికి సరిగ్గా తొమ్మిదేళ్లు. ఆ పిల్లను బలి ఇస్తే చాలనేగా మీరు చెప్పేది.’’ వేగులను అడిగారు రాజుగారు.   ‘‘అంతే మహారాజా’’ చేతులు కట్టుకున్నారు వేగులు.   ‘‘ఎంత కాటికాపరి అయినా కన్నకూతురిని బలిచేయమంటే...చేస్తాడా?’’ అడిగారు రాజుగారు.  ‘‘ఆ పాప వాడి కన్నకూతురు కాదు మహారాజా! తొమ్మిదేళ్ల క్రితం ఎవరో పాపని శ్మశానంలో వదిలేస్తే దగ్గరగా తీసుకున్నాడు వాడు. పెంచాడు అనడం పెద్దమాట! గాలికి పుట్టింది. ధూళికి పెరిగింది. అదీ అసలు సంగతి.’’  ‘‘అయితే వాడితో మాట్లాడండి. అడిగినన్ని వరహాలూ, మాడలూ అందజేయండి.’’ ఆజ్ఞాపించారు రాజావారు.   *                                   *                                *  వడగాలి వీస్తున్నది. ఆ గాలికి కొన్ని చితులు రగులుతున్నాయి. మరికొన్ని చిందుతున్నాయి.   ఏ మూలికలు నమిలాడో, ఏ తీగరసం చవిచూశాడో మత్తుగా ఉన్నాడు శివపాడు. తూగుతున్నాడు. వాణ్ణి పట్టి కూర్చోబెట్టారు సైనికులు.    ‘‘సెప్పండి సామీ’’ చేతులు జోడించాడు శివపాడు.   సేనాపతిసహా సైనికులు రాత్రివేళ శ్మశానానికి రావడం, తనతో గౌరవంగా మాట్లాడడం వింతగా ఉంది శివపాడుకి.   ‘‘పాపని బలి ఇస్తే బంగారు వరహాలూ, వెండి మాడలూ ఇస్తారా? ఏయి?’’ చూపించమన్నట్టుగా అడిగాడు శివపాడు.   పెద్దపెద్ద ముఖమల్ సంచుల్లో ఉన్న వరహాలనూ, మాడలనూ కాగడాల వెలుగులో చూపించారు సైనికులు.   ‘‘ఇయన్నీ నాకే.’’ ఆశ్చర్యపోయాడు శివపాడు.   ‘‘నీకే! ఇందాక మేము నీకు చెప్పినట్టుగా...ఈ రాత్రి పన్నెండుగంటలకి అమ్మవారికి నువ్వు పాపని బలివ్వాలి.’’  ‘‘సచ్చినోళ్లను కాల్సినప్పుడు బయపళ్లేదుగాని, అమ్మో! బతికున్నోళ్లను సంపడం...అదే బలివ్వడం అంటే బయంగా ఉందిసామీ! అయినా రాజావోరికోసం, మీకోసం పాపని బలిచ్చేత్తాను, ఎళ్రండి.’’ అన్నాడు శివపాడు. వరహాలూ, మాడల సంచుల్ని దగ్గరగా తీసుకున్నాడు. గట్టిగా కౌగలించుకున్నాడు వాటిని.   తనని బలి ఇచ్చేందుకు సైనికులదగ్గరనుంచి అయ్య డబ్బు తీసుకున్నాడు. చంపేస్తాడు తనని అనుకున్నది పాప. సైనికులతో శివపాడు సంభాషణంతా చాటుగా విన్నదా పిల్ల.   అమ్మోరే తనని కాపాడాలనుకున్నది. పరుగుదీసింది పాప. మర్రి చెట్టుదగ్గరకు చేరింది.   పొద్దున చూసినప్పటిలా అమ్మోరు శాంతంగా లేదప్పుడు. నూనెదీపం వెలుగులో భయంకరంగా ఉన్నది. భయపెడుతున్నది.   భయపడ్డది పాప. ఆ భయంతో ఊపరాడలేదు ఆ పిల్లకి. శరీరం అంతా చెప్పలేనంత నొప్పి. మెలికలు తిరిగింది. అడుగుతీసి అడుగు వేయలేకపోయింది. చెమటలుపట్టింది.   ‘‘అమ్మా’’ అన్నది. అమ్మోరు అని పూర్తిగా పిలవలేకపోయింది. కుప్పకూలిపోయింది.   పాప అలా కూలినప్పుడు, ఆ పిల్ల తల అమ్మోరికి తగిలింది. గాయం అయింది. నెత్తురు కారింది. ఆ నెత్తురు తాగి, అమ్మోరు పిచ్చిగా నవ్వింది. పెద్దగా నవ్వింది.   అప్పుడది అర్థరాత్రి.   అమ్మోరినవ్వు శివపాడుకి వినవచ్చింది. వణకిపోయాడు వాడు.    పాపను బలి ఇవ్వడం తర్వాతి సంగతి. ముందు తానందుకున్న వరహాలనూ, మాడలనూ జాగ్రత్తగా దాచాలి. మారాజు మనసుమారి ఇచ్చిన డబ్బు, తిరిగి ఇమ్మంటే..ఇవ్వలేడు. ఇవ్వకూడదు అనుకున్నాడు శివపాడు. అందుకని అందుకున్న వరహాలనూ, మాడలనూ శ్మశానం అంతటా గోతులు తవ్వి దాచసాగాడు. చాలా వరకూ దాచేశాడు. మిగినవి కొన్నే! ఆ కొన్నింటినీ గోతిలో పాతి పెడుతుంటే...అమ్మోరు నవ్వు వినవచ్చిందింతలో.   ఎలాంటి ఏడుపునైనా తట్టుకోగలడు శివపాడు. ఏడుపులు అలవాటే! కాని, ఇప్పుడు వినవస్తున్న ఈ నవ్వు భయంకరంగా ఉన్నది. శ్మశానాన్ని కుదిపేస్తున్నది. భూకంపం వచ్చినట్టుగా ఉంది.   మొదటిసారిగా ప్రాణభయం అంటే ఏమిటో తెలిసింది శివపాడుకి. పరుగందుకున్నాడు అక్కణ్ణుంచి. శ్మశానం దాటాడు. రాజ్యం పొలిమేర దాటాడు. పారిపోయాడు.   ఆ రాత్రి వానపడ్డది. తెల్లార్లూ పడ్డది. మర్నాడూ...ఆ మర్నాడూ పడ్డది. ముసురు పట్టింది.   రాజుగారు ఆనందించారు. ప్రజలు హర్షించారు.   అక్కడ ఇక్కడసహా శ్మశానంలో నేల కూడా మెత్తబడింది. మొలకలొచ్చాయి. చూస్తూండగానే ఆ మొలకలు, మొక్కలయ్యాయి. చెట్లయ్యాయి.     శ్మశానంలో వరహాలచెట్లూ, మాడలమొక్కలూ మొలిచాయి. కొమ్మలనిండా డబ్బే! కోసినకొద్దీ కాస్తున్నాయి.  