కలవారి కోడలు కలికి కామాక్షి

కలవారి కోడలు కలికి కామాక్షి   జానపద గేయాలకి ఫలానా రచయిత అంటూ ఉండడు. రుషుల జన్మ, నదుల జన్మలాగానే వాటి ఆవిర్భావం కూడా ఊహకందకుండా జరుగుతుంది. కానీ ఆ గేయాలను పరిశీలిస్తే ఒకనాటి ప్రజల జీవితం ఎలా ఉండేదో తెలిసిపోతుంది. ఆచారవ్యవహారాల దగ్గర నుంచీ ఆలోచనావిధానం వరకూ ఒక తరానికి చిహ్నంగా నిలిచిపోతుంది. అలాంటి ఒక పాటే ‘కలవారి కోడలు’. ఒకనాటి ఉమ్మడి కుటుంబ జీవనశైలిని గుర్తుచేస్తుందీ పాట. ఇంట్లోకి అడుగుపెట్టిన అన్నగారిని చూసి కోడలికి తన పుట్టిళ్లు గుర్తుకువస్తుంది. ఆ గుర్తుతో చెమ్మగిల్లిన ఆమె కళ్లని చూసిన అన్నగారు, ఆమెని తనతో కొన్నాళ్లు పుట్టింటికి తీసుకువెళ్లాలని అనుకుంటాడు. కానీ అందుకు ఆమె అత్తమామల అనుమతి కావాలయ్యే! ఇక్కడ కోడలు అనుమతి పొందే క్రమంలో, ఎవరి తీరు ఏ రకంగా ఉందో గమనించవచ్చు. అత్తగారు దర్జాగా పెద్ద కుర్చీ మీద కూర్చుని ఉన్నారు; మామ పట్టెమంచం మీద సేదతీరుతున్నాడు; బావగారు భాగవత కథాకాలక్షేపం చేస్తున్నాడు; తోటికోడలు వంట చేస్తోంది; భర్త రచ్చబండ మీద హడావుడి చేస్తున్నాడు. పైపైకి బంధాలను, సంప్రదాయాలను గుర్తుచేస్తున్నట్లు కనిపించినా... అత్తమామలు దర్జాగా కాలం వెళ్లదీస్తూ, కొడుకులు కాలక్షేపం చేస్తూ ఉంటే ఆడవారు కష్టపడే విధానాన్ని కూడా దెప్పిపొడుస్తున్నట్లు తోస్తుంది. ఆంధ్రా, తెలంగాణ, రాయలసీమ... ఈ మూడు ప్రాంతాలలోనూ చిన్నపాటి బేధాలతో ఈ గేయం ఇప్పటికీ ప్రచారంలో ఉంది.   కలవారి కోడలు కలికి కామాక్షి కడుగుచున్నది పప్పు కడవలో పోసి అప్పుడే ఏతెంచె ఆమె పెద్దన్న కాళ్లకు నీళ్ళిచ్చి కన్నీళ్ళు నింపె ఎందుకు కన్నీళ్ళు ఏమి కష్టమ్ము తుడుచుకో చెల్లెలా ముడుచుకో కురులు ఎత్తుకో బిడ్డను ఎక్కు అందలము మీ అత్తమామలకు చెప్పిరావమ్మ కుర్చీ పీట మీద కూర్చున్న అత్తా మా అన్నలొచ్చారు మమ్మంపుతార? నేనెరుగ నేనెరుగ మీ మామ నడుగు పట్టెమంచము మీద పడుకున్న మామ మా అన్నలొచ్చారు మమ్మంపుతార? నేనెరుగ నేనెరుగ మీ బావ నడుగు భారతము చదివేటి బావ పెదబావ మా అన్నలొచ్చారు మమ్మంపుతార? నేనెరుగ నేనెరుగ నీ అక్క నడుగు వంట చేసే తల్లి ఓ అక్కగారు మా అన్నలొచ్చారు మమ్మంపుతార? నేనెరుగ నేనెరుగ నీ భర్త నడుగు రచ్చలో మెలిగేటి రాజేంద్ర భోగీ మా అన్నలొచ్చారు మమ్మంపుతార? పెట్టుకో సొమ్ములు కట్టుకో చీర పోయిరా సుఖముగా పుట్టినింటికిని   -నిర్జర

జీవితాన్ని పుస్తకంలో చూపించిన - త్రిపురనేని గోపీచంద్‌

రచయిత, దర్శకుడు, హేతువాది... ఈ రంగాలలో ఏదో ఒక దానిలో ప్రతిభ కలిగి ఉండటమే గొప్పగా భావిస్తాము. అలాంటిది ఒకే వ్యక్తి ఈ మూడు రంగాలలో అడుగుపెట్టి తన ప్రతిభను నిరూపించుకోవడం ఏమంత తేలికైన విషయం కాదు. ఆ అసాధ్యాన్ని అలవోకగా సాధించినవాడు త్రిపురనేని గోపీచంద్. త్రిపురనేని రామస్వామి చౌదరి గురించి తెలుగునాట తెలియంది ఎవరికి! కవిరాజుగా, తెలుగునాట హేతువాదానికి పునాదులు వేసిన ఉద్యమకారునిగా... రామస్వామి జీవితం ఓ సంచలనం. ఆ తండ్రికి తగ్గ తనయుడిగా త్రిపురనేని గోపీచంద్‌ ప్రస్థానం కూడా తెలుగు సాహిత్యంలో చిరకాలం గుర్తుంచుకోదగినదే! సెప్టెంబర్‌ 8, 1910 సంవత్సరంలో... కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు సమీపంలో అంగలూరు అనే చిన్న ఊరిలో జన్మించారు గోపీచంద్‌. అందరిలా బుద్ధిగా చదువుకుంటున్నా, తండ్రి నుంచి అలవర్చుకునే ప్రశ్నించే తత్వం మాత్రం మానలేదు. ఆ తత్వమే ఆయనలో అనేక ఆలోచనలకి, సంఘర్షణలకీ దారితీసింది. ఆ సంఘర్షణే అక్షరాలుగా మారి అద్భుతమైన రచనలుగా రూపుదిద్దుకున్నాయి. గోపీచంద్‌ పుంఖానుపుంఖాలుగా రచనలు చేయలేదు. కానీ చేసిన కొద్దిపాటి రచనలూ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచేలా ఉంటాయి. అసమర్థుని జీవితయాత్ర, పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా లాంటి రచనలైతే... తెలుగులో చదివితీరాల్సిన పుస్తకాల జాబితాలో ఎప్పుడో చేరిపోయాయి. తెలుగునాట ‘అసమర్థుని జీవితయాత్ర’ని తొలి మనో వైజ్ఞానిక నవలగా పేర్కొంటూ ఉంటారు. మనిషి లోతులను ఆ స్థాయిలో స్పృశించే స్థాయిలో మరో నవల ఇప్పటికీ రాలేదనే చెప్పవచ్చు.   ‘సీతారామారావు జీవితం విచిత్రమైంది. ఉన్నత శిఖరాగ్రం నుంచి స్వచ్ఛమైన జలంతో భూమి మీద పడి మలినాన్ని కలుపుకొని, మురికికూపంలోకి ప్రవహించే సెలయేటిని జ్ఞప్తికి తెస్తుంది. తనలో వచ్చిన మార్పు ఆ సెలయేటికి తెలుసో తెలియదో మనకు తెలియదు. ఒకవేళ తెలిస్తే, తనలో వచ్చిన మార్పుకి ఆ సెలయేరు బాధపడుతూ ఉందో మనకు తెలియదు.’ అంటూ మొదలవుతుంది అసమర్థుని జీవితయాత్ర నవల. అలా సీతారామారావు అనే సదరు పాత్ర ఎలాంటిదో, దానికి తాను ఏ దిశను కల్పించదల్చుకున్నాడో తొలి పేరాలోనే చెప్పేస్తాడు రచయిత. అయితే ఆ పేరా కేవలం ఆరంభం మాత్రమే! ఒకపక్క సమాజ రీతిని విశ్లేషిస్తూ, మరోపక్క మనిషిలోని దౌర్బల్యాన్ని కళ్లకి కట్టినట్లు చూపిస్తాడు రచయిత. ఈ కథలో సీతారామారావు కేవలం ఒక వంక మాత్రమే! ఆ వంకతో ప్రతి పాఠకుడినీ తనలోకి తాను చూసుకునేలా, ఆత్మవిమర్శకి అద్దంలాగా తోస్తుంది ఆ నవల. పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా నవలది మరో శైలి. అభ్యుదయ భావాలు ఉన్న కేశవమూర్తి అనే పాత్రని నాయకునిగా నిలుపుతుంది ఈ నవల. స్వార్థపూరితమైన వ్యక్తుల మధ్య అతని జీవిత పోరాటం ఎలా ఉందో విశదీకరిస్తుంది. ఈ నవలలో మార్క్సిస్టు భావజాలం పుష్కలంగా కనిపిస్తుంది. 1963లో దీనికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు కూడా లభించింది. ఆ బహుమతిని అందుకున్న తొలి తెలుగు నవలగా ఘనతని దక్కించుకుంది. గోపీచంద్‌ రచనల్లో క్రమేపీ మార్క్సిస్టు ఉధృతి తగ్గి తత్వశాస్త్రం, మానవతావాదాలకు సంబంధించిన ప్రభావం కనిపించసాగింది. దీనికి ఎం.ఎన్‌.రాయ్‌, ఉన్నవ లక్ష్మీనారాయణ, అరవిందో తదితరుల ప్రభావం కారణం కావచ్చు. ఆ కారణంగానే ఆయన ప్రముఖ తత్వవేత్తల గురించి ‘తత్వవేత్తలు’ అనే గ్రంథాన్ని రాశారు. అయితే గోపీచంద్ ‘ఎందుకు?’ అని ప్రశ్నించడం మానుకుని, మూఢభక్తిని సైతం తత్వం అనుకునే స్థాయికి దిగజారాడన్న విమర్శలు లేకపోలేదు. రచయితగా ఒక స్థాయిని అందుకున్న గోపీచంద్... సినిమారంగంలోకి కూడా ప్రవేశించారు. అక్కడ గోపీచంద్‌ కథ, మాటలు అందించిన సినిమాలు గొప్ప విజాయాన్ని సాధించాయి. చదువకున్న అమ్మాయిలు (మాటలు), గృహప్రవేశం (కథ) ఆయన కలంతో రూపుదిద్దుకున్నవే! అయితే ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలేవీ విజయవంతం కాకుండానే కాలగర్భంలో కలిసిపోయాయి. సినిమారంగంలో పరాజయాలు చవిచూడటంతో అరవిందో ఆశ్రమానికి చేరి అక్కడి ఆధ్మాత్మికతతో కాస్త సేద తీరారు. తర్వాత తిరిగి జీవితంలో నిలదొక్కుకునేందుకు ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వ సమాచార శాఖ డైరెక్టర్ గా, ఆకాశవాణి ఉద్యోగిగా బాధ్యతలు నిర్వహించారు. నవలల్లోలాగానే నిజజీవితంలోనూ అనూహ్యమైన మలుపులు, ఉద్ధానపతనాలు చవిచూసిన గోపీచంద్‌... 52 రెండేళ్ల అతి చిన్న వయసులోనే లోకం నుంచి నిష్క్రమించారు. అయినా ఇప్పటికీ తెలుగునాట గొప్ప రచయితల జాబితాలో గోపీచంద్‌ పేరు ఠక్కున స్ఫురణకు వస్తుంది. అందుకే ఇన్నాళ్లు గడిచినా ఆయన సాహిత్యం అందుబాటులో ఉంది.   - నిర్జర.

