గ‌న్‌తో హ‌ల్‌చ‌ల్‌.. బైక్‌తో ఫీట్స్‌.. దుర్గగుడి ఫ్లైఓవర్‌పై ఓవ‌రాక్ష‌న్‌..

బెజ‌వాడ‌లో బ్లేడ్ బ్యాచ్‌లు, గంజాయి ముఠాలే కాదు.. తుపాకీ వీరులూ చెల‌రేగిపోతున్నారు. ఏపీలో పోలీసింగ్ సిస్ట‌మ్ అట్ట‌ర్‌ఫ్లాప్ అవ‌డంతో కుర్ర‌కారుకి ప‌గ్గాలు లేకుండా పోతోంది. త‌మ‌ను ఎవ‌రూ ఏమీ చేయ‌లేర‌నే ధీమానో.. పోలీసుల చేత‌గానిత‌నంపై న‌మ్మ‌క‌మో.. రీజ‌న్ ఏదైనా.. యూత్ య‌మ డేంజ‌ర‌స్‌గా ప్ర‌వ‌ర్తిస్తోంది. విజ‌య‌వాడ‌, గుంటూరు త‌దిత‌ర ప్రాంతాల్లో ఉన్మాదులు రెచ్చిపోతుండ‌టం, మ‌హిళ‌ల‌పై దాడుల‌కు తెగ‌బ‌డుతుండ‌టం క‌ల‌క‌లం రేపుతూనే ఉంది. పోలీసుల వైఫ‌ల్యం ఆవారా గాళ్ల‌కు, అరాచ‌క శ‌క్తుల‌కు అనుకూలంగా మారుతోంది. ఖాకీల నిఘా లేక‌పోవ‌డంతో.. కుర్ర‌కారు తెగ రెచ్చిపోతున్నారు. తాజాగా, జ‌రిగిన ఓ ఘ‌ట‌న విజ‌య‌వాడవాసుల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురి చేస్తోంది.  

బెజ‌వాడ‌ దుర్గగుడి ఫ్లైఓవర్‌పై కొంద‌రు యువ‌కులు రెచ్చిపోయారు. బైక్‌తో భ‌యంక‌ర స్టంట్స్ చేస్తూ చెల‌రేగిపోయారు. న‌డుస్తున్న బైక్‌పైకి ఎక్కి నిలుచొని ర‌క‌ర‌కాల విన్యాసాలు చేశారు. ఓ యువ‌కుడు బైక్‌పై నిలుచుని.. గాల్లో తుపాకీ చూపిస్తూ.. హ‌ల్‌చ‌ల్ చేశాడు. ఆ ఫీట్‌ను వీడియో తీయించుకొని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. 

ఆ బైక‌ర్ త‌న బండిని ఎవరూ గుర్తించకుండా నెంబర్‌ ప్లేట్ తీసేసి ఫ్లైఓవ‌ర్‌పై ఫీట్లు చేశాడు. ఆ వీడియో వైర‌ల్‌గా మార‌డంతో న‌గ‌ర‌వాసుల‌తో పాటూ పోలీసులూ ఉలిక్కిప‌డ్డారు. ఇంత‌కీ అత‌నికి గ‌న్‌ ఎలా వ‌చ్చింది? అది నిజ‌మైన తుపాకీనేనా? దుర్గ‌గుడి ఫ్లైఓవ‌ర్‌పై యూత్ ఇలా బైక్స్‌తో ఫీట్స్ చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్న‌ట్టు? ఇలా ఖాకీల‌పై విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తున్నారు నెటిజ‌న్లు.