శివపాడు ఏమయ్యాడు? పాప ఎలా చనిపోయిందీ ఎవరికీ పట్టలేదు. శ్మశానంలో డబ్బుచెట్లగురించే అంతటా చర్చ. అది ఆ నోటా ఈ నోటా పాకి పొరుగురాజుగారి చెవివరకూ వెళ్లింది. అతను మంచివాడే! దయగలవాడే! కాని డబ్బుకి ఆ రెండు గుణాలూ లేవుకదా! అందుకని అది ఆ రాజుగారిని ఈ రాజ్యం మీదికి దండెత్తి రమ్మంది.   వచ్చాడతను.   వందలాది ఏనుగులతో, వేలాది గుర్రాలతో, లక్షలాది సైనికులతో దండెత్తి వస్తున్న పొరుగురాజుని చూసి, ఇరుగురాజు బెంబేలెత్తాడు.   నీరూ డబ్బూ రెండూ వేర్వేరు కాదు. రెండూ ఒకటే! కాకపోతే...నీటిరూపంలో ఉన్న డబ్బుని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అదే ఘనీభవించి, బంగారు వరహా అయితే, వెండి మాడయితే యుద్ధం తప్పదు. ఆ యుద్ధాన్ని ఏ తాంత్రికులూ నిలువరించలేరు.   సైన్యంకన్నా ఎడారిలో నీటిచుక్క చాలా శక్తివంతం అయినది.  - జగన్నాథశర్మ

మృత్యువు- ప్రేమ

మృత్యువుకు ప్రతి ఒక్కరూ భయపడతారు కానీ జనన మరణాలు సృష్టి నియమాలు. విశ్వం యొక్క సమతుల్యతకు ఇది చాలా అవసరం. లేకపోతే, మానవులు ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయిస్తారు.  ఒకసారి ఒక రాజు తన రాజ్యం వెలుపల ఒక చెట్టు క్రింద కూర్చున్న సన్యాసి వద్దకు వెళ్ళాడు. అతనిని కలిసి "ఓ స్వామీ! నేను అమరత్వం పొందగలిగే మూలికా ఔషధం ఏదైనా ఉంటే దయచేసి నాకు తెలియజేయండి" అని అడిగాడు. అప్పుడా సన్యాసి "ఓ రాజా ! దయచేసి మీరు ఎదురుగా వున్న రెండు పర్వతాలను దాటండి.అక్కడ మీకు ఒక సరస్సు కనిపిస్తుంది. దాని నీరు త్రాగండి. మీరు అమరత్వం పొందుతారు."అని చెప్పాడు.  రెండు పర్వతాలు దాటిన తర్వాత రాజుకు ఒక సరస్సు కనిపించింది. అతను నీరు తాగడానికి  వెళ్ళబోతున్నప్పుడు అతనికి బాధాకరమైన మూలుగులు వినిపించాయి. అతను నీరు తాగకుండా ఆ గొంతును అనుసరించాడు. చాలా బలహీనమైన వ్యక్తి ఒకడు పడుకుని నొప్పితో బాధపడుతున్నాడు. రాజు కారణం అడగగా.. "నేను సరస్సులోని నీటిని తాగి అమరుడనయ్యాను. నాకు నూరేళ్లు నిండిన తర్వాత నా కొడుకు నన్ను ఇంటి నుంచి గెంటి వేశాడు.గత యాభై ఏళ్లుగా నన్ను చూసుకునే వారు లేకుండా పడి వున్నాను. నా కొడుకు చనిపోయాడు. నా మనుమలు ఇప్పుడు వృద్ధులయ్యారు. నేను కూడా తినడం మరియు నీరు త్రాగటం మానేశాను.అయినా నేను ఇంకా బ్రతికే ఉన్నాను."  రాజు ఆలోచించాడు... "అమరత్వం మరియు వృద్ధాప్యం యొక్క ప్రయోజనం ఏమిటి ? నేను అమరత్వంతో పాటు యవ్వనం పొందితే?" పరిష్కారం కోసం మళ్లీ సన్యాసి దగ్గరకెళ్ళి అడిగాడు. "నాకు అమరత్వంతో పాటు యవ్వనంకూడా లభించే మార్గం తెలుపండి "అని  సన్యాసి ఇలా అన్నాడు... "సరస్సు దాటిన తర్వాత మీకు మరొక పర్వతం కనిపిస్తుంది. దాన్ని కూడా దాటండి. అక్కడ మీకు పసుపు రంగు పండ్లతో నిండిన చెట్టు కనిపిస్తుంది, వాటిలో ఒకటి తీసుకుని తినండి. మీరు అమరత్వంతో పాటు యవ్వనం కూడా పొందుతారు."  రాజు బయలుదేరి మరో పర్వతాన్ని దాటాడు.అక్కడ  అతనికి పసుపు రంగు పండ్లతో నిండిన చెట్టు కనిపించింది. పండ్లను తెంపి తినబోతుంటే... కొందరు గట్టిగా అరస్తూ పోట్లాడుకోవడం వినిపించింది. ఇంత మారుమూల ప్రదేశంలో ఎవరు పోట్లాడుకుంటారని ఆలోచించాడు. నలుగురు యువకులు గొంతెత్తి వాదించుకోవడం చూశాడు. అలా వాదించుకుంటూ ఈ మారు మూలలో పోట్లాడుకోవడానికి కారణం ఏమిటని రాజు వాళ్ళని అడిగాడు. వారిలో ఒకరు "నాకు 250 ఏళ్లు, నా కుడి వైపున ఉన్న వ్యక్తికి 300 సంవత్సరాలు. అతను నాకు ఆస్తి ఇవ్వడం లేదు. రాజు సమాధానం కోసం అవతలి వ్యక్తి వైపు చూసినప్పుడు అతను చెప్పాడు..."నా కుడి వైపున మా నాన్న వున్నాడు. అతనికి 350 సంవత్సరాల వయస్సు. అతను తన ఆస్తిని నాకు ఇవ్వనప్పుడు, నేను నా కొడుకుకు ఎలా ఇస్తాను? ఆ వ్యక్తి అదే ఫిర్యాదును కలిగి వున్న 400 సంవత్సరాల వయస్సు గల అతని తండ్రిని సూచించాడు. ఆస్తి కోసం  అంతులేని మా పోరాటాలను చూసి తట్టుకోలేక మా గ్రామ ప్రజలు మమ్మల్ని గ్రామం నుండి వెళ్లగొట్టారని వారందరూ రాజుతో చెప్పారు.  రాజు దిగ్భ్రాంతికి గురై  సన్యాసి వద్దకు తిరిగి వచ్చి... "మరణం యొక్క ప్రాముఖ్యతను నాకు తెలియచేసినoదుకు ధన్యవాదాలు" అన్నాడు.     అపుడు ఆ సన్యాసి ఇలా అన్నారు...   మరణం ఉంది కాబట్టి ప్రపంచంలో ప్రేమ ఉంది

యండమూరితో ఓ సాయంత్రం!

