గనగనగనగా..

గనగనగనగా.. - టి.వంశి అనగనగా ఇద్దరు మిత్రులు ఉండేవారు. ఇద్దరూ కలిసి అడవిగుండా ఆ పక్క ఊరికి వెళ్దామనుకున్నారు. దారిలో వారికి ఒక పెద్ద నల్లతాడు, ఒక అగ్గిపెట్టె దొరికాయి. ఇంకొంచెం దూరం పోగానే వారికి పుండుతో బాధ పడుతున్న ఒక గాడిద దొరికింది. దానిని నడిపించుకొని పోతుంటే వారికి దారిలో ఒక సున్నం డబ్బా, గడ్డపార కూడా దొరికాయి. ఇంతలో చీకటి పడింది. ’ఎట్లా’ అనుకుంటుండగానే ఒక గుహ కనిపించింది. దానిలో నిద్రపోదామనుకున్నారు. కానీ దానిలో దయ్యాలున్నాయి వారికేమో తెలియదు. ఒక తలుపు ఉంటే లోపలికి వెళ్ళి గొళ్ళెం పెట్టుకున్నారు. బయటినుండి రెండు దయ్యాలు వచ్చి తలుపు తీయమని అరవడం మొదలు పెట్టాయి. అవి ఎంత అరిచినా వీళ్లు తలుపు తెరవలేదు. అప్పుడు దయ్యాలు ’మీరు ఎవరు?’ అని అడిగాయి. వారు "మేము దయ్యాలము" అని చెప్పారు. "మిమ్మల్ని ఎలా నమ్మాలి?" అని అడిగాయి అవి. "మమ్మల్ని నమ్మాలంటే మా జుట్టు చూడండి" అని వాళ్ళు నల్లతాడును బయటికి చూపారు. "ఇంకా కావాలంటే మా ఉమ్మిని చూడండి" అని సున్నండబ్బాని కిటికీలోనుండి బయటికి వంచారు. దానితో బయటి దయ్యాలు భయపడ్డాయి. "మీ అరుపును వినిపించండి" అన్నాయి దయ్యాలు మళ్ళీ. వాళ్ళు అగ్గిపెట్టెతో నిప్పురాజేసి, గడ్డపారను ఎర్రగా కాల్చారు. దానితో గాడిద పుండును కాల్చారు. అది గట్టిగా అరిచి తలుపు విరిగేటట్లు ధనధనా తన్నింది. దాని వెనకే పరుగెత్తుకొచ్చిన మిత్రులిద్దరూ బయటికి దూకి, తమ చేతిలోని గడ్డపారతో దయ్యాల వెంటపడ్డారు. అవి రెండూ భయంతో తోకముడిచి పరుగుపెట్టాయి.

కోడి పెట్ట కథ

కోడి పెట్ట కథ - సుధ అనగనగా ఒక ఊరుండేది. ఆ ఊళ్ళో ఇద్దరు దంపతులు ఉండేవారు. వారు మాంసం అంటే చాలా ఇష్టం. ఒకనాడు వాళ్ళిద్దరూ కోడికోసం కోళ్ళ అంగడికి పోయి, ఒక కోడిపెట్టని తీసుకొని ఇంటికెళ్ళారు. అయితే అప్పటికే చీకటి పడింది. దాంతో మరుసటి రోజు తెల్లవారిన తరువాత కోడిని కొసుకోవచ్చుననుకొని, దాన్ని ఒక గంపకింద మూసి, నిద్రపోయారు.. అయితే ఆ కోడి గంపకిందనుండి చాలా తెలివిగా తప్పించుకొని వెళ్ళి, ఒక పెద్ద అడవిలోకి పారిపోయింది. అక్కడ ఒక చెట్టుపైకి ఎక్కి కూర్చొంది. సరిగ్గా అప్పుడే ఆ అడవిగుండా ఒక ఇటుకల బండి పోతూ ఉన్నది. ఆ బండిలోనుండి కొన్ని ఇటుకలు పడిపోయాయి. కోడిపెట్ట ఆ ఇటుకలను తీసుకొనిపోయి ఒక ఇంటిని కట్టుకొని, దానిలో మూడు గుడ్లను పెట్టింది. ఆ మూడింటినీ పొదిగింది. ఆశ్చర్యం! పొదిగిన గుడ్లు మూడింటినుండీ అందమైన అమ్మాయిలు ముగ్గురు పుట్టారు. ఇలా కొంత కాలం గడిచింది. అమ్మాయిలు ముగ్గురూ పెరిగి పెద్దవారయ్యారు. వాళ్ళిప్పుడు చాలా అందంగా ఉన్నారు. పెద్దకూతురికీ, రెండవ కూతురికీ తమ తల్లి ఒక కోడి అని చెప్పుకోవడం ఇష్టం ఉండేదికాదు. చిన్న కూతురికిమాత్రం తల్లంటే చాలా ప్రేమ. ఇలా ఉండగా మూడు రాజ్యాలకు చెందిన ముగ్గురు రాకుమారులు అడవిలోకి వేటకని వెళ్ళారు. వేటాడుతూ వాళ్ళు చాలా తిరిగారు. వారికి చాలా దాహం వేసింది. కానీ ఎక్కడా నీళ్ళు మాత్రం దొరకలేదు. చివరికి రాకుమారులు వేటకుక్కలపై ఆధారపడవలసి వచ్చింది. కుక్కలు ముందు నడవగా రాకుమారులు వాటి వెనకనే వెళ్ళి, కోడి పెట్ట ఇంటిని చేరుకొని, నీళ్ళు అడిగారు. ఇంట్లోనుండి ముగ్గురు అందమైన అమ్మాయిలు వచ్చి వారికి ముగ్గరికీ నీళ్ళిచ్చారు. వారి అందానికి ముగ్దధలైన రాకుమారులు వారిని ’పెళ్ళి చేసుకుంటామని, తమతో పాటు అంత:పురానికి తీసుకుపోతామ’ని అన్నారు. అందుకు ఆ అమ్మాయిలుకూడా ’సరే’నన్నారు. పెద్ద కూతుళ్ళిద్దరూ వాళ్ల అమ్మను కూడా పట్టించుకోకుండా, రాకుమారుల వెంట వెళ్ళిపోయారు. మూడవ అమ్మాయి మాత్రం వాళ్ల అమ్మ వచ్చేంతవరకూ ఆగి, తనతో పాటు ఆ కోడిపెట్టనూ తీసుకెళ్ళింది. కొంతకాలం అయ్యాక , కోడిపెట్టకు తన పెద్దకూతుళ్లిద్దరినీ చూడబుద్దయింది. చిన్న కూతురు వద్దన్నా వినకుండా వారిని చూసి వస్తానని బయలుదేరింది. ముందుగా అది పెద్ద కూతురి ఇంటికి వెళ్ళింది. ఆమె ’నువ్వెవరివో నాకు తెలియదు పొమ్మం’టూ, కోడిమీదికి ఒక కట్టెను విసిరింది. కోడి కాలు విరిగిపోయింది. అది బాధతో రెండవ కూతురి దగ్గరకు వెళ్ళింది. రెండవ కూతురుకూడా కట్టెతో కొట్టింది. దానికి ఒక రెక్క విరిగిపోయింది. నిరాశచెందిన కోడిపెట్ట చాలా బాధతో తిరిగి చిన్న కూతురినే చేరుకున్నది. చిన్న కూతురు ఏడుస్తూ అమ్మను తన ఒడిలోకి తీసుకొంది. కూతురు ఒడిలో నిస్సహాయంగా పడిఉన్న కోడిపెట్ట తన జీవిత గమనాన్ని ఒకసారి మననం చేసుకున్నది. ’జాలిలేని మనుషుల ప్రపంచం తనను ఒకసారి కసాయి అంగట్లో బలిగోరింది. విది వశాన తను తప్పించుకోగలిగింది. ఆ తరువాత మరోసారి దంపతుల బుట్టక్రిందినుంది పారిపోయి అడవితల్లి రక్షణపొంది, బ్రతికిపోయింది. అయినా తనకు మనుషుల బెడద తప్పలేదు: చివరికి తన సొంత బిడ్డలే మనుషులై, మనుషుల్ని మనువాడి, వారి సంపర్కంతో తామూ మానవ గుణాలను అలవరచుకొని, తనను అంతం చేస్తున్నారు! కాలగమనంలో మానవజాతికి ఇతర జంతువుల దు:ఖాన్ని అర్దం చేసుకునే శక్తి కలిగితే తప్ప తమ జాతికి నిష్కృతి లేదు.’ అంతే! కోడిపెట్ట చనిపోయింది. చనిపోయిన కోడిపెట్టను చిన్న కూతురు తమ తోటలో పాతిపెట్టింది. ఆమే, ఆమె భర్త ఇద్దరూ జంతువుల్ని, పక్షుల్ని మనసారా ప్రేమిస్తూ, వాటి రక్షణకై తమ శక్తి యుక్తుల్ని ఆసాంతం వెచ్చించారు.

ఓనకే ఓబవ్వ

ఓనకే ఓబవ్వ - G.పుష్ప ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో ఉన్న చిత్రదుర్గలో పుట్టింది ఓబవ్వ. 18వ శతాబ్దికి చెందిన ఓబవ్వ గురించి తెలీనివాళ్ళు ఆ ప్రాంతంలో లేరంటే అతిశయోక్తి కాదు. మహిళల స్థైర్యానికీ, ధైర్య సాహసాలకూ పెట్టిన పేరైన ఓబవ్వను కర్ణాటక వాసులు ఈనాటికీ గర్వంగా తలచు-కుంటుంటారు. ఆరోజుల్లో చిత్రదుర్గను 'మదకరి నాయకుడు' అనే రాజు పరిపాలించేవాడు. చిత్రదుర్గను శత్రువుల బారి నుండి కాపాడు-కోవటంలోనే ఆయన సమయం అంతా వెచ్చించాల్సి వచ్చేది. మైసూరుకు చెందిన హైదరాలీ చిత్రదుర్గనును వశం చేసుకోవాలని అనేక సార్లుగా ప్రయత్నం చేస్తున్నాడు. ఏమాత్రం సందు దొరికినా హైదరాలీ సైన్యం రాజ్యాన్ని అతలా కుతలం‌చేస్తుంది. అందుకని మదకరి నాయకుడు కోట రక్షణకోసం అనేక అంచెల కావలి ఏర్పరచాడు. ఓబవ్వ భర్త కోట బురుజుకు కావలి. కోట దరిదాపుల్లోకి ఎవరైనా శత్రువులు వస్తే, శంఖం ఊది సైనికులను పిలవటం అతని పని. అతను అలా శంఖం ఊదగానే ఇలా సైనికులు వచ్చి యుద్ధం చేసి శత్రువులను ఓడించేసేవాళ్ళు. అలా ఆమె భర్త పని ప్రమాదంతో కూడుకున్నది కాకపోయినా, బాధ్యతతో కూడుకున్న పని అన్నమాట. ఒకనాడు మధ్యాహ్నం ఓబవ్వ భర్త భోజనానికి ఇంటికి వచ్చాడు. భర్తకు భోజనం వడ్డించి, ఓబవ్వ నీళ్లకోసం చూసింది. చూడగా కడవలో నీళ్లు లేవు. బిందె తీసుకొని నీళ్లకు బయలుదేరిన ఓబవ్వ చెరువు దగ్గరికి చేరుకునేసరికి, ఘోరమైన ప్రమాదం ఒకటి ఆమె కంట పడింది. కోట వెనుకవైపున గోడకు నేలబారున ఒక చిన్న రంధ్రం పడి ఉన్నది. ఆ రంధ్రంగుండా హైదరాలీ సైనికుడు ఒకడు కోటలోపలికి దూరుతున్నాడు. వాడి వెనుక ఇంకా చాలా మంది సైనికులే ఉండి ఉండాలి! ఓబవ్వ బిందెను అక్కడే పడేసి భర్తను హెచ్చరించేందుకని ఇంటికి పరుగెత్తింది. భర్త ఇంట్లో నిదానంగా భోజనం చేస్తున్నాడు. అన్నం తింటున్న భర్తను తొందర పెట్టటం ఇష్టం కాలేదు ఓబవ్వకు. మరి ఏం చేయాలి? అతనికి ఏమీ చెప్పకుండానే పోయి, మూలగా ఉంచిన 'ఓనకే '(రోకలి బండ)ను చేత పుచ్చుకొని, కోట వెనుకవైపుకు పరుగుతీసింది ఓబవ్వ. ఆ సమయానికే శత్రు సైనికుడు ఒకడు సన్నటి ఆ రంధ్రం లోంచి లోపలికి దూరుతున్నాడు. పరుగున అక్కడికి చేరుకున్న ఓబవ్వ, తన చేతిలో ఉన్న రోకలిబండతో వాడి నెత్తిన ఒక్కటిచ్చింది. వాడు దిమ్మెరపోగానే వాడిని లాగి లోపల పడేసింది. ఈ సంగతి తెలీని శత్రు సైనికులు ఒక్కరొక్కరే లోనికి దూరటం, ప్రక్కనే రుద్రమూర్తిలా నిలబడ్డ ఓబవ్వ వాళ్లను కొట్టి ఈడ్చి పడెయ్యటం జరుగుతూ పోయింది. ఓబవ్వ భర్త భోజనం ముగించుకొని, లేచి వచ్చి చూస్తే ఓబవ్వ కనబడలేదు. అతను ఓబవ్వను వెతుక్కుంటూ చూసేసరికి, కోట వెనుక గోడకు రంధ్రం పడి ఉన్నది! గోడ వారగా నిలబడ్డ ఓబవ్వ రోకలిబండతో శత్రు సైనికుడొకణ్ణి చితక బాదు తున్నది. ఆమె వెనుక వందలాది మంది శత్రుసైనికులు కుప్పగా పడి ఉన్నారు! అలికిడికి వెనక్కి తిరిగిన ఓబవ్వ భర్తను హెచ్చరించి, శంఖం ఊదమన్నది. అతను శంఖం ఊదగానే సైనికులు సచేతనమై పరుగున వచ్చారు. "వెళ్ళండి !మన రాజ్యాన్ని నాశనం చేసేందుకు వచ్చిన దుష్టులు ఇంకా ఎక్కడున్నారో వెతికి మట్టుపెట్టండి" అని అరిచింది ఓబవ్వ. సైనికులు కోట రక్షణలో మునిగారు. అయితే అప్పటికే తప్పించుకున్న శత్రు సైనికుడొకడు వెనుకనుండి వచ్చి, ఓబవ్వను కత్తితో పొడిచాడు. వెంటనే వెనక్కి తిరిగిన ఓబవ్వ రుద్రకాళిలా అతన్ని కూడా సంహరించింది. కానీ ఆమెకు గాయం బలంగా తగిలింది. దాన్నుండి ఓబవ్వ ఇక కోలుకోలేకపోయింది. రాజ్య సంరక్షణలో ఆమె అసువులు బాసింది. ఓబవ్వ ఆనాటినుండి ఓనకే ఓబవ్వ (రోకలిబండ ఓబవ్వ) అయింది. కన్నడ మహిళల స్థిర చిత్తానికీ, దేశభక్తికీ, ధైర్య సాహసాలకూ ప్రతీకగా నిలిచింది. చిత్రదుర్గలోని క్రీడాప్రాంగణానికి "ఓనకే ఓబవ్వ క్రీడా ప్రాంగణం" అని పేరు.   కొత్తపల్లి.ఇన్ వాటి సౌజన్యం తో

