దేవుడే ఇచ్చాడు

ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు. అతను గుడికి వెళ్ళినప్పుడు , ఎడమ మరియు కుడి వైపున ఇద్దరు బిచ్చగాళ్ళు కూర్చునీ ఉండేవారు.. కుడి వైపున ఉన్నవాడు- ఓ దేవా, నువ్వు రాజుకు చాలా ఇచ్చావు, నాకు కూడా ఏదైనా ఇవ్వు!' అని అడిగేవాడు. అప్పుడు ఎడమ వైపున ఉన్నవాడు- ఓ రాజా! దేవుడు నీకు చాలా ఇచ్చాడు, నాకు కూడా ఏదైనా ఇవ్వు! అని అడిగేవాడు.  ఒక రోజు రాజు తన మంత్రిని పిలిచి, ఆలయం యొక్క కుడి వైపున కూర్చున్న బిచ్చగాడు ఎల్లప్పుడూ దేవుని నుండి అడుగుతాడు ఎడమ వైపున కూర్చున్నవాడు ఎల్లప్పుడూ నన్ను అడుగుతాడు, కాబట్టి నువ్వు ఇలా చేయి, ఒక పెద్ద పాత్రలో పాయసం నింపి అందులో బంగారు నాణెం వేయండి. దానిని కుండలో వేసి అతనికి ఇవ్వండి. మంత్రి కూడా అలాగే చేశాడు. ఇప్పుడు ఆ బిచ్చగాడు సంతోషంగా పాయసం తింటూ, మరొక బిచ్చగాడిని ఆటపట్టిస్తూ- హు, దేవుడు ఇస్తాడు అని అన్నావు, ఇప్పుడు దేవుడు నీకు పాయసం ఇచ్చాడా?, అని పాయసం తిన్నాడు. అతని కడుపు నిండిపోయింది, కాబట్టి అతను మిగిలిన పాయసాన్ని పాత్రను మరొక బిచ్చగాడికి ఇచ్చి- తీసుకో, నువ్వు కూడా తిను, అని అన్నాడు. ఒక రోజు రాజు వచ్చినప్పుడు, అతని ఎడమ వైపున ఉన్న బిచ్చగాడు అలానే ఉన్నట్టు చూశాడు. కానీ అతని కుడి వైపున ఉన్నవాడు కనిపించడం లేదు. రాజు ఆశ్చర్యపోయి అతనిని అడిగాడు- నీకు పాయసం పాత్ర అందలేదా? బిచ్చగాడు- అవును, నాకు అందింది,  అది ఎంత రుచికరమైన పాయసం, నేను దానిని కడుపు నిండా తిన్నాను!   నేను కడుపు నిండిన తర్వాత, ఇక్కడ కూర్చున్న మరొక బిచ్చగాడికి ఇచ్చి- మూర్ఖుడు ఎప్పుడూ దేవుడు ఇస్తాడు, దేవుడు ఇస్తాడు అని చెబుతూనే ఉంటాడు, దానిని తీసుకొని తినమన్నాను! రాజు నవ్వుతూ అన్నాడు- ఖచ్చితంగా, దేవుడే అతనికి దానిని ఇచ్చాడు!

సున్నపుపొడి శిక్ష.. బీర్బల్ సమయస్ఫూర్తి

ఒకసారి,  న్యాయస్థానం సైనికుడికి అర కిలో సున్నపురాయి పొడి తినమని శిక్ష విధించింది. తమలపాకులతో (తాంబూలం) సున్నపురాయి పొడిని తక్కువ పరిమాణంలో ఉపయోగిస్తున్నప్పటికీ, అర కిలో సున్నాన్ని ఒకేసారి తినడం ద్వారా మానవులు బతికే అవకాశం లేదు. కాబట్టి, అలాంటి శిక్ష పొందాడంటే అతను ఖచ్చితంగా చాలా పెద్ద తప్పు చేసి ఉండాలి! ఒక సైనికుడు సున్నం కొని మరుసటి రోజు న్యాయస్థానంలో తినాలి, కాబట్టి అతను దానిని కొనడానికి తమలపాకు దుకాణానికి వెళ్ళాడు. అయితే అంత సున్నం అడిగేసరికి దుకాణదారుడు ఖంగుతిన్నాడు. దుకాణదారుడికి ఏదో సందేహం వచ్చి, ఇంత పెద్ద మొత్తంలో సున్నం కొనడానికి కారణం అడిగాడు. శిక్షగా మరుసటి రోజు కోర్టులో సున్నం తినవలసి ఉందని ఆ వ్యక్తి చాలా విచారంగా చెప్పాడు. దానికి దుకాణదారుడు, “ఫర్వాలేదు. నేను నీకు సహాయం చేస్తాను. ముందుగా వెళ్లి అర కిలో నెయ్యి తీసుకురా” అని బదులిచ్చాడు. సైనికుడు ఆశగా చూసి, వెంటనే వెళ్లి నెయ్యి కొనుక్కొచ్చాడు. అతనికి అరకిలో సున్నం ఇస్తుండగా, దుకాణదారుడు “రేపు న్యాయస్థానంకు వెళ్లే ముందు ఈ నెయ్యి తాగు, ఆపై నీ శిక్ష ప్రకారం సున్నం తిను. ఆ తర్వాత, ఆలస్యం చేయకుండా వెంటనే ఇంటికి తిరిగి వెళ్ళు. ఇది నిన్ను రక్షించడంలో సహాయపడవచ్చు.” అని చెప్పాడు. మునిగిపోతున్న వ్యక్తి ఒక గడ్డిపోచనైనా పట్టుకుంటాడు! సైనికుడు చాలా ఆశలతో ఇంటికి వెళ్ళాడు, మరుసటి రోజు అతను దుకాణదారుడు చెప్పినట్లు చేశాడు. అర కిలో నెయ్యి తాగి ఇంటి నుంచి వెళ్ళాడు. శిక్షగా, అతను ప్రజలతో నిండిన న్యాయస్థానంలో అర కిలో సున్నం కూడా తిన్నాడు. సున్నం తిన్న వెంటనే శిక్ష పూర్తవడం వల్ల, జీవితంలోని చివరి క్షణాలను కుటుంబంతో గడుపుతాడని అతనిని ఇంటికి పంపేశారు. ఇంటికి చేరుకున్న వెంటనే సున్నం మొత్తం నెయ్యితో కలిపి వాంతి చేసుకున్నాడు. కొంత బలహీనంగా అనిపించినా, మరుసటి ఉదయం నాటికి బాగానే ఉన్నాడు. మాములుగా తన ఉద్యోగవిధికి సమయానికి ఆస్థానం చేరుకున్నాడు. అందరికీ అతను ముందు రోజు సున్నపుపొడిని తిన్నాడని తెలుసు, కానీ ఎలా బతికిఉన్నాడా అని అందరూ ఆశ్చర్యపోయారు. వెంటనే, ఈ వార్త రాజభవనం అంతటా వ్యాపించింది, ఈ విషయం అక్బర్‌కు కూడా చేరింది. అక్బర్ కూడా ఆశ్చర్యపోయాడు, వెంటనే ఆ సైనికుడిని ఆస్థానానికి పిలిచాడు. అక్కడికి చేరుకోగానే అక్బర్ అతను ఎలా బతికాడో ఆ రహస్యాన్ని చెప్పమన్నాడు. దుకాణదారుడి గురించి, నెయ్యి, వాంతుల గురించి అతను నిజాయితీగా మొత్తం కథను వివరించాడు. దుకాణదారుడి తెలివిని, దూరదృష్టిని చూసి అక్బర్ ఆశ్చర్యపోయాడు. అతను ఆ దుకాణదారుని తన ఆస్థానానికి పిలవడమే కాకుండా, ‘వజీర్-ఎ-ఆజం’ పదవి మీద తన రాజ్యసభలో సభ్యునిగా కూడా నియమించాడు. ఆ దుకాణదారుడి పేరు మహేష్ దాస్, కానీ అక్బర్ అతని పేరును ‘బీర్బల్‌’ గా మార్చాడు, అంటే “సమర్థవంతమైన మనస్సు కలిగిన వ్యక్తి” అని అర్ధం. ఇది మాత్రమే కాకుండా, అతనికి ‘రాజు’ అనే బిరుదుతో కూడా సత్కరించారు. అతను అక్బర్ ఆస్థానంలోని తొమ్మిది రత్నాలలో ఒకడిగా పేరు పొందాడు. జీవితంలో మన పురోగతి వాస్తవానికి మనం ఏ రకమైన వ్యక్తులతో అనుబంధం కలిగి ఉంటామో దానిపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మనం ఉన్న వాతావరణం నేరుగా మన జీవనశైలిని ప్రభావితం చేస్తుంది, మన జీవనశైలి మన విధిని రూపొందిస్తుంది. నిజమైన ప్రతిభను గుర్తించేందుకు నిష్పక్షపాత దృష్టిని, వారిని బహిరంగంగా గౌరవించే, అంగీకరించే ఉదార హృదయాన్ని మనం అలవర్చుకోవాలి.

సత్యం.. అబద్ధం

అబద్ధం అందంగా, సత్యం కఠినంగా ఎందుకు ఉంటుది? ఈ చిన్న కథ చదివితే మీకే అర్థమవుతుంది అబద్ధం అందంగా ఉంటుంది కానీ సత్యం మాత్రం చాలా కఠినంగా ఉంటుంది. ఇది చాలా సార్లు మనం వినే ఉంటాం. అయితే ఈ నానుడి వెనక ఒక చిన్న కథ ప్రాచుర్యంలో ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. అబద్ధాన్ని గొప్పగా చెప్పొచ్చు, కానీ నిజాన్ని మాత్రం గొప్పగా చెప్పలేం. ఎందుకంటే నిజం నిజంగానే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే సత్యం చాలా కఠినంగా ఉంటుంది. అందుకే అబద్ధం వినడానికి, చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. సత్యం, అబద్ధం ఈ రెండింటి మధ్య తేడాను అద్భుతంగా వివరించే ఓ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకరోజు సత్యం, అబద్ధం రెండూ నడుచుకుంటూ పోతుంటాయి. అబద్ధం మాయ మాటలు చెబుతూ.. ఎవరినీ మోసం చేయాలా.? ఎలా నమ్మించాలా అని చూస్తుంది. కానీ సత్యం మాత్రం నిజాలు మాట్లాడుతుంది. మోసం చేసే అలవాటు ఉన్న అబద్ధం సత్యాన్ని కూడా మోసం చేయాలని నిర్ణయించుకుంటుంది. అలా నడుస్తున్న సమయంలో ఓ సరస్సు వస్తుంది. వెంటనే అబద్ధం మాట్లాడుతూ.. 'చాలా వేడిగా ఉంది. మనం ఈ సరస్సులో స్నానం చేద్దాం' అని సత్యంతో చెబుతుంది. అబద్ధం మోసం తెలియని సత్యం దుస్తులు తీసేసి నీటిలోకి దిగుతుంది. అయితే అబద్ధం మాత్రం నీటిలోకి దిగకుండా సత్యం దుస్తులను ఎత్తుకొని పారిపోతుంది. ఆ తర్వాత సత్యం దుస్తులు ధరించి బయట తిరడం మొదలు పెడుతుంది. దీంతో తర్వాతి రోజు నుంచి అబద్ధాన్ని ప్రజలు ఇష్టపడడం మొదలు పెడతారు. కానీ దుస్తులు లేకుండా ఉండే సత్యాన్ని చూడ్డానికి ఇష్టపడరు. అబద్ధాన్నే సత్యంగా నమ్మడం ప్రారంభిస్తారు. కానీ కొన్ని రోజుల తర్వాత అబద్ధం అసలు రూపం బట్టబయలు అవుతుంది. ప్రజలకు అసలు విషయం తెలిసి సత్యం గొప్పతనాన్ని తెలుసుకుంటారు. ఈ కథ మనకు నేర్పే నీతి: ఈ చిన్న కథ మనకు చెబుతోన్న నీతి ఏంటంటే. ప్రపంచంలో చాలా మంది అబద్ధాన్ని సత్యంగా నమ్మేస్తుంటారు. కానీ నిజమైన సత్యం మాత్రం నిశ్చలంగా నిలిచి ఉంటుంది. సమయం వచ్చినప్పుడు బయటకు వస్తుంది.

