ప్రమాణ స్వీకారం.. అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు జగన్
posted on May 30, 2019 12:08PM
.jpg)
ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పట్టాభిషేకానికి సర్వం సిద్ధమయింది. ప్రమాణ స్వీకారోత్సవానికి విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం ముస్తాబయింది. మధ్యాహ్నం 12.23 గంటలకు జగన్ తో గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్, ఒడిసా సీఎం నవీన్ పట్నాయక్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, పలువురు జాతీయ, రాష్ట్రస్థాయి నేతలు హాజరవుతున్నారు.
ముఖ్యమంత్రిగా నెలకు రూపాయి మాత్రమే వేతనంగా తీసుకోవాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఆయనీ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం సీఎం వేతనం నెలకు రూ.2.5 లక్షలు. ఇతర అలవెన్సులను కూడా కలిపితే 4-5 లక్షల దాకా అందుతుంది. గతంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క రూపాయి మాత్రమే వేతనంగా తీసుకునేవారు.
ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక.. త్వరగానే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని జగన్ యోచిస్తున్నారని వైసీపీ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో జూన్ 3 లేదా 7న మంత్రివర్గ విస్తరణ చేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.