పందొమ్మిదివందల ఎనభయ్యవ సంవత్సరం.   ‘విపుల:చతుర’కి సబ్ ఎడిటర్ గా ఉన్న రోజులు. ఆఫీసులో లంచ్ అయిన తర్వాత కొలీగ్సంతా కలసి, కెసిపి గెస్ట్ హౌస్ దగ్గరి పాన్ షాప్ కి వెళ్లేవాళ్లం. పాన్ బిగించి, అక్కడ సిగరెట్ తాగేవాళ్లం. ఆ షాప్ లో మ్యాగజైన్లు కూడా అమ్మజూపేవారు. ఆంధ్రభూమి వీక్లీలు ఇలా వచ్చి అలా అమ్ముడయ్యేవి. లేట్ చేస్తే వీక్లీ దొరికేదికాదు. సుమారుగా యాభై అరవై వీక్లీలు ఓ అరగంటలో అమ్ముడయ్యేవి. చూసి ఆశ్చర్యపోయేవాణ్ణి. హాట్ కేక్ ల్లా అమ్ముడుపోవడం అంటే...ఇదే అనుకునేవాణ్ణి. ఆంధ్రభూమిని ఎందుకింతలా కొంటున్నారు? పాఠకులు ఆ పత్రికను ఎందుకు అభిమానిస్తున్నారంటే...అందులో యండమూరి రచన ‘తులసీదళం’ సీరియల్ గా వస్తున్నదన్నారు.    ఆనాటికి మల్లాది వెంకటకృష్ణమూర్తిగారు నాకు మంచిమిత్రులు. యండమూరిగారితో నాకు పరిచయంలేదు. ఆంధ్రభూమి వ్యవహారం చూసిన తర్వాత ఆయన్ని ఓసారి చూడాలనిపించింది. ఆయన్ని కలవాలనిపించింది. అలాగే చేస్తేగీస్తే వీక్లీకి ఎడిటర్ గా పనిచెయ్యాలికాని, మంత్లీలకి పనిచెయ్యకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను.   ఆ ప్రస్థానంలోనే ‘ఉగాది’ వీక్లీకి ఎడిటర్నయ్యాను. యండమూరితో సీరియల్ రాయించాలని మేనేజ్ మెంట్ తో పట్టుబట్టాను.   రెమ్యునరేషన్ ఎంత డిమాండ్ చేస్తారో ఏమో! ఆలోచిద్దాం అన్నది మేనేజ్ మెంట్.  ఓకే అని ఉంటే...వెళ్లి యండమూరిని కలిసేవాణ్ణే! వాళ్లు ఓకే అనకపోవడంతో...యండమూరితో నా పరిచయం పోస్ట్ పోన్ అయింది.  కొన్నాళ్లకి ఆదివారం ఆంధ్రజ్యోతిలో జాయినయ్యాను. అందులో వారం వారం ఓ ప్రముఖుణ్ణి ఇంటర్వ్యూ చేసేవాళ్లం. అలా ఓ వారం ఇంటర్వ్యూచేసేందుకు యండమూరిని మొదటిసారిగా కలిశాను. బంజారాహిల్స్ లో వాళ్లింట్లోనే కలిశాను.   ఏం తీసుకుంటారు? అడిగారు యండమూరి.   కాఫీ అన్నాను.   నవ్వారు యండమూరి.    కాఫీ తెప్పించారు. తాగి, రెచ్చిపోయాను.   మీ నవలలన్నీ కాపీ నవలలే! మీ ఫలానా నవల, ఫలానా ఇంగ్లీషు నవలకు కాపీ. మీ కథలు కూడా కాపీలే అంటూ ఏంటేంటో వాగాను. అన్నీ విన్నారాయన. విని ఆయనిలా అన్నారు.   కాపీ కొట్టేవారు గుడ్ ఆర్టిస్టులు. దొంగిలించేవారు గ్రేట్ ఆర్టిస్టులన్నాడు పికాసో.  మీరు అంటున్నట్టుగా ఇంగ్లీషు రచనలు చదివి, ఆ ప్రేరణతో నేను తెలుగు రచనలు చేసి ఉంటే...నేను గుడ్ రైటర్ని. అందులో వస్తువుని యథాతథంగా దొంగిలించి ఉంటే... గ్రేట్ రైటర్ని్. నేను ఏ పాటి రైటర్నో మీరే నిర్ణయించండి.     ఆ మాటకి పగలబడినవ్వాను.   ఇతరులను కాపీకొట్టడంలో...అంటే అనుసరించడంలో తప్పులేదు. తననితాను కాపీకొట్టడమే విషాదం అని నవ్వారు యండమూరి.   రచయితలంతా రాసిందే రాస్తున్నారిప్పుడు. గమనించారా? అడిగారు. తర్వాత ఇద్దరం చాలా విషయాలు మాట్లాడుకున్నాం.   ఇంటర్వ్యూ ముగిసింది.   ఆ ఇంటర్వ్యూకి మంచి రెస్పాన్సేవచ్చింది. అప్పటినుంచీ ఎవరిని ఇంటర్వ్యూ చెయ్యాలన్నా నన్నే పంపేది ఆంధ్రజ్యోతి.   ఓసారి సినిమా డిస్కషన్స్ కి ప్రొడ్యూసర్ అశ్వనీదత్ గారు రమ్మన్నారు. నేను వెళ్లలేదు. పనిచేసుకుంటూ కూర్చున్నాను. అప్పుడు ఆంధ్రజ్యోతి ఎండీ జగదీశ్ ప్రసాద్ గారు పిలిచి, వెళ్లమన్నారు.    సంపాదించుకో శర్మా! వెళ్లు అన్నారు.   వెళ్లాను. ఆసరికి అక్కడ సినీరచయిత సత్యానంద్, యండమూరిసహా మేర్లపాకమురళీ, శైలకుమార్ ఇంకా ఒకరిద్దరు రచయితలు ఉన్నారు. నన్నుచూస్తూనే యండమూరి...   మీ ఎండీకి చెప్పి, మిమ్మల్నిక్కడకి రప్పించింది నేనే! మీకు డ్రామా బాగా తెలుసునని ఎవరో అన్నారు. మాకు మీరు ఏ మేరకు ఉపయోగపడతారో చూద్దాం అన్నారు.        కథ చెప్పారు.   డిస్కషన్స్ ప్రారంభమయ్యాయి.   నాకు కథ నచ్చలేదు. ఆ మాటే చెప్పాను యండమూరితో. ఆశ్చర్యపోయారాయన.   ఎందుకు నచ్చలేదు? అడిగారు. చెప్పాను.   మిమ్మల్ని ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ రాఘవేంద్రరావుగారి దగ్గరకు తీసుకుని వెళ్తారు. కలసి రండి అన్నారు.   కూలీ నెంబర్ వన్ షూటింగ్ అవుతున్నదప్పుడు. నన్ను రాఘవేంద్రరావుగారికి పరిచయం చేశారు అశ్వనీదత్ గారు.   మీకు కథ ఎందుకు నచ్చలేదు? అడిగారు రాఘవేంద్రరావు. ఎందుకు నచ్చలేదో చెప్పాను. నవ్వారాయన. సరే! వెళ్లి రండని పంపించేశారు. ఆ రోజు శివరాత్రి. నాకు బాగా జ్ఞాపకం.   ఇలా అప్పుడప్పుడూ యండమూరిని కలిసే అవకాశాలు కలిగాయి. తర్వాత ఇద్దరికీ పరిచయం పెరిగింది.   హిప్నాటిస్ట్ నాగరాజుని ఇంటర్వ్యూ చేసి ఆంధ్రజ్యోతిలో ప్రచురించాను. అందుకు ఆయన ఆనందించి, నాకు గిప్ట్ గా కొంత డబ్బును ఇవ్వబోయారు. నేను వద్దన్నాను.   