ఆరాధన

మా పిన్నికూతురు పెళ్లిలో మొదటిసారి పూర్ణని చూశాను. తెల్లగా, పొడుగ్గా ఉంది. రెండు జడలతో ఉంది. లంగా, ఓణీ మీద ఉంది. ఇంతలేసికళ్లతో, అంత లేతమొహంతో ఊరిస్తున్నట్టుగా ఉంది. కుర్రకారంతా ఎవర్రా? ఎవరీ అమ్మాయి? అని వాకబులో పడింది. వాకబు చేయగా చేయగా ఆఖరికి తెలిసిందేమిటంటే...     పూర్ణ వంట బ్రాహ్మణుని కూతురు.   దాంతో కుర్రకారంతా చూపులు మరల్చుకున్నది. ఆ రోజుల్లో వంట బ్రాహ్మణుల్నీ, వారి పిల్లల్నీ తక్కువగా చూసేవారు. పదిమందికీ వండిపెట్టుకునేవాడితో కబుర్లేమిటని వారిని పలకరించేవారు కాదు.   పూర్ణ వంటబ్రాహ్మణుని కూతురే కాదు, తల్లి కూడా లేదామెకు. దానాదీనా పూర్ణని అగ్రహారంలో పట్టించుకునేవారు కాదు. అరకొరా దొంగ చూపులుచూసి, చొంగకార్చుకోవడమే తప్ప, తెగించి పూర్ణతో మాట్లాడే మనిషే లేడు. నేను మాట్లాడేవాణ్ణి. తెగించి జోకులు కూడా వేసేవాణ్ణి. నా జోకులకు తెగనవ్వేది పూర్ణ. పాడమంటే సినిమా పాటలు పాడేది. రాయమంటే లలితగీ తాలు రాసేది. గీయమంటే బొమ్మలు గీసేది.   ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు? ఎవరు నేర్పారు? అంటే...నాన్నంటూ నవ్వేది పూర్ణ.   వంట చేయడాన్ని తక్కువ చేసి చూస్తారుగాని, వంట చేయడం అంటే పాట రాయడం లాంటిది. బొమ్మ గీయడం లాంటిదంటూ పూర్ణకి వాళ్లనాన్న ఎప్పుడో చెప్పాట్ట! పాటకి గమకాలూ, బొమ్మకి రంగులూ ఉన్నట్టే వంటకి వంద రుచులు ఉంటాయి అన్నాట్ట! చేసిన వంటకి రుచి నెలా కల్పించాలన్నదే ధ్యేయం కావాలి. బాగా వంట చేయడం వస్తే...బొమ్మలు వేయడం, పాటలు రాయడం వాటంతటవే వస్తాయి అన్నాట్ట.  నేను వంటలు బాగా చేస్తాను. అందుకే నాకు పాటలు పాడడం, రాయడం, బొమ్మలు గీయడం ఇట్టే వచ్చేశాయి అనేది పూర్ణ.   డిగ్రీ చదివేరోజుల్లో పూర్ణ టిఫిన్ బాక్స్ దొంగిలించేవాణ్ణి. రోజుకో స్పెషల్ ఉండేది అందులో. మసాలా వడలూ, మిర్చీబజ్జీలూ, మిక్చర్, కారప్పూస, మైసూర్ పాక్...రకరకాల చిరుతిళ్లుండేవి. తినేసి, ఖాళీ బాక్స్ ఇస్తూ సారీ చెబితే...నువ్వు సారీ చెప్పడం దేనికి? నీకోసమే తెచ్చాననేది పూర్ణ. పగలబడి నవ్వేది.      టెన్త్ ఫస్ట్ క్లాస్. ఇంటర్ ఫస్ట్ క్లాస్. డిగ్రీలో కూడా పూర్ణకి ఫస్ట్ క్లాస్ తప్పనిసరి.  బాగా చదివేదామె. నావన్నీ అత్తెసరు మార్కులే! ఎలాగోలా గట్టెక్కేవాణ్ణి.   ఒకసారి వాళ్లింటి కానుగు చెట్టు నీడలో అడిగిందిలా.   నీకు చదువు మీద పెద్దగా ఇంట్రస్ట్ లేదుకదూ?  లేదన్నాను.   మరి దేనిమీద ఉంది?   ఏదేని వ్యాపారం చెయ్యాలి. లక్షలూ కోట్లూ ఆర్జించాలన్నాను.   ఏదేని కాదు. ఏ వ్యాపారం చెయ్యాలో త్వరగా తేల్చుకో! లేకపోతే మనిద్దరి భవిష్యత్తూ అగమ్యగోచరం అవుతుందన్నది పూర్ణ.   మనిద్దరి భవిష్యత్తు?!   ఆ మాట నాకు అర్థంకాలేదు. తర్వాత మెల్ల మెల్లగా అర్థమయింది. పూర్ణ నన్ను ప్రేమిస్తున్నది. అమ్మో అనుకున్నాను. భయపడ్డాను. తాతగారింట ఉండి, అగ్రహారంలో చదువుకుంటున్నాను. పిచ్చిపిచ్చివేషాలేస్తే పుచ్చులు లేచిపోతాయి. తాతా, మామా తోలు తీస్తారనుకున్నాను. ఆనాటి నుంచీ జాగ్రత్తపడ్డాను. పూర్ణని దూరం చేశాను. డిగ్రీ పరీక్షలు రాశానో లేదో...అగ్రహారాన్ని వదిలేశాను. ఒకరకంగా పారిపోయి, ఇక్కడకి వచ్చేశాను.   పదేళ్లు గడచిపోయాయి.   ఉద్యోగినయ్యాను. పెళ్లయిపోయింది. తండ్రినయ్యాను. ఓ పాప నాకు. మా బావగారికూతురి పెళ్లికి విశాఖ వచ్చాను. బావగారు డిప్యూటీ కలెక్టర్. బాగానే సంపాదించారు. కూతురి పెళ్లి ఘనంగా చేస్తున్నారు. జిల్లాలో పేరెన్నికగన్న ‘పూర్ణా క్యాటరర్స్’ తో వంటంటే...పూర్ణ గుర్తొచ్చిందప్పుడు. ఎక్కడ ఉన్నదో? ఎలా ఉన్నదో అనుకున్నాను.   వంటశాల ఘుమఘుమలాడిపోతున్నది. పాతిక మంది పైబడే ఉన్నారు వంటవాళ్లు. ఉప్మా, కొబ్బరిచట్నీ చేశారు. అదిరిపోయింది. వడా, సాంబార్, పూరీ, కూర కూడా వేడివేడిగా వడ్డించారు. అన్నీ బాగున్నాయి. బ్రేక్ ఫాస్ట్ కి వంకపెట్టేదిలేదన్నారు పెళ్లివారు.   లంచ్ సిద్ధమవుతున్నది. వెయ్యిమందికి ఆతిథ్యం ఇచ్చేందుకు ఆయితమవుతున్నారు.   వేళకి భోజనాలవ్వాలి. ఆలస్యం కాకూడదు. క్యాటరర్స్ కి చెప్పక్కరలేదనుకో, అయినా మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. అందుకని అప్పుడప్పుడూ వారిని హెచ్చరించడం నీ వంతు అన్నారు బావగారు. ఓ బాధ్యతను నాకు అప్పగించారు. దాంతో కిచెన్ లో తచ్చాడడం మొదలెట్టాను. కాసేపటికి తెలియని హడావుడి ప్రారంభమయింది. ఏమయింది? ఏమయింది అంటే...మా మేడంగారు వస్తున్నారు అన్నారు వంటవాళ్లు. వేళపట్టున వంటలవ్వాలి. వంటశాల శుభ్రంగా ఉండాలి. కచ్చకచ్చాగా ఉంటే కోపగిస్తారామె అన్నారు. అబ్బో అనుకున్నాను. అంతలో ఆ మేడం రానేవచ్చారు. చూసి, షాకయ్యాను.   పూర్ణ!!  మిసమిసలాడిపోతున్నది. మెళ్లో బంగారు గొలుసులూ, చేతికి బంగారు గాజులూ...కళకళలాడిపోతున్నది. ఖరీదైన చీరలో ప్రత్యక్షమయింది. వస్తూనే ముందుగా స్థాలీపులాకన్యాయంగా వంటలన్నీ రుచి చూసింది. బాగున్న వాటిని మెచ్చుకున్నది. రుచి తక్కువగా ఉన్నవాటిని, ఏం చేస్తే వాటి రుచి ఎక్కువవుతుందో చెప్పింది. టైం చూసింది.    లంచ్ రెడీ కదా? అడిగింది. రెడీ అంటే రెడీ అన్నారు వంటవాళ్లు. పెళ్లివారికి చెప్పండి మరి అన్నది.    అప్పుడు కేకేశారు నన్ను. అంతవరకూ పూర్ణ కంటబడక, చాటుగా ఉన్న నేను తప్పనిసరై బయటపడ్డాను. నన్ను చూస్తూనే పూర్ణ ముఖం విప్పారుకున్నది. ఆనందించింది.   బాగున్నావా? అడిగింది. బాగున్నట్టుగా తలూపాను. మాటాడలేదు.   ఏం చేస్తున్నావు? అడిగింది.   చేస్తున్న ఉద్యోగం గురించి మెల్లమెల్లగా చెప్పాను.   డిప్యూటీ కలెక్టర్ గారు నీకు ఏమవుతారు?  బావగారవుతారు. వారి చెల్లెల్నే నేను పెళ్లిచేసుకున్నాను అన్నాను.  పిల్లలా? అడిగింది పూర్ణ.   ఓ పాప అన్నాను.   తాను ఇబ్బంది పడకుండా, నన్ను ఇబ్బంది పెట్టకుండా పూర్ణ అలా మాట్లాడుతుంటే ధైర్యం వచ్చింది. ఫంక్షన్ హాల్లో ఉన్న నా శ్రీమతిని పిలిచాను. పరిచయంచేశాను పూర్ణకి. అంతలో ‘మమ్మీ’ అంటూ పాపవ చ్చిందక్కడకి. దానిని కూడా పరిచయం చేశాను.    పేరు...పేరు...పూర్ణ అని చెప్పాను. సంతోషించింది పూర్ణ. పాపని దగ్గరగా తీసుకుని ముద్దుపెట్టుకున్నది. తన మెళ్లో గల ఒంటపేట గొలుసు ఒకటి తీసి, పాప మెళ్లో వేసింది.   ఆశ్చర్యంగా చూస్తున్న నా శ్రీమతితో అన్నదిలా పూర్ణ.    మీ ఆయన డిగ్రీలో నా క్లాస్ మేటమ్మా! ఆయనిచ్చిన సలహానే ఈ వ్యాపారం. ఇందులో లక్షలూ, కోట్లూ ఆర్జించాలని నాకు లేదు. కాకపోతే పదిమందికీ ఆదరవు అవుతుందని, అచ్చొచ్చిందేనని పెద్ద ఎత్తున ప్రారంభించాను. సక్సెసయ్యాను. అందుకు మీ ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకోవాలిగా! అదే మీ పాపమెళ్లో వేసిన గొలుసు.     ఆనందించింది నా శ్రీమతి.   పూర్ణా క్యాటరర్స్...చాలా పెద్దపేరు మీది? పూర్ణని పొగిడింది నా శ్రీమతి. ఎవరో పిలిస్తే...వస్తానండీ అంటూ వెళ్లిపోయింది.    మీ ఆవిడా, నీ కూతురూ ఇద్దరూ బాగున్నారు అన్నది పూర్ణ.   సరేగానీ! నీ సంగతి చెప్పలేదు, మీవారూ...పిల్లలూ... అని నేనడుగుతుంటే మాట మధ్యలోనే అందుకుని అన్నదిలా పూర్ణ.   నాకు పెళ్లికాలేదు, కాదు, నేను పెళ్లి చేసుకోలేదు.     ఏం మట్లాడాలో తెలియక వెర్రిచూపులు చూశాన్నేను.   కూరలకీ పచ్చళ్లకీ వ్యక్తిత్వాలు ఉండవు. కాని, మనసుపెట్టి చేస్తే వాటికే వ్యక్తిత్వాలు ఏర్పడినప్పుడు, మనసుపెట్టి అభిమానించిన వ్యక్తులకి వ్యక్తిత్వాలు లేకపోతే ఏం చెయ్యాలి? అందుకే ఒంటిరిగా ఉండిపోయాను అన్నది పూర్ణ. గబగబా నాలుగడుగులు వేసి, కారెక్కి వెళ్లిపోయింది.     ఎందుకో ప్రేమకీ, వంటకీ, సినిమాలకీ భావోద్వేగాలే ప్రధానం అనిపించింది. వడ్డనలకు సిద్ధమయ్యాను. -జగన్నాథశర్మ

కలిసి ఉంటే కలదు సుఖం

ఒక గ్రామంలో రెండు వీధులు ఉండేవి. మధ్యలో ఓ చిన్న నీటి కొలను ఉండేది. దాని ముందు శ్రీకృష్ణుడి విగ్రహం ఒకటుంది. ఆ రెండు వీధుల మధ్య సఖ్యత లేకపోవడంతో.. ఎప్పుడో కానీ, ఆ విగ్రహానికి పూజలు చేసేవారు కాదు. ఈ విషయం ఆనోటా ఈనోటా వ్యాపించి పొరుగూరిలోని ఓ కృష్ణ భక్తుడికి చేరింది. 'ఒక పౌర్ణమి రోజు సాయంత్రం నేను మీ ఊరు వస్తాను. ఆ రోజు శ్రీ కృష్ణుడి విగ్రహానికి పూజ చేద్దాం. పాటలు పాడుదాం. పూజకు కావాల్సిన వస్తువులతోపాటు పూలహారం కూడా తీసుకురండి. పాటలు పాడే వారిని నేను తీసుకువస్తాను' అని గ్రామస్తులకు కబురు పంపాడు ఆ భక్తుడు. పౌర్ణమి రోజు రానే వచ్చింది. ఒక సత్కార్యం చేయబోతున్నందుకు ఆ భక్తుడు ఎంతో సంతోషపడ్డాడు. 'ఎప్పుడెప్పుడు సాయంత్రం కాబోతుందా' అని ఆశగా ఎదురు చూసి పాటలు పాడే బృందంతో కలిసి ఆ గ్రామానికి చేరాడు. అయితే అక్కడ పరిస్థితి వేరుగా కనిపించింది. సఖ్యత లేని ఆ గ్రామస్తులు విగ్రహానికి పూలహారం తీసుకు రాలేదు. 'అది తూర్పు వీధి వారి పని, అది పడమటి వీధి వారి పని' అని రెండు వీధుల వారూ పంతాలకు పోయి హారం తీసుకు రాలేదని ఆ భక్తుడికి అర్థమయ్యింది. 'సరే, జరిగిందేదో జరిగింది. మీ ఇళ్లల్లో పూల మొక్కలు ఉన్నాయా?' అని గ్రామస్తులను అడిగాడు. 'ఎందుకు లేవు? అందరి ఇళ్లల్లోనూ ముద్దబంతి మొక్కలు ఉన్నాయి' అని ఒకేసారి బదులిచ్చారు. ఆ భక్తుడు తన బృందంతో కలిసి ప్రతి ఇంటికీ వెళ్లాడు. ఒక్కో ఇంటి నుంచి ఒక్కో ముద్దబంతి పుష్పాన్ని కోయించుకొని వచ్చాడు. గ్రామానికి చెందిన మహిళల సాయంతో పెద్ద పూలహారాన్ని అల్లించాడు. విగ్రహానికి పూలమాల వేస్తూ 'విడిగా ఉన్నప్పుడు ప్రతి పువ్వూ దేనికదే ప్రత్యేకం. అన్నిటినీ దారంతో కలిపితే అది హారంగా మారింది. దేవుడి మెడలో అలంకారమైంది. మీరు పంతాలు, పట్టింపులకు పోయి 'ఎవరికి వారే యమునా తీరే' అన్నట్లుగా ఉండకండి. కలిసి పనిచేస్తే అందరూ బాగుపడతారు. కలహాలు కొనసాగిస్తే అందరూ ఇబ్బందిపడతారు. పూలహారంలో పూలు ఒదిగిపోయినట్లు మీరంతా కలిసి జీవించండి' అని హితవు చెప్పాడు. వాస్తవం గ్రహించిన గ్రామస్తులు ఆ సాయంత్రం అంతా శ్రీ కృష్ణుడి విగ్రహం ముందు ఆటపాటలతో ఆనందంగా గడిపారు.

లౌక్యమూ లేక సౌఖ్యమూ లేదు....

ముక్కుసూటిగా మాట్లాడడం, మొహమ్మీద గుద్దినట్టుగా మాట్లాడడం తప్పురా! అంత నిర్మొహమాటంగా మాట్లాడకూడదు. అలా మాట్లాడితే కష్టం. జీవితంలో పైకి రాలేవు. సుమతిశతకకారుడు ఏం చెప్పాడు?  ఎప్పటి కెయ్యది ప్రస్తుత  మప్పటి కా మాటలాడి అన్యుల మనముల్   నొప్పింపక తానొవ్వక   తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నాడు.   అంటే అర్థం ఏమిటి? ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి. అప్పటికది మాట్లాడాలి. మాట్లాడి, తాను బాధపడక, ఇతరులను బాధించక తప్పించుకుని తిరగాలి. అలా తిరిగినవాడే ధన్యుడు అన్నాడు.    ధన్యుడు అంటే ఎవరనుకున్నావు? పొగడదగినవాడు. సుఖాన్ని పొందినవాడు. పుణ్యాత్ముడు. ధనాన్ని చేజిక్కించుకున్నవాడు. ఇష్టకార్యం నెరవేర్చుకున్నవాడు.   మాయచేసో, మర్మంచేసో మూడోకంటికి తెలియకుండా మనపని మనం చక్కదిద్దుకోవాలి. అంతేగాని, యాగీలుచేస్తూ కూర్చుంటే...అంతే సంగతి అని తెలుసుకో!  తనువున విరిగిన యలుగుల  ననువున బుచ్చంగవచ్చు నతి నిష్ఠురతన్  మనమున నాటిన మాటలు  విను మెన్ని యుపాయములను వెడలునె యధిపా! అన్నాడు విదురుడు. మహాభారతం ఉద్యోగపర్వంలోనిది ఈ పద్యం. ధృతరాష్ట్రునికి మంచిచెడులు చెబుతున్నాడు విదురుడు. ఈ పద్యం అర్థం ఏమిటో తెలుసా?  శరీరంలో దిగిన బాణాలను అతి కష్టమ్మీద బయటకు తీయొచ్చు. ఆ బాణాలు చేసిన గాయాలను మాన్పవచ్చు. కాని, ఇతరులకు కష్టాన్ని కలిగించేట్టు మాట్లాడిన  మాటలను, అవీ,  సూటిగా మనస్సులో గుచ్చుకున్న మాటలను ఎన్ని ఉపాయాలు ప్రయోగించినా తొలగించడం కష్టం అన్నాడు విదురుడు. ఈ బోధకూడా ధృతరాష్ట్రుని చెవికెక్కలేదు. అప్పుడు ఇంకో మాటన్నాడు. ఏఁవన్నాడంటే...    ఎదిరికి హితమును బ్రియమును మదికింపును గాగ బలుకు మాటలు పెక్కై  యొదవినను లెస్స యటుగా   కిది యది యన కూరకునికి ఎంతయు నొప్పున్!   దీని అర్థం ఏమిటో తెలుసా? ఎదుటివాడికి మేలయినవి, ఇష్టమైనవి, వాడి మనసును సంతోషపరిచే మాటలు మాత్రమే మనం మాట్లాడాలి. అలా మాట్లాడితేనే మంచిది. మనకలా మాట్లాడడం ఇష్టంలేదూ, ఊరకే ఉండడం ఇంకా మంచిదన్నాడు విదురుడు. వేదాలు ఏమన్నాయి? వాక్శక్తిని వృధాచేసుకోకూడదు అన్నాయి. భగవద్గీత ఏమన్నది? వాక్కును తపస్సులా భావించాలన్నది.   చెప్పినవన్నీ గుర్తుపెట్టుకో! మనసుకు పట్టించుకో! పట్టించుకోలేదనుకో! నిన్ను ‘మూర్ఖుడు’ అంటుంది ఈ సమాజం. నీలాంటి మూర్ఖుణ్ణీ, ఎండుకట్టెనీ వంచడం నా వల్లకాదు. పైగా ప్రమాదం కూడా. వంచితే ఎండుకట్టె విరిగిపోతుంది. నీలాంటివాడు పేట్రేగిపోతాడు.   ఇంత చదువుకున్నావు. చదువుతోపాటు సంస్కారం రావాలి కదరా? రాలేదంటే...నిన్నేమనాలి? పడగమీది మణి అనాలి.   లౌక్యం నేర్చుకోరా! లౌక్యాన్ని ప్రదర్శించు. హాయిగా ఉంటుంది. ఏ గొడవలూ ఉండవు. మనుషులూ, మహరాజులూ లౌక్యంగా ఎలా నెట్టుకు రావాలో కణికుడు ఏనాడో చెప్పాడ్రా! కణికుడు ఎవరంటావా? మహాభారతంలో దుర్యోధనుని కొలువులోని మంత్రి. కణికుడు ఏం చెప్పాడూ?  ఫలానావాడు నమ్మదగినవాడూ, ఫలానావాడు నమ్మదగనివాడూ అని మనం అనకూడదు. ఎవరినీ మనం నమ్మకూడదు. ఎవరినీ నమ్మకుండా ఓ మహరాజులా మన రక్షణ మనమే చూసుకోవాలి. అలాగే మన రహస్యాలోచనను కూడా మనమే రక్షించుకోవాలి. ఏనాడూ ఎవరికీ ఏదీ చెప్పకూడదు. అంతా రహస్యంగా దాచుకోవాలి. దాచుకుంటేనే నువ్వు అనుకున్నది సాధించగలవు. లేనిపక్షంలో అది సాధించలేవుసరిగదా, నువ్వు నవ్వులపాలవుతావు.   అలాగే...తిట్టడానికైనా, కొట్టడానికైనా సమయం సందర్భం చూసుకోవాలిరా! తగిన సమయం వచ్చేంత వరకూ శత్రువును భుజాలమీద మొయ్యాలి. సమయం వచ్చిందీ మట్టికుండను రాతిమీద వేసి కొట్టునట్టుగా శత్రువును నాశనం చెయ్యాలి.  గతంలో చేసింది చెప్పుకోదగిన అపకారంకాదని శత్రువును చేరదీయకూడదు. ముల్లు చిన్నదే అయినా అది పాదంలో గుచ్చుకుంటే...నడక సాధ్యం అవుతుందా? కాదుకదా! అలాగే వీడి వల్ల ఏమవుతుంది? వీడేం చేస్తాడని శత్రువును చిన్న చూపు చూడకూడదు. అలాగే వాడితో కలసి మెలసి తిరగకూడదు. శత్రువును ఎప్పుడూ సామదానభేదోపాలయాలతో లేదా దయచూపించినట్టుగా నటించి, హెచ్చరిస్తూ...నమ్మకం కలిగించి, సమయం వచ్చినప్పుడు మట్టుబెట్టాలి. మట్టుబెట్టడం అంటే...చంపమనికాదురొరేయ్! పదిమందిలో వాడి పరువుతియ్యాలి. స్నేహితుడైనా, బంధువైనా వాడు మనకి శత్రువు అనుకున్నప్పుడు, చెయ్యాల్సింది చేసేయ్యాలి. చేతులు దులుపుకోవాలన్నాడు కణికుడు.     పని కావాలి గాని, మాటలు అనవసరం. లౌక్యాన్ని ఎలా ప్రదర్శించాలో చిన్న ఉదాహరణ చెబుతాను, విను.  పొద్దున్నే ఫ్రెండింటికి వెళ్లి ఓ అయిదు వేలు కావాలని అడుగు. లేవంటాడు ఫ్రెండు. లేవనుకు! అర్జంట్! అయిదువేలు ఎలాగైనా కావాల్సిందే! లేకపోతే చాలా ప్రమాదంలో పడతాను. నా కష్టాలు నీకు చెప్పుకోలేనను. అయినా ఫ్రెండ్ కరగలేదనుకో! అప్పుడు పోనీ! ఓ అయిదు వందలు ఇవ్వుగురూ! నీ మేలు మరచిపోలేనను. కన్నీరు పెట్టుకో! అప్పుడు నీకు చప్పున అయిదువందలిచ్చేస్తాడు నీ ఫ్రెండు. ఇక్కడే అసలు కిటుకు ఉంది. నీకు కావాల్సింది అయిదువందలే! కాని, అయిదు వేలంటూ అడిగి, ఆఖరికి అయిదువందలని లౌక్యాన్ని ప్రదర్శించావు. సక్ససయ్యావు. నేర్చుకోరా! చాలా విషయాలు చెబుతాను, నేర్చుకో!  నేర్చుకుంటానుగానీ, దీన్ని లౌక్యం అని ఎలా అంటాం? మోసం కదా అంటారు. అడిగాన్నేను.   నీ మొహం! నమ్మినచోట చేసిన దానిని మోసం అంటారు. నమ్మనిచోట చేసిన దానిని లౌక్యం అంటారు. ఉప్పూ, కర్పూరంలా రెండూ ఒకేలా ఉంటాయిగాని, వేర్వేరు. అర్థం చేసుకో! అలాగే మనం చేస్తే దానిని లౌక్యం అనాలి. అదే ఇతరులు చేస్తే మోసం అనాలి. బుర్రలోపెట్టుకో! గందరగోళం పడకు! గాభరాపడకు. మెల్లిగా మాట్లాడు. అవకాశం దొరికిందీ కుర్చీమడతబెట్టేయ్!!  ఆఖరిగా ఓ మాట! ‘లౌక్యం’ అని టైటిల్ పెట్టినందుకే ఓ సినిమా సూపర్ డూపర్ హిట్టయింది. మరి దానిని అనుసరిస్తే...ఆలోచించుకో! నీకు తిరుగులేదు. తిరుగుండదు.   - జగన్నాథశర్మ

