పాముకి గుణపాఠం చెప్పిన కోడిపెట్ట

పాముకి గుణపాఠం చెప్పిన కోడిపెట్ట   అనగనగా ఒక చిన్న అడవి. అందులో ఒక కోడిపెట్ట ఉంది. అది ఒకసారి పది గుడ్లు పెట్టి పొదిగింది. ఆ గుడ్లలోంచి బుజ్జి బుజ్జి కోడిపిల్లలు బయటకు వచ్చాయి. వాటిని చూసుకుని కోడిపిట్ట ఎంతో మురిసిపోయింది. పిల్లలు కొంచెం పెద్దయ్యాక ఒకరోజు వాటిని ఆరుబయటకు తీసుకువె ళ్లింది. గింజలు ఏరుకుని ఎలా తినాలో నేర్పించసాగింది. అంతలో హఠాత్తుగా పొద చాటున దాక్కున్న ఒక పాము బుస్సుమని ఇవతలకు వచ్చింది.  పామును చూడగానే కోడిపెట్ట తన బుజ్జిబుజ్జి పిల్లల్ని పారిపొమ్మని హెచ్చరికగా అరిచింది. ప్రమాదాన్ని అర్థం చేసుకుని కోడిపిల్లలు చెల్లాచెదరయ్యాయి. పాపం ఒక కోడిపిల్ల మాత్రం పాముకు దొరికిపోయింది. పాము దాన్ని నోటితో కరుచుకుని వెళ్లిపోయింది. అది మొదలు ఆ పాము పొదల వెనుక, చెట్ల చాటున మాటువేయడం, అదను దొరకగానే కోడిపిల్లను పట్టుకుని తినేయడం మొదలుపెట్టింది. తన పిల్లలు పాముకు ఆహారమవుతూ ఉండటం చూసి కోడిపెట్ట తట్టుకోలేకపోయింది.  ఒకరోజు పాము కోసం వెతుకుతూ వెళ్లింది. కొద్దిదూరంలో ఒక చెట్టు కింద పాము పుట్ట ఉంది. పాము అందులో నుంచి బయటకు వస్తూ కనిపించింది. వెంటనే దాని దగ్గరకు వెళ్లి, ‘‘నువ్వు ప్రతిరోజూ నా పిల్లల్ని తింటున్నావు. నీకిది న్యాయం కాదు. నాకు రెండు పిల్లలు మాత్రమే మిగిలాయి. దయచేసి వాటిని తినకు’’ అంటూ ప్రాధేయపడింది. పాము నిర్లక్ష్యంగా ‘‘పోవమ్మా! నేను నా ఆహారాన్ని తింటున్నాను. వద్దని చెప్పడానికి నువ్వెవరు? రేపు వచ్చి వాటిని కూడా తినేస్తాను’’ అంది.  కోడిపెట్ట ఎంత బతిమాలినా పాము వినిపించుకోలేదు. పాముకి తగిన శాస్తి చేయాలనుకుంది కోడిపెట్ట. బాగా ఆలోచించాక ఒక మంచి ఉపాయం తట్టింది. తనతో ఎంతగానో స్నేహంగా ఉండే తేనెటీగల సహాయం తీసుకుందామనుకుంది. అనుకున్నదే తడవుగా కోడిపెట్ట తేనెటీగల దగ్గరకు వెళ్లి విషయమంతా విడమర్చి చెప్పి తనకు సహాయం చేయమని అర్థించింది. తేనెటీగలు ఒప్పుకున్నాయి.   తేనెతుట్టెలో ఉండే తేనెను బయటకు తీసి దానిని పాము పుట్టలో పోశాయి. పుట్టలో ఉన్న పాము తేనెలో మునిగిపోయింది. కొద్దిసేపటికే చీమలు తేనె వాసనను పసికట్టాయి. ఆ చీమలు కూడా పాము మీద చాలా కోపంగా ఉన్నాయి. అవి ఎంతో కష్టపడి పుట్ట నిర్మించుకుంటే పాము దాన్ని ఆక్రమించుకుని వాటిని బయటకు తరిమేసింది. అందుకే కొన్ని వందల చీమలు తండోపతండాలుగా పుట్ట చుట్టూ చేరాయి. చీమలను చూసి పాము భయంతో పారిపోవడానికి ప్రయత్నించింది. అయితే చీమలు దానికి ఆ అవకాశం ఇవ్వలేదు. ఒక్కసారిగా దాని మీదకు దాడి చేసి కసిదీరా కుట్టాయి. లబోదిబోమంటూ పాము అక్కడి నుండి దూరంగా పారిపోయింది.పాము బెడద తప్పిన కోడిపెట్ట మిగిలిన పిల్లలతో హాయిగా ఉండసాగింది.

పగటికల తెచ్చిన తిప్పలు

పగటికల తెచ్చిన తిప్పలు     మీనాక్షమ్మ చాలా మంచిది. అందరికీ సహాయపడేది. కానీ ఆమె కొడుకు రాము మాత్రం ఏ పని చేయకుండా జులాయిగా తిరిగేవాడు. తల్లి ఎంతో కష్టపడి డబ్బు సంపాదించి కొడుకును చదివిస్తుంటే, రాము మాత్రం చదువు కోకుండా అల్లరి చిల్లరిగా తిరిగేవాడు. "ఏమిరా రామూ?! ఎప్పుడూ అలా తిరుగుతుంటావు? చదువూ సంధ్యా లేదా? మీ బళ్ళో ఎవ్వరూ ఏమీ అనరా, ఇలా తిరిగితే?" అని ఎవరైనా అడిగితే, "ఓహో, నా గురించి మీకేం తెలుసు? నేను ఎంత తెలివైన వాడినంటే, నాకు పదవతరగతిలో జిల్లా ఫస్టు ఖాయం. చూస్తూండండి, ఆ తర్వాత నేను ఐఎఎస్సాఫీసర్నవుతాను- అప్పుడుగానీ మీ అందరినోళ్ళూ మూతపడవు" అని బుకాయించి తన దారిన తను పోయేవాడు.   అలా ఎందుకైందో ఏమో గానీ- రాను రాను రాము వాస్తవాల్ని మరచిపోయి, ఎప్పుడూ పగటి కలల్లోనే విహరించటం మొదలైంది. ఊరికే కూర్చొని 'నేను ఇట్లా అవుతాను గదా, అప్పుడు చాలా బాగుంటుంది; ఆ తర్వాత ఇట్లా అవుతుంది- ఇంకా చాలా బాగుంటుంది!' అని అనుకుంటూ ఆనందపడేవాడు. ఒక రోజున ఇట్లాగే పగటి కలలు కంటూ కూర్చున్న రాముని వచ్చి పలకరించాడు ఒక రైతు. "నాకు 25 తాటి చెట్లు ఉన్నాయి. ఆ తాటి చెట్లు ఎక్కి, తాటికాయలు కోసి క్రిందకు దించితే- చెట్టుకు 25 రూపాయలు చొప్పున ఇస్తాను" అన్నాడు. రాముకు చదవటం అంటే ఎంత అయిష్టం ఉన్నా, చెట్లు ఎక్కడం అంటే మాత్రం చాలా ఇష్టం!   అందుకని, రైతు మాట వినగానే రాము "సరే" అని బయలుదేరాడు. అయితే ఒక వైపున తాటి చెట్టు ఎక్కి తాటికాయలు కోస్తుండగానే వాడి ఆలోచనలు పరుగులు తీసాయి: "చెట్టుకి 25రూపాయలు వస్తాయి, నాకు. ఈ డబ్బుల్ని నేను మా అమ్మకు ఇస్తే, నా పుట్టిన రోజుకు బట్టలు, కేకులు కొనిపెడుతుంది. అప్పుడు నేను కేకును కోసి అమ్మకు తినిపిస్తాను. అమ్మ 'నాకెందుకురా' అంటూనే తింటుంది-'నీకు నేనంటే ఎంత ఇష్టంరా' అంటుంది. అప్పుడు నేను ఇట్లా నవ్వి, 'ఇంత!' అని చూపిస్తాను-" అనుకుంటూ తన చేతులు రెండూ వదిలిపెట్టాడు. అంతే!   ఆ తర్వాత తెలివి వచ్చి చూసేసరికి రాము కింద పడి ఉన్నాడు. ముందరి పళ్ళు రెండూ ఊడిపోయాయి. అమ్మ వచ్చి, వాడిని బాగా తిట్టి ఆసుపత్రికి తీసుకెళ్ళింది. పగటి కలలు ఎన్ని కష్టాల్ని కొని తెస్తాయో అనుభవం కొద్దీ గ్రహించిన రాము, ఆ తరువాత వాస్తవంలో బ్రతకటం అలవరచుకున్నాడు. - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

నెమలి అందం కథ

నెమలి అందం కథ   ఒక అడవిలో ఒక నెమలి, పావురం, కోయిల స్నేహంగా ఉండేవి. కోయిల కాకిలాగా నల్లగా ఉండేది. పావురం బూడిద రంగులో మట్టికొట్టుకున్నట్లు ఉండేది. కానీ‌ నెమలి మటుకు రంగు రంగుల పింఛాలతో చాలా అందంగా ఉండేది. అడవిలో‌ని పక్షులన్నీ నెమలి అందాన్ని పొగుడుతూ ఉండేవి. దాంతో నెమలికి చాలా గర్వం పేరుకున్నది. అయితే పావురం, కోయిల మటుకు దాని అందానికి ఏమంత ప్రాధాన్యతనిచ్చేవి కాదు. దాన్ని ప్రత్యేకంగా చూసేవి కావు. "నా గొప్పతనాన్ని ఇవి గుర్తించట్లేదు" అని నెమలికి అవంటే కోపం. ఒక రోజున అడవికి ఓ వేటగాడు వచ్చాడు. వాడి చేతిలో వలలు, విల్లంబులు ఉన్నాయి. దొరికిన జంతువును,పక్షినల్లా వాడు ఎత్తుకుపోతాడు!  వాడు అడవిలోకి రావటాన్ని దూరం నుండే గమనించింది పావురం. దానికి గొంతు ఏమంత లేదు కదా, అందుకని అది పరుగున వచ్చి ఆ సమాచారం కోయిలకు అందించింది. వెంటనే కోయిల తన గట్టి గొంతుతో "వేటగాడు వచ్చాడు పారిపోండి! వేటగాడు వచ్చాడు దొరకకండి!" అని పాడుతూ అడవంతా తిరగటం మొదలెట్టింది. కోయిల పాట విని అడవిలోని జంతువులన్నీ తమకు తోచిన దిక్కుకు పరుగెత్తాయి. పక్షులన్నీ తమకు తోచిన తావుల్లో కదలకుండా మెదలకుండా కూర్చున్నాయి. వేటగాడు అడవిలోకి అడుగు పెట్టేసరికి అక్కడంతా నిశ్శబ్దం! అక్కడ వాడికి ఒక్క జంతువు గాని, పక్షిగాని ఎదురవ్వలేదు!     నెమలికి కూడా కోకిల పాట వినబడింది. కానీ అది పోయి దాక్కోకుండా అక్కడక్కడే, నేలకు దగ్గరగా తిరగటం మొదలు పెట్టింది. పావురం దాని దగ్గరికి వెళ్ళి "నేస్తమా! అడవిలోకి వేటగాడు వచ్చాడు. దొరికావంటే పట్టుకుపోతాడు. గబగబా ఎక్కడికైనా వెళ్ళి దాక్కో!" అన్నది. నెమలి పావురంతో వాదించటం మొదలు పెట్టింది. "నేను ఎంత అందంగా ఉంటానో మీకెవ్వరికీ అర్థం కాదు. నా అందాన్ని ఆస్వాదించే అదృష్టం ఆ వేటగాడికే ఉంటే అలాగే కానివ్వు మరి" అంటోంది ఎంతకీ. అంతలోకే కోయిల కూడా వచ్చింది అక్కడికి. "ఇదిగో, నీ అందం ముఖ్యం కాదిక్కడ.  వేటగాడు పట్టుకెళ్లి నీ ఈకలన్నీ‌ పీక్కుంటాడు. నిన్ను వండుకొని తినేస్తాడు" అని బెదిరించ బోయింది. అయినా నెమలి బెదరలేదు. "అట్లా ఏమీ లేదు. మీకు అందాన్ని మెచ్చుకోవటం రాదు. ఇంత కాలానికి నన్ను ప్రేమించగలిగే ఒకే ఒక్క వ్యక్తి వస్తుంటే మీకు భయం వేస్తోంది. లోభం కొద్దీ నన్ను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మీరు!" అని అరిచింది. దాని అరుపులు విని వేటగాడు అటువైపుగా రానే వచ్చాడు. వాడిని చూడగానే పావురమూ, కోయిలా ఎగిరి దూరంగా పారిపోయి ప్రాణాలు కాపాడుకున్నాయి. నెమలి మాత్రం వయ్యారంగా పురి విప్పి, వేటగాడి ముందు సంతోషంగా నాట్యం చేయబోయింది.   మొరటైన ఆ వేటగాడు అదను చూసుకొని గబుక్కున ముందుకి దూకి, నెమలిని మొత్తంగానే మడిచి సంచిలో పెట్టేసుకున్నాడు! దూరం నుండి చూస్తున్న పావురం, కోయిల రెండూ "ఘోరం! ఘోరం!" అని కేకలు పెట్టాయి. వేటగాడు వాటివైపు ఓసారి చూసి, తన చేతిలోని బాణంతో వాటిని ఒకసారి బెదిరించి ముందుకు సాగాడు. ఆ క్షణంలోనే పావురానికి ఒక ఆలోచన వచ్చింది. అది కోకిల కేసి చూసి కనుసైగ చేసి, వేటగాడి తలని తన్నుతున్నట్లు ఎగిరి దగ్గరలో ఉన్న ఒక పొద మీద వాలింది. అది ఎంత దగ్గరలో ఉన్నదంటే, వేటగాడికి దానిమీద ఆశ పుట్టింది. వాడు ఆ పొద దగ్గరికెళ్ళి, పావురాన్ని అందుకోబోయాడు గానీ, వాడి చేతికి అందకుండా పావురం వెనుకకు అడుగులు వేస్తూ పోయింది. చివరికి వేటగాడు తన చేతిలోని సంచీని క్రింద పెట్టి, పొదమీదికి వంగాడు. "సమయం ఇదే" అని గుర్తించిన కోకిల గబుక్కున సంచిమీద వాలి, దాని మూతి విప్పి, అప్పటికే స్పృహ తప్ప బోతున్న నెమలిని సంచిలోంచి బయటికి నెట్టింది. ఏం జరిగిందో వేటగాడికి అర్థమయ్యేలోగా పక్షులు మూడూ మూడు దిక్కులకు ఎగిరిపోయాయి! శక్తినంతా కూడగట్టుకొని చెట్ల కొమ్మల మీదుగా దుంకుతున్న నెమలి వెంట పడ్డాడు వేటగాడు! అయినా దాన్ని అందుకోలేక, చివరికి నిరాశగా ఇంటి దారి పట్టాడు! ఆ తర్వాత ఎప్పుడో చెరువు వొడ్డున కలిసినప్పుడు "వేటగాడు మరీ ఇంత మొరటుగా ఉంటాడనుకోలేదు. నా అందాన్ని చూసి కనీసం మంచిగా మెచ్చుకుంటాడనుకున్నాను!" అన్నది నెమలి, పావురం-కోయిల లతో. "ఇంకా నయం! వాడు నిన్ను ఎత్తుకెళ్ళి వండేసి ఉంటే అప్పుడు తెలిసేది నీకు!" అంది పావురం. "ఏమోనబ్బా! నాకు తెలీదు! మీరు మటుకు నన్ను కాపాడారు. థాంక్స్" అని నెమలి చక్కా పోతుంటే పావురం కోయిల బిత్తరపోయి ఒకదాని మొహం ఒకటి చూసుకున్నాయి!   - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

