- సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం సందర్శించిన శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి....
- విజయవంతంగా ముగిసిన సిలికానాంధ్ర మనబడి మహా సదస్సు!
- సిలికాన్ వ్యాలీలో అన్నమయ్యకు నాట్య సంగీత ఘననీరాజనం
- అంతర్జాతీయ భాషా దినోత్సవం సందర్భంగా, అమెరికా వ్యాప్తంగా 'మనబడి పిల్లల పండగ '
- దక్షిణ కాలిఫోర్నియాలో ఎగిరిన తెలుగు మాట్లాట విజయ పతాకం
ఉత్సాహభరితంగా మనబడి పిల్లల నాటకోత్సవం
సిలికానాంధ్ర మనబడి బాలల నాటకోత్సవం అనే మరో అద్భుతానికి తెరతీసింది. ప్రవాస బాలలకు తెలుగు నేర్పించడమే కాకుండా మన సంస్కృతిని అలవరిచే క్రమంలో మరో అద్భుత ఆవిష్కరణ ఇది. ఎంతో ప్రఖ్యాతమైన నాటిక అనే కళాప్రక్రియను బాలలకు పరిచయం చేయడం ద్వారా, ఆ ప్రక్రియ భవిష్యత్తు ఉజ్వలంగా మారుతుందనే ఉద్దేశ్యంతో ఉన్న మనబడి విద్యార్ధులకు ఈ నాటిక పోటీలు నిర్వహించింది. ముందుగా ప్రాంతాల వారిగా ఆన్ లైన్(అంతర్జాలమాధ్యమం) ద్వారా వచ్చిన నాటికలను పరిశీలించి, జాతీయపోటీలకోసం క్యాలిఫోర్నియా రాష్ట్రంలోని మిల్పీటస్ నగరానికి వివిధ ప్రాంతాల నుంచి విద్యార్ధి బృందాలను ఆహ్వానినిచింది మనబడి.
మిల్పీటస్ లోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ డా. హనిమిరెడ్డి లకిరెడ్డి భవనంలోని వేదికపై వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన మనబడి విద్యార్ధి బృందాలు చేసిన నాటక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. ముద్దు ముద్దుగా వారు పలుకుతున్న సంభాషణలు, రాగయుక్తంగా ఆలపించిన పద్యాలు, పాటలు, మన పౌరాణిక, చార్తిత్రక, పాత్రల వేషధారణలతో ఆ పిల్లల సందడి.. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను వెలుగు దివిటీ పట్టి ముందుకు నడిచే సారధులుగా వీరే అని చాటారు. సాయి కందుల ఆధ్వర్యంలో తెలుగుతనం ఉట్టిపడేలా, అత్యంత సుందరంగా అలంకరించిన ఆ ప్రాంగణం అందరినీ ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా, నాటిక పోటీల న్యాయనిర్ణేతగా విచ్చేసిన, ప్రఖ్యాత నట శిక్షకులు దీక్షిత్ మాష్టారు, చిన్నారుల ప్రతిభ చూసి అచ్చెరువొందారు. మాతృదేశానికి ఇంత దూరంగా ఉన్నా, తెలుగు భాష పట్ల మన కళల పట్ల ఈ పిల్లలకున్న మక్కువ, వారి పట్టుదల, ప్రదర్శనలు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని, ఈ అద్భుతానికి కారణం సిలికానాంధ్ర మనబడి అని ఆయన అన్నారు. న్యూజెర్సీ, మసాచుసెట్స్, సదరన్ క్యాలిఫోర్నియా మరికొన్ని రాష్ట్రాలనుని బృందాలుగా వచ్చిన విద్యార్ధులు, ఉపాధ్యాయులు, తల్లితండ్రులతో ఆదివారం నాడు దీక్షిత్ మాస్టారు తో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో, , తమ నటన మెరుగుపరుచుకోవడానికి ఈ చిన్నారులు తెలుసుకోవలసిన ఎన్నో విలువైన విషయాలను, అందుకు చేయవలసిన వివిధ అంశాలను ఎంతో చక్కగా వివరించారు. దీక్షిత్ గారి అనుభవాన్ని, నాటకరంగ పరిజ్ఞానాన్ని, యువతకు అందించడానికి సోమవారం నుండి శుక్రవారం వరకు యువతీ యువకులకోసం మరో నటశిక్షణా శిబిరం నిర్వహించామని మనబడిఉపాద్యక్షులు దీనబాబు కొండుభట్ల తెలిపారు. ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్ధులకు, బృందాలకు, నాటికలకు, దర్శకులకు దీక్షిత్ గారితో పాటు, మరో విశిష్ట అతిధిగా విచ్చేసిన శ్రీ జొన్నవిత్తుల గారు బహుమతులను అందజేసి, మనబడి చేపట్టే కార్యక్రమాలను, చిన్నారుల ప్రతిభాపాటవాలను, తనదైన చమత్కారం తో కూడిన కవితాత్మకంగా ప్రశంసిస్తూ, ఆశీర్వదించి, సభాసదులను ఉత్తేజపరిచారు. మనబడి నాటకోత్సవం లో విద్యార్ధుల ప్రదర్శనలు చూసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, నటులు శ్రీ రఘు మల్లాది ప్రతి సంవత్సరం, సీనియర్ మరియు జూనియర్ విభాగాలలో ఉత్తమ ప్రదర్శన బహుమతి విజేతలైన జట్లకు 1116 డాలర్ల నగదును 'మల్లాది పురస్కారం' పేరిట అందించనున్నట్టు ప్రకటించి, ఈ సంవత్సర పురస్కారాన్ని అక్కిడికక్కడే విజేతలకు అందించారు. తెలుగు భాషతో పాటు మన కళలు, సంస్కృతిని పిల్లలకు నేర్పే మనబడి కి అమెరికా వ్యాప్తంగా WASC గుర్తింపు లభించిందని, 2017-18 సంవత్సర ప్రవేశాలు(అడ్మిషన్లు) ప్రారంభమైనాయి, మరిన్ని వివరాలకు మరియు నమోదు చేసుకోడానికి manabadi.siliconandhra.org చూడవచ్చని మనబడి అద్యక్షులు రాజు చమర్తి తెలిపారు. సెప్టెంబరులో మనబడి తరగతులు 250 కేంద్రాలలో ప్రారంభమౌతాయి.
అన్ని కేంద్రాలతో కలిసి ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించడానికి గత 4 నెలలుగా ముందుండి నడిపించిన రాజు చమర్తి, దీనబాబు కొండుభట్ల, తనకు సహకరించిన జయంతి కోట్ని, మాధవి కడియాల, రవీంద్ర కూచిభొట్ల, దిలీప్ కొండిపర్తి, కిరణ్ పారుపూడి, వంశీ నాదెళ్ల , నాటకోత్సవ బృందం, ఎంతో కృషి చేసారని, అదేవిధంగా నాటకోత్సవంలో పాల్గొన్న మనబడి విద్యార్ధులు, వారి తల్లి తండ్రులకు, ఉపాధ్యాయులకు, కో-ఆర్డినేటర్లకు, దర్శకులు, న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన రవీంద్ర కూచిభొట్ల, మాధవ కిడాంబి, భారత దేశం నుంచి సహకరించిన వెంకట్ మాకిన లకు కార్యక్రమ నిర్వహణ బృంద నాయకురాలు స్నేహ వేదుల ధన్యవాదాలు తెలిపారు.