గుడివాడ, గన్నవరం తెలుగుదేశం ఖాతాలోకే.. కొడాలి, వంశీ ఇక ఇంటికే!

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి ఓ రేంజ్ లో ఉంది. వేసవి వడగాడ్పులు ఎన్నికల హీట్ ముందు శీతల పవనాలుగా మారిపోతున్నాయి. రాష్ట్రం మొత్తం ఒకెత్తైతే గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలలో ఎన్నికల పోరు మరో ఎత్తు అన్న భావన నిన్నమొన్నటి దాకా ఉండేది.  ఎన్నికలు 11 రోజుల్లో జరగనున్నాయి. ఫలితాలు రావడానికి జూన్ 4 దాకా వేచి చూడాలి. అయితే గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ దాకా, ఫలితం దాకా వేచి చూడాల్సిన పని లేదంటూ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న సర్వేలు కుండబద్దలు కొట్టుస్తున్నాయి. అయితే కోడ్ అమలులో ఉన్నందున ప్రిపోల్ సర్వేలపై  నిషేధం ఉన్న నేపథ్యంలో సామాజిక మాధ్యమంలో వచ్చే సర్వేల ప్రామాణికతను నిర్ధారించలేం. అయితే.. ప్రజల మూడ్ ను గమనించినట్లైతే ఆ సర్వేలలో నిజమెంతో ఇట్లే అవగతమైపోతుంది. 

తాజాగా రైజ్ (RISE) సర్వే పేరిట సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్న సర్వే ఏపీలో తెలుగుదేశం కూటమి ఘన విజయం ఖాయమని పేర్కొంది. కోడ్ అమలులోకి రావడానికి ముందు వచ్చిన దాదాపు డజన్ సర్వేలు కూడా ఇదే విషయాన్ని చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన రైజ్ సర్వే కూడా అదే విషయాన్ని చెప్పింది. తెలుగుదేశం కూటమి 108 నుంచి 120 స్థానాలలో విజయం సాధించి అధికారం చేపడుతుందని పేర్కొంది. గత సర్వేలు కూడా దాదాపుగా ఇదే ఫలితాన్ని వెలువరించిన నేపథ్యంలో ఇదేమంత ఆశ్చర్యం కలిగించదు. కానీ ఈ సర్వేలో గుడివాడ, గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాలలో అధికార పార్టీ అభ్యర్థుల పరాజయం ఖరారైందని సర్వే పేర్కొంది. ఈ రెండు నియోజకవర్గాల పట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే.

ఎందుకంటే ఈ రెండు నియోజకవర్గాలలో అధికార పార్టీ అభ్యర్థులుగా రంగంలో ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీల రాజకీయ ప్రయాణం తెలుగుదేశంతో ఆరంభమైంది. ఇరువురూ తరువాత వైసీపీలో చేరారు. రాజకీయాలలో పార్టీలూ మారడం అరుదేమీ కాదు. కానీ వీరు తెలుగుదేశం నుంచి వైసీపీ గూటికి చేరిన తరువాత తెలుగుదేశంపై నోరుపారేసుకున్న తీరు సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. రాజకీయ విమర్శలు చేసి ఉంటే వారి పట్ల ప్రజలలో ఇంత ఆగ్రహం వ్యక్తమయ్యేది కాదు. కానీ ఇరువురూ కూడా తెలుగుదేశం అధినేత, ఆయన కుటుంబ సభ్యులపై వ్యక్తిగత దూషణలకు దిగారు. 

దీంతో తెలుగుదేశం పార్టీ కూడా ఈ రెండు నియోజకవర్గాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. గుడివాడలో నాని, గన్నవరంలో వల్లభనేని వంశీ ఓటమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా వ్యవహరించి అభ్యర్థుల ఎంపిక చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఈ రెండు నియోజకవర్గాల పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే రైజ్ సర్వేలో కొడాలి నాని, వల్లభనేని వంశీ ఓటమి బాటలో ఉన్నారని వెల్లడి కావడంతో తెలుగుదేశం శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.  రైజ్ సర్వే ప్రకారం గుడివాడలో వైసీపీ అభ్యర్థి, మాజీ మంత్రి కొడాలి నాని కంటే తెలుగుదేశం అభ్యర్థి వెనిగండ్ల రాముకు ప్రజాదరణ అధికంగా ఉందని పేర్కొంది. కొడాలి నాని గుడివాడ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎన్నికయ్యారు. ఇందులో రెండు సార్లు తెలుగుదేశం అభ్యర్థిగా, ఆ తరువాత వరుసగా రెండు సార్లు వైసీసీ అభ్యర్థిగా గెలిచారు. ఐదో సారి మాత్రం కొడాలి నానికి గుడివాడలో శృంగభంగం తప్పదని అంటున్నారు. ప్రజా వ్యతిరేకతను ముందుగానే పసిగట్టిన వైసీపీ అధిష్ఠానం ఒక దశలో  గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కొడాలి నానిని తప్పించాలని కూడా యోచించిందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. గత ఐదేళ్లుగా నియోజకవర్గ అభివృద్ధిని పూర్తిగా విస్మరించి విపక్షంపైనా, విపక్ష నేత, ఆయన కుటుంబ సభ్యులపైనా అనుచిత భాషా ప్రయోగంతో చేసిన విమర్శలూ ప్రజలలో కొడాలి నాని ప్రతిష్టను దిగజార్చడమే కాకుండా, వారి ఆగ్రహానికి కూడా కారణమయ్యాయి. ఆ ప్రజాగ్రహమే రైజ్ సర్వేలో ప్రతిఫలించినట్లు కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఇక గన్నవరం అధికార పార్టీ అభ్యర్థి  వల్లభనేని వంశీ విషయానికి వస్తే ఆయన ఇదే నియోజకవర్గం నుంచి వరుసగా రెండు సార్లు గెలుపోందారు. 2014, 2019 ఎన్నికలలో ఆయన తెలుగుదేశం అభ్యర్థిగా విజయం సాధించారు. అయితే 2019 విజయం తరువాత ఆయన తెలుగుదేశం పార్టీని వీడి జగన్ గూటికి చేరిపోయారు.  గన్నవరంలో గెలుపు తన బలం అని భ్రమించిన వంశీ తెలుగుదేశంపైనా, తెలుగుదేశం నాయకత్వం పైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు.  నియోజకవర్గ అభివృద్ధికి గుండు సున్నా చుట్టేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. అది ఆయన నామినేషన్ దాఖలు ర్యాలీలో ప్రస్ఫుటంగా కనిపించింది. దీంతో తెలుగుదేశం బలం కానీ, తన విజయానికి తన బలం కారణం కాదన్న విషయం వంశీకి బోధపడినట్లైంది. అందుకే ఇవే గన్నవరం నుంచి తన చివరి ఎన్నికలు అంటూ ప్రజాసానుభూతి కోసం బేల మాటలు మాట్లాడారు. వైసీపీలో తన వ్యతిరేక వర్గాన్ని ఈ ఒక్కసారికీ సహకారం అందించాలంటూ బతిమలాడుకున్నారు. ఆ మాటలే వంశీ ఓటమి బాటలో ఉన్నారన్న విషయాన్ని తేల్చేశాయి. ఇప్పుడు తాజాగా రైజ్ సర్వే కొడాలినాని, వల్లభనేని వంశీల సీన్ అయిపోయిందని తేల్చేసింది.