తులసికోట: గోవ్యాఘ్రసంవాదం

కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం...ఈ నాలుగునెలలూ అమ్మ తులసికోట దగ్గరే ఎక్కువగా గడిపేది. తెల్లారుజామున ఎప్పుడు లేచేదో ఏమో! నేను లేచేసరికి తులసికోట చుట్టూ దీపాలు వెలుగుతూ ఉండేవి. బంగారురంగులో కోట మెరిసిపోయేది.   ఓం తులసీదేవ్యే చ విద్మహే  విష్ణుప్రియాయై చ ధీమహి  తన్నో వృందా ప్రచోదయాత్!  తులసిగాయత్రీమంత్రంతో అందరినీ అమ్మ మేల్కొలిపేది. నూట ఎనిమిదిసార్లు గాయత్రిని పఠించేదమ్మ. తర్వాత శ్రీతులసిస్తోత్రాన్ని చేసేది.   నమస్తులసి కల్యాణి నమో విష్ణుప్రియే శుభే  నమో మోక్షప్రదే దేవి నమః సంపత్ర్పదాయికే! అనేది. ఆ తర్వాత గోవ్యాఘ్రసంవాదాన్ని పాటగా వినిపించేది. ఆ పాటంటే నాకు చాలా ఇష్టం. అడవిలో తనకి చిక్కిన గోవును పులి తింటానంటుంది. తిందూగాని, ముందు నా బిడ్డకి పాలిచ్చి రానీ అంటుంది గోవు. పులిని ప్రాధేయపడుతుంది. బాగా ఆకలిమీద ఉన్నాను, ఇచ్చినమాట నిలబెట్టుకో! తప్పుగా ప్రవర్తించకు! వెళ్లిరా అంటుంది పులి. బిడ్డను చేరుకుంటుంది గోవు. బిడ్డకి పాలిచ్చి, దానికి జాగ్రతలుచెబుతుంది. తర్వాత సాటిగోవుల్ని తన బిడ్డని దయతో చూడమని వేడుకుని, పులిని చేరుకుంటుంది గోవు. చేరుకుని తనని తినమంటూ...  అన్నరావో! పులీ రావో!  ఆకలంటే దోషమొచ్చును!  పచ్చికండలు, పచ్చినెత్తురు   గుక్కనిండా తినుర అన్నా!   అంటూ చాలవంటే...మూపుమీది కండలు ఉన్నాయి, పొందికగా ఉన్నాయి. కమ్మగా తినమంటుంది. అమ్మగొంతులో ఆ పాట నన్ను కదలించివేసేది. కన్నీరుపెట్టించేది. చెప్పేది సూటిగా చెప్పాలి. బొమ్మ కళ్లకుకట్టాలి అనేదానికి ఇంతకుమించిన కథనరీతి లేదనిపించింది. కథను చెప్పేతీరూ, సన్నివేశాన్ని దృశ్యమానంచేయడం ఇక్కణ్ణుంచే  నేర్చుకున్నాను నేను. నా అభ్యాసాన్ని పక్కనపెడితే...అసలు ఈ గోవ్యాఘ్రసంవాదం ఎవరు రచించారు? ఎందులోనిది ఈ కథ అని వెదికితే...చాలా విషయాలు తెలిశాయి.     పదహారవ శతాబ్దంలో వచ్చిన కథాకావ్యాలలో భోజరాజీయం ప్రముఖమైనది. దీనిని అనంతామాత్యుడు రచించాడు. సర్పతి అనే సిద్ధుడు, భోజరాజుకి వినిపించిన కథల సమాహారమే భోజరాజీయం. ఇది ఏడు ఆశ్వాసాల కథా కావ్యం. మా అమ్మ పాడిన గోవ్యాఘ్ర సంవాదం కథ ఈ కావ్యం లోనిదే! అయితే ఇది పద్య కావ్యం. దీనిని పాటగా మలిచినవారు ఎవరన్నది తెలుసుకోలేకపోయాను. అమ్మను అడిగినా, లాభంలేకపోయింది.   పాటగా రాసిందెవరో తెలీదురా! మా అమ్మపాడేది. నేను విన్నాను, నేర్చుకున్నాను, పాడుతున్నాను అన్నదంతే! ఈ కథకు సంబంధించి ఓ పద్యం తెలుసన్నది. చెప్పిందిలా.    ఆడకు మసత్య భాషలు  కూడకు గొరగాని వాణి గొంకక యేరు లే  గ్గాడిన నెదురుత్తర మీ  జూడకు విని వినని వాణి చొప్పున జనుమీ!  దీని అర్థం ఏమిటో తెలుసా? అసత్యాలు మాట్లాడకూడదు. అక్కరకురానివారితో స్నేహంకూడదు. నీకు హానికలిగించేమాటలు ఇతరులు మాట్లాడుతుంటే...వినీ వినట్టుండాలి. అడిగితే ఎదురుజవాబుచెప్పకుండా అక్కణ్ణుంచి వెళ్లిపోవాలి.   మీ పెద్దన్నయ్యకి నాగార్జునసాగర్ లో ఉద్యోగం వచ్చినప్పుడు, వాడక్కడ ఒంటరిగా ఉండాల్సిరావడంతో...మీ నాన్నగారు ఈ పద్యం వాడికి వినిపించి, అర్థాన్ని విడమరిచారు అన్నది అమ్మ. దూడకి ఆనాడు ఆవు చెప్పిన జాగ్రత్తలివి అన్నది.   వ్యక్తిత్వ వికాసం, టొప్పీ టొపారం అంటూ ఆంగ్లంనుంచి అనేక వందలపుస్తకాలు తెలుగులోకి అనువాదం అవుతున్నాయి. ప్రచురణకర్తలు కూడా వాటినే ప్రధానంగా ప్రచురిస్తూ వస్తున్నారు. అందులో ఉన్నదేమిటో...మన కావ్యాల్లో లేని దేమిటో నాకు ఈనాటికీ అర్థంకాదు. సరళవ్యావహారికంలో రాస్తే దేనినయినా పాఠకులు చదువుతారు. మూలాన్ని తెలుసుకోవాలంతే!  అదలా ఉంచితే ఇంట్లో ఈ తులసి కోట ఎందుకు? ఈ పాటలూ, స్తోత్రాలూ దేనికి? ఓసారి అమ్మను అడిగాను. ఎందుకంటే...తులసి ఇంట్లో ఉండడం చాలా మంచిదిరా! అది జలుబు, దగ్గు, ఫ్లూ...ఇంకా అనేక రకాల రోగాలను పోగొడుతుంది. గాలిని శుద్ధిచేస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇంట్లోని వారికి పిచ్చి పిచ్చి ఆలోచనలు రానివ్వదు. మంచి ఆలోచనలు కలిగిస్తుంది. డబ్బుకి కూడ కొదవ ఉండదంటారు. అదృష్టాన్ని తెస్తుందిరా! నరఘోషను అడ్డుకుంటుంది. కుటుంబ సంబంధాలు బాగుంటాయి. ఒక మొక్క ఇంత మేలుచేస్తూ ఉంటే...దానికి కోటకట్టడం, దాని చుట్టూ ప్రదక్షిణ చెయ్యడం, దాన్ని కీర్తించడంలో తప్పు ఉందంటావా? ఆలోచించు అన్నది అమ్మ.   అప్పుడు అమ్మ చెప్పినా పెద్దగా ఆలోచించలేదు, ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే...ఇవన్నీ గుర్తుకొచ్చాయి. మొన్న కార్తీకపున్నమికి మా శ్రీమతి గుప్పెడు ఒత్తులు వెలిగించి, తులసికోట దగ్గర కూర్చుని దానిని స్తుతిస్తూ ఉంటే...అమ్మా, తులసికోటా, గోవ్యాఘ్రసంవాదమూ దృశ్యాలు దృశ్యాలుగా కదలాడాయి.   కొన్నికథలూ, పాటలూ అంతే! గుండెల్ని కెలికేస్తాయి.   -జగన్నాథశర్మ

తులసీదాసు దీవెన

గొప్ప రామభక్తుడైన   తులసీదాసు కాశీ క్షేత్రంలో  ఉంటూ రాముని  మహిమలు కీర్తిస్తూ గానం చేసేవాడు. ఆయన ఆశ్రమంలో నిత్యమూ రాముని కీర్తిస్తూ  భజనలు చేసేవారు. రామనామగానంతో పరిసరాలు మారుమోగేవి.   అలా జరుగుతుండగా , ఒకరోజు  తులసీదాసు ఆశ్రమంలో నిత్య పూజా విధులు పూర్తి చేసి  హారతి ఇస్తుండగా  భక్తులందరితో బాటు ఒక భక్తురాలు  హారతి పుచ్చుకుని,  తులసీదాసు పాదాలకు  నమస్కరించింది.  అలా చేయవద్దని ఆ భక్తురాలిని వారించాడు తులసీదాసు. పాదాలకు వొంగి నమస్కరించిందన్న అభిప్రాయంతో ఆ భక్తురాలిని   ‘దీర్ఘ సుమంగళీభవ’ అని ఆశీర్వదించాడు.  తనకి అందుబాటులో ఉన్న  పళ్లెంలోని  పువ్వులను, కొంత  కుంకుమను  చేత్తో అందుకుని  ఆమెకు ఇవ్వబోయాడు.  కానీ ఆ భక్తురాలు భయంతో ఒక్క అడుగు  వెనక్కు వేసింది.   “అపచారం  అపచారం స్వామీ “ అంది భయం నిండిన కళ్లతో.   ఆమె ప్రవర్తనకు ఆశ్చర్యపోయాడు తులసీదాసు.  “ఏమైంది తల్లీ ! ఎందుకలా భయపడుతున్నావు? రాముని సన్నిధిలో ఉన్నావు . ఇక్కడ నీకేమీ భయం లేదు. విషయమేమిటో చెప్పు తల్లీ ” అని అడిగాడు   తులసీదాస్.   ఆ భక్తురాలు తన  కళ్ళలో కన్నీరు ప్రవహిస్తుండగా  “స్వామీ ! మీది అమోఘమైన వాక్కు అని తెలుసు. కానీ నాకంత  అదృష్టం లేదు”  అని బదులిచ్చింది.  “ ఏం జరిగిందో చెప్పు తల్లీ. అది  నా వాక్కు కాదు. నా నోట సాక్షాత్తు రాముడు పలికించిన వాక్కు . నా పట్ల కాకుండా రాముడి పట్ల విశ్వాసం ఉంచి జరిగిందేమిటో చెప్పు” అన్నాడు  తులసీ దాసు దయగా. ఆమె చెప్పడానికి ఇంకా సంశయిస్తుండడంతో తులసీదాసు   “శ్రీరాముడిది ఒకేమాట, ఒకే బాణం, ఒకే పత్ని అని తెలుసు కదా. ఆయన పలికించిన నా నోటిమాట అసత్యమౌతుందన్న మీ  అపనమ్మకానికి కారణమేమిటో చెప్పమ్మా?” అని మళ్లీ అడిగాడు.  అప్పుడా భక్తురాలు  “ నా భర్త కాసేపటి క్రితమే చనిపోయాడు. ఇప్పుడు  శవ సంస్కారానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడి ఆచారం ప్రకారం నా భర్తతో కలసి సహగమనం చేయడానికి సిద్ధపడి,  ఆఖరిసారి మీ దర్శనం చేసుకుని శ్రీరాముణ్ణి  మ్రొక్కి వెళ్లడానికే వచ్చాను” అంది జాలి కలిగేలా. ఆ మాటలకు  ఒక్క క్షణం కలత చెందాడు  తులసీదాసు.  అయినప్పటికీ వెంటనే తేరుకుని “అమ్మా! నీవు సుమంగళివి. రాముని మాటకు ఎదురులేదు” అని ఆశీర్వదించాడు.  ఆమెను ధైర్యంగా ఇంటికి వెళ్లమన్నాడు.         ఆ భక్తురాలు మరోసారి రాముడుకీ , తులసీదాసుకి నమస్కరించి తిరిగి  ఇంటికి వెళ్లింది.    అప్పటికే బంధుమిత్రులు ఆమె రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఆ భక్తురాలు పాడె మీదున్న భర్త శవం చుట్టూ మూడుసార్లు   ప్రదక్షిణ చేసి భర్త  పాదాలకు నమస్కారం చేసింది. ఆ సమయంలో తులసీదాసు ఇచ్చిన  పువ్వులు ఆమె తలమీద నుండి శవం మీద పడ్డాయి. మరుక్షణం శవం కాళ్ళు కదిలిన భావన కలిగిందామెకు.   కానీ మనసులోని ఆశ్చర్యాన్ని బయటకు కనబడనీయకుండా   భర్త  ముఖం వైపు చూసిందామె. అక్కడ అద్భుతం జరిగిందా అన్నట్టు ఆమె భర్త  ఊపిరి పీల్చుకుంటున్నాడు. అప్పటికి ఆమెకు నమ్మకం కలిగి  తన సంతోషాన్ని బయటకు వ్యక్తపరుస్తూ చుట్టూ  ఉన్న బంధువులను పిలిచి తన భర్త శరీరాన్ని చూడమంది.  అక్కడకి చేరిన ప్రతి ఒక్కరూ ఒక వైపు ఆశ్చర్యం మరోవైపు సంతోషం పొందారు. మరుక్షణం ఆ భక్తురాలి భర్త శరీరానికి  కట్టిన కట్లు విప్పారు. అప్పుడు ఆమె భర్త కళ్లు తెరచి వారందరినీ చూసాడు.  అదొక అద్భుత , అపురూప సంఘటనగా అక్కడి వారు చెప్పుకున్నారు.చనిపోయిన మనిషిని తులసీదాసు దీవెన బ్రతికించిందని ఘనంగా చెప్పుకున్నారు.  అప్పటినుండి తులసీదాసు మీద ప్రజలకు మరింత భక్తివిశ్వాసాలు పెరిగాయి. రామభక్తి ఇంకా బలంగా  వ్యాపించింది. 

రాం రాం! మధురాంతకం రాజారాం!!

రచయితలనూ, కవులనూ కోల్పోయిన జాతి, తన బాల్యాన్నీ, భవిష్యత్తునీ కూడా కోల్పోతుందని నేనెక్కడో చదివాను. ఆ మాట నిజం అనిపిస్తోందిప్పుడు. అప్పుడు...నేను ‘ఉగాది‘వారపత్రికకు ఎడిటర్ గా ఉన్నప్పుడు...అలా అనిపించలేదు. చాలా ఆశాజనకంగా ఉండేవాణ్ణి. ముప్పయి మూడేళ్ల నాటి మాటిది.   ఈనాడు, ఈవారాల్లో రిజైన్ చేసిన తర్వాత ‘ఉగాది’ వారపత్రికకి ఎడిటర్ ని అయ్యాను. అయితే ఆ రాని పత్రికకు కాని ఎడిటర్ గా మిగిలిపోయాను. మిగిలిపోతే మాత్రం ఏం? ఎన్ని జ్ఞాపకాలను మూటగట్టుకున్నానో! ఎన్ని అనుభవాలను చేజిక్కించుకున్నానో! ఎంతమంది మహాత్ములను దర్శించానో!     ఉత్తరాలు రాసి, ఫోన్లుచేసి రచనలు అడగడం కాదు, వెళ్లి రచయితలను ప్రత్యక్షంగా కలసి, రచనలడిగితే బాగుంటుందన్నది నా ఆలోచన. నా ఆలోచన మేనేజ్ మెంట్ ముందుపెడితే వారు సరేనన్నారు. వెళ్లిరండన్నారు. అంతే! రచయితలను కలవడమే మహదానందంగా ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను చుట్టేశాను. అప్పుడే శ్రీమధురాంతకం రాజారాంగారిని దర్శించాను.    రాజారాంగారు ఆనాడు చిత్తూరుజిల్లా దామలచెరువులో ఉండేవారు. నేనొస్తున్నట్టుగా ఉత్తరంరాస్తే, రండని ఆహ్వానించారు. చిత్తూరులో ఓ రాత్రి బసచేసి, మర్నాడు దామలచెరువు బయల్దేరాను. పొద్దునే ఏడుగంటలకు బస్సులో బయల్దేరాను. ఎనిమిదిన్నరకి చేరుకున్నానక్కడికి. సన్నగా వర్షం కురుస్తోంది. మట్టిరోడ్డేమో! బురద బురదగా ఉంది. భుజాన వేలాడుతున్న సంచిని నెత్తినపెట్టుకుని, రాజారాంగారిల్లు ఎక్కడని అడిగితే...అదిగో! అదే అని చూపించి వెళ్లిపోయాడు ఓ పెద్దమనిషి. ఎత్తుమీద ఉంది ఇల్లు. ఇటూ అటూ పెద్దపెద్ద అరుగులూ, మధ్యలో మెట్లూ ఇల్లు బాగుంది. వెళ్లి తలుపుకొట్టాను. తెరుచుకోలేదు. ఆలోచిస్తూ  నిలబడితే...ఆయన స్కూలుకి వెళ్లిపోయాడయ్యా! నువ్వెవరు? అడిగాడు ఇందాక ఇల్లుచూపించిన పెద్దమనిషే తిరిగొచ్చి. నేను ఫలానా అని చెప్పి, ఎక్కణ్ణుంచి వచ్చానో కూడ చెప్పి, వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ కలవాలి అన్నాను. కలవాలంటే...స్కూలుకి వెళ్లాలి. స్కూలు ఇక్కడకి మూడునాలుగు కిలోమీటర్లు దూరంలో ఉందన్నాడు ఆ వ్యక్తి. నడిచేవెళ్లాలంటూ, అదృష్టం బాగుంటే...ట్రాక్టరో, ఎడ్లబండో దొరుకుతుందన్నాడు. ఎలా వెళ్లాలో దారి చూపించాడు.        గతరాత్రి ఆకలి అనిపించలేదు. భోంచెయ్యలేదు. ఇప్పుడు కొంచెం ఆకలిగా ఉంది. టిఫిన్ చేద్దామనిపించింది. హోటల్ కోసం చూస్తే...రాజారాంగారి ఇంటి ఎదురులైన్లో ఓ పాక విలాస్ కనిపించింది. వెళ్లి రెండిడ్లీచెప్పాను. ఇచ్చాడు యజమాని. ఇడ్లీ గట్టిగా ఉంది. చల్లగా ఉంది. తినాలనిపించలేదు. ఓ ఇడ్లీతో సరిపెట్టుకుని, స్కూలు దారిపట్టాను. సన్నగా వర్షం కురుస్తూనే ఉంది. పచ్చగా పొలాలూ, చెట్లూ బాగున్నాయి పరిసరాలు. ఒక ట్రాక్టర్ వచ్చింది. అందులో కూర్చునేందుకు ఖాళీలేదు. నేనడగలేదు. వెళ్లిపోయిందది. తర్వాత ఓ ఎడ్లబండి వచ్చిందిగాని, అడిగినా ఎక్కించుకునే అవకాశంలేదనిపించింది. రాజారాంగారు పనిచేసే స్కూలు ఎక్కడని అడుగుతూ ముందుకు నడిచాను. దారి తప్పాను. ఆ దారిలో కనిపించిన ఓ వ్యక్తిని రాజారాంగారు పనిచేసే స్కూలు ఇటే కదా? అంటే...కాదయ్యా అటు, ఆ పెద్ద రోడ్డు మీంచి నడచివెళ్లన్నాడు ఆ వ్యక్తి. అతను చెప్పినట్టుగానే నడిచాను. స్కూలు కనిపించింది. పిల్లలతో గోలగోలగా ఉంది స్కూలు. అంతా మధ్యాహ్నభోజనపథకం కింద భోజనాలు చేస్తున్నారు. నాకూ ఆకలి అనిపించింది. అడిగితే మొహమాటపడకుండా స్కూలులోనే భోంచేద్దామనుకున్నాను. రాజారాం మాస్టారు ఉన్నారా? అడిగాను.    లేరయ్యా! ఓ గంటక్రితమే వాళ్లబంధువులింట ఏదో ఫంక్షన్ ఉందని వెళ్లిపోయారు. ఇక్కడకి దగ్గరే ఆ బంధువిల్లు. వస్తానంటే...రండి! తీసుకెళ్తాను అన్నారు మాస్టారు సహోద్యోగి. పదండి అన్నాను. ఆసరికి వర్షం తగ్గింది. పొలాల గట్లంట నడుస్తూ, సహోద్యోగి అడిగిన అనేక ప్రశ్నలకు జవాబుచెబుతూ, గొంతు ఆర్చుకుపోతే...దాహం అన్నాను. దగ్గరే ఇల్లు! వచ్చేశాం. అక్కడ నీళ్లు తాగుదురుగాని అని నడిపించారాయన. ఆ దూరం ఆయనకి దగ్గరేమో! నాకు చాలా దూరం అనిపించింది. కాళ్లు లాగేశాయి. కళ్లు తేలిపోయాయి. అలాగే రాజారాంగారి బంధువింటికి చేరుకున్నాను. గృహప్రవేశంట! పూలతోరణాలూ, మామిడితోరణాలూ కట్టి ఉన్నాయి. వాకిలిలో నవారుమంచలో పడుకుని కనిపించారు రాజారాంగారు. నిద్రపోతున్నారాయన. సార్! నమస్తే అన్నాన్నేను. మేలుకున్నారాయన. కళ్లిప్పిచూసి, ఎవరూ? అడిగారు. చెప్పాను. అయ్యయ్యో! మీరా? రండి రండి అని మంచం మీదినుంచి లేచి, ఆహ్వానించారు రాజారాంగారు.  వస్తానని నన్ను తోడుకుని వచ్చిన సహోద్యోగి వెళ్లిపోయినతర్వాత అన్నారిలా.   మీరింతవేగంగా వస్తారనుకోలేదు. సర్లెండి! వచ్చారు, ఆనందం.   భోంచేశారా? అడిగారు. లేదన్నాను. అయ్యయ్యో అని తెగ బాధపడ్డారు రాజారాంగారు. బంధువుని పిలిచి నాకు భోజనం వడ్డించమన్నారు. ముందు మంచినీళ్లివ్వండి, దాహంగా ఉంది అన్నాను. అయ్యో అన్నారు. జాలిపడ్డారు. గ్లాసుతో నీరు తెచ్చి ఇచ్చారు. రెండుమూడుగ్లాసులు నీరు ఏకబిగిన నేను తాగుతూంటే చూసి, కళ్లు చెమర్చుకున్నారు.   కూర, పప్పు, పులుసు...భోజనం వడ్డించారు. కడుపునిండా తిన్నాను. బూరెలూ, లడ్డూ కూడా పెట్టినట్టు జ్ఞాపకం. తేరుకుని, రాజారాంగారితో సహా మంచంమీద కూర్చున్నాను. నొప్పి పెడుతున్న కాళ్లను చేత్తో నొక్కుకుంటుంటే...చాలా దూరం నడచినట్టున్నారు, కాళ్లు లాగుతున్నాయా? అడిగారు. అవునంటే...మంచం మీద పడుకోమన్నారు. వెళ్లి గోరువెచ్చని కొబ్బరినూనె తెచ్చి నా కాళ్లకు ఆ నూనె పట్టించి, గట్టిగా నొక్కసాగారు. ఏంటిసార్ ఇది? వద్దొద్దు అని లేవబోతుంటే...పడుకోబాబూ! తప్పేం ఉంది ఇందులో అన్నారు. ఎంతగా గొడవపడ్డా వినలేదాయన. నిద్రపట్టిందంతలో. ఓ గంట తర్వాత మెలకువ వచ్చింది. పదండి! మనింటికి పోదాం అన్నారు రాజారాంగారు. ఇద్దరం దామలచెరువు బయల్దేరాం. పొలాలగట్లంట కొద్దిదూరం నడచి, రోడ్డుచేరుకునేసరికి, ఎడ్లబండి కనిపించింది. ఏఁవయ్యా! దామలచెరువుతీసుకుపోతావా? అడిగారు రాజారాం. రండయ్యా అన్నాడు బండివ్యక్తి. నేనూ, రాజారాంగారు బండెక్కి కూర్చున్నాం. మళ్లీ సన్నగా వర్షం మొదలైంది. ఉత్తరీయం నాకు కూడా కప్పి, తడవకుండా చేశారాయన. ఇంటికి చేరుకున్నాం.    పిల్లలంతా తిరుపతిలో ఉన్నారు. మా ఆవిణ్ణి మీకు పరిచయంలేదు, మరచిపోయాను, అక్కణ్ణే ఉంది, బంధువులింట అన్నారు రాజారాంగారు. ఇంటిలోనికి తోడుకుని వెళ్లారు. మీరు స్నానంచేసినట్టులేదు. రండి! ముందు స్నానం చెయ్యండి అన్నారు. పెరట్లో పెద్దనూతిదగ్గరకు తీసుకుని వెళ్లారు. నూతినీరు వెచ్చగా ఉంటుందనిచెప్పి, తలంటారు. తెల్లటిలుంగీ, లాల్చీ ఇచ్చి కూర్చోమన్నారు తర్వాత. ఆకలివేస్తే చెప్పండి, ఇద్దరికీ ఉప్మాచేసి పెడతానన్నారు. లేదని చెప్పి, కబుర్లు మొదలెట్టాను. కథ, శైలి, శిల్పం అంటూ పెద్దపెద్దమాటలు  మాట్లాడసాగాను. నవ్వుతూ విన్నారు రాజారాంగారు. నేనే మాట్లాడుతున్నాను, మీరేమీ మాట్లాడడం లేదంటే...కథగురించి ఏం చెప్పమంటారు? కథ రాసేటప్పుడు, దాని ఆఖరివాక్యం అందిపుచ్చుకున్నాకే మొదటి వాక్యం రాయాలన్నారు. రచయిత అయ్యేందుకు దగ్గర దారులు ఏమీలేవు బాబూ! రాయాలి. తిరగ రాయాలి. రాస్తూ తిరగ రాస్తూ ఉంటే రచయితలు అవుతారన్నారు. రచన నచ్చడం, నచ్చకపోవడం తర్వాతి సంగతి, ముందు రచనను చదించగలగాలి. అది రచయితలు తెలుసుకోవాలి. తెలుసుకుంటే...బాగుంటుంది అన్నారు. ఎప్పుడూ నా దగ్గర రెండు పుస్తకాలు ఉంటాయి. ఒకటి చదవడానికి. రెండు రాసుకోడానికి అని నవ్వారు.    రాత్రి అయింది. అన్నారుగాని, ఉప్మాచెయ్యలేదు రాజారాంగారు. ఎక్కణ్ణుంచో తీసుకువచ్చి పెట్టారు. మళ్లీ ఇద్దరం మాటల్లో పడ్డాం. పాఠకునికి ఏంకావాలి బాబూ? అతన్ని జీవించేలా చెయ్యడం, ప్రేమించేలా చెయ్యడం, అందుకు మనం రెండు మంచి వాక్యాలు రాస్తేచాలు! పొంగిపోతారన్నారు. రచయితగా మనం తీర్పులు చెప్పకూడదు. ఇదీ పరిస్థితి అని పాఠకులకు ఉన్నదున్నట్టు చెబితే చాలన్నారు. రచయిత జీవితంలో చెప్పుకోదగినది రాయడం, చదవడమే! ఒక లైబ్రరీని ఆసాంతం చదివితేగాని, ఒక పుస్తకం రాయకూడదన్నారు. రచయితలు రెండుసార్లు జీవితాన్ని రుచి చూస్తారు. అనుభవించినప్పుడు, ఆ అనుభవాన్ని అక్షరబద్ధం చేసినప్పుడు అని ఆవలింత తీశారు. నిద్రరావడంతో పడుకుందాం అన్నారు. ఆ రాత్రి నాకు నిద్ర రాలేదు. రాజారాంగారు చెప్పిన మాటలు గురించే ఆలోచిస్తూ గడిపాను. తెల్లారింది. చిత్తూరుకి బయల్దేరాను. కథ ఒకటి చేతిలోపెట్టి, జాగ్రత అన్నారు. మా ఊరొచ్చిన మొట్ట మొదటి సంపాదకులు మీరు, మిమ్మల్ని సరిగా గౌరవించానో లేదో అన్నారు. బలేవార్సార్ అన్నాను. బస్సెక్కాను.   ఒక కథ కోసం మీరింత దూరం వచ్చారంటే...మిమ్మల్ని తక్కువ అంచనా వెయ్యకూడదు. మీకు మంచి భవిష్యత్తు ఉంది అన్నారు రాజారాం. దీవించారు నన్ను. రాస్తున్నప్పుడు కన్నీరుపెట్టని రచయిత గురించీ, చదువుతున్నప్పుడు కన్నీరు పెట్టని పాఠకునిగురించీ ఆలోచించడం అనవసరం బాబూ! వాళ్లని పట్టించుకోకూడదు. రచయితలకుఅలారంతో పనేం ఉంది? వాళ్ల ఆలోచనలే వాళ్లని మేలుకొలుపుతాయి...చిత్తూరు చేరినా, తర్వాత హైదరాబాద్ చేరినా, ఆ తర్వాత రిటైరయి ఓ గట్టుకి చేరినా ఇంకా రాజారాంగారి మాటలు వినవస్తూనే ఉన్నాయి నాకు.    -జగన్నాథశర్మ

