మార్గం చూపిన మొసలి

  మార్గం చూపిన మొసలి     మించలవారికోట గ్రామానికి చివరలో ఒక చెరువు ఉండేది. చెరువు గట్టున గణేష్ వాళ్ళు రోజూ ఆడుకుంటూ ఉండేవాళ్ళు. ఒకరోజున వాడు బంతినొకదాన్ని తీసుకొని వెళ్ళాడు అక్కడికి. ఆ సమయానికి మిగిలిన పిల్లలెవ్వరూ రాలేదు ఇంకా. వాడొక్కడే అలా బంతితో ఆడుతుంటే, అది కాస్తా వెళ్ళి చెరువులో ఎక్కడో పడిపోయింది. గణేశ్ కు ఈత వచ్చు కదా, అందుకని బంతిని వెతుక్కుంటూ చెరువులోకి దిగాడు. అంతలో వాడికి దగ్గర్లో ఏదో కదులుతున్న అలికిడి వినబడింది. ఏంటా అని చూస్తే అది ఒక మొసలి! వలలో చిక్కుకుని గిలగిల కొట్టుకుంటోంది, ఆగి ఆగి. గణేశ్‌ పారిపోదామనుకున్నాడు. కానీ 'అది వలలో‌ చిక్కుకొని ఉన్నది కదా, భయపడేదేముందిలే' అని, దానికి దగ్గరగా వెళ్ళాడు, బురదలో నడుస్తూ. గణేశ్‌ను చూడగానే మొసలి బాధతోటీ సంతోషంతోటీ కన్నీళ్ళు కార్చింది. 'కాపాడు కాపాడు' అని మొరపెట్టుకున్నది. 'నన్ను రక్షించు, ప్లీజ్' అని వేడుకున్నది. గణేశ్‌కి కొంచెం భయం వేసింది. అయినా 'అది అంతగా వేడుకుంటున్నది గదా' అని జాలికూడా వేసింది. 'నువ్వు కౄరమృగానివి కదా! నిన్ను వలలోంచి విడిపించగానే నన్ను పట్టుకొని తినేస్తావేమో?' అన్నాడు. 'అయ్యో, నా సంగతి నీకు తెలీదు. నా కన్నీళ్లను చూడు- అబద్ధాలు చెప్పే స్థితిలో ఉన్నానా? మేలు చేసిన వారికి కీడు చేస్తానా?' అని నమ్మ బలికింది మొసలి. గణేశ్‌కి ఏం చెయ్యాలో తోచలేదు. 'పాపం, మంచి మొసలి' అనుకున్నాడు. దగ్గర్లో ఉన్న రాళ్ళు రెండింటిని తెచ్చి, ఆ రాళ్ళ మధ్యలో వల త్రాళ్ళను పెడుతూ వాటిని ఒక్కటొక్కటిగా తెగకొట్టాడు. అలా వాడు సగం వలను కోశాడో, లేదో- మొసలి తల బయటికి వచ్చింది. మరుక్షణంలో అది కాస్తా నోరు తెరచి వాడి కాలును పట్టేసుకున్నది! 'మాట తప్పుతావా? మోసం చేస్తావా? నేను నిన్ను విడిపిస్తున్నానే, నీకు అంత సాయం చేస్తున్నవాడిని మోసగించాల్సినంత అవసరం ఏమొచ్చింది?' అన్నాడు గణేష్, పెనుగులాడుతూ. 'ప్రపంచమే అంత! నా సహజగుణాన్ని నేనెలా వదులుతాననుకున్నావు?' అంది మొసలి- ప్రశాంతంగా, మరింతగా పట్టు బిగిస్తూ. 'పొరపాటు చేశానే' అని గణేష్ చాలా బాధపడ్డాడు. ఎవరైనా సాయం వస్తారేమో అని చూస్తే ఆ దారిన ఎవ్వరూ రావడంలేదు. మిగతా స్నేహితులంతా ఎప్పుడు వస్తారో తెలీలేదు. వచ్చినా వాళ్ళు మొసలిని ఎదిరించి ఏమి చేయగలరు? 'వల వేసిన పెద్దమనిషి ఎవరో వస్తే బాగుండు' అనుకున్నాడు. మొసలి చేసిన మోసాన్ని భరించలేక-పోతున్నాడు. అంతలో చెట్టుమీద ఉన్న పక్షులు కిలకిలలాడాయి. గణేశ్ వాటికి తనగోడు వెళ్ళబోసుకున్నాడు. వాడి బాధని చూసి పక్షులూ జాలి పడ్డాయి. 'మేం ఈ మారుమూలన గూళ్ళు కట్టుకుని గుడ్లు పెడుతున్నాం, ఇక్కడకూడా మమ్మల్ని వదలట్లేదు పాడు పాము. వచ్చి మా కళ్ళముందే మా గుడ్లన్నిటినీ తింటోంది. ఈ ప్రపంచం తీరే అంత. ఎక్కడ చూసినా దుర్మార్గులే ఉన్నారు. ఆ దుర్మార్గులు మారరు- వాళ్ళ స్వభావమే అంత' అన్నాయవి. అటుగా పరుగెడుతున్న కుందేలొకటి వీళ్ళ మాటలు విని ఆగింది. గణేశ్ దానికీ చెప్పుకున్నాడు తన బాధను. అంతావిన్నాక కుందేలు 'చాలా అన్యాయం' అంది. మొసలితో వాదనకు దిగింది. దాన్ని మాటల్లో‌ పెట్టి నోరు తెరిచేలా చేస్తే గణేశ్ బయటపడతాడు అనుకున్నది. మొసలి ఒకవైపున గణేశ్ కాలును పట్టుకొని, పళ్ళ సందుల్లోంచే కుందేలుతో మాట్లాడటం మొదలుపెట్టింది. "నీ మాటలు నాకు అస్సలు అర్థంకావటం లేదు. కొంచెం వీడి కాలును వదిలి మాట్లాడు" అంది కుందేలు. 'వాడిని విడిపించుదామని తెలివిగా అలా అంటున్నావా, నీ సంగతి నాకు తెలుసులే' అంది మొసలి. 'అయినా వీడు ఎక్కడ తప్పించుకుంటాడు? ఒంటికాలితో ఒక్క కుంటు కుంటేసరికి నీ తోకతో నువ్వు వాడిని పది దెబ్బలు కొడతావు- నీదేముంది? ఎలాగైనా వీడు నీ‌ పంట చిక్కిన ఆహారమే!' నవ్విందికుందేలు, మొసలిని ఉబ్బిస్తూ. ఆ మాటలకు కొంచెం బోల్తాపడింది మొసలి. కాలును వదులు చేసింది; కానీ పూర్తిగా వదల్లేదు.     అంతలో పైనున్న పక్షుల గుంపు మొత్తం వచ్చిపడింది మొసలి మీద. కొన్ని దాని కళ్ళను పొడిచాయి. వీపును రక్కాయి కొన్ని. మరికొన్నేమో దాని కాళ్ళను గీకాయి. మొసలి అటూ ఇటూ‌ పొర్లింది. దాని క్రింద పడి కొన్ని పిట్టలు పాపం‌ నలిగిపోయాయి కూడా. అయినా పక్షులు దాన్ని వదలలేదు. దాడిని కొనసాగించాయి. ఆ హడావిడిలో మొసలి నోరు విడివడింది. గణేశ్ ఒక్క గెంతులో‌ చెరువు గట్టెక్కి కూర్చున్నాడు. మరు నిముషంలో పిట్టలన్నీ‌ మొసలిని వదిలేసి చెట్టుమీదికి ఎగిరిపోయాయి. 'ఈ దుర్మార్గుల స్వభావమే అంత. మంచిగా చెబితే వినరు వీళ్ళు' అన్నది కుందేలు చెరువు గట్టున కూర్చొని వగరుస్తూ. 'చాలా చాలా థాంక్స్, పిట్టలూ, నాకోసం మీరు అంత శ్రమపడ్డారు!' అన్నాడు గణేశ్, మనసారా పిట్టల్ని మెచ్చుకుంటూ. 'అందరూ చెయ్యి కలిపితే చెయ్యలేనిదంటూ ఏమీ లేదు. ఈసారి రానియ్యి, పాముని! మేం ఏం చేస్తామో చూద్దువు!' అన్నదొక పిట్ట, చెట్టు మీది నుంచి. 'అవునవును. దుర్మార్గుల స్వభావాల గురించి మాట్లాడుకుంటూ ఇన్నాళ్ళూ‌ మేం మా బలాన్ని మర్చిపోయాం. ఇంత పెద్ద మొసలినే పారద్రోలిన మేము ఇక మీద ఆ చెత్త పాముకి భయపడేదేముంది?' అన్నాయి పిట్టలన్నీ, గట్టిగా, గొడవ గొడవగా అరుస్తూ. Courtesy.. kottapalli.in  

నలుగురు మిత్రుల కథ

  నలుగురు మిత్రుల కథ     అనగా అనగా ఒక ఊళ్లో ఒక మిరపకాయ, ఐస్‌క్రీమ్‌, ఉల్లిగడ్డ, టమోటా చాలా స్నేహంగా ఉండేవి. ఒకసారి అవన్నీ కలిసి షికారుకు వెళ్దామని బయలుదేరాయి. అవన్నీ పోతూ ఉంటే ఒక పెద్ద సముద్రం అడ్డు వచ్చింది. నాలుగూ ఆ సముద్రంలోకి దూకి, ఈది, అవతలి ఒడ్డుకు చేరుకున్నాయి. చూస్తే ఏముంది? ఐస్‌క్రీమ్‌ లేదు! అది సముద్రంలో కలిసిపోయింది!!   "అయ్యో! మన మంచి స్నేహితుడు ఐస్‌క్రీమ్‌ చనిపోయాడే" అని మిగిలిన మూడూ చాలా బాధ పడ్డాయి. బాధ పడుతూనే అవి మూడూ మార్కెట్టు దగ్గరికి పోయాయి. అక్కడ ఒకడు నిలబడి మిరపకాయలతో బజ్జీలు వేస్తున్నాడు. అకస్మాత్తుగా అతను చేయెత్తి, మన మిరపకాయను తీసుకొని, పిండిలో ముంచి, నూనెలో వేసేశాడు!     "అయ్యో! మన మంచి స్నేహితుడు మిరపకాయ చనిపోయాడే!" అని మిగిలిన రెండూ బాధ పడ్డాయి. "ఇంకేం చేద్దాం?" అనుకొని, అవి రెండూ సినిమా చూసేందుకని వెళ్లాయి. టమోటా ఒక సీట్లోను, ఉల్లి గడ్డ ఒక సీట్లోను కూర్చున్నాయి. అంతలో లావుపాటాయన ఒకాయన వచ్చి టమోటా మీదే కూర్చున్నాడు!     "అయ్యో! నాకున్న ఒక్కగానొక్క స్నేహితుడు టమోటా కూడా చచ్చిపోయాడే!" అని చాలా ఏడిచింది ఉల్లిగడ్డ. "వీళ్ళు చనిపోతే నేనున్నాను గదా, ఏడ్చేందుకు? మరి నేను చనిపోతే ఎవరు ఏడుస్తారు?" అని దానికి ఇంకా ఏడుపు వచ్చింది.   అది అట్లా ఆపకుండా ఏడుస్తుంటే దేవుడికి దానిమీద జాలి వేసింది. "నువ్వేమీ బాధ పడకు! నిన్ను కోసి చంపేవాళ్ళే ఏడుస్తారులే, నీకేమీ లోటుండదు" అన్నాడు దేవుడు, దాన్ని ఓదారుస్తూ. అప్పటినుండీ ఉల్లిగడ్డను ఎవరు కోస్తున్నా, ఆ సమయంలో తప్పకుండా ఏడుస్తున్నారు. Courtesy.. kottapalli.in