పల్లె కాకి

పల్లె కాకి - మంజునాథ్ పల్లె కాకికి బోరుకొట్టింది. పట్నం మీదికి మనసు మళ్ళింది. అక్కడ దొరికే మాంసపు ముక్కలూ, స్వీట్ల దుకాణాల బయట పడేసే స్వీటుముక్కలూ, మార్కెట్లలో దొరికే కూరగాయల ముక్కలూ మొదలైన వాటిని గూర్చి ఎప్పుడో విన్న మాటలన్నీ దానికిప్పుడు గుర్తుకు వచ్చి, పట్నమంటే విపరీతమైన మోజుపుట్టింది. ఆ ఆలోచనరాగానే దానికి పల్లెటూరిమీద ఏవగింపు కలిగింది. ఈ పల్లెలో ఏముందని, ఇక్కడుండాలి? ఇక్కడేమీ లేదు. సుఖమైన జీవితం గడపాలంటే ‘పట్నమే నయం ’ అని తనకు తానే చెప్పుకుని పట్నంవైపుకు ఎగిరింది. పల్లె పొలిమేరలోకి వెళ్ళగానే, దున్నుతున్న రేగడి మడిలో పురుగులను ఏరుకొని తింటున్న కాకుల గుంపు ఒకటి కనిపించింది. ఎలాగూ వెళుతున్నాను కదా, ఓసారి మావాళ్ళని మాట్లాడించి వెళదామనుకొని మడిలో వాలింది. మిగిలిన కాకులన్నీ అది రావటం చూసి కావు కావుమని పిలిచాయి. అప్పుడు ఈ కాకి అన్నది: "నేను ఇక్కడికి ఊరికే తినడానికి రాలేదు. ఎప్పుడూ ఒకటే తిండి గోల తప్ప, ఇక్కడ ఇంకోటి ఉండదు. అందుకే నేను పట్నం వెళుతున్నాను" అని. అదివిన్న కాకులు దానివైపు అదోలాగ చూశాయి. అప్పుడు ఆ గుంపులోని ముసలి కాకి ఒకటి 'బంగారంలాంటి చోటునొదలి పట్నం వెళ్ళడమేమిటి? నీ అవివేకం కాకపోతే?' అన్నది. అప్పుడు ఈ కాకి 'ఒసేయ్! ముసలిదానా, నీకేమి తెలుసని నన్ను అవివేకి అంటున్నావే? ఇక్కడేముందని ఉండాలే? ఎప్పుడూ ఈ నేలలోని పురుగులను ఏరుకు తినడం, లేకపోతే ఆ చెట్లపైన వాలి, ఆ పల్లె జనం ఎప్పుడు నాలుగు ముసర మెతుకులు చల్లుతారా అని కాచుకుకూర్చోవడం తప్ప?' అన్నది కోపగించుకుంటూ. ఆ మాటలకు బదులిస్తున్నట్లు ముసలి కాకి , 'నీకేదో పట్నం మోజు పట్టినట్టుంది. ఇలాంటి ఆలోచనలు మనుషులకే వస్తాయి. 'చేసుకున్నమ్మకు చేసుకున్నంత ' అని, అనుభవిస్తావులే' అన్నది. ఆ మాటలకు కాకమ్మకు చిర్రెత్తుకొచ్చింది. 'ఏమిటీ! నా మాటలూ, ఆలోచనలూ మనుషుల్లాంటివిగా ఉన్నాయా? 'గాడిదకేమి తెలుసు గంధపు చెక్కల వాసన' అని, నీలాంటి ముసలిదానికేం తెలుస్తుంది, పట్న వాసం గురించి? అయినా నీలాంటి అవివేకికి చెప్పిన నాది బుద్ధి తక్కువ. వస్తానమ్మా తల్లీ!' అని చిర్రుబుర్రులాడుతూ ఎగిరిపోయింది. సాయంత్రానికి పట్నం చేరుకుంది. ఆ రాత్రికది అక్కడే ఎక్కడో పడుకున్నది. తెల్లవారింది. దగ్గరలోని రైల్వేస్టేషనుకు ఎగిరింది కాకి. అక్కడదానికి బోలెడన్ని కాకులు కనిపించాయి. కానీ అవి పల్లె కాకుల్లా దీన్ని పిలవటం లేదు. దేనికవి వాటి పనులు చేసుకుంటున్నాయి. కాకులే కాదు, బోలెడన్ని పందికొక్కులూ కనిపించాయి. దానికి పట్టరాని సంతోషం కలిగింది. చచ్చి పడిఉన్న పంది కొక్కుల్ని కడుపునిండా తిని, ఇతర ప్రాంతాలను చూద్దామని పట్నంపైకి ఎగిరింది. చాలా తిరిగింది. రైల్వే స్టేషన్లూ, బస్టాండులూ, మార్కెట్లూ, వీధులూ, సందులూ, గొందులూ అన్నీ తిరిగింది. అది వెళ్లిన ప్రతీ చోటా దానికి ఆహారం బాగా లభించేటట్టుంది. ఎక్కడ చూసినా చెత్తకుప్పలు బాగానే ఉన్నాయి. వీధులలోని మురికి కాలువలలో ఎలుకలు చాలానే ఉన్నాయి. అబ్బో ఎంత పెద్ద పట్నమో! ఎంతదూరం ఎగిరినా పట్నమే. ఇక్కడ నివసించడానికేం కొదవలేదు' అనుకున్నది కాకి. ఆ సరికి కొత్త మోజులో కాకి చాలానే తిరిగింది. అయినా అప్పటికి సమయం ఇంకా ఏడు గంటలే. ఇక మొదలయింది వాహనాల హోరు! ఎక్కడ చూసినా జనాలే జనాలు. వాహనాల చప్పుళ్ళు, పొగవాసనలు. ఎక్కడైనా వాలదామంటే జనాలు అడ్డం వస్తున్నారు. ఎక్కడా కాకి వాలేంత చోటుకూడా దొరకటం లేదు. ఆశగా అది చెట్టుకోసం చూసింది. చెట్టుపైన వాలడానికి చాలా దూరమే వెళ్ళాల్సి వచ్చింది. సాయంత్రమయింది, రాత్రయింది. జనాలే జనాలు. అక్కడ కాసేపూ, ఇక్కడ కాసేపూ వాలి దొరికినవేవో తిన్నది. చాలా అలసిపోయి వొళ్లుమరచి నిద్రపోయింది. కానీ కాసేపటికే అది మేలుకోవాల్సి వచ్చింది. అక్కడ కోడిపుంజులు కూసి మనుషులను లేపడానికి బదులు, మనుషులే కోళ్ళను లేపేటట్టున్నారు. ఎప్పుడు నిద్రపోయారో, ఎప్పుడు లేచేశారో, తెలీటం లేదు. నిద్రపోదామన్నా కాకికి నిద్రరానివ్వటం లేదు అక్కడి శబ్దాలు! తట్టుకోలేక, కాసేపటికి అదీ లేచి రోజువారీ పనిలోకి దూకింది. రోజంతా ఏం చేస్తున్నదో తెలీలేదు, కానీ సమయం మాత్రం గడిచిపోతున్నది! ఇలా కొంత కాలం గడచింది. కాకికి ఇప్పుడు నిజమైన పట్నం కనిపిస్తోంది. అక్కడ దొరికే ఎలుకలంటే వెగటు పుట్టింది. అవన్నీ ఇప్పుడు కంపుగొడుతున్నట్లు తోస్తున్నాయి. చెత్తబుట్టలు, మురికి గుంటలు వికారం అనిపించ సాగాయి. సరిగ్గా అప్పుడే దానికి జ్వరం వచ్చింది. పల్లెలో అయితే వేపకాయల గుజ్జుతినగానే జ్వరం నయమయేది. అక్కడ దానికి వేపచెట్టు దొరకటమే గగనమయింది. ఆ దుమ్ము, పొగల మధ్య మందు మొక్క ఒక్కటీ కనబడలేదు. 'ఇక ఒక సారి పల్లెకు వెళితే బాగుండును' అనిపించింది కాకికి. మెల్లిగా పల్లెకు ఎగిరిపోయింది. రెండు రోజుల్లో జ్వరం నయమైంది. ఆపైన ఇక కాకికి పట్నం వెళ్ళాలనే ఆలోచనే రాలేదు.

చందమామపై కొంగ

చందమామపై కొంగ - నాగమణి ఒక ఊళ్ళో ఇద్దరు దంపతులు ఉండేవారు. వాళ్లొకసారి కొట్లాడినారు. ఇద్దరూ ఒకరితో ఇంకొకరు మాట్లాడకుండా ఉన్నారు. పెండ్లాముకేమో వక్కాకు (తాంబూలం) వేసుకునే అలవాటుంది. సరిగ్గా అప్పుడే ఆమె దగ్గర సున్నం అయిపోయింది. వక్కాకేసుకుందామని ఆకు తీసి, సున్నం కోసం చూస్తే సున్నం డబ్బా ఖాళీ అయిపోయింది. అప్పుడు ఆమె తన మొగుణ్ణి అడగకుండా సున్నం కోసం వెదికింది. సరిగ్గా అప్పుడే ఒక కొంగ, పైన ఆకాశంలో పోతూ పోతూ రెట్ట వేసింది. అది తెల్లగా సున్నంలా ఉంది. అదొచ్చి వీళ్ల గోడమీద పడింది. అది సున్నమేనేమో అనుకున్నది ఆ భార్య. ఆమె దాన్ని తీసుకొని ఆకుతో కలిపి నమిలింది. కొన్నాళ్లకు ఆమె గర్భవతి అయ్యింది. ఇంకొన్నాళ్లకు ఆమె ఒక కొంగను ప్రసవించింది! దాంతో ఆ దంపతులిద్దరూ హతాశులయ్యారు. కానీ ఏమి చేయగలరు? తమకు పుట్టిన బిడ్డాయె! అందరూ వారికి పుట్టిన ఆ కొంగను చూసి వాళ్లను ఎగతాళి చేసేవారు. అయినా చేసేది లేక వాళ్ళా కొంగనే పెంచుకోసాగారు. కొన్నాళ్ళకు ఆ కొంగ పెరిగి పెద్దదయింది. సరిగ్గా అప్పుడే ఆ ప్రాంతంలో పెద్ద కరువు వచ్చింది. మనుషులకు పుట్టిన ఆ కొంగకు గొప్ప గొప్ప శక్తులు వచ్చాయి. అది ఆకాశంలోకి ఎగిరి, దూర ప్రాంతాలలో దొరికే మంచి మంచి పళ్ళూ, కూరగాయలూ వాళ్ల అమ్మా-నాన్నలకు తెచ్చి ఇచ్చేది. అయినా వారికి తీరని బెంగ కొంగ సంతానం. ఆ బెంగతోటే కొంగవాళ్ల అమ్మ మంచాన పడింది. కొంగకు అది చాలా బాధను కలిగించింది. ’అందుకు కారణం తనేకదా’ అని, అది ఆకాశంలో చాలాచాలా ఎత్తుకు ఎగురుకుంటూ పోయి, చివరికి చందమామ దగ్గరికి చేరుకొని తన కష్టాన్ని చెప్పుకొంది. చందమామ దాన్ని ఊరడించి, దాన్ని తనలో కలుపుకున్నాడు. మనం జాగ్రత్తగా చూస్తే నిండు చందమామలో కొంగ కనబడేది అందుకే.     కొత్తపల్లి.ఇన్ వారి వారి సౌజన్యంతో

అల్లరి దయ్యం

అల్లరి దయ్యం - నారాయణ   కీకారణ్యంలోని పాడుబడ్డ బావిలో చాలా దయ్యాలు కాపురం ఉంటుండేవి. వాటి జీవితాల్ని అవి ప్రశాంతంగా గడిపేవి తప్ప ఏనాడూ అవి జనాల మధ్యకు వచ్చేవి కావు. వాటన్నిటికీ ఈ మధ్యే కొత్తగా ఉపద్రవం ఒకటి వచ్చి పడింది. ఇప్పటివరకు పిల్లగా ఉన్న సుబ్బన్న దయ్యం పెరిగి, పెద్దదై, చిలిపి దయ్యమైంది. తుంటరి పనులు చేయటం, వాళ్ళనీ వీళ్లనీ కదిలించి అల్లరి పెట్టటం, ఏడిపించి నవ్వటం దానికి నిత్యకృత్యమైంది. అది క్షణం కూడా ఊరికే కూర్చోలేక పోయేది. ముసలి దయ్యాల మీసాలు పీకేది, పిల్లదయ్యాల తోకలు పట్టి లాగేది, కుర్ర దయ్యాల బుగ్గలు కొరికి ఇకిలించుకుంటూ మాయమయ్యేది. దయ్యాలన్నీ "సుబ్బన్నకు ఎలాగైనా బుద్ధి వస్తేచాలు మహాభూతా" అని మొక్కుకోవటం మొదలు పెట్టాయి చివరికి. అలా ఉండగా, ఒక రోజున సుబ్బన్నకు రోడ్డు మీద గజ్జెలమోత ఒకటి క్రమబద్ధంగా వినబడింది. దాని చెవులు ఉత్సాహంగా లేచి నిలబడ్డాయి. గుర్రబ్బండి! అంటే గుర్రబ్బండి మీద తను ఎక్కి పోవచ్చు! అంతే కాదు ఒక మనిషితో ఆడుకోవచ్చు కూడాను! వెంటనే అది ఒక మనిషిగా మారిపోయింది. రోడ్డుని చూసి చేతులు ఊపేసరికి నేరుగా వెళ్తున్న రోడ్డు గుండ్రంగా, మిట్టపల్లాలుగా మారిపోయింది. చేతిలో ఒక కట్టె, కట్టెకు చివర ఒక మూటతో సుబ్బన్నం దయ్యం ఇప్పుడు అచ్చం పల్లెటూరి రైతు మాదిరి కనిపిస్తోంది. మెల్లగా గుర్రబ్బండి దగ్గరకు వచ్చేసరికి దయ్యం ఈలవేసి చేతులు ఊపి, రోడ్డు మధ్యలో అడ్డాంగానిలబడి బండిని ఆపింది. బండిలో ధనికుడు ఒకడు స్వయంగా బండిని నడుపుకొని పోతున్నాడు. " పట్నం, పట్నం" అని కేకలు పెట్టింది సుబ్బన్న. బండిలోని మనిషికి అవేమీ వినబడ్డట్లు లేదు. ఇంకా "ఏమిటి" అని ప్రశ్నిస్తున్నట్లే ఉంది అతని ముఖం. సుబ్బన్న ఏదేదో చెప్పింది. ఎంత చెప్పినా ఆ మనిషి ఒకేలా ముఖం పెట్టి చూస్తున్నాడు. అతనికి చెముడు అని గ్రహించటానికి సుబ్బన్నకు చాలా సేపు పట్టింది. ఆ తరువాత పని సులభమైంది. "నేను ఎక్కుతా" అని సైగలు చేస్తే ఎక్కమన్నాడు అతను. దయ్యం చేసే వెకిలి చేష్ఠల్ని అతను అస్సలు పట్టించుకోలేదు. దానికేసే నిశ్చలంగా చూస్తూ చిరునవ్వు నవ్వుతుంటే చిలిపి దయ్యానికి ఉత్సాహం మరింత ఎక్కువైంది. కొంచెం సేపటి తరువాత తనే బండిని నడిపిస్తానని సైగలు చేస్తే, సరేనని తలూపాడు అతను. దయ్యం పగ్గాలు చేతబట్టుకొని బండి తోలటం మొదలు పెట్టింది. ఇప్పుడు రోడ్డు ఎంత దూరం పోయినా పట్నం చేరదు! తిప్పిన తావుననే మళ్ళీ మళ్ళీ తిప్పుతుంది. "నువ్వెందుకు, నేనున్నాగా, నువ్వెళ్ళి బడలిక తీర్చుకో పట్నం రాగానే లేపుతా నిన్ను" అని గొంతు చించుకొని అరచి, సైగలు చేసి చెప్పి, సుబ్బన్న దయ్యం బండివాడిని లోపల కూర్చోబెట్టి, సంతోషంతో గంతులు వేసింది. ఇక ఆపైన బండి చిత్ర విచిత్రంగా కొంచెంసేపు నేలమీద, కొంచెం సేపు ఆకాశంలో, అటూ, ఇటూ తిరిగింది. ’లోపల బండివాడికి ఇదేమీ తెలీదు. పాపం వాడు పట్నం పోతున్నామనుకుంటున్నాడు. వాడికి మెలకువ చచ్చి చూసేసరికి ఎక్కడుండే బండి అక్కడే ఉంటుంది!" ఈ ఊహే సుబ్బన్న దయ్యానికి ఎంతో సంతోషాన్నిచ్చింది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఎగురుకుంటూ బండి తోలుతూ అది రాత్రి చీకట్లో తను బండివాడిని ఎలా భయపెట్టి ఆటలు పట్టించనున్నదో ఆలోచించుకొని ఇంకా ఇంకా మురిసి పోయింది. క్రమంగా చీకట్లు ముసురుకున్నై. బండి అటూ ఇటూ పోయి బయలుదేరిన చోటికే వచ్చి ఆగింది. సుబ్బన్న దయ్యం అరిచింది- " ఓ బండాయనా, లే, పట్నం వచ్చింది" అని. జవాబులేదు. ఓహో, చెవిటి, మూగ కదూ, అనుకొని బండిలోనికి తొంగిచూస్తే బండివాడు అక్కడ లేడు! బండి పైన కూర్చొని నవ్వుతున్నాడు. "ఏమి సంగతి? పట్నం బాగుందా?" అని సైగలు చేసింది సుబ్బన్న దయ్యం. " ఓ, బాగుంది. బాగుండకేం? " అన్నాడు బండివాడు. "అరే, నీకు మాటలొచ్చా? " అంది సుబ్బన్న. "నిక్షేపంగా వొచ్చు. ఏదో, చల్లటిపూట, షికారుగా తిరుగుదామని బయలుదేరితే, నువ్వు చాలా సాయం చేశావు పాపం" అన్నాడు బండివాడు. "అదేంటి, నిన్నింకా పట్నం చేర్చందే? " అన్నది సుబ్బన్న. "పట్నం ఎందుకు?" అన్నాడతను. "అయినా పాపం, నన్ను, నా బండిని, గుర్రాల్ని అన్నిటినీ నేలమీద నడిపి, నీళ్లల్లో తేల్చి, ఆకాశంలో ఎగిరించి నువ్వు చాలా అలసిపోయినట్లునావు పాపం, నీ రుణం ఎలా తీర్చుకోవాలో, ఏమో- అన్నాడు బండివాడు. సుబ్బన్న దయ్యం నిర్ఘాంతపోయింది. "నేను ఇంత సేపూ బండి మీద కూర్చొని చల్లటిగాలిని హాయిగా ఆస్వాదించాను. నీకు కృతజ్ణతలు" అన్నాడు బండివాడు. "ఇప్పుడే ఏమైంది, నిన్ను నిజంగా కొరికి తినేస్తే ఎంత మజానో నీకు తెలిసి వస్తుంది " అన్నది సుబ్బన్న నిజరూపం దాల్చి, కోరలు చూపెడుతూ. " నాకూ ఉన్నాయమ్మా, కోరలు, అదీ గాక దయ్యాలు దయ్యాల్ని తినవు! " అంటూనే బండివాడు ఇంకో దయ్యంగా మారిపోయాడు. " నువ్వు అందరినీ ఆటపట్టిస్తే, నిన్ను ఆటపట్టించేవాడు ఒకడు ఉంటాడని మరువకు " అన్నది ఆ దయ్యం ఇకిలిస్తూ, మెరిసే కళ్లతో. ఆ తరువాత సుబ్బన్న దయ్యం ఎవరిని ఏడిపించాలనుకున్నా, ముందుగా దానికి ఆ దయ్యమే గుర్తువచ్చేది. ఆ పైన రాను రాను అల్లరి చెయ్యలేక అదీ మిగిలిన దయ్యాలమాదిరి మంచిదైపోయింది.   కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