ఇంటర్వ్యూ వచ్చిన మూడో రోజో, నాలుగో రోజో ఆయన చనిపోయారు. అప్పుడు తొలిసారిగా నాకు యండమూరి ఫోన్ చేశారు.   నేను నాగరాజును చూసేందుకు వెళ్తున్నాను. మీరొస్తారా? వస్తారంటే...మిమ్మల్ని మీ ఆఫీసుదగ్గర పికప్ చేసుకుంటాను అన్నారు.   వస్తానన్నాను. యండమూరివచ్చి నన్ను పికప్ చేసుకున్నారు. ఇద్దరం నాగరాజు మృతదేహాన్ని చూసి  బాధపడ్డాం. తిరుగు ప్రయాణంలో నాగరాజు నాకు డబ్బు ఇవ్వజూపిన విషయం యండమూరికి చెప్పాను.   తీసుకోలేదు కదా! మంచిపని చేశారు. తీసుకుని ఉంటే...జీవితాంతం బాధపడాల్సి వచ్చేది అన్నారు.   నేను టీవీ రైటర్నయ్యాను. రెండు చేతులా సీరియల్స్ రాస్తున్నాను. ఒక లోకేషన్లో యండమూరిని కలిశాను. ఆయనక్కడ ఏదో సీరియల్ డైరెక్ట్ చేస్తున్నారు. నమస్కరించాను.   బాగున్నారా? వింటున్నాను, మీ గురించి. మీకు టీవీరంగం పెర్ ఫెక్ట్! సెంటిమెంట్ మీరు బాగా పండిస్తారు అన్నారు.   నవలపట్టుకోకుండా, టీవీకి అతుక్కుపోయేట్టుగా మహిళల్ని మార్చగలిగితే...మీరు సక్సె్స్ అని నవ్వారు.   నేను టీవీరంగంలో సక్సస్ అయ్యానో లేదో తెలియదుగానీ, ఆ రంగంలో పదిహేనేళ్లపాటు నిలదొక్కుకున్నాను.    నవ్యకు ఎడిటర్నయ్యాను. అప్పుడు యండమూరి తమ్ముడు కమలేంద్రనాథ్ పరిచయం అయ్యారు. ఇద్దరం మంచి స్నేహితులమయ్యాం. కబుర్లలో ఆయన వీరేంద్రనాథ్ గురించి చెబుతూ ‘అన్నయ్య అలాగా! అన్నయ్య ఇలాగా!’ అని పదేపదే అనడంతో నాకూ యండమూరి ‘అన్నయ్య’ అయిపోయారు. యండమూరికి ఫోన్ చేసినప్పుడల్లా నేనూ ఆయన్ని ‘అన్నయ్యా’ అని పిలవడం ప్రారంభించాను.   కష్టకాలంలో రాయమంటే...నవ్యకు రెండు మూడు సీరియల్స్ రాసిచ్చారు యండమూరి. ఆ రోజుల్లోనే నేను వీక్లీలో రామాయణం రాసేవాణ్ణి.   ఒకసారి చెన్నయ్ నుంచి ఫోన్ చేశారు యండమూరి.   ఫ్లైట్ లో నా రామాయణం చదివారట! కళ్లు చెమర్చాయి అన్నారు.  పురాణాలను సరళంగా బాగా రాస్తున్నావు అని మెచ్చుకున్నారు.   పురాణాలు చదువుతావా అన్నయ్యా? అడిగాను.   ఎందుకు చదవను? రామాయణ మహాభారతాలంటే...నాకు చాలా ఇష్టం అన్నారు.   ఒకానొక సాయంత్రం ఫోన్ చేశారు.   శర్మా! నీ రచనలనూ, నిన్నూ అభిమానించే ప్రొడ్యూసర్ ఒకరున్నారు. ఆయన నిన్ను చూడాలనుకుంటున్నారు. మా ఇంటికి వస్తావా? అడిగారు.   ఆరోజు బుధవారం. వీక్లీకి డెడ్ లైన్. ఎంతరాత్రయినా పేజీలు విజయవాడ పంపించి తీరాలి.   రాలేను! సారీ అన్నయ్యా అన్నాను.   సరే! నీకు తీరిక దొరికినప్పుడు మా ఇంటికి ఓసారి రా! సరదాగా కబుర్లాడుకుందాం అన్నారు. అని అయిదేళ్లయింది. తీరిక దొరకలేదా? అంటే రోజంతా తీరికే! కాని వెళ్లలేకపోయాను.   మొన్న 2024 ఆగస్టు 9న మిత్రులు శ్రీ సుబ్బరాయశర్మసహా వారింటికి మళ్లీ ఆహ్వానించాడు అన్నయ్య.   సుబ్బరాయశర్మగారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన నటనలో నిజాయితీ ఉంటుంది.   నిజాయితీ లేని నటన నూతిలో శవంలా తేలిపోతుందనేవాడు మా నాన్న. ఏ పాత్ర పోషించినా సుబ్బరాయశర్మగారు తేలిపోవడం నేను చూడలేదు.    నన్ను పికప్ చేసుకునేందుకు కారులో వచ్చారు శర్మగారు. ఇద్దరం యండమూరి ఇంటికి వెళ్లాం.   అన్నయ్య ఇన్నాళ్లకు దొరికాడు. నా ప్రజ్ఞంతా చూపించేందుకు అవకాశం దొరికిందని అనేక విషయాలగురించి అనేకంగా మాట్లాడాను ఆ సాయంత్రం. వింటూ నవ్వుతూ కూర్చున్నాడు అన్నయ్య. విజేతలు ఎక్కువగా మాట్లాడరు. ఎక్కువగా వింటారనిపించాడు. నా మాటలువింటూ నన్ను గౌరవించాడు.   మాట్లాడడం అంటే...మనకు తెలిసింది మళ్లీమళ్లీ చెప్పడమే! అదే ఎదుటివ్యక్తి మాట్లాడుతుంటే...వింటూ కూర్చుంటే కొత్తకొత్త విషయాలు తెలుస్తాయి. ఈ కిటుకు  ఏనాడో తెలుసుకున్నాడన్నయ్య అనుకున్నాను.    వద్దు వద్దన్నా వినలేదు. యండమూరి అన్నయ్యనూ, సుబ్బరాయశర్మగారినీ శాలువాలు కప్పి సత్కరించాను. మిత్రుడు జెన్నీని గట్టిగా కౌగలించుకున్నాను.  వస్తానని బయల్దేరాను.  ఈసారి వచ్చేటప్పుడు శాలువలు పట్టుకురాకు. నువ్వు రా! చాలు! అన్నాడు అన్నయ్య. డాబా మెట్లు దిగుతుంటే...‘జాగ్రత్త జాగ్రత్త’ అని హెచ్చరించాడు.    కారెక్కి ఇంటికి వస్తూ...సుబ్బరాయశర్మగారిని గట్టిగా కౌగలించుకున్నాను.   ఏమైంది? అడిగారాయన.   ఆలోచించడం చాలా ఈజీసార్. నటనే కష్టం. ఎవరి ఆలోచననో మీ ఆలోచనచేసుకుని, అందుకనుగుణంగా మీలాంటి నటులు నటిస్తారుచూడండీ...అద్భుతం. అందుకే కౌగలించుకున్నాను అన్నాను.   వర్షం కురుస్తున్నది.   మా ఇంటిదగ్గర నన్ను డ్రాప్ చేశారు శర్మగారు.   మళ్లీ కలుద్దాం అన్నారు. వెళ్లిపోయారు.  -జగన్నాథశర్మ

విజయీభవ!

