నీకు రెండు - నాకు మూడు

నీకు రెండు - నాకు మూడు ముసలయ్య, ముసలమ్మ చాలా పేదవాళ్లు. అంతేకాదు- పరమ పిసినారులు కూడా! ఒకరి పొందు ఒకరు మెచ్చరు! " ఒకరు కట్టె ఏది? అంటే మరొకరు తెడ్డు ఏది?" అంటారు. ఒకరోజు ముసలయ్య కష్టపడి నాలుగు రూపాయలు సంపాదించాడు. దానితో అరశేరు జొన్న పిండి తీసుకుని వచ్చి, ముసలమ్మకిచ్చి, రొట్టెలు చేయమన్నాడు. మరునాడు ఉదయాన్నే ముసలమ్మ రొట్టెలు కాల్చింది- సరిగ్గా ఐదు రొట్టెలు తయారయ్యాయి. రొట్టెలు తయారవ్వగానే ఇద్దరూ తినేందుకు కూర్చున్నారు. ముసలయ్య పళ్ళెంలో రెండు రొట్టెలు వేసి, తన పళ్ళెంలో మూడు రొట్టెలు వేసుకుంది ముసలమ్మ. ఇది చూడగానే ముసలయ్యకు పిచ్చి కోపం వచ్చింది: "ఏమే! కష్టపడి సంపాదించింది నేను- మరి నాకు తక్కువ; ఊరికే కూర్చునే నీకు ఎక్కువనా?” అని చిందులేశాడు. ముసలమ్మ కూడా ఏమీ తగ్గలేదు- "నేను కష్టం చేసి రొట్టెను కాల్చాను- కాబట్టి నాకు మూడు; నీకు రెండు- ఇదే న్యాయం!" అంది. ఇద్దరూ చాలా సేపు వాదించుకున్నారు. చివరికి- "సరే, ఇద్దరం ఒక పందెం వేసుకుందాం- మన ఇంట్లో రెండు నులక మంచాలు ఉన్నాయి కదా! వాటి నిండా నల్లులే. వాటి మీద కదలకుండా పడుకోవాలి ఇద్దరమూ. ముందుగా ఎవరు కదిలితే వాళ్లు ఓడిపోయినట్లు! ఓడినవాళ్లకు రెండు; గెలిచిన వాళ్లకు మూడు- సరేనా? " అని పందెం వేసుకున్నారు. పందెం ప్రారంభం అయింది. ఇద్దరూ మంచాలమీద బిర్ర బిగుసుకొని పడుకున్నారు. మధ్యాహ్నం అయింది- ఎవ్వరూ కదల లేదు. సాయంత్రం అయింది- అయినా కదలేదు! పట్టిన పట్టు వదల లేదు ఇద్దరూ. నల్లులు బాగా కుట్టి పండగ చేసుకుంటున్నాయి. ఒళ్ళంతా దద్దుర్లు లేచాయి. అయినా ఏ ఒక్కరూ కదలలేదు; మెదల లేదు! 'కదిలితే రొట్టె పోతుంది' అనే ఆలోచన! ఇద్దరూ అలాగే శవాల మాదిరి పడుకుండి పోయారు. రాత్రి అయింది- మళ్లీ తెల్లవారింది- అయినా ఇద్దరిలో ఏ ఒక్కరూ కదలలేదు. 'ఇంటి తలుపులు తెరుచుకోలేదు- మధ్యాహ్నం అయింది- ఇంట్లో ఎలాంటి అలికిడీ లేదు- అని పొరుగిళ్ళ వాళ్ళకి అనుమానం వచ్చింది. అందరూ‌ కలిసి, తలుపులు త్రోసి, లోపలికిపోయి చూస్తే ఏముంది- ఇద్దరు ముసలోళ్లూ శవాల మాదిరి పడివున్నారు, మంచాలమీద. రెండు శరీరాలూ ఎర్రగా కందిపోయి ఉన్నాయి. ఉలుకు లేదు-పలుకు లేదు. అందరూ గుమిగూడారు. 'పాపం! చనిపోయారు' అని ఏడిచారు. అయినా వీళ్లిద్దరూ విన్నారు తప్పిస్తే- కదల లేదు! 'కదిలితే రొట్టెలు పోతాయి' అని ఊరుకున్నారు. 'శవాలని అలా వదిలేస్తే ఎలా?' అని, వీళ్ళను మంచాలతో‌ సహా దహనం చేద్దామనుకున్నారు పొరుగు వాళ్ళు. రెండు మంచాలనూ 'ఎత్తండంటే ఎత్తండి' అని, అందరూ కలిసి ఎత్తుకొని, స్మశానానికి బయలు దేరారు. రెండు చితులు పేర్చి, ఇద్దరినీ చితులమీద పడుకోబెట్టారు. అయినా ముసలమ్మగాని, ముసలయ్యగాని కదలనే లేదు- కదిలితే రొట్టె పోతుందని! సరే, అందరూ కలిసి చితికి నిప్పంటించారు; ఎవరికి వాళ్లు వెళ్ళిపోయారు. ఇంకొక్క ఐదుగురు మాత్రం ఉన్నారు అక్కడ. ఆలోగా చితుల మీద పడుకున్న ఇద్దరికీ వేడి తగలసాగింది. అయినా భరిస్తున్నారు తప్ప ఏ ఒక్కరూ కదలలేదు! చివరికి వేడి శరీరాలకి అంటుకోసాగింది! ఇంక ఓర్చుకోవడం ముసలయ్యవల్ల కాలేదు- గట్టిగా మొత్తుకుంటూ, ఒక్క ఉదుటున చితి నుండి బయటికి దూకాడు! మరుక్షణంలోనే ముసలమ్మ "నువ్వే ఓడావు- నీకు రెండు; నాకు మూడు" అని అరుస్తూ తను కూడా చితి నుండి బయటికి దూకింది! ఇంకేముంది? 'పిచ్చాపాటిలో మునిగిఉన్న ఐదుగురూ "పరుగెత్తండి రోయ్! ఇవి అప్పుడే దయ్యాలయ్యాయి! మనల్ని పంచుకోవడానికి వాదులాడుకుంటున్నాయి!” అని కాలి బిర్రున పరుగెత్తారు. ఇది చూసిన ముసలయ్య, ముసలమ్మ తమ ప్రవర్తనకు తామే సిగ్గుపడ్డారు. ఇక ఆ ఊరు లోకి పోవడానికి వాళ్లకు మొహం చెల్లలేదు. అందుకని వాళ్ళు బుద్ధిగా వేరే ఊరికి పోయి బ్రతుక్కున్నారు! రచన: కె.గంగమ్మ, ఉపాధ్యాయురాలు, టింబక్టు బడి, చెన్నేకొత్తపల్లి. కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