అల్లరి

అల్లరి     రామయ్య,సావిత్రి ముద్దుల పుత్రుడు రాము చిన్నప్పటి నుండి చాల గారాబంగా పెంచారు.తనకు ఏది కావలి అంటే అది కొనిపించేవారు.అలా ఒక్క రోజు రాము తన ఇంటి పక్కన ఉన్న రవి పెద్ద రైలు బొమ్మతో ఆడుకుంటూ ఉండగా చూసాడు.వెంటనే రవి దగ్గరికి వెళ్లి నాకు ఇవ్వు అది నాది అని గొడవకు దిగి ఇద్దరు దెబ్బలాడుతున్నారు. ఇంతలోనే ఇద్దరి తల్లిదండ్రులు వచ్చి నచ్చచెప్పి అక్కడి నుండి వారిని తీసుకెల్తారు కాని రాము తనకు రైలు బొమ్మ కావలి అని మారం చేస్తాడు.తల్లి అది మనది కాదు నీకు వేరే కొని పెడతాను అని చెప్పి మరుసటి రోజు రవి రైలు బొమ్మ కన్నా పెద్దది కొనిపెట్టడంతో ఆనందంగా ఆడుకుంటూ ఉండగా అక్కడికి ఒక మావటి వాడు ఏనుగును తీసుకోని వస్తాడు దాన్ని చూసి రాము చాల సంబరాపడిపోతాడు.అది చూసిన తల్లి మావటి వాడికి డబ్బు ఇచ్చి ఏనుగు పై కుర్చోపెడుతుంది.కాసేపటి తర్వాత రాము ఏనుగు దిగమంటే దిగకుండా మారం చేస్తాడు మావటి వాడు భయపెట్టి ఏనుగు పై నుండి దింపేస్తాడు. రాము ఏనుగు కావలి అని మారం చేస్తాడు..అది మనది కాదు అని తల్లిదండ్రులు ఎంత చెప్పిన వినడు.రాము ఏడుపు ఆపడానికి ఒక ఏనుగు బొమ్మ తెచ్చిన నాకు నిజం బొమ్మ కావలి అని ఏడుస్తాడు. మరుసటి రోజు పక్క ఊరిలో సర్కస్ వచ్చింది అక్కడ ఏనుగులు ,సింహాలు అని ఉంటాయి అని తెలుసుకొని తల్లిదండ్రులకు చెప్పకుండా వెళ్ళిపోతాడు..సర్కస్ చూసి అక్కడే ఏనుగును చూస్తూ ఉండగా ఒక సర్కస్ వ్యక్తి ఇంటికి వెళ్లి అంటాడు.రాము నాకు అమ్మ నాన్న లేరు నేను మీతో పాటు వస్తాను అనగా సర్కస్ వాడు మనసులో ఎదో దుర్భుద్ధి తో రామును ఇక్కడే ఉండు అంటాడు అలా రాము ఒక రోజు అంతా జంతువులతో ఆడుకుంటాడు.మరుసటి రోజు తల్లి గుర్తు రావడంతో సర్కస్ వాడికి మా అమ్మ దగ్గరికి వెళ్తాను అని మారం చేస్తాడు..చిన్నపిల్లాడి ఏడుపుకు కరిగిపోయిన అతను ఈరోజు పడుకో రేపు తీసుకోని వెళ్తాను అంటాడు. అప్పటికే విషయం తెలుసుకున్న రాము తల్లితండ్రులు అక్కడికి వచ్చి రామును తీసుకోని వెళ్ళేటప్పుడు సర్కస్ వ్యక్తీ సంతోషించి వారితో అందరికంటే ఈ ప్రపంచంలో తల్లిదండ్రులే  మిన్న ఈ సత్యాన్ని మీ కొడుకు కూడా గ్రహించాడు అందరు ఇది తెలుసుకుంటే ఏంతో సంతోషంగా ఉంటారు అని చెప్పారు..తల్లిదండ్రులు మన ప్రత్యక్ష దైవాలు..!! జాని.తక్కెడశిల  

నేనెవరు

నేనెవరు   కుందేలు పిల్లకు నిస్పృహ కలిగింది. అది నిరాశగా తల వంచుకొని పోతూంటే దానికో కోయిల ఎదురైంది- పాటలు పాడుకుంటూ. "నేనెవరు?" అని కుందేలు అడిగితే అది సంతోషంగా కూసింది. "నువ్వే నేను, నేనే నువ్వు! నిన్ను నువ్వు నేనంటే, నేను నిన్ను నిన్నంటా" అని పాడుతూ ఉత్సాహపడిందది. కుందేలుకి ఆ పాట విని నవ్వైతే వచ్చింది కానీ, తన ప్రశ్నకు సమాధానం మాత్రం దొరకలేదు. ఆ పైన దానికి ఓ నెమలి ఎదురైంది. వాన గాలి చల్లగా వీస్తూంటే, దూరం నుండి తియ్యగా మట్టి వాసనని మోసుకొస్తుంటే ఆగలేక, అది నాట్యం మొదలెట్టింది. ముఖం చిన్నగా చేసుకొని కుందేలు `నేనెవరు?' అని అడిగింది దాన్ని. నెమలి నవ్వింది. "అరే, ఇది ఆలోచించే సమయం కాదురా, ఆనందించాల్సిన సమయం! చూడు చుట్టూతా, ప్రకృతి ఎంత బాగుందో!? ఇలాంటి సమయం ఎప్పుడూ ఉండదు. సంతోషపు ఘడియల్ని ఆలోచనల్తో వృధా చేసుకోవద్దమ్మా, నాట్యంచెయ్ నవ్వుతూ! దా, కావాలంటే నీకు నేను నాట్యం నేర్పిస్తాను!" అన్నది నెమలి, నాట్యం ఆపకుండానే. కుందేలు చికాకు పడి, `వీళ్లను కాదు, అడగాల్సింది!' అనుకున్నది. "నీళ్లలో నిలబడి నిశ్చలంగా తపస్సు చేసుకొనే కొంగే ఈ ప్రశ్నకు జవాబివ్వగలిగేది." అలా అనుకుని, అది కొంగను వెతుక్కుంటూ పోయింది. అనుకున్నట్టుగానే కొంగ నీళ్లల్లో నిలబడి కనిపించింది దానికి. చాలా సార్లు పిలిస్తే కానీ దాని ఏకాగ్రత తెగలేదు. అప్పుడు కూడా అది కుందేలుకేసి ఓ సారి అలా చూసి, మళ్లీ నీళ్లలోకి చూడటం మొదలుపెట్టింది. కుందేలు చాలాసార్లు అడిగిన తరువాత, అది అన్నది మెల్లగా - "చూడు నాయనా, మనందరం చేపలమే. ఎటొచ్చీ అవి నీళ్లల్లో ఉంటాయి. మనం మాత్రం గాలిలో ఉంటాం. అవి నీళ్లలో తిరుగుతై, మనం గాలిలోనూ, నేలమీదా తిరుగుతాం" అని. కుందేలుకు ఆ సమాధానమూ తృప్తినివ్వలేదు. చివరికి అది ఓ ఋషి ఆశ్రమానికి చేరింది. అక్కడ ఋషి కూర్చొని ఏవో ధర్మ గ్రంథాలు చదువుకుంటున్నాడు. "నేనెవరు స్వామీ" అడిగింది కుందేలు చేతులు జోడిస్తూ. "అది కనుక్కునేందుకే నేను ఇన్నేళ్లుగా తపస్సు చేస్తున్నానమ్మా కుందేలూ! నాకు ఇంకా ఈ జీవితం ఏంటో అర్థం కాలేదు" అన్నాడు ఋషి, విచారంగా. అయితే కుందేలు సంతోషంగా ఎగిరి, నమస్కారాలు పెట్టి, ఉత్సాహంగా ఇంటి వైపుకు పరుగులు తీసింది. దానికి అర్థమైపోయింది- తను వేరెవరో కాదు, తను కుందేలు!" అని. అడవి మూల నుండి మరికొన్ని క్యారెట్లు పెరుక్కొని తింటూ అది ఉత్సాహంగా అనుకున్నది మళ్లీ మళ్లీ - "నేను కుందేలును! నేను కుందేలును!" అని. - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

దొంగ పిల్లి

దొంగ పిల్లి   ఒక అడవిలో ఒక కొంగ ఉండేది. ఆ కొంగకు ఒక చిన్న ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో ఒక వడ్ల మూట. ఆ మూట మీదనే కొంగ గుడ్లను పెట్టింది. కొన్నాళ్లకు ఆ గుడ్లను పొదిగే సమయం వచ్చింది. కొంగ తన గుడ్ల పైన కూర్చొని ఉండగా ఒక పిల్లి అక్కడికి వచ్చి, "కొంగమ్మా! కొంగమ్మా! ఉండటానికి నాకు కొంచెం స్థలం ఇవ్వవా" అని అడిగింది. అప్పుడు ఆ కొంగ "వడ్లు పైన గుడ్లు, గుడ్లపైన నేను, నా పైన స్థలం ఉంటే వచ్చి ఒడుక్కో" అని పిల్లితో చెప్పింది.  "సరే"నని, పిల్లి పోయి ఆ కొంగమీద ఒడుక్కొని కూర్చున్నది. కాసేపటికి అక్కడికి ఓ ఎలుక వచ్చింది. దానికీ స్థలం లేదు ఉండటానికి పాపం! వచ్చి "కొంగమ్మా! కొంగమ్మా! నాకు కొంచెం స్థలం ఇవ్వవా ఉండటానికి" అని అడిగిందది. అప్పుడు కొంగ" వడ్లుపైన గుడ్లు, గుడ్లపైన నేను, నాపైన పిల్లి, పిల్లిపైన స్థలం ఉంటే వచ్చి ఒడుక్కో" అని చెప్పింది. ఎలుక మెల్లిగా ఒక్కోదాన్నీ ఎక్కి పిల్లిపైన కూర్చుంది. మరికొంచెంసేపయ్యాక అక్కడికి ఒక కుందేలు వచ్చింది. అది కూడా కొంగను అడిగింది. తనకూ కొంచెం స్థలం‌ఇవ్వమని. కొంగ చెప్పింది "వడ్లుపైన గుడ్లు, గుడ్లపైన నేను, నాపైన పిల్లి, పిల్లిపైన ఎలుక, ఎలుకపైన స్థలం ఉంటే వచ్చి ఒడుక్కో" అని. కుందేలుకూడ పైకెక్కి కూర్చున్నది జాగ్రత్తగా! అప్పటికి చీకటి పడింది. అన్నీ నిద్రపోయాయి. తెల్లారాక పైనున్న కుందేలు దాని తరువాత ఎలుక, లేచి అడవిలోకి వెళ్ళిపోయాయి. కొంగపైన పిల్లి ఒకటి ఉన్నది అప్పటికి. ఎంతకీ దిగలేదది.  అప్పుడు కొంగకు ఆకలైంది. అది పిల్లితో అన్నది, "పిల్లీ! పిల్లీ! నేను పోయి కొన్ని చేపలు తినేసి వస్తాను, నా గుడ్లను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటావా, ఇక్కడే?" అని. పిల్లి అన్నది, "నాక్కూడా ఆకలిగానే ఉంది కొంగమ్మా, నేనూ పోతాను. నీ గుడ్లకేమీ కాదులే!" అని. 'సరే' అని కొంగ, పిల్లి రెండూ బయటికి వెళ్ళాయి. అయితే కొంగ అటు వెళ్లగానే, పిల్లి వెంటనే‌ లోపలికి వచ్చి, వడ్లపైనున్న ఐదు గుడ్లనూ తినేసి, వాటి స్థానంలో ఐదు కంకర రాళ్లను పెట్టి వెళ్లిపోయింది. కొంగ వచ్చి చూస్తే, గుడ్లు లేవు! వెంటనే అది ఎలుకను, కుందేలును, పిల్లిని పిలిచి, "నా గుడ్లనెవరు తిన్నారు?" అని అడిగింది ఏడుస్తూ.     "మేం తినలేదమ్మా! మాకేంతెల్సు?" అన్నాయన్నీ. "ఆకలేసి, నీ గుడ్లను నువ్వే తిన్నావేమో! ఇప్పుడెందుకు ఏడుస్తావు?" అన్నది పిల్లి గడుసుగా. కొంగ అందర్నీ కొలనులో ఉన్న గంగమ్మతల్లి దగ్గరికి పిల్చుకు పోయింది. "గంగమ్మ తల్లీ, గంగమ్మ తల్లీ! నా గుడ్లను నేనే తినేసి ఉంటే నన్ను లోపలికి ముంచెయ్; లేదంటే తేలగొట్టు" అని ప్రార్థించి, నీళ్లలో ఓ కుండను బోర్లా విడిచి, దానిమీదికి ఎక్కి నిల్చుంది కొంగ. గంగమ్మతల్లి కొంగను తేలగొట్టింది. అలాగే ఎలుక, కుందేలు "కొంగమ్మ గుడ్లను మేం తినలేదు గంగమ్మతల్లీ! మేం అబద్ధం చెబితే మమ్మల్ని ముంచెయ్" అంటే, గంగమ్మ వాటినీ తేలగొట్టింది. అన్నిట్లోకీ చివరగా పిల్లి వచ్చి, కుండమీద నిల్చుని, ఇంకా ప్రమాణం ఏమీ చెయ్యకనే గజ గజ వణికింది. మరుక్షణంలో అది "దభీ"మని నీళ్లల్లో పడి మునిగి, కాపాడమని గోలపెట్టింది. ఎలుక, కుందేలు, కొంగ దాన్ని బయటికి లాగి, దండిస్తే, గుడ్లు తనే తిన్నానని ఒప్పుకున్నదది. అన్నీ కలిసి దొంగ పిల్లిని అడవిలోంచి తరిమేశాయి. అట్లా ఊరు చేరుకున్న పిల్లి అలవాటు ఇంకా పోలేదు- మన ఇళ్లల్లో పాలు, పెరుగుల్ని దొంగిలిస్తూనే ఉన్నదది, ఈనాటికీ! కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

