స్వీట్ మెమోరీస్

స్వీట్ మెమోరీస్ కనుమరుగైన మధురస్మృతులు గురించి రాయాలంటే ఎన్నైనా రాయవచ్చు. ప్రతి మనిషి జీవితంలో చిన్ననాటి చిలిపి చేష్టలు, అల్లరిపనులు, ఆకతాయి చేష్టలు తలచుకుంటూ ఉంటే మనస్సు పులకరిస్తుంది. ఆనందం పరవళ్ళు తొక్కుతూ ఉంటుంది. అదొక స్వర్ణయుగం. మళ్ళీ తిరిగిరాని మరిచిపోలేని మంచి రోజులవి. మాది ప్రకృతి అందాలతో, పాడిపంటలతో పచ్చని పొలాలతో, గోదావరి గలగలతో, పూల సోయగాలతో ప్రేమానురాగాలతో పలకరించే పల్లెజనులు నివశించే పల్లెటూరు. మా దోసకాయలపల్లి. గోదావరి జిల్లాలో ఉంది. ఇంక మా కుటుంబం గురించి ... మా ఇంటిపేరు శ్రీనిలయం. మాది ఉమ్మడి కుటుంబం. ప్రేమానురాగాలు, బంధాలు, బంధుత్వాల నిలయం మా శ్రీనిలయం. అందరం కలిసిమెలిసి అనురాగాలతో, ఆనందంతో ఉండేవారు. మా అమ్మ, నాన్న, నాయనమ్మ, పెద్దమ్మ, పెద్దనాన్న, పిన్ని, బాబాయ్, పిల్లలతో ప్రతిరోజూ ఒక పండగలాగానే ఉండేది. తెల్లవారుతుంది లేవండహో అంటూ కోడికూతులతో మేల్కొలిపే కోడిపుంజులు, కిటికీలోంచి వచ్చి వెచ్చగా తాకే భానుడి ఉదయ అరుణోదయ లేతకిరణాలు, తెల్లవారింది లేవండర్రా అని పలకరించే బామ్మా, వాకిలి ఊడ్చి, కల్లాపుజల్లి, ఇంటిముందు వాకిలిని రంగవల్లులతో తీర్చిదిద్ది, స్నానంచేసి తులసికోటకు పూజచేసి పలహారం చేసే అమ్మ కాలకృత్యాలు తీర్చుకోగానే పలహారం, పాలగ్లాసుతో వచ్చి కొసరి కొసరితినిపించే బామ్మా, తొందరగా తినండే మీ స్నేహితులు వచ్చారు. ముచ్చట్లకి, ఆటలకి అంటూ చెప్పే బాబాయ్ ఆ మధుర స్మృతులు తలుచుకుంటేనే మనస్సు ఆనందంతో పొంగిపోతుంది. ఇంక బాల్యస్నేహితుల గురించి : పాఠశాలలో చదువుకునే రోజుల్లో నా స్నేహితులు - దేవి, బాల, లక్ష్మి, దీపిక, సరోజ. అందరం కలిసే క్లాసులో బాగా అల్లరి చేసేవాళ్ళం. పిలకపంతుల్ని పిచ్చి పిచ్చి ప్రశ్నలతో తికమక చేసేవాళ్ళం. మా స్నేహితులందరిలో దేవి బాగా అల్లరి చేసేది. ఒకసారి ఏమయిందంటే ... మా తెలుగుమాస్టారు ఒక పద్యం చెప్పి దాన్ని బట్టీపట్టి పదిసార్లు చూసి రాసి తీసుకురమ్మన్నారు. ఎవ్వరము బట్టి పట్టలేదు. చూచి రాత రాయలేదు. కారణం రాములవారి గుడిముందు శ్రీరామనవమి తాలూకు ఉత్సవాలు జరుగుతున్నాయి. రోజూ హరికథలు, తోలుబొమ్మలాటలు, కోలాటాలు, పెద్ద తిరునాళ్ళు దేవుడిని బండిమీద ఊరేగిస్తూ ఉంటే పూజారినడిగి కొబ్బరిచిప్ప తెచ్చాను. నేను, మా స్నేహితురాలు దేవి కిరాణాకొట్లో బెల్లం దొంగలించుకుని వచ్చింది. కొబ్బరిముక్కలతో