" ఏడు రోజులు " 15వ భాగం

" ఏడు రోజులు " 15వ భాగం       రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి       ఇద్దరూ కలిసి మౌనంగా ముందుకు నడుస్తున్నారు. షూటింగ్ ఏర్పాట్లు ఆగిపోయాయి. వాతావరణం కలవరంగా తయారైవుంది.          "తమ్మారెడ్డి భరద్వాజ, దాసరినారాయణ రావు, నరేష్, ఇంకా చాలామంది వచ్చారు" మరికొంత ముందుకు వెళ్ళాక చెప్పాడు జోసెఫ్.          "అలాగా" అన్నట్టుగా తలపంకించాడు భవానీశంకర్.          "రేపట్నుండి ఈ జూనియర్ ఆర్టిస్టులు ఇందిరాపార్క్ దగ్గర ధర్నా కొనసాగిస్తారట"          "...."          "ఏదోలేరా! కాసేపు వుండి వెళ్ళిపోదాం"          పదిహేను నిమిషాల్లో వివాదస్థలికి చేరుకున్నారు. ఇద్దరూ అక్కడ వున్న మిగతా మిత్రులు భవానీశంకర్ ని చీవాట్లు వేశారు. కిమ్మనలేదు భవానీశంకర్. నిశ్శబ్దంగా నిలబడి అందర్నీ పరికించసాగాడు.          పత్రికలవాళ్ళు టీవీ ఛానెల్స్ వాళ్ళు, హడావిడి పడుతున్నారు. "చచ్చేవాడు చస్తే బతికున్నోడికి పండుగ" అన్నట్లుగా టీవీ కెమేరాల్లో బంధింపబడాలని చాలామంది ప్రయత్నిస్తూ కెమేరాలు ఎటుతిరిగితే అటు తిరుగుతున్నారు.          వాళ్ళవైపు వెటకారంగా చూశాడు భవానీశంకర్ ఇప్పుడే కాదు, ఒకసారి కర్నూల్ లో కూడా ఇట్లాంటి సంఘటనే జరిగింది.          "తను బంధువుల పెళ్ళికోసం కర్నూల్ వెళ్ళాడు. పెళ్ళి మద్యలో ఆగిపోయింది. కట్నం కోసం పీటల మీద పెళ్ళి ఆగిపోవడంతో పెళ్ళికూతురు తరపువాళ్ళ వేదన అంతా ఇంతా కాహ్డు. తను పెళ్ళికొడుకు తరపు అయినప్పటికీ, పెళ్ళికూతురి తరపు వాళ్ళమీద జాలి కనబర్చాడు.          పెళ్ళికూతురి తల్లిదండ్రులు బాగా ముసలివాళ్ళు పైగా పేదవాళ్ళు వాళ్ళను చూస్తుంటే తనక్కూడా ఏడుపు ముంచుకొచ్చింది. కఠినంగా వ్యవహరిస్తున్న పెళ్ళికొడుకువైపు వాళ్ళను శక్తిమాన్ లా మారికొట్టాలనిపించింది కూడా!          ఇట్లాంటి విపత్కర పరిస్థితిలో పెళ్ళికూతురు ఆత్మహత్య చేసుకోబోయింది. సమయానికి అందరూ వున్నారు కాబట్టి ఆమెను ఆదుకోగలిగారు.          పెళ్ళిపెద్దలు ఇరువురి మధ్య ఏకీభావానికి ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో అక్కడికి సమీపంగా వున్న ఒక హాస్పిటల్ లో షూటింగ్ నిమిత్తం చిరంజీవి వచ్చాడు అంతే! ఇక్కడ వీళ్ళ బాధ ఏమైతే మాకెందుకు అన్నట్టుగా సగానికి పైగా బంధుజనాలు చిరంజీవిని చూడ్డానికి పరుగో పరుగు!          ఇప్పుడు ఇక్కడ కూడా అట్లాంటి పరిస్థితే కనపడుతోంది. ఏంటో వెర్రిజనాలు!"          "జోసెఫ్" కాసేపటి తర్వాత పిలిచాడు భవానీశంకర్.          "ఊ..." చూడకుండానే పలికాడు జోసెఫ్.          "ఇంకా ఇక్కడ నిల్చుని ఏం చేస్తారు?" అన్నాడు భవానీశంకర్.          "సరేలేరా! ఇంకా నువ్వు బతకనిచ్చేట్టు లేదు" అని మిగతా మిత్రులవైపు చూస్తూ, "రేయ్! నాష్టచేసి ఇంకా వెళ్దాం రండి" అన్నాడు జోసెఫ్.          మిత్రులందరూ అక్కడ్నుంచి బయలుదేరారు. వెళ్తుంటే జోసెఫ్ అన్నాడు.          "రజనీకాంత్ తో మాట్లాడి, ఫోటో తీయించుకుని, నా గుర్తుగా ఆయనకి ఏదైనా గొప్ప కానుకను ఇవ్వాలని వుందిరా"          "అభిమానం వుండాలి. కాని నీలా వెర్రి అభిమానం వుండకూడదు. ఒకసారి గొప్ప కానుక అంటావు, ఇంకోసారి సినిమా హిట్టయితే ఫ్రెండ్స్ అందరికీ చికెన్ బిరియాని డిన్నర్ అంటావు. ఈ పిచ్చి కాస్త వదిలించుకోరా" అన్నాడు భవానీశంకర్.          "వెర్రిగా వుండకూడనిది అభిమానం ఒక్కటే కాదు, ప్రేమ కూడా" అన్నాడు జోసెఫ్.          "అంటే?"          "నీది వెర్రిప్రేమ"          "న అపరిమ వెర్రిది కహ్డు, ప్రేమకోసం వెర్రివాడినయ్యాను"          "మాటలు నేర్చాడు మన హీరో" అంటూ భవానీశంకర్ ను చుట్టేశాడు జోసెఫ్.          మిగతా మిత్రులు అందుకు వంతపాడుతూ "మామూలు హీరో కాదు, మెగాస్టార్ మనవాడు" అన్నారు.                  *    *    *          ఉదయం పదకొండు గంటలకు కావొస్తోందనగా ఇంటికి వచ్చాడు భవానీశంకర్.          "నువ్వేదో ఆ పిల్లను ఉద్దరిస్తాను అన్నావుకదా! నువ్వు ఉదరించక మునుపే ఆ పిల్ల వెళ్ళిపోయింది" రాగానే అంది లక్ష్మీదే వమ్మ ఆ గొంతులో కాసింత వ్యంగ్యం.          ఉలిక్కిపడి చూశాడు భవానీశంకర్.          నవ్వింది లక్ష్మీదేవమ్మ. "ఏంట్రా అలా చూస్తావు? రాత్రి పన్నెండు గంటలకు మీసాలు లేని గడ్డపాయన కార్లో వచ్చాడు. ఒంటిగంటకల్లా ఆ పిల్లను తీసుకుని వెళ్ళిపోయాడు" నవ్వాక అంది.          ఒక్కసారి అగ్నిపర్వతం కూలి తన మీద పడుతున్న భావన కలుగుతుంటే అప్రయత్నంగా చేతిలోని పాకెట్ రేడియోని జార విడిచాడు భవానీశంకర్.          "కానీ ఒక్క విషయంలో జాలివేస్తోంది. చేసుకునేవాడు ఎవ్వడైనప్పటికీ పడుచువాడై వుంటే బాగుండేది. కాని ఆ వచ్చినవాడు సాయిబుకే తండ్రిలా వున్నాడు" లక్ష్మీదేవమ్మ గొంతులో కొద్దిగా సానుభూతి.          అప్పటికి భవానీశంకర్ పరిస్థితి అరణ్య రోదనలా తయారయ్యింది. సత్తువ లేనివాడిలా అడుగులో అడుగు వేస్తూ గుమ్మం దాకా వెళ్ళి గౌసియా వాళ్ళ ఇంటివైపు చూశాడు.          దేవతలేని గుడిలా కనిపించింది ఆ ఇల్లు కాని అదేమీ పట్టనట్లుగా ఆమె చిన్న చెల్లెళ్ళు ముగ్గురు ఇంటిముందు తాడు ఆట ఆడుకుంటున్నారు. పెద్ద చెల్లెళ్ళు ఇద్దరు కూలిన బాతుల గూడును తిరిగి కడుతున్నారు. ఇంకో చిన్న పిల్ల గడప సందుల్లో కూర్చుని వుంది. అందరికంటే చిన్నదాన్ని ఎత్తుకుని వున్న ఖతీజాబీ మాత్రం కొత్త చీరలు అమ్మేవాడిని ఇంటిముందు నిల్చోబెట్టుకుని ఏదో మాట్లాడుతోంది.          ఎప్పుడూ పాత చీరలు బేరం చేసే ఖతీ జాబీని అలా చూడగానే భవానీశంకర్ సహించలేకపోయాడు. అలాగని ఆమెను ఏమీ అనలేడు కాబట్టి పగిలిన గుండె గుప్పెడు వేదనను పంచి ఇస్తుంటే అప్రయత్నంగా కళ్ళనీళ్ళు తుడుచుకున్నాడు.          విమానంలో షేక్ పక్కన కూర్చుని వుంది గౌసియాబేగం. బాగా ఏడ్చినందున ఆమె కళ్ళూ, ముఖం ఉబ్భిపోయి వున్నాయి. అవేమీ బయటికి కనిపించకుండా ధరించిన బురఖా అడ్డుకుంటోంది. అప్పటికే బాగా అలసిపోయింది కాబట్టి ప్రస్తుతం ఆమె ఏడవడంలేదు. నిశ్శబ్దంగా కూర్చుని ప్రియుడి గురించి ఆలోచిస్తోంది సన్నగా వెక్కుతోంది కూడా కాని ఆమెను ఎవ్వరూ గమనించడంలేదు. ...... ఇంకా వుంది .........  

" ఏడు రోజులు " 14వ భాగం

" ఏడు రోజులు " 14వ భాగం       రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి       అనుకోని ఆనందం ఎదురైతే అందరూ ఎలావుంటారో తెలీదు కాని తను మాత్రం లోకాన్ని మరిచిపోయాడు. అందుకే ఒక పని చేయాల్సింది పోయి మరోపని చేయడం ఒక మాట మాట్లాడాల్సింది పోయి మరొక మాట మాట్లాడ్డం చేశాడు. తన ప్రవర్తనకు మిత్రులంతా నవ్వుకున్నారు. తనూ నవ్వాడు కాని తమ ప్రేమ గురించి ఆ రోజే తన మిత్రులతో చెప్పుకోలేక పోయాడు.     అదే సమయంలో గౌసియా వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు ఇంటినుండి వచ్చారు.          వాళ్ళను చూడగానే సిరాజ్ గాడు అలవాటుగా తన పాత 'చాయ్ బండి చపాతీ' అంటూ సన్నగా ఈల వేస్తూ పాడటం మొదలెట్టాడు.          "ఊరుకోరా" వారించాడు తను.          "ఏంట్రా? ఏ రోజూ లేందీ ఈ రోజు సపోర్ట్ ఇస్తున్నావు?" ఆశ్చర్యంగా చూశాడు సిరాజ్.          "ఒకర్ని వెక్కిరించడం దేనికి? వాళ్ళ బతుకేదో వాళ్ళు బతుకుతున్నారు" అన్నాడు తను.          "ఇది వెక్కిరించడం కాదు జస్ట్ కామెడీ సో టేకిట్ ఈజీ?" అంటూ కూర్చున్న చెయిర్ లోంచి ముందుకు వంగి, "నాకేదో అనుమానంగా వుంది" అన్నాడు సిరాజ్.          "అనుమానం దేనికి?" గుమ్మడికాయల దొంగలా అడిగాడు తను.          "సపోర్ట్ ఎందుకు ఇస్తున్నావు?"          "సపోర్ట్ అని కాదు"          "మరి?"          "ఏదో... అన్నాడు అంతే!"          అంటూ అప్పుడు విషయాన్ని దాటవేశాడే గాని, నిజానికి తమ ప్రేమ గురించి మిత్రులతో చెప్పుకోవాలని తనకు ఆరాటంగా వుంది. కాని ఏదో భయం అందుకే కొన్ని రోజులవరకు మౌనంగా వుండిపోయాడు.          అయితే ఆరోజు దావత్ తర్వాత ఇంటికి వెళ్తుంటే గౌసియా గురించి ఆలోచనలు తనను వివశుడ్ని చేశాయి. అందుకే తనలో తనే నవ్వుకుంటూ ఇంటివైపు నడవసాగాడు.          "ఏయ్ పిల్లగా... శంకర్" కొంతదూరం వెళ్ళాక బాలస్వామి గొంతు వినబడింది.          "వోర్నీ! వీడు చూశాడా? క్లాసు తప్పదు" అనుకుంటూ ఆగి వెనక్కు చూశాడు.          "నీకు మొలతాడు లేదా?" అనుకుంటూ దగ్గరగా వచ్చాడు బాలస్వామి.          "ఆ..." తడబడ్డాడు తను.          "మొలతాడు లేని ఆ తుర్కనాకొడుకులు మనిషికి రెండు ముక్కలు అంటూ లెక్కగట్టి కూర వేస్తారు. అట్లాంటివాళ్ళ దావత్ కు నువ్వు వెళ్తావా? అస్సలు నీకు ఎన్నిమార్లు చెప్పాలి? ఆ తుర్కోళ్ళ పిల్లగాడితో దోస్తానం చేయొద్దని?" అధికారం చలాయించాడు బాలస్వామి.          "ఆ..." తడబాటే తన సమాధానం అయింది.          "ప్చ్! మన హిందువులు బాగుపడరు" అంతకంటే ఎక్కువ మాట్లాడకుండా అక్కన్నుండి విసుగ్గా వెళ్ళిపోయాడు బాలస్వామి.          "హమ్మయ్య" అతడు వెళ్ళిపోగానే ఊపిరి పీల్చుకున్నట్టయింది తనకు.          "రేయ్... రేయ్..."          మిత్రుల కంఠం వున్నట్టుండి వినబడింది.          ఉలిక్కిపడి చూశాడు భవానీశంకర్.          "కలలోకి వెళ్ళావేమిరా?"          "కలలో ఎక్కడెక్కడ విహరించావు?"          మిత్రులు టీజింగ్ గా అడుగుతుంటే లేదురా... లేదురా...." జుత్తు సరిచేసుకుంటూ దాటవేశాడు భవానీశంకర్.          అప్పటికి సమయం ఏడున్నర కావొచ్చింది. షూటింగ్ ఏర్పాట్లు ఇంకా గావిస్తున్నారు.          భవానీశంకర్ కు విసుగ్గా వుంది. "ఈ ఏర్పాట్లకు అంతం ఎప్పుడో" హడావిడి పడుతున్న వర్కర్స్ ని చూస్తూ అన్నాడు.          "ఆ తొందర ఎందుకు?" అన్నాడు జోసెఫ్.          అందుకు ఏం మాట్లాడలేదు భవానీశంకర్ మనసును కుదుటపర్చుకునేందుకు గానూ తనకు వచ్చిన పాటను హమ్ చేయసాగాడు.          "హింద్ దేశ్ కే నివాసీ సబ్ జనో ఏక్ హై..."          అంతలో మూడు పోలీస్ వ్యాన్లు సర్రున అక్కడికి దూసుకువచ్చాయి.          "షూటింగ్ కి ఇంత బందోబస్తా?" ఆశ్చర్యపోయారు. పోలీసులు వ్యాన్లలోంచి దిగి హుటాహుటిగా అక్కడికి సమీపంగా వున్న గుడి సెలవైపు నడిచారు.          ఎవ్వరికీ ఏమీ అర్ధం కావడంలేదు. అక్కడున్న జూనియర్ ఆర్టిస్టుల గుడిసెల్ని తొలగించడానికి పోలీసులు సంసిద్దులు అయ్యారని కాసేపటి తర్వాత అందరికీ అర్ధం అయింది.          జూనియర్ ఆర్టిస్టులు గగ్గోలు పెడుతున్నారు. పోలీసులు వాళ్ళ ఆక్రందల్ని, ప్రతి ఘటనల్ని, అరుపుల్ని, ఎంతమాత్రం లెక్కచేయడంలేదు. విచక్షణారహితంగా గుడిసెల్ని కూలగొడుతున్నారు.          షూటింగ్ చూడ్డానికి వచ్చినవాళ్ళంతా అటుకేసి పరుగెట్టసాగారు. భవానీశంకర్, అతడి మిత్రులు అక్కడే నిలబడిపోయి చేష్టలుడిగి చూస్తుండిపోయారు.          "మనం ఇక్కడ్నుంచి వెళ్ళిపోదాం. ఇక్కడేదో పెద్ద గొడవలు జరిగేట్టువున్నాయి" కాసేపటి తర్వాత అన్నాడు భవానీశంకర్.          "వద్దు" అన్నాడు జోసెఫ్.          "గొడవలు జరిగితే కష్టంరా" అన్నాడు భవానీశంకర్.          "గొడవలు ఏం జరగవు" మరో మిత్రుడు అన్నాడు.          "గొడవలు జరగవుగానీ కాసేపయ్యాక సినిమా ప్రముఖులు వస్తార్రా ఇక్కడికి! వాళ్ళను దగ్గర్నుండి చూడొచ్చు" అన్నాడు జోసెఫ్.          "ఏంట్రా? గొడ్డోడు గొడ్డుకి ఏడిస్తే మాలోడు కొవ్వుకు ఏడ్చాడంట" అన్నాడు భవానీశంకర్ (తెలంగాణ సామెత)          "ఎవ్వడికి ఏమైతే మనకేంట్రా? మనం చూడాల్సింది ఫిల్ముస్టార్లను ఆ కోరిక పెద్ద ఎత్తున తీరబోతోంది" ఖుషీగా అన్నాడు జోసెఫ్.          "ఛ! రాస్కెల్" కోప్పడ్డాడు భవానీశంకర్.          అతడితో మిత్రులు ఎవ్వరూ ఏం మాట్లాడలేదు. పోలీసుజులుం గురించి మాట్లాడుకోసాగారు.          "గొడవలు జరిగినా ఈ వెధవలు కదిలేట్టులేరు" తనలోతను అనుకోబోయి పైకే అనేశాడు భవానీశంకర్.          "విసిగించొద్దురా నువ్వెళ్ళు" భవానీశంకర్ వైపు చూడకుండానే చేయి విదిల్చాడు జోసెఫ్.          "వెళ్తానురా" రోషంగా అన్నాడు భవానీ శంకర్.          అతడి మిత్రుడు ఆ రోషాన్ని కించిత్ కూడా లక్ష్యపెట్టలేదు. కాసేపటి తర్వాత అక్కడికి ఐదారు కార్లు వచ్చీరాగానే, అతడి మిత్రులంతా వడివడిగా కార్ల వెనక పరుగెట్టినట్టుగా వెళ్ళారు.          భవానీశంకర్ వెళ్ళలేదు. వెనక్కితిరిగి బస్టాండ్ వైపు అడుగులు వేశాడు.          బస్టాండ్ దగ్గరికి వెళ్ళాక అక్కడ కూడా కలకలమే కనబడింది. జూనియర్ ఆర్టిస్టులు కొందరు అక్కడికి చేరి గొడవ సృష్టిస్తున్నారు.          "మాకు జరిగిన అన్యాయాన్ని మేం సహించం"          "మాకు న్యాయం జరగాలి"          "అందరూ కుమ్మక్కై మా బతుకుల్ని నాశనం చేస్తున్నారు"          "మాకు ఫిలింనగర్ లోనే ఇళ్ళు కావాలి"          "ఇది కావాలని జరిగిన కుట్ర"          "ఈ ఊబిలో మేం ఇరుక్కోం కష్టపడినా మేం అనుకున్నది సాధిస్తాం"          "అవసరమైతే బస్సుల్ని, ఆటోల్ని ఆపేస్తాం అసలు ఈ రోడ్డెంబడి వాహనాలే తిరగకుండా చేస్తాం"          జూనియర్ ఆర్టిస్టులు ఒకరితర్వాత ఒకరు ఆవేశంగా మాట్లాడుతూ ఎగిసెగిసిపడుతున్నారు.          "కొంపదీసి బస్సులు, ఆటోలు, బంద్ అయిపోతే ఇంటికి వెళ్ళడం కష్టమైపోతుంది" వాళ్ళనే చూస్తూ భయంగా అనుకున్నాడు భవానీశంకర్.          అతడి భయాన్ని, కంగారుని, పరీక్ష పెట్టినట్టుగా అర్ధగంట గడిచినా ఒక్క బస్సు రాలేదు.          "శంకర్..." దూరంనుండి జోసెఫ్ గొంతు వినబడింది. తిరిగి చూశాడు భవానీశంకర్.          "ఏంట్రా? చెప్పాపెట్టకుండా వచ్చేస్తే మేం ఏం అనుకోవాలి?" దూరంనుండే కోప్పడుతూ దగ్గరగా వచ్చాడు జోసెఫ్.          "మరేం చేయాలి? మీరు కదిలేట్టు లేరు" అన్నాడు భవానీశంకర్.     "నీకు ఇంత తొందర అవసరం లేదురా! మేం వుండగా నువ్వు ఏ విషయం గురించి కూడా బాధపడకూడదు మా స్నేహితుడు బాధపడితే మాకూ బాధేకదా! వెళ్దాంరా" దగ్గరగా వస్తూనే అన్నాడు.          "..."          "రారా" భవానీశంకర్ భుజంపై చేయివేశాడు జోసెఫ్.          "నా మనసు ఎందుకో శంకిస్తోంది. నేను వీలైనంత త్వరగా ఇంటికి వెళ్ళాలి. గౌసియాను చూడాలి" స్నేహితుడి వెంట నెమ్మదిగా అడుగులు ముందుకు వేస్తూ అన్నాడు భవానీశంకర్.          "నీవు ఇందాకట్నుంచి బాధపడుతుంటే, అర్ధం చేసుకోకుండా వుండేందుకు మేం చిన్నపిల్లలం కాదు గౌసియాతో నీ పెళ్లిని జరిపించే బాధ్యత మాది ఆ బాధ్యతను మేం ఎప్పుడు మర్చిపోయాం. కాబట్టి అనవసరంగా టెన్షన్ పడొద్దు" అన్నాడు జోసెఫ్.          "అది కాదురా" తన భయాన్ని చెప్పుకోబోయాడు భవానీశంకర్.          "నువ్వు ఇంకేం మాట్లాడొద్దు" అన్నాడు జోసెఫ్.          "నా మాట వినరా...." అన్నాడు భవానీశంకర్.          "ఏంమాట?"          "మీ ధైర్యం నన్ను ముందుకు నడిపిస్తోంది అయితే అనుకోకుండా నిన్న రాత్రి కిరాత్రే గౌసియా పెళ్ళి జరిగింది అనుకో అప్పుడేం చేస్తారు?"          "ఆ తాళిని తెంపి పడేస్తాం"          "ఆ అవకాశం లేకుండాపోతే?"          "ఎలా పోతుంది? ఐమీన్ అమ్మాయి చేసుకున్నవాడి వెంట వెళ్ళిపోవడమా? లేక చేసుకున్నవాడికి అంకితం కావడమా?" అని అడిగి ఆ వెంటనే "ఇఫ్ యూ డోంట్ మైండ్ రా! ఆ ఏసు ప్రమాణంగా నీ ప్రేమ గొప్పది అని నాకు తెల్సు అయినప్పటికీ అడిగాను...." అన్నాడు జోసెఫ్.          కొన్ని క్షణాలవరకు భవానీశంకర్ ఏం మాట్లాడలేదు. స్నేహితుడివైపు కళ్ళింత చేసి చూశాడు.          "ఊ... చెప్పరా?" అన్నాడు జోసెఫ్.          "ఆమె లేకుండా నేను బతకలేను" అని మాత్రం అనగలిగాడు భవానీశంకర్.          జోసెఫ్ ఇంకేం అడగలేదు. స్నేహితుడి మనసు తెరిచిన పుస్తకంలా అర్ధమైంది అన్నట్టుగా భవానీశంకర్ భుజాన్ని మృదువుగా తట్టాడు. ...... ఇంకా వుంది .........