భయపడేవాడిని లోకం మరింత భయపెడుతుంది. భయంతో కుంచించుకుపోయిన మనిషి జీవితంలో ఏదీ సాధించలేడు. భయానికి విరుగుడు సాహసం. ధైర్య సాహసాలున్న చోట అపజయానికి చోటుండదు. భయానికి ఎదురొడ్డి నిలబడటమే విజయానికి తొలి సోపానం. నచికేతుడు పసిబాలుడు. విశ్వజిత్ యాగం చేసి తండ్రి బక్కచిక్కిన ఆవులను దానం చేయడం చూసి ఊరుకోలేకపోయాడు. 'నాన్నా! నన్నెవరికి దానం చేస్తావు? ' అని అడ్డు తగిలాడు. కోపావేశంలో  నిన్ను యముడికి ఇస్తాను అని నోరుజారాడు వాజశ్రవుడు. తక్షణం నచికేతుడు యమసదనానికి బయలుదేరాడు. యముడు ఇంట లేడు. మూడురోజులు అలాగే ఎదురుచూస్తూ అక్కడే ఉండిపోయాడు నచికేతుడు. తిరిగి వచ్చిన యముడు బాలుడి ధైర్యసాహసాలకు మెచ్చి వరం కోరుకొమ్మన్నాడు. తన తండ్రిని క్షమించమని, యజ్ఞ ఫలం ఇప్పించమని కోరాడు. అగ్నివిద్య నేర్చుకున్నాడు. మూడో కోరిక క్లిష్టమైన మృత్యురహస్యం. యమధర్మరాజు నచికేతుడికి అగ్నివిద్య బోధించాక ఆత్మజ్ఞానివై జీవించమని తిరిగి భూలోకానికి పంపించాడు. పశ్చాత్తాపం చెందిన వాజశ్రవుడు కొడుకుకు పట్టంకట్టి విశ్రాంతుడయ్యాడు. తన ప్రేయసి, కాబోయే భార్య ప్రమద్వర, పాముకాటుకు గురి అయి ప్రాణాలు విడిచిందని విని, ఆమెను వెతుక్కుంటూ రురు నాగలోకం వెళ్ళాడు. నాగరాజును ఒప్పించి ప్రమద్వరతో తిరిగి ఆశ్రమం చేరుకున్నాడు. సావిత్రి సత్యవంతుడి ప్రాణాల కోసం యముడిని మెప్పించి మూడు వరాలు పొందింది. అత్తమామలకు నేత్రాలు, పోయిన రాజ్యం, తండ్రికి పుత్రసంతానం ఇప్పించింది. దీర్ఘసుమంగళిగా దీవెన అందుకుని, తెలివిగా భర్తను దక్కించుకున్నది. పురాతనమైనా, పురాణాలు నూతన ఆవిష్కారాలకు దారిదీపాలు- అన్న సత్యాన్ని ఈ మూడు ఉపాఖ్యానాలు చాటిచెబుతున్నాయి. భయం తీరాక, సంకల్పబలం సంతరించుకోవాలి. పూర్వాపరాలు బాగా ఆలోచించి, తీసుకున్న నిర్ణయానికి కట్టుబడాలి. ఆటంకాలు, అవరోధాలు ముళ్లకంపల్లా దారికి అడ్డుతగులుతాయి. మనసును చిక్కబట్టి ఏకాగ్రబుద్ధితో ముందుకు సాగాలి. ఎదురైన సమస్యల నుంచి నేర్చుకున్న పాఠాలు ప్రగతిని మరింత వేగవంతం చేస్తాయి. కార్యసాధన ధ్యేయంగా ఉన్నంతకాలం, పట్టుదలతో ఎంతటి గడ్డు పరిస్థితులనైనా అధిగమిస్తే అవకాశం స్వాగతం పలుకుతుంది. ఇది ముఖ్యంగా నేటి యువతరం తెలుసుకోవలసిన వాస్తవం. ధైర్యం, సాహసం, సంకల్పం, ఏకాగ్రత, పట్టుదల, కార్యసాధనకు పంచప్రాణాలు. పంచపాండవులు అంతిమ విజయం సాధించిన విధంగా, పంచసూత్రాలను తు.చ. తప్పకుండా మనమూ ఆచరణలోనికి అనువదిస్తే, భయాలు తొలగుతాయి. జయాలు కలుగుతాయి. సాధించిన విజయం సజావుగా సాగాలంటే మరో రెండు శత్రు శిబిరాలను వశం చేసుకోవాలి. అహంకారం, మమకారం- అరిషడ్వర్గానికి వెన్నుదన్ను లాంటివి. చాపకింద నీరులా చేరి, మనల్ని పాతాళానికి అణచివేస్తాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు విష కీటకాలు, అహంకారం వల్ల దుర్యోధనుడు, మమకారం వల్ల దృతరాష్ట్రుడు చెడ్డారు. రాగద్వేషాలే అన్ని అనర్థాలకు మూలకారణాలు. వాటిని జయిస్తే, జీవితమంతా విజయవంతంగా కొనసాగుతుంది. ఒక వస్తువు పట్ల మితిలేని అనురాగమే, మరో వస్తువుపట్ల ద్వేషాన్ని రగిలిస్తుంది. దాచుకున్న ధనం పట్ల అతి వ్యామోహం, దొంగల పట్ల భయాన్ని పెంచుతుంది. అభయమే విజయానికి స్వాగత తోరణం.

