సంక్రాంతి విశిష్టత ఏంటో తెలుసా?!

సంక్రాంతి అంటే పెద్ద పండుగ. పంటల పండుగ. పెద్దల పండుగ. పశువుల పండుగ. పుడమి పుస్తకంలో ప్రకృతి రాసుకున్న మధురమైన కవిత. గీసుకున్న అద్భుతమైన చిత్రిక. హరితవర్ణపు చీరను కట్టుకుని, బంతి, చేమంతులను జడలో తురుముకుని, రంగవల్లికల రంగుల దారిలో నడిచి వచ్చే సంక్రాంతి దేవతను చూసి మురిసిపోని మనిషి వుండడు. సంబరపడని కర్షకుడు వుండడు. మనిషికి తెలిసిన తొలి పండుగ సంక్రాంతే! బీడు నేలను దుక్కి దున్ని పంటసిరిగా మార్చిన మానవుడికి ఇదే తొలి పండుగ. అప్పట్నుంచే మనిషి జీవితం బహు ముఖాలుగా, బహు విధాలుగా వికసించింది. అభ్యున్నతి దిశగా అడుగులు వేసింది. దీనంతటికి కారణం సూర్యుడు. సూర్య భగవానుడే మనకు జీవాధారం. సమస్త జీవరాశికి, వృక్షజాతి మనుగడకు ఆయనే కారణం. సంక్రమణం అంటే గమనం. సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి అడుగుపెట్టడాన్ని సంక్రమణం అంటాం. ఏడాదిలో సూర్యుడు పన్నెండు రాశులలో ప్రవేశిస్తాడు. ఈ నెలలో ప్రవేశించేది మకర రాశిలోకి. అందుకే ఇది మకర సంక్రాంతి అయ్యింది. పుష్యమాసంలో వచ్చే మకర సంక్రమణం ఉత్తరాయణానికి నాంది. ఇది పుణ్యప్రదం కూడా. అందుకే మకర సంక్రాంతి శుభవేడుకగా మారింది. సంక్రాంతి లక్ష్మి ఒంటరిగా రాదు. వణికించే చలిని, కురిసే మంచును తరిమికొట్టే మంటల కిరీటంతో ముందు భోగిని, వెనుక కనుమను వెంటేసుకుని చెలికత్తెల మధ్య రాజకుమారిలా వస్తుంది. సంక్రాంతి కాంతి నిచ్చే పండగ. అందాల పండగ. ఆనందాల పండగ. పతంగుల పండగ. ముగ్గుల పండగ. గొబ్బెమ్మల పంగడ. హరిదాసుల పండగ. గంగిరెద్దుల పండగ. పాటల పండగ. జానపదాల పండగ. జనపదాల పండగ. సర్వశుభాలను కలిగించే పండుగ. శోభాయమాన పండుగ. హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల సందడి ఇవన్నీ సంక్రాంతి పండుగనాళ్ళలో కనిపిస్తుంటాయి. ప్రళయస్థితిలో భూమండలం సముద్రంలో మునిగి వుండేది. ఆదివరాహ రూపంలో శ్రీమహావిష్ణువు మకర సంక్రాంతి రోజునే భూమిని ఉద్దరించాడన్నది పురాణకథనం. వామనావతారంలో విష్ణువు బలిచక్రవర్తి శిరస్సుపై కాలుపెట్టి పాతాళానికి తొక్కింది కూడా ఈ రోజునే. మహాభారత యుద్ధంలో కురువృద్ధుడు భీష్ముడు అవసాన దశలో అంపశయ్యపై వుండి ఉత్తరాయణ పుణ్యకాలం వరకూ వేచివుండి అశువులు విడిచాడట. పుణ్యగతులు మకర సంక్రమణం రోజున సంప్రాప్తిస్తాయని, ఈ నెలలో వైకుంఠ ద్వారాలు తెరిచి వుంటాయని పెద్దలంటారు. ఇలా ఎన్నో విశేషాలు, పుణ్యఫలాలు మూటగట్టుకున్న పండుగ కనుకే ఇది పెద్దల పండగ అయ్యింది. పెద్ద పండుగగా మారింది. సంక్రాంతి పండుగ ఎలా వస్తుందంటే.. ఇక సంక్రాంతి ప్రత్యేకత శాస్త్రపరంగా చాలా ఉంది. నక్షత్రాలు ఇరవై ఏడు ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు. మొత్తం 108 పాదాలుగా విభజింపబడినాయి. తిరిగి 108 పాదాలని 12 రాశులుగా విభాగించారు. సూర్యుడు నెలకొక రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి సంక్రాంతిగా వ్యవహరింపబడుతుంది. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినప్పుడు అ రాశిని మకర సంక్రాంతి అని అంటారు. సూర్యుడు ప్రాణాధారమైనవాడు. సూర్యకాంతితో చంద్రుడు ప్రకాశిస్తాడు. ఒకరు శక్తి మరొకరు పదార్ధము. మనస్సుకు కారకుడు చంద్రుడు. చంద్రుడు కర్మాటక సంక్రమణంలో ప్రవేశిస్తాడు. అది దక్షిణాయనం. ఇంద్రుడు తూర్పు దిక్కుకు అధిపతి. పడమరకు అధిపతి వరుణుడు. వీరిద్దరి వాహనాలు ఐరావతము, మకరము. యోగశాస్త్ర ప్రకారం మన శరీరంలో షట్బక్రములలోని మూలాధారం వద్ద ఏనుగు (ఐరావతము) ఉంటుంది. మకర సంక్రాంతి విశిష్టత ఇదే మకర సంక్రాంతి పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలం ఉత్తమ లోకప్రాప్తిని కలిగిస్తుంది. అందుకే భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం ఉత్తమ లోకప్రాప్తిని కలిగిస్తుంది. అందుకే భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలో స్వచ్చంద మరణాన్ని కోరుకుంటాడు. రవి ధనూరాశిలో ప్రవేశించినప్పటికి నుంచి ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నెల పొడుగునా వాకిళ్ళ ముందు రంగవల్లులు తీర్చిదిద్దుతారు. ఇలా ముగ్గులు పెట్టడం అత్యంత ప్రాచీనమైన సంప్రదాయమే. పూజాస్థాన విశుద్ధ్యర్ధం దోమయేన పూజయేల్‌ తతః పంచవిదై శ్చూర్జైరంగవల్లీం ప్రకల్పయేత్‌ - స్కాందపురాణం అంటే మకర సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలంగా వ్యవహరింపబడుతుంది. అందుకే అతి పవిత్రమైనది. హిందువులు అంతా పెద్దల నుండి పిన్నలవరకు అత్యంత ప్రీతిపాత్రంగా ఆచరించే పండుగలలో సంక్రాంతి ప్రముఖస్థానం సంపాదించుకుంది. ఇది పుష్యమాసంలో సూర్యుడు మకరరాశిలో ప్రవేశించిన పుణ్యదినం. భూగోళమందు కర్మాటకరేఖ, భూమధ్యరేఖ, మకరరేఖలు ఉన్నాయి. సంక్రాంతి విశిష్టత ఏంటంటే? ఈ సంక్రాంతి ఒంటరిగా మాత్రం రాదు. మహారాణిలా ముందు భోగిని వెనుక కనుకను వెంటబెట్టుకుని చెలికత్తెల మధ్య రాకుమార్తెలా వస్తుందట.  సంక్రాంతి : ఇది మకర సంక్రాంతి పుణ్యదినం. అందువల్ల ఈ రోజు యధాశక్తి దానధర్మాలు చేయుట వల్ల జన్మజన్మల దారిద్ర్య బాధలు అంటవు. స్త్రీలు పూలు, పసుపు, కుంకుమ, పండ్లు మొదలైనవి దానం చేయుటవల్ల సకల సంపదలతో పాటు చకృని సౌభాగ్యం కలుగుతుందని నమ్మకం. ఈ రోజు పితృదేవతారాధన చేయడం వల్ల వారికి శుభాశీస్సులతో వారి వారి వంశాలు వర్ధిల్లుతాయని పండితోత్తములు చెబుతూ ఉంటారు.  కనుమ : రైతన్నలకు అత్యంత ప్రీతిపాత్రమైనది. వారి బిడ్డలకు ఏలోటు లేకుండా పాడిని అందించే గోమాతను.. వ్యవసాయ పనులలో రైతన్నకు చేదోడు వాదోడుగా ఉంటూ ధాన్యపురాశులను ఇంటికి చేర్చేవరకు సహాయం చేసే బసవన్నకు పూజలు జరిపి పశువుల పండుగ చేస్తారు. ఈరోజున అందరూ పోటీలు పడుతూ అందమైన ప్రభలు కట్టి వాటిపై పార్వతీపరమేశ్వరుల ప్రతిమలు ఉంచి మేళతాళాలతో వీధులన్నీ తిరుగుతూ అత్యంత వైభవంగా ప్రభలతీర్థం నిర్వహిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో కన్నుల పండుగగా ఈ వేడుక నిర్వహిస్తారు. ముక్కనుమ : భోగి, సంక్రాంతి, కనుమ తర్వాత నాలుగో రోజు వచ్చే పండుగ ముక్కనుమ. కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు గౌరీదేవి వ్రతం చేసుకుంటారు. బొమ్మల కొలువు పెడతారు. ఈ దేవిని తొమ్మిది రోజులు పూజించి తొమ్మిది పిండివంటలతో రోజూ నివేదన చేసిన తర్వాత అమ్మవారి విగ్రహాలని నిమజ్జనం చేస్తారు. ఇంతటి విశిష్టమైన పండుగ వింతశోభలు తిలకించాలి అంటే గ్రామసీమలే పట్టుగొమ్మలు. ప్రతి ఇల్లు అందమైన ముత్యాల ముగ్గులతో పచ్చని తోరణాలతో కళకళలాడుతూ సంక్రాంతి లక్ష్మిని అహ్వానిస్తూ ఉంటాయి. సంక్రాంతి వేడుక నిజంగా కనుల పండుగ. ఈ రోజుల్లో స్త్రీలు తెలవారుజామున లేచి వాకిళ్లలో ముగ్గులు పెడతారు. వాటి చుట్టూ వైకుంఠ ద్వారాలు తెరుస్తారు. వేకువజామున సాతాని జియ్యర్లు, జంగమదేవరలు, బుడబుక్కల దొరలు, పంబలవాండ్లు, గంగిరెద్దుల మేళాలు ఇంటింటికీ వస్తారు. ఆటపాటలతో అలరిస్తారు. దీవెనలందిస్తారు. ఇలా పర్వదినాలన్నీ ఇలా సంబరాల పర్వంలా గడుస్తాయి. తెలంగాణ ప్రాంతంలో నీలాకాశాన్ని పంతంగులు రంగుల హరివిల్లులా మార్చేస్తాయి. కనువిందుచేస్తాయి. ఈ పండుగకి లక్ష్మీదేవికి సంబంధం వుందని ఒరిస్సా ప్రజల నమ్మకం. ఈ శుభదినాల్లో పేదలకు వరాలిస్తూ ఆమె దళితుల ఇళ్లలోకి ప్రవేశించిందట. అప్పుడు జగన్నాథుడు తన సోదరుడైన బలభద్రుని ప్రేరణతో ఆమెని వెలివేశాడట. అయినా లక్ష్మిదేవి లెక్కచేయలేదు. ఈ మార్గశిర, పుష్యమాసాల్లో మరింత మంది బీదల ఇళ్లకు వెళ్లి వరాలు కురిపించిందట. అందువల్లనే ఈ మాసాల్లో లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ప్రతి ముంగిలిలోనూ రంగవల్లులు తీర్చిదిద్దుతారు. ఆమె మెత్తని పాదాలు కందిపోకుండా వుండటానికి ఆవుపేడ ముద్దలపై తామరలు, గుమ్మడి పువ్వులు అమరుస్తారు. ఈ మాసంలో గొబ్బి లక్ష్మిని పూజించటం కూడా ఆనవాయితీ. గొబ్బి లక్ష్మి అంటే భూమాతే! ఆమెను కొలిస్తే సస్యాలను ప్రసాదిస్తుందని జనుల విశ్వాసం. ఒక్కో ప్రాంతంలో ఒక్కో కథనం. ఒక్కో విధానం. భోగి రోజున ఇళ్లముందు, కూడళ్లలోనూ భోగిమంటలు వేస్తారు. విరిగిన కొయ్యలు, పాత చెక్క సామాన్లు మంటల్లో వేస్తారు. చిన్నారులు భోగిదండలు వేసి మంటల చుట్టూ తిరుగుతూ పాటలు పాడతారు. చలినుంచి తరిమేసి వెచ్చని గాలుల్ని ఆహ్వానిస్తారు. నవ్యతకు నాంది పలకడటానికి ఇది చక్కటి ప్రతీక. భోగి పండుగ నాడు సాయంత్రం చిన్న పిల్లలకు రేగుపళ్లు, చిల్లర నాణాలు, శనగలు, పువ్వులు వంటివన్నీ కలిపి భోగిపళ్లు పోస్తారు. ఈ పళ్లు పిల్లలపై పోస్తే విష్ణుమూర్తి కరుణాకటాక్షాలు లభిస్తాయని ఓ నమ్మకం. భోగభాగ్యాలను స్వాగతించే ఆకాంక్షకి ఈ వేడుక అద్దంపడుతుంది. ఇంత చక్కని ఆనందాన్ని మనకు అందించే సంక్రాంతి పండుగలు మనం జరుపుకుని మహారాణిలా వచ్చే ఆ సంక్రాంతి లక్ష్మీని మన ముంగిటలోనికి ఆహ్వానం పలుకుదాం.... 

తెలుగు సాహిత్యంలో తొలి మానవవాది ‘కవిరాజు’

మల మల మాడుపొట్ట, తెగ మాసిన బట్ట కలంత పెట్టగా విలవిల ఏడ్చుచున్న నిరుపేదకు జాలిని జూపకుండా నుత్తల పడిపోయి జీవ రహితంబగు బొమ్మకు నిండ్లు, వాకిళల్‌ పొలమును బొట్ర నిచ్చెడి ప్రబుద్ధుల నిచ్చమెచ్చెదన్‌. తిండి, గుడ్డ, నీడ లేని నిరుపేదలను అశ్రద్ధ చేసి, జీవం లేని బొమ్మలకు ఇళ్లు, వాకిళ్లు, పొలమూ, పుట్రా సమకూర్చి, పెండ్లీ, గిండ్లీ చేసే ప్రబుద్ధులను కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి (15 జనవరి 1887-16 జనవరి 1943) తీవ్రంగా నిరసించారు. తమిళులకు పెరియార్‌ రామసామి నాయకర్‌ ఉన్నట్టే, మన తెలుగువారికీ ఒక రామస్వామి ఉన్నారు. ఆయన నాయకర్‌ను వదిలేసినట్టే, ఈయన చౌదరిని వది లేశారు. ఇద్దరూ ఉన్నత శ్రేణి హేతువాదులు. మాన వీయ విలువల్ని నిలుపడానికి ఈ ఇద్దరూ జీవి తాంతం కృషి చేశారు. త్రిపురనేని రామస్వామి జయంతి, వర్ధంతులు ప్రతి సంవత్సరం ఒక్కరోజు తేడాతో వస్తాయి. ఆయనను స్మరించుకుని, ఆయన ఆశయాల్ని నిలబెట్టడానికి మనం నిరంతరం కృషి చేయాలి. మన ముందు తరాల వారిని అందుకు సిద్ధం చేయాలి! తెలుగు సాహిత్య రంగంలో కవిరాజుది, ఆయన కుమారుడైన గోపీచంద్‌ది గణనీయమైన స్థానం. 1987లో కవిరాజు శత జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం తపాల బిళ్ల విడుదల చేయగా 24 ఏండ్ల తరువాత ఆయన కుమారుడు గోపీచంద్‌ శతజయంతి సందర్భంగా 2011లో మరో తపాలా బిళ్ల విడుదల చేసింది. భారత ప్రభుత్వం ఇలా ఉన్నత శ్రేణి రచయితలైన తండ్రీ కొడుకుల స్మృతిలో తపాలాబిళ్లలు విడుదల చేయడం చాలా అరుదైన విషయం. ఈ తండ్రీ కొడుకులిద్దరూ హేతువాదులే! హైదరాబాద్‌ టాంక్‌బండ్‌ మీదున్న తెలుగు వెలుగుల విగ్రహాలలో కవిరాజు రామస్వామి విగ్రహమూ ఉంది. నేటి యువతీ యువ కులు అటు వెళ్లినప్పుడు తప్పకుండా చూడాలి. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం త్రిపురనేని రామస్వామి స్మారకార్థం ప్రతి ఏటా ఒక పురస్కారం అందిస్తోంది. ఒకరుడు ‘వేదమే’ భగవదుక్తమటంచు నుపన్యసించు నింకొకరుడు ‘బైబిలే’ భగవదుక్తమటంచును వక్కణించు వేరొకండు మా ‘ఖొరాన్‌’ భగవదుక్తమటంచును వాదులాడు, నీ తికమకలేల పెట్టెదవు తెల్పగ రాదె నిజంబు నీశ్వరా! నిజము తెల్పుమని ఇక్కడ ఈశ్వరుణ్ణి కవి అడుగుతు న్నాడంటే – ఆయన ఉనికిని గుర్తిస్తున్నట్టు కాదు. ఇది ఒక వ్యంగ్య వ్యాఖ్య. లేని దేవుణ్ణి జనం మీద రుద్ది ఏ మహిమా లేని పవిత్ర గ్రంథాల ప్రసక్తి తెచ్చి పబ్బం గడుపుకుంటున్న వారిని హేళన చేయడం ఇందులో ఉంది. ఇతర రంగాలలో ప్రముఖులయినా సరే, కొందరు దేవుడి విషయానికి వచ్చే సరికి గోడ మీది పిల్లి వాటంగా వ్యవహరిస్తుంటారు. అలాంటి చర్యకు రామస్వామి స్వస్తి చెప్పారు. ధైర్యంగా తన హేతువాద దృక్పథాన్ని తన జీవితంలో పాటించి చూపారు. అదే తన సాహిత్యంలోనూ నమోదు చేశారు. అందుకే తెలుగు సమాజానికి ఓ సూత పురాణం, ఓ శంభుక వధ, ఓ ఖూనీ, ఓ ధూర్త మానవా శతకం, కొన్ని సూతాశ్రమ గీతాలు. దక్కాయి. ఈ పుస్తకాల్ని నేటి యువతీ యువకులు వెతుక్కుని చదవాలి. వాటి స్ఫూర్తితో సమకాలీన సమాజాన్ని హేతువాత, మానవవాద ఆలోచనా ధోరణిలోకి నడిపించాలి. త్రిపురనేని రామస్వామి 15 జనవరి 1887న కృష్ణా జిల్లా అంగలూరు గ్రామంలో ఒక సంపన్న రైతు కుటుంబంలో పుట్టారు. తల్లిదండ్రులు రామమాంబ – చలమయ్య అప్పట్లో బాల్య వివాహాలు జరిగేవి కాబట్టి 1898లో పున్నమ్మ అనే బాలికతో పెద్దలు వివాహం జరిపించారు. అప్పటికి ఆయన వయసు పదకొండు. 1910లో ఆయనకు 23 యేట కుమారుడు గోపీచంద్‌ పుట్టాడు. మరోవైపు ఆయన మెట్రిక్యులేషన్‌ కూడా పాసయ్యాడు. ఆ రోజుల్లో చదువులు అలా ఆలస్యం గానే జరిగేవి. మెట్రిక్‌ తర్వాత అదే 23వ యేట యవ్వన దశలో ఎన్నో రచనలు సమా జం మీదికి సంధించారు. పల్నాటి యు ద్ధం ఆధారంగా ‘కారెంపూడి కదనం’ రాశారు. మహాభారత యుద్ధం ఆధా రంగా ‘కురుక్షేత్ర సంగ్రామం’ రాశారు. అయితే, చిత్రమేమంటే ఈ రచనలో ఆ యన పాండవులకు రాజ్యాధికారం లేదని నిరూపించి ఒప్పించారు. కారెంపూడి కదనం. కురుక్షేత్ర సంగ్రామం రెండూ నాటికలే – ఇక కవిరాజు ఇతర రచనలు : పల్నాటి పౌరుషం, గోపా లరాయ శతకం, కొండవీటి పతనం, రాణా ప్రతాప్‌, భగవ ద్గీత – మొదలైనవి. భగవద్గీత రచన భగవద్గీతను సమర్థిస్తూ రాసింది కాదు. విమర్శిస్తూ వెలువ రించిన ఒక వ్యంగ్యరచన. అలాగే, రాణా ప్రతాన్‌ రచన విషయంలో ఒక విచిత్రం జరిగింది. అది అచ్చులో ఉండ గానే అందులోని విషయం ఎలా బయ టికి చేరిందో, అది నాటి ప్రభుత్వ దృష్టికి ఎలా వెళ్లిందో తెలియదు. కానీ, ఆ రచన అచ్చవుతూ ఉండగా ప్రెస్‌లోనే నాటి బ్రిటీష్‌ ప్రభుత్వ నిషేధానికి గురైంది. 1911లో బందరు నోబెల్‌ కాలేజీలో ఇంటర్మీడియట్‌ చదివారు. అప్పుడే చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి శిష్యరికం చేసి మొదట అష్టావధానం, తర్వాత శతావధానం చేయగలిగారు. ఆ వయసులో అంతటి ధారణా శక్తిని, సాహిత్యం మీద సాధికారతను సాధించడం మా మూలు విషయం కాదు. అయితే చదువు పూర్తి చేసి ఏదో వృత్తిలో స్థిరపడాల్సి ఉంది గనుక, అవధానాలు మానేసి న్యాయ శాస్త్రం చదవడానికి 1913లో బొంబాయి వెళ్లారు. ఏదో కారణం వల్ల వెంటనే తిరిగొచ్చారు. 1914లో ఐర్లాండ్‌లోని డబ్లిన్‌ యూని వర్సిటీకి వెళ్ళి అక్కడ న్యాయశాస్త్రం చదివారు. దానితో పాటు ఆంగ్ల సాహిత్యాన్నీ చదివారు. అయితే అక్కడ కూడా ఆయన పంచె కట్టుతోనే గడిపేవారు. ‘ఏ దేశంలో ఉంటే ఆ దుస్తులే వేసుకోవాలిగానీ ఇదేమిటని’ – అక్కడ ఒక బ్రిటీష్‌ మహిళ హేళన చేసింది. అయితే ఆయన ఖాతరు చేయలేదు. తన తెలుగుతనాన్ని, పంచెనూ వదలు కోలేదు, ఇక్కడ చెప్పుకోవాల్సిన విషమేమంటే, ఆయన డబ్లిన్‌లో ఉన్నా – ఆయన మనసు ఇక్కడ తెలుగు నేల మీదే ఉండేది. డబ్లిన్‌ నుంచి ఇక్కడి కృష్ణా పత్రికకు వ్యాసాలు రాసేవాడు. అంతే కాదు ‘శంభుక వధ’ అనే ప్రసిద్ధ రచన ఆయన డబ్లిన్‌లో ఉండగా రాసిందే! అనిబిసెంట్‌ చేస్తున్న హోంరూల్‌ ఉద్యమానికి మద్దతుగా రాశారు. మద్దతివ్వండని ఇక్కడి ప్రజల్ని ప్రోత్సహించారు. అక్కడి నుండే ఎన్నో దేశభక్తి గీతాలు అందించారు. ఆ రకంగా హేతువాదం, మానవవాదం తెలుగు సాహి త్యంలో ప్రవేశపెట్టినవాడిగా కవిరాజు త్రిపుర నేనికి గుర్తింపు వచ్చింది. డబ్లిన్‌ నుంచి తిరిగి వచ్చి త్రిపురనేని 1917లో తొలుత మచి లీపట్నంలో న్యాయవాదిగా నాలుగైదేళ్లు ప్రాక్టీసు చేశారు. 1922 లో అక్కడి నుండి తెనాలికి మారి, న్యాయవాదిగా అక్కడ స్థిర పడ్డారు. వృత్తితో పాటు, సామాజిక అన్యాయాల్ని, మత అరా చకాల్ని ఎదిరించే తన ప్రవృత్తిని మేల్కొల్పారు. రాజరామ్మోహన్‌ రారు, రానడే కందుకూరి, గురజాడ వంటి వారి ఆదర్శాల్ని ప్రజ ల్లోకి తీసుకెళ్ళేవారు. ఇలాంటి సంఘ సంస్కరణ కార్యక్రమాల వల్ల ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. ఫలితంగా 1925లో తెనాలి పురపాలక సంఘానికి జస్టిస్‌ పార్టీ తరపున ఎన్నికయ్యారు. అయితే ఆయన సంస్కరణ వాదం ఆయన పదవికి ముప్పు తెచ్చింది. పురపాలక సంఘ అధ్యక్షునిగా జంతు బలుల్ని నిషేధిస్తే – అవిశ్వాస తీర్మానం పెట్టి ఆయనను పదవి నుండి దింపేశారు. త్రిపురనేని వారు కంగారు పడలేదు. ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో మళ్లీ ఘన విజయం సాధించి పదవి చేజిక్కించుకున్నారు. జంతు బలుల్ని నిషేధించారు. అంతే- ప్రత్యర్థులు దిక్కుతోచక తోక ముడిచారు. ఈసంఘటనతో మనకు నిరీశ్వరవాది, బ్రిటీష్‌ పార్లమెంట్‌ మెంబర్‌ ఛార్లెస్‌ బ్రాడ్లా (1833-1891) విషయం గుర్తుకొస్తుంది. ఆయన దేవుడి మీద ప్రమాణం చేయమని అన్నందుకు, ఆత్మసాక్షిగా మాత్రమే చేస్తానన్నందుకు వేధించి, వేధించి డిస్మిస్‌ చేశారు. ఆయినా ఆయనే మళ్లీఎన్నికై వచ్చారు. చివరకు ఆనాటి బ్రిటీష్‌ పార్లమెంట్‌ వ్యవస్థే దిగొచ్చింది. ఎవరి ఇష్ట ప్రకారం వారు ప్రమాణస్వీకారం చెయ్యొచ్చని 1888లో బిల్లు పాస్‌ చేసుకుంది. సంఘ సంస్కర్తగా కృషి చెస్తూ వచ్చిన కవిరాజు తను నివాసమున్న ఇంటికి ‘సూత్రాశ్రమం’ – అని పేరు పెట్టుకున్నారు. వేదాలు, పురాణాలు ఎంత నీతి బాహ్యంగా ఉన్నాయో చెప్పడానికి తన ఆత్మీయమిత్రుడు కుప్పుస్వామి పేరుతో ‘కుప్పుస్వామి శతకం’ (1930) రాశారు. ”పరుల నీ ముందు దిట్టెటి వాడు నిన్ను / నొరిని ముందు దిట్టక యుండబోడు / చదువు రవ్వంత వానికి ఒసంగరాదు / ముప్పు ఒచ్చున్‌ దప్పక దాన గుప్పుస్వామి” నీ ముందు వేరేవాళ్ళను తిట్టేవాడు. వేరే వాళ్ళ ముందు నిన్ను తిట్టడని నమ్మకమేమిటీ? అలాంటి వాడికి ఏ మాత్రమూ చనువు ఇవ్వగూడదని హెచ్చరిస్తూ చెప్పిన పద్యం ఇది. మరో వైపు అస్పృశ్యతకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తూ, మంత్రాలు లేని పెళ్లి విధానానికి సరళమైన తెలుగులో ఒప్పందాలు – ప్రమా ణాలతో ఒక పెళ్లి విధానం (వివాహ విధి 1930) రూపొం దించారు. దాని ప్రకారం ఎన్నో కులాంతర వివాహాలు జరిపిం చారు. ఇలాంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఆయన పురపాలక సంఘ అధ్యక్షుడిగా నిరాఘాటంగా 13 ఏళ్లు నిలదొక్కుకున్నారు. ప్రజాభిమానం ఎంతగా పెరిగిపోయిందంటే, 1940లో గుడివాడలో ఆయనతో గజారోహణం చేయించి, ఘనంగా సన్మానించుకున్నారు. ఆ రోజుల్లోనే ఆంధ్రమహాసభ ‘కవిరాజు’ బిరుదునిచ్చి గౌరవించుకుంది. 1941లో ప్రఖ్యాత మానవవాది ఎం.ఎన్‌.రారు తెనాలిలోని వీరి సూతాశ్రమాన్ని సందర్శించారు. కవిరాజు ఖ్యాతి దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించిందనడానికి ఇదొక మంచి ఉదాహరణ. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి మూడు సార్లు సెనెట్‌ మెంబరయ్యారు. వీర గంధము తెచ్చినారము వీరుడెవ్వడో తెల్పుడీ పూసి పోదుము మెడనువైతుము పూలదండలు భక్తితో- అనే ప్రసిద్ధ గీతం అందరికీ తెలిసిందే. అది కవిరాజు త్రిపురనేని రామస్వామి రచనే. ఒక స్వాతంత్య్ర సమరయోధుడిగా ఆయన బ్రిటీష్‌ పాలకులపైకి తన జీవితాంతం అక్షర తూటాలను సంధిస్తూ వచ్చారు. కేవలం 56 ఏళ్లు జీవించిన వీరు, ఎన్ని రంగాలలో ఎంతెంత కృషి చేస్తూ కూడా ఒక హేతువాదిగా, ఒక మానవవాదిగా అజేయంగా నిలబడడం సామాన్యమైన విషయం కాదు. అందువల్ల ఆయన రాసిన ఆ ప్రసిద్ధ గీతంలోని వీరుడెవరో కాదు నిస్సందేహంగా ఆయనే! అందువల్ల కవిరాజా త్రిపురనేని రామస్వామి అందించిన స్ఫూర్తిని నిలబెట్టుకుంటూ మనం ముందుకు సాగాల్సి ఉంది! – కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు విజేత, జీవశాస్త్ర వేత్త – డాక్టర్‌ దేవరాజు మహారాజు

