ఏపీ పోలీసులపై నమ్మకం లేదని... ఇఫ్పుడు సిట్ ఎందుకు వేశారు? జగన్ కు చెల్లెలు సూటి ప్రశ్న

తన తండ్రి వైఎస్ వివేకా హత్య కేసులో తమకు అనేక అనుమానాలు ఉన్నాయని కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డిలు హైకోర్టు తెలిపారు. తాము, హైదరాబాద్ నుంచి పులివెందుల వెళ్లేలోపే వైఎస్ వివేకా బెడ్రూమ్ అండ్ బాత్రూమ్ లో రక్తపు మరకల్ని శుభ్రం చేసేశారని సునీత హైకోర్టుకు తెలిపారు. అదే రోజు సిట్ ఏర్పాటు చేశారని... కానీ, తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి... సీబీఐ దర్యాప్తు కావాలని డిమాండ్ చేశారని గుర్తుచేశారు. అయితే, వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక... 2019 జూన్ 13న కొత్త డీజీపీ గౌతమ్ సవాంగ్... కొత్త అధికారులతో మళ్లీ సిట్ ఏర్పాటు చేశారని వివేకా కుమార్తె హైకోర్టుకు తెలియజేశారు. ఈ సిట్ 1300మందిని విచారించి సాక్ష్యాలను సేకరించిందని... కానీ కడప ఎస్పీగా అన్బురాజన్ నియమితులయ్యాక దర్యాప్తు నత్తనడకన సాగుతోందని సునీత ఆరోపించారు. 

ఇక, సీబీఐ దర్యాప్తు కోరుతూ తన తల్లి సౌభాగ్యమ్మ... అలాగే తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాల్లో ఇప్పటివరకు ప్రభుత్వం కౌంటర్లు దాఖలు చేయలేదని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పైగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ దర్యాప్తు కావాలని కోరిన తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి... ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 8 నెలలు అవుతున్నా ఇఫ్పటివరకు సీబీఐ దర్యాప్తు కోరలేదని ప్రశ్నించారు. అంతేకాదు... ప్రతిపక్షంలో ఉండగా ఏపీ పోలీసులపై విశ్వాసం లేదన్న జగన్.... తాను అధికారంలోకి వచ్చాక మళ్లీ సిట్ ను ఏర్పాటు చేసి ఉండకూడదన్నారు. జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో ఉన్నంతకాలం సీబీఐ దర్యాప్తు కోసం ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నట్లుగా భావించాలని సునీత అన్నారు. ఇక, తమ పిటిషన్ లో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్, ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, సిట్ ఎస్పీ తదితరులను ప్రతివాదులుగా చేర్చారు సునీత.

ఇదిలాఉంటే, వైఎస్ వివేకా కుమార్తు సునీత ప్రధానంగా 15మందిపై అనుమానాలు ఉన్నాయంటూ హైకోర్టుకు తెలిపారు. అందులో ఎక్కువగా వైఎస్ కుటుంబ సభ్యులే ఉండగా, మిగతా అనుమానితులు కూడా వైఎస్ కుటుంబ సభ్యులకు సన్నిహితులే ఉన్నారు. వివేకా కుమార్తె సునీత హైకోర్టుకు అందజేసిన అనుమానితుల జాబితాలో మొదట వాచ్ మన్ రంగయ్య(1)(వివేకా ఇంటి కాపలాదారు) పేరు ఉంది.ఆ తర్వాత యర్ర గంగిరెడ్డి (వివేకాకు అత్యంత సన్నిహితుడు)... 3.ఉదయ్ కుమార్ రెడ్డి (ఎంపీ వైఎస్ అవినాష్ కి అత్యంత సన్నిహితుడు).... 4.డి.శివశంకర్ రెడ్డి (వైసీపీ రాష్ట్ర కార్యదర్శి) (అలాగే, వైఎస్ అవినాష్ రెడ్డికి, వైఎస్ భాస్కర్ రెడ్డికి సన్నిహితుడు)... 5.పరమేశ్వర్ రెడ్డి... 6.శ్రీనివాస్ రెడ్డి... 7.వైఎస్ భాస్కర్ రెడ్డి (ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి)... 8.వైఎస్ మనోహర్ రెడ్డి (ఎంపీ అవినాష్ రెడ్డి చిన్నాన్న)... 9.వైఎస్ అవినాష్ రెడ్డి (కడప వైసీపీ ఎంపీ).... 10.శంకరయ్య (సీఐ)... 11.రామకృష్ణారెడ్డి (ఏఎస్సై).... 12. ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి.... 13. ఆదినారాయణరెడ్డి (మాజీ మంత్రి).... 14. బీటెక్ రవి అలియాస్ ఎం.రవీంద్రనాథ్ రెడ్డి (టీడీపీ ఎమ్మెల్సీ)... 15. సురేందర్ రెడ్డి (పరమేశ్వర్ రెడ్డి బావమరిది)... ఇలా, ప్రధానంగా 15మందిపై తమకు అనుమానాలు ఉన్నాయన్న వైఎస్ వివేకా కుమార్తె... ఎందుకో కారణాలను కూడా హైకోర్టుకు వివరించారు.