పిల్లి-ఎలుక

ఒకానొక అడవిలో ఓ మర్రిచెట్టు కింద ఫలితుడు అనే ఎలుక జీవిస్తోంది. అదే చెట్టు మీద రోజసుడు అనే పిల్లి కాపురం చేస్తోంది.. ఒక వేటగాడు రోజూ రాత్రి ఆ చెట్టు దగ్గరకు వచ్చి అక్కడ ఓ వలను పరచి వెళ్లేవాడు. రాత్రివేళ అందులో ఏవో ఒక జంతువులు చిక్కుకుంటాయి కనుక ఉదయమే వచ్చి వలలో చిక్కిన వాటిని చక్కగా తీసుకుని పోయేవాడు. ఒక రోజు అనుకోకుండా వలలో రోజసుడు అనే పిల్లి చిక్కుకుపోయింది. పిల్లి వలలో పడింది కనుక ఎలుక దాని చుట్టూ నిర్భయంగా తిరుగుతూ ఆహారం కోసం వెతకసాగింది.. ఆహారం కోసం అటూఇటూ ఆబగా చూస్తున్న ఎలుక గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. కొద్ది దూరంలోనే ఒక ముంగిస, గుడ్లగూబ దానికి కనిపించాయి. అవి ఎలుకని గుటుక్కు మనిపించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఎలుకకి ఏం చేయాలో పాలు పోలేదు. అలా అపాయంలో ఉన్న ఆ ఎలుకకి చటుక్కున ఓ ఉపాయం తట్టింది.. వెంటనే వలలో ఉన్న పిల్లి దగ్గరకు వెళ్లి.. ‘నేను ఈ వలని కొరికి నిన్ను రక్షిస్తాను. బదులుగా నువ్వు నన్ను ఆ గుడ్లగూబ, ముంగిసల బారి నుండి రక్షించవా!’ అని అడిగింది. పిల్లికి అంతకంటే ఏం కావాలి.. వెంటనే అది సరేనంది. దాంతో ఎలుక నిర్భయంగా వెళ్లి పిల్లి పక్కన కూర్చుంది. పిల్లి చెంతనే ఉన్న ఎలుకని పట్టుకునే ధైర్యం లేక ముంగిస, గుడ్లగూబ జారుకున్నాయి. ‘నేను నీ ప్రాణాలను రక్షించాను కదా..! మరి తొందరగా వచ్చి ఈ వలని కొరికి నన్ను బయట పడేయి అని అడిగింది పిల్లి. ‘ఉండు ఉండు నీలాంటి బలవంతులతో స్నేహం చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా..! నిన్ను ఇప్పుడే బయటకు తీసుకు వస్తే, నువ్వు నన్ను భక్షించవని ఏమిటి నమ్మకం.? కాబట్టి ఆ వేటగాడు వచ్చే సమయానికి నిన్ను విడిపిస్తాను.. అంటూ సంజాయిషీ ఇచ్చుకుంది ఎలుక. అన్నట్లుగానే మరుసటి ఉదయం ఆ వేటగాడు వచ్చే సమయానికి కాస్త ముందుగా వలని పుటుక్కున కొరికేసింది. వేటగాడు వస్తున్నాడన్న తొందరలో పిల్లి గబుక్కున చెట్టు మీదకు చేరుకుంది. ఇటు ఎలుకా తన కలుగులోకి దూరిపోయింది. మర్రిచెట్టు కిందకి చేరుకున్న వేటగాడు కొరికి వేసిన వలని చూసి తెగ బాధ పడ్డాడు. తన ప్రయత్నం వృధా అయిపోయిందన్న బాధతో వెనుదిరిగి వెళ్లిపోయాడు. వేటగాడు అటు వెళ్లగానే పిల్లి కిందకి చూస్తూ ‘ఎలుకతో.. మిత్రమా! నువ్వు నా ప్రాణాలను కాపాడావు. ఇక నుంచి మనమిద్దరం మంచి స్నేహితులుగా ఉందామని పిలిచింది. దానికి ఎలుక నవ్వుతూ ‘మిత్రుడు ఎప్పుడు శత్రువు అవుతాడో, శత్రువు ఎప్పుడు మిత్రుడు అవుతాడో చెప్పడం కష్టం. అలాంటిది సహజ శత్రువులమైన మన ఇద్దరి మధ్యా స్నేహం ఎలా పొసుగుతుంది..? ఇప్పుడు ఏదో నీకు సాయపడ్డానన్న కృతజ్ఞతతో నాతో స్నేహం చేయవచ్చు.. కానీ ఏదో ఒక రోజున ఆకలి మీద ఉన్న నీకు నన్ను చంపి తినాలన్న ఆలోచన నీకు రాకపోదు. శత్రువులతో అవసరార్థం స్నేహం చేసినా, ఆ స్నేహాన్ని విడువకపోతే ఎప్పటికైనా ఆపద తప్పదని శుక్ర నీతి కూడా చెబుతోంది. నువ్వు నన్ను రక్షించావు. బదులుగా నేను నిన్ను రక్షించాను. మన బంధం ఇక్కడితో చెల్లు.. ఇక మీదట నా జోలికి రాకు.!’ అంటూ కలుగు లోకి దూరిపోయింది ఎలుక.. ఎలుక మాటల్లోని నిజాన్ని గ్రహించిన పిల్లి కూడా మారు మాటాడకుండా వెనుదిరిగి పోయింది. 

