దీపావళి ప్రత్యేకత అలక్ష్మీ పరిహారం

  దీపావళి అనే పేరులోనే పెద్ద విశేషము ఉన్నది.  దీపావళి పండగ ప్రత్యేకముగా దేనికి ఉపయోగపడుతుంది అంటే ఒకటి అలక్ష్మీ పరిహారము, రెండు జీవోన్నతి. దరిద్రముతో బాధపడుతున్నవాళ్ళు, కాలం కలిసిరాని వాళ్ళు, దుఃఖిస్తున్నవాళ్ళు దీపావళి పండగనాడు చెయ్యవలసిన విధిని సక్రమముగా పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఇంట్లోనుండి అలక్ష్మి వెళ్ళిపోతుంది. దరిద్రముతో బాధపడుతున్నవాళ్ళని వాళ్ల పాపాన్ని తీసేసి లక్ష్మీ కటాక్షాన్ని కల్పించడం కోసం దీపావళి తిధి వచ్చింది. జీవోన్నతి అంటే మనం ఈశ్వరుడు ఎలా బ్రతకద్దని చెప్పాడో అలాంటి పనులు ప్రతీరోజూ చాలా చేస్తుంటాము. ఈశ్వరుడు ఎలా బ్రతకమన్నాడో ఆ పనులు చాలా తక్కువ చేస్తాము అప్పుడు అవి పాపములు. ఉదాహరణకి సూర్యోదయమునకు ముందు నిద్రలేవాలి, లేవట్లేదు,అసుర సంధ్య వేళ పడుకోకూడదు. పడుకుంటున్నాము. ఇంట్లో దీపం పెట్టకుండా ఇల్లు తాళం వేసి ఎక్కడకీ వెళ్ళకూడదు. తాళం పెట్టి ఊళ్ళు వెళ్ళడము వలన ఇంట్లో ఈశ్వరుడికి నైవేద్యం లేదు. ఇవన్నీ దోషములు. మరి ఈ దోషాలన్నీ ఎలా పోతాయి?పాపాలు పోగొట్టుకుని నరకభయాన్ని దూరం చేసుకోవడానికి ఉపయోగపడేది దీపావళి నాటి అమావాస్య తిధి. పాపం నుండి విముక్తి చేస్తుంది అంటే ప్రతీ ఏడాదీ తప్పులు చేసేసి దీపావళి చెయ్యమని కాదు. సాధ్యమయినంత తగ్గిస్తూ మన చేతిలో లేక జరిగిపోయింది అనుకున్న దానికి పరిహారం కోసం కనీసములో కనీసం దీపావళి పండగ జాగ్రత్తగా చేసుకోవాలి. దీపావళి పండగనాడు అలక్ష్మి పోవాలి, జీవోన్నతి జరగాలి అంటే ఏమి చెయ్యాలి? దీపావళి స్నాన విధి: తైలే లక్ష్మీ జలే గంగా దీపావళి తిధౌ వశేత్. అలక్ష్మీ పరిహారార్ధం తైలాభ్యంగో విధీయతే అని శ్లోకం చెప్తూ దీపావళి అమావాస్య రోజు తెల్లవారుఝామున స్నానం చెయ్యాలి. తైలే లక్ష్మీ ఆ ఒక్క రోజు నూనెలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. నూనెలో లక్ష్మి ఉండదసలు కానీ ఆ ఒక్క తిధినాడు నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. ఇంతకీ స్నానం అసలు ఎప్పుడు చెయ్యాలి? ఇంకా ఒక ఝాము తెల్లవారడానికి ఉందనగా అంటే తెల్లవారుఝామున నాలుగూ, నాలుగున్నర మధ్యలో లేచి ఒంటికి, తల మీద నువ్వుల నూనె రాసుకుని పైన చెప్పిన శ్లోకం చెప్తూ స్నానం చెయ్యాలి. స్నానం చేసి దీపం వెలిగించడం వల్ల అలక్ష్మి పోతుంది. మరి పాపం ఎలా పోతుంది?పాపము గంగా స్నానము చేత పోతుంది అందరము ప్రతిరోజు గంగాస్నానం చెయ్యలేము కానీ పరమేశ్వరుడు మినహాయింపుని ఇచ్చాడు. దీపావళి అమావాస్య తెల్లవారడానికి ఇంకా ఒక్క ఝాము ఉన్నదనగా ఎక్కడ తటాకము కానీ, నుయ్యి కానీ ఉన్నచోట, ఇంకా చెప్పాలంటే నీరు ఉంటే అక్కడ ఆ ఒక్క రోజు ఒక్క తెల్లవారు ఝామునందు మాత్రమే, ఒక్కసారే గంగ ప్రవేశిస్తుంది. ఒకవేళ దరిద్రముతో బాధపడుతు అనుకున్నది ఏదీ కలిసిరావట్లేదు చాలా బాధలో ఉన్నామని అనుకుని నివారణకు ఒక మార్గం దొరకాలి అంటే ఇలా స్నానం చెయ్యాలి. దక్షిణాయణ పుణ్య కాలములో కాశీ వెళ్ళకుండా గంగా స్నానం సంకల్ప సహితముగా చెయ్యడానికి అవకాశం ఇవ్వగలిగినటువంటి తిధి ఒక్క దీపావళి అమావాస్య మాత్రమే. గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని ఏమీ మంత్రం చెప్పకపోయినా దీపావళి అమావాస్య రోజు తెల్లవారుఝామున స్నానం చేస్తే గంగా స్నానం చేసిన ఫలితం ఖాతాలో వేస్తారు. గంగా స్నానం చేస్తే ఏమి అవుతుంది? పరమేశ్వరుడి శరీరాన్ని తగిలి భూమి మీదకి వచ్చినటువంటి గంగలో మునక వేసినా, నాలుక మీద వేసుకున్నా, స్నానం చేసినా లేదా "గంగ,గంగ,గంగ" అని మూడు మాట్లు అన్నా కానీ ఆఖరికి కాశీలో చాలా కాలం ఉండి గంగా స్నానం చేసి చనిపోయే వేళకి కాశీలో లేకుండా చనిపోయినా కాశీలో చనిపోయారన్న ఫలితం వేస్తారు. దీపావళి అమావాస్య నాడు జీవుడు అభ్యున్నతిని ఎలా పొందాలి? జీవుడికి అభ్యున్నతి అంటే? మనలో ఉన్న జీవుడు వచ్చే జన్మలోకూడా వేరొక శరీరములోకి వెడతాడు ఆ జీవుడు. అక్కడ పాపం లేని కారణం చేత చక్కగా సంతోషముగా హాయిగా బ్రతకగలగాలి అంటే గంగా స్నానం చెయ్యాలి. ఆ గంగా స్నానాన్ని గుమ్మం కదలకుండా చెయ్యగలిగిన అవకాశం ఒక్క దీపావళి అమవాస్య నాడే. యధార్ధముగా చెప్పాలంటే నరకద్వారము చూస్తామేమో అన్న భయం లేనివారు ఎవరూ ఉండరు. అందరికీ ఉంటుంది.ఆ భయం పోగొట్టడానికీ, ప్రశాంతమైన స్థితిలో ఈశ్వరసేవకులు వచ్చి అంత్యకాలములో తీసుకెళ్ళేటట్లు అనుగ్రహం పొందాలి అంటే దానికి ఒక్క దీపావళి అమావాస్య నాడే అవకాశం. అందుకే అమావాస్య నైమిత్తిక తిధి, అమావాస్య పితృ తిధి, అమావాస్య అటు దైవ శక్తితో ఇటు పితృ దేవతా తిధితో కలిసి శక్తి పొందిన ఒకే ఒక అమావాస్య దీపావళి అమావాస్య. ఇన్ని లక్షణాలు ఉంటాయి దీపావళి అమావాస్యలో. "నేను దేహం విడిచిపెట్టేసినప్పుడు నాకు యమ భటులు కనపడకూడదు. ఈశ్వర భటులు కనపడాలి" అనే కోరిక ఉన్నవాళ్ళు దీపావళి అమావాస్య రోజున స్నానం చేసినప్పుడు ఏమి చెయ్యాలి?. ఒంటికి నూనె రాసుకోవడం ఒకటే కాకుండా చెయ్యవలసినది ఇంకొక విధి, ఉత్తరేణి చెట్టు తెచ్చుకుని చుట్టూ త్రిప్పుకుని స్నానం చెయ్యడం. ఆ చెట్టుని ఏదో అలా వేళ్ళతో ఉన్నదానిని తీసుకొచ్చి కడిగేసి ఓ కొమ్మ తెచ్చుకుని స్నానం చెయ్యకూడదు. ఉత్తరేణి చెట్టుని పైకి తీసినప్పుడు మట్టి పెళ్ళలతో సహా ఆ చెట్టు పైకి లేవాలి. అంటే మొక్కని పైకి పీకితే మట్టి బెడ్డలతో ఉండేటట్లుగ పైకి తీయాలి. అంటే బాగా నీళ్ళు పోసి పైకి తీస్తే అది మట్టితోటి పైకి వస్తుంది. అలా మట్టితోటే తెచ్చుకోవాలి. మట్టితోటే తెచ్చుకుని, స్నానం చేసేటప్పుడు ఆ ఉత్తరేణి చెట్టుని తనకు తానే త్రిప్పుకోవాలి. ఎవరో త్రిప్పరు దృష్టి దోష పరిహారార్ధం తనకి తానే త్రిప్పుకోవాలి. ఆ త్రిప్పుకునేటప్పుడు మాత్రం ఒక శ్లోకం చెప్పాలి శీతలోష్ఠ సమాయుక్తా సకంటక దళాన్వితా హరపాపం అపామార్గ భ్రామ్యమానః పునః పునః అని చెప్పాలి. ఒక్కమారు త్రిప్పుకోకూడదు. కనీసములో కనీసం మూడు మార్లు త్రిప్పాలి. ఆ చెట్టుని పట్టుకుని తలచుట్టూ త్రిప్పుకుని ఈ శ్లోకం చెప్పాలి ఈశ్వరా! ఇదిగో ఉత్తరేణి చెట్టుని తెచ్చాను. శీతలోష్ఠ సమాయుక్తా అంటే మట్టిపెళ్ళలతో ఉన్నటువంటి ఈ ఉత్తరేణి చెట్టుని తెచ్చాను. ఇది సకంటక దళాన్వితా ఇది చిన్న చిన్న ముళ్ళతోటీ ఆకులతోటీ ఉన్నది. అటువంటి ఈ చెట్టు హరపాపం ఇది నా పాపములను అన్నింటినీ కూడా పోగొడుతుంది అపామార్గ-ఓ ఉత్తరేణి చెట్టు భ్రామ్యమానః పునః పునః-నేను మళ్ళీ మళ్ళీ త్రిప్పుకుంటున్నాను ఈ చెట్టుని అని ఉత్తరేణి చెట్టు నాలుగైదు మార్లు తల చుట్టూ త్రిప్పుకుని ప్రక్కకి పారేసి ఆరోజు నిర్భయముగా దక్షిణ దిక్కుకి తిరగాలి. దక్షిణ దిక్కుకి తిరిగి యగ్నోపవీతం ఉన్నవాళ్లయితే యమధర్మరాజు గారికి తర్పణ ఇస్తారు ఆరోజున -యమాం తర్పయామి-యమాం తర్పయామి-యమాం తర్పయామి- అంటూ యముడికి తర్పణ ఇవ్వాలి. కనీసములో కనీసం యముడికి తర్పణ ఇవ్వకపోతే యమధర్మరాజు గారి మీద ఒక స్తోత్రం ఉన్నది అది ఒక్క దీపావళి అమావాస్య రోజే చదవాలి. పోనీ ఆ నామాలు అవీ రాసుకోవడం, చదవడం భయం అంటే కనీసములో కనీసం ఈ ఉత్తరేణి చెట్టు తిప్పేసి స్నానం చేసేటప్పుడు దక్షిణ దిక్కుకి తిరిగి "ఓ యమ ధర్మరాజా! నీకు నమస్కారం" అని చెప్పి మళ్ళీ ఉత్తర దిక్కుకి తిరిగి స్నానం చెయ్యాలి. స్నానం చేసేటప్పుడు ఒంటి మీద స్నాన శాటీతోటే చెయ్యాలి. దిగంబరముగా చేస్తే ఇవన్నీ వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి. అందుకని దిగంబరముగా చెయ్యకూడదు. చిన్న తువ్వాలో ఏదో కట్టుకుని చెయ్యాలి. ఇలా దీపావళి అమావాస్యని ఎవరు చేస్తారో వాళ్ళకి జీవోన్నతి, లక్ష్మీ కటాక్షము కలిగి, అంత్యకాలములో ఈశ్వర భటులు తీసుకెళ్ళేటట్లుగా, మరణించాక నరకద్వార దర్శనము లేకుండా భగవంతుడు అనుగ్రహిస్తాడు