బెల్లం నంచుకుని తింటూ ఉంటే భలే మజాగా ఉండేది. ఇంక మరుసటిరోజు హోమ్ వరకు చెయ్యలేదని పిలకపంతులు బెత్తంతో కొట్టి, గుంజీళ్ళు తీయించి, గోడకుర్చీ వేయించాడు. అందరి ముందూ కొట్టావు కదా ఉండు నీ పనిచేప్తాను అని మనస్సులో అనుకొని మా బాబాయి నేను ఆడుకోవడానికి తెచ్చిన రబ్బరు పాముని పిలకపంతులు కుర్చీక్రింద పెట్టాను.పిలకపంతులు కుర్చీలో కూర్చుని పాముని చూచి నిజం పాము అనుకుని ఎగిరిపడ్డాడు. దీన్ని ఇక్కడ పెట్టింది ఎవరు అని అడిగితే ఎవరూ సమాధానము చెప్పలేదు. అందర్నీ బెత్తంతో పిచ్చకొట్టుడు కొట్టాడు. ఇది తల్చకున్నప్పుడల్లా పిచ్చ నవ్వొస్తుంది. బాల్యంలో ఇలాంటి సంఘటనలు మరెన్నో. అవన్నీ మరపురాని మధురానుభూతులు. ఇంక పండగల విషయానికొస్తే సంక్రాంతి పల్లెప్రజలకు పెద్దపండుగ. నెలరోజుల ముందునుంచే ఇంటికి సున్నాలు వేయించడం, అటకమీద ఇత్తడి వస్తువులన్నీ తళతళా మెరుస్తూ ఉండేలా తోమడం. నవారు పట్టీలు ఉతకడం, సైకిల్ మీద బట్టలు అమ్మే ప్రసాదు కోసం ఎదురుచూడటం కొత్త రకాలు ఏమి తెస్తాడా అని, అవి కొనుక్కుని టైలర్ కిచ్చి అవి కుట్టి ఇచ్చేదాకా పదిసార్లు దర్జీ అంగడి చుట్టూ తిరగడం ప్రతిరోజూ పోటీలుపడి రంగవల్లులు తీర్చిదిద్దడం, గొబ్బమ్మలు పెట్టి ప్రతిరోజూ స్నేహితురాళ్ళని పేరంటానికి పిల్చి గొబ్బిపాటలు పాడటం, బొమ్మల కొలువులు పెట్టడం, రోజూ వచ్చే హరిదాసు కోసం బియ్యం, డబ్బులు పట్టుకుని ఎదురుచూడటం, ఇంక పండగ శెలవులు ఇవ్వగానే అమ్మమ్మ ఇంటికి వెళ్ళటం. ఇంక అమ్మమ్మ చేసి పెట్టిన పిండివంటలు, ముఖ్యంగా అమ్మమ్మ చేసే అరిశెలు, పాకుండలు, బూరెలు, బొబ్బట్లు అంటే నాకు చాలా ఇష్టం. ఇంక పండగ మూడురోజులు భోగి రోజున ఆవుపేడతో చేసిన పిడకలతో భోగిమంటలు వెయ్యడం, నలుగుపెట్టి అమ్మ చేయించే తలంటి స్నానం, సాయంత్రం భోగిపళ్ళ పేరంటం ఆ పేరంటంలో పోటీలుపడి డబ్బులు ఏరుకోవడం అంతా భలే మజాగా ఉండేది. ఇంక సంక్రాంతి రోజుల పోటీలు పడి గాలిపటాలు ఎగరవేయడం, కనుమ రోజున పక్క ఊళ్ళలో జరిగే తీర్థాలకి, కోడిపందాలకి వెళ్ళటం అలా చాలా సరదాగా గడిచిపోయేవి. ఇంకో ముఖ్యమైన ఇష్టమయిన పండగలలో అట్లతద్ది. అట్లతద్ది అంటే ఆడపిల్లలకు యమా సరదా! ముందురోజే గోరింటాకు పెట్టుకుని, అట్లతద్ది రోజు ఉదయం 4 గంటలకే లేచి చద్దన్నం తిని ఉయ్యాల ఊగుతూ, తొక్కుడుబిళ్ళాటలు, ఉప్పులగుప్పలు అన్ని ఆడేవాళ్ళము. అన్నింటిలోను నేను బాగా ఆడుతున్నానని మా చుప్పనాతి సరోజ ఉయ్యాల