డి కాదు, ఢీ. కామేశ్వరి

ఏం రాస్తున్నామన్నది తర్వాత శర్మగారూ! ముందు రాయడం ప్రారంభించాలి. కుళాయి తిప్పితేనే గదా నీరొచ్చేది అన్నారు డి. కామేశ్వరి ఓసారి. ఆసారి నాకు చాలా కబుర్లు చెప్పారామె. మీరు కథలపోటీలు నిర్వహిస్తారుకదా! ఆ పోటీలకు కథ రాసినప్పుడు మీరు పేర్కొన్న ఏ నియమనిబంధనలూ నేను పాటించను. కథ రాస్తానంతే! మీకు నచ్చితే బహుమతి ఇస్తారు. ప్రచురిస్తారు. లేదంటే...తిప్పి పంపుతారు. అందులో నాకొచ్చే నష్టం ఏమీలేదు. పైగా ఓ కథ రాశానన్న తృప్తి ఉంటుంది అన్నారు. నవలరాయడం అంటే...రాత్రివేళ కారునడపడంలాంటిదండీ! కారు హెడ్ లైట్స్ వెలుగులో కనిపించిన దాన్నే మనం చూడగలం. చూసిన మేరే ప్రయాణించాలి. అలా ప్రయాణిస్తేనే అన్ని విధాలా క్షేమంగా ఉంటుంది. పక్కచూపులు చూడకూడదు. చూస్తే లేనిపోని ప్రమాదాలు కొనితెచ్చుకోవాలన్నారు. ఇంకా చాలా విషయాలు చెప్పారు. వాటిని చెప్పేముందు, కామేశ్వరిగారిని నేను మొదటిసారి ఎప్పుడు చూశానో చెబుతాను.   పందొమ్మిదివందల ఎనభై ఒకటో...ఎనభై రెండో...సంవత్సరం పెద్దగా గుర్తులేదుగాని, ఈనాడు ప్రచురణలు విపుల:చతురలో నేను పనిచేస్తున్న రోజులు...    కె. బి. లక్ష్మి ఆర్టికల్ ఏదో రాస్తున్నది. నేనేదో నవలను పరిశీలిస్తున్నాను. ఆ రోజు కనీసం రెండు మూడు నవలలైనా చదవాలి. ప్రచురణకోసం పంపినవి పేరుకుపోయాయి.   వాతావరణం నిశ్శబ్దంగా ఉంది.    నమస్కారం! బాగున్నారా? నవ్వు గొంతొకటి వినవచ్చింది.    ఎవరై ఉంటారా? అంటూ గొంతువినవచ్చిన వైపుగా చూశాను. తెల్లగా అంతెత్తుఆడమనిషి. చెయ్యెత్తితే ఆమెకు సీలింగ్ ఫ్యాను అందేటట్టుంది. నల్లకళ్లద్దాలు పెట్టుకుని ఉంది.   మిమ్మల్నే! బాగున్నారా? అని అడుగుతున్నాను, గొంతు పెంచి, ఎడిటర్ శ్రీ చలసాని ప్రసాదరావుని పలకరిస్తున్నదామె.   కూర్చోండి అంటున్నారాయన. కుర్చీ చూపిస్తున్నాడు. వినపించుకోవట్లేదామె.   గుర్తుపట్టారా? అని గోలగోల చేస్తున్నదామె.   ఎవరీ తల్లి? చెల్లి? తెల్లపులి? లక్ష్మిని అడిగాను.   డి. కామేశ్వరి అని నవ్వింది లక్ష్మి.  న్యాయం కావాలి సినిమా కథ ఈవిడ రాసిందే! ‘కొత్తమలుపు’ పేరుతో చతురలో మనం వేశాం అన్నది.   మీరు గుర్తుపట్టలేదు. నా పేరు...అని కామేశ్వరిగారు ఇంకా గొంతు పెంచుతుంటే...ఇక తప్పనిసరై నేను వెళ్లానక్కడకి.   మీరెంతగా అరచినా ఎడిటర్ గారికి వినిపించదు మేడం! మీరేది చెప్పదలచుకున్నా అదిగో...ఆ కాగితాల మీద రాసి చూపించండి. ఆయన సమాధానం చెబుతారు అన్నాను.   పాపం! ఇంత కూడా వినిపించదా? జాలిచెందారామె.   వినిపించదన్నాను.    కామేశ్వరిగారు కాగితాలమీద రాయసాగారు. రాస్తూ అరుస్తూనే ఉన్నారు. ఆమె గొంతు ఈనాడు కాంపౌండ్ సెకెండ్ ఫ్లోరంతా ప్రతిధ్వనిస్తూనే ఉంది.   నేనేం రాశానో! మీరేం చెప్పారో! నేనేం విన్నానో...ఏదీ నాకు అర్థం కాలేదు. వస్తా అన్నారు మేడం. అక్కణ్ణుంచి కదలి, నన్ను చూసి ఇటుగా వచ్చారు.   మీ పేరేంటో? అడిగారు.   జగన్నాథశర్మ.  మీరేనా కథలూ, నవలలూ సెలెక్ట్ చేసేది?  నేను సెలెక్ట్ చేయనండి! చదివి, నా అభిప్రాయం ఎడిటర్ గారికి చెబుతాను. ఆయన సెలెక్ట్ చేస్తారు.   తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అని...బాగుంది మీ వ్యవహారం! నావో రెండు కథలు మీ దగ్గర ఉన్నాయి. ఏఁవయ్యాయవి? అడిగారు.   తెలియదండి.  తెలిసినా చెప్పరు. అర్థమయింది. ‘సరే’నని వెళ్లిపోయారామె. వెళ్తూ వెళ్తూ ఎడిటర్ చలసానిగారిముందు అరిచారిలా.    వెళ్లొస్తాను.  వెళ్లిపోయారు కామేశ్వరి.   వడగళ్లవాన వెలిసినట్టయింది.    పెద్దగొంతుతో మాట్లాడేవారే సంఘర్షిస్తారు. తప్పొప్పులను ఎత్తిచూపుతారు. పెద్దగొంతుతో మాట్లాడేవారే చిన్నచిన్న విషయాలకు అతిగా స్పందిస్తారు అనేవాడు మానాన్న. మా అమ్మగారు పెద్దగొంతుతో మాట్లాడేది. మనుమలనూ, మనవరాళ్లనూ భయపెట్టేది. భయపడితే మళ్లీ తట్టుకోలేకపోయేది. వారిని దగ్గరగా తీసుకునేది.     ఉత్తనే! ఊరకనే అరిచానమ్మా! ఊరుకో! ఊరుకో! అనేది. లాలించేది, బుజ్జగించేది. వారితో పాటుగా కళ్లు చెమర్చుకునేది.   కామేశ్వరిగారి స్వరోపాఖ్యానం మా అమ్మను గుర్తుచేసింది.   కామేశ్వరిగారి కథాసంకలనం ‘కాదేదీ కథకనర్హం’ చదివాను తర్వాత. అందులోని ‘చోతంత్రం’ కథ మా నాన్న మాటలను ఋజువుపరచింది. ఆవగింజంత వస్తువుతో  మహిళాలోకాన్నే వేలెత్తిచూపించిందామె. రచయిత్రులు వంటచేసినప్పుడు స్టవ్ దగ్గరా, రాసేటప్పుడు టేబుల్ దగ్గరా చాలా బోల్డ్ గా ఉండాలని నేనెక్కడో చదివాను. ఆ మాట కామేశ్వరిగారి విషయంలో నూటికి నూటిపాళ్లూ నిజమయింది.    