అత్త-కోడలు

అత్త-కోడలు - హరిత        ఒక ఊరిలో ఒక మహా రాక్షసిలాంటి అత్త, తన కొడుకూ, కోడలితో ఉండేది. ఆ అత్త తన కోడలిని నానా కష్టాలకూ గురిచేసేది. పాపం ఆ కోడలు అత్తపెట్టే కష్టాలన్నింటినీ ఓపికగా భరిస్తూ ఉండేది. రాను రానూ ఆ అత్త ఆగడాలకు అంతే లేకుండా పోయింది. తన కోడలికి సరిగ్గా అన్నం కూడా పెట్టకుండా వేధించసాగింది ఆ అత్త. ఒక నాడు వారి పెరట్లో కాసిన కాకరకాయలు అమ్ముకు రావడానికని అత్త ఊళ్ళోకి వెళ్ళింది. అప్పటికి అన్నం తినక చాలా రోజులయింది కోడలికి. అత్తలేని ఆ సమయంలో, ఆమె చకచకా ఒక బానెడు అన్నమూ, సగం బానెడు కాకరకాయ కూరా చేసుకున్నది - అత్తరాకనే వాటిని తినేయాలని. మొత్తం అన్నంలోకీ కూరను కలిపి రెండు పిడసలు(ముద్దలు) చేసి, ఒక్కో పిడసను ఒక్కోసారిచొప్పున రెండింటినీ రెండుసార్లకే మింగేసింది ఆ కోడలు. అది చూసిన ఆ ఊరి దేవత `పెద్దమ్మ' తన ముక్కుమీద వేలేసుకొంది. ఊరంతా ఇదో మహాశ్చర్యకరమైన సంగతైంది. పెద్దమ్మ ముక్కుమీద వేలేసుకోవడం తెలిసిన ప్రజలంతా గుంపులు గుంపులుగా వెళ్లి చూడటం మొదలు పెట్టారు. ఇంకో గంటకల్లా సంగతి ఆ ఊరి పెద్ద వరకూ చేరుకున్నది. ’పెద్దమ్మ ముక్కుమీద వేలేసుకోవడం ఊరికి మంచిది కాదు; ఆ తల్లి తన ముక్కు మీదనుంచి వేలును తీసేట్టు చేసినవారికి వెయ్యిరూపాయలు బహుమతిగా ఇస్తామ’న్నారు ఆ గ్రామ పెద్ద . ’కానీ ముందుకొచ్చిన తర్వాత అలా చెయ్యలేకపోతే వారికి మరణ శిక్ష విదిస్తామనికూడా జోడించారు చల్లగా. ఇక ఎవరూ ముందుకు వచ్చేసాహసం చేయలేదు. కానీ ఈ సంగతి తెలుసుకున్న అత్తకు మాత్రం చాలా సంతోషం కలిగింది. "వస్తే వెయ్యి రూపాయలొస్తాయి. లేకపోతే కోడలి పీడ వదిలిపోతుంద"ని తన కోడలిని ముందుకు తోసింది. కోడలు బాధ పడింది. అయినా చేసేదేమీ లేదు. ఒక చాటా, ఒక పరకా, ఒక చెప్పు తీసుకొని వెళ్ళింది పెద్దమ్మ గుడికి. "ఏమమ్మా! పెద్దమ్మా! నేను నా కడుపాత్రంతో రెండు బానల అన్నం తింటే నీకెందుకంత మంట? అన్నది. అంతే! పెద్దమ్మ గాభరా పడింది. ఆతల్లి ముక్కు మీది వేలు క్రిందికి జారింది. పెద్దమ్మ తన ముక్కు మీద నుంచి వేలు తీసేయడానికి కారణం ఆ కోడలే అని మర్నాటికల్లా ఊరంతా తెలిసింది. ఆమెకేవో గొప్ప శక్తులున్నాయని అందరూ చెప్పుకొన్నారు. అది విన్న అత్తకు గుండెల్లో గుబులైంది. ఈ మంత్రాల కోడలు తననేమి చేస్తుందోనని, కోడలిని చంపడానికి పూనుకున్నది. గుట్టుగా ఆమెను కట్టెతో వాయించింది. ఆ దెబ్బలకు తాళలేక కోడలు పడి మూర్ఛ పోయింది. ’కోడలు చని పోయిందో’ అని రాగాలు తీసింది అత్త. చనిపోయిందనుకొన్న కోడల్ని ఆమె అత్తా, భర్తా స్మశానానికి తీసుకు వెళ్లారు. చితిపేర్చి, చితిమీద ఆమెను పడుకోబెట్టారు. తీరాచూస్తే చితిని అంటించడానికి అగ్గిపెట్టెలేదు. అగ్గిపెట్టె కోసమని ఆత్రంగా ఇంటికెళ్ళారు వాళ్లిద్దరూ. అంతలో కోడలికి స్పృహ వచ్చింది. చూసుకుంటే తను ఒంటరిగా చితిమీద ఉన్నది! వెంటనే ఆమె లేచివెళ్ళి, దగ్గర్లోనే ఉన్న ఒకపెద్ద చెట్టు పైకెక్కి కూర్చుంది. ఇంతలోనే అగ్గిపెట్టెను తీసుకొచ్చారు అత్తా, భర్తానూ. ఇద్దరూ వచ్చీ రాగానే చితిమీద శవం ఉన్నదీ, లేనిదీ కూడా చూడకుండా చితికి నిప్పుపెట్టి వెళ్ళిపోయారు. ఇక చెట్టుమీదున్న కోడలు బాగా అలసిపోయింది; నిద్రకు తూగుతూ కూర్చున్నది. ఇంతలో ఎక్కడో దొంగతనం చేసుకొని, ఒక పెద్ద దొంగలముఠా అక్కడికి చేరుకున్నది. దొంగిలించిన సొమ్మును వాటాలేసుకోవడానికి అనువైన నిర్మానుషయ ప్రదేశంకోసం వెతుక్కున్నారు వాళ్లంతా. చివరికి అందరూ కోడలున్న చెట్టుకిందే కూర్చొని తమ దగ్గరున్న బంగారం మూటలను విప్పారు. సరిగ్గా అప్పుడే చెట్టుమీద తూగుతూ కూర్చున్న కోడలు, పైనుండి దబ్బుమని కిందపడిపోయింది. ఒక్కసారిగా చెట్టుపైనుండి పడిన ఆమెను చూసిన దొంగలు అదేదో పెద్ద దెయ్యమనుకున్నారు. హాహాకారాలు చేస్తూ లేచి ఉన్నపళాన కాలికి బుద్ది చెప్పారు. మెలకువ వచ్చి తేరుకున్న కోడలు ఆ నగలన్నింటినీ ధరించి ఇంటికెళ్ళి, వాళ్ళ ఇంటి ముందు కూర్చుంది. ఆమెను చూసిన భర్త సంతోషపడ్డాడు. కానీ అత్తకు మాత్రం చెప్పరాని భయం వేసింది, కోడలు దయ్యమై తిరిగొచ్చిందని. అప్పుడా కోడలు "నేను దెయ్యాన్ని కాలేదు. చనిపోయాక నరకానికి వెళితే దెయ్యాలవుతాము. కానీ నేను వెళ్ళింది స్వర్గానికి. అక్కడ నేను మీ చుట్టాలనూ, మా చుట్టాలనూ అందర్నీ పలకరించి వచ్చాను. అక్కడున్న మీ చుట్టాలకు నిన్ను చూడాలని ఉందట, ’నువ్వు వెళ్ళి మీ అత్తను పంపు’ అని వాళ్లంతా నాకీ ఆభరణాలు ఇచ్చి పంపారు. నువ్వుకూడా వెళితే నీక్కూడా చాలా సత్కారం చేస్తారట’ అన్నది. అది విన్న అత్తకు ఆశ పుట్టింది. "అవునా! అయితే సరే, నేనూ వెళతాను. కానీ నేనక్కడికి వెళ్లడం ఎలా?’ అని ఆ అత్త అడిగింది. "ఏముందీ? నువ్వుకూడా ఓసారి బడితతో పూజ చేయించుకుంటే సరి’ అన్నదా గడసరి కోడలు. "అయితే ఆలస్యం ఎందుకు? ఆమెను వాయించిన కట్టెతోటే నన్నూ బాదండి’ అన్నది ఆశపోతు అత్త. సంగతి అర్దమైన కొడుకూ, కోడలు ఇద్దరూ కలసి అత్తను పైకి పంపారు. తిరిగొచ్చే అమ్మను తలుచుకుంటూ కొడుకూ, తిరిగిరాని అత్తను తలచుకుంటూ కోడలూ, ఉన్న సొమ్ముతో హాయిగా కాలం గడిపారు.   కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

నోటిలో కొంగ

నోటిలో కొంగ - ఎ.కె. రామానుజన్ బ్రాహ్మణుడొకడు ఒకనాడు ఒక పొలంగుండా నడుస్తూ ఇంటికి పోతున్నాడు. దారిలో అకస్మాత్తుగా అతనికి ఒక దగ్గు పొర వచ్చింది. దగ్గీ, దగ్గీ చివరికతను గట్టిగా నేలమీద ఉమ్మాడు. అయితే చూడగా, అతను ఉమ్మిన కళ్లెలో తెల్లటి ఈక ముక్క ఒకటి కనబడింది! అతనికి చాలా ఆశ్చర్యం వేసింది. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలీలేదు అతనికి. ఇంకొంత సేపట్లో అతనికి ఇక కంగారు మొదలైంది. తను కొంగ ఈకను ఉమ్మాడన్న సంగతి అతని ఆలోచనను వదలకుండా వెంటబడింది. త్వరలో అది ఇక భరింపరానంత స్థాయికి చేరుకున్నది! ఇంటికి చేరుకోగానే అతను భార్యను పిలిచి, "నన్ను ఒక సంగతి చాలా బాధిస్తున్నది. దాన్ని నేను ఎవరికో ఒకరికి చెప్పుకోవలసిందే- లేకపోతే నా తల పగిలిపోతుంది. నీకు నేను ఆ సంగతి చెప్తాను- అయితే దాన్ని ఇక వేరే ఎవ్వరికీ చెప్పనని ముందుగా మాట ఇస్తావా?" అని అడిగాడు. "ఓ! నిర్భయంగా చెప్పు. నేను ఒక్క చీమకు కూడా తెలీనివ్వనని ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను" అన్నది భార్య. అప్పుడతను నిశ్చింతగా, తన ఉమ్మిలో కనబడ్డ తెల్లటి ఈక గురించి చెప్పాడు భార్యకు. అయితే, భార్య మాటైతే ఇచ్చింది కానీ, ఇంత పెద్ద విషయాన్ని ఎవ్వరికీ చెప్పకుండా దాయటం ఆమె వల్ల కాలేదు. ఆమె ఆలోచనల నిండా తెల్లటి ఈకలే మరి! అందుకని, పొరుగింటి సుబ్బమ్మ కనబడగానే బ్రాహ్మణుడి భార్య ఆమెకు దగ్గరగా వెళ్లి- "నా మనసంతా ఒక రహస్యంతో నిండి పోయి ఉంది. నేను ఆగలేక పోతున్నాను. నీకు ఆ రహస్యం చెప్పేస్తాను- అయితే ముందు నాకు ఓ మాట ఇస్తావా? దాన్ని నువ్వు వేరే ఎవ్వరికీ చెప్పకూడదు- ఎవ్వరికీ తెలీనివ్వనని నేను మా వారికి మాట ఇచ్చాను, మరి!" అన్నది. పొరుగింటి సుబ్బమ్మ ఒప్పుకున్నది. "నెను రహస్యాల్ని ఎంత చక్కగా కాపాడతానో నీకు తెలీదా? నేను చీమక్కూడా తెలీనివ్వను- చెప్పు!" అన్నదామె ఉత్సాహంగా. "ఎవ్వరికీ చెప్పవు కదా?" "నీకంత అపనమ్మకమైతే చెప్పకు. నేనెన్నడైనా నీ రహస్యాన్ని ఇతరులకు చెప్పానా?" "సరే, సరే. చెప్పేస్తాను నీకు. నువ్వు మంచి స్నేహితురాలివని నాకు తెలుసు. నువ్వెవ్వరికీ చెప్పవు. మా ఆయన ఇంటికి వస్తూ పొలాన్ని దాటుతుండగా ఏమైందో తెలుసా? ఆయన ఏమి ఉమ్మేశాడో తెలుసా? ఆయన.. ఆయన ఉమ్మి నిండా కొంగ ఈకలు! ఎన్ని ఈకలో! ఆయనకు ఏమౌతోందో నాకు అర్థం కావట్లేదు. నాకు మాత్రం చాలా భయం వేస్తున్నది!" "అయ్యో నువ్వేమీ ఆందోళన పడకు. ఒక్కోసారి అలాంటివి జరుగుతూనే ఉంటాయి. మళ్లీ అన్నీ సర్దుకుంటాయి. కానీ, దాన్ని గురించి ఎవ్వరికీ తెలీకపోవడమే మంచిది. ఊరికే అందరూ పుకార్లు రేపుతారు, లేకుంటే". కానీ ఆ రహస్యాన్ని ఐదు నిమిషాలపాటు దాచుకోవటం కూడా ఆమె వల్ల కాలేదు. అది ఆమెలోంచి తన్నుకొని బయటికి వచ్చేస్తున్నట్లు అనిపించిందామెకు. హడావిడిగా ఆమె ఇంకా ఇంటికి పరిగెత్తుతూ ఉండగానే 'తనకిప్పుడు ఎవరు కనబడతారో, వాళ్లకి ఈ రహస్యం చెప్తే ఎలా స్పందిస్తారో' అన్న ఊహ ఆమెను తబ్బిబ్బు పరిచింది. ఆమెకో మిత్రురాలు కనబడగానే ఆమె ఇక ఆపుకోలేక బయటికి కక్కేసింది.   "ఎవ్వరికీ చెప్పనని మాట ఇవ్వు ! నేను ఆమె రహస్యాన్ని కాపాడతానని బ్రహ్మణుడి భార్యతో ప్రమాణం చేశాను. ఇవ్వాళ ఏం జరిగిందో తెలుసా? పూజారిగారు పొలంలోంచి పోతూ పూర్తి కొంగనొకదాన్ని కక్కుకున్నారట! బ్రాహ్మణులు శాకాహారులేనని నేను అనుకునేదాన్ని. కానీ మనకేం తెలుసు, నిజానికి?" అన్నదామె. "పూర్తి కొంగనా? అంత పెద్ద పక్షి! ఎలా కక్కుకున్నాడబ్బా!? వింత మనిషే! కానీ- నేను ఎవ్వరికీ తెలీనివ్వనులే., నన్ను నమ్ము." ఎంతో సేపు కాలేదు, వేరే ఒకాయనకు ఎవరో చెప్పగా తెలిసింది- పండితుడి నోట్లోంచి రెక్కలల్లార్చుకుంటూ అనేక కొంగలు వెలువడ్డాయని! ఇక ఆరోజు సాయంత్రానికల్లా పట్టణమంతా తెల్సిపోయింది అందరికీ- పండితుడి నోట్లోంచి కొంగల గుంపులూ, బాతుల మందలూ, ఇంకా రకరకాల పెద్దపెద్ద పక్షులన్నీ ఎగురుకుంటూ బయటికి వస్తున్నాయని! చుట్టుప్రక్కల గ్రామాల్లో కూడా ఆ సంగతి ప్రచారమైంది- దాంతో గ్రామాలకు గ్రామాలే ఎద్దుల బండ్లు వేసుకొని ఈ భయంకర ఘటనను చూసేందుకు పండితుడుండే ఊరికి తరలి వచ్చాయి. ఇదేదో నిజంగా అద్భుతం గదా, మరి? - రకరకాల పక్షులు, అన్ని రంగులవీ, అన్ని సైజులవీ,- కొన్ని సుదూర పక్షులు కూడా- పండితుడి నోట్లోంచి ఊడిపడి, ఆకాశాన్ని కప్పేస్తున్నాయట! బ్రాహ్మణుడికి పిచ్చెక్కినట్లయింది. అతను అందరి నుండీ‌ పారిపోయి కొండమీద, ఓ చెట్టు తొర్రలో దాక్కున్నాడు. ఈ పుకారు పూర్తిగా సద్దుమణిగి, ఇంకోటి తలెత్తేంత వరకూ బయట తిరిగే సాహసం చెయ్యలేదు!   కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

