కేఎఫ్‌సీ చికెన్ ఇంట్లోనే
కేఎఫ్‌సీ చికెన్ అంటే చాలా మంది ఇష్టపడతారు అది తెలిసిన విషయమే. ముఖ్యంగా పిల్లలు. ఎందుకంటే ఎప్పుడూ ఇంట్లో చికెన్ కరీ లాంటి ఒకే వెరైటీ తింటే వాళ్లకూ కూడా బోర్ గా ఉంటుంది కాబట్టి. అందుకే ఇంట్లోనే కేఎఫ్‌సీ చికెన్ ఎలా తయారు చేసుకోవచ్చో నేర్చుకుందాం. దీనివల్ల వాళ్లు బయట ఫుడ్ కు అలవాటు పడటం కూడా తగ్గుతుంది. అంతేకాక అక్కడ ఎలా తయారు చేస్తారో తెలియదు.. మనం ఇంట్లోనే చేస్తాం కాబట్టి ఎలాంటి భయం లేకుండా చక్కగా తినొచ్చు.
కావలసిన పదార్ధాలు:
చికెన్ ముక్కలు (స్కిన్ తో) - 1/2 కేజీ
నూనె - ఫ్రై చేయడానికి తగినంత
గుడ్లు - 2
పాలు - 2 లేదా 3 చెంచాలు
మైదా - రెండు కప్పులు
గార్లిక్ పౌడర్ - 2 చెంచాలు
ఉల్లిపాయ పౌడర్ - 2 చెంచాలు
మిర్చి పౌడర్ - 1 చెంచా
ఓట్స్ పిండి - 2 చెంచాలు
సాల్ట్ - రుచికి తగినంత
చికెన్ ను నానపెట్టుకోవడానికి
నిమ్మరసం - 1 చెంచా
మిర్చి పౌడర్ - 1/2 టేబులు స్పూన్
పెప్పర్ పౌడర్ - 1/2 టేబులు స్పూన్
సాల్ట్ - తగినంత
తయారీ విధానం:
ముందుగా చికెన్ ను శుభ్రంగా కడిగి వాటర్ డ్రై అవడానికి ఒక పేపర్ టవల్ మీద పెట్టుకోవాలి. తరువాత ఒక గిన్నె తీసుకొని దానిలో నిమ్మరసం, మిర్చిపౌడర్, పెప్పర్ పౌడర్, సాల్ట్ వేసి కలిపి ఈ మిశ్రమంలో చికెన్ వేసి రెండు గంటలపాటు నానపెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిలో రెండు గుడ్లు పగలగొట్టి.. పాలు పోసి మిశ్రమం మెత్తగా అయ్యేవరకు చేసుకోవాలి. ఇప్పుడు మరో గిన్నె తీసుకొని దానిలో మైదాపిండి, గార్లిక్ పౌడర్, ఉల్లిపాయ పౌడర్, మిర్చీ పౌడర్, పెప్పర్ పౌడర్, బ్రెడ్ ముక్కలు, ఓట్స్, ఉప్పు వేసి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమంలో ముందుగా నానపెట్టుకున్న చికెన్ ముక్కలను ముంచి మిశ్రమం ముక్కలకు మొత్తం అయ్యేలా చూసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నూనె తీసుకొని దానిని స్టవ్ మీద పెట్టి నూనె బాగా వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కిన తరువాత ఇప్పుడు చికెన్ ముక్కలను తీసుకొని వాటిని మనం ముందుగా కలిపి ఉంచుకున్న పాలు గుడ్లు మిశ్రమంలో ముంచి నూనెలో వేయాలి. చికెన్ ముక్కలు బాగా ఫ్రై అయ్యేలా.. గోల్డ్ కలర్ వచ్చేంత వరకూ ఉంచి తీసి ఒక టిష్యూ పేపర్ మీద వేసుకుంటే దానిలో ఉన్న ఆయిల్ పీల్చుకుంటుంది. అంతే ఎంతో టేస్టీగా ఉండే కేఎఫ్‌సీ చికెన్ రెడీ.. వీటిని టోమాటో సాస్ తో కానీ మిర్చీ సాస్ తో కాని తింటే చాలా బావుంటాయి.