నాటు కోతి-స్మార్ట్ ఫోను

నాటు కోతి-స్మార్ట్ ఫోను అనగనగా ఒక కోతి. దానికి ఓ తాత. తాత-మనుమళ్లు ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ. కానీ తాత-మనుమడు ఇద్దరూ పాపం, వేరు వేరు ఊళ్లల్లో ఉండవలసి- వచ్చింది! అయినప్పటికీ వీలు దొరికి-నప్పుడల్లా ఒకరి యోగక్షేమాలు మరొకరు తెలుసుకుంటూ గడిపేవాళ్ళు వాళ్ళు. ఒకరోజున, మరి ఎవరి దగ్గరినుండి ఎత్తుకొచ్చిందో గానీ, తాత చేతికి ఒక సెల్‌ఫోను వచ్చింది. అంతే కాదు- ఆ కబురు సాయంత్రం కల్లా మనుమడికి కూడా అందింది! వాళ్ల ఊరికి వెళ్ళొచ్చిన వేరే కోతి మిత్రుడు ఒకడు, సహజంగానే, అన్ని సంగతులతో పాటూ ఆ కబురునూ వాడికి చేరవేసాడు. అంతే- ఇక ఆరోజునుండీ మనుమడి కోతికి కోరిక మొదలైంది: 'నాకు కూడా ఒక సెల్‌ఫోన్ ఉంటే ఎంత బాగుంటుంది?! తాతతో చక్కగా రోజూ మాట్లాడుకోవచ్చు!' అని. ఈ మనుమడు కోతి ఉండే ఊళ్ళోనే 'చిన్ను' అనే ఆకతాయి పిల్లాడు ఒకడు ఉండేవాడు. వాడు రోజూ స్నేహితులతో కలిసి ఊరంతా తిరగడం, చెరువులో ఈత కొట్టడం, స్కూలు గ్రౌండ్లలో ఆటలు ఆడటం చేస్తుండేవాడు.   ఇంట్లో పేచీ పెట్టి, రెండ్రోజులు అన్నం తినకుండా అల్లరిచేసి మరీ, వాళ్ల నాన్నతో సెల్‌ఫోను కొనిపించుకున్నాడు వాడు! ఆ తర్వాత ఒకసారి తన స్నేహితులతో కలిసి వాడు చెరువులో ఈతకు వెళ్లటం, సెల్‌ఫోనుతో సహా బట్టలన్నీ కూడా గట్టున పెట్టి చెరువులోకి దిగటం జరిగింది.  అవకాశం వచ్చిందని తెల్సింది మనుమడు కోతికి. మెల్లగా చెట్టు దిగి వచ్చిందది; గుట్టు చప్పుడు కాకుండా చిన్ను బట్టల్లోంచి సెల్ ఫోన్ కాజేసింది; మళ్ళీ చెట్టుపైకి పరిగెత్తింది! చిన్ను చాలా సేపు ఈతకొట్టి, వెనక్కి తిరిగి వచ్చాక చూసుకుంటే స్మార్ట్‌ఫోను లేదు! కొద్ది సేపు అక్కడా ఇక్కడా వెతికాక, ఏవేవో‌ గొణుక్కుంటూ‌ అయోమయంగా ఇంటికి పోయాడు చిన్ను. సెల్ ఫోన్ దొరికిన ఆనందంతో మనుమడు కోతి వెంటనే వాళ్ళ తాతకు ఫోన్ చేసింది. తాత కోతి చాలా కష్టాల్లో ఉన్నది: 'మూడేళ్లుగా వానలు లేవు. చెట్లు ఎండిపోయాయి. పూట గడవడం కూడా కష్టంగా ఉంది. దానికి తోడు, నేను ఉండే ఊళ్లో జనం చెట్లు నరికేసి ప్లాట్లు వేస్తున్నారు!" ముసలి కోతి మనుమడికి ఈ సంగతులు చెప్పి కళ్ళ నీళ్ళు పెట్టుకున్నది. దాంతో చలించిపోయిన మనుమడు తాతతో "ఏడవకు తాతా! ఈ ఊరికి వచ్చేసెయ్యి. ఇక్కడ వానలు బాగానే పడ్డాయి. మనుగడ చక్కగా ఉంది. మనం‌ ఇద్దరం సంతోషంగా కలిసి ఉండచ్చు ఇక్కడ" అన్నాడు.   సరేనన్నది తాత కోతి. మరుసటి రోజు ఉదయాన్నే తట్టా-బుట్టా సర్దుకుని బయలుదేరింది- కానీ ఎక్కడికి పోవాలి? మనుమడు ఉండే ఊరు ఏది? ఎంత దూరం?! అంతలో దానికి గుర్తు వచ్చింది- మనుమడికి ఫోన్ చేసి అడగొచ్చు! మనుమడు నవ్వాడు- "పిచ్చి తాతా, స్మార్ట్ ఫోన్ చేతిలో పట్టుకొని వేరేవాళ్లను దారి అడిగేదేమి? గూగుల్ మేప్ ఆన్ చేసుకొని రావచ్చుగా?!" అని హింట్ ఇచ్చాడు. మేప్ దారి చూపించగా, తాత కోతి సులభంగానే మనుమడు నివసిస్తున్న చింత చెట్టు దగ్గరకు చేరుకున్నది. తాత మనుమడు ఆప్యాయంగా పలకరించుకున్నారు. "ఇద్దరూ ఒకే చోట ఉంటున్నప్పుడు రెండు ఫోన్లు ఎందుకురా?" అన్నాడు తాత. "సరే ఏదో ఒకటి చేద్దాం" అన్నాడు మనుమడు. తర్వాతి రోజున చిన్ను మళ్ళీ ఈతకు వచ్చినప్పుడు, మనుమడు కోతి పోయి, తను కాజేసిన సెల్‌ఫోనును మళ్ళీ చిన్ను బట్టల్లో‌ పెట్టేసింది. ఫోన్ దొరికిందన్న సంతోషంతో పొంగిపోతూ చిన్ను ఇంటిదారి పట్టాడు. కథ కంచికి-మనం చిన్నూ వాళ్ళ ఇంటికి! కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

మారిన దొంగ

  మారిన దొంగ   రాజీవ్‌ అనే కుర్రవాడు చక్కగా చదివి, చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం వెతుక్కుంటూ పట్టణం చేరాడు. అక్కడికి వెళ్లగానే ఉద్యోగం దొరుకుతుం-దనుకున్నాడు. కానీ దొరకలేదు. అట్లా కొద్ది రోజులు గడిచేసరికి అతను పట్టణంలోని జల్సాలకి అలవాటు పడ్డాడు. డబ్బులు సరిపోక మెల్లగా దొంగతనాలకు కూడా అలవాటు పడ్డాడు! త్వరలోనే దొంగతనాల వల్ల వాడి దగ్గర చాలా డబ్బులు పోగయ్యాయి. వాటిని చూసుకొని వాడు మరిన్ని దొంగతనాలు చేయటం మొదలు పెట్టాడు.   తల్లి దండ్రులు ఫోను చేసినప్పుడల్లా "నేను బాగున్నాను- పెద్ద ఉద్యోగం దొరికింది. పని చాలా బాగుంది" అని చెప్పేవాడు వాడు. దాంతో వాళ్ళు పాపం తమ కొడుకు ప్రయోజకుడయ్యాడని అందరికీ గొప్పగా చెప్పుకునేవాళ్ళు. అట్లా కొన్ని నెలలు గడిచాయి. అంతలో ఒకరోజున రాజీవ్‌ ఇంట్లోనే దొంగతనం జరిగింది! దొంగతనాల ద్వారా అతను పోగు పెట్టుకున్న డబ్బులు అన్నీ పోయాయి. తన సొమ్ము పోయేసరికి వాడికి చాలా బాధ వేసింది. కానీ‌ తను ఎవ్వరికీ చెప్పుకోలేడు! పోలీసుల దగ్గరికి కూడా పోలేడు!   "నా సొమ్మును దొంగతనం చేసినవాడు నాశనమైపోతాడు. వాడిని నేనే పట్టుకొని శిక్షిస్తాను!" అని వాడు చాలా ఆవేశపడ్డాడు. అయితే ఆ రోజు రాత్రి అలసిపోయి పడుకునే ముందు వాడికో ఆలోచన వచ్చింది: 'దొంగతనం చేసి సంపాదించిన డబ్బులు పోతేనే తను ఇంత బాధపడుతున్నాడు; మరి కష్టపడి ఏదో పని చేసుకొని నాలుగు డబ్బులు వెనకేసుకున్న వాళ్ల డబ్బుల్ని తను దొంగిలించినప్పుడు వాళ్లెంత బాధపడి ఉంటారు? తనని ఎన్ని తిట్లు తిట్టి ఉంటారు?' ఆ ఒక్క ఆలోచన వల్ల వాడిలో‌ పరివర్తన వచ్చింది. దొంగతనాలు, జల్సాలు మానేసి, తనకు ఎదురైన ఏదో ఒక చిన్న ఉద్యోగంలో చేరాడు. బాధ్యతగా పనిచేసి నిజంగానే ప్రయోజకుడయ్యాడు. - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

ఆడపిల్లలే ఆధారం

ఆడపిల్లలే ఆధారం   నాగసముద్రంలో రామయ్య, రాధమ్మ అనే దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళ పిల్లలు రాణి, రమేష్- ఇద్దరూ‌ పదవ తరగతి చదువుతున్నారు. రామయ్య, రాధమ్మ పేదవారైనా, పిల్లల్ని మటుకు లోటు తెలీకుండా చూసుకునేవారు. రమేష్‌కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. బాగా ఆడేవాడు కూడాను. ఒక రోజు వాళ్ల బడి తరపున ధర్మపురిలో క్రికెట్ ఆడేందుకు పదకొండు మందిని ఎంపిక చేసారు. రమేష్ కూడా అందులో ఎంపికయ్యాడు. వాడు క్రికెట్‌కోసం ఎంపికైనందుకు తల్లిదండ్రులు చాలా సంతోష పడ్డారు. వాడికి ప్రత్యేకమైన ఆహారం తెచ్చి పెట్టారు. తీరా ధర్మపురి వెళ్ళే రోజున- "అమ్మా నాకు రాను పోను, ధర్మపురి ఖర్చులకు గాను డబ్బు కావాలి. ఇవ్వు" అన్నాడు రమేష్.   "నా దగ్గర ఎక్కడ ఉన్నాయి? మీ చెల్లెలు రాణి దగ్గర ఉన్నాయిగా, తీసుకో" అంది అమ్మ. "రాణీ! డబ్బులివ్వు!" అన్నాడు రమేష్. "నా దగ్గర ఎక్కడున్నాయి, లేవు!" అంది రాణి. "ఎందుకు లేవు- నేను చూపించనా? నీ‌ పెట్టెలో‌వి డబ్బులు కాదా?" అన్నది అమ్మ. "అవి నేను కూలి పని చేసి సంపాదించుకున్న డబ్బులు. నీకు ఇవ్వను. నా స్కూల్ ఫీజుకోసం‌ ఉంచుకున్నాను" అరిచింది రాణి. "నేను అడిగితే కూడా ఇవ్వవా? నీకెంత క్రొవ్వు?!" అంటూ రాణి దగ్గర ఉన్న డబ్బును లాక్కుని రమేష్ కు ఇచ్చింది రాధమ్మ. రాణి గొల్లున ఏడవటం మొదలు పెట్టింది. అది చూసి రాధమ్మకు ఇంకా కోపం వచ్చింది. "నువ్వు ఏమైనా మమ్మల్ని ఉద్దరిస్తావా? వాడు అంతే- మగవాడు కాబట్టి ఇస్తాము" అని అరిచింది. రాణి కళ్ళ నీళ్ళు పెట్టుకొని తండ్రివైపు చూసింది. తండ్రి కూడా 'అదంతే' అన్నట్లు తల త్రిప్పుకున్నాడు.   అంతకు ముందు, ఆ తర్వాత కూడా ఇట్లాంటి సంఘటనలు చాలా జరిగాయి. భోజనం దగ్గర, పనుల దగ్గర, చదువుల దగ్గర- అన్ని చోట్లా రమేష్‌ను, రాణిని వేరు వేరుగా చూసేవాళ్ళు అందరూ. దాన్ని గురించి ఆలోచించిన కొద్దీ రాణికి తిక్కపట్టినట్లు అయ్యేది. చాలా బాధగా అనిపించేది. దాంతో చదువుల్లో అంతకు ముందు ఉన్నంత ఉత్సాహం కనబరచలేక పోయింది. రాణి వాళ్ల క్లాస్ టీచర్ గారు చాలా మంచిది. రాణి నిరుత్సాహంగా ఉండడం చూసి ఆవిడ 'ఏంటమ్మా అలా ఉంటున్నావు?" అని అడగ్గానే ఇంటిలో జరిగేదంతా చెప్పి కళ్ల నీళ్ళు పెట్టుకున్నది రాణి. "చూడు రాణీ! సమాజం ఇట్లానే ఉంది. ఆడపిల్ల అంటే చులకన. నువ్వు బాగా చదువుకొని మీ ఇంటివాళ్లకు, ఊరివాళ్లకు అందరికీ‌ బుద్ధిచెప్పాలి. నీ పరీక్షకు కావలసిన డబ్బులు నువ్వే సంపాదించుకో. నీవల్ల కాకపోతే నేను నీకు డబ్బు సాయం చేస్తాను. స్వతంత్రంగా ఉండు; బాగా చదువుకో; జ్ఞానం‌ పెంచుకో- అంతే. ఇంకేమీ ఆలోచించకూడదిప్పుడు!" అని ప్రోత్సహించిందావిడ.   అప్పటి నుండి రాణి తీవ్రంగా శ్రమించింది. రాత్రింబవళ్ళు చదివింది. రాను రాను ఇంట్లోవాళ్ళు కనీసం ఆ పాప పుస్తకాలకు కూడా డబ్బు ఇచ్చేవాళ్ళు కాదు. అయినా పాపం, ఏదో ఒక పని చేసుకుంటూ అవసరమైనన్ని డబ్బులు సంపాదించేది రాణి. చివరికి పబ్లిక్ పరీక్షలు వచ్చాయి. ఆ సమయంలో రాణి దగ్గర పరీక్షా కేంద్రానికి వెళ్ళేందుకు కూడా డబ్బులు లేవు. రమేష్ ప్రొద్దున ఏడు గంటలకు లేచి, ఆటోలో పరీక్షా కేంద్రానికి వెళ్ళేవాడు. తల్లి దండ్రులు వాడికి ఆటో డబ్బులు ఇచ్చి పంపేవాళ్ళు! కానీ, 'ఎట్లా వెళ్తున్నావు?' అని కూడా‌ అడిగేవాళ్ళు కాదు, రాణిని! రాణి ఆ సమయంలో రోజూ పొద్దున్నే నాలుగు గంటలకే నిద్ర లేచి, అడ్డదారిలో పరీక్షా కేంద్రానికి నడిచి పోయేది. అయినా పరీక్షలన్నీ బాగా రాసింది. చివరకు ఎలాగో పరీక్షలు గడచాయి.  సెలవుల తర్వాత ఫలితాలు వచ్చాయి: రాణికి జిల్లాలోనే అందరికంటే ముందుస్థానం! "నేను కాలేజికి వెళ్తానే, వాళ్ళు నన్ను ఉచితంగా చదివిస్తారు" అని రాణి అంటే తల్లిదండ్రులు చప్పుడు చేసేవాళ్ళు కాదు- "ముందు రమేష్ సంగతి చూడనివ్వు. ఎంత ఫీజు కట్టాల్నో ఏమో" అనేవాళ్ళు. చివరికి వాడికి ఇరవైవేలు కట్టి కాలేజీలో‌ చేర్పించి, "ఆడపిల్లవి, నీకు చదువు అవసరమా! నోరు మూసుకొని ఇంట్లో కూర్చో" అనేశారు రాణిని! కొద్ది రోజులకు ఓ స్వచ్ఛంద సంస్థ వారు వచ్చి "మీ పాప చాలా చక్కగా చదువుతుంది. మేం మీ అమ్మాయికి ఉచితంగా విద్య అందిస్తాం. కలెక్టరుగారు ప్రత్యేకించి మీతో మాట్లాడమన్నారు. ఆ పాపను మాతో పంపించండి" అన్నారు.    అనగానే, "ఏం అవసరంలేదు. ఆడపిల్ల ఇంతవరకు చదువుకున్నది చాలు. మా అమ్మాయి- మా ఇష్టం" అన్నది రాధమ్మ!  ఇక భరించలేని రాణి తిరగబడింది: "కుదరదు! నేను చదువుకుంటా. అంతే!" అంటూ వాళ్లతో గొడవ పెట్టుకుని స్వచ్ఛంద సంస్థ వారి సహాయంతో‌ కాలేజీకి, హాస్టలుకు వెళ్లటం మొదలు పెట్టింది. తల్లిదండ్రులకు ఆమె మీద ఎంత కోపం వచ్చిందంటే, వాళ్ళు ఇక ఆమెను ఇంటి గడప త్రొక్కనివ్వలేదు! అయినా రాణి బాగా చదువుకున్నది. ప్రతి సంవత్సరం జిల్లాలో ప్రథమ స్థానంలో‌ నిల్చింది. మంచి ఉద్యోగస్థురాలు కూడా అయ్యాక, అప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చింది! ఆ సమయానికి రమేష్ పెళ్ళి జరుగుతున్నది. ఇంటిలో అడుగు పెట్టగానే రాణి తల్లిదండ్రులు "ఏమే, ఎందుకు వచ్చావు? మళ్ళీ ఎందుకు వచ్చావు, వెళ్ళిపో!" అంటూ రాణిని బయటికి గెంటేశారు. రాణికి బాధ వేసింది గానీ, "ఆడపిల్ల అంటే అలుసు" అని తమ టీచర్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చింది- తల్లిదండ్రుల మీద ఇంతైనా కోపం చేసుకోకుండా తిరిగి వెళ్ళిపోయింది. ఇక పెళ్ళి చేసుకున్న రెండు నెలలకే తల్లిదండ్రులను బయటికి గెంటేశాడు రమేష్. అప్పటినుండి రామయ్య, రాధమ్మ ఊళ్ళో సత్రంలో ఉండటం మొదలు పెట్టారు. అది తెలుసుకున్న రాణి వెంటనే వచ్చి, "అన్న బయటికి గెంటేస్తేనేమి? నేను ఉన్నాను కదా, రండి! మన ఇంటికి వెళ్దాం!" అని తన ఇంటికి తీసుకు వెళ్ళింది. వాళ్లకు ఏ లోటూ లేకుండా బాగా చూసుకున్నది. రామయ్యకు, రాధమ్మకు ఇప్పుడు అర్థమైంది- "ఆడపిల్లలే ఆధారం" అని. - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

