అభ్యుదయ సాహిత్యపు అగుడుజాడ గురజాడ

అభ్యుదయ సాహిత్యపు అగుడుజాడ గురజాడ - సతీష్ రెడ్డి జడ్డా          జాతీయతాస్ఫూర్తి భారత దేశమంతటా వెల్లివిరుస్తున్న రోజుల్లో కలం పట్టిన యోధుడు గురజాడ. పాశ్చాత్య నాగరికత వ్యామోహంలో పడి భారత యువత కొట్టుమిట్టాడుతున్న సమయంలో వారికి భారతీయ సంస్కృతి, చరిత్ర, సాహిత్య వైభవాలను గుర్తుచేయడంతోపాటు పాశ్చాత్య లోకానికి భారతీయ ఔన్నత్యాన్ని తెలియజేయాల్సిన చారిత్రక అవసరాన్ని గుర్తించిన దీర్ఘదర్శి- గురజాడ.   తాంబూలాలిచ్చేశాను, ఇక తన్నుకు చావండి,  డామిట్‌! కథ అడ్డం తిరిగింది, పొగ తాగనివాడు దున్నపోతై పుట్టున్‌ లాంటి మాటలను ప్రజలకు ఊత పదాలుగా మార్చిన అద్భుతరచయిత గురజాడ. తెలుగు సాహిత్యానికి సరికొత్త అడుగుజాడలు చూపించిన గురజాడ 151వ జయంతి సందర్భంగా ఆయన సాహితీ గమనాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. కన్యాశుల్కం నాటకంతో సమాజంలో దురాచారాలను ప్రశ్నించిన సంఘ సంస్కర్త గురజాడ. ముఖ్యంగా ఆయన సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్పంతులు లాంటి పాత్రలు ప్రజలు మనసులో చెరగని స్ధానం సంపాదించాయి. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన సాహితీకారుడు గురజాడ అప్పారావు. హేతువాది 19 వ శతాబ్దంలోను, 20 వ శతబ్ది మొదటి దశకంలోను ఆయన చేసిన రచనలు ఈనాటికీ ప్రజలకు మార్గదర్శనం చేస్తూనే ఉన్నాయి. రాశిలో తక్కువైనా, ఆయన రచనలన్ని వాసికెక్కినవే. వ్యావహారిక భాషలో రచనలు చేయడం చేతకానితనం భావించే ఆ రోజుల్లో సామాన్యుడికి అర్ధమయ్యే సరళమూన భాషల్లో ఎన్నో రచనలు చేశారు గురజాడ. సాహితీ రంగానికి ఆయన చేసిన సేవలకు గాను అభ్యుదయ కవితా పితామహుడు, కవి శేఖర లాంటి బిరువులతో సత్కరించారు. కన్యాశుల్కం, పుత్తడి బొమ్మ పూర్ణమ్మ, నీ పేరేంటి, పెద్దమసీదు, మాటా మంతి లాంటి రచనలు ఆయన్ని ఎప్పుడు మనకు గుర్తు చేస్తూనే ఉంటాయి. దేశ భక్తునిగా, సంఘసేవకునిగా, సాహితీవేత్తగా, ఆంధ్రుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన గురజాడ అప్పారావు 1915 నవంబర్‌ 30న తన అపార సాహితీ సంపదను మనకు వదిలేసి తను మాత్రం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

మాలతీ చందూర్‌గారికి అక్షరనివాళి

మాలతీ చందూర్‌గారికి  అక్షరనివాళి                    తెలుగు సాహిత్యంలో ఓ శంకం ముగిసింది.. ఓ అక్షర ప్రయాణం ఆగిపోయింది. వేల శీర్షికల దూరం తను నడిచి మనల్ని నడిపించిన ఓ కలం శాశ్వత నిద్రలోకి జారుకుంది. ఐదు దశాబ్దాలకు పైగా నవలలు శీర్షికలు, విమర్షనాస్త్రాలను రాసిన మాలతీ చందూర్‌గారు అస్తమించారు. భౌతికంగా మనల్ని వదిలి వెళ్లిన్న తరతరాలకు సరిపడా సాహితీ సంపదను మనకందించి వెళ్లారు.  నాలుగైదు దశాబ్లాత క్రితమే సాహిత్యం మీద అవగాహన ఉన్న వారికి పరిచయం అక్కరలేని పేరు మాలతీ చందూర్‌. ఆంద్రప్రభలో వచ్చిన ప్రమదావనం, స్వాతిలో పాతకెరటాలు శీర్షికలతో ఎన్నో ఏళ్ల పాటు తెలుగు సాహితీ ప్రియులను అలరించారు ఆమె.  అంతే కాదు సాంప్రదాయ తెలుగు సాహిత్యానికి భిన్నంగా ప్రపంచ సాహిత్యాన్ని తెలుగు వారికి పరిచయం చేసిన అతి కొద్ది మందిలో మాలతి గారు ఒకరు. ముఖ్యంగా పాతకెరటాలు పేరుతో ఆమె రాసిన శీర్షికలో ఎన్నో ప్రపంచ ప్రసిద్ద నవలను తెలుగు జాతికి పరిచయం చేశారు.  ఆమె రచనల్లోని సాహిత్య విలువలు చూసిన వారు ఈవిడ ఎంతటి విద్యావంతురాలో అనుకుంటారు. కాని నిజానికి ఆమె ఉన్నత విద్యలేవి అభ్యసించలేదు. అయిన ఐదు దశాబ్దాల పాటు ఓ పత్రికలో ఏకదాటిగా శీర్షికను నిర్వహించిన ఏకైక రచయితగా ఆమె అరుదైన ఘనత సాధించారు.  మాలతీ చందూర్ కృష్ణా జిల్లా నూజివీడులో వెంకటాచలం, జ్ఞానాంబ దంపతులకు 1928 డిసెంబర్ 26న జన్మించారు. 8వ తరగతి వరకూ నూజివీడులోనే చదువుకున్న ఆమె.. ఏలూరులో హైస్కూలు, ఉన్నత విద్య పూర్తిచేశారు. అనంతరం ఏలూరులోనే కొంతకాలం ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. ప్రముఖ రచయిత ఎన్‌ఆర్ చందూర్‌తో 1948లో ఆమె వివాహం జరిగింది. అనంతరం వారు చెన్నైలో స్థిరపడ్డారు. కేవలం ఆమె రాసిన నవలా పరిచయాలే "పాత కెరటాలు", "నవలా మంజరి" పేర్లతో పుస్తకాలుగా విడుదలయ్యాయి. తెలుగు సాహిత్యం పాటు ఆంగ్ల సాహిత్యాన్ని కూడా ఆమె తెలుగు వారికి పరిచయం చేశారు. కేవలం ఆమె రచనల కారణంగానే ఆంగ్లసాహిత్యం చదవటానికి అలవాటు పడిన మహిళలు ఎందరో ఉన్నారు. తను రాసే నవల పరిచయాలలో కేవలం నా పరిచయం మాత్రమే కాదు అసలు నవలను కూడా చదివి ఆనందించండి అని విన్నవించిన సంస్కారం ఆమెది.  ఆమె రచనల్లో ముఖ్యంగా ప్రస్థావించ వలసిన మరో రచన ప్రమదావనం. ఈ శీర్షికలో పాఠకుల అడిగిన ప్రశ్నలకు లోతైన విశ్లేషణలతో సమాదానాలు చెప్పేవారు. అంతర్జాతీయ వార్తలనుండి అంతరిక్షం దాకా ఎలాంటి ప్రశ్నలకైన ఆమె సమాధానాలు ఇచ్చేవారు. కుటుంభ సమస్యలనుండి రాజకీయ విషయాల వరకు అన్ని విషయాలను ప్రస్థావించేవారు. ప్రమదావనం శీర్షిక చూసిన వారికి ఈమెకి ఇన్ని రంగాల మీద అవగాహన ఎలా ఉంది అన్న అనుమానం రాక మానదు.. అంతగా ఆమె రచనలు ఆకట్టుకునేవి.  అప్పట్లో సినిమా హీరోలకు ఉన్నంత పాపులారిటీ ఫాలోయింగ్‌ మాలతీ చందూర్‌గారికి ఉండేది. మద్రాసు వెళ్లిన తెలుగు వారు సినిమా నటులతో పాటు మాలతీ చందూర్‌ గారిని చూడటానికి కూడా క్యూ కట్టే వారు. తెలుగు సాహితీ లోకంలో అంతటి కీర్తినార్జించారావిడ.  కేవలం శీర్షికలు నవలలే కాదు, స్త్రీలకు ఉపయోగపడే వంటలు, పిండివంటలు అనే పుస్తకాన్ని కూడా రచించారు. అప్పట్లో అమ్మాయి పుట్టింటి నుంచి ఇచ్చే సారేలో వంటలు పిండివంటలు పుస్తకం కూడా ఓ ముఖ్య వస్తువుగా ఉండేది. అంతేకాదు 1974లో తొలి ముద్రణ జరిగిన ఈ పుస్తకం ఇప్పటికి 30 సార్లకు పైగా ముద్రితం అయింది. ఓ రచన ఇన్ని సార్లు ముద్రించబడటం కూడా ఓ రికార్డే.  తన సాహితీ ప్రయాణంలో 25 కి పైగా నవలలు, పలు కథలు, వ్యాసాలు వ్రాసారు.  ఆమె వ్రాసిన నవలల్లో శిశిర వసంతం, ఆలోచించు, భూమిపుత్రి, హృదయనేత్రి, కలల వెలుగు, మనసులోని మనసు, ఏమిటీ జీవితాలు విశేష ఆదరణ పొందాయి. గుజరాతీ, తమిళం, హిందీ లాంటి ఇతర భారతీయ భాషలలోకి అనువాదం అయి అక్కడ కూడా పాఠకాదరణ పొందాయి. ఇలా తెలుగు అక్షరానికి ఎనలేని సేవలందించిన మాలతీచందూర్‌ గారికి  తెలుగువన్‌ అక్షరనివాళులర్పిస్తుంది.

మనసున్న కథకుడు

మనసున్న కథకుడు రావిశాస్త్రి గారి జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం                                                                                              రమ   ఆధునిక తెలుగు సాహిత్యంలో కవిత్వ విషయంలో శ్రీశ్రీ కి ముందూ శ్రీ శ్రీ కి తరువాత  అని చెప్పుకున్నట్టు గానే, కథానికల విషయంలో రావిశాస్త్రికి ముందూ, రావి శాస్త్రి కి తరువాత అని చెప్పుకోవాలసి ఉంటుందంటారు విమర్శకులు.  వస్తు స్వీకారంలోనే కాదు, రచనా ప్రక్రియలో నిర్వహణ లో, నిర్మాణంలో,సంభాషణల లో,పాత్ర చిత్రణలో కథాకథనంలో వైవిధ్యాన్ని ప్రదర్శించిన వాడు, తనదంటూ కొత్త విధానాలను నిర్మించుకున్న రచయిత రావిశాస్త్రి. కథా కథనంలో  ఎన్ని రకాల వైవిధ్యం ఉండడానికి వీలుంటుందో అన్ని రకాల పద్దతులూ రావిశాస్త్రి గారి రచనల్లో కనిపిస్తాయి. రావి శాస్త్రి గారి నవలల్లో కనిపించే పాత్ర వైవిధ్యం తెలుగులో చాలా తక్కువ మంది రచనలలో కనిపిస్తుంది.పై తరగతి, మద్యతరగతి మనుష్యులతో పాటు ఎన్ని రకాల బతుకులు బతకటానికి వీలుందో అన్ని రకాల బతుకులు బతికే కింది తరగతివాళ్ళు రావిశాస్త్రి రచనల్లో కనిపిస్తారు. రావిశాస్త్రి గారి కథలు ఒక్కొక్కటి జీవితంలో ఒక్కొక్క కోణానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. నవలలు అంతకంటే లోతుగా వెళ్లి మానవ స్వభావాలను, జీవన సంక్లిష్టతను, సమాజంలోని వివిధ వర్గ స్వరూపాలను సూక్ష్మాతి సుక్ష్మా వివరాలతో చిత్రిస్తాయి. రావిశాస్త్రి గారి నవలలో కథా కథనం మాత్రమే ప్రధానంగా కనిపించదు.జీవిత వాస్తవాలను ముందుచటం, వాటి ఆధారంగా వ్యవస్థపైన సునిశిత విమర్శ ఈ నవల్లో ప్రధానంగా కనిపిస్తాయి మనకి.   రావిశాస్త్రి గారి నవలల్లో  కనిపించే మరో విశేషం సినిమా శిల్పం, చదువుతుంటే చూస్తున్న అనుభావాన్ని కలిగిస్తాయి. ఆయన నవలలో ప్రతి నవలా ఒక సినిమాకు స్క్రీన్ ప్లే  రాసినట్టుగా ఉంటుంది.ఇక రావిశాస్త్రి గారి కథల విషయానికొస్తే సంభాషణలు, పాత్రలు, మొదలైన విషయాలలో కథ ఎన్ని రకాల పోకడలు పోగలదో   అన్ని రకాల పోకడలు ఆయన కథలలో  కనిపిస్తాయి. ఆయన కథలు ఆయనతో పాటు ఎదుగుతూ, మారుతూ, మెరుగవుతూ వచ్చాయని చెప్పొచ్చు. తొలిదశ మద్య తరగతి జీవితాలు, తాతాత్విక ధృక్పదం  చుట్టూ తిరిగేతే, రెండవ దశలో  కథలు న్యాయన్యాయలు, సామాజిక స్పృహ తో కనిపిస్తాయి. ఆ తరువాత దశలోమరీ ముఖ్యంగా ఆరుసారా కథలతో జీవితపు లోతుల్లోకి, సమాజపు చీకటి కోణాల్లోకి ఆయన కథ ప్రవేశించిందని చెప్పొచ్చు. బూర్జువా రాజ్యం,పరిపాలనా యంత్రాంగం,న్యాయవ్యవస్థ సామాన్యుల జీవితాన్నిఎంతగా సంక్లిష్టంగా చేసిందో దయనీయంగా మార్చిందో అరుసారా కథలు, పిపీలికం, సృష్టిలో, తలుపుగొళ్ళెం, రొట్టెముక్క,లక్ష్మీ, 'మంచి'చెడ్డల్లో ',ఏ కథ, షోకు పిల్లి- విశ్వ సాహిత్యం లోనే గొప్ప కథలుగా చెప్పుకోతగ్గవి .జీవితమే సాహిత్యం కావాలని నిష్కర్షగా చెప్పినవాడు గురజాడ . ఆ అభిప్రాయం తోనే రచనలు చేసినవారు రావిశాస్త్రి." కథలు ఆకాశంలో పుట్టవు మనిషి జీవితం లోంచే పుడతాయి. అందుకనే రచయితలు జీవితానికి దగ్గరగా ఉండాలి. జీవితానికి దగ్గరగా ఉండగలిగినవాడే మంచి రచయితగా మిగులుతాడు" అనేది రావిశాస్త్రి గారి సిద్ధాంతం.  

దాశరధీ కవితా పయోనిధి

 దాశరధీ కవితా పయోనిధి    - కనకదుర్గ   "కవిత వ్రాసినపుడే అది కలమవుతుంది.      పాట పాడినపుడే అది గళమవుతుంది        బలాఢ్యులను చిత్తు చిత్తుగా ఓడించి        దుర్బలులను ఆదుకుంటే, బలమవుతుంది."                 (దాశరధి గారు రాసిన తెలుగు రుబాయి)   " డా. దాశరధి ఒక శక పురుషుడు, మహాకవి - ఆయన కవితాశరధి.  నన్ను అన్నగారూ, అని అత్యంత ఆప్యాయతతో పలకరించి, మా కుటుంబ సభ్యులలో నొకరుగా కలసి మెలసి వున్న రోజులు మరవరానివి.  ఎంత గొప్ప మహాకవియో అంత ఉన్నతమైన మహామనిషి, స్నేహపాత్రుడు, నిగర్వి, ప్రేమకు చిహ్నం.  నా తమ్ముడు దాశరధి నేను మద్రాసు ఆకాశవాణిలో కలసి పనిచేసిన రోజులు చిరస్మరణీయం.  కొన్నాళ్ళు మేమిద్దరం ఒక ఇంటిలో ఫ్లాట్సులో వుండెడివారము.  వారి కుటుంబమూ, నా కుటుంబమూ ఒక కుటుంబముగా మెలగినాము.  వారులేని లోటు నాకు తీరని వ్యధ.  వారి అకాలమరణం కవితా ప్రపంచానికి ముఖ్యంగా నాకు చెరగని మచ్చ.  వారి కవితా గేయములు నేను పాడినాను. సినిమాలో కూడా పాడినాను.  ఆ పాటలు నేటికీ చెరగని ముద్రగా శ్రోతల హృదయంలో నిలిచియున్నవి." అన్నారు ప్రముఖ సంగీతకారులు, దాశరధి గారికి మంచి మిత్రుల్లో ముఖ్యులు శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు.  దాశరధి గారు చాలా మందికి ఒక కవిగా, సినీ కవిగానే బాగా తెలుసు కానీ ఆయన స్వాతంత్ర్యయోధుడు, నిజాం రాజుని తన కవిత్వంతో అతని గుండెలో భయాన్ని కలిగించిన సాహసవంతుడు.  నిజాం రాజు గురించి మాట్లాడటానికే భయపడుతున్న సమయంలో "నిజాం రాజు తర తరాల బూజు," "ముసలి నక్కకు రాచరికంబు దక్కునే," అని జైలు గోడలపై రాసి జైలులో వుండి కూడా తన కవిత్వ ప్రభావంతో ప్రజల్లో చైతన్యాన్ని, నిజాంని గడ గడలాడించిన ధీరుడు దాశరధి.  ఆయన మొట్ట మొదటి కవితాఖండం, "అగ్నిధార."  ఇందులోని చాలా వరకు కవితలు ఆయన జైలులో వున్నపుడు ఆశువుగా చెబుతుంటే ఆయనతో పాటు వున్న తోటి కవి మిత్రులు, విని అవి మరచిపోకుండా మెదడులో భద్రపరచుకుని జైలునుండి బయటకు వచ్చాక దాశరధి గారికి కవితాఖండం పూర్తి చేయడానికి సాయం చేసారు.  " పటు బాహాబలురైన ఆంధ్రుల గత   ప్రాశస్త్యముల్ వల్లె వే   యుటలో కొన్ని తరాలు దాటినవి: పూ   ర్వోదంతముల్ నేటి సం   కటముల్ తీర్పవు గాక, నాటి జ్వలితాం   గారమ్ము లీనాటి కుం   పటిలో బూడిద కప్పుకొన్నవి, రగు   ల్పన్ లెమ్ము వీరాంధ్రుడా!" ( వీరాంధ్రుడా! -1 : అగ్నిధార )   ఆ తర్వాత ఎన్నో కవితా ఖండాలను రాసారు, 'రుద్రవీణ,' 'తిమిరంతో సమరం,' 'అమృతాభిషేకం,' 'పునర్నవం,' 'మహాంధ్రోదయం,' 'కవితాపుష్పకం,' ' జ్వాలాలేఖిని,' 'గాలిబ్ గీతాలు,' నేత్రపర్వం,' లాంటివి ఎన్నో వున్నాయి.  దాశరధి గారికి చిన్నప్పటి నుండి ఉర్దూ భాష, అరబ్భిక్, ఫారసీ భాషలంటే చాలా మక్కువ, ఉర్దూ మాష్టర్ మిర్జా గాలిబ్ కవిత్వం గురించి చెప్పే పద్దతి ఎంతగా నచ్చిందంటే ఆయనకు గాలిబ్ జీవిత చరిత్ర తెలుసుకోవడం ఆయన గజల్స్ చదవడమంటే చాలా ఇష్ట పడేవారు.  అదే ఇష్టం పెద్దయ్యాక గాలిబ్ గారి గజల్స్ ని తేటతెనుగులో కవితలుగా అనువదించారు.  దీని కోసం ఆయన చాలా కష్టపడ్డారు.  ఒకోసారి ఒక కవిత అనువాదం అయిపోయింది అనుకుని సంతోషించే లోపల అది మళ్ళీ చదివితే పూర్తి అర్ధం సరిగ్గా రాలేదనిపించి మళ్ళీ దాన్నిఎంత రాత్రయినా, ఎన్ని రోజులయినా సరే ఆయనకు సంతృప్తినిచ్చేదాక పని చేస్తూనే వుండేవారు.  అనువాదం పూర్తయ్యాక దాశరధి గారి అభిమాన సినీ నటులయిన నటసామ్రాట్ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారికి అంకితం ఇవ్వడం వారిద్దరి మధ్య మంచి స్నేహం పెనవేసుకోవడం జరిగింది.  "రమ్మంటే చాలు గానీ   రాజ్యాలు విడిచిరానా   నీ చిన్ని నవ్వుకోసం   లోకాలు గడచిరానా." గాలిబ్ కవితల నుండి ఈ ఒక్క కవిత చదివితే చాలు తెలిసిపోతుంది ఎంత సులభంగా అర్ధమయ్యే రీతిలో తేట తెలుగులో రాసారో దాశరధి గారు.  దాశరధి గారు తెలుగులో గజల్స్ రాయడమే కాదు రుబాయీలను కూడా చాలా రాసారు.  రుబాయి అంటే నాలుగు లైన్ల కవిత అని అర్ధం. దాశరధి గారి కవితల్లో పేదవాడి కష్టాలు, అవి తీరే రోజులు త్వరలో వున్నాయని ఆశాభావాన్ని చూపించేవారు.  ఆయన ప్రజల మనిషి, ప్రజల కవి. 'జ్వాలా లేఖిని,' అనే కవితా సంపుటి నుండి"ప్రజల పంచాంగం,' అనే కవితలో ఇలా రాసారు.  ఏ పండగకి కవిత రాసినా బీద గొప్ప తేడాలు పోవాలనే ఆశని వ్యక్తం చేసేవారు.     "..ప్రజల మాటకు తిరుగులేదండి       ప్రజల కోరిక తీరవలెనండి.       ధనపిశాచం ఆట కట్టాలి       జన పతాకం కోటకెక్కాలి        శ్రమికజాతికి విజయమగునండి....        దుష్ట శక్తులు తొలగిపోవాలి        కష్ట జీవుల బ్రతుకు మారాలి         ప్రజాస్వామ్యం సామ్యవాదంతో         చేయి చేయీ కలిపి నడవాలి         తెలుగు జాతికి కీర్తి పెరగాలి."  దాశరధి గారు తన కవితల్లో పేదవాడికి పెద్ద పీఠం వేసేవారు. దాశరధి గారు సినీ కవిగా "వాగ్ధనం," సినిమాలో 'నా కంటిపాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలవనీరా' అనే గీతంతో సినీ రంగ ప్రవేశం జరిగింది.  ఆ సినిమాలో ఆయన రాసిన పాట బాగా హిట్ అయ్యి ఆయన సినీ కవిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుని కొన్ని వేల పాటలు రాసి ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల, శ్రోతల మదిని దోచుకున్నారు.  అమ్మ పాట అనగానే దాశరధి గారు రాసిన, ' అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నేన్నో తెలియని మమతల మూట,' పాటే గుర్తొస్తుంది.  వీణ పాటలంటే దాశరధి గారే రాయలనుకునేవారు సినీ పరిశ్రమలో, అలాగే అన్నా చెల్లెళ్ళ పాటలు కూడా బాగానే రాసారు.  ఇటు అందమైన ప్రేమ గీతాలను, శృంగార గీతాలను ఎంతో సున్నితంగా రాసేవారు ఎటువంటి అశ్లీలతకు అవకాశముండేది కాదు ఆయన పాటల్లో.  అలాగే దేశభక్తి గీతాలు, లలిత గీతాలెన్నో రాసారు ఆయన ఆకాశవాణిలో పని చేసినపుడు.  ఘంటసాల గారు ఒకసారి దాశరధి గారిని సినిమా కోసం కాకుండా మామూలుగా రాసిన పాటలేవైనా వుంటే ఇమ్మని అడిగి మరీ తీసుకుని పాడారు, 'తలనిండ పూదండ దాల్చిన రాణి మొలక నవ్వులతోడ మురిపించబోకే..', 'వెలిగించవే చిన్నవలపు దీపం, ఎందుకే రాణి నా మీద ఇంత కోపం,'  లాంటి పాటలు పాడారు.  పి.బి. శ్రీనివాస్ గారు కూడా దాశరధి గారి గజల్స్ ని ఎన్నో పాడారు.  ఇప్పుడు గజల్ శ్రీనివాస్ గారు కూడా ఆయన రాసిన తెలుగు గజల్స్ ని పాడారు, పాడుతున్నారు.  దాశరధి గారిని ఎన్నో బిరుదులు వరించాయి, ఎన్నో సన్మానాలు అందుకున్నారు. 1967 లో ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డ్ , తామర పత్ర అవార్డ్ ని 1972 లో, జాతీయ సాహిత్య అకాడెమీ అవార్డ్ 1974లో అందుకున్నారు. కళాప్రపూర్ణ డాక్టరేట్ డిగ్రీని ఆంధ్రా యునివర్సిటీ వారు 1975లో ఇచ్చి సత్కరించారు,  అలాగే ఆగ్రా యునివర్సిటీవారు 1976లో, శ్రీ వెంకటేశ్వర యునివర్సిటీ వారు 1981 లో సాహిత్యంలో డాక్టరేట్ అంటే డి.లిట్ ని ఇచ్చి సత్కరించారు.  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆయనని ఆస్థాన కవిగా కూడా నియమించారు. దాశరధి గారు మానవతావాది, ఆయనకు ఎలాంటి తేడాలు లేవు.  కులమత బేధాలు కానీ, ఎటువంటి బేషజాలు లేవు.  ఆయన అందరినీ ఒకటే రకంగా చూసేవారు, పిల్లల్లంటే ఇష్టపడేవారు.  మంచి స్నేహశీలి.  ఆయన స్నేహితుల్లో, వానమామలై వరదాచార్యులు, వట్టికోట ఆళ్వార్ స్వామి, కాళోజి, డి.రామలింగం, వి.హెచ్. దేశాయ్ గారిలాంటివారు ఆయనతో పాటు జైళ్ళల్లో వున్నారు, కష్టసుఖాలను పంచుకున్నారు. సి. నారాయణ రెడ్డి గారు, దాశరధి గారు, కాళోజి గారు కలిసి తెలంగాణా రచయితల సంఘం ప్రారంభించి అన్ని జిల్లాలకు వెళ్ళి కవిత్వంతో ప్రజలను  చైతన్యవంతులను చేయడానికి ప్రయత్నించేవారు.  సినీ కవులందరూ ఆయనకు మిత్రులే, ఆరుద్ర, ఆత్రేయ, శ్రీశ్రీగారు, తర్వాత వచ్చిన వారు కూడా ఆయన సినీ గీతాలు రాసే పద్దతిని ఇష్ట పడేవారు.   ఆయన తమ్ముడు దాశరధి రంగాచార్యులు గారు, రచయిత. "చిల్లరదేవుళ్ళు,' నవలకి సాహిత్య అకాడెమీ అవార్డ్ వచ్చింది, ఆ నవలని సినిమాగా కూడా తీసారు, నాలుగు వేదాలను తెనుగీకరించారు. దాశరధి గారికి ముగ్గురు చెల్లెళ్ళు.  ఆయన భార్య లక్ష్మి గత సంవత్సరం తన భర్తని చేరుకున్నారు. వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు.  దాశరధి గారు ఇంకా ఎంతో సాహిత్య సేవ చేయవలసింది మిగిలి వుండగానే చిన్న వయసులోనే 1987లో కార్తీక పున్నమి నాడు పై లోకాల్లో తన కవితా గానం వినిపించడానికి వెళ్ళిపోయారు. ఆయన తెలుగు ప్రజానీకం అంతా కలిసి మెలసి వుండాలని కోరుకునేవారు.  "ముక్కలైన మాతృమూర్తి గేహమ్మును  కూర్చి కట్టినట్టి కొమరులార!  ఐకమత్య బంధమన్ని కాలాలలో  నిలిచియుండుగాక తెలుగునేల."   "దాశరధిలో మంచితనం, మంచి కవి, మంచి మిత్రుడు, నిష్కపటి, కుట్రలు, కుతంత్రాలు తెలియని వ్యక్తి.  ఈ గుణాలన్నీ కలిసి వున్న వ్యక్తులు చాలా అరుదుగా మనకి తారసపడతారు.  ఆయన చిన్న వయసులోనే పోవడం కవితా ప్రపంచం, సినీ పరిశ్రమ, ఆయన అభిమానులకి తీరని లోటు." అన్నారు  దాశరధి గారికి మంచి ఆప్త మిత్రులయిన శ్రీ అక్కినేని నాగేశ్వర రావు గారు.  అలాంటి సరస్వతీ పుత్రులు, మహానుభావులు, మానవతావాది, స్నేహశీలి, మళ్ళీ మళ్ళీ పుట్టడం కష్టం.  అలాంటివారిని 'నభూతో నభవిష్యతి.' అంటారు.  దాశరధి గారు బౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన మనకందించిన కవితాఖండాలు, సంపుటాలు, రుబాయిల్లో, గజల్స్ లో, లలిత గీతాల్లో, దేశభక్తిగీతాల్లో, సినీగీతాల్లో ఎప్పటికీ మనమధ్యనే వుంటారు.                                                                    ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు.                                                                             