సింహంపిల్ల

సింహంపిల్ల వివేకానందుడు చెప్పిన చక్కని కథ ఒకటుంది: అనగా అనగా ఒక అడవి ఉండేది. ఆ అడవికి దగ్గర్లోనే ఒక మేకలాయన ఉండేవాడు. ఆయన దగ్గర చాలా మేకలుండేవి. ఒకసారి ఆ మేకలాయన అడవిలో పోతూ ఉంటే ఒక బుజ్జి సింహంపిల్ల ఎదురైంది. మేకలాయన కాళ్లకు చుట్టుకొని, నాకుతూ ప్రేమ పడింది ఆ చిట్టిపిల్ల. ఒక్కరోజు వయసుండే ఆ పిల్లను చూస్తే మేకలాయనకు ముద్దుగా అనిపించింది. తల్లి సివంగి వచ్చిందంటే తన పని ఐపోయినట్లే- అందుకని ఆయన ఎక్కువ ఆలోచించకుండా ఆ సింహంపిల్లను చంకనెత్తుకొని ఇంటికి పరుగెత్తాడు. ఇంట్లో చాలా మేకపాలున్నై. మేకలాయన సింహాన్ని పాలతోటీ, తను తినే జొన్న సంకటితోటీ, అన్నంతోటీ పెంచుకున్నాడు. సింహం పిల్ల మేకలన్నిటికీ అలవాటు పడింది. మనుషులకూ అలవాటైంది. అది కూడా మేకలలాగే అరిచేది. తోటి మేకలతో ఆడుకునేది. వాటి లాగానే ప్రవర్తించేది. మేకలతో బాటు అది కూడా రోజూ మేతకు వెళ్లటం మొదలుపెట్టింది. మేకలాయన తన మందను కాపాడే బాధ్యతను దానికే అప్పగించేంత బాధ్యతగల గొర్రె పొటేలు మాదిరి తయారైంది. ఒకరోజున, అది అలా మేకలమందతో బాటు అడవిలో గడ్డి మేస్తున్న సమయంలో, దగ్గరున్న పొదల్లోంచి సింహ గర్జన వినబడింది. మేకలన్నీ భయంతో కంపించి పోయాయి. చెల్లా చెదరై, దిక్కులు తెలీనట్లు పరుగులు పెట్టాయి. అప్పటికి సంవత్సరం నిండిన సింహపు పిల్ల కూడా వణికిపోయింది. తోచిన దిశలో పరుగు తీసింది. "సింహం! సింహం! పారిపోండి! పోయి మీ ప్రాణాలు దక్కించుకోండి! మే! మే!" అని అరుస్తూ అది పారిపోతుంటే, వేటాడ వచ్చిన సింహం ఆశ్చర్యపోయింది. "ఏమిటిది?! సింహపు పిల్ల, ఇట్లా భయపడటమేమిటి?! అదీ, తోటి సింహాన్ని, నన్ను చూసి ఇంత అలజడి చెందటమేమిటి?!" అనుకొని, అది మేకల్ని వదిలి, సింహంపిల్ల వెంట పడింది. సింహం తన వెంటే పడటం చూసి సింహపు పిల్లకు మరింత భయం వేసింది. "కాపాడండి! కాపాడండి!" అని మేకల భాషలో అరుచుకుంటూ, అది తుప్పల మీది నుండీ, ముళ్ల పొదలలో నుండీ దౌడు తీసింది. సింహం దాన్ని వదలకుండా వెంబడించి, చివరికొక చెరువు ఒడ్డున దాన్ని పట్టుకున్నది. "నన్నొదిలెయ్! నీకు పుణ్యం ఉంటుంది. నన్నేమీ చెయ్యకు! నేనొక మేకను! చిన్ని మేకను - గడ్డి తినే దాన్ని! తింటే నీకేమి వస్తుంది? నీ కాళ్లు పట్టుకుంటాను - నన్నొదిలెయ్" అని ఏడుస్తూ ప్రాధేయ పడుతున్నది సింహం పిల్ల. "ఏంటీ? నిన్ను తినకూడదా?! నువ్వు మేకవా? నువ్వేమనేదీ నీకు అర్థమౌతోందా, అసలు?" అన్నది సింహం. "నేను చిన్నదాన్ని- నాకేమీ తెలీదు - అజ్ఞానిని - తెలివిలేని మేకను - నన్నొదిలెయ్" అని ఏడుస్తోంది సింహంపిల్ల, అశక్తతతో. "ఓరి! నువ్వు మేకవి కాదే! ఏంటి ఇట్లా ఏడుస్తావు, మేకలాగా? నువ్వు కూడా సింహానివే!" అంది సింహం. ఎంత చెప్పినా వినలేదు సింహంపిల్ల. భయం దాన్ని పూర్తిగా ఆవరించి, దాని బలాన్ని, శక్తిని హరించింది. "నేను మేకపిల్లను" అనే అసత్యం దాని అస్తిత్వాన్ని మొత్తాన్నీ సంపూర్ణంగా హరించింది. చివరికి విసుగెత్తిన సింహం దాన్ని చెరువు గట్టుకు తీసుకెళ్లి, నీటిలో దాని ప్రతి బింబాన్ని చూపించింది; దాన్ని బెదిరించి, దాని చేత తన మాదిరి అరిపించింది; దాన్ని తన గుహకు లాక్కెళ్లి తన పిల్లల్ని చూపించింది- అలా అతి కష్టం మీద సింహం పిల్లకు తానెవరో తెలియజెప్పింది. ఇప్పుడా సింహం పిల్ల మారిపోయింది! తానెవరో గ్రహించిన ఆ సింహంపిల్ల ఇప్పుడు నిజంగా మృగరాజైంది. అడవిని మొత్తాన్నీ శాసించింది. తన శక్తి సామర్థ్యాలను అడవిలోని ప్రతి జంతువూ గుర్తించేలా చేసింది. మనందరిలోనూ అంతర్లీనంగా చాలా శక్తులున్నై. "నాకు చేత కాదు" అనుకుంటున్నంతకాలం ఆ శక్తులు అట్లా నిద్రపోతూనే ఉంటై. నిరాశా భావనకు వదిలి, "నాకేమి, నేను రాజును!" అనుకున్న మరుక్షణం ఆ శక్తులన్నీ మేల్కొని, మనకు సాయం చేస్తాయి. ప్రపంచంలో ఉన్న ఏ పరీక్షలూ నిజానికి మన శక్తిని పూర్తిగా కొలవలేవు. ఏ అపజయాలూ మనల్ని సంపూర్ణంగా విశ్లేషించవు. అందుకని, “నాకు చేత కాదు" అనే మాటను ప్రక్కనపెట్టి, ప్రయత్నిస్తూపోవాలి. ఏదో ఒకనాటికి విజయం మనదౌతుంది. కథలు రాయటం కూడా అంతే. “నాకు రాదు" అనుకుంటే ఎన్నటికీ రాయలేం. “రాసి చూద్దాం" అనుకొని, మొదలుపెట్టి చూడండి: అనంత కథా సామ్రాజ్యం‌ మన హస్తగతం అవుతుంది. అలా మనకు స్ఫూర్తినిచ్చేందుకే- లలితగారు పంపారు: “ఏమో, గుర్రం ఎగరావచ్చు!” బొమ్మల కథను. దాన్ని చదివి, అంతం ఎలా ఉండాలో రాసి పంపండి, అందరూ! కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

