మా గోఖలే (వాస్తవ చిత్ర కధ రచయిత)

  మా గోఖలే(వాస్తవ చిత్ర కధ రచయిత) స్వచ్ఛమైన పల్లెటూరి భాష, ఎక్కడా పక్కకుపోని సజీవ పాత్ర చిత్రణ, కథకోసం ఊహల్లో విహరించని సజీవత్వం, ఆకలి, పేదరికం, చిన్నచిన్న ఆనందాలు, గ్రామాల జీవనంలోని సన్నివేశాలు కలిస్తే మాగోఖలే కథలు. సుమూరు ఒక డెబ్బై సంవత్సరాల నాటి పల్లె సీమల ప్రకృతిని, ఆ మనుషుల బతుకుల్లోని యదార్థ సంఘటనలను మనకు కథల ద్వారా చెప్పారు మా గోఖలే. చెప్పారు అనడం కంటే చూపించారు అనడం బాగా ఉంటుంది. ఎందుకంటే గొప్ప చిత్రకారుడైన మాగోఖలే. కథను చెప్పడు, చూపిస్తాడు. ఇదే అతని కథా టెక్నిక్. అవి కథలు కావు వాస్తవ చిత్రాలు. నేలబారు కథలు అని విమర్శకులు చెప్తే అవి నేలబారు కథలు కావు, ఊహల్లో తిరిగే మనిషిని కిందకు దించి నేల తల్లి గొప్పతనాన్ని రుచి చూపేవి అని ప్రముఖ కథా రచయిత పాపినేని శివశంకర్ చెప్పారు. కానీ తెలుగు కథా సాహిత్య చరిత్రలో మాగోఖలేకు రావాల్సినంత పేరు రాలేదు అన్నది మాత్రం వాస్తవం. ఎన్నో ఆణిముత్యాల్లాంటి కథలు రాసిన మాగోఖలే అసలుపేరు మాదవపెద్ది గోపాలకృష్ణ గోఖలే. గుంటూరు జిల్లా తెనాలి దగ్గరున్న బ్రాహ్మణకోడూరులో 1917లో జన్మించారు. మద్రాసులోని ఆర్ట్స్ కళాశాలలో దేవీ ప్రసాద్ రాయ్ చౌదరీ దగ్గర డ్రాయింగ్ నేర్చుకున్నాడు. కొంతకాలం ఆంధ్రపత్రిక, ప్రజాశక్తి పత్రికలలో రాజకీయ కార్టున్లు వేశారు. తర్వాత వెండితెరకు పరిచయం అయ్యారు. నాగిరెడ్డి, చక్రపాణి వీరిని 1950లలో ఆర్ట్ డైరెక్టురుగా చలన చిత్రసీమకు పరిచయం చేశారు. వీరిలోని ఆర్ట్ ఒక పార్శ్వమైతే, అతనిలోని రచనా సృజనాత్మకత మరో పార్శ్వం. 1940లలో అప్పటి ప్రజల వాడుకభాషలో మొదటి కథ "కిట్టకాలువ గట్టుకాడ" రాశారు. ఇది ఆంధ్రపత్రికలో ముద్రితమైంది. ఈ కథలోని ఇతివృత్తాన్ని, భాషను చూసి గ్రాంధికభాషా వాదులు నొచ్చుకున్నారు. అలా ప్రారంభమైన గోఖలే కథా ప్రస్తానం అనేక కథల్ని అలాంటి పల్లెటూరి వాతావరణంతోనే అలాంటి వ్యవహారిక భాషతోనే కొనసాగింది. మాగోఖలే మొత్తం 89 కథలు రాసినట్లు తెలుస్తుంది. ఈ కథలన్నీ మా గోఖలే కథల పేరుతో పుస్తకంగా వచ్చాయి. వీరు కథలతోపాటు వ్యాసాలు కూడా రాశారు. వీరి కథలన్నీ గుంటూరు జిల్లాలోని వీరి సొంతూరైన బ్రాహ్మణకోడూరు చుట్టూ ఉన్న వాతావరణంలోనే సాగుతాయి. అక్కడి మనుషుల జీవితాన్నే ప్రతిబింబిస్తాయి. గోఖలే మద్రాసు వెళ్లినా తన మూలాలనే కథలుగా రాశారు. అక్కడి మోతుబరీ రైతులు, బీదాసాదా, ముసలి వాళ్లు, పేదల ఆకలి, పశువులు, పొలాలు, కూలీలు- వారి ఆకలి బాధలు, తోలుబొమ్మలాటలు, పొలాల్లో జరిగే పనులు, పడుచుపిల్లలు... ఇలా పల్లెటూరి వాతావరణాన్ని తన కుంచెతో బొమ్మ గీసినట్లే ఉంటాయి. పాలెంలో దీపాలమాస, నుప్పు కుడుపులు, కోండాయి పక్షి, రాయి మడుసులు, కిష్టమ్మగారి పెద్ద జీతగాడు, బండిరాముడు పెళ్ళాం, రత్తికోక కట్టింది, వెంకటస్వామి పాలెం, నిస్సహాయులు, బల్లకట్టు పాపయ్య, పిప్పిదంట్లు, గూడెం పోకడ, పులి విస్త్రాకులు, మూగజీవాలు... వంటి ఎన్నో అద్భుతమైన కథలు రాశారు. ప్రతికథా ఓ సజీవచిత్రమే. వీరి కథల్లో గొడ్డకాడ బుడ్డోళ్లు, ఆకలి తీరని జీతగాళ్లు, కోటప్పకొండ తిరునాళ్ల సందళ్లు, బొమ్మలాటలు ఆడేవాళ్లు, గుక్కెడు చల్లకోసం అడుక్కునే వాళ్లు, రాళ్లు పగలగొట్టే కష్టజీవులు, ఎరుకలు, యానాదులు, అమాయకులు, నాగరికత అనే నగీషికి దూరంగా ఉండే పల్లెటూరి ప్రజలే మనకు కనిపిస్తారు. "మూగ జీవాలు" కథలో యానాది ముసలాయి పావల్డబ్బులకోసం రామయగారింట్లో నీళ్లుతోడతాడు, సుబ్బయ్యకు బెణికిన కాలు తోముతాడు కానీ డబ్బులు మాత్రం దొరకవు, శశిరేఖను పెళ్లిచేసుకుని ఉంటాడు. చిల్లరకొట్లో అప్పు పుట్టదు. చివరకు బుట్టలో మిగిలిన ఎండుచేపలే భార్యాభర్తల ఆకలి తీరుస్తాయి. "పాలెంలో తోలుబొమ్మలాట" కథలో ఎంకట సుబ్బయ్యగారి జీతగాడు సూరాయి రాత్రి తోలుబొమ్మలాట చూడడానికి పడే తిప్పలు అన్నీఇన్నీ కావు. అందుకు కారణం కామందుడంటే అతనికి ఉండే భయం. "రాయి మడుసులు" కథలో కూలి మనుషులు రక్తం చిందిస్తూ నల్లరాళ్లతో భవనాన్ని కడతారు. కానీ ఆఖరికి కూలీ అర్థరూపాయి దక్కుతుంది. గృహప్రవేశం విందులో కూడా చోటు దక్కదు. ఇలా భూస్వామ్య వ్యవస్థలో సాధారణ ప్రజల కష్టాలే వీరి కథల్లో కనిపిస్తాయి. కానీ ఎక్కడా పోరాటానికి దిగరు. పెత్తందార్ల చేతుల్లో నలిగి పోతుంటారు. ఎక్కడో ఒకటో రెండో పాత్రలు ఎదురు తిరుగుతాయి. ఇలా వాస్తవచిత్రణ చేసే గోఖలే ఎక్కడా నేల విడిచి సాముచేయడు కథాటెక్నిక్ కోసం పాకులాడడు. ఉన్నది ఉన్నట్లు సహజంగా చిత్రిస్తాడు. అణగారిన వర్గాల జీవన లోతుల్ని ఎంతగానో అర్థం చేసుకుంటే తప్ప ఇలాంటి కథలు రాయలేరు. కథలో రచయిత ప్రవేశించడు. ఉపన్యాసాలు ఇవ్వడు. అనవసరమైన వర్ణనలు చేయడు. ఒక్కో కథలో ఒక్క సన్నివేశమే కథగా మారిపోతుంది. మరో కథలో సంభాషణే కథను నడిపిస్తుంది. వీరి భాషకూడా పాత్రోచిత భాష. పూర్తిగా మాండలికం. " కిష్ణమ్మగారి పెద్దజీతగాడు" కథలో- "అరె నాయనా ఎట్టూటి కోడెగిత్తలు... సూరాయ్ కోడెగిత్తలు... గిత్తల మీన కిష్ణమ్మ సెయి వేశాడంటే ఒసి కర్రతో తన ఏటుకి పగిలిందన్నమాటే... ఇంకా నెమరేత్తా పండుకున్నారేందే లెగవండి లెగవండి ఏలయిపోతుండది - దూరపయానం జేశారు గావాల్ను కూసేపు జనపకట్టల్ని తినండి...." ఇలా సాగుతుంది. గోఖలేకు కథా రచయిత కన్నా ఆర్టు డైరెక్టరుగా మంచిపేరు ఉంది. "రైతుబిడ్డ" సినిమాకు పనిచేసిన గోఖలే... తర్వాత చక్రపాణి- నాగిరెడ్డి చిత్రాలకు పనిచేశారు. పాతాళభైరవి, గుండమ్మ కథ, మాయాబజార్ వంటి ఎన్నో చిత్రాలకు పనిచేశారు. ఎన్టీఆర్ ను కృష్ణుడిగా చూపించే మొదటి స్కెచ్ ను గోఖలే గీశారట. అలానే మాయాబజార్ చిత్రంలో ఎస్వీరంగారావు ఆహార్యం వీరిదే. పలు కోటలకు వీరు గీసిన స్కెచ్ లు బ్యాగ్రౌండ్ లో ఎంతో సహజంగా కనిపించేవి, నిజమైనట్లు ప్రేక్షకులను మాయజేసేవి. జగదేకవీరుని కథ, మాయాబజార్, పాతాళభైరవి వంటి చిత్రాల్లో వీరి స్కెచ్ లకు ఎనలేని పేరు వచ్చింది. పిల్లల పత్రిక "చందమామ"లోని "బాలనాగమ్మ" సీరియల్ కు కూడా బొమ్మలు వేశారు. ఇలా కథకునిగా. ఆర్ట్ డారెక్టరుగా పేరుపొందిన మా.గోఖలే 1981లోమరణించారు. కానీ ఇప్పటికీ 1940ల నాటి గుంటూరు జిల్లా పల్లెసీమల చరిత్రను తెలుసుకోవాలంటే వీరి కథలే ఆధారం అంటే అతిశయోక్తి కాదు. కళ - గోఖలే అని పాత సినిమాల్లో పేరు కనపడితే ఆయన ఆర్ట్ గొప్పతనం ఇట్టే తెలిసిపోతుంది. -  ఎ.రవీంద్రబాబు

తెలుగువారం అని చెప్పుకోవ‌డ‌మేనా!

తెలుగువారం అని చెప్పుకోవ‌డ‌మేనా! అభిమ‌న్యుడు త‌న త‌ల్లి గ‌ర్భంలో ఉన్నప్పుడే ప‌ద్మవ్యూహం గురించి విన్నాడ‌ని పురాణాలు చెబుతున్నాయి. అందులోకి ప్రవేశించ‌డ‌మే కానీ నిష్క్రమించ‌డం తెలియ‌క అత‌ను యుద్ధంలో ఓడిపోయాడు. పిల్లలు మాతృగ‌ర్భంలో ఉన్నప్పటి నుంచే బ‌య‌ట నుంచి వ‌చ్చే శ‌బ్దాల‌ని గ్రహించ‌గ‌లుగుతార‌ని ఇప్పటి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ బ‌య‌ట‌కి వ‌చ్చాక ఏ భాష త‌న‌దో తెలియ‌క జీవితంలో ఓడిపోతున్నారు. పిల్లవాడు త‌న త‌ల్లిదండ్రుల ద్వారా, స‌మాజం ద్వారా జ్ఞానాన్ని ప్రోదిచేసుకునే భాష మాతృభాష‌. ప‌సి మ‌న‌సులోని భావాల‌ను స్పష్టంగా చెప్పడానికీ, అనుమానాల‌ను నివృత్తి చేసుకోవ‌డానికిమాతృభాష ఎంత‌గానో దోహ‌ద‌ప‌డుతుంది. ఎవ‌రు ఎంత ఎదిగినా బాధ క‌లిగితే `అమ్మ` అనే క‌దా త‌ల్చుకునేది! పిల్లవాడి మెద‌డులో స‌హ‌జ‌సిద్ధంగా ఉన్న భాష‌లోనే అత‌ను వీలైనంత ఎక్కువ జ్ఞానాన్ని పొంద‌గ‌లుగుతాడ‌ని నివేదిక‌లు చెబుతున్నాయి. ప్రపంచంలోనే మేథావులుగా ఎన్నద‌గిన‌వారి గురించిప‌రిశోధించిన‌ప్పుడు వాళ్లంతా మాతృభాష‌లో ప్రాథ‌మిక విద్యాబ్యాసం చేశారని తేలింది. ఇంత‌కీ తెలుగుని మాతృభాష‌గా మ‌నం ఎంత‌వ‌ర‌కు గౌర‌విస్తున్నాం అంటే తెల్లమొగం వేయాల్సిందే. తెలుగుకి ఇప్పటికిప్పుడు అంత‌రించిపోయే భ‌యం ఏదీ లేదు. తెలుగు భాష ఉనికికి వ‌చ్చిన ప్రమాదమూ ఏమీ లేదు. కానీ తెలుగుని మ‌ర్చిపోతే న‌ష్టపోయేది మ‌న‌మే! ఒక భాష‌కు దూరం కావ‌డం అంటే దాని వెనుక ఉన్న ప‌ద‌సంప‌ద‌కీ, సంస్కృతికీ దూరం కావ‌డ‌మే! మేం తెలుగువారం అని చెప్పుకోలేని ప‌రిస్థితి వ‌స్తే ఇక మ‌న ఉనికికి అర్థం ఏముంటుంది? అలాగ‌ని ఇప్పటి పిల్లల‌ను ప్రపంచ‌భాష అయిన ఆంగ్లం నుంచి దూరం చేయ‌డంలో కూడా అర్థం లేదు. ఇప్పటి పిల్లల్లో అధిక‌శాతం ఎలాగూ ఆంగ్లమాధ్యమంలోనే చ‌దువుకుంటున్నారు. వారిలో చాలామంది తెలుగును ద్వితీయ‌భాష‌గా కూడా నేర్చుకోవ‌డం లేదు. ఇక విదేశాల‌లో చ‌దువుకునే పిల్లల‌కు బ‌డిలో తెలుగు అన్న ప్రస‌క్తే లేదు. అందుక‌నే తెలుగువ‌న్ కు అనుబంధంగా న‌డుస్తున్న కిడ్స్‌వ‌న్ వెబ్‌సైట్ తెలుగుపిల్లల‌కు మాతృభాష‌ను, మ‌న‌దైన సంస్కృతినీ అందించే ధ్యేయంతో సాగుతోంది. కంప్యూట‌ర్ ద్వారానే పిల్లలు పెద్దబాల‌శిక్షలోని అంశాల‌ను తెలుసుకునేలా e- పెద్దబాల‌శిక్షకు రూప‌క‌ల్పన చేసింది. తేట‌తెలుగును అంతే తేలిక‌గా నేర్చుకునేందుకు, అక్షర‌మాల‌ను ఆట‌ల రూపంలో అందించింది. క‌థ‌ల ద్వారా తెలుగుప‌దాల‌ను నేర్చుకునేలా వంద‌లాది క‌థ‌ల‌ను నిపుణుల‌చేత చెప్పించింది. తెలుగులో ఉన్నంత శ‌త‌క, ప‌ద్య సాహిత్యం మ‌రే ఇత‌ర భాష‌లోనూ లేదు. వాటిలో పిల్లల‌కు అనువైన, అవ‌శ్యమైన సాహిత్యాన్నంతా శ్రవ‌ణ‌, దృశ్యరూపాల‌లో పిల్లల‌కు అందించింది కిడ్స్‌వ‌న్‌. తెలుగును కాపాడుకోవాలి అన్న నినాదాలు ఏవీ మొద‌ల‌వ‌క‌ముందు నుంచే కిడ్స్‌వ‌న్ త‌న మాతృభాషా య‌జ్ఞాన్ని నిశ్శబ్దంగా కొనిసాగిస్తూ వ‌స్తోంది. ఇది ఎవ‌రో వ‌స్తార‌నో, గుర్తిస్తార‌నో సాగించిన శ్రమ కాదు. తెలుగుభాష‌కు, జాతికి త‌న‌వంతు బాధ్యత‌గా అందించిన చేయూత ఇది! ఇక తెలుగుసాహిత్యాన్ని చ‌దివేది ఎవ‌రు? ప్రపంచ‌స్థాయి సాహిత్యం తెలుగులో సాధ్యమేనా? అన్న ప్రశ్నల‌కు తెలుగువ‌న్ కావ‌ల్సిన‌న్ని జ‌వాబుల‌ని అందిస్తోంది. సాహిత్యానికి ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పరిచి ప‌ద్యం, గ‌ద్యం, క‌విత‌, క‌థ‌... ఇలా అన్ని ర‌కాల సాహితీసృజ‌న‌ల‌కు వేదిక‌గా నిలిచింది. నాటి ప్రసిద్ధ ర‌చ‌యిత‌ల‌ని, వారి ర‌చ‌న‌ల‌నీ ప‌రిచ‌యం చేయ‌డ‌మే కాదు. ఇప్పటి త‌రం ర‌చ‌న‌ల‌ని కూడా లక్షలాదిమందికి చేరువ చేస్తోంది. `తెలుగు సాహిత్యంలో హాస్యం` అంటూ ఏడు సంవ‌త్సరాలుగా వీక్షకుల‌ని అల‌రించినా, `చరిత్రలో ప్రబంధపరమేశ్వరుడు` వంటి భ‌క్తి సాహిత్యాన్ని పాఠ‌కుల‌కు అందించినా... అక్షరం నిలిచి ఉన్నంత‌వ‌ర‌కూ, తెలుగు సాహిత్యానికి ఢోకా లేద‌ని చెప్పక‌నే చెబుతోంది. తెలుగుని ప్రపంచ‌భాష‌గా మార్చేయాల‌ని ఎవ‌రూ కోరుకోరు. కానీ ఇల్లు అనే ఓ చిన్ని ప్రపంచంలో తెలుగుది తొలిస్థానంలో నిల‌వాల‌ని కోరుకోవ‌డం త‌ప్పేమీ కాదు క‌దా! మాతృమూర్తిని అమ్మా అని పిలిచే త‌రం, దానిని ప్రోత్సహించే పెద్దరికం ఉండాల‌ని ఆశించ‌డం నేరం కాదు క‌దా! ఇజ్రాయిల్ దేశంలో వంద‌ల సంవ‌త్సరాలుగా మ‌రగున ప‌డిపోయి ఉన్న హిబ్రూ భాష‌ను, ఆంగ్లానికి దీటుగా తీర్చిదిద్దగ‌లిగారు. అలాంటిది తెలుగును కాపాడుకోలేమా! కానీ ఇది ఎవ‌రో ఒక్కరు చేయ‌గ‌లిగేది కాదు, ఏదో ఒక్క సంస్థ సాధించ‌గ‌లిగేదీ కాదు. అందుకే ప్రపంచ‌వ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా ఒక్కతాటి మీద‌కు వ‌చ్చి, తెలుగుకు పున‌ర్వైభ‌వాన్ని తీసుకురావాల‌ని తెలుగువ‌న్ ఏళ్ల క్రిత‌మే కోరుకుంది. దుర‌దృష్టవ‌శాత్తూ, త‌మ‌కంటూ ప్రత్యేక‌మైన గుర్తింపుని కోరుకునే స్థితిలో విస్తృత‌మైన ఈ ల‌క్ష్యంలో క‌లిసి న‌డిచేందుకు ఎవ‌రూ ముందుకు రాలేదు. తెలుగుభాషా దినోత్సవం నాటి రోజునో, ఉగాదినాటి పండుగ‌నో తెలుగు గొప్పత‌నం గురించీ, తెలుగువారి సంస్కృతి గురించీ ఉప‌న్యాసం ఇచ్చినంత మాత్రాన తెలుగు వెలిగిపోదు. తెలుగు ప్రభుత్వాల‌కు తోడుగా, తెలుగుభాషోన్నతే ధ్యేయంగా ఉన్న సంస్థల‌న్నీ క‌లిసి ముందుకు సాగిన‌ప్పుడే భాషాప‌రిరక్షణ అన్న మాట‌కు అర్థం ప‌ర‌మార్థం ఏర్పడుతుంది. లేక‌పోతే మ‌రో వంద సంవ‌త్సరాలు గ‌డిచినా ఇంకా శ్రీకృష్ణదేవ‌రాయ‌ల‌వారు `దేశ‌భాష‌లందు తెలుగులెస్స` అన్నార‌నీ, సుబ్రహ్మణ్యభార‌తి `సుంద‌ర తెలుంగు` అని పొగిడాడ‌నీ వ‌ల్లెవేసుకోవ‌డ‌మే మిగిలిపోతుంది. అప్పటికి తెలుగు కూడా ఒక దేవ‌భాష‌గా మారిపోతుంది. - నిర్జర.

ఆవ‌కాయ ఉన్నంత‌వ‌ర‌కూ... తెలుగు భాషా దినోత్సవం స్పెషల్

    ఆవ‌కాయ ఉన్నంత‌వ‌ర‌కూ... తెలుగు భాషా దినోత్సవం స్పెషల్   తెలుగుభాష ప్రాచీన‌త గురించి కొత్తగా ఏం చెప్పగ‌లం!  క్రీస్తుపూర్వం 500 సంవత్సరానికి చెందిన ఐతరేయ బ్రాహ్మణంలోనే ఆంధ్రుల ప్రసక్తి ఉంది. ఇక దేశంలోనే మూడో స్థానంలో ఉన్న తెలుగువారి ప్రాముఖ్యత గురించి మ‌ళ్లీ గుర్తుంచుకోన‌వ‌స‌రమూ లేదు. కానీ తెలుగు భాషా దినోత్సవం సంద‌ర్భంగా ఓసారి అందులోని ప్రత్యేక‌త‌ను త‌ల్చుకుందాం. ఇటాలియ‌న్ ఆఫ్ ద ఈస్ట్ ఎందుకంటే:  తెలుగు భాష‌కు ఉన్న `ఇటాలియ‌న్ ఆఫ్ ద ఈస్ట్` బిరుదు స‌ర‌దాగా పుచ్చుకున్నది కాదు. మ‌న భాష అజంత‌భాష‌, అంటే ప్రతి ప‌ద‌మూ ఒక అచ్చు(అచ్+అంతము)తో ముగుస్తుంది. హిందీలో రా`మ్‌`గా ఉండే ప‌దం తెలుగులోకి వ‌చ్చేస‌రికి రాము`డు`గా మారిపోతుంది! ప్రపంచంలో, ముఖ్యంగా యూరోపియ‌న్ భాష‌ల్లో చాలావ‌ర‌కు హ‌లంతంతో ముగుస్తాయి. ఇటాలియ‌న్ వంటి కొద్ది భాష‌లు మాత్రమే అజంతంతో ముగుస్తాయి. దీన్ని గమనించే 15వ శతాబ్దములో ప్రసిద్ధ ఇటాలియన్ యాత్రికుడు నికొలో డి కాంటి తెలుగుని `ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్` అని ప్రస్తుతించాడు. తెలుగుభాష అజంత‌భాష కాబ‌ట్టి ప‌ద్యాల‌ను సైతం రాగ‌యుక్తంగా పాడుకోగ‌ల‌గ‌డం మ‌న‌కే సాధ్యం! భాష‌లో క‌లుపుగోలుత‌నం:   తెలుగువారికి క‌లుపుగోలుత‌నం ఎక్కువంటారు. ప‌రిచ‌యం క‌లిగిన కొద్ది నిమిషాల‌కే అత్తా, పిన్నీ అంటూ వ‌ర‌స‌లు క‌లిపేయ‌గ‌ల ఉదార‌త్వం మ‌నది. మ‌న భాష కూడా అంతే! అవ‌డానికి ద్రావిడ భాషా వ‌ర్గానికి చెందిన భాషే అయినా... సంస్కృతం, ఉర్దూ వంటి భాష‌ల‌లోని సౌంద‌ర్యాన్ని సైతం త‌న‌లో క‌లుపుకోగ‌లిగింది. నిజానికి మ‌నం రోజువారీ ప‌లికే ప‌దాల‌లో ఏది నిఖార్సైన తెలుగు ప‌దం, ఏది సంస్కృత ప‌దం అని విడ‌దీయ‌లేనంత‌గా ఈ క‌లివిడి ఉంది.  ఇక ముస్లిం పాల‌కుల ఏలుబ‌డిలో, ఉర్దూతో క‌లిసిమెలిసి ఉంటూనే త‌న ఉనికిని నిలుపుకొంది తెలుగు. ఆఖ‌రు, గుమాస్తా వంటి ఎన్నో ఉర్దూ ప‌దాలు తెలుగులో భాగంగా ఉండిపోయాయి. ప్రపంచ‌భాష‌ల‌లో ఇలాంటి ల‌క్షణం ఒక్క ఆంగ్లభాష‌కే ఉంది. అన్నర‌కాల ప‌ద‌శ‌బ్దాల‌నూ త‌న‌లో క‌లుపుకోవ‌డం వ‌ల్ల తెలుగుభాష‌ను మాట్లాడ‌గ‌లిగేవారు, ఏ భాష‌నైనా త్వర‌గా నేర్చుకోవ‌డ‌మే కాదు... దాన్ని స్పష్టంగా ఉచ్ఛరించ‌గ‌ల‌ర‌న్న భావ‌న కూడా ఉంది. జ‌గ‌దానంద తార‌క‌: ద‌క్షిణాదిన ఉన్న సంప్రదాయ సంగీతమే క‌ర్ణాట‌క సంగీతం. కానీ ఇందులోని ముఖ్య కృతుల‌న్నీ తెలుగులోనే క‌నిపిస్తాయి. తెలుగువారైన త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రిలను కర్ణాటక సంగీతానికి త్రిమూర్తులుగా భావిస్తారు. భాషాభిమానులైన త‌మిళురు సైతం త్యాగ‌య్య ర‌చించిన `ఘనరాగ పంచరత్నాల`ను శ్రద్ధగా ఆల‌పిస్తారు. ఇక అన్నమాచార్య‌, రామ‌దాసు వంటి భ‌క్తాగ్రేసులు ఆల‌పించిన వేలాది కీర్తన‌లల్లోని తెలుగుని వ‌ర్ణించాలంటే ప్రత్యేక నిఘంటువులు అవ‌స‌ర‌ప‌డ‌తాయి. ఈ కీర్తన‌ల్లో ఉట్టంకించి తెలుగు సోయ‌గాన్ని గుర్తించేందుకు `అన్నమ‌య్య ప‌ద‌కోశం` వంటి ఎన్నో గ్రంథాలు వ‌చ్చాయి. అవ‌ధానం: ప‌్రపంచ భాష‌ల్లో ఒక్క తెలుగు, సంస్కృత భాష‌ల్లో మాత్రమే అవ‌ధాన ప్రక్రియ సాధ్యం. విస్తృత‌మైన ప‌ద‌సంప‌ద‌తోపాటు, విల‌క్షణ‌మైన శ‌బ్దం సౌంద‌ర్యం ఉండ‌టం వ‌ల్లే ఇది సాధ్యమైంది. అవ‌ధాన‌మంటే సామాన్యమా! పురాణాలు మొద‌లుకొని ప్రబంధాల వ‌ర‌కూ పాండిత్యం ఉండాలి. సంధులు మొద‌లుకొని స‌మ‌స్యాపూర‌ణాల వ‌ర‌కూ భాష మీద ప‌ట్టు ఉండాలి. ఇన్ని ఉన్నా ఆశువుగా ప‌ద్యాల‌ను ఆల‌పించ‌గ‌ల‌గాలి. ధార‌ణ‌తో పృచ్ఛకులను మెప్పించ‌గ‌ల‌గాలి. ఫ‌లానా అక్షరం ఫ‌లానా స్థానంలో రావాలి అని నిర్దేశించినా, ఫ‌లానా అక్షరాన్ని అస‌లు వాడ‌కూడ‌దు అని నిర్భంధించినా... నెగ్గగ‌ల‌గాలి. అప్రస్తుత ప్రసంగాన్ని అప్రమ‌త్తత‌తో దాట‌గ‌ల‌గాలి. స‌చిన్ తెందూల్కర్‌ను సైతం స‌త్యదేవునితో పోల్చగ‌ల‌గాలి. ఇన్ని సాధ్యం కావాలంటే ఒక మ‌నిషి మేథ‌స్సు అత్యున్నత స్థితిలో ఉండాలి. అందుక‌నే అవ‌ధానం చేయ‌డ‌మే కాదు, దాన్ని చూడ‌టం సైతం ఒక గొప్ప సంద‌ర్భంగా భావిస్తారు తెలుగువారు. క్రికెట్ మ్యాచ్‌ల‌కు పోటీగా అవ‌ధాన ప్రక్రియ‌ను లైవ్‌లో ప్రసారం చేసి ఆనందించ‌గ‌ల భాగ్యం ఒక్క తెలుగువారికే సొంతం. అంచేత ఈ ప్రపంచంలో ఆవ‌కాయ, అవ‌ధాన‌ప్రక్రియ ఉన్నంత‌వ‌ర‌కూ తెలుగువారి ప్రభ‌కు ఢోకా లేదు!!! -నిర్జర‌.

Where The Mind Is Without Fear : The Beginning

  Where The Mind Is Without Fear: The Beginning     `Where the mind is without fear` was the poem written by Viswakavi Rabindranath Tagore. Though published as an integral part of Gitanjali, this poem stands out from the rest. This poem was written by Tagore in early 1900's. It appeared in his book `Naivedya` under the title `Parthona`. The poem would flow with these initial lines... `Chitta jethaa bhoya shoonya, vuchcha jethaa shir Jnaana jethaa mukto, jethaa gruhEr praachir` It might not be rare for someone to excel in multi languages. But it's unusual to find someone to write great poetry in both languages. Tagore was such an exception. He translated his `Chitta jethaa bhoya shoonya` into English as `Where the mind is without fear` in 1912. Tagore is known for his excellence in translating his works into subtle and perfect English. Being the original author, he could express his thought according to the structure of the other language. In such cases his translation would not look like a mere replica, but a glorified version of the original work. `Where the mind is without fear` is not just a patriotic song. Though it has inspired those generations to be `awaken into the freedom of heaven', it is a song forever. It's about... thought - reasoning - knowledge - character - divinity - destiny... and the force within a person to strive forever to acquire such traits.The first line of the poem itself has turned to be motivational quote. The Bengali version of this poem is recited not just in India but in Bangladesh as well. And the English version is often heard from every part of the world. From Abdul Kalam to Obama... it's revered and recited time and again. Though many other writers like Bezawada Gopalareddy, Tirumala Ramachandra, Gudipati Chalam has translated the poem out of passion for Tagore`s works... Tagore's own translation is considered to the best, and here it is: Where the mind is without fear and the head is held high; Where knowledge is free; Where the world has not been broken up into fragments By narrow domestic walls; Where words come out from the depth of truth; Where tireless striving stretches its arms towards perfection; Where the clear stream of reason has not lost its way Into the dreary desert sand of dead habit; Where the mind is led forward by thee Into ever-widening thought and action; Into that heaven of freedom, My Father, let my country awake. What could be the finest occasion to recite such poem and salute to the poet, than the Independence Day - Jai Hind! - Nirjara

మన భారత స్వతంత్ర జెండా!(69వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా)

మన భారత స్వతంత్ర జెండా! (69వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా) మన స్వతంత్ర భారత జెండా ! ఎగిరే వినువీధుల నిండా ! మువ్వన్నెల ముద్దుల జెండ ! మురిసే వసంతాలు నిండ ! స్వాతంత్ర్యపు ఊపిరి నిండుగ ఆగష్టిది మనకిల పండుగ ! శాంతి సౌఖ్యాలహింసలు మెండుగ కాంతి నింపు నీ పండుగ ! మన స్వతంత్ర భారత జెండా !! పింగళి కూర్చినదీ దండ ! గాంధీజీ కలలే పండ ! భరతమ్మకు మువ్వన్నె జెండా భరతావనికి అండదండ ! మాటల మతాల కూర్చి పేర్చిన సమైక్య భారత జెండా ! మన స్వతంత్ర భారత జెండా !! ఎవరే మనినా ?... ఏదేమైనా ?... మేమేమైనా ? ... మాసర్వస్వమ్మీ జెండ ! ఇది భారత త్యాగ నికేతనం ! ఇది భారత ధార్మిక కేతనం !! ఇది భరత పవిత్ర సుకేతనం !!! నవ భారత సమైక్య కేతనం !!!! మన స్వతంత్ర భారత జెండా ! ఎగిరే విను వీధుల నిండా !!..... గీత రచన : - నల్లాన్ చక్రవర్తుల వేంకట రంగనాథ్ .

