అప్పుడు వైఎస్‌.. ఇప్పుడు జ‌గ‌న్‌.. సంగంతో పెట్టుకుంటే షాకే..

దేశంలో తిక్క స‌ర్కారు ఏదైనా ఉందంటే అది ఏపీ ప్ర‌భుత్వ‌మే. మోస్ట్ కాంట్ర‌వ‌ర్సియ‌ల్ సీఎం జ‌గ‌న్‌రెడ్డి. గ‌ద్దెనెక్కిన నాటి నుంచి క‌క్ష సాధింపు చ‌ర్య‌లే. అభివృద్ధిని, పాల‌న‌ను గాలికి వ‌దిలేసి.. ఆప‌రేష‌న్ టీడీపీపైనే ఫోక‌స్ పెడుతూ వ‌చ్చారు. ప్ర‌స్తుత క‌రోనా స‌మ‌యంలోనూ అదే తీరు. కొవిడ్ వైఫ‌ల్యాల నుంచి ప్ర‌జ‌ల దృష్టిని మ‌ళ్లించ‌డానికి.. ధూళిపాళ్ల న‌రేంద్ర అరెస్ట్‌, సంగం డెయిరీ స్వాధీనంతో బ‌రితెగించాడు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డి. నిబంధ‌న‌ల‌కు తూట్లు పొడిచి.. అడ్డ‌గోలు జీవోలు జారీ చేసి.. పాడి రైతుల పెన్నిధి అయిన సంగం డెయిరీని ప్ర‌భుత్వ పాలు చేశారు. కాలిని త‌న్నేవాడు ఒక‌డుంటే.. త‌ల‌ను త‌న్నేవాడు ఇంకొక‌డు ఉంటాడ‌న్న‌ట్టు.. ఏపీ స‌ర్కారు అరాచ‌క నిర్ణ‌యాల‌ను హైకోర్టు ఎప్ప‌టిక‌ప్పుడూ అడ్డంగా కొట్టేస్తూ వ‌స్తోంది. తాజాగా, సంగం డెయిరీ కేసులోనూ ప్రభుత్వానికి షాక్ తగిలింది. సంగం డెయిరీ స్వాధీనంపై ప్రభుత్వం జారీ చేసిన జీవో చెల్లదని హైకోర్టు తెలిపింది. సంగం డెయిరీ కార్యకలాపాలను డైరెక్టర్లు నిర్వహించుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. రోజువారీ కార్యకలాపాలను డైరెక్టర్లు పర్యవేక్షించాలని హైకోర్టు సూచించింది. సంగం డెయిరీ ఆస్తుల అమ్మకంపై కోర్టు అనుమతి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

హైకోర్టు ఆదేశాల‌తో సంగం డెయిరీని క‌నుమ‌రుగు చేసేందుకు జ‌గ‌న్‌రెడ్డి చేసిన కుట్రలు విఫ‌ల‌మ‌య్యాయి. సంగం డెయిరీ మ‌రోసారి వైఎస్ కుటుంబ కుతంత్రాల నుంచి బ‌య‌ట‌ప‌డింది. అవును, గ‌తంలో జ‌గ‌న్ తండ్రి వైఎస్సార్ ముఖ్య‌మంత్రి ఉన్న‌ప్పుడు కూడా సంగంపై ప్ర‌తీకార చ‌ర్య‌ల‌కు దిగారు. సంస్థ ఆవిర్భావం నుంచి టీడీపీకి చెందిన వారే డెయిరీ చైర్మన్లుగా ఉండ‌టాన్ని ఓర్వ‌లేక పోయారు. సంగంపై పైచేయి సాధించేందుకు వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి హ‌యాం నుంచే ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. అయినా, టీడీపీ ప‌ట్టు కోలేదు. వైఎస్‌ హయాంలో ఆర్డినెన్స్‌ ద్వారా పాల‌క వ‌ర్గాన్ని ర‌ద్దు చేసి.. డెయిరీని స్వాధీనం చేసుకోవడానికి ఆదేశాలిచ్చారు. వీటిపై అప్పటి చైర్మన్‌ కిలారి రాజన్‌బాబు కోర్టులో స్టే తీసుకురావటంతో వైఎస్‌కు ఎదురుదెబ్బ త‌ప్ప‌లేదు. 

జ‌గ‌న్‌రెడ్డి ముఖ్య‌మంత్రి అయ్యాక‌.. తండ్రిలానే సంగం డెయిరీపై ప్ర‌తీకార చ‌ర్య‌లు మ‌రింత పెంచారు. సంగం డెయిరీని దెబ్బ కొట్టేందుకే గుజ‌రాత్‌కు చెందిన అమూల్ మిల్క్‌ను ఏపీకి తీసుకొచ్చార‌ని చెబుతారు. అమూల్ త‌ర‌ఫున పాల సేక‌ర‌ణ‌కు అధిక ధ‌ర‌లు చెల్లిస్తూ.. రైతుల‌ను అటువైపు మ‌ళ్లించే ప్ర‌య‌త్నాలు జోరుగా జ‌రిగాయి. అయినా, సంగంతో ద‌శాబ్దాల అనుబంధం ఉన్న పాడి రైతులు నేటికీ సంగం డెయిరీకే పాలు విక్ర‌యిస్తున్నారు. దీంతో.. అమూల్‌కు పాలు అమ్మ‌క‌పోతే ప్ర‌భుత్వ ప్రోత్సాహ‌కాలు ఇవ్వ‌మంటూ అధికారులు, పాల‌కులు బెదిరింపుల‌కు దిగ‌న సంఘ‌ట‌న‌లు ఇటీవ‌ల కాలంలో వివాదాస్ప‌ద‌మ‌య్యాయి. 