హరికథ చేసిన మేలు

  హరికథ చేసిన మేలు   ఒక ఊరిలో రామయ్య అనే గొర్రెల కాపరి ఉండేవాడు. ఒకసారి వాళ్ళఊరి గుడిలో హరికథ చెబుతున్నారు. ఆ సంగతి తెలుసుకొన్న రామయ్య, ఆ రాత్రికి గొర్రెల మందలోకి పనివాణ్ణి పంపి, తను హరికథ వినడానికి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు అతని భార్య అతనికి కొన్ని పప్పులు(పుట్నాలు) ఇచ్చి పంపింది. అయితే గొర్రెల్లో ఉండీ ఉండీ నోరాగకుండా తినటం అలవాటైంది రామయ్యకు. భార్య ఇచ్చిన పప్పులు కాసిన్నీ హరికథ చెప్పేచోటికి వెళ్ళేలోపే తినేసాడు అతను. తీరా గుడిని చేరుకొని చూస్తే, హరి కథ చెప్పే దాసుగారు ఇంకా రాలేదు. నోరాగని రామయ్య ఇక ఆగలేకపోయాడు. పప్పులకోసం తిరిగి ఇంటికి వెళ్లాడు. భార్య ఇంట్లో ఉన్న పప్పులన్నింటినీ బట్టలో కట్టి ఇచ్చింది రామయ్యకు. ఇక అతను సంతోషంగా వాటిని తినుకుంటూ హరికథకు వెళ్ళాడు. హరికథ మొదలయింది.   దాసుగారు "ఆఁ, అందరూ వచ్చారా? ఆఁ, అందరూ కూర్చోండి! సరే!! అయితే ఇక మొదలు పెడదామా?" అని అంటూండే లోపే, కడుపునిండా తిన్న రామయ్య నిద్రలోకి జారుకున్నాడు. హరికథంతా అయిపోయేసరికి అర్థ రాత్రయింది. అందరూ ఇళ్లకు వెళ్తుండగా మేలుకున్న రామయ్య, " ఆఁ, అందరూ వెళుతున్నారా?" అని హరికథ చెప్పే దాసుగారు అనటం మాత్రం విన్నాడు. ఇక తనూ లేచి, అందరితోపాటూ తీరికగా ఇంటికి చేరుకున్నాడు.   అప్పటికి సమయం ఒంటిగంటయ్యింది. సరిగ్గా అదే సమయానికి కొందరు దొంగలు రామయ్య ఇంటికి దొంగతనానికని వచ్చి ఉన్నారు. ఇంటికెళ్ళిన రామయ్యను, హరి కథలో ఏమి చెప్పారని అడిగింది భార్య. అడగ్గానే, " ఆఁ, అందరూ వచ్చారా?" అనిగట్టిగా అన్నాడు రామయ్య. అది విన్న పెరట్లోని దొంగలు తామొచ్చింది ఇంటిలోనివారికి తెలిసిపోయిందనుకొని, పొదలమాటున నక్కి కూర్చున్నారు. ఈ సారి రామయ్య, " ఆఁ! అందరూ కూర్చున్నారా?" అన్నాడు. తామొచ్చింది ఇంట్లోని వారికి ఖచ్చితంగా తెలిసిపోయిందనుకున్నారు బయటున్న దొంగలు!. ఈసారి రామయ్య "సరే! అయితే మొదలుపెడదామా! " అన్నాడు. తమను పట్టుకోవడానికి ఇంట్లోని వారందరూ వస్తున్నట్టున్నారని దొంగలంతా పారిపోతుండగా, "ఆఁ! అందరూ వెళ్ళిపోతున్నారా?" అన్నాడు రామయ్య, దాసుగారు అన్నట్లుగా. దాంతో దొంగలు హడావిడిగా కాలికి బుద్ధి చెప్పారు. హరికథను వినకుండానే రామయ్యకు అంతమేలు జరిగింది, విని ఉంటే ఏమయ్యేదో కదా!? Courtesy.. kottapalli.in    

ముగ్గురు స్నేహితులు

  ముగ్గురు స్నేహితులు     రాము వెంకటేష్‌లు మంచి మిత్రులు. ఊళ్ళో అందరికీ వీళ్ళని చూస్తే ముచ్చటగా ఉండేది- ఒక్క గోపీకి తప్ప. గోపీకి వీళ్ళిద్దరినీ చూస్తే అసూయ. వీళ్లను విడదీయాలని పట్టుదలగా ఉండేవాడు. ఒకసారి సెలవుల్లో రాము వెంకటేష్ ఇద్దరూ తిరుపతి వెళ్ళి వద్దామనుకున్నారు. వెంకటేష్ వాళ్ల అమ్మను అడిగితే 200 రూపాయలు మాత్రం సమకూరాయి. "అవి ప్రయాణానికి మాత్రం సరిపోతాయిరా, మిగతా ఖర్చులకు చాలవు. మరెలాగ?" అన్నాడు వాడు రాముతో. "నా దగ్గర కొంచెం ఎక్కువ డబ్బులున్నాయిలేరా, మనిద్దరి ఖర్చులకూ సరిపోతాయి- పరవాలేదు వెళ్దాం" అన్నాడు రాము. ఎట్లాగైతేనేం ఇద్దరూ తిరుపతి వెళ్ళటానికి సిద్ధం అయ్యారు. ఈ సంగతి తెలిసింది గోపికి. "ఇదే అవకాశం, వీళ్లిద్దరినీ విడదీసేందుకు" అనుకున్న గోపి వాళ్ల దగ్గరికి వచ్చి "నేను కూడా‌ వస్తానురా, మీతో" అని అడిగాడు. గోపీకి తామంటే నిజంగా ఇష్టం లేదని తెలుసు రాము, వెంకటేష్ లకు. వాడు తమ స్నేహాన్ని చెడగొట్టాలని ప్రయత్నిస్తున్నాడనీ తెలుసు. "అయినా వెంట వస్తానన్నవాడిని వద్దనేది ఎందుకు?" అనుకొని "సరేలేరా, నువ్వూ రా, వెళ్దాం" అన్నారు. తిరుపతికి వెళ్ళే రైలు నాలుగు గంటలు ఆలస్యంగా ఉంది. "మనం బస్సులో వెళ్ళిపోదాంరా, రామూ. వెంకటేష్ ఒక్కడినీ రైల్లో రానివ్వు" మొదలుపెట్టాడు గోపి. వెంకటేష్, రాము ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నారు. "వద్దులే, అందరం కలిసి రైల్లోనే వెళ్దాం. రైల్లో అయితే టిక్కెట్టు ఖర్చు తక్కువ" గట్టిగా జవాబిచ్చాడు రాము.     ముగ్గురూ మెల్లగా తిరుపతి చేరారు. కొండమీదికి వెళ్ళే బస్సు ఎప్పుడుందో కనుక్కునేందుకు వెళ్ళాడు రాము. గోపికేమో వీళ్లను కాలినడకన కొండ ఎక్కించాలని ఉంది. "అన్ని మెట్లు ఎక్కి వెళ్లేసరికి ఇద్దరూ అలిసిపోయి చికాకుగా ఉంటారు. అప్పుడు వీళ్లమధ్య గొడవలు సృష్టించటం సులభం" అనుకున్నాడు. పైకి వాడు వెంకటేష్‌తో అన్నాడు "చూడురా, రాము దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నట్లున్నాయి. బస్సు ఎక్కి వస్తాడు. అది కూడా ఎప్పుడుందో‌ ఏమో. మనం కాలినడకన చిన్నగా పోతూందాం పద" అని. "వద్దులే, కొంచెం‌ ఆగు. వాడిని రానివ్వు" అని ఎంత చెప్పినా వినలేదు వాడు. "సరే, కానివ్వు" అని వెంకటేష్ గోపీతో కలిసి మెట్లు ఎక్కటం మొదలు పెట్టాడు. రామూ వెనక్కి వచ్చి చూసుకునే సరికి అక్కడ గోపీ, వెంకటేష్ ఇద్దరూ లేరు! "ఓహో వీడు వెంకటేష్‌ని మెట్లు ఎక్కిస్తున్నాడన్నమాట" అనుకొని రాము కూడా‌మెట్లదారిన వెనకగా నడవటం మొదలు పెట్టాడు. కొన్ని మెట్లు ఎక్కారో లేదో, వెంకటేష్‌కు కాళ్ళ నొప్పులు మొదలయ్యాయి. అయినా వాడు "నేనెందుకు ఎక్కలేను? ఎక్కి చూపిస్తాను" అనుకొని తన కాళ్ళు నొప్పులు మరిచి పోయి ఎక్కటం మొదలు పెట్టాడు. అయితే ఇంకొన్ని మెట్లు ఎక్కేసరికి గోపికే కాళ్ళనొప్పులు పుట్టినై. వాడు అక్కడే నిలబడి పోయి, "ఒరే, నాకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయిరా, బస్సులో వెళ్దాం లేరా" అనటం మొదలు పెట్టాడు. "కుదరదురా, ఎట్లాగైనా సరే, మెట్లు ఎక్కాల్సిందే" అని బలవంతం చేశాడు వెంకటేష్. అంతలోనే వెనకనుండి వచ్చి చేరిన రాము కూడా‌ "అవునవును. ఎక్కాల్సిందే" అని పట్టుపట్టి గోపీని నడిపించాడు. "ఇద్దరినీ విడగొడదాం" అని ఆశపడ్డ గోపీకి అదనంగా కాళ్లనొప్పులు వచ్చి పడ్డాయి! కొండ ఎక్కాక, వెంకటేష్, రాము ఇద్దరూ స్నానానికి వెళ్ళిన సమయం చూసుకొని వాళ్ల బట్టల సంచీలో వెతికాడు గోపీ. తన చేతికందిన రెండు వందల రూపాయల్నీ తీసుకొని పారిపోయాడు! అయితే వీళ్ళిద్దరూ ముందుగానే వాళ్ల దగ్గరున్న మిగతా డబ్బుల్ని వెంట తీసుకెళ్ళారు కాబట్టి సరిపోయింది. "డబ్బులు ఊరికే దొంగ పాలయ్యాయి" అని బాధ పడుతున్న వెంకటేష్‌ని ఓదార్చాడు రాము. "మనల్ని విడగొట్టలేక వాడు ఇట్లా దొంగపని చేసి పారిపొయ్యాడు- అదీ మన మంచికేలే, ఏం పరవాలేదు" అని నచ్చజెప్పాడు. ఇద్దరూ దైవదర్శనం చేసుకొని, రెండు రోజుల పాటు తిరుపతి చుట్టుప్రక్కల ప్రదేశాలన్నీ చూసి ఇంటికి తిరిగి వస్తూ ఉంటే, దారిలో ఏడుస్తూ కనబడ్డాడు గోపీ. ఇద్దరూ తమ కోపాన్ని మర్చిపోయి గోపీ దగ్గరకు వెళ్ళి "ఏమైందిరా, ఏం జరిగింది? మా డబ్బుల్ని ఎత్తుకొని పోయావుగా, ఇప్పుడేమైంది?" అని అడిగారు. గోపీ భోరుమని ఏడ్చాడు- "నాకు తగిన శాస్తి జరిగిందిరా! మీ డబ్బులు ఎత్తుకెళ్ళి నేను అక్కడొక గాజు సామాన్ల దుకాణం ఎదుట నిలబడ్డాను. ఊరికే అక్కడున్న వస్తువుల్ని సవరిస్తూ ఉండగా ఒక వస్తువేదో జారి క్రిందపడి పగిలి పోయింది. అంతే, ఆ దుకాణం వాడు నామీద పడి, కొట్టి, నా దగ్గరున్న డబ్బులు మొత్తం లాక్కున్నాడు. తినేందుకు, ప్రయాణానికి- ఒక్క పైసా కూడా‌ మిగల్లేదు నా దగ్గర! రెండు రోజులుగా నాది ఇదే గతి!" అని ఏడ్చాడు వాడు. "నువ్వు మమ్మల్ని మోసం చేసి డబ్బు తీసుకొని పోయినందుకు బాగా జరిగిందిరా" అన్నాడు వెంకటేష్ కోపంగా. "నువ్వు ఊరుకోరా, వెంకటేష్ ! వీడు ఎంతైనా మన స్నేహితుడేగా, సర్దుకు పోదాం" అంటూ వెంకటేష్‌ను ఆపాడు రాము. గోపి వాళ్ళిద్దరి మంచితనాన్నీ అర్థం చేసుకున్నాడు. చెడ్డ అలవాట్లను మానుకున్నాడు. కాలక్రమేణా అతనూ వాళ్ల స్నేహితుడయ్యాడు. Courtesy.. kottapalli.in  