జగమెరిగిన రాజారామమోహనరావు

పత్రికలు కథలు స్వీకరించడంలేదు. రాసిన ప్రతి కథా తిరిగి వచ్చేస్తున్నది. తిరిగివచ్చిన కథలను ఏం చేసుకోవాలి? చించి పారేసే బదులు, పదిమందీ చదివేలా చేస్తే మేలనిపించింది.   నాలాంటి వర్ధమాన రచయితలంతా కూడబలుక్కున్నాం. ఓ లిఖిత పత్రిక ప్రారంభించాలనుకున్నాం. అప్పుడు రూపుదిద్దుకున్నదే ‘జ్వాల’. సంపాదకుకుడు ఎవరంటే? నువ్వే అన్నారంతా. దాంతో 1976 లోనే సంపాదకుడు  జగన్నాథశర్మ అయిపోయాను.    కథలకు బొమ్మలు గణేశ్ వేసేవాడు. ఆయనకి మా ఊరిలో పెద్దల బట్టల దుకాణం ఉండేది. పత్రికకు పెట్టుబడి ఆయనే పెట్టాడు. కాగితాలూ, కలర్ పెన్నులూ అన్నీ ఆయనే కొనిచ్చాడు. స్వీకరించిన కథలూ, కవితలూ, జోకులూ అన్నీ పత్రికలో నేనే రాసేవాణ్ణి. అరఠావు సైజులో 200 పేజీల పత్రికంతా నా చేతి రాతతో నిండిపోయేది. దానిని బౌండు చేయించి, పాఠకులకోసం స్థానిక గ్రంథాలయంలో ఉంచేవాణ్ణి. గ్రంథాలయంలో పత్రికను ఉంచేందుకూ, నలుగురికీ చెప్పి దానిని చదివేలా చూసేందుకూ లైబ్రరేరియన్ కు రోజూ ఓ టీ తాగించేవాణ్ణి. టీ కోసం కాదుగాని, లైబ్రరీరియన్ కి నా కష్టం, నా ఇష్టం నచ్చిందేమో! జ్వాలను ప్రముఖంగా ప్రదర్శించేవాడు. అందరూ చదివేలా చేసేవాడు.       రెండు సంచికలు విడుదలయి, పాఠకుల మన్నలను అందుకోవడంతో ఊరిలో ప్రముఖులంతా నన్ను ఆదరించసాగారు.    శ్రీ రామవరపు వేణుగోపాలరావుగారు ఆనాటికే యువ మాసపత్రికకు సంపాదకునిగా ఉండి, అనివార్య కారణాలవల్ల రాజీనామా చేశారు దానికి. మా ఊరికి వచ్చారు. స్వంతంగా పత్రికను ప్రారంభించే ఉద్దేశంలో ఉన్నారు. ఆ పత్రికకోసం పెద్దపెద్ద రచయితల కథలనూ, నవలలనూ సేకరించి ఉంచారాయన. ఆ సంగతి తెలుసుకున్న నేను, ఆ పెద్ద రచయితల కథలిస్తే మా లిఖితపత్రికలో వేసుకుంటానన్నాను. పెద్దగా నవ్వారాయన. నవ్వి, నా స్నేహితుల కథలు కొందరివి ఇస్తాను, అయితే వాటిని వేసుకునేందుకు ఆ రచయితల అనుమతి తీసుకోవాలన్నారు. డి. వెంకట్రామయ్య, గుమ్మా ప్రసన్నకుమార్, శ్రీకంఠమూర్తి, వి. రాజారామమోహనరావు...చాలా మంది స్నేహితుల కథలు ఉన్నాయి వారి దగ్గర. అయిదువందల పదాలలో ఉన్న వి. రాజారామమోహనరావు కథ నాకు నచ్చింది. వారి అనుమతి కోసం గణేశ్ దుకాణం నుంచి హైద్రాబాద్ కి ట్రంకాల్ బుక్ చేసి మాట్లాడాను.   లిఖిత పత్రికలో కథ వేసుకుంటారా? అనుమతి కావాలా? అని పగలబడి నవ్వారు రాజారామమోహనరావు. వేసుకోండి అన్నారు. పారితోషికం ఇస్తారా? అడిగారు. అయిదు రూపాయలిస్తాం. మని ఆర్డర్ చేస్తాం అన్నాను. వద్దు! మీరే ఉంచుకోండి. మరిన్ని కాగితాలూ, కలాలూ కొనుక్కోండి అన్నారు. అది మొదటిసారి రాజారామమోహనరావుతో నా పరిచయం.   ఇట్టే అయిదేళ్లు గడచిపోయాయి.    వేణుగోపాలరావు హైదరాబాద్ ఈనాడు అసోసియేట్ ఎడిటరయ్యారు. నేను కూడా ఈనాడులో జాయినయ్యాను. ఈనాడులో జాయినయిననాటికి, నా కథలు అనేకం పత్రికల్లో ప్రచురణకి నోచుకున్నాయి. బహుమతులు కూడా అందుకున్నాయి. చిత్రకారుడు చంద్ర సంపాదకుడిగా ఉన్న ‘పుస్తక ప్రపంచం’ లో నా కథలు తరుచూ ప్రచురణయ్యేవి. ఆనాడు ఆ కథల ప్రచురణకి ప్రధాన కారణం రాజారామమోహనరావని తర్వాత తెలిసింది. చంద్రా, వారూ స్నేహితులు. రామమోహనరావు చెప్పబట్టే నన్ను ప్రోత్సహించినట్టుగా చంద్ర చెప్పారోసారి.         నన్ను చూడడానికి చంద్ర సహా రాజారామమోహనరావు ఈనాడుకి వచ్చారు. నన్నుచూసి ‘కుర్రాడు’ అని నవ్వారిద్దరూ. రండి! టిఫిన్ చేద్దామని, ద్వారక హోటల్ కి తీసుకెళ్లారు. ఆకలిగా ఉన్నదంటే...ఫుల్ మీల్స్ పెట్టించారు.   ‘‘జాగ్రత్త శర్మా! ఇది హైదరాబాద్! ఇక్కడ నీ గొంతు వెయ్యిగొంతులై ప్రతిధ్వనిస్తుంది. నిన్ను భ్రమల్లో ముంచి తేల్చుతుంది. రకరకాల కోరికల్ని కలిగిస్తుందీ నగరం. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి.’’ చెప్పారు రాజారామమోహనరావు.   ‘‘మహానగరంలో బతుకు ఒత్తిడిమయంగా ఉంటుంది శర్మా! ఆ ఒత్తిడిలో నువ్వూ, నీ కలలూ రెండూ మాయమయిపోతాయి. మాయంకాకుండా జాగ్రత్తపడు.’’ చెప్పారు చంద్ర.  నా బాగోగులు గమనించేందుకు మా అన్నగారు గణపతిరావు హైదరాబాద్ వచ్చారోసారి. పర్వాలేదు, బతికేస్తాడు అన్న భరోసా నా మీద కలిగిందేమో! రెండు రోజుల తర్వాత ఊరికి వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారు. గోదావరి ఎక్స్ ప్రెస్ కోసం నాంపల్లి స్టేషన్ కివచ్చాం. రిజర్వేషన్ ఉంటే బాగుండేది. లేదు. జనరల్ టిక్కెట్టు తీసుకుని, ట్రయిన్ కోసం వేచి చూస్తున్నాం. అప్పుడు అటుగా వచ్చారు రాజారామమోహనరావు. నన్ను చూసి పలకరించారు. అన్నయ్యని పరిచయం చేసుకుని, రండి! చాయ్ తాగుదాం అనిచెప్పి, క్యాంటీన్ కు తీసుకెళ్లి చాయ్, బిస్కట్ తినిపించారు. ఇక్కడి కారా బిస్కట్స్ బాగుంటాయంటూ ఓ ప్యాకెట్ బిస్కట్లు అన్నయ్యకి కొని ఇచ్చారు. గోదావరికి రిజర్వేషన్ లేదని చెబితే...మీరేమీ కంగారు పడకండి! నేను చూసుకుంటానని, ఓ టీటీఈకి అన్నయ్యని అప్పగించారు. నా భుజమ్మీద చేయివేసి, ప్లాట్ ఫారం మీద నిల్చున్న రాజారామమోహనరావుని, కదలుతున్న ట్రయిన్ లోంచి చూసి, పొంగిపోయాట్ట మా అన్నయ్య! తమ్ముడికిక తిరుగులేదనుకున్నాట్ట! ఊరికి వెళ్లినప్పుడు అన్నయ్య చెప్పాడు.    నేనూ, రాజారామమోహనరావూ తరుచూ కలుసుకునేవాళ్లం. నేను పండక్కి ఊరికి వెళ్లాలంటే...రాజారామమోహనరావే ముందు టిక్కెట్లు రిజర్వ్ చేయించి, డబ్బులు తర్వాతిస్తే తీసుకునేవారు. తిరుగుప్రయాణానికి డబ్బులు ఉన్నాయి కదా? అని అడిగేవారు. ఉన్నాయంటే...నిజం చెప్పమని గద్దించేవారు. డబ్బులు చూపిస్తే...సరేననేవారు. ట్రయిన్ లో తినేందుకు  క్యాంటీన్ లో టిఫిన్స్ పాక్ చేయించి ఇచ్చేవారు. డబ్బులిస్తే తీసుకునేవారు కాదు. ఓ తమ్ముణ్ణి ఓ అన్నయ్య చూసుకునేట్టుగా చూసేవారు.   ‘అరణి’ కలం పేరుతో నేను కథలు రాసిన రోజుల్లో ‘అరణి’ నేనేనని మొదటిసారిగా గ్రహించింది రాజారామమోహనరావే! అక్కడా ఇక్కడా బహుమతులు అందుకుంటున్న నా కథలు చూసి, ఈ అరణి ఎవరో కాదు! శర్మే! ఉద్యోగ భయంతో పాపం! కలంపేరు పెట్టుకున్నాడు. పేరయితే మార్చుకున్నాడుగాని, శైలి ఎలా మార్చుకుంటాడు? అన్నారట చంద్రతో. మళ్లీ అసలు పేరుతో కథలెప్పుడు రాస్తాడో? అని బాధపడ్డారట! రాస్తాడు, దానికి బాధ ఎందుకు? అంటే...కలం పేరుకీ, అసలుపేరుకీ మధ్య చాలా తేడా ఉంటుంది. కలం మాస్క్ పెట్టుకోకూడదు అన్నారట. ఆ మాస్క్ తొలగించి, నేను కథలు రాసిన రోజు పొంగిపోయారాయన.  రచయితగానే కాదు, పత్రికా రచయితగా కూడా నేనంటే చాలా ఇష్టపడేవారు రాజారామమోహనరావు. నేను ఏ పత్రికలో పనిచేసినా అడిగితేనే కథ రాసిచ్చేవారు. కథలపోటీల్లో కూడా నేను అంగీకరిస్తేనే పాల్గొనేవారు. వద్దంటే..పాల్గొనేవారు కాదు. ఇంకా మీకేనా బహుమతులు? కొత్తవారికి రానీయండి అంటే...అలాగే అనేవారు. అడిగితే కాదనక, పోటీకథలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించేవారు. ఎక్కడా శషభిషలుపోయేవారుకాదు.   కళింగాంధ్రకథకుల్ని ఇష్టపడే రాజారామమోహనరావు, మీరంతా కష్టజీవులయ్యా! అందుకే మీ కథలన్నా, మీరన్నా నాకిష్టం అంటారు. మీ భాషలో, మీ యాసలో గొప్ప సంగీతం ఉందయ్యా! ఆ సంగీతానికి పడిపోతారంతా అంటారు.   కథ ఎప్పుడూ ఓ వ్యక్తి జీవితాన్ని పూర్తిగా ఆవిష్కరించదు. కాకపోతే ఆ వ్యక్తి, వ్యక్తిత్వాన్ని కాగడాపట్టిచూస్తుంది. చూపిస్తుంది. రాజారామమోహనరావు కథలాంటివారు. కథ అంటే నవలను నిలువునా కొలిచే సాధనం. కథ అంటే కవిత వైశాల్యాన్ని తెలియజేసే జాణతనం. కథ అంటే గుండెగొంతులో ప్రతిధ్వనించే ఓ గొప్ప నినాదం. కథంటే...శ్రీ రాజారామమోహనరావు.  జగన్నాథశర్మ

తండ్రి ఆజ్ఞ

పురాణ కాలంలో  మేధాతిథి అనే ముని వుండేవాడు.  అతనికి  చిరకారి అనే పేరున్న   కుమారుడు ఉన్నాడు. చిరకారి బుద్ధిమంతుడు. అతడికి ఒక మంచి అలవాటు ఉంది. ఏదైనా  పని అప్పగిస్తే  పనిని  మొదలు పెట్టే  ముందు  చక్కగా ఆలోచించేవాడు. ఆ పని జరగడం వల్ల మంచి జరుగుతుందనుకుంటే చేసేవాడు.  లేదంటే ఆగిపోయేవాడు.   ఒక రోజు మేధాతిథి,  తన కొడుకు చిరకారిని  పిలిచి  “మీ అమ్మ ఒక అపరాధం చేసింది. ఆమెపై నాకు కోపం  వచ్చింది. వెంటనే  ఆమెను  చంపు”  అని ఆజ్ఞాపించాడు. అలా ఆదేశించిన మేధాతిథి అంతే వేగంగా  బయటకు వెళ్ళిపోయాడు.   తొందరపడి పనులు చేసే అలవాటు లేని చిరకారి తండ్రి మాటలు వినగానే కలవర పడ్డాడు.   తండ్రి అప్పగించిన పని గురించి  బాగా  ఆలోచించాడు.  “తండ్రి ఆజ్ఞ మీరకూడదన్నది సత్యమే కానీ  తల్లిని చంపడం పాపం కదా. ఆమెను  తప్పక  రక్షించుకోవాలి.  తల్లిదండ్రులకు కలిగిన   పుత్రుడు తల్లినే చంపే  పని చేయాలా”  అనుకుని బాధ పడ్డాడు.    చిరకారి   ఆలోచనల్లో ఉండగా    బాల్యం నుండి అతడికి తల్లి  చేసిన సేవలు  గుర్తుకి వచ్చాయి.     “ తల్లిని చంపితే నరకం వస్తుంది. అలాగని తండ్రి  ఆజ్ఞను ధిక్కరించినా  పాపమే.  వంశాన్ని  నిలబెట్టే విషయంలో   తల్లి  నేల అయితే తండ్రి అందులో బీజాన్ని  నాటుతాడు.  కాబట్టి  తల్లిదండ్రులిద్దరికీ సంబంధించిన వాడినవుతాను.  “ఆత్మా లై పుత్ర నామాసి” అన్న శృతి వాక్యాన్ని అనుసరించి తండ్రియే బిడ్డగా జన్మిస్తాడు. అంటే నా తండ్రి అంశతో  నేను  పుట్టాను.  తపస్సు, ధర్మం, విద్య,  శ్రేష్టమైన దైవం అన్నీ తండ్రియే.  అరణిని మధించడం చేత అందులో నిప్పు పుడుతుంది.  అలాగే అవయవాలు,  శరీరం అంతా తల్లి వల్లనే కలుగుతాయి. అన్నిటికీ మించి భరించ శక్యం కాని గర్భధారణ కష్టాన్ని కూడా తల్లి అనుభవిస్తుంది.  తర్వాత కూడా బిడ్డ కోసం  తల్లి పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు.  తండ్రి బాధ్యత బిడ్డల యోగక్షేమాలు  విచారించడమే కానీ  నిజానికి బిడ్డను సంరక్షించేది  తల్లే.  తండ్రి కన్నా తల్లే   గౌరవంలో గొప్పదని ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి.  నిజానికి  కొడుకు చిన్న వయసులో ఉన్నా,   యుక్త వయసులో ఉన్నా,  వృద్ధుడైనా  సరే కొడుకు మీద తల్లికి ప్రేమ ఒకేలా  ఉంటుంది.  తల్లి అనే వస్తువే ఈ  లోకానికి  మూల కారణం.  నీచ  ప్రాణులకైనా,   ఉత్తమ ప్రాణులకైనా,  తల్లి అవసరం ఒకేలా ఉంటుంది.  తల్లి అనే పదార్ధం ఉన్నచోట సుఖం ఉంటుంది.  లేకపోతే శాంతి ఉండదు.  ధనవంతుడికైనా,  బీదవాడికైనా,  పండితుడికైనా,  మూఢుడికైనా,  బలవంతుడికైనా,   బలహీనుడికైనా  తల్లి జీవించి ఉంటేనే సుఖంగా  ఉంటుంది.  మహాపూజ్యురాలైన  తల్లిని చంపడం మహాపాపమనే సముద్రంలో ముంచి వేస్తుంది.  కాబట్టి  తల్లిని చంపడానికి  నాకు చేతులెలా వస్తాయి?” .  అతడి ఆలోచనలు  అలా ఎన్నో విధాలా  సాగాయి.    బయటకు  వెళ్లిన  మేధాతిథి కోపం తగ్గగానే  మరోలా ఆలోచించాడు.   “ భార్యని చంపమని నా కొడుకు చిరకారితో  చెప్పాను.  కోపంలో  చెప్పినా సరే  తొందరపడి పనులు చేసేవాడు కాదు నా కొడుకు. క్షణికావేశంలో   తీసుకున్న నిర్ణయం వలన అనర్ధం జరిగిందేమో.  వాడు తల్లిని చంపేసి ఉంటే ఇప్పుడెలా ” అనుకున్నాడు.  అలా అనుకోగానే  అక్కడ నుండి ఇంటికి  వెళ్ళాడు   చిరకారిని   పిలిచి “ నాయనా !  ఎన్నో కష్టాలను ఓర్చుకుని నీ తల్లి  నీకు జన్మనిచ్చింది.  పెంచి పెద్ద చేసింది. ఆమెని చంపమని  నీతో చెప్పాను.  నువ్వు  తొందరపడి నిర్ణయాలను తీసుకోవని నాకు తెలుసు. మీ తల్లి   బ్రతికే ఉంది కదా”   అని  అడిగాడు అనుమానంగా .   తండ్రి  మాటలు వినగానే చేతిలోని  కత్తిని  కింద పడేసి  ఆయన కాళ్ళ మీద పడ్డాడు చిరకారి. లోపల ఉన్న మునిపత్ని కూడా వచ్చి భర్త  పాదాల మీద పడింది. ఇద్దర్నీ లేవనెత్తి కౌగలించుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ ఆశీర్వదించాడు మేధాతిథి. దీర్ఘంగా ముందు  వెనుకలు ఆలోచించి, నిర్ణయం తీసుకున్న కొడుకును  మెచ్చుకున్నాడు.  వాళ్ళతో   మేధాతిథి “ ఒక  కార్యం చెయ్యాల్సి వచ్చినపుడు ధీరత్వంతో మంచి చెడ్డలు ఆలోచించి  పని చెయ్యాలి .  పనులు చేసేటప్పుడు ఆలోచించి చేసేవాడిని ఆర్యుడనీ , ఆలోచించకుండా చేసేవాడిని అనార్యుడనీ అంటారు.  తొందరపడకుండా చాలాసేపు ఆలోచించి యితడు మిత్రుడు,  యితడు శత్రువు,  యితడు యోగ్యుడు,  యితడు అయోగ్యుడు అని పరిశీలించి ఆచరించే బుద్ధిమంతుడు సమస్త శుభాలను పొందుతాడు. అలాంటి  బుద్ధిమంతుడివైన  నువ్వు నా కొడుకువైనందుకు ఎంతో   గర్వపడుతున్నాను” అని కొడుకుని కౌగిలించుకుని ఆశీర్వదించాడు.   “ధర్మరాజా!  అందువల్ల మంచి చెడ్డలు చక్కగా ఆలోచించి తొందరపాటు లేకుండా చేసే కార్యాలు శాశ్వత ఫలితాలనిస్తాయి. తొందరపడి ఒకడు పనిచేస్తే ఆ పనిచేసిన వాడికి తర్వాత పశ్చాత్తాపం కలిగిస్తుంది. అట్లా కాకుండా చక్కగాను, దీర్ఘంగాను ఆలోచించి దోషం లేదని నిర్ణయించుకుని పని చేసిన వాడికి శుభాన్ని,  కీర్తిని కలిగిస్తుంది”  అని భీష్ముడు ధర్మరాజుతో  చెప్పిన కథ ఇది.  