ఇటీవ‌ల టీడీపీ నేత‌, సంగం డెయిరీ ఛైర్మ‌న్ ధూళిపాళ్ల న‌రేంద్ర అరెస్ట్‌తోనే సంగం డెయిరీ ఎపిసోడ్ క్లైమాక్స్‌కు చేరింది. తెల్ల‌వారుజామున 100 మందికి పైగా పోలీసులు న‌రేంద్ర ఇంటిపై దాడి చేసి ఆయ‌న్ను బ‌ల‌వంతంగా అరెస్ట్ చేశారు. 2013లో సంగం డెయిరీని మ్యాక్స్‌ చట్టం నుంచి కంపెనీ యాక్ట్‌లోకి మార్చే ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ ఏసీబీ కేసు న‌మోదు చేసింది. ఆ కేసులో భాగంగానే ఛైర్మ‌న్‌ ధూళిపాళ్ల న‌రేంద్ర‌ను, ఎండీ గోపాలకృష్ణన్‌ను అరెస్ట్ చేసి.. రిమాండ్‌కు త‌ర‌లించారు. 

ధూళిపాళ్లను అరెస్ట్ చేసి త‌మ‌కు అడ్డులేకుండా చేసుకున్న ప్ర‌భుత్వం.. మూడు రోజుల వ్య‌వ‌ధిలోనే సంగం డెయిరీని ప్ర‌భుత్వ ప‌రం చేస్తూ ఆదేశాలు జారీ చేయ‌డం వివాదాస్ప‌ద‌మైంది. దులోనూ వ్య‌వ‌హారం సాఫీగా సాగ‌లేదు. స‌ర్కారుకే క్లారిటీ లేదు. ముందు సంగం డెయిరీని గుంటూరు పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి బదిలీ చేసింది. ఆ త‌ర్వాత‌.. తూచ్ అంటూ ఆ ఉత్త‌ర్వులు ర‌ద్దు చేసింది. ఆ త‌ర్వాత మ‌రో జీవో జారీ చేసి.. ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పరిధిలోని సంగం డెయిరీని తీసుకొచ్చింది. సంగం డెయిరీ రోజువారీ కార్యకలాపాల బాధ్యతను తెనాలి సబ్‌కలెక్టర్‌కు అప్పగించింది. ఆటంకం కలిగిస్తే చర్యలు తీసుకునే అధికారాలను సబ్‌కలెక్టర్‌కు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ద‌శాబ్దాల కుతంత్రం సాకార‌మైంద‌ని స‌ర్కారు ప‌గ‌టి క‌లలు కంది. కానీ, కోర్టులు ఉన్నాయి. న్యాయ‌స్థానాల‌ రూపంలో న్యాయం ఇంకా మిగిలే ఉంది. అందుకే, డెయిరీ యాజమాన్య హక్కులను బదలాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను వ్యతిరేకిస్తూ సంగం డెయిరీ డైరెక్టర్లు హైకోర్టును ఆశ్రయించారు. డెయిరీ స్వాధీనానికి ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం.19ను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉత్తర్వులు జారీ చేశారని సంగం డెయిరీ డైరెక్టర్లు కోర్టుకు తెలిపారు. 

చేతిలో అధికారం ఉంది క‌దాని విర్ర‌వీగిన‌ప్పుడ‌ల్లా.. కోర్టులు మొట్టికాయ‌ల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు ఆ అధికార అహాన్ని దించేస్తున్నాయి. తాజాగా, సంగం డెయిరీ స్వాధీనంపై ప్రభుత్వం జారీ చేసిన జీవో చెల్లదని హైకోర్టు స్ప‌ష్టం చేసింది. హైకోర్టు తీర్పే అంతిమం. సంగం డెయిరీ. గుంటూరు, ప్ర‌కాశం పాడి రైతుల‌కు పెన్నిధి. త‌మ క‌ల్ప‌త‌రువును త‌మ నుంచి ఎవ‌రూ దూరం చేయ‌లేరంటున్నారు పాడి రైతులు. అప్పుడు వైఎస్సార్.. ఇప్పుడు జ‌గ‌న్.. ఎవ‌రెన్ని కుట్ర‌లు, కుతంత్రాలు చేసినా.. సంగం డెయిరీ.. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ.. రైతుల‌దే. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu