చందమామ కథ అర్థరాత్రి

చందమామ కథ అర్థరాత్రి నారాయణపురంలోని భూస్వామి వెంకటాద్రి కొడుకు సింహాచలం తెలివైనవాడే గాని పరమ బద్ధకస్తుడు. కూర్చుని తింటే కొండలయినా కరిగిపోతాయి. చెమటోడ్చి కష్టపడకపోయినా దగ్గరుండి పనులు చేయించవచ్చుకదా అని తండ్రి ఎంత చెప్పినా సింహాచలం పొలంకేసి వెళ్ళేవాడు కాడు. బలవంతం మీద వెళ్ళినా పనులు చేసేవాళ్ళను అడ్డదిడ్డమైన ప్రశ్నలడిగి తికమక పెడుతూ పనులు చెడగొట్టేవాడు. ఊళ్ళో కనిపించినవారినల్లా అర్థం పర్థం లేని ప్రశ్నలడిగి విసిగించేవాడు. అందువల్ల సింహాచలాన్ని చూడగానే గ్రామ ప్రజలు పక్కకు తప్పుకోవడం మొదలుపెట్టారు. ఒకసారి దూరంలోని రాజవరంలో జాతర జరుగుతుంటే చూద్దామని పాలేరు మారన్నను వెంటబెట్టుకుని వెళ్ళాడు సింహాచలం. వినోదాల్లో పడి సమయం మరిచిపోవడంతో అక్కడే చీకటిపడింది. ఇద్దరూ తిరుగు ప్రయాణమై త్వరగా ఊరుచేరాలన్న తొందరలో దారి తప్పారు. వెనక్కు తిరగాలన్నా కటిక చీకటి. ఏం చేయాలో పాలుపోక చూస్తూంటే, దూరంగా మిణుకు మిణుకుమంటూ వెలుతురు కనిపించింది. అతి ప్రయాసతో వాళ్ళు ఆ వెలుతురును సమీపించారు. అక్కడ ఒక గుడిసెలో బైరాగి కనిపించాడు. ఆయన్ను చూడగానే సింహాచలం జనసంచారం లేని ఈ అడవి ప్రాంతంలో ఒంటరిగా ఏం చేస్తున్నావు? ఊరికి దూరంలో ఉన్నంత మాత్రాన బాధలు దూరమై పోతాయా? ఇక్కడ తిండికే కష్టం కదా? నువ్వు నిజంగానే బైరాగివా లేక సంసార బాధలు భరించలేక పారిపోయివచ్చావా? కొంపదీసి నేరాలు చేసి పారిపోయి రాలేదు కదా!'' అంటూ తన అలవాటు ప్రకారం అనేక ప్రశ్నలు అడిగాడు. బైరాగి చిన్నగానవ్వి, బాగా అలిసిపోయి ఉన్నావు. ఇప్పుడు ఈ అరటిపండు తిని ప్రశాంతంగా నిద్రపో నాయనా. తెల్లవారాక నీ అనుమానాలన్నీ తీరుస్తాను, అంటూ ఒక పండు ఇచ్చాడు. సింహాచలం దాన్ని తిని, గుడిసెలో పడుకున్నాడు. పాలేరు అతడికి కొంచెం పెడగా పడుకుని నిద్రపోయాడు. అంతలో సింహాచలానికి పొడవాటి చెట్లు బోలెడు కనిపించాయి. అంతే కాదు. అక్కడ పట్టపగలులా వెలుతురు ఉంది. సింహాచలం వడివడిగా వెళ్ళి ఆ ప్రాంతం చేరాడు. అతణ్ణి చూడగానే కొందరు పొడవాటి మనుషులు చెట్లపై నుంచి కిందికి గబగబా దిగివచ్చి అతని చుట్టూమూగారు. వారిలో ఒకడు సింహాచలానికి నమస్కరించి, అయ్యా, నా పేరు మద్దయ్య. ఎంతో కాలానికి మా ఊరు వచ్చిన అతిథి మీరు. సూరీడు పల్లె తరఫున స్వాగతం పలుకుతున్నాం. మా ఆతిథ్యం స్వీకరించండి,'' అన్నాడు. ‘‘మీరు చెట్లపై నుంచి దిగారు కదా. మరి మీ ఇళ్ళెక్కడ?'' అని అడిగాడు సింహాచలం. ‘‘మా ఊళ్ళో ఇళ్ళు చెట్ల మీద ఉంటాయి,'' అని పైకి చూపించాడు మద్దయ్య. తలెత్తి చూసిన సింహాచలానికి పొడవైన చెట్ల మీద అందమైన పెంకుటిళ్ళు కనిపించాయి. వాటిని చూసి ఆశ్చర్యపోయిన సింహాచలం, ‘‘నాకు తెలిసి ఇది అర్ధరాత్రి. మరి మీ ఊళ్ళో పట్టపగలుగా ఉంది. ఏమిటీ విడ్డూరం?'' అని అడిగాడు. అందుకు వేపయ్య అనే పొడగరి, ‘‘మాది సూరీడు పల్లె. ఇక్కడ సూర్య అస్తమయం అంటూ ఉండదు. మా పల్లెకు వచ్చిన వారికి చక్కని ఆతిథ్యం ఇవ్వాలనీ, ఎప్పుడో పెద్దలు ఏర్పరచుకున్న కొన్ని నియమాలను విధిగా పాటించాలనీ, లేకుంటే సూర్యుడు మాయమై మాది శాశ్వతంగా చీకటిపల్లెగా మారిపోతుందనీ మా పూర్వీకులు చెప్పారు. అందుకే అతిథుల కోసం ప్రత్యేకంగా అందమైన చక్కని అతిథిగృహం కూడా నిర్మించాం,'' అన్నాడు. ‘‘ఆ అతిథిగృహమైనా నేల మీద ఉందా? అదీ చెట్టుపైనేనా?'' అని అడిగాడు సింహాచలం.‘‘దాన్ని మిగతా వాటికన్నా మరీ ఎత్తున కట్టాం,'' అని మద్దయ్య అనేవాడు సింహాచలానికి సరివి చెట్టు పైనున్న అతిథిగృహం చూపించాడు. ‘‘నాకు చెట్టెక్కడం రాదు,'' అన్నాడు సింహాచలం. ‘‘ఆ సంగతి మేము చూసుకుంటాం,'' అంటూ వాళ్ళు సింహాచలం కాళ్ళకు చక్రాలు కట్టారు. అంతే. సింహాచలం గిరగిరా తిరుగుతూ చెట్టుపైనున్న అతిథిగృహం చేరాడు. అతడి వెనకనే తక్కిన వారందరూ అక్కడికి చేరి, అతిథిగృహంలో వెదురుబొంగులతో తయారు చేసిన అందమైన సింహాసనం మీద సింహాచలాన్ని కూర్చోబెట్టారు. అక్కడున్న రాళ్ళ పొయ్యి చుట్టూ ఒక నల్ల పిల్లి అటూ ఇటూ తిరుగుతూ కనిపించింది. ఆ పిల్లివంక వింతగా చూస్తూన్న సింహాచలంతో, ‘‘బద్ధకస్తులను నల్లపిల్లులుగా మార్చి, మా అందరికీ వంటలు చేయిస్తూంటాం,'' అన్న గంధమయ్య అనే మనిషి మాట విని అతడు ఉలిక్కిపడ్డాడు. అంతలో కింద కోలాహలం వినిపించి సింహాచలం తొంగి చూశాడు. అక్కడ చాలా మంది నృత్యాలు చేస్తున్నారు. ‘‘చాలాకాలానికి అతిథిగా నువ్వొచ్చావు గనక, మా వాళ్ళు ఆనందంతో పండుగ చేసుకుంటున్నారు,'' అన్నాడు మద్దయ్య. కింద ఉన్నవాళ్ళు సింహాచలాన్ని కిందికి రమ్మని ఉత్సాహంతో చేతులు ఊపారు. సింహాచలం మళ్ళీ కాళ్ళకు చక్రాలు కట్టుకుని కిందికి దిగాడు. అక్కడున్న వాళ్ళు వెదురు పాత్రలలో ఉన్న రసం తాగుతూ, ఒక పాత్ర సింహాచలానికి అందించారు. ఆ రసం రుచి చూసిన సింహాచలం, ‘‘చాలా బావుంది. ఏం పానీయం ఇది? అవునూ, ఈ పానీయాన్ని పాత్రలలో నింపుతూన్న ఆ ఇద్దరూ మౌనంగా విచారంతో ఉన్నారెందుకు?'' అని అడిగాడు వాళ్ళను చూపుతూ. ‘‘ఆ ఇద్దరు మౌనస్వాములే ఐదు రకాల మధుర ఫలరసాలతో కొండతేనె కలిపి ఈ అద్భుత పానీయం తయారు చేశారు. అర్థం పర్థం లేని ప్రశ్నలతో మమ్మల్ని విసిగించే వారిద్దరి నాలుకలూ కత్తిరించి మరిక ప్రశ్నలు వేయకుండా పానీయం తయారుచేసే పని అప్పగించాం. అలాంటి వారికి మేము విధించే శిక్ష ఇదే!'' అన్నాడు చింతయ్య అనే పొడగరి. సింహాచలం భయకంపితుడయ్యాడు. అంతలో నిప్పులవాన ఆరంభం కావడంతో అందరూ పట్టరాని ఆనందంతో నాట్యం చేయసాగారు. నువ్వు రావడం వల్లనే ఈ నిప్పులవాన కురుస్తోంది. మేము నీకెంతో రుణపడి ఉన్నాం. ఏం కావాలో కోరుకో. తప్పక తీరుస్తాం, అన్నాడు మద్దయ్య. నన్ను వెంటనే మా ఊరు చేర్చండి. అది చాలు. లేకుంటే ఏదో ఒక చెట్టుకు ఉరిపోసుకుంటాను, అన్నాడు సింహాచలం. అంతపని చెయ్యకు. నువ్వు కోరినట్టే మీ ఊరు పంపుతాం, అంటూ నలుగురు పొడగరులు సింహాచలాన్ని ఎత్తిపట్టుకుని గిరగిరా తిప్పి విసిరివేశారు. సింహాచలం గాలిలో పల్టీలు కొడుతూ, కాపాడండి, కాపాడండి, అని బిగ్గరగా అరవసాగాడు. పక్కనే పడుకున్న పాలేరు మారన్న సింహాచలాన్ని తట్టి లేపుతూ, ఏమిటి బాబూ, ఏదైనా కలగన్నావా? అని అడిగాడు. కళ్ళు తెరిచిన సింహాచలం, అవును, కలే! అన్నాడు గాఢంగా నిట్టూరుస్తూ. ఆ తరవాత అతనికి నిద్రపట్టలేదు. గుడిసె నుంచి వెలుపలికి వచ్చాడు. వణికించే చలిలో శరీరం మీద ఎలాంటి ఆచ్ఛాదనా లేకుండా ఒంటి కాలిపై నిలబడి ధ్యానం చేస్తున్న బైరాగిని చూసి, విస్తుపోయాడు. తెల్లవారుతూండగా కళ్ళు తెరిచిన బైరాగి కాళ్ళపై బడి మొక్కాడు సింహాచలం. బైరాగి అతణ్ణి మందహాసంతో లేవనెత్తుతూ, నీ సందేహాలకు సమాధానాలు లభించాయా నాయనా? అని అడిగాడు. సింహాచలం అవునన్నట్టు తలూపాడు. కాలం దైవస్వరూపం. బద్ధకం పరమ నీచస్వభావం. అనవసరమైన వాచాలతతో కాలాన్ని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకో, అని దీవించాడు బైరాగి. పాలేరుతో కలిసి ఇంటికి తిరిగి వచ్చిన సింహాచలం, ఆరోజు నుంచి కనిపించినవారిని అడ్డమైన ప్రశ్నలతో వేధించడం మానేశాడు. బద్ధకం వదిలి కష్టపడి పని చేస్తూ, తండ్రి చెప్పినట్టు నడుచుకుంటూ అందరిచేతా ప్రయోజకుడనిపించుకున్నాడు.

నిజమైన స్నేహం

ఒక రైతు నడుస్తూ పట్నం వెళుతున్నాడు. అతని జేబులో ఒక రాయి, ఒక అయిదు రూపాయల నాణెం ఉన్నాయి. నాణెం కొత్తది. తళతళమని మెరిసి పోతోంది. అది నల్లగా గరుకుగా ఉన్న రాయిని చూసి చిరాకు పడింది. పైగా రైతు అడుగుల కుదుపుకి రాయి వచ్చి నాణేనికి తగులుతోంది.   అయిదు రూపాయల బిళ్ల ఎగతాళిగా రాయితో ఇలా అంది. ‘‘నన్ను తాకకు, దూరంగా, మర్యాదగా ఉండు. నేను నీలా విలువ లేని రాయిని కాను. నన్ను డబ్బు అంటారు. నాతో ఆహార పదార్థాలు, వస్తువులు కొనుక్కోవచ్చు. "ధనమూలం ఇదం జగత్‌" అంటారు తెలుసుగా?’ అంటూ గొప్పలు పోయింది. . రాయి ‘అలాగా’ అన్నట్లుగా ప్రశంసగా చూసింది. ఇక నాణెం రెచ్చిపోయి తన గొప్పలు చెప్పుకోవడం ప్రారంభించింది. తను ఇప్పటి వరకు ఎన్ని చేతులు మారిందీ, తనతో కొనుక్కో దగిన వస్తువులెన్ని ఉన్నాయో వినిపించింది. అన్నింటినీ ప్రశాంతంగా వినసాగింది రాయి. ఇంతలో లేత మొక్కజొన్న పొత్తులు నిప్పులపై కాలుస్తున్న కమ్మటి వాసన వచ్చింది. ‘‘ఈ రైతు నన్ను ఆ బండి వాడికిచ్చి ఓ కండె కొనుక్కుంటే బాగుండు. వాడి గల్లా పెట్టెలో నా స్నేహితులతో కలిసి పోతాను. మురికిగా ఉన్న నీతోఉండలేకపోతున్నాను’అంది నాణెం బడాయిగా.   ‘ నిజమే ’ ఒప్పుకుంది రాయి నిజాయతీగా. కానీ రైతు నడక ఆగకుండా సాగింది. భోజన సమయానికి ఒక చెట్టు కింద ఆగాడు. అక్కడ కూర్చుని తెచ్చుకున్న మూటవిప్పి గోంగూర పచ్చడి నంచుకుంటూ పెరుగన్నం తిన్నాడు. కాసేపు నడుం వాల్చాడు. ఇంతలోనే లేచి ఎవరితోనో మాట్లాడసాగాడు.   ఆ మాటలను బట్టి పట్నం నుంచి పల్లెకు వస్తున్న అతడి మిత్రుడొకడు ఎదురు పడినట్లుగా నాణేనికి, రాయికి అర్థమైంది.   ‘‘నీ కోసమే పట్నం బయలుదేరాను మిత్రమా! నా తండ్రి చనిపోతూ ఈ రాయిని నా చేతిలో ఉంచి కన్నుమూశాడు. ఇదేపాటి విలువ చేస్తుందో చెప్పగలవా? నువ్వు రత్నాల వ్యాపారివి కదా’’ అంటూ జేబులో ఉన్న రాయిని తీసి స్నేహితుడికి చూపించాడు.   దాన్ని పరీక్షించిన రైతు మిత్రుడు ఆశ్చర్యంలో తలమునకలయ్యాడు. ‘‘ఇది ముడి వజ్రం. సానబెడితే ఈ చుట్టుపక్కల వూళ్లన్నీ కొనేయగలవు’’ అన్నాడు. ఆ మాటల్ని జేబులోంచి వింటున్న నాణెం తెల్లబోయింది. రైతు కళ్లు సంభ్రమంతో మెరిశాయి. వజ్రాన్ని కళ్లకద్దుకుని తిరిగి జేబులో వేసుకున్నాడు.   జేబులో చేరిన రాయిని చూసి నాణెం గౌరవంగా దూరం జరిగింది. తన గొప్పలకి సిగ్గుపడి మౌనంగా ఉంది. రాయి నాణేన్ని స్నేహంగా చూస్తూ ‘‘మౌనంగా ఉండిపోయావేం మిత్రమా? నువ్వు గలగలా మాట్లాడుతూ ఉంటే ఎంతో బాగుంది’’ అంది.   నాణెం సిగ్గుతో ‘‘నీ విలువ తెలియక బడాయి పోయాను. నన్ను క్షమించు. నువ్వు విలువైన వజ్రానివని ముందే నీకు తెలుసా?’ అంది.   తెలుసన్నట్లు తలూపింది రాయి. ‘‘మరి నేను అన్ని గొప్పలు పోతుంటే నాకు బుద్ధి వచ్చేలా అసలు విషయం చెప్పలేదెందుకు?’’ అంది నాణెం. ‘‘ఇదిగో, ఇందుకే. నాకు సహజమైన స్నేహం కావాలి. నువ్వు చూడు. ఇప్పుడు ఎలా వినయంగా, బిడియంగా ఉన్నావో? కృత్రిమత్వం నాకు నచ్చదు. నేను ఎవరో తెలిస్తే నువ్వు నీలా ఉండవు. మన నిజమైన విలువ స్నేహంగా, నిజాయతీగా ఉండే మన ప్రవర్తనని బట్టి ఉంటుంది. డబ్బుతో తూచగలిగేది నిజమైన విలువ అనిపించు కోదు’’ అంది రాయి.  వజ్రపు ఆలోచనా ధోరణికి ముగ్ధురాలైంది నాణెం. చేరువగా వచ్చిన నాణేన్ని ఆదరంగా చూసింది రాయి. మళ్లీ మునుపటిలానే ఎడతెగకుండా నాణెం కబుర్లతో హాయిగా సాగిపోయింది ప్రయాణం!   ఎవరూ కూడా  సంపదనుచూసి స్నేహం చేయకండి! మనసుచూసి స్నేహం చేయండి

కీర్తివర్మ కీర్తి కాంక్ష

మగధ రాజ్యాన్ని మణివర్మ  పాలించినంత కాలం  ప్రజలను కన్న బిడ్డల్లాగా చూసుకున్నాడు. తమకీ అలాంటి రాజు ఉంటే  బాగుంటుందని పొరుగు రాజ్య ప్రజలు భావించేలా  ఆయన పరిపాలన ఉండేది. అంతటి  మంచి పేరున్న రాజు  మణివర్మ   హఠాత్తుగా  చనిపోవడంతో  యువరాజు కీర్తివర్మని రాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేశారు. కీర్తివర్మకి కొన్ని బలహీనతలున్నాయి. అందులో కీర్తి కాంక్ష ఒకటి. తన తండ్రి కంటే  గొప్ప పేరుని  తొందరగా  పొందాలనుకున్నాడు అతడు.   అధికారం చేతికి రాగానే అధికారులు, మంత్రులతో  సభ ఏర్పాటు చేసి,  తన మనసులోని  మాటను చెప్పాడు కీర్తివర్మ. ప్రధానమంత్రి వివేకి మాత్రం  అలాంటి కోరిక  మంచిది కాదు. అందువల్ల ఎన్నో అనర్ధాలు జరుగుతాయి. రాజ్య భవిష్యత్తు నాశనమౌతుంది.  మీ తండ్రిగారి లాగానే  పరిపాలన అందిస్తే కొంతకాలానికి  మీకూ పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అడ్డుదారిలో వెళ్ళవద్దు అని చెప్పాడు. వివేకి మాటలు   కీర్తివర్మకు నచ్చలేదు.  దాంతో మిగతా వారిని సూచనలు, సలహాలు అడిగాడు కీర్తివర్మ.   మిగిలిన మంత్రులు, అధికారులు కీర్తివర్మ మెప్పు పొందడం కోసం కొన్ని సూచనలు చేసారు. అవేమిటంటే పేదలందరికీ ఉచితంగా ఆహార ధాన్యాలు సరఫరా చేయడం, మంచి దుస్తులు పంపిణీ చేయడం, ధర్మసత్రాలు కట్టించి ఉచిత భోజన సదుపాయం కల్పించడం, వ్యాపారులు, ధనవంతులకి పన్ను రాయితీలు కల్పించడం, రైతుల  నుండి  శిస్తు వసూలు నిలిపెయ్యడం మొదలైనవి ఉన్నాయి. వారి మాటలు కీర్తివర్మకి బాగా  నచ్చాయి. వాటిని వెంటనే  అమలుపరిచాడు.   దాంతో కీర్తివర్మ  పేరు రాజ్యమంతా మారుమోగిపోయింది. ఒక  మాసం తరువాత ప్రజల్లోకి వెళ్లి తన పరిపాలన గురించి అభిప్రాయాలు అడిగాడు కీర్తివర్మ.  ఆ  దేవుడే దిగి వచ్చినట్టు కీర్తివర్మని గౌరవించారు ప్రజలు. అంతవరకూ అమలుపరిచిన పథకాలను పొగుడుతూ కీర్తివర్మను ఆకాశానికి ఎత్తేసారు . కీర్తివర్మ సంతోషానికి అంతులేకపోయింది.     తననిలాగే ప్రజలు మెచ్చుకోవాలంటే ఇంకేమి చేయాలో చెప్పమని మళ్ళీ మంత్రులను అడిగాడు కీర్తివర్మ. ప్రజలకిచ్చిన అప్పుల మీద  వడ్డీని రద్దు చెయ్యమని, ప్రజలకు వినోద కార్యక్రమాలు ఏర్పాటు చెయ్యమని,  ఉచితంగా గృహాలను నిర్మించి   ఇవ్వమని  మరికొన్ని సూచనలు చేశారు మంత్రులు.   వాటిని వెంటనే అమలుపరిచాడు కీర్తివర్మ.    ప్రధాన మంత్రి వివేకి ఎప్పటిలాగా వాటిని వ్యతిరేకించాడు.  కానీ కీర్తివర్మ వినిపించుకోలేదు. ఖజానా లోని ధనం  సంక్షేమ పథకాల కోసం కాకపోతే  మరెందుకని ఎదురు ప్రశ్నించాడు కీర్తివర్మ.     కీర్తివర్మ అందిస్తున్న  సంక్షేమ పథకాలు రాజ్యంలోని సోమరులకు  బాగా ఉపయోగపడ్డాయి. పేద ప్రజలందరికీ  పథకాల ప్రయోజనం అందింది. దాంతో  తిండి గింజల కోసం  వెతకాల్సిన అవసరం లేకపోయింది వాళ్లకి. వీటికి తోడు ఇంట్లో ఉండే  వృద్ధులకు వచ్చే వృద్ధాప్య పథకంతో కుటుంబ ఖర్చులు కూడా గడచిపోయేవి.  ఎప్పుడైనా వంట చెయ్యడానికి బద్ధకమనిపిస్తే ఉచిత భోజనానికి వెళ్లి భోంచేసేవారు.     అలా  రాజుగారే అన్న వస్త్రాలు, గృహము ఉచితంగా ఇస్తున్నప్పుడు మళ్ళీ కష్టపడడం దేనికని ప్రజలు అనుకున్నారు. అప్పటి నుండి కష్టపడి చేసే  పనులకు వెళ్లడం మానేశారు.  అయితే రాజ్యంలో  కాయకష్టానికి అలవాటు పడిన   రైతులు, నిజాయతీ ఉన్న వ్యాపారులు ఇంకా కొందరు మిగిలారు. వాళ్లకి పంటలు పండించడానికి , సరకు రవాణా చేయడానికి పని మనుషులు దొరికేవారు కాదు.  ఊరు పరిశుభ్రత కాపాడటానికి, రోగుల సేవలు చేయడానికి, సాధారణ ప్రజల  ఆరోగ్యం కాపాడడానికి  శ్రామికులు దొరికేవారు కాదు.  అలా ఎన్నో ఇబ్బందులు వచ్చాయి ప్రజలకి.   అలాంటి వాళ్లంతా కీర్తివర్మని కలసి సమస్యలు విన్నవించడానికి  వెళ్లారు.   పొగడ్తల మత్తుకి అలవాటు పడిన కీర్తివర్మ  వాళ్ళని కలవలేదు.   ఇలా ఉండగా మరోవైపు రాజ్య ఆర్ధిక పరిస్థితి దెబ్బతింది. ఖజానాలోని డబ్బు రెండేళ్ల వరకు మాత్రమే  సరిపోయింది. ఖర్చులే తప్ప రాబడి లేకపోవడంతో తరువాతి  అవసరాల కోసం నిలువ ఉంచిన బంగారాన్ని కరిగించి డబ్బుగా మార్చి ఖర్చు చేసాడు కీర్తివర్మ. అలా ఆరు నెలలు గడిచాయి. మళ్ళీ ధనం అవసరం ఏర్పడింది. ఈసారి  రాజరిక   వారసత్వ చిహ్నాలైన భవనాలు, ఆస్తులను  తాకట్టు పెట్టి ధనం అప్పు తెచ్చాడు. అలా తెచ్చిన ధనం మరో ఏడాదిలో అయిపోయింది.  తరువాత నుండి  సంక్షేమ పథకాలకే  కాకుండా అప్పులకు వడ్డీ చెల్లించడానికి ధనం అవసరమైంది. తనఖా పెట్టిన  ఆస్తులను అమ్మేసి  ధనం తెచ్చాడు  కీర్తివర్మ.   పరిస్థితి ఇలాగే ఉంటే రాజ్యం చేయి జారిపోతుందని భయపడ్డాడు మంత్రి వివేకి. కీర్తివర్మని కలసి నచ్చజెబుతామనుకున్నా అలాంటి అవకాశమే  ఇవ్వలేదు అతడికి.  ఇంతలో పొరుగు రాజు నుండి కీర్తివర్మకు ఒక లేఖ అందింది. “మీ రాజ్యంపై దండయాత్ర ఆలోచన ఉంది.   మీ రాజ్యంలో అప్పులే తప్ప ఆస్తులు లేవని, రోజువారీ ఖర్చులకు కూడా ధనం లేదని తెలిసి  దండయాత్రను  ప్రస్తుతానికి   వాయిదా వేస్తున్నాం. మీ తండ్రిగారితో  మాకున్న స్నేహం  వలన  మీకొక అవకాశం ఇస్తున్నాం. మీ రాజ్యంలో ఉచిత పథకాల అమలుని తక్షణం నిలిపి వేసి,  ప్రజల్లో కష్టించే తత్త్వం పెంచినట్టయితే దండయాత్ర ఆలోచన విరమిస్తాం. లేనిపక్షంలో  దండయాత్ర జరిపి తీరుతాం”  అని ఉంది.     ఆ లేఖ చూడగానే కీర్తివర్మ కంగారుపడ్డాడు. మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లు  యుద్ధం అంటే ఎన్ని నష్టాల్లో తెలిసినందున వెంటనే మంత్రి వివేకిని పిలిపించి సలహా అడిగాడు.  ఉచిత పథకాలు ఆపేస్తున్నట్టు  రాజ్యంలో చాటింపు వేయించి , పొరుగు రాజుకి బదులు లేఖ పంపుదామని సలహా ఇచ్చాడు. అలాగే చేసాడు కీరివర్మ.  తరువాత నుండి వివేకి సలహాలను పాటిస్తూ  పరిపాలన సాగించడంతో      కొన్నాళ్ళకి రాజ్యంలోని  పరిస్థితులు చక్కబడ్డాయి.  కొన్నాళ్ల తరువాత పొరుగురాజుకి ఒక లేఖ అందింది.  అందులో  మా రాజ్యం విపత్తు అంచున ఉన్నప్పుడు నా కోరిక మేరకు మా రాజ్యంలోని పరిస్థితులు చక్కబడేందుకు బెదిరింపు లేఖ పంపించి, సహకరించినందుకు ధన్యవాదాలు. తమ శ్రేయోభిలాషి  వివేకి” అని ఉంది.  

నిరంతర విద్యార్థులు

ప్రముఖ ఆంగ్ల రచయిత చార్లెస్ డికెన్స్ తన సుప్రసిద్ధ నవల ఏ టేల్ ఆఫ్ టూ సిటీస్ ను  అది అత్యుత్తమ కాలం, అది మహా చేటుకాలం , అది ఆశల వసంతం (స్ప్రింగ్), అడియాసల శిశిరం (వింటర్),  అనే వాక్యంతో ఆరంభించాడు. ఫ్రెంచి విప్లవం రోజులను దృష్టిలో పెట్టుకొని డికెన్స్ అలా స్పందించాడని అంటారు. వాస్తవానికి కాలం ఎల్లప్పుడూ లోలకమే. వసంతాలు, శిశిరాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. మానవ జీవితమూ అంతే. అది ఆశలు, అడియాసల మధ్య ఊయల. కాల స్వరూప, స్వభావాలను అర్థం చేసుకొన్నవారికి జీవితపు ఊయలకు చెందిన రెండు అంచులూ సమంగానే అనిపిస్తాయి. సహజంగానే తోస్తాయి. స్వభావాన్ని కాల ఆకళించుకొంటూ కాలంతో కలిసి నడవడమే మనిషి కర్తవ్యం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో (ఈ డిజిటల్ యుగంలో) రాబోయే విప్లవాత్మక పరిణామాలను ఎంతో ముందుగా అంచనా వేసిన అమెరికన్ రచయిత- ఆల్విన్ టోఫ్లర్. ఆయన రచించిన 'ఫ్యూచర్ షాక్ (1970), థర్డ్వేవ్(1980) గ్రంథాలు సాహిత్య లోకంలో పెను సంచలనం సృష్టించాయి. టోప్లర్ కు దార్శనికుడన్న గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఆ రోజుల్లోనే ఆయన చెప్పిన ఓ అద్భుత వాక్యం సుప్రసిద్ధమైనది. '21వ శతాబ్దంలో 'నిరక్షరాస్యుడు' అనే పదానికి అర్థం మారిపోతుంది. కేవలం చదవడమో, రాయడమో తెలియని వ్యక్తికి మాత్రమే ప్రస్తుతం వర్తిస్తున్న ఆ పదం- రాబోయే రోజుల్లో మరింత విస్తృత అర్థాన్నిస్తుంది. దాని నిర్వచనమే మారిపోతుంది. నేర్చుకోనివాడు, నేర్చింది జీర్ణించుకోలేనివాడు, ఎప్పటికప్పుడు కొత్తదాన్ని నేర్చుకోవాలన్న కుతూహలం లేనివాడు- 21వ శతాబ్దం యువతరం దృష్టిలో నిరక్షరాస్యుడు అవుతాడు' అని టోఫ్లర్ నిర్వచించాడు. ఒక యుగసంధిలోనో, మలుపులోనో స్థిరంగా నిలబడి అలా రాబోయే తరాల ఆలోచనలను పట్టుకోవడం దార్శనికతకు చిహ్నం. ఏనాడో 1915లో రాసిన తన 'కాసులు' కవితలో మహాకవి గురజాడ 'మగడు వేల్పు(దేవుడు) అన్నది పాతమాట... ప్రాణమిత్రుడు అతడు నీకు' అన్నాడు. నేటి ఆధునిక మహిళ అంతరంగాన్ని అర్థం చేసుకొన్నవారికి గురజాడ దూరదృష్టి స్పష్టంగా తెలుస్తుంది. నవీన నాగరికతలో వివిధ మాధ్యమాల ద్వారా పోటెత్తుతున్న సమాచార ఉప్పెనలు... నిరంతరం మార్పుచెందుతున్న సైద్ధాంతిక ప్రవాహాలు... అనుక్షణం మారిపోతున్న ఆధునిక జీవన విధానాలు... అతివేగంగా దిగజారుతున్న మానవీయ విలువలు- మనిషిని బలవంతంగా అయోమయంలోకి నెడుతున్నాయి. ఈ సంక్లిష్ట యుగంలో మరిన్ని ప్రశ్నలకు, సందేహాలకు గురిచేయకుండా, విస్పష్టమైన సమాధానాన్ని అందిస్తూ- కాలగమనాన్ని గురించి సామాన్య మానవుడికి తేటతెల్లం చేయగల దార్శనికులు సమాజానికి అవసరం. వారినే 'వైతాళికులు' అంటారు. వారు చూపించే దివిటీల వెలుగులో ప్రతి మనిషీ కాలగమనాన్ని గుర్తిస్తూ మనుగడలో స్థిరమైన నిలకడను సాధించాలి. అంటే మనమంతా ఆల్విన్ టోఫ్లర్ చెప్పిన అర్ధంలో చక్కని 'అక్షరాస్యులు'గా మారాలి. నిరంతర విద్యార్థులం కావాలి. నేర్చుకోవడం విషయంలో నిర్లక్ష్యాన్ని విడనాడి, ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉండాలి. కాలంతో కలిసి నడవడమంటే అసలైన అర్థం అదే!

కనువిప్పు కలిగించే యదార్ధ గాథ

 ఓమ్ భూర్భువస్సువః తత్సవితు ర్వరేణ్యం భర్గో దేవస్య థీమహి  థియో యోనః ప్రచోదయాత్  అని తాతగారి గదిలోంచి వినిపిస్తున్న  గాయత్రీ మంత్రాన్ని విని వినోద్, వనజా  నవ్వుకున్నారు.  తాతగారికి ! చాదస్తం ఎక్కువలా ఉంది..ఇలా రోజూ మూడు వేళలా మూడు  గంటల సమయం వృధా చేసుకుంటున్నారు.  దీని బదులు వాకింగ్ కానీ, మరేదైనా ఎక్సర్ సైజ్ చేస్తే మేలు కదా   అన్నాడు వినోద్.  వంటగదిలోంచి  వీరి మాటలు వింటున్న బామ్మ భవాని   ఏరా! తాతగారిని విమర్శించేంత  గొప్పవారా మీరు!  మీకేం తెల్సురా  గాయత్రీ   మాత  ప్రభావం ? “అంది కోపంగా.  ఏంటర్రా!  పిల్లలూ! మీ బామ్మ ఏదో చెప్తున్నట్లుంది ? ఏదైనా కధా? అని అడిగాడు తాత  తారకరామయ్య. “వీరికి కాస్త గాయత్రి గురించి చెప్పండి .గాయత్రీ మాత  మహత్వం తెలీక ఏదో అనుకుంటున్నారు . పైకి అనలేదు కానీ వీరి మనస్సుల్లో  మంత్రాలకు చింతకాయలు రాలుతాయా ?  అనే సందేహం మాత్రం ఉంది  అంటూ బామ్మ వంట గదిలోకి  వెళ్ళింది. తారకరామయ్య తన వాలు కుర్చీలో కూర్చున్నాక   పిల్లలిద్దరూ  వెళ్ళి ఆయన కిరువైపులా  స్టూల్స్ లాక్కుని కూర్చుని  తాతగారూ చెప్పరూ! ప్లీజ్ !   అని అడిగారు. ఆయన గొంతు సవరించుకుని చెప్పసాగారు.  ఇది  నిజంగా జరిగిన సంఘటన. కల్పనా కాదు, ఎవరో రాసిన కధా కాదు. యదార్ధగాధ.  అది ఆంగ్లేయులు మన దేశంలో ఉన్నప్పటి విషయం.  అప్పటి ఒక ఆంగ్ల దొర ధామస్ మన్రో   అనే ఆయన పేరని గుర్తు. క్యాంప్ మీద కన్నడదేశానికి వచ్చి, ఒక రోజున తన గుఱ్ఱం మీద   తుంగభద్రా నది ఒడ్డున షికారుకు బయల్దేరాడు . ఆయన తోటి షుమారుగా  అరడజను మంది జవాన్లు గుఱ్ఱంతో పాటుగా పక్కనే పరుగెడుతూ  అనుసరించ సాగారు. మన గురించీ  ఏమనుకుంటున్నారు జనం?  ధామస్ తన వెంట ఉన్న వారిని అడిగాడు.                                                                         ” “చాలామంచివారనుకుంటున్నారు దొరా!  వారిలో ఒక ముఖ్య సేవకుడు, బాపన్న చెప్పాడు.  మీరంటే  అందరికీ భయమే దొరా!   ముఖప్రీతికై మరో జవాన్ చెప్పాడు.  సరి, సరి.ఈ రోజు విశేషాలేంటి?  ధామస్ మళ్ళీ అడిగాడు.  ఏమున్నాయ్ దొరా! మీరీ  సమయంలో  షికారుకు వస్తున్నారు కదా ఈ వారంగా ఒక్కపిట్టా ఈ దారంట రాదు.   ఓహ్! అక్క డ చాలామంది జనం ఉన్నారు? ఏంటి విశేషం!   ఆశ్చర్యంగా అడిగాడు ధామస్ .  దొరా! అక్కడ నది ఒడ్డున  శృంగేరి పీఠాధిపతులు   కొలువు చేసి ఉన్నారు. ఆయన శిష్యులూ  స్వామి వారి ప్రవచనం ఆలకించను ఊరి జనమూ చేరి ఉన్నారు దొరా.  శృంగేరీ పీఠమా! అదేంటీ ఎన్నడూ విన లేదే?  దొరా ! మీరిక్కడికి ఎప్పుడూ రాలేదు కదా ! అంచేత విని ఉండరు. ఈ కన్నడదేశంలోని చిక్క మగళూరు దగ్గరే శృంగేరి ఉంది. ఆది శంకరాచార్యులు  ధర్మ ప్రచారం కోసం మొదటి మఠాన్ని ఇక్కడ శృంగేరీ లో స్థాపించారు.   శృంగేరి అంటే అర్ధమేంటి ? దానికా పేరు మఠస్థాపన తర్వాత వచ్చిందా ? లేక ముందు నుంచే ఉందా?       శృంగేరి తుంగభద్ర నది ఒడ్డున ఉన్నది దొరా!. తుంగభద్ర నది ఇటు ప్రక్కన విద్యాశంకర దేవాలయం , తుంగభద్ర నది అవతల ఒడ్డున నరసింహవనం ఉన్నాయి . శృంగేరి అనే పేరు ‘ఋష్యశృంగగిరి ‘నుండి వచ్చిందని అంటారు దొరా! శృంగేరికి సమీపంలో  ’ శృంగపర్వతం’ ఉన్నది .  విభండక మహర్షి కుమారు డు  ‘ ఋష్యశృంగ  మహర్షి.  ఈ యోగి మహానుభావుడు  ఒకసారి ‘రోమపాదు’ డనే రాజు పాలిస్తున్న  అంగ రాజ్యం’ క్షామానికి  గురై , జనం బాధపడసాగారుట. ఆ సమయంలో, ఋష్యశృంగుడు  అడుగు పెట్టగానే  వర్షాలు పడి, క్షామ నివారణ ఐనదని అంటారు . ఈ గ్రామములో శంకరాచార్యులు అద్వైతాన్ని వ్యాప్తి చేయ టానికై  స్థాపించినదే ఈ శృంగేరీ శంకరమఠం. ”  ఎంతైనా మీ భారతదేశం చాలా గొప్పదోయ్ ! మహాను భావులు ఎంతోమంది ధర్మస్థాపనకై కృషి చేసిన ‘పుణ్యభూమి’ మీది. నాకెంతో ఇష్టం  మీ దేశమంటే , నేనిక్కడ పుట్టకపోతినే అని బాధపడుతుంటాను అప్పుడప్పుడూ.”  ధామస్ మనస్పూర్తిగా అన్నాడు. “ఔ దొరా! మాదేశం మహా గొప్పది!” మురిసిపోతూ  తన దేశాన్ని గురించీ చెప్పుకున్నాడు మరో జవాన్  రొప్పుతూ వెంట నడుస్తూ.  శంకరాచార్యుల వారు మఠాన్నిఇక్కడే ఎందుకు  స్థాపించాలనుకున్నారో తెల్సా?” థామస్ అడిగాడు.  శంకరాచార్యుల వారు, తన పరివార శిష్యులతో ధర్మ ప్రచారం కోసం దేశాటన  జరుపుతూ ఇక్కడ పర్యటిస్తూన్నప్పుడు, ఆయన ఒక చిత్రం చూశారు దొరా! ఒక సర్పం ప్రసవిస్తున్నఒక కప్పకు ఎండ పడకుండా తన పడగ నీడ పడుతున్న దృశ్యం , ఆయన చూసి ఆశ్చర్యపడ్డారు , ఈ స్థల మహత్యం గొప్పదని గమనించారు .  అంతే కాక ఇక్కడ వరకు వచ్చేసరికి మండన మిశ్రుడి భార్య ఐన ఉదయ భారతి సరస్వతి మూర్తిగా మారి పోతుంది. ఆ కధ చాలాపెద్దది ఇంకోమారు చెప్తాను దొరా! ఈ రెండు సంఘటనలు చూసిన  ఆయన  ఇక్కడే మెదటి మఠం నిర్మించాలని తలచి మఠాన్ని స్థాపిస్తారు . ఆది శంకరుడు ఇక్కడ 12 సంవత్సరాలు గడిపారని చెప్తారు. అంత గొప్ప పుణ్యక్షేత్రం  ఈ శృంగేరి.” “మరి ఆ మహాపురుషుడేనా ఈయన? ” కాదు దొరా అది జరిగి చాలా ఏళ్ళైంది . ఈయన ఆ గురు పరంపరలోనివారే ! వీరంతా బాల్యంలోనే  పీఠాన్ని చేరి వేద వేదాంగాలూ , శంకరాచార్యుల వారు ప్రవచించిన విశేషాలన్నీ అధ్యయనం చేస్తారు దొరా ! వీరంతా బ్రహ్మచారులు, ఎవ్వరూ వారిని ముట్టుకోడం కాదుగదా! దరిదాపులకు వెళ్ళనే ఝడుస్తారు , స్త్రీలైతే బహు దూరం నుంచీ దర్శించవలసినదే! వారు అనుగ్రహ భాషణంలోని ఆధ్యాత్మిక విషయాలు చాలా గొప్పవి దొరా! ఒక్కటి  ఆచరిస్తే  చాలు జన్మ సార్ధకమవుతుంది.”                                                                                       దూరం  నుంచీ ఆ ఆచార్యులను గమనించిన ధామస్ ” ఆహా! ఆ ముఖ వర్చస్సెంత గొప్పగా ఉంది! వెయ్యి వాల్టుల బల్బు వెలుగుతున్నట్లుంది వారి తేజస్సు! మరి బాపన్నా! ఆచార్యుల చెంతగా ఉన్న ఆ స్త్రీ మూర్తి  ఎవరు? స్త్రీలకు ప్రవేశమే లేదన్నట్లు చెప్పావు ? మరి వారికి అంత దగ్గరగా ఉన్న ఆ అందమైన ,  అద్భుతమూర్తి, టీనేజ్ గాళ్  !ఎవరు బాపన్నా! వెళ్ళి తెల్సుకుని వస్తావా? ఈజ్ షీ హిజ్ సిస్టర్ !”                              దొరా! మాకక్కడ ఎవ్వరూ స్త్రీమూర్తి కనిపించడం లేదే! మీకెవరు కనిపిస్తున్నారు అదో బాపన్నా! అంత బాగా కనిపిస్తుంటే లేదంటావేం? వెళ్ళి అడిగిరాపో? అన్నాడు ధామస్ దొర . దొర ఆదేశం మేరకు బాపన్న  చేతులు కట్టుకుని  దగ్గరగా వెళ్ళి వినయంగా , ఆచార్య శిష్యులకు తమ దొర సందేహం విన్నవించాడు . ఆ శిష్యుడు ఆశ్చర్యంగా అక్కడ మాకెవ్వరూ స్త్రీమూర్తి కనిపించడం లేదే ! అసలిక్కడ స్త్రీలకు ప్రవేశమేలేదే?” అన్నాడు.                                                      బాపన్న” ఔ  స్వామీ! మాకూ కనిపించడంలేదు . కానీ మా దొరకు కనిపిస్తున్నదిట! అడిగి వివరం తెల్సుకు రమ్మన్నారు. పీఠాధిపతులకు విన్నవించండి”అన్నాడు. ఆ శిష్యుడు పీఠాధిపతులను సమీపించి , ఆ దొరగారి సందేహాన్ని  చెప్పగానే  , ఆశ్చర్యంగా ఆయన తలెత్తి దూరంగా గుఱ్ఱం దిగి తననే దీక్షగా చూస్తున్న ఆ దొరను చూసి,” నాయనా! నా సమీపంలో ఉన్నది శారదా మాత! ఆ తల్లి దర్శనం ఎవరికో నిష్టగా గాయత్రి  చేసే వారికి కానీ లభించదు . నేను ఇక్కడ ప్రవచిస్తున్నప్పుడంతా ఆ మాత  నా సమీపంలో ఉండి సద్వాఃక్కులను నా నోట పలికిస్తుంటుంది . నాశిష్యులైన మీరే కాంచలేని  ‘అమ్మ’ను  ఆ దొర దర్శించాడంటే  ఆయన పూర్వజన్మలో భారతదేశంలో జన్మించి , గాయత్రీ జపం సంపూర్ణంగా , నిష్టగా  గావించి  ఏదో ఒక కారణాంతరంవల్ల ఆంగ్లేయుడై , ఆ ప్రాచ్యదేశంలో జన్మిం చాడు. నేను  పీఠాధిపతిని కనుక ఆయనకు నమస్కరించరాదు .  లేనిచో  ఆయన  నమస్కార అర్హుడని వెళ్ళి చెప్పిరా!” అని శృంగేరీ  పీఠాధిపతి  చెప్పిపంపారు. ‘ “అదిరా గాయత్రీ మంత్ర మహత్యం  అర్ధమైందనుకుంటా ! నియమంగా భక్తితో  జపించిన వారికి  ఈ జన్మలోనే కాక మరు జన్మలోనూ రక్షణ నందిస్తుంది.” అని తాతగారు వివరంగా చెప్పారు. . పిల్లలిద్దరూ ” మన్నించండి  తాతగారూ!! మాకివన్నీతెలీక తేలిగ్గా మాట్లాడాము. మాకూ ’ గాయత్రి’ ఉపదేశించండి.. ఈ వేసవిలో ఇక్కడ ఉన్నన్నాళ్ళూ మీతో పాటు  రోజూ  గాయత్రి  చేస్తాము . మా ఊరువెళ్ళాక వీలున్నంత సేపు నిత్య గాయత్రీ చేసేందుకు ప్రయత్నిస్తాము.”  అన్నారు.

మనసు మర్మమెరిగిన వాడే ఘనుడు!

అతడొక బీదవాడు. బీదరికం నుంచి విముక్తి పొందాలన్నది అతడి తీవ్రమైన కోరిక. ఒక భూతాన్ని వశపరచుకొంటే దాని ద్వారా కోరినదంతా తెచ్చుకోవచ్చుననుకొన్నాడు. సమీపంలోని అడవిలో ఆ వశీకరణ మంత్రాన్ని అనుగ్రహించే మహాత్ముడున్నాడని తెలుసుకొని వెళ్లి, అతడి కాళ్లమీద పడ్డాడు. భూతాన్ని వశం చేసుకునే మంత్రాన్ని ఉపదేశించమని బతిమాలాడు. మహాత్ముడు ఆలోచించి 'నీకెందుకయ్యా భూతం? దానితో వ్యవహారం చాలా కష్టం. నీవిప్పుడు సుఖంగా ఉన్నావు. పేదరికంలో మనశ్శాంతి ఉంటుంది. సంపద పెరిగితే తాపత్రయాలు పుట్టుకొస్తాయి. నీవు కష్టాలపాలవుతావు. నెమ్మదిగా ఇంటికెళ్లు' అన్నాడు. బీదవాడు వినలేదు. అతడి దైన్యాన్ని గమనించి మహాత్ముడు 'నేను చెప్పిన మంత్రాన్ని ప్రతిదినం ఉదయం జపించు. భూతం నీ వశమవుతుంది. నీవు చెప్పిన పనులన్నీ చేస్తుంది. కానీ జాగ్రత్త... భూతం చాలా భయంకరమైనది. దానికి సదా పని కల్పిస్తుండాలి. తగినంత పని కల్పించకపోతే అది నీ ప్రాణాలు తీస్తుంది' అన్నాడు. బీదవాడు ఉబ్బితబ్బిబ్బయ్యాడు. 'స్వామీ, తమ సూచన మేరకు కావలసినంత పని కల్పిస్తాను' అంటూ కొన్ని రోజులు శ్రద్ధగా మంత్రాన్ని జపించాడు. వారం రోజుల తరవాత పెద్ద భూతం ప్రత్యక్షమైంది.'ఇదో వచ్చాను. నీ మంత్రంతో నన్ను వశపరచుకొన్నావు. ఇకమీద, నాకు ఎప్పుడూ ఏదో ఒక పని కల్పించి తీరాలి. పని చెప్పకపోయావో నిన్ను చంపేస్తాను' అన్నది. 'అయితే నాకో రాజ భవనం కట్టించు' అన్నాడు. తన మనసులో భూతానికి పెద్దపనే కల్పించాననుకొన్నాడా బీదవాడు. రాజభవనం నిర్మించడానికి చాలాకాలం పడుతుందిలే అనుకొన్నాడు. చూస్తుండగానే రాజభవనం, ఉద్యానవనం అన్నీ తయారయ్యాయి. 'మరేం చేయాలో చెప్పు' అన్నది భూతం.'సమీపంలోని అడవిని కూల్చి ఒక మహా నగరాన్ని నిర్మించు' అన్నాడు బీదవాడికేమీ తోచక. నగర నిర్మాణం కొన్నేళ్లు పడుతుందనుకొన్నాడు. భూతం కొన్ని నిమిషాల్లోనే అద్భుతమైన నగరాన్ని సృష్టించింది.బీదవాడు వణికిపోయాడు. మరేం పని చెప్పాలో పాలు పోలేదు. దిక్కుతోచక నేరుగా మహాత్ముడి వద్దకు వెళ్లాడు. 'స్వామీ, నన్ను కాపాడండి' అంటూ ఏడ్వసాగాడు. 'ఎంత కష్టమైన పని చెప్పినా క్షణాల్లో పూర్తిచేస్తుంది. పని చెప్పమంటుంది. నేను ఏమీ చెప్పలేకున్నాను. స్వామీ నన్ను కాపాడండి' అని పాదాలపై పడ్డాడు. ఆయన- 'అయితే, ఆ కుక్కను పట్టుకో. దాన్ని తీసుకెళ్లి దాని తోకను నిటారుగా ఉంచమని చెప్పు' అన్నాడు మహాత్ముడు. బీదవాడు ధైర్యంగా ఆ కుక్కను పట్టుకెళ్లి భూతం చేతికిచ్చాడు. 'వెంటనే ఈ కుక్క తోకను నిటారుగా చెయ్యి' అన్నాడు. భూతం 'ఇదేం పెద్దపని!' అంటూ కుక్క తోకను తన రెండు చేతులతో నిలబెట్టి చేతులు తీయగానే వంకర! భూతం ఎన్నిసార్లు యత్నించినా ఏం లాభం, మళ్ళీ వంకరే! వారం రోజులు చేసినా సాధ్యం కాలేదు. బీదవాడి దగ్గరకు వెళ్లి, 'ఈ కుక్క తోకను నిటారుగా పెట్టించే పని మాన్పించు, నేను నిర్మించిన వాటినన్నింటినీ నీకే అప్పగిస్తాను. నిన్ను చంపనని ప్రమాణం చేస్తాను' అన్నదా భూతం.బీదవాడు సమ్మతించాడు. బతికాను అంటూ భూతం కాళ్లకు బుద్ధి చెప్పింది. బీదవాడు మహాత్ముడి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి తన రాజమందిరం చేరాడు.ఈ కథను స్వామి వివేకానందులు తమ కర్మయోగంలో చెప్పారు. ఈ ప్రపంచాన్ని దిద్దడానికి మనం యత్నించరాదు. మనకొక ప్రయోజనం ఉంది. ముందు మనసును స్థిరంగా ఉంచుకోవాలి. దాని వంకర పోతుంది. స్థిరమైన మనసుతో మంచి పనులు చేపట్టాలి. అప్పుడే మనసుకు శాంతి లభిస్తుంది. లోకం సుఖంగా ఉండగలదు. 'మనసు మర్మమెరిగినవాడె ఘనుడు' అన్నారు త్యాగరాజస్వామి.

వరాలైన శాపాలు (చందమామ కథ)

ఒక గ్రామంలో నారాయణ అనే పేద వ్యవసాయదారు ఉండేవాడు. అతడు చాలా తెలివైనవాడే కాని, అతనికంటూ సొంతంగా కుంటెడు పొలం కూడా లేదు. అందువల్ల ఇతరుల పొలాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసి జీవించేవాడు. అతనికి రెండు తీరని కోరికలుండేవి. ఒకటి దేశాటన చెయ్యటం,  రెండోది రుచికరమైన రాజ భోజనం తినాలని. అయితే అవి అతని వంటి పేద రైతుకు తీరే కోరికలు కావు. కనీసం రాజధానిలో జరిగే వసంతోత్సవాలైనా చూడాలని నారాయణ ఒక సంవత్సరం, తన స్నేహితుడైన మాధవుడితో కలిసి, రాజధానికి బయలుదేరాడు. వాళ్ళు పగలల్లా ప్రయాణం చేసి, చీకటి పడే సమయానికి అరణ్యం మధ్యలో చిక్కుకుపోయారు. ఆ రాత్రి తలదాచుకోవటానికి ఒక గుడి కనిపించింది. నారాయణ ఉత్సాహంతో, ఆ రాత్రి ఆ గుడిలో గడుపుదామన్నాడు. మాధవుడు తల అడ్డంగా ఊపుతూ, ‘‘ఇది చండముఖి అనే దేవత గుడి. ఆ దేవత మహా ముక్కోపి. ఆమె పగలల్లా ఎక్కడెక్కడో సంచారం చేసి, ఝాము పొద్దు పోయే సరికి గుడికి తిరిగి వస్తుంది. ఆ సమయానికి గుడిలో ఎవడైనా కనిపిస్తే ఆగ్రహంతో వాణ్ణి శపిస్తుంది. అందుచేత రాత్రివేళ ఎవరూ గుడిలోకి అడుగు పెట్టరు,'' అన్నాడు. ‘‘దేవత ఆగ్రహిస్తే ఆగ్రహించనీ, నే నింక ఒక్క అడుగైనా ముందుకు రాలేను,'' అంటూ నారాయణ ఆవులించి, గుడిలోకి వెళ్ళాడు. మాధవుడు మరేం మాట్లాడకుండా ముందుకు సాగి పోయాడు. గుడిలో నడుమువాల్చిన మరుక్షణం నారాయణకు నిద్ర పట్టేసింది. కొంత రాత్రి గడిచినాక ఎవరో కొరడాతో కొట్టినట్టు తోచి, నారాయణ ఉలిక్కిపడి నిద్ర మేలుకున్నాడు. ఎదురుగా ఒక దేవత, ఎరట్రి కళ్ళతో, చేతిలో కొరడా పట్టుకుని నిలబడి ఉంది. ఎవడ్రా నువ్వు? నా అనుమతి లేకుండా నా గుడిలో పడుకోవటానికి నీకెంత ధైర్యం అన్నది పట్టరాని కోపంతో.  నారాయణ ఆమెకు చేతులెత్తి భక్తితో నమస్కరించి తల్లీ  నే నొక పేద రైతును. వసంతోత్సవాలు చూడడానికి రాజధానికి పోతూ, అలసిపోయి  చీకటి పడేసరికి ఇక్కడ విశ్రమించాను. నా వల్ల తప్పు జరిగితే క్షమించుఅన్నాడు. నిన్ను క్షమించానంటే ఆ సంగతి తెలిసి జనం ఈ గుడిని చిటికెలో సత్రంగా మార్చేస్తారు. ఆ తరవాత నాకు శాంతి అన్నది కరువై పోతుంది. నిన్ను శపించి తీరాలి. అప్పుడే మానవులకు నేనంటే భయభక్తులు ఉంటాయి. నువ్వు రైతునంటున్నావు గనక, ఒక సంవత్సరంపాటు నీ చేతి నీరు తగిలిన ప్రతి మొక్కా చచ్చిపోవాలి! ఇకనైనా ఒళ్ళు దగ్గరపెట్టుకు బుద్ధికలిగి ఉండు  అని దేవత అదృశ్యమైపోయింది. వ్యవసాయం చేసుకుని బతికే తన బోటి వాడు సంవత్సరంపాటు వ్యవసాయం చెయ్యకుండా ఎలా బతకాలా అని విచారిస్తూ నారాయణ రాజధాని చేరాడు. ఆ యేడు వసంతోత్సవాలు బ్రహ్మాండంగా జరిగాయి. నారాయణ వాటిని తనివి తీరాచూసి ఆనందించాడు. దేశం అన్ని మూలల నుంచీ ఉత్సవాలకు వచ్చిన వ్యవసాయదార్లు రాజుగారితో తమ కష్ట సుఖాలు చెప్పుకున్నారు. అందరికీ దాపరించిన సమస్య ఒక చిత్రమైన కలుపుమొక్క. దాన్ని ఎన్నిసార్లు పీకినా నిర్మూలం కాక   పైరులన్నిటినీ పాడుచేస్తున్నది. ఈ సంగతి విని నారాయణ రాజుగారికి నమస్కరించి, నాకు అవకాశం ఇస్తే ఒక్క ఏడాదిలో ఈ కలుపు మొక్కలను నామరూపాలు లేకుండా సమూలంగా నిర్మూలించగలను అన్నాడు. రాజు మొదట అతడి కేసి అనుమానంగా చూశాడు. అయితే, ఆ తరవాత  అతని శక్తిని పరీక్షించి, అతనికి అలాటి శక్తి ఉన్నట్టు రూఢి చేసుకుని, అతనికి కావలసిన పరివారాన్ని ఇచ్చి  అతను కోరిన ఏర్పాట్లన్నీ చేశాడు. నారాయణ తన పరివారంతో అన్ని గ్రామాలకూ వెళ్ళి  పైరు నాటేముందుగా పొలాలన్నిటికీ తన చేతిమీదుగా నీరు పెట్టాడు. దాంతో చేలో ఉన్న కలుపు మొక్కలన్నీ పూర్తిగా నశించిపోయాయి. ఈ విధంగా దేశాటన చేయాలి  రాజభోజనం తినాలి అన్న నారాయణ కోరికలు నెరవేరాయి. అతను ఒక్క ఏడాదిలో దేశమంతా పర్యటించి, గొప్ప సత్కారాలు పొందాడు. రాజుగారు అతనికి నూరు ఎకరాల భూమి ఇనాముగా ఇచ్చాడు. మరుసటి సంవత్సరం కూడా నారాయణ వసంతోత్సవాలకు రాజధానికి పోతూ, చండముఖి ఆలయం దగ్గిరికి వచ్చేసరికి చీకటి పడటం చేత ఆ ఆలయంలోనే విశ్రమించాడు. ఒక రాత్రివేళ దేవత ప్రత్యక్షమయింది. నారాయణ ఆమెకు నమస్కరించి  తల్లీ, నీ శాపం వల్ల ఎంతో లోకోపకారం జరగటమేకాక, నా కోరికలన్నీ తీరాయి. దేశాటన చేసి, రాజభోజనం తిన్నాను,'' అన్నాడు. చండముఖి కళ్ళ నిప్పులు రాల్చుతూ మూర్ఖుడా, మళ్ళీ నన్ను కవ్వించటానికి వచ్చావా? ఈ సంవత్సరం నువ్వు నడిచిన మేర నిలువులోతు గొయ్యి పడుతుంది. నీకు ఎవరైనా పెట్టితే తప్ప తిండి ఉండదు. ఇదే నా శాపం అని అంతర్థానమయింది. తాను కదలటానికి లేదని గ్రహించి నారాయణ తెల్లవారినదాకా ఆ గుడిలోనే కూర్చుని ఒక ఉపాయం ఆలోచించాడు. తెల్లవారగానే ఆ దారినపోయే మనిషితో రాజుగారికి కబురుచేసి, ఒక పల్లకీ తెప్పించుకుని, అందులో వెళ్ళి రాజుగారి దర్శనం చేసుకుని  తన శాపం గురించి వివరంగా చెప్పి, దానివల్ల లాభం పొందే ఒక పథకాన్ని రాజుగారికి సూచించాడు. అదేమంటే, రాజ్యంలో తవ్వవలసిన పంటకాలవలన్నీ ముగ్గులతో గుర్తుపెడితే నారాయణ వాటి వెంట నడుచుకుంటూ పోతాడు. అతని వెనకనే నిలువులోతు కాలవలు వాటంతట అవే ఏర్పడతాయి. ఈ పథకం అమలు జరిగింది. నారాయణ కాలువల కోసం నడవనప్పుడు పల్లకీలో ప్రయాణం చేశాడు. అతను ఎక్కడ ఉన్నా రాజభోజనం బంగారు పాత్రలలో అతను ఉన్నచోటికి వచ్చింది. ఈ విధంగా నారాయణకు దేవత ఇచ్చిన రెండోశాపం వల్ల దేశానికి మరింత మేలు జరిగింది. ప్రయాస లేకుండా, అతి స్వల్పఖర్చుతో దేశమంతటా పంటకాలువలు ఏర్పడి  ఎంతో కొత్తభూమి సాగులోకి వచ్చింది. మూడోసంవత్సరం కూడా నారాయణ వసంతోత్సవాలకు బయలుదేరి వెళుతూ  మళ్ళీ చండముఖి ఆలయంలోనే చీకటిపడే వేళకు చేరాడు. ఒక ఝాముపొద్దు పోయేసరికి దేవత వచ్చింది. నారాయణ చేతులు జోడించి ఆమెతో తల్లీ, నీ శాపాలు అమోఘం! నీ శాపంవల్ల మరొకసారి నాకు దేశాటనా, రాజభోజనమూ, లోకోపకారం చేసిన పుణ్యమూ లభించాయి. నువ్వు దయ ఉంచి ఇక మీదటనైనా శాపాలియ్యటం మానితే  ఇటుగా వెళుతూ రాత్రివేళ ఈ అడవిలో చిక్కుకుపోయిన మనుషులు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారు. నీకు నిత్యమూ పూజలు జరిగేటట్టు ఏర్పాటు చేస్తాను   అన్నాడు. చండముఖి పట్టరాని కోపంతో  మూర్ఖుడా ఇప్పటికి రెండుసార్లు నా ఆజ్ఞ ధిక్కరించి నా గుడిలో ప్రవేశించావు. నా శాపాలను అవహేళన చేశావు. ఈసారి నీ దేశాటనా, లోకోపకారమూ ఎలా సాగుతాయో నేను చూస్తాను. నీ దృష్టిలో పడిన ఏ వస్తువైనా మరుక్షణమే భగ్గున మండి మసి అయిపోతుంది. నువ్వు బతికున్నన్నాళ్ళూ కళ్ళకు గంతలు కట్టుకుని, గుడ్డివాడిలా జీవించవలసిందే!'' అని శపించింది. నారాయణ చప్పున పై పంచ తీసి కళ్ళకు అడ్డంగా తలపాగా చుట్టుకుని, ఆ రాత్రంతా ఆలోచించి, తెల్లవారినాక తడుముకుంటూ గుడి బయటికి వచ్చి, తలపాగా విప్పి, ఒకసారి గుడికేసి చూశాడు. మరుక్షణం గుడి భగ్గున మండి బూడిదకుప్ప అయిపోయింది. దానితోనే నారాయణ శాపంకూడా పోయింది. తరవాత నారాయణ అక్కడ ఒక సత్రం కట్టించాడు. అది ప్రయాణీకులకు ఎంతో ఉపయోగపడుతూ వచ్చింది.

మూడు కలలు (చందమామ కథ)

ధర్మనిరతుడైన గోకర్ణికరాజు మణికర్ణుడికి యోగిపుంగవులన్నా, సాధు సన్యాసులన్నా అమిత గౌరవం. ఆయన తరచూ మహనీయులైన యోగులను దర్శించి వారి ఆశీర్వాదం పొందేవాడు. రాజధానికి వచ్చే సాధు సన్యాసులను సాదరంగా ఆహ్వానించి భక్తి శ్రద్ధలతో అతిథి సత్కారాలు చేసేవాడు. ఒకసారి జడధారి అనే సన్యాసి రాజభవనానికి విచ్చేశాడు. యథాప్రకారం రాజు ఆయనకు అతిథిసత్కారాలు అందించి, సాష్టాంగ దండ ప్రమాణం చేశాడు. రాజు వినయ విధేయతలకు, ధర్మబుద్ధికి పరమానందం చెందిన జడధారి, ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు బోధించి, బయలుదేరే ముందు మహారాజా! నీతో ఒక ముఖ్య విషయం చెప్పాలి. నువ్వు ఈ రోజు నుంచి మూడు రాత్రులు వరుసగా మూడు దుస్వప్నాలు కాంచబోతున్నావు. అప్రమత్తతతో వ్యవహరించు. లేకుంటే ప్రమాదం బారిన పడగలవు అని హెచ్చరించి వెళ్ళాడు. అది విన్న రాజు ఎంతగానో కలవరపడ్డాడు. వెంటనే మంత్రులను సమావేశపరచి, విషయం వివరించాడు. అప్పుడు వివేకవర్థనుడనే వృద్ధ మంత్రి జడధారి మీకు రాత్రి సమయంలోనే దుస్వప్నాలు రాగలవని హెచ్చరించాడు గనక, మీరు పగటి పూట నిద్రించి మూడు రాత్రులూ మెలకువగా గడపండి. అప్పుడు స్వప్నాలూ రావు. ప్రమాదాలు సంభవించే అవకాశమూ ఉండదు అని సలహా ఇచ్చాడు. రాజుకు ఆ సలహా నచ్చింది. ఆయనకు సంగీతం, చదరంగం, ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తిమెండు. అందువల్ల రాత్రి సమయంలో వాటితో కాలక్షేపం చేస్తే నిద్రరాదని భావించాడు. తక్కిన మంత్రులు కూడా అదే మంచిదని ఆభిప్రాయపడ్డారు. ఆనాటి రాత్రి చదరంగం ఆడుతూ గడపాలని రాజు నిర్ణయించాడు. చదరంగం ఆటలో దిట్టలైనవారిని పిలిపించాడు. తెల్లవార్లూ చదరంగం ఆడుతూ గడిపాడు. అయితే, తెలతెలవారుతూండగా మహారాజు చిన్న కునుకు తీశాడు. ఆ చిన్నపాటి కునుకులో మహారాజుకు ఒక కల వచ్చింది. ఆయన ఒక అరణ్యంలో ఉన్నాడు. ఒక త్రాచుపాము రాజును చూసి బుసలు కొడుతూ పైకి ఉరికింది. ఆయనకు ఒళ్ళంతా చెమటలు పట్టాయి. అంతలో మెలకువ వచ్చింది. రెండో రోజు రాత్రి రాజు సంగీతం వింటూ మెలకువతో ఉండాలనుకున్నాడు. కాని మధురమైన సంగీతం వింటూ ఉండగా ఆయన కొద్ది క్షణాలు కళ్ళుమూసుకున్నాడు. ఆకాశం నుంచి ఒక పెద్ద పిడుగు తనకేసి రావడం చూసి, దాని నుంచి తప్పించుకోవడానికి అటూ ఇటూ పరిగెత్తసాగాడు. అయినా, కలలో పిడుగు ఆయన్ను వెంటాడుతూనే ఉన్నది. అంతలో రాజుకు మెలకువ వచ్చింది. మూడో రోజు రాత్రి ధార్మిక, ఆధ్యాత్మిక విషయాలు చర్చిస్తూండగా మరలా కునుకు పట్టింది. ఈసారి స్వప్నంలో భయంకరమైన సింహం ఒకటి రాజు మీదికి ఉరికింది. ఆయన ఒక మడుగులో దూకాడు. మడుగులో నీరు రుధిరవర్ణంలో ఉంది. అంతలో యువరాణి మణిమేఖల అక్కడ కనిపించి, తండ్రిని నెత్తురు మడుగు నుంచి పైకిలాగింది. అంతలో రాజుకు మెలకువ వచ్చింది. తెల్లవారగానే, రాజు మంత్రులను సమావేశపరచి తన కలల గురించి వివరించాడు. మంత్రులు వెనువెంటనే పాముకాటుకు మంత్రం వేసేవారిని పిలిపించారు. మహారాజుగారిని వేటకుగాని, బయటకు గాని వెళ్ళవద్దని సలహా ఇచ్చారు. అంతఃపురంలో అందరినీ అప్రమత్తులు చేశారు. అయినా మహారాజు కలవరం తగ్గలేదు. ఆ సమయంలో శివుడనే యువకుడు మహారాజును దర్శించి రాజా! నేను చాలా తెలివిగలవాణ్ణి. కాని నా తెలివితేటలను ఎవరూ గుర్తించడంలేదు. మీరైనా నా తెలివితేటలను గుర్తించండి. లేకుంటే హిమాలయాలకు వెళ్ళిపోతాను  అన్నాడు. ఆ మాటలు విన్న మహారాజుకు వాడు మతి చలించినవాడేమో నన్న అనుమానం కలిగింది. అయినా ఎవరికి ఎలాంటి శక్తి ఉంటుందో ఏమోనని భావించి, జడధారి తనను స్వప్నాల గురించి హెచ్చరించడం ఆయన చెప్పినట్టే తనకు వరసగా వచ్చిన మూడు కలల గురించి అతనికి వివరించాడు. అంతా విన్న శివుడు కొద్ది క్షణాలు ఆలోచించి,  మహారాజా, యోగులు, సన్యాసులు దైవాంశ సంభూతులు. వారి నోటి మాట వృథా కాదు. మిమ్మల్ని కలవర పరుస్తూన్న మూడు కలలను విశ్లేషించి, ఫలితం చెప్పగలను. మొదటి రెండు కలల గురించి వివరిస్తాను. అందులో వాస్తవం ఉందని తెలిస్తే, మూడవ కలకు వివరణ ఇస్తాను,'' అన్నాడు.  అలాగే, చెప్పుమరి. ఆలస్యం దేనికి?  అన్నాడు రాజు ఆదుర్దాగా. శివుడు కొంతసేపు మౌనంగా ఊరుకుని మహారాజా! మీకు మొదటి కలలో కనిపించిన అరణ్యం జనారణ్యం. త్రాచు పాము పగకు సంకేతం. మీ మీద పగబట్టిన వ్యక్తి ఎవరో మీకు అపాయం తలపెట్టాడన్నదే ఆ కల అంతరార్థం! ఇక పిడుగు అనేది హఠాత్తుగా పడేది. అంటే  ఊహించని ఘటన ఏదో జరగబోతున్నది. పిడుగు మిమ్మల్ని వెంటాడిందంటే జరగబోయే దుర్ఘటన మీకు గురిపెట్టబడి వుందని అర్థం అన్నాడు. రాజుకు శివుడి తెలివితేటల మీద నమ్మకం కుదిరింది. శివుడు ఉండడానికి విడిది ఏర్పాటు చేశాడు. తీవ్రంగా ఆలోచించిన రాజుకు ఒక విషయం స్ఫురించింది. ఇటీవల రాజ్యంలో బందిపోట్ల బెడద ఎక్కువయితే, దానిని అరికట్టడానికి రాజు ప్రయత్నించాడు. బందిపోట్ల నాయకుడు భైరవుడు తనకు అపాయం తలపెట్టి ఉండవచ్చని భావించిన రాజు  సైనికులతో అష్ట దిగ్బంధనం చేయించి  నాయకుడు భైరవుడితో సహా బందిపోట్లందరినీ బంధించాడు. విచారణలో భైరవుడు విషనాగును రాజు శయనమందిరంలోకి పంపి రాజును చంపడానికి కుట్ర పన్నినట్టు ఒప్పుకున్నాడు. ఆ విధంగా తాను కన్న మొదటి కలకు శివుడి విశ్లేషణ సరైనదని గ్రహించి ఎంతగానో సంతోషించిన రాజు, రెండవ కల వివరణను పరీక్షించడానికి గూఢచారులను అన్ని దిశలకూ పంపాడు. రెండు రోజుల తరవాత, ఒక గూఢచారి వచ్చి,  సింహపురి రాజు విక్రమసేనుడు మన రాజ్యం మీదికి దండెత్తడానికి ఆయత్తమవుతున్నాడు అని చెప్పాడు. శివుడి తెలివితేటలకు అబ్బురపడిన రాజు, అతన్ని పిలిచి సంగతి చెప్పి అన్ని విధాలా నాకన్నా బలవంతుడైన విక్రమసేనుణ్ణి ఎదుర్కోవడం ఎలా?'' అన్నాడు విచారంతో.  దానికి మీరు కన్న మూడో కలలో పరిష్కారం సూచించబడింది  మహారాజా  అన్నాడు శివుడు.   ఎలా?'' అని అడిగాడు రాజు.  మహారాజా! మీ కలలో కనిపించిన సింహం, సింహపురిరాజు విక్రమసేనుడు. మీరు నెత్తురు మడుగులో పడడం యుద్ధంలో జరగనున్న రక్తపాతానికి సంకేతం. మిమ్మల్ని మడుగులో నుంచి బయటకు లాగిన యువరాణి గారే మిమ్మల్ని ఈ ఆపదనుంచి గట్టెక్కించ గలరు అన్నాడు శివుడు.  అదెలా?'' అని అడిగాడు రాజు.  సింహపురి రాజుకు యుక్తవయస్కుడైన కుమారుడు ఉన్నాడు కదా? ఆయనతో మన యువరాణి వివాహం జరిపిస్తే, యుద్ధ ప్రసక్తే ఉండదు!'' అన్నాడు శివుడు. అందులోని వాస్తవాన్ని గ్రహించిన మణికర్ణుడు ఒక మంచి రోజు చూసి కుమార్తె చిత్రపటాన్ని విక్రమసేనుడికి పంపి, ‘‘మీకు సమ్మతమైతే నా కుమార్తెను మీ కోడలిగా స్వీకరించండి,'' అని పురోహితుడి ద్వారా కబురు పంపాడు. మణిమేఖల అద్భుత సౌందర్యానికి ముగ్థుడైన సింహపురి యువరాజు త్రివిక్రముడు ఆమెను వివాహ మాడడానికి సంతోషంగా సమ్మతించాడు. దాంతో విక్రమసేనుడు గోకర్ణిక మీద యుద్ధ ప్రయత్నాలు విరమించి కుమారుడి పెళ్ళి ఏర్పాట్లకు శ్రీకారం చుట్టాడు. త్వరలో వారి వివాహం అత్యంత వైభవంగా జరిగిపోయింది. రాజు విక్రమసేనుడు, తనకు వచ్చిన మూడు కలలను చక్కగా విశ్లేషించి, తగిన సూచనలిచ్చి తన రాజ్యాన్ని పెను ప్రమాదాల నుంచి కాపాడిన శివుణ్ణి ఘనంగా సత్కరించి, తన ఆంతరంగిక సలహాదారుగా నియమించాడు.

సత్యసంధ (శ్రీమద్రామాయణంలోని కథ)

మునివేష ధారులైన శ్రీరామ సీతా లక్ష్మణులు శరభంగముని ఆశ్రమము చేరిరి. శ్రీ రాముని కమనీయ దివ్యమంగళ స్వరూపమును చూచుచూ శరభంగుడు శరీర త్యాగము చేసి విష్ణుపదమును చేరెను. అనంతరము దండకారణ్యములో నివసించు మునీశ్వరులందరూ శ్రీ రామ చంద్రుని దర్శనార్థం శరభంగ ముని ఆశ్రమమునకు వచ్చినారు. ఆ మునీంద్రులను చూచి మాయామానుష రూపుడైన శ్రీ రాముడు సీతా లక్ష్మణ సమేతంగా వారందరికి సాష్టాంగ ప్రణామములు చేసెను. ఆ మునులు సర్వజ్ఞుడైన శ్రీ రామస్వామిని స్తుతించి సమస్త ముని ఆశ్రములు చూచి వారిని అనుగ్రహించమని కోరిరి. మునీంద్రుల వెంట సీతారామలక్ష్మణులు తపోవనములను చూచుటకు బయలుదేరిరి. ఆ ప్రదేశములలో చాలా చోట్ల పుఱ్ఱెలు ఎముకల గుట్టలు కానవచ్చెను. “పవిత్రమైన ఈ తపోభూములలో ఈ అస్థికలు ఎలా వచ్చాయి”? అని ప్రశ్నించాడు రాముడు. వారు “సర్వేశ్వరా! సమాధి స్థితిలో వున్న మునీశ్వరులను దుష్టులైన రాక్షసులు తిని వేయగా మిగిలిన ఎముకలివి” అని తమ దైన్యమును వ్యక్త పరచినారు. కళ్ళుచెమ్మగిల్లిన స్వామి “ఈ దండకారణ్యమును రాక్షసులనుండి విముక్తము చేసెదను” అని ప్రతిజ్ఞ చేసెను. పరమానందముతో మునులు ధర్మ స్థాపకుడైన శ్రీ రామునికి జయ జయ ధ్వానాలు చేసినారు.సీతారామలక్ష్మణులు అగస్త్యమునిని సేవించి సుతీక్షుని వద్ద సెలవు తీసుకుని పంచవటికి వస్తుండగా పరమ సాధ్వీమణి లోకమాత జానకీ ఈ విధముగా భర్తతో మధుర సంభాషణము చేసినది “ప్రాణనాథా! ధర్మవర్తనము అతి సూక్షమైన పద్ధతిని అవలంబించవలెను. ఎవడైతే ప్రలోభాలకు వ్యసనాలకూ దూరముగా వుంటాడో వాడే సర్వదా ధర్మపరుడై ఉండగలడు. మనము ప్రస్తుతము మునివేషములలో ఉన్నాము. తపము ఆచరించుట మన కర్తవ్యం. తపస్సునకు శాంతి పునాది. అయిననూ మనము ధనుర్బాణములు ధరించి ఎందులకు రాక్షసులను సంహరించుచున్నాము?”. రాక్షసులతో ప్రత్యక్షముగా వైరము లేకుండానే మునులను రక్షించుట అనే “వ్యసనంతో” రాక్షసులను సంహరించుట తనకు ఇష్టములేదన్నట్టు సూచిస్తూ ఆ పతివ్రతా శిరోమణి శ్రీ రామునకు ఈ నీతికథ చెప్పినది “పూర్వం ఒక మునివల్లభుడు ప్రశాంతమైన ఓ ఆశ్రమములో తపమాచరిస్తూ ఉండేవాడు. అతడు సత్యవాది. ఆయన సత్యప్రభావముచే జంతువులు కూడా సహజ వైషమ్యాలను మరచి హాయిగా సహజీవనం చేసేవి. అలా ఉండగా దేవేంద్రుడు అతని పరీక్షించుటకై భటుని వేషంలో వచ్చి “స్వామీ! ఈ కత్తిని మీ వద్ద భద్రంగా వుంచండి. . మళ్ళీ వచ్చి నేను తీసుకుంటాను” అని అన్నాడు. ఎంతో కాలము ఆ ఆయుధం సమీపంలో ఉన్న కారణముగా ఆ మునిలో క్రూర లక్షణాలు బైటపడ్డాయి! ఆయుధం దగ్గర ఉండుటచే ఆ ముని తన కర్తవ్యాన్ని విస్మరించి హింసమీద అభిరుచి కలిగినవాడై క్రూర కృత్యాలుచేసి చివరికి ఘోర నరకమును పొందినాడు. తపస్సు చేసే మనమెక్కడ? దుష్టసంహారం చేసే క్షత్రియ ధర్మమెక్కడ? స్వామీ! చపల బుద్ధితో నాకు తెలిసినది చెప్పాను. నీవు సత్యసంధుడవు. ఏది సత్యమో ఏది అసత్యమో నీవే నిర్ణయించు” అని అనిన జానకితో శ్రీ రాముడిలా ఉన్నాడు “దండకారణ్యము లోని మునులు నిరాడంబరముగా తపస్సు చేయుచుండగా మాంసభక్షకులైన రాక్షసులు వారిని భక్షిస్తున్నారు. ఈ మునీశ్వరులు ఆ మదాంధులకు శాపం ఇచ్చుటకు సమర్థులై కూడా శాపం ఇవ్వలేదు. వారిని చంపినా కూడా కోపము తెచ్చుకోకుండా పరమశాంత చిత్తంతో తపమాచరిస్తున్నారు. దీనులై నన్ను ఆశ్రయించినప్పుడు రాక్షస సంహారము చేసెదనని ప్రతిజ్ఞ చేసినాను. అసలు ఆ యోగులు అడిగేవరకూ నేను ఆగనక్కరలేదు. ఎందుకంటే నా తండ్రిగారు భరతునకు నగర రాజ్యము నాకు వనరాజ్యము ప్రసాదిస్తున్నానని స్పష్టముగా చెప్పిరి. కావున తపముచేసినా దుష్టులను శిక్షించటం ఆర్తులను రక్షించటం వనరాజుగా నా కర్తవ్యం. సీతా! నేను నా ప్రాణాలనైనా వదులుతా. నా ప్రియభ్రాత అయిన లక్షణునైనా విడనాడుతాను. చివరకు నా హృదయేశ్వరివైన నిన్నైనా వదులుతాను కానీ సత్యమును మాత్రమూ ఎన్నడునూ వీడజాలను! అందునా ఇట్టి తాపసులకు ఇచ్చిన ప్రతిజ్ఞ ఎప్పటికీ విడువలేను”. ఇలా అద్భుతంగా సంభాషణము చేసి సుందరములైన వనభూముల వైపు నడువసాగారు. ఇట్టి సత్యసంధుడైన శ్రీ రాముని పాద స్పర్శ పొందిన ఈ భారతభూమి ధన్యం. భారతీయులు ధన్యులు. ఈ కథలోని నీతులు.. వ్యాస భగవానుడు చెప్పినట్టు సత్యం ఈ 13 విధాలైనది: నిష్పక్షపాతం ఆత్మనిగ్రహం అణకువ, సిగ్గు, ఓరిమి, తాలిమి, సంయమం, దయ, అహింస, అనసూయత త్యాగం, చింతన, శీలసంపద. ఇన్ని విషయాలను సమగ్రంగా ఆలోచించి వీటిని అనుసంధానము చేసుకుని ఎల్లవేళలా సత్యమే ఆచరించినాడు శ్రీ రాముడు. ధర్మసమ్మతమైన ప్రతిజ్ఞ చేసి ఆ ప్రతిజ్ఞను కాపాడటానికి ఏమైనా వదులుతాను కానీ సత్యాన్ని మాత్రము విడువనని అన్నాడు. మంచైనా చెడైనా చాలాకాలం సహవాసం చేస్తే ఆ గుణాలకు దగ్గరవుతాయనే నీతికథను మనకు సీతమ్మ చెప్పినది. అందుకే మన పెద్దలు సత్సంగత్యమే చేయమని అంటారు.

వైజయంతి నిర్ణయం(చందమామ కథ)

వినుకొండరాజు నరేంద్రుడి ఏకైక కుమార్తె వైజయంతి. బాల్యంలోనే తల్లిని కోల్పోయిన ఆమెను తండ్రి అల్లారుముద్దుగా పెంచి రాజోచితవిద్యలు నేర్పించాడు. యుక్తవయస్కురాలైన వైజయంతిని చక్కని రాజకుమారుడికిచ్చి త్వరలో వివాహం జరిపించే ఆలోచనలో ఉన్నాడు నరేంద్రుడు. వైజయంతి ఒకనాడు తన చెలికత్తెలతో కలిసి తూరుపు కొండమీది రాజేశ్వరీదేవి ఆలయానికి వెళ్ళింది. చెలికత్తెలు బయట వేచి ఉండగా ఆమె మాత్రం లోపలి ఆలయంలో దేవీ దర్శనం ముగించుకుని, గుడి వెనుక వైపుకు యథాలాపంగా వచ్చింది. అక్కడ ఒక యువకుడు బండరాయి మీద నర్తకి శిల్పం చెక్కుతున్నాడు. యువరాణి ఆ శిల్పాన్నీ, దాన్ని తదేకంగా చెక్కుతున్న శిల్పినీ చూసి సంతోషించి, "అద్భుతం! శిల్పం చాలా అందంగా ఉన్నది,'' అంటూ శిల్పిని సమీపించింది. ఆ మాటకు యువకుడు తలెత్తి చూశాడు ఎవరా అన్నట్టు. "నేను యువరాణి  వైజయంతిని,'' అన్నది యువరాణి. "నమస్కారం యువరాణీ! నా పేరు విశాలుడు,'' అన్నాడు యువశిల్పి వినయంగా. "నీ శిల్ప నైపుణ్యం అత్యద్భుతం. నీతో నా శిల్పం చెక్కించుకోవాలనుకుంటున్నాను,'' అన్నది వైజయంతి. "ఆ అవకాశాన్ని గొప్ప వరంగా భావిస్తున్నాను. పాలరాతితో మీ సుందర శిల్పం చెక్కుతాను. నెలరోజులు పట్టవచ్చు. అందుకు వారానికి ఒకసారి ఒక గంటసేపు మీరు నా ఎదుట నిలబడవలసివుంటుంది,'' అన్నాడు విశాలుడు. "మరి ఆలస్యం దేనికి? త్వరలోనే ప్రారంభించు. అయితే, శిల్పం పూర్తయ్యేంత వరకు ఈ విషయం రహస్యంగా ఉండాలి,'' అన్నది వైజయంతి ఉత్సాహంగా. విశాలుడు కొండకు దిగువన కొబ్బరి చెట్ల మధ్యవున్న ఒక పెంకుటిల్లును చూపిస్తూ, "అదే మా ఇల్లు. మా అవ్వ నాతో పాటే ఉంటుంది. శిల్పం విషయం రహస్యంగా ఉండాలంటున్నారు. మరి, మీరు మా ఇంటికి రాగలరా?'' అని అడిగాడు. "ప్రతి శుక్రవారం రాజేశ్వరీదేవీ ఆలయానికి వస్తాను. దర్శనం ముగించి, కొండదిగి మీ ఇంటికి వస్తాను,'' అని చెప్పి వెళ్ళింది వైజయంతి. మరుసటి శుక్రవారం వైజయంతి, దేవిని దర్శించుకుని కొండదిగి విశాలుడి ఇంటిని సమీపించింది. చెట్ల మధ్య ఒక తిన్నె మీద పాలరాతిని అమరుస్తున్న విశాలుడు, "రండి, మీ కోసమే ఎదురు చూస్తున్నాను,'' అని యువరాణిని గౌరవంతో ఆహ్వానించాడు. ఆ తరవాత వైజయంతి విశాలుడు చెప్పినట్టుగా పక్కనే వున్న ఒక చెట్టును ఆనుకుని మాధవీలతను సవరిస్తూ నిలబడింది. ఏకాగ్రతతో విశాలుడు పాలరాతిపై ఆమె రేఖా చిత్రాన్ని చిత్రించాడు. విశాలుడు, "చాలు. ఇక ఇలా వచ్చి కూర్చోండి," అంటూండగా, ఇంటి లోపలి నుంచి అవ్వ అరిటాకులో వేడి వేడి అరిసెలు తీసుకువచ్చి ఇచ్చింది. వైజయంతి అరిసెలను ఏనాడూ తినలేదు. వాటి రుచి బాగానచ్చి, వాటి పేరు అడిగి తెలుసుకుని, "ఇక మీదట నిన్ను `అరిసెల అవ్వా,' అని పిలుస్తాను. సరేనా?'' అన్నది వైజయంతి నవ్వుతూ. "మాలాంటి పేదల ఇంటికి రావడమే కాకుండా, వరస కూడా కలిపావు. నువ్వు నూరేళ్ళు చల్లగా ఉండాలి తల్లీ," అంటూ చేతులు జోడించింది అవ్వ. విశాలుడు ప్రత్యేక శ్రద్ధ కనబరచడం వల్ల మూడు వారాలలోనే శిల్పం దాదాపు పూర్తయింది. ఒకరోజు సాయంకాలం దానిని చూడడానికి వచ్చిన వైజయంతితో, "ఇక తుది మెరుగులు మాత్రమే దిద్దవలసి ఉన్నది. మరో నాలుగురోజుల్లో మీరు శిల్పాన్ని తీసుకువెళ్ళవచ్చు," అన్నాడు విశాలుడు. వైజయంతి తన శిల్పాన్ని తనివితీర చూసుకుని సంతోషంగా వెనుదిరిగింది. మరునాటి ఉదయం ఉద్యానవనంలో తిరుగుతూన్న వైజయంతి, నిండుగా పూచిన గులాబీని అందుకోబోతూ, "మీ సౌందర్యం అపూర్వం, యువరాణీ!" అన్న మాటలు వినిపించి తలెత్తి చూసింది. ఆమెకు కొద్ది దూరంలో ఒక క్షత్రియ యువకుడు కనిపించాడు. దేశాటనలో వున్న కొండవీటి యువరాజు జయంతుడు ఆరోజు తమ అతిథిగా వస్తున్నాడని క్రితం రాత్రి తండ్రి చెప్పడం గుర్తుకు వచ్చింది వైజయంతికి. "మీరు మా అతిథిగా రావడం మాకెంతో సంతోషం కలిగించింది," అంటూ వైజయంతి దూరంగా ఉన్న తోటమాలిని పిలిచి, జయంతుడికి ఉద్యాన వనమంతా చూపించమని చెప్పి, తన అంతఃపురంలోకి వెళ్ళిపోయింది. ఆ రాత్రి నరేంద్రుడు వైజయంతితో, "అమ్మా, నువ్వు జయంతుడికి ఎంతగానో నచ్చావట. నిన్ను చూసిన క్షణమే నిన్నే వివాహ మాడాలని నిశ్చయించి, నిన్ను చూడడానికి త్వరలో తన తల్లిదండ్రులను పంపుతానన్నాడు. నీ అభిప్రాయం ఏమిటి తల్లీ," అన్నాడు. "జీవితంలో వివాహం చాలా ముఖ్యమైనదికదా? నన్ను కాస్త ఆలోచించుకోనివ్వండి, నాన్నా,'' అన్నది వైజయంతి. మరునాడు తెల్లవారక ముందే ఒక చెలికత్తె వచ్చి, "కోట గుమ్మం దగ్గర ఒక ముసలిసిది మీ దర్శనార్థం వేచి ఉన్నది. అరిసెల అవ్వ అట!" అన్నది వైజయంతితో. "లోపలికి తీసుకురా," అని ఆజ్ఞాపించిన వైజయంతి, ఆమె రాగానే, తన ఆంతరంగిక మందిరంలోకి తీసుకుపోయి, "ఆ కన్నీళ్ళేమిటి, అవ్వా? అసలు ఏం జరిగింది?" అని అడిగింది ఆందోళనతో. అవ్వ ఆ క్రితం సాయంత్రం తమ ఇంట జరిగిన విషయం పూసగుచ్చినట్టు వివరించింది: కొండవీటి యువరాజు జయంతుడు తన పరివారంతో తిరిగి వెళుతూ మంచి నీళ్ళ కోసం విశాలుడి ఇంటి ముందు ఆగాడు. విశాలుడి అవ్వ అందరికీ తాగడానికి మజ్జిగ ఇచ్చింది. బయలుదేరే ముందు జయంతుడు, "ఇదేమిటి?" అంటూ వైజయంతి పాలరాతి శిల్పం మీది వస్త్రాన్ని, తన కత్తితో పక్కకు తొలగించాడు. అతిమనోహరంగా ఉన్న వైజయంతి శిల్పాన్ని చూడగానే జయంతుడు ఆగ్రహోదగ్రుడై, "ఈ జయంతుడికి కాబోయే భార్య శిల్పాన్ని ఇక్కడ ఉంచుకోవడానికి ఎంత ధైర్యం? నా హృదయపీఠంపై కొలువుండే యువరాణి శిల్పాన్ని ఇక్కడ నిలబెట్టిన ద్రోహి ఎవరు?" అని గద్దించి అడిగాడు. "ఆ శిల్పాన్ని నేనే చెక్కాను," అన్నాడు విశాలుడు వినయంగా. "ఎలా చెక్కావు? యువరాణిని ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు చూశావు?" అని నిలదీశాడు జయంతుడు. విశాలుడు బదులు పలకకుండా మౌనం వహించాడు. జయంతుడు తల తిప్పి తన అంగరక్షకుడి కేసి చూశాడు. మరుక్షణమే వాడు విశాలుణ్ణి ఎడాపెడా కొరడాతో కొట్టసాగాడు. కాని అతడు మాత్రం నోరు విప్పలేదు. జయంతుడు పట్టరాని ఆగ్రహంతో, శిల్పాన్ని కింద పడదోసి ముక్కలుగా విరగకొట్టి, "ఈ దుర్మార్గుణ్ణి అన్న పానీయాలు లేకుండా వీడి ఇంట్లోనే బంధించండి," అని ఆజ్ఞాపించి ఇద్దరు భటులను కాపలా ఏర్పాటు చేశాడు. కాళ్ళ మీద పడి అవ్వ ఎంత వేడుకున్నా పట్టించుకోకుండా కాలితోనే ఆమెను పక్కకు తోసి గుర్రం ఎక్కి వెళ్ళిపోయాడు. "నిన్న సాయంకాలం నుంచి వాడు పచ్చి నీళ్ళు కూడా ముట్టుకోలేదు. మీరే వాణ్ణి కాపాడాలి," అంటూ వైజయంతికి చేతులెత్తి మొక్కింది అవ్వ. ఆమె మాటలను విన్న వైజయంతి, "నువ్వేమీ భయపడకు. విశాలుడికి ఎలాంటి ఆపదా రాదు," అంటూండగా రాజు వైజయంతిని చూడడానికి అక్కడికి వచ్చాడు. వైజయంతి తండ్రికి జరిగినదంతా వివరించి, "మీకు తెలియకుండా నా శిల్పం చెక్కించుకున్నందుకు నన్ను క్షమించండి. జన్మదిన కానుకగా మీకు ఇచ్చి సంభ్రమం కలిగించాలని ఆ విషయం గోప్యంగా ఉంచాను. నా శిలావిగ్రహం వేరొక చోట ఉండడం చూసి అది అక్కడ ఎందుకు ఉందన్న పూర్వాపరాలు తెలుసుకోకుండా ఆగ్రహం చెంది తన రాజ్యానికి చెందని ఒక నిరపరాధిని కఠినంగా శిక్షించాడు జయంతుడు. అతని ప్రవర్తన నా పట్ల ప్రేమకన్నా, నేను అతనికే దక్కాలన్న మితి మించిన స్వార్థం, అహంకారాలను తెలియజేస్తున్నది. ఇక విశాలుడు శిల్పం చెక్కే విషయం రహస్యంగా ఉంచాలని చెప్పిన నా మీది గౌరవం కొద్దీ ప్రాణం మీదికి వచ్చినా పెదవి విప్పలేదు. మాట తప్పని గుణం, ఓర్పు, నేర్పు, శ్రద్ధ, శాంతం ఏపాలకుడికైనా ఉండవలసిన ముఖ్య లక్షణాలు. అవన్నీ విశాలుడిలో ఉన్నాయి. నేను జయంతుణ్ణి వివాహ మాడితే మన రాజ్యం కొండవీటిలో కలిసిపోయి, తన అస్తిత్వాన్ని కోల్పోతుంది. విశాలుణ్ణి చేసుకుంటే వినుకొండ రాజ్యం సుస్థిరంగా ఉంటుంది. అందువల్ల మీరు అనుమతిస్తే విశాలుణ్ణి వివాహ మాడదలిచాను," అన్నది. అంతా విన్న నరేంద్రుడు తలపంకిస్తూ, " ఆలోచించాకే నువ్వు ఏ నిర్ణయమైనా తీసుకుంటావని నాకు తెలుసు. అయినా, ఆలోచించడానికి నాకూ కొంత సమయం కావాలి," అన్నాడు. అక్కడే నిలబడివున్న అవ్వ, "ఇన్నాళ్ళు నా కడుపులో దాచుకున్న ఒక రహస్యం చెప్పవలసిన సమయం వచ్చిందను కుంటాను. విశాలుడు నా సొంత మనవడు కాదు. గుర్రంకొండ రాజును దాయాదులు కుట్రతో హతమారిస్తే, రాణిగారు ఆరునెలల పసిబిడ్డను నా కప్పగించి కన్నుమూసింది. శత్రువుల నుంచి అతడికి ఎలాంటి ఆపదా రాకూడదని రాణిగారికిచ్చిన మాట కారణంగా, ఆ రాజ్యం వదిలి వచ్చినా, ఇన్నాళ్ళు ఆ రహస్యాన్ని విశాలుడికి కూడా చెప్పలేదు. ఇకపై అతడి రక్షణాభారం మీదే,'' అన్నది అవ్వ. "ఏమిటీ! విశాలుడు గురుకులంలో నా సహాధ్యాయి అయిన గుర్రంకొండ రాజు భూపాలుడి కుమారుడా?" అంటూ సంభ్రమాశ్చర్యాలకు లోనైన రాజు, కుమార్తె కేసి తిరిగి, "వైజయంతీ, ఎంత మంచివాడైనప్పటికీ, ఒక సామాన్య శిల్పికిచ్చి వివాహం చేయడమా అన్న సందిగ్థంలో పడి వెనుకాడాను. ఇప్పుడతడు సకల సద్గుణ సంపన్నుడైన నా బాల్యమిత్రుడి కుమారుడని తెలిసిపోయింది. ఇంకేం. నిరభ్యంతరంగా నీకు నచ్చిన విశాలుణ్ణి పరిణయమాడవచ్చు," అన్నాడు. వైజయంతి ఆప్యాయంగా తండ్రిని చూస్తూ మందహాసం చేసింది.

మాయదారి జబ్బు (చందమామ కథ)

సారంగపట్నంలో ఆనందాచారికి ఒక పెద్ద బంగారు నగల దుకాణం ఉన్నది. ఆ దుకాణం ఆయనకు తాత తండ్రుల నుంచి సంక్రమించిన ఆస్తి కాదు. ఆయన కష్టార్జితం. ఆయన చిన్నవయసులోనే తల్లిదండ్రులు చనిపోతే, జీవనోపాధికి ఒక నగల దుకాణంలో పనికి కుదిరాడు. నిజాయితీగా కష్టపడి పనిచేస్తూ యజమాని విశ్వాసానికి పాత్రుడయ్యాడు. పదేళ్ళపాటు తన యజమాని మాట్లాడే విధానం, పనిలోని మెళకువలు అన్నీ ఆకళింపు చేసుకున్నాడు. ఆ తరవాత బయటికి వచ్చి, అంతవరకు పొదుపు చేసిన డబ్బుతో, స్వర్ణకారుల సహకారంతో పట్నంలో చిన్న నగల దుకాణం పెట్టాడు. ఆ దుకాణం దినదినాభివృద్ధి చెంది, ఐదు సంవత్సరాలలో ఆ పట్నంలోనే నాణ్యమైన దుకాణంగా పేరు తెచ్చుకున్నది. ఆనందాచారికి బాగా ఉన్న ఇంటి అమ్మాయి నాగావళి భార్యగా వచ్చింది. తోడుగా బోలెడంత ఆస్తి తెచ్చింది. దాంతో పనివాళ్ళ మీద పెత్తనం కూడా చలాయించసాగింది. డబ్బును బంగారు నాణాలుగా మార్చి రహస్యంగా దాచడం మొదలుపెట్టింది. భర్త అంటే ప్రేమ ఉన్నప్పటికీ, ధనం మీది పేరాశ కొద్దీ భర్తను ఓ క్షణం పాటు ఇంటి పట్టున ఉండనిచ్చేది కాదు. సూర్యోదయం ముందే నిద్రలేపి, స్నానపానాదులు, పూజ పూర్తిచేయించి దుకాణానికి పంపేది. మధ్యాహ్న భోజనానికి కూడా ఇంటికి రానివ్వకుండా, దుకాణానికే భోజనం పంపేది. ‘‘ఈ కాలంలో ఎవరినీ నమ్మడానికి లేదండీ. అందరివీ దొంగ బుద్ధులు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. రేపు మనకేదైనా అయితే ఎవరు ఆదుకుంటారు? పనివాళ్ళ మీద ఎప్పుడూ ఒక కన్ను వేసి ఉంచండి,'' అంటూ భర్తకు పొద్దస్తమానం బాలపాఠాలు చెబుతూ ఉండేది. వ్యాపారం పట్ల భార్యకున్న శ్రద్ధను చూసి మొదట ఆనందాచారి సంతోషించినప్పటికీ, రోజులు గడిచే కొద్దీ ఆమె పోరు వెగటు పుట్టించసాగింది. భార్యతో ఆ మాట చెప్పలేక మౌనంగా భరించసాగాడు. మరికొన్నాళ్ళకు ఆయనలో ఆనందం, తృప్తి అడుగంటిపోయి చెప్పరాని దిగులు చోటుచేసుకున్నది. దాన్ని గురించి ఆయన ఒకనాడు భార్యతో ప్రస్తావిస్తే, ‘‘ఇదేంటండీ, ఈ మాయదారి జబ్బు! పట్నంలో ఈ రోజు బ్రహ్మాండంగా వెలుగుతున్న మీరు, అన్నీ పోగొట్టుకున్న అనాథలా దిగులుపడి పోతారెందుకు? అది సరే, నాతో మరో దుకాణం పెట్టిస్తానన్నారు కదా? దాని మాటేమయింది?'' అని మాట మార్చింది నాగావళి. ఆనందాచారి మరేమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాడు. ఇలా ఉండగా ఆ ఊరికి ఒక సాధువు వచ్చి పట్నం పొలిమేరలో భక్తులకు దర్శనమిస్తూ, సమస్యలలో ఉన్నవారికి తగిన సలహాలు ఇస్తున్నాడని అందరూ చెప్పుకోసాగారు. ఒకనాటి సాయంకాలం ఆనందాచారి సాధువు దర్శనానికి వెళ్ళాడు.భక్తులందరూ వెళ్ళి పోయాక ఆనందాచారి సాధువు వద్ద తన బాధను చెప్పుకుని, ‘‘జీవనోపాధికోసం మరో చోట పనిచేసినప్పుడే సంతోషంగా గడిపాను. ఇప్పుడేమో, కావలసినంత ఆస్తి ఉన్నది గాని, అప్పటి ఆనందం, తృప్తి కరువయ్యాయి స్వామీ,'' అన్నాడు విచారంగా. మందహాసంతో అంతావిన్న సాధువు తల పంకిస్తూ, ‘‘జీవితంలో ఎలాగైనా పైకి రావాలనే ఉత్సాహం ఆనాడు నీలో ఉండేది. అదే నీకు ఆనందాన్నిచ్చింది. ప్రస్తుతం అలాంటి లక్ష్యం లేదు. పదిమందికి సాయపడడానికి ప్రయత్నించు. ఆ సాయమేదో నీ దుకాణంలో పనిచేసే వారితో ప్రారంభించు. పదిమందికోసం జీవించడం నేర్చుకుంటే, మునుపటి ఆనందాన్ని మించిన జీవనమాధుర్యం నీకు తెలియవస్తుంది,'' అన్నాడు. ‘‘నా భార్య అందుకు సమ్మతించాలికదా. ఆమెకు ధనవ్యామోహం ఎక్కువ,'' అన్నాడు ఆనందాచారి కాస్త సంకోచంగా. ‘‘ధనం కన్నా విలువైనవి జీవితంలో చాలా ఉన్నాయని నీ భార్యకు అనుభవ పూర్వకంగా నువ్వే తెలియజేయాలి. తెలివిగల వ్యాపారివి. ప్రేమగల భార్యలో అంత మాత్రం మార్పు తీసుకు రావడం ఆలోచిస్తే కష్టం కాదనుకుంటాను,'' అన్నాడు సాధువు మళ్ళీ నర్మగర్భంగా నవ్వుతూ. ‘‘చిత్తం స్వామీ,'' అంటూ ఆలోచనతో లేచి నమస్కరించిన ఆనందాచారికి విభూతి ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించాడు సాధువు. ఆ రోజు రాత్రి పడుకున్న ఆనందాచారి మంచం మీది నుంచి లేవలేదు. నాగావళి కంగారుతో వైద్యులను పిలిపించింది. పరీక్షలు చేసి చూసిన వైద్యులు ఆయనకు ఫలానా వ్యాధి అని నిర్థారించలేక పోయారు. దూర ప్రాంతాల నుంచి పేరు మోసిన వైద్యులను పిలిపించింది. అయినా ఫలితం కనిపించలేదు. ఆనందాచారి అన్నం తినడానికి బుద్ధికాలేదంటూ ఏవో నాలుగు మెతుకులు తినేవాడు. భర్త నీరసించి పోవడంతో నాగావళికి భయం పట్టుకున్నది. భర్త ఆరోగ్యం బాగుపడాలని భక్తిశ్రద్ధలతో పూజలు ప్రారంభించింది. దేవుళ్ళందరికీ మొక్కుకున్నది. అయినా ఆనందాచారిలో ఎలాంటి మార్పూ కనిపించలేదు. ఈ స్థితిలో భర్తను వదిలి వెళ్ళడానికి మనసురాక ఆమె దుకాణంకేసి వెళ్ళడం మానేసింది. ఇలా ఉండగా కొన్నాళ్ళకు నాగావళి చినతాతయ్య ఆమెను చూడడానికి వచ్చి, ‘‘ఆలుమగలు మూడు నెలల పాటు తీర్థయాత్ర చేసిరండి. శుభం జరుగుతుంది,'' అన్నాడు. ఆ స్థితిలో ఉన్న భర్తను తీర్థయాత్రలకు ఎలా తీసుకువెళ్ళడమా అని నాగావళి మొదట వెనుకాడింది. కాని తాతయ్య మాట మీది గురితో ఒక నౌకరును తోడు చేసుకుని వెళ్ళాలని నిశ్చయించింది. అన్నాళ్ళు వ్యాపారమే సర్వస్వం అనుకున్న ఆమె, నగల దుకాణాన్ని పనివాళ్ళకు అప్పగించి తీర్థయాత్రలకు బయలుదేరింది. మూడు నెలల తీర్థ యాత్రలో ఆమె బయటి ప్రపంచాన్ని, రకరకాల మనుషులను చూసింది. దేవాలయాలలో జరిగే ప్రవచనాలను విన్నది. భర్త ఆరోగ్యం మెరుగవడంతో పాటు, ఆమె మనసు పరిపక్వం చెందింది. ఇంటికి తిరిగి వచ్చిన ఆమె దుకాణంలో ఎలాంటి ఇబ్బందులూ, పొరబాట్లూ లేకుండా వ్యాపారం మరింత బాగా జరగడం చూసి పరమానందం చెందింది. ఒకనాడు నాగావళి భర్తతో, ‘‘మన నగల దుకాణం చూసుకుంటూన్న బసవయ్య సమయానికి దేవుడిలా ఆదుకున్నాడండీ. అలాగే మన దగ్గర పనిచేసే వాళ్ళందరూ, మనం దుకాణానికి వెళ్ళకున్నా, దానిని సక్రమంగా నడుపుతున్నారు. వాళ్ళ కేదైనా సాయం చేయాలండీ,'' అన్నది నెమ్మదిగా పాలలోటా అందిస్తూ. ‘‘నాగావళీ,'' అంటూ ఆనందాచారి ఆశ్చర్యపోయాడు. ‘‘మనకు కావలసినంత ధనం ఉంది. ఇక కావలసింది మంచి పేరు, దయాగుణం. మీకున్నది మాయదారి జబ్బు అనుకున్నాను. కానే కాదు. ధనవ్యామోహం అనే మాయదారి జబ్బు నాది,'' అన్న భార్య మాటలు విన్న ఆనందాచారి కళ్ళు మెరిశాయి. మనసులోని దిగులు పటాపంచలైపోయింది. ‘‘మనం బావుండాలి. మనతోపాటు మనల్ని నమ్ముకున్న వాళ్ళూ, మన చుట్టూ వున్న వాళ్ళూ సుఖంగా ఉండాలి,'' అంటూ నవ్వాడు ఆనందాచారి. చాలా రోజులకు భర్త నవ్వు ముఖం చూసిన నాగావళి కళ్ళ నుంచి ఆనందబాష్పాలు రాలాయి. కానీ ఆమెలో ఈ మార్పు తీసుకురావడానికి తాను ఆకలి దహిస్తున్నా నాలుగు మెతుకులే తింటూ మనిషి సగమైపోయిన రహస్యం, బయట పొక్కనివ్వకూడదనుకున్నాడు ఆనందాచారి లేచి కూర్చుంటూ.

అనుభవం నేర్పిన పాఠం (చందమామ కథ)

ఒకప్పుడు కొరియా దేశాన్నేలే రాజుకు ఇద్దరు కుమారులు. రెండవ కుమారుణ్ణి, తనకు పిల్లలు లేరని అతడి మేనమామ దత్తు తీసుకున్నాడు. అయితే, పదేళ్ళ తరవాత, రాజుగారి పెద్ద కుమారుడు ప్రపంచాన్ని త్యజించి, సన్యాసం స్వీకరించి ఇల్లువిడిచి వెళ్ళిపోయాడు. రెండవ కుమారుణ్ణి దత్తు తీసుకున్న మేనమామకు కొడుకు పుట్టాడు. దాంతో, దత్త కుమారుడి పట్ల ప్రేమ తగ్గడంతో, అతడు సొంత తండ్రి అయిన రాజు వద్దకు తిరిగి వచ్చేశాడు. దత్తత పేరుతో తనను ఇంటి నుంచి వేరు చేయడం; ఆ తరవాత అక్కడ వద్దనుకుని సొంత ఇంటికి పంపడం ఇదంతా రాజుగారి రెండవ కుమారుడికి సుతరామూ నచ్చినట్టు లేదు. అందువల్ల అతడు ఎప్పుడూ విచారంగా కనిపించేవాడు. ఎవరితోనూ మాట్లాడేవాడు కాడు. చివరకు చదువుసంధ్యల పట్ల కూడా శ్రద్ధాసక్తులు కనబరచేవాడుకాడు. అతణ్ణి విద్యావంతుణ్ణి చేయడానికి రాజు ఎందరో పండితులను నియమించాడు. అయినా ఒక్కరూ అతనికి అక్షరం ముక్క నేర్పలేక పోయారు. ఇది రాజుకు ఎంతో విచారం కలిగించింది. దీనినంతా గమనించిన మంత్రి ఒకనాడు రాజుతో, ‘‘యువరాజునేదో దుష్టశక్తి ఆవహించినట్టున్నది ప్రభూ,'' అన్నాడు. ‘‘మరి, దానిని తరమగొట్టడం ఎలా?'' అని అడిగాడు రాజు. ‘‘ఒక సాధుపుంగవుడు మన పట్టణానికి సమీపంలో ప్రవహించే నదీ తీరంలోని కొండ పాదతలం వద్ద ఉంటున్నాడు. మీరు స్వయంగా వెళ్ళి దర్శిస్తే, యువరాజును ఆవహించిన దుష్టశక్తిని వదలగొట్టే మార్గం ఆయన చూపగలడనుకుంటాను,'' అన్నాడు మంత్రి. రాజు గుర్రం మీద ఒంటరిగా సాధువు కుటీరం వద్దకు వెళ్ళి, ఆయనకు శిరసువంచి నమస్కరించి, తను ఎవరైనదీ విన్నవించాడు. ‘‘నాలాంటి పేద ప్రజలకు రాజు ఏదైనా సాయపడగలడుగాని, రాజుకు నేనేం చేయగలను?'' అని అడిగాడు సాధువు. ‘‘మహాత్మా! నేనిప్పుడు నిరుపేదగా, దీనుడిగా తమ ముందు మోకరిల్లి వేడుకుంటున్నాను,'' అంటూ రాజు తన సమస్యను సాధువుకు వివరించాడు. సాధువు తలపంకించి కళ్ళు మూసుకున్నాడు. కాస్సేపటికి కళ్ళు తెరిచి, ‘‘సరే, నీ కుమారుణ్ణి విద్యావంతుణ్ణి చేయడానికి నేను సాయపడగలను. అయితే, అంతకు ముందు నువ్వు ఒక పనిచెయ్యాలి,'' అన్నాడు. ‘‘ఏమిటి మహాత్మా, ఆజ్ఞాపించండి,'' అన్నాడు రాజు ఆతృతగా.‘‘పులి మెలకువతో ఉన్నప్పుడు నువ్వే స్వయంగా వెళ్ళి, దాని మీసాలు కత్తిరించి తీసుకువచ్చి నాకివ్వాలి,'' అన్నాడు సాధువు. ‘‘పులి మీసాలా? మానవ మాత్రులకు ఇది అసాధ్యం అన్న సంగతి తమకు తెలియనిదా, మహాత్మా,'' అన్నాడు రాజు దీనస్వరంతో. ‘‘మానవ స్వభావాన్ని మార్చడం కన్నా అసాధ్యమైనదేమీ కాదు,'' అన్న సాధువు మందహాసం చేస్తూ, ‘‘వెళ్ళు నాయనా! వెళ్ళి ప్రయత్నించు. సాధనతో సాధించలేనిది ఏదీ లేదు,'' అంటూ లేచి వాహ్యాళికి బయలుదేరాడు. రాజు బరువెక్కిన మనసుతో తీవ్రంగా ఆలోచిస్తూ, రాజభవనానికి తిరిగి వచ్చాడు. రాజోద్యానంలో పక్షులూ, జంతువులతో పాటు, బోనులో ఒక పులిని కూడా పెంచుతున్నారు. పులి రక్షణను చూసే భటుణ్ణి, దాన్ని తాకడానికి వీలవుతుందా అని అడిగాడు రాజు. ‘‘ప్రభూ, ఆ పులి చాలా దుర్మార్గమైనది. బయటినుంచే ఆహారాన్ని బోనులోకి విసుతాను తప్ప, దాన్ని సమీపించడానికి ఇంత వరకు సాహసించలేదు,'' అన్నాడు భటుడు. అయినా సాధువు చెప్పిన మాటలు రాజు మనసులో మళ్ళీ మళ్ళీ కదలాడసాగాయి. తెగువతో ఆయన ముందడుగు వేశాడు. ఆ రోజు సాయంకాలం రాజే స్వయంగా పులికి ఆహారం తీసుకుని బోనులోపలికి విసిరి, పక్కనే నిలబడ్డాడు. పులి కళ్ళురుముతూ, మాంసం ముక్కలను తిని, తర్వాత రాజు కేసి మెచ్చుకోలుగా చూసింది. రాజు రెండు వారాల పాటు అలాగే చేస్తూ వచ్చాడు. ఆ తరవాత, మాంసాన్ని బోనులోకి విసరకుండా, చేత్తో పట్టుకుని పులి కోసం అలాగే నిలబడ్డాడు. పులి తొలుత ఆయన కేసి అనుమానంగా చూసినప్పటికీ, రాజు పళ్ళెంలో పట్టుకుని ఉన్న మాంసం ముక్కలను, బోనులోవున్న చిన్న కన్నం గుండా తీసుకుని తినసాగింది. రాజు ఇలాగే కొన్ని రోజులు కొనసాగించాడు. ఒకనాడు తినడం ముగించిన పులి, రాజు చేతిని నాలుకతో తాకింది. అది తన పట్ల ఆప్యాయత కనబరుస్తున్నదని రాజు గ్రహించాడు. ఒకనాడు రాజు తన చేత్తో పులి తలను నెమ్మదిగా నిమిరాడు. తన పట్ల రాజు కనబరుస్తూన్న శ్రద్ధకు పులి సంతోషించినట్టు ఆయన గ్రహించాడు. ఇలా మరో నెలరోజులు గడిచాయి. ఇలా పులిని ఆప్యాయంగా నిమురుతున్నప్పుడు రాజు, దాంతో ప్రీతిగా మాట్లాడేవాడు. అది ఆయన పట్ల ఎంతో విశ్వాసాన్నీ, ఆప్యాయతనూ కనబరచసాగింది. ఒకనాడు రాజు అలా ఆప్యాయంగా మాట్లాడుతూ, పులి తల నిమురుతూ, చిన్న కత్తెరతో దాని మీసాలలో రెండు కేశాలు కత్తిరించాడు. పులి దాన్నేమాత్రం పట్టించుకోలేదు. రాజు పరమానందం చెందాడు. పట్టరాని ఉత్సాహంతో గురమ్రెక్కి, సాధువు వద్దకు వెళ్ళి పులి మీసాలను ఆయన చేతిలో ఉంచాడు. సాధువు సంతోషంతో తల పంకించాడు. కాని, ఆయన పులి మీసాలను మండుతూన్న మంటలో పడవేయడం చూసి రాజు విస్తుపోయాడు. ‘‘రాజా, నీ కుమారుణ్ణి ఎలా మచ్చిక చేసి పెంచాలో నీకిప్పుడు తెలిసింది కదా? పులి కన్న భయంకరుడూ, అపాయకరమైన మానవ కుమారుడు ఉండడు కదా? నీ కుమారుణ్ణి ఏ ఉపాధ్యాయుడికో అప్పగించే ముందు, నువ్వు అతినితో ప్రేమతో మాట్లాడు. కథలు వినిపించు. మొదట పులిని ఎలా మచ్చిక చేసుకున్నావో, నీ కుమారుణ్ణీ అలా మచ్చిక చేసుకో. ఆ తరవాతే అతన్ని గురువుల సాయం అర్థించేలా ప్రేరేపించి ప్రోత్సహించు. పులి మీసాల కోసం అచంచలమైన విశ్వాసంతో, దృఢ నిర్ణయంతో ఎలా ప్రయత్నించావో ఇప్పుడూ అలాగే ప్రయత్నించు. తప్పక విజయం సాధించగలవు,'' అంటూ సాధువు ఎప్పటిలాగే వాహ్యాళికి బయలుదేరాడు. రాజభవనానికి తిరిగి వచ్చిన రాజు, తన నూతన అనుభవజ్ఞానాన్ని ఆచరణలో పెట్టాడు. రాజు కుమారుడి పట్ల చూపిన ప్రేమాదరాలకారణంగా, అతడిలో క్రమంగా మార్పు రాసాగింది. తన మనసును అర్థం చేసుకుని, తన మీద అపార ప్రేమను కనబరచే శ్రేయోభిలాషిగా తండ్రిని అతడు గుర్తించాడు. ఎలాంటి విద్యనైనా నేర్చుకోవడానికి సిద్ధమైన వివేక సంపన్నుడైన యువకుడిగా తయారైన తన కుమారుణ్ణి చూసి రాజు పుత్రోత్సాహంతో పొంగి పోయాడు. ‘‘నేను మొదట నేర్చుకోవలసింది నేర్చుకున్నాకే, బిడ్డకు కావలసింది నేర్పగలిగాను,'' అన్నాడు రాజు తనలాగే ఆనందిస్తూన్న మంత్రితో ఎంతో ఆనందంగా.

అదృష్టవంతుడు (చందమామ కథ)

ఒక ఊళ్ళో శివనాధుడనే యువకుడు ఉండేవాడు. వాడు చాలా అల్లరివాడు. అందుచేత వాడంటే ఊళ్ళో ఎవరికీ పడేదికాదు. వాడికి చదువు అంటలేదు. ఒకసారి ఒక గొప్ప జ్యోతిష్కుడు వచ్చి, ఊరి మధ్యన గల మర్రిచెట్టు కింద మకాం పెట్టాడు. తన భవిష్యత్తు ఎలా ఉండేదీ తెలుసుకుందామని శివనాధుడు కూడా వచ్చి జ్యోతిష్కుడికి తన చెయ్యి చూపించాడు. జ్యోతిష్కుడు శివనాధుడి చెయ్యి చూసి తటాలున వదిలేసి నా జీవితంలో ఇంత అదృష్టవంతుడి చెయ్యి చూడలేదు. త్వరలోనే నువ్వు మట్టి పట్టుకుంటే బంగారమవుతుంది. చాలా గొప్పవాడివవుతావు  అన్నాడు. ఈ మాటలు శివనాధుడే నమ్మలేక పోయాడు. ఊళ్ళో వాళ్ళు నవ్వేశారు. అది చూసి జ్యోతిష్కుడు శాస్ర్తం అబద్ధం చెప్పదు. అదృష్టం తన్నుకువస్తే, చేసిన నేరమే వరం కావచ్చు అన్నాడు. ఊళ్ళో వాళ్ళు తనను పరిహాసం చేసినందుకు శివనాధుడు ఎలాగైనా గొప్పవాడు కావటానికి తీర్మానించుకున్నాడు. కాని గొప్పవాడు అయ్యే మార్గం వాడికి తెలీదు. ముందు కాస్త డబ్బు సంపాదిస్తే గొప్పతనం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అని ఎరిగినవాడు ఒకడు అన్నాడు. కాని డబ్బు సంపాదించే మార్గం కూడా శివనాధుడికి తెలీదు. అతడికి పనిపాటలు రావు, చదువు లేదు. ఉన్న ఊళ్ళో తనపై ఎవరికీ సదభిప్రాయంలేదు గనక ముందు ఊరు విడిచి పెట్టటం వాడికి అవసరం అనిపించింది. వాడు ఊరు దాటి అడవిలో ప్రవేశించి చాలా దూరం నడిచాడు. ఒక చోట ఒక చెట్టు కింద ఒక మనిషి పడుకుని నిద్రపోతూ వాడికి కనిపించాడు. ఆ నిద్రపోయే మనిషి పక్కన ఒక పెద్ద కత్తీ, ఒక మూటా ఉన్నాయి. శివనాధుడు ఆ మూట విప్పి చూశాడు. దాని నిండా బంగారు నాణాలు కనబడ్డాయి. శివనాధుడికి జ్యోతిష్కుడి మాటలు జ్ఞాపకం వచ్చాయి. వాడు సందేహించకుండా, ఆ మూటనూ  కత్తినీ తీసుకుని, కాలిసత్తువ కొద్దీ పరిగెత్తసాగాడు. ఇంతలోనే చెట్టు కింద నిద్రపోతున్న వాడు లేచి, జరిగిన సంగతి గ్రహించి పెద్దగా అరుస్తూ శివనాధుణ్ణి తరుముకుంటూ వచ్చాడు. శివనాధుడు వెనక్కు తిరిగి చూసి ఇక ఆ మనిషికి అందకుండా పారిపోలేమని గ్రహించి నిలబడ్డాడు. ఇంతలో ఆ మనిషి దగ్గిరికి రానే వచ్చాడు. శివనాధుడు తన వద్ద ఉన్న కత్తితో అతణ్ణి ఒక్క పోటు పొడిచాడు. ఆ మనిషి పెద్ద కేక పెట్టి కూలిపోయాడు. ఆ మనిషి కొద్దిసేపు కాళ్ళూ  చేతులూ కొట్టుకుని ప్రాణం వదలటం శివనాధుడు చూసి, కొయ్యబారి పోయాడు. తాను దొంగతనమే గాక హత్య కూడా చేశాడు. ఏమైనా వాడు తనకు చిక్కిన బంగారాన్ని మాత్రం వదలదలుచుకోలేదు. ఆ శవం దగ్గిర నుంచి సాధ్యమైనంత వేగంగా ముందుకు సాగిపోయి మరొక గంటకల్లా అడవిదాటి ఒక ఊరు చేరాడు. ఆ ఊళ్ళో వాడికి ఎదురైన మొట్టమొదటి మనిషి నీ అంగీనిండా ఆ రక్తం ఏమిటి?'' అని అడిగాడు. అంత దాకా తన అంగీ మీద రక్తం మరకలున్నట్టు ఎరగని శివనాధుడు తడువుకోకుండా వడో దొంగ నా సొమ్ము కాజెయ్యాలని చూశాడు. కత్తితో పొడిచాను అని బొంకాడు. క్షణంలో ఈ వార్త ఊరంతా పొక్కింది. పదిమంది చేరి శివనాధుడు చెప్పిన చోటికి వెళ్ళారు. చచ్చిపోయిన వాడు   కాలయముడు అని పేరు మోసిన గజదొంగ! వాణ్ణి చంపిన వారికి పదివేల వరహాలు బహుమానం ఇస్తానని కూడా రాజు ప్రకటించి ఉన్నాడు. ఈ సంగతి ప్రజలు శివనాధుడికి చెప్పి జయ జయ ధ్వానాలతో తమ గ్రామానికి తీసుకు వచ్చారు. అతనికి ఒక ఊరంటూ లేదని తెలుసుకుని, వాళ్ళు అతన్ని తమ గ్రామంలోనే ఉండి పొమ్మన్నారు. అనేక ఇళ్ళుగల సంపన్నుడు ఒకాయన శివనాధుడికి ఒక చిన్న ఇంటిని ఉచితంగా ఇచ్చేశాడు. త్వరలోనే అతనికి రాజుగారి బహుమతి కూడా అందింది. ఇప్పుడు శివనాధుడి దగ్గిర మూలధనం చాలా ఉన్నది. కాని గొప్పవాడు కావటానికి అది చాలదు. ఇంకా ధనం సంపాదించటానికి అతను వ్యాపారం చేయదలచుకుని, కొన్ని గేదెలను కొని పాలవ్యాపారం ప్రారంభించాడు. అధిక లాభాల కోసం అతను పాలలో నీళ్ళు కలిపి అమ్మసాగాడు. అయితే ఈ వ్యాపారానికి ఒక చిన్న అంతరాయం వచ్చింది. అదేమంటే శివనాధుడు ఉండే ఊరికి నీటి సౌకర్యం లేదు. గ్రామస్థులకు దూరాన ఉండే ఏరే ఆధారం. చాలా మంది ఏటికి వెళ్ళి నీరు తెచ్చుకుంటారు. తెచ్చుకోలేని వాళ్ళు హెచ్చుకూలీ ఇచ్చి నీరు తెప్పించుకుంటారు. శివనాధుడి పాలవ్యాపారం పెరిగిన కొద్దీ నీరు హెచ్చుగా కావలసి వచ్చింది. హెచ్చుకూలీ ఇచ్చి నీరు కొని పాలలో కలిపితే లాభం తరిగిపోతుంది. అందుచేత శివనాధుడు తన దొడ్లోనే ఒక బావి తవ్వించాలనుకున్నాడు. ఈ పని రహస్యంగా జరగాలి గనక  అతను పొరుగూరి నుంచి కూలీలను రప్పించి, బావి తవ్వించాడు. అతని అదృష్టం ఇందులో కూడా బయట పడింది. ఆ ఊరిలో ఎవరు బావి తవ్వించినా ఎన్నడూ నీరు పడలేదు, కాని శివనాధుడికి పది అడుగుల లోతునే తియ్యని నీరు పడింది. బావి తవ్వకం పూర్తికాగానే అతను కూలీలను రహస్యంగా పంపేశాడు. అయినా శివనాధుడు అమ్మే పాలను గురించి గ్రామస్థులకు అనుమానం కలిగింది. అది బర్రెల తీరు అని అతను అంటే వాళ్ళు నిజమే కాబోలు ననుకున్నారు. కాని అతని పాలు ఏమాత్రమూ బాగుండటం లేదు. శివనాధుడి పోటీకి తట్టుకోలేక  లోగడ ఆ గ్రామంలో పాలవ్యాపారం చేసినవారంతా ఊరు విడిచి వెళ్ళిపోయారు. అందుచేత ఇప్పుడు ఊరి వాళ్ళకు శివనాధుడు తప్ప మరోగతిలేదు. ఈ పరిస్థితిలో  ఊళ్ళో ఉండే రాముడు అనే ఒక యువకుడు రాజుగారి దగ్గిరికి వెళ్ళి, శివనాధుడి మీద ఫిర్యాదు చేస్తూ, శివనాధుడు చాలా పలుకుబడి గలవాడనీ, దర్యాప్తు వీలయినంత రహస్యంగా జరపమనీ వేడుకున్నాడు. రాజుగారి గూఢచారి ఒకడు శివనాధుడి మోసం కనిపెట్టాడు. శివనాధుణ్ణి పట్టి తెప్పించి, న్యాయస్థానంలో నిలబెట్టి  నువ్వు పాలవ్యాపారంలో దారుణమైన కల్తీ చేస్తున్నట్టు రుజువయింది. దీనికి నీ సంజాయిషీ ఏమిటి? అని రాజు అడిగాడు.  నేను చేసిన కల్తీ ఏమిటో సెలవియ్యండి అన్నాడు శివనాధుడు. నువ్వు పాలలో నీళ్ళు కలిపావు అన్నాడు రాజు. నేను పాలలో నీళ్ళు కలపలేదు, నీళ్ళలోనే పాలుకలిపాను. కావలిస్తే తెప్పించి చూడండి. నేను అమ్మే నీళ్ళలో పాల కన్న నీళ్ళే ఎక్కువ  అన్నాడు శివనాధుడు. న్యాయస్థానంలో అందరూ గొల్లుమన్నారు. అది మరింత అక్రమం అన్నాడు రాజు కోపంగా. నేను నీళ్ళవ్యాపారినే గాని, పాలవ్యాపారిని కాను. మా ఊరిప్రజల ప్రధాన అవసరం నీరు. దాని కోసం ఎంతో డబ్బుఖర్చు పెడుతున్నారు అన్నాడు శివనాధుడు. అతను ఇలా అనగానే ఆ వూరి గ్రామపెద్ద రాజుతో ఆ మాట నిజమే, మహారాజా  శివనాధుడు సామాన్యుడు కాడు. కాలయముడి బారి నుంచి మమ్మల్ని కాపాడిన మహానుభావుడు! అటువంటి వాడు కల్తీ వ్యాపారానికి దిగుతాడంటే నమ్మశక్యం కాదు. మా ఊరి నీటి ఎద్దడి గురించి మీకు తెలిసి రాగలందులకు ఇలాచేశాడని తోస్తుంది అన్నాడు. ఈ మాట విని రాజు మండిపడి, ‘అయితే, ఇంత కాలమూ మీరు ఏం చేస్తున్నారు? నాకు విజ్ఞప్తి ఎందుకు చేసుకోలేదు  అని అడిగాడు. చాలా విజ్ఞాపనలు చేసుకున్నాం. మహారాజా, కాని మీ అధికారులకు ప్రజల నేరాలను విచారించటంలో ఉన్న ఆసక్తి, ప్రజల విన్నపాలను పరిశీలించటంలో లేదు అన్నాడు గ్రామాధికారి. రాజు శివనాధుణ్ణి వెంటనే విడుదల చేసి, అతనికి అభినందనలూ, బహుమతులూ ఇచ్చాడు. తరవాత నది నుంచి, శివనాధుడు ఉండే ఊరి మీదుగా ఒక కాలువ తవ్వించాడు. శివనాధుడి దయవల్లనే తమకు ఆ కాలువ వచ్చిందని ఊరి వాళ్ళంతా అనుకున్నారు. శివనాధుడు కీర్తి ప్రతిష్ఠలతో బాటు కోట్లకొద్దీ ధనం ఆర్జించి, పెళ్ళి చేసుకుని, వక్రమార్గాలు వదిలిపెట్టి, సుఖంగా జీవించాడు.

సత్రం యజమాని పేరాశ (చందమామ కథ)

పాండ్యరాజులు పాలించే కాలంలో మధుర సంపదలతో తులతూగే నగరంగా ప్రసిద్ధిగాంచింది. ఆ కాలంలో చిన్నసామి అనే వీధులు ఊడ్చేవాడు ఉండేవాడు. వేకువ జామునే లేచి రాజు దైవదర్శనానికి వచ్చే మార్గాన్ని శుభ్రంగా చిమ్మడం వాడి పని. రాజు జోడు గుర్రాల బంగారు రథంలో దేవాలయానికి వచ్చేవాడు. ఆయనకు ముందు ఇద్దరు అంగరక్షకులు గుర్రాలపై వచ్చి మార్గాన్ని పరిశీలించేవారు. ఒకనాడు చిన్నసామి తనను దాటి వెళుతూన్న రాజుగారి అంగరక్షకులను పరిశీలనగా చూశాడు. వాళ్ళు ఎరట్రి ఉడుపులు ధరించి, పట్టు తల పాగాలను పెట్టుకుని ఉన్నారు. తను కూడా రాజుగారి అంగరక్షకుడయితే ఎంత బావుణ్ణు అనుకున్నాడు చిన్నసామి. ఆరోజు పనిని ముగించుకుని చిన్నసామి ఇంటికి చేరాడు. కాళ్ళు చేతులు కడుక్కుని నులక మంచం మీద నడుంవాల్చాడు. అంతలో భార్య తంగమ్మ వాడికి తాగడానికి మజ్జిగ తెచ్చి ఇచ్చింది. రాజుగారి అంగరక్షకులు ఎక్కివచ్చే గుర్రాలు చాలా బావున్నాయి. అలాంటి గుర్రం ఒకటి నాకూ వుంటే బావుంటుంది కదా అన్నాడు చిన్నసామి. అంగరక్షకుల గుర్రాలా? అసలు నీకు గుర్రం ఎక్కి స్వారీ చేయడం చేతనవునా?'అన్నది తంగమ్మ. నేను భయం లేకుండా గురప్రు స్వారీ చేయగలను. ఒకరోజు చేసి చూపిస్తాను చూడు అన్నాడు వాడు రోషంగా. ‘మరుపూట తినడానికి తిండిలేనివాళ్ళం. గుర్రాల సంగతి మనకెందుకు? ఇంటికప్పు ఎగిరిపోయింది. వర్షాకాలం వచ్చేలోగా సరి చేసుకోవాలి. నువ్వు అడవిలోని కొండ మీదికి వెళ్ళి  కొండదేవుణ్ణి ప్రార్థించి, మన ఇంటికప్పు సరిచేసుకోవడానికి కావలసిన డబ్బు తేవచ్చు కదా? నేను ఇప్పుడు జమీందారు ఇంటికి వెళుతున్నాను. ఈ రోజు జమీందారు మనవడికి పుట్టినరోజు. అక్కడ బోలెడు పనులున్నాయి. ఎక్కువ డబ్బుతో పాటు మనిద్దరికీ మంచి భోజనం కూడా దొరకవచ్చు,'' అన్నది తంగమ్మ. ‘‘నువ్వు చెప్పావుగా. నేనిప్పుడే కొండకు బయలుదేరుతున్నాను,'' అంటూ అప్పటి కప్పుడే బయలుదేరాడు చిన్నసామి. ‘‘తంగం నా మాట నమ్మడం లేదుగాని, ఏది ఏమైనా సరే ఇవాళ నేను అడవిలోని కొండమీదికి వెళ్ళి తీరతాను. అక్కడ దేవుడు కనిపించనీ, కనిపించకపోనీ,'' అనుకుంటూ వేగంగా అడుగులు ముందుకు వేస్తూ, చిన్నసామి ఒకసారి వెనక్కు తిరిగి చూశాడు. గోడకు ఆనించిన పొడవాటి చీపురుకట్ట కనిపించడంతో, తెల్లవారేలాగా తాను తిరిగి వచ్చి రాజు వచ్చే లోగా ఆలయ మార్గాన్ని చిమ్మాలన్న విషయం వాడికి గుర్తుకు వచ్చింది. వేగ వేగంగా నడిచి వెళ్ళి అడవి ప్రాంతంలోని నల్లటి కొండను సమీపించాడు. అతి కష్టం మీద కొండను ఎక్కసాగాడు. కొంత దూరం పైకి వెళ్ళాక ఒక గుహ కనిపించింది. కాళ్ళు నొప్పి పుట్టడంతో, గూహ ఎదుట చతికిలబడ్డాడు. తలకు చుట్టుకున్న తువ్వాలును విప్పి, తలకింద పెట్టుకుని అలసటతో కొంతసేపటికి అలాగే నిద్రపోయాడు. కలలో ఎవరో, ‘‘చిన్నసామీ! లేలే!'' అని తట్టి లేపినట్టయి, లేచి కూర్చున్నాడు. కళ్ళు నులుము కుంటూ చుట్టుపక్కల కలయచూశాడు. ఎవరూ కనిపించలేదు. ‘‘చిన్నసామీ! నువ్వు కొండదేవుణ్ణి చూడడానికే కదా ఇంత దూరం వచ్చావు. నేనే ‘మలై వాణన్‌' అనే కొండదేవుణ్ణి. నీపక్కనే ఒక శంఖం వుంది చూడు. దాన్ని తీసుకో. నీ కేదైనా కావలసి వచ్చినప్పుడు -ఆహారం, డబ్బు, కొత్త ఇంటి కప్పు, గుర్రాలు ఇలా ఏదైనా సరే, దానిని కోరు కుంటూ ఈ శంఖాన్ని ఊదావంటే అది లభిస్తుంది,'' అన్న కంఠస్వరం వినిపించింది. చిన్నసామి తల తిప్పి చూశాడు. గుహ ముఖ ద్వారంలో తళతళా వెండిలా మెరుస్తూ ఒక శంఖం కనిపించింది. వాడు లేచి వెళ్ళి దానిని తీసుకుని, తువ్వాలులో ముడివేసుకుని తలకు చుట్టుకుని ఇంటి కేసి తిరుగుముఖం పట్టాడు. కొండదిగి అడవీ ప్రాంతాన్ని దాటే సరికి పొద్దుగూక సాగింది. వాడు మరింత వేగంగా నడవ సాగాడు. కొంత సేపటికి నాలుగు వైపులా చీకటి కమ్ముకోసాగింది. దూరంగా మిణుకు మిణుకు మంటూ వెలుతురు కనిపించడంతో అక్కడికి వెళ్ళాడు. అదొక సత్రం. రాత్రి అక్కడే గడపాలను కున్నాడు. సత్రం యజమాని ఒక గదిని చూపి భోజనం తీసుకురావడానికి వెళ్ళాడు. సత్రం యజమానికి డబ్బు చెల్లించాలి కదా? అందువల్ల పది వెండికాసులు కావాలని కోరుకుని చిన్నసామి శంఖాన్ని తీసి మెల్లగా ఊదాడు. సత్రం యజమాని భోజనం తెచ్చి పెడుతూ, ‘‘ఇంతకు ముందు నువ్వేమైనా శంఖం ఊదావా?'' అని అడిగాడు యథాలాపంగా. ‘‘అవును, నేనే ఊదాను,'' అంటూ చిన్న సామి భోజనం పళ్ళెం అందుకున్నాడు. అంతకు ముందే తువ్వాలులో ముడివేసిన శంఖాన్ని చూపుతూ-తను కొండదేవుణ్ణి చూడాలని కొండ మీదికి వెళ్ళిన విషయమూ, కొండ దేవుడు తనకు మాయా శంఖాన్ని ఇచ్చి ఆశీర్వదించిన సంగతీ పూసగుచ్చినట్టు వివరిస్తూ భోజనం ముగించాడు. ఆ విషయం తెలియగానే దురాశాపరుడైన సత్రం యజమాని బుర్ర రకరకాల ఆలోచనలతో వేడెక్కింది. చిన్నసామి గాఢనిద్రలో ఉన్న ప్పుడు పిల్లిలా వాడి గదిలోకి జొరబడి, వాడు తువ్వాలులో దాచిన మాయా శంఖాన్ని తీసుకుని, దాని స్థానంలో అదే పరిమాణంలోని మరొక శంఖాన్ని ముడివేసి గుట్టుచప్పుడు కాకుండా వచ్చేశాడు. తెల్లవారగానే చిన్నసామి బయలుదేరుతూ, సత్రం యజమానికి డబ్బు ఇవ్వబోగా, అతడు తీసుకోకుండా, ‘‘నీలాంటి వ్యక్తులను చూడడమే భాగ్యంగా భావిస్తాను. నువ్వు నాకు ముఖ్యమైన అతిథివి. మరెప్పుడైనా ఈ మార్గంలో వెళ్ళాల్సివస్తే, తప్పకవచ్చి నా ఆతిథ్యం స్వీకరించాలి,'' అంటూ సాగనంపాడు. చిన్నసామి సత్రం యజమానికి కృతజ్ఞతలు చెప్పుకుని, ‘‘ఇంకా నేనెందుకు ఊడ్చే పని చేయాలి. నాకు కావలసినవన్నీ ఈ మాయా శంఖం సమకూరుస్తుందికదా?'' అనుకుంటూ ఇంటికేసి అమితోత్సాహంతో నడవసాగాడు. భార్య తంగమ్మ భర్తను చూడగానే నవ్వుతూ, ‘‘కొండదేవుణ్ణి చూశావా?'' అంటూ దాహానికి నీళ్ళు తేవడానికి ఇంటి లోపలికి వెళ్ళింది. ‘‘నీ భర్త అంటే ఏమనుకున్నావు?'' అంటూ భార్య తెచ్చి ఇచ్చిన నీళ్ళు తాగి, తాను మాయా శంఖాన్ని సంపాదించిన విషయాన్ని గొప్పగా వివరించి, తలపాగా తువ్వాలులో ముడివేసి వుంచిన శంఖాన్ని తీసి చూపాడు. ‘‘ఆహా! ఇది నిజమా! శంఖాన్ని ముందు నేను ఊదుతాను,'' అంటూ తంగమ్మ పట్టరాని సంతోషంతో శంఖాన్ని తీసుకుని, ‘‘మాయా శంఖమా! నాకో బంగారు నాణెం కావాలి!'' అని చెప్పి దాన్ని ఊదింది. అయితే, ఎలాంటి శబ్దమూ రాలేదు. బంగారు నాణెమూ రాలేదు. ‘‘నేను ఊదితే పనిచేయడం లేదు. నువ్వు ప్రయత్నించు,'' అంటూ శంఖాన్ని భర్త చేతికి చ్చింది. చిన్నసామి దాన్ని గట్టిగా ఊదాడు. అయినా ఎలాంటి శబ్దమూ రాలేదు. అటూ ఇటూ తిప్పి ఊదడానికి ప్రయత్నించాడు. కాని ప్రయోజనం లేకపోయింది. ‘‘రాత్రి ఊదితే శబ్దం వచ్చింది. పది వెండి కాసులు కావాలంటే ఇచ్చింది. వాటిని సత్రం యజమాని పుచ్చుకోలేదు. అవి నాదగ్గరే ఉన్నాయి చూడు,'' అంటూ వెండి కాసులను తీసి భార్యకు చూపాడు చిన్నసామి ఆశ్చర్యంతో. ‘‘నువ్వు ఊదిన శంఖం ఇదేనా అని జాగ్రత్తగా చూడు. బహుశా సత్రం యజమాని మాయా శంఖాన్ని దొంగిలించి, దాని స్థానంలో వేరొక దాన్ని పెట్టాడనుకుంటాను,'' అన్నది తంగమ్మ అనుమానంగా. చిన్నసామి శంఖాన్ని మరొక్కసారి పరిశీలనగా చూసి ‘‘అవును, నీ అనుమానం నిజమే అయివుంటుంది.గుహ దగ్గర నాకు లభించిన శంఖం వెండిలా తళతళా మెరుస్తూ కనిపించింది. ఇదేమో మాసిపోయివుంది,'' అన్నాడు. ‘‘రాజుగారు వచ్చేలోగా ఇప్పుడు పనిలోకి వెళ్ళు. సాయంకాలం సత్రానికి వెళ్ళి ఏమీ జరగనట్టు ఒక గది తీసుకో. భోజనం సమయంలో ఇప్పుడు నీ దగ్గరున్న శంఖాన్ని బంగారు నాణాలు ఇచ్చేలా కొండదేవుడు ఆశీర్వదించాడని సత్రం యజమానికి చెప్పు. ఆ తరవాత అతడేం చేస్తాడో చూడు,'' అని సలహా ఇచ్చింది భార్య. చిన్నసామి చీపురును అందుకుని ఆలయం వీధిని చిమ్మడానికి హడావుడిగా వెళ్ళాడు. ఆలయ దర్శనానికి రాజు ఆరోజు కొంత ఆలస్యంగా రావడంతో చిన్నసామి సంతోషించాడు. పని ముగించుకుని సత్రానికి బయలుదేరాడు. సత్రం యజమాని వాణ్ణి ఆశ్చర్యంతో చూశాడు. భోజనం చేస్తూ చిన్నసామి యథాలాపంగా తన వద్ద ఉన్న శంఖాన్ని గురించి ప్రస్తావించి, ‘‘ఈ శంఖాన్ని ఊదితే వెండి కాసులకు బదులు బంగారు నాణేలు రాలే విధంగా కొండదేవుడు ఆశీర్వదించాడు,'' అన్నాడు. ఆ తరవాత సత్రం యజమాని చూపంతా తన తలపాగా తువ్వాలులో ముడి వేసిన శంఖం మీదే ఉండడం చిన్నసామి గ్రహించాడు. భోజనం అయ్యాక, ‘‘బాగా అలిసి పోయాను. వెంటనే పడుకోవాలి!'' అన్నాడు చిన్నసామి ఆవులిస్తూ. వాడు పడుకున్నాడే కాని నిద్ర పోలేదు. నిద్ర పోతున్నట్టు నటించసాగాడు. సత్రం యజమాని అడుగులోఅడుగు వేసుకుంటూ గదిలోకి వచ్చి, చిన్నసామి తువ్వాలులో దాచిన శంఖాన్ని తీసుకుని నిన్న వాడి నుంచి దొంగిలించిన శంఖాన్ని అందులో పెట్టి జాగ్రత్తగా ముడివేసి వెళ్ళిపోయాడు. మాయాశంఖాన్ని భద్రంగా దాచుకుని పడుకున్న చిన్నసామి, తెల్లవారక ముందే లేచి, సత్రం యజమానిని నిద్ర లేపి డబ్బు ఇవ్వబోయాడు. కాని అతడు పుచ్చుకోలేదు. చిన్నసామి ఉత్సాహంగా ఇల్లు చేరుకున్నాడు. ఇంటి పైకప్పు, వెండి, బంగారు కాసులు, అంగ రక్షకుడి ఉద్యోగం ఇలా మాయా శంఖం అడిగిన వన్నీ ఇవ్వడంతో చిన్నసామి, తంగమ్మ దంపతులు సుఖసంతోషాలతో జీవించసాగారు. అక్కడ సత్రం యజమాని బంగారు కాసులు వస్తాయన్న పేరాశతో వెండికాసులు ఇచ్చే శంఖాన్ని చేజేతులా పోగొట్టుకున్నాను కదా అని తన్ను తాను తిట్టుకోసాగాడు. ‘‘ఇకరాడు.... వాడు మాయా శంఖం ఇకపై ఈ దరిదాపులకు రాడు," అంటూ వాపోసాగాడు. అయితే చిన్నసామి ఒకనాడు సత్రానికి వెళ్ళాడు. మామూలుగా కాదు; రాజోద్యోగిలా. ఎరట్రి ఉడుపులు ధరించి అందమైన నల్లటి గుర్రమెక్కి వెళ్ళాడు. సత్రం యజమాని వాణ్ణి చూసి రాజుగారి అంగరక్షకుడు అతిథిగా వచ్చాడేమిటా అని ఆశ్చర్యపోయాడు. ‘‘ఇంతవరకు ఎన్ని బంగారు నాణాలు సేకరించావో తెలుసుకుందామని వచ్చాను,'' అన్నాడు చిన్నసామి గంభీరంగా. సత్రం యజమాని ఇప్పుడు వాడి కంఠస్వరం గుర్తించి భయంతో వణికిపోతూ చేతులు జోడించి, ‘‘బాబూ, తమరా? నన్ను క్షమించండి,'' అని వేడుకున్నాడు. చిన్నసామి చిన్నగా నవ్వి, సత్రం యజమాని కేసి చేయి ఊపుతూ గుర్రమెక్కి వెళ్ళిపోయాడు.

ముగ్గురు రాజకుమారులు (చందమామ కథ)

రత్నగిరి రాజు రాజభూషణుడు ధర్మప్రభువుగా పేరుగాంచాడు. ఆయన పాలనలో ప్రజలు ఏ కొరతా లేకుండా సుఖశాంతులతో జీవించేవారు. ఆయనకు ముగ్గురు కుమారులు. ముగ్గురూ యుక్త వయస్కులయ్యారు. వారిలో ఒకరిని త్వరలో రాజ్యాభిషిక్తుణ్ణి చేయవలసి వుంది. అందువల్ల రాజు వారిని ఒకనాడు చేర బిలిచి, ‘‘మీరు ముగ్గురూ దేశాటన చేసి ప్రజల స్థితిగతులను, ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవాలి. రేపు తెల్లవారగానే ముగ్గురూ మూడు దిశలకేసి వెళ్ళి, సాయంకాలానికల్లా తిరిగివచ్చి మీరు చూసినదానిని గురించి నాకు చెప్పండి,'' అన్నాడు. మరునాడు తెల్లవారగానే, ముగ్గురు రాకుమారులూ బయలుదేరారు. పెద్ద కుమారుడు రాజకీర్తి తూరుపు దిక్కుకేసీ, రెండవ రాకుమారుడు రాజమూర్తి ఉత్తరం దిక్కుకేసీ, మూడవ రాకుమారుడు రాజస్నేహి దక్షిణం దిక్కుకేసీ పయనమయ్యారు. సూర్యాస్తమయం అయ్యేసరికి వెనుదిరిగి భవనం చేరుకోవాలని నిర్ణయించుకున్నారు. రాజకీర్తి చాలా దూరం నడిచి ఒక అడవిని చేరుకున్నాడు. ఒక కొలను గట్టున పచ్చిక మేస్తున్న మూడు చక్కని గుర్రాలు ఆయన దృష్టిని ఆకర్షించాయి. దాపులనే వున్న పొడవైన చెట్టు కింద ఆశీసునుడైన ఒక యోగి ఆ గుర్రాల కేసి తదేకంగా చూస్తున్నాడు. రాకుమారుడు యోగిని సమీపించి సాష్టాంగ నమస్కారం చేశాడు. యోగి మందహాసం చేస్తూ, ‘‘నువ్వు ఎవరివి నాయనా? ఈ అడవిలోకి ఎందుకు వచ్చావు?'' అని అడిగాడు. రాజకీర్తి తాను ఎవరైనదీ చెప్పి, తాను వెళుతూన్న కార్యం గురించి వివరించి, ‘‘మహాత్మా! తమరు అనుమతించినట్టయితే, మీ గుర్రాలలో ఒకదాని మీద వెళ్ళి, మరిన్ని ప్రదేశాలనూ, మరింత ఎక్కువమందినీ చూసి వస్తాను,'' అన్నాడు. ‘‘అలాగే, నీకు కావలసిన గుర్రాన్ని తీసుకు వెళ్ళు. అయితే, సూర్యాస్తమయం అయ్యేలోగా గుర్రాన్ని తెచ్చి నాకు అప్పగించాలి. నువ్వు చూసిన విశేషాలను గురించి తెలియజేయాలి,'' అన్నాడు యోగి. రాజకీర్తి ఒక గుర్రాన్ని అధిరోహించి అక్కడి నుంచి బయలుదేరాడు. చాలా దూరం ప్రయాణం చేశాక ఆయనకు ఒక తోట కనిపించింది. తోటమాలి కోసం చుట్టుపక్కల కలయచూశాడు. తోటమాలి కనిపించలేదు గాని, తోట చుట్టూ బలమైన కంచె వేసి ఉండడం చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. అంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం మరొకటి జరిగింది. ఆయన చూస్తూండగానే కంచె కోసం కట్టిన దృఢమైన పుల్లలు ఉన్నట్టుండి కొడవళ్ళుగా మారి తోటలోని పళ్ళనూ, కాయగూరలనూ తెగనరకడం ప్రారంభించాయి. యువరాజు రాజకీర్తి తన కళ్ళను తనే నమ్మలేక అమితాశ్చర్యంతో వెనుదిరిగాడు. అరణ్యానికి చేరుకుని యోగికి గుర్రాన్ని అప్పగించబోయాడు. అప్పుడు యోగి, ‘‘దాచుకోలేని ఆశ్చర్యంతో సతమతమవుతున్నట్టున్నావు. ఏమిటి విశేషం?'' అని అడిగాడు. రాజకీర్తి తను చూసిన విచిత్రమైన తోట గురించి వివరించాడు. అంతా విన్న యోగి, ‘‘ఆ దృశ్యం ద్వారా నువ్వు గ్రహించిందేమిటి?'' అని అడిగాడు. ‘‘అంతా విచిత్రంగా వుంది. ఎందుకలా జరిగిందో చెప్పలేకపోతున్నాను మహాత్మా,'' అన్నాడు రాజకీర్తి. ‘‘ఇలాంటి సామాన్యమైన విషయాలను కూడా అర్థం చేసుకోలేనివాడివి, రేపు రాజ్య పాలన ఎలా చేయగలవు? రాజ్యం, మూర్ఖుడైన రాజును భరించలేదు. నిన్నిప్పుడే రాతిస్తంభంగా మార్చేస్తున్నాను,'' అని యోగి రాజకీర్తిని శపించాడు. రాత్రి చాలా పొద్దుపోయినా రాజకీర్తి తిరిగి రాకపోవడంతో రాజభవనం చేరుకున్న ఆయన తమ్ములూ, తండ్రీ ఆందోళన చెందారు. మరునాడు తెల్లవారగానే, రెండవ కుమారుడు రాజమూర్తి, అన్నను వెతుక్కుంటూ వెళ్ళాలని నిర్ణయించారు. తెల్లవారగానే రాజమూర్తి, తన అన్న వెళ్ళిన మార్గంలో వెళ్ళి అడవిని చేరుకున్నాడు. కొలను గట్టున మేస్తూన్న గుర్రాలను చూశాడు. యోగికి నమస్కరించి, ‘‘ఇలాంటి చక్కటి గుర్రాలను ఇంతకు ముందెన్నడూ చూడలేదు. ఒక గుర్రాన్ని ఇస్తారా?'' అని అడిగాడు. ‘‘నిరభ్యంతరంగా తీసుకువెళ్ళు. అయితే సూర్యాస్తమయంలోపల తిరిగి వచ్చి గుర్రాన్ని అప్పగించి, నీ అనుభవాలను చెప్పాలి,'' అన్నాడు యోగి మందహాసం చేస్తూ. గుర్రాన్ని అధిరోహించే ఉత్సాహంలో రాజమూర్తి పక్కనే శిలగా మారివున్న తన అన్న ముఖం కేసి కూడా చూడలేదు. ఇరువైపులా అన్న కేసి పరిశీలనగా చూస్తూ ఆయన చాలా దూరం ముందుకు వెళ్ళాడు. ఎంత దూరం వెళ్ళినా అన్న జాడ కనిపించలేదు. కాని, వీపు మీద కట్టెల మోపు మోస్తూ వంగిపోయిన ఒక పండు ముసలివాడు కనిపించాడు. రాజమూర్తికి అతనిపై జాలి కలిగింది. అతడు గుర్రాన్ని ఆపి, ‘‘తాతయ్యా, కట్టెలమోపు నేను మోసుకురానా?'' అని అడిగాడు. ముసలివాడు తలపైకెత్తి చూడలేదు. కనీసం సమాధానం కూడా చెప్పకుండా ఇంకా ఎండు పుల్లలు ఏరడంలో నిమగ్నుడై కనిపించాడు. రాజమూర్తికి చాలా వింతగా తోచింది. సూర్యుడు పడమటి దిశకు చేరడంతో ఆయన వెనుదిరిగి వచ్చి, గుర్రాన్ని యోగికి అప్పగించి నమస్కరించాడు. ‘‘దారిలో నీకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి ఏమిటి?'' అని అడిగాడు యోగి చిన్నగా నవ్వుతూ. రాజకీర్తి తాను చూసిన ముసలివాణ్ణి గురించి చెప్పాడు. ‘‘నువ్వు అందిస్తానన్న సాయాన్ని ఆ ముసలివాడు ఎందుకు వద్దన్నాడో తెలుసా?'' అని అడిగాడు యోగి. ‘‘తెలియదు మహాత్మా. అతడొక మాట కూడా మాట్లాడలేదు,'' అన్నాడు రాజమూర్తి. ‘‘ఇలాంటి స్వల్ప విషయాలు కూడా తెలియని నువ్వు, మునుముందు రాజువైతే కష్టతరమైన ప్రజాపాలనను ఎలా సమర్థవంతంగా నిర్వహించగలవు? నువ్వు మూర్ఖుడివి. రాకుమారుడిగా వుండతగవు. నిన్నిప్పుడే శిలగా మార్చేస్తున్నాను,'' అన్నాడు యోగి. రాజమూర్తి కూడా రాకపోయేసరికి రాజు విచారానికి గురయ్యాడు. మూడవ కుమారుడు రాజస్నేహి తండ్రిని ఓదార్చి అన్నలను వెతుక్కుంటూ వెళతానన్నాడు. తెల్లవారగానే అన్నలు వెళ్ళిన మార్గంలో బయలుదేరి రాజస్నేహి అడవిని చేరుకుని, కొలను దగ్గర మేస్తున్న గుర్రాలనూ, యోగినీ చూశాడు. పక్కనే వున్న రెండు రాతిస్తంభాలనూ, వాటిలో స్పష్టంగా కనిపించిన తన అన్నల ముఖపోలికలనూ చూసి ఆశ్చర్యపోయాడు. యోగిని సమీపించి నమస్కరించి తన అన్నల గురించి అడిగాడు. ‘‘అవును. వాళ్ళు ఇక్కడికి వచ్చారు,'' అంటూ మందహాసం చేసిన యోగి, ‘‘నా గుర్రాలను తీసుకుని వెళ్ళి సాయంకాలానికి తిరిగివచ్చారు. వాళ్ళు చూసిన దృశ్యాల అంతరార్థాన్ని గురించి అడిగితే చెప్పలేకపోయారు. నేనే వారిని శిలా స్తంభాలుగా మార్చేశాను,'' అన్నాడు. ‘‘వాళ్ళు పునర్జీవితులయ్యే మార్గం సెలవివ్వండి, మహాత్మా,'' అన్నాడు రాజస్నేహి. ‘‘ఆ గుర్రాలలో ఒకదానిని అధిరోహించి ముందుకు వెళ్ళు. ఏదైనా వింత దృశ్యం కనిపిస్తే వచ్చి నాతోచెప్పు. దానిని గురించి చక్కని వివరణతో నా ప్రశ్నకు సరైన సమాధానం ఇచ్చావంటే మీ ముగ్గురన్నదమ్ములు మూడు గుర్రాల మీద హాయిగా రాజధానిని చేరుకోవచ్చు,'' అన్నాడు యోగి. రాజస్నేహి కొంతసేపు తీవ్రంగా ఆలోచించాడు. తన అన్నలను కాపాడుకోవడానికి తన అదృష్టాన్ని పరీక్షించాలన్న నిర్ణయంతో, యోగికి నమస్కరించి, ఆయన చూపిన దిశగా గుర్రం మీద బయలుదేరాడు. అతడు ఎంతదూరం వెళ్ళినా ఎలాంటి విచిత్ర దృశ్యం గానీ, వింత వ్యక్తి గానీ తారసపడలేదు. చాలా దూరం వెళ్ళడం వల్ల అతడికి దాహం వేసింది. గుర్రానికి కూడా కాస్సేపు విశ్రాంతినిద్దాం అన్న ఉద్దేశంతో ఒక కొలను గట్టున గుర్రం దిగాడు. గుర్రాన్ని పచ్చిక మేయడానికి వదిలి తను దాహం తీర్చుకోవడానికి కొలను దగ్గరికి వెళ్ళాడు. నీళ్ళ దగ్గరికి వెళ్ళి, వంగి దోసిలితో నీళ్ళు అందుకోబోయాడు. నీళ్ళు చేతులకు అందకుండా కుంచించుకుపోవడం గమనించి ఉలిక్కిపడ్డాడు. నీళ్ళలో దిగి మరికొంత ముందుకు వెళదామని రెండడుగులు వేశాడు. నీళ్ళు రెండడుగులు వెనక్కువెళ్ళాయి. అతడు లోపలికి వెళ్ళే కొద్దీ నీళ్ళు ఇంకా లోపలికి వెళ్ళసాగాయి. అతడు కొలను మధ్యకు చేరుకునే సరికి చుట్టూ ఇసుక తప్ప, బొట్టు నీళ్ళు కంటబడలేదు! అమితాశ్చర్యంతో వెనుదిరిగిన రాజస్నేహి యోగి వద్దకు వచ్చాడు. తనకు ఎదురైన అనుభవాన్ని చెప్పాడు. అంతావిన్న యోగి, ‘‘ఈ విచిత్ర అనుభవం ద్వారా నువ్వు గ్రహించిందేమిటి?'' అని అడిగాడు. రాజస్నేహి ఎంత ఆలోచించినా సరైన సమాధానం స్ఫురించలేదు. యోగికి ఆమోదయోగ్యమైన సమాధానం చెప్పలేక పోయాడు. ‘‘రాకుమారా, నువ్వు కూడా మీ అన్నలకన్నా తెలివైన వాడివేం కాదు. నీకూ, నీ అన్నల గతి తప్పదు,'' అన్నాడు యోగి. మరుక్షణమే రాజస్నేహి కూడా శిలాస్తంభంగా మారిపోయాడు. అన్నలను వెతుక్కుంటూ వెళ్ళిన రాజస్నేహి కూడా ఎంతకూ రాకపోయేసరికి రాజభవనంలోని రాజు తీవ్రమైన ఆందోళనకు లోనయ్యాడు. తనే చేజేతులా వారిని దేశాటనకని పంపి ఈ దుస్థితికి కారణమైనట్టు భావించి విలవిలలాడి పోయాడు. వాళ్ళకేమయిందో ఎవరికీ తెలియదు. రాకుమారులను వెతకడానికి సైన్యాన్ని వినియోగించాలని మంత్రి సలహా ఇచ్చాడు. అయినా రాజు వినలేదు. తన కుమారులను వెతుక్కుంటూ తనే స్వయంగా వెళ్ళాలనుకున్నాడు. మరునాడు వేకువజామున తన కుమారులు వెళ్ళిన మార్గం గుండా వెళ్ళి, అడవిని చేరి, మేస్తూన్న గుర్రాలకేసి ప్రశాంతంగా చూస్తున్న యోగి సమక్షానికి చేరుకున్నాడు. ఆయనకున్న యోగ శక్తుల ద్వారా, యోగి తన కుమారుల ఆచూకీని తెలియజేయగలడని రాజు ఆశించాడు. రాజు యోగిని సమీపించి నమస్కరించి, ‘‘మహాత్మా, నా ముగ్గురు కుమారులు దేశ సంచారం చేస్తూ ఇటుకేసి తప్పక వచ్చి ఉంటారనుకుంటాను... అంటూ ఇంకా ఏదో చెప్పబోయేంతలో యోగి అడ్డుపడి, ‘‘అవును మహారాజా, వచ్చారు. వారిని నేను మూడు ప్రశ్నలు అడిగాను. చాలా సులభ మైనవి. కాని సమాధానం చెప్పలేక పోయారు అలాంటి మూఢులకు మునుముందు రాజ్య పాలన చేసే అర్హత లేదు. అందుకే వారిని శిలా స్తంభాలుగా మార్చివేశాను. అదిగో చూడు!'' అన్నాడు. రాజు మూడు రాతిస్తంభాలనూ, వాటి పైభాగంలో తన కుమారుల ముఖజాడలూ చూసి దిగ్భ్రాంతి చెందాడు. కొంతసేపు మౌనం వహించి, ఆ తరవాత, ‘‘ఆ ప్రశ్నలేవో చెప్పండి. నా బిడ్డల తరఫున నేను సమాధానాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను,'' అన్నాడు. ‘‘నీ జ్యేష్ఠ కుమారుడు రాజకీర్తి తోటమాలి లేని ఒక తోటను చూశాడు. కంచెగా వున్న పుల్లలు ఉన్నట్టుండి కొడవళ్ళుగామారి, తోటలోని పళ్ళను, కాయలను తెగనరకడం ప్రారంభించాయి దీని అంతరార్థం ఏమిటి?'' అని అడిగాడు యోగి. ‘‘తోటలోని చెట్టు చేమలను కాపాడడానికే కంచె ఏర్పాటు చేయబడింది. తన యజమాని ఆస్తిని నాశపరిచే సేవకుడిలాంటిది ఆ కంచె,'' అన్నాడు రాజు. యోగి మందహాసం చేసి, రెండవ రాకుమారుడు చూసిన దృశ్యం గురించి చెప్పి, ‘‘రాజా! ఆ ముసలివాడు మోస్తూన్న బరువైన కట్టెల మోపు చాలదని ఇంకా ఎండు కట్టెలు ఏరుతూనే ఉన్నాడు. దీని భావం ఏమిటో చెప్పగలవా?'' అని అడిగాడు. ‘‘ఆ ముసలివాడు తన దగ్గర ఉన్న దానితో తృప్తి చెందలేదు. పర్యవసానాలను గురించి పట్టించుకోకుండా ఇంకా ఇంకా కావాలని ప్రాకులాడే పేరాశాపరుల దురవస్థకు చిహ్నం ఆ దృశ్యం!'' అన్నాడు రాజు. ‘‘బాగా చెప్పావు,'' అని మరొక్కసారి మందహాసం చేసిన యోగి, ‘‘నీ చిన్న కుమారుడు దాహం తీర్చుకోవడానికి వెళితే కొలనులోని నీళ్ళు దూర దూరంగా వెళ్ళిపోయాయి. మరి దీని వివరణ ఏమిటి రాజా?'' అని అడిగాడు.  ‘‘సంపదలు ఉన్నప్పుడు దుబారాగా ఖర్చు చేసి, పనికిమాలిన వాటికోసం వృధా చేసే వారికి చివరికి ఏదీ మిగలదు!'' అన్నాడు రాజు. మరుక్షణమే రాకుమారులు ముగ్గురూ నవ్వుతూ కనిపించారు. రాతిస్తంభాల జాడలేదు. ‘‘నా కుమారులకు మళ్ళీ ప్రాణదానం చేసిన తమకు నేను జీవితాంతం రుణపడి ఉన్నాను. తమ ఆశీస్సులతో వారిని రాజధానికి తీసుకువెళతాను. తమరు కరుణతో రాజధానికి విచ్చేసి, నా కుమారులకు విద్యాబుద్ధులు నేర్పి వారిని వివేకవంతులుగా తీర్చిదిద్దాలని ప్రార్థిస్తున్నాను,'' అన్నాడు రాజు యోగికి చేతులెత్తి నమస్కరిస్తూ. రాజు ప్రార్థనకు యోగి అంగీకరించాడు. ‘‘మీరు ముగ్గురూ మూడు గుర్రాల మీద మీ తండ్రితో రాజధానికి బయలుదేరండి, నేను త్వరలో వస్తాను,'' అని రాకుమారులను ఆశీర్వదించాడు. రాజూ, రాకుమారులూ సంతోషంగా రాజధానికి బయలుదేరారు. మరి కొన్నాళ్ళకు రాజధానికి వచ్చిన యోగికి, భక్తి ప్రపత్తులతో మేళ తాళాలతో స్వాగతం పలికారు. యోగి రాకుమారులను వివేకవంతులుగా, ఆదర్శపాలకులుగా తీర్చిదిద్దాడు.

భగవంతుడిని అర్ధం చేసుకోవడం ఎలా?

లోకంలో చాలా ఘాతుకాలు జరుగుతుంటాయి. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తుంటాయి. ఇవన్నీ భగవంతుడు చేస్తున్నవేనా? వీటన్నింటికీ కారణం ఎవరు? చాలామంది భగవంతుడు నిర్దయుడు, ఇన్ని జరుగుతుంటే చూస్తూ ఉంటున్నాడు, జరగకుండా ఆపవచ్చు కదా అంటుంటారు. ఇదెలా సాధ్యం?      కారు నడుపుతుంటే ప్రమాదం జరుగుతుంది. కారు నడిపేవాడు కారణమా, కారులో ఇంధనం కారణమా, కారే కారణమా, రహదారి కారణమా? అసలు ఆ ప్రయాణం సంకల్పించిన వ్యక్తి కారణమా, ఆ వ్యక్తికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు కారణమా, వాళ్లను కన్నవాళ్లు కారణమా? ఇలా వెదుక్కుంటూపోతే ఎన్నో కారణాలు కనిపిస్తాయి. చివరికి ఒక్క దగ్గరే అంతమవుతాయి. ఇది అంతర్జాలం లాగా ఒక మాయాజాలం. అన్నింటికీ భగవంతుడు కారణం కాదు అని తెలుసుకునేంత వరకు ఈ సంఘటనలు మనల్ని బాధపెడుతూనే ఉంటాయి. కాని, శాస్త్రాలు సర్వానికీ కారణం భగవంతుడే అని చెబుతున్నాయి కదా. ఈ చిక్కుముడి వీడటం ఎలా? కనిపించే ఈ ప్రపంచానికి కారణం భగవంతుడి సృజనాత్మక శక్తి. దానికి మరోపేరు మాయ. దీన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నించి ప్రయత్నించి విజయం సాధించినవాళ్లు మౌనం వహిస్తారు. విఫలమైనవాళ్లు భగవంతుడే కారణం అంటూ బాధపడుతూ ఉంటారు. ఏది ఏమైనా మన కళ్లముందు జరుగుతున్నదాన్ని మనం నమ్ముతాం. అది లేదు అంటే, ఆ అన్న వ్యక్తిని పిచ్చివాడికింద జమకడతాం. మన కన్నే మనకు ప్రమాణం. దాని వెనక బుద్ధి ఒకటి ఉందని మరచిపోతాం. దాని వెనక వివేకం ఒకటి ఉందని మరచిపోతాం. కనిపించనివి ఎన్నో మనం మన జ్ఞానంతో అంగీకరిస్తున్నాం. ముందు మనం దైవాన్ని అంగీకరించాలి. చూసిగాని చూడకుండాగాని సత్యాన్ని నమ్మడానికి సిద్ధపడినప్పుడే విశ్వరహస్యాలు తెలుస్తాయి. విశ్వం నడిచే విధానం తెలుస్తుంది. ఏ వస్తువూ అన్ని కాలాల్లో ఒకేవిధంగా ఉండదు. మార్పు సహజం. మనల్ని మనం అంగీకరించినట్లే దైవం చేసే పనిని కూడా అంగీకరించాలి. సృష్టిలో చాలా లోపాలు కనిపిస్తాయి ప్రతి ఒక్కరికీ. పనిగట్టుకుని విమర్శించమని చెబితే, నేనైతే ఈ సృష్టిని ఇలా కాకుండా మరోలా తయారుచేద్దును అని ప్రతి ఒక్కరూ అంటారు! దేవుణ్ని మార్చేయడానికి సిద్ధపడతారు కొందరు. దేవుడికి బోధ చెయ్యడానికి ఉద్యుక్తులవుతారు ఇంకొందరు. దేవుణ్ని పక్కనపెట్టి తామే దేవుళ్లం అంటారు మరికొందరు. మంచి ధర పలికితే దేవుణ్ని అమ్మేయడానికి ముందుకొస్తారు ఇంకొందరు. చివరికి దేవుణ్ని మాయం చేయడానికీ వెనకాడరు. మంచి జరిగినప్పుడు పొగిడి, చెడు జరిగినప్పుడు దేవుణ్ని తిట్టేవాళ్లను ఏమనాలి? అన్ని శక్తుల్లోనూ అత్యంత గొప్పది ఇచ్ఛాశక్తి. అది స్వేచ్ఛాయుతంగా మనిషి వాడుకునే సంకల్పశక్తి. దీనితో అద్భుతాలు చెయ్యవచ్చు. ఇది జ్ఞానశక్తిగా క్రియాశక్తిగా మారుతుంది. కల కను, నిజం చేసుకో అంటారు. కల కనాలి అంటే మనలో ఇచ్ఛాశక్తి పుష్కలంగా ఉండాలి. దీన్ని నడిపించేదే దైవశక్తి. మోక్షం వరకు తీసుకెళ్లేదీ ఇదే శక్తి. దీనిద్వారా నేనైనా నువ్వయినా చివరికి ఏ ప్రాణి అయినా తన ఆధ్యాత్మిక ప్రయాణంలో పురోగమనం సాధించడం తథ్యం. దేవుణ్ని అర్థం చేసుకోవటం అంటే విశ్వాన్ని అర్థం చేసుకోవటమే. చెట్టును తెలుసుకుంటే అడవి తెలుస్తుంది. నది గురించి తెలుసుకుంటే సముద్రం తెలుస్తుంది. వెలుగు గురించి తెలుసుకుంటే సూర్యుడు తప్పక అర్థం అవుతాడు. శ్రద్ధ-సహనం ఉంటే జరుగుతున్న విపరీతాల వెనక సూత్రధారి ఎవరో తెలియకుండా పోతుందా? మంచికి మంచే కారణం. చెడ్డకు తప్పనిసరిగా చెడే కారణం. తిరుగులేని ఈ అనివార్య సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని దైవాన్ని అర్థం చేసుకోవాలి. ఏది ఎవరు చేస్తున్నారో, ఎవరివల్ల జరుగుతున్నదో, ఎందుకు జరుగుతున్నదో తెలుసుకోవడానికైనా మన విమర్శలను మాని సత్యాన్వేషణ మొదలు పెట్టాలి. అప్పుడు ఎవరు దోషులో ఎవరు నిర్దోషులో తెలిసిపోతుంది!

మా సెడ్డ మంచోడు దేవుడు!

ఓసారి బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి ఒక చిన్న పల్లెటూరికి షూటింగ్ కు వెళ్ళారు, షూటింగ్ సమయంలో కాస్త గ్యాప్ రావడంతో పక్కనే ఉన్న శివాలయానికి వెళ్ళారు... అక్కడున్న పూజారి పూజ చేసుకుంటూ ఉన్నాడు, బ్రహ్మానందం తనికెళ్ళ భరణి ఇద్దరినీ చూడగానే ఆ పూజారి వీళ్ళని గుర్తుపట్టి నవ్వుతూ పలకరిస్తాడని అనుకున్నారిద్దరూ కానీ ఆయన వీళ్ళని చూసి తన పూజలో తాను నిమగ్నమయ్యాడు పోనీ పూజ పూర్తయ్యాక వచ్చి పలకరిస్తాడేమో అనుకుంటే అదీలేదు, వీళ్ళే ఆయన దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది గానీ ఆయన మాత్రం వీళ్ళ దగ్గరికి రాలేదు, ఇద్దరూ ఒకళ్ళ మొహాలు ఒకరు చూసుకొని పూజారి దగ్గరికి వెళ్ళి అభిషేకం చేయమని అడిగారు,  ఇప్పుడు సమయం అయిపోయింది రేపు ఉదయం ఏడు గంటలకు రండి అని చెప్పి వెళ్ళిపోయాడు... మర్నాడు ఉదయం ఏడు గంటలకల్లా గుడి దగ్గర నిలబడి ఉన్నారు, పూజారి రావడం, అభిషేకం చేయడం, గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం అన్నీ అయిపోయాయి... స్వామి దక్షిణ తీసుకోండి అని తలా వేయిరూపాయలు బయటకు తీశారు, ఆయన హుండీలో వేయమని సైగ చేశాడు. యూనిట్ వాళ్లు టిఫిన్ తెచ్చి ఇచ్చారు ఇద్దరూ ఆ గుడి ఆవరణలోనే కూర్చుని తినడానికి వెళ్తూ పూజారిని ఆహ్వానించారు, నేను తినేశాను మీరు తినండి అని సున్నితంగా తిరస్కరించాడు, కాఫీ అయినా తాగండి అన్నారు, ఆ పూజారి మంచినీళ్ళు కూడా తాగను అనేశాడు,  మీరు మమ్మల్ని గుర్తించారా అని అడిగారు భరణి గారు కాస్త అహంతో... ఆ పూజారి పేర్లతో సహా చెప్పాడు, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి ఆశ్చర్యంతో "స్వామి దక్షిణ ఇస్తే తీసుకోలేదు హుండీలో వేయమన్నారు, టిఫిన్ ఇస్తే తీసుకోలేదు, కనీసం కాఫీ కూడా తాగలేదు, ఎందుకు, కారణం తెలుసుకోవచ్చా" అని అడిగారు  అప్పుడాయన "సార్ నాకోక ఎకరం పొలం ఉంది, ఒక ఆవు ఉంది, ఒక శివుడు ఉన్నాడు, ఇంకేం కావాలి ఈ జీవితానికి" అని వెళ్ళిపోయాడు...  ఆ సందర్భాన్ని అప్పుడే భరణి గారు  "మాలో ఉన్న అహంకారం రాలి కుప్పలా పడింది" అని వర్ణించారు... ఎవరి దగ్గరా ఏదీ ఆశించకపోతే జీవితం ఇంత అద్భుతంగా ఉంటుందా అనిపించింది ఇద్దరికీ, ఆక్షణం ఆయన్ని మించిన శ్రీమంతుడు ప్రపంచంలో ఇంకెవరూ లేరు అన్నంత గొప్పగా కనిపించాడు ఆ పూజారి వాళ్ళిద్దరి కళ్ళకి, సంతృప్తిగా బ్రతికే ప్రతి మనిషీ మహారాజే గురూజీ... ఆశించడం ఆపేస్తే జీవితం అద్భుతంగా ఉంటుంది ఎవరి నుంచీ ఏదీ ఎక్స్పెక్ట్ చేయకూడదు, అప్పుడే లైఫ్ లో తృప్తి దొరుకుతుంది, ప్రశాంతత నీలో కొలువుంటుంది... ఈ సంఘటనను వెంటనే భరణి గారు ఓ పాటలా ఇలా రాశాడు...  "మాసెడ్డ మంచోడు దేవుడు  మాసెడ్డ మంచోడు దేవుడు... నువ్వోటి అడిగితే ఆడోటి ఇస్తాడు మాసెడ్డ మంచోడు దేవుడు... అస్సలడగకపోతే అన్నీ ఇచ్చేస్తాడు మాసెడ్డ మంచోడు దేవుడు..."

అత్యాశ (చందమామ కథ)

కుముద్వతీ రాజ్యం పొలిమేరలో ప్రవహించే కుముదినీ నదీ తీరంలో సుప్రసిద్ధమైన సోమశేఖర ముని ఆశ్రమం ఉండేది. అక్కడ గురుకుల ఆశ్రమాన్ని నడిపే సోమశేఖర ముని శిష్యులకు వివిధ ధ్యాన పద్ధతులను బోధించడంతోపాటు, చిత్రలేఖనంలో కూడా సిద్ధహస్తుడు. మనుషులను చూసి యథాతథంగా చిత్రించడంలో అద్భుతమైన ప్రతిభ కనబరచేవాడు. అందువల్ల కళాభిరుచిగల సంపన్నులు, దూర ప్రాంతాల నుంచి వచ్చి ఆయన అడిగిన సొమ్ము చెల్లించి ఆయన చేత తమ చిత్రాలను గీయించుకుని వెళ్ళేవారు. ముని తను గీసిన చిత్రాలకు ఎక్కువ మొత్తాలు వసూలు చేయడంలో చాలా జాగ్రత్త వహించేవాడు. ఇది పలువురికి ఆశ్చర్యం కలిగించేది. మరి కొందరయితే, ‘‘సర్వసంగ పరిత్యాగి అయిన మునికి ఇంత ధనాశ పనికిరాదు,'' అని చాటుమాటుగా విమర్శించేవారు. ముని వీటన్నిటినీ పట్టించుకోకుండా చిత్రలేఖనం ద్వారా సొమ్మువసూలు చేయడంలోనే నిమగ్నుడై ఉండేవాడు! ఇలా ఉండగా ఒకనాడు చక్కగా అలంకరించబడిన ఒక అందమైన గురబ్బ్రండిలో ఆశ్రమానికి వచ్చిన రాజనర్తకి శుభాంగి మునిని సందర్శించి, తన చిత్రపటం గీయించుకోవాలన్నది. ‘‘సంతోషం. క్షణాలలో చిత్రించి ఇస్తాను. అయితే కొంచెం ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది!'' అన్నాడు ముని.‘‘ఆ విచారమే వద్దు. తమరు ఎంత అడిగినా ఇస్తాను. అయినా, ముందుగానే అడుగుతున్నారు. ఎంత కావాలేమిటి?'' అని అడిగింది రాజనర్తకి. ‘‘నీ స్థాయికి తగ్గట్టు ఎంత ఇవ్వగలవో నువ్వే చెప్పు,'' అన్నాడు ముని. ‘‘వంద వరహాలు చాలా?'' అని అడిగింది నర్తకి, ముని పరమానందం చెందగలడన్న ఆశతో. ‘‘రెండు వందల వరహాలు,'' అన్నాడు ముని ఏమాత్రం తొణక్కుండా. ఆ మాటవిని ఒక్క నిమిషం అవాక్కయి పోయిన నర్తకి, వెంటనే తేరుకుని, ‘‘మరీ ఎక్కువ మొత్తం. అయినా మునివర్యులకు అంతటి అత్యాశ పనికి రాదు!'' అన్నది నిష్ఠూరంగా. ‘‘ఇందులో బేరసారాలకు ఏమాత్రం తావు లేదు. మరో మాట మాట్లాడకుండా అడిగిన మొత్తం ముందు పెడితేనే చిత్రపటం. లేకుంటే వచ్చిన దారినే తిరిగి వెళ్ళవచ్చు,'' అన్నాడు ముని నిష్కర్షగా. వచ్చిన పని పూర్తి చేసుకోకుండా తిరిగి వెళ్ళడానికి నర్తకి అహం అడ్డుపడి, ముని అడిగిన రెండు వందల వరహాలు తీసి ఆయన ముందుంచి, ‘‘సరే, ఆ పొన్నచెట్టు కింద నిలబడతాను. చిత్రించు,'' అంటూ వెళ్ళి ఎదురుగా ఉన్న చెట్టు కింద నృత్యభంగిమలో నిలబడింది. ముని తదేకంగా ఆమెవంక కొంతసేపు చూసి, కుంచెనందుకుని చకచకా చిత్రపటం చిత్రించి ఆమె చేతికిచ్చాడు. దానిని చూసిన ఆమె, ‘‘చిత్రపటం అద్భుతంగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే దానిని గీసినందుకు మీరు పుచ్చుకున్న మొత్తం మాత్రం చాలా ఎక్కువ. ఇలా ధనం కూడబెట్టి వెళ్ళేప్పుడు పట్టుకు పోతారా?'' అంటూ విసురుగా వెళ్ళి, గురబ్బ్రండిలో కూర్చుని నగరానికి తిరుగు ప్రయాణమయింది. మరికొన్ని నెలల పాటు ముని దీక్షగా చిత్రాలు గీస్తూ, అలాగే ధన సంపాదన కొనసాగించాడు. అయితే, ఆ తరవాత హఠాత్తుగా చిత్రాలు గీయడం మాని శిష్యులకు జ్ఞానబోధ చేస్తూ, ధ్యాన పద్ధతులు నేర్పడం ప్రారంభించాడు. ఆ సంగతి తెలిసి, ఆయనలో హఠాత్తుగా వచ్చిన ఈ మార్పుకు కారణం ఏమిటో తెలుసుకోవాలన్న కుతూహలం కొద్దీ రాజనర్తకి ఒకనాడు ఆశ్రమానికి బయలుదేరింది. కిందటిసారి వచ్చినప్పుడు రాయిరప్పలతో ఎత్తు పల్లాలుగా ఉన్న ఆశ్రమానికి వెళ్ళే బాట ఇప్పుడు చదును చేయబడి ఉండడంతో ఆమె ప్రయాణం హాయిగా సాగింది. ఆరోజు వైశాఖ పౌర్ణమి. ఆశ్రమ ప్రాంగణంలో పెద్ద మంటపం ఉండడం చూసి ఆమె ఆశ్చర్యం చెందింది. మంటపంలోపల శిష్యులనూ, భక్తులనూ ఉద్దేశించి సోమశేఖర ముని ప్రధాన శిష్యుడు ఉపన్యసిస్తున్నాడు: ‘‘ధ్యాన మందిరం నిర్మించాలని ఎంతగానో ప్రయత్నించి, అది నెరవేరకుండానే తన గురువు భానుప్రకాశానంద స్వాములు పరమపదించడంతో, ధ్యాన మందిర నిర్మాణాన్ని తన లక్ష్యంగా పెట్టుకుని, మన గురువర్యులు సోమశేఖర ముని నిర్విరామంగా కృషి చేశారు. స్వార్థపరుడనీ, దురాశాపరుడనీ తనను లోకులు కాకులై కూసినా బాధ పడలేదు. తనకు తెలిసిన చిత్రలేఖనం ద్వారా స్వయంగా ధనార్జన చేసి గురువు కోరికను నెరవేర్చారు. భావితరాలకు మహోపకారం చేసి, తపస్సు చేసుకోవడానికి అరణ్యానికి వెళ్ళిన మహానుభావుడాయన. ఆయన కారణంగానే ఆశ్రమానికి ఈరోజు చక్కని బాట ఏర్పడింది. మన మందరం ఆయనకెంతో రుణపడి ఉన్నాం!'' ఆ మాటలు వినగానే రాజనర్తకి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. మునివర్యులను అపార్థం చేసుకున్నందుకు నొచ్చుకుని, మనసులోనే క్షమాపణలు చెప్పుకున్నది. ఆ తరవాత తన కంఠహారాన్నీ, చేతులకు పెట్టుకున్న బంగారు మురుగులనూ తీసి, ధ్యానమందిరానికి కానుకగా సమర్పించి, ప్రశాంత చిత్తంతో నగరానికి తిరుగు ప్రయాణమయింది.

దయ్యం వదిలింది.. చందమామ కథలు

వాణీ, వర్మలకు సంతానం లేదు. వాళ్లు చాలా మంచివాళ్లు. ఎదుటివాళ్ళకు సాయపడడంలో ఆనందం పొందేవారు. ఆ ఊళ్లో వాళ్ళ మంచితనాన్ని గురించి చెప్పుకోనివారు లేరు. ఒక రోజురాత్రి పెద్దవర్షం పడుతున్నది. వర్మా, వాణీ భోజనానికి కూర్చోబోతుండగా ఎవరో దడదడా తలుపులు తట్టారు. తలుపు తీసి చూస్తే, వర్షంలో తడిసి ముద్ద అయి ఉన్న యువదంపతులు కనిపించారు. ‘‘పట్నానికని బయలుదేరి, వర్షంలో చిక్కుపడ్డాం. ఈ రాత్రికి మీ ఇంట ఉండనిస్తారా?'' అని వాళ్లు అడిగారు. ‘‘లోపలికి రండి,'' అంటూ వాణి వాళ్ళను ఆహ్వానించి, భోజనం పెట్టి, పడకలు ఏర్పాటు చేసింది. వాళ్ళుతిన్నాక అన్నం కొద్దిగామిగిలింది. దాన్ని వాణి తన భర్తను తినమన్నది. మళ్ళీ వండడానికి పుల్లలు లేవు. ముద్దగా తడిసి పోయాయి. ‘‘ఇద్దరమూ చెరిసగమూ తిందాం,'' అని వర్మ పట్టుబట్టాడు. ఇద్దరూ ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ చెరికాస్త తిని, పడుకున్నారు. తెల్లవారి ఎవరో ఏడుస్తున్నట్టయి వాళ్లు ఉలిక్కిపడి లేచారు. వీధి తలుపు తీసి ఉన్నది. గుమ్మంలో రాత్రి వచ్చిన ఆడమనిషి కూర్చుని, వెక్కివెక్కి ఏడుస్తున్నది. వాణీ వర్మలు నిర్ఘాంతపోయి, ఆమె ఏడుపుకు కారణం ఏమిటని అడిగారు. ‘‘నా కాపరం గంగపాలయింది! రాత్రి ఈ ఇంటికి రాకపోయినా బాగుండేది. రాత్రి నా భర్త మీ ఆలూమగల అన్యోన్యం చూసి, ‘నువ్వు ఎన్నడైనా నన్ను ఈ ఇంటి ఇల్లాలిలాగా ప్రేమించావా? ఎప్పుడైనా ప్రియంగా నాలుగు మాటలు మాట్లాడావా? భర్తను ప్రేమించలేని భార్య నాకు దేనికి?' అని, ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా వెళ్ళి పోయాడు. మొండిమనిషి! మళ్లీ తిరిగి రాడు. ఇక నా బతుకేంగాను? ఏం చేయను? ఎక్కడికని వెళ్ళను?'' అన్నది బెక్కుతూ. ఆమె పేరు చంద్రమతి. వర్మ ఆమె భర్తకోసం ఆత్రంగా ఊరంతా వెతికాడు. ఎక్కడా అతని జాడ లేదు. ‘‘నాకు తెలుసు, ఆయన రాడు. నా కింకెవరూ లేరు. లోతయిన బావి చూసి దూకేస్తాను,'' అంటూ చంద్రమతి మళ్లీ దీనంగా ఏడ్చింది. ఆమె స్థితి చూసి భార్యాభర్తల మనసు కరిగిపోయింది. మగవాడి మంచితనం మీదనే ఆడదాని సుఖం ఆధారపడి ఉన్నది. ‘‘నువ్వు ఏమీ బాధపడకు. నీ భర్త మనసు మారి తిరిగి వచ్చేదాకా నువ్వు మా ఇంటనే ఉండు,'' అన్నారు వాళ్ళు. అది మొదలు చంద్రమతి వాళ్లింట్లో మనిషిగానే ఉండిపోయింది. ఆమె చాలా మెత్తని మనిషిగా కనబడింది. రాత్రి వంట ఆమె చేసేది. నెల రోజులు గడిచాయి. వర్మకు చిన్ననాటి స్నేహితుడు మురారి, నాలుగు రోజులు ఉండిపోవటానికి వచ్చాడు. అతడు రెండు, మూడు నెలల కొకసారి అలా వస్తూంటాడు. కిందటిసారి వచ్చినప్పుడు చంద్రమతి లేదు. అతడు ఆమె విషయమంతా వర్మ నుంచి తెలుసుకున్నాడు. ఆ రాత్రి అందరికి చంద్రమతే వడ్డించింది. భోజనం అయ్యాక మురారి వసారాలో మంచం వేసుకుని పడుకున్నాడు. కాని అతనికి చాలా సేపటిదాకా నిద్రపట్టలేదు. అర్ధరాత్రి వేళ నిద్రపట్టుతూండగా ఏదో అలికిడి అయి, మెలుకువ వచ్చింది. చంద్రమతి చేతిలో దీపం పట్టుకుని, చిన్నగా వంటింటి తలుపు తీస్తున్నది! వంటింటి అవతలి కిటికీని ఎవరో మెల్లగా తట్టినట్టు వినిపించింది. మురారికి చంద్రమతి ప్రవర్తనా, కిటికీ చప్పుడూ అనుమానం కలిగించాయి. ఆమె వంట గదిలోకి వెళ్ళగానే అతను చప్పున లేచి, చిన్న కిటికీలో నుంచి వంటగదిలోకి చూశాడు. చంద్రమతి ఒక గిన్నెలో అన్నమూ, కూరా, పులుసూ, పెరుగూ అమర్చి, కిటికీలో నుంచి లోపలికి వచ్చిన చేతులకు జాగ్రత్తగా అందించింది. ‘‘ఇంకా ఎన్నాళ్లు ఈ అర్ధరాత్రి భోజనాలు? ఎలాగో ఇనప్పెట్టెలో డబ్బు చిక్కించుకుని త్వరగా వచ్చెయ్యి,'' అన్నాడు అవతలి మనిషి. చీకటిలో ఉన్న కారణంచేత ఆ మనిషి మురారికి కనిపించలేదు. ‘‘ఇప్పుడిప్పుడే వీళ్ళకు నా మీద నమ్మకం కలుగుతున్నది. త్వరలోనే ఇనప్పెట్టె తాళాలు నాకు అందుబాటులోకి వస్తాయి. కాస్త ఓపికపట్టు,'' అన్నది చంద్రమతి. ‘‘అమ్మ దొంగముండా! పైకి అమాయకంగా కనిపిస్తూ, మావాళ్ళ మంచితనాన్ని ఆసరాచేసుకుని, మొగుడితో కలిసి ఆడుతున్న నాటకం ఇదా? ఉండు, నీ ఆట కట్టిస్తాను!'' అంటూ మురారి తనలో అనుకున్నాడు. అతను వెంటనే వెళ్ళి పడుకుని, చంద్రమతి గురించి వాణీ, వర్మలకు చెప్పి వాళ్ళ మనసు నొప్పించకుండా, వాళ్ళ ఇంటికి పట్టిన దయ్యాన్ని వదలగొట్టాలని నిశ్చయించుకున్నాడు. మర్నాడు తెల్లవారుతూనే అతను చంద్రమతికి వినిపించేలా వర్మతో, ‘‘బాబోయ్‌, రాత్రి నేను కన్నుమూస్తే ఒట్టు. ఈ ఇంట్లో దయ్యం చేరినట్టున్నది. రాత్రంతా గజ్జెలచప్పుడు! నేను తూర్పుగా వేసుకున్న మంచం పడమటివైపుకు ఈడ్చుకు పోయింది. కిటికీలో పెట్టిన మంచినీళ్ళ చెంబు మంచం కింద ఉన్నది. నేను కాబట్టి బతికి బయట పడ్డాను. మరొకరైతే, హరీ అనేవాళ్ళు,'' అన్నాడు. వాణీ, వర్మా ఈ మాట విని హడలి పోయి, ‘‘అయితే భూతవైద్యుణ్ణి పిలుద్దాం,'' అన్నారు. ‘‘మీరేమీ కంగారుపడకండి, ఎటువంటి దయ్యాన్ని అయినా నేను వదలగొట్టగలను,'' అని మురారి వాళ్ళకు ధైర్యం చెప్పాడు. మర్నాడు రాత్రి అతను బజారులో కొన్న గజ్జెలు పక్కన పెట్టుకొని, అప్పుడప్పుడు చప్పుడు చేయసాగాడు. తరవాత అతను తలగడను మంచంమీద నిలువుగా అమర్చి, వాటిమీద దుప్పటి కప్పి, పెరటివైపు వెళ్ళి, వంటింటి కిటికీ చప్పుడు చేశాడు. చాలా సేపటికి ఎలాగో ధైర్యం చేసుకుని, చంద్రమతి వచ్చి, గిన్నెలో అన్నీ సర్ది, మురారి చేతులకు గిన్నెను అందించింది. మురారి చప్పున ఇంట్లోకి వచ్చి, ఆ గిన్నెను చంద్రమతి మంచం మీద పెట్టి, మంచాన్ని ఇంకో పక్కకు ఈడ్చేసి, ఏమీ ఎరగనట్టు తన మంచం మీద పడుకున్నాడు. చంద్రమతి గిన్నె కోసం కొంతసేపు చూసి, కిటికీని సమీపించి, బయట తన భర్త జాడ కనబడక, వంటగది తలుపు మూసి, తనగదిలోకి వెళ్ళి, కెవ్వున కేక పెట్టింది. ఆ కేకకు వర్మా, వాణీ ఉలిక్కిపడి లేచి, చంద్రమతి దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చారు. అప్పుడే లేచినట్టుగా మురారి కూడా వచ్చాడు.  చంద్రమతి భయంతో, ‘‘దయ్యం ఉన్న మాట నిజమే! నాకూ గజ్జెల చప్పుడు వినిపించింది. ఆ వైపున ఉన్న మంచం ఈ వైపుకు వచ్చింది. వంటింటిలో ఉన్న ఈ గిన్నె నా మంచం మీదికి వచ్చింది,'' అన్నది. ‘‘భయపడకండి. త్వరలోనే ఈ దయ్యం భరతం పట్టుతాను,'' అన్నాడు మురారి. రెండు రోజులపాటు అతను రాత్రిళ్ళు గజ్జెలచప్పుడు చేస్తూనే ఉన్నాడు. అందుకే, తన భర్త వంటింటి కిటికీ చప్పుడు చేస్తున్నా చంద్రమతి గది విడిచి బయటికి రావటానికి భయపడింది. మూడోరోజు రాత్రి మురారి బయటనే పొంచి వుండి, చంద్రమతి భర్త పెరటి దోవన రాబోతుండగా, తాను అదే దారిన వెళ్ళబోతున్నవాడిలాగా అతనికి ఎదురు నడుస్తూ, ‘‘నా చెల్లెలికి ఇంత ద్రోహం చేస్తాడా? నేను చూస్తాను!'' అని తనలో తాను అనుకుంటున్నట్టుగా అన్నాడు. చంద్రమతి భర్త బయటే నిలబడి, ‘‘ఏం జరిగిందండి?'' అని అనుమానంగా అడిగాడు. ‘‘ఇంకా ఏం జరగాలండీ? ఈ ఇంటాయన మా బావగారు, మా చెల్లెలికి పిల్లలు లేరు. ఈ ఇంట్లో ఎవరో మొగుడు వదిలేసిన మనిషి ఎలాగో చేరింది. ఇప్పుడు మా బావ ఆవిణ్ణి చేసుకుంటాడట! ఆవిడ కూడా అందుకు సిద్ధంగానే వున్నది!'' అంటూ విసురుగా వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయి, వీధితోవన లోపలికివచ్చి, తనమంచం మీద పడుకుని నిద్రపోయాడు. మురారి చెప్పినమాటమీద చంద్రమతి భర్తకు నమ్మకం కుదిరింది. ఎందుకంటే మూడు రోజులుగా అతనికి కిటికీ తెరవటంలేదు. తెల్లవారగానే అతను వచ్చి వర్మతో, ‘‘నేను బుద్ధి గడ్డితిని నా భార్యను ఇక్కడ వదిలి వెళ్ళాను. ఆమెను నాతో పంపెయ్యండి,'' అన్నాడు. దయ్యం భయంతో హడలిపోతున్న చంద్రమతి తన మొగుడి వెంట సంతోషంగా వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళినందుకు ఇల్లు బోసిగా ఉన్నదని వాణీ, వర్మలు బాధ పడుతూంటే, ‘‘దయ్యం వదిలిందని సంతోషించక బాధ పడుతున్నారా?'' అంటూ మురారి జరిగిన సంగతి వాళ్ళకు చెప్పి, వాళ్ళ వద్ద సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయాడు.

ప్రాణ ప్రతిష్ట అంటే ఏమిటి?

హిందూధర్మంలోని ఆచారాల ప్రకారం ఏదైనా దేవాలయంలో దేవుని విగ్రహ ప్రతిష్టకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్టించకుంటే దేవుని ఆరాధన అసంపూర్ణమవుతుందని అంటారు. అయోధ్యలోని నూతన రామాలయంలో జనవరి 22న రామ్‌లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ట జరగనుంది. ప్రాణ ప్రతిష్ట అంటే ఏమిటి? ఇందులోని విశిష్టత ఏమిటనేది ఇప్పుడు తెలుసుకుందాం... యావత్‌ భారతదేశం ఎదురుచూస్తున్న మధుర క్షణాలు అయోధ్యలోని రామ మందిరంలో రామ్‌ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట కోసమే. ఎన్నో ఏళ్ల కల జనవరి 22న నెరవేరనుంది. అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం జరగనుంది. రామ్‌ లల్లా విగ్రహం ప్రతిష్టాపన జరగనుంది హిందూ మతంలో ప్రాణ ప్రతిష్ట అనేది పవిత్రమైన వేడుక. ఆలయంలో ఏర్పాటు చేసే విగ్రహంలోకి దేవతని _ ఆహ్వానించడం. కొత్తగా ఆలయం నిర్మించినప్పుడు లేదా కొత్తగా విగ్రహాన్ని పెడుతున్నప్పుడు ప్రాణ ప్రతిష్ట చేస్తారు. వేద మంత్రోచ్చారణ మధ్య రామ్‌ లల్లా విగ్రహం ప్రాణ ప్రతిష్ట జరగనుంది. సనాతన ధర్మంలో ప్రాణ ప్రతిష్టకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రాణ అంటే ప్రాణ శక్తి, ప్రతిష్ట అంటే స్థాపన అని అర్ధం. అప్పటి వరకు ఆ విగ్రహానికి ప్రాణం ఉండదు. కేవలం విగ్రహం మాదిరిగానే పరిగణిస్తారు. ఎప్పుడైతే ప్రాణ ప్రతిష్ట జరుగుతుందో అప్పటి నుంచి విగ్రహంలోకి దైవం వచ్చి చేరుతుంది. సనాతన ధర్మంలో ప్రాణ ప్రతిష్టకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. విగ్రహ  ప్రతిష్టాపన సమయంలో ప్రాణ ప్రతిష్ట తప్పనిసరిగా జరుగుతుంది. ఏదైనా విగ్రహ ప్రతిష్టాపన సమయంలో ఆ విగ్రహానికి జీవం పోసే విధానాన్నే ప్రాణ ప్రతిష్ట అంటారు. 'ప్రాణ్‌' అనే పదానికి ప్రాణశక్తి అని, 'ప్రతిష్ట' అంటే స్థాపన అని అర్థం. మొత్తంగా చూసుకుంటే ప్రాణ ప్రతిష్ట అంటే విగ్రహంలో ప్రాణశక్తిని స్థాపించడం లేదా దేవతను విగ్రహంలోకి ఆహ్వానించడం అని అర్ధం. ప్రాణ ప్రతిష్టకు ముందు ఏ విగ్రహం కూడా పూజకు అర్హమైనదిగా పరిగణించరు. ప్రాణప్రతిష్ట ద్వారా  విగ్రహంలోనికి ప్రాణశక్తిని ప్రఎశపెట్టే, దానిని ఆరాధనీయ దేవతా స్వరూపంగా మారుస్తారు. అప్పుడే ఆ విగ్రహం పూజకు అర్హమైనదవుతుంది. ప్రాణ ప్రతిష్ట అనంతరం విగ్రహ రూపంలో ఉన్న దేవతామూర్తులను ఆచార వ్యవహారాలతో మంత్రాలు జపిస్తూ పూజలు చేస్తారు. ప్రతిష్టాపన తర్వాత భగవంతుడే ఆ విగ్రహంలో కొలువయ్యాడని చెబుతారు. అయితే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి శుభ సమయం అనేది నిర్ణయిస్తారు. శుభ ముహూరాలు లేకుండా మొక్కుబడిగా ప్రాణ ప్రతిష్ట చేయడం తగదని పండితులు చెబుతుంటారు. ప్రాణ ప్రతిష్టకి ముందు ఆ విగ్రహాన్ని పూజకి ఉపయోగించరు. ప్రాణ ప్రతిష్ట ద్వారా విగ్రహంలోకి ప్రాణశక్తిని ప్రవేశపెడతారు. భక్తులు విగ్రహాన్ని కేవలం విగ్రహంగా కాకుండా దేవుళ్ళ సజీవ స్వరూపంగా భావిస్తారు. ప్రాణ ప్రతిష్ట చేసిన తర్వాత మాత్రమే ఆ విగ్రహం పూజ చేసేందుకు అర్హత సాధిస్తుంది. ఇలా చేసిన తర్వాత దేవుడి విగ్రహంలోకి కొలువై ఉంటాడు.