తృప్తిపరుడు

  తృప్తిపరుడు     ఒక ఊరిలో రాము అనే పేదవాడు ఉండేవాడు. అడవిలో కట్టెలు కొట్టి, వాటిని అమ్ముకొని జీవనం సాగించేవాడు అతను. ఒక రోజు అతను అలా కట్టెలు కొట్టుకుంటూ ఉంటే ఏవో మాటలు వినపడ్డాయి. 'ఎవరివబ్బా, ఈ మాటలు?' అని కొన్ని అడుగులు ముందుకు వేసి చూశాడు రాము. అక్కడ మూడు ఆవులు మాత్రం ఉన్నాయి. అవి మాట్లాడుతున్నాయి! అట్లా మాట్లాడే ఆవుల్ని చూసి రాము చాలా ఆశ్చర్య పోయాడు. అవి మ్యాజిక్ ఆవులన్నమాట! వెంటనే అతను వెనక్కి వెళ్ళి, ఆవులకు ఇష్టమయ్యే చక్కని పచ్చగడ్డిని కోసి తెచ్చాడు. తను దూరంగా ఉంటూ గడ్డిని మాత్రం ఆవులకు అందేలా వేస్తూ వచ్చాడు. ఆ ఆవులు ఆ గడ్డిని మేస్తూ తమకు తెలీకుండానే రాము వెంట వాళ్ల ఇంటికి వెళ్ళాయి. ఒకసారి ఇల్లు చేరుకోగానే రాము వాటిని గబగబా కొట్టంలోకి తీసుకువెళ్ళి కట్టేసాడు. తనేమో పేదవాడు- మామూలు ఆవుల్ని కూడా‌ కొనుక్కునేంత శక్తి లేదు. అట్లాంటి తనకోసం మాట్లాడే ఆవుల్ని దేవుడే పంపించాడని తన అదృష్టానికి పొంగిపోతూ, సంతోషంగా నిద్రపోయాడు. ఉదయాన్నే లేచి ఆవులతో మాట్లాడాలని కొట్టం తలుపు తెరిచి చూస్తే ఏముంది? ఆవులు లేవు! అయితే రాము తెలివైన వాడు కదా, చుట్టు ప్రక్కల అంతా జాగ్రత్తగా వెతికాడు. కొంచెం దూరంగా బురదలో ఆవుల అడుగుజాడలు కనిపించాయి. వాటిని అనుసరిస్తూ అడవిలోకి వెళ్ళాడు రాము. కొట్టంలోంచి తప్పించుకొని అక్కడికి వెళ్ళిన ఆవులు అతను తమవెంట రావటం చూసి కంగారు పడ్డాయి. "ఇదేంటి, వీడు మనవెంట పడ్డాడు?" అని అవన్నీ ఒక్కసారిగా క్రిందపడి, చచ్చిపోయినట్లు నటించడం మొదలు పెట్టాయి. ఆవులు అన్నీ అట్లా క్రింద పడి ఉండటం చూసి రాము చాలా ఆందోళనతో పోయి వాటి పక్కన కూర్చున్నాడు. తన కారణంగానే అవన్నీ చచ్చిపోయాయేమో అని వాడికి చాలా బాధ వేసింది. అంతలో ఒక ఆవు కనురెప్పలు కదలడం చూసాడు వాడు. "ఓహో! ఇవి నన్ను చూసే ఇట్లా నటిస్తున్నాయన్నమాట!" అనుకున్నాడు.     "ఎందుకు నన్ను మోసం చేస్తున్నారు? నేను మీకు మేత, నీళ్ళు ఇచ్చి నా దగ్గర ఉంచుకుందామనుకున్నాను- అంతే తప్ప మిమ్మల్ని నేను ఏమీ చేయలేదే?" అడిగాడు రాము. అప్పుడు మూడు ఆవులూ లేచి, నవ్వుతూ అన్నాయి- "మేము మనుషుల దగ్గర జీవించలేము, రామూ! అయితే నీ మంచి మనస్సుని బాధ పెట్టటం కూడా మాకు ఇష్టం లేదు. నీ పేదరికాన్ని పోగొట్టడానికి ఏవైనా మూడు వరాలు ఇస్తాము- కోరుకో " అని. "ఒక మంచి ఇల్లు, మీ లాంటి మూడు చక్కని ఆవులు, ఓ ఎద్దులబండి ఇవ్వండి చాలు" అని కోరుకున్నాడు రాము. "ఇతను దురాశకు లోనవ్వలేదు; తనకు తగినట్లుగానే వరాలను కోరుకున్నాడు!" అని ఆవులు సంతోషపడ్డాయి. "సరే, ఇవన్నీ రేపు ప్రొద్దున నువ్వు నిద్ర లేచేసరికి నీ దగ్గర ఉంటాయి" అని చెప్పి ఆవులు రాముకి కనపడకుండా వెళ్ళిపోయాయి. పొద్దునలేచి చూసేటప్పటికి రాము ఒక పెద్ద ఇంట్లో ఉన్నాడు! ఇంటి బయట మూడు చక్కని ఆవులు , ఒక ఎద్దుల బండి ఉన్నాయి! వాటితో రాము తన జీవితాన్ని సంతోషంగా గడిపేసాడు.   Courtesy.. kottapalli.in

నక్క తిక్క కుదిరింది

  నక్క తిక్క కుదిరింది         అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక నక్క. అది ఒక రోజున వేటగాడు పన్నిన ఉచ్చులో చిక్కుకున్నది. చాలా కష్టపడి, చివరకు తప్పించుకున్నది. అయితే అలా పెనుగులాడుతున్నప్పుడు దాని తోక సగానికి పైగానే తెగిపోయింది. ఇప్పుడు దానికి పొడవైన కుచ్చు తోక లేదు: కేవలం ఒక పొట్టి తోక మాత్రమే మిగిలింది. దానితో ఆ నక్కకు పెద్ద దిగులు పట్టుకుంది. "అందరూ నన్ను చూసి నవ్వుతారే! ఎగతాళి చేస్తారే!" అనుకొంటూ తెగ బాధపడింది. అలా దిగులుపడిన నక్క, తనకు సహజమైన వంకర బుద్ధితో "నాకొక్కదానికే కాకుండా మిగిలిన నక్కలన్నింటికీ పొట్టితోక ఉంటే తప్ప నాకీ అవమాన భారం తప్పద"నుకొంది. "అప్పుడు గానీ నేను అడవిలో ప్రశాంతంగా గడపలేను" అనుకొన్నది. అనుకున్నదే తడవుగా తమ జాతివారి సమావేశం ఏర్పాటుచేసింది. అడవిలోని నక్కలన్నీ సమావేశానికి హాజరయ్యాయి. సభను ఉద్దేశించి మాట్లాడుతూ పొట్టితోక నక్క, "మిత్రులారా! భగవంతుడు మనకీ బొచ్చుతోకను ఎందుకిచ్చాడోకానీ , ఇదో పనికిమాలిన భాగం - మన శరీరంలో. ఇది పెద్దగా ఉన్నాఒకటే, చిన్నగా ఉన్నా ఒకటే. ఇది పెద్దగా ఉంటే మనకు ఎన్నో ప్రమాదాలు, చిక్కులూనూ. దానివల్ల ఎదురయ్యే కష్టాలను నేను ఎదుర్కొన్నానుకూడా! అందుకనే నేను నాఈ తోకను కత్తిరించేసుకున్నాను చూడండి" అని తెగిపోయిన తన పొట్టితోకను నక్కలకు చూపించింది. "కావున మిత్రులారా! నేను చెప్పేది ఏమిటంటే, మీరుకూడా నాలాగానే మీతోకలనూ కత్తిరించుకోండి. చిన్న తోకతో హాయిగా ఉండడానికి అందరూ సిద్ధంకండి. చిన్నతోక అందంగా ఉండదనకండి, అలవాటైతే బాగానే ఉంటుంది. అందం అనేది మన అలవాటు పైనే ఆధారపడి ఉంటుందని పెద్దలు చెబుతారు; అంతేకాక తోకను తెంపుకుంటే మనకు పొడుగు తోకతో వచ్చే బాధలూ తప్పుతాయి- ఏమంటారు?" అని మాట్లాడింది. ఆ ఉపన్యాసం విన్న నక్కల్లో కొన్నిటికి ఆ ఆలోచన నచ్చింది. ఆ సలహా బాగుందనే భావించాయి అవి. అనుభవపూర్వకంగా చెప్పిన దానిని అనుసరించడంలో తప్పేముందని అవి అనుకున్నాయి. అయితే వచ్చిన నక్కల్లో తెలివైన ముసలి నక్క ఒకటి ఉండింది. అది ఇలా అన్నది. " కొత్త విషయాలు తెలుసుకోవాలి, వీలయినన్ని నేర్చుకోవాలి. అందులో తప్పేమీ లేదు. కానీ, ఉన్న తోకల్ని చిన్నవి చేసుకోవడమేమిటి? ఇది చాలా తెలివి తక్కువ ఆలోచన. అసలు తోకలు చిన్నవిగా తెంపుకోవాల్సిన అవసరమేమిటి? ఆలోచించండి! భగవంతుడు, ఎందుకో, వాటిని కాస్తంత పెద్దవిగా ఇచ్చాడు. ఆయనకు తెలియదా, చిన్నవి పెట్టాలో, పెద్దవి పెట్టాలో? వీడికేదో అనుభవమైందని మిగిలినవారందర్నీ తోకలు కోసేసుకొమ్మంటే మనం కోసేసుకోవడమేనా? ఇందులో ఏదో మోసం ఉన్నట్లుంది. ఏ నిర్ణయమైనా ఆవేశంగా తీసుకోకూడదు. కాస్త ఆలోచించి నిర్ణయించుకోవాలి. ఇలాంటి మోసపు మాటలు వింటే, తర్వాత అందరూ బాధపడాల్సి వస్తుంది. వీడు చెప్తున్నట్లు అందరూ తోకలు తెంపుకోవాల్సిన అవసరమేమీలేదు. ఆలోచించండి" అని అన్నది ముసలి నక్క. నిజాన్ని గ్రహించిన నక్కలు ఒక్కటొక్కటే సమావేశం నుండి జారుకొన్నాయి. చివరికి అక్కడ పొట్టితోక నక్క మాత్రమే మిగిలింది- విచారవదనంతో..తన పాచిక పారనందుకు పరితపిస్తూ!   Courtesy.. kottapalli.in

అడవిలో ఆసుపత్రి

  అడవిలో ఆసుపత్రి     అనగనగా ఒక అడవి ఉండేది. ఆ అడవిలోని జంతువులన్నింటికీ, పాపం ఏదో ఒక సమయంలో గాయాలు తగులుతూనే ఉన్నాయి. గాయాలు తగిలినప్పుడు వాటిని ఎలా మాన్పుకోవాలో ఆ జంతువులకి తెలీదు! రాను రాను ఈ సమస్య బాగా పెద్దదైంది. పట్టించుకోకపోతే ఇంక వీలయ్యేట్లు లేదు. అందుకని, అడవిలోని జంతువులన్నీ ఒకసారి సమావేశమయ్యాయి. సింహం ఈ సమావేశానికి పెద్ద . అది ముందుగా లేచి, "మనం అందరం ప్రతిరోజూ ఏవో కొన్ని గాయాల బారిన పడుతున్నాము. గాయాలు తగిలినప్పుడు వాటిని ఎలా మాన్పుకోవాలో మనలో చాలామందికి తెలీటం లేదు. సమస్య బాగా పెద్దది. మనమంతా కలిసి, ఐకమత్యంతోటే దీన్ని సాధించగలం. మీలో ఎవరైనా దీనికి పరిష్కారం సూచించగలరా?" అన్నది.     అప్పుడు నక్క లేచి "మనమందరం ఏకం అవుదాం. మనకు హాని కలిగించేవాళ్ళనందరినీ చంపేద్దాం" అన్నది. సింహం దాని మాటల్ని కొట్టి పడేస్తూ "ఇది వీలు కాదు- మనకు హాని కల్గించే దెబ్బల్ని మనం ఎలా చంపగలం?" అన్నది నవ్వుతూ. "వేరే ఎవరైనా దీనికి పరిష్కారం చెప్పగలరా?" అని మిగిలిన వాళ్ళ కేసి చూసింది.   అప్పుడు పులి లేచి "మనం గాయాల బారిన పడుతున్నది చాలా వరకు మనుషుల వల్లే, కాబట్టి వాళ్ళు మన అడవిలోకి రాకుండా అడ్డుకుంటే సరి" అన్నది. "ఇది కొంచెం బానే ఉంది. ఐతే మనుషులను ఆపటం ఏమంత సులభమైన పని కాదు. ప్రస్తుతానికి సభను ఇంతటితో ముగిద్దాం. రేపు ఉదయం తొమ్మిది గంటలకల్లా సభ మళ్ళీ మొదలవుతుంది. ఆలోగా మీరు బాగా ఆలోచించి ఏదైనా మార్గం సూచించండి" అన్నది సింహం.         మర్నాడు జంతువులన్నీ ఏవేవో ఆలోచనలు చెప్పాయి గానీ, సింహ రాజుకు అవేవీ‌ నచ్చలేదు. ఇంతలో కుందేలు లేచి నిలబడి, "మహారాజా! గాయాలు,దెబ్బలు రకరకాల కారణాల వల్ల ఎదురవ్వవచ్చు- కేవలం మనుషుల వల్లనే కాదు. అందరూ కొంచెం ఆలోచించండి- మానవులకు దెబ్బ తగిలితే వాళ్ళు ఆ దెబ్బ తగిలించిన వస్తువుల్ని ఏమీ అనరు- దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి వెళతారు! అందుకని, మనం కూడా మన సమస్యను దూరం చేసుకోవాలంటే వాళ్లలాగే ఒక ఆసుపత్రిని నిర్మించుకోవాలి. వేరే మార్గాలేవీ‌ పని చెయ్యవు" అన్నది. జంతువులన్నీ "అవునవును" అన్నాయి. ఇంత అద్భుతమైన ఐడియా‌ ఇచ్చినందుకు కుందేలును అభినందించాయి. అన్నీ జంతువులు కలిసి శ్రమించి ఒక ఆసుపత్రిని నిర్మించుకున్నాయి. ఆ తరువాతగానీ వాటికి అనుమానం రాలేదు- "అవునూ, మనం ఇంత కష్టపడి ఆసుపత్రి కట్టాం కదా, మరి మనకు డాక్టరు గారు ఏరి?" అని.       "ఇంకెవరు, ఈ ఐడియా ఇచ్చిన కుందేలే మనకు డాక్టరు" అన్నది సింహం. అప్పటికే రకరకాల మందు మొక్కల గురించి చదివి పెట్టుకున్న కుందేలు "సరే, దానిదేముంది?" అన్నది. అప్పటి నుండి అడవిలోని జంతువులన్నీ దెబ్బ తగిలితే చాలు- కుందేలు డాక్టరుగారి దగ్గరికి పరుగు పెట్టసాగాయి! Courtesy.. kottapalli.in