స్క్రిప్ట్ సిద్దంగా ఉంది సినిమా తీయండి

  " స్క్రిప్ట్ సిద్దంగా ఉంది సినిమా తీయండి" పొత్తూరి విజయలక్ష్మి గారి రచనలు అంటేనే హాస్యానికి బ్రాండ్ నేమ్.  ఇది వారి సాహిత్యం తో పరిచయమున్న మనందరికీ తెలిసిన విషయమే. ఇది 1982  లో ఆంధ్ర భూమి లో ధరావాహికగా వచ్చింది.  సందర్భానుసారంగా సత్యమూర్తి గారు వేసిన కార్టూన్ల తో,  ఆ సీరియల్ బంపర్ హిట్.   పాఠకులు ప్రశంసలతో ఉత్తరాల వర్షం కురిపించారు.   ఆ కథనె పొత్తూరి విజయలక్ష్మి గారు ఇంకో నాలుగు హస్యకధలతో కలిపి తన తొమ్మిదో పుస్తకంగా శ్రీ రిషిక పబ్లికేషన్స్ లో ప్రచురించారు.    25-07-2015 నాడు  త్యాగరాజ గాన సభ లో లేఖిని ఆధ్వర్యంలో జరిగిన రచయిత్రి తో ముఖాముఖి కార్యక్రమం లో ఆవిష్కరించారు.        కధ విషయానికి వస్తే ఎంత సీరియస్ గా ఉండే మనుషులైనా పగలబడి నవ్వాకుండా ఉండడం అసాధ్యం.   1952  నుండి 1982 వరకు  వచ్చిన సూపర్ హిట్ సినిమాలన్నింటి  కధల సారాంశాన్ని కలిపి స్క్రిప్ట్ తయారు చేశారు.   ఇది 1982 లో రాశారు కదా, అప్పటినుండి   ఇప్పటి వరకు వచ్చిన చాలా సినిమాలు  రచయిత్రి కి చెప్పకుండా కాపీ కొట్టి సినిమాలు తీశారని నాకో అనుమానం.    1950 నుండి 2015 వరకు వచ్చిన అలాంటి చాలా సినిమాలు మనం చూసి తరించాం కదా.            "వోడఅంత  ఇంపోర్టెడ్ కారులో హీరో రావడం  తో కధ మొదలవుతుంది.   టైటిల్స్ కారు  అద్దాల పైన,   బానెట్  పైన, కాసేపు డిక్కి పైన చివరికి హీరొ మొహం పైన డిరెక్టర్  పేరు పడడంతో టైటిల్స్ ముగుస్తాయి "  అని  స్క్రిప్ట్ మొదవుతుంది.    రక్తి కట్టే లాగా కధ నడిపిస్తూ,  అవసరమైన చోట దర్శకుడికి "  డ్యూఎట్లకు చరణానికీ ఒక డ్రెస్ తప్పనిసరిగా మార్చాలి.  శక్తి ఉంటే పదానికి ఒక డ్రెస్ మార్చినా బాగానే ఉండ్‌థుంది" " కావాలి అనుకుంటే హీరోయిన్ తండ్రిని రెక్కలు విరిచి కట్టి పెట్రోలు డ్రమ్ము మీద కూర్చోబెట్టవచ్చు.   మరింత రోమాంచీతంగా ఉంటుంది."   లాంటి అమూల్యసలహా లిస్తారు(ద.ర.స.).  అట్ల్లాగే నిర్మాతలకు కూడా " కాస్త ఏడవగల హేరొయిన్ను పెట్టేస్తే నిక్షేపంలా తాను ఏడుస్తుంది.  ప్రేక్షకులను ఏడిపిస్తుంది."   "  ఏడుపు సీన్లు ఎక్కువగా ఉన్నాయి కనుక ఓ కిరసనాయిలు డబ్బాడూ గ్లీజరిన్ కొనెస్తే కలిసొస్తుంది",  " మనకు రక్తం సన్నివేశాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి గ్లీజరిన్ లాగానే పెద్ద   డ్రమ్ము ఎర్ర రంగు కొనేసుకుంటే సరిపోతుంది."   లాంటి ఉపయోగకరమైన సలహాలు ఇచ్చారు.           శాంత, శృంగార, భీభత్స,  రౌద్ర, భయానక,  హాస్య రసాల్లాంటి నవరసాలూ  దిట్టంగా దట్టించిన స్క్రిప్ట్.   సెంటిమెంటు ఉంది డ్రామా ఉంది. ఫైటింగ్ ఉంది.   టన్నుల కొద్ది డైలాగులు రాసే అవకాశం ఉంది.    సందర్భోచితమైన "  తెల్ల ఆవు వేసింది నల్ల పేడ,  ఆ క్షణమే వచ్చాను నిన్ను చూడ"  లాంటి పాటలు కూడా సూచించారు.   ఇంతకంటే ఎంకావాలి సినిమా సూపర్ హిట్ కావడానికి?          నవ్వు ఒక యోగం, నవ్వక పోవడం ఒక రోగం.   అన్న జంధ్యాల గారి మాటలు గుర్తోస్తాయి ఈ పుస్తకం చదివితే.    నేనిలా ఎంతసేపు చెప్పినా  తాలింపు ఘుమ ఘుమ లే  తప్ప అసలు  రుచి పుస్తకం చదివితేనే.          మిగిలిన నాలుగు కధలు కూడా నిండా  హాస్యమున్న కధలే.   ఆనందరావు ఆవూ కధలో  పొద్దున తాగే గుక్కెడు కాఫీ లోకి కల్తీ లేని చిక్కటి పాలు  కావాలని ఆనందరావు భార్య ఆవును కొని అతన్ని ఇబ్బందులు పెట్టడం,  అందంగా ఉన్నా భయంకరంగా పాటలు పాడే బాసుగారి కూతురిని పెళ్లి చేసుకోవలసి వస్తే,  ఉపాయంగా ఆమె పాటలు మాన్పించిన మాధవరావు(  మధురిమ కధ), " 'అన్నపూర్ణ' బ్రాండ్ అంబాసిడర్"  అనే కధా " ముకుందం " కధా అన్నిట్లో హాస్యం  మనలను పుస్తకం వదిలిపెట్టనివ్వదు.           పాఠకులకు ముఖ్య గమనిక.  వెంటనే పుస్తకం కొనండి.   లేకపోతే దొరకక పోవచ్చు.   పొత్తూరి విజయలక్ష్మి గారి పుస్తకాలు మార్కెట్ లో చాలా కొరత.         ...........Jhansi Manthena

గురు పూర్ణిమ సందర్భంగా వందనము అభివందనము వేదవ్యాసునకు

  గురు పూర్ణిమ సందర్భంగా వందనము అభివందనము  వేదవ్యాసునకు        వేదమందలి దివ్యజ్ఞానము విదులకే పరిమితము గాదని అందరికి ఆచరణ యోగ్య మ్మిందుగలదదనునట్టి ఋషికి॥ వందనమ్మభివందనం ॥. ఋక్ యజుస్సామాది ఋక్కుల నియమమున విభజించి వేదము లీయగల్గే ప్రజ్ఞగల్గిన యీ యశశ్వికి వందనమ్ము ॥వందనమ్మభివందనం॥ పరాశరుడా సత్యవతి నా తీరమునకు  జేర్పమనకుండిన ధర్మపరాయణు వేదవ్యాసుడు తరతరాలకు వరముయౌనె ?॥వందనమ్మభివందనం ॥ పురాణములను , ఉపనిషత్తుల పర హితముగ రచింప కుండిన పర సంసస్కృతియె నెత్తికెక్కగ భారత సంస్కృతి నిల్చి యుండెన ?॥వందనమ్మభి వందనం॥ వాష్ణువవతారమ్మితడె యౌ కృష్ణ ద్వైపాయనుడె వ్యాసుడు కృష్ణవర్ణమున కృష్ణుడాతడు ద్వీప భవ ద్వైపాయుం డితడు ॥వందనమ్మభివందనం ॥ ధర్మస్ధాపన కృష్ణు డాతడు ధర్మమ్మొసగిన కృష్ణుడీతడు ధర్మాధర్మ విచక్షణమ్మను మర్మ భారత విరించి యీతడు ॥వందనంమ్మభి వందనం॥           గీత రచన:— నల్లాన్ చక్రవర్తుల వేంకట రంగనాథ్

పుష్కరాల గోదావరి పద్యాలు

గోదావరి పుష్కరాల పద్యాలు ఉ!! గోస్తని దివ్య పాక పద గుంభన సుస్వర వాణి తో న భే దా స్తబక ద్విరేఫ మధు ధారల మాధురితో విరాళితో   వస్తివి పుష్కర ప్రభతో వాసవ దేవ మునీం ద్రులెల్ల తీ రి స్తుతిచేయ,గౌతమి హరించుము మాదు విచారమంతటిన్ శా!! గోక్షీరామృత ధారగన్ యలరచున్ ఘోషించు గోదావరీ..! దాక్షిణ్యంబున తల్లివై ప్రబలు ఆర్త్రత్రాణ పారాయణీ వక్షాంబోరుహ జాత నాక సుధగన్ వర్షించు దివ్యార్ద్రవా రీ..! క్షంతవ్యుల మీదనా కినుక పారెన్ ప్రాణముల్ పౌష్కరీ..! తే. గీ || గోప బాలుడు గాంచగ గోపిక పర దాలు వీడి పరువులెత్తె, తాను నదిగ, వలచె వనమాలి శరధిని, వంపు చను సి రిని గని తన సిరి యని హరి రతి జరిపె గోగు పూలు హారతులెత్త, గోరువంక దాకొని సరిగమలు పాడ, తాలమేసె వనము, గొంతుకలిపె మంద పవనము, శబ రి మనసు లయగ గోదావరిన్ స్మరించె Padmakar Guntur సీ ॥    గో మారక దురితాఘోర హరణముకై బిరబిర ధరణిన బెరసి నరుల దారుణ గరి దురిత ఝరిని పొరిచూపున పరిహరించు, ఘన రస కరుణ వర ఝరి సరసన పరి పరి పరఝరి కూరిమి పొరలిన గురు దురిత  ప రిహరణ గోరి మురిపెపు గోదావరి పూర్ణ ఝరిన జేరె పుష్కరుండు తే ॥   గోరసామృత మధుర రుచిర సుర ఝరి దాతృ మూర్తి గోదావరి, ధరణి యడర వరము తెరగున పుశ్కరుడరుగె ధరణి రిప్ర హర ఝరి జేరంగ రిప్ర హరుడు తే ॥    గోవుదానంబు నిచ్చిన గొప్ప ఫలము దారి వేసవి శుచి జల దాన ఫలము వలజ దానంబు జేసిన పాటి ఫలము రిక్త గోదారి పుష్కర సిక్త ఫలము తే ॥    గోదమందున వేరొద్ది గోరుకొనక దాతృభావంబు పొంగంగ దాన మిచ్చి వరద గోదారి పుష్కర భాసుర సుఝ రి సరస ముదిత స్నానము రిప్ర హరము Raghu Kishore Marupaka తే. గీ || గోచరించనే పుష్కర  ఘోష, దొరికె దానమిచ్చు వారికి  కడు దానఫలము వడిగ జేరె జనుల దరి భాగ్యరాశి రివ్వున ఎగసె గౌతమి రిప్రహరణి Rambabu Kaipa   ..... Telugu Velugu Samithi Infosys Hyderabad

నాన్న క్షమించకు...!

  నాన్న క్షమించకు...!                          నాన్నా...!   ఈ సృష్టి జీవన పాఠశాలలో తొలి బిందువు నువ్వు   నీ భుజాల భరోసాలో నే నిటారుగా నిల్చున్న బాల్యాన్ని   నీ పొట్టపై నా కేరింతలు అల్లరిలో నీ కోపాల తీయదనం   నా అడుగుల తచ్చాటల్లో తొలి ఊతానివి నువ్వు   నీ చిటికినేలు చుక్కానితో  మొదలైంది నా బ్రతుకు నడక   సాయంత్రాలు ఇంటికి నీవస్తుంటే నోరూరిన జ్ఞాపకం నాది   నాన్నా...!   నా ఎల్ కె జీ చదువులు నీ సంపాదనల మెట్లను ఇక్కట్లు చేశాయి   నే తరగతి మారినప్పుడల్లా నీ ఆర్థిక ఒత్తిడి అప్పులపాలయ్యేది   నా ర్యాంకుల్లో నీ కష్టాలు ఆర్ద్రంగా గొప్పులు పోయేవి   కానీ.., ఏ అర్ధరాత్రో అమ్మతో మాటల మధ్య మౌనంగా రోదించేవి   నా ఉద్యోగం కోసం నీ కళ్లు, జేబు ఆర్తిగా జాలువారాయి   అసలు, నా ప్రతి విజయంలో నీ శక్తి సన్నగిళ్లిన క్షణాలు ఎన్నో...   నాన్నా...!   నా నమ్మకానికి పునాది రాయివి నువ్వు   నా వెలుగుల మధ్య చీకటి ప్రభవు నువ్వు   నా విలాసాల తాలూకూ పేదరికం నువ్వు   నా రేపటి వర్తమానానికి కొడుకువు నువ్వు   అసలు, నాకు నేను మిగలనప్పుడు ఉండేది నువ్వే...   నాన్నా...!   వృద్ధాశ్రమాల ఆలనలో నువ్వు పొగిలిపొగిలి కుములుతుంటే...   ఓ ముసలి చేయి ఆకలితో నా ముందు ఆక్రందనతో ఊగుతుంటే...   మూడుకాళ్లతో ఏ అడ్రెస్ లేని రోడ్డుపైనో నీవు స్పృహతప్పితే...   దూరంగా వినోదాల విందుల్లో, ధనాంధులమై నిన్ను వదిలేస్తుంటే...   నాన్నా...!   నీ చిరునామాను... ఎక్కడని వెతకను..!?   రైలు పట్టాలా పైనా... తీరం తాకే అలల కడలిలోనా..   ఉరికి వేళాడే అస్తిపంజరాల్లోనా... ప్రాణాలు తీసే మందుల్లోనా..   అసలు... మృగ్యమైన కొడుకుల మానవత్వంలోనా...                క్షమించకు నాన్నా... క్షమించకు...                నాన్నను చూడని ఈ నాన్నలను...  - డా. ఎ.రవీంద్రబాబు

పందిలి కింద

  పందిలి కింద బందా కనకలింగేశ్వరరావు నాటక ప్రదర్శనే వృత్తిగా జీవించారు. స్వయంగా ప్రభాత్ థియేటర్ స్థాపించి ఎందరో నటులకు శిక్షణ ఇచ్చారు. కూచిపూడి గ్రామంలో సిద్ధేశ్వర క్షేత్రాన్ని స్థాపించారు. తొలితరం విడుదలైన సినిమాలలో నటించారు. ఇవన్నీ కనకలింగేశ్వరరావులో ఒక వైపు మాత్రమే. రచన ఆయనలోని మరో వైపును మనకు పరిచయం చేస్తుంది. కథలు, గేయాలు రాశారు. బళ్లారి రాఘవ లాంటి సుప్రసిద్ధ నటులు వీరిని తన వారసునిగా చెప్పుకున్నారు. కనకలింగేశ్వరరావు రచనలు ఆహ్లాదంగా, ఆనందంగా సాగుతాయి. మనం మర్చిపోతున్న, వదిలేస్తున్న కౌటంబిక సంబంధాల్లోని మానవీయతను గుర్తు చేస్తాయి. వీరి పందిలికింద కథ ఇందుకు ఓ మంచి ఉదాహరణ.           పందిలి కింద కథ ఇంటి వర్ణనతో ప్రారంభమవుతుంది. ఇంటి వెనక తాటి చెట్లు,   ఉత్తరంగా పశువుల దొడ్డి, పిల్లి కూనలు... అన్నిటిని మించి ఇంటినిండా సందడి. ఇక ఆఇంట్లో మనుషుల విషయానికి వస్తే- నలుగురు ఆడపిల్లలు, రచయిత, వాళ్ల అన్నయ్య. వీళ్లందరితో నిండిన తన ఇంటి వాతావరణాన్ని రచయిత పెద్దవాడయ్యాక కాలక్షేపం లేక గుర్తు చేసుకుంటాడు.             గంపెడు పిల్లలతో ఇల్లు కళకళలాడుతూ ఉండేది. అందరికంటే పెద్దది రచయిత అక్క సత్తెప్ప. ఆమెకు ఇద్దరు పిల్లలు. ఇంట్లోని పిల్లలు గోవిందనామాలు చదువుతుండే వాళ్లు. పుస్తకాలు మాత్రమే ఉండే ఆ ఇంట్లో కాళింది మర్దనను రచయిత కూడా చదివేవాడు. వేసవి రోజుల్లో సత్తెప్ప సాధారణంగా ఇంటికి వచ్చేది. ఆమెతోపాటు, కిష్టిగాడు, అమ్మాణి కూడా వచ్చేవాళ్లు. కిష్టిగాడు చేసే అల్లరికి అంతూపొంతూ ఉండేది కాదు. సత్తెప్ప వస్తే ఊళ్లో వాళ్లందరికీ పండుగే. ఆమె చిన్నపిల్లలను అదుపాజ్ఞలలో ఉంచేది. పనులన్నీ చేసేది. పెత్తనం కూడా చెలాయించేది. సంకురాత్రి ముగ్గులు వేసేది. తప్పాళాబిల్లలు వండేది. పిల్లలు వేసిన ముగ్గులు చూసి ఆమే పాస్ చెయ్యాలి. చివరకు చిన్నవాడైన రచయిత వేసుకునే నిక్కరు కూడా ఆమె చేత్తో కుట్టేది. చద్ది అన్నాల నుంచి పక్కమంచాల వరకు, అంతా సత్తెప్ప పెత్తనమే....          పిల్లలందరిని కంచాలు పరిచి వరసగా అన్నాలు పెట్టేది. పప్పుపులుసు, ఉల్లిపాయ కారం, వెన్నపూస మీగడ... అన్నీ ఉండేవి. కానీ సత్తెప్ప తెలివి తేటలు కిష్టిగాడి ముందు పనికొచ్చేవి కాదు. ప్రాణం పోయేలా విసిగించేవాడు. రచయిత వెన్నపూస అడిగితే సత్తెప్ప పెట్టకపోయినా, వాళ్లమ్మ మజ్జిగ చిలుకుతూ తెెచ్చి వెన్న పెట్టేది. అత్తా కూతుళ్ల సరసం అమితంగా ఉండేది. అమ్మాణి కూడా అణకువగా ఉండేది కాదు.కిష్టిగాడితో కలిసి మామిడి పండ్లకోసం పోట్లాటకు దిగేది. ముసలమ్మ మాత్రం ఈ వయసులో నాకు ప్రణయగాథలు, వింతకథలు తలనొప్పి అంటూ ఉండేది. సత్తెప్పకు తగిన పిల్లలు పుట్టారు అనేది. ఎవరన్నా తప్పు చేస్తే మొట్టు మొట్టితే గిద్దెడు మిరియాలు రాలాలి అనేది.         కిష్టిగాడికి లేగదూలతో ఆడుకోవడం ఇష్టం. రచయిత వాళ్లమ్మ ఆదెమ్మకు పాడి చేయడం ఇష్టం. సత్తెప్పకు సీతాకళ్యాణం కంటతా వచ్చినా అందరూ బతిమాలితేనే పాడేది. అది, రాత్రుళ్లు మాత్రమే పాడేది. రచయిత వాళ్లమ్మ కూడా మజ్జిగ చిలుకుతూ గుమ్మాడేడే కన్నతల్లీ అని పాడేది. అవి వింటూంటే చెవులకు హాయిగా మనసుకు ఇంపుగా ఉండేవట. పందిట్లో అందరూ కూర్చొని ఉంటే అమ్మాణి గోవిందనామాలు చదువుతుంది. కిష్టిగాడు లేగదూడకు గంగిరెద్దు ట్రైనింగ్ ఇస్తున్నాడు. అమ్మాణి-  కౌశల్య, గోవిందా రామ అంటే పోటీగా కిష్టిగాడు- ఆదెమ్మగారికి గోవిందరామ, ఆవుల్లు లేవంట గోవింద రామ అన్నాడు. అలా పందిట్లో ఉన్న అందరినీ కిష్టిగాడు ఆటపట్టిస్తుంటే నవ్వుతూ ఉన్నారు. చివరకు కిష్టిగాడు- గంగిరెద్దుకు ధాన్యం వద్దు, వస్త్రాలు వద్దు, మామయ్య కూతురు కావాలి అంటే, రచయిత వాళ్ల అమ్మ, గంగిరెద్దుల వాడికి పిల్లనెవరు ఇస్తారు అని నవ్వింది. దాంతో అందరూ  ఆనందంగా నవ్వుకున్నారు.        ఇలా రచయిత తన చిన్ననాటి సంగతులను, పందిలి కింద కలబోసుకున్న అనుభూతులను, మానవీయ దృశ్యాలను కథలో చెప్తాడు. రోజులు మారిపోయాయి, బంధాలు, అనుబంధాల మధ్య దూరం పెరిగిపోయింది. ఇలా రచయిత మౌనిలా మారిపోవడంతో ఆ ఊసులలో కిష్టిగాడ్ని, అమ్మాణిని, శ్యామలను చూద్దామా అనుకోవడంతో కథ ముగుస్తుంది.          ఈ కథంతా జ్ఞాపకాల కలపోత. ఎంతో నైపుణ్యంతో బందా కనలింగేశ్వరరావు వాటిని దారంతో అల్లారు. ముద్దు పేర్లు, అల్లరి, చుట్టాలతో కలిసిమెలిసి జీవించడం, గడ్డ పెరుగు, పాలమీద మీగడ, పాటలు, పద్యాలు... స్త్రీల మధ్య అన్యోన్యం అన్నింటిని కథలో పొదిగారు. వీటితోపాటు- మొగ మొండాకొడుకు ఒకడికంటే ఎక్కువెందుకు పోనిస్తూ, పేరు ఒకటైతే మాత్రం బుద్ధులు ఒకటవాలని ఏ శాస్త్రంలో లేదు, నీ అబ్బాయి నీకు ముద్దు మా అబ్బాయి నాకు ముద్దు... లాంటి సామెతలు ఈ కథకు మరింత మెరుగు తెచ్చాయి. అలానే ఆ రోజుల్లో స్త్రీలు పాడుకునే గోవింద నామాలు, కాళింది మర్దన వంటి పాటలతో పాటు, గుమ్మాడేడే గోపీతల్లి వంటి జానపద పాటల ప్రస్తావన కూడా తెచ్చాడు రచయిత. స్త్రీల జీవితంలో భాగమై పోయిన సాహిత్యం ఎంతో గొప్పది. కథ చివరిలో ఆ రోజుల్లో అనుభవించిన సంతోషాన్ని గుర్తు చేసుకుంటూ రచయిత బాధపడడం, నేనొక వ్యర్థుడనైనాను అని చిన్నపిల్లాడిలా కంటనీరు పెట్టుకోవడం కథ ముగింపుకు అందాన్ని తెచ్చింది. కథా వస్తువుకు బలాన్నీ చేకూర్చింది. అందుకే ఈ కథ చదివితే బాగా ఊరిన ఆవకాయ రుచి మన మనసుకు తప్పకుండా కలుగుతుంది. - డా. ఎ.రవీంద్రబాబు

అక్షర తపస్వి దాశరథి రంగాచార్య

  అక్షర తపస్వి దాశరథి రంగాచార్య                                                  ప్రజా ఉద్యమంలో పుట్టి పురాణాలను, వేదాలను అన్వేషించి సామాన్యులకు అందించిన అక్షర తపస్వి. మార్గం ఏదైనా సంపూర్ణ మానవుని దర్శించాలని జీవనఉద్యమాన్ని, సాహిత్య ఉద్యమాన్ని సాగించిన తెలంగాణ పోరుబిడ్డ. మానవునిలో సహజంగా ఉండాల్సిన ప్రేమ, కారుణ్యం, జాలి, దయ లాంటి ఉత్తమ గుణాలకోసం రచనలు చేసిన వ్యక్తి. ఆయన రచనలే కాదు, జీవితం కూడా విలక్షణంగా సాగింది. ఆయనే ప్రముఖ రచయిత దాశరథి రంగాచార్య.          రంగాచార్య వారిది ఒకప్పటి నిజాం రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో ఉన్న చినగూడూరు. వేంకటాచార్య, వేంకటమ్మలకు దాశరథి 1928, జూలై 24న జన్మించాడు. చిన్ననాడే గడీల్లో దొరల అకృత్యాలను పసికట్టాడు. బానిస బతుకుల్ని, ఆడబాపల అసహాయతల్ని కళ్లారా చూశాడు. వారి కుటుంబం తర్వాత ఖమ్మానికి వచ్చింది. చిన్నప్పుడు ఆరో తరగతి చదువుకునే రోజుల్లో నిజాం ప్రవేశపెట్టిన యూనిఫారం కు వ్యతిరేకంగా విద్యార్థులను కూడగట్టి సమ్మెకు దిగాడు దాశరథి. దాంతో అతనికి నిజాం రాష్ట్రంలో విద్య లేకుండా పోయింది. నాటి గ్రంథాలయోద్యమంలో పాల్గొన్నాడు. తర్వాత రంగాచార్య 17వ ఏటనే నిజాం వ్యతిరేకపోరాటం పాల్గొని అరెస్టయ్యాడు. స్వయం కృషితో చదవి బి.ఎ. పూర్తి చేశాడు. ఉపాధ్యయుడిగా ఉద్యోగజీవితాన్ని ప్రారంభించాడు. 1956 తర్వాత హైదరాబాదులోని మున్సిపల్ కార్పోరేషన్ లో ఉన్నతోద్యోగిగా పనిచేసి విరమణ పొందాడు. రంగాచార్య అన్న కృష్ణమాచార్య ప్రముఖ కవి. నిజాంను ఎదిరించి నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చాటిన కవి.            రంగాచార్య సంస్కృతం, తెలుగు, ఆంగ్లం, హిందీ, ఉర్ధూ భాషల్లో ప్రవీణుడు. కథ, కవిత, నవల, జీవిత చరిత్ర, విమర్శ, అనువాదాలలో విశేష కృషి చేశారు. తెలంగాణ జన జీవితాన్ని రచనలుగా మలచారు. చారిత్రక వాస్తవ పరిస్థితులకు వీరి రచనలు ఛాయాచిత్రాలు లాంటివి. 73 ఏళ్ల వయసులో మూడు ఇతిహాసాలను, నాలుగు వేదాలను సంస్కృతం నుంచి వచన తెలుగులోకి అనువదించిన ఘనుడు రంగాచార్య. 1963లో శ్రీ మద్రామయణముతో ప్రారంభమైన వీరి రచనా వ్యాసంగం ఎన్నో విలువైన సాహితీ రత్నాలను తెలుగు వారికి అందించింది. చిల్లరదేవుళ్లు, మోదుగపూలు, జనపదం, పావని నవలలు తెలంగాణ చరిత్రకు నిలువెత్తి సాక్ష్యాలు. రానున్నది ఏదినిజం, శరతల్పం, దేవదాసు ఉత్తరాలు, బుద్ధ భానుడు, రణభేరి వీరి సాహితీ విలక్షణకు దార్శనికాలు. చతుర్వేద సంహిత, అమృతోపనిషత్తు, అమృతంగమయ, శ్రీ శంకర చరితామృతం భారతీయ తాత్విక చిత్రన తెలిపే భాష్యాలు. ఇక జీవనయానం వీరి జీవిత చరిత్ర లాంటిది. సుమారు 76 ఏళ్ల వయసులో అమృతంగమయ నవలను పూర్తి చేశారంటే వీరి సాహిత్యపిపాస ఎలాంటిదో అవగతం అవుతోంది.              అభిమానులు, సాహితీ సంస్థల వాళ్లు వీరి కృషికి ఘనసత్కారాలు చేశారు. గోపీచంద్ అవార్డు, గుప్తా ఫౌండేషన్ అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయం వారి విశిష్ట పురస్కారం వీరికి వచ్చిన అవార్డులలో మచ్చుతునకలు మాత్రమే. యువకళావాహిని అక్షర వాచస్పతి బిరుదు నిచ్చింది. నేడు రంగాచార్య అక్షర వాచస్పతిగా వెలుగులీనుతున్నారు. వీరి రచనలపై పలు విశ్వవిద్యాలయాలలో పరిశోధనలు జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి.             ఒకవైపు ఆధ్యాత్మిక మార్గాన్ని, విప్లవ పంథాని రెండూ రెండు కళ్లగా స్వీకరించిన దాశరథి జీవన ప్రస్థానంలో ఎన్నో మలుపులు. మరెన్నో మైలురాళ్లు. నేటి రచయితలకు, యువకులకు జీవిత పాఠాలు. మానవీయతను ఆవిష్కరించే రచనా నిధులు. ఇన్ని విలువైన అరుదైన జ్ఞాప‌కాల్నీ వ‌దిలి వెళ్లిపోయిన దాశరథి రంగాచార్య ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని మ‌న‌సారా కోరుకొంటూ..తెలుగువన్ నివాళులర్పిస్తుంది.   - డా.ఎ. రవీంద్రబాబు  

సాహిత్యానికి వేగుచుక్క

సాహిత్యానికి వేగుచుక్క   కందుకూరి వీరేశలింగం పంతులు   తెలుగు సమాజానికి, సాహిత్యానికి వేగుచుక్క కందుకూరి వీరేశలింగం పంతులు. భవిష్యత్ సమాజాన్ని ఊహించిన క్రాంతదర్శి. సంఘసంస్కరణకు గొప్ప కృషి చేసిన మార్గదర్శి. తెలుగు సాహిత్యంలో అనేక ఆధునిక ప్రక్రియలకు ఆద్యుడు. మాటల్తో కాదు, చేతల్తో సైతం కార్యరంగంలోకి దిగి అనేక సంఘసంస్కరణ కార్యక్రమాలు స్వయంగా చేపట్టిన ఘనుడు. అందుకే ఆధునిక సాహిత్యంలో ఆయన స్థానం విశిష్టమైంది. తెలుగులో ఆధునిక యగ ఆరంభానికి వీరు సుప్రభాత గీతాన్ని ఆలపించారని నిస్సందేహంగా చెప్పొచ్చు.            కందుకూరి వారి కుటుంబం సంప్రదాయాలకు నిలయం. అలాంటి కుటుంబంలో ఏప్రిల్ 16, 1848న జన్మించారు వీరేశలింగం పంతులు. తల్లి పున్నమ్మ, తండ్రి సుబ్బారాయుడు. వీధిబడిలో చదువుకున్న వీరేశలింగం సర్వకళాశాల పరీక్ష పాసై 1871లో రాజమహేంద్రవరం (రాజమండ్రి)లో దొరవారి మండల పాఠశాలలో ఉపాధ్యాయవృత్తిలో చేరారు. ఆ తర్వాత కోరంగిలో ఆంగ్ల పాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగా కూడా పనిచేశారు. 1876లో రాజమహేంద్రవరంలోని రాజకీయ పాఠశాలలో ఆంధ్ర ద్వితీయోధ్యాయ పదవిలో నియమింపబడ్డారు. 1861లో రామలక్ష్మమ్మతో వీరికి వివాహం జరిగింది. కేశవ చంద్రసేన్, ఆత్మూరి లక్ష్మీనృసింహం వంటి వారి బోధనలలతో ప్రభావితం అయ్యారు. నేరుగా సంఘసంస్కరణ కార్యక్రమాలను చేపట్టారు. ఆ కార్యాల ప్రచారానికి, ప్రజలలో చైతన్యం తేవడానికి రచనా మార్గాన్ని కూడా ఎంచుకున్నారు. 1879లో ప్రార్థనా సమాజాన్ని నెలకొల్పారు. 1881లో వితంతు వివాహం చేశారు. 1897-98లో మద్రాసులో వితంతు శరణాలయం స్థాపించారు. 1906లో యజ్ఞోపవీతాన్ని సైతం తీసేశారు. హితకారిణీ సమాజాన్ని నెలకొల్పారు. బాలికా పాఠశాల స్థాపించారు. స్త్రీ విద్యకు, బాల్యవివాహాల నిషేధానికి, వితంతువివాహాలకు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా... పంతులుగారు విశేషమైన కృషి చేశారు. కందుకూరి వారే స్వయంగా తన స్వీయచరిత్రలో ఆధునిక సాహిత్య ప్రక్రియలలో నేనే చాలామటుకు మొదట రచించాను అని చెప్పుకున్నారు. ఇది అక్షర సత్యం. స్వీయచరిత్ర, నాటకం, ప్రహసనం, వచన ప్రబంధం, కవుల చరిత్ర, శాస్త్రీయ గ్రంథాలు అన్నీ వీరే తొలుత రాశారని చెప్పాలి. అర్థం పర్థంలేని భాషతో, ఊహలతో సరస్వతిని అవమానిస్తున్నారని సరస్వతీ నారద విలాపాన్ని (1895) లో రాశారు. ఆలివర్ గోల్డ్ స్మిత్ రాసిన ది ట్రావెలర్ ను పథికా విలాపము పేరిట అనువదించారు. శుద్ధాంధ్ర నిరోష్ఠ్య నిర్వచన నైషధాన్ని ప్రాచీన కావ్యరీతులో రాశారు. ది కామెడీ ఆఫ్ ఎర్రర్స్ ను చమత్కార రత్నావళి పేరుతో నాటకంగా అనువదించారు. బ్రాహ్మవివాహం, స్త్రీ పునర్వివాహం, సభానాటకం లాంటి ఎన్నోనాటకాలు సంఘస్కరణ దృష్టితో రచించారు. చాలామంది విమర్శకులు, పరిశోధకులు వీరు రాసిన రాజశేఖరచరిత్రను తొలి నవలగా పేర్కొంటారు. దీనిపై గోల్డ్ స్మిత్ రచించిన ది వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్ ప్రభావం ఉందని కందుకూరి వారే చెప్పుకున్నారు. ఇంకా సత్యరాజా పూర్వదేశ యాత్రలు, సత్యవతీ చరిత్రము, చంద్రమతీ చరిత్ర అనే నవలలు కూడా రచించారు. ఈ నవలల ప్రధాన ఉద్దేశ్యం స్త్రీ విద్య, స్త్రీ అభివృద్ధి, స్త్రీల ప్రాధాన్యం. వీరేశలింగం గారికి పేరుప్రఖ్యాతులు తెచ్చినవి ప్రహసనాలు. వ్యంగ్యంతో సమాజంలోని అంధవిశ్వాసాలు, స్వార్థం, ప్రజల అమాయకత్వాన్ని విమర్శకు పెట్టారు. ప్రధానంగా సంఘసంస్కరణ ప్రభోదించారు. దాదాపు 50కి పైగా ప్రహసనాలు రచించారు. పెళ్లి వెళ్లిన తర్వాత పెద్ద పెళ్లి, లోకోత్తర వివాహము, వేశ్యాభిమానం, శాఖాభేదాలు, అజ్ఞానం లాంటివి ముఖ్యమైనవి. ప్రహసనాలతో పాటు కందుకూరి వారు కథలను కూడా రచించినట్లు తెలుస్తుంది. సతీహితబోధిని పత్రికను నడిపి ఆ పత్రికలో కథల్ని ప్రచురించారు. బాలబాలికల కోసం నీతి కథలు కూడా రాశారు. ప్రతి కథ చివర ఓ నీతి పద్యాన్ని రచించారు.  పరోపకారం, బాదము కాయ, వరాల చెట్టు లాంటి చిన్నచిన్న కథలు కూడా వీరి ప్రచురించారు. కందుకూరి వారికి విశేషమైన కీర్తి తెచ్చిపెట్టినవి వీరి వ్యాసాలు. వాటిని ఆ కాలంలో ఉపన్యాసములు అనేవారు. వివేకవర్థిని, సతీహితబోధిని, చింతామణి, సత్యసంవర్థిని, సత్యవాది పత్రికలలో వీరి వ్యాసాలు విరివిగా ప్రచురింపబడేవి. తర్వాత ఇవి సంపుటాలుగా వచ్చాయి.  రాజకీయ, నైతిక, ఆర్థిక, మత, విద్య, స్త్రీ సంబంధమైన అంశాలతో పంతులుగారు వ్యాసాలు రాశారు. తెలుగు సాహిత్యానికి వీరు అందించిన మరో ముఖ్య గ్రంథం కవుల చరిత్ర. అటువంటిదే స్వీయచరిత్ర. స్వీయ చరిత్ర రచించిన వారిలో వీరే మొదటివారు. ఎటువంటి అసత్యాలకు, అపోహలకు, కల్పితాలకు తావులేకుండా నిఖ్ఖర్షగా స్వీయచరిత్రలో తన గురించి తాను చెప్పకున్నారు వీరేశలింగం పంతులుగారు. వీరి రచనలు ఆనాటి సమాజంలోని చెడును వివరిస్తాయి. మంచి మార్గాన్ని నిర్దేశిస్తాయి. గ్రాంథికంలో కాకుండా సరళ గ్రాంథికంలో ఉండి అందరికీ అర్థమవుతాయి. ముఖ్యంగా సంఘసంస్కరణ దృష్టితో స్త్రీల అభివృద్దే ధ్యేయంగా వీరి రచనలు సాగాయని చెప్పాలి. జీవితాన్ని పరులకోసం వెెచ్చించిన వీరేశలింగం గారి గురించి చిలకమర్తి వారు-             తన దేహము తన గేహము             తన కాలము తన ధనము తన విద్య జగ             జ్జనులకు వినియోగించిన             ఘనుడీ విరేశలింగ కవి జనులారా.... అన్నారు.                                      - డా. ఎ.రవీంద్రబాబు

నేడు చాగంటి సోమయాజులు శతజయంతి ( వాయులీనం)

నేడు చాగంటి సోమయాజులు శతజయంతి ( వాయులీనం)  - చాసో   నేడు ప్రముఖ కథా రచయిత, చాసోగా చిరపరిచితులైన చాగంటి సోమయాజులు శతజయంతి. ఈ సందర్భంగా ఆయన రచించిన సుప్రసిద్ధ ‘వాయులీనం’ కథను ఓసారి పరిశీలిద్దాం. నేడు తెగిపోతున్న కుటంబ సంబంధాలకు, నాలుగు గోడల మధ్య కుమిలిపోతున్న ఒంటరి తనాలకు ఏమి కావాలో తెలిజేస్తుంది 'వాయులీనం' కథ. ఈ కథలోని రాజ్యం, వెంకటప్పయ్యలు భార్యాభర్తల అన్యోన్య దాంపత్యానికి నిర్వచనం చెప్తారు. చాగంటి సోమయాజులు రచించిన ఈ కథ మానవ సంబంధాలు మృగ్యమైపోతున్న ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన కథ.         కథలోని విషయానికి వస్తే- రాజ్యానికి టైఫాయిడ్ జ్వరం వచ్చి పొక్కిపోస్తుంది. వెంకటప్పయ్య రాజ్యాన్ని ధర్మాసుపత్రిలో చేర్పించినా ఆ నెల జీతం మీద రెండొందలు ఎక్కువే ఖర్చవుతుంది. చివరకు మూడువారాలు రాజ్యాన్ని ముప్పతిప్పలు పెట్టి జ్వరం తగ్గుతుంది.         ఒకరోజు ఆఫీసునుంచి ఇంటికొచ్చి భార్యను చూసిన వెంకటప్పయ్యకు  ప్రాణాలు ఎగిరిపోతాయి. మళ్లీ ఏమైందో నన్న భయం వేస్తుంది. గొడవ చేస్తున్న పిల్లల్ని పెద్దగా కసురుకుంటాడు. దాంతో కలలో 'తోడిరాగంతో అంబర వీధుల్లో విహరిస్తున్న రాజ్యం' ఈ లోకంలోకి తిరిగివస్తుంది. భార్యకు మెలుకువ రావడంతో వెంకటప్పయ్య ప్రాణాలు తిరిగొస్తాయి.          వెంకటప్పయ్య రాజ్యం ఆరోగ్యం కోసం కొత్త యిల్లు, ఎక్కువ అద్దెతో తీసుకుంటాడు. పైగా జబ్బుకు బాగానే ఖర్చుపెట్టాడు... అని ఆలోచిస్తూ- 'మొత్తం ఏంతైంది?' అని రాజ్యం అడుగుతుంది.  భార్యకు ఈ సమయంలో డబ్బలు గురించి చెప్తే ఎక్కువ కంగారు పడిపోతుందని 'ఆ వూసే ఎత్తొద్దు. ముందు నీ ఆరోగ్యం చూసుకో...' అంటాడు వెంకటప్పయ్య. ఇలా భార్యభర్తలు ధనం కన్నా ఒకరిపై ఒకరికున్న ప్రేమాభిమానాలకే ఎక్కువ విలువ ఇవ్వడం మనకు కథలో కనిపిస్తుంది.        అంతలో ఎదురింటిలో ఉండే పిల్ల సంగీతం పాడుతుంది. ఆ సంగీతం వింటూ రాజ్యం దేదీప్యమానంగా ఆనందంతో వెలిగిపోతుంది. అసలు రాజ్యానికి సంగీతమంటే ప్రాణం. పెళ్లికి ముందే, ఆమె సంగీత విద్వాంసురాలు. పెళ్లి చూపుల్లో ఫిడేలు వాయిస్తూ పాట పాడుతుంది. కానీ ఏ మాత్రం సంగీత జ్ఞానం లేని వెంకటప్పయ్యకు ఆపాట ఏమీ అర్థం కాదు. కానీ ఇప్పడు ఎదురింటి నుంచి వినిపించే పాటకు భార్య, పిల్లలు ఆనందిస్తుంటే, అతనికి  మాత్రం పార్శ్యపు నొప్పి వస్తుంది. అక్కడ ఉండలేక 'పాప పరిహారార్థం మంచిపని చేసుకవస్తా' అని బయటకు వెళ్లిపోతాడు. వస్తూవస్తూ భార్యకోసం 'జరీఅంచు చీర, పట్టు రవికె గుడ్డ' తీసుకొస్తాడు. 'డబ్బు ఎక్కడిది?' అని రాజ్యం అడిగితే, కంగారుగా 'ఇంట్లో ఉన్న నీ ఫిడేలు 250 రూపాయలకు స్నేహితునికి ఇచ్చేశాను' అని చెప్తాడు. తను చేసింది తప్పు అని కూడా ఒప్పుకుంటాడు.       కానీ రాజ్యం మాత్రం 'మీరు ఏ తప్పు చేయలేదు. పోతూపోతూ... తల్లి తల్లి గుణాన్ని చూపించింది. నాకు ప్రాణం పోసింది. చీర రవికె గుడ్డా పెట్టింది.' అని బాధతో గుడ్లనిండా నీళ్లు నింపుకొంటుంది.      సంగీతం కంటే సంసారానికే ప్రాధాన్యత ఇచ్చే భార్య రాజ్యం, భార్య ఆరోగ్యం కోసం, ఆమె ఆనందం కోసం తపించే భర్త వెంకటప్పయ్య, ఈ కథకు ప్రాణాలు. కుటంబానికి భార్యాభర్తలు రెండు చక్రాలని నిరూపిస్తారు. గుట్టుగా ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవడం, వ్యక్తిగత ఇష్టాలకంటే మరొకరి అభిప్రాయాల్నే గౌరవించడం... ఇలా నేడు పతనమవుతున్న కుటుంబ వ్యవస్థకు గుణపాఠాలు నేర్పుతారు. అందుకే భారతీయ సంప్రదాయానికి ఈ కథ ఓ మెట్టు లాంటిదని చెప్పాలి.                                                     - డా. ఎ. రవీంద్రబాబు.

బహుముఖ ప్రజ్ఞాశాలి బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి

  బహుముఖ ప్రజ్ఞాశాలి బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి   మెరిసే వర్చస్సు ముదిమిచేరిన తరగని సొగసు స్త్రీత్వంలోని సొబగుతో కూడిన నటనా తపస్సు బుర్రావారికి మాత్రమే లభించిన దేవుడి ఆశీస్సు 1937వ సంవత్సరంలో గుంటూరు జిల్లా తెనాలి తాలూకాలో జన్మించారు బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి. బాగా పసితనంలోనే కమ్మగా పాటలు పాడటం, విన్న పద్యాలను శ్రావ్యంగా కంఠస్థం చేసి ఆలపించడం ఆయనకి జన్మతః భగవంతుడిచ్చిన వరాలు. ఆయన పాటలు, పద్యాలు విని మంత్రముగ్ధుడైన మేనమామ కోటేశ్వర్రావు వానపాముల సత్యనారాయణ అనే గురువుదగ్గర జేర్పించారు. సర్వకళల సమన్వితుడు సుబ్రహ్మణ్యశాస్త్రి: ఆయన చేతివేళ్ళళ్లోకి కుంచె చేరిదంటే అద్భుతమైన చిత్రాలు ఆవిష్కరింపబడతాయి. ఆచేతులు కాళ్ళు చక్కటి నాట్యాన్ని అభినయించి చారెడుకళ్ళ హావభావాలతో సందర్శకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి. నాటకరంగ ప్రవేశం: 1953లో ఖిల్జీరాజ్యపతనంలో దేవళ అనే స్త్రీపాత్రని యాదృచ్ఛికంగా పోషించారు సుబ్రహ్మణ్యశాస్త్రి. ఆపాత్ర ఆయనకి దిశానిర్దేశం చేసింది. ఆయన హావభావాలు. వాచకం అందరినీ అలరించాయి. ఆధ్యాత్మికవేత్తగా బుర్రావారు: రామాయణ, భారత, భాగవతాలు, వేదాలు, ఇతిహాసాలు, పంచతంత్ర అంశాలు ఏవైనా వారికి కంఠోపాఠాలు. ఆధ్యాత్మిక ప్రసంగాలను అరటిపండు ఒలిచిపెట్టినట్లుగా అందరికీ చెప్పడం ఆయనకి అలవాటు. నిరాడంబరుడు, నిగర్వి: అందరినీ గౌరవించడం, అభిమానంగా మసలుకోవడం సుబ్రహ్మణ్యంగారికి మొదటినుండి అలవాటు. సంప్రదాయ కుటుంబంలో పుట్టడం, కన్నవారి నుండి సంస్కారాన్ని నేర్చుకోవడం జరిగింది. హిందుత్వ పరిరక్షణ, భారతీయతత్వాన్ని ప్రబోధించడం ఆయన కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు. స్త్రీ పాత్రలు కొన్ని సుబ్రహ్మణ్యశాస్త్రి స్వంతాలు: సతీ సక్కుబాయి, మధురవాణి రెండూ విభిన్నమైన పాత్రలు. వాటి రెండింటికీ సమానంగా న్యాయం చేసి, ఔరా అనిపించారాయన. శశిరేఖ, సత్యభాల పాత్రలలో పరకాయ ప్రవేశం చేసారు. యోగి, వేమనలో మాధురిగా అలరించారు. ప్రజానాయకుడు ప్రకాశంలో ప్రకాశం తల్లిగా ఆయన నటన అందరికీ అన్ని వేళలా గుర్తుంటుంది. వెనకటి వితంతువులు తెల్లిటి చీర, బోడిగుండు, బోసి చేతులు, మెడ, జాకెట్టు వేసుకోకున్నా నిండుగా చీరకప్పుకుని తలవంచి పరపురుషులతో కరుణరసాత్మకంగా మాట్లాడేవిధానం. ఒంటిచేత్తో పూటకూళ్ళలో పిల్లాడిని చదివించాలని ఆమె పడిన తాపత్రయం ఆయన నటనకి నాణ్యతని అందించాయి. ఈయన గొప్ప రచయిత కూడా. కళాకారుడిగా పురస్కారాలు: తెలుగువిశ్వవిద్యాలయం ఉత్తమనటుడు అవార్డునిచ్చింది. రాష్ట్రస్థాయి అగ్రశేణి నటుడి అవార్డు సుబ్రహ్మణ్యశాస్త్రిని వరించింది. కవిసామ్రాట్‌ విశ్వనాధ సత్యనారాయణ నాట్యాచార్య బిరుదునీ, కొండవీటి వెంకటకవిచే నాట్యమయూరి బిరుదుని పొందిన సుబ్రహ్మణ్యశాస్త్రి బహుముఖ ప్రజ్ఞాశాలి. నటించడం, రాయడం చిత్రాలుగీయడం నాట్యంలో ప్రావీణ్యత ప్రదర్శించడంలో తనకి తానేసాటిగా ఉన్న బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి కారణజన్ముడు, అనుసరణీయుడు, ఆరాధ్యనీయుడు. డా|| గురజాడ శోభాపేరిందేవి, సాహితీ కిరణం మాసపత్రిక సౌజన్యంతో

కాళోజి

  కాళోజి                                                     - డా. ఎ.రవీంద్రబాబు               సాగిపోవుటే బ్రతుకు       ఆగిపోవుటే చావు       సాగిపోదలచిన       ఆగరాదిచటెపుడు                   అన్న కాళోజి ఎక్కడా రాజీపడి జీవించలేదు. వ్యక్తి స్వేచ్ఛకోసం, స్వాతంత్ర్యం కోసం అహర్నిశలు పోరాడారు. నిజాం పాలనైనా, స్వాతంత్ర భారతదేశమైనా ఆయనది ఎప్పుడూ ప్రజల పక్షమే. నిత్యం ప్రజలలో మమేకమై, ప్రజల కష్టాలను, బాధలను తెలుసుకొంటూ వారి మేలుకోసం పోరాటం చేశాడు. జీవితాన్నే ప్రజలకు అంకితం చేసిన మహానుభావుడు. ఎక్కడా అధికారాన్ని, అధికార దాహాన్ని, రాజ్యకాంక్షను ఒప్పుకో లేదు. వాటిని నిరంతరం వ్యతిరేకిస్తూ హక్కుల ఉద్యమంలో కూడా ప్రత్యక్షపాత్ర పోషించాడు. పోరాటంలో భాగంగా రచనలూ చేశాడు.                   కాళోజీ 1914 సెప్టెంబరు 9న ఆనాటి హైదరాబాదు సంస్థానం సరిహద్దుగా ఉన్న రట్టహళ్ళిలో జన్మించాడు. తండ్రి రంగాగావు. తల్లి రమాబాయి. కొన్ని ఏళ్ల క్రితం వీరి పూర్వీకులు వరంగల్ వచ్చి స్థిరపడ్డారు. కాళోజీ అసలు పేరు - రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రాం రాజా కాళోజి. కాళోజీ పుట్టిన ఆరు నెలల లోపే వాళ్ల అమ్మ చనిపోవడంతో అన్నరామేశ్వర్ రావు పెంచాడు. అతనూ ఉర్దూలో గొప్పకవి, వకీలు. కాళోజీ ప్రాథమిక విద్యాభ్యాసాన్ని మణికొండ, హైదరాబాదులలో చదివాడు. హైస్కూలు, కాలేజీ విద్యను వరంగల్ లో పూర్తి చేశాడు. 1939లో న్యాయవాద వృత్తిలో పట్టా పొందాడు. కాళోజీకి తెలుగు, ఉర్దూ, హిందీ,మరాఠీ, కన్నడ, ఇంగ్లీషు భాషలు వచ్చు. వీటిలో  రచనలు కూడా చేశాడు. 1940లో కాళోజీకి రుక్మిణమ్మతో వివాహం జరిగింది.               కాళోజీ చదువుకునే రోజుల్లోనే ప్రజా ఉద్యమాలలో పనిచేశాడు. 1930 నుంచే గ్రంథాలయోద్యమంలో పాల్గొన్నాడు. సత్యాగ్రహోద్యమంలోనూ పాల్గొన్నాడు. నిజాంకు వ్యతిరేకంగా వరంగల్ లో జాతీయ పతాకాన్ని ఎగురవేయడానికి ప్రయత్నించి నగరబహిష్కరణకు గురయ్యాడు. అంతేకాదు వరంగల్ లో నిజాం వద్దన్నా వినాయక ఉత్సవాలు జరిపాడు. ఆంధ్రసారస్వత పరిషత్ వ్యవస్థాపకుల్లో ఒకరు. స్వాతంత్ర్యపోరాటంలో పాల్గొన్నారని ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులను బహిష్కరిస్తే వారని నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేర్చడంలో చాలా ప్రముఖపాత్ర పోషించాడు. అసలు ఆ రోజుల్లో నిజాం దమననీతికి వ్యతిరేకంగా, స్వతంత్రభారతలోనూ కరువైన ప్రజా హక్కులకోసం పోరాడారు. ఆంధ్రజనసంఘం, ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఆంధ్రమహా సభ, తెలంగాణ రచయితల సంఘం లాంటి సంస్థల నిర్మాణాలలో వీరి పాత్ర వెలలేనిది.        మనిషి మనిషిలా జీవిస్తే, ఇంకో మనిషిని మనిషిలా గౌరవిస్తే ప్రపంచం బాగుపడుతుందన్న ఆలోచన ఉన్నవాడు కాళోజీ. ఇచ్చయే నా ఈశ్వరుడు అని కచ్చితంగా నమ్మి ప్రజాభీష్టంకోసం పనిచేశాడు. మొత్తం మీద మూడుసార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. ఒకటి రెండు సార్లు ఎన్నికలలో పోటీచేసి ఓడిపోయాడు. అప్పటి ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు వీరికి అనుంగు మిత్రుడు. కాళోజీ ఇల్లు ఎప్పుడూ వివిధ సిద్ధాంతాలకు కట్టుబడిన వాళ్లైన విశ్వనాథ సత్యనారాయణ, జాషువా, శ్రీశ్రీ, యంటీఖాన్, కన్నభీరన్, బాలగోపాల్ లాంటి వాళ్ల చర్చలతో నిండి ఉండేది. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతమైన భావాలు వీరివి. మనిషే వీరికి ముఖ్యం. 90 సంవత్సరాలు బతికిన కాళోజీ జీవితంలో 75 ఏళ్లకు పైగా ప్రజా జీవితమే. అందుకే దాశరథి లాంటి వాళ్లు వీరిని ప్రజావాణికి మైక్ అన్నారు.            కాళోజీ కవిత్వం రాసినా, కథలు రాసినా ప్రజా జీవితంలో ఆయన ఉన్నప్పుడు కాళోజీకి కలిగిన ఆనందాలు, విషాదాలు... వాటి స్పందనలు మాత్రమే. మనిషిని కేంద్రంగా చేసుకుని, బతుకును ఆధారంగా చేసుకొని రాసినవే  ఆయన కవిత్వం, కథలు. 1943లోనే వీరి కథలు కాళోజీ కథలు పేరుతో అచ్చయినాయి. ఇక వీరి కవిత్వం నా గొడవ. ఇది నా గొడవ కాదు ప్రజల గొడవ. ఎవరు చదివితే వారికి వారి గొడవలా కనిపిస్తుంది. ఇతర  భాషా రచనలను తెలుగులోకి అనువాదం చేశాడు.           కవి కూడా నేతగాడే           బహు చక్కని సాలెగూడు అల్లువాడే           రాజకీయ బల్లీ (యు)ల           నోటికి అందక ఎగిరెడి పక్షి(యు)ల            నేనంటే నేడు            నా గొడవంటే నాడు            నిజమో కాదో కల రుజువు            నావు నేనూ వాడూ             నేనంటే నేటి మనస్థితి వైనం             నేనంటే భరత పౌరుడు            నా గొడవ ఆ పౌరుని స్థితి... ... ఇలా కాళోజీ ప్రజల కవిత్వాన్నే తన కవిత్వంగా రాశాడు. ప్రజలకు, ప్రజల భావాలకు, ప్రజల ఈతిబాధలకు ప్రతీక చేశాడు. అందుకే ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక.  ఉదయం కానే కాదునుకోవడం నిరాశ, ఉదయించి అట్లానే ఉండాలనుకోవడం దురాశ. అసామ్య సంఘంలో అర్జనయే దౌర్జన్యం... లాంటి ఎన్నో వాక్యాలు ప్రజల నోళ్లలో నానుతున్నాయి. పత్రికలకు పతాక శీర్షికలవుతున్నాయి. వీరి కవిత్వం అంతా నా గొడవ పేరుతో లభిస్తుంది.           అన్యాయం, అక్రమం, పీడన ఎక్కడ ఉన్నా ఎదిరించడమే అతని లక్ష్యం. 1992లో భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కరాన్ని ఇస్తే, హక్కుల ఉద్యమాన్ని, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని చివరి వరకు వీడని కార్యసాధకుడు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీలో సభ్యునిగా కూడా కొంతకాలం కొనసాగాడు.          ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే టీబీ వస్తే ఒక ఊఫిరితిత్తును తీసివేశారు. డాక్టర్లు ఎక్కవ మాట్లాడితే  ఆరునెలల్లో చచ్చిపోతావు అని చెప్పారు. కానీ కాళోజీ మాట్లాడకపోతే ఆరు రోజుల్లో చచ్చిపోతాను అన్నాడు. అలా 70 ఏళ్లు ఒక్క ఊపిరితిత్తుతో ప్రజా పోరాటాలను భూజానకెత్తుకొని నడిపిన కాళోజీ 2002 నవంబరు 13 న కన్నుమూశాడు.               ఆయన ఒక ఓదార్పు               ఆయన  ఒక ఆర్తి               ఆయన ఒక భరోసా               ఆయన ఒక చైతన్యం               ఆయన ఒక వైతాళికుడు.               కాళోజీ  ఒక విశ్వమానవుడు.

మనమే నయం

మనమే నయం (కథ)                                                కాళోజీ నారాయణరావు       కాళోజీ ఆధునిక తెలంగాణ సామాజిక, సాహిత్యానికి పెద్ద దిక్కు. ఉద్యమకారుడు. ప్రజల జీవితాలను అతని గొడవ భావించి నాగొడవ పేరుతో ఆత్మకథ అందించిన సాహసి. కథలు రాశాడు. పాటలు రాశాడు. ఒకప్పటి తెలంగాణ ఉద్యమాన్ని అక్షరబద్దం చేశాడు. బహుభాషావేత్త. సమాజంలోని హెచ్చుతగ్గులపై పోరాటం సల్పిన వీరుడు. హైదరాబాదులో ఆంధ్రసారస్వత పరిషత్తు స్థాపించడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. అసలు కాళోజీ జీవితమే ఉద్యమాల చరిత్రకు మారురూపం. అలాంటి కాళోజీ రచించిన కథల్లో సామాజిక వాస్తవికత, శిల్పం కలగలిసి ఉంటాయి. అలాంటిదే మనమే నయం కథ.          మనుషుల గురించి, జంతువుల గురించి అద్భుతంగా రాసిన కథ మనమే నయం. ఈ కథకు ఎద్దుల సంభాషణే ప్రాణం. కథ విషయానికి వస్తే... ఎల్లయ్య తన రెండు ఎద్దులను అన్నిరోజులకు భిన్నంగా ఆ రోజు పూలదండలు, కుంకమతో అలంకరిస్తాడు. వాటిలోని నల్ల ఎద్దు, తెల్లఎద్దుతో ఈ రోజు ఎందుకు ఇలా జరుగుతుంది అని అడుగుతుంది. కొద్దిగా ఓపికపట్టు అన్ని తెలుస్తాయి ముందు అని చెప్తుంది తెల్లఎద్దు. ఎల్లయ్య రెండు ఎద్దులను డాబుగా అలంకరించి ఎస్.పి.పి.ఎ. (జంతువుల యెడ జరుగు అన్యాయ నిరోధక సంఘం) వారి వార్షికోత్సవంలో జరిగే ఊరేగింపుకు తీసుకెళ్తాడు. అక్కడ లక్షాధికారులు, విద్యావంతులు, రాజకీయనాయకులు, సంఘాలు, కులాలు, మతాల ప్రతినిధుల మధ్య ఎడ్లు, గుర్రాలు, ఆవుల ఊరేగింపు గొప్పగా జరుగుతుంది.           అక్కడ సంఘకార్యదర్శి వారి నివేదికలో ఎన్ని వందల ముల్లుకట్టెలు విరగగొట్టినది, బండ్లవాండ్లను, జడ్కావాళ్లను బక్కవాటిని, గాయపడిన వాటిని, ఎడ్లను, గుర్రాలను, బండ్లకు కట్టినందుకుగాను కోర్టుకెక్కించిన జరిమానాలను విరించాడు. తర్వాత జంతువుల కష్టాలు, ఇబ్బందులు, వాటిని మాన్పడానికి ఉపాయాలు... ఇలా పలు అంశాల గురించి జంతువులపై జాలితో, వాటి రక్షణకై పలు అంశాలపై ఉపన్యాసాలు చేస్తారు. ఊరేగింపు, సభ అయిపోయాక, నల్లఎద్దుతో తెల్ల ఎద్దు అందులోని తిరకాసు గురించి వివరిస్తుంది. మనుష్యులలో కొందరు, పనిబాట లేనివాళ్లు, మనతో ప్రత్యేక్షంగా ఏ సంబంధం లేని వాళ్లు, మనకోసం ఓ సంస్థ స్థాపించారు. మన రక్షణకోసం అనేకరకాలుగా కృషి చేస్తున్నారట. కానీ, వీరికి కరకర నరకబడే జంతువులపై జాలి లేదు. తెల్లవారే సరికి లక్షల కోళ్లు, గొర్రెలు, ఆవులు, ఎడ్లు వీరుకి ఆహారం కొరకు నరకబడుతున్నాయి. అవన్నీ ఆరోగ్యంగా ఉండేవే. కానీ వాటి గురించి ఏమీ వీళ్లకు పట్టదు. అని వారి దైనందిన జీవితం గురించి చెప్తుంది.        అందుకు నల్లఎద్దు నీవు చెప్పింది నిజమే... కానీ మనల్ని ఇంతగా కష్టపెట్టే ఆ నరుల జీవితం ఏమంత బాగా ఏడ్చింది. అత్యల్ప సంఖ్యాకులైన భాగ్యవంతులు తప్ప మిగతా కోట్లకొద్ది ప్రజల జీవితం మనకన్నా ఎన్నియో రెట్లు అసహ్యంగా ఉంది. వారిని ఉద్దరించడానికి సంఘమొకటీ లేదు. మనకు ఏదో ఒకటి ఉంది. కొంతవరకు నయమే అంటుంది. క్లుప్తంగా కథ ఇది.       జంతువులు మనుషుల్లా మాట్లాడే కథ ఇధి. కానీ నీతికథ కాదు. సమాజం పై వ్యంగ్య రూపకం. కథ సర్వసాక్షి దృక్కోణంలో సాగుతుంది. కాళోజి చెప్పాల్సిన విషయాలను జంతువుల పాత్ర ద్వారా చెప్పారు. ఆఖరకు జంతువులకు ఉన్న రక్షణకూడా సాధారణ ప్రజలకు లేదు. దోపిడీకి గురవుతున్నారన్నది కథలో అంతర్లీనంగా చెప్పబడింది. కథలో ఎత్తుగడ, సన్నివేశం, ముంగిపుల మధ్య ఓ అల్లిక ఉంది. అదే కథకు ప్రాణమైన శిల్పం. భాషలో అప్పటి గ్రాధిక వాసనలు కనిపిస్తున్నాయి. బుక్కాగులాలు, బ్యారేడు జోడులు లాంటివి తెలంగాణ పదాలకు ఉదాహరణలని చెప్పాలి.ఈ కథ 1943లో వచ్చింది. కానీ ఇప్పటి ప్రపంచాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. అందుకే ఈ కథ ఎప్పటికీ నిలిచే ఉండే సామాజిక సత్యం లాంటిది.                                                             - డా. ఎ.రవీంద్రబాబు

అర్థంలేని టెలిగ్రామ్ లు

  అర్థంలేని టెలిగ్రామ్ లు                                                         - ఆరుద్ర          ఆరుద్ర కవిగా, పరిశోధకునిగా, విమర్శకునిగా, పాటల రచయితగా అందరికీ సుపరిచితమే. కానీ ఆరుద్ర కథలు కూడా రాశాడు. వీరి కథలు ఊరు ఊరుకుంది, నే చెప్పానుగా పేరిట సంపుటాలుగా వచ్చాయి. ఆరుద్రకు కథలు రాయడమంటే సరదా... అలవోకగా కథలు అల్లేవారు. ఎప్పుడు సాహిత్య వాతావరణంలో ఉండే ఆరుద్రకు డిటెక్టివ్ కథలు రాసే టెంపోరావు, వైవీ రావు, కొమ్మూరి సాంబశివరావు మంచి మిత్రులు. అప్పుడప్పుడు అలా డిటెక్టివ్ కథలు రాశారు. అయితే ఇవి పూర్తిగా కథా నిర్మాణాన్ని కలిగి, ఆద్యంతం ఆసక్తిగా సాగుతాయి. పాఠకుడిని ఉత్సాహంగా చదివిస్తాయి. అలాంటి కథే అర్థంలేని టెలిగ్రామ్ లు.          అర్థంలేని టెలిగ్రామ్ లు కథ పూర్తిగా సస్పెన్స్, మర్డర్ మిస్టరి, హత్య ఎవరు చేశారు. ఎందుకు చేశారు. చేయాల్సిన అవసరం ఏమిటి... అనే విషయాలు చివరి వరకు తెలియవు. కథలోకి వెళ్తే... టెలిగ్రాఫ్ బంట్రోతు రామయ్య గంగిగోవు లాంటి వాడు. శత్రువులు ఉండరు. ఒకరోజు పదిగంటలకు టెలిగ్రామ్ లు ఇవ్వడానికి ఊళ్లోకి వెళ్తాడు. మొత్తం ఇవ్వాల్సినవి ఆరు. మొదటిది సుందరం అండే సన్స్ వారి షాపులో ఇచ్చి వస్తుంటే దారిలో నులకవీధి కేశవరావుకు ఏమైనా టెలిగ్రామ్ లు ఉన్నాయా అని అడుగుతారు. రామయ్య మామూలుగానే ఉంది... అని చెప్పి ఇవ్వడాని వెళ్తాడు. ఈ లోపే రామయ్యను ఎవరో హత్య చేశారని ఇన్ స్పెక్టర్ వేణుకు ఫోన్ వస్తుంది. వేణు సబ్ ఇన్ స్పెక్టర్ చంద్రంతో వెళ్లి హత్య జరిగిన ప్రదేశాన్ని, శవాన్ని పరిశీలిస్తాడు. ఎవరో కత్తితో రామయ్యను పొడిచి చంపి ఉంటారు.           ముందు టెలిగ్రామ్ మాస్టారుతో మాట్లాడతాడు. తర్వాత రామయ్య ఇంటికి వెళ్లి విచారిస్తాడు. అక్కడో విషయం తెలుస్తుంది. రామయ్య భార్యకు, పెట్రోలు బంకులో పనిచేసే రాఘవులకు అక్రమసంబంధం ఉందని, రామయ్య రాఘవులను కొడితే, నిన్ను చంపేస్తానని రాఘవులు అన్నాడని తెలుస్తుంది. వేణు రాఘవులను కూడా విచారిస్తాడు. కానీ హత్య జరిగినప్పుడు రాఘవులు పెట్రోలు బంకులో ఉన్నట్లు రుజువు అవుతోంది. ఇలా కథంతా రామయ్యను ఎవరు చంపారు, ఎందుకు చంపారు... అన్న ఉత్కంఠతో నడుస్తుంది. వేణు టెలిగ్రామ్ ఆఫీసుకు వెళ్లి మాస్టారును విచారిస్తూ ఉండగా కేశవరావు వస్తాడు. తనకు టెలిగ్రామ్ వచ్చింది ఇవ్వండి అని అడుగుతాడు. దాంతో వేణుకు కేశవరావుపై అనుమానం కలుగుతుంది. ఎంక్వరీ చేయగా కేశవరావుకు ఈ మధ్య కావాల్సినంత డబ్బు వచ్చిందని, వారం రోజులనుంచీ రోజూ టెలిగ్రామ్ లు వస్తున్నాయని తెలుస్తుంది. వేణు అన్నిటిని చదువుతాడు. కానీ అవి అర్థంకావు. కానీ వేణు ఆరోజు వచ్చిన టెలిగ్రామ్ ను  కేశవరావుకు వెనకది ముందు, ముందుది వెనుక మార్చి చెప్తాడు. ప్లీజ్ సెండ్ ది హోల్ స్టాక్ - స్టాప్ కేన్సిల్ అవర్ ఓల్డ్ ఆర్డర్ అని ఉంటే కేన్సిల్ అవర్ ఓల్డ్ ఆర్డర్ సెండ్ హోల్ స్టాక్ అని చెప్తాడు. ప్లీజ్, స్టాప్, ది, అవర్ అన్న పదాల్ని చెప్పడు. కేశవరావు వెళ్లిన తర్వాత వారం రోజుల నుంచి వచ్చిన వార్తా పత్రికల్ని తిరగేస్తాడు.            సుందరం అండ్ సన్స్ షాపు పక్కన కేశవరావు బ్రాకెట్ ఆడుతుంటే వేణు పట్టుకుంటాడు. అతని నెంబర్లు కరెక్టు కావు, అని తన నెబర్లు చెప్తాడు. వచ్చిన టెలిగ్రామ్ లో మొదట ఐదు మాటలు తర్వాత స్టాప్ తర్వాత నాలుగు పదాలు ఉన్నాయి. అంటే ఆ నెబర్లకు బ్రాకెట్ వస్తుందని అర్థం. కేశవరావుకు టెలిగ్రామ్ ద్వారా ఈ విషయాలు లీక్ అవుతున్నాయి. దాంతో అతను బ్రాకెట్ ఆడుతూ ధనవంతుడయ్యాడని తెలుసుకున్న దుకాణందారు రామయ్యను ఆ టెలిగ్రామ్ ఇవ్వని బెదిరించాడు. ఇవ్వక పోయే సరికి కత్తితో చంపేశాడు. ఇక్కడ నెంబర్లు లీకవుతున్నాయని పేపర్లలో వార్తలు కూడా వస్తున్నాయి. అదీగాక కేశవరావుకు టెలిగ్రామ్ వచ్చిందా అని ఈ స్థలంలోనే అడిగారు కాబట్టి... దుకాణం దారే హత్య చేసిన వ్యక్తిగా వేణు గుర్తించి అరెస్టు చేస్తాడు.              క్రైం కథకు ఉండాల్సిన అన్ని లక్షణాలు దీనికి ఉన్నాయి. కథాకాలం నాటికి ఇది వాస్తవ చిత్రణ. ముందుగా కథలో హత్య చేసింది రాఘవులు అన్న అనుమానం కలిగేలా చేసి, తర్వాత ఉత్కంఠ రేపి, చివరి వరకు కథను నడిపారు ఆరుద్ర. మిస్టరీ కథల్లోలాగే మోటర్ సైకిల్ కు ఎర్రగుర్రం అని పేరుపెట్టారు. ఈ కథ ఎప్పుడు చదివినా చివరి వరకు మనల్ని చదివిస్తుంది. ఆరుద్ర ఏ రచన నైనా గొప్పగా చేయగల మేధావి అని ఈ కథవల్ల యిట్టే తెలిసిపోతుంది.         డా. ఎ.రవీంద్రబాబు

బహుముఖ ప్రజ్ఞాశాలి... భానుమతీ రామకృష్ణ

  బహుముఖ ప్రజ్ఞాశాలి... భానుమతీ రామకృష్ణ     - డా. ఎ.రవీంద్రబాబు           భానుమతి ముందుతరం తెలుగు పాఠకులకు, సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కరలేని పేరు. సినీరంగంలోని అన్ని రంగాలలో తన ప్రతిభను నిరూపించుకున్న మణిరత్నం. సంగీతం, దర్శకత్వం, నటన, నిర్మాత, గాయని, ... ఒకటేంటి అన్నిటిలోను ఆమెకు ప్రవేశం ఉంది. తెలుగు సాహితీ రంగంలో ఆమె సృష్టించిన అత్తగారి పాత్ర ఎప్పటికీ చిరస్మరణీయమే.         భానుమతి ప్రకాశం జిల్లా దగ్గరున్నదొడ్డవరం గ్రామంలో 1939, సెప్టెంబరు 9న జన్మించారు. తండ్రి బొమ్మరాజు వెంకట సుబ్బయ్య. తల్లి సరస్వతమ్మ. వీరికి సంగీతంలో తొలి గురువు తండ్రిగారే. సంప్రదాయమైన కుటుంబం కావడం వల్ల భానుమతి పూర్తిగా కట్టుబాట్లతో పెరిగారు. అయినా 13 సంవత్సరాల వయసులోనే తండ్రిగారిని ఒప్పించి 1939లో వరవిక్రయం సినిమాలో నటించారు. ఈమె తొలిసినిమాకు తీసుకున్న పారితోషకం 350 రూపాయలు. ఆ రోజుల్లో పూర్తిగా మగవాళ్లే రాజ్యమేలుతూ, స్త్రీ పాత్రలు కూడా పురుషులే పోషిస్తున్న కాలంలో భానుమతి సినీరంగంలోకి అడుగుపెట్టారు. తనదైన సొంత ముద్రతో ఎదిగారు. భానుమతి గారిది బహుముఖీనమైన ప్రజ్ఞ. నటనపరంగా నభూతో నభవిష్యతి. చారిత్రక, పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో విభిన్నమైన, వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ఎక్కడా ఆమె తలవొంచుకుని ప్రవర్తించేది కాదు. తన మాట చెల్లాలనే మనస్తత్వం. చాలా మంది ఈమె ఆత్మాభిమానాన్ని చూసి పొగరు అనుకునేవారు. కానీ భానుమతి మాత్రం మొక్కవొని ధైర్యంతో తన అపారమైన ప్రజ్ఞతో అనేక విజయాలను సాధించారు. 1943 ఆగస్టు 8న నిర్మాత, దర్శకుడైన పి.యస్. రామకృష్ణను ప్రేమించి, అనేక అవరోధాలను తట్టుకొని వివాహం చేసుకున్నది. వీరి సంతానం భరణి. ఆ పేరుమీదే స్టూడియోను నిర్మించి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు భానుమతి.          1939లో వరవిక్రయం ద్వారా ప్రారంభమైన భానుమతి సినీ ప్రస్థానం 1998 పెళ్లికానుకతో ఆగింది. సుమారు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో వందకు పైగా చిత్రాలలో నటించారు. దర్శకురాలుగా- అసాధ్యురాలు, రచయిత్రి, చండీరాణి, భక్తధృవ మార్కండేయ (1, 2) వంటి పలు చిత్రాలకు పనిచేశారు. ఇక నిర్మాతగా మారి బాటసారి, విప్రనారాయణ, చింతామణి, ప్రేమ, లైలామజ్ఞు వంటి చిత్రాను నిర్మించారు. సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలైతే చింతామణి, చక్రపాణి, ప్రేమ లాంటివి ఎన్నో ప్రేక్షకుల మన్ననలు పొందాయి. అంతేకాదు ప్రేమ చిత్రానికి కథను కూడా అందించారు. ఇలా అర్థశతాబ్దం పాటు సినీరంగంలో తిరుగులేని పాత్ర పోషించారు. ఇలా అన్ని విభాగాలలోను పనిచేసిన మహిళ భారతదేశంలో ఈమె ఒక్కరే. వీరి నటనాపరంగా డా. సర్వేపల్లి రామకృష్ణ, బెజవాడ గోపాలరెడ్డి, పి.వి. రాజమన్నారు, కొడవటిగంటి కుటుంబరావు, చక్రాపాణీలు వీరిని ఎక్కువ అభిమానించే వారు.          భానుమతి ఒక్క సినీరంగానికి సంబంధించిన వారే కాదు భిన్నమైన రంగాలలో కూడా ప్రతిభను కనపరిచారు. ఈమె చిత్రకారిణి, జ్యోతిష్యురాలు.  తాత్వికమైన అంశాలలో మంచి ప్రవేశం ఉంది. నాలో నేను పేరిట ఆత్మకథను రాసుకున్నారు. ఇది టెలీ సీరియల్ గా కూడా వచ్చింది. వంటలు చేయడంలో అందివేసిన చెయ్యి. చెన్నై నగరంలో డా. భానుమతి రామకృష్ణ మెట్రిక్యులేషన్ స్కూలు స్థాపించి ఉచిత విద్యను అందించారు. తమిళనాడు ప్రభుత్వ సంగీత కళాశాలకు ప్రిన్సిపాల్ గా కూడా పనిచేశారు. తిరుపతి తిరుమల దేవస్థానం బోర్డు మెంబరుగా కూడా కొంతకాలం ఉన్నారు.          అన్నిటిని మించి భానుమతి మంచి రచయిత్రి. తెలుగువారు గర్వించదగ్గ అత్తగారి కథలు రచించారు. వీరు రచించిన కథలు- 1967లో అత్తగారి కథలు(7), 1971లో అత్తగారూ - నక్సలైట్లూ (9), 1985లో అత్తగారి కథలు (8), 1991లో భానుమతి కథలు (20) పేరిట ముద్రితమై అందుబాటులోకి వచ్చాయి. వీరి కథల్లోని అత్తగారు హాస్యాన్ని పండిస్తూనే తన పెద్దరికాన్ని నిలబెట్టు కుంటుంది. మానత్వాన్ని ప్రదర్శిస్తుంది. అత్తగారి ప్రవర్తన, మాటలు, చేతలు హాస్యాన్ని పుట్టిస్తూ ఆసక్తిగా సాగుతాయి. ఈ కథల్లోని అత్తగారు మద్రాసులో ఉంటారు. ఇంట్లో, చుట్టుపక్కల ఇళ్లల్లో ఈమె మాటకు తిరుగు ఉండదు. అందరూ ప్రేమను అభిమానాన్ని ఈమె పై కురిపిస్తారు. ఆవకాయ పెట్టడం నుంచి అరటి కూర చేయడం వరకు అందివేసిన చెయ్యి. పాతకాలపు పెద్దమనిషి. తెలుగు సాహిత్యంలో గిరీశం, ఎంకి, బుడుగు పాత్రలు ఎలా నిలిచిపోయాయో భానుమతి అత్తగారి పాత్రకూడా అలానే నిలిచిపోయింది. ఇవి ఆంగ్లంలోకి కూడా అనువాదమయ్యాయి.                          భానుమతి కృషికి ఎన్నో అవార్డులు, పురస్కారాలు వచ్చాయి. 1956లోనే రాష్ట్ర గౌరవ పురస్కారం వచ్చింది. 3 సార్లు జాతీయ పురస్కారాలు పొందారు. తమిళులు ఈమెను తమ రాష్ట్ర అష్టవధానిగా కీర్తిస్తారు. కేంద్రప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చింది. 1975లో ఆంధ్రవిశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదును ప్రధానం చేసింది. 1984లో మద్రాసు ప్రభుత్వం కలైమణి బిరుదు ఇచ్చింది. 1986లో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు ప్రధానం చేసింది. 1986లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ దర్శకురాలిగా గుర్తించింది. అత్తగారి కథలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది.          ఇలా బహుముఖీన ప్రతిభతో వివిధ రంగాలలో కృషి చేసిన భానుమతి 2005, డిసెంబర్ 24 న మరణించారు. ఆమె నేటి తరానికి ఆదర్శం. ఆమె పట్టుదల ఓ పాఠం. ఎందరో మహిళలకు ఆమె ఒక లెజెండ్.

ఆరుద్ర ఆనవాళ్లు

ఆరుద్ర ఆనవాళ్లు                                                     - డా. ఎ.రవీంద్రబాబు               ఆరుద్ర అధ్బుతమైన ప్రతిభాశాలి. పై చదువులు చదువుకోక పోయినా ఆయన ఓ విశ్వవిద్యాలయం. గురువు లేక పోయినా ఆయనే గురుతుల్యుడు. ఆయనకు ఏ డిగ్రీలు లేక పోయినా ఆయన రచనలే అనేక మంది పరిశోధకులకు డాక్టరేట్ పట్టాలను ఇప్పించాయి. ఆయన సాహిత్యంలో చేపట్టని ప్రక్రియ లేదు. ఆయన చేయని ప్రయోగం లేదు. ఆయనకు రాని విద్య లేదు అంటే అతిశయోక్తి కాదు. సినీ కవులే కాదు, సాహితీ వేత్తలు కూడా ఏ అనుమానం వచ్చినా ఆరుద్రనే అడిగి ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకొనే వారట. అందుకే ఆరుద్ర అవిశ్రాంత సాహితీ యోధుడు.        అరుద్ర అసలు పేరు భాగవతుల శంకరశాస్త్రి. ఆరుద్ర పుట్టిన నక్షత్రాన్ని బట్టి ఆయనను ఆరుద్ర అని పిలిచేవారు. అదే ఆయన కలం పేరుగా పెట్టుకున్నారు. ఆరుద్ర ఆగస్టు 31, 1925లో విశాఖపట్నంలో జన్మించారు. వరసకు శ్రీశ్రీ వీరికి మేనమామ. ఆరుద్రకు తొలి గురువు తండ్రి నరసింహారావు. ఆరుద్ర ప్రాథమిక విద్యను విశాఖపట్నంలో పూర్తి చేశారు. ఇంటర్మీడియట్ కోసం విజయనగరం వెళ్లినా జాతీయ రాజకీయాల ప్రభావంతో చదువుకు స్వస్తి చెప్పారు. కానీ విశాఖపట్నంలోని రీండింగ్ రూమ్ అనే గ్రంథాలయాన్ని మాత్రం వదల్లేదు. ఎన్నో అమూల్యమైన గ్రంథాలను అక్కడే చదివారు. పైగా శ్రీశ్రీ, రోణంకి అప్పల స్వామి, చాగంటి సోమయాజుల పరిచయాలతో కవిత్వంపై, తెలుగు సాహిత్యంపై మక్కువ పెంచుకున్నారు. చాసో పరిచయం, అపారమైన పుస్తక పరిజ్ఞానంతో మార్క్సిజం పై అభిమానంతో కమ్యూనిస్టు సభ్యత్వాన్ని పుచ్చుకున్నారు. చివరి వరకు ఆ భావాలతోనే జీవించారు.            కవిగా, రచయితగా కూడా ఆరుద్రది ప్రత్యేక ముద్రే. ఆరుద్ర 1960 నాటికి కవిగా గుర్తింపు పొందినా 13 ఏటనే నా కలలో అనే కవితను రాశారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో విశాఖపట్నం పై జరిగిన బాంబుల దాడిని ఖండిస్తూ లోహవిహంగాలు అనే కవిత రాశారు. 1948 జూలై 10న కృష్ణాపత్రికలో రజాకార్లచే అతిదారుణంగా మానభంగం చేయబడిన వార్త చదివి చలించి తెలంగాణ అనే కావ్యాన్నే రాశారు. కానీ శ్రీశ్రీ సూచన మేరకు దానికి త్వమేవాహమ్ అని పేరు మార్చారు. త్వమేవాహమ్ అంటే నువ్వే నేను అని అర్థం. కవిత్వంలో ప్రయోగాలు చేస్తూ సినీవాలీ అనే కావ్యాన్ని కూడా రాశారు. సినీవాలీ అంటే అమావాస్యలో కనిపించే చంద్రుడు అని అర్థం. గాయాలు - గేయాలు, కూనలమ్మ పదాలు, వెన్నెల - వేసవి, ఇంటింటి పద్యాలు, పైలా పచ్చీసు, రామలక్ష్మీ త్రిశతి వంటి కావ్యాలు ప్రచురించారు. రాముడికి సీత ఏమౌతుంది... వంటి పరిశోధనాత్మక రచనలూ చేశారు. వేమనవేదం, వ్యాసపీఠం, గురజాడ గురుపీఠం లాంటివి ఆరుద్ర వ్యాస రచనలు. డిటెక్టివ్ కథలు కూడా రచించారు. అంతేకాదు  తెలుగులో చదరంగం పై ఓ పుస్తకాన్ని కూడా వెలువరించారు. సాలభంజిక, శ్రీకృష్ణదేవరాయలు, కాటమరాజు కథ లాంటి నాటకాలు కూడా రచించారు. ఇవన్నీ ఒకెత్తైతే కె.వి. రెడ్డి కవి తిక్కన, ఖఢ్గతిక్కన ఒకరేనా అన్న ప్రశ్నకు సమాధానంగా సమగ్రాంధ్ర సాహిత్యాన్ని 13 సంపుటాలుగా తెలుగు ప్రజలకు అందించిన పరిశోధనా దురంధరుడు ఆరుద్ర. ఈ రచన చేసేటప్పుడు కళ్లకు సమస్య వస్తే బూతద్దంతో కావ్యాలను పరిశోధించాడు.  భరతనాట్యం గురించి కూడాపరిశోధనా రచనలు చేశాడు. ఇలా ఆరుద్ర ఏ పనిచేసినా, ఏ రచన చేసినా విపులంగా, సవివరంగా, పరిశోధనా పద్దతిలో సమగ్రంగా చేసేవారు.          ఆరుద్ర బతుకు తెరువుకోసం అనేక ఉద్యోగాలు కూడా చేశారు. ఆనాటి బొంబాయిలోని రాయల్  ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో గుమస్తాగా, ఆనందవాణి పత్రికకు సంపాదకుడిగా, విశాఖ హర్బర్ లో గుమస్తాగా, ఫోటోగ్రాఫర్ గా, మద్రాసు ఢంకా పత్రికలో ఫ్రూఫ్ రీడర్ గా పనిచేశాడు. ఎక్కడ చేసినా చాలీచాలని జీతంతో ఇబ్బందులు పడ్డారు. 1948లో సినీరంగంలోకి అడుగుపెట్టాడు. అంత్యప్రాసలతో అలవోకగా కవిత్వం రాయగల ఆరుద్రకు పాటలు రాయడం పెద్ద కష్టమేమీ కాలేదు. అందుకే సుమారు 4,500 పాటలు రాశారని చెప్పొచ్చు. కొన్ని సినిమాలకు మాటలు కూడా అందించారు. వారి పాటలు చిత్రంలోని కథకు, సన్నివేశానికి, పాత్రలకు తగిన విధంగా ఉంటాయి. యుగళగీతాలు, విరహగీతాలు, దేశభక్తి గీతాలు, హాస్య గీతాలు, చారిత్రకగీతాలు ఏవైనా ఆరుద్ర తనదైన ముద్రతో రాశారు.              1964లో బొబ్బిలియుద్ధం చిత్రంలో ముత్యాల చెమ్మచెక్క రత్నాలచెమ్మచెక్క అంటూ జానపద బాణిని వాణిని పాటలో వినిపించారు. రక్తసంబంధం చిత్రంలో బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే అంటూ పెళ్లి కూతురు వైభవాన్ని కళ్లకు కట్టారు. అలానే అందాల రాముడు చిత్రంలో ఎదగడాని కెందుకురా తొందరా ఎదర బతుకంతా చిందరవందర అంటూ విద్యా వ్యవస్థను, మానవుని జీవితాన్ని వ్యగ్యంగా చిత్రించారు. నాయకుడు చిత్రంలో ఏకంగా గోంగూర గురించి అద్భుతమైన పాట రాశారు. భాగ్యనగరం గురించి, మహాబలిపురం గురించి ఆయన రాసిన పాటలు ఆ ప్రదేశాల చారిత్రక వైభవాన్ని చాటుతాయి. లక్ష్మీనివాసం చిత్రంలో ధనమేరా అన్నిటికి మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవధర్మం అని పాటలో ఏకంగా ధనం విలవను, దానిని మనుషులు ఏలా చూడాలో వివరించారు. వీరాభిమన్య చిత్రంలో అదిగో నవలోకం వెలిసే మనకోసం అంటూ ప్రణయగీతానికి పల్లవి పాడారు.           తొలి ప్రేమలో పడిన మనసు ఊహల్ని వర్ణిస్తూ - బందిపోటు చిత్రంలో ఊహలు గుసగుసలాడే నా హృదయం ఊగిసలాడే అని వలపు బాసల్ని తెలిపారు. గాంధి పుట్టిన దేశామా ఇది, నెహ్రుకోరిన సంఘమా ఇది అంటూ పవిత్రబంధం చిత్రంలో సామ్యవాద భావాలను సందర్భాను సారంగా రాశారు. కొండగాలి తిరిగింది గుండె వూసులాడింది గోదావరి వరదలాగ కోరిక చెలరేగింది అని మనసులోని కోరికల గుట్టు తీవ్రతను తెలిపారు. నీలిమేఘాలు, గాజు కెరటాలతో తేలిపోయే అనుభూతిని బావామరదళ్లు చిత్రంలో ప్రేక్షకులకు కలిగించారు. పెళ్లిపుస్తకం చిత్రంలో వివాహం పరమార్థాన్నిమనసుమనసు కలపడమే అని నిర్ధారణ చేశారు. పచ్చని చెట్టు ఒకటి వెచ్చని చిలుకలు రెండూ అని రాము చిత్రంలో భార్యాభర్తల అనుబంధాన్ని పిల్లాడిచే పాడించారు. దేవుడు చేసిన మనుషులు సినిమాలో మసక మసక చీకటిలో మల్లెతోట వెనకాల అని.. ఘాటైన గీతాన్ని పసందుగా చెక్కారు. కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించారు. ఇలా ఆరుద్ర పాటలు భాషలో, భావంలో, అనుభూతిలో, ప్రయోగంలో అరుదైనవి, అతి సుందరమైనవి.        వీరిని 1974లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి ఉత్తమ విమర్శకుని పురస్కారం, 1985లో తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ పరిశోధకుడి అవార్డు, 1985లో వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేటు వరించాయి. 1987లో వీరి గురజాడ గురుపీఠం పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా లభించింది. ఆంధ్ర విశ్వకళాపరిషత్ వీరిని కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది.  పెళ్లిపుస్తకం చిత్రంలోని శ్రీరస్తు శుభమస్తు గీతానికి మనస్విని ఆత్రేయ పురస్కారం కూడా వచ్చింది. వీరి రచనలపై పరిశోధనలు జరిగాయి. జరుగుతున్నాయి.         కంటి చూపు కోల్పోయినా పరిశోధన సాగించిన ఆరుద్ర 1998 జూన్ 4న తన ప్రయాణం ముగించుకొని వెళ్లిపోయారు. ఆ అక్షరయోగి, ఆ పరిశోధనా పనిరాక్షసుడు తెలుగు సమాజానికి, సాహిత్యానికి అమూల్య నిధులను మిగిల్చి తన దారిన తాను వెళ్లిపోయారు. ఆయన పుస్తకాలే మనకు ఆయన జ్ఞాపకాలు. ప్రతి ఒక్కరూ చదవాల్సిన విజ్ఞాన నిలయాలు.    

దైవం గురు రూపేణ

దైవం గురు రూపేణ   ఒక చిన్న కథ. ఓ వ్యాపారవేత్త పనిమీద బయల్దేరతాడు. కారులో రోడ్డు మీద ప్రయాణం. మధ్యలో  భోజనానికని ఓ ఊరిలో ఆగుతాడు. అక్కడ ఓ చిన్న హోటల్ కనిపిస్తే అక్కడకి వెళ్తాడు.  కావల్సినవి ఆర్డర్ చేసి ఎదురుచూస్తుండగా, సడన్‌గా వెయిటర్స్, హోటల్ యజమాని అందరూ బయటకి పరిగెత్తడం చూస్తాడు. ఏమయ్యింది, ఎందుకిలా పరిగెడుతున్నారు అనుకుంటాడు. కాసేపటికి వాళ్ళంతా ముందు నడుస్తూ వెనక ఎవర్నో గౌరవంగా తీసుకురావడం చూస్తాడు. ఆ వెనక ఎవరు వస్తున్నారు? ఎందుకు వీళ్ళంతా ఇంత కంగారుగా పరిగెట్టారు? అంత వినయంగా ఎందుకు చేతులు కట్టుకుని నిల్చున్నారు... ఇలాంటి బోలెడన్ని సందేహాలతో ఆ వచ్చే వాళ్ళెవరో తెలుసుకోవాలనే ఆతృతతో లేచి నించుని తలుపు వైపు చూస్తాడు అతను. అతనికి అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యం వేసింది. కారణం అక్కడ ఓ వృద్ధురాలు మెల్లగా నడుస్తూ వస్తోంది. ఆమె బ్యాగు, శాలువా లాంటివి పట్టుకుని ఆ హోటలు యజమాని ఆమె  పక్కనే నడుస్తున్నాడు. ఆమెని గౌరవంగా తీసుకొచ్చి ఓ టేబుల్ దగ్గర కూర్చోబెట్టాడు. ఆమెకి కావలసినవి అడిగి స్వయంగా తేవడానికి కిచెన్‌లోకి వెళ్ళాడు. పక్కనుండి వడ్డించాడు. ఆమె తింటున్నంతసేపూ ఆమెతో కబుర్లు చెబుతూ పక్కనే  చేతులు కట్టుకుని నిల్చున్నాడు. ఇదంతా చూస్తున్న వ్యాపారవేత్తకి ఆవిడ ఎవరో ఏమిటో తెలుసుకోవాలన్న తాపత్రయం కలిగింది. ఓ వెయిటర్‌ని పిలిచి ఆవిడ ఎవరు? ఎందుకు అందరూ అంత గౌరవిస్తున్నారు అని అడుగుతాడు. ఆ వెయిటర్ ఓ పదినిమిషాలు ఆగండి - ఆమెని పంపించి వచ్చి చెబుతాను అంటాడు. ఆ తర్వాత ఆమెని కారుదాకా వెళ్ళి సాగనంపి వచ్చిన ఆ హోటల్ యజమాని వ్యాపారవేత్త దగ్గరకి వచ్చి, ఆమె ఎవరు.. ఎందుకంత గౌరవిస్తున్నామని అడిగారట కదా.. ఆమె మా టీచరు అంటాడు. అందుకు ఆ వ్యాపారవేత్త ‘‘ఓస్ టీచరా‌?’’ ఇంకెవరో అనుకున్నా అంటాడు. అదేంటి అలా తీసిపారేశారు? ఆమే లేకపోతే నేనీరోజు ఇలా వుండేవాడిని కాదు. నేనేకాదు ఎన్నోవేలమంది ఈరోజు జీవితంలో సుఖంగా, సంతోషంగా ఉన్నారంటే కారణం ఆవిడే అంటూ ఆమె గురించి చెబుతాడు. మేం స్కూల్ ఫైనల్లో వుండగా వచ్చారీ టీచరు. మా స్కూలుకి, మా క్లాస్‌లో వుండే బ్యాచ్‌కి అల్లరి పిల్లలని, మొండి ఘటాలని పేరు. ఏ టీచర్ వచ్చి ఏం చెబుతున్నా మాకు లెక్కే లేదు. మా గోల మాది. టీచర్లంతా తెగ కొట్టేవారు, తిట్టేవారు. ఇంట్లోనూ అంతే. ఛీ, ఛాలకి అలవాటు పడిపోయాం. అలాంటిది ఈ టీచరు వచ్చిన ఓ నెల తర్వాత మమ్మల్ని ఒక్కొక్కళ్ళని పిలిచి ఒక పేపరు ఇచ్చారు. ఏంటని తీసి చూస్తే అందులో నా పట్టుదలని, హాస్య ప్రియత్వాన్నీ మెచ్చుకుంటూ రాశారు.  అలా ఎవరెవరిలో ఏవి బెస్ట్ క్వాలిటీస్ అనుకుంటున్నారో అవి రాశారు. మమ్మల్ని ఎవరైనా మెచ్చుకోవడం అన్నది అదే మొదటిసారి. మాలో మాకే తెలియని లక్షణాలని ఆ టీచరు గుర్తించారు. ఇలా ప్రతి నెలా ఓ పేపర్ మీద మాలోని మార్పులు, మాలోని మంచి గుణాలు రాసి ఇచ్చేవారు. రానురాను ఆమె రాసిచ్చే ఆ కాగితాల కోసం మేమంతా ఎదురుచూసేవాళ్ళం. మనల్ని ఎవరైనా మెచ్చుకుంటే మనకి తెలియకుండానే మని ఇంకా మెప్పుని పొందాలని ప్రయత్నిస్తాం. అదే జరిగింది మా విషయంలో కూడా. ఇలా ఓ సంవత్సరం అయ్యేసరికి మా బ్యాచ్ అందరికీ స్కులులో మంచి పేరు వచ్చింది. మంచి మార్కులు వచ్చాయి. ఇన్ని సంవత్సరాలు అంతమంది తిట్టి, కొట్టి సాధించలేనిదాన్ని ఒక్క మెచ్చుకోలుతో ఈ టీచరు సాధించారు. మేం బయటకి వచ్చేసేరోజు మా అందరికీ ఓ బైండ్ బుక్ ఇచ్చారు. అందులో ఆ సంవత్సరంపాటు టీచర్ మాలోని లక్షణాలని మెచ్చుకుంటూ మాకిచ్చిన కాగితాలు బైండ్ చేసి వున్నాయి. ఎప్పుడూ మామీద మాకు అపనమ్మకం కలిగినా మాలోని బెస్ట్ క్వాలిటీలు ఏంటో గుర్తు చేస్తుంది ఈ పుస్తక... అంటూ టీచరు ఆరోజు మాకు చెప్పిన ఆ మాటలే, ఆ నమ్మకమే, ఆ మెచ్చుకోలే ఈరోజు మమ్మల్నందర్నీ మంచి పొజీషన్‌లో వుంచింది. ఇప్పుడు చెప్పండి.. ఆమె అంతటి గౌరవానికి అర్హురాలా.. కాదా? నిజమే ఈరోజు మనం ఎవ్వరం ఎక్కడున్నా, ఏ స్థాయిలోవున్నా నిస్సందేహంగా దానికి కారణం మనకి విద్య నేర్పించిన ఆ గురువులే! వారి ఒక చిన్నమాట మనలో ధైర్యాన్ని, ఆశని, ఆకాంక్షని నింపి మన కలల వెంట మనం పరుగులు పెట్టేలా చేసింది. అందుకే వారికి కృతజ్ఞతలు చెప్పాల్సిన ఈ రోజున ఒక్కసారి వారందరినీ మనసారా స్మరించుకుందాం. గురుపూజోత్సవ శుభాకాంక్షలు.     - రమ ఇరగవరపు