నీతి కథ

ఒక రైతు దగ్గర ఒక కుక్క వుండేది. అది చానా ముసలిదైపోయింది. గమ్మున పెట్టింది తిని ఏదో ఒక మూలన పడుకొని నిద్ర పోయేది. చురుకుదనం బాగా తగ్గిపోయింది. అది చూసి ఆ రైతు పెళ్ళాంతో  ఏమే ఈ కుక్క చానా ముసలిదై పోయింది. కాపలా కూడా సరిగా కాయడం లేదు. ఇది వున్నా ఒకటే లేకున్నా ఒకటే. ఇక దీనికి తిండి పెట్టడం పెద్ద దండగ. కాబట్టి తీసుకుపోయి ఎక్కడైనా దూరంగా పక్కనున్న అడవిలో వదిలేసి వస్తా అన్నాడు. ఆమె సరే'అని తలూపింది. ఆ మాటలు ఆ కుక్క వినింది. దానికి చానా బాధ వేసింది. అది చిన్న పిల్లగా వున్నప్పుడు వాళ్ళ అమ్మ నుంచి విడదీసి ఎత్తుకొచ్చి, బైటికి పోకుండా ఇంట్లో కట్టేశారు. అమ్మ కనపడక, ఎక్కడ వుందో తెలియక కొద్ది రోజులు కళ్ళ నీళ్లు పెట్టుకున్నా... చివరికి ఇక వీళ్ళనే అమ్మానాన్నలనుకొని వాళ్లు పెట్టింది తింటూ, రాత్రింబవళ్ళూ ఇంటికి కాపలా కాసింది. మాంసం మొత్తం వాళ్ళు తిని ఉత్త ఎముకలు వేసినా ఏమీ అనుకోలేదు. ఉడుకుడుకు అన్నం వాళ్లు తిని చద్దన్నం, పాసిపోయిన అన్నం పెట్టినా బాధ పడలేదు. చల్లని చలికాలం వాళ్లంతా ఇండ్లలో తలుపులు మూసుకొని రగ్గుల మీద రగ్గులు కప్పుకొని పడుకున్నా... వణుకుతూనే ఇంటికి కాపలా కాసింది గానీ ఒక్కమాటా తిట్టుకోలేదు. పొలంలోకి పశువులు రాకుండా, పంటను దొంగలు ఎత్తుకుపోకుండా కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని కాపలా కాసింది. అలాంటిదాన్ని పట్టుకొని అంత మాట అనడంతో దాని మనసు కలుక్కుమంది. "ఛ... ఛ... ఇలాంటి యజమాని దగ్గర ఉండడం కన్నా ఏ పాడుబడిన బావిలోనో పడి చావడం మేలు. నన్ను వీళ్లు వదిలేయడమేంది నేనే వీళ్లను వదిలేసి వెళ్ళిపోతా" అనుకుంటా అది పక్కనే వున్న అడవిలోకి బయలుదేరింది. అక్కడ తనలాగే ఇంటిలోంచి గెంటివేయబడ్డ ఇంకో ముసలికుక్క తోడైంది. రెండూ కలసి దొరికినప్పుడు తింటూ, దొరకనప్పుడు ఉత్త నీళ్లు తాగుతూ... ఎప్పుడు ఏ క్రూర జంతువు మీదపడి చంపుతుందో అని బెదపడుతూ భయంభయంగా బతకసాగాయి. ఆ రైతుకు ఒక పాప వుంది. ఆ పాప పెళ్లి వయసుకు వచ్చింది. దాంతో ఈడు జోడు సరిపోయే ప్రాయం పిల్లోని కోసం చుట్టుపక్కలంతా వెతుకుతా వుంటే ఒక మంచి సంబంధం ఎదురుపడింది. అబ్బాయి చానా మంచోడు. ఎటువంటి చెడు అలవాట్లు లేనోడు. పెద్దలంటే భయభక్తులు వున్నోడు. బాగా చదువుకున్నోడు. ఎలాంటి గలాటాలకు పోనోడు. ఎవ్వరిని అనవసరంగా నోరెత్తి ఒక్క మాట అననోడు. 'అలాంటి వాని చేతిలో కూతురిని పెడితే కలకాలం పిల్లాపాపలతో చల్లగా పెదాలపై చిరునవ్వు తొలగిపోకుండా బ్రతుకుతుంది కదా' అని ఆశపడ్డాడు. ఇద్దరినీ కిందికి మీదికి ఒకటికి పదిసార్లు చూసిన బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు "ఈ జంట చేతికి వచ్చిన పచ్చని పంటలా వుంది. నుదిటికి తిలకంలా, ముక్కుకు ముక్కెరలా ముచ్చటగా ఉన్నారు. సంబంధం వదులుకోకండి" అన్నారు. పెళ్ళికొడుకు వాళ్లు కూడా ఆ పాపను చూసి "అబ్బ... ఇంటి ముందేసిన చక్కని చుక్కల ముగ్గులా ఎంత పొందిగ్గా వుందీ పిళ్ళ" అని సంబరపడ్డారు. రైతుతో "మేమేమీ కోటలు కోరం. వాటాలు అడగం. పాపకు పది తులాల బంగారు పెట్టి పంపించండి చాలు. పెళ్లి ఖర్చులు అన్నీ మేమే పెట్టుకుని చుట్టుపక్కల పద్నాలుగు ఊర్లలో వున్న బంధువులనంతా పిలుచుకొని బ్రహ్మాండంగా అరవయ్యారు వంటలతో పెళ్ళి చేస్తాం" అన్నారు. రైతు ఆ సంబంధం వదులుకోవడం ఇష్టం లేక 'సరే' అన్నాడు. కానీ పది తులాలు అంటే మాటలు కాదు కదా. అలా అని చెప్పి కన్న కూతురి పెదాలపై చిరునవ్వు కంటే ముఖ్యమైనది ఈ లోకంలో ఎవరికీ ఏదీ లేదు కదా... అందుకని తనకున్న పది ఎకరాల్లో సగం అమ్మేశాడు. ఆ డబ్బు తీసుకొని కూతురిని పిలుచుకొని నగలు కొందామని అడవికి పక్కనుండే నగరానికి చేరుకున్నాడు. ఆ నగల దుకాణానికి కొంచెం దూరంలో ఒక దొంగ కాపు కాసి వచ్చీపోయే వాళ్ళని గమనించసాగాడు. వాని కన్ను వీళ్ళ పైన పడింది. రైతుకు ఇది తెలియదు కదా... దాంతో వున్న సొమ్మంతా ఇచ్చి, కూతురికి నచ్చిన నగలు కొనుక్కొన్నాడు. వాటిని శుభ్రంగా ఒక పాత సంచీలో చుట్టి, ఎవరికీ కనపడకుండా అంగీ లోపలి జేబులో భద్రంగా దాచిపెట్టుకొని తిరిగి ఇంటికి బయలుదేరాడు. దొంగ అది గమనించాడు. దూరం నుంచే వాళ్లను వెంటాడుతా అదను కోసం ఎదురు చూడసాగాడు. అట్లా ఒక గంట గడిచాక దారిలో జనం బాగా పలుచనయ్యారు. ముందూ వెనుక కనుచూపుమేరలో ఎవరూ కనబడ్డం లేదు. ఇదే సమయం అనుకోని కత్తి తీసుకొని ఎగిరి వాళ్ళ ముందుకు దూకాడు. "నీ లోపలి జేబులో వున్న బంగారు నగలు వెంటనే తీసివ్వు. లేదంటే ఇక్కడికిక్కడే నిన్ను కసుక్కున పొడిచి పాడేస్తా" అంటూ గట్టిగా అరిచాడు. దొంగను చూస్తానే రైతు కూతురు భయపడి "కాపాడండి... కాపాడండి..." అంటూ గట్టిగా అరిచింది. అది చూసి దొంగ కోపంతో కత్తి తీసుకొని ఆ అమ్మాయిని పొడవబోయాడు. రైతు అదిరిపడి చేయి అడ్డం పెట్టాడు. కత్తి చేతికి గుచ్చుకొని రక్తం కారసాగింది. "బాబూ... నీకు కావాల్సింది నగలే కదా. తీసుకో. చిన్నపిల్ల దానినేమీ చేయకు" అంటూ నగలు తీసి వాని ముందు పెట్టాడు. ఆ పాప గట్టిగా 'కాపాడండి... కాపాడండి...' అంటూ అరిచింది కదా. ఆ అరుపు అడవిలో దూరంగా ఒక చెట్టు కింద పడుకున్న ముసలి కుక్కకు వినిపించింది. అదిరిపడి లేచి కూర్చుంది. ఆ గొంతు తన యజమాని కూతురుది. వెంటనే మిత్రునితో "అడవిలో రైతు కూతురికి ఏదో ఆపద కలిగినట్లుంది దా పోదాం" అంది. దానికి ఆ రెండవ కుక్క "నీ యజమాని ఎప్పుడైతే నిన్ను కాదనుకున్నాడో అప్పుడే నీకూ వానికీ బంధం తెగిపోయింది. ఎవరు ఎట్లా చస్తే మనకేమి. హాయిగా పడుకో. అసలే ముసలిదానివి. ఎందుకొచ్చిన గొడవ. వాళ్ళ సంగతేదో వాళ్లే చూసుకుంటారులే" అంది. కానీ ఆ ముసలి కుక్కకి మనసు ఒప్పుకోలేదు. చిన్నప్పటినుంచి తన ముందు తిరిగి పెరిగిన పిల్ల... తనతో పాటు ఆడుకుంటూ అన్నం తిన్న పిల్ల... అది గుర్తుకు వచ్చి రెండవ కుక్కతో "తిట్టినా కొట్టినా వెళ్ళగొట్టినా బంధం బంధమే. అది ఎప్పటికీ తెగిపోదు. మనుషులకు బుద్ధీ జ్ఞానం లేకపోయినా కనీసం జంతువులం మనకన్నా వుండాల కదా. ఆపదలు వచ్చినప్పుడు అనవసరమైన ఆలోచనలు, చర్చలు, వాదోపవాదాలు చేస్తూ కూర్చుంటే అసలుకే మోసం వస్తుంది. పద పద" అంటూ లేచి అరుపులు వినబడిన వైపు ఉరికింది. అప్పటికే దొంగ రైతు దగ్గర నగలు తీసుకొని ఆ అమ్మాయి మెడలోని గొలుసు కూడా లాక్కుంటున్నాడు. వాని చేతిలో కత్తి తళతళ మెరుస్తా వుంది. కుక్క అదేమీ పట్టించుకోలేదు. రైతు చేతినుండి కారుతున్న రక్తం, అమ్మాయి కళ్ళలోంచి కారుతున్న కన్నీరు చూడగానే దాని హృదయం బద్దలైంది. ఆవేశంతో ఎగిరి ఆ దొంగ మీదికి దుంకింది. వాడు తిరిగి చూసేలోగా కాలిపిక్క పట్టుకొని కండ వూడి వచ్చేలా గట్టిగా ఒక పెరుకు పెరికింది. దొంగ ఆ నొప్పికి తట్టుకోలేక చేతిలోని కత్తితో దాని కడుపులో కసుక్కున పొడిచాడు. రక్తం సర్రున ఎగజిమ్మింది. అయినా అది వెనుకడుగు వేయలేదు. ఆగలేదు. వాన్ని కొరికినచోట కొరకకుండా ఎక్కడబడితే అక్కడ పెరకసాగింది. రెండవ కుక్క తన స్నేహితుని కడుపులో రక్తం కారుతుంటే చూడలేకపోయింది. ఒక్కసారిగా ఎగిరి కత్తి పట్టుకున్న ఆ దొంగ చేయి పట్టుకొని గట్టిగా కొరికింది. దాంతో వాని చేతిలోని కత్తి జారి కింద పడిపోయింది. అది చూసి రైతుకు ధైర్యం వచ్చింది. వెంటనే పక్కనే వున్న కట్టె తీసుకొని ఎగిరి వాని తల మీద ఒక్కటి వేశాడు. ఒక వైపు కుక్కలు మరొకవైపు రైతు దాడి చేసేసరికి దొంగకు దిక్కు తోచలేదు. ఎక్కడి నగలు అక్కడే వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా కుంటుకుంటా పారిపోయాడు. కుక్క కొద్ది రోజులుగా సరైన తిండి లేక చానా బలహీనంగా వుంది. అదీగాక శరీరంలో అప్పటికే రక్తం చానా కారిపోయింది. దాంతో అడుగు ముందుకు వేయలేక ఒకవైపుకు తూలి పడిపోయింది. దాన్ని చూడగానే రైతు కళ్ళల్లో నీరు కారాయి. ఒక్కుదుటన వచ్చి దాన్ని పైకి ఎత్తుకున్నాడు. గుండెలకు హత్తుకున్నాడు. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వైద్యుని కోసం పరుగులాంటి నడకతో ఊరి వైపుకు బయలుదేరాడు. కానీ కొంచెం దూరం పోయాడో లేదో పాపం అది అతని ఒడిలోనే ప్రాణాలను కోల్పోయింది. రైతు కళ్ళలో నీళ్లు కారిపోతున్నాయి. "ముసలిదానివి అయిపోయావు. నీకు తిండి దండగ అని వదిలించుకోవాలనుకున్నాను. కానీ నీవు నీ చివరి రక్తపు బొట్టు వరకు మా కోసమే బ్రతికావు. విశ్వాసం లేనిది, తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టేది నాలాంటి మనుషులే గాని మీలాంటి జంతువులు కాదు. నీ పట్ల జాలీ దయా చూపకపోయినా ఈరోజు నా కూతురి జీవితం నిలబెట్టావు" అనుకుంటూ దాన్ని ఇంటికి తీసుకొని వచ్చాడు. కన్న కొడుకులాగా దానికి గౌరవంగా అంత్యక్రియలు చేసి తన ఇంటి ముందే సమాధి నిర్మించాడు. అడవిలోని రెండవ ముసలి కుక్కను ఇంటికి తీసుకువచ్చి సొంత మనిషిలా చివరి వరకూ చూసుకున్నాడు. డా.ఎం.హరికిషన్

మానవుడే అన్నింటికీ ప్రమాణం!

