EVENTS
GWTCS President’s message

గడిచిన విజయాలను స్ఫూర్తిగా తీసుకుంటూ సమధికోత్సాహంతో బాధ్యతలు స్వీకరించబోతున్న సహకార్యవర్గ సభ్యులకు శుభాభినందనలు. అడిగినదే తడవుగా ఆర్థికసాయం అందించి కార్య క్రమనిర్వహణలో తోడ్పడుతున్న పోషకదాతలకు కృతజ్ఞతాభివందనాలు. ఏ ప్రతిఫలాపేక్షా లేకుండా అనామకంగా తెరవెనుక సేవలందిస్తున్న లెక్కకు మించిన స్వచ్ఛంద సేవకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జరుగుతున్న కార్యక్రమాలను ఆదరిస్తూ ఈ సంస్థలో భాగస్వాములైన      మీ అందరికీ కృతజ్ఞతలు.

కాలం త్వరితంగా మారుతూంది. మూడు దశాబ్ధాల క్రితం  మన సంస్థ ఏర్పడినప్పటికీ ఇప్పటికీ మధ్య ఇక్కడి తెలుగువారి జీవితాలలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఒక్క తెలుగు   మాట కోసం ఆరాటపడిన స్థితి నుంచి ఇంటి చుట్టుపక్కలా, బయట ఆఫీసుల్లో తెలుగువారే కనపడే స్థాయికి చేరుకున్నాము. తెలుగు సినిమాలూ, తెలుగు టీవీ అందుబాటులోకి రావటంతో వినోదానికి ప్రత్యామ్నాయ మార్గాలు పెరిగాయి.

ఒకవైపు ఇండియా నుంచి గత దశాబ్దంగా ఇక్కడికి చేరుతున్న యువతరమూ,మరో వైపు నవతరంగా ఎదుగుతున్న ఎప్పుడో ఇక్కడ స్థిరపడిన వారి పిల్లలూ తెలుగువారి అభిరుచుల్లో మరింత వైవిధ్యానికి కారణమవుతున్నారు. వారి అవసరాలలో, వారి ప్రాధాన్యతాక్రమాల్లో తేడాలు తప్పనిసరి అవుతున్నాయి. ఎదుర్కొనే సమస్యలు మారుతున్నాయి. మన సంస్థ చిరకాలం మనగలగాలంటే వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకోవడం అవసరం. అందరూ పాల్గొనగలిగేలా సంస్థ కార్యకలాపాలను విస్తృతపరచవలసి ఉంది. ఇది ఉమ్మడి వేదికనీ, ఏ కొద్దిమందికో చెందింది కాదనీ, దీన్ని తమ అవసరాలకూ, అభిరుచులకూ అనుగుణంగా దిద్దుకోవడం సభ్యులందరి బాధ్యత అనీ గుర్తు చేస్తున్నాను. సభ్యుల నిర్మాణాత్మక సూచనలూ, సలహాలూ మా కార్యవర్గానికి సరయిన దిశానిర్దేశం చేస్తాయి. సమయం వెచ్చించగలవారు అంతటితో ఆగిపోక క్రియాశీలపాత్ర వహించగలిగితే మరింత సహాయకారిగా ఉంటుంది.

ఏ ప్రవాస సమూహమయినా అస్తిత్వపోరాటం జరపవలసిందే. ఆటుపోట్లను తట్టుకుంటూ ఇక్కడి సమాజంలో వొదిగిపోతూనే మన ప్రత్యేకతను నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తూనే ఉంటాము. మన భాషా, సాంస్కృతికమూలాలూ కులమతప్రాంతాలకూ, వయోలింగభేదాలకూ అతీతంగా మనమంతా ఒక్క తాటిపై నిలవడానికి తోడ్పడతాయి. ప్రవాసంలో సంఘటితంగా నిలబడవలసిన అవసరం చరిత్ర పాఠాలుగా చెపుతూనే ఉంది.

మీ హార్థిక, ఆర్థిక సహాయసహకారాలు మునుపటిలాగే కొనసాగుతాయని ఆశిస్తూ,

మీ మిత్రుడు

త్రిలోక్ కంతేటి

TeluguOne For Your Business
About TeluguOne
;