నక్క-పంది

నక్క-పంది   అనగనగా ఒక అడవిలో ఇద్దరు మిత్రులు ఉండేవి. ఒకటేమో పంది, రెండవదేమో నక్క. ఒకరోజున రెండూ కలిసి బయట మాట్లాడుకుంటూ‌ ఉన్నాయి. అంతలో అకస్మాత్తుగా పొదల్లోనుంచి పంది మీదికి దూకింది, ఒక చిరుతపులి! అది నేరుగా పంది మెడను పట్టుకొని కొరికి చంపెయ్యబోయింది. అంతలో నక్క చిరుతపులిని వారిస్తూ "చూడు మామా! నీకు ఆకలి వేస్తూన్నది; అయినా కొంచెం‌ మెదడును ఉపయోగించు. ఈ పంది చాలా‌ శుభ్రంగా ఉంది- చూసావు గదా. కానీ అసలు పందులంటే ఎలా ఉండాలి? మురికిగా ఉండాలి. శుభ్రంగా ఉండే పందులు రుచిగా ఉండవు. అందుకని ఆ తినేదేదో దీన్ని బురదలో దొర్లించి తిను! చాలా‌ రుచిగా ఉంటుంది" అని చెప్పింది.   "ఓహో! అట్లాగా!" అని చిరుతపులి పందిని ఆ ప్రక్కనే ఉన్న బురదగుంతలోకి తీసుకు పోయింది- దొర్లించడానికి. నక్క సైగల్ని అర్థం చేసుకున్న పంది, చిరుతపులి తనని బురదలో పడేసేంత వరకూ కదలకుండా ఊరుకొని, ఒకసారి బురదలో పడగానే రెండు కాళ్ళతోటీ టపటపా తన్ని, బురదనంతా చిరుతపులి ముఖాన పడేట్లు కొట్టింది. ఆ వెంటనే అది తుడుచుకునేలోగా తను మురికి గుంతలోంచి ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు చేరుకుని, ఇక వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయింది. "అయ్యో! మోసపోయానే!‌" అని నిట్టూరింది పులి.   తర్వాత కొన్ని రోజులకు, ఓసారి పంది బురదగుంతలో మునిగి తేలి, సంతోషంగా కళ్ళు మూసుకున్నప్పుడు, అప్పుడే దాన్ని చూసిన చిరుతపులి గబాలున వచ్చి, దాన్ని టక్కున నోట కరచుకున్నది. "ఇప్పుడు దొరికావు. బురద బురదగా ఉన్నావు. చాలా రుచిగా ఉంటావు!" అన్నది పళ్ళు నూరుతూ. "అయ్యో! మామా! ఇవి ఇప్పుడు ఏం రోజులు? అమావాస్య రోజులు! అమావాస్య రోజుల్లో బురదపందిని తిన్నవాళ్ళు పాతాళానికే పోతారు. నన్ను బాగా కడుక్కొని తిను, కావాలంటే" అన్నది తెలివి మీరిన పంది, దానితో.  "అవునా?! అట్లాగా?!" అని, చిరుతపులి దాన్ని నోట కరచుకొని, పారుతున్న వంకలోకి పోయింది.   అక్కడ దాన్ని వదలకుండానే శుభ్రంగా కడిగింది. అటుపైన దాన్ని నీళ్లలోనే తినబోయింది. సరిగ్గా ఆ సమయానికి అటుగా వచ్చిన నక్క దాన్ని చూసి "హలో! మామా! ఆ పందిని ఎండబెట్టు!‌ వెంటనే! ప్రమాదం!!" అని అరిచింది గట్టిగా. "ఎందుకు?" అన్నది పులి, ఒకింత అనుమానంగా. "అమావాస్య రోజుల్లో తడి పందిని తిన్నవాళ్ళు మూడు రోజుల్లో జరం వచ్చి పోతారని వినలేదా, నువ్వు?!" అన్నది నక్క సీరియస్‌గా ముఖం పెట్టుకొని. "లేదే?!" అన్నది పులి.   "నిజం! కావాలంటే సాంబుడిని అడుగు- ముందు దీన్ని ఎండలో వెయ్యి. నువ్వు ఆ ప్రక్కనే నిలబడి ఉంటావు కదా, అది ఎక్కడికి పోతుంది? కావాలంటే దాని పొట్టమీద నీ పంజా వేసి పెట్టు!" అన్నది నక్క తెలివిగా. 'సరే' అని పందిని నేలమీద పడేసి, తన పంజాని దాని పొట్టమీద వేసుకొని నిలబడ్డది పులి.  అట్లా కొంచెం సేపు ఆగి, తను కొంచెం ఆరుతూనే, పులి పంజాని పట్టుకొని చక్కలిగిలి పెట్టేసింది పంది, పులి చక్కలిగిలికి తట్టుకోలేక 'కికికి' అంటూ విరగబడగానే, చటుక్కున లేచి ఇంటికి పరుగుపెట్టింది, 'బ్రతుకు జీవుడా' అంటూ!  మరోసారి మోసపోయిన పులికి తను ఎవరివల్ల మోసపోయిందీ అర్థమే కాలేదు! - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

అల్లం రొట్టె అబ్బాయి..!

అల్లం రొట్టె అబ్బాయి..!   అనగా అనగా ఇంగ్లండులో ఒక అవ్వ, తాత, వాళ్లకో చిన్ని మనవడు ఉండేవాళ్ళు. ఒకరోజు ఉదయాన్నే అవ్వ 'మనవడి కోసం ఏం చేద్దాం?' అని ఆలోచించి, వాడికి నచ్చేట్లు గోధుమపిండిని సన్నగా ఒత్తి, మనిషిలాగే ఉన్న ఓ రొట్టె బొమ్మని చేసింది. వాడికి మైదాతో కళ్ళు, ముక్కు, రింగు రింగుల జుట్టు పెట్టి, చక్కగా ముడతలు ముడతలు ఉన్న బట్టలు కూడా వేసింది. మనలాగా వాళ్ళకు పెనాలు ఉండవు కదా, అన్నీ నిప్పుల కుంపట్లే. కాలాల్సిన రొట్టెల్ని నిప్పుల కుంపట్లలో వేసి మూత పెట్టేస్తారు. కొద్ది సేపటి తర్వాత మూత తీసి చూస్తే అవి తయారైపోయి ఉంటాయి. అట్లా అవ్వ ఈ రొట్టెని కూడా కుంపట్లో వేసి మూత పెట్టింది.   అయితే అంతలోనే ఆవిడకి తోటలో పని గుర్తుకొచ్చింది- మనవడితో "ఒరే! ఇవాళ్ల తోటలో చాలా పని ఉంది. తాత, నేను ఇద్దరం కలిసి చేసినా కూడా టైము చాలుతుందో, లేదో మరి. నువ్వు ఈ రొట్టె మాడిపోకుండా అట్లా ఓ కన్ను వేసి ఉంచావంటే, నేను పోయి నిశ్చింతగా తోట పని చేసుకుంటాను" అన్నది. మనవడు మంచోడు. "నువ్వు పోయిరావ్వా, నేను చూసుకుంటాగా! రొట్టెని కాల్చటం అదేమంత పెద్ద పని?!" అన్నాడు.    దాంతో అవ్వ, తాత ఇద్దరూ పారా తట్టా పట్టుకు పోయి, తోటలో ఆలుగడ్డలు త్రవ్వటం మొదలు పెట్టారు. పిల్లాడు కుంపటి ప్రక్కనే కళ్ళు మూసుకు కూర్చొని, తను మామూలుగా ఎప్పుడూ కనే పగటి కలల్నే మళ్ళీ కనసాగాడు. అంతలో అకస్మాత్తుగా టప్పుమని ఏదో శబ్దం అయింది. మనవడు పిల్లాడు ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూసాడు. నిప్పుల కుంపటి తలుపు బార్లా తెరిచి ఉన్నది. అందులో ఉండాల్సిన రొట్టె లేదు! క్రింద, నేలమీద బోర్లా పడి ఉన్నది! మనవడు దాన్ని అందుకోబోయాడు. అయితే అంతలోనే అది- కాదు- వాడు..! ఆ అల్లం రొట్టె అబ్బాయి! వాడు లేచి పరుగు పెట్టాడు! తెరిచి ఉన్న తలుపువైపుకు పరుగెత్తాడు నేరుగా!   పిల్లాడు చటుక్కున ముందుకు దూకాడు- తలుపు వేసేద్దామని. కానీ అల్లం రొట్టె అబ్బాయి వాడికంటే ముందే అక్కడికి చేరుకున్నాడు. తలుపు రెక్క పడేలోగానే దాని క్రిందినుండి జారి, అవతలికి పోయాడు. ఇంటి మెట్లు గబగబా దిగేసి, పిల్లాడు కళ్ళుమూసి తెరిచే సరికి రోడ్డు వైపుకు పరుగెత్తుతూ కనబడ్డాడు! "అవ్వో! తాతో! వీడు పారిపోతున్నాడు! ఈ అల్లం రొట్టె అబ్బాయి పారిపోతున్నాడు, పట్టుకోండి!‌పట్టుకోండి!" అని అరుస్తూ వాడివెంట పరుగు పెట్టాడు మనవడు. ఇంటి ముందు తోటలో పని చేసుకుంటున్న అవ్వ తాత "ఏమైంది?!" అని చూసే సరికే అల్లం రొట్టె పిల్లాడు రోడ్డు ఎక్కేసాడు. వెంటనే వాళ్ళు కూడా తమ చేతుల్లో ఉన్న పారలూ, పలుగులూ ప్రక్కన పడేసి మనవడి వెంట, ఆ అల్లం రొట్టె అబ్బాయి వెంట పడ్డారు.   అయినా పెద్దవాళ్ళు కదా, కొంచెం పరుగెత్తే సరికి వాళ్ళు కాస్తా అలిసిపోయి, ఆయాసపడటం మొదలు పెట్టారు. అక్కడ దారిలో ఉన్న ఓ కల్వర్టు మీద కూర్చుండిపోయారు. అల్లం రొట్టె అబ్బాయిని అందుకోలేని మనవడు కూడా నిరాశగా వెనక్కి వచ్చి వాళ్లకి అత్యవసర సేవలు చేసాడు. అట్లా వాళ్లనుండి తప్పించుకున్న అల్లం రొట్టె అబ్బాయి కులాసాగా ఈల వేసుకుంటూ రోడ్డమ్మట నడుస్తూ పోతుంటే అక్కడ బావి త్రవ్వుతూ కనబడ్డారు ఓ‌ ఇద్దరు మనుషులు. వాళ్లకి అల్లం రొట్టె అబ్బాయిని చూస్తే ముచ్చట వేసింది. "ఎటుపోతున్నావు బాబూ, నువ్వు అల్లం రొట్టె అబ్బాయీ?! అడిగారు వాళ్ళు. "అవ్వనూ, తాతనూ, వాళ్లిద్దరి మనవడినీ ఒక్క దెబ్బకు ఓడించాను ఇదిగో, బావిని త్రవ్వే బావన్నలూ, మీ ఇద్దర్నీ కూడా ఇప్పుడే ఓడించేస్తాను నేను! జూ…..మ్ " అని వాళ్లని దాటుకొని పరుగు పెట్టాడు అల్లం రొట్టె అబ్బాయి. "ఓహో! అవునా?! అంత గొప్పవాడివా? మేమూ చూస్తాం!" అని వాళ్ళిద్దరూ తమ చేతుల్లోని పికాసులూ పారలూ ప్రక్కన పడేసి వాడి వెంట పడ్డారు. అయితే అల్లం రొట్టె అబ్బాయి శరీరం తేలిక. వాడి కాళ్ళలో సత్తువ కూడా చాలా ఎక్కువ. దాంతో కొద్ది సేపట్లోనే వాళ్ళ చేతికి అందనంత దూరం వెళ్ళిపోయాడు వాడు. బావిని త్రవ్వేవాళ్లిద్దరూ కూడా అలిసిపోయి మధ్యదారిలో కూలబడ్డారు.   అల్లం రొట్టె అబ్బాయి అట్లా పోయి పోయి ఓ అడవిలోకి దూరాడు. వెంటనే వాడికో ఎలుగుబంటి ఎదురైంది. అది చేతులు చాపి వాడిని అందుకోబోతూ "ఏయ్! అల్లం రొట్టె అబ్బాయి! ఎటు పోతున్నావు నువ్వు?" అన్నది. వాడు దానికి అందకుండా తప్పించుకొని "అవ్వనూ, తాతనూ, వాళ్లిద్దరి మనవడినీ, బావిని త్రవ్వే బావన్నల్నీ ఒక్క దెబ్బకు ఓడించాను! నాకు నువ్వో‌ లెక్కా, నిన్ను కూడా ఇప్పుడే ఓడించేస్తాను నేను! జూమ్..... " అంటూ పరుగు పెట్టాడు. "అవునా? అంత గొప్పవాడివా? నీ పని చెప్తాను ఆగు!" అంటూ వాడి వెంట పడింది ఎలుగుబంటి.   "ఓసోస్! చాలా చూసాను. రా! నన్ను పట్టుకో!" అంటూ పరుగెత్తిన అల్లం రొట్టె అబ్బాయిని అందుకోలేక, త్వరలోనే చతికిలబడింది ఎలుగుబంటి "అయ్యో! అనవసరంగా వీడి వెంట పడ్డానే, ఈ మాత్రం పరుగెత్తితే ఇంకే జంతువైనా దొరికిపోయేది గదా, నాకు!" అనుకుంటూ. దాన్ని కూడా ఓడించే సరికి అల్లం రొట్టె అబ్బాయికి చాలా సంతోషం వేసింది. వాడు కులాసాగా పాటలు పాడుకుంటూ, అటూ ఇటూ చూసుకుంటూ పోసాగాడు.   ఈసారి వాడికి ఓ తోడేలు ఎదురైంది. అది వాడిని అందుకునేందుకు చెయ్యి చాపుతూ "ఓయ్! ఓయ్! ఎటుపోతున్నావోయ్! అందాల అల్లపు రొట్టె అబ్బాయీ?" అంది. "అవ్వనూ, తాతనూ, వాళ్లిద్దరి మనవడినీ, బావిని త్రవ్వే బావన్నల్నీ, దుబ్బ ఎలుగునీ ఒక్క దెబ్బకు ఓడించాను! నాకు నువ్వో‌ లెక్కా, నిన్ను కూడా ఇప్పుడే ఓడించేస్తాను నేను చూడు! జూ...మ్‌.." అంటూ దానికి దొరక్కుండా తప్పించుకుపోయాడు అల్లపు రొట్టె అబ్బాయి. "ఓహో! అంత తురుంగాడివేమి?! నేను నిన్ను పట్టుకుంటా చూడు!" అని వగరుస్తూ వెంటపడింది తోడేలు. కానీ ఎంత పరుగెత్తినా అల్లం రొట్టె అబ్బాయి మటుకు దాని చేతికి చిక్కలేదు. చివరికి అదికూడా విరమించుకొని, తన దారిన తాను పోయింది. దాంతో అల్లం రొట్టె అబ్బాయికి చాలా గర్వం అనిపించింది. "ప్రపంచంలో ఎవ్వరూ.. నన్నింక పట్టుకోలేరూ.." అని గట్టిగా పాటలు పాడుకుంటూ పోయాడు వాడు. అంతలో వాడికో నక్క కనిపించింది. ఓ ముళ్ళ కంచెకి ఇవతలగా ముడుచుకొని పడుకొని ఉన్నది అది. జ్వరం వచ్చినట్లుంది; ముసలి గొంతు వణుకుతుండగా "ఎటు పోతున్నావబ్బీ! అల్లం రొట్టె అబ్బాయీ?" అన్నదది.    "అవ్వనూ, తాతనూ, వాళ్లిద్దరి మనవడినీ, బావిని త్రవ్వే బావన్నల్నీ, దుబ్బ ఎలుగునీ, కోరపళ్ల తోడేలుగాడినీ కూడా ఒక్క దెబ్బకు ఓడించాను! నాకు నువ్వో‌ లెక్కా, నిన్ను కూడా ఇప్పుడే ఓడించేస్తాను నేను చూడు! జుయ్..." అంటూ పారిపోబోయాడు వాడు కానీ "అంత గడగడా మాట్లాడితే అర్థం ఎట్లా అవుతుంది, అల్లం రొట్టె అబ్బాయీ? నాకేం వినబడలేదు- నువ్వేమన్నావు?" అన్నది నక్క, కదలకుండానే. దాంతో అల్లం రొట్టె అబ్బాయి జోరు కొంచెం తగ్గింది. "అవ్వనూ, తాతనూ, వాళ్లిద్దరి మనవడినీ, బావిని త్రవ్వే బావన్నల్నీ, దుబ్బ ఎలుగునీ, కోరపళ్ల తోడేలుగాడినీ కూడా ఒక్క దెబ్బకు ఓడించాను! నాకు నువ్వో‌ లెక్కా, నిన్ను కూడా ఇప్పుడే ఓడించేస్తాను నేను చూడు!" గొంతు పెంచి, ఇంకొంచెం గట్టిగా అరిచి, నక్క కదులుతుందేమో అని జాగ్రత్తగా నిక్కి చూసాడు వాడు. "ఆఁ..? ఏమంటున్నావు?  అవ్వనా?" అన్నది నక్క, ఒక కన్ను తెరిచి, ఇంకా కదలకుండానే.   "ఏదోలే, పో.. నీ దారిన నువ్వు పో... నువ్వు గొణుక్కునేదేమీ ఎలాగూ నాకు వినబడదులే గానీ, నీ దారిన నువ్వు పో.. గొంతులేని వెర్రి రొట్టెముక్కా!" అని గొణిగిందది. అల్లం ముక్క అబ్బాయికి కోపం వచ్చింది. గొంతు పెంచి, నక్క చెవి దగ్గర నోరు పెట్టి, చాలా గట్టిగా "అవ్వనూ, తాతనూ, వాళ్లిద్దరి మనవడినీ, బావిని త్రవ్వే బావన్నల్నీ, దుబ్బ ఎలుగునీ, కోరపళ్ల తోడేలుగాడినీ కూడా ఒక్క దెబ్బకు ఓడించాను! నాకు నువ్వో‌ లెక్కా, నిన్ను కూడా ఇప్పుడే ఓడించేస్తాను నేను చూడు!" అని అరవబోయాడు. కానీ వాడి మాటలు పూర్తవ్వనిస్తేగా? నక్క చటుక్కున తల తిప్పి, లటుక్కున వాడిని కరిచి పట్టుకొని, ఆపైన మెల్లగా కరకరామనుకుంటూ తినేసింది!! "అయ్యో! ఎంత ఘోరం జరిగింది?! అల్లం రొట్టె అబ్బాయికి, పాపం!" అని బాధ పడుతున్నారా? అదేమీ లేదు. "అల్లం రొట్టె ఎంత బాగుంటుందంటే, దాన్ని తినకుండా ఉండటం అసలు ఎవ్వరి తరమూ కాదు. చూసినవాళ్ల నోర్లన్నీ‌ ఊరతాయి. నక్కకు మాత్రం నోరూరదా? నాకు దొరికితే నేనూ తినేస్తాను మరి!" ... నిజం చెప్పండి: మీరూ అంతే! కదూ?! - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