కమ్యూనిస్ట్‌లు, కాంగ్రెస్‌వారూ భారతీయులంతా బ్రిటిష్‌ వారితో పోరాడి స్వాతంత్య్రం సాధిస్తే, స్వతంత్ర పోరాటంలో సంబంధంలేనివారు ఈ రోజు జాతీయత పేరుతో మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు. - తీస్తా సెతల్వాద్‌, పౌరహక్కుల కార్యకర్త ఒక లాయరు నలభైఆరు మంది దోషుల్ని ఉరిశిక్ష నుండి విడుదల చేయించాలని కోర్టులో సీరియస్‌గా వాదిస్తున్నారు. లాయర్‌గారి అసిస్టెంట్‌ చిన్న చీటి తీసుకొచ్చి ఇచ్చాడు. అదిచూసుకుని లాయర్‌గారు దాన్ని జేబులో పెట్టుకుని, తన వాదన కొనసాగించారు. ఇంతలో లంచ్‌టైం అయ్యింది. వాదిస్తుండగా మధ్యలో వచ్చిన చీటిఏమిటని న్యాయమూర్తి లాయర్‌ను అడిగాడు. ''నా భార్య చనిపోయింది జడ్జిగారూ...'' అని చెప్పాడు లాయరు దీనంగా. జడ్జిగారు ఆశ్చర్యపోయి ''ఇంకా ఇక్కడేం చేస్తున్నారూ? ముందు వెళ్ళండి. ఇంటికి వెళ్ళండి!'' అని అరిచినంత పనిచేశాడు జడ్జి. ''అయ్యా! నేను వెళ్ళినా భార్య ప్రాణాలు తీసుకురాలేను. ఇక్కడ ఉండి వాదించి, నలభై ఆరు మందిని ఉరిశిక్ష నుండి రక్షించగలనేమో కదా?'' అని అన్నాడు లాయర్‌ ఆశగా... అది విన్న బ్రిటిష్‌ జడ్జి నలభైఆరుమందిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. ఆ నలభై ఆరు మందీ స్వాతంత్య్ర సమరయోధులు! ఆ లాయరు మరెవరో కాదు, డాక్టర్‌ బీమ్‌రావ్‌ అంబేద్కర్‌! ఈ స్థాయి దేశభక్తి ఉంటుందని నేటి ఈ కాలపు ఈ ''దేశభక్తుల''కు కనీసం అర్థమవుతుందా? ఏమో? అనుమానమే... అంబేద్కర్‌ సాక్షిగా ఆలోచనా పరులు మొదలు పెట్టిన శాంతి ఉద్యమ కాగడాను ప్రజలు అంది పుచ్చుకోవాల్సి ఉంది. ''బలవంతంగా ప్రపంచ దేశాల అధినేతల్ని కౌగలించు కోవడం వల్ల, ఫారెన్‌ పాలసీ నిర్ణయాలు సఫలం కావని ఈ పాటికి మన ప్రస్థుత భారత ప్రధానికి అర్థమై ఉండాలి! ఆహ్వానం లేకుండానే బిర్యానీ విందులకు దూసుకు వెళ్ళడం వల్ల దేశాల మధ్య సుహృద్భావం పెరగదు. కనీసం దేశానికి ఇప్పటి వరకు ఉన్న గౌరవమైనా ఉండదు'' అని తీవ్రంగా విమర్శించారు భారత మాజీ ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌. ఇటు దేశ అంతర్గత సమస్యల మీద, అటు విదేశాంగ విధానాల మీద కనీస పరిజ్ఞానంలేని నేతలు ప్రచారానికి, ప్రాచుర్యానికే తెగ ప్రయత్నిస్తుంటారు మరి! అత్యధిక జనాభా ఉన్నందువల్ల, భారతదేశాన్ని 'హిందూ రాష్ట్ర'గా మార్చడానికి వీల్లేదని సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌ అన్నారు. అత్యధిక జనాభానే ముఖ్యమయితే... నెమలికి బదులు కాకిని మన జాతీయ పక్షిగా ప్రకటించాలి. అన్యాయాన్ని మనమంతా నిరంతరం ప్రశ్నిస్తూనే ఉండాలని ఆయన అన్నారు. సామాజిక ఉద్యమకారిణి, జర్నలిస్ట్‌ గౌరీలంకేశ్‌ హత్య జరిగిన వెంటనే హంతకులు సంబరాలు చేసుకుంటే ప్రధాని మోడీ ఏం చేస్తున్నట్టూ? పనికిరాని భాషణ్‌లు ఇచ్చే మోడీ, ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారూ? అని ప్రశ్నించారు ప్రకాశ్‌రాజ్‌. భారత్‌ హిందూ దేశంగా మారాలంటే ప్రతి హిందూ దంపతులు నలుగురేసి పిల్లల్ని కనాలనీ, అందులో ఇద్దరిని అరెస్సెస్‌కు దత్తత ఇవ్వాలనీ, వారిని విశ్వహిందూ పరిషత్‌ కార్యకర్తలుగా తయారుచేసి దేశానికి అంకితమివ్వాలనీ... అన్నారు సాధ్వీ రితంబర. ఈమె విహెచ్‌పి మహిళా విభాగం 'దుర్గా వాహిని' వ్యవస్థాపకురాలు. అయోధ్య రామమందిరంతో సంబంధాలున్నావిడ. ఈమేకాదు, బెయిల్‌పై ఉన్న నర్సింగానంద్‌ కూడా అదే మాట మళ్ళీ మళ్ళీ చెపుతున్నాడు. యతి నర్సింగానంద్‌ మధురలో ఇవే వ్యాఖ్యలు చేశారు. 2021లో హరిద్వార్‌లో మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన కేసులో బెయిల్‌పై బయటికి వచ్చి, మళ్ళీ అవే వ్యాఖ్యలు చేస్తూ ఉండటం చూస్తే... పిచ్చి ఎంత ముదిరిపోయిందో తెలుస్తోంది! అఖిల భారత సంత్‌ పరిషత్‌ హిమాచల్‌ ప్రదేశ్‌ ఇన్‌ఛార్జి యతి సత్యదేవానంద్‌ కూడా అదే మాట చెప్పాడు. ఊనా జిల్లా ముబారక్‌పూర్‌లో ధర్మసంసద్‌లో ఆయన మాట్లాడుతూ... 'హిందూ దంపతులు ఎక్కువమంది పిల్లల్ని కనాలని' పిలుపునిచ్చారు. ఒక పథకం ప్రకారం ఈ దేశంలోని ముస్లింలు ఎక్కువ పిల్లల్ని కంటున్నారని అందువల్ల వారి జనాభా పెరిగిపోతూ ఉందని... ఆ పరిస్థితి ఎదుర్కొవడానికి భారత్‌ను హిందూదేశంగా మార్చడానికి హిందూ దంపతులు శ్రద్ధ వహించి... ఎక్కువ మంది పిల్లల్ని పుట్టిస్తూ ఉండాలని అన్నాడు. అలాంటి మూర్ఖ గురువుల బోధనలకు కొందరు మూఢ భక్తులు ఎలా స్పందిస్తారో చూడండి! శివం గుప్త, అతని భార్య సౌమ్యగుప్త ఇద్దరూ రాముడి భక్తులు. వారికి పిల్లలు లేరు. పిల్లల కోసం మొక్కులు మొక్కుతూ, తీర్థయాత్రలకు బయలుదేరారు. అందులో భాగంగా ఒక రోజు సరయూ నదికి వెళ్ళారు. ఒడ్డున కూర్చున్న బ్రాహ్మహణులు కొందరు వీరిని బొల్తా కొట్టించి దండిగా డబ్బు లాగారు. ఒక మంత్రం ఉపదేశించారు. అదేమిటంటే... నదిలో దిగి, నీటిలో ఉండగానే ఆ మంత్రం మూడుసార్లు చదవాలి. ఆ తర్వాత ఆ దంపతులు నీటిలో ఉండగానే శారీరకంగా కలవాలి... అలా చేసినట్లయితే తప్పక రాముడిలాంటి కొడుకు పుడతాడని నమ్మించారు. ఎందుకంటే రాముడు సరయూ నదిలో మునిగి ప్రాణం వదిలేశాడని కదా పురాణం చెపుతోంది? దాని ఆధారంగా ఏ దంపతులైతే ఆనదిలోకి దిగి, నీళ్ళలో ఉండగానే శారీరకంగా కలుస్తారో వారికి తప్పక కొడుకు పుడతాడని అక్కడి పురోహితులు ప్రచారం చేయడం వల్ల.. శివం గుప్త - సౌమ్య గుప్తలు వారి మాటలు నమ్మారు. వారు చెప్పిన ప్రకారమే నీటిలోకి దిగారు. నదిలో స్నానం చేస్తున్న ఇతరులు, ఒడ్డున ఉన్నవారు కొందరు ఆ చోద్యం చూసి మొదట ఆశ్చర్యపోయారు. తర్వాత కేకలేసి గోలచేశారు. ఒడ్డుకు రప్పించారు. మా పవిత్రమైన సరయూనదిలో మీరేం పనిచేస్తున్నారర్రా... అని తిడుతూ దేహశుద్ధి చేశారు. ఈ గోలలో దండిగా డబ్బులాగిన పురోహితులు రాముడి దయతో మాయమయ్యారు. దెబ్బలు తిన్న దంపతులు అర్థనగంగానే పారిపోయారు. మళ్ళీ జన్మలో అయోధ్య పేరెత్తగూడదను కున్నారు. ఈ సంఘటన 2022 జూన్‌ చివరివారంలో జరిగింది. ఏమాత్రం మెదడు ఉపయోగించకుండా, మోసగాళ్ళ మాటలు నమ్మితే ఇలానే ఉంటుంది. ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే. రోజూ దేశ వ్యాప్తంగా మనువాదులు ఎన్నెన్ని అహేతుకమైన విషయాలు ప్రచారం చేస్తున్నారో కదా? అందుకే, ప్రతివారూ వారి మెదడును ఉపయోగిస్తూ ఉండాలి! హిందువులు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని బోధించే మత గురువులు తల్లి స్థానాన్ని గౌరవప్రదంగా ఎందుకు చూడరు? శతాబ్దాల క్రితం జరిగిన తప్పును ఇకనైనా సరిదిద్దాలి కదా? తల్లిని దేవతగా పొగడుతారు కానీ, వెనువెంటనే వివక్షతో తూలనాడుతారు. అదేం న్యాయం? భర్త చనిపోయిన తల్లి ఎదురొస్తే అరిష్టం అని విసుక్కుంటారెందుకూ? తల్లి బిడ్డకు జన్మనిస్తే పురుటిమైల.. అని అంటారెందుకూ? రుతుస్రావం అయితే నెలసరి మైల ఎందుకూ? శరీర ధర్మరీత్యా వచ్చే సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఇకనైనా అర్థం చేసుకోరా? హిందూ ధర్మంలోనే కాదు, ఇతర ధర్మాల్లోనూ స్త్రీ పరిస్థితి అలానే ఉంది. బైబిల్‌, ఖురాన్‌ తిరగేయండి. అక్కడా అంతే... పురుషుడి కంటే స్త్రీలది తక్కువ స్థాయి? భారతదేశంలో మనుషులు మాత్రమే స్వదేశీయులు. మతాలన్నీ విదేశాల నుండి వచ్చినవే. మనుషుల మధ్య ద్వేషం పెంచి, వారిని విడగొట్టేవి, పడగొట్టేవీ ఈ మతాలు! మతాలు వేరైనా మనుషులంతా ఒక్కటే. వారి డి.ఎన్‌.ఎ. ఒక్కటే! అందరూ ఒకటే అయినప్పుడు మత విభజనలెందుకూ? మనిషినే ప్రమాణంగా తీసుకుని జీవితాన్ని ఆనందమయం చేసుకోలేమా? భారతదేశంలో హిందువుల్లో ఒకవర్గంవారు ఉల్లిపాయ, ఎల్లిపాయ తినరు. అవి తినడంవల్ల పాపం తగులుతుందని భావిస్తారు. అదివారి ఇష్టం. కానీ అదేమిటో విచిత్రం లంచం, దొంగసొమ్ము, అక్రమంగా దోచుకున్నది తినడం వల్ల పాపం తగులుతుందని అనుకోరు. చిల్లర డబ్బులు కిందపడ్డా ఏరుకుని కళ్ళకు అద్దుకుంటారు. అది 'ధనలక్ష్మి' అని భక్తి ప్రదర్శిస్తారు. అప్పనంగా దోచుకున్నది, లంచంగా తీసుకున్నది కూడా ధనలక్ష్మే కదా? తామూ నైతికంగా దిగజారి, లంచం డబ్బును దేవతా స్వరూపంగా భావిస్తే సరిపోతుందా? కోయిల తన భాష తను మాట్లాడుతుంది. అందుకే స్వేచ్ఛగా విహరిస్తుంది. అదే చిలుక అయితే ఇతరుల పలుకుల్ని వల్లిస్తుంది. అందుకే అది స్వాతంత్య్రం కోల్పోయి పంజరంలో ఉండాల్సి వస్తుంది. బందీ అయిపోతుంది. ఎవరి బాషను వారు మాట్లాడుతూ ఎవరి ఆలోచనా విధానాన్ని వారు కాపాడుకుంటూ, ఎవరైతే ఆత్మవిశ్వాసంతో ఉంటారో వారే ముందుకుపోతారు. నిజం మాట్లాడేవారు కష్టాల పాలవుతారేమోగానీ, పరాజితులు కారు. బానిసలుగా మిగలరు. ప్రపంచంలోని ఆనందకర దేశాల జాబితాలో ఫిన్లాండ్‌ మొదటిస్థానంలో ఉంది. ఇది యూరోప్‌లోని ఒక దేశం. అక్కడ నాణ్యమైన విద్య, ఆరోగ్యం లభిస్తుంది. లింగ సమానత్వం, స్వచ్ఛమైన స్వభావం, వ్యక్తిగత స్వేచ్ఛ, బాగా పనిచేయగల వాతావరణం ఉంటుంది. అసమానతలకు తావు ఉండదు గనుక, నేరాలు అతి తక్కువ. ఫిన్లాండ్‌ ప్రధానిగా సన్నామారిన్‌ ఉన్నారు. ఆమె తన ముప్పయి నాలుగేండ్ల వయసులో ఆ పదవి చేపట్టారు. ప్రపంచంలోనే అతి తక్కువ వయసుగల ప్రధాని అయ్యారు. ఇప్పటికైనా పనికిరాని అనుభవానికి ప్రాధాన్యమిస్తూ, ప్రతిభను తొక్కిపెట్టే పనులు మానుకోవాలి! డెబ్భయి రెండేండ్ల ఓ నిండు అబద్ధం మన దేశాన్ని పాలిస్తోంది. దానికి కావల్సినంత అనుభవం ఉంది. కానీ, ఏం లాభం? దేశంలో ఎవరైనా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నారా? మనిషిని శత్రువుగా చూసే వాతావరణాన్ని దేశంలో తప్పనిసరిగా మార్చుకోవాల్సి ఉంది. మనిషిని పక్కనపెట్టి లేని దేవుణ్ణీ, మతాన్నీ, ద్వేష వాదాన్ని నెత్తికెత్తుకున్నందువల్ల ఏం జరుగుతూ ఉందో అందరం చూస్తూనే ఉన్నాం. హత్యలు, నిరసనలు ఫలితంగా కళ్ళముందే ప్రజాస్వామ్యం కుప్పకూలుతూ ఉంది. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో లక్షలమంది రోజువారీ కూలీల్ని వేలవేల మైళ్ళు కాలినడకన నడిపించిన ఈ ఘనమైన ప్రభుత్వం... మనిషి కేంద్రంగా పనిచేస్తున్న ప్రభుత్వం ఎలా అవుతుందీ? పరిస్థితులు మారాలి! మార్చుకోవాల్సింది బాధ్యతా, వివేకం గల ఈ దేశ పౌరులే!! - డాక్టర్‌ దేవరాజు మహారాజు   వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు విజేత,   జీవశాస్త్రవేత్త

మాయ నియమించుకున్న సేవకురాలు అజ్ణానం!

అజ్ఞానం ఆనందాన్ని కలిగిస్తుందా? ఒక వేళ అది నిజమే అయితే  ఆ ఆనందం ఎప్పటివరకు నిలుస్తుంది? కృష్ణుడు అర్జునుడి అజ్ఞానాన్ని తొలగించడానికి ఎన్నో విధాలుగా భోదచేస్తాడు. జ్ఞానం అనే కత్తితో నీలో చెలరేగే సందేహములను నరికెయ్యి. అలా నిరుత్సాహంగా కూలబడకు. లే!! ఆయుధం పట్టు. నీవు క్షత్రియుడవు. క్షత్రియ ధర్మం అయిన యుద్ధం చెయ్యి. నీవు చేసే కర్మ అంటే యుద్ధము నిష్కామంగా ఆచరించు. నీకు బంధనములు అంటవు. ఇదీ పరమాత్మ బోధ. ఎక్కడ చూసినా అజ్ఞానం కర్ర పట్టుకుని పెత్తనం చలాయిస్తూ ఉంటుంది. జ్ఞానం కోసం వెదికే వాళ్లు కూడా అజ్ఞానం వలలో పడి గిలగిల  కొట్టుకుంటూ ఉంటారు. మాయ నియమించుకున్న అత్యంత వినయం కలిగిన సేవకురాలు అజ్ఞానం. అజ్ఞానం నిర్వహిస్తున్న బాధ్యతల తీరు తెన్నులు చూస్తుంటే, శ్రీరాముడిని అడవుల పాలు చేసిన కైకకు సాయం చేసిన కుబ్జ అనే  సేవకురాలు గుర్తుకు వస్తుంది. శిశువును మాయ కప్పేసినట్లు, చెరువులో నీటిని గుర్రపు డెక్క కమ్మేసినట్లు- జ్ఞానాన్ని అజ్ఞానం కనపడకుండా చేస్తోంది... అజ్ఞానమే జ్ఞానం అన్న భ్రమనూ కలిగిస్తోంది. మిడిమిడి జ్ఞానం కూడా అజ్ఞానమే. ఇది చాలా ప్రమాదకరం. అహంకార పూరిత జ్ఞానమూ అజ్ఞానమే. ఇది వినాశనానికి హేతువు.  ఇది అజ్ఞానంలో ఉండి విజ్ఞానం గురించి మాట్లాడుతున్నామని పండితులుగా చలామణీ అయ్యేవారూ తెలుసుకోలేరు. వీళ్లు భగవద్గీత చెప్పిన పండితులు కారు. అజ్ఞానం కబంధ హస్తాల్లో చిక్కుకుని ప్రపంచమే విలవిల్లాడే పరిస్థితి వస్తూ ఉంటుంది. దీనికి కారణం యుగ ధర్మాలు. కాలం, ప్రకృతి ఈ రెండూ అజ్ఞానం ఆడిస్తున్న నాటకానికి సహకరిస్తూ ఉంటాయి. వీటికి సూత్రధారి మాయ. ఆ మాయ శ్రీకృష్ణుడి అధీనంలో ఉంటుంది. మనం మాయ వశమై ఉంటాం. ఇదొక విష వలయం. అజ్ఞానం ఆనందం కలిగిస్తూ ఉన్నా ఏ పుణ్యాత్ముడికో దీని మోసం బోధపడుతూ ఉంటుంది. అజ్ఞానం పైన విరక్తి కలిగి, జ్ఞానం కోసం వెంపర్లాడుతూ ఉంటాడు. కాని, అంత తేలిగ్గా అజ్ఞానం పక్కకు తప్పుకోదు. నిన్ను జ్ఞానవంతుడిని చెయ్యడానికి ససేమిరా అంగీకరించదు. జ్ఞానం అంటే సత్యం. ఏది తెలిస్తే,  తరవాత ఇంకొకటి తెలుసుకోవడానికి మిగలదో అదే నిజమైన జ్ఞానం. అజ్ఞానం మధ్యలో బతుకుతుండగా జ్ఞానోదయం కావడమే విచిత్రాల్లోకెల్లా విచిత్రం. అందుకే బుద్ధుడు అంటాడు- ఈ అజ్ఞాన ప్రపంచంలో, బురదలో పద్మంలా వికసించాను అని. అజ్ఞానం రాజ్యమేలుతూ ఉంటుంది. ఇప్పుడే కాదు. ఎప్పుడైనా... చీకటిలో ఉన్నా,  సూర్యుడి వైపు మొహం తిప్పుకొని వెలుగు మన మీద పడేటట్లు చూసుకోవాలి. ఎవరో వచ్చి నిన్ను వెలుగులోకి తీసుకు రారు. ఏ స్థితిలోనూ ప్రహ్లాదుడు, తండ్రి అజ్ఞాన ఆధిపత్యాన్ని అంగీకరించలేదు. హరిని సర్వశక్తిమంతుడిగా తెలుసుకుని, ప్రాణ త్యాగానికీ సిద్ధపడి జ్ఞానానికి మోకరిల్లి చరిత్రలో నిలిచిపోయాడు. చూసేవన్నీ అందంగా ఉంటాయి. ఆకర్షణ కలిగిస్తూ ఉంటాయి. అవన్నీ జ్ఞాన మకరందాలని భావించకూడదు. అందులో మునిగిపోయి అవే జీవన గమ్యంగా తీర్మానించుకోకూడదు. విలాసంగా విచ్చలవిడిగా బతుకుతుంటే... దానికి కారణం అజ్ఞానమని తెలుసుకోవాలి. వినయంగా, నిరాడంబరంగా జీవిస్తుంటే దానికి కారణం జ్ఞానమని గ్రహించాలి. ఏభై ఏళ్లనుంచి చీకటి తాండవిస్తున్న గదిలోకి వెలుగు తీసుకు రావాలంటే,  ఏభై ఏళ్లు పట్టదు. ఒక చిన్న కిటికీ తెరిస్తే చాలు. లేదా చిన్న దీపకళిక వెలిగించినా చాలు.  వెంటనే వెలుగుతో ఇల్లంతా నిండిపోతుంది! మీరు ఒక ఎత్తైన భవంతి మీద నుండి కిందికి పడితే అది చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే అజ్ఞానం పరమానందం. కానీ అది మీరు నేలని తాకేంత వరకే, ఆ కొన్ని క్షణాలే. కాబట్టి మూర్ఖులు ఆనందంగా ఉండగలరు. కానీ, అది జీవితం వారిని ఏదో ఒక విధంగా ఇబ్బంది పట్టనంత వరకే, సాధారణంగా జీవితం వారిని ఇబ్బంది పెడుతుంది. ఒక వేళ జీవితం వారిని ఇబ్బంది పెట్టకపోతే, మరణం తప్పకుండా ఇబ్బంది పెడుతుంది. అజ్ఞానము వలన పుట్టేవి ఏమిటి అంటే సంశయాలు, మోహము, మొదలైనవి అజ్ఞానం నుండి పుడతాయి. మనలో ఉన్న సకల దుర్గుణములు, అనుమానాలు, దుష్టసంకల్పాలకు మూలము మనలో ఉన్న అజ్ఞానమే. అజ్ఞానము అంటే ప్రతిదానినీ దాని వాస్తవిక స్వరూపంతో కాకుండా మనం అనుకున్నట్టు మనకు అనుకూలంగా అర్థం చేసుకోవడం. అంటే నిజాన్ని తెలుసుకోకుండా మన బుర్రలో ఉన్న ఆలోచనల ప్రకారం ఎదుటి దాన్ని నిర్ణయించడం. ఎలా అంటే అన్నీ మనకు అనుకూలం అవుతాయని భ్రమపడటం. అన్నీ మనకే కావాలని అనుకోవడం. అన్నిటికీ నేనే మూలం నావలననే జరుగుతున్నాయి. అని భావించడం. "జ్ఞానాసినా” అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని జ్ఞానము అనే కత్తితో నరికెయ్యాలి. అంటే జ్ఞానము కత్తి లాంటిది. అది అజ్ఞానాన్ని కోసేస్తుంది. చీకటి పోవాలంటే వెలుగు రావాలి. అజ్ఞానం పోవాలంటే జ్ఞానము అనే కత్తి కావాలి. "హృతమ్" అంటే ఈ అజ్ఞానము, అనుమానాలు, మోహము ఇవన్నీ ఉండే స్థావరము. స్థావరం అంటే నివాసం. ఈ అజ్ఞానం నివాసం ఎక్కడ అంటే అది మన హృదయమే దానినే మనసు, చిత్తము అని కూడా అంటారు. మన శత్రువులు ఎక్కడో లేరు మనలోనే ఉన్నారు అని అర్థం చేసుకోవాలి. మనం చేసే పొరపాట్లకు ఇతరులను నిందించేకంటే మనకు మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. హృదయములో తిష్టవేసుకొని ఉన్న అజ్ఞానాన్ని అనుమానాలని మనమే నివృత్తి చేసుకోవాలి కానీ మరొకరు నివృత్తి చేయలేరు. ఎలాగంటే మన నెత్తిమీద బరువును మరొకరు దించగలరు. మన అప్పు మరొకరు తీర్చగలరు. కాని మన కడుపులో ఉన్న ఆకలిని మనమే తీర్చుకోవాలి. మరొకరు తింటే మన ఆకలి తీరదు. అలాగే మన హదయంలో ఉన్న అజ్ఞానాన్ని, అనుమానాలని మనమే నివృత్తి చేసుకోవాలి. దానికి జ్ఞానం సంపాదించాలి. అందుకే ప్రతి మనిషికి జ్ఞానం ఎంతో ముఖ్యమైనది అని నొక్కి వక్కాణిస్తున్నది.  ఆ జ్ఞానాన్ని సంపాదించడానికి "యోగమతిష్ట" అంటే యోగమును ఆచరించాలి. అంటే నిష్కామ కర్మ యోగమును అవలంబించాలి. మనలో ఉన్న అజ్ఞానం, సందేహములు పోవడానికీ, జ్ఞానం రావడానికీ, అవసరమైనది నిష్కామ కర్మయోగము. ఎటువంటి సంగము అంటే ఎలాంటి స్వలాభాపేక్ష కానీ ఏదో ఒకటి ఆశించినట్టు కాకుండా నిస్వార్థంగా, కర్ఘృత్వభావన లేకుండా, ఏకాగ్రచిత్తంతో అంటే పని మీద మాత్రమే మనసు పెట్టి కర్మలు చేయడం. వీటిని ఆచరిస్తే ఎటువంటి కర్మబంధనములు అంటవు. అంటే ఆ పని తాలూకూ పాపం, పుణ్యం అనేవి మనిషిని వెంటాడవు. అందుకే ఓ అర్జునా! నేను యుద్ధం చేస్తే నా చేతుల్లో వీళ్లంతా మరణిస్తారు. వర్ణ సంకరం అవుతుంది. ఆ పాపం నేను భరించలేను. అందుకని నేను యుద్ధం చేయను. సన్యాసం తీసుకుంటాను, భిక్షాటన చేసి జీవిస్తాను. ఈ రక్తపు కూడు తినలేను అనే పనికిమాలిన మాటలు కట్టిపెట్టి 'ఉత్తిష్ఠ' అంటే లే, ఆయుధం పట్టు, నిష్కామంగా, కర్తృత్వభావన లేకుండా యుద్ధం చెయ్యి ఫలితాన్ని పరమాత్మకు వదిలిపెట్టు అని ప్రబోధించాడు కృష్ణుడు. ఇదే ప్రతి మనిషి తను చేసే పనికి అన్వయించుకోవాలి అప్పుడు అలా చేసిన మనిషికి  ఆ కర్మ తాలూకూ ఫలాలు జన్మజన్మనూ వెంబడించవు.

ప్రజలు నిజాన్ని మార్చలేరు.. నిజమే ప్రజల్ని మారుస్తుంది!