మోసపోయిన మంత్రగత్తె

మోసపోయిన మంత్రగత్తె K.నరేష్      అనగనగా ఒక ఊరిలో ఒక అవ్వ ఉండేది. ఆ అవ్వ దగ్గర ఒక కుందేలు, ఒక పంది, ఒక కోడిపెట్ట ఉండేవి. అవ్వ తన దగ్గరున్న డబ్బునంతా వాడి, వాటిని చక్కగా పెంచి, పెద్ద చేసింది. అయితే అవి పెద్దయ్యేసరికి అవ్వ దగ్గరున్న డబ్బులన్నీ అయిపోయాయి. ఒక రోజున అవ్వ వాటినన్నిటినీ పిలిచి "చూడండి, నా మిత్రులారా! ఏనాడూ లేనంత లోటు ఈనాడు మనకు వచ్చి పడింది. ఇంట్లో తినేందుకు ఏమీ లేదు. అందుకని ఇక మనం అందరం కలిసి ఎంతో కొంత సంపాదించుకోవలసిందే. అడవికి వెళ్ళి మనందరం కట్టెపుల్లలు ఏరుకొద్దాం. వాటిని అమ్మితే మనందరికీ సరిపోయేన్ని డబ్బులు వస్తాయిలే!" అన్నది. ఆరోజున అవ్వ దారి చూపెడితే అవన్నీ కలిసి అడవికి వెళ్ళాయి. దొరికినన్ని కట్టెపుల్లలు ఏరుకొచ్చి అమ్మారు అందరూ. ఆ వచ్చిన డబ్బులతో భోజనానికి కావలసిన సరుకులు కొనుక్కున్నారు. మరుసటి రోజున అవ్వను ఇంట్లోనే ఉండమని, కుందేలు, పంది, కోడి సొంతగా అడవికి బయలుదేరాయి. అడవిలో‌ తిరుగుతూ తిరుగుతూ అవి దారి తప్పాయి. చివరికి రాత్రి చీకటిపడే సమయానికి వాటికి ఒక గుడిసె కనబడింది. అవి మూడూ ఆ గుడిసె తలుపుతడితే, ఒక ముసలవ్వ తలుపు తీసి వాటిని లోనికి ఆహ్వానించింది. "ఓహో! మీరు అడవి చివరన ఊర్లో ఉంటారు కదూ, ముసలమ్మతోబాటూ? రండి రండి. ఈ పూటకి ఇక్కడే ఉండచ్చు. నేను మీకు భోజనం పెడతానులే, రేపు పొద్దున తెల్లవారాక ఇంటికి పోదురు గాని" అని ఆమె వాటికి భోజనం పెట్టి, పడుకునేందుకు చోటు చూపించింది. అయితే వాటికి రాత్రి ఎంత సేపటికీ నిద్ర రాలేదు. ఏదో తెలీని భయం ఆవరించి ఉన్నది వాళ్లని. చివరికి కుందేలు అన్నది- "ఇక్కడ ఏదో సరిగ్గా లేదనిపిస్తున్నది నాకు. మనం ఇక్కడంతా కొంచెం వెతికి చూద్దామా, ఏమైనా తెలుస్తుందేమో?" అని. అప్పుడు అవన్నీ అక్కడంతా వెతికాయి, నిశ్శబ్దంగా. ముసలమ్మ పడుకొని ఉంది. ఆమె పక్కనే టేబుల్ మీద ఓ డైరీ ఉంది- ఇవి మెల్లగా వెళ్ళి, ఆ డైరీని ఎత్తుకొచ్చి చదివాయి: "నేను మామూలు ముసలమ్మను కాదు- మంత్రగత్తెను" అని రాసుకున్నదామె ఒకచోట. "నా దగ్గరున్న డబ్బు, బంగారము, నగలు అన్నిటినీ తూర్పు మూలన చెట్టు క్రింద పాతి పెట్టాను" అని రాసుకున్నది ఒకచోట. "ఈ కుందేలును, పందిని, కోడిని నేను బలి ఇచ్చేస్తాను" అని రాసుకున్నది ఇంకోచోట. అది చదివాక కోడి చాలా భయపడి పారిపోదామన్నది. అయితే పందికి ధైర్యం ఎక్కువ. అదన్నది- "మనం వెళ్ళేముందు ఈమె దాచుకున్న బంగారం అంతా తవ్వుకు పోదాం" అని. కుందేలు ఇంకా తెలివైనది. "అది అన్నది, మనం ఈ మంత్రగత్తె దగ్గరున్న మంత్రదండాన్ని, చీపురు కట్టనీ, కత్తినీ అన్నిటినీ దాచిపెట్టేద్దాం. పారిపోవద్దు, తెల్లారాక ఆమెనుండి మర్యాదగా శలవు తీసుకొనే వెళ్దాం" అని. "సరే" అని అవన్నీ చెట్టు మొదట్లో తవ్వి, బంగారం, నగలు అన్నీ మూటగట్టుకొని, దూరంగా ఓ పొదలో దాచిపెట్టాయి. ఆ గుంతను బాగా మూసేసి, దూరంగా వేరే ఓ గుంత తవ్వాయి. మంత్రదండాన్నీ, చీపురునూ, కత్తినీ తెచ్చి ఆ గుంతలో పెట్టి పూడ్చేశాయి. ఆపైన ఏమీ ఎరగనట్లు వచ్చి పడుకొని హాయిగా గుర్రుపెట్టాయి. మంత్రగత్తె ఉదయాన్నే లేచేసరికి అవన్నీకూడా లేచి కూర్చుని ఆమెకు నమస్కారం పెట్టి, "అవ్వా వెళ్ళొస్తాం" అన్నాయి. మంత్రగత్తె "అయ్యో! ఇప్పుడే వెళ్తారా, కొంచెం ఆగండి, మళ్లీ భోంచేసి వెళ్దురుగాని" అంటూనే తన మంత్రదండం కోసం వెతుక్కుంటే అది దొరకలేదు. కత్తి కోసం వెతికితే అదీ దొరకలేదు! ఆ లోపల ఇవన్నీ తొందర నటిస్తూ, "మాకేమీ ఒద్దులే అవ్వా, మా ముసలవ్వ కూడా ఎదురుచూస్తూంటుంది. వెళ్ళొస్తాం, నువ్వు మాకు ఎంత సాయంచేశావో, చాలా చాలా ధన్యవాదాలు" అని చెబుతూ హడావిడిగా బయటికి పరుగు తీశాయి. వాటి వెంటపడి పట్టుకునేందుకు మంత్రగత్తె తన చీపురు కోసం చూసింది- కానీ అదీ దొరకలేదు ఆమెకు, పాపం! ముగ్గురు మిత్రులూ తాము బంగారం, నగలు దాచిన మూటను ఎత్తుకొని, నవ్వుకుంటూ హాయిగా ఇల్లు చేరుకున్నాయి. దాన్నంతా అవ్వకు చూపిస్తే ఆమె సంతోషంతో ఉక్కిరిబిక్కిరైంది. ఆపైన అందరూ కలిసి హాయిగా జీవించారు.   కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యం తో

సింహం-యువరాణి

సింహం-యువరాణి K.భార్గవి కొన్ని వందల సంవత్సరాల క్రితం మొగలి చక్రవర్తి అనే రాజు ఉండేవాడు. రాజ్యాన్ని చాలా బాగా పరిపాలించేవాడు ఆయన. ఆయనంటే ప్రజలకు అభిమానం. ఆయన ఎప్పుడూ ధర్మాన్నే పాటించేవాడు. కానీ ఆయనకు ఒక్కటే బాధ- తన తర్వాత రాజ్యాన్ని పాలించే వారసులే లేరని. ఒకరోజు ఆయన ఎక్కిన రధం పట్టు తప్పి, దారి ప్రక్కనే పోతున్న కుక్కల కుటుంబం మీదుగా పోయింది. ఎంత ప్రయత్నించినా రధాన్ని ఆపటం రాజు వల్ల కాలేదు. పాపం, ఆ కుక్కలన్నీ రధం క్రింద పడి చచ్చిపోయాయి. రాజు క్రిందికి దిగి చూసే సరికి, వాటిలో ఒక్క కుక్క పిల్ల మాత్రం బ్రతికి ఉన్నది. ముద్దుగా ఉన్న ఆ కుక్క పిల్లను చూస్తే రాజుకు జాలి వేసింది. ఆయన ఆ కుక్కపిల్లను ఇంటికి తీసుకొని పోయాడు. రాజ్యంలోని వాళ్లెవరికీ ఆ కుక్క నచ్చలేదు. ముఖ్యంగా మంత్రి, మంత్రి భార్యలకు ఆ కుక్కను చూస్తే అసహ్యంగా ఉండేది. రాజుగారు దాన్ని ముద్దు చేసినప్పుడల్లా వాళ్ళిద్దరూ ఉడుక్కునేవాళ్ళు. చివరికి ఒకరోజున మంత్రి కుక్కపిల్ల తోకమీద ఉన్న మచ్చను రాజుకు చూపెడుతూ- "మహారాజా! ఈ కుక్క చాలా దురదృష్టపు కుక్క. ఏ కుక్కకైతే తోక దగ్గర ఇలాంటి మచ్చ ఉంటుందో ఆ కుక్కవల్ల యజమానికి కీడు వాటిల్లుతుంది. కాబట్టి ఈ కుక్కను ఎలాగైనా వదిలించుకోండి" అన్నాడు. కానీ ముద్దుగా ఉన్న కుక్కపిల్లను చూస్తే రాజుకు దాన్ని వదల బుద్ధికాలేదు. "చూడండి మంత్రి వర్యా! ఈ కుక్క ఎక్కడో అడవిలో ఉండవలసినది, తన అదృష్టం కొద్దీ రాజ మహలులోకి రాగలిగింది. ఇంత అదృష్టవంతురాలైన కుక్క వల్ల ఎవరికైనా నష్టం కలుగుతుందంటే నాకు నమ్మ బుద్ధికావటంలేదు. దీన్ని మనతోటే ఉంచుకొని, ఏమేమి నష్టాలు వస్తాయో చూద్దాం!" అన్నాడు రాజు. మంత్రి ఏమీ అనలేక ఊరుకున్నాడు, కానీ ఆ కుక్క పిల్లను చూసినప్పుడల్లా అతనికి చికాకుగా ఉండేది. ఒకరోజు మంత్రి రాచకార్యాలలో మునిగి ఉన్న సమయంలో ఆయన గదిలోకి ఒక త్రాచు పాము దూరింది. మంత్రి దాన్ని గమనించలేదు. పని ముగించుకొని తన గదిలోకి వెళ్ళబోయిన మంత్రికి కుక్క అడ్డు వచ్చింది. మంత్రి దాన్ని ఎంత తిట్టినా, భయపెట్టినా అది అతని కాళ్లను చుట్టుకొని 'కుయ్ కుయ్ ' అంటున్నది తప్ప, అతన్ని లోనికి పోనివ్వలేదు. పని తొందరలో ఉన్న మంత్రి కుక్కను చావబాది లోనికి అడుగు పెట్టగానే 'బుస్'మంటూ త్రాచుపాము పడగ విప్పి కనబడ్డది. మంత్రి నిశ్చేష్టుడైపోయాడు గానీ, కుక్క పిల్ల అతన్ని దాటుకొని వచ్చి పాముపైన పడింది. చాలాసేపు యుద్ధం చేసి, చివరికి ఆ పామును చంపేసింది కుక్క. అటుపైన మంత్రికి కూడా ఆ కుక్క పట్ల ఆదరం కలిగింది. క్రమంగా అది పెద్దదై, రాజుకు మంత్రికి చాలా విశ్వాసపాత్రంగా తయారైంది. ఆ సమయంలో రాజ్యానికి ఒక ఋషి వచ్చి, రాజుగారిని సందర్శించాడు. ఆ సమయంలో కుక్క రాజు ప్రక్కనే కూర్చొని ఉన్నది. దాన్ని చూసిన ఋషి కొంచెం సేపు కళ్ళు మూసుకొని, ధ్యానించి, "రాజా! ఈ జంతువు నీవద్ద ఉన్నదేమా, అని మాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఇది నిజానికి కుక్క కాదు. చంద్రహాస మహారాజు కుమార్తే ఈమె. సదాచార మహర్షి శాపం వల్ల ఈమెకు ఈ రూపు వచ్చింది. ఈమె పాపం నేటితో నశించింది. త్వరలో ఈమెకు తన పూర్వరూపం రాగలదు. అయితే ఈమె మనిషిగా మారాలంటే కాకులు దూరని కారడవిలో ఉన్న 'అమృతవల్లి' మూలికను తెచ్చి, దాని రసాన్ని పూయవలసి ఉంటుంది. ఏ మహావీరుడు ఆ పని చేస్తాడో అతడే ఈమెకు భర్తై, మీ తదుపరి ఈ రాజ్య సింహాసనాన్ని అధిష్టించగలడు" అని చెప్పి, వెళ్ళిపోయాడు. రాజుగారికి ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. తన ఇంటిలో చేరిన కుక్క నిజానికి చంద్రహాస మహారాజు కుమార్తె అని తెలిసి ఆయనకు చాలా సంతోషం కలిగింది. అయితే 'కాకులు దూరని కారడవిలోకి వెళ్ళి 'అమృతవల్లి'ని తేగల వీరుడెవరు? మా పట్టిని చేపట్టగల యోధుడెవ్వడు?'అని ఆయన రాజ్యం అంతటా దండోరా వేయించాడు. అనేక దేశాలనుండి గొప్ప గొప్ప యోధులు వచ్చి ప్రయత్నించారు గానీ కాకులు దూరని కారడవిలోకి వెళ్లి అమృతవల్లిని ఎవ్వరూ తేలేకపోయారు. చాలామంది జాడ తెలీకుండా పోయారుకూడా. చివరికి సింహపురి రాజ్యం నుండి విక్రముడు అనే సామాన్య వ్యక్తి ఒకడు వచ్చి తానూ ప్రయత్నిస్తానని రాజును అడిగాడు. "గొప్ప గొప్ప యువరాజులే అమృతవల్లిని కనుక్కోలేక పోయారు. సామాన్య వ్యక్తివి, నీవల్ల ఏమౌతుంది?" అన్నాడు రాజు. "మహారాజా! ఇన్నాళ్లుగా ప్రయత్నించిన వీరయోధులందరూ తమ ధైర్య సాహసాలపై ఆధారపడ్డారు. నేను నా ధైర్యాన్నీ. శౌర్యాన్నీ ఎలాగూ‌ ప్రయోగిస్తాను. అయితే నాకున్న నిజమైన శక్తులు కరుణ, జాలి. అవే నాకు విజయం కలిగిస్తాయని నా విశ్వాసం" అన్నాడు విక్రముడు, కాకులు దూరని కారడవికి బయలుదేరుతూ. అడవిలో ప్రవేశించగానే అతనికి ఒక సింహం ఎదురైంది. దానికి ఒళ్లంతా కురుపులు ఉన్నాయి. "నువ్వు అమృతవల్లి కోసం వచ్చావని నాకు తెలుసు. అయితే ఈ అడవిలో మూలిక ఒక్కరికి మాత్రమే సరిపోయేటంత ఉన్నది. నా శరీరం చూస్తున్నావు కదా, పుళ్ళు పడి నాశనమౌతున్నది. నేను బాగుపడాలంటే ఆ మూలిక నాకు అవసరం. కానీ అది నాకు అందదు. నువ్వు చెట్టెక్కి దాన్ని కోసి ఇచ్చావంటే, నాకు మేలు చేసినవాడివౌతావు" అన్నదది విక్రముడితో. "మరి నేను వచ్చిందీ దానికోసమే కదా, నీకు కోసి ఇచ్చేస్తే, మరి రాకుమారికెలా?" అన్నాడు విక్రముడు. "అదే సమస్య. నీ ముందు వచ్చినవాళ్లంతా నన్ను మోసం చేసి మూలికను తీసుకుపోదామని ప్రయత్నించి తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. నీ పనీ అలాగే అవ్వాలంటే సరే, కానివ్వు" అన్నది సింహం, కళ్లనీళ్ళ పర్యంతమౌతూ. దాన్ని చూసిన విక్రముడికి జాలి వేసింది. "నాకు కావలసిన మూలికను మళ్ళీ వెతుక్కుంటానులే. ముందు నీ కష్టాన్ని తీరుస్తాను. మూలిక ఎక్కడుందో చూపించు" అన్నాడతను సింహంతో. " మూలికను చూసిన తరువాత నన్ను మోసం చెయ్యవు గద! మోసం చేసిన వాళ్ళకు మూలిక పని చెయ్యదు!" అన్నది సింహం. "మూలిక నీకోసమే" అని విక్రముడు ప్రమాణం చేసిన మీదట, అది విక్రముడిని వెంటబెట్టుకొని కారడవి లోపలికి తీసుకుపోయింది. అక్కడ అమృతవల్లి మిల మిల మెరుస్తూ ఒక చెట్టుపైన కనిపించింది. అయితే అ చెట్టు మొదట్లో అనేక పాములూ, తేళ్ళూ కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి! విక్రముడు చేతులు మోడ్చి "ఈ సింహం కష్టాన్ని నివారించటం కోసం నేను ఈ మూలికను తీసుకు రాబోతున్నాను. నా భావన నిజమైతే, ఈ విష జంతువులు నన్నేమీ చేయకుండు గాక" అని ప్రార్థించి, ధైర్యంగా చెట్టు ఎక్కటం మొదలు పెట్టాడు. ఆశ్చర్యం! పాములు-తేళ్ళు అతన్ని ఏమీ చేయలేదు! చెట్టెక్కిన విక్రముడు మూలికను కోసుకొని క్రిందికొచ్చి, దాన్ని నలగగొట్టి, రసాన్ని సింహం శరీరం అంతటా పూసాడు. "అయ్యో! నీకు కావలసిన మూలికను నాకోసమే వాడేస్తావా?" అని సింహం బాధ పడుతూనే ఒళ్లంతా ఆ రసాన్ని రాయించుకున్నది. మరుక్షణంలో దాని కురుపులన్నీ‌పోయి, ఒక దివ్య రూపం ఏర్పడింది. "విక్రమా, నిజంగా జాలి, దయగల వ్యక్తులకోసమే నేను ఇన్నాళ్ళూ ఎదురు చూస్తున్నాను. నీకు కనిపించింది అసలు అమృతవల్లి కాదు- అమృతవల్లిని కాపాడేందుకు నియోగింపబడ్డ నేను కల్పించిన భ్రాంతే అదంతా. ఇదిగో, నీకు అవసరమైన మూలిక నేనే నీకు ఇస్తున్నాను. దీనితో రాకుమారికి పూర్వరూపం వస్తుంది. వెళ్ళు. నీ కరుణతో రాజ్యానికి సరైన దిశా నిర్దేశం చెయ్యి" అని, ఆ దివ్యసింహం విక్రమునికి అమృతవల్లినిచ్చి మాయమైంది. విక్రముడు ఆ మూలికను తెచ్చి రాయగానే, కుక్కకాస్తా అందమైన యువరాణిగా మారిపోయింది. రాజుగారు ఆమెను విక్రముడికి ఇచ్చి వైభవంగా వివాహం చేశారు . అందరూ చాలా సంతోషించారు. కాలక్రమంలో విక్రముడు రాజై, రాజ్యమంతటా దయా ధర్మాల్ని పెంపొందింపజేశాడు. కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