ఎవరు గొప్ప

ఎవరు గొప్ప   అనగా అనగా ఒక ఊళ్ళో ఐదుగురు మాంత్రికులు ఉండేవాళ్ళు. ఒక రోజున ఆ ఐదుగురు మాంత్రికులూ వేరే ఊరికి బయలు దేరారు. అట్లా పోతూ ఉంటే, వేగంగా పారే నది ఒకటి అడ్డు వచ్చింది వాళ్ళకు. నదికి వరద వచ్చి ఉన్నది. ఎటు చూసినా అలవికానన్ని నీళ్ళు! దాటేదెలాగ?    వాళ్ళలో ఒకడు అన్నాడు: "చూడండి, మనందరం మామూలు మనుషులం కాదు. టక్కుటమార విద్యలు నేర్చిన మహా మాంత్రికులం. కనుక మనందరం ఇప్పుడొక పోటీ పెట్టుకుందాం. ఎవరైతే మంచిగా, తెలివితో ఈ నదిని దాటి అవతలి ఒడ్డుకు చేరుకుంటారో, మనందరిలోకీ‌ వాళ్ళే గొప్ప మాంత్రికులు!" అని. అందరూ సరేనన్నారు.   మొదట ఒకడు నదిని మొత్తాన్నీ ఒక సీసాలో బంధించేసాడు. ఇసకలో నడుచుకుంటూ అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు. ఆ తర్వాత సీసా మూత తీసి, నదిని వదిలేశాడు. రెండవ వాడు నవ్వాడు. తన చెప్పుల్ని తీసి ముందు పెట్టుకున్నాడు. ఏవేవో మంత్రాలు చదివాడు. తర్వాత ఆ చెప్పులు వేసుకొని,నీళ్ళమీదనుండి మామూలుగా నడుచు-కుంటూ పోయాడు!   మూడవవాడు తన తుండుగుడ్డనొకదాన్ని తీసి ముందు పెట్టుకున్నాడు. ఏవో మంత్రాలు చదివాక, దాన్ని నడుముకు కట్టుకున్నాడు. ఆ వెంటనే గాలిలోకి లేచి, అలవోకగా నదిని దాటేసాడు! నాలుగో వాడు ఊపిరిని బాగా పీల్చి నది మీదికి ఊదాడు. నది అంతా గింగిరాలు తిరిగి, మొత్తంగా ఆవిరైపోయింది! ఒకసారి వాడు దాటాక, ఆవిరైన నీళ్లన్నీ తిరిగివచ్చి నదిలో పడ్డాయి.   ఐదో వాడు మంత్రాలు చదివేటప్పటికి నదికి అవతల అడవిలో ఉన్న చెట్లు ఒక వంద, అక్కడికి వచ్చి చేరుకున్నాయి. ఆ చెట్లతో వంతెన కట్టి, కులాసాగా నడచుకొంటూ నదిని దాటాడు అతను! బేతాళం ఇంతవరకూ చెప్పి, "ఇప్పుడు చెప్పు విక్రం, వీళ్ళలో ఏవరుగొప్ప? ఎందుకు?" అని అడిగింది.   విక్రం కొంచెం ఆలోచించి, "బాగున్నది బేతాళం. వీళ్లు ఐదుగురూ మంత్రగాళ్ళే. సాధారణ మానవులకు అతీతమైన శక్తులు వీళ్ళకు ఉన్నై. వీళ్ళు నదిని సీసాలో బంధించగలరు; నీళ్ళమీద నడవగలరు. గాలిలో ఎగరగలరు; నదిని మొత్తంగా ఆవిరి చేయగలరు! ఐతే ఈ నాలుగు శక్తులూ కేవలం ఆయా మంత్రగాళ్ళకు మాత్రమే ఉపయోగపడతాయి తప్ప, ఇతరులెవ్వరికీ వాటి ఫలాలను ఆస్వాదించే అవకాశం లేదు.    ఐతే ఐదోవాడు ఉపయోగించిన వంతెన శక్తి వీటికి భిన్నమైనది. వంద చెట్లను పోగొడితే పోగొట్టింది గాని, తర్వాత పది కాలాలపాటు జనాలు ఉపయోగించుకునేందుకు తగిన వంతెననైతే ఇచ్చింది అది! అందుకని, సందేహంలేదు- వీళ్ళలో ఐదోవాడే గొప్పవాడు!" అన్నాడు.   విక్రం మౌనం భంగం అవ్వటంతోటే బేతాళం అతని చేతుల్లోంచి తప్పించుకొని మళ్ళీ చెట్టెక్కి కూర్చున్నది! - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

క్రిస్మస్ భూతాలు..

క్రిస్మస్ భూతాలు..!   అనగనగా ఒక వేటగాడు ఉండేవాడు. అతనికి ఒకసారి ధృవపు ఎలుగుబంటి పిల్ల ఒకటి దొరికింది. నిండా దట్టంగా ఊలుతో, అమాయకంగా ముద్దు గొలుపుతూ ఉండిందది. ఒక్క మచ్చలేకుండా మంచులాగా మొరిసిపోతున్న ఆ చిట్టి పిల్లని చూసేసరికి వేటగాడికి ముచ్చట వేసింది. అతను దానిని చాలా ఇష్టంగా పెంచుకోసాగాడు. సొంత బిడ్డలాగా పెంచుతూ, దానిని రకరకాల విన్యాసాలు వగైరాలు నేర్పాడు. అది రెండు కాళ్ల మీద నడిచేది, ఒంటి కాళ్ల మీద డాన్సు చేసేది, ఎవరైనా మెచ్చుకుంటే వంగి అభివాదం కూడా చేసేది! కొన్నేళ్లకు అది బాగా పెద్దదైంది. అది ఎంత సాధువంటే, ఇప్పుడు అది వేటగాడిని తన వీపు మీద ఎక్కించుకొని మంచు కొండల మీదంతా త్రిప్పేది!! ఒకరోజున దాన్ని చూసి వేటగాడు అనుకున్నాడు- "ఇప్పుడు ఇది చాలా పెద్దదైంది. నా దగ్గర ఉండేకంటే డెన్మార్క్ దేశపు రాజు గారి దగ్గర ఉంటే దీనికి మర్యాద, మన్నన. బహుశా ఆయన నాకు తిరిగి ఇంకా గొప్ప బహుమానం కూడా ఇవ్వచ్చు!" అని. ఆ సంవత్సరం నవంబరు నెలలో బయలుదేరి అతను నార్వే మీదుగా డెన్మార్కుకు ప్రయాణం కట్టాడు. మంచు కొండల్లోంచి వేగంగా వీచే ఈదురు గాలులు, చెలరేగే మంచు తుఫానులు అతని ప్రయాణాన్ని ఘోరంగా అడ్డుకున్నాయి. దాంతో క్రిస్‌మస్ నాటికి అతను ఇంకా డోవర్‌ఫెల్‌లోనే ఉన్నాడు! (మధ్య నార్వేలోని ఒక కొండ ప్రాంతం అది!)   ఆరోజు చీకటి అయింది. వాతావరణం అయితే ఇంకా చాలా చల్లగా ఉంది. వేటగాడికి ఆ రాత్రి ఎక్కడ గడపాలో కూడా అర్థం కాలేదు. అంతలో కొంచెం దూరంగా పొదలమాటున ఒక కుటీరం కనిపించింది. వేటగాడు ఆ ఇంటి దగ్గరకు వెళ్లి తలుపు తట్టి మర్యాదగా "నేను, నా చక్కని ఈ ఎలుగుబంటి- ఇద్దరమూ కోపెన్‌హాగన్‌కు పోతున్నాం. డెన్మార్క్ రాజుగారికి ఈ ఎలుగుబంటిని బహుమతిగా ఇవ్వాలని నా ఉద్దేశ్యం. అయితే దారిలో ఇక్కడే చీకటి అయింది. ఈ క్రిస్‌మస్ రాత్రిని మీ ఇంట్లో గడిపేందుకు ఏదో ఒక మూలన మాకు ఇంత చోటు ఇచ్చారంటే, మీ పుణ్యాన్ని మరచిపోను" అన్నాడు. తలుపు తీసిన ఇంటి యజమాని పేరు హాల్వర్. అతనన్నాడు "బాబూ! నేను చెప్తున్నది నిజం అని ఆ పైవాడికి ఒక్కడికే ఎరుక- కానీ సంగతేమంటే, మేం బయటి వాళ్లనెవ్వరినీ, ఈ రోజు రాత్రికి మటుకు- ఇక్కడ ఉండనిచ్చే అవకాశం లేదు. ఎందుకంటే, ప్రతి క్రిస్‌మస్ నాటి రాత్రీ మా ఇంటికి ఒక భూతాల గుంపు వస్తూ ఉంటుంది. వాటికి బెదురుకొని ఈ రాత్రంతా మేం- ఇంటి వాళ్లమే, ఓ గదిలో దూరి, వణుక్కుంటూ కాలక్షేపం చేస్తుంటాం; ఇక మీకు చోటు ఎక్కడ ఇవ్వగలం? అందునా అతిథులను అట్లాంటి భయంకరమైన అనుభవాలకు గురిచేయటం మాకు ఏం బాగుంటుంది చెప్పు?” అన్నాడు. "అంతేనా?!" అన్నాడు వేటగాడు తేలికగా. "మాకు భూతాలు అంటే ఏం భయం లేదు. నా ఈ పెంపుడు ఎలుగును కుంపటి క్రింద ముడుచుకొని పడుకోనివ్వండి. నేను ఆ ప్రక్క గదిలో పడుకుంటాను. మీరెవ్వరూ మా గురించి చింత పడకండి. మమ్మల్ని మర్చిపోండి!" అన్నాడు. "సరే నీ ఇష్టం!" అన్నాడు ఇంటి యజమాని, వాళ్ళని లోనికి రానిస్తూ. "కానీ నేను ముందుగా చెప్పలేదు" అని మాత్రం అనకు. భూతాలు నిన్ను ఏం చేసినా నీదే బాధ్యత సుమా!" వేటగాడు, ఎలుగుబంటి లోపలికి వెళ్లే సరికే ఇంట్లో వాళ్లు ఓ పెద్ద క్రిస్‌మస్ విందును తయారుచేసి టేబుల్ మీద పెట్టి ఉన్నారు. ఉడకబెట్టిన చేపలు, క్యాబేజ్ ఊరగాయ, ధృవపు జింక మాంసం, క్రిస్‌మస్‌కు ప్రత్యేకంగా చేసే పాయసం- అన్నీ అందంగా పెట్టి ఉన్నాయి. "ఇవన్నీ ఇదిగో, మాకు దాపురించబోయే భూతాల కోసమే! ఇక మీరెవరో మాకు తెలీదు! మీ క్షేమం మీరు చూసుకోవాలంతే!" అని ఇంట్లో వాళ్లు అందరూ ఓ మూల గదిలోకి పోయి తలుపులు మూసేసుకున్నారు. కొంచెం సేపు అటూ ఇటూ తిరిగి చూసుకొని వేటగాడు-ఎలుగుబంటి కూడా కొద్దిగా కునుకుతీశారు.   అర్ధ రాత్రి కావస్తుండగా అనుకున్నట్లే భూతాల గుంపు ఒకటి వచ్చి పడింది! ఆ భూతాలు ఎట్లా ఉన్నాయో ఏమని వర్ణించాలి!? కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవి, కొన్నింటికి పొడవాటి తోకలున్నాయి, కొన్నింటికి అయితే అసలు తోకలే లేవు. కొన్నింటికి చాలా చాలా పొడవైన ముక్కులున్నాయి. కాని వాటికి వేటికీ ఏ కొంచెం కూడా మర్యాదలు లేవు. అవన్నీ ఇష్టం వచ్చినట్లు తిన్నాయి; త్రాగాయి; పాటలు పాడాయి; డాన్సులు చేశాయి; అటూ ఇటూ దూకాయి; పదార్థాలన్నింటినీ తన్ని తగలేశాయి; గ్లాసులు పగలగొట్టాయి, గది అంతటా వీరంగం చేశాయి! అట్లా చాలా సేపు జరిగాక పిల్ల దయ్యం ఒకటి కుంపటి క్రిందికి వంగి చూసింది. చిన్న మాంసపు ముక్కను ఒకదాన్ని గుచ్చి పట్టుకొని, అక్కడ ప్రశాంతంగా నిద్రపోతున్న ఎలుగుబంటి ముక్కులోకి గ్రుచ్చుతూ "ఏయ్ పిల్లీ! పిల్లీ! ఇదిగో నీకో మాంసపు ముక్క" అని పాడటం మొదలుపెట్టింది. ఎలుగుబంటి ఏం చేసినా భరిస్తుంది కానీ, నిద్ర లేపితే మాత్రం అది అస్సలు ఊరుకోదు. పిల్లదయ్యం చేష్టలకు ఉలిక్కిపడి నిద్ర లేచిన ధృవపు ఎలుగుబంటి తటాలున దాని మెడను ఒడిసి పట్టుకొని, భయంకరంగా గర్జిస్తూ లేచి నిలబడ్డది! అంతెత్తున లేచి అది ఒళ్లు విరుచుకుంటే, దాని చేతిలోని పిల్లభూతం కీచు కీచు మని మొత్తుకుంటే, వణికి పోయిన భూతాలన్నీ చెల్లా చెదురుగా, కనబడ్డ దారి గుండా భయటికి పరుగెత్తాయి! మర్నాటి రోజున తలుపు తీసిన హాల్వర్‌కు, అతని కుటుంబ సభ్యులకు ఏం జరిగిందో చెప్పి, నవ్వుతూ సెలవు పుచ్చుకున్నారు వేటగాడు-ఎలుగుబంటి. ఆ తర్వాతి సంవత్సరం క్రిస్‌మస్ రోజు- మధ్యాహ్నం సమయంలో- ఇంటి యజమాని పొయ్యిలోకి కట్టెలు ఏరుకుంటూ ఉన్నాడు. అప్పటికే ఇంట్లో వాళ్లు వంటలు కూడా మొదలు పెట్టి ఉన్నారు- ప్రతిసారి లాగే ఈసారీ రాబోయే భూతాలకోసం. అంతలో అతని వెనక ఉన్న చెట్లలోంచి గుసగుసగా ఓ గొంతు వినిపించింది: "హాల్వర్! హాల్వర్!” అని. అతను వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఉన్నది ఒక కుర్ర భూతం! "హాల్వర్! నీ ఆ పెద్ద పిల్లి- అది ఇంకా నీ దగ్గరే ఉందా?" అడిగింది ఆ భూతం, భయం భయంగా, కొద్దిగా వణుకుతున్న గొంతుతో. "ఓ ఉన్నది! అదెక్కడికి పోతుంది?” అన్నాడు హాల్వర్ చిరునవ్వుతో. "అది ఇంకా కుంపటి క్రిందే పడుకొని ఉంది. ఈ ఏడాది దానికి ఇంకో ఏడు పిల్లలు పుట్టాయి; అవన్నీ దానికంటే పెద్దగా అయ్యాయి; దాని కంటే తిక్కగానూ, కోపంగానూ ప్రవర్తిస్తున్నాయి. అయినా మీరు రాత్రి భోజనానికి వస్తారుగా, అవన్నీ‌ మీకు పరిచయం అవుతాయిలేండి.." “-అయ్యో, అది చెప్పేందుకే వచ్చాను- విను! " అన్నది భూతం- "ఇక మీద మేం క్రిస్‌మస్‌కి మీ ఇంటికి రాలేము- మమ్మల్ని క్షమించు. ఏమీ అనుకోకు; ఇది చెప్పేందుకే వచ్చాను నేను!" అని ఆ భూతం చటుక్కున మాయమైపోయింది! అది విన్నాక హాల్వర్, అతని కుటుంబ సభ్యులు అందరూ సంతోషంతో చిందులు వేశారు- ఎందుకంటే వాళ్లకు ఏనాడూ ఇంత మంచి క్రిస్‌మస్ బహుమతి దొరకలేదు మరి! కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

