RELATED ARTICLES
ARTICLES
ఘనంగా ముగిసిన టాంటెక్స్ 82వ నెల నెలా తెలుగు వెన్నెల

“సమాజమే కవిత్వానికి ఆయుధం”: ఘనంగా ముగిసిన టాంటెక్స్ 82వ నెల నెలా తెలుగు వెన్నెల

 

 


ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక సమర్పించిన "నెల నెలా తెలుగు వెన్నెల" 82వ సదస్సు ఆదివారం, మే 18 వ తేది స్థానిక పసంద్ రెస్టారెంటులో సాహిత్యవేదిక సహ సమన్వయకర్త శ్రీమతి సింగిరెడ్డి శారద అధ్యక్షతన నిర్వహించబడినది. ప్రవాసంలో నిరాటంకంగా 82 నెలల పాటు ఉత్తమ సాహితీ వేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించడం ఈ సంస్థ విశేషం. డాల్లస్ ప్రాంతీయ భాషాభిమానులు, సాహితీ ప్రియులు అధిక సంఖ్యలో అత్యంత ఆసక్తితో ఈ సమావేశానికి విచ్చేసారు. స్థానిక గాయని శ్రీమతి దిండుకుర్తి లావణ్య  దేవులపల్లి కృష్ణ శాస్త్రిగారి "జయ జయ ప్రియ భారత" గేయంతో సభను ప్రారంభించారు.

 

సింగిరెడ్డి శారద తమ స్వాగాతోపన్యాసంలో ప్రతి నెలాజరపుకొనే నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలికారు. సాహిత్యవేదిక మొదటి భాగం నవరసభరితమయిన కవితాపఠనం, పుస్తక సమీక్ష, లలిత గీతం, తెలుగు క్విజ్ తో అత్యంత ఆసక్తికరంగా జరిగింది.

 



ప్రస్తుతం ప్రవాసంలో పర్యటిస్తున్న తిప్పిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక వ్యక్తి తన జీవిత గమనం లొ ఆదిగురువు తల్లితో మొదలిడి, యెంత మందిలో గురువుని చూడగలము, తన గురువు యెవరు అనేది తాను మాత్రమే నిశ్చయించుకోగలరు అనే తమ అభిప్రాయాన్ని తమ సొంత ఉదాహరణలతో సభతో పంచుకున్నారు. సాహిత్యవేదిక సభ్యుడు బసాబత్తిన శ్రీనివాసులు ఙ్ఞానపీఠ్  పురస్కార గ్రహీత శ్రీ రావూరి భరద్వాజ్ గారి రచన "పాకుడు రాళ్ళు" పుస్తక సమీక్ష ఆహ్వానితులతో పంచుకుంటూ, రచయిత సినీ పరిశ్రమలో కళాకారుల జీవితాలలోని వెలుగు నీడలను రాసిన తీరును కళ్ళకు కట్టినట్లు వర్ణించారు. సాహిత్యవేదిక సభ్యుడు పున్నం సతీష్ నేటి ముఖ్య అతిథి శ్రీమతి రేణుక అయలసోమయాజుల గారు రచించిన "లోపలి స్వరం" కవితా సంపుటి నుండి ముచ్చటగా మూడు కవితలు “అచ్చం గాంధిలా", "వంట ఇంటి పద్యం" మరియు "నల్లని చేపలు" చదివి వినిపించి సభకు ముఖ్య అతిథి రచనలు రుచి చూపించారు.

చిన్నారి ధర్మాపురం నేహ తన కోకిల స్వరం తో “కొండా కోనల్లో లోయల్లో” అంటూ పాడి ఆహ్వనితులను గోదారి విహారం చేయించి విరామ సమయనికి తిరిగి తీసుకొచ్చింది.  విరామంలో స్థానిక పసంద్ రెస్టారెంట్ వారందించిన వేడి, వేడి అల్పాహారం (పునుగు) మరియు తేనీరు అందరూ స్వీకరించారు. టాంటెక్స్ ఉపాధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం "మాసానికో మహనీయుడు" శీర్షికను వినూత్నంగా తెలుగు క్విజ్ రూపంలో జరిపారు.  సభను డీ.ఎఫ్.డబ్ల్యూ తూర్పు పడమర విభాగలుగా విభజించి, రెండు జట్టుల మధ్య హోర హోరి పోటీ నడిపారు.

 




ముఖ చిత్రం చూపించి కవులను గుర్తించటంతో మొదలయి, కలం పేరులతో ప్రఖ్యాతి గాంచిన కవుల అసలు పేర్లు, పద్యాలలో అలంకారం మొదలైన ప్రశ్నలతో  నిర్వహించారు.  మే నెలలొ పరమపదించిన గుంటూరు శేషేంద్ర శర్మ గారి నొబెల్ పురస్కారనికి ఎన్నికయిన "నాదేశం నా ప్రజలు" రచన గురించి ప్రస్తావించారు.  జననం మరియు మరణం రెండూ మే నెలలోనే అయిన చలం గారిని కూడ స్మరించారు. టాంటెక్స్ ఉత్తరాధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహారెడ్డి జూన్ నెల 28వ తేదీ ఇర్వింగ్ జాక్ సింగ్లీ ఆడిటోరియంలో జరుగబోయె టాంటెక్స్ ప్రత్యేక కార్యక్రమం "సిరివెన్నెల అంతరంగం" వివరాలను సభకు వివరిస్తూ అందరినీ మిత్రులు, కుటుంబంతో విచ్చేసి కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరారు.