దుర్బుద్ధి

దుర్బుద్ధి టి.రామాంజినేయులు          అనగా అనగా ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు దగ్గర ఒక పంది, ఒక నక్క, ఒక ఏనుగు జీతానికి పని చేస్తూ ఉండేవి. రైతు ఆ మూడు జంతువులను రోజూ పొలంలో పని చేయడానికి పంపిస్తుండేవాడు. తరువాత ఆయన భోజనం తీసుకొని పోయేవాడు. ఇట్లా రైతు రోజూ చేస్తా ఉండేవాడు. ఇవి పొద్దునే ముందుగా పోయి మడక దున్నడం, గెనాలు చెక్కడం, పైరు పీకడం చేస్తూ ఉండేవి. వాటిలో ఏనుగు, పంది బాగా పనిచేసేవి. రోజూ బురదలో దిగి గెనాలు చెక్కడం, పెల్లగడ్డలు వేయడం వంటివి చేసేవి. కానీ నక్క తెలివైనది కదా, వీటితో పని మొదలు పెట్టించి, పక్కనుండే వంకలోకి పోయేది. ఆ వంకలోకి పోయి, ఎండ్రకాయల బొక్కలలోకి తోకపెట్టి అల్లాడించేది. అట్లా అల్లాడిస్తే ఎండ్రకాయలు ’ఏదో వచ్చింది’ అనుకొని ఆ తోక జుబ్బరను (వెంట్రుకలను) పట్టుకునేవి. నక్కకు ఆ విషయం తెలిసిపోయేది. తర్వాత అది తోకను మెల్లగా పైకి పీకేది. ఆతర్వాత తోకకు అంటుకున్న ఎండ్రుకాయలను పట్టుకొని తినేది. అట్లా రోజంతా చేస్తూండేది; కాని రైతు భోజనం తెచ్చే సమయానికి మాత్రం, గబా గబా వంకలోంచి బయటకు వచ్చి, బురదలో పొర్లాడి, మగమంతా బురద పూసుకొని బయటకు వచ్చేది. రైతు వచ్చి, ’భోంచేస్తురాండి!’ అని పిలిస్తే అప్పుడు ఏనుగు పంది మొత్తం అంతా శుభ్రంగా కడుక్కొని వచ్చేవి; కాని నక్క మాత్రం దబ్బలు దబ్బలు కడుక్కొనేది. అపుడు రైతుకు జాలి వేసేది. ’అయ్యో, పాపం! ఈ నక్క ఎంత కష్టపడి పని చేస్తుందో! చాలా నిజాయితీ కలది’ అనుకొని మంచి భోజనం పెట్టేవాడు; అంటే నెయ్యి వేసేవాడు; పెరుగు వేసేవాడు; మంచి అన్నం పెట్టేవాడు. దీండ్లకు (పంది, ఏనుగు) మాత్రం మాడు చెక్కలు పెట్టేవాడు. ’ఇవి సరిగా పనిచేయలేదు; కనీసం బురద గూడ పూసుకొలేదు’ అని అనుకునేవాడు. పాపం వీటికి బాధ కలిగేది. కారణం నిజంగా కష్టపడి పని చేసింది ఇవే కదా, అందుకని. నక్క మాత్రం ఊరికే పైపైకి నటించేది. కాని ఇవి అట్లాగే పనిచేసేవి. కొన్ని రోజుల తరువాత, ఏనుగు రైతు దగ్గరికి పోయి ’అన్నా! మేము చాలా కష్టపడుతుంటే, ఏందన్నా! అట్లాంటి భోజనం పెడతాండావు అది మేము వచ్చినప్పటినుంచి వంకలోకిపోయి ఆ కప్పలు, ఎండ్రకాయలు తింటూ మీరొచ్చే సమయానికి ఇట్లా వస్తాది’ అంటే రైతు ’అవునా’ అని పొలంలో కాపు కాసాడు. భార్యను అన్నం తీసుకొని రమ్మన్నాడు, అపుడు నక్క ’అది బట్టు, ఇది బట్టు, ఆ పెల్లగడ్డలు వేయి, ఆ గెనిమి చెక్కు అని ఈ రెండిటికి చెప్పి, మెల్లిగా గెనిమింటి గెనిమింటి వంకలోకి పోతుంది. రైతు భార్య అన్నం తెచ్చే సమయానికి చూపెట్టుకొని వస్తాది. ఆ మోంట్లో కొంత పొర్లాడేసి, ఆప్రక్క ఈప్రక్క పొర్లాడేసి, ఆప్రక్క ఈ ప్రక్క దబ్బలు దబ్బలు కడుక్కొని వస్తుంది. ఈ రెండూ మాత్రం శుభ్రంగా కడుక్కొని వస్తాయి. ’ఇవే బాగా పని చేస్తాయి’ అని రైతుకు అర్థం అయ్యింది. ఆ రోజున రైతు నక్కకు సద్ది అన్నము, సద్దిచారు, మాడుచెక్కలు, నీళ్ల చారు, నీళ్ళ మజ్జిగ పోశాడు. పందికి, ఏనుగుకు మాత్రం ఆ రోజున నెయ్యి, మంచి అన్నము, పెరుగు పెడతాడు. ఆవిధంగా రెండు రోజులు జరిగే సరికి, నక్కకు కుళ్ళెత్తుకుంటుంది. ఇవి తిన్న తర్వాత రైతు సద్ది తీసుకొని ఇంటికి బయలుదేరాడు. అతను వెళ్ళిన తర్వాత ఏనుగు ,పందితో నక్క అన్నది: "నాకు చెరుకులు బాగా తినబుద్ధవుతున్నది. పక్కనుండే తోటలోకి పోదాము రండి; చెరుకులు తినేసి వద్దాము" అని అనింది. పంది, ఏనుగు అన్నాయి: "వద్దు, వాళ్ళు కొడతారు, చంపేస్తారు" ఇట్లా అని చెప్తే నక్క అంది, " ఏయ్ ! ఏముంది, రాండి, నేనుండా గదా!" అని. అలాగే ఆ మాటా ఈమాటా చెప్పి తోలక పోయింది. అందరూ చెరుకులు బాగా తిన్నారు. తిన్న తరువాత నక్క " నాకు చిన్న ఊళ వస్తున్నది; చిన్నగా ఊళ వేస్తాను" అంది. అపుడు పంది "వద్దు వద్దు నక్కా, సామీ!వద్దయ్యా! వాళ్ళు వచ్చారంటే కొట్టి చంపేస్తారు. అంతేకాదు మన రైతు కూడా కొడతాడు" అంటే "ఏడా లేదు లేవయ్యా! ఏడొస్తరు గానీ" అని పోయేసి "ఊ! ఊ!" అని ఊళ పెట్టింది. మళ్ళీపోయి, ఒక ఉబ్బరం(మరొక మారు) చెరుకులు తింటుంది. తిన్న తరువాత "అవి అరగాలి కదా! ఇంకొక ఊళ వస్తోంది, వేస్తాను" అన్నది. ఏనుగు పంది వద్దన్నా వినకుండా పోయి నక్క గట్టిగా ఊళ పెట్టింది. ఈ కూతను చెరుకు తోట రైతు విని, మిగిలిన వారితో "ఒరేయి! చెరుకు తోటలో నక్కలున్నాయి. రాండి వలలు తీసుకొని పోదాము" అని చెప్పి, చుట్టూ వలలు వేసి ఒక వైపు నుండి సోపేసుకొంటు వస్తే నక్క ఆడదూరి ఈడదూరి వెళ్ళిపోయింది. ఈ రెండూ మాత్రం వలలో చిక్కిపోయాయి. వారువీటిని చంపేసారు. అందుకనే ’దుష్టులతో స్నేహం చేయటం ప్రమాదకరం’ అని గుర్తుపెట్టుకోవాలి.   కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యం తో

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు "మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ" అన్నారు పెద్దలు. తల్లి, తండ్రి తరువాత స్థానం గురువుదే అని స్పష్టం చేశారు. "గురువు" అనే పదానికి ప్రత్యేకమైన అర్ధముంది. "గు" అంటే చీకటి. "రు" అంటే తొలగించు అని అర్ధం. అజ్ఞానమనే చీకటిని తొలగిస్తాడు కాబట్టి గురువు అనే పేరు స్థిరపడిపోయింది. "గు" అంటే  గుహ్యమైనది, తెలియనిది. "రు" అంటే దానిని రుచ్యము చేసేది. అంటే ఆ రహస్యమైన దానిని తెలియపరిచేది. ప్రేమ, ఆప్యాతలకు చిహ్నంగా నిలిచే గురువు విద్యార్ధుల కలలను నిజం చేసే ప్రత్యక్ష దైవం. సాక్షాత్తూ భగవంతుడే తనకు మారుగా ఉపాధ్యాయుణ్ణి పంపిస్తే విద్యార్ధులు మాత్రం ఆయన్ను విస్మరించి మార్కుల కోసం, పరీక్షా ఫలితాలకోసం గుళ్ళూ, గోపురాల చుట్టూ తిరగడం శోచనీయం. ప్రయత్నం మానవ లక్షణం. విద్యార్ధి చేసే ప్రతి ప్రయత్నానికీ గురువు ఆశీస్సులు ఉంటాయి, ఉత్సాహ ప్రోత్సాహాలుంటాయి. గురువు నుంచి వాటిని పొందడం ముందుగా విద్యార్ధి కర్తవ్యం. అది అతని బాధ్యత కూడా. బాధ్యతను విస్మరిస్తే భగవంతుడు కూడా ఏమీ చెయ్యలేడన వాస్తవాన్ని తల్లిదండ్రులు తమ పిల్లలకు చెప్పడం వారి బాధ్యత. ఒక కుటుంబంలాంటి సమాజంలో ఎవరు ఏ బాధ్యతను నిర్వహిస్తున్నా గురువు నిర్వహించే బాధ్యత సాటిలేనిది. దేనితోనూ పోల్చడానికి వీలులేనిది. ఎందుకంటే గురువు జీవితాన్ని మారుస్తాడు. ఒక తల్లి లేదా తండ్రి తమ తమ కుటుంబాలపై ప్రభావం చూపవచ్చు. కాని ఒక గురువు బాధ్యత ఆ సమాజం పైనే తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. గురువు జాతీయ నిర్మాణకర్త కాబట్టి కర్తవ్య నిర్వహణలో ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటాడు...  ప్రియమైన ఉపాధ్యయులారా ! ఈ బాలలను మీ చేతులలోకి తీసుకుని వారికి అవసరమైనవన్నినేర్పండి,  సున్నితంగా వారి మనసుకి అర్థమయ్యేలా నేర్పించండి. ప్రతి స్వార్ధ రాజకీయనాయకుడికి ఒక నిబద్ధ నాయకుడు కూడా ఉంటాడని వారికి భోదించండి. ప్రతి శత్రువుకి ఒక మిత్రుడు కూడా ఉంటాడని వారి'కి తెలియపరచండి.ఈర్ష్యకు వారిని దూరం చెయ్యండి. మాట్లాడే మాట మీద నియంత్రణ, మాటల్లో గొప్పతనం వారికి నేర్పండి. ఎదుటివారి మీద ఆధారపడి బ్రతకటం కన్నా, సొంత కాళ్ళ మీద నిలబడటం గౌరవం అని భోదించండి. మీవల్లనయితే నిశబ్దపు నవ్వులో రహస్యాన్ని విప్పండి. సాద్యమైతే పుస్తకాలు, వాటి గొప్పతనం వారు తెలుసుకునేలా చేయండి. అయితే అదే సమయంలో " ఆకాశంలోని  పక్షులలో, ఎండలోని తేనటీగల్లో, పచ్చని కొండల్లోని పువ్వులలో, ఎడతెగని మర్మాన్ని గ్రహించేటంత నిశబ్ద ఖాళీ సమయాన్ని కూడా వారికి ఇవ్వండి. ప్రకృతిని వారు ఆరాదించి, ఆస్వాదించే మనస్సుని పెంచండి. మీవల్లనయితే విషాదంలో నవ్వటం ఎలానో భోదించండి. ఓటమిని-గెలుపుని, సుఖాన్ని-ధుఃఖాన్నికూడా సమానంగా ఎలా స్వీకరించి ఆనందించాలో భోదించండి.సత్యం తనవైపు ఉన్నదని తెలిసినప్పుడు లోకుల మూకుమ్మడి కేకలను పట్టించుకోకుండా, దైర్యంగా నిలబడటాన్ని, పోరాడటాన్నిభోదించండి. వారి'కి తప్పు అంటే భయం నేర్పండి, వీటితోపాటు ఎంత కష్టానికైనా దైర్యంగా నిలబడే సహనాన్ని భోదించండి.                   మరొక్కసారి మీ అందరికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు...  