జంగయ్య - చందమామ

జంగయ్య- చందమామ రచన - సౌజన్య,  5 వ తరగతి.  ఒక ఊరిలో జంగయ్య అనే పిల్లవాడు ఉండేవాడు. జంగయ్యకు ఏడేళ్ళు. ఎప్పుడూ ఏదో ఒకపని చేస్తుంటాడు; ఏదో ఒకటి ఆలోచిస్తూంటాడు. ఒక రోజు కులాసాగా పడుకున్న జంగయ్యకు ఒక ఆలోచన వచ్చింది. చందమామ మీదకు వెళ్తే ఎంత బాగుంటుంది! ఇదీ, జంగయ్య కొత్త ఆలోచన! ఆరోజు సాయంత్రం జంగయ్య ఒక రాకెట్ సంపాదించాడు. దాని మీద కూర్చొని చందమామ దగ్గరికి బయలు దేరాడు. వెళ్తూ వెళ్తూ ఉండగా దారిలో చీకటి పడింది. జంగయ్యకు భయం వేసింది. ఆ చీకట్లో చందమామ ఎక్కడున్నాడో జంగయ్యకు కనబడలేదు. దారి కూడా తెలీలేదు! అయినా అతను పట్టు వీడలేదు; వెనక్కి తిరగ లేదు. జంగయ్య ఎక్కిన రాకెట్ ఇంకా ఇంకా పైకి వెళ్లింది. చాలా దూరం వెళ్ళాక అతనికి చందమామ కనిపించాడు. జంగయ్య ఆనందానికి అంతులేదు. అతను రాకెట్ మీదినుండి చందమామ మీద దిగాడు; అటూ ఇటూ తిరిగాడు- అంతా ఎడారిలాగా ఉంది. అక్కడక్కడా రాళ్ళు. దూరంగా కొండలు. చూద్దామంటే ఒక్క చెట్టు కూడా లేదు- కనీసం గడ్డి కూడా కనబడలేదు- ఒక పిట్టకానీ , ఒక జంతువు కానీ లేదు. తాగటానికి నీళ్లు కూడా లేవు. సరిగా ఊపిరాడటం లేదు. ఇదేం చందమామ ? ఇక్కడేం బాగాలేదు. మావూరే దీనికన్నా చాలా బాగుంది అనిపించింది జంగయ్యకు. తిరిగి అక్కడి నుండి బయలు దేరి ఊరి ముఖం పట్టాడు. ఊరు చేరుకునే సరికి ప్రాణం లేచి వచ్చినట్లైంది. అంతలోనే మెలకువ కూడా వచ్చింది. ఆ తరువాత అతను చందమామ మీద చూసిన విషయాలు ఊరందర్నీ పిలిచి చెప్పాడు. కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో 

అవ్వ - మేక

అవ్వ - మేక రచన - గణేష్, రెండో తరగతి ఒక ఊరిలో ఒక అవ్వ ఉండేది. ఆ అవ్వ దగ్గర ఒక మేక ఉండేది. ఆ మేకను రోజూ మేతకు పిలుచుకు పోయేది. ఒక రోజున అవ్వకు జ్వరం వచ్చింది. అపుడు మేక అవ్వ దగ్గరకు వచ్చింది. "అవ్వా, అవ్వా! ఏమి ఆలోచిస్తున్నావు?" అని అడిగింది. అపుడు అవ్వ "ఏమీ లేదు మేకా, నాకు జ్వరం వచ్చింది; నిన్ను మేతకు ఎలా పిలుచుకుపోవాలి?" అన్నది. అప్పుడు మేక " ఏమీ ఒద్దులే అవ్వా, నేను ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి మేసి వస్తా; పచ్చకొండకు పోయి పచ్చగడ్డి మేసి వస్తా" అని ఒక్కతే బయలుదేరింది. అలా పోతూ పోతూ ఒక నక్క దగ్గరకు వెళ్లింది. అప్పుడు ఆ నక్క "నాకు చాలా ఆకలేస్తోంది, నిన్ను తినేస్తాను" అని బెదిరించింది. "ఒద్దు నక్క బావా, నక్కబావా, ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి మేసి వస్తా; పచ్చకొండకు పోయి పచ్చగడ్డి మేసి వస్తా, అప్పుడు నన్ను తిందువులే" అన్నది మేక. నక్క "సరే" అని ఒప్పుకున్నది. "మళ్లీ రావాలి, తప్పకుండా" అని చెప్పి పంపింది అది. తరువాత మేక నడుస్తూ నడుస్తూంటే ఒక తోడేలు ఎదురైంది. "నాకు ఆకలేస్తోంది, నిన్ను తినేస్తాను" అన్నది. "వద్దు తోడేలు బావా, తోడేలు బావా, ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి మేసి వస్తా; పచ్చకొండకు పోయి పచ్చగడ్డి మేసి వస్తా, అప్పుడు నన్ను తిందువులే" అన్నది మేక. అపుడు ఆ తోడేలు సరే అని ఒప్పుకున్నది. అపుడు మేక నడుస్తూ, నడుస్తూ ఒక పులి దగ్గరకు వెళ్ళింది. అపుడు పులి "నాకు చాలా ఆకలేస్తోంది, నిన్ను తినేస్తాను" అని బెదిరించింది. అందరికీ చెప్పిన విధంగానే ఆ పులికి కూడా చెప్పింది. ఆ పులి కూడా "సరే తొందరగా వచ్చేయి, నాకు చాలా ఆకలివేస్తోంది." అన్నది . అలా పోతూ పోతూ ఆ మేక ఒక సింహం దగ్గరకు వెళ్ళింది. "నాకు చాలా ఆకలేస్తోంది, నిన్ను తినేస్తాను" అన్నది సింహం. అపుడు మేక " వద్దు సింహం బావా, వద్దు. ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి మేసి వస్తా; పచ్చకొండకు పోయి పచ్చగడ్డి మేసి వస్తా" అన్నది. సింహంకూడా ఒప్పుకున్నది. అపుడు మేక ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి మేసి, పచ్చకొండకు పోయి పచ్చగడ్డి మేసింది. అక్కడే ఒక పెద్ద గుమ్మడికాయ కనబడింది దానికి. ఆ మేక గుమ్మడికాయలోకి దూరి కూర్చున్నది. "దొర్లు దొర్లు గుమ్మడికాయ్; దొర్ల కుంటే దోసకాయ్" అని బయలు దేరింది. అలా పోతూ పోతూ ఉంటే సింహం ఎదురౌతుంది. అపుడు సింహం " ఇటుగా ఒక మేక పోయింది. నీవు ఏమైనా చూశావా" అన్నది. అపుడు ఆ గుమ్మడి కాయ "లేదు లేదు నేను వచ్చేదారిలో నాకు ఎవ్వరూ కనబడలేదు." అన్నది. అలా పోతూ, ఉంటే పులి ఎదురైంది. అపుడు ఆ పులి " ఇటుగా ఒక మేక పోయింది. నీవు ఏమైనా చూశావా" అన్నది. అపుడు ఆ గుమ్మడి కాయ "లేదు, లేదు నేను వచ్చేదారిలో నాకు ఎవ్వరూ కనబడలేదు." అన్నది. తరువాత "దొర్లు దొర్లు గుమ్మడికాయ దొర్ల కుంటే దోసకాయ్" అంటూ ఆ గుమ్మడికాయ తోడేలు దగ్గరకు వెళ్లింది. అపుడు ఆ తోడేలు " ఇటువైపుగా ఒక మేక పోయింది. నీవు ఏమైనా చూశావా" అన్నది. అపుడు ఆ గుమ్మడికాయ "లేదు, లేదు" అంటూనే దొర్లుకుంటూ నక్క దగ్గరకు పోయింది. అప్పుడు ఆ నక్క " ఇటుగా ఒక మేక పోయింది. నీకు ఏమైనా కనబడిందా." అన్నది. "లేదు లేదు" అంటూనే ఆ గుమ్మడి కాయ వేగంగా దొర్లుకుంటూ పోయింది. కానీ నక్క చాలా తెలివి గలది కదా, " అరే! గుమ్మడికాయ ఎక్కడైనా మాట్లాడుతుందా" అనుకుని, ఒక రాయిని తెచ్చి గుమ్మడికాయకు అడ్డం పెట్టింది. ఆ దెబ్బకు గుమ్మడికాయ చీలి పగిలి పోయింది. అప్పుడు ఆ మేక చెంగున బయటకు దూకి, నక్కకు అందకుండా తప్పించుకొని ఉరికెత్తుకుంటూ అవ్వ దగ్గరకు చేరుకున్నది. "ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి మేసి వచ్చాను.పచ్చకొండకు పోయి పచ్చగడ్డి మేసి వచ్చాను." అని చెప్పింది సంతోషంగా. కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