నక్క నేర్చిన పాటం

  నక్క నేర్చిన పాటం     అనగనగా ఒక అడవిలో జిత్తులమారి నక్క ఒకటి ఉండేది. దానికి స్వయంగా వేటాడటం రాదు; అడవిలో ఏదో కారణంచేత చచ్చి పడివున్న జంతువులను తిని బ్రతుకుతుండేది అది. ఒకసారి దానికి అడవిలో ఏ జంతువూ దొరకలేదు. ఆకలితో నాలుగు రోజులు అలమటించాక, దానికి ఒక ఉపాయం తోచింది. "మృగరాజైన సింహంతో జత-కడితే...!?" అనుకున్నది. అది వెళ్ళేసరికి సింహం ముందు ఒక తోడేలు నిలబడి ఉంది. అది సింహానికి వేటలో మెళకువలు నేర్పుతున్నది. సింహం శ్రద్దగా వినటం చూసి నక్కకు ముచ్చట వేసింది. అది సింహంతో "ప్రభూ, తమరు వేటాడగా చూడాలని నాకు మహా కోరికగా ఉన్నది. తమరి అనుచరులుగా నేను, ఈ తోడేలూ తమరి వెంట వేటకు రాకోరుతున్నాము. తమరు అంగీకరిస్తే ధన్యులమౌతాము" అన్నది.     తక్కువ జాతివైన నక్కలతో, తోడేళ్ళతో కలిసి వేటకు పోవటం సింహానికి నామోషీ అనిపించింది. కానీ నక్క అడిగిన తీరువల్ల, కాదనేందుకు దానికి వీలవ్వలేదు. ఆ విధంగా ఆ మూడూ కలిసి అడవిలోకి పోయినై; ఒక అడవి దున్నను, ఒక అడవి గొర్రెను, ఒక కుందేలును చంపాయి. నక్కకు, తోడేలుకు ఆ మాంసాన్ని చూసేసరికి నోట్లో నీళ్ళు ఊరాయి. "ఈ వేటలో మా భాగం ఎంత ఉంటుందో.." అని ఆలోచించటం మొదలుపెట్టాయవి. అవి అట్లా చొంగలార్చుకుంటూ నిలబడటం చూసిన సింహానికి చాలా చికాకు వేసింది. "దొంగ వెధవల్లారా! ఆగండి! ఏమౌతుందో చూడండి! మీ దురాశకు తగిన గుణపాఠం చెప్పకపోతే నేను మృగరాజునేకాదు. జన్మలో మరిచిపోలేని పాఠం చెప్తాను ఆగండి!" అనుకున్నది అది. పైకి మాత్రం రాజసంగా ముఖం పెట్టి, అది తోడేలుతో అన్నది "చూశావుగా?! మన ముందు చాలా మాంసం పడిఉన్నది. దీన్ని అంతటినీ మన తాహతుకు తగినట్లుగా పంచు" అని.       తెలివి తక్కువ తోడేలు వెంటనే నోరు జారింది- "మహాప్రభూ! మూడు జంతువులలోకీ పెద్దదైన అడవిదున్న మహాప్రభువులు, ఉత్తమ-జీవులు అయిన తమరికి చెందుతుంది. మధ్యరకం ప్రాణి కనుక, ఈ అడవిగొర్రె నాకు చెందాలి. అల్ప జీవి అయిన నక్కకు ఈ చిట్టి కుందేలు సరిపోతుంది!" అన్నది. ఇది వినగానే సింహం కళ్ళు కోపంతో ఎర్ర-బడ్డాయి. దాని వెంట్రుకలు నిటారుగా నిలబడ్డాయి. ఉరుములు ఉరిమినట్లు అరిచింది అది: "నీచపు కుక్కా! మా స్థాయి ఎక్కడ, నీ స్థాయి ఎక్కడ!? మాతోపాటు వేటను పంచుకునేందుకు, వాటా అడిగేందుకు నీకెన్ని గుండెలు?! ఎంత ధైర్యం నీకసలు..?!" అని. అట్లా అరుస్తూ ముందుకు దూకి అది తోడేలును ఒక్క చరుపు చరిచింది. ఆ దెబ్బకు తోడేలు అక్కడికక్కడ తలపగిలి చచ్చింది! తరువాత సింహం నక్కవైపుకు తిరిగి, వేటను పంచమన్నది. తోడేలు గతిని చూసిన జిత్తులమారి నక్కకు ఆ సరికే సగం ప్రాణాలు పోయినై. 'బలవంతులతో చెలిమి తన వంటి బక్క ప్రాణులకు తగదు' అని అది ఆ సరికే గ్రహించింది. అయినా ఇప్పటికి చేయగలి-గింది లేదు. ఏదో ఒక విధంగా తప్పించు-కోవాలి...   అందుకని అది సింహంతో- "మహారాజా, ఇందులో ఆలోచించాల్సింది ఏమీ లేదు. బలిసిన ఈ దున్న ఈ ఉదయాన తమరికి అల్పాహారం అవుతుంది. బలిసిన ఈ అడవి గొర్రె తమరి మధ్యాహ్న భోజనానికి అనువుగా ఉంటుంది. ఇక ఈ కుందేలు ఉన్నది చూశారా, అది ఈ రాత్రికి తమకు రుచికరమైన భోజనం కాగలదు!" అన్నది. జిత్తులమారి నక్క తెలివిగా చేసిన ఈ పంపకానికి సింహం చాలా సంతోషపడింది. మనసులోనే ఉబ్బిపోతూ అది "ఓ ప్రియమైన నక్కా, అందరికీ అనుకరణీయమైన, అతి అద్భుతమైన ఇంత చక్కని పంపకపు విధానాన్ని నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు?" అని అడిగింది. నక్క అణకువగా తల వంచుతూ, "మహా ప్రభూ, తన తెలివిమాలిన మూర్ఖపు ప్రవర్తన కారణంగా కొద్ది సేపటి క్రితమే తమ చేత యమపురికి పంపబడిన వెర్రి తోడేలు ఉదాహరణ నుండి నేను ఈ కళను నేర్చుకున్నాను. నావంటి అల్పుడికి ఇంత గొప్ప పాఠం నేర్పిన శ్రేయస్సు పూర్తిగా తమరిదే!" అన్నది. ఈ జవాబుతో సింహం ఎంత సంతోషపడిందంటే అది నక్క భుజాన్ని తట్టుతూ "విస్వాసం గల ఓ నక్కా! నువ్వు నీ స్వంత అస్తిత్వాన్ని నాకోసం త్యాగం చేసిన తీరు అమోఘం. నేను నిన్ను మెచ్చాను. ఈ జంతువులన్నింటినీ నీకే బహుమానంగా ఇవ్వాలని నిశ్చయించాను. పండగ చేసుకో, ఇక సంతోషంగా ఉండు!" అని వెళ్ళిపోయింది. "చస్తూ చస్తూ బ్రతికిపోయాను. చావుకు అంత దగ్గరగా వెళ్ళికూడా, కేవలం నా అదృష్టంకొద్దీ బతికాను. ఇక ఎప్పుడూ అహంకారులతో పొత్తు పెట్టుకోను" అని ఒట్టు పెట్టుకున్నది నక్క, నిండుగా ఊపిరి పీల్చుకుంటూ. Courtesy.. kottapalli.in    

రహస్యం

  రహస్యం     మాధవపురాన్ని పాలించే మాధవుడికి రహస్యాలు ఛేదించటం అంటే ఇష్టం. సాహస కార్యాలు ఆయన్ని అనేక దేశాలు తిప్పాయి. ఒకసారి ఆయన అలా దేశాటన చేస్తూ పొరుగు రాజ్యపు సీమలో ప్రవేశించాడు. అక్కడ దట్టమైన ఓ అడవిలో దారి తప్పి, సన్యాసులు ఉండే మఠానికి ఒక దానికి చేరుకున్నాడు. వాళ్ళు ఆయనకు అతిథి మర్యాదలు చేసి, భోజనం పెట్టి, పడుకునేందుకు ఒక గది చూపించారు. అర్థరాత్రి అవుతున్నదనగా మఠంలో ఎక్కడినుండో వింత వింత శబ్దాలు వెలువడ సాగాయి. రాజుకు హఠాత్తుగా మెలకువ వచ్చింది. 'ఏమిటా శబ్దాలు?!' అనుకున్నాడు. అయితే అతను లేచి పరిశోధించాలని అనుకునేసరికి శబ్దాలన్నీ అకస్మాత్తుగా సద్దుమణిగాయి! మరునాడు తెల్లవారాక, 'రాత్రి వెలువడిన ఆ శబ్దాలు ఏమిటి?' అని అతడు ఆ సన్యాసులను అడిగాడు. "మేము నీకు చెప్పలేము- ఎందుకంటే నువ్వు సన్యాసివి కాదు కదా?!" అన్నారు వాళ్ళు. రాజుకు తల తిరిగినట్లయింది. శబ్దాల రహస్యాన్ని తెలుసుకోవాలనే కుతూహలం అతన్ని నిలువనివ్వలేదు. అయితే కొద్ది సేపటికల్లా సన్యాసులు అతనికి వీడ్కోలు చెప్పేసారు. రాజుకేమో, అక్కడే ఉండి ఆరోజు రాత్రి శబ్దాల రహస్యాన్ని ఛేదించాలని ఉంది. అయినా ఇంక ఏమీ చేయలేక, అలా అసంతృప్తితోనే తిరిగి వెళ్లిపోయాడు.     మళ్లీ కొన్ని సంవత్సరాల తర్వాత, వింతగా అక్కడికే చేరుకున్నాడు- సంధ్యా సమయంలో! మళ్లీ అప్పటి సన్యాసులే అతన్ని సాదరంగా ఆహ్వానించి వసతి కల్పించారు. మళ్లీ అదే గది దొరికింది అతనికి. "అప్పటి లాగా ఆ శబ్దాలు వినిపిస్తాయా, ఇవాళ్ల?" అన్న ఆలోచనతో రాజుకు అసలు నిద్ర పట్టలేదు. అర్థరాత్రి అవుతున్నదనగా మళ్లీ మొదలయ్యాయి శబ్దాలు. చటుక్కున లేచిన మాధవుడు ఆ మఠంలో అంతటా కలయ తిరిగాడు. తను ఎటు వెళ్ళినా, శబ్దాలు మరొక దిక్కునుండి వస్తున్నట్లు అనిపించసాగాయి! కొద్ది సేపటికి అంతటా నిశ్శబ్దం అలుముకున్నది. మర్నాడు రాజు ఆ సన్యాసులను ఇలా అడిగాడు "ఆ శబ్దం ఏమిటో దయచేసి చెప్పండి" అని "నువ్వు సన్యాసివి కావు, మేము చెప్పము" అన్నారు అందరూ ఒకేసారి. "సరే. నేను సన్యాసిని అవుతాను- ఏం చేయాలో చెప్పండి!" అడిగాడు రాజు. "నీ గుర్రాన్ని, నీ దగ్గర ఉన్న వస్తువుల్ని, దుస్తుల్ని అన్నిటినీ దానం చేసేయ్. ఆనక ఈ దుస్తుల్ని ధరించి రా!" అన్నాడు పెద్ద సన్యాసి. 'సరే'నని, ఆయన చెప్పినట్లే చేశాడు రాజు- "ఇప్పుడు చెప్పండి, ఏమిటి, ఆ శబ్దం?!" అడిగాడు కుతూహలం ఆపుకోలేక. "ఆ దారి గుండా వెళ్లు. నీకొక ద్వారం కనిపిస్తుంది. దాన్ని తెరువు. నీకే అర్థమవుతుంది" అన్నారు వాళ్ళు. అతను అలాగే వెళ్లాడు. ఒక ద్వారం కనిపించింది- దానిని తెరిచాడు; ఆ తర్వాత మరొక ద్వారం- వెండిది- కనబడింది. దానినీ తెరిచాడు- అమితమైన కాంతి ఒక్కసారిగా వచ్చి నేరుగా అతని కళ్లల్లోకి పడింది. పారిపోవాలనిపించింది అతనికి. కానీ భయంతో కాళ్లు కదల్లేదు. అరుద్దామంటే నోరు పెగల్లేదు. అతను చూసిందేమిటి?! ఆ వింత శబ్దానికి కారణం ఏమిటి?! పాఠకులారా, క్షమించాలి- మీకు ఆ రహస్యం చెప్పలేను.. ఎందుకంటే మీరు సన్యాసులు కారు కదా!   Courtesy.. kottapalli.in  