బలవంతుని గర్వభంగం

బలవంతుని గర్వభంగం                                                                                                                                                             -నరేష్ ఒకనాడు ఒక బలవంతుడు సోము దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు: ’ప్రపంచంలో నువ్వు తెలివైన వాడివి, నేను బలమైన వాడిని. నా ఉద్దేశం ప్రకారం మనుషులకు బలం కావాలి తప్ప, తెలివి తేటలతో పనిలేదు. అందువల్ల, నువ్వు, నేను తలపడక తప్పదు. నువ్వు గొప్పో, నేను గొప్పో ఈ రోజున తేలిపోవలసిందే.’ సోము బలవంతుడిని ఒకసారి తేరిపార చూశాడు. "నీ బలమెంత?" అని అడిగాడు. "నేను ఒక చేతితో ఒక టన్ను బరువును ఎత్తి సులభంగా ఈ ప్రహరీ గోడ పైనుండి పట్టణం మధ్యకు విసిరివేయగలను" అని బలవంతుడు సమాధానమిచ్చాడు గర్వంగా. "నాకు నమ్మకం కలగటంలేదు" నెమ్మదిగా అన్నాడు సోము "అయితే నా బలాన్ని నీ ముందే నిరూపిస్తాను. ఏ బల పరీక్షకైనా నేను తయారు." అన్నాడు బలవంతుడు. "సరే, అయితే నీకొక చిన్న బలపరీక్ష పెడతాను. అందులో నెగ్గితే నువ్వు ప్రపంచంలోకెల్లా గొప్పవాడివని అంగీకరిస్తాను" అని సోము బలవంతుడిని ప్రహరీ గోడ దగ్గరకు తీసుకెళ్లాడు. తన జేబులో ఉన్న సిల్కు రుమాలును బలవంతుని చేతిలో పెట్టి, " దీన్ని ఈ ప్రహరీ గోడ అవతలికి విసిరి చూపించు చాలు" అన్నాడు. బలవంతుడు నవ్వుకుంటూ జేబు రుమాలును విసిరేశాడు. అది ప్రహరీ గోడను దాటలేదు. సోము అప్పుడు ఆ రుమాలును తీసుకొని, దానిలో ఒక చిన్న రాయిని కట్టి, దాన్ని ప్రహరీగోడ అవతలికి సులభంగా విసిరేశాడు. బలవంతుడు సిగ్గుతో తలదించుకొని, తన ఓటమిని అంగీకరించాడు. "బలం, తెలివి రెండూ గొప్పవే, ఈ ప్రపంచంలో మనిషికి రెండూ అవసరమే. ఏది లేకున్నా పరాజయం తప్పదు" అని అతన్ని ఊరడించాడు సోము. కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యం తో

అమ్మ చెప్పిన మాట

అమ్మ చెప్పిన మాట        సూర్యోదయంతో పాటే ఆ అడవి కూడా మేల్కొంది. అడవిలోని అన్ని ప్రాణులు మేతకు బయలుదేరి వెళ్ళాయి. జిరాఫీ కూడా ఆకులు, అలములు తింటూ తిరగసాగింది. " హేయ్, జిరాఫీ అన్నా, నిన్నే, ఇటురా ” అనే మధురమైన పిలుపు వినిపించి వెనక్కి తిరిగి చూసింది. ఒక చెట్టుపైన గూడులోంచి చిన్న పిచ్చుక తనని పిలుస్తోంది. దాన్ని చూస్తే జిరాఫికి చాలా ముద్దొచ్చింది. వెనక్కి వచ్చి " ఎందుకు పిలిచావు ” అని అడిగింది జిరాఫి. "మా అమ్మ మేతకు వెళ్ళింది, నాకేమో చాలా బోర్ గా ఉంది. నాకు ఇంకా పూర్తిగా రెక్కలు రాలేదు కదా. అందుకని నన్ను అమ్మ ఎక్కడికి వెళ్ళనివ్వదు. మా ఫ్రెండ్ చింటూ ఈ చెట్టు కిందున్న తొర్రలో ఉంటాడు. వాడితో కాసేపు ఆడుకుంటాను. నన్ను అక్కడికి చేర్చవా” అని పిచ్చుక పిల్ల జిరాఫీని వేడుకుంది. " మీ అమ్మ పర్మిషన్ తీసుకోకుండా ఎట్లా" అంది జిరాఫీ. "అమ్మో మా అమ్మకు తెలిస్తే అస్సలు వెళ్లనివ్వదు. ప్లీజ్ జిరాఫీ అన్నా” అంటూ పిచ్చుకపిల్ల ఏడ్చింది. పాపం పిచ్చుకను చూస్తే జాలేసింది జిరాఫీకి. పిచ్చుక పిల్లని దాని స్నేహితుని దగ్గరికి చేర్చి, మళ్ళీ ఆకులు అలములు తినడంలో మునిగిపోయింది జిరాఫీ. కాసేపయ్యాక " రక్షించండి, రక్షించండి ” అంటూ అరుపులు వినిపించాయి జిరాఫీకి. చెట్టు మొదట్లో నక్క కనిపించింది. గబగబా చెట్టు దగ్గరికి చేరుకొనే లోపే నక్క నోటిలో పిచ్చుక పిల్లను కరచుకుంది. జిరాఫీ వేగంగా కదిలి దాని పొడువాటి కాలుతో నక్కని ఒక్క తన్ను తన్నింది. ఆ దెబ్బకు నక్క నోటి నుంచి పిచ్చుక పిల్ల జారి క్రింద పడింది. నక్క పారిపోయింది. పిచ్చుక పిల్లను తిరిగి జాగ్రత్తగా దాని గూట్లోకి చేరుస్తుండగా తల్లి పిచ్చుక వచ్చింది. వస్తూనే " ఏం జరిగింది.” అని కంగారుగా అడిగింది. జిరాఫీ జరిగిన సంగతంతా చెప్పింది. తల్లి మాట వినకుండా తను జిరాఫీ సహాయంతో కిందకు వెళ్ళినందుకు పిచ్చుకపిల్ల చాలా సిగ్గుపడింది. తల్లిని క్షమించమని కోరింది. " నీవు చేసిన మేలు మరచిపోలేను” అంటూ జిరాఫీకి కృతజ్ఞతలు తెలియజేసుకున్నది తల్లిపిచ్చుక, తన పిల్లను ప్రేమగా అదుముకుంటూ. కొత్తపల్లిఇన్ వారి సౌజన్యం తో

పిల్లి దేవుడు

పిల్లి దేవుడు మూలం: పర్తాప్ అగర్వాల్ తెలుగు అనుసరణ: నారాయణ జనార్దన్ కి బాగా అతి తెలివి. చిన్న తనం నుండీ అతని అల్లరికి హద్దు ఉండేది కాదు. అయితే అతని అల్లరి వల్ల ఎవరికీ పెద్దగా నష్టం జరగలేదు. స్వతహాగా మంచివాడు కావటంతో, అతని స్నేహితులు అతన్ని చాలా ప్రేమించేవాళ్ళు. పెద్దవాళ్ళు ఒక్కోసారి కోప్పడేవాళ్లు. టీచర్లు చాలావరకూ అతన్ని భరించి ఊరుకునేవాళ్ళు. 'జనార్దన్ పెద్దవాడయ్యాక, కాలేజీ చదువులు ముగించుకొని, లక్ష్మిని పెండ్లి చేసుకున్నాడు; చక్కని అపార్టుమెంటు ఒకటి కొనుక్కున్నాడు- కానీ‌ ఆ అల్లరి మెదడు మాత్రం అట్లానే ఉంది. వాళ్లకి ఇంకా పిల్లలు పుట్టలేదు. ఇంట్లో వాళ్ళతో పాటు ఒక పిల్లి మాత్రం ఉండేది. ఒకసారి జనార్దన్ కి చాలా జ్వరం వచ్చింది. ఆస్పత్రిలో డాక్టర్లు పెదవి విరిచారు. అదేం జ్వరమో తెలీలేదు ఎవ్వరికీ. ఇక ప్రాణం పోతుందనగా జనార్దన్ కి దేవుడు గుర్తొచ్చాడు- "దేవుడా, దేవుడా! నన్ను ఇంకొంతకాలం బ్రతకనివ్వు. నా రోగం తగ్గించావంటే, నా యీ ఆస్తిని మొత్తాన్నీ అమ్మి, ఆ డబ్బును ఏదైనా మంచి పనికోసం ఇచ్చేస్తాను" అని మొక్కుకున్నాడు. దేవుడు జనార్దన్ మొర విన్నాడో, లేకపోతే డాక్టర్లిచ్చిన మందులే పనిచేశాయో, అతని ఆరోగ్యం‌ మాత్రం మెల్లగా కుదురుకున్నది. భార్యాభర్తలిద్దరూ సంతోషంగా ఊపిరి పీల్చుకున్నారు. బాగై ఇంటికి వచ్చిన జనార్దన్ ను తన మొక్కు పీడించసాగింది. "అయ్యో! తప్పు చేశానే! ఈ‌ఇల్లుని అమ్మేస్తానని మొక్కుకున్నానే! ఇంత పెద్ద ఇల్లుని చేతులారా‌ ఎలా అమ్మేది?! ఆ డబ్బునంతా వేరేవాళ్ళకి ఎలా ఇచ్చేసేది?" అని బాధ మొదలైంది. అలాగని, మొక్కును మరిచిపోయి ప్రశాంతంగా ఉండనూ లేడు! ఇదే ఎడతెరపిలేని ఆలోచన అతన్ని రాతింబవళ్ళూ వెంటాడింది. అప్పుడు అతని అల్లరి మెదడు మళ్ళీ ఓసారి మేలుకున్నది- అతనికి ఒక గొప్ప ఐడియా ఇచ్చింది! జనార్దన్ వెంటనే దాన్ని అమలు చేశాడు. ఇంటిని ఫలానా తేదీన వేలం వేస్తున్నట్లు బోర్డు పెట్టేశాడు. అనుకున్న రోజున, ఆయింటిని కొనాలనుకున్నవాళ్లంతా వచ్చారు. జనార్దన్ వేలాన్ని మొదలు పెడుతూ చిన్న ఉపన్యాసమొకటి ఇచ్చాడు- "మిత్రులారా! స్వాగతం! రండి! ఒక ఇంటినీ, ఒక పిల్లినీ వేలానికి పెడుతున్నాను. ఇంటి ఖరీదు ఒక్కరూపాయి మాత్రమే. పిల్లి ఖరీదు మొదటగా లక్ష రూపాయలు మాత్రమే. కొనేవాళ్ళు రెండింటినీ‌ కలిపే కొనాలి. ఇక మొదలు పెట్టండి- ఎవరైనా అంతకంటే ఎక్కువ చెల్లించేవాళ్ళు ఉంటే ముందుకు రండి." జనాలకు ఆశ్చర్యం‌ వేసింది. ఇంటి ఖరీదు ఎందుకు, అంత తక్కువ? పిల్లి ఖరీదు ఎందుకు, అంత ఎక్కువ, అని. అయినా వాళ్లలో‌కొందరు ముందుకు వచ్చి సరదాగా వేలం పాడారు. పిల్లి లక్షా పది వేలకు, ఇల్లు ఒక రూపాయికి అమ్ముడయ్యాయి. ఇంటిని కొన్నవాళ్ళు మరునాడే జనార్దన్ కు డబ్బు ఇచ్చేశారు. జనార్దన్ తన ఇంటిని ఖాళీ‌చేయగానే వాళ్ళు ఆ ఇంట్లోకి చేరుకున్నారు; 'పిల్లి తమకెందుకు' అని దాన్ని తరిమేశారు! జనార్దన్ ఒక రూపాయిని పట్టుకొని గుడికి వెళ్ళి, దేవుడికి నమస్కారం పెట్టి, "దేవుడా! ఇంటిని అమ్మి, వచ్చిన డబ్బంతా నీకే ఇస్తానన్నాను- ఇదిగో, ఒక రూపాయి వచ్చింది. ఇది నీదే!" అని భక్తిగా ఆ ఒక్క రూపాయినీ‌ హుండీలో‌వేసి వచ్చాడు. గుళ్ళో దేవుడు సంతోషంగా నవ్వినట్లు అనిపించింది. ఇప్పుడు అతని మనసు తేలికైంది- మ్రొక్కు తీరినందుకు హాయిగా ఉంది. ఇక ఆపైన జనార్దన్ తన దగ్గర మిగిలిన లక్షా పదివేల రూపాయలు పెట్టి మరొక ఇల్లు కొనుక్కున్నాడు. లక్ష్మి ఇంటిని చక్కగా సర్ది పెట్టింది. ఇద్దరూ సంతోషంగా క్రొత్త ఇంట్లో‌ క్రొత్త జీవితం మొదలు పెట్టారు. ఆ తర్వాత ఒక రోజు భయంకరమైన భూకంపం‌ఒకటి వచ్చింది. అదృష్టంకొద్దీ ఆ రోజు లక్ష్మి ఇంట్లో లేదు. అనేకమంది ఇళ్లతో‌పాటు జనార్దన్ క్రొత్త ఇల్లూ కూలింది. జనార్దన్ ఆ గృహ శకలాలలో కూరుకుపోయాడు. బాగా గాయాలయ్యాయి; పైన బరువు పడటం వల్ల, అతను కదలలేకపోయాడు. రెండు రోజులపాటు అతను అలా ఆ శకలాలలో పడి ఉన్నా, కాపాడేందుకు ఎవ్వరూ ఆవైపుకు రాలేదు! చివరికి అతను నీరసించి పోయి, ప్రాణాలమీద ఆశ వదులుకున్న సమయంలో ఒక విచిత్రం జరిగింది- "మ్యావ్!" అని అరుపు వినబడిందతనికి! పిల్లి!! అది వచ్చి, అరుస్తూ, జనార్దన్ చేతుల్ని నాకటం మొదలు పెట్టింది. చివరికి అదే మిగిలిన వాళ్లకు జనార్దన్ ఆచూకీ‌ చూపించింది! అందరూ కలిసి అతన్ని బయటికి లాగారు. "దేవుడా! 'నాది' అనుకున్న ఇల్లు వచ్చి నా మీద పడితే, 'నాది కాదు' అని వదిలేసిన పిల్లి వచ్చి నన్ను కాపాడింది. నీ సృష్టిలో హెచ్చు తగ్గులు ఏవీ‌ లేవు. 'నాది-పరాయిది' అంటూ వాటిని కల్పించుకొనేది మా యీ మనసే" అనుకున్నాడు జనార్దన్, పిల్లిని నిమురుతూ, కళ్లనిండా నీళ్ళతో. కొట్టాపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