సింహం-నక్క-ఎలుగుబంటి...!

సింహం-నక్క-ఎలుగుబంటి...!   గండకీ నదీ తీరంలో దట్టమైన ఒక అడవి ఉండేది. ఆ అడవిలో ఒక నక్క- ఎలుగుబంటు చాలా అన్యోన్యంగా ఉండేవి. నక్క ముసలిది- సొంతగా ఆహారం సంపాదించుకునే శక్తి దానికి ఇప్పుడు లేదు. ఎలుగుబంటిది మంచి మనసు. తనకి దొరికిన ఆహారంలో తన మిత్రుడైన నక్కకూ కొంచెం పెట్టేది అది. ఒకనాడు నక్క , ఎలుగుబంటి కలసి ఆహారం కోసం అడవిలో తిరుగుతూండగా ఆకలిగొన్న సింహం ఒకటి వీటికి ఎదురైంది. పరిస్థితిని గమనించిన ఎలుగుబంటి, నక్కతో "మిత్రమా, నక్కా! నువ్వేమో ఇప్పుడు పెద్దగా ఎటూ కదలలేని పరిస్థితుల్లో ఉన్నావు. ఆ సింహమేమో ఆకలిగొని ఉన్నది; మన వైపే వస్తోంది- దానికి చిక్కామంటే అంతే. అందుకని నువ్వు నా వీపును కరచుకో; నేను ఈ మహావృక్షాన్ని ఎక్కుతాను" అన్నది. ఆ సరికే భయంతో వణుకుతున్న నక్క ఎలుగుబంటి మాటలు వినగానే తటాలున దాని వీపును కరచుకున్నది. ఎలుగుబంటి చకచకా చెట్టు ఎక్కేసింది! చెట్టుపైన కొమ్మల్లో ఎలుగుబంటి-నక్క కదలక మెదలక ఉండగా చెట్టుకింద సింహం వాటివైపే చూస్తూ కూర్చున్నది. ఎలుగు-నక్క చెట్టు దిగలేదు. సింహం ఎంతకీ పక్కకు కదలలేదు. 'ఇంక కుదరదు' అనుకున్న ఎలుగుబంటి, చెట్టుపైనే కొన్ని కొమ్మలు విరిచి, పడుకోవడానికి ఒక పక్కను ఏర్పాటుచేసింది. చీకటిపడ్డాక అది నక్కతో- "మిత్రమా! సింహం పంతం కొద్దీ ఇక్కడే కూర్చున్నది. ఇంత పెద్ద చెట్టును అది ఎక్కలేదు. అయినా ఈ రోజంతా మన జాగ్రత్తలో‌ మనం‌ ఉండాలి. మనలో ఒకరు నిద్రిస్తే, ఇంకొకరు కాపలాగా మేలుకొని ఉండాలి" అన్నది. నక్క సరేనన్నది. అప్పుడు ఎలుగుబంటి "వయసు పైబడ్డ దానివి- ముందు నువ్వు నిద్రపో. అర్ధరాత్రి దాటాక నిన్ను నిద్ర లేపి, ఆపైన నేను నిద్రపోతాను- నువ్వు కాపలా కాద్దువు" అని నక్కతో అన్నది. నక్క సరేనని గాఢంగా నిద్రపోయింది. ఎలుగుబంటి కాపలా కాస్తూ కూర్చున్నది.   చెట్టుక్రిందనే వీటికోసం ఆశగా ఎదురు చూస్తూ కూర్చున్న సింహం కొంతసేపు అయ్యాక ఎలుగుబంటితో అన్నది- "ఓ మిత్రమా, ఎలుగు బంటీ! నువ్వు ఆ ముసలి నక్కకి కాపరివని నాకు తెలుసు. అయినా నా మాట విను- నువ్వు గానీ ఆ నక్కను కిందకి తోసేశావంటే, నేను దాన్ని తినేసి వేరే అడవికి వెళ్ళి పోతాను. అట్లా నా ఆకలీ తీరుతుంది; నీకు ఆ ముసలినక్కకు ఆహారం తెచ్చిపెట్టే బరువూ తగ్గుతుంది" అని. ఎలుగుబంటి టక్కున జవాబిచ్చింది- "చూడు, సింహరాజా! ఈ ముసలి నక్క నాకు ఎంత మాత్రమూ భారం కాదు. నేను తినే ఆహారంలో కొంచెం మాత్రమే దానికి ఇస్తున్నాను. అది నన్నే నమ్ముకుని బ్రతుకుతోంది. నామీద నమ్మకంతో అది ఎంత హాయిగా నిద్రపోతోందో చూడు. ఏ జీవికీ నిద్రాభంగం కలిగించకూడదు. అది మహా పాపం. నిద్రలోనే కదా, అన్ని ప్రాణులూ బడలికను పోగొట్టుకొని హాయినీ, సుఖాన్నీ పొందేది? నేను దీన్ని మోసం చేయటం అసంభవం. ఎన్ని రోజులైనా సరే, నన్ను నమ్మిన ఈ నక్కకు నేను తోడుంటాను" అని. అంతలోనే రాత్రి మూడవ జాము ప్రవేశించింది. ఎలుగుబంటి నక్కను నిద్రలేపి, తాను పడుకున్నది. కొంత సేపటికి, ఎలుగుబంటి నిద్రపోయిందని నిర్ధారించుకున్నాక, చెట్టు క్రింద ఉన్న సింహం ఈసారి నక్కను పలకరించింది- "నక్కబావా! నువ్వు మాంసం తిని ఎన్ని రోజులైందో గదా! ఈ ఎలుగుబంటి తను తినదు; నిన్ను తిననివ్వదు- నాకు తెలుసు.   నా మాట వింటానంటే ఓ సంగతి చెబుతాను- నువ్వు ధైర్యం తెచ్చుకొని ఆ ఎలుగుబంటిని కిందికి తోసెయ్యి- నేను దాన్ని చంపి తిని, మిగిలిన మాంసాన్ని నీకూ పెడతాను; నువ్వూ తినొచ్చు. మీలో ఎవరినో ఒకరిని తినకుండా ఇక్కడినుండి కదలకూడదని నేను ఎలాగూ నిశ్చయించేసుకున్నాను. నా నిశ్చయం ఎంత దృఢమైనదో నీకు తెలుసు- తెలివైనదానివి- ఆలోచించి నిర్ణయం తీసుకో. ఆ ఎలుగును తోసెయ్యి" అన్నది, నక్కను ప్రలోభ పెడుతూ. నక్క కాసేపు ఆలోచించి- ఎలుగుబంటిని కిందికి తోసేసింది. కిందపడ్డ ఎలుగు దగ్గరకొచ్చి నిలబడి, సింహం ఎగతాళిగా నవ్వుతూ- "ఎలుగుబంటీ, చూశావా?! ఎంత చెప్పినా నువ్వు ఆ నక్కను కిందికి తోసెయ్యకపోతివే; అది చూడు, నిన్ను ఊరకనే కిందికి తోసేసింది- చూస్తివా, నక్క తెలివి?" అన్నది. ఎలుగుబంటి విచారంగా నవ్వి, "సింహరాజా! ఆ ముసలినక్క ఎంతో కాలంగా నన్నే నమ్ముకొని బతుకుతోంది. ఈరోజున అదేదో చేసిందని దాని నమ్మకాన్ని నేను వమ్ము చేయను- ఎందుకంటే నామీద నాకు విశ్వాసం ఉంది. నేను కౄరజంతువునే; కానీ ఏ ప్రాణికీ కావాలని హాని తలపెట్టను. నా మంచితనం వల్ల నాకు హాని వాటిల్లదు- అనేది నా విశ్వాసం. నువ్వు నన్ను ఒక్కసారిగా చంపి తిని, నీ ఆకలి తీర్చుకుంటావు- నాకు కలిగే బాధ కేవలం ఆ క్షణం మాత్రమే. కానీ నక్క-?! దానంతట అది క్రిందికి దిగలేదు; మరి చెట్టు మీద దానికి ఆహారమూ దొరకదు. చివరికది ఆకలితో విలవిలలాడుతూ చస్తుంది; లేదా చెట్టు మీది నుండి క్రిందపడి ఎముకలు విరిగి చస్తుంది. ఇది సత్యం. ఇక ఈ 'నక్క తెలివైనది కాదు' అనేది స్పష్టం. దానికి ఉన్నది కేవలం మోసపూరితమైన ఒక ఆలోచనే తప్ప, తెలివి కాదు. నిజానికి నక్క తిక్కది- అందుకనే ముందుచూపు లేక, ఈ పనికి ఒడి గట్టింది" అన్నది ఎలుగుబంటి, ధైర్యంగా. "నేను నిన్ను తినకుండా వదిలేస్తాను- మరి ఇప్పుడయినా చెట్టెక్కి నక్కను క్రిందికి తోసేస్తావా?" అంది సింహం. "అలా చేయను. ఎందుకంటే, 'మోసం చేసినవాడు తనంతట తానే నష్టపోతాడు' అని దీని ద్వారా అందరికీ తెలియాలి" అన్నది ఎలుగు బంటు. ఇన్ని విషయాలు తెలిసిన నిన్ను తింటే అది నాకు మంచిది కాదు- నాకు వేరే ఆహారం దొరుకుతుందిలే- నీ దారిన నువ్వు పో" అని బయలుదేరింది సింహం. ఎలుగుబంటి కూడా తన దారిన తాను వెళ్ళింది. నక్క మాత్రం అటు చెట్టు దిగలేక, ఇటు ఆహారమూ లేక అలమటించి, చివరికి క్రిందికి దూకే ప్రయత్నంలో ప్రాణాలు విడిచింది. కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

