తెలుగు కథకు గర్వకారణం – శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి

  తెలుగు కథకు గర్వకారణం – శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి     గురజాడ, వీరేశలింగం తర్వాత తెలుగు కథను భుజానికెత్తుకున్న వ్యక్తిగా శ్రీపాదను విమర్శకులు వర్ణిస్తారు. తెలుగు కథలను చదవాలంటే వాటిలో తప్పనిసరిగా శ్రీపాదవారి కథలు కూడా ఉండాలని సాహితీవేత్తలు చెబుతారు. ఆయన రచనలు చదివినవారు... ఇలాంటి మాటలతో ఏకీభవించి తీరాల్సిందే!  ఈ నెల 23న శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి జయంతి సందర్భంగా ఒకసారి ఆయనను మననం చేసుకునే ప్రయత్నం ఇది. ఏప్రిల్ 23 1891 తూర్పుగోదావరి జిల్లాలోని ఒక కుగ్రామంలో జన్మించారు శ్రీపాద. పండిత వంశం కావడంతో ధర్మశాస్త్రాలూ, కావ్యాలూ నేర్చుకున్నారు. శ్రీపాద యవ్వనంలోకి అడుగుపెట్టేసరికి ప్రపంచంలో రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్వాతంత్ర్య ఉద్యమం మంచి ఊపు మీద ఉంది. పాశ్చాత్య నాగరికత ప్రభావం రోజువారీ జీవితంలో కనిపిస్తోంది. వేషభాషలు మారుతున్నాయి, ఆంగ్లభాష ప్రాధాన్యత పెరుగుతోంది, మతమార్పిడులు చోటు చేసుకుంటున్నాయి, అణగారిన వర్గాలు ప్రశ్నించడం నేర్చుకుంటున్నాయి. ఇలా ఒకటీ రెండూ కాదు, సవాలక్ష ద్వంద్వాలు సమాజంలో చోటు చేసుకుంటున్నాయి. వీటన్నింటికీ సాక్షిగా నిలిచిన శ్రీపాద... తన అనుభవాలకు, ఆ అనుభవాలు రేపుతున్న ఆలోచనలకు అక్షరరూపం ఇవ్వసాగారు.     శ్రీపాద దాదాపు 75 కథలను రాశారని చెబుతారు. వీటిలో ఎక్కువభాగం అప్పటి అగ్రవర్ణాల అంతర్మధనంగానే కనిపిస్తాయి. శ్రీపాద ఒక వర్గానికే వ్యతిరేకంగా తన కలాన్ని ఎక్కుపెట్టినట్లు కనిపించినప్పటికీ... ఆయన ప్రత్యక్షంగా చూసిన పరిస్థితులు అవే కావడం చేత, అవే ఇతివృత్తాలను కథాంశంగా తీసుకోవడంలో ఆశ్చర్యం లేదు. పైగా ఆయన బలం కూడా అదేనని తోస్తుంది. తను విన్న మాండలికాలు, పడికట్టు పదాలు, వాక్య నిర్మాణాలను యధాతథంగా సంభాషణల్లోకి చొప్పించడంతో సదరు కథలు సహజంగా తోస్తాయి. అందుకే తెలుగు భాష మీద పట్టు సాధించాలన్నా, ఒకప్పటి తెలుగు సమాజం మీద అవగాహన ఏర్పరుచుకోవాలన్నా తప్పకుండా శ్రీపాద కథలని చదవమని పెద్దలు చెబుతుంటారు. శ్రీపాద కథలకి ఒక పరిమితి అంటూ కనిపించదు. ఇలా రాయాలని ఆయన మడిగట్టుకున్నట్లు తోచదు. ఒకసారి రాయడం అంటూ మొదలుపెడితే అది పది పేజీలలో ముగిసిపోవచ్చు. 60 పేజీలని దాటిపోవచ్చు. తను చెప్పదల్చుకున్న విషయాన్నంతా కాగితం మీద ఆవిష్కరించడమే ఆయన ఉద్దేశంగా కనిపిస్తుంది. అలాగని ఆయన కథలలో వర్ణనలు, కల్పనలూ కనిపించవు. సాదాసీదా సంభాషణలే కథని నడిపిస్తాయి. ఒకోసారైతే ఎలాంటి వివరణా లేకుండా పూర్తిగా సంభాషణలతోనే కథ నడుస్తుంది. అందుకు ‘బ్రాహ్మణాగ్రహారం’ అనే కథే గొప్ప ఉదాహరణ. పాఠకుడు ఇందులో కథని కేవలం సంభాషణల ద్వారానే వెతుక్కోవలసి ఉంటుంది.     శ్రీపాద సంప్రదాయవాది కాదు. అలాగని అప్పటి పరిస్థితుల మీద ఘాటైన వ్యాఖ్యానాలూ చేయలేదు. అప్పటి సమాజాన్ని ఉన్నది ఉన్నట్లుగా పాఠకులకు చూపించే ప్రయత్నం చేశారు. ఆయనకు గాంధి అన్నా, ఖద్దరు అన్నా, హిందీ అన్నా ఇష్టం ఉండేది కాదని చెబుతుంటారు. ‘ఇలాంటి తువ్వాయి వస్తే’ కథ చదివితే అది నిజమే అనిపిస్తుంది. అందులో గాంధి, కాంగ్రెస్సు, హరిజనోద్ధరణ సంఘాలు, జాతీయ భాషగా హిందీని చేయడం, ఖద్దరు గురించి ప్రచారం... వంటి అంశాల మీద తన అసంతృప్తిని వెళ్లగక్కుతారు రచయిత. శ్రీపాద రాసిన కథలలో చాలావరకు ప్రజాదరణ పొందినవే. గులాబి అత్తరు, షట్కర్మయుక్తా, వడ్లగింజలు, యావజ్జీవం హోష్యామి... ఇలా చెప్పుకొంటూ పోతే శ్రీపాద విశిష్ట రచనల జాబితా చాలా పెద్దగానే తేలుతుంది. ఇవే కాకుండా ‘అనుభవాలూ-జ్ఞాపకాలూనూ’ పేరుతో ఆయన స్వీయానుభవాలు కూడా అప్పటి సమాజం గురించీ, దాని పట్ల ఆయన దృక్పథం గురించీ అవగాహన కలిగిస్తాయి. మొత్తంగా చూస్తే- సరళమైన సంభాషణలు, కథలో స్పష్టత, కథనంలో నిబద్ధత... వెరసి శ్రీపాద కథలు ప్రతి ఒక్కరూ చదివితీరాల్సిన స్థాయిలో నిలుస్తాయి. ఆ కథలు ఉన్నంతవరకూ శ్రీపాద తెలుగువారికి అమరుడే! - నిర్జర.    

మనసున్న మారాజు – అడివి బాపిరాజు

  మనసున్న మారాజు – అడివి బాపిరాజు     మనిషికి చాలా డిగ్రీలు ఉండవచ్చు. కానీ సమాజం అతణ్ని గుర్తించేందుకు ఆ డిగ్రీలేవీ ఉపయోగపడవు. అతని ప్రవృత్తి ఏమిటన్నదాంతోనే సమాజం అతణ్ని పిలుస్తుంది. అలా సమాజం గుర్తుంచుకునేందుకు చాలా విశేషణాలే వదిలి వెళ్లారు అడివి బాపిరాజు- కవి, నవలాకారుడు, చిత్రకారుడు, ఉపాధ్యాయుడు, కళా దర్శకుడు, నాటక రచయిత, న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు, సంపాదకుడు... ఇలా బోల్డు రకాలుగా చెప్పుకోవాలి అడివి బాపిరాజు గురించి. పశ్చిమగోదావరి జిల్లాలో 1895లో జన్మించారు అడివి బాపిరాజు. రాజమండ్రి, మద్రాసులలో ఆయన చదువు సాగింది. తెలుగు సాహిత్యం కావ్యాల స్థాయిని దాటి కవితలూ, కథలుగా రూపాంతరం చెందుతున్న కాలం అది! సహజంగానే భావకుడు అయినా బాపిరాజు తన సృజనకు మార్గంగా సాహిత్యాన్ని ఎన్నుకొన్నారు. ఒక పక్క న్యాయవాద వృత్తిని సాగిస్తూనే సాహిత్యం సృష్టించసాగారు. కొన్నాళ్లకు పూర్తిగా సాహిత్యానికే అంకితమవ్వడం కోసమో, వృత్తిరీత్యా అబద్ధాలు చెప్పడం ఇష్టం లేకపోవడం చేతనో... న్యాయవాద వృత్తిని వదిలి బందరు నేషనల్ కాలేజిలో అధ్యాపకునిగా ఉద్యోగాన్ని చేపట్టారు.     సాహిత్యం పట్ల బాపిరాజుకి అభిరుచి ఉండవచ్చుగాక. కానీ ఆ అభిరుచి పాఠకులని మెప్పించింది మాత్రం ‘నారాయణరావు’ నవలతోనే! 1934లో ఆంధ్రవిశ్వకళాపరిషత్తు నిర్వహించిన నవలల పోటీలో ఈ నవల ప్రథమ స్థానాన్ని పొంది ఒక్కసారిగా తెలుగు పాఠకుల దృష్టిని ఆకర్షించింది. ఆ పోటీలో విశ్వనాథ వేయిపడగలతో పాటుగా నారాయణరావు నవల ప్రథమ బహుమతిని పొందడం విశేషం. ఆనాటి సామాజిక పరిస్థితులు, స్వాతంత్ర్య ఉద్యమం, ఆధునిక భావాలు, మనుషుల మనస్తత్వం, జమీందారీ బేషజాలు... అన్నింటినీ రంగరించి వెలువరించిన నారాయణరావు నవలని తెలుగు నవలా సాహిత్యంలో ఒక మైలురాయిగా భావిస్తారు.   నారాయణరావు వంటి సాంఘిక నవలలే కాదు... గోనగన్నారెడ్డి, హిమబిందు, అంశుమతి, అడవిశాంతిశ్రీ వంటి చారిత్రక నవలలూ బాపిరాజు కలం నుంచి వెలువడ్డాయి. వీటిలో కొన్నింటిని ఆయన మీజాన్ పత్రిక సంపాదకునిగా ఉన్నప్పుడు అందులో ధారావాహికగా వెలువరించారు. అలా తెలుగులో తొలి సీరియల్ రచయిత బాపిరాజే కావచ్చు. ఆయన రచనలలో వర్ణన ఎక్కువగా ఉంటుందన్న విమర్శ వినిపిస్తూ ఉంటుంది. కొన్ని గ్రంథాలలో సమాసభూయిష్టమైన పదజాలం ఎక్కువన్న ఆరోపణా లేకపోలేదు. బాపిరాజు స్వతహాగా భావకుడు... ఆపై కవి! దాంతో ఆయన రచనల్లో వర్ణన కనిపించడం చిత్రమేమీ కాదు కదా! పైగా ఆ వర్ణన కోసమే ఆయన రచనలను అభిమానించే పాఠకులూ లేకపోలేదు. ఇదంతా బాపిరాజుగారి నవలల గురించి ప్రశస్తి. ఆయన కవితలూ అందుకు తీసిపోయేవేమీ కాదు. ముఖ్యంగా శశికళ పేరుతో ఆయన వెలువరించిన కవితలని ఎంకిపాటలు, కిన్నెరసాని పాటల స్థాయిలో నిలపవచ్చు. ‘సృష్టి అంతా నిశ్చలమ్మయె - తుష్టి తీరక నేను మాత్రము కాలమంతా నిదుర పోయెను - మేలుకొని నేనొకడ మాత్రము! మినుకు మినుకను తారకలలో - కునుకులాడెను కటిక చీకటి కన్ను మూసిన పూల ప్రోవుల - తెన్ను తెలియని గంధ బాలిక!’ (మేలుకొలుపు – శశికళ) వంటి అద్భుతమైన భావాలు శశికళలోని ప్రతి కవితలోనూ పలకరిస్తాయి. ఈ కవితలతో పాటుగా ‘హంపి శిథిలాలు’ వంటి అరుదైన కథలు, ‘ఉషాసుందరి’ వంటి నాటికలు బాపిరాజు సృజనకు అద్దం పడతాయి.     బాపిరాజు కేవలం రచయిత మాత్రమే కాదు... గొప్ప చిత్రకారుడు కూడా! ఆయన గీసిన తైలవర్ణ చిత్రాలెన్నో ప్రముఖ మ్యూజియంలలో కొలువుతీరాయి. విశ్వనాథ సత్యనారాయణ రాసిన కిన్నెరసాని పాటలకు సైతం బాపిరాజు చిత్రాలను అందించారు. ఆ అభిరుచితోనే కొన్ని చిత్రాలకు కళాదర్శకునిగా కూడా పనిచేశారు. అలా తెలుగునాట తొలి కళాదర్శకుడిగా నిలిచారు. పైన పేర్కొన్నవన్నీ కూడా బాపిరాజు సృజనను ప్రతిబింబించే విషయాలు. ఇక ఆయన వ్యక్తిత్వమూ అంటే ఉన్నతమైనదని అంటారు ఆయనను ఎరిగినవారు. స్వాతంత్ర్య సంగ్రామంలో భాగంగా ఆయన రెండు సార్లు జైలుపాలయ్యారన్న విషయం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. బాపిరాజుగారి భార్య నరాల వ్యాధితో బాధపడుతూ ఉండటం వల్ల పిల్లల ఆలనాపాలనా కూడా ఆయనే గమనించేవారట. ఉపాధ్యాయునిగా ఉన్నప్పుడు అప్పటి సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా ఉండేవారని చెబుతుంటారు. ఇలా సాహిత్యపరంగా, సామాజికంగా, వ్యక్తిగతంగా అడివి బాపిరాజు ఏర్పరుచుని నడిచిన బాట... తెలుగునాట ఓ సాహిత్య ప్రస్థానంగా మిగిలిపోయింది. - నిర్జర.    

ప్రకృతిని తడిమిన కృష్ణశాస్త్రి కవిత్వం

    ప్రకృతిని తడిమిన కృష్ణశాస్త్రి కవిత్వం   బెంగాల్ వారికి రవీంద్రానాధ్ టాగూర్ ఓ వరం. ఆయన రాసిన కథలు, కవితల సంగతి అలా ఉంచితే.... రవీంద్రుని గీతాలు ‘రవీంద్ర సంగీత్’ పేరుతో చిరస్థాయిగా నిలిచిపోయాయి. అదృష్టవశాత్తు తెలుగులో ఆ స్థాయి గీతాలు లేకపోలేదు. నోబెల్ బహుమతులను అందుకోకపోయినా, ప్రపంచం తలవంచకపోయినా... మన తెలుగులోనూ అద్భుతమైన భావగీతాలు రాకపోలేదు. వాటిలో తలమానికం కృష్ణశాస్త్రి సాహిత్యం! దేవులపల్లి కృష్ణశాస్త్రి పిఠాపురం దగ్గర రావువారిచంద్రంపాళెం అనే పల్లెలో నవంబరు 1, 1897న జన్మించారు. పండిత కుటుంబం, దానికి తోడు సాహిత్యమంటే అభిరుచి ఉన్న తండ్రి... దాంతో ఇంట్లో తరచూ సాహిత్య చర్చలు జరుగుతూ ఉండేవి. దీనికి తోడు సాహిత్యాభిలాష ఉన్న గురువులు దొరకడంతో కృష్ణశాస్త్రికి చిన్నప్పటి నుంచే రచనలు చేయాలన్న అభిలాష మొదలైంది. వాటికి ఆనాటి బ్రిటిష్ పాలన, బ్రహ్మసమాజం వంటి అంశాలు కూడా బలాన్ని చేకూర్చాయి. దాంతో చిన్నా చితకా వ్యాసాలు, కవితలూ రాయడం ఆరంభించారు కృష్ణశాస్త్రి. 1925లో కృష్ణపక్షం రచనతో కృష్ణశాస్త్రి ప్రతిభ ఏపాటిదో తెలుగువారికి తెలిసిపోయింది. తెలుగునాట భావగీతాలకు ఒక కొత్త ఒకరవడి మొదలైంది. ‘ఆకులో ఆకునై, పూవులో పూవునై’ అంటూ సాగే గీతం అందులోదే! ప్రకృతితో మమేకమవుతూ ఆయన సాగించిన సాహితీ ప్రస్థానం, భార్య మరణంతో మరో మలుపు తీసుకుంది. చిన్న వయసులోనే భార్య చనిపోవడంతో ఆయన భావగీతాలలో విషాదం వినిపించసాగింది. ‘ఎడతగని యాత్రనిట్లు సాగింప లేక, యేడ్వగా లేక కృశియింతు నే నొకండ!’ అంటూ తన బాధను ప్రపంచంతో పంచుకున్నారు. కృష్ణశాస్త్రి రచనల్లో ప్రకృతి పట్ల పలవరింపు, వ్యక్తిగత విషాదమే కానీ విప్లవం కనిపించదనే విమర్శలు లేకపోలేదు. అంతమాత్రాన కృష్ణశాస్త్రి వ్యక్తిగా నిరాశావాదనీ, నిర్లిప్తుడనీ అనుకోవడానికి లేదు. ఆనాటి హరిజనోద్ధరణ, కళావతుల వివాహం, బ్రహ్మసమాజం వంటి ఉద్యమాలలో చురుగ్గా పాల్గొన బంధువుల విమర్శలను సైతం ఎదుర్కొన్నారు. ఇలా విప్లవకారుడిగా, సాహిత్యకారునిగా, ఆకాశవాణి ఉద్యోగిగా సాగుతున్నా ఆయన ప్రస్థానం బి.ఎన్.రెడ్డి పరిచయంతో మరో మలుపు తిరిగింది.     అప్పట్లో బి.ఎన్.రెడ్డి మల్లీశ్వరి సినిమా తీయాలనే ఆలోచనలో ఉన్నారు. అదే సమయంలో కృష్ణశాస్త్రి పరిచయం కావడంతో మల్లీశ్వరికి మాటలు, పాటలు రాసే అవకాశాన్ని ఆయనకు ఇచ్చారు. ఆ అవకాశాన్ని రెండుచేతులా అందిపుచ్చుకున్నారు. అందులో  ‘మనసున మల్లెల మాలలూగెనే’ వంటి పాటలు తెలుగువారిని ఒక్క ఊపు ఊపాయి. అది మొదలు సినిమాసాహిత్యంలో కృష్ణశాస్త్రి శకం మొదలైపోయింది. రాసింది కొద్ది పాటలే అయినా... ప్రతి పాటా ఓ అద్భుతమైన కవిత్వంలా సాగుతుంది. కుశలమా నీకు కుశలమేనా (బలిపీఠం), మావి చిగురు తినగానే (సీతామహాలక్ష్మి) వంటి పాటలు తెలుగు సినిమాపై కృష్ణశాస్త్రి సంతకంగా మిగిలిపోయాయి. లలితంగా సాగే గీతాలే కాదు... విషాద గీతాలు (ఇది మల్లెల వేళయనీ, వెన్నెల మాసమనీ), భక్తి గీతాలు (నీవుండేదా కొండపై నా స్వామీ, నే నుండే దీ నేలపై), దేశభక్తి గేయాలు (జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్యధాత్రి!) వంటి రచనలూ ఆయన కలం నుంచి వెలువడ్డాయి.   కృష్ణశాస్త్రి కవిత్వాన్ని ఆయన స్వరంలోనే వినడం ఓ గొప్ప అనుభూతిగా భావించేవారు ఆనాటి శ్రోతలు. కానీ 1964లో ఆయన స్వరపేటిక తొలగించాల్సి రావడంతో ఆ స్వరం మూగబోయింది. అయినా మరో 16 ఏళ్ల వరకు అడపాదడపా రచనలు చేస్తూనే వచ్చారు. ప్రతి రాత్రి వసంత రాత్రి (ఏకవీర), పాడనా తెలుగుపాట (1976) వంటి అద్భుతమైన గీతాలు ఆ తర్వాత రాసినవే! 1980లో కృష్ణశాస్త్రి కలం మూగబోయేవారకూ ఆయన రాసిన గీతాలు తెలుగు సినీగీతాలు కవిత్వ స్థాయిని అందించాయి. దశాబ్దాలు గడిచినా, తరాలు మారినా, కృష్ణశాస్త్రి కలమూ కంఠమూ మూగబోయినా... భావ గీతం అంటే కృష్ణశాస్త్రే గుర్తుకువస్తారు. - నిర్జర.      