తొలి భారతీయ మహిళా వైద్యురాలు.. ఆనందీ గోపాల్  జోషి

తొలి భారతీయ మహిళా వైద్యురాలు.. ఆనందీ గోపాల్  జోషి   ఆనందీ గోపాల్  జోషి పాశ్చాత్య వైద్యంలో పట్టా పొందిన  మొట్టమొదటి భారతీయ మహిళావైద్యురాలు ఆనందీ గోపాల్ జోషి గారు. ఈమె 1865 మార్చి 31 వ తేదీన మహారాష్ట్రలోని పూనాలో జన్మించారు. ఈమెకు తల్లిదండ్రలు యమున అని పేరు పెట్టారట. 9 సంవత్సరాల వయసులో గోపాల్ రావు జోషిని వివాహం చేసుకున్నారట. వివాహం తరువాత ఆమె భర్త ఆమెకు ఆనందీ బాయి అని పేరు పెట్టారట. విద్య పట్ల ఆనందీబాయికి ఉన్న ఆసక్తి గమనించి  ఆంగ్లం నేర్చుకోవడానికి సహాయం చేశారట. 14 సంవత్సరాల వయసులో ఆనందీబాయి ఒక బాలుడికి జన్మనిచ్చిందట. అవసరమైన వైద్య సంరక్షణ అందుబాటులో లేకపోవడంతో బాలుడు పదిరోజుల్లో చనిపోయాడట ఈ సంఘటనఆనందీబాయి జీవితంలో ఒకమలుపును తీసుకొచ్చింది. తను వైద్యురాలు కావాలి అన్నదానికి ప్రేరణ నిచ్చింది. గోపాలరావు తన భార్య వైద్యశాస్త్రాన్ని అభ్యసించడానికి ప్రోత్సహించాడు. ఆమెకు అమెరికాలో విశ్వవిద్యాలయం ప్రవేశం కోసం ప్రయత్నాలు సాగించాడు. 1880 లో ఆయన రాయల్ విల్డర్ కు రాసిన లేఖలో ఆనందీ బాయికి యునైటెడ్ స్టేట్స్ లో వైద్య అధ్యయనం చేయడానికి గల ఆసక్తిని పేర్కొంటూ తన కోసం అమెరికాలో సరైన ఉద్యోగానికి విచారించారట. ఇద్దరు ఆలు మగలు క్రైస్తవ మతం స్వీకరిస్తే సహాయం ఇవ్వగలనని విల్డర్ ప్రతిపాదించాడట. అయితే ఈ ప్రతిపాదన జ్యోషి జంటకు ఆమోదయోగ్యం కాలేదట. అయితే విల్డర్ ఈ ఉత్తర ప్రత్యుత్తరాలను తన సొంత పత్రికైన ప్రిన్శన్ మిషనరీ రివ్యూలో ప్రచురించారట.  రొస్సెల్ న్యూజెర్సీకి చెందిన ధియోడెసియా కార్పెంటర్ అనే ఆవిడ తన దంత వైద్యుని కోసం ఎదురుచూస్తూ ఆయన కార్యాలయంలో యాద్రుచ్చికంగా  పత్రికలో ఆనందీభాయి గురించి చదివారట.  వైద్య విద్య చదవాలన్న ఆనందీబాయి తపన దాన్ని ప్రోత్సహిస్తున్న భర్త వ్రుత్తాంత ఆమెను కదిలించిందిట. ఆనందీబాయికి ఉత్తరం రాసి తాను ఆనందీబాయి అమెరికాలో ఉండటానికి వసతి సహాయం చేయగలనని ముందుకు వచ్చిందట. కార్పెంటర్ కు ఆనందీభాయికి మధ్య అనేక విషయాలమీద ఉత్తరప్రత్యుత్తరాలునడిచాయట.  తర్వాత ఆమె సహకారంతో పాటు అనేక మంది భారతీయులు ప్రముఖులు ఆమె అమెరికా  వెళ్ళడానికి ఆర్ధిక సాయం చేశారట. భర్తకు అమెరికాలో ఉద్యోగం లభించని కారణంగా ఆనందీబాయి మాత్రం ఒంటరిగా ఉన్నత విద్యాభ్యాసానికి అమెరికా వెళ్ళారు. విపరీతమైన వ్యతిరేకతల నడుమ ఆమె 1883 జూన్ నెలలో వైద్యవిద్యాభ్యాసానికి అమెరికాలో అడుగు పెట్టారట...మూడేళ్ళపాటు నానాపాటులు పడి...1886 మార్చి 11ను వైద్య విద్యలో డాక్టరేట్ సాధించారట. ఆమె పరిశోధనాంశం...ఆర్య హిందువులలో స్త్రీ జననాంగ శిశు సంబంధిత వైద్యం...స్నాతకురాలయిన సందర్భంలో విక్టోరియా మహారాణి ఆమెకు శుభాకాంక్షలతో సందేశాన్ని పంపారట. ఈ ఉత్సవంలో ఆమెను మొట్టమొదటి భారతీయ వైద్యురాలుగా పేర్కొనడం మరపురాని అనుభూతిని కలుగజేసిందట.  భారతదేశానికి తిరుగు ప్రయాణం చేసిన సమయంలో ఆనందీభాయి ఆరోగ్యం మరింత దిగజారిందిట. మొత్తానికి 1886 చివరి భాగంలో ఆనందిబాయి భారతదేశానికి తిరిగి వచ్చేశారట. దేశం ఆమెకు ఘనంగా స్వాగతం పలికిందట. కొల్తాపూర్ సంస్ధానానికి వైద్యురాలిగా నియమించిందట. అల్బర్ట్ ఎడ్వర్డ్ వైద్య శాలలోని మహిళా వార్డుకు అధికారిణి బాధ్యతలు అప్పగించిందట. కలకత్తా చేరిన తర్వాత ఆమె తరుచూ జ్వరం ఆయాసాలతో బాధపడిందట. ధియోడిసియా ఆమెకు అమెరికా నుంచి ఔషధాలను పంపిందట. కానీ ఆమె 1887 ఫిబ్రవరి 26 వ దేదీన 22 సంవత్సరాల వయసులోనే అకాలమరణం చెందారట.ఆనందీ బాయి మరణానికి దేశమంతటా విషాదం ఆవరించిందట. ఆనందీబాయి చితాభస్మం ధియోడిసియాకార్పెంటర్ కు పంపారట. కార్పెంటర్ వాటిని ప్యూకిప్సీ, న్యూయార్క్ లోని తమ కుటుంబ స్మశానవాటికలో భద్రపరిచిందట. ఈమె సమాధి శిలాఫలకాన్ని ఈ స్మశాన వాటికలో ఇప్పటికీ చూడొచ్చు అంటారు. లక్నోలోని ఒక ప్రభుత్వ సంస్ధ ఇనిస్టిట్యూట్ పరిశోధన మరియు సాంఘిక శాస్త్రంలో ఆమె ప్రారంభ రచనలకు గౌరవం ఇస్తూ ఆనందీభాయి జోషి అవార్డు ప్రదానం చేసిందట. నిజంగా వైద్యరంగంలో ప్రవేశించి డాక్టర్ ని అవ్వాలని విదేశాలకెళ్ళి వైద్యరంగంలో పట్టా సాధించిన ఆనందీ గోపాల్ జోషి నిజంగా ఆదర్శమహిళ అన్నది అక్షరసత్యం.

దేశంలోనే తొలి ఆత్మకథ - అమార్ జీవన్

  దేశంలోనే తొలి ఆత్మకథ - అమార్ జీవన్     200 సంవత్సరాల క్రితం మాట ఇది! అప్పట్లో చదువు చాలా కొద్దిమందికి మాత్రమే అందుబాటులో ఉండే ఒక విలాసం. ఇక ఆడవాళ్లు చదువుకోవడం అన్న మాటే లేదు! ఒకవేళ స్త్రీలు చదువుకోవాలన్నా నలుగురిలో కాకుండా దొంగచాటుగా చదువుకోవాల్సిన పరిస్థితి. చదవడమే ఇంత కనాకష్టంగా ఉంటే ఇక పుస్తకాలు రాయడం గురించి ఊహించుకోగలమా! కానీ ఒక బెంగాలీ మగువ తనంతట తానుగా చదువుకోవడమే కాదు... దేశంలోనే తొలి ఆత్మకథని రాసుకుంది. ఆమే రాససుందరీ దేవి! రాససుందరీ దేవి బెంగాల్లోని ఓ మారుమూల గ్రామంలో 1810లో జన్మించారు. తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో బంధువుల చేతుల్లో పెరిగారు. అప్పట్లో బాల్యవివాహాలు ఎంత సహజమో ప్రత్యేకించి గుర్తుచేసుకోవాల్సిన పనిలేదు. పైగా తండ్రి లేని పిల్ల కావడంతో, ఎంత త్వరగా ఆమెను ఒక అయ్య చేతిలో పెట్టాలా అన్న ఆసక్తి ఎలాగూ ఉంటుంది. దాంతో రాససుందరీ దేవికి 12వ ఏటనే వివాహం చేసి పంపేశారు. రాససుందరీ దేవి భర్త గొప్ప ధనవంతుడు. నౌకర్లతోనూ, బంధువులతోనూ ఆయన ఇల్లు ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేది. కానీ అలా ఇల్లు కళకళలాడేందుకు రాససుందరీ దేవి నిత్యం ఏదో ఒక చాకిరీ చేయక తప్పేది కాదు! దానికి తోడు ఒకరి తర్వాత ఒకరుగా జన్మించిన 12 మంది పిల్లల ఆలనాపాలనా కూడా చూసుకోవాలయ్యే! దాంతో రాససుందరీ దేవి విపరీతంగా అలసిపోయేది. పని ఒత్తిడిలో ఒకోసారి తిండి తినేందుకు కూడా కుదిరేది కాదు. అలాంటి ఒత్తిడి నుంచి ఉపశమనంగా ఏవన్నా ఆధ్యాత్మిక పుస్తకాలు చదివే అవకాశం వస్తే బాగుండు అనుకునేది. కానీ ఎలా! రాససుందరీ దేవి చిన్నప్పుడు తన సోదరులతో కలసి వీధి అరుగు మీద కొంత విద్యను నేర్చుకుంది. కానీ అది చాలా కొద్దికాలం మాత్రమే! అవి నేర్చుకుని కూడా ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి. దాంతో ఎలాగైనా తిరిగి అక్షరాల మీద పట్టు సాధించాలనుకున్నది. తన పెద్దకుమారుడు అవతల పడేసిన కొన్ని చూచిరాత పుస్తకాలు (cursive writing) కనిపించాయి. వాటిలోని అక్షరాలను పోల్చుకుంటూ, తన చిన్నతనంలో నేర్చుకున్న విద్యను గుర్తుచేసుకునే ప్రయత్నం చేసింది. మరోవైపు భర్త నిత్యం చదువుకునే ‘చైతన్య భాగవతం’ అనే గ్రంథంలో ఒక పేజీని దొంగతనంగా చించి.... అందులోని వాక్యాలను చదివే అభ్యాసం మొదలుపెట్టింది. మొత్తానికి ఎలాగొలా పుస్తకాలు చదివే స్థాయికి, అక్షరాలను స్వయంగా రాసే స్థాయికి చేరుకున్నారు రాససుందరీ దేవి. అంతేకాదు! తన జీవితాన్ని స్వయంగా లిఖించే ప్రయత్నం చేశారు. అలా తన 66వ ఏట ‘అమార్ జీవన్’ అనే పుస్తకాన్ని ముద్రించారు. ఆరకంగా భారతదేశ భాషలలో తొలి ఆత్మకథగా అమార్ జీవన్ నిలిచింది. ఒకవేళ ఈ విషయం మీద ఎటువంటి సంశయమైనా ఉంటే... దేశంలో తొలి మహిళా ఆత్మకథగా మాత్రం అమార్ జీవన్ పుస్తకానికి ఢోకా లేదు! అమార్ జీవన్లో అద్భుతమైన రచనా శైలి లేకపోవచ్చు. అప్పటి సమస్యల మీద తీవ్రమైన విమర్శలు కనిపించకపోవచ్చు. కానీ తన భావాలను స్పష్టంగా, సూటిగా, సరళంగా చెప్పిన తీరు ఆశ్చర్యం కలిగించకమానదు. తన బాల్యవివాహం గురించీ, ఆ సందర్భంగా తన తల్లి నుంచి తనను దూరం చేయడం గురించీ రాస్తూ- ‘బలిపీఠం మీదకు తీసుకువెళ్లే మేకపిల్లకి ఉండే నిస్సహాయ పరిస్థితే నాది కూడా. అవే ఆర్తనాదాలు, అదే ఆవేదన!’ అంటూ చెప్పుకొస్తారు. పెళ్లి తర్వాత తన ఉనికి గురించి రాస్తూ- ‘జనం తమ వినోదం కోసం పక్షులని పంజరాలలో బంధిస్తారు. నేను కూడా అలాంటి పక్షినే. జీవితాంతం వరకూ ఎలాంటి స్వేచ్ఛా లేకుండా పంజరంలో ఉండి తీరాల్సిన పక్షిని!’ అని తన బాధను వెలిబుచ్చుతారు. ఇలాంటి వాక్యాలు అమర్ జీవన్ అంతటా కనిపిస్తాయి. అమర్ జీవన్ కేవలం ఒక ఆత్మకథే కాదు. తన జీవితంలోని నిస్సహాయత గురించి ఒక మహిళ నినదించిన గొంతుక. అందుకనే రససుందరీ దేవిని దేశంలోనే తొలి ఫెమినిస్ట్ రచయిత్రులలో ఒకరిగా భావిస్తూ ఉంటారు. రాససుందరీ దేవి ప్రభావం తర్వాత తరం మీద గాఢంగానే ఉంది. 20వ శతాబ్దంలో బెంగాల్ సాహిత్యం ఉవ్వెత్తున ఎగసిపడేందుకు రాససుందరీ దేవిని కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. గమనిక: తెలుగునాట వెన్నెలకంటి సుబ్బారావు అనే ఆయన రాసిన ఆత్మకథని 1873లోనే ప్రచురించారు. అయితే ఇది ఆంగ్లంలో ఉంది! - నిర్జర.  

నృత్యం

నృత్యం   మన భారతదేశంలో  శాస్త్రీయ నృత్యాలు... ఎనిమిది రకాలు... అవేమిటంటే..... ఆంధ్రప్రదేశ్ లోని ..... కూచిపూడి తమిళనాడులోని..... భరతనాట్యం ఉత్తర భారతదేశంలోని... కధక్ కేరళ లోని ......... కధాకళి ఒరిస్సాలోని ....... ఒడిస్సీ మణిపూర్.అస్సాం, బెంగాల్ లోని... మణిపురి కేరళలోని............. మోహిని అట్టం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని....పేరిణి న్రుత్యం.... తెలుసుకుందాంమా వీటి వివరాలు....   1. కూచిపూటి నృత్యం:   తెలుగు వారి అతి ప్రాచీన సాంప్రదాయ న్రుత్య రూపం కూచిపూడి. ఆంధ్రప్రదేశ్ లోని కూచిపూడి భాగవత కళాకారులచే ప్రసిద్ధి పొందినది కనక దీనికి కూచిపూడి నాట్యం అని పేరు వచ్చింది. ఈ నాట్యానికి సిద్దేంద్రయోగి పితామహులు. వీరు రచించి రూపొందించిన భామాకలాపం బాగా ప్రాచుర్యం పొందింది. ఇది సంగీత పరమైన నాటక కళ. దీనిలో అభినయం, భావప్రకటనకు ప్రాధాన్యం ఉంటుంది. గొల్లకలాపం, యక్షగాన న్రుత్యనాటికలు, జయదేవుని గీతాలు క్షేత్రయ్య పదాలు, ఉషాపరిణయం, వంటివి కూచిపూడికి చెందిన ప్రసిద్ధ నాట్య విశేషాలు. ఈనాట్యంలో ప్రసిద్ధి చెందిన వారెందరో ఉన్నారు. వేదాంతం సత్యనారాయణ, లక్ష్మీనారాయణ శాస్త్రి వెంపటి చినసత్యం, రాధారాజారెడ్డి, శోభానాయుడు, యామినీ క్రిష్ణమూర్తి మొదలైన వారెందరో ఉన్నారు....   2. భరతనాట్యం : భరతనాట్యం అనేది తమిళనాడులో బహుళ ప్రాచుర్యం పొందిన నృత్యం. భరతముని రచించిన నాట్యశాస్త్రం కనక దీనిని భరతనాట్యం.  భ... అంటే భావం... ర.... అంటే....రాగం... త.... అంటే... తాళం... ఈ మూడింటి సమన్వయమే భరతనాట్యం. దీనిని అలరింపు, వర్ణం, పదం, తిల్లాన వంటి అంశాలతో దేవాలయంలో ఎక్కువగా ప్రదర్శించేవారు. జయదేవుని అష్టపదులు, క్షేత్రయ్య పదాలు, క్రుతులు కీర్తనలు జావళీలు, తిల్లానాలు భరతనాట్య అభినయంలో తలమానికములు. భరతనాట్యంలో ప్రసిద్ధి చెందిన కళాకారులు రుక్మిణీ అరందేల్, బాలసరస్వతి, వైజయంతీమాల. యామినీ క్రిష్ణమూర్తి మ్రుణాళినీ సారాబయి, పద్మా సుబ్రహ్మణ్యం, కమలా లక్ష్మణ్ మొదలైన వారందరూ భరతనాట్యంతో అందరినీ అలరించారు.   3. కధక్ : కధక్ న్రుత్యం అనేది... ప్రసిద్ధి గాంచిన శాస్త్రీయ నృత్యరూపం. కధ చెప్పేవారిని కధక్ అని అంటారు. ఈ పదం నుంచే కధక్ అనే పేరుతో ఈ నాట్యం ప్రసిద్ధి చెందింది అంటారు. రాధాక్రిష్ణుల గాధలను ప్రధర్శించడం ద్వారా శ్రుంగార రసాన్ని అందిస్తుంది. మీరా భజనలు, టుమ్రీలు, గజల్స్ వంటి సాహిత్య ప్రక్రియలకు ఈ నాట్యాభినయం చేస్తారు.  కధక్ నాట్యంలో రెండు రీతులు, ఒకటి లక్నో ఘరాన, రెండవది జైపూర్ ఘరాన ఉంటాయి. లక్నో ఘరానలో మొగల్ సాంప్రదాయపు జైపూర్ ఘరానాలో వైష్ణవ సాంప్రదాయపు ప్రభావం ఉంటుంది. ఇలాకధక్ నాట్యకళారంగంలో ప్రసిద్ధిచెందిన కళాకారులు.. బ్రిజ్ మహరాజ్, సుందర్ ప్రసాద్, కల్కదీన్ మహారాజ్, మధుమతి, కుముదిని, గోపీక్రిష్ణ, సితారాదేవి, దమయంతోదోషి గారి లాంటి వారందరూ ఎంతగానో అలరించారు.   4. కధాకళి : కధాకళి అనేది కేరళ రాష్ట్రానికి చెందిన నృత్యం. కథ అంటే కధ, కళి అంటే ఆట.... అంటే ఒక కధను గానం చేస్తూ నృత్యం తో అభినయించటాన్ని కధాకళి అంటారు. వీరి ఆహార్యం, వస్త్రాలంకరణ, నేత్ర చలనాలు చక్కగా ఉంటాయి. రౌద్ర, వీర.భయానక భీభత్స రసాభినయంలో వీరు కడు సమర్ధులు.  ఇలా కధాకళి నాట్యరంగంలో ప్రసిద్ధులు...గురుగోపీచంద్, చంపకులం పరమపిళ్ళై, వల్లతోల్ నారాయణన్ మీనన్, ఉదయశంకర్,  నంబూద్రి గోపీనాధ్ మొదలైన వారు ఎంతగానో అలరించేవారు.   5. ఒడిస్సీ : ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ప్రాచీన నృత్య రూపం.. ఒడిస్సీ. ఓడ్ర శబ్దమునకు ఒరిస్సా శబ్దమునకు మధ్య సమన్వయ సరళ శబ్దరూపమే ఒడిస్సీ. కూచిపూడి, భరతనాట్య పోలికలతో ఉండి హావ, భావ, లయ సమన్వయంతో  ఒడిస్సీ నాట్యం ప్రదర్శింపబడుతుంది. జదయదేవుని గీతగోవిందం, అష్టపదులు ఈ నాట్యరీతిలో ప్రదర్శింపబడుతాయి. ఇలా ఒడిస్సీ నాట్యరంగంలో ప్రసిద్దులు గురుశ్రీ రవిచంద్ర కాళీచరణ్ పట్నాయక్, దేవేంద్రశతపతి, సంయుక్తా పాణిగ్రాహి,యామినీ క్రిష్ణమూర్తి, గురు పంకజ్  చరణ్ దాస్ లాంటి వారు ఎంతగానో అలరిస్తారు.    6. మణిపురి : 15 వ శతాబ్ది నుండి మణిపూర్ లో ప్రదర్శింపబడుతూ ఈశాన్య భారతదేశంలోని  అస్సాం బెంగాల్ రాష్ట్రాలలో కూడా ప్రాచుర్యం పొందిన నాట్యరూపం మణిపురి. ఇందులో ముఖ్యంగా రాధాక్రిష్ణులు గోపికల కధాంశాలు ఇతివ్రుత్తంగా తన్మయత్వంతో న్రుత్యం చేస్తారు.రకరకాల రంగుల అద్దాలతో కుట్టిన లంగాలు ధరించి శిరోజాలు శివుని జటాజూటములు లాగ దువ్వి నెత్తిపై గోపురాకారాలుగా అలంకరించుకుంటారు.  పంజ్ అనే డ్రమ్ములు మోస్తూ ప్రధర్శిస్తారు. విశ్వకవి రవీంద్రనాధుని శాంతినికేతన్ లో నాట్యానికి మెరుగులు దిద్ది కొత్త ఊపిరిపోశారు. ఈ నాట్యకళలో ప్రసిద్ధులు. ఝవేరి సోదరీమణులు, నవినా మెహతా, నిర్మలామెహతా, గురుబిను సిన్హా కళావతీదేవి, సూర్యముఖి చారుసిజ, సంఘజిత్ సింగ్, లాంటి వారు ఎంతగానో అలరిస్తారు.   7.మోహినీ అట్టం : కేరళ రాష్ట్రంలో ప్రాచుర్యం పొందిన న్రుత్యం మోహినీ అట్టం. ఇదీ భరతనాట్యం కూచిపూడి లాగే దేవదాసి సంప్రదాయం ద్వారా ప్రసిద్ధి గాంచింది. నేత్రముల చలనములతో కనుబొమ్మలు, కనురెప్పలు, ముక్కుపుటలతో వీరు అద్భుతమైన భావ ప్రకటన చేస్తూ నాట్యం చేస్తారు. వీరి ఆహార్యం,అభినయం అతిమనోహరంగా నేత్రపర్వంగా ఉంటాయి. ఈ నాట్యకళలో ప్రసిద్ధులైన వారెందరో... ఉన్నారు.. వారిలో వల్లోత్తల్ కవి, కల్యాణి అమ్మ, వైజయంతిమాల, హేమమాలిని రీటా దేవి గారు లాంటి వారు ప్రముఖులు.   8. పేరిణి నృత్యం: కాకతీయుల కాలంలో ప్రాచుర్యంలో ఉండి తరువాత మరుగున పడినది పేరిణి న్రుత్యం. దీనిని డా.నటరాజ రామక్రిష్ణ తిరిగి జీవం పోసి  ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఆయన అనేక సార్లు రామప్ప ఆలయాన్ని సందర్శించి అక్కడి శిల్పాలలోని న్రుత్య భంగిమలను పరిశీలించి తన శిష్య బ్రుందముతో పేరిణీ శివతాండవ నృత్యన్ని రూపకల్పన చేశారు.  ఇలా మన భారతదేశంలో  పలుచోట్ల సంప్రదాయ న్రుత్యాలతో కళాకారులందరినీ అలరిస్తున్నారు.

మన దేశంలోని జాతీయ భాషల వివరాలు

  ఫిబ్రవరి 21 వ తేదీ ప్రపంచ మాత్రుభాషాదినోత్సవం. ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు. బహుభాషాతనాన్ని, భాషా సాంస్క్రుతిక భిన్నత్వాన్ని గుర్తించేందుకు అవగాహన పొందేందుకు ఈరోజును ప్రపంచ మాత్రుభాషా దినోత్సవంగా జరుపుకుంటారు. ఐక్యరాజ్యసమితి సాంస్క్రుతిక విషయాల సంస్ధ యునెస్కో ఈరోజును ప్రపంచ మాత్రుభాషా దినోత్సవంగా జరుపుకోవాలని 1999 నవంబర్ 17 వ తేదీ న ప్రకటించింది. ఐరాస జనరల్ అసెంబ్లీ ఈ విషయాన్ని ద్రువీకరించి 2008ని అంతర్జాతీయ భాషా సంవత్సరంగా ప్రకటించింది. అంతర్జాతీయ మాత్రుభాషా దినోత్సవం రోజు...ప్రపంచంలోని అన్ని దేశాలలో భాషల వివరాలు తెలుసుకొనేంత సమయం అందరూ కేటాయించగలరో లేరో కనీసం మన భారతదేశంలోని 29 రాష్ట్రాలు 7 కేంద్రపాలిత ప్రాంతాలలోని భాషల వివరాలు తెలుసుకున్నా బావుంటుందన్న ఉద్దేశంతో ప్రపంచ మాత్రుభాషా దినోత్సవం సందర్భంగా మన దేశంలోని జాతీయ భాషల వివరాలు తెలియజేయాలనుకుంటున్నాం... అవి ఏమిటంటే... అస్సామీ....బెంగాలీ...గుజరాతీ.... హిందీ....కన్నడ... కాశ్మీరీ....కొంకణి.....మళయాళం...మరాఠీ.....మణిపురి.... నేపాలీ...ఒరియా...పంజాబీ.... సంస్క్రుతం...సింధీ...... తమిళం...తెలుగు...ఉర్దూ..... బోడో...సంధాలీ....డోంగ్రీ..మైధిలి..ఇవండీ మన దేశంలోని భాషలు....అందరం అన్ని భాషలు మాట్లాడలేకపోయినా.. కనీసం ఏ ప్రాంతప్రజలు ఏ భాష మాట్లాడతారన్నది తెలుసుకుంటే తర్వాత వారు మాట్లాడిన వాటికి అర్ధాలు తెలుసుకోవచ్చు...ఇంకెందుకు ఆలస్యం ప్రపంచభాషాదినోత్సవం సందర్భంగా ప్రజలంతా కొత్తభాషనేర్చుకోవటం మీద ఆసక్తి చూపించండి... ఆల్ ద బెస్ట్....

సొంతంగా పేర్చుకున్న బతుకమ్మ పాట

సొంతంగా పేర్చుకున్న బతుకమ్మ పాట   బతుకమ్మ బతుకమ్మ బతుకమ్మా   మా ఇంటికి రావమ్మ మురియెంగా (మురిపెంగా ) ఊరూ వాడా నిన్ను కొలువంగా  వీధుల్లో ఆంటీలు (పడుచులు ) నీ చుట్టూరా చేరంగా  బతుకమ్మ బతుకమ్మ బతుకమ్మా  బతుకుమ్మ బతుకమ్మ బతుకమ్మా !! ఎన్నో రంగూల పూలు తెచ్చాను నీ కోసం  గౌరమ్మ రావమ్మ .. మా ముందుకు ఊ.ఊ  పూలన్ని పేర్చాను అందాముతో  ముత్తైదువులంతా చేరి చక్కాగ  పూలు పేర్చి నాము నీ పూజ జేసేము  చక్కంగ చూడమ్మ ఓ తల్లీ గౌరమ్మ  అరచేతి గోరింట , నిండూగ గాజులు  పసుపూ , కుంకూమ తో నీకు పూజలే  చేసేము బతుకమ్మ ..మా ఊరూ , వాడ రావమ్మా  చక్కానీ వరమూలు ఇవ్వమ్మా !! పిల్లా పాపలను రక్షించు వమ్మా  బుద్ధీ జ్ఞానములను ప్రసాదించు ఓ బతుకమ్మ  కష్టాలు , బాధలు తీసేసి ఎప్పుడూ చల్లంగ చూడమ్మ మా బతుకమ్మ  పండ్లూ , నైవేద్యాలు పెట్టేము బతుకమ్మా  మంగళ హారతులు పాడేమూ గౌరమ్మా ,  నదులలో గౌరవముగా నిన్ను సాగనంపేము  మళ్ళీ వచ్చే ఏడాది దాక చక్కనీ బతుకునూ  వరముగ ఈయవమ్మ మా బతుకమ్మా  చల్లగా పోయీ రావమ్మా  నీ చల్లాని చూపులు మా యందు  ఉంచమ్మ మా తల్లీ బతుకమ్మ  బతుకమ్మ బతుకమ్మ బతుకమ్మా 🙏🙏 - దివ్య చేవూరి 

దైవం గురు రూపేణ

దైవం గురు రూపేణ     ఒక చిన్న కథ. ఓ వ్యాపారవేత్త పనిమీద బయల్దేరతాడు. కారులో రోడ్డు మీద ప్రయాణం. మధ్యలో భోజనానికని ఓ ఊరిలో ఆగుతాడు. అక్కడ ఓ చిన్న హోటల్ కనిపిస్తే అక్కడకి వెళ్తాడు.  కావల్సినవి ఆర్డర్ చేసి ఎదురుచూస్తుండగా, సడన్‌గా వెయిటర్స్, హోటల్ యజమాని అందరూ బయటకి పరిగెత్తడం చూస్తాడు. ఏమయ్యింది, ఎందుకిలా పరిగెడుతున్నారు అనుకుంటాడు. కాసేపటికి వాళ్ళంతా ముందు నడుస్తూ వెనక ఎవర్నో గౌరవంగా తీసుకురావడం చూస్తాడు. ఆ వెనక ఎవరు వస్తున్నారు? ఎందుకు వీళ్ళంతా ఇంత కంగారుగా పరిగెట్టారు? అంత వినయంగా ఎందుకు చేతులు కట్టుకుని నిల్చున్నారు... ఇలాంటి బోలెడన్ని సందేహాలతో ఆ వచ్చే వాళ్ళెవరో తెలుసుకోవాలనే ఆతృతతో లేచి నించుని తలుపు వైపు చూస్తాడు అతను.   అతనికి అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యం వేసింది. కారణం అక్కడ ఓ వృద్ధురాలు మెల్లగా నడుస్తూ వస్తోంది. ఆమె బ్యాగు, శాలువా లాంటివి పట్టుకుని ఆ హోటలు యజమాని ఆమె  పక్కనే నడుస్తున్నాడు. ఆమెని గౌరవంగా తీసుకొచ్చి ఓ టేబుల్ దగ్గర కూర్చోబెట్టాడు. ఆమెకి కావలసినవి అడిగి స్వయంగా తేవడానికి కిచెన్‌లోకి వెళ్ళాడు. పక్కనుండి వడ్డించాడు. ఆమె తింటున్నంతసేపూ ఆమెతో కబుర్లు చెబుతూ పక్కనే  చేతులు కట్టుకుని నిల్చున్నాడు. ఇదంతా చూస్తున్న వ్యాపారవేత్తకి ఆవిడ ఎవరో ఏమిటో తెలుసుకోవాలన్న తాపత్రయం కలిగింది. ఓ వెయిటర్‌ని పిలిచి ఆవిడ ఎవరు? ఎందుకు అందరూ అంత గౌరవిస్తున్నారు అని అడుగుతాడు. ఆ వెయిటర్ ఓ పదినిమిషాలు ఆగండి - ఆమెని పంపించి వచ్చి చెబుతాను అంటాడు.   ఆ తర్వాత ఆమెని కారుదాకా వెళ్ళి సాగనంపి వచ్చిన ఆ హోటల్ యజమాని వ్యాపారవేత్త దగ్గరకి వచ్చి, ఆమె ఎవరు.. ఎందుకంత గౌరవిస్తున్నామని అడిగారట కదా.. ఆమె మా టీచరు అంటాడు. అందుకు ఆ వ్యాపారవేత్త ‘‘ఓస్ టీచరా‌?’’ ఇంకెవరో అనుకున్నా అంటాడు. అదేంటి అలా తీసిపారేశారు? ఆమే లేకపోతే నేనీరోజు ఇలా వుండేవాడిని కాదు. నేనేకాదు ఎన్నోవేలమంది ఈరోజు జీవితంలో సుఖంగా, సంతోషంగా ఉన్నారంటే కారణం ఆవిడే అంటూ ఆమె గురించి చెబుతాడు.   మేం స్కూల్ ఫైనల్లో వుండగా వచ్చారీ టీచరు. మా స్కూలుకి, మా క్లాస్‌లో వుండే బ్యాచ్‌కి అల్లరి పిల్లలని, మొండి ఘటాలని పేరు. ఏ టీచర్ వచ్చి ఏం చెబుతున్నా మాకు లెక్కే లేదు. మా గోల మాది. టీచర్లంతా తెగ కొట్టేవారు, తిట్టేవారు. ఇంట్లోనూ అంతే. ఛీ, ఛాలకి అలవాటు పడిపోయాం. అలాంటిది ఈ టీచరు వచ్చిన ఓ నెల తర్వాత మమ్మల్ని ఒక్కొక్కళ్ళని పిలిచి ఒక పేపరు ఇచ్చారు. ఏంటని తీసి చూస్తే అందులో నా పట్టుదలని, హాస్య ప్రియత్వాన్నీ మెచ్చుకుంటూ రాశారు.  అలా ఎవరెవరిలో ఏవి బెస్ట్ క్వాలిటీస్ అనుకుంటున్నారో అవి రాశారు. మమ్మల్ని ఎవరైనా మెచ్చుకోవడం అన్నది అదే మొదటిసారి. మాలో మాకే తెలియని లక్షణాలని ఆ టీచరు గుర్తించారు. ఇలా ప్రతి నెలా ఓ పేపర్ మీద మాలోని మార్పులు, మాలోని మంచి గుణాలు రాసి ఇచ్చేవారు. రానురాను ఆమె రాసిచ్చే ఆ కాగితాల కోసం మేమంతా ఎదురుచూసేవాళ్ళం. మనల్ని ఎవరైనా మెచ్చుకుంటే మనకి తెలియకుండానే మని ఇంకా మెప్పుని పొందాలని ప్రయత్నిస్తాం. అదే జరిగింది మా విషయంలో కూడా.   ఇలా ఓ సంవత్సరం అయ్యేసరికి మా బ్యాచ్ అందరికీ స్కులులో మంచి పేరు వచ్చింది. మంచి మార్కులు వచ్చాయి. ఇన్ని సంవత్సరాలు అంతమంది తిట్టి, కొట్టి సాధించలేనిదాన్ని ఒక్క మెచ్చుకోలుతో ఈ టీచరు సాధించారు. మేం బయటకి వచ్చేసేరోజు మా అందరికీ ఓ బైండ్ బుక్ ఇచ్చారు. అందులో ఆ సంవత్సరంపాటు టీచర్ మాలోని లక్షణాలని మెచ్చుకుంటూ మాకిచ్చిన కాగితాలు బైండ్ చేసి వున్నాయి. ఎప్పుడూ మామీద మాకు అపనమ్మకం కలిగినా మాలోని బెస్ట్ క్వాలిటీలు ఏంటో గుర్తు చేస్తుంది ఈ పుస్తక... అంటూ టీచరు ఆరోజు మాకు చెప్పిన ఆ మాటలే, ఆ నమ్మకమే, ఆ మెచ్చుకోలే ఈరోజు మమ్మల్నందర్నీ మంచి పొజీషన్‌లో వుంచింది. ఇప్పుడు చెప్పండి.. ఆమె అంతటి గౌరవానికి అర్హురాలా.. కాదా?   నిజమే ఈరోజు మనం ఎవ్వరం ఎక్కడున్నా, ఏ స్థాయిలోవున్నా నిస్సందేహంగా దానికి కారణం మనకి విద్య నేర్పించిన ఆ గురువులే! వారి ఒక చిన్నమాట మనలో ధైర్యాన్ని, ఆశని, ఆకాంక్షని నింపి మన కలల వెంట మనం పరుగులు పెట్టేలా చేసింది. అందుకే వారికి కృతజ్ఞతలు చెప్పాల్సిన ఈ రోజున ఒక్కసారి వారందరినీ మనసారా స్మరించుకుందాం. గురుపూజోత్సవ శుభాకాంక్షలు.  - రమ ఇరగవరపు    

నిదురబోడూ కృష్ణుడూ

నిదురబోడూ కృష్ణుడూ   తెలుగునాట లాలిపాటలకు కొదవేమీ లేదు. కాలం ఎంత మారినా కూడా... జో అత్యుతానంద జోజో ముకుందా, రామ లాలీ మేఘశ్యామ లాలీ లాంటి పాటలు ఇంటింటా వినిపిస్తూనే ఉన్నాయి. అలాంటి పాటల కోవలో ఓ అరుదైన జానపదం ఇది. ఎంత నిద్రపుచ్చుతున్నా కూడా నిద్రపోకుండా మారం చేస్తున్న బిడ్డను చూసి తల్లి పాడే ఈ పాటని వినితీరాల్సిందే! విన్నాక తనివితీరా పాడుకోవాల్సిందే! నిదురబోడూ కృష్ణుడూ బెదరినాడు అయ్యో వీడు నేడు కుదురుగా ముజ్జగములు జో కొట్టి నిదురబుస్తేగాని ॥నిదురబోడూ॥ గట్టిగా విభూతి నుదుట పెట్టి చూచి సంధ్యవేళ చుట్టుగాను గొప్ప దిష్టి దీసివేసి తేనుగాని ॥నిదురబోడూ॥ తంత్రమున నేను మహి మంత్రవాదుల బిలిపించి మంత్రింపించి మొలకొక్క యంత్రము గట్టినగాని నిదురబోడూ కృష్ణుడూ బెదరినాడు అయ్యో వీడు నేడు కుదురుగా ముజ్జగములు జో కొట్టి నిదురబుస్తేగాని ॥నిదురబోడూ॥

నిదురబోడూ కృష్ణుడూ

నిదురబోడూ కృష్ణుడూ   తెలుగునాట లాలిపాటలకు కొదవేమీ లేదు. కాలం ఎంత మారినా కూడా... జో అత్యుతానంద జోజో ముకుందా, రామ లాలీ మేఘశ్యామ లాలీ లాంటి పాటలు ఇంటింటా వినిపిస్తూనే ఉన్నాయి. అలాంటి పాటల కోవలో ఓ అరుదైన జానపదం ఇది. ఎంత నిద్రపుచ్చుతున్నా కూడా నిద్రపోకుండా మారం చేస్తున్న బిడ్డను చూసి తల్లి పాడే ఈ పాటని వినితీరాల్సిందే! విన్నాక తనివితీరా పాడుకోవాల్సిందే! నిదురబోడూ కృష్ణుడూ బెదరినాడు అయ్యో వీడు నేడు కుదురుగా ముజ్జగములు జో కొట్టి నిదురబుస్తేగాని ॥నిదురబోడూ॥ గట్టిగా విభూతి నుదుట పెట్టి చూచి సంధ్యవేళ చుట్టుగాను గొప్ప దిష్టి దీసివేసి తేనుగాని ॥నిదురబోడూ॥ తంత్రమున నేను మహి మంత్రవాదుల బిలిపించి మంత్రింపించి మొలకొక్క యంత్రము గట్టినగాని నిదురబోడూ కృష్ణుడూ బెదరినాడు అయ్యో వీడు నేడు కుదురుగా ముజ్జగములు జో కొట్టి నిదురబుస్తేగాని ॥నిదురబోడూ॥