ఓటమి-గెలుపు

గెలుపు ఓటములను సమానంగా తీసుకోవడంలోనే విజయం ఉంది. అదే విజయానికి సోపానంగా మారుతుంది. వాస్తవానికి జీవితంలో ఒకసారి ఓడటం, మరోసారి గెలవడం మామూలే. గెలిస్తే సంబరం అంబరం చుంబిస్తుంది. అమందానందం వెల్లివిరుస్తుంది. మన విజయానికి వీలుగా ఆ దేవుడు మూడు శక్తులు ప్రసాదించాడు. ఇష్టమైన పని తెలివిగా కుదురుగా చేయడానికి ఇచ్ఛాదేవిని, జ్ఞానదేవతను, క్రియాశక్తిని తోడుగా ఉంచాడు. ఏ పనికి ఎలాంటి ఫలితం ఇవ్వాలో అదొక్కటీ  మాత్రం తన చేతిలో ఉంచుకున్నాడు. పని రెండు రకాలు... ఒకటి కోరికతో మన కోసం చేసే పని. రెండోది అందరికీ మంచి కలిగించే విధంగా చేపట్టే పని. ఎవరు ఏ పని చేయాలో నిర్ణయిస్తాడు భగవంతుడు. చేయవలసిన రీతిలో ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేస్తే తగిన ఫలితం వస్తుంది. ఆ నమ్మకం మనకు ఉండాలి. తాను కర్మ చేయవలసిన అవసరం లేకపోయినా, ఎలాంటి కోరిక కోరకపోయినా, భగవంతుడు ఈ జగత్ చక్రాన్ని క్షణం తీరిక లేకుండా నడిపిస్తూనే ఉన్నాడు. ఆయనను చూసి మనమూ పని చేయాలి. ఎంతో కొంత సేవ చేయాలి. సమాజానికి. తోటి మనిషిని తప్పకుండా ఆదుకోవాలి బళ్లు ఓడలు, ఓడలు బళ్లు అవుతాయి. ధనికుడు పేదవాడవుతాడు. గరీబు నవాబుగా మారతాడు. ఇవన్నీ కళ్లారాచూస్తూ, ఏ పని ముట్టుకుంటే ఏం కొంపలంటుకుంటాయోనన్న భయంతో- మనం చేయకపోతేనేం... ఎవరో ఒకరు చేసేస్తారు అన్న ధీమాతో ఒళ్లు దాచుకోవడం మహాపచారం. అది ధర్మానికి విరుద్ధం. మూలపడ్డ యంత్రం తుప్పుపట్టి తునాతునకలైనట్టు- మన శరీరాలు, సోమరిపాటుకు గురికాక తప్పదు. పనికి దూరంగా ఉండటం సోమరి తనమే కాదు, ఆత్మవంచన కూడా. ఈ పని మనం చేస్తున్నాం కాబట్టి ఫలితం అనుకున్నట్టే రావాలి అనుకోవడం దురాశ. దురాశ వల్ల దుఃఖం కలుగుతుంది. ఓడిపోయానన్న ఆవేదన అగ్నిగోళంగా మారి కోపావేశానికి కారణం అవుతుంది. కోపిష్టికి ఒళ్లు తెలియదు. మెదడు మొద్దుబారుతుంది. బుద్ధిజ్ఞానాలు నశించడం వల్ల తానూ నశిస్తాడు. పురాణాల్లోని దూర్వాసుడు కోపం వల్ల, విశ్వామిత్రుడు కామం వల్ల, భృగుడు అహంకారం వల్ల, విభాండకుడు మమకారం వల్ల భంగపడ్డారు. జ్ఞానికి భంగపాటు తప్పనప్పుడు అసలు కర్మ చేయడం దేనికని అడగవచ్చు. సాక్షాత్తు ఆ భగవంతుడే కర్మలు చేపట్టుతూ, ఈ జగత్ చక్రం తిప్పుతుండగా- మనం చేతులు ముడుచుకుని, కాళ్లు చాపుకొని కూర్చోవడం తగునా? కేవలం మన స్వార్ధం కోసం పాటుపడకుండా నలుగురికీ పనికి వచ్చే మంచిపనులు చేపట్టాలి. అలా విశాల హృదయంతో పనులు చేస్తుంటే ఫలితం పట్ల ఆసక్తి క్రమంగా తగ్గుముఖం పడుతుంది. గెలుపు ఓటముల నడుమనున్న అడ్డుగీత అంతర్థానమైపోతుంది. అనుకున్నది అయితే మంచిది, అనుకోనిది జరిగినా అదీ మనమంచికేనని తెలుసుకోవడమే వైరాగ్యం. గెలుపు ఓటమి నాణానికి బొమ్మ, బొరుసు లాంటివి. సముద్రానికి ఆటూపోటూ, చంద్రుడికి ఎదుగుదల, తరుగుదల తప్పవు. కష్టసుఖాలు | వెలుగునీడలా వెంటాడుతూనే ఉంటాయి. గెలుపుతో పొంగిపోకుండా, ఓటమికి కుంగిపోకుండా సమతౌల్యం సాధించడమే జీవిత పరమార్థం. 