నేను నమ్మినట్టు నమ్ము లేకపోతే దేవుడు నిన్ను శిక్షిస్తాడు అంటూ ఇవ్వాళ నిన్ను భయపెట్టేవాడు రేపు  నేను నమ్మినట్టు నమ్ము లేకపోతే నేను నిన్ను చంపేస్తాను  అని తప్పక బెదిరిస్తాడు. అందుకు అతను ఏమాత్రం వెనుకాడడు' అని అన్నాడు భావ విప్లవ జ్వాలలు రగిలించిన  వోల్టేర్‌ ''మనకు లభించిన మత గ్రంథాలన్నీ ఎవరెవరో వేలమంది రాసినవి. విడగొట్టబడి, జోడించబడి, అనువదించబడి, చెడగొట్టబడి.. ఒక్కోసారి సరి చేయబడి - ఒకరికి ఒకరు తెలియకుండా శతాబ్దాల కాలంలో మార్పులు, చేర్పులు చేయబడుతూ, కాపీ చేసేవారి తప్పుడు రాతలతో భద్రపరచబడుతూ మనదాకా వచ్చాయన్న మాట! విజ్ఞాన శాస్త్రాల గ్రంథాలకున్న ప్రామాణికత వీటికి ఉండదు. దేవుడు ఒక నమ్మకం ఎలాగో, అతని చుట్టూ తిరుగుతూ వచ్చిన అతని లీలలనుకునే మత గ్రంథాలు కూడా నమ్మకాలే!'' అని అన్నారు విశ్వ విఖ్యాత వైజ్ఞానిక రచయిత రిచర్డ్‌ డాకిన్స్‌. ''మూర్ఖత్వాన్ని మహౌన్నతంగా చిత్రించడం నన్ను చాలా బాధిస్తుంది!'' అని అన్నారు మరో విశ్వ విఖ్యాత వైజ్ఞానికుడు, రచయిత కార్ల్‌ సాగన్‌. ఒకసారి ''మతాన్ని నేనెందుకు నమ్మాలీ?'' అని అమాయకంగా అడిగాడు ఒక భక్తుడు. అందుకు మత బోధకుడు ప్రశాంతంగా జవాబిచ్చాడు.. ''మతం భయం మీద కాదు నాయనా! ప్రేమ మీద ఆధారపడి ఉంటుంది'' అని అన్నాడు. భక్తుడికి నమ్మకం కుదరక మళ్లీ అడిగాడు. ''అయినా సరే! నేను మతాన్ని నమ్మకపోతే ఏమవుతుందీ? అని. మత బోధకుడికి చిర్రెత్తుకొచ్చింది. అయినా ముఖం మీద చిరునవ్వు చెదరకుండా ప్రశాంతంగా జవాబిచ్చాడు. ''నరకంలో నిట్టనిలువుగా కాల్చివేయబడతావు నాయనా!'' అన్నాడు. ధైర్యంగా ప్రశ్నించిన భక్తుడి మెదడులో భయం తిష్టవేసింది. అయోమయమై పోయి, గందరగోళంగా దిక్కులు చూశాడు. అరమోడ్పు కన్నులతో మత బోధకుడు తన విజయ గర్వాన్ని ప్రసన్నంగా జారవిడిచాడు. అలా మత బోధకులు జనాన్ని భయపెట్టి వశపరుచుకుంటారు.  ఇక్కడ వేదాలు, పురాణాలలోని అంశాలు కొన్ని నిశితంగా పరిశీలిద్దాం!  ''స్త్రీలు పుత్రుల్నే కనాలి - నారీ! పుత్రుణ్ణి కను! మరొకసారి పుత్రుణ్ణి కను! పుత్రుల్ని కంటూ ఉత్తమ సతివి కా!'' మరి తర్వాత కాలంలో పుత్రుల్ని కనడానికి మరో 'నారి' (స్త్రీ) ఎప్పుడు పుట్టాలో వేదాల్లో లేదు. అయినా సమాజం వైజ్ఞానికంగా ఇంత ప్రగతి సాధించిన తర్వాత - నారీ పుత్రుణ్ణి కను - అనే మాట ఎంత అర్థరహితమో కొంచెం మెదడు ఉపయోగించిన వారికి తెలుస్తుంది. స్త్రీలో ఎక్స్‌ ఎక్స్‌క్రోమోజోములుంటే, పురుషుడిలో ఎక్స్‌వై క్రోమోజోము లుంటాయి. పురుషుడు ఎక్స్‌ క్రోమోజోమ్‌ ఇస్తే అది స్త్రీలోని ఎక్స్‌ క్రోమోజోముతో కలసి ఎక్స్‌ ఎక్స్‌ ఆడ శిశువుకు జన్మనిస్తుంది. అలా కాకుండా పురుషుడు తన వై క్రోమోజోమ్‌నిస్తే అది స్త్రీలోని ఎక్స్‌ క్రోమోజోమ్‌తో కలిసి ఎక్స్‌ వైతో మగ శిశువు పుడుతుంది. పుట్టబోయే శిశువు లింగ నిర్ధారణ పురుషుడి వల్ల జరుగుతుంది. అందువల్ల మగ పిల్లవాణ్ణి కనలేదని కొందరు మూర్ఖులు భార్యల్ని దూషించడం చాలా పొరపాటు. ఇప్పుడు ఆలోచించండి.. వేదాలలో ప్రాథమిక వైజ్ఞానిక అంశాలు కూడా లేనిది అవి మన అత్యాధునిక జీవనానికి ఎలా ప్రామాణికాలవుతాయో? ఇంకా వేదాలలో ఉన్న మరికొన్ని అంశాలు చూడండి.. 1. స్త్రీల బుద్ధి కొంచెముది 2. బిడ్డల్ని కనని స్త్రీ తన పాపాల వల్ల వంద్యురాలు (గొడ్రాలు) అవుతుంది. మంత్రాల వల్ల ఆమె మళ్ళీ గర్భం దాలుస్తుంది. 3. పురుషుడు స్త్రీ భాగాన్ని సుఖపెడతాడు - ఇందులో తనూ సుఖపడతాడు అనే వాక్యం లేదు. ఏమైనా ఈ హీనమైన ఆలోచనల్ని, అహేతుకమైన భావనల్ని ఆధునిక ఆలోచనాపరులు ఎవరైనా సమర్థిస్తారా? స్త్రీలను కొన్ని శతాబ్దాలుగా విద్యకు, ప్రపంచ జ్ఞానానికి దూరంగా అణిచిపెట్టి, వారి 'బుద్ధి కొంచెముది' అనడంలో ఔచిత్యం ఉందా? ప్రపంచ గతిని మార్చిన ప్రతిభాశాలురలో పురుషులతో పాటు స్త్రీలు కూడా దూసుకొస్తున్న విషయం తెలియని అతి ప్రాచీన యుగాల రాతలు ఇప్పుడెలా ప్రామాణికం అవుతాయి? ''అన్నిటికీ కర్త పురుషుడు. లోకం అంతా పురుషుడిది. పురుషుడి సేవ కోసమే స్త్రీలు ఉన్నారు'' అని వేదాలు ఘోషించాయి. ఇక్కడ పురుషుడి సేవకు ఒక స్త్రీ కాదు. స్త్రీలు ఉన్నారు అని చెప్పబడింది. దీని ప్రభావం వల్లనే చక్రవర్తి, రాజు, జమీందారు, దొర లాంటి వారు వందల మందిని భార్యలుగా చేసుకోవడం చూశాం. బహు భార్యత్వం పురాణాల్లో ఉంది. శ్రీకృష్ణుడు పదహారు వేల మంది గోపికలతో ఉన్నాడు. పురుషుడు తన ఆధిక్యతను చాటు కోవడానికి అదొక లక్షణంగా కీర్తించబడింది కదా? ఆధునిక, వాస్తవిక సామాజిక జీవనం అలాంటి వాటికి అడ్డుకట్టవేసింది. మారుతున్న జీవనంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పురాణాలలో కూడా మార్పులు వచ్చాయి. శ్రీరాముడు ఏకపత్నీ వ్రతుడు అని రాసుకోవాల్సి వచ్చింది. ''శత్రువులు! శత్రువులు!! శత్రువులు ఎవరంటే ఆవుల మందల్ని తోలుకుపోయే వాళ్ళు శత్రువులు. యజ్ఞయాగాదుల్ని వ్యతిరేకించేవారు శత్రువులు. అలాగే దేవతల్ని వ్యతిరేకించేవారు కూడా పరమ శత్రువులు. వారే మాయావాదులు'' అని రాసుకున్న వేద రచయితలు. దేవతల్ని తిరస్కరించే మాయావాదులను ఏం చేయాలన్నది కూడా రాసిపెట్టారు. వాళ్ళు మాయావాదులని ఎవరిని అంటున్నారూ? దేవతల్ని తిరస్కరించిన వారిని! దేవతల్ని తిరస్కరించిన వారు ఎవరూ? చార్వాకులు, నిరీశ్వరవాదులు, హేతువాదులు, ప్రశ్నలు సంధించగల ధైర్యవంతులు! ''వీరిని కాలే కర్రలతో కుళ్ళబొడవాలి. రంపంతో నరికినట్టు కుక్కలతో పీకించాలి'' అని వేదాలలో ప్రకటించి ఉంది. అంటే అభిప్రాయ బేధాలుంటే వారిని మట్టుబెట్టాలని స్పష్టంగా ఉంది. అక్కడక్కడా రుషులకు, నాస్తికుల మీద ఉండే క్రోధం వేద సాహిత్యంలో కనిపించడం సంతోషాన్ని కలిగిస్తుంది. అంటే ఆ రోజుల్లో కూడా యజ్ఞాల్ని, ఇంద్రుణ్ణి, ఇతర దేవతల్ని తిరస్కరించే నిరీశ్వరవాదులైన 'మాయావాదులు' ఉన్నారని తెలుస్తూనే ఉంది. అంటే ప్రశ్నించడం అనేది అప్పటికే ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఆ ప్రశ్నను మరింత బలోపేతం చేయడానికి ఇప్పుడు మనం నిరంతరం కృషి చేస్తుండాలి! రాముడి ఆస్థానంలోనే రాముణ్ణి, వశిష్టుణ్ణి, ఆంజనేయుణ్ణీ అందరినీ కలిపి తీవ్రంగా విమర్శించినవాడు ఓ నాస్తికుడు.. అతనే జాబాలి! మతం దేవుడిపై ఆధారపడుతుంది. ధర్మం - జ్ఞానంపై ఆధారపడుతుంది. ఇప్పుడు - నిజాలు చెప్పే వాస్తవిక వాదిని ద్వేషిస్తున్నారు. అతనిపై రాళ్లు విసురుతున్నారు. కానీ, అదే అబద్ధాలు చెప్పే మత బోధకుణ్ణి, బూర్జువా రాజకీయ నాయకుణ్ణి విశ్వసిస్తున్నారు. అంటే మనమింకా ఏ సమాజంలో ఉన్నాం? - అనేది ఆలోచించుకోవాలి కదా? ఇప్పుడు బుక్కెడు అన్నం పెట్టి ఆకలి తీర్చలేని దేవుడు రేపు స్వర్గం తీసుకుపోతానంటే ఎవరికి కావాలీ?  రాముడు స్వచ్ఛమైన మద్యము చేతితో తీసుకుని, ఇంద్రుడు శచీదేవికి తాగించినట్టు సీతకు తాగించెను. (రామాయణం, ఉత్తరకాండ: 42-18) మంచి నేర్పుగల సౌందర్యవంతులైన నృత్య సంగీతాలలో నైపుణ్యమున్న స్త్రీ మధుపానమునకు వశులై, రామునితో నృత్యము చేసిరి. (రామాయణం, ఉత్తరకాండ: 42-21).. ఇవి వాల్మీకి రామాయణంలోని సంగతులు. ఇలాంటి అంశాల్ని ఎందుకు కప్పిపెట్టారు? కల్పిత పాత్ర అయిన రాముడి ప్రభ తగ్గిపోతుందని భయపడ్డారా? ఎవరికి వారు విశ్లేషించుకోవాలి! భార్యల్ని వదిలేసినోళ్ళు చాలా గొప్పవాళ్ళయ్యారు. ఉదాహరణకు రాముడు దేవుడయ్యాడు. మోడీ ప్రధాని అయ్యాడు - ''ఏదీ కానక్కరలేదు మనుషులైతే చాలని'' - మన మంటున్నాం! ''సొంత ఇల్లు చక్కదిద్దుకోలేని వాడెవడూ దేశాన్ని ఉద్ధరించలేడు'' అని స్వయంగా బీజేపీ నాయకుడు నితిన్‌ గడ్కరీయే ప్రకటించారు. ముస్లింల త్రిబుల్‌ తలాక్‌ గురించి మాట్లాడిన దేశ ప్రధాని, వివాహితులైన హిందువులు.. భార్యల్ని వదిలేయడం గురించి కిమ్మనలేదు. మరి ఆయన ఏ సంస్కృతీ సంప్రదాయాల్ని కాపాడుతున్నట్టూ? వేదాలలో ఉన్న ఒక కథను పరిశీలిద్దాం.. ఈ కథలో ముగ్గురు రుషులు ఉంటారు. వారి పేర్లు ఏకత్రుడు, దిత్రుడు, త్రితుడు. ఈ ముగ్గురు రుషులు అడవిలో ప్రయాణిస్తూ ఉండగా వారిలో ఏవో బేధాభిప్రాయాలు వస్తాయి. ఇద్దరు రుషులు ఒక్కటై, మూడోవాణ్ణి ఓ పాడుబడ్డ బావిలోకి తోసేస్తారు. సులభంగాపైకి రాకుండా బండి చక్రాలతో బావిని మూసేస్తారు. అలా చక్కా పోయిన వారు, ఇక్కడ బావిలో పడి ఉన్నవాడూ అందరికందరూ గొప్ప రుషులే! బావిలో పడ్డవాడికి ఏం పని ఉంటుందీ? తన దురదృష్టానికి బాధపడుతూ కాలం గడుపుతుంటాడు. ఆ బాధ ఎందుకంటే తనను వదిలేసి పోయిన వారిలాగా తను ధనార్జన చేయలేకపోతున్నానని వారిలాగా స్త్రీ సుఖం పొందలేకపోతున్నానని.. ఇక తన బతుకు అలాగే ముగిసిపోతుందేమోనని భయం! చావుకి సిద్ధపడుతూ కూడా ధనం మీద వ్యామోహం. సుఖం మీద మోజు.. మరి వీరు వేటిని జయించి గొప్ప రుషులయ్యారో మనకు మాత్రం అంతుపట్టదు. సరే బావిలో పడ్డ త్రితుడు బృహస్పతిని ప్రార్థించగా ప్రార్థించగా ఆయన అక్కడికి వచ్చి త్రితుణ్ణి బయటికి తీస్తాడు. బయట పడగానే ఏం జరిగిందన్నది వదిలేద్దాం. ధన కామ వ్యామోహాల్లోంచి బయట పడనివారు గొప్ప రుషులెట్లా అయ్యారో.. వారి ఆలోచనలు అంత నీచంగా ఉంటే వారు మహానుభావులెట్టా అయ్యారో వేదాలు విపులంగా చెప్పలేకపోయ్యాయి. ఏ రకంగానూ నేటి ఆలోచనా విధానానికి వేదాలు సమాధానమివ్వలేవు కాబట్టే.. అవి అత్యంత ప్రాథమిక రచనలు కాబట్టి, మానవీయ విలువల్ని ఏ మాత్రం స్థాపించలేకపోయాయి కాబట్టే అవి ప్రామాణికం కావు - అని మన మంటున్నాం. ''పనికి మాలినట్టి పాత శాస్త్రము లెల్ల / ఎంత చదువుకున్న ఏమి ఫలము / ఊక దంచుకున్న నూకలు రాలునా? / నవయుగాల బాట నార్ల మాట'' అని అన్నది ఆధునిక కవి అభిప్రాయం.  మరి ఆ వేదసారాన్ని వంట బట్టించుకున్న మూర్ఖులు ఈ రోజు ఏం చెపుతున్నారు? వారి ఆలోచనల్ని వ్యతిరేకించే నిరసనకారుల్ని కుక్కల్లా కాల్చేయమంటున్నారు. అసహనం తెలియజేసే వారెవరో, వారు వేసుకున్న దుస్తులే చెపుతాయని సూచన ప్రాయంగా తెలియజేస్తున్నరు. అందువల్ల మానవ సమాజాన్నీ, మానవీయ విలువల్ని ఇప్పుడు అధికారంలో ఉన్న దేశ నాయకులు రక్షించగలరని ఎలా అనుకుందాం? వేదాలు ప్రామాణికం అని చెప్పేవారు, రాముడికి మందిరం కడతామంటున్నావారు తోటి మానవుల్ని మనుషులుగా పరిగణించలేక పోతున్నారే? దేశభక్తి సంస్కృతి, సంప్రదాయం పేర దేశ ప్రజల్ని భయకంపితుల్ని చేస్తున్నారే? మోసపూరితంగా అత్యున్నత పదవులు అధిష్టించి జన జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నారే? అయితే ఇది ఎంతో కాలం సాగదు - ఇప్పుడు దేశమంతా ఒక్కటయ్యింది! నిజాన్ని గ్రహించింది!! యువతరం పిడికిలి బిగించింది. - డాక్టర్‌ దేవరాజు మహారాజు వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త.

తౄప్తి!

ఒక ఊరిలో నలుగురు స్నేహితులు ఉండేవారు. సమాన లక్షణాలున్న వారందరూ ఒకే చోట చేరటం సహజం. వీరందరూ ఆగర్భ దరిద్రులు. నిలవడానికి నీడ లేకుండా ఒక పూట తింటే మరోపూట పస్తుండేవారు. నలుగురూ ధనం సంపాదిద్దామనే ఆశయంతో విశాల ప్రపంచంలోకి బయలుదేరారు. ఊరు వదిలి కృష్ణా నది గట్టు మీద ప్రయాణం సాగించారు. కొంత దూరం ప్రయాణం చేసిన తరువాత ఒక చోట జడలుకట్టుకు పోయిన జుట్టుతో ఒక సన్యాసి వీరి కంటబడ్డాడు. ఆ సన్యాసికి వారు సాష్టాంగ దండ ప్రణామంచేసి తమ కోరికను అతడితో విన్నవించుకున్నారు. యోగ శక్తితో తమకు సహకరించమని వేడుకున్నప్పుడు ఆ సన్యాసి వారికొక జ్యోతిని ఇచ్చి "ఈ జ్యోతిని మీ చేతులలో పెట్టుకుని  హిమాలయ పర్వతాల వైపు బయల్దేరి వెళ్ళండి. చేతిలో జ్యోతి ఎక్కడ పడిపోతే అక్కడ భూమిని త్రవ్వండి. మీకు కావలసినంత ధనం లభిస్తుంది" అని చెప్పాడు.ఆ నలుగురు ఆ జ్యోతి పట్టుకుని హిమాలయ కొండలవైపు బయలుదేరారు. ఒకచోట ఆ జ్యోతి చేతులలోనుంచి పడిపోయింది. సన్యాసి వారికి చెప్పినట్టుగా అక్కడ భూమిని లోతుగా త్రవ్వారు. అది ఒక పెద్ద రాగి గని. ఆ నలుగిరిలో ఒకడు తనకు కావలసింది తీసుకుని దానితో తృప్తిపడి వెనకకు మరలిపోయాడు. మిగిలిన ముగ్గురూ జ్యోతిని పట్టుకుని యధాప్రకారం తిరిగి ప్రయాణం సాగించారు. మరొక చోట జ్యోతి జారి పడిపోయింది. అక్కడ త్రవ్విచూశారు. అదో పెద్ద వెండి గని. ఆ ముగ్గురిలో ఒకడు ఆ వెండితో తృప్తి చెంది ఇంటికి వెళ్ళాడు. మిగిలిన ఇద్దరూ ఇంకా ఉత్తమోత్తమమైనది దొరుకుతుందేమోనని బయల్దేరి నడక ప్రారంభించారు. మూడోసారి జ్యోతి పడిపోయింది. వీరిద్దరూ శ్రమపడి తవ్వారు. బంగారం! అదో బంగారు గని. మూడో స్నేహితుడు దాంతో బాగా తృప్తిపడ్డాడు. ఇంక నాలుగోవాడు అత్యాశతో మళ్ళీ ప్రయాణం ప్రారంభించాడు. వజ్రాలు, రత్నాలు లభిస్తాయని ఆశించాడు. ప్రయాసతో బహుదూరం ప్రయాణించాడు. కొంతదూరం వచ్చేటప్పటికి ఒక చోట ఒక మనిషి తల మీద పెద్ద చక్రం గిరగిర తిరుగుతూవుంటే అక్కడ ఆగి "ఇదేమిటి నీ తల మీద ఆ చక్రం అలా తిరుగుతూంది? అని అడిగాడు. ఆ పెద్ద మనిషి "మొదట ఈ చక్రాన్ని నీ తల మీద పెట్టుకో. తరువాత కథ చెబుతాను" అన్నాడు. దీనికి నాలుగోవాడు ఒప్పుకున్నాడు. కథ విందామని ఆ చక్రాన్ని తన తల మీదికి పెట్టనిచ్చాడు. ఆ పెద్ద మనిషి కథ చెప్పడం ప్రారంభించాడు. "నేనూ నీలాగే ఈ సౌభాగ్య జ్యోతిని పట్టుకుని ఇంతవరకూ వచ్చాను. నేనూ ఎంతో ఆశపడ్డాను. నేను దొరికిన రాగితో తృప్తి పడలేదు. దొరికిన వెండితో తృప్తిపడలేదు. బంగారంతోనూ తృప్తి పడలేదు. నేను ఇక్కడ ఒక వ్యక్తిని చూశాను. ఈ చక్రం అతడి తల మీద గిరగిరా తిరుగుతూంది. నీలాగే నేనూ ఈ చక్రంలో తల దూర్చాను. ఇటివంటి తప్పు ఇంకొకడు చేసి నీకు విముక్తి కలిగించే వరకు ఈ చక్రం నీ తల మీద ఇలా తిరుగుతూనే ఉంటుంది" అని చెప్పి వెళ్ళిపోయాడు.

నేను పోతే..?

భోజ మహారాజు ఒకనాడు తన ఆస్థాన పండితులతో మోక్షానికి పోగలిగే వాడెవ్వడు?"అని ప్రశించాడట. యజ్ఞయాగదులు చేస్తే మోక్షానికి పోవచ్చునని కొందరు, జ్ఞానం పొందితే పోవచ్చునని కొందరు, భక్తితో పోవచ్చునని కొందరు, మంచివారితో స్నేహం చేస్తే పోవచ్చునని కొందరు ఇలా రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్పసాగారు. అదే ఆస్థానంలో ఉన్న మహాకవి కాళిదాసు లేచి నేను పోతే పోవచ్చు అని అన్నాడు. ఆ మాట తక్కిన వారికి కోపం తెప్పించింది. మాకు లేనిది ఏమిటి? కాళిదాసుకు ఉన్నది ఏమిటి? అతనొక్కడే మోక్షానికి పోతానంటాడేంటి? అని చిరాకు పడ్డారు. ఇతడేనా మోక్షానికి పోయేవాడు" అంటూ ఆరోపణలు కూడా మొదలయ్యాయి. భోజుడు కాళిదాసు వంక ప్రశ్నార్థకంగా చూశాడు. అప్పుడు కాళిదాసు లేచి మహాప్రభూ!  నేను నేనే  అనే అహంకారం, గర్వం పోతే, ఎవడైనా సరే మోక్షానికి పోవచ్చు అన్నాను.. అంతేగాని నేను పోతానంటూ చెప్పడం నా ఉద్దేశ్యం కాదు అని వివరించాడు. 'భోజ మహారాజుతో సహా సభాసధులందరూ కాళిదాసుని మెచ్చుకున్నారు. మిత్రులారా...  దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది మనిషి ఎప్పుడైతే  నేను నేనే అనే గర్వాన్ని,  అహంకారాన్ని వదిలేస్తాడో అప్పుడే భగవంతుడిని చూడగలడు,  భగవంతుడిని చేరుకోగలడు... ఈ చిన్న విషయాన్ని మర్చిపోయి నేను అన్ని పూజలు చేశాను, నేను ఇన్ని వ్రతాలు చేశానని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు దయచేసి అవి మానండి..  అప్పుడే జీవితం బాగుంటుంది.