నటరాజుకు నతులు

నటరాజుకు నతులు        తన శివతాండవ కావ్యాన్ని సంగీత సాహిత్య నాట్య త్రివేణీసంగమంగా మలచేందుకు మా అయ్యగారికి స్ఫూర్తినిచ్చినది చిదంబరంలోని నటరాజ మూర్తి అని అయ్య పలు సభల్లో చెప్పేవారు. ప్రకృతిలోని ఆకాశ తత్వానికి ప్రతీకగా కొలువైన చిదంబరేశ్వరుని నాట్యానికి కూడా జగత్తు యావత్తూ ముగ్ధమౌతూనే  ఉంది. చిదంబరేశ్వరుని  తాండవ  విశేషాల గురించీ,  శివతత్వాన్ని గురించీ, కొంతైనా   తెలుసుకోవాలన్న తపన అప్పటినుంచీ ఇప్పటిదాకా నన్ను వదలని అన్వేషణే !!      చిత్ అంటే చైతన్యము. అంబరము అంటే ఆకాశము. చైతన్యాకాశంలోనికి ఆత్మ చేరుకోవటమనే అంతిమ ప్రయాణానికి సూచనగా యీ క్షేత్రం వెలసిందంటారు.            శివుని నాట్యాలు మూడు విధాలు. పరమ శివుని ప్రదోషకాల నాట్యంలో సరస్వతి వీణావాదనం చేస్తుంది. ఇంద్రుడు వేణువునందుకుంటాడు. బ్రహ్మ తాళం వేస్తాడు. లక్ష్మి గానం చేస్తుంది. విష్ణువు వాద్యం  మృదంగం. మృడానీపతి నాట్య హేలను చూసేందుకు, గంధర్వ, యక్ష, పతగ, ఉరగ, సిద్ధ, సాధ్య, విద్యాధర, అమర, అప్సరసలందరూ యీ అపురూప దృశ్యాన్ని సంబరంగా వీక్షించి తరించేందుకై కైలాసానికి తరలి వెళ్తారు.  అసలీ ప్రదోషమంటే యేమిటి? అన్న ప్రశ్నకు సమాధానం, ఇది  ఒక కాల విశేషo.  యీ సమయంలో దోషనివారణ అవుతుంది కాబట్టే యీ సమయాన్ని అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ప్రతిరోజూ సూర్యాస్తమయ వేళలో చంద్రుని కదలికల వల్ల యేర్పడేదే ప్రదోష ముహూర్తం. అంటే  సూర్యాస్తమయ వేళ యేర్పడే  తిధుల సంధి కాలంలో ప్రదోషమేర్పడుతుంది. సూర్యుడు అస్తమించటానికి ముందు మూడు ఘడియలు (ఒక ఘడియ అంటే మన పరిగణనలో, 24 నిముషాలు), తరువాత  మూడు ఘడియల కాలం,  అంటే మొత్తం ఆరు ఘడియల కాలం. ప్రత్యేకించి, ద్వాదశి వెళ్ళి త్రయోదశి  నాడు యేర్పడే ప్రదోషవేళ  మహా ప్రదోషం. దీనికి చాలా ప్రభావముంటుందట ! (జ్యోతిష్యం ప్రకారం,  కాల, దోష దంపతుల తనయుడు ప్రదోషుడు. నిషిత, వ్యుస్థ అతని సోదరులు.ఈ మూడు పేర్ల అర్థం, మొదలు, మధ్య చివర - అని..! ద్వాదశి వెళ్ళి త్రయోదశి ప్రవేశించే ఘడియలనే ప్రదోష కాలం అంటారు.)    సూర్యాస్తమయ వేళ, అర్ధనారీశ్వరునిగా, పరవశత్వంలో హిమాలయ సానువులపై, కాశీ మొదలైన దివ్య క్షేత్రాలలోనూ, శివ తాండవ హేలవతారునిగా నృత్యం చేయటముంది. . నిరాకార పరమాత్మ, ఆనందం కోసం  రూపాన్ని ధరించి, ఆనందతాండవం చేస్తాడని నృత్తరత్నావళి అంటున్నది.   ఈ నృత్యాన్ని వీక్షించేందుకు, దేవతాసమూహమంతా, కైలాసానికి  చేరుకుంటారు,   కాబట్టి ఆ సమయంలో శివార్చన చేస్తే, అందరు దేవతలనూ అర్చించిన పుణ్యం దక్కుతుంది. రెండుచేతులతో నాట్యమాడుతున్న శివునికి ప్రధాన దేవతలందరూ వాద్య, గాన  సహకారమందించే శిల్పాలు లభ్యాలు. శివుని పాదాల కింద అసురుడు మాత్రం కనిపించడు.   ఈ సమయంలో పరమేశ్వరుడుఅర్ధనారీశ్వరుడుగా మనకు దర్శనమిస్తూ,   ఒకే శరీరంలో రెండు రూపాల్ని ప్రదర్శిస్తాడు. ఆయన ఎడమవైపు పార్వతి,  రెండవ పార్శ్వమున శివుడు ఉంటారు. ఈ సమయంలో మనంఅర్ధనారీశ్వర స్వరూపాన్ని ధ్యానిస్తే మనకు రెండు ప్రయోజనాలు సిద్ధిస్తాయి.కోర్కెలను నియంత్రించగల్గటం  ఒకటి. కాలాన్ని అనగా మరణాన్ని జయించగల్గటం రెండవది. ఈ ప్రదోష కాలంలో  స్కాంద పురాణంలోని  శివ ప్రదోష స్తోత్రాన్ని పఠించటం వల్ల సకల పాపాలూ హరిస్తాయన్నది తరతరాల విశ్వాసం.   ఏనార్చయంతి గిరిశం సమయే ప్రదోషే, ఏనార్చితం శివమపి ప్రణమంతి చాన్యే, ఏతత్కథాం శృతిపుటైర్నపిబంతి మూఢా:  తే జన్మజన్మ సు భవంతి నరా: దరిద్రా: ఏవై ప్రదోష సమయే  పరమేశ్వరస్య కుర్వంత్యనన్య మనసోంఘ్రి సరోజ పూజాం, నిత్యం ప్రవృద్ధ ధన ధాన్య కళత్ర పుత్ర, సౌభాగ్యసంపదధికాస్థ ఇహైవలోకే: (2) కైలాసశైల భువనే త్రిజగజ్జనిత్రీ గౌరీం నివేశ్య కనకాంచిత రత్న పీఠే నృత్యం విధాతుమభివాంచతి శూలపాణౌ దేవాం ప్రదోష సమయేన భజంతి సర్వె. (3) వాగ్దేవీ ధృత వల్లకీ శతమఖో వేణుం దధత్ పద్మజం, స్తాలోన్నిద్రకరా రమా భగవతీ గేయ ప్రయోగాన్వితా విష్ణో: సాంద్ర మృదంగ వాదన పటు: దేవా: సమంతా స్థితా: సేవంతే తమను ప్రదోష సమయే దేవం మృడానీపతిం..(4)     గంధర్వ యక్ష పతగోరగ సిద్ధ సాధ్య  విద్యాధరామరవరాప్సరసాం గణాంశ్చ     యేన్యే త్రిలోక  నిలయా: సహ భూత వర్గా: ప్రాప్తే ప్రదోష సమయే హర పార్శ్వ సంస్థా: (5) అత: ప్రదోషే శివ ఏక యేవ  పూజ్యో ధనాన్యే హరి పద్మజాధ్యా: తస్మిన్ మహేశే  విధినేజ్యమానే విధినోజ్యమానే  సర్వే ప్రసీదంతి సురాధినాధ. (6)           నీలకంఠ దీక్షితులవారు (17 వ శతాబ్ది కి చెందిన నీలకంఠ దీక్షితులు, అప్పయ్య దీక్షితుల వంశానికి చెందినవారు, మదురై తిరుమల నాయకుల ఆస్థానంలో కొలువు.  కామాక్షీ దేవి  ఉపాసకులు. వారు చేసిన ఎన్నో రచనల్లో  యీ రచనసుప్రసిద్ధం.) తన 'ఆనంద సాగరస్తవం'లో శివలీలను వర్ణిస్తూ, ప్రదోషకాలంలో ఉమామహేశ్వర స్వరూపాన్ని ధ్యానించాలని మనకు గుర్తు చేసే ఈ శ్లోకం లో అంటారు.....                          “శ్లో!! సాధారణే స్మరజయే  నిటిలాక్షి సాధ్య                                   భాగీ శివో భజతు నామ యశః సమగ్రమ్                                వామాంఘ్రి  మాత్ర కలితే జనని త్వదీయే                                కా వా  ప్రసక్తి రపి   కాలజయే పురారే!!           ఈ శ్లోకార్థమిలా ఉంది.   ' అర్థనారీశ్వర రూపంలో మూడవ నేత్రం మీ దంపతులకిరువురకు చెందినదే. కానీ కామ సంహార మూర్తి లేక కామారి అనే బిరుదు శివునకు  మాత్రమే  చెందుతుంది. తల్లీ ! యెందుకో  నీకాఖ్యాతిని, గౌరవాన్ని తీసుకునే అవకాశం ఇవ్వబడలేదు. మీరిరువురకు ఉమ్మడియైన ఒక వస్తువువల్ల ఒక కార్యం సాధించబడితే, దానివల్ల లబ్ధమయ్యే కీర్తి గాని, పేరు గాని యిరువురికి చెందవలయుగదా?  కానీ యిక్కడ పరమేశ్వరునకే ఇవ్వబడింది.  అది అలా ఉండగా, కాలసంహారమూర్తి యనే పేరుకూడా ఆయనకే దక్కాలా? కాలుణ్ణి అనగాయముణ్ణి తన వామపాదంతో అణచాడు.   వామపాదం నీకు సంబంధించినది. అయినా ఈ కీర్తి కూడా నీకు దక్కకుండా ఆయనకే సంక్రమిస్తుంటే, ఓ పార్వతీ ఎలా మిన్నకున్నావు?”        ఈ చమత్కార రచన ద్వారా పార్వతీ పరమేశ్వరుల మధ్య స్పర్థ సృష్టించటం కవియొక్క ఉద్దేశ్యం కాదు. ఆవిధంగా భక్తుల దృష్టిని అర్థనారీశ్వరుని వైపు త్రిప్పి ప్రదోష కాలంలో ఆ రూపాన్ని నిత్యం క్రమంగా వారిచే ధ్యానింప చేయటమే కవి స౦కల్పం. భగవంతుని  యీ రూపంలో స్మరించినప్రతివాడూ కోరికలను జయించి పూర్వం కంటే సుఖతరమైన జీవితాన్ని గడపగల్గుతాడు.      ఇక రెండవది తాండవము. భైరవ లేదా వీరభద్రుని రూపంలో శివుడు,  శ్మశాన  భూమిలో తన దేవేరితో కలిసి,  యీ నాట్యంలో పదితలలతో  భయద గంభీరంగా నర్తిస్తాడు.ఎల్లోరా, ఎలిఫెంటా, భువనేశ్వర్ శిల్పాల్లో యీ నాట్య భంగిమలున్నాయి.  శైవ, శాక్త సంప్రదాయాల్లో యీ నాట్యవిస్తృత వర్ణన వున్నది.  శైవ, శాక్త సంప్రదాయాల్లో యీ నాట్య విస్తృత వర్ణన వున్నది.       ఇక చివరిది నాదాంత నాట్యం.చిదంబర సువర్ణ సభలో (విశ్వానికి కేంద్ర స్థానంగా అభివర్ణితమిది) శాస్త్రీయ రూపమైన లింగాకారంలో కాక, మానవాకారంలో సర్వాలంకార భూషితుడైన  నటరాజు, నృత్యానికి భాష్యకారునిగా దర్శనమిస్తాడు. ఇక్కడ ప్రాచుర్యంలో వున్న స్థల పురాణం కూడాఆసక్తిమంతం.ఈ ప్రాంతంలోని చెలమ చేరుకుని వున్న  తిల్లై వనాలలో (ఇప్పటి పరిభాషలో, చిక్కగా అలముకుని ఉన్న మాన్ గ్రూవ్ అడవులనవచ్చు)మంత్రశాస్త్రాన్ని  మీమాంసా శాస్త్రాన్ని ఆపోసన పట్టిన ఋషులంతా బృందాలుగా ఉండేవాళ్ళు.  భగవంతుని క్రతువులు, మంత్రాలతోనియంత్రించగలమనే అంతులేని అహంకారమున్న వారిని పరీక్షించే లీలా వినోదం కోసం సాధారణ యాచకునిగా శివుడు, ముగ్ధ మనోహర మోహినీరూపంలో విష్ణువు వెంటరాగా ఆ అడవుల్లో సంచరించటం మొదలెట్టాడు. అతని నాట్య చాతుర్యానికి తమ పత్నులు సంభ్రమానికి లోనవటంచూసిన  ఋషులు, కోపోద్రిక్తులై, ఆ మాయా యాచకునిపైకి ఒక భయంకరమైన పులిని తామే సృష్టించి పంపగా, శివుడు దాన్ని తన చిటికెన వ్రేలితో సం హరించి,దాని చర్మాన్ని ధరించాడు. ఋషుల ఆవేశం కట్టలు తెంచుకుంది.   ఒక విషం కక్కే మహా నాగమును సృష్టించి అతనిపైకి పంపగా,దాని కోరలను పీకివేసి, శివుడు మెడలో భూషణంగా ధరించాడు. ఋషులీసారి త్మ శక్తి యుక్తులంతా ధారపోసి, గర్వాన్నీ, అహాన్నీ నింపి, ముయూలకుడన్నే మరుగుజ్జు రాక్షసుణ్ణి సృష్టించి శివునిపైకి పంపగా, అతని వెన్నుపూసపై  తన పదాన్ని మోపి, కదలకుండా అణచివేసి, ఆమహాశివుడు, తన తాండవాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. అప్పుడు ఋషులకు అవగతమైంది, యీ యాచకుడు, సాధారణ యాచకుడు కాదనీ, సర్వ జగత్తునూ తన కను సన్నలలో నడిపించి నర్తింపజేసే పరమ శివుడన్న వాస్తవం. ఇతనిముందు యెంతటి  మంత్ర శాస్త్రమైనా , తంత్రవిద్యలైనా  ప్రభావ రహితాలన్న రహస్యం తేటతల్లమవగా, పాదాక్రాంతమయ్యారందరూ.          ఈ పౌరాణిక గాధ ఆధారంగా, వెలసిన తాండవ శివుని భంగిమ వర్ణనాతీతం. తల చుట్టూ విస్తరించిన జటలు,  బుసలు కొట్టే నాగ సమూహాలకూ, ఉవ్వెత్తున యెగసిపడుతున్న గంగా తరంగాలకూ ప్రతీకలు. అర్ధ చంద్రుడూ ఆ జటల్లో తొంగి చూస్తుంటాడు. కసింద పత్రముల (ఆంగ్లంలోకాసియా) దండ తల చుట్టూ ప్రకాశవంతమౌతుండగా, కుడి చెవిలో పురుషుల ఆభరణమూ ఎడమ చెవిలో స్త్రీల ఆభూషణమూ ధరించి, కంఠాభరణాలూ, భుజానికి వంకీలూ, నడుముకు వడ్డాణమూ, పదాలకు గజ్జెలూ, వ్రేళ్ళకు మెట్టెలూ ధరించి, నడుము చుట్టూ బిగుతైన దట్టీ, ఉత్తరీయమూధరించిన మూర్తి. నాలుగు చేతుల్లోని పై కుడి చేత (జీవి పుట్టుకను సూచించే) డమరుకమూ , క్రింది  చేతిలో అభయ ముద్ర, యెడమ వైపున్న చేతుల్లోని పై  చేతిలో (దుష్ట శక్తుల వినాశనానికి సూచనగా) ప్రజ్వరిల్లుతున్న అగ్ని,మరో చేయి పాదాల కింద అణచివేయబడిన అహంకారఆసురీవృత్తిని సంకేతంగా చూపిస్తూ అలరారుతుంటుంది.   మూర్తి వెనుకనున్న కాంతి వలయం(తిరువాశి)  విశ్వానికి సూచన. విశ్లేషణకు అందని మరెన్నో అంతరార్థాలున్న యీ మూర్తి,  (బ్రహ్మ, విష్ణు,  రుద్ర, మహేశ్వర, సదాశివుల కర్తవ్యాలను సూచిస్తూ) పంచకృత్యాలైన సృష్టి, స్థితి, సంహార, తిరోభావ, అనుగ్రహాలను సూచిస్తున్నది. సృష్టి స్థితి లయకారుడై, ఆదిమధ్యాంత రహితుడై, విశ్వాంతరాళాలంతటా నిండి సర్వ వ్యాప్తునిగా సకల జీవుల యోగక్షేమాలనూ మూడు కన్నులతోనూ కనిపెడుతూ, అత్యంత రహస్యాత్మక రూపంతో పరమేశ్వరునిగా అలరారుతున్న ఆ మహాకాలుడు,  మనసారా ఒక్కసారి పిలిస్తే, తనపరతత్వ రూపాన్నిసైతం మరచి, మరు నిముషంలో ప్రత్యక్షమయ్యే పరమ కరుణాళువుగా వినుతి కెక్కిన,  భక్తవశంకరుడు.  ఆతనిదయా పారీణతను వేనోళ్ళ కొనియాడిన భక్తకవులెందరో ఉన్నారు. సుందరర్, తిరునీలా కంఠరర్, అప్పర్, కన్నప్ప మొదలైన తమిళ నాయనార్లు, పాల్కురికి సోమనాధుడు, అక్కమహాదేవి, బసవేశ్వరుడు వంటి కన్నడ కవులు,శ్రీనాధుడు, ధూర్జటి వంటి తెలుగు కవులందరి రచనల్లోనూ, శివ భక్తి పరవళ్ళు తొక్కింది. వారందరి మనోమందిరాల్లో వెలసిన ఆ భర్గుని భవ్య రూపాన్ని వర్ణించాలంటే మరెన్నో గ్రంధాలను వ్రాయవలసి వస్తుంది. .        చిదంబరంలో వెలసిన నటరాజ మూర్తి  నాట్యాన్ని మనోనేత్రంతో వీక్షించి పరవశమంది,  సంగీత త్రిమూర్తులలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితులవారు,   తమ  కేదార  రాగ కీర్తనలో, చిదంబరేశ్వరుని ,భాను కోటి కోటి సదృశునిగా, భుక్తి ముక్తి ప్రద దహరాకాశ (హృదయకమలంలో ఉన్న చిదాకాశం) భూషితునిగా, దీనజన సం రక్షణచణునిగా, నవనీత హృదయ సదయునిగా  అభివర్ణించారు.  అట్టి నటేశ్వరునికి చేమోడ్పు.  .  కనుబొమల కదలికల కార్ముకమ్ములు జెదుర  వెనుదిరుగు మేఘముల వ్రేలిముద్రలు గుదుర అధరముల కదలికల యరుణోదయము విరియ మదన మథనమ్ములో మార్మికతలే గురియ కర పల్లవములందు కారుణ్యమే మురియ విరియబూసిన యటుల విరజాజి తా గురియ నటనలను దిలకించు నగజ నవ్వులు జింద  బుటుకు బుటుకని జటల 'బుణ్య' భంగిమలంద  ఆడెలే బరమాత్మ పాడులే బ్రతియాత్మ ఆడెలే బరమాత్మ పాడులే బ్రతియాత్మ   రచన డా. పుట్టపర్తి నాగపద్మిని

