MEMORIES
టాంటెక్స్ సాహిత్య వేదికపై తెలుగు వెన్నెల కురిపించిన ఉగాది కవి సమ్మేళనం: ఘనంగా ముగిసిన 81 వ సదస్సు

 

 

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక సమర్పించిన "నెల నెలా తెలుగు వెన్నెల" 81 వ సదస్సు ఆదివారం, ఏప్రిల్ 20 వ తేది స్థానిక డీ.ఎఫ్.డబ్ల్యూ. హిందూ దేవాలయ ప్రాంగణంలో సాహిత్యవేదిక సమన్వయకర్త ఆదిభట్ల మహేష్ ఆదిత్య అధ్యక్షతన నిర్వహించబడినది. డాల్లస్ పరిసర ప్రాంత భాషాభిమానులు, సాహితీ ప్రియులు అధిక సంఖ్యలో అత్యంత ఆసక్తి తో ఈ సమావేశానికి హాజరయి జయప్రదం చేసారు. ప్రవాసంలో నిరాటంకంగా 81 నెలల పాటు ఉత్తమ సాహితీ వేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించడం ఈ సంస్థ విశేషం.


స్థానిక చిన్నారి వాస్కర్ల శ్రియ శ్రావ్యం గా “సాధు సుజన తోషిణి” గీతం ఆలపించి సభను ప్రారంభించడం జరిగింది. ఉగాది సందర్భంగా జరిగిన కవి సమ్మేళనాన్ని స్థానిక చిన్నారి కస్తూరి ప్రణవ్ చంద్ర, అల్లసాని పెద్దన రాసిన మను చరిత్ర నుండి “ప్రవరాఖ్యుడు హిమశైలం” గురించి వివరిస్తున్న పద్యం శ్రావ్యం గా వినిపించి ప్రారంభించడం గమనార్హం.

 



సాహిత్య వేదిక సమన్వయకర్త  ఆదిభట్ల మహేష్ ఆదిత్య స్వాగాతోపన్యాసంలో తమ స్వీయ కవిత “ఉగాది.కాం” వినిపించి జయ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో సాహితీ ప్రియులందరికీ కవిసమ్మేళనానికి స్వాగతం పలికారు. కస్తూరి గౌతం చంద్ర నేటి యువతరం ఈ కార్యక్రమం లొ పాల్గొనడం చాల అనందదాయకం అని కొనియాడుతూ గుర్రం జాషువ గారి "బుద్ధ దేవుని పునరాహ్వానం" నుంచి రెండు పద్యాలు  వినిపించారు.   శ్రీమతి పాలూరి సుజన తమ  కవితలో “ఎన్నికల లో ఎన్ని కలలో “,  ప్రస్తుత ఎన్నికల వాతవరణం మీద లీటెర్ పెట్రోలు కొన్నవారికి స్కూటెర్ ఫ్రీ అన్నట్లు వంటి చెణుకులతో చక్కని కవిత చదివి అందరినీ ఆకట్టుకున్నారు.


ఆచార్య పూదూర్ జగదీశ్వరన్ టాంటెక్స్ ఉగాది పురస్కారాల మీద ఆశువుగా రాసిన పద్యాలు  కమ్మగా పాడి అలరించారు.  డా. గన్నవరపు నరసింహ మూర్తి స్వీయ రచన "వసంతం"  వర్ణిస్తూ "గగన తారల తలపు గరిక పూలు" అంటూ వసంత కాలం లొ పూచే టెక్సాస్ గడ్డి పూవులని వర్ణించారు.  నెల్సన్  మండేలా ను ఉద్దేశించి రాసిన  "నల్ల సింహం" కవిత ను  "నల్ల  సింహము విదిలించె నల్ల జూలు..తెల్ల ఏనుగు భీతిల్లి తల్లడిల్ల " అంటూ ముగించారు.

 




డా.జువ్వాడి రమణ, ఆదికవి నన్నయ పద్యం చక్కగా పాడి అందరి మన్ననలు పొందారు.  సాహిత్య వేదిక సభ్యుడు  నిమ్మగడ్డ రామకృష్ణ  "మధుమాసమిదే లే!" అనే స్వీయ కవితని చదివి వినిపించారు. మల్లవరపు అనంత్ కాల ప్రవాహం లొ దాచుకున్న కవితను దుమ్ము దులిపి తెచ్చాను మీకోసం అంటూ గతం లొ తాను రచించిన కవిత "కాల ప్రవాహం" చదివి వినిపించారు. కొండ శ్రీకాంత్ రెడ్డి, శ్రీనాధుని చాటువు చదివి వినిపించారు.  మద్దుకూరి విజయ చంద్రహాస్ స్వీయ కవిత "అదే" చదివి వినిపించారు. ఏలూరు వాస్తవ్యులు,  రిటైర్డ్ తెలుగు అధ్యాపకులు శ్రీ పి. శివశంకర్ రావ్ టాంటెక్స్ సాహిత్య వేదిక పై తాము రచించిన స్వీయ కవిత వినిపించి, ప్రవాసాంధ్రుల లో తెలుగు సాహిత్యాభిమానం గురించి  ప్రసంగించారు. ఆయలూరి బస్వి  "తెలంగాణా లో తెలుగు సాహిత్యం" అనే అంశం మీద చక్కని సమీక్షను జనరంజకముగా సాహితీ ప్రియులతో పంచుకున్నారు.