ఉపాయం

ఉపాయం     ఒక ఊరిలో కుమార్ అనే పిల్లవాడు ఉండేవాడు. కుమార్ ఆరవ తరగతి చదువుతున్నాడు- అతను ఒక మోస్తరు విద్యార్థి. శ్రమ పడితే చదువు బానే వస్తుంది; కానీ అట్లా శ్రమపడటం అంటే అతనికి ఏమంత ఇష్టం ఉండేది కాదు. "ప్రొద్దున్నే లేచి చదువుకోరా, చదువు బాగా వంటపడుతుంది' అని వాళ్ల నాన్న ఎంత చెప్పినా కుమార్ వినేవాడు కాదు. అసలు సంగతేంటంటే వాడికి నిద్రపోవటం చాలా ఇష్టం. రాత్రి త్వరగా పడుకునేవాడు; అయినా ఉదయం ఆలస్యంగానే నిద్ర లేచేవాడు. సమయం దగ్గర పడగానే గబగబా లేచి, త్వరత్వరగా తయారయ్యి, బడికి పరుగు తీసేవాడు. అట్లా చాలా సార్లు జరిగాక, ఒక రోజున వాళ్ల నాన్నగారు ఆలోచించారు- "వీడు ప్రొద్దున్నే త్వరగా లేవాలంటే ఏమి చేయాలి?" అని. ఆయనకో అద్భుతమైన ఉపాయం తట్టింది. ఆయన వెంటనే పట్టణానికి వెళ్లి, ఒక కెమెరా కొనుక్కొచ్చారు. దాన్ని కుమార్‌కి ఇచ్చి "ఒరేయ్ కుమార్! చలికాలం వస్తున్నది కదా, మన ఊరి నుండి లెక్కలేనన్ని పక్షులు కొల్లేరుకు వలస వెళ్తున్నాయట. వాటిలో కొన్ని అరుదైన పక్షులు కూడా ఉంటాయి. అట్లాంటి అరుదైన పక్షుల ఫొటోలకోసం దినపత్రికల వాళ్ళు ఎంతగానో ఎదురు చూస్తున్నారని తెలిసింది.   మనం ఫొటో తీసిన పిట్ట రకాన్ని బట్టి వాళ్ళు వెయ్యి రూపాయల వరకూ ఇవ్వవచ్చు. అంతే కాక ప్రశంసా పత్రం, ఆ ఫోటోలు తీసిన వ్యక్తి గురించి దిన పత్రికలో ఓ చిన్న సమాచారం కూడా వేస్తారట. అయితే పక్షులన్నీ కనబడేది తెల్లవారు జాముననే కదా, అందుకని మనం రేపు ఉదయాన్నే 5:30కి లేచి మేడ మీద కూర్చొని ఆ పక్షుల ఫోటోలు తీద్దాం" అని చెప్పారు. దినపత్రికలలో తన గురించి వేయటం, నగదు-ప్రశంసా పత్రం- ఇట్లాంటి మాటలు వినగానే కుమార్‌కు ఆశ పుట్టింది. మరుసటి రోజునుండి ఉదయం 5:30 కల్లా నిద్రలేచి, మేడపైకి వెళ్లి, పక్షుల కోసం ఎదురు చూడసాగాడు. అక్కడ వాడికి రకరకాల పక్షులు కనిపించేవి. చిలకలు, పిచ్చుకలు, కొంగలు- ఒక్కోసారి ఏవో వింత పిట్టలు కూడాను. అయితే వాడు ఫొటో తీద్దామనుకునేసరికి అవి ఎగిరిపోయేవి. అంతలోనే వాడికి సలీం అలీ రాసిన పక్షుల పుస్తకం ఒకటి బహుమతిగా ఇచ్చాడు వాళ్ల నాన్న . "దీన్ని చూస్తే పక్షుల్ని గుర్తు పట్టటం సులభం" అని. బయట పక్షుల్ని చూడటం, తర్వాత వాటి గురించి పుస్తకంలో చదవటం- అప్పుడప్పుడూ వాటిని ఫొటోలు తీయటం, తనూ సలీ అలీ అయిపోయినట్లు కలలు కనటం- ఇట్లా కొన్ని రోజులు గడిచాయి. చూస్తూ చూస్తూండగానే చలికాలం వచ్చేసింది. ఇప్పుడింక పక్షులు ఏమన్ని కానరాలేదు. "ఇంక వలస పక్షుల కోసం చూడనక్కర్లేదు- సమయం వృథా" అనుకున్నాడు కుమార్. ఉదయాన్నే లేవకుండా మళ్లీ తనపాత పద్ధతిలోకి మారిపోవాలనుకున్నాడు. కానీ ఎందుకనో, అది ఇక వీలు కాలేదు! ఉదయాన్నే లేవడం అలవాటు అయిపో-యినట్లుంది- ప్రతిరోజూ అయిదున్నరకు మెలకువ వచ్చేసేది! మెల్లగా వాడు ప్రొద్దున్నే చదువుకోవటం మొదలెట్టాడు. విషయాలు కూడా వాడికిప్పుడు ఇంతకు ముందుకంటే బాగా అర్థమౌతున్నాయి! తన పథకం ఫలించినందుకు కుమార్ వాళ్ల నాన్న ఎంతో సంతోషించాడు. కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

పట్టుదల

పట్టుదల   రాయలచెరువు ఊళ్లో‌ సీనుగాడు ఏడో క్లాసు చదువుతున్నాడు. ఈడు ఎట్టుంటాడంటే ఎర్రగా, ఎముకలు బైటక్కనపడి, బక్కోని లెక్కుంటాడు. నెత్తెంటికలు చెదిరింటాయి. రెన్నెల్లకో మూన్నెల్లకోసారి గానీ స్నానం జేపిచ్చుకోడు. గాని ముఖం చూస్తే అందగాని లెక్కనే వుంటడు. సూపులు జూత్తే ములుకుల్లెక్కుంటయి. ఈడికి సదువుకోల్లని ఆసె. ఏస్కునే బట్టలు లేవు గానీ‌ ఈన్కి సదువు అంటే ప్రానం. బళ్ళో ఇచ్చిండే గుడ్డలేస్కొని తిరిగేటోడు. బడికి పోయినప్పట్నుంచి సదువు మీదనే ద్యాస. అట్టాంటే ఎప్పుడూ అట్టాగని గాదు- అయ్యవారు పాటాలు సెప్పేటప్పుడొక్కటే- మళ్ళా బైట ఆడ్కొనేటప్పుడు ఆడ్కుంటాడు; అల్లరి జేత్తాడు. సీనుగాని అల్లరి సూసి సారు తిట్టేటోడు. మళ్ళా వాని సదువు సూసి ఊర్కుండేటోడు. సారు పాటాలు సెప్తాన్నాడంటే పక్కన పామొచ్చి పండుకున్నా తల్కాయ తిప్పేటోడు కాదు- అట్టాంటోడు వీడు. సాన మంది అనేటోళ్ళు- "నీకి తినేకే లేదు; యాదన్న పని జేస్కొని బతక్కోండా నీకీ సదువు సంద్యా ఏంట్కిరా?" అని. ఐనా వాడు సదువు మీద పట్టు ఇడిసిపెట్లేదు. సీనుగాన్ సదువు ఐపోతుందనేకి, సీనుగానమ్మోళ్ళు ఊరు మార్నారు, పనుల్లేవని. అట్లా ఊళ్ళు తిరుగుతాంటే ఒకూర్లో రోడ్డేసే పని దొరికింది. యాదో‌ పని- తినేకి తిండి గాల్లంటే జోబీలోకి డబ్బులు గాల్ల. కాబట్టి ఆ పనికి ఒప్పుకున్న్యారు.   ఓరోజు సీనుగానమ్మోల్లని ఆఫీసరు పట్నానికి రమ్మన్యాడు. ఈళ్ళంతా పోయినారు నడుసుకుంటా. పట్నం పోయే దావలో ఓ బడి గనపడింటే సీనుగాడు అందర్నీ బండెక్కించి, తను మాత్రం‌ నడుస్తా "మీరు పాండి. నేను మల్లా‌ వత్తాను" అన్న్యాడు. 'సరేలే' అని వీళ్ళూ పోయినారు. సీనుగాడు అక్కడ్నే బడి సందిన నిలవడి ఐవారు పాటాలి సెప్తాంటే బయట్నించే సూస్తన్నాడు. పాటం అవంగనే 'వాల్లందర్లెక్క నేనెప్పుడు కుసుంటానే'నని ఏడ్సుకుంటా ఇంటికి బేనాడు.    అమ్మోల్లు వచ్చాక 'సదువుకుంటా'నని ఒక్కటే పట్టు పట్టిన్యాడు. సీనుగానమ్మోళ్ళు వాడ్ని తిట్టి, "నువ్వు సదువుకునేకి పోతే ఈడ సిన్నోన్ని ఎవడాడిచ్చుకుంటాడు?" అని తిట్నారు. కాన్లే అని ఇంటికాణ్ణే ఉన్యాడు వాడు. అయినా‌ మనసులోనేమో సదువుకోల్లని ఉందాయె. మళ్ళా పొయ్యి అదే బడి బైట నిల్బడి సూత్తాన్యాడు. అది సూసి ఐవారు "ఎవరు నువ్వు" అన్యాడు. సీనుగాడు అంతా సెప్పినాడు. అప్పుడు ఐవారు 'మరి నేను సదివిత్తాను. సదువుకుంటావా?' అనంటే సదువ్కుంటానన్యాడు. సరేనని ఐవారు అదే బళ్ళో సేరిపించినాడి. అంతలో‌ సీనుగానమ్మొళ్ళు వచ్చి సంగతేందని అడిగితే, సీనుగాడు సదువుకుంటానన్యాడు. గానీ సీనుగాన్నాయన మాత్రం ఒప్పుకోల్యే. ఈడేడుస్తా 'ఏంటికి' అనడిగితే అప్పుడాయప్ప "సదువుకునేకి మాత్రం బడుంది; మళ్లా అన్నమెవరు వెడ్తార్రా" అంటానే వీడు ఏడ్చినాడు. వాళ్ళ మాటలిని ఐవారు "దానికేం బయం ల్యా. ఏంటికంటే గోర్నమెంటోల్లు బాలల వసతి గృహాలు కట్టించిన్యారు. దాంట్లో‌ అన్నీ ఉంటాయి" అన్యాడు ఐవారు.    "మళ్ళా వానికేమన్నైతే ఎవ్వరు బాధ్యులు?" అంటానే "దానికి నేనే బాద్యున్ని" అన్యాడు ఐవారు. ఇంగ సీనుగాడు బళ్ళో‌బాగా సదువుకుని పదోక్లాస్ పాస్ ఐనాడు. మల్లీ ఇంటరూ ఇవన్నీ అనంతపురం "బాలల వసతిగృహం"లోనే వుండి సదువుకున్యాడు. ఇంగీమద్దలో వాడు యాడుండాడో ఈ వూరికి రాల్యా. దాదాపు పదేల్లయితాంది. సీనుగాడు పట్టుదలమీద సదువుతానే ఉన్యాడు. కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

బాలల దినోత్సవం

బాలల దినోత్సవం   బడిలో బాలల దినోత్సవం జరుపుకుంటున్నారు. వేదిక మీద వెనకగా ఉన్న ఫొటోలో చాచా నెహ్రూ నవ్వుతున్నాడు. ఫొటోకి ముందు పది కుర్చీలున్నై. గ్రామంలోని ముఖ్యులు వచ్చి ఆ కుర్చీల్లో కూర్చుంటారు. ఆ కుర్చీలముందు ఒక పెద్ద టేబుల్ ఉంది. దానిమీద మంచి రోజాపూల ప్లాస్టిక్ షీటు కప్పిఉంది. ఒక గాజు గ్లాసులో‌కొన్ని పూలు అందంగా అమర్చి ఉన్నై. బడి అంతా పండుగ వాతావరణం నెలకొని ఉన్నది. క్రితం రోజున పట్నంలో కొనుక్కొచ్చి కట్టిన ప్లాస్టిక్ జెండాలు గాలికి ఊగుతూ వింతగా శబ్దం చేస్తున్నై. చెప్పినట్లుగా ఎనిమిది గంటలకల్లా వచ్చేసి, తరగతుల వారీగా వరసల్లో కూర్చున్నారు పిల్లలందరూ- వేదికకు ఎదురుగా.  కార్యక్రమాలు నడిపే పెద్దలంతా అటూ ఇటూ తిరుగుతూ హడావిడి చేస్తున్నారు. మైకులో‌దేశభక్తి గీతాలు- అవే తిప్పి తిప్పి వినిపిస్తున్నారు. సమయం పదిగంటలైంది. తొమ్మిదికే రావలసిన జిల్లా స్థాయి అధికారి గారు ఇంకా రాలేదు. ప్రధానోపాధ్యాయులవారు హడావిడిగా అందరికీ ఫోన్లు చేస్తున్నారు. పిల్లలు కొంచెం అసహనంగానే ఉన్నారు. డ్రిల్ సారుకు క్రమశిక్షణ ఎక్కువ. ఒక్క పురుగును కూడా బయటికి పోనివ్వటం లేదు. ఎండ ఎక్కువైంది. పిల్లలకు దాహార్తీ ఎక్కువైంది. కార్యక్రమం ఇంకా మొదలే కాలేదు. అధికారి గారు రావాలి, ఊరి పెద్దలు రావాలి, అందరూ పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడాలి, ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు, అప్పుడు గానీ‌ తినేందుకు ఏమీ ఇవ్వరు. ఆ తర్వాతే, ఇంటికెళ్లటం... నీళ్ళ పంపు దగ్గర రద్దీ పెరిగింది. తొక్కిసలాట మొదలైంది. డ్రిల్ సారు వచ్చి అందర్నీ తరిమేశారు అక్కడినుండి. కార్యక్రమాల్లో‌ పాల్గొనేందుకు రంగులు వేసుకున్న పిల్లల ముఖాలు వాడిపోయి ఉన్నై. ముఖాలమీద వాలే ఈగల్నీ, దోమల్నీ తోలుకోకుండా అలాగే భరిస్తున్నారు వాళ్ళు- మేకప్పులు పోతాయని. వరసల్లో పిల్లలు చాలామంది కడుపులు బిగబట్టుకొని కూర్చున్నారు. లేచి వెళ్దామంటే డ్రిల్ సారు ఏమంటారో అని భయం. బడిలో‌ ఎలాగూ టాయిలెట్లు లేవు. ఇప్పుడు దూరం వెళ్లి రావాలంటే కుదిరేట్లు లేదు.. పదకొండైంది. కార్యక్రమం ఇంకా మొదలు కాలేదు. అధికారి గారు రాలేదు. ఆకలౌతున్నట్లుంది పిల్లలకు. ఏమీ కాకనే నీరసించి పోయారు. ఆదే సమయంలో- బడి బయట నలుగురు పిల్లలు- ఒక బర్రె చుట్టూ చేరి సందడి చేస్తున్నారు. నలుగురికీ చొక్కాలు లేవు. వాటిని విప్పి తలకు చుట్టుకొని ఉన్నారు. ఒకడు బర్రెమీద ఎక్కి అటూ ఇటూ కాళ్ళు వేసుకొని, దాన్ని పట్టుకొని, గుర్రం తోలినట్లు 'చల్! చల్!' అంటున్నాడు. మరొకడు దాని కొమ్ములకు రంగు కాయితాలు అంటిస్తున్నాడు. మిగిలినవాళ్లు ఇద్దరూ బర్రెకు నీళ్లు పోస్తున్నారు సంతోషంగా. వీళ్ల సేవలందుకుంటూ అది కదలకుండా నిలబడి, తృప్తిగా చూస్తున్నది. "ఒరేయ్! మనం ఇయాల్ల బడికి బోలేదని డ్రిల్ సారు కొడితే యలాగా?" అన్నాడు వాళ్ళలో‌ఒకడు. "లేయ్! ఇయాల్ల బాలల దినోస్తవం. మన్నల్నెవ్వరూ యేమీ అనరు!" అంటున్నాడు మరొకడు, ధీమాగా.  

సింహం-అడవి

సింహం-అడవి   ఊరికి దగ్గరగా దట్టమైన అడవి ఒకటి ఉండేది. గుబురైన చెట్లతో, గల గలా పారే నీళ్ళతో, అనేక జంతువులతో ఆ అడవి కళకళలాడేది. దీనికి కారణం, ఆ అడవిలో ఉండే సింహం. చెట్లను కొట్టేసేందుకూ, జంతువుల్ని వేటాడేందుకూ వచ్చే వాళ్ళని అది అస్సలు సహించేది కాదు.    మనుషులందరికీ అదంటే భయం. అది ఉన్న అడవిలోకి వాళ్ళెవ్వరూ‌ అడుగు పెట్టే వాళ్ళు కాదు. ఒకసారి ఎందుకనో సింహం ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది.దాంతో అది గుహకే పరిమితమైపోయింది.   ఇదివరకటి లాగా అడవి అంతటా తిరగట్లేదు. ఆ సంగతి తెలుసుకున్న ఊళ్ళో మనుషులు మళ్ళీ అడవిలో తిరగసాగారు. చెట్లు కొట్టేయటం, కుందేళ్ళనూ జింకలనూ వేటాడటం మొదలు పెట్టారు. రోజు రోజుకూ అడవి పలచబారింది.   'దీనికంతటికీ కారణం సింహరాజు ఆరోగ్యం బాగా లేకపోవటమే' అని గుర్తించిన జంతువులన్నీ సింహం గుహకు వెళ్ళి చూసాయి. సింహం జ్వరంతో మూలుగుతూ పడుకొని ఉన్నది. డాక్టరు దగ్గరికి వెళ్లనే లేదు!   దాంతో జంతువులన్నీ కలిసి ఏనుగు డాక్టరుకు ధైర్యం చెప్పి, దాన్ని తీసుకెళ్ళి సింహనికి వైద్యం చేయించినై. సింహానికి ఆరోగ్యం బాగైంది. అడవి అంతటా దాని గర్జనలు వినిపించినై మళ్ళీ. దాంతో మనుషులంతా అడవికి రావటం మానేసారు. త్వరలోనే అడవి అంతా చెట్లు-జంతువులతో కళకళ లాడింది. కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో    

బుద్ధి వచ్చింది

బుద్ధి వచ్చింది....   తరగతిలోని పిల్లలందరికంటే కొంచెం పెద్దవాడు విజయ్; చాలా అల్లరి పిల్లాడు కూడా. ఆలోచన అనేదే లేకుండా ఎప్పుడూ ఏదో ఒక చిలిపి పని చేసి, ప్రమాదాలు కొని తెచ్చుకుంటూ ఉండేవాడు. టీచర్లు, పెద్దలు చేయద్దన్నదల్లా చేస్తూ ఉండేవాడు ఊరికే. ఒకసారి ఆదివారం బడికి సెలవు. విజయ్‌కి వేరే పనేమీ లేక, 'ఏం చేద్దామా' అని ఆలోచించాడు. చేను దగ్గర బావి ఉంది. తనకి ఈత రాదు; అయినా "బావిలో రాళ్ళు వేస్తూంటే బలే ఉంటుంది" అనుకున్నాడు. చేను కాడికి బయల్దేరాడు. పొలాల వెంబడి నడుచుకుంటూ పోతున్నాడు- దారిలో చెరువు గట్టున మర్రిచెట్టు ఒకటి కనిపించింది. దాని పేరే కోతుల మర్రి. దానినిండా ఎప్పుడూ వందల వందల కోతులు ఉంటై. విజయ్‌కి వాటిని ఏడిపించాలని మనసైంది. ఇంకేముంది; నేలమీదున్న రాళ్ళను ఏరుకొని, వాటి మీదికి విసరటం మొదలెట్టాడు.    కోతులన్నీ 'గుర్రు గుర్రు' మన్నాయి. అన్నీ ఒకేసారి చెట్టుదిగి వాడి వెంట పడ్డాయి. “బాబోయ్ కాపాడండి! కాపాడండి!!" అంటూ విజయ్ పొలం గట్ల వెంట పరిగెత్తాడు. అకస్మాత్తుగా వాడి కాలుని ఏదో చుట్టుకున్నట్లూ, కరిచినట్లూ అనిపించింది. 'పామే!' అనిపించింది వాడికి. “వామ్మో! పాము!" అని కేకలు పెడుతూనే పరుగు కొనసాగించాడు వాడు. దగ్గరలోనే పని చేసుకుంటున్న ముసలి రైతు ఒకడు ఆ పొలికేకలు విని గబగబా వచ్చాడు. పని చేస్తున్న కూలీలు కూడా పరుగున వచ్చారు. వాళ్లలో ఒకాయన వెంటనే 108కి ఫోన్ చేశాడు. ముసలాయనేమో తన కండువా చింపి విజయ్‌ తొడ క్రిందుగా గట్టి కట్టు కట్టాడు. అంతలో అంబులెన్సు వాళ్ళు రావటం, వాడిని దానిలోకి ఎక్కించి ఆసుపత్రికి తీసుకువెళ్లటం జరిగిపోయాయి. అక్కడ డాక్టర్‌గారు గాయాన్ని గమనించి, అది పాము కాదని తేల్చారు. అయినా మంచిదే, ఇంజక్షన్లు వేసుకోవాలి అని వరసగా నాలుగైదు ఇంజక్షన్లు ఇచ్చారు. అవన్నీ అయినాక నీరసంగా ఇంటికొచ్చాడు విజయ్‌. దాంతో బుద్ధి వచ్చినట్లుంది- విజయ్ కొంచెం పెద్దయ్యాడు: అల్లరి తగ్గించి ఇప్పుడిప్పుడే కొంచెంగా చదువులో పడ్డాడు! కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

కథల కథ

కథల కథ!   ఒక అడవిలో ఒక కుందేలుండేది. ఆ కుందేలు ఎప్పుడూ సంతోషంగా ఎగురుతూ,నవ్వుతూ ఉండేది. అడవిలో ఎవరు ఎదురైతే వాళ్ళకు ఓ కథ చెప్పుకుంటూ ఉల్లాసంగా జీవించేది. ఒకసారి దానికి జ్వరం వచ్చింది. జ్వరం వస్తే, పాపం అది ఊరికే పడుకొని ఉండిపోయింది. చుట్టూతా ఎవరున్నారన్న ధ్యాసే దానికి లేకుండా పడిపోయింది. చివరికి కుందేలు బంధువులు పట్టుబట్టి దాన్ని డాక్టర్ దగ్గరకి తీసుకెళ్ళారు. డాక్టరుగారు దాన్ని పరీక్షించి ఏవేవో గోలీలు రాసిచ్చారు. బంధువులు బలవంతంగా కొన్ని మాత్రలు దానిచేత మింగించారు, వద్దన్నా వినకుండా. వాటితో మూడోరోజుకల్లా కుందేలుకు జ్వరం తగ్గిపోయింది. కానీ దాని మనసుకు ఏమైందో, మరి, ఇప్పుడు అది పూర్తిగా నిశ్శబ్దం అయిపోయింది. ఆ కథలన్నీ ఎటుపోయాయో, ఏమో? ఒక్కటీ లేకుండా మాయమయ్యాయి!   ఇక కుందేలు ఆగలేకపోయింది. తప్పిపోయిన ఆ కధల్ని వెతుక్కుంటూ అడవిలో అంతా తిరిగేది. ఇదివరకు ఉన్న ఉత్సాహం, ఉల్లాసం ఇప్పుడు దానికి లేకుండా పోయాయి. ఊరికే "నాకథలు! నాకథలు" అని అరుచుకుంటూ పోయింది, పాపం. కానీ కథలు!- వాటిని రమ్మంటే వస్తాయా, పొమ్మంటే పోతాయా?- అవిమాత్రం పూర్తిగా ముఖం చాటు చేసుకున్నాయి.   అలా దారీ తెన్నూ లేకుండా తిరుగుతున్న కుందేలు చివరికి అడవి అంచున ఉన్న ఓ గుడిశ దగ్గరకు చేరుకున్నది. ఆ సమయానికి బాగా చీకటి పడింది. ఇంట్లో ఓ తల్లి బిడ్డను నిద్ర పొమ్మంటున్నది. బిడ్డ కథ చెప్పమంటున్నది. తల్లి ’పని ఒత్తిడి ఉన్నది- ఊరకుండమంటు’న్నది. బిడ్డ గునుస్తోంది. అటూ ఇటూ పొర్లు తున్నది. "కథ చెప్పాల్సిందే" నని పట్టుబడుతున్నది. చూరు క్రిందనున్న కుందేలుకు గుండె వేగంగా కొట్టుకున్నది. లోపల అలజడి ఎక్కువైంది. అంతలోనే దాని నోట్లోంచి అద్భుతమైన కథ ఒకటి ఊడిపడింది. అసంకల్పితంగా, అనాలోచితంగా, బిగ్గరగా కథ చెప్తున్న కుందేలుగానీ, ఆశ్చర్యపోతున్న తల్లిగానీ, నిద్రముంచుకొస్తున్న బిడ్డగానీ- ఎవ్వరూ గుర్తించలేదు- కుందేలు కథలు అసలు నిజానికి ఎక్కడికీ పోలేదు! కుందేలులోనే ఉన్నాయి! కొన్ని రోజులు ఊరికే నిద్రపోయాయంతే! మళ్ళీ అవసరం ఏర్పడే సరికి, మళ్ళీ అవకాశం వచ్చేసరికి, అవి తిరిగి వెల్లువయ్యాయి. తన నోట్లోంచి వస్తున్న కథ పూర్తవగానే కుందేలుకు ఈ సంగతి అర్థమైపోయింది. దాని మనసు తేలికైంది. మళ్ళీ దానిలో కథలు తయారవుతున్నాయిప్పుడు!   కథల తీరే అది. మన లోతుల్లోంచి ఎక్కడినుండో ఊడిపడుతుంటాయి అవి. కథలకూ తమవైన ప్రాణం ఉంటుంది. అవీ నవ్వుతాయి, ఏడుస్తాయి, వస్తాయి, పోతాయి. వాటికి తమదంటూ స్వేచ్ఛ ఒకటి ఉంటుంది. ఎవరైనా, ఎప్పుడైనా చెప్పేస్తామంటే రావు, కథలు. వాటికి ఇష్టమైతేనే వస్తాయి. ఇష్టం కాకపోతే గుర్తుకు రామంటాయి, వేరే పనుల్ని గుర్తుకు తెస్తాయి. ఒక్కోసారి అవి బయటికి రాకపోతే కంగారు పడకండి. సరైన సమయం, సందర్భం రాగానే అవి తప్పక వెలువడతాయి!    కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

అవ్వ - మేక

అవ్వ - మేక     రచన - గణేష్ ఒక ఊరిలో ఒక అవ్వ ఉండేది. ఆ అవ్వ దగ్గర ఒక మేక ఉండేది. ఆ మేకను రోజూ మేతకు పిలుచుకు పోయేది. ఒక రోజున అవ్వకు జ్వరం వచ్చింది. అపుడు మేక అవ్వ దగ్గరకు వచ్చింది. "అవ్వా, అవ్వా! ఏమి ఆలోచిస్తున్నావు?" అని అడిగింది. అపుడు అవ్వ "ఏమీ లేదు మేకా, నాకు జ్వరం వచ్చింది; నిన్ను మేతకు ఎలా పిలుచుకుపోవాలి?" అన్నది. అప్పుడు మేక " ఏమీ ఒద్దులే అవ్వా, నేను ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి మేసి వస్తా; పచ్చకొండకు పోయి పచ్చగడ్డి మేసి వస్తా" అని ఒక్కతే బయలుదేరింది.   అలా పోతూ పోతూ ఒక నక్క దగ్గరకు వెళ్లింది. అప్పుడు ఆ నక్క "నాకు చాలా ఆకలేస్తోంది, నిన్ను తినేస్తాను" అని బెదిరించింది. "ఒద్దు నక్క బావా, నక్కబావా, ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి మేసి వస్తా; పచ్చకొండకు పోయి పచ్చగడ్డి మేసి వస్తా, అప్పుడు నన్ను తిందువులే" అన్నది మేక. నక్క "సరే" అని ఒప్పుకున్నది. "మళ్లీ రావాలి, తప్పకుండా" అని చెప్పి పంపింది అది.   తరువాత మేక నడుస్తూ నడుస్తూంటే ఒక తోడేలు ఎదురైంది. "నాకు ఆకలేస్తోంది, నిన్ను తినేస్తాను" అన్నది. "వద్దు తోడేలు బావా, తోడేలు బావా, ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి మేసి వస్తా; పచ్చకొండకు పోయి పచ్చగడ్డి మేసి వస్తా, అప్పుడు నన్ను తిందువులే" అన్నది మేక. అపుడు ఆ తోడేలు సరే అని ఒప్పుకున్నది.   అపుడు మేక నడుస్తూ, నడుస్తూ ఒక పులి దగ్గరకు వెళ్ళింది. అపుడు పులి "నాకు చాలా ఆకలేస్తోంది, నిన్ను తినేస్తాను" అని బెదిరించింది. అందరికీ చెప్పిన విధంగానే ఆ పులికి కూడా చెప్పింది. ఆ పులి కూడా "సరే తొందరగా వచ్చేయి, నాకు చాలా ఆకలివేస్తోంది." అన్నది.   అలా పోతూ పోతూ ఆ మేక ఒక సింహం దగ్గరకు వెళ్ళింది. "నాకు చాలా ఆకలేస్తోంది, నిన్ను తినేస్తాను" అన్నది సింహం. అపుడు మేక " వద్దు సింహం బావా, వద్దు. ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి మేసి వస్తా; పచ్చకొండకు పోయి పచ్చగడ్డి మేసి వస్తా" అన్నది. సింహంకూడా ఒప్పుకున్నది.   అపుడు మేక ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి మేసి, పచ్చకొండకు పోయి పచ్చగడ్డి మేసింది. అక్కడే ఒక పెద్ద గుమ్మడికాయ కనబడింది దానికి. ఆ మేక గుమ్మడికాయలోకి దూరి కూర్చున్నది. "దొర్లు దొర్లు గుమ్మడికాయ్; దొర్ల కుంటే దోసకాయ్" అని బయలు దేరింది.   అలా పోతూ పోతూ ఉంటే సింహం ఎదురౌతుంది. అపుడు సింహం " ఇటుగా ఒక మేక పోయింది. నీవు ఏమైనా చూశావా" అన్నది. అపుడు ఆ గుమ్మడి కాయ "లేదు లేదు నేను వచ్చేదారిలో నాకు ఎవ్వరూ కనబడలేదు." అన్నది.   అలా పోతూ, ఉంటే పులి ఎదురైంది. అపుడు ఆ పులి " ఇటుగా ఒక మేక పోయింది. నీవు ఏమైనా చూశావా" అన్నది. అపుడు ఆ గుమ్మడి కాయ "లేదు, లేదు నేను వచ్చేదారిలో నాకు ఎవ్వరూ కనబడలేదు." అన్నది. తరువాత "దొర్లు దొర్లు గుమ్మడికాయ దొర్ల కుంటే దోసకాయ్" అంటూ ఆ గుమ్మడికాయ తోడేలు దగ్గరకు వెళ్లింది. అపుడు ఆ తోడేలు " ఇటువైపుగా ఒక మేక పోయింది. నీవు ఏమైనా చూశావా" అన్నది. అపుడు ఆ గుమ్మడికాయ "లేదు, లేదు" అంటూనే దొర్లుకుంటూ నక్క దగ్గరకు పోయింది. అప్పుడు ఆ నక్క " ఇటుగా ఒక మేక పోయింది. నీకు ఏమైనా కనబడిందా." అన్నది. "లేదు లేదు" అంటూనే ఆ గుమ్మడి కాయ వేగంగా దొర్లుకుంటూ పోయింది.   కానీ నక్క చాలా తెలివి గలది కదా, " అరే! గుమ్మడికాయ ఎక్కడైనా మాట్లాడుతుందా" అనుకుని, ఒక రాయిని తెచ్చి గుమ్మడికాయకు అడ్డం పెట్టింది. ఆ దెబ్బకు గుమ్మడికాయ చీలి పగిలి పోయింది. అప్పుడు ఆ మేక చెంగున బయటకు దూకి, నక్కకు అందకుండా తప్పించుకొని ఉరికెత్తుకుంటూ అవ్వ దగ్గరకు చేరుకున్నది. "ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి మేసి వచ్చాను.పచ్చకొండకు పోయి పచ్చగడ్డి మేసి వచ్చాను." అని చెప్పింది సంతోషంగా. కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