ఇంద్రధనసు పిట్టలు

ఇంద్రధనసు పిట్టలు రచన: లలిత అనగా అనగా ఒక పల్లెటూరు. అక్కడ ఓ చిన్న పాప. ఆ పాప పేరు లీల. లీలకు పక్షులంటే చాలా ఇష్టం. తోటలో తిరుగుతూ, పక్షుల్ని చూస్తూ, వాటి శబ్దాల్ని అనుకరిస్తూ ఎంత సేపైనా గడిపేసేది. ఒక రోజున ఆ తోటలోకి మూడు వింత పక్షులు వచ్చాయి. ఇంద్రధనసులోని రంగులన్నీ వాటిలో ఉన్నాయి! చాలా వింతగా అనిపించినై, ఆ పక్షులు! వాటిని చూసి, లీల చాలా ముచ్చట పడింది. అవి వాలి ఉన్న పొద దగ్గరకు వెళ్ళింది, నెమ్మదిగా. ఆశ్చర్యం! అవి మనుషుల భాషలో మాట్లాడుకుంటున్నాయి! నిజానికి అవి దేవ కన్యలట. వాటికి ఇంద్రధనసు అంటే ఎంతో ఇష్టమట. అందుకని, ఒక రోజు వాన లేకున్నా, అవి తమ మాయతో ఆకాశంలో ఇంద్రధనసును సృష్టించి, జారుడు బల్లలాగా దాని మీద ఎక్కి, జారుతూ ఆడుకోసాగాయిట. దాంతో వాన దేవుడికి కోపం వచ్చి "మీకు ఇష్టమైన ఇంద్రధనసు పిట్టలుగా మారిపోండి" అని, పిట్టలుగా మార్చేసి భూలోకానికి పంపించేశాడుట. ఆ విషయాన్ని గుర్తు చేసుకుని పక్షుల రూపంలో ఉన్న దేవకన్యలు బాధపడుతున్నారు. ఇది విని లీలకు వాటి పైన చాలా జాలి వేసింది. అ తర్వాత పిట్టలు ఇంకేమీ మాట్లాడలేదు. కాసేపు అలాగే ఎదురు చూసిన లీల, ఇంక ఆగలేక, మెల్లగా పిట్టలను పిలిచింది. వెంటనే అవి మామూలు పిట్టలలానే కూస్తూ అక్కడి నించి ఎగిరి పోబోయాయి. కానీ, లీల "నేను అంతా విన్నాను. మీకు ఏమైనా సాయం చెయ్యగలనా?" అని అడిగేసరికి, "అలా ఇంకొకరి మాటలు వినడం తప్పు కాదా?" అని అడిగాయవి. లీల అన్నది- "మీరు మనుషులలాగా మాట్లాడుతుంటే కుతూహలం కొద్దీ విన్నాను. మీరు కష్టంలో ఉన్నారని తెలిసి, 'సాయం చెయ్యగలనేమో' అని అడుగుతున్నాను" అంది. అప్పుడా పిట్టలు కాసేపు ఒక దానిని ఒకటి చూసుకుని, "సరే చెప్తాము. చెయ్యగలవేమో చూడు," అన్నాయి. ఆ పిట్టలు చెప్పిన దాని ప్రకారం, జరగ వలసినది ఇదీ: రోజూ సాయంత్రం పిట్టలు చెప్పిన సమయానికి తోటకు వచ్చి, అవి నేర్పే పాటను నేర్చుకోవాలి లీల. పాటను పూర్తిగా నేర్చుకునేందుకు నెలరోజులు పడుతుంది. అయితే ఆ పాటను ఇంకెవ్వరి ముందూ పాడకూడదు. నెల పూర్తయినాక లీల పాటను వినిపించగానే, పిట్టలు మళ్లీ దేవకన్యలుగా మారిపోతాయి. అయితే ఆ తర్వాత ఇంకెప్పుడూ లీల ఆ పాటను పాడకూడదు. పాడిందంటే వాళ్లు మళ్ళీ పిట్టలుగా మారిపోవాల్సి వస్తుంది! లీల అలా చెయ్యడానికి ఒప్పుకుంది. పిట్టలు నేర్పిన ఆ పాట ఎంతో బావుంది. ఇంట్లో ఆ పాటను పైకి పాడకుండా ఉండటం కష్టంగానే ఉంది. మొత్తానికి నెల గడిచింది. లీల పాటను పూర్తిగా నేర్చుకుంది. ఇక తను పాట పాడి, పిట్టలకు మళ్ళీ దేవకన్యల రూపం తెప్పించటమే మిగిలి ఉంది. ఆ రోజున లీల చాలా ఉత్సాహంగా వెళ్ళింది తోటకు. కానీ ఎందుకనో, ఆ రోజున పిట్టలు రాలేదు! లీల అక్కడే కూర్చొని చాలా సేపు ఎదురు చూసింది. చివరికి బాధగా ఇంటికి వెళ్ళింది. అలా వరసగా కొన్ని రోజులపాటు లీల రోజూ తోటకు వచ్చి, పిట్టల కోసం వెతికేది. తను నేర్చుకున్న పాటను మర్చిపోకుండా ఉండాలని, ప్రతిరోజూ ఒంటరిగా పాడుకునేది. ఒకరోజున వాళ్ళ ఊళ్ళో జాతర జరిగింది. లీల కూడా వెళ్ళింది, జాతర చూసేందుకు. అక్కడ ఒక చోట చాలామంది జనాలు పోగయి ఉన్నారు. లీల కుతూహలం కొద్దీ అక్కడకి వెళ్ళి చూసేసరికి, ఒక పెద్ద పంజరంలో కనిపించాయి ఆ మూడూ పిట్టలూ! పిట్టలని పట్టుకున్న వాడు వాటి చేత మాట్లాడిస్తూ, ప్రదర్శిస్తున్నాడు. జనాలందరూ ఆ వింతను చూసి ఆనందిస్తున్నారు! లీలకు చాలా బాధ వేసింది. వెంటనే పిట్టలు తనకి నేర్పించిన పాటను గొంతెత్తి పాడడం మొదలు పెట్టింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ అద్భుతమైన ఆ పాటను విని మైమరచిపోయారు. పాట అయిపోయే సరికి పంజరంలో ఉన్న పిట్టలు కాస్తా మాయమయ్యాయి. పాటను విన్నవాళ్లు కొట్టే చప్పట్లలో పిట్టలవాడి అరుపులు ఎవ్వరికీ వినిపించలేదు. సందడి తగ్గే సరికి అందరూ ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోయారు! అయితే ఇప్పుడు లీలకి ఇంకొక చిక్కొచ్చి పడింది. ఇంటికి వెళ్ళాక, అందరూ లీలను ఆ పాటే పాడమని బలవంతం చేయసాగారు. వాళ్ళకు లొంగి, చివరికి లీల ఒక్క సారి ఆ పాటను పాడేసరికి, దేవకన్యలు మళ్ళీ పిట్టలుగా మారి, లీల ఉన్న చోటికి వచ్చేసాయి! లీల వాటిని చూసి చాలా సిగ్గుపడింది. అయితే అవి నవ్వి, " ఏమీ నష్టం జరగలేదులే! మేము వెళ్ళాక వాన దేవుడికి జరిగిందంతా చెప్పాము. అందరి ముందూ పాట పాడవలసి వచ్చినందుకు ఇక లీల మళ్ళీ పాడకుండా ఉండడం కష్టమనీ, అందువల్ల ఆ పాటను లీల ఎప్పుడైనా ఎక్కడైనా పాడుకునేలా ఒప్పుకోమనీ వాన దేవుడిని ప్రాధేయ పడ్డాము. వాన దేవుడు ఒప్పుకుని, ఆ విషయం చెప్పి రమ్మని మమ్మల్ని మళ్ళీ ఇలా పంపించాడు" అని చెప్పాయి! ఆ సంగతి తెలుసుకొని లీల ఎంతో సంతోషించింది. ఇక తనకు ఎప్పుడు తోస్తే అప్పుడు అద్భుతమైన ఆ పాటను మనసారా పాడుకుంటూ ఉండచ్చు! అయితే ఎవ్వరికీ తెలీని రహస్యం ఒకటుంది: ఎప్పుడైనా, తోటలో ఒంటరిగా ఉన్నప్పుడు- లీల గనక ఆ పాట పాడితే, ఇంద్రధనసు పిట్టలు వచ్చి, లీలను అలా ఆకాశంలోకి తీసుకుని వెళ్ళి, మబ్బులలో తిప్పి తీసుకు వస్తాయి! కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

వెర్రి వెంగళప్ప

వెర్రి వెంగళప్ప ఏ. స్టీఫెన్, 8వ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల, చెన్నేకొత్తపల్లి. అనగనగా ఒక ఊరు ఉండేది. ఆ ఊరు పేరు రామాపురం. ఆ ఊళ్లో ఒక వెర్రి వెంగళప్ప ఉండేవాడు. వానికి ఒక అవ్వ ఉండేది. అవ్వకి అతనంటే ఇష్టం; అతనికి అవ్వ అంటే ఇష్టం. ఒకసారి అవ్వకి జ్వరమొచ్చింది. చాలా రోజులుగా అట్లాగే ఉంది. అప్పుడు మనవడికి చాలా బాధ అయ్యింది. ఎలాగైనా అవ్వ ఆరోగ్యం బాగు చేపించాలని అనుకుంటాడు. వైద్యానికి చాలా సంపాదించాలని అనుకుంటాడు. అందుకోసం ప్రక్క నగరంకి వెళ్ళాడు. వెంగళప్ప నగరానికి వెళ్ళి, రెండు రూపాయలు సంపాదించాడు. తిరిగి వచ్చేటప్పుడు, నది దాటించటంకోసం పడవ వాడికి ఒక రూపాయి ఇచ్చాడు. ఇంకొక రూపాయిని చేతిలో పట్టుకొని, ఊరికే ఉండకుండా గాలిలోకి ఎగరెయ్యటం మొదలు పెట్టాడు. అట్లా ఎగరేసుకుంటుంటే అది నదిలో పడిపోయింది. అతనికి చాలా బాధ అయ్యింది. ఇంటికి వెళ్ళగానే అవ్వ 'ఏమి సంపాదించావురా, మనవడా?' అని అడిగింది. "నేను ఒక రూపాయి పడవ వానికి ఇచ్చి, ఒక రూపాయి ఎగర వేసుకుంటూ వస్తుంటే అది నదిలో పడిపోయింది" అని చెప్పాడు వెంగళప్ప. "ఒరేయ్! అలాంటిది జేబులో వేసుకుని రావాలి" అని చెప్పింది అవ్వ. మరుసటి రోజు వెంగళప్ప నగరానికి వెళ్ళి, నెయ్యి దుకాణంలో పని చేశాడు. కూలీగా అతనికి కిలో నెయ్యి ఇచ్చాడు దుకాణదారు. ఇంటికి బయలుదేరిన వెంగళప్పకు అవ్వ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. నెయ్యినంతా తన జేబుల్లో కుక్కుకొని బయలుదేరాడు. అతను ఇంటికి చేరుకునే లోపు నెయ్యి కరిగి పోయింది. జరిగింది తెలుసుకుని, "అలాంటి దాన్ని గిన్నెలో వేసుకుని రావాలిరా, నాయనా!' అని చెప్పింది అవ్వ. ఈసారి వెంగళప్ప మేకల్ని మేపే పనికి కుదురుకున్నాడు. కొన్ని రోజులు పని చేసిన మీదట, యజమాని కూలీగా ఒక చిన్న మేక పిల్లను ఇచ్చాడు. మేకపిల్లను ఇంటికి తెద్దామని బయలుదేరిన వెంగళప్పకు అవ్వ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. దాన్ని గిన్నెలోకి ఎంత కుక్కినా పట్టలేదు. చివరికి వాడు దాన్ని ఒక గోతంలో వేసుకుని, ఇంటికి మోసుకొచ్చాడు. ఇంటికి వచ్చేసరికి మేక చనిపోయింది. అప్పుడు అవ్వ ' అయ్యో! అలాంటి దాన్ని తాడుతో కట్టుకుని రావాలి బాబూ!' అని చెప్పింది. ఈసారి వాడికి ఒక పెద్ద చేప దొరికింది. అవ్వ మాటల్ని గుర్తుంచుకొని, వాడు దానికి భద్రంగా ఒక తాడు కట్టి, దాన్ని ఇంటి వరకు ఈడ్చుకొచ్చాడు. ఇంటికి వచ్చే సరికి ఎముకలు మాత్రం మిగిలాయి. మాంసం మొత్తం ఎక్కడికి పోయిందో కూడా అంతు చిక్క లేదు! 'ఓరి బాబూ ! ఇలాంటి దాన్ని లాక్కు రారు నాయనా! ఎత్తుకుని రావాలి ' అని చెప్పింది అవ్వ. మరుసటి రోజు అతనికి ఒక గాడిద దొరికింది. అవ్వ చెప్పిన సంగతిని గుర్తుంచుకొని, వాడు దాన్ని ఎత్తుకోబోయాడు. ఉండబట్టలేక, అది వాడిని టపాటపామని తన్నుతున్నది. దాన్ని గమనిస్తూ ఉన్నది, ప్రక్కనే కోటలో ఉన్న రాణి. ఎంతో కాలంగా నవ్వు అంటూ ఎరగని ఆమె, దాన్ని చూసి పగలబడి నవ్వింది. అప్పటికే 'నా భార్యను నవ్వించిన వాళ్ళకు పెద్ద బహుమానం ఇస్తాను' అని ప్రకటించి ఉన్నాడు రాజు. ఇప్పుడు రాణి ఇలా పగలబడి నవ్వటాన్ని చూసిన రాజుకు చాలా సంతోషం వేసింది. "ఎంత అద్భుతం! ఎప్పుడూ నవ్వని నా రాణి నవ్వింది! ఎవ్వరి వల్ల, ఇది సాధ్యమయింది?' అనుకొని, అలా నవ్వించిన వాళ్లెవ్వరో వెతికి, గౌరవంగా పిలుచుకు రమ్మని పంపించాడు భటుల్ని. భటులు వెంగళప్పను రాజు దగ్గరకు తీసుకెళ్లారు. రాజు వెంగళప్పను ఘనంగా సత్కరించి, చాలా బంగారం, డబ్బులూ బహుమానంగా ఇచ్చాడు. అంతేకాక అతనికి ఆస్థాన విదూషకుడి ఉద్యోగం కూడా ఇచ్చాడు. అలా ధనవంతుడైన వెంగళప్ప , అందరినీ నవ్విస్తూ చాలా పేరు తెచ్చుకున్నాడు. కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