నమస్కారం.. సంస్కారానికి ప్రతిరూపం

సంస్కారమే మనిషి తనానికి నిదర్శనం. ఎదుటి వ్యక్తికి సముచిత గౌరవం ఇవ్వడమే ఒక వ్యక్తి వ్యక్తిత్వానికి ప్రమాణికంగా ఎవరైనా భావిస్తారు. అలా మన సంస్కారాన్ని చాటేందుకు మనం ఎదుటి వ్యక్తికి ఇచ్చే గౌరవం నిదర్శనంగా నిలుస్తుంది. అందులో నమస్కారం సంస్కారానికి ప్రతీకగా ఎంచవచ్చు.   నమస్కారానికి ప్రతిగా నమస్కరించడం మానవుని సంస్కారం. మనం తోటివారికి నమస్కరించేటప్పుడు అది సంస్కారవంతంగా ఉండాలి. మనల్ని ఎదుటివారు ఎంతగా గౌరవించారో, వారిని అంతకు మించి గౌరవించని పక్షంలో ఆ నమస్కారం తిరస్కారానికి ప్రతీకగా నిలుస్తుంది.  ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నప్పుడు ఒకరినొకరు నమస్కరించుకోవడం మన సంస్కృతి. మన  సంస్కారం. మన సంప్రదాయం. ఇలా పలకరించుకునే పద్ధతి ఒక్కొక్క జాతిలో ఒక్కో విధంగా వుంటుంది. అవి.. వారివారి సంస్కృతీ సంప్రదాయాలు, నాగరికతపై ఆధారపడి వుంటుంది. అయితే.. ఈ పలకరింపులన్నింటిలో భారతీయులది  శైలే ప్రత్యేకం. ఈ పలకరింపు శాస్త్రీయతతో మేళవించిన సంప్రదాయం. పెద్దవారిని చూడగానే చిన్నవారు చేతులు జోడించి నమస్కరించడం.  ‘నమస్కారం’లో ‘నమ’ అంటే వంగి వుండటం. అంటే.. పెద్దల ఎదుట అహంకారం ప్రదర్శించకపోవడం. అసలు ఎందుకు నమస్కరించాలి..?  ఈ రోజులలో   ‘హాయ్’, ‘హలో’ అన్న పలకరింపులు ఎక్కువ అయిపోయాయి. అదే ఎందుకు కంటిన్యూ చేయకూడదు అన్న సందేహం సహజమే.  కానీ.. అలా చేయకుండా నమస్కారం కచ్చితంగా చేయాలని చెప్పడానికి  బలమైన కారణం  వుంది. మానవ శరీరం ఒక విద్యుదయస్కాంత ఘటం. ధన, ఋణ ధృవాలు కలిస్తే విద్యుత్ ప్రవాహ మార్గం (సర్క్యూట్) పూర్తి అవుతుంది. మనిషి శరీరంలో అటువంటి ధృవాలు చేతి వ్రేళ్ళు. వాటిని కలపటం వల్ల సర్క్యూట్ పూర్తి అవుతుంది. విద్యుదయస్కాంత ఘటంలో విద్యుత్ చలనం మొదలవుతుంది. రెండు ఘటాలు దగ్గరైనప్పుడు ఒకదాని ప్రభావం మరొక దానిమీద ఉంటుంది. ఎక్కువ శక్తివంతమైన ఘటం సమక్షంలో తక్కువ శక్తివంతమైన ఘటంలో ప్రకంపనలు కలుగుతాయి. అవి  సరిగా మేలు కలిగించే విధంగా ఉండటానికి చేసిన ఏర్పాటు  నమస్కారం. నమస్కరించటంలో కూడా ఎదుటివారిని బట్టి పద్ధతి మారుతుంది. దేవతలకు రెండు చేతులు సహస్రారంపై జోడించాలి. పెద్దలకు నుదుటిపై అంజలి ఘటించాలి. సాటి వారికి అభివాదం చేయటానికి రెండు చేతులను హృదయ స్థానంలో జోడించాలి. తల్లి, తండ్రి, గురువు, దైవం, ఆ స్థాయిలో గౌరవించదగిన వారింకెవరైనా వారికి సాష్టాంగ నమస్కారం చేయాలి. దీనినే దండప్రణామం అని కూడా అంటారు. అంటే  కర్ర లాగా నేలమీద పడి ,ఎనిమిది అవయవాలు  భూమిని తగిలేట్టుగా నమస్కరించటం. స్త్రీలు పంచాంగాలతో చేస్తే సరి పోతుంది. స్త్రీల ఉదరం, వక్షస్థలం మనిషి అస్తిత్వానికి పోషణకి నిలయాలు కనుక అవి నేలకు తగుల రాదు. నిజానికి ఇలా చేయటం వల్ల నమస్కరించిన వ్యక్తికి ఎదుటి వారి నుండి శక్తి ప్రసారం జరుగుతుంది. నమస్కారానికి ఆశీర్వాదం పొందే శక్తి ఉంది. మార్కండేయుడు పదహారేళ్లకే చనిపోతాడని కొందరు జ్యోతిష పండితుల ద్వారా తెలుసుకున్న అతడి తండ్రి మృకండుడు- నారదుణ్ని వేడుకున్నాడు. తన పుత్రుడు నిండు నూరేళ్లు జీవించేలా ఏదో ఒకటి చేయాలని ప్రార్థించాడు. అందుకు ఆయన కనిపించిన ప్రతి వ్యక్తికీ మార్కండేయుడితో పాదాభివందనం చేయించాలన్నాడు. అదే విధంగా అందరికీ పాదాభివందనం చేస్తూ సాగిపోయిన అతణ్ని వారందరూ 'దీర్ఘాయుష్మాన్‌ భవ' అని దీవించారు. అలా నమస్కారాలు చేయడం ద్వారా అందరి ఆశీస్సులూ పొందిన మార్కండేయుడు అంతిమంగా దీర్ఘాయుష్మంతుడైనాడు. ఒక మహారాజు అడవి మార్గంలో వెలుతుండగా ఆ దారిలో ఒక బౌద్ధ సన్యాసి ధ్యానముద్రలో కనిపించాడు. వెంటనే ఆ రాజు శిరస్సు వంచి పాదాభివందనం చేశాడు. అది చూసిన మంత్రి 'ఈ మహాసామ్రాజ్యానికి అధిపతి, కిరీటధారులైన మీరు ఒక యాచకుడి ముందు తల వంచారేమిటి?' అని ప్రశ్నించాడు. రాజు చిరునవ్వుతో మౌనం వహించాడు ఆ తర్వాత రోజు మహారాజు ఒక మేక తల, పులి తల, యుద్ధంలో మరణించిన ఒక సైనికుడి తలను తెప్పించాడు. వాటిని విక్రయించాలని మంత్రిని ఆజ్ఞాపించాడు. మేక తల, పులి తల అమ్ముడు పోయాయి కాని మనిషి తలను తీసుకువెళ్లేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు ఆ రాజు 'మరణించిన తరవాత మనిషి తలకు ఏ విలువా (ఉండదు) ఇవ్వరు. అలాంటి తలను వంచి పాదాభివందనం చెయ్యడంలో తప్పేముంది?' అనడంతో, మంత్రికి జ్ఞానోదయమైంది. యోగశాస్త్రంలో 'నమస్కారాసనం' ప్రసక్తి ఉంది. నమస్కారం చేసినప్పుడు చేతులు జోడిస్తాం. అవి హృదయానికి దగ్గరగా నిలుస్తాయి. అది సమర్పణకు ప్రతీక. ఆ సమర్పణతో, గుండెపై ఒత్తిడితో పాటు అహమూ తగ్గుతుంది. అది ఒక ఆరోగ్యకరమైన చర్య. రాముడు అరణ్యవాసానికి వెళుతూ తల్లి కౌసల్యకు పాదాభివందనం చేశాడు. సరయూ నదిలోకి ప్రవేశించే సమయంలో, వైకుంఠానికి వెళ్లబోయే ముందు తల్లి తన పక్కన లేకున్నా ఆమెను స్మరించి నమస్కరించాడు.'ఎదిగేకొద్దీ ఒదగాలి' అంటారు పెద్దలు. ఆ విషయంలో భగవంతుడూ తనను తాను మినహాయించుకోలేదు. ఎంత ఎత్తుకు ఎదిగినా, అందరికీ ఆదర్శంగా నిలవడం కోసం ఒదిగే కనిపించాడు. ధర్మరాజు రాజసూయ యాగం చేసే సమయంలో బహుమతులు స్వీకరించే పనిని దుర్యోధనుడు చేపట్టాడు. అతిథుల కాళ్లు కడిగి ఆహ్వానించే బాధ్యత తీసుకునేందుకు అందరూ వెనకంజ వేస్తే శ్రీకృష్ణుడు తానే ఆ పని చేశాడు. అలా ఆయన ఒదిగే ఉండటం వామన అవతారంలోనూ సాగింది. శ్రీకృష్ణావతారంలో విశ్వరూపం చూపించిన మహావిష్ణువే వామనావతారంలో మూడడుగుల మరుగుజ్జుగా మారిపోయాడు. త్రివిక్రముడిగా భక్తుల గుండెల్లో నిలిచాడు. వామనుడు త్రివిక్రముడిగా ఆకాశం అంతటా వ్యాపించడంతో, ఆయన పాదాన్ని బ్రహ్మ భక్తితో కడిగాడని పురాణాలు చెబుతున్నాయి. అలా బ్రహ్మ సైతం విష్ణుమూర్తి విశ్వరూపానికి దాసోహమన్నాడు. ఎదిగేకొద్దీ ఒదగాలని, అలా ఒదిగేకొద్దీ మరింత ఎదుగుతామని, పాదాభివందనంలోని పరమార్థాన్ని, నమస్కారంలోని సంస్కారాన్ని ఎందరో ఆచరించి చూపారు. అందుకే 'అందరికీ పోషణ, రక్షణ కావాలి. అందరం వైషమ్యరహిత, శాంతియుత జీవనం వైపు నడవాలి. నీలో, నాలో,మనలో ప్రకృతిలో శాంతి వర్ధిల్లాలి.మానవుని సంస్కారం నమస్కారం కాబట్టి ఈ సమాజంలో అందరినీ( పెద్దలను ) గౌరవించి ఆదర్శంగా నిలవాలి. నమస్కారం సంస్కారాన్ని పెంచుతుంది, మన ఔన్నత్యానికి చిహ్నంగా ఉంటేందే తప్ప కించపరచదు. ఎదుటి వారిని గౌరవించడం నమస్కరించడం ఒక అలవాటుగా ఆచరించాలి. ఆచరిద్దాం.

మంచి వాడికి అంతా మంచే..!