రాము భయం

  రాము భయం     రచన: నారాయణ రాముకు భయం ఎక్కువ. ఊళ్లో అంతా పిరికి రాము అని పిలుస్తారు వాడిని. అలాగని వాడు సోమరిపోతేమీ కాదు. పిల్లవాడైనా కూడా పదిమందికి సాయం చేసే మనస్సుంది వాడికి. వాళ్లమ్మ చెప్పేది చాలా సార్లు- " ఒరే, రామూ, ఈ ఒక్క పిరికి తనాన్నీ వదిలించుకోరా, నువ్వు జీవితంలో ఎలా బ్రతుకు తావో నన్న చింత లేకుండా చచ్చిపోతాను." అని. ఆమెకు ఏదో వింత జబ్బు , రాను రాను బలహీనం అయిపోతోంది. తల్లి మాటలకు రాము రోషపడేవాడు. ఆ క్షణంలో గట్టిగా అనుకొనేవాడు. "నేను పిరికి తనాన్ని వదిలించు కుంటాను " అని. కానీ మళ్ళీ పరిస్ధితి యధా ప్రకారం ఉండేది. వాడికి నీళ్ళంటే భయం, నిప్పంటే భయం, ఎత్తైన ప్రదేశంమంటే భయం, లోయలంటే భయం, కొత్తవ్యక్తులంటే భయం, తెలీని ఊళ్ళంటే భయం, కరెంటు అంటే భయం, టీచర్లంటే భయం, ఈ భయం ఒక్కసారి వచ్చిందంటే అతను ఇంకేమీ చెయ్యలేక పోయేవాడు - వణుక్కుంటూ ఒక మూల కూర్చొనాల్సిందే. "ఊరికి కొత్తగా ఒక స్వాముల వారు వచ్చారు . అందరి కష్టాలు తీరుస్తున్నారు. మీ వాడినోసారి చూపెట్టరాదూ, ఈ మాయదారి భయం పోతుందేమో " అని ఇరుగూ-పొరుగూ అంటే, తల్లి లేని బలం తెచ్చుకొని, వాడిని తీసుకొని బయలు దేరింది. స్వాముల వారు గొప్పయోగల్లే ఉంది. ఒక వైపున శిష్యుడు వచ్చిన భక్తుల్ని వరుసగా నిలబెడుతుంటే, ఆయన ఒక్కొక్కరిని పిలిచి, విభూతిని ఇస్తున్నాడు- మంత్రించి. రాము వాళ్లమ్మ ఏదో చెప్పబోతే, స్వామి వారించాడు. " నీకోసం, నీకొడుకు కోసం వచ్చావుకదూ తల్లీ, నాకంతా తెలుసు! " అన్నాడు. కొత్త వ్యక్తిని చూసిన భయంతో అప్పటికే రాముకు తల తిరుగుతోంది. కాళ్లు వణుకుతున్నాయి. " రోజూ తిప్పతీగ కషాయంతో ఈ విభూది చిటికెడు వేసుకొని తాగండి. మీకు మేలు కలుగుతుంది." ఆశీర్వదించాడు స్వామి. స్వామి పొమ్మనే సరికి రాముకు ప్రాణం లేచి వచ్చింది. వాడు గబగబా నడిచాడు ఉత్సహంగా. అయితే రెండు అడుగులు వేశాడో లేదో, మళ్ళీ పిలిచాడు స్వామి- " నేనిక్కడ ఐదు రోజులు వుంటాను. నువ్వు రోజూ వచ్చి నాలుగు గంటల పాటు నాపక్కన కూర్చోవాలి. అలా అయితేనే మీకు మేలు కల్గేది మరి-" అన్నాడు. వాడు కంగారుగా నోరు విప్పే లోపల వాళ్ళమ్మ " మీరెలా చెప్తే అలాగే స్వామీ, నాలుగు గంటలు ఏం ఖర్మ, రోజంతా మీతోటే ఉండమని పంపుతాను" అన్నది.     అలా రాముకు కష్టకాలం మొదలైంది. స్వామి ప్రక్కన కూర్చుంటే వణుకు మొదలయ్యేది. అందరూ వచ్చి చూస్తుంటే కంపరంగా ఉండేది. అయితే మొదటి రోజు సాయంత్రం కల్లా వాడికి స్వామి పని నచ్చటం మొదలైంది. ఎవరెవరో వస్తారు; తమ కష్టాలు చెప్పుకుంటారు. స్వామి వాళ్లకు ధైర్యం చెప్పేదేమీ లేదు. కొంచెం విభూది ఇస్తాడు- "మేలు జరుగుతుంది" అంటాడు. ఆ మాత్రం పని తనూ చెయ్య గలడు! ఈ ఆలోచన వాడికి చాలా సంతోషాన్ని ఇచ్చింది. అందువల్ల వాడు మర్నాడు తల్లి చెప్పే ముందుగానే తయారై, స్వాముల వారి దగ్గరికి బయల్దేరాడు. ఈ రోజున వాడు- వచ్చిన వాళ్ళు ఏం గోడు వెళ్ళబోసుకుంటూ విన్నాడు. వినడం అంటే భయం లేదు కదా, తనకు! అందరికీ ఏవేవో రోగాలున్నై, బాధలున్నై, కష్టాలున్నై. అలాంటివేవీ లేని వాళ్ళు లేనే లేరు! స్వామి ముందు అందరూ చిన్నపిల్లలైపోతున్నారు. అందరూ తనలాంటివాళ్ళే. తనకే కాదు, భయాలున్నది, వచ్చే వాళ్లలో సగం మంది ఏదో ఒక భయంతోటే వస్తున్నారు. తనకి భయం అంటే భయం, కానీ- వీళ్ళకుండే భయాలు చాలా మామూలువి. అవంటే తను అస్సలు భయపడనక్కర్లేదు! మూడో రోజున వాడు వెళ్ళేసరికి ధనిక వ్యాపారొకడు వచ్చి ఉన్నాడు. స్వామి రామును పిలిచి "నువ్వీ రోజున ధనికుడితో తిరిగి, వచ్చి ఏమేం చేశాడో చెప్పు- సాయత్రం కల్లా" అన్నాడు. ఇప్పుడు రాముకు ఆ వ్యాపారంటే భయం వేయలేదు. వ్యాపారితో పాటు ప్రక్క ఊరికి కారులో వెళ్తే అంతా సుఖంగా ఉంది. తనకు వ్యాపారి మంచి భోజనం పెట్టాడు; తన కష్టాలన్నీ చెప్పుకున్నాడు. అవి వింటూంటే రాముకు మనసులో నవ్వొచ్చింది. వ్యాపారికి- దొంగలంటే భయం, నష్టాలంటే భయం, డబ్బులు వెనక్కి వస్తాయో రావోనని భయం, వ్యాపారి సేవకులకు వ్యాపారి అంటే భయం, వ్యాపారి పిల్లలకూ, భార్యకూ కూడా భయాలే! వాళ్ళకున్న భయాలేవీ తనకు లేవు. తనే నయం వాళ్ల కంటే! వెనక్కి తిరిగి వచ్చిన రాము స్వామికి అంతా నివేదించి, చీకట్లోనే ఒంటరిగా నడుచుకొని ఇంటికి వెళ్ళాడు. వాడికిప్పుడు చీకటంటే భయం వెయ్యలేదు! నాలుగో రోజున రామును అడవిలో కట్టెలు కొట్టేవాని వెంట పంపాడు స్వామి. రంగడు పన్నేండేళ్ళగా అడవిలో తిరిగి, ఎండిన కట్టెలు కొడుతున్నాడు. నిన్నటి రోజున భార్యకు జ్వరం వస్తే, స్వామి మందు చెబుతాడని వచ్చాడు. తనకేమీ భయాలున్నట్లు లేదు. "అడవిలో తిరుగుతుంటే భయం వెయ్యదా?" అన్నాడు రాము. "భయమెందుకు, పన్నెండేళ్ళుగా తిరుగుతున్నాను- నాకేమైంది? ఏం కాదు! అన్నాడు రంగడు. "మరి, పాములు- అవీ...." అన్నాడు రాము భయం భయంగా. "చూడు, పాములైనా, పులులైనా మనం వాటిని ఏమీ చెయ్యకపోతే అవీ మనల్ని ఏమీ అనవు. అయితే కొన్ని విద్యలు నేర్చుకుంటే, కొంచెం తెలుసుకుంటే, మన జాగ్రత్తలో మనం ఉండవచ్చు. మనం వాటిని ఏమీ చెయ్యగూడదు, గుర్తుపెట్టుకో." రంగడు ఆరోజున వాడికి పాములు పట్టటం నేర్పాడు- "అవి గూడా పాపం, నోరులేని జీవాలే కదా; వాటి భయాలు వాటికుంటాయి" అన్నాడు. పాము కాటుకు ఉపయోగపడే మొక్కల్ని కొన్నిటిని చూపాడు. కట్టెలు కొట్టేటప్పుడు చెట్లు జాగ్రత్తగా ఎలా ఎక్కాలో నేర్పాడు. "కళ్ళు తిరిగి పడిపోతేనో ?" -అడుగుదామనుకున్నాడు రాము. కానీ చిత్రం! ఆ రోజున చెట్టు పైకెక్కినా తనకు కళ్ళు తిరగలేదు! అడవిలోంచి పోతున్నప్పుడు దూరంగా, కొండకింద పులి ఒకటి పోతూ కనబడింది. మెల్లగా నడుచుకుంటూ దాని దారిన అది వెళ్లి పోయింది. "అడవిలో తిరిగేటప్పుడు కాళ్ళకు చెప్పులూ, చేతిలో కర్రా ఉంటే అసలిక భయపడక్కర్లేదు." అని రంగడంటే రాముకు ’నిజమే’ననిపించింది. మరునాడు స్వామి ప్రక్కన కూర్చున్నప్పుడు రాముకు తన భయం ఇక గుర్తుకు రాలేదు. స్వామి నుండి శలవు తీసుకొన్న రాము, రంగని తో కలసి అడవంతా కలయదిరిగినా, బళ్ళో చేరినా, చీకట్లో తిరిగినా, ఇక భయమంటూ వెయ్యలేదు. భయం భయపడ్డట్లుంది, వాడి దగ్గరికి రాలేదిక! వాడిలో మార్పును చూసి తల్లి స్వామికి మనస్సులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నది. Courtesy.. kottapalli.in  

అవ్వ-కాకి

  అవ్వ-కాకి     ఒక ఊరిలో ఒక అవ్వ ఉండేది. ఆ అవ్వ ఒకనాడు రొట్టె చేస్తోంది. అంతలో ఒక కాకి వచ్చి ఆ రొట్టెను ఎత్తుకెళ్ళి చెట్టు మీద కూర్చుంది. అవ్వ అన్నది "కాకీ కాకీ నా రొట్టె ఇచ్చెయ్, నాకు ఆకలిగా ఉంది" అని. అయినా కాకి రొట్టెను ఇవ్వలేదు. అప్పుడు ఆ అవ్వ చెట్టు దగ్గరకు వెళ్లి, "చెట్టూ, చెట్టూ, కాకి నా రొట్టెను ఎత్తుకుపోయింది, ఇవ్వమంటే ఇవ్వటం లేదు, అందుకని కాకి గూడును తోసేయ్" అన్నది. అప్పుడు ఆ చెట్టు "నేనేమీ తోసెయ్యను, కాకి నాకేమీ చెయ్యలేదు కదా?" అన్నది. అప్పుడా అవ్వ ఇంకేమీ చెయ్యలేక కట్టెలు కొట్టే ఆయప్ప దగ్గరకు పోయింది. "కట్టెలు కొట్టే ఆయప్పా, కట్టెలు కొట్టే ఆయప్పా, కాకి నా రొట్టెను ఎత్తుకుపోయింది, చెట్టు కాకి గూడును తోసేయనంది, నువ్వు చెట్టును కొట్టేయవా?" అని అడిగింది. "ఉహుఁ., నేను కొట్టేయను. చెట్టు నాకేమీ నష్టం చెయ్యలేదు" అన్నాడు కట్టెలుకొట్టే ఆయప్ప. "సరేలే", అని ఆ అవ్వ ఎలుక దగ్గరకు వెళ్లింది. "ఎలుకా, ఎలుకా, కాకేమో నా రొట్టె ఎత్తుకు పోయింది; చెట్టు గూడు తోసేయనంది; కట్టెలు కొట్టే ఆయప్ప చెట్టును కొట్టేయనన్నాడు, అందుకని నువ్వు పోయి ఆయప్ప గొడ్డలిని కొరికేసెయ్" అని అడిగింది. "నేను కొరకను, కట్టెలాయప్ప నాకేం నష్టం చేయలేదు" అన్నది ఎలుక. అప్పుడా అవ్వ "సరేలే" అని పిల్లి ఉండే తావుకు పోయింది. "పిలీ, పిల్లీ, కాకేమో నా రొట్టె ఎత్తుకుపోయింది; చెట్టేమో గూడును తోసేయనంది; కట్టెలాయప్ప చెట్టును కొట్టేయనన్నాడు; ఎలుక గొడ్డలిని కొరికేయనన్నది, నువ్వు పోయి ఎలుకను తినేసెయ్యి" అన్నది. కానీ పిల్లి ఒప్పుకోలేదు- "నువ్వు చెప్పిందైతే బాగానే ఉంది, కానీ అలాచెయ్యను. ఎలుక నన్నేమీ చెయ్యలేదు" అన్నది పిల్లి. "సరేలే" అని అవ్వ కుక్క దగ్గరకు వెళ్లింది. "నా ప్రియమైన కుక్కా, నా ప్రియమైన కుక్కా, కాకేమో నా రొట్టె ఎత్తుకుపోయింది; చెట్టేమో గూడును తోసేయనంది; కట్టెలాయప్ప చెట్టును కొట్టేయనన్నాడు; ఎలుక గొడ్డలిని కొరికేయనన్నది; పిల్లి ఎలుకను తినెయ్యనన్నది- నువ్వు పోయి పిల్లిని తినేసెయ్యి" అన్నది. అది "సరే" అని పోయి, పిల్లి వెంట పడింది అప్పుడా పిల్లి వణికిపోతూ "వద్దొద్దు, నన్ను చంపద్దు- నేను పోయి ఎలకను చంపేస్తాను" అని ఎలక వెంట పడింది. అప్పుడా ఎలక "వద్దొద్దు, నన్ను చంపద్దు, నేను గొడ్డలిని కొరికేస్తాను" అని గొడ్డలి మీద కెళ్లింది. అప్పుడా కట్టెలు కొట్టే ఆయప్ప "వద్దొద్దు, నా గొడ్డలిని కొరకద్దు, నేను చెట్టును కొట్టేస్తాను" అని చెట్టు మీదికి వెళ్లాడు. అప్పుడా చెట్టు "వద్దొద్దు, నన్ను నరకద్దు; నేను కాకిగూడును తోసేస్తాను" అని కాకి గూడును తోసేసింది. దాంతో కాకి నోట్లోని రొట్టెముక్క జారి క్రింద పడిపోయింది. అప్పుడా అవ్వ దాన్ని తీసుకొని సంతోషంగా ఇంటికి పోయింది. Courtesy.. kottapalli.in