తెలివైన కుందేలు

తెలివైన కుందేలు రచన - హర్షిత అనగనగా ఒక అడవిలో కొన్ని తేనెటీగలు, ఒక ఎలుగుబంటి, కుందేలు, ఏనుగు ఉండేవి. తేనెటీగలు పోగుచేసిన తేనెను ఎలుగుబంటి తాగేస్తుండేది. తేనెటీగలు, పాపం, తమ తేనె మొత్తాన్ని ఎలుగు బంటి తాగేస్తోందని బాధ పడుతుండేవి. ఎలాగయినా సరే, ఎలుగు బంటి బారినుండి తప్పించుకునేందుకు ఉపాయం వెతుకేవి. అప్పుడు వాటికి తమ మిత్రుడు కుందేలు గుర్తుకు వచ్చింది. కుందేలుకు తెలివి ఎక్కువ కదా, అందుకని అవి అన్నీ కలసి కుందేలును ఉపాయం అడిగాయి. తమకు సాయం చేస్తే కావలసినంత తేనెను ఇస్తామని మాట ఇచ్చాయి. కుందేలు బాగా ఆలోచించి, తేనెటీగలకు "మీరు తేనె తుట్టెను సింహం గుహ వెనక దాచి పెట్టమ"ని సలహా ఇచ్చింది. ఎలుగుబంటి ఎంత వెతికినా తేనెతుట్టె దానికి కనిపించలేదు. అలా తేనెటీగలకు ఎలుగుబంటి బెడద తప్పింది. అయితే అవి తాము కుందేలుకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు. ఒక రోజు కుందేలు ఇంటికి బంధువులు వచ్చారు. వారికి తీయని తేనె రుచి చూపాలనుకుంది కుందేలు. అది తేనెటీగల దగ్గరకి వెళ్ళి ఇచ్చిన మాటప్రకారం కొంత తేనె ఇవ్వమని అడిగింది. ’నీలాంటి వారికోసం ఇవ్వడానికేనా మేము తేనెను పెట్టుకున్నది?’ అన్నాయి తేనెటీగలు. కోపంకొద్దీ కుందేలు ఎలుగుబంటికి తేనెతుట్టె ఎక్కడ ఉన్నదీ చెప్పేసింది. మళ్లీ ఎలుగుబంటి తేనెను తాగేయడం మొదలు పెట్టింది. తేనెటీగలకు బాధలు మొదటికొచ్చాయి. మళ్ళీ వాటికి కుందేలు సహాయం అడగక తప్పలేదు. అవి కుందేలు దగ్గరకు వచ్చి తమను క్షమించమని వేడుకున్నాయి. కుందేలు వాటిని క్షమించి ఇంకొక ఉపాయం చెప్పింది. పథకం ప్రకారం తేనెటీగలు ఒక తారు డ్రమ్మును తీసుకొని సింహం గుహలో పెట్టాయి. కుందేలు ఎలుగుబంటి దగ్గరకు వెళ్లి "ఎలుగుబంటి మామా! తేనెటీగలు ఒక డ్రమ్మునిండా తేనెను చేసి గుహలో దాచి పెట్టాయి, మనం ఈ రోజు రాత్రి చీకటి పడిన తరువాత వెళ్లి దాన్నంతా తాగేద్దాం" అని చెప్పింది. అయితే ఎలుగు బంటి కుందేలుకంటే ముందు తానే వెళ్ళి తేనెను తాగెయ్యాలనుకుంది. చీకటి పడుతుండగానే ఒంటరిగా గుహ దగ్గరకు వెళ్లింది. చీకట్లో డ్రమ్ములోపల ఏముందో సరిగా కనబడలేదు. తారును చూచి నిజంగానే తేనె అనుకున్నది. దాన్ని అందుకునే ప్రయత్నంలో డ్రమ్ములోకి దూరి, తారు కారణంగా అందులోనే ఇరుక్కు పోయింది. హాహా కారాలు చేస్తున్న ఎలుగుబంటిని తేనెటీగలు, కుందేలు వచ్చి చూశాయి. తప్పును తెలుసుకున్న ఎలుగుబంటి తనను కాపాడమని మొరపెట్టుకున్నది. అప్పుడవి తమ మిత్రుడైన ఏనుగు సహాయంతో ఎలుగుబంటిని డ్రమ్మునుండి బయటికి తీసి శుభ్రం చేశాయి. అందరూ మిత్రులైనారు. తాము ప్రత్యేకంగా చేసిన తేనెతో తేనెటీగలు అందరికీ విందు చేశాయి. కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