" ఏడు రోజులు " 13వ భాగం

" ఏడు రోజులు " 13వ భాగం       రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి         ఆమె కళ్ళల్లో భయం... కంగారు...ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితిలో అటూ ఇటూ చూస్తోంది.          "గౌ...సి...యా" దగ్గరగా వెళ్ళి పిలిచాడు తను.          అంతకు క్రితం దాక కళ్ళను మాత్రమే తెరిచి వుంచిన ఆమె బురఖా ఇప్పుడు ఆమె ముఖాన్ని స్పష్టంగా చూపెడుతోంది.          "ఆ... ఆ" తనని చూసి ఆమె ఏమీ మాట్లాడలేక పోయింది.          "తప్పిపోయావా?" తెలుగులోనే అడిగాడు.          అవును అన్నట్లుగా తలాడించింది తను.          "నేను ఇంటికే వెళ్తున్నాను వెళ్దాం పదా" అన్నాడు.          ఆమె తల అడ్డంగా ఊపింది.          "తప్పిపోయావుకదా! ఈ జనాల్లో మీ వాళ్ళు కనబడ్డం చాలా కష్టం అందుకే వెళ్దాంపదా"          "వద్దు మా అబ్బా తిడతాడు"          "ఇట్లాంటి పరిస్థితిలో కూడా మీ అబ్బాకు భయపడతావేం? అక్కడ ఏం జరిగిందో తెల్సా? ఎవర్నో కత్తులతో పొడిచి చంపేశారు" చెప్పాడు.          "హా!" హడలిపోయిందామె.          "నాకు కూడా వెళ్ళిచూసేవరకు ఆ సంగతి తెలియదు" అన్నాడు.          "చంపేసారా? నేను ఏదో మామూలు గొడవ అనుకున్నాను" ఆమె గొంతు వణికిపోయింది.          "అందుకే నా వెంట వచ్చేయ్"          ఆమె అటూ ఇటూ చూసి సందేహించింది.          తను ఆమెతో మాట్లాడ్డం అది తొలిసారి కాదు చిన్నప్పటినుండి ఏదో ఒకటి మాట్లాడుతూనే వున్నాడు కాని గౌసియా పెద్దపిల్ల అయ్యాక ఆమెతో తను ఎప్పుడూ మాట్లాడలేదు అదే తొలిసారి.          "నువ్వు వెళ్ళు నేను తర్వాత వస్తాను" అందామె.          "నీ ఇష్టం" అంటూ అక్కడ్నుంచి తప్పుకున్నాడు తను కాని తన మనసు అందుకు ఒప్పుకోలేదు.అందుకే ముందుకు వెళ్ళినట్టే వెళ్ళి తిరిగి వెనక్కి వచ్చాడు.          అప్పుడు ఎవరో మోటార్ బైక్ కుర్రాడు గౌసియాను లిఫ్ట్ అంటూ వేధిస్తున్నాడు. ఆ కుర్రాడి ముఖకవళికలు చూడగానే ముస్లిం అని అర్ధమౌతున్నాడు.          "గౌసియా" పిలిచాడు తను.          తనను చూడగానే ఆ కుర్రాడు చప్పున మౌనంగా వాహనాల మధ్యవున్న ఇరుకు మార్గం గుండా తన బండిని కాసింత ముందుకు పోనిచ్చాడు.          "వేధిస్తున్నాడా?" అడిగాడు.          "అవును" అన్నట్టుగా తలాడించిందామె.          "హిందువుల్లోకంటే ముస్లిం మఠంలో ఐక్యత ఎక్కువ అని చాలామంది అనుకుంటారు. కానీ ఆ ఐక్యతను పాడుచేసే ఇట్లాంటి వెధవలు కూడా వుంటారు" తనలో తను అనుకుంటూ ఆ కుర్రాడివైపు కోపంగా చూసి మరి ఇప్పుడైనా నా వెంట వస్తావా?" అని అడిగాడు.          "వస్తాను" అన్నట్టుగా తలాడించిందామె.          తర్వాత ఇద్దరూ కలిసి వాహనాల్ని తప్పించుకుంటూ జాగ్రత్తగా ముందుకు నడవసాగారు. అదే సమయంలో వాహనాల్ని దారి మళ్లించారు. బందోబస్తుగా వచ్చిన పోలీసులు.          "నేను నీ వెంట వస్తున్నానుగానీ మా అబ్బాకు తెలిస్తే నన్ను కొడతాడేమో అని భయంగా వుంది" వెళ్తుంటే భయపడింది గౌసియా.          "తిడతాడా? కొడతాడా?" అడిగాడు తను.          "రెండూ చేయచ్చు" చెప్పింది.          "అయితే ఒక్కతినే వచ్చాను అని చెప్పేయ్..." చెప్పాడు.          "ఏమో!" భయంగా తనలో తనే అనుకుంది.          తను మాత్రం ఇంకేం మాట్లాడలేదు. కొంతదూరం వెళ్ళాక తనే మళ్ళీ అంది.          "మా అబ్బా సంగతి మన గల్లీ జనాలకు తెలియందికాదు. నేను ఈ వెళ్ళడం మా ముస్లిం అబ్బాయితో అయితే పెద్దగా ఇబ్బంది వుండదు. కానీ నువ్వు హిందువువు కదా!"          అప్పుడు తెలిసింది తనకు. ఆమెలో మత భేదం లేదని. సామరస్యాన్ని ఆమె ఇష్టపడుతోందని అందుకే అన్నాడు.          "నీకు ఈ మతాలమీద విసుగు పుట్టినట్టుంది"          "మతాల మీద విసుగు పుట్టలేదు. ఈ మనుషుల మీదే విసుగు" అంది.          "అయితే నీ మనస్సూ నా మనస్సూ ఒక్కటే" అన్నాడు.          "అంటే?"          "నాక్కూడా నీకు మల్లే ఈ మనుషుల్ని చూస్తే విసుగు మఠం పేరుతో మానవతను మరిచే ఈ రాతి హృదయాల మీద విసుగు"          ఆమె చిన్నగా నవ్వింది.          "ఎందుకు నవ్వుతున్నావు?" అడిగాడు.          "మీ హిందువుల్లో కూడా మంచివాళ్ళు వుంటారా? అని!"          "అయ్యో అదేంటి?"          "మా అబ్బా మాకు చిన్నప్పటి నుండి హిందువులంతా మంచివాళ్ళుకాదని చెప్పాడు. మంచిగా మాట్లాడినా లోపల విషం వుంటుందని చెప్పాడు ఆ అభిప్రాయమే మాలో బలంగా నాటుకుపోయింది"          "మీలాంటివాళ్ళకు మా హిందువులమీద ఎలాంటి అభిప్రాయం వుందో మా హిందువుల్లో కూడా కొందరికి ముస్లింల మీద అదే అభిప్రాయం వుంది"          "అలాగా!?"          "అవును మరి"          "మా ఇంట్లో మా అబ్బా ఒక్కడికే మత పిచ్చి నాకూ, మా అమ్మకు, మా చెల్లెళ్ళకు అందరితో మాట్లాడాలి అని వుంటుంది"          "అయినాగాని మాట్లాడే అవకాశంలేదు. కాని ఒక్క విషయంలో మాత్రం నాకు ఆశ్చర్యం అన్పిస్తోంది."          "ఏ విషయం?"          "నీవు తెలుగు స్పష్టంగా మాట్లాడ్తున్నావు"          "నీకు ఉర్దు రాదా?"          "వచ్చు"          "నాకూ అలాగే తెలుగు వచ్చు"          "అలా అని కాదు, మా హిందువుల్లో చాలామందికి ఉర్దూ వస్తుంది. కాని మీ ముస్లింల్లో చాలామందికి తెలుగురాదు"          "అదీ నిజమే"          అది మొదలు ఆమెమీద తనకు మరింత అభిమానం పెరిగింది. ఆమెకూడా తన సేహాన్ని కోరుకుంది. కాబట్టే ఎప్పుడైనా కలుసుకున్నప్పుడల్లా మాటలు కలిపింది. అలా మొదలైన తమ తియ్యని స్నేహం తననుండే ప్రేమగా మారింది. ఆమెతో తన మాటలు కలవకపోయి వుండుంటే ఆకర్షణ గానే ఆమె మీది తన అభిమానం మాసిపోయి వుండేది. కాని కలిసిన మాటలు తమ మధ్య ప్రేమాంకురాన్ని ఇంత బలంగా నాటుతాయని అప్పట్లో తను అనుకోలేదు.          చార్మినార్ సంఘటన తర్వాత కొన్ని రోజులకు సిరాజ్ వాళ్ళింట్లో దావత్ జరిగింది. పర్వీన్ ఆపా కొడుక్కి సున్తీ చేసి ఆ దావత్ ను ఏర్పాటు చేశారు. అది రాత్రి సమయం.          తను, తన ఫ్రెండ్స్ అందరూ ఆ దావత్ కు వెళ్ళారు. సాయిబు ఏదో పనిమీద వూరెళ్ళినందున గౌసియా వచ్చింది. అక్కడ మళ్ళీ తమ మాటలు కలిశాయి. ఆమె ఎవ్వరికంట పడకుండా భయపడుతూ చాటుగా తనతో మాట్లాడింది.          "నాకేమో నీతో మాట్లాడాలి అన్పిస్తుంటుంది. కాని ఏదో భయం" అంది.          "మాట్లాడ్తేనే అంత భయమా?"          "పరిస్థితులు అట్లా వున్నాయి మరి"          "సరేగాని నీతో ఒక మాట"          "ఏంటీ?"          "నీకు తెలుగు చదవడం వచ్చా?"          "తెలుగూ రాదూ, ఉర్దూరాదు"          "నిజమా?"          "నిజం"          "ఆ అలాగా" అంటూ ప్రేమలేఖని పిడికిట్లోనే నలుపుకోసాగాడు తను.          "ఏంటీ?" తనే అడిగింది.          "ఏం లేదు" అన్నాడు.          "ఏదో చెప్పాలనుకుంటున్నావు?"          "పోనీ నీకు ఎవ్వరైనా తెలుగు చదవగల ఫ్రెండ్స్ వున్నారా?"          "వున్నారు"          "అయితే వాళ్ళతో ఈ లెటర్ చదివించుకో" చెప్తూనే లెటర్ ను ఆమెకు అందివ్వబోయాడు అతడు.          "ఏం రాసావు?" కనుబొమలు ముడిచింది.          "చదివించుకో నీకే తెలుస్తుంది" చెప్పాడు.          "అట్లాంటి ఇట్లాంటి రాతలు కావుకదా?" అనుమానంగా అంది.          "ఏమీ లేవు"          "ఎందుకంటే నీవు ఏదైనా రాయకూడనిది రాస్తే ఆ పిల్ల మా ఇంట్లో చెప్పేస్తుంది ఆ పిల్ల నోట్లో మాట దాగదు"          ఆమె ఆ మాట మాట్లాడగానే తన చేతిని చప్పున వెనక్కి తీసుకున్నాడు తను.          "ఏం రాశావు?" అడిగిందామె మళ్ళీ.          కాసేపు మౌనం వహించి తర్వాత అటూ ఇటూ చూసి నెమ్మదిగా చెప్పాడు తను.          "రాశాను"          "ఏందీ?"          "నువ్వు ఏమీ అనుకోవుకదా?"          "ఏమీ అనుకోను"          "ఒట్టు"          "అల్లామీద ఒట్టు"          "ఆ... ఆ లవ్... లెటర్"          ఆమె విస్మయంగా చూసింది.          "నేనంటే నీకు ఇష్టం లేకపోతే ఈ విషయం గురించి మీ ఇంట్లో చెప్పవద్దు" భయపడ్డాడు తను.          "...."          "బయటకు చెప్పొద్దు ప్లీజ్"          "..."          "ఏదో రాశాను పొరపాటు అయింది"          "..."          "చెప్పొద్దు" అంటూనే ప్రేమలేఖను ముక్కలు చేయబోయాడు.          "సునో" వారిస్తూ అంది.          ఏంటన్నట్లుగా చూశాడు తను.          "నువ్వే ఈ విషయం గురించి ఎవ్వరితో చెప్పొద్దు" చూపులు వాల్చి అంది.          ఆమె మనసు తనకు అర్ధమయ్యింది. ఆశ్చర్యంగా చూస్తూ చప్పున ఆమె చేయి పట్టుకున్నాడు.          ఆమె చిరునవ్వు నవ్వింది. తనూ నవ్వాడు అంతలోనే సిరాజ్ గొంతు క్రింది నుండి వినబడింది.          "రేయ్... శంకర్"          "వెళ్ళిపోదాం" వెంటనే అన్నాడు.          "హూ..." అంగీకారంగా తల ఊపింది.          "ముందు నువ్వు వెళ్ళు" చెప్పాడు.          ఆమె ఆ వెంటనే డాబా దిగి క్రిందికి వెళ్ళింది. ఆమె వెళ్ళిన తర్వాత తను నెమ్మదిగా మెట్లు దిగసాగాడు.          ఆమె ఒడియాల కోసమని డాబామీదకు వచ్చింది. తను అదే సమయంలో బల్బుల్ని గోడవారగా సరిచేయడం కోసం డాబామీదకు వచ్చాడు కాని ఇద్దరూ వచ్చిన పని చేసుకోలేదు.          "ఏంట్రా? మిద్దెమీదకు ఎందుకు వెళ్లావు? ఏం చేసి వస్తున్నావు?" క్రిందికి వెళ్ళగానే అడిగాడు సిరాజ్.          "అరెరే..." తలను చిన్నగా కొట్టుకున్నాడు తను.          "వెళ్ళు" అన్నాడు సిరాజ్.          తను మళ్ళీ డాబా మీదకు వెళ్ళాడు. గౌసియా కూడా మళ్ళీ వచ్చింది పరిస్థితికి ఇద్దరూ నవ్వుకున్నారు.          ఆ రోజు తన జీవితంలో అపురూపమైన రోజు ఆ గడియలు తన జీవిత పుస్తకంలో మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. ...... ఇంకా వుంది .........

" ఏడు రోజులు " 12వ భాగం

" ఏడు రోజులు " 12వ భాగం       రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి     కాసేపటి తర్వాత అందరూ కలిసి సమీపంగా వున్న చాయ్ బండి దగ్గరకు వెళ్ళారు. అక్కడ చాయ్ మాత్రమే కాకుండా ఇతర వంటకాల్ని కూడా తయారుచేస్తున్నారు.          "చాయ్ బండీ చపాతీ          జర జూడరా జిలేబీ..."          అలవాటుగా ఎప్పుడూ పాడే సిరాజ్ కు బదులుగా జోసెఫ్ అందుకున్నాడు ఆ పాటను.          పాట వింటూ అందరూ తమలో తామే నవ్వుకోసాగారు. "నవ్వారు లేరా" అంటూనే తనూ నవ్వాడు భవానీశంకర్.          "ఏందన్నా గట్ల నగుతుండరు" కాసేపు చూసి తర్వాత అడిగాడు చాయ్ బండి అమ్ముతున్న వ్యక్తి.          "ఏం లేదన్నా! మా వాడి అత్తవారికి కూడా నీలాగే చాయ్ బండి వుంది. కట్నం అదే అనుకో! కాని మా వాడేమో అమ్ముకోడానికి నామోషీగా ఫీలౌతున్నాడు" భవానీ శంకర్ భుజం చరుస్తూ చెప్పాడు జోసెఫ్.          "గట్ల అనుకుంటే ఎట్ట తమ్ముడు కట్టపడాలా.... కట్టపడితేనే రెండు దుడ్లు ఒస్తయి" భవానీశంకర్ వైపు చూస్తూ అన్నాడు చాయ్ బండి వ్యక్తి.          మిత్రులంతా జోసెఫ్ కే వంతపాడారు. దీంతో అందరివైపు ఉక్రోషంగా చూస్తూ "వచ్చే నెల నుండి అమ్ముతుంటాను. తప్పేముంది?" అన్నాడు.          "గదీ మాట" అన్నాడు చాయ్ బండి వ్యక్తి.          "నోర్ముయ్యరా" మనసులో అనుకుని "ఏందిబై చాయ్ ఇట్ల జేసినవు?" అడిగాడు భవానీశంకర్.          "ఇస్పెషల్ టీ" అన్నాడు చాయ్ బండి వ్యక్తి.          "సర్లేగాని పంచదార తక్కువినా ఫర్వాలేదుగాని టీ పొడి కాస్త ఎక్కువెయ్యి" చెప్పాడు భవానీశంకర్.          అంతలో ఆ రోడ్డెంబడి జనాలు గుంపులు గుంపులుగా పరుగెట్టసాగారు. చూస్తున్న మిత్రబృందానికి ఏమీ అర్ధం కాలేదు. పరుగెడుతున్న జనాలవైపు కంగారుగా చూడసాగాడు.          చాయ్ బండి వ్యక్తి మాత్రం అదేం పట్టనట్టుగా తన పనేదో తను చేసుకుపోతున్నాడు.          "ఏందన్నా ఈ జనాలు" జోసెఫ్ అడిగాడు.          "గీ జనాలు ఎర్ర బస్సునా కొడుకులు. సూటింగులు సూడ్డానికి వచ్చి గిట్ల అందర్నీ పరేషాన్ జేస్తుంటరు" అంటూ బర్నాల్ స్టౌకి గాలికొట్టి "గవతలగా గుట్టకాడ మోన్ బాబుగాడి సూటింగ్ వుంది. గది సూడ్డానికే ఈ ఎర్రి జనాలు గిట్ల ఉర్కుతుండరు" చెప్పాడు చాయ్ బండి వ్యక్తి.          "ఓర్నీ" ఆశ్చర్యంగా పరుగెడుతున్న జనాలవైపు చూశారు మిత్రులంతా.          "ఏం నాష్టగావాలన్నా?" అడిగాడు చాయ్ బండి వ్యక్తి.          "దమాక్ గాని కరాబ్ అయ్యిందా బై? చాయ్ తాగి నాష్ట చేస్తాడా ఎవ్వడైనా?" అంటూ ఖాళీ గ్లాసును అక్కడున్న ఓ కుర్రాడికి అందించి "షూటింగ్ కి మనం కూడా వెళ్దాం" మిత్రుల్ని ఉద్దేశించి చెప్పాడు జోసెఫ్ తర్వాత అందరి తరఫునా థానే డబ్బు చెల్లించాడు.          భవానీశంకర్ గుండెలో రాయిపడింది. ఎట్లాగయినా సరే షూటింగ్ కి వెళ్ళడం క్యాన్సిల్ చేసి ఇంటికి వెళ్ళి తీరాలి అని గట్టిగా నిర్ణయించుకుంటూ "దయచేసి నన్ను వదిలిపెట్టండిరా నేను వెళ్ళిపోతాను" అన్నాడు.          "మోహన్ బాబును చూసి వెళ్ళిపోదాం" అన్నాడు జోసెఫ్.          "ప్చ్... వద్దురా" అన్నాడు భవానీశంకర్.          విన్పించుకోలేదు మిత్రులు. అందరూ కల్సి షూటింగ్ కి బయలుదేరబోయారు.          "వద్దురా!" గట్టిగా అన్నాడు భవానీశంకర్.          "నువ్వు ఇట్లా చేస్తే మేము నీకు హెల్ప్ చేసేదిలేదు"          "అవును హెల్ప్ చేయం"          "అందుకే షూటింగ్ కి వచ్చేయ్"          "షూటింగ్ కి రావల్సిందే వస్తేనే లవ్వులో నీవు సక్సెస్"          "ఆపండ్రా" మిత్రుల్ని ఇంకేం మాట్లాడనీయకుండా వాళ్ళ వెంటే చేసేది లేదు అన్నట్లుగా బయలుదేరి వెళ్ళాడు భవానీశంకర్.          వాళ్ళు వెళ్ళేసరికి షూటింగ్ కి ఏర్పాట్లు జరగసాగాయి ఎంతో దూరం నుండి వచ్చిన అభిమానులు, తాము చూడబోయేది మహా సంఘటనని అన్నట్లుగా కనబడుతున్నారు.          "వాళ్ళకంటే మనం తీసిపోలేదు అచ్చు అదే క్యాటగిరీ" తనలో తనే అనుకుంటూ మిత్రులతోపాటుగా అక్కడున్న ఒక చింత చెట్టు నీడన రాళ్ళకుప్పమీద కూర్చున్నాడు భవానీశంకర్.          మనిషి ఒక చోట, మనసు ఒక చోట అన్నట్లుగా వుంది అతడి పరిస్థితి. అందుకే అక్కడ వుండటం ఇష్టంలేని వాడిగా వున్నట్టుండి మోకాళ్ళలో తలపెట్టుకుని నేలని దీర్ఘంగా చూడసాగాడు.          కొన్నాళ్ళక్రితం సంఘటన అనుకోకుండా గుర్తొచ్చింది. ఒక రోజు తను అమ్మమీద అలిగి చార్మినార్ దగ్గరకి వెళ్ళాడు. అనూహ్యంగా అక్కడికి గౌసియా వాళ్ళు కూడా వచ్చారు.          చార్మినార్ నీడలో కూర్చుని వాళ్ళు  క్యారియర్ తీసుకు తింటున్నారు. తనేమో ఉదయం నుండి తినలేదు. అందుకే వాళ్ళు తింటుంటే లాక్కొని తినాలనిపిస్తోంది.          వాళ్ళకు సమీపంగా కూర్చుని వున్నాడు తను. గౌసియా తనను మధ్యమధ్యలో గమనిస్తోంది. తను కూడా గౌసియాను చూస్తున్నాడు.          ఆప్పట్లో ఆమెకూ తనకూ మధ్య ప్రేమ లేదు కాని తనకు మాత్రం ఆమెపట్ల ఆకర్షణ మొదలయ్యి కొంతకాలం అయ్యింది ఆ ఆకర్షణ ప్రేమ అన్న సంగతి తనకు ఇంకా తెలీదు.          "ఈ అమ్మాయి బాగుంది" అనుకుంటున్నాడు తను.          కాసేపటి తర్వాత భోజనం పూర్తిచేశారు వాళ్ళు. అంతలో మరెవరో ముస్లిం కుటుంబం అక్కడికి వచ్చింది. గౌసియా వాళ్ళకు ఆ కుటుంబం పరిచయం వున్నట్లుగా వుంది. రాగానే "సలాం వాలేకుం చెప్పుకుంటూ మాటలు కలిపారు.          అందరూ కలిసి మాట్లాడుతూనే చార్మినార్ నుండి మక్కా మసీదువైపు వెళ్ళారు.          వెళ్తున్న వాళ్ళవైపు చూస్తుంటే తనక్కోపం ముంచుకు వచ్చింది. ఇంటిముందు కుర్రాడ్ని అని కూడా చూసి పలకరించని వాళ్ళమీద ఎంత కోపం వచ్చిందో! ఆ కోపం తన పిడికిళ్ళలోనే నలిగిపోయింది.          "పలకరించి నాక్కాస్త కడుపు చల్లగ చేసి వుంటే మీ అల్లా మెచ్చేవాడు మీరు ఇప్పుడు మసీదుకు వెళ్ళి కూడా దండగే, మీ అల్లా మెచ్చడు" మనసులోనే శపించుకుంటూ తను కూడా చార్మినార్ వెలుపలికి వచ్చాడు.          అంతలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. అర్ధగంట గడిచినా వాహనాలకి విముక్తి లేనట్లుగా కనబడింది.          "ఎందుకు ఇంతగా జామ్ అయ్యింది?" ట్రాఫిక్ ను చూస్తూ అనుకుంటూ ముందుకు నడిచాడు తను.          కొంతదూరం వాహనాల్ని తప్పించుకుంటూ ముందుకు నడిచాక అనుకోని పరిస్థితి ఎదురయ్యింది.          "జరుగుబే" అంటూ ఎవ్వరో యువకులు తనను నెట్టేస్తూ ముందుకు వేగంగా కదిలారు.          "ఏంట్రా ఇదంతా?" భయంగా అనుకుంటూ మరికొంత ముందుకు నడిస్తే అక్కడ రోడ్డుమీద రక్తపు మడుగులో పడివుంది ఎవరో వ్యక్తిశవం.          అతడు హిందువో ముస్లీమో అర్ధంకాని పరిస్థితి అందుకే ఇంకా గొడవలు జరగాలేదు. ముఖ్యంగా శవం దగ్గరికి ఎవ్వరినీ రానివ్వలేదు ట్రాఫిక్ పోలీసులు. కాబట్టే అక్కడ ప్రశాంతత ఇంకా సడలలేదు.          ఆ విషయం అక్కడున్న కొందరి మాటల ద్వారా తెలిసింది. తనకు భయమేసింది. అక్కడ్నుంచి వీలైనంత త్వరగా వెళ్ళాలని అటూ ఇటూ చూశాడు.          జామ్ అయిన ట్రాఫిక్ కూడా పక్కనున్న సందుల్లోంచి తప్పుకుంటోంది అలా వెళ్ళడానికి కూడా కదిలే వీలులేని వాహనాలు మాత్రం హారన్ మోతలతో అలాగే నిలబడిపోయాయి.          భయంతో తను వెనుతిరిగి కొంతముందుకు నడిచాడో లేదో గౌసియా ఒంటరిగా కనబడింది.   ....... ఇంకా వుంది .........