పెద్దచింతచెట్టు... చిన్న చింతచెట్టు

పెద్దచింతచెట్టు... చిన్న చింతచెట్టు     ఒక అడవిలో రెండు చింత చెట్లు ఉండేవి. ఒకటేమో పెద్దది. ఇంకొకటేమో చిన్నది. ఒకరోజు ఆ అడవికి ఒక కాకి వచ్చింది, తన పిల్లలతో బాటు. అవి గూడు కట్టుకొనడానికి ఒక చెట్టు కావాలి. పెద్ద చింత చెట్టును చూసి 'ఇదైతే మనకు బాగుంటుంద'ని అనుకున్నాయవి. అప్పుడు అమ్మ కాకి దాని దగ్గరకు వెళ్ళి, "బావా! బావా! నీకొమ్మ ల మీద మేము ఇల్లు కట్టుకుందుమా?" అని అడిగింది. దానికి ఆ చింతచెట్టు, "ఏయ్! ఏమనుకున్నారు నేనంటే! నీలాంటోళ్ళా నా మీద ఇల్లు కట్టుకునేది! పోతారా, లేదా!?" అని గట్టిగా కసురుకుంది. ఆ అరుపుకి భయపడి అక్కడ్నించి వెళ్ళిపోయాయి అవి. తరువాత అవి చిన్న చింతచెట్టు దగ్గరకు వెళ్ళి, "బావా! బావా! నీ చిన్ని చిన్ని కొమ్మల్లో మేము ఇల్లుకట్టుకుందుమా?" అని అడిగాయి. చిన్న చింతచెట్టు సంతోషంగా, "దానిదేముంది, వచ్చి నా కొమ్మల్లో మీకు ఇష్టమొచ్చినట్లు ఇల్లు కట్టుకోండి. నాకూ మీ తోడు బాగుంటుంది" అనింది. కాకులు భలే సంతోషపడ్డాయి. అక్కడక్కడా ఉన్న ఎండు పుల్లల్ని ఏరి తెచ్చి కాకులు చిన్న చింత చెట్టులో ఒక చక్కని ఇల్లు కట్టుకున్నాయి. నిదానంగా కాకులు చాలా అయినాయి. అన్నీ సంతోషంగా బతుకుతున్నాయి. ఇప్పుడు చెట్టు నిండా చాలా కాపురాలయినాయి. కాకుల సందడితో చిన్న చింతచెట్టూ సంతోషంగా ఉంది.     ఒకరోజు చింతాకు కోసమని పక్కూరు నుండి చాలా మంది మనుషులు ఆ అడవికి వచ్చారు. వాళ్ళకి మొదట చిన్న చింతమాను కనబడింది. దాని మీది చింతాకు వాళ్ళకు బాగా నచ్చింది. కానీ దాని మీదున్న కాకుల్ని చూసి, "అయ్యో! దీని చింతాకు మనకొద్దు. దీని మీద ఎన్ని కాకులున్నాయో! అవి మనల్ని పొడుస్తాయి, ఇక్కడ వద్దు," అని ఆ మనుషులు అలా పోతూ ఉంటే వాళ్ళకు పెద్ద చింతచెట్టు కనబడింది. దానిలో కూడా‌ చింతచిగురు చాలా బాగా కాసి ఉంది. కానీ చిన్నచెట్టు మీదలాగా దీని మీద కాకులు లేవు! అంతే! మనుషులంతా దానిమీద పడి, ఆ చెట్టు మీద ఉన్న చింతాకు మొత్తం పీక్కెళ్ళి పోయినారు. ఆకులన్నీ పోగొట్టుకొని, విరిగిపోయిన కొమ్మలు రెమ్మలతో బాగా ఏడ్చుకున్నాక, పెద్ద చింతచెట్టుకు బుద్ధి వచ్చింది. అప్పటినుండీ అది అందరినీ ఆహ్వానించటం, అందరినీ కలుపుకు పోవటం నేర్చుకున్నది. Courtesy.. kottapalli.in

మారిన లత

మారిన లత     పాకాలలో రామ్మూర్తి, వనజ అనే దంపతులుండేవాళ్ళు. వాళ్లకు ఒక్కగానొక్క కూతురు లత. 'ఆడింది ఆట- పాడింది పాట' అన్నట్లు పెరిగింది ఆ పాప. కోరిన కోరికల్లా తీరడంతో బలే పెంకెగా తయారైంది. లతంటే చాలామంది పిల్లలు భయపడేవాళ్ళు. అయితే కొందరు తెలివైన పిల్లలు మటుకు ఆ పాపను పొగిడేవాళ్ళు; అట్లా ఆమె తెచ్చి పెట్టే చాక్లెట్లు, స్వీట్లు తినగల్గేవాళ్ళు. తనను పొగిడే వాళ్లకు ఏదంటే అది తెచ్చిపెట్టే లత, మిగతా పిల్లలందర్నీ చిన్నచూపు చూసి ఎగతాళి చేస్తుండేది. ఇంట్లో కూడా ఆ పాప ప్రతి దానికీ పేచీలు పెట్టేది. "అబ్బ!ఈ పాపని ఇలాగే కొనసాగిస్తే పెంకె ఘటం ఐపోతుంది; పెద్దయిన తర్వాత జీవితంలో చాలా బాధలు పడుతుంది. ఎట్లాగైనా ఈ పాపని ఓ మంచి దారికి తేవాలి!" అనుకునేది బామ్మ. ఒకరోజు స్కూల్ నుంచీ వస్తూనే పుస్తకాల సంచీ విసిరికొట్టి, "రేపు శనివారం! నాకు కొత్త ఫ్రాక్ కొంటావాలేదా?" అంటూ పేచీ మొదలెట్టింది లత. "ముందు ఏమైనా కొంచెం తిని,పాలు త్రాగమ్మా! తర్వాత మాట్లాడదాం" అన్నది వనజ. "నాకు ఇప్పుడే మంచి ఫ్రాక్ కావాలి! కొంటానంటేనే నేను తింటాను!" నేలమీద కాళ్ళు దబ దబా కొడుతూ గొడవ మొదలెట్టింది లత. భాగవతం చదువుకుంటున్న బామ్మ తన దగ్గరకి వచ్చి "లతా! నీ బీరువా నిండా బట్టలున్నాయి. తలుపు తీయగానే అన్నీ కుప్పలు కుప్పలుగా క్రింద పడి పోతున్నాయి. నీ బీరువా చాలక, మీ అమ్మ బీరువాలో కూడా బట్టలు పెట్టుకుంటున్నావు కదా?! ఇంకా కొత్త బట్టలెందుకు?" అంది.     "నీకు తెలీదులే బామ్మా, నువ్వు ఊరుకో! అమ్మకొంటుందిలే; ప్రతి శనివారంనాడూ బడికి కొత్త బట్టలేసుకెళ్తేనే కద, నాకు గౌరవం?!" అంది లత, గొంతు తగ్గించి. "సరే. ఈసారికి నీ బట్టలు నేను కొనిస్తాలే; నా పెన్షన్ డబ్బు ఈరోజే వచ్చింది. త్వరగా ఏదైనా తినేసి, పాలు త్రాగిరా!" అంటూ ముఖం కడుక్కునేందుకు లేచింది బామ్మ. బామ్మ తయారయ్యేసరికి లతకూడా కొంచెం‌ ఉప్మా తిని, పాలు త్రాగి వచ్చింది. ఇద్దరూ లిఫ్టు దిగి గేటు దగ్గరికి వచ్చారు. అక్కడ గేటు ప్రక్కగా వాచ్‌మ్యాన్ భార్య వెంకమ్మ కూర్చొని ఏదో కుడుతున్నది. ప్రక్కనే ఆమె కూతురు కుమారి- శ్రధ్ధగా ఏదో చదువు కుంటున్నది. కుమారి మంచి పిల్ల- లత ఈడుదే. "ఏం చదువుతున్నావ్, కుమారీ?!" అడిగింది బామ్మ. తలెత్తి చూసిన కుమారి నవ్వి, "ఇవాళ్ళ బడిలో చెప్పిన పాఠాలు చదువుకుంటున్నానండీ బామ్మగారూ! పరీక్షలు వస్తున్నాయి కదా!" అన్నది. "ఏదో కుడుతున్నట్లున్నావ్ వెంకమ్మా?!" అంది బామ్మ వెంకమ్మతో. "దీనికి రేపటికి బళ్ళోకి ఏసుకెళ్ళను గౌను, పెద్దమ్మ గారూ! కొద్దిగా చిరిగిపోతే కుడతన్నా! ఇది లతమ్మ గారిదే, మీరు గతేడాది ఇచ్చారు!" అంది వెంకమ్మ. "చినిగి పోతే కొత్తది కొనుక్కోక, కుట్టుకుంటారేంటీ!!" అంది లత. "మీకేంటమ్మా, లతమ్మా! మీ నాన్నగారు పెద్ద ఉజ్జోగి; ఆ అయ్య సంపాదిత్తా ఉంటే ఎన్నైనాకొంటారు. మాకు డబ్బులేవీ, కొనను? మీలాంటోల్లిచ్చిన పాత బట్టలే వాడుకుంటాం" అంది వెంకమ్మ. లత మాట తీరు ఆమెకి కూడా తెలుసు. "సరే గానీ కుమారీ! నీకు మొన్న జరిగిన సమ్మరీ‌ అసెస్మెంటు- లెక్కల్లో ఎన్ని మార్కులొచ్చాయి?" అడిగింది బామ్మ. కుమారి ముఖం చిన్నబోయింది. "93% వచ్చాయి బామ్మగారూ. 'లెక్కల్లో వందకు వందా వేస్తారు కదా, ఏడు మార్కులు ఎందుకు పోయాయి?' అని అడిగారు మా సారు" చెప్పింది.     "అవును, నిజమే కుమారీ! ఈసారి లెక్కల్లో వందకి వంద తెచ్చుకో. నా వైపునుండి నీకూ ఓకొత్త గౌను కొనిపెడతాను- సరేనా?!" అంటూ లత వైపుకు తిరిగింది బామ్మ- "పద లతా, వెళ్దాం; కొత్త గౌను కొనుక్కునేందుకు" అంది. పది అడుగులు వేసారో లేదో, చిన్న టైలర్ షాపు వద్ద లత వాళ్ళింట్లో పనిచేసే పద్మ కనిపించింది. "ఏంటి పద్మా, ఇక్కడున్నావ్?!" అంది బామ్మ. "పెద్దమ్మగారాండీ! మా పిల్లదాని పరికెణా సిరిగిపోతే కుట్టిస్తన్నానండీ, రేపేసుకెళ్ళాలనీ" అంది పద్మ. "ఓహో!" అని తలూపింది బామ్మ. "మరి మీ పిల్ల చదివేది కూడా ఏడో క్లాసే కదా, మా లతలాగా?! మొన్న పరీక్షల్లో దానికి ఇంగ్లీషులో ఎన్ని మార్కులొచ్చాయేం?!" అడిగింది. "ఎన్నో యాడివండీ?! తొంబై ఐదొచ్చాయంటండీ, ఐదు తగ్గాయని ఒకటే గోలండీ! ఇంటికాడ కూకుని చదవతన్నాదండీ! మీరేడ్కండీ, ఎల్తండరూ?!" అంది పద్మ. "ఏం లేదులే!మా లతమ్మకు కొత్త ఫ్రాక్ కావాలంటే కొందామనీ.." చెప్పింది బామ్మ. "ఈ పరికెణా కూడా మీ లతమ్మ గారిదేనండీ! రెండేల్ల కితం ఇచ్చినారండీ! భలే గట్టిదండీ! నిన్ననే- ఉతికి ఆరేత్తాంటే, ముల్లుదిగి సిరిగిందండి! పోయి రండమ్మొగోరూ, పొద్దుగూకుతన్నాది!" అన్నది పద్మ. రోడ్డు మలుపు దగ్గర వద్ద రోజూ కూరలు గంపలో తెచ్చి అమ్మే పోలమ్మకూడా ఏదో కుడుతూనే ఉంది సూదితో. దారం తెగడంతో మనవరాల్ని పిలిచి, సూదికి దారం ఎక్కించమని అడుగుతోంది. వాళ్లని దాటుకొని ముందుకు పోతున్న బామ్మ కావాలని అక్కడ ఆగింది."ఏంది పోలమ్మా! చీకటి పడుతుంటే కుడుతున్నావ్?" అని అడుగుతూ. "పెద్దమ్మగోరండీ! మా పిల్దాని గౌను సిరిగిందంటండీ! రేపు ఇస్కూల్‌కేసుకెల్లాలంటమ్మగోరూ, దీంతల్లి ఇంకా పని కాడ్నుంచీ రాలేదండీ, అందుకని కుట్టిస్తన్నానండీ. ఎన్ని దినాల్నుంచో 'కుట్టుకోడం నేర్చవే' అంటే రాదు. ఎప్పుడు సూసినా ఆ పుస్తకాలు ముందేసుకుని చదువుతా కూకుంటాదండీ. నాకా, కల్లు కాన్రావు"అంది. "ఏం నళినీ!, సోషల్లో ఎన్ని మార్కులు వచ్చాయి?" అంది బామ్మ, పోలమ్మ మనవరాలిని చూస్తూ. "అమ్మగారూ అన్నిట్లో 95 పైనేనండీ! ఈ సంవత్సరం సెవెంత్ కదండీ ! జిల్లా ఫస్ట్ రావాలని మా టీచరమ్మ కోప్పడుతుంటే చదువుకుంటున్నానండీ! నేనూ-కుమారీ ఇద్దరం ఒకే మున్సిపల్ స్కూల్, మా ఇద్దరికీ గట్టి పోటీ నండి" చెప్పింది ఆ పాప. "సరే గానీ నీ గౌన్ చిరిగిపోయిందిటగా, మరి కొత్తది కొనిపించుకోలేక పోయావూ?!" అంది బామ్మ. "కాస్త చిరిగితే కొత్తదెందుకండీ?! అయినా ఇది లతమ్మ గారిదేనండి- మీరే గత వేసవికాలంలో ఇచ్చారు. మొన్న ఓసారి నోట్ బుక్సూ, పెన్నూ కొనుక్కోవాలంటేనే డబ్బులు లేవంది అమ్మ!"చెప్పింది ఆ పాప. "సరే, బాగా చదువుకో మరి! నీకు ఫస్ట్ ర్యాంకు వస్తే నేవొచ్చి నీకు కొత్త గౌను కొనిస్తాలే!" అంది బామ్మ. "ఈసారి నాకు గౌను వద్దమ్మా- వీలైతే ఒక ఇంగ్లీషు డిక్ష్నరీ కొనివ్వండి!" అంది నళిని. "అలాగే తల్లీ! బాగా చదువు మరి!" అంటూ బయల్దేరిన బామ్మ, కొద్ది దూరం వెళ్ళాక లతని అడిగింది: "లతా! నీకు ఎన్ని మార్కులు వచ్చాయి?" అని. లత సిగ్గు పడుతూ చెప్పింది: "అన్నిట్లోనూ 50%కంటే తక్కువే వచ్చాయి"అని. "మరి మీ అమ్మా-నాన్నా ఇద్దరూ నువ్వు కోరినవన్నీ కొనిస్తున్నారు కదా తల్లీ! ఎందుకు, చదవట్లేదు? ఊరికే 'అవీ-ఇవీ కావాలి' అని గొడవ చేస్తున్నావ్, ఎందుకూ?! రెండు గౌన్లతో ఆ పిల్లలతా వందకి 90 తెచ్చుకుంటుంటే, బీరువా నిండా ఉండే బట్టలతో నీకేమో మరి వందకు 50 దాటలేదు. అసలు నువ్వు చెప్పు: మనుషులకు బట్టలు ఎందుకు? మన జీవితం సాఫీగా కొనసాగేందుకు కదా; శరీరాన్ని దాచుకునేందుకు, చలి-ఎండల నుండి శరీరాన్ని కాపాడుకునేందుకు గదా, బట్టలు వేసుకునేది?! మరి- నువ్వు ఎట్లాంటి బట్టలు వేసుకుంటావో చూసుకో! వాటితో‌ నీ శరీరానికి ఏం రక్షణ లభిస్తున్నది? అవి ఎంత పల్చగా ఉన్నాయో చూసావా?! ముతకగా ఉన్నాయనీ, మందంగా ఉన్నాయనీ వంక పెట్టి నువ్వు వాళ్లకి ఇచ్చేసిన గౌన్లనే ఆ పిల్లలు సంవత్సరమంతా వాడుకుం-టున్నారు; అయినా 90 శాతం మార్కులు తెచ్చుకుంటున్నారు! మన బట్టల ఖరీదుకీ, మనకుండే తెలివి తేటలకీ ఏమీ సంబంధం‌ ఉండదు కదా తల్లీ, అసలు!" అనేసింది బామ్మ ధైర్యంగా. లత బామ్మను కౌగిలించుకొని కళ్ళ నీళ్ళు తిరగ్గా "తప్పైపోయింది బామ్మా! ఖరీదైన బట్టలేసుకుని మా తరగతి పిల్లలందరికంటే దర్జాగా ఉండాలనుకున్నానే తప్ప, చదువు గురించి ఏనాడూ ఆలోచించలేదు బామ్మా! అమ్మా-నాన్న కూడా చదువు గురించి అసలు ఎప్పుడూ ఆడగనే అడగరు. 'వాళ్లు ఎట్లాగూ అడగరులే' అని నేను ఈ పిచ్చిలో పడ్డాను. ఈ పిల్లల్ని చూసాక నా కళ్ళు తెరుచుకున్నాయి. ఇప్పుడు ఇంక ఎంత బాగా చదువుకుంటానో నువ్వే చూద్దువు! ఈ సారికి నన్ను క్షమించు" అంది. "పిచ్చిపిల్లా! గౌరవమూ, దర్జా మన నడవడిని బట్టి వస్తాయి కానీ, మనం వేసుకునే బట్టలను బట్టి కాదమ్మా! ఎక్కడికి వెళ్ళేప్పుడు ఆ సందర్భాన్ని అనుసరించి దుస్తులు ధరించాలి. మనలో మనకు ఎక్కువ-తక్కువ భావనలు లేకుండా కలిసి మెలసి జీవించాలనేగా, స్కూళ్ళలో 'యూనిఫాం' పెట్టేది? సరేలే, దానికేం గానీ, వెళ్దాం పద. బట్టల దుకాణం మూసేస్తే మళ్ళీ అదొక సమస్య!"అంది బామ్మ. "బీరువాలో అన్నన్ని గౌన్లున్నాయి: ఇప్పుడింక నాకు ఏ గౌన్లూ వద్దు బామ్మా! ఇంటి కెళదాంపద. ఇప్పుడింక చదువు మొదలెట్టాలి" అంటూ బామ్మని వెనక్కి తిప్పింది లత.   Courtesy.. kottapalli.in  