మనసు బుద్ధి

మనసు బుద్ధి నియంత్రణలో ఉంటే అది మంచి సేవకురాలు. మనసే బుద్ధిని నియంత్రిస్తే అది ఒక నియంత. అది పాదరసం లాగా చురుకైనది. చేతికి దొరికినట్లే ఉంటుంది, కానీ తేలికగా జారిపోతుంది. భవబంధాలకు మోక్షానికి, రాగానికి ద్వేషానికి, భయానికి ధైర్యానికి, సంకల్ప వికల్పాలకు, శాంతికి అశాంతికి.... అన్నింటికీ మూలం మనసు. మనసును నియంత్రిస్తే ప్రశాంతత, శాంతిసౌఖ్యాలు లభిస్తాయి. నిజానికి అది అంత తేలిక కాదు. గట్టిగా ప్రయత్నిస్తే కష్టమూ కాదు. మచ్చికైన జవనాశ్వం రౌతు అధీనంలో ఉన్నట్లు బుద్ధి అదుపులో మనసు ఉండాలి. రౌతు కోరిన చోటుకు గుర్రం వెళ్ళాలి కాని, అది తీసుకుపోయిన చోటికి రౌతు వెళ్ళడం కాదు. మాలిమి చేసుకున్న మనసు మాత్రమే బుద్ధి అధీనంలో నడుచుకుంటుంది. మనసు మాయాజాలం మాటలకు అందనిది. మయుడి సభను మరపించే భ్రమల సౌధాన్ని కల్పిస్తుంది. తనది కానిదాన్ని తనదే అన్నట్లుగా, క్షణికమైనదాన్ని శాశ్వతమన్నట్లుగా భ్రమింపజేస్తుంది మురిపిస్తుంది. బుద్ధి ఉపయోగించి గాని ఆ మాయ నుంచి బయటపడలేము. రాగద్వేషాలతో నిండిన మనసు ఉన్నది ఉన్నట్లుగా చూడనివ్వదు. అది ప్రసరింపజేసే రంగురంగుల కాంతిలో గాజుముక్క కూడా వజ్రంలాగా కనిపిస్తుంది. బుద్ధి అనే సూర్యకాంతిలో గాని వజ్రానికి గాజుముక్కకు తేడా తెలియదు. మనసు నిజ జీవితానికి భిన్నమైన గొప్ప ఊహాప్రపంచాన్ని సృష్టిస్తుంది.. అది విశ్వామిత్రుడి త్రిశంకు స్వర్గం కన్న మిన్నయైనది. ఆ కాల్పనిక జగత్తులో మునిగితేలేవారు నిజ జీవితాన్ని దుర్భరం చేసుకుంటారు. కొంతమంది పలాయన వాదాన్ని చిత్తగిస్తారు. కొందరు మద్యపానాన్ని ఆశ్రయిస్తారు. కొందరు తమ బాధ్యతను కర్తవ్యాన్ని భగవంతుడిపై నెట్టేస్తారు. అటువంటి వారికి మద్యపానమైనా భగవంతుడి ప్రార్థనలైనా పెద్ద భేదం ఉండదు. ఎన్ని చూసినా, ఉపనిషత్తులు చదివినా, భగవద్గీతను కంఠస్థం చేసినా వాటి సారాన్ని నిజ జీవితంలో అన్వయించుకొని ఆచరించగలగాలి. అప్పుడే వాటికి సార్థకత. మనిషి బలం, బలహీనత... రెండూ మనసే. మనిషిని దైవత్వానికి చేరువ చేసేది మనసే. రాక్షసుడిగా దిగజార్చేది మనసే. బలహీనమైన మనసు ప్రతి అల్ప విషయానికీ ఉద్విగ్న భరితమవుతుంది. ప్రశంసిస్తే ఆకాశంలో విహరిస్తుంది. విమర్శిస్తే పాతాళానికి కుంగిపోతుంది. తాళం చెవి ఎడమవైపు తిప్పితే గడియ పడుతుంది, కుడిపక్కకు తిప్పితే గడియ తెరుచుకుంటుంది. మనసూ ఎటు తిప్పితే అటు తిరుగుతుంది. భౌతిక సుఖాలకు వ్యతిరేకంగా తిప్పితే ఆధ్యాత్మికత వైపు తిరుగుతుంది. మనసులోని వ్యతిరేక భావనలను తొలగించి సానుకూలమైన ఆహ్లాదకరమైన ఆలోచనలతో నింపితే శారీరక రుగ్మతలూ దగ్గరకు రావు. నేటి శాస్త్రవేత్తలు కూడా చాలా రోగాలకు కారణం మనసే అని, మనసు హాయిగా ఉంచుకున్నవారికి రోగాలు దరిచేరవని ధ్రువీకరిస్తున్నారు. ధర్మబద్ధమైన కర్మలను నిష్కామంగా ఆచరిస్తూ బుద్ధికి మనసును అప్పజెప్పి జీవనయానాన్ని కొనసాగించాలి. ఎప్పటికప్పుడు ఆత్మావలోకనం చేసుకుంటూ మనసులో చెలరేగే ఆలోచనలు ప్రలోభాలు సంఘటనలను అవగాహన చేసుకుని, విచక్షణతో వాటి ప్రభావాన్ని కొద్దికొద్దిగా తగ్గించు కోవాలి. అప్పుడు కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు దారి తప్పకుండా ఉంటాయి.

నిజమైన తోడు

ఓ రైలు ప్రయాణంలో ఓ ఊరు వెళుతుండగా నేను కూర్చున్న భోగీలో నాసీటు కింద కాళ్లదగ్గర  ఒక పాత నలిగిపోయిన పర్సు కనిపించింది. దానిని పైకి తీశాను.అందులో కొద్దిపాటి నోట్లు ఒక కృష్ణుడిఫోటో తప్ప ఏమీ లేవు. ఎవరిదో తెలిపే ఆనవాళ్ళు ఏమీ లేవు.ఎలా తిరిగి ఇవ్వడం? ఈ పర్స్ ఎవరిదండీ ?అంటూ అడిగా అక్కడునొల్లతో.... అందరూ పర్స్ కేసి చూశారు, తమ జేబులు తడుముకున్నారు. ఇంతలో పక్కబెర్తులో కూర్చుని #భగవద్గీత చదువుకుంటున్న ఒక పెద్దాయన నెమ్మదిగా వచ్చి అది తన పర్స్ అని చెప్పాడు. మీ పర్సు అని నమ్మకం ఏమిటీ ?ఏదైనా ఆనవాలు ఉంటే చెప్పండి అన్నాను. "అందులో కృష్ణుడి ఫోటో ఉంటుందండీ"అన్నాడాయన.  "ఆ ఒక్క ఆనవాలు చెబితే ఎలాగండీ ?ఇంకా ఏదైనా చెప్పండి.మీ ఫోటో పెట్టుకోవచ్చు కదా !"అడిగాను. అప్పుడు ఆ పెద్దాయన చెప్పిన సమాధానం మన అందరికీ ఒక పాఠమే. బాబూ..!  అది నాకు చిన్నప్పుడు మా నాన్న ఇచ్చిన పర్సు, అప్పుడు నాకు మా అమ్మానాన్న అంటే చాలా ఇష్టం అందుకని నేను వాళ్ళ ఫోటో అందులో పెట్టుకున్నాను. కాలం గడిచేకొద్దీ నేను చాలా అందంగా ఉన్నాను అని నాకు అభిప్రాయం కలిగింది. అందుకని నేను అప్పుడు పర్సులో నా ఫోటో పెట్టుకున్నాను. నాకో ఉద్యోగం వచ్చి పెళ్లి అయ్యింది.నా భార్య చాలా అందగత్తె.నాకు ఆమె అంటే చాలా ప్రేమ.అపుడు ఆమె ఫోటో పర్సులో పెట్టుకునే వాడిని. ఇంకో రెండు సంవత్సరాలకి నాకు కొడుకు పుట్టాడు. వాడంటే నాకు చాలా ఇష్టం. వాడి కోసం ఆఫీసు వదలగానే ఇంటికి వచ్చి వాడితోనే లోకం అన్నట్టుగా గడిపేవాడిని. వాడిని భుజాల మీద మోస్తూ రోజంతా గడిపేవాడిని.వాడిని నా పక్కనే పడుకోబెట్టుకునే వాడిని.వాడే నా లోకం. అప్పుడు పర్సులో వాడి ఫోటో పెట్టుకునే వాడిని.వాడు ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. నా భార్య మూడు సంవత్సరాల క్రితం చనిపోయింది. కొడుకు నన్ను మరచిపోయాడు.నాకెవ్వరూ లేరు.ఇపుడు భయం వేస్తోంది. ఈ వయసులోనేగా తోడు కావాలి.అందుకని నాకు తోడుగా కృష్ణుడిని పెట్టుకున్నాను.ఆయనే నాకు ఇపుడు తోడు. నా సంతోషానికి ఆయన సంతోషిస్తాడు. నా విచారానికి ఓదారుస్తాడు. నాతో ఎప్పుడూ ఉండే ఆయనను ఎప్పుడో పర్సులో పెట్టుకోవలసిన నేను చాలా ఆలస్యంగా గుర్తించాను. ఇప్పుడు నేను ఆయనతో గడుపుతున్నాను. భగవద్గీత చదువుతుంటే స్వయంగా ఆ జగద్గురువే నాతో మాట్లాడుతున్న అనుభూతి,ఆనందం కలుగుతున్నాయి.చిన్నతనం నుంచీ నన్ను విడిచిపెట్టిపోయే అశాశ్వతమైన అంశాలకే ప్రాధాన్యత ఇచ్చాను తప్ప,శాశ్వతమైన పరమసత్యం ఈ భగవద్గీత అనే నిజాన్ని విస్మరించాను.జీవితం అర్ధభాగం పైగా గడిచిపోయిన తరువాత ఈ #బ్రహ్మవిద్యపై శ్రద్ధ కలిగినదుకు సంతోషించాలో,కనీసం నూటికి 90 మందికిపైగా ఇప్పటికీ దేవునివాచ పై శ్రద్ధ లేనందుకు విచారించాలో తెలియడం లేదు అన్నాడు ఆ పెద్దాయన. ఆయన మాటల్లో ఆవేదన,ఆయన కళ్ళల్లో పలుచటి నీటిచెమ్మ లీలగా కనిపించాయి. నేను మారు మాట్లాడకుండా పర్సు ఆయనకు ఇచ్చేశా. పక్క స్టేషనులో రైలు ఆగింది,నేను దిగవలసినది అక్కడే.రైలు దిగి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నా ఆలోచనలు మాత్రం వేగంగానే సాగుతున్నాయి.బయటకు రాగానే ఎదురుగా గోడపై "భగవద్గీత చదవండి,శ్రీ కృష్ణుని నిజభావం తెలియండి" అని వ్రాసి ఉన్న బోర్డు చూసి,దానిపై ఉన్న నెంబర్ కి కాల్ చేసి నాకు భగవద్గీత కావాలని అడిగాను.ఫోన్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి నేనున్న రైల్వేస్టేషన్ కు 20 నిమిషాల ప్రయాణ దూరంలో ఉన్నానని,మీకు ఆలస్యం అవుతుందంటే మీ అడ్రస్ కు తెచ్చి ఇస్తామని చెప్పాడు.గంట సమయమైనా నేను ఇక్కడే వేచి ఉంటాను వెళితే భగవద్గీత గ్రంథంతోనే ఇంటికి వెళ్తాను అని చెప్పాను. సుమారు 25 సంవత్సరాల వయసున్న వ్యక్తి అర్ధగంటకి  బైకుపై వచ్చి నా నెంబర్ కి కాల్ చేసాడు. అతనిని చూసి చెయ్యి పైకెత్తి పిలిచాను.అతను దగ్గరకు వచ్చి "భగవద్గీత" నా చేతిలో పెడుతూ ఆలస్యం అయ్యింది అన్న,క్షమించాలి అన్నాడు.ఆ మాటల్లో మర్యాద..... నిజంగానే "భగవద్గీత" ఇంత సంస్కారం నేర్పుతుందా అని చిరునవ్వు నవ్వి,ఆ గ్రంథం యొక్క వెల చెల్లించి,ఆ వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పి,ఆటోని పిలిచాను.ఆ పెద్దాయన చెప్పింది నిజమే.,  భగవద్గీత పట్టుకుని అడుగులు వేస్తుంటే స్వయంగా ఆ దేవదేవుడే నా చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది.   #భగవంతుడు తప్ప నిన్ను కాపాడేవాడే లేడు... నిత్యం మనకు ఎన్ని పనులు వున్న భగవంతునికి , భగవంతుడు చెప్పిన భగవద్గీత కు కాస్త సమయం కేటాయిస్తే ఆయన మన కోసం జీవితకాలం తోడు వుంటాడు.  ఆయన్ని అర్జునుడిలా శరణు వెడితే! నీ జీవుతామంతా అదే అర్జునుడికి తోడుగా ఉన్నట్టే ఉండి.. నిన్ను నడిపిస్తాడు

బృందావన వనసీమ

మధురా బృందావనంలో కొన్నేళ్ల క్రితం నిజంగా జరిగిన సంఘటన ఇది.  ఇప్పటికీ ఆ ఆనవాళ్లు  ఇంకా ఉన్నాయి. ఒక పండితుడు ,తన పూరి గుడిసె లాంటి ఇంటి ముందు అరుగు పై కూర్చుండి,నిత్యం భక్తులకు పురాణం వినిపిస్తూ ఉండేవాడు,! క్రమం తప్పకుండా భక్తితో,భక్తుల నుండి ఏమీ ఆశించకుండా వినిపిస్తూ ఉంటే, ఆ ప్రాంతం వారు, చాలామంది వచ్చి శ్రద్ధగా వింటూ తన్మయం చెందే వాళ్ళు!! అప్పుడప్పుడూ ,ఆయన తాను చెబుతున్న పురాణం మద్యలో అపి, లోనికి వెళ్ళి వస్తూ , మా పిల్లవాడికి స్నానం చేయించానని, భోజనం పెట్టానని, పడుకో బెట్టాను అనీ దుస్తులు ధరింప జేశానని చెప్పేవాడు, ఇలా రోజూ జరుగుతూ వుండేది...! కానీ గుడిసె లో పిల్లవాడి అలికిడి, అల్లరి, మాట ఏదికూడా ఎవరికీ వినపడేది కాదు,ఇలా ఏళ్లు గడిచాయి,  ఒకరోజు ఆయన దేహం చాలించాడు, గ్రామస్తులు చాలా బాధ పడ్డారు,అయ్యో ! ఎంత మంచి వాడు! ఎంతో భక్తిశ్రద్ధలతో ఎవరిని ఏమీ అడగకుండా అద్భుతంగా భగవద్ కథలు వినిపించి మనలను తరింపజేశాడే ! మరల ఎవరు ఇంత గొప్పగా చెబుతారు,అంటూ విచారపడుతూ అందరూ అనుకోని ఆయన అంత్యక్రియలు జరిపే సన్నాహాలుచేయడం ప్రారంభించారు !! మా అబ్బాయి అని చెప్పాడు కదా అంటూ ఆ పిల్లాడి కోసం వారు లోనికి వెళ్లి చూస్తే ఎవరూ కనపడలేదు వారికి!! ఒక రోజు ఎదురు చూశారు! పిల్లాడి జాడ లేదు !చివరకు వాళ్ళే అతడి కళేబరాన్ని యమునానది ఒడ్డుకు తీసుకెళ్ళి మంచి గంధపు కట్టెలతో చితిని ఏర్పాటు చేశారు!! ఇక నిప్పు పెట్టడానికి వాళ్ళలో ప్రతీ వాడు,నేను పెడతాను అంటే..నేను పెడతాను అంటూ పోటీలు పడ్డారు !ఎందుకంటే, మహా పుణ్యాత్ముడయిన ఆయనకు చేసే ఈ పని వల్ల కర్మ చేసేవారికి ఎంతో పుణ్యం వస్తుంది కదా !ఇలా వాళ్ళు పేచీ పడుతూ ఉంటే, దూరం నుండి ఒక పిలుపు వినవచ్చింది వారికి ! ఆగండి.... !! ఆగండి.... !!అంటూ అందరూ చూస్తుండగా దూరంగా ఒక పదహారేళ్ళ బాలుడు పరుగు పరుగున అటే వస్తూ కనిపించాడు నేను మిమ్మల్ని ఒకటి కోరుకుంటున్నాను, చనిపోయిన ఈ పెద్దాయన నా తండ్రి !! నన్ను ఒక పని మీద పొరుగూరు పంపించాడు!! అది చూసుకొని రావడంలో నాకు కొంత ఆలస్యం జరిగింది, !!నన్ను క్షమించి, దయచేసి నా తండ్రికి అగ్ని సంస్కారం చేసే భాగ్యాన్ని అనుగ్రహించండి !!అని విచార వదనంతో అంటుంటే వారికి చాలా ఆనందం కలిగింది,చూశారా! రక్త సంబంధము బలం ఎలా ఉంటుందో...?? ఆయనకు తన కన్న కొడుకు చేత ఈ పని చేయించుకునే అదృష్టం ఉండగా, ఇతరులకూ ఆ అవకాశం ఉంటుందా...?? అనుకుని సరే అన్నారు! ఆ పిల్లవాడు చక్కగా వేద మంత్రాలు పఠిస్తూ,అంత్యేష్టి కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నాడు!! చక్కని పాండిత్యం అందమైన ఉచ్చారణతో పనసలు చదువుతూ ఉంటే, అక్కడకొచ్చిన వేద పండితులు,పురోహితులు కూడా ఆశ్చర్య పోతున్నారు! ఏమా వర్చస్సు?! ఏమా శాస్త్ర పరిజ్ఞానం...?? ఇంతవరకూ ఎవరూ, కనీ వినీ ఎరుగని శాస్త్ర విధి ప్రకారం చేస్తూ చివరకు చుట్టూ ప్రదక్షణ నమస్కారం చేస్తూ దుఖిస్తూు,చితికి నిప్పు అంటించాడు !! నాయనా ! ఇక నీవు వెనుదిరిగి చూడకుండా దూరం వెళ్లు అన్నారు ఊరి పెద్దవాళ్ళు! ఆ పిల్లవాడు అలాగే అన్నట్టుగా తల ఊపి, నేరుగా వెళ్తూ దాదాపుగా ఒక 20 గజాల దూరం వెళ్ళాక, కనిపించకుండా అంతర్ధానం కావడం వారు అందరూ కళ్ళారా చూశారు, అప్పుడు తెలిసి పోయింది వారికి, ఆ వచ్చినవాడు "కృష్ణయ్య" అని ఇన్నాళ్లూ విన్న భాగవత కథల పుణ్యమా అని, శ్రీకృష్ణుని ఒక బాలుని రూపంలో ప్రత్యక్షంగా దర్శించే మహా భాగ్యం లభించింది కదా అంటూ, ఆ బాలుడు నడచిన నేలపై గల ధూళిని ప్రసాదంగా, మహదైశ్వర్యముగా స్వీకరించారు వారంతా! ఇప్పటికీ ఆ ప్రదేశాన్ని పరమ పావనంగా పవిత్రంగా భావిస్తూ పూజిస్తూ ఉన్నారు బృందావనవాసులు! శ్రీకృష్ణుడు అదృశ్య రూపంలో కొలువై నెలవై , భక్తుల పాలిట కల్పతరువుగా అచట ఉంటున్నాడనుటకు నిదర్శనం ఈ వాస్తవ గాథ !! మా అబ్బాయికి నిద్ర, అహారం, స్నానం ఏర్పాట్లు చేసి వస్తానని చెబుతూ శ్రీకృష్ణ భగవానుని తన కుమారునిగా భావిస్తూ అదే ధ్యాసతో అంతిమ శ్వాసను విడిచిన ఆ మహానుభావునికి కృష్ణుడు, కొడుకు రూపంలో వచ్చి, స్వయంగా కన్న తండ్రి కి కొడుకు చేస్తున్నట్టుగా , శాస్త్ర రీతిలో పద్ధతిగా చేశాడు.అలా పరందాముడే స్వయంగా, అంతిమ క్రియలు చేయడం వాళ్ళు గమనించారు,భక్తుడు ఈ భవ బంధాలను కోరుకోకుండా, నేరుగా భగవంతునితో సంబంధబాంధవ్యాలు పెట్టుకొని పంచుకుంటూ, పెంచుకుంటూ ముక్తిని పొందాడు !ఆదిత్యయోగీ.. ఈ రోజుల్లో కడుపున పుట్టిన కొడుకులు కూడా దూరంగా ఉంటూ తండ్రి ఆర్తితో పిలిచే పిలుపు కు అందక పోవచ్చు!! లేదా ఖాతరు చేయకుండా పోవచ్చు,,!! కానీ పరమాత్ముడు మాత్రం తనను నమ్మిన భక్తుడిని , సదా సంరక్షిస్తూ, అతడి యోగక్షేమాలు స్వయంగా చూస్తుంటాడు!! ఇలా భగవంతునికి భక్తునికి ఉండే సంబంధం మాటలకు, ఊహకు, చేతలకు , అందదు!! భావాగ్రాహి జనార్దనా !" అంటే భక్తుని అంతరంగం లో కదిలే భావాలను జనార్ధనుడు సదా గ్రహిస్తూ, ఉంటాడు..!! ఆ ప్రేమానుబంధం అనిర్వచనీయం ! అద్భుతం కూడా !! అలాంటి బ్రహ్మానంద భక్తి సామ్రాజ్యము ఆ బృందావనం! ఆ అందాల ఆనందాల అనుబంధాల బృందావన వనసీమలో ఒక రేణువుగా మారితే ఎంత బాగా ఉండేది కదూ ! నిత్యం అచట సంచరించే సాక్షాత్తూ రాధాకృష్ణుల మృదువైన పాదములు సుతి మెత్తగా తాకుతూ ఉండగా, కలిగే పరమానందాన్ని,అఖండ ఐశ్వర్య విభూతి వైభవాన్ని అందించమని నల్లనయ్య ను కోరుకుందాం!!

మార్గ శీర్షి

మార్గశిర మాసం.. ఎందుకని విలక్షణమైన మాసం అయ్యిందో తెలుసా? కార్తీక మాసం నుంచి  మార్గశిర మాసంలో అడుగు పెట్టాం.. హేమంత ఋతువులోని మొదటి మాసం మార్గశిరం.. ఈ మాసం గురించి శ్రీకృష్ణ పరమాత్ముడు.. మాసానాం మార్గశీర్షాహం.. మాసాలలో మార్గశిర మాసాన్ని నేనే అని స్వయంగా చెప్పాడు. హిందూ సంప్రదాయాల ప్రకారం.. తెలుగు నెలల్లోని ప్రతి ఒక్క నెలకు ఒక్కో ప్రత్యేకత ఉంది. అయితే అన్ని మాసాలన్నింటిలోనూ మార్గశిర మాసానికి ఎంతో విశిష్టత.. ప్రత్యేకత ఉంది. మార్గశిర మాసాన్నే 'మార్గశీర్షం' అని కూడా పిలుస్తారు. శీర్షం అంటే అగ్రభాగం అని అర్థం. మాసాలన్నింటిలో అగ్రగణ్యమైనది కాబట్టే దీనికి ఈ పేరు వచ్చింది. అంతేకాదు మార్గశీర్షం ఒక విలక్షణమైన మాసం. అంటే మార్గాలలో శ్రేష్టమైనది. అది ఏ మార్గం అంటే భగవంతుని అనుగ్రహం పొందు భక్తి మార్గం.శ్రీమహా విష్ణువుకు ఎంతో ప్రీతికరమైన మాసం మార్గశిరం. శ్రీమన్నారాయణుడి ఆరాధనతోపాటూ పలు పర్వదినాల సమాహారం మార్గశిర మాసం. మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో చేసే లక్ష్మీపూజలూ, ఉండే ఉపవాసాలతో సకల శుభాలు కలుగుతాయని చెబుతున్నాయి శాస్త్రాలు. ఇదే విషయాన్ని 'గీత'లో శ్రీక్రిష్ణుడు అర్జునుడికి చెప్పినట్లు పండితులు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఈ మాసం యొక్క విశేషాలు, ప్రాముఖ్యత, విశిష్టతతో పాటు మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం... మార్గశిరం అంటే.. ‘బృహత్సామ తథాసామ్నాం   గాయత్రీ ఛందసా మహం మహం   మాసానాం మార్గశీర్షోహ  రుతూనాంకుసుమాంకం'  అనే శ్లోకంలో మార్గశీర్షాన్ని నేనే, ఆరు రుతువులలో పుష్ష సౌరభం నేనే, సామవేదానికి చెందిన గానాలలో బృహత్సామాన్ని నేనే, ఛందస్సులో గాయత్రీ ఛందాన్ని నేనే, శోభ అధికంగా ఉండే వసంతకాలాన్ని నేనే అని భగవద్గీతలోని విభూతి యోగంలో ఆ క్రిష్ణభగవానుడే వివరించాడు. మొత్తానికి మార్గశిరం అంటే నేనేనని చెప్పుకున్న మాసమన్నమాట. హిందువులందరికీ ‘భగవద్గీత' జన్మించిన మాసంగా పరిగణించే పవిత్రమైన మాసం. ఈ మాసమంతా శ్రీమహావిష్ణువును తులసీదళంతో పూజిస్తే పుణ్యం దక్కుతుందని.. పండితులు చెబుతుంటారు. మార్గశిర మాసం ఎన్ని పర్వాలకు నెలవుగా పరిగణిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో మార్గ శిర శుద్ధ ఏకాదశిని ‘వైకుంఠ ఏకాదశి' అని దీనినే ‘మోక్ష ఏకాదశి' అనీ అంటారు. ఈ పర్వదినాన వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం నుండి వెళ్లి దేవున్ని దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుందని చాలా మంది భక్తుల నమ్మకం. ఈ ఏకాదశి నాడే గీతా జయంతి, సమస్త మానవాళికి ధర్మభాండాగారం అయిన భగవద్గీతను క్రిష్ణుడు ప్రబోధించిన రోజు. ఇలా ఎన్నో విశిష్టతలతో భక్తులందరికీ హర్షం ఇచ్చేదే మార్గ శీర్ష మాసం. ఈ జగత్తులోని అన్నింట్లో తాను ప్రకటితమైనప్పటికీ కొన్నింట్లో తన స్వరూపం స్పష్టంగా తెలుస్తుందనీ, అలాంటి కొన్నింట్లో ఈ మాసం కూడా తన స్వరూపమేననీ చెబుతాడు కృష్ణుడు. ఈ నెలలో లక్ష్మీ నారాయణుడిని తులసీదళంతో పూజించడం పుణ్యప్రదమని అంటారు.  ఆధ్యాత్మికంగా మానసిక శక్తిని ఇచ్చే ఈ మాసంలో వచ్చే గురువారాల్లో మహాలక్ష్మిని పూజిస్తే ఆయురారోగ్యాలూ, సిరిసంపదలూ వృద్ధి చెందుతాయని చెబుతున్నాయి పురాణాలు. ఈ నెలలో ప్రతిరోజూ శుభ ప్రదమైనదే అయినా మరికొన్ని ప్రత్యేకమైన పర్వదినాలూ ఉన్నాయి. మార్గశిర తదియ నాడు కొన్ని ప్రాంతాల్లో శివపార్వతుల వ్రతం చేసే ఆచారం ఉంది. ఈ మాసంలో వచ్చే షష్ఠిని స్కంద/సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు. శివపార్వతుల కుమారుడైన సుబ్రహ్మణ్యుడు తారకాసుర సంహారం కోసం అవతరించిన దినమే సుబ్రహ్మణ్యషష్ఠి. అలాగే మార్గశిర శుద్ధ అష్టమిని కాలభైరవ అష్టమి అని అంటారు. ఈశ్వరుడు కాలస్వరూపంగా ప్రకటితమైన అవతారం ఇది. కాలభైరవుడు కాశీపట్టణానికి క్షేత్రపాలకుడిగా ఉంటూ అక్కడ మరణించిన భక్తుల పాపపుణ్యాలు స్వయంగా లెక్కిస్తుంటాడని చెబుతారు. శునకం కాలభైరవ స్వరూపం కాబట్టి ఈ రోజున శునకాన్ని పూజించి, గారెల దండను శునకం మెడలో వేస్తే మంచిదని చెబుతారు. ఈ నెలలో వచ్చే త్రయోదశినాడు... ద్రౌపది హనుమంతుడి వ్రతాన్ని చేసిందని చెబుతున్నాయి శాస్త్రాలు. దీన్ని వేదవ్యాసుడు ధర్మరాజుకు చెబితే... ధర్మరాజు ద్రౌపది చేత ఆ వ్రతం చేయించాడట. దక్షిణాయనానికి చివర, ఉత్తరాయనానికి ముందుండే ధనుర్మాసం ఆరంభం అయ్యేది కూడా ఈ మాసంలోనే. ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం. సూర్యుడు ధనుస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకూ అంటే... భోగి వరకూ ఈ ధనుర్మాసం కొనసాగుతుంది. ఈ మాసంలో ఆండాళ్‌ పూజ, తిరుప్పావై పఠనం, గోదా కల్యాణం మొదలైనవాటికి అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఈ కాలంలో తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పఠనం చేస్తారు. ఈ నెలలో సాధారణంగా విష్ణు ఆలయాల్లో స్వామికి అర్చన చేసి ఆ ప్రసాదాన్ని పిల్లలకు ప్రత్యేకంగా పంచుతారు. అలా పంచడాన్ని బాలభోగం అంటారు. కొందరు వైష్ణవులు మార్గశిర పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమి నుంచి ధనుర్మాస వ్రతాన్ని చేసుకోవడం ఓ సంప్రదాయమే. ఏడాదిలో వచ్చే ఇరవైనాలుగు ఏకాదశి తిథుల్లో ప్రతిదీ పవిత్రమైనదైనా.. వీటన్నింటిల్లో వైకుంఠ ఏకాదశి మాత్రం ఉండదు. ఎందుకంటే అన్ని ఏకాదశుల్నీ చంద్రమానం ప్రకారం గణిస్తే... వాటికి భిన్నంగా వైకుంఠ ఏకాదశిని సౌరమానం ప్రకారం గణిస్తారు. సూర్యుడు ఉత్తరాయనానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అంటారు. ‘వైకుంఠ ఏకాదశి’, ‘ముక్కోటి ఏకాదశి’, ‘స్వర్గద్వార ఏకాదశి’, ‘మోక్ష ఏకాదశి’ అంటూ పిలిచే ఈ ఏకాదశి రోజునే శ్రీమహావిష్ణువు కొలువై ఉన్న వైకుంఠంలోని వాకిళ్లు తెరుచుకుంటాయని అంటారు. దక్షిణాయనంలో యోగనిద్రలోకి వెళ్లిన నారాయణుడు కార్తిక శుద్ధ ఏకాదశిరోజున మేల్కొంటాడు. అలా మేల్కొన్న స్వామిని దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలూ మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశి రోజున వైకుంఠానికి చేరుకుంటారు. అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున ఉత్తర ద్వారంలో శ్రీమన్నారాయణుడిని దర్శించుకుంటే స్వర్గలోకప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. అలాగే... మార్గశిర శుద్ధ ఏకాదశి భగవద్గీత లోకానికి అందిన రోజు కూడా. ఇలా ఎన్నో ప్రత్యేకతలున్న ఈ మాసంలో మహావిష్ణువును భక్తిశ్రద్ధలతో పూజిస్తే... ఆయురారోగ్యాలతోపాటూ సిరిసంపదలూ కలుగుతాయని భక్తుల నమ్మకం.

బహుమతి

ఉదయం పూజ అయ్యాక పేపరు చదువుకుంటున్న నేను ఎవరో కాలింగ్‌బెల్‌ కొడితే వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా ఓ యువకుడు చేతిలో శుభలేఖలతో  మాస్టారూ  బాగున్నారా?  అని పలకరించాడు. వృద్ధాప్యం వల్ల వచ్చిన మతిమరుపు వల్ల ‘ఎవరా’ అని ఆలోచిస్తూ యథాలాపంగా ‘‘ఆ, బాగానే ఉన్నాను. లోపలికి రా బాబూ’’ అన్నాను. లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. నేను అతడికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుని ‘అతడెవరా’ అని ఆలోచిస్తున్నాను. మర్యాద కోసం ‘‘మంచినీళ్ళు కావాలా?’’ అని అడిగాను. వద్దన్నాడు. గొంతు సవరించుకుని అతడే అడిగాడు- ‘‘నన్ను గుర్తుపట్టారా మాస్టారూ?’’ అని. నేను తటపటాయిస్తుంటే చిరునవ్వుతో అన్నాడు ‘‘నేను సత్యమూర్తి నీ. మీ స్కూల్లో చదివాను. మా నాన్నగారు ఆ రోజుల్లో జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా చేసేవారు’’ అని. అప్పుడు గుర్తుకు వచ్చింది. సత్యమూర్తి చాలా మంచి స్టూడెంట్‌. బాగా తెలివైనవాడు. ఎప్పుడూ క్లాస్‌ ఫస్ట్‌ వచ్చేవాడు. అతడు స్కూల్లో చేరినరోజే వాళ్ళ నాన్నగారు నన్ను కలిసి ‘మాస్టారూ, మావాడు బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని నా కోరిక. ఏ తప్పుచేసినా అల్లరిచేసినా జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ కొడుకని చూడకుండా దండించండి. నేనేమీ అనుకోను. వాడు బాగా చదువుకుంటే అదే పదివేలు’ అని చెప్పారు. వృత్తిరీత్యా ఎంతోమంది రాజకీయ నాయకులని చూసిన నాకు, ఆయన మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఆ రోజుల్లో నేను హెడ్‌మాస్టర్‌గా పనిచేసేవాణ్ణి. పిల్లలకి గణితం, సైన్సు బోధించేవాణ్ణి. అయితే సత్యమూర్తి దండించే పరిస్థితులు వచ్చేలా ప్రవర్తించలేదు. చాలా బాగా చదివేవాడు. ఏ సందేహం వచ్చినా అడిగి నివృత్తి చేసుకునేవాడు. అతడికి చదువులో, ముఖ్యంగా గణితం మీద ఉన్న అభిరుచి చూసి అతడికి మరింత శ్రద్ధతో కిటుకులు బోధించేవాణ్ణి. కుశలప్రశ్నలయ్యాక, అతడు వచ్చిన పని చెప్పాడు. ‘‘మాస్టారూ, వచ్చే పదిహేనో తారీఖున నా పెళ్ళి, మా స్వగ్రామంలో. మర్నాడు సాయంత్రం ఈ ఊళ్ళోనే రిసెప్షన్‌. మీరూ అమ్మగారూ పెళ్ళికి తప్పకవచ్చి మమ్మల్నిద్దరినీ ఆశీర్వదించాలని నా ప్రార్థన. మీరు ఎప్పుడు బయల్దేరతారో చెబితే, నేను మిమ్మల్ని మా ఊరు తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి కారు ఏర్పాటు చేస్తాను’’ అంటూ, నా చేతిలో శుభలేఖ పెట్టి, నాకూ మా ఆవిడకీ పాదాభివందనం చేశాడు. శుభలేఖ చూశాను. అర్ధరాత్రి ముహూర్తం. నేను అతడికి మృదువుగా చెప్పాను- ఆరోగ్యరీత్యా ప్రయాణించలేమనీ వీలైతే రిసెప్షన్‌కి వస్తాననీ చెప్పాను. పెళ్ళికి రాలేమని అనేసరికి అతడి ముఖం కొద్దిగా చిన్నబోయింది. అయితే రిసెప్షన్‌కి ఇద్దరూ తప్పక రావాలని మాట తీసుకుని మరీ బయల్దేరాడు. కారు పంపవద్దనీ మేమే వస్తామనీ చెప్పాను. పెళ్ళి రెండ్రోజులుందనగా మా ఆవిడ జయ, రిసెప్షన్‌ గురించి గుర్తుచేసి, బహుమతి ఏమిద్దామని అడిగింది. సత్యమూర్తి చాలా ధనవంతుడు. అతడి స్థాయికి తగిన బహుమతి ఇచ్చే తాహతు నాకు లేదు. చాలాసేపు ఆలోచించిన తరవాత నా ఉద్దేశ్యం జయకి చెప్పాను, తనూ అంగీకరించింది. రిసెప్షన్‌కి నేనూ జయా వెళ్ళాం. సత్యమూర్తి స్నేహితులైన నా పూర్వవిద్యార్థులు కొంతమంది కలిశారు. సత్యమూర్తి తండ్రి వచ్చి పలకరించారు. రిసెప్షన్‌ మొదలయ్యాక నేనూ జయా వేదిక మీదకి వెళ్ళి వధూవరులని ఆశీర్వదించాం. సత్యమూర్తి చేతిలో నేను తీసుకెళ్ళిన కవరు పెట్టాను. ఆ కవరులో పెట్టిన ఉత్తరంలో ఇలా రాశాను. చిరంజీవి సత్యమూర్తికి ఆశీస్సులు. ఈ సమయంలో ఉత్తరం ఏమిటీ అని ఆశ్చర్యపోతున్నావా? తమ ఉన్నతికి పాటుబడిన ఉపాధ్యాయులని ఏమాత్రం పట్టించుకోని ప్రస్తుత కాలంలో నువ్వు గుర్తుపెట్టుకుని వెతుక్కుంటూ వచ్చి ఎంతో అభిమానంగా మమ్మల్ని నీ పెళ్ళికి ఆహ్వానించినందుకు చాలా సంతోషమైంది. వృద్ధాప్యం వల్ల ఈమధ్య మా బంధువులలోనైనా ఎవరైనా పెళ్ళికి ఆహ్వానించినా అంతగా వెళ్ళడం లేదు. నీ విషయంలో ఈ పద్ధతికి విరామం ఇద్దామని నిర్ణయించుకున్నాను. కారణాలు అనేకం. నువ్వు నా అభిమాన విద్యార్థివి కావడం, మీ తండ్రిగారి మీద నాకున్న గౌరవం... వగైరా. వచ్చిన చిక్కల్లా ‘నీకు ఏ బహుమతి ఇవ్వాలా’ అన్నదే. మనమిచ్చే బహుమతి అవతలివారికి ఉపయోగపడేలా ఉండాలన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. నా ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో నీకు ఎలాంటి బహుమతి ఇవ్వాలా అని చాలా తర్జనభర్జనపడ్డాను. ఎంత ఆలోచించినా సరైన వస్తువేదీ నా బుద్ధికి తట్టలేదు. ఏ వస్తువు అనుకున్నా అది నీ తాహతుకి చాలా తక్కువవుతుందనిపించింది లేదా నీ దగ్గర ఇప్పటికే ఉండి ఉంటుందని పించింది. డబ్బే ఇద్దామనుకుంటే, నేనివ్వగలిగిన మొత్తం నీకు చాలా తక్కువవుతుందనిపించింది. అటువంటి సమయంలో నాకు ఈ ఆలోచన వచ్చింది. ఈ ఉత్తరంతో జతచేసిన కాగితమే నేను నీకు ఇస్తున్న బహుమతి. నువ్వూ నీ సహధర్మచారిణీ ఎంతో ఆనందంగా మీ భావిజీవితాన్ని గడిపేలా చేయమని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం.... దీవెనలతో, శంకరం మాస్టారు డిన్నర్‌ చేశాక వద్దంటున్నా మా ఇద్దరికీ బట్టలు పెట్టారు అతడి తల్లిదండ్రులు. తీసుకోకపోతే సత్యమూర్తి బాధపడతాడంటూ బలవంతం చేశారు. చాలా మొహమాట మేసింది మాకు. అలాగే వద్దంటున్నా మమ్మల్ని కారులో మా ఇంటి దగ్గర దిగబెట్టారు. నెల రోజుల తర్వాత నా పేరున ఓ ఉత్తరమొచ్చింది. తెరిచి చూస్తే అది సత్యమూర్తి రాసినది. దైవసమానులైన మాస్టారుగారికి, నమస్కారములు. నా పెళ్ళికి వచ్చి మమ్మల్ని ఇద్దరినీ ఆశీర్వదించినందుకు సంతోషం. ఆరోజు నా పెళ్ళి రిసెప్షన్‌లో మీరు ఇచ్చిన బహుమతి చూశాక, దానికి జతచేసిన ఉత్తరం చదివాక చాలాసేపు అలా ఉండిపోయాను. మేధావులు ఎందుకు ప్రత్యేకంగా ఉంటారో అర్థమయింది. మీరు రూ.1,116 నా పేరున ఒక గోశాలకు విరాళంగా ఇచ్చి, ఆ రసీదు జత చేశారు. నా పెళ్ళికి వచ్చిన అన్ని బహుమతులలో దీన్ని అత్యంత విలువైనదిగా భావిస్తాను. స్కూల్లో చదువుకుంటున్నప్పుడు మీరు నాకు ఓ రోల్‌మోడల్‌. చిన్నప్పటి నుండీ నేను ఇతరులని ఆసక్తిగా గమనిస్తూ ఉండేవాణ్ణి. అలాగే స్కూల్లో చదువుతున్నప్పుడు మిమ్మల్ని గమనిస్తూ ఉండేవాణ్ణి. అందువల్ల నేనుచాలా మంచి విషయాలే నేర్చుకున్నాను. నేను ప్రస్తుతం ఇంత మంచి స్థాయిలో ఉండటానికి అవి ఎంతో ఉపయోగపడ్డాయి. కానీ, మీ బహుమతి నన్ను ఆలోచించేలా చేసింది. మీరన్నట్లు మామూలుగా అయితే రూ.1,116 నాకు చాలా చిన్న మొత్తమే. కానీ మీరు ఆ మొత్తాన్ని ఓ గోశాలకు విరాళంగా ఇచ్చారు- అదీ నా పేరున. మీరు చేసిన ఈ గొప్పపని నాలో ఎన్నో ఆలోచనల్ని రేకెత్తించింది. అనేకసార్లు నేను చేసే అనవసర ఖర్చుల్ని గుర్తుచేసింది. మీరు ఇచ్చిన బహుమతిని నేను అప్పుడే అనుకరించేశాను. నా పెళ్ళయిన మూడు రోజులకి మా కజిన్ పెళ్ళి అయ్యింది. వాడికి లెక్కపెట్టలేనంత డబ్బు ఉంది. అందుకని మేమిద్దామనుకున్న రూ.50,000లని గోశాలకు వాడి పేరుమీద విరాళంగా ఇచ్చాం. వాడెంత సంతోషించాడో మాటల్లో చెప్పలేను. మీరు మాకు ఓ కొత్త మార్గాన్ని చూపారు. మేమెందరమో ఈ కొత్త దారిలో ప్రయాణించే అవకాశం కల్పించారు. ఇలా మీరు మీ చర్యలతో మాకు ఎప్పుడూ బోధిస్తూనే ఉన్నారు- ఉద్యోగంలో ఉన్నప్పుడూ రిటైర్‌ అయ్యాకా కూడా. అదే మీ గొప్పతనం. పాదాభివందనాలతో, మీ విద్యార్ది,

పోలిస్వర్గం

కార్తికమాసం చివరికి రాగానే గుర్తుకువచ్చే కథ ‘పోలిస్వర్గం’. ఇంతకీ ఎవరీ పోలి?  ఆమె వెనుక ఉన్న కథ ఏమిటి? దానిని తల్చుకుంటూ సాగే ఆచారం ఏమిటి? అంటే ఆసక్తికరమైన జవాబులే వినిపిస్తాయి. పోలిస్వర్గం అచ్చంగా తెలుగువారి కథ. కార్తికమాసంలోని దీపం ప్రాధాన్యతనే కాదు, ఆ ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించాల్సిన అవసరాన్నీ సూచించే గాధ. ఎన్ని ఆటంకాలు కల్పించినా నిర్మలమైన భక్తితో శ్రీమహావిష్ణు వును ప్రార్థించి పోలి వైకుంఠానికి చేరుకున్న రోజు పోలిస్వర్గం. కార్తిక మాసం నెలరోజులు కార్తిక స్నానాలు చేసి తెల్లవారుజామునే దీపం పెట్టి, హరిహరుల ఆరాధన, పంచాక్షరి మననంతో పునీతులయ్యారు మహి ళలు. ఈ మాసం ముగింపును పురస్కరించుకొని మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు తెల్లవారుజామునే పోలిని స్వర్గానికి పంపుతారు. దీనిలో భాగంగా నదీ స్నానం చేసి ఆవునేతిలో ముంచిన వత్తులను అరటిదొప్పలలో పెట్టి వెలిగించి, ఆత్మ స్వరూపమైన ఆ దీపాలను నదీప్రవాహంలో వదులుతారు. అత్తగారు, ఐదుగురు కోడళ్ళు, అత్తగారి అహంకారం ఇలా సాగుతుంది పోలి వృత్తాంతం. దీనిలోని పరమార్థం చూస్తే అహంకారానికి నలుగురు కోడళ్ళు సహకరించి వారు కూడా అజ్ఞానంలో కూరుకుపోవడం. అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్లు ఉండేవారట. వారందరిలోకి చిన్నకోడలైన పోలికి చిన్నప్పటి నుంచే పూజలన్నా, వ్రతాలన్నా మహా ఆసక్తి. కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి కంటగింపుగా ఉండేది. తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి నమ్మకం. ఆచారాలని పాటించే హక్కు ఆమెకే ఉందన్నది ఆమె అహంభావం. అందుకే కార్తికమాసం రాగానే చిన్నకోడలిని కాదని మిగతా కోడళ్లను తీసుకుని నదికి బయల్దేరేది. అక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా నదీస్నానం చేసి దీపాలను వెలిగించుకుని వచ్చేది. ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావల్సిన సామాగ్రి ఏదీ ఇంట్లో లేకుండా జాగ్రత్తపడి మరీ బయల్దేరేవారు అత్తగారు. కార్తికమాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగనేలేదు. పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకుని దానితో వత్తిని చేసేది పోలి. దానికి కవ్వానికి ఉన్న వెన్నని రాసి దీపాన్ని వెలిగించేంది. ఆ దీపం కూడా ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు, దాని మీద బుట్టని బోర్లించేంది. ఇలా కార్తికమాసమంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి. చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది. కార్తికమాసం చివరిరోజు కాబట్టి ఆ రోజు కూడా నదీస్నానం చేసి ఘనంగా కార్తికదీపాలను వదిలేందుకు అత్తగారు బయల్దేరింది. వెళుతూ వెళుతూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటిపనులన్నీ అప్పగించి మరీ వెళ్లింది. కానీ పోలి ఎప్పటిలాగే ఇంటిపనులను చకచకా ముగించేసుకుని కార్తిక దీపాన్ని వెలిగించుకుంది. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎంత కష్టసాధ్యమయినా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలకు ముచ్చటవేసింది. వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు విమానం దిగి వచ్చింది. అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారూ, ఆమె కోడళ్లూ  ఆ విమానాన్ని చూసి, అది తమ కోసమే వచ్చిందనుకుని మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండేసరికి హతాశులయ్యారు. ఎలాగైనా ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్లాలనుకునే ఆత్రంలో పోలి కాళ్లని పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది. విమానంలోని దేవదూతలు, పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనసు ఉందని చెబుతూ వారిని కిందకి దించేశారు. ఈ నేపథ్యంలో తెలుగునాట స్త్రీలంతా పోలిని తల్చుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటిదొప్పలలో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. ఈ నగర జీవితంలో మనకు దగ్గరలో చెరువులు, నదులు అందుబాటులో ఉండే అవకాశం లేదు కాబట్టి. టబ్బులలో ఈ దీపాలను వదిలేలా ఆచారం రూపాంతరం చెందింది. ఇలా వదిలిన అరటిదీపాలను చూసుకుంటూ పోలిని తల్చుకుంటారు. కార్తికమాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా కూడా, ఈ రోజున 30 వత్తులను వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని చెబుతారు. వీలైతే ఈ రోజున బ్రహ్మణులకు దీపాన్ని కానీ, స్వయంపాకాన్ని కానీ దానం చేస్తుంటారు. తెలుగువారు ఇటు పోలిని, అటు దీపాన్నీ కూడా శ్రీమహాలక్ష్మి రూపంగా భావిస్తుంటారు. అందుకని చాలామంది ఈ పోలిదీపాలను అమావాస్య రోజున కాకుండా, మర్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటారు. పోలి దీపాలను వెలిగించుకోవడానికే సుముఖంగా ఉన్నారు. ఇదీ పోలిస్వర్గం వివరం! కార్తికమాసం దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది తరువాత మాట. ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు, మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోని ఆంతర్యంగా తోస్తుంది. భగవంతుని కొలుచుకోవడానికి కావల్సిందే శ్రద్ధే కానీ ఆడంబరం కాదని సూచిస్తుంది. అన్నింటికీ మించి ఆహంకారంతో సాగే పూజలు ఎందుకూ కొరగానివని హెచ్చరిస్తుంది. అత్తాకోడళ్ల మధ్య సఖ్యత ఉండాలన్న నీతినీ బోధిస్తోంది. అందకే ప్రతి కార్తికమాసంలోనూ, ప్రతి తెలుగు ఇంట్లోనూ  పోలిస్వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది. ఈ కథ ద్వారా భగవంతునికి కావలసింది నిర్మలమైన భక్తి శ్రద్ధలు మాత్రామేనని, వారి వారి శాక్తానుసారం భగవంతుణ్ణి ఆరాధిస్తే భగవంతుడు ప్రసన్నుడై ఎల్ల వేళలా సంరక్షిస్తాడని తెలిపే కథనే పోలి స్వర్గ దీపం అంటారు. కార్తీక మాసమంతా వ్రత దీక్షగా దీపాలు వెలిగించి మరియు కార్తీక స్నానాలు  ఆచరించిన వారు మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు తెల్లవారు ఝామున ఉద్యోపన చేసుకోవాలి. అరటి దొప్పలో దీపాలు వెలిగించి నదిలో వదిలిపెట్టాలి, తర్వాత కార్తీక మాసం లో సూర్యోదయానికి ముందే నదీ స్నానం , దీపారాధన చేసిన ఫలితాన్ని తెలియ చెప్పే పోలి  యొక్క కథను చెప్పుకొని  అక్షింతలు వేసుకొంటే మోక్షం కలుగుతుందని ప్రతీతి. అంతే కాకుండా, కార్తీక మాసం లో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా కూడా ఈ రోజున 30 వత్తులను వెలిగిస్తే మాసమంతా దీపారాధన చేసిన ఫలితం ప్రాప్తిస్తుందని చెప్తారు.