" ఏడు రోజులు " 11వ భాగం

" ఏడు రోజులు " 11వ భాగం       రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి     బిచ్చగాడు పార్క్ దాటుకుని వెళ్ళిపోసాగాడు. ఇంకా అతడ్నే చూస్తున్న జోసెఫ్ మళ్ళీ అన్నాడు.          "బిచ్చగాళ్ళు అందరూ బికార్లు కాదురా! అప్పులు కూడా ఇస్తూ అడుక్కుతినేవాళ్ళు వుంటారు"          అవును అన్నట్టుగా చిన్నగా నవ్వారు మిత్రులు.          "ఒరే అరవిందస్వామీ! మనీషాకొయిరాల నీ స్వంతం కావాలంటే ఒక్కటే ఒక్క మార్గం" వెంటనే టాపిక్ మార్చాడు జోసెఫ్.          "ఏంట్రా?" జోసెఫ్ కు దగ్గరగా జరిగాడు భవానీశంకర్.          "నేను చెప్పిన మార్గాన్ని నువ్వు  అనుసరించాలి అంటే నీకు హీరో లెవెల్లో గేట్స్ వుండాలి"          "ముందు మార్గం చెప్పరా?"          "ఓరి పిచ్చోడా! నేను చెప్పబోయేది అల్లా ఉద్దీన్ ఉపాయదీపం"          "టెన్షన్ పెట్టొద్దు వెంటనే చెప్పేసేయ్" అని భవానీశంకర్ అనగానే.          "చెప్పరా వెధవా" మిగతా ఫ్రెండ్స్ తొందరపెట్టారు.          జోసెఫ్ మిత్రులు అందరివైపూ ఒక మారు బిల్డప్ ఇస్తూ చూసి.          "మరేం లేదురా! మన అరవిందస్వామి, మనీషాకొయిరాలను పెళ్ళి చేసుకుంటే అటు గొడవలు రాకూడదు. ఇటు మనస్పర్ధలు పెరగకూడదు అందరూ ఏకాభిప్రాయంతో వుండాలంటే..." అని కాసేపాగి, "ఆ... ఏం చేయాలంటే గౌసియాను రంగరంగ వైభవంగా పెళ్ళి చేసుకో! ఆ పెళ్ళి ఎక్కడ జరగాలో తెల్సా? క...ల...లో" తాపీగా అన్నాడు.          మిత్రులంతా జోసెఫ్ మాటలకు హాయిగా నవ్వారు భవానీశంకర్ మాత్రం జోసెఫ్ వైపు కొరకొరా చూశాడు.          అంతలో అటుగా ఒకావిడ వచ్చింది. ఓ చంకలో పిల్లాడ్ని ఎత్తుకుని మరో చంకలో జోలె తగిలించుకుని మాసిన బట్టలతో తైల సంస్కారం లేని జుట్టుతో దీనంగా వుందామె.          "జాతకం బాపతే కావొచ్చు" ఆమె రాగానే అన్నాడు జోసెఫ్.          "తమరిది ఏ ఊరు?" నమ్రతగా అడిగడు జోసెఫ్.          "సిత్తూరు"          "పచ్చబొట్టు పొడవడంలో బాగా ప్రాక్టీస్ ఉందా?"          "బాగా పేక్టీసు వుంది. ఇది మాకు కూడుబెట్టే యిద్య గదా బాబూ! చిన్నప్పుడే ఈ యిద్య నేర్చుకున్నాను"          "అయితే నువ్వు వెంటనే అమెరికా వెళ్ళిపో"          "ఎందుకు బాబూ?"          "అక్కడివాళ్ళకు పచ్చబొట్లు పొడిపించుకోవాలంటే మహా వెర్రి! అక్కడయితే నువ్వు లక్షలకి లక్షలు సంపాయించుకోవచ్చు"          "అక్కడికి ఎళ్ళడానికి సార్జి ఎంతవుతుంది?"          ఆ మాటకు అందరికి నవ్వొచ్చింది.          "నూర్రూపాయలు" నవ్వుతూనే చెప్పాడు జోసెఫ్.          "గా నూర్రూపాయలు వుంటే మా తాగుబోతోడు వుండనివ్వడు" విచారంగా అని, "పచ్చబొట్టు తమరు పొడిపించుకోరా బాబూ?" అందర్నీ చూస్తూ అడిగింది.          "వద్దు పోమ్మా" అందరి తరుపునా తనే సమాధానం చెప్పాడు జోసెఫ్.          "అగ్గువకు కొడతాను బాబూ" ఆమె గొంతులో అభ్యర్ధన.          "అగ్గువ అంటే పదిపైసలకా? "ఆ దుడ్లు సెల్లవుబాబూ"          "మావద్ద అంతకంటే ఎక్కువలేవు"          "వున్న మారాజులు అట్లా మాట్లాడగూడదు బాబూ"          "మరి ఎంత అడుగుతావు?"          "పేరుకు ఐద్రూపాయలు"          "రూపాయి ఇస్తాం"          "అన్నేయం బాబూ! సంటిపిల్లోడికి ఆకలైంది. రేత్రినుండి ఏం లేదు" ఆమె గొంతు లోనే కాదు ముఖంలోనూ దీనత్వం.          బిచ్చగాళ్ళ గురించి సరదాగా హాస్యం చేస్తున్నాడు కాని, ఆమె ఆ మాట మాట్లాడగానే జోసెఫ్ మనసు నిజంగానే కరిగింది. అందుకుతోడుగా ఆమె చంకలో కూర్చున్న పిల్లాడు ఆమె కొంగు పట్టిలాగుతూ ఆమె రొమ్ముకోసం వెదుకుతున్నాడు.          "శంకర్! నువ్వు పొడిపించుకోరా" చెప్పాడు జోసెఫ్.          "నాకు భయం"          "భయం దేనికి? నీకు వున్న సీన్ మాకే వుండివుంటే ఈపాటికి పచ్చబొట్లతో నిలువునా మునిగిపోయేవాళ్ళం" జోసెఫ్ అంటుంటేనే తన ప్రాణసఖి గౌసియా పేరును తన చేతిమీద శాశ్వతంగా ముద్రించుకోవాలన్న తలంపు వచ్చింది భవానీశంకర్ కు.          "పచ్చబొట్టు పొడిపించుకోవాలనే వుంది. కాని ఇంట్లో వాళ్ళు చూస్తే ఇంకేమైనా వుందా?" వచ్చి ఆమె ముందు కూర్చుంటూనే అన్నాడు భవానీశంకర్.          "ఆ భయం వుంది కాబట్టి సింపుల్ గా 'జి' అని పొడిపించుకో చాలు" చెప్పాడు జోసెఫ్.          "సరే" అన్నాడు భవానీశంకర్.          మరో మిత్రుడు భవానీశంకర్ మణికట్టు మీద పెన్నుతో 'జి' అని రాసాడు.          "కాస్త మెల్లగా పొడవాలి" ఆమెకు ముందుగానే చెప్పాడు జోసెఫ్.          "అట్లాగే బాబూ" అంటూ తీరిగ్గా బాసింపట్టు వేస్కుని కూర్చుని, పిల్లాడిని తన వీపుకి తగిలించుకుని వున్న మరో జోలెలో కూర్చోబెట్టుకుని, ఇంకో జోలెలో వున్న పచ్చబొట్టు తాలూకు సామాగ్రిని వెలుపలికి తీసింది.          మునదేలివున్న ఆ సామాగ్రిని చూడగానే భవానీశంకర్ కాళ్ళూ చేతులు వణకనారంభించాయి. అయినప్పటికీ గౌసియా పేరును పొడిపించుకోబోతున్నాను అనే ఆనందం, తృప్తి అతడి భయాన్ని డామినేట్ చేస్తున్నాయి.          "బాబూ కళ్ళుమూసుకో" భవానీశంకర్ కు చెప్పిందామె.          "ఓ దేవుడా! నొప్పి కాకుండా చూడు తండ్రీ!" మనసులో అనుకుంటూ గట్టిగా కళ్ళు మూసుకున్నాడు భవానీశంకర్.          ఆమె తమ కొండదేవరలకు ఒకసారి పేరుపేరునా దండంపెట్టుకుని, ఆ తర్వాత నెమ్మదిగా భవానీశంకర్ చేతిమీద పచ్చబొట్టు పొడవనారంభించింది.          "అ....మ్మా..." మొదటి పొడుపుకే అతడి బాధ వర్ణనాతీతం అయిపోయింది.          అతడి బాధ తమక్కూడా బాధే అన్నట్టుగా మిత్రుల ముఖాల్లోనూ బాధావీచికలు ప్రస్ఫుటం అవ్వసాగాయి. ప్రతి పొడుపుకీ భవానీశంకర్ కుదించుకుపోతుంటే, అతడి చేయి పట్టుకుంటూ, అతడి భుజాల్ని పట్టుకుంటూ "అయిపోతుంది లేరా" అంటూ అనునయిస్తున్నారు మిత్రులు.          పచ్చబొట్టు పొడవడం పూర్తయ్యేసరికి భవానీశంకర్ చేయి రక్తసిక్తం అయిపోయింది పొడవడం పూర్తయినప్పుటికీ ఇంకా పొడుస్తున్న బాధే గుండెను పిండసాగింది.          "గాయం ఎన్నిరోజుల్లో తగ్గుతుంది" తన షర్టుజేబులోంచి ఐదురూపాయలనోటు తీసి ఆమెకు అందివ్వబోతూ అడిగాడు జోసెఫ్.          "వారం పదిరోజుల్లో మానిపోతుంది" అంటూ తనే గాయానికి కట్టుకడుతూ, ఐదు రూపాయల నోటును అందుకోబోయిందామె.          "వద్దు, నేనే ఇస్తాను" అంటూ జోసెఫ్ ను వారించి, తన స్వంత డబ్బుల్ని ఆమెకు ఇచ్చాడు భవానీశంకర్.          "ఏం? నేనివ్వకూడదా?" అడిగాడు జోసెఫ్.          "ఇట్లాంటివాటిని స్వంత ఖర్చుతో గావించాలి" అన్నాడు భవానీశంకర్.          "సెంటిమెంటా?" అన్నాడు జోసెఫ్.          "అఫ్ కోర్స్" అన్నట్టుగా చిన్నగా నవ్వాడు భవానీశంకర్.          అతడి మనసునిండా ఇప్పుడు ఏ ఆతృతో నిండిపోయివుంది. తన పచ్చబొట్లను గౌసియాకు చూపించాలని, అప్పుడు ఆమె కళ్ళల్లో కదలాడే అపురూప భావాల్ని మౌనంగా ఆస్వాదించాలని ఎంతో ఆరాటంగా వుంది. అందుకే బాధలోనూ నవ్వగలుగుతున్నాడు.          "ఇంకెవరైనా పొడిపించుకుంటారా బాబూ?" అడిగిందామె.          "ఎవ్వరికీ వద్దు" చెప్పాడు జోసెఫ్.          "సల్లంగ బతకండయ్యా" అందర్నీ ఒక మారు చూసి అని, ఐదురూపాయల్ని కళ్ళకు అద్దుకుంటూ అక్కడ్నుంచి లేచి వెళ్ళిపోయిందామె.          "అమరప్రేమికుడివి అయిపోయావు" భవానీశంకర్ గాయాన్ని మృదువుగా స్ప్రుశిస్తూ అన్నాడు జోసెఫ్.          అందుకు చిన్నగా నవ్వి "పచ్చబొట్టు చెదిరిపోనట్టే మా ప్రేమ కూడా చెదరకూడదు" అన్నాడు భవానీశంకర్. ....... ఇంకా వుంది .........

" ఏడు రోజులు " 10వ భాగం

" ఏడు రోజులు " 10వ భాగం       రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి     అలా ఎంతసేపు కూర్చున్నాడో తెలీదు కాని, మిత్రులు నిద్రలేచే సరికి భళ్లున తెల్లారిపోయింది. సూర్యుడి లేతకిరణాల జోరు నగరజీవనాన్ని ఎప్పట్లా ఉరుకుల పరుగులకు ఉసిగొల్పింది. ఫలితంగా అప్పటికే రోడ్డు వెంబడి క్రమక్రమంగా వాహనాలు పరిగెట్టడం మొదలెట్టాయి. పదిహేను నిముషాల తర్వాత మిత్రులతో కలిసి పార్కు నుండి బయటపడ్డాడు భవానీ శంకర్. అందరూ షూటింగ్ గురించిన ముచ్చట్లలో మునిగి తేలసాగారు. " బిచ్చగాళ్లలా పబ్లిక్ పార్కులో ఇంతసేపు పడుకోవడానికి మీకు సిగ్గులేదట్రా?  " మధ్యలో కల్పించుకున్నాడు  భవానీ శంకర్. " ఉన్నట్టుండి వీడికి ఉన్మాదమా? " అని ఒక మిత్రుడు అనగానే " పబ్లిక్ పార్కులను తక్కువ అంచనా వేయద్దు. నేటి పబ్లిక్ పార్క్ పర్సనే రేపటి పబ్లిక్ పర్సన్ కావచ్చు " మరో మిత్రుడి గొంతులో వ్యంగం. " ఏదో గానీ, త్వరగా ఇంటికి వెళ్దాం " అన్నాడు భవానీ శంకర్. " పోరా " చేయి విదిల్చారు మిత్రులు. మనసంతా గౌసియావైపుగా ఉండి, ఎద లోతుల్లో ఏ కలవరాన్నో సృష్టిస్తున్న శతకోటిభావనలు అతడికి కోపం తెప్పించాయి. " మీరు రాకపోయినా నేను వెళ్తాను " మొండిగా అన్నాడు. మిత్రులంతా అతడ్ని పిచ్చివాడిలా చూశారు. " గౌసియా కోసం " కోపాన్ని చల్లార్చుకుని శాంతంగా అన్నాడు. " ఈ ప్రపంచం మొత్తంలో గౌసియా, నువ్వూ, ఇద్దరే ప్రేమికులు ఉన్నట్టున్నారు " " తనకు గాళ్ ఫ్రెండ్ ఉందని ఆ బిల్డప్! కదట్రా? " " నీ గౌసియా ఎక్కడికీ వెళ్లదుగానీ, కూచి మాటలు మాని కాస్త ఓపిక పట్టు " తన మిత్రులు ఎవడు ఏ మాట మాట్లాడాడో కూడా పట్టించుకోలేదు భవానీ శంకర్. " నా బాధ మీకు తెలియదురా " అని మాత్రం అనగలిగాడు. " సర్లే గానీ కాసేపు బాధ మరిచిపో " అంటూ భవానీ శంకర్ భుజంపై చేయి వేశాడు ఒకడు. " ప్చ్.." పెదవులు చిట్లించాడు భవానీ శంకర్. " నాస్తా చేసి పోదాం లేరా " ఇంకో మిత్రుడు అన్నాడు. " టీ తాగి వెళ్లిపోదాం " భవానీ శంకర్ అన్నాడు. " నువ్వు ఇలాగే మాట్లాడితే, మధ్యాహ్నం లంచ్ చేసి వెళ్లాల్సి ఉంటుంది " ఇంకో మిత్రుడు భయపెట్టాడు. " రండిరా " భవానీ శంకర్ గొంతులో అభ్యర్ధన. " వెళ్తాం గానీ, గౌసియా గురించి ఆశువుగా ఒక కవిత చెప్పరా "  మరో మిత్రుడు అడిగాడు. " నేను సి.నా.రె కాదు "  అన్నాడు భవానీ శంకర్. " కవిత్వం చెప్పడానికి సి.నా.రె మాత్రమే కావాలా..? నేనూ చెప్పగలను " అన్నాడు వనస్థలిపురం నుండి వచ్చి షూటింగ్ దగ్గర కలిసిన ఓ మిత్రుడు జోసెఫ్. " ఏదీ చెప్పరా..! "  అన్నాడు భవానీ శంకర్. " చెట్టుకు పువ్వులు అందం.. మనిషికి మాటలు అందం.. తారలకు మేకప్ అందం.." జోపెఫ్ చెప్పుకు పోతుంటే, " వద్దురా " భవానీశంకర్ తో పాటుగా అందరూ చెవులు మూసుకున్నారు. " ఏంట్రా? " చిన్నబుచ్చుకున్నాడు జోసెఫ్. " ముందే నాకు పిచ్చిగా ఉంది. ఈ పిచ్చి కవిత్వాలు చెప్పి నా మతి మరింత చెడగొట్టద్దు. " అన్నాడు భవానీ శంకర్. " చూస్తూ ఉండండ్రా..నేను ఈ కవితను ఏ పత్రికకో పంపిస్తాను. అది అచ్చుకాకపోతే, నా పేరు జోసెఫ్ కాదు. " అన్నాడు జోసెఫ్. అందరూ కిసుకున్న నవ్వారు. జోసెఫ్ రుసరుసగా చూశాడు. అదే సమయంలో సమీపంగా కూర్చుని ఉన్న ఓ బిచ్చగాడు మిత్రబృందాన్ని చూస్తే పాటందుకున్నాడు. " నరుడా..ఓ మానవుడా.." రాగయుక్తంగా పాడుతూ, డొక్కు డబ్బాను ఆడిస్తున్నాడతను. " వాడు అన్ ఎడ్యుకేటెడ్ అయినప్పటికీ, ఎంత బాగా పాడుతున్నాడో చూడు..! పదాల్ని కూడా బాగా ఉచ్ఛరిస్తున్నాడు..! " బిచ్చగాడ్ని చూస్తే మెచ్చుకోలుగా అన్నాడు జోసెఫ్. " ఏం బాబూ " మాట్లాడేది తన గురించే అని అర్ధం కాగానే చప్పున వాళ్లకు సమీపంగా వచ్చాడు బిచ్చగాడు. " మా దగ్గర డబ్బుల్లేవు. ఉంటే ఇచ్చి వెళ్లు..నీ పేరు చెప్పుకుని టీ తాగుతాం. " చమత్కరించాడు ఒక మిత్రుడు. " ఊరుకోరా..! " అంటూ వాణ్ని వారించి " ఏ ఊరు మనది "  బిచ్చగాణ్ని అడిగాడు జోసెఫ్. " కోటప్ప కొండ బాబూ..! " చెప్పాడు బిచ్చగాడు. " అక్కడ బిక్షం దొరకడం కష్టమైందా..? "  అడిగాడు జోసెఫ్. బిచ్చగాడు ఏమనుకున్నాడో ఏమో.. జోసెఫ్ వైపు అయిదారు క్షణాలు అర్ధం కానట్టుగా చూసి ఆ తర్వాత " జాతకాలు చెప్పుకోడానికి వచ్చాను బాబూ.! నా జాతకం నూటికి నూరుపాళ్లు కరెకుటు! " అన్నాడు బిచ్చగాడు. " నీ జాతకం కరెక్టా..? నీవు సెప్పే జాతకం కరెకుటా..? " అతన్ని తమాషాగా అనుసరించాడు జోసెఫ్. " నేను సెప్పే జాతకం "  అన్నాడు బిచ్చగాడు. " అట్లాగా..! అయితే ఒకసారి మావాడి జాతకం చెప్పు..! " అంటూ భవానీ శంకర్ ను చూపించాడు జోసెఫ్. " రూపాయి బిళ్ల ఏస్కోవాలి " అన్నాడు బిచ్చగాడు. " ముందు నీవు జాతకం చెప్పు " అన్నాడు జోసెఫ్. " మాద్యావర ఒప్పుకోదు " అన్నాడు బిచ్చగాడు " అట్లాగా..! ఆహా..! " అంటూ రాగం తీసి " సర్లే..ఇదిగో రూపాయి." అంటూ తన జేబులోంచి రూపాయి బిళ్ల తీసి బిచ్చగాడికిచ్చాడు జోసెఫ్. " తమరి పేరేందన్నావు..? " రూపాయి బిళ్లను కళ్లకద్దుకుంటూ, భవానీ శంకర్ ను అడిగాడు బిచ్చగాడు. " ఇంకా అనలేదు. వాడి పేరు భవానీ శంకర్ " చెప్పాడు జోసెఫ్. " తమరికి పెండ్లి అయిందా..? " అడిగాడు బిచ్చగాడు. " అయింది. నలుగురు పిల్లలు కూడా.." జోసెఫ్ సమాధానం చెప్పాడు. మిత్రులంతా తమలో తామే నవ్వుకుంటూ ఆసక్తిగా చూస్తున్నారు. భవానీ శంకర్ మాత్రం నిశ్శబ్దంగా బిచ్చగాడినే చూస్తూ ఉన్నాడు. బిచ్చగాడు కాసేపు కళ్లు మూసుకుని, ఆ తర్వాత ఆకాశానికేసి చూసి, " బాబూ! నీకు శానా కట్టాలున్నాయి. వాటిని నీవు పడగొట్టాలంటే ఒక్కటే మార్గం. నేను సిరసైలం కొండల్ల తెచ్చిన ఒక సెక్క ఇస్తాను. దాన్ని నీ మొలతాడుకు కట్టుకో అంతే. నీ కట్టాలు పిట్టలు ఎగిరిపోయినట్టుగా ఎగిరిపోతాయి. ఈ సెక్కకు యాభై రూపాయలు మాత్రం ఇచ్చుకో...అదే వేరే వాళ్లకు అయితే నూర్రూపాయలు.." " అట్లాగా..! పూర్వజన్మంలో మేము మీకు బంధువులం అయ్యి ఉంటాం.." వెటకారంగా అన్నాడు జోసెఫ్. " గట్లని కాదు బాబూ..! మీరు పిల్లల లెక్కన ఉండరు అందుకే..! " అన్నాడు బిచ్చగాడు. " ఆ..నీ పాటను మెచ్చుకోవడం మేము ఇప్పుడు చేసిన పొరపాటు కావచ్చు.." ఆ వెంటనే అన్నాడు జోసెఫ్. బిచ్చగాడు బేలగా చూశాడు జోసెఫ్ వైపు. " ముట్టుకుంటే అంటుకొచ్చావు! ఆ...చెప్పు చెప్పు.. " అన్నాడు జోసెఫ్. "  చూడు బాబూ..! మేము పొట్ట సేతిలో పట్టుకుని వచ్చినోళ్లం. మాతో తమరిట్టా మాట్టాడ్డం మంచిది కాదు " అన్నాడు బిచ్చగాడు. " ఒకే..! " అన్నాడు జోసెఫ్. " అంటే..! " అర్ధం కాలేదు బిచ్చగాడికి. " ఓకే అంటే తప్పయింది, నన్ను క్షమించు అని అర్ధం. " " అయ్యో..! అంత మాట ఎందుకు బాబూ..!  అంటూ ఇంకొంచెం ముందుకు జరిగి.."  సెక్క గావాల్నా బాబూ..? ఆ సెక్క ఒక్కటీ తీసుకుంటే సాలు..మళ్లా తమరు జాతకం సెప్పించుకోనవసరం లేదు. ఆ మరుసటి దినం నుండే మీ జాతకం బ్రెమ్మాండంగా మారిపోతుంది. "  అన్నాడు బిచ్చగాడు. " తప్పకుండా చెక్క కొనుక్కుంటాం " అన్నాడు జోసెఫ్.   ....... ఇంకా వుంది .........

" ఏడు రోజులు " 9వ భాగం

" ఏడు రోజులు " 9వ భాగం       రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి     ఇంటికి వచ్చాక గౌసియావాళ్ళ ఇంటివైపు చూస్తుంటే బాధకి తోడుగా ఆవేశం పుట్టుకొచ్చింది అతడికి. నేరుగా వాళ్ల ఇంట్లోకి చొచ్చుకుపోయి, అందర్నీ చెడమడా తిట్టీ కొట్టీ, గౌసియాను తెచ్చుకోవాలన్పించింది. ఊహల్ని, కలల్ని అనుకున్న తక్షణమే నిజం చేసుకోవడానికి అల్లావుద్దీన్ అద్భుత దీపం అక్కడలేదు కాబట్టి, అసహాయంగా ఇంట్లోకి నడిచాడు. అప్పటికి చింతకాయ చెట్నీ తయారుగా పెట్టి ఉంచింది తల్లి లక్ష్మీ దేవమ్మ. పులకాలు తిన్నాడు అతడు. " ఏంట్రా అదోలా ఉన్నావు?" అడిగింది లక్ష్మీ దేవమ్మ. " ఏంలేదు" అన్నాడు శంకర్. " సరేగాని, నేను గిర్నీకి వెళ్లొస్తాను. ఇల్లు జాగ్రత్త" చెప్పి జొన్నల డబ్బాని నడుముకి ఎత్తుకుని ఒయటకి నడిచింది లక్ష్మీ దేవమ్మ. " పోలీస్ స్టేషన్ కి ధైర్యం చేసుకుని ఎలా వెళ్లాలి?" ఆలోచిస్తూ ఇంట్లోనే అటూ ఇటూ తిరగసాగాడు భవానీశంకర్. కాసేపటి తర్వాత అతడి మిత్రుడు గోపాల్ వచ్చాడు. మిత్రుడ్ని చూడగానే తనకేదో అండ దొరికినట్లుగా తోచింది అతడికి. వెంటనే సమస్య గురించి మిత్రుడితో చెప్పుకున్నాడు. " నేను నీకు మొదట్నుండీ చెప్తూనే ఉన్నాను. ముస్లీం పిల్లతో ప్రేమాధోమా అని తిరగవద్దురా అని! ఇప్పుడు చూడూ ఎంత పెద్ద సమస్య ఎదురయ్యిందో ?" అంతా విన్నాక అన్నాడు గోపాల్. " మొత్తానికి ఏం చేద్దామంటావురా?" " నీకు ఆ సిరాజ్ తప్ప, మన ఫ్రెండ్స్ ఎవ్వరూ సహాయం చేయరు. ఇప్పుడా సిరాజ్ కూడా సహాయం చేయడు అంటున్నావు. కాబట్టి ఆ పిల్లను మర్చిపో" " అదేంట్రా?" " లేకపోతే ఏంట్రా? ప్రేమించడానికి నీకు ఆ పిల్లే దొరికిందా? మేము వద్దన్న పనిచేశావు కాబట్టి, నీకు మంచి శాస్తి జరిగింది. జరిగిందేదో జరిగిపోయిందికాని మనం కృష్ణానగర్ వెళ్దాంరారా. మనిద్దరమే కాదు మన ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు అన్నాడు గోపాల్. " కృష్ణానగర్ ఎందుకు?" అడిగాడు భవానీ శంకర్. " రజకీకాంత్ షూటింగ్ జరుగుతుందట. మన అభిమాన హీరోని చూడబోతున్నాం. లక్ అంటే మనదే" సంబర పడిపోయాడు గోపాల్. " నేను రాలేను" అన్నాడు భవానీశంకర్. " రారా" గట్టిగా పిలిచాడు గోపాల్. " నన్ను అర్ధం చేసుకో" " అర్ధం చేసుకున్నాను, అందుకే రమ్మంటున్నాను" అర్ధం కానట్టుగా చూశాడు భవానీశంకర్ " ఎంతయినా స్నేహితుడివి కాబట్టి వద్దన్న పని చేసినా సహాయం చేయక తప్పదు. పోతే రెండ్రోజులు ఆగాలి. ఎందుకంటే మా పోలీసు మామ ఎల్లుండి వరంగల్ నుండి వస్తున్నాడు. మా మామకి ధైర్యం బాగా ఎక్కువ. నక్సలైట్ ఏరియాలో ఉన్నాడు కాబట్టి ధైర్యాన్ని కూడగట్టుకొని కూడగట్టుకొని కరడుగట్టిన సింహంలా మారిపోయాడు. ఎవ్వరికీ భయపడడు. ఆయనతో నీ సమస్య చెప్పుకుంటే తప్పకుండా నీకు మేలు జరుగుతుంది" చెప్పాడు గోపాల్. " అంతలోపే.." భవానీశంకర్ మాట్లాడబోయాడు. " ఇంకేం మాట్లాడవద్దురా! నువ్వు ఆగాల్సింది రెండు నెలలు కాదు రెండ్రోజులు. ఆ రెండ్రోజుల్లో కొంపలేం అంటుకుపోవుకాని, మా వెంట కృష్ణానగర్ వచ్చేసేయ్" అయిష్టంగా నిలబడిపోయాడు భవానీ శంకర్. " నువ్వు రాకపోతే నేను సహాయం చేయను" అన్నాడు గోపాల్. " వస్తాలేరా" అన్నాడు భవానీశంకర్ అన్నాడే కాని వెళ్లడం అతడికి ఏమాత్రం ఇష్టంలేదు. గిర్నీ నుండి తల్లి వచ్చాక చెప్పేసి గోపాల్ వెంట బయలుదేరి కృష్ణానగర్ వెళ్లాడు భవానీ శంకర్. షిరాజ్ తప్ప మిగతా ఫ్రెండ్స్ అంతా వచ్చారు. షిరాజ్ కూడా వచ్చేవాడే కానీ తమ అమ్మానాన్నలు వచ్చినందుకు రాలేదు. అందుకే అమ్మకూచిగాడు అంటూ అందరూ వెక్కిరించి నవ్వారు. భవానీ శంకర్ మాత్రం స్తబ్దుగా ఉండిపోయాడు. అభిమాన నటుడ్ని చూస్తూనే అభిమాన బాంధవి గురించి ఆలోచిస్తున్నాడు. కాబట్టే స్నేహితులతో కలిసి ఎప్పట్లా ఆనందాన్ని పంచుకోలేకపోతున్నాడు.   చూస్తుం డగానే చీకటయింది ఇంటికి రావాలనుకున్నాడు భవానీశంకర్. కానీ ఫ్రెండ్స్ అంతా అక్కడే ఉండిపోతూ అతడ్ని కూడా కదలనివ్వలేదు. బుధవారం.........   వేకువజామున ఐదుగంటలు కావొస్తోంది. దూరంగా ఉన్న కేశవస్వామి గుడిలోంచి వెంకటేశ్వర సుప్రభాతం సుమధురంగా వినబడుతోంది. పబ్లిక్ పార్క్ లో పచ్చిక తివాసీమీద పడుకుని ఉన్న భవానీశంకర్ ఆవులిస్తూ నిద్రలేచి కూర్చున్నాడు. మిత్రులు ఇంకా నిద్రలేవలేదు. " లేవండ్రా" ఒళ్లు విరుస్తూ లేచి నిల్చున్నాడు భవానీశంకర్. ఒక్కడూ పలకలేదు. " మొద్దునాకొడుకులు" అనుకుంటూ ఫౌంటేన్ దగ్గరికి వెళ్లి ముఖం కడుక్కొని వచ్చి, ఎక్కర్ సైజ్ మొదలెట్టాడు. పార్క్ పక్కగా ఉన్న రోడ్డు వెంబడి కొంత మంది రన్నింగ్ చేస్తూ వెళ్తున్నారు. మరికొంతమంది వాకింగ్ చేస్తున్నారు. " ఉన్న మహారాజులు కాసేపు వ్యాయామం చేస్తారు. ఆ తర్వాత  కార్లల్లో వెళ్లిపోతారు. వాళ్లనే చూస్తూ మనసులో అనుకుని, ఆతర్వాత చుట్టూ ఉన్న బంగళాలవైపు చూస్తూ భూజాలు ష్రగ్ చేస్కున్నాడు. పదిహేను నిముషాల్లో వ్యాయామం పూర్తిచేసి మిత్రులవైపు చూశాడు భవానీశంకర్. వాళ్లు ఇంకా నిద్రలేచినట్టు లేరు. " రేయ్! లేవండ్రా! బిచ్చగాళ్లమైపోయాం... " అంటూ మిత్రులవైపు నడిచాడు అతడు. మిత్రుల్లో చలనం లేదు. " ప్చ్! ఈ బంగళా మనుషులం కాకపోయినా ఈ పార్క్ మనుషులం మాత్రం కాదురా మనం! లేవండి.. ఇంక వెళ్ళి పోదాం " అన్నాడు. షరామామూలే ఒక్కడూ కదల్లేదు. " మీ సినిమా పిచ్చి పాడుగానూ, నన్ను చంపుతున్నారేంట్రా?" విసుగ్గా అన్నాడు. " హే... ఎంట్రా?" " నీదో జోరీగ రొద అయ్యింది ఏంట్రా?" " నీ కంటే ఆ బాలస్వామి... సాయిబులు నయ్యం" " వీడి దవడ పగలగొట్టండి" మిత్రులు ఒకరితర్వాత ఒకరు విరుచుకుపడ్డారు. భవానీశంకర్ కు చిర్రెత్తుకొచ్చింది. "నిద్రను జయించండిరా! జీవితాన్నే జయిస్తారు" అన్నాడు. " ఆ! ముందు నీ ప్రేమను మా ప్రమేయం లేకుండా జయించు " నిద్రమబ్బుతో అన్నాడు ఒక మిత్రుడు. " ఎవడ్రా?" మిత్రులవైపు చూసాడు భవానీశంకర్. అందుకు ఎవ్వరూ సమాధానం ఇవ్వలేదు. తమలో తామే గుణుక్కుంటూ అలాగే పడుకుండిపోయారు. చేసేదిలేక భవానీ శంకర్ మిత్రుల మధ్య కూర్చుని, పాలుపోక అటూఇటూ చూడసాగాడు. తమకు కాసింత దూరంలో బిచ్చగాళ్లు ఐదారుగురు పడుకుని ఉన్నారు. ఎడంగా చూస్తే ఓ పిచ్చోడు నిద్రపోతూ నిద్రలోనే ఏదో గుణుక్కుంటున్నాడు. " అయ్ బాబోయ్" అనుకుంటూ వెనక్కి చూస్తే కాసింత దూరంలో ఒక బిచ్చెగత్తే నగ్నంగా పడుకుని ఉంది. " అబ్బా! ఈ సన్యాసి వెధవలు బతుకును ఫుట్ పాత్ చేసేశారు" అనుకుంటూ తలపట్టుకున్నాడు భవానీశంకర్.   ....... ఇంకా వుంది .........