సమయస్ఫూర్తి

ఒక రాజ్యంలో ఒక ముని ఉండేవాడు. అతడు సర్వజ్ఞాని. జోతిష్యం కూడా బాగా చెప్పేవాడు. అతను చెప్పినవన్నీ నిజం అవుతుండడంతో ఆ రాజ్యంలోని వారందరికీ అతనిపై నమ్మకం కుదిరింది. అతని ప్రతిభ ఆ నోట ఈ నోట ఆ దేశపు రాజు వరకు పాకింది. ఆ ముని ప్రతిభ ఏమిటో స్వయంగా తెలుసుకుందామనిపించింది రాజుకు. అంతే! వెంటనే తన సైనికులను పంపించి, ఆ ముని ఎక్కడ ఉన్నా వెదికి తన ముందు ప్రవేశపెట్టమన్నాడు. రాజాజ్ఞ ప్రకారం బయలుదేరి, ఊళ్లన్నీ వెతుకుతూపోయారు. చిట్టచివరకు ఒకానొక ఊరిలో ముని దొరికాడు. అతనికి రాజాజ్ఞను తెలిపి, తమతో రమ్మన్నారు సైనికులు. ముందు తటపటాయించినా, రాజాజ్ఞ మీరకూడదని సైనికుల వెంట రాజు దగ్గరికి పయనమయ్యాడు ఆ ముని. రాజు మునిని సగౌరవంగా ఆహ్వానించి, సకల మర్యాదలు చేశాడు. అన్నీ పూర్తయ్యాక, రాజు ‘‘మునివర్యా! మీ జ్యోతిష్య ప్రతిభ గురించి చాలా విన్నాం. ఇప్పుడు మా భవిష్యత్తు చెప్పాలి’’ అన్నాడు. ముని ఒక్కక్షణం ఆలోచించి, రాజుగారి భవిష్యత్తు చెప్పడం ప్రారంభించాడు. తన గురించి గొప్పగా చెబుతుంటే రాజు పొంగిపోయి కానుకల మీద కానుకలు కురిపించాడు. కొంతసేపటికి ముని రాజుకు జరగబోయే చెడు చెప్పడం మొదలుపెట్టాడు. వెంటనే రాజుకు కోపం వచ్చింది, ఆ మునికి ఉరిశిక్ష వేయాలన్నంత ఆవేశం వచ్చింది. ‘తన భవిష్యత్తు ఇంత భయంకరంగా చెబుతాడా?’ అనుకుని, ‘‘నువ్వు తప్పుడు జ్యోతిష్యం చెబుతున్నావు. నీకు నిజంగా జ్యోతిష్యం వస్తే నువ్వెప్పుడు చనిపోతావో చెప్పు’’ అని అడిగాడు. మునికి రాజు కోపం అర్థమైంది. తనకు రాబోయే అపాయాన్ని కూడా ఊహించాడు. సమయస్ఫూర్తితో నెమ్మదిగా ‘‘మీరు చనిపోయే గంట ముందు నేను చనిపోతాను ప్రభూ’’ అన్నాడు. ఆ మాటతో రాజుకి కోపం చల్లారిపోయింది. తన తప్పును తెలుసుకుని మునిని గౌరవించి సాగనంపాడు.

మనస్సాక్షి

ఒక ఊర్లో మంచి పేరు ప్రతిష్టలు కలిగిన పండితుడు ఒకాయన ఉండేవాడు. చాలా చక్కని వాక్పటిమ గలవాడు. ఆయన ఆలయం ఆవరణలో కూర్చొని ప్రవచనం చెబుతూ వుంటే వేలమంది జనం అలా కదలకుండా బొమ్మల్లా వింటూ ఉండిపోయేవాళ్ళు. ఆయన ప్రఖ్యాతి చుట్టుపక్కల చాలా గ్రామాల్లో వ్యాపించింది. ఒకసారి ఆయన ప్రవచనం నిమిత్తం పొరుగూరు వెళ్ళవలసి వచ్చింది. ఆ ఊరు వెళ్ళే బస్సు ఎక్కి టికెట్ తీసుకున్నాడు. అయితే పొరపాటున బస్సు కండక్టర్ పది రూపాయలు ఎక్కువ ఇచ్చాడు. పండితుడు అది గమనించి తిరిగి ఇవ్వాలని యోచించాడు. కానీ బస్సు నిండా జనం కిక్కిరిసి ఉండటంతో, దిగేటప్పుడు ఇద్దాంలే అనుకుని కూర్చున్నాడు. కొద్ది సేపు తరువాత అతని మనసులొ ఆలోచనలు మారాయి. 'ఆ కండక్టరు కూడా ఎంతమంది దగ్గర చిల్లర కొట్టేయడం లేదు... ఈ బస్సు కూడా ఒక సంస్థదే కదా... ఎంత మంది తినటంలేదు... నా పది రూపాయలకే నష్టపోతుందా ఏమిటి.. ఈ పది రూపాయలు ఏదైనా దైవ కార్యనికి ఉపయోగిస్తా...'  అని అనుకుని మౌనంగా కూర్చున్నాడు.   అంతలో వూరు వచ్చింది... బస్సు ఆగింది... కానీ ఆయన దిగేటప్పుడు బస్సు కండక్టర్ దగ్గరికి రాగానే తన ప్రమేయం ఏమాత్రం లేకుండా అసంకల్పితంగా కండక్టరుకు ఇవ్వవలిసిన పది రూపాయలు ఇచ్చి... "మీరు నాకు టికెట్ ఇచ్చేటప్పుడు ఈ పది రూపాయలు ఎక్కువగా ఇచ్చారు" అన్నాడు. దానికి ఆ కండక్టర్ "అయ్యా..! నేను మీ ప్రవచనాలు ఎంతో శ్రద్ధగా వింటాను. మీరు చెప్పడంతోటే సరిపెట్టుకుంటారా లేక పాటిస్తారా అని చిన్న పరీక్ష చేశాను" అని అన్నాడు. పండితుడు చల్లటి చిరు చెమటలతో బస్సు దిగి.. 'పది రూపాయల కోసం తుచ్ఛమైన ఆశతో నా విలువలకే తిలోదకాలు ఇవ్వబోయాను... నా అదృష్టం బాగుంది. నా మనస్సాక్షి సరైన సమయంలో సరియైన నిర్ణయం తీసుకొని నా విలువలను కాపాడింది' అనుకున్నాడు.

దొరికిన దొంగ

రత్నశెట్టి ఓ వ్యాపారి. అక్బర్‌ పాదుషాకి మాయమాటలు చెబుతూ, విలువైన కానుకలు పంపిస్తూ తన పరపతి పెంచుకునేవాడు. రత్నశెట్టి వ్యవహార శైలిని క్షుణ్ణంగా తెలుసుకున్న బీర్బల్‌, ఆయన గురించి అక్బర్‌కి చూచాయగా చెప్పినా పట్టించుకోక పోవడంతో సరైన సమయం కోసం ఎదురు చూడసాగాడు. రత్నశెట్టికి రాజధానిలో బోలెడు వ్యాపారాలు ఉన్నాయి. ఆయన దగ్గర యుద్ధ విద్యలు తెలిసిన మెరికల్లాంటి మనుషులు ఉండేవారు. రత్నశెట్టి కఠినమైన పనులకు మాత్రమే వీరిని వినియోగిస్తూ ఉండేవాడు. వీరిని ధనవంతుల ఇళ్లు దోచుకోవడానికి కూడా వినియోగిస్తున్నాడని గూఢచారులు బీర్బల్‌కి ఉప్పందించారు. ఓ ఏడాది అక్బర్‌ సామంత రాజులు పంపిన కప్పంతో ధనాగారం నిండిపోయింది. అక్బర్‌ మంత్రులను సమావేశపరచి, 'ప్రజలకు సౌకర్యాలు కల్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేయండి' అని ఆజ్ఞాపించాడు. దురదృష్టవశాత్తు అదే రోజు రాత్రి పకడ్బందీ ప్రణాళికతో ధనాగారం ఎవరో లూటీ చేశారు. దొంగల ఆచూకీ తెలిపిన వారికి భారీ నజరానా ప్రకటించాడు పాదుషా. ఎన్ని ప్రయత్నాలు చేసినా, దొంగల ఆచూకీ తెలియరాలేదు. దాంతో అక్బర్‌ బీర్బల్‌ సలహా అడిగాడు. రత్నశెట్టి ఈ మధ్య, తన తోట మధ్యలో చిన్నపాటి సొరంగం తన వీరులతో తవ్వించాడని వేగులు బీర్బల్‌కి మరో వార్త అందించారు. దీంతో బీర్బల్‌కి రత్నశెట్టి మీద ఉన్న అనుమానం రెట్టింపు అయింది. ''జహాపనా, ధనాగారం లూటీ అయిన పద్ధతి చూస్తే, దొంగల నాయకుడు చాలా తెలివైనవాడని ఇట్టే అర్థం అవుతోంది. వాణ్ణి పట్టుకోడానికి అంతే తెలివిగా వ్యవహరించాలి'' అన్నాడు. అక్బర్‌, బీర్బల్‌ మారువేషాలు ధరించి, రాత్రి వేళల్లో రాజధాని నగరంలో సంచారం చేయసాగారు. ఓరోజు రాత్రి వారిద్దరు రత్నశెట్టి ఉండే వీధిలో అడుగు పెట్టారు. తమ ముందుగా వెళ్తున్న కొంతమంది ముసుగు మనుషులను చూశారు. నిండుగా ఉన్న సంచులతో, రత్నశెట్టి ఇంటి దగ్గర ఆగడం చూశారు. కొంతసేపటికి ముసుగు మనుషులు సంచులు లేకుండా, ఖాళీ చేతులతో బయటికి వచ్చి, అదృశ్యమయ్యారు. అదే క్షణంలో రత్నశెట్టి తలుపు మూస్తూ కనిపించాడు. జరిగినదంతా చూసి అక్బర్‌కి విపరీతమైన కోపం వచ్చింది. బీర్బల్‌ సలహాతో తోట మధ్యలో తవ్వించడంతో, సొరంగం బయట పడింది. ధనాగారంలో దోచుకోబడ్డ సొమ్మంతా బయట పడింది. రత్నశెట్టి జీవిత ఖైదీగా శిక్షింపబడ్డాడు. ''పాదుషాకు రత్నశెట్టి మీద అనుమానం వచ్చేలా ఎలా చేయగలిగారు?'' అంటూ బీర్బల్‌ భార్య ప్రశ్నించింది. బీర్బల్‌ నవ్వి, ''మారు వేషాలలో మేమిద్దరం రత్నశెట్టి ఇల్లున్న వీధిలోకి ప్రవేశించగానే, ముసుగు వేషాలు ధరించి రత్నశెట్టి ఇంటి గుమ్మం దగ్గరకు వెళ్లేలా కొందరిని ముందుగానే పురమాయించాను. నేను రాజుగారిని సందులోకి తీసుకుని వెళ్ళేలోపుల, వాళ్లు రత్నశెట్టి ఇంటిని గట్టిగా తట్టి, చల్లగా జారుకున్నారు. తలుపు చప్పుడుకు మెలకువ వచ్చిన రత్నశెట్టి తలుపు తీసి, ఎవ్వరూ లేకపోవడంతో తలుపు వేసుకున్నాడు. దీనిని సందు చివరినుంచి చూసి, దొంగలు డబ్బు తస్కరించి రత్నశెట్టికి ఇస్తున్నట్లు అనుమానించారు. అంతకు ముందే, రత్నశెట్టి తోటలో సొరంగం తవ్వించినట్టు వేగులు నాకు చెప్పారు. దాంతో ఆ సొరంగం బయటపడి రత్నశెట్టికి శిక్ష పడింది'' అన్నాడు. బీర్బల్‌ తెలివికి భార్య మురిసిపోయింది.

చిలుక చేసిన సాయం

అనగనగా రామాపురమనే గ్రామం. ఆ గ్రామంలో సాంబయ్యనే రైతు ఉన్నాడు. తనకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఐతే  కొన్ని సంవత్సరాల నుండి కరవు కారణంగా పంటలు పండలేదు. సాంబయ్య రకరకాల పనులు చేసినా కలిసిరాలేదు. కుటుంబ పోషణ భారమైపోయింది. కుటుంబాన్ని పోషించుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. తన పొలంలో ఉన్న నూతిలో దూకి, ఆత్మహత్య చేసుకోబోతుండగా.. 'ఆగు మిత్రమా' అన్న మాటలు వినిపించాయి. చుట్టూ చూడగా చెట్టు మీద ఒక రామచిలుక కనిపించింది. రామచిలుక మాట్లాడం చూసి అశ్చర్యపోయాడు. 'నేనూ, నా కుటుంబం నీ పొలంలో పండిన జామపళ్ళు తిని ఇంతకాలం బతికాం. మేము నీకు ఋణపడి ఉంటాం. ఆ ఋణం తీర్చుకునేందుకు నీకు సహాయం చేస్తాను. ఆత్మహత్య మహా పాపం. బతకటానికే ప్రయత్నం చేయాలి. నేను నీతో వస్తాను. నన్ను ఓ పంజరంలో ఉంచి, చిలుక జోస్యం అంటూ డబ్బులు సంపాదించు. కుటుంబాన్ని పోషించు' అన్నది చిలుక. సాంబయ్యకు చిలుక చెప్పింది నచ్చి, చిలుక చెప్పినట్టు చేయడానికి ఒప్పుకున్నాడు. సాంబయ్య ఊర్లన్నీ తిరుగుతూ మధ్యాహ్నం వరకూ చిలుక జోస్యం చెబుతుండేవాడు. మధ్యాహ్నం ఒక చెట్టు కింద సేద తీరేవాడు. ఈ ఖాళీ సమయంలో చిలుక ఇండ్లపై ఎగిరి.. ఆ ఇండ్ల వివరాలు తెలుసుకుని, సాంబయ్యకు చేరవేసేది. ఆ వివరాలనే చిలుక జోస్యం పేరిట జనాలకి చెప్పేవాడు. తక్కువ కాలంలోనే సాంబయ్య మంచిపేరు సంపాదించాడు. అది సాంబయ్య శత్రువులకు నచ్చలేదు. చిలుక జోస్యమంటూ ప్రజలను తప్పుతోవ పట్టిస్తున్నాడని రాజుకు ఫిర్యాదు చేశారు. రాజు సాంబయ్యను పిలిపించాడు. 'నేను ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా రాజ్యంలో పేదవారు తగ్గకపోవడానికి కారణం ఏమిటో? వారం రోజుల్లో జోస్యం చెప్పాలి. సరిగ్గా చెపితే మంచి కొలువు ఇస్తాను.. లేదంటే శిక్షిస్తాను' అన్నాడు రాజు. 'అలాగే ప్రభు' అంటూ సెలవు తీసుకుని, ఇంటికి వెళ్ళాడు సాంబయ్య. చిలుక సాయంతో ఆ రాజ్యంలో పేదరికం తగ్గకపోవటానికి అవినీతి అధికారులు, వేగులు ఒకటైపోవడమని ఆ జాబితా రాజుకు అందించాడు. రాజు సాంబయ్య చెప్పిన అవినీతి అధికారులు, వేగులను కొలువు నుంచి తప్పించి, కొత్తవారిని నియమించగా రాజ్యంలో పేదరికం తగ్గింది. రాజు సాంబయ్యను మెచ్చుకుని, తన ఆస్థానంలో మంచి కొలువు ఇచ్చాడు. ఆ విధంగా చిలుక చేసిన సాయంతో సాంబయ్య కష్టాల నుంచి బయటపడ్డాడు.

తులసి దళం గొప్పతనం!

ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతను రోజూ అడవిలోకి వెళ్లి ఆకుకూరలు కోసుకొచ్చి, వాటిని అమ్ముకుని జీవనం గడుపుతుండేవాడు. ఉన్నంతలో అవసరంలో ఉన్నవారికి సహాయం చేసేవాడు. అతను రోజూ అడవికి వెళ్లే దారిలో, ఒక గుడిసె ముందు ఒక ముసలాయన ఏడుకొండల స్వామి చిన్న విగ్రహం పెట్టుకుని, తులసి ఆకులతో అర్చన చేయడం గమనిస్తుండేవాడు. అది చూసి ఆ వ్యక్తి చాలా ముచ్చట పడేవాడు. తను కూడా అలా తులసి ఆకులతో పూజ చేయాలని నిత్యం అనుకుంటుండేవాడు. కానీ ఏదో ఒక కారణం చేత చేయలేక పోయేవాడు. ఒక రోజు అతను అడవిలో ఆకుకూరలు కోస్తుంటే, తులసి చెట్టు కనిపించింది. వెంటనే ఆ వ్యక్తి ఇలా అనుకున్నాడు.. “నేను ఎలాగూ పూజ చేయలేక పోతున్నాను. కనీసం ఇవి కోసుకెళ్లి ఆ బ్రాహ్మణుడికి ఇస్తాను” అని నిశ్చయించుకున్నాడు. కోసిన ఆకుకూరలతో పాటు, తులసి దళాలను కూడా కట్ట కట్టి నెత్తిన పెట్టుకుని బయలుదేరాడు. అతడికి తెలియని విషయం ఏంటంటే, నల్ల నాగు ఒకటి అందులో ఉన్నది. ఆ వ్యక్తి వెళ్లి గుడిసె ముందు నిలబడగానే, ఎవరో వచ్చి నిలబడ్డారని గమనించి తల తిప్పి చూసిన బ్రాహ్మణుడితో, “అయ్యా, పూజకు తులసి దళాలు తెచ్చాను. నేను చేయలేక పోతున్నాను. అందుకే మీకు ఇస్తున్నాను” అని అన్నాడు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్న ఆ బ్రాహ్మణుడు తన దివ్యదృష్టితో, తులసి దళాలను తెచ్చిన వ్యక్తి వెనుక రాహువు నిలబడి ఉండడం గమనించాడు. అతడితో, “నాయనా, నేను చెప్పేవరకు ఈ కట్టను నీ తలపై నుండి దించకు” అని చెప్పి, గుడిసె వెనకకు వెళ్ళి ఒక మంత్రం జపించగానే, రాహువు ఆయన వద్దకు వచ్చాడు. రాహువుకు నమస్కరించి, ఎందుకు అతడి వెనుక వచ్చావని ఆయన అడగగా, రాహువు ఆ బ్రాహ్మణుడికి నమస్కరించి, “నేను ఈ రోజు అతడికి హాని చేయాల్సి ఉంది. అది విధి రాత. కానీ, అతను తన తలపైన తులసీ దళాలను మొస్తున్నాడు. అందుకే నేను నా పని చేయలేక పోతున్నాను. అతను అది దించగానే, నేను కాటేసి వెళ్ళిపోతాను” అని అన్నాడు. ఈ విషయం వినగానే బ్రాహ్మణుడికి చాలా జాలి వేసింది. ఎప్పుడూ రాని వాడు, ఆ రోజు పూజకు దళాలను తీసుకు రావడం.. అతడికి ఆపద ముంచుకు రాబోతోందని తెలియగానే, “ఇతడిని ఈ గండం నుండి తప్పించాలంటే ఏదైనా పరిష్కారం ఉందా?” అని రాహువును అడిగాడు. అందుకు రాహువు, “అయ్యా మీరు ఇన్ని రోజులూ చేసిన పూజల వలన సంపాదించుకున్న పుణ్యా ఫలాన్ని అతడికి దానం ఇచ్చినట్టయితే, అతడిని ఈ గండం నుండి తప్పించ వచ్చు” అని చెప్పాడు. బ్రాహ్మణుల వారు క్షణం కూడా ఆలోచించకుండా, అతడికి తను సంపాదించుకున్న పుణ్య ఫలాన్ని దానం ఇస్తున్నానని చెప్పడంతో, రాహువు ఆశ్చర్యపోయాడు. అంతటితో సంతోషించిన రాహువు, ఆ బ్రాహ్మణుడికి నమస్కరించి, తిరిగి వెళ్ళి పోయాడు. వెంటనే పాము కూడా మాయమయ్యింది. ఒక్క తులసీ దళంతో ఇంత అద్భుతమా! ఒక దానం ఇవ్వడం వల్ల, ఒక ప్రాణం నిలబడడమా! మనం సంపాదించుకున్న పుణ్య ఫలం ఇంత శక్తి గలదా! గ్రహ దేవతలనూ, బ్రహ్మ రాతను సైతం మార్చేంత శక్తి గలదా! తరువాత బ్రాహ్మణుడు ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి, ఇక నుండి రోజూ తనకు తులసీ దళాలను తెచ్చి ఇవ్వమని చెప్పాడు. జరిగిన తంతు తెలియక పోయినా, ఆ వ్యక్తి సంతోషంగా అలాగేనని ఒప్పుకున్నాడు.