కార్తీక వనభోజనాలు సరదా కోసం కాదు

కార్తీకమాసం రాగానే సందడే సందడి.  ఒక వైపు ఆధ్యాత్మిక వాతావరణం, మరోవైపు వనభోజనాల పేరుతో సమారాధనలు. ఇంతకీ వనభోజనాలు కార్తీకమాసంలోనే ఎందుకు చేయాలి. అదికూడా ఉసిరి చెట్టుకిందే అని ఎందుకు ప్రత్యేకంగా చెబుతారు. ఉసిరి చెట్టును ధాత్రి చెట్టు అంటారు.  క్షమాగుణానికి ప్రతీక అయిన ఉసిరిచెట్టును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. లక్ష్మీదేవి ఎక్కడుందో శ్రీ మహావిష్ణువు కూడా అక్కడే ఉంటాడు. అందుకే ఉసిరి చెట్టు దగ్గర భోజనం చేస్తాం. కార్తీక పౌర్ణమినాడు నైమిశారణ్యంలో మునులందరూ సూతమహర్షి ఆధ్వర్యంలో వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నట్లు లిఖితమైంది. కార్తీక మాసంలో వన భోజనాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. కార్తీక మాసంలో వన భోజనాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆనందం , ఆరోగ్య సందేశాన్ని కార్తీక వనభోజనాలు మనకు చాటిచెబుతున్నాయి. దేశ సంస్కృతి , సంప్రదాయాలను , హైందవ ధర్మ మార్గాన్ని అనుసరించి అనాదిగా వస్తున్న ఎన్నో పర్వదినాలను మనం పాటిస్తూ వస్తున్నాం. ఇందులో భాగమే కార్తీక మాసంలో జరుపుకునే వన సమారాధన కార్యక్రమం. దీనినే కార్తీక వన భోజనాలుగా పేర్కొంటారు.  భారతీయ ఆయుర్వేదంలో వృక్ష జాతికి ఉన్న ప్రాముఖ్యత. భారతీయ ఆయుర్వేదంలో వృక్ష జాతికి ఉన్న ప్రాముఖ్యత అందరికీ తెలిసిన విషయమే. అందుకే మంచు కురిసే సమయంలో ఉసిరి చెట్టు కింద విష్ణువును పూజించి , వండిన ఆహారాన్ని ఆ చెట్టు కిందే ఆరగిస్తే కార్తీక మాసంలో గొప్ప పుణ్యఫలం దక్కుతుందని కార్తీక పురాణం చెబుతోంది. ప్రత్యేకించి ఆదివారాలు , ఇతర సెలవు దినాల్లో కార్తీక వన భోజనాలు సమీప ఉద్యాన వనాలలో , తోటల్లో , నదీ ప్రాంతాలు , సముద్ర తీర ప్రాంతాల్లో జరుపుకుంటారు. కేవలం భోజనాలకే పరిమితం కాకుండా ఆటలు , పాటలు కబుర్లకు ఇది చక్కటి వేదిక. పిల్లలు , పెద్దలలో ఉన్న సృజనాత్మకతను తట్టిలేపే క్రీడలు , నృత్యాలు , సంగీత కచేరీలు నిర్వహించడానికి మంచి అవకాశం. వనభోజనాల మధుర స్మృతులు జీవితాంతం గుర్తుండిపోతాయి. మానవ మనుగడకు వనాలు చేసే మేలు అంతా ఇంతా కాదు. భవిష్యత్ తరాలకు కూడా మేలు చేకూర్చే వృక్షజాతిని సంరక్షించాలనే నిగూఢ సందేశాన్ని వనసమారాధన అందిస్తోంది. ఎవరూ మరచిపోలేనంత గొప్ప వన భోజనం చేసినవాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. బలరాముడు , ఇతర స్నేహితులతో - ఓరేయ్ , రేపు మనమందరం వనభోజనానికి వెళుతున్నాం రా ! అన్నాడు. వాళ్ళు రోజూ వెళ్ళేది ఆ వనానికే. ప్రతి రోజూ మధ్యాహ్నం ఆహారం తినేది కూడా అక్కడే. అలాంటి వాళ్లకు కొత్తగా వన భోజనం ఎందుకు? ఎందుకంటే వన భోజనం ఎలా ఉంటుందో రుచి చూపించాలనేది ఆయన ఉద్దేశం. అందరూ పొద్దున్నే లేచారు. గోపాల బాలురకి ఉండే లక్షణం ఏమిటంటే , వాళ్ళు ఉదయం స్నానం చేయరు. సాయంకాలం వచ్చి స్నానం చేస్తుంటారు. అందుకే వారు ఎప్పుడూ చద్ది అన్నమే తింటారు. ప్రతి రోజు మాదిరిగానే అన్నం మూటకట్టుకొని వన భోజనానికి వెళ్దాం పదండి అని బయలుదేరారు. అక్కడ కృష్ణుడు చూపించిన లీలలు ఒకటా రెండా..! అందుకే వనం అంటే బ్రహ్మం కాబట్టి.. బ్రహ్మాన్ని అరిగించడం.  అంటే కృష్ణభగవానుడి లీలల్ని ఆస్వాదించటమే వన భోజనం. ఆ వన భోజనంలో ఏ అర మరికలూ లేవు. గోపాలురు కృష్ణుడితో తాదామ్యత పొందారు. మనం కూడా వనంలోకి వెళ్ళీ ఆ ఉసిరి చెట్టు కింద , తులసి బృందావనంలో చక్కగా వంట చేసుకుని , పరమేశ్వరుడికి మహా నైవేద్యం పెట్టి , అందరూ ఒక్కటిగా నిలబడి అన్నం తిని , ఆ ప్రకృతి అన్రుగహాన్ని , పరమాత్మ అన్రుగహాన్ని పొంది ఇంటికి తిరిగి రావడానికి వన భోజనమని పేరు. వనభోజనం ఎందుకు నిర్దేశించారో అందుకే చేయాలి. చేయకూడని పనుల కోసం వన భోజనాలకు వెళ్లకూడదు. ముక్తికే కాదు సమైక్యతకు , చక్కని ఆరోగ్యానికిఇలా చేయడం వలన ఆయా వృక్షాల మీదుగా వచ్చే గాలులు , ముఖ్యంగా ఉసిరిక వృక్షం నుంచి వచ్చే గాలి శరీరారోగ్యానికి ఎంతో ఉపయుక్తమని ఆయుర్వేద వైద్య విధానంలో చెప్పడం జరిగింది. ఈ ఉసిరి చెట్టునే ధాత్రీ వృక్షం , ఆమలక వృక్షం అంటారు. అందుకే ఈ వనభోజనానికి ధాత్రి భోజనం అని పేరు కూడా ఉంది. ధాత్రీ వృక్షాల నీడన అరటి ఆకుల్లో కానీ , పనస ఆకుల్లో కానీ పలు వృక్ష జాతులున్న వనంలో ప్రధానంగా ఉసిరి చెట్టు కింద భక్తితో భుజిస్తే ఆశ్వమేధ యాగ ఫలం సిద్ధిస్తుందని వేద , పురాణాల వచనం.  ఇక వనభోజనాలు ఉసిరి చెట్టుకిందే ఎందుకు చేయాలన్న ప్రశ్నకు సమాధానం కావాలంటే ఈ విషయాలు తెలుసుకోవాలి. సమయం దాటాక తినడం, అతిథికి, బ్రహ్మచారికి పెట్టాకుండా తినడం, బయటనుంచి తీసుకొచ్చి తినడం, నైవేద్యం  పెట్టకుండానే తినడం..ఇలా భోజనాన్ని 9 రకాలుగా విభజిస్తారు. రెగ్యులర్ గా తీసుకనే భోజనాల్లో రెండే రెండు ఆమోదయోగ్యం.. వాటిలో ఒకటి ఇంట్లో వండుకుని తినేది, మరొకటి ఆలయాల్లో సంతర్పణ సమయంలో తినేది. ఇవి కాకుండా నిత్యం తింటున్న ఆహారం మొత్తం అసాక్షి భోజనమే. పైగా  నడుస్తూ తినడం, మాట్లాడుతూ తినడం, మంచంపై కూర్చుని తినడంతో ఆ ఆహారంతో పాటూ శరీరంలోకి కలిపురుషుడు ప్రవేశిస్తాడు. అందుకే కార్తీకమాసంలో  శ్రీమహాలక్ష్మి, విష్ణుమూర్తి స్వరూపంగా భావించే  ఉసిరిచెట్టుకింద భోజనం చేయడం వల్ల  ఈ దోషం తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని చెబుతారు. అందుకే ఇలాంటప్పుడు సహపంక్తి భోజనాలు చేస్తారు. పరబ్రహ్మ స్వరూపం అయిన అన్నం ముందు అందరూ సమానమే అని చెప్పడమే వనభోజనాల ముఖ్య ఉద్దేశం. 

ప్రేమ పుస్తకం అమ్మ

అమ్మ కనిపించే దేవతే కాదు. కని, పెంచే దేవత కూడా. అమ్మంటే అంతులేని అనురాగం. మాసిపోని మమకారం. 'గర్భాన్ని ధరించింది మొదలు, తన బిడ్డలు సంపూర్ణ విద్యలతో శోభిల్లేవరకు వారికి సౌశీల్యాన్ని, సంస్కారాన్ని, సుగుణాల్ని బోధించే తల్లి ఎంతో ధన్యురాలు. సృష్టికారకత్వానికి ఆమె చేవ్రాలు!' అని వేదం అమ్మ ఔన్నత్యాన్ని కీర్తించింది. సకల జగత్తూ పురోగమించడానికి, జ్ఞానయుతంగా వర్ధిల్లడానికి మూలకారక శక్తి మాతృమూర్తి.  అందుకే అమ్మను మించిన ధర్మం లేదని ఆదిశంకరులు స్పష్టం చేశారు. 'జనని' అనే మాటే మంత్రపునీతం. జ్ఞానరాత్రి, దివ్య జనయిత్రి, మధుర హృదయనేత్రిగా అమ్మ స్థానం నిరుపమానం. మాతృమూర్తులు సంతాన నిర్మాతలు. బిడ్డల భాగ్య నిర్ణేతలు, వారి తలరాతల్ని నిర్దేశించే విధాతలు. అన్నిచోట్లా తానే ఉండలేక, దైవం తన బదులు అమ్మలను సృష్టించాడన్నది లోకోక్తి!  అయితే పరమాత్మకన్నా మిన్న అమ్మ.  జీవకోటికి మాతృస్థానమే అసలైన ఆలంబన మోక్ష సాధనా మార్గంలో ఎన్నో సోపానాలున్నాయి. స్వర్గారోహణం చేయాలంటే ఇహంలో ఎంతో పుణ్యకర్మ ఆచరించాలి. ఆ మోక్షం, ఆ స్వర్గం రెండూ అమ్మ పాదాల చెంతనే ఉంటాయి. అమ్మ పాదాల్ని భక్తిశ్రద్ధలతో సేవిస్తూ, బిడ్డలుగా ఆమె మనసు గెలుచుకుంటే చాలు. మనసు స్వర్గమే ఇలపైన వాలు/ నేపథ్యంలోనే "మాతృదేవోభవ" అని వేదం అమ్మకే.. అగ్రతాంబూలం ఇచ్చింది. అమ్మఒడి బిడ్డలకు ప్రథమ బడి. ఎవరి జీవితాన్నికైనా అమ్మ మార్గదర్శి అమ్మే దారిదీపం, దిక్సూచి తన బిడ్డల మూర్తిమత్వ నిర్మాణంలో అమ్మ కీలక భూమిక పోషిస్తుంది. వారిని ముందు సమాజం బాధ్యతాయుతమైన పౌరులుగా నిలబెట్టడానికి అమ్మ విద్యుక్తంగా కొన్ని ధర్మాలు నిర్వహిస్తుందని ఉపనిషత్తులు, ప్రతిపాదించాయి. అవి ధ్వస్తి, ప్రాప్తి, శక్తి, ప్రశస్తి స్వస్తి ఈ పంచధర్మాల ప్రాతిపదికన అమ్మ తన బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది. బిడ్డల మనోకాలుష్యాల్ని దూరం చేయడం, వారిని ధర్మమార్గం వైపు పయనింపజేయడం, సర్వసమర్థులుగా వారిని తయారుచేయడం, అందరి అభిమానాన్ని పొందేలా గుణసంపన్నులుగా వారిని తీర్చిదిద్దడం, ప్రతికూల భావాలు, దురలవాట్ల నుంచి. వారిని దూరం చేసి సంపూర్ణ వ్యక్తులుగా ఆవిష్కరించడం.. ఈ అయిదు ప్రక్రియల్ని మాతృమూర్తులు నిర్వహించడం ద్వారా సమాజంలో సర్వదా సౌమనస్య భావాలుపరివ్యాప్తమవుతాయని ఆర్ష ధర్మం ఆకాంక్షించింది. మాతృమూర్తి 'గర్భాలయం'లో అణువుగా, అంకురంగా, చిరుదివ్వెగా ఉపిరి పోసుకుని, నవమాసాలు ఉమ్మనీరు పుష్కరిణిలో పవిత్ర స్నానం చేసి శిశువుగా లోకంలోకి బిడ్డ ఆడుగిడుతుంది. అందుకే జననిని లోకపావనిగా పద్మపురాణం కీర్తించింది. అమ్మంటే జీవశక్తిని అందించే ప్రాణవాయువు. జరామరణాలకు అతీతమైన ప్రేమ ఆయువు సతత హరితార్థవంగా శోబిల్లే మాతృనందన వనంలో, తన బిడ్డలందరూ సదా ఆనందాతిరేకాలతో వర్ధిల్లాలని ప్రతి తల్లీ కోరుకుంటుంది. కౌసల్యా మాత అందించిన శుభ దీవెనలే ధర్మమార్గం వైపు నడిపిస్తున్నాయని శ్రీరాముడు పలికాదు. దేవకి తేజస్సు యశోదమ్మ యశస్సు తన శక్తియుక్తులకు కారణమని శ్రీకృష్ణుడు పేర్కొన్నాడు. అనసూయమ్మ అనుగ్రహమే తన అవతార పరమార్ధమని దత్తాత్రేయుడు ప్రవచించాడు. ఈ అన్నింటికీ అమ్మ ఆశీర్వాదమే మూలం! యుగపురుషులకే కాదు, బిడ్డలందరికీ అమ్మ అందించే అనంతమైన ఆలంబన ఆత్మవిశ్వాసం, జీవన గమనంలో పురోగమించడానికి ఉపయుక్తమవుతాయి. బిడ్డల మస్తకాల్ని అమేయమైన చైతన్యంతో నింపే ప్రేమ పుస్తకం-అమ్మ.

కార్తీక పౌర్ణమిరోజు ఏం చేయాలి?

ప్రతివాళ్ళూ ఇళ్లలో కార్తీక పౌర్ణమి దీపం పెట్టుకుంటారు. అందుకే ఆ రోజు వెలిగించే దీపాలు గుత్తిదీపాలు కూడా పెడతారు. దానికి రెండు కారణాలు. ఒక ఇల్లు మనం కడితే ఆ ఇంట దీపం లేకుండా ఏ ఒక్కరోజు ఉండకూడదు. శాస్త్రంలో ఏమిటంటే యధార్దంగా మీరు ఇల్లు కట్టి ఎక్కడికైనా తాళం వేసి వెళ్ళిపోతున్నారనుకోండి. ఇంటి బ్రహ్మగారు వుంటారు. ఆయన్ని పిలిచి అయ్యా! మేము కాశీ పట్టణానికి వెళుతున్నాం. రావటానికి ఒక ఇరవై రోజులు పడుతుంది. ఈ ఇరవై రోజులు మీరు కాస్త మా పూజామందిరంలో దీపం వెలిగించి స్వామికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి అని చెప్పి వెళ్ళాలి ఇంటి తాళమిచ్చి. ఆయన రోజూ దీపం పెట్టి వెళ్ళేవారు. ఇంట దీపం వెలగలేదు అంటే పరమ అమంగళకరమైన గృహం అని గుర్తు. అలా నీ ఇండ్లన్నవి ఎన్ని ఉన్నాయో అన్నిచోట్లా దీపం వెలగాలి. స్వగృహే అని నీవు ఎక్కడ కూర్చుని సంకల్పం చెప్పగలవో అక్కడన్నిచోట్లా దీపాలు వెలుగుతూ వుండాలి 365 రోజులు! అలా దీపం వెలగకపోతే ఆ దోషం మీకే వస్తుంది. మళ్ళీ ఆ ఇంట్లో తిరిగినందుకు ఆ పాపం పోగొట్టుకోవటానికి ప్రాయశ్చిత్తంగా ఇవ్వబడిన అద్భుతమైన తిధి కార్తీక పౌర్ణమి. అందుకే కార్తీక పౌర్ణమి నాడు 365 వత్తులు గుత్తిదీపం అని ఆవునేతిలో ముంచి వెలిగిస్తూంటారు. పదిరోజులొ, పదిహేనురోజులో, ఇది తెలియకముందెప్పుడు తప్పు చేసిన రోజులెన్నెన్ని వున్నాయో ఒక ఏడాదంతా నేను దీపం పెట్టకపోతే ఎంత పాపం వస్తుందో, అదంతా పోవాలని 365 వత్తులు వెలిగించి వచ్చేస్తారు. దీపాలు వెలిగించుకోవాలి. ఇంటి యజమాని వెలిగించాలి .మా ఆవిడ వెలిగిస్తుంది .నేను టీవి చుస్తాను అని అనకూడదు. యజమాని పంచె కట్టుకుని వెళ్లి దేవాలయంలో దీపం పెట్టాలి. యజమాని ఇంట్లో దీపం పెడితే సమస్త భూతములకు ఉపకారం చెప్పాలి. ధర్మపత్నీ సమేతస్య అని సంకల్పం వుందిగాని ఆవిడ వెలిగించి ధర్మపతీ సమేతస్య అని సంకల్పం లేదు. నువ్వు పెట్టాలి దీపం. పురుషుడు యజమాని ఇంటికి. కాబట్టి యజమానీ ఆ రోజున ఇది చెయ్యకపోతే అతనికి పరమేశ్వరుడు ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని జారవిడుచుకున్నవాడవుతాడు. కాబట్టి ఎంతంత దీపాలు పెడతారో అంతంత అనుగ్రహం. దేవాలయ ప్రాంగణంలో కృత్తికా నక్షత్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి. ఇంట్లో అయితే తిధిని ప్రమాణం తీసుకోవాలి. ఇంట కార్తీక దీపం పెడితే కార్తీక పౌర్ణమి తిధి ప్రధానం. దేవాలయంలో పెడితే కృత్తికా నక్షత్రం ప్రధానం. అందుకే ఇప్పటికీ అరుణాచలంలో కృత్తికా నక్షత్రం నాడు జ్యోతిని వెలిగిస్తారు. అరుణాచలంలో ఆ కృత్తికా దీపోత్సవం చూడటానికి కొన్ని లక్షల మంది వస్తారు. ఆ రోజున అసలు గిరిప్రదక్షిణ చేయటానికి అవకాశమే వుండదుఇక. మొత్తం జనంతో నిండిపోతుంటారుంకొండ చుట్టూ. వెలుగుతున్న దీపాన్ని ఒక్కదాన్నే చూస్తారు. చూసి నమస్కారం చేస్తారు భగవాన్ రమణులంతటివారు కూడా అసుర సంధ్యవేళ అయ్యేటప్పటికి వచ్చేసి ఆ సోఫాలోంపడుకుని అరుణాచలం కొండమీద వెలిగే దీపం కోసం ఎదురుచూస్తుండేవాడు ఆయనే పెద్ద జ్యోతిస్వరూపుడు.అయినా సరే జ్యోతిని చూసి నమస్కరిస్తూండేవారు. భారతదేశం మొత్తం మీద కృత్తికా దీపోత్సవం అంటే అంత ప్రసిద్ధి. అరుణాచలం కొండయే అగ్నిలింగం కాబట్టి , ఆ కొండమీద వెలిగించే దీపానికి అంత ప్రఖ్యాతి. అందుకే కార్తీకపౌర్ణమి నాడు వెలిగించే దీపం కేవలం మనకొరకే కాకుండా, మనం చేసే దుష్క్ర్తులను పొగొట్టి మన పాపములను పోగొట్టి అంతర తిమిరాన్ని పోగొట్టి బాహ్యములోని తిమిరాన్ని పోగొట్టి, లోకోపకారం చేసి, సమస్త జీవులనుద్ధరించటానికి పెట్టిన దీపం. కాబట్టి ఆశ్వయుజమాసం చివర వచ్చిన తిధినాడు వెలిగించిన దీపం మొదలుపెట్టి కార్తీకపౌర్ణమి నాటి దీపానికి అంత గొప్పతనమిచ్చారు.