" ఏడు రోజులు " 8వ భాగం

" ఏడు రోజులు " 8వ భాగం       రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి     లోపలి ఇంట్లో తల్లి లక్షీదేవమ్మ జొన్నలు జల్లెడ తిప్పుతోంది. కొడుకురాకను ఆమె గ్రహించలేదు. అలాగే ఒక అర్ధగంట కూర్చున్నాడు భవానీశంకర్. అంతసేపటి వరకు గౌసియా వాళ్ల ఇంట్లోంచి ఎవ్వరూ బయటకి రాలేదు. పరదా చాటునుండి అస్పష్టంగా ఆమె చెల్లెళ్ళు అటూ ఇటూ తిరుగాడుతూ కనబడుతున్నారు. కనీసం తన గౌసియా అలాగైనా కనబడుతుందేమోనని ఆత్రంగా చూస్తున్న భవానీశంకర్ కి, మరో అర్ధగంట తర్వాత కూడా నిరాశే ఎదురయ్యింది. అప్పటికి ఎండకూడా బాగా ఆరంభమయ్యింది. అందుకే ఇక నెమ్మదిగా లేచి ఇంట్లోకి నడవబోయాడు భవానీశంకర్. కాసింత దూరంగా ముదురురంగు బురకాధరించి వస్తూ కనబడింది పర్వీనా. " ఇంతగా మాకు సహాయం చేస్తున్నందుకు, నీకు చేతులెత్తి దణ్ణం పెడతాం ఆపా" ఆమెనే చూస్తూ మనసులో అనుకున్నాడు అతడు. అతడెవరో తనకు పరిచయం లేనట్లుగానే, తన దారిన తను వచ్చి గౌసియా వాళ్ళ ఇంట్లోకి వెళ్లింది పర్వీనా. తృప్తిగా ఇంట్లోకి నడిచాడు భవానీశంకర్. " ఏరా ఇంతసేపు ఎక్కడికి వెళ్లావు?" కొడుకును చూడగానే అడిగింది లక్ష్మీదేవమ్మ. " టైమ్ పాస్ గా ఉంటుందని అలా బజారుకి వెళ్లొచ్చా ఇంతకూ నాస్తాకు ఏం ఉండావు? వెళ్లి గిన్నెలు తెరిచిచూస్తూ అడిగాడు. " గోధుమ పులకాలు చేసాను" చెప్పిందామె. "కూర?" "  ఏమీలేదు. మిరప్పొడిలో నూనె కలుపుకో" "ప్చ్" విసుగ్గా పెదవులు చిట్లించాడు అతడు. " ఇట్లాంటివాడివి సంపాయించి పైసలు తీసుకురావాలి. అప్పుడు కమ్మగా కావాల్సినవన్నీ వండిపెడతాను" కొడుకు విసుగును గ్రహించి విసురుగా అంది లక్ష్మీ దేవమ్మ. ముందే గౌసియా గురించిన తొందర అతడ్ని పీడిస్తోంది. పైగా ఇంట్లో కూర లేదు. దానికి తోడుగా తల్లి విసుర్లు. కోపం వచ్చింది అతడికి. అందుకే చేతిలోకి తీసుకున్న కంచాన్ని అక్కడే గూట్లోకి విసిరేస్తూ బయటకి నడిచాడు. " మూతిమీద మీసం మొలవగానే మొనగాడివైపోయావు" వెళ్తున్న కొడుకును చూస్తూ అంది లక్ష్మీ దేవమ్మ. అతడు మారుమాట్లాడలేదు. వెళ్లి అరుగుమీద కూర్చున్నాడు. ఎండ తీవ్రంగా ఉన్నందున వీపు చుర్రుమంటోంది. అయినప్పటికీ ఖాతరు చేయకుండా గౌసియావాళ్ళ ఇంటివైపు చూస్తూ కూర్చున్నాడు. అర్ధగంట తర్వాత బయటకి వచ్చిన పర్వీనా, ఈమారు కూడా భవానీశంకర్ చూసీ చూడనట్లుగానే తన ఇంటివైపు నడిచివెళ్లింది. లేచి వెనుకే నెమ్మదిగా వెళ్లబోయాడు భవానీశంకర్. " రేయ్.. శంకరూ" అంతలోనే లోపల్నుంచి తల్లి పిలుపు. "ఆ!" పలికాడు భవానీశంకర్. " ఎండలో ఎందుకు కూర్చున్నావు? వచ్చి పులకాలు తిందువుగానీ రా" పిల్చింది. " నాకేం వద్దు" రోషంగా అన్నాడు. " చింతకాయ చట్నీ నూరి, తాలింపు పెట్టిస్తానుగానీ రారా" ప్రేమగా పిలిచింది. " ఇప్పుడే వస్తాను" అంటూ ఆకలి కూడా మరిచి పర్వీనావాళ్ల ఇంటికి వెళ్లాడు భవానీశంకర్. " వాళ్లు చెప్పలేదుగానీ, ఈరోజో రేపో ఆ పిల్లకు నిఖా జరగబోతున్నట్టు నాకు అనుమానం వచ్చింది" వెళ్లగానే చెప్పింది పర్వీనా. " ఆ.. ఆ..." భయంగా చూశాడు భవానీశంకర్. " మా ఆయన ద్వారా వాళ్లకీ నాకూ మంచి పరిచయం ఉంది కదా! ఆ పరిచయం నుండే గౌసియాను నావెంట బయటకు పంపించారు. గౌసియాను తీసుకొని బయటకు వెళ్లాక, ఆ పిల్ల నీకోసం రావడం.. నేను మా బంధువుల ఇంటికి వెళ్లడం.. ఆ సాయంకాలానికి తిరిగి ఇద్దరం కలిసి బయలుదేరి రావడం.. అంతా ఎలాంటి అనుమానం రాకుండా జరిగిపోయింది. " కాని ఇప్పుడెందుకో వాళ్ళెవ్వరూ నాతో సరిగ్గా మాట్లాడలేదు. ఆ పిల్లలు మంచి వాళ్లే. అయితే మాట్లడవద్దని తల్లిదండ్రులు  చెప్పిఉంటారు. అందుకే నేను వెళ్తే కనీసం బయటకి కూడా రాలేదు గౌసియా. " అయినప్పటికీ గౌసియా గురించి అడిగాను. అడగడం ఏదో పెద్ద తప్పయినట్టు " మా పిల్ల గురించి ఇంక అడగద్దు. దాన్ని ఇంకెక్కడికీ తీసుకువెళ్లవద్దు" అని ముఖం పైనే చెప్పేసింది వాళ్ల అమ్మ అయినా కూడా " ఎందుకు?" అని అడిగాను. హమ్మో! ఇందుకు ఆ ఖతీజాబీ ఏముందో తెల్సా? " మా పిల్లకు శని చీడ ఉందంట. కాబట్టి ఎవ్వరితో మాట్లాడించవద్దు. బయటకు పంపించొద్దు.. అని మున్సీపు చెప్పిండు అని నమ్మకంగా చెప్తోంది. నాకు అన్నీ తెల్సు కాబట్టి నేను ఇంకేం మాట్లాడకుండా వచ్చేశాను" చెప్పుకుపోయింది పర్వీనా. " అయ్యో ఆపా.. ఇప్పుడెలా?" ముచ్చెమటలు పట్టేశాయి భవానీశంకర్ కి. " మీరు అలా వెళ్లి ఉంటే నేను చిక్కుల్లో పడిపోయేదాన్ని. అయినా ' మధ్యలోనే నాకళ్ళుగప్పి వెళ్ళిపోయిందనో, ఇంటికి వెళ్తున్నానని చెప్పి మధ్యలోనే తిరిగివచ్చిందనో చెప్పుకునేదాన్ని. అయినా ఈ జుమ్మారోజు మిమ్మల్ని చాలా జాగ్రత్తగా పంపించి వేయాలి అనుకున్నాను. ఎలా అంటే... ఆ పిల్లకోసం నేను వెళ్లడంకాకుండా, ఆ పిల్లనే మా ఇంటికి రప్పించి పంపించాలి అనుకున్నాను. ఇలాంటపుడు ' అపిల్లను నేను తీసుకువెళ్లాను' అన్న బాధ్యత ఉండదు. ఆపిల్లే మా ఇంటికి వస్తానని చెప్పిపోయి వెళ్లిపోయినట్టుగా ఉంటుంది!ప్చ్ .. కానీ ఏం చేస్తాం? ఆలోచన ఆచరణలోకి రాకమునుపే పరిస్థితులు ఇలా తయారయ్యాయి నిట్టూర్చింది పర్వీనా. " దేవుడా " తల పట్టుకున్నాడు భవానీశంకర్. " ఒక పని చేస్తావా?" అంది పర్వీనా. ఏంటన్నట్లుగా ఆత్రంగా తల ఎత్తిచూసాడు అతడు. " పోలీస్ స్టేషన్ కి వెళ్లి గౌసియా పెళ్లి గురించి ఫిర్యాదు చేయి. నీ పేరు బయట పెట్టవద్దని పోలీసువాళ్లకు ముందే చెప్పు, వాళ్లు ఇక సాయిబు ఇంటిమీద ఓ కన్నేసి ఉంచుతారు. అప్పుడు గౌసియా క్షేమంగా ఉండగలుగుతుంది" సూచించింది పర్వీనా. " పోలీసు వాళ్ల దగ్గరికి వెళ్లాలంటే నాకు భయం ఆపా" భయపడ్డాడు అతడు. " ధైర్యం తెచ్చుకోవాలి" అంది పర్వీనా. " మీరే ఫిర్యాదు చేయండి" అన్నాడు. "హమ్మో!" గుండెలపై చేయివేసుకుని, నీకు వేరే ఎలాంటి సహాయం చేయమన్నా చేస్తాను కాని, ఇట్లాంటి సహాయం మాత్రం  చేయలేను. అయినా నీకు తెలియంది ఏముంది? మీ ప్రేమ గురించి నాకూ, సిరాజ్ కి మాత్రమే తెలుసు. ఆయనకు తెలియకుండా మేము ఇద్దరం నీకు సహాయం చేస్తున్నాం. ఇట్లాంటపుడు నేను గాని, సిరాజ్ గాని, సిరాజ్ గాని పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఇంకేమైనా ఉందా..? " ఒకవేళ ధైర్యంచేసి సిరాజ్ వెళ్లినా, అది ఒకవేళ బయటపడ్తే వాడి పరిస్థితి ఏంకావాలి? చదువుకోరా అని అక్క ఇంట్లో పెడ్తే నువ్వు ఇట్లాంటి రాచకార్యాలు నిర్వహిస్తున్నావా అని వాడ్ని మా అమ్మావాళ్లు తన్ని ఊరికి తీసుకెళ్లిపోతారు. ఇక నాకు ఆయన నుండి తలాఖ్ తప్పదు. అందుకే నేను నీకు ధైర్యాన్ని మాత్రం అందిస్తున్నాను. వెళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయి అంతకన్నా గత్యంతరంలేదు" చెప్పింది పర్వీనా. కాసేపు మౌనంగా ఉండిపోయి, ఆ తర్వాత నెమ్మదిగా పెదవులు విప్పాడు. " ఆపా! పోలీస్ స్టేషన్ కి వెళ్లాలంటే మీదొక భయం. నాదొక భయం! గౌసియా గురించి నేను ఫిర్యాదుచేస్తాను అన్న విషయం ఒకవేళ బయటపడ్తే హిందూ, ముస్లీం గొడవలు తప్పవు. అప్పుడు మా ఇద్దరికోసం మరెందరో చావాల్సి ఉంటుంది" " ఇదీ నిజమే. ఇలాగని వెనుకడుగు వేస్తే నీవు గౌసియాను మర్చిపోవాల్సి ఉంటుంది" అంది పర్వీనా. " నేను గౌసియాను మర్చిపోలేను. అస్సలు ఆమె లేకుండా బతకలేను" అంటుంటేనే భవానీశంకర్ గొంతు గద్గదమయ్యింది. " నేను మీ హిందువుల్లో ఉంటే ధైర్యంగా ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్లేదాన్ని. కాని మా మిల్లత్ ( ముస్లీం సమాజం) లో స్త్రీలు అట్లాంటి ప్రదేశాలకి వెళ్లడం అంటే, అది అనంగీకార విషయం! " మా సమాజం స్త్రీలను మసీదుకే వెళ్లనివ్వదు. అట్లాంటిది పోలీస్ స్టేషన్ కి వెళ్లడమా? అందునా సంబంధంలేని విషయంలో జోక్యం చేసుకోవడం. పైగా తోటి ముసల్ మాన్ విషయంలో"!? " ఇంతకంటే చెప్పలేను. నన్ను అర్ధం చేసుకో శంకర్!" అంది పర్వీనా. భవానీశంకర్ కు తను ఒంటరివాడైపోయిన భావన కలిగింది. భారంగా పర్వీనా వైపు చూస్తూ, " నీవు చెప్పినట్టుగానే చేస్తాను ఆపా" అంటూనే లేచి నిల్చున్నాడు. " నీలో భయంగాని, బాధగానీ ఉండకూడదు" తను కూడా లేచి నిల్చుంది పర్వీనా. " సరే ఆపా" అంటూ బయటకి నడిచాడు అతడు. ఆమె లోపలికి వెళ్లిపోయింది. ....... ఇంకా వుంది .........

" ఏడు రోజులు " 7వ భాగం

" ఏడు రోజులు " 7వ భాగం       రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి     అనూహ్యంగా తనకోసం అరబ్బుషేకు ఇంటికి వచ్చినరోజు, గౌసియాబేగం భయపడింది.. బాధపడింది.. కలవరపడింది. అప్పుడు తల్లి ఖతీజాబీ ఇలాగే ఆశల్ని పెంచుతూ ధైర్యాన్ని అందించింది. అయినప్పటికీ గౌసియా మనసు కుదుటపడలేదు. ప్రియుడ్ని కలుసుకున్న తర్వాత అతడు అందించిన ఓదార్పు, ధైర్యమే ఆమె మనసు కుదుటపడేలా చేసాయి. అయితే అరబ్బు షేకు తిరిగి ఇంత త్వరగా ఐదురోజుల తర్వాతే తనకోసం వస్తాడని అనుకోలేదు. తల్లిదండ్రులు ఆ విషయం గురించి ఆమెకు చెప్పనూలేదు. వాళ్ల దృష్టిలో గురించిన విషయాన్ని కూడా ఆమెకు చెప్పాల్సిన అవసరం లేదనుకున్నారు వాళ్లు. కాకపోతే తన రేటును మాత్రం తెల్సుకోగలిగింది గౌసియా. అదీ కూడా తెలియకపోయేదే. కానీ " వచ్చే డబ్బుల్తో ఏఏ పనులు చేసుకుని, ఏఏ అవసరాలు తీర్చుకోవాలి? అందుకు ఎంత ఖర్చువుతుంది?" అంటూ తల్లిదండ్రులు లెక్కలు వేసుకుంటుంటే విననట్లుగానే ఉండీ వినగలిగింది. " షేకు వెంట వెళ్లడం నాకు ఇష్టం లేదు" ఉబికివస్తున్న కన్నీళ్లను తుడ్చుకుంది గౌసియా. " బేటా" అంతలోనే లోపలికి వచ్చాడు సాయిబు. కళ్లనీళ్లను మరోసారి తుడుచుకుంటూ తండ్రివైపు చూసింది గౌసియా. కూతుర్ని అలా చూడగానే సాయిబు చీకాగ్గా ముఖం చిట్లించాడు. " కైకు రోరి?" పళ్ళబిగువున అడిగాడు.   భయంగా చూసింది గౌసియా. " షేకుకు సలాం చెప్పాలి. తొందరగా కొత్త సారి కట్టుకుని తయారవ్వు" అని చెప్పి, బయటకి వెళ్లిపోయాడు తండ్రి. ఇనప పెట్టెలోంచి వారంరోజుల కిందట కొన్న ఎరుపురంగు జరీచీర తీసి కూతురుకు అందించింది ఖతీజాబీ. చీర తీసుకుని ఒక మూలగా వెళ్లింది గౌసియా. పెద్ద చెల్లెలు జుబేదాబేగం పెట్టి కోట్.... జాకెట్ తెచ్చి ఇచ్చింది. పదినిమిషాల్లో చీరకట్టుకుంది గౌసియ. తర్వాత అదే గదిలో ఉన్న జాలాడిలో ముఖం కడుక్కుంది. అంతలోనే మళ్లీ వచ్చాడు సాయిబు. తయారవుతున్న కూతురిని చూస్తూ" తొందరగా" అని చెప్పి ఆ వెంటనే వెళ్లిపోయాడు. మరో పదినిమిషాల్లో తయారయింది గౌసియా. ఆమె ముస్తాబు చౌకబారుగా ఉంది. పదిరూపాయల విలువచేసే పొడవైన లోలకులు ధరించి, రెండ్రూపాయలకు దొరికిన అత్తరు పరిమళాన్ని దూది సహాయంతో నిలువెత్తున అడ్డుకుని.. ఆ దూదిని పదిలంగా చెవిలో ఒకమూలగా దోపుకుని, ఐదురూపాయలకి కొన్న ఎర్రని లిప్ స్టిక్ ని పెదవులకి పూసుకొని, రంగు పక్కపిన్నులతో నున్నగా దువ్వి జడవేసుకుని, పాపెడలో మెరుగు అద్దుకుని, నిరుపేద ఇంటి నిండైన బొమ్మలా కనబడుతోంది. " అయిపోయిందా?" అడుగుతూ లోపలికి వచ్చాడు తండ్రి. రాగానే కూతుర్ని చూసి " మేరీ బేటీ అచ్ఛాహై" మెచ్చుకోలుగా అన్నాడు. ఆ సమయంలోనే తలనిండుగా కొంగువేసుకుంది గౌసియా. " ఆ... అదీ" కూతురు ముసుగును కూడా మెచ్చుకున్నాడు తండ్రి. " అబ్బ వెంటనే బయటకి వెళ్లు" చెప్పింది ఖతీజాబీ. " సరే " అన్నట్టుగా తలాడించి, తండ్రి వెంటే బయటకి నడిచి, ముఖాన్ని పూర్తిగా నేలకు వంచేసి " సలాంవాలేకుం" అంటూ చేతిని నొసటికి ఆన్చి తీసి అలాగే నిలబడిపోయింది. ఆమెను చూస్తున్న అరబ్బుషేకు కళ్లు ఆశగా మెరుస్తున్నాయి. జరీచీర చాటునున్న ఆమె అందాన్ని చూస్తూ, " ఈ రాత్రికి నిఖా చేసుకుంటాను " అన్నాడు. " అట్లాగే " తలాడించాయి సాయిబు. " రేపు ఉదయాన్నే ముంబాయి బయలుదేరాలి. అక్కడ నాకు కొన్ని పనులు ఉన్నాయి. కాబట్టి ఒక నెలరోజులు అక్కడే ఉండి, ఆతర్వాత దుబాయి వెళ్ళిపోతాం" చెప్పాడు షేకు. వింటూ తలాడించాడు సాయిబు. " మీ ఇంట్లోనే నిఖా చేసుకుంటాను. ఇందుకు మీరేమి ఖర్చు పెట్టుకోవద్దు. ఖర్చంతా నాదే" నిండుగా గాజులు ధరించిన గౌసియా చేతిని ఒకసారి మృదువుగా స్ప్సశించి వదిలేస్తూ చెప్పాడు షేకు. అందుక్కూడా తలాడించాడు సాయిబు. " ఇక నీ బేటీను ఇంట్లోకి పంపించు" లేచి నిల్చుంటూ అన్నాడు షేకు. " బేటీ! లోపలికి వెళ్లు " తను కూడా లేచి నిల్చుంటూ చెప్పి, " బయలుదేరుతున్నారా?" షేకు ముఖంలోకి సవినయంగా చూస్తూ అడిగాడు సాయిబు. "అవును" అంటూనే బయటికి నడిచాడు షేకు. వెంటే వెళ్లాడు సాయిబు. షేకు వెళ్లగానే కారుడోరు తీసి పట్టుకున్నాడు డ్రైవరు. ఎక్కి కూర్చున్నాడు షేకు. అతడికి మరోసారి సలాం చెప్పాడు సాయిబు. అతడు గంభీరంగా తలపంకించాడు. మరుక్షణం కారు ముందుకు కదిలింది. బయటినుండి ఇంటికి వస్తున్న భవానీశంకర్ ఆ దృశ్యాన్ని చూడగానే అప్రయత్నంగా తన అడుగుల్ని నెమ్మది చేశాడు. కలవరపడిపోతూ, ఎదురొచ్చిన కార్లోకి గుచ్చి మరీ చూశాడు. " గౌసియాను తీసుకెళ్లిపోతున్నాడేమో" అని ఏ మూలనో పీడించిన అనుమానం, కార్లో గౌసియా కనబడకపోవడంతో ఆనందంగా మారింది. " రక్షించావురా దేవుడా" అనుకుంటూ సాయిబువైపు చూశాడు. సన్నగా మహమ్మద్ రఫి పాట పాడుకుంటూ చాయ్ బండి అమ్మేదిశగా వెళ్తున్నాడు సాయిబు. " దుర్మార్గుడా" మనసులో అనుకుని, ఆ వెంటనే వెనుతిరిగి, పరుగుపరుగున కిలోమీటర్ దూరాన ఉన్న స్నేహితుడి ఇంటివైపు నడిచాడు భవానీశంకర్. స్నేహితుడి ఇల్లు సమీపించగానే, ఆ దరిదాపులో బాలస్వామి గనుక ఉన్నాడేమోనని అటూ ఇటూ చూసి, లేడని నిర్ధారించుకున్నాక హాయిగా ఊపిరిపీల్చుకుంటూ స్నేహితుడి ఇంటి తలుపు తట్టాడు. ఎవరు అన్నట్టుగా కిటికీలోంచి చూసి, ఆ తర్వాత తలుపుతీసింది స్నేహితుడి అక్క పర్వీనాసుల్తాన. " ఆపా.. షిరాజ్ ఉన్నాడా?" హడావుడిగా అడుగుతూ లోపలికి నడిచాడు. " కాలేజికి వెళ్లాడు" చెప్తూ తలుపులు దగ్గరగా వేసింది పర్వీనా. " ఆపా.. గౌసియా వాళ్లింటికి ఆ షేకు గాడు మళ్లీ వచ్చాడు" అదే హడావుడితో  చెప్పాడు భవానీశంకర్. " అనుకున్నాను" అంటూ గుమ్మం తాలూకు పరదా సరిచేసి " షేకు వాళ్ల ఇంట్లోనే ఉన్నాడా ఇప్పుడు?" అడిగింది పర్వీనా. " వెళ్లిపోతుంటే చూశాను" " అలాగా!" అంటూ వెళ్లి అక్కడున్న కుర్చీలో కూర్చుంటూ " గౌసియాతో మాట్లాడాలి అనుకుంటున్నావా? అడిగింది. " అవును ఆపా" అంటూ వెళ్లి ఆమె ఎడంగా ఉన్న మరో చెయిర్ లో కూర్చున్నాడు అతడు. " ఈరోజు నాకు కుదరదు. కాబట్టి రేపు మాట్లాడు" " వద్దు ఆపా! ఈరోజే మాట్లాడాలి" " కాని ఈరోజు ఊరినుండి మా అమ్మ నాన్న వస్తున్నారు" " అయితే కనీసం గౌసియాతో మాట్లాడి విషయాలు తెల్సుకో" "సరే" " ఇప్పుడే వెళ్తావా వాళ్లింటికి?" " అంత తొందరపడ్తావేం? " చిన్నగా నవ్వింది పర్వీనా. " నాకు కంగారుగా ఉంది" చేతులు నలుపుకుంటూ చెప్పాడు భవానీశంకర్. " మొన్న జుమ్మా రోజు కూడా ఇలానే కంగారుపడ్డావు" అందామె.  " ఆరోజుకంటే ఈరోజు ఎక్కువ కంగారుగా ఉంది. ఎందుకంటే వాడు రెండోసారి రావడం అంటే గౌసియాని తీసుకువెళ్లే సమయం దగ్గరపడిందనే అర్ధం. " పడనీయ్! ఈ జుమ్మాకి మీరు వెళ్లిపోతారు కదా" " అంతలోపే వాడికి గౌసియాను తీసుకెళ్లే ఆలోచనఉంటే?" ఆ! అదీ ఆలోచించాల్సిన విషయమే" " అందుకే ఆపా! తొందరగా వెళ్లి గౌసియాతో మాట్లాడు" " సాయంకాలం వరకు నీకు ఏ విషయం చెప్పేస్తాను. తొందర పడవద్దు" "సరే" అన్నట్లుగా తలపంకించాడు భవానీశంకర్. అయినప్పటికీ అతడికి మనసులో మనసులేదు. తనకు మంత్రాలు, మాయలు, వచ్చివుండివుంటే అదృశ్యంగా వెళ్లి గౌసియాతో మాట్లాడేవాడ్ని కదా అనిపిస్తుంది. అంతేకాదు , తక్షణమే గౌసియాను తీసుకుని ఎటైనా పారిపోవాలనిపిస్తోంది. ఆమెకు తన ఒడిలో దాచుకుని ప్రపంచాన్ని మరిచి జీవించాలనిపిస్తోంది. అందుకే పర్వీనా వాళ్ల ఇంటినుండి తన ఇంటికి వచ్చేసాక, కనీసం ఇంట్లోకి కూడా కళ్ళకుండా ఇంటి ముందు అరుగుమీద కూర్చున్నాడు. ....... ఇంకా వుంది .........

" ఏడు రోజులు " 6వ భాగం

" ఏడు రోజులు " 6వ భాగం       రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి   అప్పటికి మసకమసగ్గా తెల్లవారసాగింది. నమాజు ఎప్పుడో పూర్తయింది. భక్తిగీతాలు మాత్రం ఇంకా ఆగలేదు. " ప్చ్! గౌసియా నాకు ఎందుకు నచ్చిందో ఆమెకు నేనెందుకు నచ్చానో..." మనసులోనే విచారంగా అనుకుంటూ నెమ్మదిగా అడుగులు ముందుకు వేయసాగాడు భవానీశంకర్. అతడికి గతం క్రమంగా గుర్తుకు రాసాగింది. అప్పట్లో రామజన్మభూమి గొడవలు జరిగినప్పుడు తను బాగా చిన్నవాడు . రేగుతున్న మతకలహాలు బాగా అర్ధమయ్యాయి. ఆ ప్రాంతంలో అంతకుముందు నుండే మత బేధాలు ఉన్నందున రామజన్మభూమి గొడవలు  అక్కడ తీవ్రతరంగా చెలరేగాయి. ఫలితంగా అమాయక ప్రాణాలు నేలకు ఒరిగాయి. ఇందుకు పూర్తిగా భయకంపితులైన తన తల్లదండ్రులతో పాటుగా చాలామంది కుటుంబాలు ఆ ప్రాంతాన్నే వదలిపెట్టడం జరిగింది. అప్పుడు తాము నల్లగొండ జిల్లాలో ఉన్నారు. హిందువుల దేవాలయాలపైనే కాదు, ఊళ్లోకి వచ్చిన రామపాదుకలపై కూడా ముస్లీంలు దాడి చేశారు. పొలాల్లోనూ కోన్ని ఇళ్లముందరనూ, భక్తిపూర్వకంగా కట్టుకున్న మహ్మద్ హుస్సేన్ దర్గాలపైనే కాకుండా... మసీదులపై కూడా హిందువులు దాడిచేశారు. ఆ గొడవల్లోనే బాలస్వామి తమ్ముడు చనిపోయాడు. సాయిబు అన్న కూడా చనిపోయాడు. గొడవలు సద్దుమణిగాక ఇంటికి రావడం జరిగింది. అప్పటికి  గౌసియాతో తనకు పరిచయం లేదు. కాకపోతే కలహాల్లో గౌసియా గాయపడింది. ఆమెకు ఒళ్లంతా కట్లుకట్టి ఉన్నారు. తనకు పాపం  అన్పించింది. అందుకే ఓ రోజు ఇంటిముందు కూర్చున్న గౌసియా దగ్గరకు వెళ్లి మాట్లాడాడు. అప్పుడు మళ్లీ గొడవలు చెలరేగాయి. గొడవల్లో తన తండ్రి గాయపడ్డాడు. ఇవన్నీ గుర్తు చేసుకుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. మరి తమ ప్రేమను తను ఎలా గెలుచుకోగలడు? గెలవకపోతే తను బ్రతకగలడా..? తనే కాదు, గౌసియా కూడా బతకలేదు. " రేయ్ శంకర్...." ఉన్నట్టుండి సురేష్ గొంతు మళ్లీ వినిపించింది. ఆగి తిరిగి చూశాడు భవానీశంకర్. " రేయ్ ... ఎప్పుడూ కూడా నీ మాటను, నీ ప్రేమను నేను లక్ష్యపెట్టలేదు కదా! కానీ ఇప్పుడు మాత్రం ఒక మంచి సలహా ఇవ్వడానికి వచ్చాను " దగ్గరగా వస్తూనే అన్నాడు సురేష్. " ఏంట్రా? " ఆసక్తిగా కళ్లింత చేశాడు భవానీశంకర్. " ఇదిగో ! మన హిందువుల్లో మతం మార్చుకునే ఆత్మాభిమానం తక్కువ వెధవలు చాలామంది ఉన్నారు. వాళ్లల్లో నువ్వొకడివి అయిపోతే చాలు ! నీకు ఇష్టమైన పిల్లను నువ్వు హాయిగా చేసుకోవచ్చు " చెప్పి ఆ వెంటనే వెనుతిరిగి వెళ్లిపోయాడు సురేష్. " వీడు నన్ను ఎత్తిపొడుస్తున్నాడా లేక నిజంగా ప్రోత్సహిస్తున్నాడా?" అర్దం కాలేదు భవానీశంకర్ కు. అందుకే వెళ్లిపోతున్న స్నేహితుడివైపు ఎగాదిగా చూస్తుండి పోయాడు. అంతలోనే అన్పించింది కూడా... "నిజమే! నాకు తెల్సీ మతం మార్చుకున్న ముస్లీంలు ఎవ్వరూ లేరు. ఎక్కడైనా ఉన్నారేమో తెలియదు కానీ.. తనకు తెల్సి సంగీత దర్శకుడు రెహమాన్ ముస్లీం మతాన్ని తీసుకున్నవాడే.. సరూర్ నగర్ లో తమకు తెల్సిన బ్రాహ్మణ స్ర్తీ ముస్లీంను పెళ్లిచేసుకొని రజిత పేరును కాస్తా రజియాగా మార్చుకుంది. ఇంకా సినిమా నటి ఐశ్వర్య, ఆమని ముస్లిం మతాన్ని తీసుకున్నవాళ్లే. మరి వీళ్లంతా వాడు సురేష్ అన్నట్టుగా ఆత్మాభిమానం లేనివాళ్లా? కాదు! ఆ మతంలో వాళ్లకు ప్రేమతత్వం కనబడింది. అందుకే అంత గొప్ప త్యాగం  చేశారు. మరి నేను కూడా ముస్లీం మతం తీసుకుంటే ఎలా ఉంటుంది?" " రేయ్ శంకర్!" అంతలోనే మళ్లీ వచ్చాడు సురేష్. " మళ్లీ ఏం మాటరా?" అడిగాడు భవానీశంకర్. " ఇతర మతస్థులు హిందూమతాన్ని స్వీకరిస్తే పెద్ద హంగామా ఉండదు కాని, తమ మతాన్ని స్వీకరించే ఇతర్లను ముస్లీంలు మాత్రం ఆనందంగా ఆహ్వానిస్తారు. అంతేకాదు, అట్లాంటి వాళ్లను పరిపూర్ణ ముస్లీంగా కూడా భావిస్తారు, గౌరవిస్తారు, ప్రేమిస్తారు. ఎందుకంటే.. చెల్లేళ్ల చేయిని కూడా పట్టుకునే " చెడిన మతం" కదా అది అని తిరిగి ఆ వెంటనే వెళ్లిపోయాడు సురేష్. " వీడికేం వచ్చింది? నిమిషానికి ఒకమాట మాట్లాడి వెళ్తాడు. ముస్లీం మతం చెడిన మతం అయితే హిందూమతం కూడా చెడిన మతమే! వీళ్లు మేనకోడల్ని చేసుకోవడంలేదా? అబ్బ తమ్ముడు అబ్బనే అవుతాడు. అమ్మ చెల్లి అమ్మనే అవుతుంది. అమ్మ తమ్ముడు మాత్రం మొగుడు ఎందుకు అవుతాడు. ఇది హిందువుల అనంగీకార పద్దతి కాకపోతే మరేం అవుతుంది?" అనుకుంటూ ఇంక అక్కడ ఆగకుండా ఇంటివైపు వడివడిగా అడుగులు వేయసాగాడు భవానీశంకర్. ఇంటికి సమీపంగా వెళ్లేసరికి చేతిపంపు దగ్గర నీళ్లు పట్టుకుంటూ కనిపించాడు సాయిబు. అతడితో పాటుగా ఒక హిందూవ్యక్తి కూడా ఉన్నాడు. అయితే హిందూ వ్యక్తి సాయిబు ఉనికిని పెద్దగా పట్టించుకోవడం లేదు. సాయిబు మాత్రం ఆ వ్యక్తి ఉనికిని సహించలేనట్టుగా ముఖమంతా గంటులా పెట్టుకుని పంపుకొడుతున్నాడు.   పంపుకింద ఉన్న బిందె నిండగానే తన బిందెను తీసుకొని పంపుకు సమీపంగా వెళ్లాడు హిందూవ్యక్తి. " ఏం.. జర దమాక్ కరాబ్ అయ్యిందీ? ఇవి పీనేకే పానీ! నీవు ఇట్లా మీదికి ఉర్కివస్తే మేము నీళ్లను ఎట్లా తాగాల?" ఆ మాత్రానికే కోప్పడిపోయాడు సాయిబు. " సర్లే సర్లే..." హిందూ వ్యక్తి శాంతంగా అన్నాడు. " ఈ సూదరి జనాలకు ఎవ్వరితో ఎట్లుండాల్నో గూడా తెల్వదు" అనుకుంటూ బిందె ఎత్తుకుని వెళ్లిపోయాడు సాయిబు, ( మాములు ఊళ్లల్లో హిందువులు అందర్నీ ' సూదరి జనాలు' గా పేర్కొంటుటారు ముస్లీంలు) హిందూ వ్యక్తి సహజంగా పంపుకింద తన బిందెను పెట్టి, పంపుకొట్టసాగాడు. అంతసేపూ అంతా గమనిస్తూ ఎక్కడ ఉన్నాడో మరి బాలస్వామి.. పరుగున వచ్చి పంపుకింద బిందెతీసి, పంపును కడిగినట్టుగా నీళ్లను ఒక్కసారిగా గుమ్మరించాడు. " అదేంటన్నా?" విస్తుపోయాడు ఆ వ్యక్తి. " నీకు సిగ్గూ శరం లేదురా! నీ కార్జానికి చేదు లేదురా? వాడు నువ్వేదో అంటరాని వాడివి అన్నట్టుగా మాట్లాడిపోతే, నువ్వు పౌరుషం లేనివాడిగా ఉండిపోవడమేనా?" ఆవేశంగా అని " ఇంకొక్కసారి పంపును కడిగి నీళ్లు పట్టుకో " చెప్పి వెళ్లిపోయాడు బాలస్వామి. అంతా చూస్తున్న భవానీ శంకర్ కు తల తిరిగినట్టయింది. " ఇంకేమైనా పనీపాట ఉంటేకదా" తనలో తను గొణుక్కుంటూ వెళ్లిపోతున్న బాలస్వామివైపు గుర్రుగా చూశాడు. ఉదయం పదవుతుండగా సాయిబు ఇంటిముందుకు తెల్లని అంబాసిడర్ కారు వచ్చి ఆగింది. కారు ఆగీ ఆగగానే వెనుక డోరు తీసుకొని అరబ్బుషేకు దిగాడు. అప్పటికే బయటకి పరుగెట్టుకొచ్చిన సాయిబు, అరబ్బుషేకుకు సలాం చెప్పి, సాదరంగా ఇంట్లోకి తీసుకెళ్లాడు. చెక్క స్టూలును దులిపి "కూర్చోండి మహరాజ్" వినయంగా చెప్పాడు. అరబ్బుషేకు స్టూలుమీద కూర్చుని ఇల్లంతా కలియచూశాడు. "చాయ్ తీసుకుంటారా మహరాజ్"  ఈమారు చేతులు కట్టుకున్నాడు సాయిబు. " నాకు చాయ్ వద్దు ఏమీ వద్దు. శుక్రవారం రోజు నీకు యాభైవేలు ఇచ్చాను. ఇచ్చి ఈ రోజుకి ఐదురోజులు కావొస్తోంది. ఐదు నా అదృష్టసంఖ్య. అందుకే ఈరోజు మిగతా డబ్బులు ఇచ్చేసి, పిల్లను నిఖా చేసుకొని వెళ్లిపోవాలనుకుంటున్నాను" " మంచి మాట" చిరునవ్వుతో తలాడించాడు సాయిబు. ఆ మాటల్ని వింటుండగానే లోపలిగదిలో కూర్చుని ఉన్న గౌసియాబేగం నిలువెత్తున వణికిపోయింది. " అల్లా" గుండెలపై చేయివేసుకుని భయంగా తల్లివైపు చూసింది. " ఎందుకు భయపడ్తున్నావు? షేకు ముసలివాడైనా నీకు సుఖం దక్కుతుంది. ఈ గరీబు జీవితాన్ని భరించేకంటే అట్లాంటి సంపన్న జీవితమే మేలు " గౌసియాకు మాత్రమే వినబడేలా అంది తల్లి. " వొద్దమ్మా.. నాకా జీవితం వొద్దు" గౌసియాకి కళ్లలో నీళ్లు తిరిగాయి. " అట్లా అనొద్దు బేటా! నీవు మహారాణివి అయిపోతున్నావు. ఇక కోరింది కొనుక్కోవచ్చు. ఈ చిరిగిన బట్టలు, ఈ గడ్డితిండి, ఈపాత ఇల్లు, ఇవేమీ నీకు ఉండవు" " పట్టెమంచాలు, జరీచీరలు, పెద్ద పెద్ద గదులు ఉన్న బంగళా, అన్నీ నీ సొంతమైపోతాయి. అందుకే ఆనందంగా ఉండు " ఆశ పెంచే ప్రయత్నం చేసింది తల్లి ఖతీ జాబీ.   ....... ఇంకా వుంది .........

" ఏడు రోజులు " 5వ భాగం

" ఏడు రోజులు " 5వ భాగం       రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి   అప్పట్లో కొందరు ముస్లిం మతపెద్దలు తమ మత వ్యాప్తికోసం పాటుబడుతూ, అన్నివిధాలా సరైన వ్యక్తుల్ని ఎంపికచేసి ఆయా చోట్లకు పంపించేవాళ్లు. ఆ విధంగా వెళ్లే వ్యక్తులకు నెలసరి జీతాలు ఉండేవి. ఆయా చోట్లకు వెళ్లినప్పుడల్లా వాళ్ల ఖర్చుల్ని కూడా భరించేవాళ్లు కాబట్టి వాళ్లల్లో తను ఒకడిగా ఉండాలని తెగ ప్రయత్నించేవాడు సాయిబు. కానీ అతడికి చదువుసంధ్యలు లేవుకాబట్టి, మత ప్రచారానికి అంతగా పనికిరాడనే ఉద్దేశ్యంతో కాబోలు మతపెద్దలు అతడ్ని పెద్దగా పట్టించుకోకపోయేవాళ్లు. అదే అతడ్ని ఉసిగొల్పింది. మతపెద్దలు తనని ఏంచేస్తే పట్టించుకుంటారోనని పరివిధాలా ప్రయత్నించడం మొదలెట్టాడు. అందుకు అతడి పేదరికం కూడా ఒక కారణం కావొచ్చు. ఇట్లాంటి తరుణంలోనే ఓ ముస్లిం అమ్మాయిని హిందూ అబ్బాయి టీజ్ చేయడం, దాన్ని ఆసరాగా తీసుకొని సాయిబు పెద్ద ఎత్తున ఆవేశపడటం, క్రమంగా హిందూముస్లింల మధ్య గొడవలు తలెత్తడం జరిగింది. ఇక్కడ స్వార్ధం సాయిబు ఒక్కడిదేకాదు, బాలస్వామిది కూడా! ఎలా అంటే అప్పట్లో పిట్టలరాజు అనేవాడు ఈ ప్రాంతం మొత్తానికి దాదాగా వ్యవహరించేవాడు. మనుషుల్ని పిట్టల్ని చంపినట్టుగా చంపించేవాడు. కాబట్టి వాడికి ఆ పేరు వచ్చింది. వాడి దగ్గర యువకుడిగా ఉన్న బాలస్వామి ఒక తొత్తు. అయితే పిట్టలరాజు పథకం ప్రకారం.. "హిందూముస్లింల మధ్య చాపకిందనీరులా ప్రవర్తించి గొడవలు రేపాలి. గొడవలు జరుగుతుంటే ఇరువురి మధ్యా సయోధ్యకు ప్రయత్నించాలి. ఇరువురితో మంచితనాన్ని నటించాలి. ఇందువల్ల రెండుమతాల అండదండలు తనకు లభిస్తాయి" అని యోచించి బాలస్వామిని అందుకు ఆసరాగా మలుచుకొని, లక్షల రూపాయలతో కాంట్రాక్టు మాట్లాడుకున్నాడు. డబ్బుకోసం మానవతను మరిచిన బాలస్వామి, తనకు తెలిసిన అబ్బాయిని ఉసిగొల్పి ముస్లిం అమ్మాయిని కావాలని టీజ్ చేయించాడు. ఈ గొడవల్లో ఆ అబ్బాయి మరణించాడు. అమ్మాయి కూడా ఆతరువాత మరణించింది. వీళ్లిద్దరూ మరణించారు అని చెప్పేకంటే చంపబడ్డారు అని చెప్పడమే బాగుంటుంది. తన స్వార్థంకోసం పడగవిప్పిన పిట్టలరాజు మాత్రం క్షేమంగా ఉండిపోయాడు. సాయిబు, బాలస్వాములుకూడా హాయిగా ఉన్నారు కదా" చెప్పి భవానీశంకర్ పై చూసాడు అతడు. " ఈ గొడవల గురించి నాకు మా అమ్మ చిన్నప్పుడే చెప్పింది" అని, " అవును అంకుల్! పిట్టలరాజు నరరూపరాక్షసుడు అని అందరికీ తెలుసు. మరి అతడు మంచి వాడుగా నటిస్తూ హిందూముస్లింల మధ్య సయోధ్యకు ప్రయత్నించినంతమాత్రానా అతడ్ని ఈ ప్రజలు ఎలా నమ్ముతారు అనుకున్నాడు?" అడిగాడు భవానీశంకర్. నవ్వాడు అతడు, నవ్వి, " డబ్బు బాబు డబ్బు! డబ్బు... ఉన్నవాడికి ఈ ప్రపంచం సలాం అంటుంది. వాడెవ్వడైనప్పటికీ డబ్బు గల వాడు కాబట్టి, వాడితో గులాంగా ఉంటే తమ పనులు నెరవేరుతాయేమో అని ఈ వెర్రి జనాలు భావిస్తారు. కాబట్టే అట్లాంటి గూండాల దగ్గర నేటికినీ ఎందరో యువకులు తొత్తులుగా చేరుతున్నారు అన్నాడు. " అవును అంకుల్ ! తమ పనులు సులువుగా నెరవేరుతాయని, తాము కూడా ఏదో ఒకరకంగా డబ్బు సంపాయించుకోవచ్చని, గూండాల దగ్గరఉంటే ఈ సమాజాన్ని కూడా బెదిరించవచ్చని, నాలాంటి యువకులు చాలామంది భావిస్తున్నారు" అన్నాడు భవానీశంకర్. " శభాష్! నువ్వు ఈ మాట అంటున్నావంటే నీవు బుద్ధిమంతుడివి అన్నమాట" భవానీశంకర్ భుజం చరిచాడు అతడు. అతడి పొగడ్తకు భవానీశంకర్ పెదిమలపై చిరునవ్వులు పూశాయి. " ఒక్క నిమిషం అంకుల్" అని కాసేపు తటపటాయించి, " మీరు హిందూముస్లింల మధ్య సఖ్యత అన్నారు కదా! ఈ సఖ్యతను ఎలా సాధించాలి?  హిందూ ముస్లిం ఇద్దరూ పెళ్లి చేసుకుంటే ఐక్యత వస్తుందా?" అడిగాడు భవానీశంకర్.  భవానీశంకర్ వైపు చిత్రంగా చూస్తూ నవ్వుతూ, " మరీ ఇంత అమాయకత్వం పనికిరాదు.." అంటూ భుజం చరిచాడు అతడు. "..." " హిందూ ముస్లింలు పెళ్లిచేసుకోవడంతో ఐక్యత రాదు బాబూ? అసలు ఆ ఆలోచనే తప్పు! ఎలా అంటే.. మతానికి సామాజిక విలువ ఉంది. ఎవరి మతం మీద వాళ్లకు అపారమైన అభిమానం ఉంటుంది. మతాభిమానం లేనివాళ్లు కూడా ఉన్నారు. ఇదంతా ఏమైనప్పటికీ రెండు మతాల మధ్య భేధభావాన్ని తొలగించి, మనుషులంతా ఒక్కటే అన్నట్లుగా మెలగాలి అంటే అది సామాన్యమైన విషయం కాదు. అందుకు ఎంతో శ్రమపడాలి. మంచి మనసుతో మెలుగుతూ, అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ ఓర్పూ నేర్పూ పాటించాలి. ఇంతేకాని పెళ్లిళ్లు చేసుకుంటేనే ఐక్యత వస్తుందనుకోవడం పొరపాటు. మతాంతర వివాహం తప్పుకాదు. కానీ ఐక్యత విషయంలో అట్లాంటి ఆలోచన రావడం తప్పు"అన్నాడు అతడు. సరే అన్నట్టుగా తలాడించారు భవానీశంకర్. "వస్తాను బాబూ..." అంటూ ఎడంగా ఉన్న సందువైపు బయలుదేరాడు అతడు. భవానీశంకర్ నెమ్మదిగా తమ ఇంటివైపు అడుగులు వేయసాగాడు. " శంకర్" వెనకనుండి పిలుస్తూ వచ్చాడు స్నేహితుడు సురేష్. ఆగాడు భవానీశంకర్. " అంకుల్ నీకు ఏదో క్లాస్ తీసుకున్నట్టు ఉన్నాడు?" అడుగుతూ దగ్గరగా వచ్చాడు సురేష్. " తీసుకున్నాడులేగాని, నాకు భయంగా ఉందిరా" ముందుకు నడుస్తూ అన్నాడు భవానీశంకర్. " ఎందుకు?" అడిగాడు సురేష్. "గౌసియా విషయంలో" " ఉదయాన్నే ఏంట్రా ఈ తలనొప్పి?" అన్నాడు సురేష్. " తలనొప్పి కాదురా, పరిస్థితుల్ని తల్చుకుంటే బాధ" అన్నాడు భవానీశంకర్. నవ్వాడు సురేష్. ఆనవ్వులో తేలిక భావం " నువ్వెప్పుడూ ఇంతేరా! నన్ను అస్సలు అర్ధం చేసుకోవు" భవానీశంకర్ గొంతులో బాధ. " లేకపోతే ఏంట్రా? ఆపిల్ల ఏంటీ.. ఆ పిల్లకోసం ఇంత బిల్డప్ ఏంటీ?" వెక్కిరింతగా అన్నాడు సురేష్.  భవానీశంకర్ ఇంకేం అనలేదు. సురేష్ ఎప్పుడూ అంతే. అతడి ప్రేమను మాటవరసకు కూడా ఆమోదించడు. అందుకే అతడు సురేష్ తో వీలైనంతవరకు తన ప్రేమగురించి చెప్పుకోడు. ఎప్పుడైనా చెప్పుకున్నా ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది. " ఆ చెప్పరా! వ్యాయామశాల దగ్గర్నుండి ఆ ముసలి అంకుల్ తో ఏమేం బాతాఖానీ కొట్టావు?" తనే అడిగాడు సురేష్. " ఏం లేదురా! హిందూ ముస్లీంల మధ్య సామరస్యం కోసం యువత పాటుపడాలి అని చెప్పాడు" అన్నాడు భవానీశంకర్. ఫకాలున నవ్వాడు సురేష్. " ఎవ్వడి బతుకు వాడే బతకలేక చస్తుంటే, ఆయనగారు నీతిబోధనలు చేస్తున్నాడా? సరేలే... ఆయనగారు చెప్పినట్టే బాగుపడదాం. మరి రేపొద్దున్న మన పెళ్లాం పిల్లల్ని ఎలా పోషించాలో ఒకసారి అడుగు" నవ్వాక అన్నాడు సురేష్. " అంటే స్వంత పనులన్నీ సామరస్యం కోసం వదులుకోవడం కాదు.." అన్నాడు భవానీశంకర్. "పోరా" నిర్లక్ష్యంగా చేయి విదిల్చి ఆ పక్కనే ఉన్న సందు వెంబడి సాగిపోయాడు సురేష్. " నువ్వు సామాన్యుడివి కాదురా!నీలో ఉన్న స్వార్ధం భయంకరమైనదిరా" వెళ్తున్న స్నేహితుడ్నే చూస్తూ మనసులో అనుకున్నాడు భవానీశంకర్. ....... ఇంకా వుంది .........  

