- ఘనంగా ముగిసిన టాంటెక్స్ 82వ నెల నెలా తెలుగు వెన్నెల
- టాంటెక్స్ సాహిత్య వేదికపై తెలుగు వెన్నెల కురిపించిన ఉగాది కవి సమ్మేళనం: ఘనంగా ముగిసిన 81 వ సదస్సు
- ఘనంగా ముగిసిన టాంటెక్స్ 79వ “నెలనెలా తెలుగువెన్నెల”
- వైభవంగా ముగిసిన టాంటెక్స్ దీపావళి వేడుకలు
- ఘనంగా టాంటెక్స్ రియూనియన్ బాంక్వెట్ - అలరించిన సునీత సంగీత విభావరి
హాస్య, సంగీత నృత్యాలతో ఉర్రూతలూగించిన తారలు: వైభవంగా ముగిసిన టాంటెక్స్ దీపావళి వేడుకలు
భారతీయ సంస్కృతికి ఇది గర్వకారణమైన రోజు. భారతీయులకు అత్యంత ప్రధానమైన పండుగ దీపావళి. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఆధ్వర్యంలో ఈ సంవత్సరం దీపావళి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. స్థానిక పసందైన “విందు” వారి పదహారణాల సంప్రదాయ విందు తరువాత చిన్నారుల ప్రార్థనా గీతంతో వేడుకలు ఆట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అలెన్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ సెంటర్లో నిర్వహించిన ఈ సంబరాలకు డాల్లస్ ప్రాంతీయలు కుటుంబ సమేతంగా విచ్చేసారు. గత 27 సంవత్సరాలుగా తెలుగు భాషా సంస్కృతులను పరిరక్షిస్తూ, తెలుగు వారి అవసరాలకు అనుగుణంగా తమ కార్యక్రమాలను రూపుదిద్దుకుంటున్న టాంటెక్స్ (www.tantex.org) చరిత్రలో దీపావళి వేడుకలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. సాంస్కృతిక సమన్వయకర్తల ద్వయం శ్రీమతి కృష్ణవేణి శీలం మరియు శ్రీమతి జ్యోతి వనం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ మహేష్ ఆదిత్య ఆదిభట్ల కార్య క్రమానికి ముఖ్య వ్యాఖాతగా వ్యవహరించారు.
శ్రీమతి జ్యోతి వనం తమ స్వాగతోపన్యాసంలో “సత్యభామా సమేతుడై శ్రీకృష్ణుడు నరకాసురుడనే భయంకర రాక్షసుని చంపి, ప్రజలందరినీ కాపాడాడు. దానికి గుర్తుగా ప్రజలంతా ఆనందంగా ఆ విషయాన్ని గుర్తుచేసుకుంటూ జరుపుకొనే పండుగే దీపావళి. మీ అందరితో ఈ దివ్య దీపావళి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది” అని ఈ పండుగతో తమ అనుబంధాన్ని అభివర్ణించారు.
అనంతరం టాంటెక్స్ అధ్యక్షుడు శ్రీ సురేష్ మండువ తమ సందేశంలో 2013 లో వినూత్నంగా ప్రవేశపెట్టిన/నిర్వహించిన తెలుగు క్యాలెండర్, ఉగాది పురస్కారాలు, యూత్ ఫెస్టివల్, టాంటెక్స్ స్కాలర్షిప్స్, వనితల నౌకా విహారం, వార్షిక విందు కార్యక్రమాలకు వచ్చిన విశేష స్పందనను సభతో పంచుకున్నారు. కార్యక్రమాలు సఫలీకృతం కావడానికి ఆర్థిక సహాయ సహకారాలు అందించిన పోషక దాతలను, సభ్యులను మరోసారి గుర్తించి వారికి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియ జేశారు.
ఈ సారి దీపావళి వేడుకలకు విచ్చేసిన కళాకారులు వెండితెర మరియు బుల్లితెరలో గతంలో అలరించిన వారే కావడం విశేషం. నంది పురస్కార గ్రహీత, ప్రముఖ గాయకుడు, బుల్లితెర వ్యాఖ్యాత సాగర్, “పాప్” సంగీతంలో సరికొత్త సంచలనం సృష్టించి, యువతను విశేషంగా ఆకట్టుకొన్న గాయనిమణి రనైనారెడ్డి, కితకితలు లేకుండానే “జబర్దస్త్” గా మాట్లాడే బొమ్మలతో నవ్వించగల “రాకేష్”, విభిన్న కోణాలలో హాస్యపు చిరుజల్లులు కురిపించే నవ్వుల హరిబాబు, తన గళంతో ప్రముఖుల మన్ననలను అందుకొని ఆట పాటలతో మంత్రముగ్దులను చేసిన పృథ్వీ చంద్ర , “ఈగ” “దమ్ము” పాటలతో టాలీవుడ్లో దుమ్మురేపిన రాహుల్ సిప్లిగంజ్ మరియు అందరు మెచ్చే వ్యాఖ్యాత, పురస్కారాల పుట్ట, మాటల మాంత్రికుడు ప్రదీప్, ప్రముఖ స్థానిక గాయనీమణి, నందిపురస్కార గ్రహీత నాగ సాహితి మరియు స్థానిక యువత సహకారంతో నిర్వహించిన హాస్య, సంగీత నృత్యాలు అందరినీ అలరించాయి. టాంటెక్స్ కార్యవర్గ బృందం కళాకారులను సాంప్రదాయ బద్ధంగా పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించింది.