వంకరగా ఊపి ఉయ్యాల మీదనుండి నేను కింద పడేటట్టుగా చేసింది. పైగా తను కంచి పట్టుపరికిణి కట్టుకొచ్చి గొప్పలు చెప్పేది. సరోజకి గుణపాఠం చెప్పాలని మ్యూజికల్ చేయిర్స్ ఆటలో అది కూర్చోబోయే కుర్చీలో రేకు పైకీ వచ్చేలా చేశాను. సరోజ పట్టులంగా పర్రున చిరిగింది. అర్థం చేసుకుని చిర్రుబుర్రు లాడుతూ వెళ్ళిపోయింది. మేమందరం తెగ నవ్వుకున్నాము. ఇలా చిన్ననాటి కబుర్లు చెప్పుకుంటూ పొతే బోలెడు. తరువాత నేను డిగ్రీ పూర్తి చేశాను. వెంటనే గవర్నమెంటు ఉద్యోగికిచ్చి పెళ్ళి చేశారు. వెంటనే ప్రెగ్నెసి వచ్చింది. చిన్న వయసులో గర్భవతిని అయిన నాకు అన్ని అనుమానాలే. ఎన్నో భయాలు, సందేహాలతో ఉండేదాన్ని. పురిటికోసం పుట్టింటికి వచ్చాను. ఎంతో ఉత్సాహంగా ఉండే నాలో ఫిజికల్ గానే కాక మెంటల్ గా కూడా చాలా మార్పు వచ్చింది. అప్పుడప్పుడు బియ్యం తినడం, ఆకలి మందగించడం, కాళ్ళకి నీరు రావడం, వాంతులు ఏమితిన్నా కూడా నీరసంగా ఉండటం, అప్పుడప్పుడు లైట్ గా బ్లీడింగ్ కన్పించడం, ఎబార్షన్ అవుతుందేమో అని భయపడేదాన్ని అన్నింటికీ బామ్మ తన అనుభవాలు రంగరించి ధైర్యం చెప్పేది. రెమిడీలు చెప్పేది. బామ్మ మాటలు ఎంతో మానసిక ధైర్యాన్ని ఇచ్చేవి. ఇదిగో పిల్లా గర్భం వచ్చినప్పుడు కాల్షియం ఎక్కువ కావాలి. ఇప్పుడు నువ్వు ఇద్దరికి సరిపడా తినాలి అంటూ పాలు, పళ్ళు, బలమైన ఆహారం బలవంతంగా తినిపించేది. తిననని మారం చేస్తే నువ్వు తినకపోతే వెయిట్ తక్కువగా పిల్లలు పుడతారు తరువాత నువ్వే ఏడుస్తావు అని చెప్పగానే గబగబా తినేసేదాన్ని. బి.పి. పెరగడం, కాళ్ళకి నీరు పట్టడం అన్నీ డెలివరీ కాగానే తగ్గిపోతాయి. తోలికాన్పు ఆడదానికి మరోజన్మ లాంటిది. టైంకి తిని మందులు డాక్టర్ల సలహా ప్రకారం వాడుతూ చిన్నపాటి వ్యాయామాలు చెయ్యి పండంటి బిడ్డకు జన్మనిస్తావు అని బామ్మ, నానమ్మ, ఆమ్మమ్మలు ఒకరి తరువాత ఒకరు వాళ్ళ సలహాలు, అనుభవాలు చెప్తూ ఉంటే నాకు ఎంతో ధైర్యాన్నిచ్చేవి. మాత్రుత్వంలోనే ఉంది ఆడజన్మకి సార్థకం. అమ్మా అని పిలిపించుకోవడంలోని ఆనందం నాకు పిల్లలు పుట్టాక తెలిసింది. అందుకే అన్నారు పెద్దలమాట చద్దన్నం మూట అని. ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చాను. ప్రస్తుతం అమెరికాలోని న్యూజెర్సీ స్టేట్ లో ఉంటున్నాము. చిన్ననాటి సంఘటనలు, స్నేహాలు, ఉన్న ఊరు గుర్తుకు వచ్చినప్పుడల్లా ఒక్కసారి వెళ్లాలనిపిస్తుంది. అందుకే అన్నారు ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీతల్లి భూమి భారతిని. భుక్తికోసం, బ్రతుకుతెరువు కోసం ఏదేశమేగినా కన్నవారిని, ఉన్న ఊరిని, బాల్య స్నేహితులను మరవలేము. మాతృభూమి, పుణ్యభూమి కన్న భూమి మనది. కన్నరుణం, ఉన్నరుణం తీర్చుకోలేనిది. మళ్ళా ఎప్పుడు సమయం దొరుకుతుందా పల్లె అందాలను, బాల్యస్నేహితులను, కన్నవారిని, ఉన్న ఊరిని చూడాలని మనస్సు ఉవ్విళ్ళూరుతుంది. రచన - నాగమణి గ్రంధి grandhi71@gmail.com    

మాతృదేవోభవ

మాతృదేవోభవ రచన - ముకుంద ప్రియ priyamukunda1@gmail.com "అమ్మ ప్రేమ" ని మించిన ప్రేమ ఈ ప్రపంచంలోనే లేదు. మన తెలుగు భాషలో అమ్మ అనే పదం కన్నా విలువైనది మరొకటిలేదు. మనకి దెబ్బ తగిలితే  మొదట వచ్చే మాట "అమ్మ". అమ్మ గురించి ఒక కవి ఏమన్నాడో తెలుసా ?కొలిస్తేనే పలికేది ఆ దేవుడు...కాని పిలవకుండానే పలికేది "అమ్మ మనసు" మాత్రమే. ఒక విషయం గురించి మాట్లాడమంటే 1 గంట, రోజు, నెల మట్లాడోచ్చు. కాని అమ్మ గురించి మాట్లాడమంటే జీవితాంతం మాట్లాడుతూనే ఉంటాం....అదే "అమ్మ ప్రేమ".  "అమ్మ" అనే మాట ముందు మన "ప్రాణం" అనే పదం చాలా చిన్నది కదా !  కాదని అనగలరా ఎవరైనా ? ఈ లోకంలో నువ్వు ద్వేషించినా కూడా నిన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు అంటే అది కేవలం అమ్మ మాత్రమే.   ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్నా కమ్మని కావ్యం ? ఎవరు పాడగలరు అమ్మ అను రాగం కన్నా తీయని రాగం? నిజంగా ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం...... మనం ఏమిచ్చిన అమ్మ రుణం మాత్రం తీర్చుకోలెం . అమ్మ అనే మాటలో  ఎంతో తియ్యదనం వుంది ఎంత మాధుర్యం వుందో  రోజంతా ఎంత బిజీగా ఉన్న ఎన్ని టెన్షన్స్ ఉన్న ఒక్క పది నిముషాలు అమ్మతో మాట్లడితే అన్ని మర్చిపోతాం. అమ్మకంటూ వేరే ప్రపంచం లేదు. మననుంచి  ప్రైవసీ కోరుకోదు తల్లికి పిల్లలే సర్వస్వం తను తినకపోయినా, ఆరోగ్యం బాగాలేకపోయిన ఎప్పుడు పిల్లలగురించే ఆలోచిస్తుంది. మన కోసం ఎంత కష్టమైన భరిస్తుంది ఎంత భాదనైన గుండెల్లోనే పెట్టుకుంటుంది. అలాంటి తల్లి కోసం సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మథర్స్ డే రోజైన కనీసం శుభాకాంక్షలు చెపుదాం... మదర్స్‌డే’ చరిత్ర ఈనాటిది కాదు! కొన్ని శతాబ్దాలకు ముందునుంచే ఈ మదర్స్‌డేను నిర్వహించినట్టు చారిత్రికాధారాలున్నాయి. ముఖ్యంగా గ్రీకులు దేవతలకే అమ్మగా కొలిచే ‘రెహ’ను పూజిస్తూ ఉత్సవాలు నిర్వహించేవారు. తొలినాళ్ళలో క్రైస్తవులు కూడా ప్రతి నాల్గవ ఆదివారం జీసస్ తల్లి మేరీ గౌరవార్థం ఉత్సవాలు జరుపుకొనేవారు. ఆసక్తి కరంగా తర్వాతి కాలంలో దీన్ని సెలవుగా ప్రకటించడం ఆచారంగా మారింది క్రమంగా దీన్ని ‘మదరింగ్ హాలీడే’గా ప్రకటించారు. 