తెలుగు గొప్పదనానికి 9 సాక్ష్యాలు..

తెలుగు గొప్పదనానికి 9 సాక్ష్యాలు..     01 - తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం వంటి భాషలని ద్రవిడ భాషలంటారు కదా! వీటన్నింటిలోనూ ఎక్కువమంది మాట్లాడే భాష తెలుగే! దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ భాషలలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య మూడో స్థానం. ఇక ప్రపంచవ్యాప్తంగా పదిహేనవ స్థానం.   02 - తెలుగు అన్న పేరు ఎలా వచ్చిందో చెప్పడం కష్టం. కానీ దీని వెనుక రెండు వాదనలు మాత్రం స్పష్టంగా వినిపిస్తూ ఉంటాయి. కాళేశ్వరం, శ్రీశైలం, భీమేశ్వరం అనే మూడు లింగాల మధ్య ఉన్న ప్రదేశంలో వినిపించే భాష కాబట్టి, త్రిలింగ అన్న పేరు తెలుగుగా మారింది అన్నది మొదటి వాదన. తెన్‌ అంటే ద్రవిదభాషలో దక్షిణం అని అర్థం. మనం దక్షిణాన నివసిస్తాం కాబట్టి తెనుగువారం అయి ఉంటామన్నది రెండో వాదన. తేనెలూరే భాష కాబట్టి తెనుగు అయ్యిందన్నది సాహిత్య అభిమానుల నమ్మకం.   ౦౩ - తెలుగు భాష ఒకటి కాదు రెండు కాదు... దాదాపు మూడు వేల సంవత్సరాలకు పూర్వమే ఉందని అంటున్నారు. అయితే అప్పటికి అది ఇంకా అభివృద్ధి దశలో ఉండి ఉండవచ్చు. కానీ 2500 సంవత్సరాల నాటికి దాన్ని ప్రజలు విస్తృతంగా మాట్లాడుకుని ఉంటారు. అప్పటి నాణేల మీదా, కావ్యాలలోనూ తెలుగు పదాలు కనిపించడమే దీనికి ఉదాహరణ. 2,200 సంవత్సరాలకు పూర్వం హలుడు ప్రాకృత భాషలో రాసిన గాథసప్తశతిలో సైతం తెలుగు పదాలు విస్తృతంగా కనిపిస్తాయి.   04 - మహాభారతంలోనూ, రుగ్వేదంలోనూ ఆంధ్రుల ప్రసక్తి ఉన్న విషయం తెలిసిందే! భారతానికి ముందు రామాయణంలో సైతం తెలుగు ఉండే ఉంటుందని ఓ ఆలోచన. శ్రీరాముడు సీతమ్మను వెతుక్కుంటూ మన మార్గం గుండానే పయనించాడని అంటారు. ఆ సమయంలో జటాయువు పడిపోయిన చోటుని చేరుకున్నాడు. అక్కడ సీతమ్మ కోసం పోరాడి నేలకొరిగిన జటాయువుని చూసి ఆయన ‘లే పక్షి’ అన్నాడనీ... అదే తర్వాత కాలంలో లేపాక్షి అయ్యిందని ఓ నమ్మకం.   05 - తెలుగులోని ప్రతి పదమూ అచ్చుతో అంతమవుతుంది. అలా అచ్చుతో అంతమవుతుంది కాబట్టి దీన్ని అజంత భాష అంటాము. చాలా కొద్ది భాషలు మాత్రమే ఇలా అచ్చుతో అంతమవుతాయి. వాటిలో ఇటాలియన్ ఒకటి. అందుకే ఇటలీ యాత్రికుడు నికొలో మన భాషను ‘ఇటాలియన్ ఆఫ్‌ ద ఈస్ట్‌’గా అభివర్ణించాడు.   06 - మన దేశంలో తెలుగువారి సంఖ్య గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఇక ఈమధ్య కాలంలో అమెరికాకి తెలుగువారి వలసలు ఎక్కువగా సాగాయన్న విషయమూ తెలిసిందే! కానీ మలేసియా, ఫిజి, మారిషస్, సౌదీ అరేబియా, మయమ్నార్‌ వంటి దేశాల్లోనూ తెలుగువారి సంఖ్య గణనీయంగానే ఉంది. వీరే కాకుండా శ్రీలంక వంటి కొన్ని ప్రదేశాలలోని ఆదిమజాతివారు తెలుగు మాట్లాడుతున్నట్లు పరిశోధనల్లో తేలింది.   07 - తెలుగు, సంస్కృతం అంత ప్రాచీనం కాకపోవచ్చు. అక్కడ ఉద్భవించినంత సాహిత్యం ఇక్కడ పుట్టి ఉండకపోవచ్చు. కానీ తెలుగు కావ్యాలు సంస్కృతానికి ఏమాత్రం తీసిపోవు. మొదటి నుంచి చివరికి, చివరి నుంచి మొదటికి… ఎటు చదివినా ఒకేలా తలపించే కావ్యాలు; ఒకే కావ్యంతో రెండు రకాల అర్థాలను స్ఫురింపచేసే ద్వర్థి కావ్యాలు; ఒకే ఒక్క అక్షరంతో మొత్తం పద్యమే రాసేయడం… తెలుగుకి ప్రత్యేకం. ఇక తెలుగులో ఉన్నన్ని జాతీయాలు, సామెతలు మరే భాషలోనూ ఉండవని కూడా అంటారు.   08 - ఇక ప్రపంచలో సంస్కృతం, తెలుగు రెండే రెండు భాషలలో కనిపించే అవధాన ప్రక్రియ గురించి చెప్పుకోకుండా తెలుగు చరిత్ర సంపూర్ణం కాదు. ఒకప్పుడు సంస్కృతంలో కనిపించి అదృశ్యం అయిపోయిన ఈ ప్రక్రియను తెలుగు కవులు ఇంకా నిలబెట్టుకు రావడం గొప్ప విశేషం. తిరుపతి వేంకట కవుల దగ్గర నుంచి గరికపాటి నరసింహారావు వరకు అవధాన ప్రక్రియను సజీవంగా ఉంచుతూనే వస్తున్నారు. ఎనిమిది మంది దగ్గర నుంచీ వేయి మంది వరకు పృచ్ఛకుల సమస్యాలను పూరిస్తూ సాగించే ఈ అవధాన ప్రక్రియ నిషిద్ధాక్షరి, దత్తపదీయం, ఘంటానాదం వంటి సమస్యలతో మరింత జటిలంగా మారుతుంది.  ఆ సాహితీ యుద్ధంలో విజేతగా నిలిచే అవధాని తెలుగు భాష కీర్తి పతాకను మరింతగా రెపరెపలాడిస్తాడు.   09 - ఇదీ మన తెలుగు గురించి కొన్ని విశేషాలు. తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి సుందర తెలుంగు అని పొగిడినా, దేశభాషలందు తెలుగులెస్స అని రాయుడు కొలిచినా… తెలుగులోని ఈ ప్రత్యేకతలకు ముగ్థులయ్యే కదా! అలాంటి తెలుగుని సామాన్య ప్రజానీకానికి చేరువ చేసేందుకు గిడుగు రామ్మూర్తి పంతులు, సురవరం ప్రతిపరెడ్డివంటివారు చేసిన కృషి అంతా ఇంతా కాదు. గ్రంథాలలో ఉండే భాషని కాదని, అందరూ మాట్లాడుకునే వ్యవహారిక తెలుగుని ప్రచారం చేయడంలో వారు సఫలం అయ్యారు కాబట్టే… తెలుగు ఇప్పటికీ ఉజ్వలంగా వెలుగుతోంది.   - నిర్జర.

లక్ష్మిపూజ పండుగ దీపావళి పండుగ

లక్ష్మిపూజ పండుగ దీపావళి పండుగ...!     దివిటీల పండుగ టపాసుల పండుగ లక్ష్మిపూజ పండుగ దీపావళి పండుగ గడప గడప ముందర మిలమిలా మెరయగా తారావళి ద్రోలగా తారావళి వెలగగా ॥దివిటీల॥ ఇంటింటా పండుగ ఇంపైన పండుగ ఇంటిల్లిపాదికీ ఇష్టమైన పండుగ ॥దివిటీల॥ రంగురంగు మతాబూలు రమ్యమైన రజనువత్తి అంటించగ చిచ్చుబుడ్డి అవి పూలు జిమ్మగా ॥దివిటీల॥ చిన్నదైన టపాకాయ చిటికెలో పేలుతుంది అవిటె గుండెవాడినెంతో హడలగొట్టుతుందిరా ॥దివిటీల॥ తూటాలు దరణాలు ముట్టించి వదలగా తుస్సుమంటు బుస్సుమంటూ తరుముచూ వెంటపడు ॥దివిటీల॥ నరకాసురునికింక నాశనంబేనంటూ పేరచూట్లొస్తాయి బాంబులే పేల్తాయి దేశమంతా నేడు దేదీప్యమానంగా దీపాలు వెలగంగా దీపావళి వచ్చింది ॥దివిటీల॥ కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

సర్వాయి పాపన్న కథ వింటారా!

సర్వాయి పాపన్న కథ వింటారా!   దేశంలో మొగలాయి పాలనకు వ్యతిరేకంగా నిల్చిన ధీరుడు ఎవరంటే... శివాజీ పేరే చెబుతారు. కానీ శివాజీ అంతటి వీరుడు తెలంగాణలో కూడా ఉన్నాడన్న విషయం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. అతనే సర్వాయి పాపన్న. ఎప్పుడో 1650లో వరంగల్‌ జిల్లాలోని జనగాం మండంలోని ఖిలాషాపూర్‌లో జన్మించినవాడు ఈ పాపన్న. గౌడ కులస్తుడు కావడం చేత, కల్లుగీతే వృత్తిగా అతని జీవితం సాగేది. అదే సమయంలో నిజాం నవాబుల అకృత్యాలు హద్దు మీరిపోయాయి. కల్లు మీద కూడా మోయలేనంత పన్నుని విధించారు. అయినా కిమ్మనకుండా భరిస్తూ, జీవితాన్ని సాగించాడు. కానీ అనుకోకుండా ఓసారి నిజాం నవాబుల అకృత్యాలను ఎదుర్కోవాలసి వచ్చింది. ఆ సమయంలో తన కల్లు గీసే గీతకత్తే ఆయుధంగా, నిజాం సైనికుల కుత్తులను కత్తిరించాడు పాపన్న. ఇక అప్పటి నుంచి అతని జీవితమే మారిపోయింది. నిజాం నవాబుకు వ్యతిరేకంగా సైనికులను కూడగట్టాడు పాపన్న. గెరిల్లా యుద్ధతంత్రాలతో నవాబుని ముప్పుతిప్పులు పెట్టాడు. ఖిలాషాపూర్ కేంద్రంగా దాదాపు 30 ఏళ్లపాటు ఓ రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. ఆయన పాలనలో రైతులు సుభిక్షంగా, ఎలాంటి పన్నులూ లేకుండా జీవనం కొనసాగించేవారట. ఒకానొక సందర్భంలో గోల్కొండ కోటని సైతం వశపర్చుకున్నాడు పాపన్న. చివరికి మొగలాయి సైనికులకు వ్యతిరేకంగా పోరాడుతూనే వీరమరణం పొందాడు. సర్వాయి పాపన్న శివాజీకి సమాకాలీనుడు. చిన్నకులంవాడనో, చరిత్రకారులు మర్చిపోబట్టో కానీ ఆయన చరితను తెలుగు సమాజం మర్చిపోయినట్లే కనిపిస్తుంది. అయినా జానపదులు గుండెల్లో ఇప్పటికీ సర్వాయి పాపన్న వెలుగుతూనే ఉన్నాడు. నిజానికి మరుగున పడిపోయిన సర్వాయి పాపన్న చరిత్రను జానపదుల పాటల ద్వారానే చరిత్రకారులు తిరిగి వెలుగులోకి తీసుకువచ్చారు. అలాంటి పాటల్లో ఒకటి ఇదిగో... ధీరుడు వస్తాదు పాపన్నా పాపన్నా॥ రాయిడు సర్వాయి పాపన్నా పాపడొక్క పేరు చెబితే ఊరపిచ్చుక ఊరుచేరదు పొట్టిపిచ్చుక పొలం చేరదురా                                          ॥పాప॥ పుట్టినాది పులగాము పెరిగినాది తాడికొండ కులమందు గమళ్ళవాడు పేరు సరదారి పాపన్నా                                                  ॥పాప॥ తల్లికి దండాముపెట్టి అమ్మరో సర్వమ్మతల్లి నన్ను గన్నతల్లి రావే నాకు తగ్గ పనులుచెప్పవే                   ॥పాప॥ వినరా సర్దారిపాప కలవిద్యలు యెన్నిచేర్చిన కులవిద్యకు సాటిరావు ఇంకా కొన్నాళ్ళు కొడుక ఇంటి యావులు మేపమంటాది సర్వమ్మ తల్లి ఈతచెట్టే గీయమంటాది                                                 ॥పాప॥ ఈదులు గొడితే యీడిగవాడు కల్లు గొడితే గమళ్ళవాడు మొనగాడి చట్టమొచ్చునా సర్వమ్మ తల్లీ పాళెగాడి చట్టమొచ్చునా                                               ॥పాప॥ ఊరు గొడితే యేమి ఫలము పల్లెగొడితే యేమి ఫలము పడితే బందరే పడతానే సర్వమ్మ తల్లి కొడితే గోల్కొండ కొడతానే                                              ॥పాప॥ తిన్నగా తిరుచూర్ణ మద్ది పాలు అన్నం భోంచేసి పసిడిబెత్తం చేతబట్టాడోయ్‌ పాపన్నా అవత లివతల వెండికట్లు నడుమ బంగారు కట్లు డాలుబల్లెము చేతబట్టాడోయి పాపన్నా మండీబజారు కొచ్చి సోపుదారి కేకలేశాడోయ్‌                     ॥పాప॥   -నిర్జర

అన్నమయ్య భార్యా తక్కువేం కాదు!

అన్నమయ్య భార్యా తక్కువేం కాదు!     తెలుగునాట అమ్మవారి దసరా ఎంత వేడుకగా సాగుతోందో... తిరుమలేశుని బ్రహ్మోత్సవాలు కూడా అంతే ఘనంగా జరుగుతుంటాయి. తిరుమల అనగానే వేంకటేశ్వరుని వైభవంతో పాటుగా, ఆ వైభవాన్ని కొనియాడిన అన్నమాచార్యులవారూ గుర్తుకు రాక మానరు. అన్నమాచార్యునికి తెలుగునాట తొలి వాగ్గేయకారునిగా గుర్తింపు ఉంది. కానీ ఆయన భార్య తిరుమలమ్మ తెలుగులో తొలి కవయిత్రి అన్న విషయం చాలా కొద్దిమందికే తెలుసు. 15వ శతాబ్దానికి చెందిన తిరుమలమ్మ ‘సుభద్రా కళ్యాణం’ అనే ద్విపద కావ్యాన్ని రాశారు. భర్త అన్నమయ్య ప్రభావమో, తిరుమలేశుని మీద ఉన్న భక్తి భావమో కానీ తిరుమలమ్మ ఈ కావ్యాన్ని చాలా అద్భుతంగా రాశారని అంటారు. 1100లకు పైగా పాదాలతో సాగే ఈ కావ్యంలో అర్జునుడే కథానాయకుడు. కానీ ఇందులోని కథనం అంతా తెలుగునాట సాగుతున్నట్లే కనిపిస్తుంది. తెలుగువారి ఆచారాలు, సంప్రదాయాలు ఇందులో ఎదురుపడతాయి. దక్షిణాది పుణ్యక్షేత్రాలైన తిరుపతి, అహోబిళం, కంచి, కావేటి క్షేత్రాల ప్రసక్తీ ఉంటుంది. శ్రీరమావల్లభులు - శ్రీకృష్ణు లెలమి/ ద్వారకాపట్టణము - తమ రేలుచుండ/ శ్రీకాంతపతికృపను - జెలగి పాండవులు/ ప్రాకటంబుగను ద్రౌ - పదిని బెండ్లాడి/ రంతే నింద్రప్రస్థ - మను పట్టణమున/ సంతసంబున నున్న – సమయంబునందు/ సురముని యేతెంచె - సుదతి పూజించె... అంటూ పాండవులు ఇంద్రప్రస్థములో ఉన్న ఘట్టంతో ఈ కావ్యం మొదలవుతుంది. ఆ తర్వాత సుభద్ర అర్జునుల మధ్య ప్రేమ చిగురించడం, అది అనేక అడ్డంకులను దాటుకుని పరిణయానికి దారి తీయడంతో కావ్యం ముగుస్తుంది. సుభద్రా కళ్యాణం నిజంగా తిమ్మక్క (తిరుమలమ్మకు మరో పేరు) రాసినదేనా అనే విషయం మీద కొంత వాదోపవాదాలు ఉన్నాయి. అయితే కావ్యం చివరలో ‘ఆసుభద్రాదేవి - ఆ యర్జునుండు/ సంతోషమున నుండ్రి - సర్వ కాలమ్ము/ అవనిలో తాళ్ళపాకాన్నయ్య గారి/ తరుణి తిమ్మక చెప్పె - దాను సుభద్ర/ కళ్యాణ మను పాట - కడు మంచి తేట’ అంటూ సాగే ద్విపదలు, ఈ రచన తిమ్మక్కదే అని చెప్పకనే చెబుతున్నాయి. పైగా ఈ కావ్యంలో స్త్రీలకు ఇచ్చిన ప్రాధాన్యత చూస్తే, ఇది ఒక స్త్రీ చేసిన రచనే అని స్పష్టమవుతుంది. తాళ్లపాక అన్నమాచార్యులు, ఆయన భార్య తిమ్మక్కే కాదు... వారిద్దరికీ పుట్టిన నరసింహయ్య కూడా గొప్ప కవి అంటారు. ఈయన ‘కవికర్ణ రసాయనం’ అనే కావ్యాన్ని రాశాడట. ఇలా అన్నమయ్య వంశవృక్షాన్ని గమనిస్తూ పోతే చాలామంది కవులే తేలుతారు. వారికి మూలపురుషునిగా అన్నమయ్య దంపతులు కనిపిస్తారు. - నిర్జర.      

గౌరీ పూజ

గౌరీ పూజ!     ద‌స‌రా వ‌చ్చేసింది. ఎటుచూసినా అమ్మ‌వారి కొలుపులే క‌నిపిస్తున్నాయి. ఇల్ల‌యినా, ఆల‌య‌మైనా... అమ్మ‌వారి ఆరాధ‌న క‌నిపిస్తుంది. ఆ సంద‌ర్భంగా గౌరీదేవిని పూజించేందుకు జాన‌ప‌దులు పాడుకునే పాట ఒక‌టి ఇది. అమ్మ‌వారి అలంకర‌ణ‌లు, అవ‌తారాలు ఉట్టంకిస్తూ ఈ పాట సాగించ‌డం విశేషం. శ్రీ గౌరి నీపూజ చేయబూనితినమ్మ! కాపాడి మమ్మేలు కాశీపుర రాణీ శాంకరీ పార్వతీ శంభునీ రాణీ తల్లి నిన్నెపుడు ధ్యానింతునమ్మ కలహంస నడకల కదలిరావమ్మ సింహ పీఠంబున చెలియరో కూర్చుండ బంగారు చెంబుతో గంగ నీళ్ళుదెచ్చి కాంత నీ పాదాల కడిగి తడియొత్తెద అంబికా నీకిదే అర్ఘ్యంబు నిత్తును ఆకాశ గంగతో అర్పింతు తల్లి పంచామృతంబిదే పణతిరో నీకిత్తు జలజాక్షి పన్నీట జలక మాడింతు జల్తారు చీరెను శాంభవీ గైకొమ్ము అద్దాల రవికెను అంబ నీకిచ్చెద రతనాల సొమ్ములా రంజిల్లు గౌరీ అందమౌ నీమేను చందనము బూసి అక్షంత లుంచితీ అంబ నీ పాదాల పునుగు జవ్వాదితో పూజింతునమ్మ పసుపు కుంకుమబెట్టి పణతి నిన్‌ పూజింతు పూలు పత్రిబెట్టి పూజింతు గౌరమ్మ పారిజాతంబుల పార్వతీ నీకిత్తు మారేడు దళముల మాతరో నిన్‌ గొల్తు తమ్మిపూవులతోడ అమ్మ నిన్‌ పూజింతు కలువపూవుల నిన్ను కలికిరో పూజింతు సంపెంగ పూవుల ఇంపుగా పూజింతు బంతి పూవుల దెచ్చి ఇంతి నీ కర్పింతు సన్న జాజులు నీకు మిన్నుగా నిత్తు మంకెన పూవుల శాంకరీ నీకిత్తు గొనుగుపూవుల దెచ్చి కోమలీ నీకిత్తు తంగేడు పూవులా తల్లి నిన్‌ పూజింతు మల్లెపూవులు దెచ్చి మాతల్లి బూజింతు మొల పువ్వులనిన్ను పూజింతు నమ్మరో నీలకంఠుని రాణి నీ కంఠమందున ప్రేమ పూవులమాల వేసి పూజించెద సాంబ్రాణి ధూపంబు శాంకరీ నీకిత్తు దేవి నీ సన్నిధి దీపంబు వెలిగింతు సారపల్కుల పప్పు నారికేళములును నాతిరో నీకిదే నైవేద్య మిచ్చెద పార్వతీ నీకిదే పానీయమిచ్చెద శంభు రాణీ నీకు తాంబూల మిచ్చెద దాక్షాయణీ నీకు దక్షణల నిచ్చెద మానినీ గైకొమ్మ తిరిగివచ్చీ నీకు సాగిల మ్రొక్కితిని సావిత్రి దేవీ అంగనామణి నీకు మంగళా హారతి భువనేశ్వరీ నిన్ను పూజింతునమ్మ మమ్ము గాపాడుమా మాతల్లి గౌరమ్మ తప్పులన్నీ గాచి తల్లిరో మమ్మేలు జయ జయము గౌరమ్మ జయమహో తల్లి.  

దసరా పద్యం వెనుక కథ

దసరా పద్యం వెనుక కథ!   ఇప్పుడంటే గురువులకి తగినంత జీతం దక్కుతోంది. పీఆర్‌సీలు, యూజీసీ స్కేళ్ల పేరుతో పస్తులుండే బాధలు తప్పుతున్నాయి. కానీ ఒకప్పుడు పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఉపాధ్యాయులు పని చేయడానికి వీధిబడులే ఎక్కువగా కనిపించేవి. ఆ వీధిబడిలో చేరిన పిల్లల తల్లిదండ్రులు ఏదో మొక్కుబడిగా ఫీజులు చెల్లించుకునేవారు. తల్లిదండ్రులు జాలితలిస్తేనే పూట గడిచేది. ‘డబ్బులు ఇవ్వకపోతే మీ పిల్లవాడికి చదువు చెప్పను’ అంటూ గట్టిగా గదమాయించలేని పరిస్థితి. అందుకే ‘బతకలేక బడిపంతులు’ అన్న నానుడి వినిపించేది.   ఇలాంటి పరిస్థితులలో ఉపాధ్యాయులు కాస్త డబ్బుని ఆర్జించడానికి దసరా ఓ సందర్భాన్ని కల్పించేది. ఈ సమయంలో తమ బడిలోని పిల్లలందరినీ వెంటబెట్టుకొని ఇంటింటికీ తిరిగి కానుకలను తీసుకునేవారు గురువులు. పిల్లలు గిలకల పేరుతో పూల బాణాలను తీసుకుని గురువుగారి వెంబడి బయల్దేరేవారు. ఇన్ని పండుగలు ఉండగా దసరాలోనే ఇలా ఎందుకు అనేదానికి కూడా ఒక కారణం కనిపిస్తుంది. యుద్ధకౌశలానికైనా, జ్ఞానసముపార్జనకైనా అమ్మవారి అనుగ్రహం ఉండాలన్నది పెద్దల నమ్మకం. ఆ నమ్మకంతోనే దసరా సందర్భంలో యుద్ధవిద్యలను ప్రదర్శించేవారు. అలా విద్యలను ప్రదర్శించే కాలం కాస్తా చందాలు సేకరించే సమయంగా మారిపోయి ఉండవచ్చు.   ఊళ్లో గురువుగారి వెంట వెళ్లే పిల్లలు తమ ఉపాధ్యాయుడికి తగిన కానుకలు ఇమ్మంటూ రకరకాలుగా అర్ధించేవారు. వాటిలోని ‘అయ్య వారికి చాలు ఐదు వరహాలు/ పిల్ల వారికి చాలు పప్పు బెల్లాలు’ అన్న చరణం అందరికీ తెలిసిందే! ఇక మిగతా పంక్తులు చిన్నా చితకా మార్పులతో ఇలా సాగేవి.   ‘ఘనముగా కట్నము గ్రక్కున ఇచ్చి సెలవియ్యుడీ మాకు శీఘ్రంబుగాను పట్టు పచ్చడమిచ్చి పది మాడలిచ్చి గట్టి శాలువలిచ్చి కడియంబులిచ్చి అయ్యవారికి చాలు అయిదు వరహాలు పిల్లవాండ్లకు చాలు పప్పుబెల్లాలు కొబ్బరి కురిడీలు కుండబెల్లంబు’ ఇదే పద్యం మరో రూపంలో... ‘ఏ దయా మీ దయా మా మీద లేదు, ఇంత నిర్లక్ష్యమా ఇది మీకు తగదు, దసరాకు వస్తిమనీ విసవిసలు పడక చేతిలో లేదనక అప్పివ్వరనక పావలా.. .అర్ధయితే ...పట్టేది లేదు, ముప్పావలా అయితే ముట్టేది లేదు, హెచ్చు రూపాయయితే పుచ్చుకుంటాము, అయ్య వారికి చాలు ఐదు వరహాలు పిల్ల వారికి చాలు పప్పు బెల్లాలు’ ఇంతే కాదు! టక్కున డబ్బు ఇవ్వని వారి దగ్గర ఒక రకమైన పద్యాలూ, అర్ధించేవారిని చులకనగా కసురుకునేవారికి ఒకరకమైన పద్యాలు... ఇలా పిల్లు పాడే దసరా పద్యాలలో చాలా సాహిత్యమే కనిపిస్తుంది. నయానో భయానో ఎలాగొలా దక్షిణను అందుకున్న తర్వాత ‘జయీభవా...దిగ్విజయీభవా’ అని దీవిస్తూ ముందుకు సాగిపోతారు.   ఈ దసరా వేడుకలు ఇప్పుడు మచ్చుకైనా కనిపించడం లేదు. గురువుల స్థితి మెరుగుపడింది, విద్యార్థుల నామోషీ పెరిగిపోయింది. కానీ దసరా మామూలు పేరుతో ఈ సంప్రదాయాన్ని ఇతరులు మాత్రం బాగానే ఉపయోగించుకుంటున్నారు. పాలవాడు దగ్గర నుంచి పనిమనిషి దాకా ఇస్తారా చస్తారా అంటూ ‘మామూళ్ల’ని దర్జాగా పుచ్చేసుకుంటున్నారు. - నిర్జర.  

ఇంద్రకీలాద్రి

ఇంద్రకీలాద్రి!     అల్లదే ఇంద్రకీలాద్రి, ఆకసమ్ము పై కెగయబ్రాకు, నల్ల యా ప్రాతగుడిసె పార్థుడా శైలశిఖరాన పాశుపతము బడయ శివుగూర్చి ఘోరతపమ్ము జేసె! కార్యశూరత దక్కి నిర్వీర్యు లౌచు కన్నభూమాతకును కళంకమ్ము గూర్చు పరమనాస్తికులిపుడు తపఃప్రభావ మెల్ల బూటక మంచు నిందింతు రకట! ఆ నగోత్తమమున కధిష్ఠానదేవి కనకదుర్గాభవాని లోకాలతల్లి తొల్లి తన యుగ్రశక్తుల నెల్ల నొక్క బాలసన్యాసి ఘనతపోబలముకతన గోలు పడి, యొంటి నివసింప దాళలేక స్త్రీజనోచిత కోమలప్రేమ చకిత చిత్తయై, మొన్నమొన్ననే చెంత జేర విభుని మల్లికార్జునుని రప్పించుకొనియె! ప్రాతదయ్యును నా వధూవరులప్రేమ నవనవానందజనక మై భువనతతికి పరగ నిత్యకళ్యాణమున్‌ పచ్చతోర ణముగ శోభిల్లజేయు నన్నగవరమును! ఆలయము ప్రక్క కోనేరగాధమైన, దప్సరస్త్రీలు రాత్రుల నచట జలక మాడి, దేవిని పూజించి వీడినట్టి పసుపుకుంకుమ మక్షతల్‌ కుసుమములవె! ఆ కొలని చెంతనున్న గుహాంతరముల యుగములాదిగ మునివరుల్‌ యోగనిరతు లై నిమీలితలోచను లగుచు లోక సంగ్రహార్థముగ తపమ్ము సల్పుచుంద్రు! అద్రిశిఖరమ్ముపై కిరాతార్జునులు మ హాహవ మ్మొనరించిన యట్టిచోట నేటికిని చిన్నె లగుపించు వాటివలన విజయవాడ యంచు పురికి పేరు కలిగె! చుట్టు నున్నట్టి పర్వతాల్‌ పెట్టనట్టి కోటలై యొప్ప శాత్రవకోట్ల కెల్ల మిగుల దుర్భేద్యమై పండువగుచు కనుల కలరు మా విజయునివాడ, చెలిమికాడ! కాలువలు నల్గడల నలంకారములుగ  జెలగ, జలయంత్రనిర్గత జలకణాళి మౌక్తికాహారభూషిత మందిరాంగ ణోల్లసత్‌ పుష్పవల్లుల నొప్పుపురము! వారకాంతలు నివసించు వాడలందు గాన నృత్తానుకర మృదంగములదైన స్నిగ్ధగంభీరఘోషము చెవులబడిన తోడనే మేఘరవమంచు దోచు నీకు! భాగ్యవంతులు మేడల పాన్పులందు మందమతులట్లు పొరలాడుచుందు రకట! అన్నమో రామచంద్రా యటంచు నెండ నేడ్చు బీదవానికి నిల్వనీడలేదు! కాంచుమా కృష్ణవేణి, దుర్గాంబ పైడి ముక్కుపో గందుకొన పంత మూని వేగ వచ్చు నాటోపముగ పరవళ్ళతోడ చెంగలించుచు నార్చుచు భంగపడుచు! ఇంద్రకీలాద్రి కాసింత సందు నీయ కృష్ణవేణి మోమోట మింతేని లేక చీల్చి భేదించి ప్రవహించు చెచ్చెర నదె చనువునిచ్చిన నెక్కెను చంక కనగ.   (‘ఇంద్రకీలాద్రి’ ఘనతను, అక్కడి కనకదుర్గ మహత్తును వివరిస్తూ బసవరాజు అప్పారావుగారు రచించిన కావ్యమిది)