టాంటెక్స్ స్కాలర్షిప్స్ : విద్యా సంబందిత, సామాజిక, సాంస్కృతిక కార్యక్రామాలో యువతకు ప్రోత్శాహం
సంస్థ చరిత్రలో మొట్టమొదటి సారిగా స్థాపించబడిన “టాంటెక్స్ స్కాలర్షిప్స్” విజేతలైన యువ కిరణాలు మౌక్తిక పాలూరి, ప్రముఖ్ సాయి అట్లూరి, రవితేజ లింగినేని, సాహితి కొత్తమాసు, సాయి పంగులూరి, శ్రీనంద్ బొడ్డు లకు వెయ్యి డాలర్ల నగదు, మరియు ప్రశంసా పత్రాలను పోషక దాతలైన డా. రాజు/శ్రీమతి సునీత కోసూరి, శ్రీ అరవింద్ రెడ్డి ముప్పిడి/డా. మాధవి రెడ్డి, శ్రీ రావ్ తెలిదేవర/శ్రీమతి మంజు తెలిదేవరల చేతుల మీదుగా టాంటెక్స్ అధ్యక్షుడు శ్రీ సురేష్ మండువ అందించారు. కళాశాల మొదటి సంవత్సరంలో ప్రవేశించబోవు టాంటెక్స్ యువతలో విద్యా సంబంధిత, మరియు సాంస్కృతిక, సామాజిక సేవా కార్యక్రమాలతో అనుభవం, అనుబంధం, తదితర అంశాలలో ప్రావీణ్యత ప్రామాణికంగా విజేతలను ఎంపిక చేయడం జరిగింది.
తానా 19వ మహాసభలకు సహ ఆతిధ్యం అందించిన టాంటెక్స్ సంస్థకు పదివేల డాలర్ల విరాళం:
ఈ సంవత్సరం మే నెలలో డాలస్ లో నిర్వహించిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 19వ మహాసభలకు సహ ఆతిధ్యం అందించి జయప్రదం చేసిన టాంటెక్స్ సంస్థకు పదివేల డాలర్ల విరాళాన్ని తానా సంస్థ అందించింది. తానా పూర్వాధ్యక్షుడు శ్రీ ప్రసాద్ తోటకూర, 19 వ మహాసభల సమన్వయ కర్త శ్రీ మురళి వెన్నం, మహాసభల నిర్వాహకాధిపతి డా. నవనీత కృష్ణ గొర్రెపాటి, ఉన్నత సలహాదారు సమితి అధిపతి శ్రీ రాఘవేంద్ర ప్రసాద్, మహాసభల కార్యదర్శి శ్రీ చలపతి కొండ్రకుంట, మహాసభల కోశాధికారి డా. సి.ఆర్.రావు, తానా పాలక మండలి సభ్యులు శ్రీ. రాం యలమంచిలి, శ్రీమతి మంజులత కన్నెగంటి మరియు ప్రాంతీయ ప్రతినిధి డా. రాజేష్ అడుసుమిల్లి, దౌత్య సంబంధ సమన్వయకర్త శ్రీ వినోద్ ఉప్పు, తెలుగు భాషాభివృద్ధి సమన్వయకర్త శ్రీ రాంకీ చేబ్రోలు ఈ కార్యక్రమంలో పాల్గొని సంయుక్తంగా టాంటెక్స్ కార్యవర్గ బృందం సమక్షంలో పది వేల డాలర్ల విరాళాన్ని కోశాధికారి శ్రీమతి ఇందు రెడ్డి మందాడికి అందించారు.