1872లో జులియా వార్‌డ హోవె శాంతికి చిహ్నంగా సంవత్సరంలో ఒక రోజును ‘మదర్స్ డే’ గా పాటించడం ప్రారంభించారు. ఇది నేటి ‘మదర్స్ డే’ కి మూలమని చెప్పొచ్చు. జో కొట్టినా , పాల్లిచ్చినా, భయపెట్టినా, లాలించినా, గోరుముద్దలు తినిపించినా, బల్యంలోనైనా, యవ్వనంలో నయినా,  వృద్ధాప్యంలోనైనా,  భాద్యతలలోనైనా,భాదలలోనైనా, అందరు సంతోషంగాఉండేందుకు అమ్మే ఆధారం. మనస్సాంతికైనా, మమకారములకైనా, కోరికలకైనా, వేడుకలకైనా, సమస్యల పరిష్కారమునకైనా, ఏ విషయాలకైనా, కామధెనువులా, కల్పతరువులా చీకటిని తరిమి వేలుగును అందరికీ పంచుటానికి   అమ్మే ఆధారం. అరమరికలు లేకుండా  ఫ్యామిలి లో అందరు హ్యాపీ వుండేలా అందరి మన్ననలను పొందటం ఎలానో  మనం అమ్మని చూసే నేర్చుకోవాలి. ఆత్మీయులను కలుపుకు పోవటం కాని  అసాధ్యన్ని సుసాధ్యము చేయుటానికి  కాని  అమ్మే ఆధారం. అమ్మ లేకుండా మనం ఈ సృష్టినే ఉహించుకోలెం.మన ప్రతి ఒక్కరి బలం, బలహీనత అమ్మే, అమ్మ లేకపోతే మనము లేము, ఈ సృష్టి లేదు.అమ్మ మనసు గురించి ఎందరో కవులు ఎన్నో కవితలు, కథలు వ్రాసారు, ఒకరు "పెదవి పలికే మాటల్లో తీయని మాటే 'అమ్మ' " అంటే మరొకరు "ఎవరు వ్రాయ గలరు 'అమ్మ' అను మాటకన్న తీయని మాట" అని.....అమ్మ గురించి ఎంత చెప్పిన తక్కువే అసలు నా  ఫీలింగ్స్ చెప్పడానికి భాషే సరిపోవడం లేదు, ఎన్ని చెప్పిన ఇంకా ఏదో  చెప్పాలని, ఏదో మర్చిపోయననే అనిపిస్తుంది నాకు, అమ్మే నాకు బెస్ట్ ఫ్రెండ్ అమ్మే నాకు అన్ని ఈ ప్రపంచంలో ఏమిలేకపోయిన నేను బ్రతుకుతాను బ్రతకగలను కాని అమ్మలేకుండా మాత్రం ఒక్క నిముషం కూడా ఉహించుకోలేను కనీసం ఆ ఆలోచన కూడా రానివ్వను నేను మళ్ళీ  పుడతానో లేదో తెలిదు కాని పుడుతె మాత్రం మా అమ్మకే పుట్టాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. మమల్ని మోసి కని, పెంచి మా అల్లర్నిభరించి మా తప్పులని సరిదిద్ది మా నుంచి ఏమి ఆశించని నిస్వార్ధ మాతృమూర్తులందరికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూన్నాం....మా తల్లులందరికి మథర్స్ డే శుభాకాంక్షలు.....