కత్తికంటే పదునైన కలం - కేతు విశ్వనాథరెడ్డి

  కత్తికంటే పదునైన కలం - కేతు విశ్వనాథరెడ్డి     కథకుడిగా పేరుతెచ్చుకోవడం కష్టం కాకపోవచ్చు! కానీ నాలుగుకాలాల పాటు నిలిచిపోయే మంచికథకుడిగా సాహితీ చరిత్రలోకి చేరడం అంత తేలికైన విషయం కాదు. అలాంటి అరుదైన వ్యక్తుల రచనలనీ, కథనశైలినీ పరిశీలించడం ఓ గొప్ప అనుభూతి. రచయిత దృక్పథం ఎలా ఉండాలి? ఆ దృక్పథం అతని రచనల్లో ఏ తీరున ప్రతిబింబించాలి? అనే విషయాలన్నీ అలాంటి పరిశీలనలో ప్రస్ఫుటం అవుతాయి. వర్తమానకాలంలో అలాంటి రచయితల గురించి చెప్పుకోవాలంటే కేతువిశ్వనాథరెడ్డి వెంటనే స్ఫురణకు వస్తారు. సాధారణంగా రచయితల వ్యాపకానికీ వారి వృత్తిగత జీవితానికీ సంబంధం ఉండదు. కానీ విశ్వనాథరెడ్డి జీవితం తొలి నుంచి అక్షరానికి దగ్గరగానే సాగింది. ఒక పక్క బీయే, ఎమ్మె చదువు మరో పక్క చలం, గోపీచంద్ వంటి రచయితల ప్రభావం ఆయనను సాహితీరంగం వైపుగా అడుగులు వేయించాయి. వీటికి తోడు రాయలసీమలోని కరువులు, కక్షలు, కులవ్యవస్థ ఆయనలో ఆలోచనలను రేకెత్తించాయి. ఆ ఆలోచనలకు అక్షరాలు తోడైతే ఇక చెప్పేదేముంది... అద్భుతమైన సాహిత్యం తెలుగువాడికి దక్కింది. కేతు విశ్వనాథరెడ్డి అనగానే చాలామందికి రాయలసీమే గుర్తుకువస్తుంది. కొందరైతే సీమ కథలకు ఆయనను ప్రతీకగా భావిస్తారు. నిజమే! విశ్వనాథరెడ్డి తన ప్రతి కథలోనూ సీమ నేపథ్యాన్ని ఎన్నుకొని ఉండవచ్చుగాక. కానీ ఆ కథలని చదివేవారికి అందులోని నేపథ్యం వెనుక దాగిన నిజాలు కనిపిస్తాయి. కరువు, కక్ష రెండూ వేర్వేరు కాదని నిరూపిస్తాయి. పరిస్థితులని బట్టి మనిషిలోని స్వార్థం బయటపడుతుంటుందని చాటుతాయి. ‘‘నీ నల్లరేగడి మీద తుంగభద్ర నీళ్లు పారనీ, నాలుగు పెద్ద ఫ్యాక్టరీలు రానీ – అన్నీ అబద్ధాల బ్రతుకులే, అన్నీ డబ్బు చుట్టూ జీవితాలే అని తెలిసి వస్తుంది – వెనకా ముందూ అంటే!’’ అంటూ ఓ పాత్ర ‘వెనుకా ముందూ’ అనే కథలో. దీనిబట్టే అర్థం అవుతుంది... పరిస్థితులకు అనుగుణంగా మారడమే మనిషి స్వభావమని.     కేతు విశ్వనాథరెడ్డి కథలలో పద విరుపులు ఉండవు. సుదీర్ఘమైన సంభాషణలు కానీ వర్ణనలు కానీ కనిపించవు. కానీ అలా రాయడమే ఆయన బలం అనిపిస్తుంది. ఎందుకటే ఆయన కథలను చదువుతున్నప్పుడు నేరుగా ఒక సంఘటనకి మనం కూడా ప్రేక్షకులుగా మారిపోయినట్లు కనిపిస్తుంది. ‘సతి’ అనే కథలో భార్య, మొగుడి మీద తిరగబడి తిడుతున్నా.... ‘ఎవరు వీరు?’ అనే కథలో ఓ రచయిత ప్రేమలో దిగబడుతున్నా... వాటకి మనకే ప్రత్యక్ష సాక్ష్యం అన్నట్లుగా తోస్తుంది. కేతువిశ్వనాథరెడ్డి కథలలోని మరో సుగుణం వాటిలోని సార్వజనికత. కథ ఏదో ఒక సందర్భంలో నడుస్తున్నట్లు కనిపిస్తున్నా.... దాని వెనుక సమాజపు పోకడ కనిపిస్తుంది. దానికి ‘అమ్మవారి నవ్వు’ ఓ గొప్ప ఉదాహరణ. ఇందులో రచయిత ఓ హిందూ, ముస్లిం స్నేహితుల మధ్యన ఉన్న బంధం గురించి చెబుతున్నట్లు పైకి కనిపిస్తుంది. కానీ లోలోతున మతం తాలూకు ఛాయలు మన జీవితాలను ఎంతగా ప్రభావితం చేస్తున్నాయో, అవి రోజురోజుకీ ఎంత ప్రబలంగా మారుతున్నాయో చెప్పే సూచనలు కనిపిస్తుంటాయి. ముందుగానే చెప్పుకొన్నట్లు కేతు విశ్వనాథరెడ్డి వృత్తి జీవితం కూడా అక్షరానికి దగ్గరగానే సాగింది. పాత్రికేయునిగా, అధ్యాపకునిగా, పాత్రికేయులకు శిక్షకునిగా ఆయనలోని రచయితకు తోడుగా ఉండే ఉద్యోగాలే సాగించారు. కొడవటిగంటి కుటుంబరావు, అంబేద్కర్ సాహితీ సర్వస్వాలకు సంపాదకునిగా వ్యవహరించారు. విశ్వనాథరెడ్డి తన 19 ఏళ్ల వయసులో ‘ఆమె’ అనే తొలి కథను రాశారు. ఇప్పుడ ఆయన వయసు 77 ఏళ్లు! వయసు పెరుగుతున్న కొద్దీ ఆయన కలలో పదును పెరుగుతోందే కానీ వణుకు తెలియడం లేదు. ఆయన కథలకు ఎప్పుడోనే కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు కూడా లభించింది. అవార్డు వచ్చినా రాకపోయినా ‘నేను రచయితను’ అని గర్వంగా చెప్పుకోగల కథలు చాలానే రాశారు. రాస్తూ ఉంటారు కూడా!!! - నిర్జర.    

తెలుగు సాహిత్యంలో ‘ఓల్గా’ తీరం

తెలుగు సాహిత్యంలో ‘ఓల్గా’ తీరం   అదేం అదృష్టమో కానీ తెలుగులో స్త్రీవాద సాహిత్యం పుష్కలంగానే కనిపిస్తుంది. గురజాడ రాసిన కన్యాశుల్కంలోనే స్త్రీవాద భావనలు కనిపిస్తాయి. ఇక చలం కాలానికి వచ్చేసరికి ఆ భావనలు పరిపక్వతకు చేరుకున్నాయి. ఆ తరువాత రంగనాయకమ్మవంటి వారి రచనలు ఆ రంగాన్ని పరిపుష్టం చేశాయి. ఇలా ప్రతి తరంలోనూ ఎవరో ఒకరు స్త్రీవాదాన్ని తమదైన శైలిలో ముందుకు జరిపే ప్రయత్నం చేశారు. తమతో పాటుగా గళం ఎత్తేందుకు నిదర్శనంగా నిలిచారు. ఈ కాలంలో ఆ బాధ్యతను తలకెత్తుకున్నప్పటి నిర్ద్వంద్వంగా ఓల్గానే!     పోపూరి లలితకుమారి అన్న పేరు చెబితే బహుశా ఎవరికీ ఏదీ స్ఫురించకపోవచ్చు. కానీ ఓల్గా అన్న కలం పేరుతో ఆమె సాగించిన సాహితీ ప్రస్థానం తెలుగువారికి సుపరిచితమే! 1950లో గుంటూరులో జన్మించిన ఓల్గాకి సాహిత్యం అంటే మొదటినుంచీ అభిమానమే! బహుశా అదే ఆర్తితో ఆమె తెలుగు సాహిత్యంలో ఎంఏ చేశారు. సాహిత్యం మీద ఓల్గాకి ఉన్న అనురక్తికి మార్క్సిస్టు భావజాలం తోడైంది. అప్పటివరకూ స్త్రీల అణచివేత కేవలం కుటుంబ సమస్యగా భావించేవారు. ఒకవేళ కథలు రాసినా కూడా పరిధిని గీసుకుని ఓ ఇతివృత్తం చుట్టూనే కథనాన్ని నడిపించేవారు. కానీ ఓల్గా అలా కాదు. స్త్రీ పురుషుల మధ్య ఉన్న వివక్ష కేవలం వ్యక్తిగతం కాదనీ, దాని వెనక లోతైన అణచివేత ధోరణి ఉందని భావిస్తారు. ఆ దృక్పథంతోనే రచనలు సాగిస్తారు.     ఓల్గా కథల్లో కనిపించే మరో ప్రత్యేకత దాని ప్రయోజకత్వం. తాను సాహిత్యానికి ఓ ప్రయాజనం ఉండాలన్న ఆశయంతోనే రచనలు మొదలుపెట్టానని చెబుతారు ఓల్గా. ప్రతి కథలోనూ తన లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నం చేస్తుంటారు. అందుకనే ఆమె కథలో ఓ సూటిదనం కనిపిస్తుంది. అందులో ఒకోసారి సుదీర్ఘమైన చర్చలూ వినిపిస్తాయి. చివరికి ఓ పరిష్కారమూ ఉంటుంది. పైపెచ్చు ఓల్గా ఏదో ఒక ప్రత్యేకమైన సందర్భం గురించి మాత్రమే కథ రాసినట్లు కనిపించదు. స్త్రీ ఎదుర్కొనే  ప్రతి సమస్య గురించీ ఆమె ఒకో కథలో కనిపిస్తుంది. ‘సీత జడ’ అనే కథలో ఆడవారి కట్టుబొట్టు గురించి సమాజం వివిధ సందర్భాలలో చేసే ప్రతిపాదనలని ప్రశ్నిస్తారు. ‘కళ్లు’ అనే కథలో ఆడదాని కళ్లు ఏ తీరున ప్రవర్తించాలో, ఏం చూడాలో, ఎలా ఏడవాలో సూచించే దృక్పథాలను ఎంగడతారు. ‘తోడు’ కథలో భాగస్వామి చనిపోయిన తరువాత స్త్రీ, పురుషలు జీవితాలలో వచ్చే మార్పుని సూచిస్తారు. ఓల్గా తొలుత కవితలు రాసేవారు. తరువాత వచనంలోకి మారి కథలను సృజించారు. కొండొకచో నవలలూ రాశారు. కొన్ని అనువాదాలూ చేశారు. ఏం చేసినా కూడా అందులో స్త్రీవాదమే ప్రధానంగా సాగింది. ఉదాహరణకు ‘నీలిమేఘాలు’ అన్న పేరుతో వివిధ రచయిత్రల కవితల సంకలనాన్ని తీసుకువచ్చారు ఓల్గా! ఈ సంకలనం విడుదలై పాతికేళ్లు (1993) గడుస్తున్నా ఇప్పటికీ ఇది తెలుగు సాహిత్యంలో ఓ ఆగని సంచలనమే! ఇక ‘స్వేచ్ఛ’ నవల గురించైతే చెప్పనే అవసరం లేదు. ఏ బంధంలోనూ ఇమడకుండా స్వేచ్ఛగా సాగాలనుకునే ఓ స్త్రీ కథే ఇది. సరిగ్గా 30 ఏళ్ల క్రితం వచ్చిన ఈ నవలని తొలి స్త్రీవాద నవలగా భావిస్తారు.     ఓల్గా సాహిత్యంలోని అభిప్రాయాల పట్ల పాఠకులకు భిన్నమైన ఆలోచనలు ఉండవచ్చు. కానీ స్త్రీ విముక్తి కోసం ఆమెకు ఉన్న నిశ్చయం పట్ల ఎవరికీ అనుమానం లేదు. ఆ నిశ్చయం ఆమె ప్రతి కథలోనూ కనిపిస్తుంది. ‘మగాడినని రుజువుచేసుకోవాలనీ, స్నేహితుడినని రుజువు చేసుకోవాలనీ, అది సాధిస్తాను, ఇది సాధిస్తాను – అలా నిరూపించుకోవాలనీ – ఇలాంటివి లేకుండా ప్రశాంతంగా జీవితం గడపలేరా? సరే – మీరేదో సాధించుకోండి. కానీ, దాంట్లో ఆడవాళ్లనెంత ఇబ్బంది పెడుతున్నారో ఆలోచించుకోండి,’ అంటూ స్పర్శలో కనిపించే తరహా వాక్యాలు ప్రతి రచనలోనూ పలకరిస్తాయి. ఓల్గా రచనల్లో కనిపించే మరో విశేషం... ద్వేషాన్ని చిమ్మకపోవడం! చాలామంది రచయితలు ఏదన్నా వర్గానికి అనుకూలంగా రచనలు చేసేటప్పుడు మరో వర్గం మీద తమకు ఉన్న కోపాలన్ని అణచుకోలేరు. ఒకోసారి అది వ్యక్తిగత దూషణల స్థాయికి దిగజారుతూ ఉంటుంది. కానీ ఓల్గా రచనల్లో ఆ ధోరణి కనిపించదు. ఏ ఇతివృత్తాన్ని ఎంచుకున్నా, ఏ పాత్రని తీసుకున్నా దాని ఆధారంగా ఒక సమస్యను వెలికితేవడం, దానిని చర్చించి ఓ ముగింపుని ఇవ్వడమే ఆమె కథనాలు తీరుగా గోచరిస్తుంది. అందుకే పురాణ పాత్రలను ఇతివృత్తంగా తీసుకున్నా కూడా ఆమె తన పంథాను వీడలేదు. అలా రామాయణకాలం నాటి స్త్రీ పాత్రలతో ఆమె రాసిన ‘విముక్త’ కథల సంపుటి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని సైతం గెలుచుకుంది. పురస్కారం సంగతి పక్కనపెడితే ఓల్గా తన కథలతో ప్రతి స్త్రీవాది హృదయాన్నీ గెలుచుకుంది. - నిర్జర.    

తెలుగు కథకు పెద్ద ... పెద్దిభొట్ల సుబ్బరామయ్య

    తెలుగు కథకు పెద్ద ... పెద్దిభొట్ల సుబ్బరామయ్య   కథ ఎలా పుడుతుంది అనేది ఓ చిత్రమైన ప్రశ్న. కథ రాయాలి అన్న తపనలోనుంచా! ఆ తపనకు తోడుగా ఉండే ఆలోచనల్లోనుంచా! ఆ ఆలోచనలను అక్షరబద్ధం చేయగల సత్తాలోనుంచా! బహుశా కథ, మంచి కథ కావాలంటే ఈ మూడు ప్రమాణాలూ ఉండాలేమో! అలాంటి పరిపూర్ణమైన కథలు రాసినవారు పెద్దిభొట్ల సుబ్బరామయ్యగారు. అందుకే సమకాలీన రచయితలలో అగ్రస్థానంలో నిలిచారు. తన జీవితకాలంలోనే గొప్ప రచయితగా కీర్తినొందారు. కారామాస్టారు వంటి అతికొద్ది మందికే తెలుగు సాహిత్యంలో అంతటి గౌరవం దక్కింది. సుబ్బరామయ్యగారు ఏమీ అట్టడుగు వర్గం నుంచి రాలేదు. అలాగని ఆయన జీవితం సాఫీగా సాగిపోయింది అనుకోవడానికి వీల్లేదు. మలుపులు తిరిగే కథలాగే ఆయన జీవితం కూడా రకరకాల మజిలీలగుండా ప్రవహించింది. 1938లో గుంటూరులో జన్మించిన సుబ్బరామయ్య చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు. ఆయన అన్నయ్య కూడా అంతలోనే దూరమైపోయాడు. అటు పాఠ్యపుస్తకాలు, ఇటు సాహిత్యమూ ఆయనకు జీవితంలో నిలదొక్కుకునేందుకు సాయపడ్డాయి. వీటికి తోడు విశ్వనాథ సత్యనారాయణవంటి పెద్దల సాన్నిహిత్యం ఆయనను చదివేందుకే కాదు రాసేందుకు కూడా ప్రేరణనిచ్చింది. విజయవాడలోని లయోల కళాశాలలో తెలుగు అధ్యాపకునిగా పనిచేసే అవకాశమూ వచ్చింది. ఒక పక్క విద్యార్థులకు తెలుగుని బోధిస్తూనే మరోపక్క అదే తెలుగు సాహిత్యంలో తనకంటూ కొన్ని పుటలను ఏర్పరుచుకున్నారు.   1959లో సుబ్బరామయ్యగారి తొలి కథ ‘చక్రనేమి’ అచ్చయ్యింది. అప్పటి నుంచి సుమారు 200కు పైగా కథలు రాశారని ఓ అంచనా! ఇన్ని కథలు రాసినా కూడా ఆయన ప్రతి ఒక్క రచనా విభిన్నంగానే సాగడం ఆశ్చర్యం. చాలా కథల ముగింపు ఒకే తీరున సాగుతూ అధిక శాతం విషాదాంతాలుగా ముగిసినా కూడా, ఒకదానితో మరొకటి పొంతన లేనట్లు కనిపిస్తాయి. అలాగని సుబ్బరామయ్యగారు ఎక్కడెక్కడి ఇతివృత్తాలో తీసుకుని కథలు రాయలేదు. నిజానికి అలా రాసేందుకు ఆయనకు ఉన్న పరిధి చాలా తక్కువ. సుదీర్ఘకాలం పట్నవాసం చేయడం, గౌరవప్రదమైన ఉద్యోగంలో ఉండటం చేత ఆయన మీదకు దూసుకువచ్చే అనుభవాలు తక్కువ. కానీ స్పందించే హృదయం ఉండాలే కానీ రోజువారీ కనిపించే జీవితాలలోంచి కూడా అద్భుతమైన ఘట్టాలను సృజించవచ్చని నిరూపించారు. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా సుబ్బరామయ్యగారి ప్రతి కథా విభిన్నంగానే తోస్తుంది. ఈ వస్తువుతో ఇంత అద్భుతమైన కథని అల్లవచ్చా అనిపిస్తుంది. ‘కొళందవేలు బొమ్మ’ కథనే తీసుకోండి. మనకి నిత్యం రోడ్డు పక్కనే బొమ్మలమ్ముకుంటూ కనిపించేవారి జీవితాల వెనక ఎలాంటి విషాదం దాగి ఉంటుందో ఊహించి రాసిన కథ ఇది. ఇంతా చేసి ఎలాగొలా ఓ బొమ్మని చెక్కి, దాన్ని నష్టానికి అమ్ముకుంటే... చివరికి ఆ డబ్బుని కూడా పోలీసువాడు లాక్కొనిపోతే అతని గతి ఏమవ్వాలి! ‘కొళందవేలు బొమ్మ’ చేతివృత్తులకు సంబంధించన కథ అయితే ‘సతీసావిత్రి’ ఓ వ్యభిచారిణి వ్యథ. తన వృత్తిని సాగించుకునేందుకు ఓ పిల్లవాడిని అడ్డుపెట్టుకోవాలని ప్రయత్నించి భంగపడిన మహిళగాథ.   ఇక మధ్యతరగతి జీవితాలే ఇతివృత్తంగా సాగే ఏస్రన్నర్, ఇంగువ వంటి కథలు చదవకపోతే, చిన్న కథలలో ఉన్న మజాను మిస్ అయినట్లే! మాజీ క్రీడాకారుడైన రామచంద్రమూర్తి జీవితం అనే ఆటలో ఓడిపోయిన తీరు కళ్లని చెమరుస్తుంది (ఏస్రన్నర్). మనసులో మిగిలే చిన్నపాటి అనుమానాలు కూడా వ్యక్తిత్వాన్ని ఎంతగా తొలచివేస్తాయో ‘ఇంగువ’ కథతో తేలిపోతుంది. ఇవే కాదు- కళ్లజోడు అనే ‘విలాసవస్తువు’ కోసం ఒక ముసలావిడ పడే ఆరాటం (కళ్లజోడు), గాంధీ సాధించిన స్వాతంత్ర్యం చివరికి అదే పేరుతో ఉన్న నిరుద్యోగికి ఎలా ఉపయోగపడలేదో (అలజడి), కళాప్రపంచంలో పంచన చేరి వంచన చేసే మోసగాళ్ల తీరు (దగ్థ గీతం)... ఇలా సుబ్బరామయ్య రాసిన ప్రతి కథా ఎన్నదగినదే! ఒక చిన్నపాటి సమస్యను తీసుకుని, దానిని అనుభవించేవారి జీవితాలలో ఎంతటి విషాదం ఉంటుందో ప్రతిబింబించే ఆయన కథలను చూస్తే చెహోవ్ గుర్తుకురాక మానడు. అలాంటి మహారచయితకు దీటుగా తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన వ్యక్తి మనమధ్యే ఉండటం అదృష్టం. - నిర్జర.

నిజాన్ని ‘దిగంబరంగా’ నిలబెట్టిన కవులు

నిజాన్ని ‘దిగంబరంగా’ నిలబెట్టిన కవులు   కవిత్వం అంటే ఏమిటి? అన్న ప్రశ్నకు జవాబు చెప్పడం ఏమంత సులువు కాదు. మనసులో ఎగసిపడిన భావాలను చరణబద్ధంగా అక్షరాలలోని ఒంపే ప్రక్రియ అనుకోవచ్చునేమో! కాకపోతే రానురానూ మనసులో మెదిలిన ప్రతి ఒక్క భావాన్నీ ఏదో ఒకలా వదిలించుకుని, దానినే కవిత అని పేరు పెట్టుకునే పరిస్థితులు వచ్చేశాయి. తెలుగునాట కవిత్వం చదివేవారి సంగతేమో కానీ, కవుల సంఖ్య మాత్రం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. సామాజికమాధ్యమాల ద్వారానో, చిన్నాచితకా సభల ద్వారానో ఉబికివస్తున్న స్వయంప్రకటిత కవుల తాకిడి ఎక్కువైపోయింది. కవిత్వంలో నిబద్ధత గురించి ఇలాంటివారికి ఓసారి గుర్తుచేయాలంటే ‘దిగంబర కవుల’ను తల్చుకోవాల్సిందే! 1960వ దశకంలో ఉవ్వెత్తున దూసుకువచ్చి ఇది ‘దిగంబరరశకం, నగ్ననామ సంవత్సరం, ఆశ రుతువు’ అని సగర్వంగా చాటిన దిగంబర కవుల గురించి చెప్పుకొనేందుకు చాలానే ఉంది. నగ్నముని, నిఖిలేశ్వర్, చెరబండరాజు, జ్వాలాముఖి, భైరవయ్య, మహాస్వప్న అనే ఆరుగురు కవులే మనం తల్చుకున్న దిగంబర కవులు. వీరి అసలు పేర్లు ఇవి కావు. ఈ ఆరుగురూ కూడా తమతమ లక్ష్యలకు ప్రతీకగా ఉండేందుకు నియమించుకున్న కలం పేర్లే కానీ కులం పేర్లు కావు. నిజానికి ఈ ఆరుగురూ అప్పటికే కవితాలోకంలో ఎంతో కొంత పేరు తెచ్చుకున్నవారు. అయితే నిస్తబ్దుగా ఉన్న కవితాలోకంలో ఏదో ఒక ప్రకంపన సృష్టించాలన్న తపనతో ఒక చోటకి చేరారు. అందుకోసం వారు uncensoredగా తమ భావాలను వెలిబుచ్చుతూ మూడు సంకలనాలను తీసుకువచ్చారు.   నిజానికి దిగంబర కవిత్వం ఒక చారిత్రక అవసరం. ఎన్నో ఆశలతో ఆశయాలతో సాధించుకున్న స్వాతంత్ర్యం, సంబరాలు చేసుకునే సందర్భంగానే మిగిలిపోయింది. నేతలు, పెట్టుబడిదారులు కుమ్మక్కయిపోయారు. కార్మికసంఘాలు పార్టీల పరమైపోయాయి. రైతులు, కూలీలు, నేతన్నల గురించి పట్టించుకుని పోరాడే దిక్కే లేకుండా పోయింది. పీడిత వర్గం తరపున ఎవరన్నా గొంతెత్తితే, ఆ గొంతుకను నిర్బంధించేందుకు ప్రభుత్వం వెనుకాడటం లేదు. అలాంటి సందర్భంలో ఇటు రచయితలలోని జడత్వాన్ని విమర్శిస్తూ, అటు ప్రజలలో చైతన్యాన్ని రగిలిస్తూ వచ్చిన కవిత్వమే దిగంబర కవిత్వం. 1965లో విడుదల అయిన దిగంబర కవుల తొలి సంకలనంలోని తొలి కవితే (ఆత్మయోని) ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది... ఆత్మయోని నన్నయ్యను నరేంద్రుడి బొందలోనే నిద్రపోనియ్యి లేపకు పీకనులిమి గోతిలోకి లాగుతాడు. ప్రబంధాంగనల తొడలు తాడి మొద్దులు తాకితే కాళ్ళు విరగ్గొట్టు ... భావకవుల నపుంసక హావభావాలకు సవాలు అభ్యుదయ కవీ నల్లమందుతిని నిద్రపోయావ్ నయాగారా జలపాతంలో దూకలేక పోయిన అన్నయ్యా గుడ్బై! మీకందరికీ సలామ్వాలేకమ్ వచనం లేదు! కవిత్వం అంతకంటేలేదు...  ... అంటూ సాగే కవిత్వంలో తమ ఉద్దేశం ఏమిటో కుండబద్దలుకొట్టేశారు దిగంబర కవులు. దిగంబర కవిత్వం ఊహించినట్లుగానే ప్రకంపనలు సృష్టించింది. రా.రా, తిలక్, సోమసుందర్‌ వంటి ప్రఖ్యాతులు ఈ కవిత్వంలోని పదప్రయోగాలను నిరసించారు. ఇందులోని లైంగిక ప్రతీకలని, అశ్లీల పదాలనీ ఎండగట్టారు. కానీ శ్రీశ్రీ, చలం వంటి రచయితలు ఈ రచనలను నెత్తికెత్తుకున్నారు. ఉడుకురక్తపు యువకులు పదేపదే ఈ కవితలను చదువుకున్నారు. అణగారిన వర్గాలు దిగంబర కవిత్వాన్ని గుండెలకు హత్తుకున్నారు.   దిగంబర కవిత్వం మూడు సంపుటాలుగా (1965, 66, 68) ప్రజల్లోకి వచ్చింది. మూడు సంపుటాలూ ప్రజల ఆదరణను పొందాయి. వీటిలోని ప్రతి కవితా అద్భుతం అని చెప్పలేకపోయినా, అసమాన్యమైన కవితలెన్నో వీటిలో చోటు చేసుకున్నాయి. ఇవి నిజాలు/ నిత్యం మండే యదార్థాలు/ ఆడదాని ప్రసూతి వేదనలా/ జీన్‌ వార్జీన్‌ ఆకలిమంటలా/ ఎదిగి చేతికందిన కొడుకు/ యముడి పరమైతే/ తల్లడిల్లే విధవ తల్లి గర్భ శోకంలా/ సూటిగా నగ్నంగా చెప్పబడే సత్యాలు (భైరవయ్య - దిగంబరి) వంటి కవితలు అజరామరంలా నిలిచిపోయాయి.  దిగంబర కవిత్వంలో ప్రతి కవితా ఒక నిప్పుకణికలాగే సాగుతుంది. ప్రతి వాక్యమూ పాఠకుడిని రెచ్చగొడుతుంది. నీ బొమికల్ని హడలగొడతాను/ నీ కలల్లో కల్లోలం రేపుతాను/ ఊ లే/ ముసుగు తొలగించు/ ఈ కంపు కొట్టే బట్టల్ని విప్పి/ ఆత్మ ముందు నిలబడి నిన్ను నువ్వు చూసుకో/ మనిషిలా మంచిగా ఆకాశంలా అవనిలా/ బతుకు/ తెరిచిన కళ్లు ఇంక మూయకు/ చెప్పడానికి నువ్వెవరని గొంతు నొక్కడానికి ప్రయత్నించకు (నగ్నముని – సుఖరోగి) వంటి కవితలు చదివినప్పుడు మనసులో ఏదో ఒక మూల నుంచి ఓ మూలుగు మన ఉనికిని నిదురలేపేందుకు ప్రయత్నించక మానదు. అందుకనే దిగంబర కవితల ముందుమాటలో వారు ‘ఇది సెక్స్‌ గ్రంథం కాదు. రాజకీయ నినాదాల కోసం ఉద్దేశించింది అంతకంటే కాదు. ఈ దేశంలో, ఈ గోళంలో ఊపిరిపీల్చే ప్రతి మనిషి ఉనికి కోసం తపనపడి, అతడి భావిని చూసి వెక్కి వెక్కి, పిచ్చెక్కి ప్రవచించిన కవిత’ అంటూ తమ కవితలను నిర్వచించారు. వారి కవిత్వం చదివితే అదెంత నిజమో అర్థమవుతుంది.     - నిర్జర.

చెదరని కథల సంతకం – అల్లం శేషగిరిరావు

చెదరని కథల సంతకం – అల్లం శేషగిరిరావు     ఓ పదిహేడంటే పదిహేడు కథలు రాసిన రచయిత, సాహిత్యంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకోగలరా! సాహిత్య అకాడెమీ అవార్డుని గెలుచుకోగలరా! అంటే కష్టమే అనిపిస్తుంది. మరి ఆ 17 కథలలో ఎంతటి గాఢత లేకపోతే అంతటి గుర్తింపు వస్తుంది. గుర్తింపు సంగతి పక్కన పెడితే కథ రాశామన్న విషయంకంటే మంచి కథరాశామన్న తప్తి రచయితకు అవసరం అన్న విషయమూ రుజువవుతుంది. అలా మంచి కథలతో తెలుగు సాహితీలోకాన్ని మెప్పించిన రచయిత ‘అల్లం శేషగిరిరావు’అల్లం శేషగిరిరావు 1934, డిసెంబర్ 9 న ఒడిశాలోని గంజాం జిల్లాలోని చిత్రపురంలో జన్మించారు. ఆంధ్రా యూనివర్శిటీలో ఎమ్.ఏ చేసి రైల్వేలో ఉద్యోగాన్ని సాధించారు. అదే రైల్వేలలో పదవీవిరమణా చేశారు. శేషగిరిరావు ఆంగ్ల సాహిత్యాన్ని విస్తృతంగా చదివేవారు. హెమింగ్వే వంటి రచయతల ప్రభావం ఆయన మీద ప్రగాఢంగా ఉంది. దానికి తోడు కాళీపట్నం రామారావు వంటి సాహితీకారుల సాన్నిహిత్యమూ ఉండేది. అందుకే వారి కథలు ఆషామాషీగా సాగవు. కాలక్షేపం కోసం అన్నట్లుగా ఉండవు. కథలో బిగువుతో పాటుగా పాఠకుల హృదయాన్ని తాకాలన్న లక్ష్యం స్పష్టంగా ఉంటుంది. శేషగిరిరావు తొలి కథ " పులి చెరువులో పిట్టల వేట" 1967లో ఆంధ్రజ్యోతిలో అచ్చయింది. బహుశా ఆంధ్రజ్యోతి తనను ప్రోత్సహించిందన్న అభిమానంతోనో ఏమో, ఆయన తన కథలలో ఎక్కువ శాతం ఆంధ్రజ్యోతికే పంపేవారు. అల్లం శేషగిరిరావు కథలలో కొట్టొచ్చినట్లుగా కనిపించే ఓ విశేషం- వాటిలోని వేట ఇతివృత్తం. శేషగిరిరావుగారి తొలి కథ వేట ఇతివృత్తంతో వెలువడి, అది ప్రజాదరణ పొందడంతో... ఆయనను అదే ఇతివృత్తంతో రాయమంటూ సంపాదకులు అభ్యర్థించేవారట. వేటకథలన్న పేరు పడటంతో శేషగిరిరావుగారి కథలు ఏవో కాలక్షేపపు సరుకు అనకోవడం దురభిప్రాయమే అవుతుంది. ఒక పక్క జంతువుల స్వభావాన్ని వర్ణిస్తూనే, వాటి ఉనికిని చూపిస్తూనే... మనిషి కృత్రిమంగా ఏర్పరుచుకున్న మృగలక్షణాలని ఎత్తిచూపించడం శేషగిరిరావుగారికే చెల్లుతుంది. అందుకు ‘వఱడు’ అనే కథను గొప్ప ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రచయిత కథనం ప్రకారం వఱడు అంటే ‘‘బాగా ముదిరిపోయిన ముసలి నక్క.. దీన్ని అడవిలో జంతువులన్నీ దయ్యాన్ని చూసినట్లు చూస్తాయి.. బాగముసలిదై పోవడం వల్ల, దానంతటది వేటాడి తినలేదు.. పులి చంపి తినగా ఒదిలిన మాసంతో తన ముసలి కడుపు నింపుకోవడానికి! గొప్ప దగుల్బాజీ జంతువు.’’ అయితే ప్రసవ వేదనతో బాధపడుతున్న తన కూతురిని కాపాడి, తన కోసం పై ఆఫీసరుతో పోట్లాడిన వ్యక్తి మీద ఒక గుమాస్తా చూపిన అవిశ్వాసాన్ని సమాంతరంగా చెప్పుకొస్తారు రచయిత. దాంతో తన తాత్కాలిక లాభం కోసం సాటి మనిషిని బలిచేసే మనిషి వఱడుకంటే భయంకరమైనవాడంటూ చెప్పకనే చెబుతారు. మనిషిలోని స్వార్థపరత్వాన్ని ఎత్తిచూపుతూ సాగే మరోకథ ‘ది డెత్‌ ఆఫ్‌ ఎ మేనీటర్‌’ కూడా శేషగిరిరావు రచనా ప్రతిభను కళ్లకు కడుతుంది. మనిషి రక్తాన్ని రుచిమరిగిన పులిని మట్టుపెట్టేందుకు, తనకు విశ్వాసంగా పనిచేస్తున్న నౌకరునే బలిపెట్టేలనుకుంటాడు ఓ వేటగాడు. కానీ చివరికి అతని పిల్లవాడే ఆ పులికి బలైపోతాడు. పులితో పోరాడే క్రమంలో వేటగాడూ బలైపోతాడు. మేనీటర్‌ అన్న పదం పులులకే కాదు, మనుషులకు కూడా వర్తిస్తుందనేలా సాగుతుంది ఈ కథ. శేషగిరిరావు కథలు సుదీర్ఘంగా సాగుతాయి. రచయిత విశ్లేషణలు ప్రత్యేకించి కనిపించవు. కానీ పాఠకులకు చాలా విషయాలు చెబుతున్నట్లు తోస్తుంది. సంభాషణల్లోనూ, కథ నడిచే తీరులోనూ బిగువు సడలదు. వేట గురించి ప్రస్తావన ఉన్నంతమాత్రాన ఏదో తనది కాని వాతావరణంలో ఉన్నానన్న చిరాకు కలగదు. చితికిపోయిన రాజవంశంలోని చివరి మనిషిగా నిలిచిన ఓ జంట గురించి చెప్పినా (ప్రిన్స్‌ హెమింగ్వే), కాలానికి సాక్ష్యంగా నిలిచిన ఓ తుపాకి గురించి చెప్పినా (శిథిల శిల్పాలు)... ఎలాంటి కథా వస్తువులోకైనా పాఠకుడిని లాక్కువెళ్లడం శేషగిరిరావు ప్రత్యేకత. శేషగిరిరావుగారి కథలు ‘మంచి ముత్యాలు’, ‘అరణ్యఘోష’ అనే సంపుటాలుగా వెలువడ్డాయి. వాటిలో ఉన్న చీకటి, నరమేథం, మృగతృష్ణ వంటి కథలన్నీ వేటికవే ప్రత్యేకంగా నిలుస్తాయి. ‘నక్కలోళ్లు’ అనేర సంచారజాతికి చెందిన డిబిరిగాడు అనే పాత్ర ఆధారంగా రాసిన ‘చీకటి’ కథ విమర్శకుల ప్రశంసలను పొందింది. ప్రసిద్ధ దర్శకుడు దానిని తెరకెక్కించాలనే ప్రయత్నం కూడా చేశారు. తెరకెక్కించకపోతేనేం ‘చీకటి కథ చదివి, క్లాసిక్ మూవీని చూసినంతగా థ్రిల్‌ అయిపోయాను,’ అంటారు నవ్యవవీక్లీ ఎడిటర్‌ జగన్నాథశర్మగారు. ఒక్కమాటలో చెప్పాలంటే అల్లం శేషగిరిరావు కథకులకే నచ్చే కథకుడు. కథ ఎలా రాయాలి అన్న సందేహం వస్తే ‘శేషగిరిరావుగారి కథలు చదవండి!’ అని జవాబుగా మిగిలిపోయేంతటి అక్షరసంపదని అందించినవాడు. అందుకే ఆయన మరణించి 16 సంవత్సరాలు గడుస్తున్నా, ఆయనని అభిమానించేవారి సంఖ్య పెరుగుతోందే కానీ తరగడం లేదు. - నిర్జర.  

అక్షరంతో అణచివేతని ఎదుర్కొన్న – కొలకలూరి ఇనాక్

అక్షరంతో అణచివేతని ఎదుర్కొన్న – కొలకలూరి ఇనాక్ బలహీన వర్గాల పీడన గురించి ఎవరైనా స్పందించి రాయవచ్చు. కానీ అందులో సానుభూతి పాళ్లే ఎక్కువగా కనిపిస్తాయి కానీ సమస్య మూలాల చిత్రణ అసంపూర్ణంగా సాగుతుందన్నది ఓ ఆరోపణ. అందుకే ఏ వర్గానికి చెందిన రచయితలు తమ వర్గంలోని కన్నీటిగాథలను అక్షరబద్ధం చేసే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. అలా దళితుల తరఫున కలాన్ని ఎక్కపెట్టినవారి జాబితా ఒకదాన్ని రూపొందిస్తే అందులో ఆచార్య కొలకలూరి ఇనాక్ పేరు తప్పక ప్రస్తావనకు వస్తుంది. 1939లో గుంటూరు జిల్లా వేజెండ్లలోని ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారు ఇనాక్‌. వెనుకబడిన కులాలవారు చదువుకోవడమే సాహసమనుకునే రోజులవి. కానీ ఇనాక్‌కి ఆ పట్టింపు లేకపోయింది. తను చూస్తూ ఉన్న అణచివేతని అక్షరంతోనే ఎదుర్కోవాలన్న తిరుగుబాటు ధోరణో, తను మోస్తూ ఉన్న అస్పృశ్యత బరువుని విదిలించి వదిలించుకోవాలనే తాపత్రయమో... కారణం ఏదైనాగానీ ఇనాక్ చదువు మీద పట్టు బిగించారు. తెలుగులో ఆచార్యుడిగా పదవిని సాధించేవరకూ ఆ పట్టు కాసింతైనా సడలనే లేదు. ఇనాక్‌ అక్షరాన్ని జ్ఞానసముపార్జన కోసమే కాదు... తన భావాలకీ, బాధలకీ ఒక రూపాన్నించేందుకు కూడా ఉపయోగించారు. ఆ దిశగా సాగేందుకు ఆయనకు గుర్రం జాషువా, కరుణశ్రీల ప్రభావం తోడ్పడింది. అలా 1950ల నుంచే రచనలు చేయడం మొదలుపెట్టారు. పీడనకు సంబంధించి తన నిజజీవితంలో జరిగిన ఒక సంఘటనే ప్రేరణగా 1954లో ‘ఉత్తరం’ పేరుతో తొలి కథను రాశారు. అప్పటికి ఆయన వయసు 15 ఏళ్లు మాత్రమే. అది మొదలు కథలు, కవితలు, నాటకం, నాటిక, పద్యాలు, పరిశోధనా వ్యాసాలు... ఇలా సాహిత్యానికి సంబంధించిన ప్రతి ప్రక్రియలోనూ తనదైన అరుదైన అక్షరంతో సాగిపోయారు. ఒకపక్క ఉద్యోగపర్వంలో అంచెలంచెలుగా ఎదుగుతూనే, సృజనరంగంలోనూ తన ఉనికిని చాటుకున్నారు. అందుకనే ఉద్యోగిగా అటు  శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపకులపతి స్థాయిని చేరుకున్నారు. ఇటు రచయితగా పద్మశ్రీవంటి గౌరవాలనూ అందుకున్నారు. 2015లో భారతీయ జ్ఞానపీఠ్ సంస్థ అందించే ప్రతిష్టాత్మకమైన ‘మూర్తిదేవి పురస్కారా’న్నీ సాధించారు. ఈ పురస్కారాన్ని అందుకున్న ఏకైక తెలుగు రచయిత ఇనాకే కావడం విశేషం. ఒక అంచనా ప్రకారం కొలకలూరి ఇనాక్‌ సాహిత్యం 70కి పైగా గ్రంథాలలో వెలువడింది. ఇంత విస్తృతంగా రచనలు చేసినప్పటికీ వాటిలోని భావం ఏమీ పల్చబడినట్లు తోచదు. హడావుడిగా రాసినట్లు అసలే అనిపించదు. అందుకు మచ్చుగా పదులకొద్దీ ఉదాహరణలను చెప్పుకోవచ్చు. దాదాపు 40 ఏళ్ల క్రితం రాసిన ఊరబావితోనే ఇనాక్‌ దళిత సాహిత్యాన్ని ఒక్క ఊపు ఊపారు. కొందరి విశ్లేషణ ప్రకారం ఇది తెలుగులో తొలి దళిత స్త్రీవాద కథ! ఊరిలోని ఉమ్మడి బావిలోని నీటిని తోడుకునేందుకు దళితులు సాగించిన పోరటమే ఈ కథలోని ఇతివృత్తం. ‘చిదంబరం భార్య’ అంటూ అస్తిత్వం లేని వారి బతుకులని గుర్తుచేస్తూనే... ఊరి పెద్దల మీద ఆ ‘చిదంబరం భార్య’ కక్ష తీర్చుకున్నట్లుగా చూపిస్తారు. విషయాన్ని నేరుగా చెప్పకుండానే వర్ణనల ఆధారంగా పాఠకులకు కథావస్తువుని అందించిన ఊరబావి, ఇనాక్ శైలికి మచ్చుతునకగా మిగిలిపోయింది. ఇనాక్‌ కథలలో ఇతివృత్తాలన్నీ బడుగు జీవితాలే. అణగారిన వర్గాలే! అది పురాణాలలోని శూర్పనఖ (కన్నీటి గొంతు) పాత్ర కావచ్చు, ఆళ్వారులలో దళితుడైన తిరుప్పాన్‌ ఆళ్వార్‌ (మునివాహనుడు) కావచ్చు. ఏ పాత్రను తీసుకున్నా... దాని ద్వారా సమాజంలో పడుకుపేకలుగా పెనవేసుకుపోయిన కులవ్యవస్థని కళ్లకు కట్టడమే ఇనాక్‌ లక్ష్యంగా తోస్తుంది. పాత్రను ఎన్నుకోవడం, కథా వస్తువుని ఎంచుకోవడమే కాదు... కథలోనూ అడుగడుగునా బడుగుల బాధల వర్ణన కనిపిస్తుంది. ఏ వర్గంవారితోనైనా అయ్యో అనిపిస్తుంది. అందుకు ఉదాహరణగా ‘తల లేనోడు’ కథని చెప్పుకోవచ్చు. ఇనాక్‌ కథలలో ప్రసిద్ధమైన కథలలో ‘తల లేనోడు’ కూడా ఒకటి. మంగలిపని చేసుకునే నాగలింగానికీ, ఊరి మునసబు వీరన్నకీ మధ్య జరిగే సంఘర్షణే ఈ కథ. నాగలింగానికి జీవనాధారంగా ఉన్న రెండెకరాలనీ వీరన్న మోసంతో లాక్కొంటాడు. ఆ మరుసటి రోజే తనకి క్షవరం చేయమంటూ నాగలింగానికి కబురు పంపుతాడు వీరన్న. చేయక తప్పని కులవృత్తి. ఆపై దానిని వదులుకుంటే ఊళ్లో ఉండనిచ్చే ప్రసక్తి లేదంటూ వీరన్న నుంచి వచ్చిన బెదిరింపు. ఆ బెదిరింపుకి తలొగ్గి క్షవరానికి పూనుకొన్న నాగలింగం. టూకీగా ఇదీ కథ! కానీ క్షవరం చేస్తున్నంతసేపూ ముందుకీ వెనక్కీ సాగే కథనం అపూర్వంగా తోస్తుంది. నాగలింగం చివరికి తన కత్తితో వీరన్న గొంతుని కోసిపారేస్తాడేమో అనిపిస్తుంది. కథలో మాటిమాటికీ ఈ అనుమానం రేకెత్తేలాంటి ప్రస్తావనలు కనిపిస్తాయి- ‘నాగలింగం వీరన్న గొంతు చూస్తున్నాడు. ఒకనాటి మిత్రుడి గొంతు, నేటి మునుసబు గొంతు, అమృతం (సారా) తాగిన గొంతు, తాగించిన గొంతు, పేకాడించిన గొంతు, పెడసరంగా మాట్లాడిన గొంతు, డబ్బు అడిగిన గొంతు, అబద్ధం ఆడిన గొంతు, మోసం చేసిన గొంతు, కోర్టుకీడ్చిన గొంతు- కత్తి కింద మెత్తగా ఒత్తుగా చర్మపు పొరతో, అరతో కదులుతున్న సాగుతున్న జారుతున్న గొంతు!’ అంటూ వర్ణిస్తాడు రచయిత ఒకచోట. ఇంత చదివాక నాగలింగం ఆ గొంతుని కోసిపారేస్తే బాగుండు అని పాఠకుడికే అనిపిస్తుంది. కానీ చివరికి అలా జరగదు. రచయిత చాకచక్యంగా అటు పాఠకుడిలో తిరుగుబాటు ధోరణిని రెచ్చగొడుతూనే సీదాగా ముగిసిపోతుంది. అలాగని ఇనాక్ ప్రతికథా నిస్సహాయంగానే ముగుస్తుందని అనుకోవడానికి లేదు. ఊరబావి కథలో లాగానే అణగారిని వర్గాలు తిరగబడే సందర్భాలూ కనిపిస్తాయి. అందుకు ‘సూర్యుడు తలెత్తాడు’ అన్న కథే సాక్ష్యం. ఇందులో రావడనే మనిషికి మొదట్లో ఏమాత్రం ప్రశ్నించే ధోరణి కనిపించదు. ‘రావడి శరీరాన్ని పంచభూతాలు బతికుండగానే పంచుకున్నాయి. ఏం పొరపాటు జరిగిందో ఎముకలు మిగిలాయి. మరేమయిందో అవి కదులుతున్నాయి’ అంటూ రావడి తీరుని వర్ణిస్తాడు రచయిత. ఆ రావడి పేదరికం కారణంగా కుటుంబం యావత్తూ చిన్నాభిన్నం అయినా అతనిలో చలనం కలగదు. భూమి చుట్టూ తిరిగే సూర్యుడిలాగా రావడి జీవితం అతని పొలం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. కానీ ఒకప్పటి వందరూపాయల బాకీని సాకుగా చూపి, రావడి పొలాన్ని దిగమింగే ప్రయత్నాలు మొదలయ్యాయో అప్పుడు రావడిలో చలనం మొదలవుతుంది. ‘కుంకిన సూర్యడు రావడి ముఖంలో అర్ధరాత్రి పుట్టాడు,’ అంటాడు రచయిత. అది కులవృత్తుల సమస్య కావచ్చు, ఆర్థిక దోపిడీ కావచ్చు, పెత్తందారీతనం కావచ్చు... అణగారిన వర్గాలకు సంబంధించిన ఏ సమస్యనైనా తలకెత్తుకున్న రచనలని చదవాలంటే- ఇనాక్‌ రాసే అక్షరాలను అనుసరిస్తే చాలు.   - నిర్జర