ఒక ఊరిలో ఒక రైతు వుండేటోడు. ఆయన చానా పేదోడే కానీ చానా చానా మంచోడు. మూగవాళ్ళకు నోటిలో మాటలాగుండేటోడు. గుడ్డివాళ్ళకు చక్కని చూపులాగుండేటోడు. ముసలివాళ్ళకు చేతికర్రలాగుండేటోడు. ఆడపిల్లలకు ధైర్యాన్నిచ్చే ఆయుధంలా వుండేటోడు. వూరిలో ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఎవరింట్లో ఏ శుభకార్యం జరిగినా అందరికన్నా ముందు అక్కడ వుండేటోడు. కార్యక్రమం ముగిసేదాకా అన్ని పనుల్లో చేయి కలిపేటోడు. అందుకే అందరికీ ఆ రైతంటే చానా ఇష్టం. సొంత బంధువులెక్క చూసుకునేటోళ్ళు. రైతు పెండ్లాం గూడా చానా మంచిది. మొగుడు చేసే పనికి సాయం చేయడమే తప్ప ఏనాడూ ఎదురు మాట్లాడిందీ లేదు, చెయ్యనని వెనక్కి తిరిగిందీ లేదు. ఆ రైతుండే వూరి పేరు జొన్నగిరి. దాని అసలు పేరు సువర్ణగిరి అని, ఒకప్పుడు అశోకుని పాలనలో రెండవ రాజధానిగా ఒక వెలుగు వెలిగిందని చానామంది పండితులంటారు. ఆ వూరిలో వజ్రాలు దొరుకుతాయని పెద్ద పేరు. దాంతో ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చి ఆశగా ఆ వూరి చుట్టుపక్కల వున్న పొలాల్లో, కొండల్లో నిరంతరం తవ్వుతా వెదుకుతా వుంటారు. అనేకమందికి చానా విలువైన వజ్రాలు ఎన్నోసార్లు దొరికినాయి. రాత్రికి రాత్రి ధనవంతులైనవారు ఎందరో. ఒకసారి ఆ పేదరైతు పొలానికి పోయి దాన్ని దున్నుతా బాగా అలసి పోయినాడు. దాహం అవుతావుంటే తాగుదామని చెంబు పైకెత్తినాడు. అంతలో ఒక్కసారిగా సర్రుమని గాలి పైకి లేచి, దుమ్ము రైతు కంట్లో పడింది. దాంతో చేతిలోని చెంబు జారి కిందపడి నీళ్ళన్నీ పొలంలో ఒలికిపోయినాయి. రైతు కల్ళు నులుముకుంటూ ఆ చెంబును తీసుకోవడానికి కిందికి వంగినాడు. ఆ నీళ్ళు యాడైతే పడినాయో ఆడ ఏదో తళుక్కుమని మెరిసింది. ఏమబ్బా మెరుస్తావుంది అని పరీక్షగా వంగి చూస్తే.... ఇంగేముంది చానా చానా విలువైన చిన్న వజ్రం నక్షత్రం లెక్క ధగధగా మెరిసిపోతా కనబడింది. నీళ్ళు పడి అంతవరకూ దానిమీదున్న మట్టంతా తొంగిపోయింది. రైతు ఆ వజ్రాన్ని చేతుల్లోకి తీసుకొని ''ఆహా... ఎంత అదృష్టం. చూడ్డానికి చిన్నగా వున్నా లోపల ఒక్క మచ్చగూడా లేకుండా తళతళతళ మెరిసిపోతావుంది. ఈ వజ్రం అమ్మి ఇంకొంచం పొలం కొనుక్కుంటే ఇకపై జీవితమంతా ఎటువంటి చీకూ చింతా లేకుండా హాయిగా బతకొచ్చు అనుకున్నాడు. సంబరంగా ఆ వజ్రాన్ని ఇంటికి తీసుకోనొచ్చి పెండ్లానికి చూపిచ్చినాడు. అమె దాన్ని ముట్టుకోని, ముట్టుకోని మురిసిపోయింది. ఈ విషయం వూరంతా ఒక్కసారిగా గుప్పుమనింది. ఆ రైతు చానా మంచోడు కావడంతో అందరూ సంతోషపడ్డారే గానీ ఎవ్వరూ అసూయ పడలేదు. ''నీ మంచితనమే నీకు మేలు చేసింది. నీవు పాటించిన ధర్మమే నీకు వజ్రాన్ని దొరికేలా చేసింది'' అని మెచ్చుకున్నారు. ఆ రైతు పక్కవూరి వజ్రాల వ్యాపారికి తరువాత రోజు వచ్చి దానికి సరియైన ధర చెల్లించి తీసుకుపొమ్మని కబురు పంపినాడు. ఆ రాత్రి దాన్ని భద్రంగా ఒక గూట్లో పెట్టి హాయిగా నిదురపోయినాడు. ఆ ఇంటిలో ఒక పెద్ద ఎలుక వుంది. అది చీకటి పడగానే రైతు ఇంటిలోనికి పోయి గింజలు, మిగిలిపోయిన అన్నం, కూరగాయలు తింటావుండేది. ఎప్పట్లాగే అది ఆ రోజు రాత్రిగూడా ఆహారం కోసం ఇండ్లంతా వెదుకుతా వుంటే దానికి గూట్లో ధగధగా మురిసిపోతావున్న వజ్రం కనబడింది. ఇదేందబ్బా... కొత్తగా వుంది. ఎప్పుడూ చూల్లేదే ఇటువంటి గింజ అని నోటితో పట్టుకోని కొరకసాగింది. అట్లా కొరుకుతావుంటే అది లటుక్కున జారి దాని గొంతులో ఇరుక్కోనింది. అటూ బైటికీ రాక, ఇటు లోపలికీ పోక గిజగిజలాడతా కిందామీదా పడి పొర్లసాగింది. ఆ చప్పుడుకి పొదలో పడుకున్న ఒక పాము పైకి లేచి దాన్ని చూసింది. ''ఆహా... బాగా లావుగా కొవ్వు పట్టి నిగనిగలాడతావుంది. ఎన్నాళ్ళకు దొరికింది ఇంత మంచి ఆహారం. ఈ రోజు దీన్ని పట్టుకోని పండగ చేసుకోవచ్చు' అనుకొని నెమ్మదిగా పొదలమాటున దాచిపెట్టుకుంటా... దాచి పెట్టుకుంటా ఆ ఎలుక దగ్గరికి వచ్చింది. ఎలుక వజ్రం గొంతులో ఇరుక్కోని తనకలాడతా వుంది గదా.... అది పాముని గమనించలేదు. అంతే... ఇంకేముంది పాము ఆ ఎలుకని లటుక్కున పట్టుకోని గుటుక్కున మింగేసింది. అట్లా ఆ వజ్రం ఎలుకతో బాటు పాము నోటిలోకి వెళ్ళిపోయింది. పాము ఎలుకను మింగి సంబరంగా ఒక చెట్టుకింద పొదలో హాయిగా చుట్టచుట్టుకొని పడుకుంది. ఆ చెట్టుపైన ఒక పెద్ద గద్ద వుంది. దానికి ముందురోజునుంచీ తినడానికి ఏమీ దొరకలేదు. దాంతో ఆకలితో అల్లాడిపోతావుంది. చెట్టుపైన కూచోని చుట్టూ చూడసాగింది. దానికి పొదలో పడుకున్న ఈ పాము కనబడింది. 'ఆహా... దొరికిందిరా మంచి పసందైన విందు భోజనం' అనుకుంటూ ఆ గద్ద సర్రున దూసుకోనొచ్చి ఆ పాముని తన వాడిగోళ్ళతో పట్టుకోని ఒక్కసారిగా పైకెగిరింది. పాము అదిరిపడి నిద్రలేచేలోగా తన వాడియైన ముక్కుతో పొడిచి చంపేసింది. ఒక చెరువు పక్కన పెద్ద చెట్టుంటే దానిమీద వాలి తినసాగింది. అట్లా తింటావుంటే మధ్యలో ఈ వజ్రం వచ్చింది. అది ధగధగా మెరుస్తావుంటే తినేదో, కాదో అర్థంగాక ముక్కుతో టపటపా కొట్టి చూసింది. అది బాగా గట్టిగా వుండడంతో పనికిరానిదని కింద వున్న చెరువులో పడేసింది. సరిగ్గా అదే సమయానికి అక్కడికి ఒక పెద్ద చేప వచ్చింది. ఆ వజ్రం సరిగ్గా దాని నోటిలో పడింది. అంతే... అది దానిని గుటుక్కున మింగేసింది. ఆ తరువాత రోజు ఆదివారం. ఆదివారమంటే చానామంది కోళ్ళు, మేకలు, చేపలు, రొయ్యలు తింటా వుంటారు గదా. దాంతో వాటికి బాగా గిరాకీ వుంటుంది. అందుకని జాలరులు చేపలు పట్టడానికని చెరువులోకి వలలు విసిరినారు. ఒకని వలలో ఈ పెద్ద చేప చిక్కుకోనింది. 'ఆహా... ఎంతదృష్టం. పొద్దున్నే నక్కతోక తొక్కి వచ్చినట్టున్నా. అందుకే ఇంత పెద్ద చేప దొరికింది'' అనుకోని వాడు సంబరంగా దొరికిన చేపలు గంపలో ఏసుకోని అమ్ముకోడానికి వూర్లోకి వచ్చినాడు. రైతు పెండ్లాం ఆ రోజు పొద్దున్నే లేచింది. మొగుడు చానా రోజులనుంచీ 'చేపలకూర చెయ్యే ఒక్క రోజైనా' అంటా వున్నాడు. దుడ్లు లేక రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా అంటూ ఒక్కొక్క రోజే దాటేస్తావుంది. నిన్ననే కూలీ డబ్బులు చేతికి వచ్చినాయి. దానికి తోడు వజ్రం దొరికింది గదా... ఆ సంబరమూ తోడైంది. దాంతో మొగునికి మంచిగా చేపలకూర చేసి పెడదామని ఇంటిముందు నిలబడి ఎదురు చూస్తావుంది. వాళ్ళ పక్కింట్లో బాగా డబ్బున్న కుటుంబం వుంది. ఆమె గూడా పొద్దున్నే లేచి మొగునికి చేపలకూర చేసి పెడదామని తలుపుకాడ నిలబడి పదురు చూస్తావుంది. అంతలో చేపలమ్మేటోడు ఆ వీధిలోకి వచ్చినాడు. ఇద్దరూ వాన్ని పిలిచినారు. పెద్ద చేప చానా ఖరీదు గదా... దాంతో పక్కింటామె కొనుక్కోనింది. రైతు పెండ్లాం చిన్న చేపను కొనుక్కోనింది. పొద్దున్నే రైతు లేచి సంబరంగా చూస్తే ఇంకేముంది వజ్రం గూట్లో కనబల్లేదు. అది ఎక్కడైనా పడిపోయిందేమోనని మొగుడూ పెళ్ళాలు కలసి ఇండ్లంతా కిందికీ మీదికీ వెదికినారు. కానీ అసలుంటే గదా దొరికేది. పాపం... వెదికీ వెదికీ అలసిపోయినారు. పాపం ఆమె కండ్లనుండి సర్రున నీళ్ళు కారినాయి. ''అదృష్టం చేతికి చిక్కినట్టే చిక్కి జారిపోయిందే'' అని తెగ బాధపడింది. అది చూసి ఆ రైతు ''మనం కష్టపడి సంపాదిచ్చినదైతే పోయినందుకు బాధ పడాలిగానీ వూరికే వచ్చిందానికి బాధ ఎందుకు. అసలు దొరకలేదు అనుకుంటే సరి'' అన్నాడు చిరునవ్వుతో పెండ్లాన్ని ఓదారుస్తూ. అంతలో వాళ్ళింటి తలుపు ఎవరో తట్టినారు. ఎవరబ్బా అని పోయి చూస్తే ఇంకేముంది నగరం నుండి వచ్చిన వజ్రాల వ్యాపారస్తులు. రైతు వజ్రం అమ్ముతానని కబురు పంపినాడు గదా దాంతో కొనడానికని వచ్చినారు. రైతు వాళ్ళకి జరిగిందంతా చెప్పి ''జరిగిందేదో జరిగిపోయింది. ఎట్లాగూ ఇంత దూరం వచ్చినారు గదా. మరలా వెంటనే ఏం వెళతారు గానీ కాసేపు విశ్రాంతి తీసుకోండి. వేడి వేడి చేపలకూర తిని పోదురుగానీ... నా పెండ్లాం చేతివంట అచ్చం పుల్లారెడ్డి నేతిమిఠాయి లెక్క కమ్మగుంటాది'' అన్నాడు. వాళ్ళు సరే అన్నారు. రైతు పెండ్లాంతో ''ఏమే... పొద్దున్నే మనకోసం మాంచి చేపలు కొన్నావు గదా... పాపం వాళ్ళు చానాదూరం నుంచి వచ్చినారు. ఎప్పుడు తిన్నారో ఏమో... తొందరగా జొన్నరొట్టె చేపలపులుసు చెయ్‌'' అన్నాడు. ఆమె సరేనని పెరట్లో కూర్చోని చేపల పొలుసులు తీసి శుభ్రం చేస్తావుంటే పక్కింటామె వచ్చి ''అక్కా.... అనుకోకుండా మా దగ్గరి బంధువుల్లో ఒకాయనకు ఆరోగ్యం బాగాలేదని, ఆఖరిచూపు చూడ్డానికి క్షణం గూడా ఆలస్యం చేయకుండా వున్నఫలానా వచ్చేయమని కబురొచ్చింది. అందుకే ఎక్కడిపనులు అక్కడే వదిలేసి వెంటనే వెళ్ళి పోతావున్నాం. పొద్దున్నే నీతోబాటు ఒక పెద్ద చేప కొన్నా గదా... అది తీసుకో. దానిమీద మీ పేర్లే రాసిపెట్టినట్టున్నాయి. మీరన్నా హాయిగా కడుపునిండా తినండి'' అంటూ ఆ చేపను తీసుకోనొచ్చి ఆమె చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. రైతు పెండ్లాం సంబరంగా ఆ చేపను గూడా బాగా కడిగి కత్తిపీటతో మధ్యకు కోసింది. అంతే... ఇంకేముంది దాని కడుపులో పొద్దున పోగొట్టుకున్న వజ్రం తళతళతళ మెరుస్తా కనబడింది. అది చూసి ఆమె సంబరంగా కప్పెగిరిపోయేటట్టు కెవ్వున కేక పెట్టింది. ఆ అరుపుకు అదిరిపడి ఇంట్లోవున్న అందరూ పరుగెత్తుకొని అక్కడికి వచ్చినారు. గూట్లో పెట్టిన వజ్రం చేప కడుపులోకెట్లా పోయిందో వాళ్ళకు అస్సలు అర్థం కాలేదు. వజ్రాల వ్యాపారస్తులు దాన్ని చూసి ''నీ మంచితనమే మరలా వజ్రాన్ని నీ దగ్గరికి చేర్చింది. ఇట్లాంటి విచిత్రాన్ని, నీలాంటి అదృష్టవంతున్ని ఈ లోకంలో మేమెప్పుడూ చూడలేదు'' అంటూ బాగా మెచ్చుకున్నారు.