జెండా వందనం

జెండా వందనం రచన: మోహనయ్య నా పేరు రాజు. మా చెల్లి జ్యోతి. మాఇంట్లో నేను, జ్యోతి, మా అమ్మ, నాన్న నలుగురమే ఉంటాం. మా ఊళ్లో ప్రాధమిక పాఠశాల ఒకటి ఉంది- చాలా మంది పిల్లలం బడికి పోతుంటాం, ఆగస్టు 15న మా బళ్లో స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుందామన్నారు మా అయ్యవారు. అందరం సంబరంగా సరేనన్నాం. ఎవరెవరు ఏం తెస్తార్రా అంటే పిల్లలంతా ఉత్సాహంగా మేం ఇవి తెస్తామంటే ఇవి తెస్తామని చెప్పటం మొదలెట్టారు. రవి వాళ్ల నాన్న మిఠాయి దుకాణం నడుపుతాడు- అందరికీ స్వీటు తెచ్చిస్తానన్నాడు రవి. లత వాళ్లమ్మనడిగి అందరు ఆడపిల్లలకూ సరిపడ మల్లెపూలు తెస్తానన్నది. నేను జ్యోతి మాత్రం ఏమీ అనలేక ఊరికే ఉండిపోయాం. మా యింట్లో పరిస్థితి సరిగా లేదు. మా అమ్మ, నాన్న ఇద్దరూ అడవికి వెళ్లి పని చేసినా మాకు భోజనానికే సరిపోవటం లేదు- ఇక బడికి మేం ఏమివ్వగలం? "ఏం రాజూ- జ్యోతీ, మీరు కూడా ఏదైనా తెచ్చివ్వాలర్రా," అన్నారు అయ్యవారు. మేం బదులు చెప్పకుండా నిల్చున్నాం. " మీరిద్దరూ ఈ పండగకు అతిముఖ్యమైన జెండా తీసుకు వచ్చి ఇవ్వాలి. -సరే, పిల్లలూ, మీరంతా ఉతికిన బట్టలు వేసుకొని చక్కగా తయారై రేపు ఉదయం 8 గంటలకల్లా బడికి రండి. జెండావందనం పాటలు నేర్చుకొని రావాలి, సరేనా అన్నారు అయ్యవారు. రాజు, జ్యోతి కాళ్లీడ్చుకుంటూ ఇంటిదారి పట్టారు. "ఏం చేద్దామంటావు?" అడిగాడు రాజు. "ఏముంది, అమ్మనడుగుదాం, జెండా కొనాలంటే ఏమైనా డబ్బులిస్తుందేమో" అన్నది జ్యోతి. " అలాకాదు, అమ్మ దగ్గర మాత్రం డబ్బులు ఎక్కువ ఉండవు కదా" అన్నాడు రాజు. "ఒక పని చేస్తే?, మనమే జెండా తయారు చేస్తే? " అన్నది జ్యోతి. రాజు ముఖం వికసించింది- " అవును. మనం జెండాను తయారు చేద్దాం! అందరూ జెండాలు కొంటారు; కానీ మనం మనింట్లో ఉన్న పాత ధోవతీతో జండాని తయారు చేయచ్చు!" అన్నాడు రాజు. వెంటనే ఇద్దరూ ఉత్సాహంగా పనిలోకి దిగారు. జ్యోతి ఇంటికి పరుగెత్తి వాళ్లమ్మ నడిగి ట్రంకు పెట్టెలో ఉన్న పాత ధోవతీని బయటికి తీసింది. రాజు అడవికి పోయి దొండతీగ ఆకులు, గరకమాకులు, దొండ పండ్లు, నాగజెముడు-పాపచ్చికాయలు కోసులు వచ్చాడు. వాళ్లమ్మ సూది-దారంతో బట్టను సరైనవిధంగా మడిచి జెండా ఆకారంలో కుట్టిపెట్టింది. ఇద్దరూ కలిసి కూర్చుని, బట్టను మూడు భాగాలుగా చేశారు. దొండపండ్లు, నాగజెముడు పండ్లను బాగా పిసికి పై భాగంలో రుద్దారు. బండమీద ఆకుల్ని బాగా మెత్తగా నూరి ఆ పసరును జెండా క్రింది భాగానికి పట్టించారు. జ్యోతి ఈతబర్రను సన్నగా చీల్చి, దాన్ని బ్రష్ గా వాడుతూ, ఇంకుతో జెండా మధ్యలో చక్రాన్ని గీసింది. అంతే, ముచ్చటైన జెండా తయారైంది! మా ఆనందానికి అవధులు లేవు.మేం చేసిన పనికి అయ్యవారు ఏమంటారోననుకుంటూనే మరునాడు ఏడు గంటలకల్లా బడికి చేరుకున్నాం. చాలామంది పిల్లలు అప్పటికే వచ్చి ఉన్నారు. అయ్యవారు కూడా వచ్చేశారు. మేం మాత్రం ఎవ్వరితోటీ మాట్లాడకుండా వెళ్ళి, జెండాలో పూలరెక్కలు వేసి, మడిచి కట్టి, తాడుతో పైకి ఎక్కించాం. ఎవరేమంటారో నని మా గుండెలు పీచు పీచు మంటున్నాయి.. అలాగే అన్య మనస్కంగా ఉండిపోయిన మేం కార్యక్రమం మొదలైన సంగతినే గమనించలేదు. జెండా వందనం ఇంకా కాకుండానే, అయ్యవారు చెబుతున్నారు: " ఈ రోజున మనం రాజు-జ్యోతి లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. మన పండుగకు చాలా ప్రత్యేకమైన జెండాని తయారు చేసి తెచ్చారు వాళ్ళు. దానిలో ఉన్నవి సామాన్యమైన రంగులు కావు. వాళ్ల హృదయాలలోని బాధ్యత, వాళ్లలోని సహజత్వం మన జెండా రంగులుగా రూపుదిద్దుకున్నాయి. వీరు చేసిన పని కారణంగా ఈనాటి ఈ పండుగ మరపురానిదైంది. వీరి మనసుల్లో ఉన్నంత స్వచ్ఛత మనందరిలోనూ ఉంటే మన దేశ గౌరవం అనంతకాలం నిలబడుతుంది.".... ఈ మాటలు విన్న మా గుండెలు సంతోషంతో చిందులు వేశాయి. ఆ తరువాత ఇంకెన్నడూ మా బడి పిల్లలెవ్వరూ జెండాలు కొనలేదు- ప్రకృతి దయతో అన్ని రంగులు అందిస్తుంటే, వాటినిక కొనాల్సిన అవసరం ఏముంది?