బుడ్డ మిరపకాయ కథ

బుడ్డ మిరపకాయ కథ       ఒక ఊరిలో ఒక అవ్వ నివసిస్తూ ఉండేది. ఒక నాడు ఆ అవ్వ కూరగాయలు తీసుకరావడానికని సంతకెళ్ళింది. సంతలో అవ్వ చాలా కూరగాయలు కొన్నది. వాటిలో ఒక బుడ్డ మిరపకాయ ఉన్నది. అవ్వ బస్సెక్కి ఇంటికి వెళ్ళింది. బస్సులోంచి బయటికి దూకిపోదామని బుడ్డమిరపకాయ చాలా ప్రయత్నించింది, కానీ తనను ఎవరైనా తొక్కేస్తారేమోనని భయపడి కూరగాయల బ్యాగ్ లోనే ముడుక్కున్నది. ఇంటికి చేరుకున్న అవ్వ ఏమిచేద్దామా అని ఆలోచించి, మిరపకాయ బజ్జీలు చేద్దామనుకున్నది. బజ్జీలకోసమని మిరపకాయలను తీసుకొని, వాటికున్న తొటాలను తీసింది. బుడ్డ మిరపకాయ వంతు వచ్చేప్పటికి, అది ’అవ్వా! అవ్వా! నన్ను ఏమీ చేయ్యొద్దవ్వా! నువ్వు ఏమి సహాయం చెయ్యమన్నా చేసిపెడతాను’ అని ప్రాధేయపడ్డది. సరేనన్నది అవ్వ. బుడ్డ మిరపకాయకు ఒక పరక ఇచ్చి, ఇల్లంతా ఊడ్చమని చెప్పింది. బుడ్డ మిరపకాయ సరేనన్నది, కానీ ఇల్లు ఊడ్చకుండా మంచమెక్కి కాలు మీద కాలేసుకుని కూర్చుంది. అప్పుడు అవ్వ దాన్ని పరకతో కొట్టింది. అప్పటినుంచీ బుడ్డ మిరపకాయ బుద్దిగా ఉన్నది. ఒకనాడు బుడ్డ మిరపకాయ అవ్వతో, ’అవ్వా! ఇకనుంచీ నేను బడికి పోతానవ్వా!’ అని అడిగింది. అందుకు అవ్వ ’సరే’నని ఒప్పుకుంది. బుడ్డ మిరపకాయకు ఒక పలకా, ఒక బలపం ఇచ్చి బడికి పంపింది. బుడ్డ మిరపకాయ పలకా, బలపం తీసుకొని బడికి వెళ్ళింది. ఆ రోజున బడిలో టీచరు ప్రజెంటు వేస్తూ, ’బుడ్డ మిరపకాయా’ అన్నది. అప్పుడు పిల్లలంతా గట్టిగా నవ్వారు. ఆరోజున బుడ్డ మిరపకాయ ' అ ' 'ఆ ' లు నేర్చుకుంది. సాయంత్రం ఇంటికి వెళ్ళేప్పుడు పిల్లలందరూ బై, బుడ్డ మిరపకాయా! బైబై బుడ్డ మిరపకాయా!’ అని ఎగతాళి చేశారు. ఇంటికెళ్ళిన బుడ్డ మిరపకాయ అవ్వతో, ’అవ్వా! నన్నంతా ’బుడ్డ మిరపకాయా’ అంటున్నారవ్వా!’ అని చెప్పింది. అప్పుడు అవ్వ ’ఏడుకొండల అవతల ఒక ఋషి ఉన్నాడు. అక్కడికి వెళ్ళి ఆయనను అడుగు. ఏమి చేయాలో ఆయనే చెబుతాడు’ అని చెప్పింది. బుడ్డ మిరపకాయ ఏడుకొండలు దాటి, అక్కడున్న ఋషిని కలిసి, తన బాధను చెప్పుకొంది. ఋషి " టింగరు బుల్లయ్య " అని దానికి ఒక మంత్రం ఉపదేశించి, ’ఈ మంత్రం చాలా శక్తివంతమైనది. దీన్ని సరిగా వాడితే లోక కల్యాణం జరుగుతుంది. చెడు పనులకు వాడితే వినాశనం తప్పదు’ అని హెచ్చరించాడు. తిరిగొచ్చిన బుడ్డ మిరపకాయ మర్నాడు బడికి వెళ్ళింది. ’హాయ్ బుడ్డమిరపకాయా’ అన్నారంతా. ’నన్నే బుడ్డ మిరపకాయంటారా!’ అని మండిపడ్డ బుడ్డ మిరపకాయ, "పిల్లలంతా టింగర్ బుల్లయ్య" అన్నది. అంతే! పిల్లలంతా చనిపోయారు. టీచరు వచ్చి ’ఒరేయ్! బుడ్డ మిరపకాయా! అందర్నీ లేపురా’ అని అన్నది. ’నన్నే బుడ్డ మిరకాయంటావా! టీచరూ?’ "టీచరూ టింగరు బుల్లయ్య" అన్నది బుడ్డ మిరపకాయ. అంతే! టీచరు కూడా చనిపోయింది. ఇక బుడ్డ మిరపకాయ తీరికగా ఇంటికెళ్లింది. ఇంట్లో అవ్వ ’ఒరేయ్! బుడ్డ మిరపకాయా! అరటి పండు తింటావారా?’ అని అడిగింది ప్రేమగా. గర్వపోతు బుడ్డ మిరపకాయ "నన్నే బుడ్డ మిరపకాయంటావా" అని, "అవ్వకూడా టింగరు బుల్లయ్య" అన్నది బుడ్డ మిరపకాయ. అంతే! అవ్వ కూడా చనిపోయింది. తర్వాత బుడ్డ మిరపకాయకు ఆకలైంది. అది ఒక అరటి పండును తీసుకొని అద్దానికి ఎదురుగా నిలబడింది. తన అందాన్ని చూసుకొని మురిసిపోయింది. తినటంకోసం పండు తొక్క ఒలిచింది. అద్దంలో బుడ్డ మిరపకాయ ప్రతిబింబం కూడా అరటిపండు తొక్కను ఒలిచింది. ఆత్మదురభిమానం ఎక్కువ అయిన బుడ్డమిరపకాయకు కోపం వచ్చింది. "ఆ! నేనెలా చేస్తే నువ్వూ అలానే చేస్తావా! నువ్వు కూడా టింగరు బుల్లయ్య" అన్నది. అంతే! ప్రతిబింబంతోపాటు బుడ్డ మిరపకాయకూడా చనిపోయింది! అహంకారం వినాశహేతువు.   Courtesy.. kottapalli.in

నది ఒడ్డున ఓ సామాన్యుడు

    నది ఒడ్డున ఓ సామాన్యుడు     సామాన్యుడు ఒకడు ఓ నది ఒడ్డున కూర్చొని ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నాడట. ఆ సమయంలో మధ్య వయస్సులో ఉన్న ఒక సాధువు నది అవతలి ఒడ్డుకు వచ్చాడు. అతను అలానే నీళ్లపైన నడుచుకుంటూ వచ్చి సామాన్యుడిని చేరుకున్నాడు! సామాన్యుడు మాత్రం ఉన్న చోటే కూర్చొని ప్రశాంతంగా చూస్తున్నాడు. సాధువు అతన్ని సమీపించి అడిగాడు: " నేను ఇప్పుడు ఏం చేశానో చూశావా?" అని. "ఓ! చూశాను. తమరు ఇప్పుడు నదిని దాటుకొని వచ్చారు కదూ, నీళ్లమీద నడుచుకుంటూ? ఎక్కడ నేర్చుకున్నారు మీరు, ఆ విద్యను?!" అన్నాడు పామరుడు ఉత్సాహంగా. నేను హిమాలయ పర్వత సానువుల్లోని గుహల్లో పన్నెండు సంవత్సరాలపాటు యోగాభ్యాసం చేసి , వారానికి ఆరు రోజుల పాటు ఉపవాసం ఉంటూ, ఒంటికాలిపై నిలబడి తపస్సుచేస్తూ కఠోరంగా శ్రమించాను. తత్ఫలితంగా ఈ శక్తిని ఆర్జించాను." అన్నాడు సాధువు గర్వంగా. "నిజమా?!" అన్నాడు సామాన్యుడు ఆశ్చ్యర్యపోతూ. ఇంతమాత్రం దానికి తమరు అన్ని కష్టాలు ఎందుకు పడ్డారు? " రెండు పైసలిస్తే చాలు, మీరెప్పుడుకావాలంటే అప్పుడు ఇక్కడి పడవ సరంగు మిమ్మల్ని నది దాటిస్తాడుగద!" అని అడిగాడు అమాయకంగా. సాధువు గర్వం అణిగిపోయింది. జ్ఞాన చక్షువులు తెరుచుకున్నాయి. మనం శ్రమించేటప్పుడు ‘ఎందుకు శ్రమిస్తున్నాం’ అనేది గుర్తుచేసుకుంటూ ఉంటే మంచిది. అలా కాని పక్షంలో మనం ఎంతో కష్టపడినా కూడా ఫలితాలు నిరాశనే మిగిల్చే ప్రమాదం ఉంది. కొన్నికొన్నిసార్లు మనం వివేకశూన్యమైన పనుల్నీ తలకెత్తుకుంటాం. ‘మనం చేస్తున్న పని సరైనదేనా’ , ‘పని వెనక ఉన్న ఉద్దేశం సమంజసమైనదేనా’ అని ఆలోచించుకుంటుంటే, మన పనుల్లోని మూర్ఖత్వం మనకు తెలిసే వీలుంటుంది. మనం చాలా గొప్పవిగా భావించే పనుల్లో కూడా ఒక్కోసారి అసలు పస ఉండకపోవచ్చు. అయినా మనం అహంకారం కొద్దీ అతిశయం పాలౌతుంటాం. అలా కాకూడదంటే చేస్తున్న పనిని గురించి పక్షపాతరహితమైన మనసుతో పునర్విమర్శ జరుపుకుంటూ ఉండటం మినహా వేరే మార్గం లేదు. అలా విమర్శించుకుంటున్నా ప్రయోజనం లేదంటే, కనీసం మనకు నచ్చిన పనిని మనం, శక్తివంచనలేకుండా చేశామన్న సంతృప్తి లభిస్తుంది. ఏమంటారు? Courtesy.. kottapalli.in  

త్రాగుబోతు

  త్రాగుబోతు     అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే చిన్న రైతు ఒకడు ఉండేవాడు. రామయ్య భార్య సీతమ్మ. వాళ్ళకు ఒక కొడుకు. వాళ్ల సంసారం అలా చల్లగా సాగుతున్న సమయంలో అకస్మాత్తుగా ఆ పిల్లవాడు అనారోగ్యానికి గురి అయ్యాడు, 'డాక్టర్ దగ్గరకు వెళ్దాం' అని సలహా ఇచ్చింది సీతమ్మ. కానీ రామయ్య మాత్రం తనకు తెలిసిన నాటు వైద్యం చేసి చూశాడు. పిల్లవాడి సమస్య తగ్గలేదు సరికదా, మరింత తీవ్రమైంది. ఇక విధిలేని పరిస్థితులో ఇద్దరూ ఆ పిల్లవాడిని తీసుకొని బస్టాండ్ కు పోయారు, కానీ ఎంత వేచి చూసినా ఒక్క బస్సూ రాలేదు. "ఆ రోజు ఇక బస్సులు రావు, బంద్" అనిచెప్పారు అందరూ. ఆ మాటలకు దంపతులిద్దరికీ ఏడుపు వచ్చేసింది. సరైన వైద్యం దొరక్క వాళ్ల కొడుకు చనిపోయాడు! తల్లి తండ్రులు ఆ పిల్లవాడిని మరచిపోవడమే లేదు. అన్నం‌ తిన్నప్పుడల్లా కొడుకు గుర్తుకు వస్తున్నాడు- అలా రోజులు గడిచాయి. ఒక రోజున రామయ్య పొలానికి వెళ్ళి, మంచం వేసుకొని నిదుర పోదామని అనుకున్నాడు. కానీ కళ్ళు మూసుకుంటానే కొడుకు గుర్తుకు వచ్చాడు.   అప్పుడు 'కాటమయ్య' అనే పనికిమాలిన వెధవ ఒకడు అతని దగ్గరకు వచ్చి"రామయ్యా! చనిపోయిన వాడు తిరిగి వెనక్కి రాడు. కానీ నువ్వు- ఇదిగో, ఈ బ్రాందీ త్రాగు- నీ పిల్లవాడు అసలు గుర్తుకే రాడు !" అని చెప్పాడు. రామయ్య ముందు వద్దన్నాడు. కానీ వాడు 'ఇదిగో, ఈ కొద్దిగా త్రాగు- చాలు" అని బలవంతంగా కొంచెం త్రాగించాడు. పైగా ఒక కోటర్ చిన్న సీసాడు సారాయి అక్కడ పెట్టి మరీ పోయాడు. సారాయి తాగే సరికి రామయ్యకు ఆలోచన మందగించి, బాగా నిద్రపట్టింది- ఇక ఆ తర్వాత అతనికి కూడా ఆ త్రాగుడు రోగం అంటుకున్నది. ఇప్పుడు రామయ్య ప్రతి రోజూ విపరీతంగా త్రాగుతున్నాడు. ఎప్పుడూ మత్తులోనే ఉంటున్నాడు. త్రాగకుండా ఉండలేని పరిస్థితి! తన త్రాగుడుకు ఉన్న ఆస్తి అంతా ఖాళీ చేశాడు. సీతమ్మ మనసు చంపుకొని బ్రతికేందుకు ప్రయత్నించింది, కానీ ఎన్నాళ్లు? చివరికి ఆమె బలహీనురాలై, చనిపోయింది. అయినా రామయ్యకి బుద్ధి రాలేదు. భార్య-పిల్లలు గుర్తు రాకూడదని అతను ఇంకా చాలా సారాయి తాగాడు- ఊళ్లు పట్టుకొని తిరిగాడు. ఒక రోజున రామయ్య అటూ, ఇటూ ఊగుకుంటూ పోయి ఒక గుంతలో పడిపోయాడు. అక్కడే కట్టెలు కొడుతున్న ఒక మంచి మనిషి చూసాడు అతన్ని. వెంటనే ఆస్పత్రిలో చేర్పించాడు.     అక్కడ రామయ్యను పరీక్ష చేసి, "కాలేయం అంతా పాడైపోయింది “అని చెప్పారు డాక్టర్లు . "ఇంక మేము ఏమీ చెయ్యలేం" అన్నారు వాళ్లు. భార్య-కొడుకు గుర్తుకొచ్చిన రామయ్య నిరాశచెందాడు: "నన్ను చనిపోనివ్వండి" అని ప్రాణభీతితో ఏడవటం మొదలుపెట్టాడు. అతనిని కాపాడిన మంచి మనిషి అతనికి ధైర్యం చెప్పి, తనకు తెలిసిన ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు అతన్ని, ఆ డాక్టర్ గారు రామయ్యకు రకరకాల మూలికలతో వైద్యం చేశారు; ధ్యానం కూడా నేర్పారు. వాటన్నిటి మూలంగా‌ రామయ్య ఆరోగ్యం క్రమంగా మెరుగైంది.     అప్పటి నుంచి రామయ్య మత్తుపానీయాలు త్రాగడం మానేశాడు. తను త్రాగకపోవటమే కాదు; ఇతరులకు కూడా "త్రాగద్దు బాబులూ!" అని చెప్పటం మొదలెట్టాడు !   Courtesy.. kottapalli.in