ఇష్టంతో చేస్తే పని కష్టం కాదు!

ఒక మహారాజు వేటకు వెళ్లి తిరిగి రాజ్యం చేరడం  ఆలస్యం  అవడంతో  దారిలో  ఒక చీరలు  నేసే వారి ఇంట్లో ఆ రాత్రికి  సేద తీరుతాడు  వచ్చింది రాజు అని తెలియక వాళ్ళు అతిథి  మర్యాదలు  చేసారు.అలసిపోయిన  రాజు ఉదయం లేవడం  కాస్త ఆలస్యం  అవడంతో ఆ ఇంటి వాళ్ళు వారి పనుల్లో  వారు ఉన్నారు . రాజు లేవగానే చీర నేసే అతన్ని చూసాడు.  అతడి  చేతికి ఒక తాడు  కట్టి ఉండడం గమనించాడు రాజు వెంటనే ఎందుకు ఈ తాడు అని అడగగా  ఆ వ్యక్తి రాజు అడిగే  ప్రశ్నలన్నిటికీ సమాధానం పని చేస్తూనే  ఇవ్వడం మొదలు పెట్టాడు ఉయ్యాలలో బాబు నిదుర పోతున్నాడు  బాబు కదిలినప్పుడల్లా  ఈ తాడు లాగితే  బాబు నిదుర పోతాడు  అని చెప్పాడు . అతనికి దగ్గరలో  ఒక కట్టె కనిపించింది రాజుకి. అదేందుకు  అని అడిగాడు రాజు .బయట నా భార్య ధాన్యాలను  ఎండబెట్టి  వెళ్ళింది పక్షులేవైనా  వస్తే  ఈ కట్టె కు కట్టిన  నల్లగుడ్డ  ఊపితే  అవి వెళ్లిపోతాయి  అని బదులిచ్చాడు  ఆ వ్యక్తి .ఆ వ్యక్తి నడుముకి గంటలు కట్టుకుని  ఉండడం గమనించాడు రాజు అదెందుకు అని అడిగాడు.అందుకు ఆ వ్యక్తి ఇంట్లో ఎలుకలు  బెడద  ఎక్కువగా ఉంది. అవి  వచ్చినప్పుడు ఈ గంటలు మోగిస్తే వెళ్లిపోతాయి అన్నాడు. ఆ ఇంటి కిటికీలో ఓ నలుగురు  వ్యక్తులు  కనిపించారు రాజుకి.వాళ్ళు ఎవరు అని అడిగారు ? పని చేస్తున్నది నా చేతులే కదండి  నా నోరు ఏ పని చేయట్లేదు  అందుకు నాకు వచ్చిన  కొన్ని పాటలు  వాళ్లకు నేర్పిస్తాను  వాళ్ళు నేర్చుకుంటారు  అని చెప్పాడు . రాజు మళ్ళీ సందేహంగా  ఆలా వాళ్ళు బయట ఉండి నేర్చుకోటం  ఎందుకు ఇంటి లోపలకు రావొచ్చుగా  అని అడిగారు అందుకు ఆ వ్యక్తి నేర్చుకుంటున్నది నోటితోనే...  కాళ్ళు ఊరకనే  ఉంటాయి కదండి!  పాట  నేర్చుకుంటూ  వాళ్ళు కుండలు  తయారు  చేయడానికి మట్టిని  తొక్కుతుంటారు  అని బదులిచ్చాడు . రాజుకి  చాల ఆశ్చర్యం  వేసింది ఒక మనిషి ఒకే సమయంలో ఇన్ని పనులు  చేయగలడా  అని !! అందుకు ఆ చీరలు నేసే వ్యక్తి ఇలా అన్నాడు.ఇంతే కాదండి నా భార్య కాస్త చదువుకున్నది  తాను బయట పనులకు వెళ్లి వస్తుంది వెళ్లే ముందు పలకలో  ఓ పది పదాలు  రాసిపెట్టి  వెళ్తుంది. అన్ని అయ్యాక  అవి నేర్చుకుంటుంటాను  అని బదులిచ్చాడు . రాజుకి నిజంగా చాలా ఆశ్చర్యం  వేసింది ఒక మనిషి ఇష్టపడి చేస్తే ఏ పని కష్టం కాదు అని . సోమరిగా తిరిగేస్తున్న  వ్యక్తులకు ఇటువంటి వారి పరిచయం చాలు ఏదైనా సాధించాలి  అనే పట్టుదల రావటానికి. నేర్చుకోవాలి అనే జిజ్ఞాస, సమయాన్ని సద్వినియోగం చేసుకునే ఆలోచన ఉంటే మనిషికి ఏదైనా సాధ్యమే.

మనో వైకల్యం

ఒక రాజ్యం లో ఒక రాజు ఉండేవాడు అతనికి ఒక కాలు, ఒక కన్ను మాత్రమే వున్నాయి. కానీ ఆ రాజు చాలా తెలివైనవాడు మరియు ధైర్య వంతుడు కాబట్టి ఆ రాజ్యంలోని ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఒకసారి రాజుకు తన  బొమ్మను గీయించాలని  ఎందుకో  ఆలోచన వచ్చింది. అప్పుడా రాజు దేశ విదేశాల నుండి చిత్రకారులను పిలిపించాడు. ఒకరికి మించిన ఒకరు చిత్ర కారులు రాజసభ ముందు హాజరు అయ్యారు. రాజు అందరికి నమస్కరించి వారందరికి తన అందమైన  బొమ్మను గీయాలని కోరాడు దానిని రాజదర్బార్ లో  ఏర్పాటు చేయాలనుకున్నట్లు చెప్పాడు. చిత్రకారులందరూ  ఆలోచించడం మొదలు పెట్టారు, రాజు మొదటి నుంచి వికలాంగుడు కదా, అలాంటప్పుడు అతని చిత్రాన్ని అందంగా గీయడం ఎలా ? ఇది సాధ్యం కానే కాదు మరియు చిత్రం అందంగా లేకపోతే రాజుకు కోపం వచ్చి శిక్షిస్తారు అని అలోచించి అక్కడున్న చిత్రకారులు  అందరూ కూడబలుక్కొని రాజు బొమ్మను గీయడానికి  నిరాకరించారు. అంతే కాకుండా రాజు అంగ వైకల్యాన్ని ప్రస్తావిస్తూ పుట్టుకతో రాని అందం బొమ్మలో ఎలా వస్తుంది, కుంటి రాజు గుడ్డి కన్ను అయినా ఈ రాజుకు అందంగా కనబడాలనే కోరిక ఏమిటో, ఇలా చిత్రకారులని పిలిచి ఇబ్బంది పెట్టేకన్నా తనను వైకల్యంతో పుట్టించిన దేవుణ్ణి అడగాల్సింది అంటూ వారిలో వారు గుసగుసలు పోతూ పైకి అచేతనంగా మా వల్ల కాదు ప్రభూ అంటూ పక్కకు తప్పుకున్నారు, కానీ ఆ చిత్రకారుల సమూహంలోని ఒక యువ చిత్రకారుడు మాత్రం తాను రాజు గారి బొమ్మను అత్యంత అద్భుతంగా గీస్తానని,  వెనుక నుండి చేయి పైకెత్తి, రాజా నేను మీ బొమ్మను చాలా  అందంగా గీయగలను మీకు చాలా నచ్చుతుంది అన్నాడు. అది విన్న మిగతా చిత్రకారులు ఈ పిల్లకాకి చిత్రకారునికి రాజు చేతిలో శిక్ష ఖాయం అనుకుని లోలోపల సంతసిస్తూ, పైకి అతన్ని చాటుగా వారిస్తూ ఏమి జరుగునో అని కుతూహలంతో చూస్తున్నారు, అప్పుడు చిత్రకారుడు రాజు ఆదేశాలతో చిత్రాన్ని గీయడంలో నిమగ్నమయ్యాడు . కొంత సేపటి తరువాత ఒక చిత్రాన్ని గీశాడు. రాజు ఆ  చిత్రాన్ని చూసి  చాలా సంతోషపడ్డాడు. కానీ చిత్రకారులందరూ ఆశ్చర్యపోతూ ఎలా గీశాడా అని ఉత్సుకతతో వారి వేలిని వారి దంతాల క్రింద నొక్కి పెట్టి యువకుడు గీసిన చిత్రాన్ని చూస్తూనే, ఆ యువకుని సమయస్ఫూర్తికి తెలివితేటలకు ఆశ్చర్యంతో మ్రాన్పడిపోయారు. ఆ చిత్రకారుడు ఆ చిత్రాన్ని  రాజు గుర్రంపై ఒక కాలు పూర్తిగా కనిపించే విధంగా కూర్చున్నాడు, మరియు ఇంకో కాలు గుర్రానికి అవతలి వైపు ఉంది, మరియు రాజుగారి జులపాల జుట్టు గాలికి ఎగురుతూ రాజు కంటిపైన కప్పబడినట్లు  ఉంది! పక్కన చెట్లన్నీ రాజుకు వ్యతిరేక దిశలో గాలికి వంగి పోతున్నట్టు భ్రమించేలా గీశాడు, రాజు అతని తెలివికి చాలా సంతోషించాడు. ఆ చిత్రకారుడు రాజు యొక్క అంగవైకల్యాన్ని ఎంత తెలివిగా ఒక అందమైన చిత్రంగా గీశాడు. అతని అద్భుతమైన పనితీరును రాజు ఎంతగానో మెచ్చుకుని అతనికి చాలా బహుమతులు మరియు ధనాన్ని  ఇచ్చాడు. కాబట్టి మనం కూడా ఎదుటి వారి  లోపాలను చూడకుండా, వారి యొక్క విశేషతల పైన, వారి మంచితనంపైన  దృష్టి పెట్టాలి. ఈ రోజుల్లో చాలా మంది  ప్రజలు ఎదుటివారి లోపాలను చాలా త్వరగా వెతుకుతారు, మనలో ఎన్ని లోపాలు వున్నా  ఇతరుల లోపాలువెతకడంలో ఎప్పుడూ అత్యంత శ్రద్ధ చూపుతారు. వాళ్ళు ఇలాంటి వారు, అలాంటివారు  అని ప్రచారం చేస్తారు, కానీ వారిలోని గొప్పతనాన్ని మాత్రం పట్టించుకోరు, ప్రతికూల పరిస్థితులలో కూడా మనం సానుకూలంగా ఆలోచించాలి,  మరియు మనకున్న సానుకూల ఆలోచన విధానమే మన సమస్యలన్నింటి నుండి మనల్ని రక్షిస్తుంది..