లచ్చయ్య మంచితనం

  లచ్చయ్య మంచితనం       లింగేశ్వరంలో ఉండే కోటేశ్వరావు గొప్ప ధనవంతుడు, పరమ పిసినారి. 'అతనికి ఉన్నంత డబ్బు పిచ్చి వేరే ఎవ్వరికీ ఉండదు' అని చెప్పుకునేవాళ్ళు. ఎంగిలి చేత్తో విదిలిస్తే కాకులకు మెతుకులు దొరుకుతాయని, అతను అన్నం తినేప్పుడు ఎప్పుడూ చేతుల్ని తనకు దగ్గరగానే పెట్టుకునేవాడు. కంచం అంచు వెంబడి మెతుకులు క్రింద పడకుండా ఉండాలని, తను ఎప్పుడు అన్నం తిన్నా, కంచం మధ్యలోనే కలుపుకొని తినటం అలవరచుకున్నాడు. ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే వాళ్ళు అడగకుండానే గ్లాసులకు గ్లాసులు నీళ్ళు ఇచ్చి, వాళ్లను వీలైనంత త్వరగా తిప్పి పంపించేవాడు: "వామ్మో! అతను బిచ్చగాడి నుండే బిచ్చం ఎత్తుకుంటాడు" అని బంధువులు ఎవ్వరూ అతని ఇంటికి వచ్చేవాళ్ళు కాదు.     అదే ఊళ్ళో మంచి, మర్యాద, మానవత్వం కలిగిన పేద రైతు ఒకడు ఉండే వాడు. అతని పేరు లచ్చయ్య. ఉన్నంతలో తృప్తిగా జీవించేవాడు లచ్చయ్య. ఇంటికి వచ్చిన అతిథులకు దేన్నైనా ప్రేమానురాగాలతో పంచేవాడు. తను ఒక పూట అన్నం తినకపోయినా ఇతరులకు పెట్టేవాడు. "నాకు వేరే ఏమీ ఇవ్వకపోయినా పర్లేదు కానీ, ఇంటికి వచ్చిన వాళ్ళకి కడుపునిండా అన్నం పెట్టి, సంతోషంగా సాగనంపే శక్తిని మటుకు ఉండనివ్వు స్వామీ" అని రోజూ దేవుడిని ప్రార్థించేవాడు. రాను రాను ఆ చుట్టు ప్రక్కల ప్రాంతాల వాళ్ళంతా లచ్చయ్య గురించి గొప్పగా చెప్పుకోవటం మొదలెట్టారు. దానితోబాటే కోటేశ్వరరావు పిసినారితనం కూడా ప్రచారమైంది. దాంతో కోటేశ్వరరావుకి లచ్చయ్య మీద కోపం పెరిగిపోయింది! చివరికి అతనిక తట్టుకోలేక, దూరం నుండి పిలిపించిన రౌడీలను కొందరిని లచ్చయ్య ఇంట్లో దొంగతనానికి పంపించాడు. ఆరోజు రాత్రి వాళ్ళు భోజనం కోసం వెతుక్కుంటుంటే ఎవరో చెప్పారు- "ఈ టైములో‌ భోజనం ఎక్కడ దొరుకుతుంది? ప్రక్కనే లచ్చయ్య ఇంటికి పోండి, కనీసం ఏ ఊరగాయో వేసి ఇంత అన్నం పెడతాడు" అని. అట్లా ఆ దొంగలు లచ్చయ్య ఇంట్లోనే భోజనాలు చేసారు. మరి ఆ సమయంలో వాళ్ళు ఏమనుకున్నారో ఏమో: ఆ రోజు రాత్రి కోటేశ్వర రావు ఇంట్లోనే దోపిడీ జరిగింది! దొంగలు అతని దగ్గరున్న డబ్బునీ, నగల్నీ, విలువైన సామాన్లనీ‌ మొత్తం దోచుకుపోయారు!       దు:ఖంలో‌ ఉన్న కోటేశ్వరరావు కుటుంబానికి కూడా లచ్చయ్యే ఆసరాగా నిలిచాడు. వాళ్ళు తినేందుకు రోజూ భోజనం వండి పంపించాడు! అంతలో‌ వాళ్ళ పొరుగూరు లింగగిరిలో చెరువు కట్ట తెగింది- నీళ్ళన్నీ ఊళ్లోకి వచ్చాయి; పలు కుటుంబాలకు చెందిన ఇళ్ళు కూలిపోయాయి. లచ్చయ్య ముందుపడి, పునరావాసపు పనులు మొదలుపెట్టాడు. దానికోసం తనకున్న కొద్దిపాటి భూమినీ అమ్మేసేందుకు సిద్ధపడ్డాడతను! అయితే ఊళ్ళో వాళ్లంతా ముందుకొచ్చి, చందాలు వేసుకొని ఆ పనిని తమ వంతుగా నెరవేర్చారు. అంతలోనే మరో అద్భుతం జరిగింది. లచ్చయ్య కృషిని మెచ్చుకుంటూ ఎవరో కోటీశ్వరుడు ముందుకొచ్చి, పెద్ద మొత్తం విరాళంగా ఇచ్చాడు. ఆ సంగతి చెప్పి, లచ్చయ్య ఊళ్ళోవాళ్ళిచ్చిన చందాల డబ్బును ఎవరిది వాళ్ళకు వాపసు చేసాడు! దీన్నంతా దగ్గరనుండి గమనించిన కోటేశ్వరరావులో పరివర్తన కలిగింది- "ఇకమీద నేను లచ్చయ్యను వేరుగా చూడను- నా కుటుంబ సభ్యులలో ఒకడుగా ఆదరిస్తాను. అతను చేసే మంచిపనుల్లో నేను కూడా పాలు పంచుకుంటాను" అనుకున్నాడు. అతనిలో‌ మార్పును గమనించిన కుటుంబ సభ్యులూ, ఊళ్ళోవాళ్ళు కూడా చాలా సంతోషించారు. Courtesy.. kottapalli.in

నన్ను కాపాడిన పిల్లి

నన్ను కాపాడిన పిల్లి     ఒకరోజున మేం అందరం బంతి ఆట ఆడుతుంటే ఎవరో కొత్త పిల్లాడు ఒకడు కనిపించాడు. నేరుగా మా దగ్గరికి వచ్చి, అడిగాడు- "నేను కూడా మీతో ఆడచ్చా" అని.   వాడిని చూడగానే నాకు గుర్తొచ్చింది- ఆ రోజునే మా అక్క మాకో పని ఇచ్చింది: "చెప్పిన పదాలతో కథ రాయండి" అన్నది. ఇప్పుడు ఇంక "వీడి చేతే కథ చెప్పిద్దాం" అనుకున్నాను.    "ఇదిగో, నువ్వు మాతో‌ ఆడుకోవచ్చు: అయితే ముందు నీ‌ కథ చెప్పాలి. ఆ కథలో 'సముద్రం, అమ్మమ్మ ఇల్లు, దొడ్డి కంపు, పిల్లి, నాగు పాము'- ఈ ఐదు సంగతులూ తప్పకుండా రావాలి" అన్నాను.     వాడు ఏమాత్రం‌ ఆలోచించకుండానే చెప్పటం మొదలెట్టాడు: "నేను ఇంకో దేశం నుంచి వచ్చాను. ఒక చిట్టి పడవలో సముద్రం దాటి వచ్చాను- విన్నారుగా, సముద్రం!" "సరే- సరే- ముందుకు పో!" అన్నాను నేను. వాడు కొనసాగించాడు- "సముద్రం దాటి వచ్చాక, కొన్నాళ్ళ పాటు ఉండి పోదామని మా అమ్మమ్మ వాళ్ల ఇంటికి వచ్చాను. అర్థమైంది కదా, అమ్మమ్మ ఇల్లు!'"  "సరిగ్గా ఆ సమయానికే వాళ్ల మరుగుదొడ్డికి ఉండే గొట్టం విరిగింది. ప్లంబరు వచ్చి మొత్తం కడిగి రిపేరు చేస్తున్నాడు. అక్కడ అంతా ఒకటే దొడ్డి కంపు! అర్థమైంది కదా, దొడ్డి కంపు!" ఆగాడు వాడు. "బలే ఉందిరా, నీ కథ- చెప్పు ఇంకా" అన్నాం.  "ఇక్కడ, ఈ ఊళ్ళో మా పిన్ని ఉంటుంది. అందుకనే మేము ఇక్కడికి వచ్చాం. వచ్చీ రాగానే నాకు- ఉం..- ఒక పిల్లి కనిపించింది. అది కొంచెం కుంటే పిల్లి. అందుకని నాకు అది ఏమంత నచ్చలేదు. బాగా తరిమాను దాన్ని. అయినా అది నన్ను వదలక, నా చుట్టూనే తిరుగుతూ వచ్చింది" ఆపాడు వాడు. "ముందుకు పో!" అన్నాను నేను.   "అయితే ఇందాక, మధ్యాహ్నం ఏం జరిగిందో మీరు ఊహించను కూడా ఊహించలేరు" అన్నాడు వాడు. "ఏమైంది?" అన్నాం అందరం, ఉత్సాహంగా.  "నేను తలుపు తీసుకొని తోటలోకి నడిచానా, అంతలోనే పిల్లి నా ముందుకి దూకి, కాళ్లకు అడ్డంగా తిరుగుతూ అరవటం మొదలెట్టింది. నేను దాన్ని అదిలిస్తూ కాళ్ళు ఇట్లా విసిరానో లేదో- 'బుస్' మని పెద్దగా శబ్దం! చూసే సరికి నా కాళ్ల ముందే ఓ‌ పెద్ద నాగు పాము! దాని మీదికి దూకి పోరాడుతూ ఆ కుంటి పిల్లి! ఒక్క అడుగు ముందుకు వేసినా ఆ పాము నన్ను కరిచేది; నేను ఇట్లా మీతో ఈ సంగతి చెప్పగలిగేవాణ్ణి కాదు!" అన్నాడు వాడు కథని ముగిస్తూ. మేమందరం వాడి దగ్గరికెళ్ళి "నువ్వు బలే కథలు చెబుతావురా! నిజంగా జరిగినట్టే చెబుతావు!" అన్నాం. "కాదు!‌ ఇది కథ కాదు- నిజం!" అన్నాడు వాడు. అది చెబుతుంటే వాడి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. మేం‌ వాడిని ఓదార్చాం. ఆ తర్వాత అందరం కలిసి ఆడుకున్నాం...  