పదో పదకొండో కథాసంకలనాలు, ఎనిమిదో తొమ్మిదో నవలలు రాశారు కామేశ్వరిగారు. సుమారుగా నేనన్నీ చదివినగుర్తు. అన్నీ ఎందుకు చదివానంటే...టీవీ రచయితగా ఉన్నప్పుడు...టీవికి ఏదేని పనికొస్తుందేమో! సంప్రదిద్దామనుకునేవాణ్ణి. టీవీలో ప్రముఖుల కథలు సింగిల్ ఎపిసోడ్స్ గా ప్రసారం చేస్తున్న రోజులవి.   చెదరిన బలహీనులను ఏకం చెయ్యడం, వారిని బలవంతులను చెయ్యడం, అలాగే అణచివేతవిషయమై ఒకటయిన బలవంతుల్ని చెదరగొట్టడం, వారిని బలహీనులను చెయ్యడం మంచిరచన లక్షణం. ఆ లక్షణం కామేశ్వరిగారి రచనలన్నిటా నాకు కనిపించింది. లక్ష్యంతో పాటు డ్రామాకూడా అత్యద్భుతంగా ఆవిష్కృతమయింది. ఏ ఇజానికీ ప్రత్యక్షంగా వత్తాసుపలకకపోవచ్చుకాని, పరోక్షంగా తన రచనలన్నిటా స్త్రీవాదాన్ని సమర్థించారు కామేశ్వరిగారు. ఇందులో ఎలాంటి సందేహమూలేదు.   నవ్యవీక్లీకి ఎడిటర్ అయిన తర్వాత నన్ను నేను పరిచయం చేసుకుంటూ ఓసారి కామేశ్వరికి గారికి ఫోన్ చేశాను.   మీ పేరు విన్నాను శర్మగారూ! అప్పుడప్పుడూ మీ కథలు చదివాను. మిమ్మల్నెప్పుడూ నేను చూడలేదన్నారు కామేశ్వరి. ఈనాడు ఎపిసోడ్ చెప్పాను. విని నవ్వారు. తర్వాత ఏదో సభలో ఇద్దరం కలుసుకున్నాం. పలకరింపులయ్యాయి.   మంచి కథ ఒకటి రాసి పంపండి అన్నాను.   మంచికథో చెడ్డకథో చెప్పలేనుగాని, నేను ఈ విషయం పాఠకులకు చెప్పాలి. వారు తెలుసుకోవాలి అనుకున్నప్పుడే కథ రాస్తాను. అలాంటి కథ కావాలంటే చెప్పండి, రాసినప్పుడు పంపుతాను అని నవ్వారు.   పంపించండి అన్నాను. పంపారు. ఆ కథ అర్థాంతరంగా ముగిసింది అనిపించింది. ఆ మాటే కామేశ్వరిగారికి ఫోన్ చేసి చెప్పాను. దానికి వారిచ్చిన సమాధానం...  దేనికీ ముగింపు ఉండదు శర్మగారూ! అక్కడితో కథ ఆగిపోయింది. ఆపేశానంతే అన్నారు.   తెలివిగా మాట్లాడతారు కామేశ్వరి అనుకున్నాను. కాని కాదు. ఉత్త భోళామనిషామె.   రవీంద్రభారతిలో నన్ను ఎవరో సత్కరించారు. బొకే, షీల్డు, శాలువాసహా అంతో ఇంతో క్యాష్ ముట్టజెప్పారు.    ప్రేక్షకులలో కామేశ్వరిగారూ, నా భార్యా పక్కపక్కనే కూర్చున్నారు.    ఇప్పుడు చూడండీ! ఆ బొకే, షీల్డూ, శాలువా శర్మగారు మీకిస్తారు, క్యాష్ ఇవ్వరు. దానిని భద్రంగా ఆయన జేబులో దాచుకుంటారని నా శ్రీమతికి ఆమె చెప్పారట! వారన్నట్టుగానే నేను ప్రవర్తించానట! చెప్పి పగలబడి నవ్వింది నా శ్రీమతి.   తన మనవడో, మనుమరాలో పెళ్లి రిసెప్షన్ కి కామేశ్వరిగారు పిలిస్తే కుటుంబం సహా వెళ్లాను.   ఫైవ్ స్టార్ హోటల్ లో డిన్నర్. కాక్ టయిల్ కూడా ఉంది. ఫ్యామిలీతో వచ్చాను కదా! అటు వైపే చూడకుండా కూర్చున్నాను. కూర్చుని ఇబ్బంది పడుతున్నాను. గమనించారు కామేశ్వరి.  తాగాలనుకుంటే వెళ్లి తాగండి శర్మగారూ! ఇబ్బంది పడకండి అన్నారు.   తాగండి శర్మగారూ! వెళ్లి రెడ్ వైన్ తెచ్చుకోండి! బాడీకి వైన్ మంచిదంటారు. వెళ్లండి అన్నారు.   నేను నా శ్రీమతివైపు చూస్తుంటే...  రమణిగారూ! (నా భార్యపేరు రమణి) మీరోసారి కళ్లు మూసుకోండి! శర్మగారో రెండు గుటకలేస్తారు అని నవ్వారు.  నేను వైన్ తెచ్చుకుని తాగేవరకూ ఊరుకోలేదు.   కోవిడ్ సమయంలో ఫోన్ చేశారు.   ఎలా ఉన్నారు శర్మగారు? అడిగారు.   బాగానే ఉన్నాను అన్నాను.   నవ్యవీక్లీ మూసేశారు కదా! కాలక్షేపం ఏమిటి? అడిగారు.   పుస్తకాలు చదువుకుంటున్నాను అన్నాను.   చదివిన పుస్తకాలు చాలుగానీ, టర్కీస్, కొరియన్ వెబ్ సిరీస్ చూడండి! ముందు ముందు మీకు పనికొస్తాయి అంటూ...ఏ ఏ సిరీస్ లు చూడాలో ఓ పెద్ద లిస్ట్ వాట్సప్ లో పంపారు.   మీరెలా ఉన్నారు? అడిగాను.   బాగానే ఉన్నానండీ! కాకపోతే ఇంకా ఎందుకు ఉన్నానా? అనిపిస్తున్నది. మనం ఎవరికీ ఉపయోగపడనప్పుడూ, దేనికీ ఉపయోగపడనప్పుడూ జీవించడం వృధా అనిపిస్తున్నది అని నవ్వారు.   బలేవారే! అన్నాను.   ఆరోగ్యం కోసం ఒకప్పుడు యోగా చేసేదాన్ని. ఇప్పుడు కాలూ చేయూ కూడి రావట్లేదు. దాంతో ప్రాణాయామంతో సరిపెట్టుకుంటున్నాను. చేతిలో సెల్ ఫోనూ, నోటిలో మాటా...గడచిపోతున్నాయి రోజులు అన్నారు.   రోజులు గడిపేస్తూ తొంభైలోకి అడుగుపెట్టారు.   అయినా నవ్వుతూనే ఉన్నారు. రాస్తూనే ఉన్నారు కామేశ్వరి.   ఆమె నవ్వుకి నిర్బంధం లేదు. వారి ఊహలకు వయసులేదు.  రాయక ఏం చేస్తారు?  నమ్మకం ఒక కళ. నమ్మింది రాయడం గొప్పకళ.   -జగన్నాథశర్మ