దేవులపల్లి కృష్ణశాస్త్రి

ఆంధ్ర షెల్లీ....దేవులపల్లి కృష్ణశాస్త్రి కండ్లకుంట శరత్ చంద్ర         కృష్ణశాస్త్రి కులం కోయిల కులం, కృష్ణశాస్త్రి మతం హృదయమతం.కృష్ణశాస్త్రి మార్గం స్వేఛ్చ మార్గం ! " నేను హృదయవాదిని, నాకు వేదాంతం,తర్కం తలకెక్కవ్ ! " అన్నారు కృష్ణశాస్త్రి. అప్పటివరకూ పద్యా కవిత్వమే కవిత్వం అనుకునే వారికి వచనంలోనూ కవిత్వం రాయగలమని నిరూపించిన కృష్ణశాస్త్రి. 1897 లో జన్మించినఈ కవి 'స్వేచ్చ'యే తన కవిత్వపు పునాదిగా చేసుకుని కవిత్వం రాసాడు. " ఆకులో ఆకునై , పువ్వులో పువ్వునై , ననులేత రెమ్మనై ,సెలయేటిలో పాటనై, తెరచాటు తేటినై , నీలంపు నిగ్గునై..." " జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి" అని రాముడు, లక్ష్మణునడితో అంటాడు . జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి ..." అంటాడు. దేవులపల్లి, దేశభక్తిని గుర్తుచేస్తూ.     1921 లో ఆరంభించి,1925 లో పూర్తి చేసిన అయన "కృష్ణ పక్షం" కవిత సుగంధాలు , నేటికీ ఇగిరిపోలేదు. మానవతావాదం , భక్తి వాదం ,దేశ భక్తి, వేదన, ప్రకృతి ఆరాధన ... ఇవీ అయన కవితలలోని అంశాలు. రెండు ప్రపంచ యుద్దాల వల్ల ఏర్పడిన ఆర్దిక సంక్షోభాలు,1922 లో.. అంటే 25 ఏళ్ళ వయసులో భార్య మరణం , సామజికంగా అలముకున్న నిరాశ... ఇవన్ని ఆయన కవిత్వంలో విషాదలుగా ప్రతిబింభిస్తాయి.అందుకే P.B Shelley లాగా ఈయన కవిత్వంలో హృదయాన్ని తట్టే Melancholy వుంటుంది.ఈయనను ' ఆంధ్ర షెల్లీ' అని పిలవ సాగారు.               " కృష్ణపక్షం" లో వేదననూ, విషాదాన్ని పలికించాకా "ప్రవాసం" " ఊర్వశి" రాసాడు. 'హృదయనాళం తెగెయె, హృదయధనము తొలగిపోయెను,జీవిత ఫలము స్రుక్కి నేలబడె' అంటూ "కృష్ణ పక్షం" లో రాస్తే .. "పాటయై పక్షియై, ఆశయై,హయియై ,దేసదిసల మిరునో దివ్య పడమంటునో" అని రాసాడు. ఊర్వశి లో. "ప్రేయసి ! ప్రేయసీ ఓ యమవస్యా తమస్విని !గగన సీమంతునీ! నా సఖీ! నీ దీర్ఘాధమిల్ల నీ ల వల్లీచ్ఛాయ పోడిచికొని, నిదుర విడిచి పూవులు నేడు ..." అంటాడు " ప్రేయసీ !ప్రేయసీ !" అనే కవితలో .           1925 లో " కృష్ణపక్షం " రాగానే విమర్శకులూ, పద్యకవులూ ఈయన కవిత్వాన్ని చీల్చి చెండాడారు . కవిత్వాన్ని భ్రష్టుపట్టించాడన్నారు . నెలకు రెండు పక్షాలు . ఒకటి కృష్ణపక్షం రెండు శుక్లపక్షం. కృష్ణశాస్త్రి చీకటి నిండే కృష్ణ పక్షాన్ని తన కవితా సంపుటి పేరుగా పెట్టాడని .. అదంతా చెత్త కవిత్వమని చెప్పేలా ఒకాయన " శుక్లపక్షం " అనే వెక్కిరింపు కావ్యం రాసాడు. ఆ కావ్యం ఎవరికీ ఎక్కలేదు కానీ కృష్ణ పక్షం అజరామరమయ్యే కీర్తి సంపాదించుకుంది. కృష్ణ శాస్త్రి ఏనాడూ విమర్శకులకి సమాదానం ఇవ్వలేదు. యువకులు మాత్రం అయన కవిత్వపు శైలిని , ఆయన గిరజాల జుట్టు.. శాలువతో కూడిన అయన ఆకారాన్ని అనుకరించడం మొదలుపెట్టారు.      కృష్ణ శాస్త్రి గారు ఎన్నో సభలలో తియ్యగా కవిత్వ గానం చేసారు.1964లో ఆయన గొంతు ,కాన్సర్ వల్ల మూగదయ్యింది.ఐతే ఆయన కలం ఆగలేదు . కవిత్వ పరిమళాలను విరజిమ్మింది.ఆయన కవిత్వంపై ఎందరో పి.హెచ్.డి లూ చేసారు .మల్లేశ్వరిలో "ఆకాశ వీధిలో హాయిగా తిరిగేవు .." రాజమకుటంలో సడిసేయకోగాలి.' సుఖదుఃఖలలో " ఇది మల్లెల వేళాయని , ఇది వెన్నెల మాసమని ..." ఉండమ్మ బొట్టుపెడతాలో " రావమ్మా మహా లక్ష్మి రావమ్మా .." ఏకవీర లో "ప్రతి రాత్రి వసంత రాత్రి ,ప్రతి గాలి పైరగాలి " భక్తతుకారంలో " ఘన ఘన సుందరా కరుణా రసమందిరా ""శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ లో " నా పేరు బికారి నా దారి ఎడారి .." సీతా మహలక్ష్మిలో " మా విచిగురు తినగానే కోయిల పలికెన " గోరింటాకు లో " గోరింట పూచింది కొమ్మాలేకుండా " కార్తీకదీపం' ఇలా ఎన్నో సినిమాలలో హిట్ సాంగ్స్ .రాశి తక్కువే కానీ వాసి ఎక్కువ.      ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి "కళ ప్రపూర్ణ " కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు పద్మభూషణ్ అవార్డు పొందారు.   1980 లో కృష్ణ శాస్త్రి మరణించినపుడు " తెలుగుదేశపు నిలువుటద్దం బ్రద్దలయ్యింది. షెల్లీ మళ్ళీ మరణించాడు . వసంతం వాడిపోయింది అన్నాడు శ్రీ శ్రీ కృష్ణ శాస్త్రికి ఓ స్మృత్యాంజలి ఘటిస్తూ....