నెమలి కల

నెమలి కల రచన: M.చంద్ర శేఖర్, 10వ తరగతి, ప్రకృతిబడి, చెన్నేకొత్తపల్లి, అనంతపురం జిల్లా. కనగానపల్లి చుట్టూతా రమణీయమైన ప్రకృతి ఉండేది. అడవి, కొండలు, వాగు-వంకలతో ఆ ప్రదేశం పచ్చగా కళకళలాడుతూ ఉండేది. ఊరి ప్రజలంతా అడవులపైనే ఆధారపడి జీవిస్తూ ఉండేవాళ్ళు. ఆ ఊళ్ళో సిసింద్రి- విష్ణు అనే అన్నదమ్ములిద్దరు నివసిస్తూ ఉండేవాళ్ళు. సిసింద్రి-విష్ణులకు ఇద్దరికీ అడవి అంటే చాలా ఇష్టం. అయితే బడికి వెళ్ళే పిల్లలు కావటంతో అడవికి వెళ్ళేందుకు పెద్దగా సమయం చిక్కేది కాదు. అడవిలో ఉండే పక్షులు, జంతువుల్ని చూడటం, అడవిలో దొరికే రకరకాల పండ్లు తినటం, అలా ఊరికే నడచుకుంటూ పోవటం - ఇవన్నీ వాళ్ళిద్దరికీ బలేగా అనిపించేవి. ఒకరోజున, వాళ్ల బడికి అనుకోకుండా శలవు ఇచ్చారు. సిసింద్రి-విష్ణులు ఇద్దరూ 'ఏం చేద్దామా?' అని ఆలోచించి, అడవికి వెళ్ళొద్దామనుకున్నారు. అక్కడ ఒక వంకలో చాలా సేపు ఈతకొట్టి, దగ్గర్లోనే ఉన్న ఈత చెట్లోంచి పళ్ళు కోసుకొని తిన్నారు. అంతలో విష్ణుకు ఒక నెమలి కనబడింది. మెరిసిపోయే పింఛంతో, నిగనిగలాడే ఈకలతో, నేలబారున, ఈడుస్తూ పోయే తోకతో ఉన్న ఆ నెమలి, సంతోషంగా అరుస్తూ నాట్యం చేయటం మొదలు పెట్టింది! అప్పటివరకూ వాళ్లకు ఆ అడవిలో నెమళ్లున్నాయని తెలీనే తెలీదు- ఇప్పుడు అకస్మాత్తుగా నెమలి కనబడటంతో ఇద్దరూ ఆశ్చర్యంతో నిశ్చేష్టులైపోయి, గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు. "అన్నా! అన్నా! నాకొక నెమలి ఈక కావాలి!" అన్నాడు విష్ణు గుసగుసగా. "దాని ముక్కు చూడరా, ఎంత గట్టిగా ఉందో! ఒక్క పోటు పొడిచిందంటే అంతే సంగతులు!" అన్నాడు సిసింద్రి. "మరి సుబ్బుగాడి దగ్గర ఒక మంచి నెమలి ఈక ఉన్నది గదా, అదెట్లా వచ్చింది?" అడిగాడు విష్ణు. "వాళ్ల నాన్న ఏమైనా వేటగాడో, ఏమో మరి? లేకపోతే నెమలే వాడికి ఒక ఈకను ఇచ్చిందేమో?" అన్నాడు సిసింద్రి. "మనకూ ఒక ఈకని ఇమ్మందాం- ఏం చేస్తుందో చూద్దాం" అని, విష్ణు పొదల్లోంచి ముందుకు పరుగెత్తాడు. అయితే అలికిడి వినగానే తలత్రిప్పి చూసిన నెమలి, పెద్దగా అరుచుకుంటూ చెట్టుమీదికి ఎగిరి, గబ గబా ఎటో వెళ్ళిపోయింది! విష్ణు నిరాశచెందాడు. ఆ నిరాశలో ఎటో చూసుకుంటూ నడుస్తున్న వాడికి, ఒక నేరేడు చెట్టును చూడగానే ప్రాణం లేచి వచ్చినట్లైంది. గబగబా నేరేడు చెట్టు దగ్గరికి పరుగెత్తారు ఇద్దరూ- అయితే చెట్టు పెద్దగా ఉంది, చాలా నునుపుగా కూడాను! దానిక్రింద మామూలుగా పడి ఉండాల్సిన నేరేడు పళ్ళేవీ, ఎందుకో మరి, ఒక్కటీ లేదు! "చెట్టు పైకి రాళ్ళు వేద్దామా?" అన్నాడు విష్ణు ఆశగా. "వద్దు వద్దు- పాపం చెట్టుకు దెబ్బ తగిలి నొప్పి పుడుతుంది" అన్నాడు సిసింద్రి. "మరి ఎట్లాగైనా నెమలిని వెతికి పట్టుకొని, ఒక ఈక పీకి ఇవ్వు" మారాం చేశాడు విష్ణు. "తప్పు తమ్ముడూ! చెట్టుమీదికి రాళ్ళు వేస్తే చెట్టుకు నొప్పి పుడుతుంది; ఈకలు పీకితే నెమలికి నొప్పి పుడుతుంది!' అన్నాడు సిసింద్రి- "సాయంత్రం అవుతున్నది- పద ఇంటికి పోదాం" అని లేస్తూ. విష్ణుకు అస్సలు అడవిని వదిలి పోబుద్ధి కాలేదు. "అయినా అన్న నిర్ణయం! వెళ్లక తప్పదు! సాయంత్రం అవుతున్నది! నెమలికి నొప్పి పుడుతుంది! చెట్టుకూ నొప్పి పుడుతుంది!"- ఇవే ఆలోచనలు నడుస్తూండగా, వాడూ అన్నవెంబడి నడిచి, ఇల్లు చేరుకున్నాడు. అదే సంగతి ఆలోచిస్తూ పడుకున్న విష్ణుకు ఆరోజు ఒక కల వచ్చింది: అడవిలో కనబడ్డ నెమలి వాళ్ళ ఇంటికి వచ్చింది! అది తినేందుకు ఏం తెచ్చుకున్నదో తెలుసా? నేరేడు పళ్లు! చాలా నేరేడు పళ్ళు తెచ్చుకొని, అది వాళ్ళింటి గడపమీదే పెట్టుకొని తిన్నది. అంతలో చిన్న చిన్నగా వాన మొదలైంది. ఇంటి ముందు జలజలా వాన పడుతుంటే ఆ నెమలికి చాలా సంతోషం వేసింది. వెంటనే అది పురి విప్పి, ఎంతో అందంగా నాట్యం చేసింది! చేసీ చేసీ అలిసిపోయి, అది ఒక ఈకను అక్కడే వదిలేసి అడవిలోకి వెళ్ళిపోయింది! నవ్వుముఖంతో నిద్రలేచిన విష్ణును చూసి అమ్మ మురిపెంగా "ఏమిరా, విష్ణూ! నేరేడు పళ్ళు బాగా తిన్నట్లున్నావే, ఇంటి ముందంతా విత్తనాలు పడేశావేంటి?" అన్నది. విష్ణు గబగబా లేచి పరుగెత్తుకొని పోయి చూశాడు- నిజమే.. ఇంటి ముందంతా నేరేడు పళ్ళ విత్తనాలు పడి ఉన్నై! ఇంటి ముందు నేలమీద అంతా కోళ్లు తిరుగాడినట్లు కాలి గుర్తులున్నై.. వెతికి చూడగా వాడికి ఒక నెమలీక దొరికింది కూడాను!! కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

మారిన మనసు

మారిన మనసు రచన: C.కృష్ణవేణి, 7వ తరగతి, టింబక్టు బడి, చెన్నేకొత్తపల్లి. అనగా అనగా ఒక ఊరు . ఆ ఊరి పేరు ఒంటికొండ. ఆ ఊళ్ళో ఒక బడి ఉంది. ఒక రోజున ఆ బడిలో పాటల కార్యక్రమం జరుగుతున్నది. ఆ పాటల్ని వినేందుకు చాలా మంది వచ్చి ఉన్నారు. పాటలు పాడటానికి పిల్లలంతా పోటీ పడుతున్నారు. అయితే, ఆ బడిలో చదివే భీమరాజు 'అమ్మ' గురించి పాడిన పాట విని, అందరూ పరవశించిపోయారు. ఎప్పటిలాగే ఈసారి కూడా భీమరాజుకే మొదటి బహుమతి వచ్చింది. ఆ బహుమతిని పట్టుకొని భీమరాజు సంతోషంగా ఇంటికి పరుగెత్తాడు. భీమరాజు వాళ్ళది చాలా పేద కుటుంబం. అతను చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోయాడు. అప్పటినుండీ వాళ్ళ అమ్మ కూలిపని చేసుకుంటూ అతన్నీ, వాళ్ల అన్ననీ పెంచి పెద్ద చేసింది. అన్నకు పెళ్ళైంది; చిన్న ఉద్యోగం దొరికింది- గానీ అతని సంపాదన అతని కుటుంబానికే సరిపోతుంది. భీమరాజు చదువు పూర్తయేంత వరకూ వాళ్ళమ్మకు చాకిరీ తప్పదు. సంతోషంగా ఇల్లు చేరుకున్న భీమరాజు వాళ్ళమ్మకు తన బహుమతిని చూపించి- 'నువ్వు నేర్పిన పాటకేనమ్మా, ఈ బహుమతి వచ్చింది!' అని చెబితే, వాళ్ళమ్మ గర్వంతో పొంగిపోయింది. 'సరే, నువ్వు వెళ్ళి స్నానం చేసి, రా! ఇవాళ్ల నీ పుట్టిన రోజు కదా, కొత్త అంగీ కుడుతున్నాను. నీ స్నానం అవ్వగానే ముందు కొంచెం పాయసం తిందువు ' అన్నది. అయితే, ఆమెకు చాలా కాలంగా కాన్సర్ వ్యాధి ఉన్నది. అదే రోజు సాయంత్రం ఆమె చనిపోయింది! ఇప్పుడు ఇక భీమరాజును చూసుకునే బాధ్యత వాళ్ల అన్నమీద పడింది. అన్న మంచివాడే, కానీ ఒదిన గంగమ్మకు మాత్రం భీమరాజంటే ఇష్టం ఉండేది కాదు. ఆమె ఎప్పుడూ అతన్ని సాధిస్తూ ఉండేది. భీమరాజు మాత్రం నోరు మెదపకుండా ఇంటి పనులన్నీ‌చకచకా చేసేసి బడికి వెళ్ళి శ్రద్ధగా చదువుకొనేవాడు. బడినుండి ఇంటికి వచ్చాక కూడా అతనికోసం ఇంటినిండా పనులు సిద్ధంగా ఉండేవి. అన్ని పనులూ చేసేసి, అందరూ భోజనాలు కానిచ్చి పడుకున్నాక, భీమరాజు తన హోం-వర్కు చేసుకునేవాడు. ఎంత చేసినా వదిన చేతిలో అతనికి తిట్లు తినక తప్పేది కాదు. చూస్తూండగానే సంవత్సరం గడిచి-పోయింది. బడిలో పాటల పోటీలు జరుగుతున్నై, మళ్ళీ. ఆ పోటీని చూసేందుకు భీమరాజు అన్నావదినలు కూడా వచ్చారు. 'ఈసారి భీమరాజు ఏం పాట పాడతాడా ' అని అందరూ ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. 'అన్నా వదినల ఆప్యాయత' అని తీయగా పాడాడు భీమరాజు. పాట ఎంత చక్కగా పాడాడంటే, న్యాయనిర్ణేతలుకూడా అతన్ని ప్రశంసించకుండా ఉండలేకపోయారు. ఒకాయన వాడిని దగ్గరకు తీసుకొని, ప్రేమగా 'బాబూ, నీకు ఈ పాటను ఎవరు నేర్పారు? ఇంత చక్కగా పాడేందుకు నీకు స్ఫూర్తినిచ్చింది ఎవరు?' అని అడిగాడు. 'మా ఒదినమ్మ' అని చెప్పాడు భీమరాజు. న్యాయనిర్ణేతలు భీమరాజు ఒదినమ్మను వేదిక మీదికి పిలిచి, అభినందించి, ప్రత్యేకంగా సత్కరించారు. 'ఇంత చక్కని గాయకుడిని తయారుచేసిన మీరు ధన్యులు' అని వచ్చినవాళ్ళంతా ప్రశంసిస్తుంటే ఒదినమ్మ సిగ్గుతో‌ముడుచుకు పోయింది. అటు తర్వాత గంగమ్మ మారిపోయింది. భీమరాజును చక్కగా చూసుకున్నది! కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

సమానత్వం

సమానత్వం మూలం: పర్తాప్ అగర్వాల్. తెలుగు అనుసరణ: నారాయణ. గురు గోవింద సింగ్ నాయకత్వంలో సిఖ్ఖులు ఔరంగజేబు దుశ్చర్యలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రోజులవి. సిఖ్ఖులకు, ఔరంగజేబు సైన్యాలకూ మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. గురుగోవింద సింగ్ కొద్ది మంది ముఖ్య అనుచరులతో కలిసి అతి కష్టం మీద కోటనుండి బయట పడ్డాడు. దాదాపు కోటంతా శత్రువుల పాలైంది. మొగల్ సైన్యాలు ఆనాడు విలయ తాండవం చేశాయి. అనేకమంది సిఖ్కు యోధులు ఆ ఒక్క రోజులో అమరులైనారు. సిఖ్ఖు వీరుల కళేబరాలతో రణ భూమి నిండి ఉన్నది. పది ఉన్న ఆ శరీరాల మధ్యనుండి నడుస్తున్నాడు గురు గోవింద సింగ్. ఆయనకు పరిచయం ఉన్న ముఖాలు, ఆ శరీరాల మధ్య అనేకం కనబడ్డాయి. ఆయనకు ముందుగా దీపం పట్టుకొని నడుస్తున్నారు కొద్దిమంది అనుచరులు. అక్కడ పడి ఉన్న అసంఖ్యాక మృత కళేబరాలలో ఫతేసింగ్ శరీరాన్ని గుర్తించారు వాళ్ళు- ఫతే సింగ్ గురుగోవింద సింగ్ కొడుకు. అంత చిన్న వయస్సులోనే మృతి చెందాడు, గురు పుత్రుడు. వాళ్ళు అక్కడే నిలబడి, గురుగోవింద సింగ్ రాక కోసం వేచి చూశారు. గురుగోవింద సింగ్ వాళ్లను చేరుకొన్నాక, ప్రక్కనే పడి ఉన్న ఫతే సింగ్ మృత శరీరాన్ని చూపారు వాళ్ళు. వాళ్లలో‌ఒకరు అన్నారు- " ఆ యువ యోధుడి సేవలకు, త్యాగానికి గుర్తుగా అతని శరీరాన్ని ప్రత్యేకంగా ఒక బట్టతో కప్పుదాం" అని. గురువుగారు ఆ మాటలు విన్నారు, కానీ‌ ఏమీ అనకుండా అలాగే నిలబడ్డారు చాలా సేపు. ఆయన మనసులో‌ ఏం కదులుతున్నదో‌మరి- అందరూ ఆయన ఆజ్ఞకోసం ఎదురుచూస్తూ నిలబడ్డారు. అప్పుడు అన్నాడాయన: "అవును. 'కళేబరాల్ని బట్టతో‌కప్పటం' అనేది చాలా మంచి ఆలోచన. అలాగే చేద్దాం- అయితే మనం ఈ వీరులందరి శరీరాలనూ కప్పాలి మరి- మీ దగ్గర ఎన్ని బట్టలున్నాయో‌చూడండి. అందరికీ సరిపోయేన్ని ఉంటే కప్పండి- నాకేమీ అభ్యంతరం లేదు. 'ఫతే నా కుమారుడు' అని అతని శరీరానికి ప్రత్యేకంగా మర్యాదలు చేయవలసిన అవసరం లేదు. సిఖ్ఖులందరూ నా కుటుంబ సభ్యులే. నేను నా ఫతే శరీరాన్ని కప్పి, మిగిలిన నావాళ్ల శరీరాల్ని కప్పకుండా ఎండకు-గాలికి వదిలెయ్యలేను" అని. అనుచరులెవ్వరూ మాట్లాడలేదు. గోవింద సింగ్ కొనసాగించారు: "ఢిల్లీలో కూర్చొని రాజ్యాన్నేలే మొగల్ చక్రవర్తిని మనం ఎందుకు ఎదిరిస్తున్నాం? 'సమాన న్యాయం' కోసమే గదా? అలాంటప్పుడు, మనలో మనం ఆ సమానత్వాన్ని అమలు చెయ్యకపోతే ఎలాగ? ఈ పవిత్ర యుద్ధంలో పాల్గొనే వీర యోధులందరికీ సమాన గౌరవాన్నివ్వాలి. నా కొడుకు ఫతే కూడా ఒక సిఖ్ఖు కాదూ? అతన్ని వేరు చేసి చూడటం ఎందుకు? గుర్తుంచుకోండి- మనం అందరం ఆ పరమాత్ముని బిడ్డలమే. ప్రేమ, గౌరవాల్లో మనందరిదీ సమాన వాటానే." అందరికీ సరిపోయేన్ని బట్టలు లేవు, వాళ్ల దగ్గర. అందుకని అక్కడ పడి ఉన్న శరీరాలన్నింటినీ కప్పకుండా అలాగే వదిలారు. గురుగోవింద సింగ్ నుండి ఆనాడు నేర్చుకున్న సమానత్వపు నియమాన్ని ఆయన శిష్యులు ఇక ఏనాడూ మరచిపోలేదు. కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో