వరిగ సమోసా
కావలసిన పదార్ధాలు:
వరిగ పిండి - 1 కప్పు
బంగాళ దుంపలు - 2
ఉల్లి తరుగు - పావు కప్పు
నూనె - తగినంత
గోధుమ పిండి - 1 కప్పు
ఉప్పు - తగినంత
ఆవాలు - 1 టీ స్పూను
ఉడికించిన బఠాణీ - పావు కప్పు
తరిగిన పచ్చి మిర్చి - 3
కరివేపాకు - 1 రెమ్మ
తయారుచేసే విధానం:
రోజూ ఒకే రకమైన వంట తిని విసుగుపుడుతోందా? అయితే ఖచ్చితంగా ఇది మీ కోసమే. అదిరిపోయే వరిగ సమోసా హెల్త్ కి కూడా చాలా మంచిది.. ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం. ...
ఒక పాత్రలో వరిగ పిండి, గోధుమ పిండి, ఉప్పు వేసి, తగినన్ని నీళ్లు జత చేస్తూ చపాతీపిండిలా ముద్ద చేసుకోవాలి. చిన్న చిన్న ఉండలు చేయాలి.
ఒక్కో ఉండను తీసుకుని చపాతీలా ఒత్తి, మధ్యలోకి కట్ చేసుకోవాలి. బంగాళదుంపలను ఉడికించి తొక్క తీసి, చేతితో మెత్తగా అయ్యేలా మెదపాలి.
స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక కొద్దిగా నూనె వేసి కాచాలి. ఆవాలు వేసి చిటపటలాడించాలి. ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి.
ఉడికించిన బఠాణీ, ఉడికించిన బంగాళ దుంప, ఉప్పు జత చేసి అన్ని కలిసేలా బాగా కలియబెట్టి దింపేయాలి.
ఒత్తుకున్న చపాతీలను సమోసా ఆకారంలో చుట్టి, అందులో బంగాళదుంప మిశ్రమం కొద్దిగా ఉంచి మూసేయాలి. ఈ విధంగా అన్నీ తయారుచేసుకోవాలి.
స్టౌ మీద బాణలిలో నూనె వేడయ్యాక, తయారుచేసి ఉంచుకున్న సమోసాలను వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి.
వేడి వేడీ వరిగ సమోసాలను టమాటా సాస్ లేదా గ్రీన్ చట్నీతో తింటే రుచిగాఉంటాయి.