నిర్మలమైన భక్తి

మధురకు దూరాన అడవిలో ఒక గురుకులం ఉండేది, దానికి శ్రీకృష్ణుని భక్తుడైన ‘హరిదామ్యుడు’ అనే గురువు ఉండేవారు. ఆయన తన శిష్యులతో కలసి యాత్రలకు వెళ్ళొస్తుండేవాడు. అలా ఒక రోజు తిరుగు ప్రయాణంలో ఉండగా సాయంత్రం వేళ పెద్దవర్షం ఎడతెరపి లేకుండా కురియడం వలన వర్షం ధాటికి నీళ్లు ముంచెత్తడంతో మార్గంలోని పల్లెల్లో దారులన్నీ నీటితో నిండి నిర్మానుష్యమయ్యాయి. వేరే దారిలేక ఒక పల్లెలోని ఇంట్లో విడిది చేశారు.  ఆ భారీ గాలి, వర్షానికి దారిలోని అందరూ ఇళ్లల్లో తలుపులు బిగించుకొని ఉన్నారు.  హోరుగాలి, వానలో సుడిగాలికి ఎగిరివచ్చిన ఎండుటాకులాంటి ఒక కుర్రవాడు నిరాధారంగా తిరుగుతూ తనకేదైనా ఆశ్రయం దొరుకు తుందేమోనని పది పన్నెండేళ్ళ మధ్యన వయసున్న సన్నగా, దుర్భలంగా వున్న శరీరంపై చిన్న లాగు చొక్కా తప్ప వాన, చలి నుండి కాపాడడానికి వేరే మరింకే ఆచ్ఛాదన లేని ఒక బాలుడు. ఆ కుర్రవాడి పేరు అనంతుడు. చలికి గజగజ వణుకుతూ ఎటుపోవాలో తెలియక చాలాసేపు దారిమధ్యలో నిలబడి పోయాడు. అటూ ఇటూ పరికించి చూశాడు, ఎవరినైనా తలుపుతట్టి ఆశ్రయం అడగాలంటే అపరిచితుడైన తనను దొంగగా భావించి లోపలికి రానివ్వరనే భయంతో అలాగే సాగిపోతుంటే ఒక పెద్ద వటవృక్షం కనిపించింది. ఆ చెట్టు మొదల్లో కాస్తంత స్థలం నీరులేకుండా కనిపించడంతో బ్రతుకు జీవుడా అని ఆ జానెడు స్థలంలో ముడుచుకొని కూర్చున్నాడు. కొంతసేపటికి నిద్రలోకి జారిపోయాడు. తూర్పు తెలవారుతుండగా వాన ఆగిపోయింది... ప్రజలింకా తలుపులు తెరువలేదు. ఆ సమయంలో గురువు హరిదామ్యుడు వారి శిష్యులు గురుకులానికి బయలుదేరి ఆ దారిన నడిచివెళ్తుండగా అనుకోకుండా ‘అనంతుడు’ గురువుగారి దృష్టిలో పడ్డాడు.  కనీసం కప్పుకునేందుకు చిన్న దుప్పటైనా లేకుండా ఆ భయంకరమైన వాన, చలిలో ముడుచుకొని వున్న ఆ బాలుని చూసి గురువు దయార్ద్ర హృదయం ద్రవించింది. వెంటనే ఆ బాలుని దగ్గరకు వెళ్లి తట్టి లేపాడు. బాలుడు కళ్ళు తెరచి ఎదుట నిలిచివున్న గురువును చూసి భయంతో, భక్తితో లేచి నిలబడ్డాడు.  “ఎవరు నువ్వు? ఈ వాన, చలిలో ఇక్కడ ఇలా ఎందుకు పడుకున్నావు” అని ప్రశ్నించిన గురువుకు తన పేరు అనంతుడు అని, తనకెవ్వరూ లేరని, ఈ ఊరిలో ఏదైనా బ్రతుకుదెరువుకోసం పని దొరికితే చేసుకుందామని వచ్చానని, తుఫాను తాకిడికి ఎటుపోవాలో తెలియక ఈ చెట్టునాశ్రయించానని చెప్పడంతో గురువు జాలిగుండె కరిగి, తనతో తన ఆశ్రమానికి రమ్మని చెప్పాడు. మహదానందంతో అనంతుడు గురువును అనుసరించాడు. గురుకుల ఆశ్రమానికి చేరుకున్నాక తన శిష్యుడిని పిలిచి అనంతుడికి భోజనం పెట్టి మార్చుకొనేందుకు బట్టలిచ్చి ఇకపై ఆ కుర్రవాడు ఇక్కడే వుండి ఆశ్రమంలో ఏదో ఒక పని చేసుకుంటూ తల దాచుకునేటట్టు ఏర్పాటు చేయమన్నాడు.  గురువుకు కృతజ్ఞతలు చెప్పుకొని అనంతుడు ఆ శిష్యుడి వెనుక వెళ్ళాడు.  ఆ రోజునుండి ఆశ్రమంలో తోటపని, ఇతర చిన్నా, చితక పనులు చేసుకుంటూ నమ్మిన బంటులా అందరి తలలో నాలుకలా మసలుకుంటూ అందరితోపాటు గురువుగారి మన్ననకు పాత్రుడయ్యాడు. కొంతకాలం తర్వాత ఎందుకో అనంతుడు మొఖం చాలా ఉదాసీనంగా మారడం గమనించాడు గురువు. ముందులా హుషారుగా కాకుండా ఏదో పరధ్యానం, అసంతృప్తి అతనిలో కనిపిస్తున్నాయి. అన్ని విధాలా విచారించగా అతనిపట్ల ఎవ్వరూ అనుచితంగా ప్రవర్తించలేదని, అన్నీ సక్రమంగానే వున్నాయని తెలిసింది. అయితే ఆ మార్పుకు కారణమేమిటి? అంతుబట్టలేదు గురువుగారికి.  అసలు కారణం వచ్చిన క్రొత్తలో తినడానికి తిండి, తలదాచుకోవ డానికి నీడ దొరికాయని సంతోషించాడు. కానీ కొన్ని రోజుల తర్వాత తన పనులు తాను చేస్తూనే ఇక్కడికి వచ్చే అందరినీ గమనించేవాడు. అనేకమంది ఇక్కడకు వచ్చి గురువువద్ద ఆధ్యాత్మిక విద్య, స్తోత్రపాఠాలు నేర్చుకొనేవారు. ధ్యానమందిరంలో కూర్చొని పూజలు, ప్రార్థనలు చేసేవారు. ఇవన్నీ చూశాక అనంతుడు వారంతా గొప్పవారు, చదువుకున్నవారు, వారు మంత్రాలతో, ప్రార్థనలతో, భగవంతుని కీర్తిస్తూ దైవానుగ్రహానికి పాత్రులవుతున్నారని, తనకు చదువు, సంధ్యా, వాక్సుద్ధి లేదు కాబట్టి ఎలా ప్రార్థించాలో తెలియక నిరాశా, నిస్పృహలతో వున్నాడు. రోజంతా కష్టపడి పనిచేసి, వేళకి తిని, పడుకొనే తనకు దైవానుగ్రహం ఎందుకు లభిస్తుంది?  తనపట్ల దైవం ఎలా ప్రసన్నం కాగలడు? ఇదీ అతనిలో నైరాశ్యానికి మూలకారణం. ఒకనాడు హఠాత్తుగా ఒక చిత్రమైన పరివర్తన అనంతుడి ముఖంలో కనిపించడంతో గురువుగారు ఆశ్చర్యపడ్డాడు.  ఎన్నడూ లేని ఒక క్రొత్తకాంతి అతని మొఖంలో చోటు చేసుకుంది. అతని మాటల్లో, చేతల్లో సంతోషం, ఉత్సాహం పొంగిపొర్లుతున్నాయి.  అందుకు కారణమేమైవుంటుందా అని తెలుసుకోవాలని నిశ్చయించు కున్నాడు గురువుగారు.  ఆరోజు మధ్యాహ్నం భోజనానంతరం ఎవరికి వారే ఎండవేళలో తమ తమ కుటీరాల్లోకి వెళ్ళిపోయారు. గురువు గారు కూడా తన కుటీరంలోనికి వెళ్లి తలుపులు మూసుకొని కిటికీలో నుండి అనంతుడిని గమనించసాగాడు. ఎప్పటిలా తన పనులన్నీ ముగించుకొని కుటీరం దగ్గర అరుగుపైన కూర్చున్న అనంతుడు ఒకసారి లేచి నిలబడి చుట్టూ పరికించి చూశాడు. ఎవరూ లేరని తననెవరూ గమనించడం లేదని దృఢపడ్డాక మెల్లగా ముందుకు నడిచాడు. అది చూసిన గురువు కుటీరం నుండి బయటకు వచ్చి అనంతుడు తనను చూడకుండా జాగ్రత్తపడుతూ అతడేం చేస్తున్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో గమనించ సాగాడు.  అనంతుడు తిన్నగా కుటీర ధ్యానమందిరంలోనికి వెళ్లి తలుపులు మూసుకొనడం చూసి గురువుగారు దిగ్భ్రాంతి చెందాడు.  వెంటనే సడీచప్పుడు చేయకుండా కుటీర మందిరం వద్దకు వెళ్లి చాటుగా అనంతుడు ఏం చేస్తున్నాడో చూడసాగాడు. అనంతుడు మందిరం మధ్యలో వున్న శ్రీ కృష్ణుని విగ్రహంముందు మోకాళ్ళపై కూర్చొని ప్రార్థనా పూర్వకంగా భక్తితో ఏదో మాట్లాడడం చూసి గురువుగారు శ్రద్ధగా విన్నాడు.. "కృష్ణా! అందరూ నిన్ను స్తోత్ర పాఠాలతో స్తుతించి, ప్రార్థించి నీ మన్ననలు పొందుతున్నారు.. నాకు చదువురాదు.. పూజలు రావు.. స్తోత్రాలు రావు... అందుకే నిన్ను నాకు తెలిసిన విద్యతో ప్రసణ్ణున్ని చేసుకోవాలని వచ్చాను. రోజూ నా ప్రదర్శన చూసి నన్ను అనుగ్రహించి  నీ దర్శనభాగ్యం ప్రసాదించడం నా అదృష్టం. అందుకే ఈరోజు మరికొన్ని క్రొత్త ఆటలు ఆడి నిన్ను సంతోషపెట్టాలని వచ్చాను. చూసి ఎలా ఉన్నాయో చెప్తావు కదూ?" అంటూ తన సంచిలో నుండి 10 బంతులు బయటకు తీసి వాటిని గాలిలో ఎగురవేస్తూ ఒక్కటికూడా క్రిందపడకుండా ఆడాడు, ఆ తర్వాత అరచేతిని నేలపై మోపి తల క్రిందికి, కాళ్ళు పైకి పెట్టి మందిరం అంతా నడిచాడు. ఆ తర్వాత చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేశాడు. అన్నీ ముగిశాక మోకాళ్ళపై మోకరిల్లి స్వామితో.. "కృష్ణా! చెప్పు! ఈ రోజు నేను ప్రదర్శించిన విద్యలు నీకు నచ్చాయా?” అని భక్తితో అడిగాడు.  వెనువెంటనే భగవానుడి విగ్రహంనుండి కనులు మిరుమిట్లు గొలిపే ప్రకాశవంతమైన వెలుగు వెలువడింది. ఆ వెలుగుతోపాటు స్వామి మాటలు కూడా ప్రతి ధ్వనించాయి..."మిత్రమా! అనంతా!! నీ విద్యలు అమోఘం... అవి చూసి నేను చాలా ఆనందించాను. రేపు కూడా వచ్చి నీ ఆటలు ప్రదర్శిస్తావు కదూ?" అన్నాడు. "తప్పకుండా కృష్ణా!" అని లేచి నిలబడ్డాడు అనంతుడు.  బయటనుండి ఈ దృశ్యం చూసి… శ్రీ కృష్ణుని పలుకులు విని గురువుగారు శిలాప్రతిమలా నిలబడిపోయాడు.  తలుపులు తెరిచిన అనంతుడు గురువును చూసి ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు.  కానీ గురువుగారు అతన్ని ఆమాంతం ఆలింగనం చేసుకున్నాడు..“నాయనా అనంతా! ఎన్నో దశాబ్దాలనుండి ఏకదీక్షతో నేను స్వామిని కొలుస్తున్నాను, ఎన్నో మంత్రాలు జపిస్తున్నాను. ఎందరికో నేర్పిస్తున్నాను. కానీ ఇంతవరకు నాకు ఆ భగవానుడి సాక్షాత్కారం లభించలేదు. ఈ రోజు నిర్మల భక్తిభావంతో సరళ హృదయంతో నీవు ఆటలాడి స్వామిని మెప్పించి సాక్షాత్కారాన్ని పొందావు. నీవు ధన్యుడవు. ఈ రోజునుండి నీవు ఈ ఆశ్రయంలో పనివాడవు కాదు.. నా ప్రథమ శిష్యుడవు.. నీకు సకల విద్యలూ నేర్పిస్తాను” అన్నాడు ఆనందాశ్రువులతో... దైవానుగ్రహం పొందాలంటే కేవలం జప తపాదులు, యజ్ఞయాగాదులు, మంత్రతంత్రాలు మాత్రమే కాదు. వాటితో బాటుగా ముఖ్యంగా కావల్సింది నిర్మలమైన భక్తి, స్వచ్ఛత తప్పక ఉండాలి.

కలిసి వస్తే కుట్టు సూది చాలు!

