మీ శాంతిని భగ్నంచేస్తాం!
posted on Aug 20, 2019
మీ శాంతిని భగ్నంచేస్తాం
అనురాగం అంబరమైతే
ఆనందం అర్ణవమైతే
మేం తోకచుక్కగా వస్తాం
బడబానలమై మండిస్తాం
ప్రపంచమొక నందనవనమై
జీవితమొక గులాబి ఐతే
మేం ముళ్ళతొడుగుగా ఉంటాం
సుఖస్వప్నం భంగపరుస్తాం
ఈ జీవిత కేళి గృహంలో
సుఖమే ఒక విరిపాన్పైతే
మేం కాలసర్పమై వస్తాం
విషజ్వాలల ధార విడుస్తాం
మీ నిద్రాసుఖసమయంలో
స్వాప్నిక ప్రశాంతి నిలయంలో
మేం పీడకలలుగా వస్తాం
రౌరవదృశ్యం చూపిస్తాం
మీ ప్రణయోత్సుక మధుగీతం
మీనృత్యమత్త సంగీతం
మీకటుక్షుధారోదనంలో
ముంచేస్తామొక్క క్షణంలో
మీ హేమాసన పాత్రల్లో
మీ స్వప్నజగతి యాత్రల్లో
మా అశృధార నింపేస్తాం
మీబాటను జారుడు చేస్తాం.
పానకపు పుడకగా వస్తాం
టీకప్‌లో ఈగైచస్తాం
మా ప్రాణాలైనా విడుస్తాం
మీ శాంతిని భగ్నంచేస్తాం.
(ప్రముఖ కవి బైరాగి రాసిన చీకటినీడలు కవితాసంపుటంలోంచి)