మహాకవి శ్రీ శ్రీ వర్థంతి

  రాజవీధుల్లోనూ, పండితుల చర్చాగోష్టుల్లోనూ, రాజదర్బారుల్లోనూ మాత్రమే వెలుగుతున్న తెలుగు సాహితీ సౌరభాల్ని, సామాన్యుడి చెంతకూ, మట్టివీధుల వరకూ.. తీసుకొచ్చిన మహాకవి శ్రీశ్రీ. అందుకే ఆయన పేరు తెలియని  తెలుగువాడు ఉండడంటే అతిశయోక్తికాదు. పేరు తెలుగు భాష, తెలుగు జాతి ఉన్నంత కాలం చరిత్రలో వెలుగుతూనే ఉంటుంది. తెలుగు సాహిత్యంలో సామాన్యుడి కష్టనష్టాల గురించీ, పేదసాదల జీవితాలని ప్రతిబింబించే కవిత్వాన్ని రాసిన మొదటి కవిగా ఆయన ఆంధ్రులందరికీ చిరస్మరణీయుడు. నేడు ఆ మహాకవి వర్థంతి సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని విశేషాలను తెలుసుకుందాం.. ఆయనరచనల్లో1950లోప్రచురించబడిన'మహాప్రస్థానం'అనేకవితాసంపుటి తెలుగుసాహితీఅభిమానులమనసుల్లోనేకాకుండా..సామాన్యప్రజల గుండెల్లోకూడాచిరస్థాయిగానిలిచిపోతుంది. ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్నిశాసించిన మహాకవి శ్రీశ్రీ అసలు పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధకవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవరచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా ఆయన ప్రసిద్ధుడు. మహాకవిగా శ్రీశ్రీ విస్తృతామోదం పొందాడు. కనీసం వేయి సంవత్సరాల చరిత్ర ఉన్నతెలుగు సాహిత్యంలో కవితను ఇలానిర్వచించి, ఇంత కవితాత్మకంగా వర్ణించి, ఇంత అద్భుత సృష్టి చేసిన మరో కవిలేనే లేడు. ఇదే అతణ్ణి సాహితీ శిఖరాగ్రాన నిలిపింది అన్న బూదరాజురాధాకృష్ణ గారి మాటలు శ్రీశ్రీ సాహితీ ప్రజ్ఞ్య కి నిదర్శనాలు. 1910 జనవరి 2 న పూడిపెద్ది వెంకటరమణయ్య, అప్పలకొండ దంపతులకు జన్మించాడు. శ్రీరంగం సూర్యనారాయణకు దత్తత వెల్లటం వలన ఈయనఇంటిపేరు శ్రీరంగంగా మారింది. 1935 లో విశాఖ లోని మిసెస్ ఎ వి ఎస్ కాలేజీ లో డిమాన్స్ట్రేటరు గా చేరాడు. 1938 లో మద్రాసు ఆంధ్ర ప్రభలో సబ్ ఎడిటరు గా చేరాడు. ఆ తరువాత ఆకాశవాణి, ఢిల్లీ లోను, మిలిటరీ లోను, నిజాము నవాబు వద్ద, ఆంధ్ర వాణిపత్రికలోను వివిధ ఉద్యోగాలు చేసారు. 1933 నుండి 1940 వరకు ఆయనరాసిన మహాప్రస్థానం, జగన్నాథుని రథచక్రాలు, గర్జించు రష్యా వంటి గొప్పకవితలను సంకలనం చేసి మహప్రస్థానం అనే పుస్తకంగా ప్రచురించాడు. తెలుగు సాహిత్యపు దశనూ, దిశను మార్చిన పుస్తకం అది.1947 లోమద్రాసు కు తిరిగి వచ్చి అక్కడే స్థిరపడ్డాడు. ఎన్నో సినిమాలకు పాటలు,మాటలు రాసాడు. 1970 లో ఆయన షష్ఠి పూర్తి ఉత్సవం విశాఖపట్నం లో జరిగింది. ఆసందర్భంగానే ఆయన అధ్యక్షుడు గా విప్లవ రచయితల సంఘం విరసం ఏర్పడింది. శ్రీశ్రీ చాలా చిన్న వయసులోనే తన రచనా వ్యాసంగాన్ని మొదలు పెట్టాడు. తన 18 వ ఏట 1928 లో ప్రభవ అనే కావ్య సంపుటిని ప్రచురించారు. ఈ రచనను సాంప్రదాయ పధ్ధతి లోనే రాసాడు. తరువాతి కాలంలో సాంప్రదాయికమైన గ్రాంధిక శైలి, ఛందస్సువంటి వాటిని పక్కన పెట్టి వాడుకభాషలో మాత్రా ఛందస్సులో కవిత్వం రాయడం మొదలు పెట్టారు.  1950 లో మహాప్రస్థానం కావ్యం మొదటిసారిగా ప్రచురితమైంది. ఆధునిక తెలుగు సాహిత్యం లో ఈ కావ్యం అత్యున్నతస్థానంలో నిలిచి శ్రీశ్రీ ని మహాకవి ని చేసింది. తరువాత మరోప్రస్థానం, ఖడ్గ సృష్టిఅనే కవితా సంకలనాలను, చరమరాత్రి అనే కథల సంపుటిని, రేడియోనాటికలు రచించాడు. మహాప్రస్థానం వంటి గీతాలన్నీ మార్క్సిజం దృక్పథం తో రాసినవే అయినా అవి రాసేనాటికి మార్క్సిజం అనేది ఒకటుందని ఆయనకుతెలియదు. 1981 లో లండన్ లో ప్రచురితమైన మహాప్రస్థానం కు ముందుమాటలో ఆయన ఈ విషయంస్వయం గా రాసాడు. తెలుగు వారిని ఉర్రూతలూగించిన ఎన్నో గొప్ప సినిమా పాటలను ఆయనరచించాడు. అల్లూరి సీతా రామ రాజు సినిమాకు ఆయన రాసిన తెలుగు వీరలేవరా.. అనేది శ్రీశ్రీ రాసిన ఆణిముత్యాల్లో ఒకటి. రెండవ భార్య సరోజ తోకలిసి సినిమాలకు మాటలు రాసాడు. ప్రాసకూ, శ్లేషకు శ్రీశ్రీ పెట్టింది పేరు. అల్పాక్షరాల్లో అనల్పార్ధాన్ని సృష్టించడంలోశ్రీశ్రీ మేటి. తెలుగు కవిత్వానికి దిశా నిర్దేశం చేసిన శ్రీ శ్రీ అమరుడు..  ఈ రోజు ఆ మహాకవి వర్థంతి సంధర్బంగా మరోసారి తెలుగు కవితా రథసారధికి అక్షర నివాళి అర్పింద్దాం..

డా!! రావూరి భరద్వాజ

డా. రావూరి భరద్వాజ సాహితీ ప్రపంచంలో నాటి తరం నేటి తరం అనే తేడా లేకుండా " పాకుడు రాళ్ళు " మీకు తెలుసా అని ఎవరినైనా అడిగితే...మొట్టమొదటిసారిగా సినీ జగత్తులోని వ్యక్తుల అంతరాంతరాలను ప్రతిభావంతంగా బొమ్మకట్టించిన తొలి తెలుగు నవల అని నిక్కచ్చిగా చెబుతారు. అల చెప్పేలా గుర్తుంచుకోవడం మన గొప్పతనం కాదు. మనలో మరిచిపోలేని మధురమైన భావంతో కలకాలం గుర్తుండిపోయేలా పాత్రలు సృష్టించి ఆ పాత్రలకు సరిపడా మాటలు రాసి గుండెను హత్తుకునేలా పాకుడు రాళ్ళను నడిపించిన డా !! రావూరి భరద్వాజ గారి కలానికి ఉన్న గొప్పతనం. 25 సంవత్సరాల క్రితం జ్ఞాన పీఠ్ అవార్డు- డాక్టర్ సి . నారాయణ రెడ్డి గారికి ''1988 '' లో విశ్వంభర కు వచ్చింది . ఇప్పుడు మళ్లీ 25 సంవత్సరాల తర్వాత డాక్టర్ రావూరి భరద్వాజ ''పాకుడు రాళ్ళు '' అనే రచనకు రావడం తెలుగు వారికి వెలుగు వేడుక. సాహితీ మూర్తులకు సంబరాల కానుక. వారికి తెలుగువన్.కామ్/సాహిత్యం అభినందనలు తెలుపుతుంది.