తెలివైన పిల్లలు

తెలివైన పిల్లలు   మాలిపురంలో ప్రవీణ్, మహేష్ అనే ఇద్దరు స్నేహితులు కలిసి మెలిసి ఉండేవాళ్ళు. వాళ్ళ తెలివి తేటల్ని గురించి ఊళ్ళోవాళ్లంతా గొప్పగా చెప్పుకునే వాళ్ళు. ఒకసారి ఆ ఊరి రాజుగారి భవనంలో దొంగతనం జరిగింది. రాణిగారు ఎంతో మక్కువగా పెట్టుకునే ఆభరణాల మూటని ఎవరో సునాయాసంగా దొంగిలించారు! రాజుగారు చాటింపు వేయించారు: ఈ ఆరణాల దొంగల్ని పట్టించిన వాళ్లకు వంద బంగారు నాణాలు బహుమతిగా ఇస్తానని. ఊళ్ళో వాళ్ళంతా మహేష్, ప్రవీణ్‌లతో "ఒరే, మీరు ఇంత తెలివైనవాళ్ళు, ఆ దొంగలెవరో కనుక్కోండి గదా" అన్నారు. ప్రవీణ్ కొంచెం ఆలోచించి, "ఈ పని చేసేవాళ్ళకు రాజుగారి భవనం గురించి, రాణిగారి నగల మూట గురించీ బాగా తెలిసి ఉండాలి. అంటే రాణిగారి దగ్గర పనిచేసే వాళ్ళే ఎవరో ఈ పని చేసారన్నమాట" అన్నాడు.   "రాణిగారి చెలికత్తెల్ని అందరినీ ఒక్కరొక్కరుగా పిలిపించి అడిగితే సరి!" అన్నాడు మహేష్. "రాణిగారి నగల్ని వాళ్లెవరో ఇంత త్వరగా అమ్ముకోలేరు. అందుకని ఆ మూటకి మూట ఎక్కడో భద్రంగా ఉండే ఉంటుంది ఇంకా" అన్నాడు ప్రవీణ్. "దొంగలు రాణివాసంలో వాళ్ళే. కనుక నగల మూట కూడా ఇంకా రాణివాసంలోనే ఉంటుంది. బయటికి చేరుకొని ఉండదు" అన్నాడు మహేష్. ఇద్దరూ కలిసి రాజుగారి దగ్గరకెళ్ళి, "మేం మీ నగల మూట ఎక్కడుందో కనుక్కుంటాం. మాకు ఓ రెండు మూడు రోజులు రాణివాసంలో ఉండేందుకు అనుమతి-నివ్వండి. అట్లాగే పొగ చుట్టలు కూడా ఓ పదో ఇరవయ్యో తెప్పించండి" అన్నారు. రాజుగారు సరేనన్నారు. "ఎవరో ఇద్దరు పిల్లలు రాణిగారి ఆభరణాల దొంగల్ని పట్టుకునేందుకు వచ్చారట" అని ఊరంతా తెలిసిపోయింది. ఆరోజు రాత్రి రాణివాసంలో కల్లోలం రేగింది. "మంట! మంట!" అని అరుపులు రేగాయి. రాణివాసం అంతటా పొగ క్రమ్ముకున్నది. రాజుగారు పరుగున వచ్చారు రాణివాసానికి- "ఏం జరిగింది, ఏమైంది? ఎవరికీ ఏమీ జరగలేదు గద?!" అంటూ. మహేష్, ప్రవీణ్ ఆయనకు ఎదురేగి, "ఏమీ పరవాలేదు ప్రభూ! ఇది మేం చేసిందే. నగల మూట ఇదిగోండి!" అని రాణిగారి పరుపు క్రింద నున్న మూటను తీసి ఇచ్చారు రాజుగారికి. రాజుగారు ఆశ్చర్యపోయారు. "ఇది ఇక్కడికి ఎట్లా వచ్చింది? మీకెలా దొరికింది?" అని ప్రశ్నలు కురిపించారు.   "ఏమీ లేదు ప్రభూ!‌ఈ పనిని రాణివాసంలో పనిచేసే చెలికత్తెల్లోనే ఎవరో ఒకరు చేసి ఉంటారని మాకు అర్థమైంది. అట్లాగే నగలమూట ఈ కోటని దాటి పోలేదనీ అర్థమైంది. అందుకని దొంగ ఎవరో దాన్ని తీసి, ఈ చుట్టు ప్రక్కలే, ఎవరూ చూడ సాహసించని స్థలంలో, దాచి ఉంచిందని ఊహించాం. 'మంట' పేరుతో హడావిడి చేసేటప్పటికి, అందరూ బయటికి పారిపోతారు, కానీ దొంగ మటుకు తాను మూటని దాచిన తావుకు పరుగెడుతుంది- మేం ఇక్కడే ఉండి, రాణివాసంలో పనిచేసేవారినందరినీ గమనిస్తూ ఉన్నాం. అమాయకపు దొంగ పొగ మంటకు భయపడి తను దాచుకున్న మూటని మాకు చూపించేసింది!" నవ్వారు పిల్లలిద్దరూ. రాజుగారు వాళ్ల తెలివిని మెచ్చుకొని, "ఇంతకీ దొంగలెవరో చూపనేలేదు మాకు" అన్నారు. "ఆ దొంగ ఇంకా ఇక్కడెందుకుంటుంది? పారిపోయింది మహారాజా! పోనివ్వండి, మళ్ళీ అయినా మనకు దొరక్కపోదు" అన్నాడు మహేష్. రాజుగారు తన మాట ప్రకారం వాళ్లకు వంద బంగారు నాణాల్ని, ప్రశంసా పత్రాన్నీ అందజేసారు. అదే రోజున, పిల్లలిద్దరూ ఇంకా ఊరికి బయలు దేరకనే వాళ్లకో ఉత్తరం అందింది: "ఇల్లలకగానే పండగ కాదు. మీ వంద బంగారు నాణాలను మీ ఊరికే వచ్చి దోచుకెళ్తాం. ఎవరు అడ్డుకుంటారో చూస్తాం" అని. మహేష్, ప్రవీణ్ ఇద్దరూ గట్టిగా నవ్వారు. "మన ఊరికి రమ్మను..ఈసారి దొంగల్ని అందరినీ పట్టించేద్దాం" అనుకున్నారు. ఇద్దరూ తమ బహుమతిని పట్టుకొని ధైర్యంగా తమ ఊరికి వెళ్ళిపోయారు. "ఆ దొంగలు ఎవరో మన ఊరుకు రావల్సిందే కదా, ఇవాల్టినుండి మన ఊరికి వచ్చే కొత్త మనుషుల్ని గుర్తు పెట్టుకుందాం మనం" అన్నాడు మహేష్. పిల్లలిద్దరూ జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు. మూడో‌రోజున ఆ ఊరికి కొందరు దృఢకాయులు వచ్చారు. "మన బంధువులు వీళ్ళే!" నవ్వాడు ప్రవీణ్. "ఊరికి కాపలా ఉండే సైనికులను హెచ్చరించాలి, వీళ్ళ గురించి!" అన్నాడు మహేష్. ఆ రోజు రాత్రి ఊరిమధ్యలో ఉన్న మర్రిచెట్టు తొర్రలో దాక్కున్నారు వీళ్ళిద్దరూ. అర్థరాత్రి అవుతున్నదనగా దృఢకాయులు ఎక్కడినుండో బయటికి వచ్చి, మిత్రుల ఇళ్ళున్న వైపుకు నడవసాగారు. వాళ్లని ఆ తొర్రలో నుండి గమనిస్తున్నారు మిత్రులు.. దొంగలు మర్రిచెట్టు దగ్గరికి రాగానే తొర్రలోంచి "అహ్హహ్హహ్హ- ఆహహ్హహ్హహ్హ" అని రాక్షసులలాగా నవ్వారు ఇద్దరూ.  ఆ నవ్వులకు బిత్తరపోయిన దొంగలు "ఎవరది? ఎవరక్కడ? బయటికి వచ్చి ఎదురు నిలవండి! ఎవరది?!" అని అరిచారు బింకంగా. తొర్రలోంచి మహేష్ మళ్ళీ ఓసారి నవ్వాడు. ప్రవీణ్ బొంగురు గొంతుతో "ఒరే!‌ మేం ఈ ఊరిని కాపాడే రాక్షసులం! మాకు ఎదురు నిలుస్తార్రా మీరు! అహ్హహ్హహ్హహ్హ" అని నవ్వాడు. "రాజుగారినుండి ఆభర-ణాలతోబాటు మీరు డబ్బుల్నీ దోచుకున్నారు గదరా! ఆ డబ్బులు మొత్తం ఈ మర్రిచెట్టు ముందు పెట్టేసి చెంపలేసుకొని పోండి. లేదంటే మీ పని ఇవాల్టితో సరి!" అరిచాడు మహేష్. దొంగలు గడగడా వణికారు. తమ దగ్గరున్న మొత్తం డబ్బునూ మర్రిచెట్టు ముందు పెట్టి పారిపోబోయారు. అంతలోనే అందరూ కాపలా సైనికులకు దొరికిపోయారు. వాళ్లద్వారా అంత:పురపు దొంగ కూడా దొరికిపోయింది! రాజుగారు మరోసారి పిల్లలిద్దరినీ సన్మానించారు! కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

అతి తెలివి

అతి తెలివి   ఓ ధనవంతుడికి తెలివితక్కువ కొడుకు ఒకడు ఉండేవాడు. ధనవంతుడికి తన కొడుకంటే చాలా ప్రేమ, వాడి తెలివితేటల మీద చాలా నమ్మకం. తన తర్వాత వ్యాపారాన్ని బాగా పెంచుతాడని ఆశ పడేవాడు. కొడుకు వ్యాపారంలోకి వచ్చీ రాగానే "నేను ప్రపంచానికి అటు వైపున ఉన్న ఫలానా ద్వీపంతో వ్యాపారం చేస్తాను" అన్నాడు. "ఓడ నిండా సరుకులు తీసుకెళ్తాను; అక్కడినుండి వచ్చేప్పుడు విలువైన వస్తువులు తెచ్చి ఇక్కడ అమ్ముతాను!" అన్నాడు. ధనవంతుడు సంతోషంగా ఒక ఓడను సిద్ధం చేసాడు. దాన్ని సరుకులతో నింపాడు. ఒక వంద కోట్ల రూపాయలు కూడా అందులో ఉంచాడు. "ఆ ద్వీపం మీద బంగారం ధర తక్కువ, రాళ్ల ధర ఎక్కువ బాబూ! కాబట్టి నువ్వు తిరిగి వచ్చేటప్పుడు ఓడ నిండా మంచి బంగారాన్ని తీసుకురా" అని చెప్పాడు కొడుకుతో. "నీకెందుకు నాన్నా, అంతా నా మీద వదిలెయ్యి! ఏవి మంచివో అవే తెస్తాను!" అన్నాడు కొడుకు, తండ్రి చెప్పేది ఏమీ వినకుండానే. అతను ఆ ద్వీపానికి చేరుకుని, తన దగ్గరున్న సరుకులన్నీ‌ మంచి లాభానికి అమ్మేసాడు. ఇక తిరిగి వస్తాడనగా, "ఇక్కడ ఏమేమి మంచి వస్తువులు ఉంటాయి?" అని వాకబు చేసాడు. అక్కడ నిజంగానే బంగారం ధర తక్కువ; రాళ్ల ధర ఎక్కువ. "బంగారుదేమున్నది, రాళ్లైతే చాలా మంచివి కదా! " అన్నారు అక్కడి జనాలు. "అందుకనే రాళ్ల ఖరీదు ఎక్కువ చూడు- అవే విలువైనవి !" "విలువైనవే తీసుకెళ్ళాలి" అనుకున్న కొడుకు, ఓడనిండా రాళ్లను వేసుకొని రాజ్యానికి తిరిగి వచ్చాడు. "అక్కడ ఉన్నవాటన్నిటిలోకీ ఇవే విలువైనవి. ఇవే రేటు ఎక్కువ" అని గర్వంగా చెప్పుకున్నాడు కూడా! ఇది విన్న వ్యాపారి గుండె ఒక్కసారిగా ఆగినట్లైంది. Courtesy.. kottapalli.in