బలవంతుని గర్వభంగం

    బలవంతుని గర్వభంగం     రచన: నరేష్ ఒకనాడు ఒక బలవంతుడు సోము దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు: ’ప్రపంచంలో నువ్వు తెలివైన వాడివి, నేను బలమైన వాడిని. నా ఉద్దేశం ప్రకారం మనుషులకు బలం కావాలి తప్ప, తెలివి తేటలతో పనిలేదు. అందువల్ల, నువ్వు, నేను తలపడక తప్పదు. నువ్వు గొప్పో, నేను గొప్పో ఈ రోజున తేలిపోవలసిందే.’ సోము బలవంతుడిని ఒకసారి తేరిపార చూశాడు. "నీ బలమెంత?" అని అడిగాడు. "నేను ఒక చేతితో ఒక టన్ను బరువును ఎత్తి సులభంగా ఈ ప్రహరీ గోడ పైనుండి పట్టణం మధ్యకు విసిరివేయగలను" అని బలవంతుడు సమాధానమిచ్చాడు గర్వంగా. "నాకు నమ్మకం కలగటంలేదు" నెమ్మదిగా అన్నాడు సోము "అయితే నా బలాన్ని నీ ముందే నిరూపిస్తాను. ఏ బల పరీక్షకైనా నేను తయారు." అన్నాడు బలవంతుడు. "సరే, అయితే నీకొక చిన్న బలపరీక్ష పెడతాను. అందులో నెగ్గితే నువ్వు ప్రపంచంలోకెల్లా గొప్పవాడివని అంగీకరిస్తాను" అని సోము బలవంతుడిని ప్రహరీ గోడ దగ్గరకు తీసుకెళ్లాడు. తన జేబులో ఉన్న సిల్కు రుమాలును బలవంతుని చేతిలో పెట్టి, " దీన్ని ఈ ప్రహరీ గోడ అవతలికి విసిరి చూపించు చాలు" అన్నాడు. బలవంతుడు నవ్వుకుంటూ జేబు రుమాలును విసిరేశాడు. అది ప్రహరీ గోడను దాటలేదు. సోము అప్పుడు ఆ రుమాలును తీసుకొని, దానిలో ఒక చిన్న రాయిని కట్టి, దాన్ని ప్రహరీగోడ అవతలికి సులభంగా విసిరేశాడు. బలవంతుడు సిగ్గుతో తలదించుకొని, తన ఓటమిని అంగీకరించాడు. "బలం, తెలివి రెండూ గొప్పవే, ఈ ప్రపంచంలో మనిషికి రెండూ అవసరమే. ఏది లేకున్నా పరాజయం తప్పదు" అని అతన్ని ఊరడించాడు సోము.   Courtesy.. kottapalli.in    

చిలుక-ఏనుగు (కథ)

చిలుక-ఏనుగు (కథ)   చాలా కాలం పంజరంలో ఉన్నాక ఒక చిలుకకు విసుగొచ్చింది. చాలా కష్టాలు పడ్డతరువాత అది పంజరంలోంచి తప్పించుకొని అడవికి చేరింది. అడవిలో దొరికే తియ్యని పండ్లు తింటూ, తన ఇష్టం వచ్చినట్లు చెట్లమీద గెంతుతూ కొన్నాళ్లు ఆనందంగా గడిపింది. ఒక పెద్దచెట్టు కింద కాళ్ళు బోర్లాచాపి పడుకున్న ఏనుగు ఒకటి ఆ చిలుకకు కనిపించింది ఒకనాడు. ఆ వెంటనే చిలుకకు ఒక చిలిపి కోరిక పుట్టింది. ఎలాగైనా ఆ ఏనుగు నిద్ర చెడగొట్టాలనుకుంది. వెంటనే చెట్టుమీదనుండి రివ్వున కిందకి ఎగిరి తన ముక్కుతో ఏనుగు మూపురం మీద పొడిచింది. చిలుక వాడియైన ముక్కు మూపురంమీద చురుక్కుమంటూ గుచ్చుకోవడంతో ఏనుగు ఒళ్లు విదిలించుకుంటూ కళ్ళు తెరిచింది. చిలుక చెట్టుమీదకి చేరి కిలకిలా నవ్వింది. ’ఏయ్ చిలకా! నా నిద్ర ఎందుకు పాడుచేశావ్?’ అంది ఏనుగు కోపంగా. ’ఊరికే’ అంటూ చిలుక మళ్ళీ నవ్వింది. చేసేది ఏమీ లేక ఏనుగు మళ్ళీ కళ్లు మూసుకుని పడుకుంది. కొంచెం సేపటి తరువాత చిలుక మళ్ళీ రివ్వుమని కిందికొచ్చి, ఏనుగు మూపురం మీద మరోసారి పొడిచి, వెళ్ళి చెట్టు ఎక్కి కూర్చుంది. ఏనుగు నిద్ర మరోసారి చెడింది. ఈసారి ఏనుగు ’ఏయ్ చిలకా! నీకేం పనిలేదా?’ అంటూ కోపంగా ఘీంకరించింది. కానీ చిలుక మరో రెండుమూడు సార్లు అలాగే చేసింది. దాంతో ఇక లాభం లేదని ఏనుగు అక్కడినుంచి లేచి బయలుదేరింది. చిలుకకు అది ఇంకా సరదా అనిపించింది. మరోసారి ఎగిరి ఏనుగు మూపురం మీద పొడిచి వెళ్ళి ఒక చెట్టుమీద వాలింది. ఏనుగుకి కోపం ముంచుకొచ్చింది. చిలుకకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకొని, అక్కడికి దగ్గరలో ఉన్న చెరువులోనికి దిగి తన తలా, మూపురం తప్ప మిగిలిన శరీరమంతా నీటిలో ముంచింది. అది చూసిన చిలుకకు మరింత ఉత్సాహమనిపించింది. అది అనుకుంది, "ఆహా! నాకన్నా వెయ్యిరెట్లు బలమైన ఏనుగుకూడా నా దెబ్బకు భయపడిపోయి, వెళ్ళి నీళ్ళలో దాక్కున్నది చూడు" అని. ’ఊ.... ఈ పిరికి ఏనుగుకి మరోసారి నా దెబ్బ చూపిస్తా’ అనుకొని అది రివ్వున ఎగిరి ఏనుగు మూపురం మీద వాలి దాన్ని పొడవబోయింది. కానీ చిలుక అలాగే చేస్తుందని ముందుగా ఊహించిన ఏనుగు అప్పటికే తన తొండంలో నింపుకున్న నీటిని "ఉఫ్..." మంటూ చిలుక మీదికి చిమ్మింది. ఆ నీటి తాకిడికి ఉక్కిరి బిక్కిరి అయిన చిలుక, ఇక ఎగరలేక, ఆ చెరువులో పడి గిలగిలా కొట్టుకున్నది. దయగల ఏనుగు దాన్ని చూసి జాలిపడి దానిని ఒడ్డుమీదికి విసిరేసింది. చిలుకకు ఇక బుద్ధి వచ్చింది. తనను క్షమించమని అది ఏనుగును వేడుకొన్నది. ఏనుగు గంభీరంగా చిరునవ్వు నవ్వి, తన దారిన తను వెళ్ళిపోయింది. చిలుకకు పెద్దంతరం, చిన్నంతరం తెలిసింది.   Courtesy.. kottapalli.in

బాల కార్మికులు

  బాల కార్మికులు     14సం|| లోపు వయసు గల పిల్లల్ని కొన్ని అంతర్జాతీయ చట్టాలు ’బాలలు’ అని గుర్తిస్తాయి. అయితే కొన్నిచట్టాల ప్రకారం మన దేశంలో 18సం ||కు తక్కువ వయసుగలవారంతా కూడా బాలలే. పేదరికం పెరగడం కారణంగా భారతదేశంలో చాలామంది పిల్లలు చదువులు మాని, కఠినమైన పనులు చేస్తూ బాలకార్మికులు అవుతున్నారు. ’వీరంతా బాలకార్మికులుగా ఎందుకు మారుతున్నారు’ అన్నది మనం అందరం ఆలోచించవలసిన విషయం. ఎక్కువగా పల్లెలో ఉన్న పిల్లలే బాలకార్మికులుగా మారుతుంటారు-ఎందుకంటే వారికి తినడానికి తిండి లేక. వాళ్ళ పెద్దవాళ్ళు తమ పిల్లలను చదివించే స్తోమతు లేక, పట్టణాలలో స్వీట్ షాపుల్లోను, బీడీ అంగళ్లలోను, ఆడపిల్లల్నైతే ఇళ్లలో పని మనిషులుగాను పెట్టి, వారు తెచ్చిన డబ్బుల్ని కూడా తీసుకుని వాడుకుంటారు. కాని ఆ పిల్లలు ఉదయం 7 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు నిద్రలేకుండా గొడ్డుచాకిరి చేస్తారు . రాజకీయ నాయకులు, పెద్ద మనుషులు ఉపన్యాసాలిస్తారు-’బాలకార్మికుల వ్యవస్థను రద్దుచేస్తాము; వారికి కావలసిన సదుపాయాలు కల్పిస్తాము’ అని. కానీ ఒక్కరు కూడా వాటిని అమలు చేయరు. భారతదేశంలో ఏ ఇతర దేశాలలో లేనంతగా బాలకార్మికులున్నారు.బాలకార్మికులు లేకుండా ఉండడానికి ప్రభుత్వం మొదట జనాభాని నియంత్రణ చేయాలి. అంతే కాకుండా గ్రామాలలోని పిల్లలకు చదువులు చెప్పడం వంటి కార్యకలాపాలు చేపట్టాలి. బారతదేశంలో మొత్తం 8.7 కోట్ల మంది బాలలు పాఠశాలకు పోకుండా వ్యవసాయరంగంలోను, కర్మాగారాలలోను పని చేస్తున్నారు . అలా ఉన్న పిల్లలను చూసి ప్రభుత్వం వారికి కావల్సిన సదుపాయాలు చేస్తే మంచిది. బాలలను అలా కర్మాగారాలలో పని మనుషులుగా పెట్టుకున్నవారికి తాఖీదులిచ్చి, వారిని వెంటనే పాఠశాలకు పంపటం మొదలుపెట్టాలని చెప్పాలి. అలా చేయని వారిని ప్రభుత్వం జైల్లో వేసేటట్లు చేస్తే తప్ప మన భారత దేశం ఈ బాలకార్మిక సమస్య నుండి విముక్తి పొందదు. బాల కార్మికులకు కొన్ని ఆశలు, ఆశయాలు, కష్టాలు ఉంటాయి.మనం వాటిని గుర్తించి, వారికి చదువు చెప్పడం వలన చాలా లాభం కలుగుతుంది. బాల కార్మికులను చిన్న చూపు చూస్తే వారు ఎదగరు, అలాగే వుంటారు. అంతే కాకుండా మిగిలిన పిల్లలు కూడా వారిలా తయారవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల వారిని చిన్నచూపు చూడటం మాని, వారికి సరైన అవకాశాలు కల్పించి, వారు కూడా జనజీవనంలో కలిసిపోయేందుకు అవకాశాలు కల్పించాలి. Courtesy.. kottapalli.in