పుట్టపర్తి నారాయణాచార్యులు

'' పుట్టపర్తి నారాయణాచార్యులు గారి కుమార్తె డాక్టర్ పుట్టపర్తి నాగపద్మిని గారు వారి తండ్రిగారి జీవిత చిత్రాన్ని సంక్షిప్తంగా, సవివరంగా మనకందిస్తున్నారు. ఆ సాహితీ పుత్రుని శత జయంతి ఉత్సవాలు ఈ మధ్యే ఏంతో ఘనంగా జరిగాయి. పుట్టపర్తి నారాయణాచార్యుల గారి శత జయంతి వత్సర సందర్భంగా తెలుగువన్.కామ్ ఆ మహానుభావునిని స్మరించుకుంటూ సమర్పిస్తున్న నివాళి ఆ వ్యాసం. ''   మా నాన్నగారు డా|| పుట్టపర్తి నాగపద్మిని ‘ప్రేమ.. కుండలినీ శక్తి లాంటిది! ఓ మారు మనలో ప్రవేశిస్తే యిక, సహస్రారం దాకా ఆగదు. జ్ఞాన చక్షువు ద్వారా, సకల జగత్తునూ, చుట్టి వస్తుంది! వైయుక్తికం నుంచి సామాజిక స్థాయికి పయనిస్తూ వసుధైక కుటుంబం భావనని మరింత పటిష్టం చేస్తుంది. ఈ పంక్తులిలా ‘ప్రేమ’ గురించి రాయాలని ఎందుకనిపించిందో గాని మరుక్షణం కుండలినీ శక్తి గురించి, సహస్రారం గురించి మరోసారి తెలుసుకోవాలనిపించింది. ‘ఇంకెందుకు ఆలస్యం’? అన్నట్లు గూగుల్ నో మారు పలుకరించా! ఒక్క క్షణంలోనే వందల సైట్లు! పేజీల కొద్దీ సమాచారం. మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా, సహస్రార చక్రాల వివరణ! అంతేనా! సూక్ష్మ శరీర ప్రయాణం ఎలా ఉంటుంది? మన సూక్ష్మ శరీరాన్ని మనం ఎలా చూడగలం? మరణానికి చాలా దగ్గరగా వెళ్ళి మళ్ళీ తిరిగి భౌతిక శరీరంలోకి ప్రవేశించిన వారి అనుభవాలు ఎలా ఉంటాయి? అన్న గ్రంథంలో స్వామీ యోగానంద గారి గురువు గారు యుక్తేశ్వర్ బాబా గారు మరణానంతరం గూడా సూక్ష్మ రూపంలో శిష్యుని దగ్గరికి వచ్చి తన అధ్యాత్మిక అనుభవాలను వివరించేవారట! (ఆటో బయోగ్రఫీ ఆఫ్ ఎ యోగీ) స్వామి యోగానంద ఆధ్యాత్మిక ప్రసంగాలిస్తూ ఉన్న సమయంలో అప్పటికే మరణించిన కొందరు శిష్యులు, సూక్ష్మ రూపంలో ఎదురుగా కూర్చుని వారి ప్రసంగాలను వింటూ కనిపించేవారట! ఇప్పుడైతే యిలాంటి విషయాలు ఎన్నెన్నో మనకు అవలీలగా తెలిసిపోయే మాధ్యమాలు బోలెడన్ని! కానీ 1970-75 ప్రాంతంలోనే యివన్నీ యింత అవలీలగా తెలిసిపోయే అవకాశం మాకుండేది! ఐన్ స్టీన్ తన పేరు తానే జపిస్తూ సమాధి స్థితిలో వెళ్ళిపోయేవాడట! రామకృష్ణ పరమహంస హనుమదుపాసనలో తన్ను తాను మరచిఉన్నప్పుడు ఆయనలో హనుమత్తత్వం సంపూర్ణంగా యెంతగా జీర్ణించుకుపోయిందంటే ఆయనకు వానరాల్లా వాలం (తోక) కూడా పుట్టుకొచ్చేసిందట. కబీర్ దాస్ ఒకసారెటో వెళ్తున్నారు. మార్గమధ్యంలో ఓ చోట పెద్ద గుంపు కనబడగా కారణమణిగారట ‘అందరూ ఎందుకలా మూగిఉన్నారని!’ ఎవరో చెప్పారు.. అక్కడి ఓ ఇంటిలో ఒక మహాపురుషుడు ఎలాంటి జబ్బులనైనా మూడుసార్లు రామనామం చెప్పి - తీర్దం యిస్తే ఠక్కున జబ్బు నయమై పోతోందట! కబీర్ దాస్ నవ్వారు. ‘ఇంతమాత్రం దానికి మూడు సార్లు నామం చెప్పడం అవసరమా? నేను ఒక్కసారి రామనామం చెప్పి తీర్ధం ఇస్తాను. జబ్బు తగ్గిపోతుంది. ఇలా రామనామ మహిమను తగ్గించడం మంచిది కాదని లోపలున్న మహనీయునికి చెప్పండి’ అన్నారు. తాను అన్న మాటను నిలబెట్టుకున్నారట. పుస్తకాలు తప్ప కంప్యూటర్ లాంటి మహత్తర మాధ్యమాలేవీ అందుబాటులో లేని ఆ రోజుల్లో ఇన్ని విషయాలు అవలీలగా తెలుసుకోవడం ఎలా సాధ్యం! తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది కదూ..! పదండి వెళ్దాం ఓ సారి కాలచక్రం గిర్రున వెనక్కి తిప్పి 1972 లలో కడప మోచంపేటలో వెలసి ఉన్న విశ్వేశ్వరాలయ విశాల ప్రాంగణంలోకి.! సమయం సాయంత్రం 7 గంటల ప్రంతం! లోపలికి భక్తి శ్రద్ధలతో ప్రవేశించామనుకోండి! ముందు కూర్చోవడానికి స్థలం వెదుక్కోవలసి వస్తుంది మరి. తదేక ధ్యానంతో వేదికపై నుంచి వినిపించే గంభీరోపన్యాసాన్ని వింటున్న భక్త జన సందోహం! గంగాఝరీ సదృశ్యంగా - అసదృశంగా సాగిపోతోంది. ఆ వాక్ ప్రవాహం! ఆ అప్రతిమాన ప్రసంగ వాహినిలో ప్రాచ్య, పాశ్చాత్య తత్వరీతులు మొదలు సాహిత్యం వరకూ అన్ని విషయాలూ అవలీలగా ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఉటంకించబడుతూ దాదాపు ఐదు సంవత్సరాలుగా సాగుతున్న పురాణ ప్రవచన చారిత్రాత్మక ఘట్టం! చెప్పబడుచున్నది. వాల్మీకి రామాయణం! ఇక పౌరాణికులు - ‘సరస్వతీ పుత్ర’ (1948), ‘వ్రజ భాషా భూషణ’ (1963), `సరస్వతీ తిలక’ (1964), `సర్వతంత్ర స్వతంత్ర’ (1972), ‘కవి సార్వభౌమ’ (1972) యిత్యాది బిరుదాలంకృతులు, శతాధిక గ్రంధకర్త, పుట్టపర్తి నారాయణాచార్యులవారు వయోధికులంతా భక్తి తాదాత్మ్యంతో ఏకాగ్రచిత్తులై వింటున్నారు. ‘పురాణ ప్రవచనంలో ఎక్కువగా, మీదపడిన వయసు తో ‘రామా కృష్ణా’ అని ఆయాసపడుతూ గోడకి చేరగిలబడి వినే ముసలివారే ఎక్కువగా కనిపించడం ఎక్కడైనా ఉంటుంది. ఇక్కడా ఇంతేలే! అని భావిస్తే తప్పులో కాలేసినట్టే అప్పుడప్పుడే యవ్వనంలోకి అడుగుపెట్టిన చంచరీక హృదయులు, దాంపత్య జీవన సౌఖ్యాలను మనసారా అనుభవిస్తూ ఆనందిస్తున్న దంపతులూ చాలామందే ఉన్నారక్కడ. ‘ఒక్క నిముషం ఏమరుపాటు వహిస్తే ఉపన్యాసంలోని యే ఆసక్తికర అంశాన్ని వదులుకుంటామో’ అన్న భయంతో వంచిన తల యెత్తకుండా ఆచార్యుల వారి ఉపన్యాస పాఠాన్ని తమ వెంట తెచ్చుకున్న పుస్తకాల్లో అతివేగంగా వ్రాసుకుంటూ వెళ్తున్న నావంటి శ్రధ్దాళువులూ చాలామందే ఉన్నారక్కడ. ఒక్కోరోజు వాల్మీకి విరచిత రామాయణంలోని నాలుగైదు శ్లోకాలకు మించి నడవదు ప్రవచనం! దాదాపు రెండు గంటలకు పైగా సాగే యీ ప్రవచనం. పై చెప్పిన రీతిలో ఐదు సంవత్సరాలకు పైగానే నడిచిందంటే మీరు నమ్మగలరా? ‘ఒక్కో సందర్భాన్ని తెలుగు, కన్నడ, తమిళ, మళయాళ రామాయణాలలో ఎలా చిత్రీకరించారు? వాల్మీకికి భిన్నంగా వ్రాసి, సఫలీకృతులైన వరెవరు? వాల్మీకిని అక్షరశః అనుసరించి తరించినదెవరు? రామనామ మహిమను తామనుభవించి, ఆ దివ్యానుభవాన్ని పంచి సకల జనావళినీ ధన్యజీవులను చేసిన పుణ్యపురుషులెవరు? రామనామ దివ్యమంత్రమే నారాయణ దివ్య మంత్రమా? అసలు మంత్రమంటే ఏమిటి? బీజాక్షరాలను నిక్షిప్తం చేసి వ్రాసిన ‘సౌందర్య లహరి’లో ఆదిశంకరుల వారు అమ్మవారి అఖండ తేజోరూపాన్ని అభివర్ణించిన పద్ధతి ఎలాంటిది? ఆదిశంకర భగవత్పాదులు హైందవ ధర్మాన్ని ఎంత పటిష్టంగా నిలిపారు? తదనంతర కాలంలో వైష్ణవ, మధ్వ సిద్ధాంతాలెలా నెలకొల్పబడ్డాయి? ఈ సిద్ధాంతాల మధ్య ఎలాంటి స్పర్ధలుండేవి? స్పర్ధలు కేవలం ఆయా సిద్ధాంతాలననుసరించే వ్యక్తుల వల్ల వచ్చినవా? లేక వాటి మధ్య ఉన్న తేడాలవల్లనా? వీటన్నింటికన్నా మించి అసలు అన్ని సిద్ధాంతాలలోనూ భక్తి తత్త్వాన్ని విశ్లేషించిన తీరేంటి? నవవిధ భక్తి మార్గాలలో తరించి ముక్తినందన ధన్య్లులెవరు? భగవన్నామ సంకీర్తనా సుఖాన్ని పంచిన అన్నమయ్య ముప్ఫై రెండువేల కీర్తనలెలా అనూహ్యమైన వైవిధ్యంలో వ్రాయగలిగాడు? అసలు శృంగారాన్నీ, వైరాగ్యాన్నీ, ఒకే వ్యక్తి అనితర సాధ్యమైన రీతిలో తన పదాలలో పోషించటం వూహించగలమా? అన్నమయ్య ఆరాధించిన ఏడుకొండల వానిని ‘తిరువేంగడముడైయ్యాన్’ గా ఆరాధించిన తమిళ ఆళ్వారుల పాశురాలలోని భక్తితత్వం ఏమిటి? వైష్ణవ దివ్య క్షేత్రాలలో తిరుమల స్థానం ఏమిటి? తిరుమలను కృష్ణదేవరాయలు ఎన్నిసార్లు దర్శించాడు? తిరుమలదేవి, చిన్నాదేవి వెంట ఉన్నారా? అసలు కృష్ణదేవరాయల వ్యక్తిత్వం ఎలాంటిది? రూపం ఎలా ఉండేది? స్ఫోటకపు మచ్చల ముఖమైనా, సాహసంలో, భాస్కరునిగానూ, సాహిత్య పోషణలో చలువరేనిగానూ కొనియాడబడిన రాయలవారి ఆముక్తమాల్యద రచనా విశేషాలేంటి? ‘అసలు ఆముక్త మాల్యద’ ఆయన రచనే కాదు. స్వామి భక్త పారాయణులైన అష్టదిగ్గజ కవులెవరో రాసి ఆయన పేరు పెట్టారంటారు’ నిజమేనా? యెన్నెన్నో విషయాలు..గుర్తు తెచ్చుకుని యిక్కడ ఉటంకించడానికే నాకు కాస్త కష్టంగా ఉంది కానీ ఏ కంప్యూటర్ లాంటి సాధనమూ లేని రోజుల్లో పుట్టపర్తి వారెలా ఇన్ని విషయాలు చదివి గుర్తించుకుని సందర్భోచితంగా ప్రస్తావించే వారో, తలచుకుంటె యిప్పటికీ ఆశ్చర్యమే నాకు! ‘వేదిక’ పై పుంభావ సరస్వతిలా విజృంభించే పుట్టపర్తి వారు. నామమాత్ర సంభావనగా రోజు భక్తితో ఆలయ నిర్వాహకులు సమర్పించేది ఐదు రూపాయలే అయినా వినే వారికి ఐదు జన్మలకు సరిపడే సమాచారాన్ని ఉదారంగా అందించేవారు. అంతే! వేదిక దిగిన వెంటనే అతి మామూలు వ్యక్తిగా నిరాడంబరంగా వ్యవహరించే ఆ ‘అభినవపోతన’ (1948 లో గద్వాల మహాసభలో ఇచ్చిన బిరుదు). సాక్షాత్తూ నాకు జన్మనిచ్చిన తండ్రి మా అయ్యగారు. విస్ఫారిత నేత్రాలతో ఆ విరాణ్మూర్తి రూపాన్ని పదే పదే చూస్తూ హృదయ మందిరంలో నిలుపుకునేదాన్ని నేను! వారి ఉపన్యాస పరంపరలను విన్న జ్ఞాపకాలను ఇప్పటికీ అమృత గుళికలుగా పదిలంగా దాచుకున్న అదృష్టవంతులెంతమంది ఉన్నారో తెలియదు. అసలు మా అయ్యగారంతటి పాండిత్యాన్నీ ధారణనూ ఎలా అలవరచుకున్నారో అదో పెద్ద కథ. పన్నెండేళ్ళ వయసులోనే పెనుగొండ లక్ష్మి ని ‘ఘనగిరి నివాసిని’ గా ఆవిష్కరించారు బాలనారాయణులు! (1943 సం|| మద్రాసు విశ్వవిద్యాలయం వారు, విద్వాన్ పరీక్షకు పాఠ్యగ్రంథంగా ఈ ఖండకావ్యాన్ని పెట్టారు). ఇదే కావ్యం పుట్టపర్తి వారు మళ్ళీ ఎప్పుడో విద్వాన్ పరీక్షకు కూర్చున్నప్పుడు పాఠ్యగ్రంథంగా వుండడం - ఆ పరీక్షలో ఒకే ఒక్క ప్రశ్నకు మూడు గంటలూ వెచ్చించి నారాయణా చార్యుల వారు ఆ యేటి పరీక్షలో అనుతీర్ణులవడం - ఇప్పటికీ ‘కథ’ గా నిలిచిపోయిన మరో వాస్తవం.! 