జింక చాతుర్యం

జింక చాతుర్యం   అనగా అనగా ఒక అడవిలో జింక ఒకటి ఉండేది. అది చాలా మంచిది, బాగా తెలివైనది కూడా. ఎవరితోటైనా చక్కగా, మర్యాదగా మాట్లాడి వాళ్లని మెప్పించేది. దాని మాట తీరు బాగుండటం వల్ల, అడవిలో ఉండే చాలా జంతువులు దానికి స్నేహితులైనాయి. అయితే కష్టాలు ఎవరికైనా రావచ్చు కదా, ఒక రోజున ఆ జింక ఒక వేటగాడి ఉచ్చులో చిక్కుకున్నది. వేటగాడు వచ్చి, దాన్ని చూసి చాలా సంతోష పడ్డాడు. "ఆహా! ఎంత మంచి జింక పట్టుబడింది! దీన్ని అమ్మితే నాకు చాలా డబ్బులు వస్తాయి" అనుకొని, అతను దాన్ని వలతో‌ సహా తన ఇంటికి తీసుకెళ్ళాడు. అప్పటికి బాగా సాయంత్రం అయింది. చీకటి పడబోతున్నది. దాంతో అతను దాన్ని వలలోనుండి తీయకనే తన ఇంటి బయట ఉన్న పూరిపాకలో‌ పడేసి, పాకకు గట్టి తాళం వేసి తను వంట పనిలో మునిగాడు. జింక దు:ఖం‌ రెట్టింపు అయ్యింది. అది తన కష్టాల్ని తలచుకుంటూ. కాపాడండి కాపాడండి - కాపాడండి ఎవరైనా వలలోనుండి తప్పించండి.. మీ మేలు ఇక మరువనండి.. అని పాడటం మొదలెట్టింది బాధగా. అంతలో అటుగా వెళ్తున్న ఎలుక ఒకటి జింక పాటను విని, దాని దగ్గరికి వచ్చింది. సంగతి తెలుసుకొని, రాత్రంతా శ్రమపడి వలను కొరికి ముక్కలు చేసి, జింకను బయటికి లాగింది. జింకకు ప్రాణం లేచి వచ్చింది. దానికి ధన్యవాదాలు చెప్పుకున్నది. అయితే మూసి ఉన్న తలుపులోంచి బయటికి పోలేదు కదా, అందుకని అది తలుపుకు ఒక ప్రక్కగా నిలబడి, వేటగాడు తలుపు తీయటం కోసం ఎదురు చూడటం మొదలు పెట్టింది. అది వలలోంచి తప్పించుకొని ఉంటుందని ఊహించని వేటగాడు ఉషారుగా ఈల వేసుకుంటూ గడియ తీసాడు. అంతలోనే జింక గబుక్కున ముందుకు దూకి, అతన్ని పక్కకు నెట్టి తప్పించుకొని, చకచకా అడవిలోకి పరుగు తీసింది!   వేటగాడు కొంతసేపు దాని వెంట పరుగెత్తాడు- అయినా దాన్ని అందుకోలేక నిరాశగా వెనుతిరిగాడు.  ఎంత వేటగాడినుండి తప్పించుకున్నా, ఈ క్రమంలో జింక మనసు బాగా గాయపడింది. అదిప్పుడు చాలా పిరికిగానూ, అన్నిటికీ ఇతరుల మీద ఆధార పడేదిగాను తయారైంది. అట్లా భయం భయంగా తింటుంటే గడ్డి ఎందుకు ఒంట పడుతుంది? అందుకని అది రాను రాను సన్నగా, బలహీనంగా తయారవ్వసాగింది. అంతే కాదు, దాని మాట తీరు కూడా మారింది. ఇంతకుముందు లాగా అది అందరినీ ఉత్సాహంగా పలకరించటం లేదు. ఎవరిని చూసినా, "నీకు ఇవాళ్ళ వేటగాడు ఏమైనా కనిపించాడా?" అని అడగటం మొదలు పెట్టిందది. దాంతో అడవిలోని మిగతా జంతువులు కూడా దానిని తప్పించుకు తిరగటం మొదలు పెట్టాయి. అంతలోనే దానికి ఇంకోసారి వేటగాడు ఎదురయ్యాడు! అయితే ఆ రోజున వాడు వెనక్కి తిరిగి ఉన్నాడు- జింకని గమనించలేదు. జింక మెల్లగా వెనక్కి తిరిగి, నాలుగైదు అడుగులు వేసి, తర్వాత తోచిన దిక్కుకు పరుగు పెట్టింది. అల్లంత దూరాన దానికి ఒక ఏనుగు కనబడింది- జింక దాని దగ్గరికి పోయి "వేటగాడు!‌ వేటగాడు! వస్తున్నాడు! నన్ను కాపాడు!" అని మొరపెట్టుకున్నది. ఏనుగు దానికేసి చూసి, "అయ్యో! జింకా!‌ నాకు ఇప్పుడు చాలా పని ఉంది. నువ్వు కోతి దగ్గరకు వెళ్ళరాదూ?!" అన్నది. జింక గబగబా కోతి దగ్గరకు వెళ్ళి, "వేటగాడు తిరుగుతున్నాడు అడవిలో! నన్ను కాపాడు, ప్లీజ్" అంది. కోతి ముఖం చిట్లించుకొని- 'ఎక్కడు-న్నాడు?' అన్నది. 'అదిగో ఆ వంక అవతల ఉన్నాడు. అటుతిరిగి ఉన్నాడు. నన్ను చూడలేదు వాడు" అంది జింక. "మరింకేమి భయం?" అంది కోతి "నాకు చాలా ఆకలిగా ఉంది. ఆహారం వెతుకోవడానికి వెళ్తున్నాను. నువ్వు ఏమీ భయపడకు. అంతగా ఐతే కుందేలు దగ్గరకు వెళ్లు!" అంటూ. వెంటనే జింక కుందేలు దగ్గరకు పరుగెత్తింది. "నన్ను కాపాడు! వేటగాడు వచ్చేస్తున్నాడు" అన్నది.   "ఎక్కడ? ఎక్కడ?" అని హడావిడి పడిన కుందేలు, "వంక అవతల" అని తెలియగానే నవ్వేసి, ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకున్నది. జింకకు ఇక ఏం చేయాలో తోచలేదు. అంతలో దానికి వేటగాడి అడుగుల శబ్దం వినబడింది. దూరంనుండి వాడు తనవైపుకే వస్తున్నాడు! దానికి చాలా భయం వేసి, చుట్టూ వెతుక్కున్నది. ఒక వైపున పెద్ద పొదలు కనిపించాయి దానికి. అది చటుక్కున వెళ్ళి ఆ పొదల్లో‌ నక్కింది. చెవులు నిక్కించి శబ్దాలను వినసాగింది. ఏ మాత్రం అలికిడైనా వెనక్కి తిరిగి పారిపోయేందుకు సిద్ధంగా ఉంది... కొంచెంసేపట్లో వేటగాడు వచ్చాడు అటువైపు. అయితే అతనికి అక్కడ ఏ జంతువులూ కనబడలేదు. దాంతో అతను అట్లాగే ముందుకు వెళ్ళిపోయాడు! అతను వెళ్ళిపోయాక పది నిముషాలవరకూ ఊపిరి బిగబట్టుకొని కూర్చున్న జింక, ఆ తర్వాత బయటికి వచ్చి తన ఇంటి వైపుకు పరుగు పెట్టింది. అయితే ఆ అనుభవంతో దానికి పట్టుకున్న భయం వదిలింది. దాంతోబాటు ఇంకో సంగతి కూడా అర్థమైంది: "అవసరార్థం ఇంకోళ్లను నమ్ముకోకూడదు. వీలైనంత వరకూ తెలివితేటలను ఉపయోగించి మన పనిని మనమే చేసుకోవాలి. ఎప్పుడూ ఇంకోళ్ళమీద ఆధారపడితే కష్టం" అని.  - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

ఒక మనిషి మంచితనం

  ఒక మనిషి మంచితనం       చాలాకాలం క్రితం రామాపురం అనే గ్రామంలో అందరూ బ్రాహ్మణులే ఉండేవారు. వాళ్లంతా చాలా పవిత్రంగా ఉండేవారు. అందరూ అతి సాధారణ జీవితాలు గడుపుతూ, ఉదయమూ,సాయంత్రమూ క్రమం తప్పకుండా సంధ్యావందనం చేసుకుంటూండేవారు. అందరూ వేదాధ్యయయనం చేసేవాళ్లు, తాము చేయవలసిన అన్ని పూజలు, పునస్కారాలు విధివత్ జరుపుతూ, శాస్త్రానుసారంగా జీవించేవాళ్లు. వేదబ్రాహ్మణులందరి మాదిరే వాళ్లందరికీ ఇంటి మధ్యలో అగ్నికుండం ఉండేది. అందులో నిప్పు ఆరకుండా వాళ్లంతా జాగ్రత్త పడేవాళ్లు. అలాంటి ఒక కుటుంబంలో ఒకరోజు రాత్రి, ఆ ఇంటి చిన్న కోడలికి అర్జంటుగా మూత్రం పోసుకోవాల్సి వచ్చింది. అమావాస్యేమో, బయటంతా చాలా చీకటిగా ఉంది. పోవాలంటే చాలా భయం వేసింది. చివరికి ఆమె తెగించి, ఇంటి మధ్యలో ఉన్న అగ్నిహోత్రంలో మూత్రం పోసుకొని, చప్పుడు చేయకుండా వెళ్లి పడుకున్నది. తెల్లవారాక లేచి చూస్తే, ఆమె ఇంట్లోవాళ్లకు తమ అగ్నిహోత్రంలో మెరుస్తూ స్వచ్ఛమైన బంగారు కణిక ఒకటి కనపడింది! ఇంటివాళ్లంతా నిర్ఘాంతపోయారు. ఆ ఇంటి పెద్ద-ముసలివాడూ, జ్ఞానీ అయిన బ్రాహ్మణుడు- ఇంట్లో అందర్నీ నిలబెట్టి, "మీలో ఎవరో ఏదో తప్పు పని చేశారు. లేకపోతే బ్రాహ్మణుల అగ్నిహోత్రంలో ఇలా బంగారు కణిక ఎలా వస్తుంది?" అని అడిగాడు. చాలాసార్లు అడిగిన మీదట, చిన్నకోడలు ధైర్యం చేసి, క్రితం రాత్రి తను చేసిన తప్పును ఒప్పుకున్నది. బ్రాహ్మణుడు ఆమెను గట్టిగా హెచ్చరించి, ఇక ఏనాడూ అలాంటి పని చేయనని ప్రమాణం చేయించాడు. ఇతరులెవరూ ఆమెను అనుసరించరాదని, రాత్రిపూట మూత్రం వచ్చినప్పుడు ఒకరికొకరు తోడుగా వెళ్లమని ఆయన కుటుంబ సభ్యులందరినీ ఆదేశించాడు. అయితే, ఈ సంగతి ఎలా తెలిసిందో ఏమో- ఊరంతా తెలిసింది. మొదట్లో మెల్లమెల్లగానూ. ఆపైన త్వర త్వరగాను అందరు బ్రాహ్మణుల ఇళ్లల్లోనూ అగ్నిహోత్రాల్లో బంగారు ఇటుకలు, ముద్దలు వెలిశాయి. వాళ్లలో చాలామంది గొప్ప ధనికులై, పెద్ద పెద్ద ఇళ్లు కట్టుకున్నారు, పట్టు వస్త్రాలు ధరించసాగారు. తమ కూతుళ్లకు వాళ్లు పెద్ద పెద్ద కట్నాలిచ్చి పెళ్లి చేశారు. గ్రామపు స్వరూపమే మారిపోయింది. కానీ ఒక్క కుటుంబం మాత్రం ఇంకా పేదగానే ఉండిపోయింది. గ్రామానికి చివర్లో ఓ గుడిశలో నివసిస్తూండేది ఆ కుటుంబం. ఇప్పుడా గ్రామంలో మిగిలిన ఒకే ఒక్క పేదకొంప- వాళ్ల ఇల్లు. ఆ ఇంటామె తన భర్తతో ప్రతిరోజూ పోట్లాడేది: "నువ్వు నన్ను కనీసం ఒక్కసారన్నా అగ్నిహోత్రంలో పొయ్యనివ్వచ్చుగదా" అని ఆమె ప్రాధేయపడింది. "మన యీ దరిద్రం తీరిపోతుంది. మన కడుపులకు ఇంత తిండి దొరుకుతుంది, కట్టుకునేందుకు నాలుగు కొత్త బట్టలు వస్తాయి. ఒక్కసారి చెయ్యనివ్వండి చాలు! ఒక్కసారి మాత్రం! ఒక్క బంగారు దిమ్మ మనకు చాలా కాలం వరకు సరిపోతుంది!" అని పోరేది. అలా ఆమె ఏడ్చింది, సాధించింది, వేధించింది, తనకున్న జిత్తులన్నీ వాడి భర్తను ఒప్పించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నది. ఒకరోజున, ఆమె సాధింపు ఇంకొంచెం శృతి మించే సరికి భర్త ఇక భరించలేక పోయాడు. "బ్రాహ్మణులున్న ఈ గ్రామం ముక్కలు చెక్కలవ్వకుండా ఇంకా ఒకటిగానే ఎందుకున్నదో తెలుసా?" అని అరిచాడు. "ఎందుకు? నువ్వు నన్ను అగ్నిహోత్రంలో పోయనివ్వనందుకేనా? అడ్డమైన ప్రతివాడూ ధనికుడై పోతుంటే నువ్వు మాత్రం మమ్మల్ని ఆకలితో మాడిపొమ్మంటున్నందుకేనా? చెప్పు, అందుకే గదా?!" అని ఎగతాళిగా వెటకరించింది, వేసారిపోయిన ఆ భార్య. "ఖచ్చితంగా అంతే. మనం ఇలా ఉండి, మన సమాజాన్ని మొత్తాన్నీ కలిపి ఉంచుతున్నాం. వాళ్లంతా చేస్తున్నట్లు మనమూ చేసినా, లేక మనం కూడా ఈ ఊరును విడిచి పెట్టి వెళ్లిపోయినా ఈ గ్రామం ముక్కలు చెక్కలై పోతుంది." అన్నాడు బ్రాహ్మణుడు. "చేతగాని తన భర్త తప్పించుకునేందుకు చెప్తున్న అబద్ధం ఇది" అనుకున్నది భార్య. "మనం పేదరికంలో ఉండి, ఈ ధనికులందర్నీ కాపాడుతున్నామనా, నువ్వనేది? ఎంత పొగరు, నీకు నిజంగా?! నిన్ను నువ్వు ఏమనుకుంటున్నావో ఏమో?" అన్నదామె. "సరే, అయితే నా‌మాటల్లో నిజం ఎంతో నీకు నువ్వే చూద్దువు. సామాన్లు సర్దు. మనం వేరే ఊరికి వెళ్లిపోదాం. ఏం జరుగుతుందో చూడు" అన్నాడు భర్త. వెంటనే వాళ్లు సామాన్లన్నీ సర్దుకొని, సకుటుంబంగా పొరుగూరుకు తరలి వెళ్లారు. ఒక వారంలోగా బ్రాహ్మణుల మధ్య తగవులు మొదలయ్యాయి. ప్రతివాడూ ఇంకొకడిని తిట్టడం మొదలుపెట్టాడు- తన భూముల్నీ, నేలనీ కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని. వాళ్లలోని దురాశాపరులు తమ భార్యల్నీ, కూతుళ్లనీ, కోడళ్లనీ ప్రేరేపించి అగ్నిహోత్రాలలో ఇంకా ఇంకా ఎక్కువ మూత్రం పోయిస్తుంటే, ఆ ఇళ్లలో అగ్నిహోత్రాలు దాదాపు ఆరిపోసాగాయి. ఒకనాడు ఒక కుటుంబం ఇంకొకరి ఇంటికి నిప్పంటించింది. దెబ్బతిన్న కుటుంబం ఇంకా ఎక్కువ మంటపెట్టి ప్రతీకారం తీర్చుకున్నారు. ఇక, ఇంటి తర్వాత ఇల్లు కాలిపోయి, చివరికి ఊర్లో బూడిద తప్ప మరేమీ మిగలలేదు. ప్రక్కఊరికి చేరుకున్న బ్రాహ్మణుడికి ఆ సంగతి తెలిసింది. అతనన్నాడు భార్యతో- "నేను చెప్తే నమ్మలేదు నువ్వు. ఒకరి మంచితనం వాళ్లనే కాదు, వాళ్ల చుట్టుప్రక్కల వాళ్లందర్నీ కాపాడుతుంది!" అని. Courtesy.. kottapalli.in