“తెలుగువెలుగు” దీపావళి సంచిక మరియు టాంటెక్స్ నూతన వెబ్ సైటు ఆవిష్కరణ:
సప్తవర్ణాలతో సుందరంగా రూపుదిద్దుకొన్న టాంటెక్స్ సంస్థ త్రైమాసిక పత్రిక “తెలుగు వెలుగు” దీపావళి సంచికను ముఖ్య సంపాదకుడు, శ్రీ చినసత్యం వీర్నపు మరియి టాంటెక్స్ కార్యవర్గ బృందం సంయుక్తంగా ఆవిష్కరించారు. తెలుగు వెలుగు సమన్వయకర్త శ్రీ చినసత్యం ఈ సందర్భంగా మాట్లాడుతూ “ దీపావళి సంచిక 68 పుటలతో అందరికీ ఆసక్తికరంగా ఉండేటట్లు వివిధ అంశాలతో పాటు, చిన్నారుల ప్రతిభను గుర్తిస్తూ, వ్యాపార సంస్థల అభివృద్ధికి దోహదపడే జనసముహాన్ని కలపడంలో సఫలీకృతం అయ్యింది. ఈ సంచికలో సహకారం అందించిన పోషకదాతలకు కృతజ్ఞతలు తెలియజేసారు. అనంతరం టాంటెక్స్ అధ్యక్షుడు శ్రీ సురేష్ మండువ నూతన వెబ్ సైట్ ను ఆవిష్కరించారు.
తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ ముఖ్యోద్దేశంగా పనిచేస్తున్న టాంటెక్స్ సంస్థ:
తెలుగు యువతను భాషా సంస్కృతుల వైపు మళ్ళించడానికి తెలుగు సాహిత్య వేదిక నిర్వహించే “నెలనెలా తెలుగు వెన్నెల” వార్షికోత్సవాలాలో వివిధ పోటీలను నిర్వహించడం మీకు తెలిసిందే. ఇటీవల సిలికానాంధ్ర వారి “మనబడి” నిర్వహించిన “తెలుగు మాట్లాట” పోటీలలో “తిరకాటం సిసింద్రీ” గా జాతీయ ప్రథమ బహుమతి అందుకున్న మద్దుకూరి మధుమహిత, “తిరకాటం చిరుత” గా జాతీయ ద్వితీయ బహుమతి అందుకున్న కందుకూరి ప్రతిమ మరియు పోటీదారుడు రాయవరం స్నేహిత్, “తిరకాటం సిసింద్రీ” గా ప్రాంతీయ ద్వితీయ బహుమతి అందుకున్న కస్తూరి ప్రణవ్ చంద్ర, “పదరంగం చిరుత” గా జాతీయ పోటీదారుడు కాసంశెట్టి అభినవ్, “పదరంగం సిసింద్రీ” గా ప్రాంతీయ ద్వితీయ బహుమతి అందుకున్న కందాడై సుమేధ్, “పదరంగం చిరుత” గా ప్రాంతీయ ద్వితీయ బహుమతి అందుకున్న గుండం ప్రణయ్ లను సభాముఖంగా టాంటెక్స్ కార్యదర్శి శ్రీ సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ ప్రశంసాపూర్వక అభినందనలతో గుర్తించారు.
చివరగా దీపావళి వేడుకల సమన్వయకర్త శ్రీ బాల్కి చామ్కూర వందన సమర్పణ చేస్తూ విచ్చేసిన ప్రేక్షక సమూహానికి, “ప్లాటినం” పోషక దాతలైన మయూరి ఇండియా రెస్టారంట్, మై టాక్స్ ఫైలర్ మరియు బావర్చి బిర్యానీ పాయింట్, “గోల్డ్” పోషకదాతలైన హొరైజన్ ట్రావెల్, ప్యారడైజ్ బిర్యానీ పాయింట్, పసంద్/(విందు) ఇండియన్ క్విజీన్, సౌత్‌ఫోర్క్ డెంటల్, డిస్కవర్ ట్రావెల్ మరియు విష్ పాలెపు టాక్స్ సర్వీస్ “సిల్వర్” పొషకదాత యూనికాన్ ట్రావెల్స్, దీపావళి వేడుకల కార్యక్రమ పోషకదాతలైన మై విలేజ్, వెరిటిస్ గ్రూప్, రాం కొనారా (రియల్టర్), తిరుపతి “భీమాస్” మసాల, శ్రీ శ్రీకాంత్/శ్రీమతి సుధ పోలవరపు, శ్రీ మురళి వెన్నం/డా. వినయ పొట్లూరి , ఎన్నెసై అమెరికా, మరియు ప్రసార మాధ్యమాలుగా భాగస్వామ్యం వహించిన దేశీప్లాజా, ఏక్ నజర్, మై డీల్స్ హబ్, రేడియో ఖుషి, టివి9, తెలుగు వన్ (టోరి) రేడియో, టివి5, యంకనెక్ట్, మరియు అలెన్ పర్ఫార్మింగ్ సెంటర్ యాజమాన్యానికి కృతఙ్ఞతాపూర్వక అభివందనములు తెలియజేసారు. భారత జాతీయ గీతంతో అత్యంత వైభవంగా నిర్వహించిన దీపావళి వేడుకలకు తెరపడింది.