పగటికల తెచ్చిన తిప్పలు

పగటికల తెచ్చిన తిప్పలు     మీనాక్షమ్మ చాలా మంచిది. అందరికీ సహాయపడేది. కానీ ఆమె కొడుకు రాము మాత్రం ఏ పని చేయకుండా జులాయిగా తిరిగేవాడు. తల్లి ఎంతో కష్టపడి డబ్బు సంపాదించి కొడుకును చదివిస్తుంటే, రాము మాత్రం చదువు కోకుండా అల్లరి చిల్లరిగా తిరిగేవాడు. "ఏమిరా రామూ?! ఎప్పుడూ అలా తిరుగుతుంటావు? చదువూ సంధ్యా లేదా? మీ బళ్ళో ఎవ్వరూ ఏమీ అనరా, ఇలా తిరిగితే?" అని ఎవరైనా అడిగితే, "ఓహో, నా గురించి మీకేం తెలుసు? నేను ఎంత తెలివైన వాడినంటే, నాకు పదవతరగతిలో జిల్లా ఫస్టు ఖాయం. చూస్తూండండి, ఆ తర్వాత నేను ఐఎఎస్సాఫీసర్నవుతాను- అప్పుడుగానీ మీ అందరినోళ్ళూ మూతపడవు" అని బుకాయించి తన దారిన తను పోయేవాడు. అలా ఎందుకైందో ఏమో గానీ- రాను రాను రాము వాస్తవాల్ని మరచిపోయి, ఎప్పుడూ పగటి కలల్లోనే విహరించటం మొదలైంది. ఊరికే కూర్చొని 'నేను ఇట్లా అవుతాను గదా, అప్పుడు చాలా బాగుంటుంది; ఆ తర్వాత ఇట్లా అవుతుంది- ఇంకా చాలా బాగుంటుంది!' అని అనుకుంటూ ఆనందపడేవాడు. ఒక రోజున ఇట్లాగే పగటి కలలు కంటూ కూర్చున్న రాముని వచ్చి పలకరించాడు ఒక రైతు. "నాకు 25 తాటి చెట్లు ఉన్నాయి. ఆ తాటి చెట్లు ఎక్కి, తాటికాయలు కోసి క్రిందకు దించితే- చెట్టుకు 25 రూపాయలు చొప్పున ఇస్తాను" అన్నాడు. రాముకు చదవటం అంటే ఎంత అయిష్టం ఉన్నా, చెట్లు ఎక్కడం అంటే మాత్రం చాలా ఇష్టం! అందుకని, రైతు మాట వినగానే రాము "సరే" అని బయలుదేరాడు. అయితే ఒక వైపున తాటి చెట్టు ఎక్కి తాటికాయలు కోస్తుండగానే వాడి ఆలోచనలు పరుగులు తీసాయి: "చెట్టుకి 25రూపాయలు వస్తాయి, నాకు. ఈ డబ్బుల్ని నేను మా అమ్మకు ఇస్తే, నా పుట్టిన రోజుకు బట్టలు, కేకులు కొనిపెడుతుంది. అప్పుడు నేను కేకును కోసి అమ్మకు తినిపిస్తాను. అమ్మ 'నాకెందుకురా' అంటూనే తింటుంది-'నీకు నేనంటే ఎంత ఇష్టంరా' అంటుంది. అప్పుడు నేను ఇట్లా నవ్వి, 'ఇంత!' అని చూపిస్తాను-" అనుకుంటూ తన చేతులు రెండూ వదిలిపెట్టాడు. అంతే! ఆ తర్వాత తెలివి వచ్చి చూసేసరికి రాము కింద పడి ఉన్నాడు. ముందరి పళ్ళు రెండూ ఊడిపోయాయి. అమ్మ వచ్చి, వాడిని బాగా తిట్టి ఆసుపత్రికి తీసుకెళ్ళింది. పగటి కలలు ఎన్ని కష్టాల్ని కొని తెస్తాయో అనుభవం కొద్దీ గ్రహించిన రాము, ఆ తరువాత వాస్తవంలో బ్రతకటం అలవరచుకున్నాడు.   Courtesy.. kottapalli.in

పగటి కలలు

పగటి కలలు       వాసు, వాసంతి అన్నా చెల్లెళ్ళు. వాళ్లిద్దరూ కలసి ఆడుకునేవాళ్లు, పాడుకునేవాళ్లు, చక్కగా బడికి పోయేవాళ్లు. ఒకసారి వాళ్ల ఇంటికి బంధువుల అబ్బాయి చంద్ర వచ్చాడు. ఒట్టి చంద్ర కాదు వాడు- `కలల చంద్ర'. చంద్రకు కలలు కనడమంటే ఇష్టం. సమయం దొరికినప్పుడల్లా కళ్ళు మూసుకుని, కలల్లో తేలిపోతుండేవాడు. చాలా కాలానికి తమ ఇంటికొచ్చిన చంద్రను వెంటపెట్టుకొని, వాసు, వాసంతిలు వాళ్ల తోటకు వెళ్ళారు. తోటలో మామిడి కొమ్మకు ఉయ్యాల కట్టి ఊగుదామనుకున్నారు ముగ్గరూ. చంద్రకు కూడా ఉయ్యాల ఊగటం అంటే చాలా చాలా ఇష్టం. తనే మొదట ఊగుతానన్నాడు వాడు. `సరే' నువ్వే మొదట ఊగమని, వాడిని ఊపడం మొదలుపెట్టాడు వాసు. ఉయ్యాలలో కూర్చోగానే చంద్రకు కలలు మొదలయ్యాయి:     ఊగే ఉయ్యాలలోంచి ఆకాశంలో దూసుకుపోతున్న ఓ రాకెట్ లోకి ఎగిరిపోయాడు చంద్ర. అక్కడినుండి ఏకంగా ఒక గ్రహం మీదికి దూకాడు. ఆ గ్రహం మన భూమిలాగా నిలకడగా లేదు! ఉయ్యాలలాగా ఊగిపోతున్నది. చివరికి అక్కడి చెట్లుకూడా అటూ ఇటూ సోలిపోతూనే ఉన్నాయి. ఇంకా అలా ఊగుతూనే, చంద్ర ఆ గ్రహంమీద నడవటం మొదలుపెట్టాడు. నడిచీ నడిచీ కాళ్ళు నొప్పులైతే పుట్టాయిగానీ, అక్కడ జనసంచారం అన్నది లేదు. అంతలో అతనికి ఒకచోట పే..ద్ద- మెరిసే వస్తువు ఒకటి కనిపించింది. 'ఏమిటా?' అనుకుని దాని దగ్గరికెళ్ళి చూశాడు- చూస్తే, ఆశ్చర్యం! అది ఒక భారీ వజ్రం. దాన్ని ఎత్తుకుపోదామని ప్రయత్నించాడు చంద్ర. అయితే ఆ వజ్రం సుమారు ఇరవై కిలోల బరువు ఉంటుందేమో, అసలు కదలలేదు. ఎలాగైనా సరే ఆ వజ్రాన్ని ఎత్తుకుపోవాల్సిందే అని, వాడు ముందుకు వంగి, రెండు చేతుల్తోటీ వజ్రాన్ని పట్టుకొని, అతి ప్రయత్నంమీద, బలంగా ఎత్తాడు!! - ఇంకేం చెప్పాలి? వజ్రంకోసం చేతులు వదిలిన చంద్ర, ఉయ్యాలలోంచి దబ్బున కిందపడ్డాడు .     పాపం, చంద్ర! కలలచంద్రకు పళ్ళు ఊడినంత పనైంది. దగ్గర్లోనే ఉన్న వాసు, వాసంతిలు పరుగు పరుగున వచ్చి చంద్రను పైకి లేపి, "ఏమైంది? ఎందుకు, కింద పడ్డావు?" అని అడిగారు. అప్పుడే కల నుండి తేరుకొన్న ఆ కలల రాకుమారుడు ముక్కుతూ, మూలుగుతూ తన సుందర స్వప్నాన్ని వివరించాడు. ఆ తర్వాత వాసు, వాసంతిలు చాలాకాలం వరకూ కలల రాకుమారుణ్ని తలుచుకుని నవ్వుకున్నారు. చంద్ర మాత్రం అప్పటినుంచి పగటి కలలు కనడం మానేశాడు. Courtesy.. kottapalli.in

చీమ-గడ్డిచిలక

  చీమ-గడ్డిచిలక     అనగా అనగా ఒక చీమ ఉండేది. ఎప్పుడూ పనే చేసుకుంటూ ఉండేది అది. ఎండాకాలం అంతా ఆహార సంపాదనలో గడిచిపోయేది. వానాకాలం అంతా అది ఆ ఆహారాన్ని భద్రం చేసుకునేది. ఇక చలికాలం మొత్తం ఆకలిగా తింటూ, నిద్ర మత్తులో ఉండేది. అట్లా అది ఎప్పుడు చూసినా ఏదో ఒక పనిలో మునిగిపోయే ఉండేది. అస్సలు బయటి ప్రపంచాన్నే చూసేది కాదు. ఒకసారి దానికి ఎవరో చెప్పారు- 'ఈ దేశపు రాజుగారు ప్రతి చలికాలంలోనూ ఒక పోటీ‌ పెడతారు. ఆ పోటీలో గెలవటం అంటే మాటలు కాదు. గెలిస్తే మాత్ర్రం ఇంక మన పంట పండినట్లే: జీవితమంతా సాఫీగా జరిగిపోతుంది. అయితే పోటీలో గెలిచేందుకు చాలా తెలివితేటలు ఉండాలి. ఒక్క తెలివితేటలుంటే చాలదు- చాలా‌ సాధన కూడా అవసరం'. చీమ వాళ్ళింటికి దగ్గర్లోనే ఒక గడ్డిచిలక (మిడత) ఉండేది. దానికి పాటలంటే చాలా ఇష్టం. వీలు చిక్కిందంటే చాలు, పాడటం మొదలుపెట్టేది. వాన చినుకులన్నా, ప్రొద్దునే చెట్ల ఆకులమీద నిలిచే మంచు బిందువులన్నా దానికి అమితమైన ప్రేమ. కధలంటే- ఇంకేమి, చెవులు కోసుకుంటుంది. ఎన్నెన్ని కథలు చదివిందో లెక్కలేదు. వాళ్ల అమ్మమ్మ దానికి తనెప్పుడో విన్న చీమ-గడ్డిచిలక కథ చెప్పి- "ఒరే, నువ్వు ఏమైనా పాడుకోరా, కానీ చలికాలానికి తిండిని సేకరించి పెట్టుకోవటం మాత్రం మరువకు. మనందరం బద్ధకస్తులమని ఇప్పటికే చెడ్డపేరు వచ్చేసింది. నువ్వే ఆ పేరును తుడిచెయ్యాలి" అంటుండేది. "నువ్వు చూస్తూండు అవ్వా, రాజుగారు పెట్టే పోటీలో నేను నెగ్గి ఎంత మంచిపేరు సంపాదించి పెడతానో. నాకు మాత్రం లేదా, బాధ్యత!" అంటుండేది గడ్డిచిలక. పోటీకోసమని వాళ్ల నాన్న ఏవేవో పుస్తకాలు తెచ్చిపెడితే, అది వాటినన్నిటినీ త్వరత్వరగా చదివేసి, మళ్ళీ పాటలు, ఆటలు, ఎగరటాలు అన్నీ కొనసాగించేది. "అప్పుడే చదివేశావా? ఇవేమన్నా కథల పుస్తకాలనుకున్నావా?" అని ఆయన మందలించేవాడు. "నిజం నాన్నా, నాకు వచ్చేసినై, కథల్ని వేగంగా చదివీ చదివీ వేటినైనా వేగంగానే చదువుతున్నాను నేను" అనేది అది. అంతలో చలికాలం రానే వచ్చింది. రాజుగారు పెట్టే పోటీకి వెళ్ళాయి చీమా, గడ్డిచిలకా రెండూనూ. చీమ "నేను గెలవాలి-నేను గెలవాలి" అని జపం చేసుకుంటూ, గోళ్ళు కొరుక్కుంటూ, భయం భయంగా నిలబడింది. గడ్డిచిలక నవ్వుకుంటూ, చిలకపాటలు పాడుకుంటూ‌ కులాసాగా నిలబడింది. హడావిడిపడి, గందరగోళంపడి పోటీ‌ జరిగే సమయానికి చతికిలబడిపోయింది చీమ. గడ్డి చిలక ఆడుతూ పాడుతూ పోయి, పోటీలో చక్కగా గెలుచుకొని వచ్చింది. కాబట్టి, చదువుల్లో హడావిడి, గందరగోళం అవసరం లేదు. ఇష్టంగా, ధైర్యంగా, మెల్లగా, బాధ్యతగా రోజూ చదువుకుంటే చాలు. ఆటలు ఉంటే చదువులు రావని అనుకోకూడదు. నిజానికి ఆడుతూ పాడుతూ ఉన్న చిలక పిల్లలే బాగా చదువుకునేది. చదువుల్లోగాని, ఆటపాటల్లోనేగాని- చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచిపోకూడదు. మనందరం కలిసి బ్రతుకుతున్నాం కద, అందుకని ఒకరికొకరం సహాయం చేసుకుంటూ ఉండాలి. పాత కాలంలో చీమలే గొప్పవని అనుకునేవాళ్ళు. గడ్డిచిలకలే గొప్పవనేది ఇవాల్టి మాట. ఆడుతూ పాడుతూ చక్కగా చదువుకుందాం. మనందరికీ దారి చూపుతున్న గడ్డిచిలకలకు అభినందనలతో,.....   Courtesy.. kottapalli.in