విషాద గీతాలని పలికించిన ‘అల్లం రాజయ్య’ కలం

విషాద గీతాలని పలికించిన ‘అల్లం రాజయ్య’ కలం   పేదవాడి కన్నీటి గురించి ఎవరైనా రాయగలరు. కాస్త పరిశీలన, మరికాస్త సృజన ఉంటే.. ఏ రచయిత కలం నుంచైనా బడుగుల మీద సాగే వివక్ష అక్షరాలుగా రూపుదిద్దుకుంటుంది. కానీ అందులో గాఢత ఎంతవరకు ఉంటుందన్నది అనుమానమే! ఎందుకంటే చాలామంది రచయితలు తాము పేదల పక్షం అని చెప్పుకొనేందుకు... ఏవో పైపైన తడిమి చూసిన జీవితాల గురించి రాస్తారే కానీ... గుండెలోతుల తడిని గమనించేంత నిబద్ధత వారిలో ఉండదు. అలాంటి నిబద్ధత కలిగిన రచయిత కనుకే అల్లం రాజయ్య రచనలు పేదవాడి సాహిత్యంలో దీపస్తంభాలుగా వెలుగుతూ ఉంటాయి. కరీంనగర్ జిల్లా మంథని తాలూకాలోని మారుమూల గ్రామమైన గాజులపల్లిలో 1952లో జన్మించారు అల్లం రాజయ్య. వారిది పేదరైతు కుటుంబమే అయినా సామాజికంగా కాస్త పై మెట్టు మీద ఉన్న వర్గం కావడంతో... ఇంటి ముందు రకరకాల పంచాయితీలు జరుగుతుండేవి. వాటిని నిశితంగా గమనించిన రాజయ్యకు అందులో పేదల సమస్యలు, ఆ పేదలని అణచివేసేందుకు పెద్దలు వేసే ఎత్తులు కనిపించేవి. పల్లెటూరిలో ఉన్నప్పుడు రాజయ్యది బలవంతుల వర్గం. కాబట్టి బలహీనుల పట్ల ఉన్న వివక్షను గమనించే అవకాశమే చిక్కింది. కానీ ఉన్నత పాఠశాల చదువు కోసం మంథనికి చేరుకున్నప్పుడు.... గ్రామీణుడిగా పీడితపక్షంలో భాగమయ్యాడు. పట్నవాసుల చేతిలో అవహేళనలు ఎదుర్కొని వివక్ష ఎలా ఉంటుందో స్వయంగా అనుభవించాడు.   ఒక పక్క తాను ఎదుర్కొంటున్న వివక్షని వ్యతిరేకించేందుకు విద్యార్థిసంఘాలలో చురుగ్గా పాల్గొంటూనే, తనలో రేగుతున్న ప్రశ్నలకు సాహిత్యంలో జవాబుని వెతుక్కునే ప్రయత్నం చేయసాగారు రాజయ్య. రష్యన్ సాహిత్యం నుంచి చలం రచనల వరకూ రకరకాల పుస్తకాల ఆయనలోని తిరుగుబాటు ధోరణికి ఒక సహేతకతని అందించాయి. కాలేజిలో చేరిన రాజయ్య విద్యార్థినాయకునిగా ఎదిగేందుకు దోహదపడ్డాయి. అదే సమయంలో తొలి తెలంగాణ ఉద్యమం రాజుకుంది. అందులో చురుగ్గా పాల్గొన్న రాజయ్య ఒక ఏడాదిపాటు చదువుకి దూరమైనా పదేళ్లకు సరిపడా పరిణతి దక్కింది. ఎలాగొలా రాజయ్య బి.ఎస్.సి పూర్తిచేశారు. వ్యవసాయం చేసే ప్రయత్నం చేసి, అది గిట్టుబాటు కాక ఓ చిరుద్యోగంలో చేరారు. ఇదే సమయంలో (1975-77) దేశంలో ఎమర్జన్సీ పరిస్థితులు నెలకొన్నాయి. రాజయ్యలోని ఆలోచనాపరుడు రచయితగా మారిన సందర్భం అదే! ఆ సమయంలో తాను చూసిన ఒక సంఘటన ఆధారంగా ఆయన ‘ఎదురు తిరిగితే’ అనే కథను రాశారు. అదే రాజయ్య తొలి కథ! కానీ చేయి తిరిగిన కథకులకు సైతం కన్ను కుట్టేంతగా ఆ కథ ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. రాజయ్య కథలను ఉద్యమకారులు సైతం పదిమందికీ చదివి వినిపించడం అనేది ఆయన తొలి కథతోనే మొదలైపోయింది. అల్లం రాజయ్య ఎనిమిది నవలలతో పాటుగా వందలోపు కథలు రాశారు. రాశిపరంగా చూసుకుంటే ఈ సంఖ్య చాలా తక్కువగానే కనిపించవచ్చు. కానీ సాహితీకారులు ఆయన చేసిన ప్రతి ఒక్క రచననీ ఒక క్లాసిక్గా భావిస్తారు. ముఖ్యంగా ‘మహాదేవుని కల’, ‘మనిషి లోపలి విధ్వంసం’ వంటి రచనలు ఆయన ప్రతిభకు పరాకాష్టగా నిలుస్తాయి. ఇంతవరకు మనం బడుగువర్గాలు భూమి మీద పెంచుకున్న మమకారం గురించిన కథలే చదివాము. కానీ ఒక బ్రాహ్మణకుటుంబానికి చెందిన వ్యక్తి వ్యవసాయం మీద మక్కువ పెంచుకుంటే... దానిని సమాజం ఎలా స్వీకరిస్తుంది అన్న ప్రశ్నకు జవాబే ‘మహాదేవుని కల’ కథ. సమాజపు వైఖరితో పిచ్చెత్తిపోయిన మహాదేవ్ ప్రవర్తన ఆధారంగా ఈ కథ నడుస్తూ ఉంటుంది. ఒక పిచ్చివాడికి కనిపించేది ఏమిటి? అతని చుట్టూ ప్రజలు అనుకునేది ఏమిటి? వంటి విషయాలను కథనంలోకి మార్చడమే కష్టం అయితే, దానికి తోడు... పాత్ర వెనుక ఉన్న సామాజిక విషాదాన్ని కూడా పలికించిన అద్భుతం ‘మహాదేవుని కల’. ‘మహాద్భుతమైన మనిషి, ఆరోగ్యవంతమైన మనిషి, మట్టి నుంచి పచ్చటి మొక్కలు, పంటలు- సర్వ సంపదలు సృష్టించదలచుకున్న మనిషి మహాదేవ్ సకల కలలను, సర్వశక్తులను హరించిందెవరు? ఈ విధ్వంసం ఎప్పుడు? ఎక్కడ? ఎట్లా ఆరంభమయ్యింది? ఎప్పుడుఅంతమౌతుంది?’ అంటూ వర్ణవ్యవస్థ మూలాలనే స్పృశించే వాక్యాలతో ‘మహాదేవుని కల’ ముగుస్తుంది.   రాజయ్య కథల్లో ప్రముఖంగా వినిపించే మరో శీర్షిక ‘మనిషి లోపలి విధ్వంసం’. తన జీవితం సుఖంగా సాగిపోతోందని భ్రమించే నాగరికులకి ఈ కథ చదివిని తరువాత మత్తు దిగిపోవడం ఖాయం. భూమిని నమ్ముకున్నవారి జీవితాలూ తనచుట్టూ ఎలా జీవచ్ఛవాలుగా మారిపోతున్నాయో ఒక్కసారిగా కళ్లకి కడుతుంది ఈ కథ. కథలోని వాస్తవం, దానిని అక్షరబద్ధం చేసిన తీరు వల్ల ఇది విశ్వజనీనమైన కథగా మారిపోయింది. అందుకే అనేక భాషలలోకి అనువదించబడింది. ఒక రైతు కొడుకు రైలు పట్టాల మీద తలపెట్టి ఆత్మహత్య చేసుకోవడం ఈ కథలోని నేపథ్యం. కానీ ఆ నేపథ్యంలో సాగే కథనం గుండెలను పిండేస్తుంది. కావాలంటే అందులోంచి ఈ మాటలు చదివి చూడండి... ‘రాజారాంకు (కొడుకుని పోగొట్టుకొన్న రైతు) ఈ ప్రశ్నలన్నీ సలుపుతున్నాయి. తన కొడుకును తన దగ్గరే ఉంచుకుంటే చావకపోయేటోడా? తనే ఎప్పుడో చచ్చిపోయినంక వాళ్లనెట్లా ఉంచుకుంటాడు? తన చావు ఎప్పుడు ఆరంభమయ్యింది. తన కలల ప్రపంచాన్ని ఎవరు విధ్వంసం చేశారు. ఎప్పుడు చేశారు? తన ఏడుపు ఎక్కడ, ఎప్పుడు తెగిపోయింది. తన బండరాయా? తన నరాలు ఒక్కొటొక్కటే పుటుక్కుపుటుక్కున తెంపిందెవరు? చనిపోయిన అన్నా? చదువు ఆపి పెద్ద కుటుంబాన్ని సాదుక వచ్చినప్పుడా? మిరప తోటకు కొరుకుడు రోగం తాకి మాడిపోయినప్పుడా? అప్పుకింద షావుకారు భూమి గింజుకున్నప్పుడా? అంజుమన్ అప్పులు, తనఖా బ్యాంకు వాళ్లు వేలం పాడినప్పుడా? సర్వం ఒక్కొక్కటే ఊడ్చుకుపోయి రైతు, కూలిగా మారినప్పుడా? కాదు, ఈ అన్నీ జాగల్ల తన జీవనాడులు ఒక్కొక్కటే తెగిపోయినయ్.’ చెప్పుకొంటూ పోతే అల్లం రాజయ్య రాసిన ప్రతి కథలోనూ ఏదో ఒక వేదన కనిపిస్తుంది. రైతులు, కూలీలు, ఆదివాసులు, గిరిజనులు, అంటరానివారు... ఇలా ప్రతి ఒక్కరి పట్లా సాగుతున్న వివక్ష కనిపిస్తుంది. అస్తవ్యవస్తమైన వ్యవస్థల మధ్య ఛిద్రమవుతున్న వారి జీవితం కనిపిస్తుంది. ఆ జీవితాలను ప్రతిబించేందుకు రాజయ్య పుంఖానుపుంఖాలుగా రాయనవసరం లేదు. రాసిన ప్రతి కథా సుదీర్ఘంగా సాగనక్కర్లేదు. ఉదాహరణకు ప్రభుత్వ దవాఖానాల్లో ఉన్న నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపేందుకు రాజయ్య రాసిన ‘బూడిద’ అనే కథ ఒక పెద్ద పేజీకి మించదు. విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా చెప్పేందుకు అంతకంటే పేజీలు కావాలా అనిపిస్తుంది ఆ కథని చదివితే! రాజయ్య కలం నుంచి ప్రస్తుతం కథలు తగ్గిపోయాయి. అయితే తాను మారుతున్న జీవితాలను పరిశీలిస్తున్నాననీ... త్వరలోనే మళ్లీ కలం పడతాననీ చెబుతున్నారు రాజయ్య. ఈసారి ఆయన కలం ఏ విషాద రాగాన్ని పలికిస్తుందో మరి!                                     - నిర్జర.  

స్త్రీ జీవితానికి సాక్ష్యాలు- పి.సత్యవతి కథలు

స్త్రీ జీవితానికి సాక్ష్యాలు- పి.సత్యవతి కథలు   తెలుగు సాహిత్యం చేసుకున్న అదృష్టం ఏమోగానీ కొన్ని దశాబ్దాలుగా మన భాషలో స్త్రీవాద సాహిత్యానికి లోటు లేకపోయింది. వాసిలో ఎక్కువో తక్కువో కావచ్చు. ఇతర భాషలతో పోలిస్తే భావాలు భిన్నంగా ఉండవచ్చు. కానీ స్త్రీ అణచివేత గురించి ఎవరో ఒకరు అక్షరబద్ధం చేస్తూనే ఉన్నారు. అలాంటి రచయితలలో పి.సత్యవతి ఒకరు. నిజానికి తెలుగు స్త్రీవాదులకి సత్యవతి గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కాకపోతే ఆమె కలం నుంచి వచ్చిన అపురూపమైన కథల్ని మరోసారి గుర్తుచేసుకునే ప్రయత్నమే ఇది! 1940 జులై 2న గుంటూరు జిల్లాలోని కొలకలూరు అనే గ్రామంలో జన్మించారు సత్యవతి. ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి వరకూ అక్కడే చదువుకున్నాక బీఎస్సీ కోసం హైదరాబాదులోని మేనమామ ఇంటికి చేరుకున్నారు. ఆమె మేనమామ పి.యస్‌.రావు మంచి విద్యావంతుడు. పైగా అధ్యాపక వృత్తిలో ఉన్నారు. ఆయన ఇంట్లో పుస్తకాలకి కొదవ ఉండేది కాదు. ఇంకే! అప్పటికే సాహిత్యంతో పరిచయం ఉన్న సత్యవతికి ఆ పుస్తకాలు కావల్సినంత సరుకుని అందించాయి. అలా సాహిత్యం పట్ల ఏర్పడిన అభినివేశంతో ఆమె ఇంగ్లిష్ లిటరేచర్‌లో బీయే పట్టా పుచ్చుకున్నారు. వివాహానంతరం ఆంధ్రప్రభ దినపత్రికలో సబ్‌ ఎడిటర్‌గా పనిచేస్తూ, తనకి ఇష్టమైన సాహిత్యాన్నే కార్యక్షేత్రంగా మలుచుకున్నారు. తరువాత కాలంలో ఉద్యోగం మానివేసినా ఇంగ్లిష్ లిటరేచర్‌లో ఎమ్మె డిగ్రీని పుచ్చుకున్నారు. 1980 నుంచి 1996 వరకు ఆంగ్లోపన్యాసకురాలిగా ఈసారి సుదీర్ఘకాలం పాటు ఉద్యోగం సాగించారు.     సత్యవతిగారు కలం పట్టేనాటికే తెలుగునాట స్త్రీలకు సంబంధించిన ఎన్నో సమస్యలు కథల రూపంలో వచ్చాయి. కానీ వారి వెతలని చూపించే ఇతివృత్తాలకి కొదవ ఏముంటుంది. అందుకే ఎప్పటికప్పుడు భిన్నమైన కథలతో పాఠకుల్ని ఆశ్చర్యపరిచేవారు సత్యవతి. 1978లో ఆమె రాసిన ‘మాఘ సూర్యకాంతి’తోనే సత్యవతి సునిశిత శైలి పాఠకలోకానికి పరిచయం అయిపోయింది. ‘మారిటల్‌ రేప్‌’ గురించి ఇప్పుడంతా ధైర్యంగా మాట్లాడుతున్నారు. కానీ పడకగదిలో మగవాడి అకృత్యాల గురించి దాదాపు 40 ఏళ్ల క్రితమే ‘మాఘ సూర్యకాంతి’ కథలో పేర్కొన్నారు. కూతురికి ఎలాగొలా పెళ్లి చేసేస్తే తన బాధ్యత తీరిపోతుందనుకునే తండ్రి, అలా పెళ్లి జరిగాక భర్త గొంతు పిసికినా కూడా మౌనంగా భరించాలని సూచించే సమాజం, నరకంకంటే దారుణమైన అలాంటి సంసారం అంటేనే వణికిపోయే ఆడవారు, ఇదంతా మౌనంగా చూస్తూ ఉండిపోయే తల్లి... ఇవన్నీ ఇప్పటికీ వ్యక్తమవుతున్న సందర్భాలే. కానీ ‘‘నాకు విడాకులు వద్దు. నేను కోర్టుకు రాను. నా బ్రతుకు నేను బ్రతుకుతాను. అతన్ని ఎన్ని పెళ్ళిళ్ళయినా చేసుకోమను- నాకేం అభ్యంతరం లేదు. నేను కలుగజేసుకోను. నాకింతా బతకాలని ఉందమ్మా. నేను వెళ్లను. అక్కడికి వెడితే నేను చచ్చిపోవడం ఖాయం,’’ అంటూ వాపోయే కూతురికి తల్లి అండగా నిలబడటంతో ‘మాఘ సూర్యకాంతి’ సుఖాంతం అవుతుంది. సత్యవతిగారి కథలన్నింటిలోనూ స్త్రీలే ప్రధాన పాత్ర కావచ్చు. అలాగని వాటిలో ఏదో ప్రత్యేకించిన చర్చలు కనిపించవు. కథనంలోనో, సంభాషణల్లోనో భాగంగా సమస్య వ్యక్తమయిపోతూ ఉంటుంది. ఆ సమస్యకి మూలం ఏమిటి, దానికి పరిష్కారం ఎలా అన్న ఆలోచనను పాఠకులలో రేకెత్తిస్తూ ఉంటుంది. ఒకో కథలో అయితే కేవలం స్త్రీ ప్రధానమైన ఘట్టం మాత్రమే ఉంటుంది. దానికి ‘దమయంతి కూతురు’ అన్న కథే ఓ ఉదాహరణ. దమయంతి అన్నావిడ కుటుంబాన్ని వదిలి ‘వెళ్లిపోవడం’ అన్నదే కథలోని సన్నివేశం. ఆవిడ ఎందుకు వెళ్లిపోయింది? పసిపిల్లలని వదిలేసి అలా వెళ్లిపోవడం ఎంతవరకు సబబు? వంటి విషయాల గురించి పెద్దగా వివరాలు కథలో కనిపించవు. మానసిక క్షోభ అనుభవించలేక ఆమె వెళ్లిపోయి ఉంటుందనీ... ఆమె దూరమై పిల్లలు ఎంత బాధపడ్డారో, ఆమె కూడా అంతగానే బాధని అనుభవిస్తూ ఉండి ఉంటుందన్న సూచనని మాత్రమే అందిస్తారు. కానీ అలాంటి స్త్రీ పట్ల, ఆమె పిల్లల పట్లా సమాజపు అభిప్రాయాలు ఎలా ఉంటాయో మాత్రం స్పష్టంగా కనిపిస్తాయి.   సత్యవతిగారి కథల్లో కనిపించే మరో విశిష్టమైన లక్షణం మేజిక్ రియలిజం. కాల్పనిమైనది అనిపించే ఒక సంఘటనని మన జీవితాలను అన్వయింపచేయడమే ఈ మేజిక్‌ రియలిజం లక్షణం. స్త్రీవాద సాహిత్యంలో ఇది కొత్త కాకపోయినప్పటికీ, తెలుగువారి జీవితాలని ఈ తరహా కథనంతో ప్రతిబించాలనుకోవడం సాహసోపేతమే! ఎందుకంటే పాఠకుడికి ఈ శైలి ఏమాత్రం అర్థం కాకపోయినా కథ పేలవంగా మారిపోతుంది. పైగా రచయిత ఉద్దేశమూ వృధా అయిపోతుంది. మేజిక్ రియలిజంతో సత్యవతిగారు రాసిన కథలలో ‘సూపర్‌మామ్‌ సిండ్రోమ్‌’, ‘మంత్రనగరి’ అనే కథలు రెండూ కూడా ఎన్నిదగిన తెలుగు కథల జాబితాలో చేరిపోయాయి. ఆర్థిక స్వాతంత్ర్యం కోసం ఉద్యోగం చేయాలి, అలాగే ఇంటిని కూడా మచ్చ పడకుండా శుభ్రంగా ఉంచుకోవాలి, భర్తని చక్కగా చూసుకోవాలి, కూతురికి అమెరికా సంబంధం కట్టబెట్టాలి, కొడుకుని ఎలాగైనా విదేశాలకు పంపించాలి, శుభకార్యాలలో పాల్గొనాలి.... ఇలా ప్రతి విషయంలోనూ ముందుండాలనే తాపత్రయమే సూపర్‌మామ్‌ సిండ్రోమ్‌ అంటారు రచయిత్రి. ఆ తపనలో తన శరీరాన్ని కష్టపెట్టుకుంటూ, మాత్రలు మింగుతూ ఉండే ఒక సూపర్‌మామ్‌ కథే ఇది. మాత్రలు మింగీ మింగీ ఆమె శరీరమంతా చివరికి మాత్రలమయంగా మారిపోవడంతో ఆమె జీవితం ముగిసిపోతుంది. ‘మంత్రనగరి’ కథ కూడా మేజిక్‌ రియలిజంతోనే సాగుతుంది. స్త్రీ తల ఎత్తుకు నిలబడేందుకు తరతరాల పోరాటం జరిగిందనీ... విదేశీ మోజులో పడి ఇప్పుడు మళ్లీ మరోరకమైన నిస్తేజంలోకి స్త్రీ సమాజం మారిపోతోందని హెచ్చరిస్తారు రచయిత్రి. అమెరికాను ఒక పైడ్‌ పైపర్‌గా (pied piper) వర్ణిస్తూ, ఆ ఆకర్షణలో పడిన జీవితాలు ఎంత కృతకంగా మారిపోతున్నాయో చూపిస్తారు. కూతుళ్లకి పురుడు పోయడానికి వెళ్లే తల్లులు, అక్కడి వ్రతాలలో జరిగే హంగామా వంటి సందర్భాలన్నీ వల్లిస్తారు. ఏతావాతా, భౌతిక ఆడంబరాలలో పడి మహిళలు మళ్లీ తమ అస్తిత్వాన్ని కోల్పోతున్నారన్నది రచయిత్రి భావనగా గ్రహించవచ్చు. సత్యవతిగారు కథలే కాకుండా ‘ఇస్మత్‌ చుగ్తాయ్ కథలు’ వంటి అనువాదాలు కూడా చేశారు. ‘రాగం భూపాలం’ అనే వ్యాస సంపుటిని కూడా వెలువరించారు. సత్యవతిగారి కథలు ఇప్పటివరకూ నాలుగు సంపుటాలుగా వెలువడ్డాయి. సత్యవతి కథల, ఇల్లలకగానే, మంత్రనగరి, మెలకువ- అనేవే ఈ నాలుగు సంపుటారు. వీటిలోని కథలన్నీ కలిపి 60లోపే ఉంటాయి. ఈ కథలన్నీ అద్భుతాలు కాకపోవచ్చు. కానీ ఇలాంటి కథ రాయడం ఆవిడకే సాధ్యం ఆన్న తరహాలో చాలా కథలు సాగుతాయి. సంఘర్షణపూరితమైన స్త్రీ జీవితానికి ఇది ప్రతీక అనేలా ప్రతి కథా నిలుస్తుంది. ఇక దాదాపు ఓ ఇరవై కథలన్నా తెలుగు స్త్రీవాద స్థానంలో సుస్థిరస్థానంలో నిలుస్తాయి. ఏతావాతా సత్యవతి గారి కథలు... ప్రతి పాఠకుడినీ ఆలోచింపచేస్తాయి. ఒక రచయితగా ఇంతకంటే సార్థకత మరేముంటుంది! - నిర్జర.

అరుదైన కథల - సదానంద్ శారద

  అరుదైన కథల - సదానంద్ శారద     కొందరు కథకుల గురించి చెప్పాలంటే ఫలానా కథ రాసిన రచయిత అంటే సరిపోతుంది. సాహిత్యలోకం అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడి అతనికి సాదరంగా ఆహ్వానం పలుకుతుంది. అలా ‘జాడీ’ అనే ఒకే ఒక్క కథతో తెలుగు సాహిత్యంలో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్న రచయిత సదానంద్‌ శారద. సదానంద్ శారద అసలు పేరు పాకాల సదానంద్. పుట్టింది పోరుగడ్డ వరంగల్లులో. వరంగల్ చరిత్రలోని పౌరుషమే ఒంటపట్టిందో, చిన్నప్పటి నుంచి చదువుతూ వస్తున్న సాహిత్యమే వెన్ను తట్టిందో.. 1977లో ప్రచురితం అయిన తొలి కథ జాడీతోనే తనేమీటో నిరూపించుకున్నారు. తన శ్రీమతి శారద పేరుతో కలుపుకొని ‘సదానంద్‌ శారద’గా సాహితీలోకానికి పరిచయం అయ్యారు. కథానిలయం అందిస్తున్న వివరాల ప్రకారం ఈయన రాసిన కథలు 100లోపే. చాలాకథలలో పేదవారి వెతలే ఇతివృత్తంగా సాగుతాయి. తెలంగాణ ప్రాంతపు బడుగుల జీవితాలను కళ్లకు కడతాయి. ‘మన సమాజంలో ఎన్నో సమస్యలున్నాయి- మన సంఘంలో ఎన్నో దురాచారాలున్నాయి- మన దేశంలో ఎంతో పేదరికం ఉంది. వీటిని పరిష్కరించగలిగే వాళ్లం మనమే. అది గుర్తుచేయడానికే సాహిత్యం అని నమ్మేవాళ్లలో నేను ఒకణ్ని’ అంటారు సదానంద్‌. ఈ మాటల్ని బట్టే ఆయన ఆషామాషీగా కథలు రాయదల్చుకోలేదని అర్థమవుతుంది. సదానంద్ కథలు కాస్త విభిన్నంగా ఉంటాయి. ఇందులో పేదలు పేదలలాగానే కనిపిస్తారు. వారి మాటల్లో కసి ఉండదు. తిరుగుబాటు కనిపించదు. పైగా జీవితంతో రాజీపడిపోయిన ధోరణి కనిపిస్తుంది. కానీ చదివే పాఠకుడిలోనే కసి పెరుగుతుంది. తెలియని తిరుగుబాటు మొదలవుతుంది. పోలిక, వ్యంగ్యం... ఈ రెండూ సదానంద్‌ కథల్లో తొంగిచూస్తుంటాయి. ఊహకిందని భిన్నమైన ఇతివృత్తం ఆయన కథనంలో వినిపిస్తుంది. పేదరికాన్ని ఫొటో తీసి బహుమతి కొట్టే ఫొటోగ్రాఫరు అందలాలు ఎక్కుతాడు సరే, మరి ఆ ఫొటోలో ఉన్న పేదవాడి బతుకు ఏమన్నా మారి ఉంటుందా! ఈ ఆలోచనతో ‘ఫొటో’ అనే కథే రాశారు రచయిత. అలాగని కేవలం పేదరికపు కష్టాలతోనే సదానంద్ కథలన్నీ నిండిపోయాయనుకోవడానికి లేదు. ‘ఎంత కష్టం వచ్చినా నిజాయితీగా ఉండాలనుకునే ఓ ప్రభుత్వోద్యోగికి చేతిలో చిల్లగవ్వైనా లేని సందర్భం వస్తే ఎలా ఉంటుంది!’ అని ఊహించి ‘తులసి మొక్క’ అనే కథ రాశారు. ఈ కథ చదువుతున్నంత సేపూ కథానాయకుడిలాగానే పాఠకుడి గుండె కూడా దడదడా కొట్టుకోవడం ఖాయం. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ రాయాలంటే హత్యలు, దయ్యాలే అవసరం లేదనీ... మన రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఉద్విగ్న పరిస్థితులను కూడా పటువైన కథలుగా రాయవచ్చనీ ‘తులసి మొక్క’ను చదివితే అర్థమవుతుంది. ఇక కులం హద్దులు చెరిగిపోయాయని ఎవరెంతగా ఘోషిస్తున్నా, అవి రంగుటద్దాలులాగా ప్రతి మనిషి జీవితంలో భాగంగానే ఉన్నాయని తేల్చి చెబుతుంది ‘ఉప్పునీళ్లు’ అనే కథ. హరిజనులకు చెందిన ఒక అమ్మాయి కాలేజీలో ప్రవేశిస్తే, ఆమె ఎలాంటి క్షోభకు గురికావల్సి వస్తుందో ఈ కథతో తేలిపోతుంది. సదానంద్‌ శారద తన మనసుకి తట్టిన ఏ బాధనీ అలా ఊరికనే వదిలిపెట్టినట్లు కనిపించదు. ఆ బాధని ఒక కథారూపంలోకి మార్చేందుకు తగిన ఊహని చేరుస్తారు. ఆ ఊహ ఒకోసారి సినిమాఫక్కీలో కృత్రిమంగా తోచినా, దాని వెనుక ఉన్న స్ఫూర్తిని కాదనలేకపోతాం. సదానంద్‌ గురించి ఇంత చెప్పుకొన్నాక ఆయన రాసిన జాడీ కథ గురించి ప్రస్తావించి తీరాలి. గవురయ్య అనే పల్లెటూరి రైతు తన దొర దగ్గర్నుంచీ జాడీని పట్నానికి మోసుకుపోయి దొర బిడ్డకు అందించాలి. ఇదే జాడీ కథలోని ఇతివృత్తం. ఇందులోని ప్రతి వాక్యమూ గవురయ్య దైన్యాన్ని ప్రతిబింబిస్తూనే ఉంటుంది. ‘దొర ఒంటి మీద పదిమందికి సరిపోయే దుస్తులు, సంపద ఉన్నాయి. ఉన్నదంతా పదిమందికి దానం చేసిన వ్యక్తినాగున్నాడు గవురయ్య’ వంటి పోలికలు తరచూ కనిపిస్తాయి. ఊరగాయ ఉన్న ఆ జాడీని భద్రంగా ఇరవై మైళ్లు మోసుకుపోతాడు గవురయ్య. తనకి ఉండాల్సిన అంగీని కూడా ఆ జాడీకే రక్షగా కప్పుతాడు. ఇరవై మైళ్లు నడిచి, పట్నంలో నానా అగచాట్లు పడి చివరికి ఎలాగొలా దొర కొడుకు ఇంటికి చేరుకుంటాడు. కానీ అక్కడ అతడిని పట్టించుకునే నాధుడే ఉండడు సరికదా! ఒళ్లు తూలిపోతున్నా కాసిని గంజి నీళ్లు పోసేందుకు కూడా దొరగారి కోడలికి చేతులు రావు. గవురయ్య చేతుల మీదుగా పెంచిన దొర కొడుకు, గవురయ్య కాయకష్టంతో పెరిగిన వారి ఐశ్వర్యం ముందు నిస్సహాయంగా మిగిలిపోతాడు గవురయ్య. జాడీ కథ చదివాక ఎంతటి మనసైనా చెమ్మగిల్లాల్సిందే! - నిర్జర

ముని ‘మాణిక్యం’ కథలు

ముని ‘మాణిక్యం’ కథలు ఇరవయ్యవ శతాబ్దం తెలుగు సాంఘిక సాహిత్యంలో నిజంగానే స్వర్ణయుగం అనుకోవచ్చు. చలం మొదలుకొని శ్రీశ్రీ వరకు ఎందరో రచయితలు తెలుగుసాహిత్యం మీద చెరిగిపోని ముద్ర వేశారు. భిన్నమైన దృక్పథాలతో, విభిన్నమైన రీతులలో ఎవరికి తోచినట్లు వారు జీవితం పట్ల తమ అభిప్రాయాలని అక్షరబద్ధం చేశారు. బడుగుల జీవితాల గురించి, శ్రామికుల కష్టాల గురించి పుంఖానుపుంఖాలుగా అక్షరాలు వెలువడ్డాయి. మరి మధ్యతరగతి ప్రజల సంగతేంటి! ఏ స్వామ్యం వచ్చినా, ఏ కాలం మారినా, మారని వారి జీవితాలని అక్షరబద్ధం చేసేదెవ్వరు! వారి చిన్న చిన్న సరదాలు, సంసారపు కలహాలను కథలుగా మార్చేదెవ్వరు. ఆ లోటుని పూడ్చినవారే మునిమాణిక్యం నరసింహరావు. 1898 మార్చి 15న గుంటూరులోని జాగర్లమూడిలో జన్మించిన మునిమాణిక్యం ఉపాధ్యాయునిగా గుంటూరు, మచిలీపట్నం తదితర ప్రాంతాలలో పనిచేశారు. ఆయనకు మొదటి నుంచీ తెలుగు, ఆంగ్ల సాహిత్యాల మీద మంచి అభిరుచి ఉండేది. దానికి తోడుగా ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో అసిస్టెంట్‌ ప్రొడ్యూసరుగా కూడా పనిచేశారు. ఇక జరుక్‌శాస్త్రి, విశ్వనాధ సత్యనారాయణ వంటి సాహిత్యకారుల సాన్నిహిత్యం ఎలాగూ ఉంది. వీటన్నింటి కారణంగా తనలో ఉన్న హాస్య చతురతని అక్షరబద్ధం చేయాలనే సంకల్పం కలిగింది మునిమాణిక్యానికి. అలా ‘తేనీటి గిన్నెలో తుపాను’ వంటి రచనలు మొదలయ్యాయి. వీటిలో కనిపించిన కాంతం పాత్ర పాఠకులకు సజీవంగానూ, తమ ఇంట్లోని వ్యక్తిగానూ తోచడంతో... అదే కాంతం పాత్రతో అనేక కథలను రాశారు మునిమాణిక్యం.     తెలుగువారికి కాంతం అనగానే ఇద్దరు వ్యక్తులు గుర్తుకువస్తారు. ఒకటి వెండితెర మీద చిటపటలాడిపోయే సూర్యకాంతం, రెండు మునిమాణిక్యంవారు సృష్టించిన కాంతం పాత్ర. అలాగని కాంతం ఆనాటి బారిస్టరు పార్వతీశం, గణపతి తరహాలో హాస్య పాత్రేమీ కాదు. ఇటు ఉదాత్తమైన పతివ్రతో, అటు ఆడిపోసుకునే అనుమానపు భార్యో కాదు. ఒక సగటు గృహిణి! ఉపాధ్యాయ వృత్తిలో చాలీచాలని జీతంలో నెట్టుకువచ్చే భర్తకు తోడుగా నిలిచే మనిషి. అదే సమయంలో తన చిన్నపాటి సరదాలను తీర్చుకోవాలని తపించే స్త్రీ. భర్త అమాయకత్వాన్ని కూలంకషంగా ఎండగట్టే మహిళ. గడుసు కాంతానికీ ఆమె మధ్యతరగతి భర్తకీ మధ్యా సాగే దాంపత్య సన్నివేశాలే కాంతం కథలు. మునిమాణిక్యం కేవలం కాంతం కథలే రాశారనుకోవడానికి లేదు. ‘రుక్కుతల్లి’ వంటి విషాదగాథను అక్షరబద్ధం చేశారు. తల్లి చనిపోయిన తరువాత కుటుంబభారాన్ని తన మీద వేసుకునే పధ్నాలుగేళ్ల రుక్కుతల్లి అనే బాలిక కథే ఇది. ఆసాంతం విషాదంగా సాగుతూ చివరికి రుక్కుతల్లి కూడా మరణించడంతో కథనం ముగుస్తుంది. కాంతం కథలను రాసిన మునిమాణిక్యం కలం నుంచి ఇంతటి విషాదాన్ని ఊహించడం కష్టమే! మరోవైపు ‘మాణిక్య వచనాలు’ వంటి వ్యక్తిత్వ వికాస పుస్తకాలను కూడా రాశారు. ఇది ఇంచుమించుగా ‘How to win friends and influence people’ పుస్తకాన్ని గుర్తుచేస్తుంది. దాంపత్య జీవితం గురించి మునిమాణిక్యం కేవలం కాంతం కథల్లోనే ప్రస్తావించలేదు. దాంపత్యోపనిషత్తు, ఇంటావిడతో పోట్లాట వంటి రచనలలో సైతం మధ్యతరగతి గృహస్థ జీవనమే ప్రధాన ఇతివృత్తంగా కనిపిస్తుంది. వీటిలో కుటుంబ జీవనం సాఫీగా సాగిపోవాలంటే ఎలా మెలగాలో అక్షరబద్ధం చేసిన ఆయన మాటలను కేవలం హాస్యంగా కొట్టిపారేయలేం. ఇందులో భేషజాలకు తావు ఉండదు, అధికారానికి చోటు ఉండదు- ‘మీ ఆవిడను మీ అభిప్రాయాలతో ఏకీభవింపచేయాలనీ, తన్మూలంగా ఆమెను నీ ఎడల సుముఖురాలునుగా చేసికొనవలయుననీ ఎప్పుడూ ప్రయత్నించకు. మహామహావాళ్లే ఈ విషయంలో ప్రయత్నం చేసి విఫలులైనారు. ప్రయత్నం వృధా, కాలం వృధా, నీవే ఆమె ఎడల సుముఖుడవు కా’ (దాంపత్యోపనిషత్తు).   మునిమాణిక్యం రచనల్లో ప్రధాన ఇతివృత్తం దాంపత్య జీవితమే అయినప్పటికీ, అందులో హాస్యమే ధ్వనించినప్పటికీ అటు స్త్రీలను కించపరిచినట్లు కానీ, ఇటు పురుషల అహాన్ని దెబ్బతీసినట్లు కానీ కనిపించదు. పైగా కుటుంబ కలహాలను, భార్యాభర్తల పంతాలను సైతం హాస్యం మిళితం చేసిన విశ్లేషణతో రచన సాగుతుంది. ‘యోగులు ఏళ్ల తరబడి తపస్సు చేసి సంపాదించే నిర్వికల్ప సమాధి ఈ తగవుల వలన లభిస్తుంది. ఎంత పెద్ద పెద్ద కష్టమైన లెక్కచేయకపోవడమూ, ఎంత పెద్ద శబ్దమైనా చలించకోవడమూ, ఈ రెండూ బహుకాల తపఃఫలితముగా రాతగినవి. అవి ఈ తగవుల వలననే లభిస్తవి’ (కలహ ప్రయోజనము). మునిమాణిక్యాన్ని అంతర్జాతీయ స్థాయి రచయితగా విమర్శకులు గుర్తించకపోవచ్చు. ఆయన రాసిన కథలను అద్భుత కళాఖండాలుగా ఎవ్వరూ భావించకపోవచ్చు. కానీ ఒక గృహస్థు జీవితాన్ని ప్రతిబింబించే ఆయన రచనలకి తెలుగు సాహిత్యంలో తగిన చోటు ఉంది. ఆయన రచనలు చదివినవారెవ్వరికైనా ఈ విషయం అర్థమైపోతుంది. మునిమాణిక్యం మాటల్లోనే చెప్పాలంటే- ‘నా రచనలో ధ్వని ఉంది, ఔచిత్యముంది, ఉదాత్తత ఉన్నది, శ్రవణ సుభగత్వము ఉన్నది చూసుకోండి!’ అందుకే మునిమాణిక్యం 1973లో మరణించినా ఇప్పటికీ ఆయన రాసిన కాంతం కథలు ప్రతి తెలుగు సంసారాన్నీ ప్రతిబింబిస్తూనే ఉన్నాయి. - నిర్జర.