1972 జనవరి, 25అర్ధరాత్రి ‘పద్మశ్రీ’ వచ్చిందన్న టెలిగ్రామ్ నేను అందుకుని ఆనందంగా అయ్యగారికి శుభాకాంక్షలు తెలిపితే చిరాకుపడి ‘ఇప్పుడిప్పుడే నిద్రపడుతోంది’ ఈ వార్త పొద్దునే చెబితే పోయేదిగా తొందరేముంది? అని నన్ను కసురుకుని అటు తిరిగి పడుకోవడం మరో కథ. అరవై ఏళ్ళు దాటిన వయసులో ఉర్దూ నేర్చుకునే ప్రయత్నం చేయటం, ఆకాశవాణి మృదంగ విద్వాంసుడు భాస్కరభట్ల కృష్ణమూర్తి గారి దగ్గర మృదంగ వరుసలు కంఠతా పట్టటం యింకో కథ! మృత్యుశయ్యపై పడుకుని ఉన్నా ‘పెరిస్త్రోయికా’ చదవలేకోయానే’ అని తపన చెందడం ఉత్కంఠను రేపే మరోకథ! మొత్తం అయ్యవారి జీవితమంతా యిలా కథలు కథలుగా చెబుతూ పోతే యింకా కాస్త మిగిలే ఉంటుందేమో! మా అమ్మ, మధుర కవయిత్రి వాగ్గేయకర్త్రి పుట్టపర్తి కనకమ్మ గారు (1921-1983). మా అక్కయ్యలు, అన్నయ్య మాటల్లో మరిన్ని విశేషాలు దొర్లుతుంటాయి. పెళ్ళయిన కొత్తలో (1934 ప్రాంతాలు) మా అమ్మ పంచకావ్యం పాఠం చేసేదట అయ్యగారి దగ్గర!. వంటరాదు అంతగా! ఒకే ఒక్క గోరు చిక్కుడు వేపుడు ( మా కడపలో దీన్ని ‘మటిక్కాయలు’ అంటామండీ) నీళ్ళచారు చేయడం వచ్చు. ఇదే వంటని దాదాపు రెండేళ్ళు చేసి పెట్టిందట తను. వంట ఏదైనా పరవాలేదు కానీ కావ్య పాఠం అప్పజెప్పకపోతే ఇక అయ్యగారి కోపం తారాస్థాయికి చేరుకునేదట! ప్రొద్దుటూరి నివాసంలో బడిపంతులు ఉద్యోగానికి వచ్చే చిన్న జీతంలో, వాళ్ళయిళ్ళకు వెళ్ళమన్నా వెళ్ళక అయ్యనంటిపెట్టుకుని ఉండే శిష్య బృందానికి ఎలా వండి వార్చేదే అమ్మకే తెలుసు! అంతేనా! ఊళ్ళోకి ఏ సంగీత విద్వాంసుడు వచ్చినా, రంగస్థల నటులు (సూరిబాబు లాంటివాళ్ళు) వచ్చినా, హరికథకులు వచ్చినా మా ఇంట ఆతిథ్యం స్వీకరించాల్సిందే! ఇవి కాక ఇంట్లో ఒకరి తరువాత ఒకరుగా ముగ్గురు ఆడపిల్లల రక్షణ భారం. ఎటిమలాజికల్ డిక్షనరీ తయారీకి ఏ డిగ్రీలూ లేకపోయినా పాండిత్యమే కొలబధ్దగా యెన్నుకొనబడి తిరువాన్కూరుకు అయ్య ప్రయాణం. అక్కడి పరిస్థితులు నచ్చక కొద్ది రోజులకే తిరిగి రాక. మళ్ళీ అంతలోనే సాహిత్య అకాడమీ ఢిల్లీ పిలుపు! అక్కడా యిమడలేక అనారోగ్యంతో యింటికి! ఈ మధ్యలో వైరాగ్యభావన! ఒంటరిగా హిమాలయాలకు ప్రయాణం! ఎక్కడున్నారో తెలియదు! తిరిగి కొన్ని రోజులకే సరస్వతీ పుత్రునిగా పునరాగమనం! కొన్ని రోజులు స్మశాన వాసం! కృష్ణ చైతన్య సంప్రదాయంతో చెట్టపట్టాలు! అరబిందో సహవాసం! మళ్ళీ కంచి పెద్దస్వామి శ్రీ శ్రీ శ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి ఆశీర్వాదబలంతో 1970 నాటికి జీవితంలో నిలకడ! ఇక మా అక్కయ్యలు కరుణ తరులతల మాట్లల్లో వాళ్ళ సంగీత విద్యాభ్యాసం ఘట్టమొకటి! ‘మాకప్పటికి పది పన్నెండేళ్ళే! తెల్లవారు ఝామున మూడు గంటలు. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. నిశ్శబ్ద వాతావరణం! పూల తోతలూ, చల్లగాలులూ, అందమైన కలలలో విహరిస్తున్నా! ఇంతలో భుజంమ్మీద దెబ్బపడింది. ‘కరుణమ్మా లేలే! అంటూ అయ్య పిలుస్తున్నారు. తీయని కల నుంచి తేరుకోవాలని లేదు. పక్కనున్న తరులతనూ లేపుతున్నారయ్య! బలవంతంగా కళ్ళు తెరిచాను. పాపం చెల్లెలూ లేచింది నాలాగే! ‘విను విను నాదస్వరం వినిపిస్తోందా? అయ్య ప్రశ్న! నాదస్వరమా, ఇప్పుడీవేళలోనా! చెవులు మొరాస్తున్నాయి. ‘ఏమే తరులతా! వినిపిస్తోందా? అయ్య గద్దింపు.. ‘ఆ...ఆ.. వినిపిస్తోంది..!’ ‘వినిపిస్తోంది కదూ’ శ్రద్ధగా వినండి... ఆ నాదస్వరం పై వినిపిస్తున్న కీర్తనేంటి? రాగమేంటి? దాని ఆరోహణా, అవరోహణా చెప్పండి..? నిద్రమత్తంతా ఎగిరిపోయింది. ఇంకెక్కడి నిద్ర. కళ్ళు నులుపుకుంటూ కష్టపడి ఆపాటేదో విన్నాం ఇద్దరమూ..అదీ ..అదీ .. నసుగుతున్నాం. ‘ఇన్ని సంవత్సరాలు నేర్చుకున్నా గుర్తుకురాలేదా? రఘువంశ సుధాంబుధి’ కదూ అది.. ఆ మాత్రం తెలీలేదా? విద్యార్ధులు ఎలా ఉండాలి? అర్ధరాత్రి నిద్రలేపి అడిగినా ఠక్కున జవాబు చెప్పాలిగా! అంటూ గద్దించి మళ్ళీ పడుకోమని చెప్పి వెళ్ళిపోయారయ్య! మళ్ళీ పడుకోవడానికి నిద్రవస్తేనా? ఆ నాదస్వరం వినిపించే వరకూ.. మళ్ళీ ఎప్పుడు వస్తారో, ఏ రాగం చెప్పమని అడుగుతారో అని భయంతో నిద్ర పోనేలేదు తెలుసా! ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో! ఇక సంతానంలో తరువాత జోడీ! తులజక్కయ్య, అరవిందుడు. వాళ్ళ మాటల్లో ఓ ముచ్చట. మా ఇద్దరికీ సంతీతంతో పాటూ మైథివీశరణ్ గుప్త ‘సాకేత్’ ని జంటగా కంఠోపాఠం చేయించారు. అయ్యగారితో మేము ముద్దుముద్దుగా సభలకు వెళ్ళేవాళ్ళం. అక్కడేదైనా సభా వేదికపై సందర్భం వస్తే మా పిల్లలిద్దరూ ‘సాకేత్’ జంటగా చదువుతారు. వినండి అంటూ పిలిచి సాకేత్ నవమసర్గ్ లో ఊర్మిళా వేదన ఘట్టం చదవండి..అని పురమాయించేవారు. అక్కడేదైనా పొరపాటు జరిగిందో అయ్యకు చాలా కోపం వచ్చేది. ఇవన్నీ వింటూంటే నాకొక్కటె అనిపిస్తోంది.. మా అయ్యగారికి మాతృప్రేమ దక్కలేదు. భార్యా వియోగంలో ఒంటరైన తాతగారు పుట్టపర్తి శ్రీనివాసాచార్యులవారు. తండ్రి ప్రేమనూ అందించలేకపోయారు. ఈ పరిస్థితుల్లో అయ్య జీవితంలో సరైన దిశా-దశా కరువై, ఒక గాడిలో పడేందుకు చాలా శ్రమించాల్సి వచ్చింది. నిద్రాహారాలు మాని తిరుపతిలోని గ్రంథాలయాన్నంతా కాచి వడగట్టడం, వివిధ భాషా సాహిత్యాలను మధించడం, తత్త్వశాస్త్ర అవలోకనం, తర్క వ్యాకరణాలంకార శాస్త్ర మథనం. సంగీత నాట్యాభ్యాసం.. ఇలా తనకు నచ్చినదాన్నల్లా నేరుస్తూ పోవటం వల్ల పరిధిలేని పాండిత్యం అబ్బింది. పాండితీలోకం ‘పుట్టపర్తిని చూసి’ అమ్మో ఘటికుడు! అనేలా చేసింది కానీ .. అర్ధికంగా కడగండ్లు తప్పలేదు. అలా కాక, పిల్లలనయినా ఒక మార్గాన నడిపి, వారి జీవితాలకో గమ్యం నిర్దేశించాలన్న తపనే, పిల్లలపట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకునేలా చేసిందేమో అని! సంఘర్షణాయుతమైన అయ్యగారి లాంటివారి జీవితాలు - ఇలా ఉంటేనే వారు సాధించిన విజయాలకు బ్రహ్మరథం పడతారు ప్రజలు. కూర్చున్న చోటనే చల్ల కదలకుండా, జీతం జేబులోకి చేరుతుంటే.. ఇక సాధించేదేముంటుంది? ఆటుపోటుల జీవితమే సాహసాలకు శ్రీకారం చుడుతుంది. అయ్యకు జీవిత ప్రధమార్ధం - సంఘర్షణాకాలం (1914 నుండి 1990 వరకూ పరిఢవిల్లింది వారి జీవితం) ఆనాతి సాహిత్య ప్రపంచంలోని పోటీకి ధీటుగా పదునాల్గు భాషల ప్రగాఢ పరిచయం, పుంఖాను పుంఖాలుగా వివిధ ప్రక్రియల్లో, భాషల్లో విశృంఖల విహారం, వివిధ వేదికలపై సంగీత, సాహిత్య, నాట్య, విన్యాసాల అనితర సాధ్యకృతి ‘శివతాండవ’ గానం, ప్రాకృత సాహితీ సుగంధ గంధ విస్తరణం. .ఇలా ఏనాటికా ఏడు తన జ్ఞాన విస్తరణకే చాలా సమయాన్ని వెచ్చించడం జరిగింది. అయ్య అనగానే ఇరవై నాలుగు గంటలూ తన గదిలో కరణం బల్ల ముందు కూర్చుని ఏవేవో గ్రంథాలను తదేకంగా చదువుకుంటున్న అయ్యగారి విగ్రహమే గుర్తొస్తుంది. ఎర్ర, ఆకుపచ్చ, నీలి, సిరా కలాలతో యేదో నోట్ చేసుకుంటూ తన ప్రక్కనే ఉన్న పెద్ద పెద్ద నోటు పుస్తకాలలో వ్రాసుకుంటూ ఉండెవారెప్పుడూ..తాను పనిచేసే రామకృష్ణా హైస్కూల్ కుకాలినడకన బయలుదేరేటప్పుడూ. ఇలాంటి ఒకటో రెండో నోటు పుస్తకాలు పట్టుకుని శుబ్రంగా ఉదికిన జుబ్బా కాసెపోసి కట్టుకున్న పంచె ధరించి, గంభీరంగా తలవంచుకుని వీధి వెంట వెళ్తూ ఉండేవారు. కానీ పెదవులెప్పుడూ ‘అష్టాక్షరీ మంత్రాన్ని మననం చేస్తూనే ఉండేవి. ప్రొద్దుటూరు అమ్మవారి పాఠశాలలో 15 రూ.నెల జీతంతో మొదలై, 1972 లో కడప రామకృష్ణా హైస్కూల్లో నెలకు వెయ్యి రూపాయల జీతంతో అయ్యగారి ఉద్యోగ విరమణ జరిగినట్లు గుర్తు. మా యిల్లు పూర్తిగా మధ్యతరగతి కుటుంబానికి ప్రతీక. పండుగలకూ, పబ్బాలకూ కొత్త బట్టలు తెచ్చినా, మా అమ్మే కత్తిరించి, తెల్లవార్లూ పావడా జాకెట్టు కుట్టడం నాకింకా గుర్తే. ‘దుసురుపోగు’ (దూరదూరంగా త్వరగా కుట్టే కుట్టు) తో బట్ట్లలకోరూపం ఇచ్చి, పండుగ గడిచిన తర్వాత ‘గట్టికుట్టు’ తో మళ్ళీ పావడా జాకెట్ భద్రంగా కుట్టేదమ్మ! తన జీతం అప్పుడప్పుడూ రచనలకు ప్రచురణకర్తలిచ్చే డబ్బు, సభలూ, సన్మాలకూ వచ్చే డబ్బూ - అంతా అమ్మ చేతుల్లో పోసేవారయ్య! ఇల్లంతా అమ్మే నడిపేది. మాకేకాదు మా అయ్యకు పంచెలూ, జుబ్బాలూ, ఆఖరికి బీడీలు కూడా అమ్మకొనేది. అయ్యకసలీ విషయాలు పట్టవు. ఎప్పుడూ చదువు..చదువు..