కోడి అందం

కోడి అందం     ఒక ఊళ్ళో కోడిపుంజు ఒకటి ఉండేది. అది చాలా అందంగా ఉండేది. రంగురంగుల రెక్కలు, పెద్ద పెద్ద కాళ్ళు, బలమైన గోళ్ళు, చక్కగా వంపు తిరిగిన ముక్కు, ఎర్రని తురాయి- తన అందం‌ చూసుకొని అది మురిసిపోతుండేది. ఎప్పుడూ "ఇంకా ఎన్ని సోకులు చేసుకోవాలా?" అని ఆలోచిస్తూ ఉండేది. మిగతా కోళ్లు తనంత అందంగా లేవని చిన్నచూపు చూసేది.    రైతు ఇంటి ముందు ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద ఒక గ్రద్ద నివసిస్తూ ఉండేది. ఎలాగైనా ఈ కోడిని తినాలని దానికి చాలా ఆశగా ఉండేది. 'అదను చూసి ఎగవేసుకు పోదాం' అని చాలా కాలం పాటు వేచి చూసిందది.    ఒకసారి కోడి చెట్టు క్రింద పురుగులను ఏరుకుంటుంటే 'ఇదే అదను' అని గబుక్కున మీదికి దూకింది గ్రద్ద. ఏమరుపాటు లేని కోడి మెరుపులాగా పోయి, ఆ చెట్టుకున్న తొర్రలో దూరింది. గ్రద్దకు తెలుసు- తను ఎంత ప్రయత్నించినా తొర్రలో దాక్కున్న కోడి తనకు చిక్కదని. అందుకని అది అన్నది-"కోడి మరదలూ,కోడి మరదలూ!    నీ అంత అందమైన కోడి ఎక్కడా లేదని ప్రపంచంలో అన్ని పక్షులూ చెప్పుకుంటున్నాయి. అందుకే నేను నిన్ను చూడటానికి వచ్చాను. నువ్వు నా ఇంటి ప్రక్కన ఉండటం నిజంగా నాకు గర్వకారణం!"అని. వెర్రి కోడి ఆ మాటలకు పొంగిపోయింది. "ఇన్నాళ్లకు నా అందాన్ని గుర్తించే పక్షి ఒకటి ఎదురైంది" అని కులుక్కుంటూ బయటికి వచ్చింది. వేచి చూస్తున్న గ్రద్ద ఒక్క ఉదుటున దానిమీదికి దూకి పట్టుకుపోయి, చంపి తినేసింది. - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

అడవి తల్లి

అడవి తల్లి   ఒక ఊళ్లో శివయ్య అనే యువకుడు ఉండేవాడు. వాళ్లది చాలా పేద కుటుంబం. శివయ్య చిన్నప్పటి నుండి కూలి పనులు చేసుకుంటూ డిగ్రీ వరకు చదువుకున్నాడు. అతను డిగ్రీ చదివేటప్పుడే వాళ్ల నాన్న చనిపోయాడు. వాళ్ల నాన్న చనిపోయిన తరువాత శివయ్య చదువు ఆపేసి, ఉద్యోగం కోసం వెతకసాగాడు. కానీ ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకలేదు. చివరికి వాళ్లకి తిండి దొరకడానికి కూడా కష్టమైంది. ఇక చేసేదేమీ లేక కట్టెలు కొట్టి, వాటిని అమ్మి జీవనం సాగిద్దామని అనుకున్నాడు. అతనికి తెలుసు- చెట్లు నరకడం వల్ల వర్షాలు రావని. అయినా తప్పేటట్లు లేదు మరి! అయిష్టంగానే మరుసటి రోజు కట్టెల కొట్టడానికి అడవికి వెళ్లాడు. అడవిలో కట్టెలు కొడుతూ ఉండగా శివయ్యకు బాగా ఆకలి వేసింది. "అడవిలో ఏం దొరుకుతాయి?" అని కొద్ది సేపు ఊరుకున్నాడు. అయినా ఆకలి వేస్తూనే ఉంది. 'తినేందుకు ఏమైనా కావల్సిందే' అని అడవిలో అంతా వెతుక్కుంటూ తిరిగాడు. అది ఏప్రియల్ నెల- చెట్లన్నీ పచ్చగా ఉన్నాయి. అన్నిటికీ పూలు, అక్కడక్కడా పళ్ళు ఉన్నాయి. శివయ్యకు ఏవి తినచ్చో, ఏవి తినకూడదో అంత బాగా తెలీదు- అయినా తన అనుమానం కొద్దీ నచ్చిన పళ్ళు కోసుకొని తిని చూశాడు. వాటిలో కొన్ని అద్భుతంగా ఉన్నాయి!   వాటిని తింటూ ఉండగా అతనికి ఒక ఆలోచన వచ్చింది: "నేను ఈ పళ్లు అమ్మి ఎందుకు జీవనం సాగించకూడదు? చెట్లను కొట్టకుండా ఉండొచ్చు కదా!" అనుకున్నాడు. వెంటనే తనకు నచ్చిన కాయలు, పళ్ళు కొన్ని కోసుకొని, పక్కఊరికి వెళ్లి అమ్ముకొని వచ్చాడు. అప్పటికే అక్కడ వాళ్ల అమ్మ శివయ్య కోసం ఎదురుచూస్తూ ఉన్నది. 'కట్టెలు ఏవిరా?' అని అడిగితే జరిగినదంతా చెప్పి, తను సంపాదించిన డబ్బుల్ని ఆమె చేతిలో పెట్టాడు శివయ్య. "ఒరే, అడవిలో ఏ కాయలు మంచివో, ఏవి కావో తెలుసుకోవాలి. ఎవరినైనా అడిగి ఏవి దేనికి పనికొస్తాయో కూడా‌ కనుక్కోవాలి" అని, వాళ్ల అమ్మ వెళ్ళి ఊళ్ళో వాళ్ళను అడిగి ఆ సమాచారం‌ కూడా తెచ్చి పెట్టింది. ఆ తర్వాత శివయ్య, వాళ్ళ అమ్మ ఇద్దరూ పిల్లలు ఇష్టంగా తినే రేగిపళ్ళు, జానిపళ్ళు, నేరేడు కాయలు, బలిజపళ్ళు, కలివి కాయలు, వీటితోబాటు పెద్దవాళ్లకు ఉపయోగపడే కుంకుడు కాయలు, ఉసిరి కాయలు, తేనె- ఇలా రకరకాల వస్తువులను అడవిలోంచి తెచ్చి ఊళ్ళలో అమ్మటం మొదలు పెట్టారు. ఆ సంవత్సరం వానలు సరిగా లేక, ఊరిలో కూడా పనులు ఏవీ లేక, ఊళ్ళోవాళ్ళు చాలామంది పట్నాలకు వలస పోతామని బయలుదేరారు. కానీ శివయ్య "అడవి తల్లి ఉండగా మనకు అంత అవసరం ఏమొచ్చింది?" అని ఊళ్ళో యువకులకు మరికొంతమందికి తను చేస్తున్న పనినే నేర్పాడు. తను బ్రతకటమే కాకుండా మరికొంత మందికి బ్రతుకు తెరువు కల్పించాడు.అయితే త్వరలోనే అడవిలోనే పళ్లు, కాయలు దొరకటం కష్టమై పోయింది.   ఊళ్ళో వాళ్లంతా సమావేశమయ్యారు. "అడవిని నమ్ముకుంటే బాగుంది. కానీ ఇలాంటి సమస్యలు వస్తే ఏం చెయ్యాలి? అందుకని మనం మన పొలాల్లోనే పంటలతో పాటు పూల చెట్లు, కూరగాయలు, పళ్లు పండిద్దాం. నీళ్ళ పొదుపు కోసం బిందు సేద్యం చేద్దాం. ప్రస్తుతానికి పూలు త్వరగా పూస్తాయి కాబట్టి ముందు పూలచెట్లు పెట్టుకుందాం, తరువాత మిగిలిన పంటలు చేతికి వస్తే వాటిని అమ్మి జీవనం సాగిద్దాం" అన్నాడు శివయ్య. ఇంత మంచి సలహా ఇచ్చినందుకు గ్రామస్తులంతా శివయ్యని అభినందించారు. అందరికీ లాభదాయకమైన ఈ పధకం ఫలించింది. ఆ సంవత్సరం ఊళ్ళో‌ ఎవ్వరూ‌ వలస పోలేదు! - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