కథలను కళ్లకు కట్టిన మా గోఖలే

కథలను కళ్లకు కట్టిన మా గోఖలే     కష్టజీవుల వెతలను చూసే ఏ కథకుడికైనా వారి మీద కథ రాయాలనిపించడం సహజం. కానీ అలా వారి జీవితాలను పైపైన తడుముతూ రాసిన కథ సవాలక్ష కథలలో ఒకటిగా మిగిలిపోతుంది. ఒక నామమాత్రపు స్పందనలా సాగిపోతుంది. అలా కాకుండా ఆహారం దగ్గర్నుంచీ ఆహార్యం దాకా వారి జీవితాలను అణువణువునా పరిశీలించిన కథకుడు బడుగు జీవి కష్టాన్ని కళ్లముందు ఉంచగలడు. అలాంటి అరుదైన కథకులలో మా గోఖలే ఒకరు! మా గోఖలే అసలు పేరు మాధవపెద్ది గోపాలకృష్ణ గోఖలే! గోఖలే తండ్రి లక్ష్మీ నరసయ్యగారు స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న యోధులు. బహుశా ఆ ప్రభావంతోనేమో మహాత్మా గాంధీ సైతం తన గురువుగా భావించిన గోపాలకృష్ణ గోఖలే పేరుని తన కుమారుడికి పెట్టారు. స్వతంత్ర సంగ్రామపు పోరులో లక్ష్మీ నరసయ్యగారి ఆస్తులన్నీ హరించుకుపోయాయి. కానీ తన కుమారుడికి పెట్టిన పేరు, అతనికి అందించిన సంస్కారం మాత్రం శాశ్వతంగా మిగిలిపోయాయి. 1917లో గుంటూరు జిల్లాలోని బ్రాహ్మణకోడూరులో జన్మించిన ‘మా గోఖలే’ మనసు ఎందుకనో చిత్రలేఖనం వైపు మొగ్గుచూపింది. చిత్రలేఖనానికి సంబంధించిన తొలిపాఠాలను బందరులో నేర్చుకున్నారు. ఆ తరువాత మద్రాసులోని ఆర్ట్స్ కళాశాలలో దేవీప్రసాద్‌రాయ్‌ చౌదరి వంటి ఉద్దండుల దగ్గర చిత్రలేఖనంలోని సులువులన్నీ ఔపోసన పట్టారు.   చిత్రకారునిగా, రాజకీయ కార్టూనిస్టుగా జీవనం సాగిస్తూనే అరుదైన కథలను రాయడం మొదలుపెట్టారు గోఖలే. వృత్తిరీత్యా మద్రాసులో ఉంటున్నా, ఆయన కథలన్నీ తను పుట్టిన బ్రాహ్మణకోడూరులోని జీవితాలనే ప్రతిబించేవి. గోఖలే కథల్లో ఇతివృత్తాలన్నీ దిగువ తరగతివారి గురించే ఉండేవి. ఒక మాటలో చెప్పాలంటే కాయకష్టం చేయకుండా పూట గడవనివారు, చేతిలో రూపాయి మిగులు లేనివారే ఆయన కథల్లో కనిపిస్తారు. అలాగని పాఠకులలో జాలి కలిగించేందుకు కృతకమైన కష్టాలు ఆయన కథలలో కనిపించవు. చివరికి తృప్తిని మిగిల్చేలా ఊహించని శుభాలూ ఉండవు. తను చూసిన దృశ్యాన్ని ఎలాగైతే కాన్వాసు మీద చిత్రించారో, అదే రీతిలో తను చూసిన జీవితాలను పాఠకుల కళ్ల ముందుంచే ప్రయత్నం చేశారు గోఖలే. గోఖలే రాసిన కథలన్నీ కలిపి నూరులోపే ఉంటాయి. కోటయకొండకు, కిష్టమ్మగారి పెద్దజీతగాడు, శివరాత్రి తిరణాళకు, పాలెంలో దీపాలమాశ, పులిస్త్రాకులు, గూడెం పోకడ, మార్నాల పండుగ, దొంగవాళ్లు, బండరాముడి పెళ్లాం, ఆరికేం మారాజులు, చీకటి మనుషులు, రత్తి కోకకట్టింది, పాళెంలో బొమ్మలాట... ఇలా గోఖలే కథల పేర్లన్నీ ఒక్కమారు చదివితే చాలు అవన్నీ కూడా అట్టడుగు వర్గాలవారి గురించి రాసినవే అని గ్రహించేయవచ్చు. చిత్రం ఏమిటంటే వీటిలో ఇంచుమించుగా ప్రతి కథలోనూ బడుగు జీవులు మాట్లాడుకునే భాషలోనే సంభాషణలు సాగుతాయి. చాలాసార్లు కథనం కూడా వారి యాసలోనే ఉంటుంది. ఒక యాభై ఏళ్ల క్రితం ఇలాంటి కథలు రాయడం అంటే ఎంత సాహసమో ఊహించుకోవచ్చు. ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నా ప్రతి కథలోనూ అదే సాహసం చేశారు గోఖలే.     గోఖలే కథల్లో చాలా కథలు తెలుగు సాహిత్యంలో భాగంగా మారిపోయాయి. ముఖ్యంగా గోఖలే అన్న పేరు వినబడగానే ‘బల్లకట్టు పాపన్న’ వంటి కథల పేర్లు గుర్తుకురాక మానవు. కృష్ణానది వాగు మీదుగా అటూఇటూ ఉన్న రేవులకి చేర్చేందుకు బల్లకట్టుని నడిపే పాపన్న కథే ఇది. ఇలాంటివాడు పొద్దున లేచిందగ్గర్నుంచి ఎలాంటి ప్రయాణికులను చూస్తుంటాడు, వారితో జరిగే సంభాషణలు ఎలా సాగుతాయి... వంటి విషయాలతో రేవు దగ్గర మనుషులందరినీ పరిచయం చేస్తారు గోఖలే! చివరికి పాపన్న నిరంతరం బల్లకట్టు మీదే గడపాల్సి రావడంతో, తన సంసారం దారి తప్పిపోయిందని తెలుస్తుంది. కానీ ఏం చేయగలడు! ఇంట్లో ఉంటే సంసారం చక్కబడుతుందేమో కానీ పూట గడవదు కదా! అందుకని మనసు చంపుకుని మళ్లీ తన బల్లకట్టుని సాగించవలసి వస్తుంది. బల్లకట్టు పాపన్నకు భిన్నమైన మరో కథ ‘అడుక్కుదినక సేసేదేంది!’. ఊరి చివర ఇద్దరు బిచ్చగాళ్లు చేరి సాగించే సంభాషణతో ఈ కథ సాగిపోతుంది. సాదాసీదాగా సాగిపోయే జీవితం అప్పుల ఊబిలో పడటం వల్లనో, అనారోగ్యం పాలవ్వడం వల్లనో ఎలా చిన్నాభిన్నమైపోతుందో ఈ కథ కళ్లకు కడుతుంది. ‘కూతురి పెళ్లి’ అనే మరో కథలో వ్యసనపరుడు, వయసు దాటిపోయినవాడు అయిన ఓ రెండో పెళ్లివాడికిచ్చి పెళ్లి చేసే తల్లిదండ్రుల సంభాషణ కనిపిస్తుంది. సంబంధం మంచిది కాదనీ, తమ కూతురు గొంతుకోస్తున్నామనీ ఎక్కడా వారు బటయపడకపోయినా... ఆ భావాన్ని తొక్కిపెట్టేందుకు వారు చేసే ప్రయత్నం పాఠకుడు గ్రహించేస్తాడు. గోఖలే కేవలం ఒక రచయిత, చిత్రకారుడే కాదు... గొప్ప కళాదర్శకుడు కూడా! తెలుగు చిత్రాలలో ఆణిముత్యాలనదగిన ప్రతి చిత్రం వెనుకా ఆయన కళా దర్శకత్వం కనిపించేంది. పాతాళభైరవి, మిస్సమ్మ, మాయాబజార్‌, అప్పుచేసిపప్పుకూడు, గుండమ్మకథ, శ్రీకృష్ణార్జున యుద్ధం వంటి చిత్రాలెన్నింటికో ఆయన కళాదర్శకత్వం వహించారు. ఆయన కళతో ఆ చిత్రాలు ఎంత చిరస్మరణీయంగా నిలిచిపోయాయో, ఆయన కలంతో వెలువడిన కథలు కూడా తెలుగు సాహిత్యంలో అంతే సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్నాయి. అందుకే గోఖలే చనిపోయి ఇప్పటికి పాతికేళ్లు (1981) గడుస్తున్నా, తెలుగులో మంచి కథకులు ఎవరన్న జాబితాలో ఆయన పేరు కూడా వినిపిస్తోంది. - నిర్జర.  

మధురాంతకం కథలు- జీవిత పాఠాలు

మధురాంతకం కథలు- జీవిత పాఠాలు   మన ముందు తరం రచయితల దగ్గర ఒక గొప్ప లక్షణం ఉంది. వాళ్లు ఫలానా విషయం మీద రాయకపోతే బాగోదేమో! అనుకుని కథలు రాయలేదు. తమలో సహజంగా ఏర్పడిన స్పందనలకి కథారూపాన్ని ఇచ్చారు. తాము చూసిన విషయాలనీ, తమలో ఆలోచనలు రేకెత్తించిన సమస్యలనీ ఇతివృత్తాలు మలచారు. అందుకే వారి కథలను చదువుతున్నప్పుడు దేశకాలమాన పరిస్థితులకు అతీతంగా, ఆ కథ మన ఎదురుగానే జరిగిన భావన కలుగుతుంది. అలాంటి సహజ కథకులలో మధురాంతకం రాజారాం ఒకరు. మధురాంతకం పూర్వీకులు తమిళనాడు నుంచి చిత్తూరు జిల్లాకు వలస వచ్చారు. చిత్తూరు ఒక చిత్రమైన ప్రపంచం! తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలతో ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుంది. తమిళనాడుకి సరిహద్దులో ఉండటం వల్ల భిన్న సంస్కృతులూ తారసిల్లుతాయి. కానీ పల్లెటూర్లలో మాత్రం సీమ తాలూకు కరువు తాండవిస్తూ ఉంటుంది. అలాంటి వైవిధ్యమైన పరిస్థితులకు సజీవసాక్ష్యంగా నిలిచిన మధురాంతకం రచనలు కూడా అంటే భిన్నంగా సాగుతాయి.     చిత్తూరులో విద్యాభ్యాసం చేసే రోజుల నుంచే రాజారాంకి సాహిత్యం అంటే అభినివేశం ఉండేది. ఆయన 18వ ఏటనే తొలి కథ ప్రచురితం కావడంతో ఆ ఆసక్తి కాస్తా కార్యరూపం దాల్చింది. తరువాత కాలంలో ఆయన ఉపాధ్యాయ వృత్తిని చేపట్టినా, కథలు రాయడాన్ని తన జీవిత లక్ష్యంగా మార్చుకున్నట్లు కనిపిస్తుంది. అందుకనే ఆయన కలం నుంచి 300కు పైగా కథలు జాలువారాయి. వాటితో పాటుగా వ్యాసాలు, నవలలు, తమిళం నుంచి అనువాదాలు కూడా సాగాయి. పరిణతిలోనూ, పరిమాణంలోనూ ఉత్తమమైన కథలను రాయడంతో సీమ సాహిత్య చరిత్రలో రాజారాం తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. రాజారాం కథలు నాలుగైదు పేజీలలో ముగిసిపోయేవి కావు. అవి ఒక జీవితాన్ని పరిచయం చేసి కానీ వదిలిపెట్టవు. ఉపాధ్యాయ వృత్తిలో ఉండటం వల్లనో, స్వతహాగా నిదానస్తుడు కావడం వల్లనో... పిల్లవాడికి విజ్ఞాన శాస్త్రాన్ని బోధించినంత నేర్పుగా జీవితపాఠాలను కథారూపంలో అందిస్తారు రాజారాం. రాజారాం కథలన్నీ ఆయన చుట్టూ ఉన్న ప్రాంతాలలోనే తిరుగుతూ ఉంటాయి. అందులోని పాత్రలన్నీ తన అనుభవాల్లోంచి వెలికి వచ్చినట్లే తోస్తాయి. రాజారాం కథలోని నాయకుడు నడుచుకుంటూ వెళ్లాడంటే ఆ తోవంతా వర్ణించాల్సిందే! ఆయన కథలోని ముఖ్య పాత్ర నిలబడి ఉందంటే  దాని రూపురేఖలన్నీ కళ్లకు కట్టాల్సిందే! భాష మీద పట్టు లేకపోయినా, భావప్రకటనలో నిజాయితీ లేకపోయినా... ఇలాంటి ప్రయత్నంతో పాఠకుడు విసిగిపోక తప్పదు. కానీ రాజారాం కథలలో ఉండే ఈ వివరణా విశ్లేషణలే ఆయన కథలకు ఆయువుపట్టులా తోస్తాయి. పాఠకుడిని కూడా సన్నివేశంలో పాత్రగా మలుస్తాయి.   మధురాంతకం రాజారాం కథలు అనేక సంపుటాలుటా వెలువడ్డాయి. వాటిలో విశాలాంధ్రవారు ప్రచురించిన నాలుగు సంపుటాలు ఇప్పటికీ ఆదరణకు నోచుకుంటున్నాయి. ఆయన రచనా శైలి గురించి చెప్పుకొన్నాక అందుకు ఒకటి రెండు ఉదాహరణలను కూడా చెప్పుకోవడం భావ్యంగా ఉంటుంది. ‘సర్కసు డేరా’ అనే కథలో రాజారాం బయటకు ఆకర్షణీయంగా కనిపించే సర్కసులోని జీవితాల గురించి ఊహిస్తారు. ‘‘సోదరులారా! మీరు మా అందచందాల్ని మాత్రమే చూస్తారు. ఈ అందచందాల వెనుక మమ్మల్ని కత్తుల ఎదుట నిలబెట్టి, ఒంటి చక్రాల సైకిళ్లెక్కించి, మంటల మధ్య పరుగులు తీయించే కడుపు కక్కుర్తిని మీరు చూడరు. కుందేలు కనబడగానే నాలుక చాచి చొంగలు కార్చుకుంటూ వెంటాడే జాగిలంలా, మాటిమాటికీ మాపై విరుచుకుపడిపోవడానికి పుంకించే కాముకత్వం బారి నుంచి తప్పుకుంటూ, నా అన్న వాళ్లకు దూరంగా పది రోజులకొక మకాముగా మేమెందుకిలా దుర్భర ప్రవాసక్లేశం అనుభవిస్తున్నామన్న సంగతి, తొమ్మిది గంటలప్పుడు యిళ్లల్లో భోజనం చేసిన హాయిగా తాంబూలం నములుతూ భార్యాబిడ్డలతో సహా వచ్చి సర్కసు డేరాలో కూచున్న మీకు అర్థం కాకపోవడంలో ఆశ్చర్యం లేదు. మీకు మాలాంటి తోబుట్టువులుండకపోరు. మీకు మాలాంటి కూతుళ్లుండకపోరు. వాళ్లు గడప దాటకుండా కాపురాలు దిద్దుకోవడమే మీకిష్టం. కానీ మేమిన్ని కాదు మరిన్ని సాహస కార్యాలు చేసి, ఇంతకాదు మరింత నగ్నంగా మా అందచందాల్ని ప్రదర్శించడం మీకానందం! అవును మరి. శరీరాలు మీవి కానప్పుడు, మేము కాశిదాకా ప్రాకినా మీకు నష్టమయ్యేదేమీలేదు. ఎవరికో నష్టం కలుగుతోందని చింతించడం మానవ స్వభావం కాదు. ఇది సర్కసు డేరాకు మాత్రమే పరిమితమయిన న్యాయం కాదు. లోకపు తీరే ఇంత!’’ అంటూ వారి ఆత్మఘోషతోనే మనల్ని ఎండగడతారు రచయిత. అంతేకాదు! కేవలం సర్కసులో చేసే విన్యాసాలే అద్భుతాలు కాదనీ, నిరుపేదలు రోజువారీ పడే అగచాట్లు ఆ ఫీట్లకి ఏమాత్రం తీసిపోవని నాగులు అనే ఓ పాత్ర ద్వారా వివరిస్తారు. పేదవాడికి జీవితమే ఓ సర్కస్‌ అని తేలుస్తారు. ‘సర్కస్‌ డేరా’లో పేదవాడి బతుకుచిత్రం కనిపిస్తే ఛిద్రమవుతున్న బంధాల గురించిన ఆలోచన ‘ఎడారి కోయిల’ అనే కథలో ప్రతిఫలిస్తుంది. అలెక్స్‌ హెయిలీ రాసిన ఏడు తరాలు (రూట్స్) పుస్టకాన్ని ఉట్టంకిస్తూ, మూలాలకు దూరమయ్యే ప్రతివాడూ దురదృష్టవంతుడే అన్న భావనను కలిగిస్తారు రాజారాం. ‘... అదంతా ఒక విజేతల వర్గం. విజేతలైన వారికి పరాజితుల పట్ల ఇసుమంతైనా సానుభూతి ఉండటం లేదు. ప్రేమ, త్యాగం, మమకారం, ఆత్మీయత మొదలైనవి వాళ్ల పాలిటికి అర్థహీనమైన పదాలుగా తోస్తాయి. స్వార్థమే వాళ్ల జీవితానికి పరమార్థమైపోతుంది. సంగ్రహంగా ఇది ఈనాటి సామాజిక చరిత్ర అయి ఉండాలి’ అంటూ సంపద కోసం బంధాలను దూరం చేసుకునేవారి గురించి ముక్తాయింపుని ఇస్తారు. రాజారాం కేవలం మధ్యతరగతి వారి గురించే రాయలేదు. అలాగని నిరంతరం పేదల గురించిన కథలే వెలువరించలేదు. తనని కదిలించిన ప్రతి జీవితన్నీ పైకెత్తి చూపించారు. కష్టం, మంచితనం ఉన్న ప్రతి సందర్భాన్నీ తన కథలలో ప్రతిఫలించారు. తన కథలకుగాను కేంద్ర సాహిత్య అవార్డు బహుమతి, గౌరవ డాక్టరేట్‌ వంటి పురస్కారాలు ఎన్నింటినో అందుకున్నారు. ఆయన కథలను గుండెల్లో పెట్టుకున్న తెలుగు లోకం పురస్కారాలకు అతీతమైన గౌరవాన్ని ఆయనకు ఏనాడో అందించేసింది. - నిర్జర.  

తెలుగు కథకు నిలువుటద్దం- కొడవటిగంటి

  తెలుగు కథకు నిలువుటద్దం- కొడవటిగంటి   తెలుగు కథా సాహిత్యం అనగానే ఓ పదిమంది గుర్తుకువచ్చినా చాలు... అందులో కొడవటిగంట పేరు లేకపోతే ఆ కాస్త జాబితా కూడా అసమగ్రంగా మిగిలిపోతుంది. అంతలా తెలుగు కథ మీద తనదైన ముద్ర వేశారు కొడవటిగంటి కుటుంబరావు అలియాస్‌ కొ.కు. కొడవటిగంటి 1909లో తెనాలిలో సనాతన ఆచారాలను సద్దుచేయకుండా పాటించే వ్యవస్థలో జన్మించారు. చిన్నప్పుడే తల్లీతండ్రీ మరణించడంతో మేనమామ చెంతనే పెరిగారు. తరువాత కాలంలో కొన్నాళ్లు విజయనగరంలోనూ విద్యను అభ్యసించారు. శాస్త్రీయ దృక్పథం నిదానంగా బలం పుంజుకుంటున్న రోజులవి. రష్యాలో విప్లవం సాధ్యమైన సమయమది. బహుశా ఆ సందర్భం కొ.కు ఆలోచనా ధోరణిని ప్రభావితం చేసి ఉంటుంది. పైగా ఆనాటి సాంస్కృతిక కేంద్రాలు అనదగిన తెనాలి, విజయనగరం, చెన్నైలో జీవించడం వల్ల కూడా ఆయనలోని భావాలు ఆధునిక దిశగా పయనించి ఉంటాయి. ఈ భావాలకి సృజన కూడా తోడవడంతో పుంఖానుపుంఖాలుగా రచనలు వెలువరించారు. కొ.కు మొదటి రచన 1930లో ప్రచురితం అయ్యింది. అప్పటి నుంచి తను చనిపోయే 1980 వరకూ ఆయన విస్తృతమైన సాహిత్యాన్ని వెలువరించారు. కథ, నవల, నాటిక, పాపులర్‌ సైన్స్‌ రచనలు, అనువాదాలు... ఇలా కొ.కు సమగ్ర సాహిత్యం దాదాపు పదిహేను వేల పేజీలకు చేరుకుందంటే ఆయన సృజన ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. ఒక పక్క చందమామలో సంపాదకత్వం వహిస్తూనే ఇంతటి సాహిత్యాన్ని సృష్టించడం మరో విశేషం. చందమామ ప్రస్తావన రాగానే అది తెలుగువారి జీవితంలో మమేకం అయిపోయేందుకు కొ.కు చేసిన కృషిని తలుచుకొని తీరాలి. 1952లో చందమామలో చేరిన కొడవటిగంటి తను చనిపోయేదాకా అందులోనే పనిచేశారు. తన దగ్గరకు వచ్చే రచనలను క్షుణ్నంగా పరిశీలించి, ఉత్తమమైనవాటిని ఎంపిక చేయడమే కాదు... వాటిలో ఏవన్నా లోపాలు ఉంటే వాటిని పాఠకులు తగినట్లుగా తిరగరాసేవారని అంటారు. అందుకనే చందమామ తెలుగువారికి ఓ మర్చిపోలేని బాల్యాన్ని మిగిల్చింది.   చందమామలో కుదురుకునేవరకూ ట్యూషన్‌ మాస్టారుగా, కార్మికునిగా, కాపీరైటరుగా, గుమాస్తాగా... ఇలా కొ.కు రకరకాల వృత్తులలో జీవించారు. కానీ ఆయన ప్రవృత్తి మాత్రం సాహిత్యంగానే ఉండేది. చిన్నప్పుడు తన మనసులో ముద్రవేసుకున్న కోస్తా జీవితాలను, మరణించేవారకూ కూడా తన కథలలో ప్రతిబింబిస్తూనే వచ్చారు. మధ్య తరగతి జీవితాలు, ఛాందస భావాలు, చదువులు, వితంతు వివాహాలు వంటి సమస్యలన్నింటినీ కొ.కు మార్క్సిస్టు దృక్పథంతో కథలుగా మలిచారు. కొడవటిగంటి రచనలు చూసేందుకు సాదాసీదాగా సాగిపోయినట్లు ఉంటాయి. శిల్పంలో వంపులూ, పదాల విరుపులూ కనిపించవు. కానీ రచన పూర్తయ్యాక మాత్రం ఒక కొత్త విషయం బోధపడినట్లూ, ఏదో సమస్య గురించి అవగాహన కలిగినట్లూ కనిపిస్తుంది. కొ.కు పాత్రలన్నీ సామాన్యవైనవే. కానీ అలా సహజమైన మనస్తత్వాల కారణంగానే అవి మన జీవితంలో తారసిల్లే పాత్రలుగా కనిపిస్తాయి. అందుకు ఉదాహరణగా చదువు నవలను చెప్పుకోవచ్చు. ఇందులో ప్రపంచం తల్లకిందులైనా కూడా తన చదువు సాగడమే ముఖ్యం అనుకునే సుందరం పాత్రతో కొ.కు ఏకంగా ఒక తరానికి ప్రతినిధినే పరిచయం చేస్తారు. సుందరం తన చదువుని సాగించడం, నిదానంగా జాతీయ భావాల వైపుగా ప్రభావితం కావడమూ, మధ్యతరగతి జీవితంలో కుదురుకోవడం వంటి అంశాలతో చదువు నవల సాగుతుంది. జాతీయోద్యమం, ప్రపంచ యుద్ధాల నేపధ్యంలో సాగే ఈ నవల కొకు రచనలలోనే అత్యంత ప్రసిద్ధంగా పేర్కొంటారు. కొ.కు విస్తృతంగా రచనలు చేసినా కూడా వాటిలో ఏ ఒక్కటీ నిరుపయోగంగా, లక్ష్యరహితంగా కనిపించకపోవడం విశేషం. అలవోకగా రాసేసినట్లు తోచినా, ఒకో కథనీ చెప్పేందుకు ఆయన ఒకో ప్రక్రియను ఎన్నుకొన్నారు. అందుకు ‘తాతయ్య’ కథని ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒక చిన్న పిల్లవాడి కోణంలోంచి ఈ కథ సాగుతుంది. సంప్రదాయబద్ధమైన ఒక కుటుంబంలో ఉన్న పరిస్థితులను ఆ పిల్లవాడే మనకి చెబుతూ ఉంటాడు. అందులో నిరసన ఉండదు, విమర్శ ఉండదు. కానీ పిల్లవాడు చెప్పే ప్రతిమాటా మనలో ఆలోచనని రేకెత్తిస్తుంది. ఆ పిల్లవాడి చుట్టూ ఉన్న కుటుంబం అతనిలో ఎలాంటి అభిప్రాయాలను చొప్పించేందుకు ప్రయత్నిస్తుంది, వివిధ ఆచారాల పట్ల అతనిలో ఎలాంటి ఛాందస భావాలను నాటబడతాయి అన్నది అతని మాటల్లోనే చెబుతారు రచయిత. మోకాలు లోతు బురదలో సర్కసుని చూడటం, సోడాని తాగడం వంటి చిన్నచిన్న అనుభవాలు అతనిలో ఎలాంటి సంతోషాన్ని కలిగించాయో చెబుతూనే.... వనభోజనాల దగ్గర్నుంచీ చావు దాకా అతనిలో కలిగే స్పందనల దాకా ఒక నిర్మలమైన వ్యక్తిత్వాన్ని మన కళ్లకి కడతారు. కొడవటిగంటి కేవలం సమస్యలని ఎత్తిచూపడం మాత్రమే చేయలేదు! చాలాసందర్భాలలో వాటికి తగిన పరిష్కారాలను కూడా సూచిస్తారు. సమస్య తనదాకా వస్తే మనుషులు ఎలా ప్రవర్తిస్తారో కూడా విశదీకరిస్తారు. ‘దాలిగుంటలో కుక్కలు’ అనే కథలో అప్పటివరకూ పేదవారి అసహాయత గురించీ, ధనవంతుల దాష్టీకాల గురించీ తెగ మదనపడిపోయే కుటుంబం... తన పొలంలోని కూలీలు సమ్మెకు దిగారని తెలియగానే, ప్లేటుని ఎలా ఫిరాయిస్తుందో చెబుతారు కొ.కు. కొడవటిగంటి రచనల్లో సున్నితమైన హాస్యం కనిపిస్తుంది. ఒక చిన్న కదలికనీ, మాటనీ, ప్రతిస్పందననీ పదాల్లో చూపించగలిగే నేర్పు కనిపిస్తుంది. అందుకనే తెలుగు కథ ఉన్నన్నాళ్లూ కొ.కు ప్రస్తావన ఉంటుంది. ప్రభావమూ ఉంటుంది. - నిర్జర.

కదిలే అక్షరాలు- చాసో కథలు

  కదిలే అక్షరాలు- చాసో కథలు 1940-1990ల మధ్య కాలం చాలా చిత్రమైనది. ప్రపంచీకరణ అప్పటికి మనకి పరిచయం లేదు. అయినా సమస్యలకి ఏమాత్రం కొదవ లేదు. రెండో ప్రపంచ యుద్ధం మొదలుకొని అత్యయిక పరిస్థితి వరకూ రకరకాల సమస్యలు వద్దన్నా మన ఇంట చొరబడేవి. విద్య, వైద్య సదుపాయాలు ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదు. పేదలు, మధ్యతరగతివారు, ధనవంతులు అన్న గీతలు... ఆ గీతలననుసరించిన జీవితాలు అప్పటికి (ఇప్పటికీ, ఎప్పటికీ) స్పష్టంగానే ఉన్నాయి. అలాంటి సందర్భంలో తన చుట్టూ ఉన్న జీవితాన్ని కథలుగా మార్చినవాడు చాసో! 1915 జనవరి 17న శ్రీకాకుళంలో పుట్టిన చాసో, తన జీవితకాలంలో దాదాపు 40 కథలు మాత్రమే రాశారు. ఆ కథలన్నీ నాలుగు తరాలపాటు గుర్తుండిపోయేలా సాగుతాయి. చాసోకి ఆంగ్ల సాహిత్యం అంటే మహామక్కువ. ఆంగ్లంలో పేరుగాంచిన పద్యాలెన్నో ఆయన నోటి మీదే ఉండేవట. అయితేనేం! కళింగాంధ్ర మాండలికంలో అంతర్జాతీయ స్థాయి కథలను రాయడం ఆయనకే చెల్లింది. చాసో తన 27 ఏట చిన్నాజీ పేరుతో కథని ప్రచురించారు. అది తన కూతురు చాగంటి తులసిని పాత్రగా చేసుకుని రాసిన కథే. అది మొదలుకొని చాసో రాసిన ప్రతి కథా విమర్శకుల ప్రశంశలను పొందినదే! చాసో కథలలో ఎక్కువగా మధ్యతరగతి జీవితాలు కనిపిస్తాయి. ఎత్తుకి ఎదగలేక, కిందకి జారలేకా వారు పడే అవస్థలు కళ్లకు కడతాయి. తాను అనుభవించినదైతేనేం, స్వయంగా చూసినదైతేనేం... మధ్యతరగతి జీవితాన్ని చాసో అక్షరబద్ధం చేసిన తీరు అసమాన్యం. అందుకనే ఆయన రచనల్లో వాయులీనం ఒక కళాఖండంగా మిగిలిపోతుంది. సంగీతమంటే ప్రాణమిచ్చే భార్య, ఆ భార్య వైద్యం కోసం ఆమెకి ఇష్టమైన వాయులీనాన్ని అమ్మిన భర్త- ఇదే వాయులీనంలోని ఇతివృత్తం. కానీ ఈ ఇతివృత్తం ఆధారంగా చాసో ఒక సంసారాన్నే మనకి చూపిస్తారు. అద్దెకొంపలు, సంగీతం అంటే ఇష్టమున్నా దాన్ని సాగించలేని బతుకులు, వైద్యం కోసం తలకి మించి అయ్యే ఖర్చులు, పిల్లల అల్లరి, ఇంటి యజమాని ఆరాటం, ఇల్లాలి సర్దుబాటు... ఇన్ని కనిపిస్తాయి వాయులీనం కథలో. కేవలం వాయులీనం కథ మాత్రమే కాదు- లేడీ కరుణాకరం, కర్మసిద్ధాంతం, కుంకుడాకు, గుడిసె- దీర్ఘరోగి, దుమ్మలగొండె... ఇలా చాసో రాసిన ప్రతి కథా మన మనసుకి దగ్గరగా తోస్తుంది. ఆ కథల్లోని పాత్రలు మనకి పరిచయం కాకపోవచ్చు. అప్పటి పరిస్థితులు ఈనాడు ఉండకపోవచ్చు. కానీ వీటిలోని మనస్తత్వాలు మాత్రం మనకు దగ్గరగా తోచక మానవు. వామపక్ష భావజాలంతో ప్రభావితం అవ్వడం వల్లనో, శ్రీశ్రీ వంటి మిత్రులతో తరచూ సిద్ధాంత చర్చలు చేయడం వల్లనో... చాసో రచనలన్నీ పీడితుల అణచివేతకు వ్యతిరేకంగానే సాగాయి. ఒక చిన్న పిల్ల పాత్రగా సాగే ‘కుంకుడాకు’లో సైతం తిరుగుబాటు ధోరణే కనిపిస్తుంది. చాసో జన్మించి ఏ ఏడాదికి నూరేళ్లు దాటింది. అయినా ఇప్పటికీ కొత్తగానే తోచే కథలు ఆయన దశాబ్దాల కిందటే రాయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దీనికి గొప్ప ఉదాహరణ ‘లేడీ కరుణాకరం’! భర్త ఎదుగుదల కోసం తన శీలాన్నే తాకట్టు పెట్టిన ఈ కథ అటు ఆందోళననీ, ఇటు ఆశ్చర్యాన్నీ ఏకకాలంలో కలిగిస్తుంది. మనం గొప్పగా చెప్పుకునే విలువల గురించి సరికొత్త నిర్వచనాన్ని ఇస్తుంది. చాసో కేవలం కథలు రాయడం మాత్రమే కాదు- కథా లోకానికి దిక్సూచిగా కూడా నిలిచారు. అభ్యుదయ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యునిగా, అధ్యక్షునిగా సాహిత్యాన్ని ఒక ఉద్యమ సాధనంగా మలిచారు. తను చనిపోయిన తరువాత తన దేహాన్నీ, కళ్లనీ దానం చేయమని సూచిస్తూ... మరణంలో కూడా తన అభ్యుదయ భావాల్ని ప్రతిఫలించారు. చాసో పుంఖానుపుంఖాలుగా రాయకపోయినా, పరుగులెత్తే అక్షరాలను మాత్రం ప్రపంచం మీదకు వదిలారు. వాటిలో పేదరికమన్నా కనిపిస్తుంది లేదా దైన్యమన్నా వినిపిస్తుంది. మనిషిలో ఆ దైన్యం ఉన్నంతవరకూ చాసో కథ నిలిచి ఉంటుంది. - నిర్జర.

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? ఆనీ జైదీ

  మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? ఆనీ జైదీ ఆనీ జైదీ తల్లి యాస్మిన్ జైదీ కూడా కవయిత్రె. పేపర్స్కి కవితలు రాసేది. తాతగారు , పద్మశ్రీ పురస్కార గ్రహీత అలీ జవాద్ జైదీ ఉర్దూ కవీ, స్కాలర్. అలా సాహిత్యం, కవిత్వం ఆనీ జైదీ రక్తంలోనే ఉంది. ఆమె మొదటి వ్యాస సంకలనం Known Turf: Bantering with Bandits and other True Tales, 2010 Vodafone Crossword Book Award కి నోమినేట్ అయ్యింది. ఆమె ఒక జర్నలిస్ట్ కూడా. బందిపోట్లతో ధైర్యంగా చేసిన ఇంటర్వ్యూల్లో జరిగిన సంభాషణలూ, వారి నిజ జీవిత కధలే ఈ Bantering with Bandits అనే బుక్. చాలా పేరు తెచ్చిన రచన ఇది. ఆమె కవిత్వం The Crush (2007), కధలు The Good Indian Girl (2011) రాసింది. నవల, నాటకాలూ, అన్ని రకాల రచనా ప్రక్రియల్లోనూ ఆమెకు ప్రవేశం ఉంది. ఒక సమాజం నాగరిక సమాజమా కాదా అన్నది చెప్పాలంటే, ఆ సమాజం స్త్రీలను ఎలా చూస్తుంది అన్నదొకటే కొలమానం అంటుంది ఆమె. వారి వారి వృత్తుల ద్వారా సమాజంపై ప్రభావం చూపగల మహిళలల్లో మొదటి ముప్పై మందిలో ఒకరిగా ఆమెను టైంస్ ఒఫ్ ఇండియా అభివర్ణించింది. . అలాగే First 20 under 40 in South Asia : list of Granta లో కూడా ఆమె ఉంది. ఆమె రాసిన నాటకాలు రంగస్థలం పైనా ప్రదర్శించారు ఇంకా రేడియొలోనూ ప్రసారం అవుతాయి. ఆమె నాటకాలకూ ఎవార్డ్స్ వచ్చాయి. known Turn అనే బ్లొగ్ పేరుతో blogsరాస్తుంది. ఇందులో అన్నిప్రస్తుత రాజకీయ సామాజిక పరిణమాలపై, సంఘటనలపై ఆమె వ్యాఖ్యలూ విమర్శలూ మనం చదవచ్చు. వీలు చేసుకుని ఆమె బ్లాగ్స్ చూడండి చాలా బాగుంటాయి. ఆమె Unbound: 2000 yeas of Indian Women's writing అనే పుస్తకం ఎడిట్ చేసింది. సుసీ తరు, కె లలిత రాసిన Women Writing in India : 600 BC to The Present అనె బుక్ మాదిరిగానే ఈ బుక్ లో కూడా స్త్రీలు మొదటి నుంచి అంటే ప్రపంచానికి తెలిసిన స్త్రీ రచనలనన్నిటినీ పొందు పరిచిన ఒక అద్భుత ప్రయత్నం. ఇందుకోసం రచయిత్రులుగా ఏం రాస్తే ఇందులో చేర్చచ్చు అన్న కొన్ని నిర్ణయాలు ఆమె తీస్కోవాల్సివచ్చింది. ఇక ఆ తరవాత ఒక నవలా రచయిత్రి గురించి రాయాలంటే ఆమె రచనని ఉటంకించాలంటే ఆ రచనలో ఏ భాగాన్ని అనేది చాలా క్లిష్టమైన పని. దీని కోసం వారి రచనలని కూలంకషంగా చదవటం అన్నది తప్పనిసరి. ఈ పని అనువాదాల ద్వారా చెయ్యాల్సివచ్చినప్పుడు ఇంకా క్లిష్టమవుతుంది. ఇది కూడా ఆమెకు ఎంతో పేరు తెచ్చిన పుస్తకం. 2012 డిసెంబరులో జరిగిన నిర్భయ రేపు కేసు దేశాన్నంతా షాక్కి గురిచేసింది. ఈ రేపు తర్వాత ముంబై ముంచిపల్ కార్పొరేషన్ అసలు ఈ రేప్స్ అన్నిటికీ షాప్స్ వాళ్ళు బొమ్మలకి వేసే లింగరీ వల్ల వస్తోందని తీర్మానించి లింగరీ వేసిన బొమ్మల్ని షాపులముందు ప్రదర్శనకి నిలబెట్టడాన్ని ban చేసారట. ఎందుకంటే అదే రేపులు చెయ్యటానికి మగవారిని ప్రేరేపిస్తున్నాయి కాబట్టి. ఇదెలా ఉందంటే ఈమధ్య ఓ పీఠాధిపతి శని గుడిలోకి స్త్రీలు వెళితే వారందరూ మానభంగాలకు గురవుతారని హెచ్చరించి భయపెట్టే ప్రయత్నం చేసాడు చూసారా అలా ఉంది. ఈ ఉదంతానికి స్పందిస్తూ ఆమె భూత్నామా అనే షార్ట్ ఫిల్మ్ తీసింది. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తప్పక చూడండి. ఆమె కవిత్వం, కధలూ వ్యాసాలూ, నాటకాలూ, వ్యాఖ్యలే కాకుండా సంఘటనలమీద స్పందించేందుకు ఇంకో మాధ్యమాన్ని కూడా ఉపయోగిస్తుంది. సింపుల్ గా సూటిగా, గ్రాఫిక్ స్టోరీస్ రూపంలో. అలాంటి ఒక గ్రాఫిక్ స్టోరీలో ఇద్దరు స్త్రీలు ట్రైన్లో ప్రయాణిస్తూ టిక్కట్టు లేకుండా రైల్లో తలుపు పక్కన కూర్చుని ప్రయాణించే బీదవారిని ఉద్దేశించి, అసల ఇలాంటి వారి వల్లే రైల్వేస్ కి నష్టాలు వస్తున్నాయని మాట్లడుకుంటారు. అక్కడ ఇంకొందరు ప్రయణీకులు ఫ్రీగా పోర్న్ ఎలా డౌన్ లోడ్ చెయ్యాలని నేర్చుకుంటుంటారు. మాటల్లో ఈ ఇద్దరు స్త్రీలు తాము అమ్మిన కొన్న ఫ్లాట్స్ లో వైటు ఎంత వచ్చింది బ్లాక్ ఎంత వచ్చింది అని కూడా మాట్లాడుకుంటారు. మనకు మనం చేసేవి తప్ప అందరు చేసేవీ తప్పుగా అనిపించడం చాలా సహజం. నిజానికి బక్క రైతుల రుణాలకన్న బలిసిన బీరు బిస్నెస్ స్వాములు ఎలా బేంకుల ద్వారా ప్రజల సొమ్ము తిని తప్పించుకుంటారో మనం చూస్తున్నదే.   - Sharada Sivapurapu

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? అరుంధతీ సుబ్రమణ్యం

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? అరుంధతీ సుబ్రమణ్యం అరుంధతీ కవిత్వంలో ఆధ్యాత్మికత, తాత్విక చింతన, సంస్కృతి కవితా వస్తువులు. నిజానికి ఆమె దేనినైనా కవిత్వం చెయ్యగలదు. రెండు భిన్న అంశాలని తాత్వికంగా ముడిపెట్టగల నేర్పు ఆమె సొంతం. ఆమె మూడు కవితా సంకలనాలు రాసింది. రెండు పుస్తకాలు ఒకటి బుద్ధుడి మీదా ఇంకొకటి Sadguru: More than a Life అనే పుస్తకమూ రాసింది. ఆమె రచనల్లో ప్రతిభకి గుర్తింపుగా ఎన్నో పురస్కారాలు వచ్చాయి. ప్రపంచమంతా ఎన్నో Literary conferences లో ఆమె పాల్గొంది. ఎన్నో ఇతర భాషల్లోకి ఆమె కవిత్వం అనువాదం చేయబడింది. మచ్చుకి ఈ కవిత చూడండి. కింద దాని తెలుగు అనువాదం చేసిన కవిత ఇచ్చాను. Prayer May things stay the way they are in the simplest place you know. May the shuttered windows keep the air as cool as bottled jasmine. May you never forget to listen to the crumpled whisper of sheets that mould themselves to your sleeping form. May the pillows always be silvered with cat-down and the muted percussion of a lover’s breath. May the murmur of the wall clock continue to decree that your providence run ten minutes slow. May nothing be disturbed in the simplest place you know for it is here in the foetal hush that blueprints dissolve and poems begin, and faith spreads like the hum of crickets, faith in a time when maps shall fade, nostalgia cease and the vigil end. ప్రేయర్ నీకు తెలిసిన ప్రతి చోటా ఎలా ఉన్న వస్తువులు అలానే ఉండనీ సీసాలో నింపిన మల్లెల పరిమళంలాగా మూసిన కిటికీలు గాలినలాగే ఉంచనీ చల్లగా. పడుకున్నప్పటి శరీరాకృతి ప్రకారమున్న దుప్పటి ముడతల గుసగుసలు వినడమూ మరువకు. తలగడలనెప్పటికీ ఉండనీ మెత్తని ఊలు వెండి వర్ణంతోనూ ఓ ప్రేమికుడి మౌనమైన శ్వాస ప్రకంపనలతోనూ. నీ గమనమొక పదినిముషాలాలస్యంగా సాగుతున్నదని గోడమీద గడియారం గొణుగుతూ తీర్పు చెప్తూనే ఉండనీ. నీకు తెలిసిన ఏచోటునుంచీ దేనినీ చెదరనీయవద్దు ఎందుకంటే, ఇక్కడే, ఈ నిశ్శబ్ద గర్భస్థ కుహరంలోనే నమూనాలు కరిగి ఇంక సృజన మొదలవుతుంది విశ్వాసం కీచురాళ్ళ రొదలా వ్యాపిస్తుంది. నమ్మకం ఇటువంటి ఓ కాలంలో -- అంటే ఎప్పుడు సరిహద్దు రేఖలు చెరిగిపోతాయో, గతస్మృతులు కరిగిపోతాయో, మరి జాగరూకత ముగుస్తుందో అప్పుడు. ప్రేయర్ అనే ఈ పోయెంలో ప్రార్ధన అంటే దేముడ్ని ఏవేవో కోరికలతో ప్రార్ధించటం కాదనిపించింది. ఎలా ఉన్న దాన్ని అలానే ఉంచి, అంటే ఏదీ కూడా ఇలానో, అలానో మారాలి మార్చాలి అని అనుకోకుండా, ఎందుకంటే ఏదైనా మారాలి మార్చాలి అంటే అది ఒక ఇమోషనల్ టెర్రరిజం అవుతుంది (ఇది మనం చూస్తూనే ఉన్నామీ రోజుల్లో) . ఎక్కడివక్కడే ఉన్నపుడు వ్యాపించి ఉండేది ఒక నిశ్శబ్దం, నిర్వేదం. నీ విధిలో నీ గమనంలో నువ్వొక పది నిముషాలు లేటని గడియారం గొణిగినా పట్టించుకోవద్దంటుంది. ఇలాంటి నిశ్శబ్దాన్ని ఛేదించినప్పుడు, భేదించినప్పుడు ఆ నిశ్శబ్దపు గర్భంలోంచి ఒక పిండం జీవం పోసుకుంటుంది. అది కవిత కావచ్చు. విప్లవమూ కావచ్చు. ఆ సమయంలో దేనికీ సరిహద్దు రేఖలుండవు, గత స్మృతులుండవు, వాటి తాలూకూ వైషమ్యాలూ శతృత్వాలూ ఉండవు, ఒక్క నమ్మకం మాత్రముంటుంది. ఆ నమ్మకమే, విశ్వాసమే, వ్యాపిస్తుంది. నిజానికి మనం గమనిస్తే కీచురాళ్ళు మామూలుగా రాత్రిళ్ళు ఎక్కువ రొద పెడతాయి పైగా అన్నీ ఒక్కసారే అందుకుని ఒక్కసారే ఆపేస్తుంటాయి. ఒక ఏకత్వం, ఏకమైన తత్వం కనిపిస్తుంది. నిజానికి కీచురాళ్ళు పెద్దగా పట్టించుకోవాల్సిన ప్రాణులేం కావు, పెద్దగా హానీ చెయ్యలేవు. కానీ రాత్రి సర్వ జగత్తూ జాగరూకత లేకుండా, అంటే తమని తాము రక్షించుకునే ఆలోచనలేకుండా ఉండే సమయం వాటిదే. ఆ సమయంలో ఇంకే చప్పుళ్ళూ ఉండవు, అన్నీ నిద్రావస్థలోనే ఉంటాయి. కాబట్టి కీచురాళ్ళదే స్వరం, వాటిదే రాజ్యం. ఎటువంటి అసహజత్వమూ లేనపుడు ఒక సహజత్వం పుడుతుంది అది స్వఛ్చంగా ఉంటుంది. ఇంకొక రకంగా ఆలోచిస్తే మనని మనం మరచి, మన దేహం, దాని రక్షణ, సమ్రక్షణ గురించీ ఆలోచించకుండా, గతాన్ని మరిచి, కోరికలేమీ లేకుండా, సరిహద్దు రేఖలేవీ లేని స్వేఛ్చలో, ఉండటమే ఒక రకమైన ప్రేయర్ కదూ. Home Give me a home that isn't mine, where I can slip in and out of rooms without a trace, never worrying about the plumbing, the colour of the curtains, the cacophony of books by the bedside. A home that I can wear lightly, where the rooms aren't clogged with yesterday's conversations, where the self doesn't bloat to fill in the crevices. A home, like this body, so alien when I try to belong, so hospitable when I decide I'm just visiting. *** ఇల్లు నాది కానిదొకటి నాకొక ఇల్లు ఇవ్వండి ఎటువంటి ఆనవాళ్ళు వదలకుండా ఒక గదిలోంచి ఇంకో గదిలోకి వెళ్తూ ప్లంబింగ్ గురించిగానీ కర్టెను కలరు గురించి గానీ మంచం ప్రక్కన పుస్తకాలు చేసే రొద గురించి గానీ అస్సలు ఆందోళన పడకుండా తేలికగా చూసుకోగల్గే ఒక ఇల్లు ఎక్కడ నిన్నటి సంభాషణలు గదుల్లో నిండి ఉండవో ఎక్కడ తెగ పెరిగిన అహం ఖాళీలనన్నీ నింపదో ఒక ఇల్లు, ఈ దేహంలాంటిది నే సొంతం చేసుకోవాలంటే పరాయిగానూ అతిధిలా వస్తానంటే ఆహ్వానించేదిగానూ. సొంత ఇల్లంటే ఎంతో బాధ్యత. కరెంటు, వాటరు, ఇంట్లోని వస్తువులు, కొళాయిలు అన్నీ సక్రమంగా పనిచేసినపుడే ఆ ఇల్లు వసతిగా సౌకర్యంగా ఉంటుంది. సౌకర్యంగా ఉండాలంటే ఇలాంటివన్నీ ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఉండవలసిందే. నిజానికి ఇవన్నీ ఉన్నా కొన్ని బాధించే విషయాలుంటాయి. ఆ ఇంట్లోని కొన్ని చేదు అనుభవాలు, చేదు మాటలు, వాదులాటలు, అవమానాలు, సంఘర్షణలు ఇవన్నీ జ్ఞాపకాలై ఇంట్లోని కొన్ని వస్తువులు, పరిస్తితులు గుర్తుతెచ్చి బాధపెడుతూ ఉంటాయి ఎంత వద్దనుకున్నా. మరి సౌకర్యంగా ఉండే ఇంట్లో ఇలాంటి జ్ఞాపకాలుండకపోతే ఇంకా బాగుంటుంది కదా. చివరి లైన్లు కవితకి హై లైటు. ఆత్మ ఒక దేహాన్ని తొడుక్కుంటుంది, మరణంతో దాన్ని విడిచిపెడుతుందని మన వేదాంతం చెప్తుంది. ముసలితనంలో కృశించి, మరణంతో నశించే ఈ దేహం నాదనుకోవడం, అతిగా ప్రేమించడం రెండూ వృధానే. ఇల్లంటే ఎలా వుండాలో చెప్తూ కవితకి ఒక తాత్విక ముగింపు ఇస్తుంది. దేహాన్ని సొంతం చేసుకోవాలంటే పరాయిదౌతుంది, అలాగే జస్ట్ అతిధిలా ఉండి వెల్తానంటే మాత్రం ఆహ్వానిస్తుంది. నిజానికి అతిధిలా ఉంటే దేని గురించి వర్రీ అవక్కర్లేదు. అశాశ్వతమైన బ్రతుకులో దేని మీదా సొంతమన్న భావం ఉండకపోవడం ఏంటో ఈ కవిత ముగింపులో అందంగా చెప్తుంది. Andheri Local అనే ఒక పోయెంలో చివరగా అంటుంది ట్రైన్ దిగాకా నేను కారట్ ముక్కలు చెయ్యాలా, లేదా ప్రేమికుడిని ముక్కలు చెయ్యాలా అనే రెండు చాయిస్లలో ప్రేమికుడిని చాప్ చెయ్యడం పోస్ట్పోన్ చేస్తానంటుంది. నిజమే మరి ముంబాయి లోకల్లో లేడీస్ కంపార్ట్మెంట్లో ప్రయాణిస్తేనే గాని తెలియదు. అది లక్ష నాలుకల, అనేక మొగుళ్ళ కాళిక పట్టాలపై అంటుంది సటైరికల్గా. When I descend I could choose to dice carrots or a lover I postpone the latter. ఈరోజుల్లో ఏ కవికైనా అచ్చంగా ఒక ప్రాంతానికీ, ఒక వాతావరణానికీ, ఒక మతానికీ,ఒక సంస్కృతికి చెంది ఉండటం అనేది కష్టం. ఎందుకంటే మొత్తం గ్లోబ్ ఒక విలేజ్అన్నట్టుగానే జీవితం నడుస్తోంది. ఇంటర్నెట్టూ , సమాచారం సులువుగా ప్రవహించడం వల్ల దూరం అనేది తగ్గిపోయింది. అలాగే భిన్న సంస్కృతుల మధ్య దూరం కూడా తగ్గిపోతూ వస్తోంది. ముడుచుక్కూర్చోకపోతే అన్ని పండగలూ మనవే అన్నట్టుంటున్నాయి. ఇక పల్లెలూ పల్లె జీవితమూ కనుమరుగవుతూ, ప్రతి కుటుంబం నుంచి ఒకరో ఇద్దరో పిల్లలు విదేశాలకెళ్ళడం , జీవన సరళి, పట్నాలూ, మెట్రోలూ అయితే అవి గ్లోబల్ విలేజెస్ గానే ఉంటున్నాయి తప్పించి, వాటి అసలు స్వరూపం రూపు రేఖలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. ఈ నగరాల్లో పెరిగినవారు, తమిళులైనా, తెలుగువారైనా, వేరే ఇతర రాష్త్రాల వారైనా వారి వారి సాంప్రదాయాలతో బాటుగా ఇతరుల సాంప్రదాయాలనూ కొంత చేర్చుకుని ఒక కొత్త ప్రపంచ సిటిజెన్స్ గా తయారవుతున్నారు. ఇది ఒక అనివార్య పరిణామమే, తప్పదు. మరి చాందసవాదులు వీరినీ వీరి భాషనూ, వీరి మూలాల్నీ ప్రశ్నిస్తే వారి జవాబేంటి. తన జవాబుని To Welsh Critic Who Doesn'T Find Me Identifiably Indian అనే కవితలో ఇస్తుంది. నేను ఆమె ఇంగ్లీష్ పోయెంలో కొంత భాగాన్ని పేస్ట్ చేసాను అనువాదం చేసి. “This business about language, how much of it is mine, how much yours, how much from the mind, how much from the gut, how much is too little, how much too much, how much from the salon, how much from the slum, how I say verisimilitude, how I say Brihadaranyaka, how I say vaazhapazham – it’s all yours to measure, the pathology of my breath, the halitosis of gender, my homogenised plosives about as rustic as a mouth-freshened global village. Arbiter of identity, remake me as you will. Write me a new alphabet of danger, a new patois to match the Chola bronze of my skin. Teach me how to come of age in a literature you’ve bark-scratched into scripture. Smear my consonants with cow-dung and turmeric and godhuli. Pity me, sweating, rancid, on the other side of the counter. Stamp my papers, lease me a new anxiety, grant me a visa to the country of my birth. Teach me how to belong, the way you do, on every page of world history. “ "ఈ భాషా వ్యాపారంలో ఎంత నాది, ఎంత నీది ఎంత మెదడులోంచి ఎంత కడుపులోంచి ఎంత మరీ తక్కువ ఎంత మరీ ఎక్కువ ఎంత మంగలి అంగడి నించి ఎంత బస్తీ నుంచి యదార్ధము అనే పదమెలా పలుకుతాను బృహదారణ్యక అనే పదమెలా పలుకుతాను వారపరం (తమిల్) ఎలా పలుకుతాను ఈ కొలతంతా నీదే నా శ్వాస రోగ నిర్ధారణ స్త్రీపురుష లింగ దుర్గంధం నా సజాతీయం చేసిన విస్పోటనలు నా శ్వాస రోగ నిర్ధారణ స్త్రీపురుష లింగ దుర్గంధం నా సజాతీయం చేసిన విస్పోటనలు మౌత్ ఫ్రెషెనర్ వేస్కున్న గ్లోబల్ విలేజ్ ఎంత పల్లెటూరో అంత మధ్యవర్తిగా నా ఉనికిని నీ ఇష్ట ప్రకారం తిరిగి తయారుచేయ్యి నాకొక అపాయపు అక్షరాన్ని రాసివ్వు చోళుల ఇత్తడి లాంటి నా ఒంటి రంగుకి నప్పే ఒక కొత్త మాండలికం. శాస్త్రాలుగా నువు గిరికిపారేసిన సాహిత్యంలో సమకాలీనంగా ఎలా ఉండాలో నేర్పు గోధూళి, పసుపు,గోమేయం పూయి నా సమ్యుక్తాక్షరాలకి. ఎదురుగా నిలబడి కుళ్ళి చెమటతోనున్న నాపై జాలిపడు నాకొక కొత్త ఆందోళన బదులివ్వు నా కాయితాలపై ముద్ర వెయ్యి నేను పుట్టిన నా దేశానికి నాకు వీసా ఇప్పించు దేశవాసిగా ఎలా ఉండాలో నేర్పు ప్రతి ప్రపంచ చరిత్ర పేజీపై నువు చేసే విధంగా.” చక్కని జవాబు కదూ. మీక్కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. - Sharada Sivapurapu

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? అనితా నాయిర్

  మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? అనితా నాయిర్   అనితా నాయిర్ మొదట Satyr of the Subway ఇంకా పదకొండు కధలూ మొదట రాసింది. తరవాత ఆమె రాసిన 15 నవలల్లో The Betterman, Ladies Coupe, Mistress అనే మూడు నవలలు ముఖ్యమైనవి. ఆమె మొదటి కవితా సంకలనం Malabar Mind, Where is the Rain Born కేరళ గురించిన రచనలు. ఇవి కాకుండా ఎన్నో కధలు పిల్లల కోసం రాసింది. ఆమె రచనలు 30 ఇతర భాషల్లోకి అనువదించారట. ఇక ఎవార్డ్స్ విషయానికొస్తే కొదవ లేదు. కేరళ సాహిత్య ఎకాడమీ ఎవార్డు ముఖ్యమైనది. ఆమె నవలలు కూడా అన్నీ బెస్ట్ సెల్లర్సే. ఆమె ఫేస్ బుక్ పేజీ లో ఒక కవిత ఈమధ్య కాలంలో జరుగుతున్న విషయాల గురించి, వీస్తున్న గాలులకి స్పందనగా రాసింది దొరికింది, ఒక కవి ఏంచేస్తాడు, తన స్పందన తెలపడం తప్ప దేశంలో ఇలాంటివన్నీ జరుగుతున్నపుడు అని వ్యాఖ్యానిస్తూ ఈ కవితకి ముందు. నాకు నచ్చింది. మీకూ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఆ కవితకి తెలుగు అనువాదం కింద ఇస్తున్నాను. Said-ition, Sedition, Whatever. Look young man We don't care who you are We don't care what you said It's enough you asked a question Actually you asked several, they said. So that's said-ition, sedition, whatever. We dont like dissent. Actually we don't like Dalits, Muslims, women breaking our rules, University students, human rights. But that's not for you to say. So that's said-ition, sedition, whatever. There is only one divinity What we know; there is only one right A khaki coloured kumkum scented right. So your martyrs day is our murderer's day. The constitution and tri-color aren't right. But that isn't said-ition, sedition, whatever. We have the power of om and the goons. Saffron to brandish, god men as spin doctors. So we will clamp your voice Break your spirit and steal your breath. We will tell you what is to be said. Or pay dog for said-ition, sedition, whatever.   Said-ition, Sedition, Whatever. చూడు కుర్రాడా నువ్వెవరో మాకక్కరలేదు నువో ప్రశ్న అడిగావు, అది చాలు మాకు నిజానికి నువు చాలా ప్రశ్నలడిగావని వాళ్ళన్నారు, అందుకని అది said-ition, sedition, whatever మాకు నిరసన ఇష్టం ఉండదు. నిజానికి దళితులంటే మాకిష్టం లేదు. ముస్లింలూ, సాంప్రదాయాలకు విరుద్ధంగా వెళ్ళే ఆడవాళ్ళూ మానవ హక్కులూ, విశ్వ విద్యాలయాల విద్యార్ధులూ కానీ ఇవన్నీ నువు కాదు చెప్పాల్సింది అందుకని అది said-ition, sedition, whatever ఒకే ఒక దైవం ఉంది మాకు తెలిసి: ఒకటే సవ్యం ఒక ఖాకి రంగు, సువాసన కుంకుమ సవ్యం మీ అమర వీరుల దినం మా హంతకుల దినం త్రివర్ణ పతాకం, రాజ్యాంగంతో సహా అపసవ్యమే అందుకని అది said-ition, sedition, whatever రౌడీ బలగం, ఓం శక్తి మాకుంది చిట్కా వైద్యానికి దైవ సమాన బాబాలు, ఝళిపించడానికి కాషాయం అందుకని నీ గొంతుక మేం నొక్కేస్తాం అంతరాత్మని ముక్కలు చేయ్, నీ ఊపిరి హరించు నువ్వేం చెప్పాలో మేం చెప్తాం లేదంటే జరిమానా కట్టు for said-ition, sedition, whatever. ** సమకాలీన పరిస్తితులకి అద్దం పట్టే కవిత. వివరణ అవసరం లేని కవిత. Ministry of Deceit Was it a Sunday evening When you left a window carelessly open You rang first that gong of betrayal? Was it one high noon When you thoughtlessly fed her bones of the lamb You sang first that litany of duplicity? Was it under a moonlit sky When your face flowered in surreptitious joy You knew first that triumph of transgression? Was it under a kitchen light As you lay bare fish bones of guilt You exorcised first imprudent trust? A Saturday, a Monday, Pearly light, yellow light, in the dark Eighty-six thousand four hundred ways exist. To baptize the fool Smug in the knowledge She will never be deceived. Halleluiah Ministry of Deceit నిర్లక్ష్యంగా కిటికీని తెరిచి వెళ్ళిపోయి ద్రోహపు గంట మొదటిసారిగా మోగించినది ఒకాదివారపు సాయంత్రమేనా? ఆలోచనారహితంగా గొర్రె మాంసంలోని ఎముకలనామెకు తినిపించి నువ్వో మోసపు కీర్తన పాడినది అదొక మిట్టమధ్యాహ్నపు వేళ కదూ? ఉల్లంఘన విజయాన్ని నువు చవిచూసినపుడు నీ మోముపై వికసించిన కృత్రిమానందం అది వెన్నెల పరుచుకున్న ఆకాశం కిందనే కదూ? అపరాధపు చేప ఎముకలని పరిచి అవివేకపు నమ్మకాన్ని పారద్రోలినది వంటింటి వెలుతురులోనే కదూ? ఒక శనివారం, ఒక సోమవారం తెల్లని ముత్యాల వెలుగు, పచ్చని వెలుతురు, చీకట్లో ఎనభైయ్యారు వేల నాల్గొందల మార్గాలున్నాయి నన్నెవరూ ఎప్పటికీ మోసగించలేరనుకుని భ్రమపడే ఓ మూర్ఖురాలిని బాప్తీజించడానికి హల్లలూయా. ఈ కవిత తన భర్త మీద అపారమైన నమ్మకం ఉన్న ఓ స్త్రీ గురించి. మనం Home Ministry అని గృహిణిని అన్నట్టుగా మినిస్ట్రీ ఆఫ్ డిసీట్ అనే శీర్షిక మోసం చేసే భర్త నుద్దేశించి పెట్టినట్ట్లు అనిపించింది. కళ్ళు తెరుచుకుని గమనిస్తే భర్త / ప్రేమికుడు మోసం చేస్తున్నాడని క్లియర్గా తెలుస్తుంది. ఆమె ఉదహరించినవన్నీ అతను దారి మార్చుకుంటున్నాడనటానికి సంకేతాలు గమనిస్తే. నన్నెవరూ మోసం చెయ్యలేరనే ఒక ధైర్యంతో మూర్ఖంగా ఉండిపోతే వారిని బాప్టైస్ చెయ్యడానికి ఎన్నో వేల మార్గాలున్నాయంటుంది. అపరాధపు చేప ఎముకలు పరిచి, అవివేకంగా పెంచుకున్న నమ్మకమనే ఆత్మని పారద్రోలాడట. మామూలుగా ఎముకలు పరిచి మంత్రాలు చదివి మనుషులకి పట్టిన చెడ్డ ఆత్మలని వదిలిస్తారు. కానీ ఇతను ఆమెకు అతనిపై ఉన్న నమ్మకాన్ని వదిలించేసాడు. అదీ సంగతి. ఇక అనితా నాయిర్ నవలలకొస్తే ఆమె స్త్రీ పురుష సంబంధాల్ని అత్యద్భుతంగా చిత్రిస్తుంది ఆమె స్త్రీ పాత్రలు ఎన్ని కష్టాలు పడ్డా, తిరిగి తిరిగి మొదటికే వచ్చినా మళ్ళీ అక్కడినుంచే పైకి లేచే ప్రయత్నం చేస్తాయి అన్ని నవలల్లోనూ. ప్రేమ, మోసం, భంగపాటు ఇవన్నీ ఎదుర్కొని మళ్ళీ మళ్ళీ జీవితాన్ని వెతుక్కుంటూ సాగించే పయనాలే.   - Sharada Sivapurapu