కార్తీక వనభోజనాల విశిష్ఠత

 వనము  అంటే అనేక వృక్షముల సముదాయము. ముఖ్యంగా రావి, మఱ్ఱి, మారేడు, మద్ది, మోదుగ, జమ్మి, ఉసిరి, నేరేడు, మామిడి, వేప, పనస, ఇత్యాది వృక్షాలతో.., తులసి, అరటి, జామ, కొబ్బరి, నిమ్మ, మొక్కలతో., రకరకాల పూల మొక్కలతో కూడివుండాలి. దాహము వేస్తే దప్పిక తీర్చడానికి ఓ సెలయేరు ఉండాలి. ఇవి ఉన్నచోట  జింకలు, కుందేళ్ళు, నెమళ్ళు, చిలుకలు మొదలైన సాదు ప్రాణులు తప్పకుండా ఉంటాయి. దానినే ‘వనము’ అంటారుగానీ..., అడవిని ‘వనము’ అనరు. ‘వనము’ అంటే, వసించడానికి అనువైన ప్రదేశము అన్నమాట. వేటకు, క్రూరత్వానికి తావులేనిది ‘వనము’. అట్టి వనము దేవతా స్వరూపము. ఎందుకంటే.. పైన చెప్పిన వృక్షాలు, మొక్కలు.., దేవతలకూ, మహర్షులకూ ప్రతిరూపాలు. ప్రశాంతతకు, పవిత్రతకు ఆలవాలమైన తపోభూమి. నిర్భయంగా విహరించడానికి అనువైన ప్రదేశము. అట్టి వనాలను యేడాదికి ఒక్కసారైనా., ప్రత్యేకించి కార్తీకమాసంలో దర్శించండి అని మన పూర్వులు నియమం పెట్టారు. అందుకు ఆధ్యాత్మిక, ఆరోగ్య, ఆనందకరమైన కారణాలు ఎన్నో ఉన్నాయి. అవి ఏమిటంటే.... - కార్తీకమాసం నాటికి... వానలు ముగిసి, వెన్నెల రాత్రులు ప్రారంభమౌతాయి.  చలి అంతగా ముదరని సమశీతోష్ణ వాతావరణంతో మనసుకు ఆనందాన్ని., ఆహ్లాదాన్ని కలిగించే మాసం.... ఈ కార్తీకమాసం.  - ఆధ్యాత్మికపరంగా.,శివ,కేశవులకు ప్రీతికరమైనది ఈ కార్తీకమాసం. అందుచేత శివ, కేశవ భక్తులు ఒకచోట చేరి,  ఐకమత్యంతో ఆనందంగా గడపడానికి అవకాశం కల్పించే మాసం.... ఈ కార్తీకమాసం. - పైన చెప్పిన వృక్షాలు, మొక్కలు, చెట్లు పచ్చగాచిగిర్చి,పరిశుద్ధమైన, ఆరోగ్యకరమైన ప్రాణవాయువును ప్రకృతిలో విహరింపజేసే మాసం.. ఈ కార్తీకమాసం.   పుణ్యప్రదమైన ఈ కార్తీకమాసంలో ‘వనవిహారం చేసిరండి’ అంటే ఎవరూ వెళ్ళరు. ఎందుకంటే.. ఆకలేస్తే.. అక్కడ  వండి, వార్చి పెట్టేవారెవరు? అందుకే ‘వనభోజనాలు’ ఏర్పాటు చేసారు మన పెద్దలు. ‘దేవుడి మీద భక్తా?  ప్రసాదం మీద భక్తా?’ అంటే.. పైకి అనక పోయినా...‘ప్రసాదం మీదే భక్తి’ అనే రకం మనవాళ్ళు. కనీసం భోజనంమీద భక్తితోనైనా వనవిహారానికి వచ్చేవారున్నారు. స్వార్ధంలో పరమార్ధం అంటే ఇదే.   ఇక వనభోజనం అంటే... కేవలం తిని, తిరగడమే కాదు. దానికో పద్ధతి, నియమం ఉంది. కాలకృత్యాలు, స్నానాలు పూర్తి చేసుకున్న తర్వాత..అందరు బంధు, మిత్రులు, పరిచయస్తులు, ఇరుగు, పొరుగు కలిసి, జాతి, మత, కుల వివక్షత లేకుండా.., వీలయితే ఒకే వాహనంలోగానీ., లేదా రెండు వాహనాలలోగానీ వారు ఎంచుకున్న వనానికి సూర్యోదయానికి పూర్వమే చేరుకోవాలి. ముందుగా ఓ వటవృక్షం క్రింద ఇష్టదేవతా విగ్రహాలను ఉంచి పూలదండలతో చక్కగా అలంకరించాలి. ఆనందం పంచుకోవాలంటే వంటవాళ్ళను తీసుకెళ్ళ కూడదు. మగవారు పాటలు పాడుతూ కూరలు తరుతూంటే.. ఆడవారు చీరకొంగులు నడుముచుట్టి., అందరూ తలోరకం వంట వండుతూంటే...ఉన్న ఆనందమే వేరు. పిల్లలంతా కలిసి చేసే అల్లరిలోని మజాయే వేరు. చాటుమాటు కన్నెచూపుల, కుర్రచూపుల కలయికలోని ఖుషీయే వేరు. కొత్తజంటల గుసగుసల తమాషాల వాడే వేరు. అనుభవంతో తలపండిన పెద్దల ఛలోక్తుల చురకల వేడే వేరు. ఇన్నిరకాల ఆనందాల మధ్య., ఆచారాలకూ, నియమాలకూ అంత ప్రాధన్యత లేదు. అన్ని రకాల సాంప్రదాయాలకూ., సంస్కృతులకూ సమాన వేదిక ఇధి. సామూహికంగా కలసి చేసిన శాకాహార వంట పూర్తి అయిన తర్వాత., ఆ వండిన పదార్థాలను పూజాస్ధలానికి చేర్చి..,అందరూ కలిసి దేవతారాధన చేసి., నివేదన సమర్పించి, ఆ ప్రసాదాన్ని అందరూ కొసరి కొసరి వడ్డించుకుంటూ తింటూంటే., ‘అబ్బ...సామూహిక సహజీవనంలో ఇంత రుచి ఉందా!’ అని అనిపించక మానదు. అమ్మయ్య.. సమిష్టి భోజనాలయ్యాయి. మరి తిన్నది అరగాలి కదా! ఇక ఆటపాటలదే ప్రముఖస్థానం. అంతరించిపోతున్న ప్రాచీన సాంప్రదాయ ఆటలకు సమాన వేదిక ఈ ‘వనభోజనాలు’. ఈ ఆట పాటల్లోనే కొత్త స్నేహాలు, కొత్త పరిచయాలు కలుగుతాయి. కొత్త సంబంధాలు ఏర్పడతాయి. కార్తీకంలో కలిసిన ఈ కొత్తసంబంధం..బంధుత్వంగా మారడానికి., మాఘ, ఫాల్గుణాల ముహూర్తాలు మనకోసం మనముందే ఉన్నాయి.

కృతజ్ఞత

కృతజ్ణత అంటే ఒకరు మనకు చేసిన మేలును మరచి పోకుండా ఉండటం. మనం ఒక ప్రమాదకరమైన స్థితిలో ఉన్నప్పుడో, మనకు ఏదో ఒక సహాయం అవసరమైనపుడో, మనం అడిగితే సహాయపడేవారు కొందరుంటారు. మనం అడగకపోయినా మనకు అవసరమైన ఉపకారం చేసే వారు కొందరుంటారు. వీరికెప్పుడూ మనం కృతజ్ఞులమై ఉండాలి. కృతజ్ఞత అనేది మానవ సంస్కారం. కృతజ్ఞత అనేది రుచికరమైన ఆహారం లాంటిది. దాన్ని ఇతరులతో పంచుకుంటే మరింత ఆనందిస్తాం. మనం చేసినదానికి ఇతరులు కృతజ్ఞత కలిగివున్నారని తెలుసుకున్నప్పుడు మనం సంతోషిస్తాం. అలాగే మనం ఇతరులకు కృతజ్ఞతలు చెప్పినప్పుడు వాళ్లు సంతోషిస్తారు. మనకు సహాయం చేయడానికి లేదా మన అవసరాన్ని తీర్చడానికి వాళ్లు చేసిన కృషి వల్ల మనకు నిజంగా మేలు జరిగిందని వాళ్లు గ్రహించగలుగుతారు. దానివల్ల మనకూ వాళ్లకూ మధ్యున్న స్నేహం ఇంకా బలపడుతుంది. ఒకరు తమకు చేసిన ఉపకారాన్ని గ్రహించటం పుణ్యం, దానికి సమానమైన ప్రత్యుపకారాన్ని చేయటం మధ్యమం, ఉపకారానికి మించిన ప్రత్యుపకారం చేయటం ఉత్తమం. ఏరు దాటాక తెప్ప తగలేసే చందంగా కాకుండా, మన ఉనికికి, ఉన్నతికి కారకులైనవారి పట్ల మనం కృతజ్ఞులమై ఉండాలి. ఒకనాడు మనకు మేలుచేసిన మనిషి, విధివశాత్తూ కష్టంలో పడినట్టు మనకు తెలిస్తే –అతని పట్ల సకాలంలో, అవసరానికి తగినట్టుగా స్పందించకపోతే అది కృతజ్ఞత ఎలా ఔతుంది. మేలు చేసిన సమస్త జీవుల పట్ల కృతజ్ఞత, మేలు చేయడంలో ఆసక్తి కలిగి ఉండాలి. అంటే మనుషులకే కాదు పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు, చెట్లు, చేమలు, పాములు, తేళ్ళు.. ఇలా అన్నింటికి మేలు కలగాలనే భావన ఉండాలి. శత్రువైనా, మిత్రుడైనా ఎవరైనా సరే అందరి మేలును కాంక్షించి కృతజ్ఞత, దయ కలిగి ఉండాలి. ప్రాణులన్నింటికి దుఃఖాలు బాధలు సహజం. కనుక వాటి దుఃఖాన్ని తొలగించటానికి, సుఖాన్ని కలిగించటానికి, అవసర సమయాలలో మేలుచేయటానికి ప్రయత్నించాలి.   అయితే ఇలా సమస్త జీవుల పట్ల దయ కలగాలన్నా కష్టమే. మనకు మేలు చేసిన వారిపై అనురాగం కృతజ్ఞత ఉంటాయి. కనుక తిరిగి వారికి మేలు చేయాలనిపిస్తుంది. కాని మనకు కీడు చేసిన వారైతేనో వారికి కూడా మేలు చేయాలనుకుంటామా.. అనుకోలేము.  కాని వారియందు కూడా కృతజ్ఞతాభావం, మేలుచేయాలనే గుణం కలిగి ఉండాలన్నది శాస్త్ర ప్రమాణమని పెద్దలు చెబుతున్నారు. ఇది వినటానికి బాగానే ఉంది. కాని ఆచరణకు వచ్చేటప్పటికి ఈ నీతి సూత్రాలన్నీ గుర్తుకు రావు. అయితే ఎవరికి సమబుద్ధి ఉంటుందో, అందరిని ఒకేవిధంగా, ఆత్మస్వరూపులుగా, ఒక్కటిగా చూడగలుగుతారో వారే అపకారులకు కూడా ఉపకారంచేస్తూ కృతజ్ఞత చూపగలుగుతారు. మేలు చేయాలనే ఆసక్తి కలిగి ఉంటారు. ఇలా జీవులకు చేసే హితం, సేవ పరమాత్మకు చేసినట్లే. ఎందుకంటే సమస్త జీవులయందు పరమాత్మే ఉన్నాడు గనుక.  కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువను పెంచుతుంది. డబ్బుకు మనమిచ్చే విలువ ఆపదలో ఆదుకుంటుంది. సాటి మనిషికి మనం ఇచ్చే విలువ, చూపే కృతజ్ఞత వారి మనసులో మనకొక సుస్థిర స్థానం ఇస్తుంది. అందువలన మనం అత్యాశను వదిలిపెట్టి సంతృప్తిని, కృతజ్ఞతను అలవరచుకోవటానికి ప్రయత్నించాలి. సంతృప్తితో జీవించేవారిని గౌరవించడం నేర్చుకోవాలి. ఆనందమయమైన జీవితాన్ని గడపాలని ప్రతి ఒక్కరు కోరుకోవటం సహజం. దానికోసం ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తూనే ఉంటారు. అయితే అతను తన ఆశకు పరిమితులని ఏర్పరచుకోవాలి. అన్నీ ఉన్నా ఇంకా కావాలి, ఇంకా కావాలనుకోవడం వలన అతనికి అనందం లభించదు. సంతృప్తి ప్రతి వ్యక్తికీ తప్పనిసరిగా ఉండాలి. అది లేకపోతే ఎంత ఉన్నా మనిషికి ఆనందం ఉండదు.కోరికలను పెరగనిస్తూ పోతే ప్రపంచంలోని వస్తువులన్నీ కూడా ఒక వ్యక్తికి చాలవు. అందువలన అత్యాశకు అవకాశం ఇవ్వకూడదు. తనకు దక్కిన దానితో సంతోషపడటం ప్రతివ్యక్తి నేర్చుకోవాలి. అత్యాశ లేని వ్యక్తి చాలా సంతోషంగా ఉంటాడు. అరణ్యాలలో నివసించిన ఋషులు చాలా సంతోషంగా జీవించారు. అక్కడ భౌతిక సంపదలు లేవు. అయితే వారికీ సంతృప్తి అనే సంపద ఉన్నది. అది వారికి ఆనందాన్ని ఇచ్చింది. మనిషి ఆధ్యాత్మికంగా ఎదగాలంటే సంతృప్తి అవసరం. మన కోరికలను తగ్గించుకోవటం మీద మన సంతృప్తి ఆధారపడి ఉంటుంది. పనిలో విజయం లభించినప్పడు ‘అంతా నా నిర్వాకమే’ అని పొంగిపోవద్దు. ‘దేవుడి దయ’ అని కృతజ్ఞతతో ఉండాలి. పని సఫలం కాకపోతే, అది పనితీరు అనుకోక.. కార్యాల జయాపజయాలు మానవ ప్రయత్నంతో కాకుండా దైవానుగ్రహంతో లభిస్తాయని గ్రహించాలి. గెలుపోటములు విధివిలాసం. అంతేకానీ, సంక్పల్ప శక్తో, అది లేకపోవడమో కాదు! అన్ని వేళలా సమతాబుద్ధిని సాధించడమే నిజమైన సంకల్పసిద్ధి. సాధకుడు తోటివారి ఆదరణకు పాత్రుడు అవుతూ ప్రపంచంలో ఉండాలి. ఇతరుల అసూయాద్వేషాలకు కాదు!

ఆధ్యాత్మిక సౌరభం.. కార్తిక మాసం

కార్తీక మాసం వస్తే ఆధ్యాత్మిక సౌరభాలు.. దీపాల సందళ్ళు.. ఆలయ సందర్శనలు.. శివనామ స్మరణలు.. ప్రతి రోజు ప్రత్యేకమే. ప్రతి తిథీ విశిష్టమే! ఆధ్యాత్మికంగా పరమ పవిత్రంగా భావించే కార్తీక మాసం రేపటి నుంచి ప్రారంభం. తెలుగు మాసాలు..తిథుల లెక్కల ప్రకారం కార్తీక మాసంలో వచ్చే ప్రతి రోజూ ప్రత్యేకమైనదే. ఆధ్యాత్మికంగా విశిష్టతలు సంతరించుకున్నదే. శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా చెప్పుకునే కార్తీకం విష్ణుమూర్తికీ ఇష్టమైన మసమే అని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు. ఈ మాసం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతుంది. ఆధ్యాత్మికతను ఇష్టపడని వారికి ఈ మాసంలో భక్త జనకోటి చేసే పూజలు.. అందుకోసం పాటించే విధానాలలో శాస్త్రీయత కనిపిస్తుంది. అవును.. కార్తీక మాసంలో దేవుని మీద నమ్మకంతో చేసే ప్రతి కార్యక్రమం సకల మానవాళికి ఆచరించదగ్గ కార్యక్రమం. దేవుని నమ్మినా.. నమ్మకపోయినా ఈ మాసంలో ఆధ్యాత్మికంగా పాటించే విధి విధానాలలో ఎంతో ప్రయోజనం ఉంటుంది. సనాతన ధర్మంలో ఆయనములు రెండు ఉన్నాయి. అవి ఉత్తరాయణం.. దక్షిణాయణం. ఉత్తరాయణంలో మాఘ మాసానికి ఎంతటి ప్రాధాన్యం ఉందో.. దక్షిణాయణంలో కార్తీక మాసానికి అంతటి విశిష్టత ఉంది. ముఖ్యంగా హిందువుల కు (Hindus) ఇది చాలా పవిత్రమైన నెల. ఈ పుణ్య మాసం హరిహరులు ఇద్దరికీ అత్యంత ప్రీతికరమైనది. ఈ మాసంలో చేసే శివారాధనకు విశేష పుణ్యఫలం లభిస్తుందని కార్తీక పురాణం (Karitika Puranam) చెబుతోంది. కార్తీక మాసంలో స్నానం, దానం, దీపారాధన, జపం, అభిషేకం చేయాలి. ప్రత్యేకించి సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు, ఆ తర్వాత చేసే దానాలు, ఉపవాసాలకు గొప్ప శక్తి ఉందని స్కంద పురాణ అంతర్గతంగా ఉన్న కార్తీక పురాణం వివరిస్తోంది. దీపారాధన చేస్తే పాపాలు తొలగి పుణ్యఫలం లభిస్తుంది. ఈ మాసంలో నక్తం లేదా ఉపవాసం (Fasting) ఆచరించగలిగితే ఆరోగ్యం, దైవచింతన పరంగా శుభాలు కలుగుతాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. పురాణ కాలంనుంచీ ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. ఉపవాసం, స్నానం, దానం మామూలుగా చేసేటప్పటికంటే కార్తీకమాసంలో ఎన్నో రెట్లు ఫలాన్ని ఇస్తాయి. వైకుంఠ వాసుడు పరమశివునికి ఈ మాసం ప్రీతిపాత్రం. ఎన్నో వేల సంవత్సరాలుగా హిందువులు శుభప్రదమైన మాసంగా భావిస్తూ కార్తీక మాసంలో ప్రత్యేక ఉపవాస దీక్షలు చేస్తూ మోక్షం కోసం ఆ పరమేశ్వరుడిని కొలుస్తుంటారు. అయితే హిందువులు సంప్రదాయంగా పాటిస్తూ వస్తున్నా ఇటువంటి విధానాల్లో కొంత ఆరోగ్యం, కొంత శాస్త్రీయత ఉంది. రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి లక్షకుంకుమార్చనలు విశేషంగా జరుపుతూ ఉంటారు. అలా విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై సంతోషం కలిగిస్తాడు. కాబట్టి ఆ స్వామికి ‘ఆశుతోషుడు’ అని పేరు.  విష్ణువును తులసి దళాలు, మల్లె, కమలం, జాజి, అవిసెపువ్వు, గరిక, దర్బలతోను శివుని బిల్వ దళాలతోనూ, జిల్లేడు పూలతోనూ అర్చించిన వారికి ఇహపర సౌఖ్యాలతోబాటు ఉత్తమగతులు కలుగుతాయి. శక్తిలేని వారు ఉదయం స్నానం చేసి, రాత్రికి మాత్రం భోజనం చేయకూడదు. పాలు పళ్ళు తీసుకోవచ్చు. ఆధ్యాత్మికపరంగా ఈ కార్తీక మాసం ఆరోగ్యప్రదమైన మాసం. ఈ మాసంలో ప్రతి ఒక్కరూ సోమవారం నాడు ఉపవాసం చేసి, రాత్రి పూట నక్షత్ర దర్శనం చేసి భోజనంతో ముగిస్తారు. తద్వారా ప్రజలకి అష్టఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని ‘ధర్మసింధువు’ గ్రంథం తెలుపుతున్నది. దీపారాధనలకు తప్ప నువ్వుల నూనె ఏ అవసరాలకు కూడా ఉపయోగించరాదు. ఈ కార్తీకమాస వారాలలో సోమవారానికి ప్రత్యేకత ఉన్నది. సోమవారానికి చంద్రుడు అధిపతి. దేవతలలో ప్రథముడైన అగ్ని నక్షత్రాలలో మొదటిదైన కృత్తికను అధిపతిగా ఉండటం, చంద్రుడు పూర్తుడై ఈ నక్షత్రం మీద ఉండటం వల్ల కార్తీకమాసంలోని సోమవారాలకు విశిష్టత కలిగింది. చంద్రుని వారమైన ఈ సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనది. ఈ సోమవార వ్రతవిధి ఆరు రకాలుగా ఉంటుంది. అవి ఉపవాసము, ఏకభుక్తము, నక్తము, అయాచితము, స్నానము, తిలదానము. శివకేశవులకు ప్రీతికరమైన మాసం కాబట్టి ఈ మాసంలో చేసే పూజలు వారిరువురి అనుగ్రహం కలిగిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక మాసంలో ముఖ్యంగా చెప్పుకోవలసినది దీపారాధన. ప్రతి రోజూ రెండు పూటలా దీపాన్ని వెలిగించి భక్తితో భగవంతుడిని ప్రార్థిస్తారు. దీపాన్ని ఎలా వెలిగించాలి అనే దానిలోనూ నియమాలు ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు దీపారాధన చేయకూడదు. దానికి పురాణాల్లో ఒక విధానాన్ని నిర్దేశించారు. తెల్లవారుజామునే స్నానాదులు ముగించి సూర్యోదయం కంటే ముందే తులసి కోట ముందు దీపారాధన చేయాలి. ఇలా ఉదయాన్నే ఉంచిన దీపం విష్ణువుకు చెందుతుందని చెబుతారు. అదేవిధంగా సాయంత్రం సంధ్యా సమయంలో దీపాన్ని వెలిగించాలి. ఈ దీపం తులసి మాతకు చెందుతుందని అంటారు. అసలు దీపారాధన చేసేది విష్ణువు కోసమే. ప్రతి నెలలోనూ విష్ణువుకు ఒక పేరు ఉంటుంది. కార్తీక మాసంలో దామోదరుడుగా పిలుస్తారు. విష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశినాడు యోగనిద్రలోకి వెళ్లి, కార్తిక శుద్ధ ఏకాదశినాడు నిద్రలేస్తాడని అంటారు. అందుకే కార్తీకమాసంలో వచ్చే ఏకాదశి ప్రత్యేకమైనడిగా చెబుతారు. ఇక దీపాల విషయానికి వస్తే కార్తీక మాసంలో చేసే దీపారాధన వలన గత జన్మలో చేసిన పాపాలూ తొలిగిపోతాయని అంటారు. కార్తీక పౌర్ణిమ రోజు 365 వత్తులతో దీపాన్ని వెలిగిస్తారు. ఇది సంవత్సరం మొత్తం విష్ణుమూర్తికి దీపారాధన చేసిన ఫలితాన్నిస్తుందని పండితులు చెబుతారు. దీపం పరబ్రహ్మ స్వరూపంగా చెబుతారు. చీకట్లు పారద్రోలే దీపం..భక్తుల కష్టాలనూ పారద్రోలుతుందని నమ్ముతారు. ఇక ఆలయాల్లో సాయం సంధ్యా సమయంలో ఆకాశాదీపాన్ని వెలిగిస్తారు. దీపాన్ని స్తంభం పై ఎత్తుగా ఉంచుతారు. ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత ఉన్న ఆకాశదీపం.. శాస్త్రీయంగానూ చాలా ఉపయోగకరం. కార్తీకమాసం వర్షాకాలం వెళ్లిపోయాకా వస్తుంది. వర్షాలతో ప్రకృతి అంతా నీటిలో నానిపోతుంది. అయితే, ఇదే సమయంలో వివిధ రకాల కీటకాలు వృద్ధి చెందుతాయి. వాటిని దీపాలు ఆకర్షిస్తాయి. ఆ దీప కాంతి వేడికి అవి అక్కడే ఆగిపోతాయి. అందుకే దీపాల్ని వెలిగించడం ఉపయోగకరం. ఆకాశదీపం కూడా అదే విధానం.. దైవం చెడునుంచి రక్షించేది అనేగా భావిస్తాం. దీపం కూడా ఆ పని చేస్తుంది. పూర్వం ఆలయాలు దాదాపుగా ఊరికి అటు చివర్ ఇటు చివర ఉండేవి. చిన్న చిన్న ఊళ్లు ఉండేవి. అక్కడి ఆలయాల్లో ఎత్తుగా వెలిగించి ఉంచే దీపం ఊరంతా కాంతిని పంచడమే కాకుండా కీటకాలను అక్కడే ఆకర్షించి ఊళ్లలోకి వెళ్ళకుండా చేస్తాయి.