పర్ఫెక్ట్ రొయ్యల బిర్యానీ
బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. నేడు అందుబాటులోకి రకరకాలు రుచికరమైన బిర్యానీలు అందుబాటులోకి వచ్చాయి. అందులోనూ సండే వచ్చిందంటే.. తమ పిల్లల కోసం ఎలాంటి వెరైటీ వంటకాలు చేసిపెట్టాలని ప్రతి తల్లి ఆలోచిస్తుంది. ఎప్పుడు చికెన్ మటన్ కాకుండా ఇలా ఆరోగ్యానికి మేలు చేసే రొయ్యలతో మీ పిల్లలకు బిర్యానీ వండిపెట్టండి. లొట్టలేసుకుంటూ తింటారు. పోషకాలు అందించడంలో రొయ్యలు బాగా ఉపయోగపడతాయి. మరింకెందుకు ఆలస్యం వెంటనే రుచికరమైన, ఆరోగ్యకరమైన రొయ్యల బిర్యానీని వెంటనే వండి పెట్టండి..
కావలసిన పదార్థాలు:
బియ్యం - 1 కేజీ
రొయ్యలు - కేజీన్నర
పెరుగు - 200 గ్రాములు
నిమ్మరసం - 3 టీస్పూన్లు
కారంపొడి- 20 గ్రాములు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 100 గ్రాములు
ఉప్పు - 50 గ్రాములు
గరంమసాలా - 20 గ్రాములు
రిఫైన్డ్ ఆయిల్ - 100 గ్రాములు
వేగించిన ఉల్లి ముక్కలు (సన్నగా నిలువుగా కోసి) - 30 గ్రాములు
జీడిపప్పు - కొద్దిగా
కొత్తిమీర తరుగు - 15 గ్రాములు
పుదీనా తరుగు - 15 గ్రాములు
బిర్యానీ ఆకులు - 5 గ్రాములు
డాల్డా లేదా నెయ్యి - 150 గ్రాములు
నీళ్లు - 5 లీటర్లు
తయారీ విధానం :
ఒక గిన్నెలో రొయ్యలు వేసి వాటిలో నిమ్మరసం, అల్లంవెల్లుల్లి పేస్ట్, గరంమసాలా, వేగించిన ఉల్లి ముక్కలు, పెరుగు, కొత్తిమీర, పుదీనా తరుగు, ధనియాల పొడి, నూనె వేసి మార్నేట్ చేసుకోవాలి. దీన్ని అర గంట పాటు అలాగే ఉంచాలి.
ఇపుడు కుక్కర్ పెట్టి ఆయిల్ ఇంకా నెయ్యి వేసుకుని అందులో లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, పుదీనా, కొత్తిమీర వేసి బాగా వేయించుకుని, సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేస్కుని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి, ఇపుడు అందులో మనం ముందుగా మార్నేట్ చేసి పెట్టుకున్న రొయ్యల మిశ్రమాన్ని కూడా వేసుకుని, అందులో వచ్చిన నీళ్లు అంత ఆవిరి అయ్యేవరకు ఉంచాలి.
తర్వాత బియ్యానికి సరిపడా నీళ్లు వేసి ఉప్పు చూసుకుని, బాగా మరిగాక కడిగి పెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు లేకుండా చూసుకుని ,మసులుతున్న నీళ్లలో వేసి ఒకసారి బాగా కదిపి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చాక, కాసేపు చిన్నమంటపై ( సిమ్ లో ) ఉంచాలి.
20 నిమిషాల తర్వాత మూతను తీసి కొత్తిమీర, పుదీనాల తరుగు, జీడిపప్పు, వేగించిన ఉల్లిపాయ ముక్కలతో అలంకరించాలి. అంతే రుచికరమైన రొయ్యల బిర్యానీ రెడీ అయినట్లే.. ఈ రొయ్యల బిర్యానీ ఏమీ కలుపుకోకుండా అలానే తిన్నా రుచిగా ఉంటుంది. పెరుగు పచ్చడితో తింటే మరింత బాగుటుంది.