అంతే. ఈ క్రమంలోనే కావ్య, గేయ, నవలా, వచన, విమర్శన గ్రంథాల రచనలో చిత్తు వ్రాత ప్రతుల తయారీలో అమ్మ, కరుణక్కయ్య, తులజక్కయ్యలూ శ్రమించారు. ‘అయ్యకూ సంసారినికై పాటు పడాలని ఉండేదేమో పాపం! తనకుబాగా చేతనైనదీ, తన రచనలు కావాలని వస్తున్న ముద్రణ సంస్థలకు కావలసినదీ - అదే కావటం వల్ల ఏ అవకాశాన్నీ వదులుకొనక భార్యా పిల్లలపై ఆధారపడేవారేమో అయ్య!’ అనిపిస్తుంది నాకిప్పుడు. ఎందుకో మొదటి నుంచీ అయ్య, అక్కయ్యలో వ్రాయటమే చూశాను నేను. నిదానంగా కలాలతో వ్రాసే అలవాటు వల్ల వేగంగా రాయలేకపోయేవారేమో అయ్య! అక్కయ్యల పెళ్ళిళ్ళయి - వాళ్ళు అత్తవారిళ్ళకు వెళ్ళేనాటికి (1968) నాకు పదిహేనేళ్ళు. అప్పటి నుంచీ రేడియో ప్రసంగాలూ, త్యాగరాజు, అన్నమయ్య వంటి ఉపన్యాస పాఠాలూ, వరాహపురాణం, భామినీ విలాసం లాంటి పీఠికలూ 1976-77 ప్రాంతాలలో కడప ఆకాశవాణిలో ప్రసారమైన ‘భారతంలో స్త్రీ పాత్రలు’ ప్రసంగ మాలికలు వంటి చిత్తు, వ్రాత ప్రతులు నేను వ్రాశాను. అయ్యగారి దగ్గర హాలుని గాథా సప్తశతి, రవీంద్రుని గీతాంజలి, అరబిందో ఊర్వశి, వేంకటాధ్వరి విరచిత ‘లక్ష్మీ సహస్త్రం’, ఇక అమ్మ దగ్గర నన్నయ్య ఆదిపర్వం, గోదా విరచిత ‘తిరుప్పావై’ యిలా పాఠాలు చదివాను. అమ్మయితే అయ్యగారి ‘భాగవత సుధాలహరి’ చిత్తు వ్రాత ప్రతులను ఒంటిచేత్తోనే వ్రాసింది. 1970 ల నాటి మా యింటిని తలచుకుంటే మనసు విలవిల్లాడుతుంది. మళ్ళీ కాలచక్రాన్ని యిందాకటిలా వెనక్కి తిప్పి, ఆ కాలాన్ని కొత్తగా మరింత పరిణత హృదితో.. అమ్మ అయ్యల పట్ల ఆరాధనా భావంతో, అంకిత భావంతో, అనుభవించాలన్న తపన ఊపిరాడనివ్వదు. ప్రతి శనివారం ఇంట్లో శ్రీరామ పట్టాభిషేకం! అమ్మ వారమంతా చేసి ముగించిన శ్రీమద్వాల్మీకి రామాయణం ముగింపు సర్గ - పట్టాభిషేక సర్గ చదివి తాత్పర్యం వినిపించిన తర్వాత సాయంత్రం వరకూ భక్తి కీర్తనా గానం! పులిహోర దద్ధోజనం! అమ్మ నిండు మనసుతో ఆత్మ సమర్పణ భావనతో చేసిన ఆ నైవేద్యాన్ని సీతా సమేత శ్రీరామచంద్రుల వారికి సమర్పించిన తరువాత, అందరికీ వినిమయం! అమృతతుల్యమైన ఆ ప్రసాదాన్ని కడుపారా తిని, మా పడసాల (హాల్)లో అంతవరకూ కిటకిటలాడుతూ కూర్చున్న వారంతా - మళ్ళీ .. అయ్య అష్టాక్షరీ కృతులు, అమ్మ పరమతారక ముద్ర రచనలు, పురంధర, కనకదాసు, త్యాగరాజు, అన్నమయ్య, రామదాసు రచనలు పాడుతూ.. వీధుల వెంట నడుస్తూ దేవుని కడప - వేంకట రమణుని దర్శనం కనులారా చేసుకుని, ఆ పవిత్రానుభూతిని గుండెల నిండా నింపుకుని, మళ్ళీ శనివారం కోసం నిరీక్షణతో వాళ్ళ గూళ్లకు చేరుకునేవారు! ఈ బృందానికంతా అమ్మా, అయ్యే ముందుండే వాళ్ళు. మా అమ్మ ఊరివారందిరికీ అమ్మే. అయ్య ఆదేశానుసారం ఐహిక కాముకులకు అమ్మ సలహాలు! ఆదిత్య హృదయం, వేదాన్త దేశిక విరచిత ‘కనక ధారా స్తవం’, ‘కులశేఖరాళ్వార్ - ముకుందమాల’ ఇంకా హయగ్రీవస్త్రోత్రం, శ్రీ సూక్తం.. యివన్నీ అమ్మ ద్వారా నేర్చుకున్న వారెందరో! సంతానం, ఉద్యోగాలు, కళ్యాణం ఇలాంటి కోరికలతో వచ్చే వాళ్ళకు అమ్మ చెప్పే రామాయణ సర్గ పారాయణలు, తరుణోపోయాలుగా ఇట్టే పనిచేసేవి. అంతేనా! మతిస్థిమితం లేని యిద్దరు యువకులు అమ్మ మంత్ర దీక్ష ఇచ్చిన తర్వాత పవిత్ర తీర్ధంతో మళ్ళీ మామూలుగా మారి పెద్ద చదువులు చదివి జీవితంలో స్థిరపడటం కళ్ళారా నేను చూసిన సత్యం. ఆమె మరణం (1983) అయ్యకు మా అందరకూ ఆశనిపాతం! ఆముష్మికంగా భగవదారాధన కోసం అయ్యను ఆశ్రయించే వారెందరో! భక్తి మార్గ విశ్లేషణ, అందులోని కష్టాలు, అధిగమించేందుకు భక్తుల జీవితోదాహరణలు, శరణాగతి తత్త్వవివరణ - అష్టాక్షరీ నాధుని కృపకోసం సాధన...యివి. అయ్య తనను చేరేవారికి బోధించే విషయాలు! అమ్మను బతికించుకోడానికి అయ్య మధ్య వీధిలోని రాఘవేంద్ర స్వామికి రోజూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసేవారు. అరవై తొమ్మిదేళ్ళ వయసులో అలా అహరహమూ శ్రమించినా అమ్మను కాపాడుకోలేకపోయారు. అప్పటి నుంచీ ఆయన అంతర్ముఖులైపోయారు. వ్రాతకోతలు తగ్గాయి. ఒక శ్రీనివాస ప్రబంధం ద్వితీయార్ధం వచ్చిందంతే! తోడు కోల్పోయిన పక్షి విలవిల్లాడిన వైనం గుర్తొచ్చేది. నా తరువాత తొమ్మిదేళ్ళ తర్వాత పుట్టిన చెల్లెలు అనూరాధ (1962) పెళ్ళి భారం అయ్యపై పడింది. అంతకు ముందు జరిగిన మా అక్క చెల్లెళ్ళ పెళ్ళిళ్ళన్నీ అమ్మ - మా అయ్య శిష్యుడూ - దత్త పుత్రుడిగా మా యింట మసలిన మాలేపాటి సుబ్రహ్మణ్యం అన్నయ్యల నిర్వహణలోనే - పెళ్ళి చూపులు మొదలు - పెళ్ళి పీటల వరకూ ఏర్పాటయ్యేవి. అయ్య పెళ్ళి పెద్దగా పీటలపై కూర్చొని కన్యాదానం చేయటమే! ‘ మా చెల్లెలు రాధ పెళ్ళి ఎలా జరుగుతుందా? అని అయ్యకు ఒకటె దిగులు. మొత్తానికి మా అక్కయ్యలు, అన్నా వదినల సహకారంతో అనురాధ పెళ్ళి 1988 లో అవగానే యిక అయ్య ఆరాటం తగ్గింది. కానీ సాహిత్య ప్రపంచంలో వస్తున్న మార్పుల పట్ల ఏవగింపు పెరుగుతూ వచ్చిందా సమయంలోనే. లైను కింద లైనుగా అప్పట్లో వస్తున్న వచన కవిత్వమంటే అయ్యకు అయిష్టంగా ఉండేది. సాహిత్యంలో ఆశ్రిత కవిత్వ ధోరణీ పెరిగింది. అచ్చమైన నాణ్యత కల్గిన కవులకు నిరాదరణ జరగడం చూసి సహించలేకపోయేవారు. అర్హతలేని వారు అందలాలెక్కడం - వారిని చాలా కష్టపెట్టింది. అంతవరకూ ఊరించిన ‘జ్ఞానపీఠం’ కాస్తా కడప-గడప దాకా వచ్చి గిర్రున వెనుదిరిగి పోయిన వైనం అయ్యగారిని మరింతగా కృంగదీసింది. జాల రచయిత చంద్రమోహన్ తో జ్ఞానపీఠం వల్ల నాకేమీ కొత్త కిరీటం రాకపోయినా ఆ లక్ష రూపాయలతో నా ‘జనప్రియ రామాయణం’ అరణ్య కాండ వెలుగులోకి వచ్చేదిరా అన్నారట అయ్య వడలిన శరీరంతో, వణుకుతున్న గొంతుతో! అలా కృంగినవరు యిక మరి కోలుకోలేదు. ఆరోగ్యం క్షీణిస్తున్నా జ్ఞానార్తి మాత్రం తీరలేదు. హైద్రాబాద్ ఆనంద్ బాగ్ లో 1990 ఆగస్టు 2వ తేదీ నుండి 18 వరకు మా ఇంట్లో ఉన్న సమయంలో తన అనుంగు శిష్యుడు రఘోత్తమరావుకు భాగవత రహస్యాలను విడమరిచి చెప్పేరు. చెక్కర వ్యాధి మిషతో ఆరోగ్యాన్ని దెబ్బతీసిన దైవాన్నీ, తన సహజ ధోరణిలోనే తప్పుపట్టారొకనాడు. నాయాలా! నిన్ను వదుల్తాననుకున్నావా! అని పైవాడు వెంటపడినాడురా. మూడు నెలలు మలేరియా, మళ్ళీ యిదిగో యీ కాలిపుండూ, ఈలోగా ఈ షుగరూ.. నేనేం తక్కువ తిన్నానా! నీకంటే నేను మహా మొండి వాడిని తెలుసా! చూద్దాం ఏం చేస్తావో! అని అనేశాను అని ఒకటే నవ్వు. అటు తర్వాత కడపకు వెళ్ళాలని పట్టుదల. అక్కడికి వెళ్ళిన వారం రోజులకి బాల్ రెడ్డి ఆసుపత్రిలో చేరడం, పెరిస్త్రోయికా తెచ్చి పెట్టమనడం యివన్నీ జరిగాక ‘భగవంతుడు, భాగవతము, భక్తుడూ’ అంతా ఒకటే అన్న చరమ శ్లోకార్ధం వినిపిస్తూ తను ఆ జన్మాంతం ఆరాధించిన అష్టాక్షరీ నాధునిలో సెప్టెంబర్ ఒకటవ తేదీ ప్రభాత వేళ ఈ ‘సాహితీ ప్రభాకరుడు’ ఐక్యం చెందటం జరిగిపోయాయి. ‘ఏమమ్మా నాగా! అన్న అప్యాయతతో కూడిన పిలుపిక వినబడదు. కడప రామకృష్ణ హైస్కూల్ లో తన శివతాండవ నృత్య ప్రదర్శనలో పార్వతిగా నాకు అడుగులు నేర్పించి ప్రదర్శనానంతరం నన్ను ముద్దుగా ముద్దాడిన మా అయ్య యికరారు. వేంకటాధ్వరి లక్ష్మీ సహస్రాన్ని విశ్లేషించి వినిపించిన అయ్య గంభీర స్వరం యిక వినపడదు. 1990 సెప్టెంబర్ ఒకటవతేదీ నాడే మా కుటుంబ సభ్య్లులందరూ జీవఛ్ఛవాలయ్యాం! జీవించక తప్పదు కాబట్టి బతుకు బండిని ఎలాగో లాగుతున్నా, ఇలా లాగేందుకు అవసరమయ్యే యింధనమంతా అలనాటి అద్భుత లోకాలలో విహరించినప్పటి జీవధారల అమృతపానం వల్ల అందినదే! అయ్య నుండి మేము నేర్చుకున్నదేంటి? జీవితంలోని యే క్షణాన్నీ వృధా పరచుకుకోకూడదన్న సత్యం. జీవించడానికే ఆహారం! ఆహారం కోసం జీవించడం నీచం! నిరాడంబర జీవితం! ఉన్నతాశయాలు! ఎవరి అండదండల వల్లయినా, దాసత్యం వల్లనయినా అందే గౌరవాల కన్నా, ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటూ పొందే గౌరవాల విలువే ఎక్కువ! అయ్యగారు మాకేనాడూ ‘ఇలా ఉండాలి సుమా’ అని చెప్పింది లేదు కానీ, ఆయన జీవితమే ఒక సందేశం మాకు! ఆయన్ని అభిమానించి ఆరాధించే వారందరికీ కూడా! సంగీతంలో శృతిని తల్లిగా - లయను తండ్రిగా చెబుతారు. మా జీవన సంగీతాలకూ శృతి మా అమ్మ, లయ మా అయ్య! మా అమ్మ అయ్య గారి దాంపత్యం విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా ‘ఉత్తర రామ చరిత్ర’ లో భవభూతి శ్లోకం గుర్తొస్తుందంటారు ఆచార్య శ్రీరంగాచార్యగారు. (పాలెం సంస్కృత కళాశాల పూర్వాచార్యులు) అద్వైతం సుఖదుఃఖయోరనుగతం సర్వాస్వవస్థా సుయత్ విశ్రామో హృదయస్య యత్రజరసాయస్మిన్నహార్యోరసః కాలేనా వరణాత్యయాత్ పరిణతే యత్ స్నేహ సారేస్థితం భద్రం ప్రేమ సుమానుషస్య కథమప్యేతం హి తత్ ప్రాప్యతే (320) సుఖదుఃఖాలలో సమానంగా అనుగమిస్తూ సాగే దాంపత్యం - పొద్దువాలిన వయసులో నీలిరాగంగా మరింత గాఢంగా వృద్ధ దంపతుల హృదయాల్లో నెలకొని - మరింత శోభాయమానంగా కనిపిస్తుందని అయ్యే తన ప్రసంగాలలో ప్రస్తావిస్తూ ఉండేవారు. అచ్చంగా, అలాగే మా అమ్మ, అయ్యల దాంపత్యం రూపెత్తిన విశిష్టాద్వైతం! అంతే!  

నవయుగ వైతాళికుడు

నవయుగ వైతాళికుడు గురజాడ అప్పారావు ( 1862 - 1915 ) భాషా సాహిత్యాలు రచిస్తూ, దేశభక్తిని బోధిస్తూ, కళలూ దేశ హితానికి ఉపయోగపడాలంటూ ఆకాంక్షించిన నవయుగ వైతాళికుడు గురజాడ అప్పారావు. వీరు 1862 సెప్టెంబర్ 21 న విశాఖ జిల్లా యలమంచిలి తాలుకా రాయవరం గ్రామంలో వెంకటరామదాసు, కౌశల్యమ్మ అనే పుణ్య దంపతులకు జన్మించాడు. ప్రాథమిక విద్యనూ చీపురుపల్లిలో నేర్చుకున్నాడు. తరువాత బి.ఎ. వరకు విజయనగరంలో గిడుగు రామమూర్తితో కలిసి చదువుకున్నాడు. హై స్కూలు చదువులో ఉన్నప్పుడే శ్లోకాలు రాసేవాడట. గురజాడ సాహిత్యంలో ప్రధానంగా మూడు విధాలుగా కొత్త మార్గాలను సృష్టించాడు. అవి భాష, వస్తువు, రూపం. గిడుగు రామ్మూర్తితో కలిసి వాడుక భాషను బహుళ ప్రచారంలోకి తేవడానికి తీవ్రంగా కృషి చేశాడు.కావ్యాలలో ఉపయోగించే భాష, మాట్లాడుకునే భాష ఒకే విధంగా ఉండాలని కేవలం ప్రచారం చెయ్యడం మాత్రమే కాకుండా వాడుకలో భాషలో '' కన్యాశుల్కం '' అనే నాటకాన్ని రాసి సంచలనం సృష్టించాడు. వస్తువు కోసం ఏ పురాణాలని ఆశ్రయించాల్సిన పనిలేదని తమ ఎదురుగా ఉన్న ప్రజల జీవితాలనే కథ వస్తువులుగా తీసుకోవచ్చని చెప్పి ఎన్నో కథా కావ్యాలు రాసి ఆయా పాత్రలని తెలుగునాట చిరంజీవుల్ని చేయడమే కాకుండా ముత్యాల సరాలు అనే కొత్త ఛందస్సును సృష్టించి సంప్రదాయ బద్ధంగా వస్తున్న ఛందస్సులో నూతనత్వాన్ని ప్రతిపాదించాడు. ' తలుపు..తలుపు ' అంటూ తెలుగు కథానికా ప్రక్రియకి తలుపు తట్టిన గొప్పవాడు గురజాడ. ఆయన రాసిన '' దిద్దుబాటు '' అనే కథానిక తెలుగులో వచ్చిన మొట్టమొదటి కథానిక. ఇంకా అనేక కవితలు, వ్యాసాలు రాసి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేయడమే కాకుండా జాతిబందాలు అనే గొలుసులు జారిపోవాలని, మతాలన్ని మాసిపోయి జ్ఞానం ఒక్కటే నిలిచి వెలుగుతుందని, వర్ణ భేదాలన్నీ కళ్ళ కావాలని, ఈ లోకమంతా ఒక ఇల్లుగా ఉండాలని కోరుకున్న గొప్ప మానవతావాది గురజాడ. గురజాడ 1884 లో విజయనగరం మహారాజా కాలేజి హైస్కూలులో ఉపాధ్యాయ పదవిని, ఆ తరువాత రెండేళ్లలోనే డిప్యూటి కలక్టర్ ఆఫీసులో హెడ్ క్లర్క్ పదవిని, మరు సంవత్సరం కళాశాలలో అధ్యాపక పదవిని నిర్వహించి ఆ తరువాతి సంవత్సరం రాజావారి ఆస్థానంలో చేరాడు. 1906 లో పాఠశాలల్లో తెలుగు బోధనా భాషకోసం తూర్పు జిల్లాల విద్యాధికారి జె.ఎ.ఏట్స్ తో, విశాఖపట్నం మిసెస్ ఎ.వి.ఎన్.కళాశాల ప్రిన్సిపాల్ పి.టి. శ్రీనివాస అయ్యంగారుతో, పర్లాకిమిడి కళాశాల అధ్యాపకుడు గిడుగు రామమూర్తితో కలిసి వాడుకభాష కోసం మహోద్యమాన్ని ప్రారంభించాడు. 1911 లో మద్రాసు యూనివర్సిటి బోర్డ్ ఆఫ్ స్టడీస్ లో సభ్యత్వం లభించింది. అయితే ఈ యూనివర్సిటి వాడుక భాషకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడంతో తన అసమ్మతిని తెలుపుతూ '' అసమ్మతి పత్రం '' సమర్పించాడు. " దేశమును ప్రేమించుమన్న మంచియన్నది పెంచునన్న వొట్టి మాటలు కట్టిపెట్టోయి గట్టిమేల్ తలపెట్టవోయి " అంటూ దేశభక్తి గీతాన్ని రచించిన మన గురజాడ 1915 నవంబర్ 30 న మరణించాడు. 

సాహితి రంగంలో సామ్రాట్

సాహితి రంగంలో సామ్రాట్ డాక్టర్ విశ్వనాథ సత్యనారాయణ తెలుగు వారిలో ప్రతిభ వున్న ఆది నుంచి ప్రచారం మాత్రం తక్కువే. తను తలపెట్టిన కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేయాలన్న ధ్యాసే తప్ప పబ్లిసిటీ గురించి రవంత అయిన ఒక తెలుగు వ్యక్తికీ జాతీయస్థాయిలో గుర్తింపు రాలేదు. బ్రిటీష దొరలను ప్రాణాలకు తెగించి ఎదిరించిన ఎందరో వీరులున్నారు. వారి పేరు చెబితే తెల్ల దొరలు గజగజ వణికేవారు. ఐతే వారికినాడు జాతీయస్థాయిలో ఇతర నాయకులకున్నంత ప్రచారం లేదు. వైద్య, విద్య, సాంఘిక, రాజకీయ రంగాల్లో చరిత్ర సృస్టించిన మహామహులున్నారు. అయితే వారికి తగినంత గుర్తింపు రాలేదు. దానికి కారణం తెలుగువారు ఏనాడూ ప్రచారాని కోసం ప్రాకులడలేదు. పైగా ఒక తెలుగు వాడికి పేరు వస్తే రెండోవాడు అతన్నినిరుస్తాహపరిచే అలవాటు ఉంది. ఈ తత్త్వం మిగితా ఏ భాషల వారిలో వుండి ఉండదు. ఇటువంటి వాతావరణంలో  పెరిగిన ఒక తెలుగు రచయితకు జాతీయస్థాయి గుర్తింపు లభించింది. దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక సాహితీ అవార్డు “జ్ఞానపీఠ్” లభించింది. ఆ మహారచయిత సన్మాలకీ, సత్కరాలకి, అవార్డులకీ, రివార్డులకి ఎప్పుడు ప్రయత్నించలేదు పైగా మండి పడేవారు. అయితే ఆయన ఆనందించిన సాహిత్యం అజరామరమైంది. తెలుగువారి కీర్తిని దశ దిశలా వ్యాపింపజేసిన ఆ మహా కవి పేరు కవి సామ్రాట్ డాక్టర్ విశ్వనాథ్ సత్యనారాయణ. తెలుగు వారిలో జ్ఞానపీఠ్ అవార్డు మొట్టమొదటనందుకుని పద్మభూషణ్ బిరుదుపొంది , కళప్రపూర్ణ బిరుదు స్వీకరించి గౌరవ డాక్టరేట్ సత్క్రుతులైన మహాకవి సామ్రాట్ ఆయన.  మన కథనాయకుడు సత్యనారాయణ విద్యాబ్యాసం బందరులో జరిగింది.చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి గారి ఆశీస్సులతో బి.ఏ దాక చదివారు. అయితే చివరి సంవంత్సరం చదువుతుండగా, సహాయక నిరాకరణ ఉద్యమానికి మహాత్మాగాంధీ ఇచ్చిన పిలుపు నందుకుని చదువు చాలించి, కొంతకాలం ఉద్యమంలో పాల్గోని, బ్రిటీషూ దొరలకు వ్యతిరేకంగా పాటలు, పద్యాలూ రచించి యువతరానికి అందించాడు. విశ్వనాథ వారి జీవితం చెళ్లపిళ్ల వారి గురత్వ భాగ్యంతో ఒక మలుపు తిరిగిందనే చెప్పుకోవాలి. వారి మిత్రులైన కంభంపాటి రామమూర్తి శాస్త్రిగారి దగ్గర సంస్కృత వ్యాకరణం నేర్చుకొని నరసింహశాస్త్రీ గారి దగ్గర వేదాంత ప్రకరణాలను అబ్యాసించారు. గుంటూరులోని శ్రీ కల్యానంద భారతి మంతచార్యుల దగ్గర ఉపనిషత్తులు పటించి ఆంధ్ర సంస్కృతిక ఆంగ్ల భాషల్లోప్రసిద్దమైన గ్రంధాలన్ని చదివారు. నన్నయ తిక్కన,పెద్దన, తెనాలి రామకృష్ణ, కృష్ణదేవరాయ, కాళిదాసుభావభుతుల రచనలు వారికీ కరకతలామలకం అయ్యాయి పదమూడు సంవత్సరాలు వచ్చేసరికి రచయితగా గుర్తింపు పొందారు. విశ్వనాథ  సత్యనారాయణ ఏం.ఏ.పూర్తిచేసి మొదట బందరులో, తర్వాత గుంటూరులో ఏ.సీ. కళశాలలోను తెలుగు లెక్చరర్ గా చేరారు. ఉద్యోగంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒత్తిడి ఉన్నాసాహిత్యం పట్ల గల అభిమానంతో రాత్రి సమయాలలో సాహిత్యాభిమానం కలవరందరికి సమావేశపరచి తను రాసినవి వినిపించి వారి చేతకూడా రాయించేవారు. ఆవిధంగా వారి ప్రోత్సహంతో రచనలు చేసిన వారు ఎందరో ఈనాడు మహాకవులయ్యార. విశ్వనాద వారు గుంటూరు విడిచి విజయవాడ కళశాలలో చేరారు. ఆ కాలంలో ఆయన ఆంధ్రప్రదేశం నలుమూలల్లో పర్యతిన్ పర్యటిస్తూ అనేక సాహిత్యోపన్యాసాలు ఇస్తూ మహాకవిగా విమర్శకుడిగా, ఆచార్యుడిగా ఆయన రచనల్లో వేయిపడగలు, రామాయణం, మహావృక్షం, కిన్నెరసాని, ఆంధ్రప్రశస్తి, నర్తనశాల ఏకవీర,అనార్కలి,ఋతు సంహారం,విశ్వనాథ మధ్యాక్కరలు, వీరవల్లిడు, హహహుహూ,ఝాన్సీరాణి,గోపిక గేతలు,కృష్ణ సంగీతంకోకిలమ్మ పెళ్ళి, శివార్పణం,ఆంధ్ర పౌరుషం, మాస్వామి,చెలియలి కట్ట, స్వర్గానికి నిచేనలు, కేదార గోళ, భ్రష్టయోగి బాగా పేరు తెచ్చాయి. చరిత్రకారులు అంచనాప్రకారం ఆయన ఇరవైవేలకు పైగా పద్యాలూ ,మూడు వందలకుపైగా ఇతర రచనలు అంటే నవలలు, నాటికలు నాటకాలు రాసారు. విశ్వనాథ మధ్యాక్కరకు సాహిత్య అకాడమీ అవార్డు శ్రీమద్రామాయణ కల్పవృక్షంకు  జ్ఞానపీఠ అవార్డు  లభించాయి. కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది. శాసనమండలిలో సభ్యత్వం మిచ్చి గౌరవించింది. కవిగా కధానాయకుడుగా నవల రచయితగా, నాటక కర్తగా, సాహిత్య విమర్శకుడిగా, మహావక్తగా, కావ్య గాయకుడిగా సుమారు అరవై సంవత్సరాల పాటు తెలుగువారి హృదయాలను రంజింపచేసి కవి సామ్రాట్ అనే బిరుదును ప్రజల నుంచి పొందిన మహామనిషి విశ్వనాధ్. అందువల్లే ఆయన కవి సామ్రాట్ అయ్యారు.