వెనక కోసల దేశంలో ముగ్గురు మిత్రులు ఉండేవారు. వారిలో ఇద్దరు నందుడు, సునందుడు అనేవారు ధనికులు. మూడో వాడు ఆనందుడు గర్భదరిద్రుడు. అతను తాళ్ళు పేనుకొని జీవించేవాడు. అతణ్ణి ఏ విధంగానైనా ధనికుణ్ణి చెయ్యాలని నందుడూ, సునందుడూ ఆలోచన చేశారు. " పెట్టుబడికి కొంత ధనం ఉన్నట్టయితే ఎవరైనా ధనికుడు కావచ్చు. కనుక  ఆనందుడికి కొంత మూల ధనం ఇద్దాం” అన్నాడు నందుడు. "ఎంతమంది ధనికులు దరిద్రులై పోవటం లేదు ? కలిసివచ్చినట్టయితే పెద్ద పెట్టుబడి లేకుండానే ధనికుడైపోవచ్చు” అన్నాడు సునందుడు. తన మాట నిజమని రుజువు చేయటాని కని నందుడు మర్నాడు ఆనందుడికి రెండు వందల మాడలిచ్చాడు. వాటితో ఏదైనా వ్యాపారం చేసుకొని ధనం సంపాదించమని చెప్పాడు. ఆనందుడు సంతోషించి, ఆ రెండువందల మాడలలో పది ఖర్చుకు గాను తీసి, మిగిలినవి తన తలపాగాలోనే భద్రంగా మూటకట్టి, ఇంటికి కావలిసిన వెచ్చాలు కొనటానికి బజారుకు బయలుదేరాడు. దురదృష్టవ శాత్తూ దారిలో ఒక పక్షి ఎటు నుంచో వచ్చి, ఆనందుడి తలపాగాలో మూట చూసి అందులో ఏదో ఉన్నదనుకొని మూటనూ తన్నుకుపోయింది. నూట  తొంభై మాడలూ రెక్కలు వచ్చి ఎగిరి పోయినందుకు ఆనందుడు చాలా విచారించాడు. తరువాత కొద్ది రోజులకు నంద సునంద లు ఆనందుడి ఇంటికి వచ్చి, తమ స్నేహి తుడి పరిస్థితిలో మార్పు లేనందుకు కారణం అడిగారు. " నా అదృష్టం బాగులేదు. డబ్బంతా తలపాగాలో చుట్టుకొన్నాను. కాని ఏదో పక్షి వచ్చి తలపాగా తన్నుకుపోయింది” అన్నాడు ఆనందుడు విచారంగా. ఈ వృత్తాంతం నందుడు నమ్మాడుగాని సునందుడు నమ్మలేదు. ఆనందుడు ఆ డబ్బును దుర్వినియోగపరిచి ఉంటాడని అనుకున్నాడు. నందుడు మాత్రం ఆనందుడికి మరొకసారి రెండువందల మాడలిచ్చి, "ఈసారి అయినా డబ్బు భద్రంగా ఉంచుకొని, దాని సహాయంతో ధనం సంపాదించు,” అని సలహా ఇచ్చాడు. ఈసారి ఆనందుడు తనకు కావలసిన మాడలు తీసుకోని, మిగిలినవి తవుడు తట్ట అడుగున భద్రంగా దాచి, ఇంటికి కావలసిన సంచారాలు పట్టుకువద్దామని బజారుకు వెళ్ళాడు. అతను తిరిగి వచ్చే సరికి తవుడుతట్ట కనబడలేదు. భార్యనడిగాడు. "ఉప్పు అమ్మకానికి వచ్చింది. దగ్గిర డబ్బులు లేవు. అందుకని తపుడు తట్ట అమ్మి రెండు శేర్లు ఉప్పు తీసుకున్నాను" అన్నది ఆనందుడి భార్య. ఆనందుడికి పట్టరాని దుఃఖం కలిగింది. తనకు డబ్బు దక్కించుకొనే యోగం లేదని అతను తేల్చుకొన్నాడు. మరి కొద్ది రోజులకు నందనునందులు మళ్ళీ వచ్చి జరిగిన సంగతి విన్నారు. ఆనందుడు ఎప్పటికన్న దరిద్రుడుగా  కనిపించాడు. అతడు బట్టల చిరుగులు కూడా కుట్టుకొలేదు. కారణమేమంటే ఇంట్లో సూది కూడా లేదని చెప్పాడు. అప్పుడే బజారులో సూదుల పొట్లం కొన్న సునందుడు ఆనందుడికి ఒక సూది ఇచ్చి " ఇది పెట్టి నీ భార్య చేత చిరుగులు కుట్టించుకో!” అన్నాడు. తరువాత నంద సునందులు వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రే పక్క ఇంటి బెస్తవాడి భార్య అనందుడి భార్య వద్దకు వచ్చి, " అక్కా, మీ ఇంట్లో సూది ఉంటే కాస్త ఇస్తావా? రేపు ఉదయమే మావాళ్ళు వలలు పట్టుకొని చేపలు పట్టబోతున్నారు. వల బాగుచేసుకోవాలి. వలలో మొదట పడిన చేపలు మీకిస్తాంలే!” అన్నది. ఆనందుడి భార్య ఆమెకు ఇంట్లో ఉన్న సూది అరువు ఇచ్చింది. మర్నాడు సాయంకాలం చేపలతో తిరిగి వచ్చిన బెస్తవాడు తన కూతురి చేతికిచ్చి ఆనందుడి ఇంటికి పెద్ద చేపను పంపాడు. కూర వండుదామని ఆనందుడి భార్య ఆ చేపను కోసేసరికి అందులో పెద్ద గాజు ముద్దలాటిది దొరికింది. ఆ గాజు ముద్దతో ఆనందుడి పిల్లలు వీథిలో ఆడుతూండగా చూసిన నగల వర్తకుడు అనందుడి దగ్గిరికి వచ్చి, "ఆ గాజు ముక్క నాకు అమ్ముతావా, ఆనందయ్యా? నూరు మాడలిస్తాను !'' అని అడిగాడు. అది చాలా విలువైన గాజు పెంకు అయి ఉండాలని అనుమానం కగిలి ఆనందుడు దానిని అమ్మడానికి నిరాకరించాడు. ఆ రోజే దానిని నగరానికి పట్టుకుపోయి రత్నాల వర్తకులకు చూపించాడు. నిజానికి అదొక అమూల్యమైన వజ్రం. దానిని పెద్ద వర్తకుడు ఇరవై వేల మాడ లిచ్చి కొనుక్కొన్నాడు. ఆ ధనంతో  ఆనందుడు ఇళ్ళూ, దొడ్లూ కొన్నాడు. తాళ్ళు పేనటానికి కర్రలతో యంత్రాలు చేయించాడు, తాళ్ళ పరిశ్రమ ఏర్పాటు చేశాడు, ధనికుడైనాడు. అనందుడు అకస్మాత్తుగా ధనికుడైన వార్త తెలియగానే అతని మిత్రులు నంద సునందులు అతనిని చూడవచ్చారు. "నేనిచ్చిన డబ్బు పెట్టుబడి చేసే ధనికుడ వయావు. అవునా?” అన్నాడు నందుడు. ఆనందుడు జరిగినదంతా పూసగుచ్చిన ట్టు మిత్రులకు చెప్పాడు. "కలిసివచ్చేసరికి నేనిచ్చిన సూది తోనే ఆనందుడు ధనం సంపాదించాడు, చూశావా?” అన్నాడు సునందుడు. ఈసారి నందుడికి నమ్మకం కలగలేదు. ఆనందుడు తన ధనంతోనే ధనికుడై, ఆ సంగతి కప్పిపుచ్చటానికి అబద్ధమాడు తున్నాడనుకొన్నాడు. మిత్రులు ముగ్గురూ కలిసి ఆనందుడు కొత్తగా కట్టించిన ఇల్లూ, వెనక ఉన్న దొడ్డి చూడటానికి బయలుదేరారు. వారు దొడ్లోకి వెళ్లేసరికి ఆనందుడి పిల్లలు ఒక చెట్టు ఎక్కి దాని మీద ఉన్న పక్షిగూడును కింద పడేశారు. అందులో ఆనందుడి తలపాగా కనిపించింది. దాని చెంగున మూటకట్టి ఉన్న నూటతొంభై మాడలూ దొరికాయి. వారక్కడి నుండి బయలుదేరి గొడ్లసావిడి కి వచ్చారు. అదే సమయంలో బజారు నుంచి నౌకరు ఒకడు తవుడుతట్ట కొని తెచ్చాడు. వాడు దానిలో నుంచి తవుడు తీసి కుడితిలో పోస్తూండగా బంగారు మాడలు కొన్ని వాడి చేతిలోకి వచ్చాయి. తట్ట బోర్లించి చూసేసరికి ఆనందుడు రెండవసారి పొగొట్టుకొన్న నూటతొంభై మాడలూ కూడా దొరికాయి! ఇది చూడగానే నందుడికి ఆనందుడి మాటల్లో నమ్మకం కుదిరింది. సునందుడు చెప్పినట్టు కలిసివస్తే ఐశ్వర్యం రావటానికి  కుట్టుసూది అయినా చాలునని నందుడు గ్రహించాడు.

చేసిన సాయం ఊరికే పోదు

కారు ఆగిపోయింది . అందులోంచి దిగిన ఆమెకు 40 సంవత్సరాలు ఉంటాయి . దిగి చూసింది టైర్ పంక్చర్ అయ్యింది . స్టేఫినీ ఉందికానీ తనకు  వెయ్యడం రాదు . రోడ్డు పక్కకు తీసి సహాయం కోసం చూస్తోంది . ఒక్కరూ ఆగడం లేదు . సమయం చూస్తే సాయంత్రం  ఆరు దాటుతోంది. నెమ్మదిగా చీకట్లు కమ్ముకుంటున్నాయి . మనసులో ఆందోళన . ఒక్కతే ఉంది . తోడు ఎవరూ లేరు .  చీకటి పడితే ఎలా? దగ్గరలో ఇళ్ళు లేవు . సెల్ పనిచెయ్యడం లేదు  ( సిగ్నల్స్ లేవు ). ఎవరూ కారునూ , పక్కనే నిలబడిన ఆమెనూ చూసినా ఆపడం లేదు . అప్పటికే దాదాపు ఒక గంట గడిచింది . ఎలారా దేవుడా అనుకుంటూ భయపడడం మొదలయ్యింది . చలి కూడా పెరుగుతోంది .. అటుగా వెడుతున్న ఒక బైకు ముందుకు వెళ్లి పక్కకు తిప్పి వెనక్కు వచ్చింది . ఒక వ్యక్తి బైకు స్టాండ్ వేసి, ఈమె దగ్గరకు వస్తుండటం తో ఆమె సహజంగా భయపడుతుంది.....ఎవరతను ?ఎందుకు వస్తున్నాడు ?  ఏమి చేస్తాడు .?  ఆందోళన !. అతను దగ్గరకి నవ్వుతూ వచ్చాడు ?  టైర్ లో గాలి లేదని చూశాడు . ఆమె బెదిరిపోతోందని  గ్రహించాడు ." భయపడకండి . నేను మీకు సహాయం చెయ్యడానికి వచ్చాను . బాగా చలిగా ఉంది కదా ! మీరు కారులో కూర్చోండి . నేను స్టేఫినీ మారుస్తాను" అన్నాడు  ఆమె భయపడుతూనే ఉంది . " నా పేరు బ్రియాన్. ఇక్కడ దగ్గరలో మెకానిక్ షాప్ లో పని చేస్తాను " అన్నాడు .అతను డిక్కీ తెరిచి కావలసిన సామాను తీసుకుని కారు కిందకి దూరి జాకీ బిగించాడు . తారు రోడ్డు గీసుకొన్న రక్తపు చారాల చేతులతో జాకీ బిగించి టైరు తీసి టైర్ మార్చాడు . సామాను తిరిగి  కారులో పెట్టాడు .. ఆమె డబ్బులు తీసి ఇవ్వబొయింది . వద్దు అన్నాడు ." మీరు కాదనకండి . మీరు ఈ సహాయం చెయ్యక పోతే నా పరిస్థితిని తలుచుకుంటే నాకు భయం వేస్తోంది" అంది. " నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు సహాయ పడ్డారు . మీకు సహాయం చెయ్యాలనిపిస్తే ఎవరైనా కష్టాల్లో ఉన్నారనిపిస్తే నా పేరు తలచుకుని వారికి సహాయం చెయ్యండి " అని వెళ్లి పోయాడు... మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆమె కారు నడుపుకుంటూ వెడుతోంది . అప్పుడు ఆమెకు ఆకలి గుర్తుకు వచ్చింది . తను వెళ్ళ వలసిన దూరం చాలా ఉంది . ఆకలి, చలీ ఆమెను రోడ్డుపక్కన ఉన్న హోటల్ కి వెళ్ళేలా చేశాయి ... అదొక చిన్న హోటల్ .  కస్టమర్ల టేబుల్స్ దగ్గరకి ఒక గర్భిణీ మహిళ సర్వ్ చేస్తోంది . ఆమెను చూస్తుంటే నిండు గర్భిణీ అనిపించింది . డెలివరీ రోజులు దగ్గరకి వచ్చేసి ఉంటాయి అనిపించింది . బరువుగా నడుస్తోంది . అన్ని టేబుల్స్ దగ్గరకీ వెళ్లికావలసిన ఆర్డర్ తీసుకోవడం , సర్వ్ చెయ్యడం బిల్ తీసుకుని చిల్లర ఇవ్వడం అన్నీ  తనే చేస్తోంది . ఆమె ముఖం లో ప్రశాంత మైన చిరునవ్వు.ఆమె తన టేబుల్ దగ్గరకి వచ్చింది . చిరు నవ్వుతో ఏమి కావాలండి ? అని అడిగింది . అంత శ్రమ పడుతూ కూడా చెరిగిపోని చిరు నవ్వు ఆమె ముఖం లో ఎలా ఉందొ ? అని ఆశ్చర్య పడుతోంది తను తన మనసులో. భోజనం ఆర్డర్ ఇచ్చింది . భోజనం చేసి ఆమెకు 1000నోటు ఇచ్చింది . ఆమె చిల్లర  తేవడానికి వెళ్ళింది . తిరిగి వచ్చేటప్పటికి ఈమె కనబడలేదు .. ఈమె కూర్చున్న టేబుల్ మీద ఉన్న గ్లాసు క్రింద ఒక కాగితమూ దానికింద నాలుగు 1000 నోట్లూ ఉన్నాయి . ఆ కాగితం చదివిన హోటల్ మెయిడ్ కి కన్నీళ్లు ఆగలేదు .అందులో ఇలా ఉంది .." చిరు నవ్వుతో ఉన్న నీ ముఖం నీకు బాధలు లేవేమో అన్నట్టు ఉంది . నువ్వు నిండు నెలలతో పని చేస్తున్నావు అంటే నీకు డబ్బు అవసరం అని అనిపిస్తోంది . నాకు ఒక మిత్రుడు సహాయ పడినట్టే అతడిని తలచుకుంటూ నేను నీకు సహాయ పడుతున్నాను. నువ్వూ ఇలాగే ఇతరులకు  సహాయపడు . " అని రాసి ఉంది.. ఇంటికి వచ్చింది . అప్పుడే ఇంటికి వచ్చి అలసి పోయి పడుకున్న భర్త చేతి కేసి చూసింది . గీసుకు పోయిన చేతులు రక్తపు చారలతో ఉంది . అతడి పక్కన మంచం మీదకు చేరుతూ మనం దిగులుపడుతున్నాం కదా డెలివరీకి డబ్బులెలాగా అని.... ఇక ఆ బెంగ తీరిపోయిందిలే బ్రియాన్!  భగవంతుడే మనకు సహాయం చేశాడు .  ఆయనకి కృతజ్ఞతలు అంది ప్రశాంతంగా.. మనం ఎవరికయినా మనస్పూర్తిగా సహాయం చేస్తే అది ఎక్కడికి వెళ్ళదు.. మనం ఆపదల్లో ఉన్నపుడు తిరిగి మన దగ్గరకే చేరుతుంది అన్నది ఆ కధ యొక్క పరమార్ధం..!!

తృప్తి

ఒక సాధువు ఊళ్లు తిరుగుతూ, ఒక గొప్ప రాజ్యానికి రాజధానిగా ఉన్న ప్రదేశాన్ని చేరుకున్నాడు.*  అక్కడి వీధులలో నడుస్తూ ఉంటే, నేలపై పడి ఉన్న ఒక నాణెం ఒకటి అతడి కంట పడింది. అతడు వంగి, తన చేతుల్లోకి తీసుకున్నాడు.  కానీ, ఆ నాణెం వల్ల అతడికేం ఉపయోగం లేదు. ఉపయోగం లేకపోవడం కాదు, అసలు అవసరం లేదు.  తన దగ్గర ఉన్నవేవో, ఉన్నాయి, అవి చాలు. ఆ నాణెం వల్ల కొత్తగా వచ్చే దినుసుల గురించి అతడు ఆలోచించడం లేదు. అందువల్ల, ఆ నాణేన్ని ఎవరికైనా ఇవ్వాలనుకున్నాడు.  దాని అవసరం ఉన్న వాళ్ల కోసం రోజంతా వెతికాడు. కానీ ఎవరూ కనిపించ లేదు!  చివికిన బట్టలతో కొందరు ఎదురైనా వాళ్లంతా సంతోషంగానే ఉన్నారు తప్ప, ఎవరినీ చెయ్యి చాచడం లేదు.    సాధువుకు చాలా సంతోషం వేసింది. ప్రజలు సంతృప్తిగా ఉండడం, అతడికి సంతోషాన్నిచ్చింది. ఆ రాత్రి అక్కడే ఒక చోట విశ్రమించాడు.    తెల్లారి సాధువు నిద్ర లేవగానే, ఆ దేశాన్ని పాలిస్తున్న రాజు, తన సైన్యంతో పక్క రాజ్యంపై దండెత్తేందుకు వెళుతూ కనిపించాడు.  అతడి బలగాలు సాధువు ఉన్న చోటుకు రాగానే, రాజు వారికి ఆగమని సైగ చేసి, రథం నుంచి కిందికి దిగి, ఆ సాధువుకు నమస్కరించాడు.  ‘‘ఓ సాధు పుంగవా! రాజ్యవిస్తరణ కోసం నేను దండయాత్రకు వెళుతున్నాను. నాకు గొప్ప విజయం కలగాలని ఆశీర్వదించండి’’ అని కోరాడు.  వెంటనే, చిరునవ్వుతో సాధువు తనకు దొరికిన నాణేన్ని ఆ రాజు చేతిలో పెట్టాడు.   రాజు చాలా ఆశ్చర్యపోయాడు. ‘ఏమిటి దీనర్థం’ అన్నట్లు సాధువు వైపు చూశాడు.    సాధువు చిన్నగా నవ్వి, ‘'ఓ మహారాజా !.. ఈ నాణెం మీ రాజ్యంలోనే నాకు దొరికింది. దీని అవసరం నాకు లేకపోవడంతో, అవసరం ఉన్న వాళ్లకు ఇవ్వాలని, నిన్నటి రోజంతా వెతికాను. అలాంటి వాళ్లు ఒక్కరూ కూడా కనిపించలేదు. అందరు చాలా సంతృప్తిగా కనిపించారు.   ఉన్న దానితో సంతృప్తి చెందకుండా, ఇంకా ఏదో కావాలని ఆరాటపడుతున్న వ్యక్తి మీరొక్కరే, నాకు కనిపిస్తున్నారు. అందుకే, ఈ నాణెం మీకు ఇచ్చాను’’ అని చెప్పాడు.    రాజు అంతరార్థం గ్రహించాడు. తన దండయాత్ర ఆలోచనను విరమించుకుని, వెనుదిరిగాడు.  నీతి:-  ఎప్పుడూ నిరంతరం ... లేనిదాని గూర్చి/కోసం ఆరాటపడుతూ, ఆశ పడుతూ, మథన పడుతూ ఉంటే ..., మన చేతిలో  ఉన్నదాన్ని అనుభవించే ఆవకాశం, భాగ్యాన్ని కోల్పోతాం !.  ఈ సత్యమును తెలుసుకోని వాడు ...  ఎంత ఉన్నా, ఏమి ఉన్నా, ఎన్ని ఉన్నా కూడా చివరకు "ఏమి లేని వాడే" అవుతాడు !