మార్పు అవసరం.. మనకోసం.. అందరి కోసం కూడా

అంతర్గతంగా వచ్చే మార్పే జీవితాన్ని సమూలంగా మార్చేస్తుంది. అందరితో కలిసిపోయి, ఆడుతూ పాడుతూ చిన్నపిల్లల్లా జీవితం గడపాలని చాలామంది జీవితానుభవం కలిగినవారికి ఉంటుంది. అది మనసు వరకే. ఆలోచనల్లోనే. ప్రవర్తనలోకి రాదు. కొద్ది కొద్ది మార్పులు కూడా ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. మనకే అనిపిస్తూ ఉంటుంది. మనం ఇంకొంచెం మెరుగ్గా వాళ్లతో ప్రవర్తించి ఉండాల్సిందని. కాని ఎందుకో అంతకు మించి సాగలేకపోయాం. అదేమంత కష్టం కాదు. అయినా, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే లాగా ఉండిపోయాం. ఎన్నో పుస్తకాలు చదువుతాం. వీలైతే పెద్దవాళ్ల మాటలు సభల్లో వింటాం. గొప్ప గొప్ప చలనచిత్రాలు చూస్తాం. ఇంట్లోనే అనుకోని ఒక సందర్భం ఎదురుపడినప్పుడు పదేళ్ల క్రితం ఎలా ప్రవర్తించామో ఇప్పుడూ అలానే ప్రవర్తిస్తుంటాం. శరీరంలో మార్పులు కనిపిస్తుంటాయి. కాని, మనసులో పెద్దగా మార్పులు రావు. మనసులో మార్పు ప్రతి ఒక్కరూ కోరుకోవాలి. అంతర్గతంగా వచ్చే మార్పే జీవితాన్ని సమూలంగా మార్చేస్తుంది. మారకుండా ఉండే ఏ పరిస్థితీ మానవ జీవితంలో లేదు. అసలు ప్రకృతిలోనే లేదు. మార్పు నిత్యసత్యం. ఈ సత్యం తెలుసుకున్న మనిషి అందరికీ అనుకూలంగా ఉంటాడు. ఒకరిద్దరికి మించి, మన ప్రవర్తనలో మార్పు ఉండాలి అన్నారంటే, మనల్ని మనం పరిశీలించుకోవాలి.    అద్దం ముందు పెట్టుకుని మన శరీరాన్నే కాదు, మనసును సైతం అన్ని కోణాల్లోంచీ శోధించాలి. మన ప్రవర్తన సరిగ్గా లేనప్పుడే, ఎదుటివాళ్లను ఎవరిని చూసినా ఏదో వంక పెట్టాలని అనిపిస్తుంది. వాళ్లెవరూ సరిగ్గాలేరని అనిపిస్తుంది. ఒక్కక్షణం చాలు. మనం మారితే... ప్రపంచం మారిపోతుంది!ధర్మరాజు దృష్టి కోణంలో అందరూ మంచివారే. దుర్యోధనుడి దృష్టి కోణంలో అందరూ చెడ్డవారే. చూపు మార్చుకుని, ప్రవర్తనలో ఆ మంచి విషయాలను అభ్యాసం చెయ్యాలి. మారిన మనిషిని చూస్తే, ప్రతి ఒక్కరికీ విస్మయమే. ఎందుకంటే మార్పు కష్టం. మార్పును అంగీకరించి తన ప్రవర్తన మార్చుకుని ఎదుటివాళ్లకు అనుకూలంగా ఉండాలంటే, అతడెంతో సంయమనంతో ఉండాలి. పాత అలవాట్లను అధిగమించాలి. ముఖ్యంగా జీవితాన్ని యథాతథంగా స్వీకరించాలి. శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధ సందర్భంగా అర్జునుడిలో పెను మార్పులు తీసుకొచ్చాడు. లోకకల్యాణ కారకమైన భగవద్గీతనే  అందించాడు. దైవం తలచుకుంటే మార్పును ఇవ్వడమే కాదు, కొత్త జన్మనే ప్రసాదించగలడు. ముఖ్యంగా మన ప్రవర్తనను అద్భుతంగా నియంత్రించగలిగేది ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత రవ్వంత కూడా తెలియని మనుషులూ మంచివారుగా మెలగవచ్ఛు మంచివారుగా ఉండాలంటే వారు హృదయంతో జీవించాలి. ఆ హృదయంలో ఆత్మ ఆసీనురాలై ఉంది. ఆత్మను స్పృశిస్తే ఆధ్యాత్మికత పెల్లుబుకుతుంది. అన్ని వైపుల నుంచి దివ్యమైన ఆలోచనలు రావాలి’ అని రుగ్వేదం చెబుతోంది. సహజంగా మన లోపల పుట్టే ఆలోచనలన్నీ సానుకూలంగా ఉండవు సరికదా- మంచిగానూ ఉండవు. కొన్ని మనసులు ఆలోచించినట్లు శత్రువులైనా ఆలోచించరు. అందుకే మనకు దివ్యమైన భావాలు కావాలి. ఎక్కడ అగ్ని ఉందో, అక్కడే నీటిని చల్లాలి. పుట్టే చెడ్డ ఆలోచనలను వెనువెంటనే మంచి ఆలోచనలతో ఖండించాలి. మాటలో, ప్రవర్తనలో సైతం గొప్పదనాన్ని, దివ్యత్వాన్ని ప్రకటించాలి. త్వరగా మనలో రావాల్సినంత మార్పు రాకపోతే అంత నష్టం జరిగిపోయినట్లే. కాలం తిరిగి రాదు. చింతించి లాభం లేదు. సమస్యను గుర్తించిన మరుక్షణమే మనసును మార్చుకొని ముందుకెళ్లాలి. వాళ్లవాళ్ల ప్రవర్తనలో మార్పుల వల్లనే సంఘ సంస్కర్తలు, దేశభక్తులు, శాస్త్రవేత్తలు, యోగులు, జ్ఞానులు... చరిత్రలో నిలిచిపోయారు. వేల సంవత్సరాల నుంచి భూమిలో నిక్షిప్తమై పడిఉన్న బొగ్గుముక్కే ఒక రోజు వజ్రంగా సాక్షాత్కరిస్తుంది. ఇది శాస్త్రీయ పద్ధతిలో కనిపించే ఒక సత్యం. మనం మారదాం.. మన కోసం, అందరి కోసం!