కుమ్మర్రాజు కథ

కుమ్మర్రాజు కథ   అమలాపురం అనే ఊరిలో ఏడుగురు అన్నదమ్ముళ్లు ఉండేవాళ్లు. వాళ్లలో చివరి వాడు కుమ్మర్రాజు. అతను పుట్టగానే తల్లిదండ్రులు చనిపోయారు. కుమ్మర్రాజంటే ఎవ్వరికీ ఇష్టం లేదు. కానీ మొదటి వదిన ప్రేమతో, అభిమానంగా పెంచబట్టి వాడు బ్రతికాడు. కేవలం బ్రతకటమే కాదు; పెద్దయ్యేసరికి, కనీ వినీ ఎరగనంత బలమూ, చాలా మంచితనమూ కలిగాయి కుమ్మర్రాజుకు. అలా ఉండగా, ఒక సారి ఉగాది పండగ వచ్చింది. ఈసారి ఉగాదికి వారం ఉన్నదనంగా ఆరుగురు అన్నలూ కుమ్మర్రాజుని పిలిచి, "ఒరేయ్, తమ్ముడూ! ఈసారి ఉగాదికి ఏడు కుండలు కాల్చరా, అవి గట్టిగా, భద్రంగా ఉండేట్లు కాల్చు!" అన్నారు. సరేనని, కుమ్మర్రాజు ఆ రోజున 10 బండ్ల బంకమట్టిని ఒక్కడే భుజానికి ఎత్తుకొని, కుండల్ని కాల్చేందుకు రెండు తాటిచెట్లని- ఆ చంకన ఒకటి, ఈ చంకన ఒకటి- పెట్టుకొని, నడిచి వస్తుంటే ఊరంతా అబ్బురంగా చూసింది. అయినా అతనిని ఏ ఒక్కరూ పలకరించలేదు! అలా అతను ఏడు కుండల్ని కాల్చి, మొదటి వదినకిచ్చి, "నీకు కావలసినది నువ్వు తీసుకొని, ఒకటి నాకు ఉంచు; మిగిలిన వాటిని అయిదుగురు వదినలకూ ఇవ్వు" అని చెప్పి, స్నానానికి బయల్దేరాడు. అతను వచ్చేలోగా ఆరవ వదిన తనవంతు కుండని తీసుకొని పోతూ ఉంటే, ఆమె చేయిజారి, కుండకాస్తా ఎత్తునుండి క్రిందికి పడిపోయింది. అయినా అది పగిలిపోలేదు! ఇనుములాగా శబ్దం చేసి, దొర్లుకుంటూ పోయింది! దాంతో ఆమెకు చాలా ఆశ్చర్యం వేసింది- అంతేకాక కుమర్రాజు మీద విపరీతమైన ద్వేషం కలిగింది. "వీడు ఇంత మంచి కుండలు చేస్తే, ఇక మన కుండలను ఎవరు కొంటారు? వీడిని ఎలాగైనా చంపేయాలి" అనుకున్నది ఆమె. వెంటనే తన మనసులోని మాటను తన పెద్ద అక్కతో- అంటే కుమ్మర్రాజు మొదటి వదినతో- చెప్పేసింది కూడాను. తర్వాత కొంతసేపటికి కుమ్మర్రాజు వచ్చాడు. పెద్ద వదిన అతనికి అన్నం పెడుతూ, ఆపుకోలేక కంట తడి పెట్టింది. "ఎందుకు వదినా ఏడుస్తున్నావు?" అని కుమ్మర్రాజు అడిగితే, ఆమె జరిగిన విషయం చెప్పి చాలా బాధ పడ్డది. అప్పుడు కుమ్మర్రాజు "నువ్వు ఏడవద్దు వదినా!నాకు నా బట్టలు మూటకట్టి ఇవ్వు నేను ఎక్కడికైనా వెళ్ళి బ్రతుక్కుంటాను" అని, మూట చేతబట్టుకొని బయలుదేరాడు.   అలా కుమ్మర్రాజు వెళ్తూ ఉండగా ఆశ్చర్యకరమైన దృశ్యం ఒకటి అతని కంట పడింది. సీతయ్య అనే రైతు ఒకడు ఎద్దులకు ఎండ తగలకుండా తన వీపు మీద ఒక పెద్ద జివ్విమానుని కట్టుకొని పొలం దున్నుతున్నాడు! కుమ్మర్రాజు రైతు దగ్గరికి వెళ్ళి, "అన్నా, నువ్వెంత మొనగాడివన్నా! ఎద్దులకు ఎండ తగలకుండా జివ్విమానుని వీపుకు కట్టుకొని దున్నుతున్నావు!" అన్నాడు మెచ్చుకోలుగా. అప్పుడు సీతయ్య "నేనేం మొనగాడినయ్యా! పది బండ్ల బంకమట్టిని భుజాన పెట్టుకొని,రెండు తాటిచెట్లను ఆ సంకన ఒకటి,ఈ సంకన ఒకటి పెట్టుకొని వచ్చినవాడు మొనగాడు" అన్నాడు. అప్పుడు కుమ్మర్రాజు "ఆ పని చేసింది నేనే!" అని చెప్పగానే, సీతయ్య సంతోషంతో ఉక్కిరిబిక్కిరై, కుమ్మర్రాజును ఎంతో గౌరవించి, "ఎక్కడికన్నా, ఇప్పుడు బయల్దేరావు?" అని అడిగాడు. "నేను ప్రపంచాన్ని చూసేందుకు వెళుతున్నాను"అన్నాడు కుమ్మర్రాజు. "నేను కూడా వస్తానన్నా, నీతోపాటూ!" అని సీతయ్యకూడా కొమ్మర్రాజుతోపాటు బయలుదేరాడు.   దారిలో ఇంకొక వింతమనిషి కనబడ్డాడు వాళ్లకు- నీళ్లల్లో ఉన్న చేపల్ని పట్టుకునేందుకు బాణాలు వేస్తున్నాడతను. సీతయ్య,కుమ్మర్రాజు ఇద్దరూ అక్కడ నిలబడి చూశారు. అతను నిజంగానే చేపల్ని బాణాలతో కొడుతున్నాడు! అప్పుడు కుమ్మర్రాజు అతని దగ్గరకు వెళ్ళి "నువ్వెంత మొనగాడివన్నా! నీళ్లల్లో ఉండే చేపను బాణంతో కొట్టేశావు!" అని మెచ్చుకున్నాడు. అప్పుడు ఆ రామయ్య "పోవయ్యా, పో! నేనెక్కడి మొనగాడిని?! పది బండ్ల బంకమట్టిని భుజాన పెట్టుకొని, రెండు తాటిచెట్లను ఆ చంకన ఒకటి, ఈ చంకన ఒకటి పెట్టుకొని వచ్చినవాడు కదా, మొనగాడు!" అన్నాడు. అప్పుడు సీతయ్య ముందుకొచ్చి, రామయ్యతో "ఇదిగో! ఇక్కడ కనిపిస్తున్నాడే, ఇతనే, ఆ మొనగాడు! మేము ప్రపంచాన్ని చూసి రావడానికి వెళ్తున్నాం" అని చెప్పగానే రామయ్య సిగ్గుపడి, "అన్నా! నేనూ వస్తా, మీతోపాటూ" అని వాళ్లకి తోడుగా ఇతనూ బయలుదేరాడు. అలా వాళ్లు ముగ్గురూ నడిచి నడిచి 'అలంపురం' రాజ్యం చేరుకున్నారు. అక్కడి యువరాణి అందాల భరిణ. "వీపు మీద జివ్విమానుని కట్టుకొని, ఎద్దులకు ఎండ తగలకుండా దున్నిన వాడికే తన కూతుర్ని ఇచ్చి పెళ్ళి చేస్తాను" అని ఏనాడో దండోరా వేయించి ఉన్నారు రాజుగారు. కానీ రాజ్యంలో ఎవ్వరూ ఆ పని చేయలేకపోయారు! రాకుమారికి ఇంకా తగిన వరుడే దొరకలేదు! అప్పుడు కుమ్మర్రాజు సీతయ్యను ఒప్పించి, ఆ పోటీకి పంపించాడు. సీతయ్య నెగ్గకుండా ఎలా ఉంటాడు? అతనికి రాజు కూతురిని ఇచ్చి ఘనంగా పెళ్ళి జరిపించాడు. కొన్నాళ్ళకు కుమ్మర్రాజు వెళ్తానన్నాడు. "మీకేమయినా అయితే మాకెలా తెలిసేది?" అని సీతయ్య అడిగితే అతను ఒక మల్లెచెట్టు నాటి "ఇది వాడిపోయి ఏ పక్కకు వంగితే ఆ వైపున నాకు ప్రమాదం ఉన్నదని గుర్తించు"అని చెప్తాడు. ఇక రామయ్య, కుమ్మర్రాజు బయల్దేరి పోతూ పోతూ 'భీమాపురం' రాజ్యాన్ని చేరుకున్నారు. అక్కడి రాకుమారి కృష్ణచేణికి స్వయంవరం ఏర్పాటు చేశారు. "నీళ్లలోని చేపల్ని బాణాలు వేసి పట్టగలవాళ్ళనే ఆమె పెళ్ళి చేసుకుంటుంది". ఇది విని, కుమ్మర్రాజు రామయ్యను ఒప్పించి స్వయంవరానికి తీసుకెళ్ళాడు. నెగ్గిన రామయ్య, కృష్ణవేణిని పెళ్ళి చేసుకున్నాడు. ఇంకా కొన్ని రోజుల తర్వాత కుమ్మర్రాజు వెళ్లివస్తానని బయల్దేరాడు. "మీకేమయినా ప్రమాదం జరగవచ్చు, నేనూ వస్తాను" అన్నాడు రామయ్య. "వద్దు. నేను ఓ మల్లె మొక్కను నాటి వెళ్తాను, అది వాడిపోయి ఏ దిశకు వంగితే అటువైపున 'నేను ప్రమాదంలో ఇరుక్కున్నాను' అని అర్థం చేసుకోండి" అని బయల్దేరాడు కుమ్మర్రాజు. అలా బయల్దేరిన కుమ్మర్రాజు చివరికి 'నిమ్మాపురం' రాజ్యం చేరుకున్నాడు. నిమ్మాపురంలో ఎవరింట్లో చూసినా ఉప్పునీళ్లే ఉన్నాయి! కుమ్మర్రాజు ఒక పేదరాశి పెద్దమ్మ ఇంటికి పోయి "ఎందుకవ్వా, నీళ్ళు ఇంత ఉప్పగా ఉన్నాయి? ఈ ఊళ్ళో మంచినీళ్ళు లేవా?"అని అడిగాడు. అప్పుడా అవ్వ "లేకేం నాయనా, ఉండేందుకు ఒక మంచినీళ్ళ బావి ఉంది. కానీ అక్కడ ఒక పెద్దపులి ఉంది. అక్కడికి వెళ్ళిన వాళ్లందరినీ అది తినేస్తోంది. ఆ పులిని చంపినవాళ్ళను రాకుమారి నిర్మల పెళ్లాడుతుంది. కానీ ఇంత వరకూ అక్కడికి పోయి తిరిగి వచ్చిన వాళ్లు లేరు" అని చెప్పింది, బాధ పడుతూ. వెంటనే కుమ్మర్రాజు "అవ్వా నాకు ఒక బిందె ఇవ్వు, నేను వెళ్తాను పులి దగ్గరికి" అన్నాడు. "వద్దు బాబూ, ఏ తల్లి కన్నబిడ్డవో! నీ నిర్ణయం మార్చుకో" అని వారించింది అవ్వ. అయినా తగ్గని కుమ్మర్రాజు బిందె చేతబట్టుకొని మంచినీళ్ళ బావికి చేరుకున్నాడు. ఇంతలో ఆ పులి "నరవాసన!నరవాసన!"అంటూ పరిగెత్తుకొచ్చి, "నేను నిన్ను తినేస్తా! నాకు చాలా ఆకలిగా ఉంది" అని గర్జించింది. అప్పుడు కుమ్మర్రాజు ధైర్యంగా- "చంపే ముందు ఒక పోటీ పెట్టుకుందాం, అందులో ఓడితే నన్ను తినేసేయచ్చు. ముందుగా మనం ఒకరినొకరం మూడు గుద్దులు గుద్దాలి" అన్నాడు. అందుకు ఒప్పుకున్న పులి ముందుగా కుమ్మర్రాజుని మూడుసార్లు గుద్దింది. అయినా కుమ్మర్రాజుకి ఏమీ కాలేదు. ఆ తరువాత కుమ్మర్రాజు పులిని గుద్దాడు. అతని మొదటి గుద్దుకే పులి ప్రాణం సగం పోయింది. ఇక రెండవ గుద్దుకు అది చచ్చేపోయింది! పులి కొనగోర్లు, కొనతోక, కొననాలుక కోసుకొని, బిందెనిండా నీళ్లు నింపుకొని తిరిగివచ్చాడు కుమ్మర్రాజు. అతన్ని ప్రాణాలతో చూసిన పూటకూళ్ల అవ్వ చాలా సంతోషపడ్డది. తాను పులిని చంపిన విషయం ఆమెకు చెప్పనేలేదు కుమ్మర్రాజు. అయినా ఆ సంగతి ఊరంతా తెలిసిపోయింది. ఒక్కరొక్కరే వచ్చి 'పులిని చంపిన యోధుడ్ని' చూసిపోవటం మొదలు పెట్టారు. సంగతి తెలిసిన రాకుమారి నిర్మల కుమ్మర్రాజును వరించింది. అలా రాజైన కుమ్మర్రాజు ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకుంటూ పరిపాలించాడు. కొన్నాళ్లకు అతనికి తన అన్నలు వదినలు గుర్తుకు వచ్చారు. నిర్మలనుకూడా వెంటబెట్టుకొని, సామాన్యుడిలాగా కాలినడకన బయలుదేరాడతను. తోడుగా ఆ రాజ్యపు సేనాపతి వస్తానన్నాడు. కానీ మోసగాడైన ఆ సేనాపతి, వీలు చూసుకొని కుమ్మర్రాజుని లోతైన ఒక బావిలో పడేసి, నిర్మలను ఎత్తుకెళ్లిపోయి, వాళ్ల రాజ్యాన్ని తనే కైవశం చేసుకున్నాడు. అయితే అదే సమయానికి సీతయ్య,రామయ్యల దగ్గరున్న మల్లె చెట్లు వాడబట్టాయి. వెంటనే వాళ్ళిద్దరూ సైన్యాలను వెంటబెట్టుకొని నిమ్మాపురం చేరుకున్నారు. అంతపెద్ద సైన్యాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక సేనాపతి పలాయనం చిత్తగించాడు. రామయ్య సీతయ్యలు రాజ్యం అంతా గాలించి, బావిలో పడ్డ కుమ్మర్రాజును వెలికి తీశారు. వాళ్ళే కుమ్మర్రాజు అన్నల్నీ, వదినల్నీ నిమ్మాపురం పిలిపించారు కూడానూ. ఆ విధంగా మిత్రులిద్దరి సహాయం వల్ల తేరుకున్న కుమ్మర్రాజు మళ్ళీ రాజై, అనేక సంవత్సరాలు చక్కగా రాజ్యాన్ని పాలించాడు. Courtesy.. kottapalli.in

రంగుల సీతాకోక చిలుక

రంగుల సీతాకోక చిలుక అనగనగా ఓ చిట్టి సీతాకోక చిలుక ఉండేది. ఆ రోజుల్లో సీతాకోక చిలుకలకు రంగులుండేవి కాదు. అందుకనో, ఏమో, మరి దానికి చాలా ప్రశ్నలు ఉండేవి. అప్పట్లో ఎప్పుడో ఓసారి తను గూట్లో పడుకొని నిద్రపోయింది కదా, ఆ తర్వాత ఇట్లా రెక్కలతో నిద్రలేచింది. నిద్రలేచేసరికి చూస్తే చుట్టూతా ఎవ్వరూ లేరు. అయినా దానికి ఏమీ భయం వెయ్యలేదు! అది అట్లానే ఎగురుకుంటూ‌ పోయి, తనలాగే రంగుల్లేని ఓ పెద్ద సీతాకోక చిలుకని కలుసుకున్నది.   "నువ్వేనా, మా అమ్మవి?" అని అడిగింది దాన్ని. అది నవ్వింది. "నేను అప్పట్లో ఎప్పుడో గుడ్లు పెట్టాను. ఆ గుడ్లలోంచి చిన్నచిన్న పురుగులు వచ్చాయి. చిన్న పురుగులు బాగా ఆకులు అలములు తిని, పెద్దయ్యాయి. నేను చూస్తూండగానే అవన్నీ గూడు కట్టుకొని నిద్రపోయాయి. నాకు అంతవరకే తెలుసు" అన్నది. "అయితే నువ్వేలే, మా అమ్మవి! నేను ఆ గూట్లోంచి ఇవాళ్ళే బయటికి వచ్చాను" అన్నది చిట్టి సీతాకోక చిలుక. "ఓహో! అవునా! బాగుంది బాగుంది. సరే, మరి నీకు ఇప్పుడు ఆకలి వేస్తోందా? పూలమీద వాలి, నీ తొండంతో మకరందాన్ని త్రాగు! కడుపు నిండుతుంది" చూపించింది అమ్మ, ఓ పువ్వు మీద వాలుతూ. కడుపునిండా మకరందం త్రాగాక సీతాకోక చిలుకకు హాయిగా అనిపించింది. కొంచెం కొంచెంగా నిద్ర కూడా వచ్చింది. "వాతావరణం మారిపోయింది. వాన వస్తుందేమో! ఈ ఆకుల పొద క్రింది వైపున- ఇదిగో- పొడిగా ఉంది చూసావా? ఇక్కడ పడుకో, జాగ్రత్తగా. వానలో తడవకు! ప్రమాదం" జాగ్రత్తలు చెప్పింది పెద్ద సీతాకోక చిలుక. కొద్ది సేపటికి ఉరుములు, మెరుపులతోటి పెద్దవాన మొదలైంది. చిట్టి సీతాకోక చిలుక కదలకుండా అక్కడే కూర్చుని, వాన ముగిసే వరకూ చూసింది. పెద్ద సీతాకోక చిలుక దాని ప్రక్కనే వాలి, కలగంటున్నట్లు మాట్లాడింది: "చాలా పైకి వెళ్తే స్వర్గం అనే చోటు ఉంటుందట. స్వర్గానికి రాజు ఇంద్రుదు. ఆ రాజుకి మెరుపుల వర్షం అంటే చాలా ఇష్టమట. అట్లా వర్షం వచ్చినప్పుడు ఆయన తన ధనస్సును ఈ భూమి మీదికి వదులుతాడు. నేను కూడా చూసాను- దానికి బలే రంగులు ఉంటాయి!" చెప్పింది. "ఆ రంగులన్నీ‌ మనకి ఉంటే?.. ఎంత బాగుంటుందో!" అనుకున్నది చిట్టి సీతాకోక చిలుక. కానీ ఆ మాటని అది పైకి అనలేదు. అంతలో వాన వెలిసింది. సన్నగా తుంపర మాత్రం పడుతున్నది. అంతలో ఆకాశం నిండా ఇంద్రధనస్సు విరిసింది. పిల్ల సీతాకోక చిలుక ఇంక ఆగలేక పోయింది. చటుక్కున ఎగిరింది. పెద్ద సీతాకోకచిలుక వారిస్తున్నా వినకుండా ఎత్తుకు, ఇంకా ఎత్తుకు-చివరికి ఇంద్రధనస్సును చేరుకునేంత వరకూ- ఎగురుతూ పోయింది. ఇంద్రధనస్సును తడుముతూ, మురిసిపోతూ "ఇంద్ర-ధనస్సూ! ఇంద్రధనస్సూ! నువ్వింత అందమైనదానివని అనుకోలేదు. నాకు నీ రంగులు కొద్దిగా ఇవ్వరాదా? ప్లీజ్!" అని ప్రాథేయపడింది. ఇంద్రధనస్సుకి దాని ప్రేమ, అమాయకత్వం చూసి బలే ముద్దొచ్చింది. "సరేలే! నామీద వాలి, బాగా పొర్లు. ఎన్ని రంగులు కావాలో అన్నీ తీసుకో!" అనేసింది. ఇంకేముంది, సీతాకోకచిలుక ఇంద్రధనస్సు మీద పొర్లింది; రంగులు రంగులుగా మారిపోయింది! ఆ వెంటనే వానజల్లుతో చుక్కల డిజైన్ కూడా వేయించుకున్నది! ఇక ఆనాటి నుండీ ప్రపంచంలో సీతాకోక చిలుకలన్నిటికీ రంగులు వచ్చేసాయి! - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో