సీఎం రాబోతున్న వేళ.. వైసీపీ గుప్పిట్లో విశాఖ! ఇక అరాచకమేనా.. 

అధికారం వాళ్ల చేతిలో ఉంది. వారంతా సాయంకాలం సాగర తీరం అంటూ విశాఖ బీచ్ లో సాంగ్స్ పాడుకుంటారు. ప్రతిపక్ష నేతలను మాత్రం రోడ్లపై పరుగులు పెట్టిస్తున్నారు. అక్కడ చట్టం ఒకవైపే చూస్తుంది. రెండోవైపు చూడదు..చూడాలనుకున్నా కుదరదు. మీకు నమ్మకం లేకపోతే ఏదైనా పోలీస్ తుపాకీ తీసుకుని అధికార పార్టీ వాళ్లవైపు గురిపెట్టి కాల్చండి..బుల్లెట్ రివర్స్ లో వచ్చి మీ బాడీలోకే దిగుతుంది. అంత వన్ సైడుగా వ్యవహారం నడుస్తోంది. 

సిస్టమ్ లో లూప్ హోల్స్ వాడుకున్నవాళ్లు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఉంటారు. అధికారంలో పార్టీ మారాక కూడా ఆ విషయంలో అందరూ కలిసే వ్యవహారం చేసుకుంటారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక సీన్ మారిపోయింది. మాట విని వాళ్ల వైపు వస్తే ఓకె..లేదంటే ఇక వాడికి టార్చరే. వాడి తాతల నాటి డాక్యుమెంట్లు కూడా తీసి..భూములు లాక్కుంటారు.విశాఖపట్నంలో నడుస్తున్న తతంగం చూస్తుంటే అలాగే ఉంది.  ఉత్తరాంధ్ర అంతా ఒక సామ్రాజ్యంలా... ఆ సామ్రాజ్యానికి అధిపతిలా ఎంపీ విజయసాయిరెడ్డి అన్నట్లే అక్కడ అన్ని వ్యవహారాలు నడుస్తున్నాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు మాజీ ఎంపీ, ఈ మధ్యే చనిపోయిన సబ్బం హరిని వేధించారు. సడెన్ గా తెల్లారే మున్సిపల్ అధికారులు వచ్చి గోడ పడేయాలని.. అక్రమ కట్టడమని నోటీసులిచ్చారు. ఆయన కోర్టుకు వెళ్లకపోతే పడేసేవాళ్లే. పైగా అదే మున్సిపల్ కార్పొరేషన్ కు మేయర్ గా పని చేశారు సబ్బం హరి. ఆయనకే కొత్త లెక్కలు చెప్పాలని చూశారు అధికారులు.

ఇక టీడీపీ నేత భరత్..విశాఖ ఎంపీగా పోటీ చేశారు. గీతం సంస్థల అధినేతగా ఉన్నారు. గీతం సంస్థ ఒక ల్యాండ్ ను అక్రమంగా కలిగి ఉన్నారంటూ.. అక్కడ దాడులు చేశారు. ఆ వ్యవహారం కోర్టులో ఉందని తెలిసినా.. కోర్టును ధిక్కరించినట్లు అవుతుందని తెలిసినా.. అందుకు సాహసించారు అధికారులు. ఆ తెగింపు వైపు వారిని తోసింది విజయసాయిరెడ్డేనన్నది అందరికీ తెలిసిన విషయమే.
ఇప్పుడు లేటెస్టుగా టీడీపీ నేతలు పల్లా శ్రీనివాస్, పల్లా శంకరరావుల భూములపై పడ్డారు. అవి అక్రమమేనని..బహుశా అవి కొన్నివారి తండ్రికి ఆ విషయం తెలిసి ఉండకపోవచ్చని మంత్రి అవంతి శ్రీనివాస్ జాలి కూడా చూపించారు. ఆ విషయం అధికారులకు మాత్రమే ఇప్పుడే తెలిసింది... గతంలో టీడీపీలో ఉన్న అవంతికి కూడా ఇప్పుడే తెలిసింది. 

అలా టీడీపీ నేతల్లో మాట వినేవారిని తమవైపు తిప్పుకోవడం.. మాట విననివారి పుట్టు పూర్వోత్తరాలు, ఆస్తిపాస్తుల లెక్కలు అన్నీతెలిసి..ఎక్కడ దొరికితే అక్కడ వేటు వేయడం..ఇదే ఒక ఆపరేషన్ లా విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నడిపిస్తోంది. అంతెందుకు టీడీపీ అధికారంలో ఉండగా అప్పటి మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న భూకబ్జా వ్యవహారంపై సిట్ విచారణ జరిగింది. వైసీపీ అధికారంలోకి వచ్చి మళ్లీ విచారించింది. ఆ నివేదిక ఎప్పుడో రెడీ అయినా.. దానిని వాడలేదు. ఇప్పుడు దానిని బయటకు తీస్తున్నారు.  విశాఖ టీడీపీ నేతలందరిపై బ్రహ్మాస్త్రంలా వాడబోతున్నారు. పరిపాలన విశాఖ నుంచి ప్రారంభమయ్యేనాటికి ప్రతి అంగుళం వారి స్వాధీనంలో ఉండాలనేదే టార్గెట్ గా కనపడుతోంది. త్వరలో సీఎం జగన్ క్యాంప్ ఆఫీసు నుంచి అనధికారికంగా పాలన ప్రారంభించాలని ప్లాన్ చేసుకుంటున్నవేళ...టీడీపీ నేతలపై వేధింపులను వేగవంతం చేశారు. తప్పు చేస్తే విచారించి శిక్ష వేయాల్సిందే...అక్రమ ఆస్తులను స్వాధీనం చేసుకోవాల్సిందే..కాని అవన్నీ కేవలం రాజకీయం కోసమే చేసి..కేవలం ప్రత్యర్ధులను మాత్రమే టార్గెట్ చేస్తే... భవిష్యత్ సమాధానం చెబుతుందనే కామెంట్లు వినపడుతున్నాయి.