శ్రీకృష్ణుణ్ని జీవిత కథే దశమ స్కందం

శ్రీకృష్ణుణ్ని జీవితంలో ముఖ్య ఘట్టాలు దశమస్కందంలో సోదాహరణంగా వివరించారు. పోతన భాగవతంలో దశమస్కందానికి విశేష ప్రాధాన్యత ఉంది.  భాగవతంలో ఆయువుపట్టు దశమస్కంధం. దాన్ని పూర్వోత్తర భాగాల పేరిట రెండుగా విభజించారు. పూర్వ భాగాన్ని రుక్మిణీ కల్యాణం దగ్గర పూర్తి చేస్తారు. భాగవతంలో రుక్మిణీ కల్యాణానికి ఉన్న విశేష ప్రాధాన్యమే అందుకు కారణం. ఈ ఘట్టం చదివినా, విన్నా కలిగే ఫలితం ‘ఇది’ అని చెప్పడానికి మాటలు చాలవు. ఇందులో పాఠకులకు లౌకిక, వేదాంతపరమైన రెండు అర్థాలు గోచరమవుతాయి. ప్రేమ, అనురాగం, మమకారం, ఆదరణ లాంటి సున్నిత విషయాలు అంతర్గతంగా ఉన్నాయి.తన జీవన సహచరుడు ఎలా ఉండాలో కచ్చితంగా నిర్ణయించుకునే శక్తి స్త్రీలకే ఉంటుందని దమయంతి వంటి అనేక పురాణ పాత్రల వల్ల తేటతెల్లమవుతుంది. ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకునే విషయంలో మొగమాటాన్ని కాస్త సడలించి, తెగింపు జోడిస్తే ఆశించిన విజయాలు కలుగుతాయని ఆ వనితలు నిరూపించారు. రుక్మిణీ కల్యాణ ఘట్టంలో పై విషయాలు మరింత స్పష్టంగా గోచరమవుతాయి.రుక్మిణీదేవి శ్రీకృష్ణుణ్ని వలచింది. ఆ వలపును పండించుకోవడానికి ఆమె చూపిన తెగువ అన్ని కాలాల ప్రేమికులకూ ఆదర్శప్రాయం. త్వరగా నిర్ణయం తీసుకోవడం, అంతలోనే ఒక నిశ్చయానికి రావడం, వచ్చిన వెంటనే అమలు పరచకుండా ‘ఎందుకైనా మంచిది’ అంటూ మళ్ళీ మరోసారి ముందు వెనకలుగా ఆలోచించడం పురుషుడి లక్షణం. దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది స్త్రీల లక్షణం. ఒక పట్టాన నిర్ణయానికి రారు. వచ్చిన తరవాత వెనుతిరిగి చూడరు. వారు తీసుకునే నిర్ణయంలోని గాఢత, స్పష్టత అలాంటిది.ఆ ఘట్టంలో ఆమె కృష్ణుడికి పంపిన సందేశంలో ‘ముకుందా! గుణవతి, స్థిరచిత్త అయిన ఏ స్త్రీ అయినా గుణం, రూపం, శీలం, విద్య, వయసు, ధనం, తేజస్సుల చేత శ్రేష్ఠుడైనవాడినే భర్తగా కోరుకుంటుంది. అందులో నీకు నీవే సాటి అయిన నిన్ను తప్ప ఇతరులను నేను కోరుకోకపోవడంలో తప్పులేదని నా భావన’ అని పేర్కొంది.  రుక్మిణి అనే పదానికి ‘ప్రకృతి’ అనేది ఒక అర్థం. ప్రకృతి పురుషుడి ఆలంబన వల్ల, పురుషుడు ప్రకృతి ప్రేరణ వల్ల ఒకరికొకరు రాణిస్తారు. కృష్ణుడు పూర్ణ (పురాణ) పురుషుడు, రుక్మిణి ప్రకృతి. వారు ఒకర్నొకరు చూసుకోకపోయినా గుణాలు వినడం వల్లనే గాఢంగా ప్రేమించుకుని పెళ్ళి చేసుకోవాలనే గాఢవాంఛ కలవారయ్యారు. సాధకుడు భగవంతుణ్ని చేరాలని ఎంత గాఢంగా ప్రయత్నిస్తే అతడి ఇష్టాన్ని కాదనలేక భగవంతుడు అతడికి అంత తొందరగా వశమైపోతాడనేది దీని భావం. జీవులతో పరమాత్మకు గల సంబంధం అంత గాఢమైంది.రుక్మిణి సాధకుడిలోని జీవ చైతన్యానికి సంకేతం. కృష్ణుడు పరమాత్మ తత్వానికి ప్రతీక. జీవతత్త్వం, పరమాత్మ తత్త్వం ఒకదాన్ని మరొకటి విడిచి వేరుగా ఉండనివని, రెండింటికీ అనుసంధానంగా ఉండేది ఒక్క ప్రేమ తత్త్వమేననీ రుక్మిణీ కృష్ణుల పరిణయాసక్తికి అర్థం.

జ్ఞానోదయానికే ప్రశ్న పుడుతుంది

పాండవుల తరువాత భారతదేశాన్ని ఎక్కువ కాలాన్ని పరిపాలించిన మహారాజు పరీక్షిత్తు. ఇతను అర్జునుడి మనవడు, అభిమన్యుని కుమారుడు. ఇతని తల్లి ఉత్తర. తల్లి గర్భంలో ఉన్నప్పుడే అశ్వత్థామ ఇతనిపై బ్రహ్మ శిరోనామకాస్త్రము ప్రయోగించెను. దాని మూలంగా కలిగిన బాధనోర్వలేక ఉత్తర శ్రీకృష్ణుని ప్రార్థించెను. ఆతని కరుణ వలన బాధ నివారణమై శిశువుగా ఉన్న పరీక్షిత్తు బ్రతికెను. ఇతడు ఉత్తరుని కూతురు ఇరావతిని వివాహము చేసుకొన్నాడు. ఇతని కుమారుడు జనమేజయుడు. పరీక్షిత్తుకు మరణం గూర్చి ముందే తెలుసు. ప్రతీవారికి మరణం గూర్చి తెలియాలనే ఉద్దేశ్యంతో పరీక్షిత్తు శుక మహర్షిని ప్రశ్న అడిగాడు.జ్ఞానోదయానికే శుక మహర్షి అంతే ఓపికగా సమాధానం చెబుతాడు.    జీవుడు బ్రహ్మజ్ఞానంతో పరబ్రహ్మ స్వరూపాన్ని ఆరాధిస్తే, ప్రకృతి కల్పించే మాయాబంధం నుంచి తప్పించి, అజ్ఞానానికి వశం కాకుండా కాపాడమని చేసే నిరంతర జ్ఞానసాధనే రుక్మిణి- అగ్నిద్యోతనుడి చేత సందేశం పంపడంలోని అంతరార్థం. ఆ సందర్భంలో ఆమె ‘భువన సుందరా’ అని సంబోధించింది. ఇక్కడ భువనమంటే సకల చరాచర జగత్తు. వాటన్నింటిలో సుందరుడు అంటే ఆనందం కలిగించేవాడు. సహజమైన ఆనందం దూరమైతే అవ్యక్తానందాన్ని అలౌకిక ఆనందాన్ని కలిగించేవాడు భగవంతుడొక్కడే. అందుకే అలా సందేశం పంపింది.  తెలియనితనం వల్ల మాత్రమే ప్రశ్న పుట్టదు. దానికి వచ్చే జవాబుతో ఎందరికో జ్ఞానోదయం కలుగుతుందనే ఉద్దేశంతోనూ ప్రశ్న పుడుతుంది. పుట్టిన ప్రతి ప్రశ్న వెనకా కచ్చితంగా ఒక నిజం ఉండి తీరుతుంది. ఆ నిజం వల్ల జీవనగమనం దిశ ఎటువైపు సాగాలనే నిర్ణయం తీసుకునే అవకాశం ఏర్పడుతుంది.ప్రశ్న చిన్నదే కావచ్చు. దానికి వచ్చే సమాధానం మాత్రం విస్తృత జ్ఞాన సంపదకు ఆలవాలమైనదై ఉండవచ్చు. అలాంటి ప్రశ్న ఉంటే ఆ క్షణానికి జవాబు లేకపోయినా దానికోసం తప్పకుండా వెతుకులాట మొదలవుతుంది. వేదాలు, శాస్త్రాలు, ఇతిహాస-పురాణాల్లో ఆ ప్రశ్నలకు సరైన జవాబులు దొరుకుతాయి. స్వయంభువులైన దేవతలు, జ్ఞానసంపద కలిగిన మహానుభావులు, తపశ్శక్తి సంపన్నులైన ఋషులు, మునులు, సర్వసంగ పరిత్యాగులు, సకల విషయాలూ తెలిసిన పండితులు వంటివారి ముఖతః లేఖినుల నుంచి వెలువడినవి అవి. కాబట్టి తిరుగులేనివి, నమ్మదగినవి అయిఉంటాయి. ‘మరణం ఆసన్నమైనప్పుడు పురుషులు వినదగింది ఏది?’ అనేది భాగవతంలో శుక మహర్షిని పరీక్షిత్తు అడిగిన ప్రశ్న. పరీక్షిత్తుకు మరణం వచ్చే సమయం నిర్ణయమైపోయింది. దానికిగాను తీసుకోవలసిన చర్యగా ఏడురోజుల్లో భాగవతం వినాలనే విషయం తెలుసు. ఆ పనిమీదే ఉన్నాడు కూడా. అలాంటప్పుడు ఆయన ఆ ప్రశ్న అడగడంలో ఆంతర్యం ఏమిటి? ఈ ప్రశ్న వెనక ఉద్దేశం- ‘ప్రతివారికీ మరణం తప్పదు’ అని లోకానికి చెప్పడమే. పరీక్షిత్తుకు తెలిసినట్లు ఇతరులకు మరణం వచ్చేది ఎప్పుడో తెలిసేది ఎలా? ఒకవేళ తెలిసినా అప్పటికప్పుడు పైనచెప్పిన విధంగా జాగ్రత్తలు తీసుకోవడం ఎలా సాధ్యమవుతుంది? వీటికి జవాబు లోకులకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే పరీక్షిత్తు ఆ ప్రశ్న అడిగాడు. అందులోనూ అంత కష్టకాలంలో. ఆ ప్రశ్నలకు శుక మహర్షి కచ్చితంగా, నిర్మొహమాటంగా సమాధానం చెప్పాడు. దేహం విడిచే కాలం సమీపించినప్పుడు- భయాన్ని, అన్ని విషయాల పట్ల మమకారాన్ని తెంచుకోవాలి. ఎలాంటి ఆలోచన వచ్చినా చెదరని మనసు కలిగి ఉండాలి. ఏకాంత ప్రదేశంలో నిశ్చింతగా ఉండాలి. బ్రహ్మ ప్రతిపాదితమైన ఓంకారాన్ని మననం చేసుకోవాలి. ప్రాణాయామంతో మనసును నిగ్రహించుకుని భగవన్నామ స్మరణ చేసుకోవాలి అంటూ అనేక సూచనలు చేశాడు శుకమహర్షి. వాటితోపాటు మరికొన్ని జాగ్రత్తలూ చెప్పాడు. ‘ఇంద్రియాలు, బుద్ధి, ఆలోచనలు, మనోమయ వ్యవహారాలు, జీవన గమన రీతులు లాంటివన్నీ ఒక పూర్ణ రూపంపై నిలిపి సదా దాన్నే మననం (జపించడం) చేయాలి. ఆ పూర్ణరూపును ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. చింతన చేస్తున్నప్పుడు అన్యవిషయ భాషణం, ఆలోచన, ప్రస్తావన వంటివేవీ దరి చేరనీయరాదు. అలా జరగాలంటే సాధన కావాలి. ఆ సాధన ఏ ఒక్క క్షణమో, ఒక్కసారో లేదా ఒక కోణంలోనో చేస్తే చాలదు. అది నిరంతరాయమైన ప్రక్రియ కావాలి. అప్పుడు పొందేది బ్రహ్మానంద స్థితి. ఆ స్థితి పొందినవారికి ఇతర విషయాలపట్ల ధ్యానం, ధ్యాస, ఆసక్తి లాంటివి ఉండవు’ అని వివరించాడు. వీటన్నింటి ఆంతర్యం సదా భగవధ్యానం చేస్తూండమని. భాగవతం రాసింది విష్ణ్వంశ సంభూతుడైన వ్యాసుడు. అందులో ఎన్నో ప్రశ్నలు కనిపిస్తాయి. వాటికి సూటిగా కొన్ని, మార్మికంగా కొన్ని, అంతర్గత రూపంలో కొన్ని, లౌక్యంతో కూడినవి కొన్ని జవాబులూ దొరుకుతాయి. ప్రథమ స్కంధం నుంచి ద్వాదశ స్కంధం వరకు అనేక సందర్భాల్లో, అనేక రూపాలు కోణాల్లో, ఈ ప్రశ్నలు సంఘటనలు, కథలు, బోధనల రూపంలో అడుగడుగునా తారసపడతాయి. అందుకే భాగవతం ఒక కావ్యం కాదు, జ్ఞాన భాండాగారం.