రాజు మంగలి

  రాజు మంగలి   రచన: హనుమంతు   ఏదైనా తప్పు పని చేస్తే అంతరాత్మ ఘోషిస్తుంది. " తప్పు చేశావ్, తప్పు చేశావ్" అంటుంది. దానితో మన జీవితం నరకప్రాయమౌతుంది. తప్పు చేయకుండా ఉంటే ఈ నరకం తప్పుతుంది గదా? దీన్ని గురించి మనకు హనుమంతన్న రాసిన "రాజు మంగలి" కధ బాగా చెబుతుంది. చదవండి. అనగననగా ఒక రాజు ఉండేవాడు. ఆరాజుకు గడ్డం పెరిగిపోయింది. గడ్డం తీయించుకోవాలనుకున్నాడు. సేవకులను పిలిచి మంగలిని పిలుచుకొని రమ్మని చెప్పినాడు. సేవకులు మంగలిని పిలుచుకు రావడానికి పోయి చాలా సేపటికి కూడా రాలేదు. రాజు కూర్చున్న చోటే నిద్రపోయినాడు. మంగలి నిద్రపోతున్న రాజును లేపితే ఏమంటాడో, ఏమి శిక్ష విధిస్తాడో అని భయపడి రాజుకు మెలుకువ రాకుండా గడ్డం తీసేసినాడు. గడ్డం తీయడానికి కావలసిన నీళ్లను వెండి గిన్నెలో ఇచ్చినారు సేవకులు. గడ్డం తీసేటపుడు ఆ మంగలికి ఒక దుర్బుద్ధి పుట్టింది. అది ఏమంటే, వెండి గిన్నె తీసుకు పోదామని . గడ్డం తీసేలోపు పూర్తిగా నిర్ణయించుకొని, వెండి గిన్నెను సంచిలో పెట్టుకొని మంగలి వెళ్ళి పోయినాడు. ఇంటికి పోయిన తరువాత మంగలికి భయం వేసింది. ’వెండి గిన్నెను నేనే తీసుకున్నానని రాజుకు తెలిసి ఉంటుందేమో , ఉరి శిక్ష వేస్తాడేమో’ అని రకరకాలుగా ఆలోచిస్తున్నాడు. మంగలికి ఈ ఆలోచనలతో ఊర్లో ఉండాలనిపించలేదు. అడవిలోకి పోయినాడు. పగలంతా అడవిలో ఉండి , రోజూ రాత్రికి ఊళ్ళోకి వచ్చేస్తున్నాడు . అడవిలోఉన్నాగాని అతని మనస్సు మాత్రం భయం భయంగా ఉంది. ఎవరన్నా కనిపిస్తే "ఊళ్ళో ఎవరన్నా ఏమన్నా అనుకుంటున్నారా?"అని అడుగుతాడు. అలా భయపడుతూనే ఒక తంగేడు చెట్టుకింద గుంత తీసి వెండి గిన్నెను ఆ గుంతలో పూడ్చిపెట్టినాడు. మళ్ళీ ఎవరన్నా కనపడితే "ఏమన్నా, వెండిగిన్నె -గిండి గిన్నెఅనుకుంటూ వుండిరా ఊర్లో ! తంగిడి చెట్టు గింగడి చెట్టు అనుకుంటాండారా ఊర్లో?" అంటూ భయంగా అడిగేవాడు. అయితే నిద్రపోతున్న రాజుకు మెలుకువ వచ్చేసి చూస్తే, గడ్డం లేదు! బాగా నున్నగా ఉంది! "అరే నాకు మెలుకువ రాకుండా గడ్డం తీసేసినాడంటే ఆ మంగలికి ఎంతో నైపుణ్యం ఉంది. ఖచ్చితంగా అతనికి బహుమానం ఇవ్వాల"ని రాజు నిర్ణయించుకున్నాడు. సేవకులతో మంగలిని పిలుచుకురమ్మని చెప్పి పంపాడు. సేవకులు ఊరంతా వెతికినా ఎక్కడా మంగలి కనిపించలేదు. ఆ విషయాన్ని రాజుకు చెబితే, "మీరు మంగలిని ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుని రావాల్సిందే" అని చెప్పినాడు. సేవకులు ఊరంతా మరోసారి వెతికి అడవిలోకి పోయారు. అడవిలో సేవకులు పోతుంటే మంగలికి గుండె దడదడ అంటోంది. పట్టుకొని పోతారని, ఏమి చేస్తారోనని భయం వేసింది . చివరికి వారి చేతుల్లో చిక్కక తప్పలేదు మంగలికి. ఎన్నిరోజులు దాగగలడు? రాజు పిలుస్తున్నాడని సేవకులు మంగలిని పిలుచుకుపోయినారు. రాజు దగ్గరకు పోతావుంటే మంగలికి చాలా భయం వేస్తా వుంది. కాని మంగలి అనుకున్నట్లు రాజుకు వెండి గిన్నెమీద ఆలోచనలేదు. రాజుకు ఎన్నో వెండి గిన్నెలు ఉంటాయి. కాని మంగలికి అనుమానం పోలేదు. రాజు మంగలితో "నాకు మెలుకువ రాకుండా గడ్డం తీశావు. నీలో చాలా నైపుణ్యం ఉంది. ఇదిగో ఈ బంగారు హారం బహుమానంగా ఇస్తున్నాను తీసుకో" అని బంగారు హారం బహుమానంగా ఇచ్చినాడు. రాజు ప్రవర్తనకు మంగలికి నోటమాట రాలేదు.