కొక్కిరమ్మ గుడ్లు

  కొక్కిరమ్మ గుడ్లు     పిల్లలూ! నా చిన్నప్పుడు- అంటే నాకు ఆరేడు ఏళ్ళప్పుడన్న మాట (ఇప్పుడు నాకు 65!) మా అమ్మమ్మ సత్యాన్ని గురించి చెప్పిన ఈ కథ నాకింకా జ్ఞాపకం. సత్యం మానవులకే కాక, పశు-పక్ష్యాదులకు సైతం ఒక్కటేననీ, అసత్యం చెప్పిన వారికి దండనతప్పదనీ ఈ కథ వలన తెలుస్తుంది. అందుకే మీకు ఈ కథను 'కొత్తపల్లి 'ద్వారా చెప్పాలన్పించి, చెప్తున్నాను. పూర్వం ఒక కొక్కిరమ్మ ముంతంత ఇల్లుకట్టుకొని, దాన్లో మూడు పుట్ల వడ్లు పోసుకుని, వడ్లమీద గుడ్లు పెట్టుకుని, గుడ్ల మీద తాను పడుకుంది. ఇంతలో ఒక ఏనుగు వచ్చి, "చలిగా ఉంది కొక్కెరమ్మా, నాక్కాస్త చోటిస్తావా?" అని అడిగింది, దానికి కొక్కెరమ్మ "ఏనుగన్నా! నేను ముంతంత ఇల్లు కట్టుకుని మూడు పుట్ల వడ్లు పోసుకుని, వడ్ల మీద గుడ్లు పెట్టుకుని, గుడ్ల మీద పడుకున్నా, నా వెనక చోటుంటే నువ్వు పడుకో" అంది. "సరే" అని కొంగ వెనుక ఏనుగు పడుకున్నది. ఇంకాస్త సేపటికి ఒక నక్క వచ్చింది- "కొక్కెరమ్మ కొక్కెరమ్మా! నాక్కాస్త చోటిస్తవా?" అని అడిగిందట అది. "నక్క బావా! నేను ముంతంత ఇల్లు కట్టుకొని మూడు పుట్ల వడ్లు పోసుకొని వడ్లమీద గుడ్లు పెట్టుకొని, గుడ్లమీద పడుకున్నా, నా వెనక చోటుంటే ఏనుగు పడుకుంది, ఏనుగు వెనక చోటుంటే నువ్వు పడుకో" అంది. నక్క వచ్చి ఏనుగువెనుక పడుకుంది. మరికొంత సేపటికి ఒక పిల్లి వచ్చింది- "కొక్కెరమ్మ కొక్కెరమ్మ ! నాక్కాస్త చోటిస్తవా?" అంది. కొక్కెరమ్మ చెప్పింది- "పిల్లిమావా! నేను ముంతంత ఇల్లుకట్టుకుని, మూడు పుట్ల వడ్లు పోసుకుని, వడ్ల మీద గుడ్లు పెట్టుకుని, గుడ్ల మీద పడుకున్నా, నా వెనక చోటుంటే ఏనుగు పడుకుంది, ఎనుగు వెనక చోటుంటే నక్క పడుకుంది, నక్కెనక చోటుంటే నువ్వు పడుకో!" అంది. పిల్లి కూడా పడుకుంది. మరికొంత సేపటికి ఒక గుర్రం , ఒక తోడేలు వచ్చాయి. రెండూ కొక్కెరమ్మను అలాగే అడిగాయి. కొక్కెరమ్మ వాటికీ అలాగే చెప్పింది. రెండూ వచ్చి పడుకున్నాయ్. మధ్య రాత్రి అయ్యే సరికి కొక్కెరమ్మకు పట పట మనే శబ్దం వినిపించింది. "ఏంటా శబ్దం? ఎవరైనా నా గుడ్లుకానీ‌ తింటున్నారా?" అడిగింది కొక్కెరమ్మ నిద్రలోనే. "లేదు కొక్కెరమ్మా! చలికి నా పళ్ళు పట పటమని కదులుతున్నాయి" అందట పిల్లి. తెల్లారినాక చూసుకుంటే కొక్కెరమ్మ గుడ్లు లేనే లేవు! కొక్కెరమ్మ విచారంతో "మీ అందరికీ నేను రాత్రి చోటిచ్చాను. అయినా మీలో ఎవరో నాగుడ్లు తినేశారు. ఎవరో చెప్పి తప్పు ఒప్పుకోండి మర్యాదగా" అంది. "మేమెందుకు తింటాం కొక్కెరమ్మా! నువ్వెంత మంచిదానివో మాకు తెలీదా?" అన్నాయి అన్నీ. "మీరంతా గుండ్లకమ్మ నదికి వచ్చి ఒక్కోరూ ఆ నదిలో మునిగి ప్రమాణం చేయండి. ఎవరైతే గుడ్లు తిన్నారో వారిని గుండ్లకమ్మే ముంచుతుంది"అందిట కొక్కెరమ్మ ఏడుస్తూ. అన్నీ సరేనని నదిలో నిల్చుకొని కొక్కెరమ్మ చెప్పినట్లు పలికాయి: "కొక్కెరమ్మ గుడ్లంట, నేనంట తిన్ననంట, తిన్ననంటె ముంచు ముంచు గుండ్లకమ్మ-లేకుంటే తేలగొట్టు గుండ్లకమ్మ " అని మూడుమార్లు ప్రమాణం చేసి అన్నీ ఆ నది నీళ్లలో మునిగాయి. అన్నీ నీళ్ళలోంచి బయటకి వచ్చాయి- కానీ పిల్లిమాత్రం రాలేదు: గుండ్లకమ్మలో కొట్టుకు పోయింది. అప్పుడు మిగిలినవన్నీ "చూడు, కొక్కెరమ్మా! నువ్వేమో నీ ముంతంత ఇంట్లో చలి రాత్రిలో పడుకోను చోటిచ్చావు మాకు. కృతజ్ఞతలేని ఆ దొంగ పిల్లి నీ గుడ్లన్నీ తినేసింది. కానీ గుండ్లకమ్మ నది అసత్యానికి అన్యాయానికి తగిన శిక్షే విధించిందిలే, బాధపడకు "అని ఓదార్చాయి. చూశారా పిల్లలూ! అన్యాయానికి, కృతఘ్నతకూ శిక్ష తప్పదు మరి! ఎప్పుడూ నీతి నిజాయితీలతో నడచుకుంటూ ఇతరులకు చేతనైన సాయం చేస్తుంటారు గదూ! రచన: ఆదూరి హైమావతి, విశ్రాంత ప్రధానోపాధ్యాయిని, బెంగుళూరు.   Courtesy.. kottapalli.in  

ఎవరిమాట వినాలి

  ఎవరిమాట వినాలి     ఒక ఋషికి అనేకమంది శిష్యులు ఉండేవారు. ఆయన తన జ్ఞాన సారాన్ని శిష్యులకు ఇలా బోధించేవాడు: "భగవంతుడు ఇక్కడ ఉన్నాడనీ, అక్కడ లేడనీ లేదు. ఆయన అంతటా ఉంటాడు. అందరిలోనూ ఉంటాడు. అన్నింటిలోనూ ఉంటాడు. అందువల్ల మీరు సర్వాన్నీ భగవన్మయాలుగా ఎంచి, మ్రొక్కాలి" అని. ఒకనాడు ఋషి శిష్యుడొకడు పనిమీద నగరంలోని సంతకు వెళ్లాడు. అక్కడ, ఏనుగొకదానికి మదమెక్కి, అదుపుతప్పి పరుగెత్తటం మొదలెట్టింది. అది ఎటుపడితే అటు పరుగులు తీస్తుంటే దానిపైనున్న మావటివాడు "తప్పుకోండి! తప్పుకోండి! ఏనుగుకు మదమెక్కింది! తప్పుకోండి! పరుగుతీయండి!" అని అరుస్తున్నాడు, నిస్సహాయంగా. అది చూసిన శిష్యుడికి గురువుగారి బోధన గుర్తుకు వచ్చింది. అతను అనుకున్నాడు - "భగవంతుడు నాలోను ఉన్నాడు. ఈ ఏనుగులోనూ ఉన్నాడు. భగవంతుడు భగవంతునికి కీడు ఎందుకు చేస్తాడు?" అని. అలా అనుకొని అతను అడ్డుతొలగకుండా మార్గమధ్యంలోనే నిల్చుండిపోయాడు. మావటివాడికి పిచ్చెక్కినంత పనైంది. "అయ్యో! పక్కకు పోండి సామీ, ఏనుగుకు బాగాలేదు, మీకు ప్రమాదం" - అని మొత్తుకుంటూనే ఉన్నాడు. కానీ శిష్యుడు ఒక్క అంగుళంకూడా కదలకుండా స్థిరంగా నిలబడ్డాడు. ఆ మదపుటేనుగు శిష్యుడిని చేరుకోగానే తొండంతో అతన్ని ఎత్తి, చుట్టూ తిప్పి, బలంగా పక్కనే ఉన్న మురికి కాలువలోకి విసిరేసింది. చావుతప్పి కన్ను లొట్టబోయిన శిష్యుడు గాయాలతో, రక్తం ఓడుతూ అలాగే చాలాసేపు పడి ఉండాల్సి వచ్చింది. గాయాల బాధకంటే `భగవంతుడు తనను ఇలా చేశాడు ' అనే ఆలోచన అతనిని ఎక్కువ పీడించింది. కబురు అందుకొని గురువుగారు, తోటివారు వచ్చి అతనికి సాయం చేసి ఆశ్రమానికి తీసుకొనిపోతూండగా అతను ఋషితో అన్నాడు - "భగవంతుడు అన్నింటా ఉన్నాడన్నారు మీరు! చూడండి, ఏనుగు నన్ను ఏం చేసిందో! " అని. "భగవంతుడు అన్నింటా ఉన్నాడనటంలో సందేహం లేదు నాయనా! ఏనుగులో ఖచ్చితంగా భగవంతుడు ఉన్నాడు. అయితే మావటిలోనూ భగవంతుడు ఉన్నాడు, ఆ భగవంతుడు "అడ్డుతొలుగు" అని నీకు చెప్తూనే ఉన్నాడు. ఆయన మాట ఎందుకు వినలేదు నువ్వు?" అన్నాడు ఋషి. Courtesy.. kottapalli.in

నేనే రాజవుత!

  నేనే రాజవుత!   ఒకసారి కుందేలుకు ఒక కోరిక పుట్టింది - తను అడవికి రాజునైతే బాగుండుననిపించింది. ‘ఎప్పుడూ సింహమే రాజు ఎందుకు అవ్వాలి? రాజవ్వటం అనేది వంశపారంపర్యం కాకూడదు. సింహమూ, దాని కొడుకూ, మళ్ళీ దాని కొడుకూ - ఇదే క్రమం అయితే మిగతా జంతువులకు అవకాశం రాదు గద!’ కొన్ని రోజులపాటు ఆలోచించిన పిమ్మట అది ఇక ఊరుకోలేకపోయింది. సింహంగారి దర్బారుకి వెళ్ళి అడిగేసింది - "సింహంగారూ! అడవికి మీరే ఎప్పుడూ రాజవ్వటం బాగాలేదు. మేమూ ఉన్నాం జంతువులం. మాకూ అవకాశం ఇవ్వండి." అని. సభికులంతా నివ్వెరపోయారు. సభంతా నిశ్శబ్దంగా వణికిపోయింది. సింహం ఇక కుందేలును రాజద్రోహ నేరంకింద శిక్షించి తీరుతుందని అందరూ ఊపిరి బిగపట్టారు. అయితే సింహం చిరునవ్వు నవ్వింది. "అవును మిత్రమా, మరిచాను. ప్రజాస్వామ్య భావజాలం పరుచుకున్న ఈ రోజుల్లో మేం ఇంకా ఇలా రాజసింహాసనాన్ని అంటిపెట్టుకు కూర్చోవడం బాగాలేదు. నీకే ఇస్తున్నా మొదటి అవకాశం. ఈ క్షణం నుండీ ఈ అడవి మొత్తానికీ సర్వం సహా చక్రవర్తివి నీవే. నేను నీకు వెన్నుదన్నుగా రాజ్యరక్షణ భారం వహిస్తాను." "అదికూడా అవసరం లేదు మిత్రమా! అన్నది కుందేలు రాజోచితంగా." రాజ్య రక్షణ ఇకపై మా బాధ్యత. మీరు అంత:పురంలో విశ్రాంతి తీసుకోండి, లేదా వనాంతాలకు వెళ్ళి తపస్సు చేసుకోండి." సభలోని వారికి ఎవరికీ నోటమాట రాలేదు. సింహం గద్దె దిగుతూ" ప్రజలారా! ప్రజాస్వామ్య భావనలను గౌరవిస్తూ మేం రాజపదవి నుండి తప్పుకొని, కుందేలుకు తొలి అవకాశం ఇచ్చాం. మీరంతా రాజౌన్నత్యాన్ని గౌరవిస్తూ మీ కొత్త రాజు పట్ల విదేయులుగా వర్తిస్తారనీ, వనశాంతిని సంరక్షించడంలో మీ బాధ్యతల్ని గుర్తించి మసులుకుంటారనీ ఆశిస్తున్నాను" అని ముగించి నిష్క్రమించింది. అందరూ కుందేలు మహారాజుకు జయం పలికారు. కానీ ఎవరికివారు నోళ్లు నొక్కుకున్నారు. ముఖ్యంగా పులి సేనాపతీ, గుంటనక్క మంత్రీ నోరు మెదపలేదు. వాళ్ళిద్దరూ చాలా రోజులుగా రాజ్యాన్ని కబళించే యోచనలోనే ఉన్నారు. ఇప్పుడు సింహమే తమ మార్గాన్ని సుగమం చేసింది! కుందేలు పని ముగించటం ఎంతసేపు? ఇలా సాగుతున్నాయి వాటి ఆలోచనలు. ఆ రోజు రాత్రి కుందేలుకు నిద్రపట్టలేదు. ప్రపంచం అంతా కొత్తగా అనిపిస్తోంది. తను తీసుకురావాల్సిన మార్పులు ఏమున్నాయని ఆలోచిస్తుండగానే తెల్లవారింది. అంతలోనే అంత:పురం గగ్గోలెత్తింది. పులి సేనానీ, గుంటనక్క మంత్రీ తిరుగుబాటు చేశారు. తమ బలాలతో కోటను పూర్తిగా ముట్టడించారు. కుందేలు మహా రాజు అత్యవసర సమావేశం నిర్వహించింది. పులికీ, నక్కకూ తానే స్వయంగా బుద్ధి చెబుతానన్నది. జన నష్టం తనకు ఇష్టంలేదు కనుక , ఒక్క ఏనుగుపైనెక్కి తాను తన ప్రతాపం చూపిస్తానన్నది. ఏనుగు పూర్తిగా తయారై, రాజుగారిని అంబారీమీద ఎక్కించుకొని, కోట తలుపులు తెరిచి, ముందుకు ఉరికింది. ఎదురుగా పులీ, నక్కా తమ సైన్యాలను మోహరించి నిలబడి ఉన్నాయి. ఏనుగు వాటికి ఎదురుగా నిలబడి, కుందేలు మహారాజు వేస్తానన్న శరపరంపరలకోసం ఎదురుచూస్తున్నది. కానీ ఆశ్చర్యం! ఒక్క బాణమూ రాలేదు! ఏనుగు తొండంతో తన వీపును తడుముకొని చూసింది. అక్కడ కుందేలు మహారాజు లేడు. శత్రుమూకల శబ్దానికి వెరచి ఏనాడో పలాయన మంత్రం పఠించారు వారు! బిక్కచచ్చిపోయిన ఏనుగు ప్రళయకాల ఘర్జనలా వినవచ్చిన సింహనాదంతో అకస్మాత్తుగా మేలుకున్నది. తన పక్కనే నిలబడి సింహం భీకరంగా గర్జిస్తున్నది. శత్రుసైన్య సమూహం ఆ గర్జనకు కకావికలై దారీతెన్నూ తెలీకుండా పరుగులు పెడుతున్నది! సింహం వారిని తరిమి, అందినవారిని అందినట్లు విసిరేస్తున్నది. పులి సేనానీ, గుంటనక్క మంత్రీ ఇక ఎవ్వరికీ కనిపించలేదు. కుందేలు కూడానూ! తిరిగి అడవిని సింహమే పరిపాలించవలసి వచ్చింది. అసమర్థులైన రాజులు రాజ్యానికి వన్నె తేలేరని అందరికీ మరోసారి తెలిసివచ్చింది. Courtesy.. kottapalli.in    