" ఏడు రోజులు " పార్ట్ -4

" ఏడు రోజులు " పార్ట్ -4       రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి    * మంగళవారం *      వేకువజామునే లేచి వ్యాయామశాలకు బయలుదేరాడు భవానీ శంకర్.     వాతావరణం ఆహ్లాదంగా వుంది. అతడి మనసు గందరగోళంగా వుంది.  "జన్మ ఒక్కటే... జననం  ఒక్కటే! పిల్చే గాలి  ఒక్కటే... తాగే నీరు  ఒక్కటే! వుండే దేశం  ఒక్కటే ప్రవహించే రక్తంలో రంగు  ఒక్కటే!  కాని మనసులోని  భావాలు మాత్రం  ఒక్కటిగా లేవు. మనుషులుగా క్రూరమృ గాలకంటే హీనంగా ప్రవర్తిస్తుంటారు "  మనసులో అనుకుంటూ నెమ్మదిగా  అడుగులు ముందుకు వేస్తున్నాడు అతడు.   "శంకర్... " కొద్దిదూరం వెళ్ళాక వెనుకనుండి బాలాస్వామి కంఠం వినబడిది.    ఆగుతూ వెనక్కి చూశాడు  భవానీ శంకర్.   "ఆరోగ్యం బాగోలేదా?  బాగోలేకపోతే ఇంట్లోనే పడుకోవచ్చుకదా? " దగ్గరగా వస్తు అడిగాడు బాలాస్వామి.   "అలాంటిది ఏంలేదు" చెప్పాడు భవానీ శంకర్.  "మరి  ఒంట్లో శక్తిలేని వాడిగా నడుస్తూన్నావేం? " దగరగా వచ్చి  భవానీ శంకర్ భుజాల చుట్టురా చేయివేసి ముందుకునడుస్తూ అన్నాడు బాలాస్వామి.   వెంటనే ఏమని సమాధానం చెప్పాలో తోచలేదు  భవానీ శంకర్ కు. అందుకే చిన్నగా నవ్వి వూరుకున్నాడు.   "ఏంట్రా  పిల్లగా! నవ్వుతావు? " భవానీ శంకర్ భుజాన్ని చరిచాడు బాలాస్వామి.  "ఏడవమంటావా? " మనసులో అనుకున్నాడు  భవానీ శంకర్.   ఇద్దరు హనుమాన్ వ్యమాయశాలకు సమీపంగా వెళ్ళారు. అది బాలాస్వామి నడిపిస్తున్నదే! అక్కడ ముస్లిలకు ప్రవేశంలేదు. దానికి ఎదురుగా 'ఇస్మాయిల్ బాడీ లాంగ్వేజ్ ' పేరుతో మరొక వ్యాయామశాలవుంది. సాయిబు ప్రోద్బలంతో ఇస్మాయిల్ అనే యువకుడు నడుపుతున్న వ్యాయామశాల అది.   "ఆ   తుర్కనా కొడుకుల్ని చూశావా? సగం తుర్కపేరు, సగం ఇంగ్లీషు పేరు పెట్టుకున్నారు? " ఇస్మాయిల్ వ్యాయామశాలవైపు చూస్తూ వెక్కిరింతగా అన్నాడు బాలాస్వామి.  "వాళ్ళ ఇష్టంలే అన్నా!  మనకు ఎందుకు? "  ఏదో  ఒకటి  అనాలనుకుని  అన్నాడు  భవానీ శంకర్.  "అదేం  శంకర్?  ఆ  సున్తీనాకొడుకులకి సపోర్టు ఇస్తున్నావు? " వెంటనే అడిగాడు బాలాస్వామి.  "లే  లేదన్నా " గాభరాగా అని బేకార్ నా కొడకా " మనసులో అనుకున్నాడు  భవానీ శంకర్.  "అదీమాట " అన్నాడు బాలాస్వామి.  "అవును  అన్నా...  ఒకమాట " భయపడ్తూనే అన్నాడు  భవానీ శంకర్.  "ఒక్కమాట ఎందుకు? పది మాటలు అడుగు" అన్నాడు బాలాస్వామి.   వెంటనే అడగలేకపోయాడు  భవానీ శంకర్. కాసేపు తడబడి, ఆ తర్వాత  కొద్దిగా ధ్యైర్యాన్ని తెచ్చుకుని, "ఆ... " అంటూ  ఏదో అడగబోయ, అంతలోనే విరమించుకుని, "ఏంలేదు"  అంటూ బాలాస్వామినుండి ముందుకు నడిచి వ్యాయామశాల లోపలికి వెళ్ళాడు భవానీ శంకర్.    వెళ్తున్న భవానీ శంకర్ వైపు చిత్రంగా చూస్తూ "పోరేగాడు " తనలో తను అనుకున్నాడు బాలాస్వామి.    అరగంట తర్వాత వ్యాయామం ముగించుకొని వ్యాయామశాల వెలుపలికి వచ్చాడు భవానీ శంకర్.   అప్పుడు సమయం ఐదు గంటలు. సమీపంగా వున్న మసిడులోంచి "అల్లాహో అక్బర్..." అంటూ  నమాజు ఆరంభం అయ్యింది.   నమాజు అలా మొదలయ్యిందో లేదో వ్యాయామశాల వెలుపలే వ్యాయామం  చేసుకుంటున్న బాలాస్వామి...  చేతిలోని  డంబుల్స్ కిందపడేసి  వడివడిగా అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. అతడు వెళ్లిన కాసేపటి తర్వాత గుడి దగ్గర భక్తి గీతాలు ఆరంభమయ్యాయి.  మైకు లోంచి వినబడుతున్న భక్తిగీతాలు నమాజు స్వరప్రవాహానికి అడ్డుకట్టలా మారాయి. " వీడికి కాలమే బుద్దిచెప్పాలి" బాలస్వామిని ఉద్దేశిస్తూ అన్నాడు ఒక పెద్దమనిషి. అతడు రోజూ వ్యాయామశాలకు వచ్చి యోగా చేస్తుంటాడు. " అంకుల్..." పెద్ద మనిషికి దగ్గరగా వెళ్లాడు భవానీశంకర్ ఏంటన్నట్టుగా చూశాడు పెద్దమనిషి. " మీతో ఒక్కమాట" అన్నాడు భవానీశంకర్. " ఏంటీ?" అన్నాడు పెద్దమనిషి. " హిందువులు, ముస్లీంలు, ఐక్యత లేకుండా ఉండటం మీకు బాధగా ఉన్నట్టుంది" నెమ్మదిగా అన్నాడు భవానీశంకర్. " ఉన్నట్టుంది కాదు బాబూ ఉంది" అన్నాడు పెద్దమనిషి. " మరి మీరు పెద్దవాళ్లు కదా, బాలస్వామితో ఈవిషయం గురించి మాట్లాడండి" నవ్వాడు పెద్దమనిషి "  అభ్యుదయవాదిలా ఉన్నావే? " నవ్వుతూనే అన్నాడు. ఆ మాటకు ఇబ్బందిగా కదిలాడు భవానీశంకర్. " నీలాంటి కుర్రవాళ్లు ఈ సమాజానికి అవసరం. ఇలాగని ఆవేశం పనికిరాదు" అని కాసేపాగి " ఆ.. బాబూ! నీ పేరు శేఖర్ కదూ? "అడిగాడు పెద్దమనిషి. " శంకర్. భవానీశంకర్" చెప్పాడు భవానీశంకర్. " ఏం చదువుతున్నావు?" అడుగుతూ అక్కడ్నుంచి ముందుకు కదిలాడు అతడు. " ఇంటర్ చదువుతున్నావు?" అడుగుతూ అక్కడ్నుంచి ముందుకు కదిలాడు అతడు. " ఇంటర్ చదువుతున్నాను" వెంటే నడుస్తూ అసలు సంగతి చెప్పుకోలేకపోయాడు భవానీశంకర్. " చదువుతున్నావు కాబట్టే నీకు ఇంగిత జ్ఞానం ఉంది. కానీ ఇటు బాలస్వామి, అటు సాయిబు, ఇద్దరూ చదువుకోలేదు. కాబట్టే అజ్ఞానులుగా వ్యవహరిస్తున్నారు. చదువుకున్నవాళ్లలో కూడా ఇలాంటి అజ్ఞానులు ఉన్నారు. కాని ప్రస్తుతం ఇక్కడ చదువుకోనివాళ్లే అజ్ఞానులు. వీళ్లను ఎవ్వరూ మార్చలేరు " అంటూ సిగరెట్టు వెలిగించుకున్నాడు అతడు. వింటూ వెంటే నడుస్తున్నాడు భవానీశంకర్. " నాది స్వతహాగా కర్నూలు బాబూ! మాది రాయలసీమ అయినా మా బంధువులు విజయవాడలోనూ, మహబూబ్ నగర్ లోనూ ఎక్కువగా ఉండేవాళ్లు. ఆ జిల్లాల్లో నాకు స్నేహితులు కూడా ఎక్కువే! నా స్నేహితుల్లో ముస్లీంలు కూడా ఉన్నారు. వాళ్లు ఎంత చక్కగా తెలుగు మాట్లాడతారూ అనేది విశేషం కాదు. తెలుగు సాహిత్యాన్ని సైతం ఎంతగా అభిమానిస్తారు అనేదే ముఖ్యం. ఇప్పటికీ నాలో గానీ, వాళ్లలోగాని, హిందూ ముస్లీం తేడాల్లేవు. మా బంధువులు కూడా తమ చుట్టు పక్కల ముస్లీంలతో ఎంతో సఖ్యతగా మెలుగుతుంటారు.." చెప్పుకుపోయాడు అతడు. " అట్లాంటి సఖ్యత ఇక్కడ ఉంటే ఎంత బావుండేదికదూ అంకుల్? " అన్నాడు భవానీశంకర్. " ఇక్కడ కూడా ఉంది. కాని మన వీధికి సంబంధించిలేదు. అందుకే నాకు ఇక్కడ ఉండాలి అన్పించదు. కాని స్వంత ఇల్లు కట్టుకున్నాను. కాబట్టి తప్పడం లేదు.. " నేను పుట్టింది బ్రాహ్మణుల ఇంట్లో! మా కులంవాళ్లుకు చాదస్తం కొద్దిగా ఎక్కువే! ఈ చాదస్తం మా ఇంట్లో కూడా ఉండేది. అయితే నేను మాత్రం అందుకు పూర్తిగా విరోధిని. నాకు కులం, మతం తేడాల్లేవు. అందరూ ఒక్కటే అనుకుంటాను. అనుకోవడం ఒక్కటే కాదు, నా భావాల్ని పదిమందితో పంచుకోవాలి అనుకున్నాను, అనుకుంటున్నాను. కాబట్టే ఇప్పుడు నీతో నా భావాల్ని చెప్పుకుంటున్నాను. మరి అంకుల్ నాతో సుత్తికొడుతున్నాడు అనుకోవుకదా?" భవానీశంకర్ వైపు చూశాడు అతడు. " అట్లా ఏమీ అనుకోను అంకుల్! మీ భావాలు నాకు బాగా నచ్చాయి" అన్నాడు భవానీశంకర్. అతడు ముందుకు చూస్తూ తన భావాల్ని గుండెలోతుల్లోంచి మాట్లాడుతూపోయాడు. " నేను సాహిత్యాభిమానిని కూడా!" అప్పట్లో పత్రికలకు నా రచనలు పంపేవాడ్ని. నారచనలు అన్నీ సామాజిక మానవ సంబంధాల చుట్టూ తిరిగేవి" అని కాసేపాగి. " ఇప్పుడు ఈ సాహిత్యం గురించి ఎందుకుగానీ, నీది చాలా చిన్నవయసు. నీ వయసులో ఉన్న పిల్లలు తమాషా మనస్తత్వాన్ని కలిగిఉంటారు. కానీ నువ్వు అలా ఉండకూడదు. నీ దృష్టి కేవలం చదువుపైనే ఉండాలి. తాత్కాలిక ఆనందాన్ని అందించే విషయాల మీదకు దృష్టిని అస్సలు పోనీవద్దు. ప్రేమ, దోమా అంటూ నీ అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోవద్దు. నీకు బంగారు భవిష్యత్ ఉంది. ఆ భవిష్యత్ ను పాడుచేసుకోవడం, తీర్చిదిద్దుకోవడం.. రెండూ నీ చేతుల్లోనే ఉన్నాయి " అతడి మాటలు భవానీశంకర్ గుండెల్లోకి సూటిగా గుచ్చుకున్నాయి. అందుకే ఇబ్బందిగా చేతులు నలపసాగాడు. " బాబూ నీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. మనం ఉంటున్నది మత విధ్వంసాల గుప్పిట్లో. ఏరోజు ఏం జరుగుతుందో తెలీకుండా రోజులు గడుపుతున్నాం. ఇల్లాంటి రోజులు రాక పూర్వం రాన్రానూ ఇక కులమతాలు సమసిపోతాయి అనుకున్నారు. కానీ అవి సమసిపోవడంలేదు రోజురోజుకీ పేట్రేగిపోతున్నాయి" "...." " కనీసం మీరయినా మున్ముందు ఇక్కడ సఖ్యతను నెలకొల్పాలి? మేం వచ్చిన మొదట్లో ఇక్కడ సఖ్యత ఉండేది. హిందూ ముస్లింలు ఒక కుటుంబంలా మెలిగేవారు. అయితే ఒక ముస్లిం అమ్మాయిని, ఒక హిందూ అబ్బాయి టీజ్ చేసిన విషయమై ఇక్కడ క్రమంగా గొడవలు మొదలయ్యాయి. ఇరవై ఐదేళ్ల క్రితం మొదలైన ఆ గొడవలకు కారకులు ఈ సాయిబు, బాలస్వాములే!

" ఏడు రోజులు " పార్ట్ -3

  " ఏడు రోజులు " పార్ట్ -3       రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి "వేలెడు లేదు కుర్రకుంక వీడికి సమాజం సంస్కరణ కావల్సోచ్చింది" వెళ్తున్న కొడుకును చూస్తూ భార్యతో అన్నాడు గోపాలయ్య.  బయటికి వచ్చేశాడు భావానీశంకర్. అతడి మనసులో ఇప్పుడు మునుపటికంటే రెండింతలు ఎక్కువ భయపడుతున్నాడు.  "డబ్బు తీసుకుని తను ఇంట్లోచి వెళ్ళిపోవడంవల్ల తన పప్పాకి ఇబ్బందులు ఎదురౌతాయని మాత్రమే ఇదివరకు బాధపడ్డాడు ఎందుకంటే తను గౌసియాతో కలిసి వెళ్ళిపోయినట్లు ఇంట్లో తెలియకుండా, కేవలం డబ్బు తీసుకుని ఎటో పారిపోయినట్లు మాత్రమే తెలియాలనుకున్నాడు. అలాంటిది ఇప్పుడు అనవసరంగా గౌసియా గురించి ఇంట్లోమాట్లాడాడు. రేపు ఇంట్లోంచి వెళ్ళి పోతే విషయం ఇంట్లోవాళ్ళకి కచ్చితంగా తెల్సుకాబట్టి, నిజం ఎలాగైనా బయటికి పొక్కి హిందూముస్లిం గొడవలు జరుగుతాయేమో?  తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఇంట్లోంచి వెళ్ళిపోతే ఎలాంటి సమస్యలు వుండవనీ, గౌసియా గురించి ఇంట్లో చెప్పగలిగాడు. మరి, తను తెలిసీ తెలియక చేసిన ఈ పొరపాటు నిజంగానే తలలు తెగేవరకు దారి తీస్తుందేమో"  నిలువెల్లా వణికిపోతున్నాడు భవానీశంకర్.   అప్పటికి చీకటిపడింది సమీపంగా వున్న హనుమాన్ మందిరం దగ్గర భజన కార్యక్రమం ఆనవాయితీగా మొదల మొదలయ్యి౦ది.  "అమ్మ నేను భజనకు వెళ్తున్నాను" బయటనుండేచెప్పి మందిరంవైపు నడిచాడు భవానీశంకరం.  "రామా మేలుకోనరా... శ్రీరామ మమ్మేలుకోనరా"  మైకు ముందు కూర్చుని భజనకీర్తన పడుతున్నాడు బలస్యామి.  అతడు కొంత పాడగానే మిగతావాళ్ళు ఆ రాగాన్ని అందుకుంటున్నారు.  వెళ్ళి అందరి మధ్యనా కూర్చున్నాడు భవానీశంకర్.  కొంచం దూరంగా కనిపిస్తున్న మసీదుతాలుకు ప్రహరిగోడ పక్కన  చాయ్  బండి అమ్ముతూ కనిపిస్తున్నాడు సాయిబు. అతడి బండిచుట్టూ గిరకీజనాలు నిండుగా వున్నారు.  తానే చాయ్ కాయడం, తానే గ్లాస్ కడుక్కోవడం వంటి అన్నిపనుల్ని తానే చూసుకుంటూ ఇప్పుడు తీరికలేకుండా కనిపించే సాయిబు...  ఆ  సమయంలో చాయ్ మాత్రమే అమ్ముతూ కనిపిస్తున్నాడు. ఎవరో దాదాపు పది సంవత్సరాల పిల్లవాడు పక్కనే ఎంగిలి గ్లాసులు కడుగుతున్నాడు. భజనమధ్యలో లేచి సాయిబువైపు నడిచాడు భవానీశంకర్. అతడు చాయ్ బండికి సమీపంగా వెళ్ళగానే, "చాయ్ హోనా" అడిగాడు సాయిబు.  "వద్దు...  వక్కపొడి పాకెట్టు ఇవ్వు" అంటూ చొక్కాజేబులోంచి రూపాయిబిళ్ళ తిసి డబుల్ రొట్టెల డబ్బామీద వుంచాడు భవానీశంకర్.    బండిలో ఒకపక్కగా వేలాడదీసిన వక్కపొడి పకేట్లలో ఒక పకేట్టును చింపి భవానీశంకర్ కి  అందించి, రూపాయిబిళ్ళ తీసుకుని గళ్ళలో వేసుకున్నాడు సాయిబు  "ఈ అబ్బాయి ఎవరు సాయిబు? "పాకెట్టును చింపి వక్కపొడి నోట్లో పోసుకుని నములుతూ అడిగాడు భవానీశంకర్.  "పురా గరీబు బచ్చా! సహాయంచేద్దామని పనిలో పెట్టుకుమ్నాడు" చెప్పి, "అరే పాషా! జెల్దీ కమ్ కరో'' గ్లాసులు కడుగుతున్న కుర్రాడిని ఆదేశించాడు సాయిబు.  అంతలోనే  ఓ ఇద్దరు గిరాకీలు వచ్చారు.  వస్తూనే "సాయిబు వన్ బైటు చాయ్ చెప్పాడు ఒక వ్యక్తి.  "టికే, టీకే అంటూ చిన్నగా వెలుగుతున్న బర్నాల్ స్టౌ మీద వున్న చాయ్ గిన్నెలో మరికొంచం  టీ పొడి, పంచదార, పాలు కలిపాడు సాయిబు. ఆ  తర్వాత మంటను పెద్దది చేసే ప్రయత్నంగా గాలికోట్టడం ఆరంభించాడు.  భవానీశంకర్ కొన్నిక్షణాలు సాయిబు వైపు అశ్యర్యంగా చూసి, తర్వాత హనుమాన్ మదిరంవైపు నెమ్మదిగా నడిచాడు.  రోజూ రెండుకిలోల బియ్యం కొనుక్కొని అతిభారంగా జీవితాన్ని నడిపే  సాయిబు లో ఇప్పుడు కొత్త ఉత్సాహం. ఇన్నిరోజుల వరకు 'పనిపిల్లడు ఎందుకు? పైసలు దండుగ' అనుకున్నవడల్లా, ఇప్పుడు పనిపిల్లడ్ని పెట్టుకోవడం... తోడుగా 'గరీబుబచ్చా' అని జాలిచూపడం చేస్తున్నాడు సాయిబులో అంతమార్పు ఎందుకు వచ్చిందోవ భవానీశంకర్ గ్రహించగలిగాడు. అందుకే అతనిపై కోపం వచింది.  "కన్నకుతుర్ని అంగడి సరుకు చేయాలనుకుంటున్న పాపిష్టి వెధ"  తనకి మాత్రమే వినిపించేలా తిట్టుకుంటూ మందిరం దగ్గరకి వెళ్ళి ఎప్పట్లా అందరిమధ్యనా కుర్చుంన్నాడు .   బాలాస్వామి పాడుతున్న కీర్తన పూర్తయ్యింది. మరోపాట అందుకుంటాడని అనుకుంన్నాడు  భవానీశంకర్. కానీ అతడు తనని దోషిలా చూడ్డంతో కలవరపడ్డాడు అతడు ఎందుకు అలా చుస్తుంన్నాడో కూడా భవానీశంకర్ కు తెలుసు.   "ఆ  తుర్కోడు బండిదగ్గరకు ఎందుకు వెళ్ళవు? " నిలదీసిన్నట్టుగా అడిగాడు బాలాస్వామి.   "వక్కపొడికోసం " చెప్పాడు భవానీశంకర్.  "ఇకనుండి  ఆ  సుబ్బిశెట్టి దుకాణంలో కనుక్కో " చెప్పి "రామా  శ్రీ రామా జయ రామా...  మాకు మతంలేదు... కులంలేదు... వున్నది  నువ్వొక్కడివే" అంటూ మరో కీర్తన అందుకున్నాడు బాలాస్వామి భకిపారవశ్యంతో కీర్తన పాడుతూనే తనపై ఆగ్రహించిన బాలాస్వామి తీరు భవానీశంకర్ కి  విస్మయాన్ని కలిగించింది. తోడుగా ప్రస్తుతం అతడు పాడుతున్న కీర్తన నవ్వును తెప్పించింది. అయినా మౌనంగా కూర్చుండిపోయాడు.   హిందూముస్లిం  తేడాలు బాలాస్వామి, సాయిబుల కారణంగా  ఆ  ప్రాంతములో బలంగా వున్నాయి. అలాగని శతృవుల్లా ఎవ్వరూ మెలగారు. ఎవరికివారే అన్నట్టుగా వుంటూనే,. అవసరం అయితే ఆడపాదడపా కొందరు మాట్లాడుకుంటారు.   అయితే  ఆ  'ఇద్దరు' లో సాయిబు మాత్రం వ్యాపారరీత్య తరచు అందరితో మాట్లాడుతుంటాడు. కానీ  లోలోపల మనసు చంపుకుంటాడు.     నిజానికి  ఆ  ప్రాంతానికి చెందినవాళ్ళు సాయిబు దగ్గరికి వెళ్ళడం బహు అరుదు మసీదులో తాయెత్తులు కట్టే మిన్సిపు ఒకాయన  వున్నాడు.  ఆయన దగ్గరికి వేరే ప్రాంతానికి చెందిన జనాలు మతప్రమేయం లేకుండా వస్తుంటారు. అలాంటివాళ్ళ గిరాకీ సాయిబుకి ఎక్కువ.   అదేపనిగా వస్తుండే  ఆ  జనాలు కోసమే తన దగ్గర నిమ్మకాయల్ని, అగర్ బత్తీలని, ఊదును ఉంచుకుని బయటికంటే ఎక్కువ అమ్ముతుంటాడు.   బాలాస్వామి మాత్రం ముస్లింలతో అస్సలు మాట్లాడడు.  మాట్లాడిన భవానీ శంకర్  లాంటి వాళ్లను అధికారికంగా నిలదీస్తుంటాడు. ఇంకా చెప్పాలంటే ముస్లీం పండుగల సమయాల్లో ప్రత్యేకంగా భజనసమయాన్ని పెంచుతుంటాడు. అవసరమైతే ఆ సమయాల్లో రేయింబవాళ్ళు భక్తి గీతాలతో గుడితాలూకు  మైకును ఆదరగొడుతుంటారు.     అందుకే  బాలాస్వామి చూస్తున్న భవానీశంకర్ కి  కోపం వచ్చింది. 'మంచి మనసు' ఉండాలేగాని, ఏ మతమైతే ఏముంది? ' మనసులోనే అనుకున్నాడు.   అతడి మనసును హర్షిస్తున్నట్లుగా అప్పుడే గుడిగంటలు మోగాయి. ఎవరన్నట్లుగా చూశాడు భవానీ శంకర్.   తన పప్పా! అప్పుడే మందిరంలోకి వచ్చి భజనకు కూర్చోబోతూ హనుమంతుడికి దణ్ణం పెట్టుకున్నాడు. ------ ఇంకా వుంది ------

" ఏడు రోజులు " పార్ట్ -2

" ఏడు రోజులు " పార్ట్ -2       రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి భవానిశంకర్ కి నవ్వొచ్చింది చిన్నగా నవ్వుతూ తల్లి ముందుకు వెళ్ళి మునివేళ్ళపై కూర్చుని, "అవునమ్మా!  ఒక్క కొడుకుని సాకడానికే నువ్వుఇంత కష్టంగా మాట్లాడితే, ఆ ఇదురింటి సాయిబుకి ఏడుమంది ఆడపిల్లలు, మరా పిల్లల్ని, అయన ఎలా పోషిస్తున్నాడు?  పైగా ఆయన జీవనాధారం చాయ్ బండిమాత్రమే" అన్నాడు.   "నోర్ముయ్యరా! ఆ తల్లి పిల్లలు నీలా తిని తిరుగుతున్నారా? రోజూ మల్లెపూలు దండలు అల్లి డబ్బు సంపాయిస్తున్నారు. తెలుసా? "ఎత్తిపోడిచింది లక్ష్మిదేవమ్మ.   "ఆ...  దండలు అల్లుకుని ఎంత సంపాయిస్తారు గనుక? ఒక్క కిలోకి మూడురూపాయలు. మహా అంటే రోజుకి ఆరుకిలోల పుప్వులు కడతారు అంతేకదా"  "కష్టపడి సంపాయించేది రెండు రూపాయలైన చాలు "        "అయితే కొన్నిరోజులు ఆగు! నేనూ రోజుకు యభైరుపాయలు సంపాయింస్తాను"  "నా కొడుకు యోగ్యుడైతే నాకు అంతకన్నా సంతోషమా? " అంటూ విసురుతున్న తల్లిచేయి పట్టుకుని ఆపి, ఆమెకు మరింతచేరువగా జరిగి కూర్చుని, "ఒకమాట, నువ్వేమీ అనవుకదా? " లోలోపల భయపడ్తూనే అన్నాడు.  "ఏం  మాట? "కొడుకువైపు సూటిగా చూసింది.  "మొన్నరాత్రి సాయిబు ఇంటికి కారులో ఒక  పెద్దమనిషిలాంటి వ్యక్తి వచ్చాడే ఆయన నిజంగా పెద్దమనిషి కాదు. అరబ్బుషేకు. వాడికి సాయిబు తన పెద్దకుతుర్ని మూడు లక్షల రూపాయలకు అమ్మినేస్తున్నడంట, పాపం" గొంతు తగ్గించి రహస్యంగా చెప్పాడు భావానీశంకర్.  "హా!  నీకు ఎవరు చెప్పార్రా  ఈ విషయం? "గుండెల పై చేయి వేసుకుంటూ కళ్ళింత చేసింది లక్ష్మిదేవమ్మ.  "ఎలాగో తెల్సిందిలే కానీ, ఎట్లాగయినా చేసి ఆ పిల్లను మనం రక్షిద్దాం" అని ఆశగా తల్లివైపు చూశాడు భావానీశంకర్.  "మనకెందుకొచ్చిన గొడవరా? నోర్ముసుకో" గదమాయించింది లక్ష్మిదేవమ్మ.  "మానవత్వం  లేకుండా అలా మాట్లాడ్తావేం? "  "ఇది వూరుకాదు, హైద్రాబాద్ ఊర్లలో అయితే హిందూ ముస్లింలు స్నేహంగామెలుడుతారు ఇక్కడ అట్లాకాదు గదా! తెలిసింది కూడా వాళ్ళతో కల్పించుకుంటానంటావేం వూర్లల్లోనే కాదు, ఇక్కడ కూడా చాలా మంది హిందూముస్లింలు స్నేహితులుగా మెలుగుతున్నారుగా"  "కావొచ్చు కానీ  ఆ సాయిబు ఎలాంటి వాడో నీకుతెలీదా? మూత్రం పోసేటప్పుడు ఇటుకముక్క పట్టుకోవడమేకాదు, హిందువులతో మాట్లాడేటప్పుడు కూడా ఇటుకముక్క పట్టుకొని దోషం లేదనుకుంటాడు. అలాంటి వాడితో కల్పించుకుంటే ఇంకేమైనా ఉందా? లేనిపోని మాటలు చెప్పి హిందూముస్లింలకి గొడవలు పెడ్తాడు. అప్పుడు నగరం రక్తంతో తాడిసిపోతుంది"  "నిజమే! కానీ  ఆ పిల్లలు చాలామంచి వాళ్ళు. వాళ్ళకి అలాంటి తేడాలులేవు. మంచితనమే  మతం అనుకుంటారు... " "ఆ  సాయిబు వాళ్ళతో మాట్లాడ్డానికి వాళ్ళ మతస్థులే భయపడ్తారు. మరి, ఆ పిల్లలు మంచివాళ్ళని నీకెలా తెలుసు? "  "ఎలా అంటే... తెల్సింది అంతే"  "గొప్పనిజం తెల్సుకున్నావు గానీ, నోర్మూసుకుని ఇంట్లో పడివుండు" అని చెప్పి, తిరగాలి విసురుకుంటూ "దమ్మిడి సంపాదనలేదు గానీ, దానధర్మలకి తానే మహారాజు అన్నాడంట... వెనకటికి ఎవడో" తనలోతనే గొణుక్కుంది లక్ష్మిదేవమ్మ.  "ప్చ్! నేను వాళ్ళకి ఏదో ధర్మం చేస్తానని అనడంలేదు" తల్లి గొణుగుడు విని అన్నాడు భావానీశంకర్.  "సర్లేగానీ, ముందు సాలీడుగూళ్ళు దులిపి నడుం నొప్పుల్నుండి నన్ను కాపాడు" అంది లక్ష్మిదేవమ్మ.  "నువ్వు ఒప్పుకుని వుంటే నీ అనుమతితో గౌసియాను తీసుకుని వెళ్ళిపోయేవాణ్ణి. ఇందువల్ల మీరు బాధపదకపోయేవాళ్ళు. మిమ్మల్ని బాధపెట్టి వెళ్ళాలంటేనేమో నా మనసు ఒప్పుకోవడంలేదు ఇప్పుడేం చేయాలి? " తల్లినే చూస్తూ మనసులో అనుకుని,  "అమ్మా! పిలిచాడు భవానీశంకర్ .  "ఏంట్రా? ఇంతకీ ఈరోజు నన్ను పని చేసుకోనిస్తావా? చేసుకోనివ్వవా? విసుగ్గా తిరగలి విసరడం ఆపిందమె.  "నాకు ఆ అమ్మాయి చూస్తుంటే ఏడుపొస్తోంది. అందుకే ఆ అమ్మాయిని తీసుకుని ఎటైనా వెళ్ళిపోతాను. నాకు ఓ నలుగు వందలు ఇవ్వు" కూర్చునే తలవంచుకుని భయంతో తడబడుతూ అడిగాడు.  లక్ష్మిదేవమ్మ కొడుకువైపు ఓ ముడుక్షణలు నివ్వెరపోయిం చూసింది.ఆ తర్వాత కొడుకు చెంపపై బలంగా కొట్టింది.  ఆ దెబ్బకి అతడు అల్లంతదూరం తుళ్ళిపడ్డాడు.  "నీ బతుకు నువ్వే బతకలేవు. పైగా వాళ్ళను ఉద్ధరిస్తానంటావా? ఇంకొక్కసారివాళ్ళ గురించిన మాట నీ నోటినుండి వచ్చిందా ఇక నీకు ఈ ఇంట్లో అన్నంమెతుకులు వుండవు. పస్తులుండి చావాలి. వెధవ సన్యాసి" కోపంగా అంది లక్స్మిదేవమ్మ.  భవానీశంకర్ కిమ్మనలేదు. తల్లివైపు రోషంగా చూస్తూ, లేచి బయటికి వెళ్ళి ఎప్పట్లా అరుగుమీద కూర్చుని గౌసియా కోసం చూడసాగాడు.   అప్పుడు సమయం సాయంకాలం ఆరు గంటలు కావస్తోంది. ఆ సమయంలో బతులకోసం బయటికి వస్తుంది గౌసియ. అందుకే ఇంట్లో తల్లి తనమీద ఇంకా గోనుగుతూనే వున్నా పట్టించుకోకుండా, ఆమె ఎప్పుడెప్పుడు బయటికివస్తుందా అని ఆత్రంగా ఎదురుచూడసాగాడు భావానీశంకర్.   కాసేపటికి మేతకోసంబయటికి వెళ్ళిన బాతులు బకబక అరుస్తూ తమ ఇంటిముందుకువచ్చాయి. వాటి రాకకోసమే తను ఇంతసేపు ఇదురుచుస్తున్నట్లుగా ఆ వెంటనే ఇంట్లోంచి వెలుపలికి వచ్చింది గౌసియ.  రాగానే అలవాటుగా భావానీశంకర్ కోసం చూసింది. అతడు కూడా ఆమెనే చూస్తూన్నాడు. ఇరువురి చూపులు పలకరించుకున్నాయి. పైకిమాత్రం పరిచయంలేని వాళ్ళలా కన్పిస్తున్నారు.  "బ్బ ... బ్బ ...బ్బ ... " బాతుల్ని ఇంటిముందు కట్టిన ఒక చిన్న గుడులోకి తోలుతోంది గౌసియా.   ఆమెనే చూస్తూ తల్లికొట్టిన దెబ్బను గురించి పూర్తిగా మర్చిపోయాడు భావానీశంకర్.  "ఏంట్రా...  ఎవ్వరితోనైన దెబ్బలాడావా? చెంప కందిపోయి  వుంది" అంటున్న తండ్రి మాటలకు ఇహలోకంలోకి వచ్చాడు భావానీశంకర్.  తండ్రి గోపాలయ్య అప్పుడే వచ్చినట్టున్నాడు.  ఇంకా  సైకిల్  కూడా  దిగకుండానే  కొడుకుని  గాభరాగా చూస్తున్నాడు.    "నేను దెబ్బలాడలేదు" పౌరుషంగా అన్నాడు భావానీశంకర్. "వాడి నిర్వాకం గురించి నేను చెప్తాను గానీ, మీరు ఇంట్లోకిరండి" ఆ వెంటనే ఇంట్లోంచి లక్ష్మిదేవమ్మ గొంతు వినడింది.  "ఏం చేశావురా? "అంటూనే సైకిల్ దిగి, ఒకపక్కగా ఆపి ఇంట్లోకి నడిచాడు గోపాలయ్య  భావానీశంకర్ అక్కడే కూర్చుండిపోయాడు. అప్పటికి గౌసియ లోపటికి వెళ్ళి పోయింది. ఆమె చిన్నచేల్లెళ్ళు ఇద్దరు మాత్రం ఇంటిముందుకి వచ్చి తువ్వళ్ళని చీరలుగా కట్టుకుని టిచర్లగా ఆటాడుకుంటున్నారు.   ఆ ఇంటికి రెండిళ్ళ అవతలవున్న మరో పెంకుటింట్లోంచి తబలా వాయిస్తు ఖవాళి పాడుతున్న గొంతులు స్పష్టంగా వినబడుతున్నాయి అది కూడా ముస్లింల ఇల్లే. వాళ్ళ అబ్బాయికి ఇంకో వారంరోజుల్లో పెళ్లి. ఆ సంతోషాన్ని ఆరోజునుండే అనుభవిస్తూన్నారు వాళ్ళు ఆ ఇంటితర్వత అన్నీ హిందువుల ఇళ్ళు వున్నాయి.  ఆ ప్రాంతం మొత్తానికి సుమారుగా పది వరకు ముస్లిం కుటుంబాలు వున్నాయి. అది పూర్తిగా దిగువస్థాయి ప్రాతం.అంతా పల్లెటూరి వాతావరణం గోచరిస్తుంది. అయినప్పటికీ అక్కడ హిందూ, ముస్లిం తేడాలు వున్నాయి.  మొదట్లో హిందూముస్లింలు చాలా స్తబ్దతగా కలిసిమెలిసి వుండేవారు అక్కడ. ఎక్కడ మతసంబంధ గొడవలు జరిగినప్పటికీ ఆ ప్రాంతములో మాత్రం శాంతిభద్రతలకి భంగం కలగకపోయేది. అయితే రామ జన్మభుమి గొడవలు లేవనెత్తారు. అది మొదలు ఆ  ప్రాంతంలో హిందూముస్లింల మధ్య స్నేహభావం చెడిపోయింది.  "శంకర్... " ఇంట్లోంచి తండ్రి పిలుపు.  "మళ్ళి చివాట్లు తప్పవు" అనుకుంటూలేచి లోపలికి నడిచాడు భావానీశంకర్.  "నువ్వు గొప్ప సంఘసంస్కర్తగా మారాలనుకుంటున్నావా? "వెళ్ళగానే అడిగాడు తండ్రి గోపాలయ్య.  సమాధానం చెప్పలేదు భావానీశంకర్. తల వంచుకుని నిలబడిపోయాడు.  "అసలే ఇక్కడ పరిస్థితి బాగోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు రాజారామ్మోహనరాయ్ వో, కందుకూరి వీరేశలింగానివో కానవసరంలేదు. నాకొడుకు భావానీశంకర్ గా బతుకుచాలు" అన్నాడు గోపాలయ్య అప్పటికీ పెదవి విప్పలేదు భావానీశంకర్.  "సాయిబు ఎంత దుర్మార్గుడో, మన పక్కింటి బాలస్వామి అంతకన్నా పదిరెట్లు దుర్మార్గుడు. వాడికి ముస్లిం పిచ్చి వీడికి హిందూ పిచ్చి ఇలాంటి మనుషులమధ్య నువ్వు ఆ పిల్లను రక్షించాలని వెళ్తే తలలు తెగడం ఖాయం అయినా కాపాడుతానని నీవు అడుగు ముందుకు వేసినంత మాత్రాన ఆ పిల్ల నీ వెంట వస్తుందనుకుంటుంన్నావా?  పిచ్చివాడా? వాళ్ళ పిల్లలు ప్రాణంపోతున్నా సరే గోష దాటి బయటికి రాలేదు. అయినా ఆ పిల్లను కాపాడ్డానికి  నీకేం హక్కుగానీ, సంబంధంగానీ వుందిరా? "కచ్చితంగా అడిగాడు గోపాలయ్య.  "ఎదుటివాళ్ళని కాపాడ్డానికి హక్కులతో సంబధాలతో పనిలేదు పప్పా" మనసులోనే అనుకున్నాడు భావానీశంకర్.  "ఇంక వెళ్ళరా. నాముందు నిల్చోవద్దు" అన్నాడు గోపాలయ్య.  వెనుతిరిగి మోనంగా బయటికి నడిచాడు భవానిశంకర్.   ....... వచ్చే బుధవారం పార్ట్ 3......

" ఏడు రోజులు " పార్ట్ -1

" ఏడు రోజులు " పార్ట్ -1       రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి       *ఆదివారం  భాగ్యనగర శివారులో వున్న మైసమ్మ గుడిదగ్గర కుర్చుని వున్నారా ఇద్దరు యువతీయువకులూ .   ఆమె పేరు గౌసియా బేగం .పద్దెనిమిదేళ్ళ వయసులో ఉంది .   అతని పేరు భవాని శంకర్ . ఇరవై ఏళ్ళ వయసులో వున్నాడు . ఇద్దరి వాదనల్లోను ఆందోళన స్పష్టంగా కనబడుతోంది. "శంకర్ ! ఇప్పుడేం చేద్దాం?" అడిగిందామె. "ఎక్కడికైనా వెళ్ళిపోదాం " చెప్పాడు అతను. "వెళ్ళి ఎలా బతకగలం?" "కూలిపని చేసుకుందాం " "అల్లా!"నొచ్చుకుందామె. "అంతకంటే మార్గంలేదు " "మరి ఎప్పుడు వెళ్ళిపోదాం? "   "వచ్చే శుక్రవారం" "వద్దు... రేపే వెళ్ళిపోదాం " "అంత త్వరగా ఎలా వేళ్ళిపోగలం?వెళ్ళాలంటే చేతిలో కొద్దోగొప్పో డబ్బు వుండాలి. ఈ శుక్రవారం నాటికి మా పప్పాకి జీతం వస్తుంది. నేను సగం డబ్బు ఎత్తుకుని వచ్చేస్తాను"  "ప్చ్" బాధగా నిట్టూర్చింది గౌసియ .  ఆమె బాధ అతడికి తెలుసు. అందుకే ప్రేమగా ఆమె తల నిమురుతూ అన్నాడు, "నేను డబ్బు కాజేస్తే మా ఇంట్లో కష్టాలు ఎదురౌతాయని నాకు తెలుసు. పప్పా కష్టపడడం నాకు ఇష్టంలేదు. అలాగని వూరుకుంటే మనం వెళ్ళలేం. అప్పుడు నీ పరిస్థితి మరీ దారుణంగా వుంటుంది. అందుకే అన్నివిధాలుగా గుండె దిటవు చేసుకుందాం " "సరేకానీ ఒక విషయంలో మనం జాగ్రత్త వహించాలి"అందామె.  "ఇల్లు వదిలిన తర్వాత మనం ఈ హైద్రాబాద్ లో వుండోద్దు.అస్సలు ఈ రాష్టంలోనే వుండోద్దు ఎందుకైనా మంచిది వేరే రాష్టానికి వెళ్ళిపోదాం. అక్కడైతే మన ఆచూకీ ఎవరికీ తెలీదు" "మంచి ఆలోచనే! కానీ మనం అలా వెళ్ళాలి అంటే నేను తీసుకువచ్చే డబ్బు ఎందుకూ సరిపోదు"  "ఎలా గోలా వెళ్దాం" "ఎలా వెళ్ళగలం? "  ఆమె ఆలోచనగా వుండిపోయింది. అతడు కూడా ఆలోచించసాగాడు. కాసేపటి తర్వాత ఆమె అంది. "శంకర్! ఒక మంచి అలోచన" "ఏంమిటి? " అన్నట్టుగా చూశాడు అతడు. "రైలు ఎక్కి ఎక్కడికో అక్కడికి వెళ్ళిపోదాం " "మద్యలో టిక్కెట్కలెక్టర్ వస్తే, మన దగ్గరున్న డబ్బుని మొంత్తం జరిమానా కిందికిలగేసుకుంటాడు. అప్పుడు మన పరిస్థితి ఏమిటి? " "అది నిజమే..." "అందుకే మొదట మనం ఏ మరుమూలకో వెళ్ళిపోదాం "  "సరే"  తర్వాత అతడేం మాట్లాడలేదు. ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకొని ఆమె నుదుటిపై మృదువుగా చుంబించాడు. ఆమె పరవశంగా కళ్ళు మూసుకుంది.  "ఇక వెళ్ళిపోదామా? " అతడు ముద్దు పెట్టుకున్న తర్వాత అడిగింది.  "కాసేపు వుందాం "చెప్పాడు.   నేను వెళ్లే సమయం అయింది. ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం" భయంగా అంది.  ఆమెను అతడు అర్ధంచేసుకుని ఆమె చేయి పట్టుకొని ఆమెతో పాటుగా లేచి నిలబడ్డాడు. ఇద్దరూ మైసమ్మ దేవతకి దణ్ణం పెట్టుకున్నారు.  "దేవత మనల్ని తప్పకుండా కరుణిస్తుంది"వెళ్ళబోతూ చెప్పాడు అతడు.  "అ నమ్మకం నాక్కూడా వుంది" అంటూ తలమీది బురఖాను సరి చేసుకుంది గౌసియా.  తర్వాత ఇద్దరూ కలిసి కొద్దిదూరం ముందుకు నడిచారు. అరకొర ఇళ్ళతో నగరం ఆరంభమయింది. అక్కడ ఇద్దరూ విడిపోయారు. ఆమె ఎడమవైపుగా వున్న దారివెంబడి నడిచి వెళ్ళింది. అతడు కుదిపక్కగావున్న దారివెంబడి వెళ్ళిపోయాడు.   *సోమవారం*   రెండు చిన్నగదులు పెంకుటిల్లు ఇంట్లోవున్న గుమ్మలకి, కిటికీలకి, అల్మరాలకి, పాత చీరలతో కుట్టిన పరదాలు వేలాడదదీసి వున్నాయి. వంటింట్లో పింగాణి వస్తువులు ఎక్కువగా వున్నాయి. ఒక పద్ధతి ప్రకారంకాకుండాచిందరవందరగా అమర్చిన సామాను ఇంటిని మరీ ఇరుకుగా చుపెడుతోంది. గోడలకి నిండుగా వేలడదదీసిన 'అల్లా'ని సూచించే కేలండర్ లు కొన్ని పాతబడి వున్నాయి. తోడుగా పెచ్చులు ఊడినగోడలు పేదరికాన్ని భుతద్దంలోంచి చిపిస్తున్నట్లుగా వున్నాయి.  నడి ఇంట్లో పరిచిన గోనేతట్టుమీద్ద సుమారుగా  ఐదు కిలోల మల్లెపుల్లు రాసిపోసి వున్నాయి వాటిచుట్టు కుర్చుని వేగంగా మాలలు అల్లుతున్నారా తల్లీ, ఆరుగులు ఆడపిల్లలూ. ఇంకో ఆడపిల్ల మరీ చిన్నది కావడంతో తల్లి పక్కలోనే కూర్చుని ముతకబట్టలతో తయారుచేసిన బొమ్మలతో ఆడుకుంటోంది. మరోపిల్ల తల్లిపాలు తాగుతోంది. కాగా ఆ తల్లి మళ్ళి కడుపుతో వుంది.  మాలలు అల్లుతున్న పిల్లల్లో అందరికంటే పెద్దదైన గౌసియా బేగం, ఒకవైపు మల అల్లుతూనే, మరోవైపు కొద్దిగా తొలగిన పరదా చాటునుండి ఎదురింటివైపు చూస్తోంది.  ఒక మోస్తరుగా వున్న ఎదురింటి ముందు రెండు అరుగులు వున్నాయి. అవి జాజుతో ఎర్రగా అలికి ముగ్గులతో పొందికగా అలంకరించి వున్నాయి అందులో ఒక అరుగుమీద కూర్చుని వున్నాడు భావానీశంకర్. అతడి చూపులు పెంకుటింటివైపే వున్నాయి. అయితే అతడు వెలుగులో కూర్చుని ఉన్నందున, ఇంట్లో పరదాచాటున కానీకనిపించక కూర్చుని వున్నగౌసియా బేగం అతడికి కనబడటంలేదు.  "రేయ్ ... శంకరూ"ఇంట్లో తిరిగాలి విసురుతున్న అతడిని తల్లి లక్ష్మిదేవమ్మ పిలిచింది.  "ఆ" కళ్ళలో ప్రియురాలిని వెతుకుతూనే పలికాడు.  "బయట కూర్చుని ఏంచేస్తున్నావురా? "అడిగిందామె.  "ఏం చేయాలి? "  ఇల్లంతా సాలీడు గూళ్ళతో నిండిపోయివుంది. కస్తాకర్ర తీసుకుని దులపరాడు? "  "నేనేమైనా ఆడపిల్లనా? "  "నాకు ఆడపిల్లవైనా మగపిల్లాడివైనా నేవ్వేకదరా! అయినా ఇంటిపని చేసుకోవడంలో తప్పులేదు కానీ, అదొక్క సాయంచేసిపెట్టు"  "పొమ్మా" అతడి గొంతులో నిర్లక్ష్యం.  "కాస్త చెప్పినమాట వినరా" ఆమె గొంతులో అభ్యర్ధన.  "నేను అలాంటి పనులు చేస్తే నా స్నేహితులు ముందు తక్కువైపోనూ? మగాడివై ఆడంగి పనులు చేస్తున్నావేంట్రా అని వాళ్ళు నన్ను హేళన చేస్తుంటే నేను ఎలా తలెత్తుకోవాలి? " అంటూనే అరుగుమీద నుండి లేచి లోపలికి నడిచాడు భావనీశంకర్.  "ఈమాటమాట్లాడ్డానికి నీకు సిగ్గు, శరం వుడాలి"అంటూనే తిరగాలి విసరడం ఆపిందామె.  "నీ స్నేహితులంతా చదువుకున్నారు కాబట్టి వాళ్ళతో నీకు పోటీ తగదు అంటావు, అంతేకదా" రోషంగా అన్నాడు అతడు.  "లేకపోతే ఏంట్రా? నీ స్నేహితులంతా డిగ్రీలో వున్నారు. నువ్వేమో పదవతరగతి పాసవ్వడానికే నానాతంటాలు పడుతున్నావు. మీ పప్పాకి అసలే ఆరోగ్యం బాగోలేదు. ఆ పొగాకు కంపినీలో పనిచేసీ చేసీ నలభై ఏళ్ళకే యాభైఏళ్ళ వాడిలా తయారయ్యాడు. ఆయనకి వచ్చే పదిహేను వందల్లో ఏడువందలు మందులకే సరిపోతున్నాయి. ఇక ఎనిమిది వందలతో ఎలా బతుకుతామనుకుంన్నావురా? తినడం, అరుగుమీద కూర్చోవడం, ఇదే నీకు తెల్సిన పని! ఇంట్లో ప్రతీదీ కొనడమే! దానికి తోడు నీ అవసరాలకోసం 'నెలకు వంద ఇవ్వు చాలు' అంటావు ఇలా అడిగి ఇప్పించుకోడానికి సిగ్గులేదురా!  అదేరా మగవాడంటే ... " కోపంగా మాట్లాడుతోంది లక్ష్మిదేవమ్మ.  "ఈ మాటలు పాతవే" అన్నాడు భావానీశంకర్.  "నీకు ఎన్నిసార్లు చెప్పినా తలకు ఎక్కడం లేదుకదా?  అయినా చేవిటివాడిముందు శంఖం వూదడం నాదేతప్పు" ఆమె గొంతులో నిష్టురం.    

మనసు లోతు తెలిసిన కవి శ్రీ శ్రీ

మనసు లోతు తెలిసిన కవి  శ్రీ శ్రీ     మాటలకందని భావాలని పాటల రూపంలో పలికించటం అంత తేలికైన పని కాదు. కాని గుండె లోతుల్లో దాగి ఉన్న అతి సున్నితమైన భావాలని కూడా తెరకెక్కించి  ప్రతి ఒక్కరు ఈ బాధ అంతా నేను పడ్డదే అనేట్టు ఆలోచింపచేసేవి శ్రీశ్రీ పాటలు. మనసు పొరల్లో ఎక్కడో ఉన్న బాధని, ఆవేదనని, ఆక్రోశాన్ని బయటకి తీసి మనకి తెలియని మనసు ఆరాటాన్ని మన కాళ్ళ ముందే ఉంచేవాడు శ్రీశ్రీ. నిన్ను మించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చి చేరెను తెలుసుకో....అంటూ గొప్పింటి వాళ్ళ అందాలు పేదింటి వారి కష్టాలు ఒకేసారి కళ్ళ ముందుంచారు శ్రీశ్రీ.  నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీ కోసమే కన్నీరు నింపుటకు..... నీ వ్యధ తెలిసి నీడగా నిలిచే తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము అని ప్రతి మనసు కోరుకునే ప్రేమ తత్వాన్ని అత్యంత సున్నితమైన మాటలతో మన ముందు నిలిపారు ఆయన. విప్లవకవిగా పేరు పొందిన ఆయన పాటల్లో విప్లభావల వెనక దాగి ఉన్న ఆవేదనని గమనిస్తే శ్రమజీవుల గురించి, శ్రామిక దోపిడీ గురించి ఎంతలా అర్ధం చేసుకుని వాళ్ళ తరఫున గళం విప్పి కలం కదిపి బాహ్య ప్రపంచానికి తెలియచేసారా అని అనిపిస్తుంది. శ్రీశ్రీ తన రచనా వ్యాసంగాన్ని తన ఏడవ యేటనే ప్రాంభించారట. తన మొదటి గేయాల పుస్తకం ఎనిమిదవ యేట ప్రచురింపబడింది. చిన్న వయసులోనే రచనా వ్యాసంగాన్ని మొదలుపెట్టిన శ్రీశ్రీ  తన పద్దెనిమిది ఏట ప్రభవ అనే కావ్యసంపుటాన్ని కూడా ప్రచురించారు. సంప్రదాయ శైలిలో రాసిన ఒకేఒక్క సంపుటం ఇది. తరువాత రాసిన రచనలన్నీ వాడుక భాషలో ఉండటం మొదలుపెట్టాయి. శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం ఎంతటి చరిత్ర సృష్టించిందో మళ్లీ ప్రత్యేకంగా చెప్పక్కర్లెద్దు. ఈ పుస్తకం చదివి - కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ. ప్రపంచపు బాధ అంతా శ్రీ శ్రీ బాధ అని చెప్పారు చలం. అలాగే మహాప్రస్థానం ఈ శతాబ్దంలో తెలుగులో వచ్చిన ఏకైక మహా కావ్యం అని అభివర్ణించారు పురిపండా అప్పలస్వామి.  శ్రీశ్రీ 'అనంతం' అనే పేరుతో తన ఆత్మకథను రాసారు. అందులో తన సమకాలిన రచయితలూ, కవులు గురించి కూడా ప్రస్తావించారు. శ్రీశ్రీ అధ్యక్షతన ఏర్పడిన విరసం ఎన్నో పుస్తకాలని ప్రచురించింది. వ్యక్తిగత జీవితానికొస్తే అతనిది ముక్కుసూటి మనస్తత్వం. మనసులో ఒకటి బయటకి ఒకటి మాట్లాడటం చేతకాని శ్రీశ్రీ తన ధోరణి వల్ల చాలాసార్లు అపవాదులు పొందాల్సివచ్చింది. అయినా నిజాన్ని నిర్భయంగా మాట్లాడే అలవాటుని మార్చుకోలేదు. అతడు వయసొచ్చిన పసివాడనీ, అమాయకుడైన చురుకైనవాడనీ అభివర్ణించారు బూదరాజు రాధాకృష్ణ. కొంచెం ఆలోచించి చూస్తే అది అక్షరాల నిజమనే అనిపిస్తుంది ఆయన గురించి తెలిసిన ఎవరికైనా. రైల్వే స్టేషనులో కనపడిన ఒక స్నేహితుడు ఆయనను అడిగాడు, "ఊరికేనా?" అని. దానికి శ్రీ శ్రీ  "ఊరికే" అన్నాడు. అలాగే ఒక నాటిక ఏదైనా రాయమని అడిగిన ఇంకో మిత్రుడితో  "ఏ నాటికైనా రాస్తాను మిత్రమా" అని అన్నాడట. ఇలాంటి చెణుకులు అతని హాస్య భరితమైన వాక్స్చాతుర్యానికి కొన్ని మచ్చుతునకలు మాత్రమే. వివిధ దేశాలలో ఎన్నో సార్లు పర్యటించి, కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు, రాజ్యలక్ష్మి ఫౌండేషన్ అవార్డు ఇంకా మరెన్నో అవార్డులు పొందిన ఆయన ఎప్పటికి సాహితీ ప్రియుల గుండెల్లో తన రచనల రూపంలో చిరంజీవిగా నిలిచే ఉంటారు. ....కళ్యాణి

నాయని కృష్ణకుమారి స్పెషల్ స్టోరీ

 నాయని కృష్ణకుమారి           తండ్రి నాయని సుబ్బారావు సాహిత్య వారసత్వాన్ని ఆమె పుణికి పుచ్చుకున్నారు. కవిత్వం, కథ, నవల, నాటిక, పాట, విమర్శ, పరిశోధన లాంటి భిన్న ప్రక్రియలలో తనదైన సొంత ముద్రను వేశారు. ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించారు. ఆదర్శ మూర్తిగా నిలిచి, ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నారు ఆచార్య నాయని కృష్ణకుమారి.     ప్రకాశం జిల్లాలోని నర్సరావు పేటలో మార్చి 14, 1930లో నాయని సుబ్బారావు, హనుమాయమ్మకు జన్మించారు కృష్ణకుమారి. ఆ రోజుల్లో నాయని సుబ్బారావుకు 'భావకవి'గా మంచి పేరుండేది. వారి ఇల్లే 'సాహితీ సమితి'కి పుట్టినిల్లులా ఉండేది. కృష్ణశాస్త్రి, విశ్వనాథ, అడవి బాపిరాజు, శివశంకరశాస్త్రి లాంటి ఉద్దండులైన సాహితీ వేత్తలు నాయని సుబ్బారావు ఇంట్లో సాహిత్య చర్చలు జరిపేవాళ్లు. చిన్నప్పుడే కృష్ణకుమారి ఆ విషయాలను ఆసక్తిగా వినేది. కృష్ణకుమారి ఏడో తరగతి చదువుకునే రోజుల్లోనే 'రంగైన ఒకపూవు కంటికేమింపు హంగుమీరా మాలలల్లితే సొంపు' అనే పాట రాసింది. ఇది ఆమెలోని సృజనాత్మకతకు బీజం లాంటిది. పాఠశాలలో చదువుకునే రోజుల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని బహుమతులు పొందింది.      విశాఖపట్నం ఆంధ్రవిశ్వవిద్యాలయంలో బి.ఎ. ఆనర్సు చదివింది. అక్కడే ఆమెలోని పరిపూర్ణ కవయిత్రి వెలుగులోకి వచ్చింది. కవిత్వం, కథలు రాయడమే కాదు గ్రంథాలయంలో ఎప్పుడూ పుస్తకాలు చదువుతూ గడిపేది. తరగతి గదిలో విన్న చరిత్ర పాఠాలనే 'ఆంధ్రప్రభ' పత్రికలో 'ఆంద్రుల కథ' పేరిట సీరియల్ గా రాసింది. 'కథల కడలి'  పేరుతో దారావాహికంగా కథలు ప్రకటించింది. బి.ఎ. ఆనర్సు పూర్తి కాగానే మద్రాసు ఎతిరాజు మహిళా కళాశాలలో, ఆ తర్వాత హైదరాబాదు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బాలికల కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేసింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎ. తెలుగు చదివింది.       1954లో న్యాయవాది మధుసూదన రావును వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు. 1969లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి 'తెలుగు జానపద గేయగాథలు' అనే అంశం పై పరిశోథన చేసి డాక్టరేటు పొందారు. ఊరూరా తిరుగుతూ జానపదులను కలిసి వారి గాథలు, కథలు సేకరించారు. 'నల్లగొండ జిల్లా ఉయ్యాల పాటల'ను సమీక్షించారు. జానపద సాహితీ ఉద్దండుడు బిరుదురాజు రామరాజుతో కలిసి 'జానపద గేయాలు - సాంఘిక చరిత్ర' రచనలో పనిచేశారు.       ఒకవైపు జానపద సాహిత్యం పై కృషి చేస్తూనే మరోవైపు సృజనాత్మక రచనలను సాగించారు. 'గౌతమి' నవల, 'అగ్నిపుత్రి' కవితా సంకలనం, 'ఆయుధ' కథా సంపుటి ముద్రించారు. కృష్ణకుమారి కాశ్మీరు దర్శించి అక్కడి ప్రకృతి అందాలకు ముగ్ధురాలై 'కాశ్మీరదీప కళిక'ను తెలుగు వారికి అందించారు. 'పరిశీలన', 'పరిశోధన', 'మనము-మన పూర్వులు' అనే వ్యాస సంపుటాలను వెలువరించారు. ప్రముఖ కవయిత్రులు సి. ఆనందారామం, తురగా జానకీరాణి, వాసిరెడ్డి సుజాతాదేవిలతో కలిసి 'అపరాజిత' గొలుసు నవలను రచించారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారికోసం 'జైమినీ భారతా'నికి, 'శృంగార శాకుంతలా'నికి సంపాదకత్వం వహించారు. 'తోరదత్' ను ఇంగ్లిష్ నుంచి తెలుగులోకి అనువాదం చేశారు. 'మెకన్జీ కైఫీయత్ లు - విమర్శా పరిణామం' గ్రంథాన్ని, 'ఏమి చెప్పను నేస్తం' కవితా సంపుటాన్ని ముద్రించారు. ఆకాశవాణి, టీవీలలో అనేక కార్యక్రమాలలో పాల్గొన్నారు.        కృష్ణకుమారి తెలుగు వాచకాలకు సంపాదకత్వం బాధ్యతలను కూడా నిర్వర్తించారు. విద్యావేత్తగా, సాహితీ వేత్తగా అనేక గౌరవాలు, సన్మానాలు పొందారు. 1996లో తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి (వి.సి.) గా పని చేశారు. 1979లో కేసరీ కుటీరం వారు కృష్ణకుమారిని స్వర్ణకంకణంతో సత్కరించింది. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉత్తమ రచయిత్రిగా గుర్తించింది. 1988లో సుశీలా నారాయణరెడ్డి పేరిట ఉత్తమ రచయిత్రిగా సత్కరించ బడింది. 1989లో తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ సాహితీ వేత్తగా సన్మానించింది.     నాయని కృష్ణకుమారికి ఇలా ఎన్నో అవార్డులు, ఉన్నత పదవులు దక్కాయి. అయినా నేటికీ వినమ్రంగా జీవిస్తూ, నిత్యం సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూ ప్రశాంత చిత్తంతో జీవిస్తున్నారు. ...డా. ఎ.రవీంద్రబాబు

సుస్వర పదాల సుమధుర రచయిత

సుస్వర పదాల సుమధుర రచయిత వేటూరి పాటకు ప్రతికొమ్మా చిగురించి ప్రతి పువ్వూ పులకించి సన్నాయి రాగాలు పాడుతుంది. ఆయన పేరు వినగానే ఒక వైపు ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరిహరి గుర్తొస్తే, మరోవైపు ఓంకారనాదాను సంధానమౌ గానమే, శంకరాభరణము గుర్తొస్తాయి. ఎలాంటి సందర్భానికి అలాంటి పాట రాయటమే ఆయన గొప్పతనం. బాణీలు కట్టి సినిమా పాటకు రంగుల ఓణీలు కట్టించారు వేటూరిగారు. జర్నలిస్టుగా కొనసాగుతూ దాసరథిగారి ప్రోత్సాహంతో సినీరంగంలో కాలు పెట్టిన వేటూరికి చిత్తూరు నాగయ్యగారు నటుడిగా అవకాశాన్ని ఇచ్చారు. చిత్రం ప్రారంభానికి రెండు రోజుల ముందే, నేను నటించలేనని క్షమాపణ కోరుతూ నాగయ్యగారికి ఉత్తరం రాసిన వేటూరి నటుడిగా కన్నా, రచయితగా తనని తాను రూపుదిద్దుకోవాలని అనుకున్నారు. నిజానికి ఆయన నటన వైపు మొగ్గు చూపించి ఉంటే, మనం ఎన్నో ఆణిముత్యాల్లాంటి ఎన్నో సుమధుర గీతాలను కోల్పోయేవాళ్ళమేమో. పండితుల నుండి పామరుల వరకు అలాగే, వయసులో ఉన్నవారి నుండి వయసు మళ్ళిన వారి వరకు అందరికీ నచ్చే విధంగా ఎన్నో స్వరాలకి పదాలు సమకూర్చారు వేటూరి. ఆడజన్మకు ఎన్ని శోకాలో చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో అనే పాటలో తల్లిప్రేమను సాక్షాత్కరించారు. అలాగే ఆకాశదేశాన ఆషాఢమాసాన అనే పాటలో ఒక ప్రియుడి విరహవేదనని కళ్ళకు కట్టినట్లు చూపించారు. ప్రతీ పాటలోనూ తనదైన శైలి చూపిస్తూ అందంగా లేనా అసలేం బాలేనా అంటూ కవ్వించే పాటలే కాదు, అత్తమడుగు వాగులోన అత్తకోడుకో అంటూ కుర్రకారుని ఉర్రూతలూగించారు. ఏ పాట రాసినా తనకంటూ ఒక శైలిని ఏర్పరుచుకొని ఈ పదాలు బాగోలేదు..... ఇంకొకలాగా రాస్తే బాగుండునేమో అని ఎవరితోనూ చెప్పించుకోకుండా ఎన్నో దశాబ్దాలు చిత్రసీమలో ఒక వెలుగు వెలిగారు వేటూరి. 'నువ్వు ఎడాపెడా పాటలు రాసి పారేస్తున్నావట, చాలా స్పీడుగా రాస్తున్నావట' అని ఆత్రేయ అక్షింతలు వేస్తే,  'గురువుగారు ! మీ అంత గొప్పగా ఎలాగూ రాయలేను మీకంటే తొందరగా రాయకపోతే, నా బ్రతుకుతెరువు ఎలాగండి' అని చమత్కారంగా బడులిచ్చారట వేటూరి. నూటికో కోటికో ఒక్కరు అనే పాటలో తన గురుభక్తిని చాటటమే కాదు, అదే పాటలో ఈ యువత తాత గాంధీజీ మీలో మిగిలారు, మీ నవతకు నేతాజీ మీలో రగిలారు, అందరూ మీలో ఉన్నారు దేశానికి మీరే సారధులు అనే మాటలతో యువతరాన్ని నిద్రలేపారు. నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన - ఈ రెంటి నట్టనడుమ నీకెందుకింత తపన, అని మన కంటికి నేరుగా కనిపించని జీవిత సత్యాన్ని చూపించారు. వేటూరికి ఉన్న స్నేహితులలో జంధ్యాల ఒకరు, ఆయన వేటూరిని ఒక నటుడిగా చూడాలని తపనపడేవారు. అందుకే తన చిత్రం మల్లెపువ్వులో కకుంభంజకం స్వాములవారుగా వేషం వేయించి మురిసిపోయారు. జంధ్యాలగారి సినిమాలకి వేటూరి అందించిన సాహిత్యం సినీ జగత్తులో చెరగని ముద్ర వేసింది. చినుకులా రాలి నదులుగా సాగి, అలివేణీ ఆణిముత్యమా నీకంట నీటి ముత్యమా, నీలాలు కారేనా, మనసా తుళ్ళిపడకే, అలాగే మల్లెపూల మారాణికి బంతిపూల పారాణి, కాస్తందుకో దరఖాస్తందుకో, ఇలా ఎన్నో మధురమైన పాటలని అందించి జంధ్యాల అంటే తనకి ఎంత అభిమానమో చూపించారు వేటూరి. మహదేవన్ ను తన గురువుగా చెప్పుకునే వేటూరి, వారిద్దరిమధ్య ఉన్న అనుబంధం మాటలలో చెప్పలేనిది అనేవారు. వారిద్దరి కాంబినేషన్ లో వచ్చిన పాటలు తలమానికాలు. మనుషులతోనే కాదు, వేటూరికి నదులతో కూడా విడదీయలేని అనుబంధం ఉంది. నదుల గురించి సిరిసిరిమువ్వలో గోదారల్లే ఎన్నెట్లో గోదారల్లే, ఆశాజ్యోతి ఎరేళ్ళిపోతున్నా నీరుండి పోయింది - నీటిమీద రాతరాసి నావెళ్ళిపోయింది, అంతేకాదు నావలుజాడ కృష్ణవేణి నాసిగపూలు ఎన్నెలా గోదారి, అని ఎన్నో ప్రయోగాలు చేస్తూ నదుల మీద ఉన్న గౌరవభావాన్ని పదాల రూపంలో చూపించారు వేటూరి. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అనే పాటకు 1994 లో జాతీయ పురస్కారం ప్రకటించారు. అయితే కేంద్ర ప్రభుత్వం తెలుగుభాషకు ప్రాచీనభాషా హోదాను ఇవ్వనందుకు నిరసన తెలుపుతూ తిరిగి ఇచ్చేసి తన మాతృభాషాభిమనాన్ని చాటుకున్నారు వేటూరి. అక్షరo తో అనంత భావాలని పలికించిన ఆ పద చక్రవర్తికి తెలుగు పాట  నీరాజనాలు పడుతూనే వుంటుంది...ఆయన పాట మన గుండె గదులను తట్టినంత కాలం. ------కళ్యాణి         

21 రకాల ఆకులతో విఘ్నేశ్వరుని పూజ

21 రకాల ఆకులతో విఘ్నేశ్వరుని పూజ ఏదైనా ఒక సాధారణ కార్యక్రమం ప్రారంభించేటప్పుడే కాదు, ఒక పూజ చేసే టప్పుడు కూడా ముందుగా వినాయకున్ని పూజించడం హిందూ సాంప్రదాయం. అలాంటి వినాయకుడ్ని ప్రత్యేకంగా పూజించే రోజు వినాయక చవితి. అందరికీ నచ్చే దైవం. అందరూ కొలిచే దైవం వినాయకుడు. శివ పార్వతుల కుమారుడైన వినాయకుడ్ని పూజిస్తే అందరు దేవుళ్లన్నీ పూజించినట్లే అని పురాణాలు చెబుతున్నాయి. హిందూ సంప్రదాయంలో సకల దేవతా గణములకు అధిపతి వినాయకుడు. విద్యకు, సకల శుభాలకు అధినాయకుడు విఘ్నేశ్వరుడు. అలాంటి శివ పార్వతుల ముద్దుల కుమారుడ్ని వినాయక చవితి నాడు పూజిస్తే ఎంతో ఫలం. వినాయక చవితి నాడు చేసే పూజలో పత్రాలు ప్రధానమైనవి. విఘ్నేశ్వరుని 21 రకాల ఆకులతో పూజించడం ఆనవాయితీ. అయితే ఈ 21 ఆకుల పేర్లేంటని తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి. 1. మాచీ పత్రం: మాచ పత్రి అనేది తెలుగు పేరు. చేమంతి జాతికి చెందిన దీని ఆకులు సువాసనా భరితంగా ఉంటాయి. చేమంతి ఆకుల మాదిరే ఉంటాయి. 2. దూర్వా పత్రం: దూర్వా పత్రం అంటే గరిక. తెల్ల గరిక, నల్ల గరిక అని రెండు రకాలుంటాయి. గడ్డిజాతి మొక్కలు విఘ్నేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనవి. 3. అపామార్గ పత్రం: తెలుగులో దీనిని ఉత్తరేణి అంటారు. దీని ఆకులు గుండ్రంగా వుంటాయి. గింజలు, ముళ్ళు కలిగి వుండి కాళ్ళకు గుచ్చుకుంటాయి. 4. బృహతీ పత్రం: దీనిని ములక అంటారు. దీనిలో చిన్న ములక, పెద్ద ములక అని రెండు రకాలున్నాయి. పత్రాలు వంగ ఆకులు మాదిరి. తెల్లని చారలుండే గుండ్రని పండ్లతో వుంటాయి. 5. దుత్తూర పత్రం: దుత్తూర పత్రం అంటే ఉమ్మెత్త. ఇది వంకాయ జాతికి చెందింది. ముళ్ళతో కాయలు వంకాయ రంగు పూలు వుంటాయి. 6. తులసీ పత్రం: హిందువులకు తులసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తులసీ పత్రాలను దేవతార్చనలో వాడతారు. 7. బిల్వ పత్రం: బిల్వ పత్రం అంటే మారేడు ఆకు. మూడు ఆకులుగా, ఒక ఆకుగా ఉంటాయి. ఇవి శివునికి చాలా ఇష్టం. శ్రీ మహాలక్ష్మీదేవికి కూడ ఇష్టమైందిగా చెపుతారు. 8. బదరీ పత్రం: బదరీ పత్రం అంటే రేగు. దీనిలో రేగు, జిట్రేగు, గంగరేగు అని మూడు రకాలు ఉంటాయి. 9. చూత పత్రం: చూత పత్రం అంటే మామిడి ఆకు. ఈ ఆకుకు శుభకార్యాల్లో విశిష్ట స్థానం ఉంది. మామిడి తోరణం లేని హైందవ గృహం పండుగరోజులలో కనిపించదు. 10. కరవీర పత్రం: దీనినే గన్నేరు అంటారు. తెలుపు, పసుపు, ఎరుపు రంగుల పూలుంటాయి. పూజలో ఈ పూలకు విశిష్ట స్థానం ఉంది. 11. మరువక పత్రం: దీన్ని వాడుక భాషలో ధవనం, మరువం అంటారు. ఆకులు ఎండినా మంచి సువాసన వెదజల్లుతుండటం ఈ పత్రం ప్రత్యేకత. 12. శమీ పత్రం: జమ్మిచెట్టు ఆకులనే శమీ పత్రం అంటారు. దసరా రోజుల్లో ఈ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 13. విష్ణుక్రాంత పత్రం: ఇది నీలం, తెలుపు పువ్వులుండే చిన్న మొక్క. నీలి పువ్వులుండే రకాన్ని విష్ణుక్రాంత అంటారు. 14. సింధువార పత్రం: సింధువార పత్రాన్నే వాడుకలో వావిలి అనికూడ పిలుస్తుంటారు. 15. అశ్వత్థ పత్రం: రావి ఆకులనే అశ్వత్థ పత్ర మంటారు. రావి చెట్టుకు పూజలు చేయటం మనసంప్రదాయం. 16. దాడిమీ పత్రం: దాడిమీ అంటె దానిమ్మ ఆకు. శక్తి స్వరూపిణి అంబకు దాడిమీఫల నైవేద్యం ఎంతో ఇష్టం. 17. జాజి పత్రం: ఇది సన్నజాజి అనే మల్లిజాతి మొక్క. వీటి పువ్వుల నుంచి సుగంధ తైలం తీస్తారు. 18. అర్జున పత్రం: మద్దిచెట్టు ఆకులనే అర్జున పత్రమంటారు. ఇవి మర్రి ఆకుల్ని పోలి వుంటాయి. అడవులలో పెరిగే పెద్ద వృక్షం ఇది. 19. దేవదారు పత్రం: దేవతలకు అత్యంత ఇష్టమైన ఆకు దేవదారు. ఇది చాలా ఎత్తుగా పెరుగుతుంది. ఈ మానుతో చెక్కిన విగ్రహాలకు సహజత్వం ఉంటుంది. 20. గండలీ పత్రం: దీనినే లతాదూర్వా అనికూడా అంటారు. భూమిపైన తీగమాదిరి పాకి కణుపులలో గడ్డిమాదిరి పెరుగుతుంది. 21. అర్క పత్రం: జిల్లేడు ఆకులను అర్క పత్రమంటారు. తెల్లజిల్లేడు పేరుతో తయారుచేసిన వినాయకప్రతిమను పూజించడం వల్ల విశేష ఫలం వుంటుందంటారు. ఈ 21 పత్రాలతో వినాయక చవితి రోజున పూజించే వారికి సకల సంపదలు, అష్టైశ్వర్యాలు, కార్యసిద్ధి చేకూరుతుందని పండితులు అంటున్నారు.

మాక్లీదుర్గంలో కుక్క

మాక్లీదుర్గంలో కుక్క (కథ)                                                                    - విశ్వనాథ సత్యనారాయణ              విశ్వనాథ సత్యనారాయణ కవిసామ్రాట్ బిరుదాంకితుడు. ప్రాచీన సాహిత్యానికి పెట్టని కోట. సంప్రదాయవాదిగా అతనిని అందరూ గుర్తించారు. రచనల్లో ప్రాచీన ఆచారాలకు ప్రత్యేక స్థానం ఇచ్చాడు. అసలు విశ్వనాథ రచనలే అందుకు చేశాడు. తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాషల్లో అపార పాండిత్యం కలవాడు. తెలుగులో తొలిసారిగా వీరి రచన శ్రీమద్రామాయణ కల్పవృక్షానికి జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది. వీరు తెలుగు సాహిత్యంలోని కథ, నవల, ఆధునిక కవిత్వం, ప్రాచీన పద్య కవిత్వం, విమర్శ... ఇలా ప్రతి ప్రక్రియను చేపట్టారు. వీరి  అన్ని రచనల్లాగే కథలు కూడా సంప్రదాయ భావాలకు, సనాతన ధర్మానికి కట్టుబడే ఉంటాయి. వీటిలో అందరికీ తెలిసిన కథ మాక్లీదుర్గంలో కుక్క.      మాక్లీదుర్గం గుంతకల్లు నుంచి బెంగళూరు పోయే మధ్యలో ఉన్న ఒక రైల్వేస్టేషను. చిన్న స్టేషను. అక్కడ ఓ కుక్క ఉంటుంది. స్టేషను పక్కనే ఉన్న లోయలో ఉన్న వాగుల్లో నీళ్లు తాగటం, స్టేషనులో ఉన్న ఒకే ఒక్క దుకాణం వాడు మిఠాయి పెడతాడని ఎదురు చూడడం దానికి అలవాటు. ఒకరోజు స్టేషనుకు ఓ పెద్దమనిషి సీమ ఆడకుక్కను తీసుకొని వస్తాడు. ఆ సీమకుక్కకు వయసు రావడంతో దానిని బెంగళూరులో ఉన్న అదే జాతి కుక్కల దగ్గరకు తీసుకెళ్తూ మాక్లీదుర్గం స్టేషనులో దిగుతాడు అతను. అనుకోకుండా స్టేషను మాస్టారుతో పరిచయం ఏర్పడుతుంది. స్టేషను మాస్టారు వర్ణవ్యవస్థ ఉండాలి. సనాతన ధర్మాలు ఇప్పటికీ పాటించాల్సిన అవసరం ఉంది. వర్ణాంతర వివాహాలు పనికిరావు అని వాదిస్తే, అతను మాత్రం అవన్నీ ఇప్పుడు పనికిరావు. వాదనకు నిలబడవు అని చెప్తాడు. అంతలో అతని సీమకుక్క అక్కడున్న స్టేషను కుక్కతో కలుస్తుంది. అది గమనించిన ఆయన ఆ కుక్కను దెబ్బతగిలేటట్టు కొట్టి తన కుక్కకు స్నానం చేయించి, శుభ్రపరిచి తీసుకెళ్తాడు.           కుక్క అడవిలోంచి వచ్చిన వేగోలాన్ని పసిగట్టి పోరాడి చంపేస్తుంది. అది గమనించిన స్టేషను మాస్టారు, దుకాణం అతను ఆరోజు నుంచి కుక్క పౌరుషాన్ని పొగడడం మొదలు పెడతారు. అన్నం వేస్తారు. ఒకరోజు దుకాణం అతను ఎవరూ కొనని మిఠాయిని కుక్కకు పెట్టాడు. కుక్క తిన్నది. ఆ రోజు నుంచి కుక్క ఆరోగ్యం పాడైంది. క్రమంగా బాగా చిక్కి, చర్మానికి కూడా రోగం వచ్చి నడవలేక పోతుంది.  అంతకు ముందు పరిచయం అయిన జాతికుక్కను పెంచుకునే అతను వస్తాడు. ఆ కుక్క నాలుగు పిల్లలను కనిందని అవి  జాతి కుక్కల్లా కాకుండా, ఈ కుక్కలానే ఉన్నాయని చెప్తాడు. చివరకు స్టేషనులోని కుక్క రైలుకిందపడి మూలిగిమూలిగి చనిపోతుంది.         స్టేషను మాస్టారు కోరిక ప్రకారం ఓ కుక్క పిల్లను తెచ్చి ఇస్తాడు సీమకుక్కను పెంచుకునే అతను. అది పెరిగి పెద్దదై మొదటి కుక్కలా పెరుగుతుంది. కానీ మనుషులంటే దానికి గిట్టదు. దుకాణం దారుడు పెట్టే తిండి తినదు. పౌరుషంతో అడవిలోని జంతువులను వేటాడుతుంది. తల్లిపోలికతో తోక కూడా బలుస్తుంది. మనుష్యగాలి తగిలితే కోరలు చాస్తుంది.            క్లుప్తంగా ఇదీ కథ. కానీ కథలో అంతర్గతంగా సంప్రదాయ భావాలను, వర్ణవ్యవస్థను పునరుద్ధరించాలనే తత్వం కనిపిస్తుంది. దీనికి కుక్కను ప్రతీకగా చేసుకుని చెప్పాడు విశ్వనాథ. సంప్రదాయభావాలను చీదరించుకొనే వ్యక్తి తన సీమకుక్క వీధి కుక్కతో కలవడాన్ని ఒప్పుకోడు. అలానే వీటి కలయిక వల్ల పుట్టిన కుక్క చివరకు మళ్లీ స్టేషనుకే పరిమితమైంది. అంటే వర్ణసంకరం వల్ల జరిగే అనర్థాలను అన్యార్థబోధకంగా చెప్పాడు ఈ కథలో విశ్వనాథ సత్యనారాయణ. అలానే ఇద్దరు విద్యార్థుల మధ్య సంభాషణలో కూడా కుక్కకు వేసినట్లైనా పేదవాళ్లకు అంత తిండి వేయరు అన్న విద్యార్థి, తన దగ్గరకు వచ్చేసరికి కుక్కను కాలితో తంతాడు. ప్రతి మనిషి సనాతాన భావాలను వ్యతిరేకించేవాడే, కానీ ఆచరణలో మాత్రం వాటినే పాటిస్తాడు అని రుజువు చేసాడు కథలో రచయిత.     విశ్వనాథవారి సరళ గ్రాంథిక భాష కథకు ప్రత్యేక అలంకారం. అలానే కథ, శిల్పం దృష్ట్యాం చూస్తే... శీర్షిక మాక్లీదుర్గంలో కుక్క అన్నట్లే... రైల్వే స్టేషను వర్ణన, కుక్క స్థితిగతులను అద్భుతంగా చెప్పారు విస్వనాథ. చెప్పాలనుకున్న భావాలను పాత్రల సంభాషణల రూపంలో చెప్పడం విశ్వనాథ ప్రత్యేకత.   స్టే.మా.- అయితే మీరు వర్ణవ్యవస్థను తీసిపారేయాలి అంటారా...   పె.మ.- తీసివెయ్యాలంటాను. ఈ వ్యవస్థమూలంగా అనేక భేదాలేర్పడతున్నవి. కొందరు అనవసరంగా తాము గొప్పవాళ్లమనుకుంటున్నారు. తక్కువ కులాల మీద అధికారం చెలాయిస్తున్నారు... ....      ఇలా విశ్వనాథ సత్యనారాయణ తన ఆలోచనలను అద్భుతంగా కథలో అంతర్ముకంగా చెప్పాడు. అతని శైలి కథకు మరో ప్రధాన ఆకర్షణ.         విశ్వనాథ సత్యనారాయణ గారి జయంతి సందర్భంగా......           - డా. ఎ.రవీంద్రబాబు