కుందేటి చక్రపాణి  "ఈ గాలి , ఈ నేల ఈ వూరు సెల యేరు" అంటూ చక్కని పాట పాడి శ్రవణానందం కలిగించారు.సాహిత్య వేదిక సభ్యుడు పున్నం సతీష్ "ఉగాది అదిగొ అరుదెంచె " అనే వడ్డేపల్లి క్రిష్ణ గారి  ఉగాది కవిత తో ఆరంభించి ఈ మాసం లొ పుట్టిన మహనీయులు కొందరిని తలుస్తూ, హితకరిణి సంస్థ స్థాపకులు,  గద్య తిక్కన బిరుదాంకితుడైన కందుకూరి వీరేశ లింగం గురించి "మాసానికో మహనీయుడు" శీర్షిక లొ వివరించారు.  సాహిత్య వేదిక సభ్యుడైన బసాబత్తిన శ్రీనివాసులు,  మహాకవి శ్రీ శ్రీ కవితలు కొన్ని చదివారు. టెంపుల్, టెక్సాస్  నుంచి విచ్చేసిన డా. వెంకట రాజు తాను రచించిన "ఉగాది శుభాకాంక్షలు" మరియు "తెలంగాణ జయోస్తు" అనే కవితలను ఆహ్వానితులతో పంచుకున్నారు.

 




సాహిత్య వేదిక సభ్యురాలు శ్రీమతి శారద సింగిరెడ్డి "మాతృభాష - మధురత్వం" అనే స్వీయ రచనను మధురం గా పంచుకున్నరు.  టాంటెక్స్ ఉత్తరాధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహారెడ్డి 'తెలుగు వేదం' మరియు 'కవి హృదయం' నుంచి ప్రత్యేకంగా ఎంచుకున్న కొన్ని కవితలతో పాటు,  మహిళ లను ఉత్తేజపరచడానికి తాను పొడుపు కథలు ఎంచుకున్నాను అని అందరి మెదడుకు పదును పెట్టి ఆకట్టుకుంటూ "ఉగాది ప్రసాదం" వడ్డించారు.


విరామంలో స్థానిక విందు రెస్టారెంట్ వారందించిన వేడి, వేడి అల్పాహారం (పునుగు) మరియు తేనీరు అందరూ స్వీకరించారు.  బొబ్బట్లు, ఉప్పు కారం తో పచ్చి మామిడి ముక్కలు ఉగాది కి  గుర్తుగా ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి. టాంటెక్స్ అధ్యక్షుడు కాకర్ల విజయ్ మోహన్  మాట్లాడుతూ  ఉగాది కవిసమ్మేళనం 81వ సదస్సులో అత్యంత ఆసక్తికరంగా జరగడం, ఇంతమంది సాహితీ ప్రియులు హాజరు కావటం తమకు ఆనందంగా వుంది అని వ్యక్తపరిచారు. టాంటెక్స్ సంస్థ పాలకమండలి సభ్యుడు డా. సి.ఆర్.రావు, తక్షణ పూర్వాధ్యక్షుడు మండువ సురేష్, కార్యదర్శి ఉప్పలపాటి కృష్ణారెడ్డి, కోశాధికారి వీర్ణపు చినసత్యం, కార్యవర్గ సభ్యులు శ్రీమతి వనం జ్యోతి, చామకూర బాల్కి మరియు సాహిత్య వేదిక బృంద సభ్యులు శ్రీమతి అట్లూరి స్వర్ణ, బండారు సతీష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


సభను ముగించే ముందు తెలుగు సాహిత్య వేదిక కార్యవర్గ బృందం వందన సమర్పణ చేస్తూ ఉగాది కవి సమ్మేళనం పూర్తి స్తాయిలో చక్కగా జరిగినందుకు సంతోషిస్తూ కార్యక్రమానికి విచ్చేసిన వివిధ సాహితీ ప్రియులకు, వేదిక కల్పించిన డీ.ఎఫ్.డబ్ల్యూ హిందూ దేవాలయ యాజమాన్యానికి, ప్రసార మాధ్యమాలైన దేశీ ప్లాజా, రేడియో ఖుషి, టీవీ9, 6టీవీ, టీవీ5, టోరి (తెలుగు వన్) వారికి మరియు విందు రెస్టారెంటు యాజమాన్యానికి కృతఙ్ఞతా పూర్వక అభివందనములు తెలియజేసారు.

TeluguOne For Your Business
About TeluguOne
;