ప్రాచీన గుళ్లకు నాగబంధాలుంటాయా

పురాణ ఇతి హాస లలో నాగ బంధానికి విశిష్ట స్థానం ఉంది. నాగబంధమ్ వేసేప్పుడు తాంత్రికులు మాత్రమే వేస్తారు. మంత్రం తంత్రం యంత్రం క్రియ ముద్ర జ్ఞానం ఈ ఆరింటితో నాగ బంధం వేస్తారు. గోల్కొండ నవాబుల హయాంలో కూడా నిధి నిక్షేపాలు ఉన్న గుళ్లకు నాగ  బంధం వేసే వారట. హైదరాబాద్ శాలి బండ సమీపంలోని గాజి బండాలో వెలిసిన కంచి కామాక్షి దేవాలయానికి నాగ బంధం వేసినట్లు అర్థం చేసుకోవాలి . గర్భ గుడి గడపలో నాగ బంధం ఉన్నట్లు దేవాలయం వారసులు ఇటీవలి కాలంలో గుర్తించారు. గడపకు పసుపు కుంకుమ రాసే సమయంలో నాగ బంధం ముద్రలు గుర్తించారు. వెంటనే వాటి మీద  రెడ్ పెయింట్ వేసి స్పష్టంగా కనపడేటట్లు చేసారు. ఈ విషయాన్ని తమ పూర్వికులు చెప్పలేదని 50 ఏళ్ల శ్రీనివాస చారి తెలిపారు. అయితే మా తాత నరసింహా చారి మేనత్త ఈశ్వరమ్మ మాత్రం నాగ సర్పం పక్కనే నిదరించేదని ఓ కథనం ప్రచారంలో ఉంది. ఒంటరిగా దేవాలయలో ఉండే ఈ శతా ధిక వయోవృద్దురాలు రాత్రి పడుకున్న తర్వాత అతి పెద్ద నాగ సర్పం ఈశ్వర మ్మ పక్కనే వచ్చి నిదరించేదట. అది భూమి మీద పాకుతూ దేవాలయం పై కప్పు మీదికి వెళ్లిపోయేదని చెబుతారు. అమ్మవారి వీపు భాగం లో పెద్ద పుట్ట ఉండేదని ప్రతీతి. పుట్టకు సంబంధించిన ఆనవాళ్లు ఇప్పటికీ  ఉన్నాయి. నాగు పాము పెద్దగా ఉండటం చురుకుగా లేకపోవడం బట్టి వయసు మీద పడినట్లు అర్థం చేసుకున్నామని మా తాత నర్సింహా చారి చిన్నప్పుడు చెప్పినట్లు శ్రీనివాసా చారి గుర్తు చేసుకున్నారు. క్షీర సాగర మధనంలో రాహు కేతువుల శరీర భాగాలు విడిపోతాయి. ఆ సమయం లో సర్పములు రాహు కేతువులకు  సర్పములు సాయం చేసాయి అప్పుడు రాహు, కేతువులు ఇచ్చిన వరం మూలంగానే నాగ  బంధానికి ఆ పవర్ వచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. గోల్కొండ నవాబుల హయాంలో నాగ బంధం వేసినట్లు ఇది చారిత్రక ఆధారం  దొరికినట్టయ్యింది. పార్వతి సతుడికి సర్పం ఆభరణం. కాబట్టి కంచి కామాక్షి దేవాలయంలో సర్పాలు న డ యాడినట్టు రుజువు లు ఉన్నాయి.

శివుడు నీల కంఠుడవడానికి కారణం ఇదే!

“మంచుకొండల్లో పాలు తోడుకోవు. అందుకని, అక్కడ పెరుగుగానీ, దాన్ని చిలికిన మజ్జిగ గానీ దొరికే అవకాశలు ఉండవు. ఈ కారణంగా, కైలాసంలో ఉండే పరమ శివుడికి, మజ్జిగ తాగే అల వాటు లేకపోవటాన ఆయన నీలకంఠుడయ్యాడు.  “ పాల సముద్రంలో నివసించే విష్ణుమూర్తికి మజ్జిగ ఎటు తిరిగీ దొరకదు కాబట్టే, ఆయన నల్లని వాడయ్యాడు.“స్వర్గంలో ‘సుర’ తప్ప మజ్జిగ దొరకవు కాబట్టి, ఇంద్రుడు బలహీనుడు అయ్యాడు.     “మజ్జిగతాగే అలవాటే గనక ఉ౦టే, చ౦ద్రుడుకి క్షయ వ్యాధి, వినాయకుడికి పెద్ద పొట్ట, కుబేరుడికి కుష్టురోగం, అగ్నికి కాల్చే గుణం ఇవన్నీ వచ్చేవే కాదు”  యోగ రత్నాకరం అనే వైద్యగ్ర౦థ౦లో ఈ చమత్కార విశ్లేషణ కనిపిస్తు౦ది.  మజ్జిగ తాగేవాడికి ఏ వ్యాధులూ కలగవనీ, వచ్చిన వ్యాధులు తగ్గి, తిరిగి తలెత్తకు౦డా ఉంటాయనీ, “విషదోషాలు”, “దుర్బలత్వం”, “చర్మరోగాలు”, “క్షయ”, “కొవ్వు”, “అమిత వేడి” తగ్గిపోతాయనీ, శరీరానికి మంచి వర్చస్సు కలుగుతుందనీ దీని భావం. అక్కడ దేవతల కోసం అమృతాన్నీ, ఇక్కడ మానవుల కోసం మజ్జిగనీ భగవంతుడు సృష్టి౦చాడట! వేసవి కాలాన్ని మనం మజ్జిగతోనే ఎక్కువగా గడిపేందుకు ప్రయత్నించాలి. తోడుపెట్టినందు వలన పాలలో ఉండే పోషక విలువలన్నీ మజ్జిగలోనూ పదిలంగా ఉండటంతో పాటు, అదనంగా “లాక్టో బాసిల్లై” అనే “మంచి బాక్టీరియా” మనకు  దొరుకుతుంది. పాలలో ఈ ఉపయోగకారక బాక్టీరియా ఉండదు.  అందుకని, వయసు పెరుగు తున్నకోద్దీ మజ్జిగ అవసరం పెరుగుతుంది. ప్రిజ్జులో పెడితే మజ్జిగలోని ఈ బాక్టీరియా నిరర్థకం అవుతుంది. అందుకని అతి చల్లని మజ్జిగ తాగకూడదు. చిలికినందువలన మజ్జిగకు తేలికగా అరిగే గుణం వస్తుంది. అ౦దుకని పెరుగుకన్నా మజ్జిగ మంచిది.

వడదెబ్బ కొట్టని పానీయం రసాల

  పెరుగు మీద తేరుకున్న నీళ్ళు, పాలు కలగలిపి ఆరోగ్యకరమైన “రసాల” అనే పానీయాన్ని “భీముడు” తయారు చేశాడని “భావప్రకాశ” వైద్య గ్రంథంలో ఉంది. అరణ్యవాసంలో ఉన్నప్పుడు, పాండవుల దగ్గరకు శ్రీ కృష్ణుడు వస్తే, భీముడు స్వయంగా దీన్ని తయారు చేసి వడ్డించాడట! ఇది దప్పికని పోగొట్టి వడదెబ్బ తగలకు౦డా చేస్తుంది కాబట్టి, ఎండలో తిరిగి ఇంటికి వచ్చిన వారికి ఇచ్చే పానీయం ఇది. తన ఆశ్రమాన్ని సందర్శించటానికి శ్రీరాముడు వచ్చినప్పుడు భరద్వాజ మహర్షి  రాముని గౌరవార్థం ఇచ్చిన వి౦దులో రసాల కూడా ఉంది. భావ ప్రకాశ  వైద్య గ్రంథంలో దీన్ని ఎలా తయారు చేసుకొవాలో వివరంగా ఇచ్చారు ఎండలోకి వెళ్లబోయే ముందు దీన్ని తాగండి చక్కగా “చిలికిన  మజ్జిగ” ఒక గ్లాసునిండా తీసుకోండి. అందులో ఒక “నిమ్మకాయ రసం”, తగినంత “ఉప్పు”, “పంచదార”, చిటికెడంత “తినేసోడాఉప్పు” కలిపి తాగి అప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్లండి వడదెబ్బకొట్టకుండా ఉంటుంది. మరీ ఎక్కువ ఎండ తగిలిందనుకొంటే తిరిగి వచ్చిన  తరువాత ఇంకోసారి త్రాగండి. ఎండలో ప్రయాణాలు చేయవలసి వస్తే, ఒక సీసానిండా దీన్ని తయారు చేసుకొని వెంట తిసుకెళ్లండి. మాటిమాటికీ తాగుతూ ఉంటే వడదెబ్బ కొట్టదు.