బంగారు బిందె

  బంగారు బిందె   సేకరణ: ఓమలత, మూడవ తరగతి, టింబక్టు బడి, చెన్నేకొత్తపల్లి, అనంతపురం జిల్లా.   కట్టెలు కొట్టేవాడి చేతిలోంచి గొడ్డలి జారి కింద పడింది.. నీటి దేవత బంగారు గొడ్డలి తెచ్చింది.. ఈ కథ తెలిసిందే కదా? అనేక రూపాలలో ఈ కథ ఆంధ్రదేశం అంతటా వ్యాప్తిలో ఉంది. దాని ఒక రూపాన్ని ఓమలత మీతో పంచుకుంటోంది. చూడండి: ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకు ఇద్దరు భార్యలు. వాళ్లలో మొదటి భార్య చాలా చెడ్డది, రెండవ భార్య చాలా మంచిది. ఒకరోజు చిన్న ఆయమ్మ పెద్ద ఆయమ్మను దూరంగా ఉన్న బావినుండి నీళ్లు తెమ్మని పంపించింది. చిన్న ఆయమ్మ ’సరే’ అని వెండి బిందె పట్టుకొని బావి దగ్గరకు వెళ్లింది. అయితే ఆమె చేతిలోంచి బిందె జారి నూతిలో పడిపోయింది. బిందె పోగొట్టుకున్నందుకు ఆమె చాలా బాధపడింది- లోతుగా ఉన్న బావిలోకి దిగలేక ఏడిచింది. అప్పుడు ఆ బావిలోంచి గంగా దేవత ప్రత్యక్షమైంది. ఆమె తన చేతిలో ఒక బంగారు బిందెను పట్టుకొని ఉన్నది. ’ఇదేనా, నీ బిందె? బంగారు బిందె?’ అని అడిగింది. ’కాదు’ అన్నది చిన్న ఆయమ్మ. గంగా దేవి వెళ్లి, ఈసారి ఇత్తడి బిందెతో తిరిగి వచ్చింది: ’ఇదేనా నీ బిందె? ఇత్తడి బిందె?’ అని అడిగింది. ’కాదు’ అన్నది చిన్న ఆయమ్మ. మళ్లీ గంగాదేవి వెళ్లి, ఈసారి ఆయమ్మ బిందెతోనే తిరిగి రాగానే, చిన్న ఆయమ్మ ’అదే, అదే, నా బిందె!’ అన్నది. ఆ దేవత ఆయమ్మ మనసును తెలుసుకొని చాలా సంతోషపడింది. ’ఈ మూడు బిందెలూ నువ్వే తీసుకో, చాలా మంచిదానివి’ అన్నది. అని, ఆయమ్మకు మూడు బిందెలూ ఇచ్చేసింది. చిన్నాయమ్మ మూడు బిందెలూ పట్టుకొని సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చింది. ఇది చూసిన పెద్దాయమ్మ ఊరుకోలేదు. ’ఇన్ని బిందెలు ఎక్కడివి?’ అని అడిగింది. ’నాకు బావిలో దేవత ఇచ్చింది’ అని చిన్నాయమ్మ చెబితే, పెద్ద ఆయమ్మ కూడా పోయిందక్కడికి, బిందెలకోసం. ఊరికే యాక్షన్ చేసుకుంటూ పోయి, కావాలని తన ఇత్తడి బిందెను బావిలోకి జారవిడిచింది. గంగా దేవి ఆమె బిందెనే తీసుకొని ప్రత్యక్షమైంది: ’ఈ బిందె నీదేనా?’ అని అడిగింది. ’ఉహుఁ, కాదు’ అన్నది పెద్ద ఆయమ్మ. ’అయితే ఇది నీదేనా’ అన్నది గంగాదేవి, వెండి బిందెను తెచ్చి. ’కాదు’ అన్నది పెద్దాయమ్మ బంగారు బిందెపైన ఆశతో. మళ్లీ గంగాదేవి బంగారు బిందెను తేగానే ’అదే, అదే, నాబిందె!’ సంతోషంతో అరిచింది పెద్దాయమ్మ. దాంతో గంగాదేవికి చాలా కోపం వచ్చింది. ’నువ్వు చాలా చెడ్డదానివి, నీకు ఏబిందే ఇవ్వను పో’ అని ఆమె మాయం అయిపోయింది. దాంతో పెద్దాయమ్మకు బుద్దివచ్చి మంచిదైపోయింది. ఆనాటినుండి ఆశపోతుగా ఉండకుండా మంచిగా ఉండింది.      

చలి చీమలు

చలి చీమలు   కథకురాలు : కల్యాణి       పద్యానికో కథ శీర్షికన ప్రతినెలా ఓ కథ రాస్తానంది కల్యాణి. ఆవిడ ప్రకృతి బడిలో పిల్లలకు పాఠాలు చెబుతుంటుంది. చిన్న చిన్న చీమలు కలిసి పెనుబామును ఎలా వదిలించుకున్నాయో ఈ కథలో చూడచ్చు. సుమతీ శతక కారుడు బద్దెన రాసిన ఈ పద్యం పోరాటాలకు స్ఫూర్తినిస్తుందని అనేకమంది భావిస్తుంటారు. ఒక అడవిలో నల్ల చీమల పుట్ట ఒకటి ఉండేది. నల్లచీమలంటే, గండు చీమలు కావు- కుట్టకుండా ఊరికే మన ఒంటిమీద గబగబా పాకుతాయే, ఆ చీమలన్నమాట. వర్షం పడేముందు అవి గుంపులు గుంపులుగా బయలుదేరి ఒక చోటునుండి ఒక చోటికి మారిపోతుంటాయి- అందుకే వాటిని ’చలి చీమలు’ అంటారు కొందరు. అయితే, ఈ చీమల పుట్ట ఒక చెట్టు నీడన ఉండేది. అందువల్ల దానికి వర్షపు భయం లేదు. చాలా సంవత్సరాలుగా దానిలో చీమలు నివసిస్తూ వచ్చాయి; అందులో చాలా సౌకర్యాలూ అవీ ఏర్పరచుకున్నాయి; చాలా సుఖంగా ఉంటున్నాయి. కానీ రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. సుఖాలే ఎప్పుడూ ఉండాలంటే వీలవదు- కష్టాలూ వస్తాయి; వాటినీ తట్టుకొని నిలబడాలి. ఈ చీమలకు కూడా ఒక కష్టం వచ్చి పడింది- ఎక్కడినుండి వచ్చిందో, ఒక పాము చెట్టు తొర్రలోకి వచ్చి చేరుకున్నది. ఎప్పుడైనా వాన పడిందంటే, ఆ పాము చెట్టుదిగి వచ్చేది; చీమల పుట్టలోకి దూరేది. చీమలు పుట్టను తయారు చేసుకున్నది పాముకోసం కాదుగదా, అందువల్ల దానిలోపల దారులు సన్నగా, ఇరుకుగా ఉండేవి. పాము పుట్టలో దూరి, అటూ ఇటూ దారి చేసుకుంటూ, ఒళ్లు విదిలించుకుంటూ, రుద్దుకుంటూ ముందుకు, వెనక్కు, పక్కలకు తిరుగుతుంటే, పాపం, చీమలు శ్రమపడి కట్టుకున్న గోడలు కూలిపోయేవి, చాలా చీమలు చచ్చిపోయేవి, చాలా చీమలకు గాయాలయ్యేవి, అవి కష్టపడి జమచేసుకున్న ఆహారం మట్టిపాలయ్యేది. చీమలన్నీ కలిసి పాముకు చెప్పి చూశాయి- " అయ్యా, పాము గారూ, మేం ఇన్నాళ్లుగా శ్రమపడి కట్టుకున్న ఈ పుట్టను వదిలి పెట్టండి, మీరు వేరే ఏదైనా మంచి తావును చూసుకోండి, మీరు ఇందులో దూరినప్పుడల్లా మేం చీమలం, వేల సంఖ్యలో చచ్చిపోతున్నాం.. దయచూడండి" అని మళ్లీ మళ్లీ మనవి చేసుకున్నాయి. అయినా ఆ పాము వినలేదు. చలి చీమల బాధను అర్థం చేసుకోలేదు. చీమల గోడును పట్టించుకోలేదు. వర్షం వచ్చిన ప్రతిసారీ కావాలని పుట్టలోనే దూరి నవ్వేది, కావాలని పుట్టలో అన్నివైపులా తిరిగి, ఇంకా ఎక్కువ చీమల్ని చంపటం మొదలు పెట్టింది. చలి చీమల దవడలు ఎర్రచీమల దవడల మాదిరి గట్టిగా ఉండవు. ఎర్రచీమలు కుడితే చాలా నొప్పి పుడుతుంది; కానీ చలిచీమలు కుడితే అంత నొప్పి పుట్టదు. అయినా అవి పాము పెట్టే బాధని భరించలేకపోయాయి. ఒక రోజున కలిసి అనుకున్నాయి- "ఈసారి పాము వస్తే ఊరుకోకూడదు.. కసి తీరా కుట్టాలి, చచ్చిపోయినా పరవాలేదు" అని. ఇంకోసారి పాము పుట్టలోకి దూరగానే చీమలన్నీ కలిసి దాని మీద దాడి చేశాయి. పాము అటూ ఇటూ కొట్టుకున్నది, విదిలించుకున్నది, దొర్లింది, ఏం చేసినా చీమలు మాత్రం దాన్ని వదలలేదు. వేల వేల చీమలు చచ్చిపోయాయి; కానీ వాటి స్థానంలో మరిన్ని చీమలు వచ్చి కుట్టాయి. చివరికి అంత పెద్ద పాము కూడా తట్టుకోలేక చచ్చిపోయింది. కలసి పోరాడి చలిచీమలు తమ కష్టాలనుండి విముక్తి పొందాయి. అందుకే అన్నారు: ’బలవంతుడ, నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేలా? బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి చావదె సుమతీ’ అని.  నిజమే కదూ?