 



 

సాహిత్య వేదిక సహ సమన్వయకర్త శ్రీమతి సింగిరెడ్డి శారద నేటి ముఖ్య అతిథి అయిన  శ్రీమతి రేణుక అయలసోమయాజుల గారిని  సభకు పరిచయం చేస్తూ  “ఆంధ్ర సాహితీ వనాన తన కుహూ రావముతో సామాజిక స్పృహ కలిగించిన శ్రీమతి రేణుక అయలసోమయాజుల గారు తమ అలుపెరుగని సాహితి ప్రస్థా నములో స్పర్శించని ప్రక్రియ లేదు.  దాదాపు రెండు వందలకు పై బడిన కవితలు సంపుటీకరించబడి మరెన్నో రచనలు పెక్కు భారతీయ భాషల లోకి అనుమతించ బడ్డాయి. ‘లేఖిని’ మహిళా చైతన్య రచయిత్రుల వేదికలో ఉప కార్యదర్శి గాను, ‘ స్ప్రెడింగ్ లైట్’ సాహిత్య వేదికకు కార్యదర్శిని గాను ఉంటూ అనేక దూరదర్శిని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీరి వచన కవితకు రంజని - కుందుర్తి, ఇస్మాయిల్ స్మారక పురస్కారము మరియు అంతర్జాతీయ నవరత్న మహిళా పురస్కారం కూడా అందుకున్నారు” అని కొనియాడుతూ వేదికపై ఆహ్వానించగా, ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం పూర్వా ధ్యక్షులు శ్రీమతి లలితా మూర్తి గారు పుష్పగుచ్చంతో ప్రసంగకర్తకు స్వాగతం పలికారు.



శ్రీమతి రేణుక అయలసోమయాజుల గారు మొదటగా తన ప్రసంగంలో తమ పూర్వీకులు, ముత్తాత తపోధనుడు, భగవాన్ శ్రీ రమణ మహర్షుల ప్రియ శిష్యుడు, సంస్కృతాంధ్ర పండితుడు అయిన శ్రీ కావ్యకంఠ గణపతి ముని గారిని స్మరిస్తూ తమ ప్రసంగం ఆరంభించారు. ఉద్రేకం, బాధ, కన్నీళ్ళు, సమాజంలో అన్యాయం వంటి విషయాలను నాలుగు వాక్యాలలో పాఠకుడి మదిలో ముద్రించేలా రాయటానికి సహాయ పడేది కవిత్వం అన్నారు.  సాహిత్యం దళిత వాదం, స్త్రీ వాదం వంటి  భావాలను బలంగా వ్యక్తపరచడానికి ఆయువుపట్టు, ఆయుధంగా ఉపయోగపడుతుంది అన్నారు.  తాను యాసిడ్ అట్టాక్కు స్పందించి రాసిన కవితను, ఒక వ్యక్తి అడవిలో మరణిస్తే, ఆ అడవికి ఎలా ఉంటుంది అనే ఊహ నుంచి రాసిన కవితను, ఒక భిక్షగత్తె జోలె లోపిల్లవాడిని చూసినప్పుడు ఆ జోలె ఒక తల్లి అయితే యెలా ఆలోచిస్తుంది అనే ఊహనుంచి రాసిన "వాడితో నా ప్రయణం", "పుట్టిన రోజు" వంటి రచనలు సభతో పంచుకున్నారు.  తన రచనలు ముఖ్యంగా నది, ప్రకృతి, సమాజం ప్రధాన అంశాలుగా ఉంటాయని సభకు తెలియజేస్తూ తమ ప్రసంగం ముగించారు.

 

 





ముఖ్య అతిథి ప్రసంగానంతరం ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అధ్యక్షుడు కాకర్ల విజయమోహన్ మరియు  పాలక మండలి సభ్యులు  సి. అర్. రావ్  ముఖ్య అతిథిని శాలువతో సంయుక్తంగా  సత్కరించారు. తెలుగు సాహిత్య వేదిక కార్యవర్గ సభ్యులు  సింగిరెడ్డి శారద, పున్నం సతీష్, బండారు సతీష్, బసాబత్తిన శ్రీనివాసులు, నిమ్మగడ్డ రామకృష్ణ, అట్లూరి స్వర్ణ, టాంటెక్స్ ఉపాధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, టాంటెక్స్ ఉత్తరాధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహారెడ్డి సంయుక్తంగా శ్రీమతి రేణుక అయలసోమయాజుల గారిని జ్ఞాపికతో సత్కరించారు.

 

టాంటెక్స్ కార్యదర్శి ఉప్పలపాటి కృష్ణారెడ్డి, కోశాధికారి వీర్ణపు చినసత్యం, సంయుక్త కోశాధికారి శీలం కృష్ణ వేణి, మరియు కార్యవర్గ సభ్యులు చామ్కుర బాల్కి, పావులూరి వేణు మాధవ్, మండిగ శ్రీలక్ష్మి  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 


 

తెలుగు సాహిత్య వేదిక కార్యవర్గ బృందం వందన సమర్పణ చేస్తూ ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం వారి నెల నెలా తెలుగు వెన్నెల 82వ సదస్సు చక్కగా జరిగినందుకు సంతోషిస్తూ కార్యక్రమానికి విచ్చేసిన సాహితీ ప్రియులకు, వేదిక కల్పించిన స్థానిక  పసంద్ రెస్టారెంటు యాజమాన్యానికి, ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన దేశీ ప్లాజా, రేడియో ఖుషి మరియు ప్రసార మాధ్యమాలైన  టీవీ5, 6టీవీ, టీవీ9 వారికి కృతఙ్ఞతా పూర్వక అభివందనములు తెలియజేసారు.

TeluguOne For Your Business
About TeluguOne
;