ఎర్ర గులాబీ

ఎర్ర గులాబీ - మోహనయ్య పచ్చని మొక్కల మధ్య విరపూయటానికి సిద్ధంగా ఉన్న ఎర్ర గులాబి పిల్లగాలికి చిరునవ్వులు చిందిస్తూ అటూ ఇటూ ఊగుతున్నది. ఆ దృశ్యాన్ని తన బుల్లి కళ్ళతో చూసింది సత్య. ఆ ఎర్ర గులాబి తన కళ్ళకు జిలేబీలా కనిపించింది. " భలే భలే గులాబీ, ఎర్ర ఎర్రని గులాబీ నాతో స్నేహం చేస్తావా? ముద్దుగ నిన్ను చూసుకుంటా". అంది సత్య . "ఆహా ! ఓహో! భలే భలే, నీతో నేస్తం కడతా ఓపాపా! నిన్ను మురిపిస్తాను, మైమరిపిస్తాను." అన్నది ఎర్ర గులాబి. సాయంత్రం తన తోటలోకి ఎర్ర గులాబి మొక్కని తెచ్చిపెట్టుకొని, ప్రతి రోజూ హాయిగా ఆడుతూ, పాడుతూ సంతోషంగా నీళ్ళు పోస్తూ పెంచుతున్నది సత్య. ఎర్రగులాబీని చూస్తూ అమ్మచేతి గోరుముద్దలు తింటూ హాయిగా గడపసాగింది ఆ పాప. మూన్నాళ్ళకు తన రేకులన్నింటినీ చూపిస్తూ పెద్దగా వికసించింది గులాబీ. ఆ ఉదయం పాప గులాబీని కోయబోయింది ఆత్రంగా.. పువ్వును తాకిందో లేదో అంతలోనే "అమ్మా" అంటూ తన చేతిని వెనక్కు తీసేసుకుంది బాధగా. వేలిమొన చురుక్కుమన్నది. చూస్తే ఎర్రని గులాబీని పోలిన రక్తపు బొట్టు ఒకటి నేలరాలింది. దాన్ని చూసిన పాపాయి గాబరాపడిపోయింది. అది చూసిన గులాబి, "అయ్యో నా నేస్తమా! నన్ను జాగ్రత్తగా కొయ్యాలమ్మా. ఓ బుల్లి పాపాయీ! నా రక్షణకోసం నేను కనపడని సిపాయిలలాంటి ముళ్ళను కలిగి ఉన్నాను. అవి లేకపోతే దొంగలు నన్ను సులభంగా తన్నుకుపోగలరు. అందుకని ఆత్మరక్షణ కోసం కొన్ని చిన్న ఏర్పాట్లు చేసుకొన్నాను" అని చెప్పింది గులాబి, పాపతో. "అబ్బో! ఇలాంటి ఏర్పాటు కూడా చేసుకున్నావా! ఇంత చిన్న బుర్రలో ఎన్ని తెలివితేటలో. అందుకే నువ్వంటే నాకెంతో ఇష్టం. నిన్ను చూస్తుంటే నాకెంత ముచ్చటేస్తున్నదో! మన దేశ నాయకులు కూడా నీలా ఆలోచించి అప్రమత్తంగా ఉండిఉంటే ఏ తీవ్రవాదులు గానీ, మరే విధ్వంశకర శక్తులుగానీ అమాయక జనాలను బలిగొనే పరిస్థితి ఉండేదికాదు. కానీ అలా జరగలేదే! మన దేశానికి పెద్ద గాయమే తగిలింది. అలా జరగకుండా ఆపడానికి ప్రయత్నించి, ఆ ప్రయత్నంలో తమ ప్రాణాలనే పోగొట్టుకొన్న వీర జవానుల పాదాల దగ్గర నిన్ను ఉంచి వారికి మన జోహారులు అర్పిద్దామనుకున్నాను. అందుకే నిన్ను కోయబోయాను. నన్ను క్షమించు." అన్నది సత్య. "అవునా! అలాంటి చోటుకు వెళ్ళడంకంటే నాకు ఇంకేం కావాలి? త్వరగా నన్ను కోసుకో పాపా! అక్కడికి వెళదాము" అన్నది ఎర్ర గులాబీ ఆత్రంగా.   Courtesy.. kottapalli.in  

దున్నపోతుల కథ

  దున్నపోతుల కథ     చాలా కాలం క్రితం దున్నపోతులు కూడా అడవిలోనే నివసించేవి. అవి చాలా బద్ధకంగా ఉండేవి, ఇతర జంతువులు తయారుచేసిన దారుల్ని వాడుకుంటూ ఉండేవి. ఇతర జంతువుల గడ్డిని దొంగతనంగా తినేవి, వాళ్ళ నీళ్ళన్నీ త్రాగేసేవి. అయితే అవి నీళ్లు త్రాగేవే కానీ ఎన్నడూ స్నానం మాత్రం చేసేవి కాదు. వాటికి తడవటమంటే అసలు ఇష్టం ఉండేదే కాదు, వానాకాలం వచ్చిందంటే చాలు- వానలో తడవకుండా ఉండటానికని ఎక్కడెక్కడికో వెళ్ళి దాక్కొనేవి. అవి శుభ్రంగా లేకపోయినా, కంపుకొడుతూ ఉన్నా, చూడటానికి మాత్రం చాలా అందంగా ఉండేవి. వాటి కొమ్ములు పొడుగ్గా వంపుతిరిగి ఉండేవి. వాటి శరీరం కూడా సున్నితంగా కండలతో బలిసి ఉండేది. మిగిలిన జంతువులు వీటి బలానికి భయపడి, వీటి కంపు భరించలేక వీటి నుండి దూరంగా ఉండేవి. కానీ ఒకసారి జంతువుల నెలసరి సమావేశంలో ఎవరో దున్నపోతుల గురించి పిర్యాదు చేసారు. అప్పుడు ఆ సమావేశానికి నాయకుడైన ఏనుగు అన్నది, "ఇప్పటికే ఆ జంతువులను చాల రోజులు భరించాము. ఇక చాలు. ఇప్పుడు ఇక ఆ జంతువుల గురించి ఏదైనా చేసే సమయం ఆసన్నమయింది అనుకుంటున్నాను, మీరందరూ ఏమంటారు?" అని. చాల మంది చాలా ఉపాయాలు, అభిప్రాయాలూ చెప్పినా, ఒక దుప్పి చెప్పినదే అన్నింట్లోకి బాగుంది. దుప్పి ఏమి చెప్పిందంటే, "మనలో బలంగా ఉండే పులిగారిని మన ప్రతినిధిగా నియమిద్దాం. పులి వెళ్లి దున్నపోతులకి ’స్నానం చేస్తూ ఉండమని, ఇతరుల తిండి తినకుండా ఉండమని, ఇతరుల నీళ్లు తాగకుండా ఉండమని, అందరూ కలసి చేసే పనుల్లో పాలుపంచుకొమ్మ’నీ చెప్పాలి. అయినా అవి వినక పోతే వాటిని అడవిలోంచి తరిమేద్దాం." అప్పుడు పులి దున్నపోతుల కోసం వెతుక్కుంటూ వెళ్లి, అవి కనిపించ గానే భయంతో ఒక చెట్టెక్కి "ఓ దున్నపోతులారా, మీకు వినిపిస్తోందా?" అని అరిచింది. దున్నపోతులు ఆశ్చర్యంగా తల పైకి ఎత్తి చూసాయి. అప్పుడు ఒక పెద్ద దున్నపోతు "అవును మాకు వినిపిస్తోంది. ఎవరవు నీవు, నీకు ఏంకావాలి?" అని అడిగింది. "నేను జంతువుల సమావేశం నుంచి ఒక సమాచారంతో వచ్చాను. మీరంతా మాతో కలసి పనిచేస్తూ ఉండాలని, గడ్డి తీసుకురావటం లో మాకు అందరికీ సహాయం చేస్తూ ఉండాలని, ప్రతిరోజూ స్నానం చేస్తూ ఉండాలని మేము అనుకుంటున్నాము. మీరు అలా ఉండకపోతే ఈ అడవిలో ఉండకూడదు" అని చెట్టు మీద ఉన్న పులి అన్నది. అది విన్న వెంటనే పెద్ద దున్నపోతు వెటకారంగా నవ్వి, "పోరా! మీకు నచ్చక పోతే, మీరే వేరే ఎక్కడికైనా వెళ్ళండి. మేము సామాన్య జంతువులం కాదు, చాలా బలవంతులం. మేము ఏమి చేయాలో మాకు ఎవ్వరూ చెప్పనవసరం లేదు. మాతో ఇంకోసారి పెట్టుకుంటే మిమ్మల్నందరినీ నాశనం చేస్తాం." అని అంది. పులి సమావేశానికి తిరిగి వచ్చి ఈ విషయం చెప్పింది. జంతువులన్నీ ఈ విషయం గురించి చర్చించటం మొదలు పెట్టాయి. అప్పుడు ఏనుగు నిశ్శబ్దంగా వుండమనటానికి సూచనగా డోలు మోగించి "స్నేహితులారా, మనం ఏమి చేయాలో చెప్పమని దేవుడిని ప్రార్ధిద్దాం" అన్నది. వాళ్లు అందరూ ప్రార్ధన చేశారు. అంతా నిశ్శబ్దంగా వుంది. అప్పుడు ఎక్కడినుంచో ఒక అదృశ్యవాణి వినపడింది: "జంతువులారా! మీరు చేసింది సమంజసమే. దున్నపోతులు చాలకాలం నుండీ తప్పులు చేస్తూ వున్నాయి. అ తప్పుల్ని సరి దిద్దుకునేందుకు కూడా ఏమాత్రం ప్రయత్నం చేయట్లేదు . వాటికి శిక్ష పడాల్సిందే. పులులన్నీ వెళ్లి దున్నపోతుల గుంపుపై దాడి చేయాలి." అని అన్నది. పులులన్నీ దాడి చేయటానికి బయలుదేరాయి. దున్నపోతుల గుంపు కనిపించగానే ముందే వేసుకున్న పధకం ప్రకారం దాడిని మొదలు పెట్టాయి. ఆ పోరాటంలో ఒక్క పులి కూడా గాయపడలేదు కానీ దున్నపోతుల పరిస్థితి మాత్రం ఘోరంగా అయిపోయింది. వాటి అందమయిన కొమ్ములన్నీ వెనక్కి వంగి పోయాయి. ఒళ్ళంతా గాయాలయ్యాయి. చాలా దున్నపోతులు చచ్చిపోయాయి. చావకుండా బ్రతికి ఉన్న దున్నపోతులన్నీ ఒక ఏరు వద్దకు చేరుకొని, నీళ్ళలో పడుకొని, గాయాలను మాన్పుకున్నాయి. అవి కోలుకునేందుకు కొన్ని రోజులు పట్టింది. తిరిగి బలం పుంజుకున్న తరువాత, ఏమి చెయ్యాలో నిర్ణయించు కోవటానికి అవి సమావేశమయ్యాయి. ముసలివి, తెలివైన దున్నపోతులన్నీ ’ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతే బాగుంటుంది” అని అంటే, కుర్ర దున్నపోతులన్నీ ’ఇక్కడే ఉండి జంతువులతో పోరాడాలి” అన్నాయి. దున్నపోతులన్నీ ఇలా వాదించుకుంటూ ఉంటే, అంతకుముందు ఇతర జంతువులకు వినిపించిన అదృశ్య వాణి వినబడి ఇలా శపించింది: "మీరు చేసిన తప్పులకు మీకు శిక్ష పడింది. కానీ ఇది శిక్షలో ఒక భాగం మాత్రమే. మీ అందానికి గర్వపడినందుకుగాను మీరు వికారంగా తయారగుదురు గాక. శుభ్రంగా లేనందుకుగాను బురదలో పొర్లుతూ ఉందురు గాక. దగ్గరలోని గ్రామాలకు వెళ్లి అక్కడ రైతులతో ఉండి, వాళ్ల పొలాలు దున్నుతూ ఉండిపోదురు గాక!"అప్పటి నుండి దున్నపోతులన్నీ వికారంగా తయారయ్యాయి. వాటి కొమ్ములు దేనికీ పనికిరాకుండా పోయాయి. అప్పటినుండీ అవి బురదలో పొర్లుతూ, పొలాలు దున్నుతూ ఉండిపోయాయి. Courtesy.. kottapalli.in