అవ్వ-కాకి

అవ్వ-కాకి కథకుడు: పోతి రెడ్డి, 2వ తరగతి చిత్రం: అడవి రాముడు     అవ్వ రొట్టెను కాకి ఎత్తుకుపోయింది..గొడ్డలి చెట్టును కొట్టేయనంది.. ఎలుక గొడ్డలిని కొరికేయనంది.. కథ గుర్తుందా? అవన్నీ ఎందుకు పని చేయనన్నాయి? ఎందుకంటే ఆ ముందువి తమకు నష్టం కలిగించలేదు కదా, అందుకనట! అలా నడుము వంచని జీవాలన్నీ చివరికి ఎలా దారికి వచ్చాయో మరి, ఈ అద్భుత జానపద కథ చదివితే అర్థం అయిపోతుంది. కష్టాలు తమమీదికి వచ్చినప్పుడు, జీవిలో దయ దాక్షిణ్యాలకంటే ఆత్మ రక్షణ వ్యవస్థే బలవత్తరంగా ప నిచేస్తుందని చెబుతున్నట్లుంది ఈ కథ. ఒక ఊరిలో ఒక అవ్వ ఉండేది. ఆ అవ్వ ఒకనాడు రొట్టె చేస్తోంది. అంతలో ఒక కాకి వచ్చి ఆ రొట్టెను ఎత్తుకెళ్ళి చెట్టు మీద కూర్చుంది. అవ్వ అన్నది "కాకీ కాకీ నా రొట్టె ఇచ్చెయ్, నాకు ఆకలిగా ఉంది" అని. అయినా కాకి రొట్టెను ఇవ్వలేదు. అప్పుడు ఆ అవ్వ చెట్టు దగ్గరకు వెళ్లి, "చెట్టూ, చెట్టూ, కాకి నా రొట్టెను ఎత్తుకుపోయింది, ఇవ్వమంటే ఇవ్వటం లేదు, అందుకని కాకి గూడును తోసేయ్" అన్నది. అప్పుడు ఆ చెట్టు "నేనేమీ తోసెయ్యను, కాకి నాకేమీ చెయ్యలేదు కదా?" అన్నది. అప్పుడా అవ్వ ఇంకేమీ చెయ్యలేక కట్టెలు కొట్టే ఆయప్ప దగ్గరకు పోయింది. "కట్టెలు కొట్టే ఆయప్పా, కట్టెలు కొట్టే ఆయప్పా, కాకి నా రొట్టెను ఎత్తుకుపోయింది, చెట్టు కాకి గూడును తోసేయనంది, నువ్వు చెట్టును కొట్టేయవా?" అని అడిగింది. "ఉహుఁ., నేను కొట్టేయను. చెట్టు నాకేమీ నష్టం చెయ్యలేదు" అన్నాడు కట్టెలుకొట్టే ఆయప్ప. "సరేలే", అని ఆ అవ్వ ఎలుక దగ్గరకు వెళ్లింది. "ఎలుకా, ఎలుకా, కాకేమో నా రొట్టె ఎత్తుకు పోయింది; చెట్టు గూడు తోసేయనంది; కట్టెలు కొట్టే ఆయప్ప చెట్టును కొట్టేయనన్నాడు, అందుకని నువ్వు పోయి ఆయప్ప గొడ్డలిని కొరికేసెయ్" అని అడిగింది. "నేను కొరకను, కట్టెలాయప్ప నాకేం నష్టం చేయలేదు" అన్నది ఎలుక. అప్పుడా అవ్వ "సరేలే" అని పిల్లి ఉండే తావుకు పోయింది. "పిలీ, పిల్లీ, కాకేమో నా రొట్టె ఎత్తుకుపోయింది; చెట్టేమో గూడును తోసేయనంది; కట్టెలాయప్ప చెట్టును కొట్టేయనన్నాడు; ఎలుక గొడ్డలిని కొరికేయనన్నది, నువ్వు పోయి ఎలుకను తినేసెయ్యి" అన్నది. కానీ పిల్లి ఒప్పుకోలేదు- "నువ్వు చెప్పిందైతే బాగానే ఉంది, కానీ అలాచెయ్యను. ఎలుక నన్నేమీ చెయ్యలేదు" అన్నది పిల్లి. "సరేలే" అని అవ్వ కుక్క దగ్గరకు వెళ్లింది. "నా ప్రియమైన కుక్కా, నా ప్రియమైన కుక్కా, కాకేమో నా రొట్టె ఎత్తుకుపోయింది; చెట్టేమో గూడును తోసేయనంది; కట్టెలాయప్ప చెట్టును కొట్టేయనన్నాడు; ఎలుక గొడ్డలిని కొరికేయనన్నది; పిల్లి ఎలుకను తినెయ్యనన్నది- నువ్వు పోయి పిల్లిని తినేసెయ్యి" అన్నది. అది "సరే" అని పోయి, పిల్లి వెంట పడింది అప్పుడా పిల్లి వణికిపోతూ "వద్దొద్దు, నన్ను చంపద్దు- నేను పోయి ఎలకను చంపేస్తాను" అని ఎలక వెంట పడింది. అప్పుడా ఎలక "వద్దొద్దు, నన్ను చంపద్దు, నేను గొడ్డలిని కొరికేస్తాను" అని గొడ్డలి మీద కెళ్లింది. అప్పుడా కట్టెలు కొట్టే ఆయప్ప "వద్దొద్దు, నా గొడ్డలిని కొరకద్దు, నేను చెట్టును కొట్టేస్తాను" అని చెట్టు మీదికి వెళ్లాడు. అప్పుడా చెట్టు "వద్దొద్దు, నన్ను నరకద్దు; నేను కాకిగూడును తోసేస్తాను" అని కాకి గూడును తోసేసింది. దాంతో కాకి నోట్లోని రొట్టెముక్క జారి క్రింద పడిపోయింది. అప్పుడా అవ్వ దాన్